Archives for January 2016

సాయింత్రం సూరీడు

 

mandira

Art: Mandira Bhaduri

 

మొయిద శ్రీనివాసరావు

~

Moida

నేనో చిత్రకారుడిని

గీసిన నా గత చిత్రాలను చూసి చూసి

మనసున కాసింత ఉక్కబోసి

సరికొత్త సజీవ చిత్రంతో

తిరిగి ఊపిరి పీల్చుకోవాలని

కుంచే… కాన్వాసుతో

తుమ్మచెట్టు నీడలా వున్న

ఓ ఊరి చివర కూర్చున్నాను

సాయింత్రం సూరీడు… చెరువులో

ముఖం కడుక్కుంటున్న సమయం

పగలంతా కాసిన ఎండను

కుప్పపోసినట్టుగా వున్న గడ్డివాములు

మునపటి వరిచేల యవ్వనాన్ని

పచ్చగా పొదువుకున్న మొక్కజొన్న చేలు

ఎన్ని తుపాను పాములకు

ఎదురొడ్డి నిలిచాయో గాని

వలసపోయిన పక్షులకు

గుర్తుగా మిగిలిన గిజిగాడి గూళ్ళు

పొద్దంతా పొలంలో తిరిగిన పని తూనీగను

సాయింత్రానికి అవసరాల తొండ మింగేసింది

మిగిలిన కాసింత వెలుగు ముక్కలాంటి

గొర్రెల వీపుపై

బతుకును కోల్పోయిన కత్తెర పిట్టొకటి

ముక్కల ముక్కలగా

రాత్రి పాటను పాడుతుంది

చుట్టూ మంచుతెర కమ్ముకొస్తూ

ఓ అసంపూర్ణ జీవన చిత్రం

నా చేతిలో మిగిలినప్పుడు

‘ఏటి సూస్తున్నావు నాయినా…’ అంటూ

రేపటి మొలకకై

రోజంతా మట్టిబెడ్డల్లో పడి ఇంకుతున్న

చెమట చుక్కలాంటి ఒకామె నన్నడిగింది

మరుక్షణమే నా మదిలో

ఓ సంపూర్ణ సజీవ చిత్రం నిలిచింది.

* * *

మరణాన్ని మరణానికివ్వండి..  

Art: Rafi Haque

Art: Rafi Haque

   శ్రీరామోజు హరగోపాల్

~

haragopal

ఒక కవి ఈ రోడ్డున్నే

మరణిస్తున్నాడు

ఎట్లా బడితే అట్లా చస్తానన్న

కవిని ఏం చేసుకుంటాం

అతనికి కుంతలజలపాతంలో కూడా

ఐస్ నెత్తుటినీరే

అతనికి ప్రియురాలిపిలుపు కూడా

చైనాహైడ్రోజన్ బాంబులాగే

మరణాన్ని కలవరించి వరించే మహాకవికి

మహాప్రస్థానం కానుక

అన్నింట్లో అగ్నిని చూసే రుగ్వేదపురోహితునికి

అగ్ని మీళే పురోహితమ్

మానవులంతా శవాలుగా కనిపించే

అజ్ఞాతకవికి శ్మశాన వైరాగ్యమే  గిఫ్ట్

ప్రేమలు దోమలు,ఇష్టాలు కనిష్టాలు

ఆత్మీయతలు బ్రోకరిజాలు తనకు

చావునే చావనీయకుండ చంపుతున్న మహాకవీ,శవీ,రోగీ

మా చావు మేం చస్తాం, నీకెందుకు కుతర్క కుతూహలం

పొద్దున్నే పొద్దుని చూడలేని ధృతరాష్ట్రుని కోసం

ఏ గాంధారీ గంతలు కట్టుకోదు

కొంచెం మనిషిని చూడు

వాడిలో ఔన్నత్యం చూడు

అల్పత్వాలు జయించడానికి అతని ఆరాటం చూడు

మూర్ఖత్వం వొదులుకోవడానికి అతని జ్ఞానతృష్ణ చూడు

మానవత్వం పెంచడానికి మనుషుల్ని కాదు చంపేది

మనుషుల్ని మనుషులుగా బతికించే పరుసవేది కవిత్వం

నిర్లజ్జగా వీధుల్లో వీరంగం వేసేది కాదు

దిగంబరంగా సత్యాల్ని ఆవిష్కరించేది

స్ట్రిప్ టీజ్ సినిమాలకు పనికొస్తది

అర్థంపర్థంలేని డైలాగులక్కడే అమ్ముకోవచ్చు

మనుషుల్ని భయోద్విగ్నుల్ని చేయడం కాదు

అసహ్యాలు కల్పించి ట్రేడ్ మార్క్ కొట్టేయడమా

మరణాన్ని మరణానికివ్వండి

ప్రళయాలను ప్రళయాలకివ్వండి

మాటల్ని కాల్చినసీకుల్ని చెయ్యడం కాదు

ఇంకా మంచిచూపుల్ని కళ్ళకు పంచాలి

కవిత్వానికి కొంచెం గౌరవం పెంచాలి

మరణమే నీ వరణమైతే, ఆమెన్

*

అభివృద్ధి కుట్రపై అరుణాక్షర యుద్ధం!

 

 

-నిశీధి
~

కెహనా సఖు కిత్నా ప్యార్
సెహ నా సఖు ఇత్నా ప్యార్

అతనికింత ప్రేమెందుకు పుట్టిందో విస్మయం , మనలో ఏ లోపం ఆ సహజమయిన ప్రేమకి మనల్నింత దూరం చేసిందని విషాదం. ఎంత దుఃఖం ఎంతకని దుఃఖం , కన్నీళ్ళలో హోలీ డిప్స్ , ఎన్ని లక్షల టీఎంసీల విషాదంలో మునిగినా దొరకని పాప విముక్తి.

అది కవిత్వమా కాదు ప్రభో! మనసు కన్నీరయి కలంలో కరిగి , ముందు కాలం అంతా Development ది అని మనం స్వయంగా మన చేతులతో చేస్తున్న హత్యలపై నిరసన గళం . వెర్రి కేక, మైదానం కొరకు , వలన కాలరాయబడ్డ కఠిన నిజాల నినాదం.

అన్ అవేర్ ఆఫ్ ఆల్ దీజ్ థింగ్స్ అనబడు మన మర్డర్ సంతకాలలో నెమ్మదిగా ఆరిపోతున్న చిరునవ్వులు అవేర్ ఆఫ్ ఆల్ దీజ్ థింగ్స్ స్వయంగా మనకోసం మన జీవితాల్ని వెలిగించుకొంటున్నామనే వృద్ధి మంత్రంతో బ్రతుకంటే రేలా లయలని బ్రతకడమంటే శబరి నీడలో అమాయకంగా నవ్వడమే అని మాత్రమే తెలిసిన జీవితాల్ని ముంచి చంపేసే మనలోని కోల్డ్ బ్లడెడ్ మర్డరర్స్ ని మనసు కోర్టులో వేసే క్షణకాలపు ఉరిశిక్ష . నిజమే ఏడ్చుకోవడానికి మనకి తొక్కలో . కవిత్వం అన్నా ఉంది . వాళ్ళకేమి మిగిల్చాం ? అరుణ్ ప్రశ్నించడు, చాలా సింపుల్గా మనం కట్టుకుంటున్న కొత్త ఆశల ప్రాజెక్ట్ హైయెస్ట్ పాయింట్ నుండి వెల్లువవుతున్న రక్తపు మడుగుల తరంగాలపై ఉల్టా వ్రేళ్ళాడదీస్తాడు . వాక్యాల దిగ్బంధనంలో నిలేసి కలేసి నువ్వు మురుస్తున్న అభివృద్ధి నమూనాలో ఏదో ఒక రోజు నువ్వు నాశనం అవుతావురోయ్ అంటూ గోదాట్లో కలవమని శపిస్తాడు . Yes, dear we all deserve that ultimate curse.

ప్రియతమా

ఒక వాక్యం దాటి ఒకవాక్యంలోకి సాగే ప్రతి ప్రయాణంలో కరిగిపోతున్న ప్రతి క్షణం శబరి ఇసుకల్లో గుండెని అమాంతంగా తవ్వి పాతరేసినట్లు మేటలేసుకున్న దుఃఖంతో తడిపేసాక , ఎవరన్నా రిమూవ్డ్ ఫ్రం రికార్డ్స్ కాగితం చెమ్మలవ్వకుండా గుండెలో గాంభీర్యపు నిశబ్దాలు పెళ్ళుమన్న శబ్దంలో విరిగాక కనీసం ఈ ట్రిబ్యూట్ చదవడమయినా ముగించగలిగితే నిజంగా వాళ్ళు ఐరన్ మ్యానే అని చెప్పుకోవాలి ఖచ్చితంగా.

మనకి తెలియకుండానే లక్షల్లో మనుష్యులని , కొన్నయిన భాషల్ని కొన్ని కోట్ల గుండె చప్పుళ్ళని జలజీవసమాధి చేసిన రక్తసిక్తపు మరణవాంగ్మూలం ఈ మ్యూజిక్ డైస్ .. కొట్టుకొచ్చిన శవాలని సాముహిక దహనం చేసిన బూడిదల్లో కోరి తెచ్చుకున్న నాశనానికి రాసుకున్న ముందస్తు విలాపవాక్యం.

ఈ గిల్టీ కన్ఫెషన్స్ లోకి మనల్ని అమాంతంగా తీసుకెళ్ళి , అక్కడ తప్పిపోయిన చంటిపిల్లలవడానికి బయటికి రాలేని బేలతనంలో బోరుబోరున ఏడ్చుకోవడానికి అరుణ్ వాక్యం కాకుండా వాడిన మరో అస్త్రం ప్రతి పేజ్లో అమాయకంగా ప్రశ్నల కళ్ళేసుకొని చూసే ఇమేజెస్ . పచ్చపూలతో చిరునవ్వులు చిందించే కోయ అడుగులు , దుఃఖంతో పూడుకుపోతున్న ముసురు గోదావరి , కూనవరం గిరిజన బాల్యంలో దిగులు , గొడుగుల కింద దాగి తొంగి చూస్తున్న విప్పసార , మూలబడ్డ భాస్కర్ టాకీస్ , నాచు గోడలు , గిరిజన బడులలో దడుల మధ్య దూరి ఆడుకుంటున్న పసితనాలు, భవిష్యత్తు అయోమయంలో నడిరోడ్డున పడ్డ యవ్వనాలు . ఎన్నని చెప్పడం ? ఒకో ఇమేజ్ అలా వాక్యాల్లో వొదిగి కవిత్వంగా మారిందా లేక కవిత్వాన్ని అల్లుకున్న ఆర్తి ఒక ఇమేజ్గా మారి మనల్ని కాలుస్తుందా చెప్పడం నిజానికి చాలా కష్టం.

అలాగే ఎన్ని కంటి చెమ్మలు ఒక పాటగా మారిందో చెప్పడమూ కష్టమే . అనుకుంటా ఇలా ..

ఇళ్ళు: ఇన్నిన్ని ముఖాలేసుకున్న ఇళ్ళు
ఆశలు కూలిన ఇళ్ళు
వంటరైపోయిన ఇళ్ళు
ఇళ్ళ కళ్ళ నిండా నీళ్ళు
భయం భయంగా
తమలోకి తాము
ముడుచుకుపోతున్న ఇళ్ళు

అన్న పదాల వెనక ఉన్న ఊళ్ళు ఇళ్ళు వదులుకొని మొదలు నరికిన పచ్చటి చెట్లని వదిలి ఎగరలేక కుప్పకూలిన రెక్కలపే దిగులు పడతామా

మైదానం కమ్మిన ఇనుప తివాచీ
ఆపాద సంస్కృతి అనగా సాంఘిక ఆటవికత
బ్రతుకు పృథక్కరణ చెందింది
ఒకనాటి రేల పాట పరీవాహకప్రాంతమీది
ఈ ఎడారిలో వనం కోసం అంజనం వేయాలి

అంటూ నిజాల్ని చిన్న పదాల్లో పెద్ద కోతల్లో ముందుకు తెచ్చినప్పుడు ముఖంలో అరచేతులు దాచుకోని సిగ్గుపడాలా ?

పాటలని చంపేసి , ప్రకృతిని చంపేసి , నిలబడడానికి నీడలేకుండా చేసుకుంటూ విస్తరిస్తున్న మైదానపు మోడరన్ మ్యాన్ ఎడారితనంపై పసితనాన్ని పచ్చదనాన్ని వదులుకోలేని అడవిబిడ్డల తరపున దుఃఖపు సూరీడు చిందించిన గోదారి రక్తం గురించి ఎంత చెప్తే సరిపోతుంది అని అసలు ఎంత హృదయానికి అద్దుకున్నా మనం అడ్డుకోలేని నయాకాలపు జల సమాధి లో మునిగిపోతున్న కుంట నాగరికత ముగిసిపోతున్న గదబ సవర లాంటి జాతులు . నిజమే ఇహ వాళ్ళంతా రామాపితికస్ గురించి చదువుకున్నట్లు అంత్రోపాలజీ పాఠాల్లో మాత్రమే మిగులుతారేమో అరుణ్ ప్రిడిక్ట్ చేసినట్లు . లేదా లుప్తమవుతున్న జీవజాతులనీ సంరక్షించుకున్నట్లు ల్యాబుల్లోనో లేక తర్వాత తరాల ఎజ్జిమిషన్టో రీల్లోనో మిగులుతారేమో

కవిత ఆచరణకి సాటిరాదు అయితే గియితే ఒక సహానుభూతి ఒక మద్దత్తు ప్రకటన ఒక నినాదరచన నీ జనం నేల కోసం పోరాడుతున్నచోట కనీసం గొంతయినా కలపకపోవడం నేరం అని డిక్లేర్ చేసిన అరుణ్ వాయిస్కి ఇదంతా ఒక పిచ్చుక తోడు మాత్రమే ఆకరున మాత్రం ఈ మాట చెప్పకుండా ముగించలేను . మీరు నడిచొచ్చిన మట్టికే కాదు అరుణ్ , ప్రపంచానికి ముఖ్యంగా కవిత్వానికి ఒక అద్భుతమయిన మెలాంకలీ అందించారు . చచ్చిపోయిన పాటకి మీదయిన గొంతునిచ్చారు . Kudos, Arun Sagar!  you nailed all those culprit souls with your heart reckoning poetry.

పోడుకోసం గూడుకోసం తునికాకురేటు కోసం అడవిహక్కుల కోసం జెండాలై ఎగిరిన ప్రతిప్రాణానికి మీ సెల్యూట్ పాటు మీ ఆర్తిగీతానికి మాదో సెల్యూట్ .

*

ఏడుపు మంచిదే!

చిత్రం: సృజన్ రాజ్

చిత్రం: సృజన్ రాజ్

    -మెరిమి దినేష్ కుమార్

~

varamనవ్వితే 62 కెలోరీలు కష్టపడకుండా కరుగుతాయని నవ్వుకి విలువిచ్చారు అదీ ఘోరంగా గట్టిగా నవ్వితేనే,మామూలుగా ముసి ముసి నవ్వులు నవ్వితే 12 కూడా కరగవనే నిజాన్ని ఎవ్వరూ చెప్పడానికి సాహసించలేదు అదే మామూలుగా ఏడిస్తే 50 కెలోరీలు కరుగుతాయ్.  సొ ఏడుపు మంచిదే!

సినిమా తీద్దామని ఇంట్లో చెప్పకుండా జాబ్ వదిలేసి హైదరబాద్ కి వచ్చి కరెక్ట్ గా 9 నెలలవుతోంది,మొదటి నెలలో అమ్మని బాగా ఏడిపించాను, రెండో నెల నుండి ఎక్కువ సార్లు ఫోన్లు చేస్తూ కొద్దిగా ఏడుపుని తగ్గించాను అలా ఏడుపుని నవ్వు దాకా తీస్కురావడానికి 5 నెలలు పట్టింది. కానీ నేను మాత్రం ఇంకా సినిమా తీయలేదు,

‘ఇంకా ఎన్ని రోజులు పడుతుంది రా’ అని అమ్మ అడుగుతుంటే-

‘తొందర్లో అవుతుంది మా’ అని నిజమైన అబద్దం చెప్పేవాడిని. నన్ను చూడాలని తెగ ఆరాటం నేనంటే అంత పిచ్చి ప్రేమ మా రమాదేవికి

“కల కనడానికి నిద్రపోతే చాలు, నిద్ర పోడానికి బస్సో రైలో ఎక్కితే చాలు కానీ కలని నిజం చేస్కోవాలంటే నిద్ర పోకుండా కష్టపాడాల్సిందే అదే సినిమా అయితే దారి తెలియకుండా గుడ్డిగా నడవాల్సిందే” అనే గొప్ప తత్వాన్ని మాయమ్మకు ఎలా చెప్పేది. నాలోనే ఓ పెద్ద రాక్షసుడున్నాడు చిన్నప్పటి నుండి ఆమె అనుకున్నట్టు పెరగలేదు ఇంటర్లో సమాజం లోని అన్యాయం,కుల ధూషణ,అసమానత్వం లాంటి గొప్ప లక్షణాలను భరించలేక, ముఖ్యంగా మా శ్రీశ్రీ నల్ల కాకిగా ఉన్న నన్ను తెల్ల కాకిగా మార్చి ఆపై మనుషుల మనస్థత్వాలను చూసి ఎర్ర కాకిగా మారిపోయాను.అభ్యుదయ ఆవేశంతో ఉద్యమంలోకి వెళ్లిపోవాలని అర్థరాత్రి ఇంట్లో నుండి వెళ్లిపోయాను,

చిన్నప్పటి నుండి అల్లరితో ఏడిపిస్తూనే అప్పుడు ఆవేశంతో ఏడ్పించాను.

అర్థరాత్రిలో తిరుపతి వీధులు అంత భయంకరంగా ఉంటాయని అప్పటి దాకా తెలీదు,చీకట్లో చంద్రుడున్నట్టు దొంగలు పోలీసులు అన్నదమ్ములని ఆ రోజే తెల్సింది.అలా ఓ రోడ్డు పక్కన పనుకొనుంటే ఆవు దూడను ఎలా పట్టుకుంటుందో అలా మాయమ్మ నన్ను పట్టేసుకుంది ఏడిస్తే నేను మాట విననని, ఏడుపుని ఆపుకుని

‘రారా ఇంటికి’ అంది

తడబడుతూ వచ్చే మాటలే గద్గద స్వరం అని పరిచయమైన రాత్రి. మా నాన్నేమో తాగేసి నన్ను పట్టుకుని ఏడుస్తున్నాడు అది నిజమైన ప్రేమైనా నేను నమ్మకుండా చేస్తోంది ఆయన చర్య. ఇంజనీరింగ్ లో చదువు బాగా లేదని మానేస్తానని ఫోన్లో చెప్పినపుడు అదే ఏడుపు నన్ను ఆపేసింది ఆరోజే మాటిచ్చాను ఎన్ని బాధలైన ఇబ్బందులైనా పడతానుగాని ఇంజనీరింగ్ మాత్రం పూర్తి చేసే వస్తానని. ఒక్క ఏడుపు నన్ను ఎంత ప్రభావితం చేసిందో,కన్నీళ్లు ఎప్పుడూ నన్ను మార్చలేదు ఏడుపే మారుస్తోంది ప్రపంచపు భాదను పట్టించుకున్నపుడైనా నాలోని రాక్షసుడి ఏడుపుని విన్నా మారిపోతాను ఏడుపుతోనే మారుతూ ఉన్నాను.

జీవితంలో ఏడుపే ప్రారంభం ఏడుపే ముగింపు కదా.

ఒక పరమహంస ఏడిస్తే కాళికమ్మే కదిలింది మా అమ్మ ఏడిస్తే నేను కదలనా ఆగనా. ఇంతలో రైలు రేణిగుంట లో ఆగింది టైం 3:30 ఇపుడు కాళాస్తి కి బస్సులుంటాయా అని ఒకటే డౌటు ఎందుకంటే నేనెపుడు ఇంత పొద్దున వెళ్లలేదు,సర్లే అని రోడ్లో నడుచుకుంటూ చూస్తున్నాను కొందరు నాలాగే బస్సు కోసం ఉన్నారు అరె ప్రపంచం నాలాగే ఉందే అనుకుని చూస్తున్నా,ఏదో బెంగుళూరి బండి కాళాస్తికి పోతోంది. కాళహస్తికి బెంగుళూరి నుండి బస్సుందా అని ఆశ్చర్యపడ్డాను ఇదే కదా మొదటిసారి.

ఏడుపు వల్లే మనిషి ఇంకో మనిషిని చూడగలడు మనిషిలా బ్రతకగలడు.

‘బహుశా త్యాగయ్య, అన్నమయ్య, రామయ్యలు దేవుడి కోసం ఏడ్చారు ఆ ఎడుపులే ప్రపంచానికి గొప్ప కృతులు కీర్తనలు జీవితాలయ్యాయి ఈ నిజం తెల్సుకోడమే జీవితం కాబోలు’

ఎందుకంటే నవ్వుతూ పలకరించమని చెప్తారు నవ్వుతూ ఫోటోలు దిగమని చెప్తారు నవ్వుతూ బ్రతకాలిరా అని పాటలు కూడా పాడి ఏడ్చేవాళ్లు లోకువ అని మనుషులు ఆలోచించని బావిలోకి తోసేస్తున్నారు అందుకే సమాజం లో ఇన్ని అసమానతలున్నాయని నాకనిపిస్తుంది.

అలా నవ్వి నవ్వి ఇంజనీరింగు అయిపోయింది మా నాన్న తరుపున ఓ ఉద్యోగం ఇప్పించాడు అదీ సినిమా స్టైల్లో నాకే తెలియకుండా నన్ను కారు ఎక్కించి 4 గంటలే అని చెప్పి చేతిలో ఓ 10 వేలు పెట్టి సరే ఉంటా జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోయాడు. నిద్రలో 12 గంటలైనా 1 గంటలాగే తెలుస్తుంది ఈ నిజం తెల్సుంటే డబ్బు పిచ్చోళ్ళు గంట గంట కు అలారం పెట్టుకుంటారేమో.అలా 4 గంటల నిద్రలో ఆంధ్రా దాటి ఎక్కడో తమిళనాడు చివర బెంగుళూరికి 30కి.మీ ల దగ్గరున్న హోసూర్ లో దిగుతానని కలలో కూడా అనుకోలేదు. ఆ ఉద్యోగం ఆ ప్రపంచం నావల్ల అస్సలు కాలేదు.

అప్పుడే అర్థమైంది మనిషికి ఎక్కడా స్వాతంత్ర్యం ఉండదని.

‘కడుపులో ఇరుకిరిగ్గా  ఉందని కష్టపడి బయటకొస్తే గాలి పీల్చుకునే లోపు బల్లో  చేర్పించి ,తర్వాత కాలేజీ, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు….చావు, రొటీన్ సినిమా నే జీవితమని’ ఇక తప్పదని ఎలాగోల నాలోని రాక్షసుడికి స్వాతంత్ర్యం ఇప్పించాలని సినిమాల్లోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యి ఛాలెంజ్ లో చిరు లా కాకపోయిన ఓ మోస్తరులో గొడవేస్కుని ఆటో ఎక్కి హైదరబాదు వెళ్తున్నా అని అంటే అదే ఏడుపు అవే చెమ్మగిల్లిన కళ్ళు ఈ సారి మాత్రం నాలో చలనాన్ని తీస్కురాలేదు గమనాన్నే చూస్తూ కూర్చుండిపోయాను.

ఆ క్షణం నాలో రాక్షసుడు లేడు నేనే రాక్షసుడినని అనిపించింది.

బస్సు కాళహస్తి వచ్చింది మా ఊరికి 4:30కి బస్సులుండవ్ అసలు పల్లెలకి బస్సులే ఉండవ్ ఇక నాకోసం ఇప్పుడు రావు అపుడే నాలో ఓ తాత్వికుడు,రాక్షసుడి మాట వినకుండా మా కన్నప్ప దేవున్ని కళ్ళారా చూడు చాలా రోజులైందని చెప్తే ఎలాగూ ఇపుడు చేసేదేమీ లేదు 6 గంటలకి గాని మా బస్సు రాదు అని గుడికి వెళ్ళాలని వీధిలోకి అడుగేశాను

“సార్ బాత్రూం లు సార్ రూములు సార్” అని నస పెట్టేశారు సర్లే వీళ్ళు ఇంతే అనుకుని పరుగెట్టుకుని వెళ్లకపోయినా అదే మోతాదులో పారిపోయాను గుడి మొదట్లో బిక్షగాళ్ళు లేరు కొద్దిగా ముందుకెళ్ళగానే

లాకర్లు సార్, చెప్పులు ఇక్కడే పెట్టండి సార్ అంటున్నారు పట్టించుకోకుండా వెళ్తుంటే

సార్ దేవస్థానం స్టాండ్ ఇందులో పెట్టండి అనే మాటకు విలువిచ్చి అలా వాడిని చూస్తే వాడూ  వ్యాపార  సూత్రాలను వల్లించాడనే నిజం తెల్సి కోపం వచ్చి పో అన్నాను వాడేమో నన్ను దొంగతనం చేసి పారిపోయే వాడి లాగా తిడుతున్నాడు ఏంటి శివయ్యా ఇదంతా అనుకుని ముందుకు నడిచాను అప్పుడొచ్చింది నిజమైన దేవస్థానం ఉచిత పాద రక్షలు బ్యాగ్ లు ఉంచు స్థలం అది  చూసి వెళ్ళాను చెప్పులు 2రూ అయ్యింది బ్యాగ్ 10రూ అయ్యింది ఫోన్ 5రూ అయింది

10 రూ లాకర్ ఇస్తానని చెప్పిన వాడే మేలనిపించింది

నాకేమో అడుక్కునే వాళ్ళు మోసం చేసే వాళ్ళు దౌర్జన్యంగా లాక్కునే వాళ్ళు నచ్చరు ఇ .ఓ కి కంప్లైంట్ చేద్దామని ఉంది ఊడ్చేవాళ్లే ఇంకా రాలేదు ఇ.ఓ ఎందుకొస్తాడు అనుకుని తిట్టుకుంటూ లోపలికి నడిచాను. నా చిన్నతనం లో కాళహస్తి గుడికి వెళ్ళేవాడిని కాదు అప్పుడు దేవున్ని నమ్మలేదు ఇప్పుడూ నమ్మను కానీ నాకు ఆనందం దొరికితే అడుక్కోడానికైనా వెనకాడను.నేను దేవున్ని నమ్మను నుండి నమ్మాను ఆశ్వాదించాను ఇప్పుడు నమ్మాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయానికి వచ్చేశాను.గుడి తలుపులు మూసున్నారు రాహు కేతు పూజ కోసం జనాలు సినిమా హాలు కాడ వెయిట్ చేసినట్టు గోలగోలగా ఉంది 750రూల టికెట్టు 1000రూల టికెట్టు,1500రూ టికెట్టు అని పూజ చేసేవాళ్ళు నిజంగా పూజలు చేస్తారా? వాళ్ళ వెర్రి ఇంతలా ఉంటే ఏంచేస్తాను ఆ కొంచం ఆలోచించలేరు?,అయినా పాపాలు చేసేసి డబ్బులు హుండీల్లో,పాపాలు పూజల్లో వేసేయొచ్చని కొన్ని యుగాలుగా నిరూపిస్తున్న పెట్టుబడిలేని వ్యాపారం.లక్షల కుంభకోణాలు కోట్ల అక్రమాలు అంటే జనాలు ర్యాలీలు,ధర్నాలు చేస్తారు,దేవుడి దగ్గరికి వెళ్లాలంటే 100ల రూపాయలు, పూజలకి 1000రూ, పాలు పోస్తే 100రూ, ఇంకా ఏవేవో అక్కడ దర్జాగా దొంగతనం చేస్తుంటే పద్దతిగా 4 గంటలకే పంచ కట్టుకునిమరి క్యూ లో నిల్చుని కడతారు.

ఒకానొక దశలో దేవున్ని ప్రశ్నిస్తున్న నాకు దొరకిని సమాధానాలలో దేవాలాయాలు ఎందుకు కట్టారు అంటే తిండి కోసం, వైద్యం కోసం, న్యాయం కోసం అన్నిటి కోసం  ప్రభుత్వం ఏమేం చేస్తుందో అన్నిటి కోసం, ప్రభుత్వానికి గుళ్ళకి తేడా ఒక్కటే జ్ఞానం,

దేవుడు జ్ఞానం కోసమే అని గట్టిగా నమ్ముతాను నేను

అలా ద్వజస్థంబం చూస్తుంటే ఓ ఆవు వచ్చింది వెనకనే ఇద్దరు దాన్ని పట్టుకుని వచ్చారు పూలతో మనకు నచ్చేలా అలంకరించారు బహుశా అది ఆకలికి వచ్చుంటుంది అరటి పండ్లు పెడుతుంటే తింటూనే ఉంది,

అరటి పండు పెట్టాలంటే 5రూ అంట

అదే ఆవుకి గుడి బయట అరటి తొక్క కూడా వేయరు, ఆవుకి ప్రదక్షిణ చేసేవాళ్ళు పోటీలు పడి మరి చేస్తున్నారు.

chinnakatha

ప్రదక్షిణలు వాకింగ్ కి హెల్ప్ అయితే వాళ్ళు బాగానే చేశారు.నేనేమొ ఇవన్నీ చూడలేకపోతున్నా అక్కడ తలుపులేమో ఇంకా తీయలేదు,ఉచిత దర్శనం చేస్కునే వాళ్ళు చివర్లో అంట దేవుడు కూడా ఉదయాన్నే కళ్ళు తెరవంగానే ముందు 200రు,100రు వాళ్ళని  మాత్రమే చూస్తాడు తర్వాతనే మిగిలిన వాళ్ళని చూస్తాడన్నమాట, మన న్యాయస్థానాల్లో దొంగతనం చేస్తే 1000రూ, లంచమిస్తూ దొరికితే 2000రూ ఇచ్చి ఎలా బయట పడతారో అలా అన్నమాట.

‘ఏ జ్ఞానం కోసం గుళ్ళు, దేవుళ్ళు వచ్చారో అవే గుళ్ళు ఇపుడు అజ్ఞానులకు కేంద్రాలయ్యాయి’

టైమ్ 5:30 అయింది ఇక నావల్ల కాక ఎప్పుడు తెరుస్తారు అని అడిగా 6 గంటలకి అని ముందున్నామె అంది. వెంటనే ద్వజస్థంభాన్ని చూశాను, గోపురాన్ని చూశాను గుడి మొత్తం చూశాను ప్రారంభ మేలుకొలుపు నాదస్వరం, డోలు విన్నాను, నీళ్ళు తాగి ఓం:నమశ్శివాయ అనుకుని బస్సు కోసం బయల్దేరాను నందిని చూసి

‘మా అమ్మని చూడ్డం నాకు ఆనందం సారీ ఇంకోసారి అందరూ చూస్తున్న ఆ చీకటి మూలకొచ్చి చూస్తా ఈ సారికి సర్వాంతర్యామిలా దర్శించినందుకు క్షమించు’ అని చెప్పుకుని వడి వడిగా బస్టాండుకి బయల్దేరాను,ఇంకా బస్సు రాలేదు పేపర్ చదువుతోంటే ఎవరో ఒకాయన వచ్చి మిగిలిన పేపర్ టక్కున తీస్కున్నాడు సర్లే టీ అంగడి దగ్గర ఇలాంటివి కామనే అనుకుని చదువుతోంటే ఆయన జాలిగా మొహం పెట్టి టీ తీసివ్వు బాబు పుణ్యముంటుంది అన్నాడు

‘నేను తీసివ్వను నాకు పాపమే కావాలి’

అని టక్కున నాలోని రాక్షసుడు బయటకొచ్చి చెప్పాడు. అడిగుంటే లేదు అని చెప్పేవాడిని తీసివ్వు పుణ్యమోస్తుంది అంటే ఇలానే నాలోని రాక్షసుడు బయటొస్తాడు, బస్సొచ్చింది ఎక్కాను 5నిమి తర్వాత బయల్దేరింది నేను,కండక్టరు డ్రైవరు అంతే ఎవ్వరూ ఎక్కలేదు ఏదో ప్రీమియర్ షో చూసినట్టుంది పోయినేడాద్దాకా మా బస్సుకోసం ఎదురు చూపులు సీట్ల కోసం పోటీలుండేవి ఎప్పుడైతే ఆటోలు ఇంటిదాకా దిగిపెట్టడం మొదలయ్యిందో అప్పుడే బస్సులు బుస్సాయ్యాయి కానీ జనాలు మాత్రం బస్సు రాకపోయినా టైముకి ఉండకపోయినా డైరెక్ట్ గా కలెక్టర్ దగ్గరికెళ్లి దర్నాలు చేస్తారు.

అసలు అమ్మకు తెలియదు నేనోస్తోంది ఊర్లోకి అడుగు పెట్టగానే నవ్వొచ్చేసింది ఎందుకంటే ఇదే స్థలంలో నేను మాయమ్మని ఏడిపిస్తూ వెళ్ళానని గుర్తొచ్చి. ఇంటి గేటు తీసి

“ఏమ్మా ఇలా చూస్తావా అన్నాను”

బట్టలుతుకుతోంది ఆ మాటకి వెనక్కు తిరిగి అలానే సర్రున చిరు నవ్వుతో వచ్చి

“అరె ఎన్ని రోజులయిందిరా వెళ్ళి”

అంటూ వీపుని తడిమింది ఎన్ని కోట్లు సంపాదించినా అలాంటి స్పర్శను,జ్ఞాపకాన్ని పొందలేను

సినిమాలోలా కొడుకు చాలా రోజుల తర్వాత కనిపిస్తే ఏడుస్తుందని అనుకుంటే ఇలా నవ్వి నా సినిమాలో ఓ గొప్ప జ్ఞాపకం అయిపోయింది.

నవ్వు మంచిది కాదనను ఎందుకంటే ఎక్కువసేపు నవ్వినా వచ్చేది ఏడుపే కాబట్టి

ఏడుపు చాలా మంచిది మనసుకి చేరే భాష మనిషిని చేసే భాష .

*

 

 అప్పు తీసివేత-చిన్నారి విన్నీ

gudem

 

గూడెంలో క్లాసులు మొదలుపెట్టిన తొలి రోజులు.

అప్పటికి రోజువారి దాదాపు ఒక ముప్ఫై మంది పిల్లలు క్లాసులకి వస్తున్నారు. ఆ రోజు సాయంత్రం పిల్లలు అప్పుతీసుకునే తీసివేతలు చెప్పమని అడిగేరని బోర్డ్ మీద చెబుతున్నాను.

‘అప్పు తీసుకోవడం అంటే ఏంటి టీచర్ ?’ విన్నీ అడుగుతోంది.

‘అప్పు తీసుకోవడం అంటే నువ్వు పెన్సిలు కొనుక్కుందుకు నీ దగ్గర డబ్బులు లేవనుకో  ప్రక్కింటి వాళ్లనో , తెలిసున్న వాళ్లనో అడిగి తీసుకోవడం , ఆ తర్వాత నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తిరిగి వాళ్ల డబ్బులు వాళ్లకి ఇచ్చేయడం .’

‘ మరి, నాలుగు లోంచి ఐదు తియ్యలేనప్పుడు పక్కనున్న అంకె నుంచి ఒకటి అప్పు తీసుకోమన్నారు కదా. మళ్లీ ఆ ఒకటి అప్పుని ఎలా తీర్చాలి టీచర్?’ విన్నీ ముఖంలో సీరియస్ గా కనిపిస్తున్న ప్రశ్న.ఆ అమ్మాయి ప్రశ్నకి నవ్వొచ్చింది. నిజమే కదూ, అప్పు ఎలా తీర్చాలి?……………………….

‘ టీచరమ్మా!’ అన్న పిలుపుకి తలత్రిప్పేను.

నలుగురు పెద్దవాళ్లు, వాళ్ల వెనుక నలుగురు ఆడపిల్లలు నిలబడి ఉన్నారు. ‘చెప్పండి’

‘ టీచరమ్మా, మా పిల్లలకి ఇంగ్లీషు నేర్పుతావా? పదో క్లాసు పరీక్షకి వెళ్తున్నారు. ‘ వాళ్లని వివరంగా చూసాను. పదో క్లాసు పిల్లలంటే నమ్మబుధ్ధికాలేదు. స్కూల్లో చూసినట్లే అనిపించింది. అవును, కానీ వాళ్ల క్లాసుకి నేను వెళ్లను.

‘ అందరూ రావచ్చు ఇక్కడికి. రోజూ రండమ్మా.’ ఆ మాటలకి కృతజ్ఙతగా చూసి వెనక్కి తిరిగేరు.

పదో క్లాసు పిల్లలు నలుగురు కాస్తా ఏడెనిమిది మంది దాకా రావటం మొదలు పెట్టేరు . చదువుకోవాలనే ఆశ ఉన్న పిల్లలే. మంజూష క్రమం తప్పకుండా వస్తుంది. సన్నగా , బలహీనంగా కనిపిస్తుంది. కాని చదువులో చురుకైనదే . మనసు పెట్టి వింటుంది, చక్కగా అర్థం చేసుకుంటుంది.

ఆరోజు మంజు తనతో మరొక అమ్మాయిని తీసుకొచ్చింది,

‘టీచర్, మా మామయ్య కూతురు విద్య. తనకి చదువుకోవాలని చాలా ఇష్టం. పది దాకా చదివింది. కాని పరీక్షలు రాయలేదు. వాళ్లనాన్న అప్పులుపడి,  డబ్బుకి ఇబ్బందిగా ఉందని ఇక్కడ పచ్చళ్ల కంపెనీలో పనికి కుదిర్చేడు . పరీక్ష తర్వాత రాద్దువులే అన్నాడు . కానీ ఇబ్బందులు తీరక రెండేళ్లు అయినా ఇప్పటికీ పనిలోకి వెళ్తూనే ఉంది.  అయినా అప్పులు, వడ్డీలు పెరుగుతూనే ఉన్నాయంటాడంట వాళ్ల నాన్న .

వాళ్ల అమ్మని అడిగితే ఇప్పుడు వాళ్ల అక్క ప్రసవానికి వచ్చింది కనుక ఇంకొక్క ఆరు నెలలు పనికి వెళ్లమని, చేతిలో పైసలు అస్సలే లేవని  చెప్పిందంట. ఆ తర్వాత మాత్రం విద్య  ప్రైవేటుగా చదువుకుంటుందంట. మీరు చదువు చెబుతారా టీచర్ ?’

పెద్ద పెద్ద కళ్లతో విద్య ఆశగా చూస్తోంది నావైపు. ‘ తప్పకుండా విద్యా. నేను చెబుతాను’ నా మాటలకి ఆ అమ్మాయి కళ్లు తళుక్కుమన్నాయి .

మోటారు సైకిల్ విసురుగా వచ్చి మా దగ్గర ఆగింది.   ‘ఏమే విద్దే, నీకు సదువు పిచ్చి ఇంకా ఇన్నేళ్లైనా  తగ్గలేదే? ముందు మన అప్పులుతీరనీ. నీ బావనిచ్చి పెళ్లిసేసి పంపిస్తా, అప్పుడు సదూకుందువులే , పద’ తండ్రి కళ్లల్లో పడినందుకు ఆ పిల్ల వణికిపోయింది.

‘ టీచరమ్మా, నా కూతురు రెండేళ్లై సంపాయిస్తోంది. ఇప్పుడింక కొత్తగా సదివితే మాత్రం పెద్ద ఉజ్జోగాలు వస్తయ్యా?’ నాకు ఒక ప్రశ్న సంధించి కూతుర్ని తీసుకుని వెళ్లిపోయాడు. అప్పులు చెయ్యడం వరకే ఇంటి పెద్ద బాధ్యత కాబోలు.  వాటిని తీర్చడానికి పిల్లల జీవితాల్నేపణంగా పెడుతున్నారు.

పిల్లల జీవితాలమీద పెద్దవాళ్లకిలాటి హక్కు ఎవరిచ్చారు ? పిల్లలు ‘పనుల్లోకి వెళ్లం’ అని ఎదురు తిరిగితే ఈ అప్పులు ఎలా తీరుస్తారో ‘విన్ని’ అడిగినట్లు.

 

 

అలుపూ అలకలూ లేని అద్దేపల్లి..

 

 

 -బొల్లోజు బాబా

~

 

baba“శయనిస్తున్న అతనెలా ఉన్నాడు? యోధునిలాగా లేక కవిలాగ?     హ్మ్…… కవిత్వ యోధునిలా” — జె.డి. రోబ్

ఓ మాస్టారికి ఒక  కిళ్ళీ కొట్టు వద్ద ఖాతా ఉండేది.   అయిదేళ్ళు గడిచాకా, ఓ మిత్రుడు ఆ కొట్టు యజమానికి ‘ఈయనే ప్రముఖ కవి అద్దేపల్లి రామమోహనరావు” అని పరిచయం చేసాడు.  ఆ కొట్టు యజమాని  ఓ బైండు చేసిన పుస్తకాన్ని తీసి చూపిస్తూ మనస్సు బాగోనప్పుడల్లా ఈ పుస్తకాన్ని చదువుతుంటానని చెప్పాట్ట.  ఆ పుస్తకం పేరు “అంతర్జ్వాల”.  అది  అద్దేపల్లి  రచన.  ఒక కవికి ఇంతకు మించిన పురస్కారం ఏ అకాడమీలు, యూనివర్సిటీలు, ప్రభుత్వాలు ఇవ్వగలవు?

యాభై ఏళ్ల సాహితీప్రస్థానంలో సుమారు 30 పుస్తకాల్ని వెలువరించి, వందకు పైగా ముందుమాటలు వ్రాసి, వివిధ సభల్లో రెండువేలకు పైగా అద్యక్షోపన్యాసాలు ఇచ్చి, ఎన్నో వందల పుస్తకాలను సమీక్షించి, కొన్ని వందల తెలుగు గజల్స్ ను వ్రాసి, గానం చేసి- తెలుగు సాహితీలోకంలో ఒక కవిత్వయోధునిలా జీవించిన  అద్దేపల్లి రామమోహనరావు జీవిత చరమాంకంలో కూడా  ఒక యోధునిలానే నిష్క్రమించారు.

గత మూడునెలలుగా ఆయన అస్వస్థతకు గురయ్యారని కాకినాడ సాహితీమిత్రుల మధ్య గుసగుసలుగానే ఉండింది.  కానీ ఇంత త్వరగా విడిచిపోతారని ఎవరూ అనుకోలేదు.

తన అనారోగ్యం గురించి ఎవరికి తెలియనివ్వలేదు  అద్దేపల్లి.  ఎవరినీ ఎక్కువగా కలిసే వారు కాదు.  గతమూడునెలలుగా ఎవరైనా ఆయనను కలిసినా అస్వస్థత ప్రస్తావన లేకుండానే మాట్లాడేవారు.  ఇవతలి వ్యక్తికి తెలిసినా, ఆయన ధోరణిని బట్టి, తెలియనట్టుగానే మాట్లాడాల్సివచ్చేది.  అలాగని నిర్వేదంలో పడిపోయారా అంటే అదీకాదు,  మరణానికి వారంరోజుల ముందు వరకూ కూడా స్వయంగా ఆటో ఎక్కి రేడియేషన్ చేయించుకొని వచ్చిన వ్యక్తి.  ఒక సాహితీ మిత్రునికి ఫోన్ చేసి, ఈ సంవత్సరం ఎలాగైనా “సాహితీ స్రవంతి” పత్రికను ప్రారంభించాలి అని దిశానిర్ధేశం చేసిన వ్యక్తి  అద్దేపల్లి.  “మీరు రేడియేషన్ చేయించుకొన్నారు కదా జాగ్రత్తగా ఉండాలి” అని కుటుంబసభ్యులొకరు అన్నప్పుడు, “అన్ని సిట్టింగులు అయిపోయాయి,  రేడియేషన్ అన్న మాట ముగిసిపోయిన అధ్యాయం, ఇకదాని గురించి మాట్లాడకండి” అని వారికే తిరిగి ధైర్యం చెప్పిన వ్యక్తిత్వం  అద్దేపల్లిది.  మరణాన్ని కూడా ప్రశాంతంగా స్వీకరించాలంటే గొప్ప   రుషిత్వం ఉండాలి.

కవిగా, విమర్శకునిగా, వక్తగా, వ్యక్తిగా ఆయన పోషించిన వివిధ పాత్రలను తెలుసుకోవటం ద్వారా  అద్దేపల్లి చేసిన సాహిత్యకృషిని అర్ధం చేసుకొనవచ్చును.

అద్దేపల్లి కి ప్రాచీన సాహిత్యంపై  గొప్ప  పట్టు ఉండేది . మొదట్లో చందోబద్దమైన కొన్ని వందల పద్యాల్ని రచించారు.  1960 లో తొలికవిత కృష్ణాపత్రికలో అచ్చయింది.  కాలక్రమేణా తాను విశ్వసించే  హేతువాద దృక్ఫధం, అభ్యుదయత, ప్రగతిశీల భావాలకు వచనకవిత్వమే సరైనదని అనుకొని వచన కవితామార్గాన్ని ఎంచుకొన్నారు.  ప్రపంచీకరణ ప్రభావం వలన చిధ్రమౌతున్న మానవజీవనంపై కవిత్వం వ్రాసిన తొలి తెలుగుకవి  అద్దేపల్లి.  వీరి కవిత్వ సంపుటాలలో అంతర్జ్వాల (1970), రక్త సంధ్య (1978), గోదావరి నా ప్రతిబింబం (1992), పొగచూరిన ఆకాశం, సంఘం శరణం గచ్చామి, మెరుపు పువ్వు, గీటురాయి వంటివి ప్రముఖమైనవి. మినీ కవితల ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి గొప్ప ప్రాచుర్యాన్ని కలిగించారు  అద్దేపల్లి.  తెలుగులో అనేక వందల గజల్ లను రచించి వాటిని గొప్ప రాగయుక్తంగా ఆలపించి అనేక సభలను రంజింపచేసేవారు. వీరి అనేక కవితలు వివిధ భాషలలోకి అనువదింపబడ్డాయి.  కవిగా  అద్దేపల్లి తెలుగు సాహితీలోకంలో ఎప్పటికీ చిరస్మరణీయుడే.

విమర్శకునిగా  అద్దేపల్లి పాత్ర గణనీయమైనది. శ్రీశ్రీ మహాప్రస్థానంపై వీరి మొదటి విమర్శనా గ్రంధం వచ్చి పలువురి ప్రసంశలు పొందింది.  ఈ వార్తవిన్న శ్రీశ్రీ యే స్వయంగా “సరోజినీ, ఈ విషయం విన్నావా, నా పుస్తకం మీద సమీక్షా గ్రంధం వస్తోంది” అని చెప్పటం ఒక మధురమైన ఘట్టం.  కుందుర్తి వచన కవితా వైభవం, స్త్రీవాద కవిత్వం-ఒక పరిశీలన, మహాకవి జాషువా కవితా సమీక్ష, తెలుగు కవిత్వంపై ఆధునికత, అభ్యుదయ విప్లవ కవిత్వాలు- సిద్దాంతాలు, శిల్పరీతులు వంటివి  అద్దేపల్లి వెలువరించిన వివిధ విమర్శనా గ్రంధాలు.  మంచిని విస్తారంగా చర్చించి, చెడును సూచనప్రాయంగా ఎత్తిచూపటం  అద్దేపల్లి విమర్శనా శైలి.

వక్తగా  అద్దేపల్లి సమకాలీన సాహితీవేత్తలెవరూ అందుకోలేనంత ఎత్తులో ఉంటారు.  సభలకు ఎవరైనా పిలిస్తే దూరభారాలకు వెరవకుండా,  తప్పనిసరిగా హాజరయ్యి, ఆ సంస్థలకు, అక్కడి యువకవులకు ఎంతో స్పూర్తిని, ఉత్తేజాన్ని నింపే గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేవారు. రిజర్వేషన్ లేకపోతే 80 ఏళ్ళ వయసులోకూడా జనరల్ భోగీలో ప్రయాణించైనా సరే వస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకొనేవారు  అద్దేపల్లి.  ఈ లక్షణాన్ని గుర్తించిన తెలుగు సాహితీలోకం  అద్దేపల్లికి  “సాహితీ సంచార యోధుడు” అన్న బిరుదును ఇచ్చి సత్కరించింది.  ప్రాచీన, ఆధునిక సాహిత్యాలపై లోతైన అవగాహనతో వీరు చేసే అనర్ఘళమైన ఉపన్యాసాలు, చక్కని ఉటంకింపులతో,  చలోక్తులతో సాగి సభికులను రంజింపచేసేవి.  వీరు గత ముప్పై ఏళ్ళుగా ఇచ్చిన ఉపన్యాసాలు రెండువేలకు పైమాటే.

వ్యక్తిగా అద్దేపల్లి స్నేహశీలి, నిరాడంబరుడు, భోళాశంకరుడు, నిరంతర సాహితీకృషీవలుడు. సమయపాలన విషయంలో  అద్దేపల్లి నిక్కచ్చిగా ఉండేవారు.  వీరు అద్యక్ష్యత వహించిన సభలలో కాలం తూకం వేసినట్టు నడిచేది.   తనకన్నా చిన్నవారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని వారి కవిత్వంలోని గుణగణాలను విప్పిచెప్పి ప్రోత్సహించేవారు. ఎవరైనా   మంచి వాక్యం వ్రాస్తే భలే ఉంది అంటూ వెన్నుతట్టి మెచ్చుకొనేవారు. అద్దేపల్లి అద్యక్షత వహించిన ఒక సభలో నేను నా కవిత వినిపించి వెళిపోతుంటే, నన్ను ఆపి — బొల్లోజు బాబా కవిత్వం వాచ్యంగా ఉండదు ధ్వని ప్రధానంగా ఉంటుంది, ఇప్పుడు చదివిన కవితా పంక్తులలోని సొబగులు ఇవి అంటూ విశ్లేషించి, అభినందించటం— నేను ఎన్నటికీ మరచిపోని ఒక తీపి జ్ఞాపకం.

తెలుగు కవిత్వయోధుడు అద్దేపల్లి రామమోహనరావు ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ…….

 

*

 

 

 

 

 

 

 

 

ట్రాయ్ తవ్వకాలలో ‘శివలింగా’లు, యోని చిహ్నాలు

 

స్లీమన్ కథ-19

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

అన్ని వైపులనుంచీ దాడికి సిద్ధమైన స్లీమన్, మొదటగా టర్కీలో అమెరికా రాయబారిగా ఉన్న వేన్ మేక్విగ్ కు ఒక సుదీర్ఘమైన ఉత్తరం రాశాడు. దానికి 4వేల పియాస్టర్లను జతపరిచాడు. తను హిస్సాలిక్ వెళ్లడానికీ, అక్కడి దిబ్బను కొనుగోలు చేయడానికీ విద్యామంత్రి సఫ్వెట్ పాషా ఒకవైపున అనుమతిస్తూనే, ఇంకోవైపు 3వేల పియాస్టర్లకు తనే దానిని కొనేసి మోసగించాడనీ; ఆ దిబ్బ తనకే చెందాలనీ, కనుక  మీ జోక్యాన్ని కోరుతూ దాని మూల్యం 3వేల పియాస్టర్లతో పాటు, మీ ఖర్చుల నిమిత్తం మరో వెయ్యి పియాస్టర్లు పంపుతున్నాననీ అందులో రాశాడు. ఇది వ్యాపార లావాదేవీ కాదనీ, చరిత్రకు సంబంధించిన ఒక అతి పెద్ద చిక్కుముడిని విప్పడానికి జరిపే ప్రయత్నమనీ, ఇందులో మనం వేసే ప్రతి అడుగూ మొత్తం నాగరిక ప్రపంచపు ప్రశంసలను అందుకుంటుందనీ అన్నాడు. ఆపైన కాన్ స్టాంట్ నోపిల్ లోని అధికారులకు మరెన్నో లేఖలు గుప్పించాడు. వాటిలో బెదిరింపులు, వేడికోళ్ళు, శాపనార్ధాలతో సహా అన్ని రకాల బాణీలనూ రంగరించాడు.

అయితే, ఈ లోపున అత్యవసరంగా పట్టించుకోవలసిన ఇతర పరిణామాలు తోసుకొచ్చాయి. ఆ చలికాలంలో పారిస్ నగరం ప్రష్యన్ సేనల భారీ ఫిరంగి పేలుళ్లతో దద్దరిల్లింది. తన ఆస్తుల భద్రతను తలచుకుని స్లీమన్ భయపడిపోయాడు. 6 ప్లేస్ స్ట్రీట్ మిషెల్ లో ఉన్న తన అపార్ట్ మెంట్ పై అతనికి విపరీతమైన మక్కువ. అతని పుస్తకాలూ; తూర్పు దేశాలనుంచీ, ఇథకా, తేరా లనుంచీ అతను సేకరించిన చిన్నపాటి పురావస్తు సంపదా అందులోనే ఉన్నాయి. ఒడీసీయెస్ చితాభస్మం ఉన్న కలశం కూడా వాటిలో ఉంది.

దాంతో హుటాహుటిన పారిస్ కు బయలుదేరాడు. ఎథెన్స్ లోని ప్రష్యన్ రాయబారినుంచి పరిచయలేఖ తీసుకుని మ్యూనిక్ వెళ్ళాడు. అక్కడ మరిన్ని పరిచయలేఖలు తీసుకుని స్ట్రాస్ బర్గ్ వెళ్ళి గవర్నర్ జనరల్ కౌంట్ బిస్మార్క్ బొలెన్ ను కలసుకున్నాడు. అక్కడినుంచి వెర్సై వెళ్ళి బిస్మార్క్ చేతులమీదుగా పారిస్ వెళ్ళేందుకు అనుమతిపత్రం తీసుకోడానికి ప్రయత్నించాడు. కానీ, శాంతి నెలకొనేదాకా పారిస్ లోకి ఎవరూ అడుగుపెట్టడానికి వీల్లేదంటూ బిస్మార్క్ తోపాటు అధ్యక్షుడు జూల్స్ ఫవ్రా కూడా అతని అభ్యర్ధనను తిరస్కరించాడు.

తన దారికి అడ్డువచ్చే సాధారణ చట్టాలనే కాదు, సైనిక శాసనాలను కూడా స్వేచ్ఛకు ఆటంకాలుగా భావించి మండిపడే స్వభావం అతనిది. అయిదు ఫ్రాంకులు చెల్లించి, క్లైన్ అనే పేరుతో ఒక నకిలీ పాస్ పోర్ట్ సంపాదించాడు. అతనికి యాభై ఏళ్ళు ఉన్నా దానిమీద ఫోటో మాత్రం ఓ ముప్పై ఏళ్ల యువకుడిది. తప్పనిసరిగా అతను జర్మనీ మీదుగా వెళ్ళాల్సిందే కనుక, అనుమానంతో మూడుసార్లు అతన్ని నిర్బంధంలోకి తీసుకుని ప్రశ్నించారు. యుక్తితో తప్పించుకుని బయటపడ్డాననీ, లేకపోతే గోడకు అభిముఖంగా నిలబెట్టి కాల్చి చంపేసేవారని ఆ తర్వాత రాసుకున్నాడు. జర్మన్లకు బిరుదులు, పదవుల పిచ్చి ఎక్కువ కనుక, ప్రతి లెఫ్టినెంటునూ జనరల్ గానూ, ప్రతి సైనికుణ్ణీ కల్నల్ గానూ సంబోధించడంతో వాళ్ళు ఉబ్బిపోయి వదిలేశారు.

పారిస్ పూర్తిగా ధ్వంసమైనట్టు ఎథెన్స్ లో అతనికి అందిన సమాచారం. తీరా చూస్తే అలాంటిదేమీలేదు. పాంథియన్, సెయింట్ సుల్పీస్ చర్చి, సర్బాన్ సహా  పరిచితమైన భవంతులన్నీ అలాగే ఉన్నాయి. అతని అపార్ట్ మెంటూ, దాని పక్కనే ఉన్న అతని మరో ఇల్లూ, ఎలా విడిచి వెళ్లాడో అలాగే ఉన్నాయి. లైబ్రరీలోకి అడుగుపెట్టినప్పుడు తన చెక్కిళ్ళ వెంట ఆనందబాష్పాలు రాలాయని, చనిపోయాడనుకున్న పిల్లవాడు బతికి కళ్ళు తెరిస్తే ఎలాంటి అనుభూతికి లోనవుతామో అలాంటి అనుభూతికి లోనయ్యాననీ అతను చెప్పుకున్నాడు. విచిత్రంగా అతని పొరుగిల్లు మాత్రం దెబ్బతింది. దానిని చూడగానే, మేమెల్ లో అన్ని గిడ్డంగులూ అగ్నికి ఆహుతై తన గిడ్డంగి మాత్రం భద్రంగా ఉన్న సంగతి గుర్తొచ్చింది. మరోసారి ఏ అదృశ్యశక్తో, ఏ దైవిక ప్రయోజనం కోసమో తనను విధ్వంసం నుంచి కాపాడిందనుకున్నాడు. వసంతం అడుగుపెట్టడంతో చెట్లన్నీ పూల దుప్పటీ కప్పుకున్నట్టు ఉన్నాయి. కమ్యూన్ కింద  కూడా పారిస్ ఎప్పటిలానే సొగసులీనింది.

“పారిస్ లో పెద్దగా మార్పేమీ లేదు. వీథుల్లో జనసందోహం వెనకటిలానే ఉంది. అయితే గుర్రపు బండ్లు మాత్రం తక్కువగా ఉన్నాయి. ఎన్నోగుర్రాలను చంపి తినేయడమే కారణం. రాత్రిళ్ళు మాత్రం పారిస్ అంతటా ఏదో విషాదం పరచుకున్నట్టు ఉంటోంది. వీథుల్లో ఒకే ఒక చమురు దీపం వెలుగుతోంది. గ్యాస్ లైట్లు లేకపోవడంతో థియేటర్లు పగలు మాత్రమే నడుస్తున్నాయి. సర్బాన్ మినహా మ్యూజియంలు, లైబ్రరీలు అన్నీ మూతబడ్డాయి. కాలేజ్ ఆఫ్ ఫ్రాన్స్ ను రేపే తెరవబోతున్నారన్న వార్త ఆనందం నింపింది. పారిస్ లో చెట్లన్నీ కూల్చేశారన్నారు. కానీ అన్ని చెట్లూ అలాగే ఉన్నాయి” అని, ఊటెంబర్గ్ లో ఉండే ఒక వర్తకమిత్రుడు గాట్షాక్ కు రాసిన ఉత్తరంలో అన్నాడు.

పారిస్ పూర్తిగా కమ్యూనార్డ్ ల అధీనంలోకి వెళ్ళిన తర్వాత కూడా స్లీమన్ అక్కడే ఉండిపోయాడు. రాచరికం కింద ఉన్న జర్మనీపై కంటే ఫ్రాన్స్ పైనే అతనికి ఎక్కువ నమ్మకం కుదిరింది. యుద్ధగమనాన్ని దూరం నుంచి చూస్తూ తన అధ్యయనంలో ప్రశాంతంగా గడిపాడు. ఈ మధ్యలో ఫ్రాంక్ కల్వర్ట్ కు ఉత్తరం రాస్తూ, తనూ, సఫ్వెట్ పాషా, అమెరికా రాయబారీ కలసి మాట్లాడుకుంటే ప్రయోజనం ఉండచ్చనిపిస్తోందన్నాడు. ఇంతకుముందు హిస్సాలిక్ దగ్గర నిక్షేపాలు బయటపడిన సంగతి అతనికి గుర్తుంది. ఆ ప్రదేశం తను తవ్వించిన మొదటి కందకానికి ఎంతో దూరంలో లేదు. ఆంటియోకస్ ది గ్రేట్ కాలానికి చెందిన 12వందల భారీ రజత పతకాలు అక్కడ బయటపడ్డాయి. మంత్రి తన ప్రయత్నాలకు మోకాలు అడ్డడానికి అదీ ఒక కారణం కావచ్చు ననుకున్నాడు. అదే నిజమైతే అక్కడి నిధినిక్షేపాల మీద తనకు ఎలాంటి ఆసక్తీ లేనట్టు కనిపించడమే మార్గమని అతనికి తోచింది. అక్కడ వెండి, బంగారు నిక్షేపాలను కనుగొనడమే జరిగితే, ఒక్క నాణేన్ని కూడా విడిచిపెట్టకుండా మంత్రికి ఇవ్వడానికి తను సిద్ధమేననీ, తవ్వకాలు జరిపేచోట మంత్రిత్వశాఖకు చెందిన ఇద్దరు కాపలాదారులను నియమించుకోవచ్చనీ, అయితే ఒక విషయంలో మాత్రం తను ఎట్టి పరిస్థితులలోనూ రాజీపడేది లేదనీ అన్నాడు. హిస్సాలిక్ దిబ్బ మీద తనకు పూర్తి యాజమాన్య హక్కు లభించాల్సిందే! అంతవరకూ తను తిరిగి తవ్వకాలను చేపెట్టే ప్రశ్న లేదు. కేవలం ట్రాయ్ ఉనికిని నిరూపించడం తప్ప తనకు ఇందులో మరెలాంటి స్వార్థమూ లేదు. పైగా, ఈ లక్ష్యసాధనకోసం జీవితాన్నే కాదు, అపారమైన ధనాన్నీ ధారపోయడానికి తను సిద్ధమయ్యాడు. ఇంకా కావాలంటే, అక్కడ లభించే వెండి, బంగారాలకు రెట్టింపు విలువను ప్రభుత్వానికి ముట్టజెప్పడానికీ తను తయారుగా ఉన్నాడు. కాకపోతే, ప్రభుత్వ స్థలంలో తవ్వకాలు జరిపి రేపు జీవితాంతం దాని పర్యవసానాలను ఎదుర్కొనే ఓపిక మాత్రం తనకు లేదు. కనుక ఆ దిబ్బ సొంతం అయితేనే తిరిగి తవ్వకాలు ప్రారంభిస్తాడు.

అయితే, ఇదంతా పైకి వినిపించిన వాదమే తప్ప నిజం కాదు. తవ్వకాలలో లభించబోయే నిధినిక్షేపాలను తను చేజిక్కించుకుని తీరాలని అతను అప్పటికే నిర్ణయించుకున్నాడు. ఆ టర్కులిద్దరూ తనను వంచించబోయారు కనుక, ఒక ఆరితేరిన వర్తకుడిగా వారి ఎత్తుకు పై ఎత్తు వేసి వారిని తను వంచించదలచుకున్నాడు. ఆ రోజుల్లో తరచు తన అభిమాన పాత్ర అయిన ఒడీసియెస్ ను గుర్తుచేసుకునే వాడు. దేశదిమ్మరి అయిన ఒడీసీయెస్ వంచనలోనూ సిద్ధహస్తుడే. అతని ప్రభావం స్లీమన్ పై బాల్యంలోనే పడింది. ఆపైన  సోఫియా ఇప్పుడు గర్భవతి. కొడుకే పుడతాడన్న నమ్మకంతో ఒడీసియెస్ పేరు పెట్టాలని అప్పటికే అతను నిర్ణయించుకున్నాడు.

ఎలాంటి జంకూ కొంకూ లేకుండా మరోసారి నకిలీ పాస్ పోర్ట్ తో జర్మనీ మీదుగా ప్రయాణించి మే నెలలో ఎథెన్స్ కు చేరుకున్నాడు. సోఫియా ప్రసవించింది. ఆడపిల్ల. ఆ పిల్లకు ట్రాయ్ వీరుడు హెక్టర్ భార్య యండ్రోమకి పేరు పెట్టేశాడు.

జూన్ లో కాన్ స్టాంట్ నోపిల్ కు వెళ్ళి సఫ్వెట్ పాషాను కలిశాడు. అమెరికా రాయబారి వేన్ మేక్విగ్, రాయబార కార్యాలయం కార్యదర్శి జాన్ బ్రౌన్ ల సహకారంతో అక్షరరూపమిచ్చిన కొత్త ప్రతిపాదనను అతని ముందు ఉంచాడు. దాని ప్రకారం, హిస్సాలిక్ దిబ్బపై యాజమాన్య హక్కుకు తను పట్టుబట్టడు. అక్కడి తవ్వకాలలో గొప్ప నిధినిక్షేపాలు దొరుకుతాయని తను భావించడం లేదు. ఒకవేళ దొరకడమే జరిగితే, ఉభయులం(తనూ, టర్కిష్ ప్రభుత్వమూ) దానిని సమానంగా పంచుకోవాలి. తన భాగాన్ని దేశం నుంచి తరలించడానికి అనుమతించాలి. తవ్వకాలకు అయ్యే ఖర్చంతా తనే భరిస్తాడు. ప్రభుత్వమే ఆ దిబ్బను కొనేసి ఆ టర్కుల తలనొప్పి వదిలించింది కనుక దానిపై తను హక్కును కోరబోడు. అయితే, ఆ మారుమూల ప్రాంతంలో, ఒక విదేశీయుడిగా తనకూ, అక్కడ వెలుగు చూసే చారిత్రక సంపదకూ ప్రభుత్వం రక్షణ కల్పించాలి.

1871, ఆగస్టు 2న అతను లండన్ లో ఉండగా, కాన్ స్టాంట్ నోపిల్ లోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి ఒక సీల్డు పెట్టె అందింది. అందులో టర్కిష్ ప్రభుత్వం ఇచ్చిన ఫర్మానా ఉంది. తక్షణమే తవ్వకాలను ప్రారంభించే తహతహలో ఉన్న స్లీమన్ అప్పటికప్పుడు ఫ్రాంక్ కల్వర్ట్ కు ఉత్తరం రాశాడు. సెప్టెంబర్ చివరిలో తను తవ్వకాలను చేపట్టాలనుకుంటున్నాననీ, అక్టోబర్ లో దర్దనెల్లెస్ వాతావరణం ఎలా ఉంటుందో, అప్పటికి జ్వరాలు వగైరా తగ్గుముఖం పడతాయో లేదో తన ఎథెన్స్ చిరునామాకు ఉత్తరం రాయవలసిందనీ కోరాడు.

సెప్టెంబర్ 27న భార్యతో కలసి దర్దనెల్లెస్ చేరుకున్నాడు. తీరా వెళ్ళాక ఫర్మానా పాఠంపై సందేహాలు తలెత్తాయి. అది హిస్సాలిక్ దిబ్బ గురించే ప్రస్తావిస్తోందా అన్నది స్పష్టం కాలేదు. ఆపైన దర్దనెల్లెస్ గవర్నర్ అక్మెడ్ పాషాకు ఎలాంటి ఉత్తర్వూ రాలేదు. తవ్వకాలప్పుడు “ పురాతన, చరిత్రప్రసిద్ధమైన ఆ నగరం తాలూకు ప్రాకారాలకు ఎలాంటి హానీ జరగకూడదు” అని ఆ ఫర్మానా ఆదేశిస్తోంది. పొరపాటున ఏ గోడో దెబ్బతింటే పర్యవసానాలు ఎలా ఉంటాయో అతనికి అర్థం కాలేదు.

సందేహాలతో సతమతమవుతూనే  సిప్లాక్ గ్రామంలో తన ముఖ్యకార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మేస్త్రీని, పనివాళ్లను నియమించుకున్నాడు. తోపుడు బళ్ళు, తట్టలు, పారలు, గొడ్డళ్ళు సహా సామగ్రి అంతా సిద్ధంగా ఉంది.  ఆ దిబ్బ మీద దాడికి దిగడానికి ముందు, అధికారుల మందకొడితనం అనే చివరి అడ్డంకిని దాటడం ఒక్కటే మిగిలింది. ఫర్మానాపై సందేహానివృత్తిని కోరుతూ జాన్ బ్రౌన్ కు అత్యవసర సందేశం పంపించాడు. స్పందన లేకపోవడంతో మూడు రోజుల తర్వాత మళ్ళీ పంపాడు. టర్కిష్ ప్రభుత్వం కల్పించిన పూర్తి రక్షణలో ఎట్టకేలకు అక్టోబర్ 11 వ తేదీన పని ప్రారంభించాడు.

ప్రభుత్వం జియోర్జోస్ సర్కిస్ అనే అధికారిని తన కాపలాదారుగా నియమించింది.  పుట్టుకతో అతను ఆర్మేనియన్. ఇంతకుముందు దర్దనెల్లెస్ లోని చాన్సెరీ ఆఫ్ జస్టిస్ లో సెకండ్ సెక్రెటరీగా పనిచేశాడు. స్లీమన్ కు నీడలా వెన్నంటి ఉంటూ, ప్రభుత్వం కళ్ళు కప్పి అక్కడినుంచి ఎలాంటి నిధినిక్షేపాలనూ తరలించకుండా నిరంతరం కాపలా కాయడం అతని పని. స్లీమన్ మాటల్లో చెప్పాలంటే ప్రభుత్వానికి అతను “కళ్ళూ-చెవులూ”.

స్లీమన్ ఫ్రాన్స్ నుంచి ఎనిమిది తోపుడు బళ్ళు తెప్పించుకున్నాడు. కనుక మొదటి రోజున ఎనిమిదిమందిని పనిలోకి దింపాడు. తవ్వకాలు చురుగ్గా సాగడంతో మరునాడు ముప్పై అయిదుగురినీ, ఆ మరునాడు డెబ్బై నలుగురినీ పనిలోకి తీసుకున్నాడు. ఒక్కొక్కరికీ 9 పియాస్టర్లు చెల్లించాడు. వేతనాల చెల్లింపు నికొలస్ జెఫిరోస్ జానకిస్ అనే స్ఫురద్రూపి అయిన ఓ గ్రీకు చేతిమీదుగా జరిగేది. స్లీమన్ తన వివాహమైన వెంటనే అతన్ని ఉద్యోగంలోకి తీసుకున్నాడు. రెంకోయ్ గ్రామానికి చెందిన జానకిస్ కు స్థానిక మాండలికాలు అన్నీ తెలుసు. స్లీమన్ కు అంగరక్షకుడు, వంటమనిషి, డబ్బు లావాదేవీలు జరిపేవాడూ…అన్నీ అతనే. తన దగ్గర పనిచేసే ప్రతి ఒకరినీ గ్రీకు పురాణాలలోని ఏదో ఒక పేరుతో పిలవడం స్లీమన్ కు అలవాటు. కానీ తనకెంతో నమ్మకస్తుడైన జానకిస్ ను మాత్రం అసలు పేరుతోనే పిలిచేవాడు. స్లీమన్ ఎక్కడున్నా అతని దరిదాపుల్లో జానకిస్ విధిగా ఉండాల్సిందే. స్థానిక అధికారికి ఎవరికైనా చేతులు తడపాల్సి వస్తే, స్లీమన్ దానిని జానకిస్ కు వదిలేసేవాడు. ముడుపుల చెల్లింపు కోసం, ఇతర ఖర్చుల కోసం జానకిస్ తన బెల్టు కింద బంగారు నాణేలను ఎప్పుడూ ఉంచుకునేవాడు.

వర్షాలు మొదలయ్యాయి, అయినా తవ్వకాలు కొనసాగాయి. ఎప్పటిలా స్లీమన్ తొందరలో ఉన్నాడు. ఆరు వారాల్లో ప్రియామ్ ప్రాసాదాన్ని వెలికి తీయాలని అనుకున్నాడు. వర్షంలో కూడా పనివాళ్లు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరువరకు పని చేశారు. మధ్యలో ఉదయం తొమ్మిదింటికి అరగంటసేపు అల్పాహార విరామం. మధ్యాహ్నం గంటన్నరసేపు భోజన విరామం. అప్పుడు తప్ప మరెప్పుడూ పొగ తాగడానికి వీల్లేదు. ధూమపానం మనిషి శక్తిని తగ్గిస్తుందనీ, ఏకాగ్రతను దెబ్బతీస్తుందనీ స్లీమన్ సిద్ధాంతం. పని జరుగుతున్నంత సేపూ అతను చండశాసనుడు. పని వాళ్ళ పీకల మీద ఉన్నట్టు ఉండేవాడు. వర్షాలను, మధ్య మధ్య పనికి ఆటంకమయ్యే గ్రీకు శ్రాద్ధదినాలనూ తిట్టిపోసేవాడు. దానికితోడు నెలలో మూడుసార్లు తుపానులు సంభవించి, తవ్వకాలను నిలిపివేయవలసివచ్చింది. ఆ విరామకాలంలో తవ్వకాల గురించిన నివేదికలు రాసుకునేవాడు.

రాయడానికి కూడా పెద్దగా ఏమీ కనిపించలేదు. కొన్ని నాణేలూ, కాలిన ఎముకలు, భారీ కుడ్యాలు, హోమర్ కంటే కూడా చాలా వెనకటి కాలానికి చెందిన విచిత్రమైన లింగాకృతులు బయటపడ్డాయి. ఇవి చక్కగా మెరుగుపెట్టిన నల్లరాతి లింగాకృతులు. వీటిలో కొన్నిటిపై తెల్లని చారలున్నాయి. అక్టోబర్ 30న జరిపిన తవ్వకాలలో ఇవే కాక, ఆకుపచ్చని రాయితో చేసిన బల్లెం పిడులు, అగ్నిపర్వతాలను తలపించే చిత్రమైన ఆకృతులు, పంది కోరలు, దంతాలు వందల సంఖ్యలో వెలికివచ్చాయి. ఆ తర్వాత కూడా రోజు రోజుకీ ఇలాంటివే బయటపడడం ప్రారంభించాయి. ఇంకా లోపలికి వెడుతున్న కొద్దీ గుడ్లగూబను పోలిన చిన్న చిన్న మృణ్మయమూర్తులు, గుడ్లగూబ తలను చెక్కిన రాతిపలకలు తగిలాయి. వాటిని చూడగానే ‘గుడ్లగూబ  ముఖం’ కలిగిన ఎథెనా గురించి హోమర్ చెప్పడం స్లీమన్ కు గుర్తొచ్చింది. గుడ్లగూబ పల్లాస్ ఎథెనాకు చెందిన ఓ పవిత్రచిహ్నం. కన్య అయిన ఎథెనా, ఎథెన్స్ కు రక్షణ దేవత. ఈ దేవత కళ్ళు గుడ్లగూబ కళ్లలా ప్రకాశవంతంగానూ, చీకట్లో కూడా చూడగలిగేలానూ ఉంటాయని ‘గుడ్లగూబ ముఖం కలిగిన ఎథెనా’ అన్న హోమర్ మాటకు పండితులు అర్థం చెప్పారు.

పదడుగుల లోతున, చిన్నపాటి బొంగరం ఆకారంలో ఉన్న మృణ్మయమూర్తులు కనిపించడం, వాటిలో కొన్నింటికి రెండు రంధ్రాలు ఉండడం చూసి స్లీమన్ మరింత విస్తుపోయాడు. భారతదేశంలోని దేవాలయాలలో తను చూసిన నల్లరాతి భారీ శివలింగాలు అతనికి చటుక్కున గుర్తొచ్చాయి. ఈ తవ్వకాలలో కూడా పెద్ద సంఖ్యలో కనిపించిన లింగాకృతులు పురుషసూత్రానికి చెందినవైతే; రంధ్రాలు చేసిన బొంగరం ఆకృతులు స్త్రీసూత్రానికి చెంది ఉంటాయనుకున్నాడు. ఇంతకీ ప్రియామ్ ప్రాసాదంలో ఇలాంటివి ఎందుకున్నాయో అతనికి అర్థం కాలేదు.

(సశేషం)

 

 

 

 

 

 

 

సినిమా కథ కాదు!

 

  -బమ్మిడి జగదీశ్వరరావు

~

bammidi ఒరే బాబూ.. బాబూరావూ..

మీరందరూ నవ్వొచ్చు గాక.. నేనేమి సిగ్గుపడ్డం లేదు.. గర్వంగా ఫీలవుతున్నా..! ఔను, మొన్న రిలీజయిన సిన్మాలో వెంకటేశ్వర స్వామికున్న రెండు చేతులకి వెనకన వున్న రెండు చేతులు నావే! ఈ అవకాశం రావడం వెనుక యెంత కథ వుందో కష్టముందో మీకు తెలీదు! పదేళ్లుగా వున్న ఫ్రెండొకడు ప్రొడక్షన్ మేనేజరు అవబట్టి.. వాడితో స్నేహం నిలుపుకోబట్టి.. వాడికి నాలుగేళ్ళుగా తాగబెట్టి.. వాడికి యివ్వాల్సిన గౌరవము యివ్వబట్టి.. వాడికి చేయాల్సిన సర్వీసు చేయబట్టి.. కొట్టిన గోల్డెన్ ఛాన్సు యిది! ఫస్ట్ టైము తెర మీద భగవంతుడిగా, ..కాకపోయినా భగవంతుడి చేతులుగానైనా కనిపించడం.. మిమ్మల్ని అదే చేతులతో దీవించడం.. మీ నా పూర్వజన్మల పుణ్యమే తప్పితే అలాటప్పా విషయమేమీ కాదు! ఏ బ్యాకప్పూ లేకుండా సినిమాల్లో అవకాశము దొరకడం అంత వీజీ విషయమేమీ కాదు గాక కాదు!

ఇప్పుడు యిక్కడ యింటికి యిరవై మంది హీరోలు వున్నారు! ఈ పరిస్థితుల్లో నువ్వు నిజంగా హీరోవి అయినా హీరోవి కాలేవ్! అంత సీనూ లేదు.. అంత స్క్రీనూ లేదు..! నువ్వూ నేనూ కాదు, కొత్తగా బయటినుండి వొచ్చి సినిమాల్లో చెయ్యమను, చూస్తాను? అరగని తిండీ జరగని మాటలూ యెందుకు గానీ.. భవిష్యత్తులో మనకి జూనియర్ ఆర్టిస్టు వేషాలు కూడా దొరకవు! నిజం.. వొట్టూ.. యింటికి యిరవై మంది పోటీ పడితే జూనియర్ ఆర్టిస్టుల వేషాలు మనదాకా వస్తాయా? నువ్వు యిండస్ట్రీకి రావడం యిష్టం లేక కాదు! నాకేదో పోటీ అయిపోతావనీ కాదు! నీకు పోటీ దారులు యెంతమంది వున్నారో కళ్ళు తెరుచుకు చూడు!

మన టాలీవుడ్లో వున్నదంతా వంశాల చరిత్రే! వారసత్వ సంపదే! నందమూరి వంశంలో- అలనాటి హీరో యన్టీ రామారావు. కొడుకు హరిక్రిష్ణ హీరో. మరో కొడుకు మోహన క్రిష్ణ కెమెరా మెన్.  చిన్న కొడుకు బాలకృష్ణ హీరో. తరువాత తరంలో మనవలూ హీరో హరిక్రిష్ణ కొడుకులూ కళ్యాణ్ రామ్, జూనియర్ యన్టీఆరూ.. మోహన క్రిష్ణ కొడుకు తారక రత్న అందరూ హీరోలే! అభిమానులు ఎదురు చూస్తున్న మరో మనవడు హీరో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ వుడ్ బీ హీరో! మునిమనవడూ జూ ఎన్టీర్ కొడుకూ అభయ్ రామ్ మన రేపటి హీరో! కూతురు పురందరేశ్వరి రాజకీయ రంగంలో వారసురాలిగా వుండిపోయారు!

మరి హీరో అక్కినేని వంశంలో- హీరో నాగేశ్వరరావు పెద్ద కొడుకు వెంకట్ ప్రొడ్యూసర్, చిన్న కొడుకు నాగార్జున హీరో. మనవడు సుమంత్ హీరో. మనవరాలు సుప్రియ హీరోయిన్. మరో మనవడు సుశాంత్ హీరో. మనవలూ నాగార్జున కొడుకులూ నాగాచైతన్యా అఖిల్ యిద్దరూ హీరోలే!

ఇంకా ఘట్టమనేని వంశంలో- హీరో క్రిష్ణ వాళ్ళన్నయ్య ఆదిశేషగిరిరావు ప్రొడ్యూసర్. పెద్దకొడుకు రమేష్ బాబు వొకప్పుడు హీరో, తర్వాత నిర్మాత కూడా! కూతురు మంజుల హీరొయిన్. కొడుకు మహేష్ బాబు చెప్పక్కర్లేదు హీరోలకి హీరో. పెద్దల్లుడు సంజయ్ స్వరూప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. చిన్నల్లుడు సుధీర్ బాబు హీరో. మనవడు గౌతం కృష్ణ రేపటి హీరో, అప్పుడే ‘వన్ నేనోక్కడినే’ లో చేసాడు కదా? ఇక హీరోయిన్ విజయనిర్మలగారి అబ్బాయి నరేష్ హీరో. నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ హీరో!

విలనూ కం హీరో కృష్ణంరాజు! అన్న యువీ సూర్యనారాయణరాజు ప్రొడ్యూసర్. వారి పెద్ద కొడుకు బాహుబలి హీరో ప్రభాష్!

చిరంజీవి మెగా హీరో. పెద్దతమ్ముడు నాగబాబు హీరో తప్ప అన్నీ. చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ హీరో. బావమర్దీ.. అల్లూ రామలింగయ్య కొడుకు అల్లు అరవింద్ నిర్మాతా నటుడు. అల్లుడు అల్లూ అర్జున్ స్టైలిష్ హీరో. చిన్న అల్లుడు అల్లూ శిరీష్ అప్ కమింగ్ హీరో. కొడుకు రామ్ చరణ్ హీరో. మేనల్లుడు సాయి ధర్మతేజ కూడా హీరో. పెద తమ్ముడు వరుణ్ తేజ్ హీరో. కూతురు నిహారిక త్వరలో హీరోయిన్!?

మరి మంచు వారి కుటుంబంలో మోహన్ బాబుగారి అబ్బాయిలు యిద్దరూ మంచు విష్ణు వర్ధన్ బాబూ మంచ్ మనోజ్ బాబూ హీరోలే! హీరోయిన్ మంచు లక్ష్మిదీ కీరోలే! తోడు సోదరుడు ఎం. కృష్ణగారు ప్రొడ్యూసరే!

నిర్మాతా నటుడూ రామానాయ్డు పెద్ద కొడుకు సురేష్ బాబు నిర్మాతా డిస్ట్రిబ్యూటర్. చిన్న కొడుకు హీరో వెంకటేష్. మనవడు దగ్గుబాటి రానా హీరో కం విలనూ!

పీజే శర్మ నటులైతే, వారి శ్రీమతి కృష్ణజ్యోతి శర్మ డబ్బింగ్ ఆర్టిస్టు. పెద్ద కొడుకు సాయి కుమార్ హీరో విలనూ అన్నీ. నడిపి కొడుకు రవిశంకర్ నటుడూ అనువాద రచయిత. చిన్న కొడుకు అయ్యప్ప పి శర్మ నటుడూ దర్శకుడూ. మనవడు ఆది హీరో!

శివ శక్తి దత్తా విజయేంద్ర ప్రసాదు వరుసకు అన్నదమ్ములు. కథా రచయితా దర్శకులు విజయేంద్ర ప్రసాదు గారి అబ్బాయి రాజమౌళి. రామా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్. మరి శివశక్తి దత్త కొడుకు మన మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి. కీరవాణి తమ్ముడు కాంచీ నటుడూ రచయిత. చిన్నతమ్ముడు కళ్యాణ్ మాలిక్ మరో మ్యూజిక్ డైరెక్టర్. చిన్నాన్న కూతురు ఎం.ఎం. శ్రీలేఖ యింకో మ్యూజిక్ డైరెక్టర్!

నటులు కమలహాసన్ వారసురాళ్ళు శృతిహాసన్, అక్షరహాసన్ యిద్దరూ హీరోయిన్లే! జయసుధ కొడుకు శ్రియాన్ హీరో! జయప్రద (అక్క) కొడుకు సిద్దార్థ హీరో! రావుగోపాలరావు కొడుకే రావు రమేషు, హీరో లాంటి విలన్! బ్రహ్మానందం కొడుకు హీరో! ఎమ్మెస్ నారాయణ కొడుకు హీరో, కూతురు డైరెక్టర్! హీరో శ్రీకాంత్ హీరొయిన్ ఊహల కూతురు ఆల్రెడీ రుద్రమదేవిలో నటించింది, కొడుకు కాబోయే హీరో! హీరో రాజశేఖర్ హీరోయిన్ జీవితల పెద్ద పాప హీరోయిన్ గా వస్తుందిట?!

దర్శకులు దాసరి నారాయణరావు కొడుకు దాసరి అరుణ్ కుమార్ హీరో. ఈవీవీ సత్యన్నారాయణ కొడుకులు పెద్దాడు ఆర్యన్ రాజేష్ హీరో, చిన్నాడు అల్లరి నరేష్ హీరో. పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయి రాం శంకర్ హీరో. కొడుకు ఆకాష్ పూరీ హీరోయే! టి. కృష్ణ కొడుకు గోపీచంద్ విలన్ను దాటి హీరో. సుకుమార్ అన్న కొడుకు హీరోగా రాబోతున్నాడట?!

నిర్మాతలు వీబీ రాజేంద్రప్రసాద్ కొడుకే కదా హీరో జగపతి బాబు. ఎమ్మెస్ రెడ్డి కొడుకు శ్యాం ప్రసాదరెడ్డి నిర్మాత. మనవరాలు కూడా నిర్మాతే! అశ్వినీదత్తు కూతుళ్ళూ నిర్మాతలే! ఎమ్మెస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్ హీరో. స్రవంతి రవికిశోర్ (అన్న) కొడుకు రామ్ హీరో! కేఎస్ రామారావు కొడుకు వల్లభ హీరో, ప్రొడ్యూసర్! ప్రొడ్యూసరూ డిస్ట్రిబ్యూటరూ యెన్ సుధాకరరెడ్డి కొడుకు హీరో నితిన్! బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో, పక్కన ఫస్ట్ సినిమాకే సమంతా హీరోయిన్. ఐటమ్ సాంగ్ కు హీరోయిన్ తమన్నానే దించేసారు!

సంగీత దర్శకులు టీవీ రాజు కొడుకు రాజ్. సాలూరి రాజేశ్వరరావు కొడుకు కోటి. కోటి కొడుకూ హీరోయే! రైటర్ సత్యమూర్తి కొడుకు మన దేవిశ్రీ ప్రసాద్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంకో కొడుకు గాయకుడు. బాలూ గారి చెల్లలే శైలజ. కొడుకే సింగర్ చరణ్. పాటల రచయిత సీతారామ శాస్త్రి వొక కొడుకు హీరో. యింకో కొడుకు డైరెక్టర్. కెమెరామెన్ ఛోటా కే నాయ్డు మేనల్లుడే హీరో సందీప్ కిషన్!

ఏ బ్యాక్ గ్రౌండ్ లేదని చెప్పే రాం గోపాల్ వర్మ వాళ్ళ నాన్న అన్నపూర్ణ స్టుడియోలో సౌండ్ యింజనీర్! మీనాన్న కనీసం ప్యూను కూడా కాదుగదా, నీకు గేటులోపలకి రానిస్తారా చెప్పు? ఈ సాక్ష్యాలు చాలవా చెప్పు?

సో.. ఈ సొదంతా.. సోదంతా నీకు ఎందుకు చెపుతున్నానో తెలుసా? మా ఫ్రెండ్ అసోసియేట్ డైరెక్టర్ దగ్గరుండి ఈ రిలేషన్లు తెలిసినంతవరకు యెందుకు చెప్పాడో తెలుసా? రియలైజ్ అవుతావని! నువ్వు పేరుకి బాబువే గాని.. మీ బాబువల్ల నువ్వయితే బాబువి కావు, కాలేవు. ఇండస్ట్రీని యేలలేవు. వొద్దురా.. నాలాంటి వాడిని తెలియక సినిమా యిండస్ట్రీ కొచ్చేసాను. చాలా దూరం వచ్చేసానని తెలుసు. ఇంకెంత దూరముందో తెలీదు. ఇక్కడ అందరూ అంటే యెక్కువ మంది నాలా థర్టీ యియర్స్ యిండస్ట్రీ గాళ్ళే!

లేదూ పెట్టేబేడా సర్దుకొని ఎవరి మాటా వినకుండా వస్తానంటే రా.. సంకనాకి పోదువు. పెళ్లి కాకుండా వచ్చావో నీకు భవిష్యత్తులో కాదు, యీ జన్మలోనే పెళ్లికాదు! అందుకని పెళ్లి చేసుకొని వచ్చావో మీయావిడ డైవోర్సు తీసుకున్నా ఆశ్చర్యపోకు! మీసాలు వచ్చినప్పుడు వచ్చాను, యిప్పుడు నెత్తిమీద వెంట్రుకలూ మిగల్లేదు!

నీ మీద నీకు నమ్మకం వుండడం మంచిదే. కానీ యితరుల అందాలతో పోల్చుకోవడం ప్రమాదం. ఎందుకంటే నీ వుత్తరం చదివితే వూపిరి ఆగిపోయింది. “నాగార్జున బిగినింగ్ లో విక్రం, అరణ్య కాండ సినిమాల అప్పుడు ఎలా వున్నాడు? యిప్పుడు యిండస్ట్రీకే ‘మన్మధుడు’ కాలేదా? జూనియర్ ఎన్టీఆర్.. అల్లు అర్జున్.. ఫస్ట్ సినిమాలకి యెలావున్నారు? యిప్పుడు యెలావున్నారు? మహేష్ బాబులో యెంత మార్పు వచ్చింది? మరి రాం చరణ్ మాటేమిటి?” అని రాశావ్. నటిస్తూ నేర్చుకుంటాననీ రాశావ్. ఈ లోగా ప్రేక్షకులు అలవాటు పడతారనీ అన్నావ్. నీకు యేమి చూసి యీ మెడపోత్రమో నాకేమీ అర్థం కావడం లేదు!?

ఓరే.. పిచ్చనాకొడకా.. నీ నుండి మీ అమ్మానాన్నా ఆరోగ్యం పాడై పోయిందని మీ అక్క ఫోన్ చేసింది. నీ యెర్రికి మందు లేదంది. సిన్మా వోళ్ళంతా చదువు సరిగ్గా అబ్బక.. యిల్లోదిలి మద్రాసు బండి యెక్కిన వాళ్ళేనని గర్వంగా చెపుతున్నావట. ఏ అపరాత్రి అర్ధరాత్రి నువ్వు రైలు యెక్కేస్తావేమోనని అందరూ నువ్వు వుచ్చకి లెగిసినా దొడ్డికి లెగిసినా భయపడి చస్తున్నారట! చాలక భూమి అమ్మేయమని, ఆస్తి రాసి యిమ్మని నువ్వూ నీ ఫ్రెండు కలిసి ముందు సీరియల్ తరువాత సినిమా తీస్తారట. ఒరే పద్దుకుమాలినోడా.. యిక్కడ టీవీల్లో కూడా వీజీ కాదురా. ఆల్రెడీ- ఆర్కే డైరెక్టర్ రాఘవేంద్రరావు వాళ్ళదీ.. అర్కా వాళ్ళ అల్లుడిదీ.. అక్కినేని అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళదీ.. జయసుధ వాళ్ళదీ.. రాధిక వాళ్ళదీ.. మల్లె మాల మనవరాళ్ళదీ.. దత్తు కూతుళ్ళదీ.. మంచు లక్ష్మి వాళ్ళదీ.. క్రిష్ వాళ్ళ నాన్నగారిదీ.. తాజాలూ మాజీలూ అందరూ మఠం దిద్ది కూర్చున్నారురా.. ఒక్కో సీరియల్ వెయ్యీ రెండు వేల ఎపిసోడ్లు.. ఒకసారి వస్తే స్లాటు వదులుకోరు. నీవంతు వచ్చేసరికి నీకు సష్టి పూర్తి వయసు వొచ్చేస్తుంది. అంచేత చెప్పిన మాట విను.. భూమిని అమ్మి ఆస్తి లాక్కొని పీక్కొని వొచ్చి యిక్కడ వూడబోడిచింది యేమీలేదు!

నీ వేషాలు మానుకో.. ఇక్కడ హండ్రెడ్ పెర్సెంట్ రిజర్వు అయిపోయింది. నీ సామాజిక వర్గము అనబడు కులమునకు యిక్కడ తత్కాల్ సౌకర్యమూ లేదు. హీరో ఛాన్సు లేదు. రాదు. అందుకే మన సామాజిక వర్గపు హీరో వొక్కడూ లేడు! ఒక్కడూ రాడు! ఆ నలుగురి చేతిలో థియేటర్లు వున్నాయంటారు. నిజానికి అన్ని పాత్రలూ వేషాలూ విద్యలూ ఆ నాలుగు సామాజిక వర్గాల వాళ్ళదే!

ఇక్కడ రాణించాలంటే పట్టుదల, కష్టపడే గుణం, సాధన.. యివి వుంటే చాలవు. కులమూ ధనమూ బలగమనే బలమూ బ్యాకప్  వుండాలి. లేకపోతే ప్యాకప్పే! నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బ్యాటరీ బ్యాకప్ వున్నప్పుడే సెల్లు పనిచేస్తుంది అవునా?, అప్పుడు కూడా నీకు సిగ్నలింగ్ వ్యవస్థ బాగుండాలి! అన్ని వేళలా సపోర్ట్ చెయ్యాలి! అది కనెక్టింగ్ ది పీఆర్ కావాలి! వర్కౌట్ అవ్వాలి! అదృష్టం పాత మాట, టైమింగ్ కుదరాలి! నెలనెలా మీ యింటి నుండి డబ్బులు పంపుతూ వుండాలి! అప్పులు నాల్రోజులకి నాల్గు నెలలకి పుడతాయి, పోనీ నాలుగు సంవత్సరాల వరకు పుడతాయి! మరి పద్నాలుగు సంవత్సరాలకి పుడతాయా? పుట్టవు! పుట్టగతులు వుండవు!

అంతా అనుకోకుండా జరిగి అవకాశము రావాలి! ఆట ఆడాలి! ఇక్కడ ఆడకుండా ఓడిన వాళ్ళమే యెక్కువ! ఆడి.. బాగా ఆడి.. హిట్టు వస్తే నీ అంత పోటుగాడు లేడు. హిట్టు పక్కనే ఫ్లాప్ కూడా వున్నట్టే.. హిట్టు పక్కనే ఫ్లాప్ వొస్తుంది. వొచ్చిందా గొర్రె చచ్చింది. మళ్ళీ మన ముఖం యెవడూ చూడడు! ఈ లోపల పెద్ద చేపలు చిన్న చేపల్ని మింగేస్తాయి! మూటాముల్లె సర్దుకొని వెనక్కి వెళ్లి పోవడమే!

మరి కాదని మనలాంటి వాళ్ళం బతకడం యెలా అనా? మనకి యిక్కడ కొన్ని ఆల్రెడీ రిజర్వు చేసినవి వున్నాయి. హీరోని ఎలివేటు చెయ్యడానికి చక్రాలకింద టైర్లకింద హీరో చేతులకు బదులు మన చేతులు పెట్టడం, అగ్గిలోనుంచి నడిచే హీరో కాళ్ళకు బదులుగా మన కాళ్ళతో నడవడం, నదిలో సముద్రంలో మునిగిపోతున్న హీరోయిన్ని రక్షించడానికి హీరోకి బదులుగా మనం ఈదడం, ఫ్లైట్లోంచి విలన్ హీరోని తోసేస్తే గాల్లోంచి మనం కింద పడడం, రైల్లోంచి దూకడం, రైలెక్కి రన్నింగ్ చేయడం, పట్టాలపై పరిగెత్తడం వంటి పనులు అడపా దడపా మనకి దొరుకుతాయి. ఇందులో కొన్ని స్టంటు మాస్టార్లే చేసేస్తారు! తక్కువ బడ్జెట్ వున్నప్పుడు మనలాంటి వాళ్లకి అవకాశం వొస్తుంది. ఆ అవకాశం పంచుకుందాం రా..

ఇక్కడ రేపు లేదు! ఇవ్వాలైనా వుందో లేదో తెలీదు!

ఉంటా మరి! ఇండస్ట్రీని మార్చుదాము.. కొత్తనీరు ప్రవాహింప జేద్దాం అని వుంటే రా.. నే నేవడ్ని రావద్దని చెప్పడానికి. లోతు తెలిస్తే ఈత సులువవుతుందని యిదంతా రాసాను! వుంటా రా.. *

యిట్లు

నీ

థర్టీ యియర్స్ యిండస్ట్రీ గాడు.

 

 

అసమానతల్ని ఇంకా అర్థం చేసుకోవాలి:ఓల్గా

జనవరి 10 న అజో విభో వారి ప్రతిభా మూర్తి పురస్కారం అందుకుంటున్న సందర్భంగా..ఓల్గా తో ప్రత్యేక ముఖాముఖి

 వి. ప్రతిమ

~

 

స్త్రీవాద రాజకీయోద్యమాన్ని నిర్మించాలన్న ఆలోచనే ఆమె బలమూ బలహీనతా కూడ. రచయితగా, కార్యకర్తగా, నాయకురాలిగా, నిరంతర చలనశీలిగా ఆమెచేసిన అలుపెరగని పోరాటం తెలుగు  సాహిత్య ప్రపంచానికి చిరపరిచితం. స్పష్టమైన అవగాహనతో, నిశితమైన ప్రాపంచిక దృక్పథంతో, స్త్రీజన విముక్తి కోసం రచనను ఒక రాజకీయ చర్యగా, కార్యాచరణగా భావించి సుదీర్ఘమైన ప్రయాణం సాగించిన ఓల్గాకి ప్రతిభా వైజయంతి జీవితకాల సాధన పురస్కార సత్కారం జరుగుతోన్న శుభ సందర్భంలో ఆమెతో ఒక సన్నిహిత సంభాషణ.

 

  1. ఓల్గా రష్యాలో ఒక నదిపేరు కదా? మీకా పేరెలా వచ్చింది?

జ. వ్యక్తిగతం రాజకీయం కలగలిసిన జీవితం నాది. నా కలం  పేరు ఓల్గా అవటానికి కూడా వ్యక్తిగత, రాజకీయ కారణాలున్నాయి. ఓల్గా మా అక్కయ్య అసలు  పేరు. నాకంటే నాలుగేళ్ళు పెద్దది. మా నాన్నగారు ఆమెకా పేరు పెట్టారు. కారణం మా నాన్న కమ్యూనిస్టు కావటం. మా అక్క పుట్టినపుడు రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ నెదిరించి సోవియట్‌ యూనియన్‌లో వీరోచిత పోరాటం జరిపిన ‘ఓల్గా’ అనే రెడ్‌గార్డ్‌ మరణించిందనే వార్త వార్తా పత్రికల్లో రావటంతో మా నాన్న ఆమె జ్ఞాపకంగా మా అక్కకు ఆ పేరు పెట్టారు. మా అక్క నా పదహారో ఏట మరణించింది. అది మా కుటుంబానికి కోలుకోలేని విషాదం. నేను అప్పుడప్పుడే కవితలు  రాస్తున్నాను. మా అక్కయ్య కూడా కవిత్వం రాసేది. ఇద్దరం ఆ కవితలు  చదువుకుని ఆనందపడేవాళ్ళం. బతికివుంటే మా అక్క మంచి రచయిత్రి అయ్యేది. ఆ అక్కను రచయిత్రిగా బతికించాలనే ఆశతో నేను ఆమె పేరును కలం  పేరుగా చేసుకున్నాను. మా నాన్న రాజకీయ కారణంతో పెట్టిన పేరు వ్యక్తిగత కారణం చేత నా కలం  పేరయింది. ‘‘వ్యక్తిగతం కూడా రాజకీయమే’’ అన్నమాట నా కలం  పేరులో కూడా నిజమయింది.

  1. మీ పుట్టుక, బాల్యం , మీ నాన్నగారి గురించి చెప్పండి… ఆనాటికే స్త్రీవిద్య ప్రాముఖ్యతని గుర్తించి మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారనీ, స్వేచ్ఛ నిచ్చారనీ విన్నాను…

జ. నేను 1950వ సంవత్సరంలో నవంబర్‌ 27న పుట్టాను. మాది గుంటూరు దగ్గర యడ్లపాడు గ్రామం.. నాకు ఊహ వచ్చినప్పటి నుండీ గుంటూరులో పెరిగాను.  St. Joseph’s School లో 12వ తరగతి వరకు చదివి ఎ.సి. కాలేజీలో బి.ఎ. చదివాను.  ఎం.ఎ. పిజీ. సెంటర్   గుంటూరులోనే చదివాను. 1972 లో ఎం.ఎ. పూర్తి అయింది. 1973లో తెనాలి వి.యస్‌.ఆర్‌ కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరి 1985 వరకూ పనిచేశాను. మా నాన్నగారి గురించి ఎంత చెప్పినా నాకు తృప్తి కలగదు. అమ్మని గురించి కూడా. మా నాన్న  కమ్యూనిస్టుగా మంచి విలువలు  నేర్చు కున్నారు. కమ్యూనిస్టు పార్టీ నుంచి దూరమైనా కూడా జీవితాంతం ఆ విలువలను  పాటించారు. ఆ విలువలను  సాహిత్యరూపంలో ఎక్కువగా ఆయన నేర్చుకున్నారు అనిపిస్తుంది. మాకు కూడా ఆ సాహిత్యాన్ని, ఆ విలువలను  అందించారు. మేం సాహిత్య ప్రేమికులమవుతుంటే మనసారా ఆనందించారు . పిల్లలందరికీ  మంచి చదువు అందించాలనే తాను యడ్లపాడులో కట్టించిన హైస్కూలు ను, అక్కడ సర్పంచ్‌గా పనిచేసి ప్రజలతో పెంచుకున్న అనుబంధాన్ని ఒదులుకుని గుంటూరు వచ్చి మంచి స్కూళ్ళలో చేర్పించారు. మా నాన్న మాకు నాన్నగా, స్నేహితుడిగా, గురువుగా జీవితం గురించి ఎన్నో కోణాలను అర్థం చేయించారు. ఎన్నడూ మందలింపులైనా ఉండేవి కావు. నీతి బోధలు  అసలే లేవు. ఆట పాటలు, సంగీత సాహిత్యాలు , సినిమాలు , విహార యాత్రలు  స్నేహ పరిమళాలు  ` వీటితో నా బాల్యాన్ని నింపింది మా అమ్మా నాన్నలే. నాకు చాలామందికి లాగా పల్లెటూరి బాల్యం  లేదు. పల్లెటూరి జీవితం పెద్దయ్యాక దూరం నుంచి తప్ప దగ్గరగా తెలియదు. అది ఒక రకంగా లోటయినా, నా ఎదుగుదలకు అది తోడ్పడింది. .

స్వేచ్ఛ ఇచ్చారనీ, విద్య ప్రాముఖ్యం గుర్తించారనీ నాకు మొదట్లో తెలియదు. పదో తరగతిలో అగ్ర వర్ణాలకు, అగ్ర వర్గాలకు చెందిన నా స్నేహితులు , నాతోపాటు చదువుకునే వాళ్ళు పెళ్ళి చేసుకుని చదువు మానేస్తుంటే నాకు భయం వేసి మా నాన్నతో చెబితే ఆయన స్త్రీలు  చదివి ఉద్యోగం చేస్తూ అప్పుడు మాత్రమే పెళ్ళాడాలని, మన పాత సంప్రదాయాలను ఒదిలేయాలని తనకు తోచినట్లు చెప్పి మంచి పుస్తకాలు  నా చేతికిచ్చేవాడు. మా నాన్న చదివింది పదో తరగతే` కానీ ఆ రోజుల్లో పెద్ద పెద్ద డాక్టర్లు, ఉన్నతోద్యోగులు  కూడా పిల్లలకు  పదో తరగతిలో పన్నెండో తరగతిలో పెళ్ళి చేసేవారు. చదువు, డిగ్రీలు  వేరు, జ్ఞానం, చైతన్యం వేరు అని తెలిసి మా నాన్నను చూసి గర్వపడేదాన్ని. చదువు విషయమే కాదు. అప్పటికి గుంటూరులో దాదాపు మూడువేల మంది అమ్మాయిలు  కాలేజీ చదువులో ఉన్నారు. కానీ పట్టుమని పదిమందికి కూడా సమాజ పరిజ్ఞానం లేదు. రాజకీయ పరిజ్ఞానం లేదు. కాలేజీ పుస్తకాలు  తప్ప ఇతర పుస్తకాు చదివితే చెడిపోతారనే   కుటుంబ వాతావరణంలోనే ఉండేవారు. అలాంటి రోజుల్లో తన రాజకీయ నేపథ్యం వల్లనే  కావొచ్చు నా రాజకీయ ఆసక్తుల ను కూడా ప్రోత్సహించారు.

నేను విశాఖ ఉక్కు ఉద్యమం రోజు నుండీ వామపక్ష రాజకీయాల  పట్ల ఆసక్తిని పెంచుకున్నాను. స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో పనిచేయటం మొదలు పెట్టాను. అప్పటినుంచి ఫెమినిస్టు రాజకీయాల వరకు సాగిన నా రాజకీయ జీవితాన్ని మా నాన్న అర్థం చేసుకుని ప్రోత్సహించారు. నా ఫెమినిస్టు భావాల ప్రచారంతో ఆయన కూడా మారారు. డెబ్భై ఏళ్ళ వయసులో ఇంటి పనులలో తనవంతు పనులు  చేయటం మొదలుపెట్టారు. నిజంగా ప్రజాస్వామిక విలువలను  నమ్మిన మనిషి.

  1. మీ చదువు?…. చిన్నప్పుడే మీకు వామపక్ష భావాల పట్ల ఆసక్తి ఎలా ఏర్పడింది. అందుకు దోహదం చేసిన పరిస్థితులేమిటి?

జ. చిన్నప్పటి నుంచీ చదివిన సాహిత్యం ప్రధాన కారణం. పది పన్నెండేళ్ళ వయసులోనే రష్యా అనువాద సాహిత్యం చాలా చదివాను. శ్రీశ్రీ మహా ప్రస్థానం చదివాను. అదంతా అర్థం కాకపోయినా వామపక్ష భావాల పట్ల ఆసక్తి కలగటానికి కారణమయ్యాయి. నేను 12వ తరగతికి వచ్చేసరికి. S.F.I. చాలా చురుగ్గా పనిచేస్తోంది. ముఖ్యంగా గుంటూరులో చాలా మంచి విద్యార్థులుండేవారు. సమస్యలపై కదిలి సమ్మెలు, ప్రదర్శనలు చేసేవారు. ఆ విద్యార్థి నాయకులలో డా॥ చాగంటి భాస్కరరావు, డా॥ మల్లికార్జునుడు (శ్రీకాకుళ పోరాటంలో పాల్గొన్నారు. పోలీసులు  వారిని తూటాలతో కాల్చి చంపారు) వంటి వాళ్ళు వై.కె. వంటి నాయకులు  ఉండేవారు. అందరూ నక్జల్బార్  ప్రభావానికి లోనయ్యారు. అందరితోపాటు నేనూ ‘‘వసంతకాల మేఘ గర్జన’’ పిలుపుకు స్పందించాను. ఆనాటి రాజకీయ వాతావరణం అలాంటిది. సాహిత్యంలో కూడా దిగంబర కవుల ధిక్కార స్వరం అంతకు ముందటి కవుల కంటే భిన్నంగా వినిపించారు. గుంటూరులో నేనూ, దేవిప్రియ, సుగమ్‌ బాబు, కిరణ్‌బాబు, కమలాకాంత్‌ కలిసి పైగంబర కవులు  అనే పేరుతో కవిత్వం రాయటం మొదుపెట్టి రెండు సంకలనాలు  ప్రచురించాం. శ్రీశ్రీ షష్టిపూర్తి సభ విశాఖలో జరుగుతోందని తెలిసి నేనూ ప్రయాణ మయ్యాను. అక్కడి విద్యార్థుల కరపత్రాన్ని వేడి వేడిగా అందుకుని చదివాను. ఇంతలో విరసం ఏర్పడటం ` నిజంగా 67 నుంచి 70 వరకూ ఆ మూడు సంవత్సరాలు  చైతన్యంతో వెలిగిన సంవత్సరాలు.

  1. స్త్రీల జీవితాలలో తమకు తెలీకుండానే తమ మీద అమలవుతోన్న పెత్తనాలను మీరే క్రమంలో గుర్తించారు? ఉద్యమరూపంలో దాన్ని ఎదుర్కోవాలన్న చైతన్యం ఎలా కలిగింది?

జ. స్త్రీల మీద  పెత్తనం మనకు రోజు వారీ జీవితంలో అర్థమవుతూనే ఉంటుంది. మా ఇంట్లో వాతావరణంలో ఆ పెత్తనం లేదు గానీ నా చుట్టూ సమాజంలో అసమానత్వం ఎక్కడ చూస్తే అక్కడ కనపడుతూనే ఉండేది. దానిపట్ల నాకు కోపం వస్తూనే ఉండేది. దానికి తోడు చలం  రచనలు  స్త్రీల  అణచివేత ఎంత భయంకరంగా ఉందో చెబుతుండేవి. చలం , కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యం, గురజాడ కన్యాశుల్కం  నాటకం వీటన్నిటి ప్రభావం వల్ల  స్త్రీల  అణచివేత మీద నాకొక స్పష్టమైన అవగాహన ఉంది. వామపక్ష ఉద్యమాల  ద్వారా స్త్రీ పురుష సమానత్వం సాధించవచ్చనుకున్నాను. కానీ ఉద్యమాలలో కూడా పురుషాధిక్యత ఉండటం గమనించి నిరాశ చెందాను.

  1. 1970లో విరసం ఏర్పడి తొలి మహా సభలు జరిగినప్పుడే మీరు హాజరయ్యారని విన్నాను. అప్పటి మీ అనుభవాలేమిటి? ఆ తర్వాత విరసానికి ఎందుకు దూరమయ్యారు? జనసాహితి లోనూ ఇమడలేక పోయారు మీ కభ్యంతరం లేకపోతే చెప్పండి?

జ. శ్రీశ్రీ షష్టిపూర్తి సభ నుంచీ ఏదో జరుగుతుందని నమ్మకం కలిగింది. విరసం ఏర్పడగానే చాలా సంతోషించాను. ఖమ్మంలో జరిగిన మొదటి మహా సభకు వెళ్ళి మహా మహులందరినీ కలిసి, వాళ్ళతో గొంతు కలిపి నినాదాలిచ్చి ఊరేగింపులో పాల్గొనటం మర్చిపోలేని అనుభవం. అప్పుడు అందరిలో ఒకే భావన. విప్లవం వర్థిల్లాలి. సభ్యురాలినవుతానని శ్రీశ్రీ గారికి ఉత్తరం రాస్తే ఆయనిచ్చిన జవాబు పదిలంగా  ఇప్పటికీ దాచుకున్నా. విరసం సభ్యురాలిగా పని చేశా. విరసంలోంచి బైటికి రావటానికి రాజకీయ కారణాలు  ముఖ్యంగా పనిచేశాయి. విప్లవ పార్టీలో ఏర్పడిన గ్రూపు ప్రజా సంఘాలను కూడా చీల్చాయి. చాలా అనవసరం ప్రజా సంఘా చీలికలు . ‘అది తర్వాత తర్వాత అర్థమయింది. అప్పుడు నేను నాగిరెడ్డి గారి నాయకత్వంలోని సిద్ధాంతాలతో ఏకీభవించి పనిచేసేదాన్ని. విరసం చారు మజుందార్‌, కొండపల్లి సీతారామయ్యగార్ల నాయకత్వంలోని సిద్ధాంతాల ప్రచారం చేస్తున్నట్లు మాకనిపించేది. వాటిమీద చర్చలు  జరిగేవి. నిజానికి రచయితల సంఘం ఒక పార్టీ సిద్ధాంతాకు కట్టుబడి పనిచేయటం కుదిరే పనికాదు. సృజనాత్మకతకు   ఏదో ఒక సంకెల  వేసినట్లే ఉంటుంది. కానీ విద్యార్థి సంఘాలు , రచయిత సంఘాలు , పౌరహక్కు సంఘాలు  అన్నీ గ్రూపుల  వారీగా చీలిపోయాయి. ఆ నేపథ్యంలో నేను జన సాహితిలో చేరాను. కానీ అక్కడ కూడ సాహిత్య విషయాలలో రాజకీయ జోక్యం తప్పలేదు. చలం  గారు మరణించినపుడు మేము రచయితలుగా చేసిన తీర్మానం పట్ల పార్టీ వాళ్ళకు అభ్యంతరాలు . విమర్శలు , చలం  సాహిత్య విషయంలో వాళ్ళ అభిప్రాయాలు  వేరు. అక్కడ మొదలై చాలా విషయాలలో విభేదాలొచ్చాయి. ఈ మొత్తం క్రమంతో పురుషాధిపత్యం కూడా నాకు అనుభవమయింది. అసలు  ‘‘పురుషాధిపత్యం’’ అనే మాటనే అప్పట్లో ఒప్పుకునేవారు. స్త్రీల  సమస్యలు అణచివేత వీటి గురించి మాట్లాడితే ఉద్యమాల ను పక్కదారి పట్టించటమనీ, విప్లవం విజయవంత మైతే స్త్రీ పురుష సమానత్వం వస్తుందని నమ్మ మనేవారు. అది నేను నమ్మలేకపోయిను. సోవియట్‌ యూనియన్‌, చైనాలో విప్లవం వచ్చి దశాబ్దాు గడిచినా స్త్రీ పురుష సమానత్వం రాలేదని తెలుస్తూనే  ఉంది. వీటి గురించి చర్చించు కోవచ్చు. అభిప్రాయ బేధాలతోనే పనిచేయవచ్చు. కానీ వామపక్ష పార్టీలలో సంఘాలలో ఉన్న ఒక ప్రత్యేక క్షణమేమిటంటే నాయకత్వం చెప్పిన మాటతో విబేధిస్తే ఇక వారిని చాలా పరాయి వాళ్ళుగా చూస్తారు. దాదాపు వెలివేస్తారు. సంఘాలకు బైట సంప్రదాయివాదులతోనైనా స్నేహంగా ఉంటారు గానీ వీళ్ళను శత్రువుల్లా చూస్తారు. వారి వెనుక గ్రూపు కడతారు. వ్యతిరేక ప్రచారాలు  నడుపుతారు. చివరికి వారు ఆ సంఘంలో ఉండలేని పరిస్థితి కల్పిస్తారు. వెళ్ళిపోతారనుకున్నపుడు బహిష్కరించా మంటారు. రాజీనామా చేశామని వీళ్ళు, బహిష్కరించామని వాళ్ళు. పులి మేక ఆటలా సాగుతుంది. ఇంతా చేసి అవి విప్లవాన్ని అడ్డుకునేంత పెద్ద విబేధాలు  కూడా అయి ఉండవు. ఒక ప్రజాస్వామిక వాతావరణం లేకపోవటమే అనేకమంది రచయితలు  ఆ సంఘాల లోంచి బైటికి రావటానికి కారణం.

  1. ఆ రాజకీయం, సాహిత్య ఉద్యమాలోంచి స్త్రీ రచయితగా పరిణామం చెందే క్రమంలో మీరు ఎదుర్కున్న సంఘర్షణ, బాధ, రాజకీయ ప్రశ్నలు చివరగా సంతృప్తి వీటి గురించి ఏదయినా చెప్పగలరా?

జ. స్త్రీల  అణచివేత గురించి అధ్యయనం చేసే క్రమంలో నాకు చాలా తృప్తి కలిగింది. ఆయా సంఘాల నుంచి బైటికి వచ్చినపుడు నేను ఒంటరిని. స్త్రీ వాదమంటూ ఒక సమూహం లేదు. ఒంటరిగానే బయలుదేరాను. ఆ ఒంటరితనంలో కొంతకాలం  బాధపడటం సహజమే. కానీ స్త్రీవాద రాజకీయ ఉద్యమాన్ని నిర్మించాలనే ధ్యేయం నాకు చాలా బలాన్నిచ్చింది. అధ్యయనం, రచన, ఉపన్యాసాలు  వీటిని  సాధనాలుగా చేసుకున్నాను. స్త్రీ శక్తి సంఘటన (హైదరాబాద్‌) వారితో పరిచయం నాకు మరింత బలాన్నిచ్చింది. ‘‘అతడు ` ఆమె ` మనం’’ రచనతో మొదలయింది ఆ దిశగా నా ప్రయాణం. అంత వరకూ నేను రచనను సీరియస్‌గా తీసుకోలేదు. నా ముందు తరం రచయితలు  రాస్తున్నారు గదా, నేను మిగిలిన పనులు చేద్దాం అని కార్యకర్తగానే పనిచేస్తూ వచ్చాను. స్త్రీవాద ఉద్యమం నిర్మించాలంటే రచనలు  చాలా అవసరం. నేనే రచయితను,  కార్యకర్తను, నాయకురాలిని కావలిసివచ్చింది ఆ రోజుల్లో.

1985 లో హైదరాబాద్‌ వచ్చాక ఆ పరిస్థితి పోయింది. వరసగా నా నవలలు, సాహిత్య విమర్శ, సిద్ధాంత వ్యాసాలు, అనువాదాలు  రావటంతో ఒక చర్చ మొదలవటం. నా భావాలతో ఏకీభవించే వారితో స్నేహం. అన్వేషి బృందంతో, H.B.T.తో కలిసి పనిచేయటం వీటన్నిటితో చాలా బలం  వచ్చింది. ఫెమినిస్టు స్టడీ సర్కిల్‌ మూడేళ్ళపాటు నడిపాము. ప్రతినెలా ఆ సమావేశం, స్త్రీవాదం గురించి ఉపన్యాసాలు . వాటిని పుస్తకాలు గా తేవటం ఈ పనులన్నీ చేయటానికి అంత శక్తి ఎలా వచ్చిందో ఇప్పుడు తలచుకుంటే  ఆశ్చర్యంగా ఉంటుంది. పైగా ప్రతివారం తెలంగాణాలో ఏదో ఒక పట్టణంలో స్త్రీవాదం గురించి ఉపన్యాసాలు  ఏర్పాటు చేసి నన్ను పిలిచేవారు. తెలంగాణా  అంతా తిరిగాను. స్త్రీవాదం పై ఉన్న భ్రమను, అపోహలను, అపార్థాలను తొగించి ఒక సగౌరవ స్థానాన్ని కల్పించటంలో నా వంతు కృషి నేను చేశాను.

  1. స్త్రీల శరీరాల చుట్టూ అల్లుకుపోయిన అనేకానేక భ్రమలనీ, పితృస్వామ్యాన్ని బట్టబయలు చేస్తూ మీరు రాసిన రాజకీయ కథలు  తెలుగు  సాహిత్యరంగంలో ఒక గొప్ప మలుపు …. ఆ నేపథ్యం చెప్పండి?

జ. రాజకీయ కథల నేపథ్యం ప్రత్యేకంగా ఏమీలేదు. స్త్రీల  శరీరాల గురించి ఎన్నో తరాలుగా  పోగుపడి వున్న మిత్‌ను బద్దలు  కొట్టి శరీర రాజకీయాలను అర్థం చేసుకునే క్రమంలో రాసినవి. ఆ కాలం లో (85 నుంచి  90) ఆ కథలు రాయటం నాకు కష్టమే అయింది. కానీ ఆ పనిలో విజయం సాధించాను.

  1. తెలుగు సాహిత్యంలో పూర్వ రచయితలంతా అప్పటిదాకా స్త్రీలంటే శరీరాలుగా మాత్రమే చూసినా లేని అభ్యంతరం తమ శరీరాల  గురించి, శరీర ధర్మాల  గురించీ స్త్రీలు  మాట్లాడ్డం మొదలు పెట్టాక వారి కవిత్వం, నీలి కవిత్వమంటూ తీవ్రమైన దాడి జరిగింది కదా? ఆ విమర్శల్ని స్త్రీవాదులెలా అధిగమించగలిగారు?

జ. ఔను ` స్త్రీల శరీరాలు  వర్ణనీయ వస్తువు కవులకు. వర్ణనీయ వస్తువే తిరగబడి తనను తానే కొత్తగా నిర్వచించుకుంటాననే సరికి భయపడ్డారు. అందులో కవయిత్రులు  ఎంతో పదునుగా కవిత్వం తొణికిస లాడేలా రాశారు. అప్పటిదాకా వచనరచనకే పరిమిత మయ్యారు, కవితా రంగమంతా తమదే అని ధీమాగా ఉన్న కవుల పీఠాలు  కదిలాయి. అభద్రతతో దాడికి దిగారు. ఆ సమయంలో ‘అస్మిత’ చొరవ తీసుకుని రచయిత్రుందరినీ 1992 అక్టోబర్‌ 2న హైదరాబాద్‌లో సమావేశ పరచి రెండు రోజుల  సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో స్త్రీలు  ఎన్నో విషయాలు  చర్చించుకున్నారు.  అదొక చరిత్రాత్మక సమావేశం. భాష, వస్తువు, స్త్రీ పురుష భావ వ్యక్తీకరణలో భిన్నత్వం, దానికి సామాజిక అంగీకారం సాధించడం ఇలా ఎన్నో విషయాలు  మాట్లాడుకున్నారు. మా చర్చ సారాంశాన్ని ప్రెస్‌మీట్‌ పెట్టి పత్రికల కు విడుదల  చేశాం. ఒక సంవత్సరంలో స్త్రీవాద కవిత్వం సంకలనంగా తేవానుకున్నాం. 1993 అక్టోబర్‌ 3న ‘‘నీలిమేఘాలు ’’ నా సంపాదకత్వంలో వెలువడింది.  రావు బాలసరస్వతి గారు ఆవిష్కరించారు. ఆ సంకలనం ఈ శతాబ్దంలో వచ్చిన రెండవ ఉత్తమ కవితా సంకలనమని చేకూరి రామారావు గారి లాంటి విమర్శకులు  గుర్తించారు. అదంతా తల్చుకుంటే ఇప్పుడు కూడా చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుంది. ‘‘నీలిమేఘాలు ’’ కవితా సంకలనం తర్వాత స్త్రీ వాద కవిత్వానికి ఒక ఆమోదం దొరికింది సాహిత్య ప్రవచనంలోనూ, సమాజంలోను. ఆ కీలక పాత్రను ‘నీలిమేఘాలు ’ నిర్వహించింది.

9.‘స్వేచ్ఛ’ నవల వెలువడి  బహుమతి పొందినప్పు డయితే మీ మీద వ్యక్తిగతమైన దాడి జరిగింది… కొత్త తరం స్త్రీవాదులకీ, కొత్తతరం పాఠకులకీ విషయాలు  తెలిస్తే బావుంటుందనుకుంటే చెప్పండి?

జ.‘స్వేచ్ఛ’ నవల  స్త్రీల  పౌరసత్వాన్ని చర్చకు పెట్టిన మొదటి నవల . దాదాపు సంవత్సరం పాటు, ఇంకా ఎక్కువగానో రాష్ట్రంలో ప్రతి పట్టణంలో చర్చావేదికల్లో చర్చనీయాంశమైంది. అది చాలా మేలు  చేసింది. చర్చలో అనేక విషయాలు  స్పష్టమయ్యాయి. ఇక వ్యక్తిగతమైన దాడి అంటారా ` అసూయతో  ఒకరిద్దరు చేసిన చిల్లర పని. దానిని పట్టించుకోలేదు. దానివలన నా బలం  ఏమిటో, ధైర్య సాహసాలెలాంటివో నాకూ, నా చుట్టూ వారికి తెలిసి వచ్చింది. అలాగే నాకు చాలా మంచి మిత్రులు  దొరికారు. తప్ప, తాలు  లాంటి వాళ్ళు ఎగరిపోయి జీవితం ప్రశాంతమయింది. ఆ రోజుల్లో అదొక సంచలనం. రచయిత్రులు  లోక రీతికి భిన్నంగా జీవించినపుడు రాసినపుడు ఇలాంటివి తప్పవేమో. లలితాంబిక అంతర్జనం, రాజ్యలక్ష్మి వంటి మళయాళ రచయిత్రుల  జీవితాలు తెలుసుకున్నపుడు నే ఎదుర్కొన్న సంఘటన చాలా చిన్నదనిపించింది.

10.‘స్వేచ్ఛ అన్నది ఒక కఠోరమైన బాధ్యత’ అంటారు మీరు. ఆ బాధ్యత పట్ల స్త్రీలను చైతన్యవంతం  చేయడం కోసమే మీరు సాహిత్య రచన చేపట్టారు. మరి ఈ చిరంతన దీక్షలో, తపస్సులో మీరు కృతకృత్యులయ్యారనే అనుకుంటున్నారా?

జ.స్వేచ్ఛ గురించిన ఆలోచన, ఆచరణ సమాజంలో నిరంతరం సాగుతూనే ఉంటుంది. స్వేచ్ఛ తన సరిహద్దును విస్తరించుకుంటూ పోతూనే వుంటుంది. దానికి నిరంతర చైతన్య స్రవంతి వంటి సాహిత్యం అవసరం. దానిని ఏ కాలంలో ఆ కాలానికి తగినట్లు రాసే రచయితలు  వస్తూనే ఉంటారు. ఆ ప్రవాహంలో నేనూ ఒక బిందువును అంతే. కృతకృత్యు లవటం అనేది చిన్న చిన్న పనుల  గురించి చెప్పుకోవచ్చేమో గాని ‘స్వేచ్ఛ’ వంటి భావన కుదరదు. కొత్త అణచివేతను గుర్తిస్తూ దానినుంచి సేచ్ఛ పొందే మార్గాన్వేషణ నిరంతరం చేయాల్సిందే.  ఆ విషయాన్ని నేనా వ్యాసంలో చెప్పాను. ఆ తర్వాత 1992లో రచయితు స్త్రీ వాద కవిత్వం మీద దాడిచేసి ఆ కవయిత్రులను నియంత్రించాలని చూశారు. అప్పుడు అందరం కలిసి ఆ దాడిని ఎదుర్కొన్నాం. ఆ తర్వాత 1997 ` 98 నుంచి పదకొండు భారతీయ భాషలలో రచయిత్రులతో సమావేశాలు  ఏర్పాటు చేసి వారిపై అమయ్యే సామాజిక, కుటుంబ, స్వీయ నియంత్రణ గురించి వర్క్‌షాపులను నిర్వహించాం. ఎన్నో విషయాలు  ఆ రచయిత్రులు  మాతో పంచుకున్నారు. వాటి సారాంశాన్ని పుస్తకాలుగా ఆంగ్లంలో ప్రచురించాం. తెలుగు లో  ‘అక్షర యుద్ధాలు ’ అనే పేరుతో మంచి పుస్తకం అనువాదం చేశాను. అది పై వర్కుషాపు సారాంశమే. దీన్నుంచి రచయిత్రులు  నేర్చుకోడానికి ఎంతైనా వుంది. అనేక కంట్రోళ్ల నుంచి మనం రచయిత్రులం  స్వేచ్ఛ పొందాల్సి వుంది. ముఖ్యంగా మన సహ రచయితల  దాడునుంచి, గురుత్వాల  నుంచి! గురుత్వం అంటే మనల్ని ప్రోత్సహిస్తున్నట్లు, మన రచనలని సరిదిద్దుతున్నట్లు, మనల్ని మరింత మెరుగైన రచయిత్రులుగా తీర్చిదిద్దుతామంటూ వచ్చే వారినుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. వారి ప్రోత్సాహంతో ఒక కంట్రోలు  వుంటుంది. మనకి తెలిసే లోపలే మనం వారి ఆధిపత్యంలోకి వెళ్తాం. మనదైన స్వరం మనకి లేకుండా పోతుంది. దీని గురించి గుజరాతీ రచయిత్రి ‘సరూప్‌ధ్రువ్‌’ చెప్పిన విషయాలు  అందరూ తెలుసుకోవాల్సినవి. ఇలా రకరకాల  సెన్సార్‌ షిప్‌లకు మనం తెలిసీ తెలియక కూడా గురవుతూంటాం. అందుకే ఈ విషయం మీద శ్రద్ధపెట్టి దాదాపు అయిదేళ్ళు పనిచేశాను.

  1. స్త్రీల అస్తిత్వ మూలాలను వెతుక్కుంటూ చైతన్యవంతమై, శక్తివంతంగా నిటారుగా నడిచే క్రమంలో మార్కెట్టు సమాజాన్ని కబళించి, వారిని సరుకుగా మార్చివేసింది. డెబ్భయ్యయిదు శాతం నిచ్చెన ఎక్కాక  పాము నోట్లో పడ్డట్టయింది కదా… మరి ఈ సందర్భాన్ని ఎలా అధిగమించాలి. ?

జ. మార్కెట్‌ ఇవాళ వెయ్యితలల  రాక్షసిలా మారింది గానీ ఎప్పుడూ ఉంటూనే ఉంది. దాని గురించి సాహిత్యం కూడా వస్తూనే ఉంది. ‘సరుకు ఆరాధన’ మార్క్స్‌ మాటే` అది ప్రపంచీకరణ నేపథ్యంలో మరింత అమానుషమైంది. రచయితలుగా మనం ఆ అమానుషత్వాన్ని విప్పి చెబుతూ మానవీయ విలువలను  ప్రతిపాదిస్తూ రచనలను చేయటమే.

  1. పురాణాలను, ముఖ్యంగా రామాయణంలోని కొన్ని సందర్భాలను మన పూర్వ రచయితలు తిరగరాసి పాఠకులకో కొత్త దృష్టినిచ్చారు. మీరు యింకా ముందుకెళ్ళి అందులోని స్త్రీ పాత్రలను ఈ కాలపు సందర్భాలకు తగినట్లుగా మలచి ‘విముక్త’ని అందించారు కదా? అప్పటివరకూ ప్రజల జీవితా లలో కలగలిసి, జీర్ణించుకుపోయిన ఇతిహాసాల్లోన్ని వాదానికి ప్రతివాదం చేయాన్న ఆలోచన ఎలా కలిగింది? సాహసం కదా?

జ. పురాణాలను తిరగరాసే పని త్రిపురనేని రామస్వామి చౌదరి గారే మొదలు పెట్టారు. చలం , కొ.కు వంటి వారు ఆ దారిలో నడిచారు. సాహసం నాది కాదు, వాళ్ళది. ఐతే నా మార్గం భిన్నం. అందువల్లనే ఆ కథలకు ఎంతో ఆమోదం దొరికింది. నాకెంతో తృప్తి కలిగింది. స్త్రీల మధ్య పరస్పర సహకారం నాకు ప్రియమైన భావన. దానిని ‘విముక్త’ కథలో చాలా సమర్థవంతంగా నిర్వహించాననే అనుకుంటున్నా.  ‘పురాణాలోని పాత్రలను ఎగతాళి చేయటం, కించపరచటం కాకుండా వారి జీవితగమనంలోని ఆటుపోట్లని, పరస్పర మానవ సంబంధాలలోని ఆ కాలపు విలువలను  గమనంలో ఉంచుకుని రాయటం వల్ల  నేనాశించిన ప్రయోజనం నెర వేరింది.

  1. సహజంగానే పునరుత్పత్తి శక్తి కలిగిన స్త్రీ… సమాజాలు , జాతుల అభివృద్ధికి దోహదం చేస్తున్నది కదా? మరి స్త్రీల కు ఆ పునరుత్పత్తి హక్కు కూడా లేకుండా చేయడం, పుట్టిన బిడ్డలు తండ్రికి చెందడం, ఈ పునరుత్పత్తి విధులను చూపించి స్త్రీలను ఉత్పత్తి ప్రక్రియనుండి దూరం చేయడం వల్ల  ఏర్పడిన తారతమ్యాలు … వీటన్నిటి గురించి మీరు చాలా మాట్లాడారు. ఈ పాఠకులకు కూడా మీరు కొంత చెప్పండి….

జ. ఉత్పత్తి సమాజ మనుగడకు ఎంత ముఖ్యమో పునరుత్పత్తి అంత ముఖ్యం. దానిలో కీలక పాత్ర స్త్రీది. అక్కడ వారి శ్రమకు విలువ, , గుర్తింపు, గౌరవం దొరకాలి. ప్రస్తుతం అవి లేవు. మాతృమూర్తి, దేవత అని కితాబునిచ్చి ఊరుకుంటారు. ఉత్పత్తిలో రైతు ప్రస్తుత పరిస్థితి వంటిదే పునరుత్పత్తిలో స్త్రీ పరిస్థితి. దాని గురించి ఇంకా ఎంతో సాహిత్యం రావాలి.

  1. స్త్రీలు రాస్తున్నపుడు స్వయం నియంత్రణ, అంటే సెల్ఫ్‌ సెన్సార్‌షిప్‌ వుంటుంది… ఏది రాసినా వారి వ్యక్తిగత జీవితాలతో ముడిపెట్టి చర్చల్లోకి లాగుతారు. అదే పురుషుల విషయంలో అయితే వ్యక్తిగతాన్నే రాసినా రచనగా చెలామణి అయిపోతుంది… రచన అన్నది రచయిత్రులకి ప్రాణావసరం… దీనిమీద మీరు చాలాపని చేశారు. కొంచెం చెప్పండి…

జ. స్త్రీల  సాహిత్యం`సెన్సార్‌షిప్‌ గురించి నేను 1990 లోనే ఒక వ్యాసం రాశాను. భావ కవిత్వంలో రచయిత్రులు  కనిపించక పోవటానికి కారణం, సామాజిక, స్వీయ సెన్సార్‌ షిప్పే. ఆ విషయాన్ని నేనా వ్యాసంలో చెప్పాను. ఆ తర్వాత 1992లో రచయితులు  స్త్రీవాద కవిత్వం మీద దాడిచేసి ఆ కవయిత్రులను నియంత్రించాలని చూశారు.  అప్పుడు అందరం కలిసి ఆ దాడిని ఎదుర్కొన్నాం. ఆ తర్వాత 1997-98 నుంచి పదకొండు భారతీయ భాషలలో రచయిత్రులతో సమావేశాలు  ఏర్పాటుచేసి వారిపై అమలయ్యే సామాజిక, కుటుంబ, స్వీయ నియంత్రణ గురించి వర్క్‌షాపును నిర్వహించాం.

ఎన్నో విషయాలు  ఆ రచయిత్రులు   మాతో పంచుకున్నారు. వాటి సారాంశాన్ని పుస్తకాలుగా ఆంగ్లంలో ప్రచురించాం. తెలుగులో ‘అక్షర యుద్ధాలు ’ అనే పేరుతో మంచి పుస్తకం అనువాదం చేశాను. అది పై వర్కుషాపు సారాంశమే. దీన్నుంచి రచయిత్రులు  నేర్చుకోడానికి ఎంతైనా వుంది. స్వేచ్ఛ పొందాల్సి వుంది. ముఖ్యంగా మన సహ రచయితల  దాడుల  నుంచి, గురుత్వా నుంచి! గురుత్వం అంటే మనల్ని ప్రోత్సహిస్తున్నట్లు, మన రచనని సరిదిద్దు తున్నట్లు, మనల్ని మరింత మెరుగైన రచయిత్రుగా తీర్చిదిద్దుతామంటూ వచ్చేవారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. వారి ప్రోత్సహంలో ఒక కంట్రోలు  వుంటుంది. మనకి తెలిసే లోపలే మనం వారి ఆధిపత్యంలోకి వెళ్తాం. మనదైన స్వరం మనకి లేకుండా పోతుంది. దీని గురించి గుజరాతీ  రచయిత్రి ‘సరూప్‌ ధ్రువ్‌’ చెప్పినవి   అందరూ తెలుసుకోవాల్సినవి. ఇలా రకరకాల సెన్సార్‌షిప్‌కు మనం తెలిసీ తెలియక కూడా గురవుతూంటాం. అందుకే ఈ విషయం మీద శ్రద్ధ పెట్టి దాదాపు 5 సంవత్సరాలు  పని చేశాను.

  1. మీ నృత్యరూపకాల గురించి, స్త్రీవాద కోణంలో వాటినెలా రూపొందించారు?

జ. సంప్రదాయ సంగీత నృత్యాల ను ఆధునిక భావాలు  చెప్పటానికి ఉపయోగించాలనే ఆలోచన నాకు చాలా రోజు ల నుంచీ ఉంది. యక్షగానాలనూ, నృత్య రూపకాలనూ మనం నిర్లక్ష్యం చేయగూడదనీ, ఆ ప్రక్రియల్లో కేవలం  పురాణ కథలు  భక్తి గాథలే కాక వర్తమాన కథలు , సమస్యలూ  చిత్రించి ప్రజలకు రసానుభూతితోపాటు కొత్త ఆలోచనలను  కూడా అందించవచ్చని నా అభిప్రాయం. 2000 సం॥లో ‘‘యుద్ధము `శాంతి’’ అనే నృత్య రూపకం రాశాను. ఇండియన్‌ అసోసియేషన్‌ ఫర్‌  విమెన్స్‌ స్టడీస్‌. జాతీయ సదస్సు హైదరాబాదులో ఆ సంవత్సరం జరగటంతో ఆ సదస్సులో ప్రదర్శించాం. మంచి స్పందనే వచ్చింది. ఆ ప్రదర్శనకు ప్రముఖ నాట్య గురువు శ్రీమతి ఉమారామారావు గారు నృత్య దర్శకత్వం వహించారు. రెండేళ్ళు ఆ నృత్య రూపకం ఆంధ్రప్రదేశ్‌ లోని ముఖ్యపట్టణాల్లో, డిల్లీ , జయపూర్‌, త్రివేండ్రం వంటి భారతీయ నగరాల్లో ప్రదర్శించాం. ఆ తర్వాత ప్రసిద్ధ కూచిపూడి నృత్య విద్వాంసులు  శ్రీ భాగవతుల  సేతురాం గారు దర్శకత్వ బాధ్యతలు  తీసుకున్నారు! ఆ నృత్య రూపకం దాదాపు వంద ప్రదర్శనలు  ఇచ్చాం. అందులో సీత, శూర్పణఖ, ద్రౌపది, మాధవి వంటి పురాణ పాత్రలతో పాటు దేశ విభజన ఘట్టంలో  హింసకు గురైన స్త్రీల కథ ప్రముఖంగా ఉంటుంది. ఇతి హాసాలలో స్త్రీలు  నలుగురూ కలిసి ‘‘అనాదిగా స్త్రీ శరీరం పిత్రుస్వామ్య సంఘర్షణ రంగస్థలం , చరిత్రలో ప్రతి సమరం నారీ శరీరోపరిత నిర్మితమని తేల్చి చెప్పిన తర్వాత ఆధునిక కాలం  మనందరికీ తెలిసిన వాస్తవ సంఘటన దేశ విభజన ఘట్టాన్ని తీసుకున్నాను. ఆ సంఘటన అందరికీ.. తెలిసినదనుకుంటాం గానీ తెలియని విషయాలు  ఎన్నో ఉన్నాయి.

ప్రతి సమరం నారీ శరీరోపరిత నిర్మితమనీ’’ చెప్పిన తరువాత ఆధునిక కాలానికి వచ్చాను. మనదేశంలో దేశ విభజన సమయంలో, ఉత్తర భారతదేశంలో, సరిహద్దు రాష్ట్రాలో జరిగిన మతకల్లోలాలలో స్త్రీ జీవితాలు  నాశనమైన ఘట్టాన్ని తీసుకున్నాను. దేశ విభజన జరిగినపుడు హిందూ స్త్రీలను ముస్లిములు , ముస్లిం స్త్రీలను హిందువులూ ఎత్తుకెళ్ళారు. స్త్రీల  మీద అత్యాచారాలు  చేశారు. తమ స్త్రీలు  అత్యాచారాలకు గురవుతారనే భయంతో పురుషులు తమ భార్యలను, అక్కచెల్లెళ్ళను, తల్లులను  తామే చంపేశారు. స్త్రీల  శరీరాలు  అత్యాచారానికి గురైతే తమ వంశపు పరువు మర్యాదలు , పవిత్రత మట్టిలో కలుస్తాయనే భయంతో తమ స్త్రీల  ప్రాణాలే తీశారు వారు. అపహరణకు గురైన ఇరు దేశాల  స్త్రీలూ  దేశంకాని దేశంలో ఎన్ని అగచాట్లో పడ్డారు. తిండికీ బట్టకూ ముఖం వాచారు. జీవన పోరాటంలో అందిన ఆసరాతో నిలబడ్డారు. కొన్నిసార్లు తమని ఎత్తుకెళ్ళిన వాళ్ళతోనే జీవితం సాగించారు. ఆశ్రయ మిచ్చిన వారితోనే జీవితం పంచుకున్నారు. పెళ్ళి చేసుకున్నారు. పిల్లల్ని  కన్నారు. ఇంత జరిగాక, ఇంతకాలం  గడిచాక ప్రభుత్వాలు పౌరుషాలతో మేల్కొన్నాయి. తమ దేశాల  స్త్రీలను వెనక్కు పిలిపించు కునే పనిని చేపట్టాయి. కుదురు తెచ్చుకున్న జీవితాలను మళ్ళీ కూకటి వేళ్ళతో పెళ్ళగించ బూనుకున్నారు. స్త్రీలు  రామని మొత్తుకున్నా, ఎలాగోలా బతుకుతున్న తమని మరొకసారి పెళ్ళగించ వద్దని ప్రార్థించినా వినకుండా స్త్రీల  మార్పిడీ కార్యక్రమాన్ని అమలు  జరిపారు. స్త్రీలు  కన్న బిడ్డల్ని ఒదిలి, వివాహమాడిన వారిని ఒదలి, ఆ కుటుంబాల ను ఒదిలి వెళ్ళాల్సి వచ్చింది. తమను ఎత్తుకెళ్ళిన వారి మతాన్ని స్వీకరించాల్సి వచ్చిన ఆ స్త్రీలు , తిరిగి వెళ్ళాంటే తమది ఏమతం అనే ప్రశ్న, తమ పిల్లలది  ఏ జాతి అనే ప్రశ్న ఎదుర్కొన్నారు. ఆ ప్రశ్నకు సమాధానం లేదు.

మాతృదేశానికి తిరిగి వచ్చినందుకు సంతోషిద్దా మంటే వారి కుటుంబాలు  వారిని స్వీకరించలేదు. ఇన్నేళ్ళు వేరే దేశంలో ఉండి, వేరే మతస్థుడిని వివాహమాడి, ఆ మతం స్వీకరించి, అక్కడే పిల్లల్ని  కని వచ్చిన స్త్రీలను  కుటుంబాలు  ఆదరిస్తాయా? ఆ స్త్రీలు  ఒంటరిగా ప్రభుత్వం ఏర్పరచిన శరణాలయాల్లో జీవితం వెళ్ళబుచ్చాల్సివచ్చింది. తమ కంటూ ఎవరూ లేని మోడు బతుకు బతకాల్సి వచ్చింది. వారిలో కొందరు ఇంకా బతికే ఉన్నారు. దేశ విభజన ఘట్టాన్ని వివరంగా చిత్రించిన తర్వాత, ప్రస్తుతం యుద్ధోన్మాదంలో కొట్టుకుపోతున్న ప్రపంచ దృశ్యాన్ని ‘స్థూలం’గా చూపి, శాంతి ఆవశ్యకతనును తెలిపే నృత్యాలతో ముగించాను.

ఈ రూపకంలో ‘రఘుపతి రాఘవ’ రెండవ నృత్య రూపకం లక్ష్మణరేఖ. కుటుంబ హింస గురించిన సారాంశంతో ఉంటుంది. అంబ పరాకుతో మొదవుతుంది కానీ అంబగా స్తుతించిన వాళ్ళందరూ భారతాంబకు కీర్తి తెచ్చిన పుత్రికలు  సావిత్రిబాయి ఫూలే, దుర్గాబాయి నుంచీ సువార్తమ్మ, అలీసమ్మ వరకూ అందరి స్తుతీ ఉంటుంది. తర్వాత గాంధారి, ఊర్మిళ, రేణుక మనసులు  చదివి ఆధునిక స్త్రీ కలలు, ఆశలు  – అవి విఫమయ్యే తీరు, పిత్రుస్వామ్య కుటుంబాధిపత్యం వీటన్నిటినీ చెప్పి ఇన్ని అవరోధాలున్నా స్త్రీలు  ముందడుగువేస్తున్న తీరుపై ఆశావహ దృక్పథం కల్పించి ముగింపు ఇచ్చాను. దశావతారం దరువులో స్త్రీలు  వివిధ రంగాలో రాణిస్తున్న తీరు చెప్పే ప్రయత్నం చేసి సఫలమైనందుకు గర్వపడ్డాను. ఈ రూపకం 2004 నుంచి ఇప్పటి వరకూ కొన్ని వంద ప్రదర్శనలు  జరుపుకుంది. దేశమంతటా, శ్రీలంకలో కూడా ప్రదర్శించాము.

16.మీ సినిమాలు , టి.వి.సీరియల్స్‌ ముఖ్యంగా ‘కన్నీటి కెరటాల  వెన్నెల ’లో ప్రపంచ ప్రసిద్ధ సినిమా నెన్నింటినో  పరిచయం చేసిన ఘనత మీది… ఆ నవలా నేపథ్యమేమిటి? సినిమాకి, సీరియల్స్‌కీ స్క్రిప్ట్‌, సంభాషణలు  రాయడం అంత అలవోకగా  ఎలా అలవాటయ్యింది?

జ.నేను 1986లో పూనా ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళి ఫిలిం అప్రిసియేషన్‌ కోర్స్‌ చేశాను. ఆ కోర్సులో భాగంగా ప్రపంచ ప్రసిద్ధ సినిమాలు , సినిమా చరిత్ర, అనేక సాంకేతిక విషయాల  గురించి నేర్చుకున్నాను. ప్రతిరోజూ రాత్రి ఆ రోజు నేను చూసిన, నేర్చుకున్న విషయాలన్నింటిని కుటుంబరావుకి ఉత్తరం రాసేదాన్ని. ఆ కోర్సు ముగించి వచ్చాక కుటుంబ రావు ఆ ఉత్తరాలన్నీ నా ముందు పెట్టి ‘‘నవలగా రాస్తే బాగుంటుందేమో. ఆలోచించ’’ మన్నాడు. నేను నా పద్ధతిలో దాన్నొక నవలగా రాశాను. ఆ తర్వాత కొద్ది నెలలకే ‘ఉషాకిరణ్‌ మూవీస్‌’ కథా విభాగం నిర్వాహకురాలిగా చేరాను. దాదాపు 10 సం॥ ఆ సంస్థలో పనిచేశాను. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు వెళ్ళి మరిన్ని గొప్ప సినిమాలు  చూశాను. ఎన్నో స్క్రిప్టులు  చదవడం, రచయితలతో, దర్శకులతో చర్చించడం, మార్పు, చేర్పులు చెయ్యటం యివన్నీ నా ఉద్యోగంలో భాగం. ఇదంతా తర్వాతికాలం లో నేను సినిమా, టీవీ లకు రాసేటప్పుడు ఉపయోగ పడిరది. చాలా మెళకువలు  నేర్చుకున్నాను.

  1. ఆ నవలలో ‘ఇప్పటి మన సాహిత్యం మనరాష్ట్రంలో ఫాసిస్ట్‌ సమాజాన్ని యాంటిసిపేట్‌ చేసింది’ అన్పించారో పాత్రచేత… మరి ఇన్నేళ్ళ తరువాత భావస్వేచ్ఛని హరిస్తూ రచయిత మీద భౌతిక దాడులు ….. తినే తిండిమీద నిర్భంధం, అవార్డు తిరస్కరణ… వీటి గురించి మీరేమనుకుంటున్నారు?

జ. ఇప్పుడు దేశమంతా ఫాసిస్టు పాలనలో ఉందనిపిస్తోంది. ఈ అసహన పూరితమైన, ద్వేషాన్ని రగిలించే వాతావరణాన్ని బాగుచేసుకోవటానికి, శాంతి సామరస్యాలను జీవన విధానంలో భాగం చేసుకోవటానికి రచయితలు , మేధావులు  ఎవరికి తోచిన, ఇష్టమైన మార్గంలో, వారు పని చేయాల్సి ఉంది. భావ ప్రకటనా స్వేచ్ఛ రచయితకు ఊపిరి. దానిని ప్రభుత్వాలే కాదు, వీధి గుంపులు  కూడా హరిస్తున్నాయి. దీనిపట్ల అందరం అప్రమత్తంగా ఉండాలి.

  1. అస్మితతో మీ అనుబంధం గురించి చెప్తారా?

జ: అనుబంధం అనేది సరైనమాట కాదేమో. అస్మిత, నేను వేరు కాదు. గత పాతికేళ్ళుగా అస్మిత  వ్యవస్థాపక సభ్యురాలిని. అధ్యక్షురాలిని. అస్మిత కిప్పుడు పాతికేళ్ళ వయసు. పాతికేళ్ళ క్రితం వరకూ మేము అంటే నేను, వసంత్‌ కన్నబిరాన్‌, కల్పన  కన్నబిరాన్‌ తదితర మిత్రులం  అటానమస్‌ సంఘాలలో పనిచేస్తుండేవాళ్ళం. నేను 1987 నుంచి హైదరాబాదులో ఫెమినిస్టు స్టడీ సర్కిల్‌ నిర్వహించాను స్నేహితులతో కలిసి. డౌరీ డెత్‌ కమిటి ఉండేది. స్త్రీ శక్తి సంఘటన ఇంక చిన్న చిన్న సంఘాలుండేవి. మేమంతా వేరే వేరే ఉద్యోగాలు  జీవిక కోసం చేస్తూ, ఆ డబ్బు, ఆ ఉద్యోగాలకు పోగా మిగిలిన సమయం, శలవుదినాలు  మాత్రమే మాకు నిజమైన ఆసక్తి ఉన్న రంగంలో పనిచేయగలిగే వాళ్ళం. మాకు ఉన్న శక్తి అంతా స్త్రీ ఉద్యమానికి పెట్టాలని ఉన్నా కుదిరేది కాదు. ఏదైనా అత్యవసరమైన పని ఉన్నపుడే అందరం కలవగలిగేవాళ్ళం. నిజంగా సమస్య వచ్చినపుడు కొందరికి శలవు దొరక్క, డబ్బుకి ఇబ్బందై, చాలా కష్టాలు  పడేవాళ్ళం. కానీ చాలా ఇష్టంగా ఆ కష్టాలను స్వీకరించేవాళ్ళం. వాటిని చూసి నవ్వుకునే వాళ్ళం. అంతవరకూ బాగానే ఉంది గానీ మా తర్వాతి తరం ఇలా పనిచేసే వాతావరణం కనిపించటంలేదు. సమస్యులున్న స్త్రీలు  మా దగ్గరకు రావటానికి మాకు మా ఇల్లు  తప్ప వేరే చోటు, ఒక కార్యాయం అంటూ లేదు. వీటన్నిటితో ఒక  సంస్థను ఏర్పాటు చేసుకుని, దానికి నిధులు  సమకూర్చుకుని, మేము, ఇంకా ఆసక్తి ఉన్నవాళ్ళు పూర్తికాలం  ఆ సంస్థ ద్వారా మా ఆశయాల  కోసం పనిచేయవచ్చు గదా అనే ఆలోచనవచ్చింది. నిధులంటే ప్రభుత్వ, ప్రభుత్వేతర విదేశీ సంస్థల   నుంచి తీసుకోవాలి. దానిమీద చాలా చర్చ జరిగిన తర్వాత` మా ఆశయాలతో ఏకీభావం ఉండి మమ్మల్ని స్వతంత్రంగా పనిచేసుకోనిచ్చే సంస్థలు  ఏవైనా వాటినుండి ఆర్థిక సహాయం తీసుకుంటే దానివల్ల  హాని లేదనుకున్నాం. 1991లో అస్మిత ప్రారంభించాం. ఎన్జీవో గురించి సమాజంలో, ముఖ్యంగా వామపక్ష పార్టీలలో, విప్లవోద్యమంలో అంటరానితనం, వెలి వంటివి ఉన్నాయి. దానిని భరించటం, విదేశీ నిధులు , విలాస జీవితాలు  అని తెలియకుండా మాట్లాడే మాటలు , అనేక నిందలు  భరించాం. కానీ ఎంతపని చేయగలిగామో చూసుకుంటే అవన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయి. మా ఆశయాలకొక చోటు, మా సృజనాత్మక  శక్తును వెలికి తీసుకురావటానికి కావసిన సమయం, పదిమంది కలిసి పనిచేయటం ఎలాగో నేర్చుకునే వీలు -ముఖ్యంగా ఆపదలో అపాయంలో ఉన్న స్త్రీలు  వెంటనే వచ్చి ఓదార్పునీ సహాయాన్ని పొందటానికి ఒకచోటు కల్పించగలగటం- ఇలా ఎన్నో ప్రయోజనాలి . అన్నిటికంటే గ్రామీణ స్త్రీలతో నేరుగా మాట్లాడి వాళ్ళకు వారి కుటుంబ సమస్యల  లోని రాజకీయాల నుండి, అంతర్జాతీయ రాజకీయాల  వరకూ అన్నీ తేలిక భాషలో అర్థమయ్యేలా చెప్పగలిగే అవకాశం అస్మిత వల్ల  కలిగింది. ‘జాతర’ అనే రూపంలో పాటు, స్ట్రీట్‌ ప్లేస్‌, స్త్రీలకు అవసర మయ్యే చట్టపరమైన, హక్కు, ఆరోగ్యపరమైన చిన్న పుస్తకాల  ద్వారా గ్రామాల కు వెళ్ళి వేలాది స్త్రీల ను కలిశాం.  గ్రామీణ మహిళా సంఘాల తో నెట్‌వర్కింగ్‌ చేసి అనేక విషయాలు  వాళ్ళకు బోధించాం. ‘దళిత మహిళా నాయకత్వానికి తోడ్పాటునందించాం. ఇక రచయిత్రుల తో కలిసి పనిచేశాం. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ‘‘సెన్సార్‌షిప్‌ ` విమెన్‌ రైటింగ్‌’’ గురించి పనిచేశాం. ‘‘మహిళావరణం’’ ` ఆంధ్రదేశ చరిత్రను నిర్మించిన స్త్రీల  గురించి పరిశోధించి గొప్ప పుస్తకం తెచ్చాం. కూచిపూడి భరతనాట్యం వంటి సంప్రదాయ రూపాల లో  ఆధునిక భావాలు చెబుతూ, స్త్రీల పై హింస గురించి మాట్లాడుతూ ఆ రూపాలు  నభిమానించే వారికి  కూడా ఆలోచించేందుకు మా భావాల  నందించాం. స్త్రీల  హక్కు గురించి మొదలైన అస్మిత   వికలాంగు ట్రాన్స్‌ జండర్‌ హక్కు గురించి పనిచేసే వరకూ విస్తరించింది. వసంత్‌ కన్నబిరాన్‌, నేను, కల్పనా  కన్నబిరాన్‌ ముగ్గురం కలిసి పాతి కేళ్ళు పనిచేయగలిగాం. ముగ్గురం స్నేహంగా ఒకరి బలాల  నుంచి ఒకరం నేర్చుకుంటూ, ఒకరి బలహీనత నొకరం అర్థం చేసుకుంటూ ఎదిగామనుకుంటున్నాను. మా ముగ్గురి స్నేహం మాకు ఎంతో అపురూపం. అమూల్యం .

  1. మీరు చాలా దేశాలు పర్యటించారని అనుకుంటాను.

జ: అన్నీ పనిలో భాగంగానే 1995లో బీజింగ్‌లో నాల్గవ  ప్రపంచ మహిళా సదస్సుకి ప్రతినిధిగా వెళ్ళాను. 2000 సం॥లో బీజింగ్‌ G 5 న్యూయార్క్‌లో యు.ఎన్‌. కార్యాయంలో జరిగింది. దానిలో ప్రతినిధిగా పాల్గొనటం మంచి అనుభవం. యు.ఎన్‌. తో కలిసి బీజింగ్‌ నిర్ణయాలను దక్షిణాసియా గ్రామీణ మహిళకు అందించే పనిలో దక్షిణ భారతదేశ బాధ్యతను తీసుకుని పనిచేశాను. ఆ పనిలో భాగంగా బంగ్లాదేశ్‌, థాయ్‌లాండ్‌లో జరిగిన యు.ఎన్‌. సమావేశాలకు హాజరయ్యాను. 1996లో న్యూజర్సీ రడ్గస్‌ యూనివర్సిటీలో  సదస్సుకి హాజరయ్యాను. మా బాల చిత్రం ‘‘పాత నగరంలో పసివాడు’’ కైరో ఫిలిం ఫెస్టివల్‌కు   ఎంపికైన సందర్భంలో ఈజిప్టు వెళ్ళాను.

ఈ దేశాలకు వెళ్ళటం కాదు. అక్కడి వారితో కలిసి పనిచేయగలగటం, పరస్పరం ఒకరి సమస్యలొకరు తెలుసుకోగలగటం చాలా బాగుంటుంది.

ముఖ్యంగా యు.ఎన్‌. మీటింగులో దక్షిణాసియా దేశాల ప్రతినిధుతో గడిపిన రోజులు చాలా విలువైనవి. ఎంతో మంచి స్నేహితులను సంపాదించుకోగలిగాను. వాళ్ళు ఇప్పటికీ ఆ స్నేహాన్ని కొనసాగిస్తూ ఉన్నారంటే అది వారికి నాకూ కూడా ఎంతో ముఖ్యం అని అర్థం కదా!

  1. చివరగా, నిజానికి ముందుగా కుటుంబరావు గారితో మీ సాహచర్యాన్ని గురించి చెప్పండి… సహచరులు యిలా కూడా వుండొచ్చు అని మీరు నిరూపించిన వైనం, భార్యాత్వాన్ని శిరసావహిస్తూ, కుటుంబాలలో మగ్గిపోతోన్న స్త్రీలకి కొంత తెలియాలి కదా.

జ: కుటుంబరావు నేను మంచి స్నేహితులం. జీవన సహచరులం . భార్యా భర్తలం  కాదు. మా మధ్య ఆ రకమైన అధికార సంబంధం లేదు. కుటుంబంలో ప్రజాస్వామిక సంబంధాలుండాని నమ్మే వ్యక్తులం  కాబట్టి ఒకరి అభిప్రాయాల్ని ఒకరం గౌరవించు కుంటూ ఒకరి మార్గానికొకరు అడ్డుపడకుండా వీలైనంత సహకరిస్తూ జీవిస్తున్నాం. మా ఇద్దరి అభిరుచులు , అభిప్రాయాలు , భావాలు , ప్రాపంచిక దృక్పథాలు  ఒకటే అవటం వల న మా సాహచర్యం చాలా ఫలవంతంగా సాగుతోంది. ఇద్దరం మేమనుకున్న పనులు  చేయగుగున్నాం. ఇద్దరికీ  ఒకటే ఆలోచనలున్నాయని, మాకు అభిప్రాయ బేధాలే రావని అర్థం కాదు. ఇద్దరం వాదించు కుంటాం. విబేధాలు  విబేధాలుగానే మిగిలే సందర్భాలు  కూడా ఉంటాయి. అయితే అవి మా స్నేహానికి అడ్డం రావు. ఎలకను మింగే పిల్లిగా మా ఇద్దరిలో ఎవరమూ లేము. ఆధిపత్యం అనే మాట మా ఇద్దరికీ సరిపడదు. మా పిల్లలు  నలుగురూ కూడా మమ్మల్ని అర్ధం చేసుకున్నారు. మేము వాళ్లకిచ్చిన స్వేచ్ఛను ప్రజాస్వామిక వాతావరణాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

  1. జీవితమంతా యిన్నిన్ని ఆటుపోట్లను ఎదుర్కుంటూ కూడా ఎప్పుడూ యింత ప్రశాంతంగా ఎలా వుండ గలుగుతున్నారు? మీకెప్పుడూ అసహనం కలగదా?

జ: నా అసహనమంతా మనుషుల  జీవితాలను అస్త వ్యస్తం చేసి అశాంతిమయం చేసే పితృస్వామిక సమాజం మీద. ఆ అసహనాన్ని కోపాన్ని నా రచనలలో తీవ్రంగానే ప్రకటిస్తాను. ఈ సమాజం లోని అవకతవక వల్లనే  నా జీవితం లోని ఆటుపోట్లు కూడా. దానికి వ్యక్తుల  పట్ల అసహనం చూపించి ప్రయోజనం లేదు. ఇది తెలిశాక వ్యక్తుల  పట్ల అసహనం చాలా తక్కువసార్లు వస్తుంది.

  1. కొత్తగా రాస్తున్న స్త్రీల కు మీ సూచను?

జ: సమాజాన్ని, దానిలోని అసమానతను, అణిచి వేతను అర్థం చేసుకుని రాయమంటాను. సామాజికాధ్యయనం, నిరంతర సాహిత్య పఠనం, రచయిత్రులకు అవసరం.

  1. సాహిత్య విమర్శలో ‘రాజ్యాంగ నైతికత’ అనే భావనని మీరు కొత్తగా ప్రవేశపెట్టారు. దాని గురించి వివరించండి.

జ:‘రాజ్యాంగ నైతికత’ అనే భావనను అంబేద్కర్‌ అందించాడు. మన దేశానికి రాజ్యాంగ రచన జరిగాక ప్రజల  జీవితం, సామాజిక విధి విధానాలు  రాజ్యాంగం ప్రకారం నడవాలి. పాత ఆచార సంప్రదాయాలు  మరుగునపడి పోవాలి. స్త్రీ పురుష సమానత్వం ప్రాధమిక హక్కుల్లో చెప్పిన తర్వాత సంప్రదాయాల  ప్రకారం స్త్రీ మీద విధించే అసమానత్వపు ఆచారాల ను, పోకడను మనం పాటించకుండా ఉండే సంస్కారాన్ని అల వరచు కోవాలి. అలాగే కులం , అంటరానితనం విషయాల్లో కూడా రాజ్యాంగం చెప్పినట్లు నడుచుకోవాలి గానీ పురాణా సంప్రదాయాల  ప్రకారం పోతే శిక్షార్హు లవుతారు. పాత నీతుల  స్థానంలో మనకు రాజ్యాంగ బద్ధమైన నైతిక విలువలు  సమకూరాయి. మన స్వాతంత్య్రానంతర సాహిత్యంలో అనేకమంది  రచయితలు  ఈ నైతికతను ప్రజల కు అందించే రచనలను చేశారు. ఈ భావనతో, ఈ దృష్టితో సాహిత్య విమర్శ చేస్తే ప్రజకుల  ఆ నైతిక విలువ ప్రాధాన్యం మరింత వేగంగా వివరంగా అర్థమవుతుంది. ఆ ఆలోచనతో నేను ఆ సాహిత్య విమర్శనా రీతిని పరిచయం చేయాలనుకున్నాను. అక్కినేని కుటుంబ రావు నాలుగు నవలలను ఆ దృష్టితో విశ్లేషించాను. నాకు చాలా సంతృప్తిగా అనిపించింది. మిగిలిన రచయితల  రచనల ను ఈ దృష్టితో అంచనా వేయా లనిపించింది. సాహిత్య అకాడెమి సహకారంతో, అస్మితను సమన్వయ పరచి రెండు రోజు పాటు ‘‘రాజ్యాంగ నైతికత ` స్వాతంత్య్రానంతర తెలుగు  సాహిత్యం’’ అనే అంశంపై సెమినార్‌ నిర్వహించాను. దాదాపు ఇరవై మంది రచయితల  ముఖ్య రచనను ప్రసిద్ధ విమర్శకులు  ఈ దృష్టితో విశ్లేషించారు.   చాలా మంచి స్పందన వచ్చింది. సాహిత్య విమర్శనా పరికరాలను పెంచుకుంటూ విస్తరించుకుంటూ పోవాలి. అది నాకు చాలా ఇష్టమైన పని.

24.మీరు చాలా విస్తృతంగా రాసి సాహిత్యాన్ని, సాహిత్య రంగంలో స్త్రీవాద భూమికని వేగవంతం చేశారు… కథ, కవిత, నవల , వ్యాసం, నృత్యరూపకం,  నాటకం, సినిమా, అనువాదాలు … యిలా అన్ని ప్రక్రియల్లోనూ మీరు కలాన్ని కదిపారు. మరి మీ సాహిత్యం మీద జరగవలసినంత చర్చ జరిగిందనే మీరు అనుకుంటున్నారా?

జ.‘స్వేచ్ఛ’, ‘మానవి’, ‘రాజకీయ కథలు ’ వచ్చినప్పుడు వాటిమీద చాలా విస్తృతంగా చర్చ జరిగింది. నేను అనువాదం చేసిన ‘భూమిపుత్రిక’, ‘మూడు తరాలు ’, ‘పుట్టని బిడ్డకు తల్లి ఉత్తరం’ లాంటి నవలలు మీద కూడా చర్చ జరిగింది. తర్వాత ‘అయోని’, ‘భిన్న సందర్భాలు ’, ‘ప్రయోగం’, ‘కేసు’ యిలా ఒక్కొక్క కథ ఒక్కొక్క సంచలనమై వాటిచుట్టూ ఎన్నో వాద, వివాదాలు , చర్చలు  జరిగాయి. ఇదంతా 90వ దశాబ్దం వరకూ ఆ తర్వాత పత్రికలలో సాహిత్యా నికి, ముఖ్యంగా సాహిత్య విమర్శకు చోటు తగ్గిపోయింది. అయితే విడివిడిగా గ్రూపుగా చర్చలు  సాగిస్తూనే వున్నారు.

  1. భవిష్యత్తులో ‘ఆటోబయాగ్రఫీ’ రాయాన్న ఆలోచన ఏమయినా వుందా? మీ జీవితం, సాహిత్యం, ఉద్యమ పోరాటం… ఈ మొత్తం దాచేస్తే దాగని సత్యా లన్నింటినీ రికార్డ్‌ చేయాల్సిన అవసరం లేదా?

జ: ఆటో బయోగ్రఫీ గురించి ఇప్పుడేమీ ఆలోచించడం లేదు.

*

నమ్మకమైన యింకో పడవ ప్రయాణం!

 

 

1

లెబనీస్ కవి ఖలీల్ జిబ్రాన్ కీ, అరుణ్ బవేరాకి చుట్టరికమేమీ లేదు; వాళ్ళ భాషా, వేషమూ, దేశమూ వొక్కటి కాదు. కాని, కవిత్వం అనేది భాషలకీ, వేషాలకీ, దేశాలకీ అతీతమైంది అనుకుంటే, అటు జిబ్రాన్ గుండెలోనూ, ఇటు అరుణ్ మనసులోనూ వొకే రంగు జెండా రెపరెపలాడుతోంది. వీళ్ళిద్దరూ వొకే పడవ మీద రెండు భిన్న సముద్రాల్ని ఎదుర్కొంటూ వెళ్తున్నారు. ఆ మాటకొస్తే, ప్రతి వర్తమాన కవిలోనూ నాకు ఎంతో కొంత జిబ్రాన్ అంశ కనిపిస్తూనే వుంటుంది, యీ కవిత్వ భాష విషయానికి వస్తే!

రంగస్థలం మీదికి  కవి ప్రవేశం వూరికే జరగదు. వచ్చేటప్పుడు కవి చాలా నిశ్శబ్దంగానే వస్తున్నాడు కదా అనిపిస్తుంది. కాని, అతను వెళ్ళిపోయాక అతనేమీ నిశ్శబ్దంగా రాలేదనీ, కొన్ని కొత్త శబ్దాల్ని పలికించి వెళ్ళిపోయాడనీ కచ్చితంగా తెలిసిపోతుంది. ఇలా అనిపించడానికి అతని కవి పేరుకి ముందు “మహా” అనే రెండక్షరాలేమీ అక్కర్లేదు. ఇంకో మాట అనాల్సి వస్తే, ఈ “మహా” అనేది చాలా పొడి మాట. అర్థంలేని అసంబద్ధ అబద్దం. అందుకే, నేను పనికట్టుకొని ఇప్పుడు ఎక్కడో వున్న జిబ్రాన్ నీ, ఇక్కడే మన పక్కనే వున్న అరుణ్ నీ కలిపి మాట్లాడుతున్నా.

జిబ్రాన్ అంటున్నాడు:

By poet, I mean the sailor who hoists a third sail on a ship that has only two, or the builder who builds a house with two doors and two windows among houses built with one door and one window, or the dyer who mixes colors that no one before him has mixed, in order to produce a new color for someone who arrives later on to give the ship of the language a new sail, the house a new window, and garment a new color. (1923)

అరుణ్ కవిత్వం అంతా చదివాక ఇతని కొత్త పదాలు ఏమిటీ, కొత్త సందర్భం ఏమిటీ అన్న ప్రశ్నలకి సమాధానాలు వెతికే పనిలో పడ్డాను. ఇతని కవిత్వానికి వొక వర్ణం వుందీ అనుకుంటే ఆ వర్ణానికి వొక పేరుందా అనీ అడుగుతూ ఉండిపోయాను నాలోని చదువరిని!

ఆ మూడు ముఖ్యమైన ప్రశ్నలకూ ప్రతి కవీ ఎంతో కొంత సమాధానం ఇవ్వగలిగి వుండాలని నా నమ్మకం. ఆ సమాధానం వచనంలో కాకుండా ఖాయంగా కవిత్వంలోనే  ఉండి తీరాలని యింకో గాఢమైన నమ్మకం.

 

2

సందర్భం తెలిసిన కవి అరుణ్. అంతే కాదు, యింకో ప్రత్యామ్నాయ కొత్త సందర్భం సృష్టించుకోవాల్సిన అవసరం వుందని నమ్ముతున్న కవి కూడా.

ఒక సందర్భం – క్రిక్కిరిసిన మనుషుల మధ్య గోలగా…

మరో సందర్భం ఖాళీగా…ఒంటరిగా…శూన్యంలా వేలాడుతూ.

ఈ రెండు వాక్యాలలోని రెండు సందర్భాలూ మనకి తెలుసు. మన చుట్టూ ఎంత శబ్దం వుందో, అంతటి నిశ్శబ్దం కూడా వుంది. కొన్ని విషయాలు ఎక్కువ మాట్లాడుకుంటున్నాం, అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలీనంతగా-  ఇంకా కొన్ని విషయాలు చాలా చాకచక్యంగా నిశ్శబ్దంలోకి నెట్టేస్తున్నాం, ఇంటర్నెట్లోకి! ఇప్పుడు నడిచేదంతా చరిత్రే అయితే, ఆ చరిత్రని ఎట్లా రికార్డు చేయాలన్న సందిగ్ధంలో పడేస్తున్నాం చరిత్రకారుడిని!

కాని, ఇంత సందిగ్ధంలోనూ అడగాల్సిన ప్రశ్నలు అడుగుతూ, రాబట్టుకోవాల్సిన సమాధానాలు రాబట్టుకోవడం ఏమిటో అరుణ్ కి తెలుసు. అతని ప్రతి కవితా వొక ప్రశ్నలోంచి మొలకెత్తి, సమాధానంలోకి ప్రయాణిస్తుంది. అదిగో, అలాంటి ప్రయాణాలే తన కవిత్వంగా నమోదు చేస్తూ వెళ్తున్నాడు అరుణ్.

అయితే, సందర్భాన్ని మాట్లాడే కవి చాలా సందర్భాల్లో వాచ్యమైపోతూ వుంటాడు. అరుణ్ కి అలాంటి ప్రమాదం లేదు. మరీ వాచ్యం అనిపించే సందర్భాన్ని కూడా తీసుకొని, అందులో కవిత్వాన్ని పొదగడం ఏమిటో, ఆ పరుసువేది ఏమిటో తెలిసిన వాడు అరుణ్. ఉదాహరణకి పైన పేర్కొన్న కవిత చూడండి, ఎలా ముగించాడో!

నువ్వో ఆకాశం, నేనో ఆకాశంగా

మాట్లాడుకుందాం

ఎప్పుడైనా-

ఈ నమ్మకాలు గుర్తొస్తే

జ్ఞాపకాలు జ్ఞాపకాలుగా

పెనవేసుకుందాం.

చాలా అందమైన భావనతో ముగిసింది ఈ కవిత. అరుణ్ ప్రతి సందర్భాన్నీ అంతే శ్రద్ధగా చెక్కుతాడు కవిత్వ శిల్పంగా- అది ఆ సందర్భం మీద పట్టు వున్నప్పుడే సాధ్యమవుతుందని వేరే చెప్పక్కర్లేదు కదా! ఇంతకుముందు జిబ్రాన్ అన్నాడే – the dyer who mixes colors that no one before him has mixed- అని, కచ్చితంగా అదే పని.

సందర్భం మాత్రమే కవిత్వం కాదు, సందర్భం తన రూపాన్ని తానే discover చేసుకోదు. నిపుణుడైన కవి ఇంకో కొత్త రూపంలోకి వెళ్తే, ఆ సందర్భం పదునెక్కుతుంది. అరుణ్ వొక కవితలో అన్నట్టు:

నాలోని ప్రతి పాత్రా

నిండుతున్నట్టే వుంటుంది,

కాని- మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఖాళీ అవుతుంది.

అన్న వొక సంశయం కవికి నిరంతరం వుండాలి. అప్పుడు సందర్భాన్ని ప్రశ్నించే శక్తి కూడా అతనికి వస్తుంది. అలాంటి శక్తి నిండిన కవిత్వం యిక్కడి యీ ప్రయాణంలో ఎదురవుతుంది.

arun

3

తన ప్రయాణానికి వొక సందర్భం వుందీ అని నాలోని చదువరిని గట్టిగా నమ్మించాడు అరుణ్. ఇది చిన్న విజయమేమీ కాదు. అయితే, ఆ నమ్మకం దగ్గిరే నిలిచిపోయి, అరుణ్ చెప్పినదంతా/రాసిందంతా బంగారం అనుకునే స్థిరత్వం ఈ చదువరికి లేదు. ఇతని కొత్త పదాలేమిటీ అని మెతుకు మెతుకునీ పట్టి వెతుక్కునే దప్పికలో వున్నాను. కొన్ని అందమైన వాక్యాలకే ఈ దప్పిక తీరదు. వాక్యాలకి అతీతమైన జీవజ్వాల ఏదో కనిపించాలి. దాన్ని నేను “తాత్వికత” అనుకుంటున్నాను.

ముఖ్యంగా ఎటు చూస్తే అటు కవిత్వమే వినిపిస్తున్నప్పుడు ఈ తాత్వికత నాకు పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. ఎక్కువ శాతం సమకాలీన కవిత్వంలో వాక్యాల వెంట పరుగు కనిపిస్తోంది. వాక్యాన్ని దీపంగా వెలిగించే ప్రయత్నం తక్కువగా కనిపిస్తోంది. వాక్యం దీపం కావాలంటే, కవికి దాని చుట్టూ వున్న చీకటిని సరిగ్గా చూసే కన్ను కావాలి.

అరుణ్ అన్నట్టు:

జీవితం

ఒక నిర్వచనం స్థాయి నుంచి ఎదగడం లేదు.

 అదే మాటని యింకాస్త విస్తరిస్తే, కవిత్వం కూడా వాక్యం స్థాయిని దాటి వెళ్ళడం లేదు. కవులు తమ వాక్యాల్ని తామే ప్రేమించుకోవడంలో తలమునకలై వున్నారు. తన నీడని తానే ముద్దాడుకుంటూ మురిసిపోయే narcissism బాహాటంగా పెరిగిపోతోంది. వొకానొక కాలంలో కవి చాలా సిగ్గరి. యిప్పుడు అలాంటి సిగ్గూ ఎగ్గూ లేదు. కొన్ని సార్లు కవిత్వం మీదనే వెగటు పుట్టించే స్థాయిలో ఆత్మ ప్రేలాపనలు సాగుతూ వున్నాయి. తనని తాను వెతుక్కునే అంతర్నేత్రం మూసుకుపోతోంది. అట్లాగని, బహిర్నేత్రం బలపడుతోందని కాదు. అది మరీ బలహీనమవుతోంది.

అరుణ్ కవిత్వం చదువుతున్నప్పుడు ఈ స్థితుల్ని దాటుకుంటూ వెళ్తున్న వొక composure కనిపిస్తోంది, బహుశా, అది అతని పునాదిలో వున్న వామపక్ష దృక్కోణం నించి వచ్చి వుండాలి. అతని వాక్యాల్ని వేటినీ మనం విడివిడిగా కేవలం కవిత్వంగా చదవలేం. ఉదాహరణకి:

  1. ఒక్క -కల కోసం

కొన్ని వేల సార్లు నిద్రపోవడం

ఒక్క- కరచాలనం కోసం

వేల శరీరాల్ని తవ్విపోయడం.

 

  1. వాన కురుస్తోందంటే

చెట్లు ఏం మాట్లాడుకుంటున్నాయో వినాలనుంది.

 

  1. మనుషులు ఖాళీ చేసిన వూరు

సామాన్లు సర్దుకొని వెళ్ళిపోతున్న దుఃఖం.

 

  1. ఈ జీవితాన్ని ముందెప్పుడో జీవించినట్టు

యిప్పుడంతా ఖాళీ.

  1. ఏదీ లేకపోవడం లోంచి

ఏదైనా రగిలే వాంఛ.

 

  1. యివాళ మనుషులందరూ

దీక్షా శిబిరాలుగా విడిపోయిన సందర్భంలో

బ్రతకడం అంటే –

దేనికి నిరసనో చెప్పాలి.

ఇవి కేవలం వాక్యాలు కావు. కావుకావుమనే సగటు కవిలోకపు cacophony లో సమాధి అయిపోయే నినాదాలూ కావు.

తన ప్రాణం పెట్టి మాటని బతికించే తపన ఇది. తన కన్నుని దారిదీపంగా వెలిగించి ముందుకు నడిపించే ప్రవాహపు ప్రయాణం  ఇది. యిలాంటి వెలుగు  ప్రయాణాలు మరిన్ని కావాలి, నిజమైన సందర్భాలు అసందర్భాలై పోతున్న ఈ కాలంలో!     *

*

తూర్పు-పడమర  

Artwork: Srujan Raj

Artwork: Srujan Raj

-జి ఎస్‌ రామ్మోహన్‌

 

rammohanవరలక్ష్మికి అప్పటికి గానీ అర్థం కాలేదు. అన్న కావాలనే అటూ ఇటూ తిరుగుతున్నాడని. తప్పించుకు తిరుగుతున్నాడని. వచ్చినపుడు దూరపోళ్లని పలకరిచ్చినట్టు పలకరిచ్చిందే! కుదురుగా మాట్లాడే అవకాశమిస్తేగా!  చూడనట్టే మొకం పక్కకు తిప్పుకుని మొబైల్‌లో మొకం దూర్చేస్తున్నాడు. అదొకటి దొరికింది మనుషులను తప్పించుకోవడానికి. ఏడాదిలోనే ఎంత మార్పు! మనిషి మునుపటంత తేటగా లేడు. కడుపు ముందుకు పొడుచుకుని వచ్చేసింది. మొకమంతా ఎవరో బాడిసెతో చెక్కినట్టు అదో రకంగా ఉంది. కళ్లకింద కండ ఉబ్బిపోయి వింతైన నునుపుతో రంగుతో మెరుస్తా ఉంది. ఆ నునుపు మెరుపు ఏం బాలేదు.

అన్న ముఖం ఎంత అందంగా ఉండేది? ఎంత చక్కని పలకరింపు? వెన్నెల ఆరబోసినట్టు ఏం నవ్వు అది? ఏమైపోయింది? డబ్బు ఇంతగా మనుషులను మారుస్తుందా! ఎందుకు మాట్లాడాలనుకుంటోందో ఏమి మాట్లాడాలనుకుంటుందో తెలిసిపోయినట్టే ఉంది. తెలీకుండా ఎట్లా ఉంటది? తడిక చాటు రాయబారాలతో పనికాకనే కదా ఆడో మొగో తేల్చుకుందామని ఇక్కడికొచ్చింది?

“ఇంకా తేల్చేదేముందే, వాళ్లు చేసుకునే రకం కాదు’

అని ఇరుగుపొరుగు అంటారు కానీ అలాంటి పాడు మాటలు వరలక్ష్మికి వినపడవు.

“ఎక్కడ ఈ సంబంధం కుదిరిపోతుందో అని వారి బాధ’ అని లోలోపల తనను తాను సమాధానపర్చుకుంటా ఇప్పటివరకూ లాక్కొచ్చింది వరలక్ష్మి. ఇపుడు వాస్తవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేసరికి కాళ్లు వణుకుతున్నాయ్‌.

ఏమయితే మాత్రం, తోడపుట్టినదాన్ని ఇంత అవమానిస్తాడా! ఎంత కింది చేయి అయితే మాత్రం నాలుగు మాటలు మాట్లాడలేనంత లోకువైపోయిందా!  లోలోపల సుడులు తిరుగుతా ఉంది. అయినా వరలక్ష్మి ముక్కు చీదలేదు. వరలక్ష్మి చదువూ సంధ్యలు లేని మనిషి కాదు. మంచీ మర్యాదా తెలీని మనిషి కాదు. టెన్త్‌ పాస్‌ అయిన అమ్మాయి. ఇంటర్‌ చేరి మానేసిన అమ్మాయి. దుక్ఖాన్ని అదుపు చేసుకోవడం నేర్చుకున్న మనిషి. వాళ్లూరు పెద్దమ్ములు పేరుకు పల్లెటూరేగానీ మరీ ఎక్కడెలా ఉండాలో తెలీనంత పల్లెటూరేమీ కాదు. దాచేపల్లి టౌన్‌కు పక్కనే అంతా కలిసిపోయినట్టే ఉండ్లా ఇపుడు!

“”ఆ దిక్కుపాలిన పడమటికి ఇవ్వబట్టి నా బతుకు ఇట్లా అయిపోయింది గానీ  తూరుపునే ఇచ్చి ఉంటే మెడలో గొలుసులు అవీ వేసుకుని దర్జాగా కుర్చీలో కూర్చొని బీడుపడిన పొలాల గురించి పాడైపోయిన వ్యవసాయం గురించి మాట్లాడతా ఉండేదాన్ని కాదూ.”

అని ఎన్ని సార్లు అనుకోని ఉంటదో ఈ మధ్య. ముక్కు పుటాలు అదురుతుండగా మొకంలో మారుతున్న రంగులను ఎవరైనా గమనిస్తున్నారా అని చుట్టూ చూసింది. నలుగురైదుగురి చూపు తనమీదే ఉందని అర్థమైనా ఛీఛీ అదంతా తన భ్రమ  అనేసుకుంది. ఊరికే చేతిలో మొబైల్‌ ఫోన్‌ను గట్టిగా అటూ ఇటూ తిప్పి చూపులో తడి ఎదుటోడికి కనిపించకుండా కాపాడుకుంది.

“ఓ గజ్జెల గుర్రమా, ఓ పిల్లా, ఏమే, ఎంత ఇంజనీరు మొగుడు దొరికితే మాత్రం పుట్టినూరోళ్లు కనిపించరేమే”

అని ఒక కుర్రపిల్లతో పనిగట్టుకుని పరాచికాలకు దిగింది. పక్కనున్న పెద్దావిడ చీర ఎక్కడ కొన్నదో వాకబు చేసింది.

మనింట్లో మనం ఎట్టైనా ఏడ్చుకోవచ్చు. పదిమందిలో, అందులోనూ బంధువుల పెళ్లిలో ఏడిస్తే నగుబాటు కాదూ!

Kadha-Saranga-2-300x268

పెళ్లి మంటపం కళకళగా ఉంది. గలగలగా ఉంది. ఇటీవలే కొత్త హంగులు తొడుక్కున్న మస్తానయ్య గారి ఎసి కల్యాణ మంటపం. సత్తెన పల్లి ఇదివరకటి సత్తెన పల్లికాదు, పల్నాడు ఇదివరకటి పల్నాడు కాదు అని ప్రభలు కట్టి మరీ చాటుతున్నట్టుంది. అమరావతి అంతగా కాకపోయినా తమకూ ఆ అదృష్టంలో ఎంతో కొంత వాటా వస్తుందని ఆశగా ఉంది. తమ పొలం పక్కనే పరిశ్రమలొస్తాయని భరోసాగా ఉంది. అమరావతి వాళ్లైతే ఎమ్మెల్యేల ఇల్లు తమ పొలంలోనే ఎలా వస్తాయో నలుగురికి చేతులూపుతా చెపుతా ఉన్నారు. ప్రతి పదిమందిలో ఆరేడు మంది రియల్‌ ఎస్టేట్‌ గురించే మాట్లాడుతున్నారు. కూలోళ్లు నోటికొచ్చినంత అడిగితే బక్క రైతు బరించేదెట్లా అని వినిపించే చోట, కాని కాలంలో ఆకాశంలో మబ్బు కనిపిస్తే మిర్చి తడిసిపో్తుందని ఆందోళనలు వినిపించే చోట ఇపుడు లేఅవుట్ల భాష వినిపిస్తోంది. లక్ష అంటే అపురూపంగా మాట్లాడుకునే గడ్డమీద ఇపుడు కోటి అంటే ఎంత, రెండక్షరాలేగా అనిపించేట్టు అయిపోయింది. ఎకరా అరెకరా అమ్ముకుని ఇంటినీ ఇల్లాలినీ మెరుగుపెట్టిన వాళ్ల హడావుడి ఒక రకంగా ఉంది. ఆడోళ్ల మెడలు కొత్త బంగారు లోకం అన్నట్టున్నాయి. మగాళ్ల చేతులకు కడియాలు మెరుస్తా ఉండాయి. అన్నిట్నీ మించి చేతుల్లో ఇమడలేక చారడేసి మొబైల్‌ ఫోన్లు బయటకు దూకుతా ఉన్నాయి. అమ్మేస్తే ఐసా పైసా అయిపోతాం అని వెనుకా ముందూ ఆడుతున్న జాగ్రత్త పరుల గొంతులు ఇంకో రకంగా ఉన్నాయి.

కొందరు మగవాళ్ల చూపులు తలుపు దగ్గర వరుసగా గులాల్‌  చల్లుతూ నిలబడిన మణిపురి, నేపాలీ పిల్లల మోకాళ్ల దగ్గర లంగరేసి ఉన్నాయి.  పిక్కల పైపైకి పాకుతూ ఉన్నాయి. ఇంత పెద్ద కల్యాణ మండపాలు అక్కడోళ్లకు మరీ వింతేమీ కాదు. కానీ ఇట్లా జవాన్లు వరుసగా నిలబడ్డట్టు ఆడపిల్లలు నిలబడ్డం కొత్త. అందునా తెల్లతెల్లగా పాలిపోయిన రంగున్న ఆడపిల్లలు. పిక్కలపైన గౌన్లేసుకున్న ఆడపిల్లలు.  భూమి పుట్టినప్పటినుంచి వాళ్లు అలాగే నుంచోని ఉన్నారేమో అన్నట్టు ఏమాత్రం ఆసక్తి కలిగించని నవ్వుతో రోబోల మాదిరి ఉన్నారు ఆ ఆడ పిల్లలందరూ. మొగోళ్ల వయ్యారాలు చూసి ఆడోళ్లు గొణుక్కుంటా ఉన్నారు. ఆ పిల్లల చేత గులాల్‌ చల్లించుకోవడానికి దగ్గరదగ్గరగా వాలిపోతున్న మొగుళ్లని డొక్కలో పొడుస్తున్నారు. “చూసింది చాల్లే నడువబ్బా” అని ముందుకు తోస్తున్నారు. పెళ్లి మంటపం అరేంజ్‌ మెంట్ ఆ ఊరోళ్లు నాలుగు రోజుల పాటు చర్చించుకోవడానికి వీలుగా ఉంది. మండపం పక్కనే వేదికపై కోలాటం ప్లస్‌ కథాకాలక్షేపం నడుస్తా ఉంది. యాభై యేళ్ల రాజమండ్రి ఆడపడుచు వాళ్ల బంధువల టీమ్‌తో కలిసి కథాకాలక్షేపం చేయిస్తా ఉంది. ఆ దిక్కుమాలిన రికార్డింగ్‌ డాన్సులకంటే ఈ కథ ఎంత బాగుంది ఒదినా అని మాటలు  వినిపిస్తున్నాయి. పట్టుచీరల రెపరెపల మధ్యలో రెండు మూడు లోవెయిస్ట్‌ జీన్స్ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. “ఎంత హైదరాబాద్‌లో ఉద్యోగమైతే మాత్రం పెళ్లిలో అదేం అవతారమే పోలేరమ్మలాగా” అనే సణుగుడులు గాజుల చప్పుళ్లలో కలగలసి ముసిముసిగా వినిపిస్తున్నాయి. పెళ్లి మంటపం వెనుక పై అంతస్తులో నల్లకుక్కతో ఇరవై మంది కుర్రాళ్లు కుస్తీ పడుతున్నారు. గ్లాస్ చప్పుళ్లు, జోకులు అపుడపుడు ఆగిఆగి వినిపిస్తున్నాయ్‌.

“బీరేందిరా ఆడోళ్ల మాదిరి…..డిసెంబర్లో బీరేందిబే” ..

గట్టిగట్టిగా నవ్వులు.

“హుస్‌ హుష్‌ ….మెల్లగా.. నీ యబ్బ, రెండు పెగ్గులకే వీరంగమెస్తున్నావేరా” అని అందరికీ మెల్లగా సుద్దులు చెప్పే గొంతుకలు కొంచెం గట్టిగానే వినిపిస్తున్నాయి. మొన్నమొన్నటిదాకా రాయల్‌ స్టాగ్‌ పేరే రాయల్గా వినిపించే చోట బ్లాగ్‌ డాగ్‌  మాలిమి అయిపోతా ఉంది.

 

అన్నతో అటో ఇటో తేల్చుకోవడానికి ఈ పెళ్లిని వేదికగా ఎంచుకుంది వరలక్ష్మి. పెదనాన్న మనమడి పెళ్లి. బంధుబలగమంతా చేరే పెళ్లి. ఇక్కడైతే నలుగురు పెద్దమనుషులుంటారు. అటో ఇటో తేలుస్తారు. ఏందిరా దాని సంగతి  అని అడుగుతారు. అవసరమైతే గడ్డి పెడతారు. నలుగురూ గట్టిగా అడిగితే తోడపుట్టినోడు కాదనగలడా! అటో ఇటో తేల్చకుండా తప్పుతుందా!  కొండంత అనుమానమూ గంపెడాశ కలగలిసిన ఆదుర్దాతో ఇక్కడకొచ్చింది. తీరా ఇక్కడకొస్తే సీన్‌ రివర్స్‌ గేర్‌లో తిరుగుతా ఉంది. ఇక్కడ జరుగుతున్న పంచాయితీలు తన పంచాయితీ కంటే పెద్దవిగా కనిపిస్తున్నాయి. కోర్టులు కేసులు అని ఏవేవో వినిపిస్తున్నాయి. ఇక్కడంతా పటమట తూర్పుగా విడిపోయి కనిపిస్తున్నారు. దాచేపల్లోళ్లు, అమరావతోళ్లుగా కనిపిస్తున్నారు.  సత్తెనపల్లి సెంటర్‌గా అమరావతోళ్లు, దాచేపల్లోళ్ల మధ్య సెటైర్లు నడుస్తున్నాయి. ఎక్కడ తక్కువైపోతామో అని దాచేపల్లోళ్లు సాధ్యమైనంత కష్టపడి తయారై వచ్చినా అదింకా స్పెషల్గా ఎక్కిరిస్తున్నట్టుంది కానీ అవమానాన్ని ఆపుతున్నట్టు లేదు. అంతా దగ్గరిదగ్గరోళ్లే. మొన్నమొన్నటిదాకా అంతా పంచె ఎగ్గట్టి మడిలో దిగినోళ్లే.

………………………………………..

ఎట్లాంటి అన్న. కోటప్పకొండ జాతరకు భుజాలమీదెక్కించుకుని తిప్పిన అన్న. ప్రభల ఊరేగింపు సరిగా కనిపించకపోతే నెత్తిమీద నిలబెట్టుకుని చూపించిన అన్న. మొన్నటికి మొన్న సంక్రాంతి పండక్కి పుట్టింటికి పోయినపుడు కోడలు సైకిల్‌ అడిగితే మామూలు సైకిల్‌ కాకుండా ఏడువేలు పెట్టి అదేందో గేర్ల సైకిల్‌ కొనిచ్చిన అన్న. అపుడే కదూ, అన్న ఎంత పెద్దోడయిండో తెలిసింది. మంచికి మర్యాదకు పుట్టింట్లో లోటు చేసింది లేదు. అయితే మాత్రం, ఆ దిక్కుమాలిన పడమటకిచ్చినందుకు ఒక దారి చూపించొద్దూ! బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చిన మాటైనా నిలబెట్టుకోవద్దూ!

Artwork: Srujan Raj

పెళ్లి వేదికకు దూరంగా మంత్రాల చప్పుడు మరీ ఎక్కువ కాని చోట నలుగురు పెద్దమనుషులు సీరియెస్‌గా పంచాయితీ చేస్తున్నారు. కోర్టు అనే మాట మర్యాదకాదని ఎవరికో చెపుతున్నారు. రేప్పొద్దున ఒకరికొకరు ఉండాల్సినోళ్లు అని సర్దిచెపుతున్నారు.

“కట్నం ఘనంగా ఇచ్చి తాహతుకు మించి పెళ్లి చేశాడా, లేదా! ఐదేళ్ల తర్వాత ఇపుడు భూమిలో వాటా ఉందంటే ఎట్టరా అని మీసాల పెద్దాయన చెపుతున్నాడు. అన్న ప్రేమతో ఏదైనా ఇస్తే తీసుకోవాలి. వాడు మాత్రం కాదంటడా. తాను శ్రీమంతుడైతే చెల్లెలు పేదరికంలో బతకాలని అనుకుంటడా! ఇచ్చింది తీసుకుంటే పద్ధతిగా ఉంటది, నా మాటినండి అని అనునయిస్తా ఉన్నాడు. “ఏం, అది మాత్రం వాళ్ల నాయనకు పుట్టలా! వాడొక్కడే పుట్టాడా. ఇయి పాతరోజులు కావు. ఏదో ముష్టిపడేసినట్టు పడేస్తామంటే కుదరదు. మాట ప్రకారం రెండెకరాలూ ఇవ్వాల్సిందే. ”…వెనుకనుంచి ఎవరో గొణగడానికి అడగడానికి మధ్యరకంగా మాట్లాడుతున్నారు. గట్టిగా వినిపించాలి. కానీ డిమాండ్‌ చేసినట్టు ఉండకూడదు. ఇవ్వకపోతే ఇంకో రూట్‌ తప్పదని చెప్పాలి. అదీ ఆ వాయిస్‌ సారాంశం. “ఎవడ్రా అది పెద్దోళ్లు మాట్లాడుతుంటే..” అని ఎవరో కసురుతున్నారు. వారి టోన్‌ ఇంకా స్థిరంగా ఉంది. అటూ ఇటూ స్టేక్స్‌ గట్టిగానే ఉన్నట్టున్నాయి.

 

అమరావతి నుంచి వచ్చినవాళ్లలోనే కొందరు ఇంకో చోట చేరి బెంగగా మాట్లాడుకుంటున్నారు. వాళ్లు మొకాలు అంత ధీమాగా లేవు. వాళ్ల మొకాలు బాడిసెతో చెక్కినట్టుగా లేవు. వాళ్ల మొకాలు తుప్పు పట్టిన కొడవళ్లలాగా, కొచ్చన్‌ మార్కుల్లాగా ఉన్నాయి. ఉన్న ఎకరా, అరెకరా తీసేసుకున్నారు. రేపటినుంచి ఏం పనిచేయాలి? ఎట్లా బతకాలి? పిల్లల చదువులెట్లా? ప్రభుత్వం రాజధాని నిర్మించేదెపుడు? స్థలం ఇచ్చేదెపుడు? మబ్బు చూసి ముంత ఒలకబోసుకుంటే ముందు ముందు బతుక్కు భరోసా ఏంటి అని బెంగగా చర్చించుకుంటున్నారు.

 

అంతా కలగాపులగంగా ఉంది. వరలక్ష్మికి లోపల అంతకంటే అలజడిగా ఉంది. ఏడాదిన్నరలో అంతా మారిపోయింది. ఊర్లు మారిపోయాయి. బంధుత్వాలు మారిపోయాయి. దాచేపల్లి పక్కన పెద్దమ్ములుకు ఇచ్చి పెళ్లిచేసినపుడు ఇద్దరివీ పల్లెటూళ్లే. ఇద్దరివీ మెట్ట గ్రామాలే. ఆ మాటకొస్తే అమరావతి పక్కనున్న మహేశ్వరం కంటే పెద్దమ్ములు పెద్దగానే ఉండేది. మెట్టినిల్లు కూడా పుట్టినిల్లు కంటే పెద్దిళ్లే. రెండెకరాలు ఎక్కువుండే ఇంటికే ఇచ్చారు. అపుడంటే కథ వేరు. ఇపుడంతా మారిపోలే! అక్కడి మెట్ట ఇంకా అట్లనే ఉంది. ఇక్కడి మెట్ట కోట్లకెక్కింది. అన్న ఇన్నోవాలో తిరుగుతుంటే అందరూ మీ అన్న అంతోడు ఇంతోడు అంటుంటే పైకి సంబరంగానే ఉంటుంది కానీ లోలోపలే గుచ్చుకున్నట్టు ఉంటుంది. ఏదో తేడా. ఏదో వెలితి.

ఒక కడుపున పుట్టినదాన్ని. తనకు తానుగా పిలిచి

“అరే వరా..ఇదిగోరా…ఇది నీది. ..తీసుకో” అంటే ఎంత బాగుండును. బిడ్డలు కడుపులో ఉన్నపుడు అనుకున్నమాటకే ఇపుడు దిక్కులేకుండా పోయిందే! అంతంత ఆశలు పెట్టుకోవచ్చా! ఆ మాటొక్కటి నిలుపుకుంటే చాలదూ!”

వరలక్ష్మికి కాలూ నిలకడగా లేదు. మనసూ నిలకడగా లేదు. ఊరికే అటూ ఇటూ తిరిగి వాళ్లనీ వీళ్లనీ అకారణంగా పలకరిచ్చి మాట్లాడతా ఉంది. ఉన్నట్టుండి మొగుడిమీద కోపం గొంతుకాడికి తన్నుకొచ్చింది.

“మొగుడే సరీగుంటే తనకీ యాతన వచ్చి ఉండేదా! ఆయన కదా ఈ వ్వవహారాలు చూసుకోవాల్సింది. పేరుకు మగపుట్టుకే కానీ కూతుర్ని కనడానికి తప్ప మరెందుకైనా ఆ మగతనం ఉపయోగపడిందా! గొడ్డులాగా పనిచేయడమే గానీ ఒక సంతోషం ఉందా! ఒక సంబరం ఉందా! నలుగురూ ఎట్లా బతుకుతున్నారు అనే ఆలోచనలేదు. అసలు నలుగురిలో కలిసేదే లేకపోయెనే! పెళ్లికి రమ్మంటే కూడా అమ్మా కూతుళ్లు పోండి అనే మొగోడయిపాయె. తూరుపున అన్నదమ్ములూ ఆడబిడ్డలూ ఉన్నోళ్లందరూ ఎట్లా ఉరుకులాడుతున్నరు. ఈయనకేం పట్టకపాయె. బీడీ తాక్కుంటా ఆకాశం కేసి చూస్తా ఉంటే నడిచే రోజులా ఇవి. ఏ మనిషో ఏమో! ఇంట్లో పడున్న ఎద్దూ ఒకటే ఆయనా ఒకటే. ఒకర్ననుకుని ఏం కర్మ. నా కర్మ ఇట్లా కాలింది” నిస్సహాయతతో కూడిన ఆగ్రహంతో కుతకుతా ఉడికిపోతా ఉంది వరలక్ష్మి.

“ఆ.. ఈడ సీసాలో గొట్టమేసుకుని మజా తాగుతా ఉండు. ఆడ మీ బావ ఎవర్నో చేసుకుని మజా చేసుకుంటడు. బావెక్కడున్నాడో చూసి రాపోవే. పలకరచ్చిరాపాయే ఎర్రిమొకమా”

మొగుడిమీద విసురంతా కూతురుమీదకు ట్రాన్స్‌ఫర్‌ చేసి గదమాయించింది.

ఆ పిల్ల అటూ ఇటూ తిరుగుతూ వెనుక వరుసలో గోడకు జారగిలిపడి ఐఫోన్‌తో ఆటలాడుకుంటున్న కుర్రాడిని చూసింది. ఆ కుర్రాడు పలుచగా ఉన్నాడు. పంట్లాం జారిపోతుందేమో అని చూసేవాళ్లకు భయంపుట్టేంత కిందకి వేసుకున్నాడు. సృష్టి చేసిన ఏర్పాటు వల్ల మాత్రమే  పంట్లాం ఆ మాత్రం ఒంటిని అంటిపెట్టుకుని ఉన్నట్టుంది. పైన ఒక టీషర్ట్‌ యథాలాపంగా ఉంది. పెళ్లికి ప్రత్యేకంగా తయారైవచ్చినట్టుగా అనిపించలేదు. జుట్టు నిర్లక్ష్యంగా ఉన్నా గ్లామరస్‌గా ఉంది. ఆ నిర్లక్ష్యంలో కూడా పద్థతేదో ఉన్నట్టుంది. చేతులకు కడియాలు లేవు. మెడలో కంటె లాంటి మందమైన బంగారు గొలుసేమీ లేదు. సింపుల్‌గా ఉన్నాడు కానీ చూడగానే బలిసినోళ్ల పిలగాడు అని గుర్తు పట్టేట్టు ఉన్నాడు. వాళ్ల నాన్నకు కడుపు ఎంత ముందుకొచ్చిందో ఈ కుర్రాడికి అంత లోపలికి పోయి ఉంది. భుజాల కాడ ఇపుడిపుడే బైసెప్స్‌ ఉబ్బుదామా వద్దా అన్నట్టు తొంగి చూస్తున్నాయి. చూడగానే జిమ్‌బాడీ అని తెలిసిపోయేట్టు ఉంది.  కొత్తసినిమాలో కుర్రహీరోలకు నకలుగా ఉన్నాడు. ఆ పిల్లను గమనించినా గమనించనట్టుగానే పక్కకు తిరిగి ఫ్రెండ్స్‌ని పిలుస్తూ దూరంగా వెళ్లాడు. ఆ పిల్లకు ఏదో అర్థమయినట్టే కనిపిస్తోంది. పాతసినిమాలో హీరోయిన్‌లాగా జడను ముందుకు తెచ్చుకుని దాంతో ఆవేదన పంచుకుంటున్నట్టుగా నిమురుతూ తిరిగి తల్లి దగ్గరకు నడిచింది.

వాళ్లకు మూడు వరుసల్లోనే కుర్చీలో కాళ్లు ఎత్తిపెట్టుకుని  పొగాకు నలుపుకుంటూ కూర్చున్నాడు వెంకయ్య. ఆయన జుట్టు రేగిపోయి ఆకాశం వంక చూస్తా ఉంది. మీసాలు వంగిపోయి నేల చూపులు చూస్తున్నాయి. చేతిలోని పొగాకు లాగే ముఖంపైనా ముడుతలు. ఒక్క ముక్కలో నలిగిపోయిన పొగాకు కాడలాగా ఉన్నాడాయన. ఆయన పుస్తకాలు చదవలేదుకానీ మనుషులను చదవగలిగిన వాడు. ఏం జరుగుతుందో బాగా తెలిసినవాడు. మట్టి వాసన తప్ప నోట్ల వాసన అంతగా తెలిసినవాడు కాదు. ఆయన కొడుకు ఒక నెలలో బేబులోంచి తీసినన్ని సార్లు, తీసినన్ని నోట్లు ఆయన జీవితమంతా తీసి ఉండడేమో! కూతురు మనుమరాలు తిప్పలు, కొడుకు మనుమడి జాడింపులు అన్నీ చూస్తున్నాడు. ఆ పెళ్లి జరగదు అని అర్థమవుతూనే ఉంది.

”చిన్నపుడే ఆ పిల్ల పుట్టకముందే ఇచ్చినమాట. రెండేళ్ల క్రితం వరకూ పెళ్లి గ్యారంటీ అనే అనుకున్నారు. కొడుకు చాలా ఉత్సాహం చూపేవాడు. ఏమే కోడలా అని తప్ప పేరు పెట్టి పిలిచి ఎరగడు. ఇంటర్‌ అయిపోగానే దీన్నిక్కడ వదిలేయ్‌. ఇక్కడే ఉండి బెజవాడ వస్తా పోతా డిగ్రీ చదవుకుంటది, ఎట్లా ఈడుండాల్సిందేకదా అని తన చెల్లెల్ని తొందరపెట్టేవాడు. పిల్లాడి డిగ్రీ అయిపోగానే ఇద్దరికీ ముడేయాలని అనుకున్నారు. ఈ రెండేళ్లలో చాలా మారిపోయాయి. భూములు మారిపోయాయి. జీవితాలు మారిపోయాయి. పెళ్లి కాకపోతే పోయింది, అది అక్కడే ఆగుతుందా! ఇంకా ముందుకు పోతుందా! అసలే కూతుళ్లు కొడుకుల మీద కేసులు వేయడం చూస్తూ ఉన్నాడు. తలలు పగలకొట్టుకునేంత గొడవల గురించి వింటూ ఉన్నాడు.”

మనసు పరిపరివిధాలా ఆలోచిస్తా ఉంది.

“ఒకప్పుడు బంధుత్వం అంటే ఎట్టుండేది? పెద్దరికానికి ఎంత గౌరవం ఉండేది? పాడుకాలం, ఎవరికీ ఎవరూ కానికాలం”

అని లోలోపలే వర్తమానాన్ని శపిస్తూ ఉన్నాడు.

ఆస్తులు అమ్ముకుని తింటే కొండలైనా కరిగిపోతాయ్‌రా అని ఏదో చెప్పబోతే కొడుకు చూసిన చూపు గుర్తొచ్చింది. మనసు మూలిగింది

Artwork: Srujan Raj

.

పెళ్లిమంటపం కళగానే ఉంది. సడన్‌గా వచ్చిపడిన సంపద తెచ్చిపెట్టే సంబరం కనిపిస్తానే ఉంది. అది మనుషుల మధ్య తెచ్చిపెట్టే సంక్షోభం కూడా కనిపిస్తా ఉంది. తేలని పంచాయితీలు అనేకం కనిపిస్తున్నాయి. స్టేక్స్‌ ఎక్కువైనాయి. ఎవరూ ఏదీ వదులుకునేట్టు లేరు. నలుగురిలో నగుబాటు కాకూడదనుకునే వారు పెద్దమనుషుల ఎదుట పంచాయితీలు చేసి తేల్చేసుకుంటున్నారు. అట్లా సంతృప్తిపడలేని వారు వీధికెక్కుతున్నారు. కోర్టు గుమ్మాలు తొక్కుతున్నారు. వచ్చిన డబ్బును జాగ్రత్తగా కాపాడుకోవడమెట్లా అనేవాళ్లు కొందరు.

దూరంగా వెళ్లి ఏ వినుకొండ, కుంట ప్రాంతాల్లోనో ముందు జాగ్రత్తగా భూముల వేట చేస్తున్న వారు కొందరు. వేరే భూములు లేక ఉన్న కొద్ది మడిచెక్క పోగొట్టుకుని గోడుగోడు మంటున్నవారు ఇంకొందరు. అంతా కలగా పులగంగా గందరగోళంగా ఉంది. పెద్ద సుడిగాలి వచ్చేసి కొందరిని మేడమీదకు మరికొందరి లోయలోకి విసిరేసినట్టు ఉంది. వరలక్ష్మి అన్నకోసం తిరుగుతూనే ఉంది.

ఇంకొక్క సారి నేరుగా ఎదురుపోయి పట్టుకుందాం.  అప్పటికి తప్పించుకుంటే పెద్దమనుషుల దగ్గరకు పోవడం తప్ప దిక్కులేదు అని తీర్మానించుకుంది.  ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. అన్న కోసం మళ్లీ పెళ్లి పందిరి చుట్టూ వెతుకులాట ఆరంభించింది. తూర్పుకు పడమటకు మధ్య దాగుడుమూతలాట సాగుతానే ఉంది.

*

ఫుట్‌పాత్

ARIF6

-రమా సరస్వతి

~

 

rama‘డిస్గస్టింగ్’ స్మార్ట్‌ఫోన్‌లో న్యూస్ అప్‌డేట్స్ చూసుకుంటూ!

‘వాట్ హ్యాపెండ్’ నిర్వికారంగా ఫోన్‌లోంచి తలెత్తకుండానే ఆమె కొలీగ్.

‘నిన్న రాత్రి ఒంటిగంటకు గాంధీ వే ఫుట్‌పాత్ ఓ ఆడీకార్‌ను ఢీకొట్టిందట.. అందులో ఉన్న ఇద్దరు కుర్రాళ్లు సివియర్ ఇంజ్యూర్డ్ అట.. కండిషన్ క్రిటికల్‌గా ఉందట’..

‘వాట్?’ ఆ ఆశ్చర్యం ఫోన్‌లోంచి తలెత్తి పక్కనే ఉన్న కొలీగ్ మొహంలోకి చూసేలా చేసింది

‘ఊ..’ నిజం అన్నట్టుగా తలడించింది.

‘కాంట్ బిలీవ్ ఇట్.. ఫుట్‌పాత్ కారును హిట్ చేయడమేంటి?’ ఇంకా ఆశ్చర్యం వీడలేదు.

‘అదే కదా!’

‘డీటేల్స్ ఏంటో..?’ ఆశ్చర్యం కుతూహంలా మారింది.

‘ఏంటోలే… క్లయింట్ కాల్ వస్తోంది అటెండ్ చేయాలి’ అంటూ చైర్‌ని సర్రున సిస్టమ్ ముందుకు లాక్కుని ఫోన్ కాల్ అటెండ్ అయ్యే పనిలో పడపోయింది.

కుతూహలం నిరాశ చెంది తనకేమన్నా  డీటేల్స్ దొరుకుతాయేమోనని ఫోన్‌లో వెదికే ప్రయత్నం మొదలుపెట్టింది.

మూడు రోజులయింది

‘గుడ్ మార్నింగ్‌సర్’ ఫోన్‌లో ఆన్సర్ చేశాడు గాంధీవే ఏరియా ఎస్‌ఐ.

‘ఊ…అప్‌డేట్స్ ఏంటీ?’ అవతలి నుంచి సీఐ.

‘ఆ ఇద్దరూ ఇంకా కోమాలోనే ఉన్నారు సర్.. బహుశా బయటపడక పోవచ్చు అని చెప్తున్నారు డాక్టర్లు’

‘ఆ.. నా.. కొడుకుల అయ్యలు..  మన ప్రాణాలను బయటకు తోలేటట్టున్నారు… బిగ్ షాట్స్ వ్యవహారం.. పెద్దోళ్ల ఇన్‌ఫ్లుయెన్స్ యూజ్‌చేస్తున్నారు. ప్రెషర్  ఉంది బాగా. మళ్లీ ఒకసారి ఐ విట్నెసెస్ గురించి ట్రై చెయ్’ స్వరం స్థిరంగా వచ్చింది.అది  ‘ఎం చేసైనా సరే అరెస్ట్ కావాలి’ అన్న సంకేతంగా ఎస్‌ఐకి అర్థమైంది.

‘యెస్.. స..’ అంటుంటేనే అవతల ఫోన్ డిస్కనెక్ట్ అయిన శబ్దం. ‘దీనమ్మ బతుకు’ పళ్లు కొరుక్కుంటూ ఇన్నోవా ఎక్కాడు ఎస్‌ఐ.

————————-

మధ్యాహ్నం పదకొండు గంటలు..  గాంధీవే… టీవీ 101 ఛానల్ వ్యాన్ వచ్చి ఆగింది. బిలబిలమంటూ చిన్నా, పెద్దా అంతా గుంపుగా అక్కడికి చేరారు. బ్లూ జీన్స్, రెడ్ కుర్తా, కర్లీ హెయిర్‌ను బలవంతంగా పోనీగా మలచిన ఓ 22 ఏళ్ల యంగ్ రిపోర్టర్ సెల్ ఫోన్ చూసుకుంటూ వ్యాన్‌లోంచి దిగింది. ఆ వెనకే కెమెరా మేన్, అసిస్టెంటూ దిగారు. యేం మాట్లాడకుండా ఇన్‌స్ట్రక్షన్స్ కోసం వేచి కూడా చేడకుండా కెమెరా యాంగిల్‌ను సెట్ చేసుకోసాగాడు కెమెరా మేన్. లోగో మైక్‌కున్న వైర్‌ను వృత్తాకారంలో చుడుతూ మైక్ తెచ్చి రిపోర్టర్‌కిచ్చాడు అసిస్టెంట్.  ఓ చేత్తో మైక్ పట్టుకొని, ఇంకో చేత్తో సెల్‌చూసుకుంటూ అక్కడ చేరిన గుంపు దగ్గరకు వెళ్లింది. ‘గోపాల్ ఎవరు?’ అడిగింది వాళ్లను ఉద్దేశించి.

‘గోపాల్ లేడు మేడం.. మీరు ఫోన్ చేసిన విషయం చెప్పిండు. నేను చూసుకుంటా… మీకేం కావాల్నో వీళ్లనెవర్ని అడిగినా చెప్తరు’ అన్నాడు ఆ గుంపులోని ఓ పాతికేళ్ల వ్యక్తి. ‘వీళ్లందరూ డిసెంబర్ 31 రాత్రి ఇక్కడే ఉన్నారా?’ అడిగింది.

‘అందరూ ఉన్నారు మేడం..’ అంటూ ‘అరేయ్ సాయి ముందుకు రారా.. ఆ రోజు రాత్రి చూసింది చూసినట్టు మేడంతో చెప్పుడు’అన్నాడు గుంపులో వెనకలా ఉన్న సాయిని పిలుస్తూ.

సాయి ముందుకొచ్చాడు.. సాయితోపాటే ఓ నలుగురు కూడా!

సెల్‌ఫోన్‌ను బ్యాక్‌పాకెట్లో పెట్టుకొని మైక్ సరిచూసుకుంది. కెమెరా మేన్‌కి యాంగిల్ మార్చుకొమ్మని సైగ చేసింది. అతనికి ‘రోలింగ్’ అని చెప్పి ‘యాక్సిడెంట్ జరిగినప్పడు మీరు ఇక్కడే.. ఐ మీన్ ఈ గాంధీ వే ఫుట్‌పాత్ దగ్గరే ఉన్నారా?’ అడిగింది సాయి మూతి ముందు  లోగో మైక్ పెడుతూ.

‘ఆ..’ అని ఆ అబ్బాయి సమాధానం ఇస్తున్నప్పుడే ఈ గుంపుకి చాలా దూరంగా గాంధీవే స్టేషన్ ఎస్‌ఐ  ఇన్నోవా వెహికిల్ ఆగింది.

‘సర్.. మీడియా వాళ్లు. న్యూసెన్స్ చేసి న్యూ న్యూస్ స్ప్రెడ్‌చేయడానికే వచ్చి ఉంటారు’ కోపంగా హెడ్ కానిస్టేబుల్.

‘ఊ.. చెయనియ్ ఏదో ఒకటి’ అంటూ నెమ్మదిగా ఆ గుంపు దగ్గరకి నడిచాడు ఎస్‌ఐ తన వాళ్లను అక్కడే ఆగిపొమ్మని సైగచేస్తూ!

‘ఆ యాక్సిడెంట్ అయినప్పడు టైమెంత?’ రిపోర్టర్

‘రాత్రి ఒకటి అయినట్టుంది మేడం!’

‘మీరెంత మంది ఉన్నారిక్కడ?’

‘పదిపన్నెండు మందిమి!’

‘అంత రాత్రిపూట మీకేం పని ఇక్కడ?’ రిపోర్టర్

‘అరే… మేమంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ఉన్నం మేడం!’

ARIF6

‘ఏదీ ఈ రోడ్డు మీద చేసుకుంటున్నారా సెలబ్రేషన్స్’

‘రోడ్డేంది మేడం.. దీన్ని ఆనుకునే గదా.. మా ఇండ్లు.. గాంధీ వే స్లమ్ ఈ సిటీల ఎంత ఫేమసో మీకు తెల్వదనకుంటా..’ గాంధీవే స్లమ్ గొప్పతనాన్ని చెప్పలేకపోతున్నాననే ఫీలింగ్‌తో ఆ అబ్బాయి.

‘కరెక్ట్‌గా సంజయ్ ఆడీకారు ఇక్కడికి వచ్చినప్పుడు మీరేం చేస్తున్నారు’

‘ రోడ్డు మీద నిప్పురవ్వలు తేలుతయా అన్నంత స్పీడ్‌తో వచ్చింది మేడం కార్. ఆ సౌండ్‌కి అందరం ఆ కారు దిక్కు చూసినం. సరిగ్గా అప్పుడే అగో రోడ్డుకి అటు సైడ్ ఉన్న ఆ ఫుట్‌పాత్  ఈ కారు కన్నా స్పీడ్‌గా రోడ్డు నడిమధ్యలకొచ్చి కారును ఒక్క గుద్దు గుద్ది అంతే స్పీడ్‌గా మళ్లీ దాని జాగలకు అది వెళ్లిపోయింది మేడం!’ తాను చూసిన వింతను అంతే విస్మయంగా వివరిస్తూ చెప్పాడు.

‘మీరు అప్పుడు తాగి ఉన్నారా?’

‘మేడం… మా ఎవరికీ తాగే అలవాటు లేదు. ఆ రోజు పోలీసోళ్లు కూడా చెక్ చేసిండ్రు’ మమ్మల్ని అవమానపరుస్తున్నారు అన్న భావంతో సమాధానం వచ్చింది.

‘మరి లేకపోతే ఫుట్‌పాత్ వచ్చి కారును ఢీకొట్టడమేంటి?’

‘మాకు కనిపిచ్చింది.. మేం చూసింది గదే మేడం.. మేమే కాదు ఆ సౌండ్‌కి ఇండ్లలల్ల ఉన్న మా పెద్దోళ్లు కూడా ఉరికొచ్చిండ్రు కావాలంటే వాళ్లను కూడా అడుగుండ్రి…’  అన్నాడు మైక్ ఉన్న అబ్బాయి పక్క కుర్రాడు.

వీళ్ల ఉత్సాహం వెనకనే ఉన్న ఎస్‌ఐ టీమ్‌ను గ్రహించే పరిస్థితిలో లేదు.

‘ఫుట్‌పాత్ వచ్చి కారుని ఢీకొట్టగానే మీ రియాక్షన్ ఎలా ఉండింది?’ మైక్‌ను ఇందాక జవాబు చెప్పిన అబ్బాయి నోటి ముందుకు మారుస్తూ రిపోర్టర్.

‘షాక్ అయినం. అసలేం జరుగుతుందో అర్థంకాలే. చిన్న పోరలైతే ఫ్రీజ్ అయిండ్రు. పెద్దోళ్లకు మాటరాలే’

‘కార్లో ఉన్న సంజయ్, ఆయన ఫ్రెండ్ సిట్యుయేషన్  ఎలా ఉంది?’

‘బ్యానెట్ తుక్కు తక్కు అయింది.  డ్రైవింగ్ సైడ్ ఉన్న డోర్ ఊడిపోయి ఒకాయన కిందపడ్డడు. మరి ఆయన సంజయో ఇంకెవరో తెల్వదు. తలకు పగిలింది. ఫ్రంట్ సీట్ల బెలూన్లు ఓపెన్ అయినయో లేదో కూడా  తెల్వదు. పక్క సీట్ల ఉన్నాయన డాష్ బోర్డ్ మీదకు వొంగినట్టుంది. ఆయక్కూడ తలకు బాగా దెబ్బ తగిలింది. కింద పడ్డాయనను చూసి మా అమ్మకు చెక్కరొచ్చింది. ఆయన దాహం.. దాహం అని అడిగిండు. అగో మురళిగాడి దగ్గర బాటిల్ ఉండే తాగించడానికి ట్రై చేసిండు కానీ తాగలే… స్పృహ తప్పిపోయిండు’ కళ్లకు కట్టినట్లు చెప్పాడు ఆ అబ్బాయి.

‘104కి ఫోన్‌చేయలేదా?’

‘చేసినం.. అదొచ్చే సరికి అద్దగంట అయింది. పోలీస్‌లకు కూడా కాల్ చేసినం’

‘వాళ్ల ఫ్రెండ్స్‌కి ఎలా తెలిసింది?’

‘పోలీసోలొచ్చిన తర్వాత కిందపడ్డాయన జేబుల్నించి సెల్ దీసి అందులనుంచి ఎవరెవరికో కాల్ చేసిండ్రు. అండ్ల వాళ్ల ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు’

‘కావచ్చు.. ఎందుకంటే ఓ అయిదారుగురు బుల్లెట్ బండ్లేసుకొని వచ్చిండ్రు గాంధీవేలనే ఉన్న లూథర్‌కింగ్ పబ్‌కెంచి’ గుంపులోని ఇంకో అతను చెప్పాడు.

‘నీకెలా తెలుసు వాళ్లు లూథర్‌కింగ్ పబ్‌నుంచే వచ్చారని.. వాళ్లు సంజయ్ ఫ్రెండ్సే అని!’ రిపోర్టర్ కొనసాగించింది.

‘ఆ వచ్చినోళ్లు పోలీసోళ్లతో చెప్తుంటే విన్నా..  ఇప్పటిదాకా మాతోనే ఉన్నాడు సర్.. లూథర్‌కింగ్ పబ్‌లో! ఇందాకనే ఏదో ఫోన్ వచ్చిందని బయలుదేరాడు అనిల్‌తో కలిసి’ అని’’ చెప్పాడు.

ఇంచుమించు అలాంటి ప్రశ్నలనే తిరగేసి.. మరగేసి ఇంకో అయిదుగుర్ని అడిగింది. అందులో ఇద్దరు ఆడవాళ్లు కూడా ఉన్నారు. పెద్ద శబ్దం వస్తే బయటకు వచ్చి చూశామని అప్పటికే అతను కిందపడిపోయి ఉన్నాడని… అంతకుమించి తమకేం తెలియదని చెప్పారు.. మైక్ పెట్టనీయకుండా.. కెమెరా వైపు చూడకుండా!

రిపోర్టర్  మైక్ తీసుకొని వెంటనే కెమెరా వైపు తిరిగి ‘డిసెంబర్ థర్టీఫస్ట్ ఒంటి గంట రాత్రి గాంధీవే ఫుట్‌పాత్ దగ్గర జరిగిన యాక్సిడెంట్‌కి వీళ్లు ప్రత్యక్ష్య సాక్షులు. ఈ సాక్షులు చెప్తున్నది వింటుంటే ఆ రాత్రేదో మాయా జరిగినట్టు.. ఫుట్‌పాత్‌కి కాళ్లు.. ఆ కాళ్లకు చక్రాలు మొలిచినట్టు.. అదే సంజయ్ కారును ఢీకొట్టినట్టు తేలుతోంది. ఆ రాత్రి వీళ్లు తప్ప ఇంకెవరూ అక్కడ లేరు.. న్యూ ఇయర్‌సెలబ్రేషన్స్ జరిగే సమయం.. కుర్రకారుకు హుషారు ఎక్కువై ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నా పోలీస్ పెట్రోలింగ్ లేదు. దాంతో ఈ యాక్సిడెంట్‌కి ఇంకో విట్నెస్ లేకుండా పోయింది. ఏమైనా ఈ యాక్సిడెంట్ మిస్టరీ వీడే ఛాన్సే లేక ఈ ‘హిట్ అండ్ కిల్’ కేసు ఎక్కడ మొదలైన ఫుట్‌పాత్ అక్కడే ఆగిపోయిన చందంగా ఉండేట్టుంది. టీవీ 101 కోసం కెమెరామేన్ రాంబాబుతో గంగాభవాని’ అంటూ గబగబా పీస్ టు కెమెరా ప్రెజెంటేషన్ ఇచ్చేసింది   రిపోర్టర్.

‘మనం ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం లేదు సర్’ అని ఎస్‌ఐతో హెడ్ అంటుంటే టీవీ 101 ఛానల్ వ్యాన్ రేజ్ చేసుకుంటూ వెళ్లిపోయింది. అది వదిలిన పొగతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు ఎస్‌ఐ అండ్ టీమ్.

———————————————————

ARIF6‘చనిపోయారు కదా.. .. గొడవ పెద్దగానే ఉంటది’ లాయర్ అంటున్నాడు.

‘బలిసినోళ్ల ప్రాణం కదా సర్ తీపిగానే ఉంటది. ఆ రోజు ఈ నా కొడుకులే తప్పతాగి ఫుట్‌పాత్ మీదున్న మా వాళ్ల మీదకు కార్‌ను తోలినప్పుడు   వాళ్ల అయ్యలకు తెల్సుంటే బాగుండేది సర్ మాలాంటోళ్ల ప్రాణాలు కూడా అంతే తీపిగా ఉంటాయని’ గోపాల్ కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి.. పూడుకుపోయిన దుఃఖంతో గొంతు పెగలట్లేదు.

తెల్లవారి… ఏడు గంటలకు  కాలనీ పార్క్‌లో … రిటైర్డ్ పర్సన్స్ ఇద్దరూ మార్నింగ్ వాక్ చేస్తూ…

‘ఫుట్‌పాత్ మనుషుల్ని చంపడమేంటి? అందులో ఏ ఫుట్‌పాత్‌కి సంబంధించి హిట్ అండ్ రన్‌లో నిర్దోషులుగా తేలారో వాళ్లను’ ఆశ్చర్యం, అనుమానంతో అన్నాడు.

‘ఆశ్చర్యమేముంది సర్.. చుండూరు కేసులో దళితులే వాళ్లను వాళ్లు చంపుకొని గోతాముల్లో కుట్టుకుని చెరువులోకి దూకగలిగినప్పుడు,  హిట్ అండ్ రన్ కేసులో ఫుట్‌పాత్ మీద పడుకున్న వాళ్లను ఫుట్‌పాతే పొట్టనపెట్టుకోగలిగినప్పుడు.. హిట్ అండ్ కిల్ కేసులో ఫుట్‌పాతే యాక్సిడెంట్ చేయడంలో ఆశ్చర్యమేముంది? వింతేముంది సర్!’ తేలిగ్గా చెప్పేశాడు ఇంకోతను.

అయోమయంగా చూస్తూ  అతన్ని  అనుసరించాడు మొదటి వ్యక్తి!

*

 

 

 

 

మానసిక తర్కంతో అరుణ కవిత్వం!

-ఎం. నారాయణ శర్మ 

~

ఎం. నారాయణ శర్మ

వస్తుశిల్పాల క్రియాశీలక సమన్వయం కవిత్వం. ఏ వస్తువును వ్యక్తం చేస్తున్నారు, వ్యక్తం చేయడంలో వాడుకున్న పరికరాలేమిటీ అనేదాన్ని బట్టే కవుల, కవయిత్రుల వ్యక్తిత్వాలు రూపుదిద్దుకుంటాయి. కాలంలో మానసికశీలం పరిణతను సాధిస్తుంది. ఇది వస్తువును చూసే విధానం, అర్థం చేసుకున్న తీరు, దాన్ని తాత్వికదృక్పథంతో సమన్వయం చేసిన తీరు,  ఆమార్గంలో వ్యక్తం చేసిన తీరు ఇందులో పరిణత దశలు.

ఎన్.అరుణ కవిత్వం “కొన్ని తీగలు కొన్నిరాగాలు“ఒక పరిణత తాత్వికదర్శనాన్ని వ్యక్తం చేస్తుంది. ఏకవి, కవయిత్రయినా తనుచూసినదానికి  అనుభవించినదానికి వ్యతిరేకంగా స్పందించడం కనిపించదు. ప్రతికవి తీర్పువెనుక అంతఃకరణ సూత్రం (subjective principle)తోపాటు, అది విశ్వాత్మలో చెల్లుబాటయ్యేలా ఉంటుందని సృజనకారులు అలాంటి పారమార్థికసూత్రం(transcendental principle)నిర్మిస్తారని కాంట్ అంటాడు. ఎన్.అరుణ కవిత్వంలో కనిపించేది ఇదే.

ఇందులో ప్రతీ అంశాన్ని తాత్వికదృష్టితో ప్రతీకాత్మకం(symbolize)చేయటం కనిపిస్తుంది. ఈ ప్రతీకాత్మకసూత్రం నుంచే అనేకచోట్ల జీవితాన్ని,అందులోని సంఘర్షణను వ్యక్తం చేస్తారు. వస్తుగతంగా ఇందులో గతజీవితం-వర్తమానానికి మధ్య వైరుధ్యాలను అర్థం చేసుకుని కవిత్వం చేయడం  ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతీ అంశాన్ని చిత్రించడానికి ప్రాతిపదికగా బాల్యం, యవ్వనం నుంచి దృష్టిని సమగ్రంగా ప్రసారం చేయటంవల్ల ఇవి జ్ఞాపకాలుగా కనిపిస్తాయిగాని, బాల్య యవ్వనాలు నిర్దిష్టంగావ్యక్తం గావు. ఆయాదశల్లోని సారం తాత్వికంగా కవిత్వం చేయబడుతుంది. ప్రజ్ఞావార్థక్యపు భౌతికపరిస్థితుల మానసికతర్కం ఈ కవిత్వంలో ఎక్కువగాకనిపిస్తుంది. అదీ ప్రతీకాత్మకమైన కళాగంథాన్ని అల్లుకుని.

 

దుఃఖమేదో సంతోషమేదో

ఇప్పటికీ అంతుపట్టదు/దేనిలోంచి ఏది ఉబికివస్తుందో తెలియదు./కంటికి కనపడని నైలాన్ దారం/రెంటినీ విడదీస్తుంది“-(కొన్నిసార్లు-పే.20)

ఏటిలోకి వంగిన/కొమ్మమీదవాలిన పిట్టలు/

అలల అద్దాలవైపు కదులుతున్నాయి“-(అందం ఒక అనుభవం-పే.43)

జీవితం/హఠాత్తుగా ఆకాశం నుంచి/ఊడిపడదు/

ఒక్కొక్కవర్ణం మొలుస్తూ ఇంద్ర ధనుస్సు ఏర్పడుతుంది-(అవునుజ్ఞాపకాలే-పే.47)

అన్వయంలేని కవిత్వంలా/ఉండీ ఉండీ కురుస్తుంది వాన“(దర్శనం-పే.53)

 

ఎప్పుడో సుడిగాలో వీచి/ చెట్టుకో తట్టుతుందా/జీవితం విలవిల్లాడిపోతుంది/ఆకాశంలో ఏర్పరచుకున్న/దారులకు గమ్యం స్పష్టం కాదు_(దిశాగీతం-పే.13)

 

ఈవాక్యాలన్నీ అనిర్దిష్టంగా విషయ, విషయీ సంబంధాలలో తాత్వికసూత్రాన్ని అల్లుకుని ఉన్నాయి. జీవనప్రవాహంలోని సంఘర్షణలను ఇవి వ్యక్తం చేస్తున్నాయి. అరుణ గారి కవిత్వంలో అనిర్దిష్టత ఎక్కువ. నిర్దిష్టవస్తువు ప్రత్యక్షంగా వ్యక్తంగాక, ప్రతీకలోని సారభూతమైన తాత్వికతతో వ్యక్తమౌతుంది. నిర్దిష్ట సందర్భాలు, స్థలాలు, వ్యక్తులు ఈ వాక్యాల్లో కనిపించడం తక్కువ. తాత్వికంగా, కళాత్మకంగా వ్యక్తం చేయడమే ఎక్కువ. శీర్షికలు చూసినా ఈవిషయం అర్థమవుతుంది. రూపాన్ని సాధించేవిషయంలో రష్యన్ రూపవాదులు “అపరిచయీకరణం”(Alienation)ను పరిచయం చేసారు. దీనిని రష్యన్ భాషలో “ఓస్త్రానిన్యా”(Ostraninja)అనేవారు. మనచుట్టూ ఉండేప్రపంచాన్ని కప్పి ఉన్న అతిపరిచయం అన్న తెరను తొలగించి మనకు పరిచయమైన వస్తువులను, లేదా ప్రపంచాన్ని కొత్తకోణంలో వినూత్నదర్శనంలో ప్రదర్శించడం అపరిచయీకరణం. ఈ కవిత్వం జీవితాన్ని సత్యదర్శనం ద్వారా , సాంకేతికతర్కం ద్వారా ఆవిష్కరించింది. ఏ కవితనైనా కళాత్మకంగా, తార్కికంగా, తాత్వికంగా సాధించి వ్యక్తం చేసే తీరు గమనించదగింది.-“మల్లెచెట్టు-కాలభరిణె-గడప-దిశాగీతం”లాంటి అనేక కవితలు ఇలాంటి నిర్మాణ సాధనకు నిదర్శనం. ఇవన్నీ సాంకేతికంగా స్త్రీజీవితాన్ని ధ్వనిస్తాయి.ఈ క్రమoలో అరుణ గారికవిత్వానికి ఒక సృజనసూత్రాన్ని గమనించవచ్చు.

 N. Aruna కాలం +జీవిత సంఘర్షణ +తాత్వికప్రతీక =>సృజనసూత్రం

“గడప”అనే కవితను పరిశీలిస్తే భాష సంబంధించిన తాత్విక, సాంకేతిక తర్కాలను అరుణ గారు ఎలా ఉపయోగించుకున్నారో అర్థమవుతుంది. రోమన్‌ యాకోబ్ సన్(Roman Jakobson) అనే రష్యాపండితుడు భాషా సంబంధంగా “బలవత్తరలక్షణం”(The Dominant) అనే అంశాన్ని ప్రస్తావించాడు. కవితాధ్యయనం (Poetics) భాషాశాస్త్రంలో ఒక అంతర్భాగమని ప్రస్తావిస్తూ  ఆయన”Closing statement; Linguistics and Poetics”- అనే గ్రంథాన్ని రాసారు. ఒక అంశాన్ని ప్రస్తావించాల్సిన తప్పనిసరి అవసరం బలవత్తర లక్షణం. ఈ అంశానికి మయకోవ్‌స్కీ ప్రతిపాదించిన ప్రత్యేకకేంద్రీకరణ(Foregrounding)ఆధారమని విశ్లేషకులు చెబుతారు. కవిత్వంలో చెప్పదలచుకున్న ప్రధానవిషయమే ప్రత్యేక కేంద్రీకరణ.-“గడప”లో ఈ సంకేతం నుంచే వ్యక్తమయ్యే స్త్రీ జీవితం ప్రత్యేక కేంద్రీకరణగా కనిపిస్తుంది.కేవలం స్త్రీ జీవితంకాకుండా దాన్ని పెనవేసుకున్న గత వర్తమానాలసారం ఇక్కడ ప్రధానాంశం.దీన్ని ప్రస్తావించాల్సిన సందర్భమే బలవత్తరలక్షణం.

   తగిలినప్పుడు తెలిసింది అక్కడ/అక్కడ గడప ఉందని/

 అంతవరకు దాని ఉనికి పట్టించుకున్న పాపానపోలేదు/మౌనకోపం అంటే ఇదేనేమో

-“తగిలినప్పుడుతెలవడం””మౌనంగాఉండడం”స్త్రీనేకాకుండా,స్త్రీ జీవిస్తున్న స్థితిని ఈ ఎత్తుగడ(move of poem)ప్రతీకాత్మకం (symbolize)చేస్తుంది.ఈ పదాలే గతవర్తమానాలను రికార్డు చేస్తాయి.యాకోబ్‌సన్-టిన్యునోవ్ అన్నమాటలను ఇక్కడ గమనించాలి.

Pure synchrony proves to be an illusion, every synchronic system has its past and its future as inseparable structural elements of its system

(శుద్ధమైన వర్ణన కేవలం భ్రాంతి.ప్రతీ వర్ణవ్యవస్థకు గతం,భవిష్యత్తు ఉంటాయి. అవి ఆవ్యవస్థలో విడదీయరాని మూలకాలుగా ఉంటాయి)

“మౌనకోపం””లో”మౌనం”గతాన్ని”కోపం”భవిష్యత్తును క్రియాశీలకంగా వ్యక్తం చేస్తాయి. భాషలో వ్యక్తమయ్యే భావప్రకటనావ్యాపారాన్ని”భాషాసన్నివేశం(speech event)లో విశ్లేషించవచ్చు.దీనికి సంబంధించి ఆరు భాషా కారకాలు(speech factors)ఆరు భాషా కార్యాలు(speech functions) ఉన్నాయి.పై ఎత్తుగడలో కారకాలను విశ్లేషించుకోవచ్చు.

స్త్రీ ఉనికి చెప్పడం సందర్భం(context) స్త్రీగా ఉండటం వక్తృస్థానం (addressor)-రిచర్డ్స్ప్రస్తావించిన గొంతుక(Tone)దీనిని నిర్ణయిస్తుంది.సందేశం(message)-ఇక్కడ విచారణ (phatic)రూపంలో ఉంది. ఈ ముఖంగా ఇది జీవితాన్నిచర్చించింది. మిగతావాక్యాలలోనూ ఈ లక్షణాలు కనిపిస్తాయి.

aruna photo

2.”ఇంటికీ వాకిలికీ /గడప సరిహద్దు/

 వెలుపలి ప్రపంచం పెద్దదా/లోపెలి లోకం పెద్దదా అంటే/ ఇల్లునుమించిన విస్తీర్ణం దేనికీ లేదంటాను

3.”ఇల్లు/మనస్సంత విశాలం /కాలమంత అనంతం/

ఇంతచిన్న జీవితాన్ని /ఒక బృహత్కథగామలచిన తపోవాటి

భాషాగతంగా ఈ వాక్యాల్లో చేసింది రెండుపనులు.ఒకటికి గడపను స్త్రీకి బలమైన ప్రతీకగా పునః పునః అన్వయించడం.దాన్నించి జీవితాన్ని వ్యక్తం చేయడం.వాక్యాలు విచారణలో భాగాలు.మొదటివాక్యంలోని మొదటి అంశం ఇల్లు,వాకిలి పేరుతో స్త్రీ జీవితానికిగల గృహ,సామాజికజీవితాలను సంకేతిస్తుంది.ఇది సామాన్యభాషకు భిన్నమయ్యింది కాదు.రెండవ అంశం వాక్యాలన్ని కవితార్థంగా ఇవ్వాల్సిన సందేశాన్ని సారాంశంగా అందిస్తాయి. యాకోబ్ సన్ ప్రకారం ప్రతి కారకం ఒక భాషా కార్యానికి కేంద్రబిందువవుతుంది.ఇందులో ఈభాగాలన్నీ కనిపిస్తాయి.

4.”కోపంతో అడుగు బయట పెట్టబోతుంటే/బాధ్యతగా ఆపిందీ గడపే/అదొక అందమైఅన లక్ష్మణరేఖ

5.”నీళ్ళతోనే కాదు/దానిని కన్నీళ్ళతోనూ కడిగిన సందర్భాలున్నాయి

నాలుగవ వాక్యంలో భావావేశస్థ్తి తి (emotive) కనిపిస్తుంది. అనేక సందర్భాల ప్రస్తావన(referential), చివరివాక్యంలో నీళ్ళు,కన్నీళ్ళు- కడగటం అనే ఒకే క్రియకు దగ్గరగా ఉండటం. సాధారణ అసాధారణ స్థితులను వ్యక్తం చేస్తాయి. కన్నీళ్ళతో కడగటం వల్ల భాషకు అధి భాషా(meta lingual)స్థాయి లభించింది. స్త్రీ అనేపదం ప్రత్యక్షంగా కనిపించదు కాని ప్రతివాక్యంలో ప్రాణశక్తిలాప్రవహిస్తునే ఉంటుంది. ఈ కవితలో గడప స్త్రీ అనే జీవితాన్ని వ్యక్తం చేయడానికి మాధ్యం(code)స్త్రీని వ్యక్తం చేసిన సందర్భం, గడప మాధ్యమంగా ఇంటా,బయట అనేక్రమాల్లో ప్రస్తావించడం. స్త్రీగా భావావేశస్థాయి చెప్పినపుడు కవిత్వార్థంగా అణచివేతను వ్యక్తం చేయడం. ఇవన్నీ సాంకేతికంగా ఈకవిత సాధించిన పరిణతులు.

అరుణగారి కవిత్వంలో నిర్మాణమార్గంలో సాంకేతికాంశం,దర్శనంలో తాత్వికాంశం రెండూ ఒక లక్షం వైపు నడుస్తాయి.ఈ ప్రయాణమే కవిత్వాన్ని సారవంతం చేస్తుంది.

                                                             *

కొన్నాళ్లు వొక దగ్గర…

 

 

-బాల సుధాకర్ మౌళి 

~

sudhakar

 

 

 

 

 

ఇల్లు కావాలి
వుండటానికీ, వొండుకు తినడానికీ
ఇల్లు కావాలి
వూపిరి పీల్చుకోటానికి
వుక్కబోతల నుంచి రక్షించుకోటానికి
ఇల్లు
కావాలి
వూరు వదిలి
పదేళ్లవుతుంది
ఎలాగో వొక గట్టు ఎక్కాం
కొత్త ప్రపంచాన్ని వెతుక్కొంటున్నాం
ఇల్లు
సొంత ఇల్లు వొకటి
కావాలనిపిస్తుంది
వున్నపాటుగా బతకటానికి
వూహలు అల్లుకోటానికి
సొంత గూడు వొకటి కావాలనిపిస్తుంది
చిన్నప్పుడు
బతికిన ఇంటి జ్ఞాపకాలు
వూరి జ్ఞాపకాలు
మాటిమాటికీ గుర్తుకువస్తున్నాయి
మా ఇల్లు
మా వూరు
జ్ఞాపకాల్లో పదిలంగా వుండాలి
మా వూరు
మా ఇంట్లో బతకాలి
మా యిల్లు
మాలో బతకాలి
చాలా దూరం వచ్చేసాం
చాలా కాలం నడిచొచ్చినట్టనిపిస్తుంది
ఒక వూరంటూ లేనోళ్లం
కొన్నాళ్లు వొక దగ్గర వుంటాం
పిల్లల్ని కంటాం
పెళ్లిళ్లు చేస్తాం
పిల్లల్ని కంటాం
తరాలుగా వూరు వదిలి
వూరు మారే
మనుషులం మేం
అనాది శోకం
ఇవాళ నన్ను వెంబడిస్తోంది
ఎన్నటికీ కదలని – ఎప్పటికీ మారని
సొంత ఇల్లు, సొంత వూరు కోసం
వూరు వూరూ గాలించాలనిపిస్తోంది.

*

నైరూప్య ఏకాంతం

 

 

– ప్రసాద్  బోలిమేరు
~
bolimeru
నువ్వే లేకుంటే
ద్వేషించలేక ప్రేమలో కూరుకుపోతా
ప్రేమించేలోపే ముడుచుకుపోతా
నువ్వేకదా హరివింటిలాటి ఉనికిని దానం చేసేది
గాయాలకి గర్వాలకి వేదికని చేసేది
ఎంత ప్రసవ వేదన ఎన్నిమార్లు
అనుభూతించి ఉంటావో చినుకులా
ఏకాంతమా
ఊదా, ఎరుపుల నడుమ ఎలా ఒదిగి పోవాలి
ఉదయాస్తమయాలను ఎలా రంగరించాలి
నువ్వే లేకుంటే !
నాలోకి పోతూ , ఇంకిపోతూ గుబురుగుబురుగా
ఆకుపచ్చటి ఆశల్ని ఎంతలా పోగేస్తావు
ఏ పువ్వును కోయబోతే
ఏ ముల్లు గుచ్చుకొంటుందో
మునివేళ్ళవుబికే వాసనల రక్తపు చుక్క
ఎర్రటి ప్రవక్తలా కొత్త రుచుల దారి
పువ్వునించి విడిపోతున్న పరిమళాన్ని
మనసు పొరల్లో
నైరూప్య శిలాజంలా బతికిస్తావు
నువ్వే లేకుంటే —
రంగులరెక్కలెవరిస్తారు ఈ ప్యూపా నిద్రకి ?
ఏకాంతమా
బుగ్గ మీది మల్లెతీగా , పెదవిపైని మెరుపుతీగా
నువ్వేలేకుంటే !?!
*

నాలో నేను

 

-ఉమా నూతక్కి

~

uma

 

 

 

 

 

శరత్ కాలపు చల్లని సుప్రభాత వేళ

కిటికీని దాటొచ్చిన కిరణమొకటి

వెచ్చని రహస్యాన్ని చెప్తోంది.

కిటికీ అవతల పారిజాతం క్రీగంట కనిపెడుతోంది.

రావి చెట్టుపై మైనా ఏకాగ్రతగా నా వైపు చూస్తోంది.

లేత ఎరుపు ఆవేశాన్ని వొంటినిండా కప్పుకుని

నాకు ఆలోచనల మంటనంటించడానికన్నట్లు

సూరీడు మంచుతో యుద్ధం చేస్తున్నట్లుంది.

నిశ్శబ్దం చేసే శబ్దంతో హృదయం కలసి స్పందిస్తుంటే

ఒంటరిగా నా గదిలో  మేల్కొని  మనసుని ఇలా పరచుకుంటున్నా.

నాలోపల ఎవరో చప్పున ఇటువైపునుండి అటువైపు కదులుతూ

ఆనవాలుగా వదులుతారు జీవితకాలపు జ్ఞాపకాలని-

ఎవరో నవ్వుని నొక్కిపెట్టిన ధ్వని,

మనసుని కలచి వేసినట్లు

మాటల గొంతు నులిమినట్లు.

మంచూ మసక వెన్నెలా  కలసిన

సుప్రభాత వేకువ మీద

మరకలా పడుతుంది నా నిట్టూర్పు.

ఎందుకు రాస్తున్నావంటే ఏం చెప్పను?

ఎవరి గురించి అంటే.. అసలెలా చెప్పనూ..

మాట్లాడటానికి కలసి రాలేదనేమో

మైనా విసుగ్గా వెళ్ళిపోయింది.

సూరీడు కూడా అంత ఎత్తుకు చేరిపోయాక

చుట్టూ ఉన్న మంచు తెరలు విడిపోయాక

వచ్చిందిపుడు నిజమైన మెలకువ

కిటికీలోనుండి నులివెచ్చటి గాలి

కిల కిలా నవ్వింది.

ఇక నీకోసమే నువ్వంటూ

గుసగుస లాడింది.

*

మనసూ ప్లస్ ఆలోచనా =’కేన్యా టు కేన్యా’

 

 

(డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ లో నవంబరు 1, 2015 న ఫార్మింగ్టన్ హిల్స్ గ్రంథాలయం లో ఆరి సీతారామయ్య గారి కథా సంకలనం ఆవిష్కరించారు. పుస్తకావిష్కరణానంతరం ఈ కథలపై చర్చ జరిగింది. ఈ సమీక్ష ఆ చర్చ సారాంశమే.)

-కూనపరెడ్డి గిరిజ Girija

~

 

ఆరి సీతారామయ్య గారి కథలు చాలా విభిన్నమైనవి. ఆయన ప్రతి కథా మన బుర్రకి బుల్లెట్ గురిపెట్టినట్లే. సమస్య మనది కాదు. కానీ … “మన కథ అయితే” అనే ఆలోచన ప్రతి కథకీ కలుగుతుంది. ఎందరి జీవితాలకో, ఎన్ని సమస్యలకో మనకి కిటికీలు తెరిచి తెలియజేయటమే కాదు, పరకాయ ప్రవేశం చేయించేస్తారు. ‘సుచిత్రా చంద్ర ‘ మొదటి కథ. ఇక్కడి యువతరం సైకాలజీ మరియు జీవితం పై వారి దృక్పథానికి అద్దం పట్టారు. సామాన్యంగా అమ్మాయి సర్దుకుపోవటం, అబ్బాయి సమర్ధించుకురావటం – ఇది మన నాయికానాయకుల లక్షణాలు. కానీ ఇప్పటి మన పిల్లల జీవితాల్లో ఆ పాత్రలు తారుమారవుతున్నాయి. మనం మారాము అనుకున్నా ఇంకా ఆ ఎత్తుకు ఎదగలేదనిపిస్తుంది. ‘చంద్ర’ లో ఏ సంకుచితం కనపడదు మనకి. సుచిత్ర పాత్రలో సంఘర్షణకి చంద్ర చక్కటి సమాధానం. అలాటి సమాధానం మన అమ్మాయిలందరికీ దక్కాలి. Just kidding … బులుగు తెలుగు అనుకున్నట్లున్నారు సీతారామయ్య గారు.

“ఉదారస్వభావం’ కి వస్తే, ‘రామాయణ’, ‘మహాభారత’ బ్రతుకులే మనవి ఇక్కడ. అది ఉదారస్వభావం అని వెంకట్ అనుకోవచ్చుగాక. ఆంగ్ల ఉవాచ ఒకటి ఉంది, ‘బ్రతుకు – బ్రతకనివ్వు’ అని. కానీ మనం మన పిల్లల జీవితాలు మనమే జీవించేయాలని చూస్తున్నాం. మారుతున్న కాలంతో పాటు విద్య పట్ల, సంపాదన పట్ల మన ఆలోచన మార్చుకోవాలి.

‘పై చదువు’ – ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కాబట్టి, క్రొత్తగా దేశంలోకి వచ్చిన ఇండియన్ విద్యార్థికి కలిగే అనుభవాలు ఆసక్తికరంగా చిత్రీకరించారు.

‘పరివర్తన’ – ఇది మనకు ఎక్కువగా మనసులో రొద పెడుతుంది. ముందు అసంపూర్ణం అనిపించి పూర్వాపరాలు తెలుసుకోవాలి అని ఆదుర్దా అనిపించినా, ఈ కథ ఉద్దేశం బహుశహ ఇక్కడి system గురించి ‘ఏది పరివర్తన?’ అని చెప్పడం కాబోలుననిపిస్తుంది.

పచ్చ సంచీ – అనువాద కథ. మనసుకు తగలవచ్చు, తగలకపోవచ్చు, దేశకాల పరిస్థితులు వేరు కాబట్టి.

టెస్ట్ – మనసును కదిలించే ఇతివృత్తం. సుజాత పరిస్థితి చాలా బాధాకరం. కాన్సర్ ఎక్కువైపోతున్న ఈ కాల పరిస్థితుల్లో మన ప్రతిస్పందన ఏమిటి ఆ పరిస్థితిలో ఉన్నవారితో అని ఆలోచింపజేస్తుంది. చావు బ్రతుకు అనే సమస్య చాలా గడ్డుది.

అలనాటి ఆర్జ నర్తకి – వయసులో ఒక వెలుగు వెలిగిన తార ముసలి వయసులో ఎదుర్కొన్న దుర్భర పరిస్థితి. అనువాద కథే అయినా కళ్ళు తెరిస్తే మన చుట్టుప్రక్కల చాలానే కనిపిస్తాయి ఇటువంటి జీవితాలు. మనసులు కూడా తెరవాలి మనం.

పెద్దా చిన్నా – అమెరికాలో ఉన్న కొడుకు కోడలు దగ్గరకి వచ్చిన రామ్మూర్తి గారి అనుభవాలు. చక్కటి కథ. మనకి సుపరిచితం కూడా. కోడలితో మంచిగా చెప్పించారు, “గాడిదల్ని పెంచి అమెరికాకి పంపించినా బెంగుళూరు పంపినా వాళ్ళు గాడిదల్లాగే ప్రవర్తిస్తారు … దానికీ అమెరికాకీ సంబంధం లేదు”.

లైఫ్ సైన్స్ – హఠాత్తుగా ఒంటరి అయిపోయిన జానకి జీవితం. తను లేక పోయినా, ఆమె జీవితం ఎంతో కొంత సుగమం చేయాలని తపించిన ఆమె భర్త సుబ్బు మనకి కనువిప్పుగా ఉంటారు. జీవితంలో ఎన్నో ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నప్పుడు గానీ చెప్పలేం ఎంత ఓర్చుకోగలమో.

లక్ష్మమ్మ – టూకీగా చెప్పినట్లు చెప్పినా ఈ కథ నిజానికి ఒక కథాపాఠం. మన గిరిలోంచి బైటకి వచ్చి ప్రక్క మనిషి మనసు తెలుసుకొని మసలమంటుంది.

దేశీ విదేశీ – తమాషా అయిన కథ. ఇండియాలో మాట్లాడే ఇంగ్లీష్ కి ఇక్కడి వ్యవకారిక భాషకి మధ్య తేడాకి పడే అగచాట్లు చాలా తమాషాగా ఉన్నాయి. కానీ ఇండియాలో ఉన్నవాళ్ళు చదివితే మళ్ళీ అజిత్ పరిస్థితే వాళ్ళకి. It will be lost in translation!.

ముగింపు – ఇక్కడ గాయత్రికి వచ్చే ఆలోచన మనందరికీ వస్తుంది. వైద్యం ఎంతో పురోగతి చెందిన ఈ కాలంలో ఎంతవరకు దేవునితో యుద్ధం సాగించి మరల సాయంతో మరణాన్ని ఆపగలుగుతారో … అందుకు మన శరీరాల్ని ఆటవస్తువులుగా వదలాలా వీడిపోవాలా అన్నది అందరం ఆలోచించాలి – ప్రణాళిక వేసుకోక తప్పదు!

ప్రయాణం – విదేశాల్లో పనిచేసే అబ్బాయిలు, వారిని చేసుకున్న అమ్మాయిల అగచాట్లు చెప్పకనే చెప్తుంది ఈ కథ. విదేశీ వ్యామోహం ఆశతో వస్తే అగాధంలో అడుగేసినట్లే ఇలాటి పెళ్ళిళ్ళతో భవితవ్యాలు!

గింజలు – Most thought provoking story. బాధ్యత నెరవేరుస్తున్నాననుకొని ఒకటి, బాధ్యత వదలలేక ఒకటి – రెండు పక్షుల కథ. మన దైనందిన జీవితాలకు అద్దం పట్టిన కథ. ఒక్కోసారి ఈ బాధ్యత అనే ముసుగులో, సంపాదన మత్తులో మునిగిపోయి మనం జీవితంలో ఎన్నో విలువైన సంబంధాలను పలుచన పరుచుకుంటున్నాం. జీవితం జీవించటమే మరచిపోతున్నాం. చెల్లి పక్షి అలాగే బలైపోయింది పాపం.

ఆఖరుగా కేన్యా టు కేన్యా – పుస్తకానికి ఈ పేరే పెట్టారంటే ఈ కథ విలువ తెలుస్తుంది మరి. స్టీవెన్ ఆయేషాలకు వచ్చిన పరిస్థితి ఏ భార్యాభర్తలకూ రాకూడదు. వచ్చినా, వారికున్నంత మనోధైర్యం, స్థైర్యం ఉండాలి. ఆ పరిస్థితుల్లో మన నిర్ణయం అదే కాకపోవచ్చు. కానీ వారికి తోచిన నిర్ణయం నిర్భయంగా చేసుకున్నారు.

ఆరి సీతారామయ్య గారు మంచి ఆలోచన ఉన్న రచయితే కాదు, ఆలోచింపజేయగల రచయిత. ప్రతి కథా అక్కడి నుండి ఇక్కడకు వచ్చి స్థిరపడ్డ మన జీవితాల్లో కలిగే వింత అనుభవాలకూ, సమస్యలకూ,  సంఘటనలకు ప్రతీక. ఇండియాలోనూ, ఇక్కడ ప్రతి ఒక్కరు చదివి ఆనందించ తగ్గ కథా సంపుటి ఇది. కథలు చదివేసినా, పుస్తకం మూసేసినా, అది తెరిచిన కిటికీలు మూతపడడానికి చాలా సమయం పడుతుంది. అంతగా మనసుకు దగ్గరకొస్తాయి కొన్ని కథలు.

*

కొంత చరిత్రా, కొంత కల్పన – “ఆమ్‌స్టర్‌డాంలో అద్భుతం”

 

~ కొల్లూరి సోమ శంకర్

~

కొల్లూరి సోమ శంకర్

11 సెప్టెంబర్ 2001 – చరిత్ర గతిని మార్చిన రోజు. ప్రత్యక్షంగా అగ్రరాజ్యాన్ని, పరోక్షంగా ఎందరో సామాన్యులని ప్రభావితం చేసిన రోజు. ఉగ్రవాదులు న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ యొక్క ట్విన్ టవర్స్‌ను విమానాలతో కూల్చేయడంతో అమెరికాలో ప్రారంభమైన భయం – ప్రపంచంలోని చిన్నా, పెద్దా దేశాలకు పాకిపోయింది. తీవ్రవాదులు ప్రయాణీకుల వేషంలో దాడి చేయచ్చనే భయం నుంచి మొదలైన అనుమానాలు పెనుభూతాలై, భద్రతాచర్యలు విపరీతమయ్యాయి. కొత్త చట్టాల ఏర్పాటుకు నాంది పలికాయి. దేశీయ, అంతర్జాతీయ విమానాలలో అనుమానస్పదంగా కనబడే ఎవరినైనా అదుపులోకి తీసుకుని విచారించడం మొదలైంది. ఈ నేపథ్యంలో ఎందరో అమాయకులను అనుమానితులుగా భావించి, వారిని అరెస్ట్ చేసి, విచారణ జరిపి తాపీగా విడుదల చేయడాలు ఎక్కువైపోయాయి. అంతేకాదు, విమానం గాల్లో ఉన్నప్పుడు కొందరు ప్రయాణీకుల ప్రవర్తన నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా భయపడడం, ఉగ్రవాదాన్ని ఓ మతానికి ఆపాదించి – నామరూపాలు విభిన్నంగా ఉంటే – వాళ్ళని అరెస్ట్ చేయడం వంటివి ఎన్నో విమానాశ్రాయాలలో కలకలం రేపాయి.

ప్రముఖ రచయిత శ్రీ మధురాంతకం నరేంద్ర గారి నవల “ఆమ్‌స్టర్‌డాంలో అద్భుతం” కూడా ఈ నేపథ్యంలోనే సాగుతుంది. “రోజురోజుకూ పెరుగుతున్న మత తీవ్రవాదపు పరిణామాలేమిటో అర్థమయింది. ఈ ఆందోళనల్లో సామాన్యుడి జీవితమెంత అతలాకుతలంగా తయారవుతుందో చూపెట్టడంతో బాటూ దీనికంతా మూలకారణమైన మతం, దాని పుట్టుక, స్వభావం గురించిన అన్వేషణకు కూడా నేనీ నవలను రాయడానికి పూనుకున్నాను.” అని చెబుతారు రచయిత.

అనుకోని ఘటనల వల్ల ఆమ్‌స్టర్‌డాం ఎయిర్‌పోర్ట్‌లో ముప్ఫయి గంటలకి పైగా చిక్కుకుపోయిన ప్రయాణీకులలో ఇద్దరి ద్వారా ఈ కథ సాగుతుంది. మెక్సికోలోని ఓ అంతర్జాతీయ యూనివర్సిటీ నిర్వహిస్తున్న సెమినార్‌లో పేపర్ ప్రెజెంట్ చేయడానికి వెడుతున్న ఓ తెలుగు ప్రొఫెసర్‌కి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పరిచయమవుతాడు ఓ హిందీ భాషీయుడు దమ్మలాల్ చోప్రా. అతనికి ఇంగ్లీషు అంతంత మాత్రంగానే వచ్చు. ప్రొఫెసర్ గారికి హిందీ అంత బాగా రాదు. వీరిద్దరి సంభాషణలు, ఇతరులతో వీరి సంభాషణలు పాఠకులను ఆకట్టుకుంటాయి. దమ్మలాల్ తనకు మార్మిక సంకేతాలు అందుతున్నాయని నమ్మే వ్యక్తి. మన ప్రొఫెసర్ గారేమో హద్దుల్లేకుండా పెరుగుతున్న నేటి సాంకేతిక ప్రపంచం పట్ల అబ్బురపడే మనిషి. మరి వీరిద్దరికి ఎలా పొసుగుతుంది? దమ్మలాల్ చర్యల వల్ల ప్రొఫెసర్ గారు ఏ ఇబ్బందులు పడ్డారు?  అసలీ భయాలకి మూలం ఏమిటి? తోటివారి ప్రాణాలు తీయమని ఏ మతమైనా చెబుతుందా? మత విశ్వాసాలకు విపరీత భాష్యాలు ఎలా మొదలయ్యాయి? ఇలాంటి ఎన్నెన్నో ప్రశ్నలు పాఠకుల మనస్సుల్లో అలజడి కలిగిస్తాయి.

దమ్మలాల్ చోప్రా ప్రవర్తన ప్రొఫెసర్ గారికి అసమంజసంగా అనిపించినా, అతనికి మాత్రం తన నడవడికలో ఏ లోపమూ కనిపించదు. పైగా తాను స్వాభావికంగా ఉన్నట్లే ప్రవర్తిస్తాడు. ఆమ్‌స్టర్‌డాం ఎయిర్‌పోర్ట్‌లో అద్భుతం జరగబోతోందని భావిస్తూంటాడు. అదే మాట పదే పదే వల్లిస్తూంటాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కూర్చుని ఉన్నప్పుడు తాము 22 గంటల పాటు ఆమ్‌స్టర్‌డాం ఎయిర్‌పోర్ట్‌లో వేచి ఉండాల్సి వస్తోందని ప్రొఫెసర్ గారు వాపోయినప్పుడు తోటి ప్రయాణీకుడైన చైతన్య అనే తెలుగు కుర్రాడు, “ఆమ్‌స్టర్‌డాంలో కాలం గడపడమంటే అదొక పెద్ద అవకాశమంకుల్…. ఆ యెయిర్‌పోర్టొక మాయాబజార్…. యిక ఆ వూరే పెద్ద అమ్యూజ్‌మెంట్ పార్కు. యెన్ని పార్కులూ, యెన్ని కాఫీ షాపులూ, యెన్ని మ్యూజియంలూ…. వొక్క రోజేం చాలుతుంది? యువార్ లక్కీ!…” అని అంటాడు. “వూళ్ళోకి వెళ్ళడానికి మాకు వీసా లేదు… యెయిర్‌పోర్ట్‌లోనే కాలంతోయాలి..” అని ప్రొఫెసర్ గారు విచారంగా జవాబిస్తే, “అయినా పర్వాలేదంకుల్! వోన్లీ ట్వెంటీ హవర్స్…. వొక్కో షాపును చూడ్డానికో అరగంట వేసుకోండి. మీరెంత వేగంగా తిరిగినా షాపులే మిగిలిపోతాయి…” అని అంటాడు. వీళ్ళ దృక్పథాలలో ఎంతటి వ్యత్యాసం? బహుశా అనుభవాలే మనిషికి ధైర్యాన్ని, భయాన్నీ కూడా కలిగిస్తాయేమో!

ఆమ్‌స్టర్‌డాం ఎయిర్‌పోర్ట్‌లో ఆగినప్పుడు రెస్ట్ రూంకి వెళ్ళాల్సివస్తుంది దమ్మలాల్ చోప్రాకి. ఆ సమయంలోనే చైతన్య వాలెట్ పోతుంది. దాన్ని వెతకడానికి చోప్రాని సహాయంగా తీసుకువెడతారు చైతన్య మిత్రబృందం. గంటల సమయం గడిచిపోతూంటుంది. దమ్మలాల్ రాడు. ప్రొఫెసర్ గారికి టెన్షన్ పెరిగిపోతుంది. ఆయన ఎక్కాల్సిన విమానానికి బోర్డింగ్ ఎనౌన్స్ చేస్తారు. ఇద్దరిదీ కలిపి జాయింట్ టికెట్ కావడంతో తన తోటి ప్రయాణీకుడు రాకపోతే ఏమంటారో అని భయపడతాడు. చివరికి తెగించి సెక్యూరిటీ చెక్ ముగించుకుని విమానం ఎక్కేస్తాడు. అదే సమయంలో దమ్మలాల్ కూడా విమానంలోకి వచ్చేస్తాడు. ఎందుకాలస్యం అంటే… ఓ అద్భుతానికి నాందీ ప్రస్తావన జరిగిందని చెబుతాడు? ఏమిటా సంఘటన? అతను అద్భుతానికి టీజర్‌గా భావించిన ఆ ఘటన యొక్క అసలు స్వరూపం తెలిసాక ప్రొఫెసర్ గారికి ఒళ్ళు జలదరిస్తుంది.

***

తిరుగు ప్రయాణంలో మళ్ళీ ఆమ్‌స్టర్‌డాం సమీపిస్తుంటారు. ఇక్కడ విమానం భూమి మీదకి దిగడం గురించి రచయిత చెప్పిన తీరులోని భావుకత పాఠకులను మైమరపిస్తుంది. “విమానం మేఘాల దొంతరలను చీల్చుకుంటూ కిందకి దిగసాగింది. కిటికీలోంచీ కనబడుతున్న భూమి క్రమంగా దగ్గరవసాగింది. నగరాన్ని పాయలు పాయలుగా కమ్ముకున్న నదీ, నదీ పాయల మధ్య పెరుగుతున్న చెట్లూ, చెట్ల మధ్యలో యిండ్లూ, యిండ్ల మధ్యలో యెండిన కాలవల్లాంటి రోడ్లూ, రోడ్లపైన పరిగెడుతున్న వాహనాలూ, అన్నీ క్రమంగా దగ్గరకు వచ్చాక, నిర్జనమైన విమానాశ్రయపు రన్‌వే పైకొచ్చిన విమానం, అలవోకగా టైర్లు దించి, రోడ్డు పైన పరిగెత్తసాగింది.” ఈ వాక్యాలు చదువుతున్న పాఠకులు స్వయంగా తామూ ఆ విమానంలో ఉన్నట్లు, ఆకాశం నుంచి నేలకు దిగుతున్నట్లు భావిస్తారు కదూ?

సరే, మొత్తానికి విమానం నేలని తాకుతుంది. కానీ ప్రయాణీకులెవరూ కిందకి దిగడానికి అనుమతి లభించదు. కారణం, ప్రయాణీకులలోని కొందరి ప్రవర్తన. ఎయిర్ మార్షల్స్ వారిని అదుపులోకి తీసుకుని, దూరంగా తీసుకెళ్ళాక గాని మిగతా ప్రయాణీకులకి విముక్తి లభించదు. వీళ్ళిద్దరూ ఓ మూల లాంజ్‌లో కూర్చుంటారు. సెక్యూరిటీ చెక్‍లో దమ్మలాల్ సంచీలో ఉన్న మందులు, పుస్తకాలు తీసుకుంటారు విమానాశ్రయపు అధికారులు. సమయం గడుస్తూ ఉంటుంది. దమ్మలాల్ చోప్రా డైరీలోని రాతలని చదివి అర్థం చెప్పమని ప్రొఫెసర్‌ని పిలుస్తారు అధికారులు. డైరీలో రాసి ఉన్నది కవిత్వమనీ… ఆ కవితల భావాన్ని వివరిస్తాడు ప్రొఫెసర్. “అనంతమెపుడూ యేకవచనమే! అనంతమెపుడూ అద్వయితమే! అనంతానికి మధ్యవర్తులెందుకు? అనంతానికి చేతులెందుకు? అనంతానికి మాటలెందుకు?” అని రాసున్న ఓ కవితని చదివి వినిపిస్తే, “టెల్ మీ ది ఆన్సర్ ఆల్సో!” అంటూ అడ్డు తగులుతాడో సెక్యూరిటీ ఆఫీసర్. అప్పుడక్కడ జరిగిన ఉదంతం పాఠకులని ఉక్కిరిబిక్కిరి చేసేలా నవ్విస్తుంది.

జరగబోయే అద్భుతం కోసం ఎదురుచూస్తున్న దమ్మలాల్ తన మాటలతో, చేష్టలతో ప్రొఫెసర్ గారిని బెంబేలెత్తిస్తాడు. జేబుల్లో ఉన్న నాలుగువేల రూపాయల ఇండియన్ కరెన్సీ ఇక్కడ చెల్లకపోవడం పట్ల అంతర్జాతీయ విప్లవం లేవదీయాలనుకుంటాడు. అతని మాటలకు జాలి చూపెడుతూ, సానుభూతి చెందుతూ, కంగారు పడుతూ, వంత పాడుతాడు ప్రొఫెసర్. అద్భుతం జరగబోతోందంటూ ఊదరగొడతాడు దమ్మలాల్. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఓ హోటల్లో హౌస్ అరెస్ట్ లాగా పడేస్తారు అధికారులు. “మేము తీవ్రవాదులయివుంటామనే అనుమానం, దేశాల ఎంబసీలే చేయలేని పనిని చిటికెలో చేసి పారేసింది. యిప్పుడిక్కడ మాకు పైసా ఖర్చు లేకుండా, అయిదు నక్షత్రాల హోటల్లో వసతీ, భోజనమూ దొరుకుతున్నాయి. యింతకంటే చిత్రమేముంటుంది? మొదటి నుంచీ దమ్మలాల్ చోప్రా చెబుతున్న అద్భుతం యిదేనేమో!” అనుకుంటాడా ప్రొఫెసర్.

చివరికి ఢిల్లీ వెళ్ళే విమానం ఎక్కి కూర్చుంటారు. ఈ విమానం కూడా సమయానికి ఎగరదు. ప్రయాణీకులందరూ ఎక్కినా విమానం బయల్దేరదు. ఓ పిల్లాడి దుందుడుకు చర్య వల్ల బాగా ఆలస్యం అవుతుంది. చివరికి విమానం గాల్లోకి ఎగురుతుంది. ప్రయాణం కొనసాగి ఢిల్లీ సమీపిస్తుంది. ఆమ్‌స్టర్‌డాంలో అద్భుతం జరిగిపోయిందని అంటాడు దమ్మలాల్ చోప్రా. “యింత ప్రమాదకరమైన పరిస్థితులలో, చివరకు సెక్యూరిటీ వాళ్ళు మనల్ని అనుమానించినా, తప్పకుండా తీవ్రవాదులే అనిపించే వ్యక్తులతో బాటూ మనం కలిసి తిరగవలసి వచ్చినా, యిలా తప్పించుకుని తిరిగీ మనం మన దేశానికి చేరుకుంటున్నాం చూడూ, అదీ అదీ అద్భుతం!” అంటాడు ప్రొఫెసర్.

విమానం ఢిల్లీలో లాండవుతుందనగా… వాళ్ళిద్దరు అప్పటిదాక దాచివుంచిన తమ మనోభావాలను వెల్లడించుకుంటారు. పాకిస్తానీలాగానో, అఫ్ఘనిస్తాన్ వాడిలానో అనిపించే దమ్మలాల్‌తో కలసి ప్రయాణం చేసినందుకు ప్రొఫెసర్ భయపడినట్లే, ముస్లిం అయిన ప్రొఫెసర్‌తో కలసి ప్రయాణించినందుకు దమ్మలాల్ భయపడతాడు. అయితే ఇందుకు తామిద్దరం కారణం కాదని అంటాడు ప్రొఫెసర్. మరెవరు కారణం?

***

కారణాలను, కారకాలను అన్వేషించే ప్రశ్నలతో పాఠకులను ఆకట్టుకుంటుందీ పుస్తకం. ఉత్కంఠగా చదివించే ఈ నవలని 2013లో “కథాకోకిల ప్రచురణలు” వారు ప్రచురించారు. 100 పేజీలున్న ఈ నవల వెల రూ.60/- (ప్రస్తుతం ధర మారి ఉండచ్చు). ప్రచురణకర్తల వద్ద, విశాలాంధ్ర వారి అన్ని కేంద్రాలలోనూ ప్రింట్ బుక్ లభిస్తుంది. ఈబుక్ కినిగెలో లభ్యం.

 

ప్రచురణకర్తల చిరునామా:

Kathakokila Prachuranalu

15-54/1, Padmavathi Nagar,

Tirupati West – 517 502

Phone: 0877-2241588

 

మనుషులు చేసిన దేవుళ్ళారా!

 

[పోయిన వ్యాసానికి కొనసాగింపు]

 దేవుడు అనే భావన అలౌకికమైనది. కానీ మతం భౌతికమైనది (Religion is a physically existing thing). ప్రతి భౌతిక పదార్థం తన చుట్టూ ఉన్న భౌతిక పరిస్థితుల మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే తిరిగి ఆ భౌతిక పరిస్థితుల ప్రభావానికి లోనవుతుంది. అనగా మానవ సమాజంలో వచ్చే మార్పుల ప్రభావం మతం మీద పడుతుంది, అలాగే మతంలో వచ్చే మార్పుల ప్రభావం మానవ సమాజం మీద పడుతుంది. భౌతిక పదార్థాలన్నీ నిరంతరం మార్పుకు లోనయ్యేవే. ఏది ఎల్లకాలలపాటు ఒకేలా ఉండదు. ఇది మనం బాగా అర్థం చేస్కోవాల్సిన విషయం.

మతం ప్రధానంగా వాస్తవ ప్రపంచంలో కనపడని శక్తులు/ఆత్మలు/లోకాలు వగైరాల చుట్టూ తిరిగుతుంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు, ఇటువంటి అలౌకిక భావనలు ప్రచారం జరగాలంటే భాష తగినంత అభివృద్ధి చెంది ఉండాలి. ఇంకా కళలు కూడా తగినంత అభివృద్ధి జరిగి వుండాలి .

ఉదాహరణకి “ఆత్మ” అనే భావనని భాష లేకుండా ఇంకొకరికి అర్థమయ్యేలా చెప్పడం ఎంత కష్టతరమైన విషయం? అలాగే బయట ప్రపంచంలో లేని ఊహాతీత శక్తులకి ఏదో ఒక రూపం కల్పించక పోతే, దాన్ని ఇతరులకి వ్యక్తపరచడం చాలా కష్టమవుతుంది.

మతం ఒక సామూహిక ఊహ. వ్యక్తిగతంగా ఎవరో ఒకరి మెదడులో పుట్టిన ఊహ సమూహంలోని అందరికీ అర్థమయితేనే అది ఒక సామూహిక ఊహగా మారుతుంది. ఇది భాషగానీ, చిత్రకళ గానీ, శిల్పకళ గానీ లేకుండా సాధ్యపడదు. ప్రారంభ దశలలో మతం యొక్క అభివృద్ధి భాష, కళ ఆటంకాలు. వాటి అభివృద్ధి మీదనే మతం అభివృద్ధి ఆధారపడి ఉంది.

ఈ క్రమాన్ని ఒక infographic తో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది.

vinod1

కొండ గుర్తు ౩:

మనుషులకి ప్రకృతి మీద అవగాహన పెరుగుతున్నా కొద్దీ కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. ఇవి మానవ జీవన విధానంలో మార్పులు తీసుకువస్తాయి. మనుషుల జీవన విధానం మారడం అంటే సమాజం మొత్తం మార్పుకి లోనవుతున్నట్టు. ఈ మార్పు తిరిగి భాష, కళ, మతాలలో మార్పులు తీసుకువస్తుంది.

పై infographని గమనించినట్టు అయితే, లోహాన్ని కనుగొన్న తరవాత కళల రంగంలో, ఆయుధాల తయారీలో ఒకే మాదిరి అభివృద్ధి మనం గమనించవచ్చు. 5000 సం|| పూర్వం రాగి, కాంస్యం ఆయుధాలు తయారయ్యాయి. అదే సమయంలో రాగి, కాంస్యం శిల్పాలు తయారుచెయ్యడం మొదలయ్యింది. రెండిటి పునాది ఒక్కటే. లోహాన్ని కరిగించి మలుచుకోవడం నేర్చుకున్న మనుషులు దాన్ని ఆయుధాలు తయారు చెయ్యడంతో పాటు, శిల్పాలు చెక్కడం లో కూడా ఉపయోగించారు. అంతకు ముందు దాకా కేవలం రాతితో శిల్పాలు చెక్కడం జరిగేది. లోహం వచ్చాక లోహపు శిల్పాల ప్రాబల్యం పెరిగింది.

మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు, “దేవుడు” అనే భావనని మనుషులు కల్పించుకున్నారు. ఆ దేవునికి రూపాన్ని కూడా మనుషులే కల్పిస్తారు. ఆ కల్పన చేసే మనుషులు ఏ కాలంలో బతుకుతున్నారు అనే దాన్ని బట్టి ఆ దేవుని రూపం ఆధారపడి ఉంటుంది. లోహమే తెలియని మనుషులు తమ దేవునికి బంగారు కిరీటాన్ని పెట్టడం అనేది అసంభవం. దీనిని తిరగేసి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఏదైనా ఒక పురాణంలో “దేవుడు ఫలానా కత్తిని వాడాడు” అని ఉందనుకుందాం. దీని అర్థం ఆ పురాణం తయారు చేసిన కవులు ఉన్న సమాజంలో అప్పటికే లోహపు కత్తులు వాడుతున్నారని అర్థం. వారు తాము చూస్తున్న సమాజంలోని విషయాలనే కల్పనలు జోడించి రాయగలరు. ఎలాగయితే ఆటవిక మానవులు కత్తులు, రథాలు ఉన్న దేవుడిని ఊహించలేరో, అలాగే ఈ పురాణాలు తయారు చేసిన కవులు  గన్నులు, బాంబులు ఉన్న దేవుడిని ఊహించలేరు.

అలాగే హిందూ మతంలో బ్రహ్మదేవుడు తలరాత రాస్తాడు అనీ, చిత్రగుప్తుడు పాపాల చిట్టా రాస్తాడు అనీ కొన్ని కథలు ఉన్నాయి. ఇటువంటి కథలు అన్నీ “లిపి” అనేది పుట్టాక మాత్రమే తయారవ్వగలవు. ఎందుకంటే “రాయడం” అనేది తెలియని మనుషులు తాము తయారు చేసుకున్న కథల్లో “రాయడం” గురించి ప్రస్తావించడం జరగదు.

vinod2

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, నేడు ప్రపంచంలో సనాతన/పురాతన మతాలుగా చెప్పబడుతున్న మతాలన్నీ అనాగరిక యుగం ఎగువ దశలో రూపు సంతరించుకున్నవే. హిందూ, గ్రీకు, రోమను పురాణ కథలు, ఇతిహాసాలన్నీ ఈ దశలో పుట్టినవే. దీనికి సాక్ష్యం ఆ పురాణ కథల్లోనే దొరుకుతుంది.

“గ్రీకు సముద్ర దేవుడు పోసేడాన్ త్రిశూలాన్ని ఆయుధంగా వాడాడు” అని గ్రీకు పురాణాలు చెప్తున్నాయి. అలాగే “ హిందూ దేవుడు విష్ణుమూర్తి కౌమోదకి గదని ఆయుధంగా ధరించాడు.” అని హిందూ పురాణాలు చెప్తున్నాయి. అంటే ఈ పురాణ కథలు పుట్టే కాలానికే ఆయా సమాజాలలో లోహపు త్రిశూలాలు, గదలు వాడుకలో ఉన్నాయి అన్నమాట. ఇటువంటి పురాణాలు లోహాన్ని కరిగించి ఆయుధంగా మలిచే పరిజ్ఞానం సంపాదించిన సమాజాల్లోనే పుట్టగలవు. రాళ్లు తప్ప లోహం తెలియని ఆటవిక మానవులు ఇలాంటి దేవుళ్ళని, కథలని ఊహించడం అసాధ్యం. అలాగే “రాముడు రాజ్యాన్ని పరిపాలించాడు” అని ఒక పురాణం చెప్తుంది. అంటే ఈ పురాణ కథ తయారయ్యే సమయానికే రాజ్యాలు, రాచరిక వ్యవస్థ ఏర్పడిపోయాయి అన్నమాట. అడవులలో గుంపులుగా తిరిగే ఆటవిక మానవులకి, నదుల వెంట వలసలు పోయే అనాగరిక మానవులకి “రాజ్యం” అనే వ్యవస్థని ఊహించడం అసాధ్యం.

ఈ పురాణ కథలు ఎవరు తయారు చేసారు అనేది అప్రస్తుతం. ఆ కవులు ఎవరైనా సరే, వారు అనాగరిక యుగం ఎగువ దశలో ఉన్న సమాజానికి చెందినావారే. వారు తాము చూస్తున్న సమాజాన్ని (కొంత కల్పనలని జోడించి) తమ కథల్లో ప్రతిబింబించారు. వారు చూస్తున్న సమాజంలోని రథాలు, గిన్నెలు, ఆభరణాలు, కుర్చీలు, కిరీటాలు, కోటలు, భవంతులు, నగరాలు, కాలిజోళ్ళు, పట్టువస్త్రాలు వంటివన్నీ వారి కావ్యాల్లోకి దిగుమతి అయిపోయాయి. ఇవన్నీ భౌతికమయిన వస్తువులు. ఎవరో ఒకరు తయారు చేస్తే గానీ తయారు కాని వస్తువులు. దానికి వాటిని తయారు చేసే పరిజ్ఞానం కావాలి. ఈ పరిజ్ఞానం కాలంతో పాటు ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి చెందుతూ వస్తుంది తప్ప మంత్రంతోనో, తంత్రంతోనో గాలిలోంచి ఊడిపడదు.

ఆ కథల్లో ఏ “దేవుని రూపం” అయితే వర్ణించబడిందో దాన్నే చిత్రకారులు, శిల్పులు తమ బొమ్మల్లో చిత్రిస్తారు. గుళ్ళలోను, ఇళ్ళలోనూ అదే రూపంతో ఉన్న విగ్రహాలు, చిత్రపటాలు పెట్టబడతాయి. ఆ దేవుని చేతిలో సహజంగానే అప్పుడు వాడబడుతున్న లోహపు ఆయుధాలే ఉంటాయి.

హాస్యాస్పదం అయిన విషయం ఏమిటంటే, మనుషులు అభివృద్ధి సాధిస్తున్న కొద్దీ దేవుని రూపంలో కూడా మార్పులు వస్తూనే ఉన్నాయి. కానీ ఏ కాలంలోని మనుషులు ఆ కాలం లో చెలామణీ లో ఉన్న దేవుని రూపమే అసలైన దేవుని రూపం అనీ, అది సృష్టి మొదటి నుంచీ అలాగే ఉందనీ, రాబోయే ఎల్లకాలాల పాటు అలాగే ఉంటుందనీ విశ్వసిస్తారు. మతంలో ఉన్న ప్రత్యేకత ఇదే.

[వచ్చే వారం]

 

మరల రాని మధుర “వసంతం”

 

 

 

వంగూరి చిట్టెన్ రాజు

~

chitten rajuఅది సెప్టెంబర్ 29, 2015. ఆ రోజు హ్యూస్టన్ మహా నగరం లోని నాసా అంతరిక్ష కేంద్రం చూడడానికి వెళ్ళిన వేలాది సందర్శకులు అక్కడి మిషన్ కంట్రోల్ భవనం మీద ఉన్న అమెరికా జాతీయ పతాకం సగం క్రిందకి దించబడి ఉండడం గమనించి “పాపం ఎవరో గొప్ప వ్యక్తి మరణించి ఉంటారు” అనుకున్నారు. మరో కొన్ని నెలలలో సందర్శకులు అదే ప్రాంగణం లో అమెరికా ప్రభుత్వ వ్యవస్థ అయిన నాసా వారు  మరణించిన ప్రముఖుల జ్ఞాపకార్థం సగౌరవంగా నాటిన వృక్ష సముదాయంలో మరో పారిజాతం పరిమళాలు వెదజల్లుతూ కనపడుతుంది. ఆ వృక్ష నివాళి లో భారతీయ సంతతి కి చెందిన వారు ఇద్దరే. ఇద్దరూ మహిళలే. మొదటిది 2003 లో జరిగిన “కొలంబియా” రోదసీ నౌక ప్రమాదంలో అసువులు బాసిన ఏకైక భారతీయ వ్యోమ గామి కల్పనా చావ్లా. రెండోది గత సెప్టెంబర్ 28, 2015 నాడు ఎవరూ, ఊహించని విధంగా “కపాల మోక్షం” చెందిన పదహారణాల తెలుగింటి ఆడపడుచు, నాసా శాస్త్ర వేత్త డా. పుచ్చా వసంత లక్ష్మి. ఆ వృక్షానికి నేను పెట్టుకునే పేరు “వసంత వృక్షం”. ఎందుకంటే అటువంటి పరిపూర్ణమైన మహిళ  కానీ, ఆ పేరిట కలకాలం నిలిచే వృక్షం కానీ న భూతో, న భవిష్యతి.

గత సెప్టెంబర్ 23, 2015 నాటి దౌర్భాగ్య దినాన ఎప్పటి లాగానే వసంత మధ్యాహ్నం లంచ్ సమయంలో “ఇప్పుడే అరగంట లో వస్తాను” అని తన సాటి వారితో చెప్పి, ఆ మర్నాడు ఒక కాన్ ఫరెన్స్ కోసం కాలిఫోర్నియా వెళ్ళడానికి ఏర్పాట్ల కోసం కారు లో బయలు దేరి, దారి తప్పి, సెల్ ఫోన్ లో ఒక సహా ఉద్యోగిని పిలిచి సరి అయిన దారికి మళ్ళుతున్న క్షణం లో …అంటే ఉదయం 11: 12 నిముషాలకి దేముడు పిలిచాడు. ఏ విధమైన సూచనలూ లేకుండా హఠాత్తుగా బ్రైన్ హేమరేజ్ వచ్చి, కారు అదుపుతప్పి, ఒక రెస్టారెంట్ వారి భవనం గోడ కి దూసుకు పోయింది. అది చూసిన వారు 911 కి ఫొన్ చెయ్యగానే ఆంబ్యులెన్స్ వారు వచ్చి ఆసుపత్రికి తరలించారు. వెను వెంటనే స్పందించిన పోలీసులు ఆమె ధరించిన నాసా బేడ్జ్ ని గుర్తించి, వివరాలు సేకరించి, ఒక ఆమె భర్త మల్లిక్ కి వసంత రోడ్డు ప్రమాదం వార్త మధ్యాహ్నం 1:30 కి అందించ గలిగారు. నాకు కూడా మల్లిక్ చెప్పగానే హుటాహుటిన నలభై మైళ్ళ దూరం లో ఉన్న హాస్పిటల్ కి 2:30 కి వెళ్లాను. ఆ తరువాత ఐదు రోజులు అన్ని రకాల వైద్యులు, ఎన్ని రకాల చికిత్సలు చేసినా వసంత ని మాకు దక్కించ లేక పోయారు. సెప్టెంబర్ 28, 2015 సాయంత్రం మా అందరి సమక్షంలో వసంత ఆ దేవుడి దగ్గరకి వెళ్ళిపోయింది. ఆ నాలుగు రోజులూ మేము ఎంత క్షోభ అనుభవించామో ఆ దేవుడు అంతే ఆపేక్ష గా వసంత కోసం నిరీక్షించి ఉంటాడు. నాకు అందుకే ఆ దేవుడంటే చాలా అసూయ.

NASA Award

ప్రతిష్టాత్మక నాసా పురస్కారం అందుకుంటూ..

నలభై ఏళ్లగా నాకూ, మా ఆవిడకీ ఏకైక గాఢ స్నేహితురాలిగా, మా పిల్లలకి “బొడ్డు కోసి పేర్లు పెట్టిన “పెత్తల్లి” గా వసంత గురించి వ్రాయాలంటే ఎక్కడ మొదలెట్టాలో తెలియక చాలా ఇబ్బందిగా ఉంది. అమెరికా లో ఫార్మకాలజీ శాస్త్రవేత్తలలో ఆమెకున్న అగ్రశ్రేణి స్థానం గురించి వారి కుటుంబానికీ, నాకూ తప్ప చాలా మందికి తెలియని విశేషాలు ముందుగా ప్రస్తావిస్తాను.

1946  లో అంబటిపూడి నరసింహం, శ్రీహరి దంపతులకి ఏకైక సంతానంగా కాకినాడ లో తాత గారైన మద్దూరి సోమయాజుల గారి ఇంట్లో పుట్టిన వసంత లక్ష్మి తండ్రి  గారి ఉద్యోగ రీత్యా విశాఖపట్నం, కాకినాడ, రాయపూర్, భిలాయ్ నగరాలలో బయాలజీ శాస్త్రాలలో మాస్టర్స్ డిగ్రీ దాకా చదువుకుంది. 1968 లో పుచ్చా మల్లిఖార్జున వెంకట సుబ్రమణ్యం (మల్లిక్) తో వివాహం అయిన తరువాత నాలుగేళ్ళు బెంగుళూరు లో మల్లిక్ భారత ఎలాక్రానిక్స్ కంపెనీ లోనూ, వసంత హెబ్బల్ లో అగ్రికల్చురల్ యూనివర్సిటీ లోనూ పనిచేసి, 1972 లో ముందు మల్లిక్, ఏడాది తరువాత నాలుగేళ్ల కొడుకు గిరీష్ తో వసంతా హ్యూస్టన్ వలస వచ్చారు. రాగానే వసంత యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లో ముందు బయాలజీ లో చేరి, ఫార్మకాలజీ లోకి మారి వరసగా మాస్టర్స్ డిగ్రీ, డాక్టరేట్ డిగ్రీ 1980 లో పూర్తి చేసింది. వెనువెంటనే అమెరికా ప్రభుత్వం వారి నేషనల్ రిసెర్చ్ కౌన్సిల్ వారి పోస్ట్ డాక్టరల్ ఫెలోగా నాసా అంతరిక్ష కేంద్రం వారి బయో సైన్సెస్ విభాగంలో చేరింది.

అదే ఫెలో షిప్ తో కొన్నేళ్ళు నార్త్రప్ అనే కంపెనీ లో మూడేళ్ళు కొనసాగుతూ మంచి పరిశోధకురాలిగా పేరు సంపాదించుకుంది. ఆ కారణంగా నాసా వారు 1989 లో అక్కడ ఫార్మకాలజీ లేబొరేటరీ సంస్థాపన బాధ్యతలు వసంత కి అప్పగిస్తూ ఆ ప్రభుత్వ సంస్థ లోనే కీలకమైన పదవి లో నియమించారు అప్పటి నుంచీ వసంత ఇక శాస్త్ర వేత్తగా వెను తిరిగి చూడ లేదు. అచిర కాలం లోనే అమెరికాలో అత్యున్నత స్థాయి ఫార్మకాలజీ పరిశోధనాలయం నాసా వారిదే అనే విధంగా ఆ లేబోరేటరీని తీర్చి దిద్దింది.  నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, నేషనల్ స్పేస్ బయో మెడికల్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్, అమెరికా ప్రభుత్వ నౌకాదళం మొదలైన జాతీయ స్థాయి సంస్థల నుండి అనేక మిలియన్ డాలర్ల రిసెర్చ్ గ్రాంట్స్ సంపాదించి అంతరిక్షం లో మానవ శరీరంలో వచ్చే మార్పులు, తీసుకోవలసిన జాగ్రత్తలు, కేవలం జీరో గ్రావిటీ లో మాత్రమే తయారు చెయ్యగల మందుల తయారీ మొదలైన అనేక శాస్త్రీయ విషయాలపై అగ్ర స్థాయి పరిశోధనలు చేసింది మన వసంత. అనేక అంతర్జాతీయ శాస్త్రీయ పత్రికలలో సుమారు వందకి పైగా పరిశోధనా పత్రాలు, పది విశ్వ విద్యాలయ స్థాయి పాఠ్య పుస్తకాలలో అధ్యాయాలు, మూడు పేటెంట్లతో నాసా లో ఉన్న నలభై వేల మంది ఉద్యోగస్తులలో సీనియర్ సైంటిస్ట్ లు పదముగ్గురి లో మన తెలుగు ఆడబడుచు వసంత ఉన్నత స్థానం లో నిలబడింది…కేవలం స్వయం కృషి తో. అంతే కాదు, తను చదువుకున్న యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ తోనూ, అనేక దేశాలలోని అగ్ర సంస్థల తోనూ నాసా తరఫునా, వ్యక్తిగతంగానూ విశేషమైన సేవలు అందిస్తూనే, నాసా వారికి ప్రవేటు సంస్థలతో అనుబంధం కలిగించి, అంతరిక్ష యానంలో ఏస్ట్రోనాట్స్ తరచూ వచ్చే మోషన్ సిక్ నెస్ నివారణకి తను స్వయంగా కనిపెట్టిన మందులు వ్యాపార పరంగా తయారు చెయ్యడానికి పూర్తి ఏర్పాట్లు చేసింది వసంత. మల్లిక్ కూడా నాసా లోనే ఉద్యోగం చేసేవాడు కాబట్టి వాళ్ళిద్దరినీ “స్పేస్ కపుల్” అని అందరూ పిలిచే వారు.

ఒక శాస్త్రవేత్తగా వసంత కి ఉన్న స్థాయి గుర్తింపు కి మరొక ఉదాహరణగా సెప్టెంబర్ 30, 2015 నాడు ఆమె అంతిమ యాత్రకి నాసా ఉన్నత అధికారులు వచ్చి, నాసా తరఫున అమెరికా జాతీయ జండాని ఆమె కుటుంబానికి తమ నివాళి గా సమర్పించారు. అమెరికా దేశంలో ఇది అత్యంత గౌరవప్రదమైన నివాళి గా పరిగణిస్తారు. వ్యక్తిగా వసంత అంటే ఆమె సహాధ్యాయులకి ఎంత గౌరవం అంటే నవంబర్ 8, 2015 నాడు “Celebration of Vasanta’s Life” అని ఆమె కుటుంబం నిర్వహించిన ఆత్మీయ కార్యక్రమానికి 35 సంవత్సరాల క్రితం వసంత మాస్టర్స్ & డాక్టరేట్ కి గైడ్ గా వ్యవహరించిన ప్రొఫెసర్ స్టువార్ట్ సేల్ద్మన్ గారు జార్జియా నుంచీ, ఆమెతో పని చేసిన నాసా డైరెక్టర్ డా. కేరోలైన్ హంటూన్,  ఇతర ప్రాంతాల నుండీ అనేక మంది సిబ్బందీ ప్రత్యేకంగా వచ్చి తమ జ్ఞాపకాలని పంచుకున్నారు.

 

వసంతకి ఉన్న ఒక గుణం ఏమిటంటే వృత్తి రీత్యానూ, ఒక అగ్రశ్రేణి శాస్త్ర వేత్త గానూ తను సాధించిన విజయాలని, ఎదురైన ఇబ్బందులనీ స్నేహ బృందంతో ఎక్కువగా పంచుకునే అలవాటు లేదు. కానీ ఆ అదృష్టానికి నేను నోచుకున్నాను. పైన ఉదాహరించిన చాలా వివరాలు అప్పటికప్పుడే నాకు వసంత పిలిచి చెప్పి సంబరపడుతున్నప్పుడు “మన వాళ్ళందరికీ చెప్పావా?” అని అడినప్పుడల్లా “ఎందుకు రాజూ, ఏదో గొప్పలు చెప్పుకుంటున్నాను అనుకుంటారు. పోనీ ఇదేమైనా ఓ ఆటా, పాటా వ్యవహారమా” అనేది. అందుకే ఆమె అసంఖ్యాక మిత్ర బృందానికి వసంత ఆటా, పాటల గురించే ఎక్కువ తెలుసును కానీ శాస్త్రవేత్త గా ఉన్న అఖండమైన ప్రఖ్యాతి తెలియదు.

ఇక నాకూ, వసంత కీ పరిచయం చిన్నపుడు పరోక్షంగానూ, అమెరికా లో ప్రత్యక్షం గానూ జరిగాయి. రెండూ తమాషా సంఘటనలే. అప్పుడు మా ఇద్దరికీ పదిహేనేళ్ళు ఉంటాయేమో. మేము కాకినాడ గాంధీ నగరంలో ఉంటే వసంత వాళ్ళ తాత గారు మద్దూరి సోమయాజుల గారింట్లో రామారావు పేట లో పి.ఆర్. కాలేజీ & కుళాయి చెరువు దగ్గర ఉండే వారు. మా ఇద్దరివీ లాయర్ల కుటుంబాలే కాబట్టి రాకపోకలూ, పేరంటాలూ వగైరాలు కూడా ఉండేవి కానీ నాకు అవేమీ తెలియదు. కానీ ఒక సారి మా నీల పిల్లి అనే భలే పేరు ఉన్న మా చాకలి వాడు ఉతికి తెచ్చిన బట్టల మూట లో మా బట్టల బదులు వసంత వాళ్ళ ఇంటి తాలూకు మూట పట్టుకొచ్చి ఇచ్చి వెళ్లి పోయాడు. ఆ తరువాత మూటల మార్పిడి జరిగింది కానీ నాకూ, వసంత కీ మొట్ట మొదటి పరోక్ష పరిచయం మాకున్న కామన్ చాకలివాడు నీలపిల్లి ధర్మమా అనే జరిగింది. ఈ విషయం మేమిద్దరం అమెరికా లో ప్రత్యక్షంగా కలుసుకున్నాక మాటల కాకినాడ కబుర్ల సందర్భంలో తెలిసింది. మరో ముఖ్యమైన మరో పరోక్ష పరిచయం మేమిద్దరం కాకినాడ పి.ఆర్. కాలేజ్ లో ప్రి యూనివర్శిటీ లో ఒకే బేచ్ వాళ్ళం. కానీ నాది MPL..అంటే మేథమేటిక్స్, ఫిజిక్స్ & లాజిక్ అయితే వసంత ది BPC, అంటే బయాలజీ, ఫిజిక్స్ & కెమిస్ట్రీ. అంచేత ఎక్కడా ఏ క్లాస్ లోనూ కలిసే  అవకాశం లేదు. ఆ రోజుల్లో అమ్మాయిల సంఖ్య అతి తక్కువ కాబట్టి ఇతర విద్యార్ధుల లాగా గర్స్ వైటింగ్ రూమ్ చుట్టూ తిరిగితే కనపదేదేమో కానీ నేను “రాముడు మంచి బాలుడు” కాబట్టి ఏదో నా చదువూ, నా క్రికెట్టు ప్రపంచాలలోనే ఉండే వాడిని. అంచేత నేనూ, వసంతా అప్పుడు ఒకళ్ళకి మరొకరం గుంపులో గోవిందా బాపతే. ఇది కూడా మేము అమెరికాలో కలుసుకున్నాక పి.ఆర్. కాలేజ్ సంగతులు మాట్లాడుకుంటూ ఉంటే తెలిసిన సంగతే.

Vasantha & Raju 1975

1975 లో…వసంతతో…

ఇక 1975 లో నేను హ్యూస్టన్ లో అడుగుపెట్టిన నెల తిరక్కుండానే మల్లిక్, వసంత లని కలుసుకోవడం కూడా తమాషాగానే జరిగింది. కొన్నాళ్ళ నిరుద్యోగం తర్వాత అప్పుడే నేను యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ లో పోస్ట్ డాక్టరల్ ఫెలో గా చేరాను. ఒకరిద్దరు తెలుగు వారు కాని యూనివర్శిటీ విద్యార్థులు తప్ప ఎవరూ తెలియదు. ఓ వారాంతంలో మేము మాకు 200 మైళ్ళ దూరం లో ఉన్న సాన్ ఏంటోనియో నగరం చూడడానికి వెళ్ళాం. అక్కడ “రివర్ వాక్”…అంటే నదిలో బోట్ షికారు చాలా ప్రసిద్ది చెందింది. మా కుర్రాళ్ళం నలుగురం పైన వంతెన మీద నుంచుని క్రింద నదిలో పడవలలో విహరిస్తున్న మనుషులని చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఒక పడవలో మన భారతీయులలాగా కనపడుతున్న ఒక కుటుంబాన్ని చూశాం.  ఆ రోజుల్లో భారతీయులు కనపడడం అపురూపం కాబట్టి గబ గబా చేతులు ఊపేసి హాయ్ అని చెప్తూ నేను అనుకోకుండా ఉత్తినే వేళాకోళానికి “ఏమండీ బావున్నారా?” అని తెలుగు లో గట్టిగా అరిచాను. వెంటనే ఆ పడవలో అమ్మాయి “ఆ బావున్నాం. మీరెలా ఉన్నారూ?” అని తిరిగి అరుస్తూ చెయ్యి ఊపింది. ఆ అమ్మాయే వసంత. ఆ తర్వాత వాళ్ళు ఒడ్డుకి వచ్చాక పరిచయాలు చేసుకుని తక్షణం జీవిత కాల స్నేహితులం అయిపోయాం. అప్పటికి నేను బ్రహ్మచారిని. మల్లిక్, వసంత లకి కొడుకు గిరీష్ కి నాలుగేళ్ళు. వారి సహజ సిద్దమైన ఆప్యాయత కీ తొలి ఉదాహరణ ఏమిటంటే అలా సాన్ ఏంటోనియో లో కలుసుకున్న వారం రోజులలో నేను మా ఇంజనీరింగ్ లాబ్ లో పనిచేసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరూ నన్ను వెతుక్కుంటూ పలకరించడానికి వచ్చి కేంటీన్ లో కాఫీ ఇప్పించారు. అప్పటి నుంచీ నా పెళ్ళయ్యే దాకా ఏదో వంక పెట్టుకుని వాళ్ళింటికి వెళ్లి పోయి వారానికి చాలా సార్లు అక్కడే తెలుగు భోజనం చేసేవాడిని. అందుకే మా అమ్మ తరువాత నాకు ఏమి ఇష్టమో వసంతకే ఎక్కువ తెలుసు. “రేపు గుమ్మడి కాయ వడియాలు చేస్తానురా” అనో “అరటి కాయ ఆవ పెట్టిన కూర నీకోసం రెడీగా ఉంది. వస్తావా?” అనీ “అనుజ్ గాడి కోసం ముక్కల పులుసు చేశాను. వాణ్ణి కూడా తీసుకోస్తావా. నీతో డబ్బాలో పట్టుకెళ్తావా? మీ పిల్లలందరికీ అది ఇష్టం మరి” అనో ఆప్యాయంగా వినిపించే ఆ వసంత పిలుపులు ఇక రావు.

Scan0036

వసంత, గిరిజ: ఇద్దరు నేస్తాలు

ఆ విధంగా 1975 మొదలైన మా పరిచయం గాఢ స్నేహంగా మారడానికి ఎన్నాళ్ళో పట్ట లేదు.  బ్రహ్మచారిగా ఉన్న మల్లిక్ & వసంత నాకు హ్యూస్టన్ లో మొట్ట మొదటి కుటుంబ స్నేహితులు కావడంతో నాకు కావలసిన కుటుంబ ఆత్మీయత వాళ్ళ దగ్గరే వెతుక్కుని తనివి తీరా ఆనందించాను. క్రమంగా మరో పది కుటుంబాలు పరిచయం అయినా పండగలు, పిక్నిక్ లు, షాపింగ్ లు, విహార యాత్రలు, సినిమాలు చూడ్డం, పేకాడుకోడం, దెబ్బ లాడుకోడం ..ఒకటేమిటి..అన్నీ వాళ్ళ తోటే. ఆ రోజుల్లోనే రత్న పాప కూడా అనిల్ కుమార్ ని పెళ్ళాడి హ్యూస్టన్ లో అడుగు పెట్టింది. అప్పటికే పాప చాలా పేరున్న కూచిపూడి నర్తకి. వసంత కి కూడా  చిప్పప్పటి నుంచీ శాస్త్రీయ నృత్యం, కర్నాటక సంగీతం లో ప్రావీణ్యం ఉండడమే కాక నలుగురినీ పోగేసుకుని ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం చెయ్యడానికి తెగ ఉవ్విళ్ళూరుతూ ఉండేది. అందుకే యూనివర్శిటీ లో మాస్టర్స్ డిగ్రీలో చేరగానే ఇండియన్ స్ట్యూడెంట్స్ యూనియన్ కి సెక్రటరీ గా అందరినీ పోగేసి నానా హడావుడీ చేసేది.

ఆ రోజుల్లో  అదొక్కటే యావత్ హ్యూస్టన్ మహా నగరానికీ కలిపి ఉన్న ఒకే ఒక్క ఇండియన్ సంఘం. అప్పుడే ఇండియా కల్చర్ క్లబ్ అని గుజరాతీ వాళ్ళు, పంజాబీ వాళ్ళు మొదలుపెట్టి నప్పుడు మేమూ కలిసి మెలిసి రిపబ్లిక్ డే లాంటివి చేసే వాళ్ళం. ఊళ్ళో ఇండియన్ రెస్టారెంట్స్ లేవు కాబట్టి ఉన్న గృహిణులే ఆరు బయట కార్యక్రమాలకీ, అమెరికన్ ఫెస్టివల్స్ లో ఇండియన్ స్టాల్ పెట్టీ వంటలు చేసే వారు. అందులో దక్షిణాది వంటలకి వసంత ఎప్పుడూ ముందు ఉండి ఇడ్లీలు, దోశలు వందల కొద్దీ అలా వేస్తూనే ఉండేది. మేం అంతా మేత మేస్తూ సహాయం చేసే వాళ్ళం. 1975 ఏడాది చివరికి కేవలం తెలుగు కళాభిమానమే కాక కావలసిన ప్రావీణ్యం కూడా ఉన్న వాళ్ళం తగిన సంఖ్యలో హ్యూస్టన్ చేరడంతో అందరం తర్జన భర్జన పడి అమెరికాలో తొలి తెలుగు సాంస్కృతిక సంఘాల లో ఒకటయిన హ్యూస్థన్ తెలుగు సాంస్కృతిక సమితి కి శ్రీకారం చుట్టాం. తద్వారా అప్పటి దాకా దాసట, బీసటగా ఎవరో ఒకరి ఇంట్లో కొనసాగుతున్న చిన్నచిన్న సాంస్కృతిక కార్యక్రమాలూ, పండగలూ మొదలైనవి క్రమబధ్ధీకరించి స్థాయి పెంచడం లో కృతకృత్యులయ్యాం. మా సమితి మొట్ట మొదటి కార్య నిర్వాహక వర్గంలో ఊళ్ళో ఒక పెద్ద అయిన కోనేరు తాతయ్య గారు సమన్వయ కర్త, నేను సహా సమన్వయ కర్త కాగా వసంత, దువ్వూరి నారాయణ రావు గారు, పోతు నరసింహా రావు గారు & రాజేశ్వరి గారు, తమ్మారెడ్డి చంద్ర శేఖర్, పట్టిసపు గంగాధరం గారు, తుమ్మల కుటుంబ రావు సభ్యులు. అందులో పెద్దలు దువ్వూరి అనంత అచ్యుత నారాయణ రావు గారు 1957 లో హ్యూస్టన్ మాత్రమే కాక అమెరికా దక్షిణ రాష్ట్రాలకి వచ్చిన తొలి భారతీయుడు. ఆయన వసంత పెద నాన్న గారు. అంటే వసంత తల్లి శ్రీ హరి గారు, నారాయణ రావు గారి భార్య కి స్వయానా చెల్లెలు.

1979 (1)

 

వీరిలో అందరూ ఊహించినట్టుగానే సాంస్కృతిక కార్యక్రమాలకి చైర్ పెర్సన్ ఇంకెవరూ…వసంతే. తన తో పాటు రత్న పాప, అనిల్, నేను, హీరా & సూరి దువ్వూరి, బాల & రామం చావలి. పొలాని జానకి రామయ్య, రవి తమిరిశ మొదలైన వాళ్ళం కలిసి నాటకాలు, డాన్సులు, బొమ్మల కొలువులు, పిల్లలకి భోగి పళ్ళు. ఉగాది పచ్చడి, దీపావళి టపాసులు, వన భోజనాలు, ఆటల పోటీలు…..ఒకటేమిటి అనేక రకాల కార్యక్రమాలతో తెగ సంబడం గా ఉండేది. అందరిలోకీ ఎక్కువ సంబరంగా ఉండేది ఎప్పుడూ వసంతే! ఎప్పుడైనా పొరపాటున తనని సలహా అడగక పోయినా, మరొకరితో ఎక్కువ మాట్లాడినా ప్రాణం తీసేసేది వసంత. అప్పుడే కాదు …మొన్న మొన్నటి దాకా కూడా ..మళ్ళీ అన్నీ మామూలే…. ఆ అలక అంతా అ క్షణమే! మర్నాడు ముక్కల పులుసు రెడీ!

 

1976 లో మా టీసీయే (తెలుగు సాంస్కృతిక సమితి కి హ్రస్వ రూపం) కాస్త నిలదొక్కుకోగానే నాకు మనం ఒక పత్రిక పెడదాం అని ఆలోచన వచ్చింది. అయితే ఇతర నగరాలలో లాగా కేవలం కమ్యూనిటీ వార్తల కోసమే కాకుండా ఒక సాహిత్య పత్రిక లా కథలూ, కవితలూ వేస్తే బావుంటుంది అని కూడా అనిపించి, ముందు వసంత ని పిలిచాను. “నీ బుర్ర బానే పని చేస్తోందే…కానీ కథలు, కవితలు ఎక్కడి నుంచి వస్తాయి?” అంది వసంత….అలా అందే కానీ అప్పటికే ఆ ఐడియా నచ్చేసింది అని నాకు అర్థం అయిపోయింది. కాస్సేపు మాట్లాడుకుని “ఇద్దరం చెరో కథా ముందు రాద్దాం” అని అనేసుకున్నాం. అలా నేను నా మొట్ట మొదటి కథ “జుల పాల కథ “ అనో చిన్న కథ వ్రాస్తే, వసంత “ఆవగింజ ఆంతర్యం” అని ఓ చిన్న కథ వ్రాసింది. ఒకరి కథ మరొకరు చదువుకుని “పరవా లేదులే” అనుకున్నాం. ఇక పత్రిక పేరు “మధుర వాణి” పెట్టి నేను ప్రధాన సంపాదకుడి గానూ, వసంతా, దువ్వూరి హీరా సహ సంపాదకులుగానూ మాకు మేమే నిశ్చయించేసుకున్నాం. ఆ పేరు మీద తర్జన భర్జనలు  ముఖ్యంగా “మధుర వాణి” అని గురజాడ పాత్ర పేరులా వ్రాయాలా, లేక “మధుర-వాణి” అని మధురమైన వాణి అనే అర్థ వచ్చేలా వ్రాయాలా అనే దాని మీద మా ముగ్గురి తగాదా రత్న పాప తీర్చింది…”మధ్యలో ఆ గీత ఎందుకూ అడ్డంగానూ” అంటూ…

ఆ విధంగా “ఆవగింజ ఆంతర్యం” కథ వ్రాయగానే ఆగ లేదు వసంత. దానికి తన కలం పేరు “వలపు” అని పెట్టుకుంది…అంటే ..”వసంత లక్ష్మి పుచ్చా” కి కుదింపు….ఎంత పొందిక గా కుదిరిందో కదా. దటీజ్ వసంత..ఏం చేసినా సొంత ముద్ర ఉండాల్సిందే! ఆ తరువాత ఉద్యోగం లోనూ, ఇతరత్రానూ ఎక్కువ రాయ లేదు కానీ నా సతాయింపు భరించ లేక “అసంకల్పిత ప్రతీ కార చర్య” అని మరో కథా, “మధ్యాప్యం” మొదలైన కవితలూ అడపా దడపా రాసేది. పదేళ్ళ క్రితం తెలుగు కథ శత వార్షికోత్సవం సందర్భం గా స్వర్గీయ భార్గవీ రావు గారు  “ఈ శతాబ్దంలో మహిళా రచయితల హాస్య కథలు” సంకలనం వేసినప్పుడు నేను ఈ “ఆవగింజ ఆంతర్యం” పంపిస్తే ఆవిడకి ఎంతో నచ్చి, ఆ సంకలనంలో ఎంపిక చేశారు. దానికి వసంత చాలా సంబర పడింది.

వసంత కి డ్రామాలంటే భలే ఇష్టం. “నన్ను హీరోయిన్ గా పెట్టి ఓ డ్రామా రాయకూడదూ? అస్తమానూ మీ మగాళ్ళేనా వేసేది?” అనేది. తన కోసమే మేము స్త్రీ పాత్రలు ఉన్న “ఇల్లు అమ్మబడును”, “ఆదివిష్ణు రాసిన డ్రామా మొదలైనవి వేశాం. అంతెందుకూ?  ఓ సారి జంధ్యాల రాసిన “గుండెలు మార్చబడును” వేద్దాం అనుకుంటే అందులో స్త్రీ పాత్ర లేదు కానీ ప్రధాన పాత్ర అయిన మగ డాక్టర్ మధు పాత్రని ఆడ పాత్రగా వసంత కోసం నేను తిరిగి వ్రాయవలసి వచ్చింది.

Telugu drama 1

1970-80 దశకం లో  నేనూ, అశోక్ కుమారూ మరి కొందరు బ్రహ్మచారులమూ మల్లిక్ & వసంత, అనిల్ & రత్న పాప, బాల & రామం, కుమారి & సుసర్ల శర్మ  కుటుంబాలూ  ఒకే వయసు వాళ్ళం కాబట్ట్టి బాగా కలిసి మెలిసి ఉండే వాళ్ళం. 1978 లో నేను ఇండియా వెళ్లి మా అమ్మ చెప్పిన అమ్మాయి గిరిజతో పెళ్లి ముహూర్తం కుదిరినప్పుడు అమెరికాలో ఒక్క వసంత, మల్లిక్ లకే ఫోన్ చేసి ఆ వార్త చెప్పాను. ఆ రోజుల్లో అక్కడ నుంచి అమెరికా ఫోన్ చెయ్యడం అంటే తలప్రాణం తోకలోకి వచ్చేది. మా పెళ్లి సమయానికి అమెరికా నుంచి వచ్చిన ఏకైక గ్రీటింగ్స్ టెలిగ్రాం కూడా వసంత, మల్లిక్ ల దగ్గర నుంచే! పెళ్ళయ్యాక గిరిజ అమెరికాలో అడుగుపెట్టిన మొట్టమొదటి రోజునే మా మిత్ర బృందం అందరినీ కలుసుకున్నా “లవ్ ఎట్ ఫస్ట్ సైట్” వసంత తోటే. ఆ క్షణం నుంచీ వసంత మా ఆవిడని తనకి లేని సొంత చెల్లెలిలాగానే చూసుకుంది తన జీవితాంతం. మా ఆవిడకి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా అన్నీ వసంత తోటే చెప్పుకునేది.

అన్నట్టు వసంత అమెరికా వచ్చిన కొత్తలో తనకి డ్రైవింగ్ నేర్పించిన ఘనత అశోక్ కుమార్ దే.  అతను కొన్నేళ్ళ క్రితం యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్థన్ లో ఉండగానే ఓ అమెరికా అమ్మాయిని ప్రేమించాడు. ఇక పెళ్లి కూడా చేసుకోడానికి నిశ్చయించుకోగానే ఎంతయినా గుంటూరు వాడు కాబట్టి మన హిందూ సాంప్రదాయం లో పెళ్లి చేస్తే బావుంటుంది అని అనుకున్నాం కానీ ఆ రోజుల్లో హ్యూస్టన్ లో ఏదో నామకహా గా గుజరాతీ వాళ్ళ గుడి ఒకటి ఉండేది కానీ మన తెలుగు పద్ధతికి అది పనికి రాదు కదా! ఇంకేముందీ…మల్లిక్ & వసంత పూనుకుని అశోక్ కుమార్ పెళ్లి తెలుగు పద్ధతిలో అప్పుడే కొనుక్కున్న వాళ్ల ఇంట్లోనే చేద్దాం అని నిర్ణయించుకున్నారు. కానీ పెళ్లి ఎలా చెయ్యాలో ఎవరికీ సరిగ్గా ఏమీ తెలియదు. అంచేత అందరం ఎవరికీ జ్ఞాపకం ఉన్న తంతులు, మంత్రాలు, సినిమాలలో ఉన్నవీ కలిపి, సన్నాయి వాయిద్యాలతో సహా “పెళ్లి చేయించుట ఎలా?” అని ఒక ఆడియో కేసెట్ తయారు చేసుకుని మల్లిక్ ని పురోహితుడిగా నియోగించాం. ఊళ్ళో ఉన్న తెలుగు వారినందరినీ పిలిచి అశోక్ & మేరీ ఏగ్నేస్ పెళ్ళి 1978లో అరిటాకులలో నేల మీద కూచుని భోజనాలు చెయ్యడంతో సహా అన్నీ వసంత ఆధ్వర్యంలోనే జరిపించాం. విశేషం ఏమిటంటే పురోహితుడు కూడా అయిన మల్లిక్, వసంత పెళ్ళిపీటల మీద కూచుని కన్యాదానం చేశారు. ఆ పెళ్లి ఫోటో లు గుంటూరులో ఉన్న అశోక్ తల్లి సరస్వతి గారు చూసి “అదేమిట్రా, జంధ్యం తప్పు వేశారూ?” అన్నారుట. ఆ విధంగా పెళ్లి తంతులలో ఎన్ని లోపాలు ఉన్నా అశోక్ & మేరీ ఏగ్నెస్ గత 38 ఏళ్లగా హాయిగా సంసారం చేస్తున్నారు.

raju1

అపూర్వ తో…

వసంత కి ఉన్న మరో వ్యాపకం మొక్కలు పెంచడం. అదైనా ఏదో సరదాగా నాలుగు వంగ మొక్కలు వేసేసి గొప్పలు చెప్పుకోడం కాదు. ఆ మాట కొస్తే 1970-80 లలో మన కూరగాయలలో ఒక్క టొమేటో, బెండ మొక్కలు తప్ప ఇంకేమీ దొరికేవి కాదు. అంచేత వంగ, దోస, తోటకూర, గోంగూర, పొట్ల, బీర వగైరా విత్తనాలు అన్నీ ఇండియా వెళ్ళినప్పుడు బంగారం లా జాగ్రత్తగా తెచ్చుకునే వాళ్ళం. ఇప్పటి లాగా ఎలక్ట్రానిక్ స్క్రీనింగ్ లేని ఆ రోజుల్లో విత్తనాలు ఎలాగో కష్టమ్స్ వాడి కళ్ళు కప్పి పెట్లో అట్టడుగున దాచేసి తీసుకు వచ్చే వాళ్ళం కానీ దొండ, తమల పాకులు లాంటి తీగెలు తీసుకు రావడం కోసం వసంత నాకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేది నేను ఇండియా వెళ్ళే ముందు. అదేమిటంటే కణుపులతో ఉన్న దొండ పాదుకానీ, నాలుగైదు ఆకులతో ఉన్న తమల పాకు తీగె కానీ తడి గుడ్డలో చుట్టి పొట్టకి దారంతో గట్టిగా కట్టుకుని, పైన బనీను వేసుకుని నిటారుగా నడవడం నేర్పేది. కాకినాడ నుంచి బొంబాయి దాకా మామూలుగానే పట్టుకొచ్సినా, బొంబాయిలో అలా అవి పొట్టకి కట్టుకుని అక్కడ నుంచి న్యూ యార్క్ లో దిగే దాకా కూచున్నా, నుంచున్నా, నడిచినా నిట్టనిలువుగా జాగ్రత్తగా వాటిని పట్టుకొచ్చి వసంత కి ఇచ్చే దాకా ప్రాణం కటకటలాడిపోయేది. నలభై ఏళ్ల తరువాత కూడా ఈ నాడు మా హ్యూస్టన్ లో అందరి ఇళ్ళలోనూ పెరుగుతున్న దొండ పాదు, తమల పాకు తీగెలూ ఆ విధంగా స్మగ్లింగ్ అయి వచ్చిన నాలుగో తరం పాదులని చెప్పుకోడంలో అతిశయోక్తి లేదు. సరిగ్గా అలాంటిదే మనకి ఆత్మీయమైన మల్లె మొక్క. ఆ కొన్ని నర్సరీల లో సాండ్బాగ్ జాస్మిన్ అనే పేరుతో  ఇప్పుడు మల్లె మొక్కలు, కనకాంబరాలు  దొరుకుతున్నాయి. ఇక  వసంత ఎక్కడెక్కడి చైనా వాళ్ళ నర్సరీ లకి వెళ్లి అకడ నుంచి మామిడి, జామ, నంది వర్ధనం, సన్న జాజి, సంపెంగ, రక రకాల మందారాలు మొదలైనవి తెచ్చి తన తోటలో వేసి, రోజూ సాయంత్రం ఇంటికి రాగానే చీకటి పడే దాకా అక్కడే గడ్డి పీకుతూనో, నీళ్ళు పోస్తూనో అన్ని మొక్కలనీ పలకరిస్తూ మూడు, నాలుగు గంటలు గడిపాకే ఇంట్లో అడుగుపెట్టేది. అలాగే అన్ని రకాల కూరగాయలూ, దబ్బ, నిమ్మ, నారింజ, దానిమ్మ, జామ..ఆఖరికి నేరేడు మొక్క కూడా వసంత తోటలో ఉంటాయి.

ఆ నాటి ఇతర స్నేహితుల ఆర్ధిక స్థాయి పెరుగుతున్న కొద్దీ అంతరాలు కూడా పెరిగినా కేవలం వసంత తో అనుబంధం నలభై ఏళ్ల గా ఒకే స్థాయిలో మా కుటుంబానికి కారణం ఆమెకి ఉన్న ఎంతో సహజమైన ఆడంబరం… అదే కల్మషం లేని ఆత్మీయత. అనదల్చుకున్న మాట అనేయడం ఆ ఆత్మీయత వ్యక్తీకరణ లో ఒక భాగం. 1981 లో తనకి పుట్టబోయే అమ్మాయికి ఏం పేరు పెట్టాలా అనే సంప్రదింపులలో వసంత రమ్యశ్రీ అనే పేరు ఎంచుకుంది. నేను రమ్య అంటే చాలు, మళ్ళీ అదేదో కవి గారి కలం పేరులా రమ్యశ్రీ ఎందుకూ అంటే భలే కోప్పడింది. రమ్య పుట్టిన రోజు మల్లిక్ అందరికీ హవానా చుట్టలు పంపిపెట్టి ఆడపిల్ల పుట్టినందుకు మహానందపడిపోతే, ఆ క్షణం నుంచీ వసంత జీవితం రమ్య కేంద్రబిందువుగానే సాగింది అని చెప్పవచ్చును.

వసంత ఆత్మీయతకి చొరవకి అతి మంచి ఉదాహరణ 1988 లో జరిగిన రెండు విశేషాలు. ఆ ఏడు మా అమ్మ అమెరికా వచ్చి మా తమ్ముడి దగ్గర కాలిఫోర్నియాలో ఆరు నెలలు, హ్యూస్టన్ లో మా ఇంట్లో ఆరునెలలూ ఉండి ఇక వెనక్కి మళ్ళీ కాకినాడ వెళ్ళే ప్రయత్నంలో ఉంది. ఒక్కర్తినీ పంపించడం కుదరదు కాబట్టి మాలో ఎవరో ఒకరు తీసుకెళ్ళి దిగబెడదాం అనుకుంటూ ఉంటే వసంత “ఎందుకూ. మేము ఎలాగా గిరీష్ ఒడుగు చెయ్యడానికి ఇండియా వెళ్తున్నాం. మీ అమ్మ మా అమ్మ కాదా ఏమిటీ? నేను కూడా జాగ్రత్తగా తీసుకెళ్తాను” అని ఎంతో ఆత్మీయంగా, దారిలో విమానం ఎనిమిది గంటలు ప్రాంక్ఫర్ట్ లో ఆగిపోవలసి వచ్చినా మా 75 ఏళ్ల మా అమ్మకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఇండియా తీసుకెళ్లింది. అదే వసంత కాక పొతే మేము మా అమ్మని అలా పంపించే వాళ్ళం కాదు. ఆ తరువాత మరో పదేళ్ళు ఎప్పుడు మా అమ్మతో మాట్లాడినా “వసంత ఎలా ఉందిరా?” అనేదే మొదటి ప్రశ్న. ఇది వ్యక్తిగతం అయితే గిరీష్ ఉపనయనం వసంత వ్యక్తిత్వానికీ, చొరవకీ మరో ఉదాహరణ. అప్పటికి రెండేళ్ళ ముందు ఎన్టీ రామా రావు హ్యూస్టన్ వచ్చినప్పుడు మేం అందరం ఆయన్ని కలుసుకున్నాం కాబట్టి వసంతకి అది గుర్తుకి వచ్చి, హైదరాబాదులో తిన్నగా ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్లి గిరీష్ ఉపనయనం ఆహ్వానం ఎన్టీ రామారావు గారికి అందజెయ్యమని ఆయన సెక్రటరీకి ఇచ్చింది.  ఎవరూ ఊహించని విధంగా రామారావు గారు ఆ ఉపనయనానికి వెళ్లి ఆశీర్వదించి అందరికీ ఆశ్చర్యం, ఆనందం కలిగించారు. ఆ ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను. అదీ మా వసంత అంటే !

With NTR

నందమూరిని కలిసిన క్షణాలు…

ఇక మాకు ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి పుట్టినప్పుడూ పేర్లు  ఎంపిక చెయ్యడంలో వసంత ప్రధాన సలహాదారు. వాళ్ళు పుట్టిన దగ్గరనుంచీ పెద్ద వాళ్ళు అయ్యాక కూడా పుట్టిన రోజులు, హై స్కూల్ గ్రాడ్యుయేషన్, మా అమ్మాయిలు రత్న పాప దగ్గర కూచిపూడి నృత్యానికి సలహాలు, 1998 లో వాళ్ళ రంగ ప్రవేశానికి మేకప్ తో సహా అన్ని ఏర్పాట్లు, మా రెండో అమ్మాయి పెళ్ళి దగ్గర ఉండి జరిపించడం ..ఒకటేమిటి ….మా కుటుంబంలో అంతర్భాగంగా ఉన్న వసంత ఇప్పుడు కనుమరుగు అయినా మా అందరి మనోఫలకం లో కలకాలం ఉంటుంది. నా కంటే, మా కుటుంబం కంటే ఎక్కువ సన్నిహితులు వసంతకి ఉన్నారు. అందులో ఆశ్చర్యం లేదు. వారు ఇంత కంటే మంచి స్మృతులతో సమగ్రమైన వ్యాసం వసంత గురించి వ్రాయగలరు. నేను కూడా ఇంకా చాలా విశేషాలు వ్రాయగలను. కానీ కొన్ని లోపల దాచుకుంటేనే వాటికి ఎక్కువ విలువ. ఈ వ్యాసం లో వసంత గురించి కొంత అయినా అందరితో పంచుకోవాలని పించి, నా జీవన ప్రస్థానంలో ఒక ఆత్మీయ స్నేహితురాలిగా ఆమెకి ఉన్న స్థానాన్ని అక్షర రూపంలో ఈ ఆత్మకథలో పదిలపరుచుకునే ప్రయత్నం చేశాను.

2015 ఓ విధంగా మాకు చాలా బాధనే ఇచ్చింది. నా అమెరికా జీవితంలో తొలి రోజుల నుంచీ అత్యంత ఆత్మీయులైన స్నేహితులు అనిల్ కుమార్ గత ఫిబ్రవరిలోనూ, సెప్టెంబర్ మొదటి వారంలో సుసర్ల శర్మ, ఆఖరి వారంలో వసంత ఏ మాత్రం ఊహించలేని విధంగా పరమపదించారు. ఇక డిశంబర్ లో మా ఆస్థాన పురోహితుడు గుళ్ళపల్లి ఉదయ కుమార్ కేవలం 40 వ ఏట గుండె పోటు తో మరణించారు. వీరందరికీ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ 2016 అందరికీ శాంతి సౌభాగ్యాలని కలిగిస్తుందని ఆశిస్తున్నాను.

*

 

 

 

 

 

 

 

 

సూఫీలు మనకి అర్థం కానేలేదు!

 

 

(గత గురువారం తరువాయి)

రాణీ శివశంకర శర్మ

రాణీ శివశంకర శర్మ

ఈ రాజ్యాధికారభావన, ఆధిపత్యవాంఛ పెరగడంతో సూఫీలూ పూర్వరుషులూ చేసిన కృషి మరుగున పడిపోతోంది. బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టెరిటోరియల్ భావన, హద్దులు గీసుకొనే నైజం దేశంలోని బహుళత్వాన్ని రద్దు చేసింది. ఒకేజాతి అనే భావనకి దారితీసింది. ముస్లింలు పరాయివాళ్ళయ్యారు. ఇలాంటి ఏకశిలా సదృశ జాతి నిర్మాణం పూర్తిగా ఆధునికం. అంబేద్కర్ వంటి మేధావి కూడా ఈ ఉచ్చులో చిక్కుకు పోయాడు. ముస్లింలు ప్రమాదకరమైన వాళ్ళని, జనాభా మార్పిడే పరిష్కారమని ఆయన అన్నాడు.

భారతదేశపు బహుళత్వం జాతి నిర్మాణం లేకపోవడం వల్లే సాధ్యమైంది. జాతి నిర్మాణానికి బహుళత్వం సమిధగా మారింది. ఒకే జాతిని నిర్మించాలన్న ఆతృతే బ్రాహ్మణీయ హిందూయిజానికి ఆధారభూమిక.

అంబేద్కర్ కానీ, అంబేద్కర్ని విమర్శించిన రంగనాయకమ్మ కానీ సంస్కృత బ్రాహ్మణ గ్రంధాల్నే టార్గెట్ చేయడం ద్వారా అవే భారతీయ సంస్కృతికీ, నీతికీ, చట్టాలకీ ప్రాతినిధ్యం వహిస్తాయనే భావనని పెంచి పోషించారు. నిజానికి బ్రిటిష్ పూర్వ సమాజంలో స్థానిక పంచాయతీలు తీర్పులు చెప్పేవి. అవి చాలా బహుళమైనవి. ఈ పంచాయతీలలో ఏ కులానికి ఆ కులంగా విడివిడిగానూ, మొత్తం గ్రామానికి అన్ని కులాల సభ్యులతో కలిసినట్టివీ జ్యూరీలుండేవి. చాలా మంది పొరబడుతున్నట్టు బ్రాహ్మణులకు వీటి మీద పెత్తనమేమీ ఉండేది కాదు.

నిజానికి అన్ని గ్రామాల్లోనూ బ్రాహ్మణులు ఉండే అవకాశమే లేదు. ఉన్నా అందరికీ సంస్కృతం రాదు. విలియం జోన్స్ అనే ఇంగ్లీషు దొర మనుస్మృతిని ఆంగ్లంలోకి అనువదించాడు. దానిప్రకారం బ్రిటిష్ వాళ్ళు హిందూలాని సృష్టించారు. సదరు విలియం జోన్స్ చేతిలో బైబిల్ బదులు మనుస్మృతిని పట్టుకొని ఇంగ్లాండ్ లోని సెయింట్ పాల్ చర్చి ముందు విగ్రహంగా మారాడు. మనుస్మృతిని పట్టుకున్న పెద్దమనిషి విగ్రహం ఇండియాలో మాత్రం కనబడదు అని రాశారు వెండీ దోనిగర్.

అంబేద్కర్ ప్రతికూల పద్ధతిలో మనుస్మృతికి ప్రాచుర్యం కల్పించారు. ఆయన పంచాయతీ చట్టాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అంతేకాదు, సూఫీయిజం ఆయన అధ్యయనం చెయ్యలేదనీ అందుకే ముస్లింలని మతతత్వవాదులుగా చిత్రీకరించారని గెయిల్ ఆమ్ వెద్ కు ఒప్పుకోక తప్పలేదు. బ్రిటిష్ వారు బ్రాహ్మలకి, వారి గ్రంధాలకి, ప్రాధాన్యం పెంచారు. ఇటువంటి సంస్కర్తలు వారినే అనుసరించారు.

రంగనాయకమ్మనే తీసుకోండి. రామాయణ విషవృక్షం పేరుతో సంస్కృత వాల్మీకి రామాయణంపై ప్రతి వాక్య ఖండన చేశారు. హిందూవాదుల దృష్టిలోనూ రంగనాయకమ్మ దృష్టిలోనూ రామాయణమంటే సంస్కృత రామాయణమే. హిందూవాదులకి ఎ.కె.రామానుజన్ మీద వచ్చినంత ఆగ్రహం రంగనాయకమ్మ పైన రాకపోవడానికి కారణం అదే. లోపల్లోపల ఇద్దరి మధ్యా ఒక అంగీకారం వుంది. ఎకె రామానుజన్ వివిధ దృష్టులతో రాయబడ్డ అనేక వేల రామాయణాల గురించి మాట్లాడాడు. అవి కేవలం సంస్కృత భాషలోనివి కావు. ప్రజల నాల్కలపై నాట్యం చేసే రకరకాల కథనాలవి. బహుళత్వం అంటే భయపడే హిందూవాదులు రామానుజన్ కి వ్యతిరేకంగా తీవ్ర గందరగోళం సృష్టించారు.

రంగనాయకమ్మ, అంబేద్కర్ లాంటి ఆధునిక సంస్కరణ వాదులు సంస్కృత పురాణాలకీ, సంస్కృత బ్రాహ్మణ ధర్మశాస్త్ర గ్రంధాలకీ తీవ్ర ప్రాచుర్యం కల్పించారు. దీన్నే వైరభక్తి అంటారు. అసలు హిందూయిజం అంటే యేమిటి? దాన్నెలా నిర్వచిస్తారు? అని నిలదీయకుండా హిందూయిజం ఇలాంటిది అలాంటిది అని నిందించడం ద్వారా లెఫ్టిస్టులు హిందూవాదుల వలలో చిక్కిపోయారు. వారికి ప్రాచుర్యం కల్పించారు.

అంబేద్కర్ జనసామాన్యంలోని జానపదాల్లోని ఆచార వ్యవహారాల గురించి యేమీ మాట్లాడలేదు. తన కుటుంబానికి చెందిన కబీర్ పంథీ గురించే నోరు విప్పలేదు. తద్వారా సూఫీ సంస్కృతిని నిర్లక్ష్యం చేశాడు. అందువల్లనే ముస్లింల గురించి హిందూవాదుల్ని మించి నిందించాడు. మౌఖిక సూఫీ సంప్రదాయాన్ని పక్కన బెట్టి మళ్ళీ గ్రంథస్థ బౌద్ధంలో సాంత్వన కోరాడు.

ప్రొటెస్టెంటిజం గ్రంధానికి ప్రాధాన్యం పెంచింది. కేథలిక్ క్రైస్తవంలోనివి కానీ, క్రైస్తవ పూర్వ సమాజాలకు చెందినవి కానీ, గ్రంథేతర బహుళ కథనాల్ని చిన్నచూపు చూసింది, రూపుమాపింది. దాన్నే ఆదర్శంగా తీసుకున్నారు ఆధునిక మేధావులు. పుస్తకాల పురుగులుగా మారిపోయారు. కళ్ళకీ చెవులకీ అందే వాటిని చిన్నచూపు చూశారు. ఈ ప్రొటెస్టెంటిజం ప్రభావం మన కొంప కూడా ముంచింది. మన సంస్కరణ భావాలకు కూడా ఈ ప్రొటెస్టెంటిజమే మూలం. ప్రకృతిని స్వేచ్ఛగా పరిశీలించిన పరిశోధకులను కాథలిక్కుల కంటే ప్రొటెస్టెంట్లు ఎక్కువ హింసించారని అంటాడు మార్క్సు.

చరిత్ర పుస్తకాలకి పరిమితమైతే పురాణం జీవితాల్లోకి విస్తరిస్తుంది. పౌరాణిక ఊహలకు విస్తృతీ పరిధీ ఎక్కువ. పురాణానికి వాస్తవమనే పరిధి లేదు. అది వాస్తవాన్నే ప్రభావితం చేస్తుంది. వాస్తవాన్ని సృష్టిస్తుంది. మహారాష్ట్రలోని వొక గ్రామంలో ఉన్న సీత గుడికి వొక కథ ఉంది. పట్టాభిషిక్తుడైన రాముడు సీతను విడిచిపెట్టినప్పుడు ఆమె ఆ గ్రామంలో ఆశ్రయం కోరింది. ఆ గ్రామస్తులు నిరాకరించారు. దానికి పశ్చాత్తాపంగా సీతకి గుడి కట్టి పూజిస్తున్నారని స్థల పురాణం. ఒక స్వచ్ఛంద కార్యకర్త అక్కడికి వెళ్లి సీత పట్ల చూపిన అనుచిత వైఖరికి ప్రాయశ్చిత్తంగా స్త్రీలకి ఆస్తిహక్కు కల్పించాలని కోరగానే అక్కడి పురుషులు అందుకంగీకరించి ఆస్తి హక్కు కల్పించారు (Hinduism – An alternative history).

అందువల్ల పాజిటివ్ పద్ధతిలో పురాణకల్పనల్ని జోడించడం సమాజానికి చాలా మేలు చేస్తుంది. అందుకే చారిత్రక పురుషులకన్నా పురాణపురుషులు ఎక్కువ ప్రభావశీలురని రాం మనోహర్ లోహియా అంటాడు. భారతదేశంలో పురాణం చరిత్రని తనలో కలిపేసుకుంటుంది. అందుకే ఫక్తు చారిత్రక పురుషుల జ్ఞాపకాలు మనకు తక్కువ. స్వచ్ఛత వాస్తవికత అనే భ్రమల నుంచి భారతీయులు ఎప్పుడో బయట పడ్డారు. వాస్తవాలకి తమ దృష్టి కోణాన్ని జోడించి, శుష్క వాస్తవంలో జీవించడం కాక కల్పనని వాస్తవంగా మలచుకోవాలని, కలలని నిజం చేసుకోవాలనేది భారతీయ తత్త్వం. దీన్ని భారతీయుల అజ్ఞానంగా భావించేవాళ్ళే అజ్ఞానులు. దీన్ని చీకటిగా చరిత్రహీనతగా భావించే వాళ్ళే దివాంధులు.

అందుకే గాంధీ పురాణపురుషులనే స్మరించాడు. కబీర్ లా ఈశ్వర్ అల్లా తేరే నామ్ అన్నాడు. అంతేకానీ అశోకుడినో అక్బర్ నో తలవలేదు. శ్రీశ్రీ కి కూడా ఈ రహస్యం తెలుసు. అందుకే అతని కవితల్లో పురాణ ప్రతీకలే కనిపిస్తాయి కానీ చారిత్రక ప్రతీకలు కనిపించవు. పురాణంలో చరిత్ర లీనమై గాఢమైన స్మృతిగా మారింది. అది మెలకువకీ స్వప్నానికీ సంధి కుదిర్చింది. చరిత్రనీ పురాణాన్నీ అభేదం చేసింది. అందుకే దళిత కవులు కూడా పురాణప్రతీకల చుట్టూ చక్కెర్లు కొడుతున్నారు. పురాణాలని సరికొత్తగా వ్యాఖ్యానించాలని చూస్తున్నారు. గ్రీసులోలా మనకి పురాణం గతం కాదు, వర్తమానం.

పురాణం స్థలకాలాల్ని అధిగమించేలా చేసింది. మతాల సరిహద్దుల్ని చెరిపేసింది. వెంకటేశ్వరస్వామికీ బీబీనాంచారికీ పెళ్లి చేసింది. పీర్లపండగని సృష్టించింది. చరిత్రకీ శక్తి లేదు. చరిత్ర కార్యకారణ సంబంధం లో బంధిస్తుంది. ఓడిపోవడం గెలవడం అనే భావాల్ని బలం చేస్తుంది. స్వర్ణయుగం చీకటియుగం అంటూ కాలాన్ని స్పష్టంగా విభజిస్తుంది. మార్క్సు లాంటి వాళ్ళు కూడా దీనికి అతీతంగా లేరు.

ఈ కాలవిభజన ఏం చేస్తుంది? బ్రిటిష్ కి పూర్వం చీకటి రాజ్యం చేసిందని, ముస్లింలు రాకపూర్వం ఎప్పుడో స్వర్ణయుగం వుందని భావించేలా చేస్తుంది. ఆ పూర్వయుగాన్ని ఆ స్వర్ణయుగాన్ని హిందూ వాదులు హిందూ యుగం అన్నారు, దళితవాదులు బౌద్ధయుగం అన్నారు. అందరూ కలిసి ఇండో అరబిక్ కల్చర్ కి గల ప్రాధాన్యాన్ని తుంగలో తొక్కారు. ఇదే మతతత్వానికి పునాది.

ఈ పాశ్చాత్య క్రైస్తవ సంకుచిత దృష్టిపై ధ్వజమెత్తాడు దళితకవి పైడి తెరేష్ బాబు.

వచ్చే ప్రతిదాన్నీ స్వాగతించాలన్న ఉదారత్వంతో

ఎక్కువ సార్లు స్వాగతించింది పతనాన్నే  (నేనూ నా వింతలమారి ప్రపంచమూ)

‘వచ్చెనిదే బంగారుకాలం’ అని సంస్కర్త గురజాడ చేసిన కీర్తనలకి పూర్తివిరుగుడు తెరేష్ బాబు వాక్యం.

అమ్మానాన్నలను మమ్మీడాడీలుగా మార్చినదానా

అమ్ముకోవడంలో ఉందన్నమాట

అసలు జన్మ సార్ధకం

ఇక్కణ్ణుంచి చేపలు మాంసము చలువరాయి తదితరాలు

ఎగుమతి అయినట్లే

నేనూ నీకోసం ఎగుమతి కావడం

ఎంతమధురం!

పడ్డాం కదా కొట్టుకుపోదాం అనడమే

అసలు సిసలు ప్రవాహ స్పృహ.

ఈ వాక్యాలకి వ్యాఖ్యానాలు అనవసరం. సుదీర్ఘ కాలపు పాశ్చాత్య ఆధిపత్యం మనని స్వంత ఆలోచన లేనివారిగా మార్చేసింది. “ఇక్కడి చర్మం కింద అక్కడి చైతన్యం విషాదం” యీ విషాదం నుంచే హిందూవాదులూ కంచె ఐలయ్య లాంటి వలసవాద బహుజనవాదులూ పుట్టుకొస్తున్నారు. “మరో రెండు వందలేళ్ళు మనం బ్రిటిష్ వలస పాలనలో ఉంటే దేశంలోని శూద్ర ఛండాల శక్తులు మరిన్ని అవకాశాలు పొందగలిగేవి” అంటారు కంచె ఐలయ్య (ప్రజాతంత్ర మార్చ్ 25, 2001). దళిత మేధావి గెయిల్ ఆమ్ వెట్ భారీడ్యాం లను మోన్ శాంటో కంపెనీని ప్రపంచీకరణను సమర్ధించారని బి. చంద్రశేఖర్ రాశాడు (చంద్రయానం). అంబేద్కర్ కూడా పాశ్చాత్యం తీసుకువచ్చిన మెగా ప్రాజెక్టుల విధానాన్ని సమర్ధించాడని అరుంధతీరాయ్ విమర్శించింది (ఆనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ కి ముందుమాట).

నన్ను భీభత్సాల పాలు చేసి

నా జవసత్వాల్ని పీల్చేందుకు

నా నట్టనడి గుండెలో

నీ ప్రతినిధుల్ని భద్రంగా నాటావు.

యీ పరిస్థితిలో ఆత్మజ్ఞానం ఎలా సాధ్యం? రమణమహర్షి ‘నిన్ను నువ్వు తెలుసుకో’ అని పదేపదే చెప్పడానికి యీ వలసవాద పరాయీకరణ కారణమైందా? అసలు మనం కార్యకారణ సంబంధాన్ని చూసే తీరే వలసవాద కలుషితమైంది. వలసవాద అభివృద్ధి నమూనాని ప్రశ్నించే శక్తిని మనం కోల్పోయాం.

ఆ యీ పరిస్థితుల్లో గాంధీ పాశ్చాత్యంలో ప్రాచ్యాన్ని కనుగొనవలసి వచ్చింది. పాశ్చాత్యం భారతదేశపు గుండెల్లో తన ప్రతినిధుల్ని నాటడం వల్ల పరాయీకరణ మొదలైంది. దాంతో టాల్ స్టాయ్, థోరో వంటి పాశ్చాత్యుల నుంచి గాంధీ స్ఫూర్తి పొందవలసి వచ్చింది.

పాశ్చాత్య అభివృద్ధి నమూనాకి ప్రత్యామ్నాయాన్ని వెదకడం కష్టమై పోయింది. స్థానికంగా వెదకడం మరీ కష్టమై పోయింది. ఏమంటే, స్థానికుల్లో చాలామంది తమ గతమంతా చీకటిగా భావించారు. యింకా చెప్పాలంటే తమ గతం విచ్ఛిన్నమైపోయిందని, తమ స్మృతులు పూర్తిగా చెదిరిపోయాయని భావించారు. స్మృతులలో ఉమ్మడితనాన్ని మినహాయించడమంటే స్మృతుల్నే ధ్వంసం చేయడమనే సత్యాన్ని విస్మరించారు. అలాగే తమ గత స్మృతుల్ని అవమానకరంగా భావించారు. గతంలో అవమానం, హింస వుండొచ్చు. అవమానమూ హింసలే గతం కాదు. స్మృతుల్ని మొత్తంగా దహనం చెయ్యడం ఆత్మ విచ్ఛిత్తికి దారితీసింది. తెరేష్ బాబు మాటల్లో ‘పాశ్చాత్యమే నా ప్రేయసి’ అని ప్రకటించుకొని ముద్దులతో మూతి కాల్చుకోవలసి వచ్చింది.

పాశ్చాత్య ప్రేయసిని ముద్దాడడం వల్ల మన కార్యకారణ సంబంధం పరిశీలన అనేది ఎంతగా కలుషితమైందో ఎంతగా పాశ్చాత్య వలస వాద పంక నిమగ్నమైందో తెలుస్తుంది. ఇస్లాంను విశ్లేషించే టప్పుడు అంబేద్కర్ ముస్లింలు ఉండటంవల్ల జరిగిన దౌర్జన్యాలను పెద్దవిచేసి చూపించారు. ఉమ్మడి సంస్కృతి, సంక్లిష్ట సంస్కృతిలోని ప్రధాన అంశాలను, మొగలులు రాజపుత్రులు సాధించిన రాజకీయ ఐక్యతను, సూఫీలు సన్యాసుల బోధనలను ఆయన విస్మరించారు. ఆయనకు ఇస్లాం మీద అంత సానుభూతి యేమీ లేదు. టర్కీ ముస్లిం దాడుల సమయంలో బౌద్ధారామాలను నాశనం చేసినందువల్లే ఇండియా నుంచి బౌద్ధం కనుమరుగైందని ఆయన భావించాడు. హిందూ జాతీయవాదులు భావించినట్లు గానే ముస్లిం దురాక్రమణ దారులు బలవంతపు మతమార్పిడులకి ఒడిగట్టారని అంబేద్కర్ భావించాడు (Ambedkar-Towards an Enlightened India by Gail omvedt).

ఈ అభిప్రాయాలు హిందూవాదులకి వుపయోగించాయని దళిత మేధావి గెయిలీ ఆమ్ వెట్ అంగీకరించారు. ఉమ్మడి సంస్కృతి, సూఫీలు సన్యాసుల బోధలు మన మేధావుల చెవికెక్కలేదు. అందుకే ఏకశిలాసదృశ జాతి నిర్మాణం కోసం కలలు, ఆ క్రమంలో బౌద్ధం పేరుతోనో మరో పేరుతోనో ముస్లిం జాతి వ్యతిరేకత వంటి యూరోపీయ ప్రొటెస్టెంట్ ఫాసిస్టు భావజాలం రాజ్యం చేసింది. దానినుంచే హిందూ ఫాసిజం పురుడు పోసుకుంది. హిందూ ఫాసిజం బహుళ సంస్కృతుల స్థానాన్ని దురాక్రమించింది.

“అసలు విశ్వజనీనమైన అభివృద్ధి నమూనాలోనే దానికి అపరిచితమైన జీవన విధానాలను అర్ధం చేసుకోలేని లోపం ఉంది. తనకు తెలీని దాన్ని, ఇతరాన్ని అది భరించలేదు” (డి.ఆర్.నాగరాజు)

*

 

రెండక్షరాల్లో ఇమడని కవి అలిశెట్టి

    

  -బి.నర్సన్

~

        అలిశెట్టి ప్రభాకర్ ను “కవి” అనే రెండు అక్షరాల మధ్య ఇముడ్చుతే ఇంకామిగిలిపోతాడు.  అందరిలా- తన మనసుకు నచ్చిన కవిత్వం రాస్తూ కవిగా గుర్తింపును,సత్కారాలను పొందుతూ పొద్దు గడిపిన మనిషి కాదాయన. రోజూ గుండెలో కొలిమిని రాజేస్తూనిప్పు కణికెల్లాంటి అక్షరాల్ని సృష్టిస్తూ, మంటల జెండాల రెపరెపల వెలుగులో సమాజ తీరుతెన్నుల్ని తెలుసుకొమ్మని తపన పడ్డ కవి.  కొలిమి వేడి తనను దహించి వేస్తున్నా ఖాతరుచేయకుండా అక్షరాల్ని పోత పోస్తూ పోస్తూ అక్షరాల్లోనే మిగిలిపోయిన మనిషి.

అట్ట పర్వతం ఎత్తి పట్టుకున్న వాడు

ఆంజనేయుడూ కాదు

నెత్తిలో నెమలీక పెట్టుకున్నోడు

క్రిష్ణపరమాత్ముడూ కాడు

అదంతా “అట్ట”హాసం- అంటూ నిక్కము లేని రచనలను, జీవితాలను, పాలనను ఎద్దేవా చేసాడు. రాసిన అక్షరాల్ని తమపై ప్రయోగించుకోకుండా సమాజానికి అప్పగిస్తే అది ప్రజాకవిత్వంగా చెల్లుబాటు కాదని నిరూపించిన కవి.

      జనంలో ఒకడిగా మెదలడం ఆయనకి ఎంతో ఇష్టం. చేతి నిండా డబ్బులున్న రోజుల్లోకూడా అతి సాధారణ జీవన శైలిని ఇష్టపడేవాడు. లెక్కలు చూసుకోవడం, రేపటి కోసం దాయడంఆయన మెదడుకి ఎన్నడూ తట్టని విషయం.  పుస్తకాలు కొనే వేళ మిగితా అవసరాలనుఈజీగా వాయిదా వేసుకొనేవాడు. బట్టలు, చెప్పులు లాంటి వస్తువులు కొనేటప్పుడు అతిచౌకవాటిని ఎంచుకొనేవాడు. కోఠి చౌరస్తాలో సెకండ్ హాండ్ దుస్తులు కొని బేఫికర్గా వాడుకొనేవాడు.అందుకే అలిశెట్టి ఎంత సాధారణ మానవుడో అంతటి అసాధారణ కవి.

         ఫోటోగ్రఫీ వృత్తిగా బతికిన ఆయన పట్టుమని పది ఫొటోలు దిగలేదు. ఇప్పుడు ప్రాచుర్యం పొందిన బ్లాక్ అండ్ వైట్ ఫోటో కూడా తన 19వ ఏట ఓ ఫోటో స్టూడియోకి సైన్ బోర్డ్ రాసినప్పుడు ఆ స్టూడియో ఓనర్ ప్రారంభోత్సవం రోజున తీసి ప్రేమతో ఇచ్చిన కానుక. ఇంత కాలం ఆ చిత్రాన్ని భద్రంగా దాచుకున్న భాగ్యం ప్రభాకర్ అభిమానులకందించింది.

      ప్రభాకర్ కవిత్వంలో ఇంత దగడు నెగడు, తెంపరితనం కనబడడానికి కారణం ఆయనలోఉండిన దుస్సాహస లక్షణం. నిజజీవితంలో కూడా ఏనాడూ పర్యవసాలను లెక్కిస్తూ కూర్చోలేదు. తను పోయే దార్లో కష్టజీవిని ఎవరైనా ఇబ్బంది పెడ్తూ ఉంటే కలుగజేసుకునేవాడు,కలహానికి కూడా సిద్ధ మే. తెగింపు ఆయన నైజము.

    లెక్క ప్రకారం మూడు పూటలు తినడం ఆయన జీవితంలో లేదు, తినక తప్పదన్నప్పుడుఏవో నాలుగు మెతుకులు గతకడం తప్ప ఎన్నడూ రుచులు కోరలేదు.  అందుకే ధూమపానంవల్ల దాపురించిన క్షయ ఆయనపై దునుమాడింది. శారీరక బలహీనత వల్ల మెడిసిన్ ప్రభావంఆయన్ని తిప్పి తిప్పి కొట్టింది, తట్టుకోలేని పరిస్థితిలోకి నెట్టివేసింది.

     ఆయన ఆత్మాభిమానం కూడా తాననుభవించిన కష్టాలకు ఆజ్య మే అయ్యింది.సానుభూతిని అస్సలు సహించేవాడు కాదు. 1988లో మేము హైదరాబాద్ నుండి బలవంతంగాజగిత్యాల తీసికెల్లిన వారం రోజుల్లోనే చెప్పకుండా తిరిగి వచ్చేసాడు, కారణం సిటీ లైఫ్ఆగిపోతుందని అన్నాడు కాని, మాకు భారమైనాననే అలోచన కూడా ఉండొచ్చు.

      ప్రభాకర్ కు భాగ్యం అర్ధాంగి అంటే అన్యాయమే అవుతుంది. ఆమె పూర్ణాంగి ఆయన ఒకఅంశ. చిన్ననాడే చదువు ఆపేసిన భాగ్యం బీడీ కార్మికురాలు. పెళ్లి చేయలేని స్థితిలో తల్లి పైడిముడిచి ఆమెను ప్రభాకర్ చేతిలో పెట్టింది. కొన్నాళ్లకే ప్రభాకర్ ఆమె చేతిలో బిడ్డ అయినాడు.పెరుగుతున్న పేదరికం, తరుగుతున్న భర్త ఆరోగ్యం, ఎదుగుతున్న పిల్లల మధ్య ఆమె సుడిగుండంలో నావ.

తెగిన తీగలు

సవరించడానికన్నట్లు

తెల్లవార్లూ పరిచర్యలు చేసే

నా భాగ్యమే

నా కన్నీళ్లను తూచే

సున్నితపు హృదయ త్రాసు – అని చివరి రోజుల్లో భాగ్యం పై రాసిన ఈ కవితకు వేసిన బొమ్మలో ఆర్టిస్ట్ నర్సిం ఆమెను యమధర్మరాజును అడ్డుకుంటున్న సతీ సావిత్రిలా చిత్రించాడు.

సిగరెట్ పీక లాంటి నన్ను

సిగలో పువ్వులా తురుముకొని

గాజుకుప్పెల్లాంటి నా కళ్లలోనే

ఆశల అగరొత్తులు వెలిగించుకుందే తప్ప

తులతూగే ఐశ్వర్యమో

తులం బంగారమో కావాలని

ఏనాడూ ప్రాధేయపడలేదు- అంటూ గుప్పెడు అక్షరాల్తో తన ఋణం తీర్చుకొనే ప్రయత్నంచేసాడు ప్రభాకర్.  నేటికీ ఆమె జీవితం చెదిరిన గూటి పక్షిలా ఇద్దరు పిల్లలతో దరి దొరకని ఎదురీతనే. నాడు ప్రభాకర్ కవిత్వాన్ని నెత్తికెత్తుకున్నవాళ్లు నేడు చెదిరిన మేఘాల్లా చెరోవైపు.

       12 జనవరి 1954 నాడు జన్మెత్తి అదే తేదీన 1993లో కలం విడిచిన ప్రభాకర్ రాసిన ప్రతిఅక్షరం మాత్రం సమాజంపై శర సంధానమే. కష్టజీవికి,కంట నీరుకి, దిక్కు తోచని యువతకిఆయన కవిత్వం సైదోడు.

‘కన్నీళ్లకు కర్తవ్యాన్ని నిర్దేశించే దిక్సూచిని నేను

అగ్ని పద్యం నేను దగ్ధ గీతం నేను అక్షర క్షిపణి నేను

ఆయుధాలుగా రూపాంతరం చెందే ఆకలి నేపథ్యం నేను

అడవి నేను కడలి నేను;- అంటూ సముద్రమంత విశాలమైన సాహితీ క్షేత్రాన్ని నిర్మించి నిరాశలుముంచుకొస్తున్న సమయంలో అందులో సేద తీరమని సాగిపొయాడు.

                                                                                                                               -బి.నర్సన్