జ్యోతిలక్ష్మికి చీర కడితే!

samvedana logo copy(1)

jyothi-lakshmi-18045జ్యోతి లక్ష్మి పోయారు. కొందరు మిత్రుల పోస్టులు చూశాక ఏవో ఆలోచనలు.

జ్యోతి లక్ష్మి కేవలం ఐటెం గర్ల్‌ కాదు. ఆమె సంప్రదాయ నృత్య కళాకారిణి అని చెప్పాలనే ప్రయత్నం అందులో కనిపించింది. కేవలం సమాచారం ఇవ్వడం కాకుండా విలువల పరమైన విషయమేదో అంతర్లీనంగా ఉంది. ఇంత చెత్త డాన్సులే కాదు, కూసింత మంచి డాన్సులు కూడా చేసింది అని గుర్తించండి అని చెప్పడం ఉంది. అది నిజమేనా! అంతకుముందు రాజాస్థానంలో చేసిన నృత్యాల్లోనూ- పాటల్లోనూ ఉన్నది ఏమిటి? అభిరుచుల విషయంలో మన అభిప్రాయాలను ప్రభావితం చేస్తున్నదేమిటి? సినిమా పరంగా బూతు చుట్టూ అల్లుకున్న భావనల్లో ఉన్న మతలబు ఏమిటి అనేది చూడాల్సి ఉంది.

క్లబ్‌డాన్సర్‌ అనే బదులు ఇటెం గర్ల్‌అనే పదం పొరబాటున వాడుతున్నారు. కొత్త పరిభాష అలవాటైపోయాక పాత పదం మర్చిపోయి కొత్తదే వాడేస్తూ ఉంటాం. ఈ ఐటెం అనే పరిభాష 90ల తర్వాతది. రాంగోపాల్‌వర్మ శిష్యుడు నివాస్‌తీసిన శూల్‌లో చోలీకీ పీచే క్యాహై అంటూ మాధురీ దీక్షిత్‌ చిందులేసే దాకా  ఐటెంసాంగ్‌ అనే పదం మన పదకోశంలోకి రాలేదు. తెలుగులో  వర్మ మరో శిష్యులు పూరీ జగన్నాధ్‌ తన మ్యూజ్‌ ముమైత్‌ఖాన్‌తో మరో దశకు తీసికెళ్లారు.

ఇటెం, మాల్‌, చీజ్‌ అనేవి బాంబేలో ప్రబలంగా వినిపించే మాటలు. అమ్మాయిలను సెక్స్‌ఆబ్జెక్ట్స్‌గా చూసే లంపెనైజ్డ్‌ మార్కెట్‌ పరిభాష.  జ్యోతి లక్ష్మియుగానికి వాళ్లు క్లబ్‌డాన్సర్లే. అవి బీడీ కీ జలైలే, చింకీ చమేలీ రోజులు కావు. అవి డిటెక్లివ్‌లు, పోర్నో పుస్తకాలు చిన్నచిన్న దుకాణాల ముందు తీగలపై వేలాడుతున్న రోజులు. పోర్నో ప్రతి మనిషికి అందుబాటులోకి రాని రోజులు. ల్యాండ్‌లైన్‌రాజ్యమేలుతున్న రోజులు. ప్రైవసీకి కష్టపడాల్సి వచ్చే రోజులు.  యాస్పిరేషనల్‌ మిడిల్‌క్లాస్‌ఇంత పెరగలేదు కాబట్టి విలాసం అనేది నెగెటివ్ అర్థంలో స్థిరపడిపోయి ఉండేది. అప్పుడు కారు అనేది అరుదైన వ్యవహారం కాబట్టి కారులో షికారుకెళ్లే పాల బుగ్గల పసిడిదానా అనేది విలాసాన్ని దెప్పిపొడవడానికి సరిపోయింది. ఇవాళ ఆ పాటను అదే అర్థంలో సమాజం స్వీకరించలేదు. వర్గ రాజకీయాలను అంత కుదించి మాట్లాడడం ఇవాళ కుదరదు. అప్పటికి రిసార్టులు ఇంత లేవు కాబట్టి క్లబ్‌ విలాసానికి చిరునామాగా ఉండేది. సినిమాల్లో అలాగే చూపించేవారు. అందువల్ల క్లబ్తో ముడివేసి క్లబ్‌డాన్సర్‌ అనే పేరు పెట్టారు. లేదా క్యాబరే అన్నారు. కేవలం క్లబ్బుల్లో తాగుబోతుల మధ్య డాన్స్ వేసే వారు అని నైఘంటికార్థం తీయకూడదు.

పల్లెటూరి ప్రేక్షకుడితో పాటు పట్నపు ప్రేక్షకుడిని కూడా ఆకట్టుకోవాల్సిన మార్కెట్‌అవసరం ఏర్పడిన సంధికాలంలో తెలుగు సినిమాలో ఆ సంధి ప్రేలాపన చాలా కనిపిస్తుంది. ఆ సంధికాలపు తొలిదశలో దాసరి ఉంటే దాని ఉచ్చదశకు ప్రతినిధిగా రాఘవేంద్రరావు కనిపిస్తారు. తెలుగు సినిమాల్లో కత్తులు కటార్లు తగ్గిపోయి దొరలు-భూస్వాములు వాళ్ల పంచెకట్లు తగ్గిపోయి గన్స్‌-పాంట్స్‌తో విలన్లు వస్తున్న కాలంలో వచ్చిన ట్రెండ్‌ ఈ క్లబ్‌డాన్సర్లు. అంతకుముందు పూర్తిగా గ్రామీణ ప్రేక్షకులే ఎక్కువగా మార్కెట్‌లో ఉన్నరోజున రాజుగారి లేదా జమీందారుగారి సంస్థానంలో పాటలను చూపించేవారు. స్త్రీని విలాసవస్తువుగాచూపే విషయంలో అవేమీ తక్కువ కాదు. ఇపుడు మిత్రులు జ్యోతిలక్ష్మి మీద గౌరవం పెంచడానికి పంచుతున్న త్యాగయ్య పాటే తీసుకున్నా అందులో ఆడువారు యమున కాడ క్రిష్ణుని గూడి..అందరు చూడగ.. ఏమేమి చేయుచున్నారో ఉంది. అలా క్రిష్ణుని గూడి చేసినా ఆధునిక హీరోను కూడి చేసినా చేసేది ఒకటే. చెప్పేది ఒకటే.అలాగే ఆ గీతంలో జ్యోతి లక్ష్మి వస్త్రధారణ కూడా భిన్నంగా ఏమీ లేదు. జ్యోతిలక్ష్మి రెండు పాటల్లోనూ తన పాత్రేదో తాను పోషించింది. ఒకదాని కొకటి తక్కువా కాదు. ఎక్కువా కాదు.

సెక్స్‌సంబంధమైన పరిభాషను నిత్యజీవితంలో సామాన్యులు వాడే పదజాలంనుంచి విడదీసి గంభీరంగా సంస్కృతంలో మాట్లాడుకుంటే అదేదో సున్నితం అనిపిస్తుంది.నేనెక్కడో దాచాను బంగినపల్లి అంటే బూతుగా కనిపించి ఆ త్యాగయ్య చిత్రం పాటలోని పాలిండ్లు కదల, కుటిలోలకములు మెదల అంటే బూతుగా అనిపించదు. అంతెందుకు మన సాహిత్యంలో కూడా అవసరమైన చోట రతి ప్రక్రియ అనో ఇంకోటో వాడగలం కానీ తెలుగుపదం వాడలేము. శిశ్నము, భగము అంటే అంత బూతుగా కనిపించదు, తెలుగు వాడితేనా, అమ్మో! ఇదంతా ఒక సంస్కృతి మన మెదళ్లపై చేసిన పెత్తనం ఫలితం. ఇపుడు ఇంగ్లిష్‌కి వద్దాం. ఫక్ అనేమాట యథాలాపంగా వాడేస్తుంటారు. షిట్‌ అనే మాటని డైనింగ్‌టేబుల్‌మీద కూడా యథాలాపంగా విసిరేస్తుంటారు. కానీ తెలుగులో వాడమనండి, ఎంత అసహ్యంగా మొకం పెడతారో అందరూ! ఇవేమో ఆ పదాలతో ముడిపడిన ఆంగ్ల సంస్కృతిలో ఉన్న పారదర్శక స్వభావానికి సంబంధించిన అంశం. అంతకంటే ముఖ్యంగా మార్కెట్‌కు సంబంధించిన అంశం. అంటే కాస్త వెనక్కు పోతేనేమో కొందరికి మాత్రమే పరిమితమైన వ్యవహారం. గాంభీర్యం లేదా లాలిత్యం అనిపిస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకో భాషలోనేమో ఆ భాషలో అది కామన్‌ కాబట్టి మనకు ఏమీ అనిపించదు.

actress-jyothi-lakshmi-passes-away-63

ఒకటి ఫ్యూడల్‌ మాయాజాలం. ఇంకోటి మార్కెట్‌ మాయాజాలం.ఇక్కడ బూతు అనేది ఆ భాషతోనూ ఆ భాషతో ముడిపడిన సమాజముతోనూ ముడిపడి ఉన్నది. భాషతో పాటు అనేకానేక ఇతర అంశాలు కూడా పనిచేస్తాయి. విచ్చిన పూరేకు పచ్చల పిడిబాకు, గుచ్చుకుంటే తెలుస్తుందిరా అంటే కనిపించని బూతు వేటకత్తి ఒంట్లో దూసి సిగ్గు గుత్తి తెంచేశారు అంటే కనిపిస్తుంది. రెండూ ఒకటే . వాస్తవానికి మొదటిది రెండో దానికి ఇన్‌‌స్పిరేషన్‌కావచ్చు కూడా. పిక్చరైజేషన్‌ అప్పటి వాతావరణం అనేకం పనిచేస్తాయి. అక్కడ ఆ పాత పాటలోనైనా రాక్షసి పాత్ర కాబట్టి ఆ మాత్రం తెలుగు వాడేశారు.దేవతల ఆస్థానమైతే పెట్టేవారు కాదు.దేవతల సెక్స్‌ కూడా సంస్కృతంలోనే ఉంటుంది మరి! అంతకంటే ముఖ్యంగా అప్పటి మార్కెట్‌కి అది బాహాటంగా ఉండడం అవసరం కాదు.ఇపుడు ప్రేక్షకుడి తొడనిమిరి అరే అబ్బాయి్‌ఇది ఇందుకోసమే పొరబడనక్కర్లేదు ఇందుకోసమే అని చెప్పే మార్కెట్‌. ముసుగులు అక్కర్లేని కాలం. ఇదంతా ఎందుకంటే జ్యోతిలక్ష్మి త్యాగయ్యలో పాడిన పాటైనా, లేలేలే నారాజా పాట అయినా ఒకటే. రెండూ టిటిలేటింగ్‌ ఎఫెక్ట్‌కోసమే. ఒకప్పుడు ఏదైనా ముసుగులో మాత్రమే చెప్పాల్సిన టైం కాబట్టి ఆస్థాన నర్తకిగానూ, మేజువాణీగానూ మేలిముసుగుల్లో ఆడాల్సి వచ్చేది. పట్టణ మార్కెట్‌పెరిగే కొద్దీ కొత్త తరం ప్రేక్షకుల్లో టిటిలేటింగ్‌ఎఫెక్ట్‌కోసం వేరే రూపం తీసుకోవాల్సి వచ్చింది. అపుడైనా ఇపుడైనా మార్కెటే ప్రధాన నిర్దేశకురాలు. అపుడైనా ఇపుడైనా అనేకమంది మగవాళ్ల ముందు ఒక స్త్రీ  తనను తాను ప్రదర్శించుకోవడమే. ఆ మగవాళ్లు ఇంద్ర దర్బారులోని దేవుళ్లా, ఆధునిక పబ్బులోని మగవాళ్లా అనేదే తేడా కానీ విషయంలో తేడా లేదు.

సినిమాల్లో ఏదో చేసేద్దామని దాన్ని సామాజిక సాధనంగా భావించి కొందరు చేసిన ప్రయోగాలను మినహాయిస్తే ఇతరత్రా విషయాల్లో పాత సినిమాలు సెన్సిబిల్‌అయిపోయి కొత్త సినిమాలు ఇన్‌సెన్సిబిల్‌ అయిపోవు. స్ర్తీ శరీరాన్ని వంకర్లు తిప్పుతూ మగవారి ఆనందం కోసము చిందులేయించడం అనే విషయంలో మూడు దశలు ప్రధానంగా కనిపిస్తాయి. తొలి దశ ఆస్థాన నర్తకి లేదా మేజువాణి దశ. రెండో దశ క్యాబరే డాన్సర్‌లేదా క్లబ్బు సాంగులు అనే దశ. మూడో దశ ఇటెం సాంగ్స్. ఈ మూడు పదాలకు మూడు మార్కెట్‌దశలతో సంబంధం ఉంది. గ్రామీణ ప్రేక్షకులే ప్రధానమైపోయిన దశ ఒకటి. గ్రామాలనుంచి పట్టణాలకు వలస ప్రధాన లక్షణంగా కలిగిన దశ ఒకటి. పట్టణ ప్రేక్షకులే ప్రధాన ప్రేక్షకులుగా మారిన దశ ఒకటి. స్థూలంగా అరవైల దాకా మొదటి దశ అనుకుంటే అరవైల నుంచి 90ల దాకా రెండో దశ. ఆ తర్వాత మూడో దశ అనుకోవచ్చు.దానికి సంబంధించిన ఇతర సెన్సిబిలిటీస్ అన్నీ ఆ సినిమాల్లో ప్రతిఫలిస్తాయి. తెలుగు సినిమాల్లో విలన్‌ఎలా మారుతూ వచ్చాడో చూస్తే తెలుగు సినిమా ప్రయాణం తెలిసిపోతుంది. వైరుధ్యమే కదా మూలం దేనికైనా!లేట్‌ సిక్సిటీస్‌నుంచి 90ల దాకా నడిచిన కాలం తెలుగు సినిమాకు అటూ ఇటూ కాని నాశినపు కాలం అనిపిస్తుంది. ఆ దశలో సినిమా తనకిచ్చిన పాత్రను పోషించిన నటి జ్యోతిలక్ష్మి. సమర్థురాలు కాబట్టి ముద్ర వేయగలిగింది. తర్వాతి కాలంలో సెక్స్ చుట్టూ ఉన్న ముసుగులు తొలగిపోయి శరీరానికి కూడా ప్రదర్శనా వస్తువుగా లెజ్టిమసీ వచ్చాక హీరోయిన్లే ఆ పాత్ర పోషించడం మొదలెట్టారు. టాప్‌ హీరోయిన్లు పోటీపడుతున్నారు కూడా. నాట్యంలో వేగం వల్ల ఒకరిద్దరు స్పెషలిస్టులు మిగిలి ఉన్నారు తప్పితే సాధారణంగా ఆ ట్రైబ్‌ మాయమైపోయింది. వారి ఉపాధి పోయింది.

ఫ్యూడల్‌ సమాజపు సినిమాల్లోనైనా పూర్తిగా మార్కెట్‌ మయమైన నేటి కాలంలోనైనా స్త్రీ పాత్రల్లో చైతన్యం పరంగా మౌలికమైన తేడా అట్టే లేదు. అబరేషన్స్‌ సంగతి పక్కనబెడదాం. జేబు ఇంకా ప్రధానంగా పురుషుడికే  ఉంది కాబట్టి బహిరంగ స్థలాల్లో బహిరంగ సంచారంలో పురుషుడే ఎక్కువ కనిపిస్తాడు కాబట్టి ప్రేక్షక ప్రపచంలో అతన్ని ప్రధానంగా టార్గెట్‌ చేయడం ఒక విధిగా సినిమా వాళ్లు భావిస్తారు. దానికి తగిన ఏర్పాట్లేవో చేస్తారు. పురుషుడితో పాటు స్ర్తీ కూడా ఎంతో కొంత ఆర్థిక స్వాతంత్రం  స్వేచ్ఛ చైతన్యం పెంచుకుంటున్నదని భావించే మెట్రో అర్బన్‌ సెక్షన్‌ కోసం మల్టీ ప్లెక్స్‌లు రాబట్టి కూసింత సెన్సిబిల్‌ సినిమాలు కూడా చూడగలుగుతున్నాం. గతానికి వర్తమానానికి తేడా రూపంలోనే, సారంలో కాదు. ఫ్యూడల్‌ సమాజమే ముసుగు సమాజం కాబట్టి స్ర్తీ మరీ బహిరంగంగా బయటపడకూడదు. సిగ్గుల మొగ్గగానే ఉండాలి. సున్నితంగా చెప్పినట్టు ఉండాలి. భలే భావుకత అండీ అన్నట్టుండాలి. విద్యాగంధం కొందరిదే కాబట్టి వారు చెప్పిందే వేదం. వేదమైనా భావుకత అయినా సంస్కృతమే మరి! ఆ సినిమాల్లో అదంతా కనిపిస్తుంది. అంతకంటే ముందునుంచి వచ్చిన వారసత్వం అది.

వచ్చినవాడు వామనుడు కాదయ్యా, వాడు విష్ణుమూర్తి  అని శుక్రాచార్యుడు హెచ్చరిస్తే బలి చక్రవర్తి ఏమంటాడు?

“ఆదిన్‌శ్రీ సతి కొప్పుపై తనువుపై పాలిండ్లపై నూత్న మర్యాదంజెందు కరంబు కిందగుట, మీదై నాకరంబు మేల్గాదే, రాజ్యమున్‌గీజ్యమున్‌సతతమే, కాయంబు నాపాయమే’’ అన్నాడు.

అంతటి విష్ణుమూర్తి నా ముందు చేయి చాచడం కంటే ఇంకేమి కావాలి అని చెప్పడానికి ఏ ఘనత తీసుకున్నాడు? లక్ష్మీ దేవి ఒంటి మీద పాలిండ్లమీద పారాడే చేయి మన చేయికంటే కింద ఉందంటే ఇంకే కావాలి, ఎపుడైనా పోవాల్సిన ఈ దేహానిదేముంది అన్నాడు. అంటే ఏమిటిట? అంతరార్థం ఏమిటి? ఆయన దృష్టి అంతా ఎక్కడుంది? వివరించి చెబితే భక్తులు గింజుకుంటారు కాబట్టి ఇక్కడ వదిలేస్తా. అదే కాదు, కమలాకుచ చూచుక కుంకుమతో…అని పొద్దుపొద్దునే కాలర్‌ట్యూన్‌పెట్టుకుని మరీ వింటాం కదా! అంటే అర్థాలతో నిమిత్తం లేకుండా తాము చెప్పిన ఒక భావనకు మెజారిటీ సమూహం తలవంచి ఆరాధించేలా చేయగలిగింది ఒక పర్టిక్యులర్‌  సమూహం. మళ్లీ చెప్పొచ్చేదేంటే అయ్యలారా, అమ్మలారా! ప్రతి దానికి స్త్రీ శరీరాన్ని అడ్డుపెట్టి అవమానించడం ఆధునిక నేరం కాదు, చాలా చాలా పాత నేరం. ఇంకా చెప్పాలంటే ఆధునిక కాలమే ఎంతో కొంత మెరుగు.

త్యాగయ్య జ్యోతిలక్ష్మికి ప్రేమ్‌నగర్‌జ్యోతిలక్ష్మికి ప్రేక్షక మార్కెట్‌లో వచ్చిన తేడా తప్ప విలువల పరమైన తేడా లేదు. సింబాలిజం తేడా ఉంటుంది. పళ్లూ, పూలూ కరవాలాలూ, బాకులు, మొగ్గలు, రేకులు ఇవన్నీ సున్నితమైన భావనలుగా ప్రచారంలో పెట్టి అట్లా అప్పట్లో లాక్కొచ్చారు. మధ్యరకం క్లబ్‌డాన్సర్ల టైం వచ్చేసరికి అరకోడి, చిల్లిగారె లాంటి సింబాలిజమ్ యాడ్‌అయ్యింది. ఆ తర్వాత పిడతకింద పప్పు లాంటి మరీ నాటు కూడా కలిసిపోయింది. అక్కడ ఉత్తరాదినా అంతే. ఏ మేరా దిల్‌-యార్‌కా దివానా నుంచి షీలా కీ జవానీ దాకా జరిగిన ప్రయాణం తెలుగు సినిమాల కంటే భిన్నమైన దేమీ కాదు. ఇక్కడ జ్యోతిలక్ష్మి-జయమాలిని అక్కడ హెలెన్‌-ఇరానీ. ఇక్కడ రాఘవేంద్రరావు-అక్కడ డేవిడ్‌ధావన్‌. రాజమౌలి-పూరీ జగన్నాధ్‌ టైం వచ్చేసిరికి టెన్నిస్ బంతుల పాపా, నీ బంతులకింతటి ఊపా అని మార్కెట్‌సింబల్స్‌పచ్చిగా ప్రవేశించాయి. లేటెస్ట్‌గా సాల్టెడ్‌ బటర్‌, క్రీమ్, వంటి ఆంగ్ల శృంగార ఇమేజరీ మన తెలుగు సినిమా సారస్వతంలోకి కూడా బట్వాడా అవుతున్నది. తెలుగులో పచ్చి వెన్న లాంటివి ఆల్‌రెడీ వచ్చి ఉన్నాయి. అయితే ఈ పచ్చితనం మాత్రమే బూతు అయిపోయి గతంలోది సున్నితమైన భావుకత్వం అనుకుంటే మనం ఫ్యూడల్ విలువలను మోస్తున్నట్టే అర్థం. మార్కెట్‌కు వెలుపల ఆలోచిస్తే సినిమాను అభిరుచుల వ్యవహారంగా మార్చే ప్రమాదం ఉంటుంది.

కాలంతో పాటే సింబాలిజం కూడా పాతబడుతుంది. మార్కెట్‌తో పాటు కొత్త సింబాలిజం యాడ్ అవుతూ ఉంటుంది. వర్తమానం బాగోలేదు నిజమే కానీ దానికి సమాధానం వెనక్కు పోవడంలో లేదు. ఇంతకంటే ఆరోగ్యకరంగా ముందుకెళ్లడంలో ఉంది. దానికోసం ప్రయత్నించడంలో ఉంది. టెక్నాలజీ మార్పుల వల్ల సినిమా ప్రొడక్షన్‌ ఎంతో కొంత ప్రజాస్వామికమయ్యింది. మార్కెటింగ్లో ప్రధానమైన డిస్ర్టిబ్యూషన్‌ ఇంకా ఫ్యూడల్‌ కంపు కొడుతోంది. అక్కడ ఎవరైనా మార్పు తేగలిగితే సెన్సిబిల్‌ సినిమాకు దారి వైశాల్యం పెరుగుతుంది. ఇతర రంగాల్లో మార్కెట్‌ వల్ల అది తెచ్చిన టెక్నాలజీ వల్ల కొన్ని సమూహాల గుత్తాధిపత్యానికి కొంతవరకు గండి పడింది. సినిమా రంగంలో ఆ లోటు మిగిలే ఉంది.

*

 

 

 

 

 

 

మీ మాటలు

  1. VOLETI VENKATA SUBBARAO says:

    మరణించిన వ్యక్తి లో మంచితనాన్ని గురించి ప్రస్తావించడం సబబు కానీ – ఇతర అంశాల జోలికి వెళ్లడం సమర్ధనీయం కాదని నా వ్యక్తిగత అభిప్రాయం ~

    • SR Bandaa says:

      Intakii raammohan gaaru cesindi jyotilakshmi vimarsa kaane kaadu. Appatinunci ippativaraku konasaagutuu vastunna oka pokada gurinci visleshina!

  2. అవినాష్ వెల్లంపల్లి says:

    వ్యక్తి బతికున్నప్పుడూ చనిపోయిన తరువాతా కూడ మంచి చెడ్డలు అన్నిటిని ధైర్యంగా నిర్మొహమాఁటంగా మాట్లాడు కోవడం మేలు.

    కేవలం మంచి మాత్రమే మాట్లాడితే, చెడు ఏమీ లేదని సామాన్యులు భావిస్తారు. గతంలో వైఎస్సార్ ని కూడా హటాత్తుగా మహా నేత గా మార్చి ఎడా పెడా కీర్తించి పారేశారు.

  3. వ్యవస్థ ..వేసే …దుమార్గపు ఎత్తుల లో ….జ్యోతిలక్ష్మి / లాంటి …ఒక ముడిసరుకు …. అంతే , అయితే అన్ని వర్గాలూ …ఈ విషయాన్ని అర్థం చేసుకొనే …స్థాయి ఎక్కడ ? , ఇలాంటి స్థితి లో ఇంకా ”ఒప్పుకోవడం” …!! అనే స్థితి ….?! , కొంత ఆలస్యం కావచ్చేమో …కానీ వస్తుందనే ఆశిద్దాం.
    ఏది ఏమైనా ఉన్నదంతా … either push or pull కదా ?

  4. prasad bolimeru says:

    ఇక్కడ వ్యక్తి మంచి చెడుల ప్రసక్తి కాదు….. భావజాలం ఏమిటని, ..సినిమా వ్యాపార వస్తువుగా మాత్రమే చూడ బడేటప్పుడు.. ఆ స్థల కాలాల్లో కొనుగోలుదారులుని (మగవాళ్ళు) రెచ్చగొట్టడానికి థియేటర్ కి రప్పించడానికి ఉపయోగపడిన సరుకే ఇది అని చెప్పడానికి మొహమాటమెందుకు ? .. క్లబ్ డాన్సర్ నుంచి ఐటెంగర్ల్ దాకా … తెర వెనకా ముందు అంతా ఒకటిగానే నడిచింది.. నడుస్తోంది .. ఒకరిని తిట్టడం పొగడడం కాదు… మంచి విశ్లేషణ —జి ఎస్‌ రామ్మోహన్‌ గారు.

  5. c sainath says:

    తెలుగు సినిమా పోకడ లను బాగా విశేలేశించారు
    ఎక్కడ నటి జ్యోతి లక్ష్మి పై విమర్శ కాదు అనుకుంటా

  6. దేవరకొండ says:

    ‘కళామతల్లి ‘ ఆరోగ్యానికి ఇలాంటి విశ్లేషణలు అవసరం. కళారూపాలెన్నిమారినా అవి చూపించే వ్యవస్థని, ఆ వ్యవస్థ అమలు చేసే విధి విధానాల్నీ విలువలుగా చలామణీ అయే అలిఖిత నియమ నిబంధనల్నీ దాటి పోలేవు. ఆ పరిధుల్లోనే ఆయా కళారూపాల్ని విశ్లేషించ వల్సిన అగత్యం అనివార్యం అవుతుంది. అది భూస్వామ్యమైనా పెట్టుబడిదారీ అయినా మౌలికంగా అవి దోపిడీ వ్యవస్థలే కదా! దోపిడీలో ఎంత తక్కువ వాటా ఉంటే వాళ్ళు అంత బలహీనులు. అటు సమాజంలోనూ ఇటు ఇంట్లోనూ ‘అన్ని ‘ విధాలా దోపిడీకి గురయ్యేది స్త్రీ జాతి. స్త్రీని దేవతా మూర్తిగా ఆకాశానికి ఎత్తడం, బజారు సరుకుగా ప్రదర్శనకి పెట్టడం అంతా ఆ దోపిడీ ఎత్తుగడల్లో అప్రయత్నంగా జరిగిపోయే ప్రక్రియలు. సినీమా ఇందుకు మినహాయింపు కాదు. ఆ స్త్రీ అనే సరుకును ఎంత బాగా అమ్మగలిగితే వాడు ‘నిర్మాతల దర్శకుడు ‘అయి ముసలి తనం వచ్చాకా సన్మానాలు చేయించుకోగలుగుతాడు. ఇంతకీ అంతా వ్యవస్థ తోనూ ఆ వ్యవస్థ డబ్బుతోనూ ఆ డబ్బు దోపిడీతోనూ ముడిపడి ఉన్నాయి. కష్టజీవులకు మిగిలేది తాము ప్రాణాలతో ఉంటూ మళ్ళీ దోపిడీకి గురవడానికి సిద్ధం కావడానికి సరిపడా డబ్బే. సినీమా వాళ్లకి (నటులు) సామాజికంగా గౌరవం లేని రోజులున్నాయి. వాళ్ళు పట్టుదలగా డబ్బు సంపాదించి గౌరవాన్ని కొనుక్కోగలిగారు. అలాంటి స్థాయికి వెళ్లకుండానే కొందరు వెళ్లిపోయారు. ఊరుకోకుండా ఇలాంటి విశ్లేషణలతో వారిని గౌరవించిన రచయిత రామమోహన్ గార్కి, సారంగకు అభినందనలు.

  7. కె.కె. రామయ్య says:

    “ఫ్యూడల్‌ సమాజపు సినిమాల్లోనైనా పూర్తిగా మార్కెట్‌ మయమైన నేటి కాలంలోనైనా స్త్రీ పాత్రల్లో చైతన్యం పరంగా మౌలికమైన తేడా అట్టే లేదు. ప్రేక్షకుల్లో టిటిలేటింగ్‌ ఎఫెక్ట్‌కోసం స్త్రీ శరీరాన్ని వాడుతున్న ఫ్యూడల్‌ మాయాజాలం. ఇంకోటి మార్కెట్‌ మాయాజాలం ” అంటూ పలు అంశాలను వివరించిన జి.ఎస్‌. రామ్మోహన్‌ గారు! హాట్స్ ఆఫ్ టు యు!!

    తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ ఐదు భాషల్లో 300కు పైగా సినిమాల్లో నటించి; తన నృత్యం ద్వారా, శృంగార భంగిమల ద్వారా ( క్లబ్‌ డ్యాన్సలు, వ్యాంప్‌ పాత్రల ద్వారా ) ఓ తరాన్ని ఉర్రూతలూగించిన గ్లామరస్‌ డాన్సర్‌ సినీ తార జ్యోతిలక్ష్మి బ్లడ్‌ కేన్సర్‌తో బాధపడుతూ 09-08-2016 న 68 వ ఏట కన్నుమూశారు. తన సినీ ఇమేజ్ కి భిన్నంగా ఓ మంచి వ్యక్తిగా నిజజీవితంలో అనేకమంది అభిమానాన్ని పొందారు జ్యోతిలక్ష్మి.

  8. THIRUPALU says:

    విశ్లేషణ చాలా బాగుంది. జ్యోతి లక్ష్మి గారికి ఘనమైన నివాళినే. ఆమె పేరు చెప్పి అద్భుత సామాజిక విశ్లషణను చేశారు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను . అదేమిటండి మనవాళ్ళు శృంగారాన్ని ఆహార పదార్దాలతో పోల్చడం. రసాలు ఆహారం లో ఉన్నాయనా ? అయితే ప్రేమ! అదికూడా ఆహారం లాంటిదేనా. స్త్రీ వాదులు దీన్ని ఖండించాలి.

  9. సారీ, రాంమోహన్, అసంపూర్ణం గా ఉందనిపిస్తోంది ఈ వ్యాసం.

    • మీరన్నది నిజమే. చెప్పాల్సింది చాలా ఉంది. ఆర్డర్‌ కాస్త మార్చాల్సి ఉంది. అనుకున్నదంతా పద్ధతి ప్రకారం పెట్టడానికి శక్తీ సమయమూ సరిపోవట్లేదు. అది నా పరిమితే.

  10. rani siva sankara sarma says:

    మన ఆంధ్ర దేశం సినిమా తప్ప మరే కళారూపమూ బతికి బట్టకట్టలేని అంధదేశం. దాన్నే మనం ముద్దుగా ఆధునికత అంటున్నాం.

  11. సవరణ-శూల్‌లో మాధురీ దీక్షిత్‌ చోలీకీ పీచే క్యా హై పాట తర్వాతే ఇటెం సాంగ్‌ అనే పరిభాష పదకోశంలోకి వచ్చింది అని రాశాను. పాట పేరు తప్పు రాశాను. ఆ పాట ఖల్‌ నాయక్‌లోనిది. శూల్‌ తర్వాత ఆ పదం కొత్తగా వాడారు అన్నంత వరకూ గుర్తుంది. అప్పుడెవరో పరిశోధకులు ఆ విషయం రాసినట్టు గుర్తు. శూల్‌లోది మైనే ఆయీ బీహార్‌ యుపీ లూట్‌నే అనే గీతం . నర్తకి శిల్పా శెట్టి. విషయం గుర్తున్నా చాలా సార్లు నామవాచకాలు గుర్తుండవు. ఎక్కువ జ్ఞాపకాల మీద ఆధారపడి రాయడం వల్ల దొర్లిన పొరబాటు.

  12. Ramana Yadavalli says:

    వ్యాసం చదివాక కొత్తసంగతులు తెలిశాయి. మంచి వ్యాసం, థాంక్యూ!

  13. కె.కె. రామయ్య says:

    నాటక రంగం, అంతకు మించి సినీరంగం ప్రజలపై చూపగల ప్రభావాన్ని అర్ధం చేసుకున్న తమిళనాడు రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ద్రావిడ ఉద్యమనేతలు తమ భావజాలాలని ప్రచారం చెయ్యటానికి, అసమానతలపై పోరాడటానికి, అధికారం చేజిక్కిచ్చుకోవటానికి సినిమా మాధ్యమాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారనుకోవచ్చా జి.ఎస్‌. రామ్మోహన్‌ గారూ. ( తెలుగులో కన్నా భిన్నమైన మిన్నవైన కళాత్మక సినిమాలు తమిళంలో రాలేదనుకున్నా ). సినిమా రంగం లోని గుత్తాధిపత్యానికి గండి కొట్టి విలువలతో కూడిన సిన్సిబిల్ సినిమాలు వచ్చేలా చెయ్యాలంటే ఏంచెయ్యాలో గురించీ రాయరూ.

  14. టి. చంద్రశేఖర రెడ్డి says:

    సంవేదనగా-జ్యోతిలక్ష్మి చీర కడితే శీర్షికతో జి. ఎస్. రామమోహన్ గారి స్పందన చూశాను.
    జ్యోతిలక్ష్మి చేసిన డాన్సుల్లాంటివి అంతకుముందు విజయలలితలాంటి వారు కొందరు, కొన్ని చేసినా; అలాంటి డాన్సులు క్రమం తప్పకుండా అనేక సినిమాల్లో చేసి, పూర్తిగా వాటితోనే గుర్తింపు పొందిన మొదటి నర్తకి జ్యోతిలక్ష్మి. ఆ తర్వాత జయమాలిని, అనూరాధ, సిల్క్ స్మిత అదే ధోరణిలో చాలాకాలం పాటు డాన్సులు చేసి; కొంచెం తక్కువగానో, ఎక్కువగానో జ్యోతిలక్ష్మి పొందిన గుర్తింపులాంటిదే పొందారు. అందువల్ల జ్యోతిలక్ష్మి విస్తృతకాలంపాటు కొనసాగిన ఒక ధోరణికి మొదటి అడుగు; అది నెగటివా, పాజిటివా అన్నది పక్కన పెడితే.
    కాలక్రమేణా ఈ ట్రెండ్ ప్రాధాన్యత, 1979లో వేటగాడు సినిమా విడుదలయిన రోజుల్లో; ఒక ప్రముఖ తెలుగు వారపత్రిక, తన పత్రికకి జయమాలిని ఫోటోని ముఖచిత్రంగా వేసే స్థాయికి పెరిగింది. కొందరు పాఠకులు, పత్రికాముఖంగా దీనిపట్ల, అభ్యంతరం/విస్మయం వ్యక్తపరిచారు. కథానాయికని వర్షపుధారల్లో తడుపుతూ ఆ రోజుల్లో తీసిన పాటలతో పోల్చుకుంటే; జ్యోతిలక్ష్మి, జయమాలిని డాన్సులు వెయ్యిరెట్లు నయం అని నేను ఓ లేఖ రాసినందుకు; ఓ నాలుగయిదు వారాలపాటు కొందరు నన్ను దుమ్మెత్తిపోశారు.
    ఇక పాటల సంగతి. పూల దుకాణం దాటి, పాల డిపో మీదుగా అట్టట్టా దిగివస్తే, అక్కడ మా ఇల్లు, అక్కడ అక్కడ అక్కడ అక్కడే మా ఇల్లు, అనేది 1978 లో వచ్చిన ఆడదంటే అలుసా? అనే సినిమాలో ఒక పాట. ఈ పదాల్లో బూతు అనేది లేదనీ, ఆ చరణాలకి వేరే అర్థం వచ్చేలా, నర్తకి అంగాలకు ఊపు తేవడం వలన ఆ అర్థం వచ్చిందనీ ఒక సౌకర్యవంతమయిన వాదన. ఈ వాదన నిజమే అని అనుకుంటే, 1977లో వచ్చిన సీత గీత దాటితే-అనే సినిమాలో; ఏందిరా చిన్నోడా నువ్వెంత? ఈడ్చి ఈడ్చి కొలిస్తే …(చెప్పటం బాగోదు), అనే పాటని ఏ వాదన సమర్థిస్తుంది? ఇదే పాట చివర్లో శృంగారప్రక్రియలో ఒక భాగాన్ని సూచించే మరో పదప్రయోగం సైతం ఉంది. అది కూడా ఉదహరించటం భావ్యం కాదు. ఆ పాట వింటే ఆ పదాన్ని సులభంగానే గుర్తించవచ్చు.
    1960ల్లో కొన్ని అద్భుతమయిన సినిమాలు తీసిన ఒక ప్రముఖ దర్శకుడి దృష్టిలో కథానాయిక బాహుమూలాల్లో స్వేదం కనిపించటం సైతం అశ్లీలం. అలాంటి దృశ్యాల్ని నివారించటం కోసం; కథానాయిక పాత్ర ధరించే నటీమణి, అవసరం అనిపిస్తే మార్చుకోవటానికి వీలుగా, ఆ దర్శకుడు పట్టుపట్టి మరీ, అదనంగా అదే రకం రవికలు మరో మూడు కుట్టించి సెట్స్ లో సిద్ధంగా ఉంచేవాడు అని ప్రతీతి. ఇప్పుడు స్వేదం కాదు, ఏకంగా బాహుమూలాలనే క్లోజప్ లో చూపెడుతున్నారు.
    గడియారం మీద దృష్టి పెట్టి; 1960ల్లో వచ్చిన ఒక తెలుగు సినిమాని చూస్తుంటే, కథానాయకుడు, నాయికని మొదటిసారి తాకటం అనేది, ఇంటర్వల్ తర్వాత 32 నిమిషాలకి జరిగింది. ఈ రోజుల్లో అది ఊహాతీతం అని నేనంటే, ఇప్పటి తెలుగు సినిమాని చూసే ప్రేక్షకులందరూ సమ్మతిస్తారనుకుంటాను.
    కూలిపనికి వెళ్తున్న భర్త సైకిలు వెనక భార్యని కూర్చోపెట్టి అదే కూలిపనికి తీసుకుపోతుంటే; నా బాల్యంలో, చిత్రంగా చూసేవాళ్లం. ఇప్పుడు మోటారుసైకిళ్ల మీద జంటలు కూర్చునే భంగిమలు విచిత్రం అనిపించటంలేదు. అవి చూడటానికి అలవాటు పడటం దానికో కారణం. సినిమాల్లో వచ్చిన, వస్తున్న మార్పులకి భాష్యాన్ని, ఈ ఉదాహరణ వివరంగా చెపుతుందని నా నమ్మకం.
    సినిమాల్లో చూస్తున్నవే, బయట కనపడుతున్నాయి. బయట కనపడేవే సినిమాల్లో దర్శనమిస్తున్నాయి. తీస్తున్నారు కనక చూస్తున్నాం అని ప్రేక్షకుల వాదన. చూస్తున్నారు కనక తీస్తున్నాం అని చలనచిత్రరంగ భావన. ఏది నిజం అనే ప్రశ్నకి; ఎవరికి తోచిన సమాధానం వాళ్లు చెప్పుకోవటమే సరయిన పని.

    టి. చంద్రశేఖర రెడ్డి

  15. g b sastry says:

    లైంగికతని మనిషంత దిగజారుడు తనంతో మరే జీవి చూడటంలేదు. పునరుత్పత్తికి నిర్దేశించిన లింగ బేధాన్ని,సంయోగాన్ని ఇంత నీచంగా చూడడం మనిషికే చెల్లింది,దాని చుట్టూ అనవవసర సిమిగులు,భయాలు,న్యూన్యతాభావాలు పాపపుటాలోచనలు,ఒకరినొకరు తక్కువచేసి మాటాడడానికి,తిట్టుకోడానికి లైంగికపరమైన అవయవాల్నివాడడం పురుషపరంగా జరిగేవన్నీ మగతనం గాను అడ్వైపునైతే అది జాణతనం విశృఖలత్వం లాంటి బాండ ఆలోచన చట్రంలో బిగిసి ఉక్కిరి బిక్కిరి అవుతున్న మనం జ్యోతి లక్ష్మిలాంటి పాత్రధారుల గూర్చి మాట్లాడడానికి ఇష్టపడం పొగడ్డానికి అవకాశమేదీ ?
    నిజం చెప్పాలంటే రంగస్థలం మీద నటులందరిది నటనే ఏది నిజం కాదు, నాయకులంతా నటనలో చూపించినంత మంచివారు కారు ప్రతినాయకులు రోడ్డుమీద తిరిగే గూండాలుకాదు సూర్యకాంతాలు గయ్యాళులుకారు పతివ్రత వేషాలువేసిన వాళ్ళు … కారు.
    మన దురదృష్టమేమంటే రంగస్థలం పై ప్రవర్తనుబట్టి వారిని బేరీజువేస్తాం అన్నిరకాల పాత్రధారులు అంటే కష్టపడి ప్రేక్షకుల మెప్పించ చూస్తారు
    జ్యోతి లక్ష్ములైన,సావిత్రయినా శ్రీరంజనైనా.
    అందుకని తానూ ధరించిన పాత్రలో మాన్ని మెప్పించిన జ్యోతి లక్ష్మిగారి నటనకి గౌరవమిద్దాం పాత్రతో ముడివడిన మన విలువలకి కాదని నా మనవి
    తమ భర్తలు చొంగలు కార్చుకుంటూ చూస్తుంటే చికాకు పడిన ఆడవారికి,చొంగలు కార్చుకుంటూ చూసిన మొగతనాలకి ఇదే నా మనవి.

    • Rachakonda. Srinivasu says:

      దేనినైనా చాల లోతుగా విశ్లేషితారు.ఎప్పుడు కొత్థ కోణాలు చూస్తాం మీ ఆర్టికల్స్ నందు .

మీ మాటలు

*