Archives for April 2014

నన్ను మాట్లాడనివ్వు!

నన్ను మాట్లాడనివ్వు
స్పష్టంగా, తీర్మానంగా-

నీకు నచ్చదుకాబట్టీ
నీ అనుమతిలేదు కాబట్టీ
నా అవసరాలను రోజూ
అగ్గికి ఆహుతివ్వాలా?

నీలాగే
నేనూ జీవితమం గురించి
వేయి కలల్ని మోసుకొచ్చాను
అనుదినమూ నా కలల్ని చంపేసేలా
వేయి మేకులు కొట్టేస్తున్నావు!

నీ అనుమానాలకల్లా
నేను బాధ్యురాల్ని కాను
విచారణలు, నేర నివేదికలు,
నా మీద నువ్వు ప్రవేశ పెట్టే
అవిశ్వాస తీర్మానం –
వీటన్నిట్నీ చర్చించేందుకు
పడకగది నీ పార్లమెంటు కాదు.

నన్ను మాట్లాడనివ్వు!

మిక్కుటమైన బాధల్ని
బొమ్మగీసి చూపించలేను
నా అయిష్టాన్ని
నీకు విశదపరచటానికి
యుద్ధం సాగించలేను!

– అనార్ , తెగించు (ఊడఱు) అన్న స్త్రీ సాహితీ సంకలనంలోనుండి

Anar02

శ్రీలంకకి చెందిన ప్రముఖ తమిళ కవయిత్రి  ఇస్సాత్ రిహాణా అజీమ్ గారు “అనార్‌” అనే కలంపేరుతో రాస్తారు. ఈమె కవితల్లో శృంగారం, స్త్రీ స్వేచ్ఛ, ప్రేమ భావాలే ఎక్కువగా కనబడతాయి. ఈమె కవితా సంపుటాలు శ్రీలంకలోనూ, భారత దేశంలోనూ పలు సాహితీ పురస్కారాలు అందుకున్నాయి.

ఊడరు –  ఈ స్త్రీ సాహితీ సంకలనంలో పదమూడు వ్యాసాలు, ఐదు కథలు, ఇరవైనాలుగు కవితలు ఉన్నాయి.  రంజి (స్విస్), దేవా(జెర్మని), నిరుపా(జెర్మని), విజి(ఫ్రాన్స్) – వీరి సమిష్ఠి కృషితో 2002 లో ప్రచురించబడినది ఈ సంకలనం.

 

~ అవినేని భాస్కర్

Avineni Bhaskar

ఇనుప కౌగిలి

srinu pport
నవంబర్ నెల
మొదలయ్యిందంటే చాలు
మా వూరిపైకి విరుచుకుపడేది…  అది
దానికి దొరికితే చర్మాన్ని చీరేసి
ఎముకులను కొరికేస్తుందనే భయంతో
ఊలు కవచాలను ధరించి
ఇళ్ళల్లో దాక్కునే వాళ్ళమందరం
రాత్రంతా…
ఊరి చివర గుడిసెలో
ఒంటరి దీపంలా
కడుపుమంటను
కుంపటిలో వేసుక్కూర్చుని… ఆమె
పొలిమేర పొలంలో
చీకటి చుట్టను కాలుస్తూ
నోటిలో నిప్పు కత్తితో… అతడు
తెల్లార్లు దానితో తలపడేవారు
తెల్లారేసరికి…
వారి తెగువకు అది
కాస్తా తలొగ్గేది
గాయపడిన దాని కాయం నుండి
చిందిన తెల్లరక్త బిందువులతో
ప్రతి పచ్చనాకు నిండేది
అంతవరకు…
చీకటి గది పొదల్లో
చెవుల పిల్లులమైన మేము
తరువాత తెలుసుకునే వాళ్ళం
భయపడితేనే ఏదైనా
ఇనుప కౌగిలిలో బంధించగలదని!
అగ్నిశిఖలా కలబడితే పారిపోతాయి
ఆఖరికి చలైనా… పులైనా అని!!
                                                                                                                -మొయిద శ్రీనివాసరావు

ఒక్క నీకు మాత్రమే…

Ravi_Verelly

మలుపు మలుపులో మర్లేసుకుంటూ

ఏ మైలురాళ్ళూ లేని తొవ్వలో

ఏ కొలమానమూ లేని కాలాన్ని మోస్తూ

తన కోసం కాని నడక నడుస్తూ

నది.

అట్టడుగు వేరుకొసని

చిట్టచివరి ఆకుఅంచుని

కలుపుతూ పారే

మూగ సెలయేటి పాట వింటూ

తనలోకి తనే వెళ్తూ

చెట్టుమీదొక పిట్ట.

 bird

నడిచి నడిచి

అలసి

ఏ చిట్టడివి వొళ్లోనో

భళ్ళున కురిసే కరిమబ్బులా

కనిపించని నీ దోసిట్లో

ఏ ఆకారమూ లేని

ఏ స్పర్శకూ అందని

ఒక్క నీకు మాత్రమే కనిపించే

ఒకానొక పదార్ధంగా కరిగిపోతూ

నేను.

కరిగి ప్రవహించడం తెలిసాకే-

మట్టిని ఇష్టంగా తాకే కాలి గోటికి

మింటిని గర్వంగా కొలిచే కంటి చూపుకి మధ్య

చుట్టరికం తెలిసింది.

– రవి వీరెల్లి

స్త్రీవాద విమర్శలో నిరసన, ప్రతిఘటన- కాత్యాయనీ మేలుమలుపు

                  కాత్యాయనీ విద్మహేకు ప్రాచీన ఆధునిక సాహిత్యాలలో సమాన ప్రవేశం వుండటం వల్ల రెండు కాలాల సాహిత్యాలలోని స్త్రీవాద దృక్పథాన్ని ఆవిష్కరించటంలో స్త్రీవాద విమర్శను ముందుకు నడిపించగలిగారు. ‘ స్త్రీవాద సాహిత్యం – స్త్రీవాద భూమిక పుస్తకంలోని వ్యాసాలను చాలా నిర్థిష్టంగా స్త్రీవాద సిధ్ధాంత భూమికలోంచి  ‘ఆధునిక సాహిత్యాన్ని విశ్లేషించారు. విమర్శ చేయాల్సిన పని సాహిత్యంలో అమూర్తంగానయినా ఆవిష్కరించబడిన భావాల వెనుక వున్న విషయాలను వెలికితీసి వాటి తాత్విక మూలాలను ఆవిష్కరించగలగటం. ఈ పనిని కాత్యాయనీ విద్మహే చాలా సమర్థవంతంగా ప్రాచీన ఆర్వాచీన సాహిత్యాలకు అనువర్తింపచేశారు.

                  స్త్రీ శరీరం స్త్రీకి చెందకుండా చేసింది పితృస్వామ్యం. కాబట్టి శరీరాన్ని గురించి మాట్లాడడం అనేది ప్రపంచవ్యాప్తంగా స్త్రీవాదులకు అనివార్యమైనది.  Writing the body అనే భావం స్త్రీవాదంలో అంతర్భాగమైంది.

“Women in sexist society are physically handicapped. In so far as we learn to live out our existence in accordance with the definition that patriarchal culture assigns to us, we are physically inhibited confirmed, positioned and objectified” అంటుంది Iris Young అనే స్త్రీవాద విమర్శకురాలు దేహం లేదా శరీర స్పృహతో రాసిన కవిత్వం మీద విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ విమర్శలకు సమాధానంగా కాత్యాయనీ విద్మహే ఇలా అన్నారు.

స్త్రీ అంటే శరీరంగా తప్ప మరోవిధంగా చూడలేని పితృస్వామిక సంస్కృతిని ధిక్కరిస్తూనే శరీరాన్ని గురించి ప్రపంచ సంబంధం  వలన ఏర్పడిన చైతన్యాన్ని, శరీర అనుభవ లక్షణాన్ని కవితా వస్తువుగా  చేసుకున్న స్త్రీవాద కవితలో శరీర స్పృహ ప్రధానాంశమైంది. పునరుత్పత్తి రాజకీయాలను అర్థం చేసుకునే క్రమంలో  ఇది సంభవించింది. మాతృత్వపు నిరాకరణ అయినా, హక్కు అయినా తమదిగా వుండాలనే ఆకాంక్షను అభివ్యక్తి రూపాలుగా ఆ కవితను గ్రహించాలని” ఆ కవితలకు గల  తాత్విక బలాన్ని ఆమె వివరించారు.

కాత్యాయనీ విద్మహే పై మార్క్సిస్ట్ సిధ్ధాంత ప్రభావం బలంగా వున్నప్పటికీ అది ఆమె ఆలోచనను నియంత్రించకపోవటం గమనించాల్సిన విషయం. ఆ నియంత్రణ లేకుండా ఆలోచించబట్టే రష్యా లాంటి దేశాలలో కూడా స్త్రీలు  సామాజికంగా అన్ని రంగాలలో పురుషులకంటే  వెనుక వున్నారని అనగలిగారు. “ గత శతాబ్దిలో స్త్రీవాదం – తెలుగు సాహిత్యం”  అనే వ్యాసంలో అస్థిత్వ స్పృహ, శరీర స్పృహ , పునరుత్పత్తి హక్కుల స్పృహ, శ్రమ స్పృహ, కుటుంబ అధికార స్పృహ అని ఆమె చేసిన విభజనలు, నిర్వచనాలు, వివరణలు స్త్రీవాదం ఒక సిధ్ధాంతంగా నిలదొక్కుకొనటానికి అనివార్యంగా వుండాల్సిన  విషయాలు. స్త్రీవాద సాహిత్యం లేకపోతే ‘తెలుగు సాహిత్యానికి విస్తృతి లేదు, వినూత్నత లేదు, విశిష్టత లేదు. అని ఆమె ప్రకటించగలగటం వర్తమాన సాహిత్య సందర్భంలో స్త్రీవాదానికున్న  ప్రాముఖ్యతను, అనివార్యతను నొక్కి చెప్పటమే.

కాత్యాయని విద్మహే

కాత్యాయని విద్మహే

కాత్యాయనీ విద్మహే రాసిన మరో వ్యాసం  “ తెలుగు సాహిత్య విమర్శకు స్త్రీవాద పరికరాలు” (అరుణతార – డిశంబరు 2006) ఇదే వ్యాసంలో భాష గురించి, సాహిత్య విమర్శ లక్ష్యాన్ని గురించి ఆమె చేసిన నిర్థారణలు స్త్రీవాద సాహిత్య విమర్శలో చాలా కీలకాంశాలు. ఈ పై రెండు అంశాలను గురించి కూడా ఆమె ఇలా అన్నారు.

“సాహిత్యంలో వస్తువు ఏదైనా భాషా మాధ్యమం ద్వారానే వ్యక్తమవుతుంది. పితృస్వామిక సంస్కృతిలో అభివృధ్ధి చెందిన భావజాలం ఎలాగైతే పురుష ప్రయోజనానుకూలమైందో భాష కూడా అదే విధంగా పురుష ప్రయోజనానుకూలమైందే. సూటిగా నిర్భయంగా, స్పష్టంగా భావాలను ప్రకటించడానికి వీలులేని వాళ్ళ ప్రయోగం పరిమితంగానైనా వుంటుంది, లేదా ప్రత్యేకంగానైనా వుంటుంది. పరాశ్రయతను, ఆధీనతను, తక్కువ స్థాయిని సూచించేదిగా వుంటుంది. సామాజిక అధికార సంబంధాలలో అధీన వర్గాల సామాజిక అనుభవం భాషతో వాళ్ళ సంబంధాన్ని భిన్నంగా నిర్మిస్తుందని అందులో భాగంగా జెండర్ కు, భాషకూ వున్న సంబంధాలను చూడాలని స్త్రీవాదం చెప్తుంది.( పే-9)

“సాహిత్యాన్ని విమర్శించటమంటే, ఆ సాహిత్యం వెనుక వున్న విశ్వాసాలను, విలువలను విమర్శించటం. ఆ విశ్వాసాలు, విలువలు ఒక సామాజిక అధికార  నిర్మాణ సంబంధాల నుండి రూపొంది వుంటాయి. కనుక వాటిని విమర్శించడమంటే, అధికార రాజకీయాలను విమర్శించటమే.” అని గుర్తించటంలో కాత్యాయనీ విద్మహే స్త్రీవాద భావజాల సైధ్ధాంతికతను సొంతం చేసుకోవటమేనని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు.

విమర్శకులకు ఒక సిధ్ధాంతం వుండటమే ముఖ్యం కాదు. ఆ సిధ్ధాంతాన్ని నిర్థిష్ట సాహిత్య వాచకానికి (Text) అనువర్తింపచేసి విశ్లేషించినప్పుడు ఆ విమర్శకుల  సామర్థ్యం బయటపడుతుంది. ఈ విషయంలో కాత్యాయనీ  స్త్రీవాద విమర్శనా దృక్పథాన్ని ఆవిష్కరించగలిగారు.

గతాన్ని వర్తమనంతో అనుసంధానం చేసుకోవడానికి, కొథ పాతల మేలు కలయికకు పునర్మూల్యాంకనం అవసరం. గత సాహిత్యంలో విస్మరింపబడిన  కోణాలను ఆవిష్కరించటానికి సాహిత్య అధ్యయనంలో మూల్యాంకనంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దటానికి పునర్మూల్యాంకనం అవసరం. ఈ  విమర్శ రాయటానికి విమర్శకులకు ఎంతో అధ్యయనం, దైర్యం అవసరం. గతాన్ని సమర్ధించాలంటే కొత్తగా తలెత్తిన శక్తులు ప్రతిఘటిస్తాయి. గతాన్ని తిరస్కరించాలంటే గత అవశేషాలు విజృంబిస్తాయి. విభిన్నమైన రెండుకాలాల పరిణామాల మధ్య వారధి కట్టే సామర్థ్యం వుండాలి.  ఇలాంటి క్లిష్టమైన పునర్మూల్యాంకన  విమర్శ చేస్తున్న విమర్శకురాలు ఆచార్య కాత్యాయనీ విద్మహే. ప్రాచీన సాహిత్యం అంటే రాచరిక భూస్వామ్య వ్యవస్థను సమర్ధించే సాహిత్యం. ఇది పురుష స్వామ్య సాహిత్యం కూడా. ఈ రెండు సాహిత్యాలను స్త్రీ దృష్టికోణం నుంచి వ్యాఖ్యానిస్తూ ప్రాచీన సాహిత్యం మీద కొత్త దృక్పథాన్ని ఎనలైస్ చేశారు. సామాజిక ఆమోదం పొందిన సీత, దమయంతి, సావిత్రి, ద్రౌపది, సత్యభామ, చండిక , ప్రమీల, ప్రద్వేషిణి, గాంధారి, మాంచాల, నిపుణిక, విశాల వంటి పాత్రలు కుటుంబ వ్యవస్థ పట్ల నిరసన తెలపటాన్ని గుర్తించారు.

భారతీయ అలంకార శాస్త్రాన్ని కాత్యాయనీ స్త్రీ దృష్టికోణం నుంచి వివేచించారు. అలంకార శాస్త్రంలో స్త్రీ, రసము- మహిళ అనుభూతి, మహిళావాద భూమిక నుంచి కావ్య శాస్త్ర సందర్శనం అలంకారశాస్త్రం మనుషుల్ని గురించి మాట్లాడింది నాయికా ప్రకరణంలోనే. నాయిక చర్చంతా పురుషుడి చుట్టే తిరిగిందని అభిప్రాయపడ్డారు. అలంకారశాస్త్రం స్త్రీ వ్యక్తిత్వాన్ని గుర్తించలేదని, ఆమె వయసు, శరీరంచుట్టే తిరిగిందన్నారు. త్రివిధ నాయికలు, అష్ట విధ నాయికలు  ఏ పురషుడి దగ్గర ఉన్నారు లేదా ఏ పురుషుడి దగ్గరకు వెళ్ళారు అనే అంశం చుట్టూనే   విశ్లేషణంతా కేంద్రీకరించబడడాన్ని పురషస్వామ్య ప్రతిఫలన సాహిత్యంగా ధ్రువీకరించారు. ప్రాచీనులు అశ్లీలతను కావ్యదోషంగా పేర్కొంటూనే ఎంత అశ్లీలతను సాహిత్యంలో నింపారో అది ఆధునిక సాహిత్యంలో కూడా ఎలా కొనసాగిందో “సాహిత్యం – అశ్లీలం” అనే వ్యాసంలో తేల్చి తన స్త్రీవాద దృక్పథాన్ని వ్యక్తం చేశారు.

సాహిత్యం కూడా ఒక రాజకీయ భావజాల సాధనం. ఎందుకంటే, లింగ వివక్షతను, అసమానత్వాన్ని సాహిత్య వాచకాల్లో సమర్థించటం, సాధికారీకరించటం జరుగుతుంది. అలాగే అవి పితృస్వామిక భావజాలపు ప్రాసంగికతను బలపరుస్తాయి. అందువలన గత కాలపు సాహిత్యాన్ని విశ్లేషించి అందులోని స్త్రీ వ్యతిరేకత బహిర్గతం చేసి ఖండించడం స్త్రీవాదులు అనివార్యంగా చేయాల్సిన పని. అందువల్లనే Kate Millett తన Sexual Politics లోD.H.Lawrence, henry Millen, Normain Mailen, Jean genet లాంటి రచయితలు తమ రచనల్లో లైంగిక అధికార రాజకీయాలను ఎలా ప్రవేశపెట్టారో బహిర్గతం చేశారు. ఈ సందర్భంలోKate Millett `Sexual politics’ గురించి Toil Mai అన్న మాటలు గమనార్హం:

“……….Millett argued that social and cultural contexts must be studied it literature was to be properly understood”. (Sexual/Textual  Politics,p-24) Kate Millett భావాలు ఆ తరువాత స్త్రీవాద విమర్శకులకు గొప్ప ప్రేరణగా నిలిచాయి. ఆ ప్రేరణలోంచి అనేక మంది స్త్రీవాద విమర్శకులు వర్తమాన సాహిత్యాన్నే కాక ప్రాచీన సాహిత్యాన్ని కూడా కొత్త స్త్రీవాద విశ్లేషణ పరికరాల సహాయంతో విశ్లేషించే పనికి పూనుకున్నారు. క్రమంగా ప్రాచీన సాహిత్య విశ్లేషణ అనేది స్త్రీవాదులు చేయాల్సిన అత్యవసరమైన పనులలో ఒకటిగా గుర్తింపు పొందింది. తెలుగు సాహిత్య విమర్శ లోకంలో ఈ కృషిని స్త్రీవాద దృక్పథంతో మొదటగా కృషి చేసింది కాత్సాయనీ విద్మహే. తన “సాంప్రదాయ సాహిత్యం- స్త్రీవాద దృక్పథం” అనే రచన ఇందుకు తార్కాణం. ఈ రచనను చేకూరి రామారావు  ‘మహిళాభ్యుదయ విమర్శలో పెద్ద ముందడుగుగా”  గుర్తించటం చాలా సముచిత విషయం. ఎందుకంటే, ఈ పని అత్యంత క్లిష్టమైనదైనా అవసరమైన పని. ఆ పనిని అవలీలగా నిర్వహించగలిగారు కాత్సాయనీ విద్మహే గారు.

ప్రాచీన సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేయటం వలన స్త్రీవాద దృక్పథంతో పునర్ మూల్యాంకనం చేయటం “ సంప్రదాయ సాహిత్యం- స్త్రీవాద దృక్పథం”  గ్రంథంలోని ప్రతి వ్యాసంలోనూ కనబడుతుంది. ఇంతకు ముందు స్త్రీవాదులు చేయలేని పనిని ఈమె చాలా సమర్థవంతంగా చేయగలిగారని చే.రా. అన్నారు.

స్త్రీల లైంగికత మీద పితృస్వామ్య నియంత్రణను ఈ రోజు స్త్రీవాదులు ప్రశ్నిస్తున్నారు. ఖండిస్తున్నారు. అందులోంచి విముక్తమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాక ప్రత్యామ్నాయ జీవన శైలుల్ని అవలంబిస్తున్నారు. తద్వారా తమ లైంగిక స్వేఛ్ఛను Assert చేసుకుంటున్నారు కూడా. అయ్యలరాజు నారాయణామాత్యుడు రాసిన ‘హంస వింశతి’ గ్రంధంలోని విశాల కథలో విశాల పాత్ర ఇలాంటి Assertion కలిగి వుండటం పాఠకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. కనకదుర్గ, కాత్యాయనీవిద్మహే సంప్రదాయ సాహిత్యంలో ప్రతిధ్వనించిన స్త్రీల ప్రతిఘటనా స్వరాల కోసం జరిపిన అన్వేషణలో విశాల కథ తగలటం కాకతాళీయం కాదు.

విశాల స్వతహాగానే భర్త శివదత్తయోగి పట్ల ప్రేమాదరణను కలిగి వుంటుంది. అందుకే అతని జంగమార్చనలో భాగస్వామి కాగలిగింది. కానీ ఆమెను భర్త రంకులాడిగా దూషించి తృణీకరించబడుతుంది. ఆమె తన లైంగికతను (Sexuality) కాపాడుకునే క్రమంలో పిత్రుస్వామ్య వ్యవస్థ ఏ అధికార రాజకీయాలతో ఆమె పాతివ్రత్యం పైన  నియంత్రణను అమలుచేసిందో, అదే వ్యవస్థ Promote చేసిన భర్త యోగిత్వాన్ని, వాక్శుధ్ధిని, తన లైంగికతను కాపాడుకోవడంలో వినియోగించుకోవటాన్ని కాత్యాయనీవిద్మహే గుర్తించారు. అందుకే  విశాల ప్రవర్తనకు దంపతీ వ్యవస్థలోని అసమానతల్నే కారణాలుగా చూపారు. స్త్రీలు దాంపత్యేతర సంబంధాలలోకి వెళ్ళే ప్రథాన కారణాలను ఈక్రింది విధంగా ప్రస్థావించడంలో స్త్రీవాద దృక్పథం స్పష్టంగా తెలుస్తుంది.

ఒక్క విశాల విషయంలోనే కాదు, శుకసప్తతి, హంసవింశతి లాంటి కథా కావ్యాలన్నింటిలోనూ దాంపత్యేతర సంబంధాల పట్ల వ్యక్తమైన ఆసక్తిగా పైకి కనబడినా, “ దాంపత్య సంబంధాలలోని అసమానతలు, అసంతృప్తులు, ద్వంద్వ విలువలు మొదలైన వాటి పట్ల  ఏర్పడిన ఏహ్యత నుండి పుట్టిన నిరసన, తత్పలితంగా కుటుంబ వ్యవస్థా చట్రాన్ని ధిక్కరించాలనుకోవటం, ధిక్కరించేందుకు విఫలయత్నాలు చేయటం, నిపుణిక చర్య, విశాల తెంపరితనాల్ని ఈ కోణం నుండి అర్థం చేసుకోవలసినవి” అని కాత్యాయనీ ఈ వ్యాసంలో ప్రస్థావించిన అయిదుగురు స్త్రీలతోనూ గాంధారి, మాంచాల తమ నిరసనను మౌనంగానూ, మాటల్లోనూ వ్యక్తపరిస్తే ప్రద్వేషిణి, నిపుణిక, విశాల ఆనాటి సామాజిక స్థితి కంటే భిన్నమైన చైతన్యాన్ని, భావస్వేఛ్ఛను అందిపుచ్చుకున్న పాత్రలుగా కనకదుర్గ గుర్తించిందని    కాత్యాయనీ విద్మహే అభివర్ణించటంలోని ప్రత్యేకత బహిర్గతమవుతుంది.

స్త్రీలను పునరుత్పత్తికే పరిమితం చేయడంతో మొదలై ఉత్పత్తి సంబంధాలలో స్త్రీల భాగస్వామ్యాన్ని గుర్తింపు కాకుండా చేయడంతో పితృస్వామిక వ్యవస్థ స్వభావాన్ని గుర్తించారు. స్త్రీలు సమూహాలుగా,, సామాజికులుగా కాక వ్యక్తులుగా మిగల్చబడిన తీరును ఆమె గుర్తించారు. అందుకే స్త్రీల మీద అమలవుతున్న అణచివేత వెనుక వున్న రాజకీయ స్వభావాన్ని బట్టబయలు చేయడంలో స్త్రీవాద దృక్పథాన్ని చాలా నిశితంగా ప్రదర్శించారు.

ప్రతిఘటన ప్రథమ రూపమైన నిరసనను కుటుంబ వ్యవస్థలోని పరిమిత పరిథిలో వ్యక్తమైన సాంప్రదాయ సాహిత్యంలోని స్త్రీల నిరసనలు,, ప్రతిఘటన చర్యలను ఈ గ్రంథంలోచర్చించటం ద్వారా తరతరాల స్త్రీల ప్రతిఘటన చరిత్రను అందించటంలో కాత్యాయనీ విద్మహే చేసిన కృషి, అధ్యయనం అభినందించదగింది.

 -డాక్టర్ కే. శ్రీదేవి

 

 

 

 

 

 

 

 

 

 

కటకటాల్ని వెక్కిరించిన కవిత: కిటికీ పిట్ట

kitiki pitta

మోహన్ చిత్రకారుడుగా ఆ రంగంలో లోతైన విశ్లేషణా వ్యాసాలతో “అరుణతార”లో రచనలతో సుపరిచితుడు. 2005-06 మద్య కాలంలో తీవ్రమైన నిర్బంధ కాలంలో మోహన్ ఒకరోజు అనంతపురంలో యూనివర్శిటీ దారిలో నడిచి వెళ్తుండగా తెల్ల సుమోలో యూనిఫాంలేని పోలీసులు బంధించి పదిహేను రోజులపాటు తీవ్రమైన చిత్రహింసలకు గురిచేయగా ఆ చిత్రహింసల కొలిమిలోంచి పెల్లుబికిన సాంద్రమైన ఆర్థ్రత నిండిన ఆగ్రహ వాక్యం ఈ ఖైదు కవిత్వం.

 

ఖైదులోంచి అనేకమంది కవులు రచయితల రచనలు మనం చదివాం. కానీ ఈ కవిత్వంలో ఉన్న కొత్త చూపు మానవీయత శత్రువును కూడా తనను తాను ప్రశ్నింప చేసుకొని మనిషిని చేసే సౌందర్యాన్ని తన కుంచెనుండి కలానికి ఒలికిన లేలేత నెత్తుటి రంగు పూసిన గాయాల చిత్రవర్ణ కవిత్వం ఇది. రచయితగా చిత్రకారునిగా నలుగురికీ సుపరిచుతుడైన మనిషిని తన రాజకీయ విశ్వాసానికి యింత తీవ్రమైన చిత్రహింసల పాల్జేసి రాజ్యం మానసికంగా తనని బలహీనుణ్ణి చేయబూనడం అమానుషం. కానీ రాజ్యానికి ఇవేవీ అంటని మట్టికాళ్ళ మహారాక్షసి కదా? తన కాళ్ళు నరికివేయబడ్తాయన్న భయం వెంటాడి మనుషులను వేటాడుతుంది. కానీ నిబద్ధత నిమగ్నతగల మనిషి తన సుదూర స్వప్నాన్ని ఈ దేశ శ్రామిక వర్గ విముక్తిలో కాంక్షించే వాడిగా చెక్కు చెదరని ఆత్మవిశ్వాస ప్రకటనగా తన కలాన్ని పదును పెట్టే అవకాశంగా ఈ ఖైదు సమయాన్ని కూడా సద్వినియోగం చేయగల ధీశాలత్వం ఇదే సామాజిక సందర్భం యిస్తుందని ఈ కవిత్వం మరోమారు నిరూపిస్తుంది.

 

నిజానికి ఖైదులో వున్నది ఖైదీ పేరుతోను తనకు కాపలాగా వున్న ఉద్యోగి జైలర్ పేరుతోను ఇరువురు వున్నది జైలులోనే కదా అన్న స్పృహ జీతం తీసుకునే వాడికి వుండదు కదా? వాడికి తను మనిషినే అన్న స్పృహ నశించి ఉద్యోగ ధర్మం పేరుతోనో, తన నిస్సహాయతతోనో తోటి మానవునిపై మృగంలా అమలుచేసే చిత్రహింసల గురించి ఒకింత బాధ్యతతోనే మోహన్ వారిపై కూడా సానుభూతి చూపడం కవి హృదయాన్ని పట్టిస్తుంది.

 

నువ్వయినా ఎన్నిసార్లని గాయాలు చేయగలవులే

నువ్వయినా ఎన్నిసార్లని ప్రేమలు కోల్పోగలవులే

నేనైనా ఎన్నిసార్లని నిన్ను ద్వేషించగలనులే

ఇదుగో ఇటు

నా ముఖంలోకి సూటిగా చూడు

నా కళ్ళలో నీకే వెన్నెలా కనిపించడం లేదూ

నా నుదిటిమధ్య నీకే సన్నని జీవరేఖా పొడగట్టడం లేదూ

 

హు.. అవున్లే

చూపును కోల్పోతేనే గదా

నీ చేతులకు అసహజ చర్యలు మొలుచుకొచ్చేది

కార్పణ్యపు బిరడాను బిగించుకుంటేనే కదా

నీ హృదయ సున్నిత సంస్పర్శలు బండబారేది..

ప్రియ శత్రువా

నువ్వేం దిగాలుపడకు!

నీ భ్రమల విచ్చిత్తి కోసమే

నే బతికి బట్టకడతా

నాపై నువ్వెన్ని గాయాలకైనా పాల్పడు

నీలో మూల మానవుడు అంతరించడు

 

“గాయానికి గాయానికీ నడుమ

కాసింత తెరిపి

నాకే కాదు నీకూ కావాలి” అంటాడు కవి.

 

“పునరుత్థానం ఒక పురాకాంక్ష

వేటలో అసువులు బాసిన

ఆదిమానవుని ఖననంలో పోసిన

ఇంత కుంకుమా ఎర్రగంధమూ

వియోగపు రద్దుకు గొప్ప ఆశ్వాసన” అని విశ్వాస ప్రకటన చేస్తాడు కవి.

 

“హింస పాలబడిన పురాశరీరాన్ని

నిలువెత్తుగోడల మధ్య పడదోసి కూడా

తలుపుల భద్రత కోసమో

తలుపుల్లో దాగిన బతుకు భద్రత కోసమో

తాళంపైన తాళమేసుకునే

సంశయాత్మల విచికిత్సకు

విరగబడినవ్వుతున్నా” అని జైలు వాతావరణాన్ని హేళన చేస్తూనే

 

తలుపులంటే చెట్ల రూపాంతరాకృతులే కదా

తలుపులంటే రెండు చెక్కల కలయికే కదా!

 

చెట్ల రుతు సౌందర్యాలను ఆరాధించేవాణ్ణి

రెక్కల ఆవరింతలో కదిలిపోయేవాణ్ణి

తలుపు భౌతిక చలనాలనౌ తుంపేయవచ్చు

మరి మనసు తిరిగే స్వప్న ప్రపంచపు సంగతో– అని ప్రశ్నిస్తాడు కవి.

 

మోహన్ ఇందులో ఖైదులోనుండే బయట తనకోసం వేచివున్న అమ్మా, నాన్నా, చెల్లెల గురించి, తను రోజూ చూసే మందారం కొమ్మ తెంపిన అమ్మాయి గురించి కవిత్వం రాసారు. చిత్రహింసల మద్యలోంచే తన రాజకీయ విశ్వాసాన్ని బలంగా ప్రకటిస్తూ తన నుండి ఏ ఒక్క రహస్యాన్ని పొందలేకపోయిన శత్రువుని హేళన చేస్తూ విస్పష్ట ప్రకటన చేస్తారు. ’దేహం దేహమే రహస్యమైన చోట దేశంలో కోటానుకోట్ల రహస్యాలు’ అంటాడు కవి. ఈ కవిత్వం మొత్తం సరికొత్త ఉపమాన చిత్రలిపితో తాననుభవించిన చిత్రహింసలను మన కళ్ళకు కట్టినట్టు చూపుతూ శత్రువు యొక్క అమానవీయతను వాని నిస్సహాయతను బట్టబయలు చేయడం మనల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తూనే కర్తవ్య నిర్వహణకు గుండె నిబ్బరాన్నిస్తుంది.

కేక్యూబ్ వర్మ

varma

పరాశరుడు…మత్స్యగంధి… 2012, డిసెంబర్ 16

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)

మనకు తెలుసు…పురావస్తు నిపుణులు చారిత్రకమైన ఆనవాళ్ళు దొరకవచ్చునని అనుమానించిన చోట తవ్వకాలు జరుపుతూ ఉంటారు. ఆ తవ్వకాలలో ఒక్కొక్కసారి భవనాలు, ఇళ్లేకాక కాక; నగరాలు, పట్టణాలు కూడా బయటపడుతూ ఉంటాయి. కాలగతిలో వాటిని భూమి కప్పేసిందన్నమాట. ఆ కప్పేసిన చోట మరో భవనం, లేదా మరో నగరం, లేదా మరో ఊరు ఏర్పడతాయి. దాని మీద మరొకటి ఏర్పడుతుంది. వాటిని పొరలు (layers) అంటారు. ఒక్కొక్క పొర ఎప్పుడు ఏర్పడిందో పురావస్తు నిపుణులు అంచనా వేస్తుంటారు. ఈవిధంగా అనేక చారిత్రక రహస్యాలను కాలగర్భంతోపాటు భూగర్భం కూడా మోస్తూ ఉంటుందన్న మాట.

ఇప్పుడు ఇదే ప్రక్రియను పురాణ, ఇతిహాసాలకు అన్వయించి చూద్దాం. ఇవి ఇప్పటిలా లిఖిత రూపానికి చెంది, స్థిరమైన ఆకృతిని పొందిన అచ్చుపుస్తకాల వంటివి కావు. మౌఖిక సంప్రదాయానికి చెందినవి. అసలు కథ బీజరూపంలో అట్టడుగున ఉంటుంది. అది ఒక పొర. మాంత్రికతను ఆపాదించే అత్యుత్సాహంతో ఆ కథ ఒక అద్భుతత్వాన్ని సంతరించుకుంటుంది. అది ఇంకొక పొర. ఆ కథ చిలవలు పలవలు తెచ్చుకుంటూ మరింత విస్తరిస్తుంది. ఒక్కొక్కసారి చిన్న కథ కాస్తా పెద్ద కథ, పెద్ద కావ్యం అవుతుంది. ఇదొక పొర. దానిమీద పండితుల భాష్యాలు, వ్యాఖ్యలూ,వివరణలూ మొదలవుతాయి. ఇది వేరొక పొర. కాలంలోనూ, సమాజంలోనూ, విలువల్లోనూ వస్తున్న మార్పులు కూడా ఈ ఒక్కొక్క పొరనే ప్రభావితం చేస్తూ, ఆ పొరలకు ఒక రూపం ఇస్తూ ఉంటాయి.

అయితే భూమిలో కప్పబడే పురానిర్మాణాలకు; పురాణ ఇతిహాసాలకు ఒక మౌలికమైన తేడా ఉంది. పురానిర్మాణాలు లేదా వస్తువులపై మన ప్రయత్నం లేకుండానే పొరలు ఏర్పడుతుంటాయి. పురాణ ఇతిహాసాలు మనిషి బుద్ధికీ, ఊహాశక్తికీ చెందినవి. కనుక వాటి పొరలకు రూపమివ్వడంలో మనిషి ప్రయత్నం ఉంటుంది. అతని ఇష్టాయిష్టాలు పనిచేస్తాయి. పురాణ ఇతిహాసాలు మనిషి విశ్వాసంలో లేదా మతంలో భాగమైనప్పుడు ఈ పొరలు మందంగా మారిపోతాయి. అప్పుడు పొరలు ఏర్పడడం అనే ప్రక్రియే ఆగిపోవచ్చు కూడా. ఏవైనా విశ్వాసంలో, మతంలో భాగమయ్యాయంటే, వాటితో కాలానికీ, సమాజానికీ ఉన్న ముడి తెగిపోతుంది. వాటికి ఒక స్వతంత్ర అస్తిత్వం ఏర్పడుతుంది. విశ్వాసమూ, మతమూ ఆమోదించిన మేరకే వాటి పొరల్లోకి తలదూర్చాలి తప్ప మన ఇష్టానుసారం తలదూర్చడానికి వీలులేదు. అడుగు పొరలనుంచి ఎంత దూరంగా వెడితే అంత క్షేమమన్న అప్రకటిత హెచ్చరిక అజ్ఞాతంగా ఉంటుంది. పొరల చుట్టూ మీద మౌనమనే ఉక్కుతెర వేలాడుతూ ఉంటుంది.

ఇప్పుడు మనం వ్యాసుని జన్మవృత్తాంతం చెప్పుకుని, ఈ పొరల సూత్రం దానికి ఏమైనా అన్వయిస్తోందేమో చూద్దాం.

***

Satyavati

తండ్రి దాశరాజు ఆదేశంతో మత్స్యగంధి యమునానదిలో పడవ నడుపుతుండగా, ఒక రోజున…

వశిష్టుని మనవడు, శక్తి కొడుకు అయిన పరాశరుడు అనే ముని ఆమెను చూశాడు. అప్పుడతను తీర్థయాత్రకు వెడుతున్నాడు. అతను మద మాత్సర్యాలు లేని సాధుస్వభావి. అతన్ని ముల్లోకాలూ పొగడుతుంటాయి. అతను గొప్ప బుద్ధి కలిగినవాడు, తపస్సపన్నుడు. వ్రతనిష్ఠ కలిగినవాడు.

ఏకవస్త్రంతో ఒంటరిగా ఉండి పడవ ఎక్కేవారికోసం ఎదురుచూస్తున్న మత్స్యగంధిని చూడగానే అతనికి ఆమెపై వాంఛ కలిగింది. తన దివ్యజ్ఞానంతో ఆమె ఎవరో తెలుసుకున్నాడు. పడవ ఎక్కాడు. పడవ ప్రయాణిస్తోంది. పరాశరుడు మత్స్యగంధినే చూస్తున్నాడు. ఆమెవి ఎంత అందమైన కళ్లో అనుకున్నాడు. ఆమె చనుదోయిని గిల్లాలని అతనికి అనిపిస్తోంది. ఆమె సన్నటి నడుము అతని మనసులో నిలిచిపోయింది. ఆమె కటి ప్రదేశాన్ని తదేకంగా చూస్తున్నాడు. ఆమె మీద తనకు కోరిక కలిగిందని సూచించే మాటలు ప్రారంభించాడు. ఆమె ఎలాంటి సమాధానం ఇస్తుందో తెలుసుకోవాలని ఉవ్విళ్లూరాడు. తన మాటలకు సిగ్గుపడుతున్న ఆ కన్య మీద పడి సిగ్గును పోగొట్టడానికి ప్రయత్నించాడు.

ఎంత శాంతులైనా, ఎంత వాంఛను జయించినవారైనా ఆడది ఒంటరిగా కనిపిస్తే వాళ్ళ మనస్సు చెదురుతుంది. మన్మధుడి శక్తిని ఓర్చుకోవడం ఎవరి తరం?!

ఈవిధంగా సిగ్గు విడిచేసి పరాశరుడు తన కోరిక వెల్లడించేసరికి ఆ కన్య సందిగ్ధంలో పడింది. తను ఒప్పుకోకపోతే శాపమిస్తాడేమోనని భయపడింది…

‘నేను జాలరిదాన్ని. నా ఒళ్ళంతా చేపల కంపు కొడుతూ ఉంటుంది. అదీగాక నేను కన్యను. నా కన్యాత్వం అంతరిస్తే నా తండ్రి గడప ఎలా తొక్కగలను? కనుక దోషం అంటకుండా అనుగ్రహించు’ అంది.

మత్స్యగంధి మాటలకు పరాశరుడు సంతోషించాడు. ‘నా కోరిక తీర్చడంవల్ల నీ కన్యాత్వం చెడదు’ అని వర మిచ్చాడు. ‘నువ్వు వసురాజు వీర్యం వల్ల జన్మించినదానివి తప్ప, శూద్రకులంలో పుట్టినదానివి కావు’ అంటూ ఆమె పుట్టుక గురించి చెప్పాడు. చేపల కంపు పోయి ఆమె శరీరమంతా సుగంధాన్ని తెచ్చుకునేలానూ, యోజనం దూరంలో ఉన్నవారికి కూడా ఆ సుగంధం తెలిసేలానూ అనుగ్రహించాడు. ఆ తర్వాత ఆమె ఒంటి మీద దివ్యమైన వస్త్రాలు, ఆభరణాలూ వచ్చేలా చేశాడు. మత్స్యగంధి పడవను ఒక ద్వీపానికి చేర్చింది.

అయినా ఒక శంక ఆమెను పీడిస్తూనే ఉంది.

‘అందరూ చూసేలా ఇలా బట్ట బయలు మనం ఎలా కలుస్తాం?’ అంది. అప్పుడు పరాశరుడు తాము ఎవరి కంటా పడకుండా మంచు చీకట్లు కల్పించాడు.

ఉత్తమగుణాలే ఆభరణాలుగా, ఎలాంటి దోషమూ లేని మనోహరరూపంతో ఉన్న సత్యవతికి బ్రహ్మతో సమానుడైన పరాశరమహర్షి వల్ల అప్పటికప్పుడు, సూర్యుని తలపించేలా వేదమయుడు, ఆదిముని, పుట్టుజ్ఞాని అయిన వేదవ్యాసుడు జన్మించాడు.

పరాశరుడు సత్యవతికి కోరిన వరాలు ఇచ్చి తన దారిన తాను వెళ్లిపోయాడు. అప్పుడు కృష్ణద్వైపాయనుడైన వ్యాసుడు జింకచర్మాన్ని ధరించి, ఎర్రని జడలతో, దండకమండలాలతో తల్లి ముందర నిలిచి, ఆమెకు మొక్కి,‘మీకు నాతో పని కలిగితే నన్ను తలచుకోండి, వెంటనే వస్తాను’ అని చెప్పి తపోవనానికి వెళ్లిపోయాడు. మహాభయంకరమైన తపస్సు చేసి వేదాలను విభాగం చేసి, ఆ తర్వాత విశ్వశ్రేయస్సుకోసం పంచమవేదమైన ఈ భారతసంహితను చేశాడు.

***

ఈ కథను నేను ఇంతకుముందు ఒకసారి చదివాను. అది, 2012, డిసెంబర్ 16 కు ముందు! ఇప్పుడు 2014, ఏప్రిల్ లో ఈ వ్యాసంకోసం మరోసారి చదివాను. నిజం చెప్పాలంటే, ఈసారి ఈ కథ చదివిన తర్వాత నేను మరింత ‘డిస్టర్బ్’ అయ్యాను. దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఏ స్థాయిలో నంటే, ఈ వ్యాసాలకు నేను నిర్దేశించుకున్న పరిమితులనుంచి కొంచెం పక్కకు జరిగినట్టు అనిపించినా సరే, ఈ కథ నాలో కలిగించిన అలజడిని దాచుకోలేనంతగా!

2012, డిసెంబర్ 16 అని నేను ప్రత్యేకంగా ఒక తేదీని ఎందుకు ఇచ్చానో ఈపాటికి మీరు గ్రహించే ఉంటారు. ఆ రోజున ఢిల్లీలో ‘నిర్భయ’గా అందరూ చెప్పుకుంటున్న ఒక అమ్మాయిని అత్యంత పైశాచికంగా చెరచి, హత్యచేసిన ఘటన జరిగింది. ఈ దేశంలో స్త్రీలపై లైంగిక అత్యాచారాలు ఎంతో కాలంగా జరుగుతున్నాయి. వాటిలో చాలా కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తూ పత్రికలలో లోపలి పేజీ వార్తలు మాత్రమే అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్భయ ఘటనపై వెల్లువెత్తిన జనాగ్రహమూ, అనంతర చర్యలూ మానభంగాల చరిత్రను, కనీసం భావనలోనైనా కొత్త మలుపుతిప్పాయి.

నిర్భయ ఘటన జరిగిన తర్వాత కూడా దేశంలో మానభంగాలూ, హత్యలూ జరుగుతూనే ఉన్నాయి. అయితే, మానభంగాలపై ఇంతకు ముందు లేనంత ఎక్కువగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. మానభంగాలకు ఇప్పుడు పెద్ద శిక్ష పడుతుందన్న ఒక భావన అయితే ఏర్పడింది. మానభంగాలపై సమాజం స్పందనలో తీవ్రత పెరిగింది.

2009-09-30stolensistersupdatereport

అంతేనా? లైంగిక వేధింపులను, అత్యాచార ఘటనలను సాధారణంగా కప్పిపుచ్చడమే పరిపాటిగా ఉన్న సమాజంలో కొందరైనా ధైర్యం చేసి గతంలో లేదా వర్తమానంలో తమపై జరిగిన లైంగిక అత్యాచారాల గురించి చెప్పుకునే(పేరు బయటపెట్టకూడదన్న పరిమితికి లోబడి) అవకాశం కలిగింది. చివరికి లైంగిక వేధింపుల లేదా అత్యాచార నిందితులన్న ముద్రతో న్యాయమూర్తులను, పత్రికా సంపాదకులను కూడా బోనులో నిలబెట్టడం ఈ సరికొత్త స్పృహకు పరాకాష్ట. జస్టిస్ స్వతంత్ర కుమార్, జస్టిస్ ఎ. కె. గంగూలీ,‘తెహల్కా’ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ ఉదంతాలు ఈ క్రమంలోనే ముందుకొచ్చాయి. జస్టిస్ ఎ. కె. గంగూలీ తన పదవులను కోల్పోగా, తరుణ్ తేజ్ పాల్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.

***

 

ఇప్పుడు పరాశరుడు-మత్స్యగంధి ఉదంతాన్ని చూడండి. పరాశరుడు వశిష్టు డంతటి మహర్షికి మనవడు, వ్యాసునంతటి మహర్షికి తండ్రి అనే వివరాన్ని కాసేపు పక్కన పెడదాం…కాసేపే!…

పైన చెప్పిన న్యాయమూర్తులు, సంపాదకుని ప్రతిబింబం పరాశరునిలో అచ్చుగుద్దినట్టు కనిపించడం లేదా?!.

ఒక నిర్జన ప్రదేశంలో, ఒంటరిగా అతనికి మత్స్యగంధి కనిపించింది. ఆమెపై అతనికి కలిగిన లైంగిక వాంఛ ఎన్ని రూపాలలో బయటపడాలో అన్ని రూపాలలోనూ బయటపడింది. ఉదాహరణకు, ఆమె కళ్ల దగ్గరనుంచి జఘనప్రదేశంవరకూ కాముకత్వం ఉట్టిపడే చూపులతో అతను తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. అది నేత్రపరమైన లైంగిక అత్యాచారం. ఆమె చనుదోయిని గిల్లాలనుకున్నాడు. అంటే, అతని కాముకత్వం క్రియారూపాన్ని ధరించడానికి సిద్ధంగా ఉందన్న మాట. ఆ తర్వాత నిస్సిగ్గుగా తన కోరికను వెల్లడించాడు. అది వాచికమైన లైంగిక అత్యాచారం. అంతేనా, సిగ్గుపడుతున్న ఆమె మీదపడి సిగ్గుపోగొట్టేందుకు ప్రయత్నించాడు. ఇది కాయికమైన(శారీరకమైన) లైంగిక అత్యాచారం. స్త్రీపై జరిగే అత్యాచారంలో అది ఆఖరి మెట్టు.

పోనీ ఇది పరస్పరాంగీకారం ఉన్న లైంగిక సంబంధమా, కాదు. కాదంటే శపిస్తాడేమోనన్న భయంతోనే మత్స్యగంధి అతని కోరిక తీర్చడానికి అంగీకరించింది. న్యాయమూర్తులు తమ వద్ద శిక్షణలో ఉన్న న్యాయవాద యువతులతో లైంగికంగా చొరవ తీసుకున్నారన్న ఆరోపణను; సంపాదకుడు తన సంస్థలో పనిచేస్తున్న ఒక జర్నలిస్టుపై అత్యాచారం జరిపాడన్న ఆరోపణను గమనించండి…అక్కడ జరిగింది కూడా; తమ అధికారాన్ని, లేదా తమతో ఆ యువతులకు ఉన్న అవసరాన్ని అడ్డుపెట్టుకుని వారిని భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నమే. పరాశర-మత్స్యగంధుల ఉదంతం ఈ విషయంలో కూడా పై ఉదంతాలతో అతికినట్టు సరిపోతోంది.

***

మన పురాణ, ఇతిహాస కథలను ఎలా అర్థం చేసుకోవాలనే విషయంలో సాధారణంగా సంప్రదాయ పండితులనుంచి ఒక వాదం వినిపిస్తూ ఉంటుంది. వాటిలో పైకి కనిపించే అర్థం వేరు, అంతరార్థం వేరు అన్నదే ఆ వాదం. అంతరార్థం తెలుసు కోవడం కూడా అందరికీ సాధ్యం కాదు. అందులో తగినంత శిక్షణ ఉండాలి. పరిశ్రమ ఉండాలి. అది కూడా గురుముఖతా జరగాలి. ఆ తర్వాత కూడా అనుమానాలు మిగిలిపోవచ్చు. అప్పుడు గురువాక్యాన్ని, లేదా వేదాన్ని ప్రమాణంగా తీసుకుని అనుమానాలకు అడ్డుకట్ట వేసేయాలి.

ఇప్పుడు పరాశర-మత్స్యగంధుల ఉదంతానికి కూడా ఇదే సూత్రాన్ని అన్వయించే ప్రయత్నం ఎవరైనా చేస్తారేమో తెలియదు. అందులోని ఔచిత్య, అనౌచిత్యాలను ప్రశ్నించే ఆసక్తి కూడా నాకిప్పుడు లేదు. ఒకవేళ ఎవరైనా ఆ ప్రయత్నం చేస్తే, నా ప్రశ్న ఒకటే: పురాణ ఇతిహాసాలు అందరికీ అందుబాటులో ఉండే ప్రజాక్షేత్రంలో ఈనాడు ఉన్నాయి. ఆ అందరిలో అన్ని వర్గాలవారూ, అన్ని వయసులవారూ ఉంటారు. వారందరికీ అంతరార్థాలు బోధపరచుకునే శిక్షణ ఉండకపోవచ్చు. లేదా అటువంటి అంతరార్థాల సిద్ధాంతాన్ని వాళ్ళందరూ ఒప్పుకోకపోవచ్చు. అటువంటి వారికి పరాశర-మత్స్యగంధుల ఉదంతం ఉన్నది ఉన్నట్టుగా ఇస్తున్న సందేశం ఏమిటి?

పోనీ దీని వెనుక ఏవో అంతరార్థాలు ఉంటాయని మనం మాటవరసకు ఒప్పుకున్నా, నేను పరిశీలించిన టీటీడీ వారి మహాభారత ప్రచురణలో వ్యాఖ్యాతలు ఈ ఉదంతం వెనుక ఏవో అంతరార్థాలు ఉన్నట్టు చెప్పలేదు. అందులోకి వెళ్ళేముందు, మొదటగా పేర్కొన్న పొరల సూత్రం ఈ ఉదంతానికి ఇలా అన్వయించుకుందాం:

పొర: 1

కథకు అట్టడుగున ఉన్న పొర ఇది. ఈ పొరలో జరిగింది ఒకటే. పరాశరుడు అనే పురుషుడికీ, మత్స్యగంధి అనే స్త్రీకీ లైంగిక సంబంధం ఏర్పడింది. వారికి వ్యాసుడు అనే కొడుకు పుట్టాడు. వారిద్దరి సామాజిక నేపథ్యం ఏదైనా కావచ్చు. అది పరస్పరాంగీకారం ఉన్న లైంగిక సంబంధం కావచ్చు, కాకపోవచ్చు. భిన్న సామాజిక నేపథ్యం ఉన్న స్త్రీపురుషుల మధ్య లైంగిక సంబంధం అప్పుడు సహజం కావచ్చు, కాకపోవచ్చును కూడా. అది స్త్రీ-పురుషుల మధ్య సమాన ప్రతిపత్తి గల లైంగిక సంబంధం కావచ్చు; లేదా పురుషుడిది పై చేయి, స్త్రీది కింది చేయిగా ఉన్న అసమ లైంగిక సంబంధం కావచ్చు. ఈ ఘట్టంలో, అది కావచ్చా, ఇది కావచ్చా అనే చర్చలోకే అసలు వెళ్లకుండా ఒక పురుషుడికీ, ఒక స్త్రీకీ మధ్య ఏర్పడిన లైంగిక సంబంధంగానే దీనిని చెప్పుకుందాం. అంటే దీనికి ఎటువంటి సామాజిక, కాలిక, విలువల కోణాన్నీ ఆపాదించకుండానన్న మాట. ఇలా చూసినప్పుడు పరాశరుడికి ఒక న్యాయం జరిగే అవకాశముంది. ఎలాగంటే, తన కులాన్ని, తనకు ఉన్నట్టు తోపించే శాపానుగ్రహశక్తినీ అడ్డుపెట్టుకుని మత్స్యగంధిని అతను భయపెట్టి లొంగదీసుకుని ఉండకపోవచ్చన్న సంశయలాభా(benefitofdoubt)న్ని అతనికి ఆపాదించవచ్చు.

పొర: 2

పొర: 2 దగ్గరికి వచ్చేసరికి కాలం మారింది. సమాజమూ, దాని తాలూకు విలువలూ కూడా మారాయి. అందుకు తగినట్టు మహాభారత కథ చెప్పే కథకుడూ మారాడు. అతని వ్యూహాలు, ప్రాధాన్యాలూ మారాయి. అంటే ఏమిటన్న మాట, మొదటి పొరలోని పరాశరుని, మత్స్యగంధినే తీసుకుని తన వ్యూహ, ప్రాధాన్యాలకు అనుగుణంగా వారిని మలచుకుంటున్నాడన్న మాట. ఆ విధంగా చూసినప్పుడు, దృష్టిపరంగా, వాచికంగా, కాయకంగా పరాశరునిలో చిత్రించిన లైంగిక అత్యాచార ప్రవృత్తి వాస్తవంగా అతనిది కాకపోవచ్చు, కథకుడు ఆపాదించినది కావచ్చు.

ఇక్కడ కథకుడు అన్నప్పుడు వ్యాసునో, నన్నయనో దృష్టిలో పెట్టుకుని అనడంలేదు. వందల సంవత్సరాలపాటు మౌఖిక రూపంలో ఉన్న కథకు ఎందరో కథకులు ఉంటారు. కనుక ఒక కథకుని నిర్దిష్టంగా గుర్తించడం కష్టం.

కథకుడు అలా ఎందుకు ఆపాదించాడన్న ప్రశ్న వేసుకుంటే, అతడు ఏ సామాజిక నేపథ్యం నుంచి ఆ కథ చెబుతున్నాడో ఆ సామాజిక నేపథ్యం అందుకు కారణమన్న సమాధానం వస్తుంది. మొదటి పొరలోని పరాశరుడు వాస్తవంగా ఎలాంటి వాడో, అతనికీ మత్స్యగంధికీ ఏర్పడిన లైంగిక సంబంధం ఎలాంటిదో మనకు స్పష్టంగా తెలియదు. కానీ రెండవ పొర దగ్గరికి వచ్చేసరికి పరాశరుడు ఒక బ్రాహ్మణుడు గానూ, అందులోనూ శాపనుగ్రహశక్తి గల మహర్షిగానూ రూపుగడుతున్నాడు. మరోవైపు మత్స్యగంధి చేపల కంపు కొట్టే ఒక జాలరి యువతి, జానపదస్త్రీ, బ్రాహ్మణుల దగ్గర, ఋషుల దగ్గర ఏవో మహిమలు ఉంటాయనీ, వారిని కాదంటే శపిస్తారని మాత్రమే ఆమె వింది. దాంతో పరాశరుని కోరికకు ఆమె లొంగిపోయింది. ఈ పొర దగ్గరికి వచ్చేసరికి ఇది ఈ విధంగా ఒక అసమ లైంగిక సంబంధమన్న స్పష్టత వచ్చింది.

పరాశరుని పాత్ర చిత్రణలోని వైరుధ్యం చూడండి: అతను మదమాత్సర్యాలు లేని సాధుస్వభావి, శాంతుడు. ముల్లోకాలలోనూ పొగడ్తలు అందుకునే వాడు, గొప్ప బుద్ధి కలిగినవాడు, వ్రతనిష్ఠ కలిగినవాడు, తపస్సంపన్నుడు. తను తలచుకుంటే అప్పటికప్పుడు మంచు చీకట్లు సృష్టించగలిగినవాడు. మత్స్యగంధి ఒంటికి ఉన్న చేపల కంపు పోగొట్టి యోజన దూరం వ్యాపించగల సుగంధాన్ని ఇవ్వగలిగినవాడు. ఆమె ఒంటి మీద దివ్యవస్త్రాలను, ఆభరణాలను తెప్పించగలిగినవాడు. పైగా అతను మత్స్యగంధిని ఎప్పుడు చూశాడు? తీర్థయాత్రకు వెడుతున్నప్పుడు!

ఇలా పరాశరుని శిఖరం మీద నిలబెట్టిన కథకుడే, మత్స్యగంధిని చూడగానే, నేటి భాషలో చెప్పుకునే ‘అత్యాచారా’న్ని తలపించేలా అతి కాముకత్వపు చీకటి లోయలోకి జారిపోయిన వాడిగా చూపిస్తాడు. పైగా ఎంత శాంతులైనా, ఎంత జితేంద్రియులైనా ఒంటరిగా ఆడది కనబడగానే చిత్త చాంచల్యానికి గురవుతారనీ, మన్మథుడి శక్తిని ఓర్చుకోవడం ఎవరి తరమనీ అంటాడు. ఈ మాటలోనే ఎంత వైరుధ్యమో చూడండి…ఒంటరి ఆడది కనబడగానే మనసు చెదిరేవారు కూడా ‘జితేంద్రియులు’ ఎలా అవుతారో తెలియదు.

తను ఎంత వైరుధ్యవంతంగా మాట్లాడినా చెల్లిపోతుందనీ, తన మాట ఎవరూ ప్రశ్నించడానికి వీలులేని శిలాక్షరమనే ఒక ఆధిపత్య ధోరణి కథకునిలో వ్యక్తమవుతోందా? లేక పరాశరునిలోని చీకటి, వెలుగుల కోణాలను రెండింటినీ ప్రదర్శించే సమబుద్ధిని చాటుతున్నాడా? రెండింటికీ కూడా అవకాశముంది. రెండింటికీ సంబంధం కూడా ఉండచ్చు.

మిగతా వచ్చే వారం….

-కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

 

 

 

 

ఆలోచించేలా రాయగలిగితే చాలు : సోమశంకర్

2 (1)

మార్చి నెల వచ్చిన కథలని అన్ని రకాలుగా పరిశీలించిన తరువాత ప్రయోజనకరమైన కథాంశంతో, వస్తువు-శిల్పం-కథనాల మధ్య మంచి సమతుల్యతతో నడిచిన “ముసుగు వేయద్దు మనసు మీద” (కినిగె పత్రిక) కథను ఉత్తమ కథగా నిర్ణయించాము. ఆ కథారచయిత కొల్లూరి సోమశంకర్ గారితో ముఖాముఖీ ఈ వారం –

 

  • సోమశంకర్ గారూ! మార్చ్ నెలలో వచ్చిన అన్ని కథల పోటీనీ తట్టుకొని మీ కథ ‘ముసుగు వేయొద్దు మనసు మీద’ ఉత్తమ కథగా నిలబడ్డందుకు ముందుగా మా బృందం తరఫున అభినందనలు!

ధన్యవాదాలండీ.

  • మీ రచనా వ్యాసంగం గురించి కొంచెం వివరిస్తారా?

1998లో ఓ చిన్న వ్యాసాన్ని అనువదించడంతో ప్రారంభమైంది. కాకపోతే ఆ పత్రిక వారు అనువాదానికి అనుమతి నిరాకరిండంతో ఆ వ్యాసం తెలుగు వెర్షన్ వెలుగు చూడలేదు. చదివించేలా నేను రాయగలననే నమ్మకం కలిగించిందా అనువాదం.

ఆ తరువాత, “The Adventures of Pinocchio” అనే పిల్లల నవల చదవడం తటస్థించింది. ఆ ఇతివృత్తం, పాత్రల ప్రవర్తన ద్వారా పిల్లలకి మంచి చెప్పడానికి ప్రయత్నించడం నాకు బాగా నచ్చాయి. 1999 నాటికే ఆ పుస్తక అనువాదం పూర్తి చేసినా, 2012 జనవరికి కానీ ముద్రణకి నోచుకోలేదు. “కొంటెబొమ్మ సాహసాలు” పేరిట పీకాక్ క్లాసిక్స్ వారి అనుబంధ సంస్థ పీచిక్స్ ప్రచురించింది.

అనువాదాల కన్నా ముందుగా, Indian Express దిన పత్రిక లోని Career Express అనే పేజిలో “జనరల్ అవేర్‌నెస్” అనే శీర్షిక,ఆంధ్రజ్యోతి దిన పత్రిక యొక్క కెరీర్ గైడ్ పేజిలో “కరెంట్ అఫైర్స్” అనే శీర్షిక నిర్వహించాను. ఆంధ్రభూమి సాధన అనుబంధంలో “Arithmetic” అనే శీర్షికలో పోటీ పరీక్షల లెక్కలు సులువుగా ఎలా చేయవచ్చో తెలిపాను. తరువాత అదే అనుబంధంలో “అంతర్జాతీయ అంశాలు” అనే శీర్షిక నిర్వహించాను. ఇదే సమయంలో, బాలజ్యోతిలో పిల్లల కథలు రాసే అవకాశం వచ్చింది. 2000 సంవత్సరంలో బాలజ్యోతికి 9, ఆంధ్రభూమి వారపత్రికకి 2 పిల్లల కథలు రాసాను.

బాలజ్యోతి సంపాదకుల సూచన మేరకు, వివిధ మాసపత్రిక/వారపత్రికలకు కథలు వ్రాయడం మొదలుపెట్టాను. ఆగష్టు 2001 ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురితమైన “రూపాయల పుస్తకం” అనేది నా మొదటి కథ. 9 నవంబర్ 2002 నాటి ఆంధ్రప్రభ వారపత్రికలో “విశ్వకదంబం” శీర్షికన నా మొదటి అనువాద కథ “బాకీ” ప్రచురితమైంది.

నేను రాసిన “అతడు-ఆమె-ఇంటర్‌నెట్” అనే కథని “లడ్‌కా-లడ్‌కీ-ఇంటర్‌నెట్” అనే పేరుతో నేనే హిందీలోకి అనువదించాను. అలాగే, నేను ఆంగ్లం నుంచి అనువదించిన “బొమ్మ” అనే కథని హిందీలో “టెడీబేర్” అనే పేరుతో అనువదించాను. శ్రీ కె.వి. నరేందర్ రాసిన “చీపురు” కథను “ఝాడూ” పేరిట;శ్రీ మాన్యం రమేష్‌కుమార్ రాసిన “శబ్దం” కథని “శబ్ద్” పేరిట హిందీలోకి అనువదించాను.

నేను రాసిన “పాపులర్ సుబ్బారావ్” అనే కథ అదే పేరుతో కన్నడంలోకి అనువాదమైంది. నేను అనువదించిన “బొమ్మ” కథని తెలుగు అనువాదం ఆధారంగా, కన్నడంలోకి అనువదించారు శ్రీ. కె. కృష్ణమూర్తి.

ఇక ఎమెస్కో బుక్స్ కోసం 5 పుస్తకాలను అనువదించగా, “ఆనందం మీ సొంతం” అనే పుస్తకం ప్రచురితమైంది. మిగిలినవి వివిధ దశలలో ఉన్నాయి. ఇవి కాక, పూనెకి చెందిన డా. అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ “One Life to Ride” ను తెలుగులోకి అనువదించాను. ఇది ప్రస్తుతం ప్రీ-ప్రెస్ దశలో ఉంది. యు.కె.లో స్థిరపడిన వినయ్ జల్లా రాసిన ఆంగ్ల నవల “Warp and Weft” అనువాదం ఈ మధ్యే పూర్తి చేసాను.

ఇవి కాక పలు సంస్థల కోసం రకరకాల డాక్యుమెంట్లను తెలుగులోకి అనువదిస్తున్నాను.

SomaSankar2014

  • మీరు అభిమానించే తెలుగు రచయితలు..?

కొకు, కారా, రావి శాస్త్రి, అబ్బూరి ఛాయదేవి, డి. కామేశ్వరి, మల్లాది, యండమూరి, శ్రీ రమణ, సలీం, కె.వి. నరేందర్, వాలి హిరణ్మయి దేవి మొదలైన వారు.

  • ఇక “ముసుగు వేయద్దు మనసు మీద” కథ గురించి మాట్లాడుకుందాం. ఈ కథ రాయడం వెనకాల ఉన్న నేపధ్యాన్ని వివరిస్తారా? ఈ కథాంశం ఆధారంగా మీకు కథ రాయాలనే ఊహ ఎలా వచ్చింది?

ఈ కథ చెప్పే కథకుడు నాకు పరిచయం. ఆయన నాకన్నా కనీసం ఏడెనిమిదేళ్ళు పెద్ద. ఓ కన్సల్టింగ్ సంస్థలో అడ్మిన్ అసిస్టెంట్/స్టెనోగ్రాఫర్‌గా పనిచేసేవారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం కలకత్తాలో ఉండేది. హైదరాబాద్‌తో పాటు కొన్ని ప్రముఖ నగరాలలో బ్రాంచి ఆఫీసులు ఉండేవి. కొంత కాలం తర్వాత అనుకున్న ఆదాయం రాకపోవడంతో ఆఫీసు ఖర్చులను తగ్గించుకునే నిమిత్తం, కొన్ని బ్రాంచిలను మూసేయ్యాలని యాజమాన్యం నిర్ణయించుకుంది. దశలవారీగా బ్రాంచీలను తొలగిస్తూ వచ్చింది. హైదరాబాద్ బ్రాంచిని ఎప్పుడు మూసేస్తారో తెలియక, ఈయన చాలా కంగారు పడేవాడు. ఎప్పుడూ దిగులుగా, నిరుత్సాహంగా ఉండేవాడు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా, ఉన్నదాన్నే ఎలాగొలా నిలుపుకోవాలని చూసేవాడు. అతని వ్యక్తిగత సమస్యలు నాకు పూర్తిగా తెలియకపోయినా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నయని మాత్రం తెలుసు. అతని భయాలు, సందేహాలు, బెంగ చాలా కాలం పాటు నాకు బాగా గుర్తుండిపోయాయి. ఆ ఆఫీసు మూసేసారని తెలిసింది, ఆయన ఏమయ్యారో మాత్రం తెలియలేదు. ఉద్యోగ నిమిత్తం నేను కొన్నాళ్ళపాటు హైదరాబాదుకి దూరంగా ఉండడంతో నాకు ఆయన సమాచారం తెలియలేదు. తర్వాత ఈ మధ్య ఇవే లక్షణాలు మా మిత్రుడి అన్నయ్యలో చూసాను. ఆయనదీ స్థిరమైన ఉద్యోగం కాదు. సంసార బాధ్యతలు ఎక్కువ. చేసే ఉద్యోగం నచ్చదు, మనసు పెట్టి పనిచేయలేడు. సో, ఎప్పుడూ డల్‌గా, frustrated stateలో ఉంటూంటాడు.

ఇక కథలోని వీరేశం పాత్రధారిని నేను ఓ బర్త్‌డే పార్టీలో చూసాను. ఆయన ముసలాయనే, కానీ బాగానే ఎగిరాడు. నేను అతనికి లిఫ్ట్ ఇచ్చాను. కథలో జరిగినంత సంభాషణ మా మధ్య జరగలేదు కానీ, టూకీగా ఆయన స్వభావం అదేనని గ్రహించాను.

ఓ రోజు మధ్యాహ్నం సికింద్రాబాద్ పాట్నీ సెంటర్ దగ్గర ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాను. అక్కడున్న బట్టల కొట్ల వద్ద సింహం డ్రెస్ వేసుకుని జనాలని పిలుస్తున్న ఓ వ్యక్తి, ఒక్కసారిగా తల మీద ముసుగు బయటకి తీసి ఆ వేషం వేసుకోవాల్సి వచ్చినందుకు తనని తాను తిట్టుకుంటూ, తన పేదరికాన్ని, కొట్టు యజమానుల్ని దూషించాడు. చాల స్వల్ప సమయంలో జరిగిన ఘటన, కానీ నా మనసులో ముద్ర పడిపోయింది.

మనలో చాలామంది ఆనందంగా ఉండాలనుకుంటాం, కానీ ఉండలేం. ఆనందం/సంతోషం ఎక్కడో బయటి నుంచి రావాలని అనుకుంటూ, ఎప్పుడో వస్తుందని ఊహిస్తూ, ప్రస్తుతం నిరాశలో నిస్పృహల్లో బతుకుతాం. కానీ ఈ మూడు ఘటనలని మేళవిస్తే, ఈ కథకి నేపథ్యం అయింది!

MVMM

  • కేవలం మీరు చూసిన ఒక ఘటన వల్లే కథ ఏర్పడిందా లేక ఇలాంటి వ్యక్తుల్ని మీరు కలిసి, వాళ్ళ వృత్తిపరమైన సాధకబాధకాలు తెలుసుకున్నారా?

ఒకాయన్ని కలిసాను. కాస్త సంభాషణ జరిగింది. ఆయన క్లుప్తంగా చెప్పిన కొన్ని వివరాలతో నేను వీరేశం పాత్రని సృష్టించుకున్నాను. అంతేకాని, కథ రాద్దామనే ఉద్దేశంతో ఆయనతో సంభాషించలేదు. ఆయనని కలిసినప్పుడు కథ రాయాలన్న ఉద్దేశమే లేదు. తర్వాత ఎప్పుడో తట్టిన ఆలోచన ఈ కథ.

ఆ పాత్రకి ఎదురైన కొన్ని సంఘటనలు మా ఆఫీసు అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేసి తరచూ మానేసే వ్యక్తులకి ఎదురైనవే. ఇంకా కొందరు వ్యక్తులకి ఎదురైన చిన్న చిన్న ఘటనలను ఈ కథలో ఒకే పాత్రకి ఎదురైనట్లుగా చూపాను.

  • మీ కథలో ప్రస్పుటంగా కనిపించిన మంచి లక్షణం క్లుప్తత. ఇది అంత తేలికైన విషయం కాదు. ఇది రావాలంటే కథని చాలా సార్లు ఎడిట్ అయినా చేసుకోవాలి, లేదా కథని రాసే ముందే కథ తాలూకు సంపూర్ణ స్వరూపం రచయిత మనసులో రూపు దిద్దుకోవాలి. ఈ రెండు విధానాల్లో మీరు ఏది ఆచరిస్తారు?

సాధారణంగా, ఒక ఇతివృత్తం/ఘటనని ఆధారం చేసుకుని కథ రాయాలని అనుకున్నప్పుడు మొదట కథా స్వరూపం అంతా, సంభాషణలతో సహా, మనసులోనే రూపొందుతుంది. నేను రాద్దామనుకున్న అంశానికి ఓ రూపు వచ్చింది అనుకున్నాకనే, అది కంప్యూటర్ తెర మీదకి వస్తుంది. మొదటినుంచి నాది ఇదే పద్ధతి. కథని టైప్ చేసుకున్నాక, అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులూ చేసుకుంటాను.

  • ఈ కథ రాయడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది?

నేను సొంత కథలు చాలా తక్కువగా రాస్తాను. అనువాదాలు చేసినంత వేగంగా సొంత కథలు రాయలేను.

అది నా బలహీనత. ఈ కథ మనసులోంచి కంప్యూటర్ స్క్రీన్ మీదకి రావడానికి సుమారు పది రోజులు పట్టింది. కానీ ఒకసారి టైప్ చేసాక, రెండే మార్పులు చేసాను.

  • కొంత అనిశ్చితితోనూ, దాన్నుంచి ఉద్భవించే అశాంతితోనూ జీవించే మనుషుల మనసులని మీ కథ తాకడం, ఒక కొత్త ఉత్తేజాన్ని వాళ్ళలో నింపడం అనే ప్రయోజనాన్ని మీ కథ సాధించినట్టు మా బృందం అనుకోవడం జరిగింది. కథ అనేది ఒక కొత్త ఆలోచననో, కొత్త ఉత్తేజాన్నో, కొత్త స్ఫూర్తినో ఇవ్వాలని మీరు భావిస్తారా? లేక, కేవలం ఒక తాత్కాలికమైన అనుభూతినో అనుభవాన్నో కలగజేసే కథలని కూడా మీరు సమర్ధిస్తారా?

ప్రతి కథకీ వ్యక్తంగానో, అవ్యక్తంగానో ఓ లక్ష్యం ఉంటుంది, ఉద్దేశిత పాఠకులు ఉంటారు. కొన్ని కథలు వినోదాన్ని, హాస్యాన్ని పంచితే, మరికొన్ని ఆలోచనల్ని రేకిత్తించి, ఉత్తేజితులని చేస్తాయి. కొన్ని కథలు గతంలో జరిగిన దారుణాలను గుర్తు చేస్తే, మరికొన్ని సమాజిక సమస్యలని ప్రస్తావిస్తాయి. మీరన్నట్లుగా కొన్ని కథలు అనుభూతిని, అనుభవాన్ని కలిగిస్తాయి. అవీ అవసరమే. కొన్ని కాలక్షేపం కథలుంటాయి. దేని ప్రయోజనం దానిదే. సాహిత్యం నుంచి ప్రేరణ, స్ఫూర్తి పొందడం ఆయా పాఠకుల అభీష్టం. పుస్తకంలోని పేజీలను గబగబా తిప్పేయచ్చు, లేదా జీర్ణం చేసుకుని, తమకు అన్వయించుకుని ఆచరించనూవచ్చు. సమస్యలకి పరిష్కారం చెప్పడం రచయితల పని కాదు, సమస్యలని ఎదుర్కోడానికి, ప్రేరణనిచ్చి, ఆలోచన రేకిత్తంచగలిగితే చాలు! ఎందుకంటే కథాపరంగా రచయిత సూచించే పరిష్కార మార్గాలు నిజజీవితంలో వర్తించకపోవచ్చు… కానీ సమస్యలో ఉన్నవారికి కొత్తగా ఆలోచించడానికి అవకాశం మాత్రం తప్పకుండా కల్పిస్తాయని నా నమ్మకం.

  • మీరు రాసిన ఏదైనా ఒక కథని,‘మంచి కథ’ అనుకోవడానికి మీరు ఏ ఏ ప్రమాణాలు అవసరం అనుకుంటారు? లేదూ,‘మంచి కథ’ అంటే మీ దృష్టిలో ఏది?

2014 మార్చి నెల కథలను సమీక్షించే సందర్భంలో మీరే అన్నారు, మంచి కథని నిర్వచించడం కష్టమని.   నా దృష్టిలో నేను రాసే ప్రతీ కథా మంచికథే. ఉద్దేశపూర్వకంగా సమాజానికి చెడు చేయని రచన ఏదైనా మంచిదే. రాసేటప్పుడు ప్రతీ కథ మంచి కథ అనుకునే రాస్తాను. కాకపోతే, ప్రెజంటేషన్‌లో, ట్రీట్‌మెంట్‌లోనూ తేడాలు వస్తే అది పాఠకులకు నచ్చకపోవచ్చు. పాఠకులకు నచ్చిన కథలు విమర్శకులకి నచ్చకపోవచ్చు. కాబట్టి వాదప్రతివాదాలకు దూరంగా, రాయాలనుకున్నది రాసుకోడమే నా పద్ధతి. నేను రాసినవి కొందరికైనా నచ్చుతాయని నా నమ్మకం. నా మటుకు నాకు కథా వస్తువు బాగుండాలి, సన్నివేశాల కల్పన బాగుండాలి, సంభాషణలు బాగుండాలి. ఇవన్నీ కలిస్తే, అది తప్పకుండా మంచి కథే అవుతుందని నా అభిప్రాయం. పాఠకులని చదింవించేలా, చదివిన తర్వాత ఆలోచించేలా కథ రాయగలిగితే అది మంచి కథే అవుతుందని ఓ రచయితగా నా అనుభవం.

* అనువాదాలు చేయడం ఒక రచయితగా మీ మీద ఎలాంటి ప్రభావం చూపించింది? ఒక రచయితగా మీరు స్వతంత్రంగా నిలబడడానికి ఈ అనువాదాల అనుభవం ప్రతిబంధకమయిందా, లేక సహాయపడిందా?

అనువాదాలు చేయడం, ఓ రచయితగా నా మీద తీవ్రమైన ప్రభావాన్నే చూపింది. రచయితగా స్వతంత్ర్యంగా నిలబడానికి ఓ రకంగా ప్రతిబంధకమైంది, మరో రకంగా సాయపడింది. అనువాదాల కంటే సొంత కథ రాయడమే కష్టం నాకు. అనువాదాలలో ఇతివృత్తం, సన్నివేశాల కల్పన, సంభాషణలు ఇవన్నీ రెడీమేడ్‌గా ఉంటాయి. కథలోని మూడ్‌ని పట్టుకుని, కథకుడి టోన్‌ని పట్టుకుంటే చాలు. తెలుగులో చక్కని కథ సిద్ధమవుతుంది. భావం చెడగొట్టకుండా, కథని మన భాషలో చెబితే చాలు. ఆల్రెడీ, ఒక చోట ప్రూవ్ అయిన కథ కాబట్టి, ఇక్కడా క్లిక్ అయ్యే అవకాశం ఉంటుంది. సొంత కథల విషయంలో సంభారాలేవీ సిద్ధంగా ఉండవు, అన్నీ మనమే సమకూర్చుకోవాలి. పూర్తయ్యకా గాని, ఎలా ఉంటుందో తెలియదు. మధ్య మధ్యలో రుచి చూస్తూ, సవరించుకోవచ్చుగానీ, ఆలస్యం అయిపోతుంది. ఈ కారణం వల్లే నేను రాసిన సొంత కథల సంఖ్య, చేసిన అనువాదాల సంఖ్యలో సగం కూడా లేదు.

ఇక అనువాదాలు చేయడం వల్ల కల్గిన ఉపయోగాలు: కథని క్రిస్ప్‌గా చెప్పగలగడం; సంభాషణలను, క్లుప్తంగా, ఎఫెక్టివ్‌గా రాయగలగడం; కథనాన్ని కొత్త రీతిలో నడపడం వంటివి. అయినా రచయితగా/అనువాదకుడిగా నాది ఇంకా ఇవాల్వింగ్ స్టేజే, కథారచనలో నాకు పూర్తి నైపుణ్యం రాలేదని నా భావన. రాస్తూ వుంటే మెరుగవుతాము.

  • ఇప్పటి వరకు ఎన్ని కథలు రాశారు మీరు? మీ కథాసంపుటిని తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

ఇప్పటి వరకు 29 సొంత కథలు (పిల్లలు కథలు కాకుండా), 95 అనువాద కథలు రాసాను.

నా సొంత కథల సంకలనం “దేవుడికి సాయం” త్వరలోనే వెలువడుతుంది. ముందుగా ఈ-బుక్, వీలుని బట్టి ప్రింట్ బుక్!

నా అనువాద కథలతో 2006లో “మనీప్లాంట్” అనే పుస్తకాన్ని ప్రచురించాను. ఆ తర్వాత, “నాన్నా, తొందరగా వచ్చేయ్” అనే అనువాద కథల ఈ-బుక్‌ని, “వెదురు వంతెన” అనే అనువాద కథల మరో ఈ-బుక్‌ని ప్రచురించాను.

  • మరోసారి అభినందనలు అందజేస్తూ, మీరు ఇలాంటి మరిన్ని మంచి కథలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు, సోమశంకర్ గారూ!

నా కథను ఉత్తమ కథగా గుర్తించినందుకు, ఈ ఇంటర్వ్యూ రూపంలో, నా గురించి పాఠకులకు తెలుపుతున్నందుకు మీకు, సారంగ పత్రికకి మరో సారి ధన్యవాదాలు. నమస్కారం.

(కథ చిత్రం: గురుచైతన్య, కినిగె పత్రిక సౌజన్యం)

అధివాస్తవ విస్మృతి

అధివాస్తవ విస్మృతి

ఈ నిరామయ సాయంత్రాన

ఎవరిని గుర్తుకు తెచ్చుకొని

రోదించను?

ఎత్తైన ఈ రెండు పర్వతాల మద్య

లోయలో

గుబురుగా ఎదిగిన పొదలతో

నా ఒంటరి సమాధి కప్పివేయబడివుంది

మెల్లగా, భ్రమలాగా

మేఘాలు భూమిని రాసుకొని వెళుతున్నాయి

ఒక్క జ్ఞాపకమూ గుర్తులేదు

కన్నీరు కార్చేందుకు ఒక్క జ్ఞాపకమూ గుర్తులేదు

ఈ రోజెవరో నా అజ్ఞాత సమాధి మీద

రెండు పుష్పాలు ఉంచారు

రెండు కన్నీటి బొట్లూ రాల్చారు

ఆమె ఎవరో గుర్తులేదు

ఒక్క జ్ఞాపకమూ గుర్తులేదు

కన్నీరు కార్చేందుకు ఒక్క జ్ఞాపకమూ గుర్తు లేదు

-శ్రీరామ్

శ్రీరామ్

భయం వరం

ram

గోడల మీద డైనొసార్లు తిరుగుతున్నాయి

మహా సముద్రాలు పెరటి కొలనులయ్యాయి

గ్రహ గృహాల కిటికీలు తెరిస్తే

పక్క  గ్రహాల ఇళ్ల వాకిళ్ళలో

ఆకు పచ్చ ముగ్గుల్లా హరితారణ్యాలు కన్పిస్తున్నాయి

మధ్యలో మందార చిచ్చులా అగ్గి కనుమలు

ప్రతీ తారా విద్యుత్తు అమ్ముకుంటోంది

ప్రతీ గ్రహమూ రోదసీ ట్రాన్స్ ఫార్మర్ కు దగ్గరగా

తన విద్యుత్ స్తంభాల్ని నిలబెట్టుకుంటుంది

గ్రహాంతర దూరాల్ని

ఇరుగు పొరుగు ఇళ్ల మధ్య దూరంగా

ఈ స్టోన్ హౌస్ పేటలో

ఆవలీలగా దాటిపోతున్నారు

గ్రహులందరూ

ఆ గ్రహులు, ఈ గ్రహులు

అందరూ నిగ్రహులు, ఆజాను బాహూ విగ్రహులు

ఏనుగులు ఎలకలైన ఇళ్ళలో

బాత్ రూముల్లో

నాయాగారా జలపాతాలు ధారపోతున్నాయి

అంగారక వారి అప్పారావుకీ

భూమి వారి శ్యామలకీ

శని గ్రహం షామియానాలో పెళ్లి –

పాల పుంత పథం మీద అది వాహనాల బారా –

కాదది

కదులుతున్న ఎవరెస్టుల కిల్మంజారోల కాన్వాయీ

చక్రవాహన విశ్వ ఘోష

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, తాజ్ మహల్ లు

తెచ్చారు భూమి నుంచి

మగ పెళ్లి వారు అంగారక వారి ఇంటికి –

గడ్డ కట్టిన అంగారక బంగారు నది –

ఎక్కుపెట్టిన బాణపు మొన పై గుచ్చుకున్న తిమింగలం

తెచ్చారు భూమి వారి శ్యామలమ్మకు

అనంత పౌరుషాల అప్పారావు శక్తికి ధీటుగా

పాలపుంత  కొనలలో ఒక సూర్య చితి మండుతోంది

వేల సూర్యులు జీవన ప్రభాతం లో యవ్వన ప్రాదుర్భావులై

ఉదయిస్తున్నారు

లక్షల చంద్రులు ఆకాశ కర్మాగారాలలో

అసెంబ్లీ లైను మీద తయారై, ప్రతి షిఫ్టులో

గ్రహ గృహాల ఇళ్ల దీపాలవుతున్నారు

రెండు తాళ ప్రమాణాల చుట్ట కాలుస్తూ

చెప్తున్నాడు ప్రాక్సిమా సెంటారీ నుంచొచ్చిన పెదనాన్న

కోట్ల మైళ్ళ నుంచోచ్చిన వార్తను

సుదూరాల నక్షత్ర గుచ్ఛమొకటి కాలి బూడిదైపోయిందట

అక్కడినుంచి పుట్టిందట జీవం –

పాపం ఇప్పుడు జీవనికి పుట్టినిల్లు లేదు

గ్రహాలన్నీ ఎక్కే దిగే గుమ్మాలే

ఉబ్బిపోయిందట లోకం –

ఎందుకిలా అడిగాడొక బలహీనుడు

వాడు నిండా ఆరడుగులు లేడు

మన గ్రహ గృహాలలోని చీమ కన్నా చిన్న వాడు

ఎగేసి తన్నిందట ప్రకృతి ఒకసారి

ఏదో ఒక నాడు వాడి దేవుడి పుట్టినరోజున

అడవులు, ఆకాశ నైరూప్య నిశారణ్యాలు

పట్టిపోయాడు దాంతో –

వాడూ మన పూర్వీకుడేనట –

ఎందుకిలా —

ఎవడీ అల్పిష్టి అక్కు పక్షి –

మన గ్రహాంతర వివాహ వేళ –

ఏమో ఎరగం మనం

ఏదో తెలియం మనం

అయినా ఈదుకుంటూ వచ్చాడట రోదసి నదిలో

మన మహా పారదర్శక ప్రవాహంలో

ఈ మానవ కణాన్ని జాగ్రత్తగా పంట నొక్కి పెట్టి

తెచ్చాయి రెండు సొర కాంతలు –

ఆకలేస్తే గ్రహాల దొంతర్లని తినేయగలవవి

అయినా మనిషి వలె వున్నాడని

మనిషిలో వెయ్యో వంతుగా వున్నాడని

తెచ్చాయట ఈ పెళ్ళికి –

జల గాలక్సీల కానుకగా –

వాడే అంటున్నాడు మనం ఉబ్బి పోయామని

మనకి సౌందర్య శాస్త్రం తెలీదని –

కొత్త గ్రహాల గృహాలకై పాతబడి కూలిన గృహ భస్మాల్ని

వాడుకునే మనం

ఎక్కడ వెదక గలం ఎప్పుడు బూడిద బూడిదయి

ఎన్ని సార్లు బూడిదయ్యిందో

వీడు చెప్పే భూమనే గ్రహం?

అయినా విందాం, వీడి మాట ఏమిటో ?

అంగారక అప్పారావు , భూమి శ్యామలల పెళ్ళికి

వీడే కదా ఒక అపురూప కానుక

వీడి మంటల స్థాయి , మన ఇంట సూది పడినట్టయినా లేదు –

విందాం శబ్దోల్బణ యంత్రాలతో  –

అలనాడు మనం ఎరుగని గ్రహాన –

ఆసియా మైనర్ లో ఎగిరిందట వీడి బతుకు జెండా –

మన మానవ బహు గ్రహ భాషా ప్రొసెసర్

మారుస్తోంది వీడి పలుకులు – మన గాలి ఊసుగా –

ఉబ్బిపోయాం మనం

అదీ వాడి తెలివి తక్కువ వల్లేనట

ఎవరూ  ఏ వరమూ అడగని వేలుపు

వుండే వాడట ఒకడు

అలనాటి ఆ తొలి భూమి దేవరలతో ఒకడిగా –

అట్టి వరమేవరూ అడగని  వామనుడ్ని

అడిగాడీ మానవుడు –

ఒకసారి నీ వామనత్వం నుంచి

త్రివిక్రమత దిశగా ఎదిగిన

అనుభవాన్ని తనకిమ్మని –

ఎవరమూ వైయుక్తికం కాదు – అది లౌకికం అవుతుంది

అన్నాడట వీడిలో సగముండే

ఆ మూడడుగుల వాడు – గడుసుగా –

రక్త పాతం లేకుండా

రాజ్యాధికారాన్ని మార్చిన చతుర మందహాసంతో

తన చిన్ని పాదాలు పరిశీలించుకుంటూ –

లౌకికమే అయినా సమ్మతమే –

కావాలా త్రివిక్రమత తాలూకు అనుభవం-

అడుగుతున్నదొక ఋషి

భరించలేని కోరిక, సహించలేని వరం ఇది

ఇదే కావాలా అన్నాడట ఆ వడుగు  –

అవశ్యం కోరాడీ ఋషి –

అయితే కోటి సూర్యుల, శతకోటి చంద్రుల

కాలం నాది –

నా ప్రతి వేకువలో నాలుగు వేల యుగాల కాలపు కొమ్మ

ఒకటి కూలిపోతుంది

అనంత కాలం ఈ కోరిక సాగరాదు

అయినా సాగుతుంది పన్నెండు గంటల పాటు

పన్నెండు గంటల వామన కాలంగా –

త్రివిక్రమాకార ఊహాతీత ప్రవాహంగా

ఇది నీవు వరమనుకుని కోరి

పొందుతున్న శాపం –

లోకం ఎంత పెరుగుతుందో –

ఇంతేగా వుండిపోతావు నువ్వు

ఈ పన్నెండు గంటల కాలమూ

ఆహా ఎంత బావుందీ కథ  –

వీడట మన పూర్వీకుల పూర్వీకుల ముందు వాడట –

మన సొర కాంత కసక్కన నమిలి ఉంటే  –

ఈ పాటికే చరిత్ర హీనుడయేవాడు –

అయినా వీడి నేత్రాలలో

ఆ తొలి సూర్యుడి జ్వాలలున్నాయి

ఆ ఒక్క సూర్యుడి    ఒక్క భూమికి   ఒక్క

సజీవ వారసుడా _

అయితే – ఆ వామనుడెవరయి వుంటాడు –

ఏమో –

భూమి శ్యామలకి బరువు గుండెలకెక్కింది

భృకుటి బంగాళాఖాతం  ముడుచుకున్నట్టు

ముడి వడింది –

అది చూసి లేచాడు అంగారక అప్పారావు

మా పెళ్లి వేళ మంచి ముచ్చట ఇది –

అయినా ఎవరు నువ్వు –

చెప్పి పుణ్యం కట్టుకో –

లేదా ఈ పెళ్లి వేళ విల్లు తీసి –

తిమింగలాస్త్రం ప్రయోగిస్తా –

అది వేల అణుబాంబుల పెట్టు –

చాలు నీ ఒక్క ప్రాణానికి –

పెళ్లి కొడుకు పౌరుషం చూసి మురిసారందరూ

ఆరడుగుల వాడు –

మరెప్పుడో , మరెక్కడో , వేరే కొలువులో, వేరే స్థలం లో

ఆజానుబాహుడు , అరవింద దళాయతాక్షుడు –

బాణం ముందు నిల్చున్నాడు

అంగారక ఇంటివారు

భూమి శ్యామల వంశజులూ ముచ్చట చూస్తుండగా

అంగారక అప్పారావు

అవసరం లేక పోయినా విల్లెక్కు పెట్టాడు –

నిర్వికారంగా ఉన్నాడు

నీలి మేఘపు ఛాయ వాడు –

ఉబ్బిపోయిన లోకాలన్నీమరో అణువిస్ఫోటనానికి సిద్ధమయ్యాయి

రగిలే గ్రహ భస్మరాశులు

పర్వతాల ప్రమాణపు లారీల కెత్తి –

రోదసి రోడ్డు పై కొత్త గ్రహాల తయారీకి

సిద్ధమయ్యారు శాస్త్రులు , మేస్త్రులు, తాపీ పని వారు

ఒకానొక ప్రాణ జన్య యంత్రాలే వారంతా –

అంగారక అప్పారావు తల పెట్టిన

అస్త్ర ప్రయోగం –

అబ్బుర పాటే భూమి శ్యామలకు

చూడాలని – కాబోయే వాడి శౌర్య గరిమ

వరమాల ఎలానూ చేతిలోనే ఉంది

బాణం వదలడమేమిటి , దండ వేయడమేమిటి

ఎప్పుడెప్పుడా ఉవ్విళ్లూరుతోంది

భూమి శ్యామల

అంతా ఒక ప్రళయ కాల నిశ్శబ్దం

అంతా ఒక విలయ కాల ఉలికిపాటు

నవ్వుతున్నది అంగారక అప్పరావొక్కడే

అకారణంగా అయినా ఆయుధ ప్రయోగం చేసేవాడి

అహంకార అందం తో    నారి సంధించాడు

తిమింగలాన్ని సంధించాడు –

వేయి అడుగుల విల్లు మీద

ఆరడుగుల వాడు అందులో శతాంశం లేడు

అయినా నిలుచున్నాడు

ఒకానొక ప్రాచీన సూర్యరశ్మి స్వర్ణ భస్మపు పోత లాగ

అఖండ కాలపు అనంతాకృతి లాగ

అంగారక అప్పా రావు ఎక్కు పెట్టిన విల్లు మీది

తిమింగలాస్త్రం మీద కూర్చున్న శతాంశం లో సగం వాడొకడు

అన్నాడు – ఆగాగు తొందర పడకు –

కాలాలు వేరైన మనం

ఏక కాలస్థులం కావడమే వింతల్లోకెల్లా వింత –

నడుస్తున్నదింకా పన్నెండు గంటల కాలం

ఇది వామనుడి కాలం – ఇది నాకు సంబంధించి సత్యమైన కాలం

ఇది ఈ త్రివిక్రముడి పన్నెండు గంటల కాలం

నీ బాణం భావిష్యత్తులోకి వెళ్లదు

ఇదింకా వామనావతార వేళ –

రాముడింకా పుట్టనూ లేదు – రామాయణం జరగనూ లేదు

ఇది నాకు సంబంధించిన నిజమైన కాలం

ఇక ఆ ఆరడుగుల వాడా –

వాడి జీవితం లో సీతా వియోగ వేళ కోరుకుంటాడొక

వరం – తన అవశాన దశలో –

వామనుడ్ని –

సరయూ నదిలో ఉబ్బిన రాముడి దేహం లో జరుగుతున్న కథ ఇది –

ఆ సరయూ భూమికి చెందదు

ఆ రాముడు భూమికి చెందడు

అంగారక అప్పారావు – అహంకరించిన పాదం చూడు

పాదం చూశావా – విశ్వం కన్నా పెద్దది

బాణాలు, అణు క్షిపణులు, సూర్య మండల సహస్రాలు

ఆగవు –

అర చేత విల్లు విరిచి , ఒళ్ళు మరిచి వేషాలేం

వెయ్యక్కర్లేదు

అన్నాడు పిడుగుల పాటగా ఆ వడుగు

అప్పారావు అంగారక్ చెవిలో –

తిమింగలం వణికి –  కింద పడింది

అతి కష్టం మీద నిలబడ్డాడు అంగారక అప్పారావు

తాను కింద పడితే భూమి శ్యామల పెళ్లాడదని –

ఎవరిదీ కాలం – రాముడిదా – అంగారక అప్పారావుదా,

వామనుడిదా – ఎవరిది , ఎవరిది , ఎవరిది ,

ఇదొక కలగాపులగపు విలయావర్త బలవత్ ఝరవత్ పరివర్తన

ఆ పరివర్తన లో కాలింగ్ బెల్ మోగింది –

తలుపు తీసుకు లోనికొచ్చిన అతిధి గాలి –

కాళ్ళు లేని అతిధికి ఏ కుర్చీ వేయనూ –

మెలుకువొచ్చింది – కాఫీ కప్పుతో వచ్చింది జగతి

“జగతి పై రామయ్య జన్మించినాడూ” పాట పాడుతూ

 

(వాల్మీకికి , పోతనకి , శ్రీశ్రీ , ఎమిలీ డికిన్సన్ కి క్షమాపణలతో )

-రామతీర్థ  

(శ్రీరామ నవమి 2014 , మంగళ వారం 7.30రాత్రి )

 

 

 

 

 

 

 

 

 

 

 

త్రీ ఇన్ వన్!

Saranga cartoon_mrityunjay-23-04-14మృత్యుంజయ్

11937_578811308820340_1396284388_n

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 18 వ భాగం

24

(గత వారం తరువాయి )

18

రాత్రంతా నిదురలేదు ముఖ్యమంత్రి గార్కి. అతనికి మేధావులను ఆ క్షణం చెప్పుతో కొట్టాలనిపించింది. మనిషికి సుఖాలు, సంపదలు, అధికారం.. యిలాంటివన్నీ ఉంటే సుఖంగా, సౌఖ్యంగా ఆనందకరంగా ఉంటుందని ఈ మేధావులైన రచయితలు, కవులు, యితరేతర సృజనకారులు చెప్పారు. అనేక సందర్భాల్లో అదంతా శుద్ధ అబద్ధమని ముఖ్యమంత్రిగారి గత నలభై సంవత్సరాల వ్యక్తిగత రాజకీయ జీవితం ఎంతో స్పష్టంగా చెబుతోంది.
ఎంతో పెద్ద ముఖ్యమంత్రి నివాసభవనం.. క్యాంప్‌ ఆఫీస్‌ కంప్లీట్లీ ఎయిర్‌ కండిషన్డ్‌, సకల సౌకర్యాలు.. ముట్టుకుంటే మాసిపోయేగోడలు. నడుస్తే అరిగిపోతుందా అన్నట్టు పాలరాతి నేల. వెన్నెల ముద్దవంటి బంగారు రంగు, మెత్తని పట్టు పాన్పు.. కాని..,
మనసునిండా మున్సిపల్‌ చెత్త. పాయఖాన కంపు. తలంతా పాకీవాడి బకెట్‌. ప్రొద్దునలేచినప్పట్నుండి తను ఇతరులను బ్లాక్‌మెయిల్‌ చేయడం, లేదా వెధవలందరూ తనను బ్లాక్‌మెయిల్‌ చేయడం. ఒకర్నొకరు వేటాడ్డం, ఎవడో ఒకడు తమను వెంటాడ్డం.. ఇదంతా నిజానికి అవసరమా మనిషికి.
అధికారం.. కుర్చీ.. పదవి.. మంత్రి పదవి.., ముఖ్యమంత్రి పదవి., ”అధికారంలో ఉన్న మజా.. అది అనుభవించితే తెలియనులే..” ఎక్కడో విన్నపాట.
ఉదయం… ‘అగ్ని’టి.విలో ఆ ‘రామం’ అనేవాడు ప్రసంగిస్తున్నపుడు అన్ని దిక్కుమాలిన కార్యక్రమాలను ప్రక్కనపెట్టి ఎవర్నీ తన చాంబర్‌లోకి రానివ్వద్దని, అన్ని టెలిఫోన్‌ హాట్‌లైన్లను కట్‌చేసి.. ప్రశాంతంగా .. సముద్రంలా పొంగిపోతూ విన్నాడు. విని..” నిజంగా వీడు రామంగాడు అనుకున్నాడు.
మనసు పవిత్రంగా, హృదయం నిష్కల్మషంగా.. తత్వం.. ఏ స్వార్థమూలేని పరిత్యాగకాంతితో నిండి.. మనిషి ఈ సకల తుచ్ఛమైన వాంఛలకు అతీతమైపోయిన తర్వాత.. వాడి ముఖంలో నిజంగా ఎంతో కాంతి, ఎంతో ఆకర్షణ.. ఎంతో జీవకళ.. ఎంత పరిపూర్ణతో.
నిండుపున్నమి చంద్రునిలా ముఖం.
అంటాడు.. ” ఈ తుచ్ఛమైన అధికారాన్నిపట్టుకు వేలాడ్తూ, కోట్లకు కోట్ల రూపాయలను దాచుకుంటూ.. ఎన్నాళ్ళు కొనసాగుతావు.. ఈ వెంపర్లాటకూ, సంపాదనకూ ఒక హద్ధు, ఒక అంతం ఉందా.. ఒక వేళ ఉంటే.. అది ఎంత..?”
తన గుండెలో చటుక్కున గుచ్చుకుందామాట.
ఐతే ఆ మాట డెబ్బయ్యారేండ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో తనకు తెలియనిదా.. తెలుసు.. ఐతే చెప్పినవాడు ఎవడో దొంగ సన్యాసి బెంజ్‌కార్లో వచ్చి, ఫైవ్‌స్టార్‌ ప్రవర్తనతో ”ఆర్ట్‌ ఆఫ్‌ లివింగు” గురించి బూటకపు ఉపన్యాసం   చెప్పినట్టుగాకుండా..ఈ రామం అనేవాడు.. తన చదువును, ఉద్యోగ్యాన్ని, హోదాను, ఆస్తిపాస్తులను, సర్వసంపదలనూ వదలి ప్రజాపరం చేసి తను ఊరుబయట.. ఓ అతిసామాన్య పర్ణశాలవంటి కుటీరంలో జీవిస్తూ చెప్పడం.. ఎక్కడో హృదయంలో బాణం గుచ్చుకుని నాటుకుంది.
వాడు.. బమ్మెరపోతన చెప్పినట్టు.. ‘నవ్వు రాజిల్లెడు మోమువాడు, కృపారసమ్ము పై చల్లెడు వాడు..’
ఒక్కోసారి ధర్మాధర్మ విచక్షణ మన మనసును కల్లోల సముద్రంగా మార్చి.. కలవర పరుస్తున్నపుడు సత్యం ఒక కాంతిపుంజంలా విచ్చుకుంటుంది.
ముఖ్యమంత్రికనిపించింది.. ఎక్కడో తను ఓడిపోతున్నాడు.. అధర్మ రక్షణ చేస్తున్న తాను ఎక్కడో బురదలో కూరుకుపోతున్నాడు.. రామం.. ఉదయించే సూర్యునిలా అవక్రపరాక్రమంతో విక్రమించి విజయుడు కాబోతున్నాడు.
సరిగ్గా అప్పుడు ఉదయం ఐదుగంటల పదినిముషాలైంది. కారు మినిస్టర్స్‌ కాలనీలో రివ్వున దూసుకుపోతోంది. సన్నగా చినుకులు. పైన మేఘాలు నిండిన ఆకాశం.
అంతా నిర్మానుష్యం.
కారు ‘ఆ’ గోదాంలోకి పోయింది సూటిగా.
అంతారెడీ అప్పటికే.
రాంబాబు, శివరాజం.. ఢిల్లీ అధిష్టానం బాపతు మోహన్‌ సైగల్‌.. ముగ్గురూ రెడీగా ఉన్నారు.
మొత్తం పది నిముషాల కార్యక్రమం అక్కడ.
కారు ఆగగానే దిగి.. చకచకా లోపలికి .. ఒట్టి రేకులషెడ్డువంటి విశాలమైన గోదాంలోకి నడిచి..
ఎదురుగా.. ఒక గుట్టవలె.. సిమెంట్‌ ప్లాస్టిక్‌ సంచుల్లో కుట్టిన అన్నీ ఐదువందల, వేయిరూపాయల నోట్ల కట్టలు, పదులు, వందలు.. మొత్తం నెలరోజుల లెక్క వారానికి యాభై కోట్ల చొప్పున నాల్గు వారాల్లో రెండు వందల కోట్ల పార్టీఫండ్‌. నగదు. క్యాష్‌.. నోట్లు..
రెండ్రోజుల్లో రెండు లక్షలమంది జనంతో భారీ బహిరంగసభలు నిర్వహించాలన్నా, ఎక్కడన్నా ఏదైనా రాజకీయంగా మతకలహం సృష్టించాలన్నా, అర్జంటుగా ఏ ప్రతిపక్ష, లేదా స్వపక్ష ప్రతిపక్ష సభ్యున్నయినా కొనాలన్నా.. ఎక్కడన్నా ‘పే అండ్‌ యూజ్‌’ పద్ధతి పై రాజకీయం చేయాలన్నా.. అంతా టర్మ్స్‌ ఇన్‌ క్యాష్‌. నగదు దందా. ప్రతి రాష్ట్రం అధిష్టానానికి ఉడతాభక్తిగా వారానికో వందకోట్లు సమర్పించుకోవాలి. అదొక శాశ్వత సంప్రదాయం. ఎవడు ముఖ్యమంత్రయినా అంతే. ఈలోగా బుర్రున ముఖ్యమంత్రిగారి మొబైల్‌ మ్రోగింది.
”హలో..”
”ఊఁ.. నేనండీ.. నళినీ సదాశివం”
”హలో మేడం బాగున్నారా..”
నళినీ సదాశివం అధిష్టానంలో ”ఫండ్స్‌ ప్రాక్యూర్‌మెంట్‌ సెల్‌’ అధిపతి. జాతీయపార్టీ ప్రధాన కార్యదర్శి (నిర్వహణ)
”బోలీయే మేడం”
”సబ్‌ తయార్‌హై నా.. మోహన్‌సైగల్‌కో హాండోవర్‌ కర్‌దేనా ఓ పూరాపైసా.. అచ్ఛా గాడీ భీ దో ఉస్‌కో.. ఔర్‌ చోడ్‌ దో.. ఓ సంభాల్‌ లేంగే.. ఠీక్‌హై”
”హా మేడం..”
ఫోన్‌ కటైపోయింది అట్నుండి.
పెద్ద పెద్ద రాజకీయ, ఆర్థిక వ్యవహారాల్లో ఎక్కువ మాటలుండవు.. చేతలుంటాయంతే.
ముఖ్యమంత్రిగార్కి ఎందుకో ఈ తన దాదాపు యాభైఏండ్ల రాజకీయానుభవంలో .. మార్చిన నాలుగైదు జాతీయ పార్టీల్లో ఎప్పుడూ ఏదో ఓ మంత్రి పదవో, తత్సమానమైన ఇతర పదవేదో ఉండడం వల్ల.. ఏ పార్టీ ఐనా పార్టీ ఫండ్‌ క్రింద ఇండస్ట్రియలిస్ట్స్‌, భూస్వాములు, కాపిటలిస్ట్‌లు, మాఫియాలు, గుండాలు, ప్రభుత్వ పథకాల్లో కమీషన్ల రూపంలో నొక్కేయడాలు.. ఇటువంటి వనరులనుండి కోట్లకుకోట్లు పార్టీఫండ్‌ కింద లెక్కాపత్రంలేని డబ్బను గ్టుటలు గుట్టలుగా సమీకరించడం.. గోదాముల్లో, ప్రత్యేకంగా .. రహస్యంగా నిర్వహించే అపార్ట్‌మెంట్లలో, నేలమాళిగల్లో నగదు రూపంలో దాచి ఉంచడం.. పార్టీలో అత్యంత విశ్వసనీయమైన కుక్కవంటి వ్యక్తి నిర్వహణలో అంతా నడిపించడం.. ఎన్ని చూడలేదు తను.
ముఖ్యమంత్రి అంటే అధిష్టానం దృష్టిలో ఓ కుక్క. బాల్‌ విసిరి తెమ్మంటే తేవాలి. ఛూఁ.. అంటే పరుగెత్తాలి. కరువంటే కరవాలి.. వద్దంటే విడిచిపెట్టాలి.. ఒక్కోసారి ఒట్టిగానే భౌ భౌ అని అరవమంటే అరవాలి. అటు అఖండ అధికార పటాటోపపు మత్తు.. ఇటు ఆత్మాభిమానాన్ని చంపుకుని అధిష్టానం ముందు తలవంచుకుని ఓ కట్టుబానిస.
ఆ ‘జనసేన’ రామం అన్నట్టు.. మనిషికి ఈ దిక్కుమాలిన అధికార వ్యామోహంగానీ, మనసు చచ్చిపోతూండగా నిస్సిగ్గుగా తలదించుకునే బానిసత్వంగానీ అవసరమా. చరిత్రలో ఎవడుమాత్రం ఎన్నాళ్ళు జీవించి శాశ్వతమయ్యాడని. అలెగ్జాండర్‌నుండి బ్రిటిష్‌ సామ్రాజ్యందాకా.. నియంతలందరూ కాలగర్భంలో కలిసిపోయారు గదా.  మరి.,
”సర్‌.. మొత్తం రెండువందల కోట్లు.. అన్నీ రెండు ఇన్నోవాల్లో సర్దుకున్నాన్సార్‌” అన్నాడు పార్టీ కార్యదర్శుల్లో ఒకడైన శివరాజం.
”ఔను.. వీటిని తీస్కొని ఆ సైగల్‌ గాడెక్కడికి పోతాడయ్యా”
”ఏమోసార్‌.. లంజకొడ్కు.. గత నెల మాత్రం చత్తీస్‌గఢ్‌లకెళ్ళిండ్సార్‌. అక్కడ అపోజిషన్‌ గవర్నమెంటుంది గదా.. దాన్ని పడకొట్టడానికి మనుషుల్ని కొనాలని..అంతకు ముందు ఓ చార్టర్డ్‌ ప్లేన్‌లో మన మూడు వందల కోట్లతో జార్ఖండ్‌కు పోయిండు. ఈ నార్త్‌ లంజాకొడ్కులు గింతకూడ వాసనరానీయర్సార్‌.. ఈసారి బహుశా ఈ డబ్బును మన ఎపిలనే ఎక్కడ్నో దాస్తడు.”
”ఫోనీ దొంగముండాకొడ్కు.. కని నెలనెలా ఈ రకంగా డబ్బు సమకూర్చడం కష్టమే శివరాజం..ఎక్కన్నుంచి తెస్తం.. ఎన్నని దొంగపనులు చేస్తం.. అవతల ఆ జనసేన ముండాకొడ్కులు ఒక్కొక్కని భరతంపట్టి జాడిస్తాండ్లు.. వ్చ్‌.. ఏదో కష్టకాలమే దాపురిస్తాంది.. సరేగని వాని వెహికిల్స్‌ పోంగనే జాగ్రత్తగా తాళాలేసి కీస్‌ పంపియ్‌.. ఇంక బ్యాలెన్స్‌ందుందిందుల..”
”ఏఁ. ఎంతసార్‌.. ఇరవై ఏడు కోట్లు..” శివరాజం అంటూండగా.,
‘ఏయ్‌ శివరాజం.. ఇరవై ఎనిమిది కదా.. నీయవ్వ ఎలాగూ లెక్కపత్రం లేదుగదా అని ఒకటి నొకేద్దామనుకుంటానవా..” అన్నాడు రాంబాబు. శివరాజం రాంబాబు దిక్కు గుర్రుగా, ఆల్సేషియన్‌ కుక్కవలె చూచి.. ”నీయవ్వ.. లెక్క ఒకటి తప్పిందన్కో .. యిప్పుడేమైంది. తింటమా..నువ్వు లేవా లెక్క చూచెడానికి.. ఓ ఒకటే తొందర నీ తల్లి..”
” అరెయ్‌.. లెక్కలు కిందిమీదికైతే ఎర్కేగదా.. పిట్టలోల్గె లేచిపోతరు..” ముఖ్యమంత్రి వెనుదిరిగి కారుదిక్కు నడుస్తూండగా.,
”సర్‌సర్‌.. ఈసారి మంత్రివర్గ విస్తరణలనన్న నన్ను ఓ కంట..” ప్రాధేయపూర్వకంగా శివరాజం గొణుగుతూ,
”చూద్దాం లేవయ్య.. అసలు మన సర్వైవలే కష్టంగున్నది..”
ముఖ్యమంత్రి చరాచరావచ్చి కార్లో కూర్చోగానే కారు బయల్దేరింది..పూర్తిగా రహస్యమైన ట్రిప్‌ కాబట్టి ఏ సెక్యూరిటీ, కాన్వాయ్‌, పటాటోపం లేని ప్యూర్‌ పర్సనల్‌ ట్రిప్‌.. చాలా హాయిగా ఉందతనికి.. అప్పటికే ఆయన మొబైల్‌ సైలెంట్‌ మోడ్‌లో అరుస్తూనే ఉంది.
అసహనంగా ఫోన్‌ ఎత్తాడు.. ”హలో..” అని. ఆ ఫోన్‌ హోంమంత్రి అప్పల్నాయుడుది. అప్పటికే ఎనిమిదిసార్లు వచ్చి వచ్చి వెయిటింగులో ఉంది. చాలా చికాకేసింది ముఖ్యమంత్రికి ఆ వ్యక్తి జ్ఞాపకం రాగానే. అతన్ని చూడగానే ఓ పందిని చూచినట్టు పైన ఓ బల్లో, తొండో పడ్డట్టు, ఓ బండెడు పేడ పైనబడ్డట్టు ఓ వికారమైన అనుభూతి. మొదట్నుండీ తనను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ తనతో బలవంతంగా తన పనులన్నీ చేయించుకుంటున్నాడు. పదేండ్లక్రితం ఒట్టి కేబుల్‌ ఆపరేటర్‌ వెధవ అప్పల్నాయుడు.. ఇప్పుడు వాడొక క్యాబినెట్‌ర్యాంక్‌ మంత్రి. వాడి పెళ్ళాం ఎంపి. వాని తమ్ముడు ఎమ్మెల్యే. వేల ఎకరాల భూములు కబ్జా. వేల కోట్లరూపాయల సంపద.. మనిషి.. పశువుకే మాటొస్తే టైపు – నోరు తెరిస్తే అదొక మున్సిపల్‌ మోరి. సారా, లిక్కర్‌, బార్లు, పబ్‌లు, గనులు, హార్బర్‌, ఖనిజం ఎక్ప్‌పోర్ట్‌, ఇరవై రెండు ఇంజినీరింగు కాలేజిలు. రెండు మెడికల్‌ కాలేజీలు, రెండు షిప్పింగు కంపెనీలు. విదేశాల్లో రెండు హోటళ్ళు. యితర రాష్ట్రాల్లో నాల్గు పవర్‌ ప్రాజెక్ట్‌లు.. ఒక సామ్రాజ్యం వాడిది. ఒట్టి వీధిగుండా. ఒకప్పటి రౌడీషీటర్‌ ఇప్పుడు హోంమంత్రి. వాడికింద ఒకనిమీద ఒకడు పడిపడి బూట్లు నాకే ఐపిఎస్‌ ఆఫీసర్లు.. వేలకోట్ల సామ్రాజ్యం. అధిష్టానం దగ్గర పైవాళ్ల కటాక్షవీక్షణాలు వీడికి. డైరెక్ట్‌గా సూట్‌కేస్‌లకుసూట్‌కేసులు పార్టీ పెద్దలకు, సామంతులకు చక్రం తిప్పేవాళ్ళకు, ధనకనక వస్తు వాహనాదులతోపాటు కాంతామధువులు అన్నీ చేయిచాపినంత దూరంలో ఉంచి.. వాడికి ఎవన్ని ఎట్ల మేనేజ్‌ చేయాలో బాగా తెలుసు. తన కంట్రోల్‌ అస్సలే లేదు. వాడు తన మాట వినడు.. తనను ఖాతరు చేయడు.. ఎప్పుడూ ఇరవై ఐదుమంది ఎమ్మెల్యేలను పిల్లివెంట పిల్లల్లా వెంటతిప్పుకుంటూ బ్లాక్‌మెయిల్‌ చేస్తాడు. వీడూ పార్టీ రాష్ట్ర అధ్యకక్షుడు జయవిజయులు.. తోడుదొంగలు.. కత్తీ డాలూ.
యిప్పుడు వీడు ఉంచుకున్న ముండ చింతామణికి ‘రాజ్యసభ’ సీటు కావాలి. అధిష్టానంనుండి పైరవీ చేసుకుని అఫీషియల్‌గా రాష్ట్ర పార్టీ అధ్యకక్షుడు, ముఖ్యమంత్రి అంగీకారంతో ఒక లెటర్‌ తెచ్చుకొమ్మని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌తో చెప్పించుకుని.. ఒక లెటర్‌పెట్టి.. నిన్న రాత్రి రాష్ట్ర అధ్యకక్షుని సంతకం చేయించి.. పన్నెండు తర్వాత ఫుల్‌గా ఫుల్‌బాటిల్‌ తాగి తనదగ్గరికొచ్చి సంతకం పెట్టమంటాడా కాగితంపై.. సంతకం పెట్టడం గురించిగాక వాడింకొక మాట మాట్లాడడు. మాట్లాడనీడు. అతి కష్టంమీద ఆ కాగితం అక్కడ పెట్టిపో.. రేప్పొద్దున చూద్దామని పంపించగలిగాడు తను. పోతూ పోతూ ”రేప్పొద్దున చూస్తా కాదు.. రేప్పొద్దున చేస్తా అను” అని అరుచుకుంటూ వెళ్లిపోయాడు.. వాడివెంట పాతికమంది స్పెషల్‌ సెక్యూరిటీ, ప్రొటెక్షన్‌ పోర్స్‌.
”రామం.. నువ్వు చెప్పుతున్నది అక్షరాలా నిజమయ్యా.. మేమిద్దరం బయటికి రాలేని పీతిగుంటలో మునిగిపోయి ఉన్నాం.. సత్యం.. పరమ సత్యం.. సిగ్గుగా ఉంది.. అసహ్యంగా ఉంది.. జుగుప్సగా ఉంది నాపై నాకే.. కాని..?”
”ఏమైంది.. ఎక్కడున్నారు మీకోసం అరగంటనుండి వెయిట్‌ చేస్తున్నా చాంబర్లో.. ఎంతసేపు..” అరుస్తున్నాడా ఆంబోతు హోంమంత్రి అట్నుండి.
”వస్తున్నానయ్యా.. ఐదునిముషాల్లో.. వెయిట్‌ చెయ్‌..” అన్నాడు అసహనంగా. ఆయనకా క్షణం మొన్న టి.వి. ఇంటర్వ్యూలో ‘జనసేన’ రామం పదే పదే చెప్పిన ఆత్మగౌరవం, ఆత్మతృప్తి అనే పదాలు వందసార్లు జ్ఞాపకమొచ్చాయి. ఆ రెండూ ప్రస్తుతం తన దగ్గర అస్సలే లేవని అర్ధమై ఎందుకో అతనికి దుఃఖంముంచుకొస్తున్న ఫీలింగేదో కలిగి గిలగిల్లాడిపోయాడు. నిజంగానే ఈ వయసులో.. తను యాభై ఏండ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చినపుడు పార్టీ ఏదైనా ఋషుల్లాంటి వ్యక్తులుండేవాళ్ళు. శాసనసభలో పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, నీలం సంజీవరెడ్డి, చంద్ర రాజేశ్వర్రావు, వందేమాతరం రామచంద్రరావు, పెండ్యాల రాఘవరావు.. మహానుభావులు.. అసలు స్వార్ధమే లేని ఆదర్శజీవులు. శాసనసభ అంటే పవిత్ర దేవాలయం. ప్రతి మనిషి కదలిక, నడక, మాట, ముచ్చట, ఆలోచన..సంభాషణ అన్నీ విశిష్టమే. అందరిలోనూ మానవ పరిమళం అక్కడ్నుండి.. పర్వతంపైనుండి రాయి కింది దొర్లిపడ్తున్నంత వేగంగా విలువలు పతనమై.. నైతికత ధ్వంసమై.. ఒక్క యాభై సంవత్సరాలలో భారతదేశంలోని శాసనసభలన్నీ .. పార్లమెంట్‌తో సహా మైక్‌లు విరిచి, బల్లలు చరిచి, అంగీలు చింపుకుని, పరమ చంఢాలమైన భాషతో తిట్టుకుని.. అంతా రోత. ఏమిటిది.. ఎందుకిలా.. నిజంగానే ఆ రామం అన్నట్టు నేరగాళ్ళందరూ శాసన సభల్లోకి ప్రవేశించారుగదా బాజాప్తాగా. ఆక్రమణ.. దురాక్రమణ జరిగింది.

గుండాలకు ప్రజాస్వామ్యపు అసలు రహస్యం తెలిసిపోయింది. అసలు ప్రజాస్వామ్యమే బూటకం. వంథాతం ఓటర్లలో ఏ ముప్పయ్యయిదు శాతం మందో ఓటేస్తే పద్దెనిమిదిశాతం ఓట్లను సంపాదించినవాడు గెలుస్తే. గెలిచినవాడు ఎంతశాతం ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు.. పదిహేడుశాతం ఓట్లొచ్చి ఓడిపోయినవాడు ఎంతమందితో నిరాకరించబడినట్టు.. ఐనా ఒక నిరక్షరాస్యుడు, ఒక డాక్టర్‌, ఒక కూలీ, ఒక వైస్‌చాన్సలర్‌.. వీళ్ళందరూ పౌరులే ఐనపుడు అందరి ఓటు విలువ ఒకటే ఐనపుడు.. అసలా గణన విధానమే తప్పుకదా.. అందుకే వీధీరౌడీలు కూడా ఎన్నికల్లో అసలు ఓటు వేసే బడుగు ప్రజలను ఎలా లోబర్చుకుని, వశపర్చుకోవాలో, ఎలా భయపెట్టి మభ్యపెట్టాలో.. అన్ని పద్ధతులూ నేర్చుకున్నారు. పోలింగు తేదీకంటే ముందు రెండురోజులు సర్వవిధాలుగా ప్రజలను వెధవలను చేస్తే.. చెల్లు.. యిక ఐదేండ్లు ఆడింది ఆట పాడింది పాట. ఈ దేశంలో ఎలాగూ కోర్టులకు చెవులు, కళ్ళులేవు.. పోలీసులకు హృదయం, చేతులు లేవు.. మేధావులకు ధైర్యం, సమయం లేవు.
ఈ వ్యవస్థ శరీర సర్వాంగాలకూ కేన్సర్‌ చీడపట్టినట్టయి.,
బి.డబ్ల్యు.ఎమ్‌ కారు జారిపోతుంది విడిచిన బాణంలా.

రాజకీయాల్లో.. బ్లాక్‌మెయిల్‌ చేయడం.. బ్లాక్‌మెయిల్‌ చేయబడ్డం.. ఒక గొప్ప నీచమైన జూదక్రీడ.. ఆ పరంపరలో.. యిదివరకు ఎన్నో ప్రభుత్వాల్లో పంచాయితీరాజ్‌, ఎలక్ట్రిసిటీ, ఆర్థిక, రెవెన్యూ, ఆరోగ్య.. ఒకటేమిటి.. దాదాపు అన్ని శాఖలనూ మంత్రిగా నిర్వహించిన తనకు తెలియని రహస్యమేలేదు. తెలియని లోలోతుల విషయాలూ లేవు.. ఐతే జీవిత చరమథలో ముఖ్యమంత్రి కావడం ఒక వరమై.. ఒక అద్భుతావకాశమై.. ఓ అదృష్టమై.,
శేషజీవితమంతా మాజీ ముఖ్యమంత్రి అని అనిపించుకోవచ్చు గదా.. అని ఆశ.
కాని యిది ఒక శాపమై.. క్షణక్షణ నరకం, ఆత్మవంచన, అవమానాలు, క్షోభ.. అన్నింటినీ మించి మనసుకు నచ్చని ఎన్నో తప్పుడు పనులకు ఒడిగడ్తూ.. ఇన్నాళ్ళూ ఏదో కొద్దిగా గుండెల్లో మిగిలిన చెంచాడంత ఆత్మతృప్తికూడా ఇగిరిపోయి.. ముగింపులో ‘ముసలోడు ఛండాలపు పనులన్నీ చేశాడు. చేయనిచ్చాడు’ అన్న మచ్చ శాశ్వతమై.,
అవసరమా ఈ మచ్చ తనకిపుడు. ఈ మచ్చను ఇలాగే ఇంకా ధరిస్తే.. ఇన్నాళ్ళ జీవితమంతా బురదలో పోసిన అమృతమైపోదా.
ఉహుఁ.. లోపల..లోలోపల.. ఎక్కడో.. ఏదో తగలబడిపోతోంది ఎండిన అడవిలా.

ఒక నెలక్రితం గుఢాచార విభాగంలో నీతివంతులూ, తనకు బాగా విశ్వసనీయులైన ఓ పదిమంది అధికారులతో ప్రతి మంత్రి గురించీ, ప్రతి శాసనసభ్యుని గురించీ సమీకరించిన సమగ్ర నివేదిక జ్ఞాపకమొచ్చింది ఆయనకాక్షణం. ఒక రాత్రంతా ఆ వందల నివేదికలను పరిశీలించాడు తను.. ఏమున్నయందులో.. బురద.. చెత్త.. కంపు.. గబ్బు. ఎప్పుడూ ఎవ్వడూ శుభ్రం చేయలేని సముద్రమంత అవినీతి. దాదాపు ఎనభైశాతం మంది .. అందరూ నేరచరిత్రులే. ఓ సరియైన చదువులేదు. చరిత్రలేదు.. సంస్కారం అసలేలేదు. జ్ఞానం అంతకూ లేదు. .. అంతా రాక్షస గణం. తాను దానికి అధిపతి.. అంతే.
మొన్న రాత్రి తనవద్దకు వచ్చిన ఐదారుగురు మంత్రులు, యింకో ఏడెనిమిది మంది పార్లమెంట్‌ సభ్యులు, శాసనసభ్యులు.. బృందం గుర్తొచ్చింది ముఖ్యమంత్రిగారికి. వేలకోట్ల సాగునీటి ప్రాజెక్ట్‌లలో జరిగిన వేలకోట్ల అవినీతికి సంబంధించి సవివరమైన సమాచారంతోనే వచ్చారు వాళ్ళు. చాలా బహిరంగమైన దోపిడి. నిస్సిగ్గుగా ఎగబడి తినుడే.. అదీ ప్రపంచబ్యాంక్‌నుండి తెచ్చిన అప్పు డబ్బును.
అంతా నిజమే..నిజమే.. తనకు తెలుసు.
పవర్‌ ప్రాజెక్టులలో ఏ మంత్రి ఏ పార్లమెంట్‌ సభ్యుడు, ఏ బినామీదారు ఎంత దండుకుంటున్నాడో తెలుసు.. ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ను అడ్డంపెట్టుకుని డిస్టిలరీస్‌.. ఎక్కడో అమెరికానుండి ఆంధ్రదేశందాకా విస్తరించడం తెలుసు తనకు. వాళ్లనుండి ఎవనికి అందిందివాడు కోట్లుకోట్లుగా తిని బలవడం తెలుసు. కార్పొరేట్‌ కంపెనీలకు భూముల అలాట్‌మెంట్‌ పేరుతో ఏ ఏ నాయకుడు ఎన్నెన్ని ఎకరాలు, సెజ్‌లపేరుతో గ్రామాలకు గ్రామాలను ఎలా పంచుకుతింటున్నారో.. రోడ్డు, భవనాలు, ఇసుక, బొగ్గు, అడవి, కలప, ఖనిజం, నీరు.. అంతా అంతా దోపిడీకి గురౌతున్నట్టు తెలుసు తనకు.
మొన్న తన చేయించిన సర్వేతో, ఇప్పటికీ ప్రభుత్వ వ్యవస్థలో ఒక అవశేషంగా, మిగిలిన నీతిపరులైన ఏడెనిమిది మంది సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్ల నేతృత్వంలో తయారుచేసిన ‘అవినీతి డాటా బ్యాంక్‌’ ఋజువుల్తోసహా.. తనదగ్గరుంది.. డాక్యుమెంట్లుగా.. అంతా తనకు తెలుసు.
తెలిసీ.. తెలువనట్టు.. కళ్ళు ఉండీ చూడలేనట్టు.. చెవులుండీ వినలేనట్టు.. నటిస్తూ.,
జీవిస్తూ.. మరణించినట్టు.. మరణించికూడా జీవిస్తున్నట్టు నటిస్తూ..థూఁ.. నీయమ్మ .. ఆ ‘జనసేన’ నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణలో … టి.విలో ఎవరో వేశ్య చెప్పినట్టు.. తమకంటే వేశ్యే నయంకదా.
అధిష్టానం.. పార్టీ.. పార్టీ సభ్యులు..ప్రజాప్రతినిధులు.. అధికారదాహంతో వికృతతాండవం చేస్తున్న వివిధ పార్టీ లాబీలు.. హైద్రాబాద్‌, ఢిల్లీ.. నడుమ వికృత మంత్రాంగం, యంత్రాంగం నడిపేవారు.. అందరూ చెప్పేదేమంటే.. ముఖ్యమంత్రి ఈ రొచ్చును ఈ కంపును, ఈ సర్వదరిద్రాన్ని భరిస్తూ, ధరిస్తూ.. నాయకత్వం వహిస్తూ.. ‘నడిపించండి.. నడిపించండీ రోతను’ అని కదా ఎప్పుడూ చెప్పేది.
కాని.. కాని.. ఉహుఁ.. యిక తనతో కాదు.. ఈ కుర్చీ, ఈ అధికారం.. ఈ నీచాతి నీచమైన పదవీవ్యామోహం.. అప్పులకుప్పపై దొంగ నాటకం.. ఖాళీ ఖజానాతో అబద్దాల పాలన.. వద్దు.. వద్దిక..,
కారు ముఖ్యమంత్రి అధికారిక నివాసం ముందాగి.. దిగి.. గబగబాలోపలికి నడచి.,
చుట్టూ ఎందరో విజిటర్స్‌.. ఫైళ్ళతో అధికారులు.. పాత్రికేయులు.. టివివాళ్లు.. లోపల ఆంటీరూంలో హోంమంత్రి అప్పల్నాయుడు.. ఇంకా.. ఇంకా.,
బెల్లం చుట్టూ ఈగలు.
లోపలికి వెళ్ళి సీట్లో కూర్చున్నాడో లేడో.. డోర్‌ దగ్గరగా పెట్టి అప్పల్నాయుడు ఒక వీధి రౌడీ మీదికురికొచ్చినంత రూడ్‌గా పైపైకొచ్చి,
”ఏమైందా కాగితం.. రాత్రిది.. చింతామణి రాజ్యసభ సీట్‌కు రికమెండేషన్‌ లెటర్‌. మీరు దాన్ని సంతకంచేసి నా ముఖాన పారేస్తే.. ఢిల్లీ లెవల్లో అన్ని ఏర్పాట్లూ చేసుకున్న”
”నేను చేయనయ్యా..”
”చేయవా.. ఎందుకు..” మాట ఏకవచనంలోకి దిగింది.
”ఒట్టి రోడ్‌సైడ్‌ మనుషులను పార్లమెంట్‌కు పంపడం సరియైందికాదు”
”ఏంటీ రోడ్‌సైడ్‌ మనిషా చింతామణి.. మరి నువ్వు, నేను, మన మంత్రులు, మనోళ్ళందరెవరు. సత్యహరిశ్చంద్రులా. పోవయ్యా.. ఏదో పెద్దమనిషివిగదా అని నీ సంతకం కావాలన్న. నువ్వు ఆ బోడి సంతకం చేయకుంటే పని ఆగిపోద్దనుకున్నవా. పై లెవల్ల ఎవనెవనికెంతియ్యాల్నో అన్ని ఇచ్చిపెట్టిన.. అందరూ పవర్లో ఉన్నంత సేపే తూర్పారపట్కొని పోతరు. పో.. నీతోనేంగాదు.. చూస్కుంట నీసంగతి..”అని విసవిసా, ఒక మామూలు మనిషిపై వీధిగుండా దాడిచేసి వెళ్లినట్టు.. ఓ వెంట్రుకముక్క పో అన్నంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు.,
ధూఁ.. నీయవ్వ..నిజంగానే ఏ విలువాలేని తనది ఏం బతుకు.,
పార్టీలో ప్రతివాడూ మాట్లాడేవాడే.. అందరూ ఒకర్నొకడు విమర్శించేవాడే.. అందరూ నీతిపరుల్లా మాట్లాడ్తూ ప్రతివాడూ మందికొంపలు ముంచుడే. ప్రతివాని వెనుకా ఎవడో ఒక గాడ్‌ఫాదర్‌.. ఎవనిదో దన్ను.. చివరికి అందరూ అక్కడ పైనుండి ఆడమంటే ఆడి, పాడమంటే పాడి.. కూర్చోమంటే కూర్చుని, నిలబడమంటే నిలబడి.. అంతా తోలుబొమ్మలాట.
ముక్కుతాళ్ళక్కడ.. ఒట్టి ఆడే బొమ్మలిక్కడ.
ఈ తోలుబొమ్మ జీవితం తనకు అవసరమా..?
ముఖ్యమంత్రి.. రాత్రి కూలంకషంగా పరిశీలించిన ఓ ఫైల్‌ఫోల్డర్‌ను తన టేబుల్‌ సొరుగులోనుండి బయటికి తీసి అప్రయత్నంగానే తెరచి ఓసారి తిరగేశాడు యథాలాపంగా. దాదాపు డెబ్బయిరెండు కేసులు.. మంత్రులు, శాసనసభ్యులు.. ఐఎఎస్‌ అధికారులు, వివిధ బోర్డు చైర్మన్లు.. వంటి హై ప్రొఫైల్‌ వ్యక్తుల జాతకాల చిట్టా.. ఋజువుల్తోసహా.,
ఎందుకో ఆయన తనకే అర్ధంగాని ఓ అంతర్వేదనలో.. నిర్వేదంలో.. నిశ్చేష్టలో కంపించిపోతూ.. అప్పుడతను కాలుతున్న కాగితంలా ఉన్నాడు.
కాగితం కాలిపోతూంటే అక్షరాలుకూడా కాలిపోతాయా..?

(సశేషం)

వీలునామా – 34 వ భాగం

veelunama11

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

ధనార్జన

మిసెస్ పెక్ తన గ్లాసులోని బ్రాందీని నెమ్మదిగా తాగుతూ వ్యూహాన్ని సిధ్ధం చేసుకొంది. లేచి మెల్లగా డెంస్టర్ పక్కనెళ్ళి కూర్చుని, తన ‘జీవిత గాథా ను అత్యంత దయనీయంగా ఆతనికి విశదీకరించింది. మధ్య మధ్య కన్నీళ్ళు పెట్టుకుంటూ, కొన్నిసార్లు లేని కన్నీళ్ళు తుడుచుకుంటూ ఆమె చెప్పిన మాటల సారాంశం-

తను చెప్పినట్టు ఇంతకుముందే తనకొచ్చిన ఉత్తరం తన కూతురు మరణానికి చేరువలో వుందన్న కబురుతో వచ్చింది. తనకి రెక్కలు కట్టుకొని మెల్బోర్న్ లో వున్న కూతురి దగ్గరకి వెళ్ళాలని వుంది కానీ, తనదగ్గర కనీసం ప్రయాణానికి కావాల్సిన డబ్బు లేదు. అల్లుడు మంచివాడే కానీ, పాపం వాళ్ళ సంపాదన వాళ్ళకే సరిపోవడం లేదు. దానికి తోడు ఎడతెగని దురదృష్టం వాళ్ళని పట్టుకు పీడిస్తోంది.

“…ఆ ఇంట్లోకి వైద్యుడు వెళ్ళని రోజుండదంటే నమ్మండి! పురుళ్ళూ, లేకపోతే చావులూను. ఇహ డబ్బు ఎమ్మంటే ఏ మగవాడు మాత్రం ఎక్కణ్ణించి తెస్తాడు చెప్పండి? డెంస్టర్ గారూ, నేను చిన్న చిన్న చేబదుళ్ళు వాళ్ళకెన్ని సార్లిచ్చానో లెక్కలేదు. ఈ మధ్య నాక్కూడా డబ్బుకి ఇబ్బంది గానే వుంది. పిల్లది చావు బ్రతుకుల్లో వున్నా వెళ్ళలేకపోతున్నాను. రెక్కలుంటే కట్టుకుని ఎగిరిపోయేదాన్నే!తల్లి ప్రాణం ఎలా కొట్టుకుందో ఎవరికర్థమవుతుంది?”

“ఇంతకీ మీ అల్లుడిదే ఉద్యోగం?” అనుమానంగా అడిగాడు డెంస్టర్.

“హయ్యో రాత!నిలకడైనఉద్యోగం అంటూ ఏదీ లేదు కానీ, కేంప్బెల్ కంపెనీలో చేతి పన్లు చేస్తూ వుంటాడు.”

“ఆ కంపెనీలో జీతాలు బానే వుంటాయే!”

“చెప్పాగా! ఎప్పుడూ బాలింత, చూలింత! పైగా మెల్బోర్న్ లో ఖర్చులెలావుంటాయో మీకు తెలియదా? పాపం మంచివాడే, బయటి వ్యాపకాలు కూడా లేవు. ఇంకా చిన్నారి మేరీ పెళ్ళి కూతురి దుస్తుల్లో నా కళ్ళల్లో మెదులుతూనే వుంటుంది. అప్పుడే నూరేళ్ళు నిండిపోతున్నాయి నా తల్లికి!” పెక్ గట్టిగా కళ్ళు తుడుచుకుని వెక్కిళ్ళు పెట్టింది.

“మేమసలు బ్రతికి చెడ్డ వాళ్ళమండీ డెంస్టర్ గారూ! అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటుండదు. మన ఇంగ్లండు వదిలి ఇక్కడికొచ్చి ముఫ్ఫై యేళ్ళ పైనే అయింది. ఇందాక మీరూ ఫ్రాంక్ లాండ్ గారి భార్యా మాట్లాడుకున్నారు చూడండి? వాళ్ళల్లో చాలా మంది బాగా తెలుసు నాకు. నా స్నేహితులూ పరిచయస్తులంతా సిడ్నీలో వుండబట్టి ఈ గతి పట్టింది మాకు. ఈ దిక్కుమాలిన అడిలైడ్ లోఎవరూ తెలియదు మాకు! సిడ్నీ లో హంటర్ గారి కుటుంబం వుంది చూడండి, వాళ్ళు బాగా దగ్గరి స్నేహితులు మాకు.”

“మీకు ఫిలిప్స్ కుటుంబం తెలుసన్నారుగా, వాళ్ళని సహాయం అడగలేకపోయారా?” ఇంకా ఆమెని అనుమానంగానే చూస్తూ అడిగాడు డెంస్టర్.

“ఫిలిప్స్ కుటుంబం కంటే హంటర్ గారి ఆవిడ నాకు మంచి స్నేహితురాలు, నీ అడిగి చూస్తా……”

“అది వీలుపడదు లెండి. హంటర్ గారి కుటుంబం లండన్ లో వుంది. శ్రీమతి హంటర్ మరణించి నాలుగేళ్ళవుతుంది!”

“హయ్యయ్యో! ఎంత పని జరిగింది!”

“మరే! అంత మంచి స్నేహితురాలి మరణ వార్త మీకు తెలియకపోవడం వింతగా వుంది,” వెటకారంగా అని లేచి నిలబడ్డాడు డెంస్టర్.

“చూడమ్మా! నువ్వు మాట్లాడే మాటల్లో సగానికి పైగా అబధ్ధాలే నని నాకు తెలుసు. మెల్బోర్న్ వెళ్ళాలనుకుంటున్న మాట నిజమే, కానీ మరణించబోయే కూతుర్ని చూడడానికి మాత్రం కాదు. కాబట్టి డబ్బుకోసం ఇంకెవర్నైనా వెతుక్కో!” నిర్మొహమాటంగా అని అక్కణ్ణించి వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు.

“ఎంత మాటన్నారండీ! అయినా నేనేమీ మిమ్మల్ని దాన ధర్మాలడిగానా? అప్పు మాత్రమే కదా అడిగాను. నెలతిరిగేలోగా నాకందే డబ్బు రగానే మీ డబ్బు వడ్డీతో సహా మీ మొహాన పారేసేదాన్నే కదా? సరే పోన్లెండి, పడ్డవారెప్పుడూ చెడ్డవారు కాదు. ఒక చిన్నవిషయం చెప్పండి, మెల్బోర్న్ నించి ఎవరైనా డ్రాఫ్టో చెక్కో పంపితే ఇక్కడ బాంకిలో డబ్బిస్తారా?”

“ఆ డ్రాఫ్టో చెక్కో మీ పేరు మీదే వుండి, మీరు మీరే అని నిరూపించుకోగలిగితే తప్పక ఇస్తారు,” డెంస్టర్.

ఇహ ఆమె మాటలు వినడానికి ఓపికలేక అక్కణ్ణించి వెళ్ళిపోయాడతను తన గదిలోకి.డెంస్టర్ దగ్గర తన ప్రయత్నం బెడిసి కొట్టడంతో దిగాలు పడింది పెక్. కాసేపాలోచించి హోటల్ యజమాని ఫ్రాంక్లాండ్ కి గాలం వేయాలని నిశ్చయించుకుంది. అయితే ఆయన దగ్గర కొంచెం కథ మార్చదలచుకుంది. తనకొక జబ్బు పడ్డ కూతురున్నమాట నిజమే. అయితే ఈ సారి మెల్బోర్న్ ప్రయాణానికి కారణం వేరే.

తనకి మెల్బోర్న్ లో చాలామంది చిన్న చితకా రావల్సిన బాకీలున్నాయనీ, అయితే ప్రయాణానికి సరిపడా డబ్బు లేక అదంతా వొదులుకోవాల్సి వస్తుందనీ బొంకిందామె. ఎప్పుడూ లేనిది ఎంత కష్టపడి పని చేసినా తన భర్తకి రావాల్సిన జీతం డబ్బులు కూడా అందకపోవడం వల్ల ఇంత కటకటగా వుంది! ఆమె మాటాలకీ విన్నపాలకీ ఫ్రాంక్ లాండ్ కరిగిపోయేవాడే, వున్నట్టుండి ఆయన భార్య వచ్చి అడ్డు చెప్పకపోయినట్టయితే. ప్రస్తుతం ఆ హోటల్ ఆజమాయిషీ అంతా ఆమెదే అవడం వల్ల భర్య మాటకి ఎదురాడలేకపోయాడు ఫ్రాంక్ లాండ్.దాంతో అక్కడా విఫలమైంది ఆమె ప్రయత్నం.

మర్నాడు ఆమె ఆ హోటల్లో భర్తను తాకట్టు వుంచి పోస్టు కోసం వెళ్ళే బగ్గీలో అడిలైడ్ నగరం చేరుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం కల్లా హోటలుకివ్వాల్సిన పైకం తెస్తానని ఫ్రాంక్ లాండ్ దంపతులకి వాగ్దానం చేసి మరీ బయలుదేరింది. ఎలాగైనా ఆ రోజు పది పన్నెండు పౌండ్లన్నా పుట్టించాలి. వేరు దారి లేదు.

వకీలు టాల్బాట్ తనకి రాసిన వుత్తరం చేతిలో పట్టుకుని ముందుగా కనిపించిన బాంకిలోకెళ్ళింది. ఆ ఉత్తరాన్ని అక్కడ గుమాస్తా కిచ్చి తన గోడు చెప్పుకుంది. అయితే పాపం అక్కడా ఆవిడకి చుక్కెదురైంది. నువ్వెవరో తెలియకుణ్డా కేవలం ఆ ఉత్తరం బలం మీద ఒక్క చిల్లి గవ్వ ఇవ్వనన్నాడా గుమాస్తా. కోపంగా వెనక్కి తిరిగింది మిసెస్ పెక్. ఆంఎకేం చేయాలో తోచలేదు. మర్నాడే ఒక స్టీమరు అడిలైడ్ నించి మెల్బోర్న్ బయల్దేరుతుంది. ఎలాగైనా దాన్లోకెక్కగలిగితే చాలు. కానీ, ఎలా డబ్బు పుట్టించడం?

ఆలోచనల్లోనే ఆమె తాను అడిలైడ్ లో వున్న ఇంటివైపు నడిచింది. అది చాలా ఇరుకైన వీధి. అయితే అద్దె సరిగ్గా కట్టలేదని అక్కణించి తమని తరిమేసారు. ఏదో అలవాటు చొప్పున అక్కడికొచ్చింది. తానెప్పుడూ సరుకులు కొనే కొట్టు ముందర తాను నిలబడ్డట్టు గమనించింది మిసెస్ పెక్.

“హలో మిసెస్ స్మిత్! బాగున్నావా?” కొట్టు లో కూర్చున్న యజమానురాలిని పలకరించింది.

“మీరా మిసెస్ పెక్? బాగున్నారా? బహుకాల దర్శనం! అయినా అలా వున్నట్టుండి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారే?” ఆవిడ పలకరించింది.

“అవునమ్మా! అనుకోకుండా ఆయనకీ నాకూ మంచి కొలువులు దొరికేసరికి ఉన్నపళాన బయల్దేరాల్సొచ్చింది. ఇక్కడంతా బాగేనా?”

“ఆ బాగేలే! నాలుగేళ్ళ కింద ఇల్లొదిలిపోయిన నా మొగుడు నిన్న రాత్రే తిరిగొచ్చాడు. ఉత్తరం పత్తరం లేకుండా దిగబడ్డాడు. ఇన్నాళ్ళూ నేను బ్రతికానో చచ్చానో చూడలేదు, కానీ ఇప్పుడు మహా ప్రేమ వొలకబోస్తున్నాడు.” చిరాగ్గా అంది మిసెస్ స్మిత్.

“ఏమిటీ? ఇప్పుడు తగుదునమ్మా అని వొచ్చాడా? చీపురు తిరగేసి తరిమెయ్యాల్సింది!”

“నేనూ అదే అనుకుంటున్నాను. నీకు హేరీ గుర్తున్నాడుగా? నేనూ హేరీ ఇంకొద్ది రోజుల్లో పెళ్ళి చేసుకుందామనుకుంటూంటే ఏమిటీ రభస నాకు? ఇప్పుడొచ్చి తానేదో వారం వారం ఉత్తరాలు రాసిన మొగుళ్ళా సాధింపు!”

“చేతిలో చిల్లి గవ్వ లేక మళ్ళీ నీ పంచన చేరాడు కాబోలు.”

కొంచెం తగ్గింది మిసెస్ స్మిత్.

“అదేం లేదులే. బాగానే సంపాదించినట్టున్నాడు. దాదాపు మూడు వందల పౌండ్లకి పైనే సంపాదించానంటున్నాడు.” మెత్తబడింది మిసెస్ స్మిత్ కంఠం.

“ఇంటిల్లిపాదికీ బహుమతులూ పట్టుకొచ్చాడు,” మళ్ళీ తనే అంది.

ఇంతలో అక్కడికి స్మిత్ వచ్చాడు. మిసెస్ పెక్ ని చూసి అదిరిపడ్డాడు.

“మీరిక్కడ వున్నారేంటి మిసెస్…! పేరు మర్చిపోయాను కానీ మీరు బాగా తెలుసు నాకు.”

చిరునవ్వు నవ్వింది మిసెస్ పెక్.

“హలో మిస్టర్ స్మిత్. నా పేరు మిసెస్ పెక్. మనిద్దరం బెండిగో వూళ్ళో కలిసాము.”

 

స్మిత్ మొహం ఎర్రబడింది. ఇబ్బందిగా నవ్వేస్తూ,

“అవునవును. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను. రండి లోపలికి! సూసన్! కొంచెం తాగడానికో తినడానికో ఏమైన వుంటే పట్తుకురాకూడదూ? రండి మిసెస్ పెక్, ఇలా వొచ్చి కూర్చొండి.”

మర్యాదలు వొలకబోసాడు. మిసెస్ పెక్ నవ్వుతూ వొచ్చి కూర్చుంది.

“అబ్బబ్బ ఏం ఎండ! కొంచెం చల్లగా వుండేదేదైనా తగడానికివ్వమ్మయ్. పాత స్నేహితులని కలుసుకొని మాట్లాడడంలోని ఆనందమే వేరు. ఏమంటారు స్మిత్?”

“అవునండీ! సూసన్!ఇలా రా, నువ్వూ వొచ్చి కూర్చో! ఈ అమ్మాయేమిటో కాని మిసెస్ పెక్, చూసిన కొద్దీ చూడాలనిపిస్తూంది. మా పెళ్ళయి ఇన్నేళ్ళయిందా? ఇంకా నా కళ్ళకి కొత్త పెళ్ళికూతుర్లాగే కనపడుతుంది, అదేం మాయో మరి! దేవుడి దయవల్ల నేను సరిగ్గా సమయానికొచ్చాను. లేకపోతే వాడెవడో నా పెళ్ళాన్ని యెగరేసుకు పోవాలని కాచుకు కూర్చున్నాడు. అయినా సూసన్ దేమీ తప్పు లేదు లెండి. నా వుత్తరాలు అందకపోయేసరికి తను మాత్రం ఎంత కాలం ఎదురుచూస్తుంది? నాలుగేళ్ళాయే! ఎన్నెన్ని వుత్తరాలు రాసాను! ఒక్కటీ అందలేదట!”

“నువ్వసలు రాస్తే కదా అందటానికి!” నిర్లిప్తంగా అంది సూసన్.

“ఎంత మాటన్నావు సూసన్! మీరే చెప్పండి మిసెస్ పెక్! బెండిగో లో నేనెలా సూసన్ నామ జపం చేసేవాడినో, ఎన్నెన్ని వుత్తరాలు పోస్టు డబ్బాలో వేసేవాడినో, మీరంతా నన్ను చూసి ఎలా నవ్వే వారో అన్నీ చెప్పండి! అప్పుడైనా మహా రాణీ గారికి నమ్మకం కలుగుతుంది నామీద.”

మిసెస్ పెక్ ఈ అవకాశాన్ని వొదులుకో దల్చుకోలేదు. వెంటనే రంగం లోకి దూకింది.

“హయ్యో సూసన్! మిస్టర్ స్మిత్ అంటే ఇంకెవరో అనుకున్నా. ఈయనేనన్నమాట. అబ్బాయి చెప్పేదంతా నిజమేనమ్మా!నిల్చున్నా కూర్చున్నా నీ ధ్యాసే ననుకో! అతను చెప్పేదాంట్లో ఒక్క అబధ్ధమూ లేదు. కావాలంటే నాదీ సాచ్చీకం!ఆ..”

“హమ్మయ్య! నన్ను ఒడ్డున పడేసారు. ఇంకొంచెం నాలుగు చుక్కలు బ్రాండీ పోస్తా మీ గ్లాసులో.”

“ఆ, చాలు చాలు బాబూ. మీ ఇద్దరి ఆనందం చూస్తూంటే కళ్ళ నిండుగా వుందనుకో. అయినా నేనిప్పుడున్న కష్టాల్లో ఎవరి సంతోషాల్నీ పట్టించుకునే పరిస్థితిలో లేను,” దీనంగా అంది.

“అయ్యొయ్యో! అదేం మాట మిసెస్ పెక్! ఇంత మంది స్నేహితులం వుండగా మీకేం కష్టం! అదేంటో చెప్పకపోతే నేనూరుకోను. చెప్పండి, దయ చేసి,” గారాబం చేసాడు కొత్త మిత్రుడు.

“హయ్యో నాయనా!పరాయిలతో మన ప్రస్తావనెందుకని వూరుకున్నా. నీ అభిమానం ముందు చెప్పకుండా వుండలేకపోతున్నాననుకో. ఏం లేదు బాబూ! నాకు ఇప్పటికిప్పుడు పన్నెండు పౌండ్లు కావాలి. అప్పుగానేనయ్యోయ్! బెండిగోలో వినే వుంటావు. నాకు నెల నెలా స్కాట్ లాండు నుండి పెన్షన్ అందుతుంది.”

ఆమె మాట కాదనే ధైర్యం లేదు స్మిత్ కి. తల వూపాడు బలహీనంగా.

“ఈ మధ్య నాకూ , పెక్ గారికీ ఆరోగ్యం ఏమాత్రం బాగుండడం లేదు. డాక్టర్లకీ, మందులకీ ఎక్కడి డబ్బూ చాలడంలేదు. ఒక్క పన్నెండు పౌండ్లు సర్దావంటే నా పెన్షను రాగానే వడ్డీతోసహా నీకప్పచెప్తాను!”

“మీరంతగా అడగాలా మిసెస్ పెక్! మీకిచ్చిన డబ్బెక్కడికీ పోదని నాకు తెలుసు. అయినా అవసరానికాదుకోకపోతే ఇహ స్నేహం ఎందుకు? సూసన్! ఆ డబ్బలా అందుకో!”

పన్నెండు పౌండ్లూ చేతిలో పడ్డాయి మిసెస్ పెక్ కి. ఆమె హాయిగా నిట్టూర్చింది.

ఆమెకి స్మిత్ బెండిగో లో తెలిసిన మాట నిజమే. అయితే అక్కడ అతను ఇంకొక పేరుతో , వేరే ఎవరికో భర్తగా చలామణీ అయ్యేవాడు.అడిలైడ్ లో భార్య నడుపుతూన్న కొట్టు గురించీ, సంపాదించుకుంటూన్న డబ్బు గురించీ విని వొచ్చి ప్రేమ వొలకబోస్తున్నాడని అతన్ని చూసిన క్షణంలోనే పసిగట్టిందామె. ఇప్పుడిహ చచ్చినా ఈ పన్నెండు పౌండ్లని తిరిగి అడగడు. సంతోషంగా గర్వంగా మర్నాటి ప్రయాణానికి తయారవసాగిందామె.

(సశేషం)

శారద

శారద

భారతరత్న

drushya drushyam 29

అత్యంత సామాన్యమైన చిత్రాల్లో ఇదొకటి.
ఒక గుమస్తా దేశరాజధాని అయిన ఢిల్లీలో ఉదయాన్నే తన కార్యాలయానికి బయలుదేరుతున్నప్పుడు తీసిన ఫొటో.

ఇందులో ఏమీ లేదు.
నిజమే.

కానీ, ఇది పబ్లిక్ పరేడ్లో ప్రదర్శనకు పెట్టదగ్గ ఫొటో.
కానీ, ఏముందని పెడతారు?

నిజమే.
ఇందులో ఏమీ లేదు.
సామాన్యం. సాధారణత్వం.
అంతే.

నిజానికి మీరు కోటిరూపాయలు ఇవ్వండి. ముఖ్యమంత్రి చిరునవ్వులు చిందిస్తున్నప్పుడు చిత్రీకరించమనండి.  పారిపోతాను. ఒక కోటీశ్వరుడు ధీమగా తన సామ్రాజ్యం ముందు ఫోజు ఇస్తున్నప్పుడు తీయమనండి. అవకాశం ఉంటే చంపేస్తానుగానీ తీయను. పోనీ, రేపు తెలంగాణ జెండా పండుగ రోజు ఉద్యమ ఫలితంగా అధికారం చేబూనిన అధినేతను చిత్రీకరించమని అసైన్మెంట్ ఇవ్వండి. లాభం లేదు. చేతులు రావు.
క్షమాపణలు చెప్పి ఊరుకుంటాను.

ఇదొక చిత్రమే.
ఇదీ చిత్రమనే ఈ దృశ్యాదృశ్యం.

నిజం. సంబురంగా ఉన్నప్పుడు ఊరేగే మనుషులను చిత్రీకరించడం కన్నా ఆ సంబురానికి ముందర జీవితాన్ని చెప్పడం చిత్రం. ఆ మందరి కాలాన్ని పోరాటమయం చేసిన మానవుల గురించి రాగం తీయమంటే అది శ్రావ్యం, ఆనందదాయకం.

అంతెందుకు? ఒక పెళ్లి ఫోటో తీయడం కన్నా ఒక అమ్మాయి తన కలల్ని సఫలం చేయమని దేవుడి ముందు చేతులు జోడించిన దృశ్యం తీయాలనిపిస్తుంది. తలలో ఒక పువ్వు తురుముకుని, తప్పక తన ప్రార్థన ఫలిస్తుందని గిరుక్కున వెనుదిరిగేప్పుడు తీయాలనిపిస్తుంది. అంతేగానీ, తీయమంటే తీయడానికి వాళ్లు మనుషులైతే సరిపోదు. మాన్యులు కావాలి. నిర్మలం సామాన్యం అయి ఉండాలి. అంటే ప్రదర్శనకు పెట్టని సాధారణత్వం.

నిజమని నమ్మండి. నాలుగు స్తంబాలాటలో అన్నీ అధికారాన్ని కాపాడేవే అయినప్పుడు అందులో అనివార్యంగా తలదాచుకున్న వాళ్లను పురుగుల్లాగా తీయమంటే తీయడం కూడా అయిష్టమే.
హీరోల్లాగా తీయాలని ఉంటుంది.

తాము ఎటువంటి పరిస్థితిలోనైనా ఉండనీయండి, దైనందిన జీవితంలో ప్రతి క్షణాన్నీ సుందరమయం చేసుకునే ఎదురీతల జీవితాలను తీయడమే నిజమైన బుద్ది. సహ్రుదయత.
అంతేగానీ, తీయమంటే తీయడానికి ఇవి జీవనచ్చాయలా ఇంకొకటా?
జీవితాలు. రక్తమాంసాలతో, చీమూ నెత్తురుతో వెలిగే ఆత్మనిగ్రహాలు.

తడి ఆరని గొంతులకోసం ఒక ఆర్తిగీతం పాడే జయరాజును తీయమంటే తీయబుద్ధవుతుంది.
తరతరాల దైన్యాన్ని మానని గాయంలా రాజేసే గోరటిని తీయమంటే తీయాలనిపిస్తుంది.
సామాన్యం, సాధారణత్వం. ఇవే చిత్రాలుగా తీయబుద్ధవుతుంది.

+++

ఈ ఫొటో అట్లాంటిదే.
తీసి పెద్దది చేసి ప్రదర్వనకు పెట్టినపుడు ఎవరూ అభినందించలేక పోవచ్చు.
కానీ, అంతకన్నా పెద్దది జరుగుతుంది.

ఒకరోజు అదే జరిగింది. ఇటువంటిదే ఒక రిక్షాను ప్రదర్శించినప్పుడు ఒక దళిత కవి, విద్యార్థి సోదరుడు వచ్చి అడిగాడు, కావాలని! ‘అది మా నాయిన కష్టాన్ని గుర్తు చేస్తున్నది అన్నా, కావాలి’ అన్నడు. ఇచ్చి రుణం తీర్చుకున్న.

ఒక రకంగా తాను తన తండ్రిని గుర్తుచేసినందుకు తీర్చుకున్నరుణం కూడా అది.
అలాగే, తరతరాలుగా రిక్షాలో పయనించిన మానవజాతి రుణం అట్లా సులువుగా తర్చుకున్నతరుణం అది.
ఒక పరేడ్లో పెట్టే ఫొటో అట్లా ముందు ఒక ఇంటికైతే పంపిన తృప్తి నాది.

సామాన్యమైనదే తీయాలి. ప్రదర్శించాలి. మామూలు మనుషులనే తీయాలి. అప్పుడు తాను గొప్పవాడు అవుతాడు.
సామాన్యం అసామాన్యం అవుతుంది. ఇదంతా ఒక నిదానం. చినుకు చినుకు కురవడం. వర్షమే కురుస్తుందునుకుని భూమి తడిని ఆస్వాదించే అదృష్టం. ప్రతి దృశ్యాదృశ్యంతో.

+++

తీయబుద్ధవుతుంది.
సామాన్యుల జీవనచ్ఛాయలను తీసుకుంటూ పోయే ఒక పని అవిరళంగా జరగాలనీ, దాన్ని నిరాటంకంగా రాయాలనీ అనిపిస్తుంది.

ఈ ఫొటో చూడండి. చక్కగా ఉతికిన దుస్తులు. మల్లెపువ్వసొంటి అంగి. కాఖీ ప్యాంటు. నీట్ గా తుడిచిన సైకిలు. సీటు చెమటకు ఇబ్బంది పెట్టకుండా నిండుగా ఖర్చిఫ్ రక్షణ.  కోడలు ఉదయాన్నే లేచి మామయ్యకు సిద్ధంచేసిన లంచ్ బాక్సు. దాన్ని శ్రద్ధగా అమర్చుకున్న తీరు. భార్య తన అభిమానాన్ని ఏ మాత్రం ప్రదర్శనకు పెట్టకుండా తాను వెళుతుంటే అట్లా చూసి పంపడమూ ఉంటుంది, ఈ చిత్రానికి ముందు. అంతే. ఇక ఈ చిత్రం ఇట్లానే బయలుదేరుతుంది. చేతి గడియారం చూసుకుంటుంది. సమయం మించకుండా వెళ్లి తన పని తాను చేసుకుని మళ్లీ సాయంత్రం చిత్రంగా ఇంటికి తిరిగి వస్తుంది.
మళ్ళీ ఈ సైకిల్ చిత్రం రేపూ ఇట్లే పయణిస్తుంది. మళ్లీ గూటికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటుంది.
ఇంత చిత్రజీవితం ఇంతే. మామూలే.

ముఖం లేదు ఎందుకూ అంటే ముక్కూమొహం తెలియకుండానే కోట్ల మంది మనకిట్లా కనిపిస్తారు, కార్యాలయాలకు వెలుతూ,  ఫ్యాక్టరీలకు పోతూ, భూమిని దున్నుతూ…అయినా ఈ మనిషి తనను తాను ప్రదర్శించుకోడు.

తానొక్కడే ఈ భూమ్మీద లేడు మరి! అందువల్లే తన మొహం అంత ముఖ్యం కాదనుకుంటాడు.
నేనూ అదే అనుకుంటాను. మొహంతో సహా చెప్పవచ్చు. కానీ, ఇది ఒక వ్యక్తి చిత్రం కాదు. సామూహిక వ్యక్తీకరణకు ఒక చిహ్నం. అందుకే తానూ, తన సైకిలూ, తన జీవన పయణం. ఉద్యోగ ధర్మం… అంతా ఒక చిత్రాచిత్రం. దృశ్యాదృశ్యం.
క్రమశిక్షణతో, నియమబద్ధంగా అంతా ఒక పద్ధతిలో జరిగిపోతూ ఉండే పరంపర చిత్రం.

+++

వీళ్లను “ఆమ్ ఆద్మీ’ అని చెప్పి ఒకరు తాజాగా రాజరికానికి వస్తరు. కానీ, విడిచిపెడతారు.
ఇంకొకరు “నమో ఛాయ’ అని బయలుదేరుతారు. రాజ్యానికి చేరుకుంటరు. కానీ, విడిచిపెడతరు.

ఇట్లా వచ్చిన వాళ్లు… పోయిన వాళ్లు ఉండనే ఉన్నరు.
కానీ, స్వాతంత్ర్యానంతరం ఇతడు మాత్రం తన మానాన తాను పనిచేసుకుంటూనే ఉన్నడు.
బహుశా ఓటు వేయడానికీ కూడా ఈయన ఇట్లే బయలుదేరుతాడు.

తెలుసు. ఏమీ కాదనీ తెలుసు.
కానీ, ఓపిగ్గా తన పయణాన్ని తాను చేబూనే మహానుభావులు వీళ్లు.
వీళ్ల చిత్రాలను తీసినందుకుగానూ నాకు “భారతరత్న’ ఎప్పుడొస్తుందో అప్పుడు నేను ఈ పని నిజంగానే మనేయాలి.
అంతదాకా విరామమెరగక నా కలం, కన్నూ పనిచేయవలసిందే.

నాలాగా ఎందరో, గుమస్తాలు. పాత్రికేయులు. కవులు, రచయితలు.
విజ్ఞులు. అందరికీ అభినందనలు.

~ కందుకూరి రమేష్ బాబు

ramesh

ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా…

Missamma

ఒకప్పటి సినిమాల్లో పాటలుండేవి. అంతే కాదు పాటకు సినిమా కథకి సినిమా మొత్తం నిర్మాణానికి ఒక అంగాంగి సంబంధం ఉండేది. సినిమా మొత్తాన్ని ఒక కావ్యంగా అంటే సుష్ఠు నిర్మితితో చేయాలని పాటల్ని దానిలో విడతీయలేని భాగం చేయాలనే తపన ఒకటి కూడా ఉండేది. తెలుగు సినిమాహాళ్ళల్లో పొగరాయుళ్ళు సినీమాలో పాట మొదలు కాగానే బయటికి పోయి ఆవురావురు మంటూ ఒక సిగరెట్ లాగించేసి తిరిగి పాట అయి పోయే సరికే లోనికి వస్తూ ఉండేవారు. ఇక్కడ తాత్పర్యం ఆ పాట వినకపోయినా చూడక పోయినా సినిమా అర్థం కాని పరిస్థితి కాని వచ్చే లోపం ఏమీ లేదని.

కాని ఒకప్పటి సినిమాల్లో పరిస్థితి ఇలా ఉండేది కాదు. సినిమాలో పాటకు సినిమా కథకు కథ నడిచే పద్ధతికి అంత విడదీయరాని సంబంధం ఉండేది. పందొమ్మిది వందలో ఏభై దశకంలో వచ్చిన సినిమాల్లో చాలా వాటిల్లో చందమామ పాటలు ఉండేవి. అంటే చందమామా అని వంత వచ్చే జానపద గీతాల గురించి కాదు చెప్పేది. ప్రణయ సందర్భంలో కాని విషాద సందర్భంలోగాని ఇంకో సందర్భంలో కాని నాయికా నాయకులు ఇతరులు కూడా చందమామని పాటలో పెట్టి లేదా అతన్ని ఉద్దేశించి పాటలు పాడేవారు. మనకి 1931లో మాట్లాడే సినిమా మొదటిది భక్త ప్రహ్లాద రాగా 1937 దాకా పౌరాణిక సినిమాలే వచ్చాయి. మొదటి సాంఘిక సినిమాగా మాలపిల్ల వచ్చింది అదే సంవత్సరంలో వచ్చింది దేవత సినిమా. ఇక అక్కడనుండి సాంఘిక సినిమాలు రావడం ఎక్కువైంది. ఈ సాంఘిక సినిమాల్లో పైన చెప్పినట్లుగా చందమామను తలచుకునే పాటలుండేవి. వీటిలో అద్భుతమైన సాహిత్యం ఉండేది. తొలినాటి నుండి ఇటీవలి సినిమాల దాకా చందమామ పాటలు చాలా వచ్చాయి. వాటిలో మంచి వాటిని తీసుకొని ఇక్కడ వివరించి చెప్పాలనే ఉద్దేశం ఈ వరుస వ్యాసాలు రాస్తున్నాను.

మిస్సమ్మ సినిమా 1955 లో వచ్చింది. అంటే ఇప్పటికి దాదాపు అరవై సంవత్సరాలు అయింది. కాని తెలుగు వారు ఈ తియ్యటి సినిమాని మర్చిపోలేదు. ఇప్పటికీ ఏ ఛానల్లో వచ్చినా దాన్ని నూరు శాతం ఆనందిస్తున్నారు. ఇందులోని ప్రతిపాట ఒక ఆనంద రసగుళిక. ఇందులో రెండు చందమామ పాటలున్నాయి. వీటినే నేను వెన్నెల పాటలు అని అంటాను. మిస్సమ్మలో లీల పాడిన రావోయి చందమామ మా వింత గాథ వినుమా అనే పాట ఇప్పటికీ ఎంత బహుళ వ్యాప్తంగా అందరికీ  ఆనందాన్ని కలిగిస్తుందో చెప్పవలసిన పనిలేదు. దానికన్నా నాకు నచ్చిన వెన్నెల పాట ఇంకొకటి ఉంది. దాన్ని కింద ఇస్తున్నాను. చదవండి వినండి తర్వాత దీన్ని చదివితే  మీ ఆనందం మిన్నుముట్టుతుంది.

 

ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీమాయ.

వినుటయె కాని వెన్నెల మహిమలు

వినుటయె కాని వెన్నెల మహిమలు

అనుభవించి నేనెరుగనయా

అనుభవించి నేనెరుగనయా

నీలో వెలసిన కళలు కాంతులు

నీలో వెలసిన కళలు కాంతులు

లీలగ ఇపుడే కనిపించెనయా

ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీమాయ.

 

కనుల కలికమిడి నీకిరణములే

కనుల కలికమిడి నీకిరణములే

మనసును వెన్నగ చేసెనయా

మనసును వెన్నగ చేసెనయా

చెలిమికోరుతూ ఏవో పిలుపులు

నాలో నాకే వినిపించెనయా

ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీమాయ.

ఈ పాట వినడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

http://www.raaga.com/player4/?id=2159&mode=100&rand=0.2477618893608451

 

ఈ పాట మాధుర్యం వింటే బాగా తెలుస్తుంది. అంతే కాదు సినిమా చూస్తే ఈ పాటలోని గొప్పతనం తియ్యదనం ఏమిటో తెలుస్తుంది. ఇందులో నాయకుడు ఎన్టీఆర్, నాయిక సావిత్రి ఇద్దరూ 1950ల్లో బి.ఎ పాసయ్యారు. ఆనాటికి బి.ఎ పాసు కావడమంటే నేడు పి.హెచ్.డి చేసిన వారికున్నంత స్థాయితో లెక్కవేసేవారు. అయితే ఉద్యోగానికి వచ్చిన అడ్వర్టైజ్ మెంట్లో స్కూలు పంతులు గార్ల ఉద్యోగాలు పడ్డాయి. అందులో మెలికేమిటంటే ఒక ఆడ బి.ఎ ఒక మగ బి.ఎ కావాలని ఇద్దరూ భార్యాభర్తలు అయి ఉండాలని ప్రకటనలో ఉంది. సావిత్రి ఎన్టీఆర్ ఉద్యోగాలకోసం తిరిగి తిరిగి విసిగి పోయారు. దీన్ని చూచి పెళ్ళికాని వాళ్ళిద్దరూ మాకు పెళ్ళి అయిందని అబద్ధం ఆడి, రాసి ఉద్యోగంలో చేరారు. కథలో గమ్మత్తు ఏమిటంటే అప్పటిదాకా వాళ్ళిద్దరికీ పరిచయం లేదు. పరిచయం అయిన రెండు మూడు రోజులకే ఈ ఉద్యోగానికి అప్లై చేశారు. ఆ అమ్మాయి క్రిస్టియన్ అతను హిందూ, ఇద్దరికీ పెళ్ళి కావడం అప్పటి పరిస్థితిలో సాధ్యం  అయ్యే పని కాదు. రెండు నెలలు పని చేసి గొంతు మీద ఉన్న బాకీ తీర్చుకొని పోదామని ఆమె చేరింది.

aVy3KQJ9_592

అబద్ధాలతో బతుకుతుంటారు. భార్యాభర్తలు గా నటించడానికి చాలా కష్టపడుతుంటారు. బయటివాళ్ళు వరుస పెట్టి పిలిస్తే ఆమెకు నచ్చదు. ఒకే ఇంటిలో ఇద్దరు వేరు వేరు గదుల్లో ఉంటారు. ఎవరి వంట వారే చేసుకుంటారు. వీరి రహస్యం వీళ్ళ నౌకరు దేవయ్యకే తెలుసు. వాళ్ళు పనిచేసే బడి యజమాని జమీందారు ఆయన భార్య వీరిద్దరినీ తమ కూతురు అల్లుడూ లాగా చూసుకుంటారు. అలాగే పిలుస్తుంటారు. అలా వరుసలు పెట్టి పిలవడం ఆమెకు ఇష్టం ఉండదు. జమిందారు కూతురు, జమున ఎన్టీఆర్ కి దగ్గర కావడం కూడా సావిత్రికి నచ్చదు. ఆమెకు ఎన్టీఆర్ పైన తనకే తెలియని ప్రేమ కలుగుతున్న కొద్దీ జమిందారు కూతురు జమున పైన అసూయ నానాటికి పెరుగుతుంటుంది. క్రమంగా ఎన్టీఆర్ (రాజారామ్ నాయుడు)ని గాఢంగా ప్రేమిస్తుంది. ఆ విషయాన్ని ఆమె కూడా సరిగ్గా గమనించదు. కాని ప్రవర్తనలో అది అడుగడుగునా అసూయ రూపంలో బయట పడుతుంది. ఈ అసూయతో ఎన్టీ ఆర్ పైన జమునపైన విపరీతమైన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తుంది.

ఈనాటి సినిమాల్లో ఐ లవ్ యూ చెప్పడం ఒక తప్పని సరి ఫార్ములాగా నిలిచింది. ఎన్నో సార్లు ఎంత మంది సమక్షంలోనో చెప్పాలి. ప్రేమ కోసం యుద్ధాలు చేయడాలు వగైరా ఫార్ములాల గురించి ఇక్కడ చెప్పవలసిన పని లేదు. కాని ఇక్కడ సావిత్రి పాత్రను తీర్చిదిద్దిన తీరు గురించి బాగా చెప్పాలి. ఒక కావ్యంలోనో నవలలోనో నాయిక పాత్రను ఒక మంచి నిపుణుడైన కవి ఎలా తీర్చి దిద్దుతాడో సినిమాలో ఈ పాత్రలను అలా తీర్చాడు దర్శకుడు ఎల్వీ ప్రసాద్. నాయిక సావిత్రి ఎన్టీఆర్ ని అంత గాఢంగా ప్రేమించినా అది ఆమె వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దడంలో సహజమైన ఒక పద్ధతిలో చూపుతాడు ఒక మానసిక స్థితిని ఒక నవలలో అద్భుతంగా వర్ణించిన పద్ధతిలో ఆ పాత్ర ప్రవర్తనని చూపుతాడు. కాని ఎక్కడా సావిత్రి నాయకుడిని ప్రేమిస్తున్నానని చెప్పదు. ప్రవర్తనలో కనిపిస్తుంది అదీ వ్యతిరేక రూపంలో. ఇలా సాగే క్రమంలో నాయికతో ఎలా గైనా కాలం గడపాలని కడుపుకోసం నానా కష్టాల పడుతుంటాడు ఎన్టీఆర్. ఈ కష్టం చివరి దశకు వచ్చింది. సావిత్రి గర్భవతిగా పొరపాటు పడి ఆమెకు సీమంతం చేస్తారు జమీందారు దంపతులు వాళ్ళింట్లోనే. అప్పటికే చాలా అసూయని ఆగ్రహాన్ని ఎన్టీఆర్ పైన చూపిస్తూ ఆయన చేస్తున్న తప్పులను తిడుతూ వచ్చిన సావిత్రికి తను అతనిపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నానని అనుకుంటూనే ఉంటున్నా అదే కొనసాగిస్తుంది. సీమంతం చేసిన తర్వాత ఆరాత్రి అక్కడే నిద్రపోవాలని వాళ్ళిద్దరినీ ఒక గదిలోనికి పంపిస్తారు. ముందుగా గదిలో ఉన్న నాయకుడు తర్వాత సావిత్రి లోనికి వచ్చి ఇదంతా అతని కుట్ర అని తనను ఇలా మోసం చేయడానీకే ఇదంతా చేస్తున్నారని తిడుతుందని నాయకుడు తెరచాటున దాక్కుంటాడు. తర్వాత సావిత్రి లోనికి వచ్చిన తర్వాత ఆమెను భయపెట్టి కిటికీలోనుండి బయటికి దూకి ఇంటికి పోతాడు ఆమెను ఇబ్బందికి గురిచేయడం ఇష్టం లేక.

images

సావిత్రి ఇంట్లో వాళ్ళని పిలిచి తనను తన ఇంటికి పంపించమంటుంది. ఆమె అలా ఇంటికి పోయేసరికే కిటికీ లోనుండి దూకి కాలు విరగ కొట్టుకొని (నాటకం) మంచంలో దీనంగా పడి ఉన్న నాయకుడు కనిపిస్తాడు. ఆమెకు అతనిపైని ప్రేమ అతని పట్ల సానుభూతి ఒక్కసారిగా పొంగాయి. అతన్ని మోసుకొని పోయి లోపలున్న తనుపడుకునే పందిరిమంచం మీద పడుకో బెడుతుంది. కాలి బాధతో నిద్రపోలేనంటాడు. తనకు తెలియకుండానే తనలో ఆతని పట్ల ఎంతో గాఢమైన ప్రేమ ఉందని ఆమె తెలుసుకుంటుంది. అతన్ని నిద్రపుచ్చడానికి పాట అందుకుంటుంది. ఇంత కథా సందర్భాన్ని గర్భీకరించుకొని వచ్చిన పాట పైన చెప్పిన వెన్నెల పాట. తన ప్రవృత్తిని తన మనఃస్థితిని ఈ పాటలో కవి వెల్లడిస్తాడు. సినిమా మొత్తానికి కథని మాటలని అందించిన కవి ఒక్కడే కావడం వల్ల కథా సందర్భాన్ని తెలుసుకొని దానికి ఇమిడేలా పాటనురాసాడు పింగళి నాగేంద్రరావు.

ఇప్పడు పాటని చూస్తే విషయం మనకు తెలుస్తుంది. తనలో కలిగిన ప్రేమను ఆ స్థితిని ఏమిటో ఈ మాయ అని అనుకుంటుంది గదిలోనుండి బయటికి వచ్చి బల్లమీద కూర్చుని నింగిలోని చందమామ వైపు చూస్తూ పాడుతుంది సావిత్రి ఈ పాటని. ముఖంమీద వెన్నెల పడే తీరును కెమేరా కళతో చిత్రించిన తీరు కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఓ చల్లని రాజా వెన్నెల రాజా ఏమిటో ఈ మాయ అని చందమామతో చెప్పుకుంటుంది. ఈ స్థాయిలో కూడా నాయిక తన ప్రేమని నాయకుడి ఎదురుగా కూర్చుని చెప్పదు. కుస్తీపట్లుపట్టే లా ఉండే కొరియోగ్రఫీతో నాయికా నాయకులు ఒకరిమీద ఒకరు యుద్ధం చేస్తూ ఉండేలా ఉండే నేటి రోమాంటిక్ డ్యుయెట్లని తలచుకొని ఆ పాటల్ని చూస్తే ప్రేమని ఎంత సున్నితంగా నిజమైన శృంగరంగా చిత్రించారో తెలుస్తుంది.  వినుటయె కాని వెన్నెల మహిమలు అనుభవించి నేనెరుగనయా. అంటుంది. వెన్నెల మహిమ తనపైన ఎలాఉందో అర్థం అయింది. ఇక్కడ వెన్నెల తనలోని ప్రేమకి ప్రతీక చందమామ శైతల్యం ఇక్కడ ప్రణయానికి చిహ్నం. నాయికా నాయకులు కలిసి ఉన్నప్పుడు చందమామ చల్లని రాజు, అదే విరహంలో చందమామ చల్లని వెన్నెలే నాయికకు వేడి మంటలుగా తోస్తుంది. విప్రలంభ శృంగారంలో, విరహంలో  చంద్రుడిని తిట్టడం అప్పటి కావ్యాల నుండి ఇప్పటి దాకా వస్తూనే ఉంది. వెన్నెల మండెడిదీ అని ఒక పాటలో అన్నమయ్య కూడా రాసాడు. వెన్నెల మహిమ ఎలా ఉంటుందో ప్రణయంలో అది ఎంత చల్లాగ ఉంటుందో తనకు ఇప్పటి దాకా తెలియదని చెబుతూ తనకు నీపై ప్రేమ కలిగిందని నాయకుడికి నర్మగర్భంగా చెబుతుంది ఇక్కడి నాయిక సావిత్రి.

13909646434184550535-1

కనుల కలికమిడి నీకిరణములే మనసును వెన్నగ చేసెనయా అని అంటుంది. కనులకలికమిడి అని చెప్పడం అద్భుతమైన తెలుగు పలుకుబడి. తల నెప్పి కలిగినప్పుడు సొంటితో కలికం చేసి కంట్లో రాస్తారు. మొదట భగ్గున మండుతుంది. తర్వాత అద్భుతమైన చల్లదనాన్ని ఇచ్చి తలనొప్పిని పోగొడుతుంది. ఇక్కడ చందమామ కిరణాలే కంట్లో కలికం పెట్టినట్లుగా చేసి మనసును వెన్నెగ చేసాయట. ఇది కవి చేసిన అద్భుతమైన ఊహ. ఆమె మనస్సు వెన్నలా కరిగి ప్రియుడిపైన ప్రేమను వర్షించే స్థితికి చేరిందని చెబుతుంది ఆమె. ఇక చివరిగా చెలిమి కోరుతూ ఏవో పిలుపులు నాలో నాకే వినిపించెనయా అని అంటుంది. ఏమిటో  ఈ మాయ అని చివరిగా పాటని ముగిస్తుంది. తనలో అతనిపైని ప్రేమని పూర్తిగా తెలుసుకున్నానని నాయకుడికి చెప్పే తీరుని వర్ణించిన ఈ పాట ఒక మంచి శృంగార రసగుళిక. వెన్నెలని ప్రేమకి ప్రతీకగా చెప్పిన తీరు చాలా బాగుంది.

పింగళి నాగేంద్ర రావు రాసిన ఈ పాటకి సాలూరు రాజేశ్వరరావు కూర్చిన సంగీతం మరింత మాధుర్యాన్ని తెచ్చింది. అంతే కాదు సినీమా ఈ ఘట్టానికి వచ్చే సరికే ఈ పాటని చూసిన ప్రేక్షకులకి మనస్సంతా ఆనందం ప్రేమ నిండిపోతాయి. ప్రేక్షకులు పాత్రలతో తాదాత్మ్యం చెందుతారు. సింధుభైరవి రాగంలో వచ్చిన ఈ పాట మనస్సుకు హత్తుకునే తీరులో ఉంటుంది. ఈ రాగానికి కూడా ప్రణయాన్ని పలికించే గుణం ఉంటుంది.

ఇలాంటి అద్భుతమైన వెన్నెల పాటలు తెలుగు సినిమాల్లో ఆనాటి వాటిల్లో చాలా ఉన్నాయి. వరుసగా వాటి సాహిత్య ఔన్నత్యాన్ని పరిచయం చేస్తాను.

పులికొండ సుబ్బాచారి

subbanna

 

 

 

శిల్పం మీద మరీ ఎక్కువ ధ్యాస పెడ్తున్నామా?!

2 (1)

ముందుమాట

ముచ్చటగా మూడో నెలలోకి వచ్చాక ఇప్పుడు ముందుమాటేమిటని ఆశ్చర్యపోకండి. మంచో చెడో మూడు నెలలు గడిచాయి. చాలా వరకు మా శ్రమని గుర్తించి వచ్చిన అభినందనలు, అడపాదడపా కథల గురించి విమర్శలు వచ్చాయి. మమ్మల్ని తిట్టే వాళ్ళు ప్రైవేటుగా తిట్టారు. కారణాలు రెండు – ఒకటి మేము చేస్తున్నది గడ్డిమేటలో సూదిని వెతకడమనీ, రెండోది చివరికి ఇది గొంగలిలో అన్నం తింటూ వెంట్రుకలు వచ్చాయని తిట్టుకునే పరిస్థితికి దారి తీస్తుందని. తెలుగు కథలో మంచి కథలు గగన కుసుమాలని చాలా మంది అభిప్రాయం. మేము ఆ అభిప్రాయాన్ని సగౌరవంగా తిరస్కరిస్తున్నామని చెప్పడానికే ఈ ముందుమాట.

విషయానికి వద్దాం. ఈ మూడు నెలలలో మేము చేతనైనంత వరకు అన్ని కథలు చదవాలనే ప్రయత్నం చేశాము. బ్లాగులు, ఒక ప్రాంతంలో మాత్రమే దొరికే పత్రికలు మినహాయించి అందిన ప్రతి కథా చదివాము. వీటిని ఏ ప్రాతిపదికన విశ్లేషించి, మంచి ముత్యాలను వెలికి తీయాలని అన్న విషయంలో మాలో మాకు చాలా చర్చలు జరిగాయి. అవగాహన కుదిరాక, ప్రతి కథని విశ్లేషించేందుకు వీలైయ్యేట్లుగా ఒక మూల్యాంకనా విధానాన్ని తయారు చేసుకున్నాం. సబ్జెక్టివ్ గా ఉండగలిగిన విషయాలని చర్చకు పెట్టి, తద్వారా ఆ అంశ ప్రభావాన్ని చాలా వరకు నియంత్రించే ప్రయత్నం జరుగుతూ వస్తోంది. ఆ వివరాలన్నీ మరోసారి చెప్పుకుందాం. ఈ మూడు నెలలలో మేము గమనించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మననం చేసుకుందాం.

స్థూలంగా నూటాయాభై కథలు ప్రతి నెలా తెలుగుసాహిత్యంలో వచ్చి కలుస్తున్నాయి. ఏ రకంగా చూసినా ఇది చాలా ఆనందదాయకమైన సంఖ్య. అందులో పది మంచి కథలను వెతకటం మాకు ఏమంత కష్టం కూడా కావటంలేదు. ఇంకొంచెం ముందుకెళ్తే, మంచి కథలు కాకపోయినా మరో పది దాకా కథలలో ఏదో ఒక మంచి అంశం వుండటం వల్ల (వస్తువో, శిల్పమో మరొకటో) ఇక్కడ ప్రస్తావించగలిగినవిగా ఉంటున్నాయి. ఇక ఆ పైన ఇక మంచి కథ దొరకడం కష్టంగా వుంటోంది. మరో రకంగా చెప్పాలంటే నూటాయాభై కథలలో సుమారు పదిహేను నుంచి ఇరవై మంచి కథలు వస్తున్నాయి. (మంచి నిర్వచనం కాస్సేపు పక్కన పెడదాం). అయితే ఇవన్నీ అద్భుతమైన కథలేనా అంటే ఒప్పుకోవడం కష్టం. కొన్ని కథలు వస్తుపరంగా గొప్పవిగా వుండి శిల్పంలోనే, నిర్మాణంలోనో, సమకాలీనతలోనో కుదేలౌతున్నాయి.

మరి కొన్ని కథలు కేవలం పదాడంబరమూ, శైలీ, శిల్పాలమీద ఎక్కువగా ఆధారపడి, వస్తువును విస్మరిస్తున్నాయి. ఈ రెండవ రకం క్రమంగా పెరుగుతున్న ట్రెండ్ గా కనిపిస్తున్నప్పటికీ, ఇదో కొత్త మలుపుగా గుర్తించడానికి ఇంకొంచం సమయం పట్టవచ్చు. ఈ ట్రెండ్ మరీ ముఖ్యంగా వెబ్ పత్రికల్లో కనపడుతోంది. రైతులు, పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు, లాంటి కథాంశాలు ఇప్పటికీ కథలలో సింహభాగాన్నిఆక్రమిస్తున్నాయి. కానీ, చాలా కోణాల్లోంచి ఇప్పటికే చర్చించబడ్డ ఆ వస్తువుల్లోంచి ఎలాంటి నవ్యతనైనా రాబట్టడంలో మాత్రం ఎక్కువ కథలు విఫలమవుతున్నాయి. వాటితో పాటుగా మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, గ్లోబలైజేషన్/కన్సూమరిజం, అస్తిత్వవాదం, ఉద్యోగాలలో స్త్రీలు, కార్పొరేట్ ప్రపంచంలోని నీలి నీడలు – ఇలాంటి వైవిధ్యమైన, సమకాలీనమైన కథలు కూడా వస్తున్నాయి! ఆయా వర్గాల గొంతులు వినిపిస్తూనే ఉన్నాయి!

పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల వాళ్ళ వృద్ధాప్యంలో సంతానం చూపే నిర్లక్ష్య ధోరణి కథా వస్తువుగా ఎక్కువ మంది రచయితలు/రచయిత్రులు స్వీకరించడం కనిపిస్తోంది. ఇంక రసం ఏ మాత్రం మిగలని ఈ చెరుకుగడని వదిలేసి కొత్త సమస్యల వైపు తెలుగు కథ దృష్టి సారిస్తే కథలకి మరింత వైవిధ్యం సమకూరుతుందేమోనని మా అభిప్రాయం. అలాంటి కథలే రాయాలనుకున్నా – కనీసం “పరువు” (వాణిశ్రీ, ఆంధ్రభూమి మాసపత్రిక, మార్చ్ 2014) లాంటి కథల్లో ప్రయోగించిన నవ్యతనైనా ప్రదర్శించగలగాలి.

చాలా కథలు పూర్తిగా అపరిపక్వ స్థాయిలో కనిపిస్తున్నాయి. అసలు ఇవి కథలేనా అని శంకించాల్సిన పరిస్థితి! వాటిని చదివిన పాఠకులుగా మా అభిప్రాయం లేదా అనుమానం – కొంత మంది రచయితలు/రచయిత్రులు కథ రాసిన వెంటనే పత్రికలకి పంపిస్తున్నారేమోనని. మా దృష్టిలో ఏ కథకూ మొదటి సారి రాసిన వెంటనే సమగ్ర స్వరూపం సిద్ధించదు. రాసిన తర్వాత రాసిన వాళ్ళే ఒకటికి రెండు సార్లు తమ రచనని తామే పాఠకులుగా మారి చదివితే రచనలో లోపాలు వాళ్ళకే స్ఫురిస్తాయి. ఒక అనవసరమైన వర్ణన, ఇతివృత్తానికి అనవసరమైన ఒక సంఘటన, చెప్పదలుచుకున్నదంతా చెప్పిన తర్వాత ముగింపు దగ్గరకొచ్చేసరికి అనవసరం అనిపించే పొడిగింపు – ఇలాంటివి. అవి సరిచేసి ప్రచురణకి పంపటం వల్ల మంచికథ రాసిన తృప్తి రాసినవాళ్ళకీ, చదివిన తృప్తి పాఠకులకీ కనీసం కొన్ని కథల విషయంలోనైనా పాఠకులకి దొరుకుతుంది.

 

మార్చి కథలు

ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చ్ నెల కొంతవరకు సంతృప్తికరంగా ఉంది. అయితే, బాగున్న కథలు మాత్రం పరిమితంగానే ఉంటున్నాయి. ముందుగా – టాప్ పది కథలలోకి దాదాపు చేరబోయి అడుగు దూరంలో ఆగిపోయిన కొన్ని కథలను గురించి –

ఒక ఆదివారం ప్లాట్ఫామ్ బెంచ్ మీద (స్వాతికుమారి బండ్లమూడి, ఈమాట), అనగనగా ఒక రాత్రి (పూర్ణిమ తమ్మిరెడ్డి, ఈమాట), మనిషివిత్తనం (వి. ప్రతిమ, చినుకు), నడుస్తున్న చరిత్ర (ఆదెళ్ళ శివకుమార్, గో తెలుగు 23 మార్చ్), పౌరుషం (సతీష్ పోలిశెట్టి, కినిగె పత్రిక) – ఈ ఐదు కథలలోనూ శిల్పపరంగానో, వస్తుపరంగానో చెప్పుకోదగ్గ విషయాలు వున్నాయి. మొదటి నాలుగు కథలలో శిల్పం చాలా గొప్పగా వున్నప్పటికి ఇతర విషయాలలో నిరుత్సాహపరిచాయి.

“ఒక ఆదివారం..” కథలో రచయిత్రి స్వగతం ఒక ప్రవాహంలా సాగిపోయింది కానీ ఆగి చూస్తే అందులో కథ చాలా పల్చగా వున్నట్లు తోచింది. అలాగే “అనగనగా..” కథలో కూడా ఒక ఫోక్ లోర్ లాంటి కథను అన్వయం చేస్తూ ఓ స్త్రీ కథ చెప్పే ప్రయత్నంలో కొన్ని విషయాలు స్పష్టపరచకపోవడం వల్ల కథ అసమగ్రంగా వున్నట్లు అనిపిస్తుంది. “నడుస్తున్న చరిత్ర” కథ చదవడానికి బాగున్నా దానిని కథగా అంగీకరించవచ్చా అన్నదే పెద్ద ప్రశ్న (ఇలాంటిదే “గింజలు” – ఆరి సీతారామయ్య, సారంగ 13 మార్చ్ కూడా) . ఆ ప్రశ్నపక్కనపెట్టి పరిశీలిస్తే ఎన్నెన్నో సంబంధిత సంఘటనలను తెచ్చి ఒకే కథలో పెట్టాలనుకోవడమనేది కధకు ఉండాల్సిన క్లుప్తత అనే స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. “మనిషివిత్తనం” చాలా చర్చకు అవకాశం ఇచ్చే కథ. సంతానం కోరుకుంటున్న భర్త లోపాన్ని తెలుసుకోని, అందుకు అక్రమసంబంధం పెట్టుకోవడం కథాంశం. ఇందులో ఆ స్త్రీకి పరాయి వ్యక్తి పైన ప్రేమ వున్నట్లు చెప్పినా, ఒక సమస్యకి ఇలాంటి ఆమోదయోగ్యం కాని పరిష్కారం ఇవ్వడం సబబుకాదేమో ఆలోచించాల్సిన విషయం. ప్రేమ, నైతికానైతికాలు, జీవితం – ఇత్యాది విషయాలు కూడా కథలో సంతృప్తికరంగా చోటుచేసుకున్నట్లయితే, ఇది మంచి కథ అయి ఉండేది. అయితే ఈ కథను ద్వితీయ పురుషలో ప్రతిభావంతంగా రాయడం వల్ల పఠనానుభూతి బాగుంది. “పౌరుషం” కథ వస్తువు పరంగా బానేవున్నా, కొన్ని చోట్ల దారి తప్పటం, హడావిడి ముగింపు వల్ల అందుకోదగ్గ ఎత్తుకు ఎదగలేదు.

ఈ నెలలో వచ్చిన మంచి కథలు అన్నింటినీ కలిపి వ్యాఖ్యానం చేసే బదులు ఒక్కొక్క కథను విడిగా విశ్లేషించాలని అనుకున్నాము. విశ్లేషణ ఒక్కో కథకీ విడివిడిగా చేయడం వల్ల కథలు చదవదలచుకున్నవాళ్ళకి ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది అని కొంతమంది పాఠకులు చేసిన సూచన మేరకు ఈ పనిని కూడా చేపట్టాం. ఈ పని చేస్తున్న మేము ముగ్గురం మేధావులమనో, గొప్ప విశ్లేషకులమనో కాక కాస్త తెలివిడి ఉన్న పాఠకుల చర్చలోని సారాంశాన్ని పొందుపరుస్తున్నామని ఈ వ్యాసం చదువుతున్న రచయితలు, పాఠకులు గుర్తించగలరు!

తప్పు – పి. రామకృష్ణ (ఆదివారం ఆంధ్రజ్యోతి, 2 మార్చ్):వివాహానికి ముందే శృంగారం వల్ల నెల తప్పిన ఒక స్త్రీ భావ సంచలనం. తప్పు జరిగింది. తప్పు ఏ పరిస్థితుల్లో జరిగిందో, అది జరిగాక అబ్బాయి ప్రవర్తనా, సంస్కారం ఏ పాటి ఉన్నాయో తనకి తెలుసు. ఈ ఆలోచనల్లోనే, ఆమెకు ఆ చిన్న ఇంట్లోనే రెండు ప్రపంచాలు ఉన్నట్టు అర్థమయ్యింది. “అడుసు తొక్కినప్పుడు కాళ్ళు కడుక్కోవాలిగానీ నరుక్కోకూడదు కదా!” అనే ఒక గొప్ప వాక్యంతో కథ ముగుస్తుంది. జ్యోతి పాత్ర అంతరంగ చిత్రణా, ‘ఆప్యాయతలు వెల్లివిరుస్తున్నాయి’ అనుకునే ఇంట్లో మనుషుల ఆలోచనల మధ్య వైరుధ్యాలూ ఇవన్నీ చాలా అద్భుతమైన స్థాయిలో చిత్రింపబడ్డ కథ. అయితే, ఇది ఎందుకో ఒక కథ రూపాన్ని సంతరించుకోలేకపోయింది. దీనికి కారణం – రచయిత ముగింపు వాక్యం మీదే ఆధారపడటం తప్పించి కథలోంచి ఏ విశేషమూ బయటపడకపోవడం కావచ్చు.

చెలికాడు – అలపర్తి రామకృష్ణ (స్వాతి వీక్లీ, 14 మార్చ్):ఉద్యోగం చేస్తున్న భార్య, ఉద్యోగం వదులుకున్న భర్త. ఈ పరిస్థితుల్లో భర్త చేసేవన్నీ పనికిమాలిన పనులలాగా, ఖర్చుదారీ వ్యవహారాల్లాగా, అతని ఆత్మవిశ్వాసం అనవసరమైన పొగరులాగా భార్యకి కనిపిస్తూ ఉంటాయి. కానీ అతను మాత్రం మారడు. అదే చిరునవ్వూ, అదే ప్రేమ, అదే నిజాయితీ, అదే కన్సర్న్. కథ చివర్లో అతనికి ఇంకొంచెం మంచి ఉద్యోగం రావడం అనేది కొంచెం నాటకీయమూ, కొంచెం యాదృచ్ఛికమూ అయినప్పటికీ – అతని పాత్రని చిత్రించిన తీరు మాత్రం ప్రశంసార్హం.

నమూనా బొమ్మ – బి. రమాసుందరి (తెలుగు వెలుగు, మార్చ్):“నీ మీద నేను జాలి పడగలిగిన పరిస్థితుల్లో నువ్వున్నంత కాలం నీ మీద నాకు అభిమానం ఉంటుంది. ఆ పరిస్థితుల్లోంచి నువ్వు ఏ మాత్రం ఎదిగినా నువ్వంటే ఏవగింపు కలుగుతుంది” – అన్న కోణాన్ని ప్రతిభావంతంగా ఆవిష్కరించిన కథ. సునిశితమైన పరిశీలన, కథనం మీద నియంత్రణం ఉన్న రచన. పాత్రల ప్రవర్తనలో అంతరార్థాన్ని సూచనప్రాయంగా చెప్పడం, భావాల్ని వ్యక్తీకరించడానికి వాడుకున్న వినూత్న ప్రతీకలు రచయిత్రి నేర్పుని తెలియజేస్తాయి. అయితే, కథ ముగిసిన తరువాత కూడా మరి కొంచెం సాగడం వల్ల ముగింపు బలహీనపడింది.

రచ్చబండ తీర్పు – డా. జి.వి. కృష్ణయ్య (చతుర, మార్చ్):మంచి కథ. నిడివి కొంచెం ఎక్కువేమో అన్న సందేహం వచ్చినా, కథ నడిపిన తీరు దాన్నిమర్చిపోయేలా చేస్తుంది. అట్టడుగు వర్గం మహిళని బలాత్కారానికి గురైతే, ఆ విషయం రచ్చబండకి రావడం కథాంశం.అది కేవలం “పిల్లల తప్పు” కింద భావించిన పెద్దలు ఓ అయిదువేలు నష్టపరిహారం ఇచ్చిన తీర్పుని గర్హిస్తూ బాధితురాలి భర్త “ఆ డబ్బు తీసుకొని మా ఆడోళ్ళ మానానికి వెలకట్టలేం. రేపొకరోజునమదమెక్కిన మగోడల్లా వచ్చి మా ఆడోళ్ళ రేటడుగుతాడు. అదింకా సిగ్గుమాలినతనం” అన్న మాటలు అన్యాయపు తీర్పుల్నీ, ఆడవాళ్ళంటే గౌరవంలేని పెద్దల్నీ, అలాంటి పెద్దలు నిర్వహించే రచ్చబండల్నీ – అన్నింటినీ ప్రశ్నిస్తాయి. రచయిత కథ నిడివి పట్ల ఇంకొంచెం శ్రద్ధ వహించగలిగి ఉంటే బాగుండేది.

బల్లిఫలితం – వేమూరి వెంకటేశ్వరరావు (ఈ మాట, మార్చ్): తెలుగులో అరుదుగా వచ్చే వైజ్ఞానిక కాల్పనిక రచన. ఇలాంటి కథలను మిగతా కథలను కొలిచినట్లు కొలిచి చూడలేము. సమకాలీనత, సామాజికత వంటి అంశాలు వుండకపోవచ్చు. కేవలం ప్రత్యేకంగా ప్రస్తావించాలి. కానీ ఈ కథ అలా చూసినా నిలబడుతుంది. సైన్స్ వెర్సస్ నమ్మకాల విషయంలో కథ ఎలా రాయబడాలో అలానే రాయబడింది – మంచి ఎత్తుగడ. బిగువైన కథనం. ముగింపులో చమత్కారం! గోపాలకృష్ణ వంటి అనవసరపు పాత్రలు, వివరాలను ఇంకొంచెం తగ్గించి ఉంటే కథలో గందరగోళం కొంచెం తగ్గి, చదువుకోవడానికి మరికొంచెం బాగుండేది.

పెద్దరికం అంటే – గంటి భానుమతి (ఆంధ్రభూమి మాస పత్రిక, మార్చ్): ఉరుకులు పరుగుల మధ్య తల్లిదండ్రుల దగ్గర్నుంచి సరైన అటెన్షన్ దొరకక ఏకాంతాల్లోకి దిగజారుతున్న కూతురి కథ. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, సరైన దృక్పథం, ఉత్తరోత్తరా తల్లిదండ్రుల పట్ల గౌరవం ఇవన్నీ తల్లిదండ్రుల పెంపకంలో నుంచే వస్తాయి. ఇది ప్రస్తుత సమాజానికి చెప్పాల్సిన కథ. సమస్య మూలాల్లోకి వెళ్ళిన కథనం, ఒక అంగీకారయోగ్యమైన పరిష్కారం దిశగా కథ మళ్లింపు ప్రతిభావంతంగా వున్నాయి. నిడివి, తల్లి పాత్ర చిత్రణలో నాటకీయత మినహాయిస్తే ఇది మంచి కథ.

విషయవలయాలు – జి. ఉమామహేశ్వర్ (సాహిత్య ప్రస్థానం, మార్చ్): అర్థరాత్రి న్యూస్ ఛానల్లో ప్రసారమయ్యే అశ్లీల కార్యక్రమాలను చాటుగా చూసే కొడుకుని చూసి బాధపడే తల్లి కథ. చాలా సున్నితమైన, సమకాలీనమైన సమస్య. టీవీ ఛానెల్ వాళ్ళని ప్రమీల కలవటం లాంటి అనవసర సన్నివేశాలు నిడివిని పెంచాయి. ఇలాంటి కథలకు ప్రత్యేకంగా ముగింపు అంటూ ఉండదు కాబట్టి, కథ ముగిసే సమయానికి పైన చెప్పిన క్లుప్తతా రాహిత్యం వల్ల బలహీనపడి, మంచి వస్తువు అయివుండీ పాఠకుల మనస్సులో బలంగా నాటుకోదు.

 గౌతమి – రాధా మండువ (ఈ మాట, మార్చ్):తెలిసీ తెలియని వయసులో ప్రేమ-ఒక అమ్మాయి వైవాహిక జీవితంపై దాని ప్రభావం. ఇదీ వస్తువు. పాత్ర చిత్రణలో కథనంలో భాషా పరంగా ప్రతి వాక్యంలో రచయిత్రి ప్రతిభ కనపడుతోంది. కాకపోతే కథానాయక పిచ్చిదానిలా నటించడం, భర్త మితిమీరిన మంచితనం కథని వాస్తవానికి దూరంగా తీసుకెళ్తుంది. కథా రచనలో గుర్తించదగిన ప్రావీణ్యం ప్రదర్శించిన రచయిత్రి ఇతివృత్తంలో ఈ loose ends వైపు దృష్టి పెట్టివుంటే బాగుండేది.

సందల్ ఖోడ్ – ఇబ్రహీం(ఆదివారం ఆంధ్రజ్యోతి, 23 మార్చ్): కనిపించని గంధపుచెక్కని వెతకడం కథాంశం. అంతేనా అంటే అంతమాత్రమే కాదు. కుటుంబం కోసం అహర్నిశలూ శ్రమించే తల్లి, గుర్తించని తండ్రి, ఈ రెండూ గుర్తించిన కొడుకు. హృద్యమైన కథ, అందమైన కథనం, అమ్మ గొప్పదనాన్ని చాలా లలితంగా మరోసారి చెప్పిన సందర్భం. కుటుంబ సభ్యులందరికీ అహర్నిశలూ సేవ చేస్తూ తాను గంధపు చెక్కలా కరిగిపోతూ తన వాళ్ళకి జీవన పరిమళాలని అద్దిన తల్లి. తాను పగలంతా వెతికినా దొరకని గంధపు చెక్కని తన తల్లిలో కొడుకు చూసుకోగలగటం కథ ముగింపు. అనుభూతి ప్రధానమైన కథ అన్నది మామూలు సందర్భాల్లో ప్రశంస గానూ, నాలుగు కథల మధ్యనుంచి దాన్ని ఎన్నుకోవడానికి పరిమితిగానూ పరిణమిస్తుంది. అలాంటి పరిమితులు నిజానికి తాత్కాలికమే – కొన్నేళ్ళ తర్వాతయినా ఎవరైనా అమ్మ మీద మంచి కథని ఒకటి చెప్పండీ అంటే, మనం అందరం “ఇబ్రహీంగారు రాసిన సందల్‌ఖోడ్ ఉందండోయ్!” అని మనస్ఫూర్తిగా చెప్పేయవచ్చు!

ముసుగు వేయొద్దు మనసుమీద – కొల్లూరి సోమశంకర్ (కినిగే పత్రిక, మార్చ్): అరిచి చెప్పినంతమాత్రాన బలంగా చెప్పినట్టు కాదు. కథల విషయంలో అయితే, ఎంత చెప్పీ చెప్పనట్టుగా చెబితే, ఆ విషయానికి అంత పదును. ఈ సూత్రాన్ని చాలా ఎఫెక్టివ్ గా తన కథలో వాడిన రచయిత కొల్లూరి సోమశంకర్. నిరంతరం మారిపోతూ ఉన్న ఈ టెక్నాలజీ ప్రపంచంలో పాత తరానికి చెందిన కొందరు పరిగెత్తలేక, శక్తిసామర్ధ్యాలు లేక వెనకబడిపోవడం, ఉన్న ఉద్యోగం ఉంటుందా ఉండదా అన్న అనిశ్చితితో, అవమానంతో లోపల్లోపలే కుమిలి కమిలిపోవడం నేటి వాస్తవం. అలాంటి ఒక వర్గాన్ని పట్టుకోవడమే రచయిత వస్తువు పట్ల ప్రదర్శించిన ప్రతిభ. అంతే కాకుండా, ఆ వర్గ ప్రతినిధిని రోజువారీ కూలికి రకరకాల జంతువుల ముసుగులు వేసుకొని పిల్లలకి వినోదం కలిగించే వీరేశానికి పరిచయం చేసి, ఇద్దరి జీవితాల అనిశ్చితుల మధ్యా పోలిక తీసుకువచ్చి – జీవితం పట్ల ఉన్న ఆశ, పాజిటివ్ దృక్పథం జీవితాన్ని వెలిగించడానికి సరిపోతాయీ అన్న చిన్న సూచనతో కథ ముగించడం – చాలా బాగుంది. కథ చదివే పాఠకుడిలో సమస్య పట్ల సానుభూతి కలిగించే దిశగా ఎలాంటి వాక్యాలూ కనిపించవు. క్లుప్తత. ఒక్కరోజు సాయంత్రం జరిగే కథ. కథా ప్రారంభంలో అసంతృప్తితో పరిచయమయిన పాత్ర, “లైఫ్ అన్నాక ఫైట్ చేయాలి కదా” అని లైవ్లీగా మాట్లాడే వీరేశంల మధ్య భిన్నత్వం. పరిష్కారం దిశగా ఒక ఆశావహమైన ముగింపు. ఇవీ ఈ కథను నిలబెట్టిన అంశాలు.

ఈ మాసం ఉత్తమ కథగా ఎన్నుకోవడంలో “సందల్ ఖోడ్”, “ముసుగు వేయద్దు మనసు మీద” ఈ రెండింటినీ పరిశీలించాము. సమగ్రంగా జరిగిన చర్చలోని సారం స్థూలంగా చెప్పాలంటే – “సందల్ ఖోడ్” ఒక అనుభూతిని మాత్రమే ఇస్తే, “ముసుగు వేయద్దు..” ఒక ఆచరణీయమైన సందేశాన్ని ఇస్తోంది. అందువల్ల ప్రయోజనకరమైన కథాంశంతో, వస్తువు-శిల్పం-కథనాల మధ్య మంచి సమతుల్యతతో నడిచిన “ముసుగు వేయద్దు మనసు మీద” కథను ఈ మాసం ఉత్తమ కథగా నిర్ణయించాము.

 

ఉత్తమ కథ: ముసుగు వేయొద్దు మనసు మీద

రచయిత: కొల్లూరి సోమశంకర్

ప్రచురణ: కినిగే పత్రిక, మార్చ్-2014

 

సోమశంకర్ గారితో ఇంటర్వ్యూని తరువాతి భాగంలో ప్రచురిస్తాము!

 

కొసరు మెరుపు

పాతకథలని ప్రచురించే సంప్రదాయాన్ని తెలుగు వెలుగు, స్వాతి (మాస), గోతెలుగు.కామ్, విపుల వంటి పత్రికలు పాటిస్తున్నాయి. స్వాతి మాసపత్రికలో వచ్చిన “శత్రువు” (చలసాని ప్రసాదరావు),“గోతెలుగు.కామ్” 14.03.2014 సంచికలో వచ్చిన వెయిటింగ్ ఫర్ యాద్గిరి (భగవంతం) చదవదగ్గ కథలు. ఇవి కాక,మేఘాపహరణం (మాలతీచందూర్),మేలుమరువని కన్నీరు (కవికొండలవెంకటరావు),వారసత్వం (చొప్పదండి సుధాకర్),వెలుగు-నీడలు (ఇంద్రగంటిహనుమచ్ఛాస్త్రి),సుఖం (కె వి ఎస్ వర్మ) కథలు కూడా ప్రచురింపబడ్డాయి.

 

గిరిక-అద్రిక: వడ్లగింజలో బియ్యపుగింజ

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)

గిరికకు ఉద్దేశించిన వసురాజు వీర్యాన్ని యమునానదిలో చేపరూపంలో ఉన్న ఒక అప్సరస తాగింది. గర్భం ధరించి మత్స్యరాజును, మత్స్యగంధిని ప్రసవించింది! ఇప్పటి భాషలో చెప్పుకుంటే, అప్సరస తన గర్భాన్ని వసురాజుకు అద్దెకిచ్చి SurrogateMother పాత్రను నిర్వహించిందన్నమాట. ఈవిధంగా వసురాజు పిల్లలకు తల్లి అయ్యే అవకాశాన్ని గిరిక కోల్పోయింది. ఇక్కడే తమాషా ఉంది. కథకుడు అసలు రహస్యాన్ని తన పిడికిట్లో ఉంచుకుని దానిని మూయడానికి ఎంత ప్రయత్నించినా అతని వేళ్ళ సందుల్లోంచి అది జారిపోతూనే ఉంది. వసురాజు పిల్లలకు తల్లి అయ్యే అవకాశం నిజంగా గిరిక కోల్పోయిందా? లేదు…ఆమే వసురాజు పిల్లల్ని కన్నది. కావాలంటే, గిరిక అనే పేరునూ, అప్సరసకు గల అద్రిక అనే పేరునూ పక్క పక్కన పెట్టి చూడండి…రహస్యం తెలిసిపోవడం లేదా?! గిరిక అన్నా, అద్రిక అన్నా ఒకటే అర్థం. గిరి, అద్రి ఒకదానికొకటి పర్యాయపదాలు! శతాబ్దాలుగా మహాభారతాన్ని పఠన, పాఠన, ప్రచారాలలో ఉంచిన పండితులు ఎవరూ ఇంతవరకు ఈ మర్మాన్ని గమనించినట్టు లేదు. ఈ కథను ఇలా de-code చేసినట్టు లేదు. అది ఆశ్చర్యమే. గిరిక, అద్రిక అనే పేర్లలో ఉన్న ఈ సామ్యం ఈ కథకు మాత్రమే పరిమితమైన చిన్న రహస్యం అనుకునేరు, కాదు. చిన్నదిగా కనిపించే ఈ నామసామ్యం మహాభారత కథకుడి మొత్తం వ్యూహాన్నే బట్టబయలు చేస్తోంది. ఇలా రహస్యగోపనానికి ప్రయత్నించడం, లేదా విఫలయత్నం చేయడం కథకుడి వ్యూహంలో భాగమని గుర్తించినప్పుడు, అనేక ఉదంతాలకు సంబంధించిన చిక్కుముదులు విప్పడానికి ఈ గ్రహింపు ఎంత తోడ్పడగలదో ఊహించుకోవచ్చు. అలాగని, ఈ ఒక్క ఆధారాన్నీ పుచ్చుకుని ప్రతిచోటా యాంత్రికంగా ఈవిధమైన రహస్య గోపన సూత్రాన్ని అన్వయిస్తానేమో నన్న అపార్థం ఎవరూ చేసుకోవద్దు. చిక్కుముడిగా కనిపించే ప్రతిచోటా కథకుడు కావాలనో, అప్రయత్నంగానో కొన్ని ఖాళీలను వదిలేసి వాటిని పూరించుకునే అవకాశాన్ని మనకు ఇవ్వనే ఇచ్చాడు.

మహాభారతంలో ప్రధాన కథ అయిన కురు-పాండవుల కథ వాస్తవంగా ఆదిపర్వం, తృతీయాశ్వాసంలో ప్రారంభమవుతుంది. అంతకుముందు రెండు ఆశ్వాసాలూ పాండవుల ముని మనవడైన జనమేజయుని సర్పయాగంతో ముడిపడినవి.

తృతీయాశ్వాసంలోని కురు-పాండవుల కథ కూడా ఉపరిచరవసువు కథతో ప్రారంభమవుతుంది. అతనికి సత్యవతి జన్మించడం గురించి, సత్యవతికి వ్యాసుడు జన్మించడం గురించి చెబుతుంది. వ్యాసుడు మహాభారత కథకుడే కాక, కురు-పాండవ వంశాన్ని నిలబెట్టినవాడు కూడా. వ్యాసుడి పుట్టుక గురించి చెప్పిన తర్వాత మహాభారత యుద్ధం అసలెందుకు జరిగిందో కథకుడు చెబుతాడు. ఆ తర్వాత దేవతలు, దానవులు, మొదలైనవారి అంశలతో కురు-పాండవవీరులు పుట్టి యుద్ధం చేశారని చెబుతాడు. ఆవిధంగా యుద్ధానికి, కురు-పాండవుల పుట్టుకకు అతి మానుష కారణాన్ని ఆపాదిస్తూ అదొక దైవనిర్ణయంగా చిత్రిస్తాడు. ఆ తర్వాత దేవదానవ ముఖ్యుల పుట్టుక ఎలా జరిగిందో చెబుతాడు. ఆ తర్వాత యయాతి మొదలైన కురు-పాండవ వంశ ప్రముఖుల గురించీ, వంశకర్తల గురించీ చెప్పుకుంటూ వెడతాడు.

కథ చెప్పడంలో కథకుడు మొదటినుంచీ ఒక వ్యూహంతో వెడుతున్నట్టు జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ వ్యూహం ఏమిటన్నది ప్రత్యేకంగా మరింత వివరంగా చెప్పుకోవలసిన విషయం. ఒకటి చెప్పాలంటే, కురు-పాండవుల ప్రధాన కథలోకి పూర్తిగా వెళ్లడానికి ముందు అన్ని కథలూ ప్రధానంగా స్త్రీ-పురుష సంబంధాల గురించి, పుట్టుకల గురించి, వంశాన్ని నిలబెట్టిన వారి గురించీ చెబుతాయి. చదువుతూ వెడుతున్నకొద్దీ అసలు వీటి గురించి ఇంతగా ఎందుకు చెబుతున్నాడనే అనుమానం కలుగుతుంది. ఆ అనుమానాన్ని తీర్చుకునే ప్రయత్నం మనల్ని అనివార్యంగా మాతృస్వామ్య, పితృస్వామ్యాలవైపు నడిపిస్తుంది. అందులో మాతృస్వామ్యం తాలూకు కథలను పితృస్వామికంగా మార్చే ప్రయత్నం కనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా కథకుడు మాతృస్వామ్య అవశేషాలను పూర్తిగా మరగుపరచలేకపోయిన సంగతీ తెలుస్తూ ఉంటుంది.

మహాభారతం ఎన్నో శతాబ్దాలుగా పఠన, పాఠన, ప్రచారాలలో ఉంది. వాటిని అలా ఉంచిన పౌరాణికులకు, సంప్రదాయ పండితులకు మనం ఎంతో రుణపడి ఉన్నాం. పురాణ, ఇతిహాసాలను వారు కాపాడుతూ వచ్చారు కనుకనే వాటి గురించి మనం చెప్పుకోగలుగుతున్నాం. మహాభారత వ్యూహాన్ని తమవైన పద్ధతులలో, పరిమితులలో వారు కూడా చర్చించి ఉండచ్చు. నా పరిశీలన, వారి పరిశీలన ఒకలాంటివే కాకపోవచ్చు. ఇది కేవలం వైవిధ్యానికి చెందినదే తప్ప వారి విద్వత్తును ప్రశ్నించే ప్రయత్నం ఎంతమాత్రం కాదు. అర్జునుడు యుద్ధం ప్రారంభించేముందు భీష్ముడు, ద్రోణుడు మొదలైన పెద్దలకు నమస్కార బాణాలు వేశాడని చెబుతారు. నేను చేసేది యుద్ధమనీ, నా దగ్గర బాణాలు ఉన్నాయనీ నేను అనుకోవడం లేదు కనుక పైన చెప్పిన పెద్దలకు నమస్కారం మాత్రమే చేసి ముందుకు వెడతాను.

***

వసువనే రాజు చేదిని పాలిస్తున్నాడు. అతను ఇంద్రుడితో సమానుడు. ఎంతో కీర్తిమంతుడు. అతను ఒక రోజు వేటాడడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక మున్యాశ్రమంలోకి అడుగుపెట్టగానే అతనికి వైరాగ్యం కలిగింది. ఆయుధాలు విడిచిపెట్టేసి తపస్సు ప్రారంభించాడు. అప్పుడు ఇంద్రుడు అతని దగ్గరకు వచ్చాడు. ‘ఇంతకాలం దయతో ప్రజలను కాపాడుతూ, వర్ణ ధర్మాలను రక్షిస్తూ మచ్చలేని చరిత్రతో రాజ్యాన్ని పాలించావు. ఇప్పుడు రాజ్యాన్ని వదిలేసి తపస్సులో మునగడం నీకు తగదు. ఇప్పటినుంచీ నువ్వు నాతో స్నేహం చేస్తూ, నా దగ్గరకు వస్తూ పోతూ రాజ్యం చెయ్యి’ అన్నాడు.

ఆపైన అతనికి దేవత్వం ఇచ్చాడు. బంగారాన్ని, రత్నాలను తాపడం చేసిన ఒక దివ్య విమానాన్ని; ఎలాంటి ఆయుధం నుంచి అయినా రక్షించగలిగిన, ఎప్పటికీ వాడని కమలాలతో కూర్చిన ఇంద్రమాల అనే హారాన్ని ఇచ్చాడు. దుష్టులను శిక్షించి శిష్టులను కాపాడగలిగిన ఒక వెదురుకర్రను(అంటే రాజదండాన్ని)ఇచ్చాడు.

వసురాజు ఇంద్రుడు చెప్పినట్టు తిరిగి రాజ్యపాలన ప్రారంభించాడు. ఇంద్రుడిచ్చిన విమానం ఎక్కి పైలోకాలకు వెళ్ళి, వస్తుండడంతో అతనికి ఉపరిచరవసువు అనే పేరు వచ్చింది. ఇంద్రుడి మీద భక్తితో అతను ఏటేటా ఇంద్రోత్సవం కూడా జరిపేవాడు. అప్పటినుంచీ రాజులు ఇంద్రోత్సవం జరిపే ఆనవాయితీ మొదలైంది.

ఇంద్రుడి వరంతో అతనికి బృహద్రథుడు, మణివాహనుడు, సౌబలుడు, యదుడు, రాజన్యుడు అనే అయిదుగురు కొడుకులు కలిగారు. వసురాజు ఆ అయిదుగురినీ అయిదు దేశాలకు రాజుల్ని చేశాడు. వారు వేర్వేరు వంశాలకు కర్తలయ్యారు. వసురాజు రాజర్షి అనిపించుకుంటూ రాజ్యం పాలిస్తుండగా…

అతని రాజధానికి దగ్గరలో శుక్తిమతి అనే నది ప్రవహిస్తోంది. కోలాహలుడు అనే పర్వతం ఆ నదిని కామించాడు. నదిని అడ్డగించి బలాత్కారం జరిపాడు. అప్పుడు వసురాజు తన పాదంతో ఆ పర్వతాన్ని తొలగించాడు. కోలాహలుని బలాత్కారం వల్ల శుక్తిమతి గర్భవతి అయింది. వసుపదుడు అనే కొడుకు,గిరిక అనే కూతురు కలిగారు. తనను అడ్డగించిన పర్వతాన్ని పక్కకు తప్పించినందుకు కృతజ్ఞతతో శుక్తిమతి తన కొడుకునూ, కూతురినీ వసురాజుకు కానుకగా ఇచ్చింది. వసురాజు వసుపదుని తన సేనానిగానూ, గిరికను భార్యగానూ చేసుకున్నాడు.

గిరిక ఋతుమతి అయింది. ఆమెకు మృగమాంసం తెచ్చిపెట్టమని పితృదేవతలు వసురాజుకు చెప్పారు. వసురాజు వేటకు వెళ్ళాడు. వెళ్లాడన్న మాటే కానీ, నిండు యవ్వనంలో ఉన్న గిరికే అతని ఊహల్లో ఉండిపోయింది. అనురక్తితో ఆమెను తలచుకుంటూ ఉండగా అతనికి స్కలనం అయింది. ఆ వీర్యాన్ని ఒక ఆకు దొప్పలోకి తీసుకుని, దానిని ఒక డేగ మెడకు కట్టి, దానిని తీసుకువెళ్లి గిరికకు ఇమ్మని చెప్పాడు. ఆ డేగ ఆకాశంలో పయనిస్తుండగా ఇంకో డేగ చూసింది. దాని మెడకు కట్టిన ఆకులో మాంసఖండం ఏదో ఉందనుకుంది. దానికోసం డేగను అడ్డగించింది. రెండింటి మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు ఆ ఆకుదొప్ప చినిగిపోయి అందులోని వీర్యం యమునా నదిలో పడింది.

బ్రహ్మ శాపం వల్ల అద్రిక అనే అప్సరస చేపగా మారి యమునానదిలో తిరుగుతోంది. నదిలో పడిన వసురాజు వీర్యంలోని రెండు చుక్కలను ఆ అప్సరస తాగింది. దాంతో గర్భవతి అయింది. పదోమాసం రాగా ఒక జాలరి వలకు చిక్కింది. ఆ జాలరి కడుపు కోసి చూసేసరికి అందులో ఒక మగశిశువు, ఒక ఆడశిశువు కనిపించారు. ఆ శిశువులు ఇద్దరినీ ఆ జాలరి తీసుకువెళ్లి దాశరాజు అనే అతనికి ఇచ్చాడు. మనుష్య ప్రసవంతో శాపవిమోచనం అవుతుందని బ్రహ్మ చెప్పాడు కనుక అద్రిక వెంటనే చేప రూపం విడిచిపెట్టి దివ్యరూపం ధరించి దేవలోకానికి వెళ్లిపోయింది. చేప కడుపున పుట్టిన ఆ ఇద్దరికీ మత్స్యరాజు అనీ, మత్స్యగంధి అనే పేర్లు వచ్చాయి. మత్స్యరాజు మత్స్యదేశానికి రాజు అయ్యాడు. మత్స్యగంధిని మాత్రం దాశరాజు తన కూతురుగా చేసుకుని పెంచి పెద్దచేసి; ధర్మార్థంగా, అంటే ఎలాంటి ప్రతిఫలం తీసుకోకుండా యమునా నదిలో పడవ నడిపే పనిలో నియోగించాడు.

ఓ రోజున, వశిష్టుని మనవడు, శక్తి కొడుకు అయిన పరాశరుడు యమునానది పడవ రేవులో మత్స్యగంధిని చూశాడు…

ప్రస్తుతానికి కథను ఇక్కడ ఆపుదాం.

Ravi_Varma-Shantanu_and_Satyavati

***

వసురాజు చేదిని పాలించే రాజు అని తప్ప, సూర్యచంద్రవంశాలలో ఏ వంశానికి చెందినవాడో కథకుడు చెప్పలేదు. మహాభారతంలో చెప్పిన అనేకమంది రాజులతో పోల్చితే అతనంత ప్రసిద్ధుడుగా కనిపించడు. అతనొక చిన్న రాజు అనే అభిప్రాయమే కలుగుతుంది. అసలాలోచిస్తే, సత్యవతి అనే పేరు కూడా కలిగిన మత్స్యగంధి పుట్టుక గురించి చెప్పడమే కథకుని వ్యూహంలో ప్రధానం తప్ప, వసురాజు గురించి చెప్పడం కాదనిపిస్తుంది. మత్స్యగంధి గురించి చెప్పడానికే వసురాజును సృష్టించాడని కూడా అనిపిస్తుంది.

ఇంకోటి చూడండి…వసురాజు అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక మున్యాశ్రమంలోకి వెళ్ళగానే అతనికి వైరాగ్యం కలిగింది. అంతే, తపస్సు చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. అప్పుడు ఇంద్రుడు వచ్చి, నువ్వు ప్రజలను, వర్ణధర్మాలనూ కాపాడుతూ రాజ్యం చేయాలి తప్ప ఇలా తపస్సు చేయడం తగదని చెప్పాడు. మరి కొన్ని రాజోచిత పురస్కారాలతోపాటు ఒక రాజదండాన్నీ చేతికిచ్చాడు. వసురాజు అంగీకరించి తిరిగి రాజ్యపాలన ప్రారంభించాడు.

వెంటనే మనకిక్కడ సంవరణుడు గుర్తుకు రావాలి. సంవరణుడు కూడా వేటకు వెళ్ళాడు. వసురాజును ‘తపస్సు’ ఆకర్షిస్తే, సంవరణుని ‘తపతి’ ఆకర్షించింది. రాజ్యాన్ని విడిచేసి ఆమె కోసం అక్కడే తపస్సు ప్రారంభించాడు. వశిష్టుడు వచ్చి వారిద్దరికీ వివాహం జరిగే ఏర్పాటు చేశాడు. సంవరణుడు ఆ తర్వాత తపతితో కాపురం చేస్తూ పన్నెండేళ్ళు అడవిలోనే ఉండిపోయాడు. రాజ్యంలో అనావృష్టి ఏర్పడడంతో వశిష్టుడు వచ్చి ఆ దంపతులను హస్తినాపురానికి తీసుకువెళ్లాడు. వారికి కురుడు పుట్టాడు.

మొత్తానికి రాజుకూ, అడవికీ ఏదో దగ్గరి సంబంధం ఉంది. ఇంకా వెనక్కి వెడితే పురూరవుడికీ అడవితో సంబంధం ఉంది. కొంపదీసి, అడవినుంచి, అంటే ఆటవిక తెగలనుంచి తొలి రాజులను సృష్టించలేదు కదా?!

సంవరణుడి కథలో కన్నా వసురాజు కథలో ఈ సందేహం మరింత గట్టిగా కలుగుతుంది. అంతవరకూ రాజ్యపాలన చేస్తున్న వసురాజు అడవికి వెళ్ళగానే హఠాత్తుగా వైరాగ్యం పొందడానికీ, ఆయుధాలు పక్కన పెట్టేసి తపస్సులో కూర్చోడానికీ బలమైన పూర్వరంగాన్ని కథకుడు కల్పించలేదు. ఇంద్రుడు వచ్చి అతనికి రాజదండంతో సహా వివిధ కానుకలు ఇచ్చిన తర్వాత అంతలోనే అతను వైరాగ్యాన్నీ, తపస్సునూ వదలుకుని తిరిగి రాజ్యపాలన ప్రారంభించాడనడం, అతన్ని చంచలమనస్కునిగా చూపుతోంది తప్ప అతని వ్యక్తిత్వాన్ని పెంచడం లేదు. ఈ రకంగా చూసినప్పుడు, అతన్ని ముందునుంచే రాజుగా చూపించడానికే ఈ బలహీన కల్పన అన్న అభిప్రాయం కలుగుతుంది. అంటే, అతను మొదటే రాజు కాడన్న మాట. ఆ అడవిలోని తెగకు అతను పెద్ద అయుండచ్చు.

ఇంద్రుడు వచ్చి అతనికి ఇతర రాజోచిత పురస్కారాలతోపాటు రాజదండాన్ని కూడా ఇవ్వడం -అతన్ని రాజుగా నియమించిన సంగతిని స్పష్టంగా చెబుతోంది. మొదట్లో రాచరికానికి ఇంద్రుడు ప్రతినిధి. అతడు ఇలా రాజుగా నియమించినవారు ఇంకా కొందరు కనిపిస్తారు. కనుక, ఇంద్రుడు నియమించేవరకూ వసురాజు రాజు కాడనుకుంటే, ఆటవిక తెగనుంచి ఒక రాజును సృష్టించారన్నమాట. వాస్తవానికి తెగ పెద్దకే రాజు అన్న పేరు కల్పించారన్నమాట. అంటే, తెగ పెద్ద అనే పదవిని సంస్కృతీకరించారన్నమాట.

అంతవరకూ రాజ్యార్హతలేని కులాలనుంచి, వృత్తులనుంచి రాజులను సృష్టించిన ఉదంతాలు మహాభారతంలోనే కోకొల్లలుగా ఉన్నాయి. దాని గురించి మరెప్పుడైనా చెప్పుకుందాం. ఈ కోణంలో వసురాజును రాజుగా నియమించడంలో విశేషం ఏమీ లేదు. అయితే, ప్రస్తుత కథకు వస్తే, ఇలా కొత్తగా రాజులను సృష్టించే ఆనవాయితీని ఉపయోగించుకుంటూ కథకుడు వసురాజును అనే పాత్రనే సృష్టించాడా అన్న అనుమానం కలుగుతుంది. అందుకు బలమైన కారణాలే ఉన్నాయి. అవేమిటంటే, కథకుడు మత్స్యగంధి అనే సత్యవతి పుట్టుక గురించి, ఆమెకు మహాభారతకర్త అయిన వ్యాసుడు పుట్టడం గురించి చెబుతున్నాడు. వీరిద్దరూ మహాభారతంలో ప్రముఖ పాత్రలు. కనుక వారి గురించి చెప్పడమే కథకునికి ప్రధానం. వసురాజు గురించి చెప్పడం కాదు. అంతేకాదు, సత్యవతి భవిష్యత్తులో శంతనుడు అనే భరతవంశపు రాజుకు భార్య కాబోతోంది. ఆమెకు ఆ అర్హత కల్పించాలంటే ఆమెను వాస్తవంగా ఒక రాజుకు పుట్టిన సంతానంగా చెప్పాలి!

అదీ సంగతి.

ఇంద్రుని సూచనపై ‘తిరిగి’ రాజ్యపాలన ప్రారంభించిన తర్వాత వసురాజుకు అయిదుగురు కొడుకులు కలిగినట్టు, వారిని అతడు అయిదు దేశాలకు రాజులను చేసినట్టు, వారు వేర్వేరు వంశాలను స్థాపించినట్టు కథకుడు చెబుతున్నాడు. ఆ తర్వాతే, శుక్తిమతి, కోలాహలుల ఉదంతం, వారికి వసుపదుడు, గిరిక కలగడం, వారిద్దరినీ శుక్తిమతి వసురాజుకు కానుకగా ఇవ్వడం, అతడు వసుపదుని సేనానిగానూ, గిరికను భార్యగానూ చేసుకోవడం గురించి చెబుతున్నాడు. దీనిని బట్టి గిరికకూ, వసురాజుకూ వయసులో చాలా అంతరం ఉందన్నమాట. వసురాజు పేరుతో, లేని ఒక రాజును సృష్టించడం మీదే దృష్టి పెట్టిన కథకుడు ఈ చిన్న అనౌచిత్యాన్ని విస్మరించి ఉండచ్చు.

సరే, ఆ తర్వాత జరిగిన కథాక్రమాన్ని చూడండి. గిరికకు ఉద్దేశించిన వసురాజు వీర్యాన్ని యమునానదిలో చేపరూపంలో ఉన్న ఒక అప్సరస తాగింది. గర్భం ధరించి మత్స్యరాజును, మత్స్యగంధిని ప్రసవించింది! ఇప్పటి భాషలో చెప్పుకుంటే, అప్సరస తన గర్భాన్ని వసురాజుకు అద్దెకిచ్చి SurrogateMother పాత్రను నిర్వహించిందన్నమాట. ఈవిధంగా వసురాజు పిల్లలకు తల్లి అయ్యే అవకాశాన్ని గిరిక కోల్పోయింది.

ఇక్కడే తమాషా ఉంది. కథకుడు అసలు రహస్యాన్ని తన పిడికిట్లో ఉంచుకుని దానిని మూయడానికి ఎంత ప్రయత్నించినా అతని వేళ్ళ సందుల్లోంచి అది జారిపోతూనే ఉంది. వసురాజు పిల్లలకు తల్లి అయ్యే అవకాశం నిజంగా గిరిక కోల్పోయిందా? లేదు…ఆమే వసురాజు పిల్లల్ని కన్నది. కావాలంటే, గిరిక అనే పేరునూ, అప్సరసకు గల అద్రిక అనే పేరునూ పక్క పక్కన పెట్టి చూడండి…రహస్యం తెలిసిపోవడం లేదా?!

గిరిక అన్నా, అద్రిక అన్నా ఒకటే అర్థం. గిరి, అద్రి ఒకదానికొకటి పర్యాయపదాలు!

శతాబ్దాలుగా మహాభారతాన్ని పఠన, పాఠన, ప్రచారాలలో ఉంచిన పండితులు ఎవరూ ఇంతవరకు ఈ మర్మాన్ని గమనించినట్టు లేదు. ఈ కథను ఇలా de-code చేసినట్టు లేదు. అది ఆశ్చర్యమే. గిరిక, అద్రిక అనే పేర్లలో ఉన్న ఈ సామ్యం ఈ కథకు మాత్రమే పరిమితమైన చిన్న రహస్యం అనుకునేరు, కాదు. చిన్నదిగా కనిపించే ఈ నామసామ్యం మహాభారత కథకుడి మొత్తం వ్యూహాన్నే బట్టబయలు చేస్తోంది. ఇలా రహస్యగోపనానికి ప్రయత్నించడం, లేదా విఫలయత్నం చేయడం కథకుడి వ్యూహంలో భాగమని గుర్తించినప్పుడు, అనేక ఉదంతాలకు సంబంధించిన చిక్కుముదులు విప్పడానికి ఈ గ్రహింపు ఎంత తోడ్పడగలదో ఊహించుకోవచ్చు. అలాగని, ఈ ఒక్క ఆధారాన్నీ పుచ్చుకుని ప్రతిచోటా యాంత్రికంగా ఈవిధమైన రహస్య గోపన సూత్రాన్ని అన్వయిస్తానేమో నన్న అపార్థం ఎవరూ చేసుకోవద్దు. చిక్కుముడిగా కనిపించే ప్రతిచోటా కథకుడు కావాలనో, అప్రయత్నంగానో కొన్ని ఖాళీలను వదిలేసి వాటిని పూరించుకునే అవకాశాన్ని మనకు ఇవ్వనే ఇచ్చాడు.

ఈవిధంగా వసురాజు పిల్లల్ని కన్నది గిరికే అనుకున్నప్పుడు మధ్యలో అద్రిక అనే అప్సరస ఎందుకు వచ్చిందన్న ప్రశ్న వస్తుంది. సమాధానం స్పష్టమే. నదీ గణానికి చెందిన శుక్తిమతికీ, పర్వత గణానికి చెందిన కోలాహలుడికీ పుట్టిన గిరిక, తల్లిదండ్రులలానే ఒక నిమ్నజాతికి చెందినది. కానీ, ఒక భరతవంశ క్షత్రియుడు, పాండవుల ముత్తాత అయిన శంతనుడికి భార్య కాబోయే సత్యవతి పుట్టుక గురించి కథకుడు చెబుతున్నాడు. పైగా ఆ సత్యవతికే వ్యాసుడు జన్మించబోతున్నాడు. అటువంటప్పుడు సత్యవతి గిరిక సంతానమని చెప్పడం కథకునికి అభ్యంతరకరం కావడంలో ఆశ్చర్యంలేదు. శంతనుడి కాలానికి కూడా అది అంతే అభ్యంతరం అవునో కాదో, అనివార్యమై అతను ఆమెను చేపట్టాడో మనకు తెలియదు. వాస్తవంగా కథ కూర్చేనాటికి అది అభ్యంతరకరంగా మారి ఉండచ్చు. అందుకే, వసురాజును సృష్టించి రాచరిక వారసత్వాన్ని, అద్రిక అనే అప్సరసను సృష్టించి దైవసంబంధాన్ని సత్యవతికి ఆపాదించడం. ఈవిధంగా వసురాజును, అద్రికను పక్కకు తప్పించి చెప్పుకుంటే, గిరిక భర్త ఎవరై ఉండచ్చు? బహుశా మత్స్యగంధి లేదా సత్యవతిని పెంచి పెద్దజేసిన దాశరాజే!

కథకుడు సత్యవతికే కాక గిరికకూ, ఆమె సోదరుడు వసుపదుడికీ, సత్యవతి సోదరుడు మత్స్యరాజుకీ, చివరికి దాశరాజుకీ కూడా రాచసంబంధం కల్పించాడు చూడండి, క్షత్రియులతో చుట్టరికం కలిపించుకునేటప్పుడు అది అవసరమే. గిరిక వసురాజు భార్య అని చెప్పినా, మధ్యలో అద్రికను సృష్టించడం ద్వారా సత్యవతి మాత్రం ఆమె సంతానం కాదని చెప్పడానికి కథకుడు పన్నిన వ్యూహం, పేర్లలో ఉన్న సామ్యం ద్వారా బయటపడిపోయింది.

వచ్చేవారం వ్యాసుడి జన్మవృత్తాంతం గురించి….

 -కల్లూరి భాస్కరం

 

 

 

 

 

వాస్తవం, జ్ఞాపకం, ఊహల అద్భుత కలనేత

gabrielGarciaMarquez1981-Eva-Rubinstein

గాబ్రియెల్ గర్సియా మార్కెజ్ మరణించాడన్న వార్త ఒక్కసారిగా పెటిల్లున దుఃఖాన్ని తోసుకొచ్చింది. అమ్మ చనిపోయినప్పుడు, బాపు చనిపోయినప్పుడు, ఎందరెందరో చిన్ననాటి స్నేహితులు, ప్రజావిముక్తి యుద్ధంలో ఆత్మీయులైన వీరయోధులు చనిపోయినప్పుడు జరిగినట్టుగా మనసు నిండా శూన్యం ఆవరించింది. జాతస్య మరణం ధ్రువం కావచ్చు. కాని కొందరి మరణం ఎంతమాత్రమూ అంగీకారయోగ్యం కాదనిపిస్తుంది. ఆ లోటు ఎప్పటికీ తీరదనిపిస్తుంది. మార్కెజ్ మరణ వార్త విన్నప్పటి నుంచి నలభై ఎనిమిది గంటలుగా తెరలు తెరలుగా దుఃఖం వస్తూనే ఉంది.

భాషలో, జాతిలో, భూఖండంలో, వయసులో ఎంతో ఎడం ఉన్న సుదూరమైన ఈ మనిషి, ప్రతిభలో ఆకాశమంత ఎత్తయిన ఈ మనిషి కేవలం భావాల వల్ల దగ్గరివాడైన ఈ మనిషి నా మనిషి అని ఎందుకనిపిస్తున్నాడు? నా హృదయపు ముక్క ఒకటి తెగిపోయినప్పటి మహా విషాదం ఎందుకు ఆవరిస్తున్నది?

అతి ఎక్కువగా ప్రభావితం చేసిన రచయితలు, కళాకారులు ఎవరికైనా ఇలాగే నా మనిషి అని ఆప్తులుగా అనిపిస్తారేమో. వారిని ఎన్నడూ కలవకపోవచ్చు కాని వారినిక కలిసే అవకాశం కూడ ఎప్పటికీ లేదనే ఎరుక కలగడం, వారి అద్భుత ప్రతిభ వెలువడడానికి ఇక వీలులేదని తెలియడం ఒక జీవితకాల విషాదం.

ఆయనను చదివాను. ఆయన అక్షరాల మాయలో చిక్కుకున్నాను. ఆయన వాక్యాల వెంట కన్నీరు కార్చాను. ఆయన సృష్టించిన సన్నివేశాలలో భాగమై అపారమైన ఆనందాన్ని అనుభవించాను. గొప్ప తాదాత్మ్యం పొందాను. మైమరిచిపోయాను. బహుశా ఆ పఠనానుభూతి, ఆ సంభ్రమం, ఆ ఆనందం ఎప్పటికీ మాయం కావు, ఆయన ఇక లేడు. ఆయన రచనలు వెలువడడం ఆగిపోయి పదేళ్లు అయింది గాని ఏమో హఠాత్తుగా ఆ కాన్సర్ నుంచి విముక్తి అయి, ఆ అల్జీమర్స్ నుంచి బైటపడి, ఆ అద్భుత మేధ మళ్లీ ప్రపంచం కోసం ప్రేమతో మరి నాలుగు అక్షరాలు వెదజల్లేదేమో. కాన్సర్ అని తెలిసిన తర్వాతనే, చనిపోయాడని నీలివార్త ప్రచారమైన తర్వాతనే కదా ‘కథ చెప్పడానికే బతుకు’ (లివింగ్ టు టెల్ ది టేల్) అని జీవిత కథ రాశాడు!

ఇక ఆ ఆశ లేదు. కథ చెప్పే మనిషి లేడు. ఆ కలం ఆగిపోయింది. యాభై సంవత్సరాలకు పైగా లాటిన్ అమెరికన్ జీవిత సముద్రాన్ని మథించి, ప్రపంచానికి అమృతాక్షరాలనందించిన ఆయన చేతివేళ్లు దహనమైపోయి చితాభస్మంగా మారిపోయాయి. అనంత కోటి జ్ఞాపకాలను, కోటి ఊహలను, లక్ష వాస్తవాలను కలగలిపి, ఆ రసాయనిక సంయోజనంలో ప్రపంచాన్ని సమ్మోహితం చేసిన ఆ మేధ ఆలోచించడానికి ఇంక అవకాశం లేదు. ఆయన శిష్యురాలు, చిలీ జీవితాన్ని దాదాపు గురువంత అద్భుతంగానూ చిత్రించిన నవలా రచయిత ఇసబెల్ అయెండె అన్నట్టు, “నా గురువు మరణించాడు. కాని ఆయనకు సంతాపం ప్రకటించను. ఎందుకంటే నేనాయనను పోగొట్టుకోలేదు: ఆయన మాటలను మళ్లీ మళ్లీ చదువుతూనే ఉంటాను.”

***

Gabriel-Garcia-Marquez-2-190

ఎక్కడో కొలంబియాలో పుట్టిపెరిగి, స్పానిష్ లో రాసి, మార్క్యూజ్ అనే పొరపాటు ఉచ్చారణతో పిలుచుకున్న ఈ గాబ్రియెల్ గర్సియా మార్కెజ్ అనే మహా శబ్దమాంత్రికుడు, మాంత్రిక వాస్తవికతా శిల్పి నా జీవితంలోకి ఎలా వచ్చాడు? ఆయన మా వరంగల్ వాడో, తెలంగాణ వాడో అని నేను ఎప్పుడూ ఎందుకు నమ్ముతూ వచ్చాను?

“జీవితమంటే ఒకరు జీవించినది కాదు, వారు గుర్తు పెట్టుకునేది, తిరిగి చెప్పడం కోసం ఎట్లా గుర్తుపెట్టుకున్నారనేది” అని తన ఆత్మకథ లివింగ్ టు టెల్ ది టేల్ లో అన్నాడు మార్కెజ్. బహుశా ఆయన జీవితమూ రచనా అన్నీ ఈ సూత్రానికి కట్టుబడి ఉన్నాయి. అందువల్లనే ఆయన రచన వాస్తవికత మాత్రమే కాదు, అది వాస్తవికత, జ్ఞాపకం, ఊహల కలనేత. వందల సంవత్సరాల సామూహిక జ్ఞాపకాల దొంతరలు నిత్యజీవన భయానక ఉజ్వల వాస్తవికతతో పడుగూ పేకల్లా కలిసిపోయిన తెలంగాణ వంటి ప్రతి సమాజంలోనూ ఆయన ఉన్నాడు, ఆయన సృజన ఉంది.

మార్కెజ్ ను నాకు పరిచయం చేసింది రాజకీయార్థిక శాస్త్రవేత్త, సురా పేరుతో విమర్శకుడిగా సుప్రసిద్ధుడు, సృజన సాహితీమిత్రుడు సి వి సుబ్బారావు. రాడికల్ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడిగా ఎమర్జెన్సీ కాలమంతా జైలులో ఉండి, ఎమర్జెన్సీ తర్వాత ఢిల్లీలో లెక్చరర్ గా చేరాడు. అప్పటి నుంచి 1985 దాకా ఎప్పుడు సెలవులు వచ్చినా నేరుగా వరంగల్ వచ్చి, అటూ ఇటూ వెళ్తూ వస్తూ, వరంగల్ లోనే ఎక్కువకాలం గడిపేవాడు. సృజనకూ సాహితీమిత్రులకూ బైటి ప్రపంచం గురించి తెలుసుకోవడానికి ఆయన ఒక తెరిచిపెట్టిన విశాలమైన కిటికీ. ఆయన నిశాచరుడు. రాత్రంతా మేలుకుని ఉండి ఉదయం ఐదున్నర, ఆరుకు పడుకునేవాడు. రాత్రంతా ఆయనకు తోడుగా చెప్పినవి వింటూ, రోడ్లమీద తిరుగుతూ, అన్నివేళల్లోనూ హనుమకొండ చౌరస్తాలో ఇరానీ హోటళ్లలో చాయ్ తాగుతూ కాలం గడుస్తుండేది. అలా సుబ్బారావు ద్వారానే 1982 చివరిలో మార్కెజ్ గురించి తెలియడమే కాక వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ పుస్తకమూ, మార్కెజ్ నోబెల్ ఉపన్యాసం అచ్చయిన ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ కటింగ్ ఫొటోకాపీ చేతికందాయి. ఆ నవలలో మొదటిసారి మంచుముక్కను ముట్టుకున్న మహోగ్ర ఉష్ణమండల వాసిలాగనే నేనూ ఆ అక్షరాలు ముట్టుకుని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. ఆ మొదటి పఠనంలోనే నవల మొత్తంగా అర్థమయిందని చెప్పలేను గాని గాఢమైన ప్రభావాన్ని వేసింది. అంతకన్న ఎక్కువగా ఆకట్టుకున్న, దుఃఖావేశాలు కలిగించిన, లాటిన్ అమెరికా చరిత్ర చదవడానికి పురికొల్పిన నోబెల్ ఉపన్యాసం వెంటనే తెలుగు చేశాను.

(http://www.andhraprabha.com/offbeat/hundred-years-of-solitude/15980.html) అది అప్పుడే సృజన జూన్ 1983 సంచికలో అచ్చయింది. తర్వాత గడిచిన మూడు దశాబ్దాలలో వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ చదివినప్పుడల్లా కొత్త అర్థాలు స్ఫురింపజేసింది.

తర్వాత నాలుగైదు సంవత్సరాలకు బెజవాడలో ఉండగా లవ్ ఇన్ ద టైమ్ ఆఫ్ కలరా చేతికందింది. సరిగ్గా తెలుగు సీమలో ఆట పాట మాట బంద్ అనే నియంతృత్వం అమలవుతున్న చీకటిరోజులవి. కలరా రోజులవి. పైకి ప్రేమ కథగా కనబడినప్పటికీ అది మానవసంబంధాలను విచ్ఛిన్నం చేసే వాతావరణానికీ, మానవసంబంధాల అపరాజితత్వానికీ ఘర్షణ కథ అని నాకనిపించింది. ఆ తర్వాతెప్పుడో ఒక ఇంటర్వ్యూలో స్వయంగా మార్కెజ్ కూడ ఆ నవల గురించి “పాఠకులు నా వలలో పడగూడదు” అన్నాడని చదివినప్పుడు ఆ నవల పొరలుపొరలుగా ఏమేమి చెప్పిందో ఎన్ని సార్లు చదివితే అన్నిసార్లు కొత్త అర్థాలు దొరుకుతాయనిపించింది.

images

తర్వాత బెంగళూరులో ఉండగా పన్నెండు కథల సంపుటం స్ట్రేంజ్ పిల్ గ్రిమ్స్. ఇరవై ఏళ్ల కింద ఆ పుస్తకం చదువుతున్నప్పటి అనుభవం ఈ క్షణాన అనుభవిస్తున్నట్టే ఉంటుంది. ఆ పుస్తకమంతా ప్రవాసానికీ ప్రవాస వైచిత్రికీ సంబంధించినది. ఆ ప్రవాసం స్థలానిది కావచ్చు, కాలానిది కావచ్చు, వయసుది కావచ్చు. మనసుది కావచ్చు. అధికారానిది కావచ్చు. ఆ డజను కథలూ వస్తుపరంగా గాని, శిల్పపరంగా గాని పాఠ్యపుస్తకాలుగా అధ్యయనం చేయదగినవి. ఆ పుస్తకంమీద నా ప్రేమ ఎంతటిదంటే కనీసం అరడజను మందికి ఆ పుస్తకం కానుక ఇచ్చాను. కనీసం డజను సార్లయినా కథ వర్క్ షాపుల్లోనో, సాహిత్య సమావేశాల్లోనో వాటిలో ఏదో ఒక కథ గురించి చెప్పి ఉంటాను. ఇరవై ఏళ్లు గడిచినా వాటిలో ద ట్రెయిల్ ఆఫ్ యువర్ బ్లడ్ ఇన్ ద స్నో గాని, ఐ ఓన్లీ కేమ్ టు యూజ్ ద ఫోన్ గాని గుర్తుకొస్తే కళ్లు చెమరుస్తాయి. లైట్ ఈజ్ లైక్ వాటర్ ముందర అమాయక, నైసర్గిక బాల్యంలోకి జారిపోయి నిజంగానే ఆ ట్యూబ్ లైట్ పగిలిపోయి దాంట్లోంచి వెలుగు నీటిలా ప్రవహిస్తుందా చూడాలనిపిస్తుంది.

బెంగళూరులో ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్) అని మేం నడుపుతుండిన బృందంలో అందరూ రాజకీయ, సామాజిక కార్యకర్తలే కాక సాహిత్యాభిమానులు కూడ. మార్కెజ్ రచనలు మాకు నిరంతర చర్చనీయాంశాలు. అందుకే నేను బెంగళూరు వదిలేసి వచ్చేటప్పుడు పిడిఎఫ్ మిత్రులు అప్పుడే తాజాగా వెలువడిన ఆఫ్ లవ్ అండ్ అదర్ డెమన్స్ కానుకగా ఇచ్చారు. మళ్లీ ఇది కూడ ప్రేమ కథగా కనబడుతుంది గాని పొరలు విప్పుకుంటూ పోతే వలసవాదం, క్రైస్తవం, స్థానిక ఆచారవ్యవహారాలు, అభూత కల్పనలు, ప్రేమ, ఆధిపత్యం ఒకదానిలో ఒకటి కలిసిపోయి అబ్బురపరుస్తాయి.

బెంగళూరులో ఉండగానే దొరికిన మరొక మార్కెజ్ అద్భుతం క్లాండెస్టైన్ ఇన్ చిలీ. అకాలంగా మరణించిన సాహితీమిత్రుడు గోపీ స్మృతిలో ఒక పుస్తక ప్రచురణ కార్యక్రమం, ముఖ్యంగా తనకు ఇష్టమైన అనువాద సాహిత్యం ప్రచురించాలని అనుకున్నప్పుడు వెంటనే తట్టినదీ, కొద్ది రోజుల్లోనే అనువాదం, ప్రచురణ అయిపోయినదీ ఆ క్లాండెస్టైన్ ఇన్ చిలీ పుస్తకమే. నేను, సి వనజ అనువాదం చేసిన, చీకటి పాట పేరుతో వచ్చిన ఆ పుస్తకంలో సల్వదోర్ అయెండె పేరు వర్ణక్రమం దగ్గరి నుంచి ఎన్నో పొరపాట్లు ఉన్నప్పటికీ తెలుగులో వెలువడిన మొట్టమొదటి మార్కెజ్ పుస్తకం అది. దాని అనువాదంతో, ప్రచురణతో సంబంధం ఉండడం నాకు సంతోషంగా, గర్వంగా ఉంటుంది.

IMG_20140422_074326

 

నోబెల్ బహుమతి డబ్బుతో పత్రిక కొని దాంట్లో రిపోర్టర్ గా పని చేస్తాననడమూ, చేయడమూ, ఎప్పటేప్పటి జ్ఞాపకాలనూ, తాత అమ్మమ్మల అభూత కల్పనలకు అక్షరాలు తొడగడమూ, మకాండో అనే ఊహాగ్రామం చుట్టూ అల్లిన అద్భుత గాథలూ, గెరిల్లాలతో చర్చలకు మధ్యవర్తిత్వమూ, అధ్యక్ష పదవి చేపట్టమని కోరడమూ, మరణించాడనే గాలి వార్తా, దానికి జవాబుగా కథ చెప్పడానికే బతికి ఉన్నాననడమూ, కాస్ట్రోతో స్నేహమూ, సామ్రాజ్యవాద వ్యతిరేకతా…. ఆయన చుట్టూ అల్లుకున్న అభూతకల్పనల వంటి జానపదగాథలు ఎన్నెన్నో, మిత్రులతో సంభాషణల్లో ఎన్నిసార్లో….

అనుకోకుండా వనజకు బర్కిలీలో ఫెలోషిప్ వచ్చి, నాకు కూడ మూడు నెలల కోసం అమెరికా వెళ్లే అవకాశం వచ్చినప్పుడు అక్కడ చూడవలసిన మనుషుల, ప్రాంతాల జాబితా తయారు చేసుకున్నాను. గూగీ, జేమ్స్ పెట్రాస్, మార్క్ ట్వెయిన్, పాల్ రాబ్సన్, బాబ్ డైలాన్, ఐన్ స్టీన్, స్వీజీ-మాగ్డాఫ్ లు గడిపిన మంత్లీ రివ్యూ ఆఫీసూ వగైరా… వనజకు బర్కిలీలో పరిచితమైన మెక్సికన్ వలేరియా బ్రబాతా వల్ల మెక్సికో కూడ వెళ్లడం వీలయినప్పుడు అక్కడ మార్కెజ్, ఫ్రీదా కాలో, డీగో రివేరా, వీలైతే దక్షిణాదికి వెళ్లి జపాటిస్టాలు…. కాని సరిగ్గా అప్పుడే మార్కెజ్ మెక్సికో సిటీ లో లేడు. తర్వాత కొద్ది రోజులకు గూగీని కలవడానికి అర్వైన్ కు వెళ్తూ లాస్ ఆంజెలిస్ లో మిత్రులు డాక్టర్లు జ్యోతి, గిల్బర్ట్ ల దగ్గర ఆగినప్పుడు, మాటల్లో ప్రస్తావన వస్తే గిల్బర్ట్ పనిచేసే ఆస్పత్రిలోనే మార్కెజ్ కు కీమోథెరపీయో, ఆ తర్వాత చికిత్సలో జరుగుతున్నాయని తెలిసింది. కాని ఆ షెడ్యూల్ కూడ అప్పుడు లేదు. అంటే రెండు సార్లు కనుచూపుమేర లోకి వెళ్లి కలవలేకపోయాను.

***

images

మార్కెజ్ ఆయన జ్ఞాపకాలను, తన జ్ఞాపకాలను మాత్రమే కాదు, తన జాతి జ్ఞాపకాలనూ, మానవజాతి జ్ఞాపకాలనూ తన రచనకు ముడిసరుకుగా వాడుకున్నాడు. జ్ఞాపకం అన్నప్పుడే కాలం జల్లెడ పట్టగా మిగిలిన వాస్తవం అని అర్థం. ఆ జల్లెడలో పూర్తిగా నెల్లు మిగిలిందా, పోయిందంతా పొల్లేనా ఎవరూ చెప్పలేరు. ఆ జ్ఞాపకాలను ఊహలతో రంగరించి, వాస్తవికతతో మెరుగులు దిద్ది అక్షరాలకెక్కించాడు మార్కెజ్. అందువల్లనే ఆయన రచనల్లో వందలాది కోటబుల్ కోట్స్ ఉంటాయి. అవి మానవజాతి తరతరాల సంచిత ఆస్తికీ, ప్రాచీన వివేకపు నికషోపలానికీ. ఆధునిక, అత్యాధునిక, భవిష్య ఆశాసూచికలకూ ప్రతీకలు. ఆనందంతో బాగుపడని దాన్ని ఏ మందులూ బాగుచేయలేవు అన్నా, ఎప్పుడైనా ప్రేమించడానికి ఏదో మిగిలే ఉంటుంది అన్నా మార్కెజ్ ప్రకటిస్తున్నది మనిషి పట్ల ప్రేమను, భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని. ఆ ప్రేమకూ, ఆ ఆశకూ ఎన్నటికీ మరణం లేదు.

దాన్ని ఆయన కాల్పనిక రచనల్లో మాత్రమే కాదు, కఠిన వాస్తవిక ప్రసంగంలోనూ వ్యక్తీకరించాడు.

“…ఇన్ని జరిగినా, మాపట్ల కొనసాగినఅణచివేతకూ, మమ్మల్ని కొల్లగొట్టుకు పోవడానికీ, మమ్మల్ని వెలివేయడానికీమాకు ఒక జవాబు ఉంది. అది బతుకు. మాపై కొనసాగిన దౌర్జన్యానికంతటికీ మేంబతుకుతో జవాబిస్తాం. వరదలు గానీ, రోగాలు గానీ, కరువులు గానీ, ప్రళయాలుగానీ, శతాబ్దాల తరబడి సాగిన అనంత యుద్ధాలు గానీ చావుమీద బతుకు సాధించినవిజయాన్ని కాదనలేకపోయాయి. చావు మీద బతుకు గొప్పతనాన్ని తొలగించలేకపోయాయి” అని ఆయన నోబెల్ ప్రసంగంలో అన్నాడు.

అంతేకాదు, తన సామాజిక వాస్తవికతకూ తన సాహిత్య అభివ్యక్తికీ మధ్య సంబంధం పట్ల కూడ ఆయన ప్రకటించిన సవినయ అవగాహన మనిషి మీద, సమాజం మీద, చరిత్ర మీద, భవిష్యత్తు మీద ఆయన గౌరవానికి నిదర్శనం: లాటిన్ అమెరికా బీభత్స వాస్తవాన్ని వివరంగా చెప్పి, “నిజంగా స్వీడిష్ సాహిత్య అకాడెమీదృష్టికి రాదగిన అర్హత కలిగినది ఈ పెరిగిపోయిన వాస్తవమేగాని, దాని కేవలసాహిత్య వ్యక్తీకరణ కాదు. ఒక కాగితం మీది అక్షరం కాదు. మాలో బతుకుతున్నవాస్తవం. ఆ వాస్తవం మా అసంఖ్యాక రోజువారీ మరణాలను నిర్ణయిస్తున్నది. ఆవాస్తవం అనంతమైన సృజనాత్మకతకు వనరులు చేకూర్చిపెడుతున్నది. ఆ వాస్తవంనిండా కన్నీళ్లు ఉన్నవి, సౌందర్యం ఉన్నది. గతకాలాన్ని నెమరేసుకుటూ దేశదిమ్మరిగా తిరిగే ఈ కొలంబియన్ ఆ వాస్తవానికి ఒకానొక వ్యక్తీకరణ, అదృష్టం వరించినఒకానొక ఉదాహరణ” అని ఆయన నోబెల్ వేదిక మీది నుంచి ప్రకటించాడు.

ప్రపంచమంతా ఆయనకు నివాళి అర్పించింది. కాని అన్నిటిలోకీ నాకు నచ్చినది, ఆయన పుట్టిపెరిగిన నేల మీద దశాబ్దాలుగా సాయుధ పోరాటం సాగిస్తున్న మార్క్సిస్టు విప్లవకారుల సంస్థ కొలంబియా విప్లవ సాయుధ సైన్యం (ఫార్క్) తాము వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ పాత్ర కర్నల్ అరెలియానో బెండియా నుంచి ప్రేరణ పొందుతూనే ఉంటామని అంది. ఆ మహాద్భుత వ్యక్తి మరణం తర్వాత మళ్లీ ఒకసారి చెపుతున్నాం. అరెలియానో బెండియా లాగనే మేం కూడ శాంతి గురించి కలగంటూనే ఉంటాం, శాంతిని నెలకొల్పుతాం అంది ఫార్క్.

-ఎన్. వేణుగోపాల్

venu

“ఏం సంబందమిది?”

“ఒక ముక్కు మొహం తెలీని రచయితకు, ఒక పాఠకునుకి ఏమీ సంబందమో – తల్లి తండ్రులతో, తోబుట్టువుల తో గానీ, చివరకు స్నేహితులు, హితులు, సతులు, సుతులు తోటి మనకెందుకుండదో మీ ఈ వాక్యాలు తెలుపుతున్నవి. అయినా ఈ రచయతలకు మనకు ఏం సంబందం? ఈ ప్రపంచానికి మనకు ఉన్న సంబందమా? వారు ఏడిపిస్తే మనం ఏడుస్తాం. వారు నవ్విస్తే మనం నవ్వుతాం. -అన్ని రకాల భావాల్ని వారితో పంచుకుంటాం. ఏం సంబందమిది?”

With this comment here, Thirupalu, the author of the comment above, went right to the source of what makes us humans.

Take a look at this picture.

https://www.facebook.com/photo.php?fbid=2015473347193&set=a.1359629511507.2044052.1254621224&type=1&theater

Makes you uncomfortable, doesn’t it?

I know you don’t think the man doesn’t matter. I also know that you are not insensitive. And it’s not even that you are cynical.

It is just that the mother in the picture crossed a threshold of kindness that you and I will likely never be able to cross.

It is just that, in one fell swoop, the mother saw right through the noise of the disgust, right through the broken flesh and right through that breaking humanity around her – in the isolation of the man on the sidewalk.

She saw that it was breaking not just because its flesh and bones were broken, but because a certain kind of glue has come undone.

A glue that once held us all together when we were dreaming young, when we were in a state of learning and not forgetting.

When we were not in a state of forgetting, we saw this glue – we felt this glue – across the boundaries of caste, class, race and nationalities. This glue, which nobody can explain what it is, is what made men and women reach out to each other.

But now, in our state of forgetting, this glue has come undone.  This glue has come undone, and as a result, I look at him, I see a rickshaw driver with oily hair, and sweaty forehead. I see her, I see a beggar woman. I look at this child and I think this child is ugly and I look at my fellow country men and women and I am embarrassed by their awkwardness. I look at those men and women and children at the railway station, at that bus station, running over to me and begging, and I think with disgust what animals and what ANIMALS!

I am rotting because that glue has left me. And I left it. I see inside me, I see nothing but emptiness but I am stern in my opinion, confident in my feelings of disgust. I see darkness everywhere, I blame the media thinking that even at such a dire hour, there is a conspiracy.

But is it? A conspiracy? And what has literature got to do with it?

I think we can agree that, in general, we humans cycle from a state of ignorance to a state of learning, then to a state of forgetting, and if we are self-aware enough, enter the state of relearning.

But we are not all like this.

A lot of us remain in ignorance, much like a lot of us get stuck in a state of forgetting and never enter the relearning state.

Remember how when we were young we knew so much, we dreamed so much; how we played with our friends so much, and how we spat in our fingers and wiped the dust from our knees before running off with the other caste boys and girls to play?

Then do you remember how, along the years, we somehow forgot these dreams?

Forgot how we played together but only see how different that other person is, how yucky the other person makes us feel because of her skin color, because of the way she talks, and how her little children made us feel uncomfortable when they entered too much into our homes?

How many of us, then, remember going from such a state of forgetting our dreams and forgetting our plays, back to a state of re-learning, back to a state of a decency and kindness?

I am going to claim, without sufficient proof, that there is one specific quality in us humans that determines who can be good at going from a state of ignorance to a state of learning, and from a state of forgetting to a state of relearning.

That quality is our potential ability to relate.

But this is only a potential ability, not a real capability yet.

It is like swimming. We all have the potential ability to swim, but not all of us possess the capability to swim. Unless we learn how to swim. We need to go to a swimming school. We need to learn the basics of swimming. We are not born with these basics. Then, and only then, we can swim effortlessly, without thinking about it.

Relatedness, and the ability to relate, is also like that. We need a school to develop this relatedness in us. And it is literature, more than any other teacher, that gives us a set of unique habits, a set of unique skills, a set of perspectives, to help us develop this human quality of relatedness.

Only when we fully develop this quality of relatedness in us, only then, we can go from a state of ignorance to a state of learning, and from a state of forgetting to a state of relearning.

So,

1) literature gives us the ability to relate, and

2) this ability to relate helps us to transition to increasing states of relearning and learning.

More on this later.

Featured image credit: Lange, Variation #22

Facebook image link without permission, credit: Mani Bodapati

ఇంకో జీవితంలోకి మార్క్వెజ్!

1

A kind of emptiness in his life had begun there. From then on he had been unable to distinguish, to remember what events were part of his delirium and what were part of his real life.

పందొమ్మిదేళ్ళ వయసులో మార్క్వెజ్ రాసుకున్న మొట్ట మొదటి కథలో వొక వాక్యం అది.

తను రాసుకున్న మొదటి వాక్యాలతో పదే పదే ప్రేమలో పడడం ఏ రచయితకైనా ఎంత ఇష్టంగా వుంటుందో, అంత కష్టంగానూ వుంటుంది. ఆ వాక్యాల నునులేతదనంతో పాటు వాటిలోని అమాయకత్వం అతన్ని ఎప్పుడూ గుచ్చి గుచ్చి చూస్తుంది. తనకి తెలియకుండానే అతను ఆ వాక్యాల్ని తిరగ తొడుక్కుంటూ వుంటాడు, కాని, ఎప్పుడూ వొక కొత్త చొక్కా తొడుక్కునే పిల్లాడిలాగా సంబరపడిపోతుంటాడు. అలాంటి కొన్ని సంబరాల కలయిక – మార్క్వెజ్ ఇప్పటిదాకా గడిపిన జీవితం! అతని ఇంకో జీవితం ఇప్పుడు మొదలవుతుందని నమ్ముతున్నాను కాబట్టి, నా లోకంలో మార్క్వెజ్ కి మరణం లేదు.

ఇవాళ సాయంత్రం మార్క్వెజ్ కన్ను మూశాడని తెలిసిన తరవాత ఆ పందొమ్మిదేళ్ళ వయసు నించి ఇవాల్టి ఎనభయ్యో ఏడు దాకా అతని ప్రయాణం ఏమిటా అని ఆలోచిస్తూ వొక రకమైన అస్థిమితత్వంలోకి జారిపోయాను. ప్రతి వాక్యాన్ని వొక అందమైన జ్ఞాపకంగా చెక్కే శక్తి వున్న మార్క్వెజ్ నిజానికి ఈ రెండేళ్ళ కిందటి నించి వొక్క జ్ఞాపకాన్నీ తలచుకోలేని విస్మృతిలోకి జారిపోయాడు, అల్జీమర్స్ అనే దయలేని వ్యాధి వల్ల!

“What matters in life is not what happens to you but what you remember and how you remember it.”

మార్క్వెజ్ రాసిన ఆ వాక్యం నిన్నటి నించీ విపరీతమైన ఉద్వేగంతో నా లోపల చప్పుడు చేస్తోంది. ఈ చప్పుడు వొక్కో సారి నా చెవుల్ని ఇంకే చప్పుడూ వినలేని స్థితిలోకి తీసుకు వెళ్తోంది. నన్నురకరకాల తలుపుల్లోంచి మార్క్వెజ్ అనే వొక అనేక గదులూ తలుపులూ కిటికీలూ వున్న విశాలమైన సౌధంలోకి లాక్కు వెళ్తోంది.

140417170605-01-gabriel-garcia-marquez-horizontal-gallery

       2     

మొదటి వాక్యాలు రాస్తున్నప్పుడు అతని వయసు పందొమ్మిది. అతని మొదటి వాక్యాలు చదువుతున్నప్పుడు నాకూ పందొమ్మిదే!

కాఫ్కాలూ, కామూలూ, ఇలియాస్ కానెట్టీలూ, పదే పదే చదివే షేక్స్పియర్ మాక్బెత్ లూ, బైరాగి కవిత్వాలలోంచి మళ్ళీ రాస్కల్నికోవ్, హామ్లెట్లూ, డాలీ రేఖలలో కూడా దాక్కున్న అసంబద్ధ వాక్యాలూ, త్రిపుర అనే దేశంలో వొంటరి సంచారాలూ తెగ సందడి చేసే ఆ పందొమ్మిదేళ్ళ అమాయకత్వపు అంతిమ దినాల్లో- బెజవాడ గాంధి నగర్ “ప్రబోధ” బుక్ సెంటర్లో అనుకోకుండా దొరికిన One Hundred Years of Solitude – ఆ యవ్వన కాలపు బైబిల్.

నండూరి సుబ్బారావు గారు “నమిలి మింగిన నా ఎంకి” అని ఎందుకన్నారో అప్పుడే అర్థమైంది. ఈ నవల నన్ను నమిలి మింగేసిందో, నేను ఆ వాక్యాల్ని నమిలి మింగానో తెలియదు. కాని, రాసే వాక్యం మీద చచ్చేంత మమకారాన్నీ, సంశయాన్నీ నింపిన నవల అది.

ఆ తరవాత చాలా కాలం తరవాత Love in the Time of Cholera చదివి, కొన్ని నిద్రలేని రాత్రులు గడిపాక మార్క్వెజ్ ని తట్టుకునే శక్తి పోయింది నాకు! జీవితానికి మరీ అంత సున్నితత్వం అవసరమా అనే సందిగ్ధంలో పడిపోవడం అప్పుడే మొదలయింది. సున్నితత్వాన్ని మించిన యుద్ధం లేదని ఎక్కడో నేను రాసుకున్న వాక్యానికి మూలం ఆ నవలలో, ఆ నవల చుట్టూ నేను అల్లుకున్న మాయా వాస్తవికతలో వుంది.

కాని, సున్నితత్వాన్ని నిశ్శబ్దంతో కానీ, కృత్రిమమైన మౌనంతో గాని ఆట్టే కప్పెట్టలేమని కూడా అప్పుడే అర్థమవడం మొదలైంది. నా లోపల నేను చేసుకుంటూ పోతున్న యుద్ధంలో నాతో నేనే తలపడే సన్నివేశంలో నేను మాత్రమే రాసుకోగలిగే వాక్యంలో మాత్రమే నాకు విముక్తి వుందని మార్క్వెజ్ నాకు నేర్పడం మొదలు పెట్టాడు. కచ్చితంగా అప్పుడే నాకు ఇంకా చదవాలి చదవాలి ఈ సున్నితత్వపు అంతు చూడాలి అన్న కసిని పెంచుకుంటూ వెళ్ళాడు. Love in the Time of Cholera అనే నవల యాభై ఏళ్ళ తరవాత ఎప్పుడో మళ్ళీ పుట్టుకొచ్చే, ఉబికి వచ్చే ప్రేమ గురించి అనుకుంటాం కాని, నిజానికి ఆ నవలలోపలి అసలు కథ ఈ సున్నితత్వపు పునర్జన్మ కాదా!?

అవును – అనే నా సమాధానం, ఎలాంటి సంశయం లేకుండా!

 

3

images

అయితే, మార్క్వెజ్ తో నా అసలు సిసలు సహప్రయాణం 1995 తరవాతనే!

ఆ ఏడాది మార్క్వెజ్ కథలు Strange Pilgrims ఇంగ్లీషు అనువాదం నా కంట పడింది. వొక ఆదివారం పొద్దున్న బెజవాడ అలంకార్ సెంటర్లో సైడ్ వాక్ మీద పరచుకున్న పుస్తకాల మధ్య రికామీగా తిరుగుతున్నప్పుడు Strange Pilgrims పుస్తకం అట్ట నన్ను నిలబెట్టేసింది.

అప్పట్లో ఉద్యమం ఏమిటంటే: కొత్తగా తెచ్చిన పుస్తకం రెండు రోజుల్లో వేడివేడిగా చదివేయాలి. చదివాక అందులో వున్న వాక్యాలు వొక నోట్ బుక్ లో తిరగరాసుకోవాలి. ఇంకో వారం తరవాత ఆ వాక్యాలు మళ్ళీ చదువుకొని, వాటిని తెలుగులోకి తర్జుమా చేసుకోవాలి. మళ్ళీ చదువుకోవాలి. చదువుకుంటూ నిద్రపోవాలి. నిద్రలో ఆ వాక్యాల్ని కలవరించాలి. ఇవన్నీ జరక్కపోతే ఆ రచయితకి నా లోకంలోకి వీసా లేదు.

కాలేజీలో వున్నప్పుడు మహాకవి టాగూర్ గురించి నాకొక థియరీ వుండేది. టాగోర్ గొప్ప కవీ కాదు, మంచి నవలా రచయిత అంత కంటే కాదు, గొప్ప కథకుడు అని! అలాగే, శరత్ మంచి కథకుడు కాదు, గొప్ప నవలా రచయితా అని! అలాగే… అలాగే, త్రిపుర అసలు కథకుడు కాదు, మనకి తెలియని/ మనల్ని ప్రక్రియ పేరుతో నిరంతరం మోసపుచ్చే రహస్య నవలా రచయిత అని!

Strange Pilgrims చదివాక- అలాంటి థియరీ కనిపెట్టేసాను. అప్పుడు కొంత కాలం నా వాదమూ తగవూ ఏమిటంటే, మార్క్వెజ్ నవలా రచయిత కంటే ఎక్కువగా గొప్ప కథకుడు అని!

మార్క్వెజ్ వొక కొత్త రకం భాష వాడుతున్నాడని, వొక కొత్త రకం వాస్తవికత మాట్లాడుతున్నాడని మనకి కచ్చితంగా అర్థమైతే, అతని అన్ని ప్రాణాల అసలు చిలక Strange Pilgrims లో వుందని మీరు కూడా వొప్పుకుంటారు. ఈ పన్నెండు కథలు రాయడానికి అతనికి పద్దెనిమిదేళ్ళు పట్టిందట. అంటే, ఆ కథల్లో ఎన్ని ప్రాణాలు పొదిగాడో అర్థమై వుండాలి కదా! అందులో మొదటి కథ 1970లలో వొక కలలో పుట్టిందట. ఆ కలలో మార్క్వెజ్ కి అంత్యక్రియలు..దోస్తులంతా వచ్చారట. అంతా అయిపోయాక ఎవరి దారిని వాళ్ళు వెళ్లిపోతున్నప్పుడు, తను కూడా వెళ్ళడానికి సిద్ధమయ్యాడు మార్క్వెజ్. అప్పుడు వొక చెయ్యి అతన్ని బలంగా వెనక్కి లాగి, “you’re the only one who can’t go!” అన్నదట. అంతే! మార్క్వెజ్ అక్కడే వుండిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు మార్క్వెజ్ కి అర్థమైంది: చనిపోవడం అంటే స్నేహితుల్ని మళ్ళీ కలవలేకపోవడం అని!

స్నేహితుల్ని కలవలేని ఆ వెలితిలోంచి పుట్టిన కథలు ఇవి. వ్యక్తిగతంగా నాకు ఈ కథలు ఎందుకు నచ్చాయంటే, మార్క్వెజ్ ఇతర రచనల్లో అతని దుఃఖం చాలా transparent గా కనిపిస్తుంది. కాని, ఈ కథల్లో ఆ దుఃఖాన్ని ఏ చేరుమాలుతోనూ దాచుకోలేనితనం కనిపిస్తుంది. అది అప్పుడే చెంప మీద జారి, ఆరిపోడానికి ససేమిరా నిరాకరించే తడి చుక్కలా గోరువెచ్చగా అనిపిస్తుంది ఈ కథల్లో!

వున్న వూళ్ళోనే దిగడిపోయిన మనిషికి వాస్తవికత అన్ని కోణాలూ అర్థమవుతాయని అనుకోను. వలసపోయిన కళ్ళకి కొత్త చూపుల రెక్కలు వస్తాయి. తన దేశానికి దూరంగా వుండి, తనకి తానూ, తన వాళ్ళూ, ఆ పరదేశంలోని వాళ్ళు కూడా పరాయీగా, లేదంటే కొంత ఎడంగా కనిపిస్తున్నప్పుడు మార్క్వెజ్ ఈ కథలు రాసుకున్నాడు. ఆ దూరపు దుఃఖంలో తన వూరికి తను ఎంత దగ్గిరగా వుండాలనుకుంటున్నాడో ఆ ఎడబాటు బాధలోంచి తనకోసమే రాసుకున్న కథలు ఇవి. అవి, కొన్ని క్షణాల్లో నావి అనిపించాయి అంటే, ఆ క్షణాల్లో నేనూ మార్క్వెజ్ తరహా వాస్తవికతలోకి వెళ్ళిపోయానన్న మాట!

ఎలాంటి వాస్తవికత ఇది?! వినండి మార్క్వెజ్ ఏమంటున్నాడో!

True memories seemed like phantoms, while false memories were so convincing that they replaced reality.

నా మిత్రులు చాలా మందికి తెలుసు, నా ఆలోచనల ప్రయాణం మార్క్స్ తో మొదలయింది, మరీ ముఖ్యంగా : The philosophers have only interpreted the world, in various ways; the point is to change it. అన్న వాక్యం. ఇది నా నోట్ పుస్తకాల్లోనూ, ఖమ్మం గోడల మీద ఎర్రెర్రగా రాసుకున్న రోజులన్నీ గుర్తే!

కాని, ఎంతో కొంత లోకాన్ని చూశాక, ఎన్నో కొన్ని పుస్తకాల్ని చదువుకున్నాక, ఎన్నో సంభాషణల తరవాత నాకు అర్థమైందేమిటంటే: మార్పు సుదూర లక్ష్యమనీ, అసలు వాస్తవికతనే ఇంకా సరిగ్గా అర్థం చేసుకోవాల్సి వుందనీ! వేయి పూలలో కనీసం వొక పది పూలయినా పూర్తిగా వికసిస్తే చాలు అని!

తన మరణానికి మరుసటి రోజు – మార్క్వెజ్ మళ్ళీ అదే చెప్తున్నాడు నాకు!

ఈ వాస్తవికతకి నేనెప్పటికీ వొక strange pilgrimని!

 – అఫ్సర్

చూపితివట నీ నోటను…!

10268220_4199379719866_273151692_n– మృత్యుంజయ్

11937_578811308820340_1396284388_n

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 17 వ భాగం

(గత వారం తరువాయి)

17

ఒక్కసారిగా నూటా ఎనిమిది ప్రజాపనులు జరుగుతున్న ప్రాంతాలపై ‘జనసేన’ జరిపిన ‘ప్రక్షాళన’ యాత్ర ఆంధ్రదేశాన్ని కుదిపేసింది. పత్రికలు, మీడియా.. తమ తమ రిపోర్టర్‌లందరినీ ‘జనసేన’ ప్రక్షాళన బృందాలు సమాచారచట్టం ఆధారంగా చేస్తున్న ‘ప్రశ్న’ కార్యక్రమాలను కవరేజ్‌ చేయడానికీ నియమించవలసి వచ్చింది.

గంటగంటకు అన్ని టి.వి. చానళ్ళలో వివిధ ప్రాంతాల్లో నాసిరకపు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు సిగ్గుతో తలలు  వంచుకుని లొంగిపోవడం.. ఒక చోటనైతే నిస్సహాయుడైన ఓ కాంట్రాక్టర్‌ తన నిస్సహాతను ఏకరువుపెడ్తూ, పైన ఏ రాజకీయనాయకునికి, అధికారికి..ఎవరెవరికి ఎన్ని పర్సంటేజీలిచ్చి చివరికి ఎలా మోసానికి గురై.. యిప్పుడీ దుస్థితిలో ఇరుక్కుపోయడో వివరిస్తూ భోరున విలపించాడు సిగ్గుతో.
మొత్తానికి అధికారికంగా ప్రజాధనానికి సర్వాధికారులైన ప్రజలే ఒక సమూహంగా ఎదురుగా వచ్చి ప్రశ్నలు ప్రశ్నలుగా గుండెల్లోకి బాణాలను సంధించే పరిస్థితి ఒకరోజూ ఎదురౌతుందని ఊహించిన కాంట్రాక్టర్లు మింగలేక కక్కలేక గుడ్లప్పగించి, బిక్కచచ్చి లజ్జతో లుంగలు చుట్టుకుపోవడం అన్ని టి.వి. ఛానళ్ళలో ప్రస్ఫుటంగా కనిపించింది. ఐదారుచోట్ల కాస్త ముదురు కాంట్రాక్టర్లు మొదట ఎదురు తిరిగి, తను దుష్ట అనుచరవర్గంతో ‘జనసేన’ కార్యకర్తలపై దాడిచేసి, గాయపరిచి తలలను పగులకొట్టి దౌర్జన్యం జరిపి బీభత్సం సృష్టించారు. ఐతే ఈ విషయాలన్నీ మీడియాలో ప్రసారమై బయటి ప్రపంచమంతా చూస్తోందన్న భయం, జనసేన మనుషులు అడిగే ప్రశ్నలన్ని సమాచార చట్టం ప్రకారం అధికారులిచ్చిన సర్టిఫైడ్‌ కాపీలలో ఉన్నవే కావడం, నిజంగానే తాము చేస్తున్న కోట్లకొద్ది రూపాయల పనులు నాసిరకంగా ఉన్నట్టు జనసేన బృందాల్లో ఉన్న హైలెవెల్‌ సాంకేతిక పరిజ్ఞానమున్న వ్యక్తులు కళ్ళముందే జరుపుతున్న పరీక్షలద్వారా నిర్ధారిస్తూండడం, ఇన్నాళ్ళూ తమ దగ్గరినుండి లక్షలకు లక్షలు లంచాలను తిన్న అధికారులూ, పోలీసులూ, ఇతరేతర హైరార్కీ అందరూ తేలు కుట్టిన దొంగల్లా మౌనం పాటిస్తూండడం.. ఇదంతా అయోమయంగా, పిచ్చిపిచ్చిగా, భయం భయంగా అనిపించి.. ఒక్క కాంట్రాక్టరైతే ఏమీతోచక, ఎవర్నీ ఏమీ చేయలేక అతని చొక్కాను అతనే పరపరా చింపుకుని గొడ్డులా అరిచాడు. ఆ అరుపు, ఆ ఉన్మాదస్థితి.. ఆ నిస్సహాయ దౌర్భాగ్యాన్ని దాదాపు అన్ని తెలుగు వార్తా చానళ్ళు పొద్దూ రాత్రనక అస్తమానం ప్రసారం చేశాయి.
23

బ్రేకింగ్‌ న్యూస్‌..
‘అవమానాన్ని భరించలేక ఒక అవినీతి కాంట్రాక్టర్‌ బహిరంగ రోదన’

‘ఏకు మేకై అవినీతి పర్వతాలను బ్రద్ధలు చేస్తున్న వైనం’
‘తెరవెనుక నిజాలను బయటపెడ్తున్న బినామీ కాంట్రాక్టర్లు’
‘రౌడీలందరూ రాజకీయ నాయకులూ, కాంట్రాక్టర్లయ్యారా!’
‘జనసేనను కదిపితే క్షణాల్లో వాని చరిత్ర బట్టబయలు’
‘గుప్పిట్లో నిప్పు.. విప్పుతే ముప్పు.. విప్పకుంటే తప్పు’

ఒక్కో ఛానల్‌ వాళ్ళవాళ్ళ శైలిలో ప్రత్యేక తరహా వాక్య విన్యాసాలు.. మొత్తానికి అందరికీ.. వార్తలు చదువుతున్నవారికి, వింటున్నవారికి, వార్తాపత్రికల్లో కథనాలను కంపోజ్‌ చేస్తున్నవారికి రిపోర్టర్లకు, అచ్చువేస్తున్న ప్రెస్‌మెన్‌కు, ఇన్నాళ్ళూ దుర్మార్గులకు కాపలాకాస్తున్న అట్టడుగు పోలీసులకు, అందరికీ పరమ ఆనందంగా ఉంది. చిన్న తెప్పలా వచ్చిన జనసేన ఒక ఉప్పెనగా మారి ఓ వినూత్న రీతిలో అవినీతి అంతానికి తిరుగులేని విధానాన్ని అమలు చేయడం చిత్రంగా, ఆశ్చర్యంగా.. పులకింతంగా ఉంది. ఎక్కడ చూచినా ‘జనసేన’ చర్చే.

‘జనంనాడీ’ ఇప్పుడు చూడండి.. అని ఓ ఛానల్‌లో ప్రజలముందు మైక్‌ ఉంచి వాళ్ళ అభిప్రాయాలను లైవ్‌ టెలికాస్ట్‌ చేస్తున్నారు.

‘నరకాసురుడు చచ్చిపోతే అబ్బా పీడవిరగడైపోయిందని జనమంతా సంతోషంగా దీపావళి పండుగ జరుపుకున్నారట. జనసేన పుణ్యమా అని వందల వేలమంది నరకాసురుల వధ జరుగుతోందీ రోజు ఈ తెలుగునేలపై.. ఎన్ని దీపావళి పండగలు జరుపుకోవాలో అన్నంత ఉత్సాహంగా ఉంది..’ అంటున్నాడో నలభై ఏండ్లు పైబడ్డ పౌరుడు రోడ్డుపై నడచిపోతూ.
‘అరె.. మీతిమీరిపోయిండ్లు నాయకులు. సిగ్గుశరం లేకుండా దేశాన్ని పంచుకుని తినుడేనాయె. ఇన్నాళ్ళకు జనానికి వీళ్ళ పనిబట్టే విధానం దొరికింది. జనసేనకు ధన్యవాదాలు”
‘ప్రజలు.. ఒంటరిగా ఎంత బలహీనులో.. సమిష్టిగా అంత బలవంతులని యిది ఒక సజీవ ఉదాహరణగా నిరూపించింది.’
‘స్వార్థరహిత నాయకత్వం ప్రజలను ఎలా ఏకతాటిపై నడిపించి విజయాలను సాధిస్తుందో ఈ జనసేన ప్రతిఘటన వల్ల తెలుస్తోంది’
‘ఇగ కక్కుతరు కొడ్కులు..అరె కోట్లకు కోట్లు తినుడు. కిలోలకొద్ది బంగారం దోచుడు, దాచుడు.. ఎక్కడ్నుండొస్తానై యివన్నీ అని యిండ్లళ్ళ ఆడోళ్ళు కూడా అడ్గరు మొగోళ్ళను. అడిగేటోడు లేక జన్నెకిడ్సిన ఎద్దుల్లెక్క బలిసిండ్లు.. తీయాలె, ఒక్కొక్కన్ని తవ్వి బండారం బయటికి తీయాలె.. సంబురంగున్నది. జనసేనకు జై. దాని ఎన్క ఎవ్వడున్నడోగని వానికి దండం’
.. ఇలా సాగుతున్నాయి లైవ్‌ టెలికాస్ట్‌లో ప్రజాస్పందనలు.
‘ఇంకో ఐదు నిముషాల్లో.. జనసేన సృష్టికర్త రామం, జనసేన సిద్ధాంతకర్త డాక్టర్‌ గోపీనాథ్‌లతో ‘అగ్ని’ టి.వి. ముఖాముఖి. అగ్ని టి.వి. నిప్పు పిడికిలిని విప్పుతుంది.’ఏదో యాడ్‌.. కింద మూడు లైన్ల అక్షరాల స్క్రోలింగ్స్‌.

ఈ మూడు లైన్ల అక్షరాల కదలికలను, ప్రక్కన యింకో చిన్న అడ్వర్‌టైజ్‌మెంట్‌ డిస్‌ప్లేను, పైన ఇంకేదో రౌండింగ్‌ ఐటమ్‌, తెరపై యాంకర్‌ వాచకం.. ఏకకాలంలో ప్రేక్షకుడు ఈ తెరను చూస్తూ ఎంత హింసకు గురౌతాడో ఏ మేధావీ, పౌరహక్కుల వాళ్ళూ, ఈ మొద్దు ప్రభుత్వమూ ఆలోచించదు.
‘ఈలోగా.. గోవిందరావుపేట అనేచోట.. నిన్న జరిగిన ఉదంతాన్ని తిలకించండి’
ప్రొజెక్షన్‌ ప్రారంభమైంది

అక్కడ ఓ రెండు వందల మీటర్ల పొడవున్న రోడ్‌ బ్రిడ్జ్‌ నిర్మాణం జరుగుతోంది. అటు ప్రక్క ఒక జెసిబి, టిప్పర్‌, రెండు కాంక్రీట్‌ మిక్సర్స్‌, రెండు లారీలు ఉన్నాయి. ఓ పదిమంది కార్మికులు పని చేస్తున్నారు. ఇద్దరు సగం నిలబడ్డ పిల్లర్‌కు ఉక్కు కడ్డీలను జతచేసి వెల్డింగ్‌ చేస్తున్నారు. కెమెరా దీన్నంతా చూపిస్తూంటే.. ప్రక్కన పచ్చగా పొలాలు, చెట్లు.. పెద్దగా సెలయేరులాంటి నీటి ప్రవాహపు జాడలు ఏవీలేవు. అసలక్కడ అంత పొడవైన వంతెన అవసరం ఉందా.. అని అన్పించే వాతావరణం ఉంది. చూస్తూంటే..మంత్రి, మంత్రి బామ్మర్దయిన కాంట్రాక్టర్‌, లోకల్‌ ఎమ్మెల్యే, ఆ ప్రాంత ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌.. అందరూ కుమ్మక్కయితే ఫండ్స్‌ను పంచుకునేందుకు అసలు అవసరమే లేని కావలసిన డబ్బును దండుకునేందుకు వీలుగా నాసిరకం డ్యాం నిర్మిస్తున్నారనే పరమసత్యం అర్థమౌతోంది.
”నమస్కారం సార్‌. మీరేనాండి ఈ రాంపురం బ్రిడ్జ్‌ కంట్రాక్టర్‌. నా పేరు జగన్‌. జనసేన కార్యకర్తను” అని ఓ జనసేన కార్యకర్త అడిగాడు అక్కడున్న తెల్లని స్టార్చ్‌ బట్టలేసుకున్న నల్లని వ్యక్తిని. అతను బట్టలేసుకున్న ఎలుగుబంటులా ఉన్నాడు. అతని మెడలో నులకతాడంత మందం బంగారు గొలుసులు, రాళ్ళ బిళ్ళలు, రెండు చేతులకు రెండు ధగధగా మెరిసే బేస్‌లెట్లు, రెండు చేతులక్కలిపి ఎనిమిది ఉంగరాలు ఉన్నాయి.
”ఔను..” అన్నాడు అసహనంగా, నిర్లక్ష్యంగా
” ఈ కన్‌స్ట్రక్షన్‌, ప్రాజెక్ట్‌ డిటైల్స్‌ మా జనంకోసం డిస్‌ప్లే చేయాలెగద సార్‌”
”చేయాలె.. కని చేయలె..ఐతేంది.”
”యిప్పుడు చేస్తరా సర్‌”
”ఏమో చూస్తం.. అదంత అవసరమా”
”పోనీ.. మేం పెట్టాల్నా సార్‌ బోర్డును”
”మీరు పెడ్తరా.. మీ దగ్గర డిటైల్లున్నయా..”
”ఒక్క బోర్డుయేగాదు.. మీ అందరి చరిత్ర భూగోళాల వివరాలన్నీ మా దగ్గరున్నయ్‌ సార్‌. బొడ్డుబోయిన అంజయ్యగారూ.. బాబూ..” అని ఒక జనసేన కార్యకర్తను పిలిచి.. ”ఓ నలుగురు వెళ్ళి ఈ రాంపురం బ్రిడ్జ్‌ ‘పబ్లిక్‌ ప్రకటన’ బోర్డులను ఆ కొసకు, ఈ కొసకు పాతండయ్యా” అని పనిని పురమాయించి,
”ఊఁ.. చెప్పండి అంజయ్యగారు.. అసలు ఈ వర్క్‌కు ఆఫీషియల్‌ కాంట్రాక్టరెవరు”
”నీకు చెప్పడమవసరమా” అన్నాడు తలబిరుసుగా.
”చాలా అవసరం.. ఎందుకంటే యిది ప్రజల డబ్బు. మేం ప్రజలం” అన్నాడు జగన్‌ వెనుక నిలబడిన ఉన్న దాదాపు ఓ ఇరవైమంది యువకులు.
”చెప్ప..”
”సరే.. ఐతే మేమే చెప్తం. దీని అసలు కాంట్రాక్టర్‌ మంత్రి విశ్వేశ్వర్రావు తమ్ముడు జగపతిరావు. ఒక కోటి నలభై ఎనిమిది లక్షల పనిని రెండుకోట్ల డెబ్బయి లక్షలకు ఓవర్‌ ఎస్టిమేషన్‌ వేయించుకుని.. గవర్నమెంట్‌లో మ్యామ్యాలిచ్చి సబ్‌ కాంట్రాక్ట్‌ క్రింది ఇక్కడి లోకల్‌ ఎమ్మెల్యేకు చెందిన మెసర్స్‌ వెంకటేశ్వరా కన్‌స్ట్రక్షన్స్‌కు రెండు కోట్ల రౌండ్‌ ఫిగర్‌కిచ్చి స్కిప్పయిండు. తర్వాత వాళ్ళు కూడా ఈ పనిని చేపట్టక ఈగిల్‌ అండ్‌ కంపెనీకి ఒక కోటీ ఎనభై లక్షలకిచ్చి పనిని మొదలుపెట్టి ఐదు లక్షల కమీషన్‌ మీద మీకు ఒక కోటీ డెబ్బయ్యయిదు లక్షలకిచ్చిండ్లు..మీరు..”
”వద్దు వద్దు.. యిగ చెప్పద్దు. అప్పటిక్కూడా ఆ ఎమౌంట్‌తో పనిచేస్తే పదిహేను లక్షల్నాకు మిగులుతై. కాని సిఇకి, ఇఇకి, ఎయికి.. వీళ్ళకు పదిశాతం, నక్సలైట్లకు పదిశాతం, ఎపిపి, జడ్‌పిటిసి, స్థానిక యువజన సంఘాలకు ఐదుశాతం.. అంతా తడిసి..వందల ముప్పయ్యిశాతమే మిగుల్తాంది టెండర్‌ కాస్ట్‌ల. గీ డబ్బుతో ఈ బ్రిడ్జ్‌కట్టుడు ఎవనితరంగాదు… నేను చావాల్నా .. ఏంజేయాలె”
”అసలెప్పుడైపోవాలె ఈ బ్రిడ్జ్‌.”
”మూడ్నెళ్ళ కిందట్నే హాండోవర్‌ చేయాలి.. గని యింక యాడాదైనా కాదు. యిగ నాతోని కాదు కట్టుడు. క్విటయ్‌పోత..”
”అసలిక్కడ బ్రిడ్జే అవసరంలేదు.. అక్కర్లేని దాన్ని కట్టేందుకు ఓ ప్రాజెక్ట్‌ తయారుచేసి.. ఉన్న కొత్త రోడ్డును డిస్మాంటిల్‌ చేసి, జనం రాకపోకలకు అంతరాయం కల్గచేసి.. యిప్పుడది పూర్తిగాక, వర్షాకాలంల మనుషులు నడ్వలేక..” జనసేన దళం సారధి రిటైర్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రఘువీర్‌ అంటున్నాడు.
”ఔ…” అన్నాడు కాంట్రాక్టర్‌ అంజయ్య..అంగీకారంగా తలూపుతూ.
ఆ క్షణం.. అప్పట్నుండి జరుగుతున్న తతంగాన్నంతా మీడియా కెమెరాలు కవర్‌ చేస్తున్నాయనే స్పృహ కలిగి.. అంజయ్య భయంతో అదిరిపోయి.. తడబడ్తూ, తత్తరపడ్తూ.,
”జనానికి జవాబు చెప్పండి.. యిప్పుడు మీరేంజేస్తారు..”
”మంత్రి దగ్గరికి పోయి వందసార్లు మొరపెట్టుకున్న. ప్రతిసారీ ఫుట్‌బాల్‌ లెక్క బైటికి తంతాండు. మొన్నయితే గన్‌మాన్‌తోని మెడలుపట్టి బైటికి నూకించిండు..”
చటుక్కున.. అనూహ్యంగా.. అంజయ్య ఏడ్వడం ప్రారంభించాడు.
టి.వి లో ఆ స్ట్రిప్‌ ఐపోయింది..

వెంటనే యాంకర్‌ శ్రీరాం తెరమిదికొచ్చి.. గత ఒకటిన్నర నెలలకాలంలో ఆంధ్రదేశంలో ‘జనసేన’ అనే ప్రజాసంస్థను వరంగల్లులో స్థాపించి, అవినీతిలో, అనైతికతతో, లంచగొండితనంతో కూరుకుపోతున్న ప్రస్తుత సమాజాన్ని విలువలున్న పౌరసంఘంగా పునర్నిర్మాంచాలనే లక్ష్యంతో ఒక నిర్మాణాత్మక ప్రణాళికతో రంగప్రవేశం చేసిన ‘జనసేన’ వ్యవస్థాపకుడు రామం, ఆ సంస్థ సిద్ధాంతకర్త డాక్టర్‌ పి. గోపీనాథ్‌ యిప్పుడు ఈనాటి ‘ముఖాముఖి’లో మనతో మాట్లాడ్డానికి మన స్టూడియోలో ఉన్నారు. ఒక బిందువుగా పుట్టిన ‘జనసేన’ ఈ రోజు ఒక సింధువై విస్తరించింది. ‘అవగాహన’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు, ఏకకాలంలో ఓ ఇరవై లక్షలపైచిలుకు సమాజంలోని వివిధ వృత్తుల్లో, వివిధ స్థాయిల్లో, వివిధ రంగాలల్లో ఉన్న అనేకమంది పౌరులతో రెండే రెండు ప్రశ్నలున్న ప్రశ్నాపత్రంతో సర్వే చేసి విస్తృతమైన అభిప్రాయసేకరణ చేశారు. మేము ఈ సర్వే ఫలితాలనూ, జననాడిని యిదివరకే గణాంకాలతో సహా ప్రసారంచేశాం. కాగా..’ప్రక్షాళన’ పేరుతో వివిధ రంగాలకు చెందిన, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ప్రాజెక్టులను.. ఓ నూటా ఎనిమిదింటిని గుర్తించి, దాదాపు నలభై రెండు వేలకోట్ల విలువగల ప్రజోపయోగ నిర్మాణాల స్థితిగతులను తనిఖీ చేయడానికి ఈ దేశ రాజ్యాంగం ‘సమాచార చట్టం – 2005’ ద్వారా ప్రతి పౌరునికీ, సంక్రమింపజేసిన అధికారాన్ని చేతిలో ఓ అజేయమైన ఆయుధంగా ధరించి.. ఆ ప్రాజెక్టుల సర్వ సమాచారాన్ని సర్టిఫైడ్‌ కాపీలుగా వెంటతీసుకుని, ఆయా రంగాల్లో నిపుణులనుకూడా తమ తమ బృందాల్లో సభ్యులుగా స్వీకరించి.. ‘ప్రజాధన వినియోగాన్ని ప్రజలే తనిఖీ చేసుకుంటున్నారు’ అనే నినాదంతో మొన్న ఇరవైయవ తేదీన ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీయాత్రతో.. అనేకచోట్ల బయటపడ్డ నమ్మశక్యంగాని నిజాలను వెలికితీసి ప్రజలముందు, మీడియాముందు విప్పి పెడ్తూంటే.. కోట్లమంది దిగ్బ్రాంతికీ, ఉలిక్కిపాటుకు గురై.. అందరూ అవాక్కయిపోయారు. అసలు ఏం జరుగుతోంది. వేల లక్షలకోట్ల రూపాయలు ఇంత దారుణంగా భోంచేయబడ్తున్నాయా, అదీ ప్రజలపక్షాన అప్పుచేసి, రేపు పుట్టబోయే శిశువు నెత్తిపై కూడా అప్పును వారసత్వంగా మోపుతూ.. ఈ నాయకులు, ఈ అధికారులు ఇంత నిస్సిగ్గుగా దోచుకు తింటున్నారా అని విస్తుపోతున్న ఈ ఉద్విగ్న సందర్భంలో.. ‘జనసేన’ సంస్థ వ్యవస్థాపకులు..

”రామం గారూ.. నమస్కారమండీ..”
”నమస్కారం”.. తెరపై రామం ముఖం.. నవ్వుతూ.’జనసేన సంస్థ సిద్ధాంతకర్త.. ప్రముఖ సామాజిక శాస్త్ర గ్రంథాల రచయిత డాక్టర్‌ గోపీనాథ్‌.. నమస్కారం సార్‌..”
”నమస్కారం”
”చెప్పండి.. భారత జాతిపిత మహాత్మాగాంధి ‘అహింసా’ సిద్దాంతాన్ని ప్రవచించినపుడు.. ఎవ్వరూ దాన్ని ప్రశంసించలేదు సరికదా గేలిచేశారు. కాని తర్వాత్తర్వాత నిజాయితే ప్రాణంగా గాంధీ తన అహింసాయుత సహాయ నిరాకరణోద్యమాన్ని తీవ్రతరం చేసి బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడిస్తున్నప్పుడు అందరూ అవాక్కయి విస్తుపోయారు.. దాదాపు అదేరీతిలో.. నమ్మశక్యంగాని ఒక అతి సామాన్యమైన, సాధారణమైన సమాచార చట్టం అనే పౌరాధికారాన్ని ఒక వజ్రాయుధంగా ధరించి మీరు చేపట్టిన ఈ జనసేన జైత్రయాత్ర ఇపుడు దావానలంలా విస్తరించి చీకటి మనుషుల గుండెల్లో రైళ్ళను పరిగెత్తించడం కాదు.. శతఘ్నులను ప్రేలుస్తున్నాయి.. ఈ వర్తమాన ఉద్విగ్న సందర్బంలో ప్రజలందరూ మిమ్మల్ని వినాలనీ, మీ ఆలోచనలను పంచుకోవాలనీ, మీతో కలిసి నడవాలనీ ఉవ్విళ్ళూరుతున్నారు. చెప్పండి.. అసలు ప్రజలను ఏ దిశలో మీ వెంట నడిపించాలని, అంతిమంగా ఏ లక్ష్యాలను సాధించాలని మీరనుకుంటున్నారు.”

రామం చాలా ప్రశాంతంగా చెప్పడం ప్రారంభించాడు. ”నిజానికి ఈ మితిమీరిన అవినీతి, అనైతికత, రాజకీయ నాయకుల అరాచక ప్రవర్తన ఒక్క మన రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన జాఢ్యంగానీ, సమస్యగానీ కాదు.. యిది ప్రస్తుతం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రభలిన అంటువ్యాధిలాంటిదీ జాతీయ సమస్య. దీన్ని యుద్ధప్రాతిపదికపై ఎదుర్కొని ఎవరో ఒకరు రెండవ భారత స్వాతంత్య్ర సంగ్రామ స్థాయిలో అంతర్గత పోరాటం చేయకుంటే యిది భారత భావి తరాలను అంధకారంలోకి నెట్టి వాళ్ళకు భవిష్యత్తు లేకుండా చేస్తుంది. ఒక చోట అసలు రోడ్డేలేకుంటే ఫర్వాలేదు. ఎవడో ఒకడు అందరికోసం ఎప్పుడో ఒకప్పుడు ఒక రోడ్డు వేస్తాడు. దానిపై అందరూ సౌకర్యవంతంగా నడుస్తారు. కాని అక్కడ లంచాలు మేసి మేసి ఒక దుర్మార్గుడు ఓ చెత్త, పనికిరాని, బొడుగు బొడుగు రాళ్ళతో అధ్వాన్నపు రోడ్డు వేస్తే.. యిక అక్కడ ఇంకో కొత్త రోడ్డు వేయడం సాధ్యంకాదు. ఉన్నదాన్ని తీసేయరాదు.. ఇట్‌ బికంస్‌ ఇర్రిపేరబుల్‌. అదిగో ఆవిధంగా కోటానుకోట్ల రూపాయలతో ఈ అధ్వాన్నపు రోడ్లవంటి ఎన్నో నిర్మాణాలు, పనులను చేసి ఈ దేశాన్ని చెత్తకుండీని చేస్తున్నారు కొందరు దుర్మార్గులు.యిది హత్యకన్నా ఘోరమైన నేరం. దీన్ని నిర్దాక్షిణ్యంగా నిర్మూలించాలి.”

”అసలు మీ సిద్ధాంతమేమిటి”
”మాకు ఒకే ఒక పారదర్శకమైన లక్ష్యం ఉంది. దాన్ని సిద్ధాంతం అంటానికి వీల్లేదు. ఏ యితర రాజకీయ పార్టీల సిద్ధాంతాలతోనూ మాకు నిమిత్తం లేదు. ప్రమేయం లేదు, వ్యతిరేకతకూడా లేదు. మా గమ్యం ఒకటే. శాశ్వత ప్రాతిపదికపై ప్రతి పౌరున్నీ అహింసాయుతంగా ఒక ప్రశ్నించే పదునైన ఆయుధంగా రూపొందించడం. రాజ్యాంగబద్దంగా ఎవరైనా ఏంచేయాలి.. ఏం చేస్తున్నారు.. ఏదైనా చేయకూడని అసాంఘిక కార్యం చేస్తుంటే ఎందుకు చేస్తున్నావని నిలదీసి దోషిగా జనంలో నిలబెట్టడమే జనసేన ఏకైక కార్యక్రమం..”

”రాజ్యాధికారం చేపట్టడం సంగతి..”
”యిదివరకే చెప్పాం చాలా వేదికలపైన స్పష్టంగా. ‘జనసేన’ ఒక రాజకీయ పార్టీకాదు. ఇది ఎన్నికల్లో పోటీ చేయదు. ఇది రాజ్యాధికారాన్ని చేపట్టి పరిపాలన కొనసాగించదు. ‘జనసేన’ కు ముందువరుసలో ఉన్న మేము.. ఎవరమూ ఏ నాయకత్వాన్నీ, పదవులనూ, సంపదలనూ ఆశించం. అసలు మాకు స్వంత ఆస్తులు ఉండవు. స్వంత ఆస్తి లేనివానికి స్వార్థం ఎందుకుంటుంది. అతి నిరాడంబరమైన జీవితాన్ని ఆదర్శవంతంగా జీవిస్తూ.. గాంధీ జీవితాంతం ప్రవచించిన నిరాడంబర జీవిత మాధుర్యాన్ని జనానికి ప్రయోగాత్మకంగా జీవించి చూపించాలనీ, మమ్మల్ని ప్రజలు విశ్వసించడానికి మూలమైన నమ్మకాన్ని కల్పించాలనీ ప్రయత్నిస్తున్నాం నిజాయితీగా. యిది ఈ దేశంలో ఏ నాయకుడూ చేయని పని.. ఇదివరకు మహానుభావులు వినోభా భావే నుండి బాబా ఆమ్టే వరకు నిస్వార్ధ జీవితాలను జీవించి చైతన్యాన్ని రగిలించినా.. వాటిని ప్రజాబాహుళ్యంలోకి ఒక మహోద్యమంగా శాశ్వతీకరించలేకపోయారు. ‘జనసేన’ ఒక నిజాయితీతో కూడిన పారదర్శకమైన జీవితాన్ని జీవించడం ఒక విశిష్ట సంస్కృతిగా పౌరులకు అలవాటు చేయాలని సంకల్పిస్తోంది. చెబుతే అతిగా అన్పిస్తుందిగాని.. రోడ్డుపై ఒక బంగారు బిళ్ళ పడివుంటే ‘మనది కాని దీన్ని మనం ముట్టుకోవద్దు’ అనే ఆత్మ సంస్కారంతో ఎవరికివారు దాన్ని చూస్తూ వెళ్ళిపోయే ఆదర్శ సమాజాన్ని ‘జనసేన’ లక్ష్యిస్తోంది.”
”రాజ్యాధికారాన్ని చేపట్టనప్పుడు వ్యవస్థపై మీకు ఎలా నియంత్రణ ఉంటుంది.”
”కౌటిల్యుడు చెప్పిన ‘రాజు..రాజగురు అనుబంధం’ గురించి మేం ఆలోచిస్తున్నాం. నిజానికి రాజు ప్రజలకూ, ప్రజాధనానికే రక్షకుడు, కస్టోడియన్‌ మాత్రమే. దుర్మార్గులైన పాలకులు దాన్ని ప్రజాధనానికి యజమానులుగా చిత్రించి  భక్షకులై అనుభవిస్తూ వస్తున్నారు. స్వార్థ చింతనతో ప్రజల అసలైన సంక్షేమావసరాలను రాజగురువు రాజుకు తెలియజేసినపుడు రాజు తు.చ. తప్పకుండా వాటిని అమలుచేసి ప్రజారంజకమైన, న్యాయబద్ధమైన పాలనను కొనసాగించాలి. ‘జనసేన’ విషయంకూడా అంతే. ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నవాళ్ళలో ‘జనసేన’ ఆలోచనలనకు, విధానాలకు లోబడి నిస్వార్థ, ఆదర్శ ప్రజాజీవితాన్ని గడపడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినవాళ్ళకు ‘జనసేన’ ఆమోదముద్ర వేస్తుంది. ‘జనసేన’కు ప్రజల్లో నమ్మకంతో కూడిన ఆదరణ ఉంటే అపుడా అభ్యర్థి గెలుస్తాడు. అటువంటి అభ్యర్థి ‘జనసేన’ యొక్క ఒక అంగంగా, ప్రతినిధిగా ప్రభుత్వ నిర్మాణంలో, పరిపాలనలో పాల్గొంటాడు. స్థూలంగా ఇది మా ఆలోచనాధార. ఒక అతి ప్రధానమైన ఉద్యోగానికి అనేకమంది అభ్యర్థులు తమ దరఖాస్తులను పెట్టుకుంటే వాళ్ళలో అత్యుత్తమమైన వ్యక్తిని ఎలా ఎన్నుకుంటామో  పరమ పవిత్రమైన ప్రజాసేవకోసం శాసనసభ్యునిగా, లోకసభ సభ్యునిగా పనిచేయవలసిన ప్రజాప్రతినిధిని ఎంతో కూలంకషంగా పరిశీలించి, ఎటువంటి నేరచరిత్రఉన్నా, మా గూఢాచార వ్యవస్థ అధ్యయనంలో ఏమాత్రం దుష్టచరిత్ర ఉన్నా, వాణ్ణి కనీసం జనసేన దగ్గరిక్కూడా రానీయం. కనీస విద్యార్హతలు, వయోపరిమితులు, ఇతరేతర ప్రజాహిత సంబంధ ప్రత్యేకార్హతలు.. యివన్నీ కీలకాంశాలుగా పరిగణించబడ్తాయి.. ఏ క్షణాన్నైనా, ఏ మా వ్యక్తయినా ‘జనసేన’ నియమాలను ఉల్లంఘిస్తే వెంటనే ‘జనసేన’ తనవద్ద ఉన్న అతని అన్‌డేటెడ్‌ రాజీనామా లేఖను ఉపయోగించి ఆ వ్యక్తిని రీకాల్‌ చేస్తుంది. రాజకీయ వ్యవస్థలో విలువలు పూర్తిగా పతనమైపోతున్నాయి..కాబట్టి దుర్మార్గులైన నాయకులు ప్రజలకు ఆచరణయోగ్యంకాని అనేక హామీలనిచ్చి, ఆశలు కల్పించి కుర్చీపై కూర్చోగానే మోసం చేస్తున్నారు. దగా చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుత వ్యవస్థలో దుర్మార్గ ప్రజాప్రతినిధులను వెనక్కి ‘రీకాల్‌’ చేసే ఏదో ఒక మార్గం, ఆయుధం ప్రజల దగ్గరుండాలి. ‘జనసేన’ దగ్గర ఉంటుందది. ఐతే ఎలా అనే దానిపైన యింకా స్పష్టమైన విధానాన్ని రూపొందిస్తున్నాం. రాష్ట్ర, జాతీయ పార్టీలేవైనా, వామపక్ష పార్టీలతో సహా తమ పార్టీ నాయకుడెవడైనా తప్పు చేసినప్పుడు, స్కాంతో బయటపడ్డప్పుడు వాడిపైన ఏ చర్యా తీసుకోవడం లేదు. క్రమశిక్షణ చర్యలే లేవు. శిక్షించడం అసలే లేదు. భారతదేశంలో పరిస్థితి ఎలా ఉందంటే…పత్రికారంగంలో ఏమున్నది.. ఏ పత్రికైనా అట్టతీసేస్తే అన్నీ ఒకటే అన్నట్టుగా.. రాజకీయపార్టీ పేరు ఏదైనా అవినీతి, లంచగొండితనం, అనైతిక ప్రవర్తనల విషయంగా అన్నీ ఒకే రీతిలో నీతిహీనంగానే ప్రవర్తిస్తున్నాయి. యిప్పుడు పరిస్థితి బాగా కుళ్ళిపోయి కంపువాసన కొడ్తోంది. దీన్ని వెంటనే ప్రక్షాళన చేయాలి.”

రాష్ట్రవ్యాప్తంగా లక్షలమంది ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో, ఆశతో వింటున్నారు రామం ఎంతో ఓపెన్‌గా, నిజాయితీగా చెబుతున్న విషయాలను. పరిస్థితి ఒక మొక్క మొలకెత్తబోయేముందు భూమి పులకించిపోతున్నట్టుగా ఉంది.
యాంకర్‌ అన్నాడు.. ”యిప్పుడున్న రాజకీయ, సామాజిక వ్యవస్థ.. మీరు ‘జనసేన’ కోణంలో కలగంటున్న ఆదర్శ వ్యవస్థ.. స్వరూప స్వభావాల విషయంలో ఎలాంటి మౌలిక తేడాలను కలిగి ఉంటాయి. అది చెప్పండి.”
రామం మళ్ళీ అందుకున్నాడు. ”ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ అద్భుతమైన శాసనాలనే రూపొందించి కాగితాల్లో నిక్షిప్తం చేశాయి. కాని అమలులో మాత్రం ఆవగింజంతైనా చిత్తశుద్ధి లేదు. కాగా యిక్కడి ప్రభుత్వాలూ, ప్రజలూ ఇతర అన్ని ప్రపంచ దేశాల్లోవలె తాము నిర్మించిన తమ దేశశాసనాలను తామే గౌరవించరు, అమలు చేయరు సరికదా వాటిని వక్రీకరించి విపరీతార్థాలతో దోపిడీకి పాల్పడ్తారు. మీరు ఆశ్చర్యపోతారు. అనేక ప్రజాసంఘాలు సర్వేచేసి సమర్పించిన నివేదికల ప్రకారం వర్తమాన భారత రాజకీయాల్లో ఎనభై ఐదుశాతంమంది వీధి గూండాలు, రౌడీషీటర్లు, హంతకులు, నేరచరితులు ఉన్నారు.

వీళ్ళను క్రమంగా ఆ రంగంనుండి తప్పించడం అంతసుళువైన విషయంకాదు. భారత రెండవ స్వాతంత్య్ర సంగ్రామం తరహాలో ప్రజలు ఏ ఊళ్ళోవాళ్ళు ఆ ఊళ్ళో పోరాడ్తే తప్ప ఈ ప్రక్షాళన సాధ్యంకాదు. మొదటి స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటిష్‌వాడనే శత్రువు స్పష్టంగా కళ్ళెదుటనే కనబడ్తూ ఉన్నాడు కాని ఇప్పుడు కనబడకుండా అవినీతిపరుల రూపంలో అదృశ్యంగా మనలో. మన ప్రక్కన, మన ఇంట్లోనే, మన కుటుంబసభ్యులుగా మన జాతిద్రోహులే కలిసిపోయి ఉన్నారు. కనబడని శత్రువుతో యుద్ధంచేయడం కష్టంకదా.. మీకొక అతి ప్రధానమైన రహస్యం చెబుతాను. చెప్పనా..”
”చెప్పండి..”
”ఈ దేశానికి నిరక్షరాస్యులైన భారత పౌరులతో ఎటువంటి హానీలేదు. కాని చదువుకున్నవారితో కొంత ప్రమాదం, బాగా చదువుకున్నవారితో ఇంకా భారీ ప్రమాదం పొంచివుంది. గత ఇరవై ఏళ్ళనుండి.. హర్షద్‌ మోహతా, కేతన్‌పరేఖ్‌ దగ్గర్నుండీ.. తెల్గీ.. ఈ మధ్య బయటపడ్ట అనేక సాఫ్ట్‌వేర్‌ కంపెనీల, కమ్యూనికేషన్‌ మంత్రిత్వశాఖ, కార్పొరేట్‌ కంపెనీల దాకా, ఖనిజాలు, గనులు, జలయజ్ఞాలు, ఛత్తీస్‌గడ్‌లో వందయూనివర్సిటీల స్థాపన, మెడికల్‌, ఇంజినీరింగ్‌ కాలేజీల అనుమతుల్లో వేలకోట్ల అవినీతి. ఇవన్నీ ఏం చెబుతున్నాయి..ఉన్నత విద్యావంతుల్లోనే దొంగలు ఎక్కువగా ఉన్నారని ఋజువు చేస్తున్నాయిగదా. ఔనూ.. హౌటు కర్బ్‌ దిస్‌ ఈజ్‌ ద రియల్‌ ప్రాబ్లమ్‌”
”దీన్ని ఎలా ప్రక్షాళన చేయబోతున్నారు మీరు..డాక్టర్‌ గోపీనాథ్‌గారు చెప్పండి”
”చాల సింపుల్‌.. మనిషి దొంగతనం చేస్తున్నపుడు దొంగతనాన్నెవరో చూస్తున్నారనే భయం ఉంటే చాలు. దొంగ భయపడి వెంటనే విరమించుకుంటారు. కాబట్టి మనిషిని అనుక్షణం గమనించే నిఘా కావాలి. అమెరికాలో సెటిలైట్‌ సర్వైలెన్స్‌ ఉంటుంది. ఎవనికివాడు నన్ను సిసి కెమెరాలో, ఆకాశంనుండి ఏ సెటిలైట్‌ వ్యవస్థో చూస్తోంది.. పట్టుబడ్తామని ఒళ్ళు దగ్గరపెట్టుకుని వెళ్తుంటారు రోడ్డుపై. యిక్కడకూడా అటువంటి ఈ దొంగనాయకులను వెంటాడే ఓ నిఘా వ్యవస్థ కావాలి. ‘జనసేన’ అదే. అదొక వాచ్‌డాగ్‌.. మా దగ్గర ‘జనసేన’ నిర్మాణం మూడు థల్లో ఉంటుంది. ఒకటి కేంద్రకం. దాంట్లో ఋషులవంటి నూటా ఎనిమిదిమందితో కూడిన సారధ్య బృందం ఉంటుంది. రామం, నేను ముందుంటాం. అధ్యకక్షుడు, కార్యదర్శి.. ఇటువంటి పదవులు లేవు. తర్వాత అంతర్‌వలయం. దాంట్లో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలు.. అన్ని జిల్లాల కార్యాలయాల బాధ్యులు. శిక్షణా విభాగం, క్రమశిక్షణా విభాగం, రక్షణ విభాగం, గూఢాచార విభాగం, ఆర్థిక విభాగం, విధాన విభాగం, విస్తరణ విభాగం, క్షేత్ర కార్యాచరణ విభాగం.. ఈ విధంగా ఎనిమిది సెక్టార్స్‌. దళాలుంటాయి. ఒక్కో విభాగంలో ఆయా రంగాల్లో నిపుణులైన, సాధికారత కల్గిన వ్యక్తులుంటారు. ఉదాహరణకు ఆర్థిక విభాగముందనుకో.. చార్టర్స్‌ అకౌంటెంట్స్‌, రిటైర్డ్‌ ఫైనాన్స్‌ సెక్రటరీలు, ప్రొఫెసర్స్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌.. ఇటువంటి వాళ్లు సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా మిగతా వాటిల్లోకూడా. ఈ అంతర్‌వలయం అంతా నిరంతర ఉద్దీప్తతతో ప్రజలను చైతన్యవంతులను చేయడంలో, ప్రధానంగా పౌరుల్లో నైతిక విలువలను పెంపొందించడంలో, అనవసరంగా ఈ కోట్లకు కోట్ల రూపాయలను సంపాదించాలనే దుర్భుద్ది నీకెందుకురా.. ఒక వ్యక్తికి నిజంగా ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు అవసరమా..ఏంజేస్తావ్‌ వీటితో.. వంటి జ్ఞానవికాసాన్ని కల్పించడంలో తలమునకలై ఉంటుంది. దీనికి వెలుపల ఒక బాహ్యవలయముంది. దీంట్లో ఆదర్శ భావాలున్న జనబాహుళ్యం ఉంటుంది. నిజానికి ప్రస్తుతం నాయకులకంటే ప్రజలే ఎక్కువగా కలుషితమై నీతిహీనులై ఉన్నారు. లంచాలు యిస్తారు, తీసుకుంటారు. అవకాశముంటే ఏ నీచమైన పనైనా చేస్తారు. వీడు మనిషికి వందిస్తే వీని సభకొస్తారు. మర్నాడు వాడు నూరిస్తే వాని సభకూ వెళ్తారు. ఉచితంగా ఇస్తానంటే కలర్‌ టి.వి. తీసుకుంటాడు. నగదు బదిలీ తీసుకుంటాడు. సైకిళ్ళు తీసుకుంటాడు. మోటార్‌సైకిళ్ళు, ఉచిత విద్యుత్తు, ఉచిత బియ్యం, ఉచిత బట్టలు.. ఉచితం ఏదైనా సరే.. తీసుకుంటాడు.. చచ్చినవాడి పెళ్ళికి వచ్చిందే కట్నమనుకుంటాడు. వీళ్లను సంస్కరించాలి. దేన్నయినా ఈ రాష్ట్రంలోగానీ, ఏ ఇతర రాష్ట్రాల్లోగానీ ఏనాడైనా..ఎవరైనా ప్రజలు దేన్నయినా మాకిది ఉచితంగా ఇమ్మని ఎప్పుడైనా అడిగారా. సిగ్గులేని నాయకులు వాళ్ళ ఓట్లకోసం బూటకపు ప్రజాకర్షక పథకాలను ప్రకటించి పబ్బం గడుపుకున్నారు తప్ప.. ఏ మనిషీ తనకు తానొక బిచ్చగాణ్ణి, నాకిది ఉచితంగా యిమ్మని ఎప్పుడూ అడగడు. ఇది మనిషి ‘రోషాని’కి, ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. నీకంటె పెద్ద వెధవాయను నేను అన్నట్టు ఒకణ్ణి మించి ఒకడు ఉచితాలను ప్రకటించి, సబ్సిడీలను పెంచి, కమిషన్‌లను ప్రకటించి ప్రజలను భ్రష్టు పట్టించారు. నిజానికి .. ఇప్పటికీ ప్రభుత్వం ఒక్కో లీటర్‌ పెట్రోల్‌పై రూ. 20 సబ్సిడీ యిచ్చి విచ్చలవిడిగా కుర్రకారు మోటార్‌బైక్స్‌పై పిచ్చితిరుగుడు, తిరగడానికి యిన్ని కోట్ల లీటర్ల పెట్రోల్‌ను.. రోజుకు ఇన్ని కోట్లరూపాయల సబ్సిడీని భరించడం అవసరమా. ప్రజలకు ఒకసారి తేరగా ఇవ్వడం అలవాటు చేసిన తర్వాత అవి ఇవ్వడం మానేస్తే రేపు వాళ్ళే తిరగబడి గొడవలు చేస్తారు. ఈ దిక్కుమాలిన ప్రజాకర్షక పథకాలు వద్దు మహాప్రభో అని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, భారతీయ ఆర్థిక మండలి, వంటి సంస్థలు, పౌరహక్కుల, మానవ హక్కుల సంఘాలు, అమర్త్యసేన్‌ వంటి మేధావులు ఎప్పట్నుండో నెత్తిన నోరు పెట్టుకుని మొత్తుకుంటున్నారు. తోడుకుని తింటానికి ఆరోగ్యశ్రీలు, పద్దెనిమిదేండ్ల పోరగాండ్ల ఓట్లు దండుకోడానికి ఫీజ్‌ రీ ఎంబర్స్‌మెంట్‌, రైతుల ఓట్ల కోసం ఉచిత విద్యుత్తు.. విద్యుత్తును ఉచితంగా ఇస్తూంటే ఊళ్ళలో కొందరు రైతులు మోటార్‌ పంప్‌ ఆన్‌ చేసి పోతే రాత్రంతా అది నడుస్తూనే ఉంటుంది. అరాచకమైపోతోంది ఎన్నోచోట్ల.. అటుదిక్కు ఏదోరకంగా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో నలభైశాతం అప్పులు, వడ్డీలు కట్టడానికే సరిపోతోంది. కాబట్టి మళ్ళీ ఆదాయం సంపాదించుకునేందుకు నీతిమాలిన మద్యం వ్యాపారం. పదివేల కోట్ల కోసం జనానికి వాకిట్లోనే మద్యం అందుబాటు. బడి ఒడిలో, దేవాలయం ముంగిట ఎక్కడబడ్తే అక్కడ బార్లు, బ్రాండీషాపులు. పదివేలకోట్లు రాబడైతే.. మంత్రులు, ఎమ్మెల్యేలు.. అందరూ కలిసి ముప్పయ్యెనిమిది వేలకోట్లు ప్రజలనుండి పిండి దోపిడి.. సీసాపై యాభై రూపాయల ఎమ్మార్‌పి ఉంటే బహిరంగ దౌర్జన్యంతో డెబ్బయ్‌ రూపాయలకు అమ్మడం.. సిగ్గు చచ్చి ఎక్సైజ్‌, పోలీస్‌, నిఘా వ్యవస్థలు. సిండికేట్స్‌, మాఫియాలు, గూండారాజ్యాలు.. ఏమిటి.. ఏమిటిదంతా. పుచ్చిపోయింది వ్యవస్థ. అక్కడ ఒకవైపు ఆర్థిక శాఖే కదిలి మంత్రుల ముందు చేతులెత్తి నిలబడి ఈ ప్రభుత్వాలను నడుపలేమిక.. అని ఇంట్లో చారెడు బియ్యంలేక పిల్లలను పస్తులుంచవలసిన స్థితిలో ఉన్న ఇల్లాలులా రోదిస్తోంది.. ఏం జరుగుతోంది.. ఎటు పోతున్నాం మనం.. యిది.. ఈ దుష్టమైన భూమిపుండువంటి దురవస్థను ఎదుర్కోడానికి.. రిటైర్డ్‌ స్కిల్స్‌.. డాక్టర్లు, ఇంజినీర్లు, సామాజిక వేత్తలు, విద్యావేత్తలు, దేశస్పృహ ఉన్న కత్తుల్లాంటి యువకులు, ఉద్యమకారులు.. వీళ్ళతో నిండిన బాహ్యవలయం. మొత్తం ‘జనసేన’ లక్షమంది పారదర్శకంగా జనసేన ‘కేంద్రకం’ ఈ లక్షమందిని పోషిస్తుంది – నడిపిస్తుంది.. నడుస్తుంది. ఈ సమాజాన్ని కొంగ్రొత్త మార్గంలో మున్ముందుకు తీసుకెళ్తుంది. కొత్త చరిత్రను రాస్తుంది.” చెబుతున్నారు డాక్టర్‌ గోపీనాథ్‌.

ఆనందం, ఆవేశం పట్టలేక యాంకర్‌ ఆనందరావు చప్పట్లుకొట్టాడు.. ”నిజంగా వ్యక్తిగతంగా నాక్కూడా ఎంతో సంతోషంగా ఉందిసార్‌. ఈ మా టి.వి. ద్వారా కొన్ని వందలమంది మేధావులను, పాత్రికేయులను, సూడో రాజకీయ విజ్ఞులను, విశ్లేషకులను ఇంటర్వ్యూ చేశానుగదా సార్‌ కాని ఇంత ధైర్యంగా, ఇంత ఖచ్చితంగా, యింత నిబద్ధతతో ఒక ప్రణాళికను తయారుచేసుకుని ముందుకొచ్చినవాళ్ళను చూడలేదు.. యింకా చెప్పండి..”
రామం అందుకున్నాడు.
”మన రాష్ట్రంలో అసలు పరిశ్రమలున్నాయా. యువత ఉపాధి సంగతేమిటి. విదేశీ నియంత్రణంలో ఉన్న ఎంఎన్‌సిలకు అనుబంధంగా ఉన్న సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలు తప్పితే ఈ రాష్ట్రంలో ఏవైనా భారీ పరిశ్రమలు పనిచేస్తున్నాయా ఆరోగ్యంగా, ఆర్థిక పరిపుష్టతతో. సాఫ్ట్‌వేర్‌ బహుళజాతి కంపెనీలు సామ్రాజ్యవాద రాజకీయాల్తో తమ తలుపులను భారతదేశంలో మూసేస్తే.. యిక్కడి ఇన్ని లక్షలమంది గతి ఏమిటి. ఎక్కడో స్విచ్‌ ఆఫ్‌ చేస్తే యిక్కడ లక్షల లైట్లారిపోతాయికదా. ఒకవైపు చైనా, కొరియా, థాయ్‌లాండ్‌, జపాన్‌ లాంటి దేశాలు పరిశ్రమలను ప్రపంచదేశాల గుండెల్లోకి విస్తరించుకుంటూపోతూంటే.. మన దేశీయులు చేవచచ్చి ఎందుకింత దద్దమ్మలుగా మిగిలిపోతున్నారు. వీళ్ళకెంతసేపూ కమీషన్ల యావతప్ప అసలు దేశం స్పృహలేదు. ఒక్క బొమ్మల పరిశ్రమ చూడు.. ప్రపంచమంతా మేడిన్‌ చైనా. అమెరికాలో చెప్పులు, పెన్నులు, కీచైన్‌లు, ఆహారం, చాక్లెట్స్‌, ఐస్‌క్రీం, కార్లు, మెమరీచిప్స్‌, బ్యాటరీలు.. అరెరె.. ఎన్ని.. ఎన్నెన్ని అన్నీ మేడిన్‌ చైనా.. కాని అమెరికావాడు ప్రపంచపోలీస్‌ కాబట్టి.. యిక్కడేదైనా అమ్ముకోండి.. కాని నాకు టాక్స్‌ కట్టండి. నా ఖజానాను నింపండి. నేను చెప్పిన మాట వినండి.. అని ప్రపంచాన్ని నియంత్రిస్తున్నాడు. శాసిస్తున్నాడు. యిక్కడ మనం అద్భుతమైన మానవ వనరులుండి, సహజ ప్రకృతి వనరులుండి, అడవులుండి, నదులుండి, పర్వతాలుండి.. అన్నీ ఉండి అవినీతిలో కూరుకుపోయి మనను మనం గొంతులు పిసుక్కుంటున్నాం.. యిక్కడి ప్రజలకు నిజమైన స్పృహ లేకుండా చేసి ఈ పరమ దుర్మార్గ రాజకీయనాయకులు దేశద్రోహానికి తలపడ్తున్నారు. మనం భూమిపుండులో కూరుకుపోతున్నాం. ఇప్పుడు అర్జంటుగా ఏదో ఒకటి జరగాలి.. యిక్కడి భవిష్యత్‌ దృష్టిలేని నాయకులు ఒకటివెంట ఒకటిగా చేస్తున్న తప్పులవల్ల కోలుకోలేనంతగా ప్రజాసామాజికారోగ్యం ఆల్‌రేడీ దెబ్బతిన్నది. ఈ రాష్ట్రంలో ఆరువందలయాభై ఇంజినీరింగ్‌ కాలేజీలు, వందల సంఖ్యలో ఎంసిఎ, ఎమ్‌బిఎ, ఫార్మసీ కాలేజీలు అవసరమా. యాడాదికి ఏమాత్రం నాణ్యత, ప్రమాణాలు లేని రెండు లక్షల యాభైవేల యువకులు ఉద్యోగానికి పనికిరాని ‘హ్యూమన్‌ గార్బేజ్‌’గా మార్కెట్లోకి రావడం, నిరుద్యోగులై, దిక్కుతోచక రోడ్లమీద నింగిచూపులు చూచుకుంటూ వైట్‌ కాలర్డ్‌ లేబర్‌గా మారవలసిన దుస్థితి ఏమిటి.. ఎందుకు..రాష్ట్రం.. సమాజ రూపకల్పన, భవిష్యత్‌ దార్శనికత.. ఇవన్నీ పూర్తిగా లోపించి సమాజాన్ని అసమర్థ నాయకులు చీకట్లోకి నడిపిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే రాజకీయ గుండాయిజం, కాన్సిట్యూషన్‌ వైజ్డ్‌ మాఫియా యిక్కడ సమాజాన్ని అథఃపాతాళానికి తొక్కేస్తోంది. మేల్కోవాలి..మనం వెంటనే మేల్కోవాలి. లేకుంటే యిక శాశ్వత సమాధే.”
”కాని అహింసాయుతంగా.. మీరు మీ లక్ష్యాలను సాధించడం సాధ్యమయ్యే పనేనా..”
”తప్పకుండా సాధ్యమౌతుంది.. హింసతో నక్సలైట్లు నలభై ఏళ్ళుగా చేయలేని పనిని గత రెండునెలల్లో మేము చేయడం మీరు స్వయంగా చూస్తున్నారుగదా. తుపాకి ఏకకాలంలో ఒక వ్యక్తిని మాత్రమే చంపుతుంది. కాని అహింసాయుతంగా మేము చేపట్టిన రాజ్యాంగసమ్మత ప్రజాస్వామ్య ప్రక్షాళన, పరివర్తన వ్యక్తిని చంపదు సరికదా సమూలంగా, శాశ్వతంగా మారుస్తుంది. చట్టప్రకారం శిక్షిస్తుంది.. ఐతే.. విధిలేని పరిస్థితుల్లో.. హిందూ ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నట్టు.. యథా యధాహి ధర్మస్య.. తరహాలో.. దుర్మార్గుల దౌర్జన్యం హద్దులు మీరినపుడు, అవధులు దాటినపుడు ధర్మాగ్రహ ప్రదర్శన, దుష్టశిక్షణ అనివార్యమౌతుంది. నరకాసురవధ హత్యకాదు. దుష్టసంహారమౌతుంది. అలాగే దయ్యాలకు వేదపాఠం వినిపిస్తే ఎదురుదాడి చేసినట్టు. ఈ మాఫియాగ్యాంగ్‌లు మాపై ‘జనసేన’పై దాడిచేస్తాయని తెలుసు. అట్టి స్థితిని ఎదుర్కొనేందుకు మేము సుశిక్షితుమై, సశరీర సాయుధలమై ఉన్నాం. మా యువకుల ఒక్కో శరీరాంగం ఆయుధమే. ధర్మం దారితప్పినపుడు అవసరమైతే మనిషిని నిర్మూలించడానికి.. సీనియర్‌ సిటిజన్స్‌తో నిండిన.. అంటే వాళ్ళు డెబ్బయ్‌కిపైగా సంవత్సరాలు తృప్తిగా జీవించారు. జీవితానికి ఒక అర్ధవంతమైన ముగింపును కోరుకుంటున్నారు.. ఊర్కే యింకా యింకా అలా రాయిలా, రప్పలా జీవించి ఏమీ ప్రయోజనంలేదని నిర్ధారించుకున్న వయోవృద్ధులు ఒక ‘ఆత్మార్పణ దళం’గా మావద్ద ఉన్నారు. అవసరమైతే, అనివార్యమైన పరిస్థితుల్లో వాళ్ళను బ్రహ్మస్తంగా ప్రయోగిస్తాం. ఎవడైనా ఒక పరమచంఢాలుడైన రాజకీయ నాయకుడు ఎవరిమాటా విననప్పుడు ఒక వరిష్ట ‘జనసేన’ వృద్ధ కార్యకర్త బహిరంగంగా, ప్రజల సమక్షంలో వాన్ని నిర్మూలించి వాడికి ‘మరణశిక్ష’ను అమలుచేసి ప్రభుత్వానికి స్వచ్ఛందంగా లొంగిపోతాడు. వ్యూహాత్మక ఎత్తుగడలే అవసరమైనపుడు..”

టి.వి. ప్రసారం కొనసాగుతూనే ఉంది.
రాష్ట్రం రాష్ట్రమంతా ఆ క్షణాన యిక ప్రళయించబోతున్న సముద్రాన్ని చూస్తున్నట్టు.. అప్రతిభులై మహదానందంతో ప్రసారాన్ని వింటున్నారు. వీక్షిస్తున్నారు.
అప్పుడాక్షణం.. చరిత్ర ఒక కొత్త పేజీని సింగారించుకుంటోంది.

(సశేషం)

చిత్రాంగి

drushya drushyam 28మన దిష్టి తగులుతుందిగానీ చూడగలిగితే ఎన్ని అందాలో…
అస్పష్టంగానూ, నిగూఢంగానూ ఉండే అనురాగాలూ హృద్యమైన వ్యక్తీకరణలలూ కనుల ముందు దృశ్యబద్ధమైతే మానవులు ఎంత హాయిగా ఉంటున్నారో తెలిసి రాదు!నిజానికి మనుషులు ఏకాంతంలో లేదా తమ వ్యక్తిగత ప్రపంచంలో ఎంత బాగుంటరు?
తమను తాము ఆవిష్కరించుకుని ఆనందించడంలో, తమలో తాము లీనమై ముచ్చట్లాడటంలోవాళ్లు ఎంత ముద్దుగుంటరు!నిజానికి ఈ చిత్రం ఆమెదే.
కానీ, ఇద్దరిని కాంపోజ్ చేస్తూ నేను మరో ఇద్దరు పురుషులనూ ఫ్రేంలోకి తెచ్చాను, గమనించగలరు.

ఎందుకూ అంటే, మరేమీ లేదు. అపోజిట్ సెక్స్ కారణంగా చిత్రానికి ఒక విస్త్రుతి. ఇరువురూ ఇరువురితో సంభాషణలోఉండటంలో ద్యోతకమయ్యే ఒక మోహనం. దానికి సూచికగానే ఇది!
అది ఫోన్ సంభాషణ కావచ్చు. ఏమైనా, అంది వచ్చిన సౌకర్యంలోని సుఖమూ శాంతి, విలాసమూ, అభివ్యక్తిలోని ఆ అలవోకనూ చూస్తారనే ఈ చిత్రం.పరిపరి చూపుల్లో పలు విషయాలూ పలుకుతయనే చూడమనడం!పురుషుల నుంచి విడివడి ఆ ఇద్దరిని మళ్లీ చూడండి. వాళ్లిద్దరూ కాసేపు లంచ్ టైమ్ లో అట్ల కూచున్నప్పుడు తీసిన ఈ ఫొటోను చూడండి. ఆమెనే కనిపిస్తుంది. ఆ రూపసి, ప్రేమమయి, శ్రామికురాలు చిలకపచ్చ రంగు వస్త్రాల్లో తెరతీయగ చూడండి. తనలో లోపలి భావనలకు రూపమీయడంలో లీనమవడంలో ఏదో ఒక ప్రియమైన సంభాషణలో ఉండగా అవతలి ప్రాణంతో ప్రాణమై కలబోసుకోవడంలో ఎంత ఏకాగ్రత ఉన్నది.

బాపు బొమ్మలను ఎన్ని వందలుగా నేను స్వయంగా దర్శించానో.
ఇదొక చిత్రం.

+++

మనుషులు ఏ తెరలూ లేకుండా మరే గోడలూ అడ్డు లేకుండా గొంతు ఒక్కటే ప్రాణం అయినట్లు సంభాషణ పావనం చేసే తీరు ఒక చూడ ముచ్చట. ఆ స్థితిని దర్శిస్తే ఎవరికైనా ఈర్శ కలగక మానదు. చిత్రమేమిటంటే, ఇంతటి సౌజన్యం పెంచింది మాత్రం మొబైల్ ఫోనే!

అది ఫోనే సంభాషణే కావచ్చు. కానీ, ఇరువురి మధ్యా అదొక చెలియలి కట్ట.
బహుశా ఆ గొంతు నిండా ధ్వనించే ఆప్యాయత అభిమానాలతో ఒకర్నొకరు ప్రేమగా పలకరించుకోవడం. క్షేమ సమాచారాలు పంచుకోవడం, అటు పిదప నిదానంగా సంభాషణలోకి దిగడం, పరాచకాలాడటం, నిందా పూర్వకంగా మాట్లాడుకోవడం, అలక వహించడం – అన్నీనూ. అవును. పెదవులు దాటిన పదనిసలకు అంతూ పొంతూ ఉండదు. కానీ, చూడటం కూడా ఒక రొమాన్స్.

+++

ఫోన్. అవును. ఇవ్వాళ మానవ సంబంధాలన్నిటినీ ఒక్కటి చేసిన సందర్భం….ఈ సాఫల్యాన్ని నేనొక్కడినే చూడటం లేదు. అందరి అనుభవంలోనూ ఈ సరాగాలూ ఉన్నవే! ఆ ఉల్లాస సల్లాపాలు ఎక్కడి కక్కడ ఉన్నవే.
వేష బూషణాలు, సహజ సౌందర్యం, లావణ్యమూ, సరస పరిజ్ఞానము, ఇంకా చాలా…అవన్నీ ఉన్నతీకరించబడేవి అనుబంధాలతోనే కదా! అందుకే ఈ బంధం గురించిన చిత్రం.  ఇదొక శ్రమైక జీవుల విలాస సోయగంలో ఒక చిరు ఖండిక.

+++

ఇదివరకు ఎన్నో కట్టుబాట్లు. కులం, మతం, లింగం, ప్రాంతం, ఆర్థిక తారతమ్యాలు.
వీటన్నిటితో కూడి ఇంకెన్నో సాంఘిక కట్టుబాట్లు. ముఖ్యంగా మహిళలకు.

తాను తన కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడమే అరుదు. అలాంటిది ఇప్పుడు తాను తన దగ్గరి వాళ్లతో, దూరపు బంధువులతో, అపరిచితులను పరిచయం చేసుకుని, పరిచయస్తులనూ ప్రియం చేసుకుని, తక్షణపు పలకరింపులతో ఒక హృదయపూర్వక చాలనం.

ఇపుడు ఏ అడ్డూ లేదు. ఉన్నదల్లా తానే. తనను తాను అధిగమించడమే. తన పరిమితి. తనను తాను అదుపులో పెట్టుకోవడమే..అదే ఇవ్వాళ్టి సమస్యా, పరిష్కారం.

+++

ఒకానొక మధ్యాహ్నం.. ఇద్దరు కూలీ చేసుకునే మహిళలు అట్లా లంచ్ టైం అయ్యాక కాసేపు అలా విశ్రాంతిగా కూచున్నరు. ఇంతలో ఒకామె ఫోన్ మోగింది. ఇంకేం? సంభాషణలోకి దిగింది.
మాట్లాడుతూ, మాట్లాడుతూ ఆమె అలవోకగా ఆ నేలను చిన్నగా సాపు చేస్తున్నది. ఏవో ఉంటయి, ఏరుతుంటది. ఇంకేవో కనవడుతై. తీసి పారేస్తది. ఇంకా ఎన్నో.

క్రమంగా ఆమె కళ్లు అరమోడ్పులైతయి. పెదవులు గారాబాలు పోతయి.  నవ్వు, పరిపరి విధాలై వికసిస్తది. ఒళ్లు సిగ్గుల మొగ్గవుతది. మనసు తేలిపోతుంది…అంతా మొబైల్ ఫోన్ మహిమ.

చూస్తుంటే ఆమె ఇక్కడ ఉన్నదనుకోవడం ఒట్టి భ్రమ. తన మనసు అవతలి వ్యక్తి మీదే ఉన్నది.
కేవలం ఆ శరీరం ఇక్కడుందన్నమాటేగానీ తాను అక్కడే ఉన్నది.
మాట్లాడుతూ మాట్లాడుతూ చేతుల్తో కింద నేల మీద అలవోకగా ఏదో రాస్తుంది. అది కవిత్వం కాదా? మునివేళ్లతో ఏదో ముడుతది. ఒక చిన్న పుల్లను తీస్తది. దాంతో చిన్నగా రాళ్లనూరప్పలను కదుపుతూ కదుపుతూ ముచ్చట్లను రాజేస్తది.

అర్థవంతమైనవో కావో మనకేమి ఎరుకగానీ, తీయటి పలుకులేవో వింటూ చెబుతూ తానేదో అనల్పమైన మాధుర్యంలో తేలియాడుతూ ఉండగా బిబూతీ బూషణుడు అన్న మాట గుర్తుకొస్తుంది. స్త్రీ ఒకసారి తన హృదయ ద్వారాలు తెరిచిందా ఇక స్వర్గమే అని!

నిజమే కాబోలు. కానీ ఎంతమందికా అదృష్టం.

చిత్రంలో ఆ సంగతీ చూడవచ్చు. సంభాషణలో ఉన్నప్పుడు వాళ్ల హావభావాలను, కదలికలను, శరీరపు భంగిమలను చూస్తుంటే భువన విజయం అంటే ఇదే అనిపిస్తుంది.మనిషిని సాధించడం. అవును. ఆడవాళ్లని కాదు, ఎవరైనా సరే, మనిషి ఎవరైనా సరే. ప్రేమతో దర్శించండి. వాళ్లను వాళ్లుగా వదిలినప్పుడు వాళ్లెంత బాగుంటరు. ఒకరినొకరు సాధించుకోవడంలో ఎంత దివ్యంగా కానవస్తరు.

+++

అన్నట్టు, ఆ యువతి అవతలి ఎదపై ఊసులాడుతుండగా ఆ మాటల్ని చిన్నగా వింటూ, అదంతా తనకూ తెలుసు లేదా నేనూ అనుభవించినదే అన్నట్టు ఆ సోదర మహిళ! ఒక అంగీకారం గల మనిషి పక్కన ఉన్నందువల్లో ఏమో ఈ యువతి కూడా హాయిగా లీనమైపోవడం…ఇదంతా చిత్రమే, చూస్తే! లీనమే అనుభవిస్తే.

వెలుగునీడల ఛాయా చిత్రణలో ఒక చిత్రం ఇట్లా కూడా.

తానెవరూ అని అడిగి చిన్నబుచ్చకండి. అలా తీయడం తప్పే కదా అని పెద్దరికాలు పోకండి.
మీ మనసులో ఉన్న మీ మనుషులను దర్శించమని, ప్రియమైన పరష్వంగం కోసం సంభాషించమని, ఫోన్లో అయినా ఇంత కథనం ఉందనీ అనీ ఈ చిత్రం.

కృతజ్ఞతలు,

~ కందుకూరి రమేష్ బాబు

ramesh

విమర్శ గురించి నాలుగు వాక్యాలు!

 

అసలు విమర్శ అవసరమంటారా అంటే చాలామంది అవసరమే అని అంటారు విమర్శ ప్రయోజనం ఏమిటి అంటే రకరకాలుగా స్పందిస్తారు.

ఒక కవిత చదివిన తరువాత మీ అభిప్రాయం చెప్పండి అంటే మాత్రం చాలామంది వెనుకాడుతారు ఎందుకంటే దీన్లో చాలా రాజకీయం ఉందికనక అంటాను నేను. అభిప్రాయం చెప్పడంలో రాజకీయం ఏముందని మీరు అనుకోవచ్చు కాని కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే మీకే అర్థమౌతుంది. ఎంత తెలివిగా వ్రాసామని అనుకున్నా చదివిన వారికి ఇట్టే అర్థమైపోతుంది మీరు రచయిత పార్టీనా లేక వ్యతిరేకించే పార్టీనా అన్న సంగతి. అభిప్రాయాన్ని అమాయకంగా వెలిబుచ్చే తరం కనుమరుగై చాలా కాలమైంది. లౌక్యం రాజకీయం సర్వసాధారణ మైపొయింది పల్లెటూళ్ళలో కూడా. రోడ్ మీద  నడుస్తున్నప్పుడు అటూ ఇటూ చూసి ఎలా నడుస్తామో అంత జాగ్రత్తగానూ అభిప్రాయాలు చెప్పాలి . విమర్శలు వ్రాయాలి. అవకాశం దొరికింది కదా అని అవాకులూ చెవాకులూ వ్రాస్తే అంతే సంగతులు. ఎక్కడో అక్కడ దొరక్కపోవు అక్కడ తొక్కేస్తారు.

అందుకే అంటున్నాను అభిప్రాయప్రకటన అనుకున్నంత సులభంకాదు. ఏదోఒక పార్టీ లోకి మిమ్మల్ని నెట్టేస్తారు మీ అభిప్రాయాన్ని లేక మీ విమర్శనీ ఆధారం చేసుకొని.

images

సరే అభిప్రాయప్రకటన చేసేటప్పుడు పాటించాల్సిన విధులేమన్నా ఉన్నాయా అంటే చాలానే ఉన్నాయని చెప్పాలి. మొట్టమొదటిది కవితని పదిసార్లు పైనించి కిందికీ కిందినించి పైకీ చదవాలి. కవిత్వం అంటే ఏమిటో కూడా క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. కవిత్వానికీ ఫక్తు వచనానికీ గల ముఖ్యమైన  తేడాలు తెలిసి వుండాలి. అసలైన రసజ్ఞత ఉండాలి. కవిత్వం అంటే అమితమైన ప్రేమ కూడా ఉండాలి. కవిత్వ ఆల్కెమీలో ఉపయోగపడే పదాలు, పదబంధాలు, పదచిత్రాలు, ఉహాత్మక వై చిత్ర్యాలు,వాక్యవిన్యాసాలు, బింబ ప్రతిబింబ రహస్యాల గురించి  క్షుణ్ణంగా తెలిసి వుండాలి. అప్పుడే ఒక నాణ్యమైన నిష్పక్షపాత మైన విమర్శ వ్రాయగల సత్తువ కలుగుతుంది. ఇవేమీ తెలియకుండా విమర్శ వ్రాయకూడదా అంటే మహరాజులా వ్రాయచ్చు

 

కానీ ఆ ప్రయత్నం నుంచి ఎటువంటి ప్రతిఫలం ముట్టాలో అటువంటి ప్రతిఫలమే ముడుతుంది. విమర్శకుడు గనక సృజనాత్మకతని జోడించి కవిత తాలూకు అంతరార్ధాన్ని అందుకుని వివరించ గలిగితే ఇంకేముంది కళ్లముందు ఒక మంచి సాహిత్య విమర్శ దర్శనమిస్తుంది.

 

అయితే ఒక కవిత మనకి సరిగ్గానే  అర్దం అయిందని గారంటీ ఏమిటి – ఎలా నిర్ణయిస్తాం. ఇదంత తేలికైన ప్రశ్న కాదు. చాలా సార్లు మామూలు ఫక్తు వచనపు పలుకులనే మనం అపార్ధం చేసుకుంటున్న సందర్భాలు ఎన్నో వుండగా గుప్తనిధి లాంటి కవితని అర్ధం చేసుకోవడంలోని కష్టం మనకి తెలియంది కాదు.అందుకని మనకు మరికొంత సమాచారం అవసరమనిపిస్తుంది. కవి ఆ కవితని ఏ సందర్భంలో వ్రాశాడో తెలిస్తే కొంత

ప్రయోజనం ఉండొచ్చు. నర్మగర్భితంగా ఉంటుందికదా కవిత. ఆ పై పొరని సున్నితంగా కవిత యొక్క అర్ధం చిన్నాభిన్నం కాకుండా అర్ధం చేసుకోవాలంటే గట్టి ప్రయత్నమే చెయ్యాల్సి ఉంటుంది. చాల తేలికైన వాక్యాలే కదా అనుకున్నామో పప్పులో కాలెసినట్లే అవుతుంది.

 

ఒక కవిత వ్రాసిన కవి తాలూకు వ్యక్తిగత జీవిత విశేషాలు తెలిస్తే ఇంకా మంచిది. అయితే మనకి కవిత మాత్రమే ముఖ్యం అన్న సంగతి మర్చి పోకూడదు.

 

విమర్శ వ్రాయాలనుకునే వాళ్ళు తప్పకుండా గొప్ప ప్రఖ్యాతి చెందిన విమర్శకుల పుస్తకాలు జాగ్రత్తగా అర్ధం చేసుకుంటూ చదవటం బాగా ఉపకరిస్తుంది. విమర్శ మనది కావాలంటే సరయిన అధ్యయనం చాలాచాలా అవసరం. విమర్శ వ్రాయడం దాన్ని అందరి మెప్పూ సంపాదించేలా వ్రాయడం అంత తేలికేం కాదు.

ప్రయత్నిస్తే సాధ్యపడవచ్చు. ప్రయత్నించండి. శుభం భూయాత్!

సుమనశ్రీ

SUMANASRI_PHOTO

ఇంగ్లీష్ సూరన కు నాలుగున్నర శతాబ్దాలు!

కాళిదాసు ను భారతీయ షేక్స్పియర్  అని మురిసిపోయిన పాశ్చాత్య సాహిత్య సమాజానికి మనం కూడా షేక్స్పియర్ను ఇంగ్లిష్ సూరన అని పిలిచి ప్రచారం లోకి తీసుకు రావచ్చును.  కాళిదాసు కు, షేక్స్పియర్ కు దాదాపు పదిహేను వందల ఏళ్ల అంతరం వున్నదేమో కానీ పింగళి సూరన కు, షేక్స్పియర్ కు దాదాపు సమకాలీనత వున్నది. 1564 లో పుట్టిన షేక్స్పియర్ కు ఈ ఏడాది నాలుగున్నర శతాబ్దాల  ముచ్చట ఈ ఏప్రిల్ 23న  మరియు 26/27 వారాంతంలోనూ ఘనం గా జరుగుతున్నది. బ్రిటన్ దేశమంతటా, ముఖ్యం  స్ట్రాట్ ఫర్డ్ ఏవన్ లో విశేషించి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి.

ఆంగ్ల దేశపు విఖ్యాత నాటక కర్త , కవి  అయిన షేక్స్పియర్ జ్ఞాపకాలలో ఈ ఎలిజబెతియన్ పట్నంలో ప్రజలు  ఈ ఉత్సవ దినాలలో రెండువైపులా బారులు తీరి  తమ దేశానికి ఈ సందర్భం గా  వొచ్చిన అనేక మంది నటులు, సాహితీ సాంస్కృతిక ప్రముఖులు  దాదాపు వెయ్యి మంది ఈ పాదయాత్రలో  26 ఏప్రిల్, శనివారం నాడు పాల్గొంటున్నారు. వారి వెనుకే పలు రకాల వేషాలలో  మేళాలు, తాళాలు, వాద్యాలూ సంరంభం గా కళాకారులు పాల్గొంటున్నారు.  వీరంతా హోలీ ట్రినిటీ చర్చ్ ప్రాంగణంలో షేక్స్పియర్ సమాధి వద్దకు వెళ్ళి పుష్పాంజలి ఘటిస్తారు.

index

వీటికి మించి అక్కడ ఆరోజంతా  షేక్స్పియర్ జన్మస్థల కమిటీ , మరియు  రాయల్ షేక్స్పియర్ కంపెనీ వచ్చిన వారిలోని  అన్నివయసుల సందర్శకులకూ, తగు వినోద కార్యక్రమాలు, షేక్స్పియర్ రచనల నుంచి ప్రదర్శనలూ ఏర్పాటు చేస్తున్నారు.  వీటిలో భాగం గా, సంగీత కార్యక్రమాలు,  వీధి ప్రదర్శనలూ, కథలు చెప్పే ప్రక్రియలూ,  రంగస్థల పోరాటాలూ,  రకరకాల మేకప్ లలో ఊరంతా కలయ దిరగడాలూ వంటివి చోటు చేసుకోబోతున్నాయి. ఇంకా షేక్స్పియర్ స్మారక భవనాలకు యాత్రలూ, చేయవచ్చు. అవకాశం కలిసొస్తే, ఏ ప్రముఖ నటుడిని అయినా ఒక షేక్స్పియర్ పాత్రలో మనకు సమీపంలోనే కూడా చూడవచ్చు.

2014 లో షేక్స్పియర్ 450వ జన్మదినం కాగా 2016 లో ఆయన నాలుగువందలవ వర్ధంతి వరకూ ఈ ఉత్సవాలను సాంకేతికత సహకారం తో  లైవ్ స్ట్రీమింగ్ సినిమా  గా ప్రదర్శించనున్నారు, ఇది నాటక ప్రదర్శనలు, ఒక స్థలానికి, ఒక కాలానికి, మాత్రమే పరిమితమై ఉంటాయి అనే పడికట్టు ఆలోచనను విప్లవాత్మకం గా మార్చివేయననున్నది. దీని వల్ల, ఒక వూరిలో  ఒక వేదిక పై ప్రదర్శితమవుతున్న నాటకం అదే సమయంలో, ఎన్నో నగరాలలో,   థియేటర్లలో ప్రదర్శన సాధ్యమవుతుంది. ఇలా ఇంగ్లాండ్ లో ఒక చోట ప్రదర్శితమవుతున్న నాటకం, అమెరికా లోని 42 పలు ప్రాంతాలలోని థియేటర్లలో చూడవచ్చు. ఇంకా అదే సమయానికి, , తమ సమయాన్ని సమన్వయం చేసుకుంటున్న ఆస్ట్రేలియా, కెనడా, మాల్టా, స్వీడన్, రష్యా , జర్మని, ఐర్లెండ్ వంటి  దేశ దేశాల థియేటర్లలో  పలు దేశాల ప్రేక్షకులు చూడ సాధ్యమవున్నది. బహుశా  సినిమా రంగానికి ఇటువంటి లైవ్ డ్రామా ( థియేటర్ లో మంచి తెర, మంచి సౌండ్ తో) చూడగలిగే సాంకేతిక సౌలభ్యం, సాంస్కృతిక రంగానికి అందుబాటులోనికి రావడం కొత్త మార్పులకు దారి తీయవచ్చు. దీనివల్ల మన తెలుగు నాటక రంగానికి, మంచి రోజులు రావచ్చు అనే ఆశ కలుగుతున్నది. సినిమాలు లేక మూలన పడిపోతున్న ఎన్నో థియేటర్లు ఈ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే అవకాశం, వాస్తవం గా పరిణమించే రోజులను మనం చూడబోతున్నాము అనిపిస్తున్నది. ఇందుకు, షేక్స్పియర్ నాలుగున్నర శతాబ్దాల  ముచ్చట్లు ఒక ఆరంభ బిందువు కావడం ఒక సబబైన సందర్భం.

గెలిలియో పుట్టిన ఏడాదిలోనే పుట్టి , ఈ శాస్త్రవేత్త అంతరిక్ష లోకాలలోకి  చూస్తే, మనిషి మనోలోకాలలోకి  చూసిన  అక్షర దార్శనికుడు షేక్స్పియర్. తన 52 ఏళ్ల జీవితంలో ఎన్నో నాటకాలూ , కవితలూ రాసిన షేక్స్పియర్, ఆంగ్ల భాషా వికాసంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ కవి రాసిన ఎన్నో మాటలు, పద బంధాలు, ప్రజా జీవనం లో , పత్రికా  రచనలలో, ఆంగ్ల సంస్కృతిలో  ఆంగ్లేయులు రోజూ వాడే ఈ ఇంగ్లిష్ మాటలు ఇలా  కాయిన్ చేసి రాసినది ఈ రచయితే. (dead as a doornail, a laughing stock, fair play, neither here nor there, in stitches వంటివి) ఆల్  ద వర్ల్ద్ ఈజ్ ఎ స్టేజ్, యు టూ బ్రూటస్, ద మోస్ట్ ఆన్ కైన్డెస్ట్ కట్ ఇంకా ఎన్నో షేక్స్పియర్ ఆంగ్ల పలుబదులు, ఆ భాషా సంస్కృతీ సాహిత్యాలలో,  చెరగని   ముద్రలు గా నిలిచిపోయాయి. తన రచనలలో మౌలికమైన ఇతివృత్తాలు తక్కువే అయినా, అనేక నాటకాలు  గ్రీక్, రోమన్ రాజుల కుటుంబాల కథలు అయినా వాటిని ఆంగ్లంలో అందుకున్న ఘనత షేక్స్పియర్ దే. పన్నెండు విషాదాంత   నాటకలూ, పది చారిత్రక నాటకాలూ, పదహారు సుఖాంత నాటకాలు  రాసినా, విషాద, చారిత్రక నాటకాలు వాటి ఇతివృత్త పరిమితులలో గొప్ప ఎత్తులకు ఎదగగా, సుఖాంత నాటకాలైన  వాటిలో సాంఘిక జీవనం ప్రతిబింబించగా, కల్పన, కొత్త యెత్తులకు ఎదిగిన దాఖలాలు, పింగళి సూరన కళాపూర్ణోదయం తో ( ఇదొక పద్య కావ్యమైనా) సాటి గా  షేక్స్పియర్  రచనలో కనిపించవు.

పింగళి సూరన కూడా 1550 ప్రాంతాలకు తన ఉత్తమ కావ్య  రచన  చేస్తున్నాడు, ఆయన కళాపూర్ణోదయం వంటి కల్పన ఆనాటి ప్రపంచ సాహిత్యంలో మరొకటి కనిపించదు. కథా కథన  వైచిత్రి, నవీన కల్పనా గల ఈ రచన,  షేక్స్పియర్ కి కొంచెం ముందే జరిగినా, మనం ప్రపంచ సాహిత్యానికి, పింగళి సూరన స్వకపోల కల్పనా ధురీణత  గురించి తెలియ చేసే ప్రయత్నాలు తగినంతగా చెయ్య లేదు. ఇటీవల వచ్చిన అనువాదాలు ఈ దిశలో కొంత ప్రయత్నం చేశాయి. ఇవి ఇంగ్లిష్ తోనే ఆగక స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్ వంటి యూరోపియన్ భాషలలోకి కూడా వెళ్లాల్సిన అవసరం వుంది.

కల్పనా వైచిత్రి  విషయంలో పింగళి సూరన తో పోలిక, షేక్స్పియర్ సృజన వైశాల్యత ను తగ్గించడానికి కాదు, కానీ ఒక  పెద్ద  గీత  కింద  మరొక గమనించ దగ్గ వాస్తవ రేఖ ను పొందు పరచడానికే.   పదిహేనో శతాబ్దపు తెలుగు సాహిత్యం, షేక్స్పియర్ పుట్టుకకు ముందే, ప్రబంధ యాత్ర మొదలు పెట్టింది, అనేది, ప్రపంచ సాహిత్యం లో మన స్థానం ఏమిటో, మనం గ్రహించి, ప్రపంచానికి తెలియ పరుస్తూ, ఇందుకు బాధ్యులైన ప్రతిభా మూర్తులైన  రచయితలను వారు ప్రాచ్యులైనా, పాశ్చాత్యులైనా  సమున్నతం గా గౌరవించి అనుసరించటానికే. ఎటొచ్చీ షేక్స్పియర్  అక్షరాలకు కు నివాళి గా  జరుగుతున్న ఈ జాతీయ  సందడి, మన భారతీయ, తెలుగు కవులకు కూడా జరిగేలా, ఆధునిక చేతన, సాంకేతిక సన్నాహాలూ, చేసుకుంటూ  మనం కూడ అడుగులు వేయాలని ఆశించడం సహజమూ, ఆచరణ సాధ్యమూ  అన్న నా విశ్వాసాన్ని జాతి జనులందరూ పంచుకుంటారని విశ్వసిస్తున్నాను.

    -రామతీర్థ

ram

మేకతోలు నక్కలు

నువ్వెవరో మరి డిసెంబరు 31 అర్థరాత్రి ఫోన్ చేశావు. “మీరు రాసిన కథ చదివాను బావుంది. నేను…..” ఇంకా ఏదో చెప్పబోయావు. గొంతులో మత్తు, మాటలో ముద్దతో కూడిన తడబాటు నాకర్థమయింది. ‘ఎవడో తాగి మాట్లాడుతున్నాడని.

సారీ! రేపు మాట్లాడదాంఅని ఫోన్ కట్ చేశాను. మళ్ళీ ఫోన్ చేశావు. నేను ఫోన్ సైలెంట్ లో పెట్టాను. నాలుగు మిస్డ్ కాల్స్.

తర్వాత రోజు చేశావు అయితే అప్పుడు టైమ్ రాత్రి ఏడే. ‘పర్లేదు రాత్రి న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికే చేసుంటాడేమోలేఅనుకుని ఫోన్ ఎత్తాను.

సారీ అండీ మిమ్మల్ని అందరికంటే ముందుగా విష్ చేసి మీతో ఫ్రెండ్ షిప్ చేద్దామని రాత్రంతా మేలుకొని సమయంలో చేశానుఅన్నావు.

పాపం రాత్రంతా మేలుకున్నాడంటఅని నేననుకోవాలి కాబోలు నీ సంగతి అర్థం అయింది అయినా పర్లేదు చెప్పండిఅన్నాను.

మీ కథ బావుంది

మంచిది మీ పేరు?”

వర్మరాజా రవి వర్మ

వారం కూడా ఒక కథ వచ్చింది చదవండి వర్మ గారూ. మీరేమైనా రాస్తుంటారా?”

రాత్రి ఫోన్ చేశానని మీరు నన్ను గురించి చెడ్డగా అనుకుంటున్నారట్లుంది పైపైన మాట్లాడుతున్నారు

అనుకునేదేముంది. రాత్రి పూట తొమ్మిది దాటితే నేను బయటవారెవరితోనూ మాట్లాడను

నేను ఉమనైజర్ ని కాదు నాకు మీ దగ్గర నుండి ఏమీ అక్కర్లేదు. నాకు అన్నీ ఉన్నాయి నేను కోటీశ్వరుడిని మీకు విషెస్ చెబ్దామని చేశా అంతే

మైగాడ్! ఇదేమిటండీ మీరు అనవసరంగా ఏవేవో మాట్లాడుతున్నారు సరే ఉంటానండీఅని ఫోన్ పెట్టేశాను.

మళ్ళీ చేశావు. “ఏమిటండీ ఫోన్ పెట్టేస్తున్నారు? మాట్లాడుతున్నాను కదా! వినండి ప్లీజ్!”

సరే చెప్పండి మీరు నా కథలు ఇంకా ఏమైనా చదివారా?”

లేదు నేను బిజినెస్ మాగ్నెట్ ని బాగా బిజీగా ఉంటాను. ఇంతకీ మీరు చెప్పలేదు నన్ను మీ ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేశారా?”

చూడండి ఇక్కడ ఫ్రెండ్ షిప్ ప్రసక్తి లేదు. మీరు నా కథ చదివి నచ్చిందని చెప్పడానికి చేశారు. నేను థాంక్స్ చెప్పాను. అంతే మీకు సాహిత్యాభిలాష కంటే ఫ్రెండ్ షిప్ మీద ఎక్కువ ఆసక్తి ఉన్నట్లుంది. ఉంటానండీఅని ఫోన్ పెట్టేశాను.

అప్పటికి ఊరుకున్నావు మళ్ళీ రాత్రి తొమ్మిదిన్నరకి చేశావు, కట్ చేశాను. మళ్ళీ చేశావు, కట్ చేశాను. మూడోసారి మళ్ళీ చేశావు. ఫోన్ తీశాను నీ సంగతేందో తేల్చుకుందామని.

ఎందుకు చేశారు? రాత్రి 9 తర్వాత నేను ఫోన్ లో మాట్లాడనని చెప్పానుగా మీకుఅన్నాను

మీ కథ బావుందని చెప్దామని చేస్తున్నాను. మీరు నాకు థాంక్స్ చెప్పనే లేదు. ఇందాక థాంక్స్ చెప్పానని అన్నారు కాని థాంక్స్ చెప్పలేదు మీరు నాకుఅన్నావు.

ఓకే థాంక్స్

మీ కథ గురించి మాట్లాడాలి రెండో పేరాలో మీరు రాసిన వాక్యం …….”

వర్మ గారూ కథ గురించి మాట్లాడటానికి ఇది సమయం కాదు. నేను మీకు ముందే చెప్పాను 9 తర్వాత మాట్లాడనని ఇది నేను నిద్రపోయే సమయం కాబట్టి రేపు ఉదయం 10 లోపు లేదా సాయంత్రం 4 తర్వాత 9 లోపు చేయండి సరేనా బైఅని నేను ఫోన్ కట్ చేశాను.

మళ్ళీ ఫోన్ చేశావు ఏమనుకుంటున్నారు మీరు నన్ను నేను ఆడవాళ్ళ వెంట పడే వాడిననుకుంటున్నారా? సాయంత్రమైతే నా చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు తెలుసా! మాకు త్రీ స్టార్ హోటల్ ఉంది. గంటలు గంటలు మాట్లాడుకుంటాం మేము హోటల్ లో కూర్చుని ……..”

ఛీ! వెధవఅనుకుని ఫోన్ కట్ చేసి సైలెంట్ లో పెట్టుకున్నాను. నాలుగు మిస్డ్ కాల్స్.

అప్పడు ఎనలైజ్ చేశాను నీ గురించి ఖచ్చితంగా వీడెవరో మనకి తెలిసిన వాడే నా కథలు చదివి ఫోన్ చేసే వాళ్ళకైతే నేనెవరో తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. ‘మీరెక్కడ ఉంటారు? ఏం చేస్తారు?’ అని అడిగి తెలుసుకుంటారు.

కొంత మందికి నా వయసెంతో తెలుసుకోవాలని ఉంటుంది మరికొంత మందిలో నేను రాసిన కథలు నా స్వానుభవమా అనే ఉత్సుకత ఉంటుంది. ఆఫ్ కోర్సు అన్నీ తెలుసుకున్నాక కొంతమంది వెధవల గొంతులు నా మాటలకి గౌరవం గా మారడం, నిరుత్సాహంగా మారడం కూడా ఉంటుంది. కాని నువ్వు నా గురించి అడగడం లేదు నేనెక్కడ ఉంటానో ఆసక్తి లేదు. పోనీ సాహిత్య విమర్శకుడవీ లేదా అభిమానివి మాత్రమే అయితే కథ గురించీ మాట్లాడటం లేదు సంగతి నాకెప్పుడో తెలిసిందనుకో నీకు కథల గురించి ఏమీ తెలియదనిసో నేనెవరో నీకు తెలుసు. నువ్వు నన్ను చూసి కూడా ఉంటావు. బహుశా నేను కూడా నిన్ను చూసే ఉంటానేమో! నువ్వు ఖచ్చితంగా మాకు తెలిసినవాడివో లేకపోతే నాకు తెలిసిన స్నేహితురాళ్ళకి తెలిసినవాడివో అయి ఉంటావు.

ఈసారి ఫోన్ చేయాలి చెప్తా వీడి పనిఅనుకున్నాను.

తర్వాత రోజు సాయంత్రం 4 కి ఫోన్. నడుస్తూ మాట్లాడుతున్నావు. ఎక్కడో బస్టాండ్ లో ఉన్నట్లున్నావు చుట్టూ రణగొణ ధ్వనులు.

ఆఫీస్ నుండి ఇంటికి వెళుతున్నా సరిగ్గా వినపడటం లేదు మళ్ళీ చేస్తాఅని ఫోన్ కట్ చేశావు. ఇదొక డ్రామా నాలుగుకి చేయమన్నాను కదా పాపం చేశాడు అని నేననుకోవాలనమాట. ‘సరే .. కానీఇంకా ఎన్ని నాటకాలు ఆడతావనుకున్నాను. ‘

8 కి ఫోన్ చేసి సారీ మీతో కథ గురించి మాట్లాడదామంటే నాలుగుకి చేయమంటున్నారు. అప్పడు చేద్దామంటే నేను బిజీ. ఇప్పుడు మాట్లాడతాను ఇంకా తొమ్మిది అవలేదుగాఅన్నావు. ‘ఆహా! గొంతులో ఏమి నక్క వినయాలు!?’

ఆఁ మాట్లాడండి

మీరు నాతో ఫ్రెండ్ షిప్ చేస్తారా మాట్లాడతాను

మధ్య ఒక కథ చదివాను….”

ఏం కథ?”

కథలో ఒకావిడని ఫోన్లు చేసి విసిగిస్తుంటుంటాడొకడు. ఆమె ఎంతగా విసిగిపోతుందంటే బాధ తట్టుకోలేక చేతిలో ఉండే సెల్ ఫోన్ బద్దలు చేస్తుంది. నాకు మిమ్మల్ని చూస్తుంటే కథ గుర్తొస్తుంది. కథలోలా నేను…..”

నేను మిమ్మల్ని విసిగిస్తున్నానా అయితే ఇక మీతో మాట్లాడనులెండి. ఇక మీకు ఫోన్ కూడా చేయనుఅని కట్ చేశావు.

ఇదింకో ట్రిక్. అలిగినట్లుగా పెట్టేస్తే ఎదుటి వాళ్ళు చేస్తారని. ఇంకాసేపు బహుశా 10 నిమిషాలు చేయవు అనుకుని హాయిగా నైట్ కాఫీ తాగుతూ కూర్చున్నాను. 5 నిమిషాల్లోనే చేశావు పాపం నా టైమ్ వృథా చేయడం ఎందుకని!

మండిపోయింది నాకు నిన్ను మాట్లాడనివ్వకుండా వినండి నేను చెప్పేది కథలోలా నేను చేతిలో ఫోన్ విసిరికొట్టను ఎందుకంటే మీ నంబరు ద్వారా మీ పేరు, అడ్రస్ కనుక్కోవడం నాకు నిమిషం కూడా పట్టదు. మర్యాదగా మీరు మీరుఅని నన్ను గౌరవించి మాట్లాడారు కాబట్టి వదిలిపెడుతున్నా…..”

ఫోన్ కట్ చేశావు అంతే ఇక నీనుంచి నాకు ఫోన్లు లేవు. ఇప్పుడు నువ్వు విసిరికొట్టావా ఫోను? లేకపోతే సిమ్ విరక్కొట్టావా? ఎందుకైనా మంచిది సిమ్ పోయిందని పోలీస్ కంపైట్ ఇవ్వు లేకపోతే హెర్రాస్మెంట్ కింద జైల్లో పడతావు.

డైరెక్టుగా, ఇన్ డైరెక్టుగా వెకిలిగా మాట్లాడే మగవాళ్ళని చూస్తే భయం అక్కర్లేదు వాళ్ళ సంగతి వాళ్ళ మాటల్లో తెలుస్తుంది కాబట్టి వాళ్ళని తప్పుకోని పోతాం. కాని లోపల ఏదో పెట్టుకుని పైకి మర్యాదగా మాట్లాడుతుంటారే నీ లాంటి మేకతోలు కప్పుకున్న నక్కలు వాళ్ళని కనిపెట్టడం చాలా కష్టం.

అమ్మాయిలందరికీ చెప్తా నీలాంటి వాళ్ళ గురించి

అమ్మాయిలూ చూశారుగా ఇది నిజంగా జరిగింది కథ అనుకునేరు. ఇదొక రకం మేకతోలు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇంకా చాలా రకాల మేకతోళ్ళుంటాయి. అయినా మనకి తెలుసుగా ఎవరో గొప్ప రచయిత అన్నట్లు మనం మానసికంగా దృఢంగా ఉంటే వెధవలైన మగవాళ్ళు పిరికివాళ్ళవుతారనీ, మనల్నేమీ చేయలేరని!!? –

నువ్వూ విన్నావా?……

***

 

radhamanduva1మండువరాధ

 

మగతవాక్యాల మేల్కొలుపు నిశీధి కవిత…!

ఎప్పుడో కానీ ఓ కవిత నిద్రలేపదు. ఎప్పుడో కానీ ఓ కవిత గుండెగదుల ఖాళీలని పూరించదు. ఎప్పుడో కానీ కొన్ని వాక్యాలు ఆలోచనని రేకెత్తించవు. ఇదిగో ఇప్పుడు దొరికింది అలాంటిదే ఓ కవితలాంటి పిలుపు, మేల్కొలుపూనూ. నిశీధి కవితలో!

ఈమె కవితలలో కనిపించే strong metaphors కోసం కనపడిన ప్రతీసారీ ఈ కవితలని చదువుతూంటాను. దానికి మించి అంతకంటే బలమైన ఆవేశపూరిత వాతావరణాన్ని సృష్టించే పదచిత్రాలకోసమూ వెతుకుతుంటాను. ఎక్కడో ఒకటో రెండొ కవితల్లో తప్ప ఈమె నన్ను నిరుత్సాహపర్చలేదు. ముఖ్యంగా కవిత్వానికున్న శృంఖలాల్ని తెంచడానికోసమేనన్నట్టుగా రాసే ఈ కవితల్లో శీర్షికనుంచీ ఎంచుకున్న డిక్షన్ వరకూ తనదైన ఓ ముద్రకోసం తపించకుండా వాడిన డిక్షన్నే మళ్ళీ వాడకుండా ఓ ప్రవాహంలా సాగిపోయే ఈమె కవితల్లో ఓ మాజిక్ ఉంటుంది. పైడ్ పైపర్ ఆఫ్ హామ్లిన్ లాగా నిశీధి పైడ్ పైపర్ ఆఫ్ మాడర్న్ పొయిట్రీ!! ఓ సారి మొదలుపెట్టాక చివరివరకూ చదవాల్సిందే.

ఓ బలమైన జలపాతాన్ని అనుభూతిస్తుండగా హఠాత్తుగా మనల్నేవరో అందులోకి తోసేస్తే అంతే స్పీడుగా బయటకొచ్చి చూసుకుంటే ఒళ్లంతా ఆ నీళ్ళన్నీ మనఒంటిమీదే ఉన్నాయన్న ఓ అద్భుత ఫీలింగ్ నుంచి బయటపడ్డానికి కొంచెం సేపు పడుతుంది. దాదాపు అదే అనుభూతి నిశీధి కవితలు.

తన ఓ కవిత “ఫైట్ ఫర్ లైఫ్ ” లో

“జారిపోతున్న ఇసుకల్లాంటి నవ్వులు ఒడిసిపట్టుకోవటానికి

నిజాల నీడ నుండి పారిపోతూ సూర్యుడి కాన్వాస్ ని

ఉమ్ముల రంగులతో ఎన్ని సార్లు నింపుతావు ”

 

జారిపోతున్న ఇసుకల్లాంటి–ఓ సిమిలీ

నిజాల నీడ, సూర్యుడి కాన్వాస్, ఉమ్ముల రంగూ– ఓ స్ట్రాంగ్ మెటాఫర్

 

మనక్కనిపించే చాలా కవితల్లొ ఇలాంటి ఉపమానాలక్కొదవేమీలేదు. ఐతే ఇదే ఎందుకంత ప్రత్యెకంగా చెప్పుకోవాలంటే దాదాపు ప్రతీ వాక్యంలోనూ ఇన్నేసి ఉపమానాలున్నా అవి విసుగనిపించక మళ్ళీ ఓ సారి వెనక్కెళ్ళి చదివి గుండెకెక్కించుకుని ఊరేగుతూ నలుగురికీ చెప్పాలనే తపన కలగచేయటంలో నిశీధి ఎఫోర్ట్‌‌లెస్ ప్రయత్నం అభినందనీయం.

 

ఇదేకవితలో–

“మెలుకువగా ఉండు , మగతలని కనుచూపు మేరలో కనబడనివ్వకు

రెప్ప వాల్చే సెకనులోనే నీ అస్తిత్వం మరుగు చేసే రక్కసులున్నాయి ”

అసలేవరీమె? ఎలా శాసించగలుగుతుందిలా? ఏమిటి తనకున్న ఆయుధాలు? ఒఠ్ఠి మాటల మంత్రమేనా? ఒఠ్ఠిమాటల యుధ్ధమేనా?

కొత్తైనా, కొంతైనా పాతవాసనేమీ లేని ఈ యువతరపు ఫీమేల్ వాయిస్‌‌కి కావల్సిందేమిటి?

మనచుట్టుపక్కలే ఉన్నా మనమేత్రాం పట్టించుకోని ఇన్ని ఖతర్నాకీలనీ ఎలా ఒడిసిపట్తుకుందేమో కానీ అవన్నీ ఓ నిశీధి శతకంలా మారి మన డెడ్ బ్రెయిన్ని ఉరకలెత్తిస్తుంటే మరి ఆమెందుకు తన కలంపేరుని బ్రెయిన్ డెడ్ అని పెట్టుకున్నట్లు? ఆమె కవితల్ని ఇంకొన్ని చదవాల్సిందే!

 

“అసాధారణ ఆలోచన శబ్దాలు కొన్ని గుప్పిట్లో దాచుకోని

ప్రవహిస్తున్న నీలపు ఆకాశ ప్రవాహం లో మునిగితేలుతూ

ఇంద్రధనస్సు కిరణాల లో సమ తత్వపు సమాధానాలు వెతుకు”

 

బహుశా మొదటి వాక్యంలో “దాచుకోని” కాదేమో, “దాచుకుని” అనుకుంటా!

ఐనా ఇంధ్రధనుస్సు కిరణాలలోనూ సమతత్వపు సమాధానాలు వెతకమనడంలో ఉద్దేశ్యం మనకి మనమే ఓ అద్దంలా మారి మనలోకి మనమే తొంగిచూసుకుంటే ఏం కనిపిస్తుందో నిర్మొహమాటంగా చెప్పమంటుందనుకుంటాను.

 

please unlock yourself blatantly and reveal shamelessly

 

“గత సమస్యల శంకువు తోకచుక్క లా పగిలినప్పుడు

రక్తపర్వతాలు బ్రద్ధలయిన లావాలో నువ్వు మునగకముందే

స్టాగ్నేటేడ్ వాటర్లా వాసన రాకుండా మనసుని కొంచం చలించనివ్వు”

 

తోకచుక్క శంకువులా పగలటం కొంచెం అసమంజసమైనా తరువాతి వాక్యపు గాఢతలొ అది కొట్టుకుపొతుంది. అలాగే “స్టాగ్నేటేడ్ వాటర్లా వాసన రాకుండా మనసుని కొంచం చలించనివ్వు” ఇదీ కొంచెం బలమైనదే. “ఆగి వెళ్ళుము” అన్న సైన్ బోర్డ్ లాగా మనసు స్టాగ్నేటేడ్ వాసనరాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలా అని అలోచింపచేసే కమాండ్‌మెంట్.

 

“నీరసించిన హృదయాలతో నీతో పాటు రాత్రి నీడల్లో

చలి ముచ్చట్లు వినే కొన్ని గుండెలని తట్టి లేపు” ఈ ముగింపే కాదు కవితలోని మరికొన్ని వాక్యాల్లోనూ విభిన్నభావాలనీ, different trends నీ కలిపేసిమరీ అతికినట్లు కుట్టినట్లుగా అనిపించినా పాఠకుడికొచ్చే నష్టమేమీలేదు. చదవాల్సిన కవిత ఇది అనటంలొ నిర్మొహమాటేదీలేదు.

 

ఇదీ పూర్తి కవిత—

 

నిశీధి | ఫైట్ ఫర్ లైఫ్ |

వైవిధ్యపు వైర్ చివర జీవితానికో జడ్జ్ మెంట్ డే దొరుకుతుందో లేదో అంటూ

పూల కోసం యే మార్గం లో వెతుకుతున్నావు చీకట్లో

పరిపూర్ణత కోసం ఎన్ని సార్లు పాత మొహాన్నే పగలకోట్టుకుంటూ

అసందర్భంగా యే వాదాన్ని యాచిస్తున్నావు రెస్క్యూ కోసం

జారిపోతున్న ఇసుకల్లాంటి నవ్వులు ఒడిసిపట్టుకోవటానికి

నిజాల నీడ నుండి పారిపోతూ సూర్యుడి కాన్వాస్ ని

ఉమ్ముల రంగులతో ఎన్ని సార్లు నింపుతావు

యుద్ధాలన్నీ శాంతికోసమేనట

ఇంకా మొదలవని యుద్ధాల వెనక

అశాంతి నీడల కదలిక తెలుస్తుందా నీకు

జనోద్దరణ పేరుతో భారీహస్తాల

పెట్రోలు యుద్ధాలు తెలుస్తున్నాయా ?

మెలుకువగా ఉండు , మగతలని కనుచూపు మేరలో కనబడనివ్వకు

రెప్ప వాల్చే సెకనులోనే నీ అస్తిత్వం మరుగు చేసే రక్కసులున్నాయి

నిన్ను శాశ్వత నిద్ర కి పంపి నీ ఎముకల పొడి తో వ్యాపారం చేసే

నయా వలస వాదం మరో సారి మతం ముకౌటా తగిలించుకొని

నీ రక్తం తాగడానికి సిద్దమయింది

అందుకే

అసాధారణ ఆలోచన శబ్దాలు కొన్ని గుప్పిట్లో దాచుకోని

ప్రవహిస్తున్న నీలపు ఆకాశ ప్రవాహం లో మునిగితేలుతూ

ఇంద్రధనస్సు కిరణాల లో సమ తత్వపు సమాధానాలు వెతుకు

గత సమస్యల శంకువు తోకచుక్క లా పగిలినప్పుడు

రక్తపర్వతాలు బ్రద్ధలయిన లావాలో నువ్వు మునగకముందే

స్టాగ్నేటేడ్ వాటర్లా వాసన రాకుండా మనసుని కొంచం చలించనివ్వు

నీరసించిన హృదయాలతో నీతో పాటు రాత్రి నీడల్లో

చలి ముచ్చట్లు వినే కొన్ని గుండెలని తట్టి లేపు

భయాలన్నీ సమూలంగా బహిష్కరించి బ్రతుకు కోసం పోరాడు .

 

 – వాసుదేవ్

541392_4595388722851_1575449086_n

 

 

 

 

 

వెలిగినదొక వానవిల్లు…నిను తలవంచి చూసెనే…

 CMS-when-it-is-raining...!!!(1)
ఎండలు ముదురుతున్నాయ్.. ఎటు వెళ్ళినా విపరీతమైన వేడి, చెమట, చిరాకు. శీతాకాలంలో ఈ చలి ఎప్పుడు వెళ్పోతుందో అని ఎదురుచూస్తామా, ఎండలు రాగానే ఉక్కిపోతున్నాం బాబోయ్ అని గోల పెడతాం. మిగతా కాలాల సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతానికి తెల్లారుతూనే ఫుల్ స్వింగ్ తో తన ప్రతాపాన్ని మనబోటి అల్పులపై చూపెట్టేస్తున్న మిస్టర్ సూర్యుడిని చూసి భయపడిపోతున్నాం.  అందుకనే ఈసారి కాస్త వెరైటీగా వాన పాటల వెంట పయనిద్దామని డిసైడయ్యా..:) కాసిని వాన పాటల్ని చూస్తే వాతావరణమెలా ఉన్నా “చినుకు చినుకు చినుకు చినుకు….” అంటూ కనీసం మనసైనా చల్లబడుతుంది కదా అని. ఉరుములు, మెరుపులతో కాలింగ్ బెల్ మోగించి, చిన్న చిన్న చినుకులతో ఎంట్రీ ఇచ్చి, జడివానగా మారిపోయి పుడమిని నిలువెల్లా తడిపేసే వర్షహేలను చూసి పులకించిపోని హృదయం ఉంటుందా?! అసలు వర్షాన్నీ, వెన్నెలనీ ప్రేమించని మనిషులుండరు కదా!  కాకపోతే కిటికీలోంచి చూస్తూ కూచోవడానికి అద్భుతంగా ఉంటుంది గానీ అర్జెంట్ పనులున్నప్పుడు, బట్టలు ఆరనప్పుడు మాత్రం వాన మీద కోపం వస్తుంది.
మన తెలుగు సినిమాల్లో వానపాటలకేం.. బోలెడున్నాయ్. పాత సినిమా పాటల్లో కూడా చిటపట చినుకుల్ని బాగానే కురిపించేసారు మన సినీ కవులు. “మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరునవ్వులు కాబోలు/ ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు..” అంటూ శంకరశాస్త్రి గారితో కూడా పరవశ వర్షానందగానాన్ని ఆలపింపజేసారు వేటూరి. ఇంకాస్త వెనక్కి వెళ్తే, చిటపట చినుకులతో కురిసింది వాన, మెరిసింది జాణ(అక్కా చెల్లెలు), వాన కాదు వాన కాదు వరదా రాజా.. (భాగ్యచక్రం), కరుణించవా వరుణదేవా(రాజకోట రహస్యం), చిరు చిరు జల్లుల చినుకుల్లారా(ప్రైవెటూ మాష్టారు), చినుకులలో.. వణికి వణికి(రహస్య గూఢచారి), వాన వెలిసిన వేళ(ఘరానా దొంగ),వాన జల్లు కురిసింది…లేరా..(సంపూర్ణ రామాయణం), కొండపైన వెండి వాన(ఇంటి దొంగలు), మొదలైన వాన పాటలు వినడానికి చాలా బావుంటాయి. అయితే,  వర్షం పడటం ఎక్కువగా చూపెట్టిన వాన పాటలు అయితే సరదాగా ఉంటుందని అలాంటి పాటల్ని వెతికానీసారి. అందువల్ల బ్లాక్ ఽ వైట్ తో పాటూ కాసిని రంగురంగుల పాటలతో ఈసారి పాట వెంట పయనాన్ని ముస్తాబు చేసాను. మరి ఎలా ఉన్నాయో వినేసి, చూసేసి చెప్పేయండీ…
వానపాటల్లో మొట్టమొదట అంతా చెప్పుకునేది ఈ పాట గురించే! వినడానికి పరమ అద్భుతంగా ఉంటుంది కానీ చూట్టానికే నాకు మనసొప్పదు :( వీరోవిన్ గారి ఆహార్యం ఎందుకో నా ఫ్రేం లో ఇమడదు. అసలు పాత నటీమణుల్లో బి.సరోజ నాకు బాగా నచ్చుతుంది కానీ ఈ పాటలో మాత్రం స్కార్ఫ్, రెండు పూలజడలతో నన్ను భయపెడుతుందావిడ. అందుకని ఈ పాట ఆడియోని మాత్రమే క్రింద ఇస్తున్నాను..:)
కొన్ని పాటలు అలా కళ్ళు మూసుకుని వినడానికి చాలా బావుంటాయి. ఎన్నిసార్లైనా అలానే వినాలనిపిస్తుంది తప్ప చూడాలనిపించదు. అలాంటి పాట ఇది. ఓ ప్రేమ జంట హద్దుల దగ్గర ఆగడానికి పడే పాట్లు, వారి తపన, గుసగుసలు ఈ పాటలో తెలుపుతారు గీతరచయిత రాజశ్రీ.
“వానల్లు కురవాలి వరిచేలు పండాలి
మా ఇంట మహలక్ష్మి చిందెయ్యాలి..” అంటూ సాగే ఈ కొసరాజు గీతం మనల్ని పూర్తిగా పల్లె వాతావరణంలోకి తీసుకుపోతుంది. స్పెషల్ పాటలకు పెట్టింది పేరైన ఎల్.ఆర్.ఈశ్వరి వాయిస్ ఈ పాటలోని విశేషం.
(చిత్రం: అల్లుడే మేనల్లుడు)
“ముత్యాల జల్లు కురిసే, రతనాల మెరుపు మెరిసే
వయసు మనసు పరుగులు తీసే…అమ్మమ్మా”
అంటూ “కథానాయకుడు” చిత్రంలో జయలలిత ఆనందంతో చేసే నృత్యం చూసి తీరవలసిందే! సుశీల గాత్రంలోని గమకాలు కూడా గిలిగింతలు పెడతాయి. అమ్మాయి కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నా ఎబ్బెట్టుగా అనిపించకుండా చిత్రీకరించిన దర్శకుడిని మెచ్చుకుని తీరాలి.
ఇన్ని పాటల మధ్యన ఓ సరదా గీతం కూడా చూద్దామా..
“చిటపట చినుకుల మేళం తడిపొడి తపనల తాళం” అంటూ “ముద్దుల కొడుకు” చిత్రంలో శ్రీదేవి, అక్కినేని చెప్పే ‘అందమైన అనుభవాలు’ భలే సరదాగా ఉంటాయి. ఈ పాటలో బాలూ గాత్రం అచ్చం అక్కినేని పాడుతున్నట్లే ఉంటుంది. ఇలా ఏ హీరోకి పాడితే ఆ హీరో స్వరాన్ని ఇమిటేట్ చేయడం వల్లనే తన పాటలంతగా ఆకట్టుకున్నాయి మనల్ని.
“వానదేవుడే కళ్ళాపి చల్లగా… వాయుదేవుడే ముగ్గేసి వెళ్లగా..”
“కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే… ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే ” అంటూ గీతాంజలిలో గిరిజ చేసే అల్లరి చూసి అప్పటికప్పుడు తానూ వర్షంలో తడవాలని అనుకోని అమ్మాయి ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. తను వేసుకున్న ఆద్దాల డ్రెస్ లు, చెప్పే డైలాగ్స్, పాడే పాటలూ అన్నీ ఒక అబ్సెషన్ లా ఉండేవి అప్పట్లో అమ్మాయిలందరికీ!
ఈ పాటలో “వెళ్ళడాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి..” అన్న వాక్యం మాత్రం ఇప్పటికీ అర్థం కాదు నాకు :(
పెళ్ళిచూపుల నుండి తప్పించుకోవడానికి ఓ అమ్మాయి కాలేజీ నుండి ఇంటికి రాకుండా ఈ పాట పాడుతూ సాయంత్రాన్ని గడిపేస్తుంది. అంత కష్టపడ్డా ఫలితం దక్కదు. ఆమె వచ్చేదాకా వేచి ఉండి, పిల్ల నచ్చిందని చెప్పి మరీ వెళ్తాడు పెళ్ళికొడుకు. రేవతి అంటే ఎంతో ఇష్టాన్ని పెంచేసిన మణిరత్నం మౌనరాగం ఇది.
“డాన్స్ మాష్టర్” అనగానే కమల్ కన్నా ముందర నాకు గుర్తొచ్చేది ఈ చిత్రంలో రేవతి నటన. అసలు సూపరంటే సూపరే. చలాకీ కాలేజీ పిల్ల గా రేవతి పాడే ఈ పాట తాలూకూ తమిళ్, తెలుగు రెండు వర్షన్స్ బావుంటాయి.
ఇళయరాజా సంగీతం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంటర్లూడ్స్ తో సహా అన్ని బిట్స్ కంఠస్తం నాకు.
కాస్త కొత్త చిత్రాల వైపుకి వస్తే “వర్షం” చిత్రం మొత్తం వాన గురించే కదా. అందులో నాయిక వర్షంతో చేసే స్నేహం, దెబ్బలాట, కబుర్లు అన్నీ భలేగా ఉంటాయి. అన్ని పాటలూ కొన్నాళ్ళ పాటు తెగ మోగాయి ఇంట్లో. ముఖ్యంగా ఈ పాట… అందులో వాన చప్పుడు, త్రిష పట్టీలు… అన్నీ బావుంటాయి.

 

“వాన” చిత్రంలో  కార్తీక్ అద్భుతంగా పాడిన “ఆకాశగంగ” పాటలో వర్షాన్ని చాలా అందంగా చూపిస్తారు. నేను చిత్రాన్ని ఇంతవరకూ చూడలేదు కానీ అండులో పాటలు, ప్రత్యేకంగా ఈ పాట మాత్రం బోల్డు సార్లు విన్నాను. అసలు కార్తీక్ కాకుండా ఇంకెవరన్నా ఈ పాట పాడితే ఇంత బావుండేది కాదేమో అనిపిస్తుంది కూడా.
చివరిగా కొత్త పాటల్లో నాకు బాగా నచ్చిన ఒక వాన పాట.. “నాన్న” చిత్రంలో సైంధవి పాడిన “వెలిగినదొక వానవిల్లు..”! ఈ పాటకు తియ్యటి సైంధవి గళం ప్రాణమా, ప్రకాష్ కుమార్ సంగీతం ప్రాణమా అంటే తేల్చడం కష్టం. డబ్బింగ్ పాట కావడమే ఈ పాటకు చిన్న లోపం. డబ్బింగ్ పాటల్లో సాహిత్యం కుదరదు కదా సరిగ్గా! అయినా కూడా అలా వింటూ వింటూ ఏవేవో కొత్తలోకాల్లో విహరించి రావచ్చు…
మరి బాగున్నాయా వాన పాటలూ? కాస్తైనా సేద తీరారా? మళ్ళీ మరో కొత్త నేపథ్యంతో మరోసారి కలుసుకుందాంమే…
rajiతృష్ణ.

అమ్మవారి పూజ ఐర్లాండ్ లోనూ ఉండేది!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)

ఈ కథలో, నేడు స్త్రీ-పురుషుల మధ్య మనకు తెలిసిన పితృస్వామిక సంబంధాలు తలకిందులైన సంగతి అర్థమవుతూనే ఉంది. మీవే తను ‘క్రౌచాన్ రాణి’నని చెప్పుకోవడమే కాక, మనమిప్పుడున్నది నా రాజ్యంలోనేనని కూడా మొగుడితో అంటుంది. అంటే అది నేడు మనకు అర్థమయ్యే ఇల్లరికం లాంటి దన్నమాట. అలాగని ఆమె మొగుడు అయిలిల్ గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇల్లరికం వచ్చిన పేదవాడు ఏమీ కాదు. అతను మీవేతో అన్ని విధాలా సరితూగేవాడే. అయితే, మీవేను అతను పెళ్లి చేసుకోలేదు, మీవేయే అతన్ని పెళ్లి చేసుకుంది. ఆమాట మీవే స్పష్టంగా అంటుంది, అంటే, పితృస్వామికంలోలా ఎంపిక స్వేచ్ఛ పురుషుడిది కాక, స్త్రీ దన్నమాట. ఇలా అనగానే మన కథల్లోని ‘స్వయంవరం’ అనే మాట మీకు గుర్తొచ్చి ఉండాలి. ఇలా ‘స్వామ్యా’లు తలకిందులవడంలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ‘షాకింగ్’ గా కూడా ఉండచ్చు. నీకు మానభంగం జరగచ్చు కనుక, పెళ్లి కానుకల రూపంలో ‘నీ మొహమంత వెడల్పున బంగారం’తో సహా అందుకు పరిహారాన్ని ముందే చెల్లించి, నీ మానాన్ని నేను కొనేసుకున్నానని మీవే మొగుడితో అంటుంది. బ్రిటిష్ దీవులకు చెందిన కెల్టులలో ఒక ఆచారం ఉండేదట. రోజూ రాత్రివేళ భార్య ‘మానాన్ని హరిస్తారు’ కనుక అందుకు పరిహారంగా ‘ప్రభాత కానుక’ (morning gift) ఇచ్చేవారట. ఇటువంటి కానుకే ఇక్కడ మీవే మొగుడికి ఇచ్చిందన్న మాట. ‘స్వామ్యా’లు ఎలా తలకిందులయ్యాయో చూడండి. కెల్టిక్ తెగలు పాటించిన ఆచారమూలాలు వాస్తవంగా మీవేకు చెందిన మాతృస్వామ్యంలోనే ఉండి ఉండచ్చు కూడా. పితృస్వామ్యంలో మగవాడు బహుభార్యాత్వ హక్కునే కాక, ‘ఉంపుడుగత్తె’ల హక్కును కూడా చలాయించిన, చలాయిస్తున్న సంగతి మనకు తెలుసు. ఇక్కడ మరింత షాకింగ్ ఏమిటంటే, ఈ కథలో మీవే కూడా అదే హక్కును స్థాపించుకుంటోంది. నా దగ్గర ‘ఒక మగవాడి నీడలో ఇంకో మొగవాడు ఎప్పుడూ ఉంటా’డని చెబుతోంది. అయినా నువ్వు అసూయ పడవని తెలిసే ఏరి కోరి నిన్ను చేసుకున్నానని అంటోంది.

మరేం లేదు…దేశాలు, సరిహద్దులు, జాతీయత, మతాలు, విశ్వాసాలు, సంస్కృతి, సాహిత్యం, సిద్ధాంతాలు, రాజకీయాలు, పార్టీలు, స్త్రీ-పురుషుల తేడాలు, దేశాన్నో సమాజాన్నో ఉద్ధరించాలని అనుకోవడాలు, పోరాటాలు, విప్లవాలు…వగైరాల రూపంలో మనం చాలా పెద్ద అడల్టు బ్యాగేజీని మోస్తున్నాం, మోస్తాం, మోయవలసిందే. విషయం అది కాదు….

కాస్సేపు, మన తలకాయలను అణిచేసే ఈ బ్యాగేజిని పక్కన పెడదాం, కాసేపే… అది ఎక్కడికీ పోదు. మళ్ళీ దానిని మనం తలమీదికి ఎక్కించుకోవచ్చు. పక్కన పెట్టి ఏం చేద్దామంటే, ఈ ప్రపంచాన్ని, దీని చరిత్రను, ఈ భూమిని, ఈ మనుషుల్ని అప్పుడప్పుడే ఊహ వికసిస్తున్న ఒక కుర్రవాడిలా, తటస్థంగా, ఒక అద్భుతంగా, ఆశ్చర్యంగా చూద్దాం!

ఈ వ్యాసపరంపరలో నేను అదే చేస్తున్నాను. కనీసం అదే చేయడానికి ప్రయత్నిస్తున్నాను. దానికి భిన్నంగా మీకు ఎక్కడైనా కనబడితే అది నా లోపమే, నా వైఫల్యమే. నా అడల్టు బ్యాగేజిని నేను పూర్తిగా దింపుకోలేదన్న మాట. ఈ వ్యాసపరంపర సందర్భంలో నేను ఒక పుస్తకం గురించి మాట్లాడుతున్నానంటే అది నా దృష్టిలో, మనిషి తన అనుభవాన్ని, ఆలోచనను ప్రోది చేసిన జ్ఞానసంపుటి మాత్రమే. ఒక పుస్తకం మీద మంచిదీ, లేదా చెడ్డదీ అని వేసే ముద్రలు నా దగ్గర ఏవీ లేవు; అది పుస్తకం మాత్రమే. కాకపోతే కొన్ని మామూలు పుస్తకాలు, కొన్ని గొప్పగా చెప్పిన పుస్తకాలు ఉండచ్చు. గొప్పగా ఉండడం, లేకపోవడం వేరు; మంచి-చెడు విభజన వేరు.

ఇంకోటి మీరు గమనించే ఉంటారు, ఈ వ్యాసాలకు ఒక ‘బహిరంగ ఆలోచన’ స్వభావం ఉంది. అంటే ఈ వ్యాసాలలోని చాలా ఊహలు, ప్రతిపాదనల చివరిలో సందేహార్ధకాలు, కామాలు, సెమీ కోలన్లే కనిపిస్తాయి. ఫుల్ స్టాపులు ఎక్కడో కానీ కనిపించవు. మనిషి తన ప్రయత్నం లేకుండా హఠాత్తుగా ఇంత పెద్ద ప్రపంచం అనే ఒక అపరిచిత ప్రదేశంలోకి అడుగుపెడతాడు. తన ప్రయత్నం లేకుండానే నిష్క్రమిస్తాడు. ఈ మధ్యలో ప్రకృతి తనకు నిర్దేశించిన స్వల్ప జీవితంలో ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి అతను జరిపే నిర్విరామ అన్వేషణలో కామాలు, సెమీ కోలన్లు; సందేహార్ధకాలే తప్ప ఫుల్ స్టాపులకు అంతగా అవకాశం లేదని నేను నమ్ముతాను. ఫుల్ స్టాపు పెట్టడమంటే జ్ఞానానికి ఆనకట్ట కట్టడమే. ఇంకో విధంగా అది జ్ఞానాన్ని నిషేధించడమే. అప్పుడప్పుడే ఊహ వికసిస్తున్న కుర్రవాడిలా ప్రపంచాన్ని ఓ అద్భుతంగానూ, మిస్టరీగానూ  దర్శిస్తున్న(కనీసం ఈ వ్యాసపరంపర వరకు) నాకు జ్ఞానాన్ని ఏవేవో లేబుళ్లతో నిషేధించేవారంటే చాలా భయం. జ్ఞానాన్ని నిషేధించడమంటే నా ఉద్దేశంలో చావే!

ఇంతకీ అసలు విషయానికి వస్తే, ఫుల్ స్టాపులు కనిపించని నా అన్వేషణలో నా వరకు నేను ఫుల్ స్టాపులు  పెట్టుకున్నవి కొన్ని లేకపోలేదు. ఒకటి చెప్పాలంటే, ఇది ఫలానా దేశానికి చెందిన సంస్కృతి, మతం, విశ్వాసం అనే విభజనను మించిన అతి పెద్ద మిత్ లేదని నేను అంటాను.  అడల్టు బ్యాగేజి ఏమీ లేని ఒక కుర్రాడిలా తెరచిన పుస్తకంలాంటి కళ్ళతో చూస్తే, ప్రపంచమంతటా ఒకే సంస్కృతి, ఒకే మతం, ఒకే రకమైన విశ్వాసాలు- మనం కల్పించుకున్న అనేకానేక సరిహద్దులను ముంచేసి ప్రవహిస్తూ కనిపిస్తాయి. దీనినే ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే; నా దేశభక్తిని, జాతీయతను మీరు శంకించినా సరే, ‘భారతీయత’ అని చేప్పేది అంతా పెద్ద మిత్ అంటాను. అలా అనడానికి ఇవే వ్యాసాలలో కొన్ని ఉదాహరణలు ఇప్పటికే ఇచ్చాను. ఇక ముందు అటువంటివి మరిన్ని రాబోతున్నాయి. ఇంతకుముందు చెప్పుకున్న ఐరిష్ కథకు గల పురాచారిత్రక నేపథ్యంలోకి వెళ్లినప్పుడు కూడా కొన్ని ఉదాహరణలు దొరకచ్చు.

***

మనకు తెలుసు, మన దేశంలో అమ్మవారిని ఆరాధించడం ఉంది. ఆమె అమ్మలగన్న అమ్మ. ముగ్గురమ్మలకు మూలపుటమ్మ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనే త్రిమూర్తులకు కూడా ఆమె అమ్మ. అమ్మవారికి చెందిన పురాణాలలో అమ్మే త్రిమూర్తులకన్నా గొప్ప. అయితే, త్రిమూర్తులకు చెందిన పురాణాలలో త్రిమూర్తులలో ఎవరికి వారే గొప్ప. ఇది అమ్మవారు, త్రిమూర్తులు ఒకరి ఆధిక్యాన్ని ఒకరు గుర్తించి గౌరవించుకోడానికి జరిగిన ఏర్పాటు, లేదా సర్దుబాటు. సృష్టిలోనే స్త్రీ-పురుషుల మధ్య ఈ సమన్వయం, సర్దుబాటు ఉండవచ్చు. అందులోని ప్రాకృతిక ధర్మాన్ని నేను ప్రశ్నించడం లేదు. అది నా అధ్యాయనాంశం కాదు. సామాజిక, చారిత్రక కోణాలనుంచి వ్యాఖ్యానించడం పైనే ప్రస్తుతం నాకు ఆసక్తి.

67CABA81D0F1641449BD35D21666E

అమ్మవారిని(Mother-goddess) ఆరాధించిన కాలాన్ని స్థూలంగా రాగి-కంచుయుగంగా చరిత్రకారులు వర్గీlకరించారు. సమీప ప్రాచ్యం(Near East-నేటి టర్కీ, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయిల్, సిరియా, సౌదీ అరేబియా మొదలైన దేశాలను ఇలా పిలుస్తారు); సింధు నాగరికతా ప్రాంతాలలో ఈ యుగం క్రీ.పూ. 33000-1200 వరకు; దక్షిణాసియాలో క్రీ.పూ. 3000-1200 వరకు; యూరప్ లో క్రీ.పూ. 2300-600 వరకు; చైనాలో క్రీ.పూ. 2000-700 వరకు కొనసాగినట్టు అంచనా వేశారు. వ్యవసాయ సంస్కృతి పుట్టింది కూడా ఈ కాలంలోనే. ఆ తర్వాత ఇనప యుగం(Iron Age) మొదలైంది. ఈ కాలంలో ఒకవైపునుంచి ఆర్యులు, ఇంకోవైపునుంచి సెమెటిక్ జాతులవారు ఆయా రాగి-కంచుయుగ ప్రాంతాలలోకి విస్తరించి అప్పటికి అక్కడ ఉన్న వ్యవస్థలను కూలదోశారు.

గమనించవలసింది ఏమిటంటే, అమ్మవారి ఆరాధన ప్రాంతాలలో ఉన్న సామాజిక రూపం మాతృస్వామ్యం అయితే, ఆర్యులు, సెమెటిక్ జాతుల సామాజిక రూపం పితృస్వామ్యం. అయితే ఏ వ్యవస్థలోనైనా విజేతలు, పరాజితులు గీత గీసినట్టు ఎప్పటికీ వేర్వేరుగానే ఉండిపోరు. కాలం గడిచిన కొద్దీ ఒకరితో ఒకరు కలిసిపోతారు. మనుషులు కలవడమంటే వారి మత విశ్వాసాలు, సామాజిక రూపాల మధ్య కూడా కలయిక లేదా సర్దుబాటు జరగడమే. ఆవిధంగా స్త్రీ దేవతలు, పురుష దేవతల సహజీవనం ప్రారంభమైంది. ఇలా వివిధ ప్రాంతాలలో జరిగిన దేవతల కూర్పులు, చేర్పులు, తొలగింపులు వగైరాలను థియోక్రేసియా అన్నారు. ఆసక్తి గొలిపే ఆ ప్రక్రియ పూర్తి వివరాలలోకి నేను ఇప్పుడు వెళ్ళడం లేదు.

నాగరికతకు కీలకంగా మారిన చోట్ల, స్థూలంగా క్రీస్తు శకారంభం తర్వాత మూడు నాలుగు వందల ఏళ్ల  వరకు ఈ సర్దుబాటు ప్రక్రియ కొనసాగింది. అంటే, బహుళ దేవతారాధన రూపంలో ఆస్తిక ప్రజాస్వామ్యం ఉండేదన్న మాట. అయితే రోమన్ చక్రవర్తి కాన్ స్టాన్ టైన్ క్రైస్తవానికి అధికార ప్రతిపత్తి కల్పించినప్పటినుంచీ, అనంతరం ఇస్లాం అవతరించిన తర్వాతా, ఇప్పుడు మనం ‘మతం’గా చెప్పుకునే వ్యవస్థీకృత, ఏకేశ్వరోపాసన మతాల ప్రాబల్యం మొదలైంది. ఇవి పితృస్వామిక మతాలు కూడా. పైన చెప్పిన రోమన్ చక్రవర్తి కాలంలో బహుళదేవతారాధన పద్ధతులను ‘పాగాన్’ పద్ధతులుగా చిత్రిస్తూ వాటిని తుడిచిపెట్టడం పెద్ద యెత్తున సాగింది. Witch-hunt(మంత్రగత్తెలన్న ముద్రతో వేటాడి మరీ చంపడం)అనే మాట అప్పుడే పుట్టింది.

విశేషమేమిటంటే, దాదాపు నాగరిక ప్రపంచమంతటా జరిగిన ఈ witch-hunt నుంచి, నా పరిశీలనకు అందినంతవరకూ, భారతదేశం ఒక్కటే తప్పించుకుంది. ఇక్కడ ఇప్పటికీ బహుళదేవతారాధన పద్ధతులు కొనసాగుతున్నాయి. దేవీ, దేవతల మధ్యనే కాదు, చెట్లు పుట్టలు, పశువులు, పాములు వగైరా ఆరాధనా లక్ష్యాల మధ్య కూడా నేటికీ అద్భుతమైన సర్దుబాటు, సయోధ్య కొనసాగుతున్నాయి.  ఇందుకు కారణం ఈ దేశపు ప్రత్యేక స్వభావమే. ఆ రకంగా చెప్పుకుంటే భారతదేశం నేటికీ అచ్చంగా రాగి-కంచుయుగ సంస్కృతిలోనే ఉంది. అంటే, క్రీస్తు శకం లోకి కూడా ఇంకా రాలేదన్నమాట. పాశ్చాత్యప్రపంచానికి భారత్ పట్ల ఆకర్షణకు బహుశా ఇది కూడా ఒక కారణం.  ఇవే మాటలు నేను గత వ్యాసాలలో కూడా చెప్పాను. సందర్భం వచ్చింది కనుక మళ్ళీ చెప్పాను.

తీరా ఐర్లాండ్ కథ ఒకటి ప్రస్తావించుకున్నాం కనుక, అందులోకి వెళ్ళడం కోసం అనివార్యంగా ఈ వివరాలు చెప్పుకోవలసివచ్చింది. నిజానికి ఇవి ఇంతకంటే చాలా సమగ్రంగానూ, లోతుగానూ చెప్పుకోవలసిన విషయాలు.

***

సంగతేమిటంటే, మన దేశంలో మనందరికీ బాగా తెలిసిన అమ్మవారి ఆరాధన, యూరప్ లో ఒక ఒంటరి దీవి అయిన ఐర్లాండ్ లో కూడా ఒకప్పుడు ఉండడం! ఎప్పుడు? సరిగ్గా సమీప ప్రాచ్యం, సింధు నాగరికతా ప్రాంతం మొదలైన చోట్ల  అమ్మవారి ఆరాధన కొనసాగుతున్న కాలంలోనే! అక్కడికి అసలు అమ్మవారి ఆరాధనా రూపం ఎలా వెళ్లిందన్నదే చరిత్రకారుల దృష్టిలో ఒక మిస్టరీ.

ఇంకొంచెం వివరాలలోకి వెడితే, యూరప్ లో వేట ప్రధానంగా జీవించిన పాతరాతి యుగంలో, అంటే క్రీ.పూ. 30,000-15,000 మధ్యకాలంలో ఐర్లాండ్ దాదాపు నిర్జనప్రదేశం. అప్పటికి బ్రిటన్ యూరప్ ప్రధాన భూభాగంలో ఒక భాగంగానే ఉండగా, ఐర్లాండ్ మాత్రం ఒక దీవిగా అవతరించింది.  ఫ్రాన్స్ దక్షిణ భాగం, స్పెయిన్ ఉత్తర భాగం మాత్రమే అత్యద్భుత చిత్రాలు కలిగిన గుహలతో నాటికి ప్రపంచం మొత్తంలోనే మతపరంగా గుర్తించగలిగిన ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. అప్పటికి వాటితో పోల్చగలిగినవేవీ భూమి మీద లేవు.

కానీ, పశ్చిమ యూరప్ లో కంచు యుగం ప్రారంభమయ్యే నాటికి, అంటే క్రీ.పూ. 2500 నాటికి ఐర్లాండ్ హఠాత్తుగా పాశ్చాత్య ప్రపంచం మొత్తాన్ని ఉత్తేజపరిచే శక్తులలో ఒకటిగా మారింది. ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే, నిత్య యవ్వనులైన దేవతలు ఉండే దేవభూమి లాంటి ఐర్లాండ్ కు చెందిన అమ్మవారి మాంత్రికతా కథలే నేటికీ యూరప్ మొత్తంలో వ్యాప్తిలో ఉన్న జానపద కథలకు మాతృకలయ్యాయి.

మధ్య రాతి యుగం(Mesolithic age)లో మాత్రమే ఐర్లాండ్ లో జనావాసాల తాలూకు ఆనవాళ్ళు కనిపించాయి. ఈ యుగం ప్రారంభంలో ఐర్లాండ్ కు కొంతమంది వచ్చారు. ఆ తర్వాత అదృశ్యమైపోయారు. వాళ్ళు ఎవరో, ఐర్లాండ్ కు ఏం తీసుకొచ్చారో, ఎప్పుడు, ఎందుకు అదృశ్యమైపోయారో తెలియదు. వాళ్ళ ఆనవాళ్ళు ఏమీ మిగలలేదు. ఐర్లాండ్ కు వీళ్ళ రాక, క్రీ.పూ. 7800-2500 మధ్యలో ఎప్పుడైనా సంభవించి ఉండచ్చు. ఇక క్రీ.పూ. 2500 నుంచీ ఐర్లాండ్ లో రాగి, కంచు యుగం తాలూకు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఐర్లాండ్ లో ఈ రాగి- కంచు యుగానికి చెందిన దశ తనదైన ఒక సంస్కృతిని సృష్టించింది. అది, అమ్మవారి ఆరాధన(Mother-goddess worship)కు, మాతృస్వామ్యా(Mother Right)నికి చెందిన సంస్కృతి.

క్రీ.పూ.  500-200 మధ్యలో ఇనుము చేతబట్టుకుని పితృస్వామిక కెల్టిక్ తెగలు ఐర్లాండ్ లో అడుగుపెట్టేవరకూ అదే సంస్కృతి అక్కడ కొనసాగింది. తమ కంటే పురోగామి స్వభావం కలిగిన ఇనప యుగానికి, పితృస్వామ్యానికి చెందిన కెల్టిక్ తెగల ప్రాబల్యంలో కూడా అక్కడి మాతృస్వామ్యానికి చెందిన మగరాయళ్ళ లాంటి గృహిణులు క్రీస్తు శకారంభం వరకూ తమ ఆచారాలను కొనసాగించారు. ఆశ్చర్యం గొలిపే ఆ ఆచారాల అవశేషాలు అనంతరకాలానికి చెందిన కెల్టిక్ పురాణ కథలలోనూ ప్రవేశించాయి. ఇంకా చెప్పాలంటే, కెల్టిక్ వీరయుగం ఉచ్ఛదశలో ఉన్నప్పుడు, అంటే క్రీ.పూ. 200-క్రీ.శ. 500 మధ్య కాలానికి సైతం ఐర్లాండ్ లోని ఎందరో శిష్ట, లేదా కులీన మహిళలు కెల్టిక్ పూర్వ తెగలకు చెందినవారే. వీరు తమ మాతృస్వామిక సంప్రదాయాలను పట్టుదలగా కొనసాగించారు.

ఇంతకు ముందు చెప్పుకున్న ఐరిష్ కథ దానికి ప్రతిబింబమే. ఈ కథ పేరు, “The Cattle Raid of Cooley”.

***

ఈ కథలో, నేడు స్త్రీ-పురుషుల మధ్య మనకు తెలిసిన పితృస్వామిక సంబంధాలు తలకిందులైన సంగతి అర్థమవుతూనే ఉంది. మీవే తను ‘క్రౌచాన్ రాణి’నని చెప్పుకోవడమే కాక, మనమిప్పుడున్నది నా రాజ్యంలోనేనని కూడా మొగుడితో అంటుంది. అంటే అది నేడు మనకు అర్థమయ్యే ఇల్లరికం లాంటి దన్నమాట. అలాగని ఆమె మొగుడు అయిలిల్ గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇల్లరికం వచ్చిన పేదవాడు ఏమీ కాదు. అతను మీవేతో అన్ని విధాలా సరితూగేవాడే. అయితే, మీవేను అతను పెళ్లి చేసుకోలేదు, మీవేయే అతన్ని పెళ్లి చేసుకుంది. ఆమాట మీవే స్పష్టంగా అంటుంది, అంటే,  పితృస్వామికంలోలా ఎంపిక స్వేచ్ఛ పురుషుడిది కాక, స్త్రీ దన్నమాట. ఇలా అనగానే  మన కథల్లోని ‘స్వయంవరం’ అనే మాట మీకు గుర్తొచ్చి ఉండాలి.

ఇలా ‘స్వామ్యా’లు తలకిందులవడంలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ‘షాకింగ్’ గా కూడా ఉండచ్చు. నీకు మానభంగం జరగచ్చు కనుక, పెళ్లి కానుకల రూపంలో ‘నీ మొహమంత వెడల్పున బంగారం’తో సహా అందుకు పరిహారాన్ని ముందే చెల్లించి, నీ మానాన్ని నేను కొనేసుకున్నానని మీవే మొగుడితో అంటుంది. బ్రిటిష్ దీవులకు చెందిన కెల్టులలో ఒక ఆచారం ఉండేదట. రోజూ రాత్రివేళ భార్య ‘మానాన్ని హరిస్తారు’ కనుక అందుకు పరిహారంగా ‘ప్రభాత కానుక’ (morning gift) ఇచ్చేవారట. ఇటువంటి కానుకే ఇక్కడ మీవే మొగుడికి ఇచ్చిందన్న మాట. ‘స్వామ్యా’లు ఎలా తలకిందులయ్యాయో చూడండి. కెల్టిక్ తెగలు పాటించిన ఆచారమూలాలు వాస్తవంగా మీవేకు చెందిన మాతృస్వామ్యంలోనే ఉండి ఉండచ్చు కూడా.

పితృస్వామ్యంలో మగవాడు బహుభార్యాత్వ హక్కునే కాక, ‘ఉంపుడుగత్తె’ల హక్కును కూడా చలాయించిన, చలాయిస్తున్న సంగతి మనకు తెలుసు. ఇక్కడ మరింత షాకింగ్ ఏమిటంటే, ఈ కథలో మీవే కూడా అదే హక్కును స్థాపించుకుంటోంది. నా దగ్గర ‘ఒక మగవాడి నీడలో ఇంకో మొగవాడు ఎప్పుడూ ఉంటా’డని చెబుతోంది. అయినా నువ్వు అసూయ పడవని తెలిసే ఏరి కోరి నిన్ను చేసుకున్నానని అంటోంది.

‘ఒక మొగవాడి నీడలో ఇంకో మొగవాడు’ అన్నప్పుడు గురజాడవారి ‘కన్యాశుల్కం’ నాటకంలో ఒక సన్నివేశం, గిరీశం అన్న ఒక డైలాగూ గుర్తొచ్చి ఉండాలి. గిరీశం మధురవాణి ఇంటి తలుపు కొట్టినప్పుడు అప్పటికే అక్కడ ఉన్న రామప్పంతుల్ని మధురవాణి మంచం కింద దాచి తలుపు తీస్తుంది. అంతలో పూటకూళ్ళమ్మ చీపురు కట్ట పుచ్చుకుని గిరీశాన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చినప్పుడు, గిరీశం కూడా అదే మంచం కిందికి దూరతాడు. అక్కడున్న రామప్పంతుల్ని చూసి ‘సానిది విటుణ్ణి మంచం కింద దాచింది’ అనుకుంటాడు. అంటే, ఒక విటుడికి మరో విటుడితో బహిరంగంగా కనిపించే ధైర్యం ‘సాని’కి కూడా లేదన్నమాట. కానీ ఇక్కడ మీవే ‘సాని’ కాదు, తన దగ్గర ‘ఒక మొగాడి నీడలో ఇంకో మొగాడు’ ఎప్పుడూ ఉంటాడని చెప్పుకున్న గృహిణి!

తన దగ్గర ఉన్న తెల్ల కొమ్ముల ఎద్దును ఎరువిమ్మని డైరే అనే అతనికి కబురు పంపినప్పుడు మీవే ఏమందో చూడండి, తన కటి భాగంతో అతన్ని స్నేహం చేసుకొనిస్తానని చెప్పింది. అతను తిరస్కరించేసరికి సైన్యంతో అతని మీదికి యుద్ధానికి వెళ్ళి అతన్ని ఓడించి ఎద్దును ఎత్తుకు వచ్చింది. మీవే ఇక్కడ ‘స్వైరిణి’గా కనిపించే మాట నిజమే. అయితే తటస్థంగా చెప్పుకున్నప్పుడు, పురుషుడనే స్వైరుడికి ఆమె తలకిందుల రూపం మాత్రమే.

***

ఇంతకీ విషయమేమిటంటే; ఐర్లాండ్ గురించీ, పైన చెప్పిన కథ గురించీ జోసెఫ్ క్యాంప్ బెల్ తన ‘Occidental Mythology’లో రాస్తూ, అక్కడ వర్ధిల్లిన ఒకనాటి మాతృస్వామ్యం తాలూకు ఆశ్చర్యకరమైన అవశేషాలు అనంతరకాలపు కెల్టిక్ పురాణ కథలలోకి ప్రవేశించాయంటారు. అది మనకిక్కడ చాలా ముఖ్యమైన వ్యాఖ్య. కెల్టిక్ పురాణ కథల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పితృస్వామిక పురాణ కథలు అన్నిటా ఒకనాటి మాతృస్వామ్యం తాలూకు ఆశ్చర్యకరమైన అవశేషాలు తొంగి చూస్తూనే ఉంటాయి.

మహాభారతం కూడా మినహాయింపు కాదు. ఇందులో చాలాచోట్ల ఆ అవశేషాలు సూచనగానే కాక వాచ్యంగా కూడా కనిపిస్తాయి.

తపతి-సంవరణుల కథ గురించి ఈ కోణం నుంచి ఇప్పటికే కొంత చర్చించాం. సంవరణుడు తపతిని పెళ్లి చేసుకున్నాక పన్నెండేళ్ళు ఆమెతోనే అడవిలో ఎందుకు ఉండిపోయాడు. ఈ పన్నెండేళ్లలో ఏం జరిగి ఉంటుందన్న ప్రశ్నలు మిగిలిపోయాయి. కథకుడు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పలేదు. మాతృస్వామ్య సంప్రదాయం ప్రకారం సంవరణుడు ‘ఇల్లరికం’ ఉన్నాడా అన్న సందేహం కలుగుతుంది. దానిని ప్రస్తుతానికి సందేహంగా మాత్రమే వదిలేస్తాను. ఈ పన్నెండేళ్ళ కాపురంలో తపతి-సంవరణులకు సంతానమే కలగలేదా, వారిని హస్తినాపురం తీసుకువెళ్లాకే వారికి కొడుకు పుట్టడం ఏమిటనే ప్రశ్నలూ కలుగుతాయి. కథకుడు విడిచిపెట్టిన ఈ ఖాళీలను పూరించుకోడానికి ‘పర్వ’ నవలలో భైరప్ప చేసిన అన్వయం ఏమైనా ఉపకరిస్తుందా?!

ఇలాంటి సంబంధాలలో సంతానం మీద హక్కును స్త్రీ-పురుషులు పంచుకుంటారు. అందుకు సంబంధించి ముందే ఒక ఒప్పందం చేసుకుంటారు. సంవరణుడు తన దగ్గర ఇల్లరికం ఉన్నప్పుడు కలిగిన సంతానం తపతికి, అంటే తపతి తెగకు చెందుతుంది. ఆ తర్వాత సంవరణుని కోరిక ప్రకారం ఒక కొడుకుని కని ఇచ్చింది. గంగా-శంతనుల కథలో జరిగింది చూడండి, గంగ ఏడుగురు కొడుకుల్ని తన దగ్గరే ఉంచుకుంది. భీష్ముని ఒక్కడినీ శంతనుడికి ఇచ్చింది. తపతీ-సంవరణులు హస్తినాపురం వచ్చాకే కురుడు పుట్టాడని చెప్పడంలో కథకుడు పితృస్వామిక హక్కును స్థాపిస్తున్నాడు. పన్నెండేళ్లలో ఏం జరిగిందో చెప్పకుండా మాతృస్వామ్య హక్కును మరుగుపరుస్తున్నాడు!

మరో అంశంతో మళ్ళీ వారం…

 – కల్లూరి భాస్కరం

 

మార్కెట్ మాయలో నలుగుతున్న మన కథ ‘ఒండ్రుమట్టి’

మనం నడిచొచ్చిన చరిత్రను అంచనా వేయటం అంత తేలికైన విషయం కాదు. సామాజిక పరిణామాలను సాహిత్యీకరించడం అన్ని యుగాల రచయితలకూ సవాలే. అయినా నిత్య చలనశీలమైన సమాజ పరిణామాన్ని గురించి పట్టించుకోని, వ్యాఖ్యానించని రచయిత ఉండరు. ఒక చారిత్రక గతిలో ముఖ్యమైన మలుపుల వద్ద ఒక నిర్దిష్ట కాలపు చారిత్రక, రాజకీయార్థిక పరిణామాలను చిత్రించిన మాలపల్లి, ప్రజల మనిషి వంటి గొప్ప నవలలు మన సాహిత్యంలో ఉన్నాయి. ఎన్నో రాజకీయ సంచలనాలకు కేంద్రమైన తెలుగు సమాజం అంతే అద్భుతమైన సాహిత్యాన్ని సృజించింది. అటువంటి సాహిత్యం తిరిగి ఈ చరిత్రకు, సామాజిక పరిశీలనలకు రక్తమాంసాలను అందించింది.

అదే ఒరవడిలో సరుకుల మార్కెట్‌ తీసుకొచ్చిన మార్పులను, రాజకీయ సంచలనాలు కదలబార్చిన సామాజిక సంబంధాలను, అనేక పరిణామాలను ఇమడ్చుకున్న కీలకమైన ఒక అర్ధశతాబ్దపు కాలాన్ని నాలుగు వందల పేజీల్లో రక్తమాంసాలతో మన కళ్ళముందుంచే ప్రయత్నం చేశారు విప్లవ రచయిత నల్లూరి రుక్మిణి. మార్పును గురించి మాట్లాడాలంటే నోస్టాల్జియాలో మునిగితేలుతున్న ఇటీవలి సాహిత్య ధోరణుల్లో ఒక స్పష్టమైన శాస్త్రీయ దృక్పథంతో సమాజాన్ని పరిశీలించిన అరుదైన నవల రుక్మిణి తాజా రచన ‘ఒండ్రుమట్టి’.

సాంకేతిక అభివృద్ధిలోని అన్ని అనుకూలాంశాలను భౌతికంగా అందిపుచ్చుకుని, మానసిక ప్రపంచంలో గతించిన కాలాన్ని గురించి, పల్లెలో ఒకనాడుండిన మానవ సంబంధాల గురించి వలపోసుకునే మధ్యతరగతి సాహిత్య జీవుల మన:స్థితిలోకి రచయిత ఇక్కడ పొరపాటున కూడా జారిపోలేదు. ఆ ఛాయలు ఎంతోకొంత రుక్మిణి కథల్లో అంతకు ముందు ఉండేవేమోగాని ఈ ప్రయత్నంలో అందులో నుంచి పూర్తిగా బైట పడ్డారు. అట్లాగే ఒక ప్రత్యేక పీడిత సమూహపు వేదనను వ్యక్తీకరించే అనుభవవాదమూ ఇందులో లేదు. అటువంటి వాటిల్లో సృజనకారులకు తమదైన ప్రత్యేక అనుభవం గురించి లోతైన అభివ్యక్తీకరణ సాధ్యమవుతుంది కాని చలనాలను, పరిణామాలను పట్టుకోవడం కష్టమే.

ప్రాంతీయ ఉద్యమాల సందర్భంలో కోస్తాఆంధ్ర ఆధిపత్యం, అంతర్గత వలస, వనరుల ఆక్రమణ గురించి చర్చ వచ్చినప్పుడల్లా ‘అభివృద్ధి’ గురించి మాటలుంటాయి. వాటి వెంట నీటి పారుదల, కాలువల కింది వ్యవసాయం తొట్టతొలిసారి అందిపుచ్చుకున్న ప్రాంతంగా ఆంధ్ర సంపన్నవర్గాలు ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయార్థిక, సాంస్కృతిక శాసనకర్తలుగా ఎదిగిన క్రమంమంతా నేపథ్యంగా ఉంటుంది. ఆ అభివృద్ధి వికాస క్రమం ఎటువంటిది? అది సాధించిందేమిటి? ఒండ్రుమట్టి నవల కాప్షన్‌ ‘ఒక తీర గ్రామం` యాభై ఏళ్ళ కథ’.

కాలువల కింద వ్యవసాయం ఆదాయంలో మిగులును సృష్టించడం మొదలు మార్కెట్‌ విస్తరణ సమాజాన్ని కదలబార్చిన మార్పు క్రమం కృష్ణాపురం అనే ఒక గ్రామం కేంద్రంగా ఈ కథ నడుస్తుంది. ప్రవాహానికి పోగుపడ్డ ఒండ్రుమట్టి పొరలు పొరలుగా కాలప్రవాహంలో వేగంగా కదులుతున్న జీవితాలను కనీసం ఓ రెండు మూడు తరాలను దృశ్యమానం చేస్తుంది. బకింగ్‌హాం కాలువ రావడం, బండ్లు ఓడలు కావడం, అదే క్రమంలో ఆ చిన్న గ్రామానికి విశాల ప్రపంచపు ద్వారాలు తెరుచుకుంటాయి. మరోవైపు నుండి జాతీయోద్యమ రాజకీయాలు, కమ్యూనిస్టు చైతన్యమూ ఆ ఊరును తాకుతుంది. పాత భూస్వామ్య కోటలు బీటలువారుతుంటాయి. కొత్త ఆధిపత్య వర్గం తలెత్తి బుసలు కొట్టడం మొదలు పెడుతుంది. తరాలుగా తొక్కిపెట్టబడిన కాలికింద మట్టి పైకెగిసి సవాలు చేస్తుంది. సమాజపు అన్ని పొరల్లోనూ ప్రకంపనలు బయలుదేరుతాయి. ఇవన్నీ 50 ఏళ్ళ విశాలమైన కాలపరిధిలో భిన్న వర్గాల, కులాలకు చెందిన అనేక సజీవ పాత్రలతో రూపగట్టడం చిన్న విషయం కాదు. సామాజిక పరిణామాల వెనకున్న ఉత్పత్తి సంబంధాల సూత్రాన్ని పట్టుకోవడం వల్లనే రచయితకు ఇది సాధ్యమైంది. అందుకే రచయిత తాను పుట్టిపెరిగిన మట్టి అయినప్పటికీ నోస్టాల్జియాలో పడిపోక తన అనుభవ జ్ఞానం పల్లె జీవితాన్ని లోతుగా పట్టివ్వడానికే ఉపయోగించుకున్నారు. ఈ జగ్రత్త వహించకపోతే ఏదో ఒక మూలకు జారిపోయే అవకాశం ఉంది. అనుభవానికి శాస్త్రీయ పరిశీలన తోడైనప్పుడే కనిపించే వాస్తవాల వెనక కదిలించే శక్తులు ఏవో నిగ్గుతేలుతుంది.

‘కాణీలు కనపడని రోజుల్లో’ కృష్ణాపురం వర్షాల మీదే ఆధారపడి ఇరవైనాలుగ్గంటలూ గొడ్డు చాకిరి చేసి జొన్న, కంది, రాగి, ధనియాలు పండిరచేది. ఇంటిక్కావలసిన తిండి, బట్ట కోసం ఇంటిల్లిపాదీ ఇరవైనాలుగ్గంటలూ కష్టపడే రైతు కుటుంబాలు, ఊరిని నమ్ముకుని ఉండే వృత్తి కులాలు, పూటకింత సంకటి ముద్ద కోసం జీవితాంతం నెత్తురు చెమటలుగా ధారపోసే జీతగాళ్ళు, అందరినీ అదుపాజ్ఞల్లో ఉంచే జమిందారు `అంతా కట్టుదిట్టంగా బిగించి ఉన్న ఒక బంధ వ్యవస్థ అది. ఆ ఊరివాళ్ళకు ఊరే ప్రపంచం. భూస్వామ్య వ్యవస్థ తాలూకు ఎన్ని ఎగుడు దిగుడులున్నా, ఎన్ని గాయాలు, బాధలున్నా తమ ప్రపంచాన్ని సమష్టిగా పరిరక్షించుకుంటారు. ఏ ఇంట్లో పెళ్ళైనా ఊరంతా ఒక్కటవుతుంది. మధ్యతరగతి రైతు రాయినీడు కోటయ్య కొడుకు తిరుపతయ్య పెళ్ళికి ఊర్లో అందరూ చుట్టాలను పిలుచుకుంటారు. ప్రతి ఇంటి నుండి పాలు, పెరుగు పెళ్ళింటికి తీసుకుపోతారు. అట్లాగే ఏరువాక పండగ రోజు ఊర్లోని రైతులంతా ఒకేసారి అరకలు వరుసగా పొలాలకు నడిపిస్తారు.

జమిందారు రంగస్వామి అరక ముందుంటే దాని వెంట ఊర్లో వారివారి హోదాని బట్టి వారి అరకల క్రమం నిలబడుతుంది. పల్లె స్వభావాన్ని పట్టిచ్చే ఈ రెండు సాంస్కృతిక విశేషాలను నవల చక్కగా ఉపయోగించుకుంది. యాభై ఏళ్ళు గడిచాక పెళ్ళి రూపురేఖలు ఎలా మారిపోయాయో అనే కాదు, ఏ సందర్భం వచ్చినా సమష్టితత్వం కన్నా సంపద ప్రదర్శన ప్రధానమైపోవడం కూడా ఇక్కడ కనపడుతుంది. అప్పటిదాకా మామూలుగా అనిపించిన ఊరు ఏదో కొత్తదనాననికి నాంది పలుకుతున్నట్టుగా ఏరువాక పండగ రోజు విశేషం కనపడుతుంది. ఏరువాక పండగరోజు అంతా సవ్యంగా నడిచినా ఆ ఏడు కొట్టొచ్చినట్టు కనిపించే మార్పు ఏమిటంటే జమిందారు అరక వెనక దానిని మించి తీర్చిదిద్దినట్టున్న వెంకటాద్రినాయుడి అరక . అది ఎదుగుతున్న కొత్త ఆధిపత్య వర్గానికి సూచిక. రంగస్వామి సడలిపోతున్న జమిందారీ వ్యవస్థకు ప్రతినిధి అయితే వెంకటాద్రినాయుడు మార్కెట్‌ విస్తరణ వల్ల తలెత్తిన కొత్త వ్యాపార వర్గానికి ప్రతినిధి. సంప్రదాయబద్ధుడైన జమిందారు రామస్వామి తండ్రి అతనికి కొన్ని సూత్రాలు చెప్పాడు.

రైతులకు అప్పు ఇవ్వుగాని పత్రం రాయించుకోకు. ఇనుప ముక్కల వ్యాపారం చేయొద్దు. అసలు వ్యాపారమంటేనే అవసరమైన చోట తగ్గి ఉండాలి. అది జమిందార్లు చేసే పని కాదు. అప్పుకు పత్రం రాయించుకోడమంటే తన రైతులు తన విశ్వాసం తప్పుతారని అనుమానం కలగడమే. ఆ భావన కూడా ఎన్నటికీ రాకూడదు. అయితే కాలం తీసు కొచ్చేమార్పులను ఎవరూ ఆపలేరు. కాలానుగుణంగా మారలేని పెద్దరికం, ఆధిపత్యం కూడా నశించక తప్పదు. మార్పును అర్థం చేసుకుని, వచ్చే అవకాశాల్ని పట్టుకుని ఎదిగే నూతన శక్తులు రంగం మీదికి రాక తప్పదు. వెంకటాద్రినాయుడు పిల్లలు మద్రాసు చదువులు చదువుకుని, ఓడల వ్యాపారంలో ఒడుపు తెలుసుకుని, మిగులు సంపాదించి పెట్టడంతో, అతను రైతులకు అప్పులు ఇవ్వడమే కాదు, పాత జమిందారులా కాకుండా కచ్చితంగా నోటు రాయించుకుని ముక్కు పిండి వసూలు చేస్తాడు. జమిందారు రంగస్వామే నయం అని రైతులనుకుంటేనేం, అతను అంతకంతకూ సంపన్నుడై ఊరు మీద పట్టు సంపాదిస్తాడు. ఆనాటి జాతీయోద్యమ రాజకీయాల కాలంలో రంగస్వామి జస్టిస్‌ పార్టీవైపు పోతే, వెంకటాద్రినాయుడు కాంగ్రెస్‌కు దగ్గరవుతాడు. ఇది అత్యంత సహజమే. రాజకీయంగా ఆయా వర్గాలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలవి.

వ్యవసాయంలోకి వ్యాపారపంటగా పొగాకు రావడంతో రైతులు కూడా మెదటిసారిగా మిగులు కళ్ళజూస్తారు. చీరాల పట్టణంతో సంబంధం ఏర్పడి జాతీయోద్యమ రాజకీయాలు రైతులనూ తాకుతాయి. చీరాల`పేరాల పన్నుల నిరాకరణ ఉద్యమం, పుల్లరి వ్యతిరేక ఉద్యమం, జలియన్‌ వాలాబాగ్‌ దేశం నలుమూలలా ప్రతిధ్వనించిన రోజులు అవి. జాతీయోద్యమంతో ప్రభావితులైన మధ్యతరగతి రైతు యువకుల్లో రాయినీడు కోటయ్య రెండో కొడుకు పరమయ్య ఒకడు. పురోగామి రాజకీయాల వైపు నడిచిన మధ్యతరగతికి ప్రతినిధి పరమయ్య. ఇతను తర్వాతి కాలంలో గొప్ప కమ్యూనిస్టు అవుతాడు. ప్రపంచ యుద్ధంతో పొగాకు ధరలు పడిపోవడం, అతివృష్టి రైతుల కష్టార్జితాన్ని నీళ్ళపాలు చేసి అప్పులు మిగిలించడం వంటి ప్రతికూల పరిస్థితుల్లో కృష్ణాపురం రైతులకు తెలంగాణ ప్రాంతంలో నిజాం సాగర్‌ డ్యాం కింద కారుచవగ్గా దొరికే భూమి  ఆశలు కలిగిస్తుంది. సాహసం చేసి వలస పోయే రైతుల బృందంలో పరమయ్య కూడా ఒకడవుతాడు. కుటుంబాన్ని ఒడ్డుకు చేర్చడం కోసం అతను రాకూరు పయనమై రాత్రింబగళ్ళు గుట్టలు చదునుచేసి కండలు పిండి చేసుకుంటాడు. కుటుంబం ఎదిగివచ్చిన ఫలితం పరమయ్య తమ్ముడు  వెంకయ్యకు అన్ని విధాలుగా తోడ్పడుతుంది. వెంకయ్య పెద్దకొడుకును విదేశీ చదువులు వరిస్తే, చిన్న కొడుకు భాస్కరం క్రమంగా ధనిక రైతుల ప్రతినిధిగా కొత్త ఆధిపత్యవర్గంలో చేరతాడు. పరమయ్య మాత్రం తెలంగాణ రైతాంగ పోరాటానికి సారధ్యం వహిస్తున్న కమ్యూనిస్టు పార్టీలో భాగమవుతాడు. రాజ్యహింసను చవిస్తాడు. ప్రజల మనిషిగా రాటుదేలుతాడు. ప్రజల కోసం బతకడంలోని తృప్తిని పూర్తిగా పొందుతాడు. అతని కొడుకు చంద్రం అతని చైతన్యాన్ని అందిపుచ్చుకొని దానిని మరింత ముందుకు తీసుకుపోయే రాడికల్‌ అవుతాడు.

ondrumatti cover

            మొదట బతుకుకోసమే నిజాం పోయిన రైతులు తదనంతరం దొరికినంత భూమీ సంపాదించుకోవడం మొదలు పెడతారు. వ్యవసాయంలోకి యంత్రాలు ప్రవేశించి మార్పుల్ని మరింత వేగవంతం చేస్తాయి. ఎప్పుడూ కళ్ళజూడని డబ్బు పోగవుతుంది. కృష్ణాపురం రైతుల్ని నడమంత్రపు సిరి ముంచేస్తుంది. పాత విలువలు నశిస్తాయి. రైతుల దగ్గర అందిన కాడికి దోచుకునే వ్యాపార వర్గం పుట్టుకొస్తుంది. అప్పు చేయడమే తమ స్థాయిని దిగజార్చుకోవడమని, బాకీ తీర్చమని పదేపదే అడిగించుకోవడం మరింత నామర్దా అని భావించే మధ్యతరగతి రైతు కుటుంబాల నుండే అప్పు ఎగ్గొట్టి తిరిగే దళారీ వ్యాపారులు తయారవుతారు.

అనాయాసంగా పోగుపడుతున్న సంపద ఆధిపత్యపోకడల్లో అరాచకత్వానికి దారితీస్తుంది. తమ ఆధిక్యతను కింది కులాలపై అవకాశం కల్పించుకుని మరీ ప్రదర్శిస్తారు. మార్పు మట్టిమనుషుల్నీ ప్రభావితం చేస్తుంది. ఒకప్పుడు ఆధిపత్య వర్గానికే పట్టణాలతో సంబంధం ఉండేది. కాలక్రమంలో పల్లె ప్రజలందరికీ పట్టణాలతో సంబంధం ఏర్పడుతుంది. కూలీనాలీ జనం పనుల కోసం పట్నాలకు పోవడం బస్సుల రాకతో మరింత సానుకూలమవుతుంది. ఊరిని కాదంటే బతికేదెట్లా అనే భయం ఉండనక్కర్లేని పరిస్థితులొస్తాయి. పీడిత కులాలకూ అంతో ఇంతో చదువులు అందుబాటులోకి వస్తాయి. తమ అవ్వతాతల్లాగా, తల్లిదండ్రుల్లాగా మట్టిముద్దల్లా కాకుండా మనుషుల్లా బతకాలనుకుంటారు. ఒకవైపు కొత్తగా వచ్చిన ఆధిపత్యాన్ని అనుభవించాలని దూకుడుగా ఉన్న నయా భూస్వామ్య వర్గాలు, మార్పును అంగీకరించలేని పాత ఫ్యూడల్‌ శక్తులు (మార్పు తమ జీవితాల్ని సుఖమయం చేయొచ్చుగాని అలగా జనాల్ని అంటకూడదు), మరోవైపు గతంలో మాదిరి అవమానాల్ని సహించి ఊరుకోలేని జ్ఞానం పొందిన పీడిత కులాల కొత్త తరాలు. పరస్పర విరుద్ధ శక్తులు అనివార్యంగా ఘర్షణ పడాల్సిందే.

ఆధితపత్య వర్గాల అసహనం కింది కులాలపై హింసాత్మక అణచివేతను మరింత ఎక్కువ చేస్తుంది. సరుకుల మార్కెట్‌ తీసుకొచ్చిన క్షీణ సంస్కృతి విలువలు ఊర్లో లంపెన్‌ కుర్రకారును తయారు చేస్తాయి. దళిత స్త్రీలపై అత్యాచారాలు చేస్తే కులాధిపత్య భూస్వామ్య సమాజంలో మామూలుగా అడిగేవాళ్ళుండరు. అది మరింత దిగజారుతుంది. అక్కడి నుంచి కనిపించే ఆడపిల్లలనంతా అల్లరిపెట్టే ఆ ఊరి అల్లరి మూక చివరికి పండుగపూట ఊరికోలాహలం మధ్యలో కోమటిశెట్టి భార్యను రేప్‌ చేస్తారు. మంచీ చెడ్డా మాట చెప్పే పెద్దమనుషులు ఊర్లో కరువవుతారు. పాత ఫ్యూడల్‌ విలువలూ పోయి, ఆధునిక సంస్కారమూ అలవడక ఒక విధమైన అరాచక, సంకర సంస్కృతి వృద్ధి అవుతుంది. ఈ నవలలో ఒక్కో సంఘటనకు కార్యాకారణ సంబంధాలు గతితార్కికంగా అల్లుకునిపోయి ఉంటాయి.

కదలబారుతున్న ఆర్థిక పునాదిపై సాంఘిక సంబంధాల పట్టు సడలడంలో ప్రగతిశీల రాజకీయాలు ఉపరితలంలో పోషించిన పాత్ర ఎంతో ఉంది. వర్గపోరాటంలో భాగమైన భూపోరాటాలకు, రైతుకూలీ పోరాటాలకు జమిలిగా సాంఘిక అణచివేతపై పోరాటాలు సాగాయి. కృష్ణాపురంలోనూ కమ్యూనిస్టు రాజకీయాలు ప్రజల్ని సంఘటితం చేసి సన్న కులాలకు అండగా నిలుస్తాయి. జీతగాళ్ళ వ్యవస్థ రద్దవుతుంది. రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో మొదటిసారి అట్టడుగు కులాల వాళ్ళు అగ్రకుల అహంభావంపై దెబ్బకొడతారు. దళితులకు భూమి పంచడానికి పార్టీ ముందుకు వస్తుంది. అయితే ప్రజల్ని మహోజ్వల పోరాటాల వైపు కదిలించిన కమ్యూనిస్టు పార్టీ పోరాటాన్ని పక్కన పెట్టి ఎన్నికల్లో దిగడంతో చైతన్యవంతమవుతున్న పీడిత ప్రజలకు నాయకత్వం లేకుండా పోయింది.

భూమి సమస్య అలా ఉంచితే ఆధునిక కాలంలో దళిత కులాల నుండి కొత్త తరం లేవనెత్తుతున్న ప్రశ్నలకు పోరాట రూపం లేకుండా పోతుంది. ఎన్నికల్లో ఓడిపోయిన కమ్యూనిస్టు పార్టీ ప్రజాఉద్యమాల క్షేత్రంలోనూ నీరసిస్తుంది. పార్టీ బలహీనపడటం పీడిత ప్రజల్ని ఎంతగానో నిరాశపరుస్తుంది. మనదేశంలో రివిజనిజం మార్పుని దీర్ఘకాలానికి వాయిదావేసింది. అయినా పరస్పర విరుద్ధ శక్తుల మధ్య ఎక్కడో ఒక చోట ఘర్షణ బద్దలు కాక తప్పదు. నక్సల్బరీ శ్రీకాకుళాలు అట్లానే విస్ఫోటనం చెందాయి. కృష్ణాపురంలోనూ రాడికల్‌ ఉద్యమం పొద్దుపొడిసింది. సాల్మన్‌ల, మోషేల ఆరాటాలకు పోరాట వేదికనిచ్చింది. అది ఆత్మగౌరవ చైతన్యమే కాదు, ఆయుధం ధరించే తెగువనూ ఇచ్చింది. ఊర్లలో రాడికల్‌ విద్యార్థులు, యువజనలు, జననాట్యమండలి సాంస్కృతిక కార్యకర్తలు చేసిన ప్రచారం కృష్ణాపురం యువతను ఆకర్షిస్తుంది. నిత్య అవమానాలతో వేగిపోతున్న అత్యంత పీడిత సమూహాల పిల్లలు అన్యాయాన్ని ఎదిరించి దెబ్బకు దెబ్బ సమాధానమిచ్చే చర్యలకు పూనుకుంటారు. అటు బోయవాళ్ళూ తిరగబడి, మాదిగలూ తిరగబడి, ఇట్లా ఊర్లో సన్నకులాలు తిరగబడితే మాటలా? సబ్బండకులాలూ ఏకమైతే ఇంకేమైనా ఉందా? అట్లా జరగకుండా మొగ్గలోనే తుంచెయ్యాలనుకుంటాయి ఆధిపత్యశక్తులు. కులం మంటను ఎగదోస్తాయి. మాదిగపేట బూడిద కుప్పవుతుంది.

ఇది కృష్ణాపురంగా కథగా మన ముందుకొచ్చిన కారంచేడు కథ. కారంచేడు ఏం చెప్పింది? చిట్టచివరిగా చర్చికాంపౌండులో ఏర్పాటు చేసిన శిబిరంలో చంద్రం మాటల్లో అది వ్యక్తమవుతుంది. ‘‘ప్రవాహ సదృశ్యమైన సమాజాన్నీ, కాలాన్నీ వ్యక్తులు ఆపలేరు. అలా ప్రయత్నిస్తే వారు దానికింద నలిగి పోవడమే! ఇప్పటికి వాడిదే పైచేయి కావచ్చు… భవిష్యత్తు ప్రజలదే.’’

ఆ తర్వాత ఏం జరిగింది? ప్రపంచీకరణ, ఉదారవాద ఆర్థిక విధానాలు ఏ మార్పుల్ని వేగవంతం చేశాయి? వర్గపోరాట రాజకీయాలు ఏ విజయాలు సాధించాయి? ఏ ఎదురుదెబ్బలు తిన్నాయి? సమాజం ఏ మార్పు దిశగా పోతోంది? ఈ నవల పరిధిదాటి ఇటువంటి ఆసక్తి కొంతమందికైనా కలుగుతుంది. ‘ఇదంతా యువతరం రచయితలు రాయాలి’ అని సాహిత్యంలో సమాజ చలనపు ప్రతిఫలనంపై ఏర్పాటు చేసిన ఒక సెమినార్‌లో ఒండ్రుమట్టి నవలా నేపథ్యాన్ని చర్చిస్తున్నప్పుడు రచయిత అన్నారు. మరి ఈ సవాలును ఎవరు స్వీకరిస్తారో.

 -పి.వరలక్ష్మి

1464695_615025941892480_1810339123_n

 

అమ్మా నాన్నా… కొన్ని అన్నం ముద్దలు!

Velturu2

1

తెలీదు ఎందుకో, అన్నం ముందు కూర్చున్నప్పుడు  కాశిరాజు గుర్తొస్తాడు కొన్ని సార్లు!

ఇంకా

 అసలు ఎప్పుడొచ్చిందో,  చెప్పా పెట్టకుండా ఎప్పుడేలా  పెట్టే బేడా సర్దుకెళ్ళి పోయిందో తెలియని యవ్వనమూ గుర్తొస్తుంది. నోటి దాకా వచ్చిన అన్నం ముద్ద ఇట్టే జారిపోతుందేమో అన్నట్టు  భయపెట్టే జీవితాన్ని గట్టిగా పొదివి పట్టుకోవాలనే పిచ్చి తపన గుర్తొస్తుంది.

చాలా చిత్రంగానే  వుంటుంది జీవితం మరి! దాటిపోయిన మజిలీలన్నీఅలా ఎలా జారిపోయాయా అని కలతబెడ్తాయి. కాని, కవిత్వమనే మాయా లాంతరు పట్టుకొని ఆ దాటిపోయిన వీధుల్లో గాలి కిన్నెర మీటుకుంటూ, సంచారం చేస్తూ పోతున్న వాణ్ని ఈ మధ్య చూసాను నేను! అతనేవో పాడుకుంటున్నాడు, వొక్కో సారి తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. వొక్కో క్షణపు అసహనంలో పక్కన ఎవరితోనో కాసేపు తగువు పడి, ఆ తరవాత పిల్లాడిలాగా కావిలించేసుకుంటున్నాడు. చాలా సార్లు అతను నేనే అనే ప్రతిబింబం అనిపిస్తాడు అందరికీ!

అతన్ని మనమూ మన లోకమూ  కాశిరాజు అని పిలుస్తున్నాం ఇప్పుడు  ఇంకేమని  పిలవాలో తెలియక!!

 

2

కాశిరాజు కవిత్వం చదువుతున్నప్పుడు ఆకలీ, యవ్వనమూ – వీటి చుట్టూ తిరిగే ఏదో వొక తాత్విక గానం వినిపిస్తుంది. ఇతని వాక్యాల్లో వొక తెలివైన అమాయకప్పిల్లాడు వొక తలుపు రెక్క సగమే  తెరిచి చిలిపిగా చూస్తూ వుంటాడు; ఎదో reflexive mood (స్వానుశీలన)లోకి మనల్ని తీసుకెళ్తాడు. ఇప్పటి కవుల దాదాపు అందరి కవితల్లోనూ మామూలుగానే కనిపించే ఈ స్వానుశీలన లక్షణం  కాశిరాజులో మాత్రం అదే ప్రధానంగా కేంద్రీకృతమై వుంటుంది.

Reflexivity – అంటే  తన లోపలికి తను చూసుకోవడం మాత్రమే కాదు, తలుపు ఓరగా తెరచి బయటికి చూడడమే కాదు. బయటికి ఎంత దూరం వెళ్తామో లోపలికీ అంతే దూరం వెళ్ళడం – అసలు సిసలు Reflexivity. కాశిరాజు కవిత్వమంతా ఈ Reflexive అలల చప్పుడు! కేవలం లోపలి మనిషి(insider)గా వుండే మామూలు Reflexivity ని కాశి కవిత్వం ఛాలెంజ్ చేస్తుంది. ఇతని కవిత్వంలోని ఈ స్వానుశీలన స్వభావం కేవలం తననే కాదు, బయటి పాత్రల్ని కూడా ప్రేమగా చూస్తుంది.

ఉదాహరణకి ఈ పంక్తులు చూడండి:

వర్షం వచ్చిన జాడ ఆ వాన కళ్ళకి తెలీదు
అమ్మది ఆకాశమంత దుఃఖం.
అమ్మకల్లకి నాన్న ఉపనది
మా దాహాలు తీరడానికి వాళ్ళు దు:ఖాల్లా ప్రవహిస్తారని
మాకెవ్వరికీ తెలీదు.

 

అమ్మా నాన్న కాశిరాజు కవిత్వంలో తప్పక కనిపించే పాత్రలు. కాని, అవి కాశిరాజు అనే వ్యక్తి తత్వానికి సంబంధించినంత వరకూ అతని లోపలి పాత్రలు కూడా! వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు కాశిరాజు ఎప్పుడూ తనలోపలికి వెళ్ళిపోయి, అలా తవ్వుకుంటూ కూర్చుంటాడు.  ఇది కవిత్వంలో చాలా  కష్టమైన విద్య. కవి చాలా ఉద్వేగ భారాన్ని మోస్తూ బాలన్స్ చేసుకోవాల్సిన సందర్భం. ఉద్వేగాన్ని కేవలం ఉద్వేగంగా కాకుండా, దాన్ని కాసేపు objective గా కూడా చూడగలిగిన నిబ్బరం వున్నప్పుడే పై వాక్యాలు వస్తాయి.

 

తన కవిత్వం చదివే  పఠితని  కూడా ఆ స్వానుశీలన మూడ్ లోకి తీసుకు వెళ్ళడం కాశి ప్రత్యేకత.  ఇతని వొక్కో కవితా చదివేటప్పుడు గుండె చప్పుడు కాస్త పెరుగుతుంది. చదవడం అయిపోయాక అసలే చప్పుడూ వినపడని నిశ్శబ్దంలోకి శరీరాన్ని బట్వాడా చేసి వచ్చినట్టు వుంటుంది. అందుకే, కాశిరాజు కవితని ఆగి ఆగి చదవాలి. అలా ఆగినప్పుడల్లా అతని వూరులాంటి మన ఊళ్లోకి, అతని అమ్మానాయన లాంటి మన అమ్మానాయనల దగ్గిరకీ, వాళ్ళతో తెగిపోతున్న మన “కమ్యూనికేషన్” లోకి, మనల్ని చుట్టేసి వూపిరాడనివ్వని నగరపు మాయలోకీ వస్తూ పోతూ వుంటాం. మన గురించి మనం ఆలోచించుకునే/ బాధ పడే వ్యవధి ఇస్తూ, వాక్యాల్ని కూర్చుతూ వెళ్తాడు కాశిరాజు. ఆ వ్యవధిలో అతను మనల్ని Reflexive గా మార్చి, తన అమ్మానాన్నా కథలో మనల్ని పాత్రలుగా ప్రవేశ పెడతాడు.

కాశిరాజు కవిత తెగిపోతున్న ఆ తొలి సంభాషణల  గురించి ఎప్పటికీ తెగని మనియాది. ఈ కవిత రాసిన శరీరం ఆ కవిత రాయడం ముగిసాక ఎలాంటి నిద్రలోకి వెళ్తుందో తెలీదు. ఆ నిద్రల్లో అతన్ని ఏ కలల సర్పాలు ఎలా చుట్టుకుపోతాయో తెలీదు. సగం మాత్రమే నిండిన అతని కడుపు ఎంత మారాం చేస్తుందో!

కాశిరాజు

కాశిరాజు

3

కమ్యూనికేషన్

ఇంతలేటైంది కదరా ఇంకా తినలేదా అని
అమ్మకి ఆకలైనట్టే అడుగుతావుంటే
ఓ దుఃఖపు జీర నా చెవికెలా చేరిందీ తెలుస్తూ ఉంది
దాన్ని నాదాకా మోసుకొచ్చిన ప్రేమది ఎన్ని సెకన్ల వేగమని
ఎవరినడిగితే తెలుస్తుంది

కాల్ కట్ చేస్తే

ఫోన్ టూ హార్ట్ , హార్ట్ టూ అమ్మా నాన్న
అన్న సంభాషణ సమాదైపోయి
రేపు చేయాల్సిన పనినంతా రివైండ్ చేసుకున్నా

దాహమైనట్టు అనిపించాక లెగాలని చూస్తే సహకరించని ఒళ్ళు
నీరసాన్ని బద్దకంగా చేసుకుని
బయట తినేద్దాం అని సర్ది చెప్పుకుంది

మెట్లుదిగి కాస్త ముందుకెళితే
ఆ మలుపు తిరిగాక ఉండే చపాతీలోడు సర్దేసుకున్నాడు.

నవ్వుకుని నేను పడుకుంటాననుకో పర్లేదు
అక్కడ మా అమ్మకి ఆకలేస్తేనో !

Reflexivity ప్రధాన లక్షణంగా వుండే కవితల్లో dialogue రూపంలో వ్యక్తం కావాల్సిన విషయాన్ని  monologue  కింద మార్చుకుంటాడు కవి. అంటే- బయటికి ఎంతకీ చెప్పలేని, ఎవరికీ చెప్పుకోలేని విషయాన్ని తనలో తానే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. పైన చెప్పిన కవితలో ఈ కవి చేసిన పని అదే!

వొక మామూలు సంభాషణా వాక్యం- “ఇంతలేటైంది కదరా ఇంకా తినలేదా?”- అనే ఎత్తుగడలోనే కవి reflexive mood కి రంగం సిద్ధం చేసి పెట్టాడు. ఆ తరవాత చెప్పిన శారీరక మనఃస్తితులన్నీ ఆ mood కి భౌతిక ప్రతీకలు మాత్రమే!

ఈ కవితలో నిర్మాణపరంగా కవి వేసిన ఇంకో అడుగు: కవిత్వంలోకి కథనాత్మకత ప్రవేశపెట్టడం! తెలుగులో ఆరుద్ర, కుందుర్తి, శీలా వీర్రాజు, రంది సోమరాజు- మన తరంలో నందిని సిద్దా రెడ్డి, జూకంటి, కొన్ని కవితల్లో కొండేపూడి నిర్మల  కథనాత్మక కవిత్వం రాశారు. అవి దీర్ఘ కావ్యాలో, కవితలో అవ్వడం వల్ల వాటిల్లో కథ ప్రధానమై, కవిత్వం అప్రధానమైంది.

వాటికి భిన్నంగా కాశిరాజు చిన్న కవితలో కథనాత్మకతని తీసుకువచ్చాడు. అంటే, short narrative poem – చిన్న కథనాత్మక కవిత- అనే రూపానికి తనకి తెలియకుండానే నాంది పలికి, దాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు కాశి. దీర్ఘ కథనాత్మక కవితలకి భిన్నంగా ఈ తరహా కవితలో దీర్ఘమైన వర్ణనలు వుండవు. పాత్రలు బహిరంగంగా బాహాటంగా మాట్లాడుతూ కూర్చోవు. కథా, పాత్రలు రెండూ కవి అనుభూతిలో భాగమైపోతాయి, ఆ అనుభూతికి గోడచేర్పు అవుతాయి వొక విధంగా!

ఈ కవిత్వ నిర్మాణం సాధించడానికి కాశి వాక్యస్వభావాన్ని మార్చుకుంటూ వెళ్తున్నాడు. ఉప్పెనలాంటి వాక్యాలు వొకప్పుడు కవిత్వంలో బాగుండేవి. ఉదాహరణకి: శ్రీశ్రీ కవిత్వ వాక్యాలు సాధారణంగా వేగంగా ఉరవడిగా ప్రవహిస్తాయి. అలాంటి ధోరణి అలాగే కాకపోయినా వేర్వేరు రూపాల్లో ఇప్పటికీ వుంది. ఇప్పటి కవిత్వ వాక్యాలు సెలయేటి నడకలు అని నాకు అనిపిస్తోంది. ఆగిఆగి వెళ్తూ, తనని తానూ తరచి చూసుకునే reflexive mood ఆ నడకలో కనిపిస్తుంది.

ఈ సెలయేటి రహస్యం తెలిసిపోయింది కాశికి!

*