అమ్మవారి పూజ ఐర్లాండ్ లోనూ ఉండేది!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)

ఈ కథలో, నేడు స్త్రీ-పురుషుల మధ్య మనకు తెలిసిన పితృస్వామిక సంబంధాలు తలకిందులైన సంగతి అర్థమవుతూనే ఉంది. మీవే తను ‘క్రౌచాన్ రాణి’నని చెప్పుకోవడమే కాక, మనమిప్పుడున్నది నా రాజ్యంలోనేనని కూడా మొగుడితో అంటుంది. అంటే అది నేడు మనకు అర్థమయ్యే ఇల్లరికం లాంటి దన్నమాట. అలాగని ఆమె మొగుడు అయిలిల్ గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇల్లరికం వచ్చిన పేదవాడు ఏమీ కాదు. అతను మీవేతో అన్ని విధాలా సరితూగేవాడే. అయితే, మీవేను అతను పెళ్లి చేసుకోలేదు, మీవేయే అతన్ని పెళ్లి చేసుకుంది. ఆమాట మీవే స్పష్టంగా అంటుంది, అంటే, పితృస్వామికంలోలా ఎంపిక స్వేచ్ఛ పురుషుడిది కాక, స్త్రీ దన్నమాట. ఇలా అనగానే మన కథల్లోని ‘స్వయంవరం’ అనే మాట మీకు గుర్తొచ్చి ఉండాలి. ఇలా ‘స్వామ్యా’లు తలకిందులవడంలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ‘షాకింగ్’ గా కూడా ఉండచ్చు. నీకు మానభంగం జరగచ్చు కనుక, పెళ్లి కానుకల రూపంలో ‘నీ మొహమంత వెడల్పున బంగారం’తో సహా అందుకు పరిహారాన్ని ముందే చెల్లించి, నీ మానాన్ని నేను కొనేసుకున్నానని మీవే మొగుడితో అంటుంది. బ్రిటిష్ దీవులకు చెందిన కెల్టులలో ఒక ఆచారం ఉండేదట. రోజూ రాత్రివేళ భార్య ‘మానాన్ని హరిస్తారు’ కనుక అందుకు పరిహారంగా ‘ప్రభాత కానుక’ (morning gift) ఇచ్చేవారట. ఇటువంటి కానుకే ఇక్కడ మీవే మొగుడికి ఇచ్చిందన్న మాట. ‘స్వామ్యా’లు ఎలా తలకిందులయ్యాయో చూడండి. కెల్టిక్ తెగలు పాటించిన ఆచారమూలాలు వాస్తవంగా మీవేకు చెందిన మాతృస్వామ్యంలోనే ఉండి ఉండచ్చు కూడా. పితృస్వామ్యంలో మగవాడు బహుభార్యాత్వ హక్కునే కాక, ‘ఉంపుడుగత్తె’ల హక్కును కూడా చలాయించిన, చలాయిస్తున్న సంగతి మనకు తెలుసు. ఇక్కడ మరింత షాకింగ్ ఏమిటంటే, ఈ కథలో మీవే కూడా అదే హక్కును స్థాపించుకుంటోంది. నా దగ్గర ‘ఒక మగవాడి నీడలో ఇంకో మొగవాడు ఎప్పుడూ ఉంటా’డని చెబుతోంది. అయినా నువ్వు అసూయ పడవని తెలిసే ఏరి కోరి నిన్ను చేసుకున్నానని అంటోంది.

మరేం లేదు…దేశాలు, సరిహద్దులు, జాతీయత, మతాలు, విశ్వాసాలు, సంస్కృతి, సాహిత్యం, సిద్ధాంతాలు, రాజకీయాలు, పార్టీలు, స్త్రీ-పురుషుల తేడాలు, దేశాన్నో సమాజాన్నో ఉద్ధరించాలని అనుకోవడాలు, పోరాటాలు, విప్లవాలు…వగైరాల రూపంలో మనం చాలా పెద్ద అడల్టు బ్యాగేజీని మోస్తున్నాం, మోస్తాం, మోయవలసిందే. విషయం అది కాదు….

కాస్సేపు, మన తలకాయలను అణిచేసే ఈ బ్యాగేజిని పక్కన పెడదాం, కాసేపే… అది ఎక్కడికీ పోదు. మళ్ళీ దానిని మనం తలమీదికి ఎక్కించుకోవచ్చు. పక్కన పెట్టి ఏం చేద్దామంటే, ఈ ప్రపంచాన్ని, దీని చరిత్రను, ఈ భూమిని, ఈ మనుషుల్ని అప్పుడప్పుడే ఊహ వికసిస్తున్న ఒక కుర్రవాడిలా, తటస్థంగా, ఒక అద్భుతంగా, ఆశ్చర్యంగా చూద్దాం!

ఈ వ్యాసపరంపరలో నేను అదే చేస్తున్నాను. కనీసం అదే చేయడానికి ప్రయత్నిస్తున్నాను. దానికి భిన్నంగా మీకు ఎక్కడైనా కనబడితే అది నా లోపమే, నా వైఫల్యమే. నా అడల్టు బ్యాగేజిని నేను పూర్తిగా దింపుకోలేదన్న మాట. ఈ వ్యాసపరంపర సందర్భంలో నేను ఒక పుస్తకం గురించి మాట్లాడుతున్నానంటే అది నా దృష్టిలో, మనిషి తన అనుభవాన్ని, ఆలోచనను ప్రోది చేసిన జ్ఞానసంపుటి మాత్రమే. ఒక పుస్తకం మీద మంచిదీ, లేదా చెడ్డదీ అని వేసే ముద్రలు నా దగ్గర ఏవీ లేవు; అది పుస్తకం మాత్రమే. కాకపోతే కొన్ని మామూలు పుస్తకాలు, కొన్ని గొప్పగా చెప్పిన పుస్తకాలు ఉండచ్చు. గొప్పగా ఉండడం, లేకపోవడం వేరు; మంచి-చెడు విభజన వేరు.

ఇంకోటి మీరు గమనించే ఉంటారు, ఈ వ్యాసాలకు ఒక ‘బహిరంగ ఆలోచన’ స్వభావం ఉంది. అంటే ఈ వ్యాసాలలోని చాలా ఊహలు, ప్రతిపాదనల చివరిలో సందేహార్ధకాలు, కామాలు, సెమీ కోలన్లే కనిపిస్తాయి. ఫుల్ స్టాపులు ఎక్కడో కానీ కనిపించవు. మనిషి తన ప్రయత్నం లేకుండా హఠాత్తుగా ఇంత పెద్ద ప్రపంచం అనే ఒక అపరిచిత ప్రదేశంలోకి అడుగుపెడతాడు. తన ప్రయత్నం లేకుండానే నిష్క్రమిస్తాడు. ఈ మధ్యలో ప్రకృతి తనకు నిర్దేశించిన స్వల్ప జీవితంలో ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి అతను జరిపే నిర్విరామ అన్వేషణలో కామాలు, సెమీ కోలన్లు; సందేహార్ధకాలే తప్ప ఫుల్ స్టాపులకు అంతగా అవకాశం లేదని నేను నమ్ముతాను. ఫుల్ స్టాపు పెట్టడమంటే జ్ఞానానికి ఆనకట్ట కట్టడమే. ఇంకో విధంగా అది జ్ఞానాన్ని నిషేధించడమే. అప్పుడప్పుడే ఊహ వికసిస్తున్న కుర్రవాడిలా ప్రపంచాన్ని ఓ అద్భుతంగానూ, మిస్టరీగానూ  దర్శిస్తున్న(కనీసం ఈ వ్యాసపరంపర వరకు) నాకు జ్ఞానాన్ని ఏవేవో లేబుళ్లతో నిషేధించేవారంటే చాలా భయం. జ్ఞానాన్ని నిషేధించడమంటే నా ఉద్దేశంలో చావే!

ఇంతకీ అసలు విషయానికి వస్తే, ఫుల్ స్టాపులు కనిపించని నా అన్వేషణలో నా వరకు నేను ఫుల్ స్టాపులు  పెట్టుకున్నవి కొన్ని లేకపోలేదు. ఒకటి చెప్పాలంటే, ఇది ఫలానా దేశానికి చెందిన సంస్కృతి, మతం, విశ్వాసం అనే విభజనను మించిన అతి పెద్ద మిత్ లేదని నేను అంటాను.  అడల్టు బ్యాగేజి ఏమీ లేని ఒక కుర్రాడిలా తెరచిన పుస్తకంలాంటి కళ్ళతో చూస్తే, ప్రపంచమంతటా ఒకే సంస్కృతి, ఒకే మతం, ఒకే రకమైన విశ్వాసాలు- మనం కల్పించుకున్న అనేకానేక సరిహద్దులను ముంచేసి ప్రవహిస్తూ కనిపిస్తాయి. దీనినే ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే; నా దేశభక్తిని, జాతీయతను మీరు శంకించినా సరే, ‘భారతీయత’ అని చేప్పేది అంతా పెద్ద మిత్ అంటాను. అలా అనడానికి ఇవే వ్యాసాలలో కొన్ని ఉదాహరణలు ఇప్పటికే ఇచ్చాను. ఇక ముందు అటువంటివి మరిన్ని రాబోతున్నాయి. ఇంతకుముందు చెప్పుకున్న ఐరిష్ కథకు గల పురాచారిత్రక నేపథ్యంలోకి వెళ్లినప్పుడు కూడా కొన్ని ఉదాహరణలు దొరకచ్చు.

***

మనకు తెలుసు, మన దేశంలో అమ్మవారిని ఆరాధించడం ఉంది. ఆమె అమ్మలగన్న అమ్మ. ముగ్గురమ్మలకు మూలపుటమ్మ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనే త్రిమూర్తులకు కూడా ఆమె అమ్మ. అమ్మవారికి చెందిన పురాణాలలో అమ్మే త్రిమూర్తులకన్నా గొప్ప. అయితే, త్రిమూర్తులకు చెందిన పురాణాలలో త్రిమూర్తులలో ఎవరికి వారే గొప్ప. ఇది అమ్మవారు, త్రిమూర్తులు ఒకరి ఆధిక్యాన్ని ఒకరు గుర్తించి గౌరవించుకోడానికి జరిగిన ఏర్పాటు, లేదా సర్దుబాటు. సృష్టిలోనే స్త్రీ-పురుషుల మధ్య ఈ సమన్వయం, సర్దుబాటు ఉండవచ్చు. అందులోని ప్రాకృతిక ధర్మాన్ని నేను ప్రశ్నించడం లేదు. అది నా అధ్యాయనాంశం కాదు. సామాజిక, చారిత్రక కోణాలనుంచి వ్యాఖ్యానించడం పైనే ప్రస్తుతం నాకు ఆసక్తి.

67CABA81D0F1641449BD35D21666E

అమ్మవారిని(Mother-goddess) ఆరాధించిన కాలాన్ని స్థూలంగా రాగి-కంచుయుగంగా చరిత్రకారులు వర్గీlకరించారు. సమీప ప్రాచ్యం(Near East-నేటి టర్కీ, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయిల్, సిరియా, సౌదీ అరేబియా మొదలైన దేశాలను ఇలా పిలుస్తారు); సింధు నాగరికతా ప్రాంతాలలో ఈ యుగం క్రీ.పూ. 33000-1200 వరకు; దక్షిణాసియాలో క్రీ.పూ. 3000-1200 వరకు; యూరప్ లో క్రీ.పూ. 2300-600 వరకు; చైనాలో క్రీ.పూ. 2000-700 వరకు కొనసాగినట్టు అంచనా వేశారు. వ్యవసాయ సంస్కృతి పుట్టింది కూడా ఈ కాలంలోనే. ఆ తర్వాత ఇనప యుగం(Iron Age) మొదలైంది. ఈ కాలంలో ఒకవైపునుంచి ఆర్యులు, ఇంకోవైపునుంచి సెమెటిక్ జాతులవారు ఆయా రాగి-కంచుయుగ ప్రాంతాలలోకి విస్తరించి అప్పటికి అక్కడ ఉన్న వ్యవస్థలను కూలదోశారు.

గమనించవలసింది ఏమిటంటే, అమ్మవారి ఆరాధన ప్రాంతాలలో ఉన్న సామాజిక రూపం మాతృస్వామ్యం అయితే, ఆర్యులు, సెమెటిక్ జాతుల సామాజిక రూపం పితృస్వామ్యం. అయితే ఏ వ్యవస్థలోనైనా విజేతలు, పరాజితులు గీత గీసినట్టు ఎప్పటికీ వేర్వేరుగానే ఉండిపోరు. కాలం గడిచిన కొద్దీ ఒకరితో ఒకరు కలిసిపోతారు. మనుషులు కలవడమంటే వారి మత విశ్వాసాలు, సామాజిక రూపాల మధ్య కూడా కలయిక లేదా సర్దుబాటు జరగడమే. ఆవిధంగా స్త్రీ దేవతలు, పురుష దేవతల సహజీవనం ప్రారంభమైంది. ఇలా వివిధ ప్రాంతాలలో జరిగిన దేవతల కూర్పులు, చేర్పులు, తొలగింపులు వగైరాలను థియోక్రేసియా అన్నారు. ఆసక్తి గొలిపే ఆ ప్రక్రియ పూర్తి వివరాలలోకి నేను ఇప్పుడు వెళ్ళడం లేదు.

నాగరికతకు కీలకంగా మారిన చోట్ల, స్థూలంగా క్రీస్తు శకారంభం తర్వాత మూడు నాలుగు వందల ఏళ్ల  వరకు ఈ సర్దుబాటు ప్రక్రియ కొనసాగింది. అంటే, బహుళ దేవతారాధన రూపంలో ఆస్తిక ప్రజాస్వామ్యం ఉండేదన్న మాట. అయితే రోమన్ చక్రవర్తి కాన్ స్టాన్ టైన్ క్రైస్తవానికి అధికార ప్రతిపత్తి కల్పించినప్పటినుంచీ, అనంతరం ఇస్లాం అవతరించిన తర్వాతా, ఇప్పుడు మనం ‘మతం’గా చెప్పుకునే వ్యవస్థీకృత, ఏకేశ్వరోపాసన మతాల ప్రాబల్యం మొదలైంది. ఇవి పితృస్వామిక మతాలు కూడా. పైన చెప్పిన రోమన్ చక్రవర్తి కాలంలో బహుళదేవతారాధన పద్ధతులను ‘పాగాన్’ పద్ధతులుగా చిత్రిస్తూ వాటిని తుడిచిపెట్టడం పెద్ద యెత్తున సాగింది. Witch-hunt(మంత్రగత్తెలన్న ముద్రతో వేటాడి మరీ చంపడం)అనే మాట అప్పుడే పుట్టింది.

విశేషమేమిటంటే, దాదాపు నాగరిక ప్రపంచమంతటా జరిగిన ఈ witch-hunt నుంచి, నా పరిశీలనకు అందినంతవరకూ, భారతదేశం ఒక్కటే తప్పించుకుంది. ఇక్కడ ఇప్పటికీ బహుళదేవతారాధన పద్ధతులు కొనసాగుతున్నాయి. దేవీ, దేవతల మధ్యనే కాదు, చెట్లు పుట్టలు, పశువులు, పాములు వగైరా ఆరాధనా లక్ష్యాల మధ్య కూడా నేటికీ అద్భుతమైన సర్దుబాటు, సయోధ్య కొనసాగుతున్నాయి.  ఇందుకు కారణం ఈ దేశపు ప్రత్యేక స్వభావమే. ఆ రకంగా చెప్పుకుంటే భారతదేశం నేటికీ అచ్చంగా రాగి-కంచుయుగ సంస్కృతిలోనే ఉంది. అంటే, క్రీస్తు శకం లోకి కూడా ఇంకా రాలేదన్నమాట. పాశ్చాత్యప్రపంచానికి భారత్ పట్ల ఆకర్షణకు బహుశా ఇది కూడా ఒక కారణం.  ఇవే మాటలు నేను గత వ్యాసాలలో కూడా చెప్పాను. సందర్భం వచ్చింది కనుక మళ్ళీ చెప్పాను.

తీరా ఐర్లాండ్ కథ ఒకటి ప్రస్తావించుకున్నాం కనుక, అందులోకి వెళ్ళడం కోసం అనివార్యంగా ఈ వివరాలు చెప్పుకోవలసివచ్చింది. నిజానికి ఇవి ఇంతకంటే చాలా సమగ్రంగానూ, లోతుగానూ చెప్పుకోవలసిన విషయాలు.

***

సంగతేమిటంటే, మన దేశంలో మనందరికీ బాగా తెలిసిన అమ్మవారి ఆరాధన, యూరప్ లో ఒక ఒంటరి దీవి అయిన ఐర్లాండ్ లో కూడా ఒకప్పుడు ఉండడం! ఎప్పుడు? సరిగ్గా సమీప ప్రాచ్యం, సింధు నాగరికతా ప్రాంతం మొదలైన చోట్ల  అమ్మవారి ఆరాధన కొనసాగుతున్న కాలంలోనే! అక్కడికి అసలు అమ్మవారి ఆరాధనా రూపం ఎలా వెళ్లిందన్నదే చరిత్రకారుల దృష్టిలో ఒక మిస్టరీ.

ఇంకొంచెం వివరాలలోకి వెడితే, యూరప్ లో వేట ప్రధానంగా జీవించిన పాతరాతి యుగంలో, అంటే క్రీ.పూ. 30,000-15,000 మధ్యకాలంలో ఐర్లాండ్ దాదాపు నిర్జనప్రదేశం. అప్పటికి బ్రిటన్ యూరప్ ప్రధాన భూభాగంలో ఒక భాగంగానే ఉండగా, ఐర్లాండ్ మాత్రం ఒక దీవిగా అవతరించింది.  ఫ్రాన్స్ దక్షిణ భాగం, స్పెయిన్ ఉత్తర భాగం మాత్రమే అత్యద్భుత చిత్రాలు కలిగిన గుహలతో నాటికి ప్రపంచం మొత్తంలోనే మతపరంగా గుర్తించగలిగిన ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. అప్పటికి వాటితో పోల్చగలిగినవేవీ భూమి మీద లేవు.

కానీ, పశ్చిమ యూరప్ లో కంచు యుగం ప్రారంభమయ్యే నాటికి, అంటే క్రీ.పూ. 2500 నాటికి ఐర్లాండ్ హఠాత్తుగా పాశ్చాత్య ప్రపంచం మొత్తాన్ని ఉత్తేజపరిచే శక్తులలో ఒకటిగా మారింది. ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే, నిత్య యవ్వనులైన దేవతలు ఉండే దేవభూమి లాంటి ఐర్లాండ్ కు చెందిన అమ్మవారి మాంత్రికతా కథలే నేటికీ యూరప్ మొత్తంలో వ్యాప్తిలో ఉన్న జానపద కథలకు మాతృకలయ్యాయి.

మధ్య రాతి యుగం(Mesolithic age)లో మాత్రమే ఐర్లాండ్ లో జనావాసాల తాలూకు ఆనవాళ్ళు కనిపించాయి. ఈ యుగం ప్రారంభంలో ఐర్లాండ్ కు కొంతమంది వచ్చారు. ఆ తర్వాత అదృశ్యమైపోయారు. వాళ్ళు ఎవరో, ఐర్లాండ్ కు ఏం తీసుకొచ్చారో, ఎప్పుడు, ఎందుకు అదృశ్యమైపోయారో తెలియదు. వాళ్ళ ఆనవాళ్ళు ఏమీ మిగలలేదు. ఐర్లాండ్ కు వీళ్ళ రాక, క్రీ.పూ. 7800-2500 మధ్యలో ఎప్పుడైనా సంభవించి ఉండచ్చు. ఇక క్రీ.పూ. 2500 నుంచీ ఐర్లాండ్ లో రాగి, కంచు యుగం తాలూకు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఐర్లాండ్ లో ఈ రాగి- కంచు యుగానికి చెందిన దశ తనదైన ఒక సంస్కృతిని సృష్టించింది. అది, అమ్మవారి ఆరాధన(Mother-goddess worship)కు, మాతృస్వామ్యా(Mother Right)నికి చెందిన సంస్కృతి.

క్రీ.పూ.  500-200 మధ్యలో ఇనుము చేతబట్టుకుని పితృస్వామిక కెల్టిక్ తెగలు ఐర్లాండ్ లో అడుగుపెట్టేవరకూ అదే సంస్కృతి అక్కడ కొనసాగింది. తమ కంటే పురోగామి స్వభావం కలిగిన ఇనప యుగానికి, పితృస్వామ్యానికి చెందిన కెల్టిక్ తెగల ప్రాబల్యంలో కూడా అక్కడి మాతృస్వామ్యానికి చెందిన మగరాయళ్ళ లాంటి గృహిణులు క్రీస్తు శకారంభం వరకూ తమ ఆచారాలను కొనసాగించారు. ఆశ్చర్యం గొలిపే ఆ ఆచారాల అవశేషాలు అనంతరకాలానికి చెందిన కెల్టిక్ పురాణ కథలలోనూ ప్రవేశించాయి. ఇంకా చెప్పాలంటే, కెల్టిక్ వీరయుగం ఉచ్ఛదశలో ఉన్నప్పుడు, అంటే క్రీ.పూ. 200-క్రీ.శ. 500 మధ్య కాలానికి సైతం ఐర్లాండ్ లోని ఎందరో శిష్ట, లేదా కులీన మహిళలు కెల్టిక్ పూర్వ తెగలకు చెందినవారే. వీరు తమ మాతృస్వామిక సంప్రదాయాలను పట్టుదలగా కొనసాగించారు.

ఇంతకు ముందు చెప్పుకున్న ఐరిష్ కథ దానికి ప్రతిబింబమే. ఈ కథ పేరు, “The Cattle Raid of Cooley”.

***

ఈ కథలో, నేడు స్త్రీ-పురుషుల మధ్య మనకు తెలిసిన పితృస్వామిక సంబంధాలు తలకిందులైన సంగతి అర్థమవుతూనే ఉంది. మీవే తను ‘క్రౌచాన్ రాణి’నని చెప్పుకోవడమే కాక, మనమిప్పుడున్నది నా రాజ్యంలోనేనని కూడా మొగుడితో అంటుంది. అంటే అది నేడు మనకు అర్థమయ్యే ఇల్లరికం లాంటి దన్నమాట. అలాగని ఆమె మొగుడు అయిలిల్ గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇల్లరికం వచ్చిన పేదవాడు ఏమీ కాదు. అతను మీవేతో అన్ని విధాలా సరితూగేవాడే. అయితే, మీవేను అతను పెళ్లి చేసుకోలేదు, మీవేయే అతన్ని పెళ్లి చేసుకుంది. ఆమాట మీవే స్పష్టంగా అంటుంది, అంటే,  పితృస్వామికంలోలా ఎంపిక స్వేచ్ఛ పురుషుడిది కాక, స్త్రీ దన్నమాట. ఇలా అనగానే  మన కథల్లోని ‘స్వయంవరం’ అనే మాట మీకు గుర్తొచ్చి ఉండాలి.

ఇలా ‘స్వామ్యా’లు తలకిందులవడంలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ‘షాకింగ్’ గా కూడా ఉండచ్చు. నీకు మానభంగం జరగచ్చు కనుక, పెళ్లి కానుకల రూపంలో ‘నీ మొహమంత వెడల్పున బంగారం’తో సహా అందుకు పరిహారాన్ని ముందే చెల్లించి, నీ మానాన్ని నేను కొనేసుకున్నానని మీవే మొగుడితో అంటుంది. బ్రిటిష్ దీవులకు చెందిన కెల్టులలో ఒక ఆచారం ఉండేదట. రోజూ రాత్రివేళ భార్య ‘మానాన్ని హరిస్తారు’ కనుక అందుకు పరిహారంగా ‘ప్రభాత కానుక’ (morning gift) ఇచ్చేవారట. ఇటువంటి కానుకే ఇక్కడ మీవే మొగుడికి ఇచ్చిందన్న మాట. ‘స్వామ్యా’లు ఎలా తలకిందులయ్యాయో చూడండి. కెల్టిక్ తెగలు పాటించిన ఆచారమూలాలు వాస్తవంగా మీవేకు చెందిన మాతృస్వామ్యంలోనే ఉండి ఉండచ్చు కూడా.

పితృస్వామ్యంలో మగవాడు బహుభార్యాత్వ హక్కునే కాక, ‘ఉంపుడుగత్తె’ల హక్కును కూడా చలాయించిన, చలాయిస్తున్న సంగతి మనకు తెలుసు. ఇక్కడ మరింత షాకింగ్ ఏమిటంటే, ఈ కథలో మీవే కూడా అదే హక్కును స్థాపించుకుంటోంది. నా దగ్గర ‘ఒక మగవాడి నీడలో ఇంకో మొగవాడు ఎప్పుడూ ఉంటా’డని చెబుతోంది. అయినా నువ్వు అసూయ పడవని తెలిసే ఏరి కోరి నిన్ను చేసుకున్నానని అంటోంది.

‘ఒక మొగవాడి నీడలో ఇంకో మొగవాడు’ అన్నప్పుడు గురజాడవారి ‘కన్యాశుల్కం’ నాటకంలో ఒక సన్నివేశం, గిరీశం అన్న ఒక డైలాగూ గుర్తొచ్చి ఉండాలి. గిరీశం మధురవాణి ఇంటి తలుపు కొట్టినప్పుడు అప్పటికే అక్కడ ఉన్న రామప్పంతుల్ని మధురవాణి మంచం కింద దాచి తలుపు తీస్తుంది. అంతలో పూటకూళ్ళమ్మ చీపురు కట్ట పుచ్చుకుని గిరీశాన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చినప్పుడు, గిరీశం కూడా అదే మంచం కిందికి దూరతాడు. అక్కడున్న రామప్పంతుల్ని చూసి ‘సానిది విటుణ్ణి మంచం కింద దాచింది’ అనుకుంటాడు. అంటే, ఒక విటుడికి మరో విటుడితో బహిరంగంగా కనిపించే ధైర్యం ‘సాని’కి కూడా లేదన్నమాట. కానీ ఇక్కడ మీవే ‘సాని’ కాదు, తన దగ్గర ‘ఒక మొగాడి నీడలో ఇంకో మొగాడు’ ఎప్పుడూ ఉంటాడని చెప్పుకున్న గృహిణి!

తన దగ్గర ఉన్న తెల్ల కొమ్ముల ఎద్దును ఎరువిమ్మని డైరే అనే అతనికి కబురు పంపినప్పుడు మీవే ఏమందో చూడండి, తన కటి భాగంతో అతన్ని స్నేహం చేసుకొనిస్తానని చెప్పింది. అతను తిరస్కరించేసరికి సైన్యంతో అతని మీదికి యుద్ధానికి వెళ్ళి అతన్ని ఓడించి ఎద్దును ఎత్తుకు వచ్చింది. మీవే ఇక్కడ ‘స్వైరిణి’గా కనిపించే మాట నిజమే. అయితే తటస్థంగా చెప్పుకున్నప్పుడు, పురుషుడనే స్వైరుడికి ఆమె తలకిందుల రూపం మాత్రమే.

***

ఇంతకీ విషయమేమిటంటే; ఐర్లాండ్ గురించీ, పైన చెప్పిన కథ గురించీ జోసెఫ్ క్యాంప్ బెల్ తన ‘Occidental Mythology’లో రాస్తూ, అక్కడ వర్ధిల్లిన ఒకనాటి మాతృస్వామ్యం తాలూకు ఆశ్చర్యకరమైన అవశేషాలు అనంతరకాలపు కెల్టిక్ పురాణ కథలలోకి ప్రవేశించాయంటారు. అది మనకిక్కడ చాలా ముఖ్యమైన వ్యాఖ్య. కెల్టిక్ పురాణ కథల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పితృస్వామిక పురాణ కథలు అన్నిటా ఒకనాటి మాతృస్వామ్యం తాలూకు ఆశ్చర్యకరమైన అవశేషాలు తొంగి చూస్తూనే ఉంటాయి.

మహాభారతం కూడా మినహాయింపు కాదు. ఇందులో చాలాచోట్ల ఆ అవశేషాలు సూచనగానే కాక వాచ్యంగా కూడా కనిపిస్తాయి.

తపతి-సంవరణుల కథ గురించి ఈ కోణం నుంచి ఇప్పటికే కొంత చర్చించాం. సంవరణుడు తపతిని పెళ్లి చేసుకున్నాక పన్నెండేళ్ళు ఆమెతోనే అడవిలో ఎందుకు ఉండిపోయాడు. ఈ పన్నెండేళ్లలో ఏం జరిగి ఉంటుందన్న ప్రశ్నలు మిగిలిపోయాయి. కథకుడు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పలేదు. మాతృస్వామ్య సంప్రదాయం ప్రకారం సంవరణుడు ‘ఇల్లరికం’ ఉన్నాడా అన్న సందేహం కలుగుతుంది. దానిని ప్రస్తుతానికి సందేహంగా మాత్రమే వదిలేస్తాను. ఈ పన్నెండేళ్ళ కాపురంలో తపతి-సంవరణులకు సంతానమే కలగలేదా, వారిని హస్తినాపురం తీసుకువెళ్లాకే వారికి కొడుకు పుట్టడం ఏమిటనే ప్రశ్నలూ కలుగుతాయి. కథకుడు విడిచిపెట్టిన ఈ ఖాళీలను పూరించుకోడానికి ‘పర్వ’ నవలలో భైరప్ప చేసిన అన్వయం ఏమైనా ఉపకరిస్తుందా?!

ఇలాంటి సంబంధాలలో సంతానం మీద హక్కును స్త్రీ-పురుషులు పంచుకుంటారు. అందుకు సంబంధించి ముందే ఒక ఒప్పందం చేసుకుంటారు. సంవరణుడు తన దగ్గర ఇల్లరికం ఉన్నప్పుడు కలిగిన సంతానం తపతికి, అంటే తపతి తెగకు చెందుతుంది. ఆ తర్వాత సంవరణుని కోరిక ప్రకారం ఒక కొడుకుని కని ఇచ్చింది. గంగా-శంతనుల కథలో జరిగింది చూడండి, గంగ ఏడుగురు కొడుకుల్ని తన దగ్గరే ఉంచుకుంది. భీష్ముని ఒక్కడినీ శంతనుడికి ఇచ్చింది. తపతీ-సంవరణులు హస్తినాపురం వచ్చాకే కురుడు పుట్టాడని చెప్పడంలో కథకుడు పితృస్వామిక హక్కును స్థాపిస్తున్నాడు. పన్నెండేళ్లలో ఏం జరిగిందో చెప్పకుండా మాతృస్వామ్య హక్కును మరుగుపరుస్తున్నాడు!

మరో అంశంతో మళ్ళీ వారం…

 – కల్లూరి భాస్కరం

 

మీ మాటలు

  1. E.M.I.Ravu says:

    అయ్యా

    “దీనినే ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే; నా దేశభక్తిని, జాతీయతను మీరు శంకించినా సరే, ‘భారతీయత’ అని చేప్పేది అంతా పెద్ద మిత్ అంటాను. అలా అనడానికి ఇవే వ్యాసాలలో కొన్ని ఉదాహరణలు ఇప్పటికే ఇచ్చాను. ఇక ముందు అటువంటివి మరిన్ని రాబోతున్నాయి. ”

    మీ ధోరణి చూస్తుంటే భయం గా వుంది.నిజాలు చెప్పేస్తున్నారు.
    రాబోయేది “ఫత్వా” ల కాలం.

    • కల్లూరి భాస్కరం says:

      చాలా థాంక్స్ రావు గారూ…రాబోయేదే ‘ఫత్వా’ల కాలం అంటారా? ఇప్పుడు ‘ఫత్వా’ల కాలంలో లేమంటారా? కానివ్వండి, రోట్లో తలదూర్చాక…

  2. కల్లూరి భాస్కరం says:

    చిన్న సవరణ: ‘…సింధు నాగరికతా ప్రాంతాలలో ఈ యుగం క్రీ.పూ. 33000-1200 వరకు..’ అనే వాక్యంలో పొరపాటు దొర్లింది. అందులోని అంకెలను క్రీ.పూ. 3300-1200 అని సవరించుకోగలరు.

  3. భాస్కరం గారూ,

    “మనిషి తన ప్రయత్నం లేకుండా హఠాత్తుగా ఇంత పెద్ద ప్రపంచం అనే ఒక అపరిచిత ప్రదేశంలోకి అడుగుపెడతాడు. తన ప్రయత్నం లేకుండానే నిష్క్రమిస్తాడు. ఈ మధ్యలో ప్రకృతి తనకు నిర్దేశించిన స్వల్ప జీవితంలో ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి అతను జరిపే నిర్విరామ అన్వేషణలో కామాలు, సెమీ కోలన్లు; సందేహార్ధకాలే తప్ప ఫుల్ స్టాపులకు అంతగా అవకాశం లేదని నేను నమ్ముతాను. ఫుల్ స్టాపు పెట్టడమంటే జ్ఞానానికి ఆనకట్ట కట్టడమే”

    …A great statement. I am with you.

    with best regards

    • కల్లూరి భాస్కరం says:

      మూర్తి గారూ, చాలా థాంక్స్, ఈ వాక్యాలు మీకు నచ్చినందుకు.

  4. సర్,
    ‘పురా’గమనం అద్భుతంగా సాగుతోంది. వారం వారం ఎదురుచూసేట్టుగా ఉంటోంది.
    పోయినవారానికీ, ఈ వారానికీ కలిపి ఒక సందేహం.

    …నా కటిప్రాంతంతో స్నేహం చేసుకోనిస్తాను, అని ‘ఆమె’ అందంటే…
    ఇది కూడా పితృస్వామిక రచయితనుంచి వచ్చిన మాటేమో కదా!
    ఎందుకంటే, పురుషుడిలాగే ‘స్వైర’ స్వేచ్ఛ ఉండగలిగే సమాజంలో ఉన్నప్పుడు స్త్రీ మానానికి ప్రత్యేకమైన విలువ ఏముంటుంది? ఇప్పటి పురుషుడి మానానికి ఎంత విలువ ఉందో, అప్పటి స్త్రీ మానానికీ అంతే విలువ ఉంటుంది కదా! అలాంటి సందర్భంలో, అంటే ఆ మాతృస్వామిక సమాజంలో పురుషుడి మానం విలువైనది అవ్వాలి కదా, ఇప్పటి కాలంలో స్త్రీదైనట్టు. అలాంటప్పుడు ఆ కాలంలో ఎవరైనా పురుషుడు, ‘నా కటిభాగంతో స్నేహం చేసుకోనిస్తాను,’ అంటే అర్థంవుంటుందిగానీ, స్త్రీ అలా అనడంలో అర్థం ఏముంది?

  5. కల్లూరి భాస్కరం says:

    రాజిరెడ్డిగారూ…ధన్యవాదాలు. మీ సందేహం నాకు కూడా వచ్చింది. ఇలాంటిదే ఇంకో సందేహం. మొల్ల, ముద్దుపళని, రంగాజమ్మ లాంటి కవయిత్రులు కూడా స్త్రీని పురుషుడి కళ్ళతోనే వర్ణించారు. మనకు ఎంత భావస్వేచ్ఛ ఉందని అనుకున్నా, వ్యవస్థ, ఆ వ్యవస్థ ముందుకు తెచ్చిన విలువలు వగైరాలు ఆ భావస్వేచ్ఛను ఎలా నియంత్రిస్తాయో అనడానికి ఇదొక ఉదాహరణ కావచ్చు. పురుషప్రాబల్య వ్యవస్థలో స్త్రీ కూడా పురుషుడి భాషే మాట్లాడుతుంది.

    ఇక ప్రస్తుతానికి వస్తే, మీవే-అయిలిల్ కథ పితృస్వామికానికి అనుకూలంగా మార్చిన కథ అనుకుంటే స్త్రీ మానానికి ప్రత్యేకమైన విలువ ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు. పురుషుడి దృష్టితో ఆ కథ చెబుతున్నాడు. అయితే, ఒకనాటి మాతృస్వామ్య లక్షణాలను కూడా అందులో పొందుపరుస్తున్నాడు. మహాభారతంలో కూడా ఇలాంటి ఘట్టాలు ఉన్నాయి. ఒక వ్యవస్థకు చెందిన కథలను ఇంకో వ్యవస్థకు మార్చినప్పుడు overlapping ఉంటుంది. ఇది అలాంటిదే కావచ్చు. కటిప్రదేశం, అంటే మానాన్ని నేరుగా సూచించకపోయినా మగవాడు స్త్రీకి తన పొందును ఎరవేయడానికి ఏ వ్యవస్థలోనైనా అవకాశం ఉంది. ఇంకోటి కూడా ఉంది. స్వామ్యాలు సామాజికమైన ఏర్పాటుకు చెందినవి. లైంగికత ప్రకృతి చేసిన ఏర్పాటు. కనుక లైంగిక ప్రవర్తనలో స్త్రీ-పురుష భేదాలు స్వభావసిద్ధంగానూ ఉండచ్చు. కనుక మాతృస్వామ్యంలోనూ స్త్రీ మానానికి ప్రత్యేక విలువ ఉండచ్చు.

    • రాజిరెడ్డిగారి అనుమానానికి కొనసాగింపుగా మరో అనుమానం – అప్పుడున్నది మాతృస్వామ్య వ్యవస్థ అయితే మీవే ఎద్దు కావాలని కూలీని ఆజ్ఞాపించడం, అతని ఆశలు ఎర చూపడం ఎందుకు? కూలీ భార్యని కదా అడగాలి?

      • కల్లూరి భాస్కరం says:

        కథను బట్టి అది మాతృస్వామ్య, పితృస్వామ్యాల సంధి దశగా కనిపిస్తూనే ఉంది. మీవే, అయిలిల్ ఇద్దరికీ విడివిడిగా ఆస్తులున్నట్టే, డైరే(అతని పేరు కూలీ కాదు)కీ, అతని భార్యకూ విడివిడిగా ఆస్తులు ఉండచ్చు. తెల్ల కొమ్ముల ఎద్దు డైరే ఆస్తిలో భాగం తప్ప అతని భార్య ఆస్తి కాదు. కనుక ఎద్దును ఎరువిమ్మని మీవే డైరేనే అడిగింది.

మీ మాటలు

*