Archives for September 2016

అనిర్దేశిత లక్ష్యమే నా గమ్యం!

geeta2

పసుపులేటి  గీతతో  అక్బర్  మాటామంతీ 

 

అక్బర్: శ్రీకాళహస్తి నుంచి హైదరబాదుకు ఆరువందల మైళ్ళ దూరం ప్రయాణం,పాతికేళ్ళ జర్నలిజం, కవిత్వం, కథారచన,పన్నెండు పుస్తకాల అనువాదం…..,యిప్పుడిక అన్నీ వదిలి బొమ్మల్లోకి యెందుకు అడుగు పెట్టారు?

పసుపులేటి  గీత: కవిత్వం రాయక  ముందే నేను బొమ్మలు గీసాను. ఆరేడేళ్ళ వయసు నుంచే నేను బొమ్మలు గీసేదాన్ని. బొమ్మలంటే నాకు అప్పుడు చాలా యిష్టంగా వేసుకొనేదాన్ని. కాని మా నాన్న గారికి సాహిత్యమంటనేే మక్కువ. నాకు నాన్న అంటే  ప్రాణం. అందుకే ఆయన కోసం నా యిష్టాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. ఆ తరువాత నాన్నగారి యిష్టం ప్రకారమే జర్నలిజంలోకి ప్రవేశించాను. వుద్యోగ జీవితం మొదలయ్యాక నా సమయాన్ని, శక్తిని రచన కొసమే వెచ్చించాను. యీ సంగతి నీకు కూడా తెలుసు కదా!
అసలు మనిద్దరి పరిచయానికి,పెళ్ళికి  యీ యిష్టాలు కలవడమే కదా కారణం.

అక్బర్: నేను పరిచయం అయ్యాక కూడ నీ శ్రధ్ధాశక్తులు సాహిత్యం వైపే యెక్కువగా వుండేవి. నేను బొమ్మలు వేస్తుంటే తూనీగలాగ నా చుట్టూ తిరగడమే కాని కుదురుగా కూర్చొని వొక బొమ్మైనా వేసావా?

గీత: నిజమే, నువ్వు బొమ్మ వేస్తుంటే తపస్సు చేస్తున్నట్టే వుంటుంది. నిన్ను అలా చూడటం నాకు చాలా యిష్టం.
నువ్వు బొమ్మలు వేస్తుంటే నేను వేస్తున్నటే ఫీల్ అయ్యేదాన్ని.

అక్బర్‌ : నీకు చిన్నప్పటి నుంచి బొమ్మలు చేయడమంటే చాల యిష్టం కదా, నిన్ను యెవరు యెంకరేజ్ చేయలేదా?

గీత: ఊఁ ..హు యింట్లో అలాంటి వాతావరణం వుండేది కాదు. పైగా మా వూర్లో చిత్రలేఖనానికి సంబంధించిన సామాగ్రి లభించేది కాదు.వాటి పట్ల అవగాహన కూడా లేదు. పెన్సిళ్ళు, డ్రాయింగ్ షీట్లు మాత్రమే దొరికేవి. చూసిందానినంతా అచ్చుగుద్దినట్టు గీసేయాలన్నంతా ఆతృత. వుదయాన్నే నిద్రలేచినప్పటి నుంచి నిద్దురపోయేంత వరకు అదే పని. సెలవు రోజుల్లో కూడా యెక్కడికి వెళ్లేదాన్ని కాదు. అందుకేనేమో నాన్నగారు నాకు బాగా అరిచేవారు. దాంతో ఆయనకు యీ పని అస్సలు యిష్టం లేదేమోనని నెమ్మదిగా బొమ్మలు గీయటం తగ్గించేసాను. గంటల కొద్ది పుస్తకాలు చదివితే తిట్టని ఆయన బొమ్మలు గీస్తే మాత్రం కోపగించుకొనేవారు.యిదే ఆయన మీద ఫిర్యాదు కాదు.అలా యెందుకు కోప్పడేవారో యిప్పటికి నాకు అర్థం కాక పోవడం బాధగానే వుంది.

అక్బర్:
జర్నలిజం,కవిత్వం,కథ…..యిప్పుడు చిత్రకళ,దీని తరువాత యింకా  యే యే కళారూపాలు నీలో దాగున్నాయో ?

గీత: నేను యెప్పుడూ జీవితంలో లక్ష్యాలను నిర్దేశించుకోలేదు. యేది ముందే అనుకొని చేయలేదు. కవిత్వం రాయలనుకొని రాయలేదు. బాల్యంలో చదివిన రష్యన్,మార్క్సిస్టు లిటరేచరే నన్ను సాహిత్యం వైపు నడిపించింది.యిప్పుడిక బొమ్మలంటావా, ఆరు నెలలు స్నేహం చేస్తే వారు వీరు అవుతారట, నువ్వు, నేనవడం లేదు కాబట్టి. నేనే నువ్వవుతున్నాను…అ హ్హా.హా…బొమ్మల తరువాత యేమిటీ అంటే యేమో నాకేం తెలుసు. అన్నీ వదిలేసి చటుక్కున మాయమైపోతానేమో..

geeta3

అక్బర్‌ : వేదాంతం చాలు గాని, యిప్పుడు జంతువులను వేస్తున్నావు కదా, యిదే సబ్జెక్టుగా యెంచుకోవడానికి గల కారణమేమిటి?

గీత: నాకు జంతువులంటే గౌరవం. ప్రకృతి వైవిధ్యాన్ని ప్రసాదించినట్టే, యేకరూపతను కూడా ప్రసాదించింది. యే జంతువు తన జాతిలో మిగతా జంతువుల కంటే భిన్నంగా వుండాలని, కనిపించాలని కోరుకోదు.కాని మనిషి మాత్రమే యిలా కోరుకుంటాడు. జంతువులలోని యీ లక్షణం నాకు గొప్పగా కనిపిస్తుంది. అందుకే నేను యీ సబ్జెక్టును యెంచుకొన్నాను.

అక్బర్ : నీకు అందులో యే ప్రక్రియ, యే మాధ్యమం అంటే యిష్టం?

గీత: నాకు యింక్ డ్రాయింగు అంటే చాలా యిష్టం. చార్కోల్, వాటర్ కలర్స్, ఆక్రిలిక్ రంగులతో పైంట్ చేయడమన్నా యిష్టమే. నేనిప్పుడు వేస్తున్న యానిమల్స్ సీరీస్ లో ఆక్రలిక్ పైంటింగ్ తో పాటు, యింక్ డ్రాయింగ్స్‌ కూడా వేస్తున్నాను.

అక్బర్ : నీకు యిష్టమైన చిత్రకారులెవరూ…..నేను కాకుండా ఆ..హ్హా..హా..?

గీత: ఫ్రాన్సిస్ బెకన్, యిగోన్ షీలే, పియెట్ మాండ్రియన్, వాంగోలతో పాటు యిప్పటి నాడియా టొనాజ్జో, బెక్సిన్ స్కీ, జిస్తావ్, వికం షిలేగల్ లు, మన వడ్డాది పాపయ్య కూడా బాగా యిష్టం.

geeta1

అక్బర్: పెయింటింగ్ లో  ముందు ముందు యింకా యేం యేం చేయాలనుకొంటున్నావు?

గీత: ముఖ్యంగా సోలో షో చేయాలని వుంది. దాని కన్నా ముందు కొన్ని గ్రూప్ షోలు, అందులో క్యాంప్ లలో పాల్గొనాల్సి వుంది.

అక్బర్ : నీ కవిత్వంలో, కథల్లో సామాజిక దృక్కోణం వుంటుంది ,కాని బొమ్మలు అందుకు కొంత భిన్నంగా వున్నాయి, కారణం?

గీత: నేను సీరియస్ గా చెప్పదల్చుకొన్న విషయాన్ని సూటిగా వ్యక్తీకరించేందుకు కవితలు,కథలు రాసాను. బొమ్మల విషయానికి వస్తే అవి నన్ను పాజిటివ్ గా రెజువెనేట్ చేసుకొనేందుకు వొక మార్గం. కాబట్టే యీ తేడా.

అక్బర్:  కవితా సంకలనం, ఆర్ట్ షోలు యెప్పుడు చూడవచ్చు?

గీత: త్వరలో నా రెండో కవితా సంకలనాన్ని తెస్తాను. కథల అచ్చుకు కొంత సమయం పట్టవచ్చును.

*

కొత్త మలుపులో మన కథ!

Katha-15 Cover

 

గత పాతికేళ్లుగా ఉత్తమ తెలుగు కథలకు చిరునామాగా నిలిచాయి కథా సాహితీ వెలువరిస్తున్న వార్షిక సంకలనాలు.  వాసిరెడ్డి నవీన్,  పాపినేని శివశంకర్ ల ఆధ్వర్యంలో నిరాటంకంగా సాగుతున్న ఆ కథా యజ్ఞం ఈ ఏడాదితో ఇరవయ్యారో వార్షిక సంకలనానికి చేరుకుంది.  ఆ క్రమంలో కథ- 2015 ఆవిష్కరణ ఇవాళ ( సెప్టెంబర్ 4- 2016 ) కాకినాడలో జరగబోతోంది.

ఆ సందర్బంగా ఆ కథా సంకలనానికి ఎంపికైన రచయితలతో  ముచ్చటించింది సారంగ. ఇవాళ్టి కథా రచయితలు కథా ప్రక్రియను ఎలా చూస్తున్నారు? కథ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ?? అసలు కథలు ఎందుకు రాస్తున్నారు??? అని అడిగితే ఇలా స్పందించారు. 

 

 

జాన్సన్  చోరగుడి


johnson
కథ నాకు వ్యాసాల రొటీన్ నుంచి అవుటింగ్ లాంటిది. కథలు రాయడం కథలు చదవడంతో మొదలవుతుంది. చదివిన కథ మనలో కొత్త గవాక్షాన్ని తెరుస్తుంది. ఫలితంగా మన మనోఫలకం మీద నూతన ఆవిష్కరణ జరుగుతుంది. అన్నీ సరిగ్గా కుదిరితే మనం రాసింది గొప్ప కథ కూడా కావచ్చు.  నేను చాన్నాళ్లు మంచి కథలు చదివాక, కథలు రాయాలనుకున్నాను.  అది కూడా ఆలస్యంగా కథలు రాయడం మొదలు పెట్టాను. ఇప్పటి దాకా పదిహేను కథలు రాశాను. వెనక్కు తిరిగి చూస్తే ఇప్పటికీ నేను రాయాల్సిన కథలు ఇంకా చాలా ఉన్నాయనిపిస్తుంది.
వ్యాస రచన నా ప్రధాన వ్యాపకం. ఆ రొటీన్ నుంచి బయటపడేందుకు కథలు రాస్తుంటాను. ఈ కథా సంకలనానికి ఎంపికైన …చివరి చర్మకారుడూ లేడు నాకోసం రాసుకున్న కథ. నా వ్యాసాలు అందరికోసం రాస్తే…. ఈ కథ మాత్రం నాకోసం రాసుకున్నాను. కానీ ఈ కథను చాలామంది తమదిగా  చేసుకున్నారు.  ఫోన్లు చేసి స్పందించారు.  అప్పటివరకూ అంతర్లీనంగా వున్న కల్చరల్ ఐడెంటిటీ క్రైసిస్ నుంచి వాళ్లు వెంటిలేట్ కావడాన్ని నేను గమనించాను. అస్తిత్వ ఉద్యమ ఫిలాసఫీ గొప్పతనమది. ఇందులో నేను కేవలం కేటలిస్టును మాత్రమే. తెలిసిన జీవితం కనుక తేలిగ్గా రికార్డు చేయగలిగాను. ఇప్పటిదాకా నాకు కనిపించిన దాని గురించి రాశాను. భవిష్యత్ లో కూడా రాస్తాను.

కే.ఎన్. మల్లీశ్వరి
malliswariఏ కథ ఎందుకు రాశావు అంటే చెప్పడానికి ప్రయత్నించగలనేమో కానీ కథలెందుకు రాస్తారు అంటే మాత్రం తత్తరపాటుగా వుంటుంది. రెడీమేడ్ సమాధానం నా వద్ద లేదు కనుక ఆలోచనలను గాలిపటం వలె ఆకాశంలోకి ఎగరేసి దారపు కొసను పదిలంగా పట్టుకోవడం కథకులకి తెలియాలి అనుకుంటాను. దానిని …శతపత్ర సుందరి కథలో కొంత ప్రాక్టీస్ చేశాను. స్వీయ నియంత్రణ వల్లనే చాలామంది గుర్తించిన
క్లుపత్తని ఆ కథలో సాధించగలిగాను.

అప్పటికి నాలుగేళ్లుగా నేను రాస్తున్న నవలలోని వందలాది ఘటనల్లోంచి రెండింటిని తీసుకుని కథగా మలిచాను. కనుక దాని నేపథ్యం విడిగా చెప్పడం సాధ్యపడదు. వందరేకలుగా వికసించే నవీన మహిళ జీవితంలోనుంచి వొక శకలాన్ని చిత్రించే ప్రయత్నం చేశాను. కథ వచ్చాక జరిగిన చర్చలోంచి గ్రహించగలిచే వొకటి రెండు అంశాలను మౌనంగా స్వీకరించాను. ముగింపు గురించిన ప్రశ్నలనూ అసంతృప్తులనూ గ్రహించాను. ఈ కథ గురించే కాకుండా సాధారణంగా నిశ్చయం, నిర్ణయాలతో కూడిన ముగింపులకి బాగా అలవాటు పడిపోయాం. కానీ జీవితపు నడకలో సందిగ్థస్థితి  ప్రభావమే ఎక్కువ. ఆస్థితిని చెప్పడం కోసమే కథని అట్లా ముగించాను.


విమల

 

విమల

నేను మొదట్లో కవిత్వం రాసేదాన్న.  తర్వాత వొకటి రెండు కథలు రాసిన తర్వాత కొంత విరామం తీసుకున్నాను. కవిత్వంలో చెప్పలేనిది కథ ద్వారా విస్తృతంగా ,  విభిన్నంగా చెప్పగలం. నాలోపల జరిగే ఘర్షణ, నేను నడిచొచ్చిన దారి, నేను చూసిన సమాజం…..నాలో ఆలోచనలను తట్టి లేపాయి. వాటిని సమాజంతో  వివరంగా పంచుకోవాలనిపించింది. ప్రతీ జీవితంలోని రకరకాల ఎత్తు పల్లాలుంటాయి.
వైరుధ్యాలుంటాయి.  నాకు నచ్చేవి, రాయాలనిపించేవి జీవితంలోని అనేక పార్వ్శాలను, మనిషిలోని పొరలను చెప్పగలగిన కథలు. అదే సమయంలో  కథలోపల సున్నితత్వం వుండాలి. జీవితం ఎంత విషాదంగా, దుర్మార్గంగా వున్నా కూడా….. దాంట్లో సౌందర్యం వుటుంది.  చీకట్లోంచి వెలుతురు చూసినట్లు ఆ సౌందర్యాన్ని కథలు చూపగలగాలి. వొక  ఉద్యమకారిణిగా సమాజంలో అనేక పరిణామాల్ని దగ్గర చూస్తుండడం వల్ల…రకరకాల జీవితాల్ని చూశాను. వాటిని కథ ద్వారా చెప్పాలనుకుంటాను.
అదే సమయంలో మన కథల్లో నిజాయతీ వుండాలి. మనం నమ్మని వాటిని రాయకూడదు.  అంటే రాసేదానికి,  జీవించేదానికి మధ్య పెద్ద అంతరం వుండకూడదు అని నేను నమ్ముతాను.   రచయితలుగా మనకు అనేక ప్రతిబంధకాలు వుంటాయి. వాటిని తెంచుకోగలగాలి. అనేక నియంత్రణలుంటాయి. మనం నమ్మింది చెప్పినపుడు సమాజం నుంచి కొంత వ్యతిరేకత రావచ్చు. దాన్ని ఎదుర్కోవడానికి రచయితలు సదా సిద్ధంగా వుండాలి. అలాగే రాసే విషయం పట్ల చిత్తశుద్ధి వుండాలి. ముఖ్యంగా  చెప్పాల్సింది….ప్రపంచీకరణలో భాగంగా ఇవాళ తెలుగు కథ కూడా మార్కెట్ వస్తువుగా మారుతోంది. సంచలనం కోసం, ప్రచారం కోసం రచయితలు ఆరాటపడుతున్నారు. సేలబిలిటీ…కోసం వెతుకుతున్నారు. ఇదో విషాదకరమైన పరిస్థితి. ఇన్ని ప్రతిబంధకాల మధ్య వీటన్నిటికీ లొంగకుండా నిజాయతీగా కథ
రాయాల్సిన బాధ్యత కథకుల మీద ఉంది.

ఉణుదుర్తి సుధాకర్
Sudhakar_Marine Linkకథా సాహితికి నా కథ ఎంపిక కావడం సంతోషకరం. కథలు చెప్పడం చాలా కష్టం. కవిత్వం రాయడం అందరివల్ల సాధ్యం కాదు. నాకు కథలు రాయడం సాధ్యమనిపించింది. నాకు కొన్ని విషయాల పట్ల..ప్రధానంగా చరిత్ర పట్ల ఆసక్తి వుంది. చరిత్ర లోతుల గురించి ఎక్కువగా తెలుసుకుంటాను. ఆ వెతుకులాటలోనే ఆనందాన్ని వెతుకుుంటాను. ఆ ఆనందాన్ని, నేను తెలుసుకున్న సంగతులను కథ ద్వారా చెప్పాలనుకుంటాను. రచయిత కథ ద్వారా అనేక విషయాలు చెప్పొచ్చు.  కథ చిన్నదైనా దాని ద్వారా చాలా సంగతులు ప్రతిభావంతంగా చెప్పవచ్చు.  ప్రముఖ చరిత్రకారుడు ఇ.ఎచ్.కార్ అన్నట్లు ఎవరి చరిత్రలు వారికుంటాయి. చరిత్ర అంటే ఏక శిలా సదృశ్యంగా వొకటే వుండదు. స్త్రీలకు, దళితులకు, గిరిజనులకు….ఇలా రకరకాలుగా ఎవరి చరిత్ర వారికి వేరుగా వుంటుంది. ఇటువంటి విషయాలన్నీ చర్చించేందుకు నేను కథను రాస్తుంటాను.

చిన్నయ్య
కవిత్వం చెప్పలేని విషయాలు కథలో చెప్పగలం. కథలో జీవితాన్ని, జీవితంలో వస్తున్న మార్పులను వివరించవచ్చు. తద్వారా  సమాజాన్ని చూపే ప్రయత్నం చేస్తాము…ఈ చూపే క్రమంలో ఎవరి దృక్పథాలు వారికి వుండవచ్చు. మన దృక్పథం,  నిజాయతీ, ఆచరణను మన కథలు ప్రతిబింబిస్తాయి. కథ రాయడమంటే నా దృష్టిలో వ్యవసాయం చేసినంత కష్టమైన పని. ప్రతీ కథా ఆరుగాలం సేద్యం లాంటిది. పంట చేతికొచ్చేదాకా….రైతు కంటిమీద కునుకులేనట్లు కథ పూర్తయ్యే దాకా నేను ప్రతీక్షణం ఆరాటపడతాను. ఈ క్రమంలో రకరకాలుగా ఆవేదన చెందుతాను.

కొట్టం రామకృష్ణారెడ్డి
kottamకథ గురించి అనేక ఆలోచనలు , అంతర్మథనం జరిగాక ఇక రాయలేనప్పుడే కాగితం మీద కలం కదులుతుంది. ప్రసవానంతరం బిడ్డని చూసుకున్న తల్లికి  పురిటినొప్పుల బాధ మరిచిపోయేంత అలౌకికానందం కలుగుతుంది. కథ పూర్తి చేశాక రచయితకు కూడా అంతే.   కథ పుట్టాక మాతృత్వపు మాధుర్యం అనుభవంలోకి వస్తుంది. దాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు…?

 

ఎం.ఎస్.కే. కృష్ణజ్యోతి

jyothi

విషయ వ్యక్తీకరణలో కవిత్వం భావకుల సాధనం. వ్యాసం వొకింత మేధావుల ఆయుధం. ఐతే కథ ఈ రెండిటింకి భిన్నంగా వొక అంశాన్ని జన సామాన్యానికి సులువుగా చేరువ చేసే చక్కని మాధ్యమం. అప్పుడప్పుడే ఊహ తెలిసి వస్తున్న పసివానకి అనుభవాలతో తలపండిపోయిన వృద్ధునికి కూడా ఆసక్తి కలిగించేది కథ. ఇతర సారస్వత మాధ్యమాలకి భిన్నంగా కథలో నిజ జీవితంలో లాగానే ఓ సంఘర్షణ వుంటుంది. ఆ సంఘర్షణ కథకుని ఊహలోంచి లేదా అనుభవం లోంచి వస్తుంది. ఆ ఘర్షణ నుండే పాఠకుడు తనను తాను కథతో తాదాత్మ్యం అవుతాడు. ఇలా కథకునికి, ఇతర ప్రపంచానికి వొక లంకె ఏర్పడుతుంది. నేను నివసించే అతి చిన్న ప్రపంచం నుంచి విస్తృత ప్రపంచంతో సంభాషించడానికి నన్ను నేను అనంతంగా వ్యాప్తి చెందిచడానికి నేను కథను ఎంచుకున్నాను.

గుడిపల్లి నిరంజన్
niranjanనేను చూసిన దళిత, అణగారిన వర్గాల, స్త్రీల జీవితాల్ని చెప్పడానికి కథల్ని రాస్తున్నాను. దళితుల చుట్టూ , వాళ్ల జీవితాల చుట్టూ అనేక సమస్యలున్నాయి. వాటిని సమాజానికి తెలియజేయడం నా బాధ్యతగా నేను భావిస్తాను. దాని ద్వారా సమస్య పరిష్కారం కావచ్చు, కాకపోవచ్చు.

కానీ  సమాజానికి చూపడం మాత్రం అవసరం. వ్యక్తులు, కుటుంబాలతో పాటూ పల్లెలు, ప్రకృతి వనరుల విధ్వంసం యధేచ్చగా జరుగుతోంది. ఆ విధ్వంసాన్ని చూపే క్రమంలోనే నేను నా  నీరెటుకాడి కల… కథను రాశాను.

చందు-తులసి
chandu

కథ రాయడానికి ఫలానా కారణమంటూ ఉంటుందా….అని ఆలోచిస్తే, వెంటనే చెప్పలేము.  కానీ బహుశా బయటకి చెప్పలేని అంతర్మథనం, ఆవేదన, ఆర్తి తప్పకుండా వుంటుంది. సమాజంలోని సంఘటనలకు మనుషులు రకరకాలుగా స్పందించవచ్చు.  బహుశా రచయిత  స్పందన కథ రూపం తీసుకుంటుందేమో. ఆ స్పందన వెంటనే బయటకు రాకపోవచ్చు. కానీ ఏదో వొక రోజు తప్పక బయటకు వస్తుంది.  మొత్తంగా గుండె లోతుల్లోని చెప్పుకోలేని బాధ, వలపోత, దుఖ్ఖ సముద్రం… మనకు నచ్చిన వ్యక్తితోనో, సమాజంతోనో పంచుకోవాలి అన్న ఆరాటమే కథ రూపంలో వస్తుంది.  నా మొదటి కథ… ఊడలమర్రి అలా బయటకు వచ్చిందే.

* * *

 

మాయమ్మ నవ్వింది!

Kadha-Saranga-2-300x268

 

సాయంత్రం స్కూలు గంట కొట్టగానే ఏదో కొంపలు  ముంచుకపోతున్నట్టు సర్రన ఇంటికి పరిగెత్తుకొచ్చి  పుస్తకాలు దబే..ల్మని ఇంట్లో మూల పడేసి  రచ్చ దగ్గర ఆడుకోడానికి గడప దాటుతుండగా….. రేయ్  యాడకి పోతుండా …మీ నాయనొచ్చి లేవని తెలిస్తే కుంగా తంతాడ్లే …నాకెందుకులే  నాయనా పో…నువ్వు సెప్తే వినే బిడ్డవికాదు…  అమ్మ తొట్టి దగ్గర్నుంచి దబర్లు తోముతూ అరవగానే విని విననట్టు  ఒక్క వుదుటున రచ్చ దగ్గర్కొచ్చేసి తోటి సావాసగాళ్ళతో ఆటల్లొ మునిగిపోయాను రోజు మాదిరే…..కాని ఒకపక్క  నాయన కొడతాడని  కడుపులో భయం  ఇంకోపక్క ఆడుకోవాలని ఆశ .

నేనెప్పుడూ సదువుతుండాలని నాయన కోరిక ,   స్కూల్లో సదివింది సాలు ఇంట్లో కూడా సదువుకోవాలా.. మా నాయన లాంటోడు ఇంకెవరికి ఉండకూడదనుకుంటున్న సమయంలోనే దూరం నుంచి ఒకాయన ఇనప డబ్బాను కొట్టుకుంటూ వీధిలోకొచ్చి అరిశాడు .  ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశా మా నాయననుకొని.. తీరా సూస్తే మా వూరి యెట్టాయన దండోర యేసుకుంటూ  స్టోర్లో బియ్యం.. సక్కెర.. గోదుంలు.. కిరసనాయలొచ్చింది కావల్సినోల్లు తెచ్చుకోవచ్చహో… అని కేకేసేసరికే పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లైంది నాకు.

ఒరేయ్ మీ నాయన పిలుస్తున్నాడ్రారా అమ్మ నుంచి మరొ పిలుపు రాగానే  జింకెగిరినట్టు చెంగుమని అమ్మ దగ్గరకి గంతేసి కొంగుపట్టుకొని.. మ్మో.. నాయన కోపంగ వున్నాడా లేదా మావులుగా వున్నాడా?  యేమ్మా.. కొడ్తాడా నాయన …? “అహా కొట్టకుండా ముద్దుపెట్టుకుంటాడ్లే అంత భయం ఉన్నొడివి ఇంటికాడుండొచ్చుగదా  ఈ యాలకి మీ నాయన ఇంటికొచ్చేది తెలుసుగదా.. ఆడుకోకబోతే యేంవే.. నువ్వు తన్నించుకుంటావ్ నన్నూ తన్నిస్తావ్.. పొగులుపొద్దస్తం కష్టం జెయ్యాల ఇంటికొచ్చిన తరువాత మీ నాయన చేత నేను కూడా తన్నులు తినాల .. యిట్ట రాసిపెట్టుంది నాకు యేంజేద్దం నా కర్మ”  అమ్మ తిట్టినట్టుమాట్లాడగానే నాయన కొట్టకుండా ఉంటాడా… సంపేస్తాడనుకుంటూ అమ్మ యెనకాలే దాక్కొని ఇంటికొచ్చాను. నన్ను వదిలేసి సుట్టింట్లోకి బోయి  శాట్లో బియ్యం సెరుగుతూ రాల్లేరుకుంటూ కూర్చుంది అమ్మ.

పొద్దస్తమానం రెడ్డోరింటిదగ్గర  రెక్కల కష్టం సేసి, వాళ్ళు బెట్టిన పాసిపోయిన అన్నం తిని , వాళ్ళుతిట్టిన ఏకవచన తిట్ట్లతో పుట్టెడు శోకాన్ని కడుపులో ఉంచుకొని ఆ కసిని అమ్మ పైనా నాపైన తీర్చుకోవడానికన్నట్లు  నులక మంచం మీద కుచ్చోని బీడీ  తాగుతున్న మా నాయన కెదురుగా యెల్లి నిలబడ్డా. కనుగుడ్లు పెద్దవి చేసి పొగను పీల్చి వదులుతూ…

యేం రా ….యాడికి పోయావా..?
ఆడుకోడానికి.
తాటిబద్ద తీసుకొని రెండు వాయించొదిలిపెట్టి  మళ్ళీ మంచం మీద కూచొని  ఆ కాళ్ళకి మట్టేందిరా …? యెళ్ళి కడుక్కొ రా పో…. తొట్టి దగ్గరికి పోయి రెండు చెంబులు గబ గబా కాళ్ళ మీద గుమ్మరించుకొనొచ్చి మళ్ళీ అదే ప్లేసు లో నిలబడ్డా. భయం ఉంద్రా నీకస్సలా..చెప్పరా.. మౌనమే నన్ను ఆవహించింది. భయంతో వణుకుతూ వున్నాను.. యెన్ని సార్లు జెప్పాల్రా … నీకా… పాసి పొల్లుతో సదువుకొం టే సదువొస్తాదనా…

శూద్రోల్ల పిలకాయలు సూడ్రా  యెంత సుద్దంగా ఉంటారో..
మట్లో ఆడబాకరా అం టే ఆడ్తావ్… పొద్దన్నే లేసి సదవ్ మంటే సదవ్వూ …
మాస్టీల్నాకొడికివిరా నువ్వు ….నీకు యెన్ని సా..ర్లు జెప్పినా సిగ్గు లేదు… నువ్వు సదవవ్ పోరా  బర్లికాడికేపో …..ఛ …పొ… సెప్పి సెప్పి నా నోరు పోతుందె…. సందు లేకుండా తిట్టేసి ఆరిపొయిన బీడీ ముక్కని మళ్ళీ యెలిగించి ఒక్క దమ్ము లాగి వదిలితే గూడ్సు రైలు  పొగొచ్చినట్టు నా మొహాన్ని ఆవరించింది. దాన్ని ఒక చేత్తొ పక్కకు నెట్టి  యదా విధిగా మా నాయన సాయే సూస్తూ మా నాయన నన్ను యిడిపిస్తే పంజరం  యిడిసిన పక్క్షి లాగ యెగిరిపొవాలనిపించింది. రేయ్ యెల్లి సదువ్కో…తేప తేపకు సెప్పించుకోబాక నా సేత యిదే లాస్టు  సారి నీకు సెప్టం. తెల్లారకుముందే లేసి నన్ను అగ్గిపెట్టి అడిగి  దీపం బుడ్డి యెలిగించుకొని  సదువుకొవాలా సరేనా.. లేదంటే సేద్యంలో పెట్టాస్తా …అవతల నీ బతుకు నువ్ బతుక్కుంటావ్ అని మంచం మీద నించి లేచి అన్నం వండుతున్న అమ్మను ఒమే… ఊళ్ళోకి బోయి రెడ్డోరికి పాల బూతు లో పాలు పోసేసొస్తా పొద్దుబోతుంది లేదంటే రెడ్దమ్మ తిడ్తాది …. నేనొచ్చే లోకే రూపాయికి బీడీలు తెచ్చిపెట్టిండు …. అయ్యో  నయ్యా పైసా లేదయ్య స్టోర్లో బియ్యం, కిరసనాయిలు వచ్చాయంట ..నాకు కూల్డబ్బులు కూడా రాలా తెచ్హుకుందామంటేనా….ఈడ మొదులు లేకపోతే నీకు బీడీలు కావాలా..? ఒసేయ్ ఉంటాయ్ సూడో  అని నాయన బయటికెళ్ళిపోయాడు.

కొద్ది సేపు గోతాం యేసుకొని సదువుకొంటూ నాయన యెళ్ళిపొయిన కొద్దిసేపటికి లేసి అమ్మ యేడ్నీళ్ళు తోడితే  పైకి బోసుకొని యెన్నెల కింద మంచం యేసుకొని సెల్లెలు నేను కబుర్లు జెప్పుకుంటూ అన్నం తినకుండానే నిద్ర బొయ్యాం.

యెప్పుడొచ్చాడో తెలీదు పెద్ద పెద్ద అరుపులు యినిపిస్తున్నాయ్. యింటి పక్కలోల్లు మా యింటికొచ్చి వొద్దు రావయ్య వద్దు.. మా మాట యిను  అంటూ అగ్గిపెట్టి తీసి యింటికి నిప్పు అంటించబోతున్న నాయన్ని ఆపే ప్రయత్నం జేస్తున్నారు. యేమైందోనని సగం నిద్రలో ఉన్న మేము ఉలిక్కి పడి లేసేసరికే అమ్మ ఒక మూల నాయన కొట్టిన దెబ్బలకి వోర్చుకోలేక గుంజను పట్టుకొని  లెయ్యలేక లేసే ప్రయత్నం జేస్తుంది యిద్దరిమి అమ్మ దగ్గరికెళ్ళి నేనొక రెక్క చెల్లెలొక రెక్క పట్టుకొని అమ్మను లేవదీసి యింట్లోకి తీసుకొని పోతుండగా …చంపేస్తా లంజా ముండని… చంపేస్తా దాన్ని.. ఈ రోజు అదన్నా ఉండాలా.. నేనన్నా ఉండాల.. లేదంటే ..కూరాకు లో ఉప్పు ఎక్కువేస్తదా అదా..? ఎంత కొవ్వు దానికి …తిడుతూ అమ్మను కొట్టబోయి పుల్లుగా తాగి ఉండడం వల్ల మంచం కాడికి తట్టుకొని పడిపోయాడు. పక్కింటి పెద్దాయనొచ్చి నాయన్ని లేపి మంచం మీద పడుకోబెట్టి యెళ్ళిపోయాడు.

మా నాయన్ని చంపేయాలంత కోపం వచ్చింది కాని యేంవీ జెయ్యలేని పరిస్తితి. పెద్దవాడ్ని అయితే అపుడు సూస్తా మా నాయన సంగతనుకొని అమ్మను యింట్లోకి తీసుకొని  బోయి అన్నం పెట్టి  మేం గూడా రెండు ముద్దలు తిని అమ్మ పాత చీరలు కింద పర్చుకొని ముగ్గరిమిపొడుకొన్నాం. పొద్దన్నే లేసి సదవకపొతే నన్ను కూడా తంతాడు..  కళ్ళాపి సల్లేటప్పుడు నన్ను గూడా లేపు .. యేమి ఆలొసించకుండ పడుకొ అని అమ్మకి సెప్పేసి పడుకున్నా.పొద్దున్నే లేసి దీపం బుడ్డి యెలిగించుకొని పుస్తకం  తీసి సదువుకుంటుంటే బుర్రకి యేమీ యెక్కడం లేదు. రాత్రి జరిగిన సన్నివేశం పదే పదే జ్ఞాపకమొస్తుంది.. యెన్నో జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. అన్ని గుర్తుకొస్తున్నాయి మరిసిపొయే సంగటనలు యెప్పుడూ జరగలేదు మా యింట్లో. ప్రతిరోజు ఒక చేదు జ్ఞాపకమే…జ్ఞాపకం అనే దానికంటే అనుభవం అంటే బాగుంటాదనుకుంటా.  ఆకలి… ఆరాటం.. యేడుపులు… అన్ని అన్ని అనుభవాలే… తాగుడుకు డబ్బులు యియ్యకపోయినా.. కూరలో ఉప్పు యెక్కువైనా…కూట్లో సిన్న యెంటిక పడినా అమ్మను తన్నటమే తప్ప వోదార్చడం తెలియని తాగుబోతు తండ్రి చేస్టలు గుర్తుకొస్తున్నాయి… ఇలాయెన్నోసంఘటనలు తలచుకొని నిద్రపోని రాత్రులెన్నో…. .. దాపరికాలు లేని జీవితాలు కదా ..ఇట్లానే తెల్లారతాయి… ఒక పక్క కసితో రగులుతున్న ఆలోచనలు మరో పక్క అమ్మ జీవితం యెప్పుడు బాగు పడుతుందాని ఆవేదన… అమ్మ అమాయకపు నవ్వు యెప్పుడు కనిపిస్తుందోనని …అయ్యా అని నాయ్యన్ని యెప్పుడు ఆప్యాంగా పిలుస్తుందో అని ఆశ అందరి బిడ్దలకి మల్లే చిన్ని ఆశ.. ఆ ఆశకు కూడా అవకాశం రాల నాకు.

నాయన నిద్రలేస్తున్నాడని తెలిసి మళ్ళీ పుస్తకం మీదే ద్యాస…. తెల్లారింది… నాయన రెడ్డోరింటికి యెల్లి పోయాక దీపం ఆర్పి పైకి లేశా ఇంతలో  అమ్మ మంచి నీళ్ళ బిందె యింట్లో దించి ‘పొల్లు తోంకోండి నాయనా సద్దికూడు తిందురు’ అని పొయ్యి దగ్గరికి బోయి ఉడుకుతున్న యెసురులో నానిని బియ్యం బోసి మండుతున్న కట్టిపుల్లల్ని పొయ్యిలోకి యెక్కదోసి అక్కడే కూర్చొని పచ్చడిచెయ్యడానికి చింతపండు, టమాటాలు వున్నయా లేవా అని చిన్న బుట్టలో యెతుకుతుంది. పుస్తకాన్ని మూసి చెక్కమీద పెట్టేసరికే దానికానుకోనొన్న మరో చెక్క మీదున్న గిన్నెలు చెంబులు కింద పడి పెద్ద శబ్దం చేశాయి …నాయన నాయన నువ్వు ఒక్క పని చెయ్యవు రా… పుస్తకాలు అక్కడ పెట్టకుంటే కింద పెట్టుకోవచ్చు కదా….చెక్క మీదే పెట్టాలా ఒకాలా చెప్పో…నేను పెడ్తాను పో …నువ్వు బొయ్యి పొల్లు తోముకొని సద్దికూడు తిను నేను పనికి పోవాల లేదంటే మేస్త్రొచ్చి అరస్తాది. ..కోపంగా చెప్తూ కింద పడిన గిన్నెల్ చెంబుల్ని చెక్క మీద పెట్టి  పొయ్యి కాడకొచ్చి కూర్చొంది.

బొగ్గుతో గబ గబా పొల్లు తోముకొని అమ్మ దగ్గరికొచ్చి కూచ్చొన్న. అమ్మ మౌనంగా ఉంది. రోజూ అట్టుండదమ్మ.. యేదొ ఒకటి జెప్పి నన్ను చెల్లెల్ని నవ్విస్తూ వుంటాది. కొన్ని సార్లు పాటలు కూడా పాడతాది. పొలంలో కూడా నారేతేసేటప్పుడు బాగా పాడుతుందని యెనకింటి చెన్నవ్వ సెప్తే వి న్నాను.

పొలంలో నడుం నొప్పి పోవటానికి అమ్మకు పాటుంది ..కాని తాగొచ్చిన భర్త తన్నిన నొప్పికి అమ్మకి యేపాటాలేదు…యేడుపు పాట తప్ప.
యేమ్మా..అట్టుండావా..?
యేం నాయన నేను బాగనే ఉళ్ళా.
అయితే యేం మాట్లాడకుండా ఉన్నావ్..?
యేంలేదు వర్షం పడేట్టుంది పనుంటుందా ఉండదా అని ఆలోచిస్తున్నాన్లే అని మాట దాటేసి కూచోడానికి నాకు పీటిచ్చి సద్ది కూడు యెసుకోరాడానికి సుట్టింట్లొకెళ్ళింది..నాకర్ధమైంది అమ్మ అట్టా యెందుకంటుందో.. లోపల ఎంతో బాధున్నప్పటికి నాకు తెలిస్తే బాధపడ్తానని కడుపులో మింగేసి సంతోషంగా ఉన్నట్టు నా ముందు నటించిందని. చిన్న దబరలో సద్దెన్నం యేసుకొని నిప్పులో కాలబెట్టిన యెండి చేప తీసుకొని దాని పైనున్న మసి పోడానికి నేల మీద రెండు సార్లు తట్టి అది నా ముందు పెట్టి తినేసి బడికి పోండిద్దరు అని తన పైట కొంగులో కట్టుకున్న ముడినిప్పి ఇరవై పైసలు బిళ్ళను నా యెడంసేతిలో పెట్టి నువ్వు పది పైసలు సెల్లెలు పది పైసలు తీసుకోండని గబ గబా పచ్చడి చెసేసి చిన్న కాడగిన్నెలో సద్దెన్నం పెట్టుకొని జాగ్రత్తలు జెప్పి కూలోల్లో కలిసిపోయి పనికెళ్ళిపోయింది.

కొద్దిసేపటి తర్వాత యెనక్కొచ్చి నాయనా అని పిలిచింది యెప్పుడూ పేరుపెట్టి పిలిచింది లేదమ్మ. నాయనా.. లేదంటే కొడుకా అని పిలుస్తుంది. యెనక్కి తిరిగి ..యేమ్మా మళ్ళీ వచ్చావా..? వర్షం పడేట్టుంది ఇల్లురురస్తాదేమో నాయనో.. ఒకరవ్వ సుట్టింట్లో పొయ్యి దగ్గరొక గిన్ని, సూరికిందొక దబర పెట్టిపో అవతల కూలోలెల్లిపోయారు వాళ్ళలో కలిసెల్లిపోవాలి అని యెల్లిపోతూ …సెప్పటం మర్సిపోయా మీ నాయన సద్ది కూటికొస్తే యెండుసేపకొటి కాల్చియ్యి లేదంటే నంచుకోను లేకపోతే సంపేస్తాడు నన్ను అంటూ బతుకు పోరాటానికెళ్ళిపోయింది. సద్దెన్నం తింటూ ఆలోచనలో పడిపోయాను.. నాయన యెంత కొట్టినా కొట్టించుకుంటాది ..కాని యెప్పుడూ యెదురు మాట్లాడ్డం సూడ్లేదు వొకేల అలా చేసుంటే ఇంకా కొట్టేవాడేమో……యెన్ని తన్నులు తిన్నా కూడా నాయన మీద అమ్మకు ఇంత ప్రేమ యెందుకో అర్ధం కాలేదు. యెక్కడో బడి గంట శబ్ధం యినబడతాఉంది. తినేసి చెల్లిని తీసుకొని బడికెల్లిపోయాను.

బళ్ళోకూడా అమ్మ జీవితం యెప్పుడు బాగుపడుతుందా.. అమ్మ యెప్పుడు సంతోషంగా ఉంటుందా అని ఆలోచనలు వెంటాడుతున్నాయి నన్ను…  అందరి తల్లులాగే నా తల్లి కూడా బోగి పండక్కి యెప్పుడు కొత్త కోక కడ్తుందా అని…అందరి బిడ్దలకి లాగే తన బిడ్డల్ని కిరసనాయిలు బుడ్డి యెలుతురులో కాక కరెంటు బుడ్దీ యెలుతురులోఎప్పుడు చూస్తుందా….

అమ్మ పని నుంచి యెప్పుడొచ్చిందో గానిమేం  బడినుండి ఇంటికొచ్చేసరికే కసువు కూడా చిమ్మకుండా యేదో ఆలోచిస్తూ కూచొని ఉంది. యేమ్మా ఆలోచిస్తున్నావా? యేమైంది అని అడిగా… మీ నాయన పొద్దన్నుంచి ఇంటికొచ్చినట్టులేడు.. కూటి కుండలో కూడు అట్నే ఉంది.. యెక్కడ కల్లు సెట్ల కింద తాగి పడిపోయుంటాడో తీసుకొద్దాం పా…   అని నన్ను తీసుకొని కయిల్లో పోతాఉంది…మాకెదురొచ్చిన పతొక్కర్ని మా నాయనెక్కడన్నా కనిపించాడాని ఆడిగి తెలుసుకొంటాఉంది…యేమ్మావా.. మా ఆయనేమన్నా కనబడ్డాడా నీకా …లేదే… వస్తాడులేమే…పొద్దుబోయి నువ్వెక్కడెతకతావా వాడ్ని.. రాడా… రండి పోదాం అని మాకు తెలిసిన ఒకాయన అనేసరికే.. లేదు మావా ఇక్కడదాక పోయేసొస్తాం అంది అమ్మ.

అల నడ్సుకుంటూ… దారిలో కనిపించిన పతొక్కర్ని అడుక్కుంటూ రెడ్ల పొలాల చివ్వర్నున్న తాటిసెట్లు కనిపించెంత వరకు యెల్లాం…అక్కడికెల్తే యిక్కడికెందుకొచ్చారని నాయన కొడ్తాడని అమ్మకొకపక్క భయం…కొట్టినా సరే మా నాయన కనబడితే చాలనుకుందేమో.. గెనింమీద నా చేయి పట్టుకొని పడ్తావ్ నాయనా భద్రం అంటూ తాటిసెట్లున్న సోటుకి తీసుకుపోయింది. తాటిసెట్లకింద కూచోని యెవరితోనో మాట్లాడుతున్నట్లు చూశాం నాయన్ని ఇద్దరం. అమ్మ కళ్ళలో చెప్పలేని ఆనందం వచ్చేసింది..అమ్మ సంతోషంగా ఉందనుకొని కొంచెం గాలి పీల్చి వదిలా.. దూరం నుంచి వీళ్ళెవరాన్నట్టు చూస్తున్నాడు… దగ్గరకెళ్ళి యేంవయ్యా ..పొద్దుపోలా నీకా…? ఉదయం నుంచి కూటిక్కూడా రాలేదా… రా పోదాం..అని భయం భయం గానే అంది అమ్మ. మీరెందుకొచ్చారుమే ఇక్కడికా… రానా… యెక్కడికిపోతానా పోండొస్తున్నా..అన్నాడు నాయనా. వెంటనే ఇద్దరం యింటికి వచ్చేసాం. నాయన మీద యింత ప్రేమ చూపిస్తుందే అమ్మ…యెప్పుడన్నా అమ్మ మీద ప్రేమ చూయించాడా నాయన..? మనసులొ ప్రశ్నించుకున్నా.. పతిరోజు కూలి పని జేసి అమ్మ యింటికి రావడం. తాగొచ్చిన నాయన అమ్మను కొట్టడం…యిదే తంతు.. రోజులు గడుస్తున్నాయి…కాని పరిస్తితులు మాత్రం మారడం లేదు.

అలా కాల ప్రయాణంలో నా అయిదో తరగతి పూర్తయి ఆరో తరగతికి గురుకుల పాఠశాలలో సీటొచ్చింది. వూర్లో మొత్తం పన్నెండు మందిమి ప్రవెశపరీక్ష రాస్తే  నాకొక్కడికే సీటొచ్చింది. అమ్మ సంతోషంతో వచ్చి నన్ను ముద్దు పెట్టుకొంది. మా నాయన సంతోషపడ్డాడో లేదో నాకైతే తెలియదు. కాని ఆ రోజు రాత్రి పడుకోబోయేముందు మా నాయన నాతో…”నాయన యిక్కడెట్లా సదివావో హాస్టల్కెళ్ళిన తర్వాత కూడా అట్టాగే సదవాలా…” ఆప్యాంగా అన్న మాటలు సంతోషంతో నన్ను కంట తడిని పెట్టించాయి.అమ్మ నవ్వుతూ ముద్దుపెట్టడం శాలా రోజుల తర్వాత చూశాననుకొని హ్యాపీగా నిద్రపోయా. మరుసటిరోజు ఉదయం హాస్టల్కెళ్ళేటప్పుడు  తన బొడ్లో నుండి తీసిన ముక్కుపొడిని బుగ్గన పెట్టుకుంటూ రెండు కన్నీటి బొట్లు రాల్చడం గమనించాను… యిప్పటిదాకా తన సెంతనున్నకన్న కొడుకు దూరంగా బోతున్నాడనో లేక నాయన తన్నేటప్పుడు నాకెవరడ్దొస్తారని యేడ్చుకొంటుందో అర్దం కాలేదు కాని రెండో దాని కోసమే యేడుస్తొందనుకొని…కడుపులో వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని “పొయ్యొస్తామా”  నువ్వు జాగ్రత్త …నాయన కొడ్తే పల్లెత్తి మాటనకనేసరికే యిద్దరం దుఃఖం ఆపుకోలేక పెద్దగా యేడ్చేశాం. యెందుకసే.. శుభమా అంటూ బిడ్డ పోయేటప్పుడు యేడిపిస్తావా.. నాయాన కసిరేసరికే అమ్మ భయం భయంగా యేడుపుని దిగమింగుకని జాగ్రత్త.. బాగా సదవలా…దిగులుపడమాకా…వచ్చే ఆదివారం వస్తానని అమ్మ సాగనపింది.

ఒక పక్క పుట్టెడు దుఃఖంతోమరో పక్క గెబ్బెడు సంతోషంతో హాస్టల్కెళ్ళిపోయాను… మొదటి వారం రోజులు అమ్మ మీద దిగులుతో యేడ్చుకున్నాను…  మమ్మల్నెప్పుడూ అమ్మ కొట్టిందిలేదు… ఆమె ప్రేమనంతా మా పైనే గుమ్మరించేది…. అప్పుడప్పుడు అమ్మను ఆటపట్టించేవాళ్ళం.

మా అవ్వ కల్లాంలో యేరుకొచ్చిన పరిగిమూట కావాలనే మా మీదేసుకొని  మూట మా మీద పడిపోయినట్టు “అమ్మా”  .. అని అరిస్తే తొట్టిదగ్గర గిన్నెల్ చెంబులు తోముకుంటున్న అమ్మ కంగారుపడి యేమైంది  నాయన అని యేడ్చుకుంటూ వచ్చేది మా  దగ్గరికి…  తర్వాత  తమాషాకిలేమ్మా అనే వాళ్ళం… అమ్మ నవ్వుకుంటూ యెళ్ళిపోయేది.

మా యింటి సుట్టుపక్కల పిల్లకాయల అమ్మలయితే వాళ్ళ బిడ్డల్ని బాగా తన్నేవారు. మేము యెంత తులిపిపనులు జేసినా కూడా అమ్మ మమ్మల్ని ఒక్క మాట కూడా అనేది లేదు.”నాగమణే.. నీ పిలకాయలంటే యెంత ముద్దమ్మే నీకా..” అని ఇంటి  సుట్టుపక్కలోల్లు అనేవాళ్ళు అమ్మని.  అమ్మ జ్ఞాపకాలన్ని నెమరేసుకొనేవాణ్ణి. అట్టా హాస్టల్లో నా రోజులు గడిచిపోతూ పై తరగత్లకు యెదుగుతూ తొమ్మిదో తరగతిలో ఉండగా మా చెల్లెనించి ఉత్తరం… యెప్పుడూ మా చెల్లెలు ఉత్తరం రాసింది లేదు…కొత్తగా ఉంది… యింటిదగ్గర్నించి….అది కూడా చెల్లెలు రాసిందా అని….
“అన్నా.. యెలా ఉన్నావు..? యిక్కడ అందరు బాగున్నారు.
నాయన యింట్లోకి కంజీ మంచం, బీరువా, టీవి తెచ్చాడు..
యిప్పుడు మన యింట్లో కరెంటు పోయినప్పుడు మాత్రమే దీపం బుడ్డి..
ట్యూబ్ లైట్ కింద యిప్పుడు మనిల్లు భలే యెలుతురొస్తుంది.
అన్నా చెప్పడం మర్సిపోయా…
నాయన యిప్పుడు అమ్మను కొట్టడం లేదు.
నాయన మారిపోయాడు…”

నువ్వు దిగులుపెట్టుకోకుండా బాగ సదువ్కోమని సెప్పమంది అమ్మ     వుంటాను…… టాటా.

చివ్వరి మూడు లైన్లు యెన్ని సార్లు సదువుకొన్నానో నాకే తెలియదు. ఆ మూడు లైన్లు సదువుతున్నప్పుడల్లా అమ్మ మొహమే జ్ఞాపకమొచ్చేది. దసరా సెలవులకి యింటికి పోయిందాక ఆ మూడు లైన్లు పదే పదే సదువుకొన్నా.
సెలవులకి యింటికెల్లగానే గుడ్దలు పులుంతున్న అమ్మ నన్ను సూడగానే లేసొచ్చి సేతులుకున్న చెమ్మను పైట కొంగుతో తుడుసుకొని నా కొడుకొచ్చేశాడు.. నా ముద్దుల కొడుకొచ్చాశాడమ్మా అంటూ నన్ను యెత్తుకొని రెండు ముద్దులు పెట్టి నా నూనూగు మీసాలు జూసి నా కొడిక్కి మీసాలు కూడా వస్తున్నయమ్మా అని కొడుకు పెద్దవాడవుతున్నాడనే సంతోషంతో మురిసి పోతూ యింట్లోకెళ్ళి దింపి దింపగానే.. నేను బాగున్నాన్నాయనా… మీ నాయన యిప్పుడు కొట్టడం లేదు…వెరే వాళ్ళ పొలం కవులుకు తీసుకొన్నాడా… ఈ సారి బాగ పండిందా….ఈయన్ని తెచ్చాడు…యిహన యెరే వాళ్ళింటికిబోయి టీవి సూడబల్లెదులే..యిదిగో టీవి కూడా తెచ్చాడని అమ్మ అంటుండగానే… చెల్లి నవ్వుతూ..

అన్నో ఎప్పుడొచ్చావన్నా..?

యిప్పుడే.

నాకు తెలియదే..నువ్వొచ్హినట్టా.

యాడకిపోయిండేవా..?

ఆడుకోడానికి.

అన్నా నాయన మనిద్దరికి గుడ్డలు తెచ్చాడు తెలుసా..?

నీకొక సొక్కా..నాకొక గౌను.

యింకోటేంది తెల్సా..?

యేందా..?

అమ్మకోక్కోక గూడా తెచ్చాడు నాయన.

అమ్మ సాయ జూశా..ముసి ముసి నవ్వు నవ్వుతూ అవునన్నట్టు తలూపింది అమ్మ. హమ్మయ్య మా యమ్మ నవ్వింది శాలా రోజులకనుకొన్నా. ఊళ్ళో నుంచొచ్చిన నాయన నన్ను సూడగానే నవ్వుతూ యెప్పుడొచ్చావ్ రా ..

యిప్పుడే..

యెన్ని రోజులిచ్చార సెలవలా…?

పదిరోజులు.

నాగమణే..సద్దికూడెయ్ ..పోవాల..

అమ్మ సద్దికూడేసి యర్రగడ్డిచ్చేదా..సేప గాల్చిచ్చేదయ్యా..?

ఏదోకటీమే…

అమ్మ సద్ది కూడేసిచ్చిన వెంటనే మా దగ్గరకొచ్చి  నాయనా నువ్వూ అమ్మి టీవి పెట్టుకొని సూస్తా వుండండి గుడ్దలుతికేసొచ్చి కూడేస్తా. అని అమ్మ తొట్టి దగరకెల్లి పోయింది. నాయన అమ్మను పేరు పెట్టి పిలవడం..అమ్మ నాయన్ని అయ్యా అని ఆప్యాంగా పిలుసుకోవడం సూసి సెప్పలేని ఆనందంతో కంజీ మంచం మీద తలవాల్చి…కరెంటు బుడ్డి యెలుతురులో అమ్మ నవ్వును తల్సుకుంటూ  ఒక్క సారిగా గాలి పీల్చి వదిలా…..

*

కొత్త ఆలోచనలతో…

katha

 

(కథాసాహితి పక్షాన)

ఈ 26వ సంకలనంలో కొత్త ఆలోచనలు, అభిరుచులతో మీ ముందుకొస్తున్నాం.

అందులో మొదటిది సంపాదకుల మార్పు. ప్రతి సంవత్సరం మా పక్షాన ఇద్దరు సంపాదకులు ఎన్నిక చేసిన కథలతో ఈ సంకలనాన్ని ప్రచురించాలని భావించాం. ఈ ప్రయత్నంలో తొలి అడుగు ఇది. ఈ కథ 2015కి ఆడెపు లక్ష్మీపతి, ఎ.వి. రమణమూర్తి సంపాదకులు. దాదాపు వారి తుది నిర్ణయం మేరకే ఈ కథల ఎన్నిక జరిగింది. ఒకటి, రెండు విషయాల్లో మా సలహాలు తోడయ్యాయి. అడిగిన వెంటనే బాధ్యతలు స్వీకరించి, అత్యంత ప్రజాస్వామిక పద్ధతిలో చర్చలు సాగించి, కొద్దిపాటి భిన్నాభిప్రాయాలు ఉన్నా ఎంతో సంయమనంతో వ్యవహరించి, కథలను ఎన్నిక చేసిన సంపాదకులిద్దరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వచ్చే సంవత్సరం మరో ఇద్దరు సంపాదకుల ఎన్నికతో కథ 2016 వస్తుంది.

ఈ సంకలనం నుండి ప్రతి సంవత్సరం ఒక ప్రసిద్ధ కథారచయిత రాసిన ముఖ్యమైన కథను చివర్లో అనుబంధంగా ఇవ్వాలనేది మరో కొత్త ఆలోచన. ఈ తరం రచయితలు, గతకాలపు గొప్ప కథలను చదివి కథారచనలో మెళకువలను నేర్చుకోగలరని, పాఠకులు ఈ మేలు కథల్లోని గొప్పదనాన్ని ఆస్వాదించాలని ఆకాంక్ష. అందుకే ఈ సంవత్సరం తొలి ప్రయత్నంగా శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి కలుపు మొక్కలు కథని ప్రచురిస్తున్నాం. అనితరసాధ్యమైన వారి రచనాశైలికి, కథానిర్మాణానికి మచ్చుతునక ఈ కథ.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చాలా పట్టణాల్లో బాలోత్సవ్ లు నిర్వహిస్తున్నారు. అందుకు స్పూర్తి కొత్తగూడెం బాలోత్సవ్. ఈ ఉత్సవాల్లో తెలుగు సాహితీసృజన పై పలు పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో ఒకటి కథారచన, అప్పటికప్పడు కథా వస్తువును ప్రకటించి, కథ రాయమని కోరితే వందలమంది బాలబాలికలు గంటలో కథ రాసి మెప్పించగలుగుతున్నారు. అలాంటివారిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోనే వారు రాసిన కథల్లో ముఖ్యమైన వాటిని అనుబంధాలుగా ఈ సంకలనంలో చేర్చాలని ఇంకో ఆలోచన.

ఎక్కడో లోతట్టు తమిళనాడులో నివసించే తెలుగు అక్షరం రాని తెలుగువారి గోసను తెలియజెప్పే అట్ట పుట్టింది ఆ ఊరు కథను అందిస్తున్నాం. దీన్ని రాసిన మార్టూరి సంజనాపద్మం పదమూడు సంవత్సరాల వయస్సులో తెలుగు అక్షరాలు నేర్చుకుని వారి యాసలో ఈ కథను రాసింది. ఇలాంటి మరో పదిహేను కథలతో రేగడి నీడల్లా అనే సంపుటిని ప్రచురించింది. కాకినాడలోని క్రియ సంస్థ నిర్వహించిన బాలోత్సవ్ కథల పోటీలో మొదటి బహుమతి వచ్చిన తాడాల కుసుమ సాయిసుందరీ రాణి కథ దైవం మానవ రూపేణని కూడా ఈ అనుబంధంలో చేర్చాం, ఈ అమ్మాయి ఓ మారుమూల గ్రామం (మాచర) జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది. పిల్లల్లో సృజనాత్మక సాహిత్యం పట్ల ఆసక్తిని పెంపొందించి, ప్రోత్సహించాలనే ఉద్దేశ్యమే ఈ ప్రయత్నం.

ఎప్పట్లాగే ఈ సంకలనాన్నీ తెలుగు కథాప్రియులు, పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తూ…

 

*

విభిన్న వస్తు, కోణాల సమాహారం


Katha-15 Cover

పాతికేళ్ల సుదీర్ఘమైన చరిత్ర ఉన్న కథాసాహితి వారి కథాసంకలనాల్లో నేను కూడా ఈ రకంగా ఓ స్థానం సంపాదించుకున్నందుకు కొంత సంతోషంగానూ, కొంత గర్వంగానూ అనిపించినా- ఆ తర్వాత ఆ బాధ్యతని నెత్తిన వేసుకున్న బరువు మాత్రమే తెలిసివచ్చింది. కథల ఎంపిక అనేది అత్యంత సున్నితమైన ప్రక్రియ. మన ఇష్టాయిష్టాలకు అనుగుణంగానే ఎంపిక జరిగినా- అవి చదువరులని చేరి, వాళ్ల ఆలోచనల్లో రేపవలసిన అవసరమైన కల్లోలాలని ఊహించి మరీ కథలని ఎంపిక చేయడం చాలా కష్టమైన పని. అందరూ చర్చించుకున్న కొన్ని కథలని- ఈ ప్రక్రియలో అదనంగా ఉన్న సామాజిక బాధ్యత దృష్ట్యా- పక్కన పెట్టేయాల్సి రావడం కూడా బాధాకరమైన పనే!

ఈ కథాసంపుటాన్ని తయారుచేయడంలో, 2015 సంవత్సరంలో 42 పత్రికలలో వచ్చిన 1780 కథలని పరిశీలించాం. వచ్చిన కథలని ఎప్పటికప్పుడు చదువుతూ ఉండటం వల్ల, ప్రతి కథకీ దానికి తగినంత సమయం కేటాయించడం జరిగింది. ఇంత ప్రక్రియ తరువాత, చివరి వడపోతలో కేవలం 12 కథలు మాత్రమే మిగలడం కొంత నిరాశని కలిగించడం మాత్రం వాస్తవం.

****

కథకి వస్తువు ఎంత ముఖ్యమో- ఆ కథని ఏ స్వరంతో చెబుతున్నామనేదీ అంతే ముఖ్యం. కథని రచయిత తను అనుకున్న పద్ధతిలో పాఠకుడికి చేర్చగలిగింది ఈ కంఠస్వరమే. ఆ స్వరం వైరుధ్యాలు లేకుండా ఉంటే, ఆ సూటితనాన్ని పాఠకుడు అప్రయత్నంగానే పసిగట్టగలుగుతాడు. అలాంటి సూటితనం, నిజాయితీ పాఠకుడి మేధస్సుకి సంబంధించిన అన్ని భద్రతా వలయాలనూ ఛేదించుకుని వెళ్లి, తాకవలసిన చోటుని తాకుతుంది. ఈ సంకలనంలో ఉన్న కథల్లో ఆ స్వరరచన ఎలా జరిగింది?

ప్రథమపురుష కథనంలో, ఆ తర్వాత వివిధ పాత్రల దృష్టికోణంలో నడిచిన చివరి చర్మకారుడూ లేడు… కథలో పాత్రలని బట్టి స్వరం మారడం గమనించవచ్చు. కథలో రచయిత వీలైనంత తక్కువ జోక్యం చేసుకుని, కథని మొత్తం నేపథ్యంలో ఉన్న డాక్యుమెంటరీలాగా నడుపుతారు. రచయిత పాటిస్తున్న ఈ దూరం వల్ల పాఠకుడు కథలో మరింత శ్రద్ధగా లీనమవ్వడానికి అవకాశం కలుగుతుంది. ఇలాంటి ముక్తసరి కథనమే సావిత్రి కథలో కూడా గమనించవచ్చు. క్లుప్తమైన కథనం, సన్నివేశాల్లో మరింత బరువుని నింపుతుంది. చిత్తూరు మాండలీకంలో ఓ హోరుగా సాగే రాతిమిద్దాయన చిన్న కుమార్తె కథన ప్రవాహం, చివర్లో ఓ ఆశ్చర్యకరమైన క్షణంలో ఆగిపోతుంది. అక్కడ ఆ పాత్రకి లభించిన ఎపిఫనీ తాలూకు నిశ్శబ్దాన్ని, అంతవరకూ సాగిన హోరు వల్ల పాఠకుడు మరింత ఆస్వాదించగలుగుతాడు.

తొమ్మిదో నెంబరు చంద్రుడు కథలో కథకురాలి స్వరం ఇప్పటి తరం తాలూకు తాజా స్వరం. ఆ స్వరం వల్ల ఆ పాత్రని గుర్తించడానికీ, ఆ పాత్ర భావావేశాలపట్ల అవగాహనని ఏర్పరచుకోవడానికీ పాఠకుడికి ఎక్కువ సమయం పట్టదు. చివరివరకూ సాధికారికంగా, అద్భుతంగా సాగే ఆ స్వరమే ఈ కథకి ప్రత్యేకత. శతపత్ర సుందరి కథ చెప్పే నీలవేణి మానసిక, బౌద్ధిక స్థితి కథ మొదట్లో రెండుమూడు పేరాల్లోనే ఆవిష్కరించబడుతుంది. పాఠకుడిని అలా సిద్ధం చేయడం వల్లా, కథకురాలి స్వరం అదే ప్రశాంతోత్పాత స్థితిలో కొనసాగడం వల్లా ఆ పాత్ర తాలూకు జీవనవిధానం, దానిలో అంతర్గతంగా ఇమిడివున్న సంఘర్షణ పట్ల పాఠకుడి కుతూహలం చివరివరకూ కొనసాగుతుంది. చరిత్రకి సంబంధించిన మూడు కోణాలు కథలో ఉత్సుకతని ఎక్కడా చెదరనివ్వకుండా నడపడానికి కారణం కూడా, కథలో కథకుడు ఉపయోగించిన అధిక జోక్యం లేని కంఠస్వరమే!

నెల్లూరు మాండలీకంలో సాగే నేను తోలుమల్లయ్య కొడుకుని కథలో కథకుడు (narrator) ప్రధానపాత్ర భాషలోనే కథని చెప్పడం వల్ల, ఆ పాత్ర పరిస్థితుల పట్ల పాఠకుడు ఆసక్తి చూపగలుగుతాడు. ‘కడగొట్టోళ్ల లోకి కడగొట్టుది ఆడదే,’ అన్న అర్థవంతమైన ఆవేదన కూడా ఆ పాత్ర భాషలోంచి రావడం వల్ల ఆ ఆవేదన మరింత భారవంతంగా ఆవిష్కారమౌతుంది. ఈ స్వరాలన్నీ ఒక ఎత్తైతే, క్రైస్తవ పద్ధతిలో జరిగే వివాహాల గురించీ, ఆ వివరాల గురించీ చెప్పే పరిశుద్ధ వివాహము: మూడో ప్రకటన కథలోని స్వరం విభిన్నమైనది. అన్ని వివరాలను వాస్తవిక స్వరంతో చెబితే ఆ కథ ఒక వ్యాసంలా తయారవుతుంది కాబట్టి, ఈ కథలోని కథకుడి స్వరానికి వ్యంగ్యాన్ని అద్దారు రచయిత. కథలో తను నిరసించదలచుకున్న అంశాన్ని ఎద్దేవా చేయడానికే కాకుండా, కథ మొత్తాన్నీ ఆపకుండా చదివేలా చేయడానికి ఈ వ్యంగ్యం చాలా కీలకమయింది.

తాతిల్‌ కథనంలో ఉపయోగించిన స్వరంలో ఉండే తెలంగాణ మాండలీకపు అమాయకపు స్వచ్చత- కథాంశంలో అంతర్లీనంగా ఉన్న ఆప్యాయతాస్పూర్తిని రెండింతలు చేసి చూపించడానికి సహాయం చేస్తుంది!

****

ఈ సంకలనంలో చర్మకారుల కథలు రెండు ఉన్నాయి. రెండు కథలూ, రెండు విభిన్న వాస్తవాలను చూపిన కథలు. చివరి చర్మకారుడూ లేడు… కథ-సమాజంలో వచ్చిన మార్పుల వల్ల చర్మకారులు ఇప్పుడు కనిపించకపోయినా, ఆ తరువాతి తరాలు ఒక్కొక్క మెట్టూ ఎక్కి సమాజంలో స్థిరపడటాన్ని చూపిస్తుంది. కులవృత్తులు నశించిపోతున్నాయి అనే అర్ధసత్యానికి సమాధానం ఈ కథ. కానీ, నేను తోలుమల్లయ్య కొడుకుని కథలో చెప్పులు కుట్టుకుంటూ బతుకుతున్న మారయ్య పరిస్థితిలో మాత్రం మార్పు లేదు. మార్పేదైనా ఉంటే అది అదనంగా వచ్చి చేరే సమస్యల జాబితానే. అతను ఇంకా సమాధానాలు వెతుక్కుంటూనే ఉన్నాడు. ఈ రెండు కథలూ వాస్తవాన్ని చిత్రీకరించేవే. వాస్తవం అనేది భిన్న పరిస్థితుల్లో ఒకదానితో ఒకటి పొంతన లేకుండా ఎలా ఉండగలదో నిరూపిస్తాయి ఈ రెండు కథలూ.
చరిత్ర ఆధారంగా రాయబడిన రెండు కథలు ఈ సంకలనంలో చోటుచేసు కున్నాయి. ఆంగ్లేయుల పాలనలో సర్వే పనుల నేపథ్యంలో రాయబడ్డ మూడు కోణాలు మంచి సమగ్రమైన కథ. కథలో అన్ని పాత్రల అన్ని కోణాలనూ అవసరమైనంతమేరకు స్పృశించే ఈ కథ- ముగింపులో భారతీయుల గురించి ఒక వాస్తవికమైన పరిశీలన చేస్తుంది. ‘నైపుణ్యం ఉన్నచోట శాస్త్రం లేదు; శాస్త్రం ఉన్నచోట నైపుణ్యం లేదు…’ అని. ఆ పరిస్థితిలో ఇప్పటికీ చెప్పుకోదగిన మార్పు లేకపోవడమే ఈ కథ తాలూకు వర్తమానత. అందుకే డుంబ్రిలాంటి వాళ్లు, తోలు మల్లయ్య కొడుకు మారయ్యలాంటి వాళ్లు అలాంటి పరిస్థితుల్లోనే చిక్కుబడి పోయి వుంటారు. తెలంగాణ ప్రాంతంలో గతంలో జరిగిన చెరువుల అభివృద్ధి, దాని వెనక ఉన్న సాంకేతికమైన శాస్త్రీయతా అంతా కాలగర్భంలో కలిసిపోయి, నీరెటుకాడి కల కథలో పెద్దయ్యలాంటి వాళ్లని జీవన్మృతులుగా మిగిల్చింది. వాళ్ల ఆశ తీరదు, కోరిక చావదు, కలలు నిలవనీయవు, జీవితం బతకనీయదు! తెలంగాణ ప్రాంతంలోని బతుకమ్మల నేపథ్యంలో వచ్చిన అంటరాని బతుకమ్మ మరో మంచి కథ. ఉద్యమాలనాడు బతుకమ్మలు ఆడటానికి అడ్డురాని కులాలు, ఆ ఉద్యమం కాస్తా దాటుకుని ఇప్పుడు జీవితాలు స్థిరపడ్డాక, మళ్లీ యథాప్రకారం కొనసాగుతున్నాయి. రాజకీయాల అవకాశవాదాన్ని, వ్యక్తిగత భావావేశాల నేపథ్యంలో విమర్శించిన కథ ఇది.

రైతుల కథలు ఎన్ని వచ్చినా ఇంకా రాయబడని కథలు మిగిలే ఉంటాయి. ప్రకృతీ, ప్రభుత్వాలూ, పీడకులూ- అందరివల్లా దగా పడుతున్న రైతు క్షోభకి ఎన్ని కోణాలున్నాయి? ఆత్మహత్యే శరణ్యం అని పరిస్థితులు సూచిస్తున్నా, లేచి నిలబడి చుట్టూ చూసి స్థైర్యం తెచ్చుకున్న నారాయణ కథ ఊరవతల ఊడలమర్రి.
కుటుంబ నేపథ్యంలో వచ్చిన కథలు రెండు ఉన్నాయి ఈ సంకలనంలో. అభద్రతతో, అశాంతితో బతకడం కంటే, కొంత త్యాగం చేసైనా సరే (ఆ త్యాగమైనా తన తోబుట్టువు కోసమే కదా!) వాటిని వదిలించుకోవడం మంచిదన్న తాత్వికస్థితికి చేరుకోవడానికి ముందు రాతిమిద్దాయన చిన్నకుమార్తె కథలో నాగేస్పరి చాలా ప్రయాణమే చేసింది. చివరికి- వొళ్లు దెలవకుండా నిద్రపోగల సులువుని తెలుసుకోగలిగింది. అలాగే, మనుషుల్లోనూ, సమాజంలోనూ ఉండే నెగటివ్‌ ధోరణుల నేపథ్యంలో ఎక్కువగా సాగే కథల మధ్య తాతిల్‌ కథ కుటుంబంలో ఉండే అనురాగాలకి సంబంధించిన ఆహ్లాదకరమైన కథ. ప్రత్యేకంగా కనిపిస్తుంది.

ఈ సంకలనంలో స్త్రీవాదం పునాదిగా మూడు మంచి కథలు ఉన్నాయి. ఉపరితలంలో పొసెసివ్‌నెస్‌గా కనిపించే సదాశివ ప్రేమ వెనకాల నిజాయితే ఉందో, ముందరికాళ్లకు బంధం వేసే తెలివితేటలే ఉన్నాయో నీలవేణికి తెలీదు శతపత్ర సుందరి కథలో. బహుశా, ఆమెకి స్త్రీ సహజమైన ఓర్పు, క్షమ, ప్రేమలాంటి ‘బలహీనతలు’ ఉన్నంతకాలం, సదాశివకి తన ఆధిక్యం ప్రదర్శించడానికి అవకాశం దొరుకుతూనే ఉంటుంది. ఈ  ఆటలో  తెలిసో,  తెలీకుండానో  ఓడిపోతూనే ఉండే నీలవేణిలాంటి స్త్రీలకి ఉన్న ఏకైక బలం- మారాకులు వేయగలగడం. అందుకే ఆమె శతపత్ర సుందరి. వచనానికీ, కవిత్వానికీ మధ్య హద్దులు చెరిపేసి, అతి క్లుప్తమైన కథనంతో, స్త్రీపురుష సంబంధాల గురించి పలు ప్రశ్నలు రేపి ఆలోచింపజేసే కథ ఇది. ఈ తరానికి చెందిన మోహిత, తన అస్తిత్వాన్ని తను సంపూర్ణంగా ప్రేమించుకుంటూ, తనని తను ప్రేమించుకోవడంలోనే తన అస్తిత్వం దాగివుందన్న నిజాన్ని గ్రహిస్తుంది తొమ్మిదో నెంబరు చంద్రుడు కథలో. పోగొట్టుకోవడం అంటే ఓడిపోవడం కాదన్న నిజాన్ని కూడా గ్రహిస్తుంది, అందుకే ముగింపులో ధైర్యంగా అందర్నీ పక్కకి తోసేసి నడుస్తుంది. నిడివి విషయంలో కొంచెం పెద్దదే అనిపించినా, రాసిన ప్రతి వాక్యం చదివించగల శక్తి ఉన్నదవ డంతో కథనం చురుగ్గా సాగిపోతుంది. ఉద్యమాల నేపథ్యంలో రాసిన సావిత్రి కథలోని ఆ పాత్ర జీవితం ఏమిటో తెలుసుకునేలోపలే తన ప్రమేయం లేకుండానే అది తన చేతిలోంచి జారిపోయింది. భర్త పోరాటాలని కొంతవరకూ అర్థం చేసుకోగలిగినా, జీవితం తాలూకు వాస్తవికత సృష్టించే అవరోధాలను అధిగమించడం తన వయసుకీ, శక్తికీ మించిన పనైంది. ‘నువ్వు ఉండటానికి, చనిపోవటానికి మధ్య తేడా కనపడటం లేదయ్యా నాకు…’ అన్న సావిత్రి మాటల్లో ఆమె ఆవేదన వ్యక్తమవుతుంది. జీవితంలో కోరుకున్నది దొరకకపోగా, దొరికింది కూడా చేజార్చుకోవలసి వచ్చిన దైన్యమైన స్థితి. మూడు కథల్లోనూ స్త్రీ జీవితం తాలూకు వివిధ పార్శ్వాలు కనిపిస్తాయి.

****

ఈ సంకలనంలో ఉన్న పన్నెండుగురు కథారచయితలలో ఆరుగురు రచయిత/త్రులు మొదటిసారిగా ఈ కథాసాహితి వార్షిక సంకలనాలలో చోటుచేసుకోవడం విశేషం! ఈ ఆరుగురిలోనూ, ముగ్గురికి ఇదే తొలికథ. అది మరో విశేషం!
ఇలా విభిన్న వస్తు, కథన విశేషాలతో- అట్టడుగు జీవితాల నుంచి ఆధునిక జీవనశైలుల వరకూ ప్రయాణించిన ఈ కథలు మిమ్మల్ని కూడా ఆకట్టుకోవాలని మా ఆకాంక్ష!

హైదరాబాద్‌, 22 ఆగస్ట్‌ 2016

నీతి శాస్త్రమూ కాదు, అరాచకవాదమూ కాదు!

kathana

ఒక సంకలనం కోసం, కొన్ని వందలు వేల కథల్లోంచి డజను లేదా డజనున్నర మంచి కథలను ఎంపిక చేయడానికి పెద్ద కసరత్తే అవసరమవుతుంది. మంచి కథ అని దేనిని అనవచ్చు? అందుకు ఏది సిసలైన ప్రాతిపదిక? తరచు ఎదురయ్యే ప్రశ్న ఇది.

ప్రపంచ కథాసాహిత్యంలో ‘క్లాసిక్స్‌’ అని వి.ఎస్‌. ప్రిచ్చెట్‌ భావించిన కథలు (ఆక్స్ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌, ఆక్స్ఫర్డ్‌ ప్రచురణ) వేరు, క్లిఫ్టాన్‌ ఫాడిమన్‌ ఎంచిన కథలు (పాన్‌ బుక్స్‌ లిమిటెడ్‌, లండన్‌ ప్రచురణ) వేరు. అట్లాగే సమకాలీన లాటిన్‌ అమెరికన్‌ సాహిత్యంలో చక్కని, ప్రశస్తమైన కథలుగా అర్టురోటారెస్‌ రైసెకో సంకలించినవి వేరు, పాట్‌మెక్నీస్‌ మాన్సినీ ఎన్నుకున్నవి వేరు (ఫాసెట్‌ ప్రీమియర్‌, న్యూయార్క్‌ ప్రచురణలు) అని ఆ సంకలనాలు పరిశీలిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. తెలుగులో వివిధ సంస్థలచే ప్రచురితమయ్యే వార్షిక సంకలనాల్లోకి చేర్చుకునే కథల ఎంపిక ప్రమాణాలు విభిన్నంగా ఉండడం, కథల కూర్పు ఆయా సంపాదకుల / సంకలనకర్తల అభీష్టానుసారం లేదా వారి వారి అభిరుచుల ప్రకారం జరుగుతుండటం మనం చూస్తూనే ఉన్నాం.

అంటే కథకు ముందు మనం తగిలించే ‘మంచి’ – కావ్యభాషలో ‘ఉత్తమ’ (ఇంగ్లీషులో ‘the best’)- అనేది అనిర్దిష్టమైన, అస్పష్టమైన, ఆత్మాశ్రయకమైన, సాపేక్షమైన విశేషణమేనా? ఉత్తమ కథల ఎంపికకు సంకలనకర్తల whims and fancies ఆధారమా?

నేను ఔననే అంటాను. వందలు, వేల కథల్లోంచి ఒక డజను లేదా డజనున్నర కథలను ఉత్తమమైనవిగా ఎంపికచేసే క్రమంలో సంపాదకుని/సంకలనకర్త వ్యక్తిగత అభిరుచులు, ఇష్టానిష్టాలు, దృక్పథం, మనఃప్రవృత్తి, భావావేశం తప్పక ప్రభావం చూపుతాయి. దేనినిగానీ ‘ఉత్తమం’ అని నిర్ధారించడానికి ఇక్కడ అబ్సొల్యూట్‌ టర్మ్స్‌ లేవు. ఒకరికి నచ్చినవి మరొకరికి నచ్చకపోవచ్చు.

అయినప్పటికీ- తన నిర్ణయంలో శాస్త్రీయత, హేతుబద్ధత గరిష్టస్థాయిలో వున్నాయని చెప్పుకుని సమర్థించుకునే వీలు సంపాదకునికి వుంది. అదెప్పుడంటే- సాహిత్యం సామాజిక ప్రయోజనం పట్ల ఒక స్పష్టమైన అభిప్రాయంతోపాటు సాహిత్యాన్ని వస్త్వాశ్రయంగా విశ్లేషించగల విమర్శనాదృష్టీ, ప్రత్యేకించి ఒక విశిష్ట సాహిత్యప్రక్రియగా కథ పరిణామవికాసాలు, దాని ప్రస్తుత కొత్త పోకడల గురించిన అవగాహనా తనకు తగినంతగా ఉన్నప్పుడు.
సాహిత్యం శూన్యంలోంచి ఉద్భవించదు. కాలం, మనుషులు, సాంఫిుక పరిస్థితులు, ఉత్పత్తి సంబంధాలు- ఈ నాల్గింటి పర్యవసానమే సాహిత్యం. మనిషి ఆలోచించగల, అనుభూతించగల, వివేచించగల జీవి కాబట్టి వ్యవస్థలతో సంఘర్షించడం, అవస్థలకు ప్రతిస్పందించడం తన నైజం. అతని సంఘర్షణ, సంవేదన, స్పందనల, భావోద్వేగాల ప్రతిఫలనరూపాలే వేల సంవత్సరాల పూర్వం నుండి వస్తోన్న కళలూ, సాహిత్యం. మానవ సమాజ పురోగమనానికి సైన్సు (విజ్ఞాన శాస్త్రం) ఎంతగా దోహదపడుతూ వస్తున్నదో కళలు, సాహిత్యం సైతం అంతగా తోడ్పడుతున్నాయి. మన చుట్టూ ప్రకృతిలోని నిగూఢత్వాన్ని ఛేదించే ప్రయత్నమే సైన్సు. మన జీవితంలోని గందరగోళత్వానికి, విరోధాభాసలకు భాష్యం చెప్ప ప్రయత్నించేదే సాహిత్యం. అయితే సైన్సు ఫలితాలు, ప్రభావాలలాగా సాహిత్యం ప్రభావం భౌతికంగా తక్షణరూపంలో కనపడదు. మనుషుల భౌతికావసరాలను సులువుగా తీర్చే సాధనాలు, సామాగ్రిని సైన్సు సమకూరిస్తే, వారి చైతన్యస్థాయిని పెంచగల, ఆలోచనాపరిధిని విస్తృతపరచగల జీవిత సత్యాలను తెలియజేసే vicarious experience సృజనాత్మక సాహిత్యం అందిస్తుంది. ‘At its best it (literature) evokes unifying emotions; it makes the reader see the world momentarily as a unity’ అని ఒక మహానుభావుడు అన్నది ఇందుకే. జీవితాన్ని జీవించేందుకు అనేక అవకాశాలున్న ఈ లోకంలో తన అస్తిత్వానికి అర్థం వెతుక్కునేందుకు మనిషి పడే ప్రాకులాట, లోకం ఇలా కాకుండా మరోలా వుంటే బాగుండుననే అతని ఆశల, ఊహల విస్తృతి లక్ష గొంతుకల్లో సాహిత్యం ద్వారానే మనకు వినబడతాయి. వివిధ కాలాల్లో విభిన్న పాత్రలుగా పఠితకు కనపడే ఈ మనిషి మానవజాతి ప్రతినిధి అని వేరే చెప్పనక్కర్లేదు. కెన్నెత్‌ బర్క్‌ అన్నట్టు ‘literature serves as equipment for living’ కనుకనే అనాదిగా అది ప్రజల సామాజిక, సాంస్కృతిక జీవనంలో విడదీయలేని భాగమైపోయింది.

సాహిత్యసృజన మామూలుగా ఏ వ్యక్తి అయినా చేసే పనికాదు. సమాజంలో ముఖ్యమైన భాగంగా ముందున ఉంటూ, సమాజ చలనసూత్రాలను గురించి తనకున్న అవగాహనతో తను జీవిస్తూన్న సమాజం తీరుతెన్నులను లోతుగా పరిశీలిస్తూ విస్పష్టంగా వ్యాఖ్యానించగల వ్యక్తి- అనగా రచయిత కమ్యూనిటీతో జరిపే భావప్రసారం సాహిత్యం. అలా కమ్యూనికేషన్‌ నెరపడం- అంటే సాహిత్యం సృజియించడం- ఒక రకంగా తన బాధ్యత అనుకుంటాడు రచయిత. నడుస్తూన్న కాలం మౌలిక స్వభావాన్ని దాని రూపం, సారంతో సహా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ, మారని మనిషితనం (the eternal in the man), చరిత్ర వారసత్వం నేటి ప్రపంచంలో ఎలా నెగ్గుకుని వస్తున్నాయో తన రచనల ద్వారా చూపిస్తూ ఆ బాధ్యత నెరవేరుస్తాడు. రచయిత, సాహిత్యం, సమాజం- ఈ మూడూ ఒకటి మరోదానిపై ప్రభావం కలుగజేసుకుంటాయి. కాబట్టి సాహిత్యం ఎల్లప్పుడూ సామాజిక వర్తమానతను ప్రతిబింబిస్తూంటుంది.

సోఫోక్లీజ్‌, షేక్స్‌ పియర్‌, బెకెట్‌, సార్త్రెల నాటకాలు, టాల్‌స్టాయ్‌, దస్తోవ్‌స్కీ, గంథర్‌గ్రాస్‌, గెథే, ఎమిల్‌ జోలా, మార్క్వెజ్‌ల నవలలు ఈ విషయాన్నే నిదర్శిస్తాయి.

సాహిత్యసృజన వివిధ ప్రక్రియ (genre) లలో సాగుతుంది. కథ (short story) వాటిల్లో ప్రధానమైనది. నిరంతర పరిణామశీలమైన విశిష్ట సాహితీప్రక్రియ కథ. రూపంలోనూ, సారంలోనూ కొత్త సరిహద్దులను తాకుతూ అది తనను తాను పునర్‌ నిర్వచించుకుంటూ వస్తున్నది. కొండొకచో దండాన్వయానికి, వ్యాఖ్యానానికి లొంగీ లొంగక దోబూచులాడటం కథ విలక్షణత.

కథంటే కేవలం కల్పన కాదు, అలాగని పూర్తి వాస్తవమూ కాదు. సాధారణత్వం చెరిగిపోయేలా ఊహను మేళవించి, ఒక యథార్థ జీవిత శకలాన్ని ఉన్నతీకరించి ఆసక్తికరంగా మలచడం- అనగా నిజజీవితంలో అంతవరకూ మన అనుభవం లోకి రాని రీతిలో, మన ఆలోచనకు తట్టని కోణంలో ఒక పరిచితమైన విషయాన్ని లేదా సాధారణ ఘటనను లేదా మామూలు సన్నివేశాన్ని కొత్తగా చూపడం కథ అవుతుంది. ఈ ఆసక్తికరంగా మలిచే కొత్త కోణంలో చూపే పనినే ‘కళ’ అంటాము. కళ అంటే సాధారణ అర్థంలో ప్రకృతి అనుకరణ అని మనకు తెలుసు. ఈస్థటిక్స్‌ ప్రకారం ఆలోచనలు రేకెత్తించేలా వినూత్న పద్ధతిలో ఆవిష్కృతమయ్యే వాస్తవికత పార్వ్శం అని కూడా మనకు తెలుసు. అలా చూసినప్పుడు కథారచయితని కళాకారుడనే అనాలి. ఎందుకంటే కథ (fiction) ఒక రకంగా వాస్తవమూ, మరోరకంగా వాస్తవాన్ని ధిక్కరించే ఊహాకల్పన కూడా.

కథ లక్షణాలకి సంబంధించి అదంతా ఒక పార్శ్వం మాత్రమే. అయితే కథ ప్రయోజనం (impact) ముఖ్యమనీ, దాన్నిబట్టే కథ గుణగణాలను నిర్ధారించ వీలువుతుందనీ మనకు తెలుసు. ఆ impact ఎలా ఉండాలి? సరళమైన భాషలో బ్రిటిష్‌ రచయిత విలియం బాయ్డ్‌ ఒక సందర్భంలో ఇలా అన్నాడు: ‘Short stories are snapshots of the human condition and of human nature, and when they work well, and work on us, we are given the rare chance to see in them more than in real life.’ అలాంటి ప్రయోజనం నెరవేర్చే కథలు అనగా- ఆకట్టుకుని ఆలోచింపజేసే కథలు ప్రశస్తమయిన (brilliant) కథలు. అవి మన కళ్ల ముందు మరో ప్రపంచాన్ని చూపెడతాయి. ఇప్పటిదాకా లోకంలో చూసిందీ, మన చుట్టూ మనుషుల గురించి తెలిసిందీ చాలా తక్కువేనన్న సత్యాన్ని స్పురింపజేస్తాయి. రచయిత ప్రతిభ పై impact ఆధారపడి వుంటుంది. తెలుగులో చీకటి (అల్లం శేషగిరిరావు), ఇంగ్లీషులో ‘Another way to Die’ (హరూకి మురకామి) కథలు ఇందుకు ఉదాహరణలు.

మామూలు లేక సంక్లిష్ట సామాజికాంశమైనా, వైయక్తిక మీమాంసైనా, మనిషి సంకటస్థితి (predicament) అయినా- దాన్ని తాను అర్థం చేసుకుని ఏర్పరచుకున్న దృక్పథాన్ని కమ్యూనికేట్‌ చేసేందుకు రచయిత, all art is an order to form సూత్రం ప్రకారం, కొన్ని పాత్రలు, సన్నివేశాలు, సంఘటనలను ఒక చట్రంలోకి ప్రవేశపెట్టి, వాటి మధ్య సంబంధ బాంధవ్యాలను కల్పించి, మన మస్తిష్కం లోని అంతర్నిహిత కుతూహల ప్రేరకాలను తాకేలా వాటిని కదిలిస్తాడు. తన కమ్యూనికేషన్‌ పఠితకు అందేలా చేయడానికి తానెంచుకున్న పద్ధతి ప్రకారం కథనం (narration)లో ఎత్తుగడ, విస్తృతి, ముగింపులకు స్థానమిస్తాడు. కథకు అవసరమని భావించిన మేరకే పాత్రలు, సంభాషణలు, సన్నివేశాలు, ప్రస్తావనలు ప్రవేశపెడతాడు. సన్నివేశాలు, పాత్రలు వాటి చర్యలు గతిశీలంగా వుండేటట్టు చూస్తూ ఒక సత్యం బహిర్గతమయ్యే పాయింటు వైపుగా మొత్తం యాక్షన్‌ను కేంద్రీకరిస్తాడు. ఒక్కమాటలో చెప్పాలంటే కథానిర్మితిపరమైన ‘శాస్త్రీయత’ (exactitude) పాటిస్తాడు. ‘Smaller in its overall dimensions than the novel, it is a fiction in which society is surmised as the darkness around the narrative circle of light. In other words, the scale of the short story predisposes it to the isolation of the self.”

తాను చెప్పదలుచుకున్నది చదువరి గ్రహించినా గ్రహించకపోయినా ముందుగా తన రచన పఠనీయంగా వుండేటట్టు రచయిత కసరత్తు చేయాల్సి వుంటుంది. కుతూహలం రేపే అంశాలు కథలో పొందుపరిచి ఉన్నప్పుడే అది ఆసక్తికరంగా తోస్తుంది, ఆసాంతం చదివిస్తుంది. ‘ప్లాట్‌’ (ఇతివృత్తం)ని ఉత్కంఠభరితంగా నిర్మాణం చేయడం, గతంలో వేరే ఎవరూ స్పృశించని అంశాన్ని కథావస్తువుగా స్వీకరించడం, మనం సాధారణం అని భావించే సమస్యను కొత్తకోణంలో ఆవిష్క రించడం, పాలకవర్గాలు అవలంబించే ప్రజావ్యతిరేక విధానాలను, సమకాలీన రాజకీయాల కుళ్లును హాస్య, వ్యంగ్యధోరణిలో విశ్లేషించడం… ఇవన్నీ చదువరులలో ఆసక్తి రేకెత్తించే కథన పద్ధతులు. రచయిత శ్రద్ధ పెట్టాల్సిన మరో విషయ మొకటుంది. అది కథాసంవిధానానికి సంబంధించినది. పాత్ర(ల) సంకటస్థితితో, సంఘర్షణతో, భావోద్వేగాలతో పఠిత మమేకమైపోయి, అవన్నీ తానే స్వయంగా అనుభవిస్తున్న ఫీలింగ్స్‌ కలిగేలా వాతావరణ చిత్రణ, పరిసరాల వర్ణన, సన్నివేశాల సృష్టి, ఘటనల పరంపర కథలో వుండాలి. అలా పాత్ర సంకటస్థితితో, పఠిత సంలీనమైపోయేంతగా ఆసక్తిగొలిపే కథానిర్వహణనే ‘శిల్పం’ అంటారు. అనుభవం, అధ్యయనం, అనుశీలనం, ఊహాపటిమ వున్న రచయితకు సాధారణంగా ఈ నేర్పు వుంటుంది. మంచి కథలో వస్తువు తాజాదనం గుబాళిం చడంతో పాటు వస్తువుకు తగ్గ శిల్పం వుంటుందని విమర్శకులు అందుకే అంటుంటారు.

కథాసాహిత్యం పట్ల ప్రత్యేకమైన అభిరుచి కలిగి వున్నవాడిగా లభ్యమైన కథలను క్రమం తప్పకుండా పరిశీలిస్తున్న నేను, గత పదిహేనేళ్ల నుండి తెలుగు కథలో కనపడుతోన్న గుణాత్మకమైన మార్పు గమనిస్తున్నాను. ఒకప్పటి విప్లవోద్యమ హోరు నేడు వినిపించడంలేదు. సామాజికాంశాల కన్నా వైయక్తిక సమస్యలు, స్పందనలు ఇవాళ్టి రచయితలకు కథావస్తువులవుతున్నాయి.  విశేషమేమిటంటే ఆధునిక జీవితంలోని కొత్త కోణాలను వారు ఒడుపుగా పట్టుకుంటున్నారు. తరాల అంతరాలు, పాత ఆచారాలు-కొత్త ఆలోచనల నడుమ ఘర్షణ, అర్థాలు మారుతున్న విలువలు, కొత్త నిర్వచనాల్లోకి ఒదిగిపోతున్న స్త్రీ పురుష సంబంధాలు, వైయక్తిక సుఖలాలస, భౌతిక వస్తుసంపత్తి వుండీ అయినవాళ్లు లేక ఒంటరితనంలో కూరుకుపోతున్న మనుషులు, ప్రపంచీకరణ ప్రభావాలు, అభివృద్ధి ఫలాలు అందని వర్గాల ఆందోళన, దళితుల, బిసిల, మైనారిటీల, మహిళల ఐడెంటిటీ అసర్షన్‌, విస్మృత వర్గాల అస్తిత్వ చైతన్యం… ఈ సంక్షుభిత వర్తమానమంతా వారి కథలకు అక్కరకొచ్చే సామాగ్రే.

ఈ సంకలనంలో చేర్చడానికి 15-20 మంచి కథలను ఎంపిక చేసేందుకు పూనుకున్న మేము 2015 సంవత్సరంలో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో వచ్చిన దాదాపు రెండు వేల కథలను సేకరించి వంతులవారీగా పరిశీలించాము. ముందుగా ఈ భారీ కథలరాశిలోంచి తాలును తూర్పారబట్టేందుకు ఒక ప్రాతిపదిక రూపొందించుకున్నాము. దీని పై మా నలుగురి- ఇద్దరు సిరీస్‌ ఎడిటర్లు, ఇద్దరు గెస్ట్‌ ఎడిటర్ల- నడుమ ఏకీభావం వుంది.
1. వినూత్నమైన శైలీ, శిల్పాలతో కూడిన కథనం, 2. కథావస్తువుకు సంబంధించి కొత్త సరిహద్దుల్లోకి ప్రవేశం, 3. సాధారణ అంశమే అయినా ఆవిష్కరించిన తీరులో సరికొత్తదనం, 4. అర్థవంతమైన ప్రయోగం, 5. అత్యంత ప్రాధాన్యమూ, ప్రాసంగికత కలిగివున్న సమకాలీన సమస్య, 6. విస్మృత వర్గాల జీవితచిత్రణ (వాళ్ల భాష యాసలోనే).
పై వాటిల్లో కనీసం ఒక్క షరతునైనా సంతృప్తిపరచని కథలను పక్కన పడేశాం. అన్నీపోగా 25 కథలు మిగిలాయి. నలుగురం మూడుసార్లు కూర్చుని చర్చించాక, మరో రెండు వడపోతల తర్వాత నిలబడ్డ గట్టి కథలు పన్నెండు మాత్రమే. వాటితోనే సరిపెట్టుకోక తప్పలేదు.

వీటిలో స్త్రీ-పురుష సంబంధాలను విశ్లేషించిన కథలు మూడున్నాయి. విప్లవ ఆదర్శాలు, లక్ష్యాల నెపంతో మగవాడు భార్యాబిడ్డల్ని వదిలిపెట్టి పోగలడు కానీ వంటరిదైన స్త్రీ బతుకీడ్చి పిల్లలను రేవుకు తేవడానికి ఎన్నో కష్టనష్టాలు భరించాల్సి వస్తుంది. అంతులేని సంఘర్షణ, కన్నకొడుకు వ్యతిరేకత- ఈ నేపథ్యంలో స్త్రీ తీసుకున్న కఠిన నిర్ణయాన్ని స్త్రీ కోణంలోంచే తెలియజేసిన కథ సావిత్రి. ఆడపిల్ల ఎదుగుతున్న క్రమంలోని వివిధ దశల్లో మగవాళ్ల గురించిన ఆమె ఆలోచనలు, అభిప్రాయాలు, మోహాలు, విరహాలు, స్వేచ్చా తపనలను ఆవిష్కరించిన కథ తొమ్మిదో నెంబరు చంద్రుడు. భావుకత నిండుగా వున్న కవితాత్మక శైలి, నిర్నిరోధమైన భావప్రకటనకు ఎంచుకున్న డిక్షన్‌ వల్ల ఇందులోని ఉత్తమ పురుష కథనానికి ఆకట్టుకునే గుణం వచ్చింది.

‘మనుషులకి అన్నిరకాల స్వేచ్చలూ వుండాలి, అదే అంతిమ విలువ’ అనే ఆధునిక భావన పునాదిగా స్త్రీ-పురుషుల సహజీవనం ఒక ట్రెండ్‌గా ఇప్పుడిప్పుడే మొదలైనా మన సమాజంలో ఇరువురికీ సమానంగా వర్తించే స్థాయికి ఆ భావన ఇంకా ఎదగలేదు. స్త్రీ మనోభావనలను, స్వేచ్చాపిపాసను స్త్రీ కోణంలోంచే హృద్యంగా వివరించిన కథ శతపత్ర సుందరి.

దళితుల జీవితం ఇతివృత్తంగా కల కథలు మూడు వున్నాయి. చివరి చర్మకారుడూ లేడు… కథలో ముసలి డానియేలు తర్వాతి తరంవారు- తమ్ముడు, అతని కొడుకులు- వేరే ఉపాధులు వెతుక్కుని మునుపటి నిమ్నస్థాయి నుండి పైకి ఎదిగిన వైనం కనపడితే, నేను తోలు మల్లయ్య కొడుకుని కథలో పాత, చెప్పులు కుట్టే వృత్తిని వదులుకోలేక, మరో వృత్తి వెతుక్కోలేక సతమతమయ్యే మారయ్య గుంజాటన కనపడుతుంది. దళిత కుటుంబాల్లో నేడు కనపడుతున్న పరిస్థితి రెండు రకాలుగా వుంది. ఒకటి- పాతవృత్తిని వదులుకోలేని వెనుకబాటు తనం, రెండోది- వేరే ఉపాధులు చేపట్టి సామాజిక నిచ్చెనమెట్లు ఎగబాకటం. రెండో కథ ఒక ప్రశ్న అయితే, మొదటి కథ దానికి జవాబు. Non-linear బహుళ దృక్కోణ కథనం వల్ల చివరి చర్మకారుడూ లేడు ఆసక్తికరంగా వుంటుంది.

ఇక మూడో కథ పరిశుద్ధ వివాహము: మూడో ప్రకటన విలక్షణమైనది. మన సమాజంలోని నిచ్చెనమెట్ల కులవ్యవస్థ తాలూకు కుళ్లు కంపు మతమార్పిడి- క్రైస్తవం పుచ్చుకున్న- తర్వాత కూడా గబ్బు కొడుతున్న యథార్థాన్ని వ్యంగ్య ధోరణిలో చెప్పిన కథ యిది.

ఇక మిగతా కథల గురించి. బడిపిల్లల ఎండాకాలం తాతిల్‌ (సెలవులు) మూడు తరాలవారికీ విశ్రాంతినిచ్చి శారీరకంగా, మానసికంగా సేదదీర్చే ఋతువు. ఈ సూక్ష్మం మన గ్రామీణ ప్రజలకు తెలుసు గనుకనే వారి కుటుంబబంధాలు, మానవ సంబంధాలు గట్టివి అని తెలియజేసే కథ తాతిల్‌.

అప్పులతో బేజారై నిరాశా నిస్పృహలతో కూరుకుపోతున్న రైతులోకానికి ప్రతినిధి ఊరవతల ఊడలమర్రి కథలోని నారాయణ. కానీ అందరిలాగా తను ఆత్మహత్య చేసుకోలేదు- ఊరంతా ఉరేసుకునే ఊడలమర్రిని తెగ నరకడానికి పూనుకున్నాడు. ఒక సామాజిక జాడ్యం పట్ల తిరుగుబాటును ప్రతీకాత్మకంగా తెలిపి ఆశావహ దృక్పథం చాటిన కథ.
భౌగోళిక తెలంగాణాయే కాని సామాజిక తెలంగాణ ఇంకా రాలేదన్నది చాలా మంది భావన. సబ్బండ వర్ణాలు కలిసి బతుకమ్మ ఆడటమనేది వేదికలకు, రాజకీయ సభలకు మాత్రమే పరిమితం కానీ ఊళ్లల్లో కాదు- ఈ పారడాక్స్ ని అంటరాని బతుకమ్మ కథలో చూడవచ్చు.

వడ్డీలెక్కల్లోకి పోకుండా అసలు మాత్రమే తీసుకుని అక్క వాటా భూమినీ, బీడునీ అక్కకిచ్చేస్తుంది నాగేస్పరి. రాతి మిద్దాయిన చిన్న కుమార్తె నాగేస్పరికున్న దొడ్డమనసు అందరికీ వుంటే సమాజం ఎంత బాగుండునో. కథలో చిత్తూరు మాండలికాన్ని, అక్కడి నుడికారాలను సొంపుగా వినిపించాడు రచయిత.

అతి సున్నిత పరికరమైన థియోడలైట్‌ని ఒక సవరజాతి కొండమనిషి డుంబ్రి, తన ప్రాచీన పనిముట్లతో మరమ్మత్తు చేసిన వైనాన్ని ఒక anecdote లాగా వివరించడం మూడుకోణాలు కథలో చూస్తాం. ‘ఇక్కడి శాస్త్రాలు ఆధునిక కాలంలో ఎక్కడికి పోయాయో,’ అంటూ కార్క్సన్‌ దొర వేసిన ప్రశ్న ఇప్పుడు మనమూ వేసుకోవాలి. కొండ ప్రాంతాల్లో కదలిక (అభివృద్ధి) రావడానికి చాలా కాలం ఎందుకు పడుతున్నదో కూడా మనం ఆలోచించాలి.
చెదిరిన వాస్తవాన్ని ఒక పల్లెమనిషి కల రూపంలో నీరెటుకాడి కలలో చూస్తాం. ఊరూ, నీటితావుల జలకళ, పచ్చని పరిసరాలు, వీటి మధ్య మన బాల్యం, మన బతుకు… గుర్తు చేసుకుంటూ మనమూ కలల్లో తేలిపోతాం.

ఇవీ మా దృష్టికి వచ్చిన కథలు. మా కోణంలో పరిశీలించి మాకున్న అవగాహనతో వీటిలోని వస్తు, శైలి, శిల్పాలను నిర్ధారించి బాగున్నాయని ఎంచిన కథలు. కథలను కథలుగానే చూశాం. రచయితలను బట్టి కాదు. కొన్ని కథలు ఇతరత్రా బాగున్నప్పటికీ మేలైన కమ్యూనికేషన్‌ లోపించింది. సమాజహితం కోరేది సాహిత్యం అని మనకు తెలుసు. అయితే సాహిత్యం నీతిశాస్త్రానికి ప్రత్యామ్నాయం కాకూడదనీ, అదే విధంగా అరాచకాన్ని ప్రోత్సహించకూడదనీ మా ఉద్దేశం. కొన్ని విషయాల్లో రాజీపడాల్సి వచ్చిందని ఒప్పుకోక తప్పదు. వస్తువు బాగుందనుకున్న చోట శైలీ శిల్పాలకు ప్రాధాన్యమివ్వలేదు. కమ్యూనికేషన్‌ తీరు బాగుందనుకున్నప్పుడు వస్తువును పట్టించుకోలేదు.

వేల సంఖ్యలో  కథలు  వస్తున్నా  మంచి  కథలకు  కొరత  వుందన్న  వాస్తవం ఉత్తమ అభిరుచి గల సాహితీప్రియులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నది. ఈ పరిస్థితి మారుతుందని ఆశిద్దాం.

ఇక చివరగా, చెప్పకుండా ఉండలేనిమాట. తెలుగు కథాసాహిత్యంలో ఉన్నత ప్రమాణాలను కాంక్షించే కథాసాహితి వారి కృషిలో పాలుపంచుకున్నందుకు సంతోషిస్తున్నాను.
హైదరాబాద్‌, 22 ఆగస్ట్‌ 2016

చుక్కల వెలుగులో కాంతి బాట!

konni sephalikalu

దాదాపు పాతికేళ్ళు అయిందనుకుంటాను. అయినా ‘రష్యన్ గాల్యా’ మేజర్ మూర్తిని వదలనట్టే మేజర్ దక్షిణా మూర్తీ నన్ను  వదలలేదు.  ఈ పాతికేళ్ళుగా చాలా సందర్భాల్లో నా వెనకే ఉన్నాడు.  మనుషుల మితిమీరిన స్వార్ధాన్ని, లౌక్యాన్ని, దొంగ వేషాలని చూసి నేను క్రోధంతో ఊగి పోయినప్పుడు ‘గాల్యా’ తో పాటుగా నన్ను సాంత్వన పరచాడు.

అవును. సాహిత్యం, మనం దాన్ని నిజాయితీగా, శ్రద్ధగా తీసుకోవాలే గాని మనని ఎంతయినా మార్చగలదు.  స్థిమితపరచగలదు.  ఒక్క సాహిత్యమేనా ? ఏ కళారూపమయినా అది నిజమయిన కళారూపమయితే ఆ పని చెయ్యగలదు.  దాన్ని నిరూపించడానికే ఈ రష్యన్ అమ్మాయి గాల్యా కథతో ముడిపడిన మేజర్ మూర్తి కథను మళ్ళీ మళ్ళీ తల్చుకోవాలనుంది.

ఆర్టిలరీ రెజిమెంటు అంటే ఫిరంగి దళం. అక్కడ పెద్ద పెద్ద వృక్షాల మధ్య రాబర్ట్ క్లైవ్ కాలం నాటి సున్నపు స్తంభాలున్న భవనం ఆఫీసర్స్ మెస్.  రకరకాల ఉద్యోగుల రకరకాల హాబీల మధ్య తెల్లటి షర్టు మీద మట్టి మరకలతో ఉన్న మేజర్ మూర్తిని పరిచయం చేస్తాడు రచయిత.  మేజర్ మూర్తి మంచి ఆటగాడు.  మెస్ సెక్రటరీ, రెజిమెంటల్ ఫిల్మ్ క్లబ్ కు సెక్రటరీ, ఇంకా లైబ్రరీ పుస్తకాల పురుగుగా బుక్ వర్మ్.

ఒకనాటి డిన్నర్ తర్వాత జరిగిన ఫిల్మ్ షోలో సబ్ టైటిల్స్ ఉన్న రష్యన్ పిక్చర్ తెప్పించి వేయించాడు కెప్టన్ దేవగుణ్.  ఆర్ట్ ఫిల్మ్ అంటే మూర్తికీ ఇష్టమే.రష్యన్ ఫిల్మ్ అద్భుతంగా ఉంది.  వంద నిముషాల సినిమా.  ‘వేరా పనోవా’ కథ.  కథ, నటన, ఛాయా గ్రహణం అద్భుతం అన్నారందరూ.  అందులో మూర్తి తనను చూసుకున్నాడు.  సినిమాలో ప్రధాన పాత్ర గాల్యా ‘యువతి’ కాకపోతే కథలో చాలా ఘట్టాలు తనవే అనుకున్నాడు.

ఇది మునిపల్లె రాజుగారి ‘సవతి తమ్ముడు’ కథ. జీవితానుభవాల లోంచి తాత్వికపులోతులు చూసి ఆ సారాన్ని పెరుగు చిలికి వెన్న తీసి అందించినంత సులువుగా పాఠకులకు అందించిన కథ.

దక్షిణా మూర్తి కి రేజిమెంట్ లో కొన్ని ముద్దు పేర్లున్నాయి.  వాటికి తోడు మిలటరీ హాస్పిటల్ లో ఇంకో నిక్ నేమ్  ఉంది.  మిలటరీ డాక్టర్లు అతన్ని ‘బబుల్స్’ అని పిలుస్తారు.  అతనికి హిందీలో అన్ని ప్రాంతీయ నుడికారాలూ తెలియడం ఒక కారణమైతే, అలా పిలవడానికి మరో ప్రధాన కారణం అతని కుడి కణత మీద మిల్లీ మీటరు లోతున రెండుగాయాల మచ్చలు ఉండడం. అవి అతన్ని జీవితంలో ఎక్కడా ఓడిపోకుండా పోరాడుతూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేసిన మచ్చలు.

అతని సవతి తల్లి వంట చేస్తూ చేతిలో ఉన్న పట్టకారును బలంగా విసిరితే కుడి కణతకు తగిలి రక్తం కారింది. మూర్ఛ పోయేడు.  మూర్ఛ పోయేముందు ‘నాన్నా అన్నయ్య చచ్చి పోయాడు’ అన్న తమ్ముడి ఆర్తనాదమే జ్ఞాపకం.  తల్లి చనిపోగానే తండ్రి మళ్ళీ పెళ్లి , సవతి తల్లి పెట్టిన బాధలు.  ఆమెకు పుట్టిన కవలలు వెంటనే పోయిన ఆమె బాధ సవతి పిల్లాడి మీద ద్వేషంగా మారింది.

ఆమె పెట్టిన బాధలతో జీవిత యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. కణత మీద దెబ్బ, తరవాత పుట్టిన సవతి తమ్ముడి ఆర్తనాదం కలగాపులగంగా అతని అంతశ్చేతనలో ఉండిపోయి గెలుపుకోసం పోరాటం.

ఇల్లు వదిలి దేశ దిమ్మరి అయ్యాడు.  లెక్కల్లో ఎప్పుడూ ఫస్టే.  జీవితంలో ప్రతి మలుపులోనూ లెక్కల అవసరం తెలుసుకున్నాడు.  అంచెలంచెలు గా ప్రయాణం, ఎక్కడో ఎవరో దయాముర్తుల ఆదరణ.

నారాయణ్ దత్ జోషి ఎందుకు అభిమానించాడో తెలియదు.  చదువు తరవాత జోషి గారి స్నేహితుడి సహాయంతో కంటోన్మెంటు ఆఫీసరుగా ట్రైనింగ్ ఆర్డర్లు, శిక్షణ, ఆరితేరాడు.

“సాహిత్యంతో పరిచయం పెరిగింది.  ఇల్లు లేకపోయినా ఎల్.టి.సి., దేశంతో పరిచయం చేసింది.  కజిరంగా నుంచి కన్యాకుమారి వరకు ప్రకృతి సంపద, శిల్ప సంపద. ఈ భూమిని పురాతన కాలం నుంచీ ప్రభావితం చేసిన చరిత్రనంతా కళ్ళతో చూడడం సైన్యంలో ఉండడం వల్లనే సాధ్యమయింది.

105 ఎం.ఎం. గన్  గాని 130 ఎం.ఎం. భోఫోర్సు గానీ ‘మేజర్ మూర్తి, ఆర్టిలరీ, అతి విశిష్ట సేవా మెడల్ బోర్డు చూడగానే జోహార్లు చేయవలసిందే”  ఇవన్నీ రచయిత మాటలు.  తల్లికి – పద్మాసనంలో ఉండి ప్రాణం వదిలిన తల్లికి- శ్రాద్ధం పెట్టడం కోసం, ఆ అర్హత కోసం జోషీ గారి చేత ఉపనయనం చేయించు కున్నాడు.  అంతే. తండ్రి, సవతి తల్లి, తమ్ముడు ఇల్లూ ఏమీ లేవు.

అంత అందంగా లేని దస్తూరీతో తమ్ముడి నుంచి ఎన్నో ఏళ్ళకి ఉత్తరం.  నాన్న పోయాడని, పొలం వేలం వేసారని, అప్పులు తీరలేదని అమ్మ బాధ పడుతోంది, చెల్లి మళ్ళీ పరీక్ష తప్పిందని, అంతా రాసి తనను యునిఫాం డ్రెస్ లో చూడాలని ఉందని కోరుతూ రాసాడు.

ఆ ఉత్తరం మేజర్ మూర్తిలో ఏ వికారమూ కలిగించ లేదు.  మౌనంగా, ఉత్తరం ముక్క లేకుండా వెయ్యి రూపాయలు డ్రాఫ్ట్ పంపి ఊరుకున్నాడు.  పిన్ని, సవతి తమ్ముడు తను చూడని చెల్లీ ఎవరూ అతని జ్ఞాపంలో లేరు.

రష్యన్ సినిమాలో ‘గాల్యా’ కథ కుడా ఇదే.  సవతి తల్లి బాధల నుంచి స్కూల్ టీచర్ ‘ఎలిజబెత్ ఆండ్రి యేవనా’ అనే దీపం సహాయంతో మాస్కో నగరానికి వచ్చింది.  థియేటర్ స్కూల్ లో చేరి సహజమైన ప్రజ్ఞ, ఉపజ్ఞల సహాయంతో నటిగా ఎదిగింది.  ఉత్తమ పాత్రలు ధరించింది.  పెద్ద జీతం  తీసుకుంటోంది.  ఇష్టం లేకపోయినా వెండి తెరకు కుడా పరిచయమయింది.  స్టేజి ఉత్సవాలలో భాగంగా విదేశాలకు వెళ్లి మూడు నేలల తర్వాత తిరిగి వచ్చి మూడు నెలల క్రిందట  రాసిన చెల్లి ఉత్తరం చూసింది.

దక్షిణా మూర్తి కి అందిన ఉత్తరం లాంటిదే.

గాల్యాకు ఎర్రటి కళ్ళతో భయపెట్టే సవతి తల్లి గుర్తొచ్చింది. తండ్రి మరణం, చివరకు విమానంలో తన ఊరికి బయలుదేరింది.  సవతి తల్లికి, చెల్లెళ్ళకూ చిన్న చిన్న బహుమతులు, తనకు సహాయం చేసిన రిటైరయిన టీచరుకు, ప్రపంచాన్ని చూడడం నేర్పిన పుస్తకాలు అందించిన లైబ్రేరియన్ కు కూడా బహుమతులు తీసుకొంది.

గాల్యా తండ్రిసమాధి ముందు మోకరిల్లింది.  పాత టీచరు ఉంది గాని లైబ్రేరియన్ లేదు.  సవతి తల్లిలో మార్పు లేదు.  బహుమతుల మీదే ఆసక్తి చూపించింది.  చెల్లి తనలాగే అందమైంది.  ఇద్దరూ ఆ రాత్రంతా ఒకే మంచం మీద పడుకుని కబుర్లు చెప్పుకున్నారు. చెల్లి ఎన్నో సంగతులు చెప్పింది.  గాల్యాకు చెల్లెలితో మాటలతో పాత  ద్వేషమంతా కరిగిపోయింది.  కరుడు గట్టిన మొరటు భావాలతో ఉన్న ఈ ఇంట్లో ఆమెను ఉంచకుండా తనతో తీసుకుపోవాలి.  మాస్కోకు తీసుకుపోయి అక్కడే సారస్వతంలో పెద్ద చదువు చదివించి లెక్చరర్ ను చెయ్యాలి.   ఆమె ఇష్టం కుడా అదే కాబట్టి దాన్ని నెరవేర్చాలి.

సినిమా అయిపొయింది గాని మూర్తికి ఆగిపోయిన జీవితం మొదలయింది.  “ఈ రష్యన్ గాల్యా చాలా అసాధ్యురాలు, చాలా ఆలోచనల్ని రేగగొడుతోంది” అనుకున్నాడు.  అంత వరకు జీవితంలో దేశ దిమ్మరిగా మొదలుపెట్టి అనేక సామర్ధ్యాలు  సంపాదించుకుని ఒక ఎత్తైన పీఠం మీద కూర్చున్నాను అనుకున్న మూర్తి జీవితంలో ఓడిపోలేదన్న నినాదంతో ఆత్మవిశ్వాసాన్ని దాని పరిమితినీ, స్థాయినీ దాటి పెరగనిచ్చాడు.  అలాంటి మేజర్ మూర్తి గర్వాన్ని గాల్యా కడిగేసింది.

తన బాల్యాన్ని నలిపి, చిదిమి, చింపి పారేసిన వాళ్ళ మీద ఉన్నకక్ష ఆ ఇంట్లోనే ఉన్న పిల్లల మీద చూపితే ఎలా ?  వాళ్ళు తన చెల్లి, తమ్ముడే కదా అన్న నిష్కల్మష ప్రేమ అతని మనసులో ఉదయించడానికి ‘గాల్యా’ కారణమయింది.

మేజర్ దక్షిణామూర్తి కి ప్రమోషన్ ఆర్డర్స్ వచ్చాయి.  కానీ అతను చార్జి తీసుకోవడానికి హడావిడి పడలేదు.  సెలవు కావాలని ఎప్పుడూ సెలవడగని మనిషి అడిగేడు.  కల్నల్ జగన్నాధ్ విరగబడి నవ్వుతూ “ఇప్పుడెందుకయ్యా నీకు సెలవు” అన్నాడు – “సార్ మా తమ్ముడ్ని మంచి స్కూల్లో చేర్పించాలి, వాడు అక్కడుంటే చెడిపోతాడు” అన్నాడు మూర్తి.  ఆ చివరి వాక్యంతో కథ పుర్తయిపోతుంది.

ఎవరెవరి మీదో ఉన్న ఎప్పటెప్పటి కోపాలో అనివార్యంగా మోసుకుంటూ తిరుగుతాం.  ఎంతటి సంతోష సమయాల్లో కూడా తీసి పక్కన పెట్టలేం.  కానీ పక్కన పెట్టడం ఇంత సులువుగా చెయ్యవచ్చని ఈ కథ చదివితే నాకు అనిపించింది.  అనిపించడమే కాదు అలా చెయ్యడం ప్రాక్టీసు- సాధన అంటే మరీ పెద్ద మాట అవుతుందేమోనని ఈ ఆంగ్ల పదం వాడేను-  చేసేను.  చేస్తూ ఉన్నాను.  అలా ఈ కథ నా వెంట ప్రయాణిస్తో వస్తోంది.

మూర్తి ఇంకొక మాట అంటాడు.  ఆ మాటకి ముందు “యుద్దంలో పలాయనం చేసిన వాళ్ళున్నారు. ప్రేమలో పలాయనం చేసిన వాళ్ళు ఉండవచ్చు.  ఈ దురంత నిశిత స్మృతుల నించి పారిపోగల శక్తి ఎవరికీ ఉండదేమో అనుకుని లైబ్రరీలో స్విచ్ వేసి పుస్తకం తెచ్చుకున్నాడు.  అప్పుడు ఇలా అనుకున్నాడు.  “గోల్కొండలో ఉండగా కొన్ని తెలుగు పుస్తకాలు, ముద్దు కృష్ణ వైతాళికులు, దువ్వురి రామారెడ్డి మధుశాల, వేదుల వారి పద్యాలు, రాయప్రోలు వారివి కంఠతా కొన్ని, తడుముకొంటే కొన్ని, జాషువా సంగతి సరే సరి.  జయశంకర్ ప్రసాద్, మహా దేవి వర్మ, ద్వివేది, చతుర్వేది, ఎవ్వరూ తనని ఈ రాత్రి నిద్ర పోనిచ్చేటట్లు లేరు.  గతం ఉంది, వర్తమానం ఉంది, భవిష్యత్తూఉందని  గుర్తించని వాడు సగం మనిషి అంటున్నారు వాళ్ళు” అంటాడు.

మునిపల్లె రాజు గారు మనిషిలోని సమస్త కల్మషాలూ మాలిన్యాలూ సాహిత్యం వల్ల ప్రక్షాళితం అవుతాయంటున్నారు.  సవతి తమ్ముడు కథలో దక్షిణా మూర్తి క్షమ చూస్తే, అంత కంటే ఎక్కువగా గాల్యా క్షమను చూస్తే మనకి కూడా ఎవరేనా సులువుగా క్షమించేయవచ్చని, అలా చెయ్యాలని అనిపిస్తుంది.  మేజర్ దక్షిణామూర్తి ఒక కథలో సాహిత్య రూపంలో పాత్రగా పాఠకుని అంతరంగాన్ని శుభ్ర పరుస్తాడు.

ఇందులో అంటే ఈ కథలో రాజుగారు చూపిన మరొక శిల్ప నైపుణ్యం ఏమిటంటే గొప్ప ఆర్ట్ సినిమా లాంటి కళా రూపం ద్వారా కూడా వ్యక్తిలో మార్పు వస్తుందని ఆయన ఒక కళా రూపం నుంచి మరో కళా రూపాన్ని చూపిస్తూ వాటి తాలూకు శక్తిని చెప్పకనే చెప్పడం అబ్బుర పరుస్తుంది.

మహాభారతం ఉద్యోగ పర్వంలో ధర్మరాజు కృష్ణుడంతటి వాడితో ఒక మాట చెప్తాడు.  “పగయే కలిగినేని పామున్న ఇంటిలో ఉన్నయట్లు కాక ఊరడిల్లి యుండ నెట్లు చిత్తమొక మాటు – కావున వలవధిక దీర్ఘ వైర వృత్తి” అని.  ఇక్కడ పగ అన్న మాటను కాస్త మార్చి ద్వేషం అన్న అర్ధంలో వాడదాం.  అది ఉంటె పామున్న ఇంట్లో ఉన్నట్టే మనస్సు అస్థిమితంగా ఉంటుంది కావున దీర్ఘ కాలం ఎవరితోనూ వైరం ఉండకూడదు.  ఇంకా ఇలా కూడా అంటాడు “పగ అడగించుట ఎంతయు శుభంబు, అది లెస్స” కానీ “అడంగునె పగన్ పగ “ అనీ అంటాడు.

పగను తీర్చుకోవడం మంచిదే కాని దానివల్ల పగ చల్లారుతుందా ? అన్న ప్రశ్నకు సమాధానం ఈ కథ.  జీవితంలో సౌఖ్యానికి స్థిమితం ఎంత ముఖ్యమో, దానికి దారి ఎటు వైపునుంచి ఉంటుందో చుక్కలవెలుగు లాంటి కాంతి  సహాయంతో ఈ అంధకారంలో దారి చూపించేలాంటి ఇలాంటి కథ ఎవరికైనా ఇష్టమవుతుంది.

*

పిల్లల పుస్తకాల బ్యాగు ఈ జీవితం…

saif
1
వంశపారంపర్యంగా వస్తున్నది కొంతమంది వదల్లేదు బేషరం
ఆ కోకిల అంతే పాడుతుంది ఆ పువ్వులంతే పరిమళిస్తున్నాయి 5 <3
2
సరిహద్దులోనో అడవుల్లోనో తుపాకులు పట్టుకుని బతకడం సులువు అనుకుంటా
 మూర్ఖ ఈ మనుషుల మధ్య కలం పట్టుకుని బతకడం గొప్పే బేషరం 5 <3
3
ఎక్కడికి వెళ్ళిన ఒక గొప్ప రచన ని తీసుకెళ్తుంటారు
కొంతమంది మనుషులు బేషరం తమ మనసులను పట్టుకెళ్తుంటారు 5 <3
4
మనుషులు వెతుక్కుంటున్నారు .బేషరం
దాగి ఉన్న ఎన్నో ఉపాయాలని ఈ లోకం లో 5 <3
5
పురుషాంగం లో సామర్ధ్యం పెంచే మాత్రలు ఉన్నాయేమో
బేషరం మనసుల్లో ప్రేమని పెంచడానికి ఎప్పటికి రాలేవు గా   5 <3
6
ఏదో ఒక లాభం లేనిదే ఎవరూ ఏమి చెయ్యడం లేదు బేషరం
 తిరిగే ఈ భూమి వెలిగే ఆ సూర్యుడికి ఏం లాభం దొరుకుతుందో 5 <3
7
ఏ పని అయినా బాగా ఆలోచించి చెయ్యమంటున్నారు
బేషరం బాగా ఆలోచించే జన్మిస్తుంటారా ? 5 <3
8
దోచుకోపోయే సామానులన్ని భద్రంగా ఉంటాయి
బేషరం మనసులే దోచుకెళ్ళబడుతుంటాయి 5 <3
9
ఒకరినొకరు అర్ధం చేసుకుంటే ఎంత బాగుంటుందో
బేషరం తనచుట్టూ తాను తిరిగే భూమి ఆ చంద్రుడిలా 5 <3
10
ఎన్నో రహస్యాలు దాచిపెట్టబడి ఉంటుంటాయ్
బేషరం చిన్న పిల్లల పుస్తకాల బ్యాగు ఈ జీవితం 5 <3
*

కల గురించే.. (సంవాద కవిత)

rafi1

 

ఎవరు  నీవు? ఇది రోజు రోజుకూ విస్తృతమవుతున్న ప్రశ్న. నీ అస్తిత్వం నీకే ప్రశ్నార్థకం అవుతోంది. మనకు తెలియకుండానే మనపై ముద్ర. మన జననానికి, మరణానికీ సంబంధం లేని ప్రశ్న ఇది. మన ఆలోచనలకూ చైతన్యానికి సంబంధం లేని ప్రశ్న ఇది. నీతో సంబంధం లేకుండా ఒక సంఘర్షణ లో భాగమవుతున్నావు. నీ ప్రమేయం లేకుండానే నీవు గాయపడుతున్నావు. కొన్ని ఉద్యమాల తర్వాత, కొన్ని పోరాటాల తర్వాత కొన్ని ఊచకోతల తర్వాత వెనక్కు తిరిగి చూస్తే, నీలో నీవు లేవు. నీ ప్రశ్నలకు సమాధానాలు లేవు. 2010 ప్రథమార్థం లో అఫ్సర్, కృష్ణుడు ఢిల్లీ లో కలుసుకున్నప్పుడు రాసుకున్న గొలుసు కవిత ఇది. అంతకు 20 ఏళ్ళ క్రితం ఈ ఇద్దరూ మరో నలుగురు కవులతో కలిసి ఇవే ప్రశ్నలు వేసుకొని ‘క్రితం తర్వాత ‘ అనే గొలుసు కవిత రాశారు. కాలం మారుతున్న కొద్దీ పథ ప్రశ్నలకు సమాధానం లభించదు. కొత్త ప్రశ్నలు తలెత్తక మానవు. ప్రశ్నించి జవాబులు వేసుకొనే ప్రతి కవితా సమకాలీనమే. ఆరేళ్ళ క్రితం రాసిన ఈ కవితలో నేటి సామాజిక సంక్లిష్టత బీజాలు లేకపోలేదు. 
~

అఫ్సర్:
కల గురించే మళ్లీ,
మరిచిపోని కల గురించే మళ్లీ..
కలతలో, తలపోతలో
చిటుక్కుమని పగిలిపోయిన
ఒకానొక కల గురించే
మళ్లీ.. ఇప్పుడు..

కృష్ణుడు:
పాత అంగీ జేబులోంచి
పడిపోయిన కాగితం కోసం
చెట్టుబెరడులాంటి ముఖంలో
మధుర మందహాసం కోసం
ఎప్పుడో తాగిన ఇరానీచాయ్ రుచికోసం..
తెల్లవారుజామున వచ్చిన
సుందర స్వప్నం కోసం..

అఫ్సర్:
ఇరుదేహాల ఇరుకిరుకు గోడల్ని
లోపల్నించీ తంతున్న
ఒకే ఒక్క పద్య శిశువు
జారిపోయిన మాటకోసమో..
రాలిపోయిన కలకోసమో..
కొస తెలిసీతెలియని కాలినడక.
ఈ సందు చివర గోడలు లేని బావి ఉందో,
ఇంకో దారిలో తెరుచుకునే నిప్పుకన్నుందో తెలీదు..
కల నడుస్తోంది
నిన్నటి కాళ్లతో, రేపటి కళ్లతో!

కృష్ణుడు:
నిన్న తిరిగిన రాత్రుళ్లలో
మేల్కొల్పిన పగళ్లు
కుప్పకూలిన కట్టడాల్లో
చితికిపోయిన జ్ఞాపకాలు
కరచాలనం కోసం చేతులు లేవు
చిరునవ్వుకోసం పెదాలు లేవు
ప్రతిపరిచయంపై పరుచుకుంది
ఏదో ఒక విషపు నీడ!

అఫ్సర్:
ఇవాళ ఈ దేహం
ఒక ఆలోచన కాదు
ఒక ఉద్వేగం కాదు
ఒక కల కానే కాదు
ఎప్పుడో తయారై ఉన్న మూస
ఒక స్త్రీ,
బ్రాహ్మణ్యం
మాల మాదిగ తురక
బిసీ ఏబీసీడీ
ఏ మూసలోనూ ఇమడకపోతే
ఒక వైఫల్యం
ఒక అపజయం
ఒక గాఢాంధకార మార్గం

కృష్ణుడు:
నిన్నటివరకూ
నీవు నా స్నేహం
నా రక్తంలో రక్తం
నా నేలలో నేల
నీ ప్రతి అక్షరంలో
నా చైతన్యం
ఇప్పుడు ఇద్దరి మధ్యా
ముళ్లకంచెలు
నీ ప్రతి శబ్దంలోనూ
నీ పుట్టుకే ధ్వనిస్తోంది..
నీవు మా వాడివేనా?

అఫ్సర్:
మేం వాళ్ల అడ్డంకి
వాళ్లు మా అవతలి దిక్కు
వినూత్న శత్రునిర్మాణం
తక్షణ విధ్వంసవ్యూహం
‘నేను’ ఎవరి ఎజెండా?
ఉమ్మడి కల ఓడిపోయింది
పరస్పర ఆత్మహనన శోకాల కింద;
ఉమ్మడి ఆకాశం చచ్చిపోయింది
ఎటూ కలవని దిక్కుల మృత హస్తాల కింద;
ఈ షికాయతు అందరిమీదా,
నాలోని మీమీదా
మీలోని నా మీదా
కలవనివ్వని దారుల మీదా
కలయికల్ని తెంపిన పొలిమేరల మీదా!

కృష్ణుడు:
కుళ్లిపోయిన మనసుల్లోంచి
చ చ్చిపోయిన ఆలోచనల్లోంచి
పాతిపెట్టిన నినాదాల్లోంచి
ఒక అభావం, ఒక అభద్రత
ఒక నిస్ప­ృహ, ఒక నిట్టూర్పు..
పెల్లుబుకుతున్న లావాలో
ధగ్దమవుతున్న
నా అనామక శవంలోంచేనా
ఈ దుర్వాసన?

అఫ్సర్:
ఒక కల
ఒక కళేబరం
కుళ్లిపోతోంది దశాబ్దంగా
మిగిలిన అరకొర అవయవాలు
పట్టివ్వవు ఆనవాలు
కల గురించే మళ్లీ
ఎలాగూ తెగిపోయిన
కల
గురించే
మ…ళ్లీ..
ఒక్కసారి

మాట్లాడనివ్వండి
మీరు కప్పిన కఫన్ గుడ్డల
అడుగున పడి ఉన్న కలని!
అది స్త్రీ కాదు,
బ్రాహ్మణి కాదు
ఎస్సీ, ఎస్టీ, బీసీ తురకా దూదేకులా కాదు
కాస్త మాట్లాడనివ్వండి

కృష్ణుడు:
బొందిలోప్రాణాలను శబ్దాలు కానివ్వండి
శబ్దాలను చైతన్యాలను కానివ్వండి
ప్రతి సమాధినీ ప్రతిధ్వనించనివ్వండి..

ఒక వేసవి సాయంత్రం

Akkadi MeghamFeatured

ఉర్దు మూలం : సజ్జద్ జహీర్

తెలుగు సేత : జగద్ధాత్రి

 ఈ కథ ‘అంగారే’ అనే కథా సంకలనం లోనిది. ఇందులో ఎనిమిది కథలు ఒక నాటకం ఉన్నాయి. అరసం వ్యవస్థాపకులు డాక్టర్ రషీద్ జహాన్ , ఆమె భర్త డాక్టర్ సయ్యద్ జహీర్ కలిసి తీసుకొచ్చిన మొట్టమొదటి ఉర్దు కథా సంకలనం. ఈ పుస్తకాన్ని మతాచారాలకు వ్యతిరేకంగా ఉన్నదని అప్ప్తట్లో నిషేధించారు. రషీద్ జహాన్ పేరు ముందు అంగారే వాలీ అని ఆమె ధైర్యానికి గుర్తుగా వ్యవహరించేవారు. అభ్యుదయ రచయితల సంఘం సంస్థాపక సభ్యురాలు ఈమె. ఇటీవల ఈ కథలను అమెరికాలో ఒక ప్రొఫెసర్ స్నేహాల్ సింఘ్వీ ఆంగ్లీకరించారు. ఈ కథతో బాటుగా ఉన్న మిగిలిన కథలను కూడా అనువాదం చేస్తున్నాను. త్వరలో ఇవి ఒక పుస్తకంగా వస్తోంది. 

 

సాయంత్రం ప్రార్ధన ముగించుకుని, మున్షి బర్కత్ అలీ అలవాటు  ప్రకారం అమీనాబాద్ పార్క్ లోకి నడిచాడు. అదో వేసవి సాయంత్రం, గాలి స్తంభించిపోయింది. చల్లని షర్బత్లు  అమ్మే చిన్న దుకాణాల వద్ద నిల్చుని మనుషులు మాట్లాడుకుంటున్నారు. న్యూస్ పేపర్లు అమ్మే కుర్రాళ్ళు అరుస్తూ అమ్ముతున్నారు. మల్లెపూల దండలు అమ్మే ఒకతను కాస్త నదురుగా కనబడిన వారందరి వద్దకు పరుగున వెళుతున్నాడు. ఈ మధ్యలో గుర్రపు బగ్గీలు, బళ్ళు తోలే వాటి కలగలిసిన శబ్దం వినపడుతోంది.

“కూడలికి ! అక్కడివరకు బండి మీద ! సార్! తీసుకెళ్లమంటారా కూడలి దాకా?’

‘ హే మిస్టర్, సవారి కావాలా ?’

‘మల్లెపూల దండలోయ్! బంతి పూల మాలలూ !’

‘రుచికరమైన అయిస్క్రీం!’

మున్షి ఒక పూల దండ కొని, కాస్త షర్బత్ తాగి , పార్క్ లోకి వెళ్ళే ముందు కిల్లి వేసుకున్నాడు. కూర్చోవడానికి ఒక్క బెంచీ కూడా ఖాళీ లేనందువలన , కొంతమంది కింద గడ్డిలో చతికిలబడ్డారు. శృతి తెలియని పాటల పిచ్చాళ్లు కొందరు దగ్గరలో గోల గోల చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు మౌనంగా కూర్చుని, పంచెలు ఎగదోసి తొడలు, కాళ్ళు గోక్కోవవడం లో మునిగిపోయి ఉన్నారు. ఉండుండి దోమలను కూడా వేటాడుతున్నారు. మున్షి ఎప్పుడు పొడవాటి కాటన్ పంట్లాం వేసుకుంటాడు, కనుక ఈ మనుషుల సిగ్గులేని ప్రదర్శన అసహ్యం కలిగించింది అతనికి. తనలో తాను అనుకున్నాడు ,’ ఈ వెధవలకు సిగ్గు లేదు’, ఇంతలో ఎవరో అతన్ని ఒక బెంచీ దగ్గరనుండి పిలిచారు.

‘మున్షి బర్కత్ అలీ!’

మున్షి వెనుతిరిగి చూశాడు.

‘ఓహ్ మీరా , లాలాజీ సోదరా !బాగున్నారు కదా !’

మున్షి పని చేసే ఆఫీసులోనే  లాలాజి కూడా హెడ్ గుమాస్తా. మున్షిది అతని కింద ఉద్యోగం. లాలాజీ జోళ్లు తీసేసి హాయిగా తన శరీరమంతటితో బెంచీ మీద కాళ్ళు పెట్టుకుని కూర్చున్నాడు. పొడుచుకొచ్చిన బొజ్జ మీద సన్నగా నిమురుకుంటూ తనకిరువైపులా కూర్చుని శ్రద్ధగా అలకిస్తున్న వారితో ఏవేవో చెప్తున్నాడు. మున్షి ని  గమనించి పిలవాలని నిర్ణయించుకున్నాడు. మున్షి వెళ్ళి లాలా సాహిబ్ ముందర నిల్చున్నాడు.

లాలాజీ నవ్వి అన్నాడు, ‘ఏమిటిది మున్షిజి? పూల మాల కొన్నారే ? రాత్రికి బాగా గడుపుదామన్న ప్లానా? అంటూనే పెద్ద పెట్టున నవ్వుతూ తనకు ఇరు వైపులా ఉన్న ఇద్దరి వైపు తన మాటకు అంగీకరిస్తున్నారా అన్నట్టు చూశాడు. వారిద్దరూ లాలాజీ కావాలని వేసిన జోక్ కి నవ్వడం మొదలు పెట్టేరు.

మున్షి కూడా తప్పని, నీరసమైన నవ్వొకటి నవ్వాడు. ‘ హాయిగా గడపడమా, మీకు తెలుసు నేనసలేబీద వాడిని. ఈ వేదిలో ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంది. కొన్ని రాత్రులుగా నేను నిద్రే పోలేదు. ఈ పూల దండ కొన్నది కనీసం ఓ గంటో రెండు గంటలో నిద్ర పట్టేందుకు ఉపయోగపడుతుందని.’

లాలాజీ తన బట్ట తల నిమురుకుంటూ మళ్ళీ నవ్వాడు. ‘ నువ్వు అనుభవించేవాడివి మున్షి జి, ఎందుకు చెయ్యవు?’ అనేసి ,మళ్ళీ తన మిత్రులతో మాటాడటంలో మునిగిపోయాడు. ఇదే అదను అని చూసి మున్షి ‘సరే మరి లాలాజీ సెలవు తీసుకుంటాను ఇక మరి ! ఖుదాహఫీజ్ !’ అని నడవడం మొదలెట్టాడు. తనలో తాను అనుకున్నాడు ‘ ఈ వెధవ కళ్ళలో పడ్డానేంట్రా బాబు ఇవాళ. రోజంతా రుబ్బిన తర్వాత అడుగుతున్నాడు ‘హాయిగా గడపాలని ప్లానా ? అంటే , ఏమనుకుంటున్నాడు నన్ను ! పెద్ద భూస్వామిని, రోజూ ముజ్రాలు వింటూ, సానుల కొంపలకి తిరిగే వాడిననా ? జేబులో పావలా కంటే ఎక్కువ లేని వాడిని. భార్య, పిల్లలు, నెలకి అరవై రూపాయల జీతం- ఇంకేముంది బల్ల కింద నుండి వచ్చే డబ్బుల పై నమ్మకమే లేదు. ఒక్క రూపాయి ఈరోజు సంపాదించడానికి ఏమి జరిగిందో ఎవరికి తెలుసు. ఈ పల్లెటూరి వెధవలు మహా తెలివి మీరీ పోతున్నారు రోజురోజుకీ. గంటలు గంటలు పనికిరాని హాస్కు కొట్టాక , అప్పుడు నిన్నేదో వాళ్ల బానిసవన్నట్టు ఇన్ని కొంచం నాణేలు జేబులోంచి తీస్తారు. కనీసం మాటలు కూడా మర్యాదిచ్చి మాట్లాడరు. ఈ పల్లెటూరి దరిద్రులు పొగరుమోతులై పోతున్నారు ఈమధ్య. ఇక అన్నిటికంటే దరిద్రం ఈ మర్యాదకోశం పది చచ్చే మాలాంటి మధ్య తరగతి మనుషుల బతుకు. ఒకవైపూ ఈ పల్లెటూరి వెధవలతోనూ కలవలేము, మరొక వైపు పై తరగతి వారు, ప్రభుత్వమూ మరీ స్ట్రిక్ట్ ఐ పోతున్నాది. ఒక్క రెండు నెలల క్రితం , బనారస్ జిల్లాలో ఇద్దరు గుమస్తాలు లంచం తీసుకున్నందుకు  పట్టుబడి సస్పెండ్ చేయబడ్డారు. ఎప్పుడూ జరిగేది అదే. పేదవాళ్లకే శిక్ష. అదే ఒక సీనియర్ ఆఫీసర్ కి మహా అయితే ఒక పదవి నుండి మరో పదవికి బదిలీ అవుతుంది అంతే’.

మున్షి సాబ్ ! ఎవరో ఒక పక్క నుండి అరిచారు. అది జూమ్మన్ గొంతు, తాను ఆర్డర్లీ ( బ్రిటిష్ పెద్ద అధికారుల ఇంట్లో పని చేయడానికి ఉండే ఉద్యోగి).

‘అరె నువ్వా జూమ్మన్? అన్నాడు మున్షి

కానీ మున్షి ఆగకుండా నడుస్తూనే ఉన్నాడు. పార్క్ నుండి బయటకి నడిచి నజీరాబాద్ దగ్గరకి వచ్చాడు, జూమ్మన్ అతన్ని అనుసరిస్తూ వచ్చాడు. అదొక వింత దృశ్యం.  ముందర సన్నగా పీలగా పొట్టిగా ఉండే , పడవ ఆకారం ముఖ్మల్ టోపీతో , చేతిలో పూల దండతో నడుస్తూ మున్షి , అతనికి రెండడుగుల దూరం లో , తల పాగాతో, చేతుల్లేని పొట్టి ఓవర్ కోట్ తో, నిలువెత్తు ఆజాను బాహువు ఆర్డర్లీ జూమ్మన్.

మున్షి అనుకున్నాడు , ‘ ఇప్పుడిలా ఈ వేళప్పుడు జూమ్మన్ నా వెంట పడటం దేనికబ్బా?’

అతని వైపుకి తిరిగి , ‘అయితే జూమ్మన్ , ఎలా ఉన్నావు? ఇప్పుడే పార్క్ లో హెడ్ క్లేర్క్ గారిని కలిశాను, ఆయన కూడా వేడి ఎక్కువగా ఉందంటున్నాడు’

‘సరే , మున్షి జి , ఏమి చెప్పమంటారు. ఒక్క వేడి మాత్రమే నన్ను చంపుకుతినడం లేదు. నాలుగు నాలుగున్నరకి పనిలోంచి బయటపడ్డాను, మేనేజర్ గారింటికి తిన్నగా ఇంటి పనికి వెళ్లవలసి వచ్చింది. ఇప్పుడే అక్కడ పని పూర్తి చేసుకుని ఇంటికి పోతున్నాను. రోజంతా ఎంత కష్టమో తెలుసా మీకు , ప్రతి రోజూ పొద్దున్న పది నుండి రాత్రి ఎనిమిది వరకు పనే. ఇంట్లో పని పూర్తి చేశానో లేదో మూడు సార్లు బజారుకి వెళ్ల వలసి వచ్చింది . ఐస్, కూరగాయలు, పళ్ళు – తీరా అన్నీ కొనుక్కుని వెళ్తానా తిరిగి అరుపులు చీవాట్లు ‘ఎందుకివాళ ఎక్కువ పెట్టి కొన్నావు? ఎందుకీ పళ్ళు కుళ్లి పోయాయి? మేనేజర్ గారి భార్యకి అసహ్యం వేసింది నేను ఈరోజు కొన్న మామిడి పళ్ళు చూసి. మళ్ళీ వాటిని తిరిగి ఇచ్చి రమ్మంది. ‘ఈ టైమ్ లో ఎలా తిరిగి ఇవ్వగలను అమ్మగారు ?’ అన్నాను  , ‘ నాకదంతా తెలీదు , నిన్ను పంపించింది ఈ చెత్తoతా కొనుక్కొస్తావని కాదు’. చూడండి బాబు గారు, ఒక రూపాయి మామిడి పళ్లను ఏమి చెయ్యాలో తెలియక ఉన్నాను. ఆ మామిడి పళ్ల వాడి దగ్గరకు పోయి వాడితో నానా తగాదా పడితే రూపాయికి పన్నెండణాలు మాత్రమే తిరిగి ఇచ్చాడు. నాలుగణాలు నష్టం నాకు. ఈ నెల జీతం ఖర్చు అయిపోయింది సార్ , ఒట్టు నిజంగా తినడానికి రొట్టె ముక్క కూడా మిగలలేదు. నాకేం చెయ్యాలో తెలీడం లేదు. నా భార్యకి మొహం ఎలా చూపించాలో అర్ధం కాకుండా ఉంది’.

జూమ్మన్ తనకీ కధ చెప్పడం లో ఆంతరార్ధమేమిటో మున్షి కి అర్ధం కాలేదు. ఎవరికి తెలియదు కనుక ఆకలితో మాడే పేదవాడి గురించి? అయితే ఇందులో మున్షి చేసిన తప్పేంటి? తాను మాత్రం ఏమన్నా భోగాలు అనుభవిస్తున్నాడా ఏమన్నానా ? అప్రయత్నంగా  మున్షి చెయ్యి జేబు లోకి పోయింది . పొద్దున్న సంపాదించిన రూపాయి జాగ్రత్తగానే ఉంది.

“నువ్వు చెప్పింది అక్షరాల నిజం జూమ్మన్. ఈ రోజుల్లో పేదవారు నానా కష్టాలు పడుతున్నారు. ఎవరిని చూడు ఇవే కష్టాలు. ఇంట్లో తినడానికి ఏమీ ఉండదు. నిజంగా చెప్పాల్సి వస్తే ఈ సూచనలన్నీ ‘మహా తీర్పు’ వెలువడే  రోజు త్వరలో వస్తుందని తెలుపుతున్నాయి. ఈ ప్రపంచం నిండా మోసగాళ్ళున్నారు , వాళ్ళకి అన్నీ అనుభవించడానికి దొరుకుతాయి, అల్లాను నమ్ముకున్న పవిత్రమైన వారే ఇలాంటి అన్నీ బాధలూ, కష్టాలు అనుభవించాల్సి వస్తుంది’.

జూమ్మన్ మౌనంగా మున్షి మాటలు వింటూ అతన్ని వెంబడించాడు. మున్షి బయటికి శాంతంగా మొహం పెట్టినా లోలోపల బాగా కంగారుగా ఉన్నాడు. తన మాటలు జూమ్మన్ మీద ఎలాంటి ప్రభావం  చూపాయో అర్ధం కాకుండా ఉంది అతనికి.

‘నిన్న, శుక్రవారం నమాజు తర్వాత , మౌలానా తీర్పు వచ్చే  రోజును గూర్చిన సూచనలు వివరించారు. జూమ్మన్ భాయి , నీకు నిజం చెప్తున్నా , విన్న వాళ్లందరి కళ్ళలోనూ కన్నీరే. సత్యానికి ఇవన్నీ మన పాపాల ఫలితాలే. దేవుడు ఇచ్చిన ఈ శిక్షలు చాలవు మనకు. మన ఒక్కొక్కరిలో లేని లోపాలంటూ లేవు. బెనే ఇస్రాయెల్ ను మన వాటి కంటే తక్కువైన అతని పాపాలకు దేవుడు ఎలా శిక్షించాడో తల్చుకుంటే నాకు రోమాలు నిక్క బొడుస్తున్నాయి.  అయినా ఇవన్నీ నీకు తెలిసే ఉంటాయి’.

‘నేను బీద వాడిని మున్షిజి, ఈ చదువుకున్న వారి విషయాలన్నీ నాకేలా తెలుస్తాయి.  తీర్పు రోజును గూర్చి విన్నాను  కానీ సార్, పాపమీ బన్నీ ఇజ్రీల్ ఎవరండీ?’

ఈ ప్రశ్న వినగానే మున్షికి కొంచెం హాయిగా అనిపించింది. విషయం ఆకలి , పేదరికం నుండి తీర్పు రోజు, బెన్ని ఇస్రాయెల్ వైపు మళ్లడం బాగుందని పించింది. మున్షి కి కూడా ఆ తెగల చరిత్ర అంతగా తెలీదు, కానీ దాని గురించి గంటలు గంటలు మాటాడ గలడు.’

‘ఏమంటున్నావు జూమ్మన్ ? ముసల్మాన్ వయీ ఉండీ బెనే ఇస్రాయెల్ ఎవరోతెలీదూ! అరె భాయి, ఖురాన్ మొత్తం అంతా బెనే ఇస్రాయెల్ కథలతోనే నిండి ఉంటుంది! ప్రవక్త మూసా ఖాలీం- ఉల్లా పేరైనా విన్నావా పోనీ?( ఖురాన్ లో ఉన్న మూస అనే పేరు బైబిల్ లో మోసేస్ పేరుతో  సమానమైనది. బెనే ఇస్రాయెల్ అంటే ఇస్రాయెలీయులు)

‘అదేంటి? కలీం- ఉల్లా?’

‘ ఓహ్ అలా కాదు ప్రవక్త మూసా …మూ…సా..’

‘అంటే ఆ పిడుగు పడి పోతాడు అతడిని గురించా మీరు చెప్పేది?’

మున్షి గట్టిగా నవ్వేశాడు. ఇప్పుడు పూర్తిగా హాయిగా అనిపించింది అతనికి. కాసేపట్లో ఖాసిర్ బాఘ్ దగ్గరకు చేరారు ఇద్దరూ. ఆకలి పీనుగ ఈ ఆర్డర్లీ ని వదిలించుకోవాలి ఎలాగైనా అనుకున్నాడు. ఆకలితో బీదరికంతో మగ్గుతున్న వాడిని కలుసుకోవడం ఏమీ ఆహ్లాదం కాదు అసలు, అందునా ఈ సాయంకాలం వేళ, అందులోనూ నువ్వు కడుపు నిండా ఆరగించి , నీ నమాజులు పూర్తి చేసుకున్న తర్వాత , అలా వ్యాహ్యాళికి మనసుని ఉల్లాస పరచడానికి అలా నడకకి పోయినప్పుడు. కానీ మున్షి ఏమి చెయ్యగలడు! కుక్కలాగా జుమ్మన్ నివిదిలించి పారేయడానికి అస్సలు కుదిరే పని కాదు, ఎందుకంటే రోజూ కచేరీలో అతనికి ఎదురు పడాల్సిందే, అదీగాక పేద వర్గానికి చెందినవాడవటం వలన కూడా. తాను గనుక అందరి ముందు మున్షిని అవమాన పరిచాడంటే ఇన్నాళ్లూ నిలబెట్టుకున్న పరువు కాస్తా పోతుంది. బహుశా ,ఈ మలుపులో ఇక దారులు మళ్లి విడిపోవడం మంచిది.

‘సరే అయితే ! నీకు బెనే ఇస్రాయెల్ గురించి మూసా గురించి మరోసారెప్పుడైనా చెప్తాను, కానీ ఇప్పుడు నాకు కొంచం అవసరమైన పని ఉంది…ఇక్కడ.. సలాం , జూమ్మన్.’ మాటలు పూర్తి చేసి ఖాసీ బాఘ్ సినిమా హాల్ వైపు తిరిగి పోయాడు మున్షి. మున్షి అంతా వేగంగా వెళ్లిపోవడం చూసి జూమ్మన్ కాసేపు అక్కడే నిలబడిపోయాడు. ఏమి చెయ్యాలో పాలుపోలేదు అతనికి. అతని నుదుటి మీద చెమట చుక్కలు మెరుస్తున్నాయి.అతని కళ్ళు దిగాలుగా యిటు అటు చూశాయి. పెద్ద వెలుగుతో ఎలెక్ట్రిక్ దీపాలు, నీళ్ళు చిమ్మే ఫౌంటెన్, సినిమా పోస్టర్లు, హోటళ్లు, దుకాణాలు, కార్లూ, బళ్లూ, బగ్గీలూ, అన్నిటికి మించి చిమ్మ చీకటి ఆకాశం , మెరిసే నక్షత్రాలూ. తక్కువలో చెప్పాలంటే దేవుడి సృష్టి అంతా.

అయితే వెనువెంటనే తెప్పరిల్లి జూమ్మన్ మున్షి వెనుక పరుగెట్టాడు, జూమ్మన్ వదిలించుకున్నాననే  ఆనందం లో సినిమా పోస్టరును పరికిస్తున్న మున్షి వద్దకి.

అతని దగ్గరికి వెళ్ళి “ మున్షిజీ !’ అని పిలిచాడు

మున్షి గుండె గుభెలుమంది.  మతపరమైన ఆ చర్చ అంతా , అంతిమ తీర్పు రోజును గురించిన మాటలన్నీ అంతా వృధా పోయింది. మున్షి జూమ్మన్ కి జవాబు చెప్పలేదు.

‘మున్షి జీ , ఈరోజు ఒక్క రూపాయి అప్పు ఇస్తే , మీకు జీవితాంతం…’

మున్షి ఇటు తిరిగేడు. ‘ భాయ్ జూమ్మన్ , నాకు తెలుసు నీవెంతో  ఇబ్బందికర పరిస్థితి  లో ఉన్నవాని, కానీ నా పరిస్థితి ఏంటో నీకు తెలియదు. ఒక్క రూపాయి గురించి వదిలేయ్, కనీసం ఒక్క పైసా కూడానేను నీకు అప్పివ్వలేను. నా దగ్గరుంటే దాచుకునేవాడినా చెప్పు? నువ్వు అడగల్సిన  పనే లేదు. మొదట్లోనే నా దగ్గరేముంటే అది నీకు ఇచ్చి ఉండేవాడిని”

ఐనా సరే , జూమ్మన్ బతిమిలాడ సాగేడు. ‘మున్షి జీ, ఒట్టు నా కూలిరాగానే మీకు వెంటనే తిరిగి తీర్చేస్తాను. నిజం చెప్తున్నాను అయ్యగారు. నాకు సహాయం చేయడానికి ఇంకేవ్వరూ లేరు….’

ఇలాంటి సంభాషణలేప్పుడు మున్షి ని ఇబ్బంది పెడతాయి. ఏదన్నా సరి అయిన కారణం ఉంటే ఎవరినైనా కాదనేయవచ్చును , కానీ అది బాగోదు మరి. అందుకే ముందు నుండి విషయం ఇంత వరకు రాకుండా చూస్తున్నాడు.

అదే సమయానికి సినిమా పూర్తయి జనం వీధుల్లోకి వచ్చారు ఒక్కసారిగా.

“ బర్కత్ భాయ్ ! ఇక్కడేం చేస్తున్నావు? ‘ ఎవరో దగ్గరనుండి అన్నారు. మున్షి జూమ్మన్ వైపు నుండి అన్నది ఎవరా అని అటు  వైపు తిరిగాడు. ఒక సంపన్నుడు , లావుగా గుండ్రంగా , బహుశా ముప్ఫయ్యో ముప్ఫయ్ ఐదో ఉండొచ్చు వయసు, పొడుగు కోటు  వేసుకున్నాడు,బొచ్చు టోపీ పెట్టుకుని కిల్లీ నములుతూ, సిగరెట్టు తాగుతున్నాడు. ‘ఓహ్ మీరా చాలా ఏళ్లైంది మిమ్మల్ని చూసి. లక్నో పూర్తిగా వదిలేశారే మీరు. అయినా  భాయ్ , సిటీ లోకి వచ్చినా మీకు మాలాంటి పేద వాళ్ళని చూడటానికి టైమ్ ఎక్కడిది లెండి.’. అతను మున్షి కాలేజ్ స్నేహితుడు , మంచి సంపన్నుడు.  ‘అదంతా సరేలే వదిలెయ్. కాస్త సరదాగా హాయిగా గడుపుదామని లక్నో లో కొన్ని రోజులు వచ్చాను. రేపు నాతో రా , నువ్వు  జన్మలో మరిచిపోలేనంత గొప్ప నాట్యకత్తే ఇంటికి  తీసుకెళతాను. నా కార్ ఇక్కడే ఉంది. ఎక్కువ ఆలోచించకూ దాన్ని గురించి , వచ్చేయ్ అంతే. నువ్వేప్పుడైనా నూర్జెహాన్ పాట విన్నావా ? ఓహ్ అద్భుతంగా పాడుతుంది, అందంగా సొగసైన భంగిమలతో నాట్యం చేస్తుంది. ఆ కొంటె చూపులు , ఆ వయారి వొంపులు తిరగడం , ఆ పెదవులు కదిలించే విధానం, ఆమె గజ్జెల శబ్దం. మా ఇంట్లోనే ఆరుబయట , తారల నీడ కింద , గానా బజానా ఉంది. పొద్దున్న మేల్కొలుపు రాగం వినే వరకు అదలా కొనసాగుతూనే ఉంటుంది. తప్పకుండా రా. రేపేలాగూ ఆదివారమేగా … మీ ఆవిడ చెప్పు తీస్తుందని భయమా ఏం? ఆడాళ్లకి బానిసలుగా పడి ఉండాలంటే , నీకు తెలుసు పెళ్లే చేసుకోనక్కర్లేదు , అవునా ? రా భాయ్ మరి తప్పకుండా , భలే మజాగా ఉంటుంది.అలిగిన భార్యని బుజ్జగించడం లో కూడా ఒక రకమైన ఆనందం ఉంటుందిలే …….’

పాట మిత్రుడు, కార్ ప్రయాణం, ఆట పాట,కైపెక్కించే  కను చూపుల వాగ్దానం , స్వర్గం లాంటి ప్రదేశం- మున్షి ఒక్క ఉదుటున కార్ లోకి దుమికి కూర్చున్నాడు కార్ లో .జూమ్మన్ గురించి మరో మాట ఆలోచించలేదు. కార్ సాగిపోతుంటే  జూమ్మన్ అక్కడే మౌనంగా నిలబడి ఉండటం కనిపించింది.

 

 

*

 

 

చేతుల్లేని వర్ణజీవి

Art: Rafi Haque

Art: Rafi Haque

 

విడిపోయే ముందు

దిల్దార్‌ కథకుడు

Dilavar book 1రచయిత ఏది రాస్తే అది పాఠకుడు చదువుకోవాలె. అది రచయిత  లేదా సృజనకారుడి హక్కు. హక్కుని గౌరవిస్తూనే బాధ్యతను గుర్తు చేసేవాడు విమర్శకుడు. రచయిత ఏమి రాయాలె, ఏమి రాయొద్దు అనే దాంట్లో పాఠకుడి ప్రమేయం ఉండాలా? వద్దా అనేది ఇవ్వాళ సాహిత్య చర్చలో ప్రధానాంశమైంది.   నిజానికి ఏ రచయితైనా తాను చూసిన, అనుభవించిన, దృష్టికి వచ్చిన లేదా తన మనసుకు తట్టి చర్చకు పెట్టాల్సిన/ తెలియజేయాల్సిన విషయాల్నే రాస్తాడు. ఈ రచనలే సామాజిక చైతన్యానికి తోడ్పడతాయి. రచయిత ఏమి రాయాలో పాఠకుడు నిర్ణయించలేడు. పత్రిక, లేదా పాఠకుడి డిమాండ్‌ని బట్టి సాహిత్యం వస్తే/ రాస్తే అది కమర్షియల్‌/ కలుషిత సాహిత్యమే అవుతుంది గానీ కమనీయ సాహిత్యం కాదు. ‘మనీ’ సాహిత్యం ‘మెనీ’ సాహిత్యంగా మారాలె!
ఈ కథ రచయిత దిలావర్‌ ‘మెనీ’ అంటే సమాజంలోని మెజారిటీ జీవితాల్నే చిత్రికగట్టిండు. ఇందులో కథకుడు తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నడు. తాను దగ్గరి నుండి చూసిన పద్మశాలి, మాదిగ, లంబాడీ జీవితాల్లోని దయనీయమైన వ్యధాభరిత గాథల్ని కళ్ళముందుంచిండు. ఒక వైపు నోస్టాల్జియాను చిత్రికగడుతూనే, చిధ్రమవుతున్న రైతుల, స్త్రీ జీవితాల్ని ద్రవించిన హృదయంలోంచి పాఠకుల మెదళ్ళలోకి ఒంపిండు. దిల్‌ని, దిమాక్‌ని కలెగలిపి కమనీయ సాహిత్యాన్ని మనముందుంచిండు. పాత్రలు ఉరి బెట్టుకున్నా కథలకు మాత్రం పాణం బోసిండు. చేదు నిజాల్ని తీపి పూత లేకుండా పాఠకులకు అందించిండు. ‘ఉత్పత్తి’ జీవితా హృదయావిష్కరణ చేసిండు.
నిజానికి ఇవ్వాళ సమాజంలో జరుగుతున్న విషయాలను తీసుకొని వాటిలోతుల్లోకి పోకుండానే కొంతమంది తమది కాని, తమకు తెలియని జీవితాలను ‘డిమాండ్‌’ కథలుగా అల్లుతున్నరు. అట్లా గాకుండా సమాజ హితంగోరే రచయిత, పాఠకుడికి ఇది కావాలి, ఈ విషయం తెలియాలి అని వాటి మూలాల్లోకి వెళ్ళి తనదైన శైలిలో, శిల్పంలో, భాషలో చెబుతాడు. ఆ పని దిలావర్‌ సమర్ధంగా చేసిండు. కథాసృష్టిలో సమస్య ఉండవచ్చు, సంఘటనలూ, పాత్రలు, ఘర్షణ, జీవితమూ ఉండవచ్చు. అయినప్పటికీ ఆధునిక సమాజంలో సమస్యను తార్కికంగా ఆలోచించి మెజారిటీకి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించినప్పుడే సాహిత్యానికి విలువ, గౌరవం పెరుగుతుంది. కొన్నిసార్లు మెజారిటీ సమాజం తమ సుప్థచేతన వల్ల కొన్ని విషయాను తిరస్కరించవచ్చు. ఆ విషయాల ఆమోదం పట్ల గుంజాటన ఉండొచ్చు. అట్లాంటి సమయంలో సామరస్యంగా, సమన్వయంతో మనసు నొప్పించకుండానే వారిని కన్విన్స్‌ చేయాల్సిన బాధ్యత కూడా రచయితపై ఉంటుంది. అందుకు వాహిక అస్తిత్వవాదమే! ఆత్మగౌరవం, అస్తిత్వాన్ని పెంపొందించే సాహిత్యమే సమాజానికి ఉపయోగమైంది. అవసరమైంది కూడా!
రచయిత లేదా సృజనకారుడు తనకిష్టంలేని ఏ విషయాన్ని, అంశాన్ని సాహిత్యీకరించబోడు. ఇతివృత్తంపై తాదాత్మ్యత, అవగాహన, పట్టు, లోతైన పరిశీలన, ప్రేమ లేకుండా రాసినట్లయితే అది పేలవంగా, నిస్తేజంగా, నిర్జీవంగా ఉంటుంది. ఆఖరికి రచయితను అభాసుపాల్జేస్తుంది. అందుకే నేటి సమాజంలో ఎట్లా జెప్పిండనే దాని కన్నా ఏమి జెప్పిండనేదే ప్రధానమైంది. ఎందుకు జెప్పిండనేది సామాజిక, రాజకీయాసక్తులపై, వ్యక్తిగత చైతన్యస్థాయిపై ఆధార పడి ఉంటది. వస్తువే అన్నింటికీ మూలం. అస్తిత్వోద్యమాలకు పూర్వం ఈ వస్తువుల ఎంపికలో రచయితలపై అభ్యుదయ, ప్రగతిశీల, విప్లవ భావజాలాల ప్రభావం ప్రస్ఫుటంగా ఉండింది. శైలీ, శిల్పాలు కథలను డామినేట్‌ చేసినవి. ప్రామాణిక భాష పేరిట అజమాయిషీ కొనసాగింది.
తెలుగు సాహిత్యంలో మొదట అగ్రకులస్తులు తమ జీవితంలో భాగమైన ‘సామాజిక సంస్కరణ’ ఇతివృత్తంగా రచనలు చేశారు. దీని లోని డొల్లతనాన్ని ముందు పేజీల్లో తెలుసుకుందాం. అయితే తొలి దశలో అక్షరాస్యులైన బ్రాహ్మణులతో పోలిస్తే వారి ద్వారా, వారి ఆలోచనలు, భావజాలం, ప్రభావాలకు అనివార్యంగా, పూర్తిగా లోబడాల్సి వచ్చిన కింది కులాల వాండ్లు మెల్లమెల్లగా ఒడిదొడుకుల్ని అధిగమించారు. తక్కువగానే అయినా రాజకీయ, ఆర్థిక అంశాలపై రచనలు చేసిండ్రు. తెలంగాణలో గూడూరి సీతారామ్‌, జి.రాము, సీమాంధ్రలో కొలుకలూరి ఇనాక్‌ తదితరులు అట్లాంటి వారికి ప్రతినిధులు. వీళ్ళు బహుజన జీవితాలను చిత్రికగట్టిండ్రు. బ్రాహ్మణాధిపత్య విద్యాబోధన నుంచి బయటపడ్డ వారు తర్వాతి కాలంలో ఆలస్యంగానే అయినా కొత్త విషయాలను కథలుగా మలిచిండ్రు. ఇట్లా రాసిన వారిలో రాయసీమ నుంచి కె.సభా లాంటి దళితులు, ఆంధ్రా నుంచి అందే నారాయణస్వామి లాంటి బహుజనులున్నారు. సాయుధ పోరాటం, నక్సలైట్‌ ఉద్యమ సందర్భంగా కొంత మేరకు కింది కులాల వారి జీవితాలు కథా సాహిత్యంలోకి వచ్చాయి. ఇందుకు ఉదాహరణ ఆవుల పిచ్చయ్య, అల్లం రాజయ్య కథలు. అయితే ఈ ‘పోరాట రచనలు’ అంతిమంగా అగ్రకులాల వారిని హీరోలుగా, రోల్‌ మోడల్స్‌గా, మరీ ముఖ్యంగా బ్రాహ్మణుల్ని ఉన్నతలుగా నిలబెట్టడానికీ, మరింతమంది ‘అమరు’లు కావడానికి మాత్రమే తోడ్పడ్డాయి.
బ్రాహ్మణాధిపత్య సాహిత్యానికి భిన్నంగా గ్లోబలైజేషన్‌ తర్వాత, మండల్‌ కమీషన్‌ అమలు, బాబ్రీమసీదు ‘షాహిద్‌’, కారంచేడు, చుండూరు దాష్టికాల  తర్వాత, మరీ ముఖ్యంగా 1990ల  అనంతరమే అస్తిత్వ సాహిత్యం పాదులూనుకుంది. దానికి పై సంఘటనూ, అవి సమాజంలో తెచ్చిన మార్పు, ఉద్యమాలు, ఉద్యమాలకు ఊతమిచ్చిన పత్రికలూ, వాటికి అక్షరరూపమిచ్చిన జర్నలిస్టు, సాహితీవేత్తల  మూలంగా అస్తిత్వ సాహిత్యానికి స్థిరత్వం ఏర్పడింది. దీన్ని తర్వాతి కాలంలో అన్నికులాల  అకడమిషయన్లు అనివార్యంగా గుర్తించాల్సి వచ్చి సాహిత్యచరిత్రలో భాగం చేశారు. 1980వ దశకం నుంచి విద్యారంగంలోకి   టీచర్లుగా బ్రాహ్మణేతరులు కూడా ఎక్కువగా వచ్చారు. దీనికి కొంత రిజర్వేషన్లు, మరికొంత బహుజన చైతన్యం కారణం. దీంతో అప్పటివరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న అగ్రకులాల  వాండ్లు, బ్రాహ్మణులు  బహుజనుల  దగ్గర నేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకే వాళ్ళు అప్పటికే అందివచ్చిన ప్రైవేటు, కార్పోరేట్‌ కళాశాలలను ఆశ్రయించారు. గ్లోబలైజేషన్‌ కారణంగా ఈ దశలో ప్రైవేటు విద్యాసంస్థలు, కార్పోరేట్‌ కళాశాలలు ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటయ్యాయి. వీటిలో ఎక్కువభాగం బోధకు అగ్రకులాల  వాండ్లే కావడం యాధృచ్ఛికం కాదు. ఇవి డాక్టర్లు, ఇంజనీర్లను తయారుచేసే ఫ్యాక్టరీలుగా పనిచేశాయి. ఇట్లా తొలిదశలో ఈ విద్యాసంస్థల్లో అభ్యాసం చేసిందీ, దాని ద్వారా మల్టినేషనల్‌ కొలువులు సంపాదించింది అత్యధిక శాతం కచ్చితంగా అగ్రకులాల  వాండ్లే! నక్సలైట్‌ ఉద్యమం పుణ్యమా అని గ్రామాల నుంచి నగరాల్లోకి మకాం మార్చిన రెడ్లు, వెలమలు, దొరలు, భూస్వాములు, వారికి తోడు అప్పటికే పట్టణ/నగరబాట పట్టిన బ్రాహ్మణులు  తెంగాణలో ఈ అవకాలశాను అందిపుచ్చుకున్నారు. వీరికే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు  తొలిదశలో అందాయి. ఈ తరం పిల్లలు సామాజిక మార్పుకు అనుగుణంగా ప్రజలతో ఎన్నడూ మమేకం కాలేదు. తాము ‘ఎబోవ్‌ ద కట్‌’ అన్న దృక్పథంతోనే వ్యవహరించారు. అదే విషయాలు  సాహిత్యంలోనూ చోటు చేసుకున్నాయి. చేటు చేశాయి.
మొదట చెప్పుకున్నట్టు 1990 కన్నా ముందు ఒకటి రెండు మినహాయింపుతో సాహిత్యమంతా అగ్రకులాధిపత్యాన్ని నిలబెట్టే విధంగానే ఉండింది. (కేవలం  సక్సెస్‌ స్టోరీస్‌ మాత్రమే రాసిన కొలకలూరి ఇనాక్‌ సకల ఆధిపత్యాలను అస్తిత్వ సోయితో ఎదిరించిన వారిలో ఆద్యుడంటే అతిశయోక్తి కాదు) ఈ దశలోని విప్లవ సాహిత్యమూ వర్గ దృక్పథాన్ని మాత్రమే ప్రచారం చేసింది. బహుజనులూ  అదే పంథాను అనుసరించారు. కథా సంకలన కర్తలు, సాహిత్యరంగంలో బ్రాహ్మణాధిపత్య భావజాలం  గల  విమర్శకులు చెప్పిందే తీర్పుగా చలామణి అయింది. వారి ఆలోచన చట్రంలో ఇమడని సాహిత్యాన్ని తూర్పారా పట్టేవారు. చీల్చి చెండాడే వారు. అంతిమంగా అంతో ఇంతో రాయగలిగిన సత్తా వున్న వాళ్ళు సైతం ఈ విమర్శల  మూలంగా అసలే రాయడం మానేసిండ్రు. తప్పు సరిదిద్ది ముందుకు నడిపించేదిగా గాకుండా విమర్శ అనే ఖడ్గంతో కలాలను నరకడమే లక్ష్యంగా పనిచేసిండ్రు. ముఖ్యంగా కింది కులాలవారి అక్షరాలను నరికి కుప్పలు పోసిండ్రు.
kaifiyath
అనాది కాలం  నుంచి దాదాపు గ్లోబలైజేషన్‌ ప్రభావం విస్తృతమయ్యే వరకూ బ్రాహ్మణులు తమ కులంలోని సతీ సహగమనం, వేశ్యాలోలత, వితంతు వివాహం, మధ్యతరగతి ఉద్యోగస్థుల  బాధలు, ప్రేమలు, పెళ్ళి ళ్లు, లైంగిక స్వేచ్ఛ, శృంగారం ప్రధానంగా రచనలు చేసిండ్రు. ఇవే ‘విప్లవ’, ‘అభ్యుదయ’, ‘ప్రగతిశీల’ రచనలుగా చలామణి అయ్యాయి. ఈ సాహిత్యంలో కింది కులాల  జీవితాలుగానీ, ఘర్షణగానీ అతి స్వల్పంగా  రికార్డయింది. నిచ్చెనమెట్ల సమాజాన్ని ఈ సాహిత్యం నిలదీయలేదు. పరిష్కారాలన్నింటినీ వర్గ దృక్పథంతో తాము గిరిగీసుకున్న పరిధిలో, పరిమితిలోనే వెతికారు. 1980వ దశకం నుంచీ పాక్షికంగానే అయినా బెంగాల్‌ బుద్ధిజీవులు ‘సబాల్టర్న్’ జీవితాలను చరిత్రకెక్కించినారు. అయితే వీరికి అక్కడి కానూ సన్యాల్‌ మాత్రమే కనిపించిండు. అణగారిన కులాల వారి బాధలు  వీరి కలాలకు ఆనలేదు.
అందుకే ఇవ్వాళ అస్తిత్వోద్యమ సాహిత్యకారులు ప్రధానంగా సమాంతర సాహిత్యాన్ని సృజిస్తున్నారు. సబాల్టర్న్  దృక్కోణంతో సమాజాన్ని చూస్తున్నరు. ప్రతిమనిషికి సమాన విలువ ఉండే సమ సమాజ నిర్మాణం కోసం సాహిత్యాన్ని వాహికగా ఎంచుకున్నరు. అస్తిత్వ చైతన్యంతో కిందినుండి చరిత్రను నిర్మిస్తూ, తమ సమస్యలకు అదే సోయితో జవాబులు  వెతుకుతున్నారు. ప్రతి సమస్యకూ అస్తిత్వ సోయే సమాధానమిస్తుందని నమ్ముతున్నరు. సృజనకారులతో పాటు విమర్శకులూ  ఇప్పుడు కొత్త తూనికరాళ్ళను తయారు చేసుకున్నరు. మూస పద్దతిలో గాకుండా బహుజన సోయితో వివిధ అంశాలకు, సమస్యలకు సమాధానాలు వెతుకుతున్నరు. కొత్త విషయాల్ని వెలికి తీస్తున్నరు. ఘనతను చాటుతున్నరు. పాఠకుల  తరపున, సమాజం తరపున విమర్శకులు  మాట్లాడుతున్నరు. 1990 నాటి విమర్శకు ఇవ్వాలటి విమర్శకు తేడా ఉంది. అందుకు విప్లవ సంస్థల  నుంచి బయటికి వచ్చిన వారు కొత్తదారులు  వేసిండ్రు. శివసాగర్‌ పయనం అందుకొక ఉదాహరణ. దరకమే లాంటి సంస్థలు  కొత్త ఆలోచనను ప్రోది చేశాయి. దండోరా ఉద్యమం కొత్త వాదనకు వేదిక అయ్యింది. మహాజన, సమాంతర, బహుజన కెరటాలు లాంటి పత్రికలు దారి చూపాయి. ఆనాడు విమర్శ వర్గ దృక్పథంతోనే ఉండింది. ఇవ్వాళటి విమర్శ అస్తిత్వ సోయితోటి, వర్ణ దృక్పథంతోటి ఉన్నది. ఇది రియాలిటీ. ఆనాటిది హైపోథీసిస్‌. అనుభవంలో హైపోథీసిస్‌ తప్పని తేలింది. అనేక చేదు నిజాలు  ముస్లింలు, దళితులు, బహుజనులు తమపై జరిగే దాడుల్ని మరింత బలంగా ఎదుర్కునేందుకు సన్నద్ధం చేస్తోంది.
ఇండియాలో ఇవ్వాళ ప్రధానంగా రెండు అంశాలున్నాయి. ఒకటి కులం. రెండు మతం. అయితే విమర్శకుడు మాత్రం రచయితలకున్న హక్కులకు భంగం కలుగకుండానే ఏది? ఎందుకు? ఎలా? ఎప్పుడు? ఎవరు? రాయలేదు, రాశారు! అని విమర్శించడానికి వీలుంటది.  ఈ విషయాలు చర్చకు పెట్టడం ద్వారా మేలైన సాహిత్యం` మెరుగైన సమాజం కోసం రావడానికి వీలవుతుంది. సమస్యలోతుల్లోకి వెళితే పరిష్కారం దొరుకుతుంది. ఈ రెండు సమస్యల్ని రాజకీయార్థిక కోణాల్లో గాకుండా కులం, మతం దృష్టి కేంద్రంగా చూడాలి. రాజకీయంగా ఎవరి జనాభా నిష్పత్తి మేరకు వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం ఎందుకు లేదో తెలుసుకోవాల్సి ఉంది. అలాగే ఆర్థిక విషయంలో పేదరికానికి నిర్వచనాలు మారుతున్నాయి. పేదరికానికి కులం, మతంలో కారణాలు వెతికినప్పుడు ఆధిపత్యుల దోపిడీ, అణచివేత తెలిసి వస్తుంది. అప్పుడు శత్రువెవరో తేట తెల్లమవుతుంది. పేదరికానికి, కులం మతంతో గ సంబంధాను, కార్య`కారణాను విశ్లేషించుకున్నప్పుడు కచ్చితంగా రచయిత జ్ఞానంలో, తద్వారా అభిప్రాయాల్లో మార్పు ఉంటది. కుంపై, మతాధిపత్యంపై తిరుగుబాటు ఉంటది. ఆర్థిక, రాజకీయ రంగాల్లో వర్గాధిపత్యం, అగ్రకులాధిపత్యమే సమాజంలో పేదరికానికి కారణమనే అవగాహన ఏర్పడినట్లయితే సమస్యలు  మరింత సుళువుగా పరిష్కరించుకోవడానికి మార్గమమేర్పడుతుంది. ఈ విషయంలో ఆధిపత్యుల  ‘మేధోత్వాన్ని’, కుట్రలను అర్థం చేసుకోవాలి. ఈ కుట్రలను చేధించడానికి ఫూలే, అంబేద్కర్‌ రచనలు, ఆచరణే శరణ్యం.
పూలే సామాజిక ఆధిపత్యాన్ని మొట్టమొదటిసారిగా గుర్తించి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండు. అందులో భాగంగా మేలైన మార్పుకోసం విద్యను ఆయుధంగా చేసుకున్నడు. కింది కులాలకు, మహిళలకు చదువు నేర్పడం ద్వారా  సమస్యకు పరిష్కారం చూపించిండు. ‘గులాంగిరీ’ ద్వారా సాహిత్యదారులేసిండు. పూలే చనిపోయిన తర్వాత పుట్టిన అంబేద్కర్‌ తన మేధో సంపత్తితో పూర్తిగా సామాజిక విప్లవానికి కృషి చేసిండు. అంబేద్కర్‌ రచనలు  ఎంత విరివిగా అందుబాటులోకి వస్తున్నాయో అంతే స్థాయిలో బహుజన చైతన్యం పెరిగి గతంలో పాదులూనుకున్న సిద్ధాంతాలను బద్ధలు  కొడుతోంది. తొలితరం అక్షరాస్యు లు ఇవ్వాళ అన్ని ఉద్యమాల్లో ముందున్నరు.
సంస్కరణ పేరిట బ్రాహ్మణీయ సాహిత్యాన్ని ఇంతకాలం  విప్లవ సాహిత్యంగా, అదే సమాజాన్ని మారుస్తుందని అభ్యుదయ వాదులు  తప్పుడు భావనల్ని ప్రచారంలో పెట్టడం జరిగింది. (శ్రీశ్రీ సాహిత్యాన్ని సమగ్రంగా చదివితే ఇది అర్థమైతది) దీని వల్ల  కులానికి వచ్చిన నష్టమేమీ లేదు. దాని స్థానంలో అది ఖాయంగానే ఉంది. ఈ నిచ్చెన మెట్ల సాహిత్యాన్ని తలకిందులుగా చేయాలి. అది సాధ్యం కాని స్థితిలో కనీసం సమాన స్థాయి ఏర్పడే సాహిత్య సృజన జరగాలి. ఆధిపత్యకులాలని తలకిందులు  చేయకుండా నాలుగైదు శాతం మాత్రమే ఉన్న వారి సామాజికాధిపత్యానికి చరమగీతం పాడడం సాధ్యం కాదు. నిజానికి సమాజ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి పనికొచ్చినంతగా సమాజాన్ని మార్చడానికి మార్క్సిజం పనికిరాదు. ‘అంతిమ ఘడియ’ (ఫైనల్‌ డిస్టినేషన్‌) వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది మార్క్సిజం చెప్పలేదు. అంతిమఘడియ అంటే విప్లవం వచ్చిన తర్వాత మనిషి పూర్తిగా స్వేచ్ఛా జీవి అవుతాడు. ఏ రకమైన సంకెళ్ళు ఉండవు. సొంత ఆస్తి ఉండదు. ఉదయం వేటాడటం, మధ్యాహ్నం చేపలు  పడుతూ, సాయంత్రం సాహిత్య విమర్శ చేస్తాడు అని మార్క్స్‌ భావన. ఇండియాలో ఈ పనులన్నీ  వేర్వేరు సామాజిక వర్గావారు చేస్తారు. అందుకోసమైనా కులం పోవాలి. అందుకే ఇండియాలో మార్క్సిజం ఆచరణ యోగ్యం కాదు. ఈ విషయాలన్నింటినీ కూలంకషంగా అర్థం చేసుకుంటే గానీ సమాజస్వభావం తెలిసి రాదు. ఇందులో ఆధిపత్యకులాలవారి అజమాయిషీకి ముందుగా తెరదించాలె. ఇది అస్తిత్వ సోయితోనే సాధ్యం. సకల  సమస్యలకు రాజ్యమే కారణం అని ఒక గంపగుత్త సూత్రంతో సామాజిక అంశాల్ని పరిశీలిస్తే సమస్యలకు ఎన్నటికీ పరిష్కారం దొరకదు.
భారతదేశంలో పారిశ్రామికీకరణ జరగకముందే (ప్రిమిటివ్‌స్టేజ్‌) ప్రాథమిక దశలోనే సామాజిక శ్రమ విభజన జరిగిందని మార్క్స్‌ ఇండియా మీద రాస్తూ చెప్పిండు. అంటే మార్క్స్‌ అర్థంలో పారిశ్రామికీకరణ అభివృద్ధి చెందే క్రమంలో శ్రమ విభజన జరుగుతుందనే అవగాహన ఉంది. కాని భారతదేశంలో దానికన్నా ముందే ఈ విభజన సామాజికంగా జరిగింది అంటే దాని అర్థం కులవిభజనే!
దేశీయ మార్క్సిస్టు ఉద్దేశ్య పూర్వకంగానే కులాన్ని 1990కు ముందు పట్టించుకోలేదు. కారంచేడు, చుండూరు సంఘటనల తర్వాత కొంత మార్పు వచ్చింది. అయినా ఈనాటికీ మార్క్సిస్టులకు, వాటి కుల, ప్రజాసంఘాలకు  పైకి కనిపిస్తున్నట్టుగా కులమనేది ప్రధానమైన అంశం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే అంబేద్కర్‌ ‘ఇండియాలో శ్రమవిభజన కాదు. శ్రామిక విభజన ఉంది’ అని వాదించాడు. కుల సమస్యను గుర్తించ నిరాకరిస్తూ, అణగారిన వర్గాలపై అగ్రకులాధిపత్యాన్ని లెఫ్టిస్టు పార్టీలు ఇప్పటికీ స్థిరీకరించుకుంటున్నాయి.
ఇవ్వాళ కమ్యూనిస్టులు, మార్క్సిస్టులూ  రాజకీయ, ఆర్థిక అంశాలకు ప్రాధాన్యత నిస్తూ కులం, మతం వాటి మూల స్వభావాలను విస్మరిస్తున్నారు.  మార్క్సిస్టు భావజాలం  1990లకు ముందు నుంచి రాస్తున్న సృజనకారులను ఆవహించింది. అట్లా అనడానికి ఎవరికైనా అభ్యంతరం ఉంటే ప్రభావం చూపిందని చెప్పొచ్చు. కులం, మతంతో సంబంధం లేకుండా చైతన్యవంతులైన అప్పటి సాహితీవేత్తలందరూ తమకు తెలియకుండానే బ్రాహ్మణాధిపత్య భావజాలానికి లోబడి ఉన్నారు. కులాన్ని, మతాన్ని వీళ్ళు ప్రశ్నించలేదు. ఈ బలహీనతకు కారణం మార్క్సిజం.
ఈ కథల రచయిత దిలావర్‌ కూడా ఈ బహీనతల నుంచి బయటపడలేదు. రైతు, చేనేత కార్మికుల ఆత్మహత్యలను సమర్దవంతంగా చిత్రించిండు. అట్లనే ముస్లిం పేదరికాన్ని చిత్రించిండు. దానికి తోడు లంబాడీ దయనీయమైన స్థితిగతుల్ని ఏకరువు బెట్టిండు. కరువు పీడననూ లెక్క గట్టిండు. అత్యాచారాలను ఎమర్జెన్సీ కాలంలోని రమీజాబీ నుంచి ఈనాటి ఆయేషా వరకు గుడ్లనీళ్ళు  తిరిగేలా చెప్పిండు. సరోగసీ లాంటి ఆధునిక అంశాలను అక్షరీకరించిండు. వీటన్నింటినీ ఆయన తనకున్న చైతన్యంతోటి రాజకీయ, ఆర్థిక దృక్కోణంలో రాసిండు. ఈ చైతన్యమంతా లెఫ్టిస్ట్‌ సాంగత్యంతోనే వచ్చింది. ఇది వర్గ దృక్పధాన్నే నేర్పింది గానీ వర్ణ దృక్పథాన్ని, మత దృక్పథాన్ని అలవర్చలేదు. మీదు మిక్కిలి అట్లా చూడడం తప్పని స్థిరీకరించింది. దీని వల్ల  ‘జరీనా’ కథలో లైంగిక హింస, పేదరికం ప్రధాన వస్తువైంది. దాన్ని అస్తిత్వ సోయితో జయించే అవకాశముండింది. ఇట్లా జయించి ఫెయిల్యూర్  స్టోరీని, సక్సెస్‌ స్టోరీగా చెప్పేందుకు అవకాశముండింది. ఇందుకు దిలావర్‌ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అస్తిత్వసోయిని అందుకోకుండా అడ్డుకున్న సిపిఎం కార్యశాలదే ప్రధాన బాధ్యత. అయినప్పటికీ తనలోని కాన్షియస్‌నెస్‌ ఈ విషయాలను మూగగా ఆమోదించడానికి సిద్ధపడలేదు. అందుకే ‘‘ధనిక పేద వర్గాల మధ్య, అగ్ర దళిత వర్ణాల మధ్య, పెత్తందార్లూ పనివాళ్ళ మధ్య ఈ వివక్ష ఇలాగే కొనసాగితే దేశం త్వరలోనే ప్రమాదపుటంచున పడుతుందని కూడా ఎవరైనా ప్రమాద ఘంటికలు  మోగిస్తే బాగుండును’’ అని తన మనసులోని మాటను ‘నగ్నసత్యం’ కథలో చెప్పిండు. ఇప్పుడు అస్తిత్వ సోయితోటి ముస్లింవాదులు, దళిత, బహుజన వాదులు, స్త్రీవాదులూ  ఈ ప్రమాదాలను ప్రచారం చేస్తున్నరు. నిజానికి తెలుగునాట స్త్రీవాదం పుట్టుకొచ్చిందే రమీజా బీ కేసు నుంచి అంటే అతిశయోక్తి కాదు. స్త్రీ వాదం రావడానికి అంతర్జాతీయ, జాతీయంగా అనేక కారణాలున్నప్పటికీ ఇది తక్షణ కారణమైందని చెప్పొచ్చు. దిలావర్‌ సీనియర్‌ రచయిత కావడం మూలంగానే ఎమర్జెన్సీ కాలం నాటి రమీజా బీ కేసును రెండు కథల్లో పేర్కొన్నడు.
1978 మార్చి 29`30 రాత్రి రమీజా బీ తన భర్తతో కలిసి ‘యమగోల’ సినిమా చూసి వస్తూ ఫీవర్‌ హాస్పిటల్‌ దగ్గర తన భర్త మూత్రం పోయడానికి వెళితే వెయిట్‌ చేస్తున్నది. ఈ సమయంలో నల్లకుంట  పోలీసులు  ఆమెను తీసుకెళ్ళి ఎస్సై, కానిస్టేబుల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లోనే అత్యాచారం చేసి ఆమె ప్రాస్టిట్యూట్‌, విటులను ఆకర్షిస్తుండగా పట్టుకున్నామని కేసు పెట్టారు. భర్తని లాకప్‌ డెత్‌ చేసిండ్రు. ఈ కేసు ఆనాడు తెలుగునాట ప్రజాస్వామిక వాదులందరినీ కుల, మతాలకు అతీతంగా కదిలించింది. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం ముఖ్తదర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. దోషులను నిర్ధారించింది. ఈ పోరాటంలో చురుగ్గా పాల్గొన్న వారే తర్వాతి కాలంలో ‘విమెన్స్‌ గ్రూప్‌’గా ఏర్పడ్డారు. రమా మెల్కోటె, వసంత కన్నబీరన్‌, లలిత తదితరులు ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈనాటి తరానికి అంతగా తెలియని విషయాన్ని దిలావర్‌ పేర్కొని ఎనుకటి విషయాలను మరొక్కసారి తెరమీదికి తెచ్చిండు. గతాన్ని తోసుకొని వర్తమానంలో విశ్లేషించుకొని భవిష్యత్‌కు దారులు వేయాల్సిన సమయంలో రమీజా బీని గుర్తు చేసినందుకు దిలావర్‌ అభినందనీయుడు.
దిలావర్‌ ఖమ్మం జిల్లా వాడు కావడం, ఆనాదిగా ఆ జిల్లా రాజకీయాలు, ‘చైతన్య’, ‘ప్రగతిశీల’, ‘ప్రభావశీల’ కార్యక్రమాలు, సాహిత్యశాలలు, పుస్తక ప్రచురణలు, సమీక్షలూ  అన్నీ సిపిఎం, సిపిఐ కేంద్రంగా ఆ పార్టీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ‘విజృంభణ’ ‘తిరుగుబాటు’, ‘న్యూడెమోక్రసీ’, ‘ప్రజాశక్తి’ ఇప్పటి నవ తెలంగాణ అన్నీ ఒకే సామాజిక వర్గం ఆధీనంలో ఉన్నయి. విప్లవ చైతన్యమంతా ఇక్కడే పోగయింది. పోగయింది అనేకంటే పోగు పెట్టబడిందంటే కరెక్టేమో! వీరి ప్రాబల్యం  ఇప్పటికీ అక్కడ కొనసాగుతది. దిలావర్‌ ముఖ్యంగా సిపిఎం పార్టీతో మమేకమై ఉండొచ్చు. శ్రీశ్రీ మొదలు  తెలకపల్లి రవి దాకా అంతా ఆంధ్రత్వమే అక్కడ పరుచుకుపోయి ఉంది. దీంతో తాను ప్రభావితం కావడమే గానీ తాను ప్రభావితం చేసేందుకు అవకాశం దక్కలేదు. వేదిక చిక్కలేదు. ఇది వన్‌వే. లెఫ్ట్‌ పార్టీ నుంచి దళిత, బహుజనులు స్వీకరించడమే గానీ తాను నేర్చుకున్నది అప్పజెప్పడానికి, ప్రభావితం చేయడానికి ఏ సాహిత్యశాలలూ, సాహిత్యకారులూ  అవకాశం కల్పించబోరు. అది వారి ఆచరణకు విరుద్ధం.
ఖమ్మం జిల్లా రాజకీయాలన్నీ ఒకే సామాజికవర్గం ఆధిపత్యంలో కొనసాగుతున్నాయి. పార్టీలు వేరైనా పీడితుల పక్షానా, పీడకుల పక్షానా కూడా వీళ్ళే వకాల్తా పుచ్చుకుంటారు. అందుకే ఇక్కడ అస్తిత్వవాద రాజకీయాలకు, విభిన్న అస్తిత్వాలకు ఆదరువు కరువు. ఉద్యమ కాలంలో తెలంగాణ రచయితల వేదిక అన్ని జిల్లాల్లో మీటింగ్‌లు పెట్టగలిగింది గానీ ఖమ్మం జిల్లాలో ఆ పనిచేయలేక పోయింది. ఖమ్మం జిల్లాలో శీలం సిద్దారెడ్డి, జలగం వెంగళరావు తర్వాత అన్నీ పార్టీల్లోనూ ఏక కులాధిపత్యం నెలకొంది. ఈ కులాధిపత్యం వర్ణ దృక్పథాన్ని తప్పుగా, ద్రోహంగా ప్రచారం చేసి, వర్గ దృక్పథాన్ని ప్రోత్సహించింది. ఈ ప్రోత్సాహ కార్యక్రమాలు క్రమం తప్పకుండా ‘సాహితీ స్రవంతుల’ ద్వారా, పార్టీ పత్రిక ద్వారా, వందిమాగధుల ద్వారా నిరంతరం కొనసాగుతున్నాయి. ఇప్పటికీ తెలంగాణకు అనుకూలంగా ఎక్కడా, ఎప్పుడూ తీర్మానం చేయకబోయినప్పటికీ సిపిఎం పల్లకీని ఇక్కడి బోయీలు మోస్తున్నారు.
ఇవ్వాళ మొత్తం తెలంగాణాలో ఎస్టీలు ఎక్కువగా ఉన్న జిల్లా ఖమ్మం. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం తెలంగాణలో 31,77,940 మంది (ఆంధ్రాకు పోయిన ఏడు మండలాల జనాభాతో కలిపి) ఆదివాసీలు/ గిరిజనులు అంటే ఎస్టీలున్నారు. మొత్తం ఖమ్మం జిల్లా జనాభా  26,07,066. ఇందులో 25.18 శాతం జనాభా 6,56,577 ఎస్టీలున్నారు. అలాగే 16.84శాతం ఎస్సీలున్నారు. అంటే ఈ జిల్లా మొత్తం జనాభాలో దాదాపు 42 శాతం మంది ఆదివాసీలు, దళితులున్నారు. ఈ 42 శాతంతోపాటు మొత్తం జిల్లా ప్రజలందరి తరపున కేవలం నాలుగు శాతం మాత్రమే అదీ ఒక్క సామాజిక వర్గమే మాట్లాడుతోంది. వాళ్ళు ఎంత చెబితే అంత అన్నట్టుగా ఇవ్వాళ పరిస్థితి ఉంది. అందుకే తెలంగాణలోని ఏడు మండలాలు ఆంధ్రాలో కలిపినప్పుడు ఉద్యమం పెద్దగా రూపొందలేదు. ఈ సామాజిక వర్గాల ప్రయోజనాలు ఆంధ్రాతో ముడిపడి ఉండడంతోనే ఉద్యమాలు పెద్దగా రాలేదు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముదిగొండ ఘటనలో దళిత రైతులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. ఈ పోరాటానికి సిపిఎం నేతృత్వం వహించింది. ఈ ఉద్యమంలో రైతుల ప్రాణాలు పోయినాయి తప్ప లభించిన ఫాయిదా ఏమీ లేదు. అంటే ఒక ఉద్యమం చేసి దళిత రైతుల ప్రాణాను బలిగొంటే మరో ఉద్యమం చేయకుండా ఉండి ఆదివాసీల ఉసురు తీసింది. నిజానికి సిపిఎం బలంగా ఉన్న ఈ జిల్లాలో ఆదివాసీలకు అండగా ఉండి చైతన్య కార్యక్రమాలు చేపట్టాల్సింది. సాహిత్యంలో వీటిని ప్రతిఫలింప జేసుండాల్సింది. ఉద్యమాలు లేవు, సాహిత్యంలో చోటూ లేదు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బలంగా ఉండీ అంతో ఇంతో ఉద్యమం పట్ల జిల్లాలో సానుభూతి ఉన్నప్పటికీ సభలు నిర్వహించడానికి ఇక్కడి నుంచి ఎవ్వరూ ముందుకు రాలేదు. వ్యక్తులుగా కొంతమంది తెలంగాణ వాదులు ఇక్కడ ఉంటే ఉండొచ్చుగానీ సంస్థలుగా తెలంగాణ వాదానికి మద్ధతు దక్కలేదు. అయితే ముస్లిం అస్తిత్వ వాదానికి వచ్చే సరికి ఖమ్మం జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వలసబోయిన వారే అండగా నిలిచారు. స్థానికంగా జిల్లాలో ఉన్న వాళ్ళు ముస్లిం వాదంతో పెద్దగా మమేకం కాలేక పోయిండ్రు. నిజానికి అనాది నుంచి ఖమ్మం జిల్లా తెలుగులోరాసే అత్యధిక ముస్లిం కవులను/ రచయితలను కన్నది.
ఈ జిల్లా నుంచి షంషుద్దీన్‌ (కౌముది), దావూద్‌ అలీ, సికిందర్‌ మొహసిన్‌, ఎం.ఎ. రెహమాన్‌, సయ్యద్‌ షఫీ, అఫ్సర్‌, షేక్‌ రఫీ, హనీఫ్‌, షుకూర్‌, షంషాద్‌, షాజహానా, ఇక్బాల్‌ చంద్‌, ఖాజా, అక్బర్‌, ఖమ్రొద్దీన్, జావేద్ ఇట్లా అనేక మంది ముస్లిం కవులు తెలుగులో రాసిండ్రు. అట్లనే ఉర్దూలో ముస్లింలతో పాటుగా కవిరాజమూర్తి, హీరాలాల్‌ మోరియా తదితరులు రాసిండ్రు. వీరిలో యాభై ఏండ్ల సాహితీ జీవితం ఉన్న ఏకైక వ్యక్తి దిలావర్‌ ఒక్కడే అంటే అతిశయోక్తి కాదు. 1974లో  ‘వెలుగు పూలు’ కవిత్వం వెలువరించిన నాటి నుంచీ భారతి పత్రికలో సీరియల్‌ నవలాకారుడిగా, ‘వెన్నెల కుప్పలు’ పోసి ‘జీవన తీరాల’కు చేర్చిండు. ‘కర్బలా’ కవిత్వంతో పాటు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ‘గ్రౌండ్‌ జీరో’ దీర్ఘ కవిత వెలువరించిండు. ఇటీవల తెలుగు యూనివర్సిటీ ‘ప్రతిభా’ పురస్కారం అందుకున్న దిలావర్‌ రచనకు దక్కాల్సినంత గౌరవం దక్కలేదనే చెప్పొచ్చు. పోలవరం, ఆదివాసీ జీవితాన్ని రికార్డు చేస్తూ ‘కొండా కోనల్లో’ పేరిట పుస్తకంగా వెలువరించినా దాన్ని ఏ ‘సాహిత్య శాల’లు గుర్తించలేదు. ఈయన ఎవరితోనైతే ఇన్నేండ్లూ అంటకాగాడో, లేదా కలిసి మెలిసి ఉన్నాడో వాళ్ళు ఆధిపత్య స్వభావంతో మెలగడంతో రాష్ట్ర స్థాయి వ్యక్తిని ఖమ్మం జిల్లాలో కూడా గుర్తించ లేదు. 1972 నుంచి ఇప్పటి  వరకు దాదాపు తన వయసుతో సమానంగా కథలు రాసిండు. అందులో కొన్ని గతంలో ‘మచ్చుబొమ్మ’, ‘కొండా కోనల్లో’ పేరిట పుస్తకాలుగా వెలువడ్డాయి. తన జిల్లా వాడే అయిన జాతీయ కవి ‘దాశరథి కవితా వ్యక్తిత్వ పరిశీలన’ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పట్టా అందుకున్నడు. నిజానికి దిలావర్‌ తన ముస్లిం/ దూదేకుల అస్తిత్వాన్ని త్యాగం చేసి అభ్యుదయ, ప్రగతిశీల సాహిత్యానికి జీవితమంతా ధారపోసిండు. చివరికి ‘అభ్యుదయ’ సాహిత్యం గురించి విమర్శ చేసే వారెవ్వరూ దిలావర్‌ని పేర్కొనరు. ఆకాశంలో గాకుండా నేలమీద నిలబడి ఏ సామాజిక వర్ణాలకు వాళ్ళు ముందుగా తోడ్పడాలి అనే గుణపాఠాన్ని దిలావర్‌ సాహితీ జీవితం నేర్పుతుంది. ముస్లిం సమాజానికీ ఆ మేరకు నష్టం జరిగింది. అది ఇప్పట్లో పూడేది కాదు. అణచివేతకు గురైన దూదేకుల జీవితం దిలావర్‌కు లేకపోయి ఉండొచ్చు గానీ తాత కాలంలో వందెకరాల స్థలం తన కాలానికి రెండు ఎకరాలుగా మారిన విషయాన్ని, అందుకు కారణాలను  ఆయన వెతకాల్సింది. ‘అభ్యుదయం’లో గాకుండా ‘అస్తిత్వం’తోనే ఈ విద్య అలవడుతది.
తెలంగాణలోని అన్ని జిల్లాలతో పోలిస్తే ఖమ్మం జిల్లాలోనే అత్యల్పంగా ముస్లిములున్నారు. ఈ జిల్లాలో 2001 (2011 లెక్కలు అలభ్యం) లెక్క ప్రకారం 1,37,639 మంది ముస్లిమున్నారు. అయితే తెలుగులో ముస్లింవాద సాహిత్యాన్ని అగ్రభాగంలో నిలబెట్టింది ఖమ్మం జిల్లానే! కవిత్వం, కథలు, నవలల ద్వారా ఈ జిల్లా రచయితలు ముస్లిం జీవితాల ను చిత్రికగట్టిండ్రు. వాదాలను నిలబెట్టేందుకు సాహితీదావాలు ఎదుర్కొన్నరు. ముస్లిం/దూదేకుల స్త్రీల కథలూ, కవిత్వం ఇక్కడి నుంచి వచ్చాయి. దిలావర్‌ తాను స్వయంగా ముస్లిం వాదం గురించి విస్తృతంగా రాయక పోయినప్పటికీ ఆ లోటుని ఆయన కూతురు షాజహానా కథల్లోనూ, కవిత్వంలోనూ, పరిశోధనలోనూ పూరించింది. ఇది ఖమ్మం జిల్లాకు గర్వకారణం కూడా! దేశంలోనే గాకుండా డయోస్పోరా సాహిత్యంలోనూ ఈ జిల్లా ముస్లింలు ముందంజలో ఉన్నారు. అఫ్సర్‌, షంషాద్‌ అందుకుదాహరణ. ముస్లింవాదంతో పాటు తెలంగాణ అస్తిత్వోద్యమంలో కూడా ఇక్కడి వాళ్ళు పాల్గొన్నారు. అయితే వీళ్ళందరూ జిల్లాకు ఆవల ఉన్న వాళ్ళు కావడమే విశేషం.
తన 75 ఏండ్ల జీవితంలో సాహితీ స్వర్ణోత్సవాన్ని జరుపుకుంటున్న దిలావర్‌ ఇప్పటి వరకు ఎనిమిది కవితా సంపుటాలు, నాలుగు నవలలు, రెండు కథా సంపుటాలు వెలువరించాడు. ఇది మూడో కథా సంపుటి. నిజానికి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలానికి చాలా సాహిత్య చరిత్ర ఉంది. ఇక్కడే సింగరేణి గనులకు పునాదులేర్పడ్డాయి. 1945 ఆ ప్రాంతంలో జాతీయ గ్రంథాయ మహాసభలు ఇక్కడ జరిగాయి. ఈ మట్టి పునాదుల మీదుగానే తెలంగాణ సాయుధ పోరాట జీవితాన్ని పర్చా దుర్గాప్రసాదరావు కథలుగా మలిచిండు.
మళ్ళీ ఈ పుస్తకం విషయానికి వస్తే ఇది 15 కథల ఈ సంపుటి. ఇందులో దాదాపు పది కథలూ చావులూ, ఆత్మహత్యల చుట్టూ తిరుగుతాయి. రైతు, చేనేత కార్మికుడూ బాధితులు. శవాలు కాస్తున్న చెట్టు, నగ్నసత్యం, ఉరితాళ్ళు ఆత్మహత్యతో ముగిశాయి. క్షతగాత్రుడు, దగ్ధహృదయం, జరీన, నీ పెద్దోడొచ్చిండమ్మా, ఎడారి బతుకు, అమ్మా నన్ను చంపెయ్‌, తీజ్‌ కథల్లో చావు, దాని చుట్టూ ఉన్న వ్యదార్థ జీవితాలు రికార్డు చేసిండు. మరో శాకుంతలం, తీజ్‌లో మోసపోతున్న లంబాడీ స్త్రీల జీవితాలున్నాయి. ఆధునిక ఇతివృత్తంతో పద్మ లేశిపోయింది కథలో ‘సర్రోగసీ’కి ఒప్పుకున్న పేద మహిళ, నోస్టాల్జియాకు సంబంధించి చంద్రుడు గియ్యని బొమ్మలు, మృగణ ఇందులో ఉన్నాయి.
ముందుగా ఆత్మహత్యల విషయానికి వద్దాం. శవాలు కాస్తున్న చెట్లు కథలో గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ఖమ్మం జిల్లా తల్లాడ అడ్డాగా కోట్ల రూపాయల నకిలీ విత్తనాల వ్యాపారం, అధికార్ల అలసత్వం, నకిలీ ఎరువులు,  నకిలీ పురుగు మందులు వెరసి రైతుని ఎట్లా పీల్చి పిప్పి చేస్తున్నాయో చెప్పిండు. దళారీల మోసం ఒక వైపూ, మరోవైపు వానల్లేక, బోర్లు తవ్వి, అప్పుల పాలై, రెక్కలు తెగిన పక్షిలా విలవిలలాడిన రైతు రామయ్య గురించీ, కూలీలు దొరక్క ఇంటిల్లిపాది పనిచేసినా ఫలితం లేక పోవడంతో రైతు చేనుగట్టు మీదున్న చెట్టుకు ఉరేసుకోవడాన్ని హృదయం ద్రవించేలా చెప్పిండు. అట్లాగే ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా ‘నగ్నసత్యం’ కథలో ‘మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి, మట్టిలోనే కలిసిపోవాన్నంత మమైకత్వంలో నేల తల్లిని నమ్ముకున్న బూమయ్య’ను పరిస్థితులు ఏ విధంగా ఆత్మహత్యకు పురిగొల్పాయో చెప్పిండు. కట్నం డబ్బు కోసం అత్తింటి వేదింపుల నెదుర్కొన్న కూతురు, ఇంజనీరింగ్‌ చదువుకు డబ్బుల్లేక దొంగగా మారిన కొడుకు సంగతి రాసిండు. చేతికొచ్చిన పంట తుపాను కారణంగా వర్షం పాలు కావడంతో ‘హలం పట్టిన ఆ చెయ్యి చీకట్లో హాలాహలం కోసం వెదికింది. పురుగుమందుకు పురుగుల్ని చంపే శక్తే కాదు, కష్టాలను రూపుమాపే శక్తి కూడా వుంది. బూమయ్య లాంటి కష్టజీవులకు ఆ విషయం బాగా తెలుసు. అందుకే కష్టాల నుండి శాశ్వతంగా దూరం గావడానికి గరళాన్ని గళంలోకి వంపుకున్నాడు’ అని రైతుని చంపేసిండు. ఇవన్నీ భరించలేక పిచ్చివాడిగా మారిన కొడుకు బతుకుని కూడా దిలావర్‌ గుడ్ల్ల నీళ్ళు తిరిగేలా చెప్పిండు. ‘ఉరితాళ్ళు’ కథలో ఇంటిల్లిపాది పనిచేసినా మగ్గం బతుకు ఆకలిని తీర్చలేకపోవడం, సర్కారీ దవాఖానాలో వైద్యం సరిగ్గా దొరక్క, ఇంకా చెప్పాలంటే చికిత్స నిరాకరించడంతో చనిపోయిన గర్భిణీ కూతురు గురించి చెప్పిండు. ‘‘నూలుకట్టలు ఎప్పుడైతే తడిసిపోయాయో అప్పుడే తన బ్రతుకు చీకిపోయింది. మగ్గం ఆడటం ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడే తన కాళ్ళూ చేతులూ పడిపోయాయి. రాట్నం తిరగడం ఎప్పుడైతే మానివేసిందో అప్పుడే తన జీవిత చక్రం ఆగిపోయింది. టకటకలాడే ఆసు ఎప్పుడైతే నిశ్చలనమైందో అప్పుడే తనలోని చైతన్యం మాయమైంది. ఇక ఇంతకన్నా మరణం అంటూ వేరే ఏముంటుంది’’ అని చంద్రం గోసను చిత్రించిండు. (అన్ని కథల్లోనూ  గ్రౌండ్‌ వర్క్‌ చేసి పదాలను ఉపయోగించిండు. అయితే ఇక్కడ ఆసు బదు నాడె అనే పదం వాడాల్సింది) పాణం తీసుకున్న తీరుని వివరించిండు. వీటికి భిన్నమైన కథ ‘అమ్మానన్ను చంపేసేయ్‌’. ఇందులో స్త్రీ వ్యదార్థ జీవితాలను, పసిపాపనుంచి ముసలి వాళ్ల వరకూ రోజూ అత్యాచారాలకు గురవుతున్న తీరుని గుండె తడయ్యేలా చెప్పిండు. దిమాక్‌ కన్నా ఎక్కువగా ‘దిల్‌’తోటి ఆలోచించిండు కాబట్టే ఇవి పాఠకుడి గుండెల్ని పిండేస్తయి. ‘అమ్మా నన్ను చంపేసెయ్‌’ కథలో నిర్భయ, ఆయేషా, రమీజాబీలను ప్రస్తావించిండు. వివిధ దేశాల్లో స్త్రీలు ఇంటా బయటా ఎట్లా లైంగిక హింసకు గురవుతుండ్రో రాసిండు. అయితే ఇందులో పాజిటివ్‌ అంశమేంటంటే స్త్రీలపైన ఎన్ని అఘాయిత్యాలు జరిగినా ‘‘ఏది ఏమైనా.. నా చిట్టి తల్లీ..! నిన్ను నేను చంపుకోను… అవసరమైతే మీ నాన్నను.. బామ్మను.. తాతయ్యను.. బాబాయిలను.. అత్తమ్మను.. యీ లోకాన్నైనా ఎదిరించి… నా ప్రాణంలోని ప్రాణమా! నిన్ను బతికించుకుంటాను.. నిన్ను చంపుకోలేను.. నో..నో..నో..’’ అని కరుణతో కరాఖండిగా చెప్పిస్తాడు. చావు కన్నా పాణం విలువ ఎక్కువ అని తేల్చి చెప్పిండు. కథలో భాగంగా చాలా సంగతులు చెప్పుకొచ్చిండు. ఇవన్నీ ఇటీవల జరిగినప్పటికీ సాహిత్యంలో చోటు చేసుకోలేదు. సంఘటనలు సాహిత్యంలో చోటు చేసుకున్నప్పుడే వాటి చారిత్రక విలువ ఇనుమడిస్తది. నోయిడాలో అన్నెం పున్నెం ఎరుగని అమ్మాయి కళేబరాలు, యాసిడ్‌ దాడులు, కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు, ఆఖరికి అంధబాలికపై అత్యాచారాలు జరుగుతున్న తీరుని చెప్పిండు. ఇండ్లల్లో, స్కూళ్ళల్ల్లో, కాలేజిల్లో అమ్మాయిలకు ఎక్కడా భద్రత లేదంటూ, ఆయేషాను ఇబ్రహీంపట్నంలో ఎంత కిరాతకంగా హతమార్చి అనుభవించింది రాసిండు.
ఇక చావుల విషయానికి వస్తే స్త్రీ దృక్కోణంలో దగ్ధహృదయం కథలో  ప్రభుత్వాసుపత్రిలో అవినీతి నిండుగర్భిణిని ఎట్లా పొట్టన పెట్టుకుందో చెప్పిండు. మారుమూల పల్లెల్లో వైద్యసదుపాయం లేని కారణంగా ప్రజలు పడుతున్న ముఖ్యంగా రెక్కాడితేగాని డొక్కాడని రైతు, కూలీ జిందగీని చిత్రించిండు. చావు వాళ్ళ జీవితంలో ఎట్లా భాగమైనాయో రాసిండు. బోర్ల నీళ్ళు సరిగ్గ అందక, కరెంటు కోతకు ఎండిన పంటకు మంట పెట్టిన రైతు ధర్మయ్య గురించీ రాసిండు. ఇక్కడ గర్భిణిని, పొట్టకొచ్చి ఎండిపోతున్న పంటను పోలుస్తూ మనస్తాపానికి గురైన రైతు వ్యథను చిత్రించిండు. తీజ్‌ కథలో సొంత అన్ననే వదినను వశబరుచుకోవడానికి హతమార్చిన లంబాడీ మంగీలాల్‌ దురాగతాన్ని చెప్పిండు. లంబాడీ ఆచార వ్యవహారాలను, వారి భాషను, ఆ స్త్రీ హృదయాలను ఆవిష్కరించిండు. ఎడారి బతుకుల్లో గల్ఫ్‌కుపోయిన వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కుంటున్నారో, ఎలాంటి అత్యాచారాలకు గురవుతున్నారో, ఎవరెవరి మోసాలకు గురవుతున్నారో చెప్పిండు.
చావుల్లో కూడా భిన్నమైన కథ ‘క్షతగాత్రుడు’. స్కూలు చదువు రాకున్నా, నల్లగా ఉన్నా శ్రావ్యమైన గొంతుతో, కంఠస్థమైన భాగోత పద్యాలతో అందరి మన్ననలందుకున్న ‘కర్రోడి’ హృదయవిదారకమైన జీవితాన్ని చెప్పిండు. ఇందులో బయటికి మాత్రం స్వగతంలో కథ చెబుతున్న వ్యక్తే హీరోగా కనిపించినప్పటికీ నిజమైన కథానాయకుడు అభిమానంతో, ప్రాణత్యాగం చేసిన కర్రోడే గొప్ప.
‘పద్మ లేశిపోయింది’ కథ సరోగసీ అనే ఆధునిక అంశాన్ని తెరమీదికి తెచ్చింది. పేదరికం, దుబాయి పోయిన ప్లంబర్‌ భర్త, పిల్లలకు కనీస వైద్యసదుపాయం అందించలేని దయనీయమైన స్థితి పద్మని సరోగసీకి ఎలా ఒప్పుకునేలా చేసిందో రాసిండు. అట్లనే సరోగసీకి దాదాపు మూడు లక్షలు అడ్వాన్స్‌గా ముట్టజెప్పిన తీరు, ఆ డబ్బుని తనను కనీసం ఇంట్లకు కూడా రానివ్వని అత్తమామలకు అందేలా కిటికిలోంచి పడేయడాన్ని, దాన్ని అత్త కాలబెట్టానడం, మామ వాడుకోవాలని చూడడాన్ని వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా చిత్రించిండు.
మూడుతరాలు కథలో మాదిగోళ్ళ పనిముట్లన్నీ రికార్డు చేసిండు. అంతేగాదు తరాలు మారిన తలరాతలు మారని మాదిగోళ్ళ జీవితాలను హైదరాబాద్‌ వలసొచ్చినా గ్లోబలైజేషన్‌ మూలంగా ఎదుగూబొదుగూ లేని సంసారాన్ని చిత్రికగట్టిండు.
గుండెను తడి చేసుకొని దిలావర్‌ తన కథల్ని రాసిండు. కండ్ల్ల నీళ్ళు నింపుకొని చదువుకునేలా రాసిండు. చావులు, హత్యలు, ఆత్మహత్యలు ఏది రాసినా వాళ్ళ దుఃఖాన్ని ఫీలయి రాసిండు. దేనికదే ఇగ ఇదే ఆఖరు చావు కావాలని ఆరాట పడ్డడు. దిలావర్‌ పూర్తి కాన్షియస్‌గా రాయకపోయినా దూదేకుల జీవితాన్ని చిత్రించిన కథలు కూడా ఇందులో ఉన్నాయి. అందులో చంద్రుడి గియ్యని బొమ్మలు ఒక బుక్కా ఫకీరు ఊరి నుంచి వలసొచ్చి నగరంలో ఇగ ఇంతకన్నా పోయేదేమి లేని జీవితాన్ని, వెన్నెల ఆస్వాదాన్ని, ఆ వెన్నెల అందరికీ ఒకే తీరుగ వెలుగునివ్వడాన్ని కవిత్వ రీతిలో కథ అల్లిండు. ఇందులోని భాష  తెలుగు-ఉర్దూ మిశ్రమాలతో పక్కా హైదరాబాదీ యాసను పట్టిచ్చింది. ఈ పుస్తకంలోని కథలన్నీ ఖమ్మం జిల్లా నానుడులు, సామెతలతో అలంకరించబడ్డాయి. అంతేగాదు జరీన కథలో బురఖాకు తావులేని, కూలీ బతుకును, రోజు రోజుకూ దిగజారుతున్న ముస్లిం/ దూదేకుల స్త్రీల జీవితాలను, లైంగిక దోపిడీని, భర్త, కొడుకూ ఇద్దరూ గుట్కాకు, తాగుడుకు బానిసలై చనిపోవడాన్ని, బతికుండీ శవంలాగా మారిన తాగుబోతు తండ్రినీ ఇందులో చిత్రించిండు.
అంతిమంగా ఇందులోని ఒకటి రెండు మినహా మిగతా అన్ని కథలూ కింది కులాల వారి ఫెయ్యిూర్‌ స్టోరీలను రికార్డు చేసింది. కనీసం తినడానికి తిండి దొరకని స్థితిలో ఒక పద్మశాలి చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడాన్ని ‘ఉరితాళ్ళు’ కథలో, మరో శాకుంతం, తీజ్‌ కథల్లో లంబాడీ స్త్రీ మోసాలకు, లైంగిక దోపిడీకి, మైదాన ప్రాంతం వారి చేతిలో ఆటవస్తువుగా మారిన తీరుని చెప్పిండు. పద్మ లేశిపోయింది ఒక ప్లంబర్‌ దుబాయి పోయి సచ్చిండో బతికుండో తెలియని స్థితి. ఎడారి బతుకుల్లో కూడా బహుజనుల జీవితాలే రికార్డయ్యాయి. నగ్నసత్యం, దగ్దహృదయం, శవాలు కాస్తున్న చెట్లు, క్షతగాత్రుడులో బహుజన రైతు, కళాకారుడి చావుల్ని చిత్రించిండు. మూడు తరాలు పూర్తిగా మాదిగోళ్ళ కథ. అట్లనే జరీన, చంద్రుడు గియ్యని బొమ్మలు దూదేకుల పేదరికాన్ని పట్టిచ్చే కళాఖండాలు. జ్ఞాపకాల తెరలను చిన్నప్పటి బతుకును మృగణ, నీ పెద్దోడొచ్చిండమ్మా కథల్లో చెప్పిండు.
ఒక ఉపాధ్యాయుడు జీతంతో సంబంధం లేకుండా, అవిశ్రాంతంగా ఐదు దశాబ్దాలు సాహిత్యమే జీవితంగా గడపడమనేది అబ్బుర పరిచే విషయం. ముఖ్యంగా టీచర్లంతా జీతం రాగానే చిట్టీలు, భవిష్యత్తావసరాలు అని పొదుపు చేస్తూ ఉంటారు. అయితే దిలావర్‌ 1974 నుంచి పుస్తకాలు వేయడమే గాకుండా, ఎక్కడ సాహితీ సమావేశం జరిగినా వెళ్ళిండు. ఏ సాహితీవేత్త వచ్చినా తన ఇంట్లో ఇంత జాగా ఇచ్చిండు.  పరిశోధన, సృజనాత్మక రచనా రెండు భిన్నమైన అంశాలు. అయితే ఈ రెండిరటిని సమన్వయం చేసి నడిపించిన మార్గదర్శి దిలావర్‌. సాహిత్యం తనతోనే ఆగి పోకుండా తర్వాతి తరానికి షాజహానా, షంషాద్‌ రూపంలో అందించిన దిలావర్‌కు అభినందనలు.
*