ఇంకో జీవితంలోకి మార్క్వెజ్!

1

A kind of emptiness in his life had begun there. From then on he had been unable to distinguish, to remember what events were part of his delirium and what were part of his real life.

పందొమ్మిదేళ్ళ వయసులో మార్క్వెజ్ రాసుకున్న మొట్ట మొదటి కథలో వొక వాక్యం అది.

తను రాసుకున్న మొదటి వాక్యాలతో పదే పదే ప్రేమలో పడడం ఏ రచయితకైనా ఎంత ఇష్టంగా వుంటుందో, అంత కష్టంగానూ వుంటుంది. ఆ వాక్యాల నునులేతదనంతో పాటు వాటిలోని అమాయకత్వం అతన్ని ఎప్పుడూ గుచ్చి గుచ్చి చూస్తుంది. తనకి తెలియకుండానే అతను ఆ వాక్యాల్ని తిరగ తొడుక్కుంటూ వుంటాడు, కాని, ఎప్పుడూ వొక కొత్త చొక్కా తొడుక్కునే పిల్లాడిలాగా సంబరపడిపోతుంటాడు. అలాంటి కొన్ని సంబరాల కలయిక – మార్క్వెజ్ ఇప్పటిదాకా గడిపిన జీవితం! అతని ఇంకో జీవితం ఇప్పుడు మొదలవుతుందని నమ్ముతున్నాను కాబట్టి, నా లోకంలో మార్క్వెజ్ కి మరణం లేదు.

ఇవాళ సాయంత్రం మార్క్వెజ్ కన్ను మూశాడని తెలిసిన తరవాత ఆ పందొమ్మిదేళ్ళ వయసు నించి ఇవాల్టి ఎనభయ్యో ఏడు దాకా అతని ప్రయాణం ఏమిటా అని ఆలోచిస్తూ వొక రకమైన అస్థిమితత్వంలోకి జారిపోయాను. ప్రతి వాక్యాన్ని వొక అందమైన జ్ఞాపకంగా చెక్కే శక్తి వున్న మార్క్వెజ్ నిజానికి ఈ రెండేళ్ళ కిందటి నించి వొక్క జ్ఞాపకాన్నీ తలచుకోలేని విస్మృతిలోకి జారిపోయాడు, అల్జీమర్స్ అనే దయలేని వ్యాధి వల్ల!

“What matters in life is not what happens to you but what you remember and how you remember it.”

మార్క్వెజ్ రాసిన ఆ వాక్యం నిన్నటి నించీ విపరీతమైన ఉద్వేగంతో నా లోపల చప్పుడు చేస్తోంది. ఈ చప్పుడు వొక్కో సారి నా చెవుల్ని ఇంకే చప్పుడూ వినలేని స్థితిలోకి తీసుకు వెళ్తోంది. నన్నురకరకాల తలుపుల్లోంచి మార్క్వెజ్ అనే వొక అనేక గదులూ తలుపులూ కిటికీలూ వున్న విశాలమైన సౌధంలోకి లాక్కు వెళ్తోంది.

140417170605-01-gabriel-garcia-marquez-horizontal-gallery

       2     

మొదటి వాక్యాలు రాస్తున్నప్పుడు అతని వయసు పందొమ్మిది. అతని మొదటి వాక్యాలు చదువుతున్నప్పుడు నాకూ పందొమ్మిదే!

కాఫ్కాలూ, కామూలూ, ఇలియాస్ కానెట్టీలూ, పదే పదే చదివే షేక్స్పియర్ మాక్బెత్ లూ, బైరాగి కవిత్వాలలోంచి మళ్ళీ రాస్కల్నికోవ్, హామ్లెట్లూ, డాలీ రేఖలలో కూడా దాక్కున్న అసంబద్ధ వాక్యాలూ, త్రిపుర అనే దేశంలో వొంటరి సంచారాలూ తెగ సందడి చేసే ఆ పందొమ్మిదేళ్ళ అమాయకత్వపు అంతిమ దినాల్లో- బెజవాడ గాంధి నగర్ “ప్రబోధ” బుక్ సెంటర్లో అనుకోకుండా దొరికిన One Hundred Years of Solitude – ఆ యవ్వన కాలపు బైబిల్.

నండూరి సుబ్బారావు గారు “నమిలి మింగిన నా ఎంకి” అని ఎందుకన్నారో అప్పుడే అర్థమైంది. ఈ నవల నన్ను నమిలి మింగేసిందో, నేను ఆ వాక్యాల్ని నమిలి మింగానో తెలియదు. కాని, రాసే వాక్యం మీద చచ్చేంత మమకారాన్నీ, సంశయాన్నీ నింపిన నవల అది.

ఆ తరవాత చాలా కాలం తరవాత Love in the Time of Cholera చదివి, కొన్ని నిద్రలేని రాత్రులు గడిపాక మార్క్వెజ్ ని తట్టుకునే శక్తి పోయింది నాకు! జీవితానికి మరీ అంత సున్నితత్వం అవసరమా అనే సందిగ్ధంలో పడిపోవడం అప్పుడే మొదలయింది. సున్నితత్వాన్ని మించిన యుద్ధం లేదని ఎక్కడో నేను రాసుకున్న వాక్యానికి మూలం ఆ నవలలో, ఆ నవల చుట్టూ నేను అల్లుకున్న మాయా వాస్తవికతలో వుంది.

కాని, సున్నితత్వాన్ని నిశ్శబ్దంతో కానీ, కృత్రిమమైన మౌనంతో గాని ఆట్టే కప్పెట్టలేమని కూడా అప్పుడే అర్థమవడం మొదలైంది. నా లోపల నేను చేసుకుంటూ పోతున్న యుద్ధంలో నాతో నేనే తలపడే సన్నివేశంలో నేను మాత్రమే రాసుకోగలిగే వాక్యంలో మాత్రమే నాకు విముక్తి వుందని మార్క్వెజ్ నాకు నేర్పడం మొదలు పెట్టాడు. కచ్చితంగా అప్పుడే నాకు ఇంకా చదవాలి చదవాలి ఈ సున్నితత్వపు అంతు చూడాలి అన్న కసిని పెంచుకుంటూ వెళ్ళాడు. Love in the Time of Cholera అనే నవల యాభై ఏళ్ళ తరవాత ఎప్పుడో మళ్ళీ పుట్టుకొచ్చే, ఉబికి వచ్చే ప్రేమ గురించి అనుకుంటాం కాని, నిజానికి ఆ నవలలోపలి అసలు కథ ఈ సున్నితత్వపు పునర్జన్మ కాదా!?

అవును – అనే నా సమాధానం, ఎలాంటి సంశయం లేకుండా!

 

3

images

అయితే, మార్క్వెజ్ తో నా అసలు సిసలు సహప్రయాణం 1995 తరవాతనే!

ఆ ఏడాది మార్క్వెజ్ కథలు Strange Pilgrims ఇంగ్లీషు అనువాదం నా కంట పడింది. వొక ఆదివారం పొద్దున్న బెజవాడ అలంకార్ సెంటర్లో సైడ్ వాక్ మీద పరచుకున్న పుస్తకాల మధ్య రికామీగా తిరుగుతున్నప్పుడు Strange Pilgrims పుస్తకం అట్ట నన్ను నిలబెట్టేసింది.

అప్పట్లో ఉద్యమం ఏమిటంటే: కొత్తగా తెచ్చిన పుస్తకం రెండు రోజుల్లో వేడివేడిగా చదివేయాలి. చదివాక అందులో వున్న వాక్యాలు వొక నోట్ బుక్ లో తిరగరాసుకోవాలి. ఇంకో వారం తరవాత ఆ వాక్యాలు మళ్ళీ చదువుకొని, వాటిని తెలుగులోకి తర్జుమా చేసుకోవాలి. మళ్ళీ చదువుకోవాలి. చదువుకుంటూ నిద్రపోవాలి. నిద్రలో ఆ వాక్యాల్ని కలవరించాలి. ఇవన్నీ జరక్కపోతే ఆ రచయితకి నా లోకంలోకి వీసా లేదు.

కాలేజీలో వున్నప్పుడు మహాకవి టాగూర్ గురించి నాకొక థియరీ వుండేది. టాగోర్ గొప్ప కవీ కాదు, మంచి నవలా రచయిత అంత కంటే కాదు, గొప్ప కథకుడు అని! అలాగే, శరత్ మంచి కథకుడు కాదు, గొప్ప నవలా రచయితా అని! అలాగే… అలాగే, త్రిపుర అసలు కథకుడు కాదు, మనకి తెలియని/ మనల్ని ప్రక్రియ పేరుతో నిరంతరం మోసపుచ్చే రహస్య నవలా రచయిత అని!

Strange Pilgrims చదివాక- అలాంటి థియరీ కనిపెట్టేసాను. అప్పుడు కొంత కాలం నా వాదమూ తగవూ ఏమిటంటే, మార్క్వెజ్ నవలా రచయిత కంటే ఎక్కువగా గొప్ప కథకుడు అని!

మార్క్వెజ్ వొక కొత్త రకం భాష వాడుతున్నాడని, వొక కొత్త రకం వాస్తవికత మాట్లాడుతున్నాడని మనకి కచ్చితంగా అర్థమైతే, అతని అన్ని ప్రాణాల అసలు చిలక Strange Pilgrims లో వుందని మీరు కూడా వొప్పుకుంటారు. ఈ పన్నెండు కథలు రాయడానికి అతనికి పద్దెనిమిదేళ్ళు పట్టిందట. అంటే, ఆ కథల్లో ఎన్ని ప్రాణాలు పొదిగాడో అర్థమై వుండాలి కదా! అందులో మొదటి కథ 1970లలో వొక కలలో పుట్టిందట. ఆ కలలో మార్క్వెజ్ కి అంత్యక్రియలు..దోస్తులంతా వచ్చారట. అంతా అయిపోయాక ఎవరి దారిని వాళ్ళు వెళ్లిపోతున్నప్పుడు, తను కూడా వెళ్ళడానికి సిద్ధమయ్యాడు మార్క్వెజ్. అప్పుడు వొక చెయ్యి అతన్ని బలంగా వెనక్కి లాగి, “you’re the only one who can’t go!” అన్నదట. అంతే! మార్క్వెజ్ అక్కడే వుండిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు మార్క్వెజ్ కి అర్థమైంది: చనిపోవడం అంటే స్నేహితుల్ని మళ్ళీ కలవలేకపోవడం అని!

స్నేహితుల్ని కలవలేని ఆ వెలితిలోంచి పుట్టిన కథలు ఇవి. వ్యక్తిగతంగా నాకు ఈ కథలు ఎందుకు నచ్చాయంటే, మార్క్వెజ్ ఇతర రచనల్లో అతని దుఃఖం చాలా transparent గా కనిపిస్తుంది. కాని, ఈ కథల్లో ఆ దుఃఖాన్ని ఏ చేరుమాలుతోనూ దాచుకోలేనితనం కనిపిస్తుంది. అది అప్పుడే చెంప మీద జారి, ఆరిపోడానికి ససేమిరా నిరాకరించే తడి చుక్కలా గోరువెచ్చగా అనిపిస్తుంది ఈ కథల్లో!

వున్న వూళ్ళోనే దిగడిపోయిన మనిషికి వాస్తవికత అన్ని కోణాలూ అర్థమవుతాయని అనుకోను. వలసపోయిన కళ్ళకి కొత్త చూపుల రెక్కలు వస్తాయి. తన దేశానికి దూరంగా వుండి, తనకి తానూ, తన వాళ్ళూ, ఆ పరదేశంలోని వాళ్ళు కూడా పరాయీగా, లేదంటే కొంత ఎడంగా కనిపిస్తున్నప్పుడు మార్క్వెజ్ ఈ కథలు రాసుకున్నాడు. ఆ దూరపు దుఃఖంలో తన వూరికి తను ఎంత దగ్గిరగా వుండాలనుకుంటున్నాడో ఆ ఎడబాటు బాధలోంచి తనకోసమే రాసుకున్న కథలు ఇవి. అవి, కొన్ని క్షణాల్లో నావి అనిపించాయి అంటే, ఆ క్షణాల్లో నేనూ మార్క్వెజ్ తరహా వాస్తవికతలోకి వెళ్ళిపోయానన్న మాట!

ఎలాంటి వాస్తవికత ఇది?! వినండి మార్క్వెజ్ ఏమంటున్నాడో!

True memories seemed like phantoms, while false memories were so convincing that they replaced reality.

నా మిత్రులు చాలా మందికి తెలుసు, నా ఆలోచనల ప్రయాణం మార్క్స్ తో మొదలయింది, మరీ ముఖ్యంగా : The philosophers have only interpreted the world, in various ways; the point is to change it. అన్న వాక్యం. ఇది నా నోట్ పుస్తకాల్లోనూ, ఖమ్మం గోడల మీద ఎర్రెర్రగా రాసుకున్న రోజులన్నీ గుర్తే!

కాని, ఎంతో కొంత లోకాన్ని చూశాక, ఎన్నో కొన్ని పుస్తకాల్ని చదువుకున్నాక, ఎన్నో సంభాషణల తరవాత నాకు అర్థమైందేమిటంటే: మార్పు సుదూర లక్ష్యమనీ, అసలు వాస్తవికతనే ఇంకా సరిగ్గా అర్థం చేసుకోవాల్సి వుందనీ! వేయి పూలలో కనీసం వొక పది పూలయినా పూర్తిగా వికసిస్తే చాలు అని!

తన మరణానికి మరుసటి రోజు – మార్క్వెజ్ మళ్ళీ అదే చెప్తున్నాడు నాకు!

ఈ వాస్తవికతకి నేనెప్పటికీ వొక strange pilgrimని!

 – అఫ్సర్

మీ మాటలు

 1. నాా కెందుకో ఈ రచయిత సిద్ధాంతం నచ్చింది.

 2. సాయి పద్మ says:

  వోప్పుకుంటున్నాను.. ప్రవాసం అనేది సుదూరమైన ఒక ఎడం .. అ ఎడం లోంచి వొచ్చే వొంటరితనం, అబ్జేక్టివిటీ, ఏ మనిషి కైనా , ఏ దేశానైనా .. insomnia plague లో నిలబెట్టి .. ఆరని దుఖపు మానవత్వపు తడి ఇవ్వాలిసిందే… మంచి వ్యాసం అఫ్సర్ జీ..

 3. మణి వడ్లమాని says:

  మార్క్వెజ్ మీద మీకున్న అభిమానం,ఎంతో ఆర్తిగా రాసిన మీవ్యాసమే చెబుతోంది అఫ్సర్ గారు .
  “చనిపోవడం అంటే స్నేహితుల్ని మళ్ళీ కలవలేకపోవడం అని” అతను రాసిన’ మొదటికద’ లోని వాక్యాలు గుండెని పిండాయి.

 4. గొప్ప రచయితకు ఘనమైన నివాళి సార్. నాకు తెలియని మార్క్వెజ్ గురించి చాలా తెలిసింది. నేనూ చదవడానికి ప్రయత్నిస్తా.

 5. Thirupalu says:

  ఒక ముక్కు మొహం తెలీని రచయితకు, ఒక పాఠకునుకి ఏమీ సంబందమో – తల్లి తండ్రులతో, తోబుట్టువుల తో గానీ, చివరకు స్నేహితులు, హితులు, సతులు, సుతులు తోటి మనకెందుకుండదో మీ ఈ వాక్యాలు తెలుపుతున్నవి. అయినా ఈ రచయతలకు మనకు ఏం సంబందం? ఈ ప్రపంచానికి మనకు ఉన్న సంబందమా? వారు ఏడిపిస్తే మనం ఏడుస్తాం. వారు నవ్విస్తే మనం నవ్వుతాం. -అన్ని రకాల భావాల్ని వారితో పంచుకుంటాం. ఏం సంబందమిది?

 6. చాల గొప్పగా చెప్పారు సర్.

 7. ఇట్లా రాయగలిగేవాళ్లు చాలా అరుదుగా వుంటారనేదాంట్లో సందేహం లేదు. అఫ్సర్ గారూ, అభినందనలు.

 8. kurmanath says:

  వాళ్ళు నియంతల్ని తయారు చేసుకుంటే
  ప్రజలు ఆ నియంతల్ని ఎదిరించడానికి మార్క్వెజ్ లాటి వాళ్ళని, నెరూడా లాటి వాళ్ళని, చెరబండ రాజు లాటి వాళ్ళని తయారు చేసుకుంటారు. The world would have been poorer without Marquez. The world now is richer with his writings.

 9. మీ అభిమాన రచయితకి మీరెత్తిన హారతి వెనుక ఎంతటి అంతర్జ్వలనం ఉందో పదపదానా తెలుస్తోంది.

  ఆయన విడిచిన “Message in the bottle” సరైన వ్యక్తినే చేరింది.

 10. “Amputees suffer pains, cramps, itches in the leg that is no longer there. That is how she felt without him, feeling his presence where he no longer was.”
  వెంటాడుతూనే వుంటాడు పోగొట్టుకొన్న వునికిలా — మళ్ళీ మళ్ళీ మొలిచే వెన్నెల రెక్కలా —
  తెలియవలిసినంతగా తెలియాల్సినట్టుగా మనకు దగ్గర కాకపోవడం బాధ — థాంక్స్ అప్సర్ గారు —

 11. balasudhakarmouli says:

  ఒక సృజనకారుడు – కవి గావొచ్చు , కథా రచయిత గావొచ్చు , నవలాకారుడు గావొచ్చు – వాళ్ల వాళ్ల సృజనాత్మక ప్రక్రియల ద్వారా ప్రపంచం మీద గొప్ప ముద్ర వేస్తారు. వాళ్ల కళాత్మక ఆవిష్కరణలకు అబ్బురపడతాం మనం. మన మీద అవి గొప్ప ప్రభావం చూపెడతాయి. మనల్ని నడిపిస్తాయి కూడా !
  అలాంటి వొక కళాకారుడు భౌతికంగా అస్తమిస్తే.. విపరీతమైన దు:ఖం వేస్తుంది. ఆ దు:ఖం నుంచే ఇలాంటి అద్భుతమైన వ్యాసాలూ వస్తాయని నిరూపించారు గురువు గారూ….

  నేను- డా.వి. చంద్రశేఖర్రావ్ గారి మాంత్రిక కథలు, నవలలు చదివాను. మార్క్వెజ్… అనే పునాధిని చదవలేదు. చదువుకోవాలి.

 12. దుప్పల రవికుమార్ says:

  మనసును కదిలించే గొప్ప నివాళి. అఫ్సర్ గారికి ధన్యవాదాలు. “వందేళ్ళ వంటరితనం” చదువుతున్నప్పుడు, ఆ తరువాత దాదాపు రెండు నెలల పాటు మార్క్వెజ్ మార్మిక లోకంలో విహరించిన అనుభవంతో అఫ్సర్ మాటలు మళ్లీ అవన్నీ మనసు తెరల మీదకి తోసుకుతెచ్చాయి. నిజానికి మన విశ్వనాధ ‘వేయిపడగలు’ ఫేం పసరిక మాజిక్ రియలిజంకు, మార్క్వెజ్ మార్మిక వాస్తవికతకు చాలా తేడా. ఆ తేడా బహుశా నవలలోని విషయానిది కావచ్చు. లేదా మార్క్వెజ్ వాడిన భాషదే కావచ్చు. లేదా చదువుతున్న పాఠకుడిదే కావచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ ప్రపంచాన్నంతా విస్మయపరిచిన ఆ రచనలు మనకి తెలుగులో మన నాన్నమ్మలు చెప్పిన జానపద కథలే కథా. తేడా అంతా రచయిత మనకిచ్చిన ప్రాపంచిక దృక్పథమే.

 13. మార్క్వెజ్ గురించి ఏమీ చెప్పారో నాకు అర్ధం కాలేదు.వచనం లో హాయిగా అందరికీ అర్ధం కావలసిన దానిని కూడా చాలా poetry చేసి గందరగోళం లో పడేస్తారు.అదే మన తెలుగు వాళ్ళ తో వచ్చిన తంట.ఆయన స్పానిష్ లో రాసిన Hundred years of Solitude నవలని ఇంగ్లీష్ లో అనువదించినవాళ్ళు చాలా క్రూడ్ గా చేశారు.ఎంత మందికి ఏమి అర్ధం అయిందో ఆ దేవుడికే తెలియాలి.

 14. Strange Pilgrims is definitely one of his greater works. But as much as I love every story in it ( I was left speechless by his lyrical prowess the first time I read Light is like Water ), I still think Garcia Marquez is a fantastic novelist. Nonetheless, that is beyond the point. Reading each one of his pieces gives me immense pleasure and I am grateful for him for singing into my head and opening up a vast universe of incredibility.

  I also wrote a tribute to him which I am guessing you will like.

  http://patrika.kinige.com/?p=2442

 15. Sreedhar Parupalli says:

  ఆ కలలో మార్క్వెజ్ కి అంత్యక్రియలు..దోస్తులంతా వచ్చారట. అంతా అయిపోయాక ఎవరి దారిని వాళ్ళు వెళ్లిపోతున్నప్పుడు, తను కూడా వెళ్ళడానికి సిద్ధమయ్యాడు మార్క్వెజ్. అప్పుడు వొక చెయ్యి అతన్ని బలంగా వెనక్కి లాగి, “you’re the only one who can’t go!” అన్నదట. అంతే! మార్క్వెజ్ అక్కడే వుండిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు మార్క్వెజ్ కి అర్థమైంది: చనిపోవడం అంటే స్నేహితుల్ని మళ్ళీ కలవలేకపోవడం అని. అఫ్సర్ అర్పించిన ఘన నివాళి. కథా ఇతివృత్తాలు ఎంత వినూత్నంగా ఉంటాయో, మనిషి ఆలోచనా స్రవంతి అపరిమితమని మార్క్వెజ్ కథ చెప్పక చెబుతోంది.

 16. Vaadhoolasa says:

  “సున్నితతత్వాన్నినిశ్శబ్దం తో గాని,కృత్రిమమైన మౌనం తో గాని ఆట్టే కప్పెట్ట లేమని అర్థమయ్యింది నాకు.”
  ” మార్పు సుదూర లక్ష్యమనీ, అసలు వాస్తవికతనే ఇంకా సరిగ్గా అర్థం చేసుకోవాల్సి వుందనీ! వేయి పూలలో కనీసం వొక పది పూలయినా పూర్తిగా వికసిస్తే చాలు అని!”
  గ్రేట్ లైన్స్ .మీరు ఎక్కుతున్న నిచ్చెన చాలా ఎత్తు .చాలా మెట్లెక్కిన మిమ్మల్ని
  చూస్తుంటే సంబరం.

 17. Bhavani Phani says:

  “ఈ కథల్లో ఆ దుఃఖాన్ని ఏ చేరుమాలుతోనూ దాచుకోలేనితనం కనిపిస్తుంది. అది అప్పుడే చెంప మీద జారి, ఆరిపోడానికి ససేమిరా నిరాకరించే తడి చుక్కలా గోరువెచ్చగా అనిపిస్తుంది ఈ కథల్లో!” ఇంతటి అద్భుతమైన వాక్యాలనిచ్చినందుకు ధన్యవాదాలు సర్

మీ మాటలు

*