మా అక్క పెళ్లి – అందరికీ మరపు రాని అనుభూతులే!

వంగూరి చిట్టెన్ రాజు 

chitten raju1961 సంవత్సరంలో.. ఆ రోజు పిబ్రవరి 5 వ తారీకు. ఆ రోజు మా ఇంట్లో పెద్దాడబడుచు అయిన మా అక్క పెళ్లి అయి యాభై ఏళ్ళు దాటినా ఆ ఐదు రోజుల పెళ్లి  హడావుడిలో ప్రతీ అంశమూ ఇప్పటికీ నాకు బాగా గుర్తే. అప్పటికి నేను పి.ఆర్. కాలేజీ లో ప్రీ – యూనివర్శిటీ లో చేరి ఆరేడు, నెలలు అయిందేమో. అంటే నిక్కర్లు పూర్తిగా మానేసి పగలు పంట్లాలు, రాత్రుళ్ళు పైజామాలూ వేసుకునే వయస్సు అనమాట. నా కంటే మా అక్క ఐదేళ్ళు పెద్దది. మా ఇద్దరికీ మధ్యన మా మూడో అన్నయ్య డా. సుబ్రహ్మణ్యం. నేనేమో మా అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళలో సరిగా మధ్యముణ్ణి. మా అక్క సూర్యారావు పేట లో గర్ల్స్ హైస్కూల్ లో ఎస్.ఎస్. ఎల్.సి. పాస్ అయిన దగ్గర నుంచీ సంబంధాలు రావడం మొదలు పెట్టాయి. ఆదిలక్ష్మీ మాణిక్యాంబ అని మా బామ్మ గారి పేరు పెట్టుకుని ఇంటికి మొదటి ఆడ పిల్ల కాబట్టి అందరూ ఎంతో అపురూపంగా చూసుకునే మా అక్కకి వచ్చే సంబంధాలలో సహజంగానే ఎంతో మంచి స్థాయిలో ఉండే వాటినే మా అమ్మా, నాన్న గారూ పట్టించుకునే వారు. నాకు తెలిసీ మూడు, నాలుగు  సంబంధాల తాలూకు  పెళ్లి చూపుల తరువాత అందులో ఒక సంబంధం కొంచెం చిన్న సైజు డ్రామా తరువాత నిశ్చయం అయింది.  

మా అక్క మొదటి పెళ్లి చూపులు 1959 ఏప్రిల్ లో అని జ్ఞాపకం. కొండేపూడి లక్ష్మీ నారాయణ గారి ద్వారా మంత్రిప్రగడ భుజంగ రావు గారి అబ్బాయిని మా అక్కకి అడిగితే వాళ్ళు వచ్చి చూసుకున్నారు అని మాత్రమే నాకు చూచాయగా గుర్తు. ఇక  మా పెద్దన్నయ్య పెళ్ళికి కొన్ని నెలల ముందు 1960 తొలి రోజులలో ఓ సారి మాకు ఎవరో ఎక్కడో గంగల కుర్రు అనే గ్రామం లో ఉండే మా దూరపు బంధువులు వారి అమ్మాయికి మీ వంగూరి వారింట్లో ఇంట్లో పెళ్లి చేసుకుంటాం అని అడిగితే మా అమ్మా, నాన్న గారూ ఒప్పుకుని మా రేడియో సావిడి అంతా ఖాళీ చేసి, వెళ్ళు వేయించి వాళ్లకి రెండు రోజుల పాటు ఇచ్చారు. శర భూపాల పట్నం నుంచి మగ పెళ్లి వారు కూడా దిగ గానే అదే రోజు అనుకోకుండా అప్పటికప్పుడు కబురు పెట్టి గురజాడ జగన్నాధం గారు అనే ఆయన కొడుకు, కుటుంబం తో సహా వచ్చి మా అక్కని పెళ్లి చూపులు చూసుకున్నారు. ఒక పక్కన మా ఇల్లంతా ఎవరిదో పెళ్లి హడావుడి, ఇంకో పక్క అనుకోకుండా మా అక్కకి పెళ్లి చూపులూ…ఇప్పుడు తలచుకుంటే భలే తమాషాగా ఉంటుంది. ఆ సంబంధం మా అక్కకి కుదర లేదు. ఈ రెండు ఉదంతాల గురించీ నాకు ఇంకేమీ గుర్తు లేదు. ఎవరి పేర్లూ గుర్తు లేవు.

 

అదే రోజులలో హైదరాబాద్ లో సుప్రసిద్ద హై కోర్ట్  అడ్వొకేట్ అయిన నండూరి బాపిరాజు గారి పెద్ద కొడుకు, ఆయన దగ్గరే జూనియర్ అడ్వొకేట్ గా ఉండి బాగా పేరు తెచ్చుకుంటున్న “సూరి” అనబడే  వెంకట సూర్య నారాయణ మూర్తి సంబంధం మా అక్కకి వచ్చింది. బాపిరాజు గారికి అన్నీ నచ్చి, ఎవరో ఒక అనామక జ్యోతిష్కుడికి జాతకాలు చూపించగానే ఆయన వీరిద్దరి జాతకాలు అస్సలు పడవు అని తేల్చి చెప్పడంతో మా సంబంధం వాళ్ళు మానుకున్నారు. ఈ సంగతి మా నాన్న గారికీ బహుశా తెలియదు. ఆ తరువాత నాకు తెలిసీ మా అక్కకి జరిగిన మరో  పెళ్లి  చూపులు మాకు రెండు, మూడు తరాలగా కుటుంబ స్నేహితులైన లక్కరాజు శరభయ్యతో. ఆయన అప్పటికే ఎయిర్ లైన్ ఫైలట్. మా చిన్నన్నయ్య కూడా పైలట్ గా ట్రైనింగ్ పొందిన వాడే కానీ బహుశా అంత ప్రమాదకరమైన ఉద్యోగంలో ఉన్న సంబంధం మనకెందుకులే అనుకున్నారు మా వాళ్ళు. అదే రోజుల్లో రాజమండ్రి నుంచి నండూరి రామచంద్ర మూర్తి గారు అనే అడ్వొకేట్ గారి బంధువు నారాయణ రావు సంబంధం వచ్చి, వాళ్ళు వచ్చి పెళ్లి చూపులు కూడా చూసుకున్నారు మా అక్కని. తమాషా ఏమిటంటే ఈ రామచంద్ర మూర్తి గారు మా అక్కని చూసి “ ఈ అమ్మాయి మా తమ్ముడు సూరి కి సరిగ్గా ఉంటుంది. మా చిన్నాన్న బాపిరాజు గారితో మాట్లాడదాం” అని మా నాన్న గారికి చెప్పగానే “జాతకాలు పడలేదుట” అన్నారు మా నాన్న గారు. “అదేదో తప్పు చూసి ఉంటారు” అని అయన, బాపిరాజు గారిని సంప్రదించి ఈ సారి మా అక్కదీ, పెళ్లి కొడుకుదీ జాతకాలు రాజమండ్రి లో మాకూ, వాళ్ళకీ కూడా ఆస్థాన జ్యోతిష్కులైన  కె. వి. సోమయాజుల గారికి మళ్ళీ చూపించారు.  ఆయన ఆ జాతకాలు చూసి “ఈ జాతకాలు అద్భుతంగా కుదిరాయి. ఇంకేమీ ఆలోచించకండి” అని చెప్పగానే బాపిరాజు గారు “మీ అమ్మాయిని చూసుకోడానికి వస్తాం” అని కబురు చేశారు. ఆ రోజుల్లో మగ పెళ్లి వారు పెళ్లి కూతురి తల్లిదండ్రులకి ఇలా కబురు పెట్టడం కనీ , వినీ ఎరగనిది.

మొత్తానికి 1960 ఆగస్ట్ లో రెండు టాక్సీలలో పెళ్లి కొడుకు “సూరి” గారి పెద్ద నాన్న గారు (నండూరి సూర్య నారాయణ మూర్తి గారు, పెద్దాపురం అడ్వొకేట్), తండ్రి బాపి రాజు గారు, తల్లి రాజేశ్వరి గారు, వరసకి అన్నయ్య అయిన రామ చంద్ర మూర్తి గారు (రాజమండ్రి అడ్వొకేట్) & ఆయన భార్య అమ్మడు గారు, మరి కొందరూ మగ పెళ్లి వారి కుటుంబం నుంచి తరలి వచ్చి మా అక్కని పెళ్లి చూపులు చూసుకున్నారు. ఈ సంబంధం ఇంచు మించు కుదిరిపోయినట్టే కాబట్టి మా కుటుంబం నుంచి సుబ్బారావు తాతయ్య గారు (పాలతోడు), జేగురు పాడు నుంచి పెద వెంకట్రావు నాన్న, రాజమండ్రి నుంచి సూరీడు బాబయ్య గారూ, కరప నుంచి మా పెద్దన్నయ్య మామ గారు చాగంటి సుబ్బారావు మామయ్య గారూ, కొండేపూడి సూర్యనారాయణ గారూ వచ్చారు. మా ఇల్లంతా పెళ్లి చూపుల హడావుడి తో నిండి పోయింది. ఆ మర్నాడు మా నాన్న గారూ, మా అందరు బంధువులూ రాజమండ్రి రామచంద్ర మూర్తి గారి ఇంటికి వెళ్ళగానే అమ్మాయి నచ్చిందని చెప్పారు. ఆ మర్నాడు చింతలూరి సాంబశివరావు గారు, మా అద్దంకి సుబ్బారావు నాన్న కూడా కలిసి రాగా ఇరు కుటుంబాల పెద్దలూ మొత్తం యాభై మంది మధ్యలో మా అక్కకీ, బావ గారికీ నిశ్చితార్థం జరిగి, తాంబూలాలు పుచ్చుకున్నారు. వెంటనే సోమయాజుల గారి దగ్గరికే మరో ఆరు నెలలకి వెళ్లి ఉత్తరాయణం వచ్చాక ఫిబ్రవరి 5, 1961 ఉదయం  పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. నాకు తెలిసీ ఎక్కడా అసలు కట్నం ప్రసక్తే రా లేదు. వచ్చినా “కట్నం, గిట్నం అక్కర లేదు కానీ పెళ్లి మటుకు ఘనంగా చెయ్యండి” అన్నారు మగ పెళ్లి వారు. కట్నం గురించి పట్టించుకోక పోవడం  ఆ రోజుల్లో అపురూపమే! ఎంతో నాజూగ్గా ఉండే ఆ రోజుల నాటి మా అక్క ఫోటో, మా అక్కా, బావ గార్ల పెళ్లి శుభ లేఖ ఇక్కడ జతపరుస్తున్నాను.

Mani NVS Telugu1

అప్పటి నుంచీ మా ఇంట్లో ఆరు నెలల పాటు ప్రతీ రోజూ పెళ్లి హడావుడే! పైగా మగ పెళ్లి వారు కోనసీమ వారు అవడంతో, అందునా నిష్టా గరిష్టులు అవడంతో చాలా విషయాలు పకడ్బందీగా వారి ఆచార వ్యవహారాలకీ, మడి నియమాలకీ అనుగుణంగా ఏర్పాటు చెయ్యడానికి మా నాన్న గారు, మా మొత్తం కుటుంబం చాలా శ్రమ పడ్డారు. ఇక్కడ మేము చేసిన ఒక “దొంగ పని” ఒప్పుకుని తీరాలి.   ఎప్పుడూ మా వంటింట్లో అడుగు పెట్టక పోయినా మాకు స్వామి నాయుడు అనే స్నేహితుడు మా కుటుంబానికి ప్రాణ వాయువు లాటి వాడు. అలాగే మా పక్కింటి భాస్కర రావు గాడు. ఈ బాచి గాడు సుప్రసిద్ధ కవీశ్వరులు వేంకట పార్వతీశ్వర కవులలో ఒకరయిన ఓలేటి పార్వతీశం గారి మనవాడే కాబట్టి ఇబ్బంది లేదు కానీ ఈ స్వామి నాయుడు మటుకు మా కాకినాడ క్రౌన్ టాకీస్ యజమాని గొలగాబత్తుల వీర రాఘవుల గారి రెండో కొడుకు. ఆయనే కాకినాడలో తొలి సినిమా హాలు పేలస్ టాకీస్ కట్టి ఆ ప్రాంతాలలో మొట్టమొదటి సినిమా ప్రదర్శనలు వేసినాయన. పైగా ఉల్లిపాయల వ్యాపారం కూడా ఉండేది. ఈ నాయుడు గాడు బజారు కెళ్ళి కూరగాయలు, ఉల్లి పాయలూ పట్టుకొచ్చే వాడు. అది పరవా లేదు కానీ గాడి పొయ్యిలు వేసి బ్రాహ్మలు వంట వండుచున్న చోటికి కానీ, మగ పెళ్లి వారు భోజనాల సమయంలో కానీ మా పెద్ద వాళ్ళ మడీ, ఆచారాల ప్రకారం మాంసాహారం చేసే కులాల వాళ్ళు వాడు కనపడ కూడదు. అంచేత  ఈ నాయుడు గాడు ఎప్పుడైనా పొరపాటున భోజనాల సమయంలో కనపడతాడేమో, ఈ కోనసీమ పెళ్లి వారు లేచి వెళ్లి పోతారేమో అని భయం వేసి ఆ పెళ్లి వారం రోజులూ వాణ్ని “శర్మ” అని పిలిచే వాళ్ళం. ఇప్పటికీ అది తలచుకుంటే ఎంత నవ్వొస్తుందో!

ఇక్కడ మా అక్క మామ గారైన బాపిరాజు గారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి తీరాలి. ఆయన మొదట్లో గాంధేయ వాది. ఎంత తీవ్ర గాంధేయ వాది అంటే, కావాలని హరిజనులని వంటింట్లోకి తీసుకొచ్చి ఎంతో శ్రోత్రియురాలైన భార్య ని వాళ్ళ కి భోజనం వడ్డించమని పక్కన కూచోబెట్టుకునే వారు అని బంధువులు చెప్పుకోగా విన్నాను. ఆయన స్వాతంత్య పోరాటంలో పోలీసుల చేత ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిని జైలు కి వెళ్ళారు.ఆ కొరడా, లాఠీ దెబ్బల తాలూకు చారలు వీపు నిండా కనపడేవి. రాష్ట్రానికి తొలి ఆర్ధిక మంత్రి కళా వెంకట్రావు గారికి దగ్గర స్నేహితులు. కానీ స్వాతంత్ర్యం వచ్చాక పూర్తిగా మారిపోయిన రాజకీయ వాదులనీ, పతనమై పోయిన నైతిక, సామాజిక, మత పరమైన విలువలనీ చూసి మళ్ళీ ఆధ్యాత్మక తత్త్వం,  ఆచారాలు పాటించడం  వేపూ మళ్ళారు. ఆయనే నాకు “కోట వెంకటాచలం” గారి పుస్తకాలు ఇచ్చి “ఇవి చదవ్వోయ్ రాజా, హిందువులు ఎంత గొప్పవాళ్ళో తెలుస్తుంది” అని నేను ఎప్పుడు వెళ్ళినా ఎంతో ఆప్యాయతతో నేనంటే చాలా ఇష్టంగా ఉండే వారు.  ఆయన భోజన ప్రియులు. వారింట్లో వంటిల్లు ఒక దేవాలయం గానూ, వంట చెయ్యడం, భోజనం చెయ్యడం ఒక మహా యజ్ఞం గానూ ఉండి ఎప్పుడు వాళ్ళింటికి వెడదామా అని మా బంధుకోటి ఎదురు చూస్తూ ఉండే వాళ్ళం. ఇప్పటికీ మా బావ గారితో సహా ఆయన ఆరుగురు కొడుకులూ, ఒక అమ్మాయల అందరి ఇళ్ళల్లో కూడా అదే ఆచారం కొనసాగుతోంది.

ఇక మా అక్కా, బావ గార్ల పెళ్లి విషయానికి తిరిగి వస్తే ఆ ఐదు రోజుల పెళ్ళికీ అసలు హడావుడి అంతా జనవరి లోనే మొదలయింది. కరప నుంచి మా సుబ్బారావు మామయ్య గారు  (మా పెద్దన్నయ్య మామ గారు) మా ఇంట్లో సుమారు అర ఎకరం పందిరికి సరిపడా తాటాకులు, వాసాలు, సరుగుడు రాటలు పంపించారు. ప్రత్తిపాడు నుంచి మా రైతు గొల్లకోట రామారావు 12 వీశలు స్వచ్చమైన నెయ్యి, కందులు, పెసలు, గొల్లపోలు మిరప కాయలు వగైరా సరుకులు పంపించాడు. మా పొలం నుంచీ, ఇతర చోట్ల నుంచీ భోజనాల ధాన్యం, ఇతర దినుసులూ ఎద్దు బండ్ల మీద ప్రతీ రోజూ వచ్చేవి. ఎందు కంటే మొత్తం ఐదు రోజుల పెళ్ళికీ రోజుకి వెయ్యి విస్తరాకులు లేస్తాయని మా నాన్న గారి అంచనా. అది కాక మా ఆనవాయితీ ప్రకారం మూడు విందులు….పెళ్లి వారికి, బంధువులకీ, స్నేహితులకీ కలిపి ఒకటి, కాకినాడ లాయర్లకి ఒకటి, మా పొలం రైతులకి ఒకటి. ఇక్కడ తమాషా ఏమిటంటే ఆ రోజుల్లో వారి ఇళ్ళల్లో నెల మీద విస్తరి వేసుకుని భోజనం చేసే   మొదటి రెండు విందుల వారూ “వంగూరి వారింట్లో పెళ్లి విందుకి టేబుల్ మీల్స్ పెడతారు” అని గొప్పగా చెప్పుకునే వారు. కానీ రైతులు మటుకు టేబుల్ మీద కూచోడానికి సిగ్గు పడిపోయి నెల మీదే కూచునే వారు. ఈ రోజుల్లో నేల మీద కూచుని అసలు ఎవరైనా భోజనం చేస్తున్నారా అనేది ఒక యక్ష ప్రశ్నే!

Akka2

 

మా అక్క పెళ్లికి రాని బంధువులు లేరు. మా ఆడ పెళ్లి వారి తరఫున పెళ్లి నిర్వాహకులు ఎప్పటి లాగానే మా చిట్టెన్ రాజు బాబయ్య, జయ వదిన. ఇక బంధువులలో పెద్దాపురం నుంచి బాసు పిన్ని& సుబ్బారావు మామయ్య గారు, వాళ్ళ పిల్లలు రత్నం, పద్మ  పెద్దమ్మరుసు & వెంకటేశ్వర రావు అన్నయ్య గారు, తణుకు నుంచి లక్ష్మీపతి రావు తాత గారూ, సుదర్శనం పిన్ని & సాంబశివరావు గారు, సువర్చల, రామలక్ష్మి బామ్మ గారు, రాజ మండ్రి నుంచి సూరీడు బాబయ్య గారు & మాణిక్యం పిన్ని, చెల్లం బామ్మ గారూ, పేద బేబీ, దొంతమ్మూరు నుంచి బాసక్క, చిన్న బేబీ, అమలాపురం నుంచి పెద్ద బావ, సుందరక్క, భానుడు దొడ్డమ్మ గారు సుందర శివ రావు గారు, మా మేనగోడళ్ళు ఐదుగురు, విజయ వాడ నుంచి కాంతం బామ్మ గారు, మంగ మామయ్య, వైజాగ్ నుంచి శంకరం బాబయ్య, కాంతం అత్తయ్య, కామేశ్వరి అత్తయ్య,   సత్యవతి అత్తయ్య, హైదరాబాద్ నుంచి రామం బాబయ్య ..ఇలా అందరి పేర్లూ రాసుకుంటూ పోతే చోటు చాలదు…ఇక మా వయసు గేంగ్ లో సుబ్బన్నయ్య, అబ్బులు బావ, కరప వెంకట్రావు, నేను, మా తమ్ముడు, కరప కంచి రాజు, స్నేహితుల ముఠా డజను మంది అన్ని పనులూ పైన వేసుకుని నానా హడావుడీ చేశాం.

ఇక పెళ్లి పందిరి అలంకరణ డ్యూటీ అంతా ఎప్పటి లాగానే మా పెద్దన్నయ్యదే! సుమారు అర ఎకరం తాటాకు పందిరి కి వంద సరుగుడు రాట్లకీ చుట్టూ రంగు, రంగుల ఉలిపిరి కాగితాలూ, చెమ్కీ  రిబ్బన్లూ, నక్షత్రాలు, ప్రతీ రాటకీ ఒక్కొక్క ట్యూబ్ లైటు, మళ్ళీ వాటిల్లో కొన్నింటికి పంచ రంగుల కాగితాలు….ఇలా ఒకటేమిటీ వారం రోజులు మా పెద్దన్నయ్య పర్యవేక్షణ లో అహర్నిశలూ కష్టపడి , ఒళ్లంతా తుమ్మ జిగురు, లేదా ఉడికించిన అన్నం అంటించుకుని మహానంద పడిపోయాం. 500 బుడగలు గాలి ఊది పందిరి అంతా వేలాడదీదీశాం. నేలంతా తడిపేసి, కల్లాపి జల్లి, టార్పాలిన్ లు పరిచేశాం. మా అమ్మ వేపు చుట్టాలయిన జనార్దనం బావ 200 కుర్చీలు సప్లై చేశాడు. ఇక రాటల చుట్టూ నలు చదరపు దిమ్మలు చేసి వాటి మీద రంగు, రంగుల ముగ్గులు వేసేశాం. మగ పెళ్లి వారి మడీ, ఆచారాల కి అనుగుణంగా పందిరి చుట్టూ దుప్పట్ల తో తెరలు కట్టేసి జాగ్రత్త పడ్డాం. అన్ని రాటలకీ కొత్త కొబ్బరాకులు కడితే పందిరికి మధ్యలో ఎత్తుగా కట్టిన మందిరానికి చుట్టూ అరటి చెట్లు కట్టి, మామిడాకుల తోరణాలతో అత్యంత శోభాయమానంగా మా పెద్దన్నయ్య తీర్చి దిద్దాడు. ఆ కొత్త ఆకుల పరిమళం నాకు ఇంకా గుర్తు.

ఇక 1961 ఫిబ్రవరి ఒకటో తారీకున మా ఇంట్లో అక్కని పెళ్లి కూతుర్ని చేసిన సమయానికే అక్కడ రాజమండ్రి లో మా బావ గారిని పెళ్లి కొడుకుని చేశారు. దానికి మా చిన్నన్నయ్య వెళ్ళాడు.  పెళ్లి ముందు రోజు సాయంత్రం మగ పెళ్లి వారు రెండు టాక్సీలు, మూడు పెద్ద బస్సుల్లోనూ, ఇతర విధాలు గానూ సుమారు 200 మంది తరలి వచ్చారు. వారి విడిది కోసం మా గాంధీ నగరం లో కపిలేశ్వరపురం జమీందార్ల మేడ, రాళ్ళపల్లి వారు, కాళ్ళకూరి వారు, ఎదురింటి విఠాల వారు, పక్కింటి కీర్తి వారు, చీమలకొండ వారు, పుల్లెల వారు, దుగ్గిరాల వారు ఇలా ఇంచు మించు పదిహేను ఇళ్ళు మా అధీనం లోకి వచ్చేశాయి. ఇంటికొక ఐదుగురు టీం…పని వాళ్ళు, పనమ్మాయిలు, టిఫిన్ల సప్లయ్ కి, పేకాట సామగ్రి వగైరా అన్ని సౌకర్యాలకీ ఏర్పాట్లు జరిగాయి. పెళ్లి నాడు పొద్దుట స్నాతకం లో మా పెద్దన్నయ్య హడావుడి అంతా, ఇంతా కాదు. పెళ్లి కొడుకు కాశీ వెళ్తున్నప్పుడు గడ్డం క్రింద మామూలు గా చిన్న ముక్క కాకుండా ఏకంగా వీశెడు బరువున్న పెద్ద బెల్లం ముక్కతో గట్టిగా కొట్టి అందరినీ భలే నవ్వించాడు. మా చిన్నన్నయ్య మాకు కుటుంబ స్నేహితులైన గిరి గారి రెండో కొడుకు స్మైల్స్ స్టూడియో ఓలేటి వెంకటేశ్వరావు చేత ఆ రోజుల్లో ఎంతో అపురూపమైన కలర్ ఫోటోలు తీయించాడు. అవన్నీ డెవెలప్ చెయ్యడానికి మొత్తం దక్షిణాది అంతటికీ మద్రాసు లో మాత్రమే ఉండే వేల్స్ స్టూడియో కి పంపించారు.

కోన సీమ మగ పెళ్లి వారు ఎక్కడ వంకలు పెడతారో అని మేం అందరం ఎంత భయపడుతూనే ఉన్నా, మా ఏర్పాట్లు బావుండండంతో అన్ని రోజులూ సంతోషంగానే ఉన్నారు. ..ఆఖరి రోజున తప్ప… ఆ రోజున మగ పెళ్లి వారందరూ క్రింద టార్పాలిన్ల మీద కూచుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మా పెద్దన్నయ్య మా నాన్న గారి పక్కనే కుర్చీలో కూచుని మాట్లాడుతున్నాడు. అది చూసి మగ పెళ్లి వాళ్ళలో ఒక పెద్దాయనకి కోపం వచ్చి “మేం అందరం క్రింద కూచుంటే మీ పెద్దబ్బాయి సిల్క్ లాల్చీ, సిల్కు పైజామా , చేతికి రిస్ట్ వాచీ పెట్టుకుని, సెంటు పూసుకుని ట్రిమ్ గా సినిమా హీరో లా షోకు చేస్తున్నాడు. ఆడ పెళ్లి వారం అని అప్పుడే మర్చి పోయాడా?” అని మా నాన్న గారిని హేళన గా మాట్లాడారు. మా నాన్న గారికి కోపం వచ్చి, మా పెద్దన్నయ్య దగ్గరకి వెళ్లి, జట్టు చెరిపేసి పరువు తీసేశావు అని కోప్పడ్డారు. వెంటనే మా అన్నయ్య లోపలి వెళ్లి పోయి బట్టలన్నీ విప్పేసి, మాసిన బట్టలు తొడుక్కుని, ఉంగరాలు, వాచీ విసిరేసి చింపిరి జుట్టు తో బయటకు వచ్చాడు. ఆ రాత్రి వధూవరులని పూర్తి బేండ్ మేళంతో, వెనకాల జెనరేటర్ తో రక రకాల లైట్లతో అలకరించిన కారులో, ఎందుకైనా మంచిదని పెట్రోమేక్స్ లైట్లతోటీ మొత్తం గాంధీ నగరం, రామారావు పేట ఊరేగించినప్పుడు మా పెద్దన్నయ్య రాలేదు. ఆ ఊరేగింపు తరువాత తాడేపల్లి గూడెం నుంచి పోణంగి సిస్టర్స్ బుర్ర కథ పెట్టించారు. సాయంత్రం అలక పాన్పు మీద మా బావ గారికి మద్రాసు నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఒమేగా రిస్ట్ వాచీ ని మా చిన్నన్నయ్య బహుకరించాడు. ఆ రోజుల్లో అది ఏకంగా 300 రూపాయల అత్యంత ఖరీదైన ప్రతిష్టాత్మకమైన రిస్ట్ వాచీ. అప్పగింతల సమయంలో మళ్ళీ మా పెద్దన్నయ్య గట్టిగా పోలోమని పెద్ద ఏడుపు నటించి వాతావరణాన్ని తేలిక చేశాడు.

పెళ్లి తంతులు పూర్తి అయ్యాక జరిగిన రెండు డిన్నర్లకీ..అంటే పెళ్లి వారు, స్నేహితులు, బంధువర్గానికి ఒక రాత్రి, లాయర్లందరికీ మరో రాత్రీ….గుమ్మ దగ్గర నుంచుని అతిధులని సాదరంగా ఆహ్వానించడం డ్యూటీ నాదీ, మా తమ్ముడిదీనూ. అందులో మొదటి రోజు అతిధులు ఏడింటికల్లా రావడం మొదలుపెడతారు కాబట్టి నేను ఆరూ నలభై ఐదుకి నా జన్మలో మొదటి సారిగా మా అక్క పెళ్లి కోసం ప్రత్యేకంగా కుట్టించిన సిల్క్ పజామా, లాల్చీ వేసుకుని అద్దం ముందు నుంచుని షోకు చూసుకుంటూ ఉంటే మా చిన్నన్నయ్య దూసుకుంటూ వచ్చి “ఏరా, వెధవా..ఇంకా ఇక్కడే ఉన్నావా. వెధవ షోకు చాలు కానీ గుమ్మ దగ్గరకి తగలడు. అందరూ వచ్చే వేళయింది” అని కొట్టేటంత పని చేశాడు. నిజంగా కొట్టాడేమో మటుకు అంతగా గుర్తు లేదు. కానీ ఆ సంఘటన మటుకు ఇప్పటికీ మర్చి పోలేదు.

AKKA BAAVA

ఇక మా బావ గారి విషయానికి వస్తే,  అప్పుడు   హైకోర్ట్ మద్రాసులో ఉండేది కాబట్టి చిన్నప్పుడు ఆయన మద్రాసులో కేసరి హై స్కూల్ లో చదువుకున్నారు. అప్పుడు బాపు –రమణ ఆయన సహాద్యాయులు. అక్కడే లా డిగ్రీ చదువుతున్నప్పుడు, మా చిన్నన్నయ్య కూడా అదే మద్రాసు లా కాలేజీ లోనే చదివే వాడు. ఆ విధంగా కాస్తో, కూస్తో వారిద్దరికీ ప్రత్యక్ష పరిచయం అప్పుడే ఉంది.  హైదరాబాద్ లో హై కోర్ట్ లాయర్ గా దుర్గాబాయ్ దేశ్ ముఖ్  గారి మహిళా కళాశాల లాయర్ గా తొలి రోజులలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ముళ్ళపూడి రమణ గారు ఒక ప్రముఖ నటుడి చేతిలో మోస పోయి ఒక మార్వాడీకి అప్పు తీర్చడం కోసం  ఇల్లూ, వాకిలీ అమ్మేసుకున్నప్పుడు మా బావ గారినే కన్సల్ట్ చేశారు కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అలాగే జలగం వెంగళ రావు కమిషన్ లోనూ, అప్పటి పెట్రోలియం మంత్రి  శివ శంకర్ గారితోటీ,  ఎన్టీ ఆర్ హయాంలో నూ ప్రతిష్టాత్మకమైన లాయర్ గా పని చేసి ఇప్పుడు సీనియర్ ఎడ్వోకేట్ గా విశ్రాంతి తీసుకుంటున్నారు. మా బావ గారి తమ్ముళ్ళు అచ్యుత రాం, బాపన్న, రాం చంద్, కామరాజు (మరో తమ్ముడు, నా వయసు వాడైన రత్నం కొన్నేళ్ళ క్రితం పోయాడు), చెల్లెలు కల్పకం అందరూ ఎంతో సన్నిహితులం, స్నేహితుల్లగా ఉంటాం. మా కుటుంబానికి  మా అక్కా, బావ గార్లే  పెద్దలు. వారికి చెప్పనిదే, వాళ్ళ ఆశీర్వచనాలు ముందు తీసుకోనిదే ఏ పనీ చెయ్యం.

ఇప్పుడు అలాంటి తాటాకుల పెళ్లి పందిరి సినిమాలలో కూడా చూడలేం. మొన్నే మధ్య ఆత్మీయుడు కూచిభొట్ల ఆనంద్ బందరు లో వాళ్ళమ్మాయి పెళ్లికి తాటాకుల పందిరి వేయించాడని చెప్తే భలే సంతోషం వేసింది. నేను ఈ మధ్య ఇండియా వెళ్లి నప్పుడు ఎవరింట్లోనో పెళ్లి కి వెళ్లి, ఆ ప్లాస్టిక్ పువ్వుల మధ్య, షామియానా లోనూ “నీరజ్ వెడ్స్ నీరజా” అని వెలిగీ , ఆరిపోయే లైట్లతో బోర్డు వెనకాలా ఎక్కడ వెతికినా మామిడాకుల తోరణమే కనపడ లేదు. ఆఖరికి పురోహితుడి దగ్గర పంచ పాత్ర అనే చెంబులో ఒకే ఒక్క మామిడాకు కన పడి గ్లోబలైజేషన్ అనే అమెరికనైజేషన్ కి చెయ్యెత్తి నమస్కారం చేసుకున్నాను. ఎవరి సంగతో ఎందుకూ, రెండేళ్ళ క్రితం మా అమ్మాయి పెళ్లి చేసినప్పుడు ఏకంగా ఆరు ఆకులున్న మామిడి తోరణాన్ని మద్రాసు నుంచి డాలర్ పెట్టి కొనుక్కుని యాభై డాలర్లు రవాణా ఖర్చు పెట్టి తెప్పించుకున్నాను. ఆ మాట కొస్తే గత అరవై ఏళ్ళగా నేను ఎవరి పెళ్ళికి వెళ్ళినా…ఆఖరికి నా పెళ్లి తో సహా….మా అక్క పెళ్ళే మనసులో మెదులుతూ ఉంటుంది. అందుకే అలనాటి ఆ ముచ్చట గురించి ఇంత విపులంగా వ్రాసుకుని అక్షరబద్ధం చేసుకుంటున్నాను. అలనాటి వారి పెళ్లి ఫోటో, ఈ నాడు హుందాగా ఉన్న ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను.

 *

మీ మాటలు

  1. DESARAJU SRINIVAS says:

    ఆరిపోయే లైట్లతో బోర్డు వెనకాలా ఎక్కడ వెతికినా మామిడాకుల తోరణమే కనపడ లేదు. ఆఖరికి పురోహితుడి దగ్గర పంచ పాత్ర అనే చెంబులో ఒకే ఒక్క మామిడాకు కన పడి గ్లోబలైజేషన్ అనే అమెరికనైజేషన్ కి చెయ్యెత్తి నమస్కారం చేసుకున్నాను. ఎవరి సంగతో ఎందుకూ, రెండేళ్ళ క్రితం మా అమ్మాయి పెళ్లి చేసినప్పుడు ఏకంగా ఆరు ఆకులున్న మామిడి తోరణాన్ని మద్రాసు నుంచి డాలర్ పెట్టి కొనుక్కుని యాభై డాలర్లు రవాణా ఖర్చు పెట్టి తెప్పించుకున్నాను.
    … కాకతాళీయం అంటే ఇదే. ఇవాళ ఉదయమే నేను నా పెద్దమ్మాయికి ఇద్దరు వ్యక్తుల మధ్య ఆనాటి, ఈనాటి పెళ్లిళ్లలో వచ్చిన తేడా గురించి రాసిచ్చాను. దాన్నిఅది డెవలప్ చేసుకుని స్కూల్ ప్రాజెక్టు వర్కుగా ఉపయోగించుకుంటానంది. మిత్రులు నరేష్ నున్నా గారు ఏదో లింకు పెడితే దాని ఆధారంగా ’సారంగ‘లో దూరి వంగూరి గారి ఈ ఆర్టికల్ చూడ్డం జరిగింది. ఇక్కడో స్వార్థం కూడా వుందిలేండి. మా అమ్మగారి ఇంటి పేరు వంగూరి. అందుకే ఇది నాకు రీడబుల్. ఒక తరం దాటి మరో తరంలోకి వచ్చినప్పుడు ఆనాటి సంగతులు ఎవరో ఒకరు చెబితే కానీ తెలియవు. చరిత్రకు చేరక మరుగున పడిపోతాయి. వంగూరి చిట్టేన్ రాజు గారు తన అనుభవాలను ఇలా ఈ తరానికి అందించడం బావుంది. రాజు గారు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు అంటే మన వాదం ధన్యమైందనే అర్ధమని మిత్రుడొకరు చెప్పారు. (తెలియకుండానే చాలా పదాలు వాడేస్తాం) ఇప్పుడు ఈ రచన ఎంతోమందికి చేరి ధన్యమైందని నేను భావిస్తూవున్నాను. వుంటాను. -దేశరాజు శ్రీనివాస్, హైదరాబాద్

  2. వంగూరి చిట్టెన్ రాజు says:

    నిజంగానే ధన్యవాదాలు సుమా….”మన వాదం ధన్యమైనది” అనే నిర్వచనం భలేగా ఉంది. ఎప్పుడూ విన లేదు కానీ ఇక రెచ్చిపోతాను. అమెరికాలో పెళ్ళిళ్ళ మీద ఇరవై ఏళ్ల క్రితం ఒక కథ రాశాను.. ఈ వ్యాసం మటుకు మా అక్క పెళ్లి విశేషాలు గుర్తుకు తెచ్సుకోడానికే వ్రాసుకున్నాను కానీ, మధ్యలో ఈ నాటి పెళ్ళిళ్ళ గురించి ఆ మాత్రం అయినా రాయకుండా ఉండ లేక పోయాను.

    ఇంతకీ మీ అమ్మగారి వేపు వారు ఎటువేపు వంగూరి వారూ?

  3. నాకు చినప్పటి నుండి అక్షరం కనిపిస్తే చాలు చదవటం అలవాటు . అలాగే ఈ వెబ్సైటు కూడా చూడటం జరిగింది. సర్ మీరు మీ అక్క గారి పెళ్లిని చాల వివరంగా వర్ణించారు . చదువుతూ వుంటే దృశ్యాలు అన్ని కూడా కంటి ముందు మేదులుతునట్టుగా వుంది. చిన్న వాళ్ళం అండి ఇలాంటివి ఇంకా ఇంకా తెలుసుకోవాలని వుంది.

  4. వంగూరి చిట్టెన్ రాజు says:

    సంతోషం….మా చిన్నప్పటి సంగతులు మా తరం వాళ్ళకే కాకుండా ఈ తరం వారికి కూడా నచ్చుతాయి అనే నేనూ అనుకుంటాను. చదువుతూ ఉండండి…

  5. రావు లక్కరాజు says:

    ఏదో వెదుకుతుంటే మీ పేరు కనపడి మీ అక్క పెళ్లి చదివాను. పెళ్ళిళ్ళు ఇవెంట్ ప్రోగ్రామ్మేర్ తో చేయించే రోజుల్లో, అటువంటి రోజులు మళ్ళా రావు.అన్నీ మనసులోనుంచి తీసి గుప్త పరిచినందుకు థాంక్స్. అప్పటి పెళ్ళిళ్ళ ల్లో నాకు బాగా గుర్తున్నది ఎడ్ల బండిలో మా తాతయ్య గారి ఊరు నెప్పల్లి నుండి గుడివాడ పెళ్ళికి వెళ్ళటం (మధ్యలో సత్రంలో వంటచేసుకుని భోజనం పడక).

మీ మాటలు

*