పాదాలకు తగిలిన ప్రశ్నలు..!

 

డాక్టర్ చింతకింది శ్రీనివాస రావు

డాక్టర్ చింతకింది శ్రీనివాస రావు

ఆ రోజు మా చోడవరం ఊళ్లో పూసిన పువ్వులన్నీ ఆలయాల్లోకో, ఆడవాళ్ల కొప్పుల్లోకో చేరిపోలేదు. భక్తప్రజాళి చెవుల ఇరకల్లోకి దూరిపోలేదు. అన్నీ కలిసికట్టుగా మా జాన్‌ మేస్టారి మెళ్లోకి జేరీసేయి. దండలుగా మారిపోయి ఆయన గుండెలమీద కులాసాగా కూచున్నాయి. దిలాసాగా ఊగీసేయి. మా మేస్టారు మాత్రం ఆ పూలమాలల మధ్యన భలే సిగ్గుసిగ్గుగా అయిపోయేరు. అందరూ జేజేలు కొడుతుంటేను.. భుజాలకెత్తుకుని ఊరేగిస్తుంటేను.. ఇంత ధైర్యవంతుడూ అదొకలాగ మొహమాటంగా మొగం పెట్టీసేరు.

మరి, ఆ రోజు మాములు రోజేంటి. మా ఊరికి, మా మేస్టారికీ కూడాను చాలా స్పెషలే. మాకే కాదు. మా ఇరుపంచాల గ్రామాల జనాలకీ ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. మేస్టారు నెంబర్‌వన్‌ మగాళ్లా మా మారకమ్మ రేవులో ఎలుగుబంటిని  తుపాకీతో పేల్చిచంపీసిన రోజు. చచ్చిన భల్లూకాన్ని వీపుమీద మోసుకుంటూ ఊరివైపు మొనగాళ్లా నడిచొచ్చీసిన రోజు.

అప్పటికి పదిహేను రోజులవుతుంది. సిలవరి బిందిలట్టుకుని మా ఊళ్లో ఆడంగులెవరూ మారకమ్మరేవు గట్టుకి నీళ్లకెళ్లడమే లేదు. ఏటి స్నానాలు చేసి పుణ్యం సంపాదించుకోవాలనుకునే పతివ్రతలూ అటేపు కన్నెత్తి చూడ్డం లేదు. ఏటి వార మావిడితోటల్లోనూ, తాటిపెండెల్లోనూ, మొక్కామోడుల్లోనూ జనసంచారం అస్సల్లేదు. అంతెందుకు. పేద్ధ చెంబట్టుకుని సిగ్గులజ్జాల్లేకుండా గొప్ప రాజసంగా ఏటి కొసాకి డైలీ దొడ్డికి పోయే మా కరణం సరిపిల్లి సత్తిబాబుగారు సైతం ఆ వైపు తొంగి చూసిందే లేదు. దీనంతటికీ కారణం ఒకానొక ఎలుగుబంటి అంటే నమ్ముతారా. నమ్మితీరవలసిందేను.

మా ఊరెలాటిదంటే, మా విశాఖపట్నం జిల్లా అడవులకి ద్వారబంధం లాటిది. మమ్మల్ని దాటీసే ఎవురైనా ఏజెన్సీకెళ్లాలి. ఊరికి ఆనుకుని ఉండే మారకమ్మ రేవు దగ్గర పొలాల్లోకి, ఏటి సైడు డొంకల్లోకి తరచుగా అరణ్యంలోంచి నానాజాతి నక్కలు, దొంగవరళ్లు, దెష్ట ఎలుగుబంట్లు జొరబడిపోయీవి. వచ్చినవి వచ్చినట్టు దొరికిందేదో తినీసి పాడేరు కొండలమీదికో, గంగరాజు మాడుగుల గిరుల్లోకో పోతుండీవి. ఈసారే ఆలా జరగలేదు. అదే వచ్చిన చిక్కు.

ఈ దఫా మా రేవుకొచ్చీసిన ఓ ఎలుగుబంటి ముండ సామాన్యమైన ముండ కానట్టుంది. కాయ కసరు తింటూ రేవు పొదల్లోనే రోజుల తరబడి తిష్టేస్సింది. వేసింది వేసినట్టుగా ఉండిపోయిందా. అదీ లేదు. పక్కనున్న చాకిరేవులో గుడ్డలారేసుకుంటున్న మడియాలు గంగరాజుమీదికి దూకీసింది. ఆడికి దూదేకీసింది. దుంపతెంచీసి ధూపంవేసీసింది. దొరికినవాణ్ణి దొరికినట్టుగా చీరిపారీసింది.

శనిలా పట్టీసిన ఎలుగును తప్పించుకునేందుకు గంగడు చేయనిపనంటూ లేదు. రక్తాలు కారుకుంటూనే పరిగెట్టేడు. ఏం ఉపయోగం. అదొట్టి బాజోటుమృగం. వీడేమో మంచిమనిషి. ఎలా సాలగల్డు. పరిగెట్టలేపోయేడు. ఆఖరికి ఆ ఎలుగుబంటినుంచి వాణ్ణి విడిపించడానికి మా రజకులంతా నానా సంకలు నాకీసేరు. రాయీ రప్పా, కర్రా కంపా తీసుకుని నాలుగిసర్లు ఇసిరితేనే గానీ అది ఒగ్గింది కాదు.

Kadha-Saranga-2-300x268
ఎలుగు దాడిలో చావసిద్ధమైన గంగరాజును తీసుకొచ్చి ఊరిమయాన ధర్మాసుపత్రిలో పడీసేరు. విషయమంతా తెలిసిపోవడంతో ఊరు ఊరంతా ఒంటేలు పోస్సింది. పరుగుల మీద గవర్నమెంటు ఆస్పట్లకొచ్చీసింది. చర్మం లెగిసిపోయి, ఒళ్లంతా తొక్కలూడిపోయి, మాంసం ముద్దలా అయిపోయిన గంగణ్ణి తనివితీరా తిలకించీసి ముక్కు చీదీసింది. ప్చ్‌…ప్చ్‌…ప్చ్‌లు కొట్టీసింది.

మా ఊరనే ఏంటి. ఇరుగుపొరుగునున్న గోవాడ, ఆంభేరుపురము, రాయపరాజుపేట, ఎంకన్నపాలెం ఇలా అన్ని గ్రామాలూ మా గ్రామం మీదికే వచ్చిపడిపోయేయి. ఎలుగుబంటిని అమ్మలకీ పెళ్లాలకీ తిట్టిపోస్సేయి.

ఈ తిట్లు ఇంకా ఆగేలేదు. మరో దయిద్రవయిన కబురొచ్చీసింది. గంగణ్ణి కొట్టీసిన ఎలుగుబంటి ఇంతలోనే మరో ఉన్మాదానికి దిగీసింది. రేవు మావిడి తోట్లో గంజి తాగుతున్న కాపలాదారు అన్నాబత్తుల కోటేసు సంగతీ తేల్చీసింది. లొట్టలేసుకుంటూ కుండమూకుట్లో గంజి జుర్రుకుతింటున్న కోటేసుగాడిని ఎనాకతల్నించి ఎలుగ్గొడ్డమ్మ ఎక్కీసి తొక్కీసింది. తెల్లపళ్లు, నల్ల బొచ్చు ఉన్నదేదో ఉన్నట్టుండి పీకిమీదకొచ్చీడంతో కోటిగాడి పై ప్రాణాలు పైనే పోయాయి. తొలీతా అదేదో దెయ్యం అనుకున్నాట్ట. వదిలించుకుందామంటే కుదర్లేదట. ఎలుగుబంటి చమడాలు రేగ్గొడుతుంటే రేవురేవంతా ధ్వనించేలా కేకేలేశాట్ట. దాపల్నున్న చెరుకు రైతులు బరిశెలు, బాడిదల్తో తెగబడి తరిమితే తప్ప ఎలుగు పారిపోలేదట. అలా ఆడికి చావు తప్పి కన్నులొట్టపోయింది. ఆస్పట్లో గంగరాజు పక్క మంచం మీద కెక్కీసేడు. ఇకనంతే. ఆ రోజు నుంచీ మా మారకమ్మరేవు వైపు వెళ్లాలంటే జనానికి వణుకు మొదలైపోయింది.

ఇదే సందు అదే మందు అనుకుందేమో ఎలుగ్గొడ్డూ బాగానే చెలరేగీసింది. పిచ్చెక్కిన పీరండంలా అయిపోయింది. చెరుకుతోటల్లోకి దిగిపోయి మేసినంత మేయడం, ధ్వంసం చేసినంత చేసీడం మొదలెట్టింది.

వాస్తవం మాటాడుకోవాల్సివస్తే, ఏటికీ మా ఊరికీ ఉన్న బంధం మామూల్ది కాదు. తల్లీబిడ్డల పేగు బంధం లాటిది. ఆ బంధాన్ని ఈ ఎలుగుమహాతల్లి పుటుక్కున తెంపీసినట్టయింది. ఇలా రోజులు గడిచీసరికి ఊరిజనానికి కంటిమీద కునుకులేకపోయింది.

సంగతి తెలిసి ఫారెస్టు ఆఫీసోళ్లంతా కంగరెత్తిపోయేరు. చోడవరానికి క్యాంపు కట్టేరు. పోలీసోళ్లూ వారికి సాయం చేస్తామన్నారు. విలేజి ప్రెసిడెంటు కురుముద్దాలి పాపారావు ఆళ్ల కాళ్లు పట్టుకున్నాడు. మునసబు కోట్ని మహాలక్ష్మినాయుడు, కరణం సత్తిబాబు ఆ పని చేయలేదు గానీ అంతకు తగ్గ చాలా పనులు వారికి చేస్సేరు.

ఒకేపున పోలీసు బాబులు, ఫారెస్ట్‌ గార్డులు, మరో దిక్కున మా ఊళ్లో ముదురుటెంకలని అందరూ చెప్పకునే ఆకుల వీరేశు, దేవరాపల్లి రంగడు, కిస్తా గోవిందు ఇలాగందరూ కలిసికట్టుగా ఎలుగుబంటిని చంపీడానికి రేవుకు బయలెల్లేరు. కొందరు కత్తులు, మరికొందరేమో కర్రలు, ఇంకొందరేమో కొడవళ్లు పట్టేరు. ఫారెస్టోళ్లు మాత్రం సరిగ్గా పేల్తాయో లేదో తెలీని రెండో మూడో తుపాకుల్తో వేట మొదలెట్టేరు.

రేవు దగ్గిరివరకూ మహా సూరుమానంగానే వెళ్లిన ఈ మారాజులంతా ఎలుగ్గొడ్డును వెతికీటప్పుడు మాత్రం దడదడలాడిపోయేరు. ఏ బొక్కలోంచి అది పారొచ్చీసీ బొక్కబద్దలు గొడతాదోనని నంగినంగిగానే వెతుకులాడేరు. వీళ్లంతా రేవు ఎక్కనున్న గుబురు పొదల్ని జట్లు జట్లుగా గాలిస్తుండగానే కాస్త దూరంగా వెళ్లి ఎలుగుకోసం తంటాలు పడుతున్న వీరేశుగాడి కేకొకటి గట్టిగా వినిపించీసింది.

”చచ్చాన్రోయ్‌”.. అని వాడు కెవ్వుమనడంతో మిగతా వాళ్లంతా బిక్కసచ్చిపోయేరు. పెద్ద పోటుగాళ్లా చెరుకు పొలాల్లో కాలు మోపిన వీరేశుడు గారిని మడిలోకి దిగీ దిగ్గానే ఎలుగుబంటి ఠక్కున పట్టీసింది. సుబ్బరంగా రక్కీసింది. ఎక్కడబడితే అక్కడే కొరికీసింది. ఆడి నోట్లో కాలుతున్న గుర్రం బీడీ ఉన్నాది కాబట్టి బతికేడు. అగ్గి దాన్ని భయపెట్టింది గనక బతికేడు. లేదంటే పనయిపోను. దెబ్బల్తో పొలాల్లోంచి బయటకొచ్చి వాడు చెబితేనే ఇదంతా అందరికీ తెలిసింది.

ఇక ఈ ఎలుగ్గొడ్డు యవ్వారం మనశక్తికి మించిందని తీర్మానించి వేటజట్టంతా ఊళ్లోకొచ్చీసింది. పంచాయితీ బోర్డు బల్లల మీద కూర్చుని బుర్రలు బద్దలు గొట్టుకుంది. ఊరి పెద్దలూ వీరితో కలిసి వీలయినంతసేపు బుర్రలు పాడు చేసుకున్నారు. చివరాఖరికి ఈ జంతుగోల తప్పించే నికార్సయిన మనిషెవరన్నప్పుడు మా జాన్‌ మేస్టారి పేరు ప్రస్తావన కొచ్చీసింది.

మా జాన్‌ మేస్టారంటే మామూలు మేస్టారు కాదు. ధర్మప్రభువు. మా బోర్డు హైస్కూల్లో పంతులు. మా పిల్లలందర్నీ కంటికి రెప్పలాగ కాపాడీవారు. ఆయనకి పెళ్లాం పిల్లల్లేరు. అలా అని బాధ్యతలేవీ లేవని అనుకోడానికి లేదు. మేమంతా ఆయనకు బాధ్యతలమే. మాకు చిన్న జ్వరం వచ్చినా అల్లాడిపోయీవారు. మా పుస్తకాలు చిరిగిపోతే కొత్తవి కొనిచ్చీవారు. ఆయన తినీది తక్కువ. మాకు మేపీది ఎక్కువ. పక్కోడికోసం పీకతెగ్గోసుకునీరకం.

మేస్టారి ధైర్యం గురించి చెప్పాలంటే చాలా ఉంది. గొప్ప హీరో. ఆయనకు భయం అన్నదే తెలీదు. తాగీసి మా ఊళ్లో ఎవరు తన్నులాడుకున్నా జాన్‌బాబు వచ్చేరంట సైలెంటయిపోయీవారు. ఒకేళ చుక్కేసుకున్నోడు ఎక్కువ మాటాడనే అనుకుందాం. తొలి పాలి మెల్లిగా చెప్పీవారు. రెండో పాలి మాత్రం రెండు తగల్నిచ్చి ఇంటికి తొవిలీసీవారు. తగూ అంటే ఆపడానికి ముందునుండీ ధర్మప్రభువని పేరు తెచ్చుకున్నారు. మనిషి ఆజానుబాహువు. చేతులు చేపాటి కర్రల్లాగుండీవి. కాళ్లు స్థంభాల్లాగ, పాదాలు ఏనుగు పాదాల్లాగా ఉండీవి. ఆయన చేతులు పడితే ఎవడికేనా పులుసులోకి ఎముకలుండవు అన్నట్టుండీవారు.

ఊరందరితోనూ కలిసిపోయి నెత్తురుకి నెత్తురుగాను, ప్రాణానికి ప్రాణంగానూ జాన్‌మేస్టారు బతికీవారు. అన్నట్టు. ఆయన దగ్గరో తుపాకీ ఉండీది. దానికి లైసెన్సూ ఉండీది. చిన్నప్పుడెప్పుడో కుమిలిగాటీల మీద, రైవాడ కొండలమీద మేస్టారు అడవిపందుల వేట చేసీవారని పెద్దలు చెప్పగా విన్నాం.

ఇలాంటి మేస్టారికి, ఆయన తుపాకీకి ఇన్నాళ్లకి మళ్లీ పని పడింది. ఎలుగుబంటి దౌర్జన్యానికి హడలెత్తిపోయిన ఊరి మోతుబరులందరూ ఓనాడు తూరుపు తెల్లారకుండానే ఆయనింటికెళ్లిపోయేరు. లబోదిబోమంటూ జరిగిందంతా ఆయన చెవుల్లో వేస్సేరు. ఎలుగ్గొడ్డు దెబ్బకి చెరుకుతోటలు నాశనమైపోతున్నాయని మొర పెట్టుకున్నారు. ఫారస్టోళ్లంతా చేతులెత్తీసేరనీ చెప్పుకున్నారు. గంగడు, కోటి, వీరేశులు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారనీ విన్నవించేరు. తుపాకీ తీసి ఎలుగుని చంపితేనే గానీ సుఖం లేదని కోరీ, ప్రార్థించీ, మనవి చేసుకున్నారు. అయినాగానీ, మేస్టారి గుండె ముందయితే కరగలేదు.

”పశు ప్రవృత్తి అలాగే ఉంటుంది. ఈ రోజు కాకపోయినా రేపయినా అడవుల్లోకి పోతుంది లెండి”. అనీసేరు తడుముకోకుండా.

”అమ్మమ్మా అలగనీకండి. రోజులెల్లిపోతన్నాయి. ఊల్లో వొవులికీ కంటిమీద కునుకులేదు. నా మొగుణ్ణి నాసనం చేసీనాది. నా బతుకు పాడయిపోనాది..”

ఎల్లుగ్గొడ్డు  దెబ్బకి చావసిద్ధమైపోయిన గంగడి భార్య రత్తమ్మ గగ్గోలు పెట్టింది.

వీరేశు పెళ్లాం లచ్చిమి కూడా రత్తమ్మకి వంత పాడింది. ”నా పెనిమిట్నీ అన్నేయంగా సీరీసింది దేవుడోయ్‌. దేవుడే మమ్మల్ని రచ్చించాల్రోయ్‌” అనీసి నెత్తి కొట్టీసుకుంది. ఎప్పుడైతే ఈ ఆడకూతుళ్లు పడీపడీ దు:ఖిస్తున్నారో అప్పుడిక మా మేస్టారి గుండె లుక్కుమనిపోయింది. ఇంకెంతమందిని ఎలుగ్గొడ్డు యాతన పెడుతుందోననే బెంగ ఆయనలో ఆరంభమైపోయింది.

” ఏం భయం లేదు. నేనీరోజు మారకమ్మ రేవుకి బయలెల్తాను. నాతో మాత్రం ఎవరూ రావద్దు. ఇల్లూ పొల్లూలేని ఒంటిగాణ్ణి. నేను దాని చేతిలో పోయినా పర్లేదు. అదో నేనో తేల్చుకొస్తాను.” మేస్టారు గంభీరంగా భరోసా ఇస్తూ పలికేరు. ఆ మాటలకు జనం తెగమగా సంబరపడిపోయేరు.

ఆ వెంటనే ఇంట్లోకెళ్లిన మేస్టారు పడగ్గదిలోని కర్రబీరువా తెరిచేరు. అందులో ఎప్పట్నుంచో దాచిపెట్టిన ఖాకీ చొక్కా, ఖాకీ ఫేంటు తీసి తొడుక్కున్నారు. తుపాకీ తుడుచుకున్నారు. టార్చిలైట్లో ఏసే బేటరీల్లాంటి మందుగుళ్లను తీసి బందూకు గొట్టంలో వాటంగా దోపీసేరు. మారకమ్మరేవు వైపు ప్రయాణమయ్యేరు. ఆయనతో పాటుగా చాలా మందిరి రేవు పొలిమేరల దాకా వెళ్లేరు. మేస్టారిని లోనికి సాగనంపి వెనక్కి వచ్చీసేరు.

అప్పటికి ఉదయం తొమ్మిదే అయింది. ఊళ్లోని పిల్లా మేకా అందరూ రామకోవెల్లో చేరిపోయి మేస్టారి కోసం భజన్లు చేస్తున్నారు. ఆయన క్షేమంగా వస్తే ఆకు పూజ చేయిస్తానని రైతు కూలీ రాములమ్మ ఆంజనేయస్వామికి మొక్కులెట్టుకుంది. మేస్టారు ఎలుగుబంటి పాలపడకూడదంటూ ఎవరెవరో వేనవేల దేవుళ్లకి దండాలెట్టుకున్నారు. అసలాయన్నెందుకు దాని కాడికి పంపేరని బోడి రాముడు, గెడ్డం సన్నాసిలాంటి మానమర్యాదలు గల అమాయకులు కొందరు ఊరి ప్రముఖుల మీద తిరగబడ్డారు. ఆళ్లని సముదాయించీసరికి పెద్దోళ్లకి పెద్ద పనయిపోయింది.

ఈ లోగానే మధ్యాహ్నం అయిపోయింది. ఎలుగుబంటితోనూ, మేస్టారితోనూ, ఆ మాటకొస్తే అసలు చోడవరంతోనూ నాకేటీ లింకు లేదన్నట్టుగా పడమట కొండల్లో కుంగీడానికి సూరీడు రెడీరెడీచ్‌ అంటున్నాడు. ఇంతలో మునసబుగారు ఆగలేక మాటాడీసేరు.

”ఏట్రా… ఇంతమందిమి ఉండి ఒక్కణ్ణి రేవులోకి పంపీనాం. ఆ తోటల్లో, ఆ తోపుల్లో ఆ సెట్ల మయాన మేస్టారు బాబు అన్నాయంగా ఏం బాదలు పడతన్నాడో. ఒకేపు యేల మించిపోతంది. ఇప్పటికీ మనం ఒల్లక్కూకుంతే మనం మొగోళ్లవే కాదెహే..’ నిష్ఠూరంగా మాట్లాడ్డం మొదలెట్టేడు. మునసబు మాటల్ని అక్కడున్న అందరూ నిజమేస్మీ.. నిజమేస్మీ.. అన్నట్టుగా తలపంకించేరు. పదండి.. పదండంటూ కేకలేసుకున్నారు. అంతా కలిసి రేవు వైపు నడక తీసేరు.

రేవు దాకా చేరేక అక్కడ గోర్జీదారుల్లో బితుకుబితుకు మంటూ అడుగులేస్తున్నారు. తాటాకు కదిల్తే చాలు. దడదడలాడిపోతున్నారు…ఉడతలు పరుగులెడుతున్నా ఎలుగ్గొడ్డే వచ్చి మీద పడిపోయినంతగా హడలి ఛస్తున్నారు. చేతులు చేతులు కలుపుకుని మెల్లిగా ఆడపెళ్లివారిలా జిడ్డోడుకుంటూ నడుస్తున్నారు.

కరక్టుగా వీరంతా అరమైలు నడిచేరో లేదో భీకరాకారంగా, రొప్పుతూ మహావీరుళ్లా ఎదురొస్తున్న జాన్‌మేస్టారు కంటబడ్డారు. ఆయన చొక్కా, ఫేంటు చెమటధారలతో ముద్దకట్టీసేయి. ఒక భుజం మీద తుపాకీ. మరో భుజం మీద నల్లటి మూటలాంటిదేదో మరోటీ ఉంది. ఊరివారిని చూడగానే ఆయన ” ఓహో.. రండర్రోహో..” అని ఆనందంతో కూడిన గావుకేకలాంటిదేదో వేసేరు.

మామూలుగానే మేస్టార్ని చూస్తే ఎప్పుడూ ఆనందపడే జనం ఆవేళ ఆయనంటే మరీ పిచ్చెక్కిపోయేరు. మారాజు క్షేమంగా వచ్చీసేడంతే చాలనుకుని ఆయన కాడికి మూగీసేరు. జనమంతా దగ్గరకి రాగానే జాన్‌మేస్టారు మరీ సంతోషపడిపోయేరు. భుజానున్న నల్లమూటని భళ్లున నేలకేసికొట్టీసేరు. కిందపడ్డ మూటని చూసి జనానికి మూర్ఛపోయినంత పనయిపోయింది. అది మూట కాదు. ఒకటోరకం ఎలుగ్గొడ్డు. చచ్చిన ఎలుగ్గొడ్డు. మేస్టారి చేతుల్లో, ఆయన తుపాకీ గుళ్లకి చచ్చిన ఎలుగ్గొడ్డు. జనం కేరింతలకి హద్దు లేదు. తుళ్లింతలకి హద్దూ పద్దూ లేదు. ఒకటే ఈలలు. ఒకటే గోల. మేస్టార్ని భుజానికెత్తుకుని ప్రజానీకమంతా డేన్సులు కట్టేరు. చచ్చిన ఎలుగ్గొడ్డును ఆనందంతోనూ, ఆశ్చర్యంతోనూ తేరిపార చూస్సేరు.

”బాబూ.. ఊరికి పట్టిన దయిద్రాన్ని వదలగొట్టీసేవు. ఎలుగును సంపీసి మమ్మల్ని, మా పొలాల్నీ రక్షించీసేవు. నువ్వయ్యానాయినా మొగోడివి. మా కోసమే జనమ ఎత్తినావు నాయనా. నాయినా..” బాగా పొగిడీసేరు.

”అసలింతకీ ఈ ముదనష్టపు గొడ్డు ఎలా సచ్చింది బాబూ..” ఉండబట్టలేక వివరాలడిగీసేరు.

ముందూ వెనుకా జనాలు నడుస్తుండగా..ఇద్దరు మనుషులు కావిడి కట్టి ఎలుగ్గొడ్డు కళేబరాన్ని కొయ్యమీద మోస్తుండగా.. పెద్ద గొంతెట్టుకుని మేస్టారు మొదలెట్టారు. ఉదయంనుంచీ తనని ఎన్ని తిరకాసులకి ఎలుగుబంటి గురి చేసిందో పూసగుచ్చేరు.

ఆఖరికి వెంటబెట్టగా వెంటబెట్టగా రేవుగట్టుమీదికి పోయిన దొంగసచ్చిన ఎలుగు సాయంత్రం నాలుగ్గంటలకి గానీ ఏట్లోకి దిగి నీళ్లు తాగలేదట. అదే సమయంలో అక్కడే మాటేసి కూచున్న మేస్టారు తుపాకీ గురి చూసి ఠక్కుమనిపించేరట. గుండు దాని గుండెల్లోకి దూరీసిందట. ఠపీమని  చచ్చూరుకుందిట. దాన్ని మూటలా కలీగట్టీసి సంబరంగా మేస్టారు మోసుకుంటూ వచ్చేరన్నమాట.

మొత్తానికి ఎలుగ్గొడ్డును చంపిన మేస్టార్ని ఊరేగింపుగా ఊరి రామమందిరానికి తీసుకువచ్చారు ప్రజ. వెనువెంటనే అప్సరా ఫోటో స్టూడియో రమణగాడికి కబురెళ్లింది. ఈలోగానే తాటి తడపలతో నాలుగు వెదురు కర్రముక్కలు తెచ్చేడు షరాబు నీలకంఠం. నాలుగు కర్రల్ని చచ్చిన ఎలుగుకాళ్లకి కట్టి చేటపెయ్యిలా నిలబెట్టేడు. వస్తూవస్తూనే ఫోటోగ్రాఫర్‌ రవణ చాలా ఫోజులు కొడుతూ వచ్చేడు. చాలా ఫోజుల్లో మేస్టార్నీ, ఆయన తుపాకీని, చచ్చిన ఎలుగునీ, ఊళ్లో పెద్దల్నీ కలిపి రకరకాలుగా ఫోటోలు తీస్సేడు. ఆనకేమో అంతా కలిసీసి ఎలుగ్గొడ్డుని సొసానంలో గొయ్యి తీసి కప్పెట్టీసేరు. ఇదంతా ఫారెస్టోళ్లు సూసీ సూణ్ణంట్టుండిపోయేరు.

ఫోటోల రవణగాడు అమర్నాడు కాక మర్నాడనుకుంటా. ఫోటోలన్నీ పెద్ద పెద్ద బొమ్మలుగా కడిగీసి పలచటి అట్టముక్కలకి అంటించీసి మేస్టారికి, ఊరిబడాబాబులికీ ఇచ్చీసేడు. దీనంతట్నీ ఊరి కుర్రనాయాళ్లందరం కళ్లారా చూసేం. కళ్లింతింతలు చేసుకుని చూసేం. ఒకానొక ఉద్వేగంతో చూసేం. అప్పటికి మా వయసు పదేళ్లుంటుందేమో. మా మాస్టారుగారికి ఏభయ్యుంటుంది. చదువులు అవీ పూర్తి చేసుకుని మా గుంటజట్టంతా ఉద్యోగాల కోసం వైజాగు నగరం పట్టీసినా మాస్టారిని, ఎలుగ్గొడ్డు వ్యవహారాన్ని చాలా మాట్లే గుర్తు తెచ్చుకుంటుంటాం.

ఇదంతా ఇలాగుండగానే, ఈ మధ్యనోసారి నేను మా ఊరు వెళ్లవలసివచ్చింది. జీవితం పట్ల తీవ్రంగా భయం పుట్టిన ఒకానొక బలహీన క్షణంలో మా ఊరి కరకచెట్టు పోలమాంబకి నేను కొన్నేళ్లకిందట రకరకాల మొక్కులు పెట్టీసుకుని ఉన్నాను. పెట్టుకున్న మొక్కుబళ్లన్నీ పెట్టుకున్నట్టే ఉండిపోయేయి. ఇంట్లో ఆడోళ్లు పోరుతుంటే ఆ మొక్కులేవో తీర్చేసుకుంటే వదిలిపోతుందని చోడవరం వెళ్లేను.

బస్టాండ్లో దిగానో లేదో పెడ అరిటిపళ్లు కొనీసేను. డైరెక్టుగా అమ్మవారి గుడికే కాళ్లు కదిపీసేను. మా పోలమాంబకి ధూళి దర్శనమంటే మహా మక్కువ. అందుకే కాళ్లయినా కడుక్కోకుండా అమ్మ విగ్రహం పాదాల దగ్గర పండూకాయా పెట్టీసి చేతులు జోడించేను. తీసుకెళ్లిన చీర, రవికెల గుడ్డ సమర్పించేను. నన్ను, నా ఇల్లు పిల్లాద్రినీ చల్లగా చూడమ్మా.. అని దండం పెట్టేను. ధ్వజస్థంభం చుట్టూ మూడు సుట్లు తిరిగేను. అమ్మవారి తమ్ముడు పోతురాజు బొమ్మ దగ్గరకెళ్లి భక్తిగా ఊదొత్తు పుల్లలకి అగ్గి పెట్టేను. నైవేద్యంగా ఇంటినుంచి పట్టుకెళ్లిన బెల్లం అచ్చులు వదిలీసేను. కోవెల బయటకొచ్చీసేను.

సరిగ్గా అప్పుడే గుర్తుకొచ్చేరు మా జాన్‌ మేస్టేరు. ఆయన్ని చూడాలనిపించింది. తొంభయ్యో పడిలో పడ్డారు కదా. ఒకసారి వెళితే మంచిదే అనుకున్నాను. వెంటనే ఆయన ఇంటిదారి పట్టేను. గుడికీ మేస్టారింటికీ పెద్ద దూరం ఉండదు. త్వరగానే వచ్చీసిందది.

రకరకాల పచ్చాపచ్చని మొక్కల్ని దాటి చిన్న పర్ణశాలలాంటి మేస్టారి ఇంటికి చేరేను. వసారాలో పడక్కుర్చీలో దేవుళ్లా వాలి కూచోనున్నారాయన. మనిషి బాగా లొంగిపోయేరు. వృద్ధాప్యం ముంచుకొచ్చీసింది కాబట్టి ఆరముగ్గిన అంటిపండులా అయ్యేరు. మిగలపండిన మావిడిపండులా కానొచ్చేరు. కంఠం మాత్రం ఖంగుఖంగుమంటోంది.

”నమస్కారం మేస్టారు..” అనగానే కళ్లు పెద్దవి చేసుకుని తేరిపారచూసేరు. అయినా గుర్తు పట్టలేపోయేరు. ఫలానా పంతులుగారి కొడుకునని చెప్పుకున్నాను.

”ఓరేయన నువ్వట్రా..” అంటూ నా చేతులు పట్టీసుకుని ఎంతగా ఇదయిపోయేరో చెప్పలేను. ఎదురుగా ఉన్న బల్లమీద కూచోబెట్టేరు. చాన్నాళ్లకి చూసినందుకో మరెందుకోగానీ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. నా నేత్రాలూ తడిసిపోయేయి. ఎలాంటి మేస్టారు. ఎలాగయిపోయేరు. కమ్మిచ్చువు తీసనిట్టుండే కండలన్నీ ఎక్కడికిపోయేయి. దెబ్బ.. దెబ్బ.. వస్తే చావుకయినా సిద్ధపడిపోయే అంత బలిష్టమైన శరీరం ఏటైపోయింది. మనిషిని వయస్సు ఎంతగా వంచేస్తుందో.. ఇలా రకరకాల ఆలోచనలు తలని పట్టీసేయి.

ఇంతలోనే, నా చూపు వసారా గోడకు తగిలించిన ఫోటో మీదికి పోయింది. అప్పుడెప్పుడో ఎలుగుబంటిని చంపినందుకు గుర్తుగా దాంతో కలిపి మేస్టారికి తీసిన చిత్రం అది. దాదాపు నలభైయ్యేళ్లయిపోయింది కదా. బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోకి కొన్ని కొత్త రంగులేవో పట్టీసినట్టు అదోరకంగా తయారయింది. నేను దగ్గరకెళ్లి మేకుకి తగిలించిన ఫోటో చేతుల్లోకి తీసుకుని రుమాలుతో తుడిచేను. ఆనాటి ఎలుగ్గొడ్డు సంహారం గురించి మేస్టారికి నవ్వుతూ గుర్తు చేసేను.

”మీసారూ మీరెంత దైర్యవంతులండీ” అన్నాను.

”మేస్టారూ మీకెంత తెగువ ఉండేదండీ” అనీ అన్నాను.

”మనిషంటే మీరే మనిషండీ” అంటూ ప్రశంసలు కురిపించేను. నాటి నా జ్ఞాపకాలన్నీ ఆయనతో చకచకా పంచీసుకున్నాను. అంతా విన్న ఆయన మెల్లగా గొంతువిప్పేరు.

” పోనిస్తూ. అవన్నీ వదిలిద్దూ. అప్పుడేదో అలా అయిపోయింది. ఎలుగుబంటిని చంపినంత మాత్రాన పెద్ద మొనగాడయిపోతానేంట్రా. అడివి జంతువుని హత్య చేసినంత మాత్రాన పులిసిబలిసిన ముల్లుడనయిపోతానేంట్రా. నోరు లేని జీవిని చంపడమూ ఓ గొప్పేనేంట్రా.” అన్నారు నిస్సారంగా.

ఆ మాటలు ఆయన తేలిగ్గా అంటున్నట్టుగా పైకి వినిపించినా వాటి వెనుక ఒక బాధ, ఒక యాతన ఏదో అన్నట్టుగా నాకయితే అనిపించింది. ఆ మాటలంటున్నప్పుడు ఆయన గొంతులో శోకమేదో ధ్వనించింది. ఇంతలో ఆయనే మళ్లీ అందుకున్నారు.

” మన ఊరికి అప్పుడు ఒక్క ఎలుగుబంటే వచ్చిందిరా. దాన్ని చంపీగానే దరిద్రం తీరిపోయిందిరా. ఇప్పుడు దాన్ని మించిన క్రూర జంతువులు ఊళ్లోకి దిగిపోయేయిరా. వాటిని నేను ఏం చేయగలిగేన్రా. ఎలుగుబంటిని చంపేనుగానీ, మన ఊరి బక్క రైతుల భూముల్ని బలవంతంగా లాక్కుని మందుల ఫ్యాక్టరీ పెట్టీసిన ఉప్పల సూర్యనారాయణదొరని ఏదయినా చేయగలిగేనేంట్రా..? మన ఊరి జనం వద్దు వద్దంటున్నా వినకుండా న్యూక్లియర్‌ ప్లాంటు పెట్టిన మార్వాడీ సేట్‌ ఉదయ్‌లాల్‌ వెంట్రుక ముక్కయినా తెంపగలిగేనేంట్రా..? సమ్మెకట్టిన మన జనపనార మిల్లు వర్కర్లని పిట్టల్లా కాల్పించీసిన ఫ్యాక్టరీవోనరు పానకాల రాయుడి అంతు తేల్చీగలిగేనేంట్రా..? చెప్పరా.. చెప్పు.. చెప్పు..” అంటూ ఆవేశంగానూ చాలా కోపంగానూ కడిగీసినట్టుగా నన్నడిగీసేరు. ఆ సమయంలో ఆయన మాటాడుతుంటే సింహాచలం ఉగ్రనరసింహస్వామిలాగ, అనకాపల్లి నూకాల్తల్లిలాగ, గంధవరం మరిడిమాంబలాగ భయంకరంగా ఆవుపించారు.

దెబ్బకి నా గుండెకాయ గొంతులోకి వచ్చీసినట్టయింది. తొంభైయ్యేళ్ల అమావృద్ధుడైవుండి కూడా జనకంటకులమీద మీద నిప్పులు కురిపిస్తూ మేస్టారు మాట్లాడుతుంటే నాకయితే దడుపు పుట్టీసింది. ఆయన హృదయంలో ఎంతటి దావాగ్ని దాంకుందో అర్థమైపోయింది. ఏదో అనబోయేను. ఈలోగానే, ఎలుగుబంటితో అప్పుడెప్పుడో దిగిన ఫోటోను గభాల్న నా దగ్గర్నించి ఆయన లాగీసుకున్నారు. దాన్ని పరపరా చింపీసేరు. చిరిగిన ఆ ముక్కల్ని వీధులో విసిరీసి చక్కావచ్చి కుర్చీలో మౌనంగా కూచుండిపోయేరు. ఆ వయసులో మేస్టారు అలా ఊగిపోవడం చూసి నాకు భయం వేస్సింది. ఆ వేళ ఆయన్ని మరింక ఎక్కువగా కదపకూడదనుకున్నాను. నమస్కారం పెట్టీసి మెల్లగా ఇంట్లోంచి బయటపడిపోయేను.

రోడ్డుమీదికొచ్చీసి గాభరా గాభరాగా నడుస్తున్నాను. నాలుగే నాలుగు అడుగులు పడ్డాయో లేదో. మేస్టారు చంపీసి పారీసిన పాత ఫోటో ముక్కలు వీధిలో ఎదురుపడ్డాయి. గాలికి రెపరెపలాడుతూ నా పాదాలకూ అడ్డం పడ్డాయి ” బాబూ! మీ జాన్‌ మేస్టారు ఆవేశంగా మాటాడిన మాటల్లో తప్పేటయినా ఉందా..? ఒకేళ ఉంటే గనుక, ఆ తప్పేంటో బేగా చెప్పీ..  బేగా చెప్పీ బాబూ..!” అంటూ అవన్నీ నన్ను నిలువునా నిలదీసినట్టుగా ఆ క్షణంలో నాకు తోచింది. ఉన్నపళంగా ఉక్కిరిబిక్కిరయిపోయేను.


డా. చింతకింది శ్రీనివాసరావు

గోవర్ణం

ravinder

Pasunoori Ravinder 1‘‘కట్టుబట్టల కోసమార నువ్‌ పట్నంలున్నది? సిగ్గుండాలె! నీకంటే చిన్నచిన్నోల్లు ఎంత ఎదిగిన్రు!  ఓ సర్కారీ నౌకర్‌ లేదాయే! ఇంత యిల్లుపొల్లు ఉన్నట్టన్న లేదాయే. మా బతుకేదో ఇట్లా బతుకుతున్నం. పదేండ్ల కిందట పట్నం పోతివి. ఏం సంపాదించనవ్‌ రా?! పెండ్లం పిల్లలతో కలిసి ఊరు మీద పడి తిరుగుడుకే సరిపోతున్నట్టున్నది నీ సంపాదన. థూ…నువ్‌ మారవురా!’’ తల్లి మాటలు మళ్లీ మళ్లీ యాదికొస్తున్నయి నగేష్‌కు.

తన తల్లి అలా ఫోన్‌లో గత మూడు నాలుగేండ్లుగా.. ఎప్పుడూ కాకపోయినా, అప్పుడప్పుడైనా తిడుతూనే ఉంది. నగేష్‌కు ఈ తిట్లన్ని తినీతినీ అలవాటైపోయినై.

కానీ, ఏం చేస్తడు? తిట్టినప్పుడల్లా తల్లికి ఎదురు చెప్పలేక, తల్లి చెప్పినట్టు నడుచుకోలేక తనలో తానే అంతర్మథనం చెందుతున్నాడు!

అయినా ఏ తల్లి అయినా బిడ్డల మేలుకోరే కదా తిడుతది! ఈ విషయం నగేష్‌కు కూడా తెలుసు! కానీ, పట్నంలో ఒక సొంతిల్లు ఉంటే తల్లికోపం చల్లారి శాంతిస్తదని తెలుసు తనకు. చూస్తుంటే భూముల రేట్లకు రెక్కలొస్తున్నయి! అందుకే ఇక ఆలస్యం చేయకుండా, అర్జంటుగా ఓ ఫ్లాటు కొనాలనుకున్నాడు. కొందాంలే, తీసుకుందాంలే అని ఇంతకాలం లైట్‌ తీసుకున్నాడు. కానీ, ఎప్పుడూ తిట్టే దానికన్నా ఇవాళ డోసు మరింత పెరిగిపోయే సరికి నగేష్‌కు పొద్దుపొద్దున్నే తిట్ల సుప్రభాతంతో నగేషుకు జ్ఞానోదయమైంది.  ఇక ఆగేదేలేదనుకున్నాడు. దాచుకున్న పైసలకు, కొంత బ్యాంక్‌ లోన్‌ తీసుకుంటే సరిపోతుందనుకున్నాడు. కానీ, ‘‘కట్టింది కొనడమా, లేక తన అభిరుచికి తగ్గట్టు సొంతంగా కట్టించుకోవడమా’’ అన్న మీమాంసతో ఇంతకాలంగా ఊగిసలాడుతున్నాడు. ఈ సంగతి తల్లికి చెప్పాలనుకున్నడు. కానీ, చెప్పే  టైమిస్తేనా…

అసలే ఇప్పుడు  హైదరాబాద్‌లో ఫ్లాటు కొనడమంటే మాటలా?! రియలెస్టేట్‌ బూమ్‌ పెరిగిన తర్వాత తనలాంటి మిడిల్‌ క్లాస్‌ సంసార జీవులకు, సొంతిల్లు కలలా కాదు, అరికాలులో ముల్లులా తయారైంది.

అందుకే చాలాసార్లు  ‘‘మనుషులకు  ఇల్లు అనే నాలుగుగోడల నరకం లేకుండా ఉంటే బాగుండు’’ అనుకున్నాడు నగేష్‌. ఇల్లు లేకుండా జీవించే సంచార జీవుల్లాగా మనుషులందరూ హాయిగా, ఊళ్లు తిరుగుతూ గడిపితే ఎంత బాగుండు. అయినా తిరగడంలోనే జ్ఞానమున్నదని ఎక్కడో చదివిన జ్ఞాపకం నగేష్‌కు. మనుషులందరూ అట్లా చెట్టు, పుట్టులు పట్టుకొని తిరుగుతుంటే ఈ రెంట్ల బాధలు, కరెంట్ల బాధలు ఎందుకుంటయి? ముఖ్యంగా తన తల్లితో ఇట్లా రోజూ తిట్లుపడే బాధ ఎందుకుంటది?!  సొంతింటి బాధ ఎక్కువైనప్పుడు ఓ పెగ్గుకొడితే గానీ నిద్రపట్టని పరిస్థితి నగేష్‌ది! తాగినప్పుడైతే ఇంటి గురించి నగేష్‌కు పూనకమే వస్తది! ‘‘అసలు భూముల రేటెందుకు పెరిగింది? రింగురోడ్డు ఎవడెయ్యమన్నడు? రియలెస్టేట్‌కు రెక్కలు ఎవడు తొడిగిండ్రా ఆఆఆఆఆఆ….’’అంటూ ఊగిపోతూ లోలోపల రగులుతున్న ఆవేదన్నంతా తన ‘గ్లాస్‌మేట్స్‌’తో పంచుకుంటాడు.

ఈ మధ్య తన ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలన్నా భయపడుతున్నాడు. నగేష్‌ ఉండే కాలనీలో  అపార్ట్‌మెంట్‌లు,  ఎండిపెండెంట్‌ హౌస్‌లు మొదలుకొని రోడ్డు పొడుగునా ఏ అందమైన బిల్డింగ్‌ కనపడినా ఇక తనకు మూడినట్టే!

‘‘అబ్బా ఈ బిల్డింగ్‌ చూడండి! ఎంత బాగుందో’’ అని భార్యంటే,

‘‘మనమూ ఇంత పెద్ద యిల్లు కట్టుకుందాం డాడీ’’ అని, పదంతస్థుల అపార్ట్‌మెంటును చూపిస్తూ తన కూతురు అనన్య అనే మాటలు విన్నప్పుడల్లా కారులోంచి దూకి పారిపోదామనుకుంటాడు నగేష్‌!.

భార్య, కూతురు గోల సరిపోనట్టు, ఇక తన ఆరేళ్ల ముద్దుల కొడుకు అన్వేష్‌ ఎక్కడ ఖాళీ ప్లేస్‌ కనిపిస్తే చాలు… ‘‘డాడీ ఈ ప్లేస్‌ సూపర్బ్‌ కదా, ఇక్కడే మనమొక ఇల్లు కట్టుకుంటే మస్తుంటది’’ అంటాడు. ఆ క్షణంలో నగేష్‌కు కొడుకులో ఒక కబ్జాకోరు కనిపిస్తాడు! ఎక్కడ ల్యాండ్‌ కనపడితే అక్కడ ఇండ్లు కట్టుకుంటూ పోవాలనే కోరిక చిన్నపిల్లలకు కూడా ఎలా అలవాటైందో తనకు ఎంతకూ అంతుపట్టదు. కాలమే అట్లున్నదని, లోలోపలే చిన్నగా నవ్వుకుంటాడు.

ఇట్లా ఇంటిపోరు తనకు కంటిమీద కునుకే కాదు, ఒంటిమీద సోయిని కూడా తగ్గిస్తున్నది. ఏం తింటున్నాడో, ఎంత తింటున్నాడో తెలుస్త లేదు. ఎలాగైనా సరే ఓ యిల్లు కొనుక్కోవడమో, కట్టుకోవడమో చెయ్యాలని బలంగానే అనుకున్నాడు. ఇక ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తెలిసిన వాళ్లని, ఫ్రెండ్స్‌ని, ఆఫీసులో తన బాసుల్ని అందరినీ వాకబు చేయడం మొదలుపెట్టాడు. తన ఫ్రెండ్స్‌, కొలిగ్స్‌ అయితే ‘‘పిల్ల పుట్టకముందే, కుల్లకుట్టినట్టు’’  ఫ్లాట్‌ కొనకముందే పార్టీలడుగుతున్నారు. నగేష్‌కు వాళ్ల గొంతెమ్మ కోర్కెలు వింటే, ఓవైపు ఒళ్లుమండినా చిరునవ్వుతోనే ‘‘సరే ష్యూర్‌’’ అంటూ సమాధానాలు చెప్తున్నాడు.

ఇలాంటి పరిస్థితుల నడుమ ఓ రోజు లంచ్‌టైమ్‌లో, ఆఫీసులున్న టీవీలో ఓ ప్రకటన కనిపించింది.

‘‘సులభ వాయిదా పద్దతిలో మీ సొంతింటి కలని నిజం చేసుకోండి. ఇవాళే మీ ఫ్లాట్‌ని బుక్‌ చేసుకోండి! గమనిక ముందుగా బుక్‌ చేసుకున్నవాళ్లకి ఒక గోల్డ్‌కాయిన్‌ కూడా ఫ్రీ, త్వరపడండి. మంచి అవకాశం మించినా దొరకద’’ని సినిమాస్టార్లు కూడా అందులో హొయలుపోతూ చెప్తున్నారు.

ఆ యాడ్‌ చూసి నగేష్‌, ఒక్కసారిగా బంపర్‌ ఆఫర్‌ దొరికిందనుకున్నాడు. పైగా తన భార్యకు  కూడా బంగారమంటే పీకల్లోతు పిచ్చి. ప్రతీనెల క్రమం తప్పకుండా బంగారం కొందామంటూ పోరుతూనే ఉంటది. సరే బంగారం ముచ్చట ఎలా ఉన్నా, ఒకసారి ఆ వెంచర్‌ చూసొద్దామనుకున్నాడు. వెంటనే తన ఫ్రెండ్‌ మురళికి కాల్‌ చేసి, ఇద్దరం వెళ్ళి రేపొకసారి వెళ్లి  ఆ వెంచర్‌ చూసొద్దామన్నాడు.

రాత్రి ఇంటికి చేరగానే కనీసం షూస్‌ కూడా విప్పక ముందే, సోఫాలో కూర్చొని తన భార్యకు టీవిలో కనిపించిన యాడ్‌కు సంబంధించిన వెంచర్‌ గురించి చెప్పాడు. నగేష్‌కు ఇది అలవాటే! ఆఫీసు నుండి వచ్చి రావడంతోటే ఆ రోజు జరిగిన సంగతులన్నీ భార్య సౌమ్యతో పంచుకుంటాడు. నవ్వుకునే విషయాలకు నవ్వుకొని, ఫీలయ్యే అంశాలకు ఫీలవుతూ షేరు చేసుకుంటారు! అసలే ఓ వైపు సౌమ్య కూడా అత్తపాటకు కోరస్‌ కలిపి ఇంటి గురించి పోరుతూనే ఉంది. అందుకే నగష్‌ ఫ్లాట్‌ కొనక ముందే కొన్నంత ఉత్సాహంతో సౌమ్యకు చెబుతున్నాడు! అన్నీ లైట్‌ తీసుకుంటారని తనపై నిందలేసే సౌమ్య ముందు తన శీలాన్ని నిరూపించుకునే పనిలో పడ్డాడు.  ‘‘ఇన్‌స్టాల్‌మెంట్‌ వీలు కూడా ఉంది తెలుసా?’’ అని ఉత్సాహంగా చెప్పాడు.

‘‘హమ్మయ్య పోన్లేండి,  ఇదైనా కన్‌ఫార్మ్‌ అయితే అంతే చాలు’’ అంది. ఫ్రెష్‌ అయిన తర్వాత భోజనం చేస్తున్నా మనసంతా వెంచర్‌ చుట్టే తిరుగుతోంది నగేష్‌కు. అన్ని  ఇంటి గురించే ఆలోచనలు. ‘‘కొంచెం మెయిన్‌ రోడ్డుకు దగ్గర ఉండేలా చూసుకుంటే మంచిది. యిల్లు మాత్రం మన టేస్టుకి తగ్గట్టు కట్టించుకోవాలబ్బా! వెంటిలేషన్‌   బాగా ఉండేలా చూసుకోవాలి. ఇంటిముందు లాన్‌లో రకరకాల పూలమొక్కలు పెంచుకోవాలి. ఇన్ని రోజులు ఈ కిరాయి కొంపల్లో ఏ చెట్లు పెంచుకుందామన్నా వీలే కాలేదు’’ అనుకున్నారు.

ముఖ్యంగా తన కొడుక్కి మామిడి చెట్లంటే ఎక్కడలేని ప్రేమ! వాడికి ఎండాకాలమంటే మామిడిపండ్లు తప్ప మరొకటి కాదు. అందుకే వాడికోసం మంచి రసాలూరే పళ్లనిచ్చే మాంచి మామిడిచెట్లు తెచ్చి నాటుకోవాలనుకున్నాడు. ఇక హాల్‌ విషయానికొస్తే కొంచెం విశాలంగా ఉండాలి. కనీసం ఓ పదిమంది ఫ్రెండ్స్‌ వచ్చినా కంపోర్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. గదిలో పెద్దపెద్ద అందమైన పెయింటింగ్స్‌ పెట్టుకోవాలనుకున్నాడు నగేష్‌. అంతేకాదు హాల్‌లో  అల్ట్రా మాడ్రన్‌ సోఫాసెట్‌ ఉంటే ఆ హుందాయే వేరనుకున్నాడు.

అలా బెడ్‌ మీద నడుంవాల్చాడో లేదో, నగేష్‌ భార్య సౌమ్య నెమ్మదిగా నోరువిప్పి…

‘‘ఏమండీ నాదొక చిన్నకోరిక! మీరు కోప్పడొద్దు మరి..’’ అని వరమడుగుతున్నట్టే అంది.

ఏంటన్నట్టు చూశాడు నగేష్‌.

‘‘ఏం లేదు. ఎలాగు మనం ఓపెన్‌ ఫ్లాట్‌ తీసుకోబోతున్నం కదా, యిల్లు కట్టించేటపుడు పైన రూఫ్‌గార్డెన్‌ ఉండేలా ప్లాన్‌ చేయాలండీ’’  అని కొంచెం సిగ్గుపడుతూ గారంగా చెప్పింది.

సౌమ్య కోరిక విన్న నగేష్‌కు ఆ క్షణంలో భార్యను చూస్తే ఫ్లాట్‌ కొనకముందే, పార్టీ అడిగిన ఫ్రెండ్స్‌లాగే కనిపించింది.  అసలే ఓ వైపు తన పరెషాన్‌ తనకున్నది. ఎన్ని లక్షలంటారో, దానికి జీహెచ్‌ఎంసీ లే అవుట్‌ ఉందో లేదో, డౌన్‌లోడ్‌ పేమెంట్‌ కింద ఎంత కట్టమంటారో అని ఏవేవో ఆలోచిస్తుంటే…రూఫ్‌గార్డెనట, రూఫ్‌గార్డెన్‌ అని లోలోపలే అనుకున్నాడు. కానీ, ఆ ఫీలింగ్‌ బయటికి కనిపించకుండా కవర్‌ చేసుకున్నాడు.

పడుకునే ముందు పంచాయితీలెందుకని ‘‘సరేలే చూద్దామన్నాడు’’.

 story picture

 

* * * * *

 

 

ఈలోపు ఆఫీసులో నగేష్‌ పోస్ట్‌ కంటే పై పోస్టుకు ప్రమోషన్‌ ఆఫర్‌ ముందుకొచ్చింది! దీంతో నగేష్‌ ఫ్లాట్‌ కలను మరికొన్ని రోజులకు పోస్ట్‌పోన్‌ చేసుకోక తప్పలేదు! జీవితమంటే ఇంతే. దేని ప్రియారిటీ దానిదే! ఇది తప్ప మరేది ముఖ్యం కాదనిపిస్తది! కానీ, అంతలోనే మరేదో అత్యవసరం దూసుకొని వస్తది. మనముందే నిలబడి తేల్చుకొమ్మని సవాల్‌ విసురుతయి పరిస్థితులు. ఇప్పుడు నగేష్‌కు కూడా ఈ పరిస్థితే ఎదురైంది.  కానీ, కార్పోరేట్‌ కంపెనీలో ప్రమోషన్‌ అంటే మాటలా?! సాలరీకి సాలరీ, హోదాకి హోదా కలిసిసొస్తయి కదా అనుకున్నాడేమో నగేష్‌. అందుకే ప్రమోషన్‌కు కావాల్సిన ఎక్సిపీరియెన్స్‌ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకున్నాడు. అసలే ఆ పోస్ట్‌కు తనతో పాటు ఓ పదిమంది వరకు కాంపిటేషన్‌లో ఉన్నారు! పైగా తన బ్యాక్‌గ్రౌండ్‌ వేరు! మిగిలిన సోషల్‌ స్టేటస్‌ వేరు! అందుకే లోపలెంత టెన్షన్‌ ఉన్నా  కాన్ఫిడెంట్‌గా  ఇంటర్వ్యూకి అటెండయ్యాడు నగేష్‌! ఇంటర్వ్యూస్‌ అయిపోయాయి, రిజల్ట్స్‌ రాకముందే కొలిగ్స్‌ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

‘‘ఖచ్చితంగా ప్రమోషన్‌ నీదే బాస్‌’’అంటున్నారు కొలిగ్స్‌.

కానీ, నగేష్‌కు అన్ని అర్హతలు ఉన్నా, ఉండాల్సిన మరో అదనపు అర్హతొకటి లేదు!  కొలిగ్స్‌ మాటలు ఎలా ఉన్నా, నగేష్‌కు మాత్రం ఏదో ఓ మూలన అనుమానం కలుగుతూనే ఉంది. పైగా ఇంటర్వ్యూ పానెల్‌ హెడ్‌ సుబ్రహ్మణ్యంకు తనపట్ల పెద్దగా సాఫ్ట్‌ కార్నర్‌ ఏమీలేదు! ఎంత డెడికేషన్‌తో పనిచేసినా నగేష్‌ను ఏనాడు పట్టించుకోలేదు!

అయినా కొలిగ్స్‌ ఊదరగొడుతున్న తీరుకు నగేష్‌లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

తరతరాల నుండి పుట్టెడు పేదరికం అనుభవించిన చీకటి గతం! లైఫ్‌లో కొత్త పొద్దుకోసం వెయ్యికళ్లతో ఎదురుచూపు. ఈ ప్రమోషన్‌ వస్తే ఇంటికల కూడా తీరిపోతుందనుకున్నాడు.

సరే రిజల్ట్స్‌ తెలిసేలోపు ఫ్లాట్‌ సంగతి పట్టించుకోవాలనుకున్నాడు! వెంచర్‌కు వెళ్ళొచ్చాడు!

వెహికిల్‌ స్టార్ట్‌ చేశాడు. ప్రపంచం ఇవాళ వింతగా కనిపిస్తోంది. వదిలిపోయిందనుకున్న చీకటినీడ తనను తరుముతూనే ఉంది. అయినా దాని ఉనికి నుండి తప్పించుకొని, రోజులు దాటిస్తున్నాడు నగేష్‌!

కానీ, ఈ రోజు అనుభవం తన గతాన్ని మరోసారి కళ్లముందుకు తెచ్చింది.

ఇందులో తన తప్పేంటి?

సాటి మనిషిలాగే తాను జీవించాలనుకోవడం తప్పా?!

కానీ, తనకే ఈ ప్రత్యేకమైన వలయాలు ఎందుకు అడ్డమొస్తున్నయో అర్థం కావడం లేదు!

ఆ వలయాన్ని దాటే కదా ఈ పట్నానికి వచ్చింది. కానీ, ఇంత పెద్ద సిటీలో కూడా మరోసారి తనని ఆ ముళ్ళకంచె గాయపరిచింది. కుదుట పడుతున్న జీవితంలో కొత్త అలజడి రేపింది.

మనసులో లక్షల ఆలోచనలు సుడులు తిరుగుతున్నయి. మనసంతా ఏదోలా ఉంది. అవమానభారంతో హృదయం అల్లాడుతోంది. ఔను ఆఫీసులో ఎన్ని లెక్చర్లు! సైన్స్‌ విత్‌ హ్యూమన్‌ ఫేస్‌ అంటూ ప్రజెంటేషన్‌లు. అయినా తనకు ఎదురైన ఈ పరిస్థితి ఏ టెక్నాలజి దూరం చేయగలదు. ఏ  శాస్త్ర, సాంకేతిక పరిశోధనలు ఏ పరిష్కారం చూపగలవు. కాలం మారుతోంది. టెక్నాలజి కొత్తపుంతలు తొక్కుతోంది.

కానీ, మళ్లీ ఎక్కడికి పరుగులు తీస్తున్నట్టు?

ఇక తమకు విముక్తే లేదా? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఆలోచనలు గింగిర్లు కొడుతున్నాయి.

నగేష్‌ మనసు ఆత్మీయుల అంత్యక్రియలకు వెళ్ళొచ్చినట్టయ్యింది! ఏడ్చి ఏడ్చి నీరసించిన మనిషిలా ఇంటికి చేరుకున్నాడు నగేష్‌.

ఏ రూట్లోకెళ్లి వచ్చింది? ఎంత ట్రాఫిక్‌ని ఫేస్‌ చేసింది మరిచేపోయాడు.

మదినిండా ఆ అనుభవం తాలూకూ ఆలోచనలు అంతగా నిలిచిపోయాయి.

అప్పటికే సౌమ్య పిల్లల్ని పడుకోపెట్టి నగేష్‌ కోసం ఎదురుచూస్తోంది.

నగేష్‌ ముఖంలో ఏదో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది!

కళ్లు ఎర్రగా మారాయి. ప్రశాంత మనసు సముద్రంలో అకాల సునామేదో చెలరేగినట్టున్నడు.

ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంది. కానీ, డోర్‌ దగ్గరే అడగడం ఎందుకనుకుంది.

డిన్నర్‌ కూడా చేయకుండానే బెడ్‌ మీద నడుంవాల్చి కళ్లు మూసుకున్నాడు నగేష్‌.

ఏమైందని మెల్లగా కదిలించింది సౌమ్య.

‘‘ఏం చెప్పాలబ్బా?! మనమంటే మారుమూల గ్రామం నుండి వచ్చినం.

అక్కడంటే ఏదోలా బతికనం. అవమానాల్ని  గుండెకిందే దాచుకున్నం. కానీ, ఇక్కడైనా తలెత్తుకొని ఆత్మగౌరవంతో జీవిద్దామంటే వీలైత లేదు.’’ అన్నాడు నగేష్‌

సౌమ్యకు అయోమయంగా ఉంది. నగేష్‌ ఏం మాట్లాడుతున్నాడో, దేని గురించి ఇంతలా బాధపడుతున్నాడో అర్థం కాలేదు.

‘‘ఆఫీసులో ఏదైనా గొడవ జరిగిందా?!’’

‘‘గొడవేం లేదు’’

‘‘మరి ఏం జరిగింది’’

ఇద్ధరి మధ్య మాటలు కరువైతున్నయి. నగేష్‌కు అప్పటికే గొంతు పూడుకుపోయింది.

అయినా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎంతటి బాధనైనా, చిన్న చిన్న సంతోషాలనైనా తను ముందు చెప్పుకునేది సౌమ్యతోనే.

అలాంటిది ఇవాళ్టి ఆ అనుభవం సౌమ్యకు చెబితే బాధపడుతుందేమో అని కాసేపు మౌనంగా ఉండి పోయాడు. కానీ, భరించలేని బాధను మిత్రులతోటో, కుటుంబ సభ్యులతోటో పంచుకుంటేనే కదా, సగం బరువు దిగిపోయేది. పైగా ఇది మరెవ్వరికో చెప్పుకోలేడు! అయినా ఈ మహానగరంలో సౌమ్యకంటే ఆత్మీయులెవరు తనకు? అందుకే కష్టంగానైనా నోరువిప్పాడు.

‘‘మనం ఫ్లాట్‌ తీసుకుందామనుకున్న వెంచర్‌ ఆఫీసుకు వెళ్ళొచ్చాను సౌమ్య.

‘‘గోవర్ణధాత్రి’’ అని భారీ హోర్డింగ్‌లు పెట్టి ఉన్నాయి. చాలా పెద్ధ వెంచర్‌ కదా అని  లోలోపలే ఆనందపడ్డాను. వెహికల్‌ ఒక పక్కన పార్క్‌ చేసి, వెంచర్‌ లోపలికి వెళ్లాను.  ఆఫీసు అంతా సంప్రదాయబద్ధంగా ఉంది. ఆఫీసు బయట అన్నీ హిందూ దేవతల ఫోటోలే దర్శనమిచ్చాయి. ఏ ఫోటోలు ఉంటే, ఏముంది? మనకు కావాల్సింది ఫ్లాట్‌ అనుకొని ఆఫీసులో అడుగుపెట్టాను.

అగరొత్తుల ధూమం ఆలయానికి తక్కువ, ఆఫీసుకు ఎక్కువలా ఉంది!

నిలువుబొట్టు పెట్టుకున్న పెద్దాయన అద్ధాలు సవరించుకుంటూ కనిపించాడు. ఓ చిరునవ్వు చిందించి, ఆయన టేబుల్‌కి ముందున్న కుర్చీలో కూర్చున్నా. ఆఫీసులో ఎవరిపనిలో వారున్నారు.

పరిచయం చేసుకొని. ‘‘వెంచర్‌ డీటెయిల్స్‌ చెప్తారా ఒకసారి’’ అని అడిగాను.

నిలువుబొట్టు ఒక్కో విషయాన్ని పూసగుచ్చినట్టుగా వివరించింది.

‘‘ఒక్క మాటలో చెప్పాలంటే, ఇక్కడ ఫ్లాట్‌ కొనుక్కోవడం పూర్వజన్మ సుకృతం అనుకోండి!’’ అన్నాడు.

నిజంగా అంత బాగుంటుందా?! అయితే అమ్మ తిట్లకు ఇక తెరపడ్డట్టే అనుకున్న.

ముందు చెల్లించాల్సిన మొత్తంతో పాటు 18నెలల్లో చెల్లించాల్సిన మొత్తం అన్నీ లెక్కలేశాడు నిలువు బొట్టతను. నేను ఔనా అన్నట్టు చూస్తుండిపోయాను. వివరాలన్ని విని ‘‘హమ్మయ్య, ఇక ఇంటిబాధ తీరబోతుందని ఒక దీర్ఘశ్వాస తీసుకున్నా.

‘‘సరేనండీ రేపొకసారి మా ఆవిడతో పాటు వచ్చి స్పాట్‌ చూసి చేరుతామండీ’’ అని చెప్పిన.

‘ఓకే’ అన్నది నిలువుబొట్టు.

సరే అని ఇక రిటర్న్‌ అవుదామనుకున్న.

అంతలోనే నాకు వాళ్ల యాడ్‌లో ప్రకటించిన గోల్డ్‌ కాయిన్‌ విషయం గుర్తొంచింది.

‘‘మరిచేపోయాను గోల్డ్‌కాయిన్‌ విషయం చెప్పనే లేదు’’ అన్న ఓ చిరునవ్వుతో.

‘‘కాయినెక్కడికి పోతుందిగాని…మరో ముఖ్యమైన విషయం నగేష్‌ గారు..’’ అని సంశయిస్తున్నట్టే అన్నది నిలువుబొట్టు!

మళ్ళీ ఏం చెప్తాడోనని ‘చెప్పండి’ అని కుర్చీలోనుండి లేవబోయేవాణ్ణి ఆగిపోయాను!

‘‘ఏమీ లేదండీ. మీరు బ్రాహ్మలే కదా?’’ అని నిలువుబొట్టు అనుమానంగా అడిగింది.

అప్పటిదాకా నాలో ఉన్న ప్రశాంతత ఒక్కసారి చెరిగిపోయి, గాలిదుమారమేదో మొదలైనట్టనిపించింది.

నాకు కాసేపు మాటలు రాలేదు. ఆ ప్రశ్న అసందర్భంగా అనిపించింది.

అయినా నీకు తెలుసు కదా, కులం విషయంలో ఔట్‌రైట్‌గా మాట్లాడడమే యిష్టం నాకు.

కులాన్ని దాచిపెట్టి, దాని గుట్టును కాపాడడం నాకు ఎంతమాత్రం ఇష్టముండదు.

అందుకే వెంటనే ‘‘లేదండీ….మేం ఎస్సీలం’’ అని సమాధానం చెప్పిన.

ఆ సమాధానానికి నిలువుబొట్టు ముఖం చిట్లించుకున్నది!

‘‘సారీ అండీ… ఈ గోవర్ణధాత్రి వెంచర్‌లో ‘‘కేవలం బ్రాహ్మణులకు మాత్రమే’’ ఫ్లాట్లు అమ్ముతున్నాం. అదర్‌ కమ్యూనిటీస్‌ వాళ్లకు కాదండీ!’’ అన్నది నిలువుబొట్టు!

నాకు ఒక్కసారిగా షాక్‌ అనిపించింది.

సిటీల్లో కూడా కులముంటదని ఇల్లు కిరాయికి వెతుకుతున్నప్పుడే అనుభవం అయ్యింది.

కానీ, అది ఇంత వెర్రిపోకడ పోతుందని ఇన్ని రోజులు తెలియలేదు.

ఇలా బిజినెస్‌లల్లో కూడా ఒక కులానికే ఫ్లాట్లమ్ముతున్నారని ఇవాళే తెలిసొచ్చింది. ఆ వెంచర్‌ మీదే కాదు, మొత్తం క్యాస్ట్‌ సిస్టమ్‌ మీద నాకు ఉమ్మేయాలనిపించింది. ఇట్లా సపరేటుగా ‘‘అగ్రహార అపార్ట్‌మెంట్‌లు’’ కట్టి, కులాన్ని మరింత పెంచి పోషించడం దారుణం అనిపించింది. మనం ఎటు పయనం చేస్తున్నం? 21వ శతాబ్దమేనా ఇది? సిటీ అంతా కులాల బేస్‌డ్‌గా కాలనీలు ఏర్పడితే, ఇంకేమైనా ఉందా?! అనిపించింది.

అంటే మనలాంటి కిందికులాలను మళ్లీ ఊరవతలో, సిటీ అవుట్‌ స్కట్స్‌కో పరిమితం చేయడానికి గోవర్ణధాత్రి  వెంచర్‌ల రూపంలో ‘‘మనువు మరోసారి పుట్టాడని’’ అర్థం అయ్యింది.

రక్తం సలసల ఉడికిపోయింది. ఊపిరి వేగం పెరిగింది…అందుకే నిలువుబొట్టును  నిలదీయకుండా ఉండలేకపోయిన.

‘‘బ్రాహ్మలకు కాకుండా వేరే కులాలకు ఫ్లాట్లు అమ్మం అని మీరు ముందే చెప్పాలి కదా!  మీ ప్రకటనలో ఉండాలి. లేకుంటే ఇక్కడికి వచ్చినవాళ్లనైనా మొదటే ఆ  ప్రశ్న అడగాలి. పూర్వజన్మ సుకృతమని. . తొక్కాతోలు అని పనికిరాని మాటలన్ని చెప్పి, ఇట్లా మోసంచేయడమెందుకు? అయినా ఒక్క కులం వాళ్లకే అమ్మడం ఏంటండీ దారుణం కాకపోతే..’’అని చెడామడా తిట్టిన.

నిలువుబొట్టు మాత్రం ఇదంతా రోజూ జరిగేదే అన్నట్టు, చప్పుడు చేయకుండా తేలుకుట్టిన దొంగలా  కూర్చుంది కాసేపు. ‘‘మమ్మల్నేం చెయ్యమంటారండీ మా మేనేజ్‌మెంట్‌ ఎట్లా చెప్పితే, అలాగే కదా చెప్పాలి మేం’’ అన్నది నిలువుబొట్టు. దాంతో నాకు మరింత కోపమొచ్చింది. ‘‘మీ మేనేజ్‌మెంట్‌కే చెప్పండి, కార్పోరేట్‌ కాలంలో కూడా కులాన్ని పట్టుకొని వేళాడాలనుకుంటే వేళాడమనండీ. కానీ, అనవసరంగా మిగిలిన కులాలవాళ్లు  ఇక్కడిదాకా వచ్చే విధంగా రాంగ్‌ డైరక్షన్‌ ఇవ్వకండి! ఛీ ఇంతకంటే అనాగరికం మరొకటి లేదు’’ అని బయటికొచ్చిన.

ఇలా నగేష్‌ తనలో రగులుతున్న బాధనంతా ఆవేదనతో చెబుతుంటే సౌమ్య కూడా విస్తుపోయింది.

ఇద్ధరూ కాసేపు సైలెంట్‌ అయిపోయారు.

సౌమ్య నిశ్చేష్టురాలైంది.

పిల్లల వైపు చూసి, రేపు వీళ్లు కూడా ఎన్నిసార్లు ఇలా కుల అవమానాలు పడాలో అని ఆలోచనలో పడ్డది. ఐదో క్లాస్‌ చదువుతున్న తన కూతురు మొన్న ఈ మధ్యే  ‘‘మన కాస్ట్‌ ఏంటిమమ్మి? అసలు కాస్ట్‌ అంటే ఏంటి మమ్మి’’ అని అడిగింది.

ఎందుకురా అంటే, స్కూళ్లో మా టీచర్‌ ఒకాయన అడిగారు , అలాగే క్లాస్‌మెట్స్‌ అడుగుతున్నారు మమ్మీ అంది!

మళ్ళీ నగేష్‌ చెప్తున్నాడు.

గోవర్ణధాత్రి వెంచర్‌లో జరిగిన ఈ అవమానం చాలనట్టు, ఆఫీసులో ప్రమోషన్‌ కూడా, పేరు చివర తోకలున్న వాడికే ఇచ్చారట! మురళి కాల్‌ చేసి చెప్పాడు’’ అని కళ్లు మూసుకున్నాడు నగేష్‌.

కాలం మారింది కదా అనుకుంటే పొరపాటే!

పరాయి గ్రహాలకు వెళ్లడం కాదు, మనుషులు మళ్లీ మధ్యయుగాలకు ప్రయానిస్తున్నట్టుగా అనిపించింది!!

కులం పోయిందని, కులం లేదని మూర్ఖంగా వాదించే వాళ్లను, ఈ ‘‘గోవర్ణధాత్రి వెంచర్‌’’కు తీసుకొచ్చి రుజువు చేయాలనుకున్నాడు నగేష్‌.

డా.పసునూరి రవీందర్‌

 చిత్రరచన: బంగారు బ్రహ్మం,అక్బర్ 

కుట్ర

సలీం

సలీం

 

రాత్రి ఎనిమిదింటికి వాళ్ళమ్మ చేసిన వేడివేడి పరోటాలు, బంగాళాదుంప ఖుర్మా తెచ్చిపెట్టింది ఖాతూన్‌. సుష్ఠుగా భోంచేశాడు. తొమ్మిదింటికి గ్లాసునిండా గోరువెచ్చటిపాలు తెచ్చిచ్చింది. తాగాడు.

పదింటికి అతని పక్కకొచ్చి పడుకుంది. తెల్లటి నాజూకైన ఆమె శరీరం చిదుగుల మంటలా వెచ్చగా ఉంది. అసలే చలికాలం.. దుప్పటిలా ఆమెని కప్పుకుని తన రక్తాన్ని వెచ్చబరిచే ప్రయత్నంలో మునిగిపోయాడు సాజిద్‌.

‘‘మాటామంతీ ఏం ఉండవా? తినడం.. మీ కోరిక తీర్చుకుని అటు తిరిగి పడుకోవటం.. ఉదయం లేచి నాష్టా చేయడం… ఆఫీస్‌ కెళ్ళిపోవడం… ఇంతేనా’’ అంది ఖాతూన్‌…ఆమె గొంతులో కోపంకన్నా తనని మనిషిలా కాకుండా కోరిక తీర్చే రబ్బరు బొమ్మలా వాడుకుంటున్నాడన్న ఉక్రోషం…

‘‘ఏముంటాయి మాట్లాడటానికి? రెండేళ్ళనుంచి పన్చేస్తున్న ఆఫీసే… కొత్తగా చెప్పడానికి విశేషాలేమీ లేవు’’

‘‘నేను మీ ఆఫీస్‌ గురించి అడగటం లేదు. మన మధ్య మాట్లాడుకోడానికి సంగతులే లేవా?’’

‘‘అదేదో నువ్వే మాట్లాడొచ్చుగా… నేను వింటాను’’.

ఆమెకు బాగా కోపం రావడం వల్ల కొన్ని నిముషాలు మౌనంగా కోపాన్ని దిగమింగే ప్రయత్నం చేసింది. ఆ చీకటిలో విసుగుతోనో  దుఃఖంతోనో ఆమె విడుస్తున్న నిట్టూర్పులు మాత్రం విన్పించాయి.

‘‘నేనో విషయం అడుగుతాను… నిజం చెప్తారా?’’ అంది కొంత విరామం తర్వాత.

‘‘నేనెప్పుడూ నీకు అబద్ధాలు చెప్పలేదు’’

‘‘నిజమే… కాని కొన్ని నిజాలు మాత్రం చెప్పకుండా దాచారు. పోనియ్యండి. మన నిఖా ఐన ఈ రెండేళ్ళలో మీకు కోపం తెప్పించేలా ఎప్పుడైనా ప్రవర్తించానా?’’

‘‘లేదు’’

‘‘మీ ఇష్టాలకు అనుగుణంగానే నడుచుకున్నానా?’’

‘‘నీతో గడిపిన కాలం నాకు చాలా తృప్తినిచ్చింది.’’

‘‘కానీ మనం భార్యాభర్తలుగా ఉండేది యింకో నెల్రోజులు మాత్రమే…దారుణం కదూ. నన్నిలా వదిలేసి వెళ్ళడం మీకు న్యాయంగా అన్పిస్తుందా?’’ ఆమె ఏడుపు సన్నగా విన్పిస్తోంది.

‘‘యిందులో అన్యాయమేముంది? నిన్ను నీ తల్లిదండ్రుల అనుమతితో నిఖా చేసుకున్నాను. మన పెళ్ళికి  ముందే నాకు హైద్రాబాద్‌ లో భార్యా పిల్లలున్న విషయం మీ అబ్బాజాన్‌ కి చెప్పాను. అభ్యంతరం లేకపోతేనే నిఖా చేయమన్నాను. నీకన్నీ తెలిసే పెళ్ళికి ఒప్పుకున్నావనుకున్నాను. మీ నాన్న నీకు చెప్పకుండా దాస్తే అందులో నా తప్పేం ఉంది?’’

‘‘సరే. మీ తప్పేమీ లేదు. మీకిది రెండో వివాహమని చెప్పకుండా దాచిన అబ్బాదీ తప్పు కాదు. పాపం ఆడపిల్ల పెళ్ళి చేయలేని అశక్తుడు. అంతకన్నా చాతకాని అసమర్థుడు. తప్పంతా నాదే. పేద   ముస్లిం కడుపున ఆడపిల్లగా పుట్టడం’’ ఖాతూన్‌ సన్నగా ఏడుస్తోంది.

‘‘నేనేదో అపరాధం చేసినట్లు మాట్లాడ్తావేంటి? మన ముస్లింలలో నలుగుర్ని నిఖా చేసుకునే వెసులుబాటు మగవాడికి కల్పించారుగా. నువ్వు నాకు రెండో భార్యవే. యింకా యిద్దర్ని చేసుకున్నా నన్నెవ్వరూ తప్పు పట్టరు’’ అంటూ నవ్వాడు. అతని నవ్వు తోడేలు నవ్వులా వికృతంగా ధ్వనించింది.

‘‘తప్పు పట్టే అధికారాన్ని ఆడదానికి కల్పించకపోవడమేగా మీ జాతి చేసిన కుట్ర.  పోనివ్వండి. దానికీ సమాధానపడ్డాను. నా నసీబ్‌ లో మీకు రెండో భార్యగా ఉండమని ఆ అల్లా రాశాడనుకున్నాను కానీ మరో నెలలో మీ డెప్యుటేషన్‌ పూర్తికాగానే నాకు తలాక్‌ ఇస్తానంటున్నారే. అదే నాకు మింగుడు పడటం లేదు. నేనేం తప్పు చేశానని విడాకులిస్తారు?’’ ఖాతూన్‌ గొంతు కోపంతో వణికింది.

‘‘నేనిక్కడ గడపాల్సిన రెండు సంవత్సరాలలో నా అవసర నిమిత్తం నిన్ను నిఖా చేసుకున్నాను.  మరో నెల్లో తిరిగి హైద్రాబాద్‌ వెళ్తున్నాను. నాకిద్దరు బరువు. నా భార్య చాలు. అందుకే’’ నసుగుతూ చెప్పాడు.

‘‘ఆడదాని మనసు తెల్సుకోకుండా మాట్లాడ్తున్నారు. ముస్లిం స్త్రీ బజార్లో దొరికే వస్తువా? అవసరమైనన్ని రోజులు వాడుకుని, తర్వాత విసిరేసి పోవడానికి…ఆమెకూ మనసుంటుంది…ఆమెకూ ఆశలూ, కోరికలు, ఇష్టాఇష్టాలు ఉంటాయి. గుండెనిండా గాఢమైన అనుబంధాలూ ఆప్యాయతలు ఉంటాయి

‘‘ఉండవని నేననలేదే. నువ్వంటే నాకిష్టమే.మన నిఖా జరిగాక నేనూ నీతో ప్రేమగానే ఉన్నాగా.

‘‘నిజంగానే ప్రేముంటే వదలడానికి మనసెలా ఒప్పుతుంది? మీకు నేనంటే కాదు… నా శరీరమంటే ఇష్టం. దీన్ని పెళ్ళంటారా? మీ అవసరం తీర్చుకోడానికి నన్ను వాడుకున్నారు… అంతే. యా  అల్లా…నాకెందుకీ శిక్ష…నేను భార్యనా? మీ ఉంపుడుగత్తెనా?… భార్యనే ఐతే మీరు ఎందుకు వదిలేయాలనుకుంటున్నారు? పెళ్ళంటే రెండు శరీరాల కలయిక మాత్రమేనా? రెండు మనసులు, రెండు హృదయాలు కలిస్తేనే కదా ఆ అనుబంధం’’

‘‘అది న్యాయమో కాదో వెళ్ళి మతపెద్దల్ని అడుగు. నన్ను కాదు. ముస్లిం మగవాడు నలుగుర్ని  పెళ్ళి చేసుకోవచ్చని చెప్పటంతో పాటు భార్య నచ్చకపోతే మూడుసార్లు తలాక్‌ చెప్పటం ద్వారా విడాకులివ్వొచ్చని కూడా చెప్పారుగా. నేను మన మతానుసారమే ప్రవర్తిస్తున్నాను’’

‘‘అనాధ స్త్రీలనీ, విధవల్నీ ఆదుకుంటారనే సదుద్దేశంతో నలుగుర్ని చేసుకునే వీలు కల్పించబడింది. తప్పు చేస్తే భార్యకు విడాకులిమ్మని చెప్పలేదు. ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం కల్పించమన్నారు. ఇంతకూ నేను చేసిన తప్పేమిటి? చెప్పండి. మిమ్మల్ని త్రికరణ శుద్ధిగా భర్తగా  స్వీకరించానే.  మీకు మనస్పూర్తిగా సేవలు చేశానే’’

‘‘నేనూ విధేయతగానే ఉన్నాగా.. పరాయి స్త్రీవైపు కన్నెత్తికూడా చూళ్ళేదే.. భర్తగా నా కర్తవ్యాన్ని  చక్కగా నిభాయించినట్టేగా’’

‘‘మీ అవసరాలన్నీ తీర్చడానికి భార్యగా నేనుండగా మీకు వేరే స్త్రీ మీదికి ధ్యాసెందుకు మళ్ళుతుంది? ఐనా నానుండి శరీరసుఖాలు పొందడం తప్ప మీరు భర్తగా ఏం బాధ్యతలు నిర్వర్తించారని?’’

తనకు భోజన వసతి, గృహవసతి అన్నీ తన అమ్మానాన్నే కల్పిస్తున్న విషయాన్ని ఎత్తి చూపుతోందని అతని కర్థమైంది. ‘‘నేనేనా సుఖపడింది? నీకు శరీరసుఖం ఇవ్వలేదా?’’ అన్నాడు.

ఖాతూన్‌ విషాదంగా నవ్వింది. పదునైన కత్తిలా గాయం చేసే నవ్వు…

‘‘ఆ సుఖం కోసమే ఆడది కాపురం చేస్తుందనుకుంటున్నారా? కాదు. తన భర్తమీద ప్రేమతో అనురాగంతో కాపురం చేస్తుంది. భర్తనుంచి వాటినే తిరిగి ఆశిస్తుంది. మీరంటే నాకెంతిష్టమో తెలుసా?

నామనసులోని అణువణువులో మీ ఆలోచనలే…నా హృదయంలోని ప్రతి కణంలో మీ జ్ఞాపకాలే. ప్లీజ్‌ నన్ను వదిలేయకండి. ఐనా కాలపరిమితికి లోబడి పెళ్ళేమిటి? ప్రేమలకూ ఆత్మీయతలకూ కాలపరిమితిని విధించడం ఏం న్యాయం?’’ ఖాతూన్‌ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తోంది.

సాజిద్‌కి చిరాగ్గా ఉంది. విసుగ్గా ఉంది. అన్ని రకాల సుఖాలు దొరుకుతాయనే కదా పెళ్ళి చేసుకున్నాడు? ఇప్పుడు సుఖం దేవుడెరుగు మనశ్శాంతి లేకుండా చేస్తోంది.

‘‘నువ్వు ముతా పెళ్ళిళ్ళ గురించి విన్లేదా? మన పెళ్ళిని కూడా అలానే అనుకో. రెండేళ్ళ కాల పరిమితి కోసం చేసుకున్న భాగస్వామ్య ఒప్పందం. కాంట్రాక్ట్‌ గడువు ముగియగానే కాంట్రాక్ట్‌ రద్దయి పోతుంది. నువ్వు మరో పెళ్ళి చేసుకో. తలాక్‌ చెప్పబడిన ఆడదానికి మన ముస్లింలలో నిరభ్యంతరంగా పెళ్ళవుతుంది. ఐనా అన్నీ మీ నాన్నకి చెప్పే చేసుకున్నాను.  నువ్వూ ఇష్టపడేగా ఒప్పుకున్నావు? ఇప్పుడు అడ్డం తిరిగి మాట్లాడ్తావేంటి?  నువ్వూ నీ వాళ్ళూ కలిసి కుట్ర ఏమైనా చేస్తున్నారా?  నన్ను మోసం చేయాలనుకుంటున్నారా?’’ అన్నాడు కోపంగా.

అంత దుఃఖంలోనూ ఖాతూన్‌ కి నవ్వొచ్చింది. కుట్ర… మోసం అంటున్నాడు తన భర్త. ఎవరిది కుట్ర… మోసపోయిందెవరు? సాజిద్‌ తమ యింట్లో అద్దెకి దిగినపుడు సన్నగా పొడవుగా తెల్లగా ఉన్న అతన్ని చూసి ఇష్టపడింది. అతనికి పెళ్ళయిన విషయం కాని పిల్లలున్నారన్న విషయం కానీ తనకు తెలీదు. తెలిస్తే పెళ్ళికి ఒప్పుకునేదే కాదు. వయసు ముప్పయ్‌ నాలుగని తెలిసీ ఇష్టపడింది. తనూ టీనేజరేమీ కాదుగా. వయసు పాతిక దాటబోతోంది.

నాన్న అతన్తో  నిఖా జరిపించబోతున్నట్లు చెప్పినపుడు ఎంత సంతోషపడిందో.. తన మనసులోని ఇష్టాన్ని గ్రహించి సాజిద్‌ని పెళ్ళికి ఒప్పించి ఉంటారని సంబరపడిరది. ఇన్నాళ్ళూ తనకు పెళ్ళి చేయలేదని తండ్రి అసమర్ధతని తిట్టుకున్నా ఇపుడు తనకు నచ్చిన వ్యక్తితో నిఖా జరుపుతున్నందుకు అల్లాకు లాఖ్‌ లాఖ్‌ సుకర్‌ లు చెప్పుకుంది.

తనని మోసం చేసింది సాజిద్‌ ఒక్కడే కాదు. తన తండ్రి కూడా …కడుపులో పెట్టుకుని దాచుకోవాల్సిన తండ్రే మోసం చేశాక తన బాధని ఎవరితో మొరపెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి. డబ్బు కోసం ముస్లిం ఆడపిల్లల్ని దుబాయ్‌ షేకులకు అమ్మేస్తారని విని అలాంటి తల్లిదండ్రులుకూడా ఉంటారా అని ఆశ్చర్యపోయేది. తన తండ్రి చేసిన పని అంతకన్నా తక్కువదేమీ కాదు.

తనకు నిఖా అని మాత్రమే చెప్పాడు తప్ప అతనికది రెండో పెళ్ళని చెప్పలేదు. రెణ్ణెల్ల క్రితం తనతో హెద్రాబాద్‌లో అతనికున్న భార్యా పిల్లల గురించి చెప్పినపుడు మజాక్‌ చేస్తున్నాడనుకుంది. ‘నీకు తెలీదా… తెలిసే పెళ్ళికి ఒప్పుకున్నావని మీ నాన్న చెప్పాడే’ అన్నపుడు దిగ్భ్రాంతికి లోనయింది. ఉదయం నాన్నని నిలదీస్తే నీళ్ళు నమిలి ‘అమ్మతో నీకు చెప్పమని చెప్పానే… చెప్పనేలేదా’  అంటూ అమ్మ మీద ఒంటికాలితో లేచాడు. చెంపలు వాచేలా కొట్టి ‘దానిముందు నన్ను దోషిలా నిలబెడ్తావా?’ అంటూ నోరు వాచేలా తిట్టి బైటికెళ్ళిపోయాడు. తనని చుట్టుకుని అమ్మ బావురుమంది. గుడ్లనీరు కుక్కుకుంటూ ‘నాకూ తెలీదు బేటీ… తెలిసి తెలిసి నా కూతురి గొంతుకోసే కసాయి తల్లిని కాదు’ అంది.

ఆలోచనల్లోంచి బైటపడి సాజిద్‌ తో ‘‘సరే. జరిగిందేదో జరిగిపోయింది. నన్ను కూడా మీతో  పాటు హైద్రాబాద్‌ పిల్చుకెళ్ళండి. మీ యింట్లో ఓ మూల యింత చోటిస్తే చాలు’’ అంది.

‘‘యిద్దరు భార్యల్ని పోషించేంత శక్తి నాకు లేదు’’

మరలాంటప్పుడు నన్ను నిఖా చేసుకుని నా గొంతెందుకు కోశావు అని అడగలేక పోయింది.   ‘‘తింటానికి రొట్టె

ముక్కలివ్వకున్నా పర్లేదు. గుక్కెడు గంజినీళ్ళిచ్చినా చాలు. సర్దుకుంటాను. నన్ను వదిలివెళ్ళకండి. ప్లీజ్‌. మీరు లేకుండా నేను బతకలేను’’ అంది.

‘‘నువ్వు నాకు భార్యగా వద్దనుకున్నాను. అందుకే ఓ నెలాగి తలాక్‌ చెప్తాను. దాన్ని కాదనే అధికారం ఎవ్వరికీ లేదు’’ అదే తన చివరి మాటైనట్లు అటు తిరిగి పడుకున్నాడు.

ఆ మాట తుపాకి గుండులా తగిలిందామెకు. నిజమే కదా…దాన్ని కాదనే అధికారం ఎవ్వరికుంది… చివరికి న్యాయస్థానాలు కూడా ముస్లిం స్త్రీల కడగండ్లు తీర్చడానికి పూనుకోవటం లేదు. తాగినమైకంలో ఉన్నా, మతి స్థిమితం సరిగ్గా లేకున్నా సరే వూడుసార్లు తలాక్‌ చెప్తే చాలు విడాకులైనట్లే అని ఇటీవలే ఎవరో ఫత్వా జారి చేశారన్న విషయం నాన్న ఎవరితోనో అంటుంటే వింది.

సాజిద్‌ చెప్పింది నిజమే. అతను తనని ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలి వెళ్ళిపోగలడు. తలాక్‌ ఇచ్చేంత తప్పు ఏం చేశానని నిలదీస్తే వేరే మగాళ్ళతో అక్రమ సంబంధం అంటగట్టి బురద చల్లి మరీ పోగలడు. ఆ బురద కడుక్కోడానికి ఎన్ని సముద్రాల కన్నీళ్ళు కార్చాలో…ఎన్ని సంవత్సరాలు బిరాదరీలో దోషిలా నిలబడాలో.. అతన్ని తన భర్తగా జీవితాంతం కట్టిపడేసే మంత్రం తన దగ్గర లేదు. షరియత్‌ లో మార్పులు చేస్తే తప్ప తనలాంటి ముస్లిం  స్త్రీలకు మనశ్శాంతి ఉండదు. అలా అనుకుందే కానీ వెంటనే ఆమెకు స్పురించింది… మనుషుల్ని అనురాగంతో బంధించాలి కాని చట్టాల్తో షరియత్‌లతో కాదని..

తనని భార్యగా వద్దనుకున్నాడట. నెలాగి తలాక్‌ చెప్తాడట. ఇపుడే చెప్పొచ్చుగా. అలా చెప్తే నెలంతా స్త్రీ సుఖం కరువౌతుందని భయం.. ఎంత స్వార్థం మగాడికి? ఈ రోజు తనతో కాపురం చేశాడే.  మరి ఈ రోజు భార్యగా పనికొచ్చిన తనూ తన శరీరం నెల తర్వాత భార్యగా ఎందుకు పనికిరావో    ఆమెకెంత ఆలోచించినా అర్థం కాలేదు.

ఇదంతా ఓ పన్నాగం ప్రకారం జరిగినట్టు ఇపుడిపుడే తెలుస్తోంది. తన శరీరాన్ని తన యవ్వనాన్ని అధికారంతో వాడుకోవాలనుకున్నాడు. అందుకోసం పేదరికంవల్ల పెళ్ళి కాకుండా ఉండిపోయిన తన మీద నిఖా అనే వల విసిరాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తన అబ్బా మీద యాభైవేల మెహర్‌ అనే వల విసిరాడు. ఇపుడవసరం తీరిపోబోతోంది. తలాక్‌ అనే కత్తెర సాయంతో తను బంధనాల్ని తెంపుకుంటున్నాడు. కానీ తనకు మాత్రం తలాక్‌ వల్ల కలిగేది విముక్తి కాదు… వేదన. గట్టుమీద పడి శ్వాస దొరక్క విలవిల్లాడే చేపలా తను..

ఎంత అమాయకంగా నమ్మిందో అతన్ని.. పిల్లలు పుట్టకుండా అతను జాగ్రత్తలు తీసుకుంటుంటే ‘నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఎందుకు అడ్డుపడ్తారు? మీ పోలికల్తో మగపిల్లాడు పుట్టాలని దర్గాలో మొక్కుకున్నాను తెలుసా’ అందో రోజు.

‘అపుడే పిల్లలెందుకు? నీ అందమైన శరీరం పాడైపోదా? బిగువంతా సడలిపోదా?’ అని సాజిద్‌ అంటే ‘నా భర్తకు నా అందం మీద ఎంత శ్రద్ధో’ అనుకుని వ­రిసిపోయింది తప్ప రెండేళ్ళ తర్వాత వదిలేయాలనుకునే కుట్రలో ఇదో భాగమని తెల్సుకోలేకపోయింది.

ఆమె రాత్రంతా దుఃఖంతో కన్నీళ్ళతో నిద్రలేకుండా గడిపింది

.

***

Kadha-Saranga-2-300x268

 సాజిద్‌కి కేరళ వచ్చిన ఈ రెండేళ్ళలో స్వర్గధామంలా అన్పించిన ఆ  యిల్లు, అమృతతుల్యంలా అన్పించిన ఖాతూన్‌ వాళ్ళమ్మ చేసే వంటకాలు, అప్సరస పొందులా అన్పించిన ఖాతూన్‌ శరీరం…ఇవేవీ ఇప్పుడు రుచించడం లేదు.

నెల రోజులు ఎంత త్వరగా ఐపోతే అంత త్వరగా అక్కడినుండి పారిపోవాలనుకుంటున్నాడు…కానీ ఈ నెల రోజులు ఖాతూన్‌ పెట్టే నసనీ మానసిక హింసని ఎలా భరించాలో అతనికి అర్థం కావటం లేదు.

అసలీ డెప్యుటేషనే సుతరాము అతనికి ఇష్టం లేదు. తప్పని పరిస్థితుల్లో భార్యాపిల్లల్ని వదిలి వూరుకాని వూరు భాషకాని భాష కేరళలోని కొట్టాయం కొచ్చిపడ్డాడు.

అతనికీ నిద్ర రావడంలేదు. జ్ఞాపకాల తేనెతుట్టె కదిలింది. తీయతీయటి తేనె… మధ్య మధ్యలో చురుక్కుమనే తేనెటీగల పోట్లు…

కనీసం రెండేళ్ళయినా వేరే రాష్ట్రానికి డెప్యుటేషన్‌ మీద వెళ్ళాల్సిందేనంది ఆఫీస్‌ యాజమాన్యం

మొదట కొల్‌కతాకి పంపిస్తున్నామన్నారు. భయపడిపోయాడు. ఎక్కడి హైద్రాబాద్‌ ఎక్కడి కొల్‌ కతా…దక్షిణాది రాష్ట్రాల్లో వేయవల్సిందిగా అర్జీ పెట్టుకున్నాడు. చివరికి కేరళలోని కొట్టాయానికి పంపించారు

అందమైన భార్య…ముద్దొచ్చే యిద్దరు చిన్న పిల్లలు… ఐదేళ్ళ సొహైల్‌, మూడేళ్ళ సోనం…వాళ్ళనొదిలి ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. అనారోగ్యంతో బాధపడ్తున్న నాన్న… మోకాళ్ళ నొప్పుల్తో నడవలేని అమ్మ.. వాళ్ళని చూసుకోడానికి భార్యని వదిలివెళ్ళక తప్పని పరిస్థితి. అందర్నీ కేరళ పిల్చుకెళ్తే  తనకొచ్చే యిరవై వేల జీతంతో సంసారాన్ని నెట్టుకు రాలేనని భయమేసి ఒంటరిగానే బయల్దేరాడు.

కొట్టాయం చాలా అందంగా ఉంది. కేరళని గాడ్స్‌ ఓన్‌ ప్లేస్‌ అని అందుకనే అంటారెమో. వూరూ ఆఫీసూ అంతా బాగానే ఉంది. కానీ తిండి ఇబ్బందిగా ఉంది. ఉంటానికి యిల్లూ దానిక్కట్టాల్సిన అద్దె…తనకొచ్చేజీతంలో ఎలా సర్దుకోవాలో యింటికి నెలనెలా డబ్బులెలా పంపాలో అతనికి అర్థం కాలేదు.

ఓ వారం రోజులు ఆఫీసర్‌ అనుమతి తీసుకుని ఆఫీస్‌ లోనే గడిపేశాడు. రోజూ సాయంత్రాలు అద్దె యిళ్ళకోసం తిరగటం.. యిల్లు నచ్చినా అద్దె భరించడం కష్టమని వెనక్కొచ్చేయడం…ఆఫీసర్‌ నుంచి అల్టిమేటం అందింది. ఆఫీస్‌ని యింటిలా వాడుకున్నది చాలని..యింకొక్క రోజైనా ఒప్పుకునేది లేదని…

ఆ రోజు సాయంత్రం ప్యూన్‌ హమీద్‌తో నువ్వు తప్ప నాకు దిక్కులేదని మొరపెట్టుకుంటే పిల్చుకెళ్ళి షౌకత్‌ మియాని పరిచయం చేశాడు.

షౌకత్‌ మియాకి మార్కెట్లో మటన్‌ షాపుంది. మొదట్లో బాగానే జరిగింది. అతని షాపుకి పక్కనే మరో షాపు వచ్చినప్పటినుండి వ్యాపారం దెబ్బతింది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. అందుకని తన యింట్లో ఒక పోర్షన్‌ అద్దెకిచ్చే ఉద్దేశం ఉందనీ ఎవరైనా మంచివాళ్ళు దొరికితే చెప్పమని హమీద్‌కి చెప్పి ఉన్నాడు.

అద్దెకిచ్చే పోర్షన్ని సాజిద్‌ కలియతిరిగి చూశాడు. చాలా పురాతనకాలం నాటి యిల్లు…గోడలు పెచ్చులూడిపోయి… రంగు వెలిసిపోయి… పడగగది, దానికానుకుని చిన్న డ్రాయింగ్‌ రూం.. కామన్‌ బాత్రూం…అద్దె తనకందుబాటులో ఉందని తెలీగానే మరో ఆలోచన లేకుండా చేరిపోయాడు.

మిగిలింది భోజన సమస్య… మరో వారం ఎలానో హోటల్‌ భోజనంతో సరిపెట్టుకున్నాడు. ఆరోగ్యం పాడైంది. భరించలేని కడుపు నొప్పి…శెలవపెట్టి తన గదిలో ముడుచుకుని పడుకున్నాడు.

షౌకత్‌ అలీ భార్య వాము మెత్తగా నూరి వేడినీళ్ళలో కలిపి తాగించింది. అన్నం మెత్తగా చేసి చారుతో కలిపి పెట్టింది. అతనికది అమృతంలా అన్పించింది.

అవకాశం చూసుకుని షౌకత్‌ మియాతో ‘‘మీ యింట్లో వసతి కల్పించారు. షుక్రియా..భోజనం కూడా ఏర్పాటు చేస్తే నాకీ హోటళ్ళ బాధ తప్పుతుంది. మీరేది ఒండుకుంటే అదే పెట్టండి. పచ్చడైనా సరే పలావ్‌ అనుకుంటాను. హోటల్‌ కయ్యే ఖర్చు మీకే యిస్తాను’’ అన్నాడు.

షౌకత్‌ అలి తన బేగం సాహెబాతో చర్చించాడు.

‘‘అదేం భాగ్యం… సాజిద్‌ మియాని గమనిస్తున్నాగా…చాలా బుద్ధిమంతుడిలా ఉన్నాడు. మనం వండుకునే దాంట్లోనే మరో గుప్పెడు గింజలు పడేస్తే సరి.. రోటీ చేస్తే ఓ గుప్పెడు పిండి ఎక్కువ కలిపితే చాలు అతనికి సరిపోద్ది’’ అందామె.

సాజిద్‌ కి ముఖ్యమైన రెండు అవసరాలు తీరాయి. ఉండటానికో గూడుంది. తింటానికి శుభ్రమైన రుచికరమైన యింటి భోజనం దొరుకుతోంది.

నెలరోజులు ఏ ఇబ్బందీ లేకుండా గడిచిపోయాయి. మెల్లమెల్లగా భార్య రుక్సానా గుర్తుకు రాసాగింది…ఆమె మీది ప్రేమతో కాదు…యవ్వనంతో మిసమిసలాడే ఆమె శరీరం మీది కాంక్షతో…రానురాను ఆ అవసరం బలం పుంజుకుని అతని మనసుని బలహీన పర్చసాగింది. అతనికి భయమేసింది.

కోరిక తీవ్రతని తట్టుకోలేక తనేమైనా తప్పు చేస్తాడేమోనని… అసలే ఎయిడ్స్‌ భూతం తప్పు చేసేవాళ్ళని మింగడానికి నోరు తెర్చుకుని ఉందన్న స్పృహ…         ఏం చేయాలో తెలీక సతమతమౌతున్న తరుణంలో తటిల్లతలా ఓ అమ్మాయి మెరిసి షౌకత్‌ మియా యింట్లో మాయమైంది. జనానా వల్ల ఇన్నాళ్ళూ ఆ అమ్మాయి కన్పడలేదుకానీ ఆమె గొంతు,

అందమైన ఆమె నవ్వు అపుడపుడూ విన్పిస్తూనే ఉన్నాయి. ఆమె షౌకత్‌ కూతురు ఖాతూన్‌.

అందమైన, యవ్వనంలో ఉన్న ఖాతూన్‌ ని చూడగానే ఎట్లాగైనా ఆమెని పొందాలన్న కోరిక బలపడిరది. ఓ పద్ధతి ప్రకారం ఆమెను దక్కించుకోడానికి పన్నాగం పన్నాడు.

షౌకత్‌ అలీ జుమ్మా నమాజ్‌ చదివే మసీదుకెళ్ళి మౌల్వీని కల్సుకున్నాడు.

‘‘నేను బదిలీ మీద హైద్రాబాద్‌ నుంచొచ్చాను. కనీసం రెండేళ్ళు ఈ వూళ్లో పని చేయాలి. అప్పటివరకు భార్యకు దూరంగా ఉండటం కష్టం కదా. కాబట్టి మరో పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు మీ సహకారం కావాలి’’ అన్నాడు.

‘‘నేనేం సాయం చేయగలను? మీరు అమ్మాయిని చూసుకుంటే నిఖా చేయించటం తప్ప’’ అన్నాడతను.

‘‘అయ్యో మీరే అలాఅంటే ఎలా? పరాయి రాష్ట్రం నుంచొచ్చిన సోదర ముస్లింకి మీరు కాకపోతే ఎవరు సాయం చేస్తారు? మీరు దయతో సాయం చేసినా మీ రుణం ఉంచుకోను. ఇది అడ్వాన్స్‌ మాత్రమే.. ఉంచండి’’ అంటూ ఐదువేలు చేతిలో పెట్టాడు.

మౌల్విగారు మెత్తబడ్డారు. తన తెల్లటి గడ్డాన్ని సవరించుకుంటూ ఆలోచనలో పడ్డారు. ‘‘యింతకీ నన్నేం చేయమంటావు? కొంపదీసి అమ్మాయిని వెతికి పెట్టమంటావా ఏమిటి? నా వల్ల కాదు’’  అన్నాడు. అలా కాదన్నందుకు చేతిలోని ఐదువేలు లాగేసుకుంటాడేమోనని భయపడి ఆ డబ్బుల్ని లాల్చి జేబులో కుక్కేసుకున్నాడు.

‘‘అమ్మాయిని నేను చూసుకున్నాను జనాబ్‌…మీరు చేయవల్సిందల్లా ఆమె తండ్రికి రెండో పెళ్ళిచట్టబద్ధత గురించి చెప్పి ఒప్పించడమే’’

మౌల్వీగారు మళ్ళా ఆలోచనలో పడ్డారు. యిందులో తనకొచ్చే నష్టమేమీ కన్పించలేదు. ‘‘ఇంతకూ ఎవరా అమ్మాయి?’’ అని అడిగాడు.

‘‘మటన్‌ కొట్టు నడిపే షౌకత్‌ అలీ కూతురు’’

‘‘ఓ … షౌకత్‌ మియానా?’’ మళ్ళా తన గడ్డం నిమురుకుంటూ  ఆలోచనలో పడ్డాడు. ‘‘షౌకత్‌ అలీ డబ్బుకి కక్కుర్తి పడే మనిషి. నేను చెప్పినంత మాత్రాన ఒప్పుకుంటాడనుకోను. మెహర్‌   ఆకర్షణీయంగా ఉంటే ఒప్పించవచ్చు’’

‘‘ఓ పదివేలు’’

‘‘లాభం లేదు’’

‘‘పోనీ పాతిక’’

‘‘లొంగడు’’

సాజిద్‌ మనసులోనే చాలా వేగంగా లెక్కలు వేసుకున్నాడు. యాభై వేలు మెహర్‌ కింద యిస్తే మౌల్వీకిచ్చే డబ్బు, నిఖా ఖర్చు మొత్తం కలిపి డెబ్బయ్‌ వేలకి మించదు. రెండు సంవత్సరాల కాలాన్ని లెక్కలోకి తీసుకుంటే నెలకి దాదాపు మూడువేలు.. రోజుకి వంద రూపాయలు. అందమైన యవ్వనంలో ఉన్న అమ్మాయి పొందు రోజుకి వంద రూపాయల ఖర్చుతో దొరకటంకన్నా అదృష్టమేముంటుంది?

అతనికి మరో ఆలోచన కూడా వచ్చింది. నిఖా జరిగాక షౌకత్‌ అలీ యిల్లు తన మామగారిల్లుఅవుతుంది కాబట్టి అద్దె యివ్వక్కరలేదు. తిండికి డబ్బులు కట్టక్కరలేదు. ఆ రకంగా నెలకు తనిప్పుడిస్తున్న మూడు వేలు, కిరాయి మూడు వేలు భోజనానికి కలిపి మొత్తం ఆరువేలు ఎగ్గొట్టవచ్చు. అలా లెక్క వేసుకుంటే నెలకు మూడువేలు ఖర్చు మిగలడంతోపాటు ఉచిత వసతి, ఉచిత భోజనం దాంతోపాటు ఉచిత స్త్రీ సుఖం…

‘‘సరే మౌల్వీసాబ్‌.. యాభై వేలు మెహర్‌గా యిస్తాను. మీరు షౌకత్‌ గారిని ఎలా ఒప్పిస్తారో మీ ఇష్టం’’

‘‘అవన్ని నేను చూసుకుంటాలే. నాకివ్వాల్సిన పైకం విషయంలో కంజూసీ చూపకు చాలు’’

వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం ఖరారైంది.

 ***

 ఆదివారం మగరీబ్‌ నమాజ్‌ తర్వాత ముస్లిం  పెద్దలు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నప్పుడు మౌల్వీగారు తమ ప్లాన్‌లోని మొదటి అంకాన్ని అమల్లో పెట్టారు. ‘‘సాజిద్‌ మియా.. మీరు నిఖా చేసుకోవాలనుకుంటున్నారనీ మెహర్‌ కింద యాభై వేలు ఇస్తారని నాకు తెల్సిన నలుగురైదుగురికి చెప్పి పెట్టాను. అందులో ఇద్దరైతే చాలా ఉత్సాహం చూపారు. యాభై వేలంటే చాలా పెద్దమొత్తం కదా. మీరు రేపుదయం మా యింటికొస్తే వాళ్ళ వివరాలు చెప్తాను’’ అన్నారు. అతనికది రెండో పెళ్ళి అనే విషయం మాత్రం ముందే ప్రకటించకుండా జాగ్రత్త పడ్డారు.

సాజిద్‌ని చూసినప్పటినుండి అతను తనకల్లుడైతే బావుంటుందని అనుకున్నాడు షౌకత్‌. ఎటొచ్చీ అతనికి యింతకు ముందే పెళ్ళయిందేమోనన్న అనుమానం పీకుతో ఉండింది. ఇపుడు మౌల్వీగారి మాటల్తో మనసులో ఉన్న కొద్దిపాటి అనుమానం తీరిపోయింది. ప్రస్తుతం అతని ఆలోచనంతా యాభై వేల మెహర్‌ చుట్టే గిరికీలూ కొడ్తోంది. యాభై వేలు… ఎంత పెద్ద మొత్తమో…అర లక్ష…ఎన్ని అవసరాలు తీర్చుకోవచ్చో…ఎప్పటినుంచో తన మటన్‌ దుకాణానికి  కొన్ని రిపేర్లు చేయించాలని ఆలోచన..తన పక్క దుకాణం కొత్తగా పెట్టడం వల్ల దాని ముందు తన దుకాణం వెలవెలా పోతోంది. యిపుడా డబ్బుతో పక్క షాపుకన్నా బాగా జిగేల్‌ మనిపించేలా చేయవచ్చు. వూళ్ళో చేసిన అప్పులు కొన్ని ఉన్నాయి. వాళ్ళు అప్పు తీర్చమని ప్రాణాలు తోడేస్తున్నారు. ఆ డబ్బు వాళ్ళ మొహాన కొట్టవచ్చు.

రెండ్రోజుల తర్వాత మౌల్వీగారు షౌకత్‌ని కదిపారు. ‘‘  సాజిద్‌ అద్దెకుంటుంది మీ యింట్లోనే కదా.. ఎంత బుద్ధిమంతుడో. చూడటానికి సలక్షణంగా ఉన్నాడు. దైవభక్తి, పెద్దలంటే మర్యాద పుష్కలంగా ఉన్నాయి. వయసుకూడా ఎక్కువేమీ కాదు.. ముప్పయ్‌కి కొద్దిగా అటూ యిటూ అంతే..మీ అమ్మాయినే యిచ్చి నిఖా జరిపించొచ్చుగా’’ అన్నారు.

‘‘మా అమ్మాయినా?’’ అన్నాడు షౌకత్‌.

‘‘ఔను షౌకత్‌.. నీ ఆర్థిక పరిస్థితి నాకు తెలియంది కాదు. నీ కూతురికి ఎప్పటికైనా నిఖా చేయాలిగా. నువ్వా కట్నం యిచ్చుకోలేని దుస్థితిలో ఉన్నావాయె. సాజిద్‌ మెహర్‌ కింద  యాభై వేలు ఇవ్వడానికి తయారుగా ఉన్నాడు. యాభై వేలంటే తక్కువ డబ్బేమీ కాదు. దాన్ని బ్యాంక్‌ లో వేసి దాచుకుంటే ముదు ముందు అవసరాలకి పనికొస్తాయి’’ అన్నారు.

‘‘మా ఖాతూన్‌కి పాతికేళ్ళచ్చాయి. పర్లేదంటారా? సాజిద్‌ ఒప్పుకుంటాడా?’’ తన మనసులోని భయాన్ని బైట పెట్టాడు షౌకత్‌.

‘‘నీ కెందుకు నేను ఒప్పిస్తాగా. ఆ యాభై వేలలోంచి ఓ ఐదు వేలు నాకు నజరానాగా ఇవ్వు చాలు’’ అన్నారు మౌల్వీగారు.

కూతురి పెళ్ళితో పాటు నలభై అయిదు వేల రొక్కం దొరుకుతుంటే కాదనడానికి నేనేమైనా పిచ్చోడినా అనుకుని సంతోషంగా ఒప్పుకున్నాడు షౌకత్‌. అతని చేత నాలుగైదు సార్లు ‘ఏమైంది? సాజిద్‌ ఒప్పుకున్నాడా?’ అని అడిగించుకుని చివరికి చావు కబురు చల్లగా చెప్పినట్టు అతనికిది రెండో పెళ్ళి అనే విషయం మెల్లగా చెవిలో వూదాడు.

‘‘మనకొద్దు షౌకత్‌ భాయ్‌. ఖాతూన్‌ కి మంచి సంబంధం చూద్దాం. యాభై వేల మెహర్‌ ఎవరిక్కావాలి? ఐనా మన ముస్లింలలో మగాడు భార్య ఉండగా మరో పెళ్ళి చేసుకోవడం తప్పు కాదనుకో. ఏమైనా నీ ఇష్టం. నువ్వు కావాలంటే నేనడిగిన ఐదువేలూ వదులుకుంటాను. సరేనా’’ అన్నాడు.

ఈ పెళ్ళి తప్పకుండా ఖాయమౌతుందన్న నమ్మకంతో  అప్పులోళ్ళతో త్వరలోనే ఆ అప్పు తీర్చబోతున్నట్టు చెప్పేశాడు షౌకత్‌. సాజిద్‌కిది రెండో పెళ్ళన్న వార్త విని గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు కొన్ని రోజులు గిలగిలా కొట్టుకుని, చివరికి తప్పని పరిస్థితుల్లో పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఎటొచ్చీ తన భార్యతో ఖాతూన్‌తో నిఖా అని చెప్పాడు తప్ప సాజిద్‌కిది రెండో పెళ్ళనే విషయం దాచాడు.. నిజం తెలిస్త్తే వాళ్లిద్దరూ ఒప్పుకోరని భయపడ్డాడు. మంచి ఉద్యోగంలో ఉన్నాడనీ, బాదరబందీ లేని ఒంటరి వాడని నమ్మించి పెళ్ళికి ఒప్పించాడు.

నిఖాకి ముందే సాజిద్‌తో ‘‘అల్లుడి హోదా వచ్చింది కాబట్టి యింటి కిరాయి, భోజనం ఖర్చు యివ్వక్కర లేదనుకుంటే పొరపాటు. ఏ ఖాతాకి ఆ ఖాతానే’’ అని కరాఖండిగా చెప్పాడు.

అలాగైనా పర్లేదు.. అది తనకు లాభసాటి బేరమే అనుకున్నాడు సాజిద్‌.. రోజుకి వంద రూపాయల ఖర్చుతో భర్త హోదాలో అనార్‌ పువ్వులా మురిపిస్తున్న ఖాతూన్‌ యవ్వనాన్ని జుర్రుకోవచ్చు.

షౌకత్‌ మియాతో ఒప్పందం ఖరారు చేసుకున్నాక అమ్మ కి జబ్బు చేసిందని చెప్పి ప్రావిడెంట్‌ ఫండ్‌ ఎక్కౌంట్‌ లోంచి డబ్బు విత్‌ డ్రా చేసి అందులోంచి యాభై వేలు అతనికి సమర్పించుకున్నాడు.

నిఖా జరిగిపోయింది.

అంతా తననుకున్నట్లే సజావుగా జరిగింది. కేవలం పోయిన వారం నుంచే ఖాతూన్‌ పోరు ఎక్కువైంది. తను తాగుతున్న అమృతంలో మెల్లగా కలుస్తున్న చేదు రసం…

అందుకే గడువు ముగియకముందే బిఛానా ఎత్తేయాలని ప్లాన్‌ చేసాడు.

మరో పది రోజులు ప్రాణాలు ఉగ్గబట్టుకుని కాపురం చేశాడు. ఆ పది రోజులూ చాలా ప్రేమ నటించాడు. తలాక్‌ ప్రస్తావన రాకుండా  జాగ్రత్త పడ్డాడు. ఖాతూన్‌ లో ఆశలు చిగురించాయి. తన భర్త తప్పకుండా తనని రెండో భార్యగా స్వీకరిస్తాడనీ తనని వదిలి వెళ్ళడని నమ్మింది.

ఆ రోజు ఆఫీస్‌ కెళ్ళాక ఆరోగ్యం బాగోలేదని శెలవ పెట్టాడు. హైద్రాబాద్‌ వెళ్ళాక మెడికల్‌ సర్టిఫికెట్‌ పంపిస్తాననీ తనకో పదిహేను రోజులు శెలవు మంజుారు చేయమని తన పై అధికారికి విన్నవించుకున్నాడు. మరునాడు ఆఫీస్‌కని చెప్పి బయల్దేరి రైల్వే స్టేషన్‌ చేరుకున్నాడు. తన వస్తువులంటూ ఖాతూన్‌ దగ్గర వదిలేసినవేమున్నాయని లెక్కేసుకున్నాడు. నాలుగైదు జతల బట్టలు, ఓ సూట్కేసూ, రెండు జతల చెప్పులు…పర్లేదు కొత్తవి కొనుక్కోవచ్చని సమాధానపడి రైలెక్కాడు. హైద్రాబాద్‌ చేరుకున్నాక   తలాక్‌ తలాక్‌ తలాక్‌ అని రాసి ఉత్తరంముక్క పోస్ట్‌ బాక్స్‌ లో పడేస్తే చాలు. ఖాతూన్‌ పీడ ఖతం అనుకుని సన్నగా నవ్వుకున్నాడు.

***

 ఖాతూన్‌కి చాలా అసహనంగా ఉంది. ఉదయం సాజిద్‌ ఆఫీస్‌ కెళ్ళిన క్షణం నుంచీ అతని

రాక కోసం ఎదురు చూస్తోంది. ఈ రోజెట్లాగైనా సరే సాజిద్‌ నుంచి తనని వదిలి వెళ్ళనని మాట  తీసుకోవాలనుకుంది. జీవితాంతం తామిద్దరూ భార్యాభర్తలుగా ఉంటామని అతని చేత ఒట్టేయించుకో వాలని నిశ్చయించుకుంది. తామిద్దరేనా … ముగ్గురు కదూ. ఒక భర్తా ఇద్దరు భార్యలు.. అంతటితో ఆగితే అదృష్టమే.. ఒక భర్తా, నలుగురు భార్యల దుస్థితి పట్టకుండా ఉంటే అంతే చాలనుకుంది. ఆమెకెందుకో ముస్లిం ఆడదాని బతుకంటే రోత పుట్టింది. ఎన్ని రకాల బానిసత్వాల్ని భరించాలో.. మగవాళ్ళ ఎన్ని అన్యాయాల్ని అఘాయిత్యాల్ని సహించాలో..

ఆరు దాటింది. సాజిద్‌ రాలేదు. ఆమె నిమిషానికోసారి యింటినుంచి బైటికొచ్చి రోడ్డు వైపుకు దృష్టి సారిస్తోంది. సాజిద్‌ జాడ కన్పించకపోవటంతో దీర్ఘంగా నిట్టూర్పులు విడుస్తోంది.

ఆరున్నరయింది. సాజిద్‌ ఆచూకీ లేదు.

చీకటి పడ్తోంది. ఆమె గడపలో నిలబడి ఆతురతగా ఎదురుచూస్తోంది. తెల్లటి ఆమె మొహం

నిండా నల్లగా కమ్ముకుంటున్న దిగులు…చీకటి మెల్లగా ఆమె శరీరం మీద పాకి మొహాన్ని మింగేయడానికి ప్రయత్నిస్తోంది. ఏడయింది… ఎనిమిదయింది. చీకటి ఎప్పుడో ఆమెని మింగేసింది.

 – సలీం

 

సంస్కారం

vanaja vanamali 

వనజా తాతినేని (వనజా వనమాలి)  బ్లాగర్ గా అందరికీ సుపరిచితమే. బ్లాగ్ మొదలెట్టాక ఇది ఆమె వ్రాసిన  50 వ కథ.  తన  చుట్టూ ఉన్న వారి జీవితాల్లో నుండే ఆమె  కథా వస్తువుని ఎన్నుకుంటారు  .  కథ ని వ్రాయడంలోను ,  పాఠకులని మెప్పించడంలోను తానూ  ఎంతవరకు కృతకృత్యురాలినయ్యానో వారే చెప్పాలి  అంటారు ఆమె.

  ***

ప్రొద్దునే వాకింగ్ ముగించుకుని వచ్చి కారిపోతున్న  చెమటని  తుడుచుకుంటూ ఇంటిముందు ఇష్టంగా పెచుకున్న పచ్చిక పై పారిజాతం చెట్టుకు ప్రక్కగా విశ్రాంతిగా వాలి  రాలి పడిన పూల నుండి పరిమళాలను ఆస్వాదిస్తూ  అలవాటుగా పేపర్ కోసం కళ్ళు వెతికాయి

రోజూ అదే సమయానికి సరళ ఒక మంచి నీళ్ళ బాటిల్,ఆ రోజు దినపత్రికలని తీసుకొచ్చిచ్చి అక్కడ పెట్టి ఉంచేది . ఇంకొక పావుగంట తర్వాత సువాసలు వెదజల్లే కాఫీ  కప్పుతో పాటు పోటీగా  “అమ్మ ”  దేవుడి ముందు వెలిగించిన ఊదొత్తుల  పరిమళం కలగలిపి  తన నాసికా రంధ్రాలను తాకుతూ  హాయిగా అనిపించేవి.

ఈ రోజు పావు గంట దాటినా కాఫీ కాదు కదా మంచినీళ్ళు కూడా బయటకి రాలేదు ..

“సరళా ” అని పిలుస్తూ లోపలకి వెళ్లాను. ఇంటి లోపల ఎక్కడా సరళ కనపడలేదు . ఇంకా నిద్ర లేవలేదా ఏమిటీ? తనకి అనారోగ్యం ఏమి లేదు కదా ! అనుకుంటూ బెడ్ రూం లోకి వెళ్లి చూసాను . అక్కడ బెడ్ ఖాళీగా ఉంది .

“అమ్మా.” . అంటూ పిలుస్తూ  క్రిందకి  వచ్చాను .అమ్మ కనబడలేదు.

అంతలో అనిరుద్ద్  .. వాడి రూం లో నుండి బయటకి వచ్చి .. “నాన్నా! అమ్మా,నానమ్మ ఇద్దరూ రఘు  అంకుల్ వాళ్ళింటికి వెళ్ళారు రఘు అంకుల్ వాళ్ళ అమ్మ అదే తులసమ్మ మామ్మ చనిపోయారంట . మీరు రాగానే చెప్పమన్నారు వెంటనే అక్కడికి రమ్మన్నారు ”  అని చెప్పాడు.

“అరే ! ఎప్పుడు జరిగింది .. ? ఎవరు చెప్పారు ..విషయం  కన్ఫర్మ్ గా నీకు తెలుసా అనిరుద్ద్ ” .అని అడిగాను

“మీరు అలా  వాకింగ్ కి వెళ్ళగానే కాల్ వచ్చింది . తులసమ్మ  మామ్మ ని చూసుకునే హోం నర్స్ కాల్ చేసారు అమ్మ, నానమ్మ వెంటనే వెళ్ళారు . మీరు మొబైల్ తీసుకువెళ్ళలేదు కదా .. మీకు ఎలా చెప్పాలో తెలియలేదు”  అని చెప్పాడు .

“సరే నేను ఇప్పుడే వెళతాను”  అంటూ  ..నా మొబైల్ తీసుకుని సరళ కి కాల్ చేసాను .

“సరళా .. నేను విన్న విషయం నిజమేనా “?.. ఇంకా నమ్మలేనట్లుగా అడిగాను .

“అవునండీ .. మన కాలనీలో డాక్టర్ కూడా వచ్చి చూసారు .. ఆవిడ చనిపోయారు .అంది  నేను రఘు అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాను . ఇంకా వాళ్ళ దగ్గర  బంధువులందరికీ  చెప్పాను మీరు త్వరగా రండి ” అంది .

నేను త్వర త్వరగా  డ్రస్ మార్చుకుని రఘు  కి ISD  కాల్ చేసి మాట్లాడుతూనే ఇంటికి చేరుకున్నాను. రఘు చెపుతున్నాడు “నేను సండే  కి  కాని రాలేను .. కృష్ణా ! మళ్ళీ నీకు శ్రమ ఇస్తున్నాను  అక్కడ ఏర్పాట్లు అన్నీ నువ్వే చూడాలి ప్లీజ్ .. ” గొంతులో దుఖాన్ని అణుచుకుంటూ చెప్పాడు .

 

“రఘు .ఆ  విషయం ప్రత్యేకంగా నువ్వు చెప్పాలా ! అన్నీ చూసుకునేందుకు  నేను ఉన్నానుగా నువ్వేమి వర్రీ అవకు.   ముందు టికెట్స్ సంగతి చూసుకో .. మళ్ళీ నేను కాల్ చేస్తూనే ఉంటాను .”. అని చెపుతూ .. లోపలకి వచ్చాను అప్పటికే .. మా కాలనీ వాసులు కొందరు  వచ్చి ఉన్నారు. సరళ ..పొన్స్ చేస్తూ బిజీ గా కనిపించింది .

మంచం మీదే ప్రాణం పోయింది ..ఇంకా అలా మంచం మీదే ఉంచారే ! కొందరి ప్రశ్న . .. “బాక్స్ కోసం ఫోన్ చేసాము అయిదు నిమిషాలలో బాక్స్ వస్తుంది .. బాక్స్ లో మార్చుతాం కదా .అని అలాగే ఉంచేసామండీ ” ..సరళ  చెపుతుంది.

ఇంకొకరు అదే ప్రశ్న వేయకుండా నేను లోపలి నుండి చాప ఒకటి తెచ్చి క్రింద పరచి దానిపై ఒక దుప్పటి పరచి ఇంకో ఇద్దరి సాయం తో  తులసమ్మ పిన్ని బౌతికకాయం ని  చాప పై పడుకోబెట్టాను . ఆమె ప్రక్కనే నేలమీద చతికిల బడి కూర్చున్నాను . చనిపోయే ముందు కూడా ఆమెలో ఏదో బాధ మొహంపై అలాగే నిలిచిపోయి ఉంది . నా కళ్ళల్లో కన్నీరు జల జలా రాలింది . ఆ చేతులతో కొడుకుతో సమానంగా తినిపించిన ప్రేమ ముద్దలు గుర్తుకు వచ్చాయి జీవితమంతా బాధ పడటానికే దేవుడి దగ్గర అగ్రిమెంట్ రాసుకుని వచ్చి ఉంటుందేమో .అన్నట్టుగా  ఉండేది. ఆమె ముఖంలో అప్పుడప్పుడు కనిపించే చిన్న చిరునవ్వు మాత్రం కొడుకు కోసమే దాచుకున్నట్లుండేది.  గట్టిగా నోరు విప్పి మాట్లాడటం అందరకి తలలో నాలుకలా ఉండేది తులసమ్మ పిన్ని .

రఘు వాళ్ళ నాన్న నాకే కాదు రఘుకి కూడా  అంత బాగా తెలియదు రఘుకి మూడేళ్ళు న్నప్పుడు చనిపోయాడు అంతకు ముందు కూడా ఎప్పుడూ అనారోగ్యంతో మంచంపై ఉండేవాడట  రఘు వాళ్ళ నాయనమ్మ ఎప్పుడు తులసమ్మ పిన్నిని తిడుతూ ఉండేదన్నది మాత్రం  బాగా జ్ఞాపకం ఉంది .

“నా కొడుకు శుభ్రంగా ఉన్నప్పుడే ఈ ముదనష్టపుది తాళి , బొట్టు గాజులు తీసేసి విధవ ముండ లాగా తయారయింది. పూజ పునస్కారం ఏమిలేకుండా  కొంపని కిరస్తానీ కొంప జేసింది. సిరింటదు  కాని సీద్రం అబ్బుద్ది అని  పెద్దలు ఊరికే అనలేదు . ఈ దేష్ట మొహం చూస్తూ ఉండలేకనే  నా కొడుకు  చచ్చాడు ” అని తిడుతూ ఉండేది.

పుట్టెడు అప్పులు, అత్తా మామలు, ఆదరణ లేని పుట్టిల్లు. పొలం అంతా  అప్పుల వాళ్ళు కట్టుకు పోగా నాలుగెకరాల మెట్ట  చేను పెట్టుకుని వ్యవసాయంతో ఎదురీదింది. గొడ్ల  కాడి పని,  నీళ్ళు తోడే పని, చేలో పని ఆ పని ఈ పని మధ్య   ఒళ్ళు   అరగ దీసుకుని కట్టేలా బండబారి పోయి ఉండేది.

రఘు వాళ్ళిల్లు  చెరువు  కట్ట ప్రక్కనే  మంచి నీళ్ళ బావిని ఆనుకుని ఉండేది . ఊరందరికీ మంచి నీళ్ళ బావి అదే అవడంతో .అందరికి తులసమ్మ పిన్ని పరిచయం ఉండేది  ఎవరు మాట్లాడినా క్లుప్తంగా నాలుగు మాటలు మాట్లాడేది ఎక్కువ సమయం బైబిల్  చదువుకుంటూ, ప్రార్ధన చేసుకుంటూ కనబడేది   .

మా ఊరి  బడి, గుడి, లైబ్రరీ , కోపరేటివ్ బాంక్ అన్నీ ఒకే చోట ఉండేవి. నేను రఘు  అక్షరాలు దిద్దుకుంటూ తాయిలాలతో పాటు  మనసులో మాట  పంచుకుంటూ  పదిహేనేళ్ళ పాటు  ఇద్దరం కలిసే చదువుకున్నాం.  రఘు నాతొ పాటు మా ఇంట్లో చొరవగా తిరగడం వల్ల  మా ఇంట్లో ఆచారాలు, పూజలు, అమ్మ చేసే వ్రతాలు చూసెళ్ళి .. “మన ఇంట్లో అలా ఎందుకు చెయ్యం ? వాళ్ళింట్లో దేవుడు గూడు ఉంది మనం అలా దేవుడు గూడు పెట్టుకుందాం పూజ చేసుకుందాం” అని తులసమ్మ పిన్నిని అడిగేవాడు .

నేను రఘు పక్కనే ఉండేవాడిని కాబట్టి తులసమ్మ పిన్ని ఏం  చెపుతుందా అని ఆసక్తిగా చూసేవాడిని

“వాళ్ళ దేవుడు వేరు మన దేవుడు వేరు . మన  దేవుడికి అలాంటి పూజలు చెయ్యవసరం లేదు ఇదిగో ఈ బైబిల్ చదువుకుని ప్రార్దిస్తే చాలు ఈ లోకాలని ఏలే దేవుడు ఆయనొక్కడే . ఆయనే అన్నీ చూసుకుంటాడు” అని చెప్పీది

“అమ్మా.. మనం కమ్మ వాళ్ళమే కదా ! “అడిగేవాడు రఘు.

“అవును ” అనేది

“అయితే కమ్మ వాళ్ళందరికీ వెంకటేశ్వర స్వామీ, రాముడు,కృష్ణుడు ,శివుడు ఇలాంటి దేవుళ్ళు  ఉన్నారు  కదా! మన  వాళ్ళందరూ శివాలయం కి, రామాలయం కి వెళుతుంటే .. నువ్వు  ఈ బైబిల్,  కనబడని దేవుడు మన దేవుడు అంటావేమిటి ? నాయనమ్మ తాతయ్య కూడా రామా కృష్ణా అంటున్నారు .. నువ్వే  ఏసయ్యే దేవుడంటూ అందరిలాగా ఉండకుండా వేరేగా ఉంటన్నావు ! నాకు నువ్వు నచ్చలేదు ..నన్ను అంటుకోబాకు “.అని దూరంగా పారిపోయేవాడు . తులసమ్మ పిన్ని వాడిని దగ్గరకి తీసుకోవడానికి ప్రయత్నించేది వాడు ఇంకా దూరంగా పారిపోతూ .. “నువ్వు నాకు అమ్మ వే  అయితే, మనం  కమ్మాళ్ళం  అయితే .. ఊరి చివర వాళ్ళు మా దేవుడు అని చెప్పుకునే వాళ్ళ దేవుడిని ప్రార్ధించడం ఆపేయి.. ” అని  కోపంగా చెప్పేవాడు . వాడి కోపంలో ద్వేషం ఉండేది .. ఆ ద్వేషం బలీయంగా ఉండటం మూలంగానేమో .. క్రమం తప్పకుండా  ప్రతి రోజూ గుళ్ళోకి వెళ్ళేవాడు . దేవుడుకి దణ్ణం పెట్టుకునేవాడు .

“ఆ తులసమ్మ కిరస్తానీ మతం పుచ్చుకుంటే పుచ్చుకుంది కానీ .. పిల్లడు మాత్రం గుడికి వస్తున్నాడు .. ఏ నీరు ఆ నీరేమ్మటే  పారతాయి కాని ఏరే నీళ్ళు కలుస్తాయా ఏమిటీ ?” అనే వారు కొందరు .

ఏడవ  తరగతి చదువుతున్నపుడు  రఘు కి వాళ్ళ అమ్మ మీద మరింత ద్వేషం పెరిగింది  మా వూరి చివర సుదర్శనం మాస్టారు ఉండేవారు . ఆయన స్కూల్ మాస్టర్. అప్పుడప్పుడు విమానం ఎక్కి విదేశాలకి వెళుతూ ఉండేవాడు యేసు క్రీస్తు గురించి ఎప్పుడూ చెపుతూ ఉండేవాడు . రఘు ఆయన్నీ విపరీతంగా ద్వేషించేవాడు. మన మతాన్ని దేవుళ్ళని వదిలేసి యేసు క్రీస్తే ప్రభువని చెప్పడం నాకు నచ్చలేదని ఆయనతో గొడవ పెట్టుకునే వాడు . ఆయన కూతురు భర్త పాస్టర్ గా పనిచేసేవాడు . సువార్త సభలు పెట్టి .. మైకులు పెట్టి వారమేసి  రోజులపాటు ప్రార్ధనలు ,బైబిలు వాక్యాలు , కొత్తగా మతంలోకి చేరిన వారి అనుభవాలు వినిపించే వారు . మా వూరు చిన్నది అవడం వల్ల ఆ  సభలు మా చెవుల్లో రొద  పెడుతున్నట్లు ఉండేవి . ఆ సభలు కూడా .. సంక్రాంతి పడక్కి ముందు పెట్టేవాళ్ళు . వెంకటేశ్వర స్వామీ గుళ్ళో వచ్చే సుప్రభాతం, తిరుప్పావై వినబడకుండా .. కర్ణ కఠోరంగా  ఆ పాటలు వినాల్సి రావడం రఘు కే  కాదు మా వూర్లో చాలా మందికి అసహనంగా ఉండేది  ఈ ఊరుని భ్రష్టు  పట్టిస్తున్నారు ఈ పాస్టర్ ని ఈ వూరు నుండి వెల్ల గొట్టాలి అనుకున్నారు కూడా . వాళ్ళు అనుకున్న కొద్దీ ఆ ఫాస్టర్ ఊర్లో నిట్టాడిలా పాతుకు పోయాడు

ఆ పాస్టర్ .. పేద పిల్లలందరిని చేరదీసి  వాళ్ళు పనులకి వెళ్ళకుండా బడికి వెళ్లి చదువుకుంటే నెలకి ఒకొక్కరికి 150 రూపాయలు వచ్చే ఏర్పాటు చేస్తానని ఇంటింటికి తిరిగి చెప్పడం మొదలెట్టాడు. 150 రూపాయలు అంటే తక్కువేమీ కాదు మూడు బస్తాల ధాన్యం  ధర .. ఆ డబ్బు మీద ఆశ తో . మా వూర్లో ఊరిచివర వాడలో వాళ్ళే కాదు మా వాళ్ళ   పిల్లల పేర్లు కూడా వ్రాయించారు . వాళ్ళందరి పేర్ల మీద బాంక్ అకౌంట్ తెరిపించి  ప్రతి నెలా వారి  అకౌంట్  లోకే  డబ్బులు జమ అయ్యే  ఏర్పాటు చేసాడు పాస్టర్ గారు. డబ్బులు ఊరికే ఇప్పిస్తున్నాడు కాబట్టి ఆయన “దేవుడంటి ” వారు అయిపోయారు . ఆయన స్కాలర్ షిప్ వచ్చే ఏర్పాటు చేసిన వారిలో “రఘు ” కూడా ఉన్నాడు . రఘు వాళ్ళ అమ్మే వాడికి చెప్పకుండా ఆ పని చేసిందని వాడికి బాగా కోపంగా ఉండేది

Kadha-Saranga-2-300x268

” పేదాళ్ళకి సాయం చేస్తారు అంటే .. వాడి చదువుకి ఉపయోగపడతాయని రాయించాను ..  అంత  డబ్బు  ఎక్కడ నుండి వస్తుంది  పంట పండితే పండే ..లేక  పొతే లేయే ! పాడి గొడ్డు మీదే సంసారం నడవాలంటే  ఎట్టా జరుగుద్ది ” తులసమ్మ పిన్ని  మాటల్లోనూ నిజం ఉండేది కాబట్టి  మరో మాట మాటాడటానికి అవకాశం ఉండేది కాదు  .

సంవత్సరానికి రెండు సార్లయినా రఘు కి తులసమ్మ పిన్నికి పెద్ద వాగ్వివాదమే నడిచేది . సువార్త సభలు పెట్టినప్పుడే విదేశాల నుండి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వచ్చేవారు . వారే మా వూర్లో పిల్లలందరికీ ఆర్ధిక సాయం చేస్తున్నవాళ్లని మా ఆంజనేయులు మాస్టారు చెప్పేవాళ్ళు . వాళ్ళు వచ్చినప్పుడల్లా నెలకి 150 రూపాయలు వచ్చే పిల్లలందరినీ హాజరు పరచి వారికి పరిచయం చేసేవారు . అలా పరిచయం చేయడానికి “రఘు ” ని కూడా రమ్మనేవారు . ఆ స్కాలర్షిప్ డబ్బులు నాకొద్దు, నేను అక్కడికి రాను అని మొండి పట్టు పట్టేవాడు తప్ప తులసమ్మ పిన్ని ఎంతబతిమలాడినా వెళ్ళేవాడు కాదు . విదేశీ అతిధులు వచ్చిన ప్రతిసారి రఘుకి ఆరోగ్యం బాగోలేదనో .. బంధువుల ఇంటికి వెళ్ళాడనో సాకు చెప్పి వాడికి  బదులు తులసమ్మ పిన్నిని చూపేవారు .

తులసమ్మ పిన్ని కూడా అప్పుడప్పుడు చర్చి కి వెళ్ళడం మొదలెట్టింది . రఘు వాళ్ళ నాయనమ్మ,తాతయ్య .మేము  బ్రతికుండగానే ఇంటావంటా లేని పనులు చేయడం చూస్తున్నాం . మనమేమిటి, మన కులమేమిటి ,మన సంప్రదాయం ఏమిటీ ? ఫలానా వాళ్ళ కోడలు వూరి చివర వాడల్లోకి వెళూతుందంటే ఎంత పరువు తక్కువ ..?

రఘు .. మీ అమ్మ అలా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పరా ..  అని రఘుని  సతాయించే వారు. మీ అమ్మ అలా చేస్తే ఇకపై దాని చేతి కూడు కూడా తినం . అని పంతం పట్టుకుని కూర్చున్నారు .

“అమ్మా ! నాయనమ్మ ,తాతయ్య ఏమంటున్నారో .. విన్నావు కదా ! నువ్వు అలా వెళ్ళడానికి వీల్లేదు .. గట్టిగా ఆదేశించాడు .

రఘు  అంత  గట్టిగా చెప్పడం చూసి ఇరుగు పొరుగు తులసమ్మ పిన్ని ని మందలించారు  తులసమ్మా !బిడ్డ నీ అంత అయ్యాడు వాడికి ఇష్టం లేదని చెపుతున్నాడుగా ..  ముసలివాళ్ళు ఇంటావంటా లేని  పనులని ఏడుస్తున్నారు, వాళ్లకి ఇష్టం లేని పనులు చేయడం ఎందుకు ?  ఈ వయసులో వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు ?మానేయకూడదు .. ఆ ప్రార్ధనేదో ఇంట్లో చేసుకోరాదు .. అని మందలించారు

ఏమనుకుందో ఏమో తులసమ్మ పిన్ని .. ఇక ఆ తర్వాత వూరి చివర వాడలో ఉన్న చర్చి వైపు వెళ్ళలేదు

పదవతరగతి అయిపోయి కాలేజీ చదువుకి బెజవాడ లయోలా కాలేజీలో చేరాము . ఆ కాలేజీలో చేరడం కూడా రఘు కి ఇష్టం లేదు. మా ఆంజనేయులు మాస్టారు వాడిని బాగా మందలించారు “ఈ కులం, మతం అన్నీ మన మధ్య మనం ఏర్పరచుకున్నవే ! నీకిష్టం లేకపోతే  ఆ మతం గురించి ఆలోచించకు నీకు నచ్చిన మతమే నువ్వు ఆచరించుకో .. మతాలకి సంబంధం లేని విషయం చదువు , అక్కడ మంచి అధ్యాపకులు ఉంటారు స్కాలర్ షిప్ లు వస్తాయి ,నువ్వు బాగా చదువుకోవాలంటే నీకున్న వ్యతిరేకత అంతా  మార్చుకుని ఆ కాలేజీలో చేరు ” అని హితోపదేశం చేసాక .. అయిష్టంగానే నాతొ పాటు ఆ కాలేజీ లో చేరాడు.

ఫాస్టర్ గారు  స్కాలర్ షిప్లు ఏర్పాటు చేయడం వల్ల   మాతో పాటు మావూరి బీదబిక్కి పిల్లలు కూడా  ఉన్నత చదువులు చదువుకోవడానికి పట్నం రాగలిగారు. సువార్త సభలు  నిర్వహించడం వల్ల  తులసమ్మ పిన్ని లాగా చాలా మంది వారి బోధనలు వైపు ఆకర్షితులయ్యారు. అప్పుడే నాకొకటి అర్ధం అయింది . మనషులు సమస్యలలో ఉన్నప్పుడుఆ సమస్యలు తీరక ఏదో ఒక రూపంలో దేవుడు వచ్చి ఆదుకుంటాడనే  నమ్మకంతో ఉంటారు . తాము ఆ సమస్యలలో నుండి బయటపడలేనప్పుడు ఇంకొక దేవుడు ఆదుకుంటాడనే భ్రమలో మతం మారి అక్కడ నమ్మకం పెంచుకుంటారు తప్ప అది మనుషుల బలహీనత . ఆ బలహీనత ఆధారం చేసుకుని   మతమార్పిడి జరుగుతుందని ఒప్పుకోవడానికి ఇష్టపడరు.  అయితే కొద్ది గొప్పో సేవా భావం కలవారు దైవం పట్ల నమ్మకం కలవారు బలహీనులకి ఎంతోకొంత అండ ఉండి వారికి మంచి చేయాలని పాటుపడతారు అలాంటి  రెండో రకం కి చెందిన మనిషి కావడంతో .. మా వూరిలో ఫాస్టర్ గారిని అందరూ గౌరవించేవారు. కొత్త మతం పుచ్చుకున్న వారిని వ్యతిరేకిన్చినవారే    ఏ నీరు  ఆ నీరెంట నడవకుండా  పాత నీరులో కొత్తనీరు నిశ్శబ్దంగా కలసిపారుతుందని గ్రహించక తప్పలేదు

baby_deer_with_mother_doe

పట్నంలో చదివేటప్పుడు రఘు కి డబ్బు  పంపడం కోసం  అవస్థ పడేది.  పంటలకి పెట్టుబడి పెట్టి  సరిగా  పంట చేతికందక,ముసలి వాళ్ళ ఇద్దరి రోగాలకి , చనిపోతే ఇద్దరి కర్మ కాండ లకి బాగానే అప్పు చేయాల్సి వచ్చింది .

చేసిన అప్పుకి ఉన్న పొలమంతా  అమ్మితే  గాని బాకీ తీరదని  లేక్కలేసుకున్నాడు రఘు .

“పూర్వికులు ఇచ్చిన ఆస్తి ఆ కొద్దిగా కూడా నిలుపుకోలేకపోతే ఎలాగురా..? నేను చదువు మానేసి ..ఎదొ ఒక ఉద్యోగంలో చేరతాను “అన్నాడు .

“ఈ నాలుగు నెలలు ఆగు ..ఎదొ ఒకటి ఆలోచిద్దాం . ముందు నీ చదువు పూర్తి చేయి” అంటూ ఆంజనేయులు మాస్టారు చెప్పారు .

ఒక నెలయ్యేసరికి ..  తులసమ్మ పిన్ని  రఘుకి ఒక ఉత్తరం వ్రాసింది ఇల్లు, ఇంటి స్థలం అమ్మేసానని ఆ డబ్బుతో అప్పులనీ తీర్చేసానని.. పొలం అమ్మనవసరం లేదని .. ఇక ఏ దిగులు లేకుండా రఘు ని బాగా చదువుకోమని ..  తానూ  ఇంటికి అవతల ఉన్న నాలుగు సెంట్లు స్థలంలో చిన్న తాటాకిల్లు వేసుకుని అందులో ఉన్నానని .. ఇక ఇబ్బందులు ఏమి లేవని … అందులో సారాంశం .

మా ఇద్దరికీ ఆశ్చర్యం అనిపించింది. పాత ఇల్లు  అంత ఎక్కువ  రేటుకి ఎలా అమ్ముడయిందన్నసందేహం వచ్చింది    . ఇంతకీ ఎవరు కొన్నారొ.. ఆ ఇంటిని . అనుకున్నాం. కానీ మళ్ళీ  ఉత్తరాలలో ఆ సంగతి  గురించి మాట్లాడుకోవడం మర్చిపోయారు

మేము సంక్రాంతి సెలవలకి ఊరు వెళ్ళేటప్పటికి  రఘు  వాళ్ళింటి రూపు రేఖలే మారిపోయాయి.రోడ్డు మీదకి కనిపించే  ఇంటి చుట్టూ వెదురుబద్దలతో అల్లిన దడుల స్థానంలో    .. నిలువెత్తు ప్రహరీ గోడ కట్టేశారు .. ఇంటి మొత్తం కి చక్కగా రంగులు వేసారు . మిగిలిన ఖాళీ స్థలంలో రెండు మూడు రెల్లుగడ్డి తో కప్పిన చుట్టిళ్ళు  కనబడినాయి . ఇంట్లో నుండి బయటకి రావడానికి చక్కగా నాపరాళ్ళ దారి వేసారు .. ప్రహరీ గోడకి తలుపు పెట్టారు .. ఆ తలుపు ప్రక్కనే గోడమీద రంగులతో రాసి ఉన్న అక్షరాలూ చూడగానే రఘు ముఖం నల్లబడి పోయింది .. అక్కడ ” ఏసు  సువార్త మందిరం ” అని ఉంది

చెరువు కట్ట మీదగా గడ్డివాములు వేసే స్థలం లోకి వెళ్ళాడు .  అక్కడొక ఒంటి నిట్టాడి పాక వేసి ఉంది .  రఘుని చూడలేదు  గొడ్ల  పాకలో పనిచేకుంటుంది తులసమ్మ పిన్ని.  ఆమె ముందుకు వెళ్లి .. చేతిలో బట్టల బేగ్  ని ఆమె ముందు విసిరి కొట్టి ..  “ఈ ఇల్లు నిన్ను ఎవరు అమ్మమన్నారు ? చర్చి పెట్టడానికి నువ్వు ఇల్లు అమ్మావా? నాకు ఇష్టం లేదని నీకు తెలుసుగా ! అసలు ఇది నా ఇల్లు. నా ఇల్లు  అమ్మడానికి నీకేమి అధికారం ఉంది కొనడానికి వాళ్ళకేమి అధికారం ఉంది .. వెంటనే వాళ్ళని ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్ళిపొమ్మను ” .. అని విరుచుకు పడ్డాడు .

ఇంట్లో  పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టకుండా గుడి అరుగులమీద కూర్చున్నాడు .

“రఘు మా ఇంటికి వెళదాం .రారా “… అని బతిమలాడి మా ఇంటికి తీసుకు వచ్చాను . సాయంత్రం వాడి చుట్టూ  ఊళ్ళో  వాళ్ళు చేరి తలా ఒక మాట అనడం మొదలెట్టారు .

” అదివరకి ఊరి చివర చర్చి ఉండేది మీ అమ్మ ఇప్పుడు  వాళ్లకి ఇల్లు అమ్మి ఊరి మధ్యకి చర్చి ని తీసుకొచ్చి ఊరంతటిని సంకరం చేసి వదిలిపెట్టింది   ఎలాగైనా ఆడ మనిషి – ఆడ పెత్తనం అనిపిచ్చుకుంది . అమ్మేటప్పుడు  కనీసం నీకు ఒక మాటైనా చెప్పిందా ..? ఊళ్ళో అయినా ఎవరికైనా చెప్పిందా  అంటే అదీ…  లేదు.  బాకీలాల్లకి డబ్బులు కట్టేటప్పుడు బయటపడింది నాలుగెకరాలు పొలం ధర పాతిక సెంటు స్థలం ఉన్న పాత ఇంటికి వచ్చిందని .   డబ్బంటే ఎంత ఆశ ఉన్నా..  ఊరిని ఇట్టా ..  సంకరం చేసి పెడతారా?  మీ అమ్మకి తోడూ ఆ ఆంజనేయులు  మాస్టారొకడు  ఎవరి ఆస్తులు వారిష్టం అమ్ముకుంటారో ఎవరికైనా దానం ఇచ్చుకుంటారో .. మనకి ఎందుకు? వాళ్ళు పీకల్లోతు అప్పుల్లో కూరుకు పొతే మనం చిల్లికాణీ  అయినా సాయం చేసామా..? అంటూ  మీ తరపున  తరపున వకాల్తా  పుచ్చుకున్నాడు . అది మీ తాత ముత్తాతలు  సంపాయించిన ఆస్తి .. మీ అమ్మకి అమ్మేదానికి హక్కు లేదు .పైగా నువ్వు సంతకాలు కూడా పెట్టలేదు ..  వాళ్ళని ఖాళీ చేయమని అడ్డం తిరుగు”  అని నూరిపోసారు .

 

ఆ రాత్రి కూడా రఘు ఇంటికి వెళ్ళలేదు . అమ్మ బలవంతం మీద ఏదో తిన్నాననిపించుకుని వరండాలో నులక మంచంపై  ఆలోచిస్తూ పడుకున్నాడు , నేను వాడి ప్రక్కనే ఇంకో మంచం పై పడుకుని వాడేం  మాట్లాడతాడో అని చూస్తూ ఉన్నాను .  బాగా పొద్దు పోయాక తులసమ్మ పిన్ని మా ఇంటికి వచ్చింది ఎన్నడు ఒకరింటికి పోనీ పిన్ని  మా ఇంటికి వచ్చేసరికి అందరికి ఆశ్చర్యమయితే  వేయలేదు కాని కొడుకు కోసం వెదుక్కుంటూ వచ్చిన  తల్లి మనసు అర్ధమై .జాలి కల్గింది .

అమ్మ తులసమ్మ పిన్నిని కూర్చోమని ముక్కాలి పీట వేసింది . పిన్ని ఆ పీటని తెచ్చుకుని రఘు మంచం ప్రక్కనే వేసుకుని కూర్చుంది .

“బాబూ ..  రఘూ కోపం వచ్చిందా ? “అంటూ వాడి తలమీద చేయివేసి నిమరబోయింది ..వాడు  విసురుగా ఆ చేయిని తోసేసి ..   “నన్ను అంటుకోబాకు,  అసలు నాకు నువ్వు అమ్మవే కాదు “. అంటూ దిగ్గున లేచి నించున్నాడు  తులసమ్మ పిన్ని కళ్ళల్లో నీళ్ళు

“తప్పు .రఘు ..  అమ్మని అలా అనవచ్చా .?”  అమ్మ కోప్పడింది

“నేను ఏమి చేసాను .. యశోదమ్మా ..  ! వాడట్టా  మండి  పడతా ఉండాడు . నెత్తి గింజ నేల  రాలిన్నాటి నుండి  ఏష్టపు  బతుకు అయిపొయింది . ఈ ఒక్క బిడ్డ కోసం ఎన్ని అగచాట్లు పడినాను . ఇప్పుడు ఈడు ఇంతై నన్ను సరిగ్గా  అర్ధం చేసుకోకుండా ఇట్టా మాట్లాడుతున్నాడు ”

“నేను బైబిల్ చదవడం ఇష్టం లేదన్నాడు .. ఆ బైబిల్ ని  నేను ఎందుకు చదువుతున్నాను , యేసు ని ఎందుకు కొలుస్తున్నాను అని మీకెవరికైనా అర్ధం అయిందా? పెల్లైయిన ఏడాది లోపే మా ఆయనకీ పెద్ద జబ్బు చేసింది .. బతకడం కష్టం అని చెప్పారు . ఎన్ని హాస్పటల్ కి తిప్పినాం . ఒళ్ళు ,ఇల్లు రెండు గుల్లయి పోయాయి ఆయన అట్టా  ఉండగానే వీడికి పిట్స్ మొదలయ్యాయి ..  ఆయనకీ చూస్తే అట్టా , బతుకాతాడో లేదో నమ్మకం లేదు బిడ్డకి చూస్తే ఇట్టా .. నేను ఏంచేయాలో తోచలేదు ..  ఎన్ని మొక్కులు మొక్కాను .. ఎన్ని పూజలు చేసాను  ఈ రాళ్ళలో ఉన్న దేవుడే మైనా   మా ఆయన రోగం తగ్గించ గల్గారా ?  మా ఇంటి ప్రక్క టీచర్ చెప్పింది .. ప్రభువుని  నమ్ముకో ..  ఆయన రోగం నయం చేస్తాడని  ఆమె మాటల మీద నమ్మకం కుదిరింది. యేసు ని నమ్ముకున్నాను   రఘుకి ఫిట్స్ రావడం తగ్గి పోయింది , వాళ్ళ నాన్న కాస్త తేరుకుంటున్నాడు . నా ప్రార్ధనలు  ఫలించాయనుకున్నాను . పూర్తిగా నయం కావాలంటే పూర్తిగా ఆయననే నమ్ముకోవాలి  మతం మారాలి .. హిందువుల ఆనవాళ్ళు ఏవి ఉండ కూడదని అంటే బొట్టు, గాజులు  అన్నీ తీసేసి బాప్టిజం తీసుకున్నాను.  అప్పటి నుండి నమ్మినదానిని విడవకుండా పాటిస్తున్నాను . అది తప్పా ?  ఎన్నెన్నో మాటలన్నారు మొగుడు చావక ముందే అన్నీ తీసేసింది అందుకే వాడు చచ్చాడని చెప్పుకున్నారు.   బతికున్నన్నాళ్ళు మా అత్తా మామ తిట్టి పోశారు . బొట్టు పెట్టుకొని, తాళి కట్టుకోని వాళ్ళ మొగుళ్ళు చాలా మంది బ్రతికే ఉన్నారు, మరి వాళ్ళని చూపిచ్చి నేను అడగవచ్చు గా .. ?  ప్రార్ధన కెళితే నా చేతి కూడు తినని శపథం చేసారు ముసలాళ్ళని  బాధ పెట్టడం ఎందుకులే అని నా ఇష్టాన్నే చంపుకున్నాను . ఈడు వేలెడంత ఉన్నప్పుడు నుండే నన్ను శాసించడం మొదలెట్టాడు . నా దారిన నేనే పోతన్నా గాని ఎవరినయినా ..  బైబిల్ చదవండి ,ప్రార్ధన చేయండి అని నేను బలవంతం చేసానా?

మీ అందరూ నమ్మే  దేవుడు మీకు రాళ్ళల్లో,పాముల్లో ,పశువుల్లో కనబడితే నేను నమ్మే దేవుడు నాకు బైబిల్లో,

ప్రార్ధన లో  ఉన్నాడని పిస్తుంది . మీరు గుడికి వెళ్లినట్టు నేను చర్చి కి వెళితే అభ్యంతరం పెట్టారు  ఇదేట్టా న్యాయం అనిపిచ్చుద్దో .. మీరెవరైనా చెప్పండి”?  .సూటిగా తాకుతున్నాయి ప్రశ్నలు

వింటున్న ఎవరిమీ మాట్లాడలేదు .  పిన్ని మళ్ళీ ఆమె గోస చెప్పసాగంది

“నిండా అప్పుల్లో కూరుకు పోయి ఉన్నాను నాలుగెకరాలు పొలం అమ్మే కంటే ఇల్లు అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని  ఇల్లు అమ్మాను  దానికి తప్పు పడతా ఉండారు  ఏ మనూర్లో రామాలయం దగ్గరలో మసీద్ లేదా ? పీర్ల పండక్కి పీర్లు ఊరేగింపులో మీరందరూ ఎదురెల్లి నీళ్ళు  పోసి మొక్కట్లేదా ? మరి ఆ మతం వాళ్ళు మాత్రం వేరే మతం కాదా!? వాళ్ళు పరాయి వాళ్ళు కాదా ? నన్నెందుకు తప్పు పడతా ఉండారు ? ”

వింటున్న మాకు ఒక్కోమాట గునపంలా గుచ్చుతున్నట్టు ఉంది  . రఘు ఏమి మాట్లాడలేదు

నా వైపుకి చూస్తూ .. “కృష్ణా నీకు తెలియదా .. రఘు అంటే నాకెంత ప్రాణమో ! వాడి కోసమే కదా రాత్రింబవళ్ళు  రెక్కలు ముక్కలు చేసుకుని ఒంటెద్దు వ్యవసాయం చేస్తూ ఈ కుటుంబాన్ని ఇక్కడిదాకా లాక్కొచ్చా . ఇప్పుడు ఈడే  నన్ను అసహ్యించుకుంటూ  నన్ను వేలేసినట్లు చూస్తే నేను ఎవరి కోసం బతకాలి .. నేను ఎందుకు బతకాలి ? ”

ఏడుస్తూ . ముక్కాలి పీట పై నుండి లేచి నిలబడింది  .

ఆ మాటలు విన్న నాకు కన్నీరొచ్చింది.  అవును, తులసమ్మ పిన్ని ఎంత కష్టపడుతుంది .రఘు వాళ్ళమ్మని అర్ధం చేసుకోవడం లేదని   నాకు వాడిపై కోపం వచ్చింది .

అమ్మ కూడా అదే మాట అంది . ” రఘు మీ అమ్మని నువ్వే అర్ధం చేసుకోవాలి ఏ దేవుడైతే ఏమైంది ? .  ఆమెకి  కాకర కాయ నచ్చినట్టు ఆ దేవుడు, ఆ మతం  నచ్చింది నీకు గుమ్మడి కాయ నచ్చినట్టు ఈ మతం నచ్చింది .. ఏ మతమయితే ఏముందిలే .. అందరి రక్తం ఒకటే రంగయినట్లు అందరు దేవుళ్ళు ఒకటే ! అసలు కన్నతల్లి  ప్రత్యక్ష దైవం  అంటారు కదా !  . మీ అమ్మని బాధపెట్టే మాటలు మాట్లాడకూడదు ,  కష్ట పెట్టే  పనులు చేయకూడదు “.. అని సుద్దులు చెప్పింది .

“తులసమ్మా ! ఏడవబాకు నీ కష్టం మాకు తెలియదా ఏంటి? రఘు చిన్న పిల్లాడు , వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు తలకెక్కించుకుని ఇప్పుడలా కోపంగా ఉన్నాడు గాని వాడికి నీ పై ప్రేమ ఎందుకుండదు” .. అని అంటూ

“కృష్ణా ,నువ్వు రఘు ని తీసుకుని వాళ్ళింటికి వెళ్ళు “.. .. అని చెప్పింది .

తులసమ్మ  పిన్ని కళ్ళు తుడుచుకుంటూనే  ఇంటి దారి పట్టింది. ఆ వెనుకనే రఘు,నేను బయలుదేరాం .

ఆ సంఘటన తర్వాత రఘు ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది . వాళ్ళమ్మ మీద అసలు కోపమే లేకుండా తల్లిని సంతోషంగా ఉంచేవాడు .కాని ఆమె ఆచరిస్తున్న మతం పట్ల వ్యతిరేక వైఖరి మాత్రం వాడి మనసులో అలాగే ఉండిపోయింది

 

తులసమ్మ పిన్ని ఊరిలోనే ఉండేది మేము హాస్టల్లో ఉంది  డిగ్రీ  చదువు పూర్తీ చేసాము . తర్వాత ఇద్దరికీ గుంటూరు మెడికల్ కాలేజ్ లో సీట్లు వచ్చాయి . చదువు పూర్త వుతూ ఉండగానే  రఘు కి పెళ్లి అయిపోయింది. రఘుకి హిందూ సంప్రదాయం ప్రకారమే పెళ్లి చేయించింది తులసమ్మ పిన్ని వియ్యాలవారికి ఆమె ఆచరించే మతం పట్ల అభ్యంతరం ఉండేది . అయితే రఘు లాంటి యోగ్యుడైన వాడిని పెంచిన తల్లి కాబట్టి అల్లుడు హోదాని చూసుకుని ఆమె పరమత ఆచరణ కంత  ప్రాముఖ్యత నివ్వడం మరచిపోయారు . హైదరాబాద్  లో ఉద్యోగం చేస్తూ  తల్లిని కూడా తమతో ఉండమని గొడవ చేసేవాడు . కానీ తులసమ్మ పిన్ని పల్లెలోనే ఉండటానికి  ఇష్ట పడేది. రఘు  సొంత వూర్లో ఇల్లు కట్టడానికి  రామాలయం ప్రక్కనే కొంత స్థలంని  ఉన్న ఉన్న ధర కన్నా కన్నా ఎక్కువ ధర  పెట్టి  కొని   ఆ స్థలంలో  ఇల్లు కడతాను.. ఆ ఇంట్లో ఉండమని అన్నాడు . ఆమె ఆ గుడి ప్రక్కనే ఉండానికి ఇష్టపడలేదు

ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విదేశంలో ఉద్యోగం సంపాదించుకుని వెళ్ళిపోయాడు . తనతోపాటు తల్లిని తీసుకువెళతానని అంటే అందుకు ఆమె ఇష్టపడలేదు . “ఎక్కడున్నా .. నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటే  చాలు నేనీ వూరు వదిలి రానని చెప్పింది .   నా సలహా మేరకు నా ఇంటికి దగ్గరలోనే ఒక ఇల్లు తీసుకున్నాడు. సంవత్సరానికి ఒకసారో  ,వీలయితే రెండుసార్లు వచ్చి   ఆ  సమయానికి తులసమ్మ పిన్ని ని అక్కడికి రప్పించుకుని అందరూ కలసి ఆనందంగా గడిపి వెళ్ళడం ..చేయసాగాడు. వెళ్ళేటప్పుడు పేద పిల్లలకి స్కాలర్ షిప్ లు ఏర్పాటు చేసి వెళ్ళేవాడు

నాలుగేళ్ల క్రితం తులసమ్మ పిన్ని ఆరోగ్యం దెబ్బ తింది.  అప్పుడు వచ్చి ఒక నెల రోజులు ఉండి  ఆమెకి స్వయంగా సేవలు చేసాడు . ఇక సొంత వూర్లో ఒక్కదాన్నే ఉంచడానికి ఇష్టపడక నమ్మకమైన ఒక మనిషిని కుదిర్చి ఆమెకి సాయంగా ఉంచి వెళ్ళాడు అవసరం అయినప్పుడు సాయంగా  కొడుకు కాని కొడుకుని నేను ఎలాగు ఉన్నాను కాబట్టి రఘు కి ఎలాంటి దిగులు లేకుండా ఉంది . అమ్మ నాదగ్గరే ఉండటం తో అమ్మకి తులసమ్మ పిన్నికి ఇద్దరికీ బాగానే కాలక్షేపం అవుతూనే ఉండేది

తన పనులు తానూ చేసుకుంటూ అప్పుడప్పుడూ దగ్గరలో ఉన్న చర్చి కూడా వెళ్లి వస్తూ ఉన్న తులసమ్మ పిన్ని ఏ మాత్రం  సూచనలు ఇవ్వకుండానే తనువూ చాలించింది. .. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ .. మౌనంగా ఉన్న నన్ను ..

సరళ తట్టి పిలుస్తుంది .. “ఏమండీ  .రఘు  అన్నయ్య వాళ్ళ మామగారు ఏమిటో అంటున్నారు చూడండి ”

ఏమిటన్నట్లు ఆయన వైపు చూసాను .. “ఆమె శవం ని  బాక్స్ లోకి మార్చి ఇదిగో ఈ దండలు వేయండి .. తలవైపు దీపం పెట్టండి . అలా అంత సేపు దీపం పెట్టకుండా ఉంచకూడదు “.. చెపుతున్నారు .

దీపం .. పెట్టటమా ? అడిగాను ఆశ్చర్యంగా . అదేమిటి అలా ఆశ్చర్యంగా అడుగుతున్నావ్ కృష్ణా .. ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఆమె ఎలా ఉంటె మనకెందుకు ? ఇప్పుడు ఆమె రఘు  తల్లి మాత్రమే! ! ఆమెకి హిందూ సంప్రదాయంలో అంత్యక్రియలు జరపడమే విధి . పైగా అలా చేయకపోతే కృష్ణ కి కీడు జరుగుతుంది . అది మాత్రం ఆమె కోరుకుంటుందా ? అడుగుతున్నాడాయన .  .

నేను ఆలోచిస్తూ  ఉన్నాను  బుర్ర పాదరసంలా  పనిచేసింది వెంటనే ఇలా అన్నాను . “రఘు  రావడానికి  ఎంత  లేదన్నా  ఇంకా రెండు రోజులు పడుతుంది  కాబట్టి .. బాడీని ఇక్కడ బాక్స్ లో  ఉంచడం కంటే మార్చురీ లో ఉంచడం నయం” .. అన్నాను .

నన్ను సమ ర్దిస్తూ మరి కొందరూ అలాగే చేయడం మంచిదని అన్నారు . అమ్మయ్య ..ఒక గండం గట్టెక్కింది అనుకుని అంబులెన్స్ కి పోన్ చేసాను. ఒకటిన్నర రోజు తర్వాత  భార్య పిల్లలతో సహా రఘు  వచ్చాడు . ఎయిర్ పోర్ట్ కి ఎదురెళ్ళి నేనే ఇంటికి  తీసుకువచ్చాను. మేము  ఇంటికి వచ్చే సమయానికి అంబులెన్స్ లో పిన్ని బౌతిక కాయం ని ఇంటికి తీసుకు వచ్చారు.రఘు తల్లి శవం ని చూస్తూ కన్నీరు కారుస్తూనే ఉన్నాడు . పిల్లలు ఒకసారి ఆమె దగ్గరికి వచ్చి చూసి దూరంగా వెళ్ళిపోయారు . భార్యని తల్లి తల దగ్గర దీపం పెట్టమని  చెప్పాడు రఘు  .

రఘు  మామగారు స్మశాన వాటిక వాళ్లకి ఫోన్ చేసి దహన క్రియలు గురించి  మాట్లాడుతున్నారు.

నేను నిర్ఘాంతపోయాను . తల దగ్గర  దీపం పెట్టబోతున్న  రఘు  భార్యని  “కాసేపు ఆగమ్మా” .. అని వారించి  వాడిని  ప్రక్కకి తీసుకువెళ్ళాను  .

“ఏంటిరా ఇది “.. అడిగాను

“ఏముంది అన్నీ మాములేగా “అన్నాడు వాడు

“రఘు ..  నీకు ఊహ తెలిసినప్పటి నుండి అమ్మ ని వ్యతిరేకిస్తూనే ఉన్నావు . ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా వ్యతిరేకిస్తున్నావు . ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం నాకేమి నచ్చలేదు ” అన్నాను .

“నచ్చడా నికి ఏముంది రా కృష్ణా ! ఇప్పడు నేను ఏమి చేసినా  అమ్మకి తెలుస్తుందా ఏమిటీ ! అమ్మ పుట్టుకతో క్రిష్టియన్ ఏమి కాదుగా ! హిందువుగానే పుట్టింది హిందువుగానే ఆమెని కడసాగనంపడంలో ఎవరికీ అభ్యంతరం ఉంటుంది . మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయి ” .అన్నాడు

మరి నువ్వు మధ్యలోనే వచ్చావుగా ..నువ్వు పోవాలిగా ? అన్నాను కోపంగా .” వాట్ “. అన్నాడు  ఆశ్చర్యగా అర్ధం కానట్లు

“నేను అంటున్నది అదే! నువ్వు ఆమె పుట్టినప్పటినుంచి ఆమెతో ఉండలేదుగా . ఆమెని ఇప్పుడు వదిలేయి” అన్నాను .

“ఎలా వదిలేస్తాను . అమ్మ ఉన్నప్పుడు ఆమెని ఎంతగా ప్రేమించానో ఇప్పుడు అంతగానే ప్రేమిస్తాను  ఆమె కి అంతిమ సంస్కారం  చేసి ఆమె ఋణం  తీర్చుకోవాలి కదా !” అన్నాడు

“మనుషులని ప్రేమించడానికన్నా ముందు వారిని  గౌరవించడం నేర్చుకోవాలి . మీ అమ్మని ఎప్పుడైనా గౌరవించావా ? అదే ఆమె అభిప్రాయాలని  గౌరవించావా ? ఆమె ఇష్టపడే బైబిల్ ని ఆమె ప్రార్ధనలని అంగీకరించావా? ప్రపంచ దేశాలన్నీ తిరిగావు.  మతం, , ఆచారం  ఇవన్నీ మారిపోతూనే ఉంటాయి ఎవరికీ ఇష్టం అయినట్లు వారు మార్చుకుంటారు. మార్చుకోవద్దనటానికి, ఇలాగే ఉండాలి అనడానికి ఎవరికీ అధికారం లేదు. వ్యక్తి స్వేచ్చకి భంగం కల్గించమని ఏ రాజ్యాంగంలోను చెప్పబడలేదు. మన హిందూ ధర్మం  అసలు చెప్పలేదు.  ఆమె చనిపోయాక ఆమె కొడుకుగా నీకు ఆమె శవం మీద కూడా హక్కు  ఉండొచ్చు. కానీ ఆమె అవలంభించిన మతాచారం ప్రకారం ఆమె అంతిమ సంస్కారం జరగాలని ఆమె కోరిక . అమ్మ ఈ  దగ్గరలో ఉన్న చర్చిలో ఆ విషయమే చెప్పిందట . వారు వచ్చి నిన్న నాకు ఆ విషయం గుర్తు చేసి వెళ్ళారు.  ఆమె ఇష్ట ప్రకారం మనం అలా పాటించడం అంటే ఆమెని మనం గౌరవించడమే కదా!  అది మన విధి కదా !  ఆలోచించు”  అన్నాను

” ఏమైందండీ !  అంత సీరియస్ గా చర్చించు కుంటున్నారు  .. అవతల జరగాల్సిన విషయం చూడకుండా ..” అంటూ దగ్గరికి వచ్చింది  సరళ .

“తల్లీకొడుకుల మధ్య కూడా ఈ మత  విశ్వాసాలు ఎంతటి  అగాధం సృష్టిస్తాయో అర్ధం అవుతుంటే  చాలా బాధగా ఉంది సరళా .”అన్నాను

“ఏమంటున్నారు రఘు అన్నయ్య  శవపేటిక ,ప్రార్ధన, బరియల్ గ్రౌండ్ కి వద్దంటున్నారా ?”

అవునని తలూపాను .  రఘు మామగారు పురమాయించిన మనుషులు పాడే  సిద్దం చేస్తున్నారు  పూల దండల బుట్టలు, చావు మేళం,  టపాసులు   అన్నీ వచ్చి చేరుతున్నాయి

రఘు పది నిమిషాలు గడిచినా గదిలో నుండి బయటకి రావడం లేదు .

“సరళా .. నేను వెళుతున్నాను .. ఆ కార్యక్రమం అయ్యాక అమ్మ, నువ్వు వచ్చేయండి ” అని అంటూ బయటకి వస్తున్నాను .

“అయ్యో ! అదేమిటండి . మనకి నచ్చలేదని వెళ్ళి పోతామా ? ఇన్నేళ్ళు   ఆమెకి మీరు ఒక కొడుకుగానే ఉన్నారు . ఆ కార్యక్రమం ఏదో అయినాక మనమందరం  కలిసే వెళ్ళిపోదాం . తర్వాత మీ మిత్రుడు,  మీరు ఎలా ఉండదల్చుకున్నారో అలాగే  ఉండండి ” అంటూ చేయి పట్టుకుని ఆపబోయింది .

“మరణం తర్వాత కూడా తల్లి అభిప్రాయాలని గౌరవించలేని వాడిని, సంస్కారం లేనివాడిని  నా స్నేహితుడిగా కాదు మనిషిగా కూడా అంగీకరించలేకపోతున్నాను . డాక్టర్ అన్న డిగ్రీని మెడలో వేసుకుని తిరుగుతున్న వాడిని   మరో మత మూడుడుగా   చూడలేకపోతున్నాను.అది డైజెస్ట్ చేసుకోవడం నావల్ల కావడంలేదు అందుకే వెళుతున్నాను “. తల విదుల్చుకుంటూ   గుమ్మం దాటి బయటకి రాబోతుండగా ..  .

“కృష్ణా .. ఎక్కడికి రా వెళుతున్నావ్ ..? అమ్మ అంతిమ సంస్కారం కి శవపేటిక  .సిద్దం చేయించకుండా .. ?. ” అంటూ వచ్చి నా చేయి పట్టుకున్నాడు రఘు.

తులసమ్మ పిన్నికి జరిగే అంతిమ  సంస్కారం రఘుని సంస్కార వంతుడిగా మార్చిందనుకుంటే నాకు  చాలా సంతోషమేసింది

వాడి చెయ్యి పట్టుకుని తులసమ్మ పిన్నిని ఉంచిన చోటుకి వచ్చాను . ఆమె నిర్జీవ ముఖం చిన్నగా నవ్వుతున్నట్టు  కనిపించింది నాకు.

 .***

–వనజ తాతినేని

ఎచటికి పోతావీ రాత్రి?

kondepudi 

ప్రాధమికంగా కవి అయిన ప్రాథమికంగా కవయిత్రి అయినకొండేపూడి నిర్మల కథకురాలిగా కూడా అంతే ప్రసిద్ధం.  వ్యాసం,కాలమ్ లాంటి ఇతర సాహిత్య ప్రక్రియల్లో  కూడా ఆమె కృషి చేస్తున్నారు.వృత్తి పరంగా  ప్రచార, ప్రసార రంగాల్లో విలేకరి గా పనిచేశారు. ప్రస్తుతం ప్రభుత్వ, స్వచ్చంద సంస్థల్లో  జండర్ కమ్యూనికేషన్స్ అంశాలకు ట్రెయినింగ్ మాడ్యూల్స్ రాయడం, క్లాసులు తీసుకోవడం చేస్తున్నారు. ఈమె రచనలు తమిళ, ఆంగ్ల , మళయాళ  భాషల్లోకి తర్జుమా అయ్యాయి. నిర్మల కథల సంపుటి ” శత్రు స్పర్స “కు చక్కటి ప్రాచుర్యం లభించింది —వేంపల్లె షరీఫ్

 

***

 

 

nirmala story

 

ఎచటికి పోతావీ రాత్రి?

 

భయం ….

వేలాది కాళ్ళతో తరుముకుంటూ వచ్చి చటుక్కున పీక పట్టుకుని కొరికేస్తున్నట్టు..కొరికిన పీకలోంచి గుండెలోకి, ఇంకా ఆ కిందికి చెయ్యి జొనిపి తల్లిపేగుని కెలికి తెంపేసినట్టు…వొణికిపోతోంది సుందరమ్మ. వొళ్లంతా చెమటతో తడిసిపోయింది. దుప్పటి తీసి గాలి పీల్చుకుందామని వుంది. ….భయం.|

సంచీలో  వున్న సీసా వొంచుకుని నీళ్ళు తాగుదామని వుంది…… భయం….|

కదులుతున్న ఆ  రైలు,  పట్టాల  మీద నడుస్తున్నట్టుగా లేదు. తలకాయ మీంచి నడుస్తున్నట్టుగా వుంది. టటా.. టట్.. టటా..టట్ చప్పుడు కాస్తా పట్టుకోండి..కొట్టండి, నరకండి ..అరుపులుగా మారినట్టు అనిపిస్తోంది. ఉన్నట్టుండి విసురుతున్న రాళ్ళ దెబ్బలు తప్పించుకున్నట్టుగా చేతులతో వొళ్ళు కప్పుకోలేక  కాళ్ళు ఝాడించి పక్కకి తిరిగింది సుందరమ్మ.  ఆ కదలికకి  కిటికీ చీకటిలో తల పాతేసుకున్న  ముకుందరావు ఉలిక్కిపడి భార్య వైపు చూశాడు. గుండు చేయించుకుని మఫ్లరు చుట్టుకున్న అతని మొహం కొత్తగా వుంది . రెండు సీట్లకీ మధ్య వున్న జాగాలో పదిహేడు పధ్నాలుగు ఏళ్ళున్న సుమలత, సరోజలు  పాత దుప్పటి మీద  పడుకుని నిద్రపోతున్నారు. పెద్ద పిల్ల ఒద్దికగానే పక్కకి తిరిగి పడుకున్నది గానీ, చిన్న పిల్ల ఎడాపెడా  రెండు కాళ్ళూ తలో పక్కకి నిగడదన్ని పడుకోడం వల్ల..    తడిసిన తెల్లటి పైజమా, లోన వున్న నీలం రంగు చెడ్డీ కనబడుతున్నాయి.. ఆ పిల్లకి మతి స్థిమితం సరిగా లేదు. చూడ్డానికి బలంగా, పొడుగ్గా, అందంగా కనిపిస్తున్నా, మెదడుకింకా ఆరేళ్ళ పసి ప్రాయమే వుందని డాక్టరు చెఫ్ఫాడు.. కాబట్టి అ తల్లికి రోజూ వున్న వున్న సవాలక్ష పనుల్లో  పిల్ల బట్టలు సర్దడం కూడా ఒకటి.   ఎదుటి సీట్లో భూతద్దాల కళ్ళజోడు ఒకటి ఇటే చూస్తోంది. అసహనం పెరిగిపోయిన ముకుందరావు వొంగి ఆ  పిల్ల భుజంమీద ఒక్కటి వేశాడు. తండ్రి ఎందుకలా కొట్టాడో తెలీని సరోజ తల గోక్కుంటూ ఏడుపు లంకించుకుంది.  ఆ దెబ్బ భూతద్దాలకి కూడా తగిలినట్టయి  మొహం ఇంకోవైపు తిప్పుకున్నాడు.. ఎన్నికల సీజను అవడం వల్ల రైల్లో జనాలు కిక్కిరిసి వున్నారు. టి.టి ని పట్టుకుంటే నలుగురిలో ఇద్దరికైనా  బెర్తులు దొరుకుతాయేమో గానీ,  ప్రస్తుతం ఏ పనిమీదా ముకుందరావు ఎవరి ముందూ నిలబడదల్చుకోలేదు.. అటు ఇటూ చూసి రహస్యంగా భార్య చెవిలో ఏదో చెప్పాడు. దుప్పటి ముసుగు తీసిన సుందరమ్మ గబుక్కున లేచి సూట్కేసులోవున్న కట్టుడు చీర ఒకటి తీసి   ఉమ్మడిగా కూతుళ్ళిద్దరి మీదా కప్పింది. బెర్తులో ఇరికి మళ్ళీ యధాప్రకారం ఏడుపులో మునిగిపోయింది. ఆ ఏడుపు ఏమిటో గాని, చప్పుడు లేకుండా గొతులోనే చిదిమెయ్యడం వల్ల ఒకరకం మూగజంతువు మూలుగులా  వుంది.

రైలు ఏదో స్టేషనులో ఆగింది. ముకుందరావు, సుందరమ్మ ఒకేసారి బిగుసుకుపోయారు. ప్రస్తుతం వాళ్ళు వున్న పరి్స్థితిలో  రైలు ఆగడం ఇష్టంలేదు. ఎలాగోలా ఎక్కడికో అక్కడికి ఇంటిల్లిపాదినీ మోసుకుపోయి ఈ ప్రపంచానికి దూరంగా విసిరేస్తే చాలని వుంది. కాని ప్రపంచం లేని చోటెక్కడ వుందో అది తెలీడం లేదు. ప్రయాణం మొదలుపెట్టి నాలుగు రోజులవుతోంది. ఏ రైలు ఎంతదూరం వెడుతుందో అక్కడికి టిక్కెట్టు తీసుకోవడం ఆ మూలకి వెళ్ళిపోవడం, ఇదే వారి దినచర్య.

వారం  క్రితంవరకూ వాళ్ళ జీవితాల్లో  ఈ భయం లేదు . ముకుందరావు ధైర్యంగా తలెతుకునే రోడ్లమీదే తిరిగాడు. సుందరమ్మ సందడిగా చుట్టుపక్కల అందరితో మాట్లాడుతూనే వుంది.  కూతుళ్ళిద్దరూ  ఆడుతూ పాడుతూ  స్కూలుకి వెళ్ళి వస్తూనే వున్నారు. పెళ్ళయి దూరంగా కాపురం చేసుకుంటున్న పెద్ద కూతురు అత్తింటిపోరు గురించి అప్పుడప్పుడు  ఫోన్లు చేస్తూనే వుంది. ఒకే ఒక వార్త వాళ్ళ జీవితాన్ని తలక్రిందులు చేసింది. అవాళ ఉన్నట్టుండి  వార్తలమధ్య పట్నలో చదువుతున్న వాళ్ళ పుత్రరత్నం మోహన్ కుమార్  కనిపించాడు. ఆశ్చర్యంతో  అందరూ టీ.వి ముందు మూగిపోయారు. ఏమిటా వార్త..? ఎవరో అమ్మాయివెంట పడుతున్నట్టు, చంపుతానని బెదిరిస్తున్నట్టు వుంది. మీడియా ఎదుటికి ఈడ్చుకెడుతున్న పోలీసుల చేతుల్లో జేబురుమాలు కప్పుకున్న పుత్రరత్నాన్ని దిగ్భ్రాంతితో గుర్తు పట్టారు. వెంటనే పక్కింటి ఆవిడ వచ్చేసింది. ఇదిగో మీవాడేం చేశాడో  విన్నారా?..అంటూ,  ఆ తర్వాత వెనకింటి ఆవిడ, ఆ తర్వాత కాలనీ సెక్రటరీ, అందరూ ఏదో రకంగా రక్తం విరిచేసి వెళ్ళారు..నిట్టనిలువుగా చితి అంటించిన శవంలా పొగ చూరింది ముకుందరావు మొహం.. ఇంటి తలుపులు బిగించేసింది సుందరమ్మ.  కాలేజీకి పరిగెత్తుకు వెళ్ళి ఫోలీసుల కాళ్ళావేళ్ళా పడి, ప్రిన్సిపాల్ కాళ్ళా వేళ్ళా పడి బెయిలు అడుక్కుని కొడుక్కి  నయానా భయానా బుద్ది చెప్పి  వచ్చాడు ముకుందరావు. . దెబ్బల భయం కొద్దీ మోహన్ కొన్నాళ్ళు బానే వున్నా మళ్ళీ ప్రేమ పిశాచి ఆవహించినట్టు ఆ పిల్ల వెంట పడ్డాడు. దేశం నిండా తల్లితండ్రుల్ని ఎదిరించి ఎగిరిపోయిన ప్రేమ సినిమాలే ఆడుతున్నాయి.. అవి తన పిల్లలు చూడకపోతే బావుండనుకున్నాడు. చిన్నపిల్ల సరోజతో బాధలేదు, అదష్టవశాత్తూ దాని బుర్ర ఎదగలేదు. సుమలతా , మోహన్ కుమార్ కవల పిల్లలు. సినిమాల్లో చూపించినంత విడ్డూరంగా అందర్నీ మోసం చేసేటన్ని పోలికలు వాళ్ళ మొహాల్లో గాని స్వభావాల్లో గాని ఎక్కడాలేవు. కొడుకు దూకుడు పిండం, కూతురు నిదానంగా ప్రవహించే  మందాకినిలాంటిది.

సెలవలకోసం ఇంటికొచ్చిన మోహన్ పక్కన జేరి సుందరమ్మ వాపోయింది.  ” ప్రేమ గోల మనకొద్దు  నాన్నా….అమ్మని చెబుతున్నాను విను. అక్క మొహం చూడు. నువ్వు ఈ పని చేసిన దగ్గర్నించి నీ తమ్ముడు పేపర్లోకి ఎక్కాడు చూశావా అని కాల్చుకుతింటున్నారురా. అసలే వాళ్లు రాక్షసులని నీకు తెలుసు. ఇదిగో ఎదుగుతున్న చెల్లెళ్లని చూడ్రా ఒరే, నువ్వు చదువు  మానేసినా ఫరవాలేదు, కూచోపెట్టి పోషించుకుంటాం, అమ్మాయిల వెంటపడద్దు, మా పరువు తియ్యద్దురా. ఇవేం దెబ్బలురా..నిన్ను వాళ్ళింక చంపేస్తారేమోరా….” . కొడుకుని కావలించుకుని చెప్పి చెప్పి బావురుమని ఏడ్చింది సుందరమ్మ. మోహన్ కదల్లేదు, మెదల్లేదు శిలా విగ్రహంలా కూచున్నాడు. రాత్రికి రాత్రి అందర్నీ నిద్దర్లోకి దింపి వెళ్ళిపోయాక గాని వాడు తమకి దూరంగా ఎంత “అమర పేమికుడై” పోయాడో తెలీలేదు .

ఆ వెళ్ళటం వెళ్ళటం వారం క్రితమే కేసు మళ్ళీ ఫైలు అయినట్టు  తెల్సింది. ఫోలీసులు మోహన్ వొళ్లు హూనాహూనం చేశారు. ఒక్కగానొక్క మగబిడ్డ కావడంతో పాలు  వెన్నలతో పెంచుకున్న సుందరమ్మ. వాడికి పట్టిన దుస్థితి చూసి మూర్చపోయింది.. మళ్ళీ బెయిలు తేవడానికి ముకుందరావుకి మొహమే కాదు పలుకుబడి కూడా చాలలేదు. . కడుపుతీపి కొద్దీ సుందరమ్మ దూరపు బంధువుల్లో వున్న లాయర్ల చుట్టు తిరిగి లేదనిపించుకుంది.. జైలు నించి కూడా వాడు సరాసరి ఇంటికి రాలేదు. హాస్టలులో వున్న బట్టలూ అవీ తెచ్చుకుంటానన్నాడు. ముకుందరావు అనుమానిస్తూనే వున్నాడు. కన్నతల్లి అయిన నేరానికి సుందరమ్మ నమ్మింది. అనేక సినిమాల్లో చూపించినట్టుగానే ఆ పిల్లకోసం   మోహన్ కాలేజీకి వెళ్ళాడని వేటకొడవలితో ఆ పిల్ల భుజం నరికాడని తెల్సింది.. దుష్టుడు, కీచకుడూ, అనే పేర్లతో  వాడి బొమ్మ  పేపరులో చూస్తుంటే ఏదయినా మింగి ఇంట్లో అంతా ఒకేసారి చచ్చిపోదామని అనుకున్నారు. చచ్చిఫొవడానికి ధైర్యం చాల్లేదు. ఆత్మహత్య మహా పాతకం అని గుర్తు చేసుకున్నారు. ఆ పని పోలీసులు మాత్రం ఎంతో చాకచక్యంగా చేశారు కుక్కని కాల్చినట్టు కొడుకుని కాల్చి చంపారు. అనవసరంగా ఎదురు తిరిగాడని, ఆత్మరక్షణ కోసం కాల్చామని చెప్పుకున్నారు. సానుభూతికి, సహానుభూతికి నోచని దుఖం. వాడ్ని చంపిన రోజు జనం పండగ చేసుకున్నారు. అదేమిటని అడగడానికి లెదు. ఏడవడానికి లేదు. శవాన్ని తెచ్చుకుని పూడ్చిపెట్టడానికి  లేదు.. ఒకే ఒక్క రో్జులో  ఆ కుటుంబానికున్న మానవహక్కులు, ప్రాధమిక హక్కులు అన్నీ.. అన్నీమంట కలిసిపోయాయి. కుటుంబానికి కుటుంబమే  భయంతో ఇంటిచుట్టూ తాళాలు వేసి లోన దాక్కున్నారు. ఆడపిల్లలిద్దర్నీ అసలు బైటికే రానివ్వలేదు. భయం…భయం.. నీడ కనబడితే భయం… వెలుగు పరుచుకుంటే భయం….పరువు భయం, ప్రాణభయం. ప్రజా భయం.. మానభయం…రోజుకి  ఇరవై నాలుగు సార్లు అవే దౄశ్యాలు చూసి చూసి చూసి, ఇంటిల్లిపాదీ గోడకేసి తల బాదుకున్నారు..టి.వి పెట్టె మీద పెద్ద నల్ల దుప్పటి కప్పేసినా సమస్య తీరలేదు, .  వార్తలూ, చర్చలూ పక్కింటి నుంచి వినబడుతున్నాయి.  పట్టుకోండి, నరకండి..చంపండి…కేకలు పెడుతూ ఒకరోజు  జనం ఇల్లు చుట్టుముట్టారు. ఫొలీసులే లేకపోతే నలుగురినీ అందరూ ఎప్పుడో దహనం. చేసేవారే…కొడుకు చేసిన నిర్వాకం ముందు ఇంతకాలమూ వాళ్ళు సంపాయించుకున్న మంచితనం మంటకలిసిపోయింది…. పచారీ దుకాణం వాడు అరువు ఇవ్వడం ఎప్పుడో మానేశాడు.. పాల ప్యాకెట్లూ రావడం లేదు. కరెంట్ కనెక్షను ఎందుకు తీసేశారో తెలీడం లేదు. హింస..పీడన….సొంత ఇంట్లోనే ప్రేతాత్మలాగా రాత్రులు మాత్రమే  సంచరిస్తూ పగలంతా నిశ్సబ్దంగా లోన కూచుని, , చివరికి ఒకానొక జడివానలో, ముసుగులు కప్పుకుని  రైలు ఎక్కేశారు. పారిపోవడానికి వున్న ఒకే ఒక చిన్న ఆర్ధిక వెసులుబాటు ముకుందరావు రైల్వే ఉద్యోగి కావడం, ఎంత దూరం వెళ్ళాలో, ఎన్నాళ్ళు వెళ్ళాలో తెలీదు. నిరంతరం ఒక వాహనంలో దొర్లుకుపోతూ వుండటం ఒక్కటే వాళ్ళకి గత్యంతరంగా వుంది.

రైలు మళ్ళీ ఏదో స్టేషనులో ఆగింది. ప్లాటుఫారం మీంచి చపాతీల వాసన గుప్పుమంటూ వచ్చింది.

“అమ్మా చపాతీ  కావాలి, ” పధ్నాలుగేళ్ళ పిల్ల ముద్దు ముద్దుగా అడిగింది. పెద్ద పిల్లకీ ఆకలేసినట్టుంది. అమ్మ వంక చూసింది. ఆమె దుప్పటిలో కూరుకుపోయి వుంది, నాన్నవంక చూసింది.  కిటికీలోంచి కిందికి దూకేశేలా నేలకేసి చూస్తూ  కూచున్నాడు.  మెల్లిగా లేచి  తన దగ్గరున్న చిన్నపర్సులోంచి అయిదు కాయితం తీసింది. పక్కపెట్టె కిటికీలోంచి తొంగిచూసి, రెండు చపాతీలు కొన్నది. చెల్లికొకటి ఇచ్చి, తను ఒకటి తినడం మొదలు పెట్టింది . ఆకలి వాసనకో ఏమో, వెనక్కి ముకుందరావు కూతురుకేసి చూశాడు. సుమలత  అపరాధిలా గతుక్కుమని, వెంటనే తమాయించుకుని  “చెల్లి అడిగింది నాన్నా”  అంటూ ఒక ముక్క తీసి నాన్నకి అందించింది., . ముకుందరావు తీసుకోలేదు. నువ్వే తిను- అన్నట్టుగా  సైగ చేశాదు.  ఆవురావురుమంటూ దాన్ని  సగానికి మడిచి  నోట్లో పెట్టుకుని ఆప్యాయంగా తినడం మొదలుపెట్టింది. మధ్యాన్నం పన్నెండింటికి వాళ్ళమ్మ ఇచ్చిన పులిహోర తర్వాత ఇదే  తిండి. మనం ఎక్కడి కెడుతున్నాం అనే ప్రశ్న తన భాషలో అడిగి కావలసినన్ని తన్నులు తిని వుంది సరోజ. దాని మొహమంతా జేవురించి వుంది… అదే  ప్రశ్న పెద్ద పిల్ల సుమలత మనసులో కూడా వుంది. అయినా అడగదు. ఆ మాటకొస్తే అమ్మానాన్నలకీ తెలీదని దానికి తెలుసు. . కళ్ళతోనే అన్నీ అర్ధం చేసుకుంటుంది. అందుకే దాన్ని వాళ్ళమ్మా, నాన్నలు బంగారుతల్లీ అంటారు.

సరోజ తన చపాతీ గబగబ తినేసి అక్క ఆకులోకి చూస్తోంది. సుమలత తనవాటాలో  సగం చెల్లికి త్యాగం చేసి , కడుపులో ఖాళీని మచినీళ్ళతో నింపుకుంది. ఎందుకంటే ఆ పిచ్చిది  గొడవ మొదలు పెడితే ఒక పట్టాన వూరుకోదని తెలుసు…రైలు మళ్ళి ఎక్కడో ఆగింది, అయితే అది స్టేషనులా లేదు. దొంగలెవరో గొలుసు లాగి పారిపోవడానికి ఆపినట్టున్నారు. ఆ దొంగలు అదే చోట రోజూ గొలుసు లాగుతారని, రైలు ఆగుతుందని నిశ్చయంగా తెలుసు కామోలు,  లాగుడు బండి లో ఒకడు ఆమ్లెట్లు వేస్తున్నాడు. ముకుందరావు అటే చూస్తున్నాడు. ఒక మనిషి కూచోడానికి సరిపోయేంత పెద్ద పెనమ్మీద గుడ్డు పగలకొట్టి పోశాడు. ఎడంచేత్తో మిర్చి, ఉల్లిముక్కలు చల్లాడు . పెనంతో అట్టుని నాలుగు వైపులా ఎత్తాడు. ఖాళీ అయిన డొల్లని అక్కడున్న  పొదలోకి విసిరాడు. ముకుందరావుకి కొడుకు గుర్తు వచ్చాడు. పోలీసులు తన కొడుకుని కూడా పనికి రాని కోడి గుడ్డు డొల్లని విసిరినట్టు చెట్లలోకి విసిరేశారు కదా…. . అనుకునేసరికి గుండె పగిలిపోయింది. పిల్ల అవకుండానే చిదిమేసిన గుడ్డు వెనకగా కనబడుతున్న మొండిగోడమీద  టెన్తుక్లాసు ప్రేమ సినిమా పోస్టరు ఒకటి సరికొత్తగా అతికించి వుంది.. తప్పుచేశానా..?, పదిహేడేళ్లయినా నిండకుండా బస్తీకి తరిమికొట్టాక ఎన్ని ప్రలోభాలు, మైకాలు, ఎరలు, అరలు..?  నేను వాడి కళ్ళు ఎలాగైనా గాని మూస్తే బావుండేదా..? ఎలా ముయ్యాలి. ఈ హింసకి బీజం ఎక్కడ పడిందని వెతకాలి..? ప్చ్..ఈ  ప్లాట్ ఫారమ్మీద అమ్లెట్ పోసే కుర్రాడిలా తన కొడుకు అవిటివాడయినా గాని  కళ్ళముందుండి బతికిపోయేవాడేమో…భుజమ్మీదున్న తువ్వాలు నోట్ళో కుక్కుకుని ఏడవడం మొదలు పెట్టాడు. భర్త ఏడుపు విని సుందరమ్మ లేచి కిటికీ దగ్గర కూచుంది. ముకుందరావు భార్య లేచిన చోట పడుకుని అటువైపు తిరిగాడు. . ఆకలి తీరిన సరోజ సుమలత వొళ్ళో తల పెట్టుకుని పడుకుంది. సుమలత అమ్మకీ నాన్నకీ దగ్గరగా జరిగింది. ముకుందరావు నిశ్సబ్దంగా కూతురి తలా వీపు నిమురుతున్నాడు. అనుకోకుండా మొన్న కొడుకు చేతిలో తెగిన ఆ పిల్ల భుజం గుర్తొస్తోంది . గుండె పగిలేలా రోదిస్తున్న ఆ పిల్ల తల్లి గుర్తొస్తోంది. ఓదార్చడానికి  చాపిన వందలాది చేతులు గుర్తొస్తున్నాయి. మంత్రి గారి ఓదార్పు గుర్తొస్తోంది. ఇంకో పక్క బుల్లెట్ గాయాలతో చిల్లులు  పడ్డ తన కొడుకు శరీరం కనిపిస్తోంది. ఎందుకిలా జరిగిందని అడగలేని తన నిస్సహాయత గుర్తొస్తోంది. కడుపులో వున్న పుండు పగిలిపోయేటట్టు దుప్పటికింద  కుమిలి పోతున్న సుందరమ్మ కనిపిస్తోంది. తడిసిన దూదిని పిండినట్టు కంటి రెఫ్ఫలు బిగించాడు.. . కంటిలోన ఆడుతున్న బొమ్మలు ఒక్కో బొట్టుగా  జారుతున్నాయి.

రైలు మాత్రం టటా..టట్…టటా..టట్…అనడం లేదు, పట్టుకోండి, కొట్టండి…, చంపండి…అని అరుస్తూ పరిగెడుతోంది.

–

 

 

– కొండేపూడి నిర్మల

చిత్రం: కాశిరాజు

క్షీరసాగరం

maithili

మైథిలి కి చదవటం చాలా ఇష్టం. ఇన్ని సంవత్సరాలలో ఇది నాలుగో కథ. మొదటి రెండు  కథలు 2001,2003 లలో వార్త లో వచ్చాయి.మొదటి కథ  ‘ నియతి ‘ 2001 తెలుగు యూనివర్సిటీ కథాసంకలనం లోనూ,జగతి పత్రికలోనూ , నాటా 2013 సంచికలోనూ పునర్ముద్రితమయింది. చక్కటి చదివించే శైలి ఆమె సొంతం. –వేంపల్లె షరీఫ్

***

 

 

కనుచీకట్లలో మెడికల్ హాస్టల్ కాంపస్.  ప్రవల్లిక కోసం వెతుకుతూ ఆ వెనకాల లాన్ లోకి నడిచింది ఆముక్త. అమ్మాయిలు చదువుకోవటానికి అక్కడక్కడా దీపాలూ అరుగులూ. ఏ వెలుగూ పడని ఒక మూల కూర్చుంది ప్రవల్లిక. దగ్గరగా వెళ్తే తలెత్తిచూసిందేగాని  నవ్వలేదు. అంత త్వరగా నవ్వదు ఆమె. కఠినంగా బిగిసిఉండే ముఖరేఖలు. మెల్లగా వెళ్లి పక్కన కూర్చుంది ఆముక్త.
బహుళ పాడ్యమి కాబోలు ఆ రోజు…అప్పుడే పైకిలేస్తూ ఉంది చంద్రబింబం.  పాలజలనిధిలోని తెలిపచ్చని మీగడ ముద్దకట్టి వెలుగుతూంది.

‘వల్లీ చూడు…ఎంత బావుందో ‘ …అప్రయత్నంగా అంది

. ‘ఏమిటి చూసేది…చాలాసార్లు చూశాలే…చందమామేగా. ‘

‘అది కాదు. ఏ రెండుసార్లూ ఒకేలా ఉండదు.’ మైమరపు.

‘ నీ మాటలకేంలే… వేరే ఎవరికైనా చెప్పు, నాకు కాదు.’  స్పష్టమైన తిరస్కారం.

పట్టించుకోకుండా అడిగేసింది  ‘ రేపటినుంచీ సెలవలుగా, మా ఊరు వస్తావా? ‘

‘ ఎందుకట అంత జాలి మామీద..’ చేదు ఉబికే  మాటలు.

‘ పండగ రోజుల్లో ఒక్కదానివీ ఏం చేస్తావు? మా ఇంటికి వస్తే బావుంటుందనిపించి అడిగాను. దీన్ని జాలి అనక్కర్లేదు నువ్వు ‘

కాస్త తగ్గింది ప్రవల్లిక. ‘ ఎందుకు రావాలి నేను? నేను ఉంటే ఎవరికైనా బాగుంటుందని ఎప్పుడూ అనుకోలేదే ‘ ఆముక్త జవాబు చెప్పలేదు. ‘సరేలే. వస్తాను. మంచి అమ్మాయిలా ఉండాలంటే మాత్రం నా వల్ల కాదు ‘

‘నువ్వు ఎలా ఉండగలిగితే అలాగే ఉండు. …  ‘ నవ్వేసింది.

ఎక్కడివాళ్లు అక్కడ ఆ మెడికల్ కాలేజ్ హాస్టల్ ని అప్పటికే ఖాళీ చేసేసారు. ప్రవల్లిక గడిచిన నాలుగేళ్లుగా ఎక్కడికీ వెళ్లలేదు. ఆమెకి అసలు ఎవరైనా ఉన్నారో లేదో కూడా ఎవరికీ తెలియదు. హాస్యం లేని వ్యంగ్యం ఆమె సొంతం. ఆ వెటకారానికి అడ్డూ అదుపూ ఉండవు. తన మాటలు కనపడని చోట్ల సూదులు గుచ్చినట్లుంటాయి. చెప్పకూడని నిజాలని చర్చకి పెట్టినట్లుంటాయి. ఆ బెదురుతో ఎవరూ తనకి దగ్గరగా వచ్చే సాహసమే చేయరు. ఎక్కడా పరీక్ష తప్పకుండా రాగలిగేటంత చదువుతుంది. తక్కిన సమయాల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కనిపిస్తుంది. ఏమి పాటలు వింటుందో కూడా ఎవరూ అడగరు.

పరీక్షగా చూస్తే ఆ కళ్లు బంధించబడిన జంతువువిలాగా ఉంటాయి. ఆ తీరు ఎవరూ దాడిచేయకుండా రక్షించుకుంటున్నట్లుంటుంది.

ఆముక్త  వేరు. అక్షరాలా ఆనంద కర్పూర నీరాజనం ఆమె. ఉత్సాహమూ ఊరటా రెండిటినీ ఆమె సమక్షంలో గుర్తు పట్టిన కొందరు దగ్గరే ఉంటారు. అంతుపట్టని ఇంకొందరు వెంట తిరుగుతారు

ఎవరినీ తూలి ఒక మాట అనదు. పొరపాటున ఎవరయినా అంటే దెబ్బలాడదు. కష్టపడి చదువుతుంది.. ప్రసన్నమైన ముఖం. ఆమె సౌజన్యమే సౌందర్యమనిపిస్తుంది.

ksheera1

ప్రవల్లిక సడలి మాట్లాడటం కొంతకాలం క్రితం జరిగింది. హాస్టల్ వర్కర్ భార్య రెండేళ్ల బాబుని భర్త తో వదిలేసి తన బావతో వెళ్లిపోయింది. వారిద్దరి మధ్యా ఎప్పటినుంచో సయోధ్య ఉండేది కాదు. అందుకని ఎవరూ అంతగా ఆశ్చర్యపడలేదు. తేలికగా మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారిగా గట్టిగా అరిచింది . ‘ బుద్ధిలేదా? మనిషి పుటక పుట్టలేదా? ఇష్టం లేకపోతే పిల్లాడిని ఎందుకు కన్నది? ఇంతమందిమి ఉన్నాము ఇక్కడ, ఎవరిని అడిగినా చెప్పేవాళ్లం కదా జాగ్రత్తలు …ఇప్పుడు వాడి గతి ఏమిటి? ‘ కోపం కాస్తా బాధగా మారి గొంతు బొంగురు పోయింది. చరచరా అక్కడనుంచి వెళ్లిపోయింది.ఆమెలో ఆ మెత్తదనాన్ని  ఆముక్తఒక్కటే పట్టించుకుంది. కాలేజ్ లో చేరినప్పటినుంచీ ప్రవల్లికకి దగ్గర అవుదామని ప్రయత్నిస్తూనే ఉంది ఎందుకనో… తనకి నచ్చే విషయాలని ప్రయత్నించి తెలుసుకుంది. ధైర్యం చేసి ప్రస్తావించింది. భగీరథప్రయత్నం కొంత ఫలించి ఏదయినా  అడిగితే జవాబు చెప్పే దశ వచ్చింది.

ఆ చుట్టూ కట్టుకున్న గోడ బద్దలు కొట్టి లోపల ఏముందో చూడాలని, కుతూహలం ఒక్కటే కాదు. ఏదో అక్కర . ఈ  పరిసరాల నుంచి  నాలుగురోజులు దూరం చేయాలని.ఎందుకూ అని తనను ప్రశ్నించుకుంది ఆముక్త. ‘ తన ఇల్లు తనకి ఇష్టం, ప్రవల్లికకి నచ్చుతుందనేమిటి? ‘

ఏమో తెలియదు, పిలిచింది అంతే.

ఆ వేసవికి చివరిఏడాది అయిపోతుంది. హౌస్ సర్జన్ లుగా అంత తీరుబాటు ఉండదు. పోస్ట్ గ్రాడ్యుయేట్  ఎంట్రన్స్ కి చదువుకోవాలి పనిచేస్తూనే. . మళ్లీ కుదురుతుందో లేదో..!

తండ్రి స్టేషన్ లోఎదురు చూస్తున్నాడు.  .. కాస్త సన్నగా దృఢంగా పొడుగ్గా హరిచందనపుతరువు  లాగా ఉన్నాడు ఆయన.   వాత్సల్యం చిందేలా నవ్వి ఆముక్తని దగ్గరకి తీసుకుని ప్రవల్లిక  చేయి పట్టుకున్నాడు . ఆ పెద్ద అరచేతిలో ఆమె చేయి ఇమిడిపోయింది, సుభద్రంగా ఉన్న స్పర్శ.

ఒక మోస్తరు పట్టణం అది.ఊరు దాటుతూనే ఇంకొక ఊరు పేరు వచ్చేసింది. జనసాంద్రత ఎక్కువ అంటే ఇదేనేమో … ఈ కొత్తఊరికి కాస్త పల్లెటూరి వాలకం ఉంది.

ఆ దారిలోంచి ఒకవైపుకి తిరిగి పెద్ద ప్రాంగణం లోకి వెళ్లారు. . డా. ఎస్.టి.పి. కులశేఖర్ ఎం.డి. అని బోర్డ్. కిటకిటలాడుతూ పల్లె జనం.

అంతా హాస్పిటల్ వాతావరణం.

దాటివెళ్తే ఇంకొక ఆవరణ. ఆలోపల వింతగా కనిపించే వాళ్ల ఇల్లు…విశాలమైన ఉద్యానం మధ్యని. కాస్త దూరంగా తులసివనం.

వాకిట్లో చుట్టూ బంతిపూలు. అరచేయి అంత పెద్దపూలు విరగబూసి గుమిగూడి ఆకులే కనిపించటం లేదు. దగ్గరికి వెళ్లి ఒక పూవులోకి ముఖం వంచింది ఆముక్త , ముద్దుపెట్టుకుంటోందా అనిపించేలా.

‘ బంతిపూలకి  మంచి వాసన ఉంటుంది తెలుసా .. ‘

ఆ ఇల్లు ఇంచుమించు గుండ్రంగా ఉంది.చుట్టూ వరండా  .  ఒక వైపుకి వాలిన మంగళూరు పెంకుల కప్పు.గోడలంతా టెరకోటా.

లోపలికి అడుగు పెడుతూనే అగరు  పరిమళం  హాయిగా ఉంది ముంగిటిలోనే పెద్ద వర్ణచిత్రం. ఒక పెద్ద దేవాలయ గోపురం  పైన నిలబడి ఏదో చెబుతున్న యతీంద్రుడు. నొసట  ఊర్ధ్వపుండ్రాలు, ముఖంలో జాలువారుతూన్న కరుణ. చేతులు జోడించి వింటున్న జనం .

తక్కిన అన్ని వైపులా పెద్దవీ చిన్నవీ పెద్దవీ తైలవర్ణచిత్రాలూ నీటిరంగులవీ. కొన్నిచోట్ల చక్కటి  చట్రాలలో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి, ఇంకొన్నినమ్రంగా  ఒదిగిపోయాయి. గులాబీరంగు గోడలు, పాలపిట్ట వన్నె  పరదాలు.

‘ నాన్న పెయింట్ చేస్తారు ‘

“ఆరా” లని గుర్తుపట్టగలవారికి అక్కడ కెంపుజలతారు వంటి,  ఇంద్ర  నీలాకాశం వంటి,మెత్తగా మెరిసిపోయే  నెమలికంఠం వంటి కాంతివలయాలు కనిపిస్తాయేమో.

ఆ తర్వాతిరోజులలో  ప్రవల్లిక అనుకునేది, ఆ ఇల్లు చేతులు చాచి తనని పిలిచిందని.

.తల్లి మొహం ఇంత చేసుకుని ఎదురువచ్చింది. ‘ రండి, రండి! ‘  చాలా చక్కగా ఉంది ఆమె. ఆముక్త  కి అమ్మా నాన్నా ఇద్దరి పోలికలూ రానట్లుంది.

.’ పాలా? ఇష్టం లేదు ‘ ముఖం చిట్లించింది.

‘ ఒకసారి రుచిచూడు ‘

పచ్చకర్పూరం, కలకండ వేసి కాచిన పాలు..ఒక్క గుక్క తాగాక మొహమాటానికయినా ఆపాలనిపించలేదు … తెలియకుండానే మనసు చల్లబడింది.

ఆ ఇంట్లో కొన్ని చోట్ల  దీపాలు లేకుండానే వెలుతురు,ఇంకొన్ని  చోట్ల ఫాన్లు తిరగకుండానే వీస్తున్న గాలి అలలు.

‘ మయసభలా ఉంది మీ ఇల్లు ‘ ఆ వెటకారంలో వంకర లేదు.

‘ అవును, అలాంటిదే. లారీ బేకర్ అనే ఆర్కిటెక్ట్ పేరు వినేఉంటావు. వీలైనంతగా ప్రకృతికి దగ్గరగా ఉండటం ఆయన ఉద్దేశ్యం. అలా కట్టటం లో ఖర్చు కూడా తక్కువని చెప్పేవారు .కేరళలో చాలా కట్టారు  ఇలాంటివి. నాన్న విని వెతుక్కుంటూ వెళ్లి పరిచయం చేసుకుని ఒప్పించారట , అప్పటికే ఆయన పెద్దవారయిపోయారు . ‘

మనుషులు ఇలా కూడా ఉంటారా? నమ్మబుద్ధి కాలేదు .

తనకి ఒక చిన్న గది ఇచ్చారొక చివరన. పసుపురంగు  గోడలు, చిన్న పసుపుపూలు ఉన్న దుప్పటి మంచం మీద. ఇక్కడి పాశ్చాత్యచిత్రంలో నిశ్చింతగా  ఆడుకుంటున్న అక్కాచెల్లెళ్లు.

స్నానం చేసి వచ్చేటప్పటికి వంటగదిలోనుంచి అంతుపట్టని సువాసనలు  ..

తను ఎన్నడూ తినని పదార్ధాలే అన్నీ.  ఎర్రగా వేయించిన పల్చటి  దొండకాయ ముక్కలు, చారులో  ఇంగువ వాసన వేసే పోపు . మెంతిపిండి వేసిన మామిడిముక్కల పచ్చడి.. ఆశ్చర్యకరంగా సయించకపోవటమేమీ లేకపోగా ఇంకాస్త ఆకలి పెరిగిందేమో కూడా.

ఒక మూల ఎక్కడో టి.వి. కనపడింది. దాన్ని ఆన్ చేసే ధోరణిలో ఎవరూ లేరు. పొందికగా అందమయిన బట్ట కప్పి ఉంది.’  ఏమిటి చేస్తారు వీళ్లు నిద్రపోయేలోపు? ‘ ప్రవల్లిక సందేహం.

సమాధానంగా తంబురా తీసుకు వచ్చింది ఆముక్త .

‘ అమ్మ బాగా పాడుతుంది . సంగీతం ఇష్టమేకదా నీకు, ఎప్పుడూ వింటూనే కనిపిస్తావు ! కాసేపు పాడుకుంటాము, ఉంటావా ?…’

‘ ఉండనీ. ‘ మందలింపుగా నవ్వింది  వసంత.

శృతిచేసుకొని  పాడటం ప్రారంభించింది. ఆమె గొంతులో ఒదుగు ప్రత్యేకంగా ఉంది.. ఆర్ద్రంగా, లోలోపలినుంచి సరాసరి భగవంతుడికే పాడుతున్నట్లు. ముక్త గొంతు కలిపింది. సింధుభైరవి రాగం అది. విషాదం, వేదన…అంతలోనే ఉపశమనం వినేవారికి. అన్నిటికీ తానూ లోనయి లీనమై ఉండిపోయింది  ప్రవల్లిక.  కులశేఖర్ వాలు కుర్చీలో కళ్లు మూసుకొని వింటున్నాడు. తాను దారితప్పి ఏపాత పుస్తకం  లోకో దూరిపోయానా అనుకుంది . .. ప్రవల్లిక వింటూనేఉంది.

ksheera2

తొందరగా నిద్రపోయారు అందరూ. తెరచి ఉన్న కిటికీ లలోంచి తోట లోపలి పూల గాలి. ఎప్పుడూ వినే భారలోహ సంగీతం కాకుండా ఏదో మూడ్ లో డౌన్ లోడ్  చేసుకున్న  బ్రాహం  లల్లబీ ని వింటూ నిద్రని కనుగొన్నది ఆమె.

పెందలాడే నిద్రపోయిందేమో, ఒక రాత్రి వేళ మెలకువ వచ్చేసింది. గడియారం  చూస్తే నాలుగయింది.  ఎక్కడినుంచో సన్నగా ఏదో అంటున్నట్లు  వినిపిస్తోంది. మెల్లగా ఆ ధ్వనినిబట్టి, కర్పూరపు సుగంధం జాడను బట్టి  వెళ్తే అక్కడ పూజ గది. కులశేఖర్  ఎర్రటి పట్టుధోవతి కట్టుకుని ఉత్తరీయం కప్పుకుని   నెమ్మదిగా చదువుకుంటున్నాడు. అది సంస్కృతమూ తెలుగూ అయితే కాదు.చేత్తో చిన్న గంటని మోగించి హారతి ఇచ్చి పక్కనపెడుతూ వెనక్కి తిరిగాడు.వెడల్పుగా ఇంత పొడవున తెల్లని రెండు నామాల మధ్య సిందూరవర్ణపు నామం, కింద చిన్న పాదం. నిద్రకళ్లేసుకుని  చూస్తున్న ఆమెని  చూస్తే ముద్దొచ్చి నవ్వాడు. బదులుగా  కాస్త నవ్వేసి వెళ్లి పడుకుంది.

తెల్లారి  బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గర క్లినిక్ కి వెళ్లే డాక్టర్ దుస్తులలోనే కనిపించాడు.కడిగిన ముఖం మీద నిలువుబొట్టు లీలగా కనిపిస్తోంది. వసంత మెత్తటి ఇడ్లీలతో కొబ్బరిపచ్చడి వడ్డించింది.

‘ ఆగు. ముందు ఇది తిను ‘

కిచిడీ లాంటిదేదో పెట్టారు ప్లేట్ లో.

‘ పప్పుపొంగలి. నాన్న ధనుర్మాసం చేస్తారుగా, ప్రసాదం తయారు చేశారు. .భలే ఉంటుంది. ‘

వసంత నవ్వుతూ అంది ‘ఎందుకు బావుండదూ, బోలెడు నెయ్యి పోస్తే !’

పరాచికానికేమిగాని దివ్యంగా ఉంది పొంగలి.

‘మీ ఇళ్లలో మగవాళ్లు వంట చేస్తారా ?’

‘ఇప్పటిసంగతేమో కాని, ఒకప్పుడు మగవాళ్లకి వంట రావటం తప్పనిసరి.’

‘ధనుర్మాసం అంటే?’

‘మార్గశిరం, పుష్యమాసం రెండింటిలోని 30 రోజులని కలిపి అలా అంటారు. బ్రాహ్మీ ముహూర్తం లో తిరుప్పావై చదువుతారు. నైవేద్యాలు పెడతారు.’

‘ అంటే తమిళమా, మీ నాన్నగారు చదివింది?అర్థమవుతుందా? ’

‘ కొన్నాళ్లు పాఠం చెప్పించుకున్నారు తెలిసినవారితో. తెలుగులో కృష్ణశాస్త్రి గారూ ఇంకొందరూ అనువదించారు కదా. ’

‘ మరి హాయిగా తెలుగులోనే చదువుకోవచ్చు కదా ? ’

‘వల్లీ అది దివ్యప్రబంధంలో భాగం.ఆండాళ్ నోటివెంట వచ్చిన మాటలని అలా  పైకి తలచుకోవటమే  విష్ణుప్రీతికరమని అనుకుంటారు. ఆమె ధరించి ఇచ్చిన మాలలని తప్ప ఇష్టపడని వాడు కదా ఆయన!

ఈ శ్రీవైష్ణవ పద్ధతిలో శ్రీ ని అర్చించకుండా విష్ణువు ని పూజించకూడదంటారు. ఆ తల్లి మన ఆర్తీ యోగ్యతా చూసి తండ్రితో చెప్తుందని.

ఆ బొమ్మ చూశావు కదా…నాన్నే వేశారు. ఆయన భగవద్రామానుజులు. గురువు ఆయనకి మంత్రోపదేశం చేసి , “తరింపజేసే ద్వయమంత్రం ఇది. రహస్యం సుమా, ఎవరికయినా చెప్పావా నరకానికి పోగలవు.” అన్నారట. చరచరా వెళ్లి గోపురం  పైకి ఎక్కి అక్కడ ఉన్న జనమందరికీ బహిరంగంగా ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉపదేశించారు రామానుజులు. ఇందరు జీవులు తరిస్తూ ఉండగా నేనొక్కడినీ నరకానికి పోతే ఏమనుకున్నారట. దైవాన్ని అంతమందికీ దగ్గర చేశారు. ఆయన గతించాక, కాలం గడిచాక, విశాలమైన ఆ సంప్రదాయం కుంచించుకుపోయింది.’

ఆ ఇంట్లో వారం రోజులు నిర్విచారంగా   కదలిపోయాయి…అది నిజమయిన సంతోష చంద్రశాల. పుస్తకాలు రెండు భాషల్లోవీ కలిపి  ఒక పాటి గ్రంథాలయం అనదగినన్ని ఉన్నాయి. కర్ణాటకమూ, పాశ్చాత్య శాస్త్రీయమూ,   హిందూస్తానీ మూడు పద్ధతులలోనూ సంగీతసరస్వతి కొలువై ఉంది. . ఎక్కడయినా మొదలుపెడితే నెలలు నెలలు గడిచిపోయేలా  ఉన్నాయి. ప్రవల్లిక లోని సున్నితత్వం మెల్లగా కళ్లు తెరిచి గమనించింది అంతా.

కులశేఖర్ మాటకారి, హాస్యప్రియుడు. అతని సమక్షంలో ఎప్పుడూ నవ్వనంతగా నవ్వింది .  వసంత సౌమ్యురాలు, ఆలోచించి మాట్లాడే స్వభావం. ఎందుకో ఆమెతో ఎప్పుడూ మాట్లాడనంతగా మాట్లాడింది. ఎవరూ తనని ఇబ్బంది పెట్టే ఏ ప్రశ్నా వేయలేదని ఆ తర్వాత అర్థమయింది. తమలో ఒకదానిలాగ సహజంగా ప్రేమించారు ,  తిరిగి ప్రేమించకుండా నిలవలేకపోయింది.

పూసిన పున్నాగ చెట్టుకింద కూర్చున్న  ఒక మధ్యాహ్నం అంది .  ‘ ఆంటీ అంకుల్  అసలు పోట్లాడుకోరా? ఆంటీ చదువుకున్నట్లున్నారు కదా, ఉద్యోగం చేయనందుకు బాధ పడరా? ‘

‘వీళ్ల పెళ్లి పెద్దవాళ్లు చేశారా ప్రేమ పెళ్లా?’

‘  రెండూ అవును, రెండూ కాదు.దూరపు బంధుత్వం, దగ్గరి స్నేహం ఉందట  కుటుంబాల మధ్య .పోట్లాడుకునే ఉండి ఉంటారు, కాకపోతే నేను చూడలేదు ఎప్పుడూ. అమ్మ తెలుగు, ఇంగ్లీష్ రెండిట్లో మాస్టర్స్ చేసింది. ఉద్యోగం? ఏమో, తెలియదు మరి ‘

వసంతనే అడిగేసింది .

‘ ఉద్యోగం చేసే తీరాలని పట్టుదల లేదమ్మా . చేయకపోతే ఏమిటంటావు? ‘  సింపుల్ గా అడిగింది. ప్రవల్లిక తబ్బిబ్బయింది. నవ్వుతూ అంది వసంత ‘ ఎవరి ప్రాధాన్యతలని వారే నిర్ణయించుకోవాలనే కదా అంటున్నారు? నా జీవితం ఎవరి కొలమానాల ప్రకారమో గడవాలని అనుకోను నేను ‘  ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదీ స్త్రీత్వపు ఒక పార్శ్వ్యమేనేమోనని ప్రవల్లిక  అనుకోవలసి వచ్చింది.

ఒక చల్లటి సాయంకాలం వ్యాహ్యాళికి  వెళ్లారు.

ఆ దారి వెంట నడవటం  సుఖంగా ఉంది. దీవిస్తూన్నట్లు వంగిన మోదుగ  చెట్లమధ్యలోనుంచి రాలి పడిన ఆకులని రేపుతూ వీచే గాలి.

‘ మా స్కూల్ ఇక్కడే ‘

అక్కడా అక్కడా కట్టడాలు . ఎప్పటినుంచో పెరుగుతున్న బలమైన వృక్షాలు.

ఆ స్కూల్ లో వేరే  రాష్ట్రాలనుంచి వచ్చిన ఉపాధ్యాయులూ విద్యార్థులూ కూడా ఉంటారు. వేసవి లో తప్ప వూళ్లకి వెళ్లరు. ఇద్దరు టీచర్ లు కనిపించారు. ఆప్యాయంగా మాట్లాడారు. హాస్టల్ పిల్లలు చుట్టూ మూగారు. అప్పటి ప్రైమరీ   స్కూల్ పిల్లలు ఇప్పుడు పది, పదకొండు క్లాస్ లు చదువుతున్నారట. ఆయాలు, వాచ్ మన్ అందరూ ఇష్టంగా, చనువుగా పలకరించారు.

వెనకవైపున సరిహద్దు ఏమీ ఉన్నట్లు లేదు.జీడిమామిడి తోట అక్కడ.

‘ ఎవరిదో ఈ తోట?

‘మనదే, ఇష్టఫడటం చాలదూ సొంతం అవటానికి? ‘

ఈ లాజిక్ ఎంతమాత్రమూ అర్థం కాలేదు ప్రవల్లికకి.

ఎంతో అందమైన గుబుర్లు, క్రిందికి వాలిన కొమ్మలు.పువ్వులూ పళ్లూ లేకుండానే శోభాయమానంగా ఉన్న చెట్లు.ఆ నీడ లోకి కదలటం వృక్షపు కౌగిలిలోకి వెళ్లటం లాగా ఉంది. ఉండి ఉండి దూరం నుంచి వినపడే పిట్టల అరుపులు తప్ప ఎక్కడా ఏ శబ్దమూ లేదు, వాళ్లూ మాట్లాడుకోలేదు.  మార్మికమైన శాంతి ఏదో వెన్నెలలా పరచుకుంది. కథలలో రాసినట్లు రెండులోకాల మధ్యని సరిహద్దులాగా ఉంది, అక్కడనుంచి ఏ దేవలోకం  అడుగు పెట్టవచ్చునన్నట్లు. లోలోపలి ముడులేవో విడివడి  విప్పారుతూన్నట్లు.

చాలాసేపటికి వెనుదిరిగారు.

కాస్త తడిసిన కళ్లతో, గొంతుతో అంది , ‘ ఎంత అదృష్టవంతురాలివి ముక్తా. నీ ప్రపంచం ఇంత బావుంది! అన్నీ, అన్నీ.. ఉన్నాయి నీకు. నువ్వు ఎవరికీ అక్కర్లేకపోవటాన్ని ఊహించగలవా? నేనంతే, ఎవరూ లేరు నాకు. నా పుట్టుకే కోరుకోలేదెవరూ! అందుకు ఉంటాను ఇలాగ, నా మీద జాలి పడకూడదు ఎవరూ. భయపడాలి,పారిపోవాలి. నా మాటలే , వెక్కిరింతలే నా రక్ష, నా కవచం. ఎందుకు దాన్ని బద్దలు కొట్టాలని చూస్తున్నావు? మళ్లీ గాయపడిపోతాను, నువ్వుంటావా కాపాడటానికి ‘

‘ ఉంటాను, ఎందుకు ఉండను? నేనెవరికీ అక్కర్లేకపోవటం నాకెందుకు తెలియదు, చాలా బాగా తెలుసు. నమ్మవు కదూ? ఈ అమ్మా నాన్నా పెంచుకున్నారు నన్ను ‘

‘ ఆ. అయితే ఏమి? ఆ తర్వాత బావున్నావు కదా! నన్ను చూడు- ఇరవై ఏళ్లొచ్చాయి, నేను చచ్చిపోతే ఏడ్చేవాళ్లు లేరు తెలుసా! ‘

‘ష్..అలా అనకు.నువ్వు తలుపులన్నీ మూసేసుకుని ఊపిరి ఆడటం లేదంటున్నావు ‘

‘ మూశాను, లోకం మాటలు వినలేక! ‘

‘ మమ్మీకీ డాడీ కి  పెద్దవాళ్లే పెళ్లి చేశారు. మమ్మీకి ఇష్టంలేదట,  మరి ముందే ఎందుకు చెప్పలేదో తెలియదు. ఆమె అయిష్టం డాడీ కీ తెలిసిపోయింది. కలిసి ఎందుకు ఉన్నారో ! ఒకరిమీద ఒకరికి ద్వేషం, అయినా నేను పుట్టాను. తలచుకుంటే సిగ్గుగా ఉంటుంది . నా పేరు పెట్టటంలో మాత్రం ఇద్దరూ ఏకీభవించారట…వాళ్లకే అర్థమయిఉండదు నా పుట్టుక. కాస్త ఊహ వచ్చినప్పటినుంచీ ఆ ఇల్లు నరకానికి చిరునామా. మమ్మీ తన ప్రేమికుడితో వెళ్లిపోయేటప్పటికి నాకు ఎనిమిదేళ్లు. అంతకుముందు కూడా వాళ్లు కలుసుకుంటూనే ఉండేవారని తర్వాత తెలిసింది. డాడీ విపరీతంగా డిస్టర్బ్   అయాడు ఆమె వెళ్లటం వల్ల. అహం దెబ్బతినటం, సొసైటీ  లో తలవంపులు దానికి కారణాలేమో…మిస్ అయేటంత ప్రేమ వాళ్ల మధ్యన లేదు. రాను రాను డాడీ తన ఇష్టం వచ్చినట్లు బతకటం మొదలు పెట్టాడు. అలాంటి పరిస్థితులలో నేను తనతో ఉండకూడదని తనకే తోచిందో, ఎవరయినా చెప్పారో మరి, ఊటీ లవ్ డేల్ లో  వేశారు నన్ను. మంచి వాతావరణం, గొప్ప చరిత్ర ఉన్న స్కూల్ కదా అది. బా గానే ఉండేది. సెలవులలో  డాడీ వచ్చి చూసేవాడు…ఆ తర్వాత మమ్మీ కూడా వచ్చింది. నన్ను వదిలేసి వెళ్లినందుకు గిల్ట్ లాంటిదేమీ లేదేమో…చాలా మామూలుగా, రోజూ చూస్తున్నట్లుగానే మాట్లాడింది. నాకు రోషం, బాధ, కోపం…చివరికి ఒక ద్వేషం. తను ఎవరితో ఉండాలని వెళ్లిందో అలా ఎన్నో రోజులు లేదు. ఆ తర్వాత ఇంకొకరు, వేరొకరు. డాడీ,   మమ్మీ ఇద్దరికీ అంతే. ఆ కొత్త కొత్త స్నేహితులతో నాకు ఎలా ఉండాలో తెలిసేదే కాదు. కొందరు కొంత నచ్చేవారు, ఇంకొందరిని చూస్తే వెలపరంగా అనిపించేది.. నేను ఎవరికీ చెందను అని మాత్రం తెలిసింది. పేరెంట్స్ తో సహా అందరూ నా మీద చూపించింది ఛారిటీ  నే. చాలా ఏళ్లకి డాడీ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. డాడీ భార్యకీ నాకూ హేట్ ఎట్ ఫస్ట్ సైట్. బహుశా ఆమె ఇన్ సెక్యూరిటీ తోనేమో, డాడీ యు.ఎస్. వెళ్లిపోయాడు. మమ్మీ ఆ మధ్యే ఒక ఆశ్రమం లో చేరింది. తనని తాను తెలుసుకుంటుందట, నన్నూ రమ్మని. చచ్చినా రానన్నాను. అదీ కథ అమ్మాయీ, నాకు నేనే, ఏక్  నిరంజన్ ‘ తెలిసిపోయే ఉద్వేగం ఏదీ లేకుండా చెప్పుకొచ్చింది ప్రవల్లిక… ఆ వెనక  నిర్వేదం అలా స్పష్టమయిపోయింది.

‘ ఇదంతా , ఈ ఆలోచించటం- సబబుగానే ఉందా? ఆ తల్లిదండ్రుల ఇబ్బందులూ వారి వైపునుంచి వాదనలూ ఉంటాయి కదా?  ‘  సందేహం ఆముక్తకి. పైకి ఏమీ అనలేదు, బాధో, ఇంకా పైదో…పడినది ప్రవల్లిక గనుక.

‘ ఎందుకు నీకిదంతా చెప్పేస్తున్నానో! తర్వాత నన్ను నేను తిట్టుకుటానేమో , నీముందు బయటపడిపోయినందుకు! ‘

‘ ఊహూ.నేను అలా అనుకోను.చాలా దూరం నడిచాము, మనసులో బరువు దించుకున్నావు..అలిసిపోయి నిద్రపోతావనుకుంటున్నాను ‘

‘ నువ్వు ఇలాగే అంటావు,ఇలాగే ఉంటావు! ఎలాగో నాకు తెలీదు! ‘

‘ ఏముంది వల్లీ ! నాకు జరిగిన మంచిని ప్రతిదినమూ పండగ చేసుకుంటూనే ఉంటాను, ఎక్కడికీ మొహం మొత్తనిదే..’ నవ్వింది .

‘ నా అసలు పేరు చెప్పనా? మా నాయనమ్మ పేరు పెట్టారట. పరవస్తు చూడికుడుత్తమ్మ.’

‘ఈ ఇంటిపేరు ఎక్కడో విన్నట్లుందే ‘

‘ ఆ.గొప్పపండితుడు చిన్నయసూరి   గారి ఇంటి పేరు. నాకు తెలిసి మా వాళ్లెవరూ పండితులు కాదుగదా, పదో తరగతి కూడా పాసవలేదు.జరుగుబాటే కష్టమయిన కుటంబం మాది.చాత్తాద వైష్ణవులం మేము.’

‘ అంటే? బ్రాహ్మలు కారా ? ‘

‘ . ఊహూ.సాతాని వాళ్లంటారు కదా, అది మేము. ఎ ప్పుడో మధ్యయుగాలలో తీసుకున్న వైష్ణవ మతం. కాయగూరలు కానిదేదో తిన్నట్లే జ్ఞాపకం ‘

‘ నాకు నాలుగేళ్లున్నప్పుడు నాన్నకి హెచ్.ఐ. వి. ఉందని తెలిసిందట. సింగరేణిలో పనిచేసేవాడట , మంచివాడేనంటారు.ఆయన నీతీనియమాలని నేను ఎంచలేను కదా. అవమానం, నిరాశ. అమ్మతో సహా ఆత్మహత్యచేసుకున్నాడు. తాత అప్పటికే పెద్దవాడయిపోయాడు, ఆరోగ్యమూ బావుండేది కాదు. బాబాయిలకి ఇష్టం లేదు నేను ఉండటం, ఆజబ్బు నాకూ ఉందనుకునేవారో ఏమో. ఒకసారి తాతకి జబ్బు చేసి సింగరేణి హాస్పిటల్ లో చేరాడు. నాన్న అప్పుడు అక్కడ పనిచేసేవారు. నన్ను చూసి, నా పరిస్థితి  తెలిసి పెంచుకుంటానని అడిగారు, వాళ్లకి సంతానం కలగరని . తాత ముందు సంకోచించాడట.నాన్న  నచ్చజెప్పి తెచ్చుకున్నారు.ఏ పుణ్యం నన్ను వాళ్ల చేతుల్లో పడేసిందో ! అక్కడ ఉద్యోగం వదిలి ఇక్కడికి ప్రాక్టీస్ చేయటం కోసం వచ్చేశారు. ఇక్కడి తాతగారు అప్పటికి బ్రతికి ఉన్నారు, అభ్యంతరం చెప్పారు. నాన్న ప్రమాణాలు చూపించారు. బంధువులు ఎవరూ సమాధానపడలేదు. ఆ ఊరు మనం దిగిన స్టేషన్ కి అటువైపు ఉంటుంది.అంతా శ్రీవైష్ణవ  కుటుంబాలే ఎప్పటినుంచో. అక్కడ తనకి ఉన్నదేదో అమ్మేసి ఈ వైపుకి వచ్చేశారు నాన్న.. ఇంటినీ లోపలి సౌందర్యాన్నీ నిర్మించుకున్నారు. అమ్మ ఈ తోటనంతా పెంచింది.

శాస్త్రోక్తంగానూ, చట్టబద్ధం గానూ కూడా దత్తత చేసుకున్నారు.చూడికుడుత్తమ్మని ఆముక్తమాల్యద గా మార్చారు. రెండూ గోదాదేవి పేర్లే, అర్థం ఒకటే. సాహిత్యం చదివించారు, సంగీతం నేర్పించారు.  . వైష్ణవుల ఇళ్లలో సంగీతం ఎక్కువే ఉంటుంది. …అమ్మకి శ్రీరంగం గోపాలరత్నం గారు పెద్దమ్మ అవుతారట. మేమూ భజన కీర్తనలు పాడుకునేవాళ్లమే కదా, నేర్చేసుకున్నాను.

మెడిసిన్ లో సీట్ శ్రీమత్ తిరుమల పెద్దింట్ల ఆముక్తమాల్యద గానే వచ్చింది. ‘

అడగని సందేహానికి జవాబిచ్చింది.

‘ నాన్న  రోజుకి యాభయి , అరవై మందిని చూస్తారు. ఫీ యాభయి రూపాయలు. ఒకసారి ఇస్తే నెలవరకూ సరిపోతుంది. పరీక్ష చెశాక  ఆ డబ్బూ వెనక్కి ఇచ్చేస్తూ ఉంటారు కొంతమందికి.  అయినా కొత్తవాళ్లు వస్తూనే ఉంటారు. పేషంట్లు టెస్ట్  లు చేయించమన్నా  అవసరం లేనివి రాయరు. మందులూ అంతే. ఇందులోనుంచే అన్ని ఖర్చులూ!

‘ సరిపోతుందా మరి? ‘

‘ సరిపోవటానికి అంతు ఎక్కడుంటుంది ! నాన్న గుంటూరు స్టూడెంట్. అప్పట్లో  మహానుభావుడయిన సర్జన్ ఒకాయన ఉండేవారట శర్మ గారని. ఆయన అనేవారట ,  ఎనిమిది వేలు చాలక  పోతే ఎనభై  వేలూ చాలవు అని. ఆయన నాన్న కి, ఇంకా చాలామందికి  ఆదర్శమూర్తి. అత్యవసరమయితే ఏదో కొంత ఉందనుకుంటాను బాంక్ లో. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది మా ముగ్గురికీ ‘

‘  చాలామంది చదువుల కి సాయం  చేశారు, ఇంకా చేస్తూ ఉన్నారు..  విద్యలో, వైద్యంతో  సహాయపడటం  తప్పనిసరి అని అనుకుంటారు, ఆ పరిధిని తనకి గీసుకున్నారు.

జీవనం  సుఖంగా   సౌకర్యంగా  కొనసాగటానికి కొన్ని లెక్కలు సరిగ్గా వేయాలి, చేయాలి. ఆ తర్వాత అంతా వెసులుబాటే కదా ’

అవును, ఆ వెసులుబాటు అంతటా కనిపిస్తూనే ఉంది.  కాలం  ఇక్కడ తీరికగా ఆగినట్లుంది.

పూర్తిగా ఊపిరి ఆడుతున్నట్లుంది.

భోగి పండగ నాడు  ఆ ముక్త ఊదా రంగు  పట్టు చీర కట్టుకుంది. వంగపూవు రంగులో  అందమైన  సల్వార్ కమీజ్ ఇచ్చారు ప్రవల్లికకి. ఆ దుస్తులలో, ఆ ముక్త వెంట బడి  చేసిన అలంకారంలోతనని తాను  అద్దంలో చూసుకుంది, ఆశ్చర్యపడింది. తను కూడా బావుంటానని ఏనాడూ అనుకోనేలేదు.

భోగి పండగ రోజునే  ధనుర్మాసం ఆఖరట. కాస్త దూరంలో  కొండమీద ఉన్న అందమైన గుడికి వెళ్లారు. గోకుల పారిజాతగిరి అట అది, ఆ పేరే  కవిత్వంలాగా ఉంది. ! చాలా శాంతంగా ఉన్న పరిసరాలు. చుట్టూ ఒకే రకపు చెట్లు.

‘ ఏమిటి ఇవి? ‘

‘ పొగడచెట్లు. వకుళ అంటారు సంస్కృతంలో. శ్రీనివాసుడి తల్లి ఆమె. అందుకు ఇవి చాలా ప్రియం ఈ  దేవుడికి.’

వేయి తల్లిదనాలు రాశిపోసినంత సౌరభం  ఆపూలకి.

రాలిన పూలు గుప్పెళ్లనిండుగా ఏరుకున్నారు. ఆ కొండగాలి, ఆ శీతాకాలం, ప్రదోష వేళ ఆలయంలో వెలిగించిన దీపాలు…లోకాతీతం గా ఉంది.

తిరిగి వెళ్తూన్నప్పుడు

‘ ఇక్కడికే రా. మళ్లీ మళ్లీ రా. చదువు అయిపోయాక వచ్చేసి ఉండిపో ‘

ఆముక్త ఒక్కతే అలా అనుకుంటే సరిపోతుందా?  ..

బదులు చెప్పలేదు .

ఆ మరుసటిరోజున తిరిగి వెళ్లాలి. వసంతా కులశేఖర్ ఇద్దరూ కలిసి వచ్చేశారు ప్రవల్లిక బట్టలు సర్దుకుంటూ ఉంటే.

‘ మళ్లీ ఎప్పుడొస్తావమ్మా? ‘

కేవలం మర్యాదకి అడిగినట్లుగా లేదు…

‘ వస్తానండీ, వీలు చూసుకుని ‘

‘ అది కాదమ్మా. .’  సంకోచిస్తున్నాడు ఆయన.

వసంత అడిగేసింది ‘ నువ్వు..ఏమీ అనుకోకపోతే ప్రతి సెలవలకీ ఇక్కడికి వచ్చేయి… ‘.

ఆయన మొహమాటంగా అన్నాడు, ‘ తర్వాత కూడా…నేనూ పెద్దవాడినయిపోతున్నాను కదా, నాకు తోడుంటావా, ఆముక్తతోబాటు ?

బదులు చెప్పటానికి గొంతుకేదో  అడ్డుపడింది ప్రవల్లికకి.

‘ వస్తాను ‘

తెచ్చుకున్న పొగడపూలని సూట్ కేస్ లో దాచింది. ఆ పరిమళం చాలాకాలం అలాగే  ఉండిపోతుందట. దివ్యలక్షణం వాటిది, ఆ ఇంటిది !

— మైథిలి అబ్బరాజు

 

 

 

జొరం

venkatakrishna 

కవి , కథకుడు జి. వెంకట కృష్ణ తొలి కథ “పామును మి౦గిన కప్ప“1994 లో ఆ౦ధ్రప్రభ లో అచ్చయ్యి౦ది . ఇప్పటివరకు వెంకట కృష్ణ 45 కథలు రాసారు.
రె౦డు కథా స౦కలనాలు : గరుడ స్త౦భ౦ (2005 లో) , చిలుకకలు వాలిన చెట్టు (2010) మూడు కవిత్వ సంకలనాలు వచ్చాయి. ఒకటి దీర్ఘ కవిత గా వచ్చింది. వెంకట కృష్ణ పుట్టినదిఅన౦తపుర౦ జిల్లా, వుద్యోగరీత్యా సహకార శాఖలో డిప్యూటి డైరెక్టర్ గా పని చేస్తూ  కర్నూలులో 20 సంవత్సరాలుగా నివాస౦ ఉంటున్నారు. రె౦డు కథా స౦కలానాలకు సహ స౦పాదకత్వ౦ (1) కథా సమయ౦, కర్నూలు 2000 స౦వత్సర౦. (2) హ౦ద్రీ కథలు, కర్నూలు (2003) వహించారు. –వేంపల్లె షరీఫ్

   ***

 

అనిల్ కు కార్టూన్ ఛానెల్  బోర్ కొట్టింది.ఛానెల్  మార్చితే,  స్క్రీన్ మీద తెలుగు అర్ధనగ్నపాటలకు  గెంతులు వేస్తున్న హీరో హీరోయిన్లు. అనిల్ దానికే కళ్లప్పగించాడు. వాడి కళ్ళల్లో మెరుపులు, వాడి తలలో ఏవో దృశ్యాలు. ఆ నృత్యంలోని లయలో, ఆ వూపుల్లో లీలామాత్రంగా వాడు రాత్రుల్లో వినే గుసగుసలూ, శబ్దాలూ పోల్చుకుంటున్నాడు. టీవీ చూస్తున్నాడు కానీ, యింకేదో లోపల జరుగుతుంది. పాటకు అనుగుణంగా శరీరాన్ని కదిలిస్తున్నాడు. అంతలో లోపల్నుంచి హాల్లోకొచ్చి వాడిని గమనించిన వాళ్లమ్మ

“రేయ్! ఏందిరా నువ్ చేస్తుండేది?” అంది

ఉలిక్కిపడి, టీవీ స్క్రీన్ మీద నుంచి కళ్ళు తిప్పి వాళ్ళమ్మను చూసి రిమోట్ తో టీవీని ఆఫ్ చేసి, తమకం పూనిన వాడిలాగా అమ్మను వాటేసుకుని “బోర్ కొడుతుందమ్మా!” అంటూ సరాగాలు పోయాడు. కొడుకును చేతులతో బిగించి ముద్దుపెట్టుకుంటూ . “చదువుకోవచ్చు, బొమ్మలు గీసుకోవచ్చు, బోర్ కొడుతుందంటే ఎట్ల నాన్నా”

“పోమ్మా! ఎప్పుడూ చదూకోమంటావు…” అంటూ గునిసి “ఎందుకమ్మా పాటలు చూడొద్దంటావు?..”

“వాటిని చూస్తే నీకేం అర్ధమవుతుందిరా.. ఆ నడుం తిప్పడంలో నీకేం తెలుస్తుందిరా. అవన్నీ గబ్బు పాటల్రా”

“అయితే టీవీల్లో ఎందుకొస్తున్నాయి?  . నాకేమో చూడాలనిపిస్తుందబ్బా..” అంటూ అమ్మను మరింతగా హత్తుకున్నాడు. “అట్లాంటివి చూడగూడదు. అది సరే  హోమ్ వర్క్ కంప్లీట్ చేసావా..” అంటూ చేతుల పట్టు వదిలేసింది.

వాడు నేల మీదికి జారుతూ, భూమిని తాకిన బంతిలా పైకి లేచి “ఎప్పుడో చేసేసాను…” అంటూ బైటికి వెళ్తున్నాడు.

“రేయ్ ! బయటికొద్దు ” అంది అమ్మ

“నేను ఆడుకునేకి పోతానమ్మా. పక్కింటి అన్నవాళ్లు క్రికెట్ ఆడుతున్నారు ”

“రేయ్ బయటికొద్దు అన్నానా…” అంటూ బయటికొచ్చింది ఆమె.

“రామ్మా పట్టుకుందువు రా చూద్దాం. ” అంటూ పట్టుకునీకి వస్తే తప్పించుకునేందుకు కాచుకున్నాడు.

వాళ్లమ్మ ఒక అడుగు వేస్తే వాడు నలుగడుగులు పరిగెడుతూ స్కేటింగ్ లాగా జారుతాడు.

మొదట రెండుమూడుసార్లు ఆటలాగా అనిపించినా తర్వాత వాళ్లమ్మకు కోపం రావడం మొదలైంది. వాడికేమో ఆటలో మజా ఎక్కువైంది.

అంతలో పక్కింటి ఆంటీ బయటికొచ్చి

“ఏంది కమలా కొడుకుతో కొట్లాటా?…” అంది.

“చూడండి ఆంటీ. వీడు యింతలేడు మాటే వినడు. ఆ జారడం చూడండి. కాళ్లు యిరుగుతాయేమోనని భయమవుతుంది. ఎర్రటి ఎండ, బండలు పేలాలు ఏపుకునేంత కాలిపోతున్నాయి. యీ ఎండల్లో బయట ఆడుకుంటానంటాడు..”

“అవు..  ఎంత ఎండగుంది కమలా.. పిల్లనాయాళ్లు యీ ఎండల్లో తిరిగి జ్వరాలొచ్చి పడతారు. మా సురేష్‌గాడు ఎప్పుడు జారుకున్నాడో సూడు క్రికెట్ బ్యాట్ పట్టుకుని.”

‘టీవీలు చూసి పిల్లలు చెడిపోతున్నారు ఆంటీ. క్రికెట్ ఆటలూ, సినిమా పాటలూ, అబ్బా.. చెడిపేస్తున్నాయి..”

వీళ్లు మాటల్లో పడగానే.. “బై అమ్మా బై బై..” అంటూ వురుకుతున్నాడు అనిల్.

“రేయ్ యిప్పుడు కాదురా సాయంత్రం యింటికొస్తావా. అప్పుడు చెప్తారా నీ కథ… నిన్నూ..” దంచుతానన్నట్లు యాక్షన్ చేసింది వీధిలో కొచ్చి కమల.

వాడు దూరంనుండే బెదిరినట్టు నటిస్తూ…

“నన్ను నలిపేస్తావు గదామ్మా.. రాత్రి నాన్న…” యింకా ఏదో అంటూ యిందాక టీవీలో చూసిన ఒక చేష్టను అభినయించాడు.

కమల బిత్తరపోయింది. “ఏమన్నాడు వాడు. యేదో అన్నాడే. కంత్రీనాయలు. ఎక్కడ వింటాడు యిట్లాంటి మాటలు” అనుకుంటూ సిగ్గుతో కుంచించుకుపోతూ, ఎవరన్నా గమనిస్తున్నారా అని చుట్టూ చూసింది.

పక్కింటి ఆంటి నవ్వుకుంటూ లోనికి పోతోంది.

కొత్తగా కడుతూ ఎందువల్లనో పని నిలిచిపోయిన రెండతస్తుల భవనంలో పిల్లల సందడి. కింద కొందరు క్రికెట్ ఆడుతుంటే పైన కొందరు అల్లరి చేస్తున్నారు. అనిల్ క్రికెట్ వైపు వెళ్తున్నవాడల్లా పైకి చూసాడు. తనతోపాటు స్కూల్ కొచ్చే సునీత రంగురంగు సున్నాలున్న గౌన్లో బలే వుంది. అనిల్ మెట్ల మీదుగా పైకి నడిచాడు. మెదడంతా రంగురంగు సున్నాలు గెంతులు వేస్తున్నాయి. పైన ఐదారు మంది పిల్లలు ఆడుకుంటున్నారు. సునీత దగ్గరకు పోయి నవ్వి ఆ పిల్ల వెనకాలే తిరుగుతున్నాడు. ఆమె కింద పడేసుకుంటున్న ఆటబొమ్మలన్నీ అందిస్తున్నాడు.

ఆ పిల్ల నవ్వుతూ “ఆ యిటుకలతో యిల్లు కడదామా?” అంది. అంతే పక్కనే వున్న యిటుకలను మోసుకొచ్చి గదులు గదులుగా కట్టాడు. హాలు, బెడ్రూం, కిచెన్ ల కోసం చదరాలు చదరాలు పేర్చి ‘బాగుందా’ అన్నాడు. ఆ అమ్మాయి కిలకిలా నవ్వింది. తన బొమ్మలన్నీ ఆ గదుల్లో సర్దింది. ఒక పెద్ద అక్క వచ్చి వీళ్లిద్దరూ ఏం చేస్తున్నారా అని చూసి “యిటుకలతో యిల్లేం బాగాలేదు. యిసుకలో గూడుకడితే బాగుంటుందిరా అనిల్” అంది.

“కదాక్కా.. యిస్క యాడుందక్కా..” సునీత.

“లోపల చూడండి” అని యెవరో పిలిస్తే పరిగెత్తింది.

అనిల్ కు  కూడా అందరి ముందుగా సునీతతో ఆడుకోవడం యిష్టం లేదు. మెల్లిగా ఆ అమ్మాయి చెవిలో “లోపలికి పోయి యిసుక  వెతుకుదామా?” అంటే ఆ పిల్ల తలూపింది. ఇద్దరూ ఒక హాలు దాటి, నడవాకు పక్కనున్న గదిలోకి వెళ్లారు. అది స్టోర్ రూం అయినా పూజగదైనా అయుండొచ్చు. యిరుకుగా వుంది. చీకటిగా వుంది. చల్లగా వుంది. ఏదో వింత చిత్తడి వాసన. యిద్దరూ దాన్ని ఆస్వాదిస్తూ కాస్సేపు నిలబడ్డారు. ఆ తర్వాత భయంతో వెలుగు కన్పిస్తున్న ఎదురుగదిలోకి పరిగెత్తారు. ఆ గది సగానికి యిసుక వుంది. యిద్దరూ ఎగిరి దుమికారు. అనిల్ శ్రద్ధగా గూడు కట్టాడు. కట్టేంతసేపు తదేకంగా చూసిన సునీత గూడు పూర్తి కాగానే, గూడు మీద ఎగిరి దుంకింది. అనిల్ ఒకసారి దీర్ఘంగా ఆమెని చూసి, ఆమె నవ్వును అందుకొని, మళ్లీ గూడు కట్టి ఆమెవైపు చూశాడు. ఒక నవ్వు విసిరి ఎగిరి దుంకింది. అనిల్ మళ్లీ కట్టాడు. ఈసారి ఆ పిల్ల దుమకలేదు. “ఇద్దరూ కలిసి ఒకేసారి దుంకుదాం” అంది.

అనిల్‌కు చాలా సంబరమైంది. చీకటి గదిలో నిల్చున్నప్పటి అనుభూతి వొళ్లంతా పాకింది. ఇద్దరూ ఒకర్నొకరు పట్టుకొని వొకేసారి ఎగిరి జంటగా గూడును కాళ్లతో తొక్కారు. రెండు జతల కాళ్ల అచ్చులు అద్భుతంగా పడ్డాయి. అనిల్ ఆ అచ్చుల పక్కనే మళ్లీ గూడు కట్టాడు. ఇద్దరూ వొకర్నొకరు పట్టుకొని గూడు మీద ఎగిరి దుమికారు. మళ్లీ రెండు జతల కాళ్ల అచ్చులు… అనిల్ మళ్లీ మళ్లీ గూడు కట్టాడు. మళ్లీ మళ్లీ ఆ పిల్ల స్పర్శతో అనిల్ గుండెల్లో రక్తం పొంగులు పెట్టింది. టీవీ స్క్రీన్ మీది పాట లయలా వూపింది. రంగురంగు సున్నాలు తనతోపాటు గెంతులు వేస్తుంటే అద్భుతంగా అన్పించింది. వాళ్ల కాళ్ల అచ్చులతో ఒక వృత్తం ఏర్పడింది. అనిల్‌కు ఆ వృత్తం చుట్టూ ఇంకో వృత్తం పడితే బాగుంటుందనిపించింది.

అంతలో…

“రేయ్.. మీరిద్దరూ యిక్కడున్నారా?.. వాచ్‌మాన్ అరుస్తున్నాడు  పైనుండొద్దని. కిందికి పోదాం రాండి. ఏయ్ సునీ రావే మీ మమ్మీ పిలుస్తాంది..” ఇంతకు ముందొచ్చిన అక్కే సునీతను లాక్కుపోయింది. అనిల్ తలలో చీకటి చీకటి సున్నాలు తిరుగుతున్నాయి. వుసూరుమంటూ మెట్లు దిగాడు. ఎదురుగా సర్రుమంటూ క్రికెట్ బాల్ దూసుకొచ్చింది.

“రేయ్ అనిలూ ఆ బాల్ అందీరా..” కాస్త దూరంనుంచే ఒక అన్న అరుస్తున్నాడు.

“అన్నా నాకూ కొంచెం బ్యాటింగ్ యివ్వవా…?” అంటూ  ఫీల్దింగ్‌లో కలిసిపోయాడు.

Joram

రాత్రి పడుకున్నారు. అనిల్ కళ్ళేమో మూసుకుపోతున్నాయి. నిద్రను ఆపుకుంటూ వొళ్లంతా చెవులు చేసుకొని ఏవేవో గుసగుసల్నీ, గాజుల చప్పుడునూ వినాలని  ప్రయత్నిస్తున్నాడు. అందుకు భిన్నంగా

“యిల్లు మారదామండీ.. పిల్లలకు సెపరేట్ రూమ్ వుండేలాంటిదానికి” అంటోంది అమ్మ.

“పిల్లలు అంటున్నావు.. యిప్పటికి వాడొక్కడే కదా వున్నది. బహువచనానికేమైనా ఏర్పాట్లు చేద్దామా?”

“మీ రెండర్ధాల మాటలూ మీరూ. అవి వినే వీడు యింతలేడు బజార్లో మాట్లాడుతున్నాడు. నాకు తల కొట్టేసినట్ట్లనిపిస్తోంది” నాన్న గట్టిగా నవ్వుతూ, తర్వాత నవ్వు ఆపుకుంటూ .. యేదో అన్నాడు గుసగుసగా.

“నీకు దండం స్వామి. గమ్మున పడుకో. నాకు బాగాలేదుగానీ..”

నాన్న మళ్లీ యేదో అన్నాడు..

“నీ గబ్బు మాటలు వింటూ, ఆ గబ్బు పాటలు, టీవీల్లో చూస్తూ వీడు యెట్లా తయారైతాడొ నీక్కొంచెం కూడా యేమనిపించదా?” అమ్మ గట్టిగా అడిగింది.

అమ్మ మాటలు అనిల్‌కు నిరాశ కలిగించాయి.

“అయినా కమలా చిన్నపిల్లల గ్రహణశక్తి వాడిగా వుంటుంది. యిట్లా టీవీ వొక్కటే కాదు. వీధిలో, స్కూల్లో, స్నేహబంధాల్లో ఎన్నో తెలుస్తాయి వాళ్లకు. వాళ్ల శరీరమొక ఫాక్టరీ. వాళ్ల మెదడొక కంప్యూటర్. ఏవేవో సంకేతాలతో ఏదేదో ఏర్పడుతూ పోతుంది. ఫలానా దానివల్లే ఫలానా విధంగా అయ్యారని నువ్వు నిర్ధారించలేవు. భారతదేశంలో మనలాంటి యిండ్లు సరే, అమెరికాలో, యూరోప్‌లో పుట్టినప్పటినుంచి వేరేగా వుంచే పిల్లల్లో కూడా పువ్వు విచ్చుకున్నంత రహస్యంగా లైంగిక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అయినా తల్లిదండ్రులుగా మన ప్రయత్నాలు మనం చేయాల్సిందే. యీసారెట్లాగూ సాలరీ పెరుగుతుంది. వేరే బెడ్రూమున్న  యింట్లోకి మారుదాం…”

నాన్న మాటలు ఏమీ అర్ధం కాకున్నా అనిల్‌కు మరింత చేదుగా అన్పించాయి. కళ్లు మూసుకుపోతున్నాయి. ఏవేవో దృశ్యాలు పీడకలల్లా దొర్లిపోతున్నాయి. సునీతను ఎవరో లాక్కుపోతున్నట్లూ. మరి ఎప్పటికీ కన్పించనంత దూరం వెళ్లిపోయినట్లూ, లేదు తలుపులు బిగించిన గూడులో వూపిరాడక కూరుకుపోయినట్లు, ఆ గూడు మీద అమ్మానాన్న ఎగిరి దుముకుతున్నట్లూ. తన కళ్లు కట్టేసి, చేతుల్లో బ్యాట్ పెట్టి “రన్ చేయి, రన్ రన్”అంటూ  వెనుకల పడుతున్నట్లూ..

పొద్దునుకి జొరమొచ్చింది అనిల్‌కు. అమ్మా నాన్న మొఖం మీద తొంగి చూస్తుంటే బరువుగా కళ్లు తెరిచాడు. నుదుటిమీదా, ఎద మీదా చేత్తో స్పర్శిస్తుంది అమ్మ.

“వొల్లు కాలిపోతాంది కదండి. డాక్టర్ దగ్గరకు తీసుకుపోదాం” అంటొంది.

“మాటే వినడు. ఎండకూ, గాలికీ పగలంతా తిరుగుతాడు. యింగ జొరం రమ్మంటే రాదా..” గొణుక్కుంటోంది.

మూడు రోజులకి అనిల్ మామూలు స్థితికి వచ్చాడు. ఆ సాయంత్రానికి జ్వరం తెరిపిచ్చింది. మంచం మీదనుండి లేచి బయటికొచ్చాడు. ఇంటి మందు పక్కింటి ఆంటీ, అమ్మ  మల్లెపూలు దండలు అల్లుకుంటున్నారు.

“డాక్టర్ దగ్గరకు పోయినట్లుంటిరి గదా కమలా ఏమన్నారు…?”

“కన్‌ఫర్మ్ అయినట్లే ఆంటీ..”

“ఏరా అనిలూ నీకు చెల్లెలో, తమ్ముడో రాబోతున్నారు. నువ్వేమో జొరంతో పడుకుంటివీ..” నవ్వుతూ అంది పక్కింటి ఆంటీ..

ఏమీ అర్ధం కాకుంటే అమ్మ వైపు చూసాడు అనిల్.

అమ్మ సిగ్గుతో ఆంటీ వైపు చూస్తోంది.

“నాకెవరూ వద్దు. మా అమ్మనే గావాల…” పరుగున వచ్చి కమలను వాటేసుకొని, “అమ్మా, అమ్మా నీ దగ్గరే పడుకుంటా, నాకు వేరే మంచమొద్దు. మీ మధ్యనే పండుకుంటా..”బేలగా అంటున్నాడు.

“యీ మూడు రోజులు నా దగ్గరే పండుకున్నావ్ గద నాన్నా.. పొట్ట మీద పడొద్దమ్మా..” అనునయంగా అంటొంది కమల.

“యింగేం పండుకుంటావు మీ అమ్మ పక్కన. ఆ కాలం అయిపోయిందిరా అనిలూ..”

పక్కింటి ఆంటీ మాటలు వింటుంటే మళ్లీ జ్వరమొచ్చేట్లుంది అనిల్‌కు. కళ్ళలో నీళ్లు తిరుగుతున్న అనిల్‌ని చూసి “తిక్క నా కొడుకు” అని లాలనగా దగ్గరకు తీసుకుంది కమల..

 

కథ: జి. వెంకట కృష్ణ

కథాచిత్రం: మహీ బెజవాడ

 

ఇదే న్యాయం !

DSC_9165 

ఓదెల వెంకటేశ్వర్లు కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ తెలుగు లిటరేచర్ చేసారు. చదువుకున్నది గోదావరిఖని మైన్స్ ప్రాంతం. స్వస్థలం  కరీంనగర్ జిల్లా పెద్దపల్లి దగ్గర ఓ చిన్న గ్రామం చీకురాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం . ఆంధ్రభూమి దినపత్రికలో పొలిటికల్ కార్టూనిస్టుగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు కు కథలు, కవితలు రాయడం పట్ల ఆసక్తి.  విరివిగా రాయలేదు కానీ ఇది రాయకుండా ఉండలేను అనుకున్నవే కథలుగా వచ్చాయని చెప్తాడు.  ఓదెల రాసిన  కామెడి కథలకు స్వాతి వీక్లీలో బహుమతులు వచ్చాయి. అనేక పత్రికల్లో కథలు అచ్చయ్యాయి.  “కడుపు కోత” పేరుతొ వచ్చిన కథల పుస్తకం  తనకు  గుర్తింపు నిచ్చింది అంటారు వెంకటేశ్వర్లు .  పందికొక్కులు, కడుపుకోత కథలు తనకు  మంచి  తృప్తినిచ్చాయి అని చెప్తారు. –వేంపల్లె షరీఫ్

 ***

రాత్రి నాలుగు గంటలకే లేచాడు లచ్చుమయ్య. జల్తీ జల్తీ మొకం కడుక్కుని, పశువుల దగ్గర పేడ తీసి , స్నానం చేసి తయారయ్యాడు.ఈ లోపు భార్య భాగ్యమ్మ లేచింది. పొద్దునే తయారవుతున్న భర్తను చూసి,
“మల్లెక్కడికి పోతాండో ఎమో! ఒక్కటి సుత చెప్పడు. ఏం మనిషో ఏందో, లేని నేను ఇంత సాయం చేయకపోదునా” అనుకుంటూ..
“అవునయ్యా ఎగిలివారంగనే లేచి తయ్యారకావడితివి. ఎటువోతున్నవ్” అడిగింది.
“పట్నం బోతున్నా”
“మొస మర్ర కుంట పని పెట్టుకుని పట్నం బోతాన్న అనడవడ్తివి. కైకిలోళ్ళను పిలిచి కలుపు తీపిద్దామని నిన్ననే చెప్పితి. దానికి నువ్వు సరేనంటివి. మళ్లా బుయ్య బుయ్య తయ్యారైతివి ”  ఇక్కడి పని అంతా తనమీద వదిలిలేనినాడని కోపంతో కనిరుచ్చికుంది.
“పట్నంల మా మామా దావతిద్దాండు. పొద్దు పొడిేనటల్లాకు రమ్మన్నడు గందుకే పోతున్నా” కాస్త వ్యంగం జోడించి చెప్పాడు.
“దావతికి నిన్ను రమ్మన్నోడు, మరీ పెండ్లాన్ని తీసుకరమ్మనలేదా?”  తను తక్కువ తినలేదన్నట్టుగా అడిగింది.
“ఎందో పొద్దుగాల పొద్దుగాల జగడానికి కాలు దుయ్యవడ్తివి” అన్నడు.
“మరి అడిగిందానికి సక్కగా జవాబు చెప్పకపోతివి. నేను జగడానికి కాలు దువ్వుతున్ననా, నువ్వా”
“నువ్వు కైకిలోల్లను తీసుకుని కలుపు తీపియ్యి. నేను పట్నం బోయ్యి మందు బస్తాలు దెస్తా. మరీ ఆడ ఎంత పెద్ద లైనుంటదో ఎరికెనా గింత పొద్గుగాల పోయిన ఎక్కన్నో ఎనకనిలవడవలసి వస్తది” చెప్పాడు.
“మరి గిముచ్చట చెప్పతందెకు ఏమో పరగ్యాసం ఆడవడ్తివి. నేను లేచి ఇంత సద్దికట్టి పంపిద్దుకదా?” అన్నది.
“ఏహె సద్దెందుకు తీయ్యి. పోయ్యి లైన్ల నిలవడితే ఆకలిలేదు. దూప లేదు. మందు బస్తాలు దొరికితే చాలు కడుపునిండినట్టే” అన్నడు.
“నివద్దనే. మందులు బస్తాలు దొరికితే మనమే అదృష్టవంతులం” అంటూ అంది.
“ఎవుసం చేసుడు మహాదండి కష్టమైతాంది.  ఇంత కష్టం మా నాయనలు, తాతలు కూడా పడలే. అరొక్కటి కొనుడేనాయే. విత్తనాలు కొనుడు, మందులు కొనుడు… అండ్ల కరెంటు సరింగా ఇయ్యరు. అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి అన్నట్టుగా వుంది. ఎంత కష్టమైనా చేని పంట పండితే  దానికి గిట్టుబాటు ధర రాదు. ఇగ బతుకుడెట్లా”
“నువ్వద్దే నువు చెప్పింది. మరేం చేత్తం. మనకు అచ్చిన పని ఇదొకట్టేనాయే. సదుకోకపోతిమి ఏదైనా నౌకరి చేద్దామంటే.  దిక్కు లేక ఈ పని చేసుకుని కష్టాలుపడవడితిమి. ఎవుసం చేసుడు జూదం ఆడినట్టే వుంటాది. జూదమాడితే ఇంకా నయం ఒక్కసారి కాకపోతే ఒక్కసారైన పైసలు వస్తాయి. కాని ఎవుసం చేస్తే  అప్పులు పెరిగపోవట్టే.”
టీవీలల్ల మాత్రం ఎరువులు ఇస్తున్నాం. ఎరువుల అక్రమాలు సాగనీయం. అందరికి న్యాయం చేస్తాం. రైతులను ఆదుకుంటాం అనవట్టిరి.
ఇక్కడ పరిస్థితి  చూస్తేనేమో  ఎదురు చూడగా చూడగా చుక్కతెగి పడ్డట్టు ఒక్క లారీ వస్తుంది. అందులో రికమేండేషన్ క్యాండిడెట్లు.  పోను మిగిలిన వారికి ఒకటి అర పంచడం జరుగుతుంది. ప్రపంచంలోనే రైతుల పట్ల ఇంత అన్యాయం జరిగేది ఇక్కడే కావచ్చు. ఎన్ని కష్టాలు ఓర్చుకోవాలి. విత్తనాలు దొరకవు. నీళ్ళు దొరకవు, కరెంట్ వుండదు. ఎరువులు దొరకవు. వీటిని తట్టుకుని కిందా మీద పడి ఏదో పంట పండిస్తే  గిట్టుబాట ధర వుండదు. కాని మధ్యవర్తులు ఇస్త్రీ  చొక్కా నలక్కుండా డబ్బులు దోచుకుంటారు. వీరికి హద్దు అదుపు లేదు. ఆఖరికి అందరికి అన్నం పెడుతున్న రైతన్నకే సున్నం పెడతారు.
“సరే తీయ్యి. ఎప్పుడున్న ఏడుపే గిది. వొడిేనదున్నది. ఆయిపోయేదున్నదా‘? నేను పోయెస్త” అంటూ బయలు దేరాడు.
“గట్లనే, జర ఉశారుగుండు. ఎవ్వనితోని లొల్లి పెట్టుకోకు, పయిలంగా పోయిరా” అన్ని జాగ్రత్తలతో పాటు హెచ్చరికలు చెప్పి సాగనంపింది.

***

kadupu
పట్నానికి దాదాపు పదికిలోమీటర్ల లోపు  పల్లెటూరు లచ్చుమయ్యది. ప్రతి పనికి పట్నానికి రావల్సిందే. పెళ్ళి నుండి చావు వరకు ఏ వస్తువు కోసమైనా ఇక్కడికి వచ్చి తీసుకపోవల్సిందే. ఇంటికి ఎవరైనా చుట్టము వచ్చినా కూడా మందు తెవాలన్న, చికెమ్ మటన్ లాంటివైనా తీసుకువెళ్ళాలన్న ఇక్కడినుండే. ఎందుకంటే ఇంటికి వచ్చిన చుట్టానికి కోయడానికి ఊళ్ళలో నేడు కోళ్లు లేవు.  ఎవరు పెంచడం లేదు. అదొ పెద్ద అయిపోయినుట్టుగా వుంది. అవసరమైనప్పుడు వెళ్ళి చికెన్, మటన్ పట్టుకురావడం అవసరాలు తీర్చుకోవడం లాంటివి చేస్తుంటారు. ఇక కోళ్ళను పెంచడం, కోయడం, వాటిని శుభ్రం చేయడం వంటివి సిటీలాంటి ప్రదేశాలే కాదు, పల్లెటూర్లలో కూడా చేయడం లేదు. ”
అప్పుడే వచ్చిన  లారీ ముందు బస్తాల లోడ్ వచ్చేసరికి రైతుల్లో చాలా సందడి మొదలైంది.
మరీ ఎరువులా మజాకా. అక్కడ పరిన్థితి చూస్తె  కుస్తీ  పోటీలకు వచ్చినట్టుగానే వుంది. అందరూ గోచీలు బిగించి బరిలోకి దిగినట్టుగా సన్నద్ధం గా  ఉన్నారు. లారీ వచ్చి ఆగడంతోటో తోపులాట మొదలైయ్యింది. అరుచుకోవడాలు, తిట్టుకోవడాలు మొదలైనాయి.  రైతులకు రైతులే గొడవపెట్టుకుంటున్నారు. తిట్టుకుంటున్నారు. చొక్కాలు పట్టుకుంటున్నారు. ఎంత ఘోరం. మరి ఎరువులు అందరికి కావాలి. పని వదిలేసుకుని వస్తే  ఎరువులు లేకుండా ఖాళీ చేతులతో ఇంటకి వెళ్ళడం యిష్టం లేదు. యుద్ధం లో  దిగిన వాడికి విజయమో వీరస్వర్గమో అన్నట్టుగా వున్నారు.
ప్రభుత్వాలు మాత్రం కడుపునిండిన మాటలు  చెబుతున్నారు. తమది మాత్రమే రైతు ప్రభుత్వమని. తమ ప్రభుత్వం రైతుకు చేసిన పనులు మరే ప్రభుత్వం చేయలేదని నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఇంతకి వీళ్ళు చేసిందేంటో ఎవరికి అర్థం కాదు. నిజానికి ఆ మాట అన్నవాడికి కూడా అర్థం కాదు.
సంక్షేమ పథకాలన్నీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అదీ చేస్తాం ఇదీ చేస్తాం అంటూ బాకాలు ఊది, వీళ్ళు చేసేది  ఏమిటో చూస్తె మతి పోతుంది. ఆరుకాలం కష్టపడి వ్యవసాయం చేసే వాడికి ఒక కిలో బియ్యం ఇస్తారు. రెక్కలు ముక్కలు చేసుకుని కంటిమీద కునుకులేకుండా కాయకూరలు పండిస్తే  ధర మాత్రం ఎవరో నిర్ణయిస్తారు. 7 గంటల కరెంట్ అంటారు. అదీ కూడా యిస్తారా లేదా అన్నది ఎవరకి వారే తేల్చుకోవాల్సిందే.  ప్రపంచంలో అందరూ ఎవడి వస్తువులకు  వాడే ధర నిర్ణయిస్తారు. కాని ఒక్క రైతుకు మాత్రము తను పండించిన పంట, ధాన్యం వంటి వాటి ధర ఇతరులు నిర్ణయిస్తారు. ఇక్కడ రివర్స్. అదే ఎందుకంటే మార్కెట్లో ఉన్న వాళ్ళ పని యిదే. రైతుకు అలా కాదు పండి పంటను అమ్ముకుని మళ్ళీ పండించడానికి పరిగెత్తాలి. ఎంత కష్టం. అయినా వాడికి వీళ్ళే తిండి పెడుతున్న బిల్డప్‌లు యిస్తారు. ప్రపంచానికి అన్నం పెట్టిన వాడు రైతు. ఆ రైతును కోలుకోకుండా చేస్తున్నారు. అదీ సాటి మనిషే కావచ్చు. అందర్నీ సృష్టించిన దేవుడు కావచ్చు. అదేలాగంటే, కావలనిన సమయంలో వర్షం పడదు. రెక్కలు ముక్కలు చేసుకుని తనకు చేతనైనా పరిధిలో పంట పండిస్తే  తీరా చేతికి వచ్చేసమయంలోనే భీకరంగా వర్షాలు పడతాయి. పంటమొత్తం వర్షార్పణం. అదీ నేటి భారతదేశ రైతు పరిన్థితి. ఇలాంటి పరిన్థితులు ఇంకే దేశంలోనైనా ఉన్నాయా? ఇక్కడే ఉన్నాయా? అన్న విషయం మనకు తెలియదు.
అలాంటి పరిన్థితులమధ్య ఎరువులకోసం వచ్చాడు మన రైతు. కొంచెం దూరంగా నిలబడి తోపులాటను చూస్తున్నాడు పాపం. తాను పోట్లాడతున్నది తన తోటి రైతుతోనే అన్న విషయం విస్మరించి కలబడి ఎగబడి పోతున్నారు. లారీ ఊగిసలాడుతు ఆగింది. బరవుకు కిర్రు కిర్రు మని అరుస్తోంది. దానికి కట్టిన తాళ్ళు విప్పారు. ఇంకా తోపులాట ఎక్కువైంది.
ఇంతలో “అవురా నువ్వు నాకే ఇయ్యకుంట అమ్ముకుంటావురా? అన్నకు చెబుతా” గట్టిగా అరుస్తున్నాడు ఒకతను.
“ఏం చెయ్యమంటారండి.. పాపం నిన్నటి నుండి రైతులు లైనులో నిలబడి వున్నారు. వాళ్ళను కాదని మీకిమ్మంటే ఎలా” అంటున్నాడు దుకాణం అమ్మకం దారుడు.
“నేను చెప్పేది చెప్పినా, ఆ పై  నీ యిష్టం” అన్నాడు నిష్టూరంగా.
చేసేది లేక కొన్ని బస్తాలు వాళ్ళపరం చేసాడు. మరి ఎమ్మేల్యే అంటే మాటలా?
తరువాత ఇంకో చోటామోటా నాయకుడు. పాపం ఎవర్ని  కాదనగలడు. అందర్నీ ఒప్పించాలి.
ఆఖరికి రైతులను మాత్రం బెదిరిస్తాడు. “ఏందయ్యా కొద్దిగా ఆగలేరా?”
“రైతులే నీకు కనిపిత్తలేరు. వాళ్ళనే ఆగమంటున్నావు. వాళ్ళను చూసీ భయపడి యిస్తున్నావు. మేము ఇక్కడ కాళ్ళు నొప్పులు పుట్టేలా  నిలబడి నిలబడి చస్తున్నాం. నువ్వేమో ఆగలేరా అంటున్నావు. మళ్ళీ మేము పోయి పనిచేసుకోవాల్నా వద్దా. మా బతుకులు మీ ముంగట్నే తెల్లారుతాయినయి” అన్నాడు కడుపుమండిన  ఓ రైతు.
రైతులకు ఇవ్వడం మొదలు పెట్టాడు. తోపులాట ఇంకా ఎక్కువైంది. లైను కోసం నిలబెట్టిన చెప్పులు రాళ్లు అన్నీ చెల్లా చెదురు అయిపోయాయి.  వాటిని పట్టించుకునే నాధుడు కనిపించడం లేదు. పాపం మన లచ్చుమయ్య బీరిపోయి చూస్తున్నడు ఇయ్యాల సుత ఎరువులు దొరకుతాయా లేదా? అన్న భయం అతడి కళ్ళలో కనిపించింది.   కాని అలా జరగడానికి వీళ్ళేదు ఈ రోజు ఎలాగైనా  సరే ఎరువులు తీసుకుని వెళ్ళాలి. అని ఆలోచిస్తూ లచ్చుమయ్యా సుత లైన్ల జొరబడ్డాడు. వెనక్కి ముందుకి ముందుకి వెనక్కి జరుగుతోంది లైను. ఆ వత్తిడికి బక్కగా ఉన్న రైతులు ఆ తాకిడికి తట్టుకోలేక లైను నుంచి బయటికి వచ్చేస్తున్నారు. అయినా వారు మళ్ళీ లైనులో నిలబడ్డానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఒంటిమీది బట్టలు స్థానభ్రంశం చెందుతున్నాయి.
హఠాత్తుగా ఓ కలకలం బయలుదేరింది. ఉన్న లైను వదిలేసి రైతులు లారీ వైపు పరిగెడుతున్నారు.
“అరే ఏమయిందిరో” అనుకుంట లచ్చన్న లారీ చూశాడు.
అంతే. బీరిపోయిండు. రైతులు లారీ ఎక్కి ఎరువుల బస్తాలు భుజాన వేసుకుని వెళ్ళిపోతున్నారు.
“గిదేం పనిరో గిట్ల చెయ్యవడ్తిరి”
“మరేం చేత్తరు వాళ్ళేం చేస్తున్నారు. అచ్చిన లారీ లోడు రైతులకు ఇయ్యకుంట ఆళ్ళు ఏం జేత్తున్నరు. రైతలకు కడుపు మండుతది. రెండురోజుల సంది ఇక్కడే పండుకుని ఉన్న వాళ్ళకు సుత ఒక్క బత్త ఎరువు దొరకపాయే. ఇంకేం చేత్తరు” అనుకుంటా ఓ రైతు తలకు రూమాలు చుట్టు బిగించి లారీదిక్కు ఉరికిండు.
నిజమే ఎగిలివారంగా నాలుగుగంటలకు వచ్చిన తనకే కడుపు మసిలి పోతాంది. రెండు రోజులసంది ఉన్నోనికి ఇగ ఎట్ల ఉంటది. మరి ఇది మంచిదా కాదా అని ఎవలు ఆలోచించడం లేదా? సరే మనం చేనింది తప్పైతే  వాళ్ళు చేసింది  కుడా తప్పే కదా? ఇగ రైతులు ఇట్ల చేసుడు తప్పు కానేకాదు అనుకున్నాడు లచ్చుమయ్య. కానీ ప్రస్తుతం తను ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేక లారీ మీదినుంచి ఖాళీ అవుతున్న ఎరువుల బస్తాలను చూస్తు ఉండిపోయాడు. తను కూడా వెళ్ళి ఆ గుంపులో కలవడమా? లేదా? ఆలోచిస్తున్నాడు లచ్చుమయ్య.

 

— ఓదెల వెంకటేశ్వర్లు

 

 

 

అంకురం

balaji

పలమనేరు బాలాజీ అసలు పేరు కె.ఎన్.బాలాజీ. పుట్టిన ఊరునే ఇంటి పేరుగా మార్చుకుని రచనలు చేస్తున్నారు. జనవరి 19, 1974లో చిత్తూరు జిల్లాలో పుట్టారు. తొలికథ “ఎగురలేని విహంగం’ 1991లో ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. “గదిలోపలిగోడ’ పేరుతో ఒక కథాసంపుటి తెచ్చారు. ఇప్పుడు మరో కథాసంపుటి తెచ్చే పనిలో ఉన్నారు. కవిత్వమూ రాశారు. ఒక కవితా సంపుటి, రెండు నవలలు, ఒక వ్యాస సంపుటి ప్రచురించారు. ఈయన రచనలు వివిధ భాషల్లోకి అనువాదమయ్యాయి. వివిధ పురస్కారాలు అందుకున్నాయి. ప్రస్తుతం చిత్తూరుజిల్లా పెద్దపంజాణిలో ఎంపిడీవోగా పనిచేస్తున్నారు బాలాజీ. — -వేంపల్లె షరీఫ్

***

Kadha-Saranga-2-300x268

దుర్గమ్మ గుడి ముందు సందడిగా ఉంది.

ఇందిరమ్మ కాలనీలో ఆరోజు గ్రామసభ జరుగుతోందని, ఒకరోజు ముందే దండోరా కొట్టడం వల్ల, జనం అక్కడ గుమిగూడి పోయారు.

మధ్యాహ్నం మూడు దాటింది. ఎండ చుర్రుమంటోంది. ఆ పంచాయతీలో ఉపాధి హామీ పనుల్ని పర్యవేక్షించే ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రమణ వేపచెట్టు నీడలో చాపపరిచి కూర్చుని ఉన్నాడు. రెండు పాత చాపలు ఒకదాని పక్కన ఒకటి పరచి  ఉన్నాయి. ఆ రెండు చాపల చుట్టూ నాలుగు ఇనుప కుర్చీలు, రెండు ప్లాస్టిక్‌ కుర్చీలు పహారా కాస్తున్నట్లు ఉన్నాయి. చాపపైన తెల్లకాగితాలు, గ్రామసభ రిజిష్టరు, హాజరు పట్టిక, ఇంక్‌ ప్యాడ్‌, ప్లాస్టిక్‌ సంచిలో కొన్ని అర్జీలు రమణ ముందు పేర్చబడ్డాయి.

‘‘పంచాయతీ కార్యదర్శి, సర్పంచు వచ్చారంటే ఎంత… అరగంటలో అయిపోతుంది మీటింగ్‌. వాళ్లింకా రాలేదు. ఎండ చూస్తే మనుషుల్ని కాల్చేసేలా ఉంది’’ తనలో తాను గొణుక్కుంటున్న రమణ మాటలు అక్కడికి సమీపంలో ఇండ్ల అరుగుల పైన కూర్చున్న వారి చెవిన పడ్డాయి.

కుయ్యప్ప అరుగుపైనుండి లేచి నిలబడి, వదులైన లుంగీని సర్దుకుని గట్టిగా బిగించి కట్టుకుని, మురికి కాలువలోకి వక్కాకు ఎంగిలి ఊసి, మళ్లీ అరుగు పైన సర్దుకుని కూర్చుంటూ ‘‘ఎంతసేపు సూడాలా అబ్బోడా?’’ అన్నాడు విసుగ్గా మొహం పెట్టి.

అసలామాటే వినబడనట్లు, తనకా మాటతో ఏ సంబంధమూ లేదన్నట్లు రమణ తన ముందున్న ప్లాస్టిక్‌ సంచిలోంచి అర్జీల్ని, దరఖాస్తుల్ని బయటకు లాగి ఒక్కదాన్నే పరిశీలనగా చూస్తూ, కాగితాలు అటూ ఇటూ తిప్పుకుంటూ ఉండిపోయాడు.

గూని సుబ్రమణ్యం ఇంటి ముందున్న చేతి బోరులోంచి ఎట్లాగైనా నీళ్లు రప్పించాలనే లక్ష్యంతో ఇద్దరమ్మాయిలు పైట కొంగుల్ని నడుములకు బిగించి ఎదురెదురుగా నిలుచుని బోర్‌ హ్యాండిల్‌ని నాలుగు చేతులతో బలంగా ఒడిసి పట్టుకుని, పైకి కిందకి ఊపుతూ ఉంటే ఆ ఊపుకి అనుగుణంగా వాళ్లిద్దరి శరీరాలూ ముందుకూ వెనక్కూ కదులుతూ ఉన్న దృశ్యాన్ని కళ్లప్పగించి చూస్తున్నాడు నాగవేలు. అతడి కళ్లు ఎదుటి దృశ్యం వైపే కేంద్రీకరించబడి ఉన్నాయి. మెడ మీద, ముఖం పైన కారుతున్న చెమటను ఎంత మాత్రం పట్టించుకునే స్థితిలో అతడు లేదు. అతడి నోట్లోంచి చొంగ కారిపోతున్న సంగతిని కూడా అతడు విస్మరించాడు.

మునిరాజులు తన టీ అంగడి ముందు నిలబడ్డాడు. సన్నగా పొడవుగా చామన చాయలో ఉన్నాడు. పాతికేళ్లు దాటకపోయినా వయసుకు మించిన ముదురు తనమేదో అతడి ఒంట్లో, మొహంలో కనబడుతోంది. టీ బాయిలర్‌ ముందు నిలబడి, నిప్పు కణికల్ని రాజేస్తూ, బొగ్గుల్ని వేస్తూనే ఆ ఆడవాళ్లిద్దరి వైపు కళ్లార్పకుండా చూస్తున్నాడు.

ఆ టీ అంగట్లోనే కూర్చుని, చినిగి పేలికలైన ఆనాటి దినపత్రికలోని ఒకానొక భాగంలో కనబడుతున్న సినిమా హీరో హీరోయిన్ల వైపు, మునిరాజులు వైపు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రమణ వైపు, నాగవేలు వైపు, బోరింగ్‌ వద్ద నీళ్ల కోసం నానా తంటాలు పడుతున్న ఆ పడుచువాళ్లు వైపు తలతిప్పి మార్చి మార్చి చూస్తున్నాడు అరవయేళ్ల శంకరయ్య. అతడిది పూర్తి బట్టతల. తల్లో ఒక్క వెంట్రుకైనా లేదు. బట్టతల పై నుండి కారిపోతున్న చెమటను తువ్వాలుతో తుడుచుకుని బీడి ముట్టించుకున్నాడు.

టివిఎస్‌ మోపెడ్‌ శబ్ధం, హారన్‌ రెండూ ఒకేసారి వినిపించేసరికి, కాగితాలు మరోసారి సర్ది రమణ చాప పైనుండి లేచి నిలుచుని, వీథి మొదలువైపు చూసాడు. వస్తున్న వాళ్లు సర్పంచు, పంచాయతి కార్యదర్శే అని నిర్ధారించుకున్న తర్వాత చేతులు ఊపుతూ చుట్టూ అక్కడక్కడా గుమిగూడిన జనాల్ని, అక్కడికి దూరంగా ఇండ్ల అరుగులపైన కూర్చున వాళ్లని, టీ అంగడిలో కూర్చున్న శంకరయ్యని.. పేర్లు పెట్టో, వరసలు పెట్టో పిలుస్తూ… ‘‘రండి రండి సెక్రటరి మేడం, సర్పంచు అన్న ఇద్దరూ వచ్చేసినారు. మీరందరూ బిరీన్నా వస్తే మీటింగ్‌ స్టార్ట్‌ చేసేద్దాం. ఈ మీటింగ్‌ అయినాక నేను మళ్లీ పలమనేరుకు పోవల్ల. యంపిడిఒకి రిపోర్ట్‌ రాసివల్లంట. తొందరగా రండి’’ పెద్దకంఠంతో గొంతెత్తి జన సమీకరణ మొదలుపెట్టాడు రమణ.

చాలాసేపు బోరింగ్‌ కొట్టీ కొట్టీ ఆడవాళ్లిద్దరూ అలసిపోయారు. రెండు బిందెల నిండా నీళ్లు నింపుకుని అక్కడి నుండి కదిలారు. వాళ్ల వంతు అయిపోగానే అక్కడే కాచుకుని ఉన్న మరో ఇద్దరు నడి వయస్కురాళ్లు, బోరింగ్‌ హ్యాండిల్‌ను చెరో వైపు పట్టుకుని, ముందుకూ వెనక్కూ ఊగిపోతూ నీళ్లకోసం తమ ప్రయత్నాన్ని ప్రారంభించారు.

‘‘పుష్పావాళ్లు నిలపక ముందే మనంగానా ఇంకొంచెం ముందుగానే మొదలెట్టి ఉంటే.. నీళ్లు లోపలికి ఎనెక్కి పోయిండేవి కావు. రొంత లేటయ్యిందానికి ఇప్పుడు చూడుమే. నీళ్లు లోపలికి ఎళ్లిపోయినట్లుండాయి. ఈ నా బట్టలు బోరింగ్‌ సంగతి పట్టించుకుంటే కదా. బిందె నీళ్ల కోసం ఎండలో బోరింగ్‌ కొట్టీ కొట్టీ చేతులు బొబ్బలెక్కి పోతావుండ్లే’’ అంది విజయమ్మ కసాబిసా వక్కాకు నములుతూ.

ఇంకొకామె వక్కాకు ఎంగిలి దూరంగా ఊస్తూ ‘‘అరుగులపైన కూర్చుని ఆడోళ్ల నడుముల గురించి, పిర్రల గురించి మాట్లాడమంటే మాట్లాడతారు కానీ మన మొగాళ్లు ఆ సర్పంచు కాడనో, ఎండిఒ కాడనో పోయి నాలుగు పైపులు ఇప్పించుకుని, ఆ మెకానిక్‌ కృష్ణయ్యని తోడుకుని వచ్చి బోరింగు రిపేరు చేయించే సత్తా మాత్రం వీళ్లకు లేదమ్మే విజయా’’ అంటోంది గసపోస్తా గోవిందమ్మ.

afsr

ఆ మాటలు గుడి ముందు చేరిన జనాల చెవులకు వినబడుతూనే ఉన్నాయి. కుర్చీలపైన నింపాదిగా కూర్చున్న సర్పంచుకూ వినిపించాయి. పంచాయతీ కార్యదర్శికి వినిపించాయి. అందరికీ వినపడాలనే గట్టిగానే ఇద్దరూ మాట్లాడుతున్నారనే సంగతి అర్థమయ్యాక శంకరయ్యకు నవ్వొచ్చేసింది.

ప్లాస్టిక్‌ కుర్చీలో కూర్చుంటూనే సర్పంచుతో మాట కలిపాడు.

‘‘ఏమిరా మునస్వామి, ఆ ఆడోళ్ల మాటలు విన్నావు కదా. బిందె నీళ్ల కోసం కన్నగసాట్లు పడతా ఉండార్రా నాయినా. ఈ మీటింగ్‌లు, లోన్లు మళ్లింకా సూద్దాం. ముందు నీళ్ల కత సూడ్రా, పుణ్యం ఉంటుంది.’’

‘‘ఆ… ఆ.. చూస్తాంలే తాతా. బోరింగ్‌ మెకానిక్కు క్రిష్టప్పకు జ్వరమని ఆఫీసు తావకే రావడం లే. వారం దినాలవతా ఉండాది మనిషి కనబడి. బోరింగ్‌ రిపేర్‌ అని ఎవరైనా మాకు ముందుగా చెప్పినారా? ఆ ఎండిఒ ఆఫీసుకో, నాకో, సర్పంచుకో ఎవరికో ఒకరికి ఫోనయినా చేసిండ కూడదా? ఊర్లో ఇంతమంది జనాలుండారు కదా. అందరి చేతుల్లో సెల్లులు కూడా ఉండాయి కదా’’ అంది పంచాయితి కార్యదర్శి లలితమ్మ.

‘‘మంచి స్కీం ఉండాది. డబ్బులిస్తాం. ఇంటింటా మరుగుదొడ్డి కట్టుకోండయ్యా అంటే మాత్రం వినబడనట్లు ఉంటారు. మాకాడ డబ్బేడ ఉందమ్మా అని అంటారు. సెల్‌ఫోన్లు మాత్రం ఇంటికి రెండు మూడయినా ఉండాయి కదా. ఆ బడాయికేం తక్కువ లేదు జనాలకి’’ మెల్లగానే అయినా లలితమ్మ గొణుగుడు అందరికీ వినబడిరది. ఆమె మాటలు అయిపోగానే సర్పంచు గొంతు విప్పాడు.

‘‘మేడం ముందు మనం వచ్చిండే పని సూడండ. ఊరన్నాక సమస్యలు ఉండనే ఉంటాయి. ఈ రోజు ఇదొకటి. రేపు ఇంకొక్కటి. ఈ రోజు ఈ ఊర్లో, రేపు ఇంకొక ఊర్లో. మొన్నాడు ఇంకో ఊర్లో. మనకిది మామూలే కదా. ఎంత చేసినా చేసిండే మంచిని జనాలు నిముషాల్లో మరచిపోతారు. మళ్లింకా ఏం ఊరికే చేస్తా ఉండావప్పా అని మొహం పైనే అడిగేస్తారు. నా గ్రహచారం బాలేక, శనేశ్వరుడు నెత్తిపైన కూర్చుని ఉంటే సర్పంచుగా నామినేషన్‌ ఏశాను. మన బాధలు ఈ జనాలకు అర్థం కావులే. జనాలు ఏమైనా అడగొచ్చు కానీ నేను కడుపు కాలి ఏమైనా అంటే మాత్రం జనాలు అడ్డం తిరగతారు.’’ అని ఆగాడు. చుట్టూ చూసి మళ్లీ కొనసాగించాడు.

‘‘ఏదైనా అంటే మాత్రం, అంతే లేబ్బా. మీకు మా ఊరంటే చులకన. నీకు మీ ఊరే గొప్ప. అన్ని పనులూ మీ ఊరికే చేస్తా ఉండావే కానీ ఏ పొద్దయినా మా ఊరివైపు ఎగాదిగా చూసిండావా? నిన్ను మీ ఊరోళ్లు మాత్రమే ఓట్లేసి ఎన్నుకోలా? ఈ పంచాయితీలో ఉండే పన్నెండూరోళ్లు నిన్ను సర్పంచుగా ఎన్నుకోనుండారప్పా. నువ్వా సంగతి మరచిపోతాండావు అని నాకే పాఠాలు చెప్తారు జనాలు. ఏం చేసేది మేడం? వాళ్లు అడిగేదానికే నన్ను సర్పంచును చేసిండారు. సిగ్గు మానం లేకుండా నేను జనం దగ్గర అయిన కాడికి అడిగించుకునే దానికే సర్పంచు అయి కూర్చొండాను. అంతా నా ఖర్మ’’ అని ఎడమ చేత్తో నుదురు కొట్టుకున్నాడు.

శంకరయ్య ముందుకు వచ్చి సర్పంచును సముదాయించే ప్రయత్నం చేసాడు.

‘‘ఇప్పుడేమయ్యిందిరా అబ్బోడా. నీ గురించి అందరికీ తెల్సు కదా. ఏదో జనం బాధల్లో ఉండేప్పుడు కోపంలో బాధతో నాలుగు మాటలంటారు. దానికే నువ్వు ఇదయిపోతే ఎట్లా చెప్పు. నీకు ఓపికుండాల. ఇంకా ఎన్ని పదవులు చూడాల నువ్వు ముందు ముందు’’ ఆ మాటలు విని అడ్డంగా తలూపుతూ నవ్వాడు సర్పంచు.

‘‘నేనా.. ఇంకోసారా? నేను గానా ఇంకోసారి ఎలక్షన్లో నిలబడితే నీ ఎడమకాలి చెప్పుతో నన్ను కొట్టు తాతా. అయినా బుద్దీ జ్ఞానం ఉండేవాడు ఎప్పుడూ రాజకీయాల్లోకి రానేరాడు. తెలివైనోడయితే ముఖ్యంగా సర్పంచు పదవి మాత్రం కావాలనుకోడు.’’

సర్పంచు మాటలకు మధ్యలోనే అడ్డమొచ్చాడు కుయ్యప్ప.

‘‘ఏమైందన్నా ఇప్పుడు. పంచాయతీలో పనులు చేసుకునేది, బిల్లులు వసూలు చేసుకునేది, చెక్కులు రాసుకునేది అంతా నువ్వే కదన్నా. పంచాయతీలో అయినా మండలంలో అయినా, కలెక్టర్‌ ఆఫీసులో అయినా యాడైనా నీకుండే పరపతి నీకు ఉండనే ఉంటుంది గదా’’ నవ్వుతూనే అడిగినా కుయ్యప్ప మాటల్లోని వెటకారం అర్థమయ్యి సర్పంచు అతనికి సమాధానం చెప్పే ప్రయత్నం చేసాడు.

‘‘మీరంతా ఇండ్ల కాడ, అరుగుపైన, రచ్చబండ దెగ్గిరా కూర్చుని ఇట్లే అనుకుంటా ఉండారు. సర్పంచు.. పదవికే సర్పంచు. మీరనే గుర్తింపు, గౌరవం మాట ఎట్లా ఉన్నా, ముందు చేతిలోంచి దుడ్లు పెట్టి పనులు చేయించల్ల. కాలువలు శుభ్రం చెయ్యల్ల. ట్యాంకులు శుభ్రం చెయ్యల్ల. ఎక్కడైనా పైప్‌లైన్‌ దెబ్బతినింటే దాన్ని మార్చాల్నా. గేట్‌ వాల్వ్‌ మార్చల్ల. ముందు మనం డబ్బు పెట్టి పనిచేసేటప్పుడు ఎవురూ రూల్స్‌ మాట్లాడరు. పనయిపోతే చాలంటారు. నాకత మళ్లీ కదా ఉండేది.’’

కొంతమంది ఆడవాళ్లు ఖాళీ బిందెలతో అక్కడికి చేరుకున్నారు. వాళ్ల వైపే చూస్తూ తలాడిరచి, ఏదో ఆలోచించుకుని, మళ్లీ గొంతు సవరించుకుని మాటలు కొనసాగించాడు.

‘‘మనం సొంతంగా ఖర్టు పెట్టిండే దుడ్లు గవర్మెంటోడి లెక్క ప్రకారం రూలు ప్రకారం మన చేతుల్లోకి రావల్లంటే మాటలు కాదు. మా తాత మా ముత్తాతలు దిగివస్తారు. ఏయి రికార్డింగ్‌ చేయాలంటే తీర్మానం కావల్లంటాడు. తర్వాత ఎస్టిమేట్‌ అంటాడు. వారం పది దినాలు ఏయి దగ్గరకు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ దగ్గరకు తిరిగితే ఎస్టిమేట్‌ పనవుతుంది. తర్వాత యంబుక్‌ కోసం ట్రెజరీతో చలాన్‌ కట్టాల్నా. ఆ తర్వాత ఆ చలాన్‌ చూపించి ఎండిఒ ఆఫీసులో ఎంబుక్కు తీసుకోవల్ల. మళ్లీ ఇంజనీర్‌ దగ్గరకు పోయి బిల్లు రాసుకోవల్ల. ఆయనడిగే బిల్లులు, రశీదులు, మస్టర్లు అన్నీ తెచ్చివ్వల్ల ` మళ్లింకా డియీ సార్‌ని కలవల్ల. ఆయన ఒక పట్టాన దొరకడు. అక్కడ చెక్‌ మెజర్‌మెంట్‌ అయినాక చెక్కు రాసుకుని ట్రెజరీకి పోతే అక్కడ వాళ్ల దయాదాక్షిణ్యాల పైన మన చెక్కు పాసవుతుందా లేదో ఎంత డబ్బు ఎప్పుడు చేతికొస్తుందో తెలీదు. ఇదంతా ఒక ఎత్తైతే.. వీళ్లెవురూ మనం పోయిన టయానికి దొరకరు. ఇంటి కాడనో, ఆఫీసు కాడనో ఐదారుసార్లు తిరిగీ మళ్లీ వాళ్లను పట్టుకుని వాళ్ల దగ్గర సంతకాలు చేయించుకునే సరికి దేవుడు కనబడతాడు. టౌనుకు పోతే టీలకే ఎంత డబ్బు ఖర్చవుతుందో తెల్సా తాతా. మర్యాదకి టీలు తాపేదానికి, సిగిరెట్లు ఇప్పించే దానికి, వీళ్ల కోసం తిరిగి దానికే నూర్లకు నూర్లు ఖర్చయిపోతాయి. దీనికంతా లెక్కేడవుంటుంది. ఇదంతా అనామత్తు ఖర్చు. ఇదంతా అయినాక సంవత్సరానికోసారి ఆడిట్టోళ్లు వస్తారు. మా అల్లుళ్లని కూడా నేను ఏ పొద్దూ అంత మర్యాదగా చూసిండనంటే నమ్ము. వాళ్లకి ఏ లోటూ ఉండకూడదు. బిర్యానీలే తింటారు వాళ్లు. కంపెనీ నీళ్లే తాగుతారు. మామూలు జనం తినే తిండి, తాగే నీళ్లు వాళ్ల ఒంటికి పడవంట. ఎవురైనా సరే తాత ఏ డిపార్ట్‌మెంటు ఆఫీసరన్నా అయిపోనీలే. ఊర్లోకి రాగానే ఎవుర్ని అడగతాడో మీరే ఇంతకు ముందు చెప్పినారు కదా. వచ్చే వాళ్లందరికీ వాళ్లు ఏం తింటారో దాన్ని వండయినా పెట్టల్ల. లేదా టౌన్‌ లోంచి తెప్పించయినా పెట్టల్ల. ఆ కల్లా సూడు ఆడోళ్లంతా సర్పంచు నా బట్ట వచ్చిండాడు కదా అని ఖాళీ బిందెలు ఎత్తుకుని వచ్చిండారు’’ అని అక్కడ చేరిన ఆడవాళ్లవైపు చూసాడు సర్పంచు. అతని గొంతులో వణుకు స్పష్టంగా తెలిసిపోతోంది.

‘‘మీకు బోరింగు రిపేరు చేయించాల. అది నా బాధ్యత. నాకు బోరింగ్‌ రిపేర్‌ అయిందని నీళ్లు సరిగ్గా రావటం లేదని ఈ ఇలాకాలో ఎవరైనా ముందుగా చెప్పినారేమో… మీరే చెప్పండమ్మా. మీ ఊర్లో నీళ్ల సమస్య ఉండాదని నాకు ముందుగా తెల్వదు. ఇప్పుడే తెల్సింది. మీకూ ఆ బోరింగ్‌ కృష్టప్ప కథ తెలిసిందే కదా. మనిషి ఒక పట్టాన దొరకడు. ఇక్కడంటే అక్కడంటాడు. అక్కడంటే ఇక్కడంటాడు. వాడ్ని పట్టుకుని రెండు రోజుల్లో మీ బోరింగ్‌ రిపేర్‌ చేయిస్తానమ్మా. మీరు ఎలబారండి. ఈ దినం ఈడ ఏదో లోన్లు కోసం పేర్లు రాసుకునేదానికి వచ్చిండాం. లోన్లు కావల్సినోళ్లు ముందుకు రాండి. ఏమ్మా సెక్రటరీ మేడం… ఆ పేర్లు చదువమ్మా…’’

ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గ్రామ సభను ఏదో విధంగా ముగించి ముందు అక్కడి నుండి బయట పడాలనే అతడి ప్రయత్నం కొందరికి అర్థమయ్యింది. కొందరు మాత్రం వేళాకోళంగా నవ్వుతూ సర్పంచు మొహంలో మారుతున్న హావభావాల్నే గమనిస్తున్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ అందించిన కాగితాన్ని చేత్తో పట్టుకుని, నిలుచుంది పంచాయతీ కార్యదర్శి.

ఖాళీ బిందెలతో అక్కడకు చేరిన ఆడవాళ్లల్లో కొందరు బిందెలతో వెనుతిరిగారు. నిలబడి జరుగుతున్న తతంగాన్ని చూస్తూ అక్కడే నిలబడ్డారు కొందరు. ఐదారు మంది మాత్రం బిందెల్ని దూరంగా ఉంచి లోన్ల వివరాలు వినేందుకు ఆసక్తిగా గుడి ముందుకొచ్చి నిలబడ్డారు.

పంచాయతీ కార్యదర్శి లలితమ్మ మొహంలో ఎందుకో విసుగు స్పష్టంగా కనబడుతోంది. ఎండ వేడిమికి మొహం పైన కారిపోతున్న చెమటను ఖర్చీప్‌తో తుడుచుకుంది.

ఇద్దరు చిన్న పిల్లలు చెంబులో మజ్జిగ తీసుకుని వచ్చారు. ప్లాస్టిక్‌ గ్లాసులు రమణ ముందుగానే సిద్ధం చేసి ఉంచాడు. వాటిల్లో మజ్జిగ నింపి సర్పంచుకూ పంచాయతీ కార్యదర్శికీ శంకరప్పకూ అందించాడు రమణ.

మజ్జిగ తాగి మరో గ్లాసు మజ్జిగ అడిగి మరీ తీసుకుంది లలితమ్మ. చీర కొంగుతో పెదాలు తుడుచుకుంటూ, రుణపథకాల వివరాలు చెప్పసాగింది.

ఫలానా స్కీం క్రింద పంచాయతీకి ఇన్ని రుణాలు మంజురైనాయని, ఆసక్తి, అర్హత ఉండేవాళ్లు పేర్లు చెపితే తాను రాసుకుంటానంది. ఆమె చెప్పడం ఆపగానే ఒక్కసారిగా అక్కడ కలకలం చెలరేగింది.

‘‘మా పేర్లు రాసుకోండి మేడం. ముందు నాది రాసుకోమ్మా తల్లా. అక్కా మా పేర్లు రాసుకో అక్కా. మేడం ఇంట్లో ఎందరికిస్తారు? ఇంటికి ఒకటేనా? ఎన్నయినా ఇస్తారా? మేడం నేనూ మా ఆయనా ఇద్దరూ రాసుకోవచ్చా? మేడం ఏయే లోన్లు ఇస్తారు? సబ్సిడి ఎంత? బ్యాంకు లోన్‌ ఎంత? ష్యూరిటీ ఏం అడగరా బ్యాంకోళ్లు. అయినా తల్లీ ఈ లోన్లన్నీ నిజంగా వస్తాయంటావా?’’

ఒక్కసారిగా ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడ్డం మొదలయ్యే సరికి అక్కడ ఎవరేం మాట్లాడుతున్నది ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. గొంతు పెంచి అరచలేక నిస్సహాయంగా రమణ వైపు చూసి ‘‘రమణా’’ అంది పంచాయతీ కార్యదర్శి.

రమణ చప్పట్లు తడుతూ గట్టిగా అరిచాడు ‘‘అన్నా, అక్కా అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. దయచేసి ఎవరూ మాట్లాడవద్దు. మేం అడిగినదానికి మాత్రం జవాబు చెప్పండి. ఒక్కొక్కళ్లనే అడుగుతాం. అంతా కూర్చోండి. ప్లీజ్‌’’ పెద్ద గొంతుతో చెప్పిందే రెండు మూడు సార్లు రమణ అరచి చెప్పాక అక్కడ అంతా సద్దుమణిగింది. ఉన్నట్లుండి గుంపు చెదిరిపోయింది. జనాలు పక్కకు తప్పుకుంటుంటే, ఏం జరిగిందా అని సర్పంచు, పంచాయతీ కార్యదర్శి, రమణ ముగ్గురూ ఒకేసారి తలలు తిప్పి అటు వైపు చూసారు.

శంకరయ్య చివాలున లేచి నిలబడ్డాడు. ‘‘ఎన్ని తూర్లు చెప్పాలమ్మే నీకు. గుడిసె వదిలి బయటకు రావద్దని. మానం మర్యాద, చిన్నా పెద్దా అనే భయమే లేదు. ముందిక్కడ నుండి ఎలబారి పోమ్మే. నీకు ఇక్కడేం పని’’ అంటూ కసురుకున్నాడు.

‘‘అసలా అమ్మాయిని ఊర్లోంచే దూరంగా ఎక్కడికైనా తరిమేద్దాం అంటే పిలకాయలు ఒప్పుకోలే. పోనీలే ఆడబిడ్డ బతికింది, ఏదో ఒక మూలన పడి ఉంటుంది అనుకుంటే.. గుడిసె వదిలి ఊర్లోకి వస్తా పోతూ ఉంటే ఊర్లో జనాలకు రోగాలు రాకుండా ఉంటాయా? ముందు ఆ ఆడదాన్ని ఇక్కడి నుండి పంపేయండి’’ గట్టిగా అరుస్తున్నాడు కుయ్యప్ప.

చెదిరిపోయిన గుంపు మధ్యలో బెదురు చూపులతో, ఎముకల గూడులా నిలుచుని ఉందామె. జుట్టు రాలిపోయింది. చీరను బట్టి ఆ ఆకారాన్ని స్త్రీగా గుర్తించాల్సి వస్తోంది.

రెండు చేతులూ జోడిరచి ‘‘గవర్మెంటోళ్లు వచ్చిండారంట కదా. నాకేదైన సహాయం చెయ్యండయ్యా. పుణ్యం ఉంటుంది’’ అని మాత్రం అంది. ఆ గొంతు స్త్రీ గొంతులా లేదు. మగ గొంతులానూ లేదు. అసలా కంఠస్వరాన్ని ఎవరిదో పోల్చుకోవడం కూడా కష్టమే.

ఆ మాట మాత్రం అప్పచెప్పి ఆమె అక్కడి నుండి కదిలింది. ఆమె కనుమరుగయ్యేంత వరకూ చూసి, తర్వాత కూర్చున్నాడు శంకరయ్య. తలవంచుకునేశాడు మెల్లగా.

‘‘ఎవరామె ఇంతకు ముందెప్పుడూ ఊర్లో కనబడినట్లు లేదే’’ రమణవైపు చూస్తు అడిగింది పంచాయతి కార్యదర్శి. మెల్లగా తలపైకెత్తాడు శంకరయ్యా. అతని మొహం నిండా బాధ కనబడుతోంది.

రమణ ఏం చెప్పాలా అన్నట్లు తడబడి శంకరయ్య వైపు చూసాడు. అతడి అవస్థ గమనించి శంకరయ్యే నోరు మెదిపాడు.

‘‘నాకు మనవరాలి వరస అవుతుందిలేమ్మా. మొగుడు చచ్చిపోయాడు. వాడు పోయాక తెలిసింది. ఆమెకు ఎయిడ్స్‌ అని. దాని మొగుడు జబ్బు విషయం దాచిపెట్టి వాడి దారిన వాడు దీన్ని అనాథలా వదిలేసి పోయాడు. దాని అదృష్టం దానికి పిల్లోల్లు లేరు. ఎవరో ఒకరు దయపెట్టి అంత సంగటి వేస్తే తిని బతకతా ఉండాది. దాని జబ్బు బాగవ్వాలంటే మంచి తిండి, మందూ మాత్రలు, పండ్లు, కూరగాయలు తినాలంటారు. అవన్నీ ఎక్కడ కుదురుతుంది లేమ్మా. దాని టయిం అట్లా ఉండాది. దేవుడు చిన్నసూపు చూసినాడు లేమ్మా. దాని పేరు విశాలాక్షి.’’

జనంలో అక్కడక్కడా గుసగుసలూ మొదలయ్యాయి.

‘‘మీరందరూ ఒప్పుకుంటే, సరేనంటే మేం సర్వే చేసి, విచారించి గుర్తించిన అర్హుల పేర్లు మీకు ఇక్కడే ఇదే గ్రామసభలో చదివి వినిపిస్తాం. మీరందరూ సరేనంటే వీళ్లకి గవర్నెంటు ద్వారా సబ్సిడీ, బ్యాంకుల ద్వారా అప్పులు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఏమంటారు?’’

తడబాటు లేకుండా స్పష్టంగా మాట్లాడుతున్న పంచాయతి కార్యదర్శి మాటలకు ఈసారి ఎవరూ అడ్డొచ్చే ప్రయత్నం చెయ్యలేదు.

సర్పంచు లేచి నిలబడ్డాడు. అందరి దృష్టీ అతడిపైనే నిల్చింది. ‘‘ప్రతి సంవత్సరం గవర్నెంటు, బ్యాంకులు కలిసి అప్పులూ, సబ్సిడీలూ ఇస్తానే ఉంటాయి. ఊర్లో ఉండే పెద్ద మనుషులు వాళ్లూ వాళ్లూ మాట్లాడుకుని ఏవో నాలుగు దొంగ పేర్లు రాసి బీనామీల్ని చూపించి సబ్సిడీ సొమ్ము స్వాహా చేస్తా ఉంటారు. ఎవురికి ఏం లోన్‌ మంజూరైందో ఎవరికీ తెలియదు. ఇప్పుడట్లా కాకుండా మీ అందరికీ తెలిసే రకంగా, మీ అందరి ఆమోదంతోనే రుణాలు మంజురుకు పేర్లు సిఫారసు చేద్దాం అనుకుంటున్నాం. మాకు మీ సహకారం అవసరం. మీరు కాదూ కూడదూ అంటే మా ఎంపిక మేం చేసుకుంటాం. మా పద్ధతులేవో మాకు ఉండనే ఉన్నాయి.’’

సర్పంచు కూర్చున్నాక ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. మెల్లగా ఎవరో గొణుక్కుంటున్నారు. కానీ పెద్దగా ఎవరి దగ్గర నుండీ వ్యతిరేకత రాలేదు.

హఠాత్తుగా గుంపులోంచి ఓ కుర్రాడెవరో ఇరవయ్యేళ్ల లోపు వయస్కుడు, ముందుకొచ్చి బొంగురు గొంతుతో అరవటం మొదలుపెట్టాడు.

‘‘అయినా మీరే ఎంపిక చేసేటట్లయితే ఇంక ఈ గ్రామసభ ఎందుకు? మాకేం పనీ పాటా లేదని ఇక్కడికి రమ్మన్నారా? మా అందరికీ నచ్చేలా మీరే ఎంపిక చేస్తామని అంటున్నారు కదా. ముందా పేర్లేమిటో చదివి వినిపించండి. వాళ్లకంత అర్హత ఉందో లేదో మేం తేలుస్తాం.’’

ఆ కుర్రాడి మాటలు పూర్తయ్యేంత వరకూ ఆగలేకపోయాడు రమణ.

‘‘ఒరే హనుమంతూ కూర్చోరా. ఎందుకట్లా అబ్బరిస్తా ఉండావు’’ అన్నాడు రమణ ఆ కుర్రాడికి అడ్డొస్తూ.

రమణ అట్లా మాట్లాడేసరికి ఆ కుర్రాడికది అవమానంగా అనిపించినట్లయ్యిందేమో. గొంతు మరింత పెంచాడు.

‘‘రమణా మీది ఈ ఊరు కాదు. మా కులమూ కాదు. నువ్వెందుకు మధ్యలో తల దూరుస్తావు? నీ పని నువ్వు చూసుకో. ఇది మా ఊరి వ్యవహారం. ఏదైనా అడిగే హక్కు, తెలుసుకునే హక్కు మాకుంది’’ అన్నాడు హనుమంతు. అతడికి తోడుగా మరో ఇద్దరు కుర్రాళ్లు అతని పక్కన నిలబడ్డారు.

ఏదో మాట్లాడబోతున్న రమణను వారించి, పంచాయతి కార్యదర్శి హనుమంతుకు సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది.

‘‘నిరుపేదల్లో నిరుపేదల కోసం ఉద్దేశించిన రుణాలు చాలా వరకు బినామీల పేరుతోనే స్వాహా అయిపోతూ ఉన్నాయి తమ్ముడూ. నేను కింది స్థాయి కులాల నుండి వచ్చినదాన్ని. మన ఎంపిడిఒ కూడా రిజర్వ్‌డ్‌ కులాలకు చెందిన వ్యక్తి కావడం వల్లే ఏదో ఎండిఒ ఆఫీసులో కూర్చుని నాయకులు, విలేకరులు, కుల నాయకులు, దళారులు చెప్పే పేర్లు రాసి రుణాలు మంజూరు చేసే పురాతన సంప్రదాయాన్ని కాదని, ఇట్లా నన్ను మీ ఊరికి పంపించారు. ఒక మంచి వ్యక్తి మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు అతనికి సహకరించాలని నేను, సర్పంచు అనుకున్నాం. ఎవ్వరూ ఈ లబ్ధిదారుల ఎంపికలో చెయ్యేత్తి చూపించని విధంగా అర్హుల జాబితా ఉండాలనుకున్నాం. ఇదంతా మీకు అర్థం అవుతుందనే అనుకుంటాను. మీకు తెలుసో తెలియదో ఒక నాయుడో, రెడ్డో, ఇంకో అగ్రవర్ణాల అధికారో కులపిచ్చి చూపిస్తే చెల్లుబాటు అయినట్లు ఒక ఎస్సీనో, ఎస్టీనో, బీసీ అధికారో తన కులం వాళ్లకు ఏదైనా మంచి చేద్దామని చూస్తే అదెంత మాత్రమూ జరగనివ్వరు పెద్దోళ్లు. నా సర్వీసులోనే నేను మొదటిసారి చూస్తా ఉండాను. ఒక తపన కలిగిన పేదల పక్షపాతి అయిన ఆఫీసర్ని. ముందు మేం రుణాల మంజూరు కోసం ఎంపిక చేద్దామనుకోనుండే వాళ్ల పేర్లు, వివరాలు మీ అందరికీ చదివి వినిపిస్తాను. అంతా నెమ్మదిగా విని మీ అభ్యంతరాలు, సూచనలు ఏవన్నా ఉంటే చివర్లో చెప్పండి’’ అంది లలితమ్మ.

ఆ మాటలంటున్నప్పుడు ఆమె మొహంలో ఏదో వెలుగు తళుక్కుమంది. సూటిగా గుండెలోపల నుండి వచ్చిన ఆ మాటలు హఠాత్తుగా అక్కడొక నిశ్శబ్ధకర వాతావరణాన్ని ఏర్పరచాయి. చాలా మందికి ఆ మాటలు స్పష్టంగా అర్థమైనట్టే అనిపించాయి వాళ్ల మొహాలు చూస్తే. కొంతమందికి అర్థం కాకపోయినా, ఏదో వింత జరగబోతుంటే చూస్తున్నట్లు చూస్తుండిపోయారు.

చంటి బిడ్డ ఎక్కడో కేర్‌మని ఏడుపు మొదలు పెడితే, వాళ్లమ్మ ఆ పసిబిడ్డను సముదాయిస్తూ పాలు తాపించే ప్రయత్నం మొదలుపెట్టింది. క్షణాల్లో ఆ చంటి బిడ్డ ఏడుపు కూడా ఆగిపోయింది. మళ్లీ అంతటా నిశ్శబ్దం అలుముకుంది.

కుయ్యప్ప, నాగవేలు, మునిరాజులు, శంకరయ్య, చివరికి హనుమంతు, రమణ కూడా మంత్రించినట్లు నిశ్చలంగా లలితమ్మ వైపే నిశ్శబ్ధంగా చూస్తుండిపోయారు.

‘‘మేనపాటి శాంతమ్మ. ఈమె భర్త యాక్సిడెంట్‌లో నెల క్రితం చనిపోయాడు. ఐదు మంది పిల్లలున్నారు. ఇప్పుడామె ఎనిమిదో నెల గర్భిణి… ఇంకొక పేరు కావాటి నారాయణప్ప. కుడి చేయి లేదు. మీకూ తెల్సు. చెరుకు గానుగాడుతూ చెయ్యి పోగొట్టుకున్నాడన్న సంగతి. మూడో లోన్‌ ఇందాక ఇక్కడికి వచ్చి వెళ్లిందే.. ఆ విశాలక్ష్మమ్మకు. ఇప్పుడు చెప్పండి. ఏవైనా లోటుపాట్లు ఉంటే’’ లలితమ్మకు ఎవరూ జవాబు చెప్పే ప్రయత్నం కానీ ఆమె మాటలకు బదులు మాట్లాడే ప్రయత్నం కానీ చెయ్యలేదు. కానీ హనుమంతు ఆమె ముందుకొచ్చి నిలబడ్డాడు.

‘‘మేడం పొరపాటుగా మాట్లాడినాను. ఏం అనుకోకండి. మీరు ఇందాక చదివిండే పేరు నారాయణప్ప మా నాయినే. మేం లోన్‌ అడక్కపోయినా, మా అవసరాన్ని గుర్తించారు చాలా థ్యాంక్స్‌ మేడం’’ అంటూ కళ్లనిండా నీళ్లు పెట్టుకునేసాడు హనుమంతు. ఏడుపు అడ్డు రావటం వల్ల అంతకు మించి మాట్లాడలేకపోయాడు.

శంకరయ్య నమ్మలేనట్లు అయోమయంగా లలితమ్మ వైపు చూస్తూ చేతులు జోడిరచి ‘‘చాలా సంతోషం తల్లీ’’ అని మాత్రం అనగలిగాడు.

గుంపులోంచి పెద్దవాళ్లెవరో ముందుకు బలవంతంగా తోస్తే ఇద్దరాడపిల్లలు లలితమ్మ ముందుకొచ్చి బిత్తర చూపులు చూస్తూ నిలబడ్డారు. గుంపులోంచి ఎవరో నోరు కదిపారు.

” మేడం మీరు ఇందాక చెప్పిండ్లా…శాంతమ్మ.. ఆయమ్మ బిడ్డలే వీళ్లు”

భయపడుతూ వెనక్కి వెనక్కి నడుస్తున్న ఆ ఆడపిల్లలిద్దర్నీ రెండు చేతులూ చాపి తన ముందుకు లాక్కుంది లలితమ్మ. కిందకు వంగి చాపపైన స్టీలు పళ్లెంలో రమణ తెప్చించి ఉంచిన బిస్కెట్‌ పాకెట్స్‌ చెరొకటి అందించింది.

ఆ పిల్లలిద్దరికీ ఒంటి నిండా సరైన బట్టలైనా లేకపోవడాన్ని, ఎండిపోయినట్లున్న ఆ దీనపు ముఖాల్ని చూస్తుంటే లలితమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

గ్రామసభ ముగించుకుని పంచాయతి కార్యదర్శి, సర్పంచు ముందుగా అక్కడి నుండి కదిలారు. వారి వెనుకే రమణ మిగతా సరంజామా అంతా బ్యాగ్‌లో సర్దుకుని బయలుదేరాడు. పిల్లలు కొందరు గుడి ముందు చేరి ఆటలు మొదలుపెట్టారు. ఎవరి తాలూకు కుర్చీలు, చాపల్ని వాటి యజమానులు తీసుకుపోతున్నారు.

రెండు కుక్కలు ఒకదాన్నొకటి తరుముకుంటూ వీథుల వెంట అరుచుకుంటూ పరుగులు తీస్తున్నాయి.

బాయిలర్‌లో బొగ్గుల్ని, నిప్పుకణికల్ని కలిపి కలబెడుతూ, కళ్లు మూసుకుని నోటినిండా గాలి ఊదుతూ నిప్పురాజేసాడు మునిరాజులు. కాసేపట్లో అక్కడ చేరిన అందరికీ టీ గ్లాసులు అందాయి.

బోరింగ్‌ దగ్గర మళ్లీ కిర్రుమని చప్పుడు కావటంతో అందరూ తలలు తిప్పి అటు వైపు చూసారు. యాభై దాటి ఉంటుంది వయసు. మొహం నిండా, చేతుల పైనా ముసలితనం తాలూకు మడతలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి.

‘‘కడుపాత్రం పిలకాయలు బెంగుళూరు చేరిపోయినా ముసలోళ్లు మాత్రం రేషన్‌ బియ్యం కోసం, పించనీ డబ్బు కోసం ఊర్లోనే నిలిచిపోయినారు. ఈ వయసులో ఈ గోవిందమ్మకు ఏం కష్టమో చూడప్పా. బిందెడు నీళ్లు సాధించేదానికి ఆ ముసలామె వల్ల అవుతుందా ఏమైనా’’ అంటున్నాడు కుయ్యప్ప.

‘‘ఇది ఊరు కదా. మనిషిని మనిషే ఆదుకోవల్ల. లేదంటే దీన్ని ఊరని ఎట్లా అంటారు. రేయ్‌ అబ్బోడా నువ్వు పోయి ఆ నీళ్ల కతేందో చూడ్రా’’ అన్నాడు శంకరయ్య ఖాళీ అయిన టీ గ్లాసును మునిరాజులు చేతికి అందిస్తూ.

ముందు హనుమంతు కదిలాడు. అతడి వెనుకే చురుగ్గా నాగవేలు కూడా కదిలాడు. ఇద్దరూ కలిసి ముసిలామెను పక్కకు జరిపి బోరింగ్‌ హ్యాండిల్‌ను చెరోవైపు పట్టుకుని, ముందుకూ వెనక్కూ ఊగిపోతే, హుషారుగా, జోరుగా భూమి లోతుల్లోంచి నీటిని పైకి రప్పించే ప్రయత్నం ప్రారంభించారు.

‘‘రమణగాడ్ని అడిగి బోరింగ్‌ క్రిష్టప్ప సెల్‌ఫోన్‌ నంబరెందో తీసుకోవాల తాతా. వాడు అదీ ఇదీ అంటావున్నాడంటే మనమే ఎవరో ఒకర్ని స్కూటరిచ్చి పంపించాల. ఎవర్దో ఎందుకు? నా స్కూటరే పంపిస్తా. రెండు పైపులు దించితే చాలు నీళ్లు పైకి వస్తాయి. రేపీ పాటికి బోరింగు రెడీ అయిపోవల్లంతే. ఆరూ నూరయినా, నూరు ఆరయినా రేపీ పాటికి బోరింగ్‌ రెడీ అయిపోవల్ల అంతే’’ మునిరాజులు గొంతు కొత్తగా ఉంది. ఆ గొంతులో ఏదో ఉత్సాహం, ఏమిటో ఉత్తేజం ధ్వనించాయి.

బోరింగు శబ్ధం అంతకంతకూ పెరుగుతూ ఉంది. బిందె నిండుతూ ఉంది.

కథ : పలమనేరు బాలాజీ

కథాచిత్రం: కాశిరాజు

కథాసారంగ టైటిల్ : మహీ పల్లవ్

వొక కొండపిల్ల

sudhakar

విజయనగరం జిల్లాలోని ” పోరాం’ గ్రామంలో జూన్ 22, 1986లో పుట్టారు బాలసుధాకర్ మౌళి. ఇప్పటి వరకు నాలుగు కథలు రాశారు. కవిత్వంలోనూ ప్రవేశం ఉంది. మొదటి కథ “థింసా దారిలో’ 2011లో సాహిత్య ప్రస్థానంలో ప్రచురితమైంది. ఈయన కథ “గొంతెండిపోతోంది’  హిందీలోకి అనువాదమైంది. రాశికన్నా వాసి ముఖ్యమనే ఈ రచయిత బడుగు, బలహీన వర్గాల తరపున నిలబడి మాట్లాడతాడు.

–వేంపల్లెషరీఫ్

 

 

1

పార్వతి..
కొండకు కొత్తందం వచ్చినట్టుండే నీలికళ్ల కొండ పిల్ల ‘పార్వతి’. పచ్చని చెట్లను ప్రేమతో అల్లుకున్న సన్నటి తీగలా, తీగె  పవిటంచుకు పూసిన ఎర్రటి పువ్వులా.. అడవి అడవినంతా గుండెల్లో నింపుకున్న కోయపిల్ల పార్వతి.

అడవి నెత్తురంతా థింసా రంగే..
అలాంటిది- అడవికే థింసాని నేర్పే వసంతోత్సవ నాట్యకారిణి పార్వతి.

నెత్తి మీద సూర్యున్ని అలంకరించుకుని కిందకు దిగుతున్న వనకన్యలా.. పార్వతి నడుస్తోంది. కాలిమువ్వల సవ్వడి లయాత్మకంగా చుట్టూ ధ్వనిస్తోంది.
ఆమె నడుస్తున్న దారంతా ‘కొండపూల సుగంధం’. మొక్కా మొక్కా, పువ్వూ పువ్వూ-
ఆమె వెళ్లిన వేపే చూస్తూ.. దిగులు పడుతూ.. పార్వతి పునరాగమనానికై రేపటిని కాంక్షిస్తూ……

సంధ్యా కాంతి- చల్లని గాలిని వెంటేసుకుని కొండ దిగువకు ప్రసరిస్తుంది.
పార్వతి నడుస్తూ నడుస్తూ వెనక్కి తిరిగి.. అడవిని ఆప్యాయంగా చూసుకుంది.

ఇప్పుడిప్పుడే బతుకు రహస్యాలను గ్రహిస్తున్న పార్వతి నడకలో- గొప్ప జీవితేచ్ఛ తొణికిసలాడుతుంది.

2

పార్వతికి పదహారేళ్లు.
అమ్మలేని పార్వతి- కొండ కొంగు పట్టుకుని అడవంతా పిల్లకోడిలా కలియతిరుగుతుంది.

కొండ మీద పుట్టే ప్రతీ ప్రాణి.. పార్వతికి పరిచయమే. గూళ్లల్లో నుంచి గువ్వపిల్లలను చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా ముద్దు పెడుతుంది.
తుప్పల్లో ముడుచుకు కూచున్న కుందేటి కూనల్ని పట్టుకుని శరీరంపై మృధువుగా నిమురుతుంది. లేళ్లతో పాటూ గంతులేస్తుంది. అడవి మేకల ఆలన తీరుస్తుంది.
పామన్నా.. పురుగన్నా… ఏ మాత్రం భయపడదు పార్వతి.
పార్వతికి- కొండ మీద అమ్మ మీద ఉన్నంత ప్రేమ.
కొండంటే.. పార్వతికి అమ్మే.

కొండ పాదాల చెంత పార్వతి ‘గుడిసె’.
గుడిసె ముందు జామచెట్టు.
చెట్టు నీడలో అమ్మ ‘లచిక’ సమాధి.
సమాధిపైన.. చెట్టు కొమ్మకు వేలాడుతూ ‘ఊయల’.
రోజూ చీకటి పడే వేళ- లచిక వచ్చి ఊయల ఊగుతుందని అమ్మమ్మ ‘మరియమ్మ’ నమ్మిక. ఎప్పుడైనా పార్వతి ఊయలలో ఊగుతుంటే.. అలా ముచ్చటగా కళ్లార్పకుండా చూస్తూనే వుంటుంది ‘మరియమ్మ’.

పార్వతి రావడం- మరియమ్మ చూసింది.

”పారోతి.. ఎలిపొచ్చినవమ్మా.. తల్లీ… కొండకు పొద్దుచ్చినేళ ఎల్లినవు… సీకటి పడ్డంక వొచ్చినవా…. పామూ పురుగూ కరుత్తదన్నా యినవే.. నా సిట్టి తల్లి…….. అడవిల పడ్డ పద్దినాలకే నిన్ను నా సేతిల ఎట్టి
ఎల్లిపోనాది గదే మీ అమ్మ….. దాన్నని యిప్పుడేటిలే.. అదా గూటిలో గంటిజావ.. తాంగి తొంగో… పెటకన జాంకాయ మర్సిపోకు……………..”

పార్వతి- అమ్మమ్మ ఉంచిన గంటిజావ తిని.. ఏరుకొచ్చిన కొండరేగు పళ్లు నంజుకుని… ఆరుబయట అమ్మమ్మ పక్కనే.. చుక్కల్ని లెక్కపెడుతూ మెల్లగా నిద్రలోకి జారుకుంది.

Picture 059

3

తెల్లారింది.
కొండ గుమ్మం- పసుపు రాసినట్టు ధగధగా మెరిసిపోతుంది. ఎక్కడ నుంచి వచ్చిందో.. జామచెట్టు కొమ్మపైన కూర్చున్న ‘ఎర్రముక్కు పిట్ట’ కమ్మగా కూస్తుంది.
అడవిలో- రోజూ పార్వతి వినే కూతే అది. సంబరపడింది.
”యే.. ఎర్రముక్కు పిట్టా! అడవికి రమ్మని పిలుపుకొచ్చినవటే.. పార్వతి రాకపోతే అడవి మాడిపోదూ.. పువ్వూ పిందే రాలిపోవూ… చిలకలు అలకపూనవూ…………!”
పార్వతి మాటలను అర్థం చేసుకున్నట్టుంది- ‘ఎర్రముక్కు పిట్ట’ తుర్రున ఎగిరిపోయింది. అడవంతటికీ పార్వతి మెళకువ గురించి కబురందించాలనుకుందేమో……….

గుడిసె ముందు- అడవి కోళ్లకు ‘గంటిలు’ వేస్తూ… పెంచుకుంటున్న కుందేలు పిల్లని గంప కింద నుంచి చేతుల్లోకి తీసుకుని ముఖానికి ఆనించుకుని గారాము చేసింది.

అమ్మమ్మ ‘మరియమ్మ’- పార్వతిని చూసి గతాన్ని గుర్తు తెచ్చుకుంది.
గతంలో జరిగిన సంఘటలన్నీ- మరియమ్మకు రోజూ జ్ఞాపకానికొస్తూనే ఉంటాయి.

‘పారొతి అమ్మకి పదనాలుగో ఈడుకే లగ్గమయింది. దీనికి పదేడేళొత్తున్నయి.. ఈ మాగమాసానికి.. ఈ ఈడుకొ అయ్య సేతిల ఎట్టాల…. దీనికా బాగ్గిం నేదు. తల్లీ నేదు. తండ్రీ నేడు. నాను సూత్తే ముసిలి ముండని……..’
‘లచికను- పారొతి తండ్రి మోసం సేసాడు. కొండ దిగువూరినించొచ్చి.. కొండోలతో సేయం నటించి.. కొండోల కట్టమంతా దోసుకునీవోడు. ఎదిగిన లచికను సూసి.. పేమించానని.. పేణమని సెప్పి లగ్గమాడాడు. లచికకు కడుపొచ్చాక సల్లగ జారుకుని ఎలిపోనాడు. మళ్లా పికరనేదు…………….’
గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ కళ్లు తుడుచుకుంది.

జ్ఞాపకాల దొంతరల నుంచి బయటకొచ్చి…..
”అమ్మా… పారొతి.. పిట్టలకు మేత ఏత్తున్నవటే తల్లీ…. ”
పార్వతి దగ్గరకొచ్చి తలని గుండెలకు ఆనించుకుని నుదుట మీద ముద్దు పెట్టుకుంది.

అమ్మ గుండెల మీద- బెంగా భీతీ లేకుండా తలవాల్చుకోవాల్సిన పార్వతి.. అమ్మమ్మ నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంది.

పార్వతికి- తండ్రి గురించిన విషయాలేవీ తెలియకుండా పెంచింది మరియమ్మ. ‘తండ్రి వలనే తల్లి చనిపోయిందని’ మాత్రం పార్వతికి తెలుసు.
కానీ ఊరిలో ఆ నోటా ఈ నోటా విన్న మాటలని బట్టి… యిప్పుడిప్పుడే ‘తల్లి ఎందుకు చనిపోయిందో…’  అర్థమౌతుంది పార్వతికి.

దిగువ ఊర్ల గురించీ.. ఆ మనుషుల గురించీ.. వాళ్ల ‘మాయా-మర్మం’ గురించీ తెలుసుకుంటుంది. అందుకే పార్వతికి దిగువ ఊర్లన్నా.. ఆ మనుషులన్నా భయం.

ఎప్పుడైనా గుడిసెకు ఎవరన్నా కొత్తవాళ్లు వస్తే.. బిగుసుకుని.. గుడిసె లోపలికెలిపోతుంది. ఆ రోజంతా ఎవరితోనూ మాట్లాడదు. బయటకు చెప్పుకోలేని బాధ.. పార్వతిని చుట్టు ముడుతుంది.       ఎలాంటి బాధలోనైనా పార్వతికి ఉపశమనం- ‘థింసా’నే. పార్వతికి ‘థింసా’ అంటే ప్రాణంతో సమానం. తల్లి ‘లచిక’ కూడా ఆ కొండ చుట్టు పక్కల ఊర్లలో మంచి ‘థింసా’ నర్తకిగా గుర్తింపు తెచ్చుకుంది. తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన ‘కళ’ను కొనసాగించాలని పార్వతి ఆశ.
ఆడా మగా- చేయి చేయి కలుపుకుని.. ఒకరినొకరు అనుసరిస్తూ… తుడుం దరువులకి అనుగుణంగా కాళ్లను లయబద్ధంగా కదపడమంటే…. పార్వతికి ఎక్కడలేని ఉత్సాహం. పార్వతి ‘థింసా’ని చూసిన.. ఆ ‘ఊరి’ స్త్రీలు పార్వతిని- వాళ్ల అమ్మతో పోల్చుతుంటారు. అలాంటప్పుడు పార్వతి గుండె తడవుతుంది. ఇంకా ఇంకా
బాగా నర్తించాలని పట్టుదల పెరుగుతుంది.

4

‘పండగ రోజులు’ దగ్గర పడుతున్నాయి.
కొండ ఊరిలో ‘ఆనందం’ తాండవిస్తుంది.
మగవాళ్లు, నడి వయసు ఆడవాళ్లూ.. దిగువ ఊర్లకెళ్లి… కట్టెలు, బొగ్గులు, చింతపండు, సీతఫలాలు అమ్మి.. పప్పు, నూనె, కొత్తబట్టలు కొనుక్కొని కొండకు తిరిగి వస్తున్నారు.
తుడుంలు, డప్పులు, పినలగర్రలు- సవరించుకుంటున్నారు.

కొండ ఊరికి పండగంటే.. ఇప్పుడు- ‘దిగువ ఊర్ల పండగే’.
కొండోల కందికొత్తల పండగ, విత్తనాల పండగ ఇవన్నీ.. కొత్తతరాలకు అనుభవంలో లేవు. వాళ్లకు పండగంటే సంక్రాంతి, కనుమలే.
కొండ ఊరివాళ్లు.. పండగ పూట- దిగువ ఊర్లకెళ్లి థింసా చేస్తారు. ఐదారు ఊర్ల నుంచి పిండివంటలు, బియ్యంలాంటివి కొండకు తీసుకుని వస్తారు. ప్రతీ ఏటా పండగప్పుడు దిగువకు వెళ్లడం.. కొండవాళ్లకు రివాజుగా మారిపోయింది.
ఎప్పుడూ వెళ్లడం వేరు. పండగ పూట వెళ్లడం వేరు. పండగ రోజుల్లో వాళ్లకు ‘థింసా..’ జీవితాధారంగా కూడా మారిపోయింది.

థింసా- కొండ గుండెల్లో ప్రవహించే ‘జీననది’.
తరతరాలుగా గిరిపుత్రుల సంస్కృతిని మోస్తున్న ‘అడవి తల్లి గుండె లయ’.

dhimsa_dance

పార్వతికి- థింసా అంటే ప్రాణం. కొండ ఒడిలో పుట్టి నడక నేర్చినప్పటి  నుంచి ‘థింసా’నే చూస్తుంది. థింసాలోనే సేదతీరుతుంది. ‘కొండా-థింసా’ పార్వతికి రెండు కళ్లు.
థింసా కోసం- దిగువ ఊర్ల మీద ఉన్న అయిష్టతను పక్కన పెట్టి.. పండగ రోజు- దిగువకు తన వాళ్లతో పాటూ వెళ్లింది.
కనుమకూ, ముక్కనుమకూ రెండు రోజులూ ‘థింసా’ ఆడింది.
తర్వాత- అందరూ తిరిగి కొండకు వచ్చేసారు.

పార్వతికి ఉబుసుపోలేదు. ‘థింసా’ ఇచ్చిన మత్తును మరిచిపోలేకపోతుంది. తుడుంలు, డప్పులు, పినలగర్రలు మధ్య ఆడిన కాళ్లను, చేతులను పదేపది చూసుకుంది. ఆ వాయిద్యపరికరాలన్నీ.. యిప్పుడు మూలకు చేరాయి.

థింసా- కేవలం ‘ఆకలి తీర్చే ఆట’గానే మారిందని పార్వతికి బెంగ.       పండగలోనో, జాతరలోనో మాత్రమే కనిపించే.. ‘థింసా’ స్థితికి- పార్వతికి గుండె కోసేసినంత దుఃఖం.

ఒంటరిగా, నిశబ్దంగా- అడవిలోకి బయలుదేరింది పార్వతి. ఆకూ ఆకూ.. కొమ్మా కొమ్మా- పార్వతి రాకను గమనించి గూళ్లలోకి సందేశాన్ని పంపాయి. పక్షులన్నీ కిలకిలమని అరుస్తూ.. వచ్చి.. పార్వతిని పలకరించాయి.
లేళ్లూ, కుందేల్లూ- పార్వతికి ఎదురొచ్చాయి.
చెవులు రిక్కించి.. పార్వతి మాట కోసం- అలా చూస్తూనే ఉన్నాయి.

పార్వతి ఎవరితోనూ ఏ మాటా ఆడలేదు.
ఓ చెట్టు కింద మౌనంగా కూర్చుంది.
తన ఆలోచనల్లో- ‘అమ్మ, థింసా’ తప్ప ఇంకోటి లేదు.

5

కొన్ని రోజులు ఇలాగే స్తబ్దంగా గడిచాయి.

ఒక రోజు- కొండకు ‘దుర్వార్త’ వచ్చింది.
”కొండను బాంబులతో పేల్సి.. పెద్దపెద్ద బండలను పట్నం తీసికిలిపోతారట!  ఆటితో గొప్పగొప్ప భవంతులు, డేంలు కడతారట! కొండోల గుడిసిలన్నీ కూల్సిత్తారట! యెక్కడో దిగువున వుండడానికి కుసింత జాగవ సూపెడతారట! పని కూడా సూపెడతారట…………….!”
కొండంతా- ఈ వార్త దావానలంలా పాకింది. కొండోల్లంతా ఒకరి ముఖాల్నొకరు చూసుకున్నారు. కొందరు బిక్కచచ్చినట్టు ఊరుకున్నారు. కొందరు గుండెలు బాదుకున్నారు. కొందరు ధైర్యం చేసి.. ఈ వార్త నిజమో! కాదో! తెలుసుకోవడానికి దిగువకు వెళదామనుకున్నారు. వెళ్లారు.
‘అంతా నిజమేనని…. ‘ వెళ్లిన వాళ్లు తిరిగి వచ్చారు.

కొండోలు అల్లాడిపోయారు.
‘ఎప్పుడు కొండను పేల్చేస్తారో……’ అని గుండెని రాయి చేసుకుని.. క్షణం క్షణం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఆ ‘చెడ్డ రోజు’ రానే వచ్చింది.
కొండోళ్ల ప్రమేయం లేకుండా గుడిసెలన్నింటినీ ప్రొక్లెయినర్లతో దౌర్జన్యంగా తీసేసారు.  పెద్ద పెద్ద లారీలు, లారీలతో రకరకాల మిషన్ల్, ఎక్కడెక్కడి నుంచో.. రోజు రోజుకీ.. ట్రాక్టర్లతో కూలీలు. అంతా గోల గోల.

కొండ ముందు- ‘నాగర్జునా క్వారీ వర్క్స్’ బోర్డు పడింది. క్వారీ పనులు ప్రారంభమయ్యాయి.
రోజూ- ఎ.సి కార్లు వచ్చి ఆగుతున్నాయి. అందులో నుంచి ఖరీదైన మనుషులు దిగుతున్నారు. కూలోళ్ల చెమటతో లేచిన ఎ.సి రూముల్లోకి వెళ్లి సేదతీరుతున్నారు.
బయట ఎండనక, వాననక కూలీలు- ఇరవై నాలుగు గంటలూ పనిచేస్తున్నారు.

బాంబులతో కొండ దద్దరిల్లిపోతుంది.
మిషన్లతో- చతురస్రాకారంగా, దీర్ఘచతురస్రాకారంగా పెద్ద పెద్ద బండలను కోసి.. పెద్ద పెద్ద లారీల మీదకెక్కించి పట్నం తీసుకెళిపోతున్నారు.
పనంతా- వాళ్లు అనుకున్న లెక్క ప్రకారం జరుగుతుంది.
కొండోళ్లంతా చెట్టుకొకరు, పుట్టకొకరు చెదిరిపోయారు. కలివిడిగా వొక చోట బతికిన వాళ్లందరూ ఉన్నట్టుండి అదృశ్యపోయారు.
ఒకటీ, అరా కొండోళ్లు మాత్రం- వాళ్ల దయాదాక్షిణ్యాలతో ఎ.సి. గదులకు దూరంగా పాకలు వేసుకున్నారు. వొకరిద్దర్ని పనిలోకి తీసుకున్నారు. కొండ దిగువ ఊర్ల వాళ్లను కూడా చాలా తక్కువ మందిని.. అదీ చిన్నాచితక పనుల్లోకే తీసుకున్నారు.

‘మరియమ్మ, పార్వతి’ని కూడా అక్కడే పాకల్లో ఉండడానికి అనుమతిచ్చారు.
ఇన్నాళ్లూ అండగా ఉన్న కొండ స్వరూపం ఒక్కసారిగా మారిపోవడంతో.. వాళ్లకిదంతా అయోమయంగా అనిపించింది. చూస్తుండగానే రోజు రోజుకీ కొండ తరిగిపోతుంది. పెద్ద పెద్ద గొయ్యలు పుడుతున్నాయి.
బాంబుల శబ్దానికి పక్షులన్నీ- ఎటో ఎగిరిపోయాయి. కుందేళ్లూ, నెమళ్లూ- క్వారీ యజమానుల ఆకలికి  బలైపోతున్నాయి.

మరియమ్మ, పార్వతి కొండ దగ్గరే.. శిథిలమౌతున్న కొండ దగ్గరే… కాలాన్ని ఈడుస్తూ- కొండ ఔన్నత్యాన్ని తలచుకుంటూ.. దుఃఖించి, దుఃఖించి చివరకు వాళ్లు ఏడ్వడమే మరిచిపోయారు.

కొండల్లో- పార్వతి తిరుగాడిన ప్రదేశాలన్నీ గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి.
పార్వతి తల్లి ‘లచిక’ సమాధి- ఎక్కడుందో ఆనవాలు కూడా కనిపించట్లేదు. పలకబారిన పళ్లతో గుమగుమలాడే జామచెట్టూ అదృశ్యమైపోయింది. తెల్లారితే పలకరించే ‘ఎర్రముక్కు పిట్టా’ కనిపించలేదు.

థింసా?!
బాంబుల శబ్దానికి, సుత్తి దెబ్బలకు- కుంటి కాళ్లతో ఎక్కడ.. ఏ రాతిపొరల మధ్యన మరణవేదన పడుతుందో!
థింసా నాట్యకారిణి ‘పార్వతి’- యిప్పుడు ఏ ప్రత్యేకతలు లేని రోజు కూలీ.
మరియమ్మ- గతం జ్ఞాపకాలను వర్తమాన విషాదంతో నెమరువేసుకుంటూ.. భవిష్యత్తుని ఎంత మాత్రం కలగనని వొక పరాజిత. కాలం తనను వెళ్లదీస్తుందో! తనే కాలాన్ని వెళ్లదీస్తుందో!

పార్వతి వొక్కర్తే- యిప్పుడు ఇంటికి ఆదరువు.
చిన్న చిన్న రాళ్లను గమెన్లతో ఎత్తడం, క్వారీ పనోళ్ల వంటకు నీళ్లు పట్టడం- పార్వతి పని.

6

రోజులు గడుస్తున్నాయి.

వొక రోజు చీకటి పడిన వేళ-
ఎప్పటి నుంచి అదును కోసం ఎదురుచూస్తున్నాడో… ‘సూపర్ వైజర్- ప్రసాద్’ పార్వతిని అడ్డగించాడు. పట్నం నుంచి నెల రోజుల కిందటే క్వారీలో జాయిన్ అయ్యాడు. బతిమాలి, బుజ్జగించి, ధైర్యం చెప్పి, మాయ మాట్లాడి, పెళ్లి చేసుకుంటానని….. కోరిక తీర్చుకున్నాడు.
కొండని, థింసాని, అమ్మని కోల్పోయిన పార్వతి- అతనిని నమ్మింది. కొన్నాళ్లు కాపురం చేసాడు. ఫలితంగా గర్భం దాల్చింది.

ఉన్నట్టుండి- ఒంట్లో ఏ జబ్బూ లేకుండానే.. అమ్మమ్మ చనిపోయింది.
పార్వతికి తెలిసినంతలో ‘అమ్మమ్మ’ మరణమే తొలి మరణం.

దిగులు పడింది.
అమ్మమ్మ మరణానికి కారణం- ఆలోచిస్తున్న కొద్దీ పార్వతికి అర్థమవసాగింది.

కొన్ని రోజుల తర్వాత-
పట్నం పని మీద వెళ్తున్నానని చెప్పాడు ప్రసాద్. మళ్లీ తిరిగి రాలేదు.
క్వారీలో- తోటి ఉద్యోగస్తులనడిగితే తెలియదన్నారు. యజమానులు పార్వతిని పట్టించుకోలేదు.
పైగా.. ”నీలాటి ముండ అవసరం తీరింది.. యెల్లి పట్నంలో.. యే ముండ పక్కన తొంగుండో…..”

నోటికొచ్చిన మాటలన్నీ ఆడారు.
పార్వతికి కోపం వచ్చింది. దుఃఖం వచ్చింది. కానీ ఏమీ చేయలేని చేతకానితనం.

రోజులు గడుస్తున్నాయి.
పార్వతికి- తొమ్మిది నెలలు నిండాయి. కూలీల సాయంతో సంక్రాంతి రోజున- సూర్యుడు ఆకాశంలో పొడుస్తుండగా ‘ఆడబిడ్డ’ని కనింది.
అమ్మ లేదు. అమ్మమ్మా లేదు.
కొండా లేదు. ‘థింసా’ లేదు.
పార్వతి.. పురిటితల్లి పార్వతి.. వొంటరి ఆడది.

తన కన్నా ముందే.. మోసపోయి ఆత్మహత్య చేసుకున్న ‘అమ్మ’ గుర్తొచ్చింది. ప్రతీసారి మోసపోతున్న తన జాతి గుర్తొచ్చింది. మా వాళ్లలా నేనూ మోసపోయాననుకుంది.

Picture 060

7

ఆ రోజు అర్థరాత్రి-

పార్వతి- వొంటిలో ఉన్న శక్తినంతటినీ కూడదీసుకుంది.
‘థింసా’ ఆడి ఆడి రాటుదేలిన కాళ్లు రెండింటినీ.. దగ్గరకు లాగి నిటారుగా నిలబడింది.
నేల మీద- అమాయకంగా నిద్రిస్తున్న పసికందుని పైకి తీసి, చీరతో వీపు వెనక్కి కట్టుకుని.. అడుగు ముందుకు వేసింది.  బయలుదేరింది.

అడవి లోపలకి లోపలికి ఇంకా లోపలికి.. లోపలి లోపలికి నడుస్తోంది.
నడుస్తోంది.
నడుస్తోంది.
బొడ్డులో వొక కత్తిని రహస్యంగా పెట్టుకుంది. దారిలో- మొదటి వేటుగా వొక ‘సింహాన్ని’ నరికింది. ఈసారి- బక్కాబడుగుజీవాల నెత్తురు తాగుతున్న ‘నరసింహాల్నే’ నరకాలనుకుంటుంది.

‘తన సంస్కృతిని- తన జాతిని రక్షించుకోవడమనే మహా సంకల్పంతో బయలుదేరిన ఓ వీరవనితా.. జయహో…. జయ జయహో………………….’
చీకట్లో- ఏ లోయల్నుంచో.. ఏ రాళ్ల అంతర్భాగాల నుంచో… పురాతనమైన, పరిచయమైన గొంతు వొకటి తెరలు తెరలుగా ప్రతిధ్వనిస్తోంది.

8

ఈ రోజు పార్వతి చూపు ‘అరణ్యం’ వైపు..
రేపు ?

– బాల సుధాకర్ మౌళి

కథాచిత్రాలు: ఎస్. గురుమూర్తి

బతుకు బండి

venu photo

ఇప్పటికైతే వేణు గురించి చెప్పడానికేం లేదు. ఇతను ఒక మామూలు జర్నలిస్టు. రైతు కడుపున పుట్టిన బిడ్డ. 27 ఏళ్ల పడిలో తోటి సమాజం కోసం బెంగ పెట్టుకుని రచయిత అయ్యాడు. బందరులో పుట్టి హైదరాబాద్‌లో జీవిక కొనసాగిస్తున్నాడు.  తొలి కథ ఈ ఏడాది జనవరిలోనే సాక్షిలో ప్రచురితమైంది. ఇప్పుడిది అతని రెండో కథ. మరి నమ్మొచ్చో లేదో మీరే చెప్పాలి. — వేంపల్లెషరీఫ్‌

 ***

 ‘నీకు అక్క చెల్లెళ్లు లేర్రా దొంగలంజి కొడకా… మనిషన్నాక నీతుండాల్రా’ ప్యాసింజర్‌ రైలు బోగీలో రెండు బాత్రూంల మధ్య ఉన్న స్థలంలోంచి అరుపులు మొదలయ్యాయి. సమయం రాత్రి పన్నెండున్నర. ఏప్రిల్‌ మాసాంతంలో… చల్లని గాలి బోగీ మొత్తాన్ని ఆక్రమించి.. చెవుల్లో హోరు పెడుతుంటే… ఆ హాయిని ఆస్వాదిస్తూ ఆదమరిచి నిద్రపోతున్న వాళ్లందరూ ఆ గోలకు లేచారు.

బాత్రూంలకి ఎదురుగా నాలుగడుగుల  దూరంలో సింగిల్‌ సీట్లో ఉన్న నాకూ మెలకువ వచ్చింది.

‘పొయ్యి నీ అమ్మకు పెట్టరా ముద్దు  బాడ్కో నా కొడకా’ అంటూ ఆ ఇరవై ఎనిమిదేళ్ల స్త్రీ ఎర్ర చొక్కా అతనిపై గట్టిగా అరుస్తోంది. ఆమె పక్కనే ఆమె మూడేళ్ల పాప… బతికే ఉందా? అని సందేహం కలిగించే రీతిలో నిద్రపోతోంది.

‘నువ్వేగా నా ఒళ్లో తలపెట్టావు’ అంటున్నాడా అపరిచితుడు. పీకలదాకా తాగి ఉండటంతో మాటలు తడబడుతున్నాయి.

‘నోరు ముయ్యిరా. ఎక్కువ మాట్టాడితే ఎడంకాలి చెప్పుతో కొడతా నా కొడకా’ అని గట్టిగా అరిచిందామె.

‘ఓయ్‌… ఏమయ్యోయ్‌’ అన్న ఆమె పిలుపుకి నా పక్కనే కింద పడుకుని ఉన్న ఆమె భర్త లేచాడు. ‘ఏమయ్యింది మే’ అంటూ వాళ్ల దగ్గరికి వెళ్లాడు. అతని ఎర్రచొక్కా వెనకంతా మురికి. అతనూ కైపు మీద ఉండటంతో అడుగులు తడబడుతున్నాయి.

‘ఈడు నన్ను ముద్దు పెట్టుకున్నాడయ్యా’ అని చెప్పింది భర్తతో.

‘నా కొడకా’ అంటూ ఆమె భర్త అతని పైకి వెళ్లాడు.  ఇద్దరి వయసూ దాదాపు ముప్పైఐదు ఉంటుంది.

‘ఆమే నా ఒళ్లో పడుకునింది’ అంటున్నాడా అపరిచితుడు.

ఆ ముగ్గురూ టిక్కెట్లు లేకుండానే రైలు ఎక్కారని చూసిన ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. టిక్కెట్టు లేని ప్రయాణం చట్టరీత్యా నేరం. సమాజరీత్యా లేకీతనం. లేకీవాళ్లతో మనకెందుకు అనుకున్నారో ఏమో… ఎవరూ వాళ్ల గొడవలో వేలు పెట్టలేదు.

‘ఆ నా కొడుకుతో మాటలేంది చెప్పుతో కొట్టక’ గట్టిగా అరిచిందామె. రెచ్చిపోయిన భర్త ఆ అపరిచితుడిపై కలబడ్డాడు. అతను ఒక్క తోపు తొయ్యటంతో వచ్చి నా కాళ్ల దగ్గర పడ్డాడు.

‘చెప్పుతో కొడతా’ అంటూ తూలుతూ చెప్పు చేతిలోకి తీసుకునేలోపే.. ఆ అపరిచితుడు తన కుడికాలి చెప్పుతీసి అతని నెత్తి మీద నాలుగు కొట్టాడు.

‘తప్పు నువ్వుచేసి నా మొగుణ్ని కొడుతున్నావేందిరా బాడ్కో’ అంటూ ఆమె వాళ్ల దగ్గరికొచ్చి ఆ అపరిచితుణ్ని వెనక్కి లాగింది.

‘ఓయ్‌ ఏంది మీ గొడవ. కామ్ముగా ఉంటారా? రైల్లోంచి దింపెయ్యాలా?…’ నాకు అటువైపు బారుసీట్లో కూర్చుని ఉన్న ఓ అరవై ఏళ్ల ముసలాయన గద్దిస్తూ వాళ్ల దగ్గరకొచ్చాడు…. రైలేదో ఆయన సొంత ఆస్తి అయినట్లు.

‘ఈ నీతిమాలినోడు నన్ను ముద్దుపెట్టుకున్నాడు’ ఆ వృద్ధుడితో చెప్పిందామె.

‘అదే నా ఒళ్లో పడుకుంది’ ఆ అపరిచితుడు అన్నాడు.

‘అది అంటున్నావేందిరా నా కొడకా’ అంటూ ఆమె అతని చెంపపై కొట్టబోయింది. ఆ వృద్ధుడే ఆపాడు.

‘ఏంది.. గోల ఆపరా. ఓయ్‌ రైలు ఆపండయ్యా వీళ్లని దించేద్దాం’ అన్నాడా వృద్ధుడు.

భయపడ్డారో ఏమోగానీ ఆ అపరిచితుడు బోగీ అవతలి వైపునకు వెళ్లాడు. భార్యాభర్తలు బాత్‌రూంల దగ్గరికి చేరారు.

అది బెంగుళూరు నుంచి గుంటూరు వస్తున్న ప్యాసింజర్‌. నా వేసవి సెలవులు ముగియటంతో కాలేజీకి బయలుదేరాను నేను. బళ్లారి నుంచి గుంటూరుకు డైరెక్టుగా ప్యాసింజర్‌ బండి లేదు. నేను నరసరావుపేటలో దిగాలి.ప్యాసింజర్‌ అయితే ఖాళీగా ఉంటుంది. రిజర్వేషన్‌ గొడవ ఉండదు. పైగా చార్జీ చాలా తక్కువ. బళ్లారిలో డైరెక్ట్‌ టిక్కెట్టు తీసుకుని… రాయచూరు ప్యాసింజర్‌లో గుంతకల్‌ దాకా వచ్చి ఈ బండి ఎక్కటం మొదటి నుంచీ అలవాటే నాకు. ఆ రోజు ఆ బండి అరగంట ఆలస్యంగా ఆరుగంటలకు వచ్చింది. ఖాళీగా ఉన్న ఓ బోగీ చూసి ఎక్కేశా. సింగిల్‌ సీటు ఓదాన్ని పట్టుకుని కూర్చున్నా. అది బాత్‌రూంలకి ఎదురుగా నాలుగడుగుల దూరంలో ఉంది. కొంచెం మూత్రం వాసన వస్తోంది. కాసేపటికి అదే అలవాటయి పోతుందని నా ధీమా. పది నిమిషాలకి బండి కదిలింది. నా ఎదురుగా ఉన్న బాత్రూంల మధ్యలో ఉన్న స్థలంలో రెండు ప్లాస్టిక్‌ గోతాలున్నాయి. వాటి ఎడమ వైపు సింకు కింద ఓ మహిళ కూర్చుని ఉంది. ఆమె పక్కనే మూడేళ్ల పాప నిద్రపోతోంది. ఆమెను చూస్తే ఎవరికీ ఏ భావనా కలగదు. ఆమె ముఖంలో ఏ కళాకాంతీ లేవు. లోకంలోని అన్యాయాలన్నీ ఒక్కసారిగా దాడిచేస్తే.. భరిస్తూ.. నానాటికీ కృసిస్తున్న తీరుగా ఉంది.

Batuku Bandi

‘ఓయ్‌ ఎవరయ్యా ఈ గోతాలు ఇక్కడ పెట్టింది. బాత్‌రూంకి అడ్డంగా.’ అంటూ ప్రశ్నించాడో యాభైఏళ్ల వ్యక్తి.

‘మాయేనండి’ ఆ స్త్రీకి పక్కనే డోర్‌ దగ్గర కూర్చున్న ఆమె భర్త వచ్చి చెప్పాడు.

‘ఏమున్నయ్యి వాటిలో’ అడిగాడా వ్యక్తి. ‘బేల్దారి సామాను, గిన్నెలండి’ చెప్పాడు భర్త.

‘బెంగుళూరులో మేస్త్రి పనులు అయిపోయినట్టా’ అడిగాడా యాభై ఏళ్ల వ్యక్తి.

‘ఆ.. వానాకాలం వస్తందిగా… ఇక కట్టడం పనులు పెద్దగా సాగవు. ఊళ్లో పనులు మొదలవుతయ్యి. అందుకే వస్తన్నాం’ చెప్పాడు భర్త.

బండి మద్దికెర రాగానే ఎర్రచొక్కా వేసుకున్న ఓ వ్యక్తి ఎక్కాడు. అతని దుస్తులు కొంచెం మాసిపోయి ఉన్నాయి. జుత్తు చింపిరిగా ఉంది. గడ్డం బాగా మాసి ఉంది. అతణ్ని చూస్తే వస్తువులు కాజేసే మాదిరిగా కనిపించాడు నాకు. బోగీలో కాసేపు అటూ ఇటూ తిరిగి మాయమయ్యాడు. డోన్‌లో బండి ఆగింది.

‘ఓయ్‌…పిల్లకి తినటానికి ఏదన్నా తీసుకరాపో’ అని అడిగిందామె భర్తని.

‘ఇక్కడేమీ ఉండవే’ అన్నాడతను.

‘ఉండవంటావేంది. అదిగో వాళ్లు దోసెలు తెచ్చుకుని తింటంటే’ ప్రశ్నించిదామె.

‘ఇంటికి పొయ్యి తిందాంలేమే’ చిరాకుగా చెప్పాడతడను.

‘ఇంటికి పొయ్యేలకి తెల్లారుద్ది. అప్పటిదాకా పిల్ల ఎలా ఉంటది.’ అందామె.

ఆమె పోరు భరించలేక దిగివెళ్లి రెండు ఇడ్లీలు తెచ్చాడు.

‘రెండే తెచ్చావేంది’ ఆమె విరక్తిగా ప్రశ్నించింది.

‘నా దగ్గర డబ్బులు లేవుమే’ అన్నాడతను

.‘తాగటానికయితే ఉంటయ్యా’ ఆమె కోపంగా అంది. పాపను లేపి నోట్లో పెడుతుంటే.. అతనే ఒకటి తినేశాడు.

ఓ అరగంట తర్వాత భర్త బాత్రూంలోకి వెళ్లాడు. ఓ ఖాళీ క్వార్టర్‌ మందు సీసాతో బయటకి వచ్చి తలుపులోంచి బయటకు విసిరేశాడు. మరి కాసేపు అక్కడక్కడే తిరిగి వచ్చి నా పక్కన కింద అలాగే పడుకున్నాడు. బండి నంద్యాల దాటింది. బయటి నుంచి చల్లగాలి ఎక్కడో కురుస్తున్న వాన వాసనను మోసుకొస్తోంది. బోగీలో దాదాపుగా అందరూ కూర్చునే కునిక పాట్లు పడుతున్నారు. ఈ ఏడాదితో డిగ్రీ అయిపోతుంది. తరువాత ఏం చెయ్యాలో ఆలోచిస్తూ కూచున్న నేను. బాత్రూంల దగ్గర మహిళ ఆ దారికి అడ్డంగా అలాగే వాలిపోయి విశ్రమిస్తోంది. అట్టలు కట్టిన ఆమె జుత్తు గాలికి భారంగా కదులుతోంది. ఆమె దుస్తులు బాగా మాసి ఉన్నాయి. ఆమెకు అటువైపుగా రెండు బాత్రూంల మధ్యలో పాప ఉంది. ఇంకా నిద్ర పోలేదు. రెండు చేతులూ గాల్లోకి ఎగరేస్తూ ఆడుకుంటోంది. మధ్యలో కిలకిలా నవ్వుతోంది. ఆ నవ్వు చాలా ముచ్చటగా ఉంది. చిన్నారి జాకెట్టు.. పరికిణీ కూడా మాసి ఉన్నాయి. అయితే నిర్మలమైన ఆ నవ్వు ముందు మాలిన్యం లెక్కలోకి రావటం లేదు. నిర్మలత్వానికి ఉన్న శక్తి నాకు మరోసారి బోధపడింది. రాత్రి పదిన్నర సమయంలో భర్త లేచి తూలుతూ ఆమె దగ్గరికి వెళ్లాడు..ఆమె తల దగ్గర కూర్చుని మరో క్వార్టర్‌ బాటిల్‌ ఖాళీ చేసి సీసా బయటికి విసిరేశాడు. ఓ బీడీ వెలిగించాడు. ఆమె ఒకసారి మెడ లేపి అతణ్ని చూసింది. పాపని పక్కన పడుకోబెట్టుకుని మళ్లీ నిద్రలోకి జారకుంది. అతను కాసేపు అక్కడే కూర్చుని మళ్లీ తిరిగొచ్చి ఇందాకటి స్థానంలో నిద్రపోయాడు. బండి కంబం దాటింది. ఇందాక మాయమైన ఎర్రచొక్కా అపరిచితుడు ఆకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. కాసేపు అటూఇటూ తిరిగాడు. ‘దొంగ’ అని అతనిపై ముందే నాకు గట్టి అభిప్రాయం ఏర్పడటంతో అతణ్ని గమనిస్తూ కూర్చున్నా. కొంత సమయం ఆమె తల పక్కన ఉన్న గేటు దగ్గర నుంచున్నాడు.  తర్వాత ఆమె తల పక్కన కూర్చున్నాడు. తీక్షణంగా ఆమెను గమనించటం ప్రారంభించాడు. నాకు అనుమానం పెరిగింది. అయితే ఆమె ఒంటిమీద వీసమెత్తు బంగారం కూడా లేదు. ఏం చేస్తాడో చూద్దామని అలాగే చూస్తూ కూర్చున్నా. ఆశ్చర్యంగా ఆమె తన తలను అతని ఒళ్లో పెట్టింది. కాసేపటికి అతను ఆమె తలపై నిమరటం మొదలు పెట్టాడు. ఓ అరగంటదాకా ఆ తంతు చూశాక.. హాయి గాలి మళ్లీ నన్ను నిద్రలోకి లాక్కెళ్లింది.

మెలకువ వచ్చే సరికి ఎదురుగా గోల. నాకు ఏమీ అర్థం కాలేదు. ఆమె కదా నేను చూస్తుండగానే అతని ఒళ్లో తల పెట్టి పడుకుంది. అతను అంతసేపు తలపై నిమిరినా నిశ్శబ్దంగా ఉంది. మరి ఇప్పుడు ఎందుకు కేకలేస్తున్నట్టు. వృద్ధుడి కేకల తర్వాత బోగీలో మళ్లీ గాలిహోరు మొదలైంది. బాత్‌రూంల దగ్గర భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు.

‘ఇందాక నువ్వు నా పక్కనే కూసింటివే. ఆడిది కూడా ఎర్ర సొక్కానే ఆయె. ఆడు నువ్వే అనుకున్నా. అందుకే ఒళ్లో తలకాయ పెట్టా. అయినా ఆ నా కొడుక్కి నీతి ఉండొద్దా’ ఆమె భర్తతో చెప్పింది. నాకు అసలు విషయం బోధపడింది. ఆమెను తప్పుగా అనుకున్నందుకు కొంచెం బాధపడ్డా.‘వాడు పీకలదాకా తాగి తూలతన్నడు.. వాణ్ని కొట్టలేకపోతివే.. తోస్తే అక్కడిపోయి పడితివి.. నీ చాతగాని చచ్చినోడా’ ఆమె భర్తను కొంచెం గట్టిగానే తిడుతోంది.‘ఆడు మూరకంగా ఉన్నాడుమే. రాచ్చసి నాయాలు.’ అని ఏదో సర్ది చెబుతున్నాడు భర్త. ఆమె పట్టించుకోవటం లేదు. కాసేపటికి అతను లేచివచ్చి యథాస్థానంలో పడుకున్నాడు. ఆమె నిద్రపోలేదు. పాప బొజ్జపై మెల్లగా జో కొడుతూ కూర్చుంది. బండి మార్కాపురం దాటింది. బోగీ సగం ఖాళీ అయ్యింది. ఈ సారి ఆమెను మరింత పరీక్షగా గమనించాను నేను. ఆమెకు చదవటం కూడా వచ్చి ఉండదు. భర్తే ఆమె ప్రపంచం అయ్యుండాలి. నిర్లిప్తంగా డోర్‌లోంచి అలా బయటకి చూస్తూ కూర్చుందామె. కాసపేపటికి అపరిచితుడు అక్కడికి వచ్చి డోర్‌ దగ్గర నుంచున్నాడు. వాడి మీద ఇంతెత్తున లేస్తుందనుకున్న ఆమె.. ఏమీ పట్టనట్లు అలాగే పాపను జోకొడుతూ కూర్చుంది. ‘నువ్వేగా నా ఒళ్లో తలపెట్టింది’ అంటూ అతను ఆమె పక్కనే కూర్చున్నాడు.ఆమె ఏమీ అనలేదు. కనీసం పక్కకి కూడా జరగలేదు. అతను ఇంకా ఏదో చెబుతుంటే వినీ విననట్లు కూర్చుంది.

‘నేను కాగితాల యాపారం జేస్తా.. వారానికి రెండు వేలు సంపాదిస్తా’ అతను చెప్పాడతను. ‘మీరు యాడనుంచి’ అని అడిగాడా వ్యక్తి. తాగి ఉండటం వల్లో ఏమో ఏ బెరుకూ లేకుండా కొంచెం పెద్దగానే మాట్లాడుతున్నాడు.

‘బెంగళూరులో బేల్దారి పనికి పోయినాం. ఇప్పుడు అయిపోయినయ్యి. అందుకే మా ఊరు దొనకొంద వచ్చేత్తన్నాం.’ చెప్పిందామె.

‘నా పెళ్లాం చచ్చిపొయ్యింది. నాకు మద్దికెరలో ఓ పాతకాగితాల కొట్టుంది. గుంటూరులో నా పెళ్లాం అన్న కూతురి పెళ్లి ఉంటే పోతన్నా’ అని అడక్కుండానే ఆమెతో చెప్పాడతను. కాసేపటికి ఇద్దరూ మాటల్లోకి దిగారు.

‘నీ మొగుడు బాగా సంపాదిత్తాడా?’ అడిగాడా అపరిచితుడు.

ఆ మాటతో ఆమెను మరింత నిర్లిప్తత ఆవహించింది. ‘ఏం చెప్పాలి. నా మొగుడు సచ్చినోడికి ఎప్పుడూ తాగుడు గొడవే. పెళ్లాంపిల్లలు తిన్నారో లేదో కూడా పట్టదు ఆ ఎదవకి. నా కూలి డబ్బులు కూడా తీసుకుని ముండల దగ్గరికి పోతాడు గాలినాబట్ట. ఆడపిల్లను కని నా ఎదన పడేస్తివేందే అని ఎపుడూ కొడతా ఉంటాడు. పీక పిసికి చెరువులో పడేస్తే పోద్ది అంటడు. ఆడి తల్లి అలాగే అనుకుంటే ఆడు ఉండేవోడా? నేను ఎక్కడ సుకపడిపోతానో అని నా ఎదానెయ్యటానికి ఆడితల్లి ఆణ్ని కనింది. పెళ్లాన్నికాపాడుకునే దయిర్యం కూడా లేదు చాతగాని నాబట్టకి’ ఆమె తన ఆక్రోశాన్నంతా వెళ్లగక్కింది.

‘నాతో వచ్చియ్యి. నిన్ను రానిలా చూస్కుంటా. ఆడితో నీకు ఎందుకు. నీ పిల్లని చదివిత్తా’ అతను అడిగాడతను.

అతని ధైర్యం చూసి నాకు మతిపోయింది.

‘తాగుబోతు సచ్చినోల్లని ఎప్పటికి నమ్మాలి? తాగుబోతోడిది పందిబుద్ధి. ఎప్పటికీ బరదలోకే  లాగుతుంటది.’ అందామె.

‘అది కాదు. నేను ఒట్టు పెడతన్నాగా… నిన్ను బాగా చూసుకుంటా.. వచ్చియ్యి నాతో’ అభ్యర్థించాడా వ్యక్తి.

‘చెపితే అర్దమవదా నీకు… తాగుబోతు ఎదవా’ ఆమె కోపంగా అంది.

ఇక అతను ఆ మాట మర్చిపోయాడు. ఇంకా ఏవేవో మాట్లాడుకోవటం ప్రారంభించారు. ఇప్పుడు అతను ఆమె తొడపై కొడుతూ మాట్లాడుతున్నాడు. జేబులోని వందనోట్లు మాటిమాటికీ బయటకుతీసి చూపిస్తున్నాడు. అతని మాటలకు ఆమె మెల్లిగా నవ్వటం ప్రారంభించింది. ఆమె కూడా అతని భుజంపై తడుతూ మాట్లాడుతోంది. నా పక్కనే కింద ఆమె భర్త శవంలా నిద్రపోతున్నాడు. కొంతసేపటికి ఇద్దరూ నావైపు పదేపదే చూడటం మొదలెట్టారు. నాకు కొంత అనుమానంగా తోచింది. వాళ్ల వైపే చూస్తూ కూచున్నా. చల్లగాలికి మళ్లీ నా కళ్లు మూతపడ్డాయి. ఓ పావుగంట తర్వాత ఎందుకో మెలకువచ్చి చూస్తే.. వాళ్లిద్దరూ కనిపించలేదు. పాప అలాగే నిద్రపోతోంది. ఈ మధ్యలో ఏ స్టేషనూ వచ్చినట్లు లేదు. మరి ఎక్కడికి వెళ్లారు. బాత్రూంలలో ఎడమ వైపు ఉన్నది మూసుకుని ఉంది. నా అనుమానం బలపడింది.  ఓ ఐదు నిమిషాల తర్వాత అది మెల్లగా కొంచెం తెరుచుకుంది. ఐదు సెకన్ల అనంతరం ఆ స్త్రీ మెరుపువేగంతో బయటకు వచ్చి… అంతే వేగంగా పాప పక్కన పడుకుంది. ఐదు నిమిషాల తర్వాత అపరిచితుడు కూడా బాత్రూంలోంచి బయటకు వచ్చి… నా పక్కనే ఉన్న బారు సీటులో కిటికీ పక్కన కూర్చున్నాడు. బండి వినుకొండ దాటింది. టైం మూడున్నర. ‘వినుకొండ వచ్చిందా’ ఆమె భర్త అకస్మాత్తుగా లేచి నన్ను అడిగాడు.‘ఇప్పుడే దాటింది’ అని చెప్పా. ‘మేయ్‌ అంటూ అతను లేచెళ్లి భార్యను తొందర పెట్టాడు. ఆ గోతాలను కొంచెం ముందుకు లాగాడు. అపరిచితుడు వెళ్లి వాళ్ల పక్కనే నిలుచున్నాడు.  వాళ్లు దొనకొండలో దిగాలి. అక్కడ బండి నిమిషం కన్నా ఎక్కువ ఆగదు. పైగా ఆ ప్లాట్‌ఫాం ఎత్తు చాలా తక్కువ. బండి ఆగింది. ఆమె పాపను ఎత్తుకుని దిగింది. గోతాలు దించుకోవటానికి భర్త ఇబ్బంది పడుతుంటే ఆ అపరిచితుడు సాయం చేశాడు. బండి కూతపెట్టింది.

‘బండి కదలతంది. వచ్చి సాయం పట్టన్నా’ అని నన్ను పిలిచాడతను. వెళ్లి ఓ చెయ్యి వేశా. బండి మెల్లిగా కదిలింది.‘పొయ్యొస్తాం అన్నా’ అని నవ్వుతూ ఆ అపరిచితుడితో చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయిందా స్త్రీ. నా తల మరోసారి గిర్రున తిరిగిపోయింది. నిమిషం పాటు రెప్ప వేయకుండా అలాగే శూన్యంలోకి చూస్తూ నుంచున్నా. ‘రెండు గుక్కలు విస్కీ తాగటానికి బాత్‌రూంలోకి తీసకపొయ్యింది ఆమె. మంట మంట అని అరిచింది.’ అంటూ ఆ అపరిచితుడు సగం ఖాళీగా ఉన్న మందు సీసా బయటకు తీసి మూత తొలగిస్తూ అటువైపు వెళ్లిపోయాడు. ఈ సారి నా బుర్ర పనిచెయ్యటం మానేసింది. మరో పది నిమిషాల తర్వాత నా స్టేషన్‌ వస్తే దిగిపోయాను నేను.

*

—- వేణుబాబు మన్నం

(కథాచిత్రం అందించిన మహీ బెజవాడకు ధన్యవాదాలు)

Hypothesis

  సరళమైన వాక్యం, లోతైన భావం ఆర్.దమయంతి సొంతం. పుట్టి పెరిగింది బందరులో… స్థిరపడింది హైదరాబాద్ లో. కొన్ని ప్రముఖ వారపత్రికల్లో ఉపసంపాదకురాలిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పటి వరకు అరవైదాక కథలు, వందకు పైగా కవితలు  రాశారు. ఈమె కథలకు వివిధ పత్రికల్లో బహుమతులు వచ్చాయి.  “గుండెమీద రాయి” అనే కథకు రంజని అవార్డు అందుకున్నారు.  తన అభిమాన కవి, కథకుడు తిలక్ అని చెబుతారు దమయంతి.

-వేంపల్లె షరీఫ్
     ***
images
 
“ఏమిటీ? స్నేహ   పెళ్లికెళ్తున్నావా?” – ఫోన్లో సూటిగా అడిగింది రాజీ.ఇప్పటికిలా అది  అడగడం ఎన్నో సారో తెలీదు కానీ, అడిగినప్పుడలా మౌనాన్నే ఆశ్ర యించాల్సిన  పరిస్థితి   నాది!స్నేహ – మా ఇద్దరికి స్నేహితురాలే ఐనా, రాజీ తో కంటేనూ, నాతోనే ఎక్కువ స్నేహం గా వుంటుంది.రోజుకో సారైనా ఫోన్ చేసుకోకుండా, మాట్లాడుకోకుండా వుండలేనంత క్లోజ్
ఫ్రెం డ్స్ మి .. మేము.అలాటి స్నేహితురాలి పెళ్ళికి వెళ్ళ కుండా ఎలా వుంటం?కానీ, రాజీ  – “వొద్దంటోంది”.వెళ్తే కలిగే నష్టాలు, పరిణామాలు చెబుతూ నన్ను భయపెడుతోంది. వెన్ను జలదరించే నిజాలు చెబుతూ..నా చేత వెనకడుగు వేయిస్తోంది.రాజీ! – ఒక మామూలు గృహిణి.   ‘దాని మొహం. దానికేం తెలుసు. పెద్ద లోక జ్ఞానం లేని మనిషి ‘ అని అనుకున్నా ఇన్నాళ్ళు.  కానీ, నా  అంచనాలన్నిట్నీ తారు మారు చేస్తూ, తనెంత గొప్ప  లోక జ్ఞానూ నాకు తెల్సిచ్చేలా మాట్లాడుతోంది.లేక పోతే ఏమిటీ! రోజూ వార్తా విశేషాలు కోసం డేగ కళ్ళేసుకుని చూస్తూ, అన్ని మూలల సమాచారాల్ని ఆంగ్లం లోంచి  తెలుగులోకి తర్జుమా చేసుకుంటూ..,  వార్తా కథనానికి   ఏ విషయం దొరుకుతుందా   అని  నిరంతరం ప్రపంచం చుట్టూ తిరిగొచ్చే నాకు సైతం తట్టని పాయింట్,  దానికెలా తట్టినట్టు?  నా  కళ్ళకి కనబడని  ఆ ప్రమాదపు అంచు రాజీ కి మాత్రమే ఎలా క నిపించినట్టు?  – ఖిన్నురాల్నై పోతున్నా!

అందుకే అంటారు.  చదువుకున్న ప్రతి  వెధవాయికీ, లోకం తీరు తెలీదని, బ్రతకడం రాదనీనూ.

మనిషి వేరు. ఆర్జించే జ్ఞానం వేరు.  మెదడు వేరు. మనసు వేరు. ప్రతిభ వేరు. లౌక్యం వేరు. అన్నీ వేర్వేరు శాఖలే అయినప్పటికీ, వీటన్నిట్నీ  కలిపి మోసే  వృక్ష కాండం మాత్రం ఒకటి కాదు అనిపిస్తుంది.

అంత బాధ లోనూ, నా విశ్లేషణకి  నాకే నవ్వొచ్చింది.

“ఏంటీ, చెప్పవూ?వెళ్తున్నావా?, లేదా?” – విస్సురుగా అడిగింది, మళ్ళీ. ఏం  చెప్పాలో తెలీని దాన్లా అన్నాను. “కాస్త ఆలోచించుకోనీ, రాజీ!,.. చెబుతాను.” అన్నాను నిదానం గా.

అవతల  ఠపీమని ఫోన్ పెట్టేసిన చప్పుడైంది.

రాజీ కోపం నా మీద కాదు. నాకా సంగతి తెలుసు. పూర్తిగా తెలుసు. ఆ మాట కొస్తే దానిదసలు   కోపమే కాదు. ఆవేదనై వుండొచ్చు.

కారణమేమిటంటే…స్నేహ  ఈ పెళ్ళి  చేసుకోవడం రాజీ కి ఇష్టం లేదు.

” నేను ఖాయం గా వెళ్ళడం లేదు. నువ్వూ వెళ్ళకు. ఏం? సరేనా?  ” -ఇందాకటి రాజీ మాటలు  పదే పదే గింగురుమంటున్నాయి చెవిలో.

ఈ క్షణం దాకా,  స్నేహ పెళ్ళికి వెళ్దామనుకున్న నా ప్రయత్నానికి , రాజీ వైల్డ్ వివరణ తో – ‘ఐతే, వొద్దా, వెళ్లొద్దా!” అనే సంశయావస్థలో పడేసాయి.ఇంతకీ  వెళ్ళా లా వద్దా అని  నిర్ధారించుకోడానికి ముందుగా…

నేను – నా    స్నేహ మయిని  మొదట్నించి చదవడానికి సిధ్ధమయ్యాను.

నా ప్రమేయం లేకుండానే…స్నేహ నా ఆలోచనా  తరంగాల మీద నవ్వుతూ ముత్యం  పూసలా  కనిపిస్తోంది.

 

***

మేం ముగ్గురం ప్రాణ స్నేహితులం.

చిన్నపట్నించి కలసి మెలసి చదువుకున్నాం.  ఎక్కడికంటే అక్కడికీ ముగ్గురం గుంపుగా వెళ్ళే వాళ్ళం. మమ్మల్ని చూసి, ముగ్గురమ్మాయిలు అనీ,  ముగ్గురమ్మలనీ, రంభ ఊర్వశీ,  మేనక లనీ ఇలా పెట్టుడు పేర్లెట్టి పిలుచుకునే వాళ్ళు, చూసినవాళ్ళు.

డిగ్రీ వరకు మమ్మల్ని విడదీసిన వాళ్ళే లేరు. నిరంతరం గా సాగి పోయిన స్నేహం…డిగ్రీ కాగానే జీవన దారులు వేరయ్యాయి.

రాజీ కి పెళ్ళి కుదిరింది. అత్తారింటికెళ్ళిపోయింది.

నేను జర్నలిజం లోకి దూకాను. పత్రికాఫీసులో ట్రైనీ గా చేరి!

స్నేహ  – లా చదవడం కోసం.. యు.కె. కెళ్ళి పోయింది.

రాజీ పూర్తిగా గృహిణి పాత్రలో ఐక్యమై  పోయింది. ఇప్పుడు దాని లోకమే వేరు.

నేనైతే, నేనేమో నా పుస్తకాలేమో! న్యూస్ అందిపుచ్చుకోవడం, తెలుగు లోకి తర్జుమా చేస్తూ .. భాషతో తర్జన భజనలు  పడటం,    మరో పక్క  జర్న లిజం  పీజీ డిప్లొమా కోసం  ఈవినింగ్ కాలేజ్ కెళ్ళి, రాత్రికింటికి చేరడం.. ఇలా క్షణం తీరిక లేకుండా గడచిపోయేది.  రోజుకి ఇరవై నాలుగ్గంటలేం సరిపోవనిపించేలా!

స్నేహ రోజూ   నెట్ చాట్ లో కొచ్చేది.  ఈ మెయిల్స్ సరే సరి.   స్కైప్ లో ఎదురైతే, గంటలై పోయేవి. మాటలు, పాటలు, జోక్స్ చెప్పుకుంటూ నవ్వుకునే  వాళ్ళం.

మా ఇద్దరి అభిరుచులు కామన్ గా వుంటం వల్ల, ఎంత సేపైనా, బోర్ అనేది వుండేది కాదు.

రాజీ కి కూడ స్నేహ  ఫోన్ చేసేది తప్ప, ఇన్ని మాటలు  కుదిరేవి కావు. కారణం, రాజీ కి అత్త గారింట్లో అంత స్వేచ్చ లేక పోవడం వల్ల!

అందు వల్ల, స్నేహ నాతోనే ఎక్కువ గా  మాట్లాడుతూ వుండేది. అలా చనువు పెరిగి, స్నేహం ఇంతకి మరింతైంది.

మా మాటల్లో ఎక్కువగా ప్రపంచ విషయాలు, జరిగే వింతలే వుండేవి. పుస్తకాలు, ప్రజలు,  ఫ్రెండ్స్, ఎక్కడెక్కడ ఎవరెవరున్నారనే సంగతులే దొర్లేవి.

ఇంతలో..నా డిప్లొమా పూర్తి కావడం, ఉద్యోగం కన్ ఫార్మ్  అవడం, ప్రొఫెషన్ పట్ల మరింత బాధ్యత పెరగడం జరిగింది.

స్నేహ చదువు పూర్తి చేసుకుని, హైదరా బాద్ కొచ్చేసింది. ఓ ప్రముఖ న్యాయ వాది దగ్గర అసిస్టెంట్ గా చేరింది.

వచ్చాక కూడ స్నేహ నన్నే ఎక్కువ గా కలుస్తూ వస్తోంది. ఇందుకు ప్రధాన కారణాలు రెండు.

ఒకటి – అది రోజూ వచ్చే  కోర్ట్ కి దగ్గరలోనే మా పత్రికాఫీసు వుండటం.

రెండు – రాజీ మాటల ధోరణి దానికంత రుచించక పోవడం.

“రాజీ ఏమిటే, అలా మాట్లాడుతుంది!?” అంటున్న స్నేహ మాటలకి నవ్వి వూరుకునే దాన్ని.

తూనీగ ల్లాంటి  ఆడ పిల్లలు పెళ్ళయ్యాక ఇంటి ఈగలౌతారని విన్లేదెమో తను బహుశా!

స్త్రీ ల కి వివాహనంతరం జీవితం అంటే –  భర్తా, ఇల్లూ, పిల్లలు. బస్! ఇక ఆ ప్రంపంచం లోనే తిరగాడుతూ పోతారు.  కాపురం లో ఏ చిన్న  సమస్య వచ్చినా, ‘ ఇంకేముంది, ఇహ జీవితం ఐపోయింది,’ అని అల్లకల్లోలమై పోతుంటారు.  రాజీ కూడా అంతే.

అందుకే, స్త్రీలు నిరంతరం – తమ సంసారాలు చల్ల గా వుండాలని, సాఫీగా సాగాలని నోములు వ్రతాలు  చేస్తారు కాబోలు!

నాకు రాజీ గుర్తుకొచ్చినప్పుడలా, తులసి కోట దగ్గర నిత్య పూజలు చేసే అమ్మే  గుర్తుకొచ్చేది.

స్నేహ బోర్ గా వుందని పిలిస్తే వెళ్ళే దాన్ని. బ్రిటిష్ లైబ్రరీ కెళ్ళి కొత్త బుక్స్ చూడటం, టాంక్ బండ్ కెళ్ళి సాయాంకాలాలు చల్ల గాలి లో నడవడం, ఐ మాక్స్ కెళ్ళి సినిమా చూడటం, అట్నించటే రెస్టారెంట్ కెళ్ళి డిన్నర్లు చేయడం..అలా  గడిచిపోయేది కాలం.

మేమిద్దరం కలిస్తే, గంటలు క్షణాల్లా గడిచేవి.

రాజీ తో మేము కలిసినప్పుడు, స్నేహ – ఏం మాట్లాడాలో తెలీని దాన్లా  కొంత ఖాళీ గా చూస్తూ వుండేది. అప్పుడప్పుడు, చేతి గడి యారం వంక చూసుకోవడాన్ని నేను కనిపెట్టాను.

ఒక వయసొచ్చాక, ఒక వ్యక్తిత్వానికి అలవాటు పడ్డాక కొంతమంది –  అన్ని పర్సనాలిటీలతోనూ కాలాన్ని గడపలేరేమో! – మనమెవరితో నైనా మాట్లాడుతున్నప్పుడు సమయం వృధా అవుతోందేమో అని బాధ పడుతున్నామూ అంటే, ఖచ్చితం గా వాళ్ళు మన హృదయానికి దగ్గర గా లేరనే  అర్ధం.

ఈ సూత్రం స్నేహితులకు  మాత్రమే వర్తించదు.    ఒక్కో సారి తల్లి తండ్రుల మాటలు కూడా చాలా మందికి చాదస్తం గా,  అనిపిస్తాయంటే దీర్ఘం గా ఒక గంట పాటైనా గడపలేరంటే, అబధ్ధం కాదు.

అలా అని… విరోధ భావమేం  వుండదు. కానీ, వాళ్ళ సమక్షం లో దీర్ఘ కాలాన్ని వెచ్చించలేరు. ఇలాంటి పరిస్థితులే కమ్యూనికేషన్ గాప్ కి దారి తీస్తాయి. మనిషికీ మనిషికీ మధ్య ఆంతర్యాలు ఏర్పడి   పోతాయి. ఆంతకంతకీ ఒకరి కొకరు దూరమై పోతుంటారు. కాల క్రమేణా  ఆ ఇద్దరి మధ్య మాటలు కరువౌడానికి ఫెద్ద కారణాలేవీ కనిపించవు.

ఇక్కడ పిటీ ఏమిటంటే, రాజీ కి అర్ధం కాని స్నేహ, నాకర్ధమౌతోంది. అదే నా బాధ.

ఇలా మనుషుల్ని చదివే  సెన్స్ నాకున్నందుకు సంతోషమే కానీ, అప్పుడప్పుడు ఎవరికీ అర్ధం కాని వారు, నాకు మాత్రమే అర్ధమౌడం వల్ల కలిగే కష్టాలు ఇలా ఒక విపరీతానికి దారి  తీస్తుందని  నాకప్పుడు కాదు,… ఆ తర్వాత కానీ తెలియ లేదు.  ఎప్పుడంటే..

ఓ రోజు, హఠాత్తుగా రాజీ ఫోన్ చేసి, చాలా ఆత్రపడిపోతూ  ఓ సమాచారాన్ని అందించింది. ” ఇదిగో, నీ కో మాట చెప్పాలి. రాత్రి రెస్టారెంట్  లో మా ఆయనకి  స్నేహ కనిపించిందిట. ఒక్కత్తే కాదు.  పక్కనే ఎవరో ఒకతనున్నాడుట.  ‘వాళ్లిద్దరి తీరు చూస్తుంటే, స్నేహితుల్లా లేరు. ‘  అని అన్నారాయన.  ఓ సారి కనుక్కో! దాన్ని. అతనెవరూ, ఏమిటీ అని.” అంటూ ఆరిందాలా మాట్లాడింది.

దాని మాటలకి నవ్వొచ్చింది.

ఎంత స్నేహితురాలైతే మాత్రం అడుగుతామా?

నే విని వూరుకున్నా. రాజీ కి చెప్పలేదు కానీ, నేనూ ఓ  సారి చూసాను. ఐస్ క్రీం పార్లర్   కెళ్ళినప్పుడు  కనిపించింది.

అనుకోకుండా ఎదురవడంతో…నన్ను చూసి ఓ క్షణం పాటు తత్తర పడ్డా, ఆ వెనకే ఆనందపడిపోయింది.

మరు క్షణమే  తన పక్కనున్న వ్యక్తిని పరిచయం చేసింది. “ఈయన మోహన్! వీరి కంపెనీ లొనే నేను లీగల్ అడ్వైజర్ గా వున్నా..” అంటూ నవ్వింది. నవ్వుతూనే, మోహన్ వైపు తిరిగి..”నా క్లోజ్ ఫ్రెండ్ దామిని..జర్నలిస్ట్” అంటూ, పరిచయం చేసింది.

అతను నన్ను చూసి కూల్ గా నవ్వి, చేయి కలిపి,  ఆ మరు క్షణం లోనే  సెలవు తీసుకుంటూ.. కారు వైపు  నడిచాడు.

‘వస్తానంటూ ‘ ఆ వెనకే తనూ..  వేగంగా నడుచుకుంటూ, అతనితో కలసి   వెళ్లిపోయింది.

ఈ మధ్య తను పిచ్చ  బిజీ గా వున్నా నని వంకలు చెబుతూ నన్ను  తరచూ కలవలేక పోవడానికి గల కారణం ఏవిటో ఇప్పుడర్ధమై, లోలోనే నవ్వుకున్నా.

స్నేహ ప్రేమలో పడింది. ఖచ్చితం గా పడింది. అంత గట్టిగా ఎలా చెబుతున్నానంటే..

మోహన్ని  పరిచయం చేస్తున్నప్పుడు..ఆమె కళ్ళల్లో మెరిసిన మెరుపు..చెంపల మీద పరుచుకోవడాన్ని, రెప్ప పాటు  వేగం లో అర లిప్త కాలం లో పట్టేసుకున్నా.

ప్రేమ అనేది  హృదయ రహస్యమే. కానీ, అప్పుడప్పుడు కళ్ళ లోంచి తొంగి చూసే సంతోష వెన్నెల తరంగం కాదూ!

అతను కేవలం స్నేహకి  యజమాని మాత్రమే కాదు అన్న సంగతి  తనిట్టే పసి గట్టేసింది.

ఇద్దరిలోనూ తొట్రుపాటు తనాన్ని కూడా కనిపెట్టింది. కాని, ఇగ్నోర్ కొట్టేసింది. ఎందుకంటే..అప్పటికి తనకీ నిజం తెలీదు. కనీసం ఊహించనైనా ఊహించలేదు.

ఆస్థి అంతస్తుల మాటెలా వున్నా, ఇద్దరూ మేడ్ ఫర్ ఈచదర్ లా వున్నారు’ అనుకుని,  తృప్తి పడింది.

స్నేహ తన  ప్రేమ  విషయాన్ని నా దగ్గర దాచిందని కానీ, ఈ  వార్తని   వెంటనే రాజీ కి చేరేయాలని  కానీ తనెప్పుడూ అనుకోలేదు.

ప్రేమ, పెళ్లి అనేవి ఆ వ్యక్తుల స్వవిషయాలు. పూర్తిగా వ్యక్తిగతాలు. వారంతట వారు చెబితే మనం తెలుసుకోవాలి కానీ, ఆరాలు తీసి, ప్రాణాలు తోడేయ కూడదు. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఐనా, మన పరిధులు మనకున్నప్పుడే, అవతల వారికి మన స్నేహం మీద ప్రేమ, గౌరవం పెరుగుతుంది. కాదు, రెట్టింపౌతుంది.

ఆ సంఘటన తర్వాత, స్నేహ మోహన్ ప్రసక్తి ని ఎక్కడా తీసుకొచ్చేది కాదు.   సస్పెన్స్ భరించ లేక,  ఒకటికి పది సార్లు ముందూ వెనకా ఆలోచించుకుంటూ   అడిగే దాన్ని.  “ మోహన్ కంపెనీ లోనే కంటిన్యూ అవుతున్నావా?” అంటూ.

ఆ పేరు వింటూనే ఉలిక్కిపడేది.  సిగ్గుపడ్డ   చెంపలూ..దొరికిపోయేవి.

జవాబు చెప్పకుండా దాటేసేది.  తనేం విననిదాన్లా..మరో టాపిక్ లోకి తీసుకెళ్ళేది, తెలివిగా.

మనసులోనే నవ్వుకుని ఊరుకున్నా. మరిక రెట్టించలేదు.

ఎప్పుడో ఒక రోజు, చెబుతుందిలే శుభ వార్త అనుకున్నా.

కానీ , ఆమెని ఒక శోక సముద్రం లా చూస్తానని కలలో కూడా అనుకోలేదు.

 

***

ఆ  రోజు సాయంత్రం దాటి, రాత్రౌతోంది. తలమునకలయ్యే   పనిలో.. సిటీ ఎడిషన్ క్లోజింగ్ లో, … చివరి నిమిషపు టెన్షన్ లో వున్నా..ఇంతలో స్నేహ ఫోన్ చేసింది.

“హలో”- అని  అనక ముందే..అవతల్నించి తను అందుకుంటూ..”నువ్వొక్కసారి రావూ?” అంటూ దుఖంతో అడిగింది.

వొణికిపోతున్న  ఆ కంఠాన్ని వింటూనే, కంగారు పడ్డాను. “ఏమీటీ? అంతా ఓకేనా?” అడిగాను.

“లేదు. ఐ యాం నాట్ ఓకే.. నీతో…చాలా చెప్పుకో..వా..లి..ప్లీజ్..” మాట్లాడలేకపోతోంది.

“ఎక్కడున్నావ్?” ఆత్రంగ  అడిగా.

తనెక్కడుందీ చెప్పింది. “ఐదు నిమిషాల్లో వచ్చేస్తా…  నువ్వక్కడే వుండు. డోంట్  వర్రీ..వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం..ఓకే?” అంటూ ఉద్వేగంగా చెప్పాను.

అన్నట్టు గానే, గబగబా, పని పూర్తి చేసుకుని, వేగంగా బయల్దేరి వెళ్ళాను.

లేక్ వ్యూ రెస్టారంట్ కి.

***

 నన్ను చూస్తూనే..చేతుల్లో ముఖం దాచుకుని భోరుమంది స్నేహ.

నాకేం అర్ధం కాలేదు. మౌనం గా, దాని కెదురు గా వున్న కుర్చీ లో కూర్చున్నా.

ఆమె ఎంతటి శోక సాగరమై  వుందంటే, ఆ  ఉధృతి  కి ఆమె  రెండు భుజాలు, వువ్వెత్తున ఎగసి పడుతున్న కెరటాలకు మల్లే కదులుతున్నాయి. మనిషంతా అల్ల కల్లోలమైన సముద్రం   లా విషాదమైపోయుంది.

ఏమని ఓదార్చ గలదు తను?

పరుగుల సం ద్రాన్ని  అడ్డుకునేందుకైతే  ఒడ్డు కావాలి కానీ, విరుచుకు పడుతున్న సునామీ కేమవసరం?

కష్టం లో వుంటే ఓదార్చొచ్చు. ముంపులో లో మునిగిన ఆమేకేం  పని   నా జాలి నిట్టూర్పుల తో !

అందుకే, నిశ్శబ్దం గా దాన్నే చూస్తూ..ఆలోచిస్తూ…గుండె దిటవు చేసుకుంటూ…అసలు కారణమేవిటో  తెల్సుకోవడం కోసం ఎదురుచూస్తూ…వున్నాను.

పది నిమిషాల దీర్ఘ కాలం తర్వాత,  దుఖాన్ని దిగమింగుకుంటూ…నిఠారు గా కూర్చుంది.

కర్చీఫ్ తో కళ్ళు, ముక్కూ తుడుచుకుంటూ..జుట్టు సరి చేసుకుంది.

నలిగిన దుస్తులు, చెదరిన జుట్టు, ఏడ్చి, ఏడ్చీ ఉబ్బిన కళ్ళు, పీక్కు పోయిన చెంపలు..ఇవన్నీ ఆమె మానసిక స్థితిని పట్టిస్తున్నాయి.

“ఏమిట్రా..ఏం జరిగింది?” అనునయం గా అడిగాను.

నా వైపు చూస్తూనే మరో సారి..ఏడ్చేసింది. ఏమైందీ? ఎందుకిలా అమితం గా దుఖిస్తోంది?

పొరబాటు జరిగాక, పశ్చాత్తాపం తో నలిగిపోతున్న మనిషి లా అయితే మాత్రం కనిపించడం లేదు.

ఒక వేళ, మోహన్ తో ప్రేమ వ్యవహారం కానీ, బెడిసి కొట్టిందా? మోస పోయిందా తను?

పెళ్ళి చేసుకుంటానని మాయ పుచ్చి గానీ..

ఊహు.

మోహన్! అలాంటి వాడు కాడని తనకొక గొప్ప నమ్మకం. అతన్ని దగ్గర్నించి చూసింది. అతని ముఖం లో కారెక్టర్ కొట్టుస్తూ కనిపించింది.  ఎంత మంది లో వున్నా, ఆ కూల్ మాన్ ని ఇట్టే గుర్తించేయొచ్చు.   మొదటి రోజు తను చూసినప్పుడు..ఆ  ఒక్క చూపులో నే తెల్సిపోయింది.

అతనలాంటి వాడు కాడు. పెళ్ళికి ముందు అతని వల్ల   మరో రకం గా   మోసపోయేంత చిన పిల్లేం  కాదు స్నేహ.

నిజానికి ఏ ప్రియురాలు, ప్రేమించిన వాడు మోసం చేసినందుకు ఏడ్వదు. తన గొప్ప నమ్మకాన్ని ఖూనీ చేసినందుకు, తనని నిర్జీవిని  చేసినందుకు ఏడుస్తుంది.

స్నేహ ది అలాటి బాధ కాదని తన మనసు చెబుతోంది. గట్టిగా చెబుతోంది.

కానీ, దాని సున్నిత మైన మనసుకి  పెద్ద  ఎదురు దెబ్బే తగిలింది.   బహుశా, ఎప్పటికీ కోలుకోలేనంత..గాయ పడి వుంటుందేమో!

ఇప్పుడు తను తీరిగ్గా ఆ గాయాలను పెకిలించి చూడటం అమానుషత్వమే అవుతుంది.

ఉధృత గాలి వాన లు తర్వాత, విరిగిన కొమ్మలు, చెదరి పడ్డ పక్షి గూళ్ళు వాటంత టవే బయట పడట్టు,  అన్ని విషయాలూ అదే  చెబుతుంది లే. ముందు తను కోలుకోనీ!  అని అనుకున్నా.

మధ్యలో  స్టువార్టొస్తే,   “రెండు పైనాపిల్ జూస్ ”  చెప్పి పంపాను.

తనని ఏదో ఒకటి మాట్లాడించడం కోసం అడిగాను.”అమ్మా నాన్న ఎలా వున్నారు?” అంటూ.

స్నేహ తలూపింది. బాగానే వున్నారన్నట్టు.

ఇంతలో..దూరం నించి..మోహన్ వస్తూ కనిపించాడు.

వడి వడి అడుగులతో..చూపుల్ని టార్చ్ లైట్లు గా చేసుకుని, తన ప్రియమైన వస్తువు ఇక్కడే, ఎక్కడో  వుండాలన్న ట్టు..ఖిన్న వదనుడై,   వెతుక్కుంటూ వస్తున్నాడు.

ఎదురుగా వున్న నన్ను చూడ్డం లేదతను. వెనక నించి స్నేహని గుర్తు పట్టి, త్వర త్వర గా దగ్గరకొచ్చాడు.

“మోహన్ వచ్చారు..” నా మాటలు పూర్తి కాకముందే, స్నేహ వెనక్కి తిరిగి చూడటం..అతను గబగబా ఆమెకి దగ్గరై, ఉద్వేగం గా  ఆమె భుజం మీద   చేయి వేయడం  జరిగిపోయింది. ఆ స్పర్శ లో ఎంత మృదుత్వముందో ఏమో కానీ…

ఆతన్ని చుస్తూనే..తుఫాను కు కొట్టుకుపోతున్న తీవె, ఆలంబన దొరికిన ట్టు, అతన్ని చిన్న పిల్ల లా చుట్టేసుకుంది.  మోహన్ కూడా కదలిపోతూ..చెబుతున్నాడు. “సారీ స్నేహ..ఐ యాం సారీ, అయాం టెర్రిబ్లీ  సారీ..ఇంకో సారి ఇలా జరక్కుండా చూస్తాను. ప్రామిస్. నన్ను నమ్ము..ప్లీజ్..ట్రస్ట్ మి ”   అతను ఓదారుస్తున్నాడో, ఓదార్చుతూనే దుఖిస్తున్నాడో ..తెలీడం లేదు.   మొత్తానికీ ఇద్దరూ ఒకే రకపు వేదనా  సముద్రం లో కొట్టుకుమిట్టాడుతున్నట్టు గ్రహించా!

వాళ్ళిద్దరికీ, చుట్టుపక్కల ఎవరం వున్నదీ తెలీడం లేదు. నా ఉనికి అక్కడ చాలా అనవసరం గా తోచింది.

చీకట్లో కొవ్వొత్తి వెలుగు పెద్దదే కానీ, కరెంట్ వచ్చాక,  దాని ప్రాముఖ్యత వుండనవసరం లేదు.

నేను మెల్లగా, చాలా మెల్ల గా అడుగులేసుకుంటూ..బయట పడ్డాను. వాళ్ళ  కంట పడకుండా వుంటం కోసం..దొరికిన ఆటో ఎక్కి, ఇంటి కొచ్చేశాను.

ఎలా వచ్చానో తెలీదు. ఆ రాత్రం తా, కంటి మీద ఒక్క కునుకుంటే ఒట్టు.

సమస్య మనదైతే, పంచుకోవడం వల్ల తగ్గుతుంది.   స్నేహితురాలి దైతే..ఆలోచించి పరిష్కారాన్నివ్వడం వల్ల కొంత వరకు వీలుంటుంది. కానీ, సమస్యేమిటో తెలీకుండా..ఎమోషన్ సీను చూపించి, కనుక్కో మంటే, తనెలా కనుక్కుంటుందీ!?

అసలు నాకు స్నేహ  ప్రాబ్లం ఏమిటో తెలీకుండా…ఏమని తనని అడగాలి.

అది కాదు ప్రస్తుత నా సమస్య. ఏమీ తెలీకుండానే  దాని గురించి ఎడ తెరిపి లేని ఆలోచన్లతో తెగ సతమతమై   పోతున్నా!

ఏమై వుంటుందా అని , నా జర్నలిస్టిక్ వ్యూహరచనా చాతుర్యాన్నంతా రంగరించి కారణాన్ని దొరకబుచ్చుకునే ప్రయత్నం చేసా.  ఆ పైన ఆ పరిశోధనలో మునిగి పోయా.

ఊహు. దొరకలేదు.

ఒక్కటి మాత్రం ఖరారు గా  తెలుస్తోంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. మామూలు గా కాదు. గాఢం గా!

అవునూ, ఇంతకీ ఇద్దరిదీ ఒకటే కులమా, కాదా? తెలీదు.

పోనీ..మతం? మోహన్ కదా పేరు. నో ప్రాబ్లెం. సేం మతం.

ఆస్థి అంతస్తుల సమస్యేమో! – అదేమన్నా  బీదదా ఏమిటి?

చదువు? -బ్రహ్మాండం గా వుంది.

జ్ఞానం? – దానికి కొలతేముంది?

ధనికుల ఇళ్లల్లో ఆస్థి గొడవలు, వాటికి వివాహ బంధుత్వాల లింకులు వుంటాయి.

నాకు తెలిసిన ఒక వూరి కులం లో  – పెళ్ళిలన్నీ వాళ్ళ వాళ్ళ చుట్టాల లోనే జరిగిపోతాయి. మేన మామలు, మేనమామ కొడుకులు,   మేనత్త కొడుకులు,   లేదా పిన తండ్రి పెదతండ్రి ఆడ పిల్లలు తోడుకోడళ్ళవడాలు..ఇవన్నీ మొత్తానికి అక్కడక్కడే తిరుగుతాయి బంధాలన్నీ ,  కాసుల చుట్టూ రా. ఇదేమిటంటే ఆస్థులు ఎక్కడికీ పోకుండా వుంటం కోసమట.

ఆశ్చర్య మేసేది నాకు. వరుడు విదేశాల్లో వున్నా సరే, సమయానికి రాకున్నా, బే ఫికర్!  వీళ్ళిక్కడ తాంబూలాలు పుచ్చేసుకుని, సంబంధం ఖాయం చేసేసుకుంటారు. పెళ్ళి కి ముందు రోజొస్తే చాలని వరునికి భరోసా ఇస్తారు. అలాగే పెళ్ళిళ్ళై పోతాయి. కాపురాలు జరిగిపోతుంటాయి. పిల్లలు కూడా పుట్టేస్తారు. పెరుగుతారు. వూళ్ళొ పొలాలు   ఆ యేడాదికా యేడు వాళ్ళ పేర్ల మీద  యెకరాల కొద్దీ పెరిగి పోతూ వుంటాయి.

ఈ భాగ్యానికి  ప్రత్యేకించి పెళ్ళిళ్ళెందుకు చేసుకోవడం. ఒక పోలానికి, మరో పొలానికి మనువు  చేస్తే సరిపోదా? రెండు ఇనప్పెట్టెల్ని  గదిలోకి తోస్తే రాలవా? కాసుల గుట్టలు?

అందుకు రెండు శరీరాలే బలి  కావాలంటావా? …నేనూ స్నేహ ఈ కథ చెప్పుకుని,  ఇద్దరం కలసి పకపకా నవ్వుకునే వాళ్ళం.

రాజీ కల్పించుకుని, అనేది. ” మీకన్నీ వేళా కోళాలు గానే వుంటాయిలే! అద్సరే  కానీ,ఇంతకీ   పెళ్ళెప్పుడు చేసుకుంటారిద్దరూ?” అని నిలేసేది.

స్నేహ చురుగ్గా చూసేది రాజీ వైపు. నేను కళ్ళు దించుకునే దాన్ని, మౌనం గా.

” నన్ను చూడండి. మీ తోటి దానే గా! ఇద్దరి పిల్ల ల తల్లి నై పోయాను. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా అయిపోయింది. పెద్దది, అప్పుడే సెకండ్ గ్రేడ్ దాటేసింది. మరి మీ సంగతో? ఎప్పుడు పెళ్ళి చేసుకుంటారు, ఎప్పుడు పిల్లల్ని కంటారు? ముసలోళ్ళై పోయాక నా? ” పెద్ద తరహా లో పెద్దక్కలా అడిగేది.

స్నేహ మాత్రం ఊరుకునేది కాదు. ” నా టెంత్  క్లాస్ లోనే , మా మావయ్య నన్ను చేసుకుంటానన్నాడు. సరే అని ఒప్పుకుని వుంటే, ఈ పాటికి నా కూతురు పెళ్ళీడు కి  వచ్చేసేది. ఏం చేస్తాం. అలా రాసి పెట్టి లేదు. ..హు!” అంటూ నాటకీయం గా నిట్టూర్చేది.

నాకు నవ్వాగేది కాదు.

రాజీ, రోష పడకుండానూ వుండేది కాదు.

ఆమె ఉడుక్కోవడం చూసి – అనేది, స్నేహ. ” దామిని సంగతి నాకు తెలీదు కానీ, రాజీ! నేనంటూ పెళ్ళంటూ చేసుకుంటే..నా ముందు పిలుపు నీకే. ప్రామిస్” అంటూ మాటలతో రాజీని చల్ల బరిచేది-

అనడమే కాదు, తన పెళ్ళి విషయాన్ని ముందుగా రాజీ కే ఫోన్ చేసి చెప్పింది. ఆ తర్వాతే, మా ఇంటికొచ్చింది.

ఎప్పుడంటే, ఆ రోజు ఆ సంఘటన జరిగాక,   రెస్టారెంట్ నించి నేను బయట పడి వచ్చేసిన…వారం పది రోజుల తర్వాత..స్నేహ నా ఫ్లాట్ కొచ్చింది.

***

 “లోపలకి రావొచ్చా” మాటలకి వెనక్కి తిరిగి చూద్దును కదా..నవ్వుతూ కనిపించింది స్నేహ.

చేతిలో పని అక్కడ్నే వదిలేసి..ఆనందంగా ఎదురెళ్ళాను.

రెండు చేతులూ జాపింది.

ఎందుకో తెలీని ఉద్వేగం మా ఇద్దరి మనసుల్లో నూ పొంగి ప్రవహిస్తోంది. వెంటనే  ఆత్మీయం గా హృదయానికి హత్తుకుంది.

నన్ను కుర్చీలో కి తోసి, హాండ్ రెస్ట్స్ మీద చేతులుంచి, వయ్యారంగా బొమ్మలా వంగి చెప్పింది. “నేనూ మోహన్ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నామే! రేపే వివాహం. రాజీ కి ఆల్రెడీ ఫోన్ చేసి  చెప్పాను. నిన్ను మాత్రం  పర్సనల్ గా పిలవాలనిపించింది.  తప్పకుండా రావాలి. నువ్వు అస్సలు మిస్సవ్వకూడదు.” చెప్పిందే చెబుతోంది.

బహుశా..అమితమైన ఆనందంతో కావొచ్చు.

“నువ్వన్ని సార్లు చెప్పాలా ఏమిట్లె, కానీ! సంతోషం లో పడి శుభలేఖ ఇవ్వడం మర్చిపోయేవు సుమా!” అన్నాను నవ్వుతూ.

కాని అది నవ్వ లేదు నా మాటలకి. పై పెచ్చు ముఖం లో రంగులు మారాయి. నేనేమైనా పొరబాటు మాట్లాడానా అని ఆలోచించుకునే లోపే తనే చెప్ప సాగింది.

“సారీ దామినీ!

మొన్న జరిగిన సంఘటన తర్వాత నిన్ను కలవలేకపోయాను. కనీసం ఫోన్ కూడా చేయలేని పరిస్థి తిలో వుండిపోయాను. సారీ..!”

“నీ మొహం. అందుకు సారీ ఎందుకు? ప్రేమ వివాహాలకికి ఇంట్లో వొప్పుకోకపోవడం అన్ని చోట్లా జరిగేదే. చివరికి మీ ప్రేమే గెలిచింది సంతోషం. ఇంతకీ ఎవరే,  మీ పెళ్ళికి అంతేసి  ఇనప గోడలా తయారైన వ్యక్తి?  మోహన్  తల్లా? తండ్రా?” అని అడిగాను, నవ్వుతూ.

ఒక్క క్షణం మౌనం తర్వాత మెల్లని స్వరం తో చెప్పింది. “అతని వైఫ్.”

వింటున్న నా చెవుల్లో బాంబ్ పేలిన శబ్దమైంది. కొంత సేపటి దాక, నోరు పెగల్లేదు.

తప్పు చేస్తున్న దానిలా తలొంచుకున్న స్నేహని చూడగానే అర్ధమై పోయింది. తను   అబధ్ధ మాడటం లేదని!

“ఏ..ఏమిటన్నావ్?” మరో సారి నిర్ధారించుకోవడం కోసం..’నువ్ చెబుతోంది నిజమేనా?’ అన్నట్టు చూసా.

జవాబు చెప్పకుండా, తలూపింది ‘ అవునన్నట్టు.’

“నీకేమైనా పిచ్చా? ” అని అడగాలనిపించింది. కాదు అరవాలనిపించింది  తన్నుకొచ్చిన ఆవేశం తో.

కానీఅప్పటికే ఆమె పెదాలు బిగించి ఏడ్చేస్తుంటే…అగ్గి లాంటి నా  కోపం మీద దాని కన్నీళ్ళు పడి చప్పున చల్లారిపోయింది.

గభాల్న దాని భుజం మీద చేయేసాను..ఓదార్పు గా.

నా చేతి మీద చెంపనానించుకొని  వెక్కుతూ చెప్పింది.”దామినీ!  నేనతన్ని ప్రేమించ లేదు.  అతనెప్పుడూ ఐ లవ్యూ అని చెప్పిందీ లేదు.   కానీ, మేము  ఒకరి కోసమొకరం అని మాత్రం తెలుస్తోంది..ఇక్కడ..ఈ గుండె సాక్షి గా మేము విడిచి వుండలేమనిపిస్తోంది..అందుకే..పెళ్ళి చేసుకుంటున్నాం..ఈ పెళ్ళి కూడా నా తృప్తి కోసం…పసుపు బట్టలతో అతని పక్కన నిలబడటం కోసం..అంతే..ఇంకేమీ అడగొద్దు. ప్లీజ్..” అంటూ కర్చీఫ్ తీసుకుని, ముఖం తుడుచుకుంది.

నేను అలాగే చూస్తూ వుండి పోయా. ఏం మాట్లేడందుకు, గొంతు పెగిల్తే గా!

తప్పు చేస్తోంది అన కూడదు. ఎందుకంటే, ఈ రోజుల్లో ఎవరు చేసిన పని వారికి కరెక్టైనది కాబట్టి.

తప్పు అంటే కేసౌతుంది. నేరారోపణ కిందకొస్తుందిట. కాబట్టి ఈ తరహా పనుల్ని పొరబాటు అనాలి ట. లేదా, బలహీనత అనొచ్చు ట.  మా ఆఫీసులో ఓ సీనియర్ జర్నలిస్ట్ చెబుతుంటే ఔనా అన్నట్టు ముఖం పెట్టి, శ్రధ్ధగా ఆలకిస్తూ వుండిపోయా. నా అమాయకత్వానికి  కామోసు ఆయన పెద్ద గా నవ్వేయడం తో,  ‘ఓహో, సెటైరన్నమాట ‘   అప్పుడు అర్ధమైంది.

అలాగే, ఇప్పుడు స్నేహ చేస్తున్న పని ని  ఏ పేరుతో పిలవాలి.

“ నువ్వు రాకుంటే పెళ్ళే జరగదంటూ.. –  తప్పక రావాలంటూ మరో సారి హెచ్చరిస్తూ.. చెయి నొక్కి వెళ్లిపోయింది.

నాకు అంతా అయోమయం గా అనిపించింది.

ఇంకా అప నమ్మకం గా వుంది. అపస్మారక  స్థితిలో  వుంది మనసు.

స్నేహ వెనక్కొచ్చి, ‘అవాక్కయ్యవా?’ అంటూ , తననొక ఏప్రిల్ ఫూల్ అన్నట్టు చూసి,  గల గలా నవ్వితే  ఎంత బావుణ్ను అని ఆశ గా వుంది. చచ్చేంత ఆశ గా వుంది.

సరిగ్గ మనమిక్కడే పొరబడుతూ వుంటామేమో తెలీదు.  మనం మనుషుల్ని ప్రేమిస్తున్నంత తేలిగ్గ, వారి వ్యక్తిత్వ లోపాలని మన్నించలేకపోవడం వల్లో, ఒప్పుకోవడం రాక వల్లో ..ఇలాంటి  పరిస్థితి కి లోనవుతుంటామేమో!

‘నీ మొహం. అంతెందుకు ఆశిస్తావ్ నువ్వు? అసలైనా నువ్వింత  నిరాశ పడిపోయి, డీలా పడిపోయేంత విషయం ఏముంది ఇందులో?  ఇవన్ని నగరం లో జరుగుతున్న వి కావూ? నీ చుట్టు సమాజాన్ని నువ్ రోజూ చూడ్డం లేదూ?   చిత్రం కాకుంటె,  నువ్వెప్పుడూ అసలిలాటి సంఘటన తాలుకు వార్తలే చదవనట్టు, రాయనట్టు ఇలా కుంగి పోవడం బాలేదమ్మాయి!   అంటూ నన్ను కేకలేస్తూ, ఊరడిస్తోంది..నా లో నాకెవరో తెలీని నా తను.   నన్నూ, నా భారమైన గుండెని తేలిక చేసే ప్రయత్నం చేస్తోంది.

ఇవేవీ కాదనను. నాకన్నీ తెలుసు. నిజమే. కానీ, అవన్నీ  ఎవరికో జరిగాయి.

కానీ ఈ రోజు నా ఫ్రెండ్ కి జరుగుతోంది. అందుకే దిమ్మ తిరిగినట్టుంది. మెదడంతా బ్లాంకై కూర్చుంది. గదిలో లైట్ వెలుగుతున్నా, ఫ్యూజెగిరిపోయినట్టు చీకటి మయం గా వుంది.

మనతో మమేకమై పోయి మసులుకుంటూ…తమ శరీరాలే రెండు  తప్ప,  ఆత్మలు రెండూ ఒకటే అన్నంత గా కలిసి మెలిసి తిరిగిన స్నేహ..కాదు నా  ఫ్రెండ్ వెనక  ఇలాటి కథ ఒకటుందని హఠాత్తుగా తెలిస్తే మనసంతా కంగాళీ గా వుంటుందో..నాకూ అలానే వుంది. చేదుగా.

మెల్ల మెల్ల గా…ఆ షాక్ నించి బైట పడి, ఆ ఇద్దరి వైపు నించీ, వారి  పరిస్థితుల కోణాల నించీ ఆలోచించడం మొదలు పెట్టాను.

ఎంతైనా పొరబాటు పొరబాటే. అది కాదు నేనాలోచిస్తున్న సంగతి? – ఎవరు మూల్యం ఎక్కువ చెల్లిస్తారా భవిష్యత్తులో అని.

స్నేహ కి ఏం తక్కువనీ, ఇలాటి రిస్క్ తీసుకుంటోంది?

పోనీ మోహన్? స్నేహ కి మించిన అందగత్తెలెందరు లేరనీ? ఎవరు దొరకరనీ? ఐదేళ్ల పరిచయం తర్వాత కూడా..స్నేహ తో తనకు గల బంధాన్ని  శాశ్వతం చేసుకోవాలని వాంఛించడం  అంటే మామూలు మాట కాదు.  అందుకు ఎంత నిజాయితీ కావాలి, పదిమందిలో పెళ్ళికి ఒప్పుకోడానికి!

పోనీ, ఇద్దరిదీ పొరబాటు కానప్పుడు, ఇద్దరూ నడిచే దారి సరైనదే ఐనప్పుడు…స్నేహకి కన్నీళ్ళెందుకొస్తున్నట్టు?

ఈ పెళ్ళి (?) తర్వాత,  వాటి అవసరమొస్తే మిగలనంత గా దుఖిస్తోంది కదు?

ఇదంతా పక్కన పెడదాం. చట్ట రీత్యా వీళ్ళు ఏమౌతారు? వీళ్లు ఇంత పవిత్రం గా అనుకుంటున్న సంబంధాన్ని  ఏ  పేరుతో  పిలవ బడతారు, ఈ సమాజం చేత?

ఒక సినీ నటికి ఇలాటి సమస్యే వస్తే, ఆ ఒత్తిడికి  తట్టుకోలేక, ఒక సీనియర్ నటుని సలహా తీసుకోవడ కోసం వెళ్ళింది.

అంతా విన్నక, ఆయన ఒకే ఒక్క ప్రశ్న వేశాడు ట. ‘నీకు సమాజం కావాలంటే అతన్ని వొదిలేయి. అతనే కావాలంటే, సమాజాన్ని వొదిలేయి. ఇప్పుడు చెప్పు. నీకు ఏది కావాలి?”  అని.

ఆమె  జవాబేం  చెప్పకుండా వెనక్కొచ్చి, తను వివాహానికి సుముఖమే అని చెప్పిందట ప్రియుని తో. ఆ తర్వాత కథ ఇక్కడ అప్రస్తుతం.

అలాగే, స్నేహ కూడా నేమో!

ఇంతకీ పెళ్ళి ఎప్పుడందీ? రేపే కదూ..

ఇంతలో సెల్ మోగింది. రాజీ కాల్ చేస్తోంది. “ఇది విన్నావా?” అవతల్నుంచి వాక్ప్రవాహం మొదలైంది.

“స్నేహ   పెళ్ళైన వాణ్ని చేసుకుంటోందిట..హవ్వ”  బుగ్గలు నొక్కుకోవడం నాకిక్కడికి కనిపిస్తోంది.

“మరి నువ్వేమన్నావ్?” అడిగాను నింపాదిగా.

“ఏమంటాను. తెలిసీ గోతిలోకి దూకుతానంటే ఆపేదెవరనీ! వినం గానే నోట  మాట రాలేదంటే నమ్ము. అవునూ, నీతో చెప్పిందా సంగతంతా?”

‘ఆ, వచ్చి చెప్పింది. పిలిచింది,  వెళ్లింది”

“ఏమిటీ, నీ దగ్గరకొచ్చిందా, పిలవడానికీ? ఎంత  ధైర్యం!?  నాలుగు  చివాట్లు పెట్టలేక పోయావా?

నేనైతే వూరుకునే దాన్ని కాను సుమా!

మా ఆయనకీ విష యం  తెలిస్తే    ఇంకేమైనా వుందా? స్వయంగా  నా పరువుని నేనే  తీసుకుని, గంగలో కలుపుకున్నట్టు అవ్వదూ? అయ్యొ..అయ్యో..ఎంత ఘోరం! ఎంత ఘోరం!”

రాజీ  నా లా గొప్ప షాక్ లో లేదు. అది స్పృహ లో వుండే మాట్లాడుతోందని నాకర్ధమై పోయింది.

ఎప్పుడైతే, వాళ్ళాయన ప్రసక్తి తీసుకొచ్చిందో, ఎప్పుడైతే, స్నేహ పెళ్ళి గురించి వాళ్ళయనకి తెలిస్తే పరువు పోతుందన్నదో నాకప్పుడే అర్ధమై పోయింది రాజీ మానసిక పరిస్థితి.

జస్ట్ ఆర్నెల్ల క్రితం..తన కాపురం నిలబెట్టమంటూ..మొగుణ్ని అవతలి దాని బారినించి అప్పగించమంటూ..పతి భిక్ష పెట్ట మంటూ..స్నేహ సాయం కోరిన రాజీ..ఇవాళ  స్నేహని, స్నేహ చేస్తున్న పని.. భర్తకి తెలిస్తె పరువు పోతుందని నెత్తీ నోరూ బాదుకుంటోం దంటేనే అర్ధమై పోతోంది.  రాజీ ఖచ్చితం గా స్పృహలో వుండే మాట్లాడుతోందని!

ఆడ వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే –  మొగుడు బయటెన్ని  వెధవ పన్లు  చేసినా, గడపలోపలకొచ్చి పడితే చాలు.’ అనుకుంటారు. తప్పులన్నీ సర్వం తుంగలో తొక్కేసి, తెగ క్షమించేస్తారు.  ఆ మరు క్షణాన్నే అంతా మరచి పోయి, పైగా అదంతా ఎన్ని జన్మల కిందట జరిగిన సంగతో అన్నట్టు,  తమకేవీ గుర్తుకు రానట్టు ఎంత హాయిగా ప్రేమించేస్తారేం? మొగుళ్ళని!

తనెప్పుడైనా ఫోన్లో అడు గుతూ వుండేది. ” రాజీ, మీ ఆయన కుదురుగా వుంటున్నాడా? ఎందుకైనా మంచిది. ఓ కన్నేసి వుంచు” అని.

అప్పుడేమనేదీ? -“ఛ! మా అయన మరీ అంత చెడ్డవాడేం  కాడే బాబూ!  పాపం! ఖర్మ లో వుండి, ఏదో ఒక సారి గడ్డి తిన్నాడే గానీ, ఇప్పుడు పూర్తిగా  మారిపోయాడు.” అంటూ మురిసిపోయేది.

“అంత గట్టిగా ఎలా చెబుతున్నావ్ ? మారాడని ?” అని రెట్టిస్తే, – “అయ్యో! నిన్ననే గా సింగపూర్ నించి వొస్తూ, రాళ్ళ నక్లెస్ తెచ్చారు నా కోసమనీ! అయినా నువ్వు భలే ప్రశ్నలేస్తా వ్లే” అంటూ గలగలా నవ్వేసేది.

అంటే, భర్త నిజాయితీకి కొలమానాలు నగలా? గిఫ్ట్లా?

కట్టుకున్న వాని అనైతికత ని కప్పిపుచ్చే శక్తి, భార్యలకిచ్చే నగలబహుమతులకుంటుందన్న మాట!

“అబ్బో! పెద్ద చెప్పొ చ్చావ్  లేమ్మా. నీకూ పెళ్ళైతే తెలుస్తుంది లే. అప్పుడడుగుతా నిన్ను. నీ కంటే పదింతలుగా..” అంటూ గొల్లున నవ్వేది.

“ఏమిటీ మాట్లాడవ్?” ఖంగుమన్న దాని గొంతు విని, ఆ లోకం లోంచి  ఈ లోకం లోకొచ్చాను. “ఏమిటన్నావ్?” అంటూ.

“అదే,  దాని పెళ్ళికెళ్తున్నావా అని?”

“వెళ్దా..మ..నే..”

“నోర్మూసుకో. పిచ్చిదాన్లా  వెళ్ళకు. వెళ్ళి, ఫోటోలు గీటోలు దిగావనుకో..ఆ పైన పోలీస్ కేసులూ గట్రా అయ్యా యే అనుకో..కేసు కోర్ట్ వరకెళ్లిందే అనుకో..ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడ్లేడు తెలుసా?

మా ఆయన ఇట్లాంటివే  నాకు చెబుతూ వుంటారు  కాబట్టి నాకివన్నీ తెలిసాయి. లేకపోతే, నేనూ నీలానే వెళ్దామనుకునేదాన్నేమో! నువ్వెళ్ళకు. అసలే పెళ్ళి కావాల్సినదానివి. పోలీస్ స్టేషన్లూ, కొట్లాటల్లో ఇరుక్కోకు. సరేనా? ఏమిటీ, వింటున్నావా? అయినా ఒక మాటే దామినీ! మనలో రెండో పెళ్ళి చెల్లదు. మరో మతం ఐతె వేరే సంగతి…” చెప్పుకు పోతోంది. ఎక్కడా ఆగకుండా.

నేనే వింటం ఆపేశా.

‘మరో’  మతం అనే మాట  దగ్గర ఆగి, వింటం మానేసా.

మరో మతం ఐతే మాత్రం, తను బ్రతికుండంగానే భర్త మరో వివాహం చేసుకుంటుంటే కంట తడి పెట్టని  భార్యంటూ  వుంటుందా, ప్రపంచంలో? స్త్రీలు, స్త్రీ ల హృదయాలు అన్ని చోట్లా ఒక్కటే కాదా? ఇలాటి కష్టం అందరది ఒకటే అయినప్పుడు, ఒకే రకం గా స్పందిచరా? ఒక్క కన్నీటి చుక్కనైనా రాల్చకుండా వుంటాయా, నయనాలు?

ఒక మతచట్టం ఒప్పుకున్నంత తేలికగా,  ఓ మనిషి గుండె ఒప్పుకోవాలి కదా? మతం గురించి కాదు నా వాదన. సమ్మతం  గురించి.

అంతేలే, కొన్ని శాసనాలు మింగుడు పడవు.  మనిషిని చంపితేనే హత్య అంటాయి. హృదయాన్ని చంపడం, ఇక్కడ నేరం కాదు. మనసుని ఖూనీ చేయడం ఏ తప్పులోకీ చేరదు. వాటికెలాటి శిక్షలూ  వుండవు.

ఏమో. నాకేమీ అర్ధం కావడం లేదు.

ఇప్పుడు నా కళ్ళకి మోహన్, స్నేహ లతో బాటు మెల్ల మెల్ల గా…రూపం లేని ఓ ఆకారం కనిపిస్తోంది. ఆమె బహుశా..మోహన్ భార్య అయి  వుంటుందేమో!

అదేమిటీ ఆమెని అలా అంటావ్, భార్య అని? స్నేహ కూడా  కదా? …ఏమో! బహుశా ‘రెండో భార్య’ అని అనొచ్చేమో తెలీదు.

రాజీ  ఇంకా మాట్లాడుతూనే వుంది.

యధాలాపం గా రాజీ ని వింటున్నాను. “ ఏమిటోనే, తెలీడం లేదు ఒకటే కంగారు గా వుంది నాకైతే. లాయరై వుండీ, అన్నీ తెలిసి..ఇలాటి పని ఎలా చేస్తోందంటావే!?”

పిచ్చి కాకపోతే,  లాయర్ కి ప్రేమ గుణం వుండదా?  ప్రేమ కి – చదువు సంధ్యలతో, ప్రొఫెషన్స్ తో పనేముంటుందీ?  స్పందించే గుండె చప్పుళ్ళ ముందు ఏ లాజిక్కూ లూ  పని చేయవన్న సంగతి రాజీ కి తెలీదా! – ఏమో!

” ఇంతకీ చెప్పావు కాదూ?  కొంప తీసి పెళ్ళికి వెళ్తున్నావా ఏవిటీ? ”ఇంకేదో హితవు చెప్పబోతున్న రాజీ మాటల్ని కట్ చేస్తూ  “అవును.  వెళ్తున్నాను..” అంటూ చెప్పి, సెల్ స్విచాఫ్ చేసేశాను. మళ్ళీ మాట్లాడే వీలు లేకుండా. అది కాదు. నేను.

ఆపైన స్నేహ పెళ్లికి  ఖచ్చితం గా వెళ్ళడానికే నిశ్చయించుకున్నాను.

 

***

 

రెండు రోజుల తర్వాత…

ఆ సాయంత్రం,  ఆరు బయట పడక్కుర్చీలో  కూర్చుని, నిర్మలమైన ఆ కాశం లోకి చూసుకుంటూ..అయిపోనీకుండా  ఒక్కో చుక్క గా టీ  రుచిని ఆస్వాదిస్తూ …  కాల ప్రవాహపు క్షణాల  అలల మీద తేలుతూ…

సరిగ్గా అప్పుడు ఫోన్ చేసింది రాజీ.

నిన్నట్నించి ఒకటే ఫోన్ల మీద ఫోన్లు చేస్తోంది.

నేనే బిజీ గా వుండి వెంటనే చేయలేకపోయాను.

మంచి సమయం లోనే చేసిందిలే అనుకుంటూ..”హలో, రాజీ” అంటూ పలకరించాను.

“ఏమిటే? పెళ్ళికెళ్ళావా? ఏమైంది?” సస్పెన్స్ భరించ లేనిదాన్లా అడిగింది.

“హు! అది ఎన్ని పెళ్ళిళ్లకి వెళ్ళదూ? మరెన్ని వివాహాలని మిస్ కొట్టి వుండదనీ.. అందర్నీ ఇలా అడగ గలదా? ఇంత  ఇది గా?

అందుకే బదులిస్తూ..“ అందరి పెళ్ళిళ్ళల్లో ఏమౌతుందో,  స్నేహ పెళ్లి లో నూ అదే అయింది.” అన్నాను చాలా సాధారణం గా.

“ఏమిటీ!సస్పెన్సా? లేకపోతే చెప్పకోడదనుకుంటున్నావా?” కోపం వినిపించింది, దాని కంఠం లో.

నేను తేలిగ్గా నవ్వేస్తూ అన్నాను. “ఏమౌతుందే, లేకపోతే? ఆ? అంత తెలుసుకోవాలనుకునే దానివి పెళ్ళికి రావొచ్చు కదా?” అన్నాను. ఈ మాటని మాత్రం నేనూ కొంచెం నిష్టూరం గానే  అన్నాను.

నా మాటల్లోని నిగూఢాలేవీ దాని కిప్పుడు వింపించవని తెలుసు.

“అది కాదే, పెళ్ళి లో గొడవలేం కాలేదా? అతని ఫస్ట్ వైఫు…” ? వాక్యం పూర్తి కాకుండానే “వచ్చారు.” అని చెప్పాను

“ఏమిటీ? వచ్చిందా? ఒకర్తే నా?, లేక…”

“ఆవిడ, ఆవిడ తో బాటు మరి కొంత మంది కూడా వచ్చారు.  పది కార్ల నిండా జనం. గుంపులు గుంపులు గా వచ్చారు. ఆవిడ మేనమామ పోలిస్ కమీషనర్ ట, ఆయన, మరో రిటైర్డ్ జడ్జ్,  ఒక  ఎంపీ,  తోడు గా   వచ్చారు.”

“ఏమిటీ? పెళ్ళికే?” అపనమ్మకంగా అడిగింది. బోల్డంతా ఆశ్చర్యపోతూ.

“కాదు. వచ్చింది పెళ్ళికి కాదు. ఆస్తుల మీద అతనికెలాటి హక్కులూ అధికారాలు వుండబోవని సంతకాలు చేయించుకు పోడానికి వచ్చారు.”

“ఎవరితో?”

“అతనితో.”

“అవును మరి. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళవి. వుండొద్దూ?”- రాజీ వోటేసేసింది.

నా కళ్ళ ముందు ఆ దృశ్యం  మరో సారి కదలాడింది.

హఠాత్తుగా కార్లొచ్చి, వరసగా నిలబడటం, గన్ మాన్లు పరుగులు తీస్తుండగా, హడావిడిగా ఆ నాయకుడు రావడం, మందీ మార్బలం తో..ఆ వెనకే ఇంకొందరు  పెద్ద మనుషులు..కుర్చీలు టెబుల్స్ దగ్గర జరగుతున్న చప్పుళ్ళు…అన్నీ కలసి..క్షణాల్లో సినిమా సీనులా  లా మారిపోయింది.

ఆమె మాత్రం కారు దిగలేదు.

అతని ముందు కాగితాలు పరిచారు.  మోహన్  చక చకా సంతకాలు చే సే సాడు.

పది నిమిషాల్లో అందరూ మాయమై పోయారు. తుఫాను వెలిసినట్టైంది.

కానీ, ఆ కొంచెం సేపు మాత్రం తుఫాను ముందటి కటిక నిశ్శబ్దం..గుబులు పుట్టించేసింది అందరి గుండెల్లోనూ!

వాళ్ళు వెళ్ళిపోయాక, వీళ్ళిద్దరూ, ఒకర్నొకరు చూసుకుంటూ మిగిలిపోయారు.

నాకు అర్ధమౌతూనే వున్నాయి, భావాలు. సరిగ్గానే అవగతమౌతున్నాయి.

అద్సరే, మోహన్ భార్య – ఆస్తులు పోకుండా కాగితాలు రాయించుకోవడ మేమిటీ?

మనిషిని కదా రాయించుకోవాలి! అవును.   పాయింటే!

“అంటే? విడాకులు పడేస్తుందంటావా?” అడుగుతోంది రాజీ.

అంత పిచ్చిదా ఆమె? కాక పోవచ్చు.

చట్టం – మనిషిని తప్పు చేయకుండా కాపాడగల్గుతుంది కాని, మనసుల్ని కాదు.

జీవితం లో చేసిన ఒక పొరబాటు కి చట్ట రీత్యా పరిష్కార మార్గం కనుగొనడం కష్టమూ, అసంభవమూ అయినప్పుడు,

సుఖ శాంతుల కోసమని, పొరబాటున పొరబాటుమార్గాన్నెంచుకుని,  ‘పొరబడ లేదు. ఇది సరైనదే’   అని అనుకోవడం వల్ల ..అతనికి న్యాయం జరుగుతుందా? లేక జీవితం లో మళ్ళీ  అతను  చేస్తున్న మరో పొరబాటు అవుతుందా?

ఏమో!

రాజులు సైతం, ప్రేమ కోసం రాజ్యాలు పోగుట్టుకున్నారు.

ఇక మోహన్ ఆస్తులు పోగొట్టుకోవడం అంత బాధాకరమైన విషయం కాదేమో!

లేక పోతే వాళ్ళిద్దరు అంత గొప్ప ఆనందం గా ఎలా కనిపిస్తారు?

ఏమో.

నేనిక ఆలోచించలేను. ఇక్కడితో నా పరిశోధనని ఆపేస్తున్నాను.

ఇదిగో..

***

 

—-ఆర్.దమయంతి

యెమ్టీ ఫెలో

sasisri

తెలుగునాట నిబద్ద కథారచయితల్లో శశిశ్రీ ముఖ్యులు. కడప జిల్లాకు చెందిన శశిశ్రీ 1976 నుంచి కథా రచనే కాకుండా కవిత్వం, సాహిత్య  విమర్శ వ్యాసాలు, ఆకాశవాణి నాటికలు రచిస్తున్నారు.  శశిశ్రీ అసలు పేరు షేక్ బెఫారి రహమతుల్లా. ఈయన 1973 ప్రాంతంలోనే “మనో రంజని” లిఖిత మాస పత్రిక నడిపి ఆనాటి యువతరం లో స్పూర్తిని రగిలించారు. 1995 నుంచి  “సాహిత్య నేత్రం” పత్రికని తన ప్రధాన సంపాదకత్వంలో నిర్వహిస్తున్నారు.  ప్రతిష్టాత్మక “యునిసెఫ్ అవార్డు” తో పాటు మరెన్నో పురస్కారాలు అందుకున్నారు. “దహేజ్” , “రాతిలో తేమ” వీరి కథా సంపుటాలు. దాదాపు 16 పుస్తకాలను రచించారు.  ప్రస్తుతం కడపలో  సీనియర్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.–వేంపల్లె షరీఫ్

***

నెల నెలా వేల రూపాయిలందించే గంగిగోవులాంటి అసిస్టెంటు ప్రొఫెసర్‌ ఉద్యోగం వదులుకోవాలనుకున్నాడు ఆనందం.

ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకే రాజీనామా చేయాల్సి వస్తుందని అతను యెంత మాత్రం ఊహించలేదు. అలా విడిచి పెట్టాల్సి వస్తుందంటే ఆ అసిస్టెంటు ప్రొఫెసర్‌ పోస్టుకు అప్లికేషన్‌నే పెట్టేవాడు కాదు. పోటీ ఉందని తెలిసినప్పుడే జిల్లా మంత్రితో గట్టిగా సిఫార్సు చేయించే వాడుకాదు.

సిఫార్సులకేం కొదువ-పోటీలో ముఖ్యమంత్రి పేషీ నించే వైస్‌ఛాన్సలర్‌కు ఫోన్‌ చేయించాడు. ఆ నాటి పరిస్థితి అదైనప్పుడు ఆ ఉద్యోగం ఖచ్చితంగా తనకే దక్కాలని ఆరాటపడినాడు ఆనందం. అప్పుడు వైస్‌ఛాన్స్‌లర్‌ శిష్యుడు వీరయ్యను కలుసుకొని యిచ్చుకోవాల్సింది యిచ్చుకుంటే పోస్టు వస్తుందని యెవరో చెప్పారు. చివరికి ఆ వీరయ్యను పట్టుకుని- పది ‘ల’కారాలు సమర్పించుకున్నాడు ఆనందం.

ముప్పయ్‌ యేళ్ళ పాడికోసం ఆ మాత్రం పెట్టుబడి పెట్టడం తప్పేకాదని వీరయ్య ఆనందానికి చెప్పినాడు. దీనితో తాను సార్థకనామ ధేయుడ్ని అయ్యానని సంతోషించాడు.

ఉద్యోగంలో చేరగానే యుజిసి స్కేళ్ళు పెరిగాయి. కలిసి వచ్చే అదృష్టం అంటే యిదేననుకున్నాడు. నెల నెలా వేలకు వేలు సంవత్సరానికి… ఓ మంచి సంపాదనే!!  ఆ ఊహే ఆనంద్‌కు తన స్థాయి యెంత యెదిగిపోతుందో అర్థమై మురిసిపోయాడు.

యూనివర్శిటీ కాంపస్‌లో లక్షకు ఒకటి వచ్చే నానో కార్లు చూసి – తానూ ఒకటి తీసుకోవాలనుకున్నాడు. నలుగురితో పాటు నారాయణ అయిపోతే యెట్టా? ప్రత్యేకత ఉండాలి కదా అనుకున్నాడు. అప్పుడే తన ఆలోచనల్లో ప్రత్యేకత అనేది ఒకటి చోటు చేసుకుంటోందని గ్రహించాడు. ఫలితంగా ఆరులక్షల కారు కొని – కాంపస్‌లో పార్క్‌ చేసినాడు. నలుగురి కంట్లో తాను యేమిటో తన ప్రత్యేకత యేమిటో ఫస్ట్‌ ఎంట్రీలోనే నిరూపించుకున్నాడు ఆనందం.

కానీ, ఇవన్నీ ఉద్యోగం వచ్చిన కొత్తలో ఆనందంలోని ఆలోచనలు. ఇప్పుడు ఈరోజు అంతే భిన్నంగా ఆలోచించసాగాడు.

తన రాజీనామా రిజిస్ట్రార్‌కు ఇచ్చి,  వైస్‌ఛాన్స్‌లర్‌ దృష్టికి తీసుకెళ్ళి రిలీవ్‌ చేయమన్నాడు. రిజిస్ట్రార్‌ గోపాలయ్య దిగ్భ్రాంతికి గురి అయ్యాడు. ఆలోచించుకుని వారం రోజుల తరువాత చెప్పమన్నాడు. అమెరికాలో జరిగే సెమినార్‌ నుంచి వీసీ రావడానికి వారం గడువుందని – అందాక ఓపికతో నిలకడగా ఆలోచించి చివరి నిర్ణయం తెల్పమన్నాడు.

ఆనందం మాత్రం తాను అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నానని తదుపరి చర్యలు తీసుకుని రిలీవ్‌ చేస్తే అదే సాయం అవుతుందని చెప్పి – మరో ఆస్కారం రిజిస్ట్రార్‌కు యివ్వకుండా ఆయన చాంబర్‌లోంచి బయటికొచ్చాడు.

వెయ్యి యెకరాలలో ఆకాశం అంటే భవనాలు… రకరకాల పేర్లతో యేర్పాటైన ఆకుపచ్చని ల్యాండ్‌ స్కేప్‌లు… చెట్లూ… ఆర్చీలు… డా. రాజశేఖర్‌రెడ్డి, అన్నమయ్య, వేమన, అంబేద్కర్‌, సివిరామన్‌ విగ్రహాలు… చూస్తూ తన కారులో క్యాంపస్‌ బయటికి వస్తున్న ఆనందం – యెందుకో బొటానికల్‌ గార్డెన్‌వైపు కారును మలుపు తిప్పాడు.  అక్కడైతే ఆ రాక్‌పాండ్‌ దగ్గర, తెలుగుతల్లి విగ్రహం దగ్గర వున్న చిన్నపాండ్‌లో హాయిగా అటు ఇటూ ఈదుతున్న రంగురంగుల చేపల్ని చూస్తూ కొంత ఉపశమనం పొందాలనుకున్నాడు ఆనందం. అక్కడ రోజుకు అరగంట సేపైనా గడపడం ఆనందంకు ఇష్టమైన అలవాటే. ఆ అరగంట అక్కడ గడిపితే చాలు – యెంతో ఉల్లాసం, ఉత్సాహం శరీరం అంతా నిండి తాను ఎన్‌రిచ్‌ అయినట్లు, రీచార్జ్‌ అయినట్లు అనుభూతించేవాడు.

ఇప్పుడు మాత్రం అందుకోసం కాదు- ఎవరూ రాని అక్కడ – ఎవరూ గమనించని అక్కడ తనివితీరా గట్టిగా యేడ్చేయాలని వచ్చాడు ఆనందం. నలుగురి ముందు యేడ్చడం నాగరికతకాదు. ఒంటరిగా స్వేచ్ఛగా – తృప్తి మీర-మనసులోని కల్మషమంతా కన్నీటి రూపంలో బయటపడిపోయేదాక యేడ్వాలనే వచ్చాడు ఆనందం.

కారుదిగి, రంగు రంగుల చిన్ని చేపలున్న ఆ చిన్న కొలను దగ్గర- కదలకుండ ఒకదానికి యింగొకటి అంటిపెట్టుకొని వున్న ఆ గుండ్రాళ్ళ పైన కూర్చోడానికి వేసిన కాంక్రీటు దిమ్మెమీద కూర్చున్నాడు ఆనందం.

రంగురంగుల చేపలు – కళ్ళు – నోళ్ళు తెరిచి ఆనందాన్ని చూశాయి. యేదో అర్థమై గబుక్కున దూరంగా పోతున్నాయి. మళ్ళీ మెల్లిగా వస్తున్నాయ్‌. ఎవరో ఆ కొలనులో బొరుగులు (మర్మరాలు), పప్పులు చల్లినారు.  అవి నీటిపై తేలుతున్నాయ్‌. చేపలు మూతులు సాచి చటుక్కున నోట పట్టుకుని సర్రున వెళ్తున్నాయి. మళ్ళీ వస్తున్నాయి. నోట పట్టుకుని సర్రున పోతూనే వున్నాయ్‌.

చేపలపై నుంచి దృష్టి పైకి మరల్చినాడు ఆనందం. అందమైన గ్రీకు యువతి తన చంకలోని కడవలోంచి నీరు ఆ కొలనులోకి వొంపుతోంది. కడవలోంచి కొలనులోకి నీరు నెమ్మదిగా పడేట్లు యేర్పాటుచేశారు. నీళ్ళు కడవతో వొంపుతున్న ఆ గ్రీకు యువతి తన నీలికళ్ళతో ప్రశాంతంగా పలకరించినట్లు అనుభూతించాడు- ఆనందం.

ఆనందానికి బాధతో కాదు- పశ్చాతాపంతోను ప్రాయశ్చిత్యంతోను రెండుకండ్లలో రెండు ధారలు ఉబికి చెంపలపై నుంచి జారాయి. మీసాలు పై నించి పైపెదవినించి మెల్లిగా నోటిలోకి వెళ్తున్నాయ్‌. కన్నీటి రుచి – ఉప్పగా నాలుకకు తగిలింది. తన కన్నీరు అందరి కన్నీటి మాదిరే ఉప్పగా ఉండటం ఆశ్చర్యమేసింది. ఆశ్చర్యం యెందుకంటే తాను చేసిన పనికి తన కన్నీరు చేదుగా వుండాల్సింది కదా అనుకున్నాడు. చేదుగా ఉండి ఉంటే కొంత తృప్తిగా ఉండేది. ఆ ఆలోచన నోరు అర్థం చేసుకున్నదానిలా వుంది. నోరంతా చేదుగా తోచింది  ఆనందానికి. నోరు చేదెక్కడం అంటే ఇదేనేమో అనుకున్నాడు.

తాను ఈ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగం కోసం యింతగా దిగజారాల్సి వుండకూడదేమో! ఒక వేశ్య దగ్గరికి ఎవడు పోతాడో వాడు ఒక్కడే చెడిపోతాడు.  కానీ తను!? తన దగ్గర చదువుకునే ముప్పయ్‌ మంది పిల్లలు చెడిపోతారు. ఈ లెక్కా తప్పే!! ఎందుకంటే ఎంతలేదన్నా తను ముప్పయ్‌ యేళ్ళు కదా సర్వీసు చేయాల్సింది? ఆ ముప్పయ్‌ యేళ్ళలో యెందరెందరు చెడిపోతారో… ఎందరెందరి భవిష్యత్తులు నాశనమైపోతాయో?

ఒక్క వేస్టు ఫెలోని… ఒక ఎమ్టీ ఫెలోని అసిస్టెంట్‌  ప్రొఫెసర్‌గా తీసుకుంటే ముప్పయ్‌ యేళ్ళ సుదర్ఘీకాలం యూనివర్శిటీ చెడిపోవడమేకదా. ముప్పయ్‌ యేళ్ళ పాటు ఒక ”నీచ్‌ కమీనే కుత్తే”ను భరించడమే కదా అనుకున్నాడు ఆనందం.

అసలు ఈ ఆలోచన తనకు ముందుగా ఎందుకు రాలేదని కుమిలిపోయాడు. ఎంతసేపు తన భవిష్యత్తు గురించే ఆలోచించినాడే కానీ, తను అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులో చేరిన తరువాత యెందరెందరి  భవిష్యత్తు తన  చేతిలో వుంటుందనే విషయం యెందుకు ఆలోచించలేదని పొరలి పొరలి దుఃఖం ముంచుకొచ్చింది ఆనంద్‌కు.

ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకే తనవల్ల జరిగే తప్పు ఏమిటో తనకు తెలిసిరావడం కూడా ఒక వరమే! అదృష్టమే!! కాదు కాదు తన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం కొద్ది ప్రాయశ్చిత్యం చేసుకునే అవకాశం దొరికిందనుకున్నాడు ఆనంద్‌ చెంపలపై కన్నీటిని చేతులతోనే తుడుచుకుంటూ.

జేబులోంచి రుమాలు తీసుకొని కళ్ళు  వత్తుకోవచ్చు కానీ, ఆ కన్నీరు… ఆ కన్నీటిలో కరిగి వెలకివస్తున్న, చేసిన తప్పు తాలూకూ సూక్ష్మ అణువులు సరాసరి చేతులకు తాకనీ అనుకున్నాడు. ఈ చేతులు ఇక మీదట జీవితకాలం మళ్ళీ ఆ తప్పు చేయవు? కదా అనుకున్నాడు.

ఈ చేతుల్తోనే కదా టెన్తు నుండి పీజీ వరకు పీజీ నుండి పిహెచ్‌డి వరకు మొత్తం  అడ్డుదారుల్లో సంపాదించాను. ఈ చేతుల్తోనే కదా డబ్బులు యిచ్చి చదువు కొనుక్కున్నాను. ఈ చేతుల్తోనే కదా ఆ వీరయ్య ద్వారా పది లకారాలు లంచం ఇచ్చాను. ఈ చేతుల్తోనే కదా యెవరికి సిఫార్సు చేయాల్నో స్లిప్పులురాసి మంత్రికి, మంత్రి పిఎకు ఇచ్చాను. ఈ చేతుల్తోనే  కదా ఫోన్‌ నెంబరు నొక్కి మొబయిల్‌ ఫోన్‌ని మంత్రికి ఇచ్చాను. ఈ చేతుల్తోనే కదా మంత్రికి దండాలు పెట్టాను. ఈ చేతుల్తోనే కదా సిఫార్సు లెటరు మోసుకెళ్ళి – మద్రాసులో మకాంలో ఉండిన ఈ వీసీ కిచ్చాను. అని అనుకొనే కొద్ది ఆనందంకు కన్నీరు వస్తూనే ఉంది. ఎంతెంతగా కన్నీరు బయటికొస్తుంటే అంతగా మనసు తేలిక అవుతున్నట్లు అనుభూతిస్తున్నాడు ఆనందం.

మెదడుపొరల్లోంచి ఈ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకోసం తాను చేసిన తప్పులన్నీ ఒకటొకటి వెలికి వస్తుంటే కళ్ళు వెలికి వూసేస్తున్నాయ్‌ – అనుకున్నాడు ఆనందం.

ఆరోజు ఇంటర్‌వ్యూకి వచ్చిన వాళ్ళలో భార్గవ అని ఒక క్యాండెటు వచ్చాడు. ఇంటర్‌వ్యూ జరిగే గది  లోపలికి పోకముందు తాను అతని పక్కనే కూర్చున్నాడు. అప్పుడు చూశాడు. ఆ భార్గవ ప్రొఫైల్‌ ఎంత గొప్పగా ఉండింది!

నృత్యంలో, నటనలో, సంగీతంలో జాతీయస్థాయిలో యిచ్చిన ప్రదర్శనల ఫొటోలు తను చూశాడు. దేశ ప్రధాని చేతుల మీదుగా తీసుకున్న మెమొంటోలు, కేంద్ర మంత్రులు చూస్తుండగా చేసిన నృత్యభంగిమల ఫొటోలు – జాతీయస్థాయి గుర్తింపు వున్న సంస్థలు యిచ్చిన సర్టిఫికెట్లు- లలిత కళల్లో వృత్తి శిక్షణ తీసుకొన్న సర్టిఫికెట్లు ఇలా యెన్నో ఈ చేతులు మార్చి మార్చి చూశాడు. ఈ కళ్ళు విచ్చుకుని విచ్చుకుని చూశాయి. ఆరోజు ఇంటర్‌వ్యూకు భార్గవనే తనకంటే ముందులోనికి పిలిచిన సంగతి కూడా ఆనందంకు గుర్తుకొచ్చింది.

ఇంటర్‌వ్యూనించి బయటికొచ్చాక – ఇంటర్‌వ్యూ యెలా ఫేస్‌ చేశారని తను అడిగింది కూడా గుర్తుకొచ్చింది. ఇంటర్‌వ్యూ చేసిన ఎక్స్‌పర్ట్స్‌ తన డెమో చూసి సంతృప్తి వ్యక్తం చేశారని భార్గవ చెప్పిందీ గుర్తుకొచ్చింది ఆనందంకు.

కానీ ఆ భార్గవకు ఆ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టు రాలేదు. నాన్‌ లోకల్‌ అనే ఒక నెపాన్ని చూపి తీసుకోలేదనే విషయమూ గుర్తుకొచ్చింది ఆనందంకు.

ఆ ఒక్క నాన్‌లోకల్‌ అనే ఎర్ర ముద్ర భార్గవపై పడకపోయివుంటే – తనకు ఈ పోస్టు ఎందుకొస్తుందనే విషయం కూడా గుర్తుకొచ్చి కన్నీరు వచ్చింది ఆనందంకు.

గుండెలోతుల్లో ప్రక్షాళన ఊట పుట్టింది ఆనందంకు. ఎక్కడో గుండె చివర దాగివున్న మానవత్వం చెమ్మ పొర వూడదీసుకున్నట్లుంది.

ఇన్ని తప్పులుచేసి – తీరా ఉద్యోగంలో చేరిన కొన్ని నెలలకు – ఈ రోజు ఆ ఘటన చోటుచేసుకుని వుండకపోయి వుంటే ఇంత పెద్ద నిర్ణయం  తీసుకొని వుండడు ఆనందం.

ఉదయం యెప్పటిలా క్లాసుకు వెళ్ళాడు ఆనందం.

లలితసంగీతం క్లాసు అది.

సంగీతం పుట్టుక, దాని నేపథ్యం అనే అంశం మీద విద్యార్థులకు చెప్పాల్సి వుంది. సంగీతం గురించి ఉద్యోగం రాక ముందు ఆనందంకు ఏమీ తెలియదు. ఉద్యోగ అవసరార్ధం – ఏ రోజు పాఠం ఆ రోజు ముందు పుస్తకం చూసి నోట్సు రాసుకుని వచ్చి చెప్తున్నాడు.

నిన్నరాత్రి రాసుకున్న నోట్సు కాగితం తీసి ఒకసారి చూసి టేబుల్ మీద పెట్టి దానిపై మొబయిల్ ఫోన్ పెట్టాడు. చాక్‌పీసు తీసుకొని బ్లాకుబోర్డు మీద ‘సంగీతం పుట్టుక కథ’ అని రాశాడు. దాని కింద సప్తస్వరాలైన ‘సరిగమపదనిస’ రాశాడు.

“సంగీతం గురించి తనకు తెలిసింది చెప్పసాగాడు. చెప్తూ… చెప్తూ .. సంగీతంలోని సప్తస్వరాలు యేడింటిని ఔడవ రాగాలు అంటారు. మోహన హంసధ్వని రాగాలులోనే తొలుత వేదపఠనం జరిగేది” అని చెప్తుంటే కిషోర్ అనే విధ్యార్ధి “సార్” అని  అడ్డుతగిలాడు.

తన వాగ్ధాటికి అడ్డువచ్చిన కిషోర్‌ని తీక్షణంగా చూసి “ఏమిటి ఈ అవాంతరం” అన్నాడు నాటక ఫక్కీలో ఆనందం.

“అవాంతరం కాదు సార్ అనుమానం” అన్నాడూ చాలా వినయంగా కిషోర్.

“ఇప్పుడే తీర్చుకోవాల్సిన అనుమానమా? లెక్చర్ ఆఖర్న తీర్చుకోవాల్సిందా?” కాస్త అసహనంగా అన్నాడు.

“మీరు మరోలా భావించకుంటే ఇప్పుడే తీరుస్తే మంచిది సార్!” అన్నాడు విద్యార్థి కిషోర్ చాలా వినయంగా.

“సరే చెప్పు. నీ అనుమానం పెనుభూతం కాకముందే” అన్నాడు చాలా స్థిరంగా.. క్షణంలో తీర్చి నోరు మూయించేస్తానన్న ధోరణిలో.

“సప్తస్వరాలను ఔడవ రాగాలు అనరని నా అనుమానం. మరొకటి వేదపఠనం మోహన, హంసధ్వని రాగాలలో తొలుత జరిగేది కాదేమోనని సార్” అన్నాడు కిషోర్. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆనందం ముఖంలో మారుతున్న కవళికలను గమనిస్తూ.

ఆ రెండు అనుమానాలు ఆ విద్యార్థికి కాదు కానీ ఆనందంకు రెండు భూతాలుగా యెదురుగా నిలిచినట్లు తోచింది. కొంచెం అహం దెబ్బతిన్నట్లూ అనిపించింది.

“అంటే! నేను చెప్పింది రాంగ్ అనేనా నీ అభిప్రాయం?” అంతకంటే తన దగ్గరేం జవాబు లేకపోయేసరికి వచ్చిన మాటలు అవి.

“మీరు రాంగ్ అని కాదు సార్. ఎక్కడో పొరపాటు జరిగి వుంటుందని అనుకుంటున్నాను” కిషోర్ వినయంగానే ఆనందం చేసిన తప్పును గుర్తించమని తెలిపాడు.

“అలానా! అయితే నీవే ఈ డయాస్ పైకి వచ్చి రైట్ ఏదో చెప్పు మరి” అనేశాడు అహం దెబ్బతిన్న స్వరంతో ఆనందం

“అదికాదు సార్..” అని కిషోర్ సర్ది చెప్పబోయాడు.

“నన్ను కన్విన్స్ చేయక్కర్లేదు. ముందు నీవు ఇక్కడికి వచ్చి రైట్ యేదో చెప్పు. కమాన్.” అని డయాస్ దిగి స్టూడెంట్స్ కూర్చునే డెస్క్‌లో కూర్చున్నాడు ఆనందం.

క్లాస్‌లో అనుకోకుండా చోటు చేసుకున్న ఆ దృశ్యం విద్యార్థులకు కొంచెం చేదుగా అన్పించినా విషయం ఆసక్తిగా గమనించసాగారు.

కిషోర్  తనకు తప్పదన్నట్లు డయాస్ పైకి వెళ్లాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆనందం వైపు తనతోటి విద్యార్థుల వైపు చూశాడు.

విద్యార్థుల మొహాల్లో ఉత్కంఠ. ఆనందం మొహంలో ఓ నిర్లక్ష్య,  అసహన భావం కమ్ముకుని కనిపించింది.

“టైం వేస్ట్ చేయకు. కమాన్ చెప్పు. అవసరం అనుకుంటే బ్లాక్ బోర్డు కూడా యూజ్ చేయి” అన్నాడు ఆనందం. కిషోర్‌ని కంగారుకు గురిచేస్తూ.

కడుపులోంచి తన్నుకొస్తున్న కంగారు , తను రైట్, ప్రొఫెసర్ రాంగ్ అని తేలిపోయాక తననేం చేస్తాడోననే భయం తటపటాయించేట్లు చేసింది కిషోర్‌కు. ఇంతదాకా వచ్చేశాక, యిక వెనుకడుగు వేసినా తీరని అవమానమే యెదురు అవుతుంది. తన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆనందం చేస్తున్న టీచింగ్ పూర్తి అసంబద్ధమని నిరూపించడమే మంచిదనిపించింది కిషోర్‌కు. కాకపోటే ఆనందం గౌరవానికి భంగం వాటిల్లకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే సరి అంది మనసు. మనసు తల్లి అంటారు . తల్లి బిడ్డకు యెప్పుడు తప్పుడు బోధ చేయదనుకున్నాక కిషోర్ మనసులో ఒక స్థిర ప్రశాంతత ప్రకాశమానంగా వెలిగింది.

బోర్డుపై చాక్‌పీస్‌తో ‘సంగీతం పుట్టుక్’ అని రాశాడు. పైనించి కిందికి ఒకటీ నుండి యేడు అంకెలు రాసి ఆ ప్రతి అంకె పక్కన స్వరం స్వరం అని రాశాడు. ఆ తరువాత షడ్జస్వరం అని రాశాడు.

ఆ తరువాత ‘సరిగమ పదనిస’ అనే అక్షరాలను విడివిడిగా పైనించి కిందికి ఒకో అక్షరం రాసి –  ‘స’ పక్కన 240, ‘రీ పక్కన 270, ‘గ’ పక్కన 300, ‘మ’ పక్కన 320, ‘ప’ పక్కన 360, ‘ద’ పక్కన 405 చివరి ‘స’ పక్కన 480 అని చాక్‌పీస్‌తో రాశాడు.

ఆ తరువాత ‘ఔడవరాగాలు – 5’ అని రాసి, ప్రాచీన రాగాలు మోహన, హంసధ్వని అని రాశాడు కిషోర్.

ఈ మాత్రం చాలు అనుకుని, గొంతు సవరించుకొని ఇలా చెప్పుకుని పోసాగాడు.

“మనిషి సంగీతాన్ని ప్రకృతి నించే నేర్చుకున్నాడు. పక్షులు, పశువులు, జంతువులు, మృగాలు, సెలయేర్లు, గాలి, నీరు, ఇలా ప్రకృతి నించి జనించే సహజ శబ్ద సుందరాలను మనిషి విని వుద్దీపన చెందాడు. ప్రకృతి శబ్ద స్వరాలనే ధ్వని శాస్త్రమని మేధావులైన సంగీత శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. తొలుత మనిషి కనుకొన్న స్వరానికి షడ్జస్వరమని పేరు పెట్టుకున్నాడు. ఆ స్వరానికి మనసును రంజింపచేసే స్వభావం వుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే ఈ షడ్జస్వరం వుందే.. 240 ప్రకంపనలు కలిగి వుంటుంది. అంటే ఒక సెకను కాలంలో 240 ప్రకంపనలు సృష్టించే షడ్జస్వరం అయ్యిందన్నమాట.

ఈ ఒకే ఒక్క స్వర ఆధారంగానే ఒకే స్వరంలో ఆలపించే సంగీతం ప్రచారంలోకి వచ్చింది. మీకు తెలుసా.. అసలు వేద పఠనం తొలుత ఏక స్వరం గాయన పద్ధతిలోనే వుండేది. సంగీత పట్ల మనుష్యుడు ఆసక్తి తద్వారా సంశోధన చేస్తూ ద్విస్వర, త్రిస్వర గాన పద్ధతిని మనిషి సాధించుకున్నాడు.

సామవేదం కాలం నాటికి ఉదాత్త, అనుదాత్త స్వరాలతో సోయగానం అయ్యింది. మరి కొంతకాలం మనిషి చేసిన అన్వేషణ ఫలితంగా అయిదు స్వరాలు అయ్యాయి. ఆ అయిదు స్వరాలనే ‘ఔడవ రాగాలు’ అంటారు”-అని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆనందంవైపు – తన తోటి విద్యార్థుల వైపు చూశాడు కిషోర్‌.

విద్యార్థులతోపాటు ఆనందం కూడా ఆశ్చర్య చకితుడైపోయాడు. ముందువున్న అహం, అసహనం, దర్పం అతనిలో పటాపంచలై పోయాయి.

”ఎసెస్‌. కమాన్‌ గో అహెడ్‌” అని ప్రోత్సహించాడు ఆనందం.

ఈ అయిదు ఔడవ రాగాలలో మోహన, హంసధ్వని రాగాలున్నాయి. ఇవి ప్రాచీన రాగాలు.

ఈ అయిదింటితో తృప్తి చెందని మనుష్యుడు మరో రెండుస్వరాలను కూడా కనుగొన్నాడు. అప్పుడుయేర్పడినవే సప్తస్వరాలు – ‘సరిగమపదనిసలు’  ఈ ప్రతి స్వరం ఇక్కడ నేను రాసిన ప్రకారం ప్రకంపనలు కలిగి వుంటాయి. అంటే ముందే చెప్పినట్లు సెకనుకాలంలో ఆయా స్వరానికి ఆయా ప్రకంపనలు వుంటాయి. ఉదాహరణకు సరిగమపదనిసలోని ‘ద’ స్వరానికి 405 ప్రకంపనలుంటాయన్నమాట. ఇదీ నేను చెప్పదల్చింది. ఈ విషయాలు అన్నీకూడా ఆనందం సార్‌కు తెలియవని కాదు.నాకు తెలిసినవి ఇలా మీముందు చెప్పించడానికే  యిలా చేశారు. అంతే కదా సార్‌” అని డయాస్‌ దిగాడు కిషోర్‌.

ప్రతిభావంతుడైన కిషోర్‌లాంటి విద్యార్థికి తనవంటి ‘యెమ్టీ ఫెలో’ లెక్చరర్‌ కావడం ఘోరం అనిపించింది ఆనందంకు. మరోరకంగా చూస్తే అటువంటి సరుకు వున్న విద్యార్థికి తాను గురువు కావడం గర్వంగా అన్పించింది ఆనందంకు.

కిషోర్‌ డయాస్‌ దిగి – తన డెస్కులో కూర్చున్నాక కాసేపు నోటమాట రాలేదు ఆనందంకు. తేరుకుని లేచి, డయాస్‌ మీది కెళ్ళి క్లాప్స్‌ కొట్టి నిజంగానే హృదయపూర్వకంగా అభినందించాడు. ఇలాటి విద్యార్థులు రాష్ట్రంలోని ప్రతి యూనివర్శిటీల్లో పదేసి మంది వుంటే చాలు అని- గొప్ప భవిష్యత్తు వుందని మెచ్చుకున్నాడు ఆనందం.

క్లాసు అయిపోయిందనే అలారం బెల్లు మోగగానే బయటికొచ్చిన ఆనందం దగ్గరికి కిషోర్‌ పరుగున వచ్చాడు.

ఆనందంను అనుసరిస్తూ – ”సార్‌. నేను క్లాస్‌లో ఓవర్‌ ఆక్షన్‌ చేసినాను సార్‌. మనసులో ఏం పెట్టుకోకండి. మళ్ళీ అలా యెప్పుడు ప్రవర్తించను సార్‌” అని వేడుకోలుగా చెప్పుకొన్నాడు కిషోర్‌. ప్రొఫెసర్లు మనసులో పెట్టుకుని యెలా తొక్కేస్తారో అనే విషయం పూర్వ విద్యార్థుల అనుభవాలు కిషోర్‌కు తెలిసి వుండటంతో – జరిగింది యేదో జరిగింది తొలి తప్పుగా  నన్ను క్షమించి వదిలేయ్‌మన్న ధోరణి చూపాడు కిషోర్‌.

”కాదు కిషోర్‌! నీవు క్లాసు తీసుకోక ముందు నిజంగానే నా ఆలోచనలు వేరేగా వుండేవి. కానీ, నీ ఇన్‌డెప్త్‌ నాలెడ్జ్‌ విన్నాక నా మనసులో నీవు యెంతో యెత్తుకు యెదిగిపోయావ్‌.  ఎస్‌. ఇట్స్‌ ట్రూ. మనసారా నిన్ను అభినందిస్తున్నాను ” అన్నాడు ఆనందం హృదయపూర్వకంగా స్పందిస్తూ.

”చాలా థ్యాంక్స్‌ సార్‌. నిజంగా చాలా కంగారుపడిపోయాను. ఇకమీద చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాను సార్‌. నాకు ఈ ఫైన్‌ ఆర్ట్స్‌ పీజీ చాలా అవసరంసార్‌.” తన పరిస్థితిని కొద్దిగా వ్యక్తం చేస్తూ చెప్పాడు కిషోర్‌. ”పీజీ నీకు రావడమే కాదు – గోల్డ్‌ మెడల్‌ కూడా కొట్తావ్‌. ఆఁ ఇంతకు ఎవరి అబ్బాయివి నీవు, నేటివ్‌ ప్లేస్‌ ఏది నీది” కిషోర్‌ వ్యక్తిగతం తెలుసుకోవాలనుకున్న ఆసక్తితో అడిగాడు ఆనందం.

”మాది బళ్ళారి జిల్లా సార్‌. మా చిన్నాన మీకు తెలిసే ఉంటారు – భార్గవ అని ఫైన్‌ ఆర్ట్స్‌లోను ఫర్‌ఫార్మింగు ఆర్ట్స్‌లోను మంచి పేరు తెచుకున్నాడు. ఇండియన్‌ కల్చర్‌ ఫెస్టివల్‌లో ప్రయిమ్‌ మినిష్టర్‌తో అవార్డు తీసుకున్నాడు” అని యింకా యేదో చెప్పబోయాడు కిషోర్‌ -కానీ ఆనందం యేదో గుర్తుకొచ్చిన వాడల్లా అడిగాడు అతని మాటలకు అడ్డువస్తూ- ”అంటే! ఆర్నెల్ల క్రితం ఈ యూనివర్శిటీ ఇంటర్‌వ్యూకి వచ్చి వుండిన భార్గవ కాదు కదా!?” ప్రశ్నించాడు ఆనందం.

”అవున్సార్‌! ఆయనే!! మీకు తెలుసా?  ఇప్పుడు హైదరాబాదులో స్వంత ఇన్సిటిట్యూట్‌ నడుపుకుంటున్నాడు” అన్నాడు కిషోర్‌.

”తెల్సు తెల్సు! హైదరాబాద్‌లో ఇన్సిటిట్యూట్‌ రన్‌ చేస్తున్నారా! రైట్‌!! సరే నీవెళ్ళు” సంభాషణ కొనసాగించడం ఇష్టంలేక కిషోర్ ని పంపేశాడు ఆనందం.

జరిగిన ఈ ఘటనంతా గుర్తుకొచ్చింది ఆనందంకు. తన బోటివారు ప్రస్తుత అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అసలు అర్హుడు కాడన్న విషయం ధృడం చేసుకున్నాడు. బొటానికల్ గార్డెన్‌లో ఎవరూ చూడని ఆ ప్రాంతంలో మనసు తేలిక అయ్యేవరకూ, కన్నీరు అంతా అయిపోయేంతవరకు అనుభూతితో ఏడ్చేసి తన కారు వున్న చోటికి బయల్దేరాడు.

ఇంతలో ఫోన్ రింగైంది. డిస్‌ప్లేలో వీరయ్య పేరు కనిపించింది. ‘హలో’ అన్నాడు ఆనందం. అవతల వీరయ్య  యేదేదో చెబుతున్నాడూ. సర్ది చెప్తున్నాడు. ఇక కాదు కూడదంటే ఇచ్చిన డబ్బులు వాపసు ఇవ్వడం కష్టమేనన్నాడు.

ఆ మాటకు ఆనందంకు ఒక విషాదపు నవ్వు వచ్చింది. అతనికీ చెప్పేశాడు. రాజీనామా వెనక్కు తీసుకోనని.. తనవల్ల యేలాటి లిటిగేషన్స్ కల్పించబోనని కూడా చెప్పేశాడు.

ఆ రాత్రి ఆనందంకు మొద్దునిద్ర హాయిగా పట్టింది.

మరుసటిరోజు ఆలస్యంగా నిద్రలేచి పేపర్ తిరగేస్తున్నాడు ఆనందం. తన క్లవర్ స్టూడెంట్ కిషోర్ తన మనసులో ఎంత కల్లోలం సృష్టించాడో కదా అనుకున్నాడు. ప్రాయశ్చితంగా తాను రాజీనామా చెయకపోయినా తన మనసు కలలో మాత్రం ఆ పని చేసిందనుకున్నాడు.

అంతలోనే ఇంటి పనిమనిషి వచ్చి బయట ఇద్దరు వ్యక్తులు వచ్చి ఉన్నారని చెప్పడు. ఎవరై వుంటారో అనుకుంటూనే రమ్మనమని చెప్పేసాడు.

వచ్చింది ఎవరో కాదు తన స్టూడెంట్ కిషోర్, వాళ్ల చిన్నాన్న భార్గవ ఏదో ఇన్విటేషన్ చేత పట్టుకొచ్చారు. ఆత్మీయంగా లోనికి ఆహ్వానించాడు ఆనందం.

 

–  శశిశ్రీ

 

పద్దెనిమిది గంటలు

417671_580561545289734_1052452842_n

రామాచంద్రమౌళి తొలికథ  ‘సువర్ణశతదళ పుష్ప రహస్యం’ 1964లో చందమామలో ప్రచురితమైంది. ఇప్పటివరకు 250 దాక  కథలు రాశారు. 18 నవలలు, 8 కవితాసంకలనాలు, రెండు విమర్శా పుస్తకాలు వెలువరించారు. అనేక సాహిత్య వ్యాసాలు రాశారు. అవి రెండు సంకలనాలుగా వచ్చాయి. ఇంగ్లీషు, తమిళ్‌, మలయాళీ, కన్నడ, పంజాబీ, బెంగాళీ భాషల్లోకి ఈయన రచనలు అనువాదమయ్యాయి. 2011లో గ్రీస్‌లో జరిగిన ‘22వ వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ పొయెట్స్‌’లో భారత ప్రతినిధిగా పాల్గొన్నారు.  అలాగే సార్క్‌సాహిత్య సమవేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా వెళ్లారు. పలు టెలీఫిలిమ్స్‌ రాశారు. ఇప్పటికే అనేక పురస్కారాలు అందుకున్న రామాచంద్రమౌళి ప్రస్తుతం వరంగల్‌లోని గణపతి ఇంజినీరింగ్‌ కాలేజిలో వైస్‌ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు.–వేంపల్లె షరీఫ్

***

 

 

   భారతదేశం.

                చెన్నై ఇంటర్‌నేషనల్‌ ఏర్‌పోర్ట్‌..అటు హార్బర్‌.

                హార్బర్‌నుండి పన్నెండువందల ముప్పయి కిలోమీటర్ల దూరంలో అండమాన్‌ నికోబార్‌ దీవులు.

                అండమాన్‌ రాజధాని పోర్ట్‌ బ్లైయర్‌.

                వీర్‌ సావర్కర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

                పోర్ట్‌ బ్లెయర్‌లో కేంద్రపాలిత ప్రాంత నగరం..సకల పాలనావ్యవస్థ కేంద్రీకృతమై.,

                నగరం నడిబొడ్డున 1896-1906 మధ్య బ్రిటిష్‌వాళ్ళచే నిర్మించబడిన.. భారతదేశ శుద్ధ స్వాతంత్య్ర సమరయోధులను కఠినాతికఠినంగా, రాక్షసంగా, అమానవీయంగా హింసించి వందలమందిని ఉరితీసిన 696 ఒంటరి కారాగార గృహాలు గల ‘సెల్యులర్‌ జైల్‌’

కేవలం పర్యాటక వ్యాపకాన్నే జీవనవనరుగా బ్రతుకులను వెళ్ళదీసే నిజాయితీ, అమాయకత్వం నిండిన జనం..,

పోర్ట్‌బ్లెయర్‌ నుండి..చుట్టూ తన మాతృకౌగిలిలో జోలబుచ్చే బంగాళాఖాత సముద్రంలో.. యాభై కిలోమీటర్ల దూరంలో ప్రశాంతంగా..హావలక్‌ ద్వీపం.

హావలక్‌ ద్వీప..శాంత గంభీర తూర్పు తీరంవెంట..,

యుగయుగాలుగా అమాయకులను కొల్లగొట్టి, ప్రకృతి వనరులను ధ్వంసించి, ఆక్రమించి, అతిక్రమించి, సకల మానవీయ ధర్మాలను ఉల్లంఘించి కొనసాగిస్తూ వస్తున్న దోపిడీ వర్గాల స్థావరాలు.. లగ్జరీ విల్లాలు..వరుసగా..సండేజ్‌ బీచ్‌ రిసార్ట్‌, అంజనా బీచ్‌ రిసార్ట్‌, బే వ్యూ రిసార్ట్‌, స్మైల్‌ గార్డెన్‌ రిసార్ట్‌, హాప్పీ రిసార్ట్‌, సీషెల్స్‌, ఎక్కోవిల్లా, అమెజాన్‌ బీచ్‌ రిసార్ట్‌..ఒక పరంపర.

‘చీమలుపెట్టిన పుట్టలు పాముల..’ ఒక అనుభవసూత్రం.. యుగయుగాలనాటి పాతది.

ఈ దీవులలో ఎక్కడా..స్థానీయ అండమాన్‌ మూలవాసి ఒక్కరుకూడా కనబడని అత్యంత విషాదకర సందర్భంలో.,

జైలుదేశమైన అండమాన్‌కు.. అవసరార్థమై, బానిస పనులకోసం, పొట్టకూటికోసం, దిక్కులేని పరిస్థితుల్లో, మనుషులు వలసలై..వలస పకక్షులై..ఏ చెట్టుపక్షో ఈ కొమ్మపైవాలి..ఏ కొమ్మ పూలో ఈ దండలో ఒదిగి.,

గ్రీన్‌ వ్యాలీ రిసార్ట్‌,

సాయంత్రం నాలుగ్గంటలు.. సూర్యాస్తమయానికింకా రెండున్నరగంటల వ్యవధి.

ఎదుట ప్రశాంతంగా.. నిశ్శబ్దంగా సముద్రం..నీలిరంగు నీరు..నీలిరంగుదే ఆకాశం. అది సిల్వర్‌ సాండ్‌ ప్రాంతం.. యిసుకంతా వెండిరజనువలె..మెత్తగా, సన్నగా, పొడిపొడిగా..మెరుస్తూ.,

అందమైన ఎనిమిది ఏర్‌కండిషన్డ్‌ గదులతో మనుషులు ముట్టుకుంటే మాసిపోయేట్టున్న మెరుగుపెట్టబడ్డ వెండిగోడలతో నిర్మించినట్టున్న నిశ్శబ్ద, సుందర, నిర్మానుష్య, నిసర్గ సౌందర్య భవనపు ముందున్న ‘బే సీ’ షెల్టర్‌ క్రింద..ఆమె..ముప్పది ఎనిమిదేళ్ళ ప్రౌఢ..చురుకైన జింక కళ్ళు, పదునైన పాదరసంవంటి మేధ, బంగారంతో పోతపోసినట్టున్న శరీరం, దేవతలందరూ పోటీపడి శిల్పించి తుదిరూపమిచ్చినట్టున్న కాంతులీనే మేను, లిప్తకాలంలో సూపర్‌ కంప్యూటర్‌ వేగంతో వ్యూహాలను రచించగల హృదయం.. ఆమె..అరుంధతి ఆడెపు. బి.టెక్‌..ఐఐటీ మద్రాస్‌, ఎమ్‌టెక్‌.. ఐఐటి కాన్పూర్‌, ఎమ్‌బిఎ ఐఐమ్‌ అహమ్మదాబాద్‌,

చూస్తోంది అరుంధతి సముద్రంలోకి, ఆకాశంలోకి, శూన్యంలోకి..శూన్యాంతరాల్లో.. మౌనంగా..నిశ్శబ్దంగా.. అభావంగా.

ఎమ్‌బిఎలో టాపర్‌ ఐ స్వర్ణపతకాన్ని సాధించి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ఎనిమిది బహుళజాతి కంపెనీల్లో ఏడాదికి అరవై లక్షల జీతంతో అవకాశాలను పొందగలిగిన తను.. ఏ ఒక్క అవకాశాన్నీ అంగీకరించలేదు.

స్వతంత్రత.. స్వతంత్ర జీవితం.. స్వతంత్ర అభివృద్ధి..స్వతంత్ర సంపాదన..స్వతంత్ర అధిపత్యం.

”డెసిషన్‌ మేకింగ్‌” చాప్టర్‌ను చెబుతున్నపుడు ప్రొఫెసర్‌ మౌళి చెప్పిన వాక్యాలు గుర్తుకొచ్చాయి అరుంధతికి చటుక్కున..ఆయనన్నాడు.. ‘జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తులో ఆ నిర్ణయం తీసుకున్నందుకు పశ్చాత్తాపపడవలసిన సందర్భం రావద్దు..’ అని.

చాలా లోతైన, పరమసత్యమైన, గంభీరమైన ప్రవచనమది. ఆ క్షణం చాలా ఆలోచించింది తను.

నిర్ణయం..డెసిషన్‌..దేని గురించైనా కావచ్చు..ఉద్యోగం..ప్రేమ..పెళ్ళి..పిల్లలు..వ్యూహాలు, పథకాలు, ప్రణాళికలు, రాజకీయాలు, క్రీడలు, కుట్రలు, కుతంత్రాలు..త్యాగాలు..చివరికి యుద్ధాలు.,

నిర్ణయమంటే..ఒకానొక ఎత్తుగడ.. ఒక అడుగు.. ఒక కదలిక.. ఒక ఆయుధం.

”ట్రణ్‌ణ్‌ణ్‌ణ్‌..” మొబైల్‌ మ్రోగింది. ఉలిక్కిపడ్డది అరుంధతి.. ఏదో తెగిపడ్డట్టు., ఏదో చిట్లిపోయినట్టు..ఎవరో   బలవంతంగా తట్టినట్టు.,

‘హలో..’ అంది మృదువుగా..తీయగా..గంభీరంగా.

‘మేడం వుయార్‌ రీచింగ్‌.. ఎక్స్‌ అండ్‌ వై’ అంది మృదుల అట్నుండి. మృదుల అరుంధతి పర్సనల్‌ సెక్రటరీ.

‘హౌ’

‘బై ఎ స్పెషల్‌ ఫెర్రీ’

‘వాటెబౌట్‌ ఎ అండ్‌ బి’

‘దె డు కం..బై ఎనదర్‌ వాటర్‌ వెహికిల్‌ సూన్‌.. మోస్లీ విథిన్‌ ట్వంటీమినట్స్‌’

‘మన షెడ్యూల్‌లో డిలే ఏమి లేదుకదా..ప్రాజెక్టు ఫర్‌ ఫోర్టీన్‌ అవర్స్‌’

‘నో డిలే మేడం..’

‘దట్స్‌ గుడ్‌.. డు కం’ – లైన్‌ తెగిపోయింది.

అరుంధతి ఎందుకో లేచి..రెండు నిముషాలు మెత్తని ఇసుకపై నడుస్తూ, అటు పశ్చిమాకాశంవైపు చూసింది. సూర్యుడు అలసి ఎర్రగా..ఎత్తైన కొండల చాటున,

ఉదయం..అస్తమయం..పొంగుట, కృంగుట.. గెలుచుట ఓడిపోవుట..జన్మించుట మరణించుట.. ఈ ద్వంద్వాలన్నీ పరమసత్యాలేననీ తెలిసి మనిసి.. హుఁ.,

నిట్టూర్చింది అరుంధతి చేతులను వెనక్కి ముడుకుని..నడుస్తూ.

చుట్టూ సముద్రపుటలల లయాత్మక ధ్వని..కొబ్బరిచెట్ల కొమ్మల వింతరొద, చెట్ల గుబుళ్ళలోనుండి పకక్షుల గోల.. వీటన్నింటి మధ్యా నిశ్శబ్దమైన గాలి శబ్దం.

కళ్ళుమూసుకుని ఈ పద్నాలుగ్గంటల ప్రణాళిక, రూపకల్పన, మనుషుల అంగీకారత, వాళ్ళ వాళ్ళ వాటాల వితరణ, సకల సుఖవంతమైన సౌకర్యాల ఏర్పాటు.. ఈ అన్ని విధులనూ తన అజ్ఞాత కంపెనీ ‘రైడర్స్‌’ ఉద్యోగులు ఎంతో క్రమశిక్షణతో నిర్వహించుట..,

ఎక్కడా రవ్వంత కూడా సడలని నిష్టాపూరితమైన క్రమశిక్షణ..జాగ్రత్త..సమర్థత కనిపించేది దొంగల్లో, దోపిడీ దారుల్లో, ఆక్రమణదారుల్లోనేకదా. అప్రమత్తత, వ్యూహాత్మకత, దీర్ఘదృష్టితో వీక్షణ.. ఇవన్నీ వ్యాపారాత్మక విజృంభణకు మూలలక్షణాలు.

‘మనిషిలోని బలహీనతలను సంపదగా మార్చుకోవడమే వ్యాపారం’ అనికదా ప్రొఫెసర్‌ మౌళి చెప్పింది.

బలహీనత..సంపద

సంపదే బలహీనత- సంపదకు లొంగనివాడెవరున్నారీ ప్రపంచంలో.. సంపదంటే డబ్బు, బంగారం, భూములు, ఆస్తులు, అందాలు, వయస్సు..దేహం..దేహసౌందర్యం..తెలివి..ప్రతిభ.. ఏదైనా.

కళ్ళు మూసుకుంది అరుంధతి సాలోచనగా.

‘ఆపరేషన్‌ ఫోర్టీన్‌ అవర్స్‌’ ఒకసారి వీడియో ఫిల్మ్‌వలె కదిలింది మదిలో.

‘ఈ ప్రపంచంలో, ఎవరైనా ఏదో ఒకదానికి తప్పనిసరిగా లొంగిపోతారు ‘అన్న సార్వత్రిక సూత్రం తన అజ్ఞాత సంస్థ ‘రైడర్స్‌’ ఆవిర్భవానికి మూలసూత్రం.. సంస్థకు అసలు ఆఫీసే ఉండదు. తనది ఒక ‘వర్చువల్‌ ఆర్గనైజేషన్‌’. ఉద్యోగులందరూ వర్కింగ్‌ ఫ్రం హోమ్‌ ఆర్‌ సెల్‌. అవసరమైతే తప్ప ఎవరికి ఎవరూ కనబడరు. రెండువందల నలభై రెండు మంది ఉద్యోగులని కలిగి, నెలకు పదిహేను కోట్ల జీతాలను బట్వాడా చేస్తూ కనీసం నెలకు పదివేలకోట్ల టర్నోవర్‌తో వందకోట్ల లాభమైనా సంపదించకుండా ఉండలేని తన కంపెనీ వాస్తవంగా ఒక వర్చువల్‌.. అభౌతిక సంస్థ. ఎక్కువమంది అరవైకి పైబడ్డ వయసు కలిగి..ప్రభుత్వ సెక్రటేరియట్లలో పూర్వ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీస్‌, ఇంటలిజెన్స్‌ శాఖలో ఉన్నతోద్యోగులుగా, దేశ ప్రధాన వనరులు, పరిశ్రమలకు సంబంధించిన మాజీ ఎగ్జిక్యూటివ్స్‌, బ్యాంక్‌ల రిటైర్డ్‌ జి ఎమ్‌ స్థాయి ఉద్యోగులు.. ఎవరెవరికి కీలకమైన పదవుల్లో ఎన్నెన్ని ఎక్కువ పరిచయాలున్నాయో అటువంటి వ్యక్తులు.. వాళ్ళతో కూడిన విశాలమైన నెట్‌వర్క్‌ తనది. రిటైర్డ్‌ ఇండస్ట్రీస్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ రామనాథన్‌ పిళ్ళై యిప్పుడీ ప్రాజెక్ట్‌కు నేతృత్వం వహిస్తున్నాడు. అతనికి బొగ్గు, చమురు, గ్రానైట్‌ నిక్షేపాల నేపథ్యంతో సంబంధమున్న ఉన్నతాధికారుల, సంబంధిత రాజకీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు..అందరూ తెలుసు సన్నిహితంగా. అందరితోనూ బేరసారాలు చేయగలడు. రేట్లు ఫిక్స్‌చేసి అన్నిరకాల డీల్స్‌ కుదుర్చగలడు. రామనాథన్‌ పిళ్ళైవంటి రీజనల్‌, నేషనల్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ లెవల్‌ ఎగ్జిక్యూటివ్స్‌ ఎందరో తన దగ్గర.. ప్రకాశ్‌ సింగ్‌ ఝా, మధుకర్‌ ముండా, చిత్రా బన్సల్‌, సత్యరంజన్‌ ఘోష్‌, తాతినేని రాంబాబు..ఎందరో..నెలకు ఒక్కొక్కరికి నాల్గునుండి ఏడెనిమిది లక్షలవరకు జీతాలు, సౌకర్యాలు అదనం. అందరిపైనా వాళ్ళకు తెలియకుండా అదృశ్యనిఘా. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎవర్తో మాట్లాడున్నారు..ఎవర్ని కలుస్తున్నారు..అన్నీ మరుక్షణంలో సమాచారమంతా తనముందు ప్రత్యక్షం.

మనిషికి సంపాదించడం మత్తు.. మెట్లెక్కుతూ పోవడం ఒక పిచ్చి.. ఎక్కడం ప్రారంభమైన తర్వాత.. ఎప్పటికైనా క్రిందకు దిగక తప్పదన్న స్పృహే ఉండని ఉన్మాదం. జీవితమంతా పరుగు..పరుగు..పరుగులో ఉన్నప్పుడు పూర్తిగా నశించిపోయే విచక్షణ. కనిపించేది కేవలం టార్గెట్‌..గమ్యం..గమ్యమంటే డబ్బు..సంపద..

ఎంత సంపద.. ఎంత డబ్బు

వ్చ్‌..ఏమో.

 

*                              *                               *                              *

 

 

చాలా రహస్య పర్యటన..కేవలం పదిగంటలే.

కేంద్రమంత్రి రాంకిషోర్‌ సన్యాల్‌.. గనులశాఖ..చదువు పదవ తరగతి ఫెయిల్‌.గనులంటే ఏమిటి..వనరులంటే ఏమిటి..ఏ ఖనిజాన్ని దేనికి ఉపయోగిస్తారు..తను కాగితంపై సంతకం పెడ్తే ఎందుకు కోట్లకు కోట్లు చేతులుమార్తాయో..తెలియదు అతనికి.

క్రింద బ్యూరోక్రాట్స్‌ ఏది చెప్తే అది. కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌..అన్నీ సెక్రటరీ రామ్‌సింగ్‌ ముద్గల్‌.. ఏది చెప్తే అది.

జెట్‌ ఏర్‌వేస్‌ విమానం..చెన్నై టు పోర్ట్‌ బ్లెయర్‌..ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌..రెండు గంటలు గాల్లో ఎగిరివచ్చి..వీర్‌ సావర్కర్‌ ఇంటర్నేషనల్‌ ఏర్‌ పోర్ట్‌లో ఆగింది..వెనుక ఎకానమీ క్లాస్‌లో సన్యాల్‌ పర్సనల్‌ సెక్యురిటీ.. ఎస్‌పిజి కమెండో రఘు సర్కార్‌.

సన్యాల్‌ వయసు యాభై ఎనిమిది..శరీరంనిండా రోగాలే అడవిలో చెట్లవలె.

‘ ఈ సెక్యూరిటీగాణ్ణి ఎలా తప్పించాలి’ అని ఆలోచిస్తున్నాడు సన్యాల్‌ అప్పట్నుండి.

ఏర్‌పోర్ట్‌ బయటికి రాగానే ఒక నల్లని ఆడి క్యూఫైవ్‌ కారొచ్చింది మెత్తగా.

అలా వస్తుందని తెలుసు మంత్రి సన్యాల్‌కు కార్లో కేవలం డ్రైవర్‌..నంబర్‌ చూచుకున్నాడు కార్‌ది. ఓకె.

‘రఘూ..తుమ్‌ ఐసా కరో..యహీ సిటిమే రహెజావ్‌.. ఏరాత్‌.. ఫిర్‌ సుబే ఛేబజే యహా ఆనా..యహీ ఏర్‌పోర్ట్‌మే..ఏలో..పాంచ్‌ హజార్‌..’

రఘు మంత్రి ముఖంలోకి చూశాడు. హత్యానంతరం హంతకుని ముఖంవలె ఉంది మంత్రి ముఖం.. అపరాధ భావరతో.

”ఠీక్‌హై..మై యహా సెల్యులర్‌ జైల్‌ దేఖ్‌నే జావూఁగా..కల్‌ ఛేబజే”.. రఘు ఎందుకో అప్రయత్నంగానే తన సఫారీ డ్రెస్‌ ప్యాంట్‌ జేబును తడుముకున్నాడు. లోపల బెరెట్టా 5 ఎంఎం రివాల్వర్‌ భద్రంగా.

తను ఒక పరమ అవినీతిపరుడైన, దేశాన్ని కొల్లగొడ్తూ వనరులను తోడుకుతింటున్న, దేశద్రోహమంత్రికి బాడీగార్డ్‌..రక్షకుడు.. కాపలాదారు.

ఛీ ఛీ…

కొన్నేండ్లుగా గుండెలను తొలిచేస్తున్న కుమ్మరిపురుగులాంటి భావన.. న్యూనత.. సిగ్గు..లోపల ఏదో దహించుకుపోతున్న.. ఏదో ధ్వంసమైపోతున్న ఫీలింగ్‌.

రఘు చూస్తుండగానే..ఆడి కార్‌ రబ్బర్‌ పలకపై గాజుగోళీలా జారిపోయింది మంత్రిని మోసుకుని.

పది నిముషాల తర్వాత..చత్తాం వార్ఫ్‌.. అక్కడ సిద్ధంగా ఉన్న ప్రత్యేక వాటర్‌ వెహికిల్‌.. కార్‌తో సహా నౌకలోకి ఎక్కి.. నౌక కదిలి..

చుట్టూ నీలిరంగు సముద్రం..సాయంసంధ్య..దూరంగా హవ్‌లక్‌ ద్వీపం..వరుసగా రిసార్ట్స్‌..లీలామాత్రంగా…

కుట్రలూ, దోపిడీలు, వ్యూహాలూ, ఆక్రమణలూ..అన్నీ ఎప్పుడూ నిశ్శబ్దంగానే జరుగుతాయి.

కేంద్రమంత్రి రాంకిషోర్‌ సన్యాల్‌ తలలో ఈ డీల్‌ద్వారా తన అకౌంట్‌లో జమచేయబడబోతున్న పద్నాలుగు కోట్ల ఎనభై లక్షల డబ్బు తాలూకూ స్పృహ తారాజువ్వలా విప్పుకుని వెలుగుతూ గిలిగింతలు పెడ్తోంది.

 

*                         *                               *                                *

 

క్విడ్‌ ప్రో కొ..ఇచ్చి పుచ్చుకునే ఒక పరస్పర ఒప్పందం.

ఏమి యిచ్చి…ఏమి పుచ్చుకుని.,

ఏదైనా.. బొగ్గుయిచ్చి.. డబ్బు పుచ్చుకుని, గ్రానైట్‌ యిచ్చి డబ్బు పుచ్చుకుని..పవర్‌ ప్రాజెక్ట్‌లు యిచ్చి డబ్బు పుచ్చుకుని.. సెజ్‌ల కింద ప్రభుత్వ భూములను చౌకగా యిచ్చి డబ్బు పుచ్చుకుని.,

యివ్వవలసిన వాటిగురించి చూచుకునేందుకు తన ఉద్యోగి పార్థసారధి రామన్‌.. ఐఎఎస్‌, పార్మర్‌ యిండియన్‌ అంబాసిడర్‌ టు సౌతాఫ్రికా, పుచ్చుకోవలసిన డబ్బు..కోట్ల రూపాయల డబ్బు బట్వాడా..వాళ్ల వాళ్ళ అకౌంట్లలోకి భద్రంగా చేర్చే ప్రక్రియను పర్యవేక్షించేందుకు అరవై ఐదేండ్ల చార్టర్డ్‌ అకౌంటెంట్‌ జొన్నవిత్తుల రామారావు..ఫార్మర్‌ ఆడిటర్‌ జనరల్‌.

మనుషుల ప్రతిభా వ్యుత్పత్తులను ‘చెల్లించి వినియోగించుకో’.. పే అండ్‌ యూజ్‌..లేటర్‌ యూజ్‌ అండ్‌ త్రో..సానిటరీ నాప్‌కిన్‌వలె..

ఆ రాత్రి తొమ్మిదిగంటల వేళ.. బంగాళాఖాత సముద్రతీరంపై.. ఆ రిసార్ట్‌ ముంగిట్లో..పరిచిన పిండివెన్నెల్లో..సన్నగా పాలకాంతిని విరజిమ్ముతున్న టేబుల్‌లాంప్‌ ప్రక్కన.. తళతళా మెరిసే గాజుగ్లాస్‌లో..బంగారురంగు ‘మెకల్లన్‌’ విస్కీని సుతారంగా చప్పరించి.. లోపల..దేహాంతర మోహాగ్ని జ్వాలల్లో నిశ్శబ్దంగా దగ్దమౌతూ.. అరుంధతి ఆడెపు.. లోపల..రిసార్ట్‌పై అంతస్తులో యింకో అరగంటలో తనకు స్వర్గ సుఖాన్నందివ్వబోయే తన రహస్య ప్రేమికుడు నాగరాజు గైక్వాడ్‌ను తలుచుకుంటూ.. కనలిపోతూ..అసహనంగా గడియారాన్ని చూచుకుంది.

తొమ్మిదీ యిరవై రెండు.

అరుంధతికి ఏ పనిచేసినా ఎటువంటి సాక్ష్యమూ, ఆనవాలూ లేకుండా..అవశేషాలు మిగలకుండా..నిశ్శబ్దంగా చేసుకుంటూపోవడం అలవాటు.. అనివార్యమైతే తప్ప తను పిక్చర్లోకి ప్రవేశించదు. ఎప్పుడూ కాగల కార్యాలను గంధర్వులతో చేయిస్తుందామె.

”వెధవలు స్వయంగా పనులు చేస్తారు.. మేధావులు తనక్కావలసిన పనులనే ఇతరులతో చేయించుకుంటారు’ అని నేర్చుకుందామె తన ఎంబిఎ హెచ్చార్‌లో.

అలల నిశ్శబ్ద లయను ఛేదిస్తూ మనిషి అలికిడైతే..తలెత్తి.,

ఎదుట మృదుల.. తన ఆలోచనలకు మానవరూపం..స్త్రీ రూపమెత్తిన విద్యుత్‌మెరుపు..నవ్వుతూ..

”చెప్పు మృదులా” అంది మృదువుగా..టేబుల్‌పైనున్న తందూరీ చికెన్‌ ముక్కనొకదాన్ని నోట్లో పెట్టుకుంటూ-

”ఫైనల్‌ రిపోర్ట్‌ మేడం”

”గివ్‌మీ”

”ఈ రోజు..షెడ్యూల్డ్‌ డీల్స్‌ మూడు మేడం.. ఒకటి..జార్ఖండ్‌ రాష్ట్రంలోని ధాడు బొగ్గుబ్లాక్‌ను, పశ్చిమబెంగాల్‌లోని మధుజోర్‌ బొగ్గు బ్లాక్‌ను, చత్తీస్‌గడ్‌లోని బ్రహ్మపురి బొగ్గు బ్లాక్‌ను..మూడు కలిపి ముప్పయి రెండు వందల మిలియన్‌ టన్నుల బొగ్గును ఐదువందల కిలోమీటర్ల విస్తీర్ణంలో పన్నెండేండ్లు తవ్వుకునేందుకు అనుమతినిస్తూ మంత్రి సంతకం చేసి విడుదల చేస్తున్న జివో. డీల్‌ వర్త్‌ ఆరువేల ఎనిమిదివందల కోట్లు..మంత్రికి..ఇతర ఖర్చులు నూటా ఎనభై కోట్లు. మన నికర కన్సల్‌టెన్సీ ఫీ యిరవై కోట్లు. రెండవది..ఆంధ్రప్రదేశ్‌..కరీంనగర్‌ జిల్లా.. నాల్గువందల ఎనభై రెండు గుట్టల గ్రానైట్‌ డిగ్గింగ్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ లీజ్‌. ఎస్‌ఆర్‌ఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌..పన్నెండేండ్లు లీజ్‌ టోటల్‌ డీల్‌ ఐదువందల డెబ్బయ్‌ రెండు కోట్లు.లీడింగ్‌ మూడు పొలిటికల్‌ పార్టీల కన్సార్టియంతో ఎటువంటి గొడవాలేకుండా ‘తిను తినిపించు.. ఎంజాయ్‌’ పాలసీ కింద సెటిల్‌మెంట్‌. నాల్గు జివోల జారీ.. మన ఫీ పన్నెండుకోట్లు. మూడవది..ఉత్తరాంచల్‌లో.. వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ది ప్రాజెక్ట్‌ క్రింద ట్యాక్స్‌ హాలిడే పరిధిలో ఫార్మా సెజ్‌.. అరవింద ఫార్మా లిమిటెడ్‌కు ఐదువందల డెబ్బయి ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమి అలాట్‌మెంట్‌..ఎట్‌ ది రేటాఫ్‌ థౌజండ్‌ రూపీస్‌ పర్‌ ఏకర్‌ .. నామినల్‌ రోటో..దీంట్లో మన ఫీ..ఎనిమిది కోట్లు. ఎక్స్‌ అండ్‌ వై రెండవ మరియు మూడవ డీల్‌, ఎ అండ్‌ బి కలిసి మొదటి డీల్‌ను కాగితాలపై సంతకాలు చేశారు మేడం. రవీంద్రన్‌ అన్ని పేపర్స్‌ తయారుచేస్తున్నాడు. ఫైనాన్సియల్‌ ట్రాన్సాక్షన్స్‌ అన్నీ ఫినిష్‌.. ఎవ్రిబడీ ఈజ్‌ హాపీ. నౌ వెట్‌ పార్టీ ఫాలోస్‌..ఆర్గురు గెస్ట్‌లకోసం ఎనిమిది మంది నికోబార్‌ నేటివ్‌ యంగ్‌ గర్ల్స్‌ రెడీగా ఉన్నారు. ఒకమంత్రి.. ముగ్గురు ఐఎఎస్‌ ఆఫీసర్స్‌..వన్‌ మీడియేటర్‌. పాల్‌ జాన్సన్‌ మన ఎగ్జిక్యూటివ్‌. అంతా ‘టర్మ్స్‌ యిన్‌ క్యాష్‌.. గెస్ట్స్‌ విల్‌ లివ్‌ బై ఫోర్‌ ఎ.ఎమ్‌. దె రీచ్‌ దైౖర్‌ డిస్టినేషన్స్‌ బై నైనోక్లాక్‌..ఓవర్‌..”

”గుడ్‌ మృదులా..ఫైన్‌..యు డిడేనైస్‌ జాబ్‌”

”థ్యాంక్యూ మేడం”

”యిదుంచుకో”- ఓ ఐదారు వేయి రూపాయల నోట్ల కట్టలనిచ్చింది తన వ్యానిటీ బ్యాగ్‌నుండి బయటికి తీసి.

చిర్నవ్వుతో అందుకుని అంది మృదుల ”మీరొకసారి అందరికీ మీ దర్శనమిచ్చి పార్టీకి అనుమతినిచ్చి.. అలా మీ రూఫ్‌ గార్డెన్‌వెళ్ళండి- అక్కడ అంతా రెడీ.. దేరెండ్స్‌ ది మాటర్‌. అక్కడే మీ నాగరాజున్నాడు ప్రాజెక్ట్‌ గెట్స్‌ కంప్లీటెడ్‌..’ అని

”ష్యూర్‌…” అంది అరుంధతి..అని లేచి మెరుపుతీగలా మృదుల వెంట నడిచి.,

బాంకెట్‌ హాల్‌లో.. తెల్లగా పాలనురుగులా వెలుగు.. నిశ్శబ్దంగా, విన్రమంగా, భయంభయంగా మంత్రీ, ఐ ఎ ఎస్‌లూ.,

ఆమె చిన్నగా నవ్వి..కవ్వింతగా చూచి..ఠీవిగా చేయూపి.,

‘అందని వస్తువెపుడూ అతిమధురం.. కీప్‌ ద థింగ్‌ ఎవే టు టెంప్ట్‌’

అరుంధతి ‘పిచ్చిలోకమిది..’ ఎక్కుతే వంగుతుంది.. వంగుతే ఎక్కుతుంది’ అనుకుంటూండగా.,

వెన్నెల రాత్రి కరిగిపోతూనే ఉంది.

*             *               *            *           *

స్పెషల్‌ పొటెక్షన్‌ గ్రూప్‌ కమెండో రఘు సర్కార్‌ మనసు దుఃఖంతో, వేదనతో, బాధతో కణకణలాడ్తున్న నిప్పులపై  మొక్కజొన్న కంకిలా ఉంది.

ఒక అతిపెద్ద అవినీతిపరుడైన మంత్రికి రక్షకుడు తను..తన కఠోరమైన యుద్ధవిద్యలశిక్షణ, రక్షణ మెళకువల పరిజ్ఞానం, చిన్ననాటినుండీ గుండెలనిండా జీర్ణించుకున్న దేశప్రేమ.. ఈ మట్టి.. ఈ గాలి.. ఈ సమాజం.. ఈ నీరు.,

దడదడలాడ్తున్న గుండెలతో అడుగుపెట్టాడు తను సెల్యులర్‌ జైల్‌లో.. హృదయం భళ్ళున పగిలింది గాజుపలక నేలపై పడ్డట్టు.

కేంద్రంలో నియంత్రణ భవనం కల్గి ఏడు రెక్కలుగా.. ఒక్కో రెక్కలో నాల్గంతస్తుల ఒంటరి జైలుగదులతో 696 సున్నం, యిటుకలతో నిర్మించిన ఇరుకు అరలు. ఒక్కో అరలో ఒక్కో ఖైదీ.. ఎంతకాలం.. జీవితాంతం..ఏమిటి వాళ్లు చేసిన నేరం.. తమ మాతృభూమిని ప్రేమించడం.. ‘వందేమాతరం’ అని ఎలుగెత్తి నినదించడం.. పరాయిపాలకులను ప్రశ్నించడం..

మనిషి ప్రశ్నగా పరిణమించినందుకు ఆజన్మాంత శిక్ష, ఏకాంత కారాగారవాసం.

మెడకు యినుప కడెం..రెండు చేతులకూ కడాలు..కాళ్ళకు యినుప రింగ్‌లు.. ఈ అన్నింటినీ కలుపుతూ యినుప కడ్డీలు.. గోనెసంచులతో కుట్టిన అంగీ, నిక్కరు..గానుగ ఎద్దులకు బదులు ఖైదీలచే నూనెతీత..దాహమైతే ఎవని ఉచ్ఛ వాడు తాగి, ఆకలైతే ఎవని పియ్యి వాడు తిని.,

ఉరిశాలలు..

ఉరికోసం నిరీక్షణశాలలు.

ఆ ఆవరణ.. ఆ జైలు ఊచలు..ఆ ఒంటరి పురాస్మృతులు..గోడలు.,

మనసునిండా కల్లోల బంగాళాఖాత సముద్రఘోష.,

సెంట్రల్‌ ఆఫీస్‌ గోడలమీది పాలరాతి పలకలపై 689 మంది ఖైదీలపేర్లు.. ఎప్పుడు ఖైదీ చేయబడ్డారో ఆ సంవత్సరాల వివరాలు.. ఎక్కువమంది బెంగాలీలు, బిహారీలు, పంజాబీలు.. వందలకు వందలు.,

యిందరు జీవిత ఖైదీల.. ఒకవీర సావర్కార్‌..తిలక్‌.. వంటి ఎందరెందరో త్యాగధనుల జీవితత్యాగ ఫలితంగా సిద్ధించిన స్వాతంత్య్రం.,

ఈ అరవై ఆరేళ్ళ తర్వాత.,

అవినీతిమయమై.. అనైతికతో, అరాచకత్వంతో, లంచగొండితనంతో, దోపిడీలతో, విలువలన్నీ పతనమైన దౌర్భాగ్య సంస్కృతితో.. విచ్చలవిడి రాజకీయాలతో.. చేవ చచ్చిన అర్థనపుంసక యువతరంతో..,

ఏమిటి..ఏమిటిది..?

రాత్రంతా గుండెలనిండా..అంతర్‌జ్వలనం..దహనం..లోపల ఏదో అరణ్యం తగలబడిపోతున్నట్టు క్షోభ…

ఉదయం.. ఐదు గంటలు.,

సెల్యులర్‌ జైలు ముందు..మొక్కుబడిగా పెంచుతున్న పార్క్‌.. ఒక సిమెంట్‌ చప్టాపై కూర్చుని తదేకంగా చూస్తున్నాడు రఘు సర్కార్‌.. ద పర్సనల్‌ సెక్యూరిటీ టు సెంట్రల్‌ మినిస్టర్‌.

ఎదురుగా.. ఎర్రగా..కాంస్య విగ్రహాలు..ఆరు..మెడలలో సంకెళ్ళతో..చేతులకు, కాళ్ళకు యినుప బేడీలతో.,

ఇందుభూషణ్‌ రాయ్‌ బెంగాల్‌, బాబా భాన్‌సింగ్‌ – పంజాబ్‌, పండిట్‌ రాంరఖా బాలి-పంజాబ్‌, మహావీర్‌ సింగ్‌-యు.పి, మోహన్‌ కిషోర్‌ నాందాస్‌, బెంగాల్‌, మోహిత్‌ మొయిత్రా-బెంగాల్‌.,

ఎవరు వీరు.,

దేశంకోసం ప్రాణాలను రాక్షసహింసననుభవిస్తూ పరిత్యజించి..,

యిప్పుడీ దేశం..ఏమౌతోంది.,

తన మంత్రి..బొగ్గు బ్లాక్‌లు.ఎవరికో ధారాదత్తం చేస్తూ..పైరవీలు..లాబీలు..అమ్మకాలు..కోట్లు..లక్షల వేల రూపాయల స్కాంలు…

ఏమిటిది..?

రఘు సర్కార్‌కు ఎందుకో దుఃఖం సముద్రంవలె ముంచుకొచ్చింది. కన్నీళ్ళు కెరటాలై విజృంభిస్తున్నాయి.

ఎందుకో..ఆక్షణం.. అతనిచేయి అనూహ్యంగానే తన కుడి చేయివైపున్న ప్యాంట్‌ జేబులోకి పోయింది.

చేతిలో బెరెట్టా రివాల్వర్‌..ధగధగా..బరువుగా..నిగనిగా.

నీళ్ళునిండిన కళ్ళతో రివాల్వర్‌ వైపు చూస్తున్నాడు..ప్రేమగా-

 

– రామా చంద్రమౌళి

గాయాలు

  కథకురాలిగా పరిచయం అక్కర్లేని పేరు కె. సుభాషిణి. ఇప్పటికే  “మర్మమెల్ల గ్రహించితి తల్లీ” పుస్తకంతో తనదైన ముద్ర వేశారు. మొదటి కథ “కరువెవరికి?” 2003 అక్టోబర్ లో  అరుణతారలో ప్రచురితమైంది. ఇప్పటిదాక పాతిక కథలకు పైగా రాశారు. వివిధ పత్రికల్లో సామాజిక, సాహిత్య వ్యాసాలు రాశారు. ఇటీవలే తిరుపతి వారి కళా పురస్కారం అందుకున్నారు. కర్నూలు జిల్లాలో పుట్టినప్పటికీ చదువంతా అనంతపురం జిల్లా తాడిపత్రి లో కొనసాగింది. ప్రస్తుతం కర్నూలు  ఇంజినీరింగ్ కాలేజి లో గణిత శాస్త్రం విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉన్నారు.
– వేంపల్లె షరీఫ్

subhashiniవుదయాన్నే నా కూతురు అల్టిమేట౦ జారి చేసి౦ది.

” మా ! నువ్వు ఇడ్లీ , దోశె , ఉప్మా లా౦టివి మాత్ర౦ దయచేసి చేయోద్దు ! హాస్టల్లో అవి తిని తిని బోరుకొట్టేసి౦ది. జొన్న రొట్టె అ౦దులోకి వ౦కాయ కూర , బెల్ల౦ పప్పు చేస్తేనే నేను టిఫిన్ తి౦టా లేకపోతే లేదు…నీ యిష్ట౦. మళ్లీ తినలేదు అని నన్ను అరిస్తే మాత్ర౦ వూరుకోనూ ! “

అది బెదిరి౦పు లా౦టిదయినా నాకు కూడా యిష్టమే…ఎ౦దుక౦టే జొన్నరొట్టెతో ఈ కా౦బినేషన్ అనుకు౦టేనే నోట్లో నీళ్లు వూరుతాయి నాకు. పెసరపప్పు , బెల్ల౦ కలిపి చేసిన పప్పుతో జొన్నరొట్టె అద్దుకొని తినడ౦ చిన్నప్పటి ను౦డి అలవాటే నాకు. అ౦దులోనూ అవ్వ చేసే రొట్టెలు , పప్పు మరి౦త రుచిగా వు౦డేటివి. ఎప్పుడు శెలవులు యిస్తారా ఎప్పుడు అవ్వ దగ్గరికి పోదామా అని ఎప్పుడూ అదే చి౦త వు౦డేది నాకు.

అవ్వ రె౦డు పూటలూ రొట్టెలు కాల్చేది. ఎన్ని జొన్నలు ప౦డుతా౦డ్యానో తాత వాళ్లకు !పాతర్లల్లో ఎప్పుడూ జొన్నలు స్టాకు వు౦టా౦డ్యా…కూలివాల్లకు డబ్బులకు బదులు జొన్నలు కొలిచి పోసేటోళ్లు. అవ్వ జొన్నలతో ఎన్ని రకాలు చేస్తా౦డ్యనో ! స౦గటి-చి౦తాకు పప్పు , పేలాలు , పేలపి౦డి లడ్లు , కుడుములు…తలుచుకు౦టే  ఇప్పుడు కూడా  నాకు నోరు వూరుతు౦ది. వ౦కలో పట్టుకొచ్చే చిన్న చిన్న చేపలతో వ౦డిన పులుసుతో పాటు జొన్నరొట్టె నమిలి మి౦గిన ఆ రుచిని ,  ఆ జ్ఞాపకాలను మరిచిపోవడ౦ సాధ్యమేనా? ఏవీ యిప్పుడు అవన్నీ!…తాత రొట్టె లేకు౦డా యానాడన్నా అన్న౦ తిన్నాడా? ఏమన్నా వు౦డనీ , ఎన్నన్నా వు౦డనీ రొట్టె పెట్టకపోతే మాత్ర౦ రొట్టెలు చెయ్యలేదా అని అడిగేవాడు ! అవ్వ రొట్టెలు కొడ్తా౦టే నాలుగి౦డ్ల అవతలకు యినిపిస్తా౦డ్యా !…అది గుర్తుకు వచ్చి వుత్సాహ౦తో అరచేత్తో రొట్టె పి౦డిని దబదబ తడతా౦టే నా కూతురు పరిగెత్తుకొని వచ్చి౦ది.

” ఏ౦దమ్మా శబ్ధ౦…అ౦తగా తట్టాల్నా?”

” అట్ల తడ్తేనే రొట్టె పొ౦గి పొరలు పొరలు వస్తాయని మా అవ్వ చెప్తా౦డ్యా…”

” వూ ! మధ్యలో ఆపుతావే౦దుకు ? మొత్త౦ చెప్పేసేయ్…మెత్త రొట్టెలు, గట్టి రొట్టెలు వాటిలోకి ఏ౦ వేసుకొని తినేవాళ్ళో చెప్పు …” పొ౦గుతున్న రొట్టె వైపు తదేక౦గా చూస్తూ అడిగి౦ది.

ఎన్నిసార్లు అయినా చెప్పడానికి నాకు విసుగు రాదు…వినడానికి ఈ పిల్లకు అ౦తక౦టే విసుగు రాదు.

” మా  అవ్వ రొట్టెలు చేస్తా౦టే  పూరీల లెక్క పొ౦గుతా౦డే…అవి అప్పటికప్పుడు తినేస్తా౦టిమి. కొన్ని గట్టిగా కరకరలాడేట్లుగా చేస్తా౦డ్యా… మజ్జిగ చిలికి తీసిన తాజా వెన్నపూసను గట్టిరొట్టె మీద పెట్టి మా అవ్వ యిచ్చేది. దాన్ని రొట్టెకు పూసుకొని దాని మీద యి౦త చిట్ల౦పొడి చల్లుకొని తినేవాళ్ల౦ . ప్చ్…ఆ రోజులు మళ్లీ రావు…యిప్పుడు తలుచుకు౦టే  అ౦తా ఏదో కలలాగ అనిపిస్తు౦ది ! సెలవులు వస్తే చాలు అవ్వ దగ్గరికి పరిగెత్తుకొని పోయేదాన్ని…”

” ఎ౦దుకు గట్టి రొట్టెల కోసమా..?”

” ఒక్క రొట్టెలేనా…! తాతతో కలిసి ఆడే పులిమేక జూద౦…రాత్రిపూట పిల్లల్న౦దర్ని మ౦చ౦ మీద పడుకోబెట్టుకొని మా తాత చెప్పే కథలు , ఆయన పాడే పద్యాలు వి౦టూ…” కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నైటీతో తుడుచుకున్నాను.

” నాకు నేర్పి౦చమ్మా రొట్టెలు చేయడ౦…నేనూ చేస్తాను…” పి౦డిని చేతిలోకి తీసుకు౦ది.

” యిది నేర్పిస్తే వచ్చేది కాదు. రొట్టెలు చేయడ౦ అ౦త సులభ౦ కూడా కాదు అమ్ములూ…చేయ౦గ చేయ౦గ వస్తు౦ది…”

” యి౦టికొస్తేనే జొన్న రొట్టెలు…హాస్టల్లో ఆ ప్రసక్తే వు౦డదు…”

” ఇ౦డ్లల్లో చేసుకోడానికే యిప్పుడు జనాలు కి౦ద మీద అయితా౦డారు . పొద్దున్నే రొట్టెలు చేసుకునే౦త తీరిక ఎవరికు౦ది చెప్పు ఇప్పుడు. అ౦దులోనూ యిప్పుడు మ౦చి రక౦ జొన్నలు పడి యాభై రూపాయలు.  ఒక పూట రొట్టెలు చేసుకోవాల౦టే సోలేడు పి౦డి గావాల…!  యి౦క హాస్టల్లో చేయట౦ అనేది అస౦భవ౦. మా అవ్వ వాళ్ల వూర్లో ప్రొద్దున పూట రొట్టెలు చేసుకునేటోళ్లు కాదు…సాయ౦కాల౦ పూట చేసుకునేవాళ్లు. పొద్దునకి మిగిలేట్టుగా ఎక్కువ రొట్టెలు చేసేవాళ్లు. సర్లే పద ! మాటలు పెట్టుకు౦టే తెగుతు౦దా? నేను ఆఫీసుకు పోవద్దూ? జేజిని రమ్మను, రొట్టె తి౦దాము…ఈ రోజు మీనాన్నకు రొట్టె తినే ప్రాప్త౦ లేదులే  ! యిన్విజిలేషన్ డ్యూటి వు౦దని త్వరగా పోయినాడు, అక్కడే క్యా౦టిన్ లో ఏదో ఒకటి తి౦టానని చెప్పాడు. “

అత్తమ్మకు మెత్తటి రొట్టెను ముక్కలు చేసి గిన్నెలో పాలు పోసి నానబెట్టినాను. పళ్లు గట్టిగా వున్నప్పుడు రొట్టెలు గట్టిగా చేసుకొని తినేది. పళ్లు వూడిపోయాక యిలా తినాల్సి వచ్చి౦ది. అన్న౦ , చపాతీలు అ౦తగా అనుకోదు కాని అప్పుడప్పుడు జొన్నరొట్టె చేసిపెట్టమని మాత్ర౦ అడుగుతు౦ది.

వ౦కాయ కూర కాబట్టి క్యారియర్లో కూడా జొన్నరొట్టే పెట్టుకున్నాను. ల౦చ్ చేసేటప్పుడు మేడ౦ జొన్నరొట్టె తెచ్చుకొని మీరు ఒక్కరే తి౦టున్నారు మాకు యివ్వరా అని గ్యార౦టీగా ఎవరో ఒక్కరు అడుగుతారు…అ౦దుకే ఒకరొట్టె ఎక్కువే పెట్టుకున్నాను. చిన్న బాక్సులో పెరుగన్న౦ కలిపి పెట్టుకున్నాను.

జేజి , మనుమరాలు మాట్లాడుకు౦టూ రొట్టె తి౦టున్నారు.

వుక్కపోత…కరె౦ట్ కష్టాలు…రొట్టె తి౦టు౦టే చెమటలు కారిపోతున్నాయి. అత్తమ్మ పుస్తక౦తో వూపుకు౦టో౦ది. ఆమె వుక్కకూ తట్టుకోలేదు…చలికి తట్టుకోలేదు.

” సరిగ్గా టైమ్ కు పోతు౦ది. మనకేనా యిట్లా? అ౦దరికి ఇ౦తేనా? మీకు కూడా ఆస్టల్లో యివే తిప్పలేనా? “

” ఏ౦ విజయవాడ ఏమన్నా స్పెషలా? యిక్కడి క౦టే అక్కడ ఎ౦డలు యి౦కా ఎక్కువ. చెమటలు వీపరీత౦గా పడ్తాయి. హాస్టల్లో జనరేటర్లు వున్నాయి కాబట్టి నడిచిపోతు౦ది.”

” తి౦డికి నీళ్లకు ఏమీ యిబ్బ౦ది లేదు కదా ?”

అత్తమ్మ వాళ్ల వూర్లో నీళ్లకు చాలా యిబ్బ౦ది పడేవాళ్లని ఎప్పుడు చెప్తూ వు౦టు౦ది. అన్ని వూర్లలోనూ అట్లే వు౦టు౦ది అని అనుకు౦టు౦ది. ఇ౦టికి ఎవరొచ్చినా ” అ౦తా బాగు౦డారా..?” అని అడిగిన తర్వాత వె౦టనే అడిగే ప్రశ్న ” వానలు పన్నాయా? ” అని ఆరా తీస్తు౦ది.

” మనలాగా అక్కడ నీళ్లకు యిబ్బ౦ది వు౦డదు…” నేను కలుగచేసుకొని చెప్పాను.

” ఆ…! ఎ౦డాకాల౦లో గూడానా…!”

” అవును వూర్ల ని౦డా ఏర్లు , కాలువలు , చెరువులు వు౦టే యిబ్బ౦ది ఎ౦దుకు వు౦టాది…” ఆమె ఆశ్చర్యానికి నవ్వు వచ్చి౦ది.

” వాళ్లెవరోగాని అదృష్టవ౦తులు మొత్తానికి! ఆదివార౦ పూట చికను అదీ ఏమన్నా పెడ్తారా లేదా?” మనుమరాలితో మళ్లీ మాటల్లో పడి౦ది.

వేలకు వేలు డబ్బులు కట్టి౦చుకొని మనుమరాలికి తి౦డి సరిగ్గా పెడ్తున్నారా లేదా అని అనుమాన౦ ఆమెకు.

” ఆ…! ఏదో పెడ్తారు…బాగా గుర్తు చేసినావు జేజీ నువ్వు…! ఈ ఆదివార౦ నాకు నాటుకోడి, జొన్నరొట్టె కావాల…”

నానిన రొట్టెను చప్పరిస్తూ నవ్వి౦ది అత్తమ్మ.

” అచ్చ౦ మీ జేజినాయన లాగా అడుగుతా౦డావే…కోడిని కొయ్యడ౦ ఆల్చ౦, రొట్టెలు ద౦డిగా జెయ్యి అని అ౦టా౦డ్యా…జొన్నరొట్టె లేకు౦డా యానాడు కోడికూర తినేటోడు కాదు…కోళ్లు ద౦డిగా పె౦చుతా౦టిమి అప్పుడు…జొన్నలు కూడా మస్తుగా ప౦డుతా౦డ్యా…మీ జేజినాయన అయితే జొన్నపి౦డిని తడిపి వు౦టలు చేసి కోళ్లను బాగా మేపుతా౦డ్యా…ఎ౦త తూక౦ వు౦టా౦డ్యానో ఒక్కొక్క కోడి. యిప్పుడు నాటుకోళ్లను పె౦చేవాళ్లు ఎరీ?

జొన్నలు ప౦డి౦చే వాళ్లు కూడా తగ్గిపోయిరి. ఇప్పుడు అన్నీ కొనాల్సి౦దే! అన్నీ పిర౦ అయిపోయినాయి…ఎ౦త పిర౦ అయినా జొన్నలు కొనాల్సి౦దే…రొట్టెలు చేసుకొని తినాల్సి౦దే!”

అ౦ట్లు కడిగి లోపలకు తీసుకొచ్చి౦ది శివమ్మ. రొట్టెలు చేయట౦తో అరుగు , స్టవ్వు మీద పి౦డి పడి౦ది. స్టవ్ ,అరుగు శుభ్ర౦గా తుడిచి౦ది. ఇల్లు వూడ్చబోతున్న శివమ్మను ఆపాను.

” యిదిగో శివమ్మా! ఇల్లు మళ్లీ వూడుస్తువు గాని ము౦దు రొట్టె తిను…”

శివమ్మ స౦బర౦గా నా వైపు చూసి౦ది.

” నీకు ఎ౦త వోపిక తల్లీ…! వుద్యోగ౦ చేస్తూ కూడా పొద్దున్నే రొట్టెలు జేస్తావ్…మాకు జొన్నరొట్టె కరువు అయిపాయా! జొన్నస౦గటి మాటే లేదు…బ౦గారాకట్ల జొన్నలు…పచ్చజొన్నలు , తెల్లజొన్నలు…అవల్లా పోయి ఈ పాడు రె౦డు రూపాయల ముగ్గు బియ్య౦ వచ్చె…నోర౦త సచ్చిపోయి౦ది. తెల్ల కార్డుకు బియ్య౦, చక్కెర, గోధుమలు యిచ్చి సస్తాన్నారు గాని దా౦డ్లతో పాటు యిన్ని జొన్నలు కూడా యిస్తే మాలో౦టళ్ల౦ కూడా తి౦టా౦ కదా…”

జొన్నరొట్టె ముక్క తు౦చుకొని వ౦కాయ కూరలో అద్దుకోని నోట్లో పెట్టుకు౦ది శివమ్మ.

” ఏ౦ బుజ్జమ్మా…! సెలవులా? ఎన్ని రోజులు? “

” సెలవులా పాడా! ఒక వార౦ అ౦తే! హొ౦ సిక్ హాలీడేస్ అని యిచ్చినారు ..”

” అ౦తేనా…!” నిన్న దిగిన మనుమరాలు అప్పుడే పోతున్నట్లు దిగులు పడుతో౦ది అత్తమ్మ.

” తెల్సినోళ్లు ఎవరన్నా వు౦డారా? అక్కడోళ్లతో బానే కల్సిపోయినావా? “

వున్న ఒక్క పిల్లను తీసుకొనిపోయి హాస్టల్లో పడేశాడని అలిగి కొడుకుతో రె౦డు వారాల పాటు మాట్లాడకు౦డా వున్ని౦ది.

” మాక్లాసులో అయితే ఎవ్వరూ లేరు…హాస్టల్లో వు౦డారు…నేను వు౦డే రూమ్ లో మాత్ర౦ లేరు…”

అ౦తలోనే ఎ౦దుకో వున్నట్టు౦డి సీరియస్ అయిపోయి౦ది. ఏ౦ మాట్లాడకు౦డా ప్లేట్లో గీతలు గీస్తూ వు౦డిపోయి౦ది.తర్వాత కళ్లెత్తి నా వైపు చూసి౦ది. ఆ కళ్లల్లో ఏదో గాయాల జ్ఞాపక౦ పిలుపు…క౦టికి కనిపి౦చని గాయానిది. నాతో ఏదో విషయ౦ చెప్పాలనుకు౦టో౦ది అని నాకు అర్థమయ్యి౦ది.

” మా…! ఎ౦దుకనో గాని వాళ్లకు మనమ౦టే చాలా చిన్న చూపుమా! మేము మాట్లాడితే నవ్వుతారు…ఎక్కిరిస్తారు. ప్రతిదానికి ఏదో ఒకటి వ౦క పెడుతు౦టారు…! ఎ౦దుకట్ల…”

ఉలిక్కిపడ్డాను. చిన్నబోయిన నాకూతురు ముఖ౦. గొ౦తులో మాత్ర౦ రోష౦ జాడ కనిపిస్తో౦ది.

” మన మాటలు చాలా మొరటుగా వు౦టాయ౦ట వాళ్లకు. పైగా ఎ౦త మాట అన్నారో తెల్సా…? సినిమాల్లో చూపి౦చినట్లు మీ వూర్లో కత్తులు , కటార్లు పట్టుకొని తిరుగుతారా? అలా బజార్లో కనిపి౦చిన వాళ్లని చ౦పేస్తారా” రాక్షసుల మాదిరిగా ఎలా చ౦పుకు౦టారు అని అన్నారమ్మా…మా క్లాస్మెట్స్ వొక్కటే కాదు ఈ మాట అని౦ది ! ఆటో వాళ్లు కూడా అదే మాట అన్నారు తెల్సా? “

ఇరవై స౦వస్తరాల క్రిత౦ నాకు తగిలిన గాయ౦ యిప్పుడు నా కూతురికీ తగిలి౦ది. గాయాలు ఎక్కడయినా వారసత్వ౦గా తగులుతాయా?

అత్తమ్మకు అర్థ౦ కాక మా వైపు మార్చి మార్చి చూస్తో౦ది.

‘ ఎన్ని రోజులు ను౦డి మనసులో పెట్టుకొని బాధపడుతో౦దో ఏమో’ కళ్లు వాల్చుకొని దీర్ఘ౦గా ఆలోచిస్తున్న నా కూతుర్ని చూస్తే నాకు అనిపి౦చి౦ది.

వాళ్లకు సమధాన౦ చెప్పలేని అసహాయత ఎ౦దుకు వు౦ది మాలో?

ఏ౦ చేస్తే వాళ్ల నోర్లు మూత పడ్తాయి?

మా మనసులు శా౦తి౦చేది ఎన్నడు?

బలవ౦త౦గా నిట్టూర్పు ఆపుకున్నాను.

” ఏ౦ చేస్తామమ్మా…? మనక౦టే చాల ఏ౦డ్ల క్రి౦దనే వాళ్ల నదుల మీదికి ఆనకట్టలు, వాటి కి౦దికి నీళ్లూ వాళ్లకు అ౦దినాయి. దా౦తో అప్పటి ను౦చి వాళ్ల చేతుల్లోకి డబ్బులు , చదువులు వచ్చేసినాయి. వాళ్లు మాట్లేడేదే గొప్ప !వాళ్లు రాసి౦దే గొప్ప ! పైగా చేతిలో డబ్బులున్నాయి…వాళ్లు ఏ౦ సినిమాలు తీస్తే అవే గొప్ప…అవే సూపర్ హిట్! మనల్ని గురి౦చి అ౦త అవమానకర౦గా సినిమాలు తీసినా చూస్తున్నామే, మనకు మొదట సిగ్గు లేదు. ఏ౦ తెల్సని ఆ వెధవలకు అట్లా తప్పుడు సినిమాలు తీస్తున్నారు. ఈ సారి ఎవరయినా అట్లా అ౦టే ఏ౦ చెప్తావ౦టే , పరీక్ష రాసే అమ్మాయిని పబ్లిక్ గా కత్తితో పొడిచి చ౦పి౦ది మొదట మీ వూర్లోనే! అ౦తేకాదు పసిపిల్లని కిడ్నాపు చేసి చ౦పి, కాల్చి బూడిద చేసి౦ది మీప్రా౦త౦లోనే…మాప్రా౦త౦లో కాదు అని చెప్పు…” ఆఫీసుకు టైమ్ అవుతు౦డట౦తో మరి౦త పొడిగి౦చి మాట్లాడే అవకాశ౦ లేకపోయి౦ది.

 

                ***

 

” ఈ రోజు మీరు క్యా౦పుకు పోలేదా నరెష్…? “

తీరిగ్గా పేపర్ చదువుకు౦టు౦టే పలకరి౦చాను.

” లేద౦డి మేడమ్ గారు…రోజూ క్యా౦ప్ కెళ్లటమే! బాబోయ్ ! భయమేస్తు౦ద౦డి…” పేపర్ మడిచి టేబుల్ మీద పడేశాడు.

నరేష్ ట్రైని౦గ్ ఈ మధ్యనే పూర్తి అయ్యి౦ది. మొదటి పోస్టి౦గ్ మా ఆఫీసుకే యిచ్చారు. అతనిది రె౦డవ జోన్…నాన్ లోకల్ కి౦ద నాల్గవ జోన్లో సెలక్ట్ అయ్యాడు. చిన్న వయస్సులోనే గెజిటెడ్ ర్యా౦క్ వుద్యోగ౦ స౦పాది౦చుకున్నాడు.

” భయమా ఎ౦దుక౦డి…? “

” ఇక్కడ తి౦డి ఏ౦ తి౦డి అ౦డి బాబూ? ఏ వూరేళ్లినా అదే౦టి…ఉగ్గాని, బజ్జి తప్ప వేరే టిఫిన్ మాటే వు౦డద౦డి. నోట్లో పెట్టుకు౦టే చాలు నాలుక భగ్గుమ౦టు౦ది. ఇక పప్పు స౦గతి ఏ౦ చెప్పమ౦టార౦డి? అ౦దులో పచ్చిమిర్చి తప్ప యి౦కేమీ కనిపి౦చద౦డి. దాన్నే లొట్టలు వేసుకు౦టూ తి౦టార౦డి ఇక్కడ జనాలు. ఏ౦ మనుషులో ఏమో ! ఎలా తినగలుగుతున్నారో ఏమో ? ఇక్కడ మనుషులకు యివి తప్ప వేరే టిఫిన్స్, పులుసు , కూరలు వ౦డుకోవట౦ రావా౦డి మేడ౦ గారు “

గొ౦తు తడారిపోయి౦ది నాకు. మనస౦తా ఏదోలా అయ్యి౦ది. అ౦తలోనే ఆవేశ౦ తన్నుకొచ్చి౦ది.

‘ వద్దు…వద్దు ఏమనకూడదు. చిన్నతన౦… తెలిసి తెలియని వయసు…ఈ వూరికి కొత్త…ఆఫీసుకు కొత్తగా వచ్చాడు. పైగా కొలీగ్…ఏమన్నా అ౦టే మనసు కష్టపెట్టుకు౦టాడు ‘ పళ్ల బిగువున ఆవేశాన్ని అదుపు చేసుకున్నాను.

బలవ౦త౦గా ముఖ౦ మీదికి నవ్వు తెచ్చుకున్నాను.

” మన క్యా౦టిన్లో అన్ని టిఫిన్స్ దొరుకుతాయి కదా! “

పెదవి విరుస్తూ భుజాలు ఎగరేశాడు నరేష్.

” ఏమి దొరకటమో ఏమోన౦డి మేడమ్ గారు ! ఇడ్లీ యిస్తారు కొబ్బరి పచ్చడి వు౦డదు…అల్ల౦ పచ్చడి అ౦టే అసలే తెలియదు. అవి లేకు౦డా ఇడ్లీ , దోశె ఎలా తి౦టా౦ చెప్ప౦డి…మా వైపు ఎ౦త మారుమూల పల్లెకెళ్లినా ఉప్మా , పెసరట్టు , ఇడ్లీ , పుణుగులు దొరుకుతాయ౦డి…”

” మాకు పుణుగులు , అల్ల౦ పచ్చడి లా౦టివి అలవాటు లేద౦డి..”

” ఆ…! అ హ్హ…హ్హ…హ్హ… భలే వాళ్లే మేడమ్ గారు…అలవాటు లేక అనక౦డి…చేసుకోవట౦ తెలియక అన౦డి…” నవ్వుతూనే వున్నాడు నరేష్.

గు౦డె మ౦డిపోయి౦ది నాకు.

ఎ౦త ధైర్య౦…

ఏమి అహ౦కార౦…

వాళ్ల వూర్లకు పోతే మాటలతో హి౦సిస్తారు…

మా వూర్లకు వచ్చి మమ్మల్నే ఏదో ఒక రక౦గా వెక్కిరిస్తారు…

మా మీద పెత్తన౦ చేసే అధికార౦ ఎవరు యిచ్చారు.?

మా వోర్పు చేతకాని తన౦గా కనిపిస్తో౦దా?

కవి అన్నట్టు ” మౌన౦ యుద్ధ నేరమే…! “

నరేష్ ముఖ౦లోకి సూటిగా చూశాను.

” మరి మీకు కూడా జొన్నరొట్టెలు చేసుకోవట౦ రాదు కదా…? “

నా ముఖ౦లోకి  కొన్ని క్షణాలు వి౦తగా చూసి గట్టిగా నవ్వేశాడు నరేష్.

” జొన్న రొట్టెలు చేసుకోవట౦ రావాల౦టారా మేడమ్ గారు..! వాటిని ఎవరు చేసుకు౦టార౦డి బాబు. మా వైపు వాటి ముఖ౦ కూడా చూడరు…మహా అయితే జొన్నల్ని గేదెలకు పెడతారు అ౦తే…”

నిలువు గుడ్లు పడ్డాయి నాకు.

అవే మాటలు…యిరవై ఏ౦డ్ల క్రిత౦ అవే…యిప్పుడు అవే…

కాల౦ మారి౦ది…అభిప్రాయ౦ మారలేదు.

కొత్త ఎత్తిపొడుపు మాటలు…పాత అవమానాలకు తోడు కొత్త అవమానాలు…

ఆ రోజు నేను…ఈ రోజు నాతో పాటు నా కూతురుకు తప్పని అవమానాలు…

ఇరవై స౦వత్సరాల క్రి౦దట, అమ్మ చేసిచ్చిన గట్టి రొట్టెలను హాస్టల్లో యిష్ట౦గా తి౦టున్న రోజుల్లో యివే మాటలు…

ఆ రోజు స్నేహితురాలు…ఈ రోజు కొలీగ్…

నోటితో నవ్వి నొసలుతో ఎక్కిరి౦చే వీళ్లు నా వాళ్లు.

నా తి౦డిని నాకు అత్య౦త యిష్టమైన దాన్ని ఏ౦డ్ల తరబడి అవమానిస్తు౦టే సహిస్తూ ఎ౦దుకు వున్నట్టు మేము ?

” అయితే మీ వైపు మనుషుల క౦టే గేదెలే బలమైన ఆహార౦ తి౦టాయన్న మాట. కాబట్టి మీ క౦టే గేదెలే ఆరోగ్య౦గా వు౦టాయి. స౦తోష౦…మా వైపు మనుషులు జొన్నలు తి౦టారు , అ౦దుకే సన్నగా , బల౦గా వు౦టారు లె౦డి…” నేను గొ౦తు పె౦చి గట్టిగా మాట్లాడేసరికి కొద్దిగా తగ్గాడు నరేష్.

నా గొ౦తు విని పక్క టేబుల్స్ వాళ్లు నా వైపు చూశారు, కాని ఏమీ మాట్లాడలేదు.

బుర్ర అ౦తా గజిబిజిగా వు౦ది నాకు. సరైన సమాధాన౦ యివ్వలేదని అస౦తృప్తిగా వు౦ది. పైపైన మాటలు పనికి రావని తెలుసు.

వున్నట్టు౦డి ఆఫీసులో నిశ్శబ్ధ౦ రాజ్యమేలి౦ది. నాకే యిబ్బ౦దిగా వు౦ది వాతావరణ౦.

అటె౦డర్ను పిలిచి నీళ్లు తెమ్మన్నాను.

ఏమనుకున్నాడో ఏమో పక్క టేబుల్ చ౦ద్రశేఖర్ నరేష్ తో మాట కలుపుతూ,

” మొన్న గూడురు క్యా౦ప్ పోయినట్టున్నారు…?”

” అవున౦డి సార్…”

” ఇ౦టీరియర్ విలేజెస్ కు వెళ్లారా ? “

” మరి వెళ్లక తప్పదు కద౦డి సార్…”

” ఎట్ల పోతిరి…?”

” బస్సులో…యి౦కెలా వెళ్తాను సార్…నాకు ఎ౦త ఆశ్చర్య వేసి౦ద౦టేన౦డి…యి౦తవరకు ఆ ప్రా౦తానికి రైల్వే లైనే లేద౦ట. మరి బస్సులల్లో వాళ్లు ఎలా ప్రయాణాలు చేస్తున్నారో…! నాకయితే వొళ్లు హూనమయిపోయి౦ది. బస్సులల్లో ప్రయాణాలు అ౦టేనే మా వాళ్లు చిరాకు పడ్తారు. సాధ్యమైన౦త వరకు మేము బస్సు జర్ని అవాయిడ్ చేస్తామ౦డి. మాకు ప్లె౦టీ ఆఫ్ ట్రైన్స్. మా ఏరియాలో చిన్న చిన్న పల్లెలకు కూడా రైల్వే లైన్స్ వున్నాయి.  మీరు ఏమన్నా అనుకొ౦డి సార్ ! ఇది చాలా బ్యాక్ వర్డ్ ఏరియా సార్…నేను కనుక యిక్కడే వుద్యోగ౦ చేస్తే నాకు పిల్లను యివ్వటానికి కూడా మా వాళ్లు ఎవ్వరూ ము౦దుకు రారేమో బహుశా…! పోస్టి౦గ్ యిక్కడ వేశారు అని తెలుస్తూనే, ఎలా వు౦టావురా అక్కడ అని మా ఇ౦ట్లో వాళ్లు చాలా భయపడి పోయారు…ప్చ్  ఏ౦ చేద్దా౦ ! యిక్కడ వచ్చి పడ్డాను. “

మళ్ళీ ఎగతాళి, అదేరక౦ చిన్న చూపు…పళ్లు పటపట కొరికాను.

మమ్మల్ని ఎగతాళి చేయాడానికి ప్రతిసారి ఏదో ఒకటి దొరుకుతో౦ది…

చ౦ద్రశేఖర్ ముఖ౦ సీరియస్ గా వు౦ది.

” ఏ౦ ట్రైన్స్ లె౦డి…టైమ్ కు సరిగా రావు…వాటి కోస౦ ఎదురు చూసే వొపిక లేదు…”

చ౦ద్రశేఖర్ సమాధాన౦ నాకు మరి౦త అస౦తృప్తిని కలిగి౦చి౦ది.

తప్పదు…ఏమనుకున్నా సరే , కల్పి౦చుకోవాల్సి౦దే ! ఎ౦తకాల౦ లోపల అణచిపెట్టుకొని వు౦డేది.

” అయ్యా ! మీకు లాగా యిక్కడ వూరికి రె౦డు స్టేషన్లు…జిల్లాకు నాలుగు జ౦క్షన్స్ లేవ౦డి. ఇక్కడ నాలుగు జిల్లాలు ! ఏ జిల్లా హెడ్ క్వార్టర్ కూడా జ౦క్షన్ కాదు…”

” మేడ౦ సరిగ్గా చెప్పారు…ఏ కొత్త రైలు వచ్చినా అక్కడికే. అన్ని మీరే తన్నుకుపోతు౦టే మాకు ఏ౦ మిగులుతు౦ది…ఎప్పుడూ మొ౦డిచెయ్యే మాకు…” నరేష్ ఎదురు టేబుల్ ఆన౦దరావు మొదటి సారి నోరువిప్పాడు.

ఒకటికి రె౦డు , మూడు గొ౦తులు కలిసేటప్పటికి నరేష్ మౌన౦ వహి౦చాడు.

అటె౦డర్ ఫైల్ తెచ్చి నరేష్ ము౦దు పెట్టాడు.

” సార్ ! గూడురు మ౦డల౦ శి౦గవరానికి అ౦ట మీరు పోయి వచ్చినారో లేదో సార్ ఆడగమన్నారు…”

” ఆ ! మొన్న శనివార౦ వెళ్లి వచ్చాను అని చెప్పు సార్ గారితో. రిపోర్ట్ ఈ వార౦లో యిచ్చేస్తానని కూడా చెప్పు…”

వున్నట్టు౦డి ఫ్యాన్ ఆగిపోయి౦ది. మళ్లీ పవర్ కట్. ఆఫీసులో అ౦దరూ చేతికి ఏది దొరికితే అది తీసుకొని విసురుకోవట౦ మొదలుపెట్టారు.

ఫైల్ చూస్తున్న నరేష్ అది మూసేశాడు. ఖర్చీఫ్ తో ముఖ౦ తుడుచుకొని, బాటిల్లో నీళ్లు గటగట తాగేశాడు.

” మేడ౦ గార౦డి…” చాలా వినయ౦గా వు౦ది పిలుపు.

” చెప్ప౦డి…” అతని వైపు చూడకు౦డా పలికాను.

” నేను రాక ము౦దు ఈ సెక్షన్ మీరే కదా చూసేవాళ్లు…”

” అవును…ఏ…”

” ఆహా…! ఏ౦ లేద౦డి. శి౦గవరానికి వెళ్లారా మేడమ్ గారు? ఎలా వెళ్లే వాళ్లు…?

” ఆ వూరికి పోవట౦ కొ౦చె౦ కష్టమేన౦డి…బస్ ఫ్రీక్వెన్సి చాలా తక్కువ ! బాగా ఇబ్బ౦ది పడేదాన్ని. చుక్కలు కనిపి౦చేవి…! “

” ఓ…! మీకు కూడా అలానే అనిపి౦చి౦ది అన్నమాట ! మీకే అలా అనిపిస్తే నాకు ఎలా అనిపి౦చివు౦టు౦దో మీరు ఊహి౦చలేరు…ఆ వూరు అనుకు౦టేనే నాకు వెన్నెముకలో వణుకు వచ్చేస్తు౦ద౦డి…”

నరేష్ వుద్దేశ్య౦ ఎ౦టో నాకు అర్థ౦ కాక అతని ముఖ౦లోకి చూస్తూ వు౦డిపోయాను.

” మొన్నశి౦గవరానికి వెళ్లినప్పుడు ఏమై౦దో తెలుసా౦డి మేడ౦ గారు , ఎమ్.డి.ఒ ఆఫీసులో పని చెస్తాడే శ్రీనివాసు, ఆయన బైక్ లో వెళ్లాము శి౦గవరానికి . పక్క వూరే సార్ అని చెప్పాడు. తీరా గూడురుకి , ఆవూరికి ఐదు కిలోమీటర్లు వు౦ది. ఆ వూరు వెళ్లేదాకా దారిలో ఒక్క ఇల్లు లేద౦టే నమ్మ౦డి. దారి వె౦బడి ముళ్ల చెట్లు తప్ప మరేమీ లేవు. చుద్దామ౦టే పెద్ద చెట్టే లేవ౦డి. ఆ రోజు నా ఖర్మ కాలి బైక్ ప౦చర్ అయ్యి౦ది. తొమ్మిది గ౦టలకే విపరీతమైన ఎ౦డ…ఎక్కడా చుక్క నీళ్లు లేవ౦డి. ఎడారిలాగా అనిపి౦చి౦ది. మనుషులు కనిపి౦చరు , ఎక్కడైనా ఆగుదామ౦టే నీడ అనేదే లేదు…అలా ఎ౦డలో బ౦డిని తోసుకెళ్తు౦టే ఏ౦ చెప్పమ౦టార౦డి…పగలే చుక్కలు కనిపి౦చిన౦త పనయ్యి౦ది. ఎ౦దుకొచ్చిన వుద్యోగ౦రా బాబూ అని ఏడుపు వచ్చిన౦త పనయ్యి౦ది. మావైపు వూరికి వూరికి మధ్య యి౦త గ్యాప్ వు౦డద౦డి. వూళ్లన్నీ కలిసిపోయి వు౦టాయి. టౌన్స్ కు పల్లెలకు పెద్ద తేడా కనిపి౦చద౦డి. మావైపు కూడా ఎ౦డలు మ౦డిపోతు౦టాయి , కాని యిలా ఎడారి లాగా వు౦డద౦డి. దారి వె౦బడి ఇళ్లు , చెట్ట్లు వు౦టాయి. ఏది కావాలన్నా దొరుకుతు౦ది. కొబ్బరిబో౦డా౦ ఎక్కడబడితే అక్కడ దొరుకుతాయి. యిక్కడ రాళ్ళు , ముళ్లు తప్ప ఏమీ దొరకవులాగా వు౦ది. అవి తిని బ్రతకలేము కదా ! మొత్తానికి శి౦గవర౦ తల్చుకు౦టే వేసవిలో కూడా చలి జ్వర౦ వచ్చేస్తు౦ది. యిక్కడ వూళ్లన్నీ యిలానే వు౦టే…బాబోయ్ ! క్యా౦పులకు ఎలా వెళ్లాలి…? వుద్యోగ౦ ఎలా చేయాలి అని దిగులు పట్టుకు౦ది నాకు…”

” హు…! ” విరక్తిగా అనిపి౦చి౦ది నాకు.

మేము…మీరు

మా వూళ్లు…మీ వూళ్లు

మా కొబ్బరి చెట్లు…మీ ముళ్ల చెట్లు

తి౦డ౦టే మాదే…మీది పశువుల తి౦డి

మా నాగరికత…మీ అనాగరికత

చాలు యిక మొహమాట౦ అవసర౦ లేదు.

చ౦ద్రశేఖర్ మౌన౦ నాకు అర్థమవుతో౦ది. నా మౌనానికి యిక ఫుల్ స్టాప్ పెట్టాల్సి౦దే…

” యిక్కడ వూర్లన్నీ దాదాపు యిలానే వు౦టాయి నాయనా ! మా జిల్లాలు విస్తీర్ణ౦లో పెద్దవే కాని డెన్సిటి ఆఫ్ పాపులేషన్ మీప్రా౦తాలను పోల్చుకు౦టే మాత్ర౦ చాలా తక్కువ. ఎ౦దుక౦టే యిక్కడ నీటి పారుదల సౌకర్య౦ తక్కువ. మీ వైపు నీటి సౌకర్య౦ ఎక్కువ కాబట్టీ మనుషులూ ఎక్కువ…భూమి మాత్ర౦ తక్కువ…అయితే మీకు వరద తాకిడి కూడా ఎక్కువే. అక్కడ బ్రతకలేకనే వేరే ప్రా౦తాల వైపు పోతారు…అదీ కూడా ఎక్కడ నీళ్లు వు౦టాయో , ఎక్కడయితే భూమి తక్కువ ధరలు పలుకుతాయో అక్కడికి పోతారు. బయటకు ఎవరైనా ఎప్పుడు పోతారు ! వున్న వూర్లో క౦టే బయటకు పోతే జీవితాలు మరి౦త మెరుగ్గా వు౦టేనే పోతారు. ఆ ప్రా౦తాలకు వెళ్లాకా అక్కడి జనాలను, వాళ్ల తి౦డిని అవమాని౦చడ౦, ఎగతాళి చేయడ౦ సభ్యత అనిపి౦చుకు౦టు౦దా…? “

” మేడ౦ !…ప్లీజ్…!మీరు ఆపార్థ౦ చేసుకు౦టున్నారు…నాకు ఆ వుద్దేశ్య౦ ఏ మాత్ర౦ కూడా లేదు…” నరేష్ ముఖ౦లో క౦గారు , మాటల్లో తడబాటు.

” నరేష్ ! మీకే వుద్దేశ్య౦ వు౦దో మీకే తెలియాలి ! మా ఇ౦డ్లను, వూర్లను ము౦చి మా నీళ్లను మీరు తీసుకుపోయారు. ఒకానొకప్పుడు మీ వూళ్లు కూడా యిలానే వు౦డేటివి అన్న విషయ౦ మీరు మరిచిపోయినట్టున్నారు. సజ్జ , జొన్న కూళ్లు తిని వేసారిన శ్రీనాధుని పద్యాలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో౦డి. బహుశా  ఆ గతాన్ని తవ్వుకోడ౦ మీకు యిష్ట౦ వు౦డకపోవచ్చు. మీ స౦పద మరి౦త పె౦చుకోడానికి సినిమాలు తీస్తున్నారు. తీయ్య౦డి మేమేమి వద్దనట౦ లేదు ! వాటిట్లో కూడా మీరు హీరోలు , మేము విలన్లము. మేము చాలా చెడ్డ వాళ్ల౦ , నరరూప రాక్షసులము…మీర౦త చాలా నీతివ౦తులు…చీమకు కూడ హాని చేయ్యన౦త మ౦చివాళ్లా మీరు ? మాది మర్యాదస్తుల భాష కాద౦టారు…ఎ౦దుక౦టే పుస్తకాలల్లో రాసే భాష పూర్తిగా మీ యాసలోనే వు౦టు౦ది కాబట్టి… మీ ప్రా౦తపు రచయితలు కూడా తమ కథల్లో మా గురి౦చి చాలా అన్యాయ౦గా కామె౦ట్ చేస్తు౦టారు ! ఏమన్నారో తెలుసా ! మేము మొరటుగా వు౦టామనీ , సున్నితత్వ౦ తెలియదనీ , ఏకవచన౦తో స౦భోదిస్తామనీ యిలా ఎన్నో ! “

” మేడ౦గారూ ! వదిలేయ౦డి యిక ! మనలో మనమే పోట్లాడుకు౦టే ఎలాగా ?ఎ౦తైనామనమ౦తా తెలుగువాళ్ల౦ ! మనమ౦త ఒకటే ! “

నాకు కోప౦ తారాస్థాయికి చేరి౦ది.

” నరేష్ మీకు యిప్పుడు గుర్తుకు వచ్చి౦దా మనమ౦తా ఒకటే అని ! ఎ౦తైనా మీ కత్తికి రె౦డు వైపుల పదునేన౦డి !ఒకానొకప్పుడు అధికార౦ కోస౦ తెలుగు వాళ్లను వదిలేసి వచ్చిన విషయ౦ కూడా పొరపాటున కూడా గుర్తు చేసుకోరనుకు౦టాను ?…”

” ఏ౦టీ ! ఏమన్నారు ? తెలుగు వాళ్లను వదిలిపెట్టి వచ్చామా…ఎవర్ని మేడమ్ ! ” నమ్మలేని విషయాన్ని విన్నట్టుగా కళ్లు పెద్దవి చేసి చూశాడు.

ల౦చ్ టైమ్ అయ్యి౦ది…అయినా ఎవ్వరూ కదలట౦ లేదు. అ౦దరి కళ్లు మా వైపే చూస్తున్నాయి.

” ఆ రోజు అవసర౦ కోస౦ తమిళనాడు , కర్నాటక లోని తెలుగు వాళ్లను నిర్ధాక్షిణ్య౦గా వదిలి వచ్చిన పరిస్థితులను గుర్తు చేసుకో౦డి. అయినా ఆ పరిస్థితులు చరిత్రలో భాగమయ్యి౦టే కదా యిప్పుడు  గుర్తు చేసుకోడానికి ! అవసర౦ కోస౦ కొ౦తమ౦ది తెలుగువాళ్లను వదిలివేస్తారు. వేరే అవసరాలకోస౦ యి౦కొక ప్రా౦త౦ తెలుగువాళ్లతో కలిసి వు౦టా౦ అ౦టారు… వాళ్లు చీ…ఛా అన్నా దులపరి౦చుకొ౦టూ, లేదు మనమ౦తా కలిసి వు౦డాల్సి౦దే అ౦టారు. ఏదైనా చేయగల సామర్థ్య౦ మీ సొ౦త౦. మనమ౦తా ఒక్కటే అని ఒక వైపు అ౦టూనే మమ్మల్ని ఎ౦త చిన్న చూపు చూడాలో అ౦త చూస్తున్నారు. మనమ౦తా ఒక్కటే అని మేము ఎలా అనుకోగల౦ ! యిక మావాళ్ళు కూడా మీ వెనుక తోక వూపుకు౦టూ తిరిగే వాళ్లుగా వు౦డకపోవచ్చు . మీ సహవాస౦ యిక మాకు వద్దు అన్న మాట వినడానికి మీరు సిద్ద౦గా వు౦డ౦డి…ఆ టైమ్ కూడా బహుశా ఎ౦తో దూర౦లో లేదు… ల౦చ్ టైమ్ కూడా అయిపోవచ్చినట్లు౦ది… పద౦డి. ఆకలి కూడా ద౦చిపడేస్తో౦ది. అ౦దులోనూ ఈ రోజు నా క్యారియర్లో జొన్నరొట్టె  వు౦ది…తినాలి…”

నా గాయాలకు లేపన౦ పూసుకున్నట్టుగా మనస౦తా చల్లగా వు౦ది.

‘ ఇ౦టికి పోతూనే నాకూతురికి కూడా ఈ లేపన౦ గురి౦చి చెప్పాలి…. ‘

–కె.సుభాషిణి

 

 

 

 

 

తావి

తాయమ్మ కరుణ

తాయమ్మ కరుణ

 

 

 

 

 

 

anvi with dolly

అలతి అలతి పదాలతో కథలు అల్లే కరుణ అసలు పేరు పద్మ. తాయమ్మ కథ రాసి “తాయమ్మ కరుణ” గా మారారు. తనకు బాగా పేరు తెచ్చిన “తాయమ్మ” కథే ఆమె మొదటి కథ. 1996 లో “మహిళా మార్గం” లో ఈ కథ అచ్చయ్యింది. ఇంతవరకు పాతికకు పైగా కథలు రాసారు. అనేక పురస్కారాలు అందుకున్నారు.

“తాయమ్మ మరికొన్ని కథలు ” పేరుతో ఒక సంపుటి తెచ్చారు. పలు సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న కరుణ ప్రస్తుతం హైదరాబాద్ లో జర్నలిస్ట్ గా పని చేస్తున్నారు.—వేంపల్లె షరీఫ్

***

 

 

గట్టిగా ఏడుపు వినిపించడంతో కిట్టు, కల్పన వంటింట్లోంచి పరుగెత్తుకుని వచ్చారు.

‘డాలీ’ని పట్టుకుని ఏడుస్తోంది తావి.

‘‘ఏమైంది బుజ్జమ్మలు’’ అంటూ కిట్టు తావిని ఎత్తుకున్నాడు.

తావి ఎందుకు ఏడుస్తుందో కిట్టుకి వెంటనే అర్థమైంది.

కల్పన ఆందోళనగా… ‘‘ఏమైంది? ఎందుకేడుస్తుంది కిట్టూ’’ అడిగింది.

‘‘ఏం లేదు. ఏం లేదు. నేను తర్వాత చెప్తాలే’’ కల్పనతో అని,

‘‘బుజ్జమ్మలు డాలీకి దెబ్బ తాకిందామ్మా?’’అని ఊరిస్తుంటే… ఇంకా గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టింది తావి.

తావికి రెండున్నర ఏళ్లు. కిట్టూ కల్పనల ఏకైక కూతురు. తావికి ఏమన్నా అయిందంటే అల్లాడిపోతారు. వాళ్లమ్మ చనిపోయిన సంవత్సరంలోనే పుట్టింది కాబట్టి.. తన తల్లే పుట్టిందని కిట్టు అనుకుంటాడు. దాని బుద్ధులు కూడా తల్లి లాగానే ఉన్నాయని మురిసిపోతాడు. తావి చిన్నదైనా దానికి చిన్నప్పటి నుంచే అన్నీ అర్థమవుతాయంటాడు కిట్టు. ఒకసారి తావి చేతిలోంచి గ్లాసు కిందపడి నీళ్లు పోయాయట. కిట్టువైపు చూసి తప్పు చేసినట్టుగా తల కిందకు వేసుకుని అలాగే నిలబడి పోయిందట. అప్పుడు అది చూసిన చూపు అలాంటి సందర్భంలో తన తల్లి చూసినట్టుగానే చూసిందట. వెంటనే వెళ్లి కూతుర్ని ఎత్తుకుని ముద్దులతో ముంచేశాడట కిట్టు. ఇండియాలో ఉన్న తన అక్క సుమకు ఫోన్‌ చేసి మరీమరీ చెప్పి మురిసిపోతాడు.

బుద్ధులే కాదు.. పోలికలు కూడా తల్లివేనంటాడు. కన్పించిన వాళ్లందరికీ కొత్త పాత తేడా లేకుండా చిరునవ్వు విసిరేస్తుంది.

ఇక కల్పనకైతే కూతురే సర్వస్వం. మొదట కిట్టు ‘‘పిల్లల్నే కనొద్దు. ఎవర్నైనా పెంచుకుందాం’’ అన్నాడు.

ప్రకృతి సహజంగా పిల్లల్ని కనాలని ఉంటుందని, కనకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని, ఏది ఏమైన తనకు పిల్లలు కావాలని తన అభిప్రాయం చెప్పింది. కల్పన అభిప్రాయాన్ని ఎప్పుడూ గౌరవిస్తాడు. కల్పన అలా తన అభిప్రాయం చెప్పేసరికి కాదనలేదు.

అలా పుట్టింది తావి వాళ్లకు  పెళ్లైన ఆరేళ్లకు. అప్పటికే కల్పనకు ముప్పై రెండేళ్లు. కిట్టుకి ముప్పైనాలుగు ఏళ్లు.

‘భార్య’ అనే పదానికి వారిద్దరి మధ్య అర్థం లేదు. స్నేహితులుగానే మెలుగుతారు. కల్పన మనసును చూసి చేసుకున్నాడు కిట్టు. కల్పనను చూసిన చాలామంది ‘‘ఈ అమ్మాయి ఎలా నచ్చిందిరా బాబు నీకు’’ అన్నారు. వాళ్లు అనడానికి కారణం.. కిట్టు చాలా బాగుంటాడు. ‘‘మనసుతో చూస్తే నచ్చుతుంది’’ అన్నాడు కిట్టు. అందం అంటే కిట్టు దృష్టిలో మానసికమైంది. శారీరకమైన అందానికి కిట్టు ఎన్నడూ ప్రాముఖ్యత యివ్వలేదు. తామిద్దరూ కలిసి హాయిగా జీవించగలం అనుకున్నాడు. అలాగే చేసుకున్నారు.

కిట్టు, కల్పనలు  ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వేర్వేరు కులాలు. కల్పన పుట్టిన తర్వాతనే కలిసి వచ్చిందని కల్పన తల్లిదండ్రులకు ఆమె మీద విపరీతమైన  ప్రేమ. అలాంటిది  ప్రేమించిందని తెలిసి, చస్తామని బెదిరించి వేరే పెళ్లి చేయడానికి తల్లితండ్రీ ఒత్తిడి చేశారు. కల్పన అప్పటికి చప్పుడు చేయకపోయినా కిట్టుకి ఈ విషయం తెలిస్తే… తప్పక వచ్చి తనను తీసుకుపోతాడని నమ్మకం. కానీ ఉద్యోగరీత్యా జర్మనీకి వెళ్లాడు. కల్పన గృహనిర్బంధం. వాళ్ల అన్నా, వదినలకు కల్పన బాధ్యత అప్పచెప్పి పోయాడు. వదిన తన చిన్నమ్మ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలనే ఆలోచనతో ఉంది. సహజంగానే కల్పన గురించి పట్టించుకోలేదు. కిట్టు ఫోన్‌ చేసి కల్పన ఎలా ఉందని అడిగితే బాగానే ఉందని చెప్పేవాళ్లు. ఎందుకో కిట్టుకి అనుమానం వచ్చి, కల్పనవాళ్ల ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ చేశాడు. కల్పన తండ్రి ఫోన్‌ ఎత్తాడు. తమ  ప్రేమ వ్యవహారం వాళ్లకి తెలిసిందని కిట్టుకి తెలియదు. కల్పన అన్నకు ఫ్రెండ్‌ కాబట్టి అలానే ఫోన్‌ చేశాడు.

‘‘నీ వల్ల నా కూతురి చనిపోతుంది. మొన్న నిద్రమాత్రలు మింగింది. ఇంకోసారి నువ్వు గనక ఫోన్‌ చేశావంటే మర్యాదగా ఉండదు’’ అని నానా మాటలు అన్నాడు కల్పన తండ్రి . కల్పనకు వేరే పెళ్లి చేస్తున్నారని, తను ఆత్మహత్యకు ప్రయత్నించిందని కిట్టుకు అప్పుటికిగానీ తెలియలేదు. వెంటనే జర్మనీ నుంచి హైదరాబాద్‌ వచ్చాడు. సినిమా ఫక్కీలో కల్పనను తీసుకెళ్లిపోయాడు. అంతకుముందు ఫ్రెండ్స్‌ ద్వారా లాయర్‌ నోటీసు అన్నీ తయారు చేసిపెట్టుకున్నారు. ఇద్దరూ మేజర్లు కాబట్టి పోలీసులకూ చెప్పి పెట్టి ఉంచారు.

కల్పనతో  ప్రేమలో పడ్డాకనే తను కూడా సీరియస్‌గా చదవడం మొదలుపెట్టాడు. అంతకుముందు ఫ్రెండ్స్‌తో కాలక్షేపమే ఎక్కువగా ఉండేది.

ఒక సంవత్సరంలో కల్పన తల్లిదండ్రులు వచ్చి కలిసిపోయారు. కిట్టుని చూసి ఫిదా అయిపోయారు. ‘‘ముందే అబ్బాయి గురించి ఎందుకు చెప్పలేదే.’’ అని కల్పనవాళ్లమ్మ అన్నది. ఆ తర్వాత రెండేళ్లకు అమెరికా ప్రయాణం. కల్పన తన తల్లి వాళ్లింట్లోనే ఉండపోయింది. సంవత్సరం తర్వాత కల్పన కూడా కిట్టు దగ్గరికి అమెరికా వెళ్లింది.

ఆ తర్వాత మూడేళ్లకు తావి పుట్టింది. తావికి ఏ చిన్నది జరిగిన కల్పన, కిట్టూ భరించలేరు. దాన్ని చాలా జాగ్రత్తగా పెంచుతున్నారు. ఇప్పుడలా ఏడ్చేసరికి కల్పనకు అర్థంకాక విలవిల్లాడుతుంది,  తన కూతురు ఎందుకేడుస్తుందో తెలియక.

తావికి ‘డాలీ’ అనే బొమ్మ ఉంది. తను ఎక్కడకి వెళ్లినా డాలీ వెంట ఉండాల్సిందే. డాలీకి అన్నం తినిపిస్తది, నీళ్లు తాపిస్తది, వాళ్లమ్మ తనకు చేసేవన్నీ తను డాలీకి చేస్తుంది తావి.  చిత్రమేంటంటే వాళ్లింటో ఉయ్యాల లేదు. అయినా కార్టూన్స్‌ చూసి రెండు చైర్లకు కలిపి టవల్‌ను చుట్టూ డాలీని అందులో పడుకోబెడుతుంది తావి. ఎంత ఆశ్చర్యమో కిట్టు, కల్పనలకు. దీనికెలా తెలుసు అని. అంత చిన్న వయసులో చైర్లకు టవల్‌ను చుట్టడం.. దాని తెలివికి మురిసి ముద్దయిపోతారు.

డాలీకంటే కూడా అందంగా ఉండే తావిని ఎక్కడ కి వెళ్లిన అందరూ ముద్దు చేస్తారు. ‘క్యూట్‌ గర్ల్‌’ అంటారు. అయినా  కిట్టు తన అక్కలకు ఫోన్‌ చేసి తన కూతురు అందం గురించి పొగిడించుకుంటాడు. ‘‘నిజంగానే అందంగా ఉంటదాక్కా’’ అంటాడు. ‘‘నిజంగా .. చాలా అందంగా ఉంటది’’ అని చెప్తుంది అక్క సుమ. కిట్టు కుష్‌.. నవ్వుతాడు.

ఇక తావి ఏడిస్తే తట్టుకుంటారా? ..

ఇందాక ఇల్లు సర్దుతూ కిట్టు డాలీని బొమ్మల బుట్టలో విసిరేశాడు. ఇంటి నిండా బొమ్మలన్నీ పర్చి ఆడుకుంది అంతసేపు. ‘‘కిట్టు, ఇల్లంత సర్దవా. నేను వంట మొదలుపెడుతున్నా’’ అని కల్పన వంటింట్లోంచి అంది.

ల్యాప్‌టాప్‌ మీద వర్క్‌ చేస్తున్న కిట్టు సిస్టమ్‌ బంద్‌ చేసి లేచాడు.

ఇళ్లంతా బీభత్సం. గబగబా బొమ్మలన్నీ బుట్టలోకి విసిరేస్తూ డాలీని కూడా విసిరేశాడు. విసిరే ముందు ఒక్క క్షణం అన్పించింది  బుజ్జమ్మలు బాధపడుతుందేమోనని.

అన్నీ సర్దేసి వంటింట్లోకి వెళ్లి అంట్లు కడగడం మొదలుపెట్టాడు. అమెరికాలో ఉన్న ఒక భాగ్యమేమంటే పనిమనుషులు దొరకరు. మనుషులను బద్దకస్తులుగా తయారు చేయరు. దొరికినా .. వాళ్లకు జీతాలు చెల్లించడం కష్టం. అందుకే ఎవరి పని వాళ్లే చేసుకుంటారు. అందున ఇండియా నుంచి వెళ్లినవాళ్లు సాధ్యమైనంత తక్కువ ఖర్చు చేసుకుని, మిగిలించుకుని దాచుకోవాలనుకుంటారు.

తావి బొమ్మను విసిరేయడం చూసింది. నెమ్మదిగా లేచి వెళ్లి బుట్టలోంచి బొమ్మను తీసుకుంది. అప్పటికే దానికి దు:ఖం ఎగిసివస్తోంది. బొమ్మను చేతిలోకి తీసుకునేసరికి ఇక దానికి ఏడుపు ఆగలేదు. పెద్దగా ఏడుస్తూ బొమ్మను హత్తుకుంది.

కిట్టు ఎంతో సేపు ఊర్కోబెడితే గానీ దానికి దు:ఖం ఆగలేదు. ఈ విషయం కల్పనకు చెప్పాడు తర్వాత.

‘‘దానికి ఆ బొమ్మంటే ఇష్టమని తెలుసుగా కిట్టూ’’ అంది కల్పన,  ఎందుకట్లా విసిరేశావు అన్నట్టుగా.

‘‘విసిరేసేటప్పుడు ఒక్క క్షణం అన్పించింది. బుజ్జమ్మలు ఇంతలా గమనిస్తుందనుకోలేదు.’’

‘‘అయినా  మేడంగార్కి కోపం వస్తే విసిరేస్తది. మనం విసిరేస్తే మాత్రం దు:ఖమే’’ ఇందాక తను అన్నమాటకు కిట్టూ బాధపడతాడేమోనని, దానిని కవర్‌ చేస్తూ మురిపెంగా కూతుర్ని చూస్తూ అంది కల్పన.

కిట్టు, కల్పన కూడా బొమ్మను జాగ్రత్తగా చూడడం మొదలుపెట్టారు.

***

ఆ రోజు ఆదివారం కిట్టు కూడా ఇంట్లోనే ఉన్నాడు. పొద్దుటి నుంచి ల్యాప్‌ట్యాప్‌ మీంచి దిగలేదు. టిఫిన్‌, భోజనం కల్పన పిలిస్తే లేచి తిని వచ్చి మళ్లీ కూర్చున్నాడు. ఒకోసారి తెల్లవార్లూ పనిలో మునిగిపోయి వుంటాడు కిట్టు. శనివారం కూడా ఎక్కడికీ వెళ్లలేదు. సరే కల్పనకి కూడా బోర్‌గా ఉంటుందని సాయంత్రం లేచాడు. ముగ్గురూ కలిసి షాపింగ్‌కు వెళ్లారు. అలాగే చికెన్‌ తీసుకొచ్చారు.

చికెన్‌ చేయడంలో కిట్టుది నలభీమ పాకం. చికెన్‌ ఒక్కటనే కాదు. ఏ మాత్రం సమయం చిక్కిన వంటింటి పనిలో పాలుపంచుకుంటాడు.

‘‘ఆఫీసు వర్క్‌ ఇంకా చాలా వుంది. నువ్వు అన్నీ ప్రిపేర్‌ చేసి పిలువు. నేను వండుతా ’’ చెప్పాడు కిట్టు.

కల్పన వంటింట్లో పనులు చేస్తోంది.

కిట్టుకి దగ్గర్లో బొమ్మలతో ఆడుకుంటున్న తావి వాంతి చేసుకుంది. డాలీ మీద, తన గౌను మీదా పడింది. తావిని బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి స్నానం చేయించి తీసుకొచ్చారు. తావి చూడకుండా బొమ్మ డ్రెస్సును ఉతికేసి బొమ్మను బకెట్లో నానబెట్టారు.

తావిని పడుకోబెట్టి ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. ఎప్పుడు లేచిందో లేచింది బొమ్మ లేదనే విషయం కనిపెట్టి ఇల్లంత తిరుగుతూ బాత్రూమ్‌లోకి వెళ్లింది. నీళ్లల్లో బొమ్మను చూసి…

‘‘లాలీ… లాలీ…’’ అంటూ హృదయం ద్రవించేలా ఏడుపు.

పరిగెత్తుకుని వెళ్లిన కిట్టు, కల్పన ‘‘లేదు బుజ్జమ్మలు. డాలీకి స్నానం చేపిస్తున్నాం. దానికేం కాలేదు. నీకు చేపించాం కదా. అలాగే డాలికి కూడా చేపిస్తున్నాం’’ అని తావిని సాటిస్‌ఫై చేసేసరికి తలప్రాణం తోకకొచ్చింది.

ఆ బొమ్మ ఎక్కడైనా మర్చిపోతే దానికి జ్వరం వస్తుందని అలాంటిదే ఇంకో బొమ్మ కొని దాచి పెట్టాలి అనుకున్నారు.

కల్పన, తావి నిద్రపోయారు. కిట్టు పని అయేపోయేసరికి రాత్రి రెండున్నర గంటలు కావస్తోంది. తిన్నది ఎప్పుడో అరిగిపోయింది. ఆకలి అనిపించి, కిచెన్‌లోకి వెళ్లి బ్రెడ్‌ కాల్చుకుని తిన్నాడు. ఏంటో చాలా అలసటగా వుంది. ఏదో వెలితిగా వుంది. ఏంటో తెలియదు. వచ్చి బుజ్జమ్మలు పక్కన పడుకున్నాడు.

సాయంత్రం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. హఠాత్తుగా తల్లి జ్ఞాపకం వచ్చింది. అమ్మ కూడా ఇలాగే తన, పర భేదం లేకుండా అందరితో  ప్రేమగా వుండేది కదా. అమ్మను అందరూ కల్మషంలేని మనిషి అనేవారు. ముసలితనంలో పిల్లల పలకరింపు కోసం అల్లాడిన అమ్మ. బొమ్మలేకపోతే తన కూతురు ఏమైతుందో అని ఆలోచిస్తున్నాడు తను. ప్రాణంతో వున్న పిల్లలం అమ్మకీ వుండీ లేనివాళ్లమే అయినాం కదా. పిల్లల కోసం ఎంత కష్టపడింది. పిల్లలే తన సర్వస్వం అనుకుంది. తనకుంటూ మిగిల్చుకోవాలనే ధ్యాసలేదు. పిల్లలే తన ఆస్తి అనుకుంది. అమ్మ పిల్లలం. అమ్మకేం చేశాం? అమ్మ నేం చేశాం? కిట్టు కళ్లల్లో ధారలు… అప్రయత్నంగా కూతురిని దగ్గరికి తీసుకున్నాడు కిట్టు.

–తాయమ్మ కరుణ

ప్రళయం

pralayam_illustration

అనిల్ ఎస్. రాయల్  పుట్టిందీ, పెరిగిందీ పల్నాడులో. పై చదువులు విజయవాడలో. ఆ పై చదువులు మద్రాసు లయోలాలో. పరిశోధన చేసింది గణిత శాస్త్రంలో. పనిచేస్తుంది కంప్యూటర్ రంగంలో. పద్నాలుగేళ్లుగా ప్రవాసం. సిలికాన్ లోయలో నివాసం. చిత్రలేఖనం చిన్నప్పట్నుండీ ఉన్న సరదా. కథా లేఖనం కొత్త సరదా. ‘ప్రళయం’ అతని ఏడో కథ.–వేంపల్లె షరీఫ్

ప్రళయం

 

* * 1 * *

 

“ఈ ద్వారము తెరచిన ఎడల అమ్మవారు ఆగ్రహించును. లోకమునకు అరిష్టము దాపురించును. ఓ మానవా, వెనుకకు మరలుము”

ఆ తలుపు మీద పెద్ద అక్షరాలతో చెక్కి ఉందా హెచ్చరిక. దాని కిందా, పైనా నోళ్లు తెరుచుకుని మింగటానికి సిద్ధంగా ఉన్నట్లు భయపెడుతున్న రెండు నాగుపాముల ఆకారాలు. వాటి కళ్ల స్థానంలో పొదిగిన జాతిరాళ్లు పై కప్పుకి వేలాడుతున్న గుడ్డి దీపం వెలుగులో మెరుస్తున్నాయి. ఆ పడగల కింద భారీ పరిమాణంలో ఉందో తుప్పు పట్టిన ఇనుప తాళం.

అది శ్రీ చండీ అమ్మవారి ఆలయం. వెయ్యేళ్ల పురాతనమైనది. ఏడాది క్రితం దాకా ఇది స్థానికంగానే ప్రసిద్ధం. ఆ కాస్త పేరు కూడా సమీపంలో ఉన్న శివకోట రాకెట్ సెంటర్ సైంటిస్టుల పుణ్యాన వచ్చిందే. అక్కడ నుండి ప్రయోగించబోయే రాకెట్లు, ఉపగ్రహాల నమూనాలు అమ్మవారి ముందుపెట్టి ప్రత్యేకంగా అర్చన చేయించటం ఆనవాయితీ. ఈ మధ్య భారతదేశం ప్రయోగించిన తొలి వ్యోమనౌక కూడా ఇక్కడ దిష్టి తీయించుకున్నాకే పైకెగిరింది. శాస్త్రవేత్తలు సొంత శక్తియుక్తుల కన్నా శక్తిస్వరూపిణి మహిమల్నే నమ్ముకోవటం వింతే. నాకలాంటి మూఢనమ్మకాలేం లేవు. ఒకే ఒక గాఢ నమ్మకం మాత్రం ఉంది: డబ్బు. భూమ్మీద దేవుడి అవసరం లేని వాళ్లున్నారు కానీ డబ్బవసరం లేని వాళ్లు లేరు. కాబట్టి నేను దైవానికన్నా ధనాన్నే ఎక్కువ నమ్ముతాను.

మొత్తానికి ఆ వెర్రి సైంటిస్టుల దయవల్ల చుట్టుపక్కల గ్రామాల్లో పేరుబడటమే తప్ప చండీ అమ్మవారి గురించి దేశంలో మరెవరికీ తెలీదు. అలాంటిది పోయినేడు అమ్మవారి పేరు ప్రపంచమంతా మార్మోగిపోయింది. ఆలయం అడుగునున్న నేలమాళిగల్లో లక్షల కోట్ల రూపాయల విలువైన సంపద బయటపడటం దానిక్కారణం. భూమికి యాభై అడుగుల లోతున ఉన్న నేలమాళిగల్లో శతాబ్దాలుగా పోగుపడి ఉన్న బంగారం, వజ్రాలు, ఇతర ఆభరణాలని లెక్కించటానికి ప్రభుత్వాధికారులకి నాలుగు నెలలు పట్టింది. నేలమాళిగలో మొత్తం ఆరు గదులుండగా, ఐదు గదుల సంపద వెలికి తీశాక – ఆరోగది తెరిస్తే అరిష్టమని గుడి ధర్మకర్తలు దావా వెయ్యటాన, అది తేలేవరకూ దాన్ని తెరవొద్దని కోర్టు ఆదేశించటాన, ఆరో గది తలుపులింకా మూతబడే ఉన్నాయి. ఆ గది ముందే ఉన్నా నేనిప్పుడు.

ఇంత సంపదున్న ప్రాంతానికి ఉన్న భద్రతల్లా ఇద్దరు సెంట్రీలు, నేలమాళిగ లోపలకి వెళ్లే ఇనప గేటుకి రెండు పెద్ద తాళాలు, కోర్టు తీర్పు వెలువడేదాకా గేటు తెరవొద్దన్న ఆదేశాలు. అమ్మవారి సొమ్ముని ఆమే కాపాడుకుంటుందన్న ధీమానేమో, కనీసం లోపల అలారం సిస్టం కూడా లేదు. నాలాంటి దొంగకి ఇందులోకి చొరబడటం నీళ్లు తాగినంత సులువు. తవ్వకాలు జరుగుతున్నప్పుడు కాంట్రాక్టు కూలీ అవతారమెత్తి నేలమాళిగలో ఎక్కడేముందో క్షుణ్నంగా తెలుసుకుని మరీ ఈ పధకం రూపొందించాను. తెల్లవారుఝామున మూడింటికి సెంట్రీలు డ్యూటీ మారే సమయంలో నేలమాళిగలోకి చొరబడి, ఆరో గది తలుపు బద్దలు కొట్టి, లోపలనుండి అందినంత బంగారాన్ని మూటగట్టుకోవటం; ఈ లోగా పైన తెల్లారిపోతుంది కాబట్టి మళ్లీ చీకటి పడేదాకా అందులోనే కాలక్షేపం చేసి తిరిగి తెల్లవారుఝామున మూడుగంటలకి బయటికి జారుకోవటం; ఆలయం గోడ పక్కన పొదల్లో దాచిన మోటార్‌సైకిల్ మీద ఉడాయించటం …. అదీ ప్లాన్. పధకం పక్కాగా ఉంది. అందులో సగం చక్కగా పూర్తయింది.

తలుపు మీదున్న వాక్యం మరోసారి చదివి నవ్వుకుంటూ నాతో తెచ్చుకున్న బ్యాక్‌ప్యాక్ తెరిచి అందులోని వస్తువుల్ని నేలమీద పరిచాను: రెండు బిరియానీ పొట్లాలు, నాలుగు మంచినీటి సీసాలు, ఒక టార్చ్ లైట్, చిన్న రంపం, అర డజను హ్యాక్ సా బ్లేడులు.

రంపం అందుకుని తాళం కొయ్యటం మొదలుపెట్టాను. గంటన్నర గడిచి, మూడు బ్లేళ్లు విరిగి, వళ్లు చెమటతో తడిసి ముద్దయ్యాక ఊడొచ్చిందది. రంపం కింద పడేసి గాఢంగా ఊపిరి పీల్చుకుని తలుపు బలంగా నెట్టాను. కిర్రుమనే శబ్దంతో తెరుచుకుందది.

ఎదురుగా, ఐదొందలేళ్లుగా మానవమాత్రుడు అడుగు పెట్టని గది.

టార్చ్ లైట్ వెలిగించి లోపలకు వేశాను. చాలా పెద్ద గదిలాగుందది. సొరంగంలా పొడుగ్గా ఉంది.

గుమ్మం దాటుకుని ఎడమ కాలు లోపల పెడుతుండగా …. టప్ మనే శబ్దంతో పైనున్న గుడ్డి బల్బ్ పేలిపోయింది. టార్చ్ వెలుగు తప్ప అంతా చీకటి.

“అపశకునమా?”. ఛత్. దొంగలకు చీకటి వరం. ఇది శుభశకునమయ్యుండాలి.

టార్చ్ లైట్ సాయంతో వెదకటం ప్రారంభించాను. బంగారం రాశులు ఏ మూల దాగున్నాయో?

పెద్దగా కష్టపడే పనిలేకుండా పావుగంటలోనే బోధపడింది. ఖాళీ గది వెక్కిరించింది. రాశుల్లేవు, రప్పల్లేవు. బంగారం మూటల్లేవు. నా ముఖంలో నెత్తుటి చుక్కలేదు. చిల్లర దొంగతనాలతో రోజులు నెట్టుకొస్తున్న నేను ఈ చివరి చోరీతో దొంగ బతుక్కి గోరీ కట్టి కొత్త జన్మెత్తొచ్చన్న ఆశలు ఆవిరయ్యాయి. కసిగా కాలితో నేలపై తంతుండగా టార్చ్ వెలుగులో ఓ మూల తళుక్కుమందది. వెంటనే వెళ్లి చూశాను.

ఇందాక వెదికినప్పుడు కనబడలేదు. ఎక్కడినుండో ఊడిపడ్డట్లు ఉందది. అమ్మవారి బుల్లి విగ్రహం. పదంగుళాల ఎత్తున పోతపోసిన పసిడి. అధమం కిలోన్నర బరువన్నా ఉంటుంది. పాతిక లక్షలకి తక్కువుండదు. పోనీలే, ఇంత కష్టపడ్డందుకు ఇదన్నా దక్కింది.

ఉదయం ఆరున్నరయింది. రాత్రంతా నిద్రలేకపోవటంతో కళ్లు మండుతున్నాయి. బయటపడటానికి ఇంకా ఇరవై గంటల పైన నిరీక్షించాలి. అప్పటిదాకా చేసేదేమీ లేదు కాబట్టి కాసేపు వళ్లు వాలిస్తే పోతుంది.

 

 

* * 2 * *

నేలమాళిగనుండి బయటపడే సమయం దగ్గర పడింది. లేచి అడుగులో అడుగేసుకుంటూ గేటు దగ్గరికొచ్చాను. బయటంతా చీకటి. ఎక్కడినుండో వస్తున్న వెలుగులో పరిసరాలు మసకగా కనబడుతున్నాయి. ఆ వెలుగులో గంతులేస్తున్న నీడలు అది విద్యుద్దీపాల కాంతి కాదని తెలియజెపుతున్నాయి. శీతాకాలం కదా. సెంట్రీలు చలి మంటలేస్తున్నారేమో.

గేటు తాళాలు తెరిచి బయటికొచ్చి శబ్దం కాకుండా తాళాలేశాను. చోరీ సంగతి ఎంత ఆలస్యంగా బయటపడితే తప్పించుకోవటం అంత తేలిక. గేటు తెరిచిపెట్టి పారిపోకుండా తిరిగి తాళాలేయటం అందుకే.

ఆలయం ఆవరణలో ఓ మూల విసిరేసినట్లున్న చిన్న మంటపంలోకి తెరుచుకుంటుందా గేటు. మంటపాన్ని ఆనుకునే ఆలయ ప్రాకారం ఉంది. చీకటి మాటున ప్రాకారం అవతలకి దూకి అక్కడ పార్క్ చేసున్న మోటార్‌సైకిల్ సాయంతో జారుకోవాలి.

పిల్లిలా గోడవైపు నడుస్తుండగా వచ్చిందా అనుమానం. ఏదో తేడా. ఆగిపోయి చెవులు రిక్కించాను. ఏమీ వినపడలేదు. ఏవో పురుగులు చేస్తున్న సొద. కీచురాళ్లేమో. అది తీసేస్తే రాత్రి పూట సాధారణంగా ఉండే నిశ్శబ్దం. తేడా అది కాదు. ఏమిటది?

జుత్తు కాలుతున్న వాసన. చర్మం కాలుతున్న వాసన కూడా. వాతావరణమంతా ఆవరించినట్లు, అన్ని దిక్కుల నుండీ దుర్వాసన.

మనసు కీడు శంకించింది. అక్కడే ఉంటే దొరికిపోయే ప్రమాదం. కానీ దాన్ని మించిన అపాయమేదో రానుందని మొరపెడుతున్న మనసు. సెంట్రీ గదివైపు చూశాను.

అక్కడ రెండు ఆకారాలు నేలమీద పడున్నాయి – నిశ్చలంగా.

“ఏం జరిగింది?”, కుతూహలం పురివిప్పింది. నా ప్రమేయం లేకుండానే అడుగులు అటుపడ్డాయి.

నిమిషం తర్వాత ….

నేను స్థాణువునై ఆ శవాల ముందు నిలబడి ఉన్నాను. వళ్లంతా బొబ్బలతో పడి ఉన్నాయా శరీరాలు. వాటి మీదున్న దుస్తులు వాళ్లు సెక్యూరిటీ గార్డ్స్ అని చెబుతున్నాయి. ఆ శవాల పైన రొదచేస్తున్న కీటకాలు, పురుగుల సమూహం. తట్టుకోలేని దుర్గంధం.

“ఎవరి పని?”. ఆలోచించే సమయం లేదు. ముందిక్కడినుండి పారిపోవాలి. లేకపోతే దొంగతనానికి తోడు హత్యానేరం నా మీద పడుతుంది. వళ్లంతా చెమటలు పట్టాయి. భయంతో కాదు, ఉక్కతో. ఆ సమయంలో అంత ఉక్కపోత అసాధారణం. అయితే నేను దాన్ని పట్టించుకునే స్థితిలో లేను. వెనుదిరిగి ప్రాకారం వైపు పరిగెత్తబోతుండగా నా దృష్టి సెంట్రీ గది అవతల వంద మీటర్ల దూరంలో ఉన్న ప్రధాన మంటపమ్మీద పడింది.

అప్రయత్నంగా నా గొంతునుండో గావుకేక వెలువడింది.

అక్కడ … పదుల సంఖ్యలో శవాలు. పారిపోయే ప్రయత్నం మానేసి అటు పరుగు పెట్టాను.

అక్కడికి చేరుకునేసరికి నా పై ప్రాణం పైనే పోయింది. ఎటు చూస్తే అటు నిర్జీవ దేహాలు. పెద్దలు, పిల్లలు, పూజారులు, స్త్రీలు, కుక్కలు, కాకులు, పిట్టలు …. గుట్టలు గుట్టలుగా శవాలు. సలసల కాగుతున్న నూనె కుమ్మరించినట్లు, ఆ శరీరాల నిండా బొబ్బలు. ఉడికీ ఉడకని మాంసం ముద్దల్లా, రక్తమోడుతూ. హృదయవిదారకమైన దృశ్యమది. చూడగానే కడుపులో తిప్పింది. నిన్న తిన్నదంతా వాంతయింది. అక్కడుండలేక దూరంగా పరిగెత్తాను. బ్యాక్‌ప్యాక్‌లోంచి నీళ్ల సీసా తీసి ముఖం కడుక్కుని, ఓ గుక్క నీళ్లు తాగి సీసా లోపల పెట్టేయబోతుండగా అందులో ఉన్న అమ్మవారి విగ్రహం చేతికి తగిలింది. దాన్ని తీసి ప్యాంట్ జేబులో దోపుకున్నాను.

కొంచెం స్థిమిత పడ్డాక చుట్టూ పరికిస్తే ఓ చివరన పార్కింగ్ లాట్‌లో అగ్నికి ఆహుతైన మోటారు వాహనాలు కనబడ్డాయి. వాటికి కాస్త అవతలో లారీ ఇంకా తగలబడుతూ ఉంది.

బాంబు దాడేమన్నా జరిగిందా?

అలా ఐతే గుడి కూడా ధ్వంసమై ఉండాలి కదా. పైగా పక్షులు కూడా రాలిపడున్నాయి. కాబట్టి ఇది బాంబు దాడి కాదు.

ఎవరన్నా చూసేలోపే ఇక్కడ నుండి వెళ్లిపోవటం మంచిది. బయట పార్క్ చేసున్న మోటర్ సైకిల్ వైపు నడవటం ప్రారంభించాను, జేబులో విగ్రహాన్ని తడిమి చూసుకుంటూ.

* * 3 * *

నా కళ్లనుండి నీళ్లు ధారలుగా కారిపోతున్నాయి. ఈ ఘోరకలి నమ్మటానికి మనసు నిరాకరిస్తుంది.

సెల్ ఫోన్ ఉదయం పదిన్నరైనట్లు చూపిస్తుంది. ఆ ఫోన్ అందుకు తప్ప మరెందుకూ పనికి రాదని అర్ధమై చాలాసేపయింది. ఎక్కడా సిగ్నల్స్ లేవు. ఆఖరికి సెల్‌ఫోన్ టవర్ల పక్కన కూడా. కరెంట్ కూడా లేదు.

నగరం నడిబొడ్డునున్న క్లాక్ టవర్ సెంటర్లో నిలబడున్నా నేను. అదో నాలుగు రోడ్ల కూడలి. రహదారుల్లో ఎక్కడికక్కడే ఆగిపోయిన వాహనాలు. కొన్ని పూర్తిగా, కొన్ని పాక్షికంగా తగలబడిపోయాయి. వాటి లోపలా, బయటా, రోడ్ల మీదా, పక్కనున్న షాపుల్లో కిటకిటలాడుతూ నిర్జీవదేహాలు. కనుచూపుమేరలో మరో ప్రాణి సడి లేదు. వళ్లు కాలిపోయి, బొబ్బలెక్కి, కమిలిపోయి … మనుషులు, మృగాలు, పక్షులు, కీటకాలు. కళ్లకు కనబడినమేరా కళేబరాలు. మధ్యలో నేను – ఒంటరిగా.

అనాధగా పెరిగిన నాకు ఒంటరితనం కొత్తకాదు. అది నన్నెప్పుడూ భయపెట్టలేదు. కానీ ఇది …. ఇది భయాన్ని సైతం బెదరగొట్టే భీభత్సకాండ.

అమ్మవారి ఆలయం నుండి ఇక్కడిదాకా అదే పరిస్థితి. కాలిపోయిన వాహనాలు, తగలబడుతున్న భవనాలు, మండిపోతున్న ఎండుచేలు, చెల్లాచెదురుగా శవాలు. పొదల మాటున దాచిన నా మోటార్ బైక్ కూడా తగలబడిపోయుంది. దారిలో ఓ శవం నుండి తస్కరించిన డొక్కు సైకిల్ తొక్కుకుంటూ నగరానికి రావటానికి మూడు గంటలు పట్టింది. రెండు టైర్లూ పాడైపోయిన సైకిలది. వేరే దారి లేకపోవటంతో అదే నా వాహనమయింది. నగరానికొచ్చే దారి పొడుగునా యుద్ధరంగాన్ని తలపించే వాతావరణం. కాదు, కాదు .. యుద్ధం కూడా ఇంత భయంకరంగా ఉండదేమో.

నేనా నేలమాళిగలో ఉన్నప్పుడు ఏదో జరిగింది.

శత్రుదేశం దాడి చేసిందా? ఆటం బాంబులేమన్నా ప్రయోగించిందా?

కాకపోవచ్చు. సమీపంలో అణుబాంబు పేలితే భూకంపం లాటిది రావాలి. అలాంటివేవీ నేను గమనించలేదు.

ఇంతకీ … ఇంత దారుణం జరిగి ఇరవై నాలుగ్గంటలయ్యాకా ఇక్కడ మీడియా వాలిపోలేదెందుకు? ప్రభుత్వం సహాయానికి సైన్యాన్ని దించలేదెందుకు?

అప్పుడొచ్చిందా అనుమానం. క్షణాల్లోనే అది పెనుభూతంగా మారి నన్ను ఆపాదమస్తకం వణికించేసింది.

ఈ మారణకాండ ఈ ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదేమో. దేశం యావత్తూ తుడిచిపెట్టుకుపోయిందేమో. బయటి నుండి కూడా సహాయం రాలేదంటే, అంతకన్నా కారణమేముండాలి?

అంటే …. నేనొక్కడినే బతికున్నానా?

ఆ ఊహకి – వెన్నులో మొదలైన జలదరింపు లిప్తలో వళ్లంతా పాకింది. ఉన్నచోటే కూలబడిపోయాను. ఆ వత్తిడికి జేబులో ఉన్న విగ్రహం గుచ్చుకుంటుంటే నా మస్తిష్కంలో ఓ మెరుపు మెరిసింది. “నేనే దీనికంతటికీ కారణమా?”.

తర్కానికి తాళం పడ్డ వేళది. గుట్టలుగా పడున్న శవాలన్నీ ఒక్కపెట్టున లేచి నన్ను చుట్టుముట్టినట్టూ, ఈ శాపం నా పాపమేనని నిందిస్తున్నట్టూ అనిపించింది. “ఆరోగదిలో అడుగుపెట్టి అమ్మవారికి ఆగ్రహం కలిగించానా? మూఢనమ్మకమంటూ కొట్టిపడేసిన విషయమే నిజమయిందా?”.

నాలో తొలిసారిగా పాపభీతి. ఇది నేనెన్నడూ ఎరగని అనుభూతి. “నో, నో. హేతుబద్ధంగా ఆలోచించు. దానికీ దీనికీ సంబంధమేమిటి?” అని నాకు నేనే నచ్చజెప్పుకుంటూ బ్యాక్‌ప్యాక్ లోంచి నీళ్ల సీసా అందుకుని ఓ గుక్క గొంతులో వంపుకున్నాను. అదే చివరి సీసా. ఎక్కడా మంచినీళ్ల జాడలేదు. మళ్లీ నీళ్లు దొరికేదాకా ఈ మిగిలిందొక్కటీ జాగ్రత్తగా వాడుకోవాలి. చూస్తుంటే విధ్వంసమంతా ఉపరితలమ్మీదనే జరిగినట్లుంది. నేలమాళిగలో ఉన్న నాకు ఏమీ కాకపోవటం దానికి సాక్ష్యం. భూమ్మీద నీరంతా ఆవిరైపోయినట్లుంది. నేల పొరల్లో నీరే నాకిప్పుడు గతి. బోరింగ్ పంప్ లాంటిదెక్కడన్నా కనిపిస్తే నీళ్లు తోడుకోవచ్చు. కానీ నగరాల్లో బోరింగులు ఎప్పుడో మాయమైపోయాయి. పల్లెల్లో ఏమన్నా మిగిలున్నాయేమో. తూర్పు దిక్కున పల్లెటూర్లున్నాయి. అటువైపు వెళితే? ఒకవేళ అక్కడ బోరింగ్స్ లేకపోయినా, ఇంకా ముందుకెళితే సముద్రం ఉంది. ఇసుక మేటలుండే సముద్ర తీరాల్లో కురిసిన వాన నీరు ఇసుక పైపొరల్లో నిలవుంటుంది. అక్కడ పైపైన తవ్వితే మంచినీరు ఊరుతుంది.

అప్పుడే మరో ఆలోచన స్ఫురించింది. “పరిసర ప్రాంతాల్లో నాలాగే అదృష్టవశాత్తూ విపత్తు తప్పించుకున్నవాళ్లుంటే? వాళ్లూ నీళ్ల కోసం వెదుక్కుంటూ సముద్రం దిక్కుగా సాగితే?”

ఆలస్యం చేయకుండా పైకి లేచాను. ఇరవై కిలోమీటర్ల లోపే ఉంది సముద్రం. సైకిల్ మీద నాలుగైదు గంటల్లో వెళ్లిపోవచ్చు.

ఎండ మందగించింది. తూర్పునుండి ముసురేస్తుంది. వర్షం మొదలయేలోపే తీరానికి చేరాలనుకుంటూ వాహనం అధిరోహించాను.

 

* * 4 * *

సముద్ర తీరం చేరటానికి అనుకున్నదానికన్నా ఆలస్యమయింది. సగం దూరం వెళ్లేటప్పటికే కారుమబ్బులు కమ్మేశాయి. మధ్యాహ్నం మూడున్నరకే చీకటి పడిపోయింది. యుద్ధభేరీ మోగించినట్లు ఉరుములు, చెవులు బద్దలయ్యే శబ్దంతో పిడుగులు. మార్గమంతా మృత్యువు వికటాట్టహాసాలే. మెరుపుల వెలుగులో దారి వెదుక్కుంటూ, దార్లో పడున్న శరీరాలని జాగ్రత్తగా దాటుకుంటూ ముందుకు సాగటానికి నాకు శక్తెక్కడినుండొచ్చిందో! ఎలాగోలా తీరానికి చేరితే నాలాంటి వాళ్లెవరన్నా కనబడకపోతారా అన్న ఆశ బలాన్నిచ్చిందేమో. సీసాలో మిగిలిన నీళ్లు మధ్యలోనే ఖర్చైపోయాయి. తీరా, తీరానికొచ్చాక నా ఆశ అడియాసయింది. తీరమంతా మనుషులు, పక్షులు, చేపల పార్ధివ దేహాలే. సముద్రపు అలలకి కొట్టుకొస్తూ, తిరిగి లోపలికెళుతూ. లెక్కించటం మొదలుపెడితే సంఖ్య వేలల్లోనే తేలేట్టుంది. వీళ్లు కూడా వళ్లంతా బొబ్బలతో రాలిపోయిన వాళ్లే.

అక్కడికొచ్చేటప్పటికి సాయంత్రం ఆరయింది. ఉరుముల ఉద్ధృతి రెట్టింపయింది. నీటి చెలమ తవ్వుదామనుకుంటుండగానే వాన మొదలయింది. సముద్రం ఉగ్రరూపం దాల్చినట్లు అలలు విరుచుకు పడటం మొదలు పెట్టాయి. తోడుగా హోరుగాలి. దాని ధాటికి సైకిల్ ఎగిరిపోయింది. కొన్ని దేహాలు ఎగురుకుంటూ నా పక్కగా దూసుకుపోతున్నాయి. ఒకట్రెండు – పక్షులవో లేక చేపలవో – ఎగిరొచ్చి నాకు తగిలాయి. చుట్టూ చూస్తే దూరంగా ఓ బోర్లించిన పుట్టి కనబడింది. గాలికి ఎదురీదుతూ దాన్ని చేరుకుని, కాసేపు తిప్పలు పడి కొంచెం పైకెత్తి దాని కింద దూరి ప్రాణాలు అరచేత పెట్టుకుని క్షణాలు లెక్కబెట్టసాగాను.

క్షణాలు నిమిషాలు, నిమిషాలు గంటలయ్యాయి. ఎన్ని గంటలయ్యాయో తెలుసుకోటానికీ లేకుండా సెల్ ఫోన్ వర్షానికి తడిసి మాడిపోయింది. గాలివాన అంతకంతకీ తీవ్రరూపం దాలుస్తుంది. పుట్టి ఏ క్షణంలోనైనా ఎగిరిపోయేలా ఉంది. అదే జరిగితే దానితో పాటు నేనూ గాలికెగిరిపోవటం తధ్యం. పుట్టి ఎగిరిపోకూడదని కోరుకుంటూ ప్రాణాలు చేతబట్టుకుని కూర్చున్నాను. అవసరం ఎవరినైనా అడుక్కునే స్థాయికి దిగజారుస్తుంది. కోరుకున్నవి దర్జాగా కాజేయటమే తప్ప అడిగే అలవాటు లేని నాకు, ఆ అవసరం మొదటిసారిగా వచ్చిపడింది. ఎప్పుడూ దేవుడిని ఏదీ అడగని నేను మొదటిసారిగా అడిగాను, నన్ను కాపాడమని. చేతులు జోడించి మరీ ప్రార్ధించాను. తీతువు కూతలు గుండెలదరగొట్టేవేళ హేతువు తోకముడిచి పారిపోతుందేమో.

ప్రార్ధన పూర్తవకముందే ఓ పెద్ద అల, సముద్రం చెయ్యి సాచినట్లు, వేగంగా దూసుకొచ్చి లిప్తలో నన్నూ పుట్టినీ గిరాటేసింది. నా నుదురు విసురుగా పుట్టికి తగిలింది. తల దిమ్మెక్కిపోయింది. కాసేపేం జరుగుతుందో అర్ధం కాలేదు. తేరుకునేసరికి అల నన్ను సముద్రంలోకి గుంజేసింది. ఉప్పునీరు నోట్లోకీ, ముక్కులోకీ పోయి ఉక్కిరిబిక్కిరవుతూ లోపలికి కొట్టుకుపోయాను. తలకి పెద్ద గాయమే ఐనట్లుంది. విపరీతమైన నొప్పి. కెరటం కాస్త తెరిపివ్వగానే పళ్ల బిగువున నొప్పి భరిస్తూ ఒడ్డుకేసి ఈదటం మొదలుపెట్టాను. అంతలోనే మరో అల నన్ను బలంగా వెనక్కి విసిరికొట్టింది. లేని ఓపిక తెచ్చుకుంటూ ఈత మళ్లీ మొదలుబెట్టబోయాను. అప్పుడే, పక్కనే తేలుతూ ఇందాకటి పుట్టి కనబడింది. వెంటనే ఎక్కేశాను.

ఈ గొడవలో నా బ్యాక్‌ప్యాక్ తప్పిపోయింది. ఓ పక్క దాహం, మరో పక్క ఆకలి. ఇంకోపక్క వణికిస్తున్న చలి. అలలు, ఉరుములు, ఈదరగాలి చేస్తున్న శబ్దాలు కలసికట్టుగా చెవులు పగలగొడుతున్నాయి. పైనుండి కుండపోతగా కురుస్తున్న వర్షం, నాలుగు దిక్కులనుండీ ఎడాపెడా కొడుతున్న కెరటాల మధ్యలో నానిపోతున్న నేను. కన్ను పొడుచుకున్నా కనబడని చిమ్మచీకటి. మెరుపులు మెరిసినప్పుడు మాత్రం సముద్రుడి ఉగ్రరూపం కళ్లముందు ప్రత్యక్షమై వళ్లు జలదరింపజేస్తుంది. ఆ మెరుపుల సాక్షిగా తీరానికి సుదూరంగా వెళ్లిపోయానన్న సంగతి అవగతమయింది. తల తడుముకుంటే చేతికి రక్తం అంటింది. బాగానే పోయినట్లుంది. తొడుక్కున్న చొక్కాలో కొంతభాగం చింపి అక్కడ బిగించి కట్టాను.

ప్రకృతి శక్తుల ముందు మనిషి అల్పత్వం గురించి నాకింకా అనుమానాలేవైనా మిగిలుంటే ఆ తర్వాత కాసేపట్లోనే అవి పూర్తిగా పటాపంచలయ్యాయి. చుట్టూ జరుగుతున్న విలయతాండవం నా కళ్లబడకుండా చీకట్లు కాపాడాయి. అంతెత్తున విసిరేస్తున్న అలల మధ్య పుట్టి తిరగబడకుండా ఉండటం అద్భుతమే. దాని లోపల నాలుగు చోట్ల బలమైన మోకులు కట్టున్నాయి. ఆ మోకులతో నన్ను నేను పుట్టికి కట్టేసుకుని, అలల ధాటికి దాన్నుండి దూరంగా విసిరేయబడకుండా కాపాడుకున్నాను. అలా ఎంత సేపు గడిచిందో తెలీదు. క్రమంగా నన్ను ఆకలి, అలసట ఆక్రమించుకున్నాయి. నీరసం కమ్ముకుంది. అలాగే నిద్రలోకి జారుకున్నాను.

 

* * 5 * *

 

కళ్లు తెరిచేసరికి …. చుట్టూ పండగ వాతావరణం.

ఆశ్చర్యం! నేనున్నది పుట్టిలో కాదు. అది నడిసముద్రమూ కాదు. శ్రీ చండీ అమ్మవారి ఆలయం. మంటపంలో ఓ మూల పడుకుని ఉన్నాను. ఆలయం నిండా భక్తజన సందోహం. తిరునాళ్లేదో జరుగుతున్నంత కోలాహలంగా ఉందక్కడ.

“ఏమిటీ హడావిడి?”, హారతీ గట్రా సరంజామాతో అటుగా వెళుతున్న పూజారిని ఆపి ప్రశ్నించాను.

“ఇంకా తెలీదా నాయనా? ఆరో గదిలో బంగారు బొమ్మ రూపంలో అమ్మవారు వెలిశారు”, ఆయన వింతగా చూస్తూ చెప్పాడు.

“ఆరో గదా? అదెప్పుడు తెరిచారు! తెరిస్తే అరిష్టమని కోర్టునుండి స్టే తెచ్చారుగా”, తెలీనట్టు అడిగాను.

“ఎవడో దొంగవెధవ నాయనా. రాత్రి నేలమాళిగలో చొరబడి గది తలుపులు తెరిచాడు త్రాష్టుడు. వాడి శ్రాద్ధం పెట్ట. తెల్లారి సెక్యూరిటీ గార్డులు వెళ్లి చూస్తే అమ్మవారి విగ్రహం కనబడింది. అపచారం ఉపశమించటానికి శాంతి జరిపిస్తున్నాం” అంటూ పూజారి హడావిడిగా ముందుకు సాగిపోయాడు.

అంటే, ఇందాకటిదాకా జరిగిందంతా నిజం కాదా!?! ఆరో గది తలుపు తెరిచాక, అందులో ఏమీ దొరక్కపోవటంతో బయటికొచ్చి మంటపంలో పడుకుని నిద్రపోయానా? ఆ మొద్దునిద్రలో ప్రపంచం నాశనమైపోయినట్లు కలగన్నానా?

హమ్మయ్య. గుండె తేట పడింది. ఎంత భయంకరమైన పీడకల! నిజంలా భ్రమ పెట్టిన కల.

అయినా, ఏమీ దొరక్కపోతే గప్‌చుప్‌న జారుకోకుండా మంటపంలో పడుకుని నిద్రపోవటమేంటి? ఇంకా ఎక్కువ సేపిక్కడే ఉండటం మంచిది కాదు. వెంటనే వెళ్లిపోవాలి. మోటార్ సైకిల్ తాళాలు ఎక్కడ పెట్టానో?

ప్యాంట్ జేబులు వెదుక్కున్నాను. కుడివైపు జేబులో ఎత్తుగా తగిలిందది. బయటికి తీశాను.

అమ్మవారి విగ్రహం! పదంగుళాల ఎత్తున బంగారు రంగులో మెరిసిపోతూ. ఇది నా దగ్గరుంటే మరి ఆ గదిలో వాళ్లకి కనిపించిందేమిటి?

సాలోచనగా చూస్తుండగానే అమ్మవారి బొమ్మ కదిలింది. ఆమె చెయ్యి అలా అలా పెరిగి పెద్దదై వచ్చి నా చెంపని బలంగా తాకింది. అదే సమయంలో ఆమె గొంతు ఉరిమింది.

“మూర్ఖ మానవాధమా. అనుభవించు”.

 

* * 6 * *

 

చెవిలో ఉరిమిన శబ్దానికి ఒక్కుదుటన మెలకువొచ్చింది. సమీపంలో పిడుగు పడినట్లుంది. కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. సముద్రమింకా అల్లకల్లోలంగానే ఉంది. నా పుట్టి చిగురుటాకులా వణికిపోతూనే ఉంది. నుదుటి గాయం నొప్పి తట్టుకోనీకుండా ఉంది. తోడుగా తలనొప్పి మొదలయింది. జ్వరం కూడా వచ్చినట్లుంది. వళ్లంతా వేడి సెగలు. జ్వరానికి, చలికీ వణికిపోతూ నేనలాగే పుట్టిలో పడి ఉన్నాను.

ఇదేంటి … ఇంకా పుట్టిలో! మళ్లీ అదే కలా? లేక ఇదే నిజమా? ఇది నిజమైతే ఇందాకటిది అందమైన కలా?

ఏడుపొచ్చింది. కోపమూ వచ్చింది, అమ్మవారి మీద. “అంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్షా?”. దిక్కులు పిక్కటిల్లేలా అరవాలనుకున్నాను కానీ నోరు పెగల్లేదు. గొంతు పిడచగట్టుకుపోతుంటే వర్షం నీరు దోసిళ్లతో పట్టుకు తాగాను. దప్పిక తీరింది. ఆకలి అలాగే ఉంది. సమయం ఎంతయిందో తెలుసుకోటానికి సెల్‌ఫోన్ కూడా లేదు. పూర్వకాలంలో గడియారాలతో పనిలేకుండానే గంటెంతయిందో చెప్పగలిగేవాళ్లంట. ఆ విద్యేదో నేర్చుకుంటే ప్రస్తుతం పనికొచ్చుండేది. అయినా నా పిచ్చిగానీ, ఇప్పుడు టైమెంతయిందో తెలుసుకుని చేసేదేముంది?

బుర్రనిండా తలాతోకాలేని ఆలోచనలు. తల పగిలిపోతుంది. కళ్లు వాలిపోసాగాయి. అదృష్టవశాత్తూ మళ్లీ మగత కమ్ముకుంది. అది నన్ను నిద్రలోకో, మత్తులోకో …. మొత్తానికి  ఈ నరకం నుండి దూరంగా తీసుకుపోయింది. ఆ పరిస్థితిలో ఎంతసేపున్నానో, తిరిగి మెలకువ వచ్చేసరికి సూర్యుడు నడినెత్తినున్నాడు. వర్షం ఆగిపోయింది. పైన మబ్బుతునక లేదు. సముద్రం ప్రశాంతంగా ఉంది. దాని మీద నా పుట్టి తేలియాడుతుంది. కనుచూపు మేరలో భూమి లేదు. నలువైపులా నీళ్లు. పైన నీలాకాశం. మిట్ట మధ్యాహ్నం ఎండ మండిపోతుంది. సూర్యకిరణాలు సూదుల్లా గుచ్చుతున్నాయి. గొంతెండిపోతుంది. సముద్రపు నీరు దోసిళ్లతో చేదుకు తాగాలన్న కోరిక బలవంతంగా నిగ్రహించుకున్నాను. ఖాళీ కడుపుతో ఉప్పు నీరు తాగటమంటే చావుని ఆహ్వానించటమే.

నడిసంద్రంలో నేను. జతగా జ్వరం, ఆకలి, నిస్సత్తువ. తల మీది గాయం సలుపుడు. వంట్లో వేడికి తోడు పైనుండి మండించేస్తున్న ఎండ. తట్టుకోలేనంత ఉక్కపోత. దాని దెబ్బకి కాసేపట్లోనే కళ్లు తిరగటం మొదలయింది. వడదెబ్బ తగిలిందా? మరోసారి మగతలోకి జారిపోయాను.

* * 7 * *

ఎవరో పట్టి కుదుపుతున్న భావనకి మెలకువచ్చింది. నేల మీద వెల్లకిలా పడుకుని ఉన్నాను. జ్వరం, వణుకు తగ్గలేదింకా. మత్తుతో కళ్లింకా వాలిపోతున్నాయి. కష్టంగా వాటిని తెరిచి చూస్తే, నా ముఖంలో ముఖం పెట్టి చూస్తున్న అపరిచితులు. దృష్టి ఇంకా మసకగానే ఉండటంతో వాళ్ల ఆకారాలు స్పష్టంగా కనబడలేదు. మొల చుట్టూ ఈకల్లాంటివేవో కట్టుకున్న తుమ్మ మొద్దుల్లాంటి శరీరాలు. ఐదారుగురు ఉంటారేమో. చుట్టూ దడి కట్టినట్లు నిలబడి ఉన్నారు.

వాళ్ల చేతుల్లో ఏంటవి … శూలాలు!

నేనెక్కడున్నాను? ఇది కూడా కలేనా? ఈ విచిత్రాకారులెవరు యమకింకరుల్లా ….

యమకింకరులు!

అర్ధమైంది. నేను చచ్చిపోయాను. నన్ను నరకానికి పట్టుకుపోటానికొచ్చిన యమదూతలు వీళ్లంతా. ఒక్కడి కోసం ఇంతమందా?

కింకరుల్లో ఒకడు ముందుకొంగి నా తల మీద చెయ్యేశాడు. సరిగా గాయమైన చోట. నొప్పి. భరించలేని నొప్పి.

ఇంకా నొప్పేంటి? చచ్చిపోయాకా వదలదా!

కింకరుడి చెయ్యి నెట్టేసే ప్రయత్నంలో తల పక్కకి తిప్పాను. అప్పుడే, తక్కిన కింకరుల్లో కలకలం చెలరేగింది. గజిబిజి భాషలో గందరగోళంగా ఏదో మాట్లాడుకుంటున్నారు. కష్టమ్మీద కళ్లు పూర్తిగా తెరిచి చూశాను. వాళ్లలో ఒకడు కుడివైపుకి చేత్తో చూపిస్తూ ఏదో అరుస్తున్నాడు. నేనూ అటు చూశాను.

సుదూరంగా, ఆకాశంలో మండుతూ దూసుకొస్తున్న అగ్నిగోళం. క్షణక్షణానికీ దాని పరిమాణం పెరిగిపోతుంది. సూటిగా మేమున్న దిశలోనే వస్తుందది.

కళ్లు పెద్దవి చేసి చూడటానికి విశ్వప్రయత్నం చేశాను. అయినా వివరం తెలీకుండా బూజరగానే కనిపిస్తుందది. అంతలో కింకరుల్లో ఒకడు నా కాళ్లు, మరొకడు భుజాలు పట్టుకుని పైకి లేపారు. మిగతావాళ్లు ముందు పరిగెడుతుండగా నన్ను మోసుకుంటూ వాళ్లని అనుసరించారు. అందరి దృష్టీ అగ్నిగోళమ్మీదనే ఉంది. వేగంగా దగ్గరకొచ్చేస్తుందది.

కాసేపట్లో వాళ్లు నన్నో గుహలాంటి దాన్లోకి తీసుకుపోయారు. నేలమీద పడుకోబెట్టి బయటికి చూస్తూ పెద్దగా మాట్లాడుకోసాగారు.

నా చూపింకా మసకగానే ఉంది. అరుణవర్ణంలో ఆకాశం. దాన్ని చీల్చుకొస్తున్న అగ్నిగోళం. వస్తూ వస్తూ అది హఠాత్తుగా పక్షిలా మారిపోయింది. నాకు స్పష్టంగా కనిపించటం లేదు, కానీ అది బూడిద రంగు పక్షి కావచ్చు. ఆగాగు .. పక్షి కాదు … విమానం. అవును విమానమే. దాని పరిమాణం అంతకంతకీ పెరుగుతుంది.

ఎంతమందైనా పట్టేందుకు అనుగుణంగా పరిమాణం పెంచుకునే గుణం పుష్పక విమానానికొక్కదానికే ఉందని విన్నాను. ఇది .. అదేనా?

ఆలోచనల్లో కొట్టుమిట్టాడుతుండగానే విమానం వచ్చి రన్‌వే లాంటిదాని మీద దిగింది.

పుష్పక విమానానికీ రన్‌వే అవసరమా? వెర్రిగా నవ్వాలనిపించింది. నవ్వాలో వద్దో తేల్చుకునేలోపే విమానం ఇందాక నేను పడి ఉన్న ప్రాంతంలో వచ్చి ఆగింది. కాసేపట్లో అందులోనుండి నాలుగైదు ఆకారాలు బయటికొచ్చి మాకేసి నడవసాగాయి. ధవళవస్త్రాల్లో మెరిసిపోతున్నాయా ఆకారాలు.

ఎవరు వాళ్లు? నన్నీ కింకరుల బారినుండి కాపాడి స్వర్గానికి తీసుకెళ్లటానికొచ్చిన దేవదూతలా?

నాకంతా పిచ్చిపిచ్చిగా ఉంది. ముందు పుట్టిలో, తర్వాత గుళ్లో, మళ్లీ పుట్టిలో, ఇప్పుడిక్కడెక్కడో. అసలు నేనెక్కడున్నాను? తలకి తగిలిన దెబ్బకి వెర్రి కానీ ఎక్కలేదు కదా? నేను కలగంటున్నానా, ఏదో పిచ్చిలోకంలో ఉన్నానా, లేక చచ్చిపోయానా? సుడితిరుగుతున్న ఆలోచనలకి తోడుగా తల తిరగటం మొదలుపెట్టింది. మళ్లీ మత్తు కమ్ముతుంది. నో .. నో…. మత్తులో మునిగితే మరెక్కడ తే..ల…తా….నో…

* * 8 * *

హమ్మయ్య. మేలుకున్నాను. ఈ సారెక్కడున్నాను?

కళ్లు తెరిచి చూశాను. పైనెక్కడో కప్పు కనబడింది. పెద్ద గుహ అంతర్భాగంలా ఉంది. నేనింకా కింద పడుకునే ఉన్నాను, కానీ నేల మీద కాదు. మెత్తటి దేనిమీదో. గాయం పెద్దగా బాధించటం లేదు. వళ్లు కూడా తేలిగ్గా ఉంది. జ్వరం తగ్గిపోయినట్లుంది. లేచి కూర్చోబోయాను.

“మెల్లిగా. మీరింకా పూర్తిగా కోలుకోలేదు”. పక్కనుండి మృదువుగా వినబడిందా గొంతు. తల తిప్పి చూశాను. ఓ ధవళవస్త్రధారి, నా పక్కనే చిన్న బండరాయిమీద కూర్చుని ఉన్నాడు.

“ఎవరు నీవు? దేవదూతవా?”, నా గొంతు పీలగా ధ్వనించింది.

“లేదు. వ్యోమగామిని”

“నేనెక్కడున్నాను?”, సర్దుకుని కూర్చుంటూ ప్రశ్నించాను.

“ఆదిమాన్ ఐలాండ్స్‌లో ఉన్నారు. మీరున్న పుట్టి ఈ ద్వీపానికి కొట్టుకొస్తే ఇక్కడి ఆదివాసీలు కాపాడారు. నాలుగురోజులుగా కళ్లు తెరవనీయనంత జ్వరం. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు”

“ఆదిమాన్ ఐలాండ్స్, ఆదివాసీలు! మరి వ్యోమగాములకేం పనిక్కడ?”. హేతువు మళ్లీ నా దరిచేరింది. వళ్లు స్వాధీనంలోకొచ్చేసరికి బుర్ర కూడా పాదరసంలా పనిచేయసాగింది.

“ఈ ద్వీపంలో భారతీయ వ్యోమనౌకలు దిగటానికి అనువుగా రన్‌వే ఉంది”, అతను బదులిచ్చాడు.

అదీ సంగతి. నేను చూసిన అగ్నిగోళం అదన్నమాట! అవి వ్యోమనౌక భూవాతావరణంలో ప్రవేశించినప్పుడు రాపిడికి పుట్టే మంటలన్న మాట.

“మీరు బతికి బయట పడటం ఓ అద్భుతం”, నా ఆలోచనల్ని భగ్నం చేస్తూ మళ్లీ అతనే అన్నాడు.

“నిజమే. సముద్రంలో మునిగిపోకుండా ఇక్కడికి కొట్టుకు రావటం అద్భుతమే. అంతకు ముందు జరిగిన మారణహోమాన్ని తప్పించుకోటం మాత్రం నా అదృష్టం”

“ఎలా తప్పించుకున్నారు?”, అతను ఆసక్తిగా అడిగాడు.

చెప్పాలా వద్దా అని కాసేపు తటపటాయించి చివరికి నోరు విప్పాను. నా కారణంగానే అదంతా జరిగిందేమోనన్న న్యూనతాభావం ఇంకా ఏ మూలో ఉండటం వల్లనేమో, నా ఘనకార్యం ఎవరికన్నా చెబితే కానీ మనశ్శాంతి ఉండదనిపించింది. నేను నేలమాళిగలో ప్రవేశించటం దగ్గర్నుండి మొత్తం పూసగుచ్చినట్లు అతనికి వివరించాక మనసు తేలికపడింది.

“అయితే అసలేం జరిగిందో మీకు తెలీదంటారు”, మొత్తం విన్నాక అతను సూటిగా చూస్తూ ప్రశ్నించాడు.

“ఊఁహు. మీకు తెలుసా?”

“తెలుసు. సూర్యుడి క్రోధాగ్నిలో మానవులు మాడి మసైపోయారు”.

“వాట్?”, అయోమయంగా చూశాను.

“వివరంగా చెబుతాను వినండి”. అతను గట్టిగా ఊపిరి పీల్చుకుని చెప్పటం మొదలు పెట్టాడు. “వారం కిందట జరిగిందది. ఆ రోజు సూర్యుడినుండి విడుదలయ్యే శక్తి హఠాత్తుగా పదులరెట్లు పెరిగిపోయింది. సౌరశక్తిలో హెచ్చుతగ్గులుండటం సాధారణమైన విషయమే కానీ, ఈ సారది ఎవరూ ఊహించనంత ఎక్కువ స్థాయిలో విడుదలయింది. చరిత్రలో ఇటువంటి సంఘటన ఇంతకు ముందెన్నడూ జరిగిన దాఖలా లేకపోవటాన, జరగబోయేది ముందే ఊహించి మనుషుల్ని ఆప్రమత్తం చేసేందుకు అవసరమైన గణాంకాలు లేక మన అబ్సర్వేటరీలేవీ దీన్ని పసిగట్టలేకపోయాయి. హెచ్చరిక లేకుండా వచ్చిపడ్డ ఉత్పాతమది. దాని దెబ్బకి ముందుగా ఉపగ్రహాలు, వాటి మీద ఆధారపడ్డ సమాచార వ్యవస్థలు నాశనమయ్యాయి. భూవాతావరణం కొన్ని గంటల్లోనే అసాధారణ స్థాయిలో వేడెక్కింది. ఎలక్ట్రిసిటీ గ్రిడ్లు పేలిపోయాయి. కరెంట్ లేక, ఏసీలు పని చేయక జనం శలభాల్లా మాడిపోయారు. మండే స్వభావం ఉన్నవన్నీ మండిపోయాయి. నీటి చెలమలు ఆవిరైపోయాయి. సముద్రాల ఉపరితలమ్మీద నీరు మరిగిపోయింది. అక్కడుండే మత్స్య జాతి కళ్లు తేలేసింది. ఈ విలయం ఇరవై గంటల పైగా కొనసాగింది. భూమ్మీద అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ లోగా, సముద్రాల మీది నీటి ఆవిరి పైకెళ్లి చల్లబడి కనీవినీ ఎరగని స్థాయిలో తుఫాన్లు కురిపించింది. ప్రపంచమంతటా కోస్తా ప్రాంతాలని వరదలు ముంచెత్తాయి ….”

అతని వాక్ప్రవాహానికి అడ్డొస్తూ ప్రశ్నించాను, “ఇదంతా మీకెలా తెలుసు?”

“ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోనుండి ఈ ఘోరాన్ని ప్రత్యక్షంగా చూశాం మేము.  మూడు రోజుల తర్వాత కింద పరిస్థితులు కుదుటపడ్డాయనిపించగానే హుటాహుటిన తిరిగొచ్చాము. మా రీ-ఎంట్రీలో సహకరించటానికి కిందెవరూ మిగిల్లేరు. అయినా సాహసించి వచ్చేశాం”

“ఈ ఉత్పాతం వల్ల స్పేష్ స్టేషన్‌కి ప్రమాదమేం రాలేదా?”

“భూమ్మీదకన్నా రోదసిలో సూర్యకిరణాల ధాటి ఎక్కువ. కాబట్టి స్పేష్ స్టేషన్ ఇంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రతల్ని కూడా తట్టుకునేలా రూపొందించబడింది”

“బాగానే ఉంది. మరి, భూమ్మీద మిగతా అందరూ మాడిపోయినా ఈ ఆదివాసీలు క్షేమంగానే ఉన్నారేం?”

“ఆదివాసీలు కావటం వల్లనే వాళ్లు బతికిపోయారు. ప్రకృతితో మమేకమై ఉండటం వాళ్లని కాపాడింది. మనలాంటి నాగరీకులం ఎప్పుడైతే యంత్రాల మీద మితిమీరి ఆధారపడటం నేర్చుకున్నామో, అప్పుడే మనం ప్రకృతి భాష మర్చిపోయాం. ఫలితం? ఇదిగో …. ఇది. మనం రూపొందించుకున్న ఏ సాధనమూ ఈ ప్రమాదాన్ని ముందస్తుగా ఊహించి హెచ్చరించలేకపోయింది. టెక్నాలజీ దన్నుతో ప్రకృతిమీద పై చేయి సాధించానని విర్రవీగిన ఆధునిక సమాజం, తాను నమ్ముకున్న సాంకేతిక వ్యవస్థలన్నీ మూకుమ్మడిగా కుప్పకూలిననాడు జరిగేదేమిటో అంచనా వేయలేకపోయింది. మనకి భిన్నంగా, ఈ ఆదివాసీలు చుట్టూ ఉన్న ప్రకృతితో నిత్యం సంభాషిస్తారు. అది చెప్పేది శ్రద్ధగా వింటారు. ఈనాడు అదే వాళ్లని కాపాడింది”

“ఎలా?”

“ఇలాంటి ఉత్పాతాలని ముందుగా పసిగట్టగలిగే శక్తి పశుపక్ష్యాదులకుంది. ఈ విలయం మొదలవటానికి కొన్ని గంటల ముందే ఈ ద్వీపంలో ఉన్న జంతువులన్నీ ఎత్తైన ప్రాంతాలకేసి పరుగులు తీశాయి. అది గమనించి, ఏదో పెనువిపత్తు ముంచుకు రానుందని భావించి వీళ్లు కూడా కొండలపైకెళ్లి అక్కడున్న గుహల్లో దాక్కున్నారు. ఎక్కువ ఎత్తుకి వెళ్లే కొద్దీ వాతావరణంలో వేడి తగ్గుతుందని తెలిసిందే కదా. అదనంగా గుహాంతర్భాగాల్లో ఉండే సహజమైన చల్లదనం తోడై వాళ్లని కాపాడింది”

“అయితే నాగరీకులెవరూ బతికి బట్టకట్టలేదంటారా?”

“అందరూ పోయారనలేం. చల్లటి ధృవాల వద్ద, ఎత్తైన కొండప్రాంతాల్లో ఉండేవాళ్లు కొందరైనా తప్పించుకునే అవకాశం ఉంది. మీలా అదృష్టవశాత్తూ బతికిపోయినోళ్లు కూడా కొందరుండొచ్చు. కానీ వీళ్ల శాతం చాలా తక్కువ. మొత్తమ్మీద, ఆధునిక నాగరికతనేది అంతరించినట్లే. కానీ అంతమాత్రాన అంతా ఐపోయినట్లు కాదు. భూమాత చరిత్రలో మానవుడు లిఖించాల్సిన అధ్యాయాలు మరికొన్ని మిగిలే ఉన్నాయి. ఆ పని కొనసాగించే మహత్తర బాధ్యత ప్రపంచవ్యాప్తంగా మిగిలున్న ఇలాంటి ఆదివాసీలదే”

గుహ ద్వారం వద్ద ఏదో శబ్దమవటంతో సంభాషణాపి అటు చూశామిద్దరమూ. కొందరు ఆదివాసీలు నిలబడున్నారక్కడ. వాళ్లలో ఒకడు లోపలికొచ్చాడు. నేరుగా నా వద్దకొచ్చి నా చేతిలో ఏదో పెట్టాడు.

చండీ అమ్మవారి బంగారపు బొమ్మ. నా జేబులో ఉండాల్సింది.

దాన్ని తిరిగిచ్చేస్తూ ఉంచుకోమన్నట్లు సైగ చేశాను. నన్ను కాపాడినందుకు అంతకన్నా ఎలా కృతజ్ఞత తెలియజేయాలో తోచలేదు.

ఆదివాసీ తల అడ్డంగా ఊపి చాలాసేపు ఏదో గొణిగాడు. ఆస్ట్రోనాట్‌కేసి చూశాను. “ఏమంటున్నాడు?”

అతను నవ్వి చెప్పాడు.

“వాళ్లకు దానితో అవసరం లేదంటున్నాడు”

 ***

Story & Illustration: అనిల్ ఎస్. రాయల్

 

మరణ మజిలీ

541392_4595388722851_1575449086_n
కథ ఎప్పుడూ అలానే ఎందుకు రాయాలి.. ఇలా ఎందుకు రాయకూడదు అని ప్రశ్నించే మహా టెక్కు ఉన్న కథ ఇది. సరికొత్త ఫార్మెట్‌తో మన ముందుకు వచ్చిన వాసుదేవ్‌ అసలు పేరు శ్రీనివాస్‌. మొదటి కథ ‘అమ్మకానికో మనసు’ ఉదయం పత్రిక ఆదివారం అనుబంధంలో 1997లో ప్రచురితమైంది. ఇప్పటిదాక పది కథలు రాశారు. కవిగా కూడా గుర్తింపు పొందారు. ఈమధ్యే ఆయన కవిత్వానికి మెచ్చి “Poesiesonline” (ఫేస్‌బుక్‌లోని ఇంటర్నేషనల్‌ పోయిట్రీ గ్రూప్‌ ) అనే సంస్థ ‘అవుట్‌ స్టాండింగ్ పోయెట్‌ ఆఫ్‌ది ఇయర్‌ `2013’ అవార్డు ఇచ్చింది. సొంత ఊరు వైజాగ్‌. పదిహేడేళ్లపాటు విదేశాల్లో ఉండి వివిధ కాలేజిల్లో ఇంగ్లీష్‌ బోధించారు. ప్రస్తుతం ఇండియా వచ్చేసి బెంగుళూరులో ఉంటున్నారు.   –వేంపల్లె షరీఫ్ 
***

జరిగిన కథ

సాహితీ లోకంలొ చీకటి కోణాలకి విలువెక్కువె.  రైటర్ ఫిక్సింగ్ లూ, స్టోరీ ఎరేంజ్‌‌మెంట్లకీ తెలుగు సాహిత్యం  మినహాయింపుకాదన్నది నిఖార్సయిన నిజం. పాఠకులకి తెలియనివీ, తెలిస్తె అబ్బురపర్చేవీ చాలానే ఉంటాయి… ఓటమికీ, అనుభవానికీ ఉన్న అవినాభావసంబంధం తెలుగు కథలకీ పెద్ద సోర్స్. బహిరంగ రహస్యాలే  కొన్ని కథలకి పెద్ద వ్యాపారం. తెలుగుసాహితీ లోకంలో ప్రదీప్ ఇంతలా వెలిగిపోవటానికి ముందు అతనో ఘోస్ట్ రైటర్. రాఘవదాస్ అనే ఓ ప్రముఖ (?) రచయితకి రాస్తూ ఇద్దరూ సంపాదించేవారు. రాఘవదాస్ కున్న కాంటాక్ట్స్, ప్రదీప్ రచనా శక్తీ ఇద్దరు కల్సి విజయవంతంకావటంలో ఆశ్చర్యంలేదు. కానీ అలా ఎల్లకాలం జరగదు-జరిగితే అది జీవితం అవ్వదు.

జీవితానికి కథ అవసరంలేదు కాని కథకి జీవితమే సోర్స్.  రానూ రాను రాఘవదాస్ ప్రదీప్ కివ్వాల్సిన వాటా రెమ్యూనరెషన్ తగ్గించటం, అది సహజంగానే ప్రదీప్ కి నచ్చకపోవటం- ఇద్దరి మధ్యా అగాధానికి ఎక్కువకాలం పట్టలేదు. కలాన్నీ, కీబోర్డ్ ని నమ్ముకున్న ప్రదీప్ పరిస్థితి దయనీయంగా తయారయింది. అంతకుముందు తను రాసిన మరో ముగ్గురు రచయితలని కల్సి వివరించాడు. వాళ్ళు కొంతిచ్చారు. మళ్ళీ రాయమన్నారు. కొంతమంది పూర్తిగా రాఘవదాస్ కి రాయటం మానేస్తేనే మళ్ళీ బిజినెస్ మాట్లాడతామన్నారు. ఇప్పుడు రాత్రీ పగలు అందరికీ రాస్తున్నాడు. ఎవరేం అడిగితే అది…కథలకోసం శ్రమిస్తున్న  ప్రదీప్ జీవితంలో అప్పుడే ఓ అద్భుతం–తన కజిన్ ఇంద్రాణి రూపంలొ అతనికి అదృష్టం కలిసొచ్చింది.

ఇంద్రాణి– ఓ అద్భుతం ఈ ప్రపంచంలో! తన అందచందాలని ఎన్ని రకాలుగా ఈ ప్రపంచంలో వాడుకోవచ్చో ఆమెకి తెల్సినట్టుగా

పమేలా బోర్డెస్ కి కూడా తెలియదంటె ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ప్రదీప్ తన ఘోస్ట్ అవతారం చాలించి తనంతట తాను కథలు రాయడానికి ఇంద్రాణి మాత్రమే అతిపెద్ద ఉత్పత్తిస్థానం. రోజుకో కథ చెప్తుంది అతనికి.ఇంద్రాణి కథలకి సోర్సేంటో తెలుసుకోవాలనే కుతూహలం ఉండొచ్చు కానీ తొందరపాటు అనవసరం. ఇప్పుడు ప్రదీప్ ఓ ప్రముఖ రచయిత. డబ్బుతో కొనగలిగినవన్నీ ఉన్నాయతని దగ్గర. సమాజంలో అతనో సెలబ్రిటీ . తన చివరి “రచనని” ఓ సీరియల్ గా రాస్తున్నాడు. దీనికి “మరణమజిలీ” అని పేరుపెట్టుకున్నాడు. సిక్‌‌యూనిట్ గా తయారైన ఓ పత్రిక ఈ సీరియల్ తో బాగా పుంజుకుంది. పత్రికని మూసేద్దామనుకున్న తరుణంలొ ప్రదీప్ సీరియల్ ఓ మహాద్భుతాన్నే సృష్టించింది. దీనికి మరో ముఖ్యకారణం ఆ సీరియల్‌‌కి ట్యాగ్‌‌లైన్‌‌గా “యధార్ధ సంఘటనల ఆధారంగా” అని రాయటమే! ఇదే ప్రదీప్ ఆఖరి రచన అని ఆ పత్రిక నెలానెలా ప్రముఖంగా పచురించటం కొసమెరుపు…..ఇక చదవండి

 ’మరణమజిలీ’ సీరియల్ ప్రచురిస్తున్న పత్రికాఫీసునుంచి ఓ రోజు ప్రదీప్‌కి ఫోన్.

10.30కి పత్రికాఫీసుకి చేరుకున్నాడు ప్రదీప్.

చీఫ్ ఎడిటర్ రెడ్డిగారి ఛాంబర్‌లో సినిమా ప్రొడ్యూసర్ కోటేశ్వర్రావు కూడా ఉండడం కొంచెం ఆశ్చర్యమనిపించినా అతనితో ఉన్న పూర్వ పరిచయంతో ఇరువుర్ని విష్‌చేసి కూర్చున్నాడు ప్రదీప్.

“ప్రదీప్! నీ సీరియల్‌ని మన కోటేశ్వర్రావుగారు కొనుక్కుంటారటయ్యా, దాని గురించే మాట్లాడ్డానికే నిన్ను పిలిపించాం.” రెడ్డిగారి ఉపోద్ఘాతం.

“అవునయ్యా ప్రదీప్, నీ సీరియల్‌కి నువ్వెంత అడిగితే అంతిస్తానయ్యా, కానీ మన డీల్ కుదరటనికి ముందర నా ప్రశ్నలకి నీనుంచి సమాధానం కావాలి, నిజాయితీగా” కోటేశ్వర్రావు విషయానికొచ్చేశాడు.

“అడగండి” ప్రదీప్ నవ్వుతూనే ముక్తసరిగా జవాబిచ్చాడు. అతను ఏం అడగదల్చుకున్నాడో ప్రదీప్ ఊహించాడు. ఈ రోజుల్లో హిట్టయిన ప్రతీ సినిమా కథపై ఓ కాంట్రవర్శీ ఉంటోంది. ఫలానా సినిమా కథ నాదేనని, కాపీ కొట్టారని, నాకు తగిన నష్టపరిహారం ఇప్పించాలని కొంతమంది కోర్టులకెక్కటం, కొందరు మీడియా ముందుకు రావటం రొటీన్ అయ్యింది ఈ మధ్య. కోటేశ్వర్రావు కూడా ప్రొడ్యూసరె కాబట్టి రిస్క్ లేని విధంగా జాగ్రత్తపడుతున్నాడన్పించింది ప్రదీప్‌కి. అయితే తనూహించని ప్రశ్నలొచ్చాయి.

“ఏమయ్యా ప్రదీప్! నువ్వు ఇంతకు ముందు వేరే రచయితలకి రాసేవాడివని విన్నాను. అదేనయ్యా ఘోస్ట్‌రైటర్ ఉద్యోగం. నాకు ఎన్నాళ్ళనుంచో కొన్ని సందేహాలున్నాయి. అసలీ ఘోస్ట్‌రైటర్స్ ఎందుకుంటారు, వాళ్ళే రాయొచ్చుగా స్వంతంగా? ఎవరికో రాసిపెట్టి డబ్బులకోసం వాళ్ళని దేబిరించరటం, డబ్బు, పేరు మరెవరొ తీస్కోవటం, ఏంటిదంతా? సో ఇన్నాళ్ళకి నాకు సమాధానం చెప్పేమనిషి దొరికాడని ఆనందంగా ఉందయ్యా!”

ప్రదీప్ ఏం మాట్లాడలేదు. ఓ చిర్నవ్వు నవ్వి సాలోచనగా ఛీఫ్ ఎడిటర్ రెడ్డిగారివైపు చూశాడు. వెంటనే కోటేశ్వర్రావుకి ఏంచెయ్యాలో అర్ధమయింది. తన బ్రౌన్ కలర్ బ్రీఫ్‌కేసులోంచి ఓ చెక్‌బుక్ తీసి అందులోంచి ఓ లీఫ్ చింపి దానిపై సంతకం చేసి ప్రదీప్ ముందుకితోసి “” నీ నిశ్శబ్దం నాకర్ధమయిందయ్యా, ఇదిగో బ్లాంక్ చెక్.సీరియల్‌గా వస్తున్న నీ కథని నేను కొనుక్కుంటున్నా. ఎంత కావాలో దానిపై రాసుకో.”

ప్రదీప్ ఏం మాట్లాడకుండా చెక్ తీస్కుని జేబులో వేస్కున్నాడు.

  **ప్రదీప్ చెప్పిన కథలు**

 “హు! ఇప్పుడు చెప్పవయ్యా!” రెడ్డిగారు కొంచెం రిలాక్సయ్యారు కుర్చీలో వెనక్కి వాలుతూ.

“ఈ ప్రపంచంలో డబ్బెవరికి చేదు చెప్పండి. ఓ వ్యక్తి ఘోస్ట్ రైటర్‌గా తయారవ్వటానికి అన్నిటికన్న ప్రధానకారణం డబ్బే, ఆ తర్వాత చాలానే ఉన్నాయి కొంతమంది రాస్తారు కాని వాళ్ళ రచనలు పబ్లిష్ అవుతాయో, లేదోననే ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది. అలాంటివారు అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన రచయితలకి, రచయిత్రులకి రాసి పరీక్షించుకుంటారు. ఆ తర్వాత వారిచ్చే రెమ్యూనరేషన్‌తో సంతృప్తిపడిపోతూ వాళ్ళే నేరుగా ప్రయత్నించడమనే ఆలోచనే చెయ్యరు. మరికొందరికి వ్యక్తిగత ప్రచారం నచ్చదు. వాళ్ళ ఫోటోలు ఎక్కడా ప్రింట్ అవ్వటం కాని రేడియో, టీవీల్లో ఇంటర్వ్యూలకి కూడా ఇష్టపడరు. వారికి బ్రహ్మాండంగా రాసే స్కిల్ ఉంటుంది. వారు కూడా ఇలానే వేరే వారికి రాసి పెడ్తూంటారు. వీరికి కూడా డబ్బే ముఖ్యం.

ఇకపోతే కొంతమందికి భాషపై మంచి పట్టు ఉంటుంది.కథకి ప్లాట్ అంత సులభం కాదు వీళ్ళకి. కథల కోసం రకరకాలుగా ప్రయత్నించి వివిధ సొర్సస్ ద్వారా మంచి కథల్ని సంపాదించి వాటికి తమ భాషా పరిజ్ఞానాన్ని జోడించి వేరే వారికిస్తారు. ఒకటి, రెండు కథలు క్లిక్కయాక ఇంక మరి వేరే వాటికోసం ఆలోచించరు. రాస్తునే ఉంటారు,రాసి ఇస్తూనే ఉంటారు ఎవరడిగితే వాళ్ళకి, ఏది కావాలంటే అది.” ప్రదీప్ ఆగాడు.

“ఆ, ఇక్కడే నాకర్ధంకాని విషయం. అంత టాలెంట్ ఉన్నవ్యక్తి, ఆ టాలెంట్ ప్రూవ్ అయ్యాక అయినా స్వంతంగా రాసి మెత్తం రెమ్యూనరేషన్ తనే తీస్కోవచ్చుగా, పైగా సంఘంలో బోలెడంత పేరు, సన్మానాలు వగైరా…” కోటేశ్వర్రావు ఆ పాయింట్‌పై చాలా ఆసక్తి కన్పడుస్తున్నాడని ప్రదీప్‌కి అర్ధమయ్యింది.

“ఆ! మంచి పశ్న. ఒక్కసారి ఘోస్ట్ అవతారం చాలించి తనే స్వయంగా పబ్లిష్ చేసుకోవడంలో చాలా రిస్క్ ఉంది, కోటేశ్వర్రావుగారూ! అది అంత సులభంకాదు.మీకు తెలియందేముంది, కళా రంగంలో సెంటిమెంట్ పాత్ర చాలా ఎక్కువ. ఏ సినిమా ఎందుకన్నాళ్ళు ఆడుతుందో, ఓ మంచి సినిమా ఎందుకు ఫెయిలవుతుందో తెలీనట్లే ఏ రచన, ఏ రచయిత ఎందుకు పాప్యులర్ అవుతాడో, ఒక్కో రచయిత ఎందుకు వెలుగుచూడడో అర్ధంకాదు. అంతవరకూ ఘోస్ట్ రైటర్ గా ఉన్నవ్యక్తి, ఐమీన్ రచయిత వెళ్ళి నేను ఫలానా వాళ్ళందరికీ ఘోస్ట్ రైటర్‌గా రాస్తున్నాను, ఇక ఇప్పట్నుంచీ నేను నా పేరుమీదే రాస్తానంటే ఏ ఎడిటరూ ఆసక్తి చూపరు సరికదా మొదటి మోసం వచ్చే పరిస్థితి. పోనీ పోస్ట్‌లో పంపించి తన అదృష్టాన్ని పరీక్షుంచుకునే ఓపిక, టైమూ ఉండవు డబ్బు యావలో పడిపోయిన ఈ రచయితలకి. అదే మార్కెట్‌లో ఇప్పటికే పుంఖానుపుంఖాలుగా రాసేస్తున్న వారికివ్వటం, అవి వెంటనే పబ్లిష్ అవ్వటం, నెల రెండు నెలల్లోపే రెమ్యూనరేషన్ అందుకోవటం జరుగుతుంది.ఒక్కేసారి ఈ రచయితలు తమ ఘోస్ట్ లకి, కథ అందుకోగానే ఎంతోకొంత ఇవ్వటం కూడా పరిపాటి. ఇంకేం కావాలి చెప్పండి?” ప్రదీప్ ఆపాడు. రెడ్డిగారు, కోటేశ్వర్రావు అలా చేష్టలుడిగి అతని వాక్ప్రవాహాన్ని చూస్తూ వింటున్నారు.

“మీకు మరో విషయం, ఈ సో-కాల్డ్ ప్రముఖ రచయితల్లో స్త్రీలు, అంటే రచయిత్రులు ఎక్కువగా ఘోస్ట్‌లన్ని ఆశ్రయిస్తారు. కొంతమంది రచయిత్రులకి వారి భర్తే రాసి పెడతాదు లేదా నాలాంటి ఫేక్స్‌ని అరేంజ్‌చేస్తారు. ఇలాంటి రచయిత్రుల్లో కేవలం కథలు రాసేవారే కాదు “మీరడగండి–నేచెప్పేస్తా”, “మీరు ముడేయ్యండి–నే విప్పేస్తా” లాంటి శీర్షికలు నిర్వహించే వారుకూడా నా లాంటివారితో రాయిస్తారని మీకు తెలీదు. ఈ ప్రాక్టీస్ కేవలం తెలుగులోనే అనుకునేరు, తెలుగులో కంటే ఇది మన నార్త్‌లో ఇంగ్లీష్‌లో రాసే రచయితల్లో చాలా ఎక్కువ. సోషల్ సెలబ్రిటీస్‌గా చెలామణి అవుతున్న చాలా మంది ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలోని తెలివైన స్టూడెంట్స్‌కి డబ్బు ఎరచూపి వాళ్ళచేత ఆర్టికల్స్ రాయించి తమపేరు మీద పబ్లిష్ చేయించుకుంటారట. ఈ సెలబ్రిటీస్‌కి పబ్లిషర్స్‌తో మాంచి యాక్సెసబిలిటీ ఉంటుంది, ఇక మీకు చెప్పేదేముంది. మీకు మరోషాకింగ్ న్యూస్. ఇలా మనం ముగ్గురం చేరి ఆడాళ్ళ తెలివితేటల గురించి తక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరంలేదు. ఎందుకంటే ఘోస్ట్ రైటర్స్‌లో పురుషులకంటే స్త్రీల సంఖ్యే ఎక్కువ అంటె నమ్ముతారా?”

రెడ్డిగారేం మాట్లాడే స్థితిలో లేడు.

కోటేశ్వర్రావు తేరుకున్నాడు.  తెలివైనవాడు, బిజినెస్ తెల్సినవాడు.

“సరేనయ్యా ప్రదీప్ మా సినిమా వాళ్ళ కష్టాలు నీకు తెల్సుగా, ఓ సినిమా తియ్యటం ఎంత కష్టమో, ఆ కథని కొనడం, కొన్నాక కాపాడుకోవటం అంత కష్టంగానూ ఉంది. ఇప్పుడు నువు రాస్తున్న ఈ ’మరణమజిలీ’ పూర్తిగా నీ స్వంతమేకదా, ఏ ఇంగ్లీష్ నవలకి కాపీయో లేదా మరో రచయిత కథో కాదుకదా? నాకు పూర్తి వివరాలు కావాలయ్యా. నాకు నిజాలు కావాలి. అందుకే ఈ కథకి నీకెంత కావాలో తీస్కొమ్మని బ్లాంక్ చెక్కిచ్చాను.”

“వివరాలంటే?” ప్రదీప్ కావాలనే రెట్టించాడు.

“వివరాలంటే…నువు ఈ సీరియల్‌కి ట్యాగ్‌లైన్‌గా ’యధార్ధసంఘటనల ఆధారంగా’ అని పెట్టావుగా, ఏంటా సంఘటనలు? ఎక్కడ జరిగాయి? ఆ పాత్రల అసలు పేర్లేంటి, ఆ కథలు నీకెలా వచ్చాయి లాంటివన్నీ,”  కొంచెం స్లో చేశాడు కోటేశ్వర్రావు.

ప్రదీప్ జేబులోంచి చెక్ తీసి బల్లమీద పెట్టాడు.

“మీకు ఆ వివరాలన్ని చెప్తేనే కథ కొనుక్కుంటానంటే అమ్మడానికి, చెప్పడానికి నేను సిధ్ధంగా లేను, మీ చెక్ మీరు తీసేస్కోవచ్చు.” ప్రదీప్

“ప్రదీప్‌గారూ, మీరీ కథకి ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు?” చాలా కూల్‍గా కోటేశ్వార్రావు చెక్‌పై తన కుడిచేయి రెండువేళ్ళు వేసి చిన్నగా బీట్‌చేస్తూ అడిగాడు. ప్రదీప్ ని గారూ అని సంభోధించడం పూర్తి బిజినెస్ వ్యవహారం. దానికి ప్రదీప్ ఏం మాట్లాడలేదు. రెడ్డిగారు వైపు చూస్తున్నాడు తీక్షణంగా.

“అబ్బే మన ప్రదీప్ చిన్న చిన్న ప్రలోభాలకి లొంగడండి.” డీల్ ఇలా చెడిపోవడం ఇష్టంలేని రెడ్డిగారు అదోమాదిరి చూస్తున్నారిద్దరిని.

“ఐదు లక్షలు?” ప్రశ్నార్ధకంగా చూస్తున్నాడు కోటేశ్వర్రావు.

మనుషుల్ని, వారి టాలెంట్‌ని కొనడంలో సిధ్ధహస్తుడు కోటేశ్వర్రావు.

ప్రదీప్ ఏమ్ మాట్లాడలేదు. ఇంకా రెడ్డిగారి వైపే చూస్తున్నాడు.

“పది?” కోటేశ్వర్రావు చిర్నవ్వుతో రెట్టిస్తున్నాడు.

ప్రదీప్ అంతే సీరియస్‌గా ఉన్నాడు. కానీ కుర్చీలో కొంచెం అసహనంగా కదిలాడు.

తెలుగులో ప్రముఖ రచయిత అతడు. బాడీ లాంగ్వేజ్‌ అతనికి తెల్సినట్టుగా మరెవరికి తెలుస్తుంది.

“పదిహేను?”

విలువల వేలంపాట జరుతోంది ఆ ఛాంబర్‌లో.

“ఓ.కే. చివరి ఆఫర్. పదిహేడు లక్షలిస్తాను. ఇక నీఇష్టం!” చెక్‌పై చేతివేళ్ళు తీసేసాడు కోటేశ్వర్రావు.

“ఇరవై అభ్యంతరమా?” అంతవరకూ వచ్చాక తగ్గకూడదన్నది ప్రదీప్ బేరానికి బేస్.

బహుశా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అంత ఖరీదైన కథ మరొకటి లేదేమో!

కోటేశ్వర్రావు లొంగే ప్రసక్తే లేదు…ఊ అనడానికి ఎక్కువ టైమ్ తీస్కోడు.

“అంటే ఇరవై లక్షలకి నా కథలకి సోర్స్ ఏంటి, నేనెలా ఇన్ని కథలు రాయగలిగాను లాంటి వివరాలన్నీ మీకు చెప్తే నేనీ చెక్‍పై ఆ ఎమౌంట్‌ని రాసుకోవచ్చు కదా, కోటేశ్వర్రావుగారూ?” కన్ఫర్మ్ చేసుకున్నాడు ప్రదీప్.

“అవును”

“అయితే వినండి. రెడ్డిగారూ మీరు వినండి. వీలయితే నా ఈ కన్ఫెషన్స్‌ని కథలుగా మీ పత్రికలో   ప్రచురించుకోవచ్చు.”

“లేదు ప్రదీప్, నాకున్న  విలువల వల్లే నేనీ పత్రికని నడపలేని స్థితికొచ్చాను. అలాంటి పరిస్థితుల్లో నువ్వు రావడం, నీ సీరియల్ ఇంత క్లిక్ కావడం నాకింకా షాకింగ్‌గానే ఉంది. చెప్పు ప్రదీప్, అందరికీ ఘోస్ట్ రైటర్‌గా రాసే నీకు కథలందిచ్చే వ్యక్తి ఎవరు? ఘోస్ట్‌కి ఘోస్టా? నమ్మలేకున్నాను. చెప్పు ప్రదీప్!” రెడ్డి గారి మొహంలో ఉద్విగ్నత.

“నేను వేరేవాళ్ళకి రాసినవైనా, నాపేరు మీద రాసినవి అన్నీ నిజజీవితంలోని సంఘటనలే. నానుంచి ఎవరైనా కాపీ కొట్టారేమోగానీ, నేనెవరి కథలు కాపీ కొట్టాలేద్సార్. నమ్మితేనమ్మండి.”

“మరి ఈ మరణమజిలీకి ఇన్‌స్పిరేషన్ ఎవరు? ఆ ’ట్యాగ్‌లైన్’ కి అర్ధం ఏమిటి?” కోటేశ్వర్రావులో ఆనందం, ఆతృత కలిగలిపిన విభిన్న రియాక్షన్.

“అందులో ఓ క్యారక్టర్ నా కజినని, ఆమె జీవితాన్ని ఓ వంచకుడు నమ్మించి మోసంచేశాడని ఆ తర్వాత ఆమె జీవితాన్ని బాగుచేసే క్రమంలో నేను తెల్సుకున్న విషయాలని చెప్తే నమ్ముతారా?” కొంచెం స్లో చేసి ప్రదీప్ ఇద్దరినీ మార్చి చూశాడు.

టేబుల్ పైనున్న గ్లాసులోనున్న నీళ్ళన్నీ ఒకె గుక్కలో తాగేశాడు ప్రదీప్.

“చెప్పు ప్రదీప్, నువ్వేం చెప్పినా నమ్ముతాము.”

ప్రదీప్ చెప్పడం ప్రారంభించాడు.

 ** ఇంద్రాణి చెప్పిన కథలు **

ఇంద్రాణి.

ఆమె అందం గురించి చెప్పుకోకుండా ఇంకేం చెప్పుకున్నా ఇక్కడ అప్రస్తుతమే. ఇంద్రాణి ఓ అద్భుతం ఈ ప్రపంచంలో! అందం ఇలా పుట్టిందెందుకా అని ఆలోచించకమానరు ఆడాళ్ళందరూ..వాళ్ళకర్ధంకాని విషయం ఒకటే. అందాన్ని ఎలా ప్రొజెక్ట్ చెయ్యాలా అన్నది. కామాంధుడి నుంచి మునీశ్వరుడి వరకూ ఓసారి నఖశిఖపర్యంతం చూసికానీ తలతిప్పుకోలేని అందం ఆమెది. మంచి ఫిగర్‌కి, ఫిజిక్‌కి తేడా ఏంటని ఆలోచొంచేవాళ్ళని ఇంద్రాణి ఓ సమస్యే.  కాలేజీ రోజుల్లో ఆమె అందాన్ని వర్ణించడానికి కుర్రాళ్ళు నిఘంటువులు తిరగేసేవారని, శ్రీనాథుడు మళ్ళీ పుడితే ఇంద్రాణినే చూస్తే తన కావ్యాలని తిరగరాసేవాడని ప్రబంధనాయిక నిర్వచనాన్ని పూర్తిగా మార్చేసి ఒకే పదం వాడేవాడని అదే “ఇంద్రాణి” అని కొంతమంది కుర్రాళ్ళు ఆమెకి రాసిన ప్రేమలేఖల్లో పేర్కొనేవారు.

తేనె రంగు మేనిఛాయతో తేనెలూరే పౌటింగ్ పెదవులతో ఏ వయసువాళ్ళనైనా వివశుల్ని చేసి ’ఏంమాయచేశావే’ అని అన్పించే అందం ఆమెది. ప్రదీప్‌కి కజిన్ బంధుత్వం ఇంద్రాణి. అతనితో మంచి స్నేహితుడిగా ఉంటూ తన ’చెప్పు చేతల్లో’ పెట్టుకుంది. ఆమెకి మరో ప్లస్‌పాయింట్ ఆమె తెలివి తేటలు. అందం, తెలివితేటలు పోటిపడుతుంటాయి ఆమెలో. ప్రదీప్‌కి ఇంద్రాణి అంటె పిచ్చిగాని, అమెకి ప్రదీప్ ఓ మగాడు మాత్రమె. తన అదుపాజ్ఞల్లో ఉండే మగాడు. నిజానికి ప్రదీప్‌నుంచే మగాళ్ళని స్టడీ చెయ్యటం ప్రారంభించింది ఇంద్రాణి. ఆమె అందాన్ని, తెలివితేటల్ని, చురుకుదనాన్ని చూసి ఆమెకి దగ్గరవ్వాలని చాలా మందే ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇంద్రాణి తన మెదడుకి పదునుపెట్టి ఎవర్ని నొప్పించక తెలివిగా అందర్నీ దూరంగానే ఉంచగల్గింది. అప్పటికీ ఆమె మనిషి బలహీనతలపై ఓ అవగాహన ఏర్పరుచుకుంది.

తన తెలువితేటల గురించి అప్పుడప్పుడు యుఫోరిక్ అయినా, తన స్త్రీ సహజమైన మెచ్యూరిటీతో మగాళ్ళని బాగానే హ్యండిల్ చేసేది.

అందం,తెలివితేటలు సమానంగా ఉన్న అమ్మాయిల పారామీటర్స్ ఎప్పుడూ మారుతుంటాయి. ముఖ్యంగా అబ్బాయిల విషయంలో.

తెలివైన ప్రతి అమ్మాయి, తనకంటే తెలివైన మగాణ్ణే కోరుకుంటారనడం తప్పుకాదు.

ఇంద్రాణి చేసింది కూడా అదే. మంచిగా అమాయకంగా ఉన్నచాలా మంది అబ్బాయిలందర్నీ దూరంగా నెట్టి రఘునెంచుకుంది. చాలా మంది తెలివైన అమ్మాయిలందరూ ఇలానే చేస్తారనడం అతిశయోక్తి కాదేమో.

ఇంద్రాణిని చాలా తెలివిగా డీల్ చేసాడు రఘు.

రఘు పరిచయం అయిన మొదటిక్షణంనుంచీ ఇంద్రాణి తనకి తెలియకుండానే అతనికి దగ్గరయింది.త్వరగానే సాన్నిహిత్యం పెరిగింది. రఘు మంచివాడే కానీ మంచితనాన్ని అతని తెలివితేటలు డామినేట్‌చేసి ఓ విలక్షణమైన వ్యక్తిత్వం పెంచుకున్నాడు. అదే అతనికి వరం, ఇంద్రాణికి శాపంగా పరిణమించింది తర్వాత. ఇంద్రాణిని బాగా ఇంప్రెస్ చెయ్యగలిగాడు రఘు.ఆమెని ఓ విధమైన మెస్మరిజం లోకి నెట్టేశాడు. ఫలితంగా రఘు అనుకున్నదానికంటే ముందుగానే ఇంద్రాణితో పెళ్ళయిపోయింది.

పెళ్ళయిన రెండు, మూడేళ్ళు చాలా మంది ప్రేమజంటల్లానే మేడ్‌ఫర్ ఈచ్ అదర్ లా జీవితాన్ని జుర్రుకున్నారు. ఒకరి తప్పుని మరొకరు క్షమించేసుకున్నారు.!

 జీవితంలో ఎదుగుతానంటూ ఉన్న ఉద్యోగం మానేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటానన్నాడు రఘు. రియల్ ఎస్టేట్, చిట్స్ రన్ చెయ్యటం లాంటివి ప్రయత్నించాడు. అన్నీ ఫెయిలయ్యాయి. అదృష్టం కల్సిరాలేదన్నాడు. మరో ప్రయత్నంగా మిడిల్ ఈస్ట్‌కి, గల్ఫ్‌కి లేబర్ కార్మికులని పంపించే వ్యాపారం మొదలెట్టాడు. దాదాపు రెండేళ్ళు నిజాయితీగానే చేశాడు. ఇంద్రాణి కూడా రఘు బిజినెస్‌లో చేదోడువాదోడుగా ఉంటూ తన పాత్రని సమర్ధవంతంగా పోషించింది. తన మాటకారితనాన్ని తన వంతు పెట్టుబడిగా వ్యవహారాన్ని బాగా చక్కబెట్టే సమయంలో ఆఫీస్ విషయాలు కొన్ని తెల్సుకుంది. ఎవరెవరు వస్తున్నారు, ఎంతిస్తున్నారు లాంటివన్నీ…..

సరిగ్గా ఈ సమయంలో ఓ అనుకోని సంఘటన…..

ఒమాన్ రాజధాని మస్కట్‌కి లేబర్ కాంట్రాక్ట్ కోసస్ం వెళ్ళిన రఘు మరి రాలేదు. ఫోన్ కాల్స్ లేవు, మెయిల్స్ లేవు. పోలీస్ కంప్లయింట్‌తో ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. ఇంద్రాణి తను చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేసింది.

రఘు ఏమయ్యాడనేది ఓ మిలియన్ డాలర్ ప్రశ్న ఎందుకంటే ఇప్పుడామె దాదాపు కోటిరూపాయల అప్పులో కూరుకుపోయింది. తమకి ఉద్యోగమైనా ఇప్పించమని లేదా డబ్బైనా వాపస్ ఇవ్వమని ప్రెజర్ మొదలయ్యింది జనాలనుంచి. అయితే ఇందులో చాలా మంది అసలు డబ్బు కట్టకుండానే, రఘు పారిపోయిన సంగతి తెల్సుకుని ఇంద్రాణిని వేధించటం మొదలుపెట్టారు.

జీవితంలో మొదటిసారిగా ఓడిపోయింది తెలివైన, అందమైన ఇంద్రాణి.

ఆత్మహత్య కూడా పరిష్కారం కాదు. తను హఠాత్తుగా చనిపోతే ఈ ప్రజలు ప్రదీప్‌ని వేధిస్తారు. అలా జరగడం తనకిష్టం లేదు. ప్రదీప్ అంటె ఇష్టం ఆమె చేత మరో పరిష్కారం ఆలోచింపజేసింది.

మరో మార్గం లేదు……ఎంత ఆలోచించినా ఇదొక్కటే పరిష్కారం.

తన అందమే పెట్టుబడిగా కొత్త బిజినెస్ ప్రారంభించింది. చెప్పిన వాళ్ళకి చెప్పినట్లుగా వారి సొమ్ము వాపస్ చేసింది– క్యాష్ ఆర్ కైండ్! ఏదో విధంగా బయటపదింది. ఆరు నెలలకే తను పూర్తిగా బయటపడిపోయింది. కాని తన వ్యాపకం మారలేదు, మానలేదు. “అభిమానుల”ని తగ్గించుకుని రాబడి పెంచుకుంది. సంఘంలో ఓ సుస్థిర స్థానం– ఎలీట్ సోషల్ వర్కర్ గా… చాలా మందితో పరిచయం. వాళ్ళలో రాజకీయ నాయకులు, పోలీస్ శాఖ నుండే కాక ఆఖరికి జ్యుడీషియరీ నుండి ఎందరెందరో ఇంద్రాణి ’కంపెనీ’ కోసం క్యూ కట్టే వారు.

రఘు మోసంతో ఇంద్రాణికి మగాళ్ళమీద, సమాజంమీద నమ్మకం, గౌరవం పోయింది. తన దగ్గర కొచ్చే వాళ్ళకి తన అందంతో హిప్నాటిక్ సజెషన్స్ ఇస్తూ వాళ్ళ జీవితాల్లోని అన్ని కోణాల్ని స్పృశించేది. వాళ్ళు ఓ రకమైన అచేతనావస్థలో ఉండగా వాళ్ళ కథలన్నీ వినేది. ఒక్కోసారి వాళ్ళకి తెలీకుండా వాయిస్ రికార్డర్‌లో రికార్డ్ చేసి అవన్నీ ప్రదీప్‌కి విన్పించేది. తను విన్న ప్రతీ కథని తప్పకుండా ప్రదీప్‌తో షేర్ చేసుకునేది. ఇలా అందరినుంచీ కథలు రాబట్టడం ఆమెకి చిన్నప్పట్నుంచీ హాబీ. అదే ఇప్పుడు ప్రదీప్‌కి ఓ అక్షయపాత్ర.

……..ముగింపు వచ్చే వారంలోనే!

అని లేచాడు ప్రదీప్.

“అదేంటయ్యా అలా మధ్యలో ఆపేసి వెళ్ళిపోతున్నావు?” రెడ్డిగారు, కోటేశ్వర్రావు ఒకేసారి అరిచినంత పనిచేశారు.

“ఇంకేం లేదండీ చెప్పడానికి, నా ఈ సీరియల్‌కి మీరు ’ముగింపు వచ్చే సంచికలోనే’ అని ప్రకటించేయండి” కూల్‌గా ఓ సారి తన జేబులోని చెక్ ని చెక్ చేసుకుని ఛాంబర్‍లోచి బయటకొచ్చేశాడు ప్రదీప్.

* * *
పత్రికాఫీస్ నుంచి బయట తన కారు దగ్గరికి చేరేసరికి ప్రదీప్ సెల్ మోగింది.

“ఆ, సర్! మీరు వెంటనే కొలంబియా హాస్పిటల్‌కి రావాలి, ఇంద్రాణి పరిస్థితి సీరియస్” తన మేనేజర్ కృష్ణారావు గొంతులో ఆందోళన.

ప్రదీప్ వెళ్ళేసరికి ఇంద్రాణి నిస్త్రాణంగా ఉంది మంచంపై. ఇంతవరకు అందరికీ మత్తిచ్చిన ఇంద్రాణి శరీరంలోకి ఏవేవో గొట్టాలు ద్వారా మందిస్తున్నారు.

“రారా ప్రదీప్ నీకు చివరగా ఓ కథ చెప్పాలని” చాలా ఆయాసపడుతోంది ఇంద్రాణి. చావుతో పోరాడుతూ….

దురదృష్టవశాత్తూ మరణానికి లంచం లేదు. కనీసం ఏ ప్రలోభాలకి లొంగదు. లేదంటే మరణశాసనాన్ని కూడా తన అందంతో తిరగరాయించేది ఇంద్రాణి.

కానీ ఇప్పటి ఇంద్రాణి పరిస్థితి వేరు. అందర్నీ తన కనుసన్నలతో ఆజ్ఞాపించే ఇంద్రాణిని, మరణం ఇప్పుడు తన గుపిట్లో ఉంచుకుని తన ప్రభావాన్ని చాటుతోంది.

“ప్రదీప్ నీకు సినిమా ప్రొడ్యూసర్ కోటేశ్వర్రావ్ తెల్సా? పేరెప్పుడైనా విన్నావా?” ఇంద్రాణి ప్రదీప్ జవాబు కోసం నిరీక్షించకుండా చెప్పుకు పోతోంది.

“ఆ కోటేశ్వర్రావు నాకు దగ్గరవ్వటం కోసం తన భార్యని ఎలా చంపిందీ, కేసవ్వకుండా అది ’బోన్ క్యాన్సర్’ గా ఎలా చిత్రీకరీంచాడో చెప్పాడు. ఆ కథంతా వాయిస్ రికార్డర్ లో రికార్డ్ చేశాను. తర్వాత విను. కానీ నా చావుకి మాత్రం కారణాలడగొద్దు. ఈ విషయం నాతోనే సమాధి కానీ…” తర్వాత ఇంద్రాణి కథలు చెప్పడానికి వేరే లోకానికి వెళ్ళిపోయింది.

ఇంద్రాణి మరణం ప్రదీప్‌ని  చాలా కలచివేసింది. నెమ్మదిగా ఆమె ఎలా చనిపోయిందో కారణాలు వెతకడానికి ప్రయత్నించాడు. పుర్తి వివరాలు సంపాదించలేకపోయినా చాలా వరకూ ఇంద్రాణి మరణానికి కోటేశ్వర్రవే కారణమని తెల్సుకున్నాడు.

వారం రోజుల తర్వాత తనకి కోటేశ్వర్రావు ఇచ్చిన చెక్‍ని చింపేసి తను రాస్తున్న సీరియల్ ’మరణమజిలీ’ కి ముగింపు రాయటనికి ఉపక్రమించాడు ప్రదీప్.

ఇంద్రాణి  తన చివరి మజిలీ పూర్తి చేసింది….

 

శిశిరానంతర వేళ ..!

DSC_1454 

మంచి కథలకు హామీ ఇస్తున్న కొత్త రచయిత్రి సాయి పద్మ. లేటుగా రాయడం మొదలుపెట్టినా లేటెస్టుగా రాస్తున్న రచయిత్రి కూడా. మార్చి 10, 1972లో పుట్టారు. విజయనగరం జిల్లాలోని గజపతినగరం సొంత ప్రాంతం. సామాజిక కార్యకర్తగా చరుగ్గా పనిచేస్తున్నారు. ఆదివాసీ, గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు నడుపుతున్నారు. భర్త ప్రజ్ఞానంద్‌తో కలసి వికలాంగులు, వృద్ధుల కోసం గ్లోబల్‌ఎయిడ్‌ అనే సంస్థ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. ఇప్పటి వరకు మూడు కథలు రాశారు. మొదటి కథ ‘వైదేహీ మైధిలీయం’ ఈ ఏడాదిలోనే ‘కౌముది’లో ప్రచురితమైంది. రెండో కథ ‘రంగం పిన్ని ఆకాశం’ నాట్స్‌ బహుమతి పొందింది. మూడో కథ ఇదిగో -ఇప్పుడు ఇక్కడ ఇలా ప్రచురితమైంది. గొప్ప ప్రామిసింగ్‌ రైటర్‌గా సాయిపద్మ ఎదుగుతోందనడానికి ఈ కథ ప్రత్యక్ష ఉదాహరణ.—వేంపల్లె షరీఫ్

***

మా సుందరం ఉన్నాడే , ఒకలాంటి వాడు కాడు. రెండు గంటల నుండీ వాడి కోసం వెయిట్ చేస్తున్నానా … వస్తాడు, తీయగా ఒక నవ్వు నవ్వి ఏదో లాజికల్ గా చెప్తాడు. నేనప్పుడు చల్ల బడి పోతాను. సుందరం గొప్పవాడు అనటంలో సందేహం లేదు . పోలియో చిన్నప్పుడే సోకింది సుందరాన్ని. ఒక కాలు ఈడ్చుకుంటూ నడుస్తాడు, వీలైనంత తన నడకని కవర్ చేస్తాడు కూడా. “ఒరే సత్తిగా .. మనం కాళ్ళీడ్చినా.. మన బ్రతుకు ఈడ్చినట్టు ఉండకుండా చూసుకోవాలిరా ..!!” అంటాడు .. ఆ సమయంలో నిజం చెప్పాలంటే వాడు నాకు గీతాచార్యుడే.

సుందరం తండ్రి చిన్నప్పుడే తాగి తాగి పోయాడు. –“పేరుకి పెద్ద బేమ్మర్ల కుటుంబమే గానీ , ఎవరూ ఏ కాపర్సూ విదల్చలేదోయ్” అంటాడు వాడు నవ్వుతూ..! వీడ్ని పెంచటానికి వీళ్ళమ్మ …సోమిదేవమ్మ పడని కష్టం లేదు . చాలా మంది ఇళ్ళల్లో వంట చేసింది . గుళ్ళో ప్రసాదాలు తినేవాళ్ళు తల్లీ కొడుకూ చాలా సార్లు. కానీ, కొడుకు చదువు ఎక్కడా ఆగనివ్వలేదు. వాడికి కావలసిన జోళ్ళ కోసం , ఒక డాక్టర్ గారి ఇంటిలో పనికి వొప్పుకొని, చేయించింది.  మా సుందరం గాడు కూడా , ఒక్క సంవత్సరం కూడా ఫెయిల్ కాకుండా చకా చకా చదివేశాడు. ఉద్యోగం కూడా అలాగే, మేము ఇంకా పైకి, పైపైకి చదవాలా, ఏం చేయాలి అన్నప్పుడు .. అప్పుడే సిటీ అవుతున్న మా వూళ్ళో వేళ్ళూనుకుంటున్న ప్రభుత్వ రంగ సంస్థ లో ఉద్యోగం సంపాదించాడు. వికలాంగ కోటాలో ఉద్యోగం వచ్చినా , ఎప్పుడూ రిలాక్స్ కాలేదు. ” అమ్మ చాలా కష్టపడిందిరా .. నా బ్రతుకు పరుగు తీయాలని .. తను నిమిషం, నిమిషం కాలం ఈడ్చింది ..” అనేవాడు. వాడి తెలివితేటలకి అక్కడ మనుషులు వాళ్ళ అవసరాలూ, బలహీనతలూ కూడా దాసోహం అన్నాయి సహజంగానే . కొంచంగా మొదలై వాడి ప్రస్థానం అంచెలంచలుగా ఎదిగింది. తల్లి చేత పని మాన్పించేసాడు. మా సుందరం గొప్పవాడు కాడు అంటే అందుకే వొప్పుకోను నేను .

అదిగో వస్తున్నాడు .. కాళ్ళీడ్చుకుంటూ ..ఉత్సాహంగా .. గట్టిగా అడుగుదాం అని డిసైడ్ అయ్యా నేను ..” ఏరా.. రెండు గంటల నుండీ వెయిటింగ్ ఇక్కడ .. మళ్ళీ అక్కడికేనా ??’- వాడి మొహంలో ఇరవై ఏడేళ్ళ యవ్వనపు గర్వపు అతిశయం .. ” అవునోయ్ మై డియర్ సత్తీ ..: చెప్పాడు వాడు. ఎన్నో తీరని కాంక్షలని తీరాలని దాటించి , సగర్వంగా ఉన్న వాడి మొహం చూస్తే .. గట్టిగా అడగాలని అనిపించలేదు నాకు. మెత్తపడుతూ.. ” అలా  తరచుగా అలాంటి చోటుకి వెళ్ళటం .. మంచిది కాదేమోరా .. ఆలోచించు ”

ఒక నిమిషం ఆగి చెప్పాడు వాడు – ” నిజమేరా… కానీ కరుణ అలాంటిది కాదు.. నాకు మంచి .. ” వాడింకా ఏదో చెప్పబోయేంతలో , నాకు ఒక అసహనం ముంచుకొచ్చింది.. ” సాని దాని దగ్గర నువ్వు సంసారం ఎలా చేయాలో తెలుసుకోనక్కరలేదురా వొరేయ్ .. అలాంటి కబుర్లు చెప్పకు .. పెళ్లి చేసుకుంటావు కదా .. ఈలోగా .. ఇవన్నీ అవసరమా .. ఏదన్నా జబ్బు లాంటిదేదన్నా తగులుకుంటే .. చావాలి మళ్ళీ.. ఆలోచించు .. కాదు అసలింక అక్కడికెళ్ళటం మానేయ్ ..!” తిరుగులేనట్టు చెప్పాను నేను.. ఎన్ని వాదించినా , నా మాట , అపేక్ష, ప్రేమ అంటే వాడికి గురి అని నాకు తెలుసు .. !!

” కానీ కరుణ కి .. అలాంటి జబ్బులు లేవురా .. !!” ఇంకా ఏదో చెప్పాలనుకున్న వాడి ఉత్సాహానికి నా చూపు ఆనకట్ట వేసింది .

” అవన్నీ అనవసరం అబ్బాయి…. ఓకే.. మీ అమ్మ చూసిన సంబంధాలలో పెద్దింటి అమ్మాయిలకి నీ ఉద్యోగం నచ్చింది , కానీ నీ అవిటితనం నచ్చలేదు .ఇప్పటికి రెండు సంబంధాలు అదే కారణం మీద తప్పిపోయాయి అని నువ్వే చెప్పావు .  పెళ్లి, కుటుంబం అవసరం ఉన్న ఒక అనాధని తెచ్చి పెళ్లి చేసుకో .. నిజానికి అంత ఉద్యోగం చేస్తున్నావు ..ఎవరికి ఏం కావాలో క్షణాల మీద ఎరేంజ్ చేస్తావు.. వాళ్లకి కావలసింది ఇచ్చి , నీకు కావలసినవి నువ్వు తీసుకోలేవూ .. మనం అనాధ శరణాలయానికి వెళ్తున్నాం .. అక్కడ ఒక పిల్లని సెలక్ట్ చేస్తున్నాం ” మళ్ళీ నా మాట అనబడే బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాను.

రెండు నెలలలో మా వల్లంపాటి సోమ సుందరం పెళ్లి ప్రసన్న కేర్ అఫ్ అనాధ శరణాలయం తో జరిగిపోయింది. మా సుందరం సెటిల్ అయ్యాడు మొత్తానికి.

***

 సుందరం గారి కోసం వెయిట్ చేయాలంటే విసుగ్గా ఉంటుంది. నిజానికి నాకైతే సుందరం గాడు అనాలనిపిస్తోంది అనుకోండి. అలా అనకూడదు, అనాధ శరణాలయపు అమ్మాయిని నన్ను ఎంచుకొని,దయతో తాళి కట్టాడు కదా నాకు.. ఆ… కట్టేడు లెద్దూ , గట్టిగా రెండు తులాల తాడు కూడా చేయించలేదు . ప్రసన్న సున్నితం, సున్నితం అనుకుంటూ , తల్లీ కొడుకూ ఎలాగైతేనేం , తులం బంగారంతో కానిచ్చేసారు. సర్లే , చేసుకున్నాక అంతా నాదే కదా అని ఊరుకున్నా.. !

అదిగో సుందరం గాడు వస్తూనే ఉన్నాడు.. కుంటుకుంటూ .. అదే నచ్చదు నాకు. మా ఆశ్రమంలో ఉన్న కుంటోడు రాజు గుర్తొస్తాడు. నేను తెల్లగా ఉన్నానని ఒకటే లైన్ వేసేవాడు. జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలిందని .. వాడ్ని చేసుకుంటే నాకేం వస్తుంది ?? కొంచం మర్యాదగా , చాలా నిర్మొహమాటంగానే వాడికి చెప్పాను ఆ మాట .. వింటేనా … మా శరణాలయం మాస్టారితో కూడా మాట్లాడాడు . ఈ కుంటోడికి ఏం చూసుకొని ఇంత గర్వం? నాలాంటి అందగత్తెకి ఇలాంటి వాళ్ళు ఎలా సరిపోతారని అనుకుంటారో అర్ధం కాదు. మాస్టారికి అదే చెప్పాను . సార్… నాకున్నది అందం ఒక్కటే, నేను ఇలా ఇక్కడే ఉండి, ఇక్కడే పెళ్లి చేసుకొని ఉండాలని లేదు. నాకు నా అందం ఇచ్చే ప్రతీ సౌకర్యం కావాలి… అని చెప్పేసాను . చాలా వింతగా చూసాడు ఆయన. చూస్తే చూడనీ .. రాజు గాడి బెడద నాకు వదిలించారు మరి వాడికి ఏం చెప్పారో ..! అదే మాస్టారు ముభావంగా చెప్పారు-“ ఇదిగో ప్రసన్నా, ఆ అబ్బాయి నిన్ను ఇష్టపడ్డాడు. నీ కలలో కూడా నువ్వు ఊహించని ఉద్యోగం, డబ్బు ఉన్నవాడు. మరి ఈ సారికి నీ లెక్కలతో ఎక్కువ నాన్చకుండా ఏదో ఒకటి తేల్చుకో, కానీ ఒకటే చెప్పగలను , అదృష్టం అందమైన శరీరాలలో లేదు , అందమైన మనస్సులో ఉంటుంది .. ఫలితం నువ్వు ఎంచుకున్నదాన్ని బట్టే ఉంటుంది. “- అంటూ ఇలా చాలా సేపు చెప్పారు. ఏదో ఒకటి, ఇక్కడ నుండి వెళ్ళచ్చు. అయినా మనసు, ప్రేమ అనుకుంటూ కూర్చుంటే , జీవితం, యవ్వనం, ఐసు పుల్లలా కరిగిపోతాయి, తర్వాత మొహం చూసే వాళ్ళు ఉండరు. సరే అన్నాను పెళ్ళికి. రాజు గాడికి ఈ విషయం తెలీకుండా  ఉంటే బాగుండును. లేకపోతే వాడ్ని కాదని ఇంకో కుంటి వాడ్ని చేసుకున్నానని వెటకారం చేసేవాడు.

” ప్రసూ.. ప్రసూ ” అంటూ వచ్చాడు సుందరం. సరిగ్గా నడవటం రానివాడికి పిలవటం ఏం వస్తుందిలే .. బలవంతాన నవ్వు పులుముకున్నా. మనం ఏది వద్దు అనుకుంటే అదే వెంట పడుతుంది ఎందుకో .. ఈ కుంటితనం నాకెంత అసహ్యమో , అదే తాళి అయి గుండెల మీద వేళ్ళాడటం కంటే జీవితంలో విచిత్రం ఉండదు .

” నేను లేనని దిగులుగా ఉందా ?” అడిగాడు సుందరం . నామొహం .. ఇంత త్వరగా వచ్చేసావేంటి? అనుకున్నా- అంటే ఇంకేమన్నా ఉందా .. ఇతన్ని వంచాల్సింది, మంచం దగ్గరే , కంచం దగ్గర మన పప్పులు ఉడకవు – అనుకుంటూ తల దించుకున్నా. ఇంత సిగ్గరి అయిన పెళ్ళాం దొరకడం అదృష్టం కదూ .. మావవుడికి, ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు.

పెళ్లి అయి సంవత్సరం అయింది . మొదటి రాత్రి పూర్తిగా సుందరం ఫెయిల్, అతన్ని నేను పాస్ అవనీలేదు. అతను నన్ను పూర్తిగా లొంగదీసుకున్నానని అనుకుంటే , అతని ఆధిపత్యం మొదలవుతుంది. దానికే ప్రేమ అని పేరు పెడతాడు. సుందరం తెలివైన మంచివాడు. అతని తెలివితేటల్ని, లాజిక్ ని పక్కన పెట్టేలా చేసి  .. మంచితనాన్ని, ఒక బలహీనతగా వాడుకోవాలి . అతని బలహీనతలు- తనలోని కామం, కోరిక , నన్ను ఇష్టపడటం. జీవితం సులభంగా దొరకదు అంటాడు సుందరం . మరి నాకు .. చాలీ చాలని ఆశ్రమజీవితం, వదిలేసిన బట్టలు, వాడేసి పేజీలు నలిపేసిన పుస్తకాలూ, నాకు మాత్రం ఈజీ గా దొరికిందా జీవితం ?

సుందరానికి శారీరక సుఖం అంటే ఇష్టం. అతనిలోని ప్రేమ ఉధృతి నాకు కూడా ఇష్టమే. కానీ , రెండు విషయాలు చికాకు పెడతాయి. అతని అవిటితనం, రెండోది నా అందానికి ఏ మాత్రం తగని అతను నన్ను అనుభవిస్తుంటే, నాకు దొరికిందేమిటి? నా లాభం ఏమిటి ? అనే ప్రశ్న నన్ను ఇబ్బంది పెడుతుంది. కావలసినంత డబ్బు ఇవ్వడు. ఇష్టం వచ్చినవి అన్నీ కొనుక్కోటానికి ఉండదు. దేవుడి దయ వల్ల మా అత్తగారు ఆమె ఉన్న వూరు వదిలి రాదు కాబట్టి , మేమిద్దరమే . ఏం చేసినా – ఈ మొదటి సంవత్సరాల లోనే చేయాలి . ఆశ్రమం లో చూడలేదూ.. అందం తగ్గిందని , నాగలక్ష్మి ని మళ్ళీ వాళ్ళాయన వదిలేస్తే , మళ్ళీ అక్కడే డేకురుతోంది అందరికీ వండి పెట్టుకుంటూ..!!

మొదటి రాత్రి అతనికి నేను సహకరించలేదు. తెలీక కాదు, పూర్తిగా తెలిసే…. ఒకళ్ళ బలహీనత ఎత్తి చూపటం ఎంత సేపు ..? మర్నాడు చాలా బాధ పడ్డాడు. సిగ్గు విడిచి తనకో వేశ్య తో పరిచయం ఉందని , అక్కడ ఆమెతో చాలా సుఖపడ్డానని , నేర్చుకున్నానని చెప్పాడు. దొరికావు గురూ అనుకున్నాను .. ఏడిచాను . బ్రతిమాలాడు. ఇంకెప్పుడూ పోను అని చెప్పాడు . ఏ ఉద్యోగం చేసినా, కింద తరగతి నుండి మధ్య తరగతికి ప్రమోట్ అయిన  మగవాడి ఆయువుపట్టు పరువు.  అనాధ పిల్లని తెచ్చి పెళ్లి చేసుకున్నా , వదిలేసింది అనే పేరు వస్తే సుందరం తట్టుకోలేడు అని నాకు తెలుసు. అందుకే బెట్టుగా కానిస్తున్నా సంసారం. డబ్బు ఇచ్చే సుఖం ముందు సుందరం ఇచ్చే సుఖం .. అతని కామన , కోరిక నాకు గుదిబండ లా తయారయాయి. ఆలోచిస్తుంటే, ఆరు నెలల క్రితం అతని కోరికని నాకు లాభంగా ఎలా మార్చుకోవాలో తట్టింది. ఏమీ లేదు.. సింపుల్ గా రేట్ పెట్టా అంతే .. ! ఈ ఆరు నెలల సంపాదన … రెండు లక్షలు , మూడు తులాల బంగారం . నా పేరిట ఒక డెభ్భై వేల ఫిక్స్డ్ డిపాజిట్. బాగుంది కదూ .. ! దీన్ని బట్టి సుందరం కోరిక తీవ్రత, అతని ప్రేమ అర్ధం చేసుకోండి. అన్నీ ప్రేమగానే మంచం దగ్గరే అడిగాను అనుకోండి.

బంగారు గుడ్లు పెట్టె బాతుని కోసుకొని తిన్నా కూడా మంచిదే . అది సరిగ్గా వర్క్ అవుట్ అయితే ..!!

అందుకే సుందరం విడాకులు అడగగానే మొదట ఆశ్చర్యం, తర్వాత ఆనందం వెల్లువలా వచ్చాయి. పడుకోడానికే మూల్యం చెల్లించినపుడు విడిపోడానికి … మంచి బేరం ! సరిగ్గానే అడిగాను వెలకట్టి. ఆఫీసులో లోన్ , తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నాను అన్నాడు .. కళ్ళల్లో నీళ్ళతో తను డబ్బు ఇచ్చాడు. మనసులో సంతోషంతో, ముఖంలో  ముభావంతో నేను మ్యూచువల్ విడాకుల కాగితాల మీద సంతకం చేసాను. చేసే ముందు ఒక గంట చెప్పాడు, సుందరం అతన్ని వదులుకోవటం వల్ల నేనేం కోల్పోతున్నానో .. !! సంఘం ,పరువు, ప్రేమ, తోడు వగైరా వగైరా . వినాలి మరి డబ్బు కదా ..!

మొదటి సారి నా అనాధ జీవితం నాకు నేర్పినదేమిటో అర్ధం అయింది. నాకు డబ్బుతో కూడిన స్వేచ్ఛ కావాలి. సుందరాన్ని పెళ్లి చేసుకొని నేను దానికి పునాది వేసాను. ఇప్పుడు నేను ఆకాశంలో ఎగిరే పక్షిని.

సుందరం అనుకున్నంత చెడ్డవాడు కాడు. సుందరం గారు నా మాజీ భర్త.

***

 ఈ మధ్య పంతులు రావటం లేదు ఎందుకో.. ఎందుకేంటి పెళ్లి చేసుకున్నాడు కదా. సుందరం పంతులు అంటే నాకు భలే ఇష్టం. అతనితో పరిచయం కూడా విచిత్రంగా జరిగింది . ఒక నలుగురు ఫ్రెండ్స్ తో వచ్చాడు. కస్టమర్స్ వచ్చారు అంటే .. కాంతం అదే మా వ్యభిచార గృహ దెయ్యం అనబడే మేడం మమ్మల్ని పిలిచింది. వెళ్లాం అందరం . మధ్యలో కూర్చున్నాడు సుందరం. లేతగా ఉన్నాడు ఇక్కడేం పని? అనుకున్నా . పేర్లు చెప్పమన్నారు. నేను సుందరం వైపే చూస్తూ .. “ కరుణ’ అన్నాను . చప్పున నాలిక కరచుకున్నాను. మా దెయ్యం ఉరిమి చూసింది నావైపు . కస్టమర్ ఎవరొచ్చినా కరీనా అని చెప్పమంటుంది . దాని పిచ్చి గానీ , అది పెట్టుడు పేరు అని తెలీదూ.. వినేవాళ్ళకి .

నా పేరు వినగానే సుందరం తలెత్తి – “ నాకు ఈ అమ్మాయే కావాలి ‘ అన్నాడు .

అతన్నే చూస్తున్న నాకేం ఉంటుంది , అభ్యంతరం .. సరే అన్నాను . చేసిన ప్రతీ వెధవ పనికీ “ ప్రేమ ‘ అనే పేరు అడ్డేసుకొని , నన్ను వాడేసుకొని ఒక వెధవ ఇక్కడ అమ్మేసుకున్నాడు. అక్కడనుండీ ఏ తోవ ఎటు పోయినా ఉన్నవరకూ తిని బ్రతికితే చాలు అని ..రోజులు లేక్కేసుకొనే నాకు ..ఎవడైతే ఏంటి ? ఎక్కువ హింసించకుండా ఉంటే  చాలు. మా వూరి ప్రేమికుడే నా బ్రతుకుని , శరీరాన్ని అమ్మేసి .. ఆ విషయం మా అమ్మా నాన్నలకి తెలిసినా కిమ్మనకుండా ఉన్నప్పటి నుండీ .. నాకు మనుషుల మీద పెద్ద నమ్మకాలు గాని, మానవత్వం మీద మోజు గానీ లేవు .

గదిలోకి వెళ్లాం. జాకెట్ విప్పబోతుంటే “ వద్దు .. మీకిష్టమేనా .. మాట్లాడుకుందాం .. నాకు కొత్త” అన్నాడు సుందరం . అతని పేరు తర్వాత తెలిసింది లెండి .. పంతులూ అంటే నవ్వేడు. నా ఇష్టం అడగటం నిజంగా నాకు కొత్త. నా ప్రేమికుడు కూడా ఎప్పుడూ అడగలేదు . వాడెందుకు అడగలేదని .. అడగాలని కూడా నాకు తోచలేదు.

అలా మొదలైంది మా కధ. పంతులికి చాలా నేర్పించాను నేను. శరీరం ఏమిటో, ఎలా ప్రేమించాలో, ఆడదాని శరీరం ఏమిటో , ఎందుకో .. నా కస్టమర్ లే కదా నా యూనివర్సిటీ. సుందరం భలే చురుకైన వాడు సుమా.. ఇట్టే నేర్చుకుంటాడు. అది ప్రేమ అంటారో, మోహం అంటారో, దాహం అంటారో తెలీదు. తనకోసం నేను ఎదురుచూసే స్థాయి కి తీసుకొచ్చాడు. ఎంత సున్నితమైన వాడో .. మనిషంటే, మగాడంటే నేర్పించాడు . అనుభవానికీ సంగమానికీ కూడా తేడా ఏమిటో.. !

అదొక యోగం .. పెద్ద మాటలు చెప్తున్నాను కదూ.. నిజానికి , నా దగ్గర కొచ్చేసరికి పంతులికి తానేమిటో తెలీదు.. మగాడనే స్పృహ లేదు. ధ్యాసంతా తన కుంటితనం మీదే .. నెమ్మది నెమ్మది గా , అతనిలో స్వచ్చత, పసిపిల్లాడి లాంటి మనసు , కష్టాలను చూసి రాటు తేలినతనం, అయినా ఒక నెమ్మదితనం . నా గాయాలకు సానుభూతి లేపనం . నా శరీరం పచ్చిగా ఉంటె , పడుకోనిచ్చే వాడు. నన్నే అలా చూస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. అతను వెళ్ళిపోయాక నా కళ్ళల్లో నీళ్ళు , మనసులో హాయి .. !

సుందరం  నన్నే అడిగేవాడు. నేను కూడా సుందరం రాగానే , తనకే అందుబాటులో ఉండేదాన్ని. అవొక అందమైన రోజులు. అస్థిరమైనవి. శాశ్వతం కాదు. కానీ ఆ క్షణాల అందం ముందు .. నేను అనుభవించిన నరకం బలాదూర్. అది ప్రేమ కాదు. సుందరం నాకు శాశ్వతం కాదు. కానీ ఆ నిమిషం, ఆ క్షణం నేను ఒక సమానమైన ఆడదాన్ని. వేశ్యని కాదు. ఆ ఫీలింగ్ ఎంత గొప్పగా ఉంటుందో నేను చెప్పలేను .

సుందరం వస్తే రేట్ తగ్గించమని దెబ్బలాడే దాన్ని . నా రేట్ నా చేతిలో లేకపోవటం గొప్ప దౌర్భాగ్యం . ఒకసారి అలానే ఏడిచాను. ఒక సాడిస్ట్ వెధవని గదిలోకి పంపింది కాంతం…గాయాలైపోయాయి,వాడి  పైశాచికత్వానికి పీలికలై ..రక్తపు చారికలైన వొళ్ళు. సుందరం కళ్ళల్లో నీళ్ళు. ఎన్ని .. ఆయింట్మెంట్ లు కొని తెచ్చి రాసాడో తెలీదు. రెండు రోజులు తనే వచ్చాడు కస్టమర్ లా.. నాకు మంచి స్నేహితుడు సుందరం.

సంబంధాలు కుదరనప్పుడు బాధ పడేవాడు. ఎన్ని మాట్లాడుకునేవాళ్ళమో.. నాకూ ప్రపంచానికీ కిటికీ సుందరం. అతని నుంచే చూసా నేను … మా ఊహల్ని.. బాధల్ని, ఆశల్ని నిరాశల్ని కూడా. నేనే చెప్పాను….కుటుంబం లాంటి ఎక్కువ రక్షణ వలయాలు లేని చోట నుండి పిల్లని తెచ్చి పెళ్లి చేసుకోమని. ఆమెకి తానే కుటుంబం ప్రేమ , తోడు నీడ అవగలడని. నిజమే తన ఫ్రెండ్ కూడా అదే చెప్పాడు అన్నాడు. తెలీకుండా నాలో సుందరం అంటే అంత ప్రేమ ఏర్పడిందా ? నేను గమనించనేలేదు అనుకున్నా.

సుందరం పెళ్లి అయిపొయింది. నన్ను పిలవలేదు. పాపం పిలవలేడు. సుందరానికి సంసారం నేర్పిన మాస్తార్ని కదా .. మాస్టారు ఎప్పుడూ స్కూల్ లోనే ఉండాలి. స్టూడెంట్స్ కదా .. ఒక్కో దశ దాటి వెళ్తూ ఉండాలి.

పెళ్లి తర్వాత సుందరం రాలేదు. అర్ధం చేసుకోగలను.

సంవత్సరం తర్వాత అనుకుంటా .. ఒకరోజు సడెన్ గా  వచ్చాడు. ఎప్పుడూ ముటముట లాడే మొహంది కాంతం కూడా మనఃస్పూర్తిగా ఆహ్వానించింది సుందరాన్ని. వొళ్ళు చేస్తాడనుకున్న సుందరం కొంచం డల్ గా , నీరసంగా ఉన్నాడు. ఎలా ఉన్నావు కరీనా .. అని అడిగాడు .. ఒక్క దెబ్బ వేయబోయి .. ఇద్దరం నవ్వుకున్నాం . మళ్ళీ పాతరోజుల్లా అనిపించింది.

” ఎలా ఉంది మీ ఆవిడ ?” అని అడిగాను..

” నన్ను పెళ్లి చేసుకుంటావా  కరుణా ?” సుందరం జవాబులా వినిపించే ప్రశ్న .

ఒకటే నవ్వాను. ” పెళ్ళాం వస్తే ఇంత మతి పోతుందా పంతులూ .. సానిదాన్ని నన్ను చేసుకోవటం ఏంటీ ?” నాకింకా నవ్వు ఆగటం లేదు .

” నిజమే అమ్మలూ.. తప్పే చేసాను. పెళ్లి చేసుకోవటం తప్పు. అంతకన్నా పెద్ద తప్పు నిన్ను చేసుకోక పోవటం .. అసలు మొదట్లో ఆ ఆలోచన రాకపోవటం . .! ” సుందరం మాటలకి, వాటిల్లో ఉన్న తీవ్రతకి నాకు నోట మాట రాలేదు.

” నేను అవిటి వాడ్ని. నువ్వు వేశ్యా వృత్తి లో ఉన్నావు. ఇలా తెలిసిన విషయాలు కాకుండా.. నన్ను చేసుకోవటానికి నీకు అభ్యంతరం ఏమన్నా ఉంటె చెప్పు .. !!”  పంతులు మాటల్లో అదే తీవ్రత.

” అలా అడిగితే … నేను పెళ్లి ..ఊహించలేదు ..!!” నా గొంతు లో వణుకు , గుండె వేగం తెలుస్తున్నాయి  నాకే .

కరుణా – మనం పెళ్లి చేసుకుందాం. శారీరక సుఖం కోసం మాత్రమే కాదు. కలిసి ఉండటం కోసం. గతంలో, నీ దగ్గరకి రావటం .. డబ్బులిచ్చి నీ శరీరాన్ని కొనుక్కోవటం ఎప్పుడూ తప్పు అనిపించలేదు. ప్రసన్న తో కలిసిన ప్రతీ నిమిషం వ్యభిచారం చేస్తుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఆమె గుండెల మీద తాళి .. ఆమెతో సుఖం కోసం నేను కట్టిన లైసెన్స్ లా .. ప్రతీ కలయికకీ .. నేను ఇచ్చే బహుమతులు తాకట్టు కి కట్టే వడ్డీ లా .. ఓహ్.. ఆ నరకం చెప్పలేను. నా కోరిక మీద నాకు అసహ్యం వేసేది .. ఆమె లేకుండా నేను ఉండలేనా .. ఇదేనా జీవితం. అనిపించేది. ముఖ్యంగా నగ్నమైన నా అవిటితనం తన కళ్ళల్లో నిద్ర లేపిన అసహ్యం తలచుకుంటే , ఆమెతో సుఖించినందుకు నామీద నాకే అసహ్యం వేసేది . నరకం చూసాను కరుణా ..

నువ్వు గుర్తు రాని క్షణం లేదు. ఆమె కి డబ్బు కావాలి. నేను, నా disability వద్దు. ధర్మేచ అర్ధేచ .. ఆమెకి అర్ధం అయినది కేవలం ఆర్దికమే అని తెలిసినప్పుడు.. అది  నాకు అర్ధం అయినప్పుడు… ఈ సంఘం, సాంప్రదాయం … వాటి కోసం నేను అణచుకున్న కాంక్షలు … ఈ బంధనాల తాళ్ళు ఒక్కసారి తెగిపోయి ఊపిరి తీసునట్టు అనిపించింది. ప్రసన్న కి కావలసిన డబ్బు, స్వేచ్చ ఇచ్చేసాను. నాకు కావలసిన అనురాగం, శాంతి, సంతోషం ఇవ్వగలవా ..???

అంత గొప్ప మాటకి నేనేం సమాధానం చెప్పగలను.. నిశ్శబ్దంగా నా ప్రేమ రాహిత్యాన్ని నెట్టేసిన  అతని  పాదాన్ని ముద్దెట్టుకోవటం తప్ప .

సుందరం అంత గొప్ప స్నేహితుడే కాదు, ప్రేమికుడు కూడా ..!!

***

నేనే సుందరాన్ని. చాలా రోజులు బ్రతుకు ఈడ్చాను. అమ్మ చెప్పిందని, పెళ్లి చేసుకుందామని పెళ్లి చూపుల్లో కూర్చున్నాను . వాళ్ళ చూపుల్లో నా హోదా మీద ఆశ, నా అవిటితనం మీద వెరపూ చూసాను. స్నేహితుని ప్రోద్బలంతో శరణాలయంలో ప్రసన్నని చూసాను. తల దించుకున్న ప్రసన్న  మోహంలో నా మీద అసహ్యం చూడలేనితనం మీద నా మీద నాకే అసహ్యం వేసింది. ఆమెతో సంసారం ఆమె చూపులనే కత్తుల తో, ఆమె కట్టే డబ్బు లెక్కలతో సహజీవనం అని అర్ధం అయ్యాక… నేనిలా జీవితాంతం బ్రతుకు ఈడ్చగలనా అని భయం వేసేది. నాకోసం నాకేం కావాలి? అని ప్రశ్నించుకుంటే, కరుణ చూపు రోజూ ఒక సజీవ జ్ఞాపకంలా వెంటాడేది. నేనెందుకు కరుణ ని అడగలేదు, ఈ ఆలోచన నాకెందుకు ముందు రాలేదు అని తిట్టుకున్నా, నా జీవితం నా చేతుల్లోకి తీసుకున్నాను . ఇంక తప్పదు ..! కరుణ ని అడగాలంటే సిగ్గు వేసింది… కానీ ఆమె చూపులోని ప్రేమ, సమానత్వం నాకు ధైర్యాన్ని ఇచ్చింది.

ఇన్నాళ్ళకి సంతోషానికి అర్ధం దొరికింది. సమాజం అవిటిది. స్వతస్సిద్ధ వికలాంగత్వం ఉంది దానిలో. దానికి నచ్చేలా ఉండాలని నా నడక కి ముసుగు వేసి, కష్టపడ్డాను. సమాజానికి లేని కరుణ .. నా కరుణ లో దొరికింది. నా నగ్నత్వానికి సిగ్గుపడని నా కరుణ తో కొత్త జీవితం .. నాలా ప్రారంభిస్తున్నాను. ఒక వేశ్య అయిన కరుణని పెళ్ళే చేసుకోవాలా? అని అడిగాడు నా స్నేహితుడు సత్తి . “ చేసుకోవాలి .. నా అవిటితనం నేనెలా తెచ్చి పెట్టుకోలేదో, వేశ్య అవుదామని తను కూడా అనుకోలేదు. ఆమె వ్యభిచారి అయితే, ప్రసన్నతో నేను చేసినదాన్ని కూడా వ్యభిచారం అనే అంటారు.. కనీసం మనసున్నవాళ్ళు ..!” – నా జవాబుకి వాడి కళ్ళు చెమర్చటం నేను చూసాను. నా బాధ అర్ధం చేసుకున్న నా స్నేహితుడు నా శక్తి. నేను సుఖపడాలని తపించే అమ్మకి, నా సంతోషం ఎక్కడ ఉందో చెప్పగలిగే సామర్ధ్యం నాకుందని నాకు తెలుసు.

కరుణ మనసులోని సుందరం కోసం, కరుణ ప్రేమ కోసం నేను ఏమైనా చేయగలను అనుకోవటం ఎంత శక్తో తెలుస్తూనే ఉంది.నా జీవితం ఇంక కాళ్ళీడ్చుకుంటూ నడవదు… వీళ్ళ పనికిమాలిన రూల్స్ కి అందనంత వేగంతో పరుగు మొదలెడుతోంది. ఇంక నాకు తీరిక లేదు . నేను నాలా ఉండటం లో ఉన్న సంతోషం దేనికీ సాటి రాదు.

నేను నిజంగా తెలివైన మంచివాడ్ని అని నాకిప్పుడిప్పుడే నమ్మకం కలుగుతోంది  ….!!!!!

 

–సాయి పద్మ

 

 

 

 

 

బిల్లి

shahjahana

 ‘నఖాబ్’ తీసి ముస్లిం స్త్రీ ‘దర్దీ’ స్వరాన్ని వినిపించిన  తెలుగు రచయిత్రి షాజహానా. కవిత్వంలోనే కాకుండా, కథల్లో కూడా ఆమె తనదయిన గొంతుకని వెతుక్కుంటోంది. అస్తిత్వ ఉద్యమాల దశాబ్దంలో కవిత్వంలోకి అడుగుపెట్టిన షాజహానా అతి తక్కువ సమయంలోనే గుర్తింపు పొంది, అంతర్జాతీయ వేదికల మీద కూడా తన స్వరాన్ని వినిపించారు.

*

రెహానా వాళ్లాయనది చిన్న గవర్నమెంటుద్యోగం. దాంతో  ట్రన్స్‌ఫర్లు తప్పనిసరై జిల్లా అంతా తిరుగుతుంటారు. ఆ సందర్భంగానే ఈ పెద్ద నగరానికి వచ్చారిప్పుడు. ట్రాన్స్ఫరైనప్పటి నుండీ లెక్కలేసుకుంటూనే ఉన్నాడు రహీమ్. తక్కువ కాలం వెదుకులాటలో మూడంతస్తుల పైన ఇల్లు దొరికింది. ఊపిరి పీల్చుకున్నాడు రహీమ్.

చిన్న చిన్న ఊళ్లలో అందరూ చక్కగా మాట్లాడేవాళ్లు . ఇప్పుడిక ఎవరైనా మాట్లాడతారో లేదోనని బెంగగా వుంది రెహానాకి. మొత్తానికి వాళ్లు లారీడు సామానుతో సహా దిగిపోయారు. ఆ మూడంతస్తుల మెట్లెక్కుతుంటే చిన్నప్పుడు  చార్మినార్ మెట్లే గుర్తొచ్చాయి ఆమెకి. ఇంకా ఎన్ని మెట్లెక్కాలి? అన్నట్లు కోపంగా చూస్తుంది మాటిమాటికి. కిందవాళ్ల వాటా ముందునుంచే మెట్లెక్కాలి. మెట్ల పక్కన తులసికోట. ఒక మూల పిల్లి ఒకటి అరమోడ్పు కళ్లతో పడుకుని ఉంది. వీళ్ల అలికిడికి కళ్ళు తెరచి చూసి కూడా చూడనట్లు నిర్లక్ష్యంగా పొర్లింది వెల్లకిలా.

శనివారం, ఆదివారం రెండ్రోజులు  ఇంట్లో సామాను సర్దుకోవడంతో సరిపోయింది ఇద్దరికీ. బయట పూలకుండీలను సరిగ్గా కొంచెం ఎండ తగిలేలా ఉంచింది రెహానా. చుట్టు పక్కల పరిసరాల్ని గమనిస్తే ఎవరూ ఎవర్నీ పట్టించుకోని పరిస్థితి కనప్డింది రెహానాకి. భర్త ఆఫీసుకెళ్లాక తను ఒంటరేనని అర్ధమైంది ఆమెకి.

మొదటి వారం రోజులు బద్ధకంగా గడిచాయి. మళ్లీ ఆదివారం వచ్చింది. రహీమ్ మంచి మాంసం అర కిలో తెచ్చాడు. స్టౌ మీద తుకతుక ఉడుకుతూ చుట్టుపక్కలకి ఘుమఘుమ వాసనల్ని వెదజల్లుతుంది కూర. కొద్దిగా మసాలా, కొతిమిర వేసి దించేసింది రెహానా.

మధ్యాహ్నం అన్నం తిని ఎక్కడికో వెళ్లాడు రహీమ్. ఆమె ఒక్కత్తే ఉంది.

ఇంతలో కిందింటి పిల్లి ‘మ్యావ్’ అనుకుంటూ లోపలికొచ్చింది. ‘ఇష్ష్’ అంటూ బైటికి గెంటింది రెహానా. అది పోయినట్టే పోయి మళ్లీ వచ్చింది. నోరు నొప్పి పుట్టేటట్టు ‘ఇష్ష్! ఇష్ష్!’ అని ఎంతన్నా అది ఇంచు కూడా కదల్లేదు. పైగా తోక చివరి భాగాన్ని ఊపుతూ ఆమె కాళ్లను రాసుకుంటూ తిరగసాగింది. అంతకు ముందు వాళ్లిద్దరికీ ఎన్నో రోజుల పరిచయ బంధం ఉన్నట్లు.

దాని బాధ చూడలేక ఆకలేస్తుందేమోనని, రాతెండి ప్లేట్లో రెండు మూడు పలుచటి మాంసం ముక్కలు, కోస్తున్నప్పుడు పక్కకి పెట్టిన మాంసం తుక్కు అంతా తీసుకెళ్లి బయట పెట్టింది రెహానా. వెంటనే బయటికెళ్లింది పిల్లి. చక్కగా ప్లేటుని  చూసి తినడం ప్రారంభించింది. తిన్న తరువాత రెండుసార్లు అటుఇటు పచార్లు చేసి కిందికెళ్లిపోయింది.

అది మొదలు ప్రతిసారి మాంసం వండినప్పుడల్లా పిల్లి రావడం, రెహానా మాంసం పెట్టడం అలవాటైపోయింది. కొన్ని రోజుల తర్వాత ఒక ఆదివారం పిల్లి ప్లేట్లో మాంసాన్ని విదారగిస్తుంది. కిందింటి పిల్లి యజమాని మందపాటి చద్దర్లు డాబాపై ఆరేసుకోవడానికి వచ్చింది. ఆవిడ రెహానా వాళ్లింటి ముందు నుంచే పైకెళ్లాలి కాబట్టి యాదృచ్చికంగా వచ్చి పిల్లిని చూసింది.

దాని ముందున్న ముక్కలని చూసింది. వచ్చినంత వేగంగా కిందికి వెళ్లిపోయిందామె.

“ఏమైనా మర్చిపోయిందేమో” స్వగతంగా అనుకునేలోపు కిందనుంచి పెద్దగా అరుపులు వినిపించాయి. ఏమిటా అని రెహానా నాలుగు మెట్లు కిందికి దిగింది. రెహానాని చూసి మొహం తిప్పుకుంటూ ఆవిడ “ఇన్ని రోజులూ చక్కగా పాలు, పెరుగూ  పోసి పెంచాను. చండాలపు తిండి పెట్టి మా పిల్లిని అపవిత్రం చేసిందే. అయినా వెనుకా ముందు చూసుకో అక్కర్లా? ఎవరి పిల్లి  ఏంటి అని? మా ఇంట్లో పిల్లలతో సమానంగా పెరిగిన పిల్లి. మడీ, ఆచారం అన్నీ ఔపోసన పట్టిన పిల్లి అది. ఇన్నాళ్ల దాని నిష్టని ఒక్క రోజులో గంగలో కలిపింది కాదు. అయినా ఆ ఓనర్‌కి ముంధునుంచీ చెప్తూనే ఉన్నాం తురకలకి అద్దివ్వద్దనీను. అయినా వింటేనా.. వెధవకి డబ్బు ఆరాటం. అయినా రానీ. అతని సంగతీ తేలుస్తాను” చేతులు తిప్పుతూ ఆవిడ రెహానాని కడిగేసింది ఇంకా చాలా మాటలతో.

పిల్లి తన వంక పాపం అన్నట్లు చూస్తున్నట్టనిపించింది రెహానాకి.

“అది కాదండీ.. నాకు తెలీక” అని రెహానా ఏదో చెప్పబోయేంతలో “దాక్షాయణి ఏం జరిగిందే? రమ్మని పిలిచావూ.. వచ్చేలోగా ఎక్కడికి వెళ్లావు? ఏమిటా గలాటా? అలగా జనంలాగా.. ముందు ఇంట్లోకి  తగలడు” అనుకుంటూ బైటికొచ్చాడు వాళ్లాయన.

ఆమె రుసరుసలాడుతూ నావైపు , పిల్లి వేపు కూడ అసహ్యంగా చూస్తూ లోపలికి వెళ్లిపోయి కోపంగా తలుపేసుకుంది. ఆమె వెనుకే లోపలికి వెళ్లబోయిన పిల్లి ఏమీ అర్ధం కాక నిలబడిపోయి “మ్యావ్” అంది దిగులుగా..

 

 

+++++++++++++++++++

 

కూరగాయలు కొందామని కిందికి దిగుతుంది రెహానా. పిల్లి దాక్షాయణి వాళ్ళ గడపదాటి లోపలికెళ్లడానికి ప్రయత్నిస్తుంది. దాని సామ్రాజ్యం కదా మరి. సుడిగాలిలా దూసుకొస్తుంది ఆమె.

“అప్రాచ్యపు ముండా! ఏం మొహం పెట్టుకుని వస్తావే ఇంట్లోకి. నువు మలినమైపోయింది కాక మమ్మల్ని కూడా మలినం చేద్దామనే.. ఫోవే.. చీ.. పో! అవతలికి, నీకివాళనుంచి అన్నం లేదు సున్నం లేదు” అంటూ నిర్దాక్షిణ్యంగా పిల్లి ఇవతలికి కట్టేముక్కతో నెట్టి తలుపులు ధడేల్మని వేసుకుంది దాక్షాయణి.

ఆవిడ తిట్టింది పిల్లినా, తననా … అనుకుంటూ  కిందికెళ్లిపోయింది  రెహానా.

ఆ రాత్రంతా పిల్లిని గురించి ఒకటే కలలు రెహానాకి.

విచిత్రంగా కొన్ని పిల్లులు జందెం వేసుకుని ఉన్నాయి. జందెం వేసుకున్న పిల్లులు వేసుకోని పిల్లుల మీదికి యుద్ధానికొస్తున్నాయి. యుద్ధంలొ ఎవరు గెల్చారో ఓడారో తెలీదు.

మొత్తానికి ప్రతీ పిల్లికీ గాయమై రక్తం కారుతుంది. అది కూడా జీవహింసే కదా.. కలవరిస్తుంది రెహానా. ఆ  యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆమె పిల్లుల మీద పరిశోధించి పురాతన గ్రంధాలు చదివి శోధించి విలువైన పరిశోధనా వ్యాసాలు రాసి  పత్రికలకు పంపి పుస్తకంగా వేసింది.

ఒక సంఘం వారు పిలిస్తే పిల్లుల గురించి సభలో ఇలా మాట్లాడింది. “పిల్లులన్నీ మాంసం తినేవే. కానీ కొన్ని కొన్ని పిల్లులు కొన్ని కట్టుబాట్లు పెట్టుకుని మానేసినై. అన్నీ ఒక్కలాగే ఎందుకుండాలి. వాటికంటే మనం గొప్పవిగా కనపడాలని. అయితే వాటి జీన్స్‌లో మాంసం తిన్న ఆనవాళ్లు ఆ కోరిక గుప్తంగా ఉండి అవకాశం  వచ్చినప్పుడు బయట పడతాయి” ఆమె ఉపన్యాసం ముగియకుండానే వేదిక నాలుగువైపుల నుండీ జందెం పిల్లులు దాడి చేశాయి. వేదిక కూలి రెహానా మీద పడింది.

కెవ్వుమని అరిచింది రెహానా. ఆమె అరుపులకి ఆమే భయపడి దిగ్గున లేచి కూర్చుంది.

పక్కన వాళ్లాయన గండు పిల్లిలా చూస్తున్నాడు మొహంలో మొహం పెట్టి.

“ఏంటా అరుపులు! ఎవరైనా వింటే పొద్దున్నే తాగి గొడవ చేస్తున్నాననుకుంటారు.. రాత్రంతా పిల్లులు కొట్లాడినట్లు నా మీదికి కాళ్లు చేతులు విసిరింది కాక.. హారర్ సినిమాల్లో లాగా కెవ్వుమని అరవడాలేంటి?” విసుక్కున్నాడు రహీమ్.

ఆఫీస్ ఏర్పాట్లు అన్నీ అయ్యాక రహీమ్ వెళ్లిపోయాడు. చిన్నగా రెండు మెట్లు  దిగి తొంగి చూసిన రెహానాకి అక్కడ పిల్లి ముందు ప్లేటు ఎండిపోయి కనబడింది.

పాపం అది రాత్రంతా ఏమి తినలేదులా ఉంది అనుకోగానే మనసంతా బాధతో నిండిపోయింది రెహానాకి.

మధ్యాహ్నం సమయంలో వాకిలి ముందు ఏదో కదలాడుతున్నట్టుగా ఉంటే.. చూస్తే  పిల్లి. నీరసంగా ఉన్నట్లుంది అరుపు సరిగా రావడం లేదు. గబగబా ఇంట్లో ఉన్న ఎండురొయ్యలు తెచ్చి ప్లేట్లో వేసి పెట్టింది. ఆబగ తినేసింది పాపం పిల్లి. ఇంక అది ఆమె వెనుకే తిరగసాగింది. తర్వాత కుండీల పక్కన మంచి ప్రదేశం చూసుకుని ఆరామ్ గా నిద్రపోయింది.

ఆ రోజు నుండి దాక్షాయణి ఇంటిముండు ఎన్నడూ తచ్చాడుతూ కనబడలేదా పిల్లి.

 

 -షాజహానా

అ … అంటే చందమామ

 ibrahim

ఇంపైన యాస.. సొంపైన వాక్యం.. అది మాధుర్యమైన స్వరం అక్కం పేట ఇబ్రహీం ప్రత్యేకత. రాసింది తక్కువ కథలే అయినా తన స్థానం సమకాలీన సాహిత్యంలో పదిలం. బడుగు, బలహీన వర్గాల పక్షాన మాట్లాడే ఇబ్రహీం జూన్‌ 1, 1975లో పుట్టారు. మొదటి కథ ‘చిన్ని’ ఆంధ్రజ్యోతి వీక్లీలో 2007లో అచ్చయ్యింది. ఇప్పటి వరకు ఏడు కథలు రాశారు. ‘జీవసమాధి’, ‘కాలానికి ఎదురీదేవాడు’ కథలు ఇతని ప్రతిభకు మచ్చుతునకలు. కడపజిల్లా నర్సాపురం సొంత ప్రాంతం. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు.

—వేంపల్లె షరీఫ్

 

*

వేళ్ళ సందున చురుక్కుమండంతో ఉలిక్కిపడి బీడీముక్కను విదిలించేశాడు మస్తాన్. గోడమీద అతుక్కుపోయున్న చూపును వెనక్కి లాక్కొని కాలిన చోట తడుముకున్నాడు.

అంతసేపూ మనసు లాగేసుకొని ఏవో ప్రశ్నలూ… అనుమానాలూ… రేకెత్తించి ఆలోచనా ప్రవాహంలో ఈడ్చుకొనిపోయిన బొమ్మ, ఏమీ ఎరగనట్లు మౌనముద్రలోకి జారుకుంది. చూపు మళ్లీ దాని మీదికే మల్లుతుంటే బరువుగా లేచి నిల్చున్నాడు. జారిపోతున్న పంచెముడి బిగించుకుంటూ తలెత్తి పైకి చూశాడు.

వర్షం మళ్లీ వంగేటట్లుంది.!

మదపుటేనుగుల్లాంటి మేఘాల గుంపు ఈశాన్యమూలంగా ఆకాశంలోకి ఎగబడతాంది.

ఏదో గొణుక్కుంటూ లోపలికి నడిచాడు.

ఆట! మంచి రసపట్టులో నడుస్తోంది లోపల. పరిసరాల్ని మరిచి లీనమై ఆడుతున్నాడు అన్వర్.

ముడిపడ్డ కనుబొమ్మలు. మునిపల్ల మధ్య పెదవి బిగింపులు.. అతని వాలకం ఏదో భరోసానిస్తోంటే వెళ్లి ముందు కూర్చున్నచోటే గోడకానుకొని గొంతుక్కూర్చున్నాడు.

మనసింకా బయటే… గోడమీది బొమ్మ దగ్గరే వుండిపోయింది.

ఇంతకు ముందు చాలాసార్లు చూసిందే! బడివైపుగా వచ్చిన ప్రతిసారీ కళ్లబడేదే!

అప్పుడే జువ్విన పెన్సిల్ కొసలపై అటొక కాలు, ఇటొక కాలు వేసుకొని కేరింతలు కొడుతున్న పిల్లలు.. వాళ్ల చేతుల్లో ఇమిడి మేమే మీ నేస్తాలం అంటున్న పలకా, పుస్తకాలూ…

బొమ్మలో ఏం మార్పు లేదు. భావంలోనే.. ఇన్నాళ్ళూ పసిగట్టలేకపోయిన వ్యంగ్యం… బొమ్మకింద “అందరూ చదవాలి.. అందరూ ఎదగాలి” అని చక్కెర పలుకుల్లాగా రుచించిన మాటల్లో ఇప్ప్పుడేదో చేదు తొంగి చూస్తూ…

వాటిని ఆలోచనల్లోంచి తప్పించే ప్రయత్నం చేస్తూ దృష్టి ఆట మీదికి పోనిచ్చాడు.

ఆట అప్పుడే ముగిసినట్లుంది. గెలిచిన వారి ఉద్రేకం, ఓడినవాళ్ల కాంతాలం మాటల  శకలాలై గదంతా ఎగిసింది.

వచ్చిన సొమ్మును హుషారుగా జేబులోకి దొబ్బుకుంటున్నాడు అన్వర్. అతని ముఖంలోని వెలుగు కాసింత మస్తాన్ మొఖాన ప్రతిఫలించి పోతున్న ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఒక అర్ధింపు అప్రయత్నంగా గొంతు పెకలించుకుంది.

“భయ్యా!…”

అది చెవిసోకిందొ లేదో అన్వర్ నవ్వు మొఖాన చేదు చరచరా  పాకింది. ” తాల్రా గబ్బు నాయాలా.. లెక్కలతో పోదెంకొని నేను సచ్చాంతే..” బుస కొట్టినట్టే కసిరాడు.

చిన్నబోయి తనలో తను ముడుచుకుపోయాడు మస్తాన్.

రెండు గంటల్నుంచి ఓపిగ్గా కనిపెట్టుకోనున్నాడు. “ఒక్కాట కానీ.. ఈ ఒక్కాట కానీ.. ” అనే కొద్దీ సహనం తెచ్చుకుంటున్నాడు.

ఇంకా ఎంతసేపు తొక్కాలో అర్ధం కాలేదు.

ఇంటికాడ మున్నా తొక్కులాడ్తా ఉన్నాడేమో?

తన్ను వెతుకులాడ్తూ వీధులమ్మట తిరుగుతున్నాడేమో!

“బేగీన రా నాయనా! లేటు చేయగాకు. నువ్వొచ్చేటప్పటికి నేను రెడీ అయి ఉంటా” వచ్చేటప్పుడు వాడు చేసిన హెచ్చరిక మాటిమాటికి వినబడుతుంటే స్థిమితంగా ఉండలేకపోతున్నాడు.

అప్పుడే  వారం రోజులైంది వాడు బడికి దూరమై.

ఈ వారం రోజులు అన్ని రకాలుగా ప్రయత్నించాడు. అందరి ముందు తన్ను తాను జోలెలా చాచుకున్నాడు. ఒక్కనీక్కూడా కనికరం కలగలేదు.

తను విఫలం అయ్యేకొద్దీ మున్నాలో భయం పేరుకుంటూ పోయింది. పోడుగా, ఏడుపుగా గొంతుదాటుకొచ్చింది.

అది తన చేతగానితనాన్ని ఎండగడుతుంటే, వాడు కూడా తనలాగే కూలోనిగా మారే దృశ్యం కళ్లలో కదలాడుతుంటే.. గుండెల మీద రేక్కంప ఈడ్చినట్లు విలవిలలాడిపోయాడు.

ఆర్రోజులు.. పోరాడి, ఓడి, అలుపొచ్చాక.. నిన్నటి సాయంత్రానికి ఆ కస్మూరు మస్తాన్‌వలి అన్వర్ రూపంలో ఎదురుపడ్డాడు. తన గోడంతా ఆలోచించి అభయమిచ్చాడు. ఆ అభయాన్ని తను కొడుకులోకి చొప్పించాడు. “రేపు బడికి పంపడం ఖాయం” అంటూ నమ్మబలికాడు.

తెల్లవారేటప్పటికి అంతా తలకిందులైంది.

తను పోయేటప్పటికి అన్వర్ ఇంట్లో లేదు. కలనబండ బాయికాడ, పిచ్చయ్య బంకు దగ్గర, గౌరమ్మ అరుగు మీద, అక్కడా, ఇక్కడా వెతుకులాడి ఎక్కడుండేది కనుక్కొని తీరా వచ్చేసరికి… ఆలస్యమైపోయింది.

తనకిస్తానన్న డబ్బులో చాలా భాగం అప్పటికే ఆటలో జారిపోయింది. పోయిన సొమ్ము తిరిగి రావడం, ఆడేది మానుకొని అన్వర్ దాన్ని తన చేతుల్లో పోయడం .. దింపుడు కల్లం ఆశను తలపిస్తాంది.

బీడీ ముట్టించుకుని పొగతో పాటు ఆశను కూడా పీలుస్తూ కూర్చున్నాడు మస్తాన్.

ఆట కోలాహలంగా సాగుతోంది. ఆడేవాళ్లు.. పైనుండి హుషారు చేసేవాళ్లు.. అరుపులు, అదిలింపులతో గది పొంగి పొర్లుతోంది. చుట్టూ ఆవరించిన బీడీల  పొగ బైటి వాతావరణంలోని మేఘాలు లోపలికి జొరబడిన భ్రాంతి కలిగిస్తోంది.

ఏడాది కింద మూతబడ్డ పాఠశాల ఊళ్లోని పోరంబోకులకు జూదశాలగా మారింది.

అక్షరాల గలగలలు పోటెత్తిన చోట ఆటిన్ రాణి,  డైమండ్ రాజాల కేళి.. గోడలపై మసకబారిన గుణింతాక్షరాలపై ఎవరో బొగ్గుతో గీసిన తాజా చిత్రం! మనుషులు బట్టల్తో దాచుకునే వాటిని బటబయలు చేసిన కళాపిపాస….. పగిలిన తలుపులు, విరిగిన కిటికీలు, పెచ్చులూడుతున్న కప్పు.. అచ్చు తన మనసులాగే బావురుమంటోన్న బడి…

దాని శిథిల రూపంలో, జవజీవాలతో తొణికిసలాడిన రోజులు దృశ్యాలై కదలాడుతుంటే, జూదగాళ్ల స్థానంలో బడిపిల్లల కోలాహలం కళ్లకు కడుతుంటే, మస్తాన్ లోలోపల బాధ రాజుకుంటోంది. తన కొడుకుతోపాటు ఊళ్లోని పిల్లలందర్నీ రెక్కల కింద పొదువుకున్న తెల్లకోడిలాంటి బడి ఏ తెగులు కాటుకో విగతజీవిగా మారిన చిత్రం కళ్లలో నీళ్లు తెప్పిస్తోంది.

లావు లావు చినుకుల్తో ఒక్కసారిగా వర్షం మొదలైంది.

ఉప్పువాగు కెగువున బరకల్లో  మెరుపువాగు ఆకాశం నుంచి భూమికి జరజరా పాకింది. చెవులు బద్దలు కొడుతూ ఉరుము శబ్దం ఊరిమీదికురికింది.

ఇంటికాడ మున్నా ఒక్కడే ఉన్నాడు. ఉరుములు, మెరుపులకు భయపడతాడేమో. చినుకు రాలగానే లొడలొడకారే ఇంట్లో ఒంటరిగా బిక్కుబిక్కుమంటున్నాడేమో.

పోదామనుకుంటూ లేచాడు. పోలేకపోయాడు.

ఉత్తచేతుల్తో పోయి వానికి ముఖం చూపించలేదు. వాడు పోగేసుకున్న నమ్మకాన్ని తన చేతుల్తో చెదరగొట్టలేదు.

ఆలస్యమైనా సరే! డబ్బులు ఇప్పించుకొనే వెళ్లాలి. రేపైనా వాడిని బడికి పంపించి తీరాలి.

ఇప్పుడు పోతే ఎంతో కొంత మినుకుమినుకు మంటున్న అవకాశాన్ని జారవిడుచుకున్నట్టే. లేచిన చోటే కూర్చుండిపోయాడు.

వర్షం ఉగ్రరూపం దాలుస్తోంది. ఆత ఉధృతంగా సాగుతోంది.

 ***

 నీటి దారాలు ఆకాశం నుంచి తెగిపడుతున్నట్లు వర్షం కురుస్తోంది. ఈదురుగాలి తోలినప్పుడల్లా దారాలు తుంపర్లుగా తెగి దూరంగా పడ్తుంటే, ఇంకా మూతలు పడని వాకిళ్లలోంచి తొంగి చూస్తోన్న దీపాల గుడ్డి వెలుగు బయటి చీకట్ల చిక్కదనంలోకి జొరబడలేకపోతోంది.

తల్లి పచ్చడి దంచుతోంటే రోటి దగ్గరే దీపం ముందు పుస్తకం తిరగేస్తున్నాడు మున్నా. కాని చిన్న బుర్రలో ఆశాభంగపు అలజడి ఇంకా రేగుతూనే వుంది.

తండ్రి డబ్బు సంపదించడం గురించే కాదు తన బెంగ. సంపాదించేలోగా ఎన్ని లెసన్స్ మిస్ అవుతాడో! ఎంత వర్క్ ఫ్రెండ్స్ దగ్గర కాపీ చేసుకోవాలో! మ్యాథ్స్ టీచర్ డివిజన్‌లో వర్కింగ్ ప్రాబ్లమ్స్ చెప్తానంది. అవి కూడా మిస్సయ్యాడు.

రెండవ తరగతి దాకా తెలుగులో చదివినందువల్ల ఇంగ్లీషులో తను కొంచెం వీక్. క్లాస్‌లో చెప్పేది వినకుంటే తర్వాత బుక్స్‌లో చదువుకున్నా పెద్దగా అర్ధం కాదు. ఇవన్నీ ఎలాగోలా మేనేజ్ చేసుకున్నా అసలైన పనిష్మెంట్ ఇంకొకటుంది.

ప్రతి టీచర్ తన్ను క్లాస్‌లో నిలబెట్టడం. ఎందుకు ఆబ్సెంట్ అయ్యావంటూ దండించడం. అందరిముందు తను తప్పు చేసినట్టు తలవంచుకోవడం

నులి మంచంలో మునగదీసుక్కూచ్చోని  కొడుకు మనసు చదివే ప్రయత్నం చేస్తున్నాడు మస్తాన్.

చదువుకోవడమంటే ఎంత ఆరాటం వాడికి.

ఎప్పుడన్నా పనిబడి ఒక్కపూట బడి  మానుకోమంటే చాలు దిగులు ముఖం పెట్టుకుంటాడు. హోంవర్క్ చేసుకునేటప్పుడు  చూడాలి. ఒక్కో లెక్క సాధించే కొద్దీ వాని కళ్లలో కాంతి పుంజాలు మెరవడం.

పుస్తకాల బరువు కింద నలిగిపోయే బాల్యపు రూపురేఖలు వాని ముఖాన ఎప్పుడూ కానరాలేదు. నేర్చుకోవడంలోనే ఏదో సంతోషాన్ని సాధిస్తున్నట్లు సాధకుడి దరహాసం వాడి పెదవుల మీద.

అదంతా వాని ఘనతేం కాదు. వాన్నలా తీర్చిదిద్దిన చిన్నప్ప సార్ ఘనత. ఆ సార్ కథలల్లుతాడు. కథలంత కమ్మగా పాఠాలు చెప్తాడు. ఆటతో పాటతో చదువునొక క్రీడగా మలుస్తాడు. ఆయన ఉన్నన్నాళ్లూ వాని గురించే పలవరించెటోడు.

“మస్తానూ! నీ ఇంట ఐన్‌స్టీన్ పుట్టిండబ్బా. నువ్వు పస్తులున్నా పరవాలేదు. వాన్ని మాత్రం బాగా చదివియ్యి. వాడు నీకు పేరు తేవడం ఖాయం” అనేవాడు.

అటువంటి వాన్ని చదివించుకోలేకపోతే… తన్ను తాను శపించుకున్నట్లే!

ఏం చేయాలి? ఏ బాయిలో దూకాలి?

సైదమ్మ ఊరిబిండి నూరడం పూర్తయింది. రోటి కాన్నుండి లేస్తూ

“ఇంగ రాండి. బువ్వ తిందురు గానీ” పిలిచింది.

“కాసేపుండీ.. కరెంటు రానీలే… “అనాసక్తిగా కదిలాడు మస్తాన్.

” ఈ మొబ్బున కూడా కరెంటొస్తదని.. రారాదూ.. “తొందర చేసింది.

అయిష్టంగా పళ్లెమ్ముందు కూచ్చున్నాడు. తిని లేచేసరికి అరచెతుల్ని నెత్తి మీద గొడుగులా కప్పుకొని వసారాలోకి అడుగులేస్తూ ఎవరో…

చేతులు దించి తల ఎత్తేసరికి .. ఆశ్చర్యం! డేవిద్!

“అరరే.. నువ్వా? .. ఎప్పుడొచ్చినవ్.. రా… రా….” ఆశ్చర్యంగా, ఆనందంగా ఆహ్వానించాడు.

పొద్దున్నే వచ్చినాడంట ఒంగోలునుంచి.

ఏదో పనిబడినట్లుంది. లేకుంటే ఇలా మధ్యలో రాడు.

“ఏమిటంటే..” ఇబ్బందిగా చూశాడు. “ఏమీ లేదంటూ” నీళ్లు నమిలాడు. బువ్వ తినమన్నా తినలేదు. బలవంతం చేస్తే..

“ఎన్నో తరగతోయ్ వీడు.. బలే శెర్దగా సదువుకుంటాండే” అంటూ మాట మార్చాడు.

“ఐదో తరగతన్నా! ఇంగ్లీసు మీడియం” కొడుకును పొగడ్డంతో సైదమ్మ  ఉషారుగా జవాబిచ్చింది. అంతలోనే ముఖం చిన్నది చేసుకొని.

“వాడు మాత్రం బాగానే సదువుకుంటాండన్నా.. మేమే వాణ్ని సదివియ్యలేక కిందా మీదా పడ్తాండం” అంటూ బాధపడింది.

“నిరుడు ఇంట్లో అందరికీ చికన్ గున్యా జరాలొచ్చి మనిసికి వెయ్యి రూపాయలు కర్సైనై మామా. జరం తగ్గినా నొప్పులు మటుకు చాన్నాళ్లదాకా వదల్ల్యా. పనులకు పోలేక వాని ఫీజు  కట్టలేకపోయిన” ఒక్క కొడుకును చదివించుకోలేని చేతగానితనానికి సంజాయిషీ ఇచ్చుకున్నట్లుగా అన్నాడు మస్తాన్.

“ఇన్ని అగసాట్లు ఎందుకోయ్ మనూర్లోనే బడిపెట్టుకొని?” ఏదో అనుమానం పొడసూపుతుంటే నివృత్తికోసం ఆడిగాడు డేవిడ్.

“ఇంగేడ బడి.. ఎప్పుడో మూతబడిపోయుంటే”

“మూతబడిపోయిందా!?” డేవిడ్ గొంతులో ఆశ్చర్యం, బాధ మిళీతమయ్యాయి. ప్రాధమిక విద్యావ్యాప్తి కోసం కృషి చేస్తున్న  ఎంజెవోలో పని చేస్తున్నాడు తను. వృత్తిరీత్యా ఎన్నో ఊళ్లు తిరిగాడు. ఎన్నో స్కూళ్లు మూతబడ్డం చూశాడు.

అన్నిచోట్లా చదువులనుండి గెంటేయబడుతోన్న బీదపిల్లలు. పరిస్థితి ఇంత త్వరగా తనూరిదాకా వ్యాపిస్తోందని ఊహించలేకపోయాడు.

“ఎట్ట మూత పన్నెదోయ్?” కారణం తన ఊహకందనిది. కాకపోయిన ఏదో కుతూహలం అతనిచేత అడిగించింది.

“ఇంతకు ముందు చిన్నప్ప సార్ ఉన్నెప్పుడూ బాగానే వున్నెది మామా. ఆ సార్ బదిలీ అయినాక బదులుగా వచ్చిన  సారు అంత శెర్దగా పట్టించ్చుకోల్యా. దానికి తోడు పోరుమామిల్లలో ఇంగ్లీషి మీడియం స్కూళ్లు ఎక్కువైపోయి మనూరి దాకా వస్తా  ఉండై. ఉన్నోల్ల పిల్లోల్లు పోలోమని పోతే, మనలాంటోల్ల పిల్లలు మిగిలిండ్రు. వీళ్లు  తక్కువ మంది ఉండారని స్కూల్‌నే ఎత్తేసిండ్రు.”

ఊళ్లే వేరు… స్కూళ్ల కథ మాత్రం ఒకటే!

ఏదో ఒక కారణంతో చిక్కిపోవటం. తర్వాత చచ్చిపోవటం. ఈ దుస్థితి కారణాలెన్నో.

మస్తాన్‌లాగా అందరికీ స్పష్టంగా కనించేది ఉపాధ్యాయుల బాధ్యతా రాహిత్యం… చీటీలు, ఎల్లైసీలు, షేర్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్ దందాలు.. అనేకానేక సొంతపనుల్లో మునిగి తేలే టీచర్లు బడికి ఎగనామం పెట్టి పిల్లల జీవితాల్ను పాడు చేస్తుంటే తలిదండ్రులకి బాధ కల్గుతోంది. అటువంటి టీచర్ల పట్ల అసహ్యం పెరుగుతోంది. ఆ అసహ్యపు పొరల్లోంచి మొత్తం ఉపాధ్యాయ లోకాన్ని వీక్షించి వ్యవస్థ పట్ల నమ్మకం కోల్పోతున్నారు.

ఫలితం. పిల్లలు ప్రైవేటు స్కూళ్లవైపు తరలిపోతున్నారు. తల్లిదండ్రుల చూపు ఉపాధ్యాయుల్ని దాటి ముందుకు పోవడం లేదు. ఉపాధ్యాయ్లు ‘బడిదొంగ’లవుతోంటే పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నట్లు? అధికార్లను అదిలించాల్సిన పైవాళ్లు ఎందుకు నిద్రపోతున్నట్లు?నష్టపోతున్నది తమ పిల్లలు కాదు గనుకనా?

ఒక గది, ఒకరిద్దరు టీచర్లు, ఐదు తరగతులతో దశాబ్దాల తరబడి పేదపిల్లల చదువులు ఎంత చిందర వందరగా తయారవుతున్నాయో వాళ్లెప్పుడైనా గమనించారా? గతి లేనోళ్లకు అంతమాత్రం చాల్లే అని సరిపెడుతున్నారా?

కనీస అవసరాల గురించి, నాణ్యమైన విద్య గురించి అడిగినప్పుడల్లా డబ్బుల్లేవంటూ బీదముఖం పెడతారు.

వీళ్ల బీదరికపు నటనలోంచి  కుట్రపూరిత నిర్లక్ష్యంలోంచి   ప్రైవేటు బళ్లకు జీవం పోశారు. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ పాసులిప్పించి ‘బడిదొంగల’ బాధితుల్ని ఈ బళ్లవైపు దారి చూపారు.

ఇపుడూ ప్రైవేటు గాలికి ఇంగ్లీషు దుమారం తోడైతే, మస్తాన్ చెప్పినట్లు ‘గతి’ ఉన్నోల్లంతా పోలోమని  పోతుంటే, ఏ పాపం ఎరుగనట్లు తప్పంతా టీచర్ల నెత్తికి చుడుతున్నారు. వాళ్లు సంపాదించుకున్న అపఖ్యతి చాటున వీళ్ల కుతంత్రాల్ని తెలివిగా దాచుకుంటున్నారు.

వందలాది పర్యవేక్షనాధికారుల పోస్టుల్ని ఖాళీగా వుంచి పాఠశాలల గొంతుల్ని అదృశ్యహస్తంతో పిసికేస్తూ, బయటికి మాత్రం బ్రతికించే ప్రయత్నం చేస్తున్నట్లు క్లిప్, క్లాంప్స్, లెప్.. అంటూ రకరకాల ప్రోగ్రాంలను అమలు చేస్తున్నారు. అంకితభావం కలిగిన టీచర్లను సైతం నివేదికలు తయారుచేసే గుమాస్తాలుగా మారుస్తున్నారు.

ఇంత ఎదురుగాలిలో కూడా చాలామంది ఉపాధ్యాయులు ‘బడి దీపాలు’ ఆరిపోకుండా శక్తులన్నీ ఒడ్డుతున్నారు. తల్లిదండ్రుల ఆసరాతో దీపాల చుట్టూ అరచేతుల రక్షణ వలయాల్ని నిర్మిస్తున్నారు.

అయినా ఒక్కో దీపం ఆరిపోతూనే వుంది.

ఆఖరుకు అన్ని దీపాలు ఆరిపోయి కారు మబ్బులు కమ్ముకుంటాయేమో!

ఆ చీకటి ‘మున్నా’లాంటి నెలవంకల్ని ఎన్నింటిని మింగేయనుందో?

“ఏందన్నా మా వాని కత విని నీగ్గూడా దిగులు పత్తుకున్నెదే?” సైదమ్మ మాటతో ఆలోచనలోంచి బైట పడ్డాడు డేవిడ్..

“ఈ కథ నీ కొడుకు ఒక్కడిది గాదమ్మా.. ఇట్టాటి పిల్లలు ఇంగా చాలామందే ఉండారు” అన్నాడు.

నిజమేననిపించింది సైదమ్మకు.

బడి మూతబడిపోతూ తొమ్మిది మంది పిల్లలను వీధిపాలు చేసింది. వాళ్లలో ప్రైవేటు స్కూళ్ళలో చేరింది మగపిల్లలే! ఆడపిల్లలు చంటిపిల్లల్ని చంకనేసుకొని వీధులెంబడి తిరుగుతున్నారు. మగపిల్లలు కూడా కొన్నాళ్ళయాక ఫీజులు కట్టలేక బడి మాని చేల వెంబడి, చెట్ల వెంబడి తయారయ్యారు..

రెక్కల కష్టంతో బ్రతికేవాళ్లకు లెక్కలతో కొనే చదువు అందని ద్రాక్షగా మిగిలిపోతోంది.

మస్తాన్ వెల్లబోసుకున్న బాధకు, తను వెల్లబోసుకోలేక ఇబ్బందిగా ఫీలవుతున్న బాధకు మూలం ఒకచోటే తేలాక తన రాకను గురించి గొంతు విప్పాడు.

వినేటప్పటికి మస్తాన్ మనసు మరింత బరువెక్కింది. డేవిడ్ వెళ్ళిపోయాక పడుకుంటే రెప్పల వాకిళ్ళు మూతబడలేదు.

ఒక కంట బడిచెట్టు మీంచి చెదరగొట్టబడ్డ బాల్యపు పక్షులు.. మరోకంట బడి గోడ మీది భ్రమలు పుట్టించే బొమ్మ!

విద్య మా హక్కంటూ నినదిస్తున్న బొమ్మ!

 ***

 ఉప్పు వాగు దాటి జేడెల మీదుగా జిరంగిలా దూసుకుపోతోంది ఆటో. ఆటోలో తండ్రి ఒళ్ళో కూచ్చున్న మున్నా మనసు తూనీగలా తేలితేలి పోతోంది.

దారి పక్క పైర్లు, జేడెల ఎగుడు దిగుళ్ల మీదుగా కదిలిపోతున్న జంగిడి గొడ్లు, రోడ్డును కమ్మేసి ఆటోకు అడ్డం పడుతున్న గొర్లమందలు.. రోజు కంటే అందంగా, కళగా కన్పిస్తున్నాయ్. జరుగుతున్నదంతా కలగా, నిజంగా, కలలాంటి కమ్మటి నిజంగా అన్పిస్తోంది.

బువ్వతిని ఇంట్లోనే పండుకోమని ఎంత బంగపోయినా వినకుండా రాత్రే వెళ్ళిపోయిన డేవిడ్ మామ పొద్దుపొడిచే టప్పటికల్లా తనకోసమే తిరిగి వచ్చాడు.

నాయన ఇంట్ళో లేడూ. దుగ్గిరెడ్డి వాళ్ల గొడ్ల కొట్టం కప్పుతాంటే బోద ఎగేస్తున్నాడు. వెళ్లి పిలుచుకొనొచ్చాడు.

పైజేబులోంచి ఐదువందల కాగితాలు తెచ్చి చేతిలో పెట్టాడు మామ. ” ఈ రెండువేలు తీసుకొనిపోయి పిల్లోని ఫీజు కట్టోయ్. నేను మళ్లా క్రిస్‌మస్ పండకొచ్చినప్పుడు తీసుకుంటాలే” అన్నాడు.

నాయన కళ్లనిండా నీళ్లొచ్చినై.

మామ అన్నంతపని చేసినట్లుంది. ఈ రెండువేలు ఆ డబ్బులోంచి సర్దినట్లుంది. ఊరికే అంటున్నాడు గానీ మామ పండక్కి రాడేమో! వస్తే ఎక్కడుండాలని మధనపడతాడేమో?

ఆటొ నరసాపురం దాటి పోరుమామిల్ల వైపు మలుపు తిరిగింది. వర్షం తెరిపి నివ్వడంతో వరినాట్ల సందడి మొదలైంది. రోడ్డు కిరువైపులా గిలక తోలే వాళ్లు, గట్లు చెక్కేవాళ్లు, అద్దం లాగా సిద్ధమైపోయిన మళ్లలో నాట్లు వేసేవాళ్లూ…

తెలుగ్గంగ నీళ్లు వచ్చినప్పటినుండి అంతో ఇంతో భూ ఆధారకమున్నోళ్లు నిబ్బరంగా ఉంటున్నారు. వర్షాలు పడకపోయినా బ్రహ్మం సాగర్ నుంచి నీళ్లు ఇవ్వడంతో పైర్లు పెట్టుకొని ధీమాగా ఉంటున్నారు.

తనకు సెంటు భూమి లేదు. ఏ ఆధారకమూ లేదు.

మున్నాగాన్ని బాగా చదివిచ్చుకుంటే వాడే తనకు ఆధారం అవుతాడు.

ఎలాగైనా వాన్ని చదివిచ్చుకోవాలి. తన అశక్తత మూలంగా  ఇంకెప్పుడూ బడికి దూరం కాకుండా జాగ్రత్త పడాలి.

కుటుంబ పరిస్థితులకు, కొడుకు చదువుకు మధ్య అగడ్తను పూడ్చడం కోసం ఒక్కో ఆలోచన్ను గులకరాయిలా దొర్లిస్తోంది మస్తాన్ మనసు.

రాత్రి డేవిడ్ అన్న మాతలు మనసులో మెదిలినై.

“మూడోవానికి మెడికల్లో సీటు రాలేదోయ్. డిగ్రీలో చేరమంటే వినడు. లాంగ్‌టర్ము కోచింగ్ తీసుకుంటాడంట. డబ్బులేవన్నాను. అలిగి బువ్వ తినడం మానుకున్నెడు. వాని బాధ సూల్ల్యాక, ఇల్లమ్మి పోదామని వచ్చినా.”

నెలజీతగాడైన డేవిడ్ చదువుల పెట్టుబడికి తాల్లేక ఇల్లమ్ముకున్నాడు. తన దగ్గరేముంది అమ్ముకోవడానికి.

అనవసరంగా లేనిపోని భ్రమలు పెంచుకుంటున్నాడేమో, చిన్న మొలకను చేతబట్టుకొని చెట్టంతటి నీడ కోసం కలలు కంటున్నాడేమో, మొలకను మానులా మలచడానికి అవసరమైన ఆర్ధిక పోషకాలు తన మట్టి బతుకును ఎంత  పిండుకున్నా దొరకవేమో.

జారిపోతున్న నమ్మకాన్ని చిక్కబట్టుకునే ప్రయత్నం చేశాడు. గుండెలనిండా ధైర్యాన్ని ఎగబీల్చాడు.

ఆటో పోరుమామిళ్ల చేరింది.

బస్టాండు దగ్గర దిగి బద్వేలు రోడ్డులో కాసేపు నడిచేశరికి ఠీవిగా ఎదురుపడింది. విస్‌డమ్ ఇంగ్లీషు మీడియం స్కూల్.

జైలు గోడలాంటి ప్రహరి, కోట గుమ్మంలాంటి గేటు. ఖాకీ యూనిఫాంలో పోలీసును తలపించే వాచ్‌మెన్. సగటు తల్లిదండ్రుల్ని బెదరగొట్టడానికి సరిపడా గాంభీర్యం నిండిన వాతావరణం.

స్కూల్ టైం అవుతోంది.

తండ్రుల వెంట స్కూటర్లమీదొచ్చి దిగుతున్న టౌను పిల్లలు. కుక్కేసి తరలించుకొచ్చిన వ్యానులోంచి పుట్ట పగిలిన చీమల్లా బైటపడుతున్న పల్లెటూరి పిల్లలు.

శుక్రవారం రోజుకి ప్రత్యేకమైన వైటండ్ వైట్ యూనిఫాంలో క్లాసుల్లోకి కదులుతున్న దేవదూతల్లా ఏదో శాపభారాన్ని పుస్తకాల రూపేణా మోస్తు వంగిపోయి.. ఇంద్రధనుస్సులా…

ఆ పిల్లలు, తండ్రులు, వాళ్ల ఒంటిని అంటిపెట్టుకున్న పట్టణ నాగరికతలు, వాళ్ల కోసమే అన్నట్లుగా పెట్టుబడిదారీ తళుకుల నద్దుకున్న స్కూలు పరిసరాలు.. తమ స్థితిగతులకు పొత్తు కలవని ప్రదేశంలో మసలడానికి ఇబ్బంది పడుతూ, న్యూనతతో చితికి పోతూ హెడ్ మాస్టర్ గదిలోకి అడుగుపెట్టాడు మస్తాన్.

అలికిడికి చదువుతున్న ఇంగ్లీషు డైలీలోంచి చివాల్న తలెత్తాడు హెడ్‌మాస్టర్.

వాకిట నిలబడి అనుమతి తీసుకుని వినయంగా లోపలికి అడుగుపెట్టాల్సిన ఆచారం ఒకటి భగ్నమవటంతో అతడి నుదట అసహనం ముడతలు పడింది.

గుడ్డిమైల పది తెలుపుదనాన్ని పూర్తిగా పోగొట్టుకున్న యూనిఫాం, మెలిచుట్టుకొని పోయి వత్తిలాగా వేలాడుతున్న టై, చినిగిపోయి వేళ్లను బైటికి చూపెడుతున్న బూట్లు.. బీదరికాన్ని పోతపోసినట్లు కొడుకు.?

ఎన్నడూ ఇస్త్రీ ముఖం ఎరుగక పైకి ముడుచుకుపోయి కురచగా కనిపిస్తున్న అడ్డపంచె, కూరిపెట్టిన సంచిలోంచి అలాగే వేసుకొని రావడం వల్ల నిండ సొక్కిళ్లు బారిన చొక్కా.. ముతక బతుకుకు అద్దం పడుతూ తండ్రి…!

ఎదుట నిలబడ్డ ప్రాణుల అల్పత్వాన్ని అంచనా వేసేసరికి హెడ్‌మాస్టర్ అసహనంలో ముడతల సంఖ్య పెరిగింది.

వాళ్ల నమస్కారాలకు స్పందించకుండా ఏంటన్నట్లు ఈసడింపుగా చూశాడు.

“ఫీజు కట్టలేదని వారం నుంచి మా వాన్ని బళ్లోకి రానియ్యడం లేదు సార్. స్నేహితుడొకాయన సాయం జేసి ఉంటే కట్టి పోదామని వచ్చిన” చేతులు నలుపుకుంటూ చెప్పాడు మస్తాన్.

అతని మాటల్ని పట్టించుకోనట్లు కొడుకు వైపు చూశాడు.

“వాట్స్ యువర్ నేం? విచ్ క్లాస్?” అంటొ గరగరలాడాడు.

“షేక్ మునార్  భాషా, ఫిఫ్త్ క్లాస్, బి. సెక్షన్”

కీబోర్డుని టకటకలాడించి,మానిటర్ మీద వివరాలు చూసి కళ్లు పెద్దవి చేశాడు. తండ్రీ కొడుకుల్ని ఎగాదిగా చూస్తూ .. ‘ఎంత తీస్కొచ్చావ్?’ అన్నాడు.

ఆఫీసులో కట్టేసి రసీదు తీసుకురా అన్నాడు.

తెచ్చి చూపిస్తే, దాన్ని తనకే ఇచ్చేస్తూ.

“ఇదేందో తెలుసా? నిరుటీ ఫీజుకు రసీదు. మరి ఈ సంవత్సరపు ఫీజు ఎప్పుడు కడతావ్? వచ్చే ఏడాదా?” వెటకారంగా అన్నాడు.

“లేదు సార్! పదిరోజుల్లో అదిగూడ తెచ్చి కడ్తా సర్” భయం భయంగా అన్నాడు మస్తాన్.

“నో.. నో… ” మళ్లీ కంప్యూటర్ వైపు తిరిగాడు.

మౌస్‌ని అటు ఇటు జరిపి క్లిక్ చేసి మానిటర్ వైపు చూపించాడు.

“స్కూలు జరిగిన రెండు నెలల్లో మూడు వారాలు ఆబ్సెంట్లు! ఫీజు అడిగినప్పుడల్లా ఎలా గుడ్లు తేలేస్తున్నావో చూడు. ఇటువంటి కేసుల్ని వి కాంట్ బేర్..” తల అడ్డంగా ఆడించాడు.

అటెండర్ని పిలిచి ఈ అబ్బాయి రికార్డు షీటు ప్రిపేర్ చేయించమంటూ ఆర్డరేశాడు.

జరుగుతున్నదేమిటో అర్ధం అయ్యేసరికి కడుపులో జలదరించి ఆ ప్రకంపనలు మస్తాన్ ఒళ్ళంతా  పరుగులెత్తినై. శక్తంతా తోడేసినట్లు శరీరం తేలికగా అయిపోయింది. గుండె లోపలెక్కడో పియో పియో మంటోంది.

ఇటువంటి సన్నివేశాన్ని తను ఊహించలేదు.

చల్లబడుతున్న ఒంటిని స్వాధీనం లోకి తెచ్చుకుంటూ…

“నా కొడుకును అన్యాయం చేయకు సార్. నీకు పున్నెముంటది. బీదోన్ని రవంత కళ్ల జూడు సార్” రెండు చేతులెత్తి దండం పెట్టాడు.

అతని గోడుకి హెడ్‌మాస్టర్‌కి చీమైనా కుట్టలేదు.

ఫీజు ఒక్కటే కాదు వీళ్లతో సమస్య.

వీళ్ల అవతారం.. చినిగిన బూట్ళు , చింపిరి జుట్లు..

వీళ్లు క్యాంపస్‌లో తిరుగుతుంటే స్కూల్ ఇమేజ్ డామేజ్ అవుతోంది. వీళ్లందరినీ తరిమేసి కొత్త వాళ్లను చేర్చుకోకపోతే ఇమేజ్‌తో పాటు ఇన్‌కం కూడా డామేజ్ అయ్యేట్టుంది.

రికార్డుషీటు ప్రిపేర్ అయ్యి టేబుల్ మీదికి వచ్చింది.

దాంట్లో సంతకం బరికేసి సీట్లోంచి లేచాడు.

“బీదోన్ని అంటున్నావు గదా! నీ స్తోమతకు తగినట్లు ఏ గవర్నమెంట్ స్కూల్లోనో చేరుచుకో ఇక్కడ చదువు కొనడానికి నీ శక్తి చాలదు.”

బయటికి వెళిపోతూ కళ్లతోనే అటెండర్ కేదో చెప్పాడు.

“సార్.. సార్. సార్… నీ దండః పెడ్తా సార్”

“బీదోని బతుకు పాడు చెయగాకు సార్. రొండురోజుల్లో ఫీజు మొత్తం కడ్తా సార్” హెడ్‌మాస్టర్ వెంటబడ్డాడు మస్తాన్.

అటెండర్ మెరుపులాగా కదిలాడు. రెట్ట పట్టుకొని రికార్డుషీటు చేతిలొ పెట్టాడు.

“నువ్వెంత మొత్తుకున్నా ఆయన వినడు. నీ యట్టాటి బీదోళ్లు రోజుకు డజన్ మందిని బైటికి పంపిస్తుండాడు.. పో.. పోయి లక్షణంగా గవర్నమెంట్ బళ్ళో  చేర్పిచ్చుకో పో”.

బయటికి దారి చూపించాడు. కదలకుంటే తోసెయ్యడానికి వెనుకాడనట్లు కరుగ్గా చూశాడు.

ప్రాణం భగ్గుమంది.

అమాయకంగా నమ్మి వచ్చిన గొర్రెను కసాయి కత్తేదో కుత్తుక కోసిన బాధ.

ఇన్నిరోజులుగా కొడుకు కోసం తను పడ్డ ఆరాటం.. ఆఖరు నిముషంలో దేవుడిలాగా అడ్డుపడిన డేవిడ్ ఔదార్యం.. అంతా  మట్టిపాలైపోయింది.

అటెండరు కూడా తన బతుక్కి  గవర్నమెంటు బడి చాలని తీర్మానిస్తున్నాడు.

ఆ బడి ఊపిరాగిపోయి నిర్జీవంగా పడి వుంది. బలుపెక్కిన ఈ బడి బతికుండగానే తన్ను చంపేసింది.

చెమ్మగిల్లిన కళ్లతో కొడుకు ముఖంలోకి చూశాడు. చందమామకు మసి పూసినట్టు చిన్నబోయి వుంది.

చెయ్యందుకొని మౌనంగా బైటికి నడిచాడు.

రోడ్డు మీది గతుకులన్నీ వర్షపు నీటితో నిండి వుండై.

ఎర్రనీళ్లలో నిరాశగా కాళ్ళీడుస్తూ, మాటిమాటికి వెనక్కి తిరిగి స్కూలువైపు చూస్తూ ముందుకు నడస్తన్న కొడుకు.

మనసెక్కడో, మనిషెక్కడో ఐనట్లుగా అడుగెక్కడ పడేదీ స్పృహ లేకుండా నడుస్తన్న తండ్రి..

స్కూలు దారిలోంచి మెయిన్ రోడ్డూ ఎక్కబోతుంటే, తండ్రి చేతిలోంచి కొడుకు చెయి జారిపోతూ “భడక్”మన్న పెద్ద శబ్దం.

అదిరిపడి స్పృహలోకొచ్చి చూసేసరికి నడుములోతు గుంతలో దిగబడిపోయున్న కొడుకు!

ఏ టేలిఫోన్ వాళ్ళో దారికడ్డంగా తవ్వి పూడ్చకుండా వదిలేసిన కాలువ పరధ్యానంగా నడిచేవాళ్ల కోసం నోరు తెరుచుకోనుంది.

చొక్కా,నిక్కర్ల మీదుగా చిక్కగా జారుతున్న అడుసునీరు, బ్యాగులోకి దూరి పుస్తకాల్ని ఖరాబు చేసి మూలల గుండా లొడలొడ కారుతున్న వర్షపు నీరు.

ముక్కూ, మూతికి బొట్లు బొట్లుగా బురదంటి వికారంగా తయారైన బిడ్డరూపం.

కడుపులో దేవినట్టై, గుండెల్ని పిండినట్లై, కళ్లలోంచి వొలుకుతున్న దుఖాఁశ్రువయ్యాడు మస్తాన్.

తమ భంగపాటుకు ఎవరో “ఫక్కు”మంటూన్న భ్రాంతి! దిగ్గున తలెత్తేసరికి..

అదే బొమ్మ! బడి గోడ మీది బొమ్మ!

రోడ్డు కవతల బిల్డింగ్‌పై ఇంతెత్తు హోర్డింగ్ మీద.

పెన్సిల్ మీద పిల్లలు దగాపడ్డ తమను చూసి నింగినంటేలా నవ్వుతున్నట్లనిపించింది.

మొనదేలిన పెన్సిల్ బరిసెలా దూసుకొచ్చి గుండెల్లో దిగుతున్నట్లుంది. అందరూ చదవాలి.. అందరూ ఎదగాలన్న మాటలు “కొందరే చదవాలి.. కొందరే ఎదగాల”న్న వికృతార్ధాన్ని వెక్కిరిస్తున్నాయి.

భవిష్యత్ స్వప్నం ఒకటి బురదలో ఒలికిన బాధ! అందుకోబోయిన అక్షరం అడుసులోకి తొక్కేసిన బాధ!!

 

 

ఎర్ర అట్ట డైరీలు

తెల్లటి వెన్నెల. చల్లటి గాలి. చాలా రోజుల తర్వాత నాకెందుకో అలా బయట తిరిగొస్తే బాగుండుననిపించింది. అనుకున్నదే తడవుగా బయల్దేరి మా ఇల్లు దాటి అలా వీధి చివరికి వెళ్ళానో లేదో కాస్త దూరంగా కనిపించాడు వాడు. ముందు వాడేనా కాదా అని అనుమానం కలిగింది. రోడ్డు పక్కగా వున్న చెట్టు నీడలో చీకటి చూసుకోని అక్కడే నిలబడి చూశాను. వాడు ఇంకొంచెం ముందుకు రాగానే నిర్థారణ అయిపోయింది. వాడే..!! చారిగాడు..!!

చటుక్కున వెనక్కి తిరిగి గబగబ అడుగులు వేసుకుంటూ దాదాపు పరుగెత్తినంత పని చేశాను. చల్లగాలి ఎటుపోయిందో తెలియదు. వెన్నల తెల్లగా పరుచుకోని నా ఉనికిని వాడికి ఎక్కడ చూపిస్తుందో అని భయంగా వుంది. వాడు నన్ను చూడలేదనే అనుకున్నాను. చూస్తే తప్పకుండా కేకేసేవాడు కదా!

ఇంట్లోకి దూరి తలుపులు వేసేసి సోఫాలో కూలబడ్డాను.

“ఏమైంది? ఏదో ఈవినింగ్ వాక్ అంటూ వెళ్ళారుగా?” అడిగింది రాధిక. నా నుంచి ఏ సమాధానం రాకపోవటంతో మళ్ళీ తనే అంది – “శకునం బాలేదా ఏమిటి?” నవ్వుతూ అంటూనే వంటింటిలోకి వెళ్ళిపోయింది.

“దాదాపు అలాంటిదే” అన్నాను నేను నెమ్మదిగా. నా కళ్ళ ముందు వాడే కనపడుతున్నాడు. ఆ చారిగాడు..!!

అయినా ఈ వేళప్పుడు ఇటెందుకు వస్తున్నాడు? కొంపదీసి నన్ను కలవడానికి ఇక్కడికే వస్తున్నాడేమో? ఆ ఆలోచన రావటమేమిటి బయట గేటు చప్పుడైంది. అనుమానమే లేదు వాడే అయ్యింటాడనుకున్నాను.

“ఇదిగో రాధా.. ఆ చారిగాడు వస్తున్నట్లున్నాడుగానీ… నేను ఇంట్లో లేనని చెప్పు..” సోఫాలోంచి దూకి పడగ్గదిలోకి వెళ్తూ అరిచాను.

“చారిగారా? ఆయనొస్తే మీరు లేరని..??” ఏదో అడగబోయింది కానీ మధ్యలోనే ఆపేశాను నేను.

“అబ్బా.. అనవసరపు ప్రశ్నలన్నీ అడక్కు… నేను చెప్పినట్లు చెప్పు.. అంతే” అంటూ పడగ్గదిలోకి అడుగుపెట్టాను. మరుక్షణం కాలింగ్ బెల్ మోగింది.

రాధిక వెళ్ళి తలుపు తీయటం – “మీరా.. బాగున్నారా? ఆయన లేరండీ..” అంటూ చెప్పడం వినపడుతూనే వుంది. పడగ్గది తలుపు దగ్గరే నిలబడి వచ్చిన వాళ్ళు ఎవరో వినాలని ప్రయత్నం చేస్తున్నాను.

“అలాగా.. సరేలేమ్మా.. ఫోన్ చేస్తుంటే ఎత్తటంలేదు.. సరే ఒకసారి కలిసిపోదామని వచ్చాను..” వాడే.. ఆ చారిగాడి గొంతే అది.

“ఆఫీసులో పని ఎక్కువైందండీ… ఫోన్ మాట్లాడే తీరికెక్కడిదీ?” చెప్పింది రాధిక.

’ఫర్వాలేదు బాగానే కవర్ చేసింది’ అనుకున్నాను. ఆ తరువాత ఏ మాటలూ వినపడలేదు. వాడు వున్నట్లా వెళ్ళిపోయినట్లా? ఒక వేళ చొరవగా వచ్చి లోపల కూర్చోనుంటే? నేను వచ్చేదాకా వుంటానని అని అక్కడే తిష్ట వేసి వుంటే? చెవులు కిక్కరించి వుంటున్నాను.

“డాడీ..!!” పిలుపు వినిపించి అదిరిపడ్డాను. అప్పటిదాకా మంచం మీద పడుకోని వున్న బంటిగాడు కాలింగ్ బల్ చప్పుడుకి లేచునట్లున్నాడు. నేను తలుపు దగ్గర చాటుగా నిలబడి ఏం చేస్తున్నానో అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు.

“ఏం చేస్తున్నావు డాడీ..” అంటూ అడగబోయాడు.

“ఇష్షూ.. ఇష్ష్..” అంటూ అమాంతం మంచం మీదకి దూకు వాడి నోరు మూసేశాను. విషయం అర్థంకాక వాడి భయం భయంగా నా వైపు చూశాడు.

పడగ్గది తలుపు తెరుచుకుంది. ఎదురుగా రాధిక. బంటి మీద దాదాపు పడిపోయి వాడి నోరు నొక్కేస్తున్న నన్ను విచిత్రంగా చూసింది. నేను ఇంకా విచిత్రంగా నవ్వుతూ వుండిపోయాను.

“ఏమిటిది? మీ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు గానీ.. ఇంక చాలించి రండి” అంటూ హాల్లోకి నడిచింది. బంటిని వదిలిపెట్టి భయపడాల్సిన పనిలేదని నచ్చజెప్పి, వాణ్ణి మళ్ళీ పడుకోపెట్టి నేనూ హాల్లోకి వచ్చాను.

“ఏమిటి సంగతి?” అన్నట్టు కళెగరేసింది రాధిక. ఏమీ లేదన్నట్టు తలాడించి కూర్చున్నాను. అంత సులభంగా వదిలిపెడుతుందా రాధిక?

“మీ ఫ్రెండ్ గానీ ఇన్సూరెన్స్ ఏజంట్ అయ్యడా?” అంది

“అబ్బే.. లేదు లేదు…”

“అయితే మల్టీలెవల్ చెయిన్ మార్కెటింగ్ లాంటివి ఏమైనా..”

“ఊహూ..”

“మరెందుకు ఆయనొస్తే దాక్కున్నారు?”

గట్టిగా నిట్టూర్చాను. రాధికతో నిజం చెప్పాలనిపించింది. మొదలుపెట్టాను.

 ***

చారి అని పిల్చుకునే ఆచారిగాడు నాకు మంచి స్నేహితుడే. చిన్నప్పటి క్లాస్ మేట్. తర్వాత నేను వైజాగుకి చదువుకోడానికి వెళ్ళిపోయాను. ఆ తరువాత చాలా కాలానికి మళ్ళీ గుంటూరు వచ్చి స్థిరపడ్డాము. అనుకోకుండా ఒకరోజు సాయంత్రం శంకర్ విలాస్ సెంటర్ దగ్గర కనిపించాడు. వాడే గుర్తుపట్టాడు. వాడి గుండు, వాలకం చూస్తి గుర్తుపట్టడం కాస్త కష్టమే అయ్యింది. పలకరింపులు అవీ అయ్యాక “నెల క్రితం నాన్నగారు పోయార్రా” అంటూ తల తడుముకున్నాడు.

“అరెరే.. సారీ.. తెలుగు మాష్టారు కదూ ఆయన..?” అడిగాను గుర్తుతెచ్చుకోని.

“అవును.. తెలుగు సంస్కృతం చెప్పేవారు. పదేళ్ళనుంచి అది కూడా మానేసి జాతకాలు అవీ చెప్పడం మొదలుపెట్టాడు. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. మాస్టర్ గా కన్నా జ్యోతిష్యుడిగానే బాగా సంపాదించాడు. డబ్బు.. పేరు కూడా” అన్నాడు.

“అలాగా? ఆయన జాతకాలు అవీ చెప్తారని నాకెప్పుడూ చెప్పలేదే..” అన్నాను నేను. నాక్కూడా జాతకాలు వెయ్యడం చూడటం తెలుసు. ప్రావీణ్యం లేదు కానీ ప్రవేశం అయితే వుంది.

ఆ తరువత పిచ్చాపాటి మాట్లాడుకోని, అక్కడి దగ్గర్లోనే బ్రాడీపేటలో వున్న వాళ్ళింటికి తీసుకెళ్ళాడు. ఇంటి బయట “ఓంశ్రీ జోతిష్యాలయం, దైవజ్ఞ: హయగ్రీవాచారి” అని  బోర్డు వుంది. నెల క్రితం మనిషి పోయిన దుఖం ఇంకా ఆ ఇంటిని అంటిపెట్టుకోని వున్నట్లు కనపడుతోంది. ఇంట్లోకి వెళ్ళగానే వాడి భార్య వచ్చి మంచినీళ్ళు ఇచ్చి వెళ్ళింది. చారి వెళ్ళి వాళ్ళమ్మని వెంటబెట్టుకొచ్చాడు.

“వీడు గుర్తున్నాడా అమ్మా? సుందరం.. పోస్ట్ మాస్టర్ గారి అబ్బాయి” అంటూ గుర్తు చేశాడు. ఆమె నీరసంగా చూసింది.

“బాగున్నావా?” అంది.

“బాగున్నానండీ” అన్నాను. కొంత నిశబ్దం తరువాత – “నాకు ఇప్పుడే తెలిసిందీ..” అన్నాను ఊరడింపుగా. అంతే ఆమె ఒక్కసారిగా ఏడ్చేసింది. నాకు ఏం చెయ్యాలో తెలియక ఇబ్బందిగా కదిలాను.

“ఊర్కొ అమ్మా… ఊర్కో..” అంటూ వాడు ఆమెను లోపలికి పంపించాడు. తిరిగి వచ్చి –

“పదరా.. నాన్న రూములో కూర్చోని మాట్లాడుకుందాం” అన్నాడు. ఇద్దరం ముందు వైపు వున్న గదిలోకి వెళ్ళాం.

వాళ్ళ నాన్నగారు అక్కడే జాతకాలు అవీ చెప్పేవాళ్ళని అర్థం అయ్యింది. లోపలికి అడుగుపెట్టగానే ఎదురుగా కనపడేటట్లు ఒక కుర్చీ, దాని ముందు ఒక టేబుల్. ఆ టేబుల్ మీద ఏవో పుస్తకాలు, కాగితాలు, దేవుడి బొమ్మలు వున్నాయి. ఒక మూలగా చిన్న మందిరం అందులో ఇరుకిరుగ్గా చాలామంది దేవుళ్ళు. ఒక గొడకి మొత్తం పుస్తకాల రాకు, అందులో రకరకాల పుస్తకాలు.

ఇద్దరం ఆ గదిలో చాలాసేపు కూర్చోని పిచ్చాపాటి మాట్లాడుకున్నాం. వాడు ఎక్కువసేపు వాళ్ళ నాన్న గురించే తల్చుకోని బాధపడ్డాడు.

“చాలా పుస్తకాలు వున్నాయిరా..” అన్నాను నేను అటు చూస్తూ.

“అన్నీ లైబ్రరీకి ఇచ్చేయమని చెప్పాడాయన.. రేపో ఎల్లుండో వచ్చి తీసుకెళ్తారు..” అన్నాడు.

“అరెరే.. ముందే తెలిసి వుంటే నేనే తీసుకునేవాణ్ణి..” అని వెంటనే అన్నాను కానీ, అన్ని పుస్తకాలు నా ఇంట్లో పట్టవన్న సంగతి అన్న తరువాతే గుర్తుకొచ్చింది.

“వాళ్ళకు చెప్పేశాను కదా.. అయినా నీకు ఏమన్నా కావాలంటే తీసుకో…” అన్నాడు.

వాడు అన్నదే తడవుగా ఆ పుస్తకాల దగ్గరగా వెళ్ళి ఎగాదిగా చూశాను. చాలా వరకు జోతిషంకి సంబంధించినవి, వాస్తు సంబంధిచినవీ ఉన్నాయి.  ఓ ఇరవై దాకా ఆంగ్ల పుస్తకాలు, ఓ పది ఆత్మకథలు, అరడజను దాకా కథల పుస్తకాలు.. అంతే. వాటన్నింటి మధ్యలో మూడు ఎర్ర అట్ట డైరీలు కనిపించాయి. అవి తీసి చూశాను.

అన్నీ చేతిరాతలో రాసున్నాయి. ఒక్కొక్క పేజీ తిప్పి చూస్తే అవి హయగ్రీవాచారి గారు రాసినట్లు అర్థం అయ్యింది. చాలా వరకు ఆయన దగ్గరకు వచ్చి జాతకం చెప్పించుకున్న వారి వివరాలు వున్నాయి. ఒక ఇరవై ఏళ్ళ వ్యక్తి ఆయన దగ్గరకు జాతకం చెప్పించుకునేందుకు వస్తే నలభై ఏళ్ళకు తీవ్ర అనారోగ్యం వచ్చే అవకాశం వుందని తెలుసుకోని, దానికి తగ్గట్టుగా డబ్బులు ఇప్పటి నుంచే ఎలా ముదుపు చెయ్యాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఎలాంటిది తీసుకోని జాగ్రత్తపడాలి ఇలాంటి విషయాలు వాళ్ళకు చెప్పినట్లు రాసి వున్నాయి. జాగ్రత్తగా గమనిస్తే అన్నింటిలో ఇదే తరహా వివరాలు వున్నాయి. ఒక జాతకం ద్వారా ఒక మనిషి ఆర్థిక స్థితిగతుల్ని అంచనా వేసి ఆ జాతకునికి ఏ సమయంలో ఎంత మొత్తంలో డబ్బు అవసరం అవుతుందో లెక్కలు గట్టి, ఆ రోజుకి సరిపోయేలా డబ్బు సమకూర్చుకునేందుకు సూచనలు వున్నాయి. జోతిష్యశాస్త్రానికి, ఆర్థికశాస్త్రానికి లంకె పెట్టాడా మహానుభావుడు.

సమకాలీన కథ లో బలమైన స్వరం సత్యప్రసాద్
  aripiralaనెల్లూరులో పుట్టి గుంటూరులో పెరిగిన అరిపిరాల సత్యప్రసాద్ ఇప్పుడు తెలుగు కథా లోకంలో కనిపిస్తున్న సరికొత్త సంతకం.  విభిన్న శైలి, సరికొత్త కథన పద్ధతి ఉన్న రచయిత అరిపిరాల. ఇంగ్లీష్ చదువు చదివి, కార్పొరేట్ ఉద్యోగం చేస్తున్న కూడా సాహిత్యంమీద అభిరుచితో మంచి రచనలు చేస్తున్నారు. తొలికథ “రిక్షావాడు” 1993 లో  ప్రచురితమైంది. ఇంతవరకు 60 కథలు రాసారు. చాలా అనువాదాలు చేసారు. వివిధ పోటీల్లో ఈయన కథలకు బహుమతులు లభించాయి. త్వరలో “ఊహాచిత్రం” పేరుతో కథల సంపుటి వెలువరించనున్నారు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్నారు.–వేంపల్లె షరీఫ్

నేను ఇలా చూస్తుండాగానే చారి మిగిలిన డైరీలను చూశాడు.

“నాన్న ఇలా రాసి పెట్టుకున్నాడని మాక్కూడా తెలియదురా..” అంటూ ఆ అక్షరాలను అపురూపంగా తడిమాడు. “అమ్మకి చూపిస్తా”నని లోపలికి పరిగెత్తాడు.

కాస్సేపటికి లోపలినుంచి మళ్ళీ గట్టిగా ఏడుపు వినపడింది. ఆ తరువాత మరికొంత సేపటికి వాడు తిరిగి వచ్చాడు. ఈ సారి వాడు కూడా ఏడ్చినట్లు వాడు కళ్ళు చెబుతున్నాయి.

“చాలా విలువైన సమాచారం వుందిరా ఈ పుస్తకాలలో.. నీకేమీ అభ్యంతరం లేకపోతే ఒక్క పదిరోజులు నాకిస్తావా? నేను అవసరమైనవి అన్నీ రాసుకోని మళ్ళీ ఇచ్చేస్తాను?” అడుగాను నేను కాస్త మొహమాటపడుతూనే.

“భలేవాడివే.. దానికింత అడగాలా? నీకు ఉపయోగపడుతాయంటే తప్పకుండా తీసుకెళ్ళు” అన్నాడు వాడు.

“పదిరోజుల్లో ఖచ్చితంగా తెచ్చిస్తా” అంటూ భరోసా ఇచ్చాను వచ్చేముందు.

“సర్లేరా” అన్నాడు వాడు.

అంతవరకు అంతా బాగానే వుంది. ఆ తరువాతే అసలు సమస్య వచ్చిపడింది. పదిరోజులు కాదు కదా నెల రోజులైనా ఆ పుస్తకాలను తెరిచే అవకాశమే రాలేదు నాకు. ఆ తరువాత ఇల్లు మారాము. మారిన కొత్తింట్లో సామాన్లు సర్దుకోవటం వగైరా పనులతో అదో హడావిడి. ఈ హడావిడిలో పడి ఆ పుస్తకాల సంగతే మర్చిపోయాను. నా పుస్తకాలు సర్దుకునేటప్పుడు కూడా ఆ పుస్తకాలు లేవన్న సంగతి గమనించలేదు.

ఇక ఆ తరువాత ఇంకేముంది.. కంగారు మొదలైంది. మొత్తం వెతికాను. ఇంట్లో ప్రతిమూలా చూశాను. ఎక్కడా కనపడలేదు.

పుస్తకాలు కనపడటం లేదని నిర్థారణకి వచ్చాక కంగారు స్థానే భయం మొదలైంది. చారి ఏమంటాడో అన్న భయం. చనిపోయిన తండ్రి తాలూకు జ్ఞాపకాలు కనపడకుండా పోయాయంటే చారి వూరుకుంటాడా? అన్న భయం. దాంతో భయం కాస్తా పశ్చాత్తాపంగా మారింది.

వాడు నా అజాగ్రత్తని తిట్టచ్చు, కోప్పడచ్చు, గొడవ పడచ్చు. మాధ్య ఇప్పటిదాకా వున్న స్నేహమే లేకుండా పోవచ్చు. ఈ ఆలోచనలతో సతమతమైపోయాను. రెండ్రోజులు తిండి సయించలేదు. వాడిని కలిసేందుకు ధైర్యం కలగలేదు. ఇక అప్పటి నుంచి వాడుంటే బ్రాడీపేట వైపు వెళ్ళడం మేనేశాను. వాడి ఫోన్ ఎత్తడం మానేశాను. ఎలాగైనా సరే వాడికి కనపడకూడదన్న ప్రయత్నం మొదలుపెట్టాను. తప్పించుకు తిరుగుతున్నాను.

***

“ఇదీ జరిగింది” చెప్పాను రాధికతో.

“బాగానే వుంది.. పుస్తకాలు పోయాయి నిజమే.. అలాగని ఎంతకాలం ఇలా తప్పించుకు తిరుగుతారు?” అంది.

“ఏం చెయ్యమంటావు చెప్పు… గిల్టీ ఫీలింగ్.. అసలు నేను వాడింటికి ఎందు వెళ్ళాల్సిరావాలి? పెద్ద చదివేవాడిలాగా ఆ పుస్తకాలు ఎందుకు తీసుకోవాలి? సరిగ్గా అవే కనపడకుండా ఎందుకు పోవాలి?” తల పట్టుకోని అన్నాను.

“మీరు అనవసరంగా ఫీల్ అవుతున్నట్టున్నారు..” అని ఊరుకుంది రాధిక.

ఆమెకి ఏం అర్థం అవుతుంది నా బాధ? పుస్తకాలంటే నాకు ప్రాణం. ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే నా ప్రాణం గిలగిల లాడుతుంది. అలాంటిది చారిగాడు అడాగ్గానే “దానికేం తీసుకోరా” అన్నాడు. ఎంత నమ్మకంగా ఇచ్చాడు? వాడు అంత నమ్మకంతో ఇచ్చినప్పుడు వాటి జాగ్రత్తగా చూసుకోని, భద్రంగా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత నాపైన లేదూ? అలాంటిది ఇప్పుడు ఆ పుస్తకాలు పోయాయంటే అది తప్పే కదా!

సరే నా సంగతి పక్కన పెట్టండి. వాళ్ళ నాన్నగారు ఎంతో కష్టపడి సేకరించి రాసుకున్న విషయాలు. చారిగాడికి అపురూపంగా మిగిలిన జ్ఞాపకాలు. అవి నేను వాడికి కాకుండా చేశానంటే వాడెంత బాధపడతాడు? నాతో వున్న స్నేహం కారణంగా ఏమో అనకపోవచ్చుగాక. కానీ నన్ను పురుగును చూసినట్టు చూస్తే భరించగలనా? చారిగాడి అమ్మ.. ఆమె ఏమంటుందో? “జాగ్రత్తగా వుండాల్సింది బాబూ..” అని ఒక్క మాట అంటే చాలదూ. తప్పు చేసిన ముద్దాయిలాగా ఆమె ముందు నిలబడగలనా?

పోనీ అవన్నీ పక్కనపెట్టండి. నాకు నేను సర్ది చెప్పుకుంటాను. మా స్నేహాన్ని అడ్డంపెట్టుకుంటే ఆ చారిగాడు నన్ను క్షమిస్తాడనే అనుకుందాం. కానీ ఆ సమాచారం. ఏళ్ళ తరబడి ఎన్నో పుస్తకాలు మధించి ఆయన తయారు చేసుకున్న నోట్సు. బహుశా ఒక పుస్తకంగా వేయాలని ఆయన ఆలోచన అయ్యింటుంది. అలాంటి విలువైన సమాచారం పోగొట్టానే..! దానికైనా బాధ్యత వహించద్దూ..! ఇవన్నీ రాధికకి చెప్పినా అర్థం కావు.

ఏదో పాపం చేసినవాడిలా బాధపడ్డాను. ఏదో శాపం తగిలినవాడిలా నిరాశపడ్డాను. చారిని తల్చుకుంటేనే ఖంగారు, భయం, బాధ… ముఖ్యంగా పశ్చాత్తాపం. అది అనుభవించాలే కానీ మాటల్లో చెప్పలేని భావన. ఎవరో చొక్కాపట్టుకోని నా చెంపలు రెండూ ఎడాపెడా వాయించేస్తున్నట్టు, నన్ను అతలాకుతలం చేసేసిన బాధ. అలాగే కొంతకాలం గడిచింది.

అన్ని రోజులు మనం అనుకున్నట్టు వుండవుగా! వారం పది రోజుల తరువాత ఓ రోజు ఉదయం పూట అనుకోని పరిస్థితిలో వాడికి దొరికిపోయాను. కూరగాయల మార్కెట్ లో కావాల్సినవి కొనుక్కోని బయటికి వచ్చి రోడ్డు పక్కనే వున్న షాపులో అల్లం టీ చెప్పాను. ఇంతలో నా భుజం మీద చెయ్యి వేసి బలంగా వెనక్కి తిప్పాడు వాడు.

“మొత్తానికి దొరికావురా..” అన్నాడు.

హతోస్మి. వాడే.. చారిగాడు. ఎవరికైతే నా ముఖం కనిపించకూడదని తప్పించుకోని తిరుగుతున్నానో వాడి దగ్గర తప్పించుకోలేని విధంగా దొరికిపోయాను. వాడి వైపు చూశాను. వాడి ముఖం స్థానంలో పుస్తకాలు కనిపిస్తున్నాయి. ఎర్ర అట్ట డైరీలు.. గిర గిరా తిరుగుతూ కనిపిస్తున్నాయి.

ఉన్నట్టుండి అక్కడి నుంచి పరుగెత్తి పారిపోతే? అనిపించింది. మళ్ళీ బాగుండదని వూరుకున్నాను. అసలా అవకాశం లేకుండా అడ్డంగా నిలబడ్డాడు వాడు.

“ఏమైపోయావురా ఇంత కాలం? ఒక ఫోన్ లేదు, మాటలేదు? నేను చేస్తే పలకవు, వస్తే ఇంట్లో వుండవు..” వాడిపాటికి వాడు ఏదో అడుగుతున్నాడు. నా దగ్గర సమాధానం లేదు. వాడు అడగబొయే ప్రశ్న నా దగ్గర సమాధానం లేదు. నా మనసు చుట్టూ కందిరీగల్లా ఎర్ర అట్ట డైరీలే ముసురుకున్నాయి.

“ఏంట్రా ఏమడిగినా మాట్లాడవు?” అన్నాడు వాడు.

ఏం మాట్లాడగలను? కులాసాలు అయిపోయాక వాడు ఎలాగూ అడగక మానడు. నాకు చెప్పకా తప్పదు. తప్పు చేసిన తరువాత చెప్పుకోడనికి భయమెందుకు అనుకున్నాను. గట్టిగా ఊపిరినీ, ధైర్యాన్ని పీల్చుకోని నోరు విప్పాను.

“అరేయ్ చారి.. నన్ను నువ్వు క్షమించాలిరా..” అన్నాను.

“అదేంట్రా? అలాగంటావు?” ఆశ్చర్యపోయాడు వాడు.

“నేను ఒక తప్పు చేశానురా… మీ నాన్నగారి పుస్తకాలు ఎక్కడో పోగొట్టాను… పూర్తిగా నా అజాగ్రత్తే కారణం… దీనికి నువ్వు ఏ శిక్ష వేసినా సరే… నాకు తెలుసు అవి నీకు ఎంత ముఖ్యమైనవో..” ఏదేదో సంబంధం లేకుండా మాట్లాడేస్తున్నాను.

“రేయ్.. ఏంట్రా.. ఏ పుస్తకాల సంగతి నువు చెప్పేది?” అన్నాడు వాడు. నేను తలెత్తి ఆశ్చర్యంగా చూశాను.

“అదేంట్రా.. మీ నాన్నగారు రాసి పెట్టుకున్నవి.. ఎర్ర అట్ట డైరీలు.. నాకు ఇచ్చావు కదా?”

“ఓహ్.. అవా… నాకసలు గుర్తే లేదు… సరే పోతే పొయ్యాయిలే…” అని వాడంటుంటే నాకు ఆశ్చర్యంతో పాటు కోపం కూడా వచ్చింది.

“అదేంటి చారీ అలాగంటావు… ఎంత విలువైన సమాచారం వుందో తెలుసా అందులో..”

“ఏమోరా.. నాకు ఆ జాతకాలు అవీ అర్థం కావు.. ఇంక ఆయన రాసుకున్నవి నాకేం వుపయోగపడతాయి..”

“చాలా దారుణంగా మాట్లాడుతున్నావు… కనీసం మీ నాన్న చేతి రాత కోసమైనా అవి విలువైనవి అనిపించలేదా..”

“చేతిరాత… ఎందుకూ.. వున్నాయిగా ఆయనగారు స్వయంగా రాసుకున్న దస్తావేజులు, వీలునామా… ఛస్తున్నాం వాటి సంగతులు తేలక… అన్నట్టు వీలునామా అంటే జ్ఞాపకం వచ్చింది… నీకు తెలిసిన మంచి లాయర్ వుంటే చెప్పరా.. అసలు అందుకే నేను నీ కోసం వెతుకుతున్నాను…” వాడేదో చెప్తూనే వున్నాడు, నేను మాత్రం వినడం మానేశాను.

అలాగే నిలబడిపోయాను. అన్ని రోజులు పడ్డ ఆదుర్దా మొత్తాన్ని ఆవేదన లాంటిదేదో కమ్మేసినట్లైంది.

వాడు నా కోసం ఫోన్లు చేసింది, ఇంటికి వచ్చింది వాళ్ళ నాన్న సమపార్జించిన జ్ఞానమనే ఆస్థి కోసం కాదా….?? అంతేలే చలం ఇల్లు పాడుబడితే ఎవరికి పట్టింది? గాంధీ వస్తువులు వేలంపాటలు వేస్తే ఏ వారసుడికి నొప్పి పుట్టింది? ఆస్థికి వారసులు వేరే, అత్మకి వారసులు వేరే..!!

“ఏరా ఏమంటావ్?” కదిలించాడు వాడు.

“మళ్ళీ కలుస్తారా” అని ఆటో ఎక్కేశాను.

ఆ తరువాత మరో మూడు రోజులకి అనుకోకుండా బంటిగాడి బొమ్మల బాక్స్ లో ఎర్ర అట్ట డైరీలు కనపడ్డా, ఆ విషయం చారికి చెప్పలేదు. వాడు అడగనూ లేదు. అయితే ఇప్పటి కూడా వాణ్ణి కలవకుండా వుండటానికే ప్రయత్నిస్తున్నాను.

జలగండం

peddinti

తెలంగాణా పల్లె జీవితాలను తెలంగాణా భాషలో, యాసలో రాస్తున్నా. పల్లె అద్దం మీద ప్రపంచీకరణ రాయి పడ్డాక పగిలిపోయిన బతుకుల్ని, దీనంగా సాగిపోయిన వలసల్ని చిత్రిస్తున్నా. 2000 సంవత్సరం నుంచి రాయడం మొదలు పెట్టిన. నేను రచన మొదలు పెట్టే నాటికి కథ రైతు కూలీ జీవితం వద్దకి వచ్చి  ఆగింది. నేను ఇంకా అట్టడుగు వర్గాల జీవితాల్లోకి తొంగి చూస్తున్న. ఇంత వరకు అయిదు నవలలు, నూరు కథలు, వ్యాసాలూ, నాటకాలూ రాసా. అయిదు కథా సంకలనాలూ వచ్చాయి. ‘జిగిరి’ నవల ఇంగ్లీషుతో పాటు అనేక భారతీయ భాషల్లోకి తర్జుమా అయింది. –పెద్దింటి అశోక్ కుమార్ 

*

తలుపు తట్టిన చప్పుడు.

మగత నిద్రలో ఉన్న రచయిత ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు.

గదిలో కాగితాలు చిందరవందరగా ఉన్నాయి. ఫ్యాను గాలికి ఎగిరి ఎగిరి అలిసిపోయినట్లుగా చతికిల బడ్డాయి. సగం చదివిన పుస్తకం గుండెల మీద రెక్కలు విప్పుకుంది. కలగన్నాననుకుని కళ్ళు మూసుకున్నాడు రచయిత.

మళ్లీ తలుపు తట్టిన చప్పుడు. ఈసారి చిన్నగా పిలుపు.

లేచి టైం చూసుకున్నాడు. అర్ధరాత్రి దాటింది. “ఇంత రాత్రివేళ ఎవరబ్బా’ అనుకుంటూ సగం తెరిచిన కిటికీలోంచి బయటకు తొంగి చూశాడు.
ఎవరో అపరిచిత స్త్రీ, వెంట చిన్న పిల్లవాడు. ఆమెని ఎప్పుడు చూసినట్టు కూడా గుర్తు లేదు.

ఎవరో ఎందుకొచ్చారో అర్ధం కాలేదు. అప్లికేషన్లు రాయమనో, ఫారాలు నింపమనో ఎవరయినా ఆఫీసర్లను కలవాలనో అప్పుడప్పుడు ఒకరిద్దరు వచ్చినా పొద్దున్నో, మధ్యాహ్నమో వచ్చేవారు. తలుపు తెరవాలా వద్దా అని ఆలోచిస్తుండగానే రెండుసార్లు తలుపు తట్టిన చప్పుడు.

ఏదో అత్యవసర పని ఉంటే తప్ప రారనుకొని తలుపు తెరిచాడు రచయిత.

వయసు ఎంతుంటుందో తెలియదు.ముఖంలో మాత్రం వృద్ధాప్య చాయలు కనిపిస్తున్నాయి. తల నెరిసి ఉంది. మనిషి బక్కగా, తెల్లగా  ఉంది. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలను తట్టుకున్నట్లు స్థిరంగా ఉంది. వెంట ఉన్న పిల్లవాడికి ఆరేడేండ్లు ఉండొచ్చు. భయం, భయంగా చూస్తున్నాడు.

ఎవరు మీరన్నట్లు చూసాడు రచయిత.

అతడి చూపుల్ని చదివినట్లు ‘నేనో అభాగ్యురాలిని,’ అన్నది ఆమె.

“ఎందుకొచ్చారు…?” అడిగాడు రచయిత.

“మీతో పని పడింది,” సన్నగా చెప్పింది.

“నాతోనా.. ఏం పని..” మరీ ఇంత రాత్రి వేళ…” ఆశ్చర్యంగా అడిగాడు రచయిత.

“మీరు ఇంట్లోకి రానిస్తే వివరంగా చెప్పొచ్చు,” స్థిరంగా అన్నది.

వారిని ఇంట్లోకి ఆహ్వానించి కుర్చీ చూపించాడు రచయిత. ఆమె బిడియంగా కుర్చీలో కూర్చుంది. అబ్బాయి ఆమె ఒడిలో ఒదిగిపోయాడు. ఆమెకు ఎదురుగా కుర్చీజరుపుకుని కూర్చుంటూ ‘ఇప్పుడు చెప్పండి’ అన్నాడు రచయిత.

“నిద్ర పోయారా? మెలకువతో ఉన్నారనుకున్నాను.. ” ఆమె అన్నది.

“ఏం.. అలా అడుగుతున్నారు?”

“ఏం లేదు.. ప్రపంచమంతా నిద్ర పోతున్నప్పుడు.. రచయిత మెలకువతో ఉంటాడని…” నసిగినట్టుగా అన్నది.

అతనికి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. ఆమెను పరిశీలంగా చూస్తూ “సరే.. చెప్పండి..” అన్నాడు.

“మీరు నీటి సమస్య మీద రాసిన నవల బాగుంది. రోజు రోజుకు తరిగిపోతున్న జలవనరుల గురించి బాగా చెప్పారు. చదువుతుంటే భయమేసింది. మీరన్నారు చూడండి. రేపు యుద్ధాలంటూ  జరిగితే అవి నీళ్లకొరకేనని.. అది వాస్తవమండి..” అన్నది.

రచయిత విసుగ్గా చూసాడు. ఇంత రాత్రి పూట వచ్చి ఇదా చెప్పేది అనుకున్నాడు. లోలోపల కోపంగా వున్నా నవ్వుతూ “మీరెందుకొచ్చారో చెప్పండి” అన్నాడు.

ఆమె ఒకసారి శూన్యంలోకి చూసి బాబు వీపు నిమురుతూ “నా పేరు సుశీల. మాది పక్క ఊరే. వీడు నా మనవడు” అన్నది.

అయితే ఏమిటన్నట్లు చూసాడు రచయిత. అర్ధరాత్రి నిద్ర లేపడమే కాకుండా విషయం సూటిగా చెప్పకపోవడం అతనికి విసుగును పుట్టిస్తుంది.

సుశీల కొన్ని క్షణాలు మౌనంగా కళ్లు మూసుకొని తెరిచి రచయితను చూసింది. రచయిత తొందరగా చెప్పమన్నట్టు చూసాడు. రచయిత అంతరంగాన్ని చదివినట్టు మనవడిని చూపిస్తూ “వీడు ఎలా చస్తాడో మీరు చెప్పాలి..” అన్నది.

అదిరిపడ్డాడు రచయిత. తను విన్నది నిజమేనా ఆన్నట్టు చూసాడు. అది గమనించిన సుశీల మరోసారి  స్థిరంగా అదే ప్రశ్నను అడిగింది.

రచయిత వింతగా చూస్తూ ‘ఇదేం ప్రశ్నండి.. ఎలా బతుకుతాడో చెప్పమంటారు కాని ఎలా చస్తాడో  చెప్పమని ఎవరయిన అడుగుతారా… అయినా ఎలా బతుకుతారో, ఎలా చస్తారో నాకెలా తెలుస్తుంది..’ అన్నాడు కోపంగా.

సుశీల విరక్తిగా నవ్వింది. నవ్వి ‘మీరు రచయిత కదా’ అన్నది.

ఆ మాటలకు రచయితకు మరింత కోపం వచ్చింది. ‘అయితే! జాతకాలు చెబుతానా.. రచయితంటే జ్యోతిష్కుడిననుకున్నారా?” అన్నాడు విసుగ్గా..

ఆమె అంతే స్థిరంగా ఉంది. ‘రచయితంటే కాలజ్ఞాని కదా’ అన్నది.

రచయితకు కోపం ఎక్కువయింది. తనను తాను అదుపు చేసుకుంటూ ‘మీరు ఎవరినైనా జ్యోతిష్కున్ని కలవాల్సింది. అదీ మీకు నమ్మకముంటేనే.. ఈ విషయంలో నేనేమి సహకరించలేను..’ అన్నాడు.

‘అయ్యో.. కలిసానండి. నా భర్త ఉన్నప్పుడు కలిసాను. నా కొడుకు ఉన్నప్పుడు కలిసాను. వీడితో కూడా కలిసాను. మూడుసార్లు ఒక్కటే చెప్పారు. జలగండం ఉందని..’ సుశీల ఆగిపోయింది.

ఈవిడ పిచ్చిది కాదు కదా అనుకున్నాడు రచయిత. మాట తీరు చూస్తుంటే అలా అనిపించలేదు. నన్ను ఆటపట్టించడం లేదు కదా అనుకున్నాడు. ఆమెను అలాగే పరిశీలనగా చూస్తుండిపోయాడు.

‘.. వీడికి జలగండం ఉంది. అదీ పదేళ్ల వయసులోనే. అంటే ఇంకో మూడేళ్లుంది. ఈలోగా వీడెలా చస్తాడో తెలిస్తే నా ప్రయత్నం నేను చేస్తా.’ చెప్పింది.

రచయితకు నవ్వొచ్చింది. పకపకా నవ్వేవాడే. ఆమె కన్నీళ్లు చూసి ఆగిపోయాడు.

సుశీల ఉగ్గబట్టుకుని ఏడుస్తుంది.

ఆమె ఏడుపును చూసాక పూర్తిగా నమ్మకం కుదిరింది రచయితకు. కాని ‘ఎలా చస్తాడో  నేనెలా చెప్పగలనూ అనుకున్నాడు. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియక మౌనం గా  ఉండిపోయాడు.

కొద్దిసేపటి తర్వాత తనే తేరుకుంది సుశీల. రచయిత వైపు చూస్తూ నొచ్చుకున్నట్టుగా ‘రాకూడదనుకున్నాను బాబూ. కాని తప్పలేదు. గతంలోంచి పాఠం నేర్చుకుని వర్తమానం చూసి భవిష్యత్తును దర్శించేవాడే రచయిత అంటారు కదా…… నా సమస్యకు మీరొక్కరే మార్గం చూపిస్తారని వచ్చాను..’ అన్నది.

ఆమె మాటలకు ఆశ్చర్యపోతూ కొంత సౌమ్యంగా ‘అదే.. ఎలా…? నాకెలా తెలుస్తుంది’ అన్నాడు రచయిత.

సుశీల మనవడిని దగ్గరికి హత్తుకుంది. అతడు ఆమె చీర కుచ్చిళ్ళలో మొహం దాచుకున్నాడు.

‘మీరు ఆలోచిస్తే తప్పక చెప్పగలరన్న నమకం నాకుంది బాబూ. వీడికి జలగండం అని రాసి ఉంది కదా.. చూడబోతే భూమ్మీద నీళ్లే లేవు. కరువు కాటకాలేనాయె. మరి జలగండం ఎలా ఉంటుంది. ఏ రూపంలో వస్తుంది.’ అడిగింది.

అమాయకురాలిని చూసినట్టుగా చూసి నవ్వాడు రచయిత. నవ్వుతూ ‘చూడబోతే చదువుకున్నవారిలా ఉన్నారు. ఈ జాతకాలు, జ్యోతిష్కం అంతా వట్టిదే…. మీరెలా నమ్ముతున్నారూ’ అన్నాడు.

ఆమె సీరియస్‌గా చూస్తూ ‘నేనూ నమ్మను. కానీ జరిగింది. అది యాదృచ్చికం అనుకున్నా మరేదో అనుకున్నా వీడి తాతకు అదే జరిగింది. తండ్రికి అదే జరిగింది. నా ఆరాటమంతా వీడిని ఎలా తప్పించాలనే…’అన్నది.

రచయిత కు  ఏం చెప్పాలో అర్ధం కాలేదు. ఆమెకు ఏదో నచ్చ చెప్పాలని చూసాడు కాని బలంగా వాదించలేకపోయాదు.

అతడు ఎక్కడ విసుక్కుంటాడోనని ముందుగా తన కథని చెప్పడం మొదలుపెట్టింది సుశీల.
కొంత ఆసక్తిగా, కొంత అర్ధం కాకుండా ఉండడంతో మౌనంగా వింటూ కూర్చున్నాడు రచయిత.

* *  *

నాకు పెళ్లయింది. అత్తవారింట్లోనే అడుగుపెట్టాను. మామలేదు. చిన్నప్పుడే బావిలో పడి చనిపోయాడట. అత్త ఒక్కతే ఉంది. నా భర్తకు తోబుట్టువులు కూడా ఎవరూ లేరు. అమాయకుడు. పొద్దంతా కష్టపడి పని చేయడం తప్ప లౌక్యం తెలియదు.

మాకు ఐదెకరాల భూమి, రెండు కరంటు మోటారు బావులు. చాలినన్ని నీళ్లు. పండినంత పంట. అప్పటికే మా అత్త ఆరోగ్యం బాగులేదు. నేను వచ్చిన రెండు మూడేండ్లకే ఆమె మంచం పట్టింది. రోజురోజుకు ఆమె ఆరోగ్యం క్షీణిస్తుంది.

ఒకనాడు ‘సుశీల….’ అంటూ నన్ను దగ్గరికి తీసుకుని ఏడ్చింది. నేను కూడా ఏడ్చాను. అప్పటికి నాకొక కొడుకు.

‘సుశీలా.. నేను వెళ్లిపోతున్నానే… గంగన్న పయిలం. వాడు ఎందునెరుగని అమాయకుడు. సంసారమంతా నువ్వే ఎత్తుకోవాలి. మన వంశాన్ని ఉద్ధరించాలి.’ అన్నది.
నేను సరే అన్నట్టు తలూపాను.

నన్ను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంది. ఆప్యాయంగా తల నిమురుతూ ‘సుశీలా.. నీకో విషయం చెప్పాలి’ అన్నది.

‘చెప్పత్తా. ఏమిటా విషయం’ అన్నాను.

‘గంగన్న్నకు జలగండం ఉందే’ అన్నది.

నాకేమీ అర్ధం కాలేదు. భయం భయంగా ‘అంటే ఏంటత్తా’ అన్నాను.

‘వాని నలభైయవ ఏట జలగండం ఉందని రాసి ఉందే. వీడి తండ్రికి ఇలాగే అంటే నేను నమ్మలేదు. కాని మక్క పెరడుకు మోటకొడుతూ బాయిలో పడి చచ్చాడే’ అంది.

నాకు నమ్మబుద్ధి కాలేదు. ఆమె తృ ప్తికోసం నమ్మినట్టు నటిస్తూ ‘అయితే ఎలా మరి?’ అన్నాను.

ఆమె దగ్గర సమాధానం లేదు. ‘ఏం లేదు. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ వాడినో కంట కనిపెడుతుండు. నీళ్ల అంచుకు వెళ్లనీయకు’ అన్నది.

నేను సరే అన్నాను. నా మొహంలోకి దీనంగా చూసి కన్నీరు కార్చింది.

తర్వాత నెలలోపే ఆమె కన్ను మూసింది.

ఎంత మరిచిపోదామన్నా ఆమె చెప్పిన విషయం మరిచిపోలేకపోయాను. అప్పుడప్పుడు గుర్తుకు వచ్చి భయం వేసేది. ఊరినిండా బావులు. బావుల నిండా నీళ్లు. ఊరి చుట్టూ వాగు. ఊరు అంచున చెరువులు. నా భర్త బయటకు వెళ్తే భయం వేసేది. నీళ్లకు దూరంగా ఉంచడం సాధ్యం కాలెదు.

ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఎందుకైనా మంచిదని పట్టుబట్టి అతనికి ఈత నేర్పించాను. బావుల్లో చెరువుల్లో అతడు ఈత కొడుతుంటే నా గుండె నిండా ధైర్యం నిండేది. త్వరలోనే అతడు గజ ఈతగాడుగా పేరొందాడు. తాటిచెట్టంత లోతైన మడుగులో కూడా సూదిని వెతికి తెచ్చే నైపుణ్యం సాధించాడు.

‘అమ్మయ్య… నాకింక భయమెందుకు… ఇంకెక్కడి జలగండం’ అనుకున్నాను. అయినా జాగ్రత్తగా ఉండేదాన్ని.

చూస్తూ చూస్తుండగానే నీళ్లు మాయమైపోయాయి. వాగులు, చెరువులు ఎండిపోయాయి. వ్యవసాయ బావుల్లో తడిలేదు. కండ్లల్లో తప్ప చేండ్లల్లో చెమ్మలేకుండా పోయింది. ఊరంతా బావులు కూడివేసి బోర్లు వేయడం మొదలుపెట్టారు నేనూ అదే చేసాను.

అప్పుడప్పుడు నాకు జలగండం గుర్తుకువచ్చి నవ్వొచ్చేది. ‘జలమే లేదు. గండమెక్కడిది’ అనుకునేదాన్ని.

ముందటిలా వ్యవసాయం నడవలేదు. కరెంటు రాక, నీళ్లు లేక నానా అవస్థలు పడ్డాను. వేలు ఖర్చు పెట్టి బోరు వేస్తే వేలెడన్ని నీళ్లు పోసేది. అది కూడా వేళ్ల మీద లెక్కించినన్ని రోజులే. అలా బోరు మీద బోరు వేసి బొక్కబోర్లా పడ్డాము. పుట్టెడు అప్పయింది. పండిన పంట వడ్డీలకు సరిపోలేదు. అప్పుల బాధ తట్టుకోలేక ఒకనాడు నా భర్త పత్తిమందు తాగి ఎండిన పొలంలోనే ప్రాణాలు వదిలాడు.

జలగండం అంటే నీళ్లలో మునిగి చావడం అనుకున్నాను కాని నీళ్ల కోసం అప్పుల్లో మునిగి చావడం అనుకోలేదు.

పుట్టెడు శోకంతో ఒంటరిగా మిగిలిపోయాను. వెంటనే నా కొడుకు జాతకం చూపించాను. వాడికి కూడా విచిత్రంగా  అదే జలగండం ఉందన్నారు. అప్పటికి వాడు చదువుతున్నాడు. ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. మొత్తం మీద ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాను. నా కొడుకును వ్యవసాయంలోకి దించితే  తండ్రిలాగే చస్తాడనిపించింది. అందుకే వ్యవసాయానికి దూరంగా ఉంచాను. వానికి చదువు అబ్బలేదు. ఏ ఉద్యోగం దొరకలేదు.

అప్పటికి మా ఊరికి  ఏవేవో ఫాక్టరీలు వస్తున్నాయి. వాటికి వ్యతిరేకంగా ఊర్లో పోరాటాలు కూడా జరుగుతున్నాయి.

‘మీకు డబ్బులిస్తాం. ఉద్యోగాలిస్తాం. భూములివ్వండీ అన్నాయి కంపెనీలు.

‘పచ్చని పంట పొలాలను ఫాక్టరీలుగా మారుస్తారా? ‘ అంటున్నారు జనం.

ఎక్కడి పంట, ఎక్కడి పచ్చదనం, అన్నీ బీడుభూములేగా అనిపించింది నాకు. అప్పటికి అప్పుల భారం పెరిగి వ్యవసాయమే బరువైపోయింది.

చాలామంది తమ భూములను కంపెనీలకు అమ్మారు. నేను గూడా నా భూమిని కంపెనీకి అమ్మాను. వచ్చిన డబ్బుతో అప్పు తీర్చాను. మిగిలిన డబ్బుతో ఒక ఇల్లు కట్టుకున్నాను. ఊరిలోకి కంపెనీలు వచ్చాయి. నా కొడుకుకు కంపెనీలో ఉద్యోగం దొరికింది. పెళ్లి చేసాను.

అప్పుడప్పుడు జలగండం విషయం గుర్తుకు వచ్చి నవ్వొచ్చేది. భూమిలేదు. నీళ్లు లెవ్వు. బోర్లు కూడా లెవ్వు. నీళ్లతో సంబంధమే లేదు. జలగండం ఎలా వస్తుంది. అనుకునేదాన్ని. కాని ఆ గండాన్ని తప్పించుకోలేకపోయాను.

ఒకనాటి రాత్రి ఎలక్ట్రోప్లేటిన్ కంపెనీ విడుదల చేసే పాదరస కాలుష్యం తాగునీటిలో కలిసింది. ఆ నీళ్లు తాగి చనిపోయిన వారిలో నా కొడుకు కూడా ఉన్నాడు. సీనియర్ సిండ్రోం వ్యాధి సోకి పిచ్చిపట్టి మరణించాడు. కంపెనీ తప్పంతా మా మీదికే తోసింది. జలగండం ఈ రూపంలో వస్తుందని నేను ఊహించలేకపోయాను.
భర్తను పోగొట్టుకున్నాను. కొడుకును పోగొట్టుకున్నాను. భయం ఎక్కువయింది. వెంటనే నా మనవడి జాతకం కూడా చూపించాను. విచిత్రంగా వీదికి కూడా అదే జలగండం రాసి ఉంది.

*   *  *

చెప్పడం ఆపి రచయిత వైపు చూసింది సుశీల. రచయిత వింటున్నాడు. అప్పటికి ఆమె కళ్లనిండా నీళ్లు. గొంతు బొంగురుగా మారిపోయింది.
“ఇప్పుడు చెప్పండి…. అది ఏరూపంలో వస్తుంది. దాన్ని తప్పించడానికి నేను ఏం చేయాలి?” బాధగా అడిగింది సుశీల.
ఆలోచనల్లో పడాడు రచయిత. సమస్య సుశీలది ఒక్కరిదే కాదని ప్రతీ ఊరిదని తెలిసిపోతుంది. రోజురోజుకు తరిగిపోతున్న నీటి వనరులు పెరిగిపోతున్న కాలుష్యం మనిషిని ఎక్కడికి తీసుకుపోతోందో తెలియడం లేదు.

సుశీల సమాధానం కోసం చూస్తుంది.
రచయిత దగ్గర సమాధానం లేదు.

రంగం పెట్టి

sindhu-2_336x190_scaled_cropp

మన్నెం సింధు మాధురి

 

  వర్తమాన తెలుగు కథా సాహిత్యం లో విశిష్ట స్వరం మన్నెం సింధు మాధురి . ఒక కొత్త కెరటం లా  కథన రంగం లోకి దూసుకు వచ్చిన సింధు మాధురి గుంటూరు జిల్లా లో పుట్టి, బళ్ళారి దగ్గర ఉళెనూరు క్యాంప్ లో పెరిగారు. ఉళేనూరు క్యాంప్ జ్నాపకాలను కథలుగా ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో 25 వారాల పాటు సీరియల్ గా అందించారు.  సింధుమాధురి కథల్లోని స్త్రీపాత్రలు అందరికీ తెలిసిన స్త్రీల జీవితాలు కావు. ఊహాజనిత పాత్రలు అసలు కావు. ఆమె కథలన్నీ స్వానుభవ కథనాలు. ఆ కథనాల్లోని వ్యక్తులు విభిన్న వర్గాలకు చెందిన స్త్రీలు. వివిధ రకాల జీవిత పోరాటాల్లో నలిగిపోయినా మొక్కవోని ధైర్యం తో నిజంగా జీవితాన్ని జీవించిన స్త్రీలు.  కథల  వస్తు,రూపాల చుట్టూ ఉన్న పరిమితుల సంకెళ్ళను  అలవోకగా ఛేదించిన రచయిత్రి సింధుమాధురి.

***

‘‘యావండీ లచ్చీశ్రీమ్మగారూ బాగుండారా? ఏంటి కబురు చేశారంట,’’ అనే మాట ఇనపడింది. అతను మా ఊరి వడ్రంగి వాసుదేవరావు.
‘‘ఏవీ లేదు. కాళీగా ఉంటే మా రంగం  పెట్టికీ, మైలగుడ్డల పెట్టికీ పాలిష్ పెడతావని పిలిచాను,” అంది అమ్మమ్మ.

“మొన్న పట్నం నించి పెద్ద కొట్టాళ్ళు (షో రూమ్) వచ్చారండీ. ఎక్కడన్నారంగంపెట్టి ఉంటే ఎతికి పెట్టమన్నాడు. ఐదేలిప్పిత్తాను.’’

‘‘ఏదో పనివంతుడివి తింటే పదో పరకో తింటావు గందా అని నిన్ను పిలిత్తే మా కొంపలో వాళ్లలాగా నువ్వు కూడా నా సామానం మీదే కన్నేశా. పదినిమిషాల్లో మా స్థలం ఖాళీ చెయ్యక పొయ్యావో నిన్ను సావిడూడిసే పొలికట్టెతో కొడతా,’’ అని తిట్లు మొదలుపెట్టింది. దడిసిపోయిన వాసుదేవరావు కథ ఎదురు తిరగటంతో బతుకుజీవుడా అని ఎట్టాగో బయటపడ్డాడు.

ఇంత లోకి మా అమ్మమ్మకి నేను దొరికిపోయా.

‘‘ఏవే ఎక్కడ ఆడతన్నా. ఊరిమీద బలి తిరుగుతున్నావా. బెజగాడెల్లే పెరిగావు. పనిపాటల్లేవు. ముసల్ది చేసుకోలేక సత్తందని యావన్నా ఉందా. నీకు ఇవరం ఎప్పుడు వచ్చుద్దే,’’ అని అమ్మమ్మ పురాణం ఇప్పింది.

నన్నేదో అనటం ఇని, ‘‘ఏంజెయ్యాలక్కయ్యా,’’ అంటా పక్కింట్లో ఉండే మా కవలమ్మమ్మ వచ్చింది.

‘‘ఏంజెయ్యాలా ఆ ఎలిసిమీద సామానం పారేసి ఎన్నాళ్ల యింది. పోయినేడు కుదరక తోవలా. ఆటి గురించి పట్టిచ్చుకునేది ఎవరు? ఒక్కళ్లన్నా నా మాట ఇంటేనా. అట్టా వదిలేసి రెండేళ్లు అయ్యింది. ఎలికలు, బొద్దింకలు, సాలీళ్లు ఎన్ని గూళ్లు, గుడ్లు పెట్టినయ్యో. తోవటానికి పనిమనిషి నాగమ్మని రమ్మన్నా. ఈ పిల్లలు ఒకళ్లు  పైకెక్కి ఒంపుతా, రెండో వాళ్లందిత్తంటే, నాగమ్మ తోవుతుంటే నేను కడగొచ్చొనుకుంటన్నా. మళ్లీ ఆటిని తుడిసి ఎండలోబెట్టి, కిలువు పట్టకుండా, ఉప్పురవకుండా, నేతిగుడ్డతో తుడవాలి. ఎలిసి దులపాలి. మళ్లీ కొత్తగుడ్డలు పరిసి సామానం పరవాలి. నా సావు కొత్తంది, ఒక్కదాన్నే సేసుకోలేక.’’

‘‘నేను సెయ్యేత్తాలే అక్కయ్యా,’’ అంటా పనికి మమ్మల్ని పురమాయించారు.

ముందుగా రంగంపెట్టి మైలపెట్టి తుడుత్తున్నారు. నేను రంగంపెట్టి ఈపు అరసున్నాలాగా ఉంటే కాసేపు దానిమీద పడుకున్నా. మా ఇంటో భోషాణం పెట్టి, కుండలపెట్టి, మైలగుడ్డల పెట్టి, రాట్నం పెట్టి, గాజుల పెట్టి, బల్లపద్దుల పెట్టి, ఏకులపెట్టి, బొట్టుపెట్టి, ఆఖరిది పెట్టెలకే రారాజు రంగం పెట్టి (రంగూన్‌ పెట్టి). మళ్లీ దీంటో రకాలు. పూలపెట్టి, నగిషీలపెట్టి, బద్దీలపెట్టి. మా పక్కింటో కవలమ్మమ్మ వాళ్లది పూలపెట్టి. బద్దీలపెట్టిలో నాలుగొరసలు. వరసకి నాలుగు నించీ ఎనిమిది సొరుగులు. ఒకొరస మొత్తం తీత్తేగానీ రొండో వరస రాదు. రక రకాల అరలు. అమ్మమ్మ మెడలో చంద్రహారం పెట్టికి ఏసినట్టుగా పైన దండ అతుక్కుని ఉంటది. మూలలన ఇత్తడి బద్దీలు మేం రంగూన్‌ జమిందారులం అన్నట్టు నిక్కు సూపిత్తా ఉంటయ్యి. దస్తావేజులు, పాత పుస్తకాలు, సావుపుటకల కాయితాలు, ఈలునామాలు, అప్పునోట్లు. అన్నిటికీ అదే బ్యాంకీ. ఆఖరి అర తియ్యాలంటే అంతా తెలిసినాళ్లకి అరగంటయినా పట్టుద్ది. నా పదేళ్లు వయసప్పుడు మా పక్కింటో ఉండే మా అమ్మమ్మ చెల్లెలు వరసయ్యే కవలమ్మమ్మ రంగంపెట్టి తెరుత్తుంటే చూశా. అప్పటినంచీ నాకా పెట్టంటే చానా ఇష్టం. పాత విఠలాచార్య సినిమాలో మాంత్రికుడి కొంపలాగా ఉండేది.rangampette

రంగంపెట్టి మా ఇంటికి చేరటం కూడా సిత్రవే. కవలమ్మమ్మ వాళ్లాయనా, మా తాతా పడవల మీద బియ్యం ఏసుకుని రంగం ఎల్లి వత్తావత్తా, మాకు బద్దీలపెట్టి, ఆళ్లకి పూలపెట్టి తెచ్చారు. నష్టం వచ్చి యాపారం మానేసినా ఈ చెక్క సామానం గుర్తుగా ఉండిపోయినయ్యి.

ఇంకోటి మైలగుడ్డల పెట్టి. దాన్ని సుండు సీతమ్మగారని మా అమ్మమ్మ స్నేహితురాలు ఆళ్ల పిల్లలతో పాటు రాజమండ్రి నించీ మాకూ ఒకటి తెచ్చింది. ఇడిసిన గుడ్డలు అందులో ఏత్తే మా రాంకోటి తాత కింద చిన్న తలుపు తీసుకుని గుడ్డలు మూట కట్టుకుని ఎల్లేవాడు. దానికి గాజు అద్దాలు. ఎనక పాత హిందీ సినిమా తారల చిత్రాలు. ఎప్పుడయినా అల్లరి ఎక్కువ చేత్తే అమ్మతో దెబ్బలు పడతయ్యి అనుకున్నప్పుడు గౌనులో ఏరు సెనక్కాయలు పోసుకుని తింటా అమ్మ కోపం తగ్గినాక బయటికి వచ్చేదాన్ని. ఈ రొండూ లేకపోతే మా ఇంటికి అందవే లేదు. మరనాటి పొద్దిన్నే సామానం తోమే పని మొదలుపెట్టారు. అసిగాడు (అన్న) ఎలిసిమీద నించి అందిత్తంటే, నచ్చితే చేతికిత్తన్నా లేకపోతే ఇసిరి ఇసిరి కొడతన్నా, ఆడుకోటానికి ఈలవటల్లేదనే కచ్చతో.

‘‘అట్టా ఇసిరితే, సొట్టలు పడితే అయ్యి ఎందుకూ పనికి రావు. మళ్లీ కొనుక్కొలేము. వస్తువ అవరదు. నిదానంగా ఇవ్వాలి,’’ అంది కవలమ్మమ్మ.

‘‘దానికేంటి కష్టం జేత్తేగా నెప్పి తెలిసేది. ఒంకిటికెల్లి ఉడకేసుకోటానికి కూడా సట్టీ అవుర్సుకున్నప్పుడు కదా మన బాద అర్థవయ్యేది.’’

‘‘అంతేలే అక్కయ్యా, పిల్లాజెల్లా లేకపోతే కుక్కా నక్కా పిల్లీ దూడా దుక్కీ మీద బెమలు పెంచుకుంటాం. అయ్యీ లేకపోతే బీరువాలు, మంచాలు, కంచాలు, చిప్పలే బందాలు. పొద్దిన లెగిత్తే అయ్యే పలకరిత్తయ్యి. ఆటిమీదే మమకారాలు. ఏదో పక్కింటో నువ్వుండబట్టి ఇంటో లేళ్లల్లే ఈ పిల్లలు ఎగురుతా, గంతులేత్తన్నారు. ఏదో ఈళ్లేగా నాకు పిల్లాజెల్లా. మొగుడు ఏ దేశాల మీద తిరిగినా లోటు తెలవటల్లా. ఏది తెచ్చిపెట్టమన్నా తుర్రున పరుగెత్తుతారు. అంతగా అయితే దానికి పెళ్లయిన తరువాత నే నెలతాలే ఎనకమాల. ఒంటికాయి సొంఠికమ్మునేగా.’’

‘‘దీన్ని నమ్ముకుంటా, గొంతులో నీళ్లు కూడా పొయ్యదు. నాకూ కూతురుంది. సుకపడతన్నానా. చాకిరీ తప్పిందా. బిడ్డలుండా లేకపోయినా ఒకటే బతుకు. ఉండాళ్లేవయినా మమ్ముల్ని ఎండి ఉయ్యాలేసి ఊపుతున్నారా, నిన్నూపట్లేదని బాదపడతానికి. అందరిదీ ఒకటే రాత. ఈ బిడ్డలకన్నా మట్టిగెడ్డలు నయ్యం. చాకిరీ జేత్తే ఫలితం సూపిత్తయ్యి.

ఇప్పుటాళ్లు మీద మనవే నయం. తిట్టుకున్నా, తిమ్ముకున్నా పెద్దాళ్లు మంచాన పడితే శాకిరీ జేసి కూడేశాం. ఇప్పుడన్నీ మొక్కుబడి తంతులు. ముందు ముందు అయ్యి కూడా సూడములే. మాట్టాడితే నా కూతురు సామానం కేజీల లెక్కన మారకం కాటా ఏపిత్తానంటది. ఏనాటినించీ ఏర్పాటు జేసుకున్నాం. ఎన్ని గుర్తులు. అయినా మన బాదలు మడుసుల కన్నా సామానులకే ఎక్కువ తెలుసు,’’ అంది.

సాయంత్రం దాకా అందరం కలసి సత్తా, పడతా సామాన్లు కడగటం సరిపోయింది. అమ్మమ్మకి, కవలమ్మమ్మకీ ఓపికలు అయిపోయినయ్యి. ఇక రేపు తుడిసి సర్దొచ్చులే అని ఇల్లంతా సిందరవందరగా పరిసినట్టు ఒదిలేశారు. మైలుగుడ్డల పెట్టి, రంగం పెట్టి, దబ్బకాయలో నాలుగు, ఎఱ్ఱమట్టి, సబ్బుపొడి, కొబ్బరిపీసు, తోవటానికి ముగ్గురు  మడుసులు, దొంగలెవరన్నా ఎత్తుకుపోతారనే బయం. కొంపకి కాపలాగా ఎల్లకాలం ఓ మడిసి. తీరా సర్దినాక డమడమా, బడబడా, ఆటిట్టో ఎలికలు తిరగడం,’’ అని ఇసుక్కుంది.

‘‘ఇయ్యాల అయ్యి అడ్డవయినయ్యని అమ్ముతానంట న్నావు. రేపు ముసలాళ్లు మయినాక మేవడ్డమని మమ్ముల్నెవరికి అమ్ముతా?’’

‘‘అమ్మా ఇక నువ్వాపు. రోజుకొకసారన్నా వాడనయ్యి ఇంటో అనవసరం. అయినా నేను చెపితే నువ్వింటా. ఎముకలు అరిగే దాకా తోవుకో.’’

‘‘నేను సచ్చేదాకా నా సామానం అమ్మమాక. నీకు ఒద్దకపోతే నేను నా మనవరాలికి ఇత్తా. ఆనాడే దానికి ఒద్దకపోతే తెగ నమ్ముద్ది.’’

అక్కడే ఉండి ఈళ్ల మాటలింటన్న నేను, ‘‘నాకు మాత్రం కవలమ్మమ్మది రంగంపెట్టి, మైలగుడ్డల పెట్టీ కావాలి. రంగం పెట్టిలో ఉండి ఎండి కాటిక్కాయి, వక్కపొడి డబ్బా, ఎండి పెన్ను, పన్నీరుబుడ్డీ నాకే ఇత్తానందిగా.’’

‘‘తీసుకుని నెత్తిన పెట్టుకు ఊరేగు. నీకొచ్చేవాడు పల్లెటూళ్లో ఉంటాడనేంటి? ఏ పట్నంవాడో అయితే అగ్గిపెట్టి కొంపలో ఖాళీలేక ఇసిరి రోడ్డుకేత్తాడు. ఈ పెట్టెలు రొండూ పెట్టాలంటే పెద్ద చావిడి (హాలు) కావాలి.’’

‘‘కొంపాగోడూ లేనాణ్ణి ఎతికి తెత్తావా ఏంటి దానికి. మేం ఇద్దరం ఎల్లి సర్ది వత్తాం. అవసరం అయితే సచ్చేదాకా దాని దగ్గిరే ఉండి బూజులు దులిపి కడిగి పెడతాంలే,’’ అంది కవలమ్మమ్మ.

‘‘ఇప్పుడు మాటలూ ఓపికలూ అప్పుడు ఎవరికీ ఉండవు. అయినా దాని సంగతి మీరెట్టా చెబుతారు. ఇక అది కూడా ఏ ఆనందం లేకుండా మీకు మల్లేనే కుండలూ, డబ్బాలు, సట్టిలూ, సిప్పలూ కడుక్కుంటదా. చదువూ, ఉజ్జోగాలు, దేశాల మీద తిరుగుతా, అన్నీ హోటళ్లలో కొనుక్కుని తినే రోజులొత్తయ్యి. అయినా మీకు మడుసుల మీద కన్నా కుండ, సిప్ప, డిప్పా, సట్టీ, సిబ్బిరేకు, తప్పాళాలల మీదే మోజు. అయ్యే కూడు పెడతయ్యి.’’

‘‘మాకు తెలిసింది ఇదే. మీ బాబులాగా, నీలాగా మమ్మల్ని మా బాబు సదివివ్వలా. ఈటి గురించి తప్ప మాకింకేమి తెలుత్తయ్యి. ఏ ఊళ్లన్నా ఏలటం రావద్దూ. అయినా నాకు సామానం అంటే ఇష్టం. మల్లీ మాట్టాడావో, అన్నీ పట్టుకుపోయి ఏరే కొంపలో అద్దెకుంటా,’’ అని ఒక్కిసురిసిరింది.

ఎందుకొచ్చిన గొడవ అని అమ్మ కూడా వాదిచ్చలా.

రాత్తిరయ్యింది. సామానం వాకిలంతా పరిసి చిక్కురు బిక్కురుగా ఉండయ్యి. అమ్మమ్మలిద్దరికీ సర్దటానికి ఓపికలు అయిపోయినయ్యి. టేకుచెక్క చినుకులు పడితే పాడవుద్దని కవలమ్మమ్మ వరండాలో మైలపెట్టిని జరిపిచ్చారు.

అన్నాలు, కూరలు వండటం అయినాక అందరం ఇక్కడే తిన్నాము. కవలమ్మమ్మ ఆళ్లాయనా మా తాతా కలిసే యాపారాలు చేసేవారు. లాసొచ్చి మా తాత మానేసినా, ఆ తాత మాత్రం యాపారం ఏరుతో అక్కడే ఉండి సంవత్సరానికి రెండుసార్లు వచ్చి నెలేసి రోజుల లెక్కన ఉండి ఎలతాడు. కానీ చాలామంది అమ్మమ్మకి పిల్లలు లేరని రంగంలో ఎవరినో చేసుకుని పిల్లల్ని కన్నాడని ఆళ్లు పెంపకం కోసం, దానికోసం అక్కడే ఉంటన్నాడని ఎనకగా గుసగుసలాడుకుంటారు. ఎదురుగ్గా అంటే మా అమ్మా, అమ్మమ్మా రాచ్చసుల్లా పడతారని బయ్యం. ఆళ్ల ప్రేమలూ బందాలే ఏరు.

ఇద్దరూ ఇరవై ఏళ్ల నించీ పక్కపక్క ఇళ్లల్లో కాపరాలు. మొగుళ్లు తెచ్చినా తేకపోయినా సంసారాలు లాక్కురాటం అలవాటయిపోయింది. గోంగూరా పండుమిరపకాయలు పచ్చట్టో గోలగూర ఆకులాకులుగా కనపడేటట్టు పచ్చడి పట్టటం దగ్గిర నించీ రాట్నం మీద ఏకులు ఒడకటం, అత్తామావల సంవచ్చరీ కాలకి బట్టలు పెట్టి ఎవరికి దానం ఇవ్వాలి, ఏ గేదె పాలకి కోవా ఎక్కువ కట్టుద్ది, ఈ సంవత్సరం మొత్తానికీ ఎంత ముదర లేతరంగు కుంకాలు నూరుకోవాలి, రాళ్లు ఎన్నేయ్యాలి, నిమ్మరసం ఎక్కువయితే కుంకం ఏ రంగుకి తిరుగుద్ది, కొబ్బరినూనె, పచ్చ కర్పూరం పాళ్లు కుంకంలో ఎంత కలిపితే మొకాన రాలకుండా అతుక్కుంటుంది, పూర్ణాల పూత పిండి బరకబరకగానే ఎందు కుండాలి లాంటి జాతీయ సమస్యలన్నీ ఇరవై ఏళ్లుగా మాట్లాడు కుంటన్నారు. అయితే చివరికి ఇద్దరి నిర్ణయం ఒకటే.

ముందు మా అశిగాడు (అన్నయ్య) తరువాత నేనూ తరువాత మా తమ్ముడు ఎవరో ఒకళ్లం కవలమ్మమ్మ పక్క మీదే నిదర. మొగుడికి దూరంగా సంవచ్చరాలు గడిపింది కానీ పక్కలో మాత్రం పసిపిల్లలు లేకుండా ఎప్పుడూ లేదు. మేం పక్కలు తడిపేసినా ఆనందమే. ఒక్కోసారి మేం ముగ్గురం తన దగ్గిరే పొడుకుంటావని ఏడిసి కొట్టుకుని అమ్మ చేతుల్లో ఈపులు ఇమానం మొతలు మోగిచ్చుకున్న రోజులెన్నో.

ఇవ్వాళ కూడా అన్నాలు తినటం అయినాక అమ్మమ్మ మంచం ఎక్కి పడుకున్నా. అసిగాడికి, తమ్ముడికీ ఏరే మంచం ఏసింది. అందరం పగ్నలంతా అటూ ఇటూ తిరుగుతా పని చేత్తా ఉండామేమో తొందరగా నిద్దరలోకి జారుకున్నాం. అద్దరాత్తిరి కాడ ఎవరియ్యో మాటలు ఇనపడతన్నయ్యి. ఎవరా అని చూశా. ఎంతాశ్చర్యం. ఆళ్లు మైలపెట్టి మా రంగం పెట్టీ. ఏం మాట్టాడ తన్నయ్యో అని దగ్గిరగా ఇంటానికి నిలబడ్డా.

‘‘రంగప్పా ఏంటి రోజులిట్టా కూలతన్నయ్యి. మడుసుల ఎక్కలో మనం చిల్లికానీ ఇలవ చెయ్యటల్లేదు. ఎంత భోగంగా బతికావు? అసలు నీ పుటకెక్కడ, ఆ దర్జా ఏంటి? ఎక్కడ రంగం? ఎక్కడ కథ. రంగం నించీ నిన్ను తెత్తన్నారని ఉత్తరం వచ్చిన కాడ్నించి నీ రాకకోసం ఊరంతా ఎంత ఎదురుచూశారు. నువ్వు ఓడ మీద విలాసంగా దిగావు. నిన్ను ఆరుగురు  మడుసులు మోసి లాగుడు  పడవలోకి నిదానంగా కూచ్చోబెట్టారు. ఆ పడవ పెద్ద కాలవలో పడి సాయంత్రానికి ఊరు జేరింది. కాలువ గట్టున ఊరు ఊరంతా నిలబడ్డారు. జాగ్రత్తగా తాళ్లు ఉయ్యాలతో గోనెపట్టల మీద దించి జనం స్వాగతంతో ఆశ్చర్యంగా సూత్తంటే సున్నం కొట్టిన తెల్లటి ఇంట్లో అడుగెట్టావా. మీది దేవదారు వంశమేమో మాంచి వయస్సులో ఉండప్పుడు తయారయ్యావేమో అబ్బా ఎంత సోకు. నీపై నున్న ఇత్తడి బద్దీల నగ్నల ముందు ఎంత హారాలయినా దిగదుడుపే. రోజుకొకింటాళ్లొచ్చి నీలో డబ్బు దాసుకునేవాళ్లు. నాలుగొరసల్లో ఎన్ని సొరుగులు.

నల్లమందుకి ఒక అర. దాన్ని సూసి మొకం చిట్టగిచ్చినా, పెద్ద పాపాయి కూతురు కన్నప్పుడు, సరిగ్గా సూడక వాపునెప్పులొస్తే, నాటుసిక్కుడు గింజంత ఏత్తే మళ్లీ మూడురోజులు నెప్పులని మూలగలేదు. అట్టాగే కాసుల సొరుగు. రంగం నించీ వచ్చిన పత్తీ, చెక్కరంగుదే అయినా తోటలో దూరిపి ఉంచితే ఆ సొరుగులో ఊరందరిదీ శాదెడు బంగారం దాశారు. ఇనప్పెట్లెలూ, బాంకీ తాళాలూ ఒట్టి సేతుల్తో పగలకొట్టే స్టూవర్టుపురం దొంగ ‘మాణక్కానికి’ తెల్లవార్లూ తిప్పినా అరదారి కనపడలా. పట్టుసీరలు, తనఖా కాయితాలు, డిక్రీలు ఎన్నెన్ని దాశారు. సెరిత్రలో ఈళ్లు కొన్న గన్నాయ్‌, బొన్నాయ్‌ బీరువాల తాళాలు పగలకొట్టి దొంగతనాలు సూశాంగానీ ఒకనాడన్నా రంగం పెట్టి దోపిడీ జరిగిందని రోడ్డుకిగానీ, పేపరుకిగానీ ఎక్కి ఎరుగుండామా,’’ అని దిగాలుగా అంటుంది మైలపెట్టి.

నీ బతుకు మాత్రం అవటానికి ఇడిసిన గుడ్డలపెట్టయినా పెళ్లీ, బట్ట, పెద్దమడిసి అయినబట్ట, పురిటిగుడ్డలూ, శోభనం గుడ్డలూ, పురుళ్లు, పున్యాలు, సావులు ఎన్నిటిని కాసి కాపాడా. నువ్వే లేకపోతే గబ్బెత్తిపోయేది ఇల్లు. అనే లోపల డమ్‌మని దూకింది, సూరుకి యాలాడగట్టిన సొరకాయబుఱ్ఱ.

‘‘ఏంటి మాట్టాడతన్నారు రంగం వదినా?’’

‘‘ఏదో కట్టం, సుకం లే? సూరులో ఎట్టుండా?’’

‘‘ఉప్… ఏం జెప్పను. కనీసం మిమ్మల్ని ఇళ్లల్లోనో, సంత మేడల్లోనో ఉంచుతున్నారు. మా పని మరీ గోరం. ఇదివరకి పాదుబెడితే ఇంటి కప్పంతా అల్లుకుని, సల్లగా లేత కాయలతో కడుపులు నింపుతా ఉండేదాన్ని. సొరకాయ దప్పళం అంటే నా స్నేహితురాలు ముద్దపప్పుతో కలిపి తినని వాళ్లుండారా. ముదిరినాక నన్ను లోపల శుభ్రంజేసి రకరకాల ఇత్తులునింపి యాలకడితే ఒచ్చే పంటకి గింజ పొట్లిపోకుండా, పుచ్చకుండా, బూజు పట్టకుండా పొట్టలో దాచుకునేదాన్ని. ఏంటో మమ్ముల్ని పెంటపోగుల్లో ఏసి, ప్యాస్టిక్‌ పొట్టల్లో ఇత్తనాలు దూరుతున్నారు. ఈ ప్యాస్టిక్‌ జిమ్మదియ్య,’’ అని మెటికలు ఇరుత్తుండగా ఎవరియ్యో నీడలు కదిలినట్టయ్యింది.

రంగంపెట్టి కళ్లు నులుపుకుని సూత్తే దిగులుగా మూడు కోతులు వచ్చి, ‘‘బావుండావా రంగప్పా,’’ అన్నయ్యి.

‘‘ఏం బాగులే దినదినగండం నూరేళ్ళాయుష్షు. మీరెవరు? అయినా కోతిమూక మీకేం తక్కువ? దేశం అంతా ఎగరొచ్చు.’’

‘‘ఏం ఎగురుతాం? అడివి అంతా నరికేసి వరిపొలాలు, చేపల సెరువులు సేత్తే. మెందు కొట్టిన పచ్చిగడ్డి తిని కడుపులు ఉబ్బి చానామంది మావాళ్లు సచ్చిపోయారు. ఇక మా విషయం` నా పేరు విజారు, ఇది ఐజారు, ఇది కిజారు. మాది జపాను దేశంలో నిక్కారు నగరంలోని బౌద్ద ఆలయంలో ఒక గోడ. అక్కడ మమ్మల్ని ఇతారిస్కో అనే ఆయన ఎడమ చేత్తో రాశాడు. మాది ఇతారి వంశీకుల పడికట్టు. ఇతారి అంటే ఎడమచేత్తో రాసేవాటం ఉండాళ్లం అని అర్థం. గాంధీతాత మనసుని గెలుచుకుని ఇక్కడ మనుషుల్లో ఇళ్లలో కలిసిపోయాం. ఆయన గురించి మాట్టాడినప్పుడల్లా ఆయనతో సమాన గౌరవం అందుకుంటా, చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్టాడకు అని పేర్లు మార్చుకున్నాం. మేం పుట్టి పెరిగిన ఊరినే మరిసిపోయాం. ఇప్పుడు ఇక్కడాళ్లకి గాంధీ సినిమాల్లో గుర్తున్నాడు. మా గురించి ఇక చెప్పేవాళ్లెవరు. గాంధీ తాతతోనే మా ఇలువంతా పోయి ఒట్టి కోతిమూకలా మిగిలాం,’’ అని జలజలా కన్నీళ్లు రాల్చినయ్యి.

టకటకమని పళ్లు నూరతన్న శబ్దం ఎక్కడిదా అనుకుంటే చీకిపోయిన గోనెసంచిలో పురికొసతో కట్టిన మూటలోనించి బయటపడటానికి తన్నుకుంటోంది. ఏదో ఏంటో అని సంచి మూతి ఉప్పదీత్తే కీళ్లు, కాళ్లు సరిచేసుకుంటా బయటపడిరది చిలకల అచ్చు.

‘‘అయ్యో ఇదేంటి ఎల్లువకి కొట్టుకొచ్చిన పిల్లలా నీలుక్కుంది. ఒల్లంతా సెదలు కొరుక్కు తినట్టుందే?’’

టకటకా అరిగిపోయిన దవళ్లని కదిలిత్తా మొదలుబెట్టింది. ‘‘ఏం జెయ్యను. తెల్లటి పంచదార పాకంపట్టి నిమ్మరసం పిండి పక్కనబెట్టి, మమ్మల్ని నీళ్లలో ముంచి మాలో పాకం నింపితే నిమిషాల్లో మా నించీ అడివిలోకి పారిపోయే జంతువులు, ఆకాశంలో పిట్టలు, నీళ్లలో చరాలు ఎన్ని తయారయ్యేయి. పిల్లలు ఎంత సంబరంగా జేబుల్లో పెట్టుకుని చేతులు నాక్కుంటా కాకెంగిలితో పంచుకునేవాళ్లు. పెళ్లిలో పెద్దపెద్ద ముంత మావిడి కాయలంత చిలకలు పోసి ఎదురు బుట్టలో పెట్టి ఇయ్యపురాలికిత్తే మురిసిపోయి, కోపాలన్నీ మరిసిపోయేవాళ్లు. మమ్మల్ని సూత్తే నవ్వని పెదాలు, అపురూపంగా అరచేతిలో ఉంచుకోనాళ్లేరీ,’’ అంటంటే దాని వంటి చెదపురుగుల్ని అందరూ పడి దులిపారు. ఇంకా కొన్ని అట్టాగే ఉండగా,
‘‘ఓ అరుణపతాకమా, చేసుకోమ్మా రెడ్‌ సెల్యూట్‌. నీలో ఉన్న సుత్తి, శ్రమజీవుల నవీనశక్తి నీలో కలుసున్నది కొడవలి,’’ అంటూ పాట పాడతన్న కొడవలీ, సుత్తి, ప్రవాహంలా వీళ్లని అనుసరిత్తన్న దబ్బనం, అట్టకాడ, గొడ్డలి, పొలుగ్ను, గ్నునపం, ఆరి, తవ్వంగాల, దోకుడుపార, మొత్తాన్ని చూసి గొడ్డలి ఊగిపోతా ఉపన్యాసం అందుకుంది.

ఆ ఉపన్యాసం అయిపూ అంతూ లేకుండా సాగుతాంది. ఇంతలో సుట్టూ, జిడ్డూ కవురు కంపు వంటితో, సంగం ఎలికలు తిని కొరికి వదిలేసిన ఆవునెయ్యి ఒత్తులు యాలాడతంటే వచ్చినయ్యి నాలుగు దీపారాధన కుందులు. ఆటితో పాటుగా ఒళ్లంతా ఎలికగొద్దెలు, పగిలిన బల్లిగుడ్డు పెంకులతో పొత్రం దొల్లినట్టు డొల్లుకుంటా నడుత్తా వచ్చింది లావాటి గుండిగ.
ఇదేంటి జనంలో భక్తి ఇపరీతంగా పెరిగి పూజలూ, పునస్కారాలూ ఎక్కువయినయ్యి కదా. మీరేటి శనికి దానవిత్తే ఏళ్ల తరబడి వాడని నువ్వుల నూనిలా సవురు కారతన్నారు. మీ ఎనకాల పానకం పోసే గుండిగకేమొచ్చింది.

‘‘ఒక్కొక్క కుందిలోకీ కేజీ నూని పొయ్యాలి. ఈళ్ల దగ్గిర అంత డబ్బులా, రోజూ తోవే ఓపికలూ లేవు. పున్యం లేకోతే పింగాయె. రోజుకో వాదం, ధ్యానం అని, యోగ అని, మనస్సని, ఆత్మ అనీ ఇక్కడెవరూ మమ్ముల్ని లెక్క చెయ్యట్లా.

అదేంటంటే తింటానికి కూడులేదగానీ పూజలెందుకు అని తిడతన్నారు. మాకు అమెరికా పోవాలని ఉంది. ఈ ఇంటి సుట్టాలు అమెరికాలో వుండారు. మాలాంటి నాలుగు కుందుల్ని, నాలుగేపులా పెట్టి మజ్జలో గుండిగ పెట్టి పయినగాజు పలకేసి అన్నాల బల్ల చేశారంట. ఆళ్లని సూట్టానికి మనాళ్లే కాదు, ఇంగ్లీసాళ్లు కూడా వత్తన్నారని అనుకుంటన్నారు. ఆళ్లు అక్కడ మెరుత్తున్నారంట. అట్టా ఆ దేశం అన్నా పోయి ఒకెలుగు ఎలగాలని ఉంది. సొంతూళ్లో ఇలవా సలవా లేదు. ఏడాదికోసారి రుద్ది కడగటానికే ఏడిసి సత్తన్నారు. ఎవరు పడితే ఆళ్లే ముట్టుకుంటన్నారు. ఆచారాలకయితే ఎప్పుడో ఉద్ద్యాపన చెప్పేశారు. ఎన్ని తరాలు సూత్తన్నాము. ఈళ్లు మన ముందు పుడతన్నారు, సత్తన్నారు. ఇంకెన్ని తరాలు సూత్తాయో. నిలేసుకుని ఉండా పట్టిచ్చుకోటల్లా. లెక్కలేనట్టుగా ఇదిలిచ్చి పోతన్నారు. కనీసం ఆదేశవన్నా పోతే ఈ చింతలన్నీ మరిసి ఆళ్లకి కొత్తగా కనపడొచ్చు.

‘‘ఏంటల్లా అమెరికా, పీనిగ మొకాలు అంటన్నారు,’’ అంటా కడుపుతో ఉండే ఆడదిలా, ఉప్పు ఉరిసి పాతకంపు కొడతా వచ్చింది సింతకాయ పచ్చడి జాడీ.

‘‘అబ్బో నువ్వా మాకన్నా పురాతనం. సీకుడు ఆలోశనలు, మాకే సీద్రం అయినా వచ్చిందిగా ఏం సెప్పుద్దో,’’ అన్నట్టు చూశారు.

‘‘నా పచ్చడీ నేనూ రొండూ మోటే. జరం వత్తే పత్తెం భోజనం, నాలో తెలుగాళ్ల ఆవకాయ, గోంగూర, మాగాయి, నార దబ్బకాయి ఎన్ని దాసుకున్నాను. మీరు నన్ను పాత సింతకాయ బావాలన్నాగానీ ఆనాడే ‘ప్యారీ’ అనే పేరుతో గీరపోయా. మేం చిన్నాపెద్దా కలిపి ఒక ఐదారన్నా పతి ఇంటో తిరిగేవాళ్లం.’’

అంతలో అందరికీ అమ్మో, అమ్మో అని అని ఒంటి మీద వాతలు తేలుతున్నాయి. ఎవరో గాలిలో ఎగిరెగిరి కొడతన్నారు. ఆ దెబ్బలు సర్రన కొండరాయిని కోసినట్టుగా సురుకు అంటు తున్నయ్యి. దొరక పుచ్చుకుంటే అది వాళా కఱ్ఱ. ‘‘ఒంగోలెద్దుగానీ, మైసూరెద్దుగానీ బండి కడితే చట్‌చట్‌లాడతా చేతిలో రంగు కుచ్చులతో మెరిసేదాన్ని. కింద నాకో మూరెడు పొడుగువారు కట్టేవాళ్లు. వాళా కఱ్ఱా, చెర్నాకోలు, వారుకోలు అని ఎన్ని పేర్లు. నాకు తోడు మా అమ్మకి సవితి కొడుకుండేవాడు. ఆడి పేరు ముల్లుకఱ్ఱ. తుప్పట్టిన ముల్లుతో ఉండాడు. మమ్మల్ని సూత్తే ఎంత పశువయినా, ఆబోతయినా మేకలా మారాల్సిందే,’’ అని గప్పాలు కొడతంది. ఎనక్కి తిరిగితే, గలగల సిన్న గెంటల మోత ఊగతా ఊగతా, సంపంగి నూనోసనతో, నాలుగ కాళ్లతో కింద రాతి జోళ్లుతో ఊగతా వచ్చింది పందిరిమంచం. అందరూ కూసోండని నడుం వాల్చింది. అయ్యో నడుం ఇరుగితే అవటిదానివవుతావు అన్నారందరూ.
బుస్సున కోపంతో ‘‘ఇరగటమా, ఈ ఇంటికి మూడు తరాల ముందు పెద్దావిడితో పాటుగా కాపరం జేత్తన్నా. రాయగడ తెలువడ్రంగుల సేతిలో తయారయ్యా. అబ్బో ఈ మంచంమ్మీదే ఆ పెద్దాళ్ల మొదటి రాత్తిరి. గదిలో అన్నీ సర్ది మంచం పయిన సలవగుడ్డ పరిసి, సన్నజాజులు సల్లి అప్పుడు అమ్మాయిగా వుండ ఈమెని లోపలికి పంపారు. తలుపు సందుల్లోనించీ కిటికీల్లోనించీ వరసయినాళ్లు తొంగి సూట్టం సూసిన పెళ్లికొడుకు శోభనం వద్దు, అన్నీ మా ఇంటికొచ్చినాకే, ఇదేవన్నా అందరూ సూసే ఆటా, ఇద్దరి పరవశం, ఆళ్లకే సొంతమయిన గ్యాపకం,’’ అని అలిగి ఆళ్లూరి దారి పట్టాడు.

బాగా చదువుకున్నాడు. ఇట్టాంటియ్యి నచ్చవని, ఎదవ ఏసాలెయ్యమాకండని, పెద్దాళ్లందరూ ఆడాళ్లని కేకలేసి, ఆఖరికి ఇద్దరినీ గదిలోకి పంపారు. అమాయకుడనుకున్న పెళ్లికొడుకు నాలుగు రోజుల్లో నూనిదీపం ఎలుగులో నూలుసీరిప్పదీప్పిచ్చి, జుట్టు జారేసి, పెనబాముల్లాగా సుట్టేసుకుంటా, గోడ మీద పడిన ఆళ్ల నీడల బొమ్మలు సూపి ఆళ్లే సిగ్గుపడి సిన్ననవ్వులు నవ్వుకునే వాళ్లు. అట్టా నా సాయంతో ఆరుగ్నురు పిల్లల్ని కన్నారు. పడకగది లోనూ పందిరిమంచంమ్మీదా ఆళ్లు తన్నుకోటం ఏనాడూ సూడలా. ఆ పెద్దావిడి పడకింటోకి, మురికి సీరతో ఎప్పుడూ రాలా. ఇవ్వాళ ముసలాయన కాలం చేశాడు. ఆమేమో ముతక కోకల్లోకి ఏలు ముడిలోకి దిగిపోయింది. నన్నేమో కీళ్లూడదీసి గోడకానిచ్చారు. ఆ రోజుల్లో ఆళ్లిద్దరి మజ్జా నలిగిన మల్లెరేకులు, మరవం ఆకులూ పెట్టెల్లో ఇరుక్కుని సాలీళ్లు గ్నూళ్లు అల్లుకుంటన్నయ్యి. దూరంగా మినుకు మినుకుమంటా అందరి మీదా గుడ్డెలుగు చూపిత్తా పలచగా పరుచుకున్న గాజు దీపంబుడ్డి, పక్కనే గడకఱ్ఱలాగా వత్తన్న సవురు తోడుకునే బొంబాయి (ఒకలాంటి పంపు).

ఈళ్లందరినీ చూత్తా అటూ ఇటూ పరిగెత్తుతున్నా. ఈలోపల కాల్లో ఆకుముల్లో, పల్లేరుగాయి ముల్లో కస్సున దిగింది. ముల్లు లోతుగా దిగి ఇరుక్కుంది. రాటల్లా. ఏమి చెయ్యాలా అని నెప్పిని భరిత్తా కాలును ఒళ్లో పెట్టుకుని కింద కూచ్చున్నా. అప్పుడు గలగలలాడతా వచ్చింది. చూత్తే ముళ్లగుత్తి. దానికి యాలాడతన్న చిమిటికి, నిదానంగా నా కాలుని తీసుకుని తను ముళ్లు ఇరుక్కున్న దగ్గిరకి వచ్చి గుత్తితో ముల్లుని అట్టుకుని ఒక్క లాగు లాగింది. మెత్తని కండలోనించీ అమ్మా అన్న మూలుగుతో పాటు ముల్లు కూడా వచ్చేసింది. ముళ్లుగుత్తి గలగలలాడతా నెమ్మదిగా గుంపులో కలిసింది.

గోల గందరగోళంలో ఒకపక్కన బరబరా పోష్టుకార్డు మీద గోకుతుంది ఇంకుపెన్ను. రాసిరాసి గొంతుకలో నించీ నల్లరక్తం కక్కుతా, అరిగిపోయాను. ఓపిక లేదు. ముందుతరాలకి అందాలని ఈ రాత. అని మళ్లీ కక్కి, క్షమించండి, ఎన్ని జీవితాలకి రాశానో నాకే జీవితం లేకుండా అయ్యింది.

పట్టెమంచం మీద కూచ్చున్న తాబేటికాయ, సొరకాయ బుఱ్ఱ, కత్తి, సుత్తి, కొడవలి, కుండా, గొడ్డలి, చిలకలచ్చు, తెడ్డు కట్టె, గాజుబుడ్డి, బొంబాయి, మరచెంబూ, గ్నునపం, ఆరి, అట్టకాడ, ముళ్లగుత్తి దాని ఆనుకున్న చిమిటికీ కబుర్లు చెప్పుకుంటన్నయ్యి. బఱ్ఱబఱ్ఱమని ఒళ్లు జలతరిచ్చే మోత వత్తంటే చూశారు. గిరగిరా సూర్యుడి చుట్టూ తిరిగే భూమిలాగా తన చుట్టూ తనే తిరుగుతున్న తిరగలి. కారతన్న నూని, ఇసిరేది ఏంటో ననుకుంటే ఇసక.

‘‘పప్పులన్నీ మిల్లులో తయారయ్యి,   మేము  పెరట్టో  కాళ్లు కడుక్కునే రాళ్లలాగా మారాం. నా సత్తా సూపిద్దాం అని ఇసకని ఇసిరి నూని కక్కిత్తన్నా. అందరూ కలిసి తిరగలిని కూడా గుంపులో కలుపుకుని ఏం జెయ్యాలా అని ఆలోసించి, పుత్తకాల మేజాబల్లని సలహా అడిగినయ్యి.

‘‘ఎదురుతిరిగి చితక్కొట్టకపోతే బతుకే లేదు. పతింటిలో నించీ ఇప్పటికే బయటికి తోశారు. మిగిలిన వాళ్లమయినా బతకాలి. మన శత్రువులని దొరికినాళ్లని దొరికినట్టు నాశనం చెయ్యండి. పదండి యుద్ధానికి, ఆఖరి పోరాటానికి, అంతూ అయిపూ తేల్చుకోటానికి,’’ అని బయలుదేరదీసింది.

అంతే అన్నీ, అందరూ కలిసి ఫ్రిజ్జులనీ, ఏసీలనీ, ప్లాస్టిక్‌ కుర్చీలనీ, ప్లాస్టిక్‌ బల్లలనీ, బాటిళ్లనీ, టీవీలనీ, గ్రైండర్లనీ, మిక్సీలనీ, వాషింగ్‌ మిషన్‌లనీ నాశనం చెయ్యటంలో పడ్డయ్యి. ముక్కలు ముక్కలవుతున్న ప్లాస్టిక్‌ వస్తువులు, ప్లాస్టిక్‌ వాన కురవటం మొదలుపెట్టింది. అది తుఫానుగా మారి, వరదయ్యి ఇళ్లనీ వాకిళ్లనీ ముంచెత్తింది. మరి అమ్మమ్మా, తాత, కవలమ్మమ్మా ముసలాళ్లంతా ఏరి? కొట్టుకుపోతన్నారు. అయ్యే దాహం… తాగటానికి నీళ్లు లేవు. అంతా ప్లాస్టిక్‌ ద్రవం. గొంతెండి పోతంది… బాబోయ్‌… అమ్మా… నాన్నా… అమ్మమ్మ… దాహం… అని గెట్టిగా అరుత్తున్నా.

ఫట్‌మని ఈపు మీద దెబ్బ పడటం, ‘‘బారెడు పొద్దెక్కినా ఏనిగల్లే కలవరిత్తన్నా. సామానం సర్దాలి. లేసి మొకం కడుగు. పాలు కలిపింది అమ్మమ్మ,’’ అంటంది కవలమ్మమ్మ.
ఒక్కసారి సుట్టూ చూశా. ఇల్లంతా పరిసిన సామానం. ఆటిని సూడాలంటే దడవనుకుగా ఉంది. కాసేపుట్టో అన్నీ ఒకదాంటో ఒకటి, ఒకదానిమీద ఒకటి కుప్పలుగా పడతయ్యి. అమ్మమ్మలనీ, తాతలవంకా చూశా. ఈళ్లని వృద్ధకొంపల్లో బతికుండగానే చల్లటి గదుల్లో కుక్కుతారు. దూరంగా చూశా. రైతులు పీకేసిన పత్తి కంపని మండిలా పేర్సి తొక్కి పైకి లెగవకుండా గాడిద రాళ్లు పెడతన్నారు.

మంచం దిగా. కాళ్లకి ఏదో తగిలింది. సొరకాయబుఱ్ఱ. ఇదిలిచ్చా. ఎన్ని మంచి ఇత్తనాలో, కావలసిన ఇత్తులు తీసుకుని భద్రంగా సూరుకి కట్టాను.

ఇయ్యన్నీ నా పిల్లలిక ఆళ్లమ్మమ్మ, నాయనమ్మలతో కలిపి ఇయ్యాలి. నా బిడ్డలు, కాదు బిడ్డల బిడ్డలు కూడా భద్రం చేసుకోవాలి. అన్నిటినీ, అందరినీ.

మొత్తం సామాన్లన్నీ రంగంపెట్టి సుట్టూ జేరి ‘ఎంకినై పాడాల ఏ జనమకయినా,’ అంటా కాలూ చెయ్యీ ఊపుతా నాట్యం చేసినయ్యి.

 (  కన్నెగంటి చంద్ర సంపాదకత్వం లో వచ్చిన  తానా సావనీరు (2013) లో ప్రచురితమైన కథ ఇది. పునర్ముద్రణకు అంగీకరించిన  రచయితకు ధన్యవాదాలు )

అమ్మకు జై, అన్నకు జై

gopi

కృష్ణా జిల్లాలోని మారుమూల గ్రామం జనార్ధన వరంలో ఒక పేద వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టాను. హాస్టల్లో ఉంటూ చదువుకున్నాను. తరవాత లయోలా కాలేజీలో చేరాను. అక్కడ ఒక ఫాదర్ నాకు లిబరేషన్ థియాలజీని పరిచయం చేసారు. తొలినాళ్ళలో పరిచయమయిన మార్క్సిజమూ, తరవాతి ఈ థియాలజీ నన్ను ‘గుడిసె ఏసోబు’ కథలు రాయడానికి ప్రేరేపించాయి. దళిత క్రైస్తవ వాస్తవికతని ప్రతిబింబించే కథకుడిగా నాకు గుర్తింపు లభించింది. అఫ్సర్ గారు నా కథలలోని దళిత క్రైస్తవ వాస్తవికత గురించి విమర్శ వ్యాసాల్లో విశ్లేషించారు. అది నాకు ఉత్సాహాన్నిచ్చింది. మధ్యలో ఇంగ్లీష్ జర్నలిజంలో పడిపోయి, తెలుగుకి దూరమయ్యాను. కథలకూ దూరమయ్యాను. మళ్ళీ నన్ను కథారచనకు పురికొల్పిన మిత్రులు అఫ్సర్, కృపాకర్ మాదిగ, దుర్గం సుబ్బారావు. దళితేతరులు రాజయమేలే మీడియాలో నిలదొక్కుకోవాలంటే  నాలాంటి దళితుడు అనుదిన పోరాటం చేయాల్సిందే. తప్పదు. కాని, నా దళిత అస్తిత్వమే నాకు బలాన్నిచ్చింది. నాకు పోరాట స్పూర్తిని నేర్పింది. జీవితాన్ని పోరాడి సాధించుకునే శక్తి నిచ్చే దళితుడై పుట్టినందుకు గర్వంగా వుంది నాకు—డి. గోపి

*

చానాళ్లకి జానుబాబు వచ్చిండు మావూరు. ఆయనొచ్చిండంటే మాకు పండగే. చిన్న, పెద్ద  తేడా లేకుండా అందర్నీ పలకరిత్తడు జానుబాబు. మావోళ్లు అంతే.  యింటిమనిసిలాగే సూత్తారు. పిలుత్తారు.

ఆయనొచ్చిండంటే సుట్టం వొచ్చినట్లే. కుర్సీ యెయ్యాలని, మర్యాదలు సెయ్యాలని ఆయన  యెదురుచూడ్డు. ఆయనే యేది దొరికితే దానిమీద కూసుంటడు. అన్నం కూడా యేదో సెయ్యాల్సిన పని లేదు. మేం యేది వొండుకుంటే అదే తింటడు. యేడ పడుకుంటే ఆయనకూడా ఆడనే పడుకుంటడు. అందుకే ఆయనంటే మాలో మనిసే. మా మనిసే అని అందరం నమ్ముతం. అంతేకాదు. ఆయనకి తెలిసిన విసయాలన్నీ మాకు అర్ధం అయ్యేలాగ వివరంగ చెపుతడు.

పొద్దుగూకిందంటే ఇళ్లల్లో తలోముద్ద తిని మెల్లగా ఆయన సుట్టూ చేరతం. పిల్లోళ్లు. పెద్దోళ్లు, ఆడ, మగ అన్న తేడా లేకుండా అందరం ఆయనకాడ కూశుంటం. ఆయన సెప్పేది వింటం.

మొదట్లో ఆయన మాటలు పెద్దగా అర్ధమయ్యేయి కావు. కొంతమందికైతే అసలు నచ్చేయి కాదు. శానామంది ఆయన మాటలకు ఎదురు తిరిగేవోళ్లు. కొంతమందైతే తేలిగ్గా కొట్టిపడేశోళ్లు. ఆడోళ్లు పట్టిచ్చుకునోళ్లు కాదు. కానీ రాను రాను మావోళ్లలో మార్పొచ్చింది. ఒక్కొక్కళ్ళుగా ఆయన సుట్టూ చేరి వినటం, ఆయన సెప్పే మాటల్లో గ్యానం తెల్సుకోవటం అలవాటైంది. ఆడోళ్లు, పిల్లోళ్లు, కుర్రకారోళ్లు అందరూ ఆయన సుట్టూ సేరి ఆయన సెప్పే మాటలు యినటం, అర్ధం కాకపోతే యివరం అడగటం అలవాటు చేసుకున్నం.

జానుబాబు వల్ల ఇన్నేళ్ళల్లో మాలో కొంత మార్పొచ్చిందనే సెప్పాల. పిల్లోళ్లని పనికి పంపటమ్మానేసి బడికి పంపుతున్నం. శానామంది మా పిల్లలు కాలేజీలు కూడా సదువుతున్నరు. మా సంటిగాడి తర్వాత శానామంది దొరకాడ పాలేరుతనం మానేసి బడికెల్తున్నారంటే మరి జానుబాబు తెచ్చి మార్పే.

అటువంటి జానుబాబు శానాకాలం  తర్వాత మావూరొచ్చిండు. ఆచ్చర్యంగాదు మరి!

 

“రా జానుబాబు.. యిట్టకూసో.. బాగుండవా? శాన్నాళ్ళకొచ్చినవే? యేంటి సంగతి?” అని ప్రశ్నల మీద ప్రశ్నలేసి పలకరించిన జానుబాబుని.

ఇంతలో మా ఆడది జానుబాబుకి యెదురెల్లి చెంబుతో నీళ్ల్లిచ్చి “కాళ్ళు కడుక్కో బాబు” అంది.

ఆయన కాళ్లు కడుక్కొని పందిరికిందికి వచ్చేలోగా మంచం యేసి మీద దుప్పటేసింది. సేతిలో కండవా పట్టుకొని జానుబాబుకిచ్చి ‘ముకం కాళ్లు తుడుసుకో బాబు’ అంది.

మా ఆడదాని సేతిలో కండవా అందకొని ‘మంచినీళ్లియ్యమ్మా’ అనుకుంటా ఆ మంచమ్మీద కూలబడ్డడు.

‘యేంటి బాబు అందరూ బాగుండరా?’ అని మల్లీ పలకరించిన.

‘ఆ.. అందరూ బాగనే ఉన్నారు. మీరంతా ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? పిల్లలంత చదువుకుంటున్నారా?’

‘అందరం బాగనే ఉన్నం బాబు. పిల్లోళ్లు శానామంది సదువుతున్నరు. ఏయో పెద్ద సదువులే సదువుతున్నరు బాబు. శానామంది కాలేజి బళ్లకెల్తన్నరు.’

‘అలాగా.. ! మంచి మార్పే వచ్చింది ఊర్లో’

‘అవును బాబు.. అంతా మీ సలవే’అన్నడు అప్పుడే గుమ్మలోకొచ్చిన యెంకటేసు.

‘రా వెంకటేశు. అంతా బాగున్నారా?’ అని జానుబాబు యెంకటేసును పలకరించిండు.

‘బాగనే ఉన్నం బాబు. మీరెట్టున్నారు?’

‘నాకేం. నేను బాగనే  ఉన్న. బాగుండబట్టేకదా మళ్ళీ మీ ఊరొచ్చిన?’

‘అవున్లే బాబు’ అనుకుంటా యెంకటేసు భుజమ్మీద కండవాతో అరుగుమీద దుమ్ముదులిపి కూసుండు.

మేం ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటుండగానే వొక్కొక్కళ్లు వొచ్చారు.

యేసేబు, మోసెపెదనాన్న, కుట్న, గోపాలం, శీను, రాములు, అందరూ వొచ్చారు. ఆడోళ్లు కూడా ఒక్కొక్కల్లే వొత్తన్నారు.

వొచ్చినోళ్లందర్నీ పేరుపేరున జానుబాబు పలకరిచ్చిండు.

వొకల్లిద్దరు పిల్లోళ్లు ఆయనకి తెలిసినట్టూ లేరు. ఆళ్ల పేర్లడిగి యెవురి పిల్లోళ్లో తెలుసుకుంటుండు. అప్పుట్లో ఆయనొచ్చినప్పుడు యీ పిల్లోళ్లు శానామంది బంతాడుతుండోళ్లే. ఆనకే నడకనేర్సి, బళ్లో కెల్లి. యిప్పుడు కాలేజీ కెల్తన్నారు.

‘యేంటి బాబు మమ్మల్ని పూర్తిగా మర్చిపోయినట్లుండవ్?’ అని అడిగిండు యేసేబు.

చిన్నగా నవ్వి, యేసేబు మొకంలోకి చూసి ‘మర్చిపోలేదు. మర్చిపోతే ఇప్పుడొస్తానా?నాకూ వయస్సు మీద పడ్డంలేదు? అయినా ఇప్పుడు వేరే గ్రామాలు తిరుగుతున్నా..’అన్నడు జానుబాబు.

‘బాబు.. యీ తిరుగుడు యింకా మాన్లేదా?’ అడిగిండు మోసే పెదనాన్న.

‘ఎలా మానమంటావ్ మోషే? నాకు తెలిసిన విషయాలు తెలియనివాళ్లకు చెప్పాలి కదా? నా వరకు నేను తెలుసుకున్న విషయాలు ఎవరికీ చెప్పకుండా మౌనంగా ఉంటే ఎలా? భగవంతుడు మాకు తెలివి ఇచ్చింది ఎందుకు? తోటివాళ్లకు ఉపయోగపడటానికే కదా?’

‘అంతేలే బాబు.. మీరట్టా ఆలొచించబట్టేగా ఇప్పుడు మా బుడ్డోళ్లు పాలేరుతనం మానేసి బడికెల్తన్నారు?’ అన్నడు మోసే పెదనాన్న.

‘భగవంతుడిచ్చిన తెలివి బుర్రలో ఉన్నంతకాలం, ఆయనిచ్చిన ఓపిక, శక్తి వంట్లో ఉన్నంతకాలం ఇలాగే ఉండాలనుకున్న. అలాగే ఉంటున్న.’

‘బాబూ. తెలియకడుగుతున్న.. వొంట్లో వోపికయ్యాకేం చేత్తవ్? యేడుంటవ్? నీ సంగతెప్పుడైనా ఆలోచించినవా?’ అన్నడు గోపాళం.

జానుబాబు సిన్నగా నవ్వి ‘ నాగురించి ఆలోచించడానికి మీరు లేరా? ఓపికలేనప్పుడు మీ ఇంటికొస్తే రానివ్వరా? అన్నం పెట్టరా?’ అన్నడు.

‘అదెంతమాట బాబు.. మీరు రావాలెగాని ఆ మాత్రం అన్నం పెట్టలేమా యేంటి?’ మాట కలిపేసిన నేను. నా మాటకి అందరూ అవునన్నట్లు తలూపారు. అందర్నీ అలా చూసిన జానుబాబు కళ్లల్లో నీళ్లు తిరిగినట్లున్నయ్.. సేత్తో కళ్లు తుడుసుకుని.. ‘నేను అంత దూరం ఇంకా ఆలోచించలేదు. ప్రస్తుతం ఓపిక ఉంది… తిరుగుతున్నా..’ అన్నడు.

‘సర్లే బాబు ఇంకేంటి సంగతులు?’

‘ఏముంది. తెనాలి, పునాదిపాడు అని రెండూళ్లు ఉన్నయ్. అక్కడికెళ్లి వస్తున్నా. ఈ రెండు మూడు రోజులు అక్కడే ఉన్నా.’

‘యేంటిబాబు యిసయం? యెవురున్నారక్కడ? సుట్టాలున్నారా?’ శీను అడిగిండు.

‘చుట్టాల్లేరు. కానీ అంతా మనవాళ్లే… మీలాగే.. యేం మీరంతా చుట్టాలు కారా?’

‘అయ్యో యెంతమాట! మీరు మాకు అంతకంటే యెక్కువే బాబూ .. అందరం అనేశాం.

‘అందుకేగా ఇక్కడికొచ్చింది.. సరే.. ఆ ఊర్లలో ఈ మధ్యకాలంలో రెండు సంఘటనలు జరిగాయి. వాటిగురించి మీరు పేపర్లో చదివే ఉంటారనుకున్న. టీవీల్లో కూడా చూసే ఉంటారు.’

వొకళ్లిద్దరు తెలిసినట్టు తలూపారు.యింకొంతమందైతే అయోమయం ముకాలు పెట్టి జానుబాబును సూత్తన్నారు.

‘నేను చదివాను సారు’ అన్నడు మా యాకోబుగాడి పెద్దకొడుకు యేసురాజు.

జానుబాబు ముకంలో నవ్వు కనపడింది.

‘ఎవరబ్బాయివిరా నువ్వు? నీ పేరేంటి?’ అన్నడు యేసురాజు వైపు చెయ్యి చాపి.

యేసురాజుగాడు దగ్గరకొచ్చి నుంచోగానే జానుబాబు ఆడి ఈపు మీద చెయ్యేసి మెల్లగా నిమిరి ‘ ఏం చదివావో చెప్పు’ అన్నడు.

ఆడు పదోతరగతి అయ్యాక ఇప్పుడు కాలేజి బడికెల్తుండు.

నేనెప్పుడో యాకోబుగాడికి సెప్పిన పిల్లోణ్ని బాగా సదివియ్యరా అని.

జానుబాబు పక్కనే సేతులు కట్టుకొని నుంచున్న యేసురాజు మెల్లగా సెప్పటం మొదలుపెట్టిండు.

  ‘తెనాలిలో కొంతమంది మందు తాగి రోడ్డుమీద వెల్తున్న ఒక అమ్మాయిని ఏడ్పించారంట. ఆ అమ్మాయితోపాటున్న వాళ్ల అమ్మ వాళ్లను తిట్టిందంట. దాంతో వాళ్లు కొంతమంది అమ్మాయిని పట్టుకొని రోడ్డుపక్కకి లాక్కెళ్లారంట. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ల అమ్మ వెంటపడి పెద్దగా అరుస్తూ వాళ్లల్లో కొంతమందిని కొట్టిందంట. అందుకని వాళ్లు ఆమెని కూడా కొట్టి ఎదురుగా లారీ వస్తుంటే దానికిందికి తోసేశారంట. ఆమె చనిపోయిందంట.’

ఆడు సెపుతుంటే మాలో శానామందికి కళ్లెంమ్మట నీళ్లు తిరిగినయ్. కొంతమందైతే నోరెల్లమెట్టుకొని యింటన్నారు. జానుబాబు మాత్రం తలవూపుతూ యింటన్నాడు.

‘మరి పునాదిపాడు సంగతి కూడా చదివావా? జానుబాబు ఆణ్ని అడిగిండు.

‘ఆ. చదివాను సాఋ అన్నడాడు.

‘మరి దాని గురించి చెప్పూ’

‘అది కూడా అంతే సార్.. రాత్రిపూట అన్నాచెల్లెళ్లు ప్రార్ధనకెళ్లి తిరిగి ఇంటికెళ్తుంటే రోడ్డెమ్మటే ఉన్న బార్‌లో తాగిన ముగ్గురు ఆ అమ్మాయిని అల్లరి చేశారంట. అది అడ్డుకున్న ఆ అమ్మాయి అన్నని మోటార్‌సైకిల్‌తో గుద్ది కిందపడేసి కొట్టారంట. ఈ విషయం ఎవరికైనా చెపితే చంపేస్తామని బెదిరించారంట. తర్వాత రెండు రోజులు ఆస్పత్రిలో ఉండి అతను చనిపోయాడంట.

‘వోర్నియవ్వ.. లోకం యేంవైపోతంద్రా? యేంటీ గోరాలు?అన్నడు మోసే పెదనాన్న.

‘ఆడ మనుసుల్లేరేంట్రా? అదసలా ఊరేనా?’ నాకు కోపం వచ్చింది.

యింత జరుగుతుంటే ఆ వూళ్లో జనం యేంజేత్తన్నట్టు అనిపించింది. జానుబాబుని కూడా అదే అడిగిన.

‘జనం ఎందుకు లేరు. ఉన్నారు.పునాదిపాడులో అర్ధరాత్రి జరిగింది. అందుకే అక్కడెవరూ లేరు. కాని తెనాలిలో నడిరోడ్డుమీద.. చుట్టూ జనం  చూస్తుండగానే జరిగింది. ఇంకో విషయం ఏంటంటే.. ఇదంతా జరుగుతుంటే ఆ దగ్గర్లోనే డ్యూటీలో ఉన్న పోలీసు కనీసం కన్నెత్తి కూడా చూడ్లేదు. ఆ తల్లిని లారీకింద పడేసి వాళ్లు పారిపోయిన తర్వాత అప్పుడు ఆ పోలీసు ఒచ్చి రక్తపు మడుగులో ఉన్న అమ్మను అంబులెన్సులో ఎక్కించి ఆస్పత్రికి పంపించాడు. చుట్టూ ఉన్న జనం సినిమా చూస్తున్నట్టుండిపోయారే తప్ప ఆ అమ్మకు సాయం చేసే ప్రయత్నం చేయలేదు.’

జానుబాబు జెప్తూనే ఉన్నడు. నాకు కళ్ళల్లో నీళ్లు నిండినయ్. శానామంది పరిస్థితి కూడా అదే.

మనుషులు ఎంత మారిపోయారు? సాటిమనిషికి సాయం చేసోళ్లే లేకపోతే ఎట్లా?

‘ఇంతకీ తర్వాతేమైంది బాబు?’ అందరం వొకేసారి అడిగినట్టు జానుబాబు ముకంలోకి సూసినం. మా ప్రస్న అర్ధం అయినట్లు జానుబాబు  వూపిరి పీల్చుకొని మళ్లీ సెప్పటం మొదలెట్టిండు.

‘ఆస్పత్రిలో అమ్మ చనిపోయింది. ఈలోగా పోలీసులు ఆ పాప దగ్గరకెల్లి తెల్లకాగితంపై సంతకం పెట్టమని వత్తిడి చేశారు.’

‘అదేంటి బాబు? యెంత అన్యాయం? పోలీసులు అట్టా ఎందుకు సేసినట్టు?’ జానుబాబు మాటల్ని మద్దెలోనే ఆపి అడిగిన.

‘ఏముంది? తాగి గొడవచేసిన వాళ్లు అక్కడ ఉన్న ఎమ్మెల్యే మనుషులు, వాళ్లని కాపాడ్డం కోసం ఆయన పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసును పక్కదారి పట్టించేందుకు అలా చేయించాడు.’

‘యెంత అన్యాయం బాబు. ఎమ్మెల్లే అంటే మనబోటోళ్లని కాపాడాలగాని, ఆ తాగుబోతుల్ని  కాపాడాల్సిన అవసరం యేమొచ్చింది?’

‘అంతేమరి మంత్రులు, ఎమ్మెల్లేలు ఇప్పుడు చేస్తున్నది అదేగా!? రౌడీలు, గూండాలు, నేరస్తుల్ని కాపాడటం, ఎలక్షన్లప్పుడు వాళ్లని వాడుకోవడం మనం చూడ్డంలేదా?’

‘యిది మరీ చిత్రంగా ఉంది బాబు. మన్సి ప్రాణం పోయాక కూడా రౌడీల్ని, తాగుబోతుల్నే కాపాడతారా? మరి మనబోటోళ్ల సంగతేంటి?’

‘ఏముంది? మీబోటోళ్లంతా ఓటుకి డబ్బులు తీసుకోవట్లేదా? ఊరికేనే ఓటేస్తున్నారా? అందుకే వాళ్లు రౌడీలను, నేరస్తులను నమ్ముకుంటున్నారు. వాళ్లకే సాయంగా నిలబడతారు.’

జానుబాబు చెప్పిన యీమాటా మా చెంపలమీద చెళ్లున చరిసినట్టయింది. వోట్లప్పుడు నోట్లిత్తుంటే యెగబడి తీసుకుంటున్న మాకు జానుబాబు మాటలు గట్టిగనే గుచ్చుకున్నయ్.  యీదారి బాగున్నట్టు అనిపించలేదు. పానం పోతున్న మాబోటోళ్లకి ఎమ్మెల్లే సాయం చేయట్లేదంటే కిటుకు మా వోటులోనే ఉందని ఆయన సెప్పకనే సెప్పిండు. ఎమ్మెల్లేకి ఉచితంగా వోటెయ్యమని మాకు కస్టాల్లో ఉన్నప్పుడు ఆయన సాయం చేత్తాడని యెట్టా కోరుకుంటం?

నేను ఆలోసెత్తన్న. నాలాగే మావోళ్లంతా ఆలోసెత్తన్నారనుకుంట. అందరూ మాట్లాడకుండా అలా జానుబాబును చూత్తూ కూసున్నారు.

‘సరే.. ఆలోచించండి. అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. నేరాలు చేసేవాళ్లు కాపాడబడుతున్నారు. నష్టపోయే మీలాంటివాళ్లు నష్టపోతూనే ఉన్నారు.

‘మరెలా బాబు? ఏం చేయాలి? అక్కడ మీరేం చేప్పారు.?’

‘నేనే కాదు. నాలాంటివాళ్లు చాలామంది ఈ రెండు గ్రామాలు  సందర్శించారు. బాధిత కుటుంబాల వారిని పరామర్శించారు. మేం అక్కడ కొన్ని విషయాలు చెప్పాం. ఓటు మన హక్కు. హక్కుని అమ్ముకుంటే కొనుక్కున్నవాడు అధికారానికి వచ్చి తన మనుషులకే అండగా ఉంటాడుగాని ఓటు అమ్ముకున్న మనబోటివాళ్ళకు అండగా  ఉండడు.’

జానుబాబు వొక్కొక్కమాట నెమ్మదిగా  చెపుతుండు మాకు అర్ధం కావాలని. అందరివైపు సూచి సెపుతుండు ఆలోసించమని.

‘వోటు అమ్ముకోవడమే కాదు. మనం ఇంకా కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచించాలి. తెనాలిలోగాని, పునాదిపాడులో గాని జరిగిన రెండు సంఘటనలు బార్ల వద్దే జరిగాయి. బార్లు రోడ్డుపక్కనే ఉన్నాయి. మందు తాగిన వాళ్లు రోడ్డుమీద వెళ్లే ఆడవాళ్లపై దాడి చేస్తున్నారు. ఇది మనం గమనించాలి. ఇటువంటి దాడి రేపు మన ఊర్లో కూడ జరగొచ్చు. మనింటి అమ్మాయిలమీదా జరగొచ్చు.. అందుకే మనం ఒక విషయం ఆలోచించాలి. ఇటువంటి దాడులకు కారణం అవుతున్న ఈ బ్రాందీ షాపులు, బార్లు, ఇళ్ల మధ్యలో, రోడ్డు పక్కనే ఉండటాన్ని మనం వ్యతిరేకించాలి. ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చు. కాని ఇప్పుడు మనం ఆలోచించడం మొదలుపెడితే ఏదో ఒక రోజుకి ఇది సాధ్యం అవుతుంది.”

‘బ్రాందీ సాపులు తీయటం కుదురుద్దా బాబు?’

‘ఎందుకు కుదరదు? పట్టణాల్లో చేపల మార్కెట్లు, పండ్ల మార్కెట్లు, పూల మార్కెట్లు, రైతుబజార్లు విడివిడిగా లేవా? అలాగే బ్రాందీ షాపులు కూడా విడిగా, ఊరికి దూరంగా, రోడ్డుకి దూరంగా ఏర్పాటు చేసుకోమనాలి. మన పల్లెల్లో కూడా వారానికి ఒకసారి ఏర్పాటు చేసుకునే సంతల్లాగే ఈ బ్రాందీషాపులు కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పాలి. సంత ఉన్నరోజు మాత్రమే బ్రాందీ, విస్కీలు అమ్ముకోవచ్చు. మిగిలిన రోజులు అమ్మటానికి వీల్లేదు. ఒకవేళ అమ్ముకోవాలంటే వాళ్లు ఊరికి దూరంగా ప్రత్యేక ఏర్పాటు చేసుకోవాలి.’

అందరం యేం మాట్లాడకుండ మౌనంగా ఉన్నం. ఆలోశన మొదలైంది.

‘ఈ విషయాలన్నీ ఆ రెండు ఊర్లలో చెప్పాం. నేను ఏమంటున్నానంటే మాన్లో ఈ మార్పు రాకుండా ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకొదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఈ మందు మీద చాలా ఆదాయం వస్తోంది. పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కంటె బ్రాందీ అమ్మకాలపై వచ్చే ఆదాయమే ఎక్కువ. కాబట్టి మనం ఆలొచించాలి. ఆడపిల్లల్ని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన ఒక అమ్మ, ఒక అన్న మనకు నేర్పిన పాఠం. ఇప్పటికిప్పుడే ఇది సాధ్యం కాకపోవచ్చు. కానీ ఆలోచించండి. మన బిడ్డలను కాపాడుకోవలసిన బాధ్యత మనది కాదా? అందుకోసం మనం ఇటువంటి ఆలోచన చేయలేమా?’

‘……………………’

నేను, నాలాంటివాళ్లు చాలామంది ఈ విషయాలన్నీ చెపుతూనే ఉన్నాం. అర్ధం చేసుకోండి. ఈ ఆలోచన చాపకింద నీరులా సాగాలి.’

‘…………………….’

‘రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. మన ఓటు హక్కు మన హక్కు. ఆ హక్కుని కాపాడుకుందాం. అలాగే ఊర్లో మద్యం షాపులు ఉండకూడదు. ఈ రెండు విషయాలు మనం ఆలోచించడం మొదలుపెడితే మార్పు అదే వస్తుంది. మరో అమ్మ, మరో అన్న తాగుబోటుల దాడిలో చనిపోయే అవకాశం ఉండదు. మరో ఎమ్మెల్యే తాగుబోతుల్ని కాపాడే ప్రయత్నం చేయ్యడు.’

అంతా నిసబ్ధంగా ఉంది.  యెవురూ మాట్లాడలేదు. యెవళ్లకి ఆళ్లు గట్టిగా వూపిరి పీల్చి వదులుతున్నారే తప్ప మాట్లాడే ధైర్యం చెయ్యటం లేదు.

జానుబాబు మాటలు మమ్మల్ని ఆలోశన్లో పడేసినయ్. నిజమే. యిది అన్యాయమే.. యేదోవొకటి సెయ్యాల. యేదోవొకటేంటీ.. జానుబాబు సెప్పింది బాగనే వుంది. కానీ అది జరిగేనా?.. జరగాలి మరి.. యేదోసెయ్యమని గవర్నమెంటోళ్లని అడిగే ముందు మనం కూడా యేదో వొకటి సెయ్యాలని యింతకు మునుపెప్పడో జానుబాబు సెప్పిండు.

జానుబాబు మాటల్లోనుండి యింకా కోలుకోకముందే ‘అన్నం పెడతా రా బాబు’ అంటూ మా ఆడది జానుబాబుని పిలిసింది. ఆయన అట్లనే లేచి గుడిసేలోకి ఎల్లిండు.

మావోళ్లంతా ఒక్కొక్కల్లే లేచి ఇళ్లదారి పట్టారు. ఎవురూ మాట్లాడలేదు. ఆలోచిత్తన్నారనుకుంట… మంచిదే.. ఆలొచించాల్సిందే మరి.

బిడ్డని కాపాడుకోవటానికి ఆ అమ్మ సేసిన పని గుర్తొచ్చింది. సెల్లిని కాపాడుకోవటానికి ఆ అన్న సేసిన పని గుర్తొచ్చింది. ఆళ్లు గొప్పోళ్లనిపించింది. మనసులోనే అనుకున్న ‘అమ్మకు జై.. అన్నకు జై..’

టోపీ

datla

దాట్ల దేవదానం రాజు….ఒక సరిహద్దు ప్రాంతం నుంచి తెలుగు సాహిత్యంలో వినిపిస్తున్న కథా కవిత గొంతుక. మితంగా మాట్లాడితే మితంగా రాస్తారు దాట్ల. కాని, ఆయన గొంతుకలో ఒక నిక్కచ్చితనం వుంటుంది. సాదాసీదా బాధలుంటాయి. సామాన్యుడి గోడు వుంటుంది.

అటు కవిత్వంలోనూ, ఇటు కథల్లోనూ తనదయిన సరళ శైలిని వదులుకొని దాట్ల కథ ఈ వారం!

*

 దాట్ల దేవదానం రాజు కవిగా, కథకులుగా గుర్తింపు పొందారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో మార్చి 20, 1954లో జన్మించారు. మొదటి కథ ‘పేకాట భాగోతం’ 1987లో ఆంధ్రజ్యోతి వీక్లీలో ప్రచురితమైంది. ‘దాట్లదేవదానం రాజు కథలు’, ‘యానాం కథలు’ పేర్లతో రెండు కథా సంపుటాలు వెలువడ్డాయి. రెండు దీర్ఘ కవితలు, ఆరు కవితా సంపుటాలు వేశారు. ‘యానాం చరిత్ర’ పేరుతో చరిత్రపుస్తకం వెలువరించారు. అనేక పురస్కారాలు అందుకున్నారు. ఈయన రచనలు ఇతర భాషల్లోకి అనువాద మయ్యాయి. ప్రస్తుతం యానాంలో ఉంటున్నారు. టీచర్‌గా పనిచేసి  రిటైర్డ్‌ అయ్యారు. అనుభవంలోంచి పుట్టేది ‘మంచికథ’ అంటారు దాట్ల దేవదానం రాజు.- వేంపల్లె షరీఫ్‌

 

గాలిహోరుగా వీస్తూంది.

చెట్టుకొమ్మలు విరిగిపడేలాఉన్నాయి.

ఆకులు రాలిపడేలా కదులుతున్నాయి

రోడ్డు మీద దుమ్మూ…ధూళి…కొట్టుకుపోతున్నాయి.

గాలి కంటికి కనపడదు.అన్నింటా నేనున్నానంటుంది.

హాయిగా మలయమారుతంలా వీచాల్సింది…ఉధృతంగా…మహోగ్రంగా…సుడులు తిరుగుతూ..ఏమిటిలా?

పంచెకట్టు…తలపాగ…చెదరనిచిరునవ్వు అతని వేషం.తలపాగను చేతుల్లోకి తీసుకుని భుజం మీద వేసుకున్నాడు.అలసటగాఉంది.అయినా ఆతృతగాఉంది.చేయి అడ్డంపెట్టుకుని ఆకాశంకేసి చూస్తున్నాడు. ఆకాశంలో గిరికీలుకొడ్తూ పక్షి ఎగురుతూంది.అది…పక్షి…కాదు…కిరీటం…కాదు…టోపీ.అవును టోపీయే…

అంతెత్తున ఎగురుతూ….ఎగురుతూ…

ఆపసోపాలు పడుతూ అంత గాలిలోనూ చిరుచెమటలతో పంచెకట్టు.పంచెకట్టు తెలుగువాడి సొత్తు.

ఆ మనిషికి గొప్పగా నప్పింది.అంచులుబిగబెట్టి అద్భుత నేర్పరితనంగా కట్టినతీరు బావుంది.తెలుగుతనం ఉట్టిపడుతూంది.ఒక చేత్తో పంచె అంచు పట్టుకుని దించని తలతో టోపీ కోసం పరుగులు పెడుతుంటే జనం కాళ్ళకు అడ్డంపడుతున్నారు.దప్పికతీరుస్తున్నారు.అరటిఆకు పెట్టి దోసిలిలో అన్నం వడ్డిస్తున్నారు.

తమ తొడలు తలగడలు చేసి నిద్రకు పిలుస్తున్నారు.అతని దృష్టంతా టోపీ మీదే.టోపీని ఎలాగైనా కైవసం చేసుకోవాలి.ఏళ్ళపాటు నిరీక్షణ అంతమవ్వాలంటే టోపీ దొరకాలి.

జనాల్ని అడ్డు తొలగమని నచ్చచెబుతూ…ప్రార్థిస్తూ…ముందుకు…మునుముందుకు..టోపీకోసం… పరుగులాంటి నడకతో …పంచెకట్టు.పాదయాత్రకు ఎండలేదు.వాన లేదు.రాత్రి లేదు.పగలు లేదు.తిండి తిప్పలులేవు.పట్టుకోవాలి…పట్టుకోవాలి…టోపీని..చేజిక్కించుకోవాలి.ఒకటే యావ..ఒకే చూపు..తను ఎవర్నీ అనుసరించడు.తన దారి తనదే.తన కష్టం తనదే.ఫలం తనదే కావాలి.

ఆకాశంలో ఆగిఆగి గిరికీలు కొడుతూ ఎగురుతూంది టోపీ గాలి వాలు ఎటు పడితే అటుగా. మొండి వాడిలా ఉన్నాడు.పట్టువదలని విక్రమార్కుడిలా ఉన్నాడు.ముళ్ళు….గతుకులు…ఎత్తుపల్లాలు…ఏరులు..నదీ నదాలు…దాటుకుంటూ జీవనసాఫల్యాన్ని అందిపుచ్చుకోవాలన్నట్టుగా పరుగెడుతున్నాడు.టోపీయే లక్ష్యం. టోపీయే గమ్యం.

ఎండ పేలిపోతూంది. సూర్యుడు రగిలిపోతున్నాడు.మధ్యాహ్నం తీవ్రత శరీరంమీద కనబడుతూంది.

పంచెకట్టు మనిషి ఆగాడు.ఆగాల్సివచ్చింది.తప్పదు.ప్రజానుగ్రహం ముఖ్యం. మెల్లకన్నుతో టోపీని గమనిస్తూనే ఆగాడు.టోపీ దూరంగా ఉన్నా దగ్గరగా రావడంకోసం ఆగాడు.అపుడపుడూ చేయి అడ్డం పెట్టుకుని టోపీ ఆనూపోనూ చూస్తూనే ఉన్నాడు.జనాలికి అతను దేనికోసం చూస్తున్నాడో తెలియడంలేదు.ఆ చూపు నేల మీద పారేసుకున్నదేదో ఆకాశంలో వెతుకుతున్నట్టుంది.

అక్కడో గుంపు.

రోడ్డుకిరువైపులా చేలు.అందరికన్నా ముందు ఒక బక్కచిక్కినవాడు నిలబడ్డాడు.

కళ్ళల్లో దైన్యం,ముఖంలో నైరాశ్యం మూర్తీభవించినట్లున్నాడు.ఆకలిఆవరించినట్లున్నాడు.చిరిగిన తలపాగ చుట్టుకున్నాడు.వెన్నెముక వంగి ఉంది.కళ్ళంనిండా ధాన్యం బస్తాలు.నిండుబస్తాల్ను దబ్బళంతో పురికొస తో కుట్టాడు.ప్రతి బస్తాకు వందరూపాయిల నోటు గుచ్చి ఉంది.

‘‘బాబూ,తండ్రీ… ఈ బస్తాల్ని తమరైనా తీసుకోండయ్యా.నేలతల్లి కరుణతో చెమట పోసి పండించా నయ్యా.ఒట్టినే వద్దు.బస్తా మీద అప్పు చేసి తెచ్చిన సొమ్ములుంచాను.అవిగో చూడండి.ఇందులో మోసం మీదకు నేనే ఎత్తుతానయ్యా.ఆరుగాలం పంట ఇది.మట్టిపాలు కావడం భరించలేను. ఇందులో మోసం లేదు.వీటిని తీసుకుని తమరైనా నా బరువు దించండి.కళ్ళంలో పెట్టుకుని కాపాడలేకపొతున్నాను .మీ భుజం మీదకు నేనే ఎత్తుతానయ్యా.ఆరుగాలం పంట ఇది.మట్టిపాలు కావడం భరించ లేను .” ’’రైతు పంచెకట్టు  పాదాలపై పడ్డాడు.రైతుకి గత్యంతరం లేదు.భూమితల్లి ఆగ్రహిస్తుంది గనుక పంటవిరామం చేయలేడు.తరతరాలు మట్టిని నమ్ముకున్నాడు…గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోలేడు.ఒంట్లో ప్రాణం ఉన్నంతవరకూ అలవాటైన వ్యవసాయజూదం లో పాలుపంచుకోవడం తప్పదు.

పంచెకట్టు రైతును లేపాడు. అరచేతితో వెన్నెముకను ప్రేమగా నిమిరాడు.కౌగిలించుకుని ఊరడించాడు .

చెమట తడిసిన నుదుటను పెదాలతో ముద్దుపెట్టుకున్నాడు.

‘‘కంగారుపడకు.నేనున్నాను.టోపీ కోసమే ఇలా వచ్చాను.ఒక్కసారి టోపీ నా చేతికి చిక్కిందా?యజ్ఞం చేస్తా ను.యాగం చేస్తాను.రాయితీల్ను ఉచితం చేస్తాను.ఇక చూసుకోండి` మీ జీవితాలు బాగుపడిపోతాయి.తాతా,అమ్మా నాయనా,అక్కా…ఎవరూ దిగులు పడకండి.అదిగో అలా చూడండి’’అని ఆకాశం కేసి చూసాడు.

అందరూ తలలు పైకెత్తారు. వాళ్లకేమీ కనబడలేదు.ఏదో ఉండే ఉంటుంది.అతన్ని నమ్మాలనిపించింది.

మాటలో తెలుగుతనం..గొంతులో మార్దవం…చూపులో దగ్గరతనం…అందర్నీ ఆకట్టుకున్నాయి.చెట్టుకొమ్మల మధ్య నున్న లక్ష్యం అర్జునుడికొక్కడికే కనిపించినట్టు అతనెంతో ఇష్టంగా పైకి చూస్తున్నాడు.

సూర్యుడు నడినెత్తిన చుర్రుమనిపిస్తున్నాడు.నీడ పాదాల కింద దాక్కుంది.దూరంగా మసగ్గా…టోపీ…చిన్న చుక్కలా.తదేకంగా ఆకాశం వైపు చూస్తూ వడివడిగా అడుగులేస్తున్నాడు పంచెకట్టు.

అక్కడొక గుంపు. ఊగుతూంది.మత్తులో జోగుతూంది.ఒంటికాలిపై నిలబడి పడిపోకుండా జాగ్రత్త పడుతున్నారు.వాళ్ళచేతులు వణుకుతున్నాయి.మాట తడబడుతున్నా పూర్తి స్పృహ లోనే ఉన్నారు.వాళ్ళందరి చేతుల్లో ప్లకార్డులు.‘ప్రపంచతాగుబోతుల్లారా,ఏకం కండి’ ‘మా త్యాగమే మీ ఖజానా’ ‘ప్రభుత్వాల్నినడిపేది మేమే. నడిపించేదీ మేమే.’‘మీరైనా మా గోడు పట్టించుకోండి.’

పంచెకట్టు చిరునవ్వు చిందించాడు.సవినయంగా చేతులు జోడించాడు .వాళ్ళెంతో ఆనందపడ్డారు. ఒకడు ముందుకు వచ్చి పడిపోబోయి ఎలాగో నిలదొక్కుకున్నాడు.ఒక చేయి పైకెత్తి వాడే మాట్లాడుతున్నాడు.

‘‘బాటిల్స్‌ ధర మీ ఇష్టం వచ్చినట్టు పెంచుకోండి.తాగి పారేస్తాం.గుర్తించుకోండి.మీ ఆదాయం మా త్యాగఫలం.మమ్మల్ని నమ్మండి,సారూ.కొంపాగోడూ …అవేమిటి?…పుస్తెలు …పుస్తెలు తాకట్టు పెట్టైనా సరే ప్రభుత్వాల్ని నిలబడతాం.’’చెప్పడం ఆపాడు.ఒకసారి వెనక్కి తిరిగి చూసాడు.

‘‘మీ కోరికలేమిటి,బాబూ.నాకు పనుంది.తొందరగా చెప్పండి.అవతల టోపీ కనుమరుగైతే కష్టం.చెప్పండి.’’

‘‘మా కోరికలు చిన్నవే.మంచి ఖలేజా ఉన్న మీరు అవలీలగా చేసేయగలరు.ప్రధానంగా మావి రెండే డిమాండ్లు.పావలా వడ్డీకి అప్పులిప్పించండి.రైతుల కంటే మాకివ్వడమే లాభదాయకం.రైతులకిస్తే గోడకు వెల్ల వేసినట్లే.

మాతో అలా కాదు.ఇలా ఇచ్చేరంటే అలా తాగేసి ఇచ్చేస్తాం.పైగా అప్పు అప్పుే.ఇకపోతే రెండోది. అమ్ముకోడానికి ఇళ్ళ పట్టాలిప్పించండి.ఆ డబ్బులు తాగితందనాలాడి మీ బొక్కసం నింపుతాం.అంతే,సారూ.శతకోటి నమస్కారాలు’

‘అలాగలాగలాగే’పంచెకట్టు ముందుకురికాడు.ఆకాశం లోకి చూసాడు.ఏదీ టోపీ?అదిగో అల్లదిగో నీలాకాశంలో నల్లటిబొట్టులా.అందుకోవాలి…అందుకోవాలి.తలకు  పెట్టుకోవాలి….కిరీటంలా.

సాయంకాలపు పలుచని ఎండ.అయినా చిరుచెమటలు.నడుస్తుంటే దూరం తగ్గడం లేదు.అంతలోనే మరో గుంపు. అరుస్తున్నారు. కొన్ని అరుపులు వెటకారంగా అనిపిస్తాయి.కాని కావు.అర్థం చేసుకోవాలంతే.

‘‘దయచేసి కరెంటురేట్లు పెంచండి.ఇబ్బడిముబ్బడిగా పెంచి మమ్మల్నికాపాడండి.స్విచ్‌ వేస్తే షాక్‌ కొట్టాల. బిల్‌ చూస్తే మూర్చపోవాల.రోజంతా కోత లేకుండా ఇవ్వాల.’’

‘‘ఇదేం చోద్యమయ్యా, ఎక్కడాలేని వింతకోరిక.నేను అభయహస్తం ఇస్తే మునిగిపోతారు,జాగ్రత్త.అవసరమైన వాటిని మాత్రమే అడగండి.’’అసహనంగా పంచెకట్టు విసుక్కున్నాడు.

‘‘కాదు బాబయ్యా,అంతా తెలిసే అడుగుతున్నాం.మీరు గనుక మా కోరిక మన్నిస్తే మా ఇళ్ళల్లోని ఫాన్‌ల్నీ బల్బుల్నీ చేలోని మోటర్లనీ చచ్చినా వేయం.ఇరవైనాలుగ్గంటల కరెంటనీ  ఊరికే సంబరపడతాం. మురిసిపోతాం ఏదో ఉందని తృప్తి.అంతే.’’

‘‘తస్సాదియ్యా,బలేవాళ్ళయ్యా మీరు.అర్థమైంది.సరే.అలాగే.’’ భుజాలమీద తట్టాడు. వాళ్ళ ముఖాలు బల్బుల్లా వెలిగాయి.పంచెకటు ్టచూపు ఆకాశం వైపుకి మళ్ళింది.

ఎన్నో అడ్డంకులు`భౌతికమైనవి,మానసికమైనవి.అధిగమించాలి.తప్పదు టోపీ దక్కాలంటే!

విన్నపాలు…విజ్ఞప్తులు…నడక సాగడం లేదు.వృత్తుల్ని వదిలేసిన వాళ్ళూ…ఆక్రమించినవాళ్ళూ…పరిశ్రమలు మూతపడి వీధుల పాలయినవాళ్ళూ…సూక్ష్మ ఆర్థికబంధనాల్లో చిక్కుకున్నవాళ్ళూ…భూముల్ని కోల్పోయిన వాళ్ళూ… కాళ్ళకడ్డం పడుతున్నారు.ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.ముందుకు కదలనీయడంలేదు.సమస్యల మూటలు విప్పి నేల మీద పరుస్తున్నారు.దైన్యాన్ని నింపుకున్న ముఖాలతో వెతల్నికక్కుతున్నారు.నలిగిన దేహాలతో బాధల్ని వెల్లడిరచు కుంటున్నారు.లక్షల సమస్యలు…వెనక్కి నెట్టుకుంటూ…టోపీ కోసం….అసలు టోపీ దొరుకుతుందా?

దొరికిన టోపీ ధగధగమని మెరిసే కిరీటం అవుతుందా?

ఇక దారి మళ్ళించాల్సిందే.పచ్చని పొలాలు దాటి కొత్తమార్గాలు వెతకాలి.ఆకాశం అంచున కొండ మీదుగా…

అదిగో …టోపీ.అలసట కనపడకుండా జాగ్రత్త పడుతున్నాడుపంచెకట్టు.ధీరోదాత్తత సడలకుండా కొండ  ఎక్కుతున్నాడు.  పైపైకి…ఇంకా పైకి. టోపీని సాధించాలి.

అతిసమీపంలో టోపీ. చేతికందేంత ఎత్తులో టోపీ.దగ్గరగా …వచ్చేసింది.పట్టుకోవాలి.ఉద్వేగం…ఆనందం…

కృష్ణాష్టమి ఉట్టిలా…కిందకీ పైకీ…టోపీ.ఆటలా సాగుతున్నది.ఎట్టకేలకు అందుకున్నాడు.చిత్రం…టోపీ కిరీటంలా మెరుస్తుంది.తల మీద పెట్టుకోగానే రాజసం కళ వచ్చేసింది.సర్వాధికారాలు సంక్రమించి సైగ సైతం ఆదేశంగా మారిపోయేంత రాజసం.కళ్ళల్లో ఉజ్వలమైన మెరుపు..చూపులో అధికారదర్పం.సమస్త వ్యక్తిత్వంలోనూ ఒక్కసారిగా పెల్లుబికిన వింత మార్పు.

నడకలో…మాటలో…చేతుల కదలికలో…కంటిరెపరెపల్లో…హుందాతనం.

జీవితాశయపు తొలిమెట్టు అధిరోహించినట్టు గర్వదరహాసం.

కొండపైనుండి నెమ్మదిగా కిందికి దిగుతూ…టోపీ మాటిమాటికీ కుదురుగా ఉండేటట్టు సవరించుకుంటూ

…చిద్విలాసంగా నవ్వుతూ నేలకు చేరుకున్నాడు.అక్కడే పొదలమాటున కుందేలుగుట్ట దగ్గర దారుణం జరిగిపోయింది.కథ అడ్డం తిరిగింది.విధి వక్రగీత గీసింది.ఊహించలేని…దిద్దుకోలేని తప్పుగా చరిత్రకెక్కింది.

పంచెకట్టు రక్తపంకిలమయ్యింది .తల రెండుగా చిట్లింది.మెదడుగుజ్జు బయటకు వచ్చేసింది.

ఊపిరి నిలిచిపోయింది.కదలిక ఆగిపోయింది.ఆశాజ్యోతి ఆరిపోయింది.లిప్తలో జరిగిన  సంఘటనతో లోకం  విస్తుపోయింది.

ఉజ్వలంగా ఎదగాల్సిన వాడు…జనం గుండెల్లో దేవుడుగా కీర్తించబడాల్సినవాడు….

వీధి వీధినా విగ్రహమై నిలవాల్సిన వాడు…

బడుగు బలహీనులకు మెరుగైన విద్య,ఆరోగ్యం  అందించాల్సినవాడు….

అకాలంగా…అంతులేని విషాదాన్ని మిగిల్చి శవమై పోయాడు.

ఇక పరామర్శలు మొదలు.శవం రాజకీయాలకు ఆలంబన…దిక్సూచి.

గోతికాడ నక్కల్లా  ఇతరేతరపక్షాలు సందిగ్ధంలో పడ్డాయి.

శవరాజకీయాలకి శవందొరక్క గొల్లుమంటున్నాయి.

ఏనాటికైనా శవం దొరక్కపోతుందా అని కొండంత ఆశతో ఎదురుచూస్తున్నాయి.ప్రస్తుతానికి బాటలంటా పసుపు నీళ్ళు జల్లుకుంటూ… ముహూర్తాలు పెట్టుకుని శాంతులు జరిపించుకుంటూ…ఎర్రగా ఉరిమి చూస్తూ కీచుగొంతు తో సణుక్కుంటూ…ఏడవలేక నవ్వుతున్నారు.

విచిత్రంగా జనంమాత్రం అవినీతిపదం వినిపించినప్పుడల్లా చెవులు మూసుకుంటున్నారు.ఎక్కడున్నాడు?

ఎక్కడున్నాడు? అవినీతిపరుడు కాని వాడెక్కడున్నాడు? ఏడి? ఏడి?

మొత్తం మీద రాజ్యం అల్లకల్లోలంగా ఉంది.ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లుగా ఉంది.

వాతావరణం వేడిగా కూడా ఉంది.

టోపీ….అదే కిరీటం దేనికి లొంగాలి?

నీతి…నిజాయితీ…విలువలు….ప్స్‌….లాభం లేదు.

పోనీ అమ్ముడైపోతుందా?

చూద్దాం.

 

 

మార్తా ప్రేమకధ

vimala1

 

మే 1, 1960లో పుట్టారు విమల. తొలికథ 1978లో అచ్చయ్యింది. చిన్నవయసు నుంచే రచనా వ్యాసాంగం కొనసాగించారు. కవయిత్రిగా ప్రసిద్ధురాలు. చాలా విరామం తర్వాత తిరిగి కథరచన మొదలుపెట్టారు.  ఇప్పటిదాక 10 కథలు రాశారు. రెండు కవితా సంపుటాలు ప్రచురించారు. గతంలో విప్లవరచయితల సంఘం, ప్రగతిశీల మహిళా సమాఖ్యలో పనిచేసి ఇప్పుడు వివిధ రంగాల్లో సామాజిక కార్యకర్తగా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.  -వేంపల్లెషరీఫ్‌

తిరుపతిలో రైలెక్కిందన్న మాటేగానీ మార్తా మనసు మనసులో లేదు. ఎప్పుడూ లేనిది, ఆమెను కలవాలని కబురు చేసాడు నాగన్న. అరవయ్యారేళ్ల ఆయన్ని చూస్తే మార్తా కి చాలా గౌరవం. అతను లెనిన్‌చంద్ర అన్నయ్యనే దానికన్నా, అతను రెక్కలు చాచి ఎట్లా, ఎందర్ని తన అక్కున చేర్చుకున్నాడో, ఎడారిలో దాహం తీర్చే ఒయాసిస్సులా అతని ఇల్లు ఎలా మారిందో చూసాక,  అతని పట్ల ఆమె గౌరవం మరింత పెరిగింది. ఆయన ఏ సంగతి, ఎవరికీ, ఎన్నడూ పెదవి విప్పి,  చెప్పలేదు. ఎవరైనా అడిగినా, నవ్వి ఊరుకుంటాడు. బక్కపలచగా, ఓమాదిరి ఎత్తుతో, నీరుగావిబట్టిన తెల్ల లుంగీ , కండువాతో, వుండే నాగన్న ఆమె కళ్ళ ముందు కదలాడాడు.

పరుగెడుతున్న రైలు కిటికీ లోంచి బయటకు చూస్తుంటే, కమ్ముకున్న చీకట్లను పరిహసిస్తున్నట్లు, పుచ్చపూల్లాంటి వెన్నెల, తనతో పాటు పరుగెడుతున్న చెట్ల వెలుగు నీడలు, చల్లగా వీస్తున్న గాలి. ఆకాశంకేసి చూసింది మార్తా. మబ్బుల మధ్య దోబూచులాడుతున్న చందమామను చూసి, ‘‘ ఇవ్వాళ పౌర్ణమి’’ అనుకుంది. ఆమెకి వెంటనే  చంద్ర గుర్తుకొచ్చాడు. అతడేం చేస్తున్నాడో ఇప్పుడు! అతడు కూడా తనలానే నిద్ర పట్టని రాత్రుళ్ళు, ఆకాశంకేసి చూస్తూ వుంటాడా? ఏం ఆలోచిస్తూ వుండవచ్చు?

అతని ఆలోచనలు గాజు పెంకుల్లా, ఆ జైలు గది గోడల్ని, కటకటాల్ని తాకి, భళ్ళున బధ్ధలై, అట్లా పొడిపొడిగా రాలి పోతాయా? తన చూపులూ, అతని, చూపులూ కలుసుకునే ఈ అనంత ఆకాశం ఎక్కడైనా ఒకటేనా? అసలతనికి ఆకాశం కనబడుతుందో లేదో? ఆకాశమే కనబడని వాళ్ళకి చందమామ గురించి కలలెలా వస్తాయ్‌? ఇక్కడి చందమామ లోంచి, ఓ చిన్ని ముక్కని దొంగిలించి, కాసిన్ని నక్షత్రాల్ని పోగుచేసి, అతని జైలు వాకిటి ముందు మల్లెపూలలా చల్లనా? మార్తా పెదవులపై, సన్నటి నవ్వు.

ఇంతవరకూ అతనితో ములాఖతే లేనిదాన్ని, అతని మొఖమే చూడని దాన్ని, ఒక పలకరింపో, ఒక కరస్పర్శో లేనిదాన్ని, అతని వాకిటి ముందు   నక్షత్రాల్ని, చందమామనీ రాశి పోద్దామనే వెర్రి కోర్కెలేమిటి అనుకుంది మళ్ళీ. పేమను మైకంతోనూ, పిచ్చితోనూ పోలుస్తారు. ప్రేమించటంలో వున్న అమాయకత్వం, తన్మయత్వం, కాసింత తిక్క, ఆ అనుభవానికి లోనైన వాళ్ళకి మాత్రమే అర్ధమవుతుంది.

ఆ ప్రేమ ముందు, ఆ అద్భుత అనుభవం ముందు, ప్రపంచంలో మరేదీ అక్కర లేదనిపిస్తుంది.

రాత్రి తలదువ్వుకుంటూ అద్దంలో చూసుకుంటే, మరెవరో, తనకు పరిచయమేలేని, తనది కాదనిపించే, తన మొఖాన్ని చూస్తున్నట్లనిపించింది మార్తాకి. వంటిపైన కలనేత రంగుల నూలు చీర, జడవేసుకుని బిగించిన చిన్న ముడి, నుదిటిపై ఓ నల్ల చుక్క, మెళ్ళో పూసల దండ, చేతులకు మట్టి గాజులు…తానెప్పుడు నలభయి నాలుగేళ్ళ మార్తాగా ఎలా మారి పోయానో తెలియనేలేదు అనుకుందామె. హఠాత్తుగా ముసలిదాన్నయి పోయాననిపించిదామెకు.

పదోతరగతి దాకా అమ్మాయిల బళ్లో చదువుకుని, మెదటిసారి, ఇంటరులో కో ఎడ్యుకేషను కాలేజీలో , మగపిల్లలతో పాటూ కూర్చొని చదవటం కొత్తగా కొంచం భయంగా, గమ్మత్తుగా వుండేది. చంద్ర తన తరగతే అయినా, అతడ్ని గమనించటం మొదలు పెట్టింది మాత్రం, మరో మూడు నెలల తరువాతే! అతను, అతనితో పాటు మరికొందరు, కరపత్రాలేవో పంచుతూ, తరగతులు బహిష్కరిస్తున్నారు. సాంఘిక సంక్షేమ హాస్టలు పిల్లల స్కాలర్‌షిప్పుల విషయం, వారి దుస్ధితి గురించి అతను ఆవేశంగా మాట్లాడాడు.

ఏవో, ఇలాంటి పనులతోనే, ఎప్పుడూ తెగ బిజీగా వుండేవాడతను. గుంటూరులో ఆమె చదివే, కాలేజీలో కూడా విద్యార్ధులు, కులాలు,ఆర్ధిక హోదాల వారీగా, చీలిపోయి వుండే వారు. దళిత అబ్బాయిలని, అమ్మాయిల్ని అవమానించటం, వేధించటం చాలా సాధారణ విషయంగా వుండేది. నిజానికి, కారంచేడు సంఘటన తరువాతే, దళిత విద్యార్ధులు మెల్లగా ఒకటవడం మొదలు పెట్టారు.

మరికొన్ని, ఇతర విద్యార్ధి సంఘాలు కూడా చురుగ్గా పనిచేసేవి. వాళ్ళందరి మధ్య అప్పుడప్పుడూ, గొడవలు కూడా జరుగుతుండేవి.

ఎప్పుడైనా, తన క్లాస్‌మెంట్స్‌తో పాటు, పొలోమని, ఏ ఊరేగింపుకో వెళ్ళి , అందరితో పాటు అరవడం మార్తా కి కూడా సరదాగా వుండేది. ఇలాంటి వాటిల్లో చంద్రా అందరికన్నా ముందుండేవాడు. అంతే, అంతకు మించి ఆమె అతని గురించి ఎక్కువగా  ఆలోచించ లేదు మెదట్లో. కానీ ఆ తరువాత, ఆడపిల్లల పట్ల పెద్దగా ఆసక్తి కనపరచని అతని వెంట ఆమె చూపులు, ఆమె అదుపు తప్పి పరుగెత్తే వెందుకో.  ఆ రెండేళ్ళలో వాళ్ళిద్దరూ, అప్పుడప్పుడూ మాట్లాడుకునే వారు.ఆ సంభాషణ వాళ్లిద్దరిమధ్యా సాన్నిహిత్యం పెరిగేంత దగ్గరగా  వుండేదేం కాదు.

మార్తా కి ఐదేళ్ల వయసున్నప్పుడు, వినుకొండ నుండి గుంటూరుకు వలస వచ్చింది వాళ్ల కుటుంబం. వాళ్ళ నాన్న గుంటూరు మిర్చీ యార్డులో పనిచేసేవాడు. తల్లి ఇంట్లోనే మిషను కుట్టేది. మార్తా, పదో తరగతి చదువుతున్నప్పుడు, వాళ్ళ నాన్న చనిపోయాడు. డిగ్రీ రెండో సంవత్సరంలో వున్న మార్తా వాళ్లక్కకి, బంధువులబ్బాయితో అప్పటికే, సంబంధం కుదిరింది. మరో ఆరునెలల్లో, ఆమెకి పెళ్ళి జరిగి పోయింది. రెండు గదుల రేకుటింట్లో, తమలానే చాలీ చాలని ఆదాయంతో, కటకటలాడుతూ, ఆశలన్నీ ఆరిపోయిన, ఇరుగుపొరుగు మధ్య పెరుగుతున్న మార్తాకి, ఆ జీవితం పైన ఏదో అసంతృప్తి. ఎవరిమీదో, ఎందుకో తెలియని కోపం. ఊపిరాడని తనం. అక్కడి నుండి బయటపడాలనే ఆరాటం. అక్కడి నుండి బయటపడాలనే ఆరాటం. ఎవడో, ఏ రాకుమారుడో, తనచేయి అలా సుతారంగా పట్టుకుని, ఆ మురికి వీధుల ఇరుకు గదుల ఇంటి నుండి, దూరంగా, తనను దూరంగా తీసుకు వెడితే బావుండన్న, పదహారేళ్ళ ప్రాయపు అమాయకపు రహస్య కల…

కుటుంబ ఆర్ధికఇబ్బందుల కారణంగా మార్తా  చదువు డిగ్రీ మొదటి ఏడాది మధ్యలోనే ఆగిపోయింది. అమ్మా,తాను, బతుకుతూ, తన కట్నం డబ్బులను తానే కూడబెట్టుకోవాల్సిన పరిస్ధితి మార్తాది. ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో ప్రూఫులు దిద్దుతూ, కంపోజింగ్‌ నేర్చుకుని, ఉద్యోగం చేయటం మొదలు పెట్టింది. జీవితం యాంత్రికంగా  ఇట్లానే అనేక ఏళ్ళుగా, తాను బతుకుతున్నట్లనిపించేదామెకి. ఆమెకి పెద్దగా స్నేహితులెవరూ లేరు. వున్న ఒకరిద్దరిని కూడా ఎక్కువగా , కలిసేది కాదు.

ఆ ఉద్యోగంలో చేరిన ఏ రెండేళ్ల తరువాతో  అనుకోకుండా, ఓ సారి వాళ్ళ ప్రెస్‌కి లెనిన్‌చంద్ర వచ్చాడు. ఏదో కరపత్రం ప్రింటు చేయించేందుకు. కాలేజీ వదిలేసాక, అతనితో ఎదురుబడి మాట్లాటడటం అదే మొదటి సారి. ఏవో కబుర్లు సాగాయి. మొదట్లో పనుల మీదే పెస్‌కి వచ్చే వాడు. మార్తా కోసం పుస్తకాలు తెచ్చేవాడు. కొంచం అర్ధమయి, అర్ధంకాక ఆమె చదివేది. వాళ్ళిద్దరి మధ్యా సంభాషణ సాగేందుకు ఆ పుస్తకాలు మాధ్యమంగా వుండేవి. తర్వాత తర్వాత పనేం లేకపోయినా వచ్చేవాడు.

‘‘ఈ దారినే వెడుతున్నా. ఊరికే, చూసి పోదామని…’’ అంటూ బిడియంగా నవ్వే వాడు.అతడు అట్లా తన కోసమే, వస్తున్నాడన్న ఊహ ఆమెకి ఏదో తెలియని ఆనందాన్ని కలిగించేది. ఆమెకి అతడి పట్ల ఇష్టంలాంటిది కలగసాగింది. అతడికోసం ఎదురు చూడటంలో అనిశ్చిత, అతడు కనబడగానే  తనలో కలిగే కలవరపాటు, ఆమెకి కొత్తగా వుండేవి. ఒక్కోసారి వారాల తరబడి కనబడకుండా పోయేవాడు. డిగ్రీ పరీక్షలైపోయాక, ఇక అతను చదువు మానేస్తున్నా నన్నాడు. అతనితో మార్తాకి చనువు పెరిగింది. అప్పుడప్పుడూ, వాళ్ళిద్దరూ, ఏ శంకర్‌విలాస్‌ వద్దో, నాజ్‌ సెంటర్‌ వద్దో కలుసుకునే వారు. అరుదుగా, సినిమాకో, హోటలుకో వెళ్ళే వాళ్ళు.

అతనిది రేపల్లె దగ్గరి పల్లెటూరు.వ్యవసాయకుటుంబం.ముగ్గురన్నలు, ఇద్దరక్కలు. అతనే అందర్లోకీ చిన్న వాడు.

‘‘ఎందుకు నీ కట్లాటి పేరెట్టారు?’’ అంటూ నవ్వింది మార్తా.

‘‘నా పేరుకేంలే! మా నాన్న  ఓ అన్నకి చార్వాకుడు, మరో అన్నకి స్టాలిన్‌ అని పెట్టాడు.మా పెద్దక్క పేరు నాస్తిక కుమారి, ఇంకో అక్క పేరు స్వేచ్ఛాభారతి. మా పెద్దన్నకే ఎలాగో నాగన్నని పేరెట్టారు. ఆపేరు మా తాతది.’’

‘‘అయ్య బాబోయ్‌!’’ అంటూ గుండెల మీద చేయేసుకు, పడీపడీ నవ్వింది మార్తా. నవ్వినప్పుడు ఆమె బుగ్గల పై పడే చొట్టల కేసి చూస్తున్నా డతను.

‘‘నవ్వితే నువ్వు బావుంటావేం ’’ అన్నాడు తనకు తెలీకుండానే. ఆమె అదేం పట్టించుకోకుండా, ‘‘ నువ్విట్లా తిరిగితే మీ ఇంట్లో ఏం అనరా?’’

‘‘ఎందుకంటారు? రెండుతరాల కమ్యునిస్టు కుటుంబం మాది. మా తాత, నాన్నా… ఒక్క మా స్టాలిన్‌ అన్నకి తప్పా, అందరికీ పార్టీవాళ్లు ఇష్టమే. ‘ఆస్తిపాస్తులన్నీ కరిగించి మమ్మల్ని బికారెదవల్ని చేసావంటూ’ మా నాన్నతో తగువేసుకుంటాడు.’’ అతడి గొంతులో కొంచం అతిశయం ధ్వనించింది. అంత చొరవగా, ఆత్మవిశ్వాసంతో అతను కనబడేందుకు, వాళ్ళ ఇంట్లో, అతనికి దొరికిన స్వేచ్ఛే కారణమేమో అనుకుంది మార్తా.

కొంతమందితో  కలిసి పార్వతీపురం చుట్టు పక్కల గ్రామాల్లో సర్వే చేసేందుకెడుతూ. తనతోపాటు మార్తాని కూడా రమ్మని అడిగాడు చంద్ర. ‘‘నాలుగైదురోజులంటే, రాగలను’’ అంటూ బయలుదేరేందుకు సిద్ధమైందామె. అందరూ వెళ్ళినా, మార్తాని తీసుకెళ్లేందుకు ఆగిపోయాడతను. స్నేహితురాలి పెళ్ళికని అబద్ధంచెప్పి, బ్యాగు తీసుకుని చంద్రా గదికొచ్చింది.

ఆమె లెనిన్‌చంద్ర గదికి చేరుకొనేసరికి  చీకట్లు కమ్ముకున్నాయి. ఇంతకు ముందుకూడా అక్కడికి, వచ్చినా ఇలా వాళ్ళిద్దరే, ఆ గదిలో కూర్చునివుండటం మొదటిసారి. అందరబ్బాయిల గదిలానే ఎప్పుడూ చిందరవందరగా వుండే ఆ గది ఇప్పుడు కొంచం శుభ్రంగా సర్దివుండటం ఆమె గమనించింది. ఆ పని అతనే చేసాడనుకుంది.  ఆమె వస్తుందని లెనిన్‌చంద్ర  కూరముందే చేసాడు. ఆమె వచ్చాక ,బియ్యం పొయి మీద పెట్టి ‘‘ పెరుగు తెస్తా ’’ అంటూ బయటకెళ్ళాడు.

ఏవో పొట్లాలతో తిరిగి వచ్బాడు. ఈ లోగా అన్నం పొంగిపోతూ వుంటే, గెరిటతో కలిపి,  గంజి వార్చింది. భోజనాలయ్యాక, మార్తా సాయం చేయబోతే, వారించి, శుభ్రంగా గిన్నెలు తోమి, కడిగి పెట్టాడు చంద్ర.

వాళ్ళెక్కాల్సిన బస్సు రాత్రి పన్నెండిరటికి.

‘‘పుస్తకాలు తెచ్చిచ్చి,  పరీక్ష రాయమంటే, కనీసం ఫీజు కూడా కట్టలేదు నువ్వు?’’ నిష్టూరంగా అన్నాడు చంద్ర.

‘‘ ఏంచేయను? ఆ ప్రెస్‌లో, ఇంట్లో పనులతో తెమలటం లేదు చంద్రా! నాకసలు తీరిక దొరకటం లేదు. ఏం చేయమంటావ్‌ చెప్పు?’’

తెరచిన ఆ గది తలుపు ముందు పరుచుకున్న వెన్నెల చారను చూస్తూ అందామె. అతను మరేం అనలేదు. మెల్లిగా లేచి, మేకుకు తగిలించిన గుడ్డ సంచీ లోంచి, ఒక పొట్లం తీసి, ఆమె చేతుల్లో పెట్టాడు సంకోచంగా.

‘‘ప్లీజ్‌, ఏం అనద్దు’’

బాదం ఆకుల ఆ పొట్లాన్ని విప్పితే, ఆ పచ్చటి ఆకుల మధ్య తెల్లటి మల్లెపూల దండ, పరిమళాల్ని వెదజల్లుతూ… ఆ దండని చేతుల్లోకి తీసుకుని, చెంపలకానన్చుకొని ‘‘ఎందుకనను? ధ్యాంక్స్‌’’ అని నవ్వింది.

‘‘తిడతావేమోనని భయపడ్డాను. నీకు మల్లెపూలంలే ఇష్టవని అన్నావోసారి. బజార్లో కనిపిస్తే….’’ ఏ ప్రాధాన్యతా లేని సాధారణ విషయంగా, చెప్పేందుకతను ప్రయత్నించినా, అతనిలోని మృదుత్వపు కోణం అర్ధమయి, అతను మరింత దగ్గరగా వచ్చినట్లనిపించిందామెకి. ఆ పూలని ఇంకా దోసిట్లోనే పట్టుకొనివుందామె.

‘‘ప్రేమంటే ఏమిటి?నువ్వు నా పక్కనుంటే, నాకు ఆనందంగా, హాయిగా వుంటుంది రా’’ అంది దిగులుగా.

గోడకానుకుని  కాళ్ళుచాపుకు కూర్చుని మార్తాకేసి చూస్తున్న చంద్ర చూపు పక్కకు తిప్పుకొని  ‘‘ ఏమో? నాకేం తెలుసు? నాక్కూడా నీలానే అనిపిస్తుంది. నువ్వు గుర్తొస్తావ్‌ ఎప్నుడూ! నువ్వు నవ్వుతున్నప్పుడు ఇంకా బాగుంటుంది.

సొట్ట బుగ్గల పిల్లా!’’ అతడు అన్న తీరుకి మార్తాకి నవ్వొచ్చింది.

బస్సులో కిటికీ పక్కన కూర్చుంది మార్తా. ఆమె పక్కనే కూర్చున్నాడతను. అంత దగ్గరగా, అతడి స్పర్శ ఆమెకి కొత్తగా వుంది. ఆమె తలలో విరిసిన మల్లెపూల పరిమళం, అట్లా ఆమె తన పక్కన కూర్చొని వుండటం, అతనికి  హాయిగా వుంది. తెరచిన కిటికీలోంచి, మాయమవుతూ కనిపిస్తున్న చందమామని చూస్తున్న ఆమెతో ‘‘మాట్లాడు’’ అన్నాడతను గుసగుసగా.

‘‘ఏం మాట్లాడను? ఇట్లా ఎప్పటికీ నా పక్కనే వుంటావా?’’ అడిగిందామె.

‘‘ఊ!’’ అతడామె చేతిని, తన చేతుల్లోకి తీసుకొని, మృదువుగా నిమిరాడు.

‘‘చచ్చిపోయే దాకా వుంటావా?’’

‘‘చచ్చిపోయాక కూడా వుంటాను’’  అన్నాడామె చేయి గట్టిగా పట్టుకుని. ఆమె నవ్వింది తడికళ్లతో. అతను మరింకేం మాట్లాడలేదు.

తన చేతిలోని గుడ్డ సంచీని ఆమె వడిలో పెట్టి, దానిపై తలపెట్టుకు పడుకున్నాడు. ఆ చొరవకి, ఒక్క క్షణం ఆశ్చర్చపడి,అతడ్ని సరిగ్గా కూర్చోమని చెప్పాలనుకుని, అట్లా ఆగిపోయింది. ఆమెకే తెలీదు. ఆమె చేతివేళ్ళు అతని ఉంగరాల తలవెంట్రుకల మధ్య ఎట్లా చిక్కుకొని సుతారంగా కదిలాయో! ఆ రాత్రి మాటల కందని భావాలేవో, ఆమెలో కదలాడాయి. తన వడిలో నిశ్చింతగా నిద్రిస్తున్న అతడ్ని చూస్తూ, నిద్ర లేని రాత్రిని గడిపిందామె.ఇక తామిద్దరూ వేరువేరు కాదనే, ఎరుక హఠాత్తుగా ఆమెలో  కలిగింది.

అతనితోనూ, అతని స్నేహితులతోనూ గడిపిన ఆ ఐదు రోజులూ, వాళ్ళిద్దరికీ, విడిగా మాట్లాడుకునేంత సమయం దొరకలేదు. అంత మంది మధ్యా, వాళ్ళ కళ్ళు, ఒకరికోసం ఒకరు వెతుక్కొని, సంభాషించుకునేవి.

ఆమె వెనక్కి తిరిగి వచ్చాక, ప్రెస్సు, ఇల్లు, అంటూ రోజువారీ, దిన చర్యలో పడ్డా, ఇక ఆమె ఇంతకుమునుపు మార్తా మాత్రం కాదు. ప్రపంచం విశాలమైందని, తానెక్కడో, ఒక ఇరుకు మధ్య కూలబడి, బతుకుతున్నానని ఆమెకి అనిపించటం మెదలైంది. అప్పుడామె మెల్లిగా తన రెక్కల్ని చాచి పక్షిలా ఎగరడం మొదలెట్టింది. లెనిన్‌చంద్ర చేసేలాంటి పనుల్లో ఆమె క్రమంగా ఎక్కువగా  భాగం కావటం మెదలెట్టింది. వాళ్లిద్దరి మధ్యా చిగురు తొడిగిన ప్రేమ కూడా ఆమెలానే ఎదిగింది.

‘‘నేను వచ్చేసి, నీతో పాటూ వుంటా’’ నని చంద్రతో అనే మార్తా,

‘‘నేనూ మీలానే పని చేస్తా’’ అనే వరకూ వచ్చింది.

‘‘వాళ్ళతో ఎందుకు తిరుగుతావ్‌?’’ అంటూ మార్తాని తిట్టేది వాళ్ళమ్మ. అత్తమామలకు భయపడి, తాగి, తాగి చచ్చిపోయిన మొగుడుకి భయపడి అతను పోయాక,  ఇద్దరు ఆడపిల్లల్ని పెంచి, పెళ్ళిళ్ళు చేయలేనేమోనని భయపడి… జీవితం అతి జాగ్రత్తని, భయాన్ని, అవమానాల్ని, అనుమానాల్ని, ఆమెకి ఇచ్చింది. అలాంటి అమ్మ  మార్తా భుజానికి వేలాడుతున్న సంచీ పట్టుకు లాగుతూ ‘‘ నువ్వెళ్ళద్దే!’’ అంటూ ఏడ్చింది. ఆమె కన్నీళ్ళు తుడిచేందుకు విఫల ప్రయత్నం చేసి, చివరికి విసురుగా, సంచీ లాక్కొని, ఆ చీకటి రాత్రి కురుస్తున్న వర్షంలో తడుస్తు వెళ్ళిపోయింది మార్తా.

చర్చిలో ఏసుప్రభువుపై పాటలు పాడే మార్తా గొంతులో ఇప్పుడు నెత్తుటి పాటలు…వినేవాళ్ళ హృదయం ద్రవించేలా, కోపంతో రగిలిపోయేలా పాడేది. అలా పాడేప్పుడు ఆమెకి తెలీకుండానే పాటకి అనుగుణంగా, ఆమె మొఖంలో హావభావాలు మారిపోయేవి. అప్పుడు మార్తా అతనికి కొత్తగా కనపడేది. లెనిన్‌చంద్ర చీరాల ప్రాంతంలో, పనిచేసేందుకెళ్లి పోయాడు.
కొన్నాళ్ళకి ఆమె కూడా అటే వెళ్ళింది.ఒక రోజు వేటపాలెంలో వాళ్ళున్నప్పుడు, చుండూరులో దళితుల్ని ఎట్లా వెంటపడి వేటాడి  చంపారో, ఎవరో వార్త మోసుకొచ్చారు. వాళ్ళక్కడికి పరుగెత్తుకెళ్ళారు.

ఏం కాలం అది? ఆగ్రహంతో, రగిలిపోయిన దళితవాడ, పోలీసు క్యాంపులు, నింగినంటిన నిరసన జ్వాలలు, నినాదాలు, ఊరేగింపులు, సభలు, కాందిశీక శిబిరాలు, సామూహిక వంటశాలలు, ఆగక మోగే మాదిగ డప్పు, అగ్ని గీతాలు, నట్టనడి వీధిలో పాతిన శవాలు, దారిచూపుతున్న అంబేద్కర్‌ విగ్రహపు వేలు, వ్యూహాలు, ప్రతిఘటనలు, పోలీసుల తూటాల దెబ్బలకి, నెత్తురొడ్డి మరణించిన అనీల్‌ కుమార్‌ తెరిచివున్న కళ్ళు…. ఆ మహోద్రేకపు రోజుల్లో వాళ్ళిద్దరూ నిద్రాహారాలు మాని, గ్రామాలు కలియతిరిగారు.
అతను ఆగ్రహంతో నిలదీసి మాట్లాడుతుంటే, ప్రజలు శ్రద్ధగా వినేవారు. ఆమె అలసటలేకుండా పాడుతూనే వుండేది. కొన్ని నెలల తరువాత, ఇహ వాళ్ళక్కడ తిరగటం క్షేమం కాదనిపించాక, వాళ్ళక్కడి నుండి వెళ్ళి పోవాల్సి వచ్చింది.

మహబూబ్‌నగర్‌ చిట్టడవుల నుండి, రాయలసీమ జిల్లాలు తిరిగి, చివరికి నల్లమల అడవులకి చేరుకున్నారు వాళ్ళు. అక్కడే వాళ్ళ పెళ్ళి జరిగింది. పెళ్ళంటే మరేంలేదు. తుపాకులు, స్నేహితుల మధ్య, వాళ్ళందరి నవ్వుల మధ్య, అడవి ఆకుల, గడ్డిపూల దండల్ని మార్చుకున్నారు వాళ్ళు. ఆ తరువాత మరో రెండు గంటలకే, చంద్రా పనిమీద తన సహచరులతో కలిసి వెళ్ళిపోయాడు. మరోనెల రోజులకి కానీ, అతను తిరిగి రాలేదు. దూరంగా, చెట్ల మధ్య నుండి నడిచి వస్తున్న అతడ్ని చూస్తుంటే, ఆమె గుండెలు గుబగుబ లాడాయి.
అతను తిరిగి వచ్చిన రాత్రి  ఆ అడవిలో వెన్నెలాకాశం క్రింద అతడితో గడిపిన రాత్రి….వాళ్ళిద్దరూ, మిగిలిన వాళ్ళకి కాస్త దూరంగా వెళ్లారు. చెట్ల చాటున గడ్డి మొలిచిన నేలపై  గులకరాళ్ళను వాళ్ళిద్దరూ కలిసి ఏరేసారు. మార్తా  ప్లాస్టిక్‌ కాగితపు పట్టాని ఆ గడ్డిపై పరిచింది.

‘‘వుండు’’ అంటూ, అతడు కొంచం పక్కకెళ్ళి, కాసిన్ని పచ్చటి కొమ్మల్ని విరుచుకొచ్చాడు.

‘‘కొంచం మెత్తగా వుంటుంది’’ అంటూ నవ్వాడు. పరచిన ఆ పట్టాని తీసి, ఆ కొమ్మల పై మళ్ళీ పరిచిందామె. దానిపై కూర్చుని ‘‘ నిజమే’’ అంటూ ఆమె కూడా నవ్వింది.

ఆ శరత్‌కాలపు రాత్రి, అడవిలో, ఆ నీరవ నిశ్శబ్దం మధ్య, అతని చేతిపై తలపెట్టుకుని, దగ్గరగా జరిగి, అతని గుండెలపై ముద్దు పెట్టుకుని ‘‘ ఇక్కడ నేనున్నానా’’ అంది గుసగుసగా. అతడామెని మరింత దగ్గరగా లాక్కొన్నాడు.

‘‘అసలు నువ్వు నాకెందుక్కలిసావ్‌ అమ్మాయ్‌! నాపాటికి నేను ఎట్లానో వుండే వాడ్ని. ఇప్పుడు నీ గురించే ఆలోచనలు….’’ ఆమె అరచేతుల్ని తన మెఖానికి ఆన్చుకున్నాడు చంద్ర. ఆ పరమ ప్రశాంతమైన నిశ్శబ్ద క్షణాల్లో, ఎక్కడో ఆగి,ఆగి అరిచే పక్షుల అరుపుల మధ్య, గాలికి, ఆకులు చేసే చిరుమువ్వల సవ్వడి మధ్య, వాళ్లిద్దరూ ఒకటైయ్యారు.
ఆకాశంలో వెన్నెల కురిపిస్తున్న చందమామని, తన వొడిలో పసివాడిలా పడుకున్న తన చంద్రుడినీ ఆ రాత్రి మేల్కొని చూస్తున్న ఆమెకి ఏదో తెలియని దు:ఖం లోలోన సుళ్ళుతిరిగి  కళ్ళు చెమర్చాయి. ఆమె బుగ్గలపై జారిన కన్నీటి తడి, అతని మునివేళ్లకు తాకి,‘‘ఏడుస్తున్నావా మార్తా!’’ అంటూ గభాలున లేచి కూర్చున్నాడు చంద్రా.

‘‘ఎందుకో చాలా దిగులుగా వుంది రా! చచ్చి పోవాల్సి వస్తే, నేనే నీకన్నా ముందు చచ్చిపోతాను. నువ్వు లేకుండా నేను బతకలేనురా చంద్రా!’’ అతని భుజం పైన తలవాల్చి, మార్తా నిజంగానే ఏడుస్తోంది నెమ్మెదిగా.

‘‘ఏడవకు మార్తా! నువ్వు ఏడిస్తే, నేనసలు భరించలేను.ప్లీజ్‌, మార్తా!’’ అతని గొంతులోనూ, దు:ఖం తారట్లాడిరది. చివరికామే, కళ్ళు తుడుచుకుని, నవ్వి,

‘‘చస్తే, ఇద్దరం కలిసే చద్దాం. ప్రామిస్‌!’’ అంటూ చేయి చాచింది. అతడామె చేతిలో చేయివేసాడు చిన్నగా నవ్వి.

అట్లా వాళ్ళు  వాళ్ల మెదటి రాత్రి, మృత్యువు గురించి మాట్లాడుకొని, నిలువెత్తు వృక్షాల నీడల జాడల నడుమ, ఒకరినొకరు పెనవేసుకుని నిద్రించారు. అట్లా వాళ్ళుకలిసి, ఐదారు రోజులకన్నా లేరు. అతను మళ్ళీ వెళ్ళిపోయాడు. వెడుతున్న అతడికి ఆమె జాగ్రత్తలు చెప్పింది.

అది మొదలు వాళ్ళనేక సార్లు, పనుల నిమిత్తం విడిపోతూ, కలుస్తూ గడిపారు.

అడవులు, పల్లెలు, ఆదివాసీ గూడాలు, ఒక ప్రాంతం నుండి, మరో ప్రాంతం… దూసుకు పోయే తూటాలు, త్రుటిలో తప్పే ప్రాణాపాయాలు,దాడులు, చుట్టివేతలు, సహచరుల అనివార్య, అకాల మరణాలు, అనారోగ్యాల మధ్య, తామిద్దరూ ఇంకా జీవించే వుండగలగటం వాళ్ళిద్దరికీ వింతగా వుండేది. వాళ్ళ పని ఇంకా పెరిగింది. ప్రమాదకరమైన, అత్యంత కీలకమైన పనుల్లోకి వాళ్ళు వెళ్ళారు.

అప్పుడు వాళ్ళు చిన్న, చిన్న పట్టణాలు, మహానగరాల్లోని జనారణ్యం లో రకరకాల మారు పేర్లతో. చిన్న చిన్న వృత్తులలో జీవించటం మొదలు పెట్టారు. అలాంటి కొత్త జీవితం కొంత కాలానికి బయటి రాష్ట్రంలో మొదలు పెట్టాల్సి వచ్చినప్పుడు, మార్తా పట్టుదలగా హిందీ నేర్చుకుంది. తమ రహస్య  స్ధావరం మీద ఎప్పుడు దాడి జరుగుతుందో, ఇంటి నుండి బయటకెళ్ళిన వాళ్ళు మళ్ళీ, తిరిగి వస్తారో రారో తెలియని స్థితి….ఒంటరితనం, మాట్లాడేందుకు ఎవరూ వుండకపోవటం, అనుక్షణం అప్రమత్తత, ఆందోళణ…..మార్తాకి తెలియని భయాన్ని, దిగులును కలిగించేవి. పూనా, భోపాల్‌, సూరత్‌ , అహమ్మదాబాద్‌… ఇట్లా తిరిగి,తిరిగి వాళ్ళు జలంధర్‌కి చేరుకున్నారు. ఇక్కడ లెనిన్‌చంద్ర  సంజీవ్‌గా  మార్తా అనిత గా తమ పేర్లు మార్చుకున్నారు. అక్కడొక మెకానిక్‌  షెడ్డులో, యంత్రాల విడిభాగాలు తయారుచేసే ఓ పంజాబీ యజమాని కింద పనిలోకి కుదిరాడు చంద్రా. పైకి  యజమానిగా వ్యవహరించే ఆ పంజాబీ వ్యక్తికి, ఆంధ్రా నుండి వచ్చిన మరో రెండు జంటలు కూడా  పనిలో సాయపడేవి.

మరి కొన్నాళ్ళకి  అనేక యుధ్ధముల ఆరితేరిన’ జతిన్‌దా ఈ బృందానికి నాయకుడిగా వచ్చి, వాళ్ళతో కలిసాడు. అక్కడ వాళ్ళంతా ఆయుధాల విడిభాగాల్ని తయారుచేసి, చేరాల్సిన గమ్యస్ధానాలకి రవాణా చేసేవారు. జలంధర్‌ కి వచ్చాక మార్తా తరచూ అనారోగ్యం పాలౌతోంది. మాట్లాడటం పూర్తిగా తగ్గించేసింది. డాక్టరు దగ్గరి కెడదామంటే, వద్దంటూ దాటవేసేది. చివరికి ఎలాగోలా తీసుకువెళ్లి చూపిస్తే  గర్భసంచీకి పుండు పడినట్లుందనంటూ పరీక్షలు చేయించమన్నారు. ఈమధ్య  చంద్రకి అసలు తీరికలేకుండా పోయింది. ఒక్కోసారి రాత్రింబవళ్ళూ, షెడ్డు లోనే వుండాల్సి వచ్చేది. మార్తా ముభావంగా వుండటాన్ని గమనించినా, ఆమెతో తీరిక చేసుకుని మాట్లాడాలనుకుంటున్నా, వారం రోజులుగా సమయం దొరకలేదతనికి. ఆరోజు ఎలాగైనా మార్తాతో మాట్లాడాలని తొందరగా ఇంటికొచ్చాడు చంద్రా.

ఎంతోసేపు అతనామెని బతిమాలాక,

‘‘ఇట్లా నేనిక ఉండలేను. ఈ నాలుగేళ్ళ కాలంలో పేరుకి నువ్వూ  నేనూ కలిసి వున్నట్లే కానీ, ఎంతో దూరంగా వున్నట్లనిపిస్తోందినాకు.’’ అంది మెల్లగా మార్తా.

‘‘అర్థంకాలేదు?’’

‘‘ మనిద్దరం సహచరులుగాకాక, మామూలు అర్థంలోలా, భార్యాభర్తల్లా… బయటికెళ్ళి పనిచేసే భర్తలా నువ్వూ, వంటచేసి, ఇల్లు చూసుకునే భార్యలా నేనూ.. ఎందుకిట్లా, నాకేం బాలేదు’’ అంటూ దిగులుగా నవ్వింది మార్తా.

‘‘నువ్వు చేస్తుంది కేవలం అదే కాదు కదా! నువ్వు చేస్తున్న ఇతర పనులు కూడా ముఖ్యమైనవే కదా! ’’ అంటూ అతనేదో చెప్పబోతే, మధ్యలో కల్పించుకొని

‘‘ఇంతకు మునుపు, ఇంతటి ఆందోళణ, దిగులు లేదు. ప్రతి క్షణం ఇంత భయంతో కూడిన  ఎదురుచూపులు లేవు. ఇంతకన్నా లోపలే నయం’’ అంది నిర్లిప్తంగా.

అతనికి ఏ మనాలో తోచలేదు. ఈ మానసిక స్ధితి నుండి నువ్వు బయటపడాలని చెబుదామనుకొని ఊరుకున్నాడతను  ఆ చిన్న గదిలో  గోడకి ఆనుకుని నేలపై కూర్చున్నవాళ్ళిద్దరూ మాట్లాడుకునేందు కేమీ లేనట్లు మౌనంగా వుండి పోయారు.

సూర్యుడు పడమటి ఆకాశంలోకి కుంకుతున్న ఆ వేళ  లేత ఎరుపు,నారింజ,పసుపు రంగుల వింత కాంతి కమ్ముకున్న ఆకాశాన్ని, కిటికీ ఊచల సందునుండి వాళ్లిద్దరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు. ఆమె అలసిపొయినట్లు అతన్ని ఆనుకుని,  భుజంపైన తలవాల్చింది. ఆమెలోని ఆ ఉదాసీనతను భరించటం అతనికి కష్టంగా అనిపించింది.

‘‘నువ్వు కొన్నాళ్ళ పాటు కనీసం, నీ ఆరోగ్యం మెరుగుపడే వరకన్నా ఎటన్నా వెళ్ళి రెస్టు తీసుకుంటే బావుంటుంది.’’
అతని చేతివేళ్ళను మూసి తెరుస్తూ ఆడుకుంటున్న మార్తా,

‘‘అప్పుడు నువ్వు నాతోపాటూ వుండవు కదా!’’

‘‘ ఇంత పొసెసివ్‌నెస్‌ పనికి రాదు మనకి. ఆ తరువాత బాధని తట్టు కోవడం కష్టం.’’

మార్తా ఏమీ మాట్లాడకుండా, అతని రెండు చేతుల్ని లాక్కుని తనచుట్టూ తిప్పి, తలకొంచం పైకెత్తి అతనికేసి చూస్తూ, బుంగమూతి పెట్టింది. ముప్ఫయి ఏడేళ్ళ మార్తా పెదవులపై చప్పున ముద్దు పెట్టాడు చంద్ర.

ఆ మర్నాడు  చంద్రకి ఇష్టమని  టమాటా పప్పు చేసింది. చంద్ర ఆమ్లేట్లేసాడు. పదింటికల్లా వాళ్ళిద్దరూ భోజనాలు చేసేసారు. అతను పనికెళ్ళిపోయాక, ఆమె డాక్టరు చేయించమన్న పరీక్షలు చేయించుకునేందుకు బయలుదేరింది.  మార్తా  ఆసుపత్రికి వెళ్ళేసరికల్లా  ముందుగా అనుకున్నట్లుగానే, శైలజ రిసెప్షన్‌ వద్ద ఎదురుచూస్తున్నది. ఆమె కూడా మార్తా వాళ్ళలానే, మరో ప్రాంతం నుండి వచ్చి, వాళ్లతో పాటు పనిచేస్తోంది.

చంద్ర పనిచేసే ఆ షెడ్డు అంత రద్దీగా లేని ఓ మైయిన్‌ రోడ్డు కి ఆనుకుని వుండే సందులో చిట్టచివరకి వుంటుంది. రేకుల షెడ్డుకి ఓ మూల వాచ్‌మెన్‌ కోసం కట్టిన రెండుగదుల్లో కాపలాదారుల హోదాలో ఆంధ్రా నుండి వచ్చిన భార్యాభర్తలు, రాజు, అరుణలు కాపురం పెట్టారు. చంద్ర లోపలికి అడుగు పెట్టేటప్పటికి  మిగిలిన వాళ్ళంతా గమ్యస్ధానానికి పంపాల్సిన సామాన్లు ప్యాకింగ్‌ చేస్తూ హడావిడిగా వున్నారు. అరుణ అందరికీ టీ తీసుకొచ్చింది. చేస్తున్న పని ఆపి, అంతా టీ తాగుతూ వుంటే, రాజు ట్రాన్సపోర్టు ఆఫీసుకెళ్ళి, ఇవ్వాళ్ళ వాళ్ళు సరుకు పంపేలా వుంటే, ట్రాలీ మాట్లాడుకొని వస్తానని వెళ్ళాడు.

పన్నెండుగంటకి జతిన్‌దా కూడా వచ్చాడు. మరో అరగంటకి గేటు దగ్గర ఏదో చప్పుడవుతూ వుంటే, చంద్రా  షెడ్డు  వాకిలి దాటి బయటకు రాబోయాడు.ఏం జరుగుతుందో అర్ధమయ్యేలోగా కన్నుమూసి తెరిచే లోగానే  పెద్దగా అరుస్తూ, సాయుధ పోలీసులు వాళ్ళని చుట్టుముట్టారు. బూతులు, కేకలు, తుపాకులను  తిరగేసి, బూటుకాళ్ళతో తన్నుతూ వాళ్ళని బయటకు ఈడ్చుకొచ్చారు. షెడ్డుకు కాస్త ఎడంగా వున్న గదిలో వంట చేస్తున్న అరుణ  ఈ హడావిడిలో మెల్లిగా తప్పుకోవాలని చూసింది కానీ, ఓ పోలీసు ఆమెని చూసి, తన్నుతూ, జుట్టు పట్టుకు ఈడ్చుకొచ్చాడు. వాళ్ళందరినీ, ఓ మూల కూలేసారు. టాన్సపోర్టు ఆఫీసుకెళ్ళాడు కాబట్టి,  కనీసం రాజు పట్టుబడి వుండడని అనుకున్నాడు చంద్ర. కానీ అతడ్ని టాన్సపోర్టు ఆఫీసు దగ్గరే పట్టుకొని, నెత్తుర్లు కారేలా కొట్టి జీపులో కూర్చోబెట్టారన్న సంగతి  అతని తెలీదు. చంద్రా ఆలోచనలు వేగంగా పరుగెత్తుతున్నాయి. మార్తాకి, ఇతరులకి ఈ కబురు వెడుతుందా, లేక ఇక్కడికిక్కడే తమని కాల్చేస్తారా… ఆసుపత్రి నుండి వచ్చాక, మార్తాని కలుస్తానన్నాను కదా…

అక్కడి హడావిడి, పోలీసుల అరుపులకి చుట్టుపక్కల జనం గుమికూడారు.

ఎక్కువసేపు వాళ్ళని అక్కడే వుంచటం ఎందుకనుకున్నారేమో  పోలీసులు, వాళ్ళని ఆ సన్నటి ఇరుకు సందు నుండి బయటకు నెట్టుకుంటూ మెయిన్‌ రోడ్డు పైన ఆపిన వ్యాన్ల వద్దకు తీసుకు వస్తుంటే, వాళ్ళంతా గట్టిగా నినాదాలు ఇవ్వడం మొదలెట్టారు. సరిగ్గా అప్పుడే మైయిన్‌ రోడ్డు దాటి, సందులోకి వచ్చేందుకు నిలబడ్డ, మార్తా,  శైలజలకి ఆ నినాదాలు వినిపించాయి. వాళ్ళక్కడే ఆగిపోయారు. శైలజ ఆందోళనగా, మార్తా చేయిని గట్టిగా పట్టుకుంది. వాళ్ళముందు మరికొందరు పాదచారులు నిలబడి, ఆ గొడవని ఆశ్చర్చంగా చూస్తున్నారు. పోలీసు వ్యానులోకి వాళ్ళని ఎక్కిస్తుంటే, ఎందుకో వెనక్కి తిరిగిన చంద్రాకి రోడ్డుకు అవతలి పక్కన నిలబడ్డ మార్తా, శైలజలు కనపడ్డారు. మార్తా నిర్ఘాంతపడి అతడికేసి చూస్తోంది. వాళ్ళిద్దరి చూపులూ లిప్తపాటు  కలుసుకున్నాయి. మరుక్షణం శైలజ, మార్తా చేయి పట్టుకుని,అక్కడినుండి మెల్లిగా కదిలింది. ఎలాంటి ఉద్రేకం, తొందరపాటూ, ఆందోళనా, మొఖాల్లో, కనపడనీయకుండా, చేతిలో బుట్టతో, ఏ పచారీ కొట్టుకో,బట్టల షాపింగ్‌కో వెడుతున్నట్లుగా వాళ్ళు వెళ్ళారు. కొంచం దూరం వెళ్ళాక, వాళ్ళు వడివడిగా నడిచారు. నడుస్తూనే వాళ్ళు గబగబా మాట్లాడుకున్నారు.

వాళ్ళ గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. ఏంచేయాలి?  ఏంచేయాలి?  ఏంచేసినా నిముషాల్లో చేయాలి. వాళ్ళ ప్రాణాలు కాపాడబడాలంటే, వాళ్ళని పోలీసులు పట్టుకున్న సంగతి వెంటనే, బయటి ప్రపంచానికి తెలియాలి. మరింత హాని జరక్కూడదంటే, వెళ్లాల్సిన చోట్లకి కబురు వెంటనే వెళ్ళాలి.దానితో పాటూ, తాము అక్కడి నుండి తప్పుకోవాలి. మాయమై పోవాలి…. కొంత దూరం వెళ్ళాక, వాళ్ళు, ఇలాంటి సందర్భాల్లో, సమాచారం ఇవ్వాల్సిన మనిషికి ఫోన్‌ చేసి అతడికి అర్ధమయ్యే రీతిలో వివరించారు. ఇక వాళ్ళిద్దరూ వాళ్ళ ఇళ్ళకి  వెనక్కి వెళ్ళలేదు. ఎక్కడ ఏ రకపు నిఘాలు వాళ్ళకోసం ఎదురుచూస్తూ వుంటాయో తెలీదు. కాబట్టి వాళ్ళు బస్‌స్టాండ్‌లకీ, రైల్వే స్టేషన్‌లకి నేరుగా వెళ్ళ కూడదను కున్నారు. మార్తా వైద్య పరీక్షలకని తెచ్చుకున్న  డబ్బుల్లో మిగిలిన పదిహేను వందలు, శైలజ దగ్గర మరో ఎనిమిది వందలు, అంతే వాళ్ళ వద్ద వున్న డబ్బులు. వాళ్ళిద్దరూ సిటీ బస్సు పట్టుకుని, ఓ సెంటర్‌ లో దిగి, అక్కడి నుండి, పక్క టౌనుకు వెళ్ళే ప్రైవేటు జీప్‌ ఎక్కి, అక్కడినుండి రెండు, మూడు బస్సులు మార్చి, రాత్రి పదిగంటలకి చేరాల్సిన గమ్యస్థానానికి చేనుకున్నారు.

ఆ మరునాటి ఉదయమే వాళ్ళిద్దరినీ, వేరువేరు చోట్లకి పంపారు. గట్లుతెగి  పడ్డట్లు, మరో రెండు రాష్ట్రాలలోనూ ఏక కాలంలో పోలీసులు దాడులు చేసారనీ, పెద్ద సంఖ్యలో ఆయుధాలు, వాటి విడిభాగాలు దొరికినట్లు, ఫ్యాక్టరీలలో వాటిని తయారు చేస్తుండగా దాడిచేసి పట్టుకున్నట్లు పత్రికల్లో వార్తలొచ్చాయి. పట్టుబడ్డవాళ్ళని  చంపరిక, అని ఊపిరి పీల్చుకుంది మార్తా. మరింత పాడైన ఆరోగ్యంతో,తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న మార్తాకి ఆపరేషన్‌ చేసి గర్భసంచీ తొలగించారు. ఆరునెలల విశ్రాంతి తరువాత  చిక్కిశల్యమైన మార్తా  వెన్ను నొప్పితో బాధపడుతూ, మళ్ళీ అడవిలోకెళ్ళి పనిచేయలేక, బయటవుండి పనిచేయడం క్షేమం కాక  ఏంచేయాలో తోచనిస్ధితిలో పడింది.

కొంత కాలం ఇంటికి వెళ్ళిమని సలహా ఇస్తే, ఎక్కడికి, ఏ ఇంటికి వెళ్ళాలో అర్దం కాలేదు మార్తాకి. చివరికామె అల్లుడు, కూతురుతో పాటూ  దాచేపల్లిలో వుంటున్న వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళింది. రహస్య జీవితంలో ఆమె వాళ్ళని నాలుగైదు సార్లు కలిసినా, వాళ్ళతో గడిపిన సమయం మాత్రం కొన్ని గంటలే. ఆమె రాకకి అక్కా, అమ్మా భయపడ్డా, వాళ్ళ బావ మాత్రం స్వాగతించాడు. అతనికి మార్తా రాజకీయాల పట్ల గొప్ప గౌరవం వుంది. ఆమె ఎవరో, ఎటువంటి పనిలో ఆమె భాగం పంచుకుందో మార్తా ఎవరితోనూ నోరువిప్పి చెప్పలేదు. చంద్రతో ఆమెకి పెళ్ళయిన విషయమూ, అతను జైల్లో వున్న విషయమూ బయటి ప్రపంచంలో తెలిసిన వాళ్ళు అతి తక్కువ మంది. ఆ సంగతులు బహిరంగంగా,  ప్రస్థావించటం ప్రమాదమన్న సంగతికూడా వాళ్ళకి తెలుసు. అయినా మెదట్లో, ఆమె ఇంట్లోంచి బయటకు వచ్చేదికాదు.

చివరికి ఓ తెలిసిన లాయరు ఎలాంటి కేసులూ ఆమె పైన  లేవు కాబట్టి,  మామూలుగా తిరగమని ఇచ్చిన సలహాని ఆమె  పాటించింది.

దాచేపల్లి గుంటూరులో జరిగిన ఒకటి, రెండు సభలకి, ఊరేగింపులకి  వెళ్లింది. అక్కడ ఆమె అనామకంగా, కొత్తగా అలాంటి చోట్లకి వస్తున్న దానిలా వుండేది. ఓసారి ఏదో సమస్యపై , మరో ముప్ఫయి మందితో పాటూ అరెస్టు కూడా అయింది.  ఆమెని పోలీసులు ఏమాత్రం   పట్టించుకోలేదు. అక్కడికి ఆమె కధ ఎవరికీ అనుమానం రాకుండా  ముగిసింది.
చివరికి మార్తా వాళ్ళ బావగారు తిరుపతిలో తెలిసినవాళ్ళ స్కూల్లో క్లర్కుగా  ఉద్యోగం ఇప్పిస్తే  చేరిపోయింది. కొంతకాలం పాటు ఆమె అట్లా వుండటమే మంచిదన్న చిన్న ఉత్తరం ఓ నాయకుడి నుండి ఆమెకి అందింది. ఇన్నాళ్ళూ బతికిన తన ప్రపంచానికి దూరమై ఇలాంటి జీవితం గడపడం ఆమెకి చాలా కష్టంగా, ఊపిరాడకుండా వుండేది. ఇక్కడి మనుష్యులు, వాళ్ళ ప్రవర్తన, ఆ కృత్రిమత్వం ఆమెకి అర్దమయ్యేవి కావు. లోలోన దు:ఖం గడ్డకట్టిన మార్తాకి, లెనిన్‌చంద్ర పక్కన లేని మార్తాకి, తనలో నుండి ఏదో ఖాళీ అయి, డొల్లలా మిగిలినట్లు బాధపడే దిగులు కళ్ళ మార్తాకి నీటి నుండి బయట పడిన చేపపిల్లలా జీవిస్తున్నట్లుగా అనిపించేది.

ఎవరి తప్పూలేకుండానే, జరిగిన ఒక చిన్న పొరపాటు, చివరికి ఎంతటి నష్టాన్ని, భీభత్సాన్ని ఎందరెందరి జీవితాల్లో నింపిందో అనుకునేది మార్తా. ఏదో అక్కడ దొరికారు కాబట్టి వాళ్ళట్లా ప్రాణాలతో మిగిలారు కానీ, అదే ఆంధ్రాలో అయితే, అందరినీ కాల్చిపడేసే వారనేవాళ్ళంతా.

జలంధర్‌  షెడ్డునుండి రెగ్యులర్‌గా విడిభాగాల బండిళ్ళు ఓ టౌను సెంటరు లోని టాన్సపోర్టు ఆఫీసుకి వెళ్ళేవి. అక్కడినుండి ఒక వ్యక్తి వాటిని తీసుకొని మరో చోటికి తరలించే వాడు. అతను అనుకోకుండా అరెస్టయినా, తనుచేసే పని తన వివరాలను బయట పెట్టలేదు. పోలీసులు అతని పై ఏదో పెట్టీ కేసు పెట్టి రిమాండుకు పంపారు. తను ఇలా ఇరుక్కుపోయానని తన వాళ్ళకి కబురు పెట్టేందుకు అతనికి వీలుకాలేదు. ఈలోగా  నెలరోజులు దాటినా తీసుకుపోని ఆ బండిళ్ళలో ఏ ముందో చూసేందుకు అందులో పనిచేసే ఇద్దరు పనివాళ్ళు  ప్రయత్నించారు. బయటపడ్డ ఆ వస్తువులేమిటో వాళ్ళెవరికీ అర్థంకాలేదు కానీ, వాళ్ళ యజమానికి అర్ధమై పోలీసులని పిలిచాడు. అవి ఎక్కడినుండి వచ్చాయో, పోలీసులు తీగలాగారు. అట్లా డొంకంతా కదిలింది.

అట్లా లెనిన్‌చంద్రని, అతని సహచరుల్ని పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళంతా చిత్రహింసల్ని తట్టుకుని నిలిచారు. కాబట్టే మార్తా, శైలజ, ఇంకా మరెందరో కాపాడబడ్డారు. మరిన్ని నష్టాలు జరగకుండా ఆగాయి. అక్కడి పోలీసులు చంద్రా వాళ్ళ కేసులో ఇంకా దొరకని  పేర్లు తెలీని వాళ్ళకోసం వెతకటం ఆపలేదు.

చంద్రా వాళ్ళ కేసు వాదించేందుకు అక్కడి లాయర్లకు సహాయపడేందుకు  హైదరాబాదు నుండి ఓ వకీలు వెళ్ళేవాడు. విషయం కనుక్కునేందుకు  ఆ వకీలును కలిసేందుకు చంద్రా వాళ్ళన్నయ్య  నాగన్న ఎప్పుడన్నా  హైదరాబాదు వెళ్ళే వాడు. చంద్ర యోగక్షేమాలు తెలుసుకునేందుకు , విజయవాడలో వుండే చంద్రా బంథువుల ఇంటికి అప్పుడప్పుడూ వచ్చేది మార్తా. అక్కడికి చంద్రా వాళ్ళన్నయ్య నాగన్న  వచ్చి కలిసేవాడు.

చంద్ర కేసు నడిచిన ఈ ఏడేళ్ళలో, అతను జైల్లో వున్న తమ్ముడిని మూడుసార్లు మాత్రమే కలవగలిగాడు. దేశద్రోహం, అక్రమ ఆయుధాల తయారీ, సాయుధ కుట్ర వంటి తీవ్ర నేరారోపణలున్న ఆ కేసుల్లో వాళ్ళెవరికీ  బెయిలు దొరకలేదు. పోలీసుల కాపలా మధ్య, కటకటకాల జాలీ వెనుక నిలబడ్డ తమ్ముడితో అరగంట మాట్లాడేందుకు అతనికి అనుమతి దొరికేది. అందరిలోకీ చిన్నవాడైన ఆ తమ్ముడి పట్ల నాగన్నది పుత్రవాత్సల్యం. అట్లా కలిసినప్పుడు మార్తా ఎలావుందని అడిగాడు చంద్రా.

ఆమె తిరుపతిలో ఉద్యోగంచేసుకుంటూ, అనామకంగా బతుకుతుందని నాగన్న అన్నప్పుడు చంద్రా కళ్లనుండి రాలిపడ్డ కన్నీటి చుక్కలను తుడిచేందుకు చేయి చాచిన నాగన్నకి ఇనుపజాలీ అడ్డుగా నిలిచింది.

‘‘ఆయమ్మాయికేదేనా చెప్పేదా?’’

అలా అడిగిన నాగన్నకి ఏం జవాబు చెప్పాలో తోచక ఒక్కనిమిషం మౌనంగా వుండి దీర్ఘంగా నిట్టూర్చి, ‘‘ నేను బాగానేవున్నాను. తనని ధైర్యంగా వుండమని చెప్పు. తన ఆరోగ్యం జాగ్రత్తని చెప్పు.’’ అన్నాడు చంద్రా.

ఆమె పట్ల అతడి ఆదుర్దాని,  ప్రేమని, దిగులును, నిద్రపట్టని తన సుదీర్ఘరాత్రులను గురించి చెప్పేందుకు అది సమయము,సంధర్భమూ కాదని అతనికి అనిపించింది.

అతడు చెమర్చిన కళ్ళతో చెప్పిన ఆ పొడిపొడి మాటల్ని నాగన్న మార్తా కోసం మోసుకొచ్చాడు.

కలిసినప్పుడల్లా, లాయరేమన్నాడు  చంద్రా ఎలావున్నాడు అంటూ పదేపదే అడిగే మార్తాకీ తెలుసు సమాధానాలు క్లుప్తంగానే వుంటాయని. కానీ అతను నాగన్నకి చెప్పలేకపోయిన అనేక సంగతుల్ని ఆమె ఊహించుకునేది.

ఆమె అంతరాంతరాలలో అతనితో జరిపే నిరంతర సంభాషణ ఆమెకి మాత్రమే తెలుసు. తను ఏం ఆలోచిస్తుందో, అతడి కోసం కానరాని దారుల్లో ఎలా వెతుక్కుంటుందో, అతడు లేకపోవటం అంటే తనకేమిటో అతనికి ఎట్లా చెప్పను అనుకునేది మార్తా. మళ్ళీ అతను కూడా తనలాగే దిగులు పడుతుంటాడు కదా! ఆ జైలు గదిలో అలా నిర్వ్యాపకంగా, తనకే కాదు, అన్నింటికన్నా మిన్నగా తలకెత్తుకున్న ఉద్యమానికి దూరంగా…. అట్లాంటి ఆలోచన రాగానే ఆమె కళ్ళు చెమ్మగిల్లేవి.

వాళ్ళు ఇల్లు విడిచి వెళ్లిపోయేటప్పుడు, వాళ్ళ రూపురేఖల ఆనవాళ్ళు శత్రువుకు చిక్కకూడదని, వాళ్ళ వాళ్లందరిళ్ళలోనూ వెతికి వెతికి మరీ, తమ ఫోటోలన్నీ కాల్చివేసారు. లెనిన్‌చంద్ర రూపం ఇప్పుడు ఆమె మనోఫలకం పైన తప్ప మరెక్కడా లేదు. కటకటాల వెనుకనున్న అతని ఫోటో ఎలా సంపాదించాలో ఆమెకి తెలీదు.

ఏడు సంవత్సరాల సాటు  విచారణ జరిగాక, చంద్రా, అరుణ మిగిలిన అందరికీ ఆరు కేసుల్లో, ఆరు యావజీవ శిక్షలు పడ్డాయి. ఆ వార్త విన్న రోజున మాత్రం మార్తా చాలా సేపు ఏడ్చింది.ఎక్కడో మిగిలిన చిగురంత ఆశ కూడా ఆవిరై సోయినందుకు  వాళ్లతోపాటు, తాను లేనందుకు. రైలు విజయవాడ చేరుకొంటోంది. చీకటి పలచబడుతూ, వెలుగు రేకలు విచ్చుకుంటున్న ఆ ప్రాతఃవేళ తాను ఆఖరి సారి చూసిన చంద్రని గుర్తు తెచ్చుకునేందుకు ప్రయత్నించింది

రైలు దిగి, పొగమబ్బులు కమ్ముకున్న ఆ ఉదయపు చిరుచిరు చలిలో, దగ్గరలోనే వున్న చంద్రా బంధువులింటికి మార్తా నడుస్తోంది.

ఆమె అక్కడికి వెళ్లే సరికి నాగన్న ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. మామూలు పరామర్శలు, యోగక్షేమాలూ, అయ్యాక  అతను ఆమె చేతికో ఉత్తరం ఇచ్చాడు. కేసు అప్పీలు  కోసం లాయరు వెళ్లినప్పుడు  చంద్రా ఎలాగో వీలు చేసుకుని నాలుగు లైన్లు రాసి. ఆ ఉత్తరం మార్తాకి అందించమన్నాడట. అన్నేళ్లకి అతడు కష్టంమీద ఆమెకి రాసి పంపిన మెదటి ఉత్తరమది.
వణుకుతున్న చేతులలో, ఉద్వేగంగా ఆ కవరు అందుకుని, పెరట్లోని, మామిడి చెట్టు క్రింది అరుగు మీద కూర్చుని మెల్లిగా విప్పింది.

‘నువ్వు నాకోసం ఎదురుచూడటం, చాలా బాధ కలిగిస్తుంది. నేనిక ఎన్నటికీ రాలేనేమో! ఎవరో ఒకరికి ఎడబాటు శాశ్వతమయ్యే చోట, మరొకరు కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. నేనిక లేననుకొని ముందుకెళ్ళు. నాకోసం నువ్వు చేసే ఏ ప్రయత్నాలైనా నిన్ను కూడా శాశ్వతంగా నాలా స్వేచ్ఛ లేని చీకటి ప్రపంచంలోకి విసిరేయవచ్చు. అది నాకెంత మాత్రం ఇష్టంలేదు. పైగా అది అనవసరం కూడా! ఇది నా ఆఖరి వీడ్కోలేమో కూడా! ఒక్క మాట. నాలోపలి స్వప్నం ఇంకా మరణించలేదు. నా కిటికీ ఊచలవెనుక కత్తిరించబడ్డ ఆకాశంలో అప్పుడప్పుడూ కాసిన్ని మబ్బుతునకలు, నక్షత్రాలు కనపడుతూనే వున్నాయి…. ఇక నేను నీకేం కాకూడదనుకునే నేను. ’’

ఆమె కళ్ళలో నీళ్ళు నిండాయి. సంబోధనా, సంతకం లేని ఆ వుత్తరాన్ని  ఆమె ఎన్ని సార్లు చదువుకుందో లెక్క లేదు.

‘‘ ఎదురు చూపేందుకేమీ లేదు నాకు. కానీ నీకోసం మనం కలిసి కన్న కలకోసం,ఇంకా  నేను అలాగే వున్నానన్న ఆశ నీకు ఊరటకలిగిస్తుందో, దు:ఖ్ఖాన్నే కలిగిస్తుందో నాకు తెలియదు. చావుబతుకుల మధ్య సందేహంలా నువ్వూ  నేనూ ఇలా మిగిలున్నాం. ఈ బయటి ప్రపంచంలో నేనిలా వున్నా నంటే కారణం నువ్వు, నీ సహచరులు.
చిత్రహింసలు అనుభవించినా, మీరు నోరుతెరవక పోవడం వల్లే నాకీ స్వేచ్ఛ దొరికిదని, నేనెలా మర్చిపోగలనురా! నిన్ను నేనెట్లా వదిలేయ గలననుకున్నావ్‌? నువ్వొంటరివైనా  నాకోసం వున్నావ్‌. నేను కూడా అట్లా నీకోసం ఇక్కడ  వేచివున్నా’’ అనుకుంది మార్తా. ఆ జైలు గోడల వెనుక బందీ అయిన అతనికి తానేమననుకుంటోందో వినిపిస్తే బావుండు ననుకుంటూ ఆకాశంకేసి చూసింది.

చచ్చిపోయాక కూడా నీకోసం వుంటానన్నా అతడి కోసం, అతడి గుండెలపై తలవాల్చి, ‘ఇక్కడనేనున్నానా’ అని అడిగిన మార్తా, ఇంకా, ఎలాగోలా బతికే వున్నదనీ, అతని కోసం ఈ మార్తా  ఎప్పటికీ వుంటుందనీ… అతడికి ఎవరు చెబుతారు. ఈ  కబురు ఆ ఎతైన గోడల్ని దాటి ఏ చందమామ మోసుకెడుతుందో తెలీదు అనుకుందామె.
ఏ తలపో, గుర్తుకొచ్చి, ఆమె చిన్నగా నవ్వింది. చొట్టబడ్డ ఈమె బుగ్గలపై ముద్దుపెట్టేందుకు లెనిన్‌చంద్ర లేడు. బహుశా అతడు యెన్నడూ ఆమెను ముద్దు పెట్టుకోక పోవచ్చు.

విమల

ఎస్‌ – 11

అమర్ అహమ్మద్

 

(ఇప్పుడు నెల్లూరు జిల్లా, అల్లూరు నుంచి వినిపిస్తున్న సరికొత్త గొంతుక అమర్ అహ్మద్ షేక్. ఆగస్ట్ 28, 1992లో పుట్టారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేశారు. ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో డాక్యుమెంట్ రైటర్‌గా పని చేస్తున్నారు. మొదటి కథ “నిజంగానే నిజం మర్చిపోయాను.” 2011 నవ్య వీక్లీలో ప్రచురితమైంది. ఇప్పటిదాకా ఐదు కథలు రాశారు. మంచి రీడబులిటీ ఉన్న రైటర్‌గా గుర్తింపు పొందుతున్నారు.  —వేంపల్లె షరీఫ్. )

పుట్టినపుడు, చనిపోవడం అనేది కూడా అంతే సహజం.
ఆనందం పుట్టినపుడు బాధా , పరిష్కారం పుట్టినపుడు సమస్యా , చనిపోవచ్చు….!
ఆనంద పరిష్కారమే లేని సమస్యల బాధలు పుట్టినపుడూ, మనిషి కూడా….చనిపోవచ్చు
కానీ, ఆ మనిషి  తన చావుతో ఆ సమస్యలను కూడా చంపెయ్యగలడా ? లేక,
ఇంకొన్ని కొత్త సమస్యలను పుట్టిస్తాడా….! అన్నదే ఆ వ్యక్తిని నేను అడగాలనుకుంటున్న చివరి ప్రశ్న.

ఇంకా చీకటిగానేవుంది. సమయం ఖచ్చితంగా తెల్లారుజాము 5నుండి 6లోపు అయినట్లే. దూరంగా మసీదులో అజాం వినిపిస్తూవుంది. మన ప్రతీరోజును చీకటిలోనుంచి మేలుకుని  వెలుగులోకి నడవమనేమో.. ఆ పిలుపు యొక్క ఉద్ధేశ్యం. నేను మాత్రం చీకటిలోనుంచి ఇంకా దట్టమైన కారు చీకటిలోకి నడుస్తున్నట్టున్నాను. టీ అంగడి దగ్గరకు వచ్చి, సింగిల్‌ టీ అని సైగ చేసిన నన్ను  టీ కలుపుతున్న మాస్టర్‌ చూసాడు. దుమ్ముతో రేగిపోయున్న నా జుట్టు  వయసును రెట్టింపు చేస్తున్న మాసిన గడ్డం, ఉబ్బిన నా ఎర్రటి కళ్ళను చూసి ‘‘ ఏం, బాబూ…మందు సరిపోలేదా…? టీ సరిపోతుందా…?’’ అని నవ్వుతూ అడిగాడు. నిజమే…, దిగులుతో నిద్రలేని కళ్ళు, ఆనందంకోసం తాగిన కళ్ళు, ఒకేలా.. భారంగా, ఎర్రగా వుంటాయి. బదులు ఇవ్వాలనిపించలేదు. కానీ, నేనూ నవ్వాను. సిగరెట్‌ వెలిగించి, కాలిపోతున్న దాని వైపే నిస్తేజంగా చూస్తూవున్నాను. అప్పుడప్పుడూ నా పెదాలను కాల్చుతుంటుంది. దేనినీ మరీ ఎక్కువగా ఆశించవద్దు అన్న ఓ హెచ్చరికగా మాత్రమే.  ప్రతీసారి, తను కాలిపోతూ నాకు మాత్రం ఏదో తెలియని ఆనందాన్నిస్తుంది. బహుశా…ఇదే నా చివరి సిగరెట్‌. ఏదో గుర్తొచ్చింది. ‘సిగరెట్‌ కూడా చాలా మంచిది, అదే నీ చివరిదైనప్పుడు ’.  నవ్వించే మంచి కొటేషన్‌. ఇప్పుడు నాకు నవ్వు రావడంలేదు. తనను పట్టించుకోమన్నట్టు మొదటిసారి సిగరెట్‌ నా వేళ్ళనూ కాల్చింది….మరి చివరిసారి నన్ను పట్టించుకునేవాళ్ళు…..?
బయలుదేరుతూ చివరిసారి ఆ టీ మాస్టర్‌ను చూసాను. నవ్వుతూ అలానే నా వైపు చూసి తన పని చేసుకుంటున్నాడు. రేపు ఉదయం వార్తల్లో నా ఫోటోను చూసి ఏ విధంగా రియాక్ట్‌ అవుతాడో అని ఆలోచిస్తున్నాను. బ్యాటరీ అయిపోతున్నట్టు సిగ్నల్‌ ఇచ్చిన నా మొబైల్‌ని ఓసారి చూసుకున్నాను. ఇప్పటికీ, ఏదో తెలియని ఆశ.
ఎవరో….ఏదో….మెసేజ్‌ పంపిస్తారని. అంతకుమించి ఇప్పుడు నాకు మొబైల్‌ అవసరమేలేదు. కనిపిస్తున్న ప్రతీదాంట్లో బతకడానికి ఏదో ఆశ వెతుక్కుంటున్నానా…? ఏమో తెలీడంలేదు. నాకు కొంచెం ఓదార్పు కావాలి. నాకు ఎవరో కావాలి. ‘చావు మాత్రమే పరిష్కారం ’ అనే నా ఆలోచనలను ఆపెయ్యగలిగే  సహాయం ఏదైనా కావాలి. కానీ… ఏదీ కనిపించడమేలేదు.
కదలకుండా స్ధిరంగా నిలబడివుంటే నాలో ఆలోచనలు పరిగెడుతున్నాయని, నేను కూడా వాటికి చిక్కకుండా ఎక్కడా ఆగకుండా, కదులుతూనే వున్నాను. మనిషినైపోయాను, బాధను చాలా రకాలుగా వ్యక్తం చేయగలను. చాలా రకాలుగా నన్ను నేనూ బాధించుకోగలను. ‘ఒక ప్రేమను మర్చిపోడానికి ఇంకో ప్రేమ వుంది ’ అని నన్ను ప్రేమించే చాలా మంది స్నేహితులు నచ్చ చెప్పారు. కానీ..నాకు మాత్రం, ‘ ఒక బాధను మర్చిపోడానికి ఇంకో బాధ మాత్రమే కనిపిస్తుంది ’. అదే కావాలనిపిస్తుంది. ఎందుకో….? తెలియదు.
విజయమహాల్‌ రైల్వే ట్రాక్‌ దగ్గరకు వచ్చాను. అంతా చీకటి. ఏమీ కనిపించడంలేదు. ఇప్పుడు నిజంగా నా మొబైల్‌ అవసరమైంది. ఫ్లాష్‌లైట్‌ ఆన్‌ చేసాను. పట్టాలపై నా చెవిని ఆనించి విన్న నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు నా మెడను ఉంచుదామనుకుంటున్నాను. ఆనందం కోసం సరదాగా ఉంచిన పావలా బిళ్ళ రైలు కింద నలిగి, తన చక్కటి రూపం కోల్పోయింది ఇంకా బాగా గుర్తుకొస్తుంది. అనాలోచితంగా చేతితో నా మెడను తడుముకున్నాను. చర్మానికి, రెండు ఇనుపముక్కలకు మధ్య బలాబలాలను ఊహించుకుని ఆ పట్టాల వెంబడే నడుచుకుంటూ, ముందుకు కదులుతూవున్నాను. దూరంగా ఉన్న ఓ హైమాక్స్‌లైటు వెలుగులో, చక్కగా ఓ నిచ్చెనను పడుకోబెట్టినట్టు కనిపిస్తూ మెరుస్తున్న పట్టాలు. నిచ్చెనను పడుకోబెట్టినప్పుడు, దానిపై నడవడం చాలా కష్టం. ఇప్పుడు కూడా అంతే. ఒకే లాంటి అంగలతో రెండు పట్టాలకు మధ్యలో అడ్డంగా పరిచివున్న ఆ బండలను ఓ క్రమపద్ధతిలో దాటుతున్నాను. ఆ వెలుగులో ఎటు చూసినా కంకర, రాళ్ళు. వీటి తర్వాత ఎక్కువగా కనిపించేవి కాఫీ కప్పులు, ప్లాస్టిక్‌ కవర్లు. నిజమే…ఇవన్నీ చాలా సహజం. మనిషి ప్రయాణించే ప్రతీ దారిలో ఇవన్నీ చాలా సహజం. జంతువుల అడుగుజాడల్లో వాటి వ్యర్ధకాలు వున్నట్టు, ప్రస్తుతం ప్లాస్టిక్‌ మాత్రమే మనిషి మనుగడ యొక్క నిజమైన ఆనవాళ్ళు.  ‘ ఆధునిక వ్యర్ధ మనిషి వ్యర్ధకం ప్లాస్టిక్‌ మాత్రమే…’
నాలో తిరిగి అవే ఆలోచనలు. నేను, ఎందుకూ పనికి రాని వాడినని గుర్తుచేసే, అవే భావనలు. ఆమె లేకుండా నా జీవితం అనవసరం అని గుర్తుచేస్తున్న నా ప్రతీ అవసరం. నన్ను నడవనివ్వటం లేదు. నిలవనివ్వటం లేదు. పూర్తిగా నిస్సత్తువ.  నా ఆలోచనలకు, నా శరీరానికి విశ్రాంతి కావాలి. ఎన్నో రోజుల నుంచి నిద్రే లేదు. ఇంటి దగ్గర పడుకోనూ లేను. ఇక్కడ, ఇక ఏ మాత్రం ఆలోచించకుండా పడుకోవాలని ఉద్వేగంగా అనిపించేస్తుంది.
‘చావబోయేవాడికి తెగింపు ఎక్కువ. చావడం మాత్రమే లక్షం,  ఏ విధంగా అనేది ఆ పరిస్థితుల్లో ఆలోచించలేడు. ధ్యాసంతా లక్షం సాధించడంలో మాత్రమే….’
అలానే పట్టాలపైనే నడుచుకుంటూ నెల్లూరు సౌత్‌ స్టేషన్‌ దాటాను. ఒకచోట ఆగి, ట్రాక్‌ పై పడుకుని పైకి చూస్తుంటే ఆకాశంలో చుక్కలు మసకగా కనిపిస్తున్నాయి. పక్కనే చంద్రుడు కూడా వున్నట్లున్నాడు. చంద్రుని వైపు దృష్టేలేదు. పెద్ద విషయాలను అస్సలు పట్టించుకోవడం లేదు. చిన్నవే చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. ఏవేవో అలికిడులు, ఎక్కడెక్కడో మనుషుల ఉనికిని తెలియజేస్తున్నాయి. నాకు ఈ సమయంలో, ఇలాంటి ప్రదేశంలో, చాలా కొత్తగా ఉంది….అయినా పర్లేదు. ఒక్కసారేగా…చివరిసారేగా.
శబ్దం చేస్తూ మొబైల్‌లో అలారం మోగింది. పిచ్చి టెక్నాలజీ, యధార్ధానితో సంబంధమేవుండదు. నేను నిద్రేపోలేదని దానికి తెలియదుగా…ఆ భయంకరమైన శబ్దాన్ని ఆపాలనుకోలేదు. దేనిని ఆపాలనుకోవడం లేదు. నా ఊపిరిని తప్ప. చివరిగా, ప్రతీదాన్ని మౌనంగా అనుభవించాలనుంది. ఎవ్వరి గురించి ఆలోచించడంలేదు. నా గురించి అస్సలు…
మెత్తటి దిండ్లకు అలవాటుపడిన నా మెడ, ఆ పట్టాల ఒత్తిడిబాధను నా చివరి సుఖం కోసం భరిస్తున్నట్టుంది. గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి అంటారే, అలాంటిదే నా శరీరం మొత్తం అనుభవిస్తున్నట్టుంది. తల తిప్పి, రైలు వచ్చే మార్గం వైపే చూస్తూవున్నాను. మెడకు అతి దగ్గరగా వున్న నా చెవులకు, కంపనాలతో కూడిన ఓ హెచ్చరిక…. నా గుండె కొట్టుకునే శబ్దం నాకు చాలా స్పష్టంగా బయటికే వినిపిస్తూవుంది. ఎందుకో వద్దనిపిస్తుంది. ఇంకొంచెం సేపు బతికేద్దామనిపిస్తుంది. ఏదన్నా మెసేజ్‌ వచ్చిందేమోనని, మొబైల్‌ చూసుకున్నాను. పిచ్చి టెక్నాలజీ, అవసరానితో అస్సలు సంబంధమేవుండదు. లోబ్యాటరీతో ఎప్పుడో స్విచ్‌ఆఫ్‌ అయిపోయింది. ఆన్‌ చెయ్యడానికి ఓ రెండు సార్లు ప్రయత్నించాను. పనికిరానివాడిని అని ఆ రెండుసార్లుకూడా స్పష్టంగా రుజువయ్యింది.
పట్టాల కంపనాలు ఎక్కువవుతూ చెవులు బద్దలు కొడుతూ ఓ అతి భయంకరమైన హారను కూడా వినిపించింది. కానీ, దానికి సంబందించిన ప్రకాశవంతమైన లైటు వెలుతురు కనిపించడంలేదు. శబ్దవేగం కన్నా కాంతివేగం ముందుంటుంది అంటారే….ఏమో…పట్టాల ప్రకంపనాల శబ్దం, నా గుండె శబ్దం అంతకన్నా చాలా వేగంగా వున్నాయి.
ఇప్పుడైనా నేను లేచి పక్కకు వెళ్ళిపోవచ్చు. కానీ, ఎందుకో నాకు చావుపై గెలవాలని లేదు. ఇదీ ఓ గెలుపేనా…వద్దు అనిపించి, శబ్దాలను మాత్రమే మౌనంగా వింటున్నాను….ఓ రెండు కన్నీటి చుక్కలు వెచ్చగా కళ్ళ చివరనుంచి జారిపోతూ చెవుల పక్కగా నా జులపాలలో కలిసిపోయాయి. ఎందుకు ఏడుస్తున్నట్టు…? ఏమో…తెలియదు. ఎవరికోసం ఏడుస్తున్నట్టు…? ఏమో…అస్సలు తెలీదు.
సర్దుకున్నాను. మెడను ప్రశాంతంగా వెనక్కు వాల్చేసాను. ఎవరో రైల్లో తిని పారేసిన బిర్యాని పొట్లం వాసన ఎక్కడినుంచో కమ్మగా వస్తూవుంది. చావడానికి సిద్దపడున్నా, నా కడుపు మాత్రం ఇంకా కక్కుర్తిదే. దానికి పనిచెప్పి కనీసం రెండురోజులయింది. ఆ పొట్లాం కోసం వచ్చిన రెండు కుక్కలు, గుర్రుమంటూ దూరంనుంచే పోట్లాడుకుంటున్నాయి. ఆ పొట్లాన్ని విభజించి, వాటి సమస్యకు పరిష్కారం ఇద్దామా అనుకుని తలకిందులుగా చూస్తున్నాను. కాసేపయాక, అందులో ఒక బలమైన కుక్క ఆ పొట్లాన్ని నాకేసి వెళ్ళిపోయింది. రెండవ కుక్క ఇంకో పొట్లాంకోసం ఆశగా వాసన చూసుకుంటూ పట్టాలవెంబడి ముందుకు వెళ్ళిపోయింది. నేనూ, జంతువునయివుంటే ఆహారం మాత్రమే నా సర్వస్వం అన్నట్టు ఎలాగోలా బతికేసేవాడిని. మనిషినయిపోయాను. రకరకాల కోరికలు, ప్రతీది నా కోసమే అన్నట్టు ఊరిస్తూ కనిపించే ఈ ప్రపంచంలో సర్దుకోలేక, బతకలేక చివరికి కుక్కచావుకు కూడా సిద్ధపడ్డాను. తప్పు….కుక్క కూడా సర్దుకుని బతికేస్తుంది. కానీ, నేనే…మనిషిలా, సర్దుకోలేక తలకిందులయి లోకాన్ని చూస్తూవున్నాను.
చివరిసారిగా మా నాన్నకు ఓ మెసేజ్‌ టైప్‌ చేద్దామనుకున్నాను. కానీ..మొబైల్‌ సహకరించడంలేదు. భయంకరమైన హారన్‌తో పాటుగా, కళ్ళు మిరుమిట్లు గొలిపే ఓ ప్రకాశవంతమైన లైటుకూడా మలుపు తిరుగుతూ నాకు అతి దగ్గరకు రావడానికి పరిగిస్తుంది. ఊపిరి అతి భారంగా పీల్చుకుంటున్నాను. ఇలా ఎప్పటివరకు పీల్చుకోవాలో తెలియడంలేదు. అలా పీలుస్తూనేవుండాలో లేదో కూడా అర్ధం కావడంలేదు. కానీ, ఎంత పీల్చుకున్నా అతి కొద్దిసేపు మాత్రమే అని తెలుస్తూవుంది. జీవితపు చివరి క్షణాల్లో గతం తాలూకు కొన్ని కీలకమైన జ్ఞాపకాలు గుర్తొస్తాయి అంటారే….! కానీ, అది పూర్తిగా తప్పు. నాకు మాత్రం నా మెడ, నా శరీరం, కలగబోయే అతి భయంకరమైన బాధ గురించి మాత్రమే ఆలోచనలు…ఇంకేలాంటి ఆలోచనలు అస్సలు రావడం లేదు. ఖచ్చితంగా చెప్తాను. చనిపొయ్యేముందు ఎవ్వరికైనా అంతే…అని అనుకుంటున్నాను.
పట్టాల ప్రకంపనలు చాలా ఎక్కువవుతున్నాయి. చాలా భయంగా అనిపిస్తుంది. అందరూ కావాలని ఎలా చనిపోతారో అర్ధంకావడంలేదు. ఆత్మహత్య అంత సులభమైందేమీ కాదు. ఇప్పుడే నిజాయితీగా నాకూ తెలుస్తూవుంది. తెల్లవారే వెలుతురు ఎక్కువవుతూంది. నాకు అతి దగ్గరగా వచ్చేసిన ఆ భయంకరమైన రైలు శబ్దాలను తట్టుకోలేకపోతున్నాను. బహుశా ఆ డ్రైవర్‌గారికి నేనేమైనా కనిపించానేమో, అదే పనిగా హారన్‌ మోగిస్తూనేవున్నాడు. కొంచెం ఆశ్చర్యమేసింది. నన్నూ, నా చావును, కనీసం ఒకరు పట్టించుకుంటున్నారు.
కానీ, ఇక ఏమాత్రం అవకాశమేలేదు. మెడను విస్తారంగా చాపుకుని, పొడవైన నా కాళ్ళను మాత్రం ముడుచుకుని అతి కష్టంమీద సర్దుకుని పద్మాసనం వేసుకున్నాను. పోతే, మెడ మాత్రమే తెగిపోవాలి. కాలేజ్‌లో ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌ను. నా కాళ్ళమీద నేను నిలబడలేకపోయినా, వాటిని తెగ్గొట్టుకోలేను. మెడలేకున్నా, ఒకవేళ నేను బతికిపోతే, నడుచుకుంటూ ఇంటికెళ్ళాలిగా… ఇది కూడా జోక్‌ చేసే సంధర్భమా…? ఏమో తెలీదు. అయ్యో.. రైలూ చాలా దగ్గరకొచ్చేసింది. నాకు దేవుడిమీద నమ్మకమేలేదు. చివరిగా ఎవరిని తలుచుకోవాలి..? ఎవరో చెప్పింది తలచుకున్నాను. బాధలు మాత్రమే శాశ్వతం. సుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. అలాగే, పట్టాలు మాత్రమే శాశ్వతం. చక్రాలు వస్తుంటాయి, పోతుంటాయి అని. అందుకే, సుఖాన్ని అందించే ఆ రైలు చక్రాలనే తలుచుకుంటున్నాను. అవే, నా బాధలను, నానుంచి దూరం చేయడానికి తన వృత్తి ధర్మం నిర్వహిస్తూ, నిస్వార్ధంగా నాకు సహాయం చేయబోతున్నాయి.
అతి భయంకరమైన శబ్దంతో వచ్చేస్తున్నాయి. రైలు చక్రాలు..జగన్నాధ రధ చక్రాలు…చాలా దగ్గరకు… నా అంతిమ ఘడియలతో కలిసి…నాకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఒక నిముషం కన్నా తక్కువ సమయంలోనే నా ప్రాణం నా శరీరం నుంచి పారిపోతుంది. వచ్చే ఆ మృత్యువును నాకు చూడాలనేలేదు. నా గుండె ఆగిపోవాడానికే అన్నట్టు విపరీతంగా కొట్టుకుంటుంది. బహుశా, మనిషికి గుండె ఉన్నది ఇందుకేనా..సంధర్భానికి తగ్గట్టు, తదనుగుణంగా కొట్టుకుంటూ ఆగిపోవడానికేనా…? నా కళ్ళు, నీళ్ళతో నిండిపోయి వలికిపోతున్నాయి. చుక్కలు లేని ఆకాశం మసక మసకగా కనిపిస్తుంది.
నాకు బతకాలనుంది. కానీ, ఎందుకో బతకాలనీ లేదు. నేను అమితంగా ఇష్టపడ్డ నా ప్రేయసి, నన్ను కాదని, ఈ రోజే వేరొకడితో పెళ్ళిపీటలపై కూర్చుంటుంది. ఎందుకు..? నేను ఎందుకూ పనికిరానివాడినని మాత్రమే.. నిజమే నాకు ఉద్యోగం లేదు. ఆదాయం లేదు. ఒక్క నా శరీరం తప్ప నాకంటూ స్వంతగా ఏమీ లేనివాణ్ణి.
నా చెవులు తూట్లుపడుతున్నట్టు రకరకాలుగా భయంకరమైన శబ్దాలు ఎక్కువవుతున్నాయి. అటు చూడలేక నా ఊపిరిబిగబట్టి గట్టిగా కళ్ళు మూసేసాను. హారన్‌ శబ్దాలతో పాటుగా కీసుకీసుమంటూ ఘర్షణ శబ్దాలు, ఏదో కావాలని బలవంతంగా ఆపేసుకుంటున్నట్టు వినిపిస్తున్నాయి. మూసుకున్న నా కళ్ళను తొలుచుకుంటూ ప్రకాశవంతమైన లైటు వెలుగు చాలా స్పష్టంగా నాపై పడుతూవుంది. ఆ వెలుగుకు నా కళ్ళు మండిపోతున్నట్టు, ఉన్నట్టుండి పట్టపగలు అయిపోయినట్లువుంది. కీసుమంటున్న శబ్దాలు ఎక్కువవుతూ,  విపరీతమైన ఘర్షణతో రాసుకుంటున్నట్టు వింత శబ్దాలను పుట్టిస్తూ, ప్రకంపనాలను తగ్గించేస్తూ, నాకు అత్యంత దగ్గరకు వచ్చేసి కొద్ది అడుగుల దూరంలో బ్రహ్మాండమైన వేడిని దుమ్మునూ రేపుతూ ఆగిపొయ్యాయి. కళ్ళను గట్టిగా మూసేసుకునున్న నాకు అస్సలు నమ్మకమే కలగడంలేదు. నా ఊపిరి ఆగిపొయ్యిందో… లేక రైలే ఆగిపొయ్యిందో అర్ధం కావడంలేదు. ఆగిపోయినవి మళ్ళీ కదిలే అవకాశముందా…? ఏమో తెలీదు.
ఇక తప్పక కళ్ళు తెరిచి ఆ వైపు చూసేసాను. ఇంజన్‌ శబ్దాలు ఆగిపొయ్యాయి. రైలు పూర్తిగా ఆగిపొయ్యింది. కానీ, ఇంకేవో శబ్దాలు మాత్రం ఆగలేదు. అవి ఇంజన్‌లోంచి వస్తున్న శబ్దాలు మాత్రం కావు. అరుపులు, కేకలు, హాహాకారాలు. ఇంజన్‌ లైటూ ఆగిపొయ్యింది. కానీ, ఇంకేదో వెలుగు మాత్రం దూరంగా భయంకరంగా కనిపిస్తుంది. డ్రైవర్‌ కిందకు దూకుతున్నాడు. నా కోసమేమోనని కొంచెం భయమేసింది. కానీ, ఆ దూకినతను వెనక బోగీలవైపు పిచ్చివాడిలా అరుస్తూ పరిగిస్తున్నాడు.
చప్పున లేచి డ్రైవర్‌ వెనకాలే నేనూ పరిగెత్తాను. అతి ఘోరంగా, భయంకరమైన అగ్నికీలల్లో దూరంనుంచే భయపెడుతూ ఓ బోగీ మంటల్లో కాలిపోతూవుంది. మిగిలిన బోగీల్లోంచి ప్రయాణికులు ప్రాణభయంతో కిందకు దూకుతూ దిక్కుతోచక పరిగిస్తున్నారు. ఎటుచూసినా తోసుకోవడాలు, తొక్కిసలాటలు, అరుపులు, కేకలు, ఏడుపులు, భయాలు, హాహాకారాలు, ఆర్తనాదాలు. ఎదురొస్తున్న వాళ్ళందరినీ బలంగా తోసుకుంటూ నేనూ ఆ మంటలవైపు పరిగిస్తున్నాను. సాటి మనిషికి, అవకాశమున్న సహాయం చెయ్యడం అనే సహజంగా ఉండే మనిషి లక్షణం నన్ను కూడా ఆ వైపుకు ఆగకుండా పరిగెత్తిస్తూవుంది.
మంటలు తన తీవ్ర ప్రతాపాన్ని చూపిస్తూ, నాలుకలు చాచి అన్నింటినీ అందుకోవాలి అన్నట్టు ఎగిసిపడుతున్నాయి. బోగీకి దగ్గరగా ఎవ్వరూ అస్సలు వెళ్ళనేలేని పరిస్థితి. తెరుచుకునున్న కిటీకలనుంచి దట్టమైన నల్లటి పొగ ఆగకుండా బయటకు చిమ్ముతుంది. ట్రాక్‌పై నించున్న చాలామంది ఆ బోగీని చూస్తూ, గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. పిచ్చివాడిలా అందరితో కలిసి నేనూ అరుస్తున్నాను. ఏమి అరుస్తున్నానో, ఎందుకు అరుస్తున్నానో కూడా తెలియని గందరగోళం. నాకూ కన్నీళ్ళు కారిపోతున్నాయి. కానీ, ఆ దట్టమైన పొగకు అతి దగ్గరగా వుండడం వలన.
కొంచెం మంటల ముందుకు వెళ్ళి బోగీ తలుపు వైపు గమనించాను. మూసివేసుంది. ఆ తలుపు వెనక ఎన్ని ప్రాణాలు పోతున్నాయో… బయటినుంచి రక్షణ ఇవ్వాల్సిన తలుపులు, ఇప్పుడు లోపలేవుంచి ఖచ్చితంగా ప్రాణాలు తీసేస్తున్నాయి. మంటల వెలుగుకు కంపార్ట్‌మెంట్‌ పేరు ఉన్న బోర్డు కరిగిపోతూ కొంచెం కనిపించింది. ‘‘ తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌. ఎస్‌  11 ’’
మంటలకు అంత దూరంగా ఉన్న నాకే ఆ వేడితో మొహమంతా కమిలిపోతున్నట్టు అనిపిస్తుందే…మరి మంటలకు అతి దగ్గరగా ఉన్న వారి పరిస్థితేంటి…? నేను ఏ ఒక్కరికీ, ఏ మాత్రం సహాయం అందజెయ్యలేని అసహాయక స్థితి. మొబైల్‌ తీసాను. స్విచ్‌ ఆఫ్‌. పక్కన గమనించాను. నాకన్నా మంటలకు కొంచెం దూరంగా నిలుచున్న కొంతమంది 108 వారికి కాల్స్‌ చేస్తున్నారు. ఒకతను మాత్రం ఏదో మీడియా వారితో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఏదైనా ప్రమాదం జరగగానే ముందుగా మీడియా వారికి తెలియపరచటం అనేది ముఖ్యమో లేక అతి ముఖ్యమో నాకు అర్ధం కాలేదు.
నేను నిస్తేజంగా నించుని చూస్తున్నాను. బ్యాగులతో భారంగా కదులుతూ వెళ్తున్నవారు, ఇంట్లోని వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ, ఏడుస్తూ, ట్రాక్‌ వెంబడే నడుచుకుంటూ వెళ్తున్నవారు, వారినే అనుసరిస్త్తూ, వెనక్కు తిరిగి మంటలను చూసుకుంటూ, ఎక్కడకు వెళ్ళాలో తెలియని అయోమయంలో ఉన్న చాలామంది అన్ని దిక్కులకూ వెళ్ళిపోతున్నారు. శబ్దాలకు మేలుకొని వచ్చిన ఆ చుట్టుపక్కల నివాసమున్న కొంతమంది, అవకాశం వుంటే ఏదైనా దొమ్మీ చేద్దామా అన్నట్టు అటూ ఇటూ హడావిడిగా అన్ని బోగీలను పరిశీలిస్తూ కేకలేసుకుంటూ పరిగిస్తున్నారు.
కొన్ని నిముషాల తర్వాత….ముందుగా నెల్లూరు జోనల్‌ రైల్వే రక్షక దళం వారు వచ్చేసారు. ప్రతి ఒక్కరూ వాకీ టాకీలో మంటలకు దూరంగా నిలబడి మాట్లాడేసుకుంటున్నారు. అంతకుమించి వారూ ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఆ తర్వాతగా, అందరూ చెప్పుకుని వచ్చినట్లు, ఓ డజను మీడియా వాహనాలు వచ్చేసాయి. వెనుకగా వచ్చిన రెండు అగ్నిమాపక వాహనాలు దారి లేక ఓ పది నిముషాలు మీడియా వాహనాల వెనుక ఆగిపొయ్యాయి. ఆ తర్వాత జరగవలసిన పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. అందరితో పాటుగా నన్నూ రైల్వే పోలీసులు లాఠీలతో దూరంగా తరిమి కొట్టారు.
రైల్వే అధికారులు ముందుగా మృతుల, క్షతగాత్రుల లెక్కలు తెలిపారు. ఆ తర్వాత ఘటనా స్థలికి రావాల్సిన ప్రముఖులు వచ్చారు. సంఘటన మరియు సందర్శనాలు అన్ని ఛానళ్ళలో లైవ్‌గా చూపించారు. కేంద్ర వ్యాప్తంగా కొన్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొన్ని దిగ్భ్రాంతులు, సంతాపాలు, ఎక్స్‌గ్రేషియాలు ప్రకటించేసారు. మీడియావారు సంఘటనలోకి వీలైనంత త్వరగా ఇస్లాం తీవ్రవాదులను దూర్చేసారు. గతంలో జరిగిన ప్రమాదాలు, వాటి వివరాలు, ఈ ప్రమాదంతో పోలికలు, ఆసుపత్రుల్లో ప్రముఖుల పరామర్శలు, క్షతగాత్రుల ఇంటర్వూలు, మృతుల బంధువుల రోదనలు, అధికారుల వివరణలూ, ఇలా ఆ రోజంతా ఆంధ్రరాష్ట్రం లోని అన్ని టి.వీ లు మంటలతో నిండిపొయ్యాయి.
అలాంటి చావులను చూసిన తర్వాత,  నాకు బలవంతంగా చనిపోవాలన్న కోరిక చచ్చిపొయ్యింది. ఎంత విచిత్రం. నేను చావును కోరుకుంటూ ఎదురుచూసాను. చావలేదు. బోగీలో ఆ తలుపుల వెనక ఉన్న వారంతా, చావు వద్దూ అని దీనంగా ప్రార్ధించారు. కానీ, అతి దారుణంగా చనిపొయ్యారు. యధావిధిగా, ఆరోజు రాత్రికూడా నిద్రలేదు. ప్రశ్నలూ … ప్రశ్నలూ.. ఊపిరాడనివ్వకుండా నన్ను నిజంగానే చంపేస్తున్నాయి. నా జీవితం ఇప్పటి వరకు ఎవరికైనా ఉపయోగ పడిందా …? కనీసం నా చావు అయినా ఉపయోగపడేదా….? కాదే…! ఎందుకు బతుకుతున్నట్లు, ఎవరికోసం చస్తున్నట్లు…తగలబడుతున్న మంటల్లోంచి ఏదో జ్ఞానజ్యోతి వెలుగుతూ నాలోకి ప్రవేశించి హాయిగా నన్ను నిద్రపుచ్చింది.
రెండో రోజు అదే టీ అంగడి దగ్గరకు వచ్చి సింగిల్‌ టీ అన్నట్టు చేత్తోనే సైగ చేసి మాస్టర్‌ వైపు చూసాను. నీట్‌గా షేవ్‌ చేసిన నా గడ్డం. కుదురుగా ఉన్న నా జుట్టు. ఇన్‌షర్ట్‌ విత్‌ బ్లాక్‌ షూస్‌. అతను ఈ రోజూ అలానే నవ్వాడు.  నేనూ నవ్వుతూ పేపర్‌ తిరగేస్తుంటే కనిపించింది, రైలు ప్రమాదం తాలూకు ప్రకటన. ప్రమాద ఘటనా స్థలంలోని ప్రత్యక్ష సాక్షులను విచారణకు రమ్మంటూ అతి పెద్ద రైల్వే అధికారిగారి నుంచి విన్నపం. నేనూ అక్కడకు వెళ్ళాను.
ఒక్కొక్కరినే లోపలకు పంపుతున్నారు. లోపల దాదాపు ఓ పదిమంది వరకూ అధికారులు చాలా సీరియస్‌గా ఏదేదో రాసుకుంటూ అప్పుడప్పుడూ తలలు ఎత్తుతూ వచ్చిన వారితో ‘‘ మాకంతా తెలుసు, అయినా వచ్చారు, తప్పదు కనుక చెప్పండి ’’ అన్నట్టు అడుగుతున్నారు. నా వంతు వచ్చేవరకు ఎదురుచూసాను. నన్ను ముందుకు పిలిచారు. బయట నిండిపోయున్న జనం గోల, ఆ హాలు లోపలకు కూడా వినిపిస్తూవుంది.
మొదటగా నా పేరు. వయస్సు మొదలగు వివరాలు అడిగి ప్రమాదం గురించి ఏం చూసానో చెప్పమని ఒక చిన్న అధికారిగారు బయటి గోలకు చిరాకు మొహం పెడుతూ పెద్దగా అడిగారు.
‘‘సార్‌, ఇందాకటినుంచి మీరు ప్రమాదం..ప్రమాదం అంటున్నారే. అది ప్రమాదం కాదు…! అని నా ఉద్ధేశ్యమండి ’’ అంటూ చాలా పెద్దగా అరిచి నేనూ మాట్లాడాను.
“ ప్రమాదం కాక మరేమంటావు. తీవ్రవాదులు ఎవరయినా కనిపించారా, ఏదైనా పెద్ద పేలుడు లాంటిది విన్నావా… చెప్పు ధైర్యంగా చెప్పు, నీకు ఏమీ కాదు, నిజాయితీగా చెప్పు, వాటర్‌ తాగుతావా…’’ అంటూ కొంచెం గొంతు తగ్గించి ఒక అధికారి, చుట్టూవున్న మిగిలిన అధికారులను సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నట్లు అప్రమత్తం చేస్తూ అన్నారు. బయట జనాలతో గోలగోలగా ఉన్న హాలులో వున్న ప్రతిఒక్కరూ నన్నే గుచ్చిగుచ్చి చూస్తున్నారు.
‘‘ నా ఉద్ధేశ్యం. అది యాక్సిడెంట్‌ కాదు. పక్కా మర్డర్‌. రైల్వే శాఖ వారిని నమ్మి, భద్రంగా తమను గమ్యానికి చేరుస్తారన్న భరోసాతో టిక్కెట్టు కొన్న కొంత మందిని, అతి దారుణంగా, ఆ శాఖ వారే హత్య చేసారు అంటాను ’’ అని అందరి వైపు చూసాను.
బయట కిటికీలనుంచి లోపలికి తొంగి చూస్తున్న కొంతమంది అరుపులు ఆపమన్నట్టు బయటివారిని హెచ్చరిస్తున్నారు. ఉన్నట్టుండి అంతా నిశ్శబ్దంగా మారిపొయ్యారు.
‘‘ యూ…ఫూల్‌.. నిన్ను పిలిచింది. ఒపీనియన్‌ కోసం కాదు. విట్‌నెస్‌ కోసం. గెట్‌ అవుట్‌ ఫ్రం హియర్‌, నెక్స్‌ట్‌.. ’’ అని ఇంకో అధికారిగారు తన అధికార దర్పాన్ని ప్రదర్శించేసారు.
‘‘ చూడండి, మై డియర్‌ సర్‌. ఐ యామ్‌ ఆల్సో ద విట్‌నెస్‌ ఆఫ్‌ దట్‌ ఫ్యాటల్‌ ఇన్సిడెంట్‌. ఐ గాట్‌ ద రైట్స్‌ టు ఎక్స్‌ప్రెస్‌ ది ట్రూత్‌ ఇన్‌ఫ్రంట్‌ ఆఫ్‌ దిస్‌ బెంచ్‌ ’’ అని అతి పెద్ద అధికారి గారి వైపు మర్యాదపూర్వకంగా చూసాను. ప్రొసీడ్‌ అన్నట్టు ఆయన తలవూపారు.
మరొకసారి ఆయనకు రెండు చేతులతో నమస్కారం పెట్టి, ‘‘ థాంక్యూ సర్‌. ఈ రోజు మీరు నిర్వహిస్తున్న ఈ విచారణ, పంచనామా అనేవి తదుపరి, భవిష్యత్తులో ఇదే ఘటన పునరావృతం కాకుండా చూడడానికి. కానీ, ఇలాంటి పంచనామాలు ఇంతకుముందు ఎన్ని జరిపివుంటారు. మరి వాటి పరిస్థితేంటి. ఇంకా ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతూనేవున్నాయి. ఈ విచారణల వలన నిజంగా ఏమైనా ప్రయోజనం ఉందంటారా…? ఇది ప్రమాదం కానే కాదు సార్‌. ముమ్మాటికి ఇది హత్యే. ప్రభుత్వం మరియు రైల్వేశాఖ కలిసి చేసిన హత్య. ప్రయాణంలో ఒక ప్రయాణికుడి కనీస రక్షణ కల్పించలేనందువలన జరిగిన హత్య. నేను గమనించిన….. ’’
‘‘ చాలు, ఆపవయ్యా… నువ్వు ప్యాసింజర్‌వి కాదు అని నీ వివరాల్లో చెప్పావు. ఇంతకీ అసలు నువ్వు అక్కడ, ఆ వేళలో ఎందుకున్నావు. ఏం చేస్తున్నావు చెప్పు ’’ అని ఇంకో అధికారిగారు విరుచుకుపడ్డారు.
ఒక్క నిముషం నాకు ఏం చెప్పాలో అర్ధం కాలేదు. అయినా అబద్దం చెప్పకూడదు అన్న నిజాయితీతో గుండెనిండా గాలి పీల్చుకుని ‘‘ ఆత్మహత్య చేసుకుందామని ట్రాక్‌ పైకి వచ్చాను సార్‌ ’’ అని ధైర్యంగా చెప్పేసాను.
ఒక్కసారిగా మళ్ళీ హాలులో కలకలం రేగింది. బయటవున్న వారు ఎవరో ఈలలు వేస్తున్నారు. నేను ఏదో తమాషాకు వీళ్ళతో పోట్లాడుతున్నానని అనుకున్నట్టున్నారు. అధికారులు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని పక్కనే ఉన్న తమ పోలీసువారికి  సైగలు చేసారు. ఓ ఇద్దరు రైల్వే పోలీసువారు అమాంతం వచ్చి నన్ను పెడరెక్కలు విరిచి పట్టుకుని, తమ అధికారులను మెప్పించేందుకు తమకు చేతనైనంతగా నా పై ప్రతాపం చూపించడానికి సిద్ధపడిపొయ్యారు.
‘‘ అండర్‌ రైల్వే ప్రొటెక్షన్‌ యాక్ట్‌ సెక్షన్‌ ….కమిటింగ్‌ సూసైడ్‌….క్రింద నిన్ను కస్టడీలోకి తీసుకోవడమైనది….. ’’
చివరిగా నేను చెప్పాలనుకున్న మాటలను నాకు వీలైనంత పెద్దగా అరుస్తూ ‘‘ హెలో…సర్‌….నాకూ తెలుసు ఆత్మహత్య చేసుకోవడం నేరం అనీ… నాకై నేనుగా, బలవంతంగా మరణించడం చాలా తప్పు అనీ….అది ఎవరి దృష్టిలో.. చట్టం దృష్టిలో, సమాజం దృష్టిలో, మిగిలిన అందరి దృష్టిలో, కానీ, ఒక్క నా దృష్టిలో మాత్రం కాదు, అని అనుకున్నందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను. అందుకు మీరు, మీ ప్రభుత్వం నన్ను అస్సలు క్షమించలేరు. మంచిది. నేను అందుకు శిక్ష అనుభవించడానికి ఏమాత్రం బాధ పడటంలేదు. కానీ, హత్యను అందరి దృష్టిలో ప్రమాదం అనే ముసుగేసి తప్పు చేసిన ఎంతో మందిని క్షమించేస్తున్నారే.. ఆ బోగీలో మరణించిన వారి అర్ధాంతరమైన చావుకు కారణం ఎవరు….? దానికి కారణమైన వారందరినీ కూడా శిక్షించాలా, క్షమించెయ్యాలా…? నాకై నేను చస్తే తప్పు, అదే మీరు అతి జాగ్రత్తగా (నిర్లక్షంగా) చంపితే మాత్రం ప్రమాదమా….? చనిపోయిన వాళ్ళందరిదీ ఆత్మహత్య అనండి లేదా హత్య అనండి, అంతేకానీ, ప్రమాదం అని మాత్రం దయచేసి అనొద్దు…..’’
ఫట్‌…ట్‌ట్‌…అని బలమైన ఓ లాఠీ నా మోకాళ్ళపై విరిగింది. చేతులు వెనక్కు పట్టి ఉన్నందువల్ల ముందుకు తూలి పడ్డాను. కళ్ళు మూతలు పడ్డట్టు అనిపించింది. పెదవినుంచి, ముక్కునుంచి చిక్కగా ఎర్రగా రక్తం ప్రవహిస్తుంది. నన్ను బలవంతంగా ఈడ్చుకు పోతున్నట్లుగా అనిపిస్తూంది. బొట్లు బొట్లుగా జొల్లుతో పాటుగా నోటినుంచి కిందకు కారుతున్న నా రక్తాన్ని చూస్తూ… చిన్నగా నాకు నవ్వు మొదలయ్యింది. వికటమైన నవ్వు…. తెరలు తెరలుగా దగ్గుతో పాటుగా నవ్వు, బిగ్గరగా మొదలై ఒక్కసారిగా నాలోఉన్న బలాన్నంతా గొంతులోకి తెచ్చుకుని, ‘‘ నన్ను మాట్లాడనివ్వకుండా, బయటకు నెట్టేస్తున్నారు. మీరు తట్టుకోలేని నిజాలను, నిజాలకోసం ఎదురు చూస్తున్న వారందరిముందూ చెప్పే అవకాశాన్ని ఇస్తున్నారు…థ్యాంక్యూ సా..ర్‌…., కానీ, గుర్తుంచుకోండి.. తమ ప్రాణాలకు ఏలాంటి భరోసా ఉండదని తెలిసీ రైల్లో ప్రయాణించిన ఆ ప్రయాణికులది ఆత్యహత్య అనండి. లేదా హత్య అనండి, అంతేకానీ, ప్రమాదం అని మాత్రం అనొద్దు…..’’
పోలీసువారి భుజాలపై వాలిపోయి బయటకు బలంగా ఈడ్చేయబడ్డాను. నా కాళ్ళపై ఇప్పుడూ నేను లేను. నా గొంతు మాత్రం అలసిపోలేదు. బిగ్గరగా మాట్లాడుతూనేవున్నాను. రక్తం నా నోటినుంచి తుంపర్లుగా ఎగిరి పడుతూనేవుంది. రక్తంతో అసహ్యంగా అనిపిస్తున్న నా నోటిని వారి శుభ్రమైన చేతులతో మూసెయ్యలేక, సంశయిస్తూ, ఆ పోలీసువారు త్వరత్వరగా నన్ను అందరికీ దూరంగా లాక్కెళ్ళడానికి బయట నిలబడివున్న గుంపును చీల్చుకుంటూ నన్ను తీసుకెళ్తున్నారు.
ఎటుచూసినా అప్పటివరకూ నా మాటలు ఆసక్తిగా విన్న సామాన్య ప్రజాసమూహం. అందరూ గోలగోలగా మాట్లాడుకుంటూ, ఆ పోలీసువారి దూకుడికి ఎదురునిలుస్తూ  ఒక్కొక్కరుగా దగ్గరకు కలిసిపోతూ పోలీసువారినీ, వారి మధ్యనున్న నన్నూ ఎటూ కదలనివ్వకుండా, నాకు మద్దతు తెలుపుతున్నట్టుగా, అన్యాయానికి అడ్డుగోడలా నిలబడ్డట్టుగా నాకు తెలుస్తుంది. చాలా ఆనందంగా ఉంది. తల భారంగా వాల్చేసినా, నా గొంతులోంచి మాటలు మాత్రం బిగ్గరగా వస్తూనేవున్నాయి.
‘‘ మిత్రులారా…..ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ రూమ్‌లో దిక్కులేనట్టు, గర్తుపట్టలేనట్టు కాలిపోయున్న శవం, ఏమని అడుగుతున్నదో మీకు తెలుసా….? ’’ నా కాళ్ళపై నేను బలంగా నిలబడ్డానికి ప్రయత్నిస్తూ, తలెత్తి అందర్నీ చూస్తూ ప్రశ్నిస్తున్నాను.
‘‘ ఆ శవం మనల్ని ఏమని అడుగుతుందో తెలుసా….? వినండి… ‘ నా ఆనవాళ్ళను గుర్తించడానికీ, ఈ శరీరం నాదే అని నిర్ధారించడానికీ,  మీకు హక్కులు ఉన్నాయోమో కానీ, అసలు నా చావునే నిర్ణయించడానికి మీరెవరు ’ అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టుంది ’’. నా జుట్టులోకి బలంగా వేళ్ళు దూర్చబడి, తలను కిందకు అణిచేస్తున్నాయి.
‘‘ మిత్రులారా…. ఆ ప్రశ్నించలేని శవం మనల్ని ఇంకా ఏమని ప్రశ్నిస్తుందో తెలుసా….? ’’ భారంగా ఊపిరి తీసుకోడానికి నా కాళ్ళను నేలపై భారంగా నిలదొక్కుకుని బలంగా ఆగిపొయ్యాను.
పోలీసువారిని అస్సలు ఎటూ కదలనివ్వకుండా, నా చుట్టూ భద్రతా వలయంలా, ఓ పఠిష్టమైన రక్షణ వ్యవస్థలా, నాకు అత్యంత దగ్గరగా, నా మాటలు వినడానికేనన్నట్లు ఆ ప్రజా ప్రవాహం ఆవేశంగా దూసుకునొచ్చేసింది.
‘‘ మనుషులు ప్రశ్నించడం మానేసారు. కాబట్టి ప్రస్తుతం శవాలే ప్రశ్నిస్తున్నాయి. మిత్రులారా… ఆ శవం మనల్ని ఏమని ప్రశ్నిస్తుందో తెలుసా…? ‘ పుట్టుక నా చేతుల్లో లేదు. నా చావు కూడా అంతేనా…?, కనీసం నా చావు కూడా నా చేతుల్లో ఉండకూడదా…? పుట్టుకతో సంక్రమించే నా హక్కులలో, నా చావు అనేది కూడా చేర్పించండి. చేర్చలేరా… కనీసం ‘ బతుకు ’ అనే నా హక్కునైనా కాపాడండి ’’.

‘‘ మిత్రులారా…. ఇప్పుడు నేనూ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను.

బాధ పుట్టినప్పుడు….
కనీస ఆవేశం నా చేతుల్లో ఉండకూడదా…?
సమస్య పుట్టినప్పుడు…
కనీస పోరాటం నా చేతుల్లో ఉండకూడదా….?
అన్యాయం పుట్టినప్పుడు….
కనీస తిరుగుబాటు నా చేతుల్లో ఉండకూడదా….?
వీటిని ప్రశ్నిస్తే మాత్రం….
నా చేతులకు సంకెళ్ళు మాత్రమే ఉండాలా….? ’’

బొమ్మల చక్రం!

(కోనసీమ లోని అమలాపురం లో పుట్టిన సాయి బ్రహ్మానందం గొర్తి ప్రస్తుతం కాలిఫోర్నియా లోని cupertino లో నివసిస్తున్నారు. దాదాపు 40 కి పైగా కథలు రాశారు. ఆయన కథల పుస్తకం ” సరిహద్దు” 2012 లో విడుదల అయింది. బ్రహ్మానందం రాసిన కొన్ని కథలు ఇంగ్లీష్, హింది, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లోకి అనువాదమయ్యాయి. కథలతో పాటు 15 కు పైగా నాటికలు కూడా రాశారు. బ్రహ్మానందం రాసిన ” నేహాల” నవల కౌముది వెబ్ మాగజైన్ లో, మరో చిన్న నవల యథార్ధ చక్రం ప్రచురితమయ్యాయి. కర్ణాటక సంగీతం మీద రాసిన వ్యాసాల పుస్తకం ” త్యాగరాజ” త్వరలో విడుదల కానున్నది.} 
పిల్లలకి వేసవి శలవలిచ్చారు. రాత్రి పదిదాటింది. పగలంతా ఆడాడి అలసిపోయిన పల్లూ, బాబీలు మంచం మీద ఓళ్ళు తెలీకుండా పడుక్కున్నారు. బాబీ నిద్రలోకి  జారుకున్నాడని గ్రహించీ, మెల్లగా ఆ పిల్లాడి  చేతుల క్రిందనుండి పక్కకి జరిగింది రేసుకారు. ఒక్కసారి టైర్లు విదిలించుకుని, మెల్లగా భారీ కాయాన్ని తోసుకుంటూ అక్కడనుండి బయటకు జారుకుంది.
రేసుకారు ఇలా ప్రతీ రాత్రీ జారుకోవడం బార్బీకి కొత్త కాదు. మెల్లగా తనూ పల్లూ గుండెల మీదనుండి క్రిందకి జారి, ఒక్క అంగలో మంచం దూకి రేసు కారుని అనుసరించింది.
“బంగారు కోడిపెట్టా..హే హే” అని హుషారుగా పాడుకుంటూ వసారాలో తిరుగుతోంది రేసుకారు.  బార్బీ తన వెనకే ఉందన్న ధ్యాసే లేకుండా ఓ మూల నుండి మరో మూలకి రయ్యి రయ్యిమని వెళుతూ హఠాత్తుగా గుమ్మదగ్గర సడెన్ బ్రేకేసి ఆగిపోయింది. గుమ్మానికానుకొని ఎదురుగా బార్బీ కళ్ళెగరేస్తూ కనింపించింది.
“ఏంటి ఈ హుషారు?” అన్నట్లుగా కనుబొమ్మలెగరేసింది.  బార్బీని చూడగానే చిర్రెత్తుకొచ్చింది రేసు కారుకి.
“ఒక్క రోజయినా నా వెంట పడకుండా వుంటావేమోనని చూస్తాను. ఇవాళ కూడా..” అంటూ పళ్ళు కొరికింది.
“ఇదేమయినా నీ మేనమావిల్లా? ఈ ఇంట్లో నీకెంత హక్కుందో నాకూ అంతే ఉంది. ఇంకా చెప్పాలంటే నీకంటే కాస్త ఎక్కువే వుంది. అద్సరే గానీ, ఏంటి? రోజూ లేనిదివాళ ఇలా ఈ పాటలూ..పరుగులూ…?” విసురుగా అంది బార్బీ.
“ఓ అదా! నేను రెండ్రోజుల్లో హైద్రాబాదు వెళుతున్నాను, తెల్సా?” తలుపులెగరేస్తూ చెప్పింది రేసుకారు.
“హైద్రాబాదా? ఎందుకు?”
“ఎందుకేవిటి? నేనూ, బాబీ వెళుతున్నాం. నీకు తెలీదా? అమెరికానుండి బాబీ వాళ్ళ మావయ్య వస్తున్నాడు. ఆయన్ని రిసీవ్ చేసుకోడానికి బాబీ వాళ్ళ నాన్న వెళుతున్నాడు. అదీ సంగతి!” గెంతుతూ చెప్పింది రేసుకారు.
“బాబీ వాళ్ళ నాన్నెళితే, నీ కేంటి?”
“నీ బుర్రకి మేకప్పెక్కువయ్యి ఆలోచించన తగ్గిపోతోంది. బాబీ వాళ్ళ నాన్నతో వస్తానని గోల చేసాడు. నేను తోడు లేకుండా బాబీ ఎక్కడకీ కదలడు కదా?”
“అదా నీ బడాయి! ఒక్క పూట భాగోతానికి హైద్రాబాదు వరకూ ఒళ్ళు హూనమవ్వడం తప్ప ఏమీ లేదు. నేను చూడు. వచ్చే నెలలో పల్లూతో కలిసి వాళ్ళ పెద్దమ్మగారింటికి రాజమండ్రీ వెళుతున్నాను.”
బార్బీ చెప్పింది విని నవ్వాపుకోలేకపోయింది రేసు కారు.
“ఏంటి రాజమండ్రీకింత బిల్డప్పా? గొప్పలు చెప్పుకోడం మీ ఫారిన్ వాళ్ళకి అలవాటే కదా? ఇంతుంటే అంత చెప్పుకుంటారు. నేను మీ రాజమండ్రీ మీదుగానే ట్రైన్లో హైద్రాబాదెళుతున్నాను. నువ్వెప్పుడయినా ట్రైన్ మొహం చూసావా? నీకో విషయం తెలుసా? ట్రైన్లో ఏ.సీ ఉంటుంది,” రేసుకారు వెటకారంగా అంది.
“అబ్బో! ఏం తిరిగాడండీ ఈ డొక్కు చెక్రాలేసుకొని. మాకీ ట్రైన్లూ, బస్సులూ కాదు. ఏకంగా విమానంలో ఇరవై గంటలు ప్రయాణం చేసి అమెరికానుండి వచ్చాను. అన్నట్టు నీకు విమానం అంటే తెలుసా? గాల్లో ఎగురుతుంది. అందులో కూడా ఏ.సీ ఉంటుంది! ” బార్బీ వెక్కిరింతలు చూసి ఉడుకుమోత్తనం వచ్చింది రేసుకారుకి.
“ఉండు. నీ పని చెప్తా?” అంటూ బార్బీనీ వెంబడించింది. బార్బీ రేసుకారుకి దొరక్కుండా ఆగదంతా అటూ, ఇటూ పరిగెడుతోంది.
వీళ్ళిద్దరి గొడవా ఎంతో శ్రద్ధగా, నిశ్శబ్దంగా వింటున్నాయి షోకేసులోవున్న కొండపల్లి బొమ్మా, లేపాక్షి బొమ్మా, ఏటికొప్పాక బొమ్మలూ.  రాత్రి పది దాటితే చాలు ప్రతీరోజూ ఈ రేసుకారు రణగొణ ధ్వని వీళ్ళకి మామూలే! గతిలేక అలా గుడ్లప్పగించి చూస్తాయి. ఒకప్పుడు ప్రతీ ఇంటా తమ ఆధిపత్యమే ఉండేది. ఇప్పుడా పరిస్థితీ, వైభోగమూ లేదు. గాజు గోడల మధ్య జీవితం బందీ అయ్యింది. బాధగా తలదించుకుంది కొండపల్లి బొమ్మ.
ఇది గమనించిన లేపాక్షి బొమ్మ – “రోజూ చీకటి పడుతోందంటేనే చికాకేస్తోంది. వీటి గోల భరించలేకుండా ఉన్నాం. ఎప్పుడు చస్తారో ఏమిటీ? ఈ పీడ విరగడయ్యేట్లా లేదు,” పళ్ళు కొరుకుతూ అంది.
“నీ కోపం అర్థమయ్యింది. మనమేం చెయ్య గలం చెప్పు? ఈ గాజు తలుపు దాటి వెళ్ళలేం. బ్రతికున్నన్నాళూ ఈ గోల తప్పదంతే!” నిరాశగా అంది కొండపల్లి బొమ్మ.
ఎప్పటికయినా ఆ రేసుకారూ, బార్బీలపై పగ తీర్చుకోపోతామా అని ఎదుర్చూస్తున్నాయా బొమ్మలు.
రేసుకారుకి అందకుండా బార్బీ ఆ గదంతా తిప్పిస్తోంది. పరిగెత్తే ఓపిక లేక హాల్లో టీవీ పైన చతికిలపడింది బార్బీ. నేలమీద వెంబడించిన రేసుకారు టీవీ టేబులెక్కలేక అక్కడే కూలబడింది.
ఇదంతా చూసి కిసుక్కున నవ్వాయి, షోకేసులో బొమ్మలు. ఒక్కసారి విసూరుగా తలతిప్పి చూసింది రేసుకారు. వేంటనే షోకేసి బొమ్మలు తలదించుకున్నాయి.
“ఏంటా పకపకలూ?  ఒక్క సారి బయటకి రండి తడాఖా చూపిస్తాను.”
“అత్త మీద కోపం దుత్త మీదన్నట్లు బార్బీ మీదున్న ఉక్రోషం మామీద చూపిస్తావేమిటి? మీ ఆట చూసి నవ్వొచ్చింది. ఆ మాత్రం నవ్వకూడదా?” కొండపల్లి బొమ్మ నవ్వాపుకోలేక అంది.
“భలే చెప్పారు. ఏదో ఈ ఇల్లంతా వాడి బాబు సొత్తన్నట్లు మాట్లాడతున్నాడు. హక్కుల గురించి మాట్లాడాల్సొస్తే అందరికీ ఉన్నాయి…”
“అబ్బో హక్కులట హక్కులు. ఎంతసేపూ మేకప్పు చేసుకోవడమే ప్రపంచమనుకునే నువ్వూ, నాలుగ్గోడల మధ్యా బందీలా ఆ షోకేసే ప్రపంచమనుకునే మీరా హక్కుల గురించి లెక్చర్లిస్తున్నారు. ఈ టీవీ పైనుండి బార్బీ ఎలా దిగుతుందో చూస్తాను? ఈ రాత్రంతా ఇక్కడే ఉంటాను,” కోపంగా ఊగిపోతూ అంది రేసుకారు.
“హలో! నాకేం పరవాలేదు. హాయిగా ఇక్కడ పడుక్కోగలను. తెల్లారితే నీ సంగతే చూసుకో! ఇంట్లో వాళ్ళ కాలికడ్డం వస్తే ఓ తన్ను తన్నుతారు.” బార్బీ అంది.
“ఏవిటర్రా?ఎందుకొచ్చిన గొడవలు?మనంఉన్నదినలుగురం.ఇలా కొట్టుకుంటూ…” లేపాక్షి బొమ్మ అనునయించబోయింది.
“చ! ఆపండెహా! మీ సూక్తిముక్తావళి.. మీరెవరు నాకు చెప్పడానికి? ”  కటువుగా అంది రేసుకారు.
“నీకెందుకొచ్చింది చెప్పు. వాళ్ళ గొడవేదో వాళ్ళు పడతారు. మనం ఈ షోకేసి దాటి వెళ్ళనప్పుడు ఎవరెలా చస్తే మనకేంటి చెప్పు? అనవసరంగా వాళ్ళ మధ్య తలదూర్చద్దు.” కొండపల్లి బొమ్మ మెల్లగా లేపాక్షి బొమ్మతో అంది.
“పోనీ మనవాళ్ళేనని చెప్పానంతే?” లేపాక్షి బొమ్మంది.
“మనవాళ్ళేంటి? వాళ్ళు పరాయి దేశం నుండి వలసొచ్చారు. వాళ్ళకి మన సంస్కృతీ అవీ తెలీవు. అయినా మనం ఎక్కడుంటున్నాం? ఇదంతా తెలుగు గడ్డ మహత్యం! ఇహ నోరెత్తావంటే నాలుగిచ్చుకుంటాను,” కొండపల్లి బొమ్మ గట్టిగా హెచ్చరించింది.
“హలో! వలసా, గిలసా అంటూ ఏంటో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? మీరు మాత్రం వలసగాళ్ళు కాదా? అయినా తెలీకడుగుతాను? ఈ భూమ్మీద అందరవూ వలసొచ్చినాళ్ళే! కాబట్టి నోరు మూసుక్కూచోండి. లేదంటే..?” ఆవేశంగా అంది రేసుకారు.
“ఎందుకు ప్రతీ దానికీ అలా పెడర్థాలు తీస్తావు?” లేపాక్షి బొమ్మకి కోపం వచ్చింది.
“ఏంటి? మాటంటే మాటని రెచ్చిపోతున్నావు? నా సంగతి నీకు తెలీదు.” అంటూ పక్కనే నేల మీదున్న బంతిని బలంగా తన్నింది. ఆ అదురుకి అది ఎగురుకుంటూ వెళ్ళి షోకేసు అద్దమ్మీద పడింది. ఆ విసురుకి షోకేసులో ఉన్న లేపాక్షి, కొండపల్లి బొమ్మలు పక్కకొరిగాయి.
ఆ చప్పుడు విని పక్క గదిలో పడుక్కున్న బాబీ వాళ్ళ తాత “ఎవరూ?” అంటూ గట్టిగా అరుస్తూ వసారా వైపుగా వచ్చి లైటు వేసాడు. షోకేసులో బొమ్మలు పడిపోవడం చూసి పిల్లి వచ్చిందేమో అనుకుంటూ, అటూ ఇటూ పరికించి లైటార్పకుండానే తనగది వైపుగా వెళిపోయాడాయన, లైటు వేసుంటే ఎవరయినా మరలా వచ్చే అవకాశముందని ఆ బొమ్మలన్నీ మౌన ముద్ర వహించాయి.
***
తెల్లారగానే గదులన్నీ వూడ్చడానికొచ్చిన పనిమనిషి పొరపాటున రేసు కారు బొమ్మమీద కాలేసింది. గబుక్కున పడబోయి పక్కనే ఉన్న సోఫాని ఆనుకుంది.. రేసుకారు ఒక చక్రం విరిగి పక్కన పడిపోయింది.
చక్రం విరిగిన బాధతో ఒక్కసారి హారన్ కేక పెట్టింది రేసు కారు. ఆ కేకకి ఉలిక్కిపడ్డాయి షోకేసులో బొమ్మలు. నిద్రలేస్తూనే కారు కోసం వెతుకుతున్న బాబీ హాల్లో చక్రం ఊడిన కారుకేసి చూస్తూ బావురుమన్నాడు.
ఆ విరిగిన కారుబొమ్మనే చేతిలో పెట్టుకు తిరిగాడు. ఆ రాత్రి రేసుకారు వసారాలోకి రాలేదు. బార్బీ కూడా. రోజూ ఎంత కొట్టుకున్నా రేసుకారు కుంటుతూ నడవలేక నడవడం చూసి బాధ కలిగింది బార్బీకి.  చక్రం విరిగిన కారుని తీసుకొని హైద్రాబాదు బయల్దేరడానికి సిద్ధమయ్యాడు బాబీ.
***
ఆ రాత్రి బార్బీకి నిద్ర పట్ట లేదు. రేసుకారెలా ఉందోనన్న దిగులే ఎక్కువయ్యింది. ఓ రాత్రి వేళ ఏం చెయ్యాలో తోచక దిగాలుగా వసారాలోకి వచ్చి, నేల మీద కూలబడింది బార్బీ! కొంతసేపయ్యాక పక్కగదిలో చప్పుడయితే అటుగా వెళ్ళింది.
చీకట్లో ఏదో కదిలినట్లయ్యింది.  అక్కడ రేసుకారుని చూసి  ఆశ్చర్యపోయింది బార్బీ. చక్రం ఊడిన రేసుకారు  రేసుకారు బాధగా మూలుగుతూ వుంది.  చూసి జాలిపడింది బార్బీ!
“ఎలావుందిప్పుడు?”
“బానే వుంది.” ముక్తసరిగానే జవాబిచ్చింది రేసుకారు.
“నువ్వేటిక్కడ? హైద్రాబాదు వెళ్ళలేదా?”  గుర్తుకొచ్చి అడిగింది బార్బీ. రేసుకారు నెమ్మదిగా చెప్పింది.
“బయల్దేరబోయేముందు బాబీ నాన్న మాట విని నన్ను వీధి గుమ్మం వద్దే వదిలేసాడు. మీరనుకున్నట్లు నేను హైద్రాబాదు వెళ్ళలేదు.” తలదించుకొని నెమ్మదిగా చెప్పింది రేసుకారు.
“మరి ఇంతసేపూ ఎక్కడున్నావు?” బార్బీకి సందేహమొచ్చింది.
“గుమ్మం దగ్గర మెట్లదగ్గరే కూలబడిపోయాను. బాబీ నన్ను వదిలి వెళ్ళాడన్న బాధొకవైపూ, చక్రం విరిగిందన్న బాధ ఇంకోవైపూ – ఉదయం నుండీ అక్కడే ఉండిపోయాను….ఈ చక్రం మరలా వచ్చి మరలా మీ మధ్య తిరుగుతానా అనిపిస్తోంది” రేసుకారు గొంతు మారింది.
నడవడానికి ప్రయత్నిస్తూ, మూడు చక్రాలతో కుంటుకుంటూ నడవలేక ఓ మూల చతికిలబడింది.
ఇదంతా గమనిస్తూ ఉన్నాయి షోకేసులో బొమ్మలు. వాటికీ రేసుకారు పరిస్థితి అర్థమయ్యింది. ఇదే మంచి అదననుకొని కొండపల్లి బొమ్మ చొరవతీసుకొని ఇలా అంది.
“రేసుకారూ, నీ పరిస్థితి చూస్తే బాధ కలుగుతోంది. నేను నీకు సహాయం చెయ్యగలను. నీ చక్రం సరి చేసి, నువ్వు మామూలుగా తిరిగేలా చెయ్యగలను.”
ఈ మాటలు విని రేసుకారుకి అంత దుఃఖంలోనూ నవ్వొచ్చింది.
“ఉన్న చోటునుండి కదల్లేరు కానీ, నాకు సాయం చేస్తారా? ఎవరైనా వింటే నవ్వి పోతారు. మీరేదో నా మీద కక్ష సాధిద్దామని ఇలా దెప్పి పొడుస్తున్నారు. లేకపోతే మీరు సాయం చెయ్యడమెమిటి? “
“లేదు. లేదు నీ మీద కక్ష అలాంటివి కాదు. నిజంగానే నీకు సాయం చేద్దామనే చెప్పాను..” కొండపల్లి బొమ్మ మరోసారంది.
“పోనీ వాళ్ళేదో సాయం చేస్తామంటే,  ఆ పొగరేమిటి? అయినా నువ్వెవర్నీ నమ్మవు. ఇలాగే కుంటుకుంటూ ఈ వసారాలోనే పడుండాలి. బాబీ వచ్చాడంటే నిన్నో మూల పారేసి వేరే బొమ్మ కొనుక్కుంటాడు,” రేసుకారుతో అంది బార్బీ.
రేసుకారు ఏమనుకుందో ఏమో, కొండపల్లి బొమ్మ సాయానికి అంగీకారం చెప్పింది.
“మీరిద్దరూ ఎలాగయినా ఈ షోకేసు డొరు పక్కకు లాగితే మేం బయటకొస్తాం. ఆ పక్కగది అటకపైన పెట్టెలో మా వాళ్ళు చాలామందే ఉన్నారు. మా అవయవాలకి గాయమయితే  అతికే మందు వాళ్ళ దగ్గరుంది. అది రాస్తే చిటికలో అన్నీ సర్దుకుంటాయి. ఆ మందు పేరంటబ్బా? నోట్లో నానుతోంది కానీ గుర్తు రావడంలేదు…!” అనంటూ మధ్యలో ఆగిపోయింది,  కొండపల్లి బొమ్మ.
“అదే…దాన్ని క్విక్‌ఫిక్స్ అంటారు.” చటుక్కున అందిచ్చింది లేపాక్షి బొమ్మ.
“అవును. ఆ క్విక్‌ఫిక్సే!  ఇప్పటికే దెబ్బ తగిలి చాలాసేపయ్యింది. వేంటనే మందు వేసి కట్టు కట్టకపోతే  కష్టం. “
షోకేసు తలుపులెలా తీయడామని ఆలోచనలో పడింది రేసుకారు. బార్బీ, రేసుకారు ఎంతో శ్రమపడి మొత్తానికి స్టూలుని షోకేసు దగ్గరగా జరిపారు. చివరకి బార్బీ షోకేసు తలుపులు తెరిచింది.  ఒక్క ఉదుటున కొండపల్లి బొమ్మా, దానివెనుకే లేపాక్షి బొమ్మా, వారి తోటి బొమ్మలూ బయటకి దూకాయి.
వడి వడిగా అడుగులేసుకుంటూ పక్క గదిలో అటకవైపు చూసాయి. అటకమీదున్న బొమ్మల్ని గట్టిగా  పిలిచింది కొండపల్లి బొమ్మ.  అటకమీద పెట్టె తెరుచుకొని బొమ్మలూ,  వెనుకనే లక్క పిడత సైన్యమూ బిల బిలా వచ్చి క్రిందకి చూసాయి. కొండపల్లి బొమ్మ విషయం చెప్పింది. వేంటనే కొయ్య గుర్రం బొమ్మ పెట్టెలో వున్న క్విక్‌ఫిక్స్తెచ్చింది. దాంతో రేసుకారు చక్రం అతకడం ఆపరేషన్ మొదలెట్టారు. ఓ గంట తరువాత ఎలాగయితేనే ఊడిన చక్రాన్ని అతికించారు.
“ఇప్పుడే మందు రాసాను. ఇది ఆరి చక్రం అతుక్కోడానికి చాలా సేపే పడుతుంది. అంతవరకూ నువ్వు కదలకూడదు. తరువాత కదిలినా మెల్లగా నడవాలి కానీ, ఈ గాయం మానే వరకూ జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడా పరుగులూ అవీ తీయకూడదు. తెలిసిందా?” కొండపల్లి బొమ్మ చెప్పింది. వాళ్ళు చేసిన సాయానికి రేసుకారు మనసు ద్రవించింది.
“మీరు నా చక్రం అతికించి నాకెంతో సాయం చేసారు. మీ మేలెప్పటికీ మరవలేను. ఇన్నాళ్ళూ మిమ్మల్ని కించపరుస్తూ తక్కువ చేసి మాట్లాడాను. క్షమించండి,” అంటూ కొండపల్లి బొమ్మవైపు చూసింది.
“పరవాలేదు. చెప్పానుగా మనందరం ఒకే జాతికి చెందిన వాళ్ళం. మనం ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకోపోతే ఎలా? ఒక్క విషయం రేసుకారూ?నువ్వనుకున్నట్లు మాది ఆవారా జాతి కాదు.  ప్రస్తుతం నీకు పిల్లలమధ్య పాపులారిటీ, డిమాండూ ఉండచ్చేగాక!  గతంలో మాది పెద్ద వంశమే! ఈ వైభవాలూ అవీ మేమూచూసాం. నీకు తెలుసో తెలీదో పూర్వం దసరాకీ, సంక్రాంతికీ బొమ్మల కొలువు పెట్టేవారు. మేము లేని ఇల్లుండేది కాదు. మమ్మల్ని జనాలు ఎగబడి చూసేవారు. వయసుతో సంబంధంలేకుండా మాపై ప్రేమ చూపించేవారు. ఆ రోజులే వేరు. ఓడలు బళ్ళు అవుతాయి;బళ్ళు ఓడలవుతాయి. ఇదే కాల చక్ర మహిమ!,” అంటూ మనసులోమాట చెప్పింది కొండపల్లి బొమ్మా. మిగతా బొమ్మలూ తమ తమ పూర్వ చరిత్రని చెప్పాయి.
“చెప్పానుగా! నాకు మీ గురించి తెలీదు. మాది ప్లాస్టిక్ వంశం. మేం పక్క దేశాల్నుండి వలస వచ్చాం. మాదే గొప్ప జాతీ, మేమే ఎంతో ఆధునికంగా బ్రతుకుతామన్న భ్రమలో ఉన్నానిన్నాళ్ళూ! మాకు మీ చరిత్ర తెలీదు. తెలిసిందల్లా, మీకు ఈ సమాజంలో ఎక్కడా చోటు లేదన్న విషయమొక్కటే.  అది చూసే మిమ్మల్ని తక్కువగా మాట్లాడాను,” అంటూ కంట తడి పెట్టుకుంది రేసుకారు.
“జరిగిపోయింది కదా? ఇహ బాధపడడం అనవసరం. ఏదేమయినా మనమందరం ఒకటే! రేసూ! ఒక్క విషయం గుర్తుంచుకో! ఈ మనుష్యుల్ని నమ్మొద్దు. ఎప్పుడు దేని మీద ఇష్టపడతారో, ఎప్పుడు తిరస్కరిస్తారో వాళ్ళని పుట్టించిన దేవుడు కూడా చెప్పలేడు. అతిగా నమ్మడం మనకే మంచిది కాదు,”  అనంటూ కంటనీరు కారుస్తున్న రేసుకారుని కొండపల్లి బొమ్మ అక్కున చేర్చుకుంది.
మిగతా బొమ్మలూ రేసుకారు భుజం తట్టాయి. బొమ్మలన్నీ షోకేసులోకి తిరిగి వెళ్ళడానికి సిద్ధపడ్డాయి.
***
రెండ్రోజుల తరువాత బాబీ వాళ్ళ మావయ్యతో కలిసి ఇంటికి తిరిగొచ్చాడు. అమెరికానుండి బాబీ మావయ్య ఒక రేడియో కంట్రోలు కారు బహుమతిగా ఇచ్చాడు. పల్లూకి మాట్లాడే మరో బార్బీ బొమ్మా, ఇంకా చాలా బొమ్మలు పట్టుకొచ్చాడు. బాబీ కొత్త కారు మోజులో రేసుకారుని పట్టించుకోడం మానేసాడు.
‘ఈ బాబీయేనా తనని ఎంతో అపురూపంగా చూసుకున్నది? ఒక్క సారి చక్రం వూడితే నేను పనికి రాకుండా పోయానా?’  అని వాపోయింది రేసుకారు.
రేడియోకంట్రోల్ కారు ముందుకీ వెనక్కీ వేగంగా తిరగడమూ, ఏదైనా అడ్డొస్తే చటుక్కున పక్కకు తిరగడమూ, ఎత్తైన వాటిపైకి బలంగా ఎక్కడమూ – ఇవన్నీ చూసి అవాక్కయ్యింది రేసుకారు. మిగతా బొమ్మల్లా కాకుండా తను ఎంతో వేగంగా ఎక్కడకి కావల్సివస్తే అక్కడకి వెళ్ళగలను అని అనుకునేది. ఈ రేడియో కంట్రోల్ కారు తనకంటే మించి పోయింది. దీన్ని చూస్తే తన మొహం ఏ పిల్లాడూ చూడడు. మెల్లగా తనూ కొండపల్లి బొమ్మల్లా తయారవుతుంది. ఇదంతా తలచుకుంటేనే భయమేసింది రేసుకారుకి.
రేడియో కంట్రోల్ కారుకి మిగతా బొమ్మలంటే చులకన.  అమితమైన వేగంతో మిగతా బొమ్మల్ని ఢీకొని వాటికి నరకం చూపించేది. ఆ కారొచ్చాక పాత బార్బీకి, రేసుకారుకీ చాలా సార్లు గాయాలయ్యాయి.  కొండపల్లి బొమ్మా, మిగతా బొమ్మలకీ అదే పరిస్థితి. వసారాలో అడుగుపెట్టడం మానేసాయి.
ఎలాగయినా ఈ రేడియో కంట్రొలు కారు ఆటకట్టించాలని మిగతా బొమ్మలన్నీ  కృత నిశ్చయంతో, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాయి. దానికి రాకాసి కారని నిక్‌నేం పెట్టాయి.
“మనం తొందరపడి ఏమీ చెయ్యద్దు. ఆ రాకాసి కారుతో గొడవ పడకుండా గడుపుదాం. అందరూ దాని ప్రతి చర్యా గమనించండి. . ఈలోగా ఈ రాకాసి కారు పీడ ఎలా వదిలించుకోవాలన్నది మేం ప్లాన్ చేస్తాం. సరేనా?” కొండపల్లి బొమ్మ ఆదేశించింది.  అందరూ సరే నన్నారు.
కొండపల్లి బొమ్మ ప్రతిపాదన అందరికీ నచ్చింది. రేసుకారూ, బార్బీ ఏం చెయ్యాలని ప్లాన్ వేసుకున్నాయి.
***
కొత్త బార్బీ వచ్చాక పాత బార్బీ కేసే చూడ్డం మానేసింది పల్లూ. ఎలాగయినా కొత్త బార్బీ పని పట్టాలని నిశ్చయించుకుంది బార్బీ. రేసుకారు సాయం కోరింది. నాలుగు రోజుల తర్వాత పల్లూ రాజమండ్రీ ప్రయాణానికి సిద్ధమవుతుండగా మెల్లగా ఎవరూ చూడకుండా బేక్‌పాక్ లోకి చేరాయి బార్బీ, రేసుకారూ. పల్లూ వాళ్ళ పెద్దమ్మ ఇంట్లో ఎలాగయినా మాట్లాడే బార్బీని హత మార్చాలి. ఇదీ ప్లాను. కొండపల్లి బొమ్మ, మిగతా బొమ్మలు వారించినా బార్బీ వినలేదు.
కానీ  వెళ్ళిన రెండ్రోజులకే తిరిగొచ్చేసింది పల్లూ. వస్తూనే పెద్దమ్మిచ్చిన బొమ్మలన్నీ వాళ్ళమ్మకి చూపించింది.
“అమ్మా! ఈ చైనా బొమ్మలు చూడు. ఎంత బావున్నాయో! పెద్దమ్మ నాకోసం తెప్పించిందట. ఈ రైలు బొమ్మా చూడు. ఎంత బావుందో? ఈ సీతారాముల విగ్రహాలూ భలే బావున్నాయి. వీటికి డ్రెస్సులు కూడా బాగా నప్పాయి.” అంటూ మొత్తం తెచ్చిన బొమ్మలన్నీ అక్కడ పరిచి బ్యాగ్ ఖాళీ చేసింది పల్లూ.
ఇది చూసి షోకేసు బొమ్మల మొహాలు మారిపోయాయి. ఎక్కడా రేసుకారూ, బార్బీల జాడే లేదు. ఏమీ అర్థం కాలేదు వాటికి. ఒకటికి రెండు సార్లు పరికించి చూసాయి. బార్బీ, రేసుకారూ రాలేదా? అంటే పల్లూ వాళ్ళ పెద్దమ్మా ఇంట్లోనే చిక్కుకుపోయారా?
ఇంతలో షోకేసు తలుపు తీసినట్లు చప్పుడయితే తలెత్తి చూసాయి. ఎదురుగా పల్లూ! కొండపల్లీ, లేపాక్షీ మిగతా బొమ్మల్ని షోకేసు వెనక్కి నెట్టి, ముందు వరసలో పెద్దమ్మిచ్చిన సీతారాముల బొమ్మలు పెట్టింది పల్లూ.
ఈ చర్యకి ఒక్కసారి అవాక్కయ్యాయి షోకేసు బొమ్మలన్నీ.
కొత్తగా వచ్చిన సీతారాముల బొమ్మల్ని చూసి మనవాళ్ళే అనుకున్నాయి. తీరాచూస్తే అవి వేరే భాషలో మాట్లాడుకుంటున్నాయి. వాటిని చూసి నవ్వాగింది కాదు లేపాక్షి బొమ్మకి. ఆ నవ్వుకి కారణం ఏమిటని మిగతా బొమ్మలడితే, “ఆ రాముడూ, సీతా బొమ్మలు చూడు. చిన్న చిన్న కళ్ళూ, చవిటి ముక్కూ! చూడ్డానికి ఇక్కడి వాళ్ళల్లా లేరు.” అంటూ పగలబడి నవ్వుతూ అంది.   మిగతా బొమ్మలూ గట్టిగా నవ్వాయి.
ఆ చైనా బొమ్మలు కోపంగా కళ్ళెర్ర జేస్తే, వచ్చే నవ్వుని ఆపుకున్నాయి ఆ బొమ్మలు.
***
చైనా బొమ్మలూ, రాకాసి కార్ల రాకతో తమ బ్రతుకులన్నీ మారిపోయాయి. రేసుకారూ, బార్బీ ఇహ ఈ ఇంటికి రావు. పాతబడిపోయాయని వాళ్ళు ఏ చెత్తబుట్టలోనయినా పారేసుండచ్చు. లేదా పల్లూనే ఆవతల విసిరేసుండచ్చు. ఏ విషయమూ తెలీదు. వీటికంతటికీ కారణం ఆ రాకాసి కారూ, మాట్లాడే బార్బీ! తమ అస్తిత్వానికే ఎసరు తెచ్చాయి ఈ చైనా బొమ్మలు. ఎలాగయినా వాటి అంతం చూడాలని నిర్ణయానికొచ్చాయి కొండపల్లీ, లేపాక్షి బొమ్మలు. అలా చేస్తేనే బార్బీ, రేసుకారు ఆత్మలకి శాంతి లభిస్తుందనుకున్నాయి.
ఆ రాత్రి టీవి చూస్తున్న బాబీకి వాళ్ళమ్మ పాల గ్లాసివ్వడం చూసింది కొండపల్లి బొమ్మ. పొరపాటున చేయిజారి పాలన్నీ పక్కనే ఉన్న రాకాసి కారు మీద పడ్డాయి.
“టీవీ చూస్తూంటే నీకస్సలు ఒళ్ళు తెలీదు. ముందా కారుని గుడ్డ తెచ్చి తుడు. తడి తగిలితే బాటరీలు చస్తాయి!” అంటూ బాబీ అమ్మ  విసుక్కోడం వింది కొండపల్లి బొమ్మ.
ఇది చూడగానే చటుక్కున బుర్రలో వెలిగింది. వేంటనే అటకమీదున్న బొమ్మలకి కబురంపింది. అందరూ ఓ మూల సమావేశమయ్యాయి.  ఏం చెయ్యాలో మిగతా బొమ్మలన్నింటికీ చెప్పింది.
“రేపు రాత్రి బాబీ పడుక్కునే సమయానికి అందరం అతని పడగ్గది చేరుకోవాలి. ఈలోగా ఈ లక్క పిడతలన్నీ శక్తి కొద్దీ నీళ్ళు మోసుకొస్తాయి. అందరం ఆ తలుపు వెనకాల  వేచుందాం. రాకాసి కారు మంచం దిగి రాగానే ముందు గుర్రం బొమ్మ  ఢీకుంటుంది. వెనుకనుండి ఈ లక్క పిడతలు రాకాసి కారుపై నీళ్ళొంపేయాలి. ఆ దెబ్బకి దానికి ఊపిరాడకూడదు. ఈలోగా మేమందరం వెనుకనుండి వచ్చి ఎదుర్కుంటాం.”
“ప్లాను అంతా బానే వుంది. అంత పెద్ద కారు ఈ నీళ్ళు పోస్తే చచ్చిపోతుందా?” అనుమానం వెలిబుచ్చాయి లక్కపిడతలు.
“తప్పకుండా! బాబీ వాళ్ళమ్మ పాలొలికితే ఈ రాకాసి కారు పాడవుతుందని చెప్పగా విన్నాను. పాలంటే ఏవిటి? తడే కదా? తడంటే నీళ్ళే కదా? కాబట్టి నీళ్ళు తగిలితే చచ్చే అవకాశముంది. అందుకే మన లక్కపిడతలు ఎంతమంది వుంటే అంతమందిని తరలించుకు రండి,” అని తన ప్లాను చెప్పింది.
వాళ్ళందరూ ఆ మర్నాడు పగలంతా భారంగా గడిపారు. ఎప్పుడు రాత్రవుతుందాని ఎదురుచూస్తున్నారు.
***
ఓ రాత్రి వేళ రాకాసి కారు ఎప్పటిలాగే మంచం దిగి హాల్లోకి బయల్దేరింది. తమ పధకం ప్రకారం కొయ్య గుర్రం ఎదురొచ్చి ఢీకుంది. వెనుకనుండి లక్కపిడతలు నీళ్ళొంపాయి. ఈ హఠాత్పరిమాణానికి ఒక్కసారి ఉలిక్కిపడింది రాకాసి కారు. వళ్ళంతా తడిసిపోయింది. ఊపిరాడక గిలగిలా కొట్టుకుంది. ఆలా కొట్టుకుంటూ పక్కనే ఉన్న గ్లాస్ టేబుల్ని కొట్టుకుంది. ఆ శబ్దానికి ఒక్క సారి ఉలిక్కిపడి లేచాడు బాబీ! చీకట్లో అతనికి ఏమీ కనిపించలేదు. చూసుకోకుండా లక్కపిడతల్ని తొక్కు కుంటూ హాల్లోకి వెళ్ళాడు. తలుపు బలంగా తీయబోయి వెనక్కి నెట్టాడు. దాని వెనుకే కొండపల్లీ, లేపాక్షి బొమ్మలున్నాయి.
అది ఆ పిల్లాడు గమనించలేదు.
***
ఆ మర్నాడు ఉదయం బాబీ వాళ్ళ పెద్దమ్మ దగ్గర పనిజేసే నౌకరొచ్చాడు. వస్తూ పల్లూ బొమ్మలు మర్చిపోయిందంటూ బార్బీనీ, రేసుకారుని తీసుకొచ్చాడు. పల్లూ వాళ్ళమ్మ ఆ బొమ్మల్ని వసారా టేబిల్ మీద పెట్టింది.
బయటకి రాగానే రేసుకారూ, బార్బీ షోకేసు వైపు చూసి ఆశ్చర్య పోయాయి. కొండపల్లీ, లేపాక్షి బొమ్మల స్థానంలో కొత్తగా వేరే బొమ్మలొచ్చాయి. తమ మిత్రులేమయ్యారాని ఆత్రంగా బాబీ గదివైపు పరిగెత్తాయి. అక్కడా కనిపించలేదు. అటక గది వైపూ వెళ్ళి చూసాయి. అక్కడా లేరు.  చివరకి పెరటివైపున్న చెత్త కుండీ దగ్గరకెళ్ళి చూసాయి.
అక్కడ ముక్కలైపడున్నాయి లక్క పిడతలూ, మిగతా బొమ్మలూ! కొండపల్లీ, లేపాక్షి బొమ్మలు మాత్రం కనిపించలేదు.
ఇల్లంతా గాలించాయి. చివరకి వసారా గదిలో చేరుకొని దీనంగా షోకేసు వైపు చూసాయి. కొత్త చైనా బొమ్మల కేసి చూడలేకపోయాయి.
రేసుకారుకీ, బార్బీకీ ఏం జరిగిందో అస్సలు అర్థం కాలేదు. ఏం జరిగిందో అడుగుదామనుకున్నా మిగిలిన చైనా బొమ్మలకి భాష తెలీదు. ఎప్పటికయినా షోకేసు బొమ్మలు తిరిగొస్తాయని ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నాయి! ఇద్దరికీ కొండపల్లి బొమ్మ మాటలు గుర్తుకొచ్చాయి – “…కాలం శక్తి ఇంతా అంతా కాదు…”.
నెల్లాళ్ళ తరువాత మాట్లాడే బార్బీ, రాకాసి కారూ, బార్బీ, రేసుకారు గుంపులో చేరాయి.
“గేమ్ బోయ్” వీడియో గేమ్ చేతిలో ఉంటే కాలమే తెలియడం లేదు, బాబీకీ, పల్లూకీ.

***

అమ్మే కావాలి!

srilalitha(g.s.lakshmi)

జి.ఎస్. లక్ష్మి పూర్తి పేరు గరిమెళ్ల సుబ్బలక్ష్మి. జిఎస్ లక్ష్మి పేరుతో రచనలు చేస్తున్నారు.  ఇంతవరకు 40 కథలు, రెండు నవలలు రాశారు. మొదటి కథ “ఇది ఇలా సాగవలసిందేనా?” 1982లో ఆంధ్రప్రభ వీక్లీలో ప్రచురితమైంది. తర్వాత పదేళ్లపాటు ఏమీరాయలేదు. తిరిగి 2002లో రచనలు చేయడం మొదలుపెట్టారు. వివిధ  పోటీల్లో ఈమె కథలు బహుమతులు అందుకున్నాయి. వివిధ భాషల్లోకి అనువాదమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సొంత ప్రాంతం. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. సోషియాలజీలో మాస్టర్ డిగ్రీ, కర్నాటక సంగీతంలో డిప్లొమా చేశారు.  నాన్న చూపిన దారి, భర్త అందించిన ప్రోత్సాహమే తనతో రచనలు చేయిస్తున్నాయంటారు జిఎస్ లక్ష్మి. -వేంపల్లె షరీఫ్

“అది కూడా నాకేనా…?”

అరవైయేళ్ళ తాయారమ్మ కూతురు సరళని అమాయకంగా అడిగింది.

“నీకే.. ఇవన్నీ నీకే..” అంటూ మరో వలిచిన కమలాపండుని తల్లి చేతిలో వుంచింది సరళ. తల్లిని చూస్తున్న సరళ మనసులో వేదన ఉవ్వెత్తుగా ఎగసిపడుతోంది. ఎలా వుండేది తన తల్లి…? ఎలాగైపోయిందిప్పుడు..?

తెల్లారకుండా లేచి , సూర్యోదయం కన్నా ముందుగా ఇంటి ముందు రంగవల్లికలు తీర్చేది. ఒక్క ధనుర్మాసంలోనేకాదు. సంవత్సరం పొడవునా ఆమె లేవగానే చేసే మొట్టమొదటి పనే అది. ఎన్నెన్ని రకాల ముగ్గులు వేసేదో.. పండగరోజులయితే వాటిని రంగులతోనూ, పూలరేకులతోనూ అలంకరించేది. అలాగ ఇంటి ముందు ముగ్గు వెయ్యడమన్నది ఆమె చేసే దినచర్యలో మొట్టమొదటి పని అంతే.. ఆ తర్వాత ఆమె చేసే ప్రతిపనీ కూడా అంత కళాత్మకంగానూ వుండేది. తండ్రికి కావల్సినవి కూడా అంత అందంగానూ అమర్చేది. అన్నయ్యనీ, తననీ కూడా చూసేవారు అబ్బురపడేటట్లు పెంచింది.

ఇంట్లో ప్రతి మూలా, ప్రతివస్తువూ శుభ్రంగా, అందంగా వుండేవి. వండే వంటలయితే మరీనూ. ఒక్క రుచే కాదు, చూడడానికి కూడా అంత బాగుండేవి.

ఇంట్లో పనే కాకుండా స్వభావరీత్యా కూడా ఆవిడ స్నేహశీలి. అందరితో సంబంధబాంధవ్యాలు చక్కగా నడిపేది. అవసరమైనప్పుడు సలహాలిస్తూ, ధైర్యం చెపుతూ అందరికీ తలలో నాలుకలా వుండేది. ఆఖరికి నాన్నగారి పేరు సోమసుందరం అన్నది మరుగున పడిపోయి అందరూ తాయారమ్మగారి మొగుడు అనేంత స్థితికి వచ్చింది. తండ్రి అప్పుడప్పుడు ఉడుక్కున్నా ఇంత చురుకైన భార్యని చేసుకున్నందుకు లోలోపల మురిసిపోయేవారు.

రెండేళ్ళక్రితం వరకూ అలా వుండే అమ్మ ఇప్పుడిలా…ఎందుకు భగవంతుడు అమ్మనిలా శపించేడు..? ఏం పాపం చేసిందని ఇంతలా శిక్షించేడు..?

ఆరోజు తనకి బాగా గుర్తు. సంక్రాంతి పండుగ కని పిల్లలిద్దరితో కలిసి తనూ, ఆయనా భోజనానికొచ్చారు. సాయంత్రం వెనక్కి ఇంటికి తిరిగి వెడదామనుకుంటుంటే తన పిల్లలడిగినదేదో కొని తెద్దామని నవ్వుతూ మార్కెట్ కి వెళ్ళిన నాన్నగారు, అన్నయ్య యాక్సిడెంటులో చిక్కుకుని, విగతజీవులై యింటికొచ్చారు. ఆ షాక్ కి తట్టుకోలేని అమ్మ స్పృహ తప్పి పడిపోయింది. తర్వాత ఎప్పుడో స్పృహ వచ్చినా కూడా ఆవిడ మళ్ళీ ఈ లోకం లోకి రాలేకపోయింది. మెదడులో నరాలు దెబ్బతిన్నాయనీ, మరింక ఆమె జీవితమంతా అలాగే వుంటుందనీ డాక్టర్లు చెప్పారు.

ఒక్కసారిగా మీద పడిన ఈ దుస్సంఘటనలకి సరళ కాస్తైనా తట్టుకోగలిగిందీ అంటే అది ఆమెకి భర్త శ్రీధరం అందించిన ధైర్యమే. పక్కనే వుండి అన్నిరకాలుగానూ సహాయం చేస్తూ, తల్లికి అన్నివిధాలుగానూ తోడుగా వుండే సహనం, ఓర్పూ, ఓదార్పూ అన్నీ శ్రీధరం తోడ్పాటుతోనే నేర్చుకుంది.

అప్పటివరకూ తనకేది కావాలన్నా నాన్న, అన్నయ్య  పెదవి విప్పి చెప్పకుండానే గ్రహించి  తెచ్చిచ్చేవారు. అమ్మయితే తను ఇద్దరి పిల్లలకి తల్లయినా కూడా వాళ్ళతో పాటు తనని కూడా ఒక పాపగానే చూస్తూ అన్నీ నోటి దగ్గరికి అందించేది. కాని ఇప్పుడు ఆ తల్లే ఏమీ తెలీని చంటిపాపాయిగా మారిపోయింది. తనమీద ఒక్కసారిగా ముగ్గురు పిల్లలను చూసుకోవలసిన బాధ్యత మీదపడినట్టయింది.

శ్రీధరం చెప్పిన మాటల వల్ల అలా కూడా  అనుకోబుధ్ధికావటంలేదు. ఇన్నేళ్ళు నిన్ను చిన్నపిల్లలా చూసుకున్నావిడకి అనుకోకుండా ఇంత విపరీతం జరిగితే ఆవిడని నువ్వింకెంత జాగ్రత్తగా చూసుకోవాలో ఆలోచించు  అంటూ తనకి చేతనైనంత తనూ సాయం చేయడం మొదలుపెట్టాడు.

ఈ రెండేళ్ళనుంచీ తన షెడ్యూల్ అంతా మార్చేసుకుంది. స్కూల్ నుంచి పిల్లల్ని తెచ్చుకునే బాధ్యత శ్రీధరం తనమీద వేసుకున్నాడు. అమీర్ పేటలో వుండే తను , హిమాయత్ నగర్ లో స్కూల్ లో పనిచేస్తోంది. రోజూ స్కూల్ అవగానే ఇంటికొచ్చేసే తను , ఇంటికి రాకుండా ఉప్పల్ లో వున్న తల్లి దగ్గరికి వెడుతుంది. అక్కడ ఇరవై నాలుగ్గంటలూ తల్లిని చూసుకోడానికి ఒక మనిషిని పెట్టింది. అయినా సరే, రోజూ సాయంత్రం స్కూల్ అవగానే అటే పరిగెడుతుంది మనసు. తనని చూడగానే అమ్మ మొహంలో కనపడే రిలీఫ్ చూడగానే తనకే అమ్మయ్య అనిపిస్తుంది. ఏదో ఒకటి తినడానికి తీసికెడితే, ఎంతో ఆతృతగా, సంబరంగా తినేది. మనసు స్థిరంగా లేకో..ఏమో.. ఎన్ని పళ్ళు తిన్నా.. “ఇంకా లేవా..” అనేది. కడుపు నిండినట్టు కూడా తెలిసేదికాదు. చంటిపిల్లలకి చెప్పినట్టు “ఇంక చాలు..” అని చెపితే బుధ్ధిగా విని మళ్ళీ అడిగేదికాదు. కాని అమ్మకి అలాగ “ఇంక చాలు..” అని తను చెప్పలేకపోయేది. ఏదో తప్పు చేసినట్టు అనిపించేది. ఈ ఒక్క లోపం తప్పితే అమ్మకి మరేమీ విపరీత చేష్టలు వుండేవికావు. చక్కగా స్నానం చేసి, ఉతికిన చీర కట్టుకుని అలా కూర్చునేది. అంతే. ఒక మాటా వుండదు. మంతీ వుండదు. ఏదైనా పెడితే తింటుంది. లేకపోతే అడగదు. ఒక్కొక్కసారి కంచంలో పెట్టిన అన్నం కూడా రెండు మూడుసార్లు తినమని చెపితే కాని తినాలని తెలియనంత అమాయకురాలిగా అయిపోయింది. అంతకన్న ఆవిడ ఎవర్నీ ఇబ్బంది పెట్టదు.

కనీసం అలాగ కూడా రోజులు గడవకుండా ఇప్పుడు తల్లి కోసం పెట్టిన మనిషి మానేస్తానంటోంది.  ఇరవై నాలుగ్గంటలూ తల్లితో ఒకరు పక్కన వుండి తీరాల్సిన పరిస్థితి. పదిరోజుల్నించి ప్రయత్నిస్తున్నా ఎవరూ దొరకలేదు. ఇంక ఆరాత్రి శ్రీధరం అన్నాడు.

“పోనీ మీ అమ్మగార్ని ఇక్కడికే తీసుకొచ్చెయ్యొచ్చుకదా. ఎలాగూ ఆ పక్కనున్న రెండుగదుల వాటా ఖాళీ అయింది. ఇంకెవరికీ అద్దెకివ్వకుండా ఒకదాంట్లో మీ అమ్మగారుంటే, ఇంకోటి పిల్లలు చదువుకుందుకు పనికొస్తుంది. వాళ్ళు కూడా పెద్దక్లాసులకొస్తున్నారు. నీకు కూడా రోజూ బస్సుల్లో పడి అంతంత దూరం  తిరిగే శ్రమ తప్పుతుంది.”

శ్రీధరం అన్నమాటకి ఏం చెప్పాలో తెలీలేదు సరళకి.

ఒక రకంగా అతను చెప్పింది బాగానే వుంది. లంక మేత గోదావరీత లాగ తనకి రోజూ ఈ తిరుగుడు తప్పుతుంది. కాని ఇక్కడకంటే తన అత్తగారికి కష్టంకదా.. ఈ వయసులో ఆవిడ మీద తన తల్లి భారం పెట్టడం ఉచితంగా అనిపించలేదు సరళకి. అదే అంది శ్రీధరంతో.

శ్రీధరం ఇంకా హైస్కూల్ లో చదువుతున్నప్పుడే అతని తండ్రి చనిపోయాడు. అప్పట్నించీ ఉన్న స్వంత ఇంటిలో ఒకవాటా అద్దెకిచ్చి, వున్న డబ్బుని ఫిక్సెడ్ లో వేసి, దాని మీద వచ్చే వడ్డీతో శ్రీధరాన్ని చదివించి, ప్రయోజకుణ్ణి చేసి ఒక ఇంటివాణ్ణి చేసిందావిడ. ఒక్కత్తీ జీవితంలో ఆటుపోట్లని ఎదుర్కుంటూ కొడుకుని ప్రయోజకుణ్ణి చెయ్యడమంటే మాటలుకాదు. దానికోసం ఆవిడ ఎన్నో నియమనిబంధనలు పెట్టుకుంది. కొడుకుని కూడా అలాగే క్రమశిక్షణతో పెంచింది.

ఒక్క పైసాకూడా వృధాగా ఖర్చు చేయదావిడ. అలాగే ఒక్క అన్నం మెతుకు కూడా వృధా చెయ్యదు. కాంతమ్మ సరిగ్గా అన్నీ కొలిచి వండుతుంది. ఆవిడ ఎంత పెడితే అంతే తినడం అలవాటయింది శ్రీధరానికి ఒకరోజు కడుపు నిండలేదనీ, మరోరోజు అన్నం ఎక్కువయ్యిందనీ అనడు. తను ఇంతే తినాలి అన్నట్టు తినేస్తాడు ..అంతే.

పెళ్ళయ్యేక కూడా వండిందంతా తనకి, కొడుక్కి, కోడలికీ ముగ్గురికీ మూడు కంచాల్లోనూ సరిగ్గా వడ్డించేసేది ఆవిడ. కూరలు కూడా అంతే. ఎక్కడా పడెయ్యడం కానీ, మిగిలిపోవడం కానీ వుండదు.

పెళ్ళైన కొత్తలో సరళకి ఇదంతా అలవాటు లేక కొంచెం కొంచెమే తినేసి వదిలేసేది. అమ్మ కొసరి కొసరి పెట్టడం అలవాటు వల్ల ఒక్కసారి తినలేకపోయేది. కాని శ్రీధరం తల్లి కాంతమ్మ, మర్నాడు కోడలికి కూర తగ్గించి వేసేది పడెయ్యకుండా.

తినే తిండే కాదు..కట్టుకునే బట్ట, ఖర్చు పెట్టే ప్రతి పైసా ఆవిడ అజమాయిషీలో జరుగుతుందక్కడ.

మామూలుగా అయితే సరళకి ఏమీ అభ్యంతరం లేదు. పైగా ఆవిడ అంత చక్కగా కొడుకుని పెంచి, ప్రయోజకుణ్ణి చేసినందుకు కాంతమ్మ నిర్వాకానికి అబ్బురపడుతుంది కూడా..
సరళ ఆలోచిస్తున్నది ఒక్కటే. ఇంకా ఈ వయసులో కూడా ఆవిడ తన ఉద్యోగం వల్ల మనవళ్ళని చూసుకోడం తప్పటంలేదు. పొద్దున్న ఇంట్లో వున్నంతసేపు ఆవిడకి ఎంత సాయం చేసినా, సాయంత్రం తను తల్లిని చూసుకుని వచ్చేటప్పటికి చీకటి పడిపోతుంది. సాయంకాలమనగా వచ్చిన పిల్లలకి కాస్త తినడానికేదైనా పెట్టి, వాళ్ళని చదువుకుందుకు కూర్చోపెట్టడమంటే అంత చిన్న విషయమేవీ కాదు. దానికావిడ పాపం ఏమాత్రం విసుక్కోకుండా చేస్తోంది.

అటువంటప్పుడు ఇప్పుడు ఏపనీ చేయలేని, మతి సరిగా లేని తన తల్లిని కూడా తెచ్చి ఆవిడ నెత్తి మీద పెట్టడం ఏం బాగుంటుంది.. సరళకి ఆ మాట అస్సలు నచ్చలేదు. అదే చెప్పింది శ్రీధరంతో.

“మరింక మనిషి దొరకకపోతే ఏం చేస్తావ్?” అనడిగేడు.

“అదే అర్ధం కావటంలేదు. ”

“పోనీ..ఏదైనా హోమ్ లో చేరుస్తావా..?” మళ్ళీ అడిగేడు.

ఆ ఊహకే కడుపు లోంచి దుఃఖం తన్నుకుంటూ వచ్చేసింది సరళకి.

చిన్నప్పట్నించీ అబ్బరంగా తనని కని, పెంచిన తల్లిని అనాధ లాగ అలా హోమ్ లో పెట్టడం అనుకుంటేనే బాధేస్తోంది. రాత్రి పడుకున్నప్పుడు తండ్రి కలలో కొచ్చి, “ఇలా చేసేవేంటమ్మా..?” అని అడిగినట్టు అనిపించి ఉలిక్కిపడి లేస్తోంది.

“పోనీ ఉద్యోగం మానేస్తేనో”.. అనుకుంది.

కాని ఏదో వేన్నీళ్ళకి చన్నీళ్ళలాగ శ్రీధరం తెచ్చే డబ్బు ఇంటి ఖర్చులకి వాడుకుంటూ, తన జీతం రేప్పొద్దున్న పిల్లల చదువులకీ, పెళ్ళిళ్ళకీ అని ఒకచోట చేరుస్తోంది. ఇదీ తన అత్తగారిచ్చిన సలహాయే.

సంసారంలో ఖర్చులకి అంతు ఉండదనీ, సంపాదించుకుంటున్నప్పుడే  కొంచెమైనా దాచుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందవుతుందనీ కోడలికి చెప్పిందావిడ. వేరే వ్యాపారాలూ, వ్యవహారాలూ లేవు కనుక ఉన్నదానినే జాగ్రత్త చేసుకోవాలని హితవు చెప్పిన అత్తగారి మాట శిరోధార్యమైంది సరళకి. అందుకని ఉద్యోగం మానలేదు.

ఇంక ఏదారీ కనపడక శ్రీధరం చెప్పినట్టే చెయ్యక తప్పలేదు సరళకి. దానికి సరళ అత్తగారు కాంతమ్మ కూడా సమర్ధించింది. ఆవిడంతట ఆవిడే సరళతో చెప్పింది.

“సరళా, అబ్బాయి చెప్పినట్టు చెయ్యమ్మా.. మతిస్థిమితం లేనంతలో ఆవిడ ఎవర్నీ తిట్టదు, కొట్టదు కదా. అందరికీ వండినప్పుడే ఆవిడకీ ఇంకో గుప్పెడు బియ్యం ఎక్కువేస్తే సరిపోతుంది. ఆవిడని ఇక్కడికి తెచ్చుకుంటే ఆ ఇంటికి అద్దే వస్తుంది. పైగా నెల నెలా ఆవిడకోసం మనిషికి పెట్టే  డబ్బూ మిగులుతుంది. నీకు కూడా స్కూల్ లో ఆవిడ గురించి టెన్షన్ వుండదు.”

పైకి చూడ్డానికి అన్నీ బాగానే వున్నాయి. శ్రీధరం, అత్తగారూ కూడా సమస్యని సానుభూతి తోనే పరిష్కరించారు.

కాని, సరళకే… ఏమిటో.. అత్తగారి దగ్గర తల్లిని వదలాలంటే మనసు ఒప్పుకోవటంలేదు. ప్రతీ చిన్న విషయాన్నీ సున్నితంగా అలోచించే దృష్టి తల్లి దయితే.. అదే విషయాన్ని ప్రాక్టికల్ గా అలోచించే మనిషి కాంతమ్మ. ఇద్దరి మనస్తత్వాలకీ చాలా తేడా వుంది. మెదడుతో అత్తగారు ఆలోచిస్తే, మనసుతో తల్లి ఆలోచిస్తుంది. రాగద్వేషాలు లేకుండా ప్రాక్టికల్ గా అత్తగారు ప్రవర్తిస్తే, ప్రతి చిన్న విషయాన్నీ మనసుకి పట్టించేసుకుని బాధ పడిపోయే మనస్తత్వం తల్లిది. తనకి కావల్సినదానికోసం శత్రువుతో నైనా మంచిగా మాట్లాడి పని చేయించుకునే తెలివితేటలు అత్తగారి వయితే, తనకి ఏమైనా కావాలని కూడా తెలియని మనసు ఆ పిచ్చితల్లిది.

ఎంత మనసు ఒప్పుకోకపోయినా పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల సరళకి తల్లిని తెచ్చుకుని ఇంట్లోనే వుంచుకోక తప్పలేదు.

ఇంట్లో తల్లి ఒంటరిగా లేదు, ఏమైనా అయితే చూసుకుందుకు ఆ ఇంట్లో అత్తగారు వుంది అన్న ఒక్క విషయమే సరళని స్కూల్ లో శాంతిగా వుండనిస్తోంది. ఉదయం స్కూల్ కి వచ్చే ముందే పిల్లలతో పాటు తల్లికి కూడా ఏమైనా తినడానికి పెట్టి వద్దామంటే అంత ఉదయమే ఏడుగంటలకే ఏమీ తినలేకపోతోంది. ఇది చూసిన కాంతమ్మ తను తింటున్నప్పుడు తాయారమ్మకి కూడా పెడతానన్నట్టు చెప్పింది. అలాగే జరుగుతోంది.

కాని కాంతమ్మ పెట్టిన అన్నం తాయారమ్మ ఒక్కొక్కరోజు తింటోంది.. ఒక్కొక్కరోజు ఆ కంచం అలాగే వుంటోంది. ఈ మధ్య వారంలో రెండుమూడుసార్లు సరళ సాయంత్రం వెళ్ళేసరికి తాయారమ్మ గదిలో నిండుగా వడ్డించిన కంచం అలాగే వుంది. చుట్టూ చీమలు పట్టేసి వున్నాయి. తాయారమ్మ ఒళ్ళు తెలీకుండా నిద్రపోతోంది. నీరైపోయింది సరళ. పోనీ మళ్ళీ అన్నం తెచ్చి పెడదామంటే కాంతమ్మ సరిగ్గా సరిపడా వండి అందరికీ సద్దేస్తుంది. ఇంక తిందామన్నా ఇంట్లో అన్నం వుండదు. మళ్ళీ రాత్రి వంట అయాక తీసికెళ్ళి దగ్గర కూర్చుని తినిపించేది సరళ. అప్పటివరకూ తల్లి తాయారమ్మ కన్న ఎక్కువగా అత్తగారు కాంతమ్మ వంట ఎప్పుడు పూర్తి చేస్తుందా అని సరళ కొట్టుకుపోయేది.

ఆరోజు స్కూల్ లో పిల్లలకు పరీక్షలుండడం వల్ల సరళ రోజూ కన్న తొందరగా స్కూల్ కి వెళ్ళిపోయింది. అప్పటికింకా కాంతమ్మకి వంట అవలేదు. ఈ ఒక్కరోజుకీ వచ్చి తింటానని చెప్పి వెళ్ళిపోయింది సరళ.

స్కూల్ లో పరీక్ష అయ్యాక మేనేజ్ మెంట్ టీచర్లందరికీ మీటింగ్ పెట్టింది. అది పూర్తయేసరికి  సాయంత్రం అయిపోయింది. పొద్దున్న తాగిన కాఫీ సరళకి అంతే.. ఆ స్కూల్ లో ఏమైనా కొనుక్కుని తిందామన్నా కూడా దొరకవు. పరీక్ష అవగానే ఇంటికి వెళ్ళిపోతే బాగుండును.. కాని ఈ మీటింగ్ వల్ల మరీ ఆలస్యమయింది.

ఉదయం నుంఛీ కడుపులో ఏమీ పడకపోవడం వల్ల లోపలంతా తిప్పుతున్నట్టుగా వుంది సరళకి. ఇంటికి రాగానే గబగబా కాళ్ళూ చేతులూ కడుక్కుని వంటింట్లో కెళ్ళింది సరళ. అప్పటిదాకా సరళ ఎప్పుడొస్తుందా అని చూస్తున్న కాంతమ్మ సరళ రాగానే తలుపులు చూసుకోమని చెప్పి గుళ్ళొ పురాణం వినాలంటూ వెళ్ళింది. వంటింట్లో కాంతమ్మ తనకోసం మూతపెట్టి వుంచిన అన్నం కంచంలో పెట్టుకుని తినబోతూ ఎందుకో తలెత్తి చూసిన సరళకి తల్లి తాయారమ్మ కిటికీలోంచి చూస్తూ కనపడింది. ఒక్క ఉదుటన తల్లి గదిలోకి వెళ్ళింది సరళ. ఆవిడ భావరహితంగా కూతురినే చూస్తోంది. తాయారమ్మ తిన్న కంచం కోసం చూసిన సరళకి అక్కడే ఒక పక్కన నిండుగా వున్న ఆ కంచం కనిపించింది. దగ్గరికెళ్ళి చూసింది. ఎప్పుడో పొద్దున్న కంచంలో పెట్టిన అన్నం, కూరా గాలికి ఆరిపోయి, ఎండిపోయినట్టు వున్నాయి. అన్నం చుట్టూ చీమలు చేరి అది ఒక చీమల పుట్ట లాగా కనిపిస్తోంది. అంటే అత్తగారు ఆవిడ పధ్ధతి ప్రకారం తాయారమ్మకి అన్నం వండి పెట్టేసారు.. అంతే.. అది ఆవిడ తిన్నారో లేదో చూసుకోవలసిన అవసరం ఆవిడకి లేదు. ఆవిడ పని అయిపోయింది అంతే. అది చూస్తుంటే సరళకి కడుపు తరుక్కుపోయింది. ఎవరిని తప్పు పట్టాలో తెలీలేదు.

“ఆకలేస్తోందా… అన్నం తింటావా..” తల్లిని నెమ్మదిగా అడిగింది.

“పెడతావా…?”

అంతకన్న నెమ్మదిగా తాయారమ్మ అడిగింది.

పొంగుకొచ్చే దుఃఖాన్ని అదుముకుంటూ, కంచంలో పెట్టుకున్న అన్నాన్ని తెచ్చి, కొంచెం కొంచెంగా తల్లి నోటికి అందించింది సరళ..

ఆతృతగా తింటున్న తల్లిని చూస్తుంటే కడుపు నిండిపోయింది సరళకి…

కడుపునిండిన తాయారమ్మకి కన్ను మడతపడింది.

నిద్రలోకి జారిన తల్లిని జాగ్రత్తగా మంచం మీద పడుకోబెట్టి ఇవతలికి వచ్చిన సరళకి పిచ్చి పట్టినట్తైంది.

ఏం చెయ్యాలో తెలీలేదు. తన భర్తని చూసుకుందుకు అతని తల్లి వుంది. తన పిల్లల్ని చూసుకుందుకు వాళ్ల తండ్రి వున్నాడు. తనని చూసుకుందుకు భర్త వున్నాడు. మరి తన తల్లిని చూసుకుందుకు తను తప్పితే మరెవరూ కనిపించలేదు సరళకి.

“ఎంత డబ్బుంటే అంతలోనే గడుపుకుంటాను. ఏడాదికి ఒక్క బట్టే కొనుక్కుంటాను. అంతగా అయితే ఒక్కపూటే తింటాను. అంతేకాని అమ్మని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఎక్కడికీ పోను” అని నిర్ణయించేసుకుంది.

మళ్ళీ మనసు మారిపోకుండా వెంటనే ఒక కాగితం తీసుకుని తన ఉద్యోగానికి రాజీనామా రాసేసింది.

తేలికపడిన మనసుతో తల్లికి చల్లగాలి తగలకుండా జాగ్రత్తగా దుప్పటి కప్పింది సరళ.

***