Archives for January 2016

క్వీన్    

 

               

 -నాదెళ్ళ అనూరాధ

~

nadellaపూణె నగరం అందమైనది అని ప్రత్యేకంగా చెప్పేందుకేముంది? చుట్టూ చిక్కనైన ప్రకృతి పరుచుకుని కొండల్లోకో, అడవుల్లోకో, సరస్సుల్లోకో మనలని ప్రయాణించేలా చేస్తుంది. ఆ అందాల్ని ఏ కవి మాత్రం వర్ణించగలడు? చూసే కళ్లకి, ఆస్వాదించే మనసుకీ మాటలు రావు మరి.

నగరంలో ఒకపక్క పశ్చిమదేశాల నాగరికత స్పష్టంగా కనిపిస్తూంటే , మరోపక్క మరాఠాల సంస్కృతి కూడా అంతే స్పష్టంగా కనిపిస్తుంది.

జనాభాలో కొట్టొచ్చినట్టు కనిపించే విద్యార్థినీ ,విద్యార్థుల శాతం, ఐ.టి. నిపుణుల శాతం నగర సంస్కృతిని సరికొత్తగా నిర్వచిస్తున్నట్టుంది.

ఆ నగరానికి అతిథిగానైనా రావటం ఎప్పుడూ ఇష్టమే శ్యామ్ కి. ఆఫీసు పని ఒక్క పూటతో తెమిలి పోతుందని , కూతురు శ్వేతని చూసే టైము కూడా ఉండదని భార్య మాధురి ని తనతో తీసుకురాలేదు. తీరా పని పూర్తి కాలేదు.  ఆఫీసు నుండి బయటపడుతూంటే కొలీగ్ రంగన్ తమ ఇంటికి ఆ రాత్రికి అతిథిగా రమ్మని ఆహ్వానించాడు. ఆహ్వానానికి కృతజ్ఞతలు చెప్పి, రాలేననీ, కూతురు శ్వేతని కలుసుకుందుకు అనుకోకుండా దొరికిన అవకాశం అని చెప్పి భండార్కర్ రోడ్డులో తనని వదిలెయ్యమని అడిగాడు శ్యామ్.

ఇదివరకెప్పుడో కెరీర్ మొదట్లో పూణేలో ఉన్నప్పుడు తాము ఉన్న ఇంటిని, ఆ పరిసరాల్ని చూస్తూ, కాస్సేపు ఫెర్గుసన్ కాలేజీ రోడ్డులోనూ ఎవో పాత జ్ఞాపకాల్ని తలుచుకుంటూ అక్కడి పురాతన శివాలయం పాతాళేశ్వర్ లోకి నడిచాడు. ఆ ప్రాంతంతో ముడిపడి ఉన్న బాంధవ్యం అపురూపమైనది.

పెందరాడే వెళ్లినా శ్వేత ఆఫీసునుండి ఇల్లు చేరదు అని తీరిగ్గా రోడ్డు ప్రక్కల ఉన్న మహా వృక్షాల్ని చూస్తూ తనూ, మాధురి నడిచిన దారుల్ని మళ్లీ మళ్లీ మననం చేసుకుంటూ భార్యకి ఫోన్ చేసాడు.

‘పని అయిపోయిందా? బయలుదేరుతున్నారా?’ అంది ఫోన్ తీస్తూనే.

‘లేదు, ఈ పూట శ్వేతని చూసే అవకాశం దొరికింది’ అన్నాడు ఉత్సాహంగా. తను మిస్ అవుతున్నందుకు మాధురి కొంచెం నిరుత్సాహ పడింది.

‘శ్వేతకి ఫోన్ చేసి నేను వస్తున్నట్టు చెప్పకు. సర్ప్రైజ్ ఇవ్వాలి’ అని భార్యకి చెప్పాడు.

‘గుల్మొహర్ పార్క్’ అపార్ట్మెంటు కాంప్లెక్స్ ముందు టాక్సీ దిగి ఫ్లాట్ నంబరు మరోసారి మననం చేసుకుని లోపలికి వెళ్లబోతుంటే గేటు దగ్గర సెక్యూరిటీ అటకాయించాడు.వివరాలు చెప్పి, విజిటర్స్ బుక్ లో సైన్ చేసి మూడో అంతస్థులో ఉన్న శ్వేత ఇంటిముందు బెల్ నొక్కాడు.మనసంతా ఉద్విగ్నంగా ఉంది. తనను చూసి కూతురు ఎంత సంతోషిస్తుందో అనుకుంటుంటే పెదవులపైకి చిరునవ్వు పరుచుకుంది.

తలుపుతీసిన వ్యక్తి ఎవరో అపరిచితుడు. ఉత్తరాది వ్యక్తి అని తెలుస్తోంది.ముఫ్ఫై సంవత్సరాలు ఉంటాయి. అప్పుడే స్నానం చేసి వచ్చినట్టున్నాడు, తల తుడుచుకుంటూ,’ఎస్’ అన్నాడు.

ఇదేమిటి తను పొరపాటున వేరొకరి ఇంటికి వచ్చాడా? అనుకుంటూ ‘ సారీ’ చెప్పబోయేంతలో లోపలినుండి శ్వేత ‘ ఎవరొచ్చారు రాహుల్’ అంటూ ఇంగ్లీషులో ప్రశ్నిస్తూ ముందుగదిలోకి వచ్చింది.

తండ్రిని చూస్తూనే, గబుక్కున రెండు అడుగులు ముందుకు వేసి,’ హాయ్ డాడ్, ప్లెజెంట్ సర్ప్రైజ్! అమ్మని కూడా తీసుకొచ్చారా? ‘ అంటూ తండ్రిని దాటి వెనక ఎవరికోసమో వెతికింది.

‘లేదురా, ఆఫీసు పనిమీద పొద్దున్నే వచ్చాను. పని అవకపోవటంతో ఆగిపోవాల్సి వచ్చింది.’ అంటూన్న తండ్రిని ఆ యువకుడికి పరిచయం చేసి, ‘ డాడ్, ఇతను రాహుల్,నా కొలీగ్ ‘ అంటూ అతన్ని పరిచయం చేసింది.

శ్యామ్ కూతురికోసం కొన్న మాంజినిస్ కేక్స్ టేబిల్ మీద పెట్టి స్నానానికి లేచాడు.

శ్వేత , రాహుల్ వంటింటి లోంచి గిన్నెలు, పళ్లేలు తెచ్చి వడ్డన చేసారు. అతనికి ఆలోచన సాగటం లేదు. యాంత్రికంగా భోజనం చేసాడు. తను కూతురికి సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాడు. కాని తనకే ఇక్కడ ఒక పెద్ద సర్ ప్రైజ్ ఎదురైంది. రాహుల్ కూడా అదే అపార్ట్ మెంటులో ఉంటున్నట్టు గ్రహించుకున్నాడు.

‘ డాడ్ , ఈ రోజు ఆఫీసు నుండి త్వరగా వచ్చేం కనుక సినిమా ప్లాన్ చేసుకున్నాం మేము. చాలా రోజులుగా చూడాలని అనుకుంటున్న సినిమా. నువ్వు కూడా రా మాతో. అలసట తీరి కాస్త రిలాక్స్ అవచ్చు.’ అంటూ తండ్రిని బయలుదేరదీసింది.

కారు వెనక సీట్లో జారగిలపడి కూర్చుని, ముందు సీట్లో కబుర్లలో మునిగిపోయిన రాహుల్ ని, శ్వేతని చూస్తూ ఆలోచనలో పడ్డాడు శ్యామ్.

దాదాపు ఆరునెలలు పైనే అయింది కూతురు తమ వూరొచ్చి. ఈలోపు ‘ చాలా రోజులైపోయింది, కూతుర్ని చూడాలని ఉంది’ అని మాధురి గోల పెడుతూనే ఉంది. మధ్యలో శ్వేత ఎనిమిది వారాల పాటు ప్రాజెక్టు పనిమీద బయటకు వెళ్లింది. వచ్చిన తర్వాత ‘ ఇంటికి వస్తున్నా’ అంటూనే ఆఫీసులో పని వత్తిడి అంటూ రాలేకపోతోంది.

క్రితం సారి శ్వేత ఇంటికి వచ్చినప్పుడు కూడా తను ఆఫీసులో ఇనస్పెక్షన్ హడావుడిలో ఉన్నాడు. ఒక్క వీకెండ్ వచ్చివెళ్లిపోయింది , అప్పుడే చెప్పింది ఆఫీసుపనిమీద కొన్నాళ్లు బయటకు వెళ్తున్నానని. అంతే మళ్లీ ఇప్పుడే చూడటం.

శ్వేత వచ్చి వెళ్లాక భార్య ముభావంగా ఉండటం గమనించాడు. తను పదేపదే రెట్టించి అడగటంతో శ్వేత పెళ్లికి సుముఖంగా లేదని, కూతురి ఆలోచనలు తనకు అందటం లేదని మాధురి చెప్పుకొచ్చింది.

అప్పుడే తన చిన్ననాటి స్నేహితురాలు , మానసిక విశ్లేషకురాలు అయిన మాలతిని కూడా కలిసి వచ్చింది. తను మాత్రం భార్య భయాలు, ఆలోచనలూ తేలిగ్గానే తీసుకున్నాడు.

కొన్ని నెలల క్రితం జరిగిన విషయాలు మరోసారి అతని మనోఫలకం మీదకొచ్చాయి.

 

**********

Kadha-Saranga-2-300x268

ఆ వారాంతంలో శ్వేత ఇంటికి రావటంతో మాధురి చిన్నపిల్లలా ఆనందంతో గెంతులు వేసింది.వరండా ముందు క్రొత్తగా పాకిన నైట్ క్వీన్ తీగని కూతురికి చూబించింది. అకస్మాత్తుగా పడిన వర్షపుజల్లుల్లో కూతురితో కలిసి తడిసింది. కూతుర్ని ఒక్క క్షణం వదలలేనట్లు రాత్రి పగలు కబుర్లూ, షాపింగ్ మధ్య గడిపేసింది శనివారమంతా. శ్యామ్ ఆఫీసు పని వలన కూతుర్ని మిస్ అవుతున్నాడని కూడా వెక్కిరించింది.

ఆదివారం ప్రొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ చేసి భర్త బయటకు వెళ్లిపోవటంతో , తీరిగ్గా కూతురికోసం జంతికలు చెయ్యటం మొదలు పెట్టింది మాధురి.

‘ఎందుకమ్మా, కష్టపడతావ్? అన్నీ బయట దొరుకుతూనే ఉన్నాయి. ఎప్పుడు తినాలని ఉంటే అప్పుడు కొనుక్కుంటానుగా. హాయిగా నూన్ షో చూసి, ఎక్కడైనా బయట భోజనం చేసి వచ్చే వాళ్లం కదా.’ అంటున్న కూతుర్ని మురిపెంగా చూసుకుంటూ,

‘దొరుకుతాయిరా, ఇంట్లో చేసిపెడితే నాకు తృప్తి గా ఉంటుంది’ అంది.

తల్లీ కూతుళ్ల కబుర్లు కొంచెం సేపు శ్వేత ఆఫీసు పని గురించి, స్నేహితుల గురించీ, సినిమాల గురించీ నడిచీ, శ్వేత పెళ్లి వైపుకి మలుపు తిరిగాయి.

‘చిన్నీ, చదువయ్యాక కొన్నాళ్లు ఉద్యోగం అన్నావు. ఆ సరదా తీరింది. ఇంక బుధ్ధిగా మేము చూసిన సంబంధం చేసుకో ‘  .  మాధురి ఈ సారి ఎలాగైనా కూతుర్ని పెళ్లికి సుముఖురాల్ని చెయ్యాలని పట్టుదలగా ఉంది. ఆ ముచ్చట జరిపించటం అంటే తమ బాధ్యత తీర్చుకోవటం కూడాను అనుకుంటోంది.

మాధురి స్నేహితురాలు పద్మ కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుంది. పద్మ, ఆమె భర్త కూడా తమ పెద్దరికాన్ని కూతురు లక్ష్యపెట్టలేదని చిన్నబుచ్చుకున్నారు.

‘మధూ, నీ కూతుర్ని పెళ్లి విషయం తేల్చమను. ఎవరినైనా ఇష్టపడిందేమో కనుక్కో. ఎటూ వాళ్ల ఇష్టాల్ని కాదనమని తెలుసు వాళ్లకి. అన్ని  విధాలా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే లోకజ్ఞానం, వయసు, ఆర్థిక స్వతంత్రం ఉన్నాయి కదా.’ అంటూ చెబుతూనే ఉంది.

‘మనలాగా మొక్కుబడి చదువులు కావు. పెళ్లి అనగానే తలొంచుకుని సరేననేందుకు మన కాలమూ కాదు.’ పద్మ కూతురి వైవాహిక జీవితం సంతృప్తికరంగానే ఉన్నా తల్లిగా తనవైపు నుండి కొన్ని అసంతృప్తులు ఆమెలో ఇంకా ఉండిపోయాయి. అందుకే ఆమె మాటల్లో కూతురి పట్ల నిష్టూరం ధ్వనిస్తూనే ఉంటుంది.

మాధురి ఆమె మాటలు విన్నప్పుడల్లా ఆలోచనలో పడుతుంది. శ్వేత తాము చెప్పిన మాట వింటుంది, చూసిన సంబంధం చేసుకుంటుంది అని గాఢంగా నమ్ముతుంది. ఎంత చక్కగా పెంచింది తను! తన కూతురు అందరిలాటి అమ్మాయి కాదు. చదువు పూర్తి అయి, ఉద్యోగరీత్యా ఇల్లు వదిలి వెళ్లే వరకూ అమ్మనాన్నలు చెప్పిందే వేదం అన్నట్టు నడుచుకునేది.

మాధురి ఆలోచనలు అకస్మాత్తుగా చెదిరాయి,

‘పెళ్లి మాట ఎత్తకమ్మా. పెళ్లి చేసుకునే ఆలోచన లేదు నాకు. ‘ అంటున్న శ్వేతని చూసి తను ఏంవింటోందో ఒక్కసారి అర్థం కాక కూతురు తనని ఆట పట్టించటానికి అలా మాట్లాడుతోండేమో అని చూసింది. అలాటి సూచన ఏదీ కనపడకపోయేసరికి,

‘ఏమిటా పిచ్చి మాటలు?’ అంటూ కసురుకుంది.

‘పిచ్చిమాటలేముంది? నా పెళ్లి విషయం నా ఇష్టం. నాకు చేసుకోవాలని లేదు. అదే చెబుతున్నాను’ శ్వేత గట్టిగా చెప్పింది తన మనసులో మాట.

అనుకోని పిడుగుపాటులాటి ఆ మాటలకి మాధురికి కళ్లు చెమరించాయి. ఇలాటి సమాధానం ఊహించనిది. కూతురి ముందు బేలగా బయటపడకూడదని తనను తాను సర్దుకుంది.

‘ఏం, ఎందుకు చేసుకోవు? అదేదో ప్రపంచానికి కొత్త విషయంలా కొట్టిపారేస్తున్నావు. మన కుటుంబాల్లో ఎవరైనా పెళ్ళి చేసుకోకుండా మానేసేరా?’

‘అమ్మా, నువ్వు పెళ్లి చేసుకుని మూడు దశాబ్దాలు దాటింది. నువ్వు అప్పటి మనుషులు, అలవాట్లు,ఆచారాలు గురించి చూసేవు. అవన్నీ ఇప్పటి కాలానికి అనుసరించేవే అనుకుంటున్నావు. బయట ప్రపంచాన్ని చూడు. ఎన్నెన్ని మార్పులు వచ్చాయో , వస్తున్నాయో తెలుస్తుంది. నువ్వు అంటూంటావుగా, నేను చూస్తున్న ప్రపంచం నువ్వు చూసిన దానికంటే చాలా విశాలమైనది అనీ, నాకళ్లతో చూసే ప్రపంచాన్ని గురించి నీకు చెప్పమనీ. ……’

ఒక్క క్షణం ఆగింది. తల్లి ముఖం అంతలోనే వాడిపోయింది. చేస్తున్న పని పూర్తి చేసి , చేతులు కడుక్కుంటున్న తల్లి ప్రక్కనే క్షణం నిశ్శబ్దంగా నిలబడింది.

‘అమ్మా, పెళ్ళి మీద నీకున్నంత నమ్మకం నాకు లేదు. ఇప్పటి తరం జీవనశైలికి అదెంత వరకూ నప్పుతుందో చెప్పలేము.అలా అని ఎవరూ పెళ్లిళ్లు చేసుకోవట్లేదా అంటే చేసుకుంటున్నారు. కాని ఎన్ని పెళ్లిళ్లు మీ తరంలోని పెళ్లిళ్లులాగా కుదురుగా, స్థిరంగా ఉంటున్నాయి? చెప్పు’

మాధురి మౌనంగా ఉండిపోయింది. మొన్న మొన్నటిదాకా ప్రతి విషయానికీ ‘అమ్మా, నాన్నా’ అంటూ తమ వెనుకే తిరిగిన పిల్లేనా ఇప్పుడు మాట్లాడుతున్నది? తనకెందుకో ఇదంతా కొత్తగా ఉంది. ఆమోదయోగ్యంగా లేదు. తనూ పుస్తకాలు చదువుతుంది, నిత్యం న్యూస్పేపర్లూ చదువుతుంది. తన స్నేహితులు వాళ్ల  పిల్లల గురించి చెబుతున్న ఎన్నో సమస్యలు, కంప్లెయింట్లు వింటూనే ఉంది. కాని పెళ్లి అనేది శ్వేత చెప్పినట్టు ఇంత నిరసించే విషయమని మాత్రం అంగీకరించలేకపోతోంది.

‘అమ్మా, ప్రపంచాన్ని నీకు అలవాటైన కోణం నుండి కాకుండా చూసేందుకు నీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను, ప్రీతి తెలుసుకదా నీకు. తను తిలక్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరివైపూ పెద్దల ఆమోదం దొరకలేదు. వీళ్ల నిర్ణయాన్ని నిరసించనూ లేదు. అలా అని వీళ్లని దగ్గరకు తీసుకోనూలేదు. ఇద్దరూ బానే ఉన్నారు.

తిలక్ ఈ మధ్య ఉద్యోగరీత్యా తరచూ దేశం విడిచి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ప్రీతిని, పాపాయిని తీసుకుని వెళ్లటం కుదరదు. ఇక్కడ ప్రీతి ఉద్యోగం , పాపాయిని చూసుకోవటంతో సతమతమవుతోంది. మేము స్నేహితులమున్నాం. కాని భర్తకి దూరంగా ఉండటం, అమ్మ ఇంటికో, అత్తగారి ఇంటికో వెళ్దామని ఉన్నా ఇప్పటికీ వాళ్లు ఆదరించకపోవటం తనని చాలా బాధ పెడుతున్నాయి .ఊహ తెలుస్తున్న తన కూతురికి అందరూ ఉండీ  ఒంటరిగా పెరుగుతోందని అంటుంది.

ఆ మధ్య ప్రీతి కూతురికి బావులేదని హాస్పిటల్ లో చేర్చింది. మేమంతా సాయం చేసేం. మా కొలీగ్ శ్రీనాథ్ ఆమె వెంట ఉండి చాలా సహాయం చేసేడు. అది తనకి నచ్చలేదని తిలక్ అన్నాడట. శ్రీనాథ్ లో ఒక స్నేహితుణ్ణి , శ్రేయోభిలాషిని కాకుండా ఒక మగవాణ్ని మాత్రమే చూసిన తిలక్ ని ఎలా అర్థం చేసుకోవాలంటుంది ప్రీతి. దాని గురించి ఇంకా భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది. అది ఎంతవరకూ వెళుతుందో అర్థం కావట్లేదు ‘ శ్వేత చెప్పిన విషయం విని నిట్టూర్చింది,

‘నిజమే. తిలక్ అలా ఆలోచించకూడదు. అందుకోసం పెళ్లి వ్యవస్థే నమ్మదగ్గది కాదు అంటే నేను ఒప్పుకోను. మన బంధువుల్లో నీ వయసు పిల్లలు బోలెడు మంది ఉన్నారు . వాళ్లెవరూ నీలా పెళ్లి వద్దని కూర్చోలేదు. ఇన్నాళ్లూ కాస్త సమయం ఇమ్మని చెప్పి ఇప్పుడు నువ్వు అసలు పెళ్లే వద్దని అంటున్నావ్. శ్వేతా, నా మనసు బాధ పెట్టకు.నువ్వు ఎవరినైనా ఇష్టపడితే చెప్పు. అంతే కాని ఇలా మాట్లాడకు.’

‘ నీకెలా చెప్పాలో తెలియట్లేదు. నాకు నమ్మకం లేనిది, అవసరం అనిపించనిదీ నువ్వు చేసుకోమంటే చేసుకుంటానని అనుకోకు.’

artwork: srujan raj

‘ఒంటరిగా జీవితమంతా ఉండిపోతావా? ఒక తోడు కావాలని నీకు అనిపించట్లేదా? మాకు ఉన్నదే నువ్వు ఒక్కదానివి. నీకు పెళ్లి చేసి ఆ ముచ్చట తీర్చుకోవాలని మాకు మాత్రం ఉండదా? కని,పెంచిన మా ఇష్టాల గురించి ఆలోచించవా? అయినా నీ వయసు పిల్లలు పెళ్లిచేసుకోవాలని, ఒకతోడు కావాలని కోరుకోవటం అసహజం కాదుకదా.’

‘అమ్మా, తోడు కావాలంటే పెళ్లే చేసుకోనక్కరలేదు. నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు కలిసి జీవించటం బావుంటుంది. అంతవరకే. పెళ్లి అనే సంకెళ్లు వేసుకోనక్కర్లేదు. పిల్లలకోసం తాపత్రయ పడక్కరలేదు. ఆ సహచర్యం సాగినన్నాళ్లు సాగుతుంది. ఆ తర్వాత ఎవరి జీవితాలు వాళ్లవి. దాని గురించి కూడా దిగుళ్లు పెట్టుకోనక్కర్లేదు .’

మాధురి కూతురివైపు విచిత్రంగా చూసింది. ఇదేమిటి? ఈ ఆలోచనలు తానింతవరకూ వినలేదే?!

తన చెల్లెలు రుక్మిణి కూతురి పెళ్లిచేస్తూ క్రిందటేడాది తనతో అన్న మాటలు తను మర్చిపోలేదు.

‘అక్కా, శ్వేత కంటే నా కూతురు లాస్య చిన్నది. శ్వేత పెళ్లి ఇప్పుడే వద్దంటోందని చెప్పావు నువ్వు. లాస్యకి మాకు తెలిసున్నకుటుంబం నుండి ఒక మంచి సంబంధం వచ్చింది. లాస్య కూడా అభ్యంతరం చెప్పలేదు. న్యాయంగా పెద్దపిల్ల కనుక శ్వేత పెళ్లి ముందు జరిగితే బావుంటుంది. కాని ఇప్పుడు పరిస్థితి ఇలా వచ్చింది’ అంది తానేదో అపరాధం చేస్తున్నట్టు.

తను నవ్వుతూ కొట్టిపారేసింది ‘ అలాటివేం పెట్టుకోకు ‘’ అని. ఆ పెళ్లి జరిగిపోయింది.

శ్వేత ఆలోచనలు ఎందుకిలా ఉన్నాయి? తన పెంపకంలో లోపమా? పెళ్లి, కుటుంబ వ్యవస్థ పట్ల కూతురిలో సరి అయిన అవగాహన కల్పించలేక పోయిందాతను? ఎక్కడుంది లోపం?మాధురిని ఒక న్యూనతా భావం కమ్ముకుంది. ఒక తల్లిగా తను సరైన బాధ్యత నిర్వర్తించలేదా? భర్తకి చెబితే ఏమంటాడు? కూతుర్నే సమర్ధిస్తాడా? అసలు అతను కాదూ ఇన్నేళ్లూ కూతురి మాటలకి వంత పాడుతూ ,పెళ్లి వాయిదా వేస్తూ వచ్చింది! తన దగ్గర చెప్పిన విషయాల్నే తండ్రి దగ్గర కూడా చెబుతుందా ? ఏమి చెయ్యలి తను?

శ్వేత ఆరాత్రే బయల్దేరి వెళ్లిపోయింది. తెల్లవార్లూ నిద్రపట్టక పక్కమీద మసులుతూనే ఉంది మాధురి. కిటికీ బయట చిక్కని వెన్నెల మనసుని సేదదీర్చలేకపోయింది.

*************

ప్రొద్దున్న శ్యామ్ ఆఫీసుకు బయలుదేరుతుంటే  మాలతి క్లినిక్ దగ్గర తనను దింపమని చెప్పింది భర్తతో.

మాలతి అప్పుడే వచ్చినట్టుంది. క్లినిక్ లో ఆమె ఒక్కతే ఉంది. మాధురి తన మనసులో  బాథ వెళ్లబోసుకుంది.

‘మధూ, శ్వేత చెప్పిన విషయం నాకు విస్మయాన్ని కలిగించటం లేదు. ఇప్పటి తరం ఆలోచనలు ఇలాగే ఉన్నాయి. నా దగ్గరికి కౌన్సిలింగ్ కోసం వచ్చే పిల్లల్ని, తల్లిదండ్రుల్ని చూస్తున్నాను కదా.

ఈ మార్పు అనివార్యమనే అనిపిస్తోంది .మన అమ్మల కాలంలో ఉమ్మడి కుటుంబాలే చాలావరకు.వాళ్లు స్వంత ఊళ్లని వదలవలసిన అవసరం రాలేదు. మనతరం  ఉద్యోగాల పేరుతో స్వంత ఊళ్లనీ, కన్నవాళ్లనీ వదిలి పరాయి ప్రాంతాలకొచ్చేసేం. ఇదంతా సహజంగానే జరిగిపోయిందని అనుకున్నాం. వెనుక మిగిలిపోయిన వాళ్ల ఆలోచనలు ఏమిటన్నది మనం అంతగా పట్టించుకోలేదు.

ఒక్కసారి మనం పెరిగిన వాతావరణం గుర్తు తెచ్చుకో. అలాటి బలమైన కుటుంబ వ్యవస్థలో అమ్మకి దీటుగా పెద్దమ్మలు, పిన్నమ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు అందరూ మనం పెరిగిన నేపధ్యంలో మన వెనుకే ఉన్నారు. వాళ్లంతా మన కుటుంబంలో భాగంగానే ఉండేవాళ్లు.

మారుతున్న కాలంలో మన జీవితాలు మనమిద్దరం, మనకిద్దరు లేదా ఒక్కరు తో మొదలయ్యి, కొంచెం సంకుచితం అవుతూ వచ్చేయి. మనతరంలోనే కొందరు కులమత,వర్గాల్ని ప్రక్కకి పెట్టి పెళ్లిళ్లు చేసుకున్నవాళ్లున్నారు. వాళ్లకి సమాజం నుండి బోలెడు వ్యతిరేకత ఎదురైంది. అయినా పెళ్లిపట్ల , స్వంత నిర్ణయం పట్ల ఉన్న కమిట్మెంట్ వాళ్ల జీవితాల్ని సవ్యంగా నడిపించింది.

ఇప్పుడు ఉద్యోగాలపేరుతో పొరుగూళ్లు, పొరుగు రాష్ట్రాలు, పొరుగు దేశాలు పట్టుకు తిరుగుతున్నారు. ఇద్దరు, ముగ్గురు సభ్యులున్న కుటుంబం కూడా రెండు వేరువేరు చోట్ల జీవించాల్సి వస్తోంది. భార్య,భర్తల ఉద్యోగమనో, పిల్లల చదువులనో ఈ రకంగా సంసారాలు రెండు , మూడు ముక్కలుగా బ్రతికేస్తున్నాయి…….’

మాలతి మాటలకి అడ్డం వస్తూ మాధురి అంది, ‘ఏమో మాలతీ ఇవన్నీ వింటుంటే భయమేస్తోంది. ఏమయిపోతోంది మన సమాజం? ఎవరు కారణం ఈ మార్పులకి?’

‘అలా భయపడితే ఎలానోయ్ అమ్మాయీ?! నువ్వు కుటుంబం వరకే పరిమితమై బయట ప్రపంచాన్ని, వస్తున్న మార్పుల్ని గమనించట్లేదని చెబుతాను. ఇప్పుడున్న సమాజాన్ని ఎవరో ఎందుకు మార్చేస్తారు? మనం, మన పిల్లలు ఆ మార్పు కి కారణం. ఏ తరంలో అయినా యువతరం ముఖ్య నిర్ణయాల్ని చేస్తూ తమకు అనువైన కొత్త మార్పుల్ని తీసుకొస్తుంటుంది కదా. క్రిందటి తరం వాళ్లు వాళ్లకు అనువైన మార్పుల్ని వాళ్ళు తెచ్చుకున్నారు సమాజంలో. అది అప్పటి పెద్దలకి పెను సవాళ్లనే విసిరింది. ఇప్పుడు ఆ సవాళ్లు ఎదుర్కోటం మనవంతు.

ఎక్కడికక్కడ ఎవరి జీవితాలు వారివి, ఎవరి సమస్యలు వారివి అయినప్పుడు మిగిలిన వాళ్లకోసం ఆలోచించే తీరిక ఎవరికుంది?

నీ కూతురు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. తన అభిప్రాయాన్ని అంత స్పష్టంగా చెప్పింది. తన ఆలోచనల పట్ల ఎలాటి అయోమయం లేదు తనకి.

ఇప్పటి వాళ్లు ప్రాక్టికల్ గా ఎదుర్కొంటున్న ఇబ్బందులున్నాయి. వాళ్లకి అనువుగా ,సౌకర్యంగా ఉన్న నిర్ణయాల్ని వాళ్లు తీసుకుంటున్నారు. నీకూతురికి కౌన్సిలింగ్ కావాలని అన్నావు కదూ. తనకు కౌన్సిలింగ్ ఇవ్వవలసిన అవసరం లేదు. నీకు మాత్రం కొంత అవసరం.’ నవ్వుతూ తను చెప్పదలచుకున్నది చెప్పింది మాలతి.

‘మాలా, నీకు వేళాకోళం గా ఉంది నా సమస్య. కూతురికి పెళ్లి చెయ్యాలన్న ఆశ, ఆ బాధ్యత తీర్చుకోవాలన్న తపన న్యాయమైనదేకదా ’ మాధురి ముఖంలో అలక.

‘వేళాకోళం కాదు మధూ, మన చుట్టూ సమాజంలో విడాకుల రేటు పెరుగుతోందన్నది చూస్తున్నావుగా. జీవితాల్లో వచ్చిన వేగం, ఉద్యోగపు ఒత్తిళ్లు, పోటీ ప్రపంచంలో భవిత గురించిన అభద్రత ఇప్పటి తరాన్ని వేధిస్తున్నాయి. వాళ్లని వాళ్లు చూసుకోవటం,వాళ్ల పోరాటాలు ….ఇవి జీవితంలో ముఖ్య సమస్యలు అయిపోయాయి. ఇంకా పెళ్లి, పిల్లలు లాటి జంఝాటాలు వాళ్లకి సహించరానివిగా ఉన్నాయి. ఇది నువ్వు ఒప్పుకుతీరాల్సిందే.

అదీకాక కూతురి పెళ్లి చెయ్యాలన్న ఆశ, అదో బాధ్యతలా భావించటం ఈ కాలానికి నప్పవు. నీ ఆనందం కోసం పిల్లలు, అది వాళ్లు పిల్లలుగా ఉన్నంతవరకే. పెంచటం వరకే నీ బాధ్యత. ఆ తర్వాత వాళ్ల జీవితాలమీద నీకు ఎలాటి హక్కూ లేదు. ఎందుకంటే జీవితం వాళ్లది. ఆ మంచి చెడులు వాళ్లని ఆలోచించుకోనీయటమే న్యాయం. వాళ్లకి అవసరమైనప్పుడు వాళ్ల వెనుక నువ్వు ఉన్నావన్న నమ్మకం వాళ్లకి కలిగించటం వరకే నువ్వు చెయ్యవలసింది. ’

‘అయితే ఇక కుటుంబాలు, వివాహ వ్యవస్థ సమాజంలోంచి మాయమైపోతాయా? సమాజం అంటే ఒంటరి వ్యక్తుల సమూహమేనా? ’

‘ఎందుకు మాయమవుతాయి? ఈ తరం వాళ్లలో శ్వేతలాగా ఆలోచించేవాళ్లతో పాటు నీ ఆలోచనలు సమర్ధించే వాళ్లు ఉన్నారు కదా. పెళ్లిళ్లు ఉంటాయి. అయితే విడాకులు, కుటుంబాలు విచ్చిన్నమవటం,మరింత పెరుగుతాయి. ఎదుటి వ్యక్తి కోసం ఆలోచించటం, సర్దుబాటు అనేవి లేనప్పుడు ఇది తప్పదు. ఒంటరి జీవితాలు అని నువ్వు అంటూన్నావే అవి కొన్నేళ్లకి మనుషుల మధ్య కొత్త బంధాలకోసం ఆరాట పడేలా చేస్తాయేమో. ఆ తర్వాత మళ్లీ సమాజంలో ఒక స్థిరత్వం కోసం ప్రయత్నాలు మొదలవుతాయేమో! అప్పుడు మళ్లీ వివాహవ్యవస్థ కావాలని బలంగా కోరుకుంటారేమో! చూద్దాం.’…..

మాలతి మాటలు పూర్తి కాకుండానే తలుపు తోసుకుని ఎవరో రావటంతో , మాధురి మళ్లీ కలుస్తానంటు లేచింది. ఇంటికొస్తుంటే దారిపొడవునా ఆలోచనలే. ఊపిరి సలపనట్టుగా అనిపిస్తోంది మాధురికి. తనను అర్థం చేసుకుంటుందనుకున్న మాలతి కూడా తన ఆలోచనధోరణి ఈ కాలానికి చెల్లదని సూటిగా చెబుతోంది.

అమ్మవాళ్ల తరం కంటే కాస్త ముందడుగు వేసి డిగ్రీ చదువులు చదివి, అంతో ఇంతో ప్రపంచాన్ని గమనిస్తూ కూడా తను కూతురి అభిప్రాయాల్ని అర్థం చేసుకోలేని దశలో ఉందన్నది మాధురి ఒప్పుకోలేకపోతోంది . తరానికి తరానికి మధ్య ఈ అగాధాలు పూడ్చలేనివేనా?

*******************

artwork: srujan raj

సినిమా ఆసక్తి కరంగా అనిపించినా మధ్యమధ్యలో భార్య గురించిన ఆలోచన అతడిని కాస్త అస్థిమితం చేస్తూనే ఉంది.

‘ ఈ సినిమాలో హీరోయిన్ తన జీవితాన్ని తనకు కావలసినట్టు మలుచుకుంది. ముందు పిరికిగా కనిపించి , ఏడుస్తూ కూర్చున్నా బయటి ప్రపంచంలోకి వచ్చాక తనకు కావలసినదేమిటో నిర్ణయించుకునే మెట్యూరిటీ ని సంపాదించింది. సినిమా పేరుకి, ఆ నాయిక పాత్రకి  తగినట్టుగానే నిజంగా క్వీన్ లాగే తన జీవితాన్ని తను రచించుకుంది. నీకు నచ్చిందా డాడ్’ అంటూ అడుగుతోంది శ్వేత సినిమా నుండి వస్తూంటే .

శ్యామ్ కూతురి అభిప్రాయాన్ని అంగీకరించాడు. ఆ సినిమా లో పాత్ర అద్భుతంగా పోషించినందుకు  నాయిక కంగనా కి జాతీయ అవార్డ్ వచ్చిందని చెబుతోంది శ్వేత.

అవును, క్వీన్ ఈ కాలపు పిల్ల. తనకు ఏమికావాలో తను నిర్ణయించుకుంది.

శ్వేత తన జీవితం పట్ల తీసుకున్న నిర్ణయాన్ని మాధురికి అర్థం అయ్యేలా చెప్పడానికి శ్యామ్ సిధ్ధపడ్డాడు.

******************

 

 

పూర్వనీడలు పరుద్దాం రా!

 

 

“పొదల మాటునుండి రెండు కళ్లు తననే గమనిస్తున్నాయని అప్పుడతనికి తెలీదు”

యండమూరి వీరేంద్రనాధ్ నవలలు విచ్చలవిడిగా చదివిన వాళ్లందరికీ చిరపరిచితమైన వాక్యమిది. అచ్చంగా ఇదే కాకపోయినా, ఇంచుమించు ఇటువంటి వాక్యాలు ఆయన నవలల్లో తరచుగా ఎదురవుతుంటాయి. నాకు తెలిసినంతవరకూ తెలుగులో ఫోర్ షాడోయింగ్ ప్రక్రియని ప్రభావశీలంగా వాడుకున్న- కొండొకచో దుర్వినియోగ పరచిన – రచయితల్లో అగ్రగణ్యుడు యండమూరి (నా పరిజ్ఞానం అంతవరకే పరిమితం. పాపము శమించుగాక!)

పందొమ్మిదో శతాబ్దపు ప్రముఖ కథా రచయిత ఆంటన్ చెకోవ్ కథల్లో క్లుప్తత ఆవశ్యకత గురించి నొక్కివక్కాణిస్తూ ఓ మాటన్నాడు: “మీ కథలో తుపాకీ ప్రస్తావన గనుక వచ్చిందంటే, కథ పూర్తయ్యే లోపు అది పేలి తీరాలి!”. కథలో అనవసరమైన ముచ్చట్లేమీ ఉండకూడదని చెకోవ్ ఉద్దేశం. ఇదే ‘చెకోవ్స్ గన్’ ఉపమానాన్ని తిరగేసి మరోరకంగానూ చెప్పొచ్చు: “మీ కథ చివర్లో తుపాకీ పేలిందంటే అంతకు ముందే దాని ప్రస్తావన వచ్చి తీరాలి!”.  ఇదే ఫోర్ షాడోయింగ్, లేదా తేటతెలుగులో ‘పూర్వనీడలు పరవటం’. దీనికి బ్రహ్మాండమైన ఉదాహరణ ‘అతడు’ సినిమాలో కనిపిస్తుంది. ఆల్రెడీ గుర్తొచ్చేసుండాలి మీకు.

కథకుల తూణీరాల్లో ఉండాల్సిన బాణాల్లో ఫోర్ షాడోయింగ్ ఒకటి. కొన్ని రకాల కథనాలని పదునెక్కించాలంటే దీన్నెలా వాడాలో తెలిసుండటం అవసరం.

ఇంతకీ కథనం అంటే ఏమిటి?

చాలా తేలిగ్గా చెప్పాలంటే – ‘కథనం’ అంటే కథలో సంఘటనలు జరిగే క్రమం. ‘ఓస్, అంతేనా’ అంటే ఇంకా చాలా చాలా చెప్పొచ్చు. కానీ మన ప్రస్తుత అవసరానికి ఈ నిర్వచనం సరిపోతుంది.

మొదట్లో జరిగే ఓ సంఘటన, ముగింపులో జరిగే మరో సంఘటన, ఆ రెండింటి మధ్యా జరిగే ఇతర ఘటనలు. ఏ కథలోనైనా ఉండేవి ఇవే. ఆయా సంఘటనల్ని వరుసగా చెప్పుకుంటూ పోవచ్చు, లేదా ముందువెనకలుగానూ చెప్పుకు రావచ్చు. ఎలా చెప్పినా, ఆ కథనం పాఠకుడిలో కుతూహలాన్ని కలగజేయాలి. తెలివైన కథకుడు ఏ వివరాన్ని ఎప్పుడు ఏ మోతాదులో బయటపెట్టాలో తెలిసినవాడై ఉంటాడు. కథలోని సంఘటనల కాలక్రమంతో కబడ్డీ ఆడుతూ దాన్ని రక్తి కట్టిస్తాడు. ఈ కబడ్డీలో కొన్ని పట్లున్నాయి. వాటిలో అందరికీ తెలిసినది ‘ఫ్లాష్‌బాక్’ అయితే, మనం ప్రస్తుతం మాట్లాడుకుంటున్న ‘ఫోర్ షాడోయింగ్’ అనేది మరో పట్టు. ఇవి రెండే కాక మరో మూడ్నాలుగు ‘కాలక్రమ కబడ్డీ పట్లు’ కూడా ఉన్నాయి. వాటి గురించి వీలునుబట్టి మరెప్పుడైనా ముచ్చటించుకుందాం.

ఒకరకంగా, ఫోర్ షాడోయింగ్ అనేది ఫ్లాష్‌బాక్‌కి వ్యతిరేక ప్రక్రియ. మతిమరపు కథానాయకుడి నెత్తిన ప్రతినాయకుడు కొట్టిన దెబ్బకి ‌గతమెరుపు మెరవటం చాలా సినిమాల్లో చూసే ఉంటారు. అద్గదిగో … ఆ రింగుల రంగులరాట్నమే ఫ్లాష్‌బాక్. ఈ విధానంలో – రచయిత గతంలో గడచిపోయిన కీలక ఘట్టాన్నొకదాన్ని కథలో అవసరమొచ్చినప్పుడు విప్పిచెబుతాడు. కథని ఆసక్తికరంగా మలచటానికి ఇదొక మార్గం. దానికి భిన్నంగా, ఫోర్ షాడోయింగ్ ప్రక్రియ ద్వారా రచయిత కథలో తర్వాతెప్పుడో ఎదురవబోయే సంఘటనలు, జరగబోయే పరిణామాలపై ముందస్తు అవగాహన కలగజేస్తూ పాఠకుల్లో ఉత్కంఠ, ఆసక్తి నింపుతాడు. సాధారణంగా, ఫ్లాష్‌బాక్‌లో పూర్తి స్థాయి సన్నివేశాలు దర్శనమిస్తాయి. ఫోర్ షాడోయింగ్ మాత్రం చిన్న చిన్న వాక్యాల ద్వారానే చేయొచ్చు.

ఈ ‘పూర్వనీడల’ ప్రక్రియని స్థూలంగా రెండు విధాలుగా వాడొచ్చు. అది ఫోర్ షాడోయింగ్ అని చూడగానే తెలిసిపోయేలా వాడటం ఒక రకం. ఇది ఉత్కంఠ పోషించటానికి పనికొచ్చే పద్ధతి. ఈ వ్యాసం మొదట్లో ఎదురైన యండమూరి శైలి వాక్యం దానికో ఉదాహరణ. ఈ విధమమైన పూర్వనీడలు పరవాలనుకునే కథకుడు గుప్పిట ఎంతవరకూ తెరవాలనేదీ బాగా కసరత్తు చేయాలి. “ఏం జరగబోతోంది?” అనేదీ ఉత్కంఠే, “ఎలా జరగబోతోంది?” అనేదీ ఉత్కంఠే. కాకపోతే మొదటిది కాస్త ఎక్కువ ఉత్కంఠ పుట్టించే విషయం. ఫోర్ షాడోయింగ్ మరీ ఎక్కువైపోతే ఉత్కంఠ స్థాయి పడిపోతుంది; తక్కువైతే ఉత్కంఠే ఉండదు. కాబట్టి సమతూకం సాధించటం ముఖ్యం.

అయితే, కొన్ని రకాల కథలకి ఉత్కంఠతో పనుండదు. ఇటువంటి కథల్లోనూ ఫోర్ షాడోయింగ్ చేస్తూ, కథ ఎటు దారితీస్తోందీ పాఠకులకి చూచాయగా తెలియజేయొచ్చు. ఇది రెండో పద్ధతి. ఈ తరహా పూర్వనీడలు అదృశ్య సిరాతో రాసిపెట్టిన వాక్యాల్లా కథలో దాక్కుని, రెండోమారు ‘వెలుగులో’ చదివినప్పుడు మాత్రమే కనబడి పాఠకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. నా ‘శిక్ష’ (goo.gl/kVEZ3S) కథలో ఈ రకమైన ఫోర్ షాడోయింగ్ కనబడుతుంది. ఇదే రకం అమాయకపు పూర్వనీడలు తొంగిచూసే మరో తెలుగు కథ, శివ సోమయాజుల (యాజి) రచించిన ‘పగడ మల్లెలు’ (goo.gl/2vlSb6).

వ్యక్తిగతంగా, నాకు కథల్లో పూర్వనీడలు పరవటమంటే సరదా. నా కథలన్నిట్లోనూ ఫోర్ షాడోయింగ్ కనిపిస్తుంది. ఉదాహరణకి ‘ప్రళయం’ (goo.gl/8rqOLP) ప్రారంభ వాక్యాలు చూడండి:

“ఈ ద్వారము తెరచిన ఎడల అమ్మవారు ఆగ్రహించును. లోకమునకు అరిష్టము దాపురించుము. ఓ మానవా, వెనుకకు మరలుము”

కథ ఎత్తుగడలోనే ఈ వాక్యాలు కనబడటం వల్ల పాఠకుల్లో ఆసక్తి కలుగుతుంది. తర్వాత జరగబోయేదానిపై చూచాయగా ఓ అంచనా ఏర్పడుతుంది. అది వాళ్లు మిగతా కథ చదివేలా ప్రేరేపిస్తుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసింది ఒకటుంది. పాఠకుడికి ఓ అంచనా కలిగించాక దాన్ని ఎట్టి పరిస్థితిలోనూ చేరుకోవలసిందే. లేకపోతే అతన్ని మోసం చేయటమే అవుతుంది. ఉదాహరణకి, పై వాక్యాలు ఓ ద్వారమ్మీద కనబడే అక్షరాలు. కథ మొదట్లో వాటినంత ప్రముఖంగా చూపించి, తర్వాత కథంతా దానికి సంబంధం లేకుండా నడిపించేసి, ఆనక తీరిగ్గా “కథానాయకుడు దారిన పోతుంటే అతని కళ్లబడ్డ సవాలక్ష చిల్లర వివరాల్లో అదీ ఒకటి, అంతకు మించిన ప్రాముఖ్యత దానికి లేదు” అని చప్పరించేస్తే కుదరదు. అప్పుడది ఫోర్ షాడోయింగ్ అవదు. ఫోర్ ట్వంటీ యవ్వారం అవుతుంది. పూర్వ నీడల పేరుతో పాఠకుల్ని మోసబుచ్చజూస్తే కథకుడి క్రెడిబిలిటీపై క్రీనీడలు కమ్ముకుంటాయి.

‘ప్రళయం’ కథలోనే మొదటి చాప్టర్‌లో ఈ క్రింది వాక్యాలొస్తాయి:

 

————-

ఈ మధ్య భారతదేశం ప్రయోగించిన తొలి వ్యోమనౌక కూడా ఇక్కడ దిష్టి తీయించుకున్నాకే పైకెగిరింది. శాస్త్రవేత్తలు సొంత శక్తియుక్తుల కన్నా శక్తిస్వరూపిణి మహిమల్నే నమ్ముకోవటం వింతే. నాకలాంటి మూఢనమ్మకాలేం లేవు. ఒకే ఒక గాఢ నమ్మకం మాత్రం ఉంది: డబ్బు.

————–

ఇక్కడ వ్యోమనోక ప్రస్తావన వేరే contextలో ఉన్నట్లు కనిపించినా, దాని అసలు ప్రయోజనం కథ చివర్లో తెలుస్తుంది. ఇదొక రకం ఫోర్ షాడోయింగ్.

చివరగా – కథలో ఫోర్ షాడోయింగ్ దేనికి అవసరం, దేనికి అవసరం లేదు అనేది గుర్తెరగటం ముఖ్యం. సాధారణంగా కథకి అత్యంత కీలకమైన విషయానికి ఫోర్ షాడోయింగ్ వన్నె తెస్తుంది. ప్రతి చిన్న విషయానికీ పూర్వనీడలు పరుస్తూ పోతే కథ పొడుగు పెరగటం, పాఠకులకి చిర్రెత్తటం తప్ప ఒరిగే ప్రయోజనం ఉండదు.

*

 

 

మ‌ళ్ళీ వెళ్ళిపోవ‌డానికైనా మ‌ళ్ళీ రా…

 

లాలస
~
అనంతాంబ‌రం  దిగువున ప్రతి వస్తువూ కవిత్వమే … అనంతాకాశం పైన కూడా అవ‌ధులు లేని ప్ర‌పంచం నిండా కవిత్వమేనని సంబ‌ర‌ప‌డి కవితలు రాసి రాసి దాచుకున్న  రోజుల్లోనే శాస్రవేత్తలు చిన్న ప్లూటో  గ్రహమే కాద‌న్న‌పుడు అలిగి నక్ష‌త్రాల కవితలు ఇక వద్ద‌నుక‌న్నాను. ఆ వార్త విన్న‌పుడు న‌క్ష‌త్రాల‌ను   ప్రేమించిన నువ్వు కూడ  నాలా నిర్ఘాంత పోయి ఉంటావా లేక  చిన్న ప్లూటో క‌న్నా ముందు  చాలా గ్రహాలున్నాయ‌నే మురిసిపోయావో తెలియదు. కానీ వివక్ష‌ల నీలి నీడల నుంచి మళ్ళీ నువ్వొక ఆత్మ‌గౌర‌వ సూచికా సూర్య నక్ష‌త్రంగా ఎక్కడో  వెలుగుతుంటావ‌ని తెలుసు.
చెట్టు నుంచి విరిగిన కొమ్మ  బాధ ఎంత కాలం ఉండ‌గ‌లదులే .  నేను వీడినలోకం ఎంత కాలం పరితాపం ప‌డుతుందిలే అనుకున్నావో తెలియ‌దు కానీ  మొట్ట మొద‌టి సారి ఉట్టి లేఖ పేరుతో  చివరి మరణ మహావచనం ఒకటి నీ హృద‌యం నుంచి కత్తిరించి ఎన్నో హృద‌యాల‌ అంచున  ప‌ర్మినెంట్‌గా పేస్ట్ చేశాని తెలుసు.
నీకు న‌చ్చిన మేఘాలు లేక‌పోయిన నా పైన ఈ వాన .. పాట నీకెంత ఇష్ట‌మో తెలియ‌దు. కానీ దేహ‌మొక గాయ‌మై,  చూపు ప్ర‌శ్న గా మారి గుండె దిగాలైన ఈ లోకం మీది…మీది.. మీది ముమ్మాటికీ మీదే. నాది.. నాలాంటి వాళ్ళ‌ది కాదంటూ నీ ఆత్మ చేసిన గానం మాత్రం యే దునియా అగ‌ర్ మిల్ భి జాయే తో క్యాహై ( ఈ లోకం చేతికందిన‌నేమి) అని మాత్రం తెలుసు.
నీకు ఎప్ప‌టికీ చేర‌ని ఈ ఉత్త‌రం రాస్తుంటే కాఫ్కా ర‌చ‌న‌లోని వాక్యాలు  గుర్తుకువ‌స్తున్నాయి. …నేనెప్ప‌టికీ అర్ధం చేయించ‌లేను. నాలోని అంత‌ర్మ‌ధ‌నం నేనెప్ప‌టికీ అర్ధం చేయించ‌లేను…. ఈ రెండు వ్యాక్యాల త‌రువాతి వ్యాక్య‌మైన నాలో ఏమి జ‌రుగుతుందో నాకే తెలియ‌దు… నీకు వ‌రిస్తుందో లేదో తెలియ‌దు. కానీ నీకు అర్ధం కాన‌ట్లు ఉంటోంద‌ని మేం గ్ర‌హించ‌లేక‌పోవ‌డం మాత్రం ముమ్మాటికీ నేరమేన‌ని తెలుసు.
నీ అభిమాన రచయిత కార్ల్ సాగ‌న్  చెప్పినట్లు.Absence of evidence is not absence of evidence.  ఉత్తరంలో శూన్యం మాత్రమే ఎందుకు చెప్పావో తెలియ‌దు.  నువ్వు
రాయకపోయినా కానీ మన‌సున్న వాడే విరిగిపోతాడ‌ని  జీవితం మీద అనురక్తితోనే విర‌క్తీ క‌లుగుతుంద‌ని, నీ పోరాటంలో విరక్తి . నీ విరక్తిలో శూన్యంలో అనురాగం ఉంద‌నీ తెలుసు.
నీ మనసు పాస్‌వర్డ్‌ ఏదో తెలిసీ తెలిసినట్లుంది. ఈ ఉత్తరం ముగించాల‌ని లేదు.  కానీ  నా చుట్టూ  నడిరాత్రి.. . .  బ‌హుశా ఆ దుర్దినం  నీ మ‌న‌సు క‌మ్మేసిన చిమ్మ చీక‌టిలా..
మరణమే  ప్ర‌గాఢ ప‌రిచ‌య‌మైన నీకు తమ్ముడూ పుట్టిన రోజు ఇంత క‌న్నా ఏం చెప్ప‌గ‌లం
మ‌ళ్ళీ వెళ్ళిపోవ‌డానికైనా మ‌ళ్ళీ రా…
*

రేపటి మీదే ఆశ!

 

చందు తులసి

~

chanduకథంటే…
కథంటే సమస్యలు కాకపోవచ్చు….
కథంటే పరిష్కారాలు కూడా కాకపోవచ్చు, కానీ…, కథంటే జీవితం. కథలో జీవితం వుండాలి. ఇదైనా ఒప్పుకుంటారా…? ఇది ఇటీవలే జరిగిన కథసాహితీ పాతికేళ్ల సభలో ప్రముఖ రచయిత, విమర్శకులు ఎన్. వేణుగోపాల్ అడిగిన ప్రశ్న .

కథలెలా పుడతాయి. జీవితంనుంచా..? సమాజం నుంచా..? లేక కేవలం సృజనకారుల ఆలోచనల్లోంచేనా..? సృజన అంటే కల్పనే. కానీ ఏ తరహా కల్పన. జీవితాన్ని మరిపించే కల్పనా…? జీవితాన్ని నడిపించే కల్పనా..?
***
గత ఏడాది సారంగ కథల్లో సమకాలీన సమాజానికి దూరంగా వున్న కథలు కొన్నైతే… సమాజాన్ని, జీవితాలను చిత్రించిన కథలు కొన్ని వున్నాయి. అన్నదాత ఆత్మహత్యలాంటి సీరియస్ సమస్యను ఇతివృత్తంగా తీసుకొని కలాన్ని ఛర్నాకోలలా ఝళిపించిన కథ ప్రసాద మూర్తి – ఓ రైతు ప్రార్థన. తెలుగులో అరుదైపోతున్న…వ్యంగ్య రచనా శైలిలో వచ్చిన కథ. రాజకీయ చదరంగంలో రైతుల జీవితాలు ఎలా పావులుగా మారుతున్నాయో ప్రభావవంతంగా చెప్పిన కథ.
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని భూ సేకరణ నేపథ్యంలో….అమరావతి, దాని చుట్టుపట్టు పల్లెల్లో వచ్చిన సామాజిక పరిణామాలను చర్చించిన కథ ఎమ్వీ రామిరెడ్డి త్రిశంకు స్వప్నం . కలలో కూడా ఊహించని విధంగా అమాంతంగా పెరిగిపోయిన భూముల ధరలు….ఆ ప్రాంతంలోని మానవ సంబంధాల్ని ఎలాంటి మార్పులకు దారితీస్తున్నాయో ఆసక్తికరంగా వివరించిన కథ.  ఇంచు మించు అదే ఇతివృత్తంతో ఆ ప్రాంతంలోనే జరుగుతున్న రియల్ ఎస్టేట్ మోసాలను వివరిస్తూ వచ్చిన కథ బుద్ధి యజ్ఞమూర్తి మాయ.
అలాగే తెలుగులో దాదాపూ అంతరించి పోతోందేమో అని ఆందోళన కలిగించే ప్రక్రియ ఆరోగ్యకరమైన హాస్యకథ.  ఆ లోటునూ తీర్చిన కథ డా.కోగంటి విజయ్ బాబు రాసిన ఎవరు కవి. నిజాయతీ, చిత్తశుద్ధి లేని కవులు, వారి కవిత్వం దండగ అని తేల్చిచెప్పి, ఆత్మీయంగా స్పందించే చిన్న మాట గొప్ప కవితకు ఏ మాత్రం తీసిపోదు అని విలువైన సందేశం ఇచ్చిన కథ. వెర్రితలలు వేస్తున్న మతమౌఢ్యం, భక్తి పేరిట జరుగుతున్న మోసాల గుట్టు విప్పిన కథలు కే.సుభాషిణి- నీలకంఠం పి.హెచ్.డీ, శివ్-అపరిచితులు కథలు. మూఢాచారాలను ప్రశ్నించిన ఇంద్రగంటి మాధవి- భోక్త కూడా అలాంటిదే. ఈ కథలు చదివిన తర్వాత…మొత్తానికి తెలుగు కథకులు అప్రమత్తంగానే వున్నారన్న సంతోషం తప్పక కలుగుతుంది.
బలవంతులు తమ అధికారం, బలం ఉపయోగించి ప్రకృతి వనరులు కొల్లగొట్టడం….ప్రత్యక్షంగా కనిపించని దోపిడి. ఈ నేరం ఎవరిదైనా శిక్ష మాత్రం అందరూ అనుభవించాల్సిన దుస్థితి. అందుకే ఈ దిశగా పాఠకులని మరింత చైతన్యం చేయాల్సిన బాధ్యత సాహిత్య కారులపైన ఉంటుంది. ఈ బాధ్యతనే స్వీకరిస్తూ… పర్యావరణ మార్పులు, పర్యవసానాలు… సైంటిఫిక్ ఫిక్షన్ తరహాలో ఆసక్తి కరంగా చెప్పిన కథ కొట్టం రామకృష్ణారెడ్డి 3456జీబీ. భవిష్యత్ లో తెలుగు కథలు విరివిగా రావడానికి అవకాశం ఉన్న విభాగం పర్యావరణ పరిరక్షణ. ఐతే ఈ దిశగా మరింత పరిశోధన, అధ్యయనం చేయాల్సి వుంటుంది.

ఇక ఈ కథల్లో అస్తిత్వవాద కథలూ ఒకటి, రెండు వచ్చాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన కథ కృష్ణజ్యోతి  నేను తోలు మల్లయ్య కొడుకుని. వర్ణం, కులం, లింగం అన్ని వర్గాల వేదనల్ని సున్నితంగా చర్చిస్తూనే…పరిష్కారాన్ని కూడా చూపించిన కథ. ఇతివృత్తంతో పాటూ…రాసిన తీరు కూడా కొత్తగా ఉన్నకథ.  అలాగే కత్తి మహేశ్ నా హీరోకోసం కూడా మరో మంచి కథ. హాలీవుడ్ స్థాయికి ఎదిగాం అని సంబరపడిపోతోంది తెలుగు సినిమా.  ఓ వైపు ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులతో కలిసి పని చేయడానికి ఆరాటపడుతూ…మరోవైపు ఇక్కడే వున్న దళిత, అణగారిన వర్గాల కళాకారులని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమపై సంధించిన ప్రశ్న కత్తి మహేశ్ కథ.  దగ్గర దగ్గర వందేళ్ల చరిత్రకు చేరువవుతున్న తెలుగు సినిమా పరిశ్రమలో ..ఒక్క దళితుడు హీరోగా లేకపోవడాన్ని, కనీసం ఓ గుర్తింపు పొందిన కళాకారుడు లేకపోవడాన్ని ఏమనాలి. ?  తెలుగు సాహిత్యాన్ని మలుపు తిప్పిన…ముఖ్యంగా అద్భుతమైన పాటను సృష్టించిన దళిత సృజనకారులు సినిమారంగంలో కనీసం ప్రవేశాన్నికూడా ఎందుకు పొందలేకపోయారు…? పోయే కొద్దీ లోతైన చర్చకు దారితీసే అంశమిది. మొత్తానికి ఆ దిశగా ఓ చర్చను
లేవనెత్తిన కథ నా హీరోకోసం.

ఇక ఫెమినిస్టు కథలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఆ మాటకొస్తే చాలా కథలు మహిళలే రాయడం “సారంగ” కథల్లో కనిపించిన ఒక ప్రత్యేకత.  గ్లోబలైజేషన్ తదంతర పరిణామాలు మహిళల్ని కూడా వేగంగా అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములని చేశాయి.  పర్యవసానంగా….కొత్త ప్రపంచాన్ని, కొత్త మనుషుల్ని, మనస్తత్వాల్ని మగువలు ఎదుర్కొంటున్నారు. సహజంగానే కొంత సున్నితత్వం, స్పందించే తత్వం ఉన్న స్త్రీ ఈ ఇతివృత్తాల్ని సాహిత్య రూపంలోకి అనువదించేందుకు ఆరాటపడుతోంది. ముఖ్యంగా వెబ్ పత్రికలు వచ్చిన తర్వాత…ప్రచురించే అవకాశాలు బాగా పెరిగాయి. ఫలితంగా అటు కవిత్వంలోనూ, కథా ప్రక్రియలోనూ మహిళలు అధికంగా రావడం మొదలైంది. తరతరాలుగా తమలోనే ఇంకిపోయిన భావాలను…బాహ్య ప్రపంచంలోకి తీసుకువచ్చేందుకు…చర్చించేందుకు మహిళలకు అవకాశం లభిస్తోంది. ఐతే రకరకాల కారణాల వల్ల అంతర్జాల పత్రికల్లో సంపాదకీయం పూర్తి స్థాయిలో నిర్వహించడానికి అవకాశం తక్కువ.  అక్షర దోషాలు, అన్వయ దోషాలు కూడా సవరించకుండానే పాఠకుల ముందుకు రావడం దీన్నే రుజువు చేస్తోంది.  పెరుగుతున్న వెబ్ పత్రికల అవసరాల్ని తీర్చే సంఖ్యలో రచనలు రాకపోవడం వల్ల…సంపాదకులు ప్రమాణాల విషయంలో ఓ మేర రాజీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.  ఫలితంగా వెబ్ పత్రికల వల్ల ప్రమాణాలు తగ్గుతున్నాయనే విమర్శా వినిపిస్తోంది. ఈ విమర్శలో వాస్తవం ఉన్నా, క్రమక్రమంగా రచయితల సంఖ్య పెరుగుతున్నందున… వాటంతటవే ప్రమాణాలు కూడా పెరిగే రోజు రాక తప్పదు.
ఏదైమైనా వెబ్ పత్రికల పుణ్యమాని…మున్ముందు సరికొత్త ఇతివృత్తాలను, భిన్న కోణాలు తెలుగు కథల్లో చూసేందుకు అవకాశాలు పుష్కలంగా వున్నాయి. ఆ పరిణామానికి సూచనలుగా కనిపించే కథలు…రాధిక-ఆలోక.  ఆర్. దమయంతి-అమ్ములు,  రాజ్యలక్ష్మి కథ-మహాలక్ష్మి , పాలపర్తి జ్యోతిష్మతి- వారిజాక్షులందు. . అన్నీ ఉదాత్త పాత్రలున్న ఆలోక కథ ఓ మంచి అనుభూతినిచ్చే కథ. రేపటి తరం గురించిన ఆవేదన వ్యక్తం చేస్తూ….వారిని నిర్లక్ష్యం చేస్తే
వచ్చే పరిణామాలను చూపిస్తూ హెచ్చరించే కథలు… శాంతి ప్రభోద-బాల్యం మోస్తున్న విషాదం,  అన్వీక్ష-తొలి కలుపు,  మమత కొడిదెల-బరువు. ఈ కథలు బహుశా మహిళలు మాత్రమే రాయగలిగినవి. అలాగే సారంగలో వచ్చిన చిన్న కథలు నిడివిలో చిన్నవైనా…. పెద్ద కథలకు ఏ మాత్రం తీసిపోనివి. మా రోజుల్లో అంతా బాగుండేది….అంటూ పెదవి విరచడం కన్నా… కాలంతో పాటూ మనం మారాలని చెప్పే కథ లక్ష్మీ రాఘవ –అనుబంధాల టెక్నాలజీ.  కణ్ణగి-
పిచ్చుకలు, వినోద్ అనంతోజు- చింటూ అమ్మెక్కడ..? లాంటి కథలు.., సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా…తక్కువ పరిధిలోనే ఎక్కువ ప్రయోజనాన్ని సాధించిన కథలు.
చిన్న కథల్లో ఎక్కువగా….కొత్తగా రాస్తున్నవారు, యువత వుండడం గమనార్హం. బహుశా కొత్త తరం రాస్తున్న కథల ద్వారా… తాము ఎలాంటి కథలను ఇష్టపడుతున్నారో….చెప్పకనే చెపుతున్నారని అనుకోవచ్చు.

ముఖ్యంగా మేడి చైతన్య, ఎండ్లూరి మానస, ప్రజ్ఞ వడ్లమాని చిన్న కథలు విరివిగా రాస్తూ ఆకట్టుకుంటున్నారు. తెలుగు కథల్లో ఇటీవల తాత్విక చింతన, అంతరంగ అన్వేషణ కథలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏడాది చివరలో వచ్చిన కోడూరి విజయ్ కుమార్-చివరాఖరు ప్రశ్న,  బి.హరిత-అన్వీక్షణ కథలు ఆ కోవకు చెందినవే. మానసిక ప్రపంచంలోని అలజడిని, అంతస్సంఘర్షణను కవితాత్మకంగా చిత్రించిన కథ చివరాఖరు ప్రశ్న. అన్వీక్షణ కథ ఆంగ్ల కథా రచయిత ఎండీ వెయిర్ రాసిన ది ఎగ్ స్ఫూర్తితో రాసిన కథ అని స్పష్టంగానే తెలుస్తోంది.( మూల కథను అనిల్.ఎస్.రాయల్ బ్రహ్మాండం పేరుతో సారంగలోనే అనువదించారు.) ఐనా తొలి కథలోనే రచయిత్రి చూపిన పరిణతి,  చేసిన ప్రయోగం అభినందించేలా చేస్తుంది.

ఇక ప్రాంతీయ అస్తిత్వ వాద కథలు ఒక్కటి కూడా లేకపోవడం లోతుగా తరచి చూడాల్సిన అంశం. ఇతర ప్రాంతాల సంగతి ఎలావున్నా….తెలుగు సాహిత్యంలో  ప్రత్యేక గుర్తింపు కోరుకుంటున్న…తెలంగాణ ప్రాంతీయ ఇతివృత్తంతో ఒక్క కథ కూడా లేకపోవడం గమనార్హం.  అల్లం వంశీ (రెండు పట్టాలు...) కథ,  స్కైబాబా-అన్ మోల్ రిష్తే...కథ కనిపించినా అవీ కూడా పూర్తిస్థాయి ప్రాంతీయ కథలుగా చెప్పుకోలేం. తెలంగాణ జీవితాల్ని కానీ, సమస్యలను కానీ పట్టించిన కథలు కానీ లేకపోవడం… ఈ ప్రాంత రచయితల్లో నెలకొన్న ఒక స్తబ్ధతను (ఆన్ లైన్ పత్రికలకు సంబంధించినంత వరకైనా) తెలియజేస్తుంది.  అసలు కథలు రావడం లేదా..వచ్చినా వెలుగులోకి రావడం లేదా…? అని తరచి చూసుకుని ఆ దిశగా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిన బాధ్యత ఆ ప్రాంత సాహితీకారులపై వుందన్నది స్పష్టం.

స్థూలంగా చూస్తే రాసిన కథలు బాగానే వున్నా రాయాల్సిన కథలు ఇంకా చాలా  వున్నాయనిపిస్తుంది.  సమాజంలో అనునిత్యం చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనించకుండానో, నిర్లక్ష్యం చేస్తూనో, లేదా ఉద్దేశ్యపూర్వకంగా విస్మరిస్తూనే రావడం కొంత మింగుడు పడని అంశం. ప్రపంచంలోని ఏ భాషా సాహిత్యం లేదా సాహిత్య ప్రక్రియలో అయినా ఆయా కాలాల్లో వచ్చిన సాహిత్యం ద్వారా ఆనాటి ప్రజల జీవితాల్ని, జీవన విధానాల్ని, సమాజాన్ని అంచనా వేయడానికి ప్రయత్నించడం సహజం. ఆ రకంగా సాహిత్యం సమకాలీన జీవితాల్ని ఎంతో కొంత తప్పక ప్రతిబింబించాలి.
గత ఏడాది సారంగలో వచ్చిన కథలు సామాజిక కోణంలోంచి చూసినపుడు కొంత నిరాశ కలిగిస్తాయి.  ఇతివృత్తాల ఎంపికలో, కథలను నడిపించిన తీరులో, ముగింపులో ఇలా అడుగడుగునా ఒక కొత్త ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నవారు….సమకాలీన సామాజిక అంశాలను  ఇతివృత్తాలుగా స్వీకరించేందుకు  వెనుకంజవేయడం బాధాకరం.
రచయిత ఏ కథ రాయాలనేది అతని స్వేచ్ఛ. అందులో సందేహం లేదు.  ఆ విషయం పట్ల ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ సామూహికంగా చూసినపుడు ఆ (రచయితలు, సృజనకారుల ) సమాజం మొత్తం దూరంగా ఉండడం వెనక కోణాల్ని, కారణాల్ని మాత్రం తప్పక చర్చించాల్సి ఉంటుంది.  సమాజాన్ని విస్మరించి వచ్చే సాహిత్యం…పెయిన్
కిల్లర్ లాగా తక్షణ సంతృప్తినివ్వవచ్చునేమో కానీ ….దీర్ఘకాలంలో నష్టాన్ని చేస్తుంది. తాత్కాలిక ఆనందాన్నిచ్చే సాహిత్యం….దాని అసలు ప్రయోజనాన్ని, సమాజపు అవసరాల్ని తీర్చలేదు. మొత్తంగా ఇటు వెలుగు, అటు చీకటి అన్నట్లుగా….సారంగ కథలన్నింటిని సింహావలోకనం చేసుకుంటే ఒకింత ఆశ, మరింత నిరాశ కలుగుతుంది. సీనియర్ల స్తబ్ధతను చీల్చుకుంటూ…ఎప్పటికప్పుడు కొత్త కలాలు వెలుగుచూడడం ఆశాభావాన్ని కలిగిస్తుండగా, ఆ రచనల్లో సామాజిక జీవితాన్ని ప్రతిబింబించకపోవడం కొంత అసంతృప్తిని కలిగిస్తుంది.

సాహిత్యం సమకాలీన జీవితంతో ఎంతోకొంత ప్రభావితం కావాలి. అలాగే తానూ సమాజాన్ని ప్రభావితం చేయాలి.

మొదటి వ్యాసంలో చెప్పినట్లు ….చాలా మంది  కాలమే  మనలో మార్పు తీసుకొస్తోందని… భావిస్తుంటాం. వాస్తవానికి మార్పును… కాలం తీసుకురాదు, మనమే మారుతుంటాం. ఈ మార్పు కొత్త సంవత్సరం కథల్లోనైనా కనిపిస్తుందని ఆశిద్దాం.

***

వెలివాడ అనబడు ఒక అనాధ కూడలి

 

 

-అబుల్ కలాం ఆజాద్

తెలుగుసేత: నిశీధి

~

azad

 

 

 

 

 

 

ఎండమావులై

కురుస్తున్న వెన్నల తీరాన

దుఃఖిస్తున్న మృత్యువు

 

విరిగిన రెక్కల తివాచీల్లో

ఎముకలు పిండిన దుర్గంధం

 

నిశీధి నిశబ్ధం నిండుతున్న

రక్తమోడే పక్షుల సమరాగం

 

వెచ్చని శవాల నడుమ

మొరుగుతున్న కుక్కల ఆకలి

 

ఆకాశపు నక్షత్రాలని ఉరేస్తున్నట్లు

వేలాడుతున్న తాళ్లై

తెగ తెగనరకబడిన బొటనవ్రేళ్ళు

 

చీకటి గుహల నిద్రలేని  రాత్రులలోకి

ఉమ్మేయబడ్డ మురికి గొట్టాలై  మృతదేహాలు

 

వధించబడ్డ  గాయాలేవో

కవుల ఏకాంతమై ప్రతిధ్వనిస్తూ

ఖాళీ కాగితాలని సమాధి చేస్తూ

కోరుకున్న వాక్యాల గొంతుకలని

ఎవరది తెగనరికింది

 

రైల్వే ట్రాకుల నిండా

శిరచ్చేదన తలల పూలమాలలు

ప్రేమికులంతా ఎదురుచూస్తున్న

రైలు మరో జీవితకాలపు ఆలస్యం

 

కాలం స్తంబించిన లోకంలో

బక్కచిక్కిన నోట్బుక్కోకటి

సాయం కోసం చేతులూపుతూ

లేత నీలపు  తీర సమీపంలో

తన చావుకి వదిలేయబడ్డ నత్తలా

 

ఆడ చేతుల్లో చినిగి

లేఖలయ్యే పేజిలేవో

నదుల్లో మునిగిపోతూ

చెట్ల అంచుల్లో ఊగుతూ

నిప్పుగుండాల్లోకి దూకుతూ

 

కుగ్రామాల మెడ చుట్టూ

సొంతదారులేవరు లేని

శరీరాలు కుళ్ళిన కంచెలు ఏర్పాటు చేస్తూ

 

మూసిన తలుపులు  నిండిన

వేట  మాంసపు  గురుతులు

 

ప్రతి రాత్రి ప్రకాశించే చంద్రుడు

భయంతో కళ్ళు మూసుకొనే లోపు

ఒక చోట సమూహమవుతున్న విరిగిన దీపాలు

 

మూయబడని కిటికీల్లోంచి

ట్యూబ్లైట్లు లేని రాత్రుళ్ళలోకి జారిపోతూ

లేత వర్షాలకే కరిగిపోయే అక్షరాలతో

సురక్షిత భూభాగాల్లో

సుదూర ప్రేమికుల ఉత్తరాలు

 

పూర్వీకుల ఆత్మలు వెంటాడే ఈ ఇంట్లో

మా సిగ్గంచుల్లో నిలబడ్డ ఈ  వీదుల్లో

జీవితాలని అనాధలని చేసే ఈ పట్టణాల్లో

 

 

ఒకరికొకరు

గుసగుసల కవితలు వినిపించుకుంటున్న

కన్నీళ్ళు ,ఆలస్యానికి కరిగిపోయిన కలలు

దహించబడ్డ శిశుగుట్టల పైకుప్పలుగా పడి కనబడుతూ

 

వెలివాడ అనబడు ఒక అనాధ కూడలి

                                             *

రోహిత్ కోసం …

 

కొన్ని మరణాలే చరిత్ర సృస్తిస్తాయి , మరు తరానికి దిశానిర్దేశం చేస్తూ ఐకాన్లుగా చరిత్రపుటల్లో శాశ్వతం అవుతాయి . రోహిత్ మరణం కొండంత దుఃఖం, బండబారిన వ్యవస్థ మీద ఒక వంటరితనపు నెత్తుటి మరక . ఈ దుఃఖాన్ని తెలుగు సాహిత్యంలో నిలబెట్టి వ్యవస్థని ఎదురు తీయాల్సిన సమయం ఇది నక్షత్రాలని పుస్తకాల్లో బంధించలేం కాని రోహిత్ కో చిన్న ట్రిబ్యూట్ గా ఒక పోయెట్రీ అంతాలజీ తేవాలన్న చిరు కోరిక.

ఒక బిడ్డ మరణం ఇంకో నలుగురు బిడ్డలకి వెలుగవ్వాలన్న వెర్రితనం పాతిక ముప్పై కవితలు ఒకటి రెండు ఆర్టికల్స్ తో ఒక చిన్న పుస్తకంగా వేద్దామన్న ఆలోచన ఇంగ్లీష్ లో ఇప్పటికి ఇలాంటి ఒకే సబ్జెక్ట్ మీద అందరు రాసి ఒక పుస్తకంగా తేవడం ఉంది తెలుగులో నాకు తెలిసి తక్కువ లేదా అసలు లేదు . ఎవరి పుస్తకాలు వాళ్ళు లేదా ఒకరి కవిత్వమే ఒక పుస్తకంగా రావడం లాంటి ప్రక్రియలనుండి కొంత మార్పు రావాల్సిన సమయం ఇది .కవుల కంటే కవిత్వం గొప్పది అన్న నిజాన్ని గుర్తిస్తూ ఇష్యూ బేస్డ్ పోయెట్రీ ముందుకు తేవడం ఇక్కడ ప్రధాన అంశం . ఇందులో భాగం అవ్వాలన్న మనసున్న కవులకి రచయితలకి ఇది ఒక ఆహ్వానం మీ కవిత్వం మీ వాక్యం , ఈ బలవంతపు హత్యలపై మీ అభిప్రాయం ఆలోచన ఆర్దత ఏదయినా సరే పంపొచ్చు వీలునన్ని ప్రచురిద్దాం.

మనిషి కి మనిషి సాయం తప్ప ఇందులో కండిషన్స్ ఏమి లేవు ఒక వేళ మీరు ఆల్రెడీ రాసేసి ఫెస్బుక్లో కాని ఇంకో సోషల్ మీడియాలో కాని వేసి ఉంటే కూడా పంపొచ్చు ( ఎందుకంటే ఎమోషన్ మళ్ళీ మళ్ళీ అంతే స్ట్రాంగ్ గా వెలిబుచ్చడం సాధ్యం కాదన్న విషయం నాకు తెలుసు ) పోతే మీ కవిత , వాక్యం ప్రింట్ చేయోచ్చనే నో అబ్జెక్షన్ కవరింగ్ లెటర్ లేదా నాలుగు వాక్యాలు రాసి పంపండి కవితతో పాటు . మీ పేరు లేదా మీరే కలం పేరు తో రాయదలుచుకున్నారు క్లియర్ గా తెలపండి . మీ ఫోటో మీ కాంటాక్ట్ నంబర్ అడ్రెస్ లాంటివి ఇవ్వాలి అనుకుంటే ఇవ్వొచ్చు ఇందులో కూడా ఏమి కండిషన్స్ లేవు ఇస్తే నష్టం లేదు, లేదా ఈ పబ్లిసిటీ అదీ అక్కర్లేదు అనుకున్నవాళ్ళతో కూడా సమస్య లేదు జస్ట్ మీ పేరు తో వేసేస్తాం .

వీలున్నంత త్వరలో పంపితే మంచితే ఒక వారం లేదా పక్షం రోజుల్లో ఫైనలైజ్ చేద్దాం అన్న ఒక ఆలోచన మీ రచనలు పంపాల్సిన ఆఖరు తేది :05/02/16 మెయిల్ ఐడి : nisheedhii@gmail.com

తక్కువ సమయంలో అంతాలజీ బయటికి రావాలన్న ఉద్దేశ్యం, రచనల్లో మార్పులు చేర్పులు చివరి కూర్పులు , ప్రూఫ్ రీడింగ్ అన్ని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని పంపితే బెటర్ .

-బ్రెయిన్ డెడ్ 

గమనమే గమ్యం- 32

 

olga title

రామకృష్ణయ్య వచ్చాడు .

‘‘మనం ఈ రాత్రికే గాంధీజీ హత్యను ఖండిస్తూ సభ జరపాలి’’

‘‘ఈ రాత్రికా?’’

‘‘ఔను. కార్యకర్తలు  చాలామంది ఊళ్ళోనే ఉన్నారు. ఆరెస్సెస్‌ రాజకీయాలను ఎండగట్టాలి. కాస్త పొద్దుబోయిన తర్వాతే  పెడదాం. ఇవాళ ఎవరికీ తిండ సహించదు. నిద్ర రాదు’’

‘‘గుర్తుందా నీకు ఉప్పు సత్యాగ్రహానికి  ముందు గాంధీ మద్రాసు వచ్చారు . ఎట్లా పని చేశాం ఆ సభ కోసం. గాంధీ మనల్ని చూడాలని, నవ్వాలని  ఒక మాట మాట్లాడాలని తపించాను నేను. ఉప్పు సత్యాగ్రహం  గుర్తుందా ` అదంత కాదు. గాంధీ 1920లో కోర్టులో చెప్పిన మాటలు ` గుర్తున్నాయా నీకు. నువ్వింకా చిన్నవాడివి అప్పుడు. నాకు పదిహేనేళ్ళు. చదువు మానేసి సహాయనిరాకరణంలోకి వెళ్ళిపోదామని అంత సిద్ధమయ్యా. గాంధీ మాటలు  నిరంతరం నా  దేహంలో ప్రతిధ్వనిస్తుండేవి. గొప్ప ఆవేశంతో ఊగిపోయేదాన్ని –  చదువు, ఇల్లు , తల్లిదండ్రులు  అన్నీ ఒదిలి గాంధీ దగ్గరకు వెళ్ళిపోదామనుకున్నాను . కానీ వెళ్ళలేకపొయ్యా. వెళ్ళలేకపొయ్యా’’.

శారద దు:ఖాన్ని తగ్గించటం రామక్రుష్ణయ్య, మూర్తీ ఇద్దరి వల్లా కాలేదు.

‘‘శారదా – ఆనాడు వెళ్ళలేదు గనుకనే నువ్విప్పుడు కమ్యూనిస్టువైనావు. కమ్యూనిస్టు కావటం కంటే గొప్ప సంగతేమీ లేదు’’. రామక్రుష్ణయ్య మందలించాడు కాస్త తీవ్రంగానే.

‘‘నువ్వు మహిళా సంఘ సభ్యులకు కబురు పంపు. రాత్రి తొమ్మిది గంటలకు మీటింగు – ఆరెస్సెస్‌ హత్యా రాజకీయాన్ని ఉతికి ఆరెయ్యాలి’’ శారద శక్తిని కూడగట్టుకుని లేచింది.

సుబ్బమ్మ శోకాన్ని ఎవరూ ఆపలేకపోయారు. ఒక్క ఇల్లేమిటి, ఊరేమిటి, దేశం దేశమంత ఏడుస్తోంది.

volgaతొమ్మిదిన్నరకంత మీటింగు మొదలైంది. నాయకులంతా మాట్లాడారు. ఆరెస్సెస్‌ వాళ్ళను కడిగి వదిలారు. మీటింగు పూర్తవుతుందనంగా వార్త వచ్చింది. ఆరెస్సెస్‌ వాళ్ళు గాంధీ మరణాన్ని ఒక విజయంగా భావించి ప్రదర్శన చేస్తున్నారని  . ప్రజలకు, గాంధీని జాతిపితగా భావించే ప్రజలకు, దేశ స్వాతంత్రప్రదాత అని నమ్మిన ప్రజలకు,  ఆయన చెప్పిన మాట కోసం, ఆయన చూపిన బాటలో నడవటం కోసం ఆస్తులను, ఆప్తులను, ప్రాణాలను లెక్కచెయ్యక స్వాతంత్రాగ్నిలో దూకిన ప్రజలకు ఈ ఆరెస్సెస్‌ ప్రదర్శన సహించరానిదయింది. గాంధీ మరణంతో శోక సంద్రాలైన వారి మనసులో కోపకెరటాలు లేచాయి. ప్రదర్శన మీద రాళ్ళు రువ్వారు . పోలీసులు  వచ్చి కొందరిని అరెస్టు చేశారు. ఆరెస్సెస్‌ చేస్తున్న ఈ హీనమైన పనికి సహజంగానే కమ్యూనిస్టు యువకులకు కోపం వచ్చింది. తమ మీటింగుకు వచ్చిన వారిని కొట్టబోయారు. నాయకులు  ఒచ్చి ఆపారు. అంత కాస్త గందరగోళమైంది. ప్రతివాళ్ళూ ఉద్రిక్తంగానే ఉన్నారు. ఆ గలాభాలోకి పోలీసులు  ఎప్పుడొచ్చారో గమనించేలోగా పోలీసులు  లాఠీతో కమ్యూనిస్టులపై పడ్డారు. ఆరెస్సెస్‌ కార్యకర్తలు  పదిమందీ ఎటు పోయారో తెలియదు. కమ్యూనిస్టులను కొట్టటం, అరెస్టు చేయటం మొదలెట్టారు. గాంధీ హత్యను ఖండించేవారిని అరెస్టు చేసి, గాంధీని చంపిన వారిని సమర్థించిన వారిని రక్షించే పనికి వచ్చాము  అన్నట్లుంది పరిస్థితి. అప్పటికే ప్రకాశం ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ ఒకటుంది కమ్యూనిస్టు అరెస్టుకి. ముఖ్యమైన నాయకులు  అక్కడ నుంచి పరిగెత్తారు. మొగల్రాజపురం గుండా పారిపోయి రహస్య స్థావరంకు చేరుకున్నారు. మరునాడు  ‘ప్రజాశక్తి’ లో ఆరెస్సెస్‌ వారిపట్ల చూసీచూడనట్లు మెతకగా ప్రవర్తిస్తున్న పోలీసులను విమర్శిస్తూ వార్తలు, వ్యాసాలూ వచ్చాయి . చేయవలసిన పని చేయకుండా పోలీసులు  పత్రికమీద దాడ చేశారు. పత్రికలో పనిచేసే  కొందరిని అరెస్టు చేశారు.

ఫిబ్రవరిలో కలకత్తా  కమ్యూనిస్టు మహాసభలు  జరగబోతున్నాయి. ఫిబ్రవరిలోనే ఆంధ్రలో ఈ నిర్భంధం. శారదాంబ, మూర్తి కలకత్తా  మహాసభకు వెళ్ళటానికి సన్నద్ధమవుతున్నారు. అనేకమంది నాయకులు  రహస్య జీవితంలోకి వెళ్ళటంతో బహిరంగంగా పని చేసే వారి లో  ముఖ్యమైన వాళ్ళు మహాసభలో పాల్గొని తమ అభిప్రాయాలు  చెప్పవలసిన అవసరం ఉంది. తెలంగాణా పోరాటం ముమ్మరంగా జరుగుతోంది. ఆ పోరాటం గురించి మాట్లాడి  ఆ పోరాటం  దిశా నిర్దేశం చెయ్యాలి.

మహాసభలో జరిగిన చర్చతో పార్టీలో ఉన్న రెండు భిన్న ధోరణులను ముఖ్యనాయకుందరూ చర్చించక తప్పని పరిస్థితి.

శారదాంబ తను పాల్గొన్న సమావేశంలో ఆంధ్ర ప్రాంత పరిస్థితిని స్పష్టంగా వివరించింది. 1939 నుండి  గడచిన పదేళ్ళలో ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు గ్రామీణ ప్రాంత ప్రజలలోకి చొచ్చుకుపోయారు. యుద్ధంలో బ్రిటన్‌కి మద్దతిచ్చిన ప్రజలు  అర్థం చేసుకున్నారు. సోవియట్‌ సాహిత్యాన్ని న్ని, సోవియట్‌ విప్లవ క్రమాన్నీ కమ్యూనిస్టు పార్టీ ప్రజలకు సన్నిహితంగా తీసికెళ్ళింది. రైతు యువకులు  పెద్ద సంఖ్యలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలై అంకితభావంతో పనిచేస్తున్నారు. . మహిళా సంఘం, యువజన సంఘం, విద్యార్థి సంఘం, ట్రేడ్‌ యూనియన్లూ అన్నీ చాపకింద నీరులా కమ్యూనిస్టు పార్టీని ప్రజలకు దగ్గరగా తీసుకెళ్తున్నాయి. దీనిని స్థిరపరుచుకుని దీర్ఘకాలం  ప్రజల  పక్షాన, ప్రజలకు మేలు  చేసే చట్టాల  కోసం, పరిపాలన పద్ధతుల  కోసం పార్టీ ప్రయత్నించాలి. కాంగ్రెస్‌ పార్టీ కమ్యూనిస్టులకు ప్రజలలో దొరుకుతున్న ఆదరణను చూసి భరించలేకపోతున్నది. బ్రిటీష్‌ వారి నిర్బంధాన్ని మించిన హింసాకాండ జరపటానికి దాయి వెతుకుతోంది. జమీందార్ల పక్షం నిలబడుతోంది. ఈ పరిస్థితులలో మన వ్యూహాలలో కొత్తదనం ఉండాలి. ప్రజలు  మరింతగా మనతో రావాలి . నిర్బంధాన్ని ఎదిరించటానికి మొరటు పద్ధతులు  కాకుండా సృజనాత్మక  పద్ధతులేమిటని ఆలోచించాలి. లేకపోతే కార్యకర్తలను కోల్పోతాం. కార్యకర్తలు  అలాంటి ఇలాంటి వారు కాదు. సాహసం, త్యాగం , అంకితభావం ఉన్నవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళను నిలబెట్టుకోగలిగితే రెండు మూడేళ్ళలో కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రలో అతి బలమైన శక్తిగా మారుతుంది. ఆ వైపుగా పార్టీ తీర్మానాలు , కార్యక్రమాలు

ఉండాలి అని వాదించింది. కానీ రణదివే వర్గం అధిక సంఖ్యలో ఉన్నారు. ఆయననే ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. . పొలిట్‌బ్యూరోలో స్త్రీల ను ఈసారి కూడా తీసుకోలేదు. ఈసారి ఆ విషయాన్ని చర్చకు చేపట్టాలనుకున్న శారదాంబ అది ముఖ్య విషయమని మర్చిపోయేలా చేశాయి పరిస్థితులు . మహాసభ తీర్మానాల్లో  ఒక తీర్మానం గా  ‘‘నెహ్రూ ప్రభుత్వాన్ని  సాయుధ పోరాటం ద్వారా  కూలదోయాలి’’ అనేది ప్రవేశపెట్టారు. నెగ్గించుకున్నారు. శారదాంబకది మింగుడు పడలేదు. అది అసాధ్యం, ఆచరణీయం కాదు అని ఆమె మనసు ఘోషిస్తున్నా  పార్టీ క్రమశిక్షణకు కట్టుబడ తీర్మానాన్ని  ఆమోదించి వచ్చారు  శారద, మూర్తి.

శారద, మూర్తి, రామస్వామి వంటి కొందరికి ఈ మొత్తం పరిణామాల  మీద ఆందోళనగా ఉంది. ఎక్కడో ఏదో లోపం జరుగుతోంది. కాంగ్రెస్‌ ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు ప్రాబ్యల్యం  తగ్గించాలని విచక్షణా రహితంగా ప్రవర్తిస్తోంది. ఆ విచక్షణ లేనితనంతో అంతే మూర్ఖంగా తలపడుతున్నామా? వేరే దారిలో మరింతగా ప్రజల్లోకి చొచ్చుకుపోవాల్సిన సమయంలో కార్యకర్తల  ప్రాణాలను పణంగా పెడితే భయభ్రాంతులైన ప్రజలను సమీకరించేవారెవరు?

శారద మనసు విరుచుకుపడుతోమ్ది . రామక్రుష్ణయ్య దొరకటం అసంభవంగా ఉంది. శారద ఇల్లు ఆసుపత్రి పోలీసు పహారాలో ఉన్నట్లున్నాయి . ఎవరో తెలియని వ్యక్తులు  అపుడపుడూ తెచ్చే ఉత్తరాలు  తప్ప తన ఆలోచనలను పంచుకునే దారి లేదు.

ఒకరోజు ప్రసవానికని వచ్చిన స్త్రీని పరిక్ష  చేస్తుంటే ఆమె పొట్ట దగ్గర కట్టుకు వచ్చిన డాక్యుమెంట్లు కనిపించాయి. నర్సుని కూడా రానివ్వకుండా గబగబా ఆ డాక్యుమెంట్లను దాచేసి ఇంత దూది గాజు గుడ్డతో మళ్ళీ పెద్ద పొట్ట తయారుచేసి పంపింది.

olga titleప్రాణాలకు తెగించి చేస్తున్నారు స్త్రీ పురుషులు  ఈ పనిని. వారి ప్రాణాలను రక్షించాల్సిన పని ముఖ్యమైనది కాదా?

ఆ డాక్యుమెంట్లనీ మూర్తీ, శారదా కలిసి రెండు రోజు చదివారు. డాంగే మితవాది – అంటే తెలంగాణా పోరాట విరమణ చేయమంటున్నాడు. రణదివే తెలంగాణా పోరాటం కొనసాగించాల్సిందేనంటున్నాడు.

నిజాం పాలన అంతమయ్యాక సాయుధ పోరాటం అవసరం లేదని తెంగాణా నాయకుడైన రావి నారాయణ రెడ్డి  అంటున్నాడు. అనటమే కాదు. తెలంగాణా వదిలి ఆయన బొంబాయి వెళ్ళిపోయాడు.

పోరాటం విరమించాలా ఒద్దా అనే విషయమై పైస్థాయి నాయకులందరిలో విబేధాలున్నాయని ఆ డాక్యుమెంట్లు స్పష్టం చేశాయి. శారదకు ఆ విషయాలు  తెలియనివి కావు గానీ ఇప్పుడు డాక్యుమెంట్ల వల్ల  స్పష్టంగా ఎవరి వైఖరి ఏమిటనేది సాక్ష్యాధారాల తో తెలిసినట్లయింది.

గ్రామాల  పరిస్థితి దారుణంగా ఉంది. మలబారు పోలీసులు  భయంకరంగా హింసాకాండ కొనసాగిస్తున్నారు. ఎమర్రు కాటూరులో ప్రజలను దిగంబరం చేసి గాంధీ విగ్రహం చుట్టూ నిలబెట్టటం గురించిన వార్తతో ప్రజలందరిలో కాంగ్రెస్‌ అంటే కోపం అసహ్యం కలిగాయి. ఇళ్ళు తగలబెట్టటం, అనుమానించిన వారిని కాల్చిచంపటం పళనియిప్పన్‌ పేరంటేనే కొందరిలో భయం మరికొందరిలో అసహ్యం. ఒక్క మహిళా సంఘాన్ని తప్ప కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన ప్రజాసంఘాలను, ట్రేడ్‌ యూనియన్లను నిషెధించారు.

శారద మనసు ఆగ్రహంతో రగులుతోంది. ఈ హింసాకాండను ఎదుర్కోవటానికి కొత్త పోరాట వ్యూహాలు  రచించాలని, ప్రజలలో ఉన్న సానుభూతికి ఒక రూపం ఇచ్చి వారి ఆగ్రహంతోనే ఈ బీభత్సానికి  తెరదించాలనీ ఆమె అనుకుంది. మూర్తి కూడా శారద ఆలోచనను బలపరిచాడు. రామస్వామి మరికొందరు శారద ఆలోచను సరైనవన్నారు.

ఇంతలో పార్టీని నుంచి ఆదేశం వచ్చింది ‘‘కంటికి కన్ను – పంటికి పన్ను’’ అనేదే మన మార్గమని – ఇది శారదకసలు మింగుడు పడలేదు. ఈ సమయంలో ఆదేశంతో కార్యకర్తలు ప్రాణాలు  పోగొట్టుకుంటారనే ఆందోళనతో కుంగిపోయింది. దీనిని ఆపేదెలా? తానేమైనా చేయగలదా అనే ఆలోచనతో రగిలిపోయింది.

చివరకు మద్రాసు వెళ్ళాలని నిర్ణయించుకుంది. దుర్గాబాయి తో  మాట్లాడి  నెహ్రూతో ఇంటర్వ్యూ అడిగి చూడానుకుంది. ప్రకాశం గారితో మాట్లాడి ప్రయోజనం లేదు. ఆయన తను చెప్పినదానికి అంగీకరించి, మర్నాడు  ఇంకెవరో తనకు వ్యతిరేకంగా చెబితే మనసు మార్చుకుంటాడు. ఎంత స్థిరమో, అంత అస్థిరం, ఎంత బలమో అంత బలహీనత – ఆయన మనసులో గట్టిగా ఏదైన అనుకుంటే మార్చటం ఎవరితరం కాదు. వీరేశలింగం తాతయ్యకు వ్యతిరేకంగా వాదించి ఆయనను ఓడించటం సరికాదని ఆయన అంతరాత్మకు తెలియదూ? తెలిసిన ఒట్టి తర్కానికి, , తన సామర్ధ్యాన్ని  నిరూపించుకోటానికీ ఆ పని చేశాడు. నాన్నకు, హరి బాబాయికి ఎంతో కోపం వచ్చింది. ప్రకాశం గారు నవ్వేసి మరి నేను ప్లీడర్ని – నా వాదన పటిమ నిరూపించుకోవద్దా అన్నారు. హరిబాబాయి చెప్పేవాడు ` కాంగ్రెస్‌ సభలో ఒకసారి బ్రాహ్మణులకు వేరుగా భోజనాలు  ఏర్పాట్లు  చేయించాడనీ, హరి బాబాయి మరికొందరూ వెళ్ళి అడిగితే ‘‘అది తప్పంటావా  ? సరే తీసేద్దాం’’ అని అదో ప్రిన్సిపల్‌కి సంబంధించిన విషయం కాకుండా ఏర్పాట్లకు  సంబంధించిన విషయమన్నట్లు మాట్లాడారట. అందువల్ల  ప్రకాశం గారితో మాట్లాడటం వృధా. దుర్గ అర్థం చేసుకోగలదు. అర్థం చేసుకోక పోయిన ఒక్కసారి నెహ్రూ గారితో ఇంటర్వ్యూ ఇప్పించగలిగితే చాలు . సరోజినీదేవి ఆరోగ్యం బాగోలేదు. లేకుంటే హరీన్‌ తో వెళ్ళి ఆమె ద్వారా  నెహ్రూని కలిసినా  బాగుంటుంది. ఇంత ఆలోచించి మద్రాసు ప్రయాణం పెట్టుకుంది.

*

 

 

***

 

ట్రాయ్ నగలతో సోఫియాకు అలంకారం

 

స్లీమన్ కథ-22

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

పనివాళ్లు అందరూ వెళ్ళిపోయారు. సోఫియా తిరిగివచ్చింది. స్లీమన్ ఒక జేబుకత్తితో నిక్షేపాలను తవ్వి తీయడం  ప్రారంభించాడు. మట్టి, రాతిముక్కలు, పెద్ద పెద్ద రాళ్ళతో నిండిన రక్షణకుడ్యం కుప్పకూలేలా ఉంది. కానీ కళ్ళముందు కనిపిస్తున్న ఓ పెద్ద ఖజానా  అతని భయాలన్నింటినీ హరించేసింది. మళ్ళీ సోఫియావైపు తిరిగి, “త్వరగా వెళ్ళు, నీ పెద్ద శాలువ తీసుకురా” అన్నాడు.

మరోసారి సోఫియా చెక్క నిచ్చెన మీంచి పైకి ఎక్కి, ఇంటికి వెళ్లింది. భారీగా కుట్టుపని చేసిన ఓ పెద్ద ఎరుపురంగు శాలువతో తిరిగివచ్చింది. సాధారణంగా శ్రాద్ధదినాలలో గ్రీకు మహిళలు అలాంటి శాలువలు కప్పుకుంటారు. తవ్వి తీసిన నిక్షేపాలను ఆ శాలువలో మూటగట్టి ఇద్దరూ ఇంటికి మోసుకెళ్లారు.

తలుపు గడియ పెట్టేసి ఓ చెక్క టేబులు మీద ఆ నిక్షేపాలను పరిచారు. చిన్నచిన్న వస్తువులను పెద్దవాటిలో సర్దేశారు. పురావస్తుప్రదర్శనశాలల్లో అద్దాలలోంచి కనిపించే ఇలాంటి నగా నట్రా లేత పసుపురంగులో ఉండి, తాజాగా మెరిసిపోతున్నట్టు ఉంటాయి. ఒక విచిత్రమైన నిర్జీవత వాటిలో ఉంటుంది. కానీ భూమిలోంచి తవ్వి తీసినప్పుడు అవి అద్భుతమైన ఎరుపురంగుతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ నిక్షేపాలలో ఒక రాగి డాలు, ఒక రాగి కళాయి, ఒక వెండి తొడుగు, ఒక రాగి తొడుగు, ఒక బంగారు సీసా, రెండు బంగారు కప్పులు, వెండి బంగారు మిశ్రమంతో చేసిన ఒక చిన్న నగల పాత్ర ఉన్నాయి. ఇంకా, ఒక వెండి కొమ్ము జారీ, మూడు పెద్ద వెండి కలశాలు, రెండువైపులా పదునున్న ఏడు రాగి బాకులు, ఆరు వెండి కత్తులు, పదమూడు రాగి బల్లెపు పిడులు ఉన్నాయి. ఒక పెద్ద వెండి కలశం అడుగున రెండు బంగారు శిరోభూషణాలు, నాలుగు బంగారు జూకాలలాంటివి, 56 బంగారు చెవిపోగులు, 8,750 బంగారు ఉంగరాలు, బొత్తాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం అతి చిన్నవి.

అన్నింటిలోనూ శిరోభూషణాలు ఎక్కువ ఆశ్చర్యం గొలిపాయి. వాటిలో ఒకదానికి తొంభై గొలుసులున్నాయి. వాటిపై ఆకులు, పువ్వుల చెక్కుడులు ఉన్నాయి. రెండువైపులా సన్నని బంగారు దారాలలాంటివి వేలాడుతున్నాయి. పర్షియన్, రోమన్ శిరోభూషణాలు కేవలం తలకు చుట్టుకునే పట్టీలలా మాత్రమే ఉంటాయి. వాటికి భిన్నంగా ట్రోజన్ శిరోభూషణాలు అసంఖ్యాకమైన బంగారు వలయాకార నిర్మాణాలతో నుదుటి మొత్తాన్ని కప్పేలా ఉంటాయి. అలాంటివి ఇంతకు ముందు కానీ, ఆ తర్వాత కానీ మరెక్కడా కనిపించలేదు.

Priam-treasure

స్లీమన్ సంభ్రమం పట్టలేకపోతున్నాడు. కంపిస్తున్న చేతుల్లోకి ఆ శిరోభూషణాలను తీసుకుని వెలుతురులోకి వెళ్ళి పరీక్షగా చూశాడు.  ఆ తర్వాత వాటిని సోఫియా నుదుట అలంకరించాడు. అవి ట్రోజన్ రాణికి చెందిన శిరోభూషణాలని అతను జీవితాంతం నమ్మినట్టు కనిపిస్తుంది కానీ, నిజానికి అవి రాజు ధరించిన శిరోభూషణాలు కావడానికే అవకాశ మెక్కువ. ఆమె ఒకవిధమైన ఆటవికపు వైభవంతో వెలిగిపోయేలా మెడలో నగలు దిగేశాడు. వేళ్ళకు ఉంగరాలు తొడిగాడు. మెక్లంబర్గ్ కు చెందిన ఒక అనామక చర్చి ఉద్యోగి కొడుకు ఎట్టకేలకు రాజులు నడయాడిన చోట, ఒక మహారాణిలా మెరిసిపోయే మహిళ ముందు నిలబడి ఉన్నాడు.

తను కచ్చితంగా రాజు ప్రియామ్ కు చెందిన నిక్షేపాలను కనుగొన్నాననుకున్నాడు. ట్రాయ్ తగలబడుతున్నప్పుడు వాటిని రహస్యంగా ఒక గోడలో భద్రపరిచారనీ, చివరి క్షణాలలో హడావుడిగా వాటిని ఒక చెక్కపెట్టెలో పెట్టి ఉంటారనీ, ఆ తొందరలో తాళం చెవిని అలాగే వదిలేసి ఉంటారనీ అనుకున్నాడు. కానీ అతను తాళం చెవి అనుకున్నది నిజానికి ఒక రాగి ఉలి. ఆ నిక్షేపాలను ఒక పెట్టెలో పెట్టారనడానికి కూడా ఆధారాలు కనిపించలేదు.

వాటి తయారీ విషయానికే వస్తే, బంగారు పాత్రలపై చక్కని పనితనం కనిపిస్తోంది. అయితే, తలపాగా లాంటి కిరీటా(tiara)లు చూడగానే ఆకట్టుకునేలా ఉన్నా వాటిపై పనితనం ప్రాథమికంగా ఉంది. తీగ చుట్లతోనూ, తాపడం చేసిన బంగారు రేకులతోనూ వాటిని తయారుచేశారు. ఉంగరాల మీద ఎలాంటి చెక్కడాలూ లేవు.  ఎంతో అందంగా మలచిన ఒక బంగారు కొమ్ము పాత్రను మాత్రం పనితనంలో తలమానికమని చెప్పచ్చు. అయితే కత్తులు, బాణపు మొనలు, చిత్రమైన మృణ్మయమూర్తుల మధ్య అలాంటి పాత్ర ఎందుకుందో అర్థం కాలేదు. గోడల్లో భద్రపరచిన వాటిలో వెండి, బంగారాలే కాదు; ముతక పనితనం కనిపించే దంతపు వస్తువులు, ఒకమాదిరి మేలిరకపు రాళ్ళతో మలచిన  సుత్తి గొడ్డళ్ళు, మర్మస్థానంపై స్వస్తిక చిహ్నం కలిగిన ఒక స్త్రీ తాలూకు చిన్న సీసపు బొమ్మ ఉన్నాయి. వీటన్నిటినీ పక్క పక్కన చూసినప్పుడు, మూర్తి ఆరాధనా, ఆటవికతలతో ఉత్తమ కళాభిరుచి చెట్టపట్టాలు వేసుకుందా అనిపిస్తుంది. ఇంతకీ ఇది హోమర్ చిత్రించిన ట్రాయేనా, లేక అంతకంటే వెనకటి కాలానికి, మరింత ఆటవిక కాలానికి చెందినదా అన్న అనుమానం తలెత్తుతుంది.

స్లీమన్ మాత్రం, తను ప్రియామ్ కు చెందిన నిక్షేపాలను తవ్వితీశాననే నిర్ధారణకు వచ్చాడు.

అతను ఎంత ప్రయత్నించినా రహస్యం పూర్తిగా దాగలేదు. ట్రాయ్ అంతటా వదంతులు వ్యాపించాయి. అమీన్ ఎఫెన్డీ ఇంటికొచ్చి, తనకు తెలియకుండా ఏదో దాచారంటూ విరుచుకుపడ్డాడు. ఇల్లు సోదా చేస్తానన్నాడు. పెట్టెలు, దుస్తుల బీరువాలతో సహా అన్నీ తెరవమని సుల్తాన్ పేరు మీద ఆదేశించాడు. స్లీమన్ కూడా ఆగ్రహంతో ఊగిపోతూ అతన్ని గెంటివేశాడు. ఆరోజు రాత్రో, ఆ మరునాటి రాత్రో తింబ్రియాలోని కల్వర్ట్ ఇంటికి నిక్షేపాలను తరలించి; ఆ తర్వాత కొన్ని రోజులకు దేశం దాటించాడు.

మరికొన్ని రోజులపాటు రక్షణకుడ్యం అడుగున గాలించాడు. ఇంకేమీ దొరకలేదు. జూన్ 17న తవ్వకాలను అకస్మాత్తుగా ఆపేశాడు. పనివాళ్ళకు వేతనం చెల్లించి పంపేశాడు. ఒక్కసారిగా నిర్జనంగా మారిపోయిన ఆ దిబ్బ మీదికి ఒక పూజారి వచ్చి మతపరమైన తంతు నిర్వహించాడు. ఎక్కడబడితే అక్కడ కందకాలతో, నడవలతో పద్మవ్యూహంలా మారిన ఆ ప్రదేశం యుద్ధరంగాన్ని తలపించింది. తను ఎథెన్స్ కు వెళ్లిపోతున్నాననీ, ట్రాయ్ గడ్డ మీద మళ్ళీ అడుగుపెట్టననీ స్లీమన్ ప్రకటించి తను సేకరించిన కొన్ని వస్తువులను తీసుకుని నిశ్శబ్దంగా అక్కడినుంచి తప్పుకున్నాడు. మిగతా వస్తువులను ముందే పంపేశాడు. జూన్ 19 కల్లా ఎథెన్స్ లో ఉన్నాడు. అదే రోజున, తను వెలికితీసిన వాటి గురించి గర్వంగా చెప్పుకుంటూ వరసపెట్టి మిత్రులకు, బంధువులకు ఉత్తరాలు రాయడం ప్రారంభించాడు.

ఉత్సాహం, ఉత్తేజం అతన్ని ఊపేస్తున్నాయి. “నేటి కాలంలోనే మహత్తరమైన, యావత్ప్రపంచం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అద్భుతాన్ని” తను కనుగొన్నాడు! ఎప్పుడూ తన గురించి గొప్పలు చెప్పుకునే ఈ పెద్దమనిషి, అలా చెప్పుకోవడం సహేతుకమేనని మొదటిసారి నిరూపించుకున్నాడు. ఆశకూ, హేతుబద్ధతకూ, అన్ని రకాల ఆధారాలకూ ఎదురీది తను ట్రాయ్ ని కనుగొన్నాడు. తన చేతుల్లో మెరిసిపోతున్న స్వర్ణ శిరోభూషణాలే అందుకు సాక్ష్యం! కాదనే ధైర్యం ఎవరి కుంటుంది?!

ఇంకోవైపు నిక్షేపాలు అతనికి మోయలేని బరువూ అయ్యాయి. సోఫియా బంధువులను కూడా ఈ గూడుపుఠాణీలోకి లాగాడు. గ్రీస్ అంతటా పశువుల కొట్టాల్లోకీ, గాదెల్లోకీ, పెరళ్ళ లోకీ గడ్డి చుట్టబెట్టిన విచిత్రమైన వస్తువులు రహస్యంగా చేరుకున్నాయి. ఒక వెదురు బుట్ట ఎలూసిస్ లో ఉంటున్న ఒక బంధువు ఇంటికి చేరింది. నిక్షేపాలను తలో చోటికీ తరలించేముందు ప్రతి వస్తువు గురించిన వివరాలను, తూకంతో సహా స్లీమన్ పూస గుచ్చినట్టు రాసుకున్నాడు. వాటిపై గ్రీకు, టర్కిష్ ప్రభుత్వాల కన్ను పడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు.

తను ఎథెన్స్ లోనే ఉండిపోయాడు. సోఫియా కూతురిని తీసుకుని కొన్ని రోజులు విశ్రాంతిగా గడపడానికి ఇటలీలోని అగ్నిపర్వతద్వీపమైన ఈశ్చియాకు వెళ్లింది. కొన్ని వారాల తర్వాత ఒక నమ్మకస్తుడైన పనివాడిని పంపించి నిక్షేపాలను  ఎక్కడెక్కడ దాచాడో నోటి మాటగా ఆమెకు చెప్పించాడు.

ఇప్పుడిక మైసీనియా, ఒలింపియాలలో తవ్వకాల గురించి గట్టిగా ఆలోచించడం ప్రారంభించాడు. సొంత ఖర్చుతో తవ్వకాలు జరపడానికి అనుమతించమని ఇంతకు ముందు అడిగినప్పుడు గ్రీకు ప్రభుత్వం తిరస్కరించింది. తను కనుగొన్న నిక్షేపాలను ప్రభుత్వానికి అప్పగించే ప్రతిపాదనతో మరోసారి ప్రభుత్వాన్ని అనుమతి కోరాడు. టర్కీ ప్రభుత్వంతో ఎందుకొచ్చిన తలనొప్పి అనుకుని ఈసారి కూడా గ్రీకు ప్రభుత్వం నిరాకరించింది.

ఆగస్టులో టర్కీ ప్రభుత్వం నుంచి స్లీమన్ కు తలనొప్పి రానే వచ్చింది. అతను నిక్షేపాలను కనుగొని, వాటిని రహస్యంగా తరలించిన సంగతి ప్రాథమిక దర్యాప్తు ద్వారా ప్రభుత్వం పసిగట్టింది. Augsburger Allegemeine Zeitung ప్రచురించిన స్లీమన్ నివేదికలు కూడా దానిని ధ్రువీకరిస్తున్నట్టు గమనించింది. తవ్వకాల దగ్గర తన ప్రతినిధిగా నియమించిన అమీన్ ఎఫెన్డీ తన విధిని సక్రమంగా నిర్వర్తించలేదన్న ఆరోపణతో ప్రభుత్వం అతనిపై చర్య తీసుకోబోతున్నట్టు స్లీమన్ కు తెలిసింది. అటోమన్ సామ్రాజ్యంలో తప్పు చేసిన అధికారికి విధించే శిక్ష ఒక్కోసారి మరణశిక్ష కూడా కావచ్చు. స్లీమన్ నైతిక సందిగ్ధంలో పడ్డాడు. తను కనుగొన్న నిక్షేపాలను టర్కీ ప్రభుత్వానికి అప్పగించే ప్రశ్న ఎలాగూ లేదు. టర్కీ వెళ్ళి అమీన్ ఎఫెన్డీ తరపున జోక్యం చేసుకునే ప్రశ్న అంతకంటే లేదు. కాకపోతే, ఎఫెన్డీ పూర్తిగా నిర్దోషి అని స్పష్టం చేస్తూ, “మానవత్వమూ, పవిత్ర న్యాయమూ” పేరిట ఉత్తరం రాసే అవకాశం తనకు ఉంది. అదే చేశాడు:

అక్కడ జరుగుతున్న ప్రతి పని పైనా అతను నిఘా పెట్టడం అసాధ్యం. ప్రతిరోజూ ఏకకాలంలో అయిదు చోట్ల తవ్వకాలు జరుగుతూ వచ్చాయి. తనే అయిదు రూపాలు ధరించి అయిదు చోట్లా కాపలా కాయగల మనిషి ఇంతవరకూ పుట్టలేదు.

అమీన్ ఎఫెన్డీ ఆ దిబ్బ మీద ఇంకో పక్క ఉన్నప్పుడు నేను నిక్షేపాలను కనుగొన్నాను. పనివాళ్ళ ద్వారా ఆ సంగతి తెలిసినప్పుడు పాపం అత నెంత డీలాపడిపోయాడో; కోపంతో రగిలిపోతూ నా ఇంటికి వచ్చి పెట్టెలూ, బీరువాలూ తెరచి చూపించమని సుల్తాన్ పేరు మీద ఎలా ఆదేశించాడో మీరు చూసి ఉంటే అతని మీద జాలిపడేవారు.

నా తవ్వకాల మీద అతనిలా రెప్పవాల్చకుండా నిఘా పెట్టినవారు ఇంకెవరూ లేరు. అయితే, పురావస్తు తవ్వకాలను పర్యవేక్షించే వ్యక్తి తప్పనిసరిగా ఓ పురావస్తునిపుణుడు అయుండాలి. అమీన్ ఎఫెన్డీ తప్పల్లా పురావస్తునిపుణుడు కాకపోవడమే…

ఆపైన, తను సమర్ధించుకోలేని తప్పు చేసి కూడా టర్కీ ప్రభుత్వంతో అడ్డదిడ్డం వాదనలోకి దిగాడు. మీరు నాక్చిన ఫర్మానాను రద్దు చేశారు కనుక, నేను ఏం చేసినా అడిగే హక్కు మీకు లేదన్నాడు. మీరు నాతో రాసుకున్న ఒప్పందాన్ని ఎప్పుడైతే ఉల్లంఘించారో, అప్పుడే దానికి కట్టుబడి ఉండాల్సిన నైతికబాధ్యతనుంచి నేను బయటపడ్డా నన్నాడు. నిక్షేపాలలో కొంతైనా లాంఛనంగా కాన్ స్టాంట్ నోపిల్ లోని ఇంపీరియల్ మ్యూజియంకు పంపవలసిందిగా ప్రభుత్వం లోపాయికారీగా అడిగింది. రవ్వంత కూడా పంపేది లేదని తెగేసి చెప్పిన స్లీమన్; ట్రాయ్ లో మరో మూడు మాసాలపాటు తవ్వకాలకు అనుమతిస్తే, ఆ తవ్వకాల్లో దొరికే ప్రతి ఒక్క వస్తువునీ మ్యూజియంకు ఇస్తానని అదే ఉత్తరంలో బేరం పెట్టాడు.

ఇక్కడ గ్రీకు ప్రభుత్వం వైఖరి కూడా అతనికి చికాకు తెప్పిస్తోంది. ఇటలీ వెళ్లిపోతే ఎలా ఉంటుందన్న ఆలోచన బుర్రను తొలవడం ప్రారంభించింది. పురావస్తునిపుణుల దృష్ట్యా పాలెమో, నేపుల్స్ లు తవ్వకాలకు ఎంతో యోగ్యమైన  ప్రదేశాలు. దాంతో ఇటలీలోని మ్యూజియం అధికారులను గిల్లడం మొదలుపెట్టాడు. ఈ ప్రదేశాలలో తను స్వేచ్ఛగా తవ్వకాలు జరపడానికి అనుమతిస్తే, వాటిలో బయటపడే వస్తువులను ఉంచడానికి సొంత ఖర్చుతో మ్యూజియం నిర్మించి ఇస్తానని ఆశపెట్టాడు.

ఈలోపల అతని పేరు మారుమోగడం ప్రారంభించింది. ట్రాయ్ లో అతను కనుగొన్న విశేషాల గురించి విని బ్రిటిష్ ప్రధాని గ్లాడ్ స్టన్ ముగ్ధుడయ్యాడు. ప్రముఖ ప్రాచ్య పండితుడు మాక్స్ ముల్లర్ వాటిపై ఒక వ్యాసం రాశాడు. జర్మనీలో అతని అనుకూల, వ్యతిరేకుల శిబిరాలు అప్పటికే ఏర్పడి యుద్ధం ప్రారంభించాయి. శిశిరం నుంచి శీతాకాలం ప్రారంభంవరకూ స్లీమన్ తన ట్రోజన్ నివేదికలకు పుస్తకరూపమిస్తూ గడిపాడు. మధ్య మధ్య ఫొటోల చేర్పుతో, Troianische Altertumer  అనే పేరుతో పూర్తి చేసిన ఆ పుస్తకాన్నీ, తనే చేసిన దాని ఫ్రెంచి అనువాదాన్నీ ప్రచురణకర్తకు పంపించాడు.

పుస్తకం పూర్తయ్యాక మళ్ళీ అస్తిమతంలోకి జారిపోయాడు. గ్రీకు ప్రభుత్వం ఒలింపియాలో తవ్వకాలు జరిపే హక్కును ప్రష్యన్ ప్రభుత్వానికి ఇచ్చినట్టు తెలిసి కోపంతో కుతకుతలాడాడు. మైసీనియా వెళ్ళి ప్రాథమిక పరిశీలన జరపాలని నిర్ణయించుకున్నాడు. ట్రాయ్ తరహా విజయాలను తను మరోసారి మూటగట్టుకునే అవకాశం అక్కడ తప్ప ఇంకెక్కడా ఉండదనుకున్నాడు.

Sophia_schliemann_treasure

సోఫియాను వెంటబెట్టుకుని, ఎవరికీ చెప్పకుండా రహస్యంగా మైసీనియాకు వెళ్లిపోయాడు. అప్పటికప్పుడు పనివాళ్లను నియమించుకున్నాడు. అయిదురోజులపాటు గిరిదుర్గం దగ్గర ముప్పైకి పైగా చిన్న చిన్న కందకాలను తవ్వించాడు. పెద్ద ప్రాముఖ్యం లేని కొన్ని కుండపెంకులు మాత్రం బయటపడ్డాయి. మైసీనియాలోని కోటగోడ లోపల వీరయుగం తాలూకు సమాధులు బయటపడగలవని తాను నమ్ముతున్నట్టు Ithaka, der Peloponnes und Troja అనే తన పుస్తకంలో చాలాకాలం క్రితమే రాసుకున్నాడు. ఆ నమ్మకం మరింత బలపడడమే ఈ అయిదురోజుల్లో అతను సాధించిన ముఖ్యమైన ఫలితం. కారణం చెప్పలేకపోయినా, ట్రాయ్ లో బంగారు నిక్షేపాలు ఉంటాయని ముందే ఊహించినట్టే; మైసీనియాలోని ప్రసిద్ధ సింహద్వారం (Lion Gate) దగ్గరలో, దానికి ఒకింత దూరంలో కచ్చితంగా రెండు గోపురం ఆకారంలోని శవాగారాలు(mortuary dome chambers) ఉంటాయని అతను ఊహించాడు. సింహద్వారానికి కొంచెం అవతల తవ్వితే తయస్టీస్, అగమెమ్నన్ తదితర మైసీనియా రాజుల సమాధులు బయటపడచ్చన్నాడు. ఇప్పటికే తను ఒడీసియస్ చితాభస్మాన్ని, ప్రియామ్ ప్రాసాదాన్ని వెలికి తీసి ప్రపంచాన్ని ఆశ్చర్యచకితం చేశాడు. మైసీనియా రాజుల సమాధులను కూడా బయటపెడితే అది తనకు మరో కీర్తి కిరీటాన్ని అలంకరిస్తుందని అనుకున్నాడు.

అయితే దురదృష్టవశాత్తూ మైసీనియాలో తవ్వకాలను చేపట్టడానికి అతనికి అనుమతి లేదు. అక్కడ అతను రహస్యంగా తవ్వకాలు జరిపిస్తున్న వార్త గ్రీకు ప్రభుత్వం చెవిన పడనే పడింది. తక్షణమే వాటిని ఆపవలసిందిగా  ఆర్గోలిస్ (గ్రీస్ లోని ఒక ప్రాంతీయ పరిపాలనా విభాగం)ముఖ్యాధికారికి తంతి ఆదేశాలు పంపింది. ఆ తర్వాత, స్లీమన్ అంతవరకూ తవ్వితీసిన వాటిని జప్తు చేయవలసిందనీ, అతని పెట్టే బేడా సోదా చేయవలసిందనీ వెంట వెంటనే మరో రెండు టెలిగ్రాములు పంపింది.

ఈ పనులను నాఫ్లియోలోని పోలీస్ ఉన్నతాధికారికి అప్పగించారు. అతను స్లీమన్ ఉంటున్న ఇంటికి వెళ్ళాడు. అతనితో కలసి ప్రశాంతంగా కాఫీ సేవిస్తూ సంగతేమిటని అడిగాడు. స్లీమన్ ఓ బుట్టెడు కుండ పెంకులు చూపించాడు. పురాతన నగరాల్లో అలాంటి కుండపెంకులు ప్రతి సందులోనూ, గొందులోనూ దొరుకుతాయనీ, విలువైనవేవీ తనకు కనిపించలేదనీ, కనుక అక్కడితో దానిని వదిలేశాననీ ఆ పోలీస్ అధికారి పైవాళ్ళకు రాశాడు.

ఎథెన్స్ కు తిరిగి వచ్చిన స్లీమన్, తనపై ప్రభుత్వం కత్తులు నూరుతున్న సంగతి గమనించాడు. ట్రాయ్ లో నిక్షేపాలను కనుగొన్నప్పటినుంచీ అతను అతిపెద్ద అనుమానితుల జాబితాలో చేరిపోయాడు. పోలీస్ అధికారి, ఆర్గోలిస్ ముఖ్యాధికారి, మైసీనియా మేయర్ చేతకాని దద్దమ్మలని గ్రీకు విద్యామంత్రి తిట్టిపోశాడు. “గ్రీసుకు ఎలాంటి రక్షణా లేదనీ; ఎవడైనాసరే చట్టాలను ఇష్టానుసారం కాలరాస్తూ ఈ నేలలోకి చొరబడి ఏమైనా చేయచ్చనీ తమ చర్యల ద్వారా నిరూపించా”రని దుయ్యబట్టాడు.

  (సశేషం)

 

 

ఆమె ముందడుగు!

 

రచన: శివి సింగ్
అనువాదం: ఇంద్రప్రసాద్
 

నేను ఇవాళా , రేపూ కూడా సంతోషంగానే ఉంటాను ‘ సింక్ మీద వేళ్లతో చప్పుడు చేస్తూ నెమ్మదిగా అనుకొంది.

‘ఇదంతా యీ ప్రక్రియలో  భాగమే. నీ మనసుకెక్కేటట్లు ధైర్యం చెప్పుకోవాలి. గతాన్ని మర్చిపోతూ వర్తమానంలోకి రావడానికి వేసేచిన్న అడుగిది.’ ఎన్నిసార్లు వినలేదు? ప్రతీ అరకొర డాక్టరూ ఇదే మాట చెప్పేవారు. రంగులేని ఆస్పత్రులలో  ఎన్నిసార్లువిన్నట్లు నటించలేదు?

కాటన్ చొక్కా వేసుకొని, బాగ్ నిండా కాఫీ పొట్లాలతో కూర్చున్నావిడ ముందర ఎన్ని శనివారం మధ్యాహ్నాలు గడపలేదు? ఆవిడేమిటి అందరూ అంతే.  మానవమస్తిష్కంలో చెలరేగే శబ్దంలేని అలజడులన్నీ ఫైనలియర్ మెడిసిన్ పుస్తకాల్లో చదివేసేంఅని ఎంత ప్రదర్శన?

వాళ్లు చెప్పిందంతా నమ్మినట్లు నటించాలనీ, ఆకుపచ్చని చీటీలన్నీ ఎగిరిపోతూంటే చూడాలనీ….

 బట్టలు సవరించుకొని ముఖానికి నవ్వు పులుముకొని ఆలోచనల్నించి బయటకొచ్చి అద్దంలో చూసికొంది .  ఆద్దం తననిజాన్నెప్పుడూ బయటపెట్టదు. చుట్టూరా ఒక్కసారి దృష్టి సారించింది. లేడీస్ రూము నించి వరండా కొసదాకా నడిచింది.

‘గతం అందరికీ ఉండేదే. తలుచుకొన్నప్పుడు తెలుస్తుంది దాని అందమేమిటో. గతంలో జీవిద్దామనుకొంటున్నమా, తొంగిచూసి వస్తున్నామా అన్నదాన్నిబట్టి ఉంటుంది దాని అందం.’

1997 వేసవిలో అంతర్రాష్ట్ర పోటీల్లో మా జట్టు (ఈగిల్స్) గెలుపు అందరూ చెప్పుకున్నదే. మెచ్చుకున్నదే. ఒక చిన్న పట్టణంనించి వచ్చిన జట్టు గెలుపొందడం నిజంగా గొప్ప విశేషమే.

17 ఏళ్ల వయసులో పల్లెటూరి అమాయకత్వంతో ఎంత మెరుస్తూ ఉండేది? జుట్టు ముడి వేసుకొని సరదాగా అమ్మ చీర కట్టుకొన్న రోజు ఎంత అందంగా కనిపించేది . అందరి కాలేజి పిల్లల్లా జీను పాంటు వేసుకొని పాటలు వినే పిల్లని హుషారుగా తుళ్ళింత లాడే  చిన్న పిల్లలా అనిపించేది కాదు ఆ సౌందర్యమే వేరు.

Akkadi MeghamFeatured

ఆ వేసవి లోనే, అంత ఉల్లాసంగా ఉన్న రొజుల్లోనే జరిగింది.  ట్రాక్టర్  వెనుకభాగంలొ నిశ్చేతనంగా కాళ్లు రెండు తెరుచుకొనికనిపించింది , ఎవరికీ ఎలా జరిగిందో తెలియలేదు , ఎవరికీ తెలుసుకోవాలని శ్రద్ధ కూడా లేకపొయింది ,  ఆట జరిగిన రోజురాత్రి. ఎప్పుడు దూరమయ్యిందో, ఎలా అందరి నించీ విడిపోయిందో ఎవరు ఏం చేసేరో … తనని తానే కోల్పోయింది.

నగరంలో అందరినోటా తన కథే, తన గుణగణాల గురించే. వేరే ఎవరు దోషులు? ఎవరికీ తెలియదే.. ఎవర్ని తప్పు పడతారు.

ఎవరో వస్తున్నారు. బాగా డబ్బున్న మనిషిలా ఉంది

నెమ్మదిగా వచ్చి కూర్చొంది ముందు కుర్చీలో కాగితాలు సర్దుకొంటూ సంశయంగా చూస్తూ.

“గుడ్ మార్నింగ్. నేనే డాక్టర్ని. చెప్పండి.”

(19ఏళ్ల శివి సింగ్  ప్రస్తుతం  పూనె ఫెర్గుసన్ కాలేజి లో సొషియాలజి మేజర్తొ రెండొ సంవత్సరం డిగ్రీ  చదువుతున్నారు. 8 ఏళ్లవయసునించీ రచనలు చేస్తున్నా రు. కథ 2002లో viewspaper.netలో ప్రచురితం.)

ఫేస్‌బుక్‌ కవుల ఫేసు లెక్కడా?!

స్కై బాబ

~

skyసోషల్‌ మీడియా ఇంటలెక్చువల్స్‌కి, ఆక్టివిస్టులకు, కవులు, రచయితలకు ఒక ఆయుధంగా అందివచ్చింది. అందులోనూ ఫేస్‌బుక్‌ మరింత వెసులుబాటు కల్పించింది. మీడియా ‘మోడియా’గా మారిపోయిన నేపథ్యంలో ఫేస్‌బుక్‌ ఎన్నెన్నో భావ వ్యక్తీకరణలకు వేదికగా మారింది.

ఈ నేపథ్యంలో సాహిత్యానికి అతి కొద్ది స్పేస్‌ కల్పిస్తున్న మీడియా చెంప ఛెళ్లుమనిపిస్తూ ఫేస్‌బుక్‌, మరికొన్ని వెబ్‌ మాగజైన్స్‌ కవులు, రచయితల భావ వ్యక్తీకరణకు చోటు కల్పిస్తూ భావ సంఘర్షణలకు తావునివ్వడం మంచి పరిణామం. ఈ నేపథ్యంలోనే ఫేస్‌బుక్‌లో కొన్ని గ్రూప్స్‌ కవిత్వానికి పెద్ద పీట వేస్తూ ఎంతో కృషి చేశాయి. అందుకు పూనుకున్న కవులు, సాహిత్యకారులను తప్పక అభినందించాలి. పత్రికల సాహిత్య పేజీల కరుణా కటాక్షాల కోసం మొహం వాచి ఉన్న ఎందరికో ఫేస్‌బుక్‌, అందులోని కవిత్వ గ్రూపులు ఒక మంచి వేదికగా మారాయి. అస్సలు పత్రికలు చూసే తీరిక లేని వారి దగ్గరి నుంచి, తమలో ఒక కవి/కవయిత్రి ఉందని తెలుసుకునే అవకాశమే లేనివారి దగ్గరి నుంచి, హౌజ్‌వైఫ్‌ల దగ్గర నుంచి, సాఫ్ట్‌వేర్‌ రంగంలోని వారి నుంచి, ఎంతో తపన ఉన్న వారి దాకా ఈ వేదిక ఒక పెద్ద క్యాన్వాస్‌ అయ్యింది. దాంతో వందలాది కవులు పుట్టుకొచ్చారు. అందులో ఎందరో అతి తక్కువ కాలంలోనే ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఈ విషయం కూడా అందరూ హర్షించదగిందే.

ఈ సందర్భంలోనే ఒక వైచిత్రి చోటు చేసుకుంది. సాహిత్యమంటే అదేదో సులభమైన వాహికగా, కవిత్వం రాయడమంటే అదో చిన్న విషయంగా చాలామంది భావించడం మొదలయ్యింది. అస్సలు కవితా హృదయం లేనివారు కూడా నాలుగు ముక్కలు, నాలుగు వాక్యాలు పరిస్తే అది కవిత్వమై పోతుందని తమకు పేరొచ్చేస్తుందని భావించే దాకా ఈ వ్యవహారం వెళ్లింది. అవకాశవాదాలు, పేరుకోసం పాకులాటలు మొదలయ్యాయి. ఏ పెయిన్‌ లేనివాళ్లు కవిత్వం రాస్తే ఎలా ఉంటుందో ఇలాంటి వారి పద గారడీ అలా ఉండడం మామూలే. సరే, ఇలాంటివి ఎక్కడైనా ఉంటాయిలే అనుకోవచ్చు. మరోకోణం ఏమిటంటే, ఫ్యామిలీ అంతా సెటిల్‌ అయిపోయింది, ఇక మనం హాయిగా శేషజీవితం గడపొచ్చు అనుకున్నవారు కూడా కవులుగా పేరు తెచ్చుకోడానికి నానా తంటాలు పడడం కవిత్వానికి ఒకింత చేటు చేయడం మొదలయ్యింది. ఎందుకంటే వారి చేతిలో స్మార్ట్‌ఫోన్‌లు స్మార్టెస్ట్‌ కవిత్వం ఒలకపోయడం మొదలుపెట్టాయి.

ఇదిలా ఉంటే, ఒక కవిత రాస్తే, మిత్రులకు చూపెట్టుకొని ఎంతో భావ సంఘర్షణ తర్వాత, చర్చోపచర్చల తరువాత, మార్పులు చేర్పుల తర్వాత దాన్ని అచ్చుకి ఇచ్చే సాహసం చేసేవారు, చేస్తుంటారు గట్టి కవులు. దానికి కవుల కలయికలు, గ్రూపులు, సంఘాలు ఎన్నో, ఎన్నెన్నో..! ఇలాంటి వాతావరణం అసలే లేకుండా పోయింది ఫేస్‌బుక్‌ కవులకు. రాసింది రాసినట్లు పోస్ట్‌ చేసేస్తూ, రోజుకో కవిత, గంటకో కవిత, రెస్పాన్స్‌ వచనం రాసేసి అవే కవితలు అనుకునే స్థాయికి దిగజారడం జరిగిపోయింది. చాలామంది కాసిన్ని కవితలు రాసి మహా ఫోజు కొట్టే స్థాయికి ‘ఎదిగిపోయారు’. ఏండ్లకేండ్లు.. అన్నపానీయాలు మాని, రాత్రులలకు రాత్రులు కాల్చుకొని ఒక్కో కవితను ఒక్కో కార్యంగా భావిస్తూ, ఒక్కో దివిటీగా వెలిగిస్తూ ఎదిగొచ్చిన కవులను, వారి కవిత్వాన్ని ఎద్దేవా చేస్తూ.. ముందు నమస్కారం వెనక వెటకారం చేస్తూ.. ప్రతి విషయాన్ని జోక్‌గా మార్చేసి హిహి.. హెహెల దాకా వెళ్లారు కొందరు!

సరే, వారెవరినీ ఏమీ అనొద్దని, అసలు కవులే పుట్టడం తగ్గిపోయిన కాలంలో కొత్త తరం ఇలా పుట్టుకు రావడం, అందుకు ఫేస్‌బుక్‌ వేదిక కావడం ఎంతో మేలు అని అనుకున్న కవులు ఈ కొత్త తరాన్ని ప్రోత్సహిస్తూ కొందరు, గమనిస్తూ కొందరు ఉండిపోయారు. కొన్ని సందర్భాల్లో ‘ఏంటన్నా! మనం కవులుగా ఎంతగా తపనతో, సంఘర్షణతో కవిత్వం రాశాం.. కవిత్వానికి ఎంతటి ఉన్నత స్థానం ఉంది మన హృదయంలో.. వీళ్ళెంటి, ఇంతగా మిడిసిపడుతున్నారు.. నిలువని కవితలు, నిలువని ఒక్కో పుస్తకం వేసుకొని మహా ఫోజు కొడుతున్నారు???’ అనే ప్రశ్నలూ, ఆశ్చర్యార్ధకాలూ వినబడ్డాయి. ఏది తోస్తే అది రాసేసి కవిత్వమనుకోవడం, కవిత్వాన్ని అవహేళన చేసే శీర్షికలు పెట్టడం, భావ సంఘర్షణగానీ, భావజాల సంఘర్షణగానీ అస్సలు లేకపోవడం మొదలైనవన్నీ తీవ్రమయ్యాయి. ఎన్ని లైకులు, ఎన్ని కామెంట్లు అనే దగ్గర మొదలై, ఎవరైనా సద్విమర్శగా ఏదైనా కామెంట్ చేస్తే దాన్ని వెకిలి చేయడం దాకా వెళ్లింది. పొగడ్తలు తప్ప విమర్శను భరించలేని విపరీత బుద్ధి ఈ ‘కవుల’కు పట్టుకుంది.

ఇక్కడ గ్రహించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఫేస్‌బుక్‌ కవులుగా ఎదిగి వచ్చిన వారిలో బీసీ, ఎస్సీ కులాలకు చెందిన కవులు, కవయిత్రులు ఎక్కువమందే ఉన్నారు. మైనారిటీలు కూడా ఉన్నారు. వీరిలో చాలామంది మొదట్లో తమ జాతుల వెతలను, సంఘర్షణను కవిత్వీకరించారు. కాని ఆ కవితలకు వచ్చిన రెస్పాన్స్‌ కన్నా పువ్వూ ప్రకృతీ ప్రేమ సౌందర్యం లాంటి భావ కవిత్వం రాస్తే వచ్చే రెస్పాన్స్‌ సాధారణంగానే ఫేస్‌బుక్‌లో చాలా ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నెట్ వాడే సౌకర్యం అగ్రవర్ణాల వారికి, ‘సాఫ్ట్‌వేర్‌ కోళ్ల’కే ఎక్కువగా ఉంటుంది. వారిలో 99 శాతంమందికి అణగారిన జాతుల కవిత్వం పట్ల, వారి సామాజిక సమస్యల ఏమాత్రం కన్‌సర్న్‌ ఉండదు, అవగాహన ఉండదు. అది వారికి అవసరం లేని విషయంగా తయారయింది వ్యవస్థ. దీనికి తగ్గట్టుగానే కొందరు కవులు కూడా ‘భావ కవిత్వం’ రాయడానికే మద్దతునిచ్చి ఆ కొత్తతరం ఫేస్‌బుక్‌ కవులకు మార్గదర్శకులుగా మారడంతో వారు భావకవిత్వానికి పరిమితమవడం మొదలయింది. దాంతో వారు వేసుకుంటూ వచ్చిన కవితా సంపుటులకు అలాంటి  పేర్లే పెట్టడం, ఏ అస్తిత్వమూ అంటకుండా జాగ్రత్తలు తీసుకోవడం వేగంగా జరిగిపోయింది. ఎన్నో కవితా సంపుటులు వెలువడ్డాయి. ఆవిష్కరణలు, పార్టీలు, చిన్న చిన్న రివ్యూలు, ఒకరిద్దరి ఇంటర్వ్యూలు జరిగిపోయాయి. వీరు గురుసమానులుగా భావించినవారు ఎంతగా వీరిని ప్రభావితం చేశారంటే అస్తిత్వవాదులు, విప్లవవాదులు, సామాజిక సమస్యల మీద కవిత్వం రాసే ఎవరితోనో వీరికి సాంగత్యమే లేకుండా పోయింది. మొదట్లో ఉన్నా తర్వాత్తరువాత అది అంతరించి పోయింది.

సరే, మరికొంత కాలం గడిచింది.. ఈ మిడిసిపడ్డ కవులంతా ఒక్కొక్కరూ మాయమైపోతూ వస్తున్నారు.. చాలామంది ఫేస్‌బుక్‌లో కనబడ్డమే మానేసారు. ఏ గ్రూపుల నుంచి ఎదిగొచ్చారో వాటి మీదే జోకులెయ్యడం.. వాటికి వ్యతిరేకమవ్వడం కూడా జరిగిపోయింది.. ఫేస్‌బుక్‌లోకి రాట్లేదు అని ‘మేధావు’ల్లాగా అనేదాకా వచ్చింది. మొత్తంగా సామాజిక సమస్యలకు వీరు మొత్తంగానే స్పందించడం మానేసారు. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా లాగా తయారయింది కొందరి పరిస్థితి.

తమ ఇంటి కాడ, కుటుంబంలో, కులంలో, మతంలో, తమ ఊర్లలో, ప్రాంతంలో ఉన్న సమస్యల పట్ల స్పందించే గుణం కోల్పోయి, ముఖ్యంగా ఆ పెయిన్‌ను కోల్పోయి జడపదార్ధాలుగా మారిపోతున్నారు. కంటికి సూటిగా కనిపించే ప్రేమ ప్రకృతి అందం తప్ప ‘కాళ్ల కింది నేల కోతకు గురవుతున్న’ విషయం పట్టని స్థితి ఇది. ఇదే ఇవాళ దేశాన్ని కుదిపేస్తున్న రోహిత్‌ వేముల ‘హత్య’ పట్లగాని, హిందూత్వవాదుల, బ్రాహ్మణీయ ఆధిపత్య శక్తుల దాడుల పట్ల గాని ఆయా కవుల నుంచి స్పందన కరువైన పరిస్థితిని అద్దం పడుతున్నది. పైగా కొందరు ‘కవుల’ మనుకుంటున్నవారు కొత్తగా తమ వెనుకబాటుతనాన్ని బట్టబయలు చేసుకుంటూ తామేదో కొత్త విషయాన్ని కనుగొన్నట్లు పోస్టులు పెట్టే స్థాయికి ఈ పరిస్థితి దారితీసింది. ఈ సందర్భంలోనే ఫేస్‌బుక్‌ ‘యువ’, ‘నవ’ కవులను, ‘పెద్ద’ కవులమైపోయామనుకుంటున్న వారిని ‘గౌతమి మాసుల’ (Gouthami Masula) నిగ్గదీసి అడిగారు.. ఇలా-

 

”కవులెక్కడ ? మరీ ముఖ్యంగా యువకవులు 

ఏ అమ్మాయి పిరుదుల మీద పద్యాల్లో బిజి ఉన్నారో తెలుసుకోవచ్చా ? (vis-A_vis ) 
అత్యాచారం లాంటి కేసులకి వద్దన్నా బక్కెటడు కవిత్వం గుమ్మరించి మొసలి కన్నీరు కార్చే కవులెక్కడ ? 
అమ్మ దినం అయ్యా దినం ఆ దినం ఈ దినం అనగానే ఉరుక్కుంట వచ్చి ఫేస్బుక్ నిండా బరికి పోతారు వద్దురాభై అంటే కూడా అట్లాంటి కవులెక్కడ ? 
హత్య అంటే భయపడ్డారా ? లేక ఆకుకి పోక కి అందని చిదానంద స్వాముల అవతారం ఎత్తారా ?

రోహిత్ హత్యకి ప్రో గానే రాయమని కాదు కనీసం ఒక ఇస్శ్యు జరిగినప్పుడు మనకి ఎదో ఒక అభిప్రాయం లేకుండా అభావంగా బ్రతికేసే దిక్కుమాలిన సేఫ్ ప్లే ఇపుడు కొత్త తరం కూడా నేర్చుకుంది అంటే మాత్రం ఇన్నాళ్ళు వీళ్ళనా అభిమానించి వాళ్ళ వాక్యం కోసం ప్రపంచంతో పోరాడింది అని అసహ్యం వేస్తుంది

రైటో మేమంతా అంటీ సోషల్ ఎలిమేంట్స్ ఒప్పుకుంటున్నా. కానసలు మండిపోతున్న సోషల్ ఎలిమెంట్ మీద కూడా నోరిప్పలేని కలం ఎందుకు 
ఇదంతా మానవతా వాదం మేమసలు కులం మతం లేని సొసైటీ నే చూడాలనుకుంటున్నాం అంటే మాత్రం మీ అంత సమస్య ని వదిలిపోయే పిరికి సన్నాసులు లేరని ఘంటాపథంగా రాసివ్వగలను స్టాంప్ పేపర్ మీద.” (జనవరి 22, సా. 6:53)

అయితే, ఫేస్‌బుక్‌ వల్ల ఇంకా ఎందరో కొత్తవాళ్లు పుట్టుకొస్తున్నారు. వారికి కూడా సరైన దిశానిర్దేశం లేదు. వారి పరిస్థితి కూడా రేపు ఇంతే. అందుకని, కనీసం ఆయా గ్రూపులవాళ్లు, కవిత్వ ప్రేమికులు కొత్తవారితోనైనా కవులనుకునేవారికోసమైనా, కవిత్వం పట్ల తపన ఉన్నవారికోసమైనా కొన్ని అంతర్గత సమావేశాలు, గ్రూప్‌ డిస్కషన్స్‌ పెట్టి భావ సంఘర్షణకు, భావజాలాల సంఘర్షణకు తావు కల్పిస్తే తప్ప కొత్తతరం ఎదిగివచ్చి నిలదొక్కుకునే పరిస్థితి లేదు. అందుకు వారు పూనుకోవాలని, పూనుకున్నవారికి సహకరించాలని మనవి.

*

 

రోహిత్ ఆత్మహత్య: ఒక సరికొత్త/పాత సందర్భం

 

 

-భాస్కరం కల్లూరి

~

 

హైదరాబాద్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య అంతఃకరణను కలచి వేసే ఒక భావోద్వేగ సందర్భం. అదే సమయంలో లోతుగా తరచి చూసి అర్థం చేసుకోవలసిన ఒక సరికొత్త/పాత సందర్భం కూడా. ఒక తెలుగు రాష్ట్రానికి చెందిన ఒక దళిత విద్యార్థి ఆత్మహత్య వార్త జాతీయ మీడియాలో ప్రముఖంగా ప్రసారం కావడం చూసి ఒకింత ఆశ్చర్యం కలిగింది. సాధారణంగా దక్షిణాది రాష్ట్రాల వార్తలు మరీ ముఖ్యమూ, సంచలనాత్మకమూ అయితే తప్ప జాతీయ మీడియాలో ప్రముఖంగా రావు. ఆ పైన రోహిత్ ఆత్మహత్యపై దాదాపు అన్ని జాతీయవార్తా చానెళ్లూ చర్చ జరపడం ఆశ్చర్యాన్ని పెంచింది. ఆ చర్చ వరసగా కొన్ని రోజులపాటు జరగడం ఆశ్చర్యాన్ని రెట్టింపు చేసింది. దాంతోపాటు ఆలోచనలనూ రేకెత్తించింది.

దేశ వ్యాప్తంగా జరుగుతున్నట్టే, నిన్నటి అవిభక్త, నేటి విభక్త తెలుగు ప్రాంతాలలోనూ ఆత్మహత్యలు, దళితులపై హింస ఎంతోకాలంగా జరుగుతూనే ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు, తెలంగాణ ఉద్యమసమయంలో జరిగిన ఆత్మాహుతులు తెలిసినవే. దళిత హింసకు వస్తే; కారంచేడు, చుండూరు, పదిరికుప్పం; మహారాష్ట్రలో ఖైర్లాంజీ లాంటి ఘటనలను ఎన్నైనా చెప్పుకోవచ్చు. స్థూలంగా చెప్పుకుంటే, ఆ క్రమంలో రోహిత్ ఆత్మహత్య, పునరావృతమైన ఒక పాత సందర్భమే అవుతుంది.  అయితే, రోహిత్ ఆత్మహత్య జాతీయస్థాయిలో చర్చనీయం అయినంతగా పైవేవీ కాలేదు. అప్పటికి మీడియా వ్యాప్తి ఇంత లేకపోవడం ఒక కారణం అనుకున్నా; ఇప్పటికీ జాతీయ మీడియా వింధ్య అవతలి ప్రాంతాలపై, ముఖ్యంగా ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలపై పెడుతున్నంత ఫోకస్; వింధ్య ఇవతలి ప్రాంతాలపై పెట్టడం లేదన్న వాస్తవాన్ని గుర్తిస్తే రోహిత్ ఆత్మహత్యపై దాని స్పందన విలక్షణంగానే కనిపిస్తుంది. ఆవిధంగా అదొక సరికొత్త సందర్భం. వెరసి అదొక సరికొత్త/పాత సందర్భం.

ఇలా రోహిత్ ఆత్మహత్యను కొత్త సందర్భంలోకి తీసుకొచ్చినది సాక్షాత్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, దాని భావసారూప్య వర్గాలే. అందుకు కారణం, అవి అనుసరించే ఒక నిర్దిష్ట భావజాలం. కానీ విచిత్రమేమిటంటే, రోహిత్ ఆత్మహత్య పాత సందర్భానికి కొనసాగింపు మాత్రమే తప్ప కొత్త సందర్భం ఎంతమాత్రం కాదని అవి నొక్కి చెబుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో దళితుల ఆత్మహత్యలు లేవా అని ప్రశ్నిస్తున్నాయి. ఒక దళిత విద్యార్థి ఆత్మహత్యను జాతీయస్థాయికి పెంచి మీడియా రభస చేయడం వెనుక మోడీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్ర ఉందని ఆరోపిస్తున్నాయి. మోడీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ జరుగుతున్న మతపరమైన ఘటనలు, అసహనం పెరిగిపోవడం గురించిన ఆరోపణల విషయంలోనూ బీజేపీ, దాని మిత్రవర్గాలూ ఇదే ఆరోపణ చేస్తూ వచ్చాయి. అధికారపక్షాన్ని ఇరుకున పెట్టే అవకాశాన్ని ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా వదలుకోదన్న కోణంలో చూస్తే ఇది నిజం కావచ్చు కూడా.  అయితే, బీజేపీ, దాని మిత్రవర్గాలు ప్రస్తుతం తామున్న ఒక విలక్షణ పరిస్థితిలో; జరుగుతున్నవన్నీ పాతసందర్భానికి కొనసాగింపులే తప్ప కొత్తవి కావని చెప్పడానికి కూడా దీనిని తెలివిగా వాడుకుంటున్నాయి.

అయితే, వాటి అసలు లక్ష్యం దేశాన్ని పాత సందర్భం నుంచి తప్పించి కొత్త సందర్భంలోకి తీసుకెళ్ళడం! ఎందుకంటే, వాటికి తమవైన నిర్దిష్ట భావజాలమూ, ఆచరణా ఉన్నాయి. ఆ భావజాల అవసరాల రీత్యా కుల(దళిత)-మత(ముస్లిం)పరమైన అస్తిత్వాలకు కొత్త నిర్వచనం ఇచ్చి, కొత్తసందర్భంలోకి తీసుకురావడమనే ఒక ముఖ్యమైన అజెండా వాటికి ఉంది.  దీనిని వారు కూడా కాదనరు. అధికారంలో ఉండడం ఆ అజెండా అమలుకు మంచి వెసులుబాటు. తమ భావజాల అజెండాను అమలు చేయలేనప్పుడు అధికారంలో ఉండడమే అర్థరహితం అవుతుంది. అయితే, విచిత్రంగా అవి చేస్తున్నదేమిటంటే;  దేశాన్నికొత్త సందర్భంలోకి తీసుకురావడమనే తమ అసలు లక్ష్యాన్ని తమే కప్పి పుచ్చుకుంటూ;  తమ అజెండా అమలును పాత సందర్భానికి పొడిగింపుగానే అవి చెబుతున్నాయి. చాలా విషయాలలో అవి చేసే వాదనలో ఇదే వైరుధ్యం కనిపిస్తుంది. ఆయా కుల, మత అంశాలను కొత్త సందర్భంలోకి తీసుకు రావడంలో తమకు దేశవ్యాప్తంగా ఏర్పడే ప్రతికూలవాతావరణంలో ఒకవైపు ఆత్మరక్షణలోకి జారిపోతూనే; ఇంకోవైపు కిందపడినా పై చేయి మాదే నని చెప్పుకోవడానికి అవి ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికలలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు, దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తూనే, మరో ఎన్నికల తరుణంలో మళ్ళీ అదే అజెండాను పైకి తీస్తున్నాయి. అలాగే, అధికారపక్షంగా ఒకవైపు రాజ్యాంగ పరిధిలో పని చేయవలసి రావడం, ఇంకోవైపు కొత్త సందర్భంలోకి దేశాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఆ రాజ్యాంగ పరిధిని లేదా స్ఫూర్తిని తనే దాటడం అనే జోడుగుర్రాల స్వారీ చేస్తున్నాయి. ఇప్పుడున్న ఎన్నికల రాజకీయాల చట్రంలో అవి దళిత, ముస్లిం ఓటర్లను పూర్తిగా దూరం చేసుకోలేవు కనుక; ఒకవైపు కుల, మత పరమైన ఆ గుర్తింపులను దృష్టిలో ఉంచుకుంటూ తమ బ్రాండ్ ‘సంతుష్టీకరణ’ విధానాలను అనుసరించక తప్పదు. మరోవైపు, అలాంటి గుర్తింపులకు అతీతంగా ఒక ఏకశిలా జాతీయతను నిర్మించడమనే తమ భావజాల లక్ష్యం వైపు అడుగులు వేయకతప్పదు.

ఈవిధంగా వాటిది అనేక వైరుధ్యాలు నిండిన దాగుడుమూతలాట. మోదీ అధికారంలోకి వచ్చిన గత ఇరవై మాసాలుగా ఈ దాగుడుమూతల ఆట వివిధ రూపాలలో సాగుతూనే ఉంది. ఒక ప్రభుత్వంగా మోదీ ప్రభుత్వం పాత సందర్భానికి కొనసాగింపుగా కనబడడానికి ప్రయత్నిస్తుంది. కానీ పార్టీ, దాని భావజాలవర్గాలు దేశాన్ని కొత్తసందర్భంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇందుకు ప్రభుత్వం పైకి నిశ్శబ్ద ప్రేక్షకరూపంలోనూ; అది సరిపోనప్పుడు లోపాయికారీగా ఇతరేతర రూపాలలోనూ ప్రోత్సాహం అందిస్తూ ఉంటుంది. రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితుల నేపథ్యం వాస్తవానికి గత ఇరవై మాసాలుగా సాగుతున్న ఈ దాగుడుమూతల ఆటకు కొనసాగింపే.

రోహిత్ అంబేడ్కర్ విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నాడు. ఆ యూనివర్సిటీలో అఖిలభారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) సహా మరికొన్ని విద్యార్థి సంఘాలు పనిచేస్తున్నాయి. భావజాల విభేదాలు ఉన్న విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలు జరుగుతుండడం, అవి ఒక్కోసారి హింసాత్మకం కావడం దాదాపు అన్నీ యూనివర్శిటీలలో మామూలే. వాటి పరిష్కారాలు, శిక్షలు యూనివర్సిటీ నాలుగు గోడల మధ్యా; ఇంకా అవసరమైతే శాంతి భద్రతల పరిధిలో జరిగిపోతూ ఉంటాయి. అలా చూసినప్పుడు ఇది పాత సందర్భం. కానీ బీజేపీతో భావజాల మైత్రి కలిగిన ఏబీవీపీ దానిని కొత్త సందర్భంలోకి తీసుకురావడానికి ప్రయత్నించింది. విద్యార్థిరంగంలో దళిత/దళితేతర కులాల గుర్తింపులకు అతీతంగా హిందూత్వ ప్రాతిపదికపై అన్ని కులాలను కూడగట్టడం; హిందూ యేతర మతాలను కట్టడి చేయడం దాని లక్ష్యం. పాత సందర్భానికి అదనంగా ఇప్పుడు ఏబీవీపీకి ప్రభుత్వం అనే కొత్త అండ ఉంది. దానిని వాడుకోడానికి ప్రయత్నించింది. ప్రభుత్వం కూడా అందుకు సిద్ధంగానే ఉంది. దాని ఫలితమే ఏబీవీపీకి అనుకూలంగా  కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, మానవవనరుల అభివృద్ధి మంత్రి స్మృతీ ఇరానీల జోక్యం. యూనివర్సిటీ పాలక వ్యవస్థ తన ప్రత్యేక ప్రతిపత్తిని పక్కన పెట్టి ఆ జోక్యానికి దారి ఇచ్చింది. రోహిత్ ఆత్మహత్యతో ఇవన్నీ బయటపడేటప్పటికి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఎప్పటిలా, ఇది పాత సందర్భానికి కొనసాగింపే తప్ప, కొత్తగా జరిగింది ఏమీలేదని తనను సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. అది విఫల యత్నంగానే పరిణమించింది. ఇలా ఆత్మరక్షణలో పడిపోవడం-ఏదో విధంగా సమర్ధించుకోవడం గత ఇరవై మాసాలుగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఒక స్క్రీన్ ప్లే.  ఎన్నిసార్లైనా దీనిని పునరావృతం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది తప్ప మడమ తిప్పే ఉద్దేశంలో లేదు. ఎందుకంటే, దాని అంతిమలక్ష్యం తన భావజాలాన్ని జనంలోకి తీసుకువెళ్లి, దేశాన్ని తను కోరుకునే కొత్త సందర్భంలోకి తీసుకువెళ్లడం.  లోక్ సభలో తిరుగులేని మెజారిటీ, మోదీ లాంటి వ్యక్తి నాయకత్వమూ అందుబాటులో ఉన్న ఈ తరుణంలో ఈ పని  చేయలేకపోతే ఇంకెప్పుడూ చేయలేమని అది భావించడంలో ఆశ్చర్యం లేదు. ఈవిధంగా దానిది విజయమో, వీరస్వర్గమో తేల్చుకోవలసిన పరిస్థితి.

ఈ పరిస్థితిలో ప్రభుత్వాన్ని రాజ్యాంగ నియమనిబంధనలు, ఔచిత్యాల వంటి రకరకాల హద్దులను దాటిస్తే తప్ప పనిజరగదు. ప్రభుత్వమూ, పార్టీ, దాని భావసారూప్య వర్గాలూ పూర్తి స్పృహతో, ఏకీభావంతో ఈ హద్దుల ఉల్లంఘనకు సిద్ధమయ్యాయి. ఎంతోకాలంగా సాగుతున్న ఆత్మహత్యలు, దళిత హింసకు భిన్నంగా, రోహిత్ ఆత్మహత్య జాతీయస్థాయిలో తీవ్ర చర్చనీయాంశం చేసింది ఇదే. నిజానికి కులవివక్షకు, దళిత హింసకు కాంగ్రెస్ తో సహా దాదాపు ప్రధానస్రవంతి పార్టీలు ఏవీ అతీతం కావు. వ్యవస్థాపరంగా చెబితే కులదాష్టీకాన్ని అణువణువునా జీర్ణించుకున్న భూస్వామ్యంతో స్వాతంత్ర్యం తర్వాత కూడా అన్ని ప్రధానపక్షాలూ మమేకమై దానిని భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నాయి. అయితే, సూత్రరీత్యానైనా కులమత వివక్షలేని లౌకిక ప్రజాస్వామిక రాజ్యాంగ ప్రక్రియకు గత ఆరుదశాబ్దాలుగా మనం అలవాటు పడ్డాం. భూస్వామ్య శక్తులు పూర్తి బలంతో తెరముందుకు రాకుండా ఈ ప్రక్రియ, మళ్ళీ సూత్రరీత్యానైనా వీలైనంతవరకు నిరోధిస్తూ వచ్చింది. ఇంతవరకు అధికారంలో ఉన్న సోకాల్డ్ లౌకిక పక్షాలు రాజకీయంగానూ, లోపాయికారీగానూ కులమత ఆధిపత్యశక్తులతో అంటకాగుతూనే, ప్రభుత్వస్థాయిలో తగుమేరకు తటస్థ పాత్ర పోషిస్తూ వస్తున్నాయి. కోర్టులు, చట్టాలు, విద్యాసంస్థలు, ఇతర బహిరంగ వ్యవస్థలు పోషించవలసింది అటువంటి తటస్థపాత్రేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ఇన్నేళ్లలో కుల, మత హింస చెలరేగినప్పుడల్లా ప్రభుత్వాన్ని కాక, తెరవెనుక శక్తులను దోషులుగా నిలబెట్టడం జరుగుతూవచ్చింది. ఆయా ప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యవస్థలు భిన్న, భిన్న; పరస్పర శత్రుత్వపూరిత భావజాలాల అభివ్యక్తికి స్వేచ్ఛ నిస్తూనే వాటిని రాజ్యాంగం, చట్టాల పరిధి దాటకుండానూ; శాంతి భద్రతల పరిధిలోనూ నియంత్రిస్తూ యధాశక్తి తటస్థ భూమిక పోషిస్తూ వస్తున్నాయి.

ఇప్పుడు బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వమూ, దాని భావసారూప్య వర్గాలూ ఈ తటస్థత అనే పలచని పొరను కూడా తొలగిస్తున్నాయి. రోహిత్ ఉదంతంలో జరిగింది అదే. ఫలితంగా, ముక్కూ, మొహం లేని వ్యవస్థ స్థానంలో;  రాజ్యాంగబద్ధంగా వ్యవహరించవలసిన, స్పష్టమైన రూపురేఖలు కలిగిన ఒక ప్రభుత్వం ఇందులో దోషిగా నిలబడింది.  రోహిత్ ఆత్మహత్య జాతీయస్థాయికి ఎక్కవలసిన తీవ్ర పరిణామం అయినది అందుకే.  అయినాసరే, ఎంత అప్రతిష్ట పడినా, ఎన్నికల ఓటమి రూపంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా, ఎన్నిసార్లు ఆత్మరక్షణలో పడవలసివచ్చినా ఈ తటస్థత అనే పొరను ఎన్నిసార్లైనా ఉత్తరించడానికి బీజేపీ, దాని ప్రభుత్వమూ, దాని భావసారూప్య వర్గాలూ కంకణం కట్టుకున్నాయి. ఎలాగైనా సరే తమ భావజాలాన్ని నెగ్గించుకుని, దేశాన్ని ఎప్పటికైనా పూర్తిగా కొత్త సందర్భంలోకి తీసుకువెళ్ళే కృతనిశ్చయంతో ఉన్నాయి. తటస్థ ప్రదేశంలోకి ప్రభుత్వం చొచ్చుకు వెళ్లడానికి ప్రయత్నించిన ఉదాహరణలు ఈ ఇరవై మాసాలలో ఇంకా చాలా కనిపిస్తాయి. ప్రజాస్వామిక లౌకిక రాజ్యాంగం కల్పించిన తటస్థభూమిక ఎప్పుడైతే బలహీనపడిపోతుందో అప్పుడిక ఈ దేశంలో ఎంతో చరిత్ర కలిగిన రకరకాల శత్రు పక్షాలూ, భావజాలాలూ బలాబలాలు తేల్చుకోడానికి పూర్తి శక్తియుక్తులతో, అత్యంత నగ్నంగా యుద్ధక్షేత్రంలోకి అడుగుపెట్టడం సహజ పరిణామం. వివిధ భావజాలాలను హద్దుల్లో ఉంచుతూ నియంత్రణ పాత్రను పోషించే ‘రిఫరీ’ అదృశ్యమైనప్పుడు అప్పుడిక NO HOLDS BARRED!

ఇప్పుడు అదే జరుగుతోంది. చూస్తున్నది, చూడబోతున్నది కచ్చితంగా వందలు, వేల సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగిన ఒక సంకుల సమరం. అక్షరాలా భిన్న భావజాలాల మధ్య జరుగుతున్న కురుక్షేత్రం. పాత/కొత్త సందర్భాల మధ్య అమీ తుమీ తేల్చుకోడానికి పెద్ద ఎత్తున జరుగుతున్న, ఇంకా ముమ్మరం కాబోతున్న పెనుగులాట. ఈ క్షణాన ఢిల్లీలో జరుతున్నది దేశగమనాన్ని గత ఆరుదశాబ్దాల అనుభవానికి భిన్నమైన మలుపు తిప్పగల ఒక అతి పెద్ద రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ప్రయోగం! ఇది ఎలా పరిణమిస్తుందన్నది కాలానికి విడిచిపెట్టవలసిన ప్రశ్న.

*

 

 

 

 

ఈ మార్పు ఎటు అన్నదే ప్రశ్న: “కథా” నవీన్

 

  

వాసిరెడ్డి నవీన్ , పాపినేని శివశంకర్ ల సంపాదకత్వంలో ‘కథాసాహితి’ ప్రతి యేటా ప్రచురిస్తోన్నఉత్తమ  కథల సమగ్ర సంకలనం ఆవిష్కరణ జనవరి 24 న , హైదరాబాదులో .  ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వాసిరెడ్డి నవీన్ తో ‘సారంగ’  సంభాషణ.

ఇంటర్వ్యూ : ఎ . కె . ప్రభాకర్ 

  

  • కథాసాహితి ‘కథ’ కి పాతికేళ్ళు , పాతిక సంకలనాలు. 155 మంది రచయితలు – 336 కథలు – రాయల్ సైజులో 2600 పేజీలు  ; 25 సంవత్సరాల కృషి అంతా వొకచోట చూసుకొన్నప్పుడు యెలా ఫీలవుతున్నారు?

సహజంగానే చాలా సంతోషంగా వుంది. పాతికేళ్ళ కృషిని వొకసారి ఆగి వెనక్కి తిరిగి చూసుకుంటే తృప్తిగా వుంది. మిగతా భాషల్లో ఏమో గానీ వొక సమాజలో చోటుచేసుకొన్న చలనాన్ని సామాజిక క్రమ పరిణామాన్ని కథలద్వారా చూసుకోగలగడం ఈ సంకలనాల రూపంలో తెలుగులోనే సాధ్యమైందని అనిపిస్తుంది. ఇంతకు ముందు వందేళ్ళ కథా చరిత్రని చూస్తే – ఏ యే కాలాల్లో మంచి కథలు వచ్చాయి , ఎప్పుడు రాలేదు – అందుకు కారణాలేంటి అని వెతుక్కోవలసి వస్తుంది. కానీ పాతికేళ్ళుగా క్రమం తప్పకుండా మా కథాసాహితి వెలువరించిన సంకలనాల్లోని కథలన్నీ ఒకచోట చేర్చడం ద్వారా ఆ కారణాలు అన్వేషించడానికి తేలికగా వీలవుతుంది. ఉదాహరణకి 1990 నుంచీ 1998 వరకూ ఒక ఎనిమిదేళ్ళ పాటు తెలుగులో మంచి కథలు వచ్చాయి. ఆ తర్వాత క్వాలిటీ కొంచెం తగ్గింది. మళ్ళీ ఇటీవలి కాలంలో మంచి కథ రావడం మొదలైంది.  అన్ని కథలూ ఒక దగ్గర చూడడం వల్లే ఇటువంటి స్థూల విభజన వీలవుతోంది. అలాగే అందుకు కారణమైన సామాజిక పరిస్థితుల నేపథ్యాన్ని సూక్ష్మ పరిశీలన ద్వారా అధ్యయనం చేయడం కూడా సులువవుతుంది. ఆ విధంగా యీ సమీకృత బృహత్ సంకలనానికి కథా సాహిత్య చరిత్రలో ఒక ప్రత్యేకత ఉంటుంది. మేం ఆ చరిత్రలో భాగం అవుతున్నందుకు ఆనందంగా వుంది.

  • అసలీ వార్షిక సంకలనాలు తీసుకురావాలన్న సంకల్పానికి బీజం యెక్కడ పడింది?

దానికి ముందుగా – అసలు కథల మీద ఆసక్తి ఎలా కలిగిందో చెప్పాలి. ‘ప్రజాసాహితి’ పత్రిక సంపాదకుడిగా వున్నప్పుడు (1980 – 90 మధ్య కాలంలో) ‘నిన్నటి కథ’ పేరున పాత కథల్ని వేస్తుండేవాళ్ళం. అలా ప్రతి నెలా ఒక కథ వెయ్యడానికి చాలా  కథలు చదివి – వాటిలో మంచిది అనిపించింది ఎన్నుకునేవాళ్ళం.  ఆ క్రమంలో 1910 నుంచీ వచ్చిన అనేక కథలు చదవడం వల్ల కథల పట్ల ఆసక్తి ఏర్పడింది. దాంతో పాటు వాటి వెనకవున్న సామాజిక కారణాలు తెలుకోవడం మరింత ఉత్సాహంగా వుండేది. అప్పుడే తెలంగాణ రైతాంగ పోరాట నేపథ్యంలో వచ్చిన కథల్ని సేకరించాం. అది కథల అధ్యయనానికి ఎంతో ఉత్తేజానిచ్చింది.

ఇక కథా వార్షిక సంకలనాలు రావడం వెనక ఇద్దరు వ్యక్తులదీ ఒక సంస్థదీ ముఖ్యమైన పాత్ర ఉంది. ఆ సంస్థ HBT(హైదరాబాద్ బుక్ ట్రస్ట్). వ్యక్తులు – చేకూరి రామారావు , హరి పురుషోత్తమరావు (హరి). అప్పుడు ట్రస్టు సభ్యుడు పరుచూరి సుబ్బయ్య పాతికేళ్ళ మంచి కథల సంకలనం తీసుకురావాలని సూచించాడు. ఆ అభిప్రాయాన్ని  అప్పటి చైర్మన్ C K నారాయణ రెడ్డి బలపరచి ఆ పని హరిగారికి అప్పచెబుదామని భావించారు. అయితే హరి నా పేరు సూచించారు. దాంతో ‘తెలుగు కథ 1960 – 85’ నా సంపాదకత్వంలో  తయారైంది. దాని కోసం కథల సేకరణలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అందులో ప్రధానమైన సమస్య లభ్యత. చాల కథలు పత్రికల్లోనే ఉండిపోవడం , సంకలనాల్లోనో సంపుటుల్లోనో అతి కొద్ది కథలే రావడం వల్ల వచ్చిన ఇబ్బంది అది. పత్రికలు కూడా  గ్రంథాలయాల్లో అంత తేలికగా దొరికేవి కావు. అప్పుడు వచ్చిన ఆలోచన – ఎవరైనా ప్రతి సంవత్సరం మంచి కథలతో సంకలనం వేసి వుంటే బాగుండేది కదా అని. HBT సంకలనం పూర్తయ్యే సరికి మూడేళ్ళు పట్టింది. 90ల చివరికి ఆ పుస్తకం పూర్తయి విడుదలైంది. అంతవరకూ జనసాహితి సాంస్కృతిక సమాఖ్యలో ముఖ్య బాధ్యతల్లో వుండేవాణ్ని. వివిధ కారణాలతో 90 లో సంస్థ నుంచి బయిటికి రావడం వల్ల దొరికిన సమయాన్ని యిలా వార్షిక సంకలనాలు తీసుకురావడానికి ఉపయోగించవచ్చు అనిపించింది. అప్పటికే కథలమీద కొంత అవగాహన ఏర్పడింది. జనసాహితి తరపున జరిగిన ఒకటి రెండు వర్క్ షాపుల్లో పాఠాలు చెప్పిన పాపినేని శివశంకర్ తో యీ విషయం ప్రస్తావించాను. అతను సరేననడంతో పని మొదలైంది. పుస్తకం తయారై ‘కథాసాహితి’ ప్రచురణగా బయిటికి వచ్చింది. ఇలా మొదటి సంకలనం ‘కథ 90’ ని  1991 డిసెంబర్ 28న హైదరాబాద్ ద్వారకా హోటల్లో చే రా విడుదల చేశారు. ఈ వార్షిక సంకలనం రెగ్యులర్ గా వస్తుందా అని చాలా మందికి సందేహాలుండేవి. ఆ సందేహం నిర్వాహకులుగా మాకూ వుండేది. కానీ చేయగల్గినంత కాలం చేద్దాం అనే ఆలోచన. కానీ ఆ తర్వాత ఇక వెనక్కి చూడలేదు. పాతికేళ్ళుగా నిరాటంకంగా వస్తూనే వున్నాయి.

  • ఇటువంటి వార్షిక సంకలనాలు యింతకు ముందేమైనా వచ్చాయా? మీతోనే మొదలా?

మేం మొదలూ కాదు – చివరా కాదు. 1968 ప్రాంతంలో ఎమెస్కో వాళ్ళు ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులతో కథలు రాయించి ‘విద్యార్థి కథా సాహితి’ పేరు మీద ఒకటి రెండు సంవత్సరాల పాటు సంకలనాలు తెచ్చారు. ఆ ప్రయత్నం ఇతర విశ్వవిద్యాలయాల్లోనూ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 90 లో మాతోనే మొదలైంది. అయితే విచిత్రంగా అదే సంవత్సరం ‘కథ’ అనే సంస్థ గీతా హరిహరన్ సంపాదకత్వంలో ‘Katha Prize Stories’ పేరు మీద భారతీయ భాషల్లో ఆ సంవత్సరం వచ్చిన మంచి కథల్ని ఎంపిక చేసి ఇంగ్లీషులోకి అనువదింప జేసి వార్షిక కథా సంకలనాలు వేయడం మొదలుపెట్టారు. అదొక పదేళ్ళు నడిచి ఆగిపోయింది. ఆ తర్వాత మన దగ్గర తెలుగు విశ్వవిద్యాలయం వారు ‘తెలుగు కథ’ , మధురాంతకం నరేంద్ర – రాసాని సంపాదకత్వంలో ‘కథా వార్షిక’ , కర్ర ఎల్లారెడ్డి సంపాదకత్వంలో ‘తెలంగాణ కథ’ కొద్ది సంవత్సరాల పాటు వచ్చి ఆగిపోయాయి. ఇప్పుడు సామాన్య కిరణ్ ఫౌండేషన్ వారి ‘ప్రాతినిధ్య’ , సింగిడి వారి తెలంగాణ కథ ( రంది , తన్లాట) కొత్తగా మొదలయ్యాయి. ఇవన్నీ తెలుగు కథ వికాసానికి చేసిన/చేస్తున్న దోహదం  చాలా విలువైనది. ఇదిలా వుండగా 1915లో ప్రారంభమైన The Best American Short Stories అన్న సంకలనం 100 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంలోనే మా కథ సంకలనాలు 25 సంవత్సరాలు పూర్తిచేసుకోవడం యాదృచ్ఛికం. ప్రస్తుతానికి ఈ రెండూ తప్ప ఇన్నేళ్ళుగా నిరంతరాయంగా ఇలాంటి ప్రయత్నాలు సాగుతున్న దాఖలాలు ఎక్కడా నాకు తెలిసి లేవు.

25 Years Katha Cover

  • నిజంగా అభినందించాల్సిన విషయమే. అయితే మంచి కథల ఎంపికలో మీరు పాటించే ప్రమాణాలు – పధ్ధతి యేమిటి?

నిజానికి ఇదొక పెద్ద చర్చ. ఇప్పటికీ చాలా మంది నోళ్ళలో నానుతున్న చర్చ. ఒక రకంగా యే ఎన్నిక అయినా వ్యక్తిగత అభిరుచికి సంబంధించినదే. మనం యెంత objective గా ఎన్నిక చేసినా యెంతో కొంత మేరకి అది subjective కాక పోదు. ఎందుకంటే మన వ్యక్తిగత ఆలోచనలు , సమాజం పట్ల  – సాహిత్య ప్రయోజనం పట్ల మనకుండే దృష్టి ,  మనం విశ్వసించే భావజాలం మన అభిరుచిని నిర్ధారిస్తాయి. అదే కథల ఎంపికలో ప్రతిఫలిస్తుంది. అందువల్ల ఆ మేరకు అది subjective అవుతుంది. తొలి రోజుల సంకలనాల్లో మా కథల ఎన్నిక చూసి – చాలామంది ఇవన్నీ కమ్యూనిస్టు కథలు అన్నారు. సమాజం గురించి మాట్లాడటమే కమ్యూనిజం అయితే అలా అనుకోవడం పట్ల మాకేం అభ్యంతరం లేదని సమాధానం యిచ్చేవాళ్ళం. వాస్తవానికి కథల ఎన్నికలో ప్రధానంగా రెండు విషయాలు దృష్టిలో పెట్టుకునే వాళ్ళం. వస్తువు సామాజిక ప్రయోజనోద్దిష్టమై వుండాలి. శిల్పం కొత్తగానూ చదివించేదిగానూ వుండాలి – ఆ సామాజిక ప్రయోజనాన్నిపాఠకుడికి అర్థవంతంగా అందించేదిగానూ వుండాలి. ఈ లక్ష్యంతో కలిసి నడిచిన సంపాదకులిద్దరం మార్క్సిస్ట్ భావజాల ప్రభావం నుంచి వచ్చిన వాళ్ళం కావడం వల్ల చాలామందికి ఇవి కమ్యూనిస్టు కథలని అనిపించవచ్చు.

తెలుగు కథ ఎప్పుడూ సమాజంతోనే ప్రయాణించింది.  దాన్ని మేం విడదీయ దల్చుకోలేదు. ఈ ఆలోచన 90 నుంచీ అలాగే కొనసాగింది. పాతికేళ్ళ తర్వాత నేటికీ కొనసాగుతోంది.

160 పేజీలున్న మొదటి సంకలనంలో 15 కథలున్నాయి. అప్పుడు ఆ 15 కథలు ఎంపిక చేయడానికి పెద్ద పరిశ్రమే చేయాల్సి వచ్చింది. సరిగ్గా 1990లోనే  ఆంధ్రజ్యోతి  వార పత్రిక ‘ఈ వారం కథ’ పేరుతో వారం వారం ఒక మంచి కథ ప్రచురిస్తూ వచ్చింది. అలా వాళ్ళు ప్రకటించినవే యాభైకి పైగా కథలున్నాయి ఆ సంవత్సరం. ఇతర పత్రికల్లో వచ్చిన  కథలు – మొత్తం చూసుకుంటే మంచి కథలు అనిపించినవి వందా నూట యాభై పైగానే లభ్యమయ్యాయి. వాటి నుంచి 15 కథలు వడపోయడం కష్టమే అయ్యింది.  పాతికేళ్ళ తర్వాత  యిప్పుడు అంత కష్టం అనిపించడం లేదు. దానికి రెండు కారణాలు. ఇరవై అయిదేళ్ళుగా కలిసి పని చేసే క్రమంలో సంపాదకుల మధ్య చక్కటి అవగాహన ఏర్పడడం ఒక కారణం. నిర్మొహమాటంగా చెప్పుకోవాలంటే కథల స్థాయి తగ్గడం రెండో కారణం. కాకపొతే ఇటీవలి కాలంలో కొత్త తరం కథలు రాయడం మొదలెట్టాకా కథా రచనలో విలక్షణత పెరిగింది. కానీ యెక్కడో సామాజిక పరిణామాన్ని పట్టుకోవడం యింకా యీ కొత్త రచయితలకి పూర్తిగా అలవడలేదు అనిపిస్తుంది.

  • అంటే వస్తు శిల్పాల విషయికంగా తెలుగు కథలో యీ పాతికేళ్లలో పేర్కొదగ్గ మార్పులు చోటు చేసుకున్నాయని చెప్తున్నట్లే గదా! ‘కథ’ సంపాదకులుగా మీరు గుర్తించిన మార్పులేమిటి – అవి తెలుగు కథ పురోగమనానికి గానీ విస్తృతికి గానీ తోడ్పడ్డాయా?

అవును మార్పులున్నాయి. ఉంటాయి కూడా. ఎటొచ్చీ ఆ మార్పులు ఎలా వున్నాయన్నదే ప్రశ్న. సమాజంలో సంభవిస్తున్న పరిణామాల్ని కథకులు తమ కథల ద్వారా పాఠకులకి అందించ గల్గుతున్నారా లేదా అన్నది ఒకటి – ఆ అందించే క్రమంలో కథా నిర్మాణంలో నూతన పద్ధతులు ఆవిష్కృతమవుతున్నాయా లేదా అనేది రెండోది. వీటి గురించి ఆలోచించాలంటే తెలుగు సమాజపు 25 ఏళ్ళ రాజకీయ – ఆర్ధిక – సామాజిక – సాంస్కృతిక జీవన పరిస్థితుల గురించి , వాటిలో వచ్చిన మార్పుల గురించి పెద్ద చర్చే చేయాల్సి వుంటుంది. ఒకప్పుడు వామపక్ష భావజాలం శాసించిన ఈ సమాజాన్ని ఇవ్వాళ అస్తిత్వవాద రాజకీయాలు శాసిస్తున్నాయి. ఇది అభివృద్ధా – తిరోగమనమా అనేది సామాజిక శాస్త్రవేత్తలు నిర్ధారించాల్సిన అంశం. అయితే 1990 నుంచి 95 వరకు వచ్చిన కథల్లో వామపక్ష ఉద్యమ భావజాలం ప్రధానంగా కనపడటానికీ ఆ తర్వాత వచ్చిన కథల్లో స్త్రీవాద మొదలైన అస్తిత్వ వాద భావజాలం కనపడటానికీ వున్న కారణాలని సూక్ష్మ దృష్టితో అన్వేషించాలి. మరీ ఇటీవలి కాలంలో మానసిక సంఘర్షణలు , పురా జ్ఞాపకాలు , వైయక్తిక ధోరణులు , మానవ సంబంధాల్లో వచ్చిన మార్పుల గురించి వున్న కథలే ఎక్కువ వస్తున్నాయి. అంతకు ముందున్న రాజకీయ నిబద్ధత ఇప్పుడు కనిపించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం వామపక్ష ఉద్యమాలు ఒకడుగు వెనక్కి వెళ్ళడం కావచ్చు.

90లో వచ్చిన ఒక తండ్రి కథ గానీ ఆ తర్వాత వచ్చిన అతడు , జాడ , పిలక తిరుగుడు పువ్వు వంటి కథలు గానీ యిప్పుడు రావడానికి అవకాశాలు కనిపించడం లేదు.

  • గ్రామీణ నేపథ్యం నుంచి కథలు రావడం తగ్గింది కదా!

ఇప్పుడు తెస్తున్న పెద్ద సంకలనానికి ముందుమాట రాస్తూ ఒకటి రెండు అభిప్రాయాలు ఈ విషయం గురించి చెప్పాను. సౌకర్యాల రీత్యా గ్రామాలు పట్టణాలకు బాగా దగ్గరయ్యాయి. మానసిక సంబంధం దృష్ట్యా గ్రామానికీ పట్టాణానికీ మధ్య దూరం పెరిగింది. గ్రామాల్లో వ్యవసాయ సంబంధాల్లో మార్పులొచ్చాయి. ఉత్పత్తి విధానం మారింది. చేతి వృత్తులు దాదాపు కనుమరుగవుతున్నాయి. కనుమరుగవుతున్న ఆ దశని 2000 – 2010 మధ్య వచ్చిన కథా సాహిత్యం బాగానే పట్టుకొంది. అన్నం గుడ్డ , కుట్ర , కొలిమి , పరవ వంటి కథలు ఇందుకు మంచి ఉదాహరణలు. రైతు జీవన విధ్వంసాన్ని క్షతగాత్ర గానం , నేల తిమ్మిరి , మిత్తవ , బతికి చెడిన దేశం , రంకె , తెల్ల దెయ్యం వంటి కథలు , గ్రామీణ మానవ సంబంధాల్లో వచ్చిన మార్పుల్ని మాయి ముంత , భూమి దు:ఖం వంటి కథలు ప్రతిఫలించాయి.

నాగరికత అభివృద్ధి క్రమంలో ఇవి అనివార్య కారణాలు అని అనిపించవచ్చు ; కానీ అవి వచ్చిన వేగం , పధ్ధతి అందుకు మానసికంగా సిద్ధంగా లేని గ్రామీణ జీవితాన్ని అతలాకుతలం చేశాయి. దానిలోని అమానవీయకరణ తెలుగు కథలో ప్రతిబింబించింది.

ఆ తర్వాత కథల వస్తు స్వరూప స్వభావాలు మారాయి. వీటన్నిటికీ దూరంగా వ్యక్తిగతమైన మనోవేదన , పరాయీకరణకి గురై అందులో ఇమడలేని తనం , దాన్నుంచీ పుట్టిన అంతస్సంఘర్షణ – ఇవి కథా వస్తువులయ్యాయి. గత రెండు మూడేళ్ళుగా మా వార్షిక సంకలనాలు చూస్తే యీ ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రయోగం ప్రయోజనం కోసం కాకుండా కేవల ప్రయోగం కోసమే చేసినట్లు అనిపిస్తుంది. ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందని సమాజంలో యీ ధోరణి యిప్పుడే ప్రవేశించడం అంత ఆరోగ్యకరమైన పరిణామం కాకపోవచ్చు. కానీ ప్రస్తుతం జరుగుతున్నది అదే.

Naveen Vasireddy2

  • సామూహిక భావన , ఆచరణ వెనకతట్టు పట్టి వైయక్తిక భావనలూ ప్రయోజనాలూ ముందుకు రావడంలో ప్రపంచీకరణ ప్రభావం యే మేరకు వుంది? అది కథ వస్తు రూపాల్లో యెలా ప్రతిబింబించింది?

నిజానికి ప్రపంచీకరణ ప్రభావం సమాజంలో పెనుమార్పులకు కారణమైంది. ముఖ్యంగా తెలుగు సమాజం ప్రపంచీకరణకు ప్రయోగ వేదిక అయ్యింది. ఈ మార్పులు కేవలం ఆర్ధిక విషయాలకే పరిమితం కాలేదు ; ప్రభుత్వ నిర్ణయాల్లోకి , గ్రామీణ జీవితం లోకీ , వ్యాపారాల్లోకీ , విద్యా – ఉద్యోగ రంగాల్లోకీ , నెమ్మదిగా వ్యక్తిగత జీవితాల్లోకీ ప్రవేశించాయి. ఇంతకు ముందు  చెప్పుకొన్నట్టు గ్రామీణ జీవితం ఛిన్నాభిన్నమైంది. పట్టణ ప్రాంతాల్లో పరిశ్రమలు ఒకటొకటిగా మూతబడుతూ వచ్చాయి. అద్భుతమైన పనితనమున్న కార్మికులు పనికి దూరంగా నెట్టివేయబడ్డారు. అది వారికి తట్టుకోలేని స్థితి. ఈ స్థితిని చిత్రించిన కథలు ఈ కాలంలో  ఎక్కువగానే వచ్చాయి. ఉదా. విధ్వంస దృశ్యం , టైటానిక్ , జీవన్మృతుడు , అలజడి , మొగుడూ పెళ్ళాల ప్రేమ కత … వంటి కథలు. అలాగని కొత్తగా వచ్చిన ఉద్యోగ జీవితాల్లో భద్రత ఉందా అంటే అదీ లేదు. అభద్రతా భావం కొత్త వేతన జీవులను నిత్యం వెన్నాడుతూనే వుంది. క్రానికల్స్ ఆఫ్ లవ్ , సాలభంజిక వంటి కథలు యీ స్థితికి ప్రతీకలు మాత్రమే. దీన్నుంచీ నెమ్మదిగా కథా వస్తువు వ్యక్తిగత జీవితాలకు పరిమితమయ్యే వైపు ప్రయాణించింది. ఈ క్రమంలో కథా రచనలో శిల్ప పరమైన ప్రయోగాలూ పెరిగాయి. చంద్రుడు గీసిన బొమ్మలు , చిట్టచివరి సున్నా , రామేశ్వరం కాకులు , చిత్రలేఖ వంటి కథల్ని యిందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

  • ఒక్క మాట ; యీ పరిణామాల్ని వ్యతిరేకిస్తూ ఏదో వొక రూపంలో యెక్కడో వొక చోట ప్రజా వుద్యమాలు పురివిప్పుకొంటూనే వున్నాయి. వాటి ప్రభావంలో వస్తున్న కథా సాహిత్యాన్ని ప్రధాన స్రవంతిగా చెప్పుకొనే వాళ్ళు  యెందుకు పట్టించుకోవడం లేదు?

ప్రజా ఉద్యమాలు జరుగుతున్న ప్రాంతాల నుంచి ఆ ఉద్యమాల నేపథ్యాన్నీ ఉద్యమ జీవితాన్నీ ప్రతిబింబిస్తూ తక్కువగానైనా మంచి కథలే వస్తున్నాయి. అయితే రకరకాల కారణాలచేత అవి ప్రధాన స్రవంతిలో భాగం కావడం లేదు. పత్రికా మాధ్యమాల నిర్లిప్తత కొంత కారణమైతే , ఆ యా రచయితలు విధించుకొన్న నియమాలు పరిమితులు మరికొంత కారణం కావచ్చు. అవి ప్రధాన స్రవంతిలోకి వచ్చినపుడు తెలుగు కథ వస్తు శిల్పాల రీత్యా విస్తృతినీ వైవిధ్యాన్నీ సాధించి మరింత బలపడుతుందని నా విశ్వాసం.

  • మీ యీ పాతికేళ్ళ ప్రయాణంలో – సంపాదకుల మధ్య కథల ఎంపికలో అభిప్రాయభేదాలు వచ్చాయా – వస్తే వాటిని యెలా పరిష్కరించుకొన్నారు?

సంపాదకులం ఇద్దరం ప్రధానంగా ఒకే భావజాలానికి చెందిన వాళ్ళం అయినప్పటికీ వ్యక్తిగత అభిప్రాయాలు అభిరుచుల విషయంలో చాలా తేడాలున్నాయి. దీనివల్ల ప్రతి సంకలనంలోనూ కథల ఎన్నిక విషయంలో తీవ్రమైన చర్చలే జరిగాయి. ఒక్కోసారి అవి తారాస్థాయికి వెళ్ళిన సందర్భాలూ వున్నాయి. అయినా సంపాదకుల ఇద్దరి మధ్య వున్న సంయమన ధోరణి వల్ల యీ బంధం కొనసాగింది. కథల ఎన్నికలో తీవ్ర స్థాయిలో అభిప్రాయ భేదం వచ్చినపుడు మూడో వ్యక్తి దగ్గరకు వెళ్ళేవాళ్ళం. హరి , శివారెడ్డి , కేతు విశ్వనాథ రెడ్డి , పెనుగొండ లక్ష్మీ నారాయణ , ఎ కె ప్రభాకర్ వంటి మిత్రులకు సాహితీవేత్తలకు నిర్ణయాల్ని వదిలేసేవాళ్ళం. ఇప్పటికీ ఆ సంప్రదాయాన్ని పాటిస్తూనే వున్నాం. ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత కథ – 2015 నుంచీ కొత్త సంప్రదాయాన్ని ప్రారంభిద్దామనే ఆలోచనలో వున్నాం. మేమిద్దరం ప్రధాన సంపాదకులుగా వుంటూనే యే సంవత్సరానికి ఆ సంవత్సరం మరో ఇద్దరు సంపాదకులకు ఎన్నిక బాధ్యతను అప్పజెప్పాలనుకుంటున్నాం. బహుశా అప్పుడు ఆ  మూడో వ్యక్తి పాత్ర మేం పోషించాల్సి రావచ్చు.

  • మీరింత కష్టపడి తెచ్చే వార్షిక సంకలనాల్ని పాఠకులు యెలా స్వీకరించారు? కథల ఎంపిక విషయంలో వచ్చిన విమర్శల్ని యెలా యెదుర్కొన్నారు? ఆ  విమర్శలు తదనంతర సంకలనాల పై ప్రభావం చూపాయా?

ముందుగా కథ 90 వెలువడినపుడు ‘కథా సాహిత్యానికి మార్కెట్ లేదు , కథా సంకలనాలు అమ్ముడుపోవు’ – అన్నది పుస్తక విక్రేతల ఏకాభిప్రాయం. అది వ్యాపార నవలలు రాజ్యమేలుతోన్న కాలం. విక్రేతలూ , ప్రచురణ కర్తలూ ప్రధానంగా వాటినే అమ్ముకొని నమ్ముకొని ప్రయాణం చేశారు. అప్పటికింకా తమ కథా సంపుటాల్ని ముద్రించుకొనే పరిస్థితి రచయితలకి లేదు. ప్రచురణ కర్తల కోసం ఎదురు చూసేవాళ్ళు. కథ 90 వెలువడ్డ తర్వాత యివన్నీ అపోహలేనని తేలిపోయాయి. మేం వేసిన వెయ్యి కాపీలూ కేవలం అయిదారు నెలల్లోనే అమ్ముడుపోయాయి. పునర్ముద్రించే ఆర్ధిక వనరులు లేక ఆ పని చేయలేదు. ఇది మాకూ ఆశ్చర్యమే. వరసగా రెండు మూడు సంకలనాలు తెచ్చే ఉత్సాహం వచ్చింది. వాటి పట్ల పాఠకులకున్న ఆదరణ చూసి ఇక వీటిని కొనసాగించాల్సిందే అని నిర్ణయించుకొన్నాం. ఈ లోపు రచయితలలో ఉత్సాహం పెరిగింది. కథలు చదివే పాఠకులు పెద్ద సంఖ్యలో వున్నారని వాళ్లకు అర్థమైంది. నెమ్మదిగా రచయితలు సొంతంగా కథా సంపుటులు ప్రచురించుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత విశాలాంధ్ర వంటి ప్రచురణ సంస్థలు కథా సంపుటాలనూ సంకలనాలనూ తీసుకురావడం ప్రారంభమైంది. 95 నుంచి ఈ కథా వాతావరణం వెల్లివిరిసింది. నేటికీ అది కొనసాగుతోంది. అందులో కథాసాహితి వార్షికలు భాగమైనందుకు మాకు చాలా సంతోషంగా వుంటుంది.

అయితే యీ క్రమంలో విమర్శలూ రాకపోలేదు. విమర్శలు రెండు రకాలుగా వస్తున్నాయి. ఒకటి – కథల ఎన్నిక పట్ల పాఠకుల అసంతృప్తి , రెండు – రచయితల అసంతృప్తి. రచయితల అసంతృప్తిలో కొంత వ్యక్తిగత ధోరణులు ఉండవచ్చు. కానీ పాఠకుల స్పందనను మేం చాలా సీరియస్ గానే తీసికొన్నాం. కొన్ని సందర్భాల్లో బాధ్యతా యుతమైన , నిర్మాణాత్మకమైన విమర్శలు మా ఎంపికలోని లోపాల్ని ఎత్తిచూపాయి. వాటిని స్వీకరించాం. రచయితల అసంతృప్తి మా మీద వొత్తిడిని పెంచేది. ఒక ప్రాంతానికి , ఒక జెండర్ కి , ఒక వర్గానికి సరైన న్యాయం చేయడం లేదేమోనన్న వొత్తిడి అది. దాన్ని అధిగమించడానికి ఆ యా రచయితల రచనలను మరింత శ్రద్ధగా పరిశీలించేవాళ్ళం. ఇప్పటికీ ఆ స్థితి వుంది.

  • తెలంగాణ కథకి మీ సంకలనాల్లో సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని బలమైన విమర్శ వుంది. దానికి మీ సమాధానం యేమిటి?

మా ఎన్నిక ప్రధానంగా కథా వస్తువు  , కథా శిల్పం చుట్టూ మాత్రమే తిరిగేది. ఆ క్రమంలో కొన్ని ప్రాంతాలకీ కొన్ని వర్గాలకీ ఒక్కోసారి ప్రాతినిధ్యం లభించని మాట నిజమే( ప్రాతినిధ్య ప్రాతిపదికన వేసిన సంకలనాలు కావివని గమనించాలి). తెలుగు నేల మీద ఒక్కో ప్ర్రాంతంలో ఒక్కో సాహిత్య ప్రక్రియ బలంగా వెలువడింది. ఉదాహరణకి తెలంగాణ ప్రాంతంలో కవిత , పాట వచ్చినంత  ఉధృతంగా ఆంధ్ర ప్రాంతంలో రాలేదు. రాయలసీమలో మరీ తక్కువ. కథ నవల అక్కడ ఎక్కువ. అందుకు అనేక చారిత్రిక కారణాలున్నాయి. ఒక వ్యాసంలో కె శ్రీనివాస్ చెప్పినట్లు తెలంగాణ ప్రాంతంలో చాలా కాలంపాటు తెలుగు భాష మీద వున్న ఆంక్షలు  ఒక కారణం. వాటిని కవిత్వం పాట ముందుగా ఛేదించుకొన్నాయి. 80 – 90 ల మధ్యలో తెలంగాణలో రగిలిన ఉద్యమాలు కథకి మంచి ఊపుని తీసుకువచ్చాయి. ఆ క్రమంలో 95 వరకు మేం వేసిన సంకలనాల్లో తెలంగాణ ప్రాంత రచయితలకు మంచి చోటే లభించింది. అంతే కాదు – ఆ కథలు అన్ని ప్రాంతాల ప్రజల్నీ విశేషంగా ఆకట్టుకొన్నాయి. మళ్ళీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలయ్యాకా కవిత్వం వచ్చినంత బలంగా కథ రాలేదు. అయినా తెలంగాణా రాష్ట్రోద్యమ నేపథ్యం  ఆ ప్రాంతం నుంచి వచ్చిన  రచయితల  కథల్ని ఎన్నిక చేయడానికి మా పై పెద్ద వొత్తిడినే తీసుకువచ్చింది. వచ్చిన ప్రతి కథనీ క్షుణ్ణంగా అదనపు జాగ్రత్తతో పరిశీలించాం. వచ్చిన ఏ కథా మా దృష్టి నుంచి పోలేదని  చెప్పగలం. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాకా తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కువ కథలు వెలువడతాయని ఆశించడం అత్యాశ కాదు.

  • ఈ క్రమంలోనే సంపాదకుల అర్హతలపైనా , సంపాదకుల కథలు సంకలనంలో వుండటం పైనా ప్రశ్నలు వచ్చాయి. వాటికి మీ స్పందన యేమిటి?

ముందుగా సంపాదకుల కథలు ఉండటం గురించి మాట్లాడుకుందాం. ఇది కొత్త సంప్రదాయం ఏమీ కాదు. తెలుగు వాతావరణంలో కొత్త కావచ్చు గానీ ప్రపంచ సాహిత్యంలో సంపాదకులు కథకులు కూడా అయిన సందర్భాల్లో ఆ రచయితల కథలు సంకలనాల్లో చోటు చేసుకొన్నాయి. కాకపొతే శివ శంకర్ కథల్ని ఎన్నిక చేసినప్పుడు ఆ నిర్ణయం పూర్తిగా నాకో మూడోవ్యక్తికో మాత్రమే పరిమితం.

ఇక అర్హతల గురించి అంటారా – సంపాదకులు కథకులే అయివుండాలన్న నియమం ఏం లేదు. సంపాదకులకు కథ మంచి చెడులను నిర్ణయించే శక్తి ఉందా లేదా అన్నది ముఖ్యం. ఆ పని మంచి పాఠకుడు కూడా చేయగలడు. ఈ వార్షిక సంకలనాలు 25 ఏళ్లుగా పాఠకుల ఆదరణతో కొనసాగుతున్నాయంటే అదే సంపాదకుల అర్హతకు నిదర్శనంగా భావించవచ్చు. మేం ప్రచురించిన      ‘ రెండు దశాబ్దాల కథ’ సంకలనం కేవలం సంవత్సర కాలంలోనే రెండు వేల కాపీలు అమ్ముడుపోవడానికీ కారణం అదే.

  • అయితే యీ సంకలనాల్లో మీరు మిస్సయ్యాం అనుకొన్న కథలున్నాయా – అందుకు కారణాలేంటి? మంచి కథ అని భావించి వేసి – విమర్శలు యెదురయ్యాకా వేయకుండా  వుండాల్సింది అనుకొన్న సందర్భాలున్నాయా?

కథ ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకొన్న సందర్భంలో ఈ సంకలనాల్లో ప్రచురించలేకపోయిన కథలతో ఒక కథా సంకలనం తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక ప్రకటన కూడా ఇచ్చాం. అంటే దానర్థం మేం మిస్ అయిన కథలు ఉన్నాయనే. ఇలా మిస్ కావడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి – తొలి రోజుల్లో కథల లభ్యతలో ఎదుర్కొన్న ఇబ్బంది. మారుమూల ప్రాంతాల నుంచి వెలువడే చిన్నపత్రికల్లో వచ్చిన కథలు మాకు అందుబాటులోకి రానందువల్ల వాటిని చూడలేకపోయాం. ఒక్కోసారి జడ్జిమెంట్ లో జరిగిన లోపాలూ వున్నాయి. అటువంటి లోపాలు పునరావృతం కాకుండా వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాం.

ఇకపోతే – మేం ప్రచురించిన 339 కథల్లో ( మూడు కథలకు రచయితల అనుమతి లేనందువల్ల ఈ బృహత్ సంకలనంలో 336 కథలే వున్నాయి) కనీసం ఒక పాతిక కథలైనా ఎన్నిక చెయ్యకుంటే బాగుణ్ణు అని యిప్పుడు అనిపిస్తుంది. కథలన్నీ మళ్ళీ మళ్ళీ చదువుతూ వుండగా ఇప్పుడు కలిగే భావన అది. అయితే అవి ఆ యా సంవత్సరాల్లో వచ్చిన  కథల్లో మంచివే కదా అని సరిపెట్టుకోవచ్చు. ప్రతి సంకలనంలో వున్న కథలన్నీ పాఠకులందరికీ నచ్చాయని అనుకోలేం. మూడు /నాలుగు కథల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటూనే ఉన్నాయి.అందుకే యీ నచ్చడం నచ్చకపోవడం అనేది సంపాదకులకి యెంత subjective గా వుంటుందో పాఠకులకీ అంతే ఉంటుందని అనుకోవాలి కదా!

  • మంచి కథలు మిస్ అవడానికి కారణం మీరు కొన్ని పత్రికలు చూడరనీ వెబ్ పత్రికలు పరిశీలించరనీ ఆరోపణ వుంది….

అది నిజం కాదు. 9౦ లో మొదలు పెట్టినపుడు చక్కటి కథలు ప్రచురిస్తారన్న పేరున్న పత్రికలే గాక అందుబాటులో వున్న పత్రికలన్నీ చూసేవాళ్ళం. వాటిలో అచ్చయిన కథల్ని మాత్రమే తీసుకొన్నాం. అదే 92 నుంచి తొలిసారి సంపుటాల్లో సంకలనాల్లో అచ్చయిన కథలు కూడా స్వీకరించాం( ఉదా. ఏటి పాట – కథా వేదిక ). 2000 సంవత్సరం నుంచే వెబ్ పత్రికల్లో వచ్చిన కథల్ని సైతం చేర్చాం  ( కానుగు పూల వాన – తెలుగు కథ డాట్ కాం). కాబట్టి మేమా విషయంలో స్పష్టంగానే వున్నాం. కొందరికి తెలియక పోవడం వల్ల ఇలాంటి అపోహలు ఏర్పడ్డాయి. 2014సంకలనంలో 14 కథల్లో రెండు కథలు వెబ్ పత్రికలో వచ్చినవే.

  • పాతిక సంకలనాల్లో మీకు బాగా నచ్చిన సంకలనం యేది?

కథ 95 నాకు బాగా నచ్చిన సంకలనం. అందులో వున్నవి పది కథలే అయినా పది కాలాల పాటు నిలబడిపోయే కథలు కనీసం నాలుగైనా వున్నాయి. వస్తు శిల్పాల రీత్యా ఆ నాలుగు యీ పాతికేళ్లలో వచ్చిన ఉత్తమ కథలని నా అభిప్రాయం.

  • కథల్ని సంకలనాల్లోకి తీసుకు వచ్చేటప్పుడు – వాటి ఎంపికలోనే గాక ప్రచురణ విషయంలో యెటువంటి జాగ్రత్తలు పాటిస్తారు? అందుకు యేమైనా మెథడాలజీ రూపొందించుకొన్నారా?

కథ 90 లో చూసినట్లయితే మా పేర్లు సంకలన కర్తలుగా వుంటాయి. 93 నాటికి అది సంపాదకులుగా మారింది. అంటే కథని ఎన్నిక చేయడంతో పాటు వాటిలో కనిపించిన లోపాలను , వాక్య నిర్మాణ దోషాలను , చిన్న చిన్న కథా నిర్మాణ దోషాలను ఆ యా రచయితలకు చెప్పి వారితోనే వాటిని సరిదిద్దే ప్రయత్నం చేశాం. ఈ పధ్ధతి నిజానికి 91 లోనే మొదలైనా 93 నుంచి మరీ క్షుణ్ణంగా చదివి మార్పులు చేసుకునే వెసులుబాటు వ్యవస్థని రూపొందించుకొన్నాం. అది నేటికీ కొనసాగుతూనే వుంది. అందుకే పత్రికల్లో వచ్చిన కథలకి , అవే కథలు మా సంకలనాల్లో అచ్చైనపుడు – వున్న తేడాలు గమనించవచ్చు. ఇందుకు రచయితలు మాకు పూర్తిగా సహకరించారు. వారు అభ్యంతర పెట్టినపుడు యథాతథంగానే ప్రచురించాం.

katha90

ఇది ఇలా వుండగా పుస్తక ప్రచురణ విషయంలో కొన్ని ప్రమాణాలను నిర్దేశించుకున్నాం .కొన్ని సంవత్సరాలుగా మేం పొందిన అనుభవం నుంచి నిర్దేశించుకున్న ప్రమాణాలు అవి. అందులో ముఖ్యమైనవి – కథల తేదీలు , పత్రిక వివరాలు నమోదు చేయడం , ప్రతి సంవత్సరం అప్పటి వరకూ వచ్చిన రచయితల అకారాది క్రమ సూచీనీ  , పుస్తక ఆవిష్కరణ వివరాలను పొందుపరచడం. ప్రచురించే కథ సారాన్ని ఒకటి రెండు వాక్యాల్లో పరిచయం చేయడం కూడా అందులో భాగమే. రచయితల పరిచయాలివ్వడంలో కూడా ఒక పద్ధతిని పాటిస్తున్నాం.  రచయితల ఫోటోతో బాటు వారి పుట్టిన తేదీ , అచ్చైన తొలి కథ వివరాలు ,  కథా సంపుటుల పేర్లు రికార్డు చేస్తున్నాం. 2600 పేజీల ఈ బృహత్ సంకలనంలో కూడా 336 కథలకూ 155 మంది రచయితలకూ అకారాది క్రమ సూచిని పేజి నంబర్లతో సహా పొందుపరిచాం. నిర్దిష్ట  ప్రమాణాలకు లోబడి మాకు మేం గా రూపొందిచుకొన్న style manual ప్రకారమే కథల్ని అచ్చు వేస్తున్నాం. అందులో విరామ చిహ్నాలు కామాలూ ఫుల్ స్టాప్ లూ కొటేషన్లూ మొ. విషయాల్లో ఒక పధ్ధతి పాటిస్తున్నాం. తెలుగు పుస్తక ప్రచురణలో ఒక ప్రామాణికమైన పధ్ధతి ఆవిష్కరింపబడాలని మా కోరిక.

  • ఇంత అందంగా ముద్రిస్తూ తక్కువ ధరకి పుస్తకాలను యెలా అందించగలుగుతున్నారు?

కథ 90 ప్రచురించినపుడు దాదాపు 160 పేజీల పుస్తకాన్ని ఆ రోజుల్లో 17 రూపాయిలకే యిచ్చాం. నిజానికి ఆ రోజుల లెక్క ప్రకారం దాని రేటు 30 వుండాలి. ఆ పుస్తకంలో మాకు 3 వేల నష్టం వచ్చింది. అది మేమే భరించాం. ఆ తర్వాత తక్కువ రేటు వల్ల వచ్చే నష్టాన్ని భరించడానికి కొందరు మిత్రులు , కథా ప్రేమికులు ముందుకు వచ్చారు. 1999 నుంచి అమెరికాలోని ‘తానా’ (TANA) ప్రచురణల కమిటీ చైర్ పర్సన్ జంపాల చౌదరి చొరవ వల్ల ఈ సంకలనాల ప్రచురణలో కొంత ఆర్ధిక భారాన్ని మోయడానికి ‘తానా’ పూనుకొంది. అందువల్ల దాదాపు 200 పేజీలుండే ప్రతి పుస్తకాన్నీ ఈ నాటి వరకూ గరిష్టం 65 రూపాయిలకే ఇవ్వగలుగుతున్నాం.

మేం మా సంకలనాల్ని  అనేక నగరాల్లో పట్టణాల్లో ఆవిష్కరించడం వల్ల ఆ ప్రాంత పాఠకులకు పుస్తకాల గురించి తెలియడమే గాక అవి అందుబాటులోకి కూడా వచ్చాయి. అందువల్ల పాఠకులు వాటికోసం ఎదురు చూడటం , నెమ్మదిగా వెయ్యి నుంచి రెండున్నర వేల ప్రతుల వరకూ అమ్ముడు పోవడం జరిగింది. మొన్నటికి మొన్న తెనాలిలో కథ 2014 ఆవిష్కరణ జరిగినపుడు ఆ ఒక్క రోజే 450 కాపీలు అమ్ముడుపోవడం ఈ సిరీస్ సాధించిన విజయంగా భావిస్తాను.

‘మనసు ఫౌండేషన్’ వారు కూడా పుస్తకాలను పాఠకులకు తక్కువ ధరకే అందించే లక్ష్యంతో పనిచేస్తున్నారు కాబట్టి కేవలం 750రూ. లకే ఈ 2600 పేజీల పెద్ద  సంకలనం స్టాండ్స్ లోకి వస్తుంది. దీన్ని కూడా మా పాఠకులు ఆదరిస్తారనే కథాసాహితి నమ్మకం.

  • ‘కథాసాహితి’ భవిష్యత్ ప్రణాళికలు యేమిటి?

పైన చెప్పినట్టుగా యీ సంవత్సరం నుంచీ ప్రతి సంకలనానికి సంపాదకుల మార్పు చేయదల్చుకొన్నాం. ఒక్కొక కథా సంకలనం మీదా పాతిక సమగ్ర సమీక్షా వ్యాసాలు రాయించి ఒక పుస్తకం తీసుకురావాలనే ఆలోచన వుంది. అది  ఆ యా కాలాల్లో తెలుగు కథ , తెలుగు సమాజం ప్రయాణం చేసిన తీరు తెన్నుల్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుందని నమ్మకం. ఇది గాక – గతంలోనే రెండు సార్లు ఎంపిక చేసిన కథల అనువాదాలతో ఆంగ్లంలో పుస్తకం తేవాలని విఫల ప్రయత్నం చేశాం. అది ముందు ముందు సఫలం కావాలని ఆశిస్తున్నాం.

  • కథకోసం ప్రత్యేక పత్రిక తేవాలనే ఆలోచన యేమైనా వుందా?

ప్రస్తుతానికైతే లేదు.

  • ఈ సంకలనాలు కొత్త కథకులు తయారుకావడానికి స్ఫూర్తినిచ్చాయా?

కొత్త కథకులు తయారు కాక పోవచ్చు గానీ కొత్తగా రాస్తున్న కథా రచయితలకు ఇవి తప్పనిసరిగా తోడ్పడ్డాయి. కొత్త తరం రచయితలు తమ కథలు యీ సంకలనాల్లో రావాలని భావించడం , దానికోసం పాత తరం రచయితలతో పోటీ పడడం ఒక రకంగా మంచి పరిణామమే కదా!

  • తెలుగులో ఆధునిక సాహిత్యభాషలో వచ్చిన మార్పుని , వికాసాన్ని పరిశీలించడానికి యీ సంకలనాల అధ్యయనం ఉపయోగపడుతుందని భావిస్తారా?

తెలుగు భాషా వికాసంలో మాండలికాల పాత్ర ప్రముఖమైనది. భిన్న మాండలికాల్లో కథలు రాయడం 80 ల్లో ఊపందుకొని 90 ల నాటికి స్థిరపడింది. అన్ని ప్రాంతాల వాళ్ళూ ఇతర మాండలికాల్లోని కథలు చదవడం అలవాటు చేసుకోవడమే గాక వాటిని ఆస్వాదించడం కూడా జరిగింది. ఈ క్రమంలో 90 నుంచీ మొదలైన మా సంకలనాల పరంపర భిన్న ప్రాంతాల వర్గాల మాండలిక కథలకు వేదికయ్యింది. ఉదా. ‘నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేదా’ కథలో నడిపిన మాండలికం యెంత క్లిష్టమైనదైనా యితర ప్రాంతాల వారికి యే మాత్రం అలవాటు లేనిదైనా ఆ కథని అన్ని ప్రాంతాల వారూ వర్గాల వారూ మళ్ళీ మళ్ళీ చదివినా ఆస్వాదించగలిగారు. అలాగే ఇటీవలి కాలంలో ‘పాంచలమ్మ పాట’ వంటి అచ్చ తెలుగులో వస్తున్న కథలు కూడా భాష విషయంలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ప్రజలో నోళ్ళలో నలిగిణ పదజాలం కథా సాహిత్యంలోకి వచ్చి చేరడం తెలుగు భాషకు అదనపు చేర్పు అవుతుంది. ఈ రంగంలో తెలుగు భాషలో జరిగినంత కృషి ఇతర భాషల్లో జరగలేదనుకొంటున్నాను. ఆ కృషి కి ‘కథాసాహితి’ నెలవయ్యింది. అందుకు సంతోషం .

  • ఈ పాతికేళ్లలో కథ సాధించిన విస్తృతి కథా విమర్శలో కనపడుతుందా?

నిస్సందేహంగా కనపడదు. నిజానికి తెలుగులో సాహిత్య విమర్శ దాదాపు మృగ్యమై పోయినట్లే లెక్క. అది సమీక్షల వరకే పరిమితమై వుంది. వల్లంపాటి వెంకట సుబ్బయ్య లా సాహిత్య విమర్శనీ కథా విమర్శనీ ఒక బాధ్యతలా స్వీకరించిన విమర్శకులు దాదాపుగా లేరు. విమర్శ అంటే అదేదో తిట్టులా మారిందే తప్ప ‘క్రిటికల్ అనాలిసిస్’ అనే విస్తృతమైన అర్థం తెలుగులో లేకుండా పోయింది. అందుకు విమర్శ లేకపోవడం ఒక కారణమైతే విమర్శను సహించలేని తెలుగు రచయితల ధోరణి మరో కారణం. నిజానికి మంచి విమర్శ మంచి కథా వాతావరణానికి దోహదం చేస్తుంది. రచయిత ఎదుగుదలకీ పరిణతికి కూడా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని  విమర్శకులూ రచయితలూ లోతుగా ఆలోచించడం తెలుగు సాహిత్యానికి నేటి తక్షణ అవసరం. కథలో వచ్చిన విస్తృతి విమర్శలో రాలేదని భావించడం తప్పు కాదు.

  • 25 సంకలనాలకి సంపాదకులుగా శివశంకర్ , మీరూ రాసిన ముందుమాటలూ , అప్పుడప్పుడూ రాయించిన వ్యాసాలూ, సంకలనాలపై వచ్చిన స్పందనలూ , సమీక్షలూ – తెలుగు కథ ఉన్నతికి గానీ కథా విమర్శ అభివృద్ధికి గానీ  సహకరించాయా?

సంపాదకులుగా మేం రాసిన ముందు మాటలు అటుంచితే – వల్లంపాటి వెంకట సుబ్బయ్య  , కాత్యాయినీ విద్మహే , రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి , కె శ్రీనివాస్ వంటి వారు రాసిన యితర వ్యాసాలవల్ల కొంత మేరకు ఉపయోగం జరిగినా వాటికి కొనసాగింపుగా మా సంకలనాల బయట జరగాల్సిన చర్చ జరగలేదు. అందువల్ల మేం రాసిన ముందు మాటల్లో మేం లేవనెత్తిన అంశాల  మీద ఆశించినంత స్పందన రాలేదు. వీటన్నిటి మీదా అర్థవంతమైన చర్చ జరిగి వుంటే అది తెలుగు కథ ఉన్నతికి ఏదో ఒక రూపంలో దోహదం చేసేది.

ఈ పరిస్థితిని అధిగమించి విమర్శకులు , పత్రికలు కథని పట్టించుకొని కథా ప్రయోజనానికి ఉపయోగపడాలని ఆశిస్తున్నాం.

 

  • థాంక్యూ నవీన్ ! ఆదివారం పుస్తకావిష్కరణ సభలో కలుద్దాం.  

రోహిత్  కోసమే  కాదు…

 

 

 

-అఫ్సర్ 

~

 

1

నొప్పెడుతుందని చెప్పుకోలేని

వొకలాంటి రాత్రిలోంచి  యింకోలాంటి  రాత్రిలోకి వెళ్లిపోయావే తప్ప

రెండు కలల మధ్య  చావుని మాత్రమే అల్లుకుంటూ పోయావే తప్ప

యెవరి చీకట్లోకి నువ్వు

నీ దేహంతో సహా గబుక్కున దూకేశావో,

యెవరి గోడల్ని

పిడిబాకులాంటి  పిడికిళ్ళతో బాదుకుంటూ వుండిపోయావో

ఆ రాత్రికో ఆ వొంటరి తనానికో

యిప్పుడు నీడగా అయినా  కన్పించని నీకో తెలుసా?

 

2

మరణంలో మాత్రమే

నిన్నూ నన్నూ యెవరినైనా పలకరించే

పరమ లౌక్య లౌకిక లౌల్యంలో వున్నవాళ్ళం కదా,

నువ్వున్నంత కాలమూ ప్రతి క్షణమూ  కన్పించని/ కన్పించనివ్వని

తెలియని/ తెలియనివ్వని

లెక్కలేనన్ని గోడలకి మాత్రమే చెప్పుకున్న కథలన్నీ

నిస్సహాయ అంతః శోకంలో పంచుకున్న కేకలన్నీ

యిప్పుడే విన్పిస్తున్నాయా నాకూ నా లోకానికీ?

 

3

అద్దాలు అడ్డం పడుతున్నాయి నిజాలకి,

విదూషకుడి మాయవరణంలో నువ్వొక అబద్దమై రాలిపడుతున్నావ్!

కచ్చితంగా నువ్వు గుర్తు పట్టినట్టే

నీ గుర్తులన్నీటికి మకిలి పట్టించాక

నువ్వేదో అంతుపట్టవు యీ  కళ్ళల్లో!

 

యీ  పూటకి

కాసింత  కాలాన్ని చంపే దృశ్యమై తేలిపోతున్నావ్ నువ్వు

యీ  గుడ్డి చూపుల దర్బారులో!

ఏదో వొక దృశ్యమేగా యీ  కంటి మీద  వాలాలి

ఆ తరవాతి మత్తు నిద్రకి మాత్రలాగా-

 

4

జీవితం యింకాస్త అందంగా

యింకాస్త ప్రశాంతంగా

యింకా కాస్త నిర్మలంగా వుంటే బాగుణ్ణు అనుకొని

నిన్నటి నిద్రలోకి జారిపోతూ యీ  పొద్దుటి కల రాసుకుంటూ వున్నానా

అదే  అరక్షణ శకలంలో  నువ్వు

చివరి పదాల ధిక్కారాన్ని వాక్యాలుగా పేనుతూ వున్నావ్,

కొండని పిండి చేసే ఆగ్రహమై కాసేపూ

అంత ఆగ్రహమంతా నీటి చుక్కయి రాలిపోయే నిట్టూర్పువై ఇంకాసేపూ-

 

5

యీ పొద్దున్న

యింకో సారి అద్దం కూడా నవ్వింది

నీకు నువ్వు తెలుసా అని!

నీలోపల పేరుకుపోతున్న ఆ పెదవి విప్పని  చీకటి పేరేమిటి అని!

 

నీ చూపు చివర

వైఫల్యమనే మాయలాంతరొకటి యింకా  కాచుకునే వుంది, చూశావా? అని-

 

యింకోలాగా  మాట్లాడలేనందుకు నువ్వు క్షమిస్తావో లేదో కాని

యింతకంటే నిజం యింకోలా లేనందుకు

యివాళ

యీ శరీరమంతా వురితాడై సలుపుతోంది నన్ను-

 

*

 

 

 

వంటిల్లు కథ అదే..కొన్ని సవరణలతో…!

 

-అపర్ణ తోట

~

aparnaఉపోద్ఘాతం

రాత్రి తొమ్మిదిన్నర. లాప్ టాప్ ముందు కూర్చుని ఆమె శ్రద్ధగా పని చేసుకొంటోంది. అతను కూడా…అతనికి ఆకలి వేసింది. “ భోంచేద్దామా” అన్నాడతను. ఆమె ఇప్పటికిప్పుడు పని ఆపితే లెక్క తప్పుతుంది. అరగంట నుంచి చేస్తున్నపని మళ్ళీ మొదలు పెట్టాలి. “కాసేపు”. అందామె లాప్టాప్ నుంచి కళ్ళు తిప్పకుండా.. ఇంకో పది నిముషాలు గడిచాయి. “ఎంతసేపూ?”…విసుగు! “వస్తున్నా..” కళ్ళు మరల్చకుండా అందామె. “అయిపోవచ్చింది. ఇంకో ఐదునిముషాలు…”ఆమె లెక్క తేలడం లేదు. అతను చప్పుడు చేస్తూ లేచాడు. డైనింగ్ టేబుల్ మీద కంచం గట్టిగా చప్పుడు చేస్తూ పెట్టాడు(ఒకటే కంచం, ఆమెకు లేదు. నోట్ దిస్ పాయింట్) ఉదాసీనంగా తింటున్నాడు. ఆమె హడావిడిగా లాప్ టాప్ మూసేసి వచ్చింది. “సారీ, ఎంతకీ పని తెమలలేదు.”  “పర్లేదు.” అన్నాడు. బోల్డంత పరవా ఉందందులో…

  “పొద్దుట పూట హడావిడి పడకుండా ఉండాలంటే రాత్రికే అన్నీ సిద్దం చేసుకోవాలి. కూరగాయలు టివి చూస్తూ కట్ చేసుకోవచ్చు. అలానే పిల్లల బూట్లూ, సాక్సులూ, యూనిఫాం రెడీగా ఉంచుకోవచ్చు. పనిని సంబాళించుకోవడం లో ఉంది గృహిణుల నేర్పంతా… “కర్టసి తెలుగు మాగజైన్స్ అండ్ వనితల వంటల షోస్.

భర్తకి టీ, పిల్లలకు పాలు, పిల్లలకు పోషకాహారానికి లోటు చెయ్యకూడదు. డ్రై ఫ్రూట్స్, గుడ్లు. మరి భర్తకూ, తనకూ- కొన్ని స్ప్రౌట్స్, అందరికీ ఫ్రూట్స్, ఒళ్ళు పెరగకుండా ఓట్స్, అత్తగారు మరవన్నీ తినరు. అవసరమైతే ఒక ప్లేట్ ఇడ్లి వెయ్యాలి. మరి చట్ని? ఇంకాస్త పని. రాత్రి అన్నం- పులిహార? ఫ్రైడ్ రైస్? మధ్యాహ్నం ఒక్క పప్పు, కాస్త చారు, ఒక కూరా…పెరుగు? తోడేసానా లేదా? టిఫిన్ బాక్సులు ఏవి? పనమ్మాయి సరిగ్గా తోమిందా? అన్నం సరిపడా చల్లారిందా? లేకపోతే మధ్యాహ్నానికి వాసనొస్తుంది. మళ్ళి భర్త గారికి రోటీలు. పిల్లలు ఫ్రై తప్ప తినరు. ఈయనకి కాస్త తడికూర అయితే తప్ప రోటీ గొంతు దిగదు.

“అన్నయ్యకి కాస్త ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వెయ్యి, బాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది.” ఆడపడుచు సలహా. మగవారి ఆరోగ్య రహస్యాలెప్పుడూ వారి భార్యల దగ్గరే ఉంటాయి. మరి ఆడవారి ఆరోగ్యాలో..

ఆరింటి నుంచీ తొమ్మిదింటి వరకూ ప్రతీరోజు సాగే ట్రపీజ్ షో.

సరే మరి. ఇంత శ్రమ ఎవరి కోసమట? ఇంట్లో అందరికి ఆరోగ్యం బానే ఉందే? ఈ సూపర్ హీరోయిన్ రోల్ ఎవరి కోసం. కన్నాంబా, సావిత్రి మార్కు ఆక్షన్ సమంతా సీజన్లో ఏలా?

దాదాపు ఇరవైయేళ్ళు కావొస్తోంది కుప్పిలి పద్మ “మమత(మాతృక- జనవరి- మార్చ్ 1996) ” వచ్చి! అందులో ఇప్పటి ఆధునిక మహిళని  ఆవిష్కరించారు రచయిత. చదువు, ఇష్టపడే ఉద్యోగం. ఈ రోజుల్లో ఒక అర్బన్ మిడిల్ క్లాసు అమ్మాయికి ఈ రెండూ అంత అసాధ్యమైన విషయాలేమీ కావు.

కాని పెళ్ళి! అందులోనూ వంటిల్లు! ఇంతకూ మించిన కష్టం ఉంటుందా? ఈ కథ లో ఒక జనరేషన్ ముందు నుంచే ఉద్యోగం చేస్తున్న అత్తగారూ, అమ్మా ఉంటారు. అత్తగారికి కోడలి పరిస్ధితి అర్ధమైనా ఎక్కడో కొడుకు వ్యక్తిగత వ్యవహారంగా కల్పించుకోదు. ఇలా వ్యవహరించడం ఆమెకు తెలియని సదుపాయం ఏదైనా ఉందేమో. ఆర్నెల్లు వంటగదికే పరిమితం అయిన అమ్మాయి- భర్తతో ఉండే ఇంటిమేట్ టైమ్స్ లో కూడా ‘రేపటి వంట ఏంటి’ అని ఆలోచిస్తూ ఉంటుంది.

మొదట్లో వంటమనిషి మానేసింది. వంట బాధ్యత కొద్దిరోజులు తీసుకొమ్మని భర్త అంటే…

“నాకు వంట సరిగ్గా రాదే” అంటుంది.

“ఆ దానిదేముంది. రెండు రోజుల్లో అలవాటయిపోతుంది.”

“మీకొచ్చా”

“అబ్బెబ్బే…రాదు”

అదే మగవాళ్ళకైతే జీవితాంతం నేర్చుకున్నారాదు. ఆడవాళ్ళకు నిముషాల్లో వచ్చేస్తుంది.

అంతెందుకు వంట గురించి మాట్లాడే మోడరన్ విమెన్ అంటే అందరికీ తెలియని గౌరవం కలుగుతుంది. చీర కట్టుకోవడం, వంట రావడం- ఇవి రెండూ మన భారతీయ సంప్రదాయానికీ, సంస్కృతికీ సోపానాలు. మరి ఆడవాళ్లందుకే కదా ఉండేది! మగవారు ఎటన్నా పోనీ!

మమత అమ్మా, అన్నయ్య భార్యా మమత బాధని అర్ధం చేసుకుంటారు. నాన్నకూ, అన్నయ్యకూ అదొక విషయం లా కూడా తోచదు. పాపం మమత వంటగది నుంచే కాదు, మాతృత్వభారాన్ని కూడా వదిలించుకోవాలి. రచయిత్రి ఇక్కడ చూపిన తెగువకు వంద సాష్టాంగాలు చెయ్యాలి.

సమస్య చిన్నదే. కాని దాని వెల చాల పెద్దది. ఎంత పెద్దది అంటే ఒక జీవితం లో సగభాగమంత. రోజులో ఐదారు గంటలంత. వంటింటిని భుజాన మోసుకు తిరిగినంత. పాతివ్రత్యమంత. మాతృత్వమంత! ‘అసలు ఆడదానివేనా’, అనే పనికిరాని మాటలకు బాధపడి గిల్ట్ ను జీవితమంతా మోసేటంత. ఇష్టమైన ఉద్యోగాన్ని పక్కకు నెట్టేసేంత. ఒక మంచి నిద్రంత. ఒక చక్కని పుస్తకం చదవలేనంత. మనకిష్టమైన స్నేహితులను పక్కన పెట్టేంత. ఎంతో ఎదురు చూస్తున్న ఒక మీటింగ్ లో మంచి మాటలు వదిలి పరిగెత్తి ఇంటికి వచ్చి పోపు వెయ్యవలసి వచ్చేంత. మహానుభావురాలు మన రచయిత. ఇడ్లి లో కొబ్బరి పచ్చడి గురించి మమత పడే టెన్షన్ అర్ధం చేసుకుంది.

Art: Srujan Raj

ఇంచుమించు అదే వయసున్న భర్త. కానీ క్రికెట్, రాజకీయాలు, సినిమలాకన్నా రేపటి వంట ఏంటి? అనే కబురు బాగా సాగుతుంది.

“ఇవాళ బాంక్ లో విశేషాలేంటి?” అడుగుతుంది మమత. వెర్రిదాన్ని చూసినట్టు చూస్తూ, “ఏమైంది” అంటాడు కిషోర్

“ఏం లేదు, ఊరికే.” దిక్కులు చూస్తూ అంటుంది.

“పకోడీలు బావున్నాయా?”

“ఇంకాస్త కరకరలాడితే బావుండును.”

“దోస బాగొచ్చిందా”

“ఇంకాస్త పల్చగా రాదా?”

“పాయసం బావుందా?”

“తీపి ఎక్కువైంది. నీకు కేరళ వాళ్ళ పాయసం వచ్చా?” సో..వంతావంతకాలు..మా మధ్య ఈ సంభాషణ బాగా జరిగేట్లుంది, అనుకుంటుంది మమత.

ఈ పనితో విసిగి పోయి నేను వంట పని చేయలేను ఉద్యోగానికి వెళ్ళిపోతానని, తెగించి చెప్పన మమత తో, “నీతో చక్కగా పనులు చేయిస్తున్నానని అంతా మెచ్చుకుంటుంటే నువ్వేంటి ఆ ఏడుపు మొహం? ఏదో, పరాయివాళ్ళకి చేసినట్టు..” పితృస్వామిక వ్యవస్తను ఇంకా భుజానేసుకు తిరుగుతున్నామని చెప్పడానికి ధీటైన వాక్యమిది.

ఈ కథలో ఇంకా ఎన్నో విస్తృతంగా చర్చించవలసిన అంశాలున్నాయి. కాని, ప్రస్తుతం వంటిటి గురించి మాత్రమే మాట్లాడదామని ఆగిపోతున్నా. ఇంత మంచి కథను రెండు దశాబ్దాల క్రితమే అందించిన పద్మగారికి అందరమూ రుణపడిపోయాము.

‘ఈ రోజుల్లో వంటేటమ్మా..మా రోజుల్లో ఐతే ఈ ఫ్రిజ్జూ, మిక్సి, కుక్కర్లు లేనే లేవు. అన్ని రోట్లో దంచుకోవడం, కుంపటి మీద వాడుకోవడం. ఈ మాత్రం దానికే ఇంత రాద్ధాంతం చేస్తే ఎలా..’

‘అమ్మమ్మగారూ మీలా రోలూ, రోకళ్ళతో కష్టం పదకుండా ఉద్ధరిద్దమనేగా మేమంతా చదివి ఉద్యోగాలు చేస్తోంది. అయినా సంపాదన లో భాగం ఉన్నప్పుడు వంటగదిలో భాగస్వామ్యం వద్దా?’

అసలు మన ఆడవారి శీలపరీక్ష అంతా వంటగదిలోనే జరుగుతుంది. ఆవిడెవరో బాగా వంట చేసి వడ్డిస్తే చాలు. ఎంతటి క్రూరురాలైనా క్షమించేయచ్చు. పిల్లలను కొట్టినా, భర్త సంపాదన సరిపోవట్లేదని వేపుకుతిన్నా పర్లేదు. వంట చాలా బాగా చేసిపెడుతుంది. పెళ్లిలో క్వాలిఫై కావడానికి పొందవలసిన ప్రైమరీ డిగ్రీ! వంట సరిగ్గా రాని ఆడది కాదని కాదు కాని..ఆమెలో ఫెమినిటి పాలు తక్కువ! స్త్రీత్వ చాయలు తగ్గిపోతాయి..ఎండలో కి వెళితే రంగు తగ్గిపోయినట్లు. వంట రాకపోతే ఆడవారిలో ఆ స్త్రీత్వం దెబ్బతింటుంది—కొంచేమేలే!అయినా…

భర్త మనసులోకి దారి అతని కడుపేను. మరి భార్య మనసులోకి దారి? సారీ, ఈ విషయాలు మనకెవరూ చెప్పరు. అసలు తెలుసుకోవలసిన అవసరమేముంది. మగవాళ్ళ పెర్ఫార్మన్స్ ప్రెషర్ గురించి మనకెందుకు గాని ఆడవారి కిచెన్ పెర్ఫార్మన్స్ ప్రెషర్ ఏంటో తెలుసా మీకు- అందునా అత్తగారి తరఫు చుట్టలవారు వచ్చినప్పుడు?

ఇల్లు బాగా పెట్టుకుంది. వంట బాగా చేస్తుంది. మరి ఆమె వేరే పనులు కూడా చేస్తుంది. మీకు తెలుసా?

“తెలుసులేగానీ ఇంట గెలిచి రచ్చ గెలవాలి. అయినా ఫెమినిస్టు మాటలు బాగా నేర్చారు ఈ ఆడవాళ్ళు. వాళ్ళకేం తక్కువ. ఇంట్లోనే పనమ్మాయి, బంగారం లాంటి భర్తా..ముద్దులు మూటగట్టే పిల్లలు. ఇంకేంటి?”
“అయ్యయ్యో…ఇంకా ఉన్నాయి. ఆమెకో ఉద్యోగం ఉంది తెలుసా…ఆమె ఆఫీసులో ఎన్నో వ్యవహారాలూ యిట్టే పరిష్కరిస్తుంది. ‘ఆడవారు కబుర్లు చెప్పుకుంటారు గాని పనిచెయ్యరు అనే నానుడి’ ఆమెకు బాగా తెలుసు. అందుకే ఇంకాస్త ఎక్కువ కూడా పనిచేస్తుంది. మగవారిలా టీలకనీ సిగరెట్టుకనీ రెండు మూడుసార్లు బయటికెళ్ళదు. మొన్న సెమినార్ లో ఆమె ప్రెజెంట్ చేసిన పేపరుకి…”

“అవునా, మరిన్ని చేసినామెకి ఇల్లు చక్కపెట్టుకోవడం ఎందుకు రాదంటావు?”

“మరి మీ అబ్బాయికో..? అతనికెందుకు రాదు.”

“అయ్యో, చాలా పని చేస్తాడమ్మ…ఆమె టూర్ల మీద వెళ్ళినప్పుడు, పిల్లలని హోటల్ కు తీసుకెళతాడు. స్కూల్ లో దింపుతాడు. వాళ్ళమ్మ ఫ్రిజ్జిలో వండి పెట్టినది వేడి చేసి తినిపిస్తాడు. కానీ వంట కష్టమమ్మాయ్..మగవాళ్ళు కదా..పాపం చేసుకోలేరు!”

నిజమే చాలా మారారు మగవారు! పాపం.

ఇప్పుడు విమల చెప్పిన వంటింటి తనాన్ని గురించి మాట్లాడుకుందామా?  (‘వంటిల్లు’ కవిత; ఆంధ్రజ్యోతి’ 86)

చిన్నప్పటి జ్ఞాపకాల తరువాత ఆడతనాన్ని ఆపాదించుకునే వయసులో ముఖ్యంగా అందుకోవలసినది- వంటింటితనం!

భయం భయంగా, నిశబ్దంగా, నిరాశగా

మా అమ్మొక ప్రేతం లా తేలుతూ ఉంటుందిక్కడ

అసలు మా అమ్మే నడుస్తున్న వంటిగదిలా ఉంటుంది

నడుస్తున్న వంటగదిలా ఆడవాళ్ళు కనిపించడం మానేసి చాలాకాలమైంది అనవచ్చు. కాని ఆడవాళ్ళు ఒప్పుకోరు. చిన్నప్పుడు వారి అమ్మలు పడిన కష్టాల్లో మనం పడేవి కష్టాలే కావని చెప్పొచ్చునుగాక. వారికీ మనకీ తేడా ఉందని విషయం కూడా గుర్తిస్తే బావుండును. అదేదో మా మాస్టారు మమ్మల్ని కోదండం వేయించేవాడు, మిమ్మల్ని బెత్తంతో మాత్రమే కొడుతున్నారు అని చెప్పినట్లుగా…ఏంటో ఈ సామ్యం!

వంటగది మాత్రమే ఎదురుగా నిలబెట్టి స్త్రీల మెదడును ఎక్కడో ప్రాచీననా కాలాల్లో ఇరికించడానికి తీవ్రప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. తమ మేధస్సు ఆచూకీ తెలీక స్త్రీలు నిజంగానే తెలియని అశాంతికి లోనవుతారు.  అందుకే అంటుంది –విమల

ఒక్కోసారి ఆమె మండుతున్న పొయ్యిలా ఉంటుంది

అప్పుడు బందీ అయినా పులిలా ఆమె

వంటగదిలో అశాంతిగా తిరుగుతూంటుంది

నిస్సహాయతతో గిన్నలు దడాల్నఎత్తేస్తుంది

ఇంటి ముందు నిలబడో, బిందెల దగ్గరో కొట్టుకునే ఆడవాళ్ళని చూసి అందరూ నవ్వుకోవడం లో బోల్డంత ‘జోకు’ ఉండొచ్చుగాక..కాని అంతకన్నా భావప్రకటన స్వేచ్చని ఇవ్వలేని పితృస్వామ్య వ్యవస్ధని ఏమనగలం. సరే, అది ఒక కాలం లో జరిగింది. ఇప్పుడు ఆడవాళ్లకా ప్రారబ్ధం లేదు. ఇంచుమించుగా మధ్యతరగతి ఆడవాళ్ళందరూ  చదువుకున్నవారు. వారిలో కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు. మరి వారి పరిస్ధితేంటి? విమల చెబుతున్నారిలా…

నేనొక మంచి వంటగదిలో పడ్డానన్నారందరూ

గ్యాసు, గ్రైండరూ, సిలిండరూ, టైల్సూ…

అమ్మలా గారెలూ, అరిసెలూ గాక

కేకులూ పుడ్డింగులూ చేస్తున్నాను నేను

గిన్నెల పై పేర్లు మాత్రం నా భర్తవే.

ఈ కవిత 1986 లో రాసింది. సరిగ్గా ముప్ఫైయేళ్ళ క్రితం. నిజంగానే ఇప్పుడేం మార్పు వచ్చింది. ఒక రొటీన్ లా ఎందరు భర్తలు వంటగదిలోకి  వెళ్లి వంటతో తమ రోజును మొదలు పెడతారు? ఒక రోజు ‘చేంజ్’ కోసమో, ఒక ‘స్పెషల్ డిష్’ కోసమో కాక ఒక బాధ్యతగా ఎప్పుడు ఫీల్ అవుతారు? వంటమనిషిని పెట్టుకోవచ్చు. అది ప్రివిలేజేడ్ భార్యకు వచ్చే కన్సొలేషన్ ప్రైజ్ మాత్రమే అని ఒప్పుకుంటారా…

పాపం ఆ అమ్మాయి అంటుంది గదా…

నేనొక అలంకరించిన వంటగదిలా

కీ ఇచ్చిన బొమ్మలా ఇక్కడ తిరుగుతుంటాను

నా వంటిల్లొక యంత్రసాలలా ఉంది

ఈ యంత్రసాల ఆమెను నెమ్మదిగా ఎలా మార్చేసిందంటే….ఆమె ‘మల్లెపూలలోనూ పోపువాసనలే!!’ ఇంతకన్నా భావ దారిద్ర్యం ఇక ఉందా…వంటగది వాసనలు పడకగది వరకూ చేరుతాయి!

కూరగాయలైపోయాయి. బిగ్ బాస్కెట్ వచ్చింది. వంటగది ఇప్పుడు మోడ్యులర్ కిచెన్ అయిపోయింది. జీతం పెరిగాక కొందరు మహా అదృష్టవంతురాళ్ళకు వంటమ్మాయి కూడా దొరకొచ్చు. కానీ బాధ్యత మాత్రం- పూర్తిగా అమ్మదే. అంతేగదా అమ్మ కడుపు చూసి పెడుతుంది. మరి నాన్నేమి చేస్తాడు? నాన్న ఏమి చేసినా, అమ్మ కూడా చేయగలుగుతుంది. కాని నాన్నే పాపం. సొంతఇంటి వంటగదిలో వాలంటరీ వెలివేత తీసుకుంటాడు. అందులో ఉండే సుఖం ముందే తెలిసిన మహానుభావుడు!

శ్రమవిలువను కాల్కులేట్ చేయడంలో ఏమి తక్కువ లేదు. కాని దానికి మారకం ఏంటో తెలియడం లేదు. రోజుకు నాలుగైదు గంటల కూలి. ఆఫీసులో గంట బిల్లింగుకు వెయ్యిరూపాయిలు. మరింటిలో నాలుగు కూరలు. ఆకొన్న కుటుంబం కడుపు నింపిన తృప్తి. ఎంత సంపాదిస్తే వస్తుంది. అయ్యో… వంకల గురించీ, వెక్కిరింపుల గురించీ మాట్లాడకండి మరి.

కాదని ఎవరూ సవాలు చేయకండి. మీకు 103 డిగ్రీల జ్వరమున్న రోజున మీ భర్త తప్పక టీ పెట్టి ఇస్తారు. కొన్నిసార్లు, సూర్యుడు దారి తప్పినప్పుడో, ఆర్నాబ్ గోస్వామి నోరుమూసుకున్నప్పుడో….మీ భర్తని టీ పెట్టమనండి. ఏ కళనో టీ అందిస్తారు. ఆగండి- మరి మీరు టీ పొడి ఎక్కడుందో చెప్పారా..తిట్టుకోకండి. మరి పంచదార అనిపించకుండా పెడితే మీదే కదా తప్పు. పాలు. ఫ్రిజ్ లో ఉన్నాయని చెప్పొచ్చుకదా అంత విసుగెందుకు? కప్పులా.ఎదురుగా ఉన్నాయి కాని మీ ఆయనకీ ఆ టైం కి వంటగదిలో ఊపిరాడక కళ్ళు కనిపించడం మానేశాయి. విసుక్కుని లేస్తున్నారా..వంటగదిలోకి వచ్చి విసురుగా టీ కప్పు లాక్కున్నారా? తప్పుకదూ!

Art: Srujan Raj

Art: Srujan Raj

ఐతే వంటింటి సామ్రాజ్యానికి తాము మహారాణులమని ఇంట్లో ఏదైనా తమ కనుసైగల పైనే నడుస్తుందని భ్రమించే కొందరు ‘సూపర్ మామ్’ లు ఉంటారు. ఇలాంటి ‘కంట్రోల్ ఫ్రీక్ మామ్స్’ తో ఏం చెప్పినా చిక్కే! అన్నింటా తామే అయ్యే అడ్వర్టైస్మెంట్ అమ్మల్లా ఉందామనుకునే ఆడవారంటే జాలిపడాలి. ఆమెకు నడుమునొప్పి వస్తే కానీ ఎవరికీ, ఆఖరుకి  భర్తకు కూడా సాయం చేయాలని తోచదు. అది కూడా మూవ్ కాని విక్స్ కానీ రాసేవరకే. ఆమె బాగుపడగానే  మళ్ళీ ఆమె దారి –రహదారి- అదే వంటిటికి దారి.

మనదేశంలో వంటిల్లంటే వంటపనే కాదు. చాలాసార్లు ఆరోగ్యమూ, వ్యక్తిత్వము కూడా పెట్టుబడవుతాయి. కొన్నిసార్లు ఈ కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ లో ఆడవారు ఘోరమైన లాస్ లో పడతారు. కొన్నిసార్లు ఆరోగ్యం నష్టపోతే ఇంకోన్నిసార్లు వ్యక్తిత్వాన్ని కోల్పోయి. టైం బావుండకపోతే, కొన్నిసార్లు రెండూ తన్నేస్తాయి.

సూపెర్ మామ్ సిండ్రోమ్’- సుప్రభాతం, 20 జూన్, 1996, ఇల్లలకగానే– ఉదయం వారపత్రిక, 4 మే, 1990

సత్యవతిగారి ఈ రెండు కథలూ అదే చెబుతాయి. పైన చెప్పిన పరిస్ధితి ‘సుపర్ మామ్  సిండ్రోమ్’ లో ప్రస్తావిస్తే, ‘ఇల్లలకగానే’ కథలో ఇంటికే జీవితాన్నంతా ధారబోసిన ఆమె తన ఉనికి పూర్తిగా మర్చిపోయేంత ప్రమాదంలో పడుతుంది. కుటుంబం కొరకు సర్వమూ త్యాగం చేసే ఆడవారికి ఈ విషయం అర్ధమవుతుందా? ఆమె పేరే ఆమె వ్యక్తిత్వమైతే …ఆమె ఏది? భర్త పేరు లోనో, పిల్లలపేరులోనో, ఆ చివరింటి ఆవిడగానో ఆమె మిగిలి పోతుంది. పెళ్ళికి ముందు ఆమె చదివిన చదువులు, వాదించిన ఉపన్యాసాలూ, స్నేహితులూ…వీరంతా ఏరి. ఫన్ని విషయం ఏంటంటే- ఇల్లలికే ఈగ మాత్రమే తన పేరు మరచిపోతోంది అన్నారప్పుడు. ఇప్పుడు ఇల్లూ, ఉద్యోగమూ చక్కబెట్టే ఈగనేమనాలి? ఈగలనెప్పుడూ ఉద్యోగాలతో కొలవరు. కొలిచినా మన కుటుంబవ్యవస్ధలో దానికే గుర్తింపూ ఉండదు. ఆడవారి ఔన్నత్యాన్ని కొలవడానికి మొదటి మూడు స్థానాల్లో- కన్యత్వమూ, పాతివ్రత్యమూ, మాతృత్వమూ ఉంటాయి. కల్పనా చావ్లా, కిరణ్ బేడి, సునీత విలియమ్స్  ఇలాంటి వారింట్లో వారిని ఏమన్నారో తెలుసుకోవాలని మహా ఉబలాటంగా ఉంటుందెప్పుడూ…

చాలా చదువులు చదివాం కాని ఈ వంటింటి గోల మాత్రం తప్పట్లేదు. వంట మనుషులని పెట్టుకున్నంత మాత్రాన ఆడవారు వంటిల్లు తప్పించుకున్నరనుకోకూడదు. వంటింటి చాకిరీ నుంచి తెరపి ఉండొచ్చు కాని, నైతికంగా…అవును నైతికంగానే, వంటిల్లు, ఇంట్లో అందరికీ తిండి ఏర్పాటు చేసే బాధ్యత భార్యదే. చేయని భార్యలు లేరా అని అడగకండి. ఉన్నారు. వారిని గురించి ఎలా మాట్లాడతారో, వారికి అందే గౌరవం ఏంటో మనందరికీ తెలుసు. చాల చాలా తక్కువ సందర్భాలలో- భార్య ఉన్నతోద్యోగం చేస్తూ, వంటింటికీ ఆమెకే బాధ్యత లేదనుకునే కొన్ని ఉద్యోగాలలో ఉన్నప్పుడు మాత్రమే ఆమెకు ఈ నైతిక శీలపరీక్ష నుంచి విడుదల. లేకపోతే ఈ పరీక్షకు ఏ పూటకు ఆ పూట సిద్ధపడుతూ ఉండవలసిందే.

సామాన్య కథ “ కల్పన” లో ఇదే చర్చకు వస్తుంది. “ ఎంత పెద్ద చదువులు చదివినా ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా, ఎంత టీం లీడర్ గా ఎదిగినా ఎక్కడుందీ లోపం ఒక చిన్న కుటుంబ వ్యవస్ధ ను మేనేజ్ చేయలేకపోతున్నాం. “ అని. నిజమే. ఈ మాట అంటే నాతో ఒక పెద్దావిడ అన్నది. “ఇప్పటి పిల్లలలకి తెలివి ఉండడం లేదు. భర్తను, అత్తగారింటి వారిని ఎలా తనవైపుకు తిప్పుకోవాలో తెలీదు.” బహుశా నిజమేనేమో..ప్రేమకన్నా లౌక్యం తోనే పెళ్ళిళ్ళు నిలబడతాయనిపిస్తుంది. మరి మన చదువుల్లో వంటింటి బాధ్యతా మరియు లౌక్యం అనే అంశాన్ని కూడా చేరిస్తే బావుండు.

మరిప్పటి పిల్లలకో? చైతన్య, నారాయణ, ఐఐటి, బిట్స్ పిలాని వీటిని దాటాక ప్రొఫెషనల్ కోర్సులు- తర్వాత ఉద్యోగమూ…తర్వాత పెళ్ళి. సరిసరి. ఇప్పుడుగదా మళ్ళీ వంటింటి గురించి మాట్లాడవలసింది. సామాన్య ‘కల్పన’ కథలో కల్పన చెబుతుంది. “ ఎంతెంత పెద్ద కార్పరేట్ ఆఫీసుల్లో, యునివర్సిటీల్లో పనిచేస్తున్నాం ఇప్పటి ఆడపిల్లలం. ఎంతమంది కస్టమర్స్ ని హాండిల్ చేస్తున్నాం. విదేశాలకు కూడా ఒంటరిగా వెళ్ళి వచ్చేస్తాం. టీం ని లీడ్ చేసేస్తాం. కాని కుటుంబం విషయం వచ్చేసరికి ఎక్కడో తప్పు జరిగిపోతుంది. మన తెలివంతా ఎక్కడికి పోతుంది అనిపిస్తుంది. మన జనేరేషన్ ఆడపిల్లలం చదువు నుండి నేరుగా ఉద్యోగాల్లోకి, పెళ్ళిలోకీ వచ్చేస్తున్నాం కదా. తినడం తప్ప వంట నేర్చుకునే తీరిక కుడా ఉందని షెడ్యూల్స్ కదా మనవి.“  మరి తనను ఒకేసారి వంటగదికి పంపి అత్తగారు. తమాషా చూద్దామనుకుని బయటకు వచ్చేసారు. “ పాపం కల్పన చింతపండు వెయ్యని సాంబారు చేసిననదుకు పెద్ద రాద్ధాంతం చేసారు. అదేదో ప్రపంచ యుద్ధమైనట్టు.  ‘మమత’ కథలానే ‘కల్పన’ అత కూడా విస్తృతి ఎక్కువ. ప్రస్తుత చర్చ కోసం ఈ భాగాన్ని మాత్రమే ప్రస్తావించాను. కాని కథా మూలాలలోకి వెళితే ఎన్నో విషయాలు అర్ధమవుతాయి.

కామన్ గా వినే మాటేంటంటే…’మీరు వంట నేర్చుకోకపోతే మమ్మల్నంటారు.’ అమ్మ వైపు వాళ్ళంతా పెళ్ళికి ముందనే మాటలివి. ఎందుకంటారు? అబ్బాయి పుట్టింటివారిని ఎప్పుడైనా  అతని అత్తగారంటారా? మీరు మీ అబ్బాయికి వంటనేర్పలేదేమని?

అత్త- కోడలు మధ్య దెబ్బలాటలలో పెద్ద అంశం- వంటిల్లు ఎవరిదీ? అనీ. కోడలుకు పూర్తిగా బాధ్యత లేకపోతే అత్తకు ఇష్టం ఉండదు. అలా అని పూర్తి బాధ్యతా కోడలి మీద వేయలేదు. ఈ వంటింటి పవర్ డైనమిక్స్ చూస్తే దుఖ్ఖం వస్తుంది. కాని మన కుటుంబ వ్యవస్థ ఎంతో గొప్పది. ఇలాంటి ఆడవారి మధ్య ఇటువంటి చిల్లర గొడవల సృష్టించడం వలనే వలనే మన వ్యవస్థను కాపాడుకుంటున్నాము. ఈ గొడవలో వంటింటికి ఎవరు రాజీనామా చేసిన రాజకీయ కారణాలు వెతికినా అది సమాజానికి పెద్ద ముప్పే. ఎందుకంటే, పెళ్ళికాని మగవారికి కుటుంబమంటే ఒక వంటిల్లు కలిసిరావడం. ఆడవారికి కుటుంబమంటే వంటచేయడం. పిల్లలు పుట్టాక అడిషనల్ మార్పులు రావచ్చుగాని నిజం ఇదే. మారా వంటింటి వ్యవస్ధకే ఉసురు తగిలితే..అమ్మో, కాపురాలు కూలిపోతాయి.

శుభమా అని ఇంటిలో అందరి యోగక్షేమాలూ పట్టించుకునే దేవత లాంటి ఆడవారి హృదయాన్ని ఇలా విషపూరితం చేసే ధోరణిలో రాసే నాకు నిష్కృతి లేదు. తెలుసు. కానీ, ఈ వంటింటి పాతివ్రత్యాన్ని వదిలించుకోని ఆడవారికి ఎలా చెప్పాలి? కొత్తగా పెళ్లైన కోడలు అత్తగారింట్లో అందరి మనసుని అలరించడానికి ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకూ…పుట్టింటి నుంచి తెచ్చిన జెమినీ టీ వాడుతూనే ఉంటారు. కాలం మారింది కదా మరి వంటింటి విషయమో? ష్..ఇన్ని విషయాలు మనం మాట్లాడకూడదు.

ఉపసంహారం:

“అరే, భలే ఇంత కాలానికి కలిసామే! రా టీ తాగుదాం.”

“ఓయ్, మీటింగ్ కి వచ్చావా…టీ నా, లేదురా పనుంది.”

“ఆడవారి హక్కుల గురించి భలే మాట్లాడావే. నువ్వెప్పుడు మాట్లాడినా చాలా నేర్చుకున్నానో  అనిపిస్తుంది.”

“హక్కులే కాదు, వారి సెక్సువాలిటి లిమిటేషన్స్ నుంచి బయట పడవలసిన అవసరం ఎంతో ఉంది. అసలు “ సెకండ్ సెక్స్” అనే పుస్తకం చదివావా నువ్వు? చదివితే మతిపోతుంది.”

“నీ నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. నీలా అందరు మగవాళ్ళూ ఆలోచిస్తే ఎంత బావుంటుంది. ఇంటికి రా మాట్లాడుకుందాం.”

“ఆ..నీకే పిలుస్తావు. అసలు ఇన్నిసార్లు కలిసాం కదా. ఎన్నో ఏళ్లుగా పెళ్లాం పిల్లలు లేనివాన్ని. ఇంటికి పిలిచి భోజనం కూడా పెట్టవేమి.”

 

 

 *

 

 

 

 

 

గమనమే గమ్యం-31

 

volgaఅన్నపూర్ణ, అబ్బయ్య శారదతో మాట్లాడదామని చాలా రోజు నుంచీ ప్రయత్నిస్తున్నా  శారద వారికి దొరకటం లేదు. కబుర్లు చేసీ, ఉత్తరాలు రాసి, టెలిఫోన్లు చేసి విసిగిపోయిన అన్నపూర్ణ చిన్న పెట్టెలో వారానికి  సరిపడా బట్టలు  సర్దుకుని బెజవాడ వచ్చేసింది. సుబ్బమ్మ ఆనందం చెప్పనలవికాదు.

‘‘వారం రోజులు ఉంటావుటే – మా తల్లే, మా శారద నాకే నల్లపూసయి పోయింది ` అంత గందరగోళంగా ఉంది. పసిపిల్ల  తల్లి కోసం మారాం చేస్తోంది. కానీ ఈ పిల్ల  కోసం నా  బంగారు తల్లి ఆగితే ఎట్లా చెప్పు. ఆస్పత్రి సంగతి సరేసరి – పార్టీ వాళ్ళు ఎంతెంత పనులు , ఎంతెంత త్యాగాలు చేస్తున్నారు . ప్రాణాలకు తెగించేశారనుకో. శారద కూడా అంతేగా – ఏ క్షణంలో జైలు కెళ్ళాల్సి వస్తుందోనని నాకు కంగారుగా ఉంది ` ’’

సుబ్బమ్మ మొదలుపెడ తే ఇంక ఆ కబుర్లకు అంతుండదు. అన్నపూర్ణ ఆమెను ఆపి

‘‘దేశానికి స్వతంత్రం వచ్చింది గదమ్మా ` ఇంకా జైలుకెందుకెళ్ళాలి?’’ అంది.

‘‘అయ్యో పిచ్చిదాన – స్వతంత్రం అందరికీ ఎక్కడొచ్చింది? ఆ జమిందార్లంత కాంగ్రెస్‌లో చేరితే వాళ్ళకొచ్చింది స్వతంత్రం. రైతులు , పేదవాళ్ళు, మాల మాదిగలు  వీళ్ళందరికీ స్వతంత్రం రావొద్దూ? పార్టీ వాళ్ళకోసం పోరాడకుండా వాళ్ళకెలా స్వతంత్రం వస్తుంది?’’

అన్నపూర్ణ సుబ్బమ్మ గారికున్న స్పష్టతకు ఆశ్చర్యపోయింది.

‘‘ఐతే అమ్మాయ్‌ – నువ్వింకా ఆ కాంగ్రెసులోనే ఉన్నావా  ? పాపం ఈ పేద రైతు పొట్టకొడుతున్నారుగా మీరు ` ’’

అన్నపూర్ణ నోటమాట రాలేదు. తనెందుకిక్కడకు వచ్చిందో ఆ పని జరగదని అనిపించింది.

‘‘నేను పేద రైతు పొట్ట కొట్టేదానిలా  కనిపిస్తున్నానా  అమ్మా’’ అంది పేలవంగా నవ్వుతూ `

‘‘నువ్వంటే నువ్వు కాదులే ` మీ పార్టీ – ’’

‘‘మా పార్టీలో నువ్వన్నట్లు జమీందార్లు వాళ్ళూ వీళ్ళూ పనికిమాలిన వాళ్ళంత ఉన్నారమ్మా. కానీ ప్రభుత్వం, స్వతంత్రంగా ఏర్పడింది. ఈ గడ్డీ గాదం ఏరెయ్యటానికి సమయం కావొద్దూ? గాంధీ గారూ, నెహ్రూ గారూ ఊరుకుంటారా చెప్పు జమీందార్లు రైతుల్ని చంపేస్తుంటే. రెండొందలేళ్ళు పరాయి వాళ్ళు  భ్రష్టు పట్టించిన దేశాన్ని బాగుచేసుకోటానికి కనీసం రెండు మూడేళ్ళు సమయం కావాలా ఒద్దా – ఆ సమయంలో మనం మనం కొట్టుకుంటే ఎలా? జమీందార్లను నేనూ వ్యతిరేకిస్తాను. నాలాంటి వాళ్ళింకా ఉన్నారు. మాతో కలిసి ఒక పద్ధతిగా అన్నిటినీ మన చేతిలోకి తెచ్చుకోవాలి గానీ, ఇప్పటికిప్పుడు జమిందార్లను వెళ్ళగొట్టాలంటే కుదిరే పనేనా ? చట్టాలు  చెయ్యాలి. దానికోసం సంప్రదింపులు  చెయ్యాలి గానీ తుపాకీతో మనలో మనం పోట్లాడుకుంటే నష్టం ఎవరికమ్మా?’’

సుబ్బమ్మ ఏం సమాధానం చెప్పాలోనని ఒక్క క్షణం ఆలోచించలేదు.

‘‘లేదులేమ్మా – శారదకూ, పార్టీ వాళ్ళకూ ఈ సంగతి తెలియదంటావా ? నువ్వు చెప్పినట్టు జరగదు. ప్రజలు  పోరాడాల్సిందే ` ’’

సుబ్బమ్మ గారే ఇలా ఉంటే ఇక శారద, మూర్తీ తన మాటలు  వింటారా ? ఒప్పుకోవటం సంగతలా ఉంచి ఇంత సింపుల్‌గా తన నోరు మూయించి పంపించేస్తారేమో – అయిన సరే శారదతో మాట్లాడాల్సిందే. వచ్చిందేమో వచ్చింది. పిల్లల్ని  అబ్బయ్యకు వదిలి వచ్చింది. నటాషాతోనన్నా  స్నేహం చేసుకు వెళ్తుంది అనుకుని స్థిమిత పడింది.

రెండు రోజుల  పాటు సుబ్బమ్మకు వంటలో సాయం చేస్తూ నటాషాతో ఆటలు పాటల తో కాక్షేపం చేశాక గానీ శారద దర్శనం కాలేదు.

అన్నపూర్ణ కనిపించేసరికి అలసటంత ఎటుపోయిందో శారద హాయిగా నవ్వుతూ ఆమెను కావలించుకుంది.

అన్నపూర్ణ చంకలో ఉన్న నటాషాకూ తల్లి స్పర్శ దొరికింది ఆరురోజుల  తర్వాత .

‘‘నట్టూ – అత్తతో బాగా ఆడుకున్నావా ?’’

‘‘అమ్మా అత్త చాలా పాటలు  నేర్పింది’’ అంది నటాషా ముద్దుగా.

‘‘ఏదీ ఒకటి పాడూ’’ కూతుర్ని ముద్దు పెట్టుకుని ఒళ్ళో కూచోబెట్టుకుంది శారద.

‘‘నేనొచ్చి రెండు రోజులయింది. వారం రోజులుందామనే వచ్చాను గానీ ఈ వారమూ నువ్వు ఇంటికి రావేమోనని భయం వేసింది. నా  అద్రష్టం బాగుంది’’.

‘‘చాల్లే ` ఊరుకోవోయ్‌. పనులలా ఉన్నాయి. నేను స్నానం చేసి వస్తాను. తర్వాత  తీరిగ్గా మాట్లాడుకుందాం’’ శారద లోపలికి వెళ్ళింది.

‘‘స్నానం చేశాక అమ్మ వెళ్ళిపోతుంది. నువ్వూ వెళ్తావా ?’’

నటాషా అడిగిన తీరుకి అన్నపూర్ణ హృదయం ద్రవించి ఆ పసిదాన్ని గుండెకు హత్తుకుంది.

‘‘నువ్వు పెరిగి పెద్దయ్యి మీ అమ్మ కంటే గొప్ప పనులు  చేస్తున్నపుడు అర్థమవుతుంది నీకు మీ అమ్మ’’ చిన్నపిల్లకు  ఆ మాటలు  అర్థం కావని తెలిసీ అనకుండా ఉండలేక పోయింది.

అన్నపూర్ణ, శారద మునిగినన్ని పనుల్లో మునగక పోయిన పిల్లలకు  తనమీద నిరసన ఉంది అనే సంగతి తెలుసు.

ఇప్పుడంటే పెద్దవాళ్ళయ్యారు గానీ చిన్నతనంలో వాళ్ళకూ తల్లి తమను పట్టించుకోకుండా ఎక్కడెక్కడ కో వెళ్ళిపోతుందనే బాధ, కోపం ఉండేవి. అప్పుడు పెరిగిన దూరం పదిహేడేళ్ళ వయసులో కూడా అన్నపూర్ణ కూతురు స్వరాజ్యానికి తగ్గలేదు. పద్నాుగేళ్ళ కొడుకు మాత్రం వీలైనంత ఎక్కువగా అమ్మకు అతుక్కుపోవాలని చూస్తాడు.

రాత్రి భోజనాలయ్యాక స్నేహితులిద్దరూ కబుర్లతో మొదలెట్టి రాజకీయాలలోకి దిగారు. అన్నపూర్ణ వచ్చిన పనే అది.

‘‘ఏంటి శారదా – మీ పార్టీ వాళ్ళు దేశానికి స్వతంత్రమే రాలేదంటున్నారు’’ అని తేలిక ప్రశ్నతోనే మొదలెట్టింది.

olga title

‘‘మరి ఏం మారిందోయ్‌ ` అధికారం చేతులు  మారింది. అంతే గదా ` జమిందారీలు  పోయాయా ` భూస్వాముల  దోపిడీ పోయిందా? పెట్టుబడీదారులు  దోచుకోవటం ఆగిందా?’’

‘‘స్వతంత్రం రాగానే అవన్నీ జరిగిపోతాయా? సమయం కావొద్దా. ఎన్ని శాసనాలు  చేసుకోవాలి. ఎన్ని చట్టాలు  రావాలి. . అవతల రాజ్యాంగం  ఒకటి తయారవుతోంది. అది అందరికీ న్యాయం  చెయ్యటానికి వీల్లేకుండా అడ్డుపడేవాళ్ళున్నారు. అంతెందుకు హిందూ కోడ్‌బిల్లు  తయారవటానికి ఎంత చర్చలు  – ఇవన్నీ ఒక్క రోజులో తయారవుతాయా? ఒకరిద్దరి వల్ల అవుతాయా?

మనం వాటికోసం పనిచెయ్యాలి. మన అభిప్రాయాలు  గట్టిగా వినిపించాలి. అంతే కాదు శారదా – ప్రజల్ని తయారు చెయ్యాలి గదా – ప్రజలు  సిద్ధంగా ఉన్నారా  మనం కలలు గంటున్న సమాజానికి? భార్యాభర్తలిద్దరూ సమానులని చదువుకున్న మగవాళ్ళే ఒప్పుకోరు. మా ఆయనకెన్ని పరిమితులున్నాయో నాకు తెలుసు. మూర్తి సంగతి నీకు తెలుసు -` స్త్రీల  విషయంలో వీళ్ళే సరిగ్గా లేరే సమాజం సంగతి చెప్పేదేముంది. చట్టాలు  చేసి వాటిని జనం అర్థం చేసుకుని అంగీకరించేలా చేసే  పని మన మీదుంది. అదంత మానేసి జమీందార్లతో తొత్తులతో కిరాయి రౌడీల  చేతుల్లో అమూల్యమైన ప్రాణాలు  పోగొట్టుకుంటున్నారు మీ కార్యకర్తలు . జమీందార్ల పని అయిపోయింది ` ’’

‘‘ఎక్కడయిపోయిందోయ్‌ – వేషాలు  మార్చుకుని అంత మీ కాంగ్రెస్‌లో దూకుతున్నారు గదా ` ’’

‘‘మీరూ దూకండి – లేదా కాంగ్రెస్‌ గురించి ప్రజలకు తెలియజెప్పండి ’’.

‘‘మీ కాంగ్రెస్‌ గురించి మీరు చెప్పుకోండోయ్‌ ` నమ్ముతారు’’.

‘‘నిజం. కాంగ్రెస్‌ ఎప్పుడూ బాగాలేదు. ఇప్పుడూ బాగాలేదు. మా పార్టీ మీద నాకున్నంత కోపం నీక్కూడా ఉండదు. అంత పాడయింది. కానీ మనం పార్టీలకతీతంగా జనాన్ని చైతన్యవంతం చెయ్యాలి ` జనం మారాల్సింది లేదా ` బానిస బుద్ధులు  ఒదిలించేలా మనం చెయ్యాలా ఒద్దా ` ’’

‘‘మేం అదే చేస్తున్నామోయ్‌ ` అది భరించలేకే మమ్మల్ని వెంటాడుతున్నారు. రేపో మాపో నిషేదిస్తారని  వార్తలొస్తున్నాయి. నువ్వు మళ్ళీ సంస్కరణోద్యమం ప్రారంభించమంటావా ? మా ధ్యేయం విప్లవం. విప్లవమే సమూలంగా మార్చగలుగుతుంది’’.

‘‘విప్లవం గురించి నేను నీకు చెప్పేంతదాన్ని కాను. కానీ విప్లవానికి దాయి వేయాల్సిన సమయంలో సాయుధ పోరాటం అని సమాజంలో మార్పు తెచ్చేవాళ్ళనీ, సమాజానికి ఎంతో మంచి చేసేవాళ్ళనీ పోగొట్టుకుంటున్నారు మీరు. ఎలాంటి మనుషులు  చనిపోతున్నారో నా  కంటే నీకే ఎక్కువ తెలుసు. ఆలోచించు శారదా. కనీసం పార్టీలో చర్చను  పెట్టు ` ’’ ఆవేదనగా అంది అన్నపూర్ణ.

చనిపోతున్న కార్యకర్తలను సహచరులను తల్చుకుంటే శారదకూ దు:ఖం వచ్చింది.

‘‘ఇదంత తప్పదు – నువ్వింతగా చెబుతున్నావుగా. ఆలోచిస్తా. పార్టీలో కూడా మా అన్నపూర్ణ ఇలా అడిగిందని చర్చ లేవదీస్తా. సరేనా  . ఇక పడుకో – పొద్దు పోయింది. నేను ఉదయాన్నే ఆస్పత్రి పని చూసుకుని నా  పనిలో పడాలి. తొందరలో మహిళా సంఘం మహాసభలు  జరపాని ప్రయత్నిస్తున్నాం’’.

ఇద్దరూ నిద్రకు ప్రయత్నించారు గానీ నిద్ర రాలేదు. ఎవరి మంచ  మీద  వాళ్ళు మసలుతూనే ఉన్నారు.

అన్నపూర్ణ ఆ రోజు ఉండి  మర్నాడు  వెళ్తూ నటాషా బడికి వెళ్ళనని పేచీ పెడుతుంటే సుబ్బమ్మ గారు బతిమాడలేక సతమతమవటం చూసింది.

సుబ్బమ్మ లాంటి తల్లి ఉండటం శారద అదృష్టం అనుకుంది. శారద ఇంట్లో  ఉన్నా  లేకపోయిన ఆ ఇంట్లో జరిగే కార్యక్రమాలకు అంతు లేదు. ఒక రకంగా ఇది రెండో పార్టీ ఆఫీసు. సాంస్కతిక కేంద్రం. ఒకవైపు పెద్ద హాలుంటుంది. శారద ప్రత్యేకంగా రిహార్సిల్స్‌ కోసం అది కట్టించింది. అక్కడ నాటకాు, రకరకాల  కళారూపాలు  రిహార్సిల్స్‌ జరుగుతూ ఉంటాయి. ఒకటి రెండు ముఖ్యమైన చిన్న సమావేశాలు  జరుగుతుంటాయి. మద్రాసు నుంచో, మరో చోట నుంచో వచ్చిన ప్రముఖులకు అక్కడే బస. ఆ ఇంట్లో పొయ్యి మలుగుతూనే ఉంటుంది.

ఇదంత సుబ్బమ్మ లేకపోతే జరగదు. సుబ్బమ్మకు ఓపిక తగ్గుతున్న సమయంలో ఆమెను ఆదుకోటానికి పద్మ వచ్చింది. పద్మ సుబ్బమ్మకు మేనగోడలు . ఆ దంపతులిద్దరికీ శారదంటే ప్రాణం. శారద ఏం చెపతే  అది ఆజ్ఞ వాళ్ళకు. ఇంటి పనులు  పార్టీ పనుల్ప్ప్  అన్నీ బాధ్యతగా చేస్తుంటారు.

అన్నపూర్ణ ఆ హడావుడి నంతటినీ చూసి, దీనికి మూలస్తంభమైన శారదను మనసులో మరీ మరీ మెచ్చుకుని వెళ్ళిపోయింది.

1948 జనవరి 30. మామూలుగానే తెల్లవారింది. శారదను మూర్తిని కలవటానికి రైతు సంఘం నాయకులొచ్చారు. చల్లపల్లి  జమిందారు మీద జరిపే  పోరాటంలో విజయాలు  ఇచ్చే ఆనందం కంటే కార్యకర్తల  ప్రాణాలు  పోవటం ఎక్కువ బాధ కలిగిస్తోంది. పోలీసు జమీందారులు  వైపు. ప్రభుత్వం జమీందారు పక్షం. ఎలాంటి వ్యూహాలతో ముందుకు పోవాలనే చర్చలు  జరుగుతున్నాయి. ‘‘మనం అనుకున్న లక్ష్యం ఆలస్యమైనా  ఫరవాలేదు. కార్యకర్తల  ప్రాణాలు   చాలా ముఖ్యం. త్వరలో ప్రభుత్వం మనమీద నిర్బంధం పెంచుతుంది. దాన్ని తట్టుకోవాలి. ఒక కార్యకర్తను కోల్పోయామంటే పదేళ్ళు వెనక్కి వెళ్ళినట్టే అనుకోండి  . తెలంగాణాలో పోరాటం ఒకవైపు విజయాల  వైపు వెళ్తున్నట్టు కనిపించిన యూనియన్‌ సైన్యం  వచ్చిన తర్వాత  పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము. ఆయుధాలు  సేకరించటం కంటే ప్రజలను సమీకరించటం చాలా అవసరం. ఒకరిద్దరు సాయుధ కార్యకర్తలను చూసి తాత్కాలికంగా  భయపడతారేమో కానీ వేల మంది ప్రజలను సమీకరిస్తే  అది శాశ్వత విజయాల ను ఇస్తుంది.’’

‘‘మన రైతు మహాసభలకు లక్షమంది రైతులు  వచ్చారు గదండీ’’ అన్నాడో యువకుడు. అతనికి శారద మాటలు  బొత్తిగా నచ్చలేదని తెలుస్తోంది.

‘‘అది స్వతంత్రానికి పూర్వం. ఇప్పుడు ప్రజల్లో మార్పు రాలేదా?’’

‘‘మన కృష్ణాజిల్లా ప్రజల్లో మార్పు రాలేదు. స్వతంత్రం వచ్చినా  కాంగ్రెస్‌ అంటే మండ పడుతున్నారు. మనం స్వతంత్ర పోరాటానికి భిన్నంగా యుద్ధానికి సహకరించినపుడే రైతులు  మనతో ఉండి  మహాసభకు బళ్ళు కట్టుకుని, నడచీ వచ్చారు . ఇప్పుడు కూడా రైతులు  మనతోనే ఉన్నారు’’.

శారదకు పరిస్థితి అర్థమైంది. యువకులంతా  తెలంగాణా పోరాటం తో  ఉత్తేజితులై ఉన్నారు. వారితో వాదించి లాభం లేదు. అనుభవమే వారికి నేర్పాలి.

రైతులు  పెట్టవలసిన జమిందారీ వ్యతిరేక డిమాండ్ల గురించి చర్చలు  మళ్ళించి సాయంత్రానికి వాటికొక రూపం తెచ్చారు . సాయంత్రం అందరికీ కాఫీు వచ్చాయి. సమావేశం ముగిసింది గనుక అందరూ విడిపోయి ఇద్దరు, ముగ్గురు కలిసి ముచ్చట్లాడుతున్నారు. కొందరు సిగరెట్‌ తాగేందుకు బైటికి వెళ్ళారు. శారద హాస్పిటల్‌కి వెళ్ళటానికి తయారవుతోంది.

మూర్తి హడావుడ గా లోపలికి వచ్చి

‘‘శారదా – గాంధీ – గాంధీజీని హత్య చేశారు’’. అరిచినట్టే చెప్పాడు. శారదకొక క్షణం ఏమీ అర్థం కాలేదు.

‘‘గాంధీజీ మరణించారు. ఆయన్ని చంపేశారు’’.

‘‘ఎవరు’’ శారద కళ్ళనుంచి కన్నీళ్ళు కురుస్తున్నాయి.

‘‘ఇంకా తెలియదు’’. రేడియో పెడుతున్నాడు.

శారద కుర్చీలో కూలబడింది. గుండేలు దడదడ కొట్టుకుంటున్నాయి. ఒళ్ళంత నీరసం కమ్మేసింది. ఎన్నడూ ఇలా జరగలేదు శారదకు. రేడియోలో చెబుతున్నదేమిటో వినబడటం లేదు.

గాంధీ లేరు. చనిపోయారు. సహజ మరణం కాదు. హత్య. చంపేశారు. ఎవరు? జాతిపితను కాల్చేసిందెవరు? ఎవరికంత కోపం ఆయన మీద. హిందూ ముస్లిం కలహాలను ఆపే  క్రమంలో ఆయన చేసిన కృషికి ఎవరు కోపగించారు. హిందువులా? ముస్లిములా? ఉన్మాదానికి  మతమేమిటి? కానీ గాంధీ హిందువు. ఒక ముస్లిం ఆయనను చంపాడంటే దాని పర్యవసానాలు  ఊహించలేం. మళ్ళీ మారణకాండ. శారదకు గాంధీ గురించీ, ముస్లింల  గురించీ కూడా గుండెల్లోంచి దు:ఖం తన్నుకొచ్చింది.

‘‘శారదా – గాంధీని చంపింది ఆరెస్సెస్‌ వాళ్ళు. నాధూరాం  గాడ్సే అట తెలిసింది’’.

శారదకు కొంచెం తెరిపనిపించింది.

‘‘ఆరెస్సెస్‌ వాళ్ళ క్రూరత్వానికి  అంతే లేదా? హత్యా రాజకీయాలా? ఎవరిని వాళ్ళు చంపింది – ఇడియట్స్‌. జాతిద్రోహలు . మారణకాండకు నాయకులై ఏం సాధిస్తారు’’.

శారద కోపంతో ఊగిపోయింది. విషయం తెలిసి జనం గుంపుగా కూడుతున్నారు.

***

 

వారిదే కథాకాశం..!

 

-చందు తులసి

~

 

చందు“రాయడమంటే ……నడిరోడ్డులో నిన్ను నువ్వు నగ్నంగా నిలబెట్టుకోవడం..!

రాయడమంటే ఏమనుకున్నావు? రాయడమంటే  నీ లోపలున్న  అగ్నిగుండాన్ని బద్దలు చెయ్యడం. రాయడమంటే ఒక తపస్సు. అన్కాన్షియస్ సెల్ఫ్ నుండి విసిరేయబడ్డ ఎన్నో నిన్నులను జల్లెడ బట్టడం. రాయడమంటే నీ కళ్లు తెరిపించే అనుభవం. రాయడమంటే నడిరోడ్డులో నిన్ను నువ్వు నగ్నంగా నిలబెట్టుకోవడం. అలా ఒక పేజీ అయినా రాయగలిగితే మనసుకి శుద్ధి జరుగుతుంది. జ్ఞానోదయమవుతుంది. అసౌకర్యంగా అనిపించినా నిన్నొక కొత్త వ్యక్తిగా ఆవిష్కరించుకుంటావు.”

ఈ వాక్యాలు  గత ఏడాది సారంగలోనే వచ్చిన వెంకట్ సిద్ధారెడ్డి-సోల్ సర్కస్ కథలోనివి.

***
నిజమే. రాయడమంటే మన లోపల మనం చేసే అన్వేషణ. ప్రస్తుత మన స్వరూపమేమిటో తరచి చూసుకొనే పరీక్ష. ఆదర్శాలు, విలువల రాళ్లతో ఘర్షణ పడి కుబుసం వదిలించుకొని…సరికొత్త రూపం పొందటానికి పడే ఘర్షణ.  ఈ ప్రయాస ఎదుర్కొనేందుకు చాలా కష్టపడాలి. బహుశా అందుకేనేమో ఒక దశ దాటిన కథకుల వేగం తగ్గిపోతుంది.  ఒక్క అక్షరం రాయడానికి వేయి ఆలోచనలు చేయాల్సి ఉంటుంది.

ఇదంతా ఎందుకంటే తెలుగులో ఇప్పుడు సీనియర్ కథకులు చాలామంది అస్త్ర సన్యాసం చేశారు. ఒకరిద్దరు మాత్రం అప్పుడప్పుడూ చాలా తక్కువగా రాస్తున్నారు.  ఓ వైపు  సీనియర్ కథకులు క్రమంగా తెరమరుగవుతుంటే ఏడాదికేడాది కొత్త కథకులు వేదికపైకి వస్తున్నారు.

గత ఏడాది నామిని రాసిన కథ కోరిన కొండ మీద వాన. తిరుపతి నగరంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారం చుట్టూ తిరిగే కథ.  భూములకు పెరుగుతూ , మనుషులకు తగ్గిపోతున్న ”విలువ” గురించి జమునమ్మ  అనే పాత్ర నేపథ్యంలో చర్చిస్తుంది. అలాగే మరో సీనియర్ కథకుడు రామా చంద్ర మౌళి రాసిన కథ దిగడానికి కూడా మెట్లు కావాలి. చక్కని శిల్పంతో పాటూ…చిక్కని కథనంతో సాగిపోయే కథ. జీవితంలో ఎదుగుదల కోసం ఉష అనే గాయని సాగించిన గాథ… కథలా కాకుండా ఒక వ్యక్తిత్వ వికాస పాఠం లాగా అనిపిస్తుంది. ఎదుగుతున్నామనుకుంటూ…ఎటు దిగజారుతున్నామో లోతుగా చర్చిస్తుంది.

పురుషాధిక్య భావజాలం, పేద ముస్లింల జీవితాలు, పేదరికంలోని అనుబంధాలను సున్నితంగా వివరించిన కథ  స్కైబాబా రాసిన అన్ మోల్ రిష్తే. టీవీ ప్రోగ్రాములు, ప్రకటనల ద్వారా మనం ఏం కోల్పోతున్నామో, దానికి పరిష్కారమేంటో కొత్తగా చెప్పిన కథ అరిపిరాల సత్యప్రసాద్ రాసిన  అబ్సలీట్ రియాలిటీ.  మహలక్ష్మమ్మ అనే చారిత్రక పాత్ర చుట్టూ అల్లిన ప్రయోగం దాట్ల దేవదానం రాజు కథ మన్యం వోరి మేడ. ఇలా సీనియర్ కథకులు తమదైన ముద్రతో సాగిపోతుంటే….కొత్త రచయితలు కూడా విభిన్న రకాల ప్రయోగాలతో ఆకట్టుకున్నారు.

గత ఏడాది వచ్చిన కొత్త తరం కథకుల్లో ప్రత్యేకించి చెప్పాల్సిన వాళ్లు కొంతమంది ఉన్నారు. రకరకాల కారణాలతో…రంగురంగుల ముసుగులు కప్పుకొని…పైకి ఆనందపు భ్రమల్లో జీవిస్తూ, అంతర్లీనంగా మౌనంగా కుమిలి కుమిలి రోదించే అంతరాత్మలకు, పరదాలను తొలగించి… అసలు జీవించడం అంటే ఏమిటో చూపించిన కథ వెంకట్ సిద్దారెడ్డి సోల్ సర్కస్.  కథ  పేరు దగ్గర నుంచి… కథను నడిపించిన తీరు, కొటేషన్లలా దాచిపెట్టుకోదగిన వాక్యాలు, కథ ముగింపు…ఇలా అన్ని రకాలుగా ప్రత్యేకత సంతరించుకున్న కథ.  సారంగలో మాత్రమే కాకుండా గత ఏడాది వచ్చిన తెలుగు కథల్లోనే ఉత్తమ కథగా సోల్ సర్కస్ ను చెప్పుకోవచ్చు.  అలాగే ఈ కథలోని చిత్వాన్ పాత్ర కూడా పాఠకులను చాలా కాలం వెన్నాడుతుంది.  వెంకట్ సిద్దారెడ్డి రాసిన కాక్ అండ్ బుల్ స్టోరీ, టైం ఇన్ టూ స్పీడ్ కథలు కూడా పాఠకులను ఆకట్టుకున్నాయి. ఐతే కాక్ అండ్ బుల్ స్టోరీ మాత్రం..కథను నడిపించడంలో కొంత సమన్వయం తప్పినట్టు అనిపిస్తుంది. మొత్తానికి ఇతివృత్తం ఎలాంటిదైనా శిల్పంతో ఆకట్టుకోవడం వెంకట్ సిద్దారెడ్డి కలం బలం.

“జీవితమంటే ప్రయోగం చెయ్యాలి. ధైర్యం చెయ్యాలి. కష్టాలుంటాయి. కన్నీళ్ళుంటాయి. ఒంటరితనం ఉంటుంది. ఏకాంతం ఉంటుంది. ప్రేమించేవాళ్ళు ఉంటారు. ద్వేషించే వాళ్ళు ఉంటారు.  జీవితం…ఎవరికి వారు వారి జీవితానికి తగినట్లు చేయాల్సిన సాధన”  అంటూ చిన్నచిన్న పదాలతోనే జీవితానికి సరికొత్త భాష్యం చెప్పిన కథ పింగళి చైతన్య తనదే ఆ  ఆకాశం.  సహజంగా,  సరళంగా…ఒక ప్రవాహంలా సాగిపోయే కథ.  ఒక ఒంటరి మహిళపట్ల సమాజానికుండే అభిప్రాయాలు, సందేహాలకు …తనదైన సొంత వ్యక్తిత్వంతో సమాధానం ఇచ్చిన లక్ష్మి కథ. సాధారణ ఫెమినిస్టు కథలకు భిన్నంగా ఉండడంతో పాటూ లక్ష్మి పాత్రను నడిపించిన తీరు, రచయిత్రి శైలి కూడా పాఠకులను ఆకట్టుకుంటుంది. అలాగే కులాంతరం వివాహం చేసుకున్న మహిళ సమస్య…నామాలు కథ కూడా ఆసక్తికర చర్చకు దారి తీసింది.

Untitled-2

అల్లం కృష్ణ చైతన్య రాసిన …చుక్కలు తాకిన చేతులు కథ కూడా శైలి పరంగా భిన్నమైన కథ. రెండు వేరు వేరు కథలను…రషోమాన్ తరహా టెక్నిక్ తో చెప్పిన ఈ కథలోని మార్మికత పాఠకులను మెప్పిస్తుంది. ఇక భిన్న నేపథ్యంతో పాటూ, తనదైన భాషను, తనదైన ముద్రతో దూసుకొస్తున్న మరో కలం అల్లం వంశీ. ఒక సమస్యను కేవలం ఏకరవు పెట్టడం  కాకుండా…సున్నితంగా చర్చించడం,  మానవ సంబంధాలను బలంగా చెప్పడం వంశీ బలాలు. రిజర్వేషన్ అంశాన్ని మిరకిల్ కథలోనూ, తెలంగాణ-ఆంధ్ర జీవితాల్లో వైవిధ్యాన్ని రెండు పట్టాలు-ఒక రైలు కథలో చర్చించిన తీరు….సహచరి కథ నడిపించిన తీరూ ఆకట్టుకుంటాయి.

వైవిధ్యమైన ఇతివృత్తాలను, కవితాత్మకంగా చెపుతున్న మరో రచయిత్రి వనజ తాతినేని.  ఫేస్ బుక్ అనుబంధాలకు మతం, లింగ బేధం లేదని చెప్పే స్నేహితుడా! రహస్య స్నేహితుడా.., మీడియా రంగంలో మహిళలపై వేధింపులను చర్చిస్తూ కుక్కకాటుకు-చెప్పుదెబ్బ లాంటి పరిష్కారాన్ని చూపిన కథ పిడికిట్లో పూలు. ఇతివృత్తాన్ని అందంగా చెప్పే వనజ తాతినేని కథలు ఆసాంతం చదివిస్తాయి. శైలి పరంగా షాజహానా-మనిషి పగిలిన రాత్రి ప్రత్యేకమైన కథ. అద్భుతమైన చైతన్య స్రవంతి పద్ధతిలో,  ఒక మహిళ భావాలకు అద్దం పట్టిన కవిత్వం లాంటి కథ.
బొట్టు, అదే ప్రేమ లాంటి కొత్త తరహా ఇతివృత్తాలతో ఆకట్టుకున్న మరో యువ రచయిత్రి ఎండ్లూరి మానస. ముఖ్యంగా అదే ప్రేమ కథలో ఒక సున్నితమైన అంశాన్ని చర్చకు పెట్టారు. స్వేచ్ఛ, లెటర్స్ , కీమాయ కథలతో ప్రజ్ఞ వడ్లమాని కూడా మెప్పించారు.  మైడి చైతన్య రాసిన నెర్లిచ్చిన అద్దం, అసంపూర్ణం కథలు శిల్పం, శైలి పరంగా ఆలోచింపజేస్తాయి. ది ప్రొఫెషనల్ కథతో గమన,  కృష్ణజ్యోతి కథ- పతి పత్నీ ఔర్ జస్ట్ నథింగ్, స్నాప్ ఔట్ కథతో మమత కొడిదెల, మయూఖ కథతో సెలవు లాంటి రచయితలు కొత్త తరం….భవిష్యత్ కథపై ఆశాభావాన్ని, భరోసాని కలిగిస్తారు. మొత్తంగా కొత్త తరం రాస్తున్న కథలని పరిశీలిస్తే  ఇతివృత్తం కన్నా శైలికి, శిల్పానికి ప్రాధాన్యం పెరగడాన్ని మనం గమనించవచ్చు. కొత్త కొత్త ప్రయోగాలు, భిన్న పోకడలతో  ప్రత్యేక గుర్తింపు కోసం,  తెలుగు కథని ఇంకో మెట్టు ఎక్కించడానికి కొత్త తరం కలిసి కట్టుగా చేస్తున్న ప్రయత్నించడం నిజంగా సంతోషకరం.

శైలి, శిల్పం పరంగా కె.ఎన్. మల్లీశ్వరి రాసిన రూబా, శైలజా చందు-వాన కథ, మైథిలి అబ్బరాజు- రాజహంస,  జి. వెంకట కృష్ణ-స్మృతి, ఉత్తమ కథలు. ఇంకొన్ని కథల్లో అసలు తీసుకున్న ఇతివృత్తాలే చర్చకు దారి తీసిన కథలూ ఉన్నాయి. వాటిల్లో పి. వసంత లక్ష్మి రాసిన వారిజ కథ ప్రధానంగా చెప్పుకోవచ్చు. తల్లి కావడానికి పెళ్లి చేసుకోకుండా…జీవితంతో కొత్త ప్రయోగం చేసిన మహిళ కథ వారిజ.  సహజీవనాన్ని కేవలం మాతృత్వానికి మాత్రమే పరిమితం చేసిన వారిజ నిర్ణయం కొత్తగా ఉన్నా …ఆచరణ సాధ్యమా అనే సందేహాన్ని, ఆ తర్వాత పర్యావసానాల గురించి ఆలోచింపచేస్తుంది. తాత్కాలిక ఆకర్షణలకు లోనై వివాహ బంధాన్ని చిన్నాభిన్నం చేసుకున్న మహిళ కథ బుద్ధి యజ్ఞమూర్తి రాసిన తెగని గాలి పటం. ఈ కథలో కమలిని పాత్ర ప్రవర్తన, అందుకు ఆమె భర్త శేఖర్ ప్రతిస్పందన విచిత్రంగా ఉంటాయి.

ఇదే తరహా అంశంతో లివ్-ఇన్ రిలేషన్ షిప్ గురించి చర్చించిన మరో కథ కృష్ణవేణి రాసిన తెగిన గాలిపటం. ఈ తరహా కథలన్నీ ఆధునిక మహిళల ఆలోచనలకు అద్దం పడుతూ… వివాహ వ్యవస్థలో ఇమిడిపోలేక ఎదుర్కొంటున్న సంఘర్షణను చూపిస్తాయి. కానీ వాటికి రచయితలు చూపిన పరిష్కారం సమంజసమా ( ముఖ్యంగా వారిజ కథలో ) అనే సందేహం కలుగుతుంది.
ఇక్కడో ఆసక్తి కరమైన విషయమేమిటంటే…మిగతా సాహిత్య ప్రక్రియల సంగతి ఏమోకానీ ఇటీవలి కాలంలో కథా ప్రక్రియలో పురుషుల కన్నా మహిళా రచయితలే అధికంగా రాస్తున్నారు. ఒకప్పుడు నవలా ప్రక్రియను మహారాణుల్లా ఏలిన మహిళలే…సమీప భవిష్యత్తులో తెలుగు కథను కూడా తమ చేతుల్లోకి తీసుకొనే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఐతే ఇందుకు దారితీస్తున్న పరిస్థితులేమిటి..?  ఏ కారణాల చేత మహిళా రచయితలు అధికంగా రాస్తున్నారు.?  ఏ అంతర్గత సామాజిక పరిస్థితులు వారిని ఈ దిశగా నడిపిస్తున్నాయన్నదీ తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.

( ముగింపు వచ్చేవారం )

మా అనసూర్యక్క ఓ కన్నీటి జీవనది

ARIF4

చిత్రం: సృజన్ రాజ్

-కందికొండ 

~

kandiగామధ్య మాచెల్లెకు ఆపరేషనయ్యిందంటే చూసొద్దామని నేను మా భార్య, మా పిల్లలు కలిసి వరంగల్లుకు పోయినం. మాచెల్లె అత్తగారూరు ‘‘రేకంపల్లి’’ నర్సంపేట మండలానికి పడమర దిక్కున ఓ ఏడెనిమిది కిలోమీటర్లుంటది. ఉత్తశేతుల్తోటి పోతె మంచిగుండదని పోతాంటె పోతాంటె హన్మకొండల ఓ రొండుమూడు రకాల పండ్లు తీసుకున్నం. ‘‘రేకంపల్లి’’కి పోయేసరికి పొద్దుగూకింది. మా చెల్లోల్ల ఇంటిముందుకు పోంగనే ఇంట్ల నుంచి మా అవ్వ (అమ్మ) బయిటికచ్చింది. మా అవ్వ మా చెల్లెకు ఆపరేషనయినకాన్నుంచి మంచి శెడు అర్సుకునెదానికి మా చెల్లె దగ్గెర్నె వుంటాంది. మమ్ములజూసి కాళ్ళు శేతులు కడుక్కోండ్లన్నది. మేం ‘‘గోలెం’’ కాడికిబోయి కాళ్ళు రెక్కలు కడుక్కున్నం. ఇంట్లకుబోయి మా చెల్లె పండుకున్న మంచంపక్క కుర్సీలల్ల కూసున్నం. మా చెల్లెతోని మంచిశెడు ఇసారిచ్చినం. తీసుకపోయిన పండో, ఫలమో ఇచ్చినం. ఇంతల్లకే మా అవ్వ నాలుగయిదు ‘‘గిద్దెల’’ బియ్యం ఉడుకబెట్టి ఇంత పప్పుశారు జేసింది. నపరింత సల్లబడ్డం. పప్పుశారు మస్తు రుచున్నది, అది కిరాణందుకాండ్ల కొన్న కందిపప్పుకాదు మా చెల్లోల్ల చేన్ల పండింది. పట్టిచ్చి పొట్టుతోనే వండింది. అందుకే అంత రుశున్నది.

రాత్రి పది గంట్లకు పండుకునే ముందు  ఎగిలిబారంగనే (ఎర్లిమార్నింగ్‌) లేశి మేం హైదరాబాదుకు పోతమని మా అవ్వతోని శెప్పినా. హైదరాబాదుకు వద్దు ‘‘నాగూర్లపల్లె’’కు పోదాం అందరం కలిసి ఊళ్ళె ‘‘బద్దిపోచమ్మ’’ను చేసుకుంటానం’’ అని మా అవ్వన్నది. ‘‘నాగూర్లపల్లె’’ మా ఊరు ఇది ‘‘నర్సంపేట’’ మండలానికి ఉత్తరం దిక్కున నాలుగు కిలోమీటర్ల దూరం వుంటది. ‘‘చెల్లెకు ఆపరేషనయి మీ పరేషాన్ల మీరే వుంటిరి. ఇప్పుడు ఈ ‘‘బద్దిపోచమ్మ’’ను ఎందుకు జేత్తాండ్లే’’ అన్న. అప్పుడు మా అవ్వ ‘‘మన అనసూర్యక్కకు నాలుగయిదు నెలల నుంచెల్లి పానం మంచిగుంటలేదు తిరుగని దవాఖాన లేదు, వాడని మందు లేదు. ఎంతకు నయం అయితలేదు, మనిషి మస్తు గుంజింది, రాత్రిపూట నిదురబోతలేదు, ఆయిమనంగ నాలుగు బుక్కల బువ్వ తింటలేదు, అంత భయం భయం అయితాందట, గుండె దడచ్చినట్టయితాందట, మనిషి మనకాలి వుంటలేదు, ఊకె ఏడ్తాంది. అనుమానమచ్చి దేవున్నడిగిత్తె ‘‘బద్ది పోచమ్మ’’ కొంటెతనమన్నరు. అందుకే అందరంగలిసి ఓ యాటను తెచ్చి ‘బద్దిపోచమ్మ’’కు శేత్తానం అని విషయం మొత్తం ఇగురంగ జెప్పింది.

నాకు ఎంటనే మా ‘‘అనసూర్యక్క’’ యాదికచ్చి, నా కండ్ల్ల మెరిసింది. ఆమె మా మేనత్త మా నాయిన చెల్లె. మా తాత పేరు కట్టయ్య. ఆయనకు మొత్తం అయిదుగురు సంతానం. మొదటాయినే మా నాయిన, రొండొ ఆయినే ఇంకో చిన్నాయిన. మూడో ఆమే మా ‘‘అనసూర్యక్క’’, నాలుగో ఆయినె, ఐదో ఆయినే ఇంకో ఇద్దరు చిన్నాయినున్నరు. మా మేనత్త అసలు పేరు ‘‘అనసూయ’’ కాని అందరం అనసూర్యక్క అని పిలుస్తం. మా నాయిన, మా తాత, మా నాయినమ్మ, మా నాయిన ఎనుకాయినె మా బాబాయి ఈ నలుగురే ఆమెను ‘‘అనసూర్య’’ అని పేరుబెట్టి పిలుస్తరు. మా అక్కంటె అందరికి అంత గౌరవం.

మేం పొద్దున్నే చీకటితోటి లేశి మా ఊరికి పోయినం. మా ఇంటికి తూర్పు దిక్కున మా తాత కట్టయ్య ఇల్లుంటది. రొండురూముల బెంగుళూరు పెంకుటిల్లు. దానికి ఆనిచ్చి ఇంటి ముందుకు చిన్నరేకు షెడ్డు ఏషిండ్లు. ఆ రేకు ‘‘సాయబాను’’ కింద కూసునెదానికి పొడుగుగా ఓ అరుగుంటది. నేనెప్పుడు మా ఊరికిపోయిన రోజుల ఎక్కువసేపు ఆ అరుగుమీదనే కూసుంటా. మా కట్టయ్య తాత సచ్చిపోయి మూడు సంవత్సరాలయితాంది.ఆ తరువాత సంవత్సరంనర్థానికి మా నాయినమ్మ కూడ సచ్చిపోయింది. ఇప్పుడు ఆ ఇంట్ల మా ‘‘అనసూర్యక్క’’ ఒక్కతే వుంటాంది. ఎప్పటి లెక్కనే పోయి మా కట్టయ్య తాతోల్ల రేకు షెడ్డు కింద అరుగుమీద కూసున్న. నన్ను సూశి మా అనసూర్యక్క వచ్చి నా పక్కపొంటి కూసున్నది. ఆమెను సూడంగనే నాకు చానా బాధయ్యింది. మనిషి మొత్తం బక్కగయ్యింది. రొండుమూడు సంవత్సరాలకిప్పటికి సగమయ్యింది. ‘‘ఎప్పుడచ్చిండ్లురా బిడ్డ అంత మంచేనా’’ అన్నది. ‘‘ఆ… అంత మంచే అక్కా రాత్రొచ్చినం’’ అన్న. మంచిశెడు మాట్లాడుతానం. మాట్లాడుతాంటె, మాట్లాడుతాంటెనె ఆమె కండ్ల్ల నీళ్ళూరుతానయ్‌, నిమ్మలంగ నిమ్మలంగ ఆమె కండ్ల్లకెళ్ళి నీళ్ళు వడుత్తానయ్‌. అరె ఎందుకు ఏడుత్తానవ్‌ ఊకో అక్క… అన్న. ఆమె దు:ఖం ఆపుకోలేక బాగ ఏడుస్తాంది. కండ్ల అద్దాు తీసి పక్కన బెట్టింది, ఊకో అక్క ఊకో అని కండ్లనీళ్ళు తుడిసినా ఆమెకు దు:ఖం అసలే ఆగుతలేదు. ఆమె కండ్లపొంటి నీళ్ళు కారుతనే ఉన్నయ్‌. కారెనీళ్ళను కొంగుతోని తుడుసుకుంట ఏడుస్తాంది. ఆమె అట్ల ఏడుస్తాంటె నాక్కూడ మస్తు ఏడుపచ్చింది, ఆమెను ఎట్ల ఊకుంచాల్నో అర్దంగాక నాకండ్లకెళ్ళి గూడ వట్ట వట్ట నీళ్ళు వడుత్తాంటె నాకు అప్సోస్‌(ఆశ్చర్యం) అనిపిచ్చింది. ఎందుకంటె గుండెను కాలిసె ‘‘ఎత’’ నా లోపల వున్న కూడ నా కండ్లకు నీళ్ళురావ్‌. అసొంటి నేను గూడ ఏడిసిన. అట్ల శానాసేపు ఆమె ‘‘సొద’’ సల్లారెదాక ఏడిసింది. ‘‘కొంచెం ఏడుసుడు ఆపినంక ‘‘ఎందుకు ఏడుస్తానవ్‌ అక్క నీకేం తక్కువయ్యింది మేమంత లేమా’’ అన్న ‘‘కంటిమీద రెప్పవాల్తలేదురా బిడ్డ. తిండసలే సయించుతలేదు. పాణం మన కాలి వుంటలేదు.. ఎటోపోతాంది, కయాల్‌ తప్పుతాంది, గుండెదడత్తాంది, అంత భయంభయమయితాంది, ఒంటరి బతుకయిపోయిందిర. సచ్చిపోవాలెననిపిస్తాంది’’ అనుకుంట కొంగుతోని కండ్లనీళ్ళు తుడుసుకున్నది. అంతట్లకే మా నాయిన ఒక పాత ‘‘ఐరోండ్లకుండ’’ల సున్నం కలుపుకొని దాంట్లె ‘‘బ్రెష్‌’’ ఏసుకొని వచ్చిండు. అరుగు పక్కన ఎడమరోకు అంతకుముందు రోజే ‘‘బద్ది పోచమ్మ’’ కు ఒక చిన్న గుడి కట్టిండు, మా నాయిన సుతారి పనిశేత్తడు అందుకే ఆయినే కట్టిండు, ఆ గుడికాడ కూసోని గుడికి సున్నం ఏసుకుంట ‘‘ఊకోవే అనసూర్య. ఇగ బద్ది పోచమ్మకు గూడ శెయ్యబడితిమి కొంటెతనంబోయి అంత మంచే జరుగుతది తియ్‌ ఊకె ఏడువకు బాధపడకు’’ అన్నడు.

పొద్దుగూకుతాంది చిన్నగ మెల్లగ చీకటయితాంది. టైము ఐదారున్నరయితాన్నట్టున్నది ఇగ గొర్రెను కోద్దామని అందరు గుమిగూడిండ్లు. ఇంటిముందు యాపశెట్టుకు గొర్రెను కట్టేసి ఇంతంత పచ్చగడ్డేశిండ్లు. అది పొద్దటిసంది పచ్చగడ్డి నములుతనే వున్నది. మా చిచ్చ ‘‘నర్సింహస్వామి’’ యాటను కోశెదానికి కత్తి పట్టుకొని వచ్చిండు.  వీళ్లు మా పాలోళ్ళు.  నాకు ఆయినె చిన్నాయినయితడు. ‘‘గొర్రెను రొండు కాళ్ళసందు పెట్టుకొని గొర్రె కడుపుకింద శేతులేసి లేపి బరువు సూశిండు. ఓ పది కిలో కూర ఎల్తది కావచ్చు, బోటి, కాళ్ళు ,తలకాయ కలిపి ఓ మూడు మూడున్నర కిలోలు ఎల్తది, మొత్తం పదమూడు చిల్లరే ఎల్తది కూర అన్నడు. ఆ గొర్రె రొండు మూడు ఈతలు ఈనిందట.  ‘‘బద్దిపోచమ్మ’’కు మగ గొర్రెపోతును కొయ్యద్దట. ఆడ గొర్రెను అది ఓ రొండు మూడు ఈతు ఈనిన పిల్ల తల్లిని కొయ్యాల్నట. ఇవన్ని ఇంటాంటె గమ్మతనిపిచ్చింది. ఈ రూల్స్‌, పద్దతు ఎవ్వు పెట్టిండ్లు, ‘‘బద్దిపోచమ్మ’’ వచ్చి వీళ్ళకు శెప్పిందా అనిపిచ్చింది. గొర్రెను బద్దిపోచమ్మ గుడికాడికి  తీసుకచ్చిండ్లు, గొర్రెకు బవంతంగా కొంచెం కల్లు తాపిచ్చిండ్లు. మా అనసూర్యక్కచ్చి గొర్రె ‘‘నొసు’’(నుదురు) మీద కుంకుమ బొట్టు పెట్టి పసుపు రాసింది. గొర్రె కాళ్ళు మొక్కింది. పక్కనున్న మా చిన్నమ్మ ‘‘ఇగ అనుమానమద్దు తల్లీ మంచి జరుగుతె మళ్ళా వచ్చే ఏడు శేత్తం ‘‘జడత’’ ఇయ్యి అన్నది. ఒగలెనుక ఒగలు పోయి కుంకుమబొట్టు, పసుపుబొట్టు పెట్టి గొర్రె కాళ్ళు మొక్కిండ్లు. మా నర్సింహస్వామి చిచ్చ దాని ఈపు(వీపు) మీద నీళ్ళు సల్లి దువ్విండు యాట ‘‘జెడుత’’ ఇయ్యంగనే కోషిండ్లు, ఒక ఎనుకకాలు సప్ప(లెగ్‌) తీసి దాషిండ్లు. మిగతది వండిండ్లు అందరు తిని పండుకున్నరు.

నేను ‘‘ఎగిలిబారంగనే’’ (ఎర్లిమార్నింగ్‌) లేశి హైదరాబాదుకు రావాల్నని తయారయితాన. సాయత్రం కోశి దాశిన ఎనుకకాలు సప్ప వండెదానికి మావోళ్ళు మాల్ మసాల తయారుజేత్తాండ్లు. ‘‘మీరు కూడ ఇంత సల్లబడిపోండ్లి. హైదరాబాదుకు పొయ్యెటాలకు ఏ టైం అయితదో ఏందో’’ అన్నది మా అనసూరక్క. నేను సరేనన్నా. అన్నం తిని బయుదేరే ముందు మా భార్య నాదగ్గరికచ్చి ‘‘అనసూర్యక్కను హైదరాబాదుకు తీసుకపోదం అక్కడ ‘‘కిమ్స్‌’’ హస్పటల్ల సూపిద్దం, ఆమె పరిస్థితి మంచిగలేనట్టనిపిస్తాంది రాత్రి మూడు నాలుగు గంట్లకు మీ చెల్లె దగ్గరకచ్చి ఏడిసిందట, నేను సచ్చిపోతనంటాందట. అసలే నిదురత్తలేదట ‘‘సైక్రియాటిస్ట్‌’’ డాక్టర్‌కు సూపిద్దం’’ అన్నది. సరేనన్నా మరి వత్తదో, రాదో అడుగన్న. అడుగుతె వత్తనన్నది, హైదరాబాదుకు మాతోని తీసుకచ్చినం. తెల్లారి ‘‘కిమ్స్‌’’కు సైక్రియాటిస్ట్‌ డా॥ నాగలక్ష్మి దగ్గరికి తీసుకపోయినం. డాక్టరమ్మ మా అనసూర్యక్క తోటి శానసేపు మాట్లాడిరది. డాక్టరమ్మతోని తన బాధ శెప్పుకుంట మా అక్క ఏడిసింది. డాక్టరమ్మ పరిక్షచేసి ‘‘ఈమె చాలా డీప్‌ డిప్రెషన్‌లో వున్నది. 20 రోజులకి మెడిసన్‌ కోర్స్‌ రాస్తున్నా, 20 రోజుల తరువాత మళ్ళీరండి ఆమెను జాగ్రత్తగా చూసుకొండి. మీ దగ్గరే ఓ నెల రోజులు వుంచుకొని జాగ్రత్తగ సూసుకోండి’’ అన్నది సరేనన్నాం, మా దగ్గర మూడురోజులున్నది, నాలుగో రోజు అమ్మటాల్లకు (ఉదయం ఎనిమిది, పది గంట మధ్య) ఇగ నేను పోతర బిడ్డ అన్నది ‘‘వుండరాదక్క ఊళ్ళెకు బోయి ఏం జేత్తవ్‌’’ అన్న. ‘‘లేదుర బిడ్డా పోత’’ అన్నది మా కొడుకును ఆమెను ఊళ్ళె తోలిరమ్మని ఆమె ఎంట పంపిచ్చిన. నేను నా రాసుకునే, చదువుకునె రూముకు పోయి తలుపు మూసుకొని కూసున్న ఏందోత్తలేదు. గుడిపాటి వెంకటాచంగారి గీతాంజలి (ఠాగూర్‌ అనువాదం) మళ్ళా ముందటేసుకున్న నా పుస్తకాల ర్యాక్‌ల  శాన్నే పుస్తకాలుంటయ్‌ సదివినయి, సదువనియి. కాని నా చెయ్యి చలం పుస్తకాలకాడికే పోతది. ‘‘చలం నన్ను మింగిండు’’ చలం పుస్తకాలు సదువుతాంటె బతుకు రుచనిపిస్తది, పెద్ద పెద్ద బాధలు చిన్నగనిపిస్తయ్‌. మనుషులను ప్రేమించాలనిపిస్తది, కష్టాలను కావలిచ్చుకోబుద్దయితది, ‘‘లేకిడి’’ తనం పోయి గుండె బారిదయితది. ఎట్ల బతుకాల్నో, ఎందుకు బతుకాల్నో ఎరుకయితది. బతికే రీతిని చలం గుండెకు ‘‘ఇంజెక్ట్‌ చేస్తడు’’. గీతాంజలి సదువుకుంటపోతాన ‘‘ప్రేమ ఏకం. ఏకమైన ప్రేమ ఐక్యం కావాలనే కాంక్షలో రెండు రూపాల విభాగమై తనని తాను వ్యక్తం చేసుకుంటోంది. ఒకటే విద్యుచ్చక్తి ఆకాశాన ఈ మూల ఒక మెరుపుగా, ఆ మూల ఒక మెరుపుగా చలించి పెనవేసుకుని ఐక్యమై తేజస్సుని మించిన అంధకారంలో లీనమౌతుంది. విద్యుచ్చక్తి అంతా ఒకటే కాని పాజిటివ్‌ మరియు నెగిటివ్‌ అని విభాగమై ఇన్ని గృహాల్ని, ఉత్సవాల్ని వెలిగించి ఐక్యమై ఇన్ని చిత్రాలుగా దీపాలుగా నవ్వుతోంది.’’ ఇట్లా… దనాదన సదువుకుంటపోతానే వున్నా. పుట సంఖ్య.65

36 వ గీతం సదువుతాన

‘‘ఇదే నీకు నా ప్రార్థన, ప్రభో!

నరుకు నరుకు

నా హృదయంలోని దరిద్రాన్ని సమూలంగా నరకు.

నా సుఖదు:ఖాల్ని తేలికగా తీసుకునే బలాన్ని నాకియ్యి.

సేవలో నా ప్రేమను సఫలం చేసుకునే శక్తిని ప్రసాదించు.

దీనుల్ని నిరాకరించే దుర్గతి నించి నన్ను తప్పించు.

మదాంధుల ముందు మోకరించనీని అభిమానాన్ని నాలో పెంపొందించు.

నిత్య జీవనంలోని అల్ప విషయాల నించి

నా మనసుని తప్పించే నేర్పునియ్యి.

ప్రేమలో నీ సంకల్పానికి

నా శక్తిని అర్పించుకునే బలాన్ని కటాక్షించు.’’

ఈ గీతం సదువుడు అయిపోంగనే మా అనసూర్యక్క గుర్తుకచ్చింది. నేను దేవున్ని నమ్మాల్నని మస్తనుకుంట కాని నమ్మ, కాని… ‘‘ఈ భూలోకాన్ని, మనిషిని, మాకును, పుట్టను, పురుగును, నిప్పును, నీటిని, గాలిని, ధూళిని నడిపించే శక్తి ఏదో వున్నదట. ఆత్మ అవినాశి, బహిర్గత సౌందర్యం కన్న ఆత్మ సౌందర్యం గొప్పది. అని నేను నా చిన్నప్పుడు ‘‘సొక్రటీస్‌’’ పుస్తకంల చదివిన ఆ మాటలు నా గుండెలకు గుసాయించి, నా దమాక్‌ల జమాయించి కూసున్నయ్‌. ఆ‘‘శక్తి’’ని లేదా ఈ లోకులు పూజించే ‘‘దేవున్ని’’ కన్నీళ్ళతోని నేను రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ లెక్క ప్రార్దించిన. మా అనసూర్యక్క ఇప్పుడు పుట్టెడు దు:ఖంలున్నది. ‘‘సుఖదు:ఖాల్ని తేలికగా తీసుకునే బలాన్ని ఆమెకియ్యి. నీ సేవలో ఆమె ప్రేమను సఫలం చేసుకునే శక్తిని ఆమెకు ప్రసాదించు. ఈ మూర్ఖపు లోకం ముందు మోకరించనీని అభిమానాన్ని ఆమెలో పెంపొందించు. నిత్యజీవనంలోని అల్పవిషయాల నించి తప్పించుకునే నేర్పుని ఆమె మనసుకియ్యి, ప్రేమలో నీ సంకల్పానికి ఆమె శక్తిని అర్పించుకునే బలాన్ని మా అనసూర్యక్కకు కటాక్షించు’’ అని దిల్‌సే ఏడిసిన.

Kadha-Saranga-2-300x268

ఆమె దు:ఖం చెప్పుకునేది కాదు. చెప్పుకుంటె తీరేదికాదు. ఆమెకు అన్నీ వున్నయ్‌… ఇల్లు, జాగ, ఎద్దు, ఎవుసం, పైసలు కాని… ఆవ్వెవీ ఆమెకు సంబురాన్నియ్యయి, సంతోషపెట్టయి. ఆమెకు అందరున్నరు. బలుగం, బంధువు, అన్నలు, తమ్ముళ్ళు, మనుమలు, మనువరాండ్లు కాని… ఎవలు ఆమె వాళ్ళు కాదు. అన్నీ వున్నట్టె అనిపిస్తయ్‌ కాని బతుకంత ఎల్తి ఎల్తి వుంటది. అందరు వున్నట్టె అనిపిస్తరు కాని ఎనుకకు తిరిగి సూసుకుంటె ఎవరుండరు. ఆమె తట్టుకోలేని ఒంటరితనం వుంటది. ఈ పరిస్థితిని ఆమె ఎవ్వలకు చెప్పుకోలేదు, ఆమె పరిస్థితి ఇదని బహిరంగంగ ఒప్పుకోలేదు. చెరువుతెగి చెర్లనీళ్ళు చెరువెనక పడ్డయ్‌. ఇప్పుడు శెప్పుకొని ఏంలాభం అని సప్పుడుజేక వూకుంటది. అప్పుడప్పుడు బాధలు, ఒంటరితనం ఆమె గుండెను ‘దబ్బుడుకం’ (గోనె సంచు కుట్టె సూది) లెక్క పొడిశినప్పుడు అవస్థను తట్టుకోలేక సాటుకో, నేటుకో, అయినోళ్ళతోని శెప్పుకొని ఏడుస్తది.

మా అనసూర్యక్కకు ఇప్పుడు దగ్గరదగ్గర ఓ యాభైఅయిదు సంవత్సరాల ఉమర్‌(వయసు) వుంటది. నాకు ఊహ తెలిసి తెలవకముందే ఓ పది పదకొండు సంవత్సరాల వయసునే ఆమెకు పెండ్లయ్యింది. పెండ్లయ్యినంక కొన్ని రోజులు అత్తగారింటికి పోయింది. తరువాత పోనని ఏడుసుడు మొదలుబెట్టి వచ్చి మా ఇంటికాన్నే వున్నది. అట్లా శానా దినాలు గడిశినయ్‌. మా అనసూర్యక్క చానా ‘‘కష్టబోతు’’. మొగోళ్ళతోని సమానంగా పనిజేత్తది. అత్తగారింటికి పోకుంట ఇంట్లనే వున్నప్పుడు, ఇంటికాడ, అన్నం, కూర వండుడు. ఇల్లు, వాకిలి ఊడుసుడు, అంట్లుతోముడు, అలుకుసల్లుడు దగ్గర్నుంచి, వ్యవసాయం పనులు ఎక్కువ చేసుడు మొదలుబెట్టింది. ఎందుకంటె మాఅక్కోళ్ళ అవ్వ, నాయిన, అరె బిడ్డ మస్తు పనిచేత్తాంది, మంచిగ ఆసరయితాందని, అత్తగారింటికి పంపియ్యరని ఆమె ఉపాయమేసింది. ఆమె ఉపాయం కరక్టే అయ్యింది. ఇంటిపని, వంటపని, వ్యవసాయం పని అన్నీ మా అక్క  ఒక్కతే ఒంటిశేతి మీద శేత్తాంటే మా తాతకు శానా ఆరామ్‌(రిలాక్సేషన్‌) దొరికింది. శానా సుఖానికి అవాటుపడ్డడు. వుంటాంటె వుంటాంటె కొంత కాలం తరువాత మా తాత పని శెయ్యాల్సిన అవసరం కనిపించకుంట పోయింది. ఓ నాలుగురోజులు కనుక ఏ పెండ్లికో, పేరంటానికో మా అనసూర్యక్క పోతే ఎక్కడి పనులు అక్కణ్ణే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. వుండంగ వుండంగ మా అక్క మనసు మారింది. మనిషిలో మార్పు మాములే కదా. అత్తగారింటికి పోవాల్నని నిర్ణయించుకున్నది. మా అక్కను పెండ్లిశేసుకున్నాయినే కూడా శానా మంచి మనిషే ఈమెను బతిలాడో, బామాడో తీసుకపోయెటానికి శానాసార్ల వచ్చెటోడు. అత్తగారింటికి పోవాల్నని మా అక్క మనసు కూడా వుండేది. కాని మా తాత పంపించెటోడు కాదు. ఈమె మా అత్తగారింటికి నేను పోత అని  శెప్పలేని పరిస్థితి. మా తాత, మా అక్క భర్తను తిట్టి, బెదిరించి పంపించెటోడు. ఎందుకంటె ఈమె అత్తగారింటికి పోతే ఎక్కడ పనులు అక్కణ్ణే పంటయ్‌ అని మా తాత బాధ. కొంతకాలం తరువాత మా అక్కకు విడాకులు కూడా చేసేసిండు మా తాత. ఇంట్ల ఏ పని చెయ్యాల్నన్న, ఏ నిర్ణయం తీసుకోవల్నన్న అంతా మా తాత శేతుల్నే వుండేది.

ARIF4‘‘మా అనసూర్యకు మళ్ళా పెండ్లిశెయ్య ఎందుకంటె దానిమీద దేవుడున్నడు దాన్ని దేవునికి ఇడిసిపెడుతాన’’ అని మా తాత మా బందువులకు శెప్పిండు. మా నాయినమ్మ, మా నాయిన, బాబాయి, కోడళ్ళు అందరూ మా తాత మాటను ఎదురించలేక తలకాయూపిండ్లు. ఆ కాలంల అది మంచా, చెడా, అని ఆలోసించె తెలువులు వాళ్ళకు కూడా లేవు. పాపం మా అనసూర్యక్క పరిస్థితి గోరంగ తయారయింది. ‘‘నాకు పెండ్లి శెయ్యిండ్లి అని అడగలేని పరిస్థితి, నాయినను ఎదురించలేని స్థితి’’ ఆడోళ్ళు ఈ కాలంల్నే నాకు పెండ్లి శెయ్యిండ్లి అని అడగలేని పరిస్థితి. ఆ కాలంల ఆ స్థితే లేదు. కాని మా అనసూర్యక్కకు నాది అనే ఒక కుటుంబం వుండాల్నని, ఆమె కడుపు పుట్టిన పిల్లలు, ఓ సంసారం వుండాల్నని శానా‘‘కాయిశు’’ వుండేది. నేను పసిపోరణ్ణయిన ఆమె కండ్లల్ల  ఆ బలమైన ‘‘కాయిశు’’ను పసిగట్టిన శానాసార్ల. మా అక్కకు ఇడుపుకాయితం (విడాకులు) అయినంక కూడా మా అక్క ఆమె మెడ తాళిబొట్టు తియ్యలే….దేవుని పేరుమీద అట్లనే ఏసుకునేది. శానా రోజుల తర్వాత ఆ పసుపుతాడు రంగు ఎలిసి పోయి షీకిపోయే దశకు రాంగనే, మా ఊరుపక్క నర్సంపేటల ఆదివారం నాడు అంగడి జరుగుతది, ఆ అంగట్లకుపోయి పూసబెర్లోల్ల దగ్గర కొత్త పసుపుతాడు కొనుకచ్చుకునేది, మెడల్నుంచి పాత పసుపుతాడు తీసి దాని ముళ్ళిప్పి, సకిలముకిలం పెట్టుకొని కూసోని ఆమె ఒళ్ళె (ఒడిలో) ఆ పాత పసుపుతాడుకున్న నల్లపూసలగుండ్లు, బంగారుగుండ్లు, బంగారు చింతాకుపువ్వు, తాళిబొట్టు అన్నీ….పోసుకొని, కొనుక్కచ్చుకున్న కొత్త పసుపుతాడుకు సంటర్ల (నడుమ) తాళిబొట్టునుకట్టి నల్లపూస గుండ్లను, బంగారుగుండ్లను, చింతాకు ఆకారంల వుండే బంగారు పువ్వును, వరుసగా లెక్కతప్పకుంట ప్రేమగా, సుతారంగా కుచ్చి మళ్ళా మూడుముళ్ళేసుకొని మెడలెసుకొని పొగసూరి మసకబారిన పాత చిన్న అద్దంల మంచిగున్నదా…. లేదా… అని సూసుకునేది అప్పుడు నేను శానా చిన్న పోరగాణ్ణి.

పినిశెట్టి రామస్వామి అని మా నాయినమ్మోళ్ళ తమ్ముడు వుండెటాయినె ఆయిన మా అనసూర్యక్కకు మేనమామ.  ఓసారి నోరిడిషి మా అక్క మా రామస్వామి తాతకు చెప్పింది. ‘‘మామ నేను పెండ్లి శేసుకుంటనే నాకూ సంసారం, పిల్లో, జెల్లో, ఇల్లు, వాకిలి ఉండాలె కదనే. రేపు నాకు కాళ్ళు, రెక్కలు దగ్గరబడి పురాగ శాతగాక మంచంబడితే నన్ను ఎవ్వరు అర్సుకుంటరు. నా కడుపు పుట్టిన పిల్లలుంటె నన్ను సూసుకుంటరు. ఇట్ల ఇంటిమీద ఎన్నిరోజుండాల్నే అన్నది’’ పాపం మా రామస్వామి తాత ఆమె దు:ఖం అర్దం శేసుకొని “అనసూర్యవ్వ నేను చెప్తా ఆగు టైం వచ్చినప్పుడు” అన్నడు.

కొన్ని రోజుల తరువాత మా రామస్వామి తాత ఓ మంచి సంబంధం సూశిండు. పిలగాడు మంచి బుద్దిమంతుడు. మా కుమ్మరి పని మంచిగ శేత్తడు కాని ఎనుకముందు ఎమీ లేరు. పిలగానికి మా అనసూర్యక్క గురించి చెప్తె చేసుకుంటనన్నడు. మా అక్కకు కూడా పిలగాని గురించి చెప్తె సరే మామ చేసుకుంటనన్నది. ఓ రోజు మా కట్టయ్య తాత దగ్గరికి మా రామస్వామి తాత పోయి ‘‘అనసూర్యకు ఓ మంచి సంబంధం తెచ్చిన్నే బావ! అని పిలగాని గురించి శెప్పిండు, ఎంటనే మా కట్టయ్య తాత మస్తు సీరియస్‌ అయ్యి ‘‘ఎడమకాలు చెప్పుదీసి కొడుత బాడుకావ్‌ అని ఎడమకాలు శెప్పు దీసిండు. బామ్మర్ధివి బామ్మర్ధి లెక్కుండు. నా బిడ్డకు నువ్వు పెండ్లి సంబంధం సూశెటోనివి అయినావురా? అని అనరాని మాటనుకుంట, దానికి పెండ్లిజెయ్య ఏంజెయ్య దేవునికి ఇడిషిపెట్టిన’’ అన్నడు. ఎందుకంటే మా అక్కకు మళ్ళ పెండ్లిజేత్తె కట్నం, కానుకలు, బట్టు, బాతు, బోజనాల ఖర్సు ఎటులేదన్నా ఓ యాభైవేల రూపాలన్న ఖర్చుయితయి ఆ రోజుల్ల, మళ్ళా మా అనసూర్యక్క పెండ్లి శేసుకొని అత్తగారింటికిపోతె ఎక్కడి పనులు అక్కణ్ణే ఆగిపోతయ్‌ అని మా కట్టయ్య తాతకు మనసు వుండేది కాని….బయటికి శెప్పెటొడు కాదు. మా రామస్వామి తాత చేసేదేమి లేక జరిగిన సంగతి మా అక్కతోని చెప్పిండు. ఏం జెయ్యాల్నో అర్దంగాక మా అక్క బాగా ఏడిషింది. ఆడపిల్లకు కష్టమస్తె కన్నోళ్ళముందో, తోడబుట్టినోళ్ళముందో, అయినోళ్ళముందో వాళ్ళ కష్టం ఎల్లబోసుకుంటరు. కాని కన్న తండ్రే కన్న బిడ్డ రెక్క కష్టానికి అలవాటుపడి, బిడ్డ కాయకష్టం నుంచి పొందే సుఖానికి మరిగి, పరాణ్ణజీవి ‘అమీబా’ లెక్క మారినప్పుడు… కన్నతల్లి, అన్నదమ్ములు, వదినొ నవారుపట్టె మంచం నల్లులలెక్క నిమ్మకు నీరెత్తనట్లు సప్పుడు జేకుంట, మాటగూడ మాట్లాడకుంట ఊకుంటె పాపం ఒక ఆడిమనిషి ఏంజెయ్యగలుగుతది. కొంగునోట్లె కుక్కుకొని సప్పుడు గాకుంట సాటుకు ఏడుసుడు తప్ప. అప్పుడు మా అక్క అట్లనే ఏడిసింది. ‘‘ఈ వదిన తోని, మరుదళ్ళతోని, అన్నదమ్ములతోని, అయినోళ్ళతోని, కానోళ్ళతోని నేను మాటు పడలేను. నన్నొక అయ్య శేతుల పెట్టుండ్లి, నా బతుకేదో నేను బతుకుతా… అని సాటుంగ, నేటుంగ శానాసార్ల అడిగింది, కాని అప్పటికే మా అనసూర్యక్క మీద దేవుడున్నడు, ఆమెను దేవునికి ఒదిలేశిండ్లు అనే ముచ్చట ఆ నోటా, ఈ నోటా మా చుట్టాందరికి తెలిసింది. వుండంగ వుండంగ ఆమె పెండ్లిగురించి మాట్లాడే మనుషులే కరువయ్యిండ్లు. ఆమెకు పెండ్లి మీద ఆశ సచ్చిపోయింది. మా అక్కమీద దేవుడున్నడట. కనీసం ఆ దేవునికి కూడ మా అక్క మీద జాలి కలుగలే. ఆఖరికి మా అక్కమీద కూడా మా అక్కకే జాలిపోయింది. ఆమె కసిగా పెండ్లి అనే మాటను తన ఎడమకాలి బొటనఏలు(మే)తో  ఎర్రచీమను నలిపేసినట్టు నలిపేసింది.

ARIF4ఇప్పుడు మా అక్కకు యాభై అయిదు సంవత్సరాలపైనే వయసుంటది. కూలికో, నాలికో పోతది, ఆమెకు వున్న బుంతంత చొక, ఇంత కోతిమీర, ఇంత ఉల్లాకు, ఇంత గోగ్గూర, ఇంత సుక్కకూర, ఇంతంత పాలకూర సీజన్‌ను పట్టి చిన్నచిన్న ‘‘మడులు” అలుకుకుంటది. సాయంత్రం కోసుకస్తది. వాకిట్ల సాపపరుసుకొని కూసోని, కోసుకచ్చిన ఆకు కూరలు, చీరిన తాటాకు ఈనెతోని కట్టు కట్టుకుంటది, పెద్ద గంపల వరుసగా బతుకమ్మను పేర్సుకున్నట్టు పేర్సుకుంటది. తెల్లారి మబ్బుల లేత్తది. యాపపుల్లతోనన్న లేకపోతే బొగ్గుతోనన్న (ఎనుకటయితే ‘‘పిడిక’’ బొగ్గుతోని తోమేది ఇప్పుడు పిడికలు లేవు) పళ్ళు తోముకొని మొఖం కడుక్కుంటది. గంపనెత్తి పెట్టుకొని నర్సంపేటకు నాలుగు కిలోమీటర్లు నడుసుకుంట పోతది, అక్కడ కూరగాయల అడ్డమీద కూసోని అమ్ముకుంటది. పాణం పురాగ శాతగానినాడు మారుబేరపోళ్ళకు ఎంతకో ఒగంతకు అడ్డికి పావుశేరు గుత్తకు అమ్ముతది. వచ్చిన పైసలు బొడ్లె సచ్చిల పెట్టుకొని ఇంటికత్తది. అన్నం కూర వండుకొని తిని, అరుగుమీద కూసోని బొడ్లె సంచిల పైసలు అరుగుమీద కుమ్మరిత్తది, రూపాయి, రెండు రూపాయలు అన్నీ లెక్కేత్తది, ఒక పాత చెక్క బొట్టుపెట్టెల పైసలు దాసుకుంటది, ఓ బర్రెను కొనుక్కున్నది. దాని పాలు పిండి అమ్ముకుంటది, సగంపాలను పెరుగు తోడేత్తది, పెరుగు అమ్ముకుంటది. పైసలు అసలే ఖర్సుపెట్టది. కడుపుకు ఆయిమనంగ తినది. రాతెండి టిఫిని గిన్నెల (లంచ్‌బాక్స్‌) ఇంతంత అన్నం బెట్టుకుంటది. చిన్న స్టీలు కటోరల ఇంతంత కూర, లేకపోతే మామికాయ తొక్కో, టమాట తొక్కో పెట్టుకుంటది. ఆ కటొరను టిపిని బాక్స్‌ల పెట్టుకుంటది. ఎడ్ల బండి కట్టుకొని బాయికాడికి పోతది. ఎడ్లబండి నొగుల బట్టి ఒక్కతే లేపుతది, ఎడ్లు వచ్చి బుద్దిగా ‘‘కాణి’’ కింది మెడలు పెడుతయ్‌, సతాయించయ్‌. ఎడ్లకు కూడా మా అనసూర్యక్కంటె అంత ప్రేమ, జాలి. ఈ ప్రేమ, జాలి, పావురం మా కట్టయ్య తాతకు మా అక్కమీద వుండివుంటే మా అక్క బతుకిట్ల ఒంటరిదయ్యేదికాదు. గత యాభై సంవత్సరాలుగా మా అనసూర్యక్కది ఇదే దినచర్య. ఎసొంటి మార్పు శేర్పు లేవు. అప్పుడప్పుడు బతుకు రోటీన్‌గా, రోతగా అనిపిచ్చినప్పుడు ‘‘నా పెండ్లయినప్పుడు నేను చిన్నదాన్ని. అవ్వగారి ఇంటిమీద మనుసుగుంజి అత్తగారింటికి పోనని మంకుపట్టు బట్టిన. నాలుగు బుద్దిమాటలు జెప్పి తోలియ్యాలె, మా అత్తగారోళ్ళు వచ్చినప్పుడన్న తోలియ్యాలె గదా? ఆ సంబంధం ఇడుపుకాయితం (విడాకు) అయ్యినంకనన్నా మళ్ళా నన్నో అయ్యశేతులబెట్టాలే కదా, మా రామస్వామి మామ తెచ్చిన సంబంధాన్ని కూడా శెడగొట్టె,  పని చేసి చేసి నా బొక్కలు షీకిపోయినయ్‌. నేను బండెడు కష్టం జెత్తాంటే తిని కూసోని సుఖానికి మరిగి నాది ఇట్లా ఎటుగాని ఒంటరి బతుకుజేసిండు మా నాయిన ‘‘లంజకొడుకు’’ అని ఆమె ఎత తీరెదాకా ఏడుస్తది.

ఇప్పుడు మా అక్క అన్నదమ్ములందరు ఏరుబడ్డరు, అన్నదమ్ముల పిల్లలకు పిల్లలయిండ్రు, ఎవ్వల కుటుంబాలు వాళ్ళకున్నయ్‌, పాపం మా అనసూర్యక్కకే ఓ కుటుంబం లేకుంటయ్యింది. ఏదయిన పండుగకో, ప్రభోజనాకో మా చెల్లెండ్లు, మా తమ్ముండ్లు, మేము, మా పిలగాండ్లను తీసుకొనిపోతం, ఆ రొండు రోజులు సంబురంగనే వుంటది. ఎక్కడోళ్ళక్కడ పోంగనే బెంగట్నీట్టయితది. ‘‘సముద్రం కెరటాలు ఉవ్వెత్తున ఎగిరెగిరి పడుకుంటొచ్చి తీరాన్ని ముంచినప్పుడు, తీరానికి సంబురమయితది. బతుకు సుట్టూరంగా మస్తుతోడు భద్రతునట్టనిపిస్తది. అవే కెరటాలు ఎనుకకు మర్లిపోయినప్పుడు తీరం ఒంటరితనంతోటి ఏకాకై బెంగటిల్లి ఏడుస్తది’’ ఇప్పుడు మా అనసూర్యక్క బతుకు ఆ ఒంటరి తీరం లెక్కున్నది.

ఆమె బాల్యం, ఆమె యవ్వనం, ఆమె గుండెల పురుడుపోసుకున్న ఆశలు, కోరికలు, అమె జీవితం, అన్నీ… ‘‘వానలు బాగ కొట్టినప్పుడు మా ఊరి చెరువునిండి మత్తడి పడ్డప్పుడు రువ్వడిగ (అతి వేగంగా) ఉరికే మా ఊరి పెద్ద వాగు పడి కొట్టుకపోయినయ్‌. కాదు, కాదు, మా తాత ‘‘మాదర్‌చోద్‌’’గాడు మా అక్క బతుకును ఆ వాగు పారబోషిండు’’. ఎవ్వులు తెచ్చిత్తరు ఆమె బతుకును ఎనుకకు. ఏ నడిజామ్‌ రాత్రో ఆమెకు నిద్ర రాక జారిపోయి మట్లె గలిసిన జీవితం యాదికచ్చి, ‘‘కష్టమస్తె గుండెకు అమురుకొని ఏడిసెదానికి కడుపు పుట్టన బిడ్డలు లేరని, కండ్లనీళ్ళు తుడిసెదానికి ఓ తోడు లేదని, ఎక్కెక్కి ఏడుస్తాంటే మావోళ్ళు ఇది బద్దిపోచమ్మ కొంటెతనమంటాండ్లు మావోళ్ళు పిచ్చోళ్ళు. కాని…..మా అక్క గుండె యాభై సంవత్సరాలుగా మండుతున్న ఒక ఒంటరి బాధ సూర్యగోళం, ఆమె కండ్లు గడ్డకట్టిన కన్నీటి హిమాలయాలు. ప్రతిరోజు ఆమెకు ఆమె ఒంటరి బతుకు మీద రోతపుట్టి బాధను ‘‘బర్ధాష్‌’’ చెయ్యలేక గుండె భగ్గున మండుతాంటే ఆ మంట శెక (సెగ) ఆమె కండ్ల కన్నీటి హిమాలయాలను తాకి అవి కరిగి ఆమె కండ్లు కన్నీటి నదులై ప్రవహిస్తాంటయ్‌, పాపం మా అనసూర్యక్క ఓ కన్నీటి జీవనది.

*

 

 

   నీలి రంగు నీడలో… 

 

                                                                              -బమ్మిడి జగదీశ్వరరావు

 

bammidi ఒరే రోహితూ.. వీలేoట్రా.. నువ్వేదో యిప్పుడే కొత్తగా వురితాడు మెడకేసుకొని వూయలేదో వూగుతున్నట్టు చెపుతున్నారు? నీ మెడలో నా మెడలో మనవాళ్ళందరి మెడలో వురితాడు లేనిదెప్పుడు చెప్పు? నువ్వు మీ అమ్మ కడుపులో పడినప్పుడు నీకు పేగుతాడు పడకముందే వురితాడు పడిందని వీళ్ళకు తెలీదు! పుట్టినప్పుడు బొడ్డుతాడు కోస్తారుగాని మెడలో వురితాడు కొయ్యరని కొయ్యలేరని వీళ్ళకు తెలీదు! తాడు లేకుండా మనకి తనువుండదని కూడా వీళ్ళకు తెలీదు!

ఒరే గుర్తుందిరా.. నువ్వు చిన్నప్పుడు నా మెడలో ఈ తాడేమిటీ అని అడిగేవాడివి! అమ్మ యేమంది? బ్రామ్మర్లకి జంద్యమెలాగో మనకి యీ వురితాడు అలాగ అనేది! మూతికి ముంత – ముడ్డికి తాటాకు కట్టుకోడం కన్నా మెడలో తాడుంటే తప్పు కాదంది! తప్పు చేసినప్పుడు తప్ప దానితో ప్రమాదం లేదంది!

ఏదయినొరే.. నువ్వు తప్పు చేసావురా.. ఆల్లు యిదము అంటే అదే యిదము.. పదము అంటే అదే పదము.. అలా అని వుంటే యిప్పటికి బతికిపోదువు కదరా.. లోకమెలా చచ్చి బతికిపోతోందో చూస్తున్నావు కదరా.. నువ్వెందుకురా బతికి చచ్చిపోదామనుకున్నావ్?

కొత్తేట్రా నీకు.. నువ్వు అద్దంలో చూసుకుంటే మసిబొగ్గు అని నవ్వినోల్లని యేమన్నావ్? నలుపు కూడా వొక రంగే అన్నావ్! నువ్వు చదివితే కలక్టర్ దిగాడండీ అని బడిలో నవ్వినట్టే యూనివర్సిటీలోనూ ఆమాట అనకుండా నవ్వినోల్లని యేమన్నావ్? నానవ్వు నాదన్నావ్! నిజమేరా.. నీ నవ్వు యెవరూ కాపీ కొట్టలేరు! నువ్వు వాళ్ళలాగ నవ్వనందుకు వాళ్ళు యెంతో యేడ్చారు!

నువ్వు ఆకాశంలో నక్షత్రాలను చూస్తుంటే వాళ్ళు నీ పాదాల బురదని చూసారు! నీ నీలిరంగు జుబ్బా వాళ్ళకి నచ్చలేదు! వాళ్ళు కాషాయపు గోచీ కట్టమన్నారు! కట్టనన్నావు! కట్టిందే కట్టడం నాకు నచ్చదన్నావ్! పైగా గోచీ కనపడితే చింపుతానన్నావ్! కాషాయానికి అంటిన రక్తపు మరకలు నీకు నచ్చలేదు! దాని మాంసపు వాసన వొంట్లో తిప్పుతోందన్నావ్! తోడేలుగా మారలేనన్నావ్! వాళ్ళoతా విడిచిన బట్టలే తొడుక్కున్నారు.. వాడిన చెప్పులే వేసుకున్నారు.. వాడేసిన కళ్ళజోడే వాడుతున్నారు.. నాకళ్ళజోడు నాదన్నావ్! మీ కళ్ళజోడుతో చూడనన్నావ్.. చూడలేనన్నావ్! వాళ్ళు తాగి వదిలిన తీర్థమే తాగుతున్నారు.. యెంగిలి తింటూ ప్రసాదమన్నారు.. పెట్టినబొట్టే పెట్టుకున్నారు.. నెత్తికి కాషాయం చుట్టుకున్నారు.. నంది అంటే నంది అన్నారు.. పంది అంటే పంది అన్నారు.. ఆ పాఠాలే ప్రొఫెసర్ల నుండి వీసీ దాక పాడుతుంటే అరిగిన రాగం అందుకోనన్నావ్! ఆ రాగంలో ఆర్తనాదాలు వున్నాయన్నావ్! వాళ్ళ పలుకు పలకలేక పోయావ్!

ఊపిరి సలపడం లేదన్నావ్! ఉరితాడు తడుముకున్నావ్! యూనివర్సిటీలో చేరినరోజు మెడలోని వురితాడు తీసి నాకింక దీనితో పనిలేదని తీసి విసిరి పారేసావ్! వీసీతీసి దాచాడు!

నువ్వేమి తినాలో.. నువ్వేమి తాగాలో.. నువ్వేమి ఆలోచించాలో నీబాగుకోరి చెపుతామంటే కాదనేసావ్! వాళ్లకు నచ్చినట్టు తుమ్మడం రాదన్నావ్.. వాళ్లకు నచ్చినట్టు దగ్గడం రాదన్నావ్.. వాళ్ళలా పోతపోసినట్టు వుండరా అంటే వుండలేనూ రాత మార్చుకుంటానూ అన్నావ్.. నారాత నేనే రాసు కుంటానూ అన్నావ్.. అందరూ ఎద్దుకి మొక్కితే నువ్వు పొద్దుకి మొక్కావ్..

నా అభిమతం నాదన్నావ్.. వాడి మతం కాదన్నావ్.. వెక్కిరించాడు.. నువ్వు యెర్రగా చూస్తే తప్పయిపోయిందని అన్నాడు.. ఈ చేత్తో క్షమాపణ పత్రం రాసిచ్చాడు.. ఆచేత్తో పిటీషనూ యిచ్చాడు.. పోలీసులకి బెదరలేదు.. ఆస్పెటిల్ సాక్షం చెల్లలేదు.. కమిటీ కథ ముగిసింది అంది.. వాడు భయపడ్డాడు.. భంగపడ్డాడు.. వొకపక్క కోర్టుకెక్కాడు.. మరోపక్క కుర్చీకి బావురుమన్నాడు.. మేమంతా మీ వానరసైన్యం అని, యిలా అయితే రామరాజ్యాన్ని నిలబెట్టలేమన్నాడు.. ముగిసిన కథ మళ్ళీ మొదలయి మొదటికొచ్చింది.. కోర్టులు తీర్పివ్వకముందే కొరడాదెబ్బలకి మంత్రిగారి అర్జీల మీద అర్జీలు.. శాంతిభద్రతల సమస్య.. సంఘవిద్రోహుల సమస్య.. తీవ్రవాద సమస్య.. కులోన్మాద సమస్య.. సమస్యల తీవ్రతని గుర్తించిన రాణీగారు ఆదేశాలు.. ఆజ్ఞలు.. వీసీ తలారయ్యాడు.. మూటాముల్లె తీసి పడేసాడు.. నిన్నూ నీ నలుగురు నేస్తాలని బహిష్కరించాడు!

మీరంతా గుంపుగా తిరగకూడదన్నాడు! బహిరంగాప్రదేశాల్లో తిరగకూడదన్నాడు! ఒంటరిగా మీకు మీరే వొక జైలు కావాలన్నాడు! వర్సిటీలో నివాసం వుండరాదన్నాడు! చెట్టుకింద పిట్టలయ్యారు! ఎండనక వాననక పగలనక రాత్రనక వెలిలో చలిలో వున్నారు! ఆగక, ఆందోళన చెయ్యకూడదన్నాడు! ఆకలికి అరవకూడదన్నాడు! యిదే కాప్ తీర్పన్నాడు! అదే సాంఘీక బహిష్కారం అన్నాడు! సరే అని సిద్దమైపోయారు.. మనకి వెలి కొత్త కాదుగా? వూరిలో వెలి! బడిలో వెలి! గుడిలో వెలి! పేరుపెద్ద వూరుదిబ్బ అయిన హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ నట్ట నడుమన వెలి! వెలి వాడ! మనమున్నచోటల్లా వెలివాడే! చలికీ పులికీ దొరకని వాడు మనలో యెవడు అన్నావ్! నేస్తం జ్వరంతో వుంటే మనము యిలాగే చచ్చిపోవాలా అని బెంగ పడ్డావ్! అమ్మవాళ్ళకి డబ్బులు పంపలేదని బాధపడ్డావ్! ఫెలోషిప్ రాని ఫెలోష్ అయిపోయారు మీరు! ఏడు నెలలు ఎండబెట్టారు! యిప్పుడుమీడియాకి మంచి ఫుటేజి.. గొప్ప రేటింగ్.. యాడ్స్ తో యిన్కం పెరిగింది.. ఒక్క నా కొడుకూ మంచు ముద్దలైనప్పుడు రాలే.. నువ్వు మాంసపు ముద్దవైతే తప్ప! అంత గుట్టుగా అంచెలంచెలుగా చెండుకు తిన్నారని ఆగేవా?

వాడొక బంటు.. వాడొక బానిస.. వాడొక కీ యిస్తే తిరిగే మరబొమ్మ.. కుర్చీకి కాళ్ళోత్తే వాడెవడయినా వాడొక తలారి.. తలారి పనేంటి? తలలు తియ్యడమే! పది తలలు రాలినట్టే పదకుండో తల! వాడి లెక్కలు వాడివి! తల నువ్వు తీసేది యేమిటి? నా తల నేనే తీసుకుంటానన్నావ్! యింత విషమిమ్మన్నావ్! లేదంటే నా వురితాడు నాకివ్వు అన్నావ్! ఎప్పటిలాగే మళ్ళీ మెడలో ఉరితాడు వేసుకున్నావ్.. ఉసురు తీసుకుంటావని అనుకోలేదని నీ నేస్తగాళ్ళు దొంత ప్రసాదు, చెముడుగుంట శేషయ్య, పెద్ద పూడి విజయ్, వేల్పుల సుంకన్న వెక్కి వెక్కి యేడుస్తున్నార్రా.. నువ్వు చుక్కల్లో కలిస్తే చూడరా..

ఉరికి ఉమన్న గది వాడుకున్నానని క్షమాపణలు అడిగావు, చావడానికి చోటుకూడాలేని నీ లోలోపలి ఖాళీతనమేమిటో.. నిన్ను కమ్మేసిన శూన్యమేమిటో బోధపడినట్టు వుమన్న శూన్యంలోకి చూస్తున్నాడు చూడు.. ఏయస్ఏ ని నీ కుటుంబమన్నావ్.. క్షమిస్తారని యెంత నమ్మకంరా నీకు? రోజుకూలి చేసి రోజూ నీకు అన్నం పెట్టి చదివించిన అమ్మ నువ్వు ఆత్మహత్య చేసుకోలేదని హత్య చేసారని అర్థం చేసుకుంది, కడుపు తీపికి పేగులు తెగేలా యేడుస్తోందిరా.. తమ్ముడూ చెల్లీ నమ్మకమిచ్చే నువ్వు లేక బితుకుబితుకుమంటున్నార్రా..

నువ్వన్నట్టు ‘గాయపడకుండా నిజంగా ప్రేమించడం చాలా కష్టం అయింది’రా..

‘నన్ను నేను చంపుకోవడానికి యెవరూ బాధ్యులు కారు’ అని భలే మర్యాదలు పాటించావులే! విష సర్పాలకు పాలు పోసినట్టు లేదూ నీ మంచితనం? నీ హత్యకు నువ్వే కారణం అని యెంత అబద్దం ఆడావురా?! నిజం తెలిసిన నేనే కాదు, లోకం మొత్తం నిన్ను క్షమిస్తుంది లే! నిన్ను వురితీసిన చోట నీ స్థూపం రాబోయే తరాలకు చెప్పాల్సిన పాఠమేదో చెపుతుందిలే! సైన్సు రచయితగా నీ రచనలు చదివే అదృష్టం మాకు లేకపోయినా- నీవు నడిచిన తోవ యెరుకనిచ్చి రేపటి చరిత్ర చెద పట్టకుండా కొత్తతరానికి యివ్వాల్సిన ఆయుధమేదో యిస్తుందిలే!

చివరిగా నీవన్న నీ మాటతో గొంతులో గొంతు కలిపి..

జై భీమ్!

నీ

సావాసగాడు

 

ఆరు బుట్టల్లో, బస్తాలో బంగారం తరలించాడు

 

స్లీమన్ కథ-21

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

తవ్వకాలను కొనసాగించాడు. మరికొన్ని లింగాకృతులు, చక్కని పాలరాయి నుంచి చెక్కిన ఓ పక్షి గుడ్డు తప్ప ఇంకేవీ దొరకలేదు. నాలుగు నెలలుగా వర్షాలు లేవు. రోజుల తరబడీ హిస్సాలిక్ దిబ్బను ధూళి మేఘాలు కప్పేశాయి. అలాంటిది, హఠాత్తుగా కుంభవృష్టి. దిబ్బ అంతా బురద బురద అయిపోయింది. తవ్వకాలను నిలిపేశాడు. భార్యతో కలసి ఎథెన్స్ కు వెళ్లిపోయాడు. మనిషి అస్వస్థంగా ఉన్నాడు. భార్యా, ముగ్గురు మేస్త్రీలూ, అంగరక్షకుడూ కూడా జ్వరంతో ఉన్నారు.

ఎథెన్స్ లో తిరిగి ఆరోగ్యం పుంజుకున్నాడు. ప్రియామ్ ప్రాసాదం తాలూకు ప్రణాళికను తెప్పించుకుని పరిశీలించిన బర్నూఫ్, అందులో కొన్ని లోపాలున్నాయనీ, ఫొటోగ్రాఫర్ సాయంతో మెరుగైన ప్రణాళికను తయారుచేయమనీ సూచించాడు. దాంతో నెల రోజుల తర్వాత ఫొటోగ్రాఫర్ ను వెంటబెట్టుకుని స్లీమన్ ట్రయాడ్ కు వెళ్ళాడు.

తీరా వెళ్ళాక, హిస్సాలిక్ దగ్గర నియమించిన కాపలాదారు పెద్ద పెద్ద రాళ్ళను చడీ చప్పుడు కాకుండా అమ్మేస్తున్న సంగతి బయటపడింది. సిప్లాక్ గ్రామంలో ఇళ్ల నిర్మాణానికి కొన్ని రాళ్ళు వాడుకున్నారు. ఎహ్నీ షెహర్ అనే ఒక క్రైస్తవ గ్రామంలో గంటగోపురం నిర్మించడానికి మరికొన్ని వాడుకున్నారు. స్లీమన్ ఆగ్రహం పట్టలేకపోయాడు. అప్పటికప్పుడు ఆ కాపలాదారును తొలగించి అతని స్థానంలో ఒక సాయుధ కాపలాదారుని నియమించాడు. ఫొటోగ్రాఫులతో, కొత్త ప్రణాళికలతో ఎథెన్స్ కు తిరిగివెళ్ళాడు.

మరోవైపు ట్రాయ్ తవ్వకాల్లో అద్భుతాలేవీ బయటపడకపోవడం అతన్ని కుంగదీస్తూనే ఉంది. ఇంతవరకూ తవ్వకాలు జరపని ప్రదేశాల మీదికి అతని దృష్టి మళ్ళింది. సొంత ఖర్చు మీద మైసీనియా, ఒలింపియాలలో తవ్వకాలకు అనుమతించవలసిందిగా గ్రీకు ప్రభుత్వానికి రాశాడు. వాటిలో బయటపడే విలువైన సామగ్రిని తన జీవితాంతం దగ్గర ఉంచుకుంటాననీ, తన తదనంతరం అవి గ్రీకు జాతీయసంపద అవుతాయనీ షరతు పెట్టాడు. తన పేరుతో ఒక పురావస్తు ప్రదర్శనశాలను నిర్మించే ఒప్పందం మీద 2 లక్షల ఫ్రాంకులు ఇవ్వజూపాడు. కానీ ప్రభుత్వం అతని అభ్యర్థనలను తిరస్కరించింది. దాంతో తను శాశ్వతంగా ఎథెన్స్ ను విడిచిపెట్టి పారిస్ వెళ్లిపోతానని బెదిరించడం ప్రారంభించాడు.

3bf230edf319b9b3d4b1cb5b56972adc

కానీ ట్రాయ్ అతన్ని విడిచిపెట్టలేదు. అక్కడ అంతవరకూ కనుగొన్న వాటిలో ఎక్కువ భాగాన్ని బయటికి తరలించేశాడన్న ఆరోపణతో టర్కీ ప్రభుత్వం తన కిచ్చిన ఫర్మానాను రద్దు చేసినట్టు అతనికి తెలిసింది. తన తరపున జోక్యం చేసుకోవలసిందని కోరుతూ ఉన్నతస్థానాలలో ఉన్న పరిచితులకు ఎప్పటిలా ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి ఊదరగొట్టాడు. ఫలితంగా తవ్వకాల కొనసాగింపునకు అనధికారిక అనుమతి వచ్చింది. వెంటనే హిస్సాలిక్ కు తిరిగి వచ్చాడు. మార్చి 1నుంచీ పని ప్రారంభిస్తానని మిత్రులతో అన్నాడు కానీ, జనవరి 31 నాటికే పనిలోకి దిగిపోయాడు. ఉత్తరం నుంచి మంచుగాలులు వీస్తున్నాయి. గాలివానలు, చర్చి పండుగల బెడదకు అదనంగా ఊహించని మరో శత్రువు అతనికి ఎదురయ్యాడు. స్మిర్నాకు చెందిన ఒక వర్తకుడు లికొరిస్(liquorice) అనే ఒకరకం వేళ్ళను[మన దగ్గర ‘అతిమధురం’ అని పిలిచే ఈ వేళ్ళు దక్షిణ యూరప్ లోనూ, మన దేశంలోనూ, ఆసియాలోని మరికొన్ని ప్రాంతాలలోనూ దొరుకుతాయి] తవ్వితీయడం కోసం రోజుకు 12 నుంచి 23 పియాస్టర్ల కూలికి 150మంది గ్రామస్తులను పనిలోకి తీసుకున్నాడు. అది స్లీమన్ చెల్లించే కూలి కన్నా ఎక్కువ. నిశ్శబ్దంగా పళ్ళు నూరడం తప్ప అతను చేయగలిగిందేమీ లేకపోయింది. 1873, మార్చి 15న ఇలా రాసుకున్నాడు:

రాత్రిళ్ళు అతిశీతలంగా ఉంటున్నాయి. పొద్దుటిపూట ఉష్ణోగ్రత గడ్డకట్టే స్థాయికి పడిపోతోంది. కానీ పగలు మాత్రం ఎండ దహించేస్తోంది. తరచు ఉష్ణోగ్రత 72 సెంటీగ్రేడ్లకు చేరుతోంది. చెట్ల ఆకులు మాడిపోతున్నాయి. ట్రాయ్ మైదానాన్ని వసంత కుసుమాలు కప్పేస్తున్నాయి. గత పదిహేనురోజులుగా చుట్టుపక్కల ఆవల్లోంచి లక్షలాది కప్పల బెకబెకలు చెవులు చిల్లులు పొడుస్తున్నాయి. గత ఎనిమిదిరోజుల్లో గూడకొంగలు తిరిగొచ్చాయి. నేను తవ్వకాలు జరిపిన చోట గోడల రంధ్రాలలో లెక్కలేనన్ని గుడ్లగూబలు గూడు కట్టుకుని, ఈ అడవి బతుకును మరింత నరకం చేస్తున్నాయి. ఏదో మార్మికతతోపాటు భయంగొలిపే వాటి అరుపులు రాత్రిళ్ళు మరీ దుర్భరంగా ఉంటున్నాయి.

స్లీమన్ ఆ దిబ్బమీద రెండడుగుల మందంగల గోడలతో ఒక చిన్న రాతి ఇల్లు, ఒక చెక్క ఇల్లు కట్టించాడు. రాతి ఇంటిని ఓ మేస్త్రీకి ఇచ్చి చెక్క ఇంట్లో తను ఉంటున్నాడు. గోడ పగుళ్ళలోంచి గాలి చొరబడుతోంది. మార్చి చివరిలో ఓ రోజు అర్థరాత్రి మూడు గంటలకు అతనికి హఠాత్తుగా మెలకువచ్చింది. గదంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఒక గోడ అప్పటికే తగలబడుతోంది. ఆ పడకగదిలో ఒక మూల, చెక్క పలకల మీద రాతితో ఏర్పాటు చేసిన నిప్పుగూడు ఉంది. రవ్వ పడి చెక్క అంటుకున్నట్టుంది. ఉధృతంగా వీస్తున్న ఉత్తరపు గాలి దానికి తోడైంది. గట్టిగా కేకలు వేస్తూ సోఫియాను నిద్రలేపి బయటికి పంపించేశాడు. స్నానాలగదిలోంచి నీళ్ళు తెచ్చి తగలబడుతున్న గోడ మీద కుమ్మరించాడు. ఈ కలకలానికి మేలుకున్న మేస్త్రీ వచ్చి తట్టలతో మట్టి ఎత్తిపోస్తూ మంటలు ఆర్పడానికి సాయపడ్డాడు.

ఇదంతా పావు గంటలో జరిగిపోయింది. కానీ, తనకు మెలకువ రావడంలో కేవలం కొన్ని క్షణాలు ఆలస్యమైతే తన పుస్తకాలు, కాగితాలు, తను భద్రపరిచిన పురావస్తువులు ఏమైపోయేవో; మరీ ముఖ్యంగా సోఫియా ఏమైపోయేదో నన్న ఊహ కొన్ని రోజులపాటు అతన్ని వెంటాడి వణికించింది.

మరోసారి విసుగూ, అలసటా అతని మీద దాడి చేస్తున్నాయి. ఉత్తరపు గాలి అదేపనిగా వేధిస్తూనే ఉంది. చర్చి శ్రాద్ధదినాలు దినదిన గండంగా మారి సహనాన్ని పరీక్షిస్తూనే ఉన్నాయి. డబ్బు మంచినీళ్లలా ఖర్చైపోతోంది. ఇప్పటికీ రోజుకి 160 మందిని పనిలోకి దింపుతున్నాడు. నల్లని కుండలు, రాగితో చేసిన ఒక బల్లెపు పిడీ, మరికొన్ని బొంగరం ఆకారంలోని బొమ్మలు తప్ప విశేషంగా చెప్పుకోదగినవేవీ ఇప్పటికీ బయటపడడం లేదు. బయటపడినవి కూడా పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయాయి.

ఏప్రిల్ లో ఉత్తరపు గాలి ఉపశమించింది. మైదానమంతటా పసుపురంగు పువ్వులు పరచుకున్నాయి. ఇప్పుడు పనివాళ్లు మబ్బు విడిచిన ఆకాశం కింద ఆరుబయటే నిద్రపోగలుగుతున్నారు. స్లీమన్ ను కూడా తెలియని ప్రశాంతి ఆవహించింది. ఏదో అద్భుతాన్ని కనుక్కోబోతున్నాడన్న ఓ విచిత్రమైన స్ఫురణ అతనికి కలగడం ప్రారంభించింది. ఏప్రిల్ 16న, చప్టా చేసిన ఒక వీధీ, మనిషి ఎత్తున ఉన్న తొమ్మిది అతిపెద్ద మట్టి కూజాలూ బయటపడ్డాయి. అలాంటి కూజాలు అంతవరకూ ఎక్కడా వెలుగు చూడలేదు. అనంతర కాలంలో క్రీటు ద్వీపంలోని నోసస్ లో జరిగిన తవ్వకాల్లో మాత్రమే అలాంటివి బయటపడ్డాయి. స్లీమన్ లో ఉత్సాహం ఉరకలేసింది. ఆ తర్వాత, ఒకదాని కొకటి 20 అడుగుల ఎడమున్న రెండు ద్వారాలను కనుగొన్నాడు. వాటికి వెంటనే  ‘స్కెయిన్ గేట్’ అని పేరుపెట్టాడు. వాటి వెనక కనిపించిన ఓ పెద్ద భవనాన్నే ప్రియామ్ ప్రాసాదం అన్నాడు. అక్కడే మరికొన్ని కలశాలు, గుడ్లగూబ తలలూ కనిపించాయి.

స్లీమన్ సంతృప్తి చెందాడు. తన ఇన్నేళ్ల శ్రమా ఫలించబోతోందనీ, తను ఆశించిన వాటిని కనుక్కోబోతున్నాడనే నమ్మకం చిక్కింది. అంతవరకూ తను కనుక్కొన్నవాటిని వెల్లడి చేయబోతున్నట్టు ప్రకటించాడు. వాటిలో 200 చిత్రిత ఫలకాలు, 3500 చెక్కడాలు ఉన్నాయి. హిస్సాలిక్ లాంటి ఒక చిన్న దిబ్బ హోమర్ చిత్రించిన ట్రాయ్ అయ్యే అవకాశం లేదని జనం అనుకుంటారు, నిజమే. కానీ ఆ విశాలమైన ద్వారమూ, ప్రాసాదపు గోడలూ, సహజసిద్ధమైన రాళ్ళు పేర్చి నిర్మించిన దుర్గమూ, అసంఖ్యాకమైన నల్లమట్టి కుండల తాలూకు పెంకులూ, భారీ కూజాల్లాంటి పాత్రలూ,  వేల సంఖ్యలో ఉన్న కళాకృతులూ తను ట్రాయ్ ని కనుగొన్న సంగతిని రుజువు చేస్తున్నాయని స్లీమన్ భావించాడు.

అంతలో అతని ఉత్సాహంపై నీళ్ళు చల్లే వార్త…సోఫియా తండ్రి అవసానదశలో ఉన్నాడు. ఆమె వెంటనే బయలుదేరి ఎథెన్స్ కు వెళ్లింది. కానీ ఆమె వెళ్ళేటప్పటికే తండ్రి కన్ను మూశాడు. ఆ దిబ్బ మీద  ఇంట్లో స్లీమన్ ఒంటరిగా కూర్చుని భార్యకు ఓదార్పు లేఖ రాశాడు. అంత మార్దవం నిండిన లేఖ అతని మొత్తం లేఖలలోనే ఇంకొకటి లేదు:

అద్భుతవ్యక్తి అయిన మీ నాన్న దగ్గరికి మనందరం నేడో రేపో చేరేవాళ్ళమేనన్న సంగతిని గుర్తుచేసుకుని నిన్ను నువ్వు ఓదార్చుకోవాలి. మన ప్రియమైన కూతురికి తల్లి అవసరం ఎంతో ఉంటుందనీ, తల్లితోనే తన జీవితానందం అల్లుకుని ఉంటుందనీ అర్థం చేసుకుని నువ్వు ఓదార్పు పొందాలి. మన కన్నీళ్లు మీ నాన్నను తిరిగి తీసుకురాలేవనీ; ఎంతో ఉత్తముడూ, సాహసీ  అయిన మీ నాన్న ఈ జన్మ సంబంధమైన విచారాలకూ, తాపత్రయాలకూ దూరంగా; పరిశుద్ధమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడనీ; దుఃఖవిచారాలతో మగ్గుతూ ఈ భూమ్మీద మిగిలిపోయిన మనకంటే ఎక్కువ సంతోషంగా ఉన్నాడనీ గ్రహించి నువ్వు ఓదార్పు పొందాలి. అయినా నువ్వు దుఃఖాన్ని జయించలేకపోతే, అందుబాటులో ఉన్న మొదటి ఆవిరిబోటు అందుకుని నా దగ్గరికి వచ్చెయ్యి. నీ దుఃఖ నివారణకు నేను చేయగలిగినవన్నీ చేస్తాను. నువ్వు లేకుండా ఇక్కడ ఎలాంటి తవ్వకాలూ జరగవు. త్వరలోనే రమ్మని ఆనందబాష్పాలతో వేడుకుంటున్నాను.

కొన్ని రోజుల తర్వాత సోఫియా బయలుదేరి వచ్చేసింది. తన అవసరం ఎక్కడో ఆమెకు బాగా తెలుసు. తను లేనిదే అతను ఒంటరి అయిపోతాడు. అతని జీవితవిజయాలన్నిటికీ ఆమె పతాకచిహ్నం.

వేసవి అడుగుపెడుతోంది. పసుపు రంగు పువ్వులు మాడిపోతున్నాయి. త్వరలోనే మైదానమంతా దగ్ధభూమి కాబోతోంది. జూన్ మధ్యనాటికి తవ్వకాలు ఆపేయబోతున్నాననీ; భార్యనూ, కూతురినీ మధ్య యూరప్ లోని ఏదైనా విశ్రాంతి స్థలానికి తీసుకువెళ్లదలచుకున్నాననీ- మే 30న కొడుకు సెర్గీకి స్లీమన్ ఉత్తరం రాశాడు. గత నాలుగు నెలల పనీ తన కెంతో సంతృప్తి నిచ్చిందన్నాడు. తను ట్రాయ్ ప్రాకారాలను, ప్రియామ్ ప్రాసాదం ఉనికినీ కనిపెట్టాడు. 250,000 మీటర్ల మేరకు మట్టి తవ్వాడు. ఒక మ్యూజియం మొత్తానికి సరిపడినన్ని పురావస్తువులను సేకరించాడు…

అదే రోజున ఫ్రాంక్ కల్వర్ట్ కు కూడా ఉత్తరం రాశాడు. హిస్సాలిక్ కు కొన్ని గంటల ప్రయాణదూరంలో, బునర్ బషీకి దగ్గరలో, తింబ్రియా అనే చోట కల్వర్ట్ కు ఒక ఎస్టేట్ ఉంది. అతనికి స్లీమన్ రాసిన ఉత్తరం, కొడుక్కి రాసిన ఉత్తరానికి  పూర్తి భిన్నమైన శైలిలో సాగింది. అందులో ఒకవిధమైన భయమూ, వణకూ తొంగిచూస్తున్నాయి.  నాటకీయంగా ఉండి; తన ప్రగాఢమైన ఆశలతో, కలలతో సన్నిహితంగా పెనవేసుకున్న ఇలాంటి లేఖ అతని జీవితం మొత్తంలో ఇదే:

నామీద గట్టి నిఘా పెట్టారని మీకు తెలపడానికి విచారిస్తున్నాను. కారణం తెలియదు కానీ, ఆ టర్కిష్ కాపలాదారు నామీద అదేపనిగా మండిపడుతున్నాడు. రేపు అతను నా ఇంటిని సోదా చేయబోతున్నాడు. కనుక, సొతంత్రం తీసుకుని ఆరు బుట్టలూ, ఒక బస్తా మీ దగ్గర భద్రపరచడానికి పంపుతున్నాను. దయతో వాటిని మీ ఇంట్లో ఉంచి తాళం వేయవలసిందిగానూ, వాటిమీద టర్కుల చేయి ఏవిధంగానూ పడకుండా చూడవలసిందిగానూ వేడుకుంటున్నాను.

ఆ ఆరు బుట్టలలోనూ, బస్తాలోనూ ఉన్నవి ట్రాయ్ తవ్వకాలలో బయటపడిన స్వర్ణ నిక్షేపాలు!

Troy-jewellery-Istanbul-Archaeoloy-Museum-8051

ఈ నిక్షేపాలు కచ్చితంగా ఏ తేదీన బయటపడ్డాయో తన ప్రచురిత రచనల్లో స్లీమన్ ఎక్కడా వెల్లడించలేదు. స్థలమూ, సమయమూ మాత్రం తెలుస్తున్నాయి. ఉదయం 7 గంటలకు, ప్రియామ్ ప్రాసాదానికి దగ్గరలోని ఒక చుట్టుగోడ(circular wall)కు అడుగున, బాగా లోతైన చోట అవి దొరికాయి. కల్వర్ట్ కు ఉత్తరం రాసిన మే 30నో, లేదా అప్పటికి కొన్ని రోజుల ముందో స్లీమన్ కు అవి కనిపించి ఉంటాయి. తను నిక్షేపాలను కనుగొన్నాననీ, అయితే సమయం లేక వాటిని ఇంకా పరిశీలించడం, లెక్కించడం చేయలేదనీ మే 31న అతను మొదటిసారి తన నివేదికలో రాశాడు. అంటే, ఈ మాటలు రాయడానికి ముందే ఆ నిక్షేపాలను కల్వర్ట్ ఇంటికి తరలించి ఉంటాడు.

వేర్వేరు సమయాలలో రాసిన మూడు వేర్వేరు కథనాలను బట్టి, మే నెలలో విపరీతంగా ఎండ కాసే ఒకరోజున అతను ఈ నిక్షేపాలను కనిపెట్టాడని అర్థమవుతోంది. ఆరోజున మైదాన మంతటినీ తళతళలాడే పసుపురంగు ధూళి పొగలా కమ్మేసింది. అంతకు ఎనిమిదిరోజుల ముందు అతనికి ఒక భారీ వెండి కలశం కనిపించింది. దానిలోపల ఓ చిన్న వెండి చెంబు ఉంది. దానికి దగ్గరలోనే ఒక రాగి శిరస్త్రాణం ఉంది. అది ఛిద్రమైనా, లింగాకారంలోని దాని కొమ్ములు మాత్రం భద్రంగా ఉన్నాయి. ఆ చుట్టుపక్కల కచ్చితంగా మరికొన్ని నిక్షేపాలు కనబడతాయన్న అంచనాతో తవ్వకాలు కొనసాగించాడు.

పనివాళ్లను గుంపులు గుంపులుగా విడదీసి వేర్వేరు చోట్ల తవ్వకాలు జరపడానికి పంపించేశాడు. వాళ్ళు కందకాల్లోనూ, నడవల్లోనూ పనిచేసుకుంటూ ఉంటే, నిక్షేపాలను గుట్టు చప్పుడు కాకుండా దిబ్బ మీది తన ఇంటికి తరలించవచ్చని అతని ఆలోచన. ముఖ్యంగా ప్రభుత్వ ప్రతినిధి అమీన్ ఎఫెన్డీ ఆ సమీపంలో లేకుండా జాగ్రత్తపడాలనుకున్నాడు.

స్లీమన్, అతని భార్య, కొద్దిమంది పనివాళ్లు స్కేయిన్ గేటుకి దగ్గరలోని చుట్టుగోడ పొడవునా తవ్వకాలు జరుపుకుంటూ వెళ్లారు. 28 అడుగుల లోతున, విశేషమైన పనితనం కలిగిన ఒక రాగి పేటిక లాంటిది అతనికి కనిపించింది. పైన పేరుకుపోయిన దుమ్మును, ధూళిని పక్కకు తప్పిస్తూ చూసి, అది మూడడుగుల పొడవూ, 18 అంగుళాల ఎత్తూ ఉంటుందని అంచనా వేశాడు. ఆ పేటిక పైన శిరస్త్రాణం ఆకారంలోని రెండు వస్తువులు, ఒక భారీ దీపపు కుందె లాంటిది ఉన్నాయి. ఆ పేటిక బద్దలై ఉంది. అందులోంచి కొన్ని వెండి పాత్రలు తొంగి చూస్తున్నాయి. దానికి చుట్టుపక్కల నాలుగైదు అడుగుల మందాన ఎరుపు, గోధుమ రంగుల్లో ఉన్న దగ్ధశిథిలాలు ఉన్నాయి. అవి రాయంత కఠినంగా ఉన్నాయి. వాటికిపైన అయిదడుగుల వెడల్పు, ఇరవై అడుగుల ఎత్తు ఉన్న భారీ రక్షణకుడ్యాలు ఉన్నాయి.

ఎట్టకేలకు నిక్షేపాలను కనిపెట్టాననుకున్నాడు. టర్కుల చూపు పడకుండా వాటిని రక్షించడ మెలా అన్నది తక్షణ సమస్య. పనివాళ్లలో ఎవరూ పసిగట్టలేదు. సోఫియా అతని పక్కనే ఉంది. ఆమెవైపు తిరిగి, “నువ్వు వెంటనే వెళ్ళి ‘పైడోస్’ అని కేకపెట్టు” అని చెప్పాడు. పైడోస్ అనే ఆ గ్రీకు మాటకు సెలవుదినం అని అర్థం.

సోఫియా అప్పటికింకా నిక్షేపాలను గమనించలేదు. దాంతో ఆశ్చర్యపోయింది. “అదేమిటి, ఇంత హఠాత్తుగా?” అని అడిగింది. “అవును. ఇవాళ నా పుట్టినరోజనీ, ఇప్పుడే ఆ సంగతి గుర్తొచ్చిందనీ చెప్పు. పని చేయకపోయినా ఈరోజుకు పూర్తి వేతనం ఇస్తామని చెప్పు. అంతా ఊళ్ళకు వెళ్లిపోతారు. ఆ ఓవర్సీర్ ఇక్కడికి రాకుండా చూడు. త్వరగా వెళ్ళు. పైడోస్ అని కేకపెట్టు” అని స్లీమన్ ఆమెను తొందరపెట్టాడు.

 

సోఫియా చెక్క నిచ్చెన ఎక్కి, పైకి వెళ్ళి అతను చెప్పినట్టే చేసింది. సెలవుదినాలను ప్రకటించడం ప్రతిసారీ సోఫియా వంతు. వెంటనే పనివాళ్లు తవ్వకాలు ఆపేసి వెళ్లిపోవడం ప్రారంభించారు. అనుకోని విధంగా వేతనంతో సెలవు దొరికినందుకు సంతోషించినా, ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా హఠాత్తుగా సెలవు ప్రకటించలేదు కనుక కొంత అయోమయానికి గురయ్యారు. ప్రభుత్వ ప్రతినిధి అమీన్ ఎఫెన్డీ మరింత విస్తుపోయాడు. తనకు ముందుగా చెప్పకుండా ఇంత ఆకస్మికంగా ఎప్పుడూ సెలవు ప్రకటించలేదు.

(సశేషం)

 

 

 

 

 

 

 

జిహ్వ

 

-అల్లం కృష్ణ చైతన్య

~

    Krishna Chaitanya Allam      “ఒక సారి తిని చూడ్రా, బాగుంటది” అడిగిండు రాజు.

“అద్దు రా, నేను తిండి విషయంలో చాలా పెకీ. చూడ చక్కని ప్రేసెంటేశన్, మంచి టెక్స్చర్, సొంపైన వాసన ఉంటె కానీ నాలుక దాకా పోదురా ఏ తిండైనా” పోజు కొట్టిండు కార్తీక్.

“నీ ఇష్టం. నీ కడుపే మాడేది నాకెందుకు”

“రేయ్, నాలుక మనకున్న అవయవాల్ల గొప్పది రా. ఏది పడితే అది తిని దాని విలువని తగ్గించలెం గదా?”

“కడుపు కాల్తే నాలుకేంది, దానమ్మకు కూడా విలువుండది.”

“అది వేర్రా. ఆ రుచి ఆకలి నుండి వస్తది. ఇప్పుడు లేదు కదా ఆకలి”

“సరే నీ ఇష్టం. మాడు. ఎవడెం చేస్తడు నీలాంటోల్లతోని. నీది కూడా నేనే తింటున్న”

“పండగ చేస్కో”

“నువ్ పోయి ఈ పళ్ళెం కడుక్కో” కార్తీక్ ప్లేట్ల ఉన్న నీళ్ళ పప్పు, అన్నం తన ప్లేట్ ల ఎస్కుని ఖాళి పళ్ళెం వెనకకు ఇచ్చిండు రాజు.

“సరే కడుగుదాంతీ గనీ, ఈ జైళ్ల వంట మనిషి ఉద్యోగం చేయాలంటే ఎం చేయాల్రా?”

“జైలర్ని అడగాలే” తినుకుంటనే చెప్పిండు రాజు.

ఆలోచనల పడ్డడు కార్తీక్.

***

“కొన్ని దేశాల్ల నీసు లేకుంటే ఆల్లకు ముద్దే దిగదట తెల్సా? అక్కడ జైళ్ళల్ల కూడా నీసు పెడతారంటవారా?” రాజుని అడిగిండు కార్తీక్ పక్క సెల్ ల నుండి.

“ఎవడు పోయి చూసిండ్రా. ఎక్కడి జైలు ఐతేంది? జైలు జైలే. తిండి తిండే. నేరం చేసినోనికి కూసోవెట్టి మేపుతరా ఏంది?” తనకు తెల్సిన విజ్ఞానాన్ని పంచిండు రాజు.

“నిజమేరా. కనీ ఒక్కో సారి బయట దేశాల జైల్లన్నీ తిరిగి అక్కడ తిండి ఎట్లా పెడతారో సూడాలే అనిపిస్తది రా.” కార్తీక్ గోడకు తల ఆనించి సీలింగ్ మీదకు చూస్తా ఆలోచనల పడ్డడు.

“ప్రపంచం మా గమ్మత్ ఉంటదిరా. కొట్లాటలు, కత్తులు, తుపాకులు, విద్వేషాలు, ద్వేషాల మధ్యన నీలాంటోని కలల పరిధులు కూడా జైలుని దాటక పోవుడు ఆశ్చర్యం అనిపిస్తలేదు. కానీ స్వేచ్చని మించిన అనుభూతిని తిండిల వెతుక్కుంటున్నవంటే మొక్కాల్రా బాబు నీకు.” రాజుకు కార్తీక్ మీద జాలి పడాల్నో లేదో కూడా అర్ధం అయితలేదు.

“ఏమోరా, నా ధ్యాస ఎప్పుడూ, రుచి మీదనే ఉంటది. ఊచలు, గోడలు, పల్లాలు అన్ని రుచి చూసిన. వాసన కన్నా ముందు నాకు రుచే మతికస్తది.”

“నువ్వు తెలివున్నోనివో, మెంటలోనివో అర్ధం కాదొక్కోసారి. దేశాలు కాదు, నీ రుచి అనంతలోకాలకు చేరుకోవాల్నని ప్రార్తిస్తున్న. పండుకో ఇగ.”

“వస్తదిరా, మనక్కూడా ఓ రోజు, చలో గుడ్ నైట్”

“గుడ్ నైట్”

***

సూర్యుడు నూనెల గోలిచ్చిన పెద్ద పూరీ లెక్కనే ఉబ్బిపోయి మీదకస్తున్నడు. పూరి పక్కన లేశే నూనె నురగ లెక్కనే విచ్చుకుంటున్నై సూర్య కిరణాలన్నీ. ఊచల మధ్యన విచ్చుకున్న వెచ్చని ప్రభాతం పేర్చి పెట్టిన మైసూరు పాకుల లెక్కనే ఉన్నది.

నిద్ర లేవంగనే గట్టిగ తిత్తుల నిండా గాలి పీల్చిండు కార్తీక్. రుచికరమైన ప్రభాతం కూడా జైలు గోడల మధ్య మురికి కంపు కొడుతున్నది. తుప్పు పట్టిన ఊచలు ఉప్పటి వాసన వేస్తున్నై. చెమట, తుప్పు, దుమ్మూ, ధూళి, మన్నూ, మశానం అన్నీ ఉప్పగనే ఉంటై అనుకున్నడు కార్తీక్.

సున్నం ఉప్పగ ఉండదేమో. ఆ ఆలోచన రాంగానే గోడకున్న సున్నాన్ని నాకిండు. ఏ రుచీ లేదు. ఏ రుచీ లేకుండ ఎట్లుంటది ఇది అనుకున్నడు. ఎదో ఆలోచిస్తూ ఉండిపోయిండు.

స్నానాల టైం అయింది. రాజూ, కార్తీక్ స్నానం చేస్తున్నరు. సబ్బు వాసన ఘుమఘుమలాడుతున్నది.

“రేయ్ అది తినేది కాదు కదరా. సబ్బు వాసన చూస్తానవెం రా మెంటలోడా?”

“సర్వదోష నివారిణి, పరిశుద్ద ఆత్మ పరిరక్షణా కవచం…. “

“రేయ్ తెలుగులో చెప్పురా”

“సబ్బు గురించి రావి శాస్త్రి ఏమన్నడో తెల్సారా?”

“తెల్సు. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ.. “

“రేయ్ అది శ్రీ శ్రీ రా. ఆయన మహా కవి. ఈయన మహా కథకుడు”

“ఐతే తెల్వది రా. నువ్వే చెప్పు. వాసన సూడుమన్నడా?”

“కాదు. ఎంత మలినం అంటినా స్వచ్చంగానే ఉండే స్వయం పరిశుద్ధక పదార్థంగా అభివర్నిన్చిండు.”

“ఆహా..”

ఈ సబ్బు రుచి ఎట్లుంటదో .. సబ్బుని నాకి చూసిండు.

“రేయ్ .. ఎం పని రా అది”

ఎవరి మాటలు వినపల్లేదు కార్తీక్ కి. సబ్బు వాసన ఘాటుగా ముక్కుపుటాలని తాకుతున్నది. కళ్ళకు దగ్గర ఉన్న సబ్బు నురగతో కళ్ళు మండుతున్నై. అయినా నాలుగయిదు సార్లు సబ్బుని నాకి చూసిండు. నాలుక మీద ఏ రకమైన ఆచ్చాదనా లేదు. రుచి లేదు. నాలుక్కో పదార్ధం కూడా తాకినట్టు లేదు.

నోరు, ఒళ్ళూ కడుక్కొని ఎం మాట్లాడకుండ అక్కణ్ణించి వెల్లిపోయిండు కార్తీక్. రాజుకి ఎం మాట్లాడాల్నో అర్ధం కాలేదు.

***

మద్యానం నడి ఎండ నెత్తిమీద సుర్రున కొడుతున్నది. రాగి పళ్ళాలు చేతుల పట్టుకుని ఖైదీలందరూ లైన్ల నిల్చున్నరు.

“ఏమైందిరా పొద్దున్న?” అడిగిండు రాజు.

“కాసేపాగు..”

మాడిపోయిన గిన్నెల తేలుతున్న నూనె, పోపు సరిపోకపోవడం వల్ల ఎక్కడా కనిపించని మసాలా పదార్థాలు, తగినంత పసుపు వాడకపోవడం వల్ల రంగు లేకుండా, ఎక్కువగా ఉడకటం వాళ్ళ అది అన్నమో, పప్పో అర్ధం కాకుండ చెమటలు చిందించి మరీ వండుతరు వంటగాళ్ళు. చెమటలెం ఖర్మ, చీమిడీ, సొల్లూ ఏమైనా చిందించి వంటలో ఉప్పు రుచి తీసుకురాగలిగిన వాళ్ళు. లేహ్యం లాంటి ఆ పదార్తమేదో పళ్ళెంల వేసిన్లు.

ఇంకో గిన్నెల నీళ్ళమీద తేలుతున్న నూనె, అక్కడక్కడా మాడిపోయిన మిరపకాయలతో సాంబారు అనబడు ఎర్రటి ద్రావకం ఒకటి గిలాసలో పోయబడ్డది.

పళ్ళెంల పడ్డ ఆ పదార్థాన్ని, గిలాసలో ఉన్న ఆ ద్రావకాన్ని ఎన్నడూ తిండి మొకం సూడని మనిషి లెక్క ఒక్క బుక్కలో తిని, ఒక్క గుక్కలో తాగిండు కార్తీక్.

గత పదేళ్ళలో తన వంటని అంత ఆప్యాయంగా, మురిపెంగా, ఆబగా, ప్రేమగా ఎవరూ తినడం చూడని వంటగాడు ఇంచు మించు కన్నీళ్ళు పెట్టుకున్నంత పని చేసిండు. కార్తీక్ని దగ్గరికి పిల్చి “ఇంకొంచెం కావాల్నా తమ్మీ” అని అడిగిండు.

“అద్దద్దు. ఇది చాలు” కార్తీక్ పళ్ళెం కడుక్కోనీకి పోయిండు.

ముక్కు మూస్కొని తినడం ఎట్లనో తెల్వక కష్టపడి కడుపులో ఆ పదార్థాల్ని పడేస్తున్న రాజు దగ్గరికి వచ్చి కూచున్నడు కార్తీక్.

“ఏమైందిరా నీకియాల?”

“రుచి పోయిందిరా.”

“ఎక్కడ పోయింది? ఎట్ల పోయింది?”

“ఏమోరా. పోయింది అంతే. పోద్దట్నించి ఎన్నింటిని నాకిన్నో, ఏమేం తిన్ననో. గడ్డీ, మట్టీ, గోడలు, చువ్వలు.. ఏదీ రుచి అస్తలేదురా.”

“నువ్వు మొదట్నుండీ అంతే కదరా”

“అట్లా కాదురా. ఇది వేరే. మొత్తానికే పోయింది. ఒక అవశేషం లెక్క, వ్యర్ధ అవయవం లెక్క అయిందిరా  నాల్క.”

“సరిపోయింది. నీ వంకలకు, నాల్కె రోగానికీ మంచిగ సరిపోయింది.”

“రేయ్, నీకర్ధం కాదురా నా బాధ. ఎక్కడున్నా, రుచేరా నా అనుభూతి, మనశ్శాంతి అన్నీ. ఆస్వాదన లేకుంటే ఎందుకురా జీవితం.”

“అట్ల ఎందుకురా అనుకునుడు. ఇట్ల సూడు. ఇక్కడ ఎలాగూ నీకు తిండి సైపదు. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండ తినచ్చు.”

“నిజమే.” నిరుత్సాహంగ చెప్పిండు కార్తీక్.

***

లంచ్ టైం అయింది. గంట కొట్టిన్లు. రోజూ లెక్కనే అందరు పళ్ళాలు, లోటాలు పట్టుకుని లైన్ల నిలబడ్డరు.

“ఎం వంట చేసిన్లు రా ఇవాళ?” అడిగిండు కార్తీక్.

“ఆనక్కాయ చేసినట్టున్నర్రా, అయినా నువ్ తెలుసుకొని చేసేదేమున్నది రా?” అన్నడు రాజు.

“నిజమే”

ఆనప కాయ. కార్తీక్ మనసు ఎక్కన్నో ఉన్నది.

“ఎం ఆలోచిస్తానవ్ రా?”

“ఆనప కాయ గురించి. మా ఇంట్ల చిన్నప్పుడు తిండికి సరిగ ఎల్లేది కాదు. మా అవ్వ ఎన్నుంచి తెచ్చేదో కానీ ఇంటి మీద మొత్తం, ఆనప తీగెలు, బీరకాయ తీగలు, గుమ్మడి కాయ తీగలు, బచ్చలాకు అన్ని రకాల తీగల కూరలు పాకిపోయ్ ఉండేటియ్. పిందెలు కాంగనే మా అవ్వ కళ్ళళ్ళ చిన్న సంబురం కనిపించేది. నాలుగు రవ్వలు ఆదా అయితున్నయనో, నాలుగు తిండి గింజలు దొరికినయనో తెల్వది కని.”

“పళ్ళెం పట్టు” పాత జ్ఞాపకాల్ల మునిగిపోయిన కార్తీక్ వడ్డించే వాని పిలుపుతో మళ్ళీ ఈ లోకంలకు వచ్చిండు.

ఇద్దరు కలిసి రోజూ తినే జాగాలకు పోయిన్లు.

“దూది పిందెల లెక్క ఎముంటై రా ఈ ముక్కలు. సారీ రా. ఇందాకటిది కంటిన్యూ చెయ్.” తిండి ఆస్వాదనలో మునిగిపోయి అన్నడు రాజు.

“అన్ని కూరగాయలు చేతికి అందెతట్టు కాశేటియ్. దొంగ ముండ ఆనపకాయకు మాత్రం మాదండి బలుపు. అదొక్కటి మాత్రం ఇంటి మీద కాశేది. అది కోయ్యాల్నంటే ఇల్లెక్కాలే. అది కోయ్యాల్నంటే నా సాయం కావాల్శిందే మా అవ్వకు. ఒక సారి అది కోయ్యబోయి గూన పెంకుల మీదికెల్లి జారి పడ్డ. ఊళ్ళ ఆరెంపీ పెద్దగ పైసలేం తీస్కోడు కని ఇచ్చే ఆ నాలుగు పైసలు కూడా కనాకష్టమే మా ఇంట్ల. పక్కింట్ల చేబదులు పట్కచ్చింది మా అవ్వ.

రెండ్రోజులకు పక్కింటి శీను గాడు మా ఇంటి మీద కనిపిచ్చిండు.

“రేయ్ ఎం చేత్తానావ్ రా ఆడ” అన్న. “మీ అవ్వే ఎక్కమన్నదిరా” అన్నడు వాడు.

నాకు దెబ్బ తాకిందని వాణ్ని ఇల్లు ఎక్కిచ్చిందేమో అనుకున్న. వాడు గంప నిండా ఆనపకాయలు కోస్కోని వాని సందాన వాడు పోయిండు.

“అవ్వా, ఏందే వాడు కాయలు కోస్కోని పోతాంటే సప్పుడు చెయ్యవ్?” అడిగిన.

“రాజవ్వనే అన్నది రా, మొన్న దీస్కున్న చేబదులు వంతు పైసలేం అద్దు కనీ ఆనక్కాయలిమ్మన్నది. సరేతీమన్న. మల్ల కాత్తైతీరా.” చానా సులువుగ చెప్పింది మా అవ్వ. అవి కాశినంక సాంబారు, కూర, అనపకాయ సర్వపిండి ఎన్ని తినచ్చో అని నా మనసుల గుర్రాలు ఉర్కుతుండే. గప్పుడు అన్ని మాయం అయినై ఒక్క సారే.

“అది సరే రుచికీ ఈ కథకీ సంబంధం?”

“అయిదింటికి రావాల్సిన బస్ రాత్రి పన్నెండిటికి అస్తే? అయిదింటికే వస్తే బస్ ఎక్కి పోతవ్. పన్నెండింటికి వచ్చింది కాబట్టి ఆ ప్రయాణం గుర్తుండి పోతది. రెండో కాపు కాసే వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. మళ్ళీ కొన్ని నెలలు పట్టింది. లేత ఆనపకాయలు ఎన్నో రోజుల ఎదురు చూపుల తరవాత నాలుకతో నలుగుతుంటే స్వర్గం కనిపించింది.”

“నిజమేరా. ఎక్కడిదో ముచ్చట యాదికి ఉంచుకున్నవ్ బాగనే”

“రుచి అంటే అదే రా. స్మృతులని తడిమే సాధనం. ఒక్కో రుచికీ ఒక్కో కథ. ఎన్నో జ్ఞాపకాలు. నోట్లోకి పోయిన పదార్ధం యధార్ధాన్ని బయటకు తీసి అడుగున పడిన జ్ఞాపకాలని తట్టి లేపుతది”

***

మూడు నెల్ల శిక్షా కాలం అయిపొయింది ఇద్దరికీ.

బయటకు రాంగనే పిల్లగాలోకటి స్వాగతం చెప్పింది.

“ఒక్క నిముషం నిల్చోరా ఇక్కన్నే” కార్తీక్ అడిగిండు.

ఇద్దరు జైలు తలుపు ముందర నిల్చొని స్వేచ్చా లోకాన్ని చూస్తున్నరు.

“ఏముందిరా.. ఈ గాలి” రాజు తిత్తుల నిండా గట్టిగ గాలి పీల్చుకున్నడు. బయట దుర్గంధం కూడా సువాసన లాగనే ఉన్నది.

రెండు చేతులూ పాంటు జేబుల్ల పెట్టుకొని నిలబడ్డడు కార్తీక్. ప్రశాంతంగా లోకం దిక్కు చూస్తున్నడు.

“గాలి కాదురా. స్వేచ్చా వాయువు. సమస్త జీవరాశులకూ సమానంగా పంచబడనిది. ఆటవిక జంతుజాలం, మనిషి మాత్రమె అనుభవించగలిగింది. పదే పదే దుర్వినియోగం చేయపడేది. అవధులు, పరిధుల్ని దాటి రెక్కలు విచ్చుకుని ఎగరాల్నని అనుక్షణం తహతహలాడేది. ఒకళ్ళ చేతుల ప్రేమగా, మరొకళ్ళ చేతిల ఆయుధంగ మారిపోయే కనిపించని మానసిక విశేషం.”

“… ..”

దానికి ఎట్లా ప్రతి సమాధానం ఇయాల్నో అర్ధం కాలే రాజుకు.

“పదా చాయ్ తాగుదాం.” ఎదురుగ ఉన్న చాయ్ స్టాల్ కు పోయిన్లు ఇద్దరు.

ఘాటుగా, తియ్యగా, వెచ్చని పొగ ఆవిరిలో నుంచి అల్లం చాయ్ వాసన వస్తున్నది. చాలా రోజుల తరవాత ముక్కు పుటాలకు సుఖమైన వాసన.

చాయ్ గ్లాస్ నోట్లో పెట్టుకుని ఒక సిప్ చేసిండు కార్తీక్.

తియ్యగా, ఘాటుగా, వెచ్చగా, సుఖంగా అనిపించింది.

రెండు నీటి చుక్కలు బోట బొటామని కారినై కార్తీక్ కుడి కన్ను నుండి.

ఎందుకని అడగలేదు రాజు.

***

 స్వప్న నగరం

 

 

-ఆకెళ్ళ రవిప్రకాష్

~

akella

 

 

 

 

 

నేనొక స్వప్నం చూసాను
ఆ స్వప్నంలొ ఒక నగరం చూసాను
అక్కడ సైన్యాలు లేవు
ఎవరి భుజాల మీద తుపాకులు లేవు

కత్తుల గురించి
కవాతుల గురించి
బాంబుల గురించి
ఆలోచనల్లేవు
ఆవేదనల్లేవు

పిల్లల్ని సైన్యంలోకి
చేర్చడం లేదు
సైనికుల శరీరాల మీద
జాతీయ జెండా కప్పడం లేదు
యుద్ధ కధల్ని పిల్లలకి చెప్పడం లేదు

అటువంటి
ప్రేమ ప్రపంచంలోకి
భూగోళం ఎగరడం చూసాను

అటువంటి
భవిష్య నగరంలోకి
నేను మళ్ళీ పుట్టడం చూసాను

ప్రేమలోకి
స్వేఛ్ఛలోకి
ప్రతి మనిషి ఎగరడం చూసాను
నేనొక స్వప్నం చూసాను-

*

కవిత్వం కాకి బంగారం కాదు: అనిశెట్టి రజిత

 

boorlaకవయిత్రి సామాజిక ఉద్యమ కారిణి అనిశెట్టి రజిత తన చిన్ననాటి నుండే ప్రజా ఉద్యమాలతో మమేకమైనవారు. కాళోజీ అడుగుజాడల్లో నడిచినవారు. ఇప్పటి వరకు ఐదు కవితా సంపుటాలు, తన సంపాదకత్వంలో అనేక కవితా సంపుటాలు ప్రకటించారు. అనేక పురస్కారాలు అందుకున్నారు. ఇటీవల తెలంగాణ రచయితల వేదిక అలిశెట్టి ప్రభాకర్ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా అన్నవరం దేవేందర్, బూర్ల వేంకటేశ్వర్లు వారితో జరిపిన ముఖాముఖి.

  • అలిశెట్టి ప్రభాకర్ పురస్కారం స్వీకరిస్తున్నారు కదా! ఎలా అనుభూతి చెందుతున్నారు. అలిశెట్టి ప్రభావం మీ కవిత్వం మీద ఉన్నదా? ఆయన కవిత్వం పై మీ వ్యాఖ్య?

#  అలిశెట్టి ప్రభాకర్ స్మృతిలో ఒక పురస్కారం ఒకటి కరీంనగర్ తెలంగాణ రచయితల వేదిక నెలకొల్పడం, ప్రతి సంవత్సరం 12జనవరిని చరిత్రాత్మకం చేస్తుంది.  ఈ పురస్కారానికి ఈ సంవత్సరం నన్ను ఎంచుకోవడం ఆనందం కలిగినా చాలా ఆలోచిస్తున్నాను.

39 ఏళ్ల వయసు నాటికి ఒక అరాచకత్వంతో, క్రమ శిక్షణా రాహిత్యంతో, దారిద్ర్యం పడగ నీడలో బతికిన మంచి కవి సాహితీలోకం నుండి నిష్క్రమించడం తలుచుకుంటే విషాదం కమ్ముకుంటున్నది.

అలిశెట్టి కవిత్వంతో నాకు ఉన్న పరిచయం అప్పట్లో ఎక్కువేమీ కాదు. గత మూడు సంవత్సరాలుగా చాలా లోతైన అనుబంధం ఏర్పడింది. ఎంత పదునైన కవిత్వం అది. అంత చిన్న పదాల్లో అత్యంత పెద్ద భావన, చురుక్కుమనిపించే మినీ కవితలో లోకం తీరును అనితరసాధ్యంగా ప్రతిబింబిస్తుంది ఆ కవిత్వం. simply he is a great poet. పరోక్షంగా ఆయన కవిత్వ ప్రభావం నాపైన ఉన్నదనే అనుకుంటాను.

  • నలభై ఏళ్లకు పైగా సాహత్య రంగంలో ఉన్నారు. ఇప్పటికి ఐదు కవితా సంపుటాలు, రెండు దీర్ఘ కవితలు, నానీలు, హైకూలు, కథా సంపుటి, ఎనిమిది సంకలనాలకు సంపాదకత్వాలు వెలువరించారు. ఒకరకంగా చెప్పాల్సివస్తే తక్కువగా రాసినట్టే…క్రియాశీల ఉద్యమాల్లో పాల్గొన్నందున ఇలా జరిగిందా!

#  పైన పేర్కొన్న ప్రక్రియలే కాకుండా మరో రెండు ప్రక్రియలు వ్యాసం, పాట కూడా నేను రాసాను… రాస్తున్నాను. ప్రచురించబడిన రచనలు ఉన్నట్లే సంకలనం కాని రచనలు వివిధ పత్రికల్లో వచ్చినవి ఎన్నో ఉన్నాయి… కాబట్టి ఒక సామాజిక కార్యకర్తగా క్షేత్ర స్థాయిలో పని చేస్తూ సమయం సరిపోక ఇంకా ఎక్కువగా రాయలేక పోయాను అనేది లేదు.

నిజానికి ప్రజాతంత్ర ఉద్యమాల్లో క్షేత్ర స్థాయిలో పాల్గొనడం వల్లనే రాయగలుగుతున్నాను. ఆ క్రియాశీల భాగస్వామ్యమే లేకపోతే బహుశా నేనూ “వాలుకుర్చీ” రచయితగా మిగిలిపోయి ఉందును as a careerist and as a professional writer గా…

  • మీరు పౌర, స్త్రీ వాద, ప్రజాతంత్ర ఉద్యమాల్లో పాల్గొంటున్నారు కదా! ఆయా ఉద్యమాల ప్రభావం సమాజం మీద క్రియాశీలంగా పని చేస్తుందా! ఫలితాలెలా ఉన్నాయి…

#  ఉద్యమాలు క్లిష్టమైన సామాజిక సాంస్కృతిక సమస్యల నుండే కదా పుట్టేది! వాటిలో పాల్గొనడం అంటే ప్రతి రోజూ ప్రతి క్షణం ఒక సంక్షోభం… అందుకే నేనంటాను ఉద్యమాలు ఉల్లాస క్రీడలు కావు అవి ప్రతినిత్యం జీవన్మరణ వేదనలని..

ఉద్యమాల ప్రభావం సమాజం మీద శాశ్వతంగానో సుదీర్ఘంగానో ఉండదు… అది తాత్కాలికంగానే ఉండదు… ఒక ఉద్యమం లోని కొన్ని డిమాండ్లు pass కాగానే సమూల మార్పులు జరిగిపోవు.. ఉద్యమాలకు చివరి అధ్యాయాలుండవు… ఒక తేదీన మొదలయి మరో తేదీన ముగిసిపోవదమూ ఉండదు. ఫలితాలు కూడా పాక్షికంగానే ఉంటాయి. సంపూర్ణతకు అర్థం లేదు. ఈ యథాతథ సమాజం కూలిపోయి సరికొత్త సమాజం ఏర్పడినపుడే ఉద్యమాలు మరో సృజనశీల రూపం తీసుకొని ప్రజా బాహుళ్యాన్ని  చైతన్య శీలురుగా మారుస్తాయి.. ఉద్యమాలు ఇంకెంతో పెరుగాల్సి ఉన్నది.. హేతు బద్ధత విస్తరించాల్సి ఉన్నది…

  • తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మనం అనుకున్న నిర్మాణానికి అడుగులు పడ్తున్నయా, ఎట్లా ఫీల్ అవుతున్నారు! ‘పునర్నిర్మాణం’ ‘బంగారు తెలంగాణ’ పట్ల మీ భావం ఏమిటి?

#  తెలంగాణ రాష్ట్రం రాజకీయంగా, భౌగోళికంగా సాధించుకున్నాం.. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం తన భావజాలంతో పని చేస్తున్నది.. అంతేనా..? ప్రత్యేక రాష్ట్రం కోసం కదిలిన సకల జనుల ఉద్యమ పాత్ర అయిపోయినట్టేనా..? చేయాల్సింది చేసినం. ఇక చేయవలసిందంతా సర్కారే అనుకుంటే అతి పెద్ద ప్రమాదం… దీనివల్ల అంతా సమసిపోయిందనే అనుకోవాల్సి వస్తుంది.

ప్రజలు ఆలోచించడం.. పని చేయడం ఆగిపోయి ఎదురుచూడటం… అడుక్కోవడం మొదలయ్యిందంటే ఉద్యమ ప్రభావం అంతరించినట్టే… ఉద్యమాన్ని గతంలోకి నెట్టేస్తే ఈ నిర్మానంగానీ, పునర్నిర్మాణంగానీ, ప్రజా తెలంగాణ గానీ ఏదీ సాధ్యం కాదు.

ప్రజలు సంతోషంగా ఉన్నారా.. మెలకువతో ఉన్నారా.. సుభిక్షమైన తెలంగాణే బంగారు తెలంగాణంటే.. దాని కోసం తమ భాగస్వామ్యాన్ని గుర్తిస్తున్నారా.. తమ పని అయిపోయిందని చేతులు దులుపేసుకుంటున్నారా.. తమ ఆకాంక్షలు ఏమిటి? అవి తీరే దారి ఏమిటి? వీటి గురించి చిత్త శుద్దితో ఆలోచిస్తేనే ఏదైనా సాధ్యం…

  • ప్రస్తుత కవితారంగం ఎటువైపు ప్రయాణిస్తున్నది? ఇంకా ఎలాంటి మార్పును తీసుకోవలసి ఉన్నది?

#  కవిత్వం మన లోపల కాలుష్యాలను ప్రక్షాళనం చేసి మంచి వైపుకే లాక్కుపోతుంది. కవితారంగం బాగా రాణిస్తున్నది…పురోగమిస్తున్నది… ఎటొచ్చీ కవులే కార్మికులు కాకుండా వైట్ కాలర్ ఉద్యోగుల్లా ప్రవర్తిస్తున్నారు. ముసుగు వీరుల్లా ముసుగు మనుషుల్లా సొంత డబ్బాలు మోగిస్తూ.. కోటరీలను తయారు చేసుకుంటూ..లొంగిపోయి బతుకుతున్నారు.

దేనికి లొంగిపోయి అంటే తమ వ్యక్తిగత అవకాశాల కోసం, కీర్తి కండూతి కోసం తమను తాము గొప్ప కవులుగా ప్రమోట్ చేసుకోవడానికీ.. సొంత దుకాణాలను బాగా అభివృద్ధి చేసుకొని ‘యాజమాన్యం’ చెలాయించడానికి దొంగ దారుల్లో.. పక్క దారుల్లో.. తప్పుడు దారుల్లో అడ్డదారులు పట్టి ఎగబడిపోతున్నారు. అందమైన తొడుగుల్నీ, ముసుగుల్నీ వేసుకొని చెలామణి అయిపోతున్నారు. సామాజిక స్పృహను కోల్పోయి దృష్టి హీనత్వం తెచ్చుకుంటున్నారు..

కవిత్వం కాకి బంగారంలా సింగారించబడి అహో ఒహోల్ల్లో సుడి చుట్టుకపోతున్నది. మనిషి కానివాడు కవెట్లయితడు? ఈ ముసుగులూ తొడుగుల్నీ చీల్చుకొని నిఖార్సైన మనుషుల్లా కవులు బయిటికి రావాల్సి ఉన్నది.. వ్యక్తిగత కాలుష్యాల నుండి కవిత్వరంగం ప్రక్షాళన కోరుకుంటున్నది.

  • తెలంగాణ ఆవిర్భావం తర్వాత కవి/రచయితల పాత్ర ఎట్లా ఉన్నది? ప్రస్తుత కర్తవ్యం ఏమిటి?

#  చాలా మంది కవులు అయోమయంలో ఉన్నారు… కిం కర్తవ్యం అనే డైలమాలో పడిపోయారు.. దారి తప్పిపోయిన వాళ్ళూ.. దారి తెలియక తచ్చాడుతున్న వాళ్ళుగా చీలిపోయారు.. ఉమ్మడి లక్ష్యం తెలంగాణ వచ్చేసింది.. ఇంకేమున్నది అన్న నిర్లిప్తతలో ఉన్నారు. నిశ్శబ్దం గుహల్లో దాక్కుంటున్నారు.. పిరికితనంతో ముడుచుకుపోయి మూగగా రోదిస్తున్నారు.

ప్రస్తుతమైనా ఎప్పుడైనా కవీ, రచయితా, మేధావీ సమాజానికి సరైన దిశా నిర్దేశకత్వం చేయాలి.. ప్రజా పక్షంలో ఉండాలి.. సమాజాన్ని కాపాడుకోవడం.. ఎప్పటికప్పుడు కొత్త నిర్మాణాలు చేస్తుండటం మన పని. ఏ బాధ్యతా లేదు, ఏ పనీ లేదు.. ఏ మేధావిగా ఆలోచనా రాదు అనుకుంటే కవిగా, రచయితగా, మేధావిగా, అంతా end అయినట్టే…

ఇప్పుడు కవులూ రచయితలూ చాలా మంది తమకో కర్తవ్యం బాధ్యత అస్తిత్వం ఉందనుకుంటున్నారా? అచేతనం నీడలో విశ్రమించకుండా ‘సోయి’ లోకి రావడం తక్షణ కర్తవ్యం. ఎటు గాలి వీస్తే అటు కొట్టుకపోవడం అగమ్యం.. అరాచకం.. దీన్ని గుర్తెరిగి కవులు తమను తాము నిరూపించుకోవాల్సి ఉంది.

 

 

  • ఇంకా ఏమైనా చెప్పదల్చుకున్నారా?

నేనింకా చెప్పదల్చుకున్నది.. కవులు తమ బాధ్యత గుర్తెరుగక పొతే, మాట్లాడటం ఆగిపోగానే మనిషి నత్తగుల్లలోకి పలాయనం చిత్తగించినట్టవుతుంది. లాలూచీలు, రాజీ పడటాలు, పటాటోపాలు, తళుకు బెళుకులు కవులు రచయితలకు సంబంధించిన లక్షణాలు కావు.

అటు ఇటు కాకుండా ఏదో కవిత్వం కెలికి కవులమని రచయితలమని పురస్కారాలు పుచ్చుకుంటే అది ఆత్మవంచనకు పరాకాష్ట. సమాజం కోసమే కలం పట్టాలె… ప్రజల కోసమే నిలబడాలె. అదీ కవంటే.. అదీ కవిత్వమంటే.. ఇయ్యాల అలిశెట్టి ప్రభాకర్ కవిగా అందుకే చిరంజీవుడు.

ఇప్పుడున్న ఇంకొక ట్రెండ్ అకవిత్వం… అకవుల బెడద.. కవిత్వం సాధన చేయకుండా అకవులు వెల్లువెత్తుతున్నారు.. ఇక బోగస్ కవులూ పుడ్తున్నారు.. అవకాశవాదం ఎంతకైనా లోబడుతుంది. లోబడు కవులూ తేలుతున్నారు. ఈ చరిత్ర ద్రోహం నుండీ, చరిత్ర హీనత్వం నుండీ బయట పడమని నేను కవులనూ రచయితలనూ కోరుతున్నాను.

 

ఈ చిన్ని అద్దంలో కౌముది!

 

-కేక్యూబ్ వర్మ

~

 

varmaచిన్న అద్దంలో కొండని చూపించడం లాంటిదే కౌముది గారిని  చిరు వ్యాసంలో పరిచయం చేయడం! ఆయన కవి, కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు,అభ్యుదయ  రచయితల సంఘానికి క్రియాశీల కార్యవర్గ సభ్యుడు. ఖమ్మం జిల్లాలో అరసం  వ్యవస్థాపకుడు. కమ్యూనిస్టు  పార్టీ యువజన పత్రిక  “యువజన” కి సంపాదకుడు. “విశాలాంధ్ర” ఉద్యోగిగా జీవితం ప్రారంభించి, అధ్యాపకత్వంలో స్థిరపడ్డారు. అక్షరోద్యమ నేత గా  మారుమూల ప్రాంతాల్లో రాత్రనకా పగలనకా పర్యటించి, అక్షర సేవలో కన్ను మూసిన ఉద్యమ శీలి.  ప్రజానాట్య మండలిలో కొన్ని వందల స్టేజీ నాటకాలపై నటించిన ప్రజా నటుడు, గాయకుడు. ఇవన్నీ కాక, రచయితగా అనేక కథలూ, అనువాద రచనలూ అందించిన సృజన శీలి.

అలనాటి కమ్యూనిస్టు ఉద్యమాలతో కలిసి నడిచిన కార్యశీలిగా, ప్రజా నాట్యమండలి కళాకారునిగా ప్రాచీన కవిత్వం నుండి అత్యాధునిక కవిత్వం వరకు విశ్లేషించే సాహిత్య పిపాసిని ఈ కొద్ది మాటల్లో  పరిచయం చేయడం -కొండను అచ్చంగా అద్దంలో చూపడమే.

చాలా సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో సమకాలీన అంశాలను తన కవితలలో ప్రతిబింబిస్తూ వచన కవితా స్థాయిని ఏమాత్రం చెక్కుచెదరకుండా నిలిపి వుంచిన అక్షరశిల్పి కౌముది గారు. తన రచనా సమాహారం ’అల్విదా’ ముందుమాటలో ప్రముఖ కవి ఖాదర్ మొహియుద్దీన్ చెప్పినట్లు కౌముదిగారు కవీ, రచయితా, విమర్శకుడూ, తన యవ్వన దశని ప్రగతిశీల సాంస్కృతిక ఉద్యమానికి పరిపూర్ణంగా వెచ్చించిన సమరశీలి, ప్రతిభాశాలి. ఇంతకుమించి ఆయనకు ఎలాంటి విశేషణాలు అవసరం లేదు. కొందరి సాహితీ మూర్తిమత్వాలు ఏ విశేషణాలకూ అందవు. అటువంటి కొందరిలో ఒకరు కౌముది గారు అని అంటారు. ఇది నిఖార్సయిన నిజం. తన రచనలలోని సమరశీలత ప్రగతిశీల ధృక్పథం నేటికీ మనలను కట్టి పడేస్తాయి. ఆలోచనలను ఉర్రూతలూగిస్తాయి. రచనలలోని సమకాలీన రాజకీయ ప్రాంతీయ స్థల కాల విశ్లేషణలు నాటి సమాజాన్ని మన కనుల ముందు సాక్షాత్కరింప చేస్తాయి. ఉదాహరణకు బంగ్లాదేశ్ ఆవిర్భావం గురించి రాసిన ’ముక్తి వాహినీ విజయ్ కరే’ కవితలో

చెప్పు తల్లీ! చెప్పు మళ్ళీ

ఎందుకు పుట్టాడు దానవుడు

ఏ అపరాధం చేశాడని

వంగభూమిలో మానవుడు

 

నిద్రిస్తూన్న శిశువుమీద

నిండు చూలాలిమీద

మంచిమీద మానవత్వం మీద

అఘాయిత్యాల సంపుటి

అమ్మా! ఇది గుండె మీది కుంపటి!

….

 

మతాలు, గతానుగతికాలు

మనస్సును కుంచించే సంకుచితాలు కుత్సితాలు!

మానవతామృధ్జ్యోత్స్నావగాహుడైన మనిషికి

కానే కావు సమ్మతాలు

-అంటారు.

 

చలనశీలమైన సమాజంలో మార్పును కాంక్షించే అభ్యుదయ వాదిగా కౌముది గారు ’ఇలాగే వస్తుంది మార్పు’ కవితలో –

ఇలాగే వస్తుంది మార్పు

ప్రజలు వినిపించినప్పుడు తీర్పు

ఇలాగే వస్తుంది మార్పు

 

నగరాలు నినాదాలు యిస్తాయి

రాస్తాలు వూరేగింపులు తీస్తాయి

రేపటి వుదయానికి ఆకాశం

పంచరంగుల పోస్టర్లను ఆవిష్కరిస్తుంది

పిల్లగాలుల పత్రికా విలేకర్లు

ఈ వార్తను అందుకొని ఎగిరిపోతారు

దిక్కులు భేరీ భాంకృతుల్తో ఈ సత్యాన్ని ప్రకటిస్తాయి

-అని రేపటి మార్పుని ఓ గొప్ప ఆశావహ దృక్పథంతో ఆవిష్కరిస్తారు.

ప్రతీ కవితలో అన్నార్తుల అభాగ్యుల జీవన వేదనను చిత్రిస్తూ చివరిగా రేపటి తరంలోని మంచి మార్పును ఆశించి సాగిన కవిత్వం కౌముది గారిది. నాటి అభ్యుదయ భావజాలం నేటి సామాజిక స్థితికి కూడా దగ్గరగా వుండడం వారి రచనలలోని సజీవత్వానికి నిదర్శనం. ’ఉదయిస్తున్నాడు రేపటి రవి’ కవితలో

పాలులేక మరణించిన

పసిపాప సమాధిమీద

పాడె బట్ట నోచుకోని

పరమదరిద్రుడి శవం మీద

ఇరుకు బ్రతుకు, మురికి గుడిశ

ఆకటి, చీకటి, చిత్తడుల మీద

పచ్చ పచ్చగా వెలుతురు

పరుగెత్తుతూంది చూడు!

– అంటారు..

హరించిపోతున్న మానవత్వం కోసం పరితపించడం కౌముది గారి కవితలలో ప్రతి చోటా మనల్ని నిలువనీయదు. సూటిగా ప్రశ్నించడం తన కవితలలో ఓ గొప్ప లక్షణం. చాలా నిక్కచ్చిగా నిర్మొహమటంగా మనలోని సంకుచితత్వాన్ని మతతత్వాన్ని ప్రశ్నిస్తూనే రేపటి ఉషస్సుకోసం ఆరాటపడడం ప్రతి కవితలో ప్రస్ఫుటం. వెన్నెలను కలం పేరుగా మార్చుకున్నా తన రచనలలో మాత్రం అగ్నిశిఖలా వెలిగిపోవడం కౌముది గారి ప్రత్యేకత. చివరిగా మహాకవి, మహానాయకుడు మఖ్దూమ్ స్మృతిలో తను రాసిన కవితా పాదాలే తనకోసం ఉదహరిస్తూ ’అల్విదా’ తో ముగిస్తాను.

గీతశిల్పి వెళ్ళిపోయాడు

గీతం తెగిపోయింది

ఏ సంకేతమూ లేకుండా

ఎవ్వరికీ చెప్పకుండా

అనుకోకుండా తెగి

గాలిలో కరిగిపోయే నక్షత్రంలా

అకస్మాత్తుగా జారి

మట్టిలో కలిసిపోయే కన్నీటి చుక్కలా

ఉన్నట్టుండి హఠాత్తుగా

సభ మధ్యలోంచి తలవంచుకొని

షాయర్ వెళ్ళిపోయాడు

ముషాయరా ఆరిపోయింది…

 

*

 

అభ్యుదయ కవుల్లో భిన్న స్వరం!

alvidaa

-ఇంద్రగంటి శ్రీకాంత శర్మ

~

 

indraganti 1970ల దశాబ్దిని “కల్లోల దశాబ్ది” అనే వారు. అలనాటి మిత్రులు కౌముది గారు అప్పుడే పరిచయం.

కచ్చితంగా చెప్పాలంటే, పరిచయమైతే 1969 నుంచి- దాశరధి పాటలో పాదంలాగా – “మాట్లాడని మల్లె మొగ్గ  మాదిరిగా నడిచి వచ్చి”- పలకరించే ఆయన స్వరం నాకిప్పటికీ గుర్తు. ఆ కాలంలో తరుచూ ఆయన గేయ కవిత్వం వ్రాస్తుండే వారు. కవిత్వ ప్రసంగాల మధ్య ఆయన కమ్యూనిస్టు నిబద్ధత నాకు తెలిసేది కాదు. బుగ్గన పరిమళించే జరదా పాన్ వుండేది. ఉద్విగ్నంగా ఉపన్యాసాలిచ్చే స్వభావం కాదేమో అనిపించేది. ఆనాటికి నేనెరిగిన మల్లారెడ్డి అభ్యుదయ గీతాలకు వేరుగా కౌముది రచనలు నాకు తోచేవి.

అలాగే, అలనాటి ఇతర అభ్యుదయ రచనల్లో కనిపించే “మొనాటనీ”కి కౌముది దూరంగా కనిపించే వారు. ఆయన్ని సమకాలీన “చప్పుడు కవులు” చెడగొట్టకుండా ఉర్దూ కవులు ఆయన్ని రక్షించారనుకుంటాను. శబ్దం ఎంపికలో శ్రద్ధ, లాలిత్య విషయంలో ఔచిత్యం ఎరిగిన సాహిత్యవేట్టగా కౌముది గారంటే నాకు గౌరవం. వూరికే నోరు చేసుకోవడం కంటే కవిత్వాన్ని అనుభవించడంలో ఆయన చూపే శ్రద్ధ చాలా తక్కువ మందిలో చూశాను. ఆలోచనా శీలి అయిన కౌముది గారు తక్కువగా రచనలు చేశారంటే నేను ఆశ్చర్య పడను. ఆయన అంతర్ముఖీనత ఆయన ఇంటర్వ్యూల్లో స్పష్టంగానే కనిపిస్తుంది.

“రత్నం వెదకదు: వెదక బడుతుంది” అన్నాడు కాళిదాస కవి ఒక చోట. అలాగే, కవిత్వం కూడా వెల్లడి కాదు; వెల్లడింపబడుతుంది. దాని కోసం అన్వేషణ, అధ్యయనంలో వుందనే కిటుకు కౌముది గ్రహించడం వల్లనే బహుశా కవిత్వం పేరిటా, అభ్యుదయం పేరిటా వట్టి మాటలు ఉద్రేకాలను ఆయన వెలిగక్కలేదు.

లోకం తీరు, అందులో మనుషుల ప్రవర్తనల్లో ఎగుడు దిగుళ్ళూ, అందుకు కారణాలూ కౌముది వెల్లడిగా చూడగలిగారు. పైగా మాట్లాడ్డంలో నిదానం, స్పష్టత విశిష్టంగా ఎరిగిన వారు. ఆయన కవిత్వమంతా ఇవాళ వరసగా చదువుతూంటే, పాతగా పొగలాగా అనిపించదు. ఆ వాక్యాలకు, పదసంపుటికి పాతదనం లేదు. పునరుక్తి కాదు, కవిత్వ రహస్యమెరిగిన వ్యక్తి పడే జాగ్రత్త అది.

మరీ ముఖయ్మ్గా “ఏకాంత”, “ఒక వృక్షం”, “ఇంతకూ నేనెవర్ని?” అనే వచన పద్యాలూ, “కవినైతిని”, “వసంత గీతి” “విశ్వ శాంతి” “దీపావళి” “వికృత ప్రాకారాలు” – పద్యాలూ, “ఒక అనుభవం” రచన వంటివి కౌముది గారి కవిత్వాన్ని పాతబడనివ్వవు.

ఏకాంతం – కవితలో కౌముది అంటారు:

గుండెల మీద

ఘనీభవించిన దూరాలు

 

నిట్టూర్పుల నిప్పు కణికల మీద

ఉచ్చ్వాస నిశ్వాసాల పరిమళాల నివురు.

ఎక్కడో  ఎందుకో

మంచులా కురుస్తున్న చూపులు.

దిగంతాల దగ్గిర

అప్పుడే ముత్యాల పల్లకీ దిగిన సంధ్య

ఎర్ర దుమ్ము ఎగరేసుకుంటూ

సరుగుడు చెట్ల వెనక

నిష్క్రమించిన రథం

 

అప్పుడే

నిప్పుల నది ఈది ఈది

తీరం ఎక్కి

వగర్చుతూ ఒళ్ళు ఆరబెట్టుకుంటున్న ఒంటరి చుక్క.

 

మిణుగురు పురుగు రెక్కల మీద ఎగిరి వచ్చి

మెల్లగా వ్యాపించే

నీ

ఆలోచన.

*

తన కాలంలో మిగతా కవుల కంటే వేరుగా మాట్లాడగలిగితే – ఒక కవి తన గొంతులో మాట్లాడుతున్నాడని అర్థం.

కౌముది గారు అభ్యుదయ కవుల్లో సొంత గొంతున్న కవి.

నా మిత్రుని కవిత్వానికి నమస్కరిస్తున్నాను.

*

 

కౌముది కవిత్వ సంపుటి “అల్విదా” కోసం సంప్రదించండి: సాహితీ మిత్రులు, 28-10-26/1, అరండల్ పేట, విజయవాడ- 520 002. 

ఎండు చేపా, ఎండు చేపా, ఎందుకున్నావు కథలో?

artwork:"Artio" Mahy ( www.artioadvertising.com)

artwork:”Artio” Mahy (www.artioadvertising.com)

3

~

 

అనగనగా అప్పుడెప్పుడో పూర్వకాలంలో, అదేదో దూరదేశంలో కుక్కలకి వేట నేర్పటానికో పద్ధతి పాటించేవాళ్లు. ఫలానాదాని వాసన చూపిస్తే దేవులాడుకుంటూపోయి దాని ఆచూకీ పట్టేయటం శునకరాజావారి పని . కానీ ఆ ఫలానా వాసనకన్నా ఘాటైన పరిమళమేదో వాతావరణాన్ని కమ్మేస్తే రాజావారి పరిస్థితేంటి? కాబట్టి, ఎట్టి పరిస్థితిలోనైనా అసలు వాసన మీదనే మనసు లగ్నం చేసేలా జాగిలాలకి తర్ఫీదునీయటం ముఖ్యం. అందుకోసం శిక్షణాప్రాంగణాన్ని ఎండుచేపల తీవ్రాతితీవ్రమైన సుగంధంతో ముంచెత్తేవారు. ఆ కంపుదెబ్బకి దారితప్పుతుందా, లేక ఆనవాలు వాసనే ఆఘ్రాణిస్తూ పోయి ఆచూకీ కనిపెట్టేస్తుందా అన్నది పరీక్ష.

కథలు రాసే మెళకువలేవో దొరుకుతాయనొస్తే కుక్కల వేట చిట్కాలు ఎదురయ్యాయని కళవళపడకండి. ఈ ఉపోద్ఘాతమంతా కథారచనలో వాడబడే ‘రెడ్ హెర్రింగ్’ అనబడే ఒకానొక ప్రక్రియ గురించి.

‘హెర్రింగ్’ అనే ఒకరకం వెండి చేపని ఎండబెట్టి పొగలో పండబెడితే కాసేపటికది ఎర్రబారి ‘రెడ్ హెర్రింగ్’ అవుతుంది. అప్పట్లో శునక శిక్షకులు ఎలాగైతే ఈ యొక్క ఎర్ర హెర్రింగుతో కుక్కల్ని ఉద్దేశపూర్వకంగా దారి మళ్లించ ప్రయతించేవాళ్లో, అలాగే కొన్ని తరహా కథల్లో పాఠకుడి దృష్టి అసలు విషయం నుండి మరెటో మళ్లించటానికి కథకులు రకరకాల ఎత్తులు వేస్తారు. ఇవి సాహిత్యానికి సంబంధించిన రెడ్ హెర్రింగ్స్. పాత్రికేయులడిగే ప్రశ్నలకి రాజకీయ నాయకులు పొంతన లేని సమాధానాలు చెప్పి అసలు సమస్యనుండి దృష్తి మళ్లిస్తారు చూడండి – అది రాజకీయెర్ర హెర్రింగన్న మాట. మనకి రాజకీయాల్తో సంబంధం లేదు కాబట్టి కథల్లో ఎండు చేపలెందుకో మాత్రం చూద్దాం.

అన్ని రకాల కథలకీ ఎర్ర హెర్రింగులతో అవసరముండదు. వీటి ఉపయోగం అపరాధ పరిశోధన, సస్పెన్స్, హారర్, మిస్టరీ తరహా కథల్లోనే ఎక్కువగా ఉంటుంది. సాధారణీకరించాలంటే – చిక్కు ముడులు విప్పే తరహా కథలకి ఎండు చేపలతో ఎక్కువగా అవసరం పడుతుంది. ఈ కథల్లో ప్రధాన పాత్ర ఓ సమస్య పరిష్కరించటానికి పూనుకుంటుంది. ఆ సమస్య ఓ హత్యో, దొంగతనమో, మరే నేరమో కావచ్చు; నిధి నిక్షేపాల ఆచూకీ కనిపెట్టటం కావచ్చు; ఏదో రహస్యం గుట్టు విప్పటమూ కావచ్చు. ఆ పని చేసే క్రమంలో ప్రధాన పాత్రకి పలు ఆధారాలు లభించటం, వాటినో క్రమంలో పేర్చుకుంటూ పోయి చివరికి చిక్కుముడి విప్పటం – స్థూలంగా ఇదే కథ. రెడ్ హెర్రింగులేమీ లేకుండానే ఇలాంటి కథలు రాసేయొచ్చు. అయితే అవి చప్పగా ఉండే అవకాశాలెక్కువ. చేప కూరకి మసాలా ఎంత ముఖ్యమో, చిక్కుముడి కథకి ఎండుచేపలు అంత ముఖ్యం. ఎందుకో చూద్దాం పదండి.

మిస్టరీ, క్రైమ్, డిటెక్టివ్ తరహా కథలు ఇష్టపడే పాఠకులు వాటిలో ఎదురయ్యే చిక్కు ప్రశ్నలు కథానాయకుడి కన్నా ముందు తామే పరిష్కరించాలని ఉబలాటపడతారు. వాళ్లు ఇటువంటి కథలు చదవటానికి సదరు ఉబలాటమే సగం ప్రేరణ. కానీ ఈ పాఠకులతో వచ్చిన చిక్కేమిటంటే – వాళ్లు ఇలాంటి కథలు విరగబడి చదివేసి కథానాయకుడికన్నా ముందే సమస్యని పరిష్కరించే స్థాయికి చేరిపోయుంటారు! వాళ్లు వాసన పట్టలేనంత పకడ్బందీగా కథ నడపాలి. ముగింపుదాకా రాకముందే మిస్టరీ విడిపోయిన కథ తుస్సుమన్నట్లే. కాబట్టి ఇలాంటి కథల్లో పాఠకుల్ని చివరిదాకా దారి తప్పించాలి. వాళ్లనుద్దేశించి కథలో కొన్ని తప్పుడు ఆధారాలొదలాలి. అవి ఎంత పక్కాగా ఉండాలంటే, అవే అసలు ఆధారాలనుకుంటూ పాఠకుడు వాటి వెంటబడి పరుగుతీయాలి. చివరికొచ్చాక తన తప్పు గ్రహించి నాలిక్కరుచుకోవాలి. ఈ నాలిక్కరిపించేవే రెడ్ హెర్రింగ్స్ లేదా ఎండు చేపలు.

రెడ్ హెర్రింగ్స్ ఎలా ఉండాలో చెప్పమంటే కష్టం. చాలా అపరాధపరిశోధనా కథల్లో ఓ పోలిక్కనిపిస్తుంది: ఓ నేరం; ఏ అరడజను మందో అనుమానితులు; నేరం చేయటానికి అందరికీ సహేతుకమైన కారణాలు, అవసరాలు. ఇది రెడ్ హెర్రింగ్‌కి ఓ మూస ఉదాహరణ. అయితే రెడ్ హెర్రింగ్ అంటే ఇలాగే ఉండాలనేం లేదు. నిజమైన ఆధారం నుండి పాఠకుడి దృష్టి మళ్లింపజేసేది ఏదైనా – అదొక అసందర్భ వ్యాఖ్య కావచ్చు, జోక్ కావచ్చు, మరోటి కావచ్చు – అది రెడ్ హెర్రింగ్ కిందకే వస్తుంది.

సాధారణంగా రెడ్ హెర్రింగ్స్ అనేవి కథ పూర్తిగా రాసిన తర్వాత వేసే తాలింపులు. అప్పటికి కథ ఓ రూపానికొస్తుంది కాబట్టి ఎక్కడెక్కడ పాఠకుడి దృష్టిమళ్లించాలో రచయితకి అవగాహనొస్తుంది. అప్పుడు అవసరమ్మేర రెడ్ హెర్రింగ్స్ చల్లితే సరిపోతుంది. అయితే ఒకటి – పాఠకుడి దృష్టి మళ్లించటానికి రచయిత తోచినన్ని వేషాలేయొచ్చు, కానీ ఆ వేషాలు మితిమించకూడదు. మీరిచ్చే ఆధారాలు తప్పైనా ఒప్పైనా కథ పరిధిలోనే ఉండాలి, కథకి సంబంధించినవై ఉండాలి. మాన్య మంత్రివర్యులవారు సభలో ప్రతిపక్షం సంధించిన ప్రశ్నకి సంబంధం లేని అనర్ఘళ సమాధానమివ్వటాన్ని చూస్తున్న టీవీక్షకులకి ఎలా చిర్రెత్తుతుందో, రెడ్ హెర్రింగ్ అనుకుంటూ కథకి సంబంధంలేని చెత్తంతా రాస్తే చదివేవారికీ అలాగే చిరాకేస్తుంది. అవసరమైన వివరాలని కావాలని దాచిపెట్టి అనవసరమైన విశేషాలతో కథంతా నింపేసి చివర్లో అసలు సంగతి బయటపెట్టటం సరైన పద్ధతి కాదు. పాఠకుడికి ఎండుచేపలు ఎరవేయటానికీ, తొండిచేయటానికీ చాలా తేడా ఉంది. రెడ్ హెర్రింగ్స్ పని పాఠకుల్ని వక్రమార్గం పట్టించటం; వాళ్లని వెధవల్ని చేయటం కాదు.

కొన్ని రకాల కథల్లో రెడ్ హెర్రింగ్స్ ఉంటాయనే అంచనా ఉన్న పాఠకుడు కనబడ్డ ప్రతి ఆధారాన్నీ అనుమానంగానే చూస్తాడు. ఇలాంటివారిని బురిడీ కొట్టించటం కాస్త కష్టమే కానీ  అసాధ్యమేమీ కాదు. దానికోసం కథకుడు చేయాల్సిందల్లా, అది రెడ్ హెర్రింగ్ అని అనుమానం రాకుండా, అతి సాధారణంగా కనపడే వాక్యాలతో పాఠకుడి దృష్టి మళ్లించటమే. అంటే, కథలో ఎండుచేపలున్నా వాటి వాసన తెలీకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. వ్యక్తిగతంగా – నా దృష్టిలో పాఠకుడిని పూర్తిగా తప్పుదారి పట్టించకుండా, అన్ని వివరాలూ సక్రమంగా అందిస్తూనే వాటి పూర్వోత్తర సంబంధాన్ని (context) మాత్రం స్పష్టపరచకుండా వదిలేసి, పాఠకుడి దృక్కోణాన్ని కాస్త పక్కకి జరిపే రకం రెడ్ హెర్రింగ్స్ ఉత్తమమైనవి, అత్యంత ప్రభావశీలమైనవి. ఇటువంటి కథలు మొదటిసారి చదివినప్పుడు ఓ రకంగానూ, context బోధపడ్డాక తిరిగి రెండోసారి చదివినప్పుడు మరోరకంగానూ కనిపించి పాఠకులతో ఔరా అనిపిస్తాయి. నా ‘శిక్ష’ కథలో ( లంకె ) ఈ విధమైన ఎండుచేపలు దండిగా ఉంటాయి గమనించండి. ఎర్ర హెర్రింగుల్ని కేవలం చిక్కుముడి కథల్లోనే కాదు, సందర్భం కుదిరితే ఎలాంటి కథలోనైనా దర్జాగా వాడుకోవచ్చు అనేదానికీ ఈ కథ ఓ ఉదాహరణ.

ఇదే కథలో నేను వాడిన మరో ప్రక్రియ గురించి మరో భాగంలో తెలుసుకుందాం.

గమనిక: కథల్లో రెడ్ హెర్రింగ్స్ వాడకానికి ఉదాహరణలీయటానికి చాలా గొప్పకథలున్నాయి కానీ, వాటిని విపులీకరించటం వల్ల ఆయా కథల ముగింపులు బయటపడిపోయే ప్రమాదముంది. అందువల్ల ఈ వ్యాసంలో వాటి జోలికిపోలేదు.

*

2015: కొత్త కలాల కథాకళి

      

( కథా సారంగ-2015 సమీక్ష )

~

chanduఅనంత గమ్యం వైపు సాగిపోతున్న మహా ప్రవాహం కాలం.  చాలా మంది  కాలం మనలో మార్పు తీసుకొస్తోందని… భావిస్తుంటాం. వాస్తవానికి మార్పును… కాలం తీసుకురాదు, మనమే మారుతుంటాం.
***

గడిచిన ఏడాది 2015 మన జీవితాలపై చాలా ప్రభావాన్ని చూపింది.  మన చుట్టూ తనదైన ముద్రలను ఎన్నో వదిలి వెళ్లింది. ఆర్థిక, రాజకీయ, సామాజిక కారణాల వల్లనే కాక సాహిత్య పరంగా కూడా గత సంవత్సరానికి ఓ విశిష్టత ఉంది. సాధారణంగా సాహిత్యం, సాహిత్య కారులు…రాజకీయ పాలనా అంశాలను ప్రభావితం చేసే సందర్భాలు చాలా తక్కువ. ఏ అవార్డులో, పురస్కారాల సందర్భంలో తప్ప… సాహిత్యం,  రచయితలు ప్రధాన వార్తా స్రవంతిలో ఉండడం చాలా అరుదు. అలాంటిది… గడచిన ఏడాదిని సృజనకారులే నడిపించారని చెప్పుకోవచ్చు. వివిధ రకాల అంశాలపై వారి స్పందన పట్ల…. విభిన్న రకాల అభిప్రాయాలున్నా కూడా, మొత్తానికి సృజన కారులు అప్రమత్తంగానే ఉన్నారన్న భావన ఎవరికైనా సంతోషాన్ని కలిగించేదే.  మన తెలుగు నాట కూడా ఇదే సందడి కొనసాగింది.  రకరకాల వాదనలు, చర్చలు, అభిప్రాయాలు, నిరసనలు…ఇలా 2015  వేగంగా గడిచిపోయింది.

వీటన్నింటిని నేపథ్యంగా తీసుకుంటూ సారంగ పత్రికలో గత ఏడాది కాలంలో వచ్చిన కథలను పరిశీలిస్తే… మనకు చాలా విషయాలు అవగతమవుతాయి.  గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకూ సంవత్సర కాలంలో యాభై మూడు పెద్ద కథలు, పందొమ్మిది చిన్న కథలు వచ్చాయి.  ఇవి కాకుండా  అనిల్-ఎస్-రాయల్  అనువాద కథ బ్రహ్మాండం,  అనురాధ నాదెళ్ల రాసిన గూడెం చెప్పిన కథలు లాంటి ఇతర కథలు కూడా వచ్చాయి. నామిని,  రామాచంద్రమౌళి లాంటి సీనియర్ కథకులు ఎప్పటిలాగే తమ కథాయజ్ఞాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.  అలాగే వెంకట్ సిద్ధారెడ్డి,  పింగళి చైతన్య, అల్లం ‌వంశీ, రేఖా జ్యోతి వంటి….చాలామంది  కొత్త రచయితలు వెలుగు చూడడం సంతోషకరం. పేరుకే కొత్త రచయితలైనా…వస్తువు ఎంపిక, శైలి, శిల్పం పరంగా మంచి పరిణతిని చూపిస్తున్నారు.

Artwork: Bhavani Phani

Artwork: Bhavani Phani

ఈ ఏడాది కథలన్నీ చదివిన తర్వాత…ముందుగా ఒకటి చెప్పాలి. “తెలుగు భాష త్వరలోనే అంతరించిపోతుందని” ప్రచారం చేసే వారికీ, “అవునా..?” అని భయపడేవారికి.  మరేం ఫర్వాలేదు,  తెలుగు భాషకే కాదు… తెలుగు కథకు కూడా ఇప్పట్లో ఏ ప్రమాదమూ లేదని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు.

ముద్రణా పత్రికల కథలతో పోలిస్తే…, సారంగలాంటి అంతర్జాల పత్రికల కథలకు కొన్ని తేడాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. రకరకాల కారణాలతో దినపత్రికలు లేదా ఇతర వార పత్రికలు  కొన్ని రకాల ఇతివృత్తాలను అంగీకరించలేని పరిస్థితి. పైగా ఎంత కాదన్నా అక్కడ సీనియర్ కథకులు, పేరు మోసిన వారి కథలకే ప్రాధాన్యం ఎక్కువగా ఉంటోంది. ఎప్పడో తప్ప కొత్త రచయితల కథలు రావు. ఇందుకు ఇతర కారణాలూ ఉండొచ్చు.  ఆ రకంగా ఆన్ లైన్ పత్రికల కథల్లో కొత్త రక్తం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటోంది.  దాంతోపాటూ ఏ తరహా ఇతివృత్తానికైనా ఆన్ లైన్ పత్రికలు కొంత వెసులు బాటు ఇవ్వడం కూడా కొత్త దనం కనిపించడానికి కారణమవుతోంది. అలా కథా సారంగ ద్వారా పాఠకులకు చాలా కొత్త కలాలు పరిచయమయ్యాయి.

ఆ రకంగా వస్తున్న కొత్త తరంలో విభిన్న ఇతివృత్తాల ఎంపిక,  శైలి శిల్ప పరంగా సరికొత్త ప్రయోగాలు చేస్తూ కొందరు కొత్త పుంతలు తొక్కుతున్నారు. అప్పటికే చాలామంది రాసిన ఇతివృత్తాలని కూడా…. మూలాల్లోకి వెళ్ళి అన్వేషించి కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నారు. కొన్ని కథలైతే..అనుభవజ్ఞులైన రచయితలకూ తీసిపోని విధంగా ఉన్నాయి.

ఐతే ఇదంతా ఒకవైపే. మరో వైపు ఊహాజనిత సమస్యలు,  కృత్రిమ ఇతివృత్తాలు సృష్టించిన వాళ్లూ ఉన్నారు.  తమ సొంత గొడవలనే కథల పేరుతో దేశం మీదికి ప్రయోగించిన వాళ్లూ లేకపోలేదు.  కొన్ని కథలైతే డైరీలో దినచర్యను తలపించినవి కూడా లేకపోలేదు.  అయినా కూడా  కథలు రాయాలన్న తపనతో… ఓ అడుగు ముందుకు వేసినందుకు వీరినీ భుజం తట్టాల్సిందే. చిన్న చిన్న లోపాలున్నా… కొత్త కథకులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వారినీ పరిగణనలోకి తీసుకుంటున్న సారంగ సంపాదకులనూ అభినందించాల్సిందే.

చాలా మంది కొత్త రచయితలు  తమకు ఎదురైన సాధారాణ సంఘటనలనే కథలుగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. కథలు రాసే కొత్తల్లో ఏ రచయితలకుండే ఆవేశం, అత్యుత్సాహం వల్ల… కనిపించే ప్రతీ ఘటననూ కథలుగా రాయాలనుకుంటారు. పొద్దున సిటీ బస్సులో సీటు దొరక్క పోవడం నుంచీ…రాత్రికి సీరియల్ లో లేడీ విలన్ ప్రవర్తన  దాకా…కనిపించే ప్రతీ ఘటనను కథలుగా సంధించాలనుకుంటారు. అది మంచిదే. కథలు రాయాలన్న తపన అభినందనీయమే కానీ ప్రతీ అనుభవమూ కథ కాదని తెలుసుకోవాలి.  కథకు సంబంధించిన కొన్ని మౌలిక లక్షణాలపై  కొత్త రచయితలు మరింతగా అధ్యయనం చేయాలి. కవితకు సరిపోయే తక్షణ భావావేశం… కథగా మారినపుడు మాత్రం సంతృప్తి పరచదు.

అలాగే  కొత్త రచయితలే కాక…సీనియర్లు కూడా దృష్టి కోణంలో వ్యక్తిగత జీవిత పరిధిని దాటలేక పోతున్నారు. తమకు తెలిసిందే రాయాలన్నదే మంచి నిర్ణయమే ఐనా కేవలం తమ కతలే….కథలు కాబోవని కూడా గుర్తించాల్సి ఉంది.   సృజనకారులకు వ్యక్తి గత జీవితం, వ్యక్తిగత బాధ్యతలే కాదు… సాంఘిక జీవితం, సామూహిక బాధ్యతా ఉంటాయి.  తమ వ్యక్తిగత దృక్కోణంలోంచే కాకుండా….సమాజ కోణంలోంచి కూడా  అంశాలను తప్పక పరిశీలించాలి.

artwork: Srujan

artwork: Srujan

ఇక ఇక్కడ లోతుగా చర్చించాల్సిన విషయమూ ఇంకొకటి ఉంది. మాండలికం కథల గురించి.  ఏదీ మాండలికం..? ఏదీ యాస…? ఏదీ గ్రామ్యం…ఏది వ్యవహారం…? అంటూ ప్రశ్నించాల్సిన అవసరమూ ఉంది. ఎందుకంటే కొందరు మాండలికం పేరుతో….కేవలం గ్రామ్యం రాస్తున్నారు.  నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు కొన్ని పదాల ఉచ్ఛారణను తమకు అనుగుణంగా మార్చుకున్న వాటినే మాండలికం అనుకుంటున్నారు. కథకు తగిన విధంగా, పాత్రకు అనుగుణంగా  ఏభాష వాడినా అభ్యంతరం ఉండదు. కానీ ఓ పక్క గ్రామ్యం రాస్తూ….మళ్లీ మధ్య మధ్యలో  సంస్కృత భూయిష్ట సమాసాలు, ఆంగ్ల భాష పదాలు రాయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి…?

కొంచెం ఇష్టం కొంచె కష్టం అన్నట్లుగా….కొంచెం కథ రాసి, ఇంకొంచెం కవిత్వం కలిపి రాసిన వాళ్లూ ఉన్నారు.  తెలుగు కథల్లో వస్తున్న ఓ ఆధునిక పరిణామంగా దీన్ని చూడాల్సి ఉంటుంది.     అలాగే  ఒక సున్నిత సమస్యను తీసుకొని …దాన్ని వ్యతిరేకించేవారు కూడా అద్భుతం అని మెచ్చుకునేలా రాసిన కథలూ ఉన్నాయి.  వెంకట్ సిద్దారెడ్డి సోల్ సర్కస్ కథ, పింగళి చైతన్య -తనదే ఆకాశం, అల్లం వంశీ మిరకిల్…ఎండ్లూరి మానస అదే ప్రేమ..కథలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎంచుకున్న ఇతివృత్తాలు వివాదాస్పద అంశాలైనా…చెప్పిన కోణం, ఒప్పించిన తీరుతో పాఠకుల్ని ఆకట్టుకున్నాయి.

రైతు ఆత్మహత్యలు, కొత్త రాజధాని కోసం భూ-సేకరణ, కరువు, వివేక్, శృతి ఎన్ కౌంటర్… లాంటి అంశాలు గత ఏడాది తెలుగునాట తీవ్రంగా చర్చకు వచ్చాయి. కానీ ఈ కథల్లో అలాంటివేమీ కనపడవు. రైతు ఆత్మహత్యలు, భూ సేకరణ మీద మాత్రం ఒక్కో కథ వచ్చాయి.  అంటే సామాజిక సమస్యలు రచయితలను స్పందింప జేయలేకపోయాయా..? లేదా రచయితలు స్పందించలేకపోయారా..?

వివాహేతర సంబంధాల పట్ల ఆసక్తి, స్వలింగ సంపర్కుల  సమస్యలు వంటి సున్నిత అంశాలపైన కూడా స్పందిస్తున్న మన కథకులు … సామాజిక సంక్షోభాల్ని, సమాజాన్ని కుదిపేస్తున్న తీవ్ర పరిణామాలను మాత్రం ఎలా పక్కకు పెట్టగలుగుతున్నారు…?  ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తున్నారా అన్న సందేహమూ కలుగుతుంది…?
ఇలా రకరకాల అభిప్రాయాలకు తావిస్తున్న కథా సారంగ కథలను వివరంగా చర్చిద్దాం.

                                      (మిగతా వచ్చే వారం)

స్మితా పాటిల్: వెలిగి నిలిచిన రూపం…

 

 

ల.లి.త.

~

 

    ల.లి.త.

మట్టిప్రమిదలో వెలిగిన దీపం ఆమె. చుట్టుగుడిసె ముందు పెట్టిన మట్టిప్రమిదలోని దీపానికి ఉన్న ఆకర్షణకి ఏది సాటి? నూనెదీపం చీకటి అసల్లేనేలేదనే భ్రాంతి కలిగించదు. చీకట్లని చిన్నగా చెదరగొడుతూ వెచ్చటి కాంతిని పరుస్తుంది. గాలేస్తే వణుకుతుంది. చినుకు మీదపడబోతే ఆరినంతపని చేస్తుంది. నూనె సరిగ్గా అందకపోతే కొడిగడుతుంది. ఎక్కువ అందితే పెద్ద జ్వాలవుతుంది. భ్రమించిన రెక్కలపురుగుల్ని చుట్టూ తిప్పుకుంటుంది. పంచభూతాలనీ పరవశించి మరీ నశిస్తుంది.

‘స్మితాపాటిల్’ అనుకోగానే అందంగా గాఢంగా వెలిగే మట్టిదీపం, మెత్తటి నాగేటి చాలు, ఆషాఢపు జల్లుకు తడిసిన నేలవాసనా, బలమైన సరుగుడు చువ్వా గుర్తొస్తాయి. స్మిత జీవితం పుస్తకంగా వస్తే బాగుండుననిపించేది. ఇన్నాళ్ళకి వచ్చేసింది. స్మిత జీవితంలోని ఒక్క మలుపునీ మెరుపునీ కూడా వదిలిపెట్టకుండా మైథిలీ రావు “Smitha Patil, A brief Incandescence” ను ఎంతో ప్రేమతోనూ ఇష్టంతోనూ రాసింది.  స్మిత జీవితఝరిని తమ జ్ఞాపకాల దోసిళ్ళలోంచి ఆమె తల్లీ, ఆమె స్నేహాన్ని ఎప్పటికీ మరచిపోలేని స్నేహితులూ అందిస్తే  మైథిలీరావు ఆ గంగను అందరికీ పంచింది.

ఒక్క పన్నెండేళ్ళే. అంతకంటే ఎక్కువ లేదు స్మితాపాటిల్ సినిమాల్లో నటించిన కాలం. 1955లో పుట్టిన ఈ నల్లటి బక్కపిల్ల న్యూ వేవ్ సినిమాని వెలిగిస్తుందని ఎవరూ ఊహించలేదు. తల్లి విద్యాతాయి నర్స్ గా పనిచేసింది. సంఘసేవిక కూడా. తండ్రి శివాజీరావు పాటిల్ రాజకీయాల్లో ఉండేవాడు. ఇద్దరూ తమ కులమేమిటో పిల్లలకు చెప్పకుండా పెంచిన ఆదర్శవాదులు. అందరికీ ఉపయోగపడటమే జీవితం అనుకున్నవాళ్ళు.  వాళ్ళ ముగ్గురాడపిల్లల్నీ రాష్ట్రీయ సేవాదళ్ అనే గాంధీవాద సంస్థలో చిన్నప్పుడే చేర్పించారు. దానితో వాళ్లకి కులమతభేదాలు లేకుండా అందరూ సమానమే అనుకోవటం చేతనయింది. చిన్న స్మిత tomboy లా తిరుగుతూ మగపిల్లలతో వాలీబాల్ ఆడుతూ, వాళ్ళని తిడుతూ తిరిగేదట.

సినిమాల్లోకి వస్తానని స్మిత ఎప్పుడూ అనుకోలేదు.  దూరదర్శన్లో మరాఠీ న్యూస్ ప్రెజెంటర్ గా స్మితను రోడ్డుమీద టీవీ షాప్ లో చూసిన అరుణ్ ఖోప్కర్ తన ఇరవై నిముషాల FTII డిప్లొమా ఫిల్మ్ “తీవ్ర మధ్యమ్ (1974)” లో ఆమెకు మొదటి అవకాశం ఇచ్చాడు. బహుమతులతోపాటు మంచిపేరు కూడా వచ్చిన డిప్లొమా ఫిల్మ్ అది.  అందులో తాన్పురా పట్టుకుని నిశ్చలంగా నిర్మలంగా ఉన్న స్మిత రూపాన్ని షబానా అజ్మీతో సహా చాలామంది కళ్ళు ఫోటో తీసుకున్నాయి.  కామెరా ఆమెతో ప్రేమలో పడిపోవటం అక్కడే మొదలైందంటారు మైథిలీ రావు.

తరువాత శ్యాంబెనగల్ ‘చరణ్ దాస్ చోర్’ లో చిన్న వేషమిచ్చాడు. ఇక వరుసగా జబ్బార్ పటేల్, బెనెగల్, ముజఫర్ అలీ, మృణాల్ సేన్ ఇంకా న్యూ వేవ్ సినిమా మహామహులందరికీ స్మితాపాటిల్ ముద్దుబిడ్డయిపోయింది. 70, 80 ల్లో దేశమంతటా పరమచెత్త అని ఏకాలంలోనైనా ఎవరైనా చెప్పగల సినిమాలు వచ్చేవి. మరోపక్క సత్యజిత్ రాయ్ నీ, ఫ్రెంచ్ న్యూ వేవ్ నూ, రిత్విక్ ఘటక్ నూ అనుసరిస్తూ సినిమా అంటే ఒట్టి కలే కాదు మన బతుక్కూడా కావచ్చని చెప్పేవీ,  సినిమాకి ‘కళా’యిపూత పెడితే మెరుస్తుందని కూడా చెప్పేవీ కొన్ని సినిమాలు వచ్చేవి. 90ల నుండీ ప్రపంచవ్యాపారంతో మనం ఏకమవటం మొదలెట్టాక ‘న్యూ వేవ్ సినిమా’ సారంలోనూ రూపంలోనూ అరుదై, పూర్తిగా నశించింది.

స్మితాపాటిల్ దశావతారాలు గా 10 సినిమాలను ఎన్నుకుంది మైథిలీ రావు. అవి మంథన్, జైత్ రే జైత్ (మరాఠీ), భూమిక, అకాలేర్ సంధానే(బెంగాలీ), చక్ర, ఉంబర్తా(మరాఠీ)/సుబా(హిందీ), అర్థ్, బాజార్, తరంగ్, ఆఖిర్ క్యూఁ.  వీటిలో ఒక్క ‘అర్థ్’ మాత్రం పూర్తిగా షబానా అజ్మీ సినిమా.  తను షబానా పక్కన చిన్నగీత అవుతానని తెలిసీ స్మిత అందులో వెయ్యటం గొప్పధైర్యంతో చేసిన పని. సాటి స్త్రీ సంసారాన్ని పాడుచేసిన(?) రెండో స్త్రీగా అప్పటి సమాజం ఏ మాత్రం సానుభూతికి చోటివ్వని బలహీనమైన పాత్ర.  ఆ బలహీనురాలి  split personality ని తను ఎంతబాగా చూపించగలదో తెలియచెప్పడానికే స్మిత ‘అర్థ్’ లో చేసి ఉండొచ్చు. ఏదయినా చేసెయ్యగలనన్న ధైర్యం తనకుండేది. (‘ఇజాజత్’ లో అనూరాధా పటేల్ వేసిన neurotic other woman ను చూస్తే ‘అర్థ్’ లో స్మిత నటనలోని పస తెలుస్తుంది).

smita1

చిన్న వూరినుంచి వచ్చి (అప్పటి పూణేకు ఇప్పటంత నాజూకుతనం లేదు. పైగా స్మిత చదివింది కాన్వెంట్ లలో కాదు) సినిమాల్లో నిలదొక్కుకోవటమే కష్టంగా ఉన్న స్మితకు షబానాఅజ్మీతో పోటీ పెద్ద బాధ అయిపోయింది.  ఉప్పూ నిప్పూలాంటివాళ్ళు ఇద్దరూ. షబానాలో మనసుకంటే బుద్ధి ఎక్కువగా పనిచేస్తుంది. స్మిత సరిగ్గా ఆమెకు వ్యతిరేకం. పైగా తమ ఇద్దరి నటనకీ పోలిక తేలేని ‘అర్థ్’ లాంటి సినిమాలో పోలిక తెచ్చి,  స్మిత రెండో నాయికగానే పనికొస్తుందని షబానా అనటం ఆమెను మండించింది.  ‘అర్థ్’ లో స్మిత నటనను ఆమె దశావతారాల్లో ఒకటని చెప్పి   మైథిలీరావు షబానామీద sweet revenge తీసుకున్నారు.

‘చక్ర’, ‘మంథన్’ లాంటి సినిమాల్లో ఊరిని ఒంటినిండా నింపుకున్న స్మితను చూశాక,  తనకు బైక్ నీ  కార్లనీ   వేగంగా నడపటం ఇష్టమనీ, ఎప్పుడూ జీన్స్ లోనే ఉండేదనీ తెలుసుకోవటం ఆశ్చర్యంగా ఉంటుంది. ఫోటోలు కూడా చక్కగా తీసేదట. దూరదర్శన్లో వార్తలు చదివేటప్పుడు జీన్స్ మీదే మంచి నూలుచీరలు కప్పుకుని చదివేసేదట. స్టార్ కి ఉండాల్సిన లక్షణాలు అసల్లేవని దిలీప్ కుమార్, రాఖీ మూతులు విరిచారట. చిన్నప్పటి రాష్ట్రీయ సేవాదళ్ స్నేహితుడు తరువాత జూనియర్ ఆర్టిస్టుగా కనిపిస్తే అంత మందిలోనూ స్నేహంగా వాటేసుకుని అతన్ని ఇబ్బందిలో పెట్టేసిందట. అల్లరిస్మితనీ,  సాయం చెయ్యటానికి ఎప్పుడూ ముందుకురికే స్మితనీ ఎంతో ఇష్టంగా గుర్తు చేసుకున్నారు స్నేహితులు. ‘అకాలేర్ సంధానే’ సినిమా చేస్తున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా సర్దుకుపోతూ, అందరూ మాంసం, చేపల్తో భోజనం లాగిస్తుంటే, వంటమనిషినడిగి ఓమూల స్టవ్ మీద తను అన్నం, కూరగాయలు వండుకు తినేదట. కరువు ప్రాంతంలోని పేద రైతుకూలీగా ఆమెను తప్ప వేరెవరినీ ఊహించలేనని ధ్రితిమాన్ చటర్జీ (నటుడు) చెప్పాడు. “ఆమెలో పల్లెటూరి అమ్మాయిల ఒంటికదలికల్లాంటి ఒక లయ ఉంటుంది.. మిరపకాయకో రుచీ వాసనా ప్రత్యేకంగా ఉన్నట్టే  స్మిత వ్యక్తిత్వానికి ప్రత్యేకత ఉంటుంది”  అంటాడు అరుణ్ ఖోప్కర్.

ఈ వజ్రాన్ని మెరుగు పెట్టినవాడు శ్యాంబెనెగల్.  మరాఠీనటి హంసావాడ్కర్  జీవితం ఆధారంగా తీసిన “భూమిక’ లో చేసేనాటికి స్మిత వయస్సు ఇరవై ఒక్కేళ్ళు. ఇంకా జీవితమే తెలీని ఆవయసులో,  మొగుడితో బాధలు, ముగ్గురు మగవాళ్ళతో ప్రేమలు, నటన, నాట్యం, పాట … ఇలా ఎన్నో అలజడులున్న హంసా వాడ్కర్  పూర్తి జీవితంలోని ప్రతివొక్క షేడ్ నీ చూపెట్టేస్తుంది స్మిత.  తను మిగతావారిలా NSDలోగానీ  FTIIలో గానీ నటనలో శిక్షణ తీసుకోలేదు. అయినా పుణేలోని FTII  లో స్నేహితులతో తిరుగుతూ ఎప్పుడూ కనిపిస్తూ ఉండటంవల్ల  FTII లో చదువుతోందేమో అనుకునేవారట. నిజానికి శ్యాం బెనెగలే స్మితకు గురువు. ఏదైనా ఇట్టే పట్టేసే చురుకుతనం ఆమె జీవలక్షణం.  సంతోషమొస్తే చిన్నపిల్లలా కీచుగొంతుతో నవ్వే స్మితనవ్వును హస్కీగా తీర్చి, ‘గుండెలోంచి మాట్లాడు’ అని చెప్పి ఆమె ‘నిండుగొంతుక’ను బైటకు తెచ్చాడట శ్యాం బెనెగల్.

స్మిత అందం కూడా వేరే.  నలుపురంగు. ఎదుటివాళ్ళని నిలబెట్టేసే సాంద్రమైన కళ్ళు.  పక్కనుంచి చూస్తే చెక్కిన శిల్పంలాంటి మొహం, పొడవైన మెడా, ‘సన్నగా ఉన్నానని నా శక్తిని తక్కువ అంచనా వెయ్యకండ’ని హెచ్చరించే దృఢమైన చెక్కిళ్ళూ, నిండు పెదవులూ, చువ్వలా నిటారుగావుండే ఆకారం .. ఇవీ స్మితంటే. పెద్దగా ఆరోగ్యవంతురాలు కాదు. ఏ కోణంలోనుంచి చిత్రీకరించినా ఆమె అందంగానే ఉంటుందంటాడు గోవింద్ నిహలానీ.  నిజానికి మరీ అందం ఉట్టిపడే ఐశ్వర్యా రాయ్ లాంటి నటుల్ని చూస్తూ, నటన కంటే మనం వాళ్ళ అందాన్ని ఎక్కువ ఆస్వాదిస్తూ ఉండిపోతాం. స్మిత ఫోటోజనిక్ మొహంలోంచి సినిమాపాత్ర వ్యక్తిత్వం, బలం, బలహీనతా అన్నీ ముందుకు వస్తాయి. గాఢమైనకళ్ళతో మాట్లాడే మనదేశపు ఆడవాళ్ళ sensuality ని  స్మితాపాటిల్ తో ఎంతబాగా చూపించవచ్చో అర్థమయింది ఆర్ట్ హౌస్ సినిమా దర్శకులకు. ‘భూమిక’, ‘మంథన్’ (శ్యాం బెనెగల్), ‘ఉంబర్తా’ (జబ్బార్ పటేల్), ‘చిదంబరం’ (అరవిందన్), ‘తరంగ్’ (కుమార్ సహానీ) సినిమాలు ఆమె స్త్రీత్వానికి హారతిచ్చేశాయ్. ‘నమక్ హలాల్ ’ లో ‘ఆజ్ రపట్ జాయేతో హమే నా ఉఠయ్యో’ అంటూ స్మిత, అమితాబ్ బచ్చన్లతో ప్రకాష్ మెహ్రా  చేయించిన వానపాటలో ఆమె ఆడతనం చిన్నబోయింది.  ఆ పాట చేశాక స్మిత బాగా ఏడిస్తే  అమితాబ్ తనని ఎదగమని(?!!) సలహా యిచ్చి ఓదార్చేడట. ‘ఉంబర్తా’ లాంటి స్త్రీవాద చిత్రాన్నీ ‘నమక్ హలాల్’ లాంటి పక్కా కమర్షియల్ సినిమానీ  ఒకేసారి చేసిందట. పదిరోజులు ‘ఉంబర్తా’ షూటింగ్ చేస్తే మరో పదిరోజులు ‘నమక్ హలాల్’.  నటిగా ఆమెది ఎంత స్కిజోఫ్రెనిక్ బ్రతుకో  చెప్పటానికి ఇది చాలంటాడు జబ్బార్ పటేల్. వ్యాపార, సమాంతర చిత్రాల్లో దేనికెలా చెయ్యాలో సరిగ్గా అర్థం చేసుకునే తెలివి ఉంది కాబట్టే అంతబాగానూ రెండిట్లోనూ నెగ్గిందని ఓంపురి అంటాడు.

 

‘చక్ర’ సినిమాలో ఆమె చేసిన స్నానంసీను పెద్దపోస్టరైపోయి  అంతటా కనిపించటం స్మితను బాధించింది. నిజానికి ఆ దృశ్యం ఉద్దేశ్యం మురికివాడల్లో ఉండేవాళ్ళ జీవితంలో దేనికీ ఏకాంతం దొరకదని చూపించటమే. అక్కడ ఆడవాళ్ళు బైట పంపు దగ్గర స్నానం చెయ్యటం చాలాసహజం. ఇప్పుడా సీన్ పెద్దవిషయం కాకపోవచ్చు గానీ 80ల్లో సాహసమే.   స్మిత గట్టినిజాయితీతో  ‘చక్ర’ లో ‘అమ్మ’ పాత్రకున్న బలాన్నీ  ధైర్యాన్నీ చూపిస్తూ  ఆ సినిమాలోని ‘voyeurism’ ను దాటి నిలవగలిగిందని మైథిలీ రావు అంటారు.

smita4

వ్యాపార చిత్రాల్లో చేస్తే స్టార్ డమ్ వస్తుంది కాబట్టి ఆ ఆకర్షణతో తను చేసే సమాంతర సినిమాలకు ఎక్కువమంది జనం వస్తారనీ, అలా సమాంతర సినిమాను గెలిపించాలన్న ఆలోచనతోటే వ్యాపార చిత్రాలు చేస్తున్నాననీ  స్మిత చెప్పేది. అలా అనుకుంటూ చెత్త సినిమాలు కూడా చేసేసింది. వాటిలో ‘ఆఖిర్ క్యూఁ’ తప్ప చెప్పుకోదగ్గది లేదు. అయినా వాటిలో ఆమె ఎంత నిజాయితీగా చేసిందో వివరిస్తూ ఆ సినిమాకథలు కొన్ని రాసుకొచ్చింది  మైథిలీరావు . విసుగనిపించినా స్మితాపాటిల్ చేసిన ప్రతి పాత్రనూ ఆవిడ వర్ణించటం వల్ల సమాంతర, వ్యాపార చిత్రాలు ఎంత భీకరమైన తేడాలతో ఉండేవో బాగా అర్థం అవుతుంది.  ప్రతి దృశ్యంలోనూ ఆమె నటనను వర్ణిస్తూ మోహంలో పడిపోతారు మైథిలి.  నిజానికి స్మితను ఎప్పుడూ కలవనేలేదట ఆవిడ.

స్మితాపాటిల్ అంటే గాఢత (intensity) కు నిర్వచనం అంటారు ప్రతి ఒక్కరూ.  “తనే పాత్రగా మారిపోయి లీనం కావటం స్మిత పధ్ధతి కాదు. దర్శకుడికి తనలోని నటిని పూర్తిగా అప్పచెప్పి ఆమె మనసుకు తోచినట్టు నటిస్తుంది. లోపలున్న intensity  ఆమె వేసే పాత్రల మనసు మూలాల్లోకి  ప్రవహిస్తుంది. అందువల్ల చెత్త సినిమాల్లో కూడా ఆమె చేసినపాత్రల ఉద్వేగాలు మనల్ని నమ్మిస్తాయి.  స్మితలాంటి గొప్ప నటులు నటనలో చాతుర్యాన్ని కూడా దాటేసి ఆ సినిమాలు మన జ్ఞాపకాల్లో భాగమైపోయాక కూడా ఎప్పటికీ మనల్ని తాకుతూనే ఉంటార”ని బంగారంలాంటి మాటంది మైథిలీ రావు.

స్మితాపాటిల్  తను నటిస్తున్న పాత్రలు ఎలాటిచోట పుట్టేయో ఎలా నడిచి ఎలా నవ్వి  ఎలా మాట్లాడి  బతుకుతాయో, ఎలాటి బట్టల్లో కనిపిస్తాయో లోతుగా తెలుసుకుంటుందని, ఆలాంటి కుతూహలం అందరిలోనూ ఉండదనీ ‘అనుగ్రహం’ సినిమాకి పనిచేసిన ఆరుద్ర అనేవాడు.

స్మిత తల్లి విద్యాతాయి గట్టిగా కర్రపట్టుకుని పిల్లలను పెంచింది. ఆవిడతో ఎంత ఘర్షణ పడ్డా తల్లే స్మితకు రోల్ మోడల్. ‘ఉంబర్తా’లో సంఘసేవికగా వేస్తున్నప్పుడు ప్రతి నిముషం అమ్మను గుర్తుచేసుకుంటూ నటించిందట. ‘ఉంబర్తా’ కథ విన్నాక జబ్బార్ పటేల్ తో ‘ఈ సినిమా నాదే. ఇంకెవరినైనా తీసుకుంటే నిన్ను చంపేస్తా’నందట. రాజ్ బబ్బర్ తో స్మిత పెళ్లిని విద్యాతాయి ఒప్పుకోలేకపోయింది. బిడ్డను దూరం చేసుకుంది. స్మిత తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు ఫిల్మ్ జర్నలిస్టులు తీవ్రంగా విమర్శించారు. ఒక్క స్నేహితులే వ్యక్తిగా ఆమె నిర్ణయాన్ని గౌరవించారు. “సమాంతర సినిమాకి  పోస్టర్ గర్ల్ లాంటి  స్మితాపాటిల్, నిజజీవితంలో పెళ్ళయి ఇద్దరు పిల్లలున్నవాడిని  ప్రేమించటాన్ని ఆమె వ్యక్తిత్వంలో భాగంగా సమాజం చూడలేకపోయింద”ని చెప్తాడు మహేష్ భట్. స్మితాపాటిల్ లో కూడా ‘అర్థ్’ లో ఆమె వేసిన పాత్రలోని వైరుధ్యం లాంటిదే ఉందంటాడు. స్మిత చిన్నప్పటినుంచీ తాననుకున్నదే చేసేదట. ‘తను బొహీమియన్’ అంటాడు ఓం పురి. ఓరాత్రి  అందరు స్నేహితులూ కలిసి మాట్లాడుకుంటూ ఓ గదిలో ఉండగా ఓంపురి ఒక్కడినీ బైటకు తీసుకుపోయి నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా ఆవరణలో కాసేపు కూర్చుని మాట్లాడిందట. “ఆమెను చూసి ఐదు నిముషాల్లోనే  ప్రేమలో పడని మగవాళ్ళు ఉండరు. ఆమెతో మాట్లాడిన ప్రతివాడూ తననే ప్రేమిస్తోందనీ అనుకుంటాడు. తన ఉద్దేశ్యం అదికాదని ఆమె స్పష్టం చేశాక ఒడ్డునవేసిన చేపలా గిలగిలా కొట్టుకుంటాడు” అంటాడు మోహన్ అగాషే.

రాజ్ బబ్బర్ తో తన పెళ్ళిని అందరూ ఒప్పుకోవాలని అనుకోవటం ఆమె అమాయకత్వం.  పసుపు కుంకుమలూ, పేరంటాలకు విలువిచ్చేదనీ, సీమంతం కోసం ఆరాటపడిందనీ చెప్తుంది మైథిలీరావు కథనం. తను సహచరులుగా ఎన్నుకున్న మగవాళ్ళు కూడా ఆమెకు తగనివాళ్ళే.  “మగవాళ్ళకు నాతో బతకటం చాలా కష్టం. నన్ను నేను ఎంతగా ఇచ్చుకుంటానో అంతగానూ నావాడి నుండి తీసుకోవాలనుకుంటాను. అంత ఆదర్శంగా పరిస్థితి లేద”ని చెప్పిందట స్మిత. గంగమ్మలాంటి స్మితను మోయగల నిబ్బరం ఉన్న శివుడు ఆమె సర్కిల్లో దొరకటం అంత అసాధ్యమేమీ కాదనిపిస్తుంది.  పెళ్లి విషయంలో తనను గట్టిగా తప్పుపట్టిన జర్నలిస్టులను పట్టించుకోకుండా ఉండలేకపోయింది. వ్యాపార చిత్రాల్లో  తెగ నటించి ఆమె అంతరాత్మ అలిసిపోయింది. ఇక ఎక్కువకాలం అవి చెయ్యలేని పరిస్థితి కూడా వచ్చింది. పెళ్ళయిన స్టార్లకే రెండోభార్యలుగా మారిన హేమమాలిని, షబానాఆజ్మీ, శ్రీదేవిల నిర్ణయాలను కొన్నాళ్ళకి సమాజం ఒప్పుకుంది.  ఎలాంటి వ్యాపార చిత్రాల్లో నటించాలో ఎన్నుకోవటంలో కూడా షబానాయే స్మిత కంటే ఎక్కువ తెలివిగా ప్రవర్తించింది.

దీపక్ సావంత్ స్మితాపాటిల్ కి సొంత మేకప్ ఆర్టిస్టు. వ్యాపార సినిమాల్లో ఆమెను సున్నంకొట్టినట్టు కాకుండా సరైన లేతరంగుల మేకప్ లో చూపించటం అతని ప్రతిభ. స్మిత అతన్ని పదేపదే ఓ వింత కోరిక కోరేదట. తను చచ్చిపోయినప్పుడు తనను పుణ్యస్త్రీ (సుహాగన్)గా సాగనంపాలని..  Premonitions  తనకు వస్తుండేవట.  పిల్లలంటే చాలా ఇష్టం. గంపెడు పిల్లల్ని కనాలని కోరిక. కుటుంబంతో స్నేహితులతో సడలని బంధాలను అల్లుకుంది. తనా పరా అనేదిలేకుండా   ప్రేమను పంచుతూ పోవటమే.  సేవ చెయ్యటం, పరిచయమైన అందరితో కలిసిపోవటం, కోపమొస్తే తిట్టటమే తెలుసు. ఇప్పటికీ సినిమావాళ్ళు వాళ్ళ ప్రేమల గురించి పత్రికలతో మాట్లాడరు. ఎనభైల్లోనే స్మిత తనకు వినోద్ ఖన్నాతో  సంబంధం ఉండేదని ఫిల్మ్ ఫేర్ కి చెప్పేసుకుని తరువాతి  గోలను తట్టుకోలేకపోయిందట.  ‘తారా’ధూళిని  వెదజల్లటం చేతకాని మామూలు మనిషి…

స్మిత అమ్మకాబోయే రోజుల్లో నెమ్మదిగా విద్యాతాయికి దగ్గరయింది. సముద్రం విశాలంగా కనిపించే చోటా, బాల్కనీలో పడే వానజల్లుల్లో తను హాయిగా తడిసే వాలూ వీలూ ఉన్నచోటా ఒక అపార్ట్ మెంట్ ను బొంబాయిలో కొనుక్కుంది. తనఇంటిని కట్టడంలో శ్రమపడిన కూలీలే గృహప్రవేశానికి మొదటి అతిథులవాలనుకుంది. బిడ్డను కన్నాక  రాజ్ బబ్బర్ ను వదిలేస్తానని స్నేహితురాలితో చెప్పిందట. కొత్త ఇంట్లోకి వెళ్ళకముందే, ప్రతీక్ ను ప్రసవించిన రెండు వారాలకే డిసెంబరు 13, 1986 న బ్రెయిన్ ఫీవర్ తో మరణించింది. బాలెంత జ్వరంతో మూడురోజులు ఆమె హాస్పిటల్ కు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోవటం అర్థంకాని పజిల్. పరిస్థితి విషమించాక జస్లోక్ డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆమెను కాపాడలేకపోయారు.

“ఆమె స్థానాన్ని ఇంకెవరూ పూరించలేరు” అన్నాడు సత్యజిత్ రాయ్. దీపక్ సావంత్ స్మితను సుహాగన్ లాగే ముస్తాబు చేసి సాగనంపాడు.

***

ఈ పుస్తకాన్నిబట్టి,  స్మిత చిన్నతనమూ 1974 నుంచీ 1980 వరకూ వేసిన సినిమాలూ చూస్తే, అభ్యుదయవాదులతో, మేధావులతో, కళాకారులతో సావాసం, స్వేచ్ఛ, తనకు సంతోషాన్నిచ్చే పాత్రలు, షబానాతో పోటీ.. ఇదీ ఆమె జీవితం. ‘80 నుంచీ ’86 లో  చనిపోయేవరకూ వ్యాపారచిత్రాలూ, వాటి జర్నలిస్టులూ, తారలూ కూడా తన జీవితాన్ని ఆక్రమించారు. రెండుచోట్లా బాగానే చేస్తున్నట్టు కనిపించినా రెండురకాల సినిమాల ప్రభావమూ ఆమె మీద పడిందేమో! బొహీమియన్ గా కనిపించిన మనిషి, పెళ్ళీ పసుపు కుంకాల సెంటిమెంట్లలోకి వెళ్లి మనసు బాధ పెట్టుకుందంటే, రెండు ప్రపంచాల మధ్యా సరిగ్గా రాజీ పడలేకపోవటమే అయుంటుందేమో అనిపించింది. నిండైన స్త్రీత్వం కూడా ఒక బాధే…

smita3

స్మితాపాటిల్ జీవితాన్ని తలుచుకుంటే నాకు అరుంధతీరాయ్ ‘గాడ్ అఫ్ స్మాల్ థింగ్స్’లోని ఒక వాక్యం గుర్తు వస్తుంది. అందులో  రాహెల్ తనతల్లి అమ్ము చనిపోయిన వయసును (31 వ ఏట అమ్ము చనిపోతుంది) ‘a viable die-able age’ అంటుంది. 31 వ ఏటనే చనిపోయిన స్మితాపాటిల్ సినిమాజీవితం వరకూ ‘viable die-able age’ లోనే పోయింది. ఇంత నిస్పృహతో ఎందుకంటున్నానంటే ఆ తరువాత సినిమాల్లో వచ్చిన స్త్రీ పాత్రల్లో దమ్మున్నవి ఎంతవరకూ ఉన్నాయి? “మరో ‘ఉంబర్తా’ నా కోసం తియ్యవా?” అని జబ్బార్ పటేల్ ను బతిమాలారట తబూ, మాధురీ దీక్షిత్.  గాఢతలో స్మితాపాటిల్ కు తీసిపోని తబూ లాంటి నటులకు ఎన్ని మంచి సినిమాలు దొరికాయి?

ఊళ్లలో వాడల్లో ఉన్న ‘మిర్చ్ మసాలా’లాంటి  సోనుబాయ్, ‘మంథన్’ లో ‘బిందు’లాంటి దళితమందారం, ‘చక్ర’ ని తిప్పిన మహాశక్తి ‘అమ్మ’, ‘చిదంబరం’ శివగామి లాంటివాళ్ళని సినిమాల్లోకి తెచ్చేవాళ్ళెవరూ ఇప్పుడు లేరు.  సరైన సమయంలో పుట్టి, సరైన సమయంలో సరైన సినిమాల్లో వేసి వెళ్ళిపోయింది ఆమెలోని ఆర్టిస్ట్.  కానీ నిండుగా  జీవితాన్ని అనుభవించాల్సిన మానవి స్మితాపాటిల్ కథ అర్ధాంతరంగా ముగిసిపోయింది.  బతికుంటే 90ల నుంచీ తనకు తగ్గ సినిమాల్లేక మానసిక హింస పడేదేమో అనిపిస్తుంది, ఈ పుస్తకంలో ఆమె వ్యక్తిత్వం ఏమిటో పూర్తిగా తెలుసుకున్నాక..

ఆంగ్ల సాహిత్య నేపధ్యంవున్న మైథిలీరావుకి నటన అంటే ఏమిటో బాగా తెలుసు. “Smitha Patil, A brief Incandescence”  చదివితే స్మితాపాటిల్ సినిమాలు చూడనివాళ్ళకు వెంటనే అన్నీ చూసేయాలనిపిస్తుంది.  స్మిత నిండైన స్త్రీ. పరిపూర్ణమైన కళాకారిణి. ఆమె జీవితచరిత్రను మైథిలీరావు లాంటి మనసున్న స్త్రీ రాయటం మరీ సంతోషం.

స్మితాపాటిల్ ను తలుచుకుంటూ శ్యాంబెనెగల్ విద్యాతాయికి ఉత్తరం రాస్తూ, జలాలుద్దీన్ రూమీ కవితను ప్రస్తావించాడు. ఈ పుస్తకంలో చేర్చిన ఆ కవితతోనే …..

I died mineral and turned plant.

Died a plant to turn sentient.

Died a beast to wear human clothes.

So when by dying did I grow less?

Again from manhood I must die,

And once again released,

Soar through the sky

And here as well I must lose place.

Everything passes, but His face.

*

 

 

 

 

ఒక వీడ్కోలు సాయింత్రం

Art: Srujan Raj

Art: Srujan Raj

ఉణుదుర్తి సుధాకర్

~

Sudhakar_Marine Linkజాన్ ఇంకా రాలేదు; చెన్నపట్నం మీదుగా స్టీమర్ లో ఇంగ్లండు తిరుగుప్రయాణానికి సర్దుకోవలసిన సామాన్లూ, చేయ్యాల్సిన ఏర్పాట్లూ ఇంకా చాలా ఉన్నాయనీ, అందుచేత ఆ రోజు సాయింత్రం ఏడుగంటలకిగానీ క్లబ్బుకి చేరుకోలేననీ ముందుగానే చెప్పాడు. ఎర్రమట్టి దిబ్బల మీద పరుచుకున్న కోరమాండల్ క్లబ్బు దొరలందరికీ స్థానిక జలాశయం. కేవలం దొరలకీ,  రాజాలకీ, జమీందార్లకే కాకుండా తగినస్థాయి కలిగిన ఇతర స్థానికులకు కూడా ప్రవేశం కల్పించవచ్చని క్లబ్బుయాజమాన్యం – తీవ్రమైన అభ్యంతరాల్ని తోసిపుచ్చి – ఇటీవలే తీర్మానించింది.

క్లబ్బులాన్స్ లో కూర్చుంటే సముద్రం స్పష్టంగా కనిపిస్తుంది; మంద్రంగా వినిపిస్తుంది. కెన్ క్లబ్బుకి చేరేటప్పటికి పడమటి ఆకాశం బాగా ఎర్రబడింది. తూర్పువైపు నుండి సముద్రపుగాలి బలంగా వీస్తోంది – చల్లగా, కాస్తంత ఉప్పగా – మధ్యాహ్నం పూట వేధించిన వేడినీ, ఉక్కనీ మృదువుగా  మరపింపజేస్తూ. క్లబ్బు ఆవరణలోని కొబ్బరి, మామిడిచెట్ల మీద బంగారు ఎండ తేనెరంగులోకి మారుతోంది. దూరంగా తీరంవెంట సరుగుడుతోటల వెనక ఇసుకతిన్నెలు ఎర్రగా మెరుస్తున్నాయి. వాటికి నేపధ్యంగా గాఢనీలంలోంచి ఊదారంగుకి మారిన సముద్రం.

‘ఇప్పుడు బాగానే ఉందిగాని చీకటి పడ్డాక దోమలబాధ తప్పదు’ అనుకుంటూ లాన్స్ లోకి నడిచాడు కెన్. తెల్లటి గుడ్డలు పరచిన గుండ్రటి టేకు మేజాలు; వాటిచుట్టూ నాలుగేసి లేతాకుపచ్చ రంగువేసిన పేము కుర్చీలు.  కుర్చీలన్నీ ఇంకా ఖాళీగా ఉన్నాయి.  కాసేపట్లో సందడి మొదలౌతుంది. పేకాటరాయుళ్ళు, పీకలదాకా తాగేవాళ్ళు భవనంలోపలే కూర్చుంటారుగనక లాన్స్ లో కాస్త ప్రశాంతంగానే ఉంటుంది.  కుర్చీలన్నీ దాటుకుంటూ వెళ్లి ఒక మూల కూర్చున్నాడు కెన్  – ‘ఇక్కడైతే చీకట్లో ఎక్కువమందికి కనిపించం’ అనుకుంటూ. ఇది జాన్ కి తను వ్యక్తిగతంగా ఇస్తూన్న వీడ్కోలువిందు. ఇంకెవర్నీ పిలవలేదు. పదింటికల్లా ముగించి బంగళాలకు బయిల్దేరాలని ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నారు.

పాగా, ఎర్రకోటూ, నీలం కమర్బంద్ ధరించిన బేరర్ పరుగెత్తుకుంటూ వచ్చి, వంగి సాయిబుల పద్ధతిలో సలాం చేసాడు.

“సింహాచలం! కైసా హై?” ఎన్నాళ్ళయినా కెన్ కి తెలుగు పట్టుబడలేదుగాని హిందుస్తానీతో నెట్టుకుపోగలడు. నేటివ్స్ తో కాస్త సఖ్యంగా ఉంటే వాళ్ళు ప్రాణాలైనా ఇస్తారని ముప్ఫై ఏళ్ల ఇండియన్ సర్వీసు చివరి దశలో అతను గ్రహించాడు. ఈ గ్రహింపు వెనుక జాన్ ప్రభావం చాలానే ఉంది. అలాగని వాళ్ళని నెత్తికెక్కించుకోకూడదు – ఇది మాత్రం ముందే తెలుసు.

కెన్ దొరంతటి వాడు తనని పేరుపెట్టి పిలిచినందుకు సంతోషం పట్టలేక పోయాడు సింహాచలం.  “అచ్ఛా హూ, సార్. క్యా లేంగే సార్” అన్నాడు.

అందాకా తనకో బీరు, జాన్ రాగానే షాంపేన్, ఆవెంటనే విస్కీ ఆర్డరు చేసాడు. దోమలురాకుండా ధూపం వెలిగించమన్నాడు. సింహాచలం పరుగుతీసాడు.  జాన్ దొర వొస్తున్నాడంటే అతనిలో ఉత్సాహం ఉప్పొంగింది. ఎప్పుడో గాని రాడు; వొచ్చినప్పుడల్లా అర్థరూపాయికి తక్కువ కాకుండా బక్షీష్ ఇస్తాడు మరి. తెలుగు ఒక మాదిరిగానైనా మాట్లాడే దొర జాన్ ఒక్కడే.

Kadha-Saranga-2-300x268

పొగాకు దాచి మడత పెట్టిన తోలు సంచీ, పైపూ కోటుజేబులోంచి తీసి టేబుల్ మీద పరిచి పైపులో పొగాకు కూరడం మొదలు పెట్టాడు కెన్. ఇండియాలో ఉన్న ముప్ఫై ఏళ్లల్లో చాలామందికి స్వాగతాలు పలికాడు;  వీడ్కోళ్ళు చెప్పాడు. వచ్చేవాళ్ళు సవాలక్ష సందేహాలతో జంకుతూ వస్తారు. వెళ్ళేటప్పుడు ఆత్మవిశ్వాసంతో పొంగిన చాతీలతో, బరువైన డబ్బు సంచులతో వెళతారు. ఇంగ్లాండు తిరిగివెళ్ళి పోతున్నామనే ఉత్సాహం, ఇండియాను వీడిపోతున్న దిగులుని అధిగమిస్తుంది. భార్యలైతే మరీను. ఎగిరి గంతేసి వెళ్ళిపోతారు. ఇంగ్లండులో  నౌకర్లు ఉండరనేదొక్కటే వాళ్ళకు దిగులు కలిగించే విషయం.  జాన్ భార్యా, పిల్లలూ ఆరు నెలల క్రిందటే వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రయాణం కడుతున్నప్పుడు –

“ఏ విషయంలో ఇండియాని మీరు మిస్ అవుతారు?” అని కెన్ అడిగితే, జాన్ పిల్లలిద్దరూ తడుముకోకుండా – “మామిడిపళ్ళు” అని టపీమని జవాబు చెప్పారు. అప్పుడు వాళ్ళని చూస్తే కెన్ కి ముచ్చటేసింది. ఇప్పుడు తలుచుకుంటూంటే – తనకి భార్యా, పిల్లలూ లేకపోవడం గుర్తుకొచ్చి బాధ కలిగిస్తోంది. అసలు తను ఇండియా వచ్చినప్పుడే ఐదు, పదేళ్లకన్నా ఎక్కువ ఉండననుకున్నాడు. అలాటిది తనకన్నా తరవాత వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు; వెళ్ళిపోతున్నారు.

పాతికేళ్ళ సర్వీసు దాటాక ‘ఇక్కడేం తక్కువ? చిన్నజమీందారు లాగా బతుకుతున్నాను. ఇప్పుడు ఇంగ్లాండు వెళ్లి మాత్రం ఏం ఊడపొడవాలి?’  అన్న ఆలోచన బలపడింది. బంగాళా చుట్టూ పెంచిన తోటన్నా, తనని విడిచి ఉండలేని కుక్కలన్నా అమితమైన ప్రేమ ఏర్పరచుకున్నాడు. ఒక ఆంగ్లో-ఇండియన్ టీచర్ దగ్గరైంది. ఇంకేం కావాలి? కానీ ఎక్కడో ఏదో అసంతృప్తి.  ఎంతమంది వెళ్ళిపోయినా ఏమంత అనిపించలేదు గానీ  జాన్ వెళ్ళిపోతాడంటే మనసుకి కష్టంగా ఉంది.

సింహాచలం గ్లాసులో పోసిన బీరు గుక్కెడు తాగి, గ్లాసు కిందపెట్టి  పైపు వెలిగించాడు. చీకటవుతోంది. గాస్ దీపాలు వెలిగించారు. దోమలింకా రాలేదు. ధూపం పనిచేస్తున్నట్టుంది. పాతికేళ్ళు ఇంగ్లండులోనూ, ముప్ఫైఏళ్ళు ఇండియాలోనూ గడిపాడు. ఏది తన దేశం? ఇక్కడే పోతే ఏ వాల్తేరు సెమెట్రీ లోనో పాతిపెడతారు. ఎక్కడయితేనేం? చివరికి మట్టిలో కలిసిపోవడమే కదా?…ఛ ఛ…ఎందుకిలా ఆలోచిస్తున్నాడు?

Art: Srujan Raj

తను ఇలా దిగాలుగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు  తన అంతులేని ఉత్సాహంతో, సునిశితమైన హాస్యంతో జాన్ తనని పైకిలాగాడు? జాన్ కి ఆసక్తిలేని విషయమేదీ లేదనిపిస్తుంది. ఎన్నో విషయాల గురించి మాట్లాడతాడు. తెగ చదువుతాడు. ఏవేవో కొత్త వార్తలు, సంగతులు చెబుతూనే ఉంటాడు. అలాగని ఎవరిగురించీ చెడ్డగా చెప్పడు.   టెన్నిస్, క్రికెట్ ఆడతాడు. మంచి కార్యదక్షుడిగా పేరుపొందాడు. అతనికింకా పదేళ్ళు సర్వీసుంది. అనుకోకుండా లండన్ లోని  ఇండియా ఆఫీసులో ఉపకార్యదర్శిగా చేరమని ఉత్తర్వు వచ్చింది. అంటే రిటైరయ్యే నాటికి చాలా పెద్ద పొజిషన్ లోకి వస్తాడు. అలాంటి అరుదైన స్నేహితుడు వెళ్ళిపోతున్నాడు.

పైపు ఆరిపోయింది. కోటు లోపలి జేబులోంచి గొలుసు గడియారం తీసి చూసాడు. ఏడు దాటింది. కొన్ని టేబుళ్ల చుట్టూ జనం చేరారు. పకపకా నవ్వులు వినిపిస్తున్నాయి. దోమలు కుడుతున్నాయి. కెన్ కి చిరాగ్గా ఉంది. ఆరిన పైపుని టేబిల్ మీద విదిలించి కొట్టాడు. బూడిద బయటకొచ్చి తెల్లటి టేబిల్ క్లాత్ ని పాడుచేసింది. అతని చిరాకు ఇంకా ఎక్కువైంది. అటుగా వెళ్తున్న ఒక బేరర్ ని కసిరినట్టుగా పిలిచి మరో బీరు తీసుకురమ్మన్నాడు. సేవకుల పట్ల వ్యవహరించాల్సిన తీరుపై జాన్ నేర్పిన పాఠాలు రెండుగ్లాసుల బీరుతో ఎటో ఎగిరిపోయాయి.

ఈరోజు అతనికెందుకో జెన్నిఫర్ జ్ఞాపకం వస్తోంది. ఇరవై ఏళ్ల కిందటి మాట. లేక ఇంకా ఎక్కువే అయిందా? ఇప్పుడు తగ్గిపోయిందిగాని అప్పట్లో ప్రతీ ఏడూ చలికాలపు రోజుల్లో, అంటే క్రిస్టమస్ సెలవుల్లో పెళ్లికొడుకుల్ని వెతుక్కుంటూ ఇంగ్లండు నుండి యువతుల బృందాలు  తరలివచ్చేవి. వాళ్ళని ‘గేలం యువతులు’ అనే వాళ్ళు.  కలకత్తా, బొంబాయి, డిల్లీ, సిమ్లా – ఈ ప్రదేశాలన్నీ చుట్టబెట్టే వాళ్ళు. కొన్ని గేలాలకి చేపలు పడేవి; లేదంటే సరదాగా సెలవులు గడిపేసి ఎండలు ముదిరేలోగా తిరిగివెళ్ళిపోయేవారు. జెన్నిఫర్ కూడా అలాగే వచ్చింది. ఇక్కడే, ఈ క్లబ్బులోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. అర్థరాత్రి వరకూ సంగీతం, డాన్సులు, నవ్వులు, కేరింతలు – అదంతా ఓ కలలా అనిపిస్తోంది. అదే రోజున ప్రపోజ్ చేద్దామనుకుంటూ ఎందుకో జంకాడు. చేసి ఉంటే ఎలా ఉండేదో? వాళ్ళిద్దరి మధ్యా ఏదో ఉందని అందరూ అనుకున్నారు.

ఆమె  జాన్ కి కజిన్. వాళ్ళింట్లోనే దిగింది. వేసవిలో తనని లండన్ రమ్మంది, ఉత్తరాలు రాస్తానంది. ఎందుకోగాని మనసు మార్చుకుంది. తను రాసిన ఉత్తరాలకి జవాబివ్వలేదు. ముడిపడుతున్న బంధాన్ని చేతులారా ఎందుకు తెంచింది? జాన్ ని అడుగుదామని చాలా సార్లు అనుకున్నాడు గాని, తీరా అడిగితే ఏ చేదునిజం చెబుతాడో అని ఊరుకున్నాడు. ఆమె నవ్వినప్పుడు బుగ్గమీద పడే సొట్ట, న్యూ ఇయర్ పార్టీ నాడు ఆమె వేసుకున్న ఎర్ర ముఖమల్ గౌను, అదే ఎరుపు లిప్ స్టిక్,  మెడలో మెరిసే ముత్యాల పేట – కళ్ళకి కట్టినట్టుగా గుర్తొస్తున్నాయి. మర్చిపోయినవి అనుకున్న సంగతులు మస్తిష్కపు మారు మూలల్లో దాగి ఉంటాయి కాబోలు; ఎప్పుడెప్పుడో ఉబికి వస్తాయి. అలా వచ్చినప్పుడల్లా కొత్తకొత్త రంగులు పులుముకొని మరీ వస్తాయి. గతానికి వర్తమానం  చేసే అలంకరణ అది. జెన్నిఫర్ ఇప్పుడెలా ఉందో? ఒకేఒక సారి మాటల సందర్భంలో జాన్  ఆమె ప్రసక్తి  తీసుకొచ్చాడు – పెళ్లి చేసుకొని గ్లాస్గోలో స్థిరపడిందని చెప్పాడు.

చీకట్లో ఎట్నుంచి ఊడిపడ్డాడోగాని, “సారీ, ఆలస్యం అయింది” అంటూ చటుక్కునవచ్చి కూర్చున్నాడు జాన్, తన ఉత్సాహభరితమైన చిరునవ్వుతో.

“ఏడుకే క్లబ్బుకి చేరాను గాని రిసెప్షన్ దగ్గర ఎప్పట్నించో కలవాలనుకుంటున్న ఒక ప్రముఖ వ్యక్తిని ఒకాయన పరిచయం చేశాడు. నాలుగు ముక్కలు మాట్లాడే సరికి ఆలస్యం అయింది”

“ఎవరా వ్యక్తి?”

“మనం ఎప్పటినుంచో వింటూన్న పేరే. సర్ ఆర్థర్”

“ఆ!? సర్ ఆర్థర్ కాటనే?!”

“ఆహా, ఆయనే!”

“ఏమంటాడు?”

“టూకీగా చెబుతాను. బ్రిటీష్ పాలనకు గుర్తుగా చిరకాలం మిగిలిపోయే ఉత్తమచిహ్నాల గురించి సంభాషణ సాగుతోంది. సీనియర్ రైల్వే అధికారి ఒకాయన – శాశ్వతంగా ఈ దేశంలో నిలిచిపోయేది భారతీయ రైల్వేవ్యవస్థ మాత్రమే అన్నాడు”.

Calcutta Club_Bearer

“అలా అంటే కాటన్ మహాశయుడు ఒప్పుకోడే?”

“అవును మరి. జవాబుగా సర్ ఆర్థర్ – రైల్వేల మీద పెడుతున్న ఖర్చులో పదోవంతు నీటి పారుదల, జలరవాణాల మీద పెడితే ఇంకా గొప్ప ప్రయోజనాలను ఈదేశస్తులు పొందిఉండేవారన్నాడు. ఈ దేశపు అపార జలసంపదని సద్వినియోగంచేసి లక్షలమందిని కరువులనుండి ఎలా శాశ్వతంగా విముక్తులను చెయ్యవచ్చో చెప్పాడు. రైల్వేలు అవసరమేగాని పంటభూములకు నీరు అందించడం పాలకుల మొదటి కర్తవ్యం అన్నాడు. భారతదేశపాలకులు ప్రాచీనకాలం నుండీ  ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూవస్తున్నారన్నాడు”.

“ఇదే అతని వాదన, ఎప్పట్నించో” అన్నాడు కెన్.

“ఈరోజున తన వాదనని హేతుబద్ధంగానే కాకుండా భావోద్వేగంతో కూడా వినిపింప జేశాడు. తక్షణ లాభనష్టాల బేరీజు కన్నా దీర్ఘకాలిక ప్రయోజనాలు, ప్రాణాల్ని కాపాడడం ముఖ్యం అన్నాడు. ఈ దృష్టి లేకపోతే భగవంతుడు పాలకులను క్షమించడన్నాడు. అతనికి హృదయానికి చాలా దగ్గరగా ఉండే ప్రతిపాదన – ఈ దేశపు నదుల్ని అనుసంధించే పథకం గురించి చెప్పాడు. ముసలాడి ఉత్సాహం చూస్తే ముచ్చటేసింది”.

“పదవీ విరమణ చేసి ఇంగ్లండు వెళ్లిపోయాడని విన్నాను?”

“నిజమే. ప్రభుత్వంవారి పిలుపుమీద సలహాదారుడిగా ఈ మధ్యనే తిరిగి వచ్చాడు. కుంఫిణీ పాలన ముగిసి ప్రత్యక్ష బ్రిటీష్ ప్రభుత్వ పాలన ఏర్పడింది గనక, ఇటువంటి నిపుణుల సలహాలతో ఇకమీదట పెద్దపెద్ద పథకాలు అమలు కాబోతున్నాయనే ఆశాభావం పెరుగుతోంది”.

“ఈరోజున సర్ ఆర్థర్ వస్తున్నట్టు క్లబ్బువాళ్ళు ముందుగా చెప్పలేదే? ఒట్టి పనికిమాలిన సజ్జు” అన్నాడు కెన్ చిరాగ్గా.

“టౌన్ హాల్లో ఆయనకి సన్మానం జరిగింది. ఆ విషయం నాకూ తెలుసుగాని వెళ్ళడం కుదరలేదు. నీక్కూడా ఆహ్వానం వచ్చి ఉండాలే? డిన్నర్ కని ఇక్కడికి తీసుకొచ్చినట్టున్నారు. నేను కలిసినప్పటికే  భోజనాలు ముగించి బయిల్దేరిపోతున్నారు”.

సర్ ఆర్థర్లాంటి మహానుభావుడిని కలుసుకొనే అవకాశం చేజారిపోయినందుకు కెన్ మనసు అసంతృప్తి తో నిండి పోయింది. అది గ్రహించిన జాన్ –

“ఇంకా కొన్నాళ్ళు ఉంటాడులే. విశాఖపట్నం పోర్టు పథకం ముందుకెళ్ళేటట్టుగా ఉంది. దానికి మరి ఈయనే ఆద్యుడు కదా. ఇరవై ఏళ్ల కిందట సర్ ఆర్థర్ ఇక్కడే యారాడ కొండమీద కుటుంబంతో సహా రెండేళ్లున్నాడు – నువ్వు వినే ఉంటావు. అప్పుడే పోర్టు నిర్మాణానికి ప్రతిపాదన చేసాడుగాని నిదులులేక కుంఫిణీ అధికారులు దాన్ని పక్కన పెట్టారు”.

“బ్రిటిష్ పాలనకు గుర్తులు అన్నావు. అంటే మనం ఇక్కడినుంచి వెళ్ళిపోయే పరిస్థితి రావచ్చునంటావా?” ఈ ఊహకందని పరిణామం కెన్ ని కంగారుపెట్టింది. తన కుక్కలూ, బంగళా, తోటా, సహచరీ గ్యాపకం వచ్చాయి – అదే క్రమంలో .

“ఇప్పట్లో కాదులే. నువ్వూనేనూ ఆ రోజు చూడం గాని ఎప్పుడో వస్తుంది. తప్పదు”.

కెన్ కాస్త ఊపిరి పీల్చుకుని, “ఇంగ్లీషు పాలనలో లేని భారతదేశం! ఊహకే అందడం లేదు” అన్నాడు.

సింహాచలం వచ్చి షాంపేన్ సీసాని కెన్ కి అందజేశాడు. పొగాకు బూడిదని తుడిచి, వైన్ గ్లాసుల్ని, వేయించిన చేప ముక్కల్నీ  టేబిల్ మీద సర్దివెళ్ళిపోయాడు. కెన్ స్వయంగా బిరడా తీసి, ఇద్దరి గ్లాసుల్లోనూ పోసాడు.

“ఛీర్స్! భారతదేశంలో నీ అద్భుత అనుభవాల్ని  గుర్తుచేసుకుంటూ, ఇంగ్లండులో మరిన్ని విజయాల్ని సాధించాలని కోరుకుంటూ –“

ఇద్దరి మధ్యా కాసేపు నిశ్శబ్దం. బీరు, షాంపేన్, విస్కీ కలగలిసిపోయి కెన్ లోలోపల గందరగోళం సృష్టిస్తున్నాయి. దూరంగా సముద్రపు హోరు. ‘మనం ఇక్కడ లేకపోవడం’ అన్న ఆలోచనే అతనికి ఇబ్బందికరంగా, చిరాగ్గా ఉంది.

“మనం వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని ఎందుకనుకుంటున్నావు, జాన్?”

“1857లో ఏమైందో చూశాం. చావుతప్పి కన్నులొట్ట పోయింది. కేవలం లాభార్జన కోసం ఏర్పడ్డ కుంఫిణీ మాదిరిగా కాకుండా బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా వ్యవరించవలసిన రోజులొచ్చాయి. లేకపోతే ఇక్కడ మనం కొనసాగడానికి జనామోదం ఉండబోదు. వాళ్ళు తిరగబడితే మనం చెయ్యగలిగేది ఏమీలేదు. ఈ మధ్య ఇంగ్లీషు చదువులు, ముఖ్యంగా ఇంగ్లండువెళ్లి చదువుకొని తిరిగిరావడం ఎక్కువైంది. వాళ్ళంతా ఎక్కువగా మధ్యతరగతి, లేదా ఉన్నతవర్గ, అగ్రవర్ణ లాయర్లు, ఉపాధ్యాయులు; ఇంగ్లీషు చక్కగా మాట్లేడే వాళ్ళు, రాసే వాళ్ళూను. మనకి అత్యంత ప్రమాదకరమైన సమూహం ఇదే”.

కొంతమంది నేటివ్ లాయర్లు, ఉపాధ్యాయులు ఒక మూల గుమిగూడి బ్రిటీష్ సామ్రాజ్యాన్ని అంతమొందించేందుకు మంతనాలు చేస్తున్నారని ఊహించుకుంటే కెన్ కి నవ్వొచ్చింది. ఈ మాటన్నది జాన్ గనక నవ్వకుండా విన్నాడు.

“వీళ్ళ నాయకత్వంలోనే రాబోయే కాలపు తిరుగుబాట్లు పుట్టుకొస్తాయి. సిపాయిల్లోంచి కాదు. వీళ్ళని ఎదుర్కోవడానికి కొత్త ఎత్తుగడలు అవసరం. వాళ్ళకన్నా తొందరగా నేర్చుకుంటేతప్ప వాళ్ళని ఎదుర్కోలేం”.

“పాతిక ముప్ఫై ఏళ్లనుంచి ఇక్కడ పనిచేస్తున్నాం. ఈ దేశాన్ని నియంత్రిస్తున్నాం. ఇప్పుడు కొత్తగా నేర్చుకొనేదేముంది?”

Art: Srujan Raj

“ఇక్కడికి వచ్చే అధికారులకు కుంఫిణీ వారు ఇస్తూవచ్చిన తర్ఫీదు ఇంకెంతమాత్రమూ సరిపోదనన్నీ, ఇండియన్ సివిల్ సర్వీస్ అనే కొత్త విభాగాన్ని ఏర్పరచాలని 1858లో తీసుకున్న నిర్ణయాన్ని హుటాహుటిన అమలు చేస్తున్నారు.  ఈ కొత్త కాడర్ ని నిర్మించేందుకూ, మరోవైపు  గూఢచార వ్యవస్థని పటిష్టం చేసేందుకూ చాలామందిని దిల్లీలోనూ, లండన్ లోనూ కొన్ని  ప్రత్యేక విభాగాల్లో నియమిస్తున్నారు. ఇప్పుడు నాకు అప్పగించిన బాధ్యతలు కూడా ఇలాంటివే”.

ఒక్క క్షణంలో కెన్ కి మొత్తం అంతా అర్థమైపోయింది. కాని ఒక సందేహం అతన్ని పీడిస్తోంది.

“మనం లేకపోతే ఈ దేశం ముప్ఫైమూడు చెక్కలవుతుంది” అన్నాడు– కొంచెం అలకతో కూడిన స్వరంతో.

“నిజమే. మన పాలనలేకపోతే  ఈ దేశపు లోలోపలి సంఘర్షణలు, వాటితోబాటు మధ్యయుగ అవలక్షణాలు బయటపడతాయి. రైల్వేలు, టేలిగ్రఫీ, విద్యా, న్యాయవ్యవస్థలు – ఇవే దీర్ఘకాలిక ప్రగతికి మనం ఏర్పరచిన మార్గాలు.  గమ్మత్తేమిటంటే ఇవే రేప్పొద్దున్న మన పీకలకు చుట్టుకుంటాయి”.

కెన్ కిక్కు కొంచెం దిగింది. ఆసక్తిగా వింటున్నాడు. సింహాచలం ఆఖరి రౌండు విస్కీ, సలాడ్, చికెన్ బిరియానీ తీసుకొచ్చి పేర్చాడు.

“ఈ మధ్య ఒక నివేదిక చదివాను. దాంట్లో ఒక పాత్రికేయుడు – పేరు గుర్తు రావడం లేదు – 1857నాటి సంఘటనల గురించి రాస్తూ ‘తిరుగుబాటు విఫలమైందిగాని బ్రిటిష్ వారు ప్రవేశపెడుతూన్న రైల్వేలే వారి కొంపముంచుతాయి. అన్ని కులాలవాళ్ళూ రైళ్లల్లో కలసికట్టుగా ప్రయాణిస్తారు. క్రమేపీ వారిమధ్య విభేదాలు తొలగిపోతాయి’ – ఈ ధోరణిలో.  విడ్డూరంగా అనిపించినా దీంట్లో కొంత నిజం ఉంది”.

కెన్ ఇక తమాయించుకోలేక పోయాడు. “రైళ్లల్లో ప్రయాణిస్తే కుల వ్యవస్థ అంతం కావడమేమిటి? ఎవడా రాసింది?”

“ఎవరో  జర్మన్ అనుకుంటా. మొదటిసారిగా మనం ఈ దేశపు ప్రజలు, ప్రాంతాలు చేరువకాగల అవకాశాల్ని సృష్టించామన్నది మాత్రం వాస్తవం”.

“ఇదంతా సరేగాని జాన్, మళ్ళీ తిరిగి ఎప్పుడొస్తావు?” అనడిగాడు కెన్ – సంభాషణని మరో దిశలోకి మళ్లిస్తూ.

“ఏమో? ప్రభుత్వంవారు పంపితేనే”.

“ఈ దేశం వదిలి వెళ్ళాలంటే నీకేమనిపిస్తోంది?”

“నేనిక్కడికి వచ్చినప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. బంగాళాఖాతం,  అరేబియన్ సముద్రం, హిందూమహాసముద్రం, హిమాలయా పర్వతాలు, గంగానది, వారణాసి, పాటలీపుత్రం, కపిలవస్తు, మలబార్, కోరమాండల్ – ఈ పేర్లలోనే గొప్ప చరిత్ర, సాహసకృత్యాలు, రొమాన్సు దాగి ఉన్నట్లు అనిపించేది. ఇప్పటికీ ఆ భావన అలాగే ఉంది. మా అబ్బాయి ఈ మధ్య రాసిన ఉత్తరంలో ఒక మంచి మాటన్నాడు. ఒక దేశం పేరున ఉన్న ఏకైక మహాసముద్రం  ఇండియన్ ఓషన్ అని. నిజమే కదా అనిపించింది”.

“ఇప్పుడేమనిపిస్తోంది?”

“ఇప్పుడా? భారతదేశంలో ఇన్నాళ్ళు పనిచేయడం నాకు లభించిన గొప్ప అవకాశం అనిపిస్తోంది. ఇది నా జీవితకాలపు గొప్ప అనుభవం. దీన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడి ప్రజలకోసం చెయ్యగలిగిన మంచిపనులేమైనా చెయ్యాలనేదే నా కోరిక. ఇవాళ అనుకోకుండా సర్ ఆర్థర్ ని కలుసుకున్నాక ఇలాగని మరీబలంగా అనిపిస్తున్నది. నేనీ క్లబ్బుకి వచ్చిన ఆఖరిరోజున ఆయన తటస్థపడడం దైవసంకల్పం కావచ్చు”.

కాసేపు మౌనంగా బిరియానీ తిన్నారు. భావోద్వేగంతో మాట్లాడడం జాన్ పద్ధతి కాదు. ఈ రోజు మాత్రం అతనిలో ఎక్కడో దాగిన ఉద్వేగ స్వరాలు వినిపించాయి కెన్ చెవులకి.

జాన్ కి కూడా అలా అనిపించిందేమో. “నేనిక బయిల్దేరాలి” అని ఏకపక్షంగా, ముక్తసరిగా ప్రకటించి లేచి నిటారుగా నిలబడ్డాడు. అర్థరాత్రి అయితేగాని కెన్ క్లబ్బు నుండి కదలడని జాన్ కి తెలుసు.  అయిష్టంగానే కెన్ కూడా లేచాడు; లేవగానే ఒకింత తూలాడు. కుర్చీని పట్టుకొని సంభాళించుకుని అడుగు ముందుకేసాడు. క్లబ్బు గేటువైపు నడుస్తున్నారు. నిండు పున్నమి వెన్నెల. పాదాలక్రింద ఎండుపుల్లలు విరుగుతున్నాయి.

సింహాచలం పరుగెత్తుకుంటూ వచ్చాడు. “దొరగారు పైపు మర్చిపోయారు” అని కెన్ కి అందజేశాడు. “గుడ్ నైట్ సార్” అన్నాడు వంగి సలాం చేస్తూ. జాన్ ఒక వెండి జడ రూపాయి – విక్టోరియా రాణి బొమ్మ ఉన్నది – సింహాచలం చేతిలో పెట్టాడు. అతను సలాంచేసి వెళ్ళిపోయాడు.

స్నేహితులిద్దరూ ముందుకి నడిచారు. కీచురాళ్ళ రొద; వాటి వెనుక తరంగ ఘోష. రెండు కెరటాల మధ్య కొద్దిక్షణాల ఉద్రిక్త నిశ్శబ్దం. ఆ తరవాత మళ్ళీ కెరటం విరిగిన సంరంభం.

“నేనొకటి అడుగుతాను, చెబుతావా?” అన్నాడు కెన్.

“అడుగు”.

“జెన్నిఫర్ ఎందుకు మనసు మార్చుకుంది? నీకేమైనా చెప్పిందా?”.

“నేనే ఆమెకు చెప్పాను. మీ ఇద్దరికీ జోడీ కుదరదని. నాకలా అనిపించింది మరి – అప్పట్లో”.

కెన్ ఇంకేమీ అనలేదు. గేటు సమీపించారు. వీళ్ళ రాకని గమనించిన జట్కాగుర్రం తలాడించి సకిలించింది. జట్కాసాయిబు ఉలిక్కిపడి నిద్రలేచాడు.

(వివరణలు: ఆర్థర్ కాటన్ 1860లో పదవీవిరమణచేసి ఇంగ్లండ్ వెళ్ళిపోయాడు. బ్రిటిష్ ప్రభుత్వం కోరికపై 1863లో తిరిగివచ్చి సుమారు ఏడాదిపాటు  ఉన్నాడు గాని ఆ వ్యవధిలో మళ్ళీ విశాఖపట్నం వచ్చిన దాఖలాలు లేవు. 1863లోనే ఇండియన్ సివిల్ సర్వీస్ లో చేరే అర్హతను సాధించిన మొదటి భారతీయుడు – రవీంద్రనాథ్ టాగోర్ అన్నగారైన సత్యేంద్రనాథ్ టాగోర్. రెండవ వ్యక్తి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన రొమేష్ చంద్ర దత్. మూడవది బ్రహ్మోసమాజ్ లో చేరిన బిహారిలాల్ గుప్తా.  నాలగవ వ్యక్తి  సురేంద్రనాథ్ బెనర్జీ. బ్రిటిష్ పార్లమెంట్ లో మొదటి భారతీయ సభ్యుడు, సెకండ్ ఇంటర్నేషనల్ సభ్యుడైన దాదాభాయి నౌరోజీ భారతదేశపు అభివృద్ది విషయమై – 1899 వరకూ ఇంగ్లండులో జీవించిన కాటన్ ని  అనేకసార్లు సంప్రదించాడు, ఆయనతో సహకరించాడు. అన్నట్టు – ఈ కథలో జాన్ మర్చిపోయిన జర్మన్ పాత్రికేయుని పేరు కారల్ మార్క్స్).

*

 

నిధుల వేటలో…ఆశనిరాశల ఊగిసలాటలో…

 

స్లీమన్ కథ-20

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

నిజానికి ఈ విడత తవ్వకాలలో బయటపడినవన్నీ అతనికి చిక్కుముడులుగానే కనిపిస్తున్నాయి. గుడ్లగూబ ఎథెనా పవిత్రచిహ్నమనీ, ఎథేనియన్ నాణేలపై అది ఉంటుందనీ అతనికి తెలుసు. కానీ, ఇక్కడ కనిపించిన గుడ్లగూబ చిహ్నాలు  మరీ చరిత్రపూర్వకాలానికి చెందినవిలా ఉన్నాయి. తను రాతి యుగపు అవశేషాలను వెలికితీశాడా అనుకున్నాడు. నిరుత్సాహం చెందాడు. అభిప్రాయం కోరుతూ ఫ్రాంక్ కల్వర్ట్ సోదరుడు జేమ్స్ కల్వర్ట్ కు ఉత్తరం రాశాడు. అతను జవాబు రాస్తూ, అందులో ఆశ్చర్యపోవలసిందేమీ లేదనీ, క్రీ.పూ. 6,7 శతాబ్దుల వరకూ గ్రీకులు చిత్రిత మృణ్మయ పాత్ర(painted pottery)లను తయారుచేసుకోలేదనీ, మీకు కనిపించిన మూర్తుల్లాంటివి ఇంతకుముందు తవ్వకాల్లో కూడా బయటపడ్డాయనీ అన్నాడు. మరీ ఆటవికకాలానికి చెందిన ప్రదేశంలో తవ్వకాలు జరుపుతున్నాననుకుని నిరుత్సాహపడనవసరంలేదనీ, ముందుకు సాగమనీ ధైర్యం చెప్పాడు.

స్లీమన్ తవ్వకాలు కొనసాగించాడు. లింగాకృతులు, బొంగరం రూపంలోని మట్టి బొమ్మలు ఇంకా ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. ఈ బొంగరం ఆకారంలోని బొమ్మలు విచిత్రంగా ట్రాయ్ మైదాన ప్రాంతంలోని శ్మశానం దిబ్బల్ని పోలి ఉన్నాయి. లావా కత్తులు(లావా వేగంగా ప్రవహిస్తూ, మంచి పదును కలిగిన నల్లని గాజు రూపంలో గడ్డకడుతుంది. దానిని కత్తిగా ఉపయోగించేవారు)కూడా కనిపించాయి. అవి ఎంత పదునుగా ఉన్నాయంటే, బహుశా వాటిని రేజర్లుగా వాడేవారేమోనని స్లీమన్ అనుకున్నాడు. ఆపైన కాల్చిన మట్టితో(terracotta) చేసిన చిన్న చిన్న పడవ బొమ్మలు కనిపించాయి. అవి భారతదేశంలో కనిపించే పడవల్లా ఉన్నాయి. ఈ వస్తువులన్నీ భారత్ నుంచి వ్యాపించి ఉండచ్చని అనుకున్నాడు. ఇక్కడ కనిపించిన లింగాకృతులను బట్టి ఈ ప్రదేశానికి వేదకాలపు భారతదేశంతో ఏదో సుదూరసంబంధం ఉండి ఉంటుందని భావించాడు. అయితే, ఈజిప్టుకు చెందినదా అనిపించే వెలిసిపోయిన శాసనలిపీ కనిపించింది. అక్కడక్కడ మట్టి పలకలపై చెక్కిన స్వస్తిక చిహ్నాలు బయటపడ్డాయి. బొంగరం ఆకారంలోని మట్టి బొమ్మల్లానే ఇవి కూడా అతనికి విస్తుగొలిపాయి.

నవంబర్ 16న, పెద్ద పెద్ద రాళ్ళతో నిర్మించిన గోడల్లో ఒకదానినీ, ఒక పెద్ద ద్వారబంధాన్నీ తవ్వితీయడానికి పురమాయించాడు.  ఆరోజు మూడు గంటల సేపు అరవై అయిదుగురు పనివాళ్లు చెమటోడ్చినా అవి లొంగలేదు. మరునాడు కూడా ఆ పని కొనసాగింది. నవంబర్ 18 సెలవు దినం. ఆరోజు పని చేయబోమని సిబ్బంది చెప్పేశారు. దాంతో స్లీమన్ తవ్వకాల నివేదిక రాసుకుంటూ గడిపాడు. ఈ నివేదికల ప్రతులను ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పండితులకు పంపడం అతనికి పరిపాటి.  లింగాకృతులు, బొంగరం ఆకారంలోని బొమ్మలు, లావా కత్తులు, స్వస్తికచిహ్నాలు, శాసనపు రాతలూ అతనికి ఎంత కొరకరాని కొయ్య లయ్యాయంటే; తనే సర్వజ్ఞుడనుకునే ఆ మనిషి కాస్తా, వాటి గురించి తెలియచెప్పి పుణ్యం కట్టుకోండంటూ తనదైన శైలిలో పండితులకు విజ్ఞప్తి చేశాడు. తను ఈ శీతాకాలాన్ని ఎథెన్స్ లో గడుపుతాననీ, అక్కడి తన చిరుమానాకు రాయవలసిందనీ కోరాడు.

ఉత్తరం నుంచి వీచే తీవ్రమైన చలి గాలులు ట్రాయ్ మైదానాన్ని ఊపేస్తున్నాయి. అయినాసరే, పెద్ద చలికోటు, నెత్తిన హెల్మెట్ తో టంచన్ గా పనిలోకి దిగిపోయి సిబ్బందిని పరుగులెత్తించే స్లీమన్, సాధ్యమైన చివరి క్షణం వరకూ తవ్వకాలను జరిపించాల్సిందే ననుకున్నాడు. కానీ, నవంబర్ 24నుంచీ రెండు రోజులపాటు పెద్ద తుపాను విరుచుకుపడడంతో తప్పనిసరై తవ్వకాలను ఆపేసి ఎథెన్స్ కు వెళ్లిపోయాడు. ఆ నిర్బంధ విరామంలో కొంత కాలాన్ని స్వస్తికాలపై తను రాసుకున్న సమాచారానికి వ్యాసరూపమిస్తూ గడిపాడు. నాజీ స్వస్తికాలలా కాకుండా అసలైన స్వస్తికాలు కుడి నుంచి ఎడమకు తిరుగుతాయి. ప్రపంచంలో అవి కనిపించని చోటు అంటూ లేదు. పురాతన చైనా చెక్కడాలపై, మిలాన్(ఇటలీ)లోని సెయింట్ యాంబ్రోస్ వేదికపై, నార్ఫిక్(ఇంగ్లండ్)లో కనిపించిన కెల్టిక్ అంత్యక్రియల కలశాలపై, రామాయణంలో వర్ణించిన ఓడల ముందు భాగంపై స్వస్తికచిహ్నాలు ఉన్నాయి. ఒక పుస్తకం రాయడానికా అన్నట్టుగా స్వస్తికాలపై అతను విస్తారమైన సమాచారాన్ని సేకరించిపెట్టుకున్నాడు.

విరామ కాలంలో ఎక్కువ సమయాన్ని తన పరిశోధన వ్యాసాలకు మెరుగులు దిద్దుకోవడం లోనే గడిపాడు. అవి అయిదు విడతలుగా అస్పెర్గర్స్ ఆల్గమైనా సైటూంగ్ లో ప్రచురితమయ్యాయి. ఆ తర్వాత ‘ట్రోజనీష్ ఆల్టట్యూమర్’(Trojan Antiquities) పేరుతో పుస్తకరూపం ధరించాయి. స్లీమన్ ప్రారంభ వ్యాసాలపై ప్రముఖ గ్రీకు అధ్యయనవేత్త ఎర్నెస్ట్ కర్టియస్ స్పందిస్తూ, బునర్ బషీయే ట్రాయ్ తప్ప స్లీమన్ భావించినట్టు హిస్సాలిక్ కాదని నొక్కి చెప్పాడు. దాంతో స్లీమన్ అతనిపై మండిపడ్డాడు. ట్రాయ్ రాజప్రాసాదాలు హిస్సాలిక్ లో కాక, ఇంకెక్కడో ఉంటాయని భావించేవాడు వట్టి మూర్ఖుడనీ, కాకపోతే లోయ మీదుగా ట్రాయ్ నగరం బునర్ బషీ వరకూ విస్తరించి ఉండచ్చనీ అన్నాడు.

లింగాకృతులు, బొంగరం ఆకారంలోని బొమ్మలు గడ్డు ప్రశ్నలుగా మారినా, తను పురాతన ట్రాయ్ నగరాన్ని కనుగొన్నానని అతను ఇప్పటికీ దృఢంగా నమ్ముతున్నాడు. ట్రాయ్ నగరం కేవలం ఊహల్లో తప్ప ఉనికిలో లేదని ఎర్నెస్ట్ రెనాన్, మాక్స్ ముల్లర్, లాంగ్ పెరియా లాంటి మహాపండితులు సైతం కొట్టిపారేసినా, స్లీమన్ మాత్రం అది నిజంగా ఉందని నిర్ధారణకు వచ్చాడు. 1872 మార్చిలో తన నాలుగో విడత తవ్వకాలకు ఎథెన్స్ నుంచి బయలుదేరి వెడుతూ, “హోమర్ పై నాది చెక్కు చెదరని విశ్వాసం. ప్రియామ్ ప్రాసాదాన్నీ, పురాతన ట్రాయ్ దుర్గాన్నీ కనుక నేను వెలుగులోకి తీసుకురాగలిగితే ప్రపంచవ్యాప్తంగా అదో పెద్ద సంచలనం అవుతుంది. ఆ కాలపు చారిత్రక, పవిత్ర అవశేషాలను దర్శించడానికి వందలు, వేల సంఖ్యలో హోమర్ అభిమానులు తరలివస్తారు” అని రాసుకున్నాడు.

bhaskar3

స్వస్తిక చిహ్నం కలిగిన ఒక దేవత

ఎంతో ఆత్మవిశ్వాసంతో నాలుగో విడత తవ్వకాలకు సిద్ధమయ్యాడు. లండన్ లోని అతని మాతృసంస్థ బ్రదర్స్ ష్రోడర్స్ కంపెనీ అరవై తోపుడుబళ్ళను, నాణ్యమైన ఇంగ్లీష్ పారలను, తేలికరకపు గొడ్డళ్లను కానుకగా పంపింది. మార్చి చివరిలో భార్యతో సహా దర్దనెల్లెస్ చేరుకుని ఏప్రిల్ 5న తవ్వకాలను పునః ప్రారంభించాడు.

పనివాళ్లతో సమస్యలు మామూలే. దానికితోడు వరసపెట్టి గాలివానలు, గ్రీకు పండుగ దినాలు. తొలి పదిహేనురోజుల్లో కేవలం ఎనిమిది రోజులు మాత్రమే పని జరిగింది. కొన్ని రోజులు వందమందిని, మరి కొన్ని రోజులు 126 మందిని పనిలోకి తీసుకున్నాడు. సగటున రోజుకు 20 మంది పనివాళ్ళ చొప్పున 300 ఫ్రాంకులు చెల్లించానని లెక్క వేసుకున్నాడు. మూడు వారాల తర్వాత ఒక రోజున పనివాళ్ళు పొగ తాగుతుండడం చూసి స్లీమన్ కేకలేశాడు. దాంతో వాళ్ళలో కొంతమంది ఎదురు తిరిగి పని మానుకుంటామని బెదిరించారు. పని చేసుకుంటున్న మిగిలిన వాళ్ళ మీద రాళ్ళు విసిరారు.

స్లీమన్ వెంటనే చర్యకు దిగాడు. దాదాపు అందరినీ పనిలోంచి తీసేశాడు. ఆరోజు రాత్రంతా నిద్రపోకుండా కొత్త పనివాళ్ళను వెతికాడు. మరునాడు విజయవంతంగా 120 మంది కొత్తవాళ్లను రంగంలోకి దింపాడు. పని చురుగ్గా సాగడం లేదని అదనంగా ఇంకో గంట పని చేయించాలనుకున్నాడు. ఉదయం ఓ గంట ముందుకు జరిపి, అయిదు నుంచే పని చేయించడం ప్రారంభించాడు. అయినాసరే, మధ్యలో గ్రీకు ఈస్టర్ పండుగ రావడంతో ఆరు రోజులపాటు తవ్వకాలు ఆగిపోయాయి. ఎలాగైనా తవ్వకాలు కొనసాగేలా చూడడానికి పనివాళ్ళకు అదనపు కూలీని ఎరేశాడు, బతిమాలాడు, బెదిరించాడు, సోమరిపోతులంటూ తిట్టిపోశాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఇంకోవైపు, తవ్వకాలలో చెప్పుకోదగినవీ బయటపడడం లేదు. ఎలకను పట్టడానికి కొండను తవ్వుతున్నానా అనుకుంటూ తీవ్రనైరాశ్యంలోకి జారిపోయిన క్షణాలూ ఉంటున్నాయి.

మే నెలలో మరికొన్ని శ్రాద్ధదినాలు వచ్చాయి. ఎక్కువ వేతనం ఇస్తానని ఆశపెట్టి తవ్వకాలు కొనసాగేలా చూడడానికి యధావిధిగా ప్రయత్నించాడు. చర్చి పెద్దలు మా తోలు తీస్తారంటూ పనివాళ్ళు తిరస్కరించారు. సెలవు దినాల్లో తరచు పనివాళ్ళ ఇళ్లకు వెళ్ళేవాడు. వాళ్ళల్లో, లేదా కుటుంబసభ్యుల్లో ఎవరైనా అనారోగ్యంతో తీసుకుంటూ ఉంటే మందులు సూచించేవాడు. అప్పట్లో సాధారణంగా గ్రీకు పూజారులే వైద్యం కూడా చేసేవారు. రోగి ఒంటి మీద గాటు పెట్టి, లోపల మెత్తని దూది పెట్టి మండించిన ఓ చిన్న కప్పును దాని మీద బోర్లించి అందులోకి రక్తం తీసుకునేవారు. ఆ నాటువైద్యం చూసి స్లీమన్ భయభ్రాంతుడైపోయాడు. అలా పసిపిల్లలనుంచి కూడా రక్తం తీయడం మరింత బెంబేలెత్తించింది. అందువల్ల పిల్లల్లో మాటి మాటికీ రక్తస్రావం అవుతుండడం గమనించి, వాళ్ళ పెదవుల చుట్టూ ఉండే లోతైన ముడతలే అందుకు కారణమని తీర్మానించాడు. రోగి ఒక్క రక్తపు చుక్క కూడా చిందించనవసరం లేకుండా తను నయం చేస్తూవచ్చాననీ, దాదాపు అన్ని రోగాలకూ విరుగుడుగా ఉప్పునీటినీ, సముద్రస్నానాన్నీ సూచించి అద్భుతాఫలితాలు సాధించానని అతను చెప్పుకున్నాడు.

ఓ రోజున ఒంటినిండా పుళ్ళు పడిన ఓ అమ్మాయిని అతని దగ్గరికి తీసుకొచ్చారు. ఆమె ఎడమ కన్ను పూర్తిగా పుండు పడిపోయింది. విపరీతంగా దగ్గుతూ ఒక్క అడుగు కూడా వెయ్యలేని స్థితిలో ఉంది. ఒక డోసు ఆముదం తాగించమనీ, సముద్ర స్నానాలతోపాటు ఛాతీ విశాలం కావడానికి కొన్ని అభ్యాసాలు చేయించమనీ చెప్పాడు. రెండు వారాల తర్వాత ఆ అమ్మాయి తన ఊరి నుంచి మూడు గంటల ప్రయాణదూరంలో ఉన్న హిస్సాలిక్ కు అవలీలగా నడచివచ్చి స్లీమన్ పాదాల మీద పడి, అతని బూట్లను ముద్దుపెట్టుకుంది. మొదటి సముద్రస్నానానికే తనలో తిరిగి ఆకలి పుట్టిందని చెప్పింది. ఎడమ కన్ను బాగుపడుతుందన్న ఆశ లేకపోయినా ఒంటి మీద పుళ్ళు చాలావరకూ మానిపోయాయి. ఈ అమ్మాయి ఉదంతాన్ని ప్రతిసారీ అతను గర్వంగా చెప్పుకునేవాడు.

వేసవి వచ్చింది. ఆకాశం ఉష్ణం కక్కుతోంది. ఆవల్లోని కప్పల బెకబెకలతో రాత్రిళ్ళు దద్దరిల్లుతున్నాయి. సన్నగా, గోధుమ రంగులో ఉండే చిన్న చిన్న రక్తపింజరలు తిరిగే కాలమది. అవి చాలా ప్రమాదకరమైనవి. తవ్వకాలు జరిగేచోట శిథిల్లాల్లోంచి కూడా వస్తున్నాయి. గ్రామస్తులు పాము విషానికి ముందస్తు విరుగుడుగా ఒక రకం మూలికతో కషాయం తాగుతారని తెలిసి స్లీమన్ కూడా దానిని చేయించుకుని తాగాడు.

ఆ దిబ్బ మీద లోతైన కందకాలు తవ్విస్తున్నప్పుడు పెద్ద పెద్ద గోడలు కుప్పకూలి పనివాళ్లు ఆ శిథిలాల కింద కప్పడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎన్నడూ, ఏ ఒక్కరూ పెద్దగా గాయపడకపోవడం చూసి ఆనందాశ్చర్యాలకు లోనయ్యేవాడు. అదో అద్భుతంలా అనిపించేది. ఒక కోతి చెట్టెక్కినంత అవలీలగా ఆ దిబ్బ ఎక్కేవాడు. రోజంతా పనివాళ్లతో కలసి ఒళ్ళు అరగదీసుకునేవాడు. రాత్రిళ్ళు నిద్ర కాచుకుంటూ నోట్సు రాసుకునేవాడు.

అయితే, పురావస్తు తవ్వకాలకు సంబంధించి అతనికి శాస్త్రీయపరిజ్ఞానం లేదు. నిజానికి అప్పటి కింకా ఆ శాస్త్రం శైశవదశలోనే ఉంది. ఎథెన్స్ లోని ఫ్రెంచ్ స్కూల్ డైరక్టర్ గా ఉన్న ఎమీల్ బర్నూఫ్ చాలా విషయాల్లో అతని అజాగ్రత్తను ఎత్తి చూపుతూ గట్టిగా మందలించాడు. లింగాకృతులు, బొంగరం ఆకృతులు, కుండ పెనుకులు వగైరాలను కేవలం తవ్వి తీస్తే సరిపోదనీ; అవి ఎలా ఉన్నాయో, ఏ పరిస్థితిలో ఉన్నాయో, ఏ ప్రదేశంలో బయటపడ్డాయో-తేదీ, సమయంతో సహా అన్ని వివరాలూ పూసగుచ్చినట్టు డే బుక్కులో నమోదు చేయాలనీ హెచ్చరించాడు. అలా చేయనప్పుడు మీరు ఎలాంటి అద్భుతాలను వెలికితీసినా వాటి గురించి ఎప్పటికీ ఒక కచ్చితమైన నిర్ధారణకు రాలేరనీ పాఠం చెప్పాడు. అప్పటినుంచీ స్లీమన్ వివరాల నమోదుపై మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ, ప్రతి వస్తువుకూ కాగితంపట్టీ అతికిస్తూ వచ్చాడు. పురావస్తు తవ్వకాలలో ఒక పద్ధతి ప్రకారం కచ్చితమైన సమాచారాన్ని పొందుపరచడం ఎంత ముఖ్యమో క్రమంగా అతనికి అనుభవపూర్వకంగా అర్థమైంది.

అయినాసరే, ఇప్పటికీ తవ్వకాల్లో గొప్ప మెరుపులేవీ బయటపడడం లేదు. పెద్ద పెద్ద ప్రాకారాలు, అక్కడక్కడ పొడవైన అంకిత పాఠాలు లిఖించిన పాలరాయి పలకలు వెలుగు చూశాయి. అయితే అవి అనంతరకాలాలకు చెందినవి. ఆపైన కొన్ని భారీ కూజాల లాంటివీ, నల్లని మృణ్మయపాత్రలూ దొరికాయి. రాజు ప్రియామ్, రాకుమారుడు హెక్టర్, అఖిలెస్ లకు చెందినవేవీ కనిపించలేదు.

bhaskar2

ట్రాయ్ తవ్వకాల్లో దొరికిన స్వస్తిక చిహ్నం

అంతలో హఠాత్తుగా జూన్ 18, 1872న  రాతిమీద మలచిన ఒక చిత్రం బయటపడింది. అపోలో అనే దేవుడు నాలుగు సూర్యుని గుర్రాలపై స్వారీ చేస్తున్న చిత్రం అది. చిన్నదైనా అందులో చక్కని పనితనం ఉట్టిపడుతోంది. ఆ గుర్రాలను పైపైన చెక్కినప్పటికీ వాటిలో జవాసత్వాలే కాక, గొప్ప శిల్ప నైపుణ్యం తొంగి చూస్తోంది. అపోలో, బంగారు వన్నెలీనే తన శిరోజాలపై పది దీర్ఘ కిరణాలు, పది హ్రస్వ కిరణాలతో మలచిన కిరీటాన్ని ధరించి ఉన్నాడు. ఆ చిత్రం ట్రాయ్ కాలానికి తర్వాతిది, బహుశా టోలెమీల కాలానికి చెందినది. అయినాసరే, స్లీమన్ దానిని చూసి ముగ్ధుడయ్యాడు.  ఫ్రాంక్ కల్వర్ట్ కు చెందిన భాగంలో కనుగొన్నాడు కనుక అతని సాయంతో దానిని తక్షణమే బయటికి తరలించాడు. ఆ చిత్రం చాలా ఏళ్లపాటు ఎథెన్స్ లోని అతని ఇంటి తోటను అలంకరించింది.

ఒక పక్క వేసవి ముదురుతున్నా, హోమర్ చిత్రించిన ట్రాయ్ ఆనవాళ్ళు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఉండి ఉండి నైరాశ్యం అతన్ని కుంగదీస్తోంది. ఎంతో డబ్బు ఖర్చుపెట్టి, ఆ దిబ్బ ఉత్తరం వాలున ఓ పెద్ద చప్పరా(terrace)న్ని, ఓ రాతిగోపురాన్ని వెలికితీయించాడు. అయినాసరే, రోజు రోజుకీ అతనిలో సందేహాలు పెరిగిపోతున్నాయి. కాన్ స్టాంట్ నోపిల్ లోని బ్రిటిష్ కాన్సూల్ మరో 20 తోపుడు బళ్ళను,10 లాగుడు బళ్ళను, 6 గుర్రపు బళ్ళను; పెద్ద సంఖ్యలో రకరకాల తవ్వుడు సామగ్రిని పంపించడంతో పనైతే సునాయాసంగా జరిగిపోతోంది కానీ, స్లీమన్ లో మాత్రం ఆశ అడుగంటిపోతోంది.

ఆ వేసవిలో మొదటిసారి అతనిలో అలసటా, అనారోగ్యం తొంగిచూశాయి. వెనకటి ఉత్సాహం మందగించింది. టర్కీ ప్రభుత్వం ఇచ్చిన ఫర్మానాను మంచి వనరులున్న ఏ పురావస్తు సంస్థకో, విదేశీ ప్రభుత్వానికో అప్పగించి చేతులు దులుపుకుందామా అనుకున్న క్షణాలున్నాయి. తన డబ్బంతా వృథా అవుతోందన్న చింత పట్టుకుంది. ఆపైన రోజుల తరబడి గాలిదుమారం రేగుతోంది. పనివాళ్ళకు ఎదురుగా ఏముందో కూడా కనిపించని పరిస్థితి. జులై రాగానే దుర్వాసనతో కూడిన చీడ వ్యాపించడం ప్రారంభించింది. కుళ్ళిపోయిన లక్షలాది కప్పల కళేబరాలనుంచి అది వ్యాపిస్తోందని స్లీమన్ అనుకున్నాడు. హిస్సాలిక్ దిబ్బ మీద అతను కట్టించిన ఇంటి దూలాలమీంచి పాములు కింద పడుతున్నాయి. వాటికితోడు తేళ్ళ భయం,

ఒక్కోసారి ఒంటరితనం నుంచి బయటపడడానికి పొరుగునే ఉన్న ఓ గ్రామానికి వెళ్ళేవాడు. అక్కడ ఒక గ్రీకు దుకాణదారు పరిచయమయ్యాడు. అతని పేరు కొస్తాదినోస్ కొలబాస్. పుట్టుకతోనే వికలాంగుడు. ఇటాలియన్, ఫ్రెంచి భాషలు తెలుసు. ఇలియడ్ ను పేజీలకు పేజీలు అప్పజెప్పేవాడు. అతనితో పండితగోష్ఠిని స్లీమన్ ఆనందించేవాడు. విసిరేసినట్టు ఉన్న ఆ మారుమూల ప్రాంతంలో అతనికి ఒకింత ఉల్లాసం కలిగించింది అదొక్కటే.

ఆగస్టు 4…అప్పటికే అతను జ్వరంతో బాధపడుతున్నాడు. ఇక ఆ వేసవిలో తవ్వకాలు ఆపేద్దామనుకుంటున్నాడు. అంతలో అతను ఎదురుచూస్తున్న నిధి మొదటసారి కంటబడింది. ఆనందపు అంబర మెక్కించేంత గొప్ప నిధిగా అతనికి తొలిచూపులో కనిపించలేదు. మూడు బంగారు చెవిపోగులు, ఒక బంగారు బొత్తం…! దగ్గరలోనే ఒక అస్థిపంజరం. అది ఒక యవతిదనీ; ఎముకల రంగును బట్టి, ట్రాయ్ తగలబడినప్పుడు మంటల్లో చిక్కుకుని మరణించి ఉంటుందనీ స్లీమన్ అంచనాకు వచ్చాడు.

(సశేషం)

 

 

గమనమే గమ్యం-30

 

volgaచీకట్లోంచి నడిచొచ్చిన అన్నపూర్ణను చూసి ఆనందంతో కేకేసింది శారద.

‘‘ఇదేంటి –  ఇంత పొద్దుబోయి. అందరూ బాగున్నారు గదా’’

‘‘అందరం బాగున్నాము. మా బంధువు పెళ్ళికని పొద్దునే వచ్చా. ఇవాళ రాత్రి నీతో కాసేపు మాట్లాడి  రేపు పొద్దున వెళ్దామని ` ’’

ఇద్దరూ ఒకరినొకరు పరిశీలనగా సంతోషంగా చూసుకున్నారు.

‘‘ఎలా జరిగాయి ఎన్నికలు ?’’

‘‘ఓడిపోతాననిపిస్తోంది. మీ కాంగ్రెస్‌ వాళ్ళూ ` ’’

‘‘మా కాంగ్రెస్‌ అనకు. వాళ్ళు ఏలూర్లో  చేసిన పిచ్చి పనులన్నీ నాకు తెలుసు “.

‘‘నువ్వూ వచ్చి కాంగ్రెస్‌కి ఓటెయ్యమని ప్రచారం చేస్తావనుకున్నాను’’.

‘‘మా పార్టీ వాళ్ళు చాలా ఒత్తిడ చేశారు ఏూరు వెళ్ళమని. వెళ్తాను వెళ్ళి శారదకు ఓటెయ్యమని ప్రచారం చేస్తానన్నాను. దాంతో వెనక్కు తగ్గారు’’.

‘‘నిజంగా అలా అన్నావా ?’’

‘‘మరి – అసలు  నీకు ఎదురుగా ఎవర్నీ నిబెట్టొద్దన్నాను. వజ్రంలాంటి మనిషిని ఏకగ్రీవంగా గెలిపించాలని  అంటే అక్కడ వినేవాళ్ళెవరు? నీ విలువ  తెలిసినవాళ్ళెవరు?’’

‘‘నా  స్నేహితురాలివని తెలుసుగా –  నీ మాటలేం పట్టించుకుంటారు గానీ ` పోనీ ` మీ పార్టీ సంగతి తెలిసొచ్చింది గదా ` మా పార్టీలో చేరిపోరాదూ?’’

‘‘కాంగ్రెస్‌ అంటే ఈ మురికి మనుషులే అనుకుంటున్నావా ? గాంధీ, నెహ్రూ, సరోజినీ, దుర్గాబాయ్  -ఎలాంటి వాళ్ళు నడిపిస్తున్నారు. ఆ కాంగ్రెస్‌ని ఒదలటమే. ఒడ్డున నీళ్ళు మురిగ్గా ఉన్నాయని  నదీ ప్రవాహాన్నే కాదంటామా? నేనూ ఆ మహా ప్రవాహంలో ఓ నీటిబొట్టుననుకుంటే కలిగే తృప్తి వేరు. పార్టీ గొడవ ఒదిలెయ్‌. బాగా నలిగిపోయినట్లున్నావు. నట్టూ నిద్ర పోయిందా? దానిని కాస్త పట్టించుకో. మా పిల్లల్ని  నేను చిన్నతనంలో పట్టించుకోలేదని ఇప్పుడు సతాయిస్తారు.’’

‘‘ఎలా కుదురుతుంది చెప్పు అన్నపూర్ణా? ఆస్పత్రి, మహిళా సంఘం, పార్టీ పనులు , మనలాంటి వాళ్ళు పిల్లల్ని  కనకూడదేమో `

రాజకీయాలోకి వచ్చి పని చేయటమంటే ఆడవాళ్ళకెంత కష్టం. మనలా అన్నిటికీ తెగించిరావటం కాదు. ప్రతివాళ్ళు తేలికగా రాజకీయాల్లోకి వచ్చే వీలుండాలి. మా ప్రభుత్వం వస్తే  మేం అలాగే చేస్తాం.’’

‘‘ఏం చేస్తారు?’’

‘‘అబ్బో – చాలా చేస్తాం.తల్లుల కోసం, పిల్లల  కోసం ఎన్ని పథకాలు  నా  బుర్రలో ఉన్నాయో  నీకు తెలియదు. నీకే కాదు – మా వాళ్ళకూ తెలియదు. నేనన్నీ రాసి  పెడుతున్నాను . ఆడవాళ్ళు ఆనందంగా తల్లులు కావాలి. రాజకీయాలు  నడపాలి. ప్రతి గ్రామంలో ఆడవాళ్ళు రాజకీయాధికారం పొందుతారు. అప్పుడు అక్కడ తల్లులందరూ కలిసి తమ పిల్లల  పెంపకం గురించి, ఆరోగ్యం గురించి, చదువు సంధ్య గురించి కలిసి మాట్లాడుకుని అందరికీ బాగుండే సామాజిక నిర్ణయాలు  తీసుకుంటారు. సోవియట్లలో అలాగే జరుగుతోంది.’’

‘‘ఔనట. నేనూ విన్నాను. ఈ మధ్య అబ్బయ్య సోవియట్‌ పుస్తకాలు  తెచ్చి చదువుతున్నాడు. ఆయన చదివాక నేనూ, అమ్మాయి కూడా చదువుతాం’’.

‘‘అమ్మాయేమిటి – స్వరాజ్యమని పేరు పెట్టి – మీ అబ్బాయి పేరు మాత్రం గుర్తుండదోయ్‌ నాకు –  అసలు వాడిని  చూసిందే తక్కువ. అన్నపూర్ణా ఈ సారి నువ్వొక్క దానివీ వస్తే  ఊరుకోను. పిల్లల్ని తీసుకుని, అబ్బయ్యని కూడా తీసుకుని రావాలోయ్‌. నటాషాకు మీ పిల్లల  స్నేహం కావాలిగా – అసలు  అబ్బయ్యికి బెజవాడ కాలేజీలో ఉద్యోగమైతే ఎంత బాగుండేది ` ’’

‘‘మేమొచ్చి మీ ఇంట్లో కాపురం పెట్టేవాళ్ళం’’

‘‘తప్పేముంది. ఆ పని చెయ్యకుండా వేరే ఉంటే నేనొప్పుకుంటానా ?’’

ఆ రాత్రి స్నేహితుల  కబుర్లతో తెల్లవారింది.

ఎన్నికలలో ఓడిపోవటం శారదనంతగా బాధించలేదు గానీ ఎన్నిక గురించి సమీక్షించుకునేందుకు ఏర్పాటు  చేసిన సమావేశం శారదను కుదిపి వేసింది. మహిళా సంఘం సభ్యులు  కుంగిపోయారు. కొందరు ఏడ్చారు. వాళ్ళందరినీ శారద ఓదార్చగలిగింది. ఎన్నికలలో పోటీ చేయటం కేవలం  గెలవటం కోసం కాదనీ, మన సిద్ధాంతాలు  ప్రజలలో ప్రచారం  చేసుకునే అవకాశంగా చూడాలని, ప్రతి పక్షాలు  తప్పును ఎత్తిచూపగలగటం కూడా చిన్న విషయం కాదనీ చెపితే చాలామంది సమాధాన పడ్డారు.

 

img111‘‘అంతమంది ప్రజల ను మనం ఎలా కలుస్తాం? మన సానుభూతి పరుతో మనం మాట్లాడటం వేరు. మనల్ని వ్యతిరేకించే వారిని కూడా ఆలోచింప చేయగలగటం ఎన్నికలోనే సాధ్యం. నేను గెలిచిన , గెలవకపోయిన పార్టీకి, ప్రజలకూ దగ్గరగానే ఉంటాను. అందులో తేడా లేపుడు మనకెందుకు బాధ’’ అంటూ మళ్ళీ సభ్యులలో ఉత్సాహం  నింపింది.

కానీ పార్టీ ముఖ్యులు  చేసిన సమీక్షలో శారద ఓడిపోయినందుకు కారణం మహిళా సంఘం సభ్యులు , శారద చూపిన అత్యుత్సాహం, తెగువ, తెంపరితనం అని చెబుతుంటే నిర్ఘాంత  పోయింది.

‘‘నువ్వు కాంగ్రెస్‌ సభలో వాళ్ళ వేదిక మీదికి ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చింది?’’

‘‘వాళ్ళు అసు విషయాలు  కాకుండా అవాకులు  చెవాకులు చెపుతుంటే విని ఆనందించాలా?’’ శారద తీవ్రంగా అడిగింది.

‘‘వాళ్ళ మీటింగులో వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. మనం వెళ్ళి జోక్యం చేసుకోవటం వల్ల  శారద తెగించిన మనిషని, అహంభావి అని ఇంకా ఇక్కడ నేను చెప్పలేని నానా  మాటలూ  మాట్లాడుకున్నారు. ఆ అవకాశం వాళ్ళకెందుకివ్వాలి?’’

‘‘కానీ ఆ తర్వాత  నా  వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం మానేశారు’’

‘‘నీ పెళ్లి గురించి మానేశారేమో – కానీ టోటల్‌గా నీ క్యారెక్టరు గురించి చాలా చెడ్డ ప్రచారం చేశారు. పైగా మహిళా సంఘం వాళ్ళు రౌడీలను కర్రతో కొట్టారు. ఆ రాపూట ఇళ్ళ మీద రాళ్ళేస్తే  బైటికి రాకుండా ఉంటే సరిపోయేది. వచ్చి వాళ్ళను కొట్టటంతో కమ్యూనిస్టు ఆడాళ్ళకీ, రౌడీలకూ తేడా లేకుండా పోయింది.’’

‘‘ఆత్మ రక్షణకు, రౌడీయిజానికీ తేడా తెలియకపోతే తెలియజెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది గానీ, ఆత్మ రక్షణ చేసుకోకపోతే ఎట్లా?’’

‘‘కమ్యూనిస్టు ఆడవాళ్ళని మగరాయుళ్ళుగా మారుస్తున్నారనే పేరు వచ్చింది. అది మంచిది కాదు.’’

‘‘మగ రాయుళ్ళేమిటి? వాళ్ళ గొప్పేమిటి? ఆడవాళ్లు తమ మీదికి ఎవరైన వస్తే  ఆత్మరక్షణ చేసుకోగలరని నమ్మి, వాళ్ళకలాంటి శిక్షణ ఇచ్చాం  మనం. అది తప్పెలా అవుతుంది?’’

‘‘ఎన్నికల  సమయంలో తప్పే  అవుతుంది. మామూలు  ప్రజలు  ఆడవాళ్లు వినయంగా, ఓర్పుగా ఉండాలనుకుంటారు. ఆ నమూనాను మనం ఇవ్వలేదు కమ్యూనిస్టు ఆడవాళ్ళు ` ’’

‘‘ఫాసిస్టు వ్యతిరేక దళాలుగా స్త్రీలు  కూడా బెజవాడ వీధుల్లో కవాతు చేశారు. పార్టీ మెచ్చుకుంది. రేపు అవసరమైతే తుపాకులు  కూడా పట్టుకుంటారు.’’

‘‘ప్రత్యేక సమయాలు  వేరు. ఎన్నికలు  వేరు.’’

‘‘మనం ఏమిటో, ఎలా ఉంటామో ప్రజలకు ఎప్పుడైన ఒకటే మెసేజ్‌ వెళ్ళాలి. ఎన్నికలప్పుడొకటి, ఇంట్లో ఒకటి, బైట ఒకటి ఇదేంటి?’’

‘‘ఇంట్లో భర్త కొడితే కమ్యూనిస్టు భార్య తిరిగి కొడుతుందా?’’

‘‘వై నాట్‌. ఎందుకు కొట్టకూడదు ? కాదు – ఆ ప్రశ్నే తప్పు. భర్త కొడితే తిరిగి కొట్టాలి. అప్పుడే అతను భార్యను కొట్టటానికి భయపడతాడు. మీరేమంటారు? భర్త కొడుతుంటే పడాలా?’’

‘‘మరి ఇద్దరూ కొట్టుకుంటే ఆ సంసారం ఎలా సాగుతుంది?’’

‘‘ఆ సంసారం సాగకపోతే ఏం? లోకానికి ఏం జరుగుతుంది. ఆ సంసారం సాగితే ` ’’

‘‘శారదా – నువ్వు మాట్లాడే మాటలు  మహిళా సంఘంలో మటుకు మాట్లాడకు. వాళ్ళు భయపడతారు. భర్తలు  ఒక మాటంటారు. ఒక దెబ్బ వేస్తారు. కాస్త సర్దుకు పోవాలి’’.

శారదకు ఈ చర్చ అవసరమనిపించింది. కమ్యూనిస్టుల్ని బోలెడు మార్చాలి . ఆమెకు జర్మన్‌ ఐడియాలజీలో మార్క్స్‌ రాసిన వాక్యాలు  గుర్తొచ్చాయి. మగవాడు ఆడదానితో ఎలా వ్యవహరిస్తున్నాడో అనేదానిని బట్టే అతను మనిషిగా ఏ స్థాయిలో ఉన్నాడో తెలుస్తుందని చాలా లోతైన తాత్విక విషయంగా చెప్పాడు.

శారద అది చాలా వివరంగా చెప్పింది. అందరూ నిశ్శబ్దంగా విన్నారు. ఇరవై నిమిషాలు  శారద ఉత్సాహంగా మాట్లాడి  ఆపేసిన తర్వాత  ‘‘ఆ ` ఎజెండాలో తత్వాటి  విషయం ఏంటి? చూడండి  ’’ అన్నాడు ఆనందరావు.

అందరూ ఆ సంగతి మాట్లాడుతున్నారు. శారద ముఖం అవమానంతో ఎర్రబడింది.

తర్వాతితి సమావేశంలో శారద నోరు తెరవలేదు. తను ఇట్లా మార్క్సిస్టు సిద్ధాంతాలను  స్థానిక సమస్యలకు అన్వయించి, మార్క్స్‌, ఏంగెల్స్‌ రచనలను  ఉదాహరిస్తూ మాట్లాడినప్పుడల్లా ఇలాంటి మౌనమే ఎదురయిందనే విషయం ఆరోజు అర్థమైంది.

తనను క్రమంగా ఆరోగ్య విషయాలకే పరిమితం చేస్తున్నారనీ, మహిళా సంఘానికే పరిమితమవుతున్నాననీ కూడా అనిపించింది.

మహిళా సంఘానికే పరిమితం అవటంలో చిన్నతనమేమీ లేదు. కానీ అక్కడ కూడా తను చేసే  పొరపాట్లుగా ఆడవాళ్ళకు ఓర్పు, వినయం నేర్పలేకపోవటాన్ని చూపిస్తున్నారు.

తనను ఒక మేధావిగా, కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల లో  ఒకదానిగా గుర్తించటానికి నిరాకరిస్తున్నారు.

‘‘ఛ –  తను మరీ ఎక్కువ ఆలోచిస్తోంది’’  అనుకుని అప్పటికి ఆ ఆలోచనలను  పక్కకునెట్టి సమావేశంలో ఇతర అంశాల  మీద మాట్లాడుతున్న వారి మాటలు  శ్రద్ధగా వినసాగింది.

***

దేశానికి స్వతంత్రం రాబోతోందనే వాతావరణం వస్తుండగా కమ్యూనిస్టు మీద నిర్భంధం ఎక్కువైంది. బ్రిటీష్‌ వాళ్ళ ప్రయోజనాలు  తీరిపోగానే వాళ్ళకు కమ్యూనిస్టులే అసలు  శత్రువులని, వారు తమ వారసులు గా ఎవరికి అధికారం అప్పగించి పోవాలనుకున్నారో వాళ్ళకు కూడా కమ్యూనిస్టులే శత్రువులనీ అర్థమైంది. నిర్బంధం పెరగటంతో మళ్ళీ పార్టీ యంత్రాంగమంత చెల్లాచెదరైంది. రహస్యంగా పత్రికలు  నడపటం, నాయకుల  అజ్ఞాతవాసం, ప్రజా సంఘాల  పని పెరగటం ఎన్నో ప్రతికూలతల  మధ్య పని చేయాల్సి వచ్చింది. తెలంగాణలో నిజాం వ్యతిరేక పోరాటంలో కమ్యూనిస్టులు  పేద ప్రజలకు అండగా నిలిచారు. సంగాలుగా  ప్రజల్లో కలిశారు. సంగపోళ్ళంటే పేద రైతు కూలీలు , చిన్న కులాల   వాళ్ళూ ప్రాణాలిచ్చే స్థితికి వచ్చారు. శారదాంబ తెలంగాణా నాయకులకు ఆశ్రయం కల్పించటం వంటి పనులు  అదనంగా మీద వేసుకుంది. రజాకార్ల ఆగడాలకు తట్టుకోలేని వాళ్ళు తాత్కాలికంగా  బెజవాడ వైపు వచ్చి కొన్ని రోజులు  శక్తి పుంజుకున్నారు. వారికి వైద్యం అవసరమైతే శారద ఉండనే ఉంది.

దేశానికి స్వతంత్రం – అర్థ శతాబ్దం దాటిపోయిన స్వతంత్ర సంగ్రామంలో విజయం. భారతదేశం ఒకవైపు విజయోత్సవాలలో మరోవైపు దేశ విభజన సృష్టించిన విలయాలలో  మునిగింది. ఉత్తర భారతదేశంలో హిందూ ముస్లిం మధ్య పగలు  ప్రతీకారాలు  పెరిగిపోయి చరిత్రలోనే అతిపెద్ద విధ్వంసకాండ ఆరంభమైంది. దక్షిణ భారతదేశంలో అది లేదు గానీ హైదరాబాద్‌ నిజాం గురించిన ఆలోచనలు , చర్చలు  మొదలైంది. స్వతంత్ర భారతదేశంలో చేరకుండా తన స్వయం ప్రతిపత్తి నిలబెట్టుకుంటానన్న నిజాం నవాబుపై తెంగాణాలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టు ఆర్యసమాజం వంటి అన్ని పార్టీలలో సాంఘిక గ్రూపుల్లో వ్యతిరేకత ఎక్కువయింది. కాంగ్రెస్‌ కంటే కమ్యూనిస్టు ప్రాబల్యం  పెరగసాగింది. ఆంధ్రప్రాంతంలో కమ్యూనిస్టు జమిందారీ వ్యతిరేక పోరాటాలు ముమ్మరం చేయాలనుకున్నారు. దానితో జమీందార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీని ఆశ్రయించారు. కాంగ్రెస్‌లో అంతకు ముందున్న పెద్ద భూస్వాముల  సంఖ్య, వారి ప్రాబల్యం  కూడా తక్కువ కాదు. దానితో గ్రామాల్లో వర్గ పోరాటం మొదలైందా అన్నంతగా తీవ్ర వైరుధ్యాలు  కనిపిస్తున్నాయి.

మారిన ఈ పరిస్థితులలో శారదకు ఒక్క క్షణం తీరిక దొరకటం లేదు. కూతురికి కూడా ఒక్క గంట సమయం ఇవ్వలేకపోతోంది. అమ్మమ్మ పెంపకంలో నటాషాకు వచ్చిన లోటేమీ లేదు గానీ తల్లి కోసం పసి మనసు లోపల  ఎక్కడో ఒక ఆరాటం, ఆ ఆరాటం సంతృప్తి  చెందక పోవటంతో చిన్న కోపం చోటు చేసుకుంటున్నాయి. మూర్తి దాదాపు ఇంటి పట్టున ఉండటం లేదు. శారద ఆస్పత్రిని ఒదలలేదు గాబట్టి ప్రయాణాలు  తగ్గి స్థానిక బాధ్యతలు  పెరిగాయి. కృష్ణా గుంటూరు జిల్లాల  గ్రామాల లో చిన్న రైతులకు భూస్వాములకు, చల్లపల్లి జమీందారు వంటి జమీందార్లకు మధ్య పోరు పెరగటంతో కమ్యూనిస్టులు  తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నారు. వారి ప్రాణాలు  ప్రమాదంలో పడుతున్నాయి. కొందరు ప్రాణాలు  కోల్పోయారు.

*