Archives for May 2016

కొత్త బాటలో నాటా సాహిత్య సభలు!

 

-సుజాత 

~

nata1

సంస్కృతి, సాహిత్యం అవిభాజ్యాలు! నివాసం విదేశాల్లోనే అయినా సంస్కృతి వేళ్ళు ఎక్కడ పాదుకున్నాయో, అక్కడికి హృదయాలు తరచూ ప్రయాణించడం, ఆ సువాసనల్ని ఇక్కడ ప్రోది చేసుకోవాలని ప్రయత్నించడం , మొగ్గ వేసినంత సహజం, పువ్వు పూసినంత సహజం! అందుకే ప్రవాస సాంస్కృతిక సంఘాలు ఎప్పుడు, ఎక్కడ సభలు నిర్వహించుకుని అంతా ఒక చోట చేరినా, సాహిత్యానికి తొలినాటి నుంచీ పెద్ద పీట వేస్తూనే ఉన్నాయి. మెమోరియల్ వీకెండ్ -మే 27,28 న జరగబోయే నాటా సభల్లో కూడా సాహిత్య వేదిక ప్రధాన భూమిక పోషించబోతోంది.

ప్రవాస తెలుగు సాహిత్యాభిమానులు, రచయితలు కవులు అంతా కల్సి సాహితీ సౌరభాలు పంచుకోడానికి రంగం సిద్ధం అయింది. కథ, కవిత, నవల, అవధానం వంటి ప్రక్రియల్లో నిష్ణాతులైన వారి ప్రసంగాలు, సభికులు కూడా పాలు పంచుకోనున్న చర్చలు ఈ సాహిత్య వేదికలో ప్రథానాంశాలు గా రూపు దిద్దుకున్నాయి. అన్ని విభాగాల్లోనూ నూతనత్వాన్ని స్పృశిస్తూ ఎంచుకున్న అంశాల మీద కవులు రచయితల ప్రసంగాలు సాగనున్నాయి.

నాటా సాహిత్య కమిటీలో కొందరు...

నాటా సాహిత్య కమిటీలో కొందరు…

శనాదివారాలు మొత్తం నాలుగు విభాగాలుగా జరగనున్న ఈ కార్యక్రమాల్లో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడున్నర వరకూ జరగనున్న కథా వేదికలో “తెలుగు కథ-ఒక సమాలోచన” కార్యక్రమానికి ప్రముఖ రచయిత చంద్ర కన్నెగంటి సంచాలకులుగా వ్యవహరిస్తారు. “సరైన దారుల కోసం – కొత్త కథకుడి రచనా స్ఫూర్తి” అనే అంశం మీద  మధు పెమ్మరాజు, “ఇండియన్ డయాస్ఫోరా లో తెలుగు డయాస్ఫోరా స్థానం” గురించి గొర్తి సాయి బ్రహ్మానందం, “అమెరికా కథా వస్తువులు, లోపించిన వైవిధ్యత” అనే అంశం మీద వంగూరి చిట్టెన్ రాజు, “సమకాలీన కథ పై ఇంటర్నెట్ ప్రభావం” అనే అంశం మీద రచయిత్రి కల్పనా రెంటాల, ఇంకా , “కథలెందుకు చదవాలి?” అనే అంశం మీద మెడికో శ్యాం ప్రసంగిస్తారు. ఆ తర్వాత “తెలుగు కథ-దశ, దిశ” అనే అంశం పై చర్చా కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ సాహిత్య వేదికలపై ఇంతకు ముందు పెద్దగా చర్చంచని వినూత్నతను ఆపాదించే, కొత్త ఆలోచనల వైపు అడుగులు వేయించే అంశాలే!

మధ్యాహ్నం  3-30 నుంచి 5 గంటల వరకూ ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం లో భాగంగా “తెలుగు నవల- చారిత్రక నవల ” అంశం మీద  మంథా భానుమతి ప్రసంగం, “తెలుగు నవలా పరిణామ క్రమం (బుచ్చిబాబు)” అనే అంశం మీద  దాసరి అమరేంద్ర, ఆ తర్వాత “తెలుగు నవల-సినిమా” అనే అంశం మీద బలభద్ర పాత్రుని రమణి ప్రసంగం ఉంటాయి .

 

ఆదివారం ఉదయం సాహితీ ప్రియులంతా ఎంతో ఆసక్తి తో ఎదురు చూసే ప్రధాన కార్యక్రమం అష్టావధానం! అవధాన కంఠీరవ నరాల రామారెడ్డి గారి అష్టావధానానికి సంచాలకులుగా వద్దిపర్తి పద్మాకర్ గారు వ్యవహరిస్తారు. పృచ్చకులుగా జువ్వాడి రమణ, పూదూరి జగదీశ్వరన్ మరికొంత మంది సాహితీ ప్రియులు పృచ్చకులుగా పాల్గొంటారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకూ మూడు గంటల పాటు ఉత్సాహభరితంగా సాగే ఈ కార్యక్రమం ఆదివారం నాటి ప్రధానాకర్షణ గా నిలవబోతోంది.

మధ్యాహ్నం జరిగే కవిత్వ విభాగ కార్యక్రమం మరింత ఆసక్తి గా ఉండబోతోంది. “తెలుగు కవిత-ఓ నూతన దృక్కోణం” శీర్షికన జరిగే ఈ కార్యక్రమానికి అఫ్సర్ సంచాలకులుగా వ్యవహరించనున్నారు . ఈ కార్యక్రమంలో కవులు కవయిత్రులు ఎంచుకున్న అంశాలన్నీ ఇంతకు ముందు ప్రవాస తెలుగు సాహితీ సభలో చర్చకు రాని సమకాలీన నూతనాంశాలే!

“కవిత్వానికి ప్రేరణ”  అనే అంశం మీద పాలపర్తి ఇంద్రాణి,”కవిత్వంలో ప్రయోగాలు” అన్న అంశాల మీద విన్నకోట రవిశంకర్ ప్రసంగించనుండగా, “కవిత్వంలో ప్రాంతీయత” అనే సరికొత్త అంశం మీద వెంకటయోగి నారాయణ స్వామి, “భిన్న అస్తిత్వాలు-వస్తురూపాలు” అనే వినూత్నాంశం గురించి కొండేపూడి నిర్మల ప్రసంగిస్తారు.

హుషారుగా సాగబోయే ఆ తర్వాత చర్చా కార్యక్రమం “తెలుగు సినిమా పాటల్లో సాహితీ విలువలు”! ఈ కార్యక్రమం లో సినీ గీత రచయితలు చంద్రబోస్, వడ్డెపల్లి కృష్ణ, సంగీత దర్శకులు కోటి, దర్శకులు వి.ఎన్ ఆదిత్య పాల్గొంటారు. మాడ దయాకర్ సంచాలకులుగా వ్యవహరిస్తారు

nata

చివరగా నాలుగున్నర నుంచి ఐదున్నర వరకూ మనబడిలో తెలుగు నేరుస్తున్న చిన్నారుల  “ఒనిమా”- ఒక్క నిముషం మాత్రమే పోటీ ల ఫైనల్స్ సాహిత్య వేదిక మీద జరుగుతాయి. తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా వీక్షించబోయే ఈ కార్యక్రమం  ఆదివారం నాటి సాహిత్య కార్యక్రమాలలో చివరిగా తెలుగు భాషా ప్రేమికులకు అందనున్న బోనస్

సాహిత్యాభిమానులను సరికొత్త అంశాలతో, వినూత్న చర్చలతో అలరించనున్న  సాహిత్య వేదిక సభికులతో కళ కళలాడుతుందని నాటా ఆశిస్తోంది.

కొత్త ఆలోచనల సరికొత్త వేదిక: ఇస్మాయిల్ పెనుకొండ (సాహిత్య విభాగం చైర్)

ismail

 

“సమకాలీన సాహిత్యానికి సంబంధించి అన్ని కోణాలు ఒక కొత్త దృక్పథం నుంచి వీక్షించే వీలు కలిగించేట్టుగా నాటా సాహిత్య సభల్ని తీర్చిదిద్దుతున్నాం. ప్రసిద్దులంతా ఒక వేదిక మీద కనిపించడం ఒక ఎత్తు అయితే, వారు భిన్నమైన అంశాల మీద – ముఖ్యంగా ఇప్పటి కాలానికి అవసరమైన వాటి మీద మాట్లాడబోవడం, ఇది ఒక ప్రయోజనకరమైన చర్చకి దారి తీస్తుందన్న నమ్మకాన్నిస్తుంది. కథ, కవిత్వం, అవధాన, సినిమా సాహిత్యం- వీటన్నిటితో పాటు బుచ్చిబాబు శతజయంతి సందర్భంగా కేవలం నవల మీద ప్రత్యేకించి ఒక సభ నిర్వహించడం కూడా విశేషమే!”

*

 

 

 

“ప్రియా సోఫియా…ఇంక సెలవా!”

 

స్లీమన్ కథ-34

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

కైరోలోని బ్రిటిష్ సైనికాధికారులు తన రాకపై ప్రత్యేకమైన ఆసక్తి చూపకపోవడం స్లీమన్ ను బాధించింది. బ్రిటిష్ ఆధిపత్యంలో ఉన్న ఈజిప్షియన్లపై అతనిలో సానుభూతి అంకురించింది. ఆస్వాన్ 1 చేరగానే, తన రాక గురించి స్థానిక అధికారులకు తెలియజేయమని కార్యదర్శిని ఒడ్డుకు పంపించాడు. తిరిగొచ్చిన కార్యదర్శి, అధికారులు మీ పేరెప్పుడూ వినలేదన్నారనీ, మీకు స్వాగతం చెప్పే ఉద్దేశంలో లేరనీ చెప్పాడు. తన పేరు ప్రతిష్టలు ఆస్వాన్ లోని ఈజిప్షియన్ కార్యాలయాలవరకూ పాకలేదని తెలిసి స్లీమన్ దిగ్భ్రాంతి చెందాడు. కోపంతో గింజుకున్నాడు. అధికారులు వచ్చి తనకు స్వాగతం చెబితే తప్ప ఒడ్డు ఎక్కేదిలేదని భీష్మించాడు.

ఆ శీతాకాలంలో ఆస్వాన్ పర్యాటకులతో కిక్కిరిసి ఉంది. వాళ్ళలో చాలామంది ఔత్శాహిక పురావస్తునిపుణులున్నారు. వాళ్లలోనూ కొందరు మంచి అంకితభావం ఉన్న యువకులు. అలాంటి వారిలో ఈ.ఏ. వ్యాలిస్ బాడ్జ్ 2 ఒకడు.  అప్పటికతను అంతగా ప్రసిద్ధుడు కాదు. బ్రిటిష్ మ్యూజియం తరపున మొదటిసారి ఈజిప్టులో పని చేయడానికి వచ్చాడు. కుఫిక్ లిపి 3 రాతలతో ఉన్న తొలినాటి మహమ్మదీయుల గోపుర సమాధులను గుర్తించడం అతనికి అప్పగించిన బాధ్యత. ఎందుకంటే, హిజిరా 4 సమీపకాలం నుంచీ ఆస్వాన్ యాత్రాస్థలిగా ఉంటూ వచ్చింది.

వ్యాలిస్ బాడ్జ్ పనిపట్ల మంచి శ్రద్ద, ఆసక్తి ఉన్నవాడే కాక, సరళస్వభావి. స్లీమన్ చిన్నబుచ్చుకున్న సంగతి అతనికి తెలిసింది. వెంటనే ఇద్దరు మిత్రులను వెంటబెట్టుకుని స్లీమన్ ఉన్న దహబియా వద్దకు ఒక బోటులో వెళ్ళాడు. బట్లర్ వాళ్ళకు ఎదురేగి పడవ వెనుక భాగంలో ఉన్న ఒక విశాలమైన గదిలోకి తీసుకెళ్ళాడు. అతను తెచ్చి ఇచ్చిన కాఫీ తాగి సిగరెట్లు వెలిగించిన తర్వాత అసలు విషయానికి వస్తూ, కొత్తగా తవ్వితీసిన మహమ్మదీయ సమాధుల పరిశీలనకు మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చామని స్లీమన్ తో చెప్పారు. ఆ మాట వినగానే స్లీమన్ బిర్ర బిగుసుకున్నాడు. తనకు అలాంటి ఆసక్తేమీ లేనట్టు తన కవళికలతోనే సూచించాడు. “మీరు వచ్చి అడిగినందుకు సంతోషం. నా పురావస్తు పరిజ్ఞానం అంతా ఉపయోగించి ఆ సమాధులగురించి మీకు క్షుణ్ణంగా బోధించి ఉండేవాణ్ణే కానీ, ఇప్పుడు నాకంత తీరిక లేదు. వాడీ హల్ఫా వెడుతున్నాను” అన్నాడు.

ఆ తర్వాత కాసేపు నిశ్శబ్దం. స్లీమన్ ఇంకో మాట మాట్లాకుండా, ‘ఇక మీరు దయచేయచ్చు’ అని సూచిస్తున్నట్టుగా, అంతవరకూ తను చదువుతూ ఉన్న ఇలియడ్ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ ముగ్గురూ విస్తుపోయారు. “ఇక మమ్మల్ని సెలవు తీసుకోమంటారా” అని వారిలో ఒకడైన మేజర్ ప్లంకెట్ ఎంతో మృదువుగా, మర్యాదగా అడిగాడు. స్లీమన్ తల ఊపాడు. తిరిగి వెడుతూ వారు ఒక విచిత్రమైన అనుభూతికి లోనయ్యారు. ఒకవైపు, ఒక ప్రపంచప్రసిద్ధ పురావస్తునిపుణుని కలసుకున్నామన్న సంతృప్తి, ఇంకోవైపు ఆయన ప్రవర్తన కలిగించిన మనస్తాపం!

schliemann and sophia

ఒకవిధంగా అతని ప్రవర్తన అసాధారణమే. తన శేషజీవితాన్ని బాధాగ్రస్తం చేస్తూవచ్చిన తలనొప్పి కూడా అందుకు ఒక కారణం కావచ్చు. మరోసారి ఇలాగే అతను నైలు నదిలో ప్రయాణించాడు. అప్పుడు రుడాల్ఫ్ విర్కో అతని వెంట ఉన్నాడు. తలనొప్పి, చెవినొప్పి కొంత ఉపశమించిన ఆ దశలో స్లీమన్ చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నాడు. కార్నక్ 5 స్తంభాల మధ్య తిరుగుతూ, అక్కడి అంతుచిక్కని గజిబిజి దారులపై యువ పురావస్తునిపుణుడు ఫ్లిండర్స్ పేట్రీ 6 రూపొందించిన రేఖాపటాలను పరిశీలిస్తూ నాలుగు గంటలపాటు గడిపాడు. ఒకప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద భవంతి ఉన్న ప్రదేశం అది. ఆ భవంతిలో మూడు వేల గదులు, బ్రహ్మాండమైన 12 దేవీడీలు ఉండేవి. గదుల్లో సగం భూగర్భంలో ఉన్నాయి. గజిబిజి దారులతో ఉన్న ఆ సువిశాల ప్రదేశంలో ఫ్లిండర్స్ ఎంతో ఓపికగా జరిపించిన తవ్వకాలు స్లీమన్ ను ముగ్ధుణ్ణి చేశాయి. ఆ తర్వాత స్లీమన్, విర్కోలను కలసుకున్న ఫ్లిండర్స్ , పిడివాది అంటూనే వాస్తవాలను అంగీకరించే నిజాయతీ స్లీమన్ లో ఉందని కితాబు ఇచ్చాడు.

స్లీమన్ 1888లో సితేరా దీవిలో కొద్దిపాటి తవ్వకాలు జరిపి అఫ్రోడైట్ ఆలయాన్ని వెలికితీశాడు. హిస్సాలిక్, మైసీనియాలలో తను కనుగొన్న వాటితో మాత్రమే పోల్చదగిన ఓ బ్రహ్మాండమైన నిర్మాణాన్ని తను బయటపెట్టానంటూ లండన్ టైమ్స్ కు పొడవైన తంతి పంపించాడు. అదే ఏడాది పీలోస్ లోనూ, స్ఫేక్టీరియా 7దీవిలోనూ తవ్వకాలు జరిపాడు. క్రీ.పూ. 425లో స్పార్టాన్లు కనిపెట్టి ఉపయోగించుకున్నట్టు తూసడడీస్ రాసిన దుర్గాలను స్పేక్టీరియాలో వెలికితీశాడు. ఇవి ముఖ్యమైన పరిశోధనలే కానీ; హిస్సాలిక్, మైసీనియాలకు సాటి వచ్చేవి మాత్రం కావు.

నోసస్ అదే పనిగా అతన్ని గుంజి లాగుతూనే ఉంది. “నోసస్ (క్రీటు రాజధాని) రాజులు నివసించిన ప్రాసాదాలను బయటపెట్టడడమన్న ఒకే ఒక మహత్కార్యంతో ఈ జీవితాన్ని చాలిద్దామని ఉంది” అని 1889 జనవరి 1న రాసుకున్నాడు. అదే ఏడాది వసంతంలో అక్కడి భూమి కొనుగోలుకు మరో ప్రయత్నం చేద్దామనుకున్నాడు. దార్ఫెల్త్ ను వెంటబెట్టుకుని వెళ్ళి మళ్ళీ బేరసారాలు మొదలుపెట్టాడు. భూమి యజమాని అక్కడున్న 2500 ఆలివ్ చెట్ల ధరను కూడా కలుపుకుని లక్ష ఫ్రాంకులు అడిగాడు. స్లీమన్ 40వేల ఫ్రాంకులు ఇవ్వజూపాడు. చివరికి 50వేల ఫ్రాంకులకు బేరం కుదిరింది. తీరా ఆలివ్ చెట్లను లెక్కబెడితే 888 మాత్రమే ఉన్నాయి. దాంతో మండిపడిన స్లీమన్ ఇలాంటి అబద్ధాలకోరుతో తను లావాదేవీలు జరిపేదిలేదని మొండికేసాడు.

వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలేయడానికి దార్ఫెల్త్ కు మనస్కరించలేదు. ఆ భూమి గురించి మరింత కూపీ తీశాడు. తమకు అమ్మజూపిన వ్యక్తి కింద మూడో వంతు భూమి మాత్రమే ఉందనీ, మిగతా భూమి మరొకరి యాజమాన్యంలో ఉందనీ తేలింది. ఆ కొత్త వ్యక్తితో సునాయాసంగా బేరం కుదిరి ఒప్పందం సిద్ధమైంది. అక్కడి తవ్వకాలలో లభించే నిధినిక్షేపాలలో మూడో వంతు స్థలయజమానులకు స్లీమన్ ఇవ్వజూపాడు. కానీ ఈసారి సంతకం చేయడానికి మొదటి స్థలయజమాని తిరస్కరించాడు. ఇది తెగే వ్యవహారం కాదని స్లీమన్ నిర్ణయానికి వచ్చి దార్ఫెల్త్ తో కలసి తిరుగుముఖం పట్టాడు. అతని క్రీటు గురించిన కల పూర్తిగా కరిగిపోయింది.

ఆ సంవత్సరంలోనే అతను ట్రాయ్ లో ట్రోజన్ పురావస్తు సంపద మీద మొదటి అంతర్జాతీయ సమ్మేళనం ఏర్పాటు చేసి దేశ దేశాల పండితులనూ ఆహ్వానించాడు. వారితోపాటు ట్రాయ్ శిథిలాల వెంట తిరుగుతూ తను కనుగొన్న విశేషాలను వారికి చూపించాడు. తన అనుభవాలను కథలు కథలుగా వారికి వినిపించాడు. ఇప్పటికీ అతనిలోని తొలినాటి ఉత్తేజం అలాగే ఉంది. మరుసటేడు అక్కడే రెండవ అంతర్జాతీయ సమ్మేళనం నిర్వహించాడు. పండితులను ఉద్దేశించి ఎంతో హుందాగా ప్రసంగాలు చేశాడు. విచిత్రంగా అతని మాటల్లో కొంత మార్పు వచ్చింది. వెనకటిలా సాటి పండితుల అల్పవిద్వత్తునో, మరుగుజ్జుపోకడలనో ఎత్తిచూపి తీసిపారేసే ధోరణి తగ్గింది. ఆ రోజుల్లోనే రుడాల్ఫ్ విర్కోను వెంటబెట్టుకుని మరోసారి ఈదా పర్వతం మీదికి విహారయాత్రకు బయలుదేరాడు. సాయంత్రానికి ఆ పర్వత పాదాల దగ్గర ఉన్న ఒక గ్రామానికి చేరేసరికి అతనికి దుర్భరమైన చెవిపోటు వచ్చి వినుకలిశక్తి పోయింది. విర్కో చెవిని పరీక్షించి లోపల బాగా వాచి ఉన్నట్టు గమనించాడు. వెంటనే ట్రాయ్ కి వెళ్ళడం మంచిదన్నాడు. ఇద్దరూ ఈదా పర్వతం ఎక్కకుండానే వెనక్కి వెళ్ళిపోయారు.

Atlantis-1882

Atlantis-1882

సమ్మేళనం ముగిసిన తర్వాత మళ్ళీ విర్కోతో కలసి గుర్రాల మీద ఈదా పర్వతయాత్రకు వెళ్లాడు. కొండ ఎక్కిన తర్వాత జియస్ కూర్చున్నదిగా చెప్పిన సింహాసనం మీద కూర్చుని, ఆ ఎత్తునుంచి కింది మైదానాన్ని చూస్తూ కాసేపు గడిపాడు. ఆ తర్వాత శిఖరానికి చేరుకుంటుండగా తుపాను విరుచుకుపడింది. చూస్తుండగానే అది పెను తుపానుగా మారిపోయింది. పెద్ద పెద్ద ఉరుములతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి. అద్భుతమైన మెరుపులతో నలుదిక్కులూ వెలిగిపోయాయి. ఇద్దరూ రాతి గుట్టల కింద తల దాచుకున్నారు. అయినా వర్షంలో నిలువునా తడిసిపోయారు. కాసేపటికి తుపాను వెలిసింది. వర్షపు నీటితో శుభ్రపడిన కాంతిలో స్లీమన్ మరోసారి కింది ట్రాయ్ మైదానాన్ని, అదే చివరిసారా అన్నట్టుగా తన్మయంగా చూస్తూ ఉండిపోయాడు. నిజంగా అదే చివరిసారి అయింది.

సమ్మేళనం ముగిసినా పని కొనసాగింది. పనుల సారథ్యాన్ని దార్ఫెల్త్ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. శిథిలాల చెత్తను తొలగించే ముందు, పట్టుబట్టి ప్రతి వివరాన్నీ సునిశితంగా పరిశీలించాడు. ఫోటో తీయించాడు. చీటీలు అతికించాడు. సమయం వృథా అవుతోందని స్లీమన్ పోరు పెడుతున్నా వినిపించుకోలేదు. అతని శ్రమ వృథా పోలేదు. కొత్తగా కొన్ని అపురూపమైన మైసీనియా కుండ పెంకులు వెలుగు చూశాయి. మరికొన్ని కోటగోడలు బయటపడ్డాయి. చివరికి ఒక పెద్ద భవంతి బయటపడింది. దాంతో స్లీమన్ లో కొత్త ఆశలు చిగురించాయి. హోమర్ చిత్రించిన ట్రాయ్ తాలూకు మొత్తం ప్రణాళిక అంతా తన జీవితకాలంలోనే బయటపడుతున్నట్టు ఊహించుకుని ఉత్సాహం చెందాడు. అంతలో వేడి గాలులు మైదానాన్ని ఊపేయడం ప్రారంభించాయి. పనివాళ్లు కొందరు జ్వరపడ్డారు. తవ్వకాలను మరుసటేడుకు వాయిదా వేస్తూ జులై చివరిలో తిరిగి ఎథెన్స్ కు వెళ్లిపోయాడు.

పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. స్లీమన్ రాతబల్ల మీద ఆ ఏడాది పని తాలూకు వివరణ పత్రాల దొంతర పేరుకుపోతోంది. ఎప్పటిలా సోఫియా సాహచర్యం అతనికి ఉపశమనం కలిగిస్తూ పనిభారాన్ని తేలిక చేస్తూనే ఉంది.  మరోవైపు, ఎప్పటిలా అస్థిమితంగానూ, ఏవేవో కలలు కంటూనూ గడుపుతూనే ఉన్నాడు. అయితే, తను మరోసారి ట్రాయ్ ను సందర్శించే అవకాశం లేదన్న సంగతి అప్పటి కతనికి తెలియదు. అట్లాంటిస్ 8 దీవులను సందర్శించాలనీ, మెక్సికోకు వెళ్ళి రావాలనీ అనుకుంటున్నట్టు విర్కోకు రాశాడు. ఈ ప్రదేశాలలో ఎక్కడో ఒడీసియస్ యాత్రకు సంబంధించిన ఆనవాళ్ళు దొరుకుతాయని అతని ఊహ. కెనారీ దీవుల్లోనే తను అట్లాంటిస్ ను కనుక్కోగలనని తలపోసాడు. ఈ దీవులు నిత్యవసంతశోభతో అలరారుతూ ఉంటాయన్న హోమర్ అభివర్ణనే అతని ఊహకు మూలం. అయితే, ఈ లోపల ఇటీవలి ట్రాయ్ తవ్వకాలపై  పుస్తకాన్ని పూర్తి చేయాలనీ, మరో అంతర్జాతీయ సమ్మేళనం నిర్వహించాలనీ, వచ్చే వసంతాన్నీ, వేసవినీ పూర్తిగా ట్రాయ్ లోనే గడపాలనీ అనుకున్నాడు.

చెవిపోటు ఇప్పుడు అంతగా బాధించడంలేదు. వాపు కూడా తగ్గింది. బహుశా శస్త్రచికిత్స అవసరం కాకపోవచ్చు. దానిని వీలైనంత కాలం వాయిదా వేస్తే మంచిదని విర్కో సలహా ఇచ్చాడు. స్లీమన్ ఆ సలహాను పాటించాడు. సోఫియా వియెన్నా సందర్శనకు వెళ్లింది. ఆమె తోడులేని గృహజీవితం అతనిలో ఎప్పుడూ శూన్యాన్ని నింపుతూనే ఉంటుంది. ఇంట్లో దెయ్యం పట్టినట్టు తిరిగేవాడు. తాము ఇద్దరూ కలసి ఎథెన్స్ లో ఎప్పుడూ పెళ్లిరోజు జరుపుకోని సంగతి అతనికి సెప్టెంబర్ చివరిలో గుర్తొచ్చింది. ఆమెకు ప్రాచీన గ్రీకులో ఒక సుదీర్ఘమైన ఉత్తరం రాశాడు:

మన పెళ్లిరోజును తలచుకుని ఎంతో గర్విస్తున్నాను. వచ్చే ఏడాది మనిద్దరం కలసి పెళ్లిరోజు జరుపుకునేలా చూడమని దేవతలను ప్రార్థిస్తున్నాను. నీ బంధువులందరినీ ఆహ్వానిస్తున్నాను. మనిద్దరం కలసి ఇరవయ్యొక్క ఏళ్లపాటు సుఖసంతోషాలతో జీవించాం. ఇన్నేళ్ల కాలాన్నీ ఒకసారి వెనుదిరిగి చూసుకుంటే విధి మన జీవితాల్లో తీపినీ, చేదునూ సమానంగా నింపిందనిపిస్తుంది. మన పెళ్లిని పరిపూర్ణంగా ఎప్పుడూ పండుగ చేసుకోలేనేమో కూడా. ఎందుకంటే, నువ్వు నా ప్రియాతిప్రియమైన అర్థాంగివి మాత్రమే కాదు; నాకు నెచ్చెలివి. కష్టాలలో దారి చూపించిన సారథివి. నా చేతిలో చేయి వేసి నడిచిన విశ్వసనీయ సహచరివి. ఒక అద్వితీయ మాతృమూర్తివిగా కూడా. నీ సుగుణ సంపదను తలచుకుని నిరంతరం మురిసిపోతూనే ఉంటాను. జియస్ కరుణిస్తే మరుజన్మలో కూడా నిన్నే పెళ్లి చేసుకుంటాను.

ఇవే రోజుల్లో చెవిపోటుకు శస్త్రచికిత్స తప్పని పరిస్థితి వచ్చింది. విర్కో సిఫార్సు మీద హాలీ 9 లోని ఒక క్లినిక్ కు వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు. కబురు అందుకున్న సోఫియా భర్త ప్రయాణం ఏర్పాట్లు చూసి సాగనంపడానికి వెంటనే ఎథెన్స్ కు వచ్చింది. బయలుదేరేముందు తన స్వభావవిరుద్ధంగా స్లీమన్ గంభీరంగానూ, నిర్లిప్తంగానూ ఉండిపోయాడు. బ్యాంక్ డైరక్టర్లతో తన వీలునామా గురించి మాట్లాడాడు. తన దుస్తులు మడత పెట్టి ట్రంకులో పెట్టుకుంటున్నప్పుడు, “ఈ దుస్తులు ఎవరు వేసుకుంటారో?!” అన్న మాటలు అతని నోట అప్రయత్నంగా వెలువడ్డాయి. సోఫియా తను కూడా వస్తానంది. “ఆరువారాల్లో వచ్చేస్తాను, పిల్లల్ని చూసుకుంటూ ఉండు” అని స్లీమన్ అన్నాడు. రైల్వే స్టేషన్ కు బయలుదేరేముందు, చివరిక్షణంలో భర్త రిస్టువాచీ ఛైను పట్టుకుని ఆపి ముఖంలోకి చూసింది. అదే చివరిచూపా అన్న స్ఫురణ ఆమె చూపుల్లో కదలాడింది.

నవంబర్ లో అతను హాలీ చేరుకున్నాడు. చలికాలం. క్లినిక్ కిటికీలకు అవతల మంచు కురుస్తోంది. వైద్యులు అతని రెండు చెవులనూ పరీక్షించారు. రెండింటికీ శస్త్రచికిత్స అవసరమని తేల్చారు. మరునాడు శస్త్రచికిత్స జరిపారు. ఆ సమయంలో తెల్లని నూనెబట్ట పరచిన ఒక బల్ల మీద పడుకోబెట్టారు. “అంతకుముందు ఒక శవపరీక్ష జరపడానికి ఉపయోగించిన బల్లలానే అది కనిపించింది” అని ఆ తర్వాత స్లీమన్ ఒక మిత్రుడితో అన్నాడు. శస్త్రచికిత్సకు ఒకటిమ్ముప్పావు గంట పట్టింది.

వైద్యుల ప్రకారం శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. కానీ స్లీమన్ కు అలా అనిపించలేదు. దానికితోడు ఆసుపత్రిలో గడపడం దుర్భరంగా తోచింది. సందర్శకులను అనుమతించలేదు. తలకు పెద్ద కట్టు కట్టారు. ఆ పరిస్థితిలో కూడా చుట్టూ పుస్తకాలు పేర్చుకుని, ఉత్తరాలు రాస్తూ గడిపాడు. దార్ఫెల్త్ కూ ఉత్తరం రాస్తూ, తను చేసిన తప్పులన్నింటినీ క్షమించమనీ, తమ ఇద్దరి మధ్యా ఛాయామాత్రంగానైనా ఎప్పుడైనా మనస్పర్థ కలిగిందని భావిస్తే, దానిని నిర్మొహమాటంగా వెల్లడించమనీ కోరాడు. భార్యనుంచి అందుకున్న ఉత్తరానికి జవాబు రాస్తూ, “మహిళలందరిలోనూ మణిపూసవు నువ్వు, నీ ఉత్తరాన్ని చెమ్మగిల్లిన కళ్ళతో చదువుకున్నాను” అన్నాడు.

(సశేషం)

***

అథోజ్ఞాపికలు

  1. ఆస్వాన్: ఈజిప్టులో నైలు నది ఒడ్డున ఉన్న ఒక నగరం. ఆస్వాన్ డ్యామ్ సుప్రసిద్ధం.
  2. ఈ. ఏ. వ్యాలిస్ బాడ్జ్(1857-1934): ఈజిప్టు పురాచరిత్ర, సంస్కృతి, సాహిత్యాలలో నిపుణుడైన ఆంగ్లేయుడు, భాషాశాస్త్రవేత్త. ప్రాచీన మధ్యప్రాచ్యం పై అనేక గ్రంథాలు రచించాడు.
  3. కుఫిక్ లిపి: వివిధ అరబ్బీ లిపులకు చెందిన ప్రాచీన రాతలిపి. ఇరాక్ లోని కుఫా అనే చోట క్రీ.శ. 7వ శతాబ్ది చివరిలో అభివృద్ధి చెందింది.
  4. హిజిరా: మహమ్మద్ ప్రవక్త క్రీ.శ. 622లో మక్కా నుంచి మదీనాకు వెళ్ళిన సందర్భాన్ని సంకేతించే ముస్లిం శకం.
  5. కార్నక్: ఈజిప్టులోని తీబ్స్ నగరంలో భాగంగా ఉన్న విశాలమైన ప్రాచీన, మధ్యయుగ ఆలయ సముదాయం. వీటిలో అనేకం శిథిల ఆలయాలు.
  6. ఫ్లిండర్స్ పేట్రీ (1853-1942): ఈజిప్టు విషయాలలో నిపుణుడైన ఆంగ్లేయుడు. పురావస్తుశాస్త్రానికీ, ప్రాచీన కళాఖండాల పరిరక్షణకూ సంబంధించిన శాస్త్రీయ పద్ధతులను అభివృద్ధి చేసిన ప్రముఖులలో ఒకడు.
  7. స్ఫేక్టీరియా: గ్రీస్ లోని పెలొపనీస్ ద్వీపకల్పంలో పీలోస్ అఖాతం వద్ద ఉన్న ఒక చిన్న దీవి. క్రీ.పూ. 431-404 మధ్య పెలొపనీసస్ యుద్ధంగా ప్రసిద్ధమైన యుద్ధం ఇక్కడే జరిగింది.
  8. అట్లాంటిస్-కెనారీ దీవులు: అతి పురాతనకాలంలో, ఒక అంచనా ప్రకారం 9వేల సంవత్సరాల క్రితం, అట్లాంటిక్ సముద్రంలో ఉండేదిగా భావిస్తూ వచ్చిన ఒక దీవి/దీవులు ఇవి. ప్రాచీన గ్రీకు తత్వవేత్త ప్లేటో(క్రీ.పూ. 428-348) తన ‘తీమేయస్’ (Timaeus), ‘క్రీషియస్’ (Critias) అనే డైలాగులలో అట్లాంటిస్ గురించి రాశాడు. పెద్ద ఉత్పాతం ఏదో సంభవించి ఈ భూఖండం సముద్రంలో లోతుగా మునిగిపోయిందనీ, ఇందులోని పెద్ద పెద్ద పర్వతాల శిఖరాలు మాత్రమే నీటిపై కనిపిస్తాయనీ రాశాడు. ఆయన నిజమైన ఆధారాలతోనే రాశాడా, లేక ఊహించాడా అన్నది తెలియదు. కాకపోతే, అప్పటినుంచీ అట్లాంటిస్ అనే భూఖండం నిజంగానే ఉండేదని నమ్ముతూ వచ్చినవాళ్ళు నేటి కెనారీ(Canary) దీవులు, అజోర్స్(Azores)దీవులు, కేప్ వర్ద్(Verde),మదీరా(Madeira)లు భాగంగా ఉన్న మైక్రోనేసియా యే ఆ మునిగిపోయిన ప్రాచీన భూఖండం తాలూకు అవశేషమని భావిస్తారు.

గ్రీకు పురాణాల ప్రకారం చూస్తే, ప్రముఖ గ్రీకువీరుడు హెరాక్లీస్ చేపట్టిన 12 సాధనలలో ఒకటి, ప్రపంచం అంతం వరకూ వెళ్ళి సంధ్యా దేవతలలో ఒకరైన హెస్పరడీస్ కాపలా కాస్తున్న తోటలోని బంగారు యాపిల్ పండ్లను తీసుకురావడం! హెస్పరీస్, అట్లాస్ ల కుమార్తే హెస్పరడీస్. గ్రీకు, రోమన్ పురాణాలు ఒక రాక్షసునిగా పేర్కొన్న అట్లాస్ పేరే అట్లాంటిక్ సముద్రానికీ, మొరోకోలోని అట్లాస్ పర్వతశ్రేణికీ వచ్చింది. హెరాక్లీస్ స్తంభాల(Pillars of Heracules) ఉనికిని చెబుతున్న నేటి జిబ్రాల్టర్ జలసంధిని కూడా దాటి సంధ్యాదేవతలు నివసించే స్వర్గధామానికి హెరాక్లీస్ వెళ్లాడనీ;  ఆ స్వర్గధామమే నేటి కెనారీ దీవులనీ, పౌరాణిక వర్ణనకు అవే సరిపోతున్నాయనీ భావించారు.

హోమర్ కూడా ఈ దీవులను ఎలిజియం(Elysium)దీవుల పేరిట గుర్తించాడు. పుణ్యకార్యాలు చేస్తూ, ధర్మబద్ధంగా జీవించినవారు చనిపోయి ఈ దీవులకు వెడతారని రాశాడు. అయితే అతి ప్రాచీన నావికులైన ఫినీషియన్లు కానీ, గ్రీకులు కానీ ఈ దీవులకు వెళ్ళినట్టు ఆధారాలు లేవు. అయితే ఉత్తర ఆఫ్రికాలోని అట్లాంటిక్ తీరాన్ని సందర్శించిన తొలి ఫినీషియన్లు, వారి వారసులైన పురాతన కార్తేజ్ నగరవాసులు కెనారీ దీవులను కనీసం చూసి ఉండడానికి ఎంతైనా అవకాశముంది. క్రీ.పూ. 12వ శతాబ్దిలో ఫినీషియన్లు కెనారీ దీవులకు వెళ్ళి వచ్చారని కొందరు చరిత్రకారులు భావించారు. క్రీ.పూ. 470లో కార్తేజ్ కు చెందిన నావికుడు హన్నో ఈ దీవులను సందర్శించాడంటారు. క్రీ.పూ. 146లో జరిగిన మూడవ ప్యూనిక్ యుద్ధంలో కార్తేజ్ ను జయించిన రోమన్లు పురాణ ప్రసిద్ధమైన ఈ దీవులపై పెద్ద ఆసక్తి చూపించలేదు. ఉత్తర ఆఫ్రికాలోని ప్రాచీన లిబియా రాకుమారుడు, మంచి విద్యావేత్త అయిన జుబా-2 క్రీ.పూ. 40లో కెనారీ దీవులకు ఒక పరిశోధక బృందాన్ని పంపించాడు. ఆ వివరాలను ప్లినీ ద ఎల్డర్ (క్రీ.శ. 23-79) నమోదు చేశాడు. టోలెమీ(క్రీ.శ. 150) భౌగోళిక ఊహారేఖలను ఆధారం చేసుకుని ఈ దీవుల ఉనికిని తగుమేరకు కచ్చితంగా గుర్తించి వాటిని ప్రపంచపు అంతిమ సరిహద్దు అన్నాడు. (పైన ఇచ్చిన రేఖాపటాన్ని చూడగలరు)

Read more: http://www.lonelyplanet.com/canary-islands/history#ixzz49dtzEVAE

ఖండాల చలన సిద్ధాంతం (continental drift) ఇటీవలి కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన సంగతి తెలిసినదే. ఆ కోణంలో చూసినప్పుడు అట్లాంటిస్ ఉనికి గురించి ప్లేటో క్రీస్తు పూర్వకాలంలోనే ఊహించడం విశేషంగానే కనిపిస్తుంది. మన విషయానికి వస్తే, రామాయణంలో సీతాన్వేషణకు వానరవీరులను అన్ని దిక్కులకూ  పంపుతూ సుగ్రీవుడు అనేక ద్వీపాలు, సముద్రాలు, పర్వతాలు, ప్రాంతాల గురించి చెబుతాడు. వాటిని నేటి భౌగోళిక పరిజ్ఞానంతో ఎంతవరకు గుర్తించగలమో చెప్పలేం. హోమర్ ఆధారంగా అట్లాంటిస్ ను గుర్తించాలని స్లీమన్ అనుకున్నట్టే, రామాయణం, పురాణాలు వగైరాలలో పేర్కొన్న భౌగోళిక ప్రాంతాలను గుర్తించడానికి ప్రయత్నించిన పండితులు మన దగ్గరా ఉన్నారు. మహాభారతంలోనూ ఇటువంటి అజ్ఞాత భౌగోళిక వివరాలు కనిపిస్తాయి. సముద్రంలో మునిగిపోయినట్టు పౌరాణికంగా విశ్వసించే  శ్రీకృష్ణుని ద్వారకా నగరాన్ని యు. ఆర్. రావు అనే పురావస్తునిపుణుని సారథ్యంలో గుర్తించినట్టు చెప్పడం ఇటీవలి చరిత్ర.

కొలంబస్ కనిపెట్టడానికి చాలాముందే 11, 12 శతాబ్దులలోనే గ్రీస్ లాండ్ కు చెందిన నావికులు అమెరికాను కనిపెట్టారనీ, అంతకంటే అతి ప్రాచీనకాలంలోనే భూగోళపు అమరికను బట్టి అమెరికా ఖండాన్ని ఊహించగలిగారనీ ఆ మధ్య ఒక పుస్తకంలో చదివాను.

  1. హాలీ: జర్మనీలోని ఒక నగరం.

 

రాక్షస గీతం

 

 

-అనిల్ ఎస్. రాయల్

~

 

“Reality is merely an illusion, albeit a very persistent one.” – Albert Einstein

 

—-

చెవులు చిల్లులు పడే శబ్దం. దాన్ననుసరిస్తూ, కాలం నివ్వెరపోయినట్లు క్షణమాత్రపు నిశ్శబ్దం. మరుక్షణం మిన్నంటిన రోదనలు.

దట్టంగా పొగ. చెదురుమదురుగా మంటలు. చిందరవందరైన పరిసరాలు. ఛిద్రమైన శరీరాలు. వాటినుండి రక్తపు చుక్కలు పైకెగరసాగాయి. ఒకటి, రెండు, పది, వంద. చూస్తూండగానే చిక్కబడ్డాయవి. నేలమీంచి నింగిలోకి కుండపోతగా రుధిరవర్షం కురవసాగింది. ఆకాశాన్ని చీలుస్తూ నల్లటి మెరుపొకటి మెరిసింది. సమీపంలో పిడుగు పడింది. దిక్కులు పిక్కటిల్లిన చప్పుడుతో –

దిగ్గున మెలకువొచ్చింది.

ఎప్పుడూ వచ్చేదే. అయినా అలవాటవని కల. పదే పదే అదే దృశ్యం. మానవత్వం మాయమైన మారణహోమం. రక్తంతో రాసిన రాక్షసగీతం.

అది నా ఉనికి దేనికో విప్పి చెప్పిన విస్ఫోటనం.

నిశ్చలంగా పైకప్పుని చూస్తూ పడుకుండిపోయాను – అది కలో, మెలకువో తెలీని అయోమయంలో.

మేలుకోవటమంటే – వాస్తవంలోకి వళ్లు విరుచుకోవటమా, లేక ఒక కలలోంచి మరో కలలోకి కళ్లు తెరుచుకోవటమా?

ఇదీ కలే ఐతే మరి ఏది నిజం?

“నువ్వేది నమ్మితే నీకదే నిజం,” అన్నాడెవరో మేధావి.

నిజమేనేమో. సత్యం సైతం సాపేక్షం! అందుకే లోకమంతా ఈ అరాచకత్వం. ఎవడికి నచ్చింది వాడు నిజంగా నమ్మేసి ఎదుటోడి నెత్తిన రుద్దేసే నైజం. అందులోంచి పుట్టేది ముందుగా పిడివాదం. ఆ తర్వాత అతివాదం. అది ముదిరితే ఉన్మాదం. అదీ ముదిరితే –

ఉగ్రవాదం.

ఆలోచనల్ని బలవంతంగా అవతలకి నెడుతూ మెల్లిగా లేచాను.

 

మరో రోజు మొదలయింది.

 

* * * * * * * *

 

“అవకాశం దొరకాలే కానీ … వాణ్ని అడ్డంగా నరికేసి ఆమెని సొంతం చేసుకుంటా,” అనుకున్నాడు వాడు పెదాలు చప్పరిస్తూ.

ఇరవైలోపే వాడి వయసు. ఇంజనీరింగ్ విద్యార్ధి వాలకం. చిరిగిన జీన్స్, చింపిరి జుత్తు, ఓ చేతిలో సిగరెట్, ఇంకో చేతిలో కాఫీ కప్, వీపున బ్యాక్‌పాక్. నిర్లక్షానికి నిలువెత్తు రూపం. యమహా మీద ఠీవిగా తిష్ఠవేసి నల్ల కళ్లద్దాల మాటునుండి నిష్ఠగా అటే చూస్తున్నాడు.

నేనూ అటు చూశాను. నాలుగు టేబుల్స్ అవతలొక పడుచు జంట. భార్యాభర్తల్లా ఉన్నారు. ఎదురెదురుగా మౌనంగా కూర్చుని ఒకే కప్పులో కాఫీ పంచుకు తాగుతున్నారు. ఆ యువతి సౌందర్యానికి నిర్వచనం. ఆమె భర్త పోతురాజు ప్రతిరూపం.

చింపిరిజుత్తు వైపు చూపు తిప్పాను. వాడింకా పెదాలు చప్పరిస్తూనే మర్డర్ ఎలా చెయ్యాలో, ఆ తర్వాత ఆమెతో ఏం చెయ్యాలో ఆలోచిస్తూన్నాడు. ఆమె వాడికన్నా ఆరేడేళ్లు పెద్దదయ్యుంటుంది. కానీ అది వాడి ఆలోచనలకి అడ్డురాని వివరం. ఈ రకం తరచూ తారసపడేదే. ఊహల్లో చెలరేగటమే తప్ప వాటి అమలుకి తెగించే రకం కాదు. ప్రమాదరహితం.

వాడినొదిలేసి ఆ పక్కనే ఉన్న టేబుల్‌వైపు చూశాను. అక్కడో ముగ్గురు అమ్మాయిలు. ఇవీ కాలేజ్ స్టూడెంట్స్ వాలకాలే. కాఫీకోసం‌ నిరీక్షీస్తూ మొబైల్‌ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. అలవాటుగా వాళ్ల బుర్రల్లోకి చూశాను. నిమిషంలోపే అర్ధమైపోయింది. పోసుకోలు కబుర్లు. ఎదురు బొదురుగా కూర్చుని ఒకరితో ఒకరు వాట్సాప్‌లో చాట్ చేస్తున్న నవతరం ప్రతినిధులు. హార్మ్‌లెస్ క్రీచర్స్.

వాళ్లమీంచి దృష్టి అటుగా వెళుతున్న యువకుడి మీదకి మళ్లింది. ముప్పయ్యేళ్లుంటాయేమో. వడివడిగా నడుస్తూ ఫోన్లో మాట్లాడుతున్నాడు. అతడి కవళికలు అనుమానాస్పదంగా తోచాయి. ఏమన్నా విశేషమా? వెంటనే అతడిని స్కాన్ చేశాను. ఫ్యామిలీ మాటర్. పట్టించుకోనవసరం లేదు. మరొకరి మీదకి దృష్టి మరల్చబోతూండగా అతను చటుక్కున ఆగిపోయాడు. నేనూ ఆగిపోయాను. ఆ పక్కనే దట్టంగా విరిసిన పూల మొక్క. అందులో ఒక పువ్వునుండి తేనె గ్రోలుతూ నీలిరంగు బుల్లిపిట్ట. నగరాల్లో అరుదైన దృశ్యం. అంత హడావిడిలోనూ అది చూసి ఆగిపోయాడంటే వీడెవడో భావుకుడిలా ఉన్నాడు. ఆటవిడుపుగా అతడిని గమనించాను. నాకూ కాసేపు కాలక్షేపం కావాలిగా.

అతను ఫోన్ మాట్లాడటం ఆపేసి, అదే ఫోన్‌తో ఆ పిట్టని ఫోటో తీసుకుని, తిరిగి ఫోన్‌లో మాట్లాడుతూ వడి నడక ప్రారంభించాడు. ప్రస్తుతాన్ని చిత్రాల్లో చెరపట్టి ఆస్వాదన భావికి వాయిదావేసే ఆధునిక భావుకుడు!

కాలక్షేపం కట్టిపెట్టి, అతన్నొదిలేసి చుట్టూ పరికించాను – ఆ పరిసరాల్లో అలల్లా తేలుతున్న ఆలోచనల్ని అలవాటుగా పరిశీలిస్తూ, ప్రమాదకరమైనవేమన్నా ఉన్నాయేమోనని అలవోకగా పరీక్షిస్తూ. నగరంలో నలుగురూ చేరే ప్రముఖ ప్రదేశాల్లో స్కానింగ్ చెయ్యటం నా బాధ్యత. సిటీ నడిబొడ్డునున్న పార్కులో, సదా రద్దీగా ఉండే కాఫీ షాపు ముందు అదే పనిలో ఉన్నానిప్పుడు. షాపు ముందు పచ్చటి పచ్చిక బయలు. దాని మీద పాతిక దాకా టేబుళ్లు. వాటి చుట్టూ ముసిరిన జనం. వాళ్ల నీడలు సాయంత్రపు నీరెండలో సాగిపోయి నాట్యమాడుతున్నాయి. వాతావరణం వందలాది ఆలోచనల్తో, వాటినుండి విడుదలైన భావాలతో కంగాళీగా ఉంది. ఆవేశం, ఆక్రోశం, అవమానం, అనుమానం, అసూయ, అపనమ్మకం మొదలైన ప్రతికూల భావనలదే మెజారిటీ. అదేంటోగానీ, మనుషులకి ఆనందం పొందటానికంటే ఆవేదన చెందటానికి, అసంతృప్తిగా ఉండటానికే ఎక్కువ కారణాలు దొరుకుతాయి! అదిగదిగో, అక్కడో అమాయకత్వం, ఇక్కడో అల్పానందం కూడా బిక్కుబిక్కుమంటున్నాయి. ఇవి కాదు నాక్కావలసింది, ఇంతకన్నా ముఖ్యమైనవి – అమానుషమైనవి. అదేంటక్కడ … ఆత్మహత్య తలపు? పట్టించుకోనవసరం లేదు. ఆ మధ్య టేబుల్ దగ్గరున్నోడి తలని అపరాధపుటాలోచనేదో తొలిచేస్తోంది. అదేంటో చూద్దాం. ఇంకాసేపట్లో భార్యని హత్య చెయ్యటానికి కిరాయి హంతకుడిని పురమాయించి ఎలిబీ కోసం ఇక్కడొచ్చి కూర్చున్న అనుమానపు మొగుడి తలపు. అది వాడి వ్యక్తిగత వ్యవహారం. నాకు సంబంధించింది కాదు. ఇలాంటివాటిలో కలగజేసుకుని జరగబోయే నేరాన్ని ఆపాలనే ఉంటుంది. కానీ ఏజెన్సీ ఒప్పుకోదు.

పావుగంట పైగా స్కాన్ చేసినా కలవరపెట్టే ఆలోచనలేవీ కనబడలేదు. అక్కడ రకరకాల మనుషులున్నారు. దాదాపు అందరూ మొబైల్ ఫోన్లలోనూ, టాబ్లెట్లలోనూ ముఖాలు దూర్చేసి ఉన్నారు. పొరుగింటి మనుషుల్ని పలకరించే ఆసక్తి లేకున్నా ముఖపరిచయం లేని మిత్రుల రోజువారీ ముచ్చట్లు మాత్రం క్రమం తప్పక తెలుసుకునేవాళ్లు. అన్ని సమయాల్లోనూ అన్ని విషయాలతోనూ కనెక్టెడ్‌గా ఉండే తహతహతో చుట్టూ ఉన్న ప్రపంచం నుండి డిస్కనెక్ట్ అయిపోయినోళ్లు. ఇ-మెయిళ్లు, ఎస్సెమ్మెస్‌లు, పోస్ట్‌లు, లైక్‌లు, పోక్‌లు, ఫోటోలు, వీడియోలు, ట్వీట్‌లు, ట్యాగ్‌లు, డౌన్‌లోడ్‌లు, అప్‌లోడ్‌లు, యాప్స్, గేమ్స్, ఫీడ్స్ … కిందటి తరం వినైనా ఎరగని విశేషాల్లో, విషాల్లో నిండా మునిగిన జనం. వాస్తవలోకాన్నొదిలేసి ‌సైబర్ వాస్తవంలో ముసుగులు కప్పుకు సంచరించే వెర్రితనం.

 

ముసుగులు. లేనిదెక్కడ?

ఇంటర్నెట్‌లోనే కాదు, ఈ లోకం నిండా ఉందీ ముసుగు మనుషులే. అందరు మనుషులకీ అవతలి వ్యక్తి ముసుగు తొలగించి, వాడి మదిలో మెదిలే వికృతాలోచనల్ని చదివే శక్తి ఉంటే? అప్పుడిక ప్రపంచంలో రహస్యాలుండవు. మోసాలుండవు. ఇన్ని నేరాలుండవు. కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండవు. మాటతో పనుండదు. పిల్లల మనసెరగని తల్లిదండ్రులుండరు. తలలో పుట్టే తలపులకి మరుగన్నది లేనినాడు భయంతోనో, సిగ్గుతోనో వాటిని నియంత్రించటం మనుషులు నేర్చుకుంటారు. మెరుగుపడతారు. ప్రపంచానికిక నాలాంటివారితో పనుండదు. నా శక్తికేం ప్రత్యేకతుండదు.

శక్తి.

ఈ శక్తి నాకెందుకొచ్చిందో తెలీదు. ఎప్పుడొచ్చిందో మాత్రం లీలగా గుర్తుంది.

 

మొట్టమొదటిసారి నేను చదివింది అమ్మ ఆలోచనల్ని. అప్పుడు నాకు ఐదేళ్లుంటాయి. ఆలోచనల్ని చదవటం అనేదొక అద్భుతమైన విషయమని తెలీని వయసు. యథాలాపంగా అమ్మ మనసులో ఏముందో చదివేసి బయటకు చెప్పేయటం, దానికామె ఆశ్చర్యపడిపోవటం, మళ్లీ చదవమనటం, నేను మరోమారామెని ఆశ్చర్యపరచటం, ఆ సాయంత్రం అంతా ఇద్దరం అదే పనిలో ఉండటం … ఇంతే గుర్తుంది. ఆ వయసులో నాకదొక ఆటలా మాత్రమే తోచింది. తర్వాత మరి కొన్నిసార్లూ అమ్మ ఆలోచనలు చదివి చెప్పాను. అయితే, ఆమె మొదట్లో చూపించిన ఆసక్తి తర్వాత చూపకపోగా చిరాకుపడింది. నేను చిన్నబుచ్చుకున్నాను. ఎందుకో బోధపడకపోయినా, ఆమె ఆలోచనలు నేనలా చదివేయటం అమ్మకి ఇష్టంలేదని అర్థమయింది. దాంతో ఆమె దగ్గర నా శక్తి ప్రదర్శించటం మానేశాను. మొదట్లో అనుమానించినా, మెల్లమెల్లగా ఆమె కూడా నాకా శక్తి ఎంత చిత్రంగా వచ్చిందో అంత చిత్రంగానూ మాయమైపోయిందనుకుని కాలక్రమంలో ఆ విషయం మర్చిపోయింది.

అమ్మకి తెలీని సంగతేంటంటే – నా శక్తి రోజు రోజుకీ పెరిగిపోసాగింది. మొదట్లో ఆమెని మాత్రమే చదవగలిగిన నేను, కాలం గడిచే కొద్దీ ఇతరులనీ చదివేయసాగాను. అతి సమీపంలో ఉన్నవారి నుండి రెండు వందల మీటర్ల రేడియస్‌లో ఉన్న ప్రతి మనిషినీ చదవగలిగేవరకూ నా పరిధి విస్తరించింది. అందరిని చదవటం వల్లనో ఏమో, నాకు వయసుకి మించిన పరిపక్వత అబ్బింది. ఏడేళ్లొచ్చేటప్పటికే ఓ విషయం అర్థమైపోయింది: పరాయి వ్యక్తి తన మస్తిష్కంలోకి చొరబడి అందులో ఏముందో కనిపెట్టేయటం ఏ మనిషీ ఇష్టపడడు. మరి నాకీ శక్తున్న విషయం అందరికీ తెలిసిపోతే? ఇక నన్నెవరూ మనిషిలా చూడరు. నేనంటే భయమే తప్ప ఇష్టం, ప్రేమ ఎవరికీ ఉండవు. ఆ ఆలోచన భరించలేకపోయేవాడిని. అందువల్ల నా వింత శక్తి సంగతి ఎవరికీ తెలియకుండా దాచాలని నిర్ణయించుకున్నాను. దానికోసం చాలా కష్టపడాల్సొచ్చింది. నలుగురిలోకీ వెళ్లటం ఆలస్యం – అన్ని దిక్కులనుండీ ఆలోచనలు కమ్ముకునేవి. కళ్లు మూసుకుంటే లోకాన్ని చూడకుండా ఉండొచ్చుగానీ దాన్ని వినకుండా ఉండలేం. నా వరకూ పరుల ఆలోచనలూ అంతే. వద్దన్నా వచ్చేసి మనోఫలకంపై వాలతాయి. వాటిని ఆపటం నా చేతిలో లేదు. వేలాది జోరీగలు చుట్టుముట్టినట్లు ఒకటే రొద. తల దిమ్మెక్కిపోయేది. తప్పించుకోటానికి ఒకే దారి కనపడింది. ఆ జోరీగల్లో ఒకదాన్నెంచుకుని దాని మీదనే ఫోకస్ చేసేవాడిని. తక్కినవి నేపథ్యంలోకెళ్లి రొదపెట్టేవి. గుడ్డిలో మెల్లగా ఉండేది.

అలా, టీనేజ్‌కొచ్చేసరికి వేల మనసులు చదివేశాను. ఆ క్రమంలో‌ నాకో గొప్ప సత్యం బోధపడింది. కనిపించేదంతా మిథ్య. కనిపించనిదే నిజం. అది ఎవరికీ నచ్చదు. అందుకే ఈ నాటకాలు, బూటకాలు. కని పెంచిన ప్రేమలో ఉండేదీ ‘నా’ అనే స్వార్థమే. స్వచ్ఛమైన ప్రేమ లేనే లేదు. అదుంటే కవిత్వంతో పనుండేది కాదు. పైకి మామూలుగా కనపడే ప్రతి వ్యక్తి లోపలా పూర్తి భిన్నమైన మరో వ్యక్తి దాగుంటాడు. వాడి ఆలోచనలు అనంతం. చేతలు అనూహ్యం. ఆ పుర్రెలో ఎప్పుడు ఏ బుద్ధి ఎందుకు పుడుతుందో వివరించటం అసాధ్యం. మనిషి కళ్లకి కనిపించే విశ్వం – పొడవు, వెడల్పు, లోతు, కాలాలనే పరిధుల మధ్య గిరిగీసి బంధించబడ్డ మరుగుజ్జు లోకమైతే, ఆ పరిధులకవతలుంది మరోప్రపంచం. అది మంచికీ చెడుకీ మధ్య, నలుపుకీ తెలుపుకీ నడుమ, మానవ మస్తిష్కంలో కొలువైన అవధుల్లేని ఊహాలోకం. దాని లోతు కొలవటానికి కాంతి సంవత్సరాలు చాలవు. ఆ చీకటి లోకాల్లోకి నేను తొంగి చూశాను. పువ్వుల్లా విచ్చుకు నవ్వే వదనాల వెనక నక్కిన గాజు ముళ్లు. ఎంత తరచి చూస్తే అంత లోతుగా చీరేసేవి. ఆ బాధ పైకి కనపడకుండా తొక్కిపట్టటమో నరకం. అదో నిరంతర సంఘర్షణ. దాని ధాటికి స్థితిభ్రాంతికి లోనయ్యేవాడిని. చిన్న చిన్న విషయాలు మర్చిపోయేవాడిని. వేర్వేరు సంఘటనల్ని కలగలిపేసి గందరగోళపడిపోయేవాడిని.

అయితే వాటిని మించిన సమస్య వేరే ఉంది. తండ్రి లేకుండా పెరగటాన, అమ్మకి నేనొక్కడినే కావటాన, ఒంటరి నడకలో అలుపెంతో నాకు తెలుసు. ‘నా వాళ్లు’ అనే మాట విలువెంతో మరింత బాగా తెలుసు. కానీ నా శక్తి పుణ్యాన, నా వాళ్లనుకునేవాళ్లంతా లోలోపల నన్నేమనుకుంటున్నారో గ్రహించాక వాళ్లతో అంతకు ముందులా ఉండలేకపోయేవాడిని. ఈ లోకంలో నేనో ఏకాకిగా మిగిలిపోతానేమోననే భయం వెంటాడేది. దానికి విరుగుడుగా – నా వాళ్ల ఆలోచనలు పొరపాటున కూడా చదవకూడదనే నిర్ణయం పుట్టింది. వద్దనుకున్నవారి ఆలోచనల్ని వదిలేయగలిగే నిగ్రహం సాధించటానికి కిందామీదా పడ్డాను. కానీ చివరికి సాధించాను. నా వైట్ లిస్ట్‌లో అతి కొద్ది పేర్లే ఉండేవి.

 

వాటిలో ఒకటి షాహిదా.

తను ఇంజనీరింగ్‌లో నా సహచరి. చూపులు కలిసిన తొలిసారే మా మధ్య ఆకర్షణేదో మొగ్గతొడిగింది. ఆమె ఆలోచనలు చదవకూడదన్న స్థిర నిశ్చయానికి ఆ క్షణమే వచ్చేశాను. పరిచయం ప్రేమగా మారటానికి ఎక్కువరోజులు పట్టలేదు. చదువు పూర్తయ్యాక అమ్మని ఒప్పించి షాహిదాని పెళ్లాడటానికి కాస్త కష్టపడాల్సొచ్చింది. మొదట్లో ఇద్దరి మతాలూ వేరని అమ్మ బెట్టుచేసినా, తర్వాత తనే మెట్టు దిగింది. పెళ్లయ్యాక, అప్పుడప్పుడూ షాహిదా మనసులో ఏముందో చదివి తెలుసుకోవాలన్న కోరిక తలెత్తినా, దాన్ని తొక్కిపట్టేసేవాడిని.

అదెంత పెద్ద తప్పో తర్వాతెప్పటికో తెలిసింది. అప్పటికే ఆలస్యమయింది.

తల విదిలిస్తూ, స్కానింగ్ కొనసాగించాను. చుట్టూ జనాలు ఎవరి ఆలోచనల్లో వాళ్లు మునిగున్నారు. ఆశలు, అసూయలు, కోరికలు, కోపాలు, వల్గారిటీస్, పెర్వర్షన్స్ అన్నీ వాళ్ల తలపుల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి. అవన్నీ నేను వింటున్నానని తెలిస్తే? అప్పుడా ఆలోచనలకి కళ్లాలేస్తారా? నో. నా మీద దాడికొస్తారు. తమ ప్రైవసీ హక్కుకి భంగం కలిగించానంటూ రాద్ధాంతం చేస్తారు. ఈ కారణంగానే ఏజెన్సీ అజ్ఞాతంలో ఉండిపోయింది.

anil

ఇందాకెప్పుడో తెచ్చుకున్న కాఫీ చల్లారిపోయింది. మరో కాఫీ కోసం లేచెళ్లి కౌంటర్లో ఆర్డరిచ్చి, అదొచ్చేలోపు ఎదురుగా గోడకున్న టీవీలో స్క్రోలింగ్ న్యూస్ చదవసాగాను. “ప్రత్యేక హోదా సాధించి తీరతాం – చంద్రబాబు”. “విదేశాల నుండి నల్ల ధనం వెనక్కి రప్పిస్తాం – నరేంద్రమోదీ”. “త్వరలోనే మెగాస్టార్ నూట యాభయ్యో సినిమా ప్రకటన – రామ్ చరణ్”. “ఈ దేశంలో పుట్టినోళ్లందరూ జై శ్రీరామ్ అనాల్సిందే – సాధు మహరాజ్”. రెండేళ్ల నుండీ రోజు మార్చి రోజు ఇదే బ్రేకింగ్ న్యూస్! కానీ సామూహిక అత్యాచారాలు, సంఘవిద్రోహ చర్యల వార్తల కన్నా ఇవే మెరుగు.

కాఫీ వచ్చింది. తీసుకుని వెనక్కొచ్చి ఇందాకటి టేబుల్ వద్దే కూర్చుని తాగబోతోండగా … తలలో చిన్న మెరుపు మెరిసింది. లిప్తపాటు మెదడు మొద్దుబారింది.

 

సందేశాలు రాబోతున్న సూచన. ఏజెన్సీ నుండి.

కాఫీ కప్పు కిందపెట్టి కళ్లు మూసుకున్నాను, అంతఃచక్షువులకి అల్ల్లంత దూరంలో కనబడుతున్న సూక్ష్మబిందువు మీదకి ఫోకస్ లాక్ చేయటానికి ప్రయత్నిస్తూ. కొత్తలో ఈ పని చేయటానికి రెండు నిమిషాల పైగా పట్టేది. ఇప్పుడు రెండే సెకన్లు.

ఫోకస్ లాక్ అవగానే సందేశాలు డౌన్‌లోడ్ కావటం మొదలయింది. మొదటగా ఎవరిదో ఫోటో వచ్చింది. అంత స్పష్టంగా లేదు. పురుషాకారం అని మాత్రం తెలుస్తోంది. నాతో సహా ఎవడైనా కావచ్చు. టెలీపతీ ద్వారా శబ్ద సంకేతాలొచ్చినంత స్పష్టంగా చిత్రాలు రావు. ఇంత అస్పష్టమైన ఫోటోలతో ఉపయోగం ఉండదు, కానీ టార్గెట్ ఎలా ఉంటుందో అసలుకే తెలీకపోవటం కన్నా ఇది మెరుగని ఏజెన్సీ వాదన.

ఫోటోని పక్కకి నెట్టేసి, తక్కిన సందేశాలని జాగ్రత్తగా విన్నాను. ఏదో రామదండు అట. కన్నుకి కన్ను, పన్నుకి పన్ను సిద్ధాంతంతో కొత్తగా పుట్టుకొచ్చిన మతోన్మాద మూక! మక్కా మసీదులో పేలుళ్ల పథకం. ముహూర్తం రేపే. దాని సూత్రధారుల పని మిగిలిన ఏజెంట్స్ చూసుకుంటారు. ప్రధాన పాత్రధారి పని మాత్రం నేను పట్టాలి. అందుకు అనువైన స్థలం కూడా సూచించబడింది. ‌ఆ ప్రాంతం నాకు చిరపరిచితమైనదే. అయినా కూడా ఓ సారి ఫోన్‌లో ఆ ప్రాంతానికి సంబంధించిన తాజా మాప్ తెరిచి పరిశీలించాను. నేను చివరిసారిగా అటువైపు వెళ్లి చాన్నాళ్లయింది. ఈ మధ్యకాలంలో అక్కడ ఏమేం మార్పులొచ్చాయో తెలుసుకోవటం అత్యావశ్యకం.

 

మాప్ పని పూర్తయ్యాక మళ్లీ కళ్లు మూసుకుని మిగిలిన వివరాలు విన్నాను. ఆఖర్లో వినపడింది వాడి పేరు.

చిరంజీవి.

 

* * * * * * * *

అరగంటగా అక్కడ కాపుకాస్తున్నాను. తమ అమానుష పథకాన్ని అమలుచేసే క్రమంలో- అర్ధరాత్రి దాటాక చిరంజీవి నగరంలో అడుగుపెడతాడని, ఇదే దారిగుండా తన షెల్టర్‌కి వెళతాడని ఏజెన్సీ పంపిన సందేశం. కచ్చితంగా ఏ వేళకొస్తాడో తెలీదు. ఎంతసేపు నిరీక్షించాలో?

అది నగరానికి దూరంగా విసిరేసినట్లున్న పారిశ్రామికవాడ. పగలు హడావిడిగా ఉండే ఆ ప్రాంతం అర్ధరాత్రయ్యేసరికి నిర్మానుష్యంగా మారిపోతుంది. అక్కడక్కడా భవనాలు. వాటి మధ్యగా ఓ డొంకదారి. దాని పక్కనున్న తుప్పలూ పొదలే తప్ప చెట్లూ చేమలూ పెద్దగా లేవు. కొన్ని భవనాల్లో విద్యుద్దీపాలు వెలుగుతున్నాయి. నేనున్న ప్రాంతం మాత్రం చీకట్లో మునిగుంది – మతం చీకటి కమ్మేసిన మనుషుల్ని గుర్తుచేస్తూ.

ఏదో ద్విచక్ర వాహనం ఇటుగా వస్తోంది. డుగుడుగు శబ్దం. ఎన్‌ఫీల్డ్. దాని మీద ఒక్కడే ఉన్నాడు. చిరంజీవి?

డొంకదారి పక్కనున్న పొదల వెనక నక్కి కూర్చుని స్కానింగ్ మొదలు పెట్టాను. ఊఁహు. చిరంజీవి కాదు. శృంగారతార సినిమా సెకండ్ షోకెళ్లి వస్తున్న రసిక ప్రేక్షకుడు. వాడి ఆలోచనలు అమానుషంగా లేవు. అసహ్యంగా ఉన్నాయి. వాటితో ఎవరికీ ప్రమాదం లేదు. ఉంటేగింటే వాడికే. అది కూడా, వాడి బుర్రలో ప్రస్తుతం ఏముందో చదవగలిగే శక్తి వాడి పెళ్లానికుంటేనే.

 

నన్నెప్పుడూ ఓ సందేహం తొలిచేది. ఈ శక్తి నాకొక్కడికే ఉందా, లేక నా వంటివాళ్లు ఇంకా ఉన్నారా?ఉంటే, వాళ్ల మనసులతో సంభాషించటం సాధ్యమవుతుందా? ఆ ప్రశ్న నన్ను ఎన్నో రోజులు వెంటాడింది. చివరికో రోజు సమాధానం దొరికింది. దానికి నెలముందో దారుణం జరిగింది.

ఆ రోజు – అన్నిరోజుల్లాగే నగరమంతటా – నాన్నలు ఆఫీసులకెళ్లారు. అమ్మలు షాపింగ్‌కెళ్లారు. ‌భార్యాభర్తలు సినిమాలకెళ్లారు. పిల్లలు ప్లేగ్రౌండ్స్‌కెళ్లారు. ప్రేమికులు పార్కులకెళ్లారు.

వాళ్లలో చాలామంది తిరిగి ఇంటికి రాలేదు.

అమ్మ కూడా.

 

ఆ సాయంత్రం ఆమె మందులకోసం మెడికల్ షాపుకెళ్లింది, నాకు కుదరకపోవటంతో.

దారిలోనే నకుల్ చాట్ హౌస్. దాన్ని దాటుతూ ఉండగా ఆమె పక్కనే మొదటి బాంబు పేలింది. ఆ తర్వాత పది నిమిషాల వ్యవధిలో నగరంలో వరుసగా మరిన్ని పేలుళ్లు. వందల్లో మృతులు.

ఏం పాపం చేశారు వాళ్లు? లోపాలపుట్టలే కావచ్చు. కానీ మనుషులు వాళ్లు. నాలాంటి మనుషులు. బతకటం వాళ్ల హక్కు. దాన్ని లాక్కునేవాళ్లు మనుషులు కారు. నరరూప రాక్షసులు. నరికేయాలి వాళ్లని.

ఆవేదనలోంచి ఆవేశం. అందులోంచి ఆలోచన. నా శక్తితో ఏదన్నా చెయ్యలేనా? ఇలాంటివి జరగకుండా ఆపలేనా? బహుశా, నేనిలా ఉండటానికో కారణముందేమో. అది, ఇదేనేమో!

ఆ రాత్రి పిచ్చివాడిలా నగరమంతా తిరిగాను. బాంబు పేలిన ప్రతిచోటికీ వెళ్లాను. అన్ని చోట్లా రాక్షస గీతాలాపన. ఏదో చెయ్యాలి. ఈ ఘోరం మళ్లీ జరక్కుండా నా శక్తిని అడ్డేయాలి. కానీ ఎలా?

సమాధానం నెల తర్వాత వెదుక్కుంటూ వచ్చింది – ఏజెన్సీ నుండి.

ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉండే టెలీపతిక్స్ సభ్యులుగా, ప్రభుత్వాల ప్రమేయం లేకుండా నడిచే అజ్ఞాత సంస్థ – ఏజెన్సీ. మైండ్ రీడింగ్ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాల ఆచూకీ పట్టేసి వాటిని నిరోధించటం దాని పని. చాలా రోజులుగా నా మనసుపై నిఘా ఉంచి, నా శక్తిని మంచికోసం వాడాలన్న తపన చూసి, తమలో ఒకరు కమ్మనే ఆహ్వానం పంపింది ఏజెన్సీ. అంగీకరించటానికి అరక్షణం కన్నా ఆలోచించలేదు.

 

ఆనందం.

నేను ఒంటరిని కాను. ఉత్పరివర్తనాన్నో, ప్రకృతి వైపరీత్యాన్నో కాను. నాలాంటి వారు మరిందరూ ఉన్నారన్న ఆనందం.

అది నాలుగు నిమిషాలే.

సభ్యత్వానికి సమ్మతం తెలిపిన వెంటనే ఏజెన్సీ నుండొచ్చిన రెండో సందేశం నన్ను కలవరపరచింది: “నీ భార్య మనసు చదువు”.

ఎందుకో అర్ధం కాలేదు. అన్యమనస్కంగా, అయిష్టంగా ఆ పని చేశాను.

 

దిగ్భ్రమ!

షాహిదాని వైట్ లిస్ట్ చేసి ఎంత తప్పు చేశానో వెంటనే అర్ధమయింది.

ఆలస్యం చెయ్యకుండా ఆ తప్పుకి పరిహారం చెల్లించాను.

నాటి నుండీ, ఎదురైన ప్రతి వ్యక్తి ఆలోచనలూ చదవసాగాను. ఉగ్రవాద కుట్రల్ని పసిగట్టటం, వాటిని ఏజెన్సీతో పంచుకోవటం, కుదిరితే కుట్రదారుల్ని మట్టుపెట్టటం – ఇదే నా పని. ఆ జాబితాలో ఇప్పటికే ఐదురుగున్నారు.

చిరంజీవి ఆరోవాడు.

వచ్చేది వాడేనా?

రోడ్డు మీద దూరంగా ఏదో ఆకారం, వేగంగా ఇటే నడిచొస్తూ.

పొదలమాటున సర్దుక్కూర్చుని స్కానింగ్ మొదలు పెట్టాను. పదే క్షణాల్లో తెలిసిపోయింది.

వాడే.

వాడి మనసులో – రేపు సాయంత్రం – మక్కా మసీదు – సూసైడ్ బాంబింగ్.

నేనుండగా ఆ పథకం అమలయ్యే ప్రసక్తే లేదు.

 

పొదల వెనక పొజిషన్ తీసుకుని సిద్ధంగా ఉన్నాను. వాడు నన్ను దాటి రెండడుగులు వెయ్యగానే వెనకనుండి లంఘించి మీదకి దూకాను. వాడు నేలమీద బోర్లాపడ్డాడు. ఊహించని దాడికి విస్తుపోతూ వెనక్కితిరిగాడు. అంత దగ్గరనుండి మసక వెలుగులోనూ వాడి ముఖం స్పష్టంగా కనబడింది. గెడ్డం పెంచి, మీసాలు తీసేసి, మహమ్మదీయుడిలా అగుపిస్తున్నాడు.

మసీదు ముంగిట ఎవరికీ అనుమానం రాకుండా బాగానే వేశావురా మారువేషం!

అంతలోనే వాడు నోరు తెరిచాడు. అయోమయం నటిస్తూ అడిగాడు. “కోన్ హే తూ? ఏం కావాలి?”.

హైదరబాదీ యాస కూడా బాగానే పలికిస్తున్నావురా. కానీ నన్ను ఏమార్చలేవు.

“నీ ప్రాణం,” అంటూ ఒకచేత్తో వాడిని నేలకేసి తొక్కిపడుతూ రెండో చేత్తో ఆయుధం బయటకి లాగాను. వాడి కళ్లలో అయోమయం స్థానంలో భయం చోటుచేసుకుంది. కీచుగొంతుతో అరుస్తూ నన్ను నెట్టేయబోయాడు. కానీ నా బలం ముందు వాడి శక్తి చాల్లేదు.

“దొరికిపోయావు చిరంజీవీ. నీ పథకం పారదిక,” అంటూ ఆయుధం పైకెత్తాను.

“యే చిరంజీవీ కోన్? నేను రియాజ్ అహ్మద్. ఛోడ్ దే ముజే,” అని దీనంగా చూశాడు గింజుకుంటూ. ఒక్క క్షణం ఆగిపోయి వాడి మనసులోకి చూశాను.

“నా అబద్ధం నమ్మాడో లేదో. ఇప్పుడేమన్నా తేడావస్తే ప్లానంతా అప్‌సెట్ అవుద్ది,” అనుకుంటున్నాడు. ముఖంలో మాత్రం కొట్టొచ్చిన దైన్యం.

మృత్యుముఖంలోనూ ఏం నటిస్తున్నావురా! నీ ముందు ఐదుగురిదీ ఇదే తీరు.

షాహిదాతో సహా.

 

ఏడాది తర్వాత కూడా ఆమె మాటలు నా జ్ఞాపకాల్లో తాజాగానే ఉన్నాయి.

“పోయిన్నెల నకుల్ చాట్ పేలుడులో మీ అమ్మ పోవటమేంటి? ఆ కుట్రలో నా హస్తం ఉండటమేంటి? మన పెళ్లయ్యేనాటికే అత్తయ్య కదల్లేని స్థితిలో మంచాన పడుందని, అదే మంచంలో ఏడాది కిందట పోయిందని  … కైసే భూల్ గయే ఆప్? ఆమె పోయినప్పట్నించీ అదోలా ఉంటే దిగులు పెట్టుకున్నావేమోలే, మెల్లిగా నువ్వే బయట పడతావనుకుని సరిపెట్టుకున్నా. చూడబోతే నీకేదో పిచ్చెక్కినట్టుంది. ఏదేదో ఊహించేసుకుంటున్నావు. నేను జిహాదీనేంటి నాన్సెన్స్! ఐదేళ్లు కలిసి కాపురం చేసినదాన్ని …  మైగాడ్. ఆ కత్తెక్కడిది? ఏం చేస్తున్నావ్ … స్టాపిట్ … యా అల్లా… ”

 

అదే తన ఆఖరి సంభాషణ. మహానటి. చచ్చేముందూ నిజం ఒప్పుకు చావదే! పైగా నేను పిచ్చివాడినని నన్నే నమ్మించబోయింది.

ఈ ఉగ్రవాదులందరికీ ఇదో ఉమ్మడి రోగం. తమ పిచ్చి తామే ఎరగని ఉన్మాదం. బ్లడీ సైకోపాత్స్. వీళ్ల పిచ్చికి ఒకటే మందు.

ఎత్తి పట్టుకున్న కత్తి కసిగా కిందకి దిగింది. సూటిగా, లోతుగా చిరంజీవి గుండెలోకి.

 

వాడి కళ్లలో కొడిగడుతున్న వెలుగుని తృప్తిగా చూస్తూండగా ఎందుకో మేధావి మాటలు గుర్తొచ్చాయి.

“నువ్వేది నమ్మితే నీకదే నిజం”.

 

*

గమనిక: ఈ కథ ముగింపులోని అస్పష్టతపై వ్యాఖ్యలకి, విమర్శలకి ఆహ్వానం. అదే సమయంలో, ముగింపు బయట పెట్టేయకుండా సంయమనం వహించమని మనవి.

——–

 

అలా ఎలా వెళ్లిపోతావ్?

 

డా. నారాయణ గరిమెళ్ళ

~

 

అలా ఎలా వెళ్లిపోతావ్?

దూడనొదలిన ఆవు సంతలో అమ్ముడై పోయినట్టు

జంట బాసిన పావురం బోయకు ఆహారమైనట్టు

కుందేలునొదలిన నిండు చందమామ శాస్వతంగా మాయమైనట్టు

అలా ఎలా వెళ్ళి పోతావ్?

 

అనుభవాలన్నింటినీ జ్ఞాపకాలుగా మార్చి

నువ్వున్న ఫొటోలను వీడియోలనూ

నీ సమక్షానికి సాక్ష్యాలుగా మార్చి

కళ్ళల్లో దీపాలతో నీ రాకను తలపోసే భార్యను విడిచి

నీ మీదెక్కి ‘చల్ చల్ గుర్రం’ ఆటకు తెరతీసే

పసి పిల్లలను నడిమధ్యనొదిలి

అలా ఎలా వెళ్ళి పోతావ్?

 

ఒక్క సారైనా

మాతో కరకుగా మాట్లాడి ఉండాల్సింది కదరా?

ఆ కాఠిన్యాన్నే గుర్తు పెట్టుకుని

నిన్ను మరచిపోడానికి ప్రయతించే వాళ్లం.

 

హైదరాబాద్ వరకూ వచ్చి

నిన్ను కలవలేక పోవడం నా తప్పే

చిన్న శిక్ష వేసి క్షమిస్తావనుకుంటే

క్షమించకుండా తిరిగి ఇంతలా శిక్షిస్తావా?

 

అమ్మా అన్నలు అక్కలు అందరూ

నీ భార్యా బిడ్డల తోడుగా

గుండెలవిసేలా  సామూహిక శోకగీతమాలపిస్తున్నాం

ఒక్కసారి రాలేవా!

 

పెద్దలందరినీ వదలి చిన్న వాళ్ళు అలా పోకూడదురా

నిన్ను కళ్ళల్లో పెట్టుకున్న వాళ్లం

ఎలా చెరిపేయగలం?

నిన్ను చూసుకోవడానికి

అందరం సిద్ధంగా ఉన్నాం

ఒక్కసారి రారా..ప్లీజ్

 

రేడియో లో ఇళయరాజా పాటలొస్తున్నాయి

మునిగి తేలడానికి నువ్వు లేవురా

జువ్వలు ఎగరేసుకున్న హాస్యాల గురించీ

నెమరేసుకోడానికీ నవ్వుకోడానికీ నువ్వు లేవురా

వాదాలకు ప్రతివాదాల సరిజోడు  లేక

అంశాలన్నీ ఏకపక్షమైపోతున్నాయి.

 

క్యారంస్ బోర్డ్ ని ఏకబిగిన

క్లియర్ చెయ్యడానికి ఎవరూ లేక

ఆటంతా చిన్నబోయింది

 

సగం షో అయినా పూర్తికాలేదు

ఇంటర్వెల్ కావడానికి సైతం

ఇంకా పదేళ్ళు బాకీ ఉన్నాయి కదరా

అంత తొందర పడిపోయావేమిరా!

 

దశాబ్దాలుగా నీ చెప్పు చేతల్లో వున్న బైకే కదా!

ఎలా నిన్ను పడేసి నీ మీద పడి పోయింది?

నిత్యం నీకు కరతలామలకమైన రోడ్డు మీద

అర్ధాంతరంగా అలా ఎలా పొట్టన పెట్టుకుంది?

 

అందరినీ వదిలేసి ఎలా వెళ్ళి పోతావ్?

ఇల్లు వదిలి పెట్టి వెళ్లిపోయినంత సులభమా

లోకాన్ని వదిలిపోవడం

 

ప్రతి ఒక్కరినీ త్రాసులలో తూచి తప్ప

బతకలేని మనుషుల మధ్య

సాటి మనిషులని ఎర(లు) గా భావించే వారి మధ్య

జుట్టూ జుట్టూ ముడేసి వినోదించే తగాదా గాళ్ళ మధ్య

నిలువెత్తు మానవతా సాక్ష్యంగా

మిగిలున్నావని నిను చూపేందుకైనా

నువ్వుండాలి కదా?

 

గాద్గదికమౌతున్న

గొంతు మూసేందుకు

చెబితే తప్ప వీడ్కోలు

తీసుకోనని మాట ఇచ్చేందుకు

రావాలిరా రవీ.

 

(అకాలముగా ప్రమాదములో మృతి చెందిన నా కజిన్ సోదరుడు ‘ఆకెళ్ళ రవికుమార్’ కి, కన్నీటి తో, ప్రేమతో…)

 

 

నాక్కాస్త సమయం పడుతుంది!

 

 

-రేఖా జ్యోతి 

~

నువ్వొచ్చిన వసంతంలో నుంచి
నువ్వు లేని గ్రీష్మంలోకి  జారిపోవడానికి, నాక్కాస్త సమయం పడుతుంది !

నా కుడి భుజం మీద ఇంకా నీ తల ఆన్చినట్టే ఉంది
మెత్తని మల్లెలు ఒత్తు పెట్టుకొని నా మెడ ఒంపులో ఒత్తిగిలినట్టే ఉంది..
ఏమని కదలను ..?

ఈ కాస్త ఇప్పుడు లేదనుకోవడానికి ..
నాక్కాస్త సమయం పడుతుంది !

ఈ సెలయేటి ఒడ్డున నీతో ఆడి ఆడి…
నీ మువ్వల సంగీతానికి అలవాటుపడి
ఇప్పుడిక బోసిపోయిన ఈ ఇసుక తిన్నెల నిశ్శబ్దంలోకి ఒదిగిపోవడానికైనా సరే,
నాక్కాస్త సమయం పడుతుంది,

లోకాన్ని పోనీ ముందుకు
నా కాలాన్ని పోనీ వెనకకు … నీవున్న కాలానికే !

బహుశా నాలాగే , నీకూ తెలీదేమో కదా
వెచ్చని అరచేతులతో వీడ్కోలు తీసుకొనేటప్పుడు
ఈ  ఆర్ద్ర  క్షణమొకటి మళ్ళీ రాదని,

‘ఎలా వదిలేసుకున్నాను అలా ..!’ అని

దీర్ఘంగా పశ్చాత్తాప పడడానికైనా సరే ,
నాక్కాస్త సమయం పడుతుంది

తిరిగి తిరిగి చూస్తూ బేలకళ్ళతో  నువ్వెళ్ళిన
ఆ దారిలో నుంచి, నన్ను నేను వెనక్కి తెచ్చుకోవడానికి,

కనీసం ఈ స్తబ్ధత నుంచి
ఓ దిగులులో మునిగిపోవడానికైనా సరే .. !

వెలుతురునీ, వెన్నెలనీ నువ్వు నీతో  తీసుకెళ్ళినపుడు
ఈ చీకటిని కాస్త ఓపికగా వెలిగించుకోవడానికైనా సరే ,
నాక్కాస్త సమయం పడుతుంది .. !

కాచుకొని కాచుకొని
మళ్ళీ నువ్వొస్తావన్న ఒక్క ఊహ చేయడానికైనా సరే

అలసిపోయి ఒక కన్నీటి చుక్కగా ఇక్కడ కురిసిపోవడానికైనా సరే ..

నాక్కాస్త సమయం పడుతుందేమో
ఏమో, మరో జీవితకాలం పడుతుందేమోరా … !!

peepal-leaves-2013

మిత్రస్పర్శ

 

 

తేలిక కాదు –  ఎద లోపలి ఎదను స్పృశించటం … ఆ సుకుమారమైన చోట్లను ఈ కథ తాకటమే కాదు , నెమ్మదినీ ఇస్తుంది.  బహుశా అందుకనే – ఫ్రెంచ్ లో తీసిన Intouchables సినిమా , సబ్ టైటిల్స్ తో 32 దేశాలలో విజయవంతమైంది.

‘ ఇచ్చుట లో ఉన్న హాయి ‘ ని పల్లకీ ఎక్కించినందువలన. మొట్టమొదట కొడవటిగంటి (కొ.కు.) చెబితే తెలిసొచ్చింది – ఇంకొకరికి సహాయం చేయాలనిపించటమూ ఒక instinct వంటిదేనని. అడ్డం పడకండి-  మన కడుపు ఎంతోకొంత  నిండాకనే, పోనీ.

ఏముంది ఇందులో ? చాలా  predictable కథ. చాలా సంపన్నుడైన పరాధీనుడు ఒకరు, తన పైన తనకు అదుపు లేని బీద మనిషి ఒకరు.   ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆప్తులవుతారు.

అవునవును, స్నేహం సమానుల మధ్యనే ఉంటుందని అంటారు నిజమే , కాని అవసరార్థం మొదలైన సంబంధాలు కూడా ఎత్తుకి ఎదగటమూ జరుగుతుంటుంది. చమత్కారం ఇది – ఈ కథ ఇంచుమించుగా ఇలాగే నిజంగా జరిగింది.

వాస్తవాధీనమైనంత మాత్రాన ఒక కళారూపానికి విలువ హెచ్చదని నా నమ్మకం – అలా చూస్తే ఇది యాదృచ్ఛికమంతే.   మంచం లో పడిఉండి, నిరంతరమూ సేవలు చేసేవారిని చీదరించుకోగలవారు లేరా ? ఉన్నారు, నా కళ్ళతో చూసి ఉన్నాను.  ఇక్కడొస్తుంది – వ్యక్తిగతమైన ఔన్నత్యాల ప్రాముఖ్యం

జాలి పడే సేవకుడు నాకు వొద్దని డబ్బుగలాయన Philippe కి పంతం. బీదవాడు Driss కి జాలీ గీలీ ఏం ఉండవు –  నీ కాళ్ళూ చేతులూ పనిచెయ్యవు గదూ  అని చిన్న పిల్లాడిలాగా వేళాకోళం చేస్తాడు, వేడి వేడి నీళ్ళు పోస్తే నీకు కాలదు గదా అని ఆడుకుంటుంటాడు. అదొక అపచారం అనిపించదు, మనకీ నవ్వొచ్చేస్తుంది.

Ludovico Einaudi సంగీతం – ఊరట, విడుదల. ఒక్కడే సింగపూర్ నాన్ యాంగ్ లో చదువుకుంటూ మా అబ్బాయి ఈ సినిమా చూసి ఆ దివ్య ధ్వనులలో  తల్లకిందులుగా మునిగిపోయాడు. ఒక సినిమా నేపథ్యసంగీతం లోంచి ఆ విద్వాంసుడిని కనుగొనటం దృశ్య మాధ్యమానికి గొప్ప గౌరవం. Ludovico పద్ధతిని alternate classical  లేదా classical crossover అని అంటుంటారు.  కదా, శాస్త్రీయమైనదాన్ని కాస్త అటూ ఇటూ మార్చుకుంటే జీవనం లో అన్నన్ని సందర్భాలకూ పాడుకోగల వీలు. అలా అని , తక్షణ ఉత్సాహాన్ని తెచ్చి పెట్టగల సంగీతాన్ని ఇందులో మెచ్చుకోకపోయింది లేదు. ఒకానొక ఉత్సవం లో Driss  అందరినీ ఆ లయకి నాట్యం చేయించేస్తాడు.

intouchables

Break the rules, Out of box thinking  అని రెండు స్థాయిల అరాచకపు ధోరణులున్నాయి. ప్రాణాంతకమైన వ్యాధులకి గరళం వాడేవారు గుర్తుందా – అలాగ, అంతకన్న చెడేదేమీ లేనప్పుడు -ఏం చేస్తేనేం ? ఆ సమర్థనే తోచకపోతే ఆ మితిమీరిన వాహనవేగాన్ని చూసి ఊరుకోబుద్ధి అవునా ! అయితే – కేవలమొక ఉద్వేగపు చెల్లింపు కోసం తలపెట్టుకునే paragliding, car racing లాంటి ప్రాణాంతక క్రీడ లని  మాత్రం నేను శాపనార్థాలు పెట్టుకుంటాను.

ధనికుడు తెల్లవాడూ సేవకుడు నల్లవాడూ అయారని అమెరికా లో దీనికి రేసిస్ట్ ముద్ర వేసి కొందరు అభిశంసించారు. ఏదీ కాని మనలాంటి వారికి వాళ్ళు ఇదీ అదీ వీళ్ళు అదీ  అయినా పట్టింపు ఉండదు- న్యాయంగా హక్కులు కొని తెలుగు లో తీసిన ‘ ఊపిరి ‘ కి ఆ దోషం పట్టనూ లేదు.

పునర్నిర్మాణం లో – రెండు యుగళ గీతాల జోడింపు తప్పించి రసాభాస ఏమీ జరగలేదు . చాలా సంతోషం.

” ఆ తిండి తినీ తినీ నోరు చవి చచ్చిపోయింది. కొంచెం చారు చేసి పెడతావా ” అని  తెలుగు రుచిని  తెచ్చి నింపారు.

నిజం చెప్పాలంటే , తెలుగు [ తమిళం లో కూడా ఒకేసారి తీశారు ] లో కొన్ని సంఘటన లు ఇంకా ఎక్కువ నిండుగా ఉన్నాయి – చెల్లి పెళ్ళి, తమ్ముడి రక్షణా లాంటివి , మనకి అలాగే well rounded గా  నచ్చుతాయి- తప్పేమిటట ?  డబ్బూ పరపతీ ఉన్నాయి – మనసు పుట్టి,  ఉపయోగించి  ఆదుకున్నాడు – లేకపోతే ఏమయిఉండేదీ అనటం లో ఏమీ అర్థం ఉండదు.

కార్తి ఇంత బాగా చేస్తాడని నాకు తెలీనే తెలీదు , ఊపిరి అతను నిజంగా. నాగార్జున చక్కగా తూగాడు [ ఈయన గురించి ఈ మాట అనుకోగలనని ‘ మనం ‘ చూసేదాకా ఊహించాను కాను ]

voppiri

కార్తి తమ్ముడి వేషం వేసిన అబ్బాయి ఫ్రెంచ్ సినిమా లో మెత్తగా గొప్పగా కనిపించిన పక్క ఎక్కి తొక్కుతుంటాడు , ఒక పక్కన హత్యా నేరం మీద పడి ఉండి. తెలుగు లో అది తీసేశారు. లాలాజలం తుడవటమూ  మరింకొన్ని శరీరధర్మాల ప్రసక్తీ కూడా పరిహరించబడింది తెలుగులో – మన sensibilities వేరు. కార్తి పెయింటింగ్ ని ప్రకాష్ రాజ్ చేత కొనిపించటం, దాన్ని ప్రకాష్ రాజ్ వైన వైనాలుగా కార్తి కే వివరించటం- తట్టుకోలేక ఇతను ఉన్నమాట చెప్పేయటం – తెలుగు లో ఎక్కువ ఆహ్లాదకరం గా ఉంది.

ఫ్రెంచ్ లో తమన్నా పాత్ర lesbian  . తెలుగు లో-  మరొక సందర్భం లోgay  విషయాల్లోంచి హాస్యాన్ని ఉద్దేశించారు. మా అమ్మాయి అంది – 90 ల వరకూ అక్కడా దాన్ని కామెడీ చేసేవారని. No comments.

శ్రీ శ్రీ 1960 ల్లో ‘ వెలుగునీడలు ‘ లో ఒక పాట రాసి తర్వాత నాలుక కరుచుకున్నారు . ” ఉన్నవారు లేని వారి కష్టాలను తీర్చు దారి కనిపెట్టి మేలు చేయగలిగినప్పుడే ” అని.

ఆ అక్కరే లేని రోజులు వస్తే ఎంతో ఆనందం – ఇప్పటికింతే, తప్పులు వెతకొద్దు. ఇదంతా fantasy  అంటారా , మీ ఇష్టం!

*

బిస్కెట్

 

 

Padmaja-నాగ పద్మజ

~

(ఇది నాగపద్మజ తొలి కథ. ఆమె   గుంటూరు లో ఒక ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపాల్ గా చేస్తున్నారు. )

*

“నేను కొత్త కొత్త మెథొడ్స్ నేర్చుకుని పిల్లలకు ఇంకా బాగా చెప్పాలి అని ఈ కోర్స్ లో చేరాను ” చెప్పి తన సీట్ లో కూర్చుంది మాధవి.

“నాది గవర్నమెంట్ జాబ్ , బి ఎడ్ కంప్లీట్ అయితే ఎస్ జీ టీ గా ప్రొమోషన్ వస్తుంది హై స్కూల్ కి టీచ్ చెయ్యచ్చు.. అందుకే జాయిన్ అయ్యాను “, అన్నది స్వాతి

” నేను ఇదివరకు జర్నలిస్ట్ ని, డిల్లీ లో ఉరుకుల పరుగుల జీవితం తో అలిసిపోయి, పిల్లలతో అసోసియేట్ అవుదామని రెండేళ్ళ క్రితం ఈ జనారణ్యానికి దూరంగా వున్న ఒక బోర్డింగ్ స్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ గా చేరాను.   జర్నలిజం  స్కిల్స్  తో  మాత్రమే అయితే క్లాసు రూమ్ లో పిల్లలకు న్యాయం చెయ్యలేనేమో అనిపించింది. అందుకే ఈ ఫార్మల్ ట్రైనింగ్ ఆప్ట్ చేశాను ” ఇంగ్లిష్ లో చెప్పింది దేవిక నాయర్.

” మాది మిషనరీ స్కూల్, బి ఎడ్ చేస్తే ప్రాస్పెక్ట్స్  బాగుంటాయని సిస్టర్ సలహా ఇచ్చారు.. అందుకని ..” సిన్సియర్గా చెప్పింది సూసన్.

” నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం, ఇలాంటి ఒక మంచి ప్రొఫెషనల్ ట్రైనింగ్ వల్ల నా స్టూడెంట్స్ కి ఎంతో లాభం ఉంటుందని అనిపించింది, నేను కూడా ఇంకా స్మార్ట్ గా పని చేయగలుగుతాను..” లోకల్ స్కూల్ లో సైన్సు చెప్పే నందన.

…..

వివిధ జిల్లాల నించి డిస్టెన్స్ కోర్స్ క్లాసెస్ కోసం అక్కడ జమయిన ముప్పై మంది ఇన్-సర్వీస్ టీచర్ లు తమని తాము పరిచయం చేసుకున్నారు.

” వెరీ గుడ్, మీ అందరి ఆశయాలు వింటుంటే నాకు గర్వంగా వుంది…  ముప్పై వేలు పడేస్తే డిగ్రీ చేతికోచ్చే ఈ కాలం లో మీరంతా ఇంత కఠినమయిన ఎంట్రన్స్ పరీక్ష నెగ్గి ఎంతెంతో దూరాల నించి వచ్చి మా డిస్టెన్స్ కోర్స్ లో జాయిన్ అవడం చిన్న విషయంగా నేను అనుకోవడం లేదు …  ఇక మనం కోర్స్ గురించీ, వచ్చే రెండు వారాల వర్క్ షాప్ గురించీ వివరంగా తెలుసుకుందాం ..” ఫాకల్టీ చెప్పుకుపోయింది.

*   *   *

లంచ్ టైం. అందరూ కబుర్లూ కూరలూ పంచుకుంటూ భోజనం చేస్తున్నారు. మాధవి ఫోన్ రింగయింది.

” చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే .. నేను అప్పుడే చెప్పాను ..టార్గెట్స్ ఫినిష్ చేసుకుని వెకేషన్ కి వెళ్ళమని… ” ఫోన్ లో సరాసరి విజయవాడకే వినపెడేటట్టుగా అరుస్తోంది మాధవి.

“.. సర్లే చూస్తాలే” ఫోన్ పెట్టేసి తలెత్తే సరికి అంతా తననే చూస్తున్నారు .

“ఎనీ థింగ్ సీరియస్?” దేవిక అడిగింది.

“ఏం లేదు. నా ఫ్రెండ్, నాతో పాటే పని చేస్తుంది హిందీ చెప్తుంది ప్రైమరీ పిల్లలకు. టార్గెట్స్ మీట్ అవలేదట .. నా దగ్గరేమయినా కాంటాక్ట్స్ వుంటే చెప్పమంటోoది.  అది కాదు నా బాధ … కావలిస్తే డబ్బులిస్తానంటోంది” ఆవేశంగా వివరించింది మాధవి.

“టార్గెట్సా? ఏం టార్గెట్స్??”

“అదేనండి, ఈ ఇయర్ మాకు పది అడ్మిషన్స్ టార్గెట్ పెట్టారు, ఇలాంటి సమస్య వస్తుందనే నేను మార్చ్ నుంచే ఒక్క నిముషం కూడా వేస్ట్ చెయ్యకుండా ఎక్కే గడపా దిగే గడపా అని చూడకుండా కష్టపడ్డాను. సరిగ్గా నిన్నటితో నా పది అడ్మిషన్స్ పూర్తి చూసుకుని ఇవ్వాళ ఇలా  రాగలిగాను. కష్టపడకుండానే అన్నీ కావాలంటారు”

“మీరు దేని గురించి మాట్లాడుతున్నారో కొంచం చెప్తారా?” అసహనంగా అడిగింది దేవికా నాయర్.

అంతా అనుమానంగా దేవిక వైపు చూసారు. ఈవిడ నటిస్తోందా లేక నిజంగానే అర్ధం కాలేదా?

“ప్రతి టీచర్ కి కొన్ని అడ్మిషన్స్ తీసుకురావాలి అన్న ఒక టార్గెట్ వుంటుంది ఇక్కడ… ” సుసాన్ వివరించబోయింది

“తీసుకురాలేకపోతే .. ”  గాభరాగా అడ్డుపడింది దేవిక.

” ఉద్యోగం ఊష్టింగే ” కక్షగా అంది మాధవి.

“కొన్ని స్కూళ్ళలో మూడు నెలలు జీతం ఇవ్వరు… పొమ్మనక పొగ పెట్టడం అన్నమాట” నందన పూరించింది.

“ఆc .. టీచర్లా సేల్స్ గరల్సా !!”

“ఈ రెండు నెలలు మాకు  తప్పదు”

“మీ స్కూల్ లో పిల్లలెంత మంది ?” దేవికకి ఇంకా మింగుడు పడలేదు

“ఒక పదహైదు వందల మంది వుంటారు”

“మై గుడ్నెస్! అంత మంది వుంటే మరి మీకీ తిప్పలెందుకు?”

“వెళ్ళే వాళ్ళు కూడా వుంటారు కదా దేవికా!”

“ఎందుకుంటారు ?”

“అవతల వేరే స్కూళ్ళు కూడా ఇలాగే కాంపైన్ చేస్తుంటారు కదా మేడం, వాళ్ళూ ఎదో బిస్కెట్ వేస్తారు కదా”

“మీరిక్కడ పది మందితో మాట్లాడుతుంటే అక్కడ మీ పది మందిని వేరే వాళ్ళు బుట్టలో వేస్తుంటారన్న మాట ..  ”

“అంతే కదా..”

“ఈ మాత్రం దానికి ఇటు మీరు అటు వాళ్ళూ రోడ్ల మీద పడటం దేనికి” దేవిక కన్విన్స్ కాలేదు

“మీరు చెప్పేది మరీ బాగుంది.. అట్లా వదిలేస్తే స్కూల్ ఖాళీ అవుతుంది కొన్నాళ్ళకి. ”

“ఎందుకవుతుంది .. ఇదే యత్నం  చదువు చెప్పడం లో పెడితే వాళ్ళే వుంటారు. అసలు మీరీ గొడవ లో పడి పిల్లల చదువు మీద ఎంత మాత్రం దృష్టి పెట్టగలుగుతారు .. ఈ రకంగా మీకు టీచింగ్ స్కిల్స్ కంటే మార్కెటింగ్ స్కిల్సే ఎక్కువ అవసరంలా కనిపిస్తోంది”

“మేమేదో ఇదంతా ఇష్ట పడి చేస్తున్నట్టు మీరనుకుంటున్నట్లుందే.. మేనేజ్ మెంట్ చెప్పినట్లు చెయ్యడమే మా పని” మాధవి నిష్టూరపడింది.

“కాంటీన్ లో కాఫీ దొరుకుతుందేమో చూద్దాం వస్తారా”, చర్చ వేడెక్కుతుండంతో నందన దేవికని మరల్చింది.

*  * *

ఇద్దరూ లంచ్ బాగ్స్ కట్టిపెట్టి కాంటీన్ కి బయలుదేరారు. సంభాషణ ఇంగ్లిష్ లో సాగింది.

దేవిక తన అనుమానం బయట పెట్టింది. “మాధవి చెప్పేది నిజమే నంటారా ?”

“మాధవి చెప్పింది కేవలం సముద్రం లో నీటి బొట్టంతే, ఇంకా చాలా వుంది. మీకు మా రాష్ట్రం సంగతీ ఈ జిల్లాల సంగతీ బొత్తిగా తెలియక ఆశ్చర్య పోతున్నారు కాని ఈ విషయం ఇక్కడ చిన్న పిల్లాడినడిగినా చెప్తాడు. అందునా ఇవి పేరు మోసిన చదువుల నిలయాలు. మార్కెటింగ్ ఎబిలిటీ వున్న వాళ్ళనే టీచర్స్ గా తీసుకుంటారు ఇక్కడ స్కూల్స్ లో. దాని వల్ల  పిల్లల చదువు దెబ్బతిన్నా పెద్దగా పట్టిచ్చుకోరు, ఎందుకంటే పిల్లల రిపోర్ట్ కార్డ్స్ మీద అందంగా మార్కులూ గ్రేడ్లూ చూపించడం చేతిలో పని. పేరెంట్స్ నించి సమస్య రాకుండా అట్నించి కమ్ముకొస్తారన్న మాట. పైగా సిలబస్ అంతా అయినట్లు చూపడం కోసం పిల్లలతో పుంఖాను పుంఖాలుగా నోట్సులు రాయిస్తారు.”

” నాకంతా అయోమయంగా వుంది, ఇలాంటి మోసాన్ని తల్లిదండ్రులు ఎలా సహిస్తున్నారు?”

*   *    *

” మీకీ టార్గెట్ల బాధలుండవు కదా” దేవిక స్వాతి తో అంది టీ బ్రేక్లో .

“మా బాధలు వేరు. మిడ్-డే మీల్ తో సహా నాదే బాధ్యత. మా హెడ్ మాస్టర్ స్కూల్ కి వచ్చేదే తక్కువ.  వచ్చినా ఫుల్ లోడ్ లో వస్తాడు.”

“ఊర్లో ఎవరూ కంప్లెయిన్ చెయ్యరా ?”

” వార్నింగ్ లు ఇచ్చారు, కాకపోతే రిటన్  కంప్లయంట్ ఇచ్చి వాడి “పొట్ట కొట్టటం” ఎందుకులే అని ఊరుకున్నారు”

“ఎంత మంది మీ బడిలో ?”

“ఇరవయ్ ఆరు మంది, అయిదో తరగతి వరకే” చెప్పింది స్వాతి.

“పిల్లలు తక్కువే, అయినా వేరు వేరు క్లాసుల్లో వుంటారు కదా, సిలబస్ ఎట్లా పూర్తి చేస్తారు?” జర్నలిస్ట్ బుద్ధి పోనిచ్చుకోలేదు దేవిక.

“సిలబసా పత్తికట్టా, 3R’s నేర్పిస్తాం, రీడింగ్ రైటింగ్ ఇంకా అరిత్మెటిక్. అన్ని ప్రశ్నలు మీరే అడుగుతున్నారు. మీ బోర్డింగ్ స్కూల్ సంగతేంటి.”

” హ హ.. ప్రశ్నించడం అలవాటయి పోయింది. ప్రొఫెషనల్ హజార్డ్. ”

*  *  *

నందన ఇంటికి వెళ్తూ ఆలోచిస్తోంది, స్వాతీ దేవిక ల సంభాషణ గురించి. అప్పుడప్పుడు తన బడికి వచ్చే జోనాథన్ సర్ గుర్తుకు వచ్చాడు. ఆయన పల్లెటూరిలో గవర్నమెంట్ స్కూల్ లో టీచర్.  వాళ్ళ బడిలో పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించడానికి మా దగ్గర కొత్త పద్ధతులేమయినా వుంటాయేమో అని చర్చించడానికి వస్తుంటాడు. వచ్చినప్పుడు తను ట్రైనింగ్ వర్క్ షాప్ లో నేర్చుకున్న కొత్త విషయాలు కూడా మాతో పంచుకుని వెళ్తుంటాడు. తనని వాళ్ళ బడికి ఒకసారి రమ్మని ఆహ్వానించి వెళ్ళాడు కూడా, కుదరనే లేదు. వెళ్ళాలి, ఆ పిల్లలెలా వున్నారో చూసి రావాలి. ఏమో.. ఒక ఆలోచన కూడా వుంది.

తన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ లో చేరిపిస్తే ఎట్లా వుంటుంది. నిజంగా చిన్న పిల్లలకు కావాల్సినవి 3R’s..ఇంకా బోలెడు స్వేచ్ఛ. లైఫ్ స్కిల్స్ లైఫ్ నించి నేర్చుకోవాలి గాని తను పని చేసే బడిలో మాదిరిగా క్లాసు రూమ్ లో చెప్పగలమా? కానీ ఇక్కడ నా పిల్లలకు స్వాతి లాంటి, జోనాథన్ సర్ టీచర్ దొరకుతారా? ఒకవేళ దొరికినా ఈ కాంపిటీటివ్ ప్రపంచం లో నెగ్గడానికి ఆ చదువు సరిపోతుందా?

స్కూళ్ళ పరిస్థితి ఇలా వుంటే మరి నేటి చురుకయిన యవత అంతా ఎక్కడి నించి వస్తున్నట్టు? వీళ్ళు చదువుకుని పైకోస్తున్నవారా లేక ఈ చదువుల్ని తట్టుకుని, వ్యవస్థని జయించి నిలుస్తున్నవారా?  బిస్కెట్ కోసం పెరిగెత్తి పరమాన్నం కోల్పోతున్నదెవరు?

తల్లికడుపులోకి తోవ యివ్వండి!

 

 

-బమ్మిడి జగదీశ్వరరావు

~

 

ఓ నా నగర జీవులారా..!

మీరు మల మలా కాకుల్లా మాడిపోతున్నారు కదూ? పెనం మీద వేసిన నీటి బొట్టులా మీ వొంట్లోని ప్రతి నీటిబొట్టూ చెమటై ఆవిరై యింకిపోతోంది కదూ? గొంతు యెండిపోతోంది కదూ? నాలుక పిడచ కట్టుకు పోతోంది కదూ? దాహం.. దాహం.. అని అల్లల్లాడిపోతున్నారు కదూ? పిల్లలూ పెద్దలూ తేడా లేదు కదూ? వయసుకూ వల్లకాడుకూ సంబంధం లేదు కదూ? అమ్మ చేతి దెబ్బ తిననివారున్నారేమో గాని వడదెబ్బ తిననివారు లేరు కదూ?

ఎండ ఫెళ్ళున ‘పేల్చేస్తోంది’ అంటే.. అదేమన్నా తుపాకీనా- పేల్చేయడానికీ కాల్చేయడానికీ.. అని హాస్యానికి అన్నా.. అంతకన్నా యెక్కువేనని యిప్పుడిప్పుడే అర్థమవడం లేదూ? ఎండలకు కొండలు పగలడం అంటే.. అర్థమవడం లేదూ? రోహిణీ కార్తె యెండలంటే రోళ్ళు పగులుతాయి అంటే.. అర్థమవడం లేదూ? రథసప్తమి రోజున సూర్యుడు రథం మారింది మొదలు.. యెండలు మండిపోవడానికి అదే మొదలు అంటే.. అర్థం అవడం లేదూ?

ఎండాకాలం వచ్చిందంటే.. మామిడిపళ్ళూ మల్లె పూలూ వొస్తాయని మీలో యెదురు చూసిన సంబరం చచ్చిపోయిందని నాకు తెలుసు! మీరు చచ్చిన శవాలైపోయారనీ తెలుసు! పిల్లలు మునిపటిలా వేసవి సెలవులని సరదాగా గడపడమే మర్చిపోయారనీ తెలుసు! అమ్మమ్మా తాతయ్యల యిళ్ళకు వూర్లు పోవడమే మానుకున్నారనీ తెలుసు! ఇంట్లోంచి అడుగు తీసి బయట పెట్టలేని బందీలయిపోయారనీ తెలుసు! మీకు ఆకలి మందగించిందనీ తెలుసు! మీరు నిద్రకు దూరమయ్యారనీ తెలుసు!

అరే.. మెత్తని స్పర్శకీ మొత్తబుద్ది అవుతోందే..! మీ దాంపత్యానికి కూడా వేసవి సెలవులు యిచ్చేసినట్టున్నారే..! పిల్లల్నో పెళ్లాన్నో పట్టుకుంటే కాని నిద్రరాని మీకు.. పట్టుకుంటే చాలు నిద్ర వొదిలిపోతోందే..! చిన్న విషయాలకు కూడా చిరాకులూ పరాకులూ పెరుగుతున్నాయే..! అన్ని పనులూ వాయిదా పడుతున్నాయే! అయ్యో పని చెయ్యకుండానే అలసి సొలసిపోతున్నారే..! వేసవి కాలపు నాలుగు నెలల్ని చిన్న పిల్లల్లా కేలండర్లోనుంచి చింపేస్తున్నారే..!?

మా చిన్నప్పుడు శివరాత్రికి ‘శివ.. శివ’ అనుకోనేంత చలి వుండేదని అంటే.. మా చిన్నప్పుడు యెండలు వుండీవి కాని యిలాంటి యెండలు కావు బాబోయ్.. అని ఠారెత్తి పోతున్నారా? బీర్లతో కూల్ డ్రింకులతో వేసవిని చల్లార్చలేక పోతున్నారా? కరెంటుపొతే చాలు ప్రాణం పోతోందా? అప్పు చేసన్నా ఎయిర్ కండిషనరో.. కనీసం ఎయిర్ కూలరో కొనుక్కుంటున్నారా? కరెంటుబిల్లు బెంబేలు యెత్తిస్తోందా?

నీళ్ళు లేవు! నగరం నిప్పులగుండం! ఇల్లు అగ్నిగుండం! బతుకు మృత్యుగండం! అకాలమరణం కాదది హననం! పాప హరణం! వడగాల్పులు కావవి యముని పాశాలు! నరక ద్వారాలు!

నిప్పుల కొలిమిలా భగ భగల భుగ భుగల సూర్యుడు! భూతాపం! ప్రకృతి ప్రకోపం! తార్రోడ్డులు కావవి నిలిచి కాలుతున్న తాటాకు మంట! రాక్షసబొగ్గుతో రాజేసిన చితి! చితీ కాదిది.. చింతా కాదిది.. నిప్పుల పుంత!

గుక్కపెట్టి యేడుస్తున్న పిల్లల్ని చూసి.. దేవుడా తీసుకుపోరా తండ్రీ అన్న పెద్దల్ని చూసి.. బతుకు కాలి బొబ్బలెక్కిన మిమ్మల్ని చూసి.. గడ్డకట్టిన నేను కదిలి కరిగి నీరయ్యాను! తొలకరి చినుకయ్యాను! ఎండాకాలంలో వానయ్యాను! వడగాల్పుల మీద వడగళ్ళ వానయ్యాను! ఎండాకాలంలో వానలు.. వానాకాలంలో యెండలు.. కలికాలం అని వెక్కిరించినా.. కాలం తప్పినా.. కర్మం తప్పకూడదని కురిసాను! మురిసాను!

గాలితో గంతులేసాను! అది చూసి చెలిమి చేయ రమ్మని మెరుపు మేళమయ్యింది! ఉరుము తాళమయ్యింది! చెట్టూ చేమతో చెలిమి చేద్దామనుకున్నాను! కొమ్మ కొమ్మన చేరి ఆకు ఆకున జారి ఆడుదామనుకున్నాను! పిందెలతో పోటీపడి రెమ్మ రెమ్మనా ఆకు ఆకునా వేళ్ళాడదామనుకున్నాను!

నిజమే! కాంక్రీట్ జంగిల్! ఈ జంగిల్లో వొక్క చెట్టూ లేదు! పుట్టా లేదు! పిట్టాలేదు! అరుపూ లేదు! ఆనవాలూ లేదు! చిరునామా లేదు! మీ డ్రాయింగ్ రూముల్లో పచ్చని పెయింటింగ్ గా తప్ప, యే జాడా లేదు! లేదే లేదు.. లేనే లేదు!

మీరు నన్ను వెలేశారు! నేలలో యింక కుండా విడదీసారు! అసలు నేలేది? మట్టేది? మట్టి వాసనేది? తొలకరి పరిమళమేది? మట్టి పరిమళాల మధుర వాసనలు యేవి?

సిమెంట్.. సిమెంట్.. సిమెంట్.. వున్నదంతా సిమెంటే! పచ్చదనం లేని పేవ్ మెంటే! ఇళ్ళు కావివి యినుప గూళ్ళు! రాతి నగరం! రాగం లేని నగరం! అనురాగం లేని నగరం! ఆదరము లేని నగరం! శిలా నగరం! శ్మశాన నగరం! క్షుద్ర నగరం!

ఒరే.. నేను మీకోసమే వచ్చాన్రా.. నాకు తోవ యివ్వండ్రా.. దారివ్వండ్రా.. నన్ను పోనివ్వండ్రా.. నన్ను యిమ్మనివ్వండ్రా.. యింకనివ్వండ్రా.. నేల వొడిని చేరనివ్వండ్రా.. అమ్మనిరా.. చెమ్మనిరా..  నేను జలాన్నిరా.. జీవాన్నిరా.. మీ జీవాన్నిరా.. మీ జీవనాధారాన్నిరా.. యేదీ అమ్మ గర్భంలోకి నన్ను చేరనివ్వండ్రా.. చేరుకోనివ్వండ్రా.. చేదుకుందుర్రా.. దప్పికలు తీర్చుకుందుర్రా.. నాలుకలు తడుపుకుందుర్రా.. వొరే దెష్టల్లారా.. దరిద్రుల్లారా.. భ్రష్టుల్లారా.. ద్రష్టల్లారా.. నాకు దారి వొదలండ్రా.. వదలండి!

అరే.. యెదవల్లారా.. మొదవల్లారా.. పాలు కొనుక్కుంటారు సరే, నీళ్ళు కూడా యెన్నాళ్ళు కొనుక్కుంటారురా? లీటరు బాటిలు యిరవై.. యిరవై లీటర్ల నీళ్ళ కేను యాభై రూపాయలు.. వున్న ఖర్చులకు తోడు నెల నేలా నీళ్ళ ఖర్చు.. డబ్బుల్లేకపోతే మంచి నీళ్ళు కూడా తాగడానికి లేదన్నమాట..! గుక్కెడు నీళ్ళ కోసం రొండు వందలు కాదు.. రెండు వేలు.. రెండు వేల అడుగులు తవ్వుతున్నారే.. డ్రిల్లింగ్ మిషన్లు దించుతున్నారే.. తోడేస్తున్నారే.. అమ్మ దగ్గర పాలుంటే చిమ్ముతూ వుంటే తాగొచ్చు.. తాగే పెరగాలి! కానొరే.. స్తన్యంలో పాలు లేవని రావని నెత్తురు పీలిస్తే యెలారా..? రేపు మీ పిల్లలు యేమి తాగి బతుకుతార్రా..? బతికి చస్తార్రా..?!

నీళ్ళురా.. నీ ముంగిటకి వచ్చాయిరా..! తలుపు మూయకురా..! నేను తీర్థాన్ని రా..! దేవుడు పంపిన తీర్థాన్ని రా..! తీర్థ ప్రసాదాల్ని పారబోయకురా..! మూడొంతుల నీళ్ళు యీ భూమ్మీద వున్నట్టు.. మీ దేహంలో కూడా మూడొంతుల నీళ్ళు వుండాలిరా..!

నీరు పల్లమెరుగు.. పల్లానికిపోదామంటే దారీలేదు.. నిజం దేవుడెరుగు.. అడుగుదామంటే దేవుడి జాడా లేదు! మట్టి జాడా లేదు! నేలని యిలా సిమెంటు పోసి కప్పేస్తే.. తల్లికి వూపిరెలా ఆడుతుందిరా? తల్లి పేగు తెగాక మీకు వూపిరెలా ఆడుతుందిరా? సమాధులు కట్టినట్టు కట్టారు కదరా? బతికుండగానే కప్పెట్టారు కదరా? ఇంచీ వదలకుండా సిమెంటు తాపడం పెట్టారే..! యిళ్ళూ వాకిళ్ళూ సరే..! అరుగులూ మెరుగులేనా..? వీధులూ.. వాడలూ.. దారులూ.. రహదారులూ.. వాటి పక్క ఆ వార యీ వార .. దేన్నీ యెక్కడా వదలర్రా? మట్టి అంత అంటరానిది అయ్యిందా? మీరు వేసిన వేషాలు చాలవని యింకుడు గుంతల కంటి తుడుపుతో కవరు చేస్తున్నార్రా?

చిన్న చినుకుకే చిత్తడి అయ్యే మీ నగరం వొక నగరమా? జల జలమని జల్లు కురిస్తే జడిసిపోయే మీ నగరం వొక నగరమా? వానొస్తే రోడ్లమీద మీ బళ్ళూ మీరూ తేలుతారే.. పడవలేసుకు పరుగులు తీస్తారే.. గట్టిగా గంట వాన కురిస్తే మునిగిపోయి.. నీట్లో తేలే మీ నగరం వొక నగరమా? మురుగు కాల్వలు ముడ్డికింద దాచుకొని ముక్కు మూసుకు బతికేస్తారే నాకేమో కడిగి పారేయ్యాలని వుంటుంది.. కాని దెబ్బ యెప్పుడూ ముందు తగిలేది చిన్నవాళ్ళకే! నిజమే, వాన కూడా అందరికీ వొకటి కాదు.. ప్చ్..!

ఏసీలు మీరు పెడతారు.. మీకు చల్లందనము.. మీ చుట్టూ వున్నవాళ్ళకి వెచ్చందనము.. మొక్కలొద్దు.. చెట్లద్దు.. దొడ్లద్దు.. తోటలొద్దు.. పచ్చదనం మీద యింత పగ పట్టారేమిరా? సిమెంటు రంగుకి సాటిరాదురా?

ఇంకా నాకు వోపిక లేదు! అదంతా నాకు తెలీదు.. నాకు దారి యిస్తారా? చస్తారా? యింకుడు గుంతలకన్నా ముందు.. సిమెంటు కనపడితే తవ్వండిరా.. పలుగూ పారా అందుకోండిరా.. గునపాలు తియ్యండిరా.. యీ సిమెంటుని తవ్వి పారేయండిరా.. గచ్చులు చప్టాలు ప్లాస్టింగులు పగలగొట్టండిరా.. మీ సమాధులు మీరు తవ్వుకొని బయటకు రండిరా.. బయటపడండిరా.. నేలతల్లికి గాలాడితేనే మీకు గాలాడుతుంది! నాకు దారి యిస్తేనే మీకు దారి! వీధులన్నీ తిరిగి కాలనీలన్నీ తిరిగి జనావాసాలలో తిరిగి యింకుడు గుంతలలోనే యిమిడలేక అలసిపోయి మట్టిలో యింకే మార్గం లేక రోడ్డెక్కానురా..! మీరూ మీ బతుకులూ రోడ్డెక్కుతాయిరా..!

నాకు తోవ యివ్వండిరా.. తల్లి గర్భంలోకి తోవ యివ్వండిరా.. తల్లి గర్భంలో చేరి స్తన్యమవుతాను.. మీ దప్పిక తీరుస్తాను.. మీకు ప్రాణం పోస్తాను..

నాకు తోవ యివ్వండిరా.. తల్లి గర్భంలోకి తోవ యివ్వండిరా..

మీ

వాన చినుకులు

 

 

యే…

 

 

కె. రామచంద్రా రెడ్డి 

~

 

ఉండలేక స్వప్నస్వర్గ కుహరంలోంచి
వో నరక నాలుక వూడిపడింది
వాలిన పొద్దు ముసురు గుబుర్లో

వోల్డ్ మాంక్ నిశాని సాక్షిగా

*   *    *

క్షవరం చేంచుకోని తలపులు

నిక్కబొడిచుకుని రెల్లు గడ్డి మూల
మూలిగే నక్కలా కాకుండా

లేలేక బొంగురుగా కూసే కాకిలా

నూతిలోంచి బరువు బాల్చీ లేచిన చప్పుడు

 

సంతర్పణలో సాంబారన్నం మెక్కుతుంటే
పురాతన పులకింత

పలకరించి

ఇంగితం లేకుండా

పలమారింది
*   *    *

ఎందుకు వూకే కూకుని తిరగేత నాలుక
అరిపాదం మయంగా దిగిన పల్లేరుగాయ

మాదిరి ఉప్పటి కంటి అద్దప్పొరపై

మాంత్రికప్పౌడరేసి తుడు

 

చీకటి బయలు పడనమ్మకు

నడి వేసవి పసి రోగానికి

గాడ్పు వీథిలోంచి తుడపం పెట్టినట్టు

శివం తొక్కు
    *     *     *

అన్నీ పెడసరడ్డంకులే

మాడుమాటల అట్టువాక్యాలు మెక్కి

వెక్కిళ్ళ వేవిళ్ళు నీకు

నువ్ కనే పేడి పదం

ఏ లోకానిది .


తుడపం – వేసవి లో నడి పొద్దున  పిల్లలకొచ్చిన రోగాలకై గ్రామదేవతకి చెల్లించుకునే మొక్కు(కోడి)

మాయా తివాచి

 

 

చిత్రం: ప్రవీణా కొల్లి

పదాలు:  విజయా కర్రా

~

 

సూరీడింకా చూడని ఆ ఉదయాన

తూగుటుయ్యాలలో సాగుతున్న పయనం చిన్న కుదుపుతో ఆగి

కళ్ళు తెరిచి చూస్తే …

రెక్కల మనిషేవరో రమ్మని

చెయి చాచి పిలిచి మాయమైనట్లనిపించింది

 

అబ్బురపడి

కాసింత పక్కకి ఒత్తిగిల్లి, మబ్బు కళ్ళని విప్పార్చి చూస్తే

దూరాన కనిపించే ఊరేదో నచ్చి –

వుండొస్తానని  మనసు ఎగిరెళ్ళి పోతే

చేను ఆహ్వానించిందట  –  గాలి గంధం పూసిందట

తెలిమంచు పన్నీరు జల్లి

కొమ్మల ఆకులు కుశలమడిగాయట

 

పచ్చని పంటచేల మధ్య పట్టుమని పది ఇళ్ళుట

ఊరి జనమంతా మనసుకి నచ్చిన వాళ్ళేనుట

బరువు బాధ్యత – కష్టం నష్టం లేనే లేవని

వాగు వంకా – చెట్టూ పిట్టా చెపితే

అవునవునని వాళ్ళ నవ్వు మొహాలు వంత పాడాయిట

 

ఆ ఊసుల దారాలన్నీ పోగేసుకుని

ఆశల తివాచిని అల్లి తెచ్చింది మనసు

మనసు మంత్రించి ఇచ్చిన మాయా తివాచి పైన

మబ్బుల్లో సాగింది

తిరిగి నా పయనం

**

ఖదీరుడి సరికొత్త ‘చిత్రం’!

 

 

 

–  వెంకట్ సిధా రెడ్డి

~

 

ఇది ఖదీర్ బాబు “కథలు ఇలా కూడా రాస్తారు” గురించి.

కానీ దానిగురించి చెప్పే ముందు….. నా గొడవ కొంచెం.

సినిమాల్లో కి వద్దామని అనుకున్నప్పుడు- మొట్టమొదట ఫిల్మ్ మేకింగ్ గురించి కొన్ని పుస్తకాలు (సిడ్ ఫీల్డ్, రాబర్ట్ మెకీ ఇంకా చాలా) కొన్నాను. చాలా సార్లు ఆ పుస్తకాలు ఎంత బోరింగ్ గా ఉంటాయంటే, ఏంట్రా బాబూ ఈ సోది అనిపించేది. అలాగే కథలు రాయడం నేర్చుకోవాలని కాదు గానీ,ఎలా రాసారో చూద్దామని అయాన్ ర్యాండ్ – ఆర్ట్ ఆఫ్ ఫిక్షన్ లాంటి పుస్తకాలు కొని ఎన్నేళ్ళైనా ఇప్పటికీ పూర్తి చేయలేదు. చెప్పొచ్చేదేమిటంటే – క్రియేటివ్ ప్రాసెస్ కి సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఎంత వరకూ ఉపయోగపడతాయనేది నాకు పెద్ద అనుమానం. అదే సమయంలో సిడ్నీ లూమెట్  మేకింగ్ మూవీస్ పుస్తకం కొన్నాను. అది కూడా పైన చెప్పిన పుస్తకాల్లాగే పరమ బోరింగ్ గా ఉంటుందేమోనని భయపడుతూనే మొదలుపెట్టి ఒక రాత్రి పూర్తిగా చదివేశాను. సరిగ్గా అలాగే జరిగింది ఖదీర్ బాబు పుస్తకం విషయం లో కూడా.

ఈ రెండు పుస్తకాలకీ ఉన్న పోలిక ఏంటంటే – వీళ్లిద్దరూ కూడా వారి వారి రంగాల్లో ఎంతో సాధించిన తర్వాత, వారి అనుభవాలను చాలా ఇన్‍ఫార్మల్ వాయిస్ లో, ఎంతో ఆత్మీయంగా మనతో పంచుకుంటారు. అలాగే రెండు పుస్తకాల్లోనూ అథారిటేటివ్ వాయిస్ ఉండదు. టోన్ చాలా మోడెస్ట్ గా ఉంటుంది. మేము చెప్పిందే రైట్ అని తలబిరుపూ ఉండదు. అందుకే ఈ రెండు పుస్తకాలు చదువుతుంటే మనకి ఆప్తులైన వారితో మాట్లాడినట్టనిపిస్తుంది.

నేను కూడా ఈ మధ్య కథలు రాస్తున్నాను. ఇంకా రాయాలనుకుంటున్నాను. చాలా సార్లు నాకు తెలిసిన రచయితలతో కలిసి మాట్లాడి నా కథలని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో అని సలహా తీసుకుందామనుకున్నాను. కానీ నాకు మరీ అంత బాగా పరిచయమున్న రచయితలు చాలా తక్కువ.అలాంటి సమయంలో ఈ బుక్ రిలీజ్ అయింది. రిలీజైన రోజే కొన్ని చాప్టర్స్ చదివేశాను. అప్పట్నుంచీ ఎప్పటికప్పుడు చదవాలనే ఉన్నా, చివరికి నిన్న చెన్నై ఐర్పోర్ట్ లో దొరికిన ఐదు గంటల ఖాళీ సమయంలో ఏకబిగిన చదివేశాను. చదివేశాను అనడం కంటే చదివించింది అనడం కరెక్ట్. అంతా ఒకేసారి చదివేసి ఆయాసపడకండి అని ఖధీర్ బాబు ముందే వార్నింగ్ ఇచ్చినా, చదవడం మొదలు పెట్టాక ఆపడం కష్టం. ఏదైతేనేం. పూర్తి చేశాను.

ఐతే ఒక మనవి. ఇది సమీక్ష కాదు. ఏదో నాకనిపించిన నాకు తోచిన నాలుగు మాటలునిజాయితీగా పంచుకోవడమే!

ఫస్ట్ కట్ 

పుస్తకం ఎలా ఉంది అంటే?… ఖదీర్ బాబు తో నాకు బాగా పరిచయం ఏర్పడి, ఒక సాయంత్రం పూట ఆయనతో కూర్చుని ఒక నాలుగైదు గంటలు – ఆయన కథల గురించి, ఆయనకు నచ్చిన కథల గురించీ – చెప్తుంటే హాయిగా విన్నట్టుంది. ఏదో మూడొందల పేజీల  భారీ నాన్‌ఫిక్షన్ పుస్తకం చదివిన ఫీలింగ్ లేదు. కథలు రాయాలనుకున్న వాళ్ళకి, రాస్తున్న వాళ్ళకీ తప్పకుండా ఉపయోగపడే పుస్తకం. అసలు కథ అంటే ఏ మాత్రం ఇంట్రస్ట్ ఉన్నా వాళ్ళకి కూడా నచ్చేసే పుస్తకం. అది చెప్పాలనే ప్రయత్నమే ఇది రాయడం!

khadeer book

పుస్తక కథకు హీరో ఫుట్ నోట్స్ 

ఇందులో మనం తెలుసుకున్న కొత్త కథలు, రచయితలు, వారి గురించి రాసిన ఫుట్ నోట్స్ చూస్తే – బాబోయ్, అసలు ఈ పుస్తకం ఎలా రాసాడ్రా బాబూ అనిపిస్తుంది. బహుశా వందేళ్ల తెలుగు కథ రాయబట్టే ఖధీర్ బాబు ఈ పుస్తకం రాయడం వీలైందేమో అనిపించింది. ఎందుకూ కాకపోయినా కేవలం ఫుట్ నోట్స్ కోసమైనా ఈ పుస్తకం చదవొచ్చు.

ఈ పుస్తకం చదివే తారాగణం? వారి పాత్రౌచిత్యా(త్రా)లు 

చాలామందే చదువుతారు. చదివిన ప్రతి ఒక్కరూ ఇంకొక్కరికైనా చెప్తారు. ఎందుకంటే ఇందులో కరుణ ఉంది. బోల్డెన్ని జ్ఞాపకాలున్నాయి. ఇంకా…తనకి తెలిసింది నలుగురికీ పంచుకోవాలనే గుణం ఉంది. తెలుగు లో ఇంకా మంచి కథలు రావాలనే తపన ఉంది. కాబట్టి ఇది కొత్త వాళ్లు,పాతవాళ్లు అందరూ చదువుతారు. ఎ ఉద్దేశంతో చదువుతారని అడిగితే గొప్ప చిక్కే …. ఎందుకంటే చదివేవారు అన్నిరకాల ఉద్దేశాలతో చదువుతారు. హమ్మయ్య ఈ పుస్తకం చదివేస్తే మనకీ కథలు రాయడం తెలిసిపోతుందనే అమాయకత్వం తోనూ, తొక్కలోది మనకి తెలియంది ఏం చెప్పుంటాడులే అనే గర్వంతోనూ, ఇతను ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎలా రాసెయ్యగలుగుతున్నాడనే ఈర్ష్యతోనూ, ప్రేమతోనూ, కోపంతోనూ – ఇలా అన్ని ఉద్దేశాలతో చదువుతారు. మొత్తానికైతే చదివి తీరుతారు.

 

కానీ చదివేముందు బుక్ కవర్, వెనుక చాప్టర్స్ లిస్ట్, ఇప్పటికే అక్కడా ఇక్కడా వచ్చిన టాక్ బట్టి ఇది ఆషామాషీ పుస్తకం కాదనే చేతులోకి తీసుకుంటారు. తెలుగులో కథలు రాయడం గురించి వచ్చిన చాలా తక్కువ పుస్తకాల్లో ఇది ఒకటి కావడం, సైజు కూడా భారీగా ఉండడం వల్ల – బోర్ కొడ్తుందేమోనని భయమూ, ఏదో తెలుసుకోబోతున్నామనే ఉత్సుకతతోనే ఈ పుస్తకం తెరుస్తాం. అయిపోయాక మంచి ఫీలింగ్ తోనే మూసేస్తాం. తెలుసుకోవాలన్నోడికి తెలుసుకున్నంత ఉంది. (ఇంకా ఉంటే బావుండేది. నిజానికి ఇంకా చాలా చాలా ఉండాలనిపిస్తుంది. ఆ విషయం గురించి తర్వాత.)

 

అసలు కథేమిటంటే ..?

ఒక సంవత్సరంలో తెలుగులో వేల కొద్దీ కథలొస్తున్నా అందులో మంచి కథలు చాలా తక్కువ ఉంటున్నాయి. అవి ఎక్కువ కావడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. కథలు రాయడానికి కాస్తా పిచ్చి ఉండాలి. కొంచెం భావుకత్వం ఉండాలి. అన్నింటికంటే ఎక్కువగా కరుణ ఉండాలి.రాయడంకంటే ముందు చదవడం తెలియాలి. మనకంటూ ఒక ధృష్టి కోణం ఉండాలి…అని ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. ఇంతే కాదు. ఇంకా కథా రచనకు సంబంధించి ఎన్నో విషయలాను ఖదీర్ మనతో ఈ పుస్తకం లో షేర్ చేసుకున్నారు. కొత్తగా కథలు రాసేవాళ్లకంటే -ఆల్రెడీ రాస్తున్న వాళ్లకి, కొన్ని రాసి ఆపేసిన వాళ్లకి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది. తట్టి లేపుతుంది. మనకి తెలియని ఎన్నో కథలని పరిచయం చేస్తుంది. ఎంతో మంది రచయితలకు దగ్గర చేస్తుంది. కొన్ని తెలిసిన విషయాలే అయినా భలే చెప్పాడే అనిపిస్తుంది. అసలు నాన్ ఫిక్షన్ ని కూడా ఇంత ఇంట్రస్టింగా రాయొచ్చా అనిపిస్తుంది. కాబట్టి ఈ పుస్తకం చదవాల్సిందే.

మరైతే అంతా ఒకేసారి కాకుండా అప్పుడప్పుడూ  ఒకటో రెండో చాప్టర్స్ చదవాలని ఖదీర్ బాబు చెప్పాడు కానీ, నేను చెప్పేదేంటంటే మొత్తం ఒకేసారి చదివెయ్యాలి. ఆ తర్వాత మనం రాయడం మొదలు పెట్టాలి. రాస్తూ ఉండగానో, రాయడం అయ్యాకనో అప్పుడు చాప్టర్ హెడింగ్స్ చూసుకుని మనకి కావాల్సినవి అప్పుడు మళ్లీ చదువుకుంటే మేలని నా అభిప్రాయం.

ఈ బుక్ లో ఏం చెప్పారు? అసలు థీమ్ ఏంటి?

ఇందులో ఖధీర్ బాబు భారీ ప్రకటనలు చేయలేదు. ఇలానే రాయాలని పట్టుపట్టలేదు. నేను ఇలా రాస్తుంటాను. నాకు నచ్చిన కొంత మంది ఇలా రాశారు. సింపుల్ గా చెప్పాలంటే ఇంతే ఉంది ఈ పుస్తకంలో. ఆ పైన చాలా ప్రాక్టికల్ విషయాల గురించి మనతో షేర్ చేసుకున్నారు. చాలా వరకూ అందరికీ ఉపయోగపడేవే. థీమ్ అండ్ ప్లాట్ గురించి, శైలీ-శిల్పం గురించి, కాన్‍ఫ్లిక్ట్ గురించి వచ్చిన మూడు చాప్టర్స్ మాత్రమే కొంచెం హెవీగా ఉంటాయి. అసలు ఇలాంటి “హౌ టు ” బుక్స్  దెబ్బతినేదే ఇక్కడ. ఎందుకంటే పైన చెప్పినవి సాంకేతిక అంశాలు. టెక్నిక్ కి సంబంధించినవి. వీటి గురించి ఎంత లాగినా తెగదు. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎవరెవరో ఎన్నో చెప్పారు వీటి గురించి. కానీ పూర్తిగా ఎవరికీ క్లారిటీ ఉండదు. అందుకే ఖధీర్ బాబు థీమ్ విషయం లో థాంక్ గాడ్ అనేసి తప్పించుకున్నాడు. కానీ శైలీ-శిల్పం విషయంలో, కాన్‍ఫ్లిక్ట్  విషయంలో కూడా డెఫినిషన్లతో విసిగించకుండా ఉదాహారణలతో చెప్పి అర్థమయ్యేలా చేశాడు. ఆ విధంగా ఇది హౌటు గైడ్ అని అనుకోవడం కంటే ప్రాక్టికల్ ఎడ్వైజ్ ఫ్రం ఏన్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు.

 

ఎప్పటికీ నిలిచిపోయే చిత్రమేనా?”

తెలుగులో కొన్ని, ప్రపంచ వ్యాప్తంగా ఇంకా ఎన్నో పుస్తకాలు కథల గురించి వచ్చుండొచ్చు కానీ ఇంతకు ముందు, ఆ తర్వాత కూడా ఇలాంటి పుస్తకం రాలేదు, వస్తుందనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే దీని వెనుక చాలా శ్రమ ఉంది. తను చేస్తున్న పని మీద చాలా శ్రద్ధ ఉంది. అపారమైన నమ్మకం ఉంది. కాబట్టి స్థలమూ కాలమూ ఈ పుస్తకానికి ఆపాదించలేం. ఇంకో వందేళ్ళు కాదు. తెలుగు కథ ఉన్నంతవరకూ ఈ పుస్తకం ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు – ప్రపంచంలో ఏ మూల ఉన్నవాడికైనా తెలుగు కథ గురించి తెలుసుకోవాలంటే ఖధీర్ రాసిన రెండు పుస్తకాల తర్వాతే ఏదైనా. ఒకటి వందేళ్ళ తెలుగు కథైతే రెండోది, ఈ పుస్తకం!

అసలు సబ్జెక్ట్ ని ఖధీర్ బాబు ఎలా డీల్ చేశారు?

చాలా తెలివిగా అని చెప్పొచ్చు. ఎందుకో చదివితే మీకే అర్థమవుతుంది. ఖధీర్ అన్నట్టు దిస్ ఈజ్ నాట్ ది ఎండ్. ఒన్లీ బిగినింగ్.

అలాగే ఖదీరుడు పుస్తకానికి  టైట్ట్ పేరు తెలివిగా  పెట్టాడు. తెలివిగా అని ఎందుకన్నానంటే ఈ పుస్తకానికి పెట్టిన పేరు చూస్తే చాలు మీకర్థమవుతుంది. ఒక వేళ లోపలి కంటెంట్ లో ఒక్క పదం మార్చకుండా, ఈ పుస్తకానికి “కథలు ఎలా రాయాలి?” అని పేరు పెట్టుంటే – ఈ పుస్తకం అట్టర్ ఫ్లాప్ అయ్యుండేది. అంటే కేవలం టైటిల్ వల్ల సినిమాలు ఫ్లాప్ అయిన సందర్భాలు, కథలు నచ్చకపోవడాలు చాలా సార్లు జరిగాయి. టైటిల్ ది ఏముంది. అది చాలా ఆబ్వియస్ విషయం అనుకుంటాం. కానీ ఇక్కడే ఖధీర్ చెప్పిన చాలా చిన్న చిన్న విషయాలు మనకి ఉపయోగపడతాయి. మనం చాలా ఆబ్బ్వియస్ అనుకున్న విషయాల గురించి జాగ్రత్త వహించమని చెప్తాడు.

ఈ పుస్తకంతో నాకున్న కాన్ఫ్లిక్ట్ అను  పేచీ ఏంటంటే?

కథ అనేది ఎంతో విశాలమైన పరిధి కలిగి ఉన్నది. కథల్లో ఎన్నో రకాలున్నాయి. యాక్షన్ ఎడ్వంచర్ కథలుంటాయి. ఫాంటసీ కథలుంటాయి. డిస్టోపియన్ ఫిక్షన్ ఉంది. యంగ్ అడల్ట్ లిటరేచర్ ఉంది. ఎరోటికా ఉంది. హారర్, థ్రిల్లర్. మిస్టరీ హిస్టరీ. పల్ప్ ఫిక్షన్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.అయితే ఈ పుస్తకంలో ఖధీర్ బాబు డీల్ చేసింది కేవలం “లిటరరీ ఫిక్షన్” గురించే. తెలుగులో మొదట్నుంచీ జాన్రా ఫిక్షన్ ని పెద్దగా పట్టించుకోలేదు. ఖధీర్ బాబు కూడా దీన్ని వదిలేశారు. అయితే మొదట్నుంచీ ఖధీర్ బాబు రాసినవి లిటరరీ ఫిక్షన్ కథలే. కాన్ఫ్లిక్ట్ కూడా చాలా వరకూ ఎక్స్‍టర్నల్! కానీ ఈ మధ్యనే – మెట్రో కథలు, బియాండ్ కాఫీ –  లలో శైలి మార్చారు. బహుశా కొన్నేళ్ళ తర్వాత వచ్చే మరో ఎడిషన్ లో కొత్త ఛాప్టర్ లు యాడ్ అవుతాయని నమ్మకం. అప్పుడు – అసలు కథలు ఇలానే ఎందుకు రాయాలి? అనే ఒక చాప్టర్ ఉంటుందేమో!

 

క్లైమాక్స్ 

అసలు కథలు ఎందుకు రాస్తారు, ఎవరు రాస్తారు, ఎలా రాస్తారు లాంటి విషయాలతో మొదలైన పుస్తకం చివరికొచ్చేసరికి చాలా ప్రాక్టికల్ సజెషన్స్ తో ముగుస్తుంది. మధ్యలో సంభాషణలు ఎలా రాయాలి, పంక్చుయేషన్ ఎలా ఉపయోగించాలి లాంటి ఆవసరమైన విషయాలు చర్చించాక చివరి చాప్టర్స్ లో చాలా ఫ్రెండ్లీ అడ్వైజెస్ ఇచ్చారు ఖధీర్. ఇవన్నీ నాకు చాలా ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా విమర్శను ఎలా తట్టుకోవాలి? పుస్తకం ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి, వేశాక ఏం చేయాలి లాంటి విషయాలు కొన్ని కథలు రాసి కథకులుగా ప్రాక్టీస్ లోకి వస్తున్న వాళ్ళకు చాలా ఉపయోగపడతాయి.

మొత్తానికి చెప్పొచ్చేదేంటంటే – ఇది చాలా మంచి పుస్తకం. ప్రస్తుతం చాలా అవసరమున్న పుస్తకం. సాదా సీదా గా ఉంటూనే చాలా గొప్ప విషయాలను తెలియచెప్పే పుస్తకం. కాబట్టి తెలుగు కథకులు, పాఠకులు, విమర్శకులు చదవాల్సిన పుస్తకం.

కాబట్టి, దయచేసి చదవండి.

(శుభం కార్డు పడింది. ఇక దయచెయ్యండి.)

 

బతకాలి

 

రెడ్డి రామకృష్ణ

~

 

అన్నా! నువ్వు బతకాలి

వ్యవసాయం వ్యాపారమైపోయి

లాభాల వెన్నెలంతా నగరాల్లో పూస్తున్నప్పుడు

పగలుకుంపటిని గుండెలపై మోస్తూ

ఇంకా

పొలంగట్టే సింహాసనం

గ్రామమే సామ్రాజ్యం

కల్లమే కోట

ఇల్లే స్వర్గం

కడుపే కైలాసమనుకుంటూ… కూర్చుంటావా!

వద్దన్నా వద్దు

కాలం చెల్లిన భావాలు వద్దు

ఆ భ్రమలూ వద్దూ

నువ్వు బతకాలి

 

బతుకు జూదగాడి చేతిలో పేక ముక్కైపోయి

సంపదంతాఓపక్కనే పోగైపోతున్నప్పుడు

నాలుగు మడిగట్ల మధ్య మనసు

నాపరాయై మిగులుతున్నా

మదుపుకి మదుం తీసి

కాసులకొద్దీ కాలువ

కన్నీరు పారిస్తూ

ఇంకా

ఊరు పై ఆశలెందుకు

ప్రభుత్వ పంచాంగాల పై నమ్మకాలెందుకు

 

తెల్లదోమ పచ్చపురుగు

పసుపుముడత,ఎర్రమచ్చలు

ఏవైతేనేం

తెగుళ్లే అధికారంలో వుండి

చేలపైన చేతలపైన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నప్పుడు

కరువులూ ఎరువులై వాటికే సహకరిస్తున్నప్పుడు

నువ్వు కొన్నపురుగుమందు దృష్టిలో

నువ్వే ఒక పురుగైపోతున్నావు

 

అప్పు పురుగు వేరుకు పట్టి కాయాన్ని(కాండాన్ని) తొలిచేస్తుంటే

నువు కూడా పురుగుమందే పెరుగన్నం అనుకునేసరికి

నీ కుటుంబానికి బూడిదతెగులు ఆశ్రయిస్తోంది

వద్దన్నా!వద్దు

ఆవేశాలొద్దు

ఆలోచనా రాహిత్యాలొద్దు

 

అన్నా!

పట్టణం పరాయిదేం కాదు

అలాగే స్వయంభువు కాదు

తండ్రులనాడో తాతల నాడో

చేరుకున్నవాళ్లమే మేమంతా!

శ్రామికులుగా కార్మికులుగా..

 

నగరము నిషేధిత ప్రాంతము కాదు

భయమెందుకు

భయపడితే తాడైనా పామవుతుందని ఎరుగవా!?

శ్రమను నమ్ముకున్న వాళ్లం

అమ్ముకోవాల్సిన వాళ్లం

సంపదకు ఎల్లలు లేనట్టే

శ్రమకూ  సరిహద్దులు లేవుగదా!

చెల్లినచోటే సరుకు ఆమ్ముకోవటం వ్యాపార నీతి

మనము బతుకుతున్నది వ్యాపార ప్రపంచములోనే

మరిచిపోకు

అన్నా! నువ్వు బతకాలి….

నేనూ బతకాలి

సమస్త శ్రామికులూ బతకాలి

గ్రామమా..పట్టణమా..నగరమా

ఆంధ్రానా అమెరికానా ఆఫ్రికానా

ఎక్కడ బతకాలి

ఎక్కడ బతుకుంటే అక్కడ బతకాలి

మనల్నిఈ స్థితికి పడగొట్టిన వాన్ని

పడగొట్టడానికి

తొడగొడుతూ బతకాలి

***

వాగ్దానపర్వం 

 

 

 

~

రాన్రానూ రాజకీయాలు కష్టమైపోతున్నాయ్ రా బాబూ. మా  తాత ఎలక్షన్లలో నిలబడ్డ రోజుల్లో అంతగా నోరు పారేసుకోకుండానే, పుసిక్కిన   గెలిఛేసేవాళ్లు. ఇప్పుడలా కాదు. ఓ బలమైన వాగ్దానం చేయాలి. అంతే కాదు. గెలిచాక అది నెరవేర్చాలి” అన్నాడు ‘టామ్’ మీసాలకంటిన పాలు తుడుచుకుంటూ!

అది విని అప్పుడే తొర్రలోంచి బయటికొచ్చిన జెర్రీ – “నువ్వేం వర్రీ అవకు.

వాగ్దానాలు ఏమేమి ఇవ్వాలనేగా నీ ప్రాబ్లం? అదేదో నీ జోబీ లోంచి ఏదో తీసిచ్చే అపోహలో ఏవన్నా ఉన్నావుటోయ్ వాగ్దానం ఇవ్వడం అంటే? ఆరోజుల్లో  భూదానం  గట్రా లాటివన్నీ  భావే లాటి బుర్రలేనోళ్లూ … పుచ్చలపల్లి లాంటి పిచ్చోళ్ళూ  ఇచ్చేసుకుని ఇల్లు గుల్ల  చేసుకున్నారు  గానీ, మనలాంటి అల్ట్రా మాడ్రన్ గాళ్ళు అవలంబించే  కార్యక్రమమా అది నువ్వే చెప్పు? అసలు ‘వాగ్దానం’ అంటే ఎంటనుకుంటున్నావ్ నువ్వు? భూమ్మీద సమస్త దానాల్లోకెల్ల అతి గొప్ప ‘దానం’ ఏంటయ్యా అంటే అదే ‘వాగ్దానం’. అందునా,  అతి సహజంగా అనాయాసంగా లేదా అప్పనంగా దొరికేవాటిని  నీవిగా స్వంతం చేస్కుని ఎడాపెడా  ప్రా’మిస్’లు చేయటమే నేటి నిఖార్సైన వాగ్దానం ! అన్నప్రసాదానికి అంగూళీయక మానించి, అంగట్లోకి ముట్టించి … ఆవిధంగా  అంగుళమంత కడుపుకి పట్టించి అన్నప్రాశనం అనేది ఒకటి  చేస్తాం కదా బొడ్డూడిన బుడతడికి! రాజకీయ వాగ్దానమైనా  అంతే అనుకో! ఉత్తినే మెతుకు నాలిక్కి కతుకుతామ్ … బుడ్డోడు ఓసారి గట్టిగా  చప్పరించి ఊరుకుంటాడు. అంతే! అలాగని అప్పటినుంచీ మొదలుపెట్టి ఎడాపెడా  భోజనం చేయించే  ఏర్పాట్లు చేస్తామా యేమ్?” ఏక బిగినుగా చెప్పాడు జర్రీ తెగ బాడీ లాంగ్వేజ్ ప్రదర్శిస్తూ.

అర్ధం గాలేదని చెప్పలేక ‘సింబాలిగ్గా’ బుర్ర గోక్కున్నాడు టామ్  నెత్తిన కించిత్ దురద లేకపోయినా!

“ఆ  గోక్కొడమ్ ఆపు. నీకర్ధం కాలేదని నాకర్ధవైంది. వాగ్దానం పారేయడానికి పేద్ద తెలివితేటలు ఏడవక్కర్లేదు. విను. ఉదాహరణకు – నీకు కాసిన్ని మంచినీళ్లు తాగాలనిపించిందనుకుందాము. నీకులానే ఓటేసే ప్రజలక్కూడా నీళ్ళు తాగాలనిపిస్తుందిగా.  పాత కాన్సెప్టుని వలిచిపారేసి, దాన్ని సృజనాత్మకంగా మలిచిపారేసి – ఇంటింటికీ ఉచితంగా  చెంబెడు  నీటిని అందించడమే మా పార్టీ ధ్యేయం ’ అని ఉచిత రీతిన అనేసేయ్…బకెట్లు బకెట్లుగా ఓట్లు కురుస్తాయ్! “ చెప్పాడు జర్రీ.

‘మరో ఉదాహరణ  చెప్పు’ అన్నాడు టామ్  మళ్ళీ బుర్ర గోకితే నిజాయితీగా ఉండదనిపించి.

“అంత తేలిగ్గా అర్ధమైతే నువ్వు టామ్ ఎందుకవుతావు. విను మరో ఉదాహరణ –ఏ సాయంత్రం వేళో నీ ఫార్మ్ హౌస్ లోని ఇసకో మట్టో గర్వంగా కెంజాయ మెరుపులతో మిలమిలా మెరుస్తోందనుకో. నీకులాగానే  ప్రజల కంట్లో కూడా మెరుపు చూడాలనిపించదూ.  వేంఠనే – ‘మీ ఇంటి పెరట్లో మట్టి ఇకనించీ ఉచితంగా మీపాటికి  మీరే శుభ్రంగా తవ్వుకోవచ్చు. ఎవడి పర్మిట్లూ అక్కరలేదు’  – అని  ప్రకటించు. ఎలా ఉంది అయిడియా?” అంది జెర్రీ.

“ఓహోహో! మట్టికొట్టుకున్నట్లుంది. ఓహ్ …సారీ!  భూ-చక్రమ్ తిప్పినట్టుంది. అదిసరే…భూమైపోయింది … ఇహ ‘గాలి’ అంటావేమో?” అన్నాడు టామ్ .

“బాగా గుర్తు చేశావ్ .. కాస్కో మరో ఉదాహరణ. ….’ప్రతి పొద్దుటా ప్రతి మనిషికీ పచ్చి ప్రాయాననే స్వచ్చమైన పచ్చిగాలి దొరికేలా ప్రతి ఉదయాన్నీ మీకు అందుబాటులోకి  తెస్తామ్’ – అని ప్రకటించు! అలా సరాసరి   ‘గాలి’ ని వదలొచ్చు. అదేనోయ్… వాగ్దానానికి గాలినలా వాడుకోవచ్చు.”

“జనాలు మరీ అంత పిచ్చోళ్ళా? గాలి ఫ్రీ – అంటే నమ్మడానికి?” బుకాయించాడు టామ్!

“మరదే! సాంకేతికంగా చెబితేనే గానీ ఏదీ వినవు. కావాలంటే ఈ వాగ్దానాన్నే కొంచె టెక్నికల్ గా … – ప్రతీ ఇంటికీ పచ్చి గాలి పిచ్చ ఉచితంగా 137 ఘనపు మీటర్లు ఉచితంగా అందేలా చేస్తాం – అని ప్రకటించుకో. అలానే ఇందాక చెప్పిన చెంబుడు నీళ్ళు బదులు నీకు తోచిన క్యూసెక్కులను. లేకపోతే ప్రతి పంచలోనూ  8 సెంటీమీటర్ల వర్షపాతాన్ని కురిపిస్తామను. వోట్లు కురిపించుకో. ”.

“ఇప్పుడు బాగా కుదిరింది. నమ్మబలికేలా కూడా ఉంది.  ‘గాలి’ మాటలు ఎప్పటికీ  చద్ది మూటలు. గాలి లీలల్ని మించి ఏమైనా కలదా? అయినా చిన్న సందేహం.  అలా అన్నేసి  గాలి మాటలు చెబితే ఉత్త ‘గ్యాస్’ అంటారేమో?”

“నీకు కాన్సెప్తు బ్రహ్మాండంగా అర్ధమైపోయినట్టుంది. నాక్కూడా తెగ సజెస్టు  చేసేస్తున్నావ్. యస్! ఏవన్నావ్ ఇప్పుడు ….. గ్యాస్ అని కదూ అన్నావ్? ఈ సారి వాగ్దానాన్ని ఇలా వదిలేయ్ పబ్లిక్ మీదకి – ‘గ్యాసు ఊసే వద్దు. గాడిపొయ్యే నీక్కు ముద్దు’ – అలా స్లోగనిచ్చి  ప్రజల్ని చైతన్యవంతుల్ని చెయ్. ఈ క్రమంలో ఇంటింటి కి ఒక ‘గాడిపొయ్యి’ ఉచితంగా  తవ్వించి పెడతామని బృహత్తరమైన వాగ్దానం చెయ్.  ఎక్స్ చెకర్ కి  ఏవన్నా ఖర్చా బొచ్చా?”

“మహాద్భుతం … పబ్లిక్ అడ్మిన్స్ట్రేషన్ నించి పాలిటిక్స్ దాకా ఎవరైనా  మీదగ్గరే నేర్చుకోవాలి. అ…యి…నా ….”

“అర్ధమయింది నీ డౌటు. అలా తాపతాపకీ బుర్ర తక్కువ వెధవలా బుర్ర గోక్కోకు. గాడిపొయ్యి ఆకమడేట్ చేసుకునే స్థలం ఎక్కడేడిచిందీ ఈ రోజుల్లో అనేగా నీ డౌటు? మళ్ళీ  వాగ్దానానికి కొంచెం టెక్నికల్ రంగు పులుము. ‘నీచ నికృష్ట కడు నిరు పేద వెధవాయిలందరికీ గ్యాసు బండ పూర్తిగా ఉచితం’ అని ప్రకటించు”.

“అబ్బబ్బ …తమరి బండ పడ… ఏం టెక్నిక్కు వదిలారు సారువాడూ. చ్చస్తే  నోరూ వాయీ ఉన్న ఏ వెధవాయీ దీనిమీద నోరు చేస్కోడు. ఇది అదుర్స్”

రజనీకాంత్ లాగా గిర్రున తిరిగి కాలిమీద కాలేసుకుని కూర్చుంది జెర్రీ. “పృధ్వాపస్తేజోవాయురాకాశాలని పంచ భూతాలు కదా .. పృధ్వీ, అపస్సూ అయింది. అంటే  భూమైందీ,  నీరైందీ. వాయువూ  అయింది. అంటే గాలీ అయింది.  ఇక అగ్గి , ఆకాశం మిగిలాయి. అంచేత  ఇప్పుడు ‘తేజో’ కాన్సెప్టుని వాడుదాం ….”

టామ్ పరవశం తో తోకూపుతూ  – “అంటే ఇప్పుడు  సమ్మర్ కదా! ఏదన్నా అగ్గిరాముడు వాగ్దానం వదలండి.” అన్నాడు.

“భేషుగ్గా గుర్తు చేశావ్. విను. వేదిక పైన  మైకుచ్చుకున్నాక …. ‘ప్రజలారా… దిమ్మదిరిగే ఈ సమ్మరుకి మీరంతా సమ్మ సమ్మగా ఉండాలని ప్రతి భడవాయికీ ఓ నల్ల కళ్ళద్దాలు ఉచితంగా ఇచ్చిపారేద్దామని నిర్ణయించుకున్నాం’ – అని ఓ వాగ్దాన బాణం వదులు. ఠపీ మని గుచ్చుకుంటుంది.”

“ఎక్కడ? కంట్లోనా?” అడిగాడు టామ్.

kamedee karner

“ఊర వెటకారం అంటే అదే! కూల్ కూల్ కబుర్లు చెబుతుంటే… కంట్లో కారమద్దే మాటలు చెప్పకు. ఖజానాకు ఖర్చు అనుకుంటే… ఆ కూలింగ్ గ్లాసేదో కంటి చూపు వంద శాతం  సరిగా ఉన్నోడికే ఇస్తామని చిన్న రైడర్ పెట్టుకో. ఈ పెపంచకంలో వంద శాతం సరైన కంటి చూపు ఏ జీవికీ ఉండదు.” రీసర్చి స్కాలర్లా  చెప్పాడు జెర్రీ.

“వహ్వా…వాహ్వా! అగ్గి తాలూకు వాగ్దానం పన్నీరు పోసిన బుగ్గిలా అదిరింది.  ఇహ ఆకాశం గురించి సెలవివ్వండి  ….” అన్నాడు టామ్ గోక్కొడమ్ మానేసి అదే చేత్తో మీసాలు అనవసరంగా తిప్పుకుంటూ.

“ ఆ … అక్కడికే వస్తున్నా….విను.  ప్రతి ఆడపడుచు ఇంటికీ వెళ్ళి – ఆకాశం అమ్మాయయితే నీలా ఉంటుందే…నీలా ఉంటుందే -అని చెప్పు.”

“చెప్పుచ్చుకుంటారు.”

“కదా? ఆ చెప్పు చక్కగా రెండు  చేతుల్లోకి తీసుకుని – ‘ఇహ ఈ పాద రక్షలతో అవసరం లేదు ఆడపడుచుగారూ. ఎందుకంటే మీరు ఈ భూమ్మీద నడవరు. ఎంచక్కా రూపాయికే ఆకాశంలో విమానాల్లో ‘వియన్నా’ దాకా వెళ్ళి వచ్చే ఏర్పాటు చేసేలా ‘వియన్నా ఒడంబడిక’ కుదుర్చుకుంది మా పార్టీ – అని చెప్పు! తొక్కలోది … ఆకాశం అమ్మాయవడమేంటి? అమ్మాయే ఆకాశమవుతుంది ఆనందంతో!”

“మరి ఎక్స్ చెకరు మీద భారం … గట్రా….?”

“ ఎక్స్ చెకరా… చైనీస్ చెకరా? ఇలాటప్పుడే సృజనాత్మకతో,  సాంకేతికతో అద్దు అని చెప్పానా? వాగ్దానానికి ఇలా కండిషను పెట్టు.  టికెట్టయితే ఇప్పుడే తీస్కోవచ్చు గానీ … కాక… పోతే…”  దర్పంతో చెప్పుకు పోతున్నవాడల్లా కొం…చెం ఆగాడు   జర్రీ.

“పోతే…?” రెట్టించాడు టామ్.

“ పోతే ఏవుంది? ప్రయాణికురాలి  వయసు 50 దాటిన తరువాతే టిక్కట్టు  చెల్లుతుంది… అని మళ్ళీ ఓ రైడరు వేస్కో! ఎన్నో ఇక్కట్లు పడి టిక్కట్లు  అట్టేపెట్టుకున్నా గానీ,  50 దాటాక…. అప్పటికి పోతే పోతారు! అథవా  ప్రభుత్వం మారగా… వారంతట  వారే  పోతారు!  ఆకాశం అన్నాక ఎప్పటికైనా  పోక పోతారా?”

“హబ్బబ్బ … ఏమి సెప్పితిరి!”

“వాగ్దానం వంకాయలా నవనవలాడుతుండాలే గానీ, గంపగుత్తంగా  జనాలు వత్తాసు పలికేసి  డిన్నర్లోకి  గుత్తొంకాయ వండుకోడానికి రెడీ అయిపోరూ? పొహళింపు పొందిగ్గా ఉండి దీటైన మేటి వాగ్దానపు వడ్డింపు అలాంటిది. దాని ఘుమఘుమే వేరు ”

$$$

 

“అమ్మా పిన్ని” ఇక లేదు!

 

-వంగూరి చిట్టెన్ రాజు

~

 

మే నెల 17, 2016…పొద్దున్నే ఫోన్. అంత పొద్దున్నే ఎవరా అని ఫోన్ అందుకోగానే “అమ్మా పిన్ని” పోయింది అనే వార్త. విని నిర్ఘాంత పోయాను. ఆవిడకి 92 ఏళ్ళు అనీ తెలుసు. గత ఐదారేళ్ళ గా డిమెంషాయా అనే అనారోగ్యంతో ఉన్నారనీ తెలుసును. కొన్ని రోజులగా డాకర్లు నిరాశ వ్యక్తంచేస్త్తున్నారు అనీ తెలుసును. అన్నీ తెలిసినా, ఎంత తెలిసినా, అప్పుడే తెలిసిన ఆ నిర్యాణ వార్తకి కళ్ళు చెమర్చాయి.

తెలుగు జానపదానికి, ఎంకి పాటలకి, లలిత సంగీతానికి “నేను సైతం గొప్ప గొంతుక”  అరువు ఇచ్చిన ఆ గొంతు శాశ్వతంగా మూగబోయింది. కావడానికి ఆవిడ అవివాహిత. కానీ మా అందరికీ ఆవిడ “అమ్మా పిన్ని”. అక్కయ్య అనసూయా దేవి గారి పెద్ద కుమార్తె రత్న పాపని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటూ పాప ఇల్లే తన ఇల్లుగా గత పదేళ్ళకి పైగా హ్యూస్టన్ లో నివసిస్తున్నారు. విశేషం ఏమిటంటే సరిగ్గా అంతకు మూడు రోజుల ముందే పెద్దావిడ అనసూయ గారి 97 వ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. తెలుగు తిథుల ప్రకారం అనసూయ గారికి 100 ఏళ్ళు వస్తే సీత గారికి 97.

 

 

ఓ విధంగా చూస్తే సీత గారి జీవితంలో రెండు అధ్యాయాలు ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది. మొదటిది సీత – అనసూయ …లేదా వింజమూరి సిస్టర్స్ …అనగానే తెలుగు జానపదమే మనసులో మెదులుతుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మేనగోడళ్ళు అయిన వారిద్దరూ 1930 దశకంలో ఆయన కవితలకీ, ఇతర భావకవుల గేయాలకీ బాణీలు కట్టి, సభారంజకంగా పాడుతూ దేశమంతటా తిరుగుతూ ఐదు దశాబ్దాల పాటు అఖండమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూనే మారుమూల పల్లెలలో దాగి ఉన్న జానపదాలని వేల సంఖ్యలో సేకరించి వాటికి సభా గౌరవాన్ని కలిగించిన జంట స్వరాలు.

 

ఎక్కడా స్వయం ప్రకటిత ఆర్భాటాలకి పోకుండా తన స్వరాన్నీ, సర్వస్వాన్నీ అక్క అనసూయా దేవికే అంకితం చేసిన ఆదర్శ సోదరి గా సీత గారికి గుర్తింపు కూడా వచ్చింది.  అతి చిన్నతనం లోనే వారి ప్రతిభకి ఇందుతో జత పరిచిన ఫోటో అద్దం పడుతుంది. ఈ ఫోటో 1934 నాటిది. అప్పుడు సీత గారి వయసు పదేళ్ళు.

220px-V_Seetha_Devi

ఆ నాటి “తెలుగు స్వతంత్ర” అనే పత్రికలో “మన మధుర గాయకులు” అనే శీర్షికలో ఈ అప్పచెల్లెళ్ళ గురించి ప్రచురించబడిన ఒక సమగ్ర వ్యాసంలో “ఆ నాటికి పన్నెండేళ్ళకి మించని ముక్కు పచ్చలారని వయస్సు, సభాసదులకి వెరవని ధైర్య స్థైర్యాలతో పెద్దమ్మాయి అనసూయ, తగిన మెళకువలతో చాకచక్యంగా వాయించుకునే హార్మొనీ, అక్క వేపే క్రీగంటి దృక్కులు నిముడ్చుకుని కీచుమనే సన్న గొంతుతో చిన్నమ్మాయి సీతాంబ వంత పాట – ఆ గానానికి ముగ్ధులు కాని వారు ఆ నాడు సాధారణంగా కంటిలో కలికానికైనా ఉండే వారు కాదు” అని మెచ్చుకున్నారు. కాలక్రమేణా సీత గారి గొంతు అసమానమైన శ్రావ్యత, వెల్వెట్ లాంటి మృదుత్వం సంతరించుకుని, దానికి అనువైన అయిన బాణీలు సమకూర్చుని తనదే అయిన గుర్తింపు తెచ్చుకున్నారు.

 

ఆ విధంగా 1930 వ దశకం నుండి అనేక దేశాలలో వేల కొద్దీ కచేరీలతో సాగిన సీత –అనసూయ ప్రస్థానం మూడు దశాబ్దాలు అద్వితీయంగా జరిగింది. తరువాత ఇప్పటి దాకా కొనసాగుతూనే ఉన్నా 1960 దశకంలో సీత గారు సమిష్టి కుటుంబ నివాసం అయిన మద్రాసు నుంచి చదువుల కోసం హైదరాబాద్ తరలి వెళ్ళడంతో ఆమె “సొంత గొంతుక” ఎక్కువగా వినపడడం ఆమె జీవితంలో రెండో అధ్యాయం అని చెప్పుకో వచ్చును.  తెలుగునాట సంగీతంలో మాస్టర్స్ డిగ్రీ అందుకున్న తొలి మహిళ గా వింజమూరి సీతా దేవి చరిత్ర సృష్టించారు. వెనువెంటనే 1963 లో ఆలిండియా రేడియో లో జానపద సంగీత విభాగానికి మొట్ట మొదటి మహిళా ప్రొడ్యూసర్ గా మరో చరిత్ర సృష్టించి 1984 లో పదవీ విరమణ చేశారు.

# 6

సీత గారి ఆధ్వర్యం లో రూపొందించబడిన కొన్ని వేల సంగీత కార్యక్రమాలు, రేడియో నాటికలు ఎంతో ప్రాచుర్యం పొంది ఆమెకి ఒక అగ్రశ్రేణి రేడియో ప్రయోక్త గా గుర్తింపు తెచ్చిపెట్టాయి. అంతే కాక వందల కొద్దీ ఔత్సాహిక గాయనీ గాయకులకి తన శిక్షణ ద్వారా స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. ఇవన్నే ఒక ఎత్తు అయితే 1980 లో విడుదల అయిన “మా భూమి” సినిమాకి సంగీత దర్శకురాలిగా సీతా దేవి ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.

యావత్ దేశంలోనే భారత దేశం సినిమాలకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన సత్యజిత్ రాయ్, మృణాల్ సేన్ ల తరువాత అటువంటి ఖ్యాతి తెచ్చుకున్న తొలి తెలుగు సినిమా “మా భూమి”. తెలంగాణా సాయుధ పోరాటం (1940-48) నేపధ్యంలో బి. నరసింగ రావు నిర్మించిన ఆ చిత్రంలో సీతా దేవి గారు ఐదు పాటలకీ స్మగీతం సమకూర్చారు. అందులో బండెనక బండి కట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లె వస్తవు కొడకో.. అనే పాట వినని, పాడుకోని తెలుగు వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. గద్దర్, సంధ్య, మోహన్ రాజు చేత ఆయా పాటలు పాడించడమే కాక మహా కవి శ్రీ శ్రీ గారి గేయాలకి బాణీలు కట్టి ఆ సినిమాలో ఎంతో సముచితంగా వాడుకున్నారు సీతా దేవి గారు. బెర్లిన్, కైరో, సిడ్నీ మొదలైన అనేక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టి వల్స్ లో ఈ చిత్రం ప్రదర్శించబడింది. ఆ తరువాత “మా ఊరి కథ” అనే సినిమాకి కూడా సీత గారు సంగీత దర్శకురాలు. ఆమె సేవలకి గుర్తింపు గా గృహ లక్ష్మి స్వర్ణ కంకణం మొదలైన వందలాది పురస్కారాలు అందుకున్న విదుషీ మణి మన వింజమూరి సీతా దేవి గారు.

anasooya - sitha - gruhalakshmi 1934

సీత గారితో నా మొదటి పరిచయం 1977 లో ఆమె మొదటి సారి అమెరికా వచ్చినప్పుడు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా ఆమెకి నేనూ, మా ఆవిడ, మా పిల్లలూ అంటే ఎంతో ఆప్యాయత. నేనే కాదు. ఎవరైనా సరే అందరినీ అదే ఆప్యాయత తో పలకరించి కబుర్లు చెప్పే వారు. ముఖ్యంగా ఆవిడ హ్యూస్టన్ లో ఉన్నప్పుడు ఎప్పుడు మా తెలుగు సాంస్కృతిక సమితి కార్యక్రమాలు జరిగినా సంగీతం కార్యక్రమాలని సొంతం చేసుకుని తన అసమాన అనుభవంతో అందరికీ మంచి పాటలు నేర్పి ఆయా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించే వారు. ఆవిడ నిస్వార్థ సేవలకి మేము అందరం ఎంతో ఋణపడి ఉన్నాం.

 

సీత గారు మంచి రచయిత్రి. జాన పదాలు, ఎంకి పాటలు, స్త్రీల పాటలు మొదలైన పుస్తకాలు తెలుగులోనూ, అందరూ నేర్చుకుని పాడుకోడానికి వీలుగా ఇంగ్లీషు లోనూ సంగీతం నోటేషన్ తో సహా ప్రచురించారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప గాయని, రేడియో ప్రయోక్త, సంగీతం టీచర్ గా తన సుదీర్ఘ జీవితంలో వేలకొద్దీ కళాకారుల, సంగీత ప్రేమికుల గౌరవాభిమానాలని పొందిన అమర గాయని మా అందరి “అమ్మా పిన్ని”, డా. వింజమూరి సీతా దేవి గారికి వ్యక్తిగతంగానూ, అశేష అభిమానుల తరఫునా నివాళి అర్పిస్తున్నాను.

*

 

 

 

 

 

 

 

 

 

అతని లానే మరొకడు…!    

 

స్లీమన్ కథ-33

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

స్లీమన్, దార్ఫెల్త్ ఇద్దరూ నాప్లియోలో మకాం పెట్టారు. సూర్యోదయానికి ముందే లేచి స్లీమన్ సముద్రస్నానానానికి వెళ్లడం, పదినిమిషాలసేపు ఈత కొట్టడం మామూలే. ఆ తర్వాత ఇద్దరూ కలసి అక్కడికి పాతిక నిమిషాల దూరంలో ఉన్న టిర్యిన్స్ కు గుర్రం మీద వెళ్ళేవారు. ఉదయం ఎనిమిదికి తొలి విరామం. అక్కడి బ్రహ్మాండమైన రాతి వసారాల నీడలో పనివాళ్లు అల్పాహారం తీసుకునేవారు. సూర్యాస్తమయంవరకూ పని జరిగేది. ఆ తర్వాత ఇద్దరూ నాప్లియోకు తిరిగివెళ్ళేవారు.

జూన్ వరకూ తవ్వకాలు కొనసాగాయి.  హోమర్ వర్ణించిన ప్రాసాదం తాలూకు మొత్తం ప్రణాళిక అంతా వేసవి తొలి రోజుల్లోనే బయటపడింది. ఆ భారీ దుర్గం ఒక సున్నపురాతి కొండ మీద నిలబడి ఉంది. కింద చిత్తడి మైదానం. పెద్ద పెద్ద రాళ్ళతో నిర్మించిన పైకప్పుతో వసారాలు అనేక తరాలుగా గొర్రెల దొడ్లుగా ఉపయోగపడుతూ వచ్చాయి. గొర్రెల రాపిడికి కొన్ని చోట్ల రాళ్ళు నునుపుతేలాయి. ఈ రాతి కట్టడాలను దర్శించిన పసన్నియస్, ఎన్ని కంచరగాడిదలతో లాగించినా వీటిలో చిన్న రాయిని కూడా కదిలించలేరని రాశాడు. మైసీనియాలో లానే ఇక్కడా పసన్నియస్ రాతలను స్లీమన్ పరమప్రమాణంగా తీసుకున్నప్పటికీ, ఆయన రాతకు భిన్నంగా అనేక చిన్న చిన్న రాళ్ళను పనివాళ్ళ చేత సునాయాసంగా తీయించగలిగాడు.

మరుసటి వేసవిలో టిర్యిన్స్ ను మరోసారి సందర్శించాడు. ఒక బాలుడు తామ్రవర్ణంలో ఉన్న ఒక ఎద్దు మీదికి గెంతుతున్నట్టు ఉన్న ఒక చక్కని కుడ్యచిత్రం, రేఖాగణితనమూనాలో ఉన్న మరో చిత్రం తాలూకు అవశేషాలు, అసంఖ్యాకమైన నీలిరాతి బొంగరం ఆకృతులు, లావా కత్తులు, బాణపు మొనలు కనిపించాయి. అరంగుళం వెడల్పు మాత్రం ఉన్న ఒక బంగారు గొడ్డలి తప్ప మరెంలాంటి బంగారు వస్తువులూ దొరకలేదు.

టిర్యిన్స్ పేరుతో అతను రాసిన పుస్తకం 1886లో ప్రచురితమైంది. ట్రాయ్ పై అతను రాసిన చివరి పుస్తకంలానే ఇది కూడా నిరాశగొలిపింది. తన రాతను తవ్వకాలలో లభించిన వస్తువుల వర్ణనతో సరిపెట్టి, బయటపడిన భారీ కట్టడాల గురించిన చర్చను దార్ఫెల్త్ కు విడిచిపెట్టాడు. ఇక్కడ దొరికిన అనేక మృణ్మయ కలశాలు, ట్రాయ్, మైసీనియాలలో దొరికిన వాటికంటే అభివృద్ధి చెందిన శైలిని సూచిస్తున్నాయి. మెలి తిరిగిన కొమ్ములతో ఉన్న ఒక భారీ  వృషభచిత్రం ప్రపంచాన్ని ఆశ్చర్యచకితం చేసింది. ఇటువంటి వృషభచిత్రాలే ఆ తర్వాత నోసస్ తవ్వకాలలోనూ బయటపడ్డాయి. టిర్యిన్స్ వృషభాన్ని కూడా క్రీటు కళాకారుడే చిత్రించి ఉండడానికీ అవకాశం ఉంది. అయితే, స్లీమన్ కాలానికి గ్రీసు ప్రధానభూభాగంపై క్రీటు సంస్కృతి ప్రభావాన్ని ఎవరూ గమనించలేదు. మైసీనియా, టిర్యిన్స్ గిరిదుర్గాలను ఫినీషియన్లు1 నిర్మించి ఉంటారని స్లీమన్ భావిస్తూ వచ్చాడు. సుదూర పురాచరిత్రకాలంలో గ్రీసు, ఏజియన్ దీవుల్లోకి, అయోనియన్ సముద్రంలోకి ఫినీషియన్లు పెద్ద ఎత్తున చొచ్చుకువచ్చారనీ;  క్రీ.పూ. 1100 ప్రాంతంలో డోరియన్ 2 ఆక్రమణదారులు తరిమికొట్టేవరకూ ఈ ప్రాంతాలలో వారి ఆధిపత్యం కొనసాగిందనీ పురాచరిత్రనిపుణులు భావించారు.

220px-Charles_George_Gordon_by_Freres

గోర్డాన్

స్లీమన్ గట్టిగా విశ్వసిస్తూ వచ్చిన సిద్ధాంతాలలో వీరయుగం అంతరించిందన్నది ఒకటి. పురాతన గ్రీసు వీరులలోనే వీరత్వం అసాధారణస్థాయిలో నిండి ఉండేదనీ, ఆ తర్వాత అంత ప్రగాఢంగా మరెక్కడా, మరెప్పుడూ అది పరిమళించలేదనీ అతను నమ్మేవాడు. ట్రాయ్, మైసీనియాలు మహితాత్ములు నడయాడిన భూములనీ, అనంతరకాలంలో  ప్రపంచం అల్పజీవులు, అంగుష్టమాత్రుల పాలబడిందని అనుకునేవాడు.3 అయితే అతని దృష్టిలో ఈ కాలంలోనూ కొన్ని మినహాయింపులు లేకపోలేదు. 1881 మార్చిలో నిహిలిస్టుల 4 చేతిలో హతుడైన జార్ చక్రవర్తి అలెగ్జాండర్ –II ను 5 వెనకటి ప్రామాణిక వీరుల తెగకు చెందినవాడిగా భావించేవాడు. అంతకంటే ఉజ్వలోదాహరణగా జనరల్ గోర్డన్ 6 ను స్మరించుకునేవాడు. సూడాన్ లో అతను గడించిన అదృష్టాలను స్లీమన్ ఎంతో ఆసక్తితో గమనిస్తూవచ్చాడు.

స్లీమన్, గోర్డన్ ల మధ్య ఎన్నో పోలికలున్నాయి. ఇద్దరూ మొండి ధైర్యమూ, తమపట్ల తమకు అచంచల విశ్వాసమూ ఉన్నవారే. భూమిలో నిక్షిప్తమైన వస్తువుల పట్ల, విచిత్రంగా ఇద్దరిలోనూ ఒకేవిధమైన ఆసక్తి. హోమర్, పసన్నియస్ లపట్ల తిరుగులేని నమ్మకం ఉన్న స్లీమన్ భూమిలో కప్పడిన ట్రాయ్, మైసీనియా, టిర్యిన్స్ నగరాలను వెలికితీశాడు.  బైబిల్ లోని ఉత్తేజిత వచనాలను ప్రగాఢంగా విశ్వసిస్తూ పవిత్రభూమి(Holy Land) అంతటా సంచరించిన గోర్దన్;  తను గల్గత(Golgota), గిబియన్(Gibeon), గార్డెన్ ఆఫ్ ఈడెన్ ల వాస్తవిక ఉనికిని కనుగొన్నానని నమ్మాడు. ఇద్దరూ తమవైన ఏకాంతదుర్గంలో,  తమను నేరుగా ప్రభావితం చేసిన రచనలను మాత్రమే చదువుతూ గడిపినవారే. ఇద్దరూ ఒకేలా సమకాలీన నాగరికతతో ఇబ్బంది పడుతూ; తమను పురాతనజీవులుగా, తిరిగిరాని గతానికి చెందినవారిగా భావించుకుంటూ తమ తమ స్వాప్నికప్రపంచాలలో జీవించినవారే. భవిష్యత్తు గురించిన ప్రశ్న తలెత్తినప్పుడల్లా గోర్డన్ బైబిల్ అందుకుని ఏదో ఒక పుటను తెరిచి చూసేవాడు. అందులో భవిష్యచిత్రం అతని కళ్ళకు స్పష్టంగా కనిపించేది. సరిగ్గా అలాంటి సందర్భాలలో  స్లీమన్ కూడా హోమర్ ను తెరచి చూసేవాడు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలిగిన వ్యక్తులు వాళ్ళిద్దరూ.

స్లీమన్ దృష్టిలో గోర్డన్ తన కాలపు నిజమైన వీరుడు. ఇంకా చెప్పాలంటే, తన కాలపు హెక్టర్. సూడాన్ రాజధాని ఖార్టూమ్ లో గోర్డన్ విడిసి ఉన్నప్పుడు మాదీ(Mahdi) 7గా తనను ప్రకటించుకున్న మహమ్మద్ అహ్మద్ అబ్ద్ అల్లాహ్ (1884-1885) సేనలు అతన్ని ముట్టడించాయి. గోర్డన్ బలగానికి ఆహారం, ఇతర నిత్యావసరాలు అందకుండా చూశాయి. మరోవైపు తుపాకీ మందు తరిగిపోతుంది. తామున్న భవంతి కిటికీలకు ఇసుకబస్తాలతో రక్షణ కల్పించమని గోర్డన్ కు సహచరులు విజ్ఞప్తి చేశారు. గోర్డన్ తిరస్కరించాడు. అందుకుబదులు ఒక కిటికీ వద్ద ఇరవైనాలుగు కొవ్వొత్తులు వెలిగించిన ఒక లాంతరును ఉంచమని ఆదేశించాడు. అప్పుడు అతను అన్నాడు: ”భగవంతుడు భయాన్ని ఒక్కొక్కరికే పంచుతూ వెళ్ళాడు. నా వంతు వచ్చింది. తీరాచూస్తే, నాకు పంచడానికి భయం కాస్త కూడా మిగలలేదు. కనుక గోర్డన్ దేనికీ భయపడడని వెళ్ళి ఖార్టూమ్ ప్రజలకు చెప్పండి.”

మహమ్మద్ అహ్మద్

మహమ్మద్ అహ్మద్

1885 ఫిబ్రవరి 3న మాదీ, అతని సహచరులు గోర్డన్ ఉన్న భవంతిని సమీపించారు. సూర్యోదయానికల్లా అతని సేనలు నగరం మొత్తాన్ని కమ్మేసాయి. గోర్డన్ కరవాలం చేతబూని భవంతి మెట్ల దగ్గర శత్రువుల రాకకు నిరీక్షిస్తూ నిలబడ్డాడు. శత్రువుపై విరుచుకుపడి అద్భుతంగా పోరాడాడు. చివరికి ఆ మెట్ల దగ్గరే, పీనుగుల కుప్ప మధ్య ప్రాణాలు వదిలాడు. అతని తల నరికి ఒక వస్త్రంలో చుట్టి మాదీకి కానుకగా ఇచ్చారు. దానిని ఒక చెట్టు కొమ్మకు వేలాడదీయమని మాదీ ఆదేశించాడు. ఆ రక్తపంకిలమైన శిరసు చుట్టూ కొన్ని రోజులపాటు రాబందులు తిరిగాయి.

తను ఎథెన్స్ లో ఉంటూనే మధ్యధరాసముద్రానికి ఆవల, ఖార్టూమ్ లో జరుగుతున్న పరిణామాలను స్లీమన్ ఆందోళనతో గమనిస్తూ వచ్చాడు. గోర్డన్ మరణం అతన్ని తీవ్రంగా కుంగదీసింది. జీవించి ఉన్నవారిలో తను అమితంగా అభిమానించి ఆరాధించినది గోర్డన్ నే. అప్పటి ప్రధానమంత్రి గ్లాడ్ స్టన్ చేసిన ఒక అనూహ్యమైన పొరపాటే గోర్డన్ విషాదమరణానికి దారి తీయించిందని రాణి విక్టోరియా సహా యావత్ బ్రిటిష్ ప్రజలూ నమ్మారు. గోర్డన్ కు అండగా సకాలంలో అదనపు బలగాలను పంపడంలో గ్లాడ్ స్టన్ విఫలమయ్యాడని ఆరోపణ.  స్లీమన్ కు గ్లాడ్ స్టన్ బాగా తెలిసినవాడే. తన మైసీనియా కు సుదీర్ఘమైన ఉపోద్ఘాతం రాసింది ఆయనే. తనను 10 డౌనింగ్ స్ట్రీట్ లోని తన నివాసానికి ఆహ్వానించి విందు ఇచ్చింది ఆయనే. కానీ తన ఆరాధ్యవీరుడు గోర్డన్ మరణానికి కారణమైన గ్లాడ్ స్టన్ పొరపాటును స్లీమన్ క్షమించలేకపోయాడు. అతనిపట్ల ఆగ్రహంతో వణికిపోయాడు. తన అధ్యయన కక్ష్యలో ఉంచిన అతని సంతకంతో ఉన్న ఫోటోను నేలమీదికి విసిరికొడదామా, లేక చించి పారేద్దామా అనుకున్నాడు. చివరికి తీసుకెళ్లి పాయిఖానాలో ఉంచాడు.

నోసస్ స్థల యజమానితో బేరం కుదరక ఎథెన్స్ కు తిరిగివచ్చినా క్రీటు తవ్వకాలపై దీర్ఘకాలికప్రణాళికను రచించుకుంటూ, మధ్యలో తిరిగి ట్రాయ్ దారి పడితే ఎలా ఉంటుందని అనుకుంటూ, ఇంకోసారి ఇథకా వెడితే మంచిదా అని భావిస్తూ గడిపాడు. ఇవేవీ కాక, ఓసారి పారిస్ వెళ్ళి తన ఇళ్ల పరిస్థితిని చూసొస్తే బాగుంటుందా అని కూడా అనుకున్నాడు. కానీ ఇవేవీ చేయకుండానే రోజులు దొర్లించాడు. వృద్ధాప్యం, అలసిపోయిన భావన  కమ్ముకుంటున్న కొద్దీ అతను తనలోకి తాను అదృశ్యమైపోతూ వచ్చాడు. రోజంతా, అర్థరాత్రివరకూ హోమర్ పఠనమే. అదొక మత్తుమందుగా మారింది. అదొక్కటే అతన్ని బుద్ధిమాంద్యంలోకి నెట్టకుండా మానసికస్వస్థత కల్పిస్తూవచ్చింది. ఇప్పుడూ ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు కానీ, దస్తూరీలో వణకు కనిపిస్తోంది. రాను రాను అతని రాతల్లో అఖియన్లను శాపనార్థాలు పెట్టే  ట్రోజన్ వీరుల గొంతు ధ్వనిస్తోంది. కాకపోతే, హోమర్ వీరుల నోట ప్రవహించిన ఆ అద్భుత శాపనార్థాలు ఒక పిరికి ప్రొఫెసర్ ను తలపించే ఈ వ్యక్తి నోట వినిపించడమే ఆసక్తికరం.

అయితే, వృద్ధాప్యం మీదపడుతున్నా స్లీమన్ లో వెరపు మచ్చుకైనా లేదు. తన మహత్తర పరిశోధనలకు ఇవ్వవలసిన గుర్తింపు ఇవ్వకపోయినా, లేదా అరకొరగా గుర్తించినా ఇప్పటికీ ఆగ్రహాన్ని కుమ్మరిస్తూనే ఉన్నాడు. కెప్టెన్ బాటిషర్(Bottischer) అనే అతను హిస్సాలిక్ పై ఒక వ్యాసం రాస్తూ, అది ఒక పెద్ద దహనవాటిక అనీ, బహుశా పర్షియన్లకు చెందిందనీ అన్నాడు. దానిని హాస్యాస్పద సిద్ధాంతంగా పేర్కొని తుత్తునియలు చేయడానికి స్లీమన్ రీముల కొద్దీ కాగితాలు వెచ్చించాడు. చిన్నపాటి విమర్శకు కూడా గాయపడిన సింహంలా గర్జించే అలవాటు అతనికి ఇప్పటికీ పోలేదు. స్లీమన్ ఏదో అంకితం ఇవ్వజూపినప్పుడు మెక్లెమ్బర్గ్ పాలకుడు(Grand Duke) అందుకు స్పందించకపోవడంతో అతను తీవ్రనిరసన రంగరిస్తూ ఒక తంతి పంపించాడు. మంచి పేలుడుమందు దట్టించినట్టు ఉండే తంతులు పంపించడం అతనికి ముందునుంచీ అలవాటే. దాంతో స్లీమన్ గౌరవార్థం మెక్లెంబర్గ్ పాలకుడు ఒక స్వర్ణపతకాన్ని జారీచేసి అతనితో సంధి చేసుకున్నాడు.

మధ్యలో కొన్ని మాసాలపాటు స్లీమన్ పురావస్తుపరిశోధనలను పక్కన పెట్టేసి తిరిగి వ్యాపారవేత్తగా అవతారమెత్తాడు. తన ఆస్తులు, పెట్టుబడులు భద్రంగా ఉన్నాయో లేదో చూసుకోడానికి ప్రపంచపర్యటన ప్రారంభించాడు. క్యూబాలో తనకు భారీ ఎస్టేట్లు ఉండడంతో హవానా సందర్శించాడు. అలాగే, మాడ్రిడ్, బెర్లిన్ లలో ఉన్న తన ఆస్తుల్ని చూసుకోడానికి ఆ దేశాలకు వెళ్ళాడు. పనిలోపనిగా వెళ్ళిన ప్రతిచోటా  ట్రాయ్ పై తన సిద్ధాంతాలను బలపరచుకుంటూ ఉపన్యాసాలు చేశాడు. తనకున్న ధనబలంతో అనుకున్నదే తడవుగా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లగలిగే అవకాశాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాడు.

శారీరకంగా అతనిలో మార్పు వస్తోంది. చెవిపోటు రాను రాను దుర్భరంగా మారుతోంది. ఒక్కోసారి పెదవులు బాధతో మెలితిరుగుతున్నాయి. మాట నట్టుతోంది. ఆహారనియమాలను మరింత కచ్చితంగా పాటించవలసివస్తోంది. చీకటితోనే నిద్రలేవడం, సముద్రస్నానం చేయడం, మూడు గుడ్లు, ఒక కప్పు టీ తో ఉదయపు అల్పాహారం, ఆ తర్వాత వార్తాపత్రికలు, స్టాక్ ఎక్స్ఛేంజ్ నివేదికలు చదవడం,  ఉత్తరాలు రాయడం; హోమర్ తోపాటు సోఫొక్లీస్ లేదా యురిపిడీస్ ల నుంచి మూడేసి వందల పంక్తులు వల్లించడం(ప్లేటోను చాలా అరుదుగా చదివేవాడు, అరిస్టాటిల్ ను అసలు చదివేవాడు కాదు), ఆతర్వాత మధ్యాహ్నభోజనం, కాసేపు నడక, సాయంత్రంవరకూ పూర్తిగా అధ్యయనం, సాధారణంగా సాయంత్రాలు సందర్శకులతో గడపడం, రాత్రి పదిగంటలకు పడక. ఇదీ అతని నిత్యకృత్యం. రాత్రిళ్ళు తరచు నిద్రపట్టేదికాదు. దాంతో రాత్రంతా చదువుతూనే గడిపేవాడు.

వృద్ధుడవుతున్న కొద్దీ నిద్రలో వచ్చే కలలను పట్టించుకునే చాదస్తం పెరిగింది. వాటిని జాగ్రత్తగా విశ్లేషించేవాడు. సోఫియాకు కలలో కాకులు, చిక్కుడు కాండం, విదేశీ సందర్శకులు కనిపించినట్టు తెలిస్తే విపరీతంగా ఆందోళన చెందేవాడు. 8 పురాతన దేవతల ఆధికారిక వాణిని, స్వప్నవిశేషాలను హోమర్ పదే పదే ఉగ్గడించాడు. స్లీమన్ పై వాటి ప్రభావం ఉంది. వయసు మీరుతున్న ఈ దశలో అతను క్రమంగా బాహ్యప్రపంచం నుంచి ఆంతరికప్రపంచంలోకి జారుకుంటూవచ్చాడు.

శరీరం దుర్బలమవుతోంది. చెవిపోటు నానాటికీ తీవ్రమవుతోంది. యూరప్ శీతగాలులు దుస్సహం అవుతున్నాయి. దాంతో మిగిలిన శీతాకాలాలు దక్షిణాదిన గడపడానికి నిర్ణయించుకున్నాడు. ఈజిప్టు అతన్ని ఆకర్షించింది. మూడు తరాలుగా ఈజిప్టులో తవ్వకాలు జరుపుతున్న ఫ్రెంచి, ఇంగ్లీష్ పురావస్తుశాస్త్రజ్ఞుల నివేదికలను అప్పటికే అతను విస్తారంగా చదివి ఉన్నాడు. అయితే, తనకున్న బుద్ధికుశలత వాళ్ళకు లేదనీ, వాళ్ళ పురావస్తుశాస్త్రపరిజ్ఞానం కూడా అంతంత మాత్రమే ననీ, తనలా వాళ్ళెవరూ స్వర్ణనిక్షేపాలు కనిపెట్టలేదనీ అనుకున్నాడు.  తనే ఈజిప్టులో కొద్దిపాటి తవ్వకాలను చేపడితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేశాడు.

 గ్లాడ్ స్టన్

గ్లాడ్ స్టన్

1886 ముగింపునకు వస్తోంది. ఒక్క సహాయకునీ; గ్రీకు, అరబ్బీ పుస్తకాల దొంతరనూ వెంటబెట్టుకుని మూడు మాసాలపాటు నైలు నదిలో తీరుబడిగా ప్రయాణిస్తూ గడపాలని నిర్ణయించుకున్నాడు. అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. ఆ కాలానికి అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలతో, అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దిన ఒక చక్కని దహబియా 9 ను1500 పౌండ్లకు అద్దెకు తీసుకున్నాడు. తీబన్(Theban) 10 శిథిలాలు, టోలెమీ ఆలయాల మీదుగా వెడుతున్నప్పుడు పడవను ఆపించి తీరగ్రామంలోకి వెళ్ళి సంతలో తిరిగేవాడు. గ్రామస్తులతో అరబ్బీలో ముచ్చటించడం అతనికి సంతోషం కలిగించేది. వాళ్ళ ఒంటి మీద ఉన్న పుళ్ళకు చిన్న చిన్న చిట్కా వైద్యాలు సూచించేవాడు. ఒక ఈజిప్టు బాలిక భుజానికి పక్షవాతంతోనూ, వాపుతోనూ బాధపడుతుండడం చూసి; రోజూ రెండుసార్లు నైలు నదిలో స్నానం చేయమనీ, అవిసె గింజలను, కొన్ని రకాల మూలికలను ముద్ద చేసి వేడి వేడిగా భుజానికి పిండికట్టు వేసుకోమని సూచించాడు. ఫలితం ఏమైందో తెలియదు. నల్లని దేహాకాంతితో, శిల్పించినట్టు ఉండే ముఖాలతో కనిపించే న్యూబియన్ల 11 ను ఎంతో ఇష్టపడేవాడు. తనకు ఇంతవరకు తారసపడిన జనాలలో వీరొక్కరే వీరజాతిగా కనిపిస్తున్నారనుకున్నాడు.

వాడీ హల్ఫా(Wadi Halfa)12 వరకూ ప్రయాణించాలన్నది అతని సంకల్పం. మధ్యలో క్లియోపాట్రా గురించిన ఆలోచనలు చేశాడు. నైలు నది లోతును, మేఘాల కూర్పును అధ్యయనం చేశాడు. బాగా ఎత్తున ఏర్పడిన మేఘాలను బట్టి మరుసటి రోజు వాతావరణాన్ని అంచనా వేసేవాడు. ప్రయాణాల్లో ప్రతిసారీ చేస్తున్నట్టే, రోజువారీ ఉష్ణోగ్రతలను నమోదు చేశాడు. అక్కడక్కడ కనిపించిన శాసనాల నకలు రాసుకున్నాడు. పడవ కప్పు మీద అస్థిమితంగా పచార్లు చేసేవాడు కానీ అతనిలో ఒక విచిత్రమైన నెమ్మది ఏర్పడింది. హోమర్ ను చదువుతున్నప్పుడు మాత్రం ఎందులోనూ పొందనంత ఆనందం అతనిలో పురివిప్పి నర్తించేది.

(సశేషం)

***

అథోజ్ఞాపికలు

  1. ఫినీషియన్లు: ఋగ్వేదంలో పేర్కొన్న ‘పణు’లే ఫినీషియన్లు అని కోశాంబీ అంటారు. ఫినీషియన్లు సముద్రయానంలో నిపుణులైన ప్రాచీనకాలపు వర్తకులు. వీరికి సంబంధించిన మరికొన్ని విశేషాలను నేను ‘పురా’గమనం శీర్షిక కింద రాసిన ఈ వ్యాసాలలో చూడవచ్చు. 1. దేవతల కుక్క(18-09-2014) 2. ప్రపంచచరిత్రలో మనం(24-09-20140 3. పర్షియన్ రాముడు-గ్రీకు హనుమంతుడు (02-10-2014) 4. చరిత్రలో ఒక అద్భుతం (13-11-2014)
  2. డోరియన్లు: నాలుగు పురాతన గ్రీకు తెగలలో ఒకరు. మిగిలిన మూడూ: అయోలియన్లు, అఖియన్లు, అయోనియన్లు.
  3. విచిత్రంగా మహాభారతం కూడా గొప్ప వీరులైన క్షత్రియజాతి అంతరించిపోవడం గురించీ, ‘అల్ప’జీవులు ప్రాబల్యంలోకి రావడం గురించీ చెబుతుంది. ఒకానొక కాలంలో ప్రపంచంలో పలుచోట్ల జరిగిన పరిణామాల సాదృశ్యాన్ని పరిశీలించిన పురాచరిత్రకారులు, వాటిని ‘వీరయుగం’ కింద వర్గీకరించారు. నేను గమనించినంతవరకు మహాభారతాన్ని ఈ వీరయుగ కోణం నుంచి ఎవరూ పరిశీలించినట్టులేదు. నా ‘పురా’గమన వ్యాసాలు కొన్నింటిలో ఈ కోణాన్ని కొంతవరకు స్పృశించాను.
  4. నిహిలిస్టులు: నిహిలిజాన్ని బోధించేవారు నిహిలిస్టులు. అన్ని రకాల విలువలను, నైతికతను వీరు వ్యతిరేకిస్తారు. Nihil అనే లాటిన్ మాటనుంచి nihilism పుట్టింది. ఫ్రెడరిక్ హెన్రీ జాకొబీ(1743-1819)అనే జర్మన్ తాత్వికుడు ఈ మాటను కల్పించాడు. జోసెఫ్ వాన్ గారెస్ (1776-1848) అనే జర్మన్ పాత్రికేయుడు ఈ మాటను మొదటిసారి రాజకీయార్థంలో వాడాడు. రష్యన్ రచయిత తుర్గేనివ్  (1818-1883) తన ‘ఫాదర్స్ అండ్ చిల్రన్’ అనే నవలలో nigilizm అనే రష్యన్ రూపాన్ని వాడి ఆ మాటను తనే రూపొందించానన్నాడు. 1860-1917 మధ్యకాలంలో రష్యాలో సాగిన విప్లవ అరాచకత్వాన్ని ఈ మాటతో సంకేతించారు. Online Etymology Dictionary, © 2010 Douglas Harper
  5. అలెగ్జాండర్ –II(1818-1881): రష్యా చక్రవర్తి(జార్). 1855లో పట్టాభిషిక్తుడయ్యాడు. పోలండ్ కు రాజుగానూ, ఫిన్ లాండ్ కు గ్రాండ్ డ్యూక్ గానూ కూడా ఉన్నాడు. 1881లో నిహిలిస్టుల చేతిలో హతుడయ్యాడు.

 

  1. చార్లెస్ జార్జి గోర్డన్(1833-1885): బ్రిటిష్ సైనికాధికారి. చైనా, సూడాన్ లలో విధులు నిర్వహించాడు.
  2. మాదీ(Mahdi): ఇస్లాం పరిరక్షణకు, స్థాపనకు కత్తి పట్టి ఉద్యమించిన వీరుని సూచించే పేరు. చరిత్రలో పలువురు తమను ‘మాదీ’గా ప్రకటించుకున్నారు.
  3. స్వప్నాలవల్ల మంచి గానీ, చెడుగానీ జరుగుతుందన్న విశ్వాసం మనలోనూ ఉంది. రామాయణంలో ‘త్రిజటా స్వప్నం’ లాంటి ఉదాహరణలు ఉన్నాయి.
  4. దహబియా: నైలు నదిలో తిరిగే పడవలను ఈ పేరుతో పిలుస్తారు.
  5. తీబన్(Theban): ఈజిప్టులోని పురాతన నగరం తీబ్స్(Thebes) కు చెందిన పౌరుడు తీబన్.
  6. న్యూబియన్లు: ఈజిప్టుకు దక్షిణంగానూ, నేటి సూడాన్ ఉత్తరప్రాంతంలోనూ ఉన్న న్యుబియా అనే ప్రాంతానికి చెందినవారు.
  7. వాడీ హల్ఫా(Wadi Halfa): సూడాన్ ఉత్తరప్రాంతంలో ఉన్న ఒక నగరం.

  

 

 

 

 

 

 

 

 

 

ఇప్పుడొచ్చింది మెలుకువ!

 

 

 

కవిత్వ అనువాదం గురించి మహాకవి  షెల్లీ అన్నాడేమో – గుర్తు లేదు- కాని, వాక్యం వరకూ గుర్తుంది: The plant must spring again from its seed.

గొప్ప కవిత్వం అనువాదానికి లొంగదు అని చాలా సార్లు విన్నాం. అది ఎంత కష్టమో ఈ షెల్లీ వాక్యం చెప్తుంది. అదే విత్తనం నించి అదే మొలక సాధ్యం కాకపోవచ్చు కాని, రెండు భాషల రహస్యం తెలిసినప్పుడు కవిత్వం మక్కీ కి మక్కి కాకపోయినా భావానువాదం సాధ్యమే కావచ్చు. అయితే, ఆ రెండు భాషలూ వొక దానికి ఇంకోటి సాంస్కృతికంగా ఎంత దగ్గిరగా మసలుకుంటాయన్న విషయం మీద అది ఆధారపడుతుంది.

తెలుగు-ఒరియా భాషల మధ్య చుట్టరికం ఇప్పటిది కాదు. కాని, ఏ కారణం వల్లనో వచనం అనువాదం అయినంత ఎక్కువగా ఈ రెండు భాషల మధ్య కవిత్వం తర్జుమా కాలేదు. వెనిగళ్ళ బాలకృష్ణ రావు సహకారంతో ఇప్పటికైనా ఈ వెలితి కొంత భర్తీ చేస్తున్నందుకు వేలూరి వెంకటేశ్వర రావు గారిని అభినందించాలి.

సౌభాగ్య కుమార మిశ్ర పేరు ఒరియాలో సుపరిచితం. దాదాపు అయిదు దశాబ్దాలుగా ఒరియాలో ఆయన కవిత్వం రాస్తున్నారు. యిప్పటికి పదకొండు కవిత్వ సంపుటాలు తీసుకువచ్చారు. ఆధునికమైన భావన ఎలా వుంటుందో, దానికి ఎన్ని కోణాలు వుంటాయో వాటన్నిటినీ ఆయన ఒరియా వర్తమాన కవిత్వంలో పరిచయం చేశారు.

సునిశితమైన సాంస్కృతిక అంశాలని చుట్టుకుని వుండే ఆయన వాక్యాల సొగసుని తెలుగులోకి తీసుకురావడం ఎంత శ్రమ వుందో, ఆ శ్రమ సౌందర్యమంతా ప్రతిఫలించే అనువాదాలు ఇవి- ఈ ఎండాకాలం కొన్ని అనువాదాల్నివొక పుస్తకంగా తీసుకురావాలని వేలూరి- వెనిగళ్ళ  ప్రయత్నం! ఈ రెండు అనువాదాలు మీ కోసం ఇదిగో..

-అఫ్సర్ 

 

ఆహ్వానం:

 

ఒరియా మూలం: సౌభాగ్య కుమార మిశ్ర

తెలుగు అనుసృజన: వేలూరి వేంకటేశ్వర రావు (వెనిగళ్ళ బాలకృష్ణ రావు సహకారంతో)

 

 

ఈ అరణ్యజనుల  ఉచ్చులు  తప్పించుకొని రా, మృగుణీ (1)

సిమెంట్‌ వరండా ఎర్రగా  కాల్చేసే సహజమైన ఈ  మండుటెండ

అగ్నివలయం లోపలినుండి తప్పించుకొని రా మృగుణీ

సందిగ్ధ సమయంలో ప్రార్థన కేవలం పునః స్మృతి; నిన్నటి ఎంగిలి కూడులా!

రాక్షసుడి ఆకలికి  ఈ వడ్డు, ఆ వడ్డు అనే భేదం లేదు.

 

నీలిమేఘాల ద్వీపంలో కూడా చావు లేదు మృగుణీ

టెలిఫోన్‌ లో పెద్ద గర్జన తప్ప. ఏనుగ లేదు, మొసలి లేదు,

ఏ దొంగదో, సన్యాసిదో, మెత్తని అవ్యక్తధ్వనిలో కలిసి పోయి రా, మృగుణీ.

 

కొండంత మా అపనమ్మకపు శిఖరం ఎక్కి రా మృగుణీ,

క్రిందకి దిగిరా మా దుర్మార్గపు గడ్డిపరకల కోసం.  మెలకువతో చేకొంటావు కదా,

దిగువనుండి  దిగ్మండలాంతానికి వ్యాపించిన ఈ నేలపై

లెక్కలేనన్ని దేవుళ్ళ అంగాలలో ఆలింగనాలలోవినిపించే రతికూజితాలు ఎన్నెన్నో!

*

మృగుణి  అంటే, కురంగి,  ఆడు జింక అని అర్థం.  మనం తెలుగులో లేడి అని కూడా అంటాం.   సప్తఋషులలోఒక ఋషి పులహుడు. అతనికి అనేకమంది భార్యలున్నారు. వారిలో ఒక భార్య మృగి.  పులహుడు, పిశాచాలని, క్రూరమృగాలు పులులని, సింహాలనీ, మొసళ్ళనీ పుట్టించిన ఋషి అని చెపుతారు.  పులహుడు సృష్టించిన జంతువులలో లేడి కూడా ఒక జంతువు. అది సాధు జంతువు. క్రూరజంతువుల బారినుండి తప్పించుకొని రమ్మని ఆడుజింకకి ఆహ్వానం అని అన్వయం చేసుకోవటానికి అవకాశం లేకపోలేదు.  కవితలో ఆఖరివాక్యం చదివిన తరువాత ఈ వ్యాఖ్య అసమంజసం అనిపించదు. ఈ అన్వయం గురించి  సౌభాగ్య కుమార మిశ్ర తో మాట్లాడినప్పుడు, అతను చెప్పాడు:  పులహుడి కథ తనకి తెలుసు.  అయితే, సుమారు యాభై ఏళ్ళక్రితం  ఈ కవిత రాసినప్పుడు తనకి పులహుడి సృహ లేదని! ఒకే పద్యానికి పాఠకులు/విమర్శకులు  వేరువేరు వ్యాఖ్యానాలు  చెయ్యటానికి అవకాశం ఉన్నది  సుమా అని అతనూ గుర్తించాడు.  పోతే, అనాగరిక  రాక్షసజనులబారినుండి తప్పించుకొని ఈ దుర్మార్గపు ప్రాంతానికి  రమ్మని కురంగికి “ఆహ్వానం” అని సాధారణ అన్వయం.  –  వేవేరా

 

కొండ:

ఒరియా మూలం: సౌభాగ్య కుమార మిశ్ర

తెలుగు అనుసృజన: వేలూరి వేంకటేశ్వర రావు (వెనిగళ్ళ బాలకృష్ణ రావు సహకారంతో)

 

నేను మహమ్మద్ లాగా కొండ దగ్గిరకి పోలేదు

నేను కొండని రమ్మని పిలవనూ లేదు. నా గది తలుపు

తెరిచి వుందని తానే దూసుకొని వచ్చింది; సాయంత్రం

ఆకాశంమీదుగ దిగివచ్చి, నందివర్ధనం చెట్టు పక్కనుంచి

మా ఇంటి గుమ్మంకేసి తిరిగింది.

నమ్మశక్యంకాని ఈదృశ్యం చూసి నేను అవాక్కయ్యాను,

కొండకి కుర్చీ వేసాను, టీ కెటిల్‌ పొయ్యి మీద పెట్టాను.

 

జాగ్రఫీ పాఠం నేర్చుకోవటం గ్యారంటీగా చాలా కష్టం.

అట్లాసులో ఎర్రచుక్క, నీలం గీత, నల్ల గుర్తూ,

ఏవి ఎక్కడ ఉన్నాయా అని వెతికి వెతికి కళ్ళు వాచిపోయేవి,

క్లాసులో వెనకబెంచీలో కూచొని కునుకుతీస్తూ కలవరపడేవాణ్ణి.

 

ఎక్కడిదీ కొండ?

ఏదో పిక్‌నిక్‌ సందడి. కాళ్ళు అటూఇటూకొట్టుకొని, చెప్పులుచిరిగిపోయాయి,

నా ప్యాంటు చొక్కాకి  ఏదో ముళ్ళకంప తగులుకుంది.

గ్లాసులోకరిగిపోయింది కొండ, పంచదార క్యూబ్‌లా!

నాకు ఎంతోఏడుపొచ్చింది; జాగ్రఫీ పుస్తకంలో,

యాభైఐదో పేజీలో ఇద్దరు భారీ మనుషులు ఎవరెస్ట్ ఎక్కుతున్నారు.

 

ఇప్పుడు మెలుకువ వచ్చింది, నన్ను ఎవరో మోసగించారు.

నేను చిన్నప్పుడు పనస తోటలో చెట్లు ఎక్కటం

ఎందుకు నేర్చుకున్నాను? నిండు యవ్వనంలో

ఎందుకు కోరుకున్నాను, ఇంత భారం?

ఎన్నెలో యెన్నెలా… !

 

 

-అట్టాడ అప్పల్నాయుడు

~

 

 

ఆ ఇంట్లో టీ.వీ అతని మరణాన్ని ప్రసారం చేస్తోంది. మరణం వెనక కారణాలను విశ్లేషిస్తోంది. రోజులో యింకేవీ వార్తలు లేనప్పుడూ, అడ్వర్టయిజ్ మెంట్ల తర్వాతా మూడు రోజులుగా టీ.వీ ఛానళ్లన్నీ అతని గురించి చెపుతూనే వున్నాయి. న్యూస్ ఏంకర్లు వారి రిపోర్టర్లను యెప్పటికప్పుడు అప్ డేట్సుని అడుగుతూ, వాట్ని ప్రసారం చేస్తూ, కొన్ని విజువల్స్ వేస్తూ, యిటువంటి వార్తలను ప్రసారం చేస్తున్నందుకు సంతోషిస్తున్నట్టు కనబడుతున్నారు. అప్పటికి అతను చనిపోయి నాలుగోరోజు.

అతను చనిపోలేదు, హత్యచేసారంటారు అతని మిత్రులూ, సహచరులూ.  అతన్నెవరూ హత్యచేయలేదు, అతనికతనే ఉరి వేసుకుచనిపోయేడు. బతకడం ఇష్టంలేక తనే చనిపోతున్నాని, బతుక్కంటే చావు హాయిగా వుందని ఉత్తరం రాసి చనిపోతే హత్యంటారేమిటీ అసహనంగా ప్రశ్నించేరు కొందరు. ఆ కొందరే అతని మరణానికి కారణమని యింకొందరూ ! ఇన్నోసెంట్ ఛైల్డ్ , టేక్ హిజ్ లైఫ్ ఫర్ నో కాజ్.. అని వాపోయిందొకామె. అంతేకాక- ఆ చావుకి తమను బాధ్యుల్ని చేసి మాటాడిన ప్రతికక్షుల్ని… ఉతికి ఆరేసింది. రాజకీయాలు శవాలతో చేయకండి. ఊపర్ భగవాన్ హై.. పాపోంకో ఓ నహీ ఛోఢేగీ… అని నిప్పుకళ్లతో హుంకరించింది. భగవాన్ కూడా ఆ క్షణాన ఆమెను చూస్తే హడలిఛస్తాడు.

భగవాన్ ఆప్ జైసే మహిళా నహీ… భగవాన్ పురుష్ హో, నహీ ఛోడీగీ నహీ, నహీఛోఢేగా భోలో అని ఇంకొందరు అభ్యంతరం చెప్పేరు. ఆమె ధీమాగా – ఓటర్ తమ పక్కనున్నారన్నట్టు.. భగవాన్ హమారే సాధ్ హై… అనన్నది ! ప్రతికక్షులవేపు నిసాకారంగా చూసి – ఇన్నోసెంట్ ఛైల్డ్ టేక్ హిజ్ లైఫ్.. అని రుద్ద కంఠంతో పలికి… భగవాన్ నహీ ఛోడేగీ అనన్నది మళ్లీ !

” .. చూసేవమ్మా, నువ్వెప్పుడూ అల్లరి పిల్లడివని తిట్టేదానవి. ఆమె నన్నెపుడూ చూడనేలేదు. నా శవాన్నిగూడా చూడలేదు. అయినా ( ఇన్నోసెంట్ ఛైల్డ్ ) తెలివిలేని పిల్లడని బాధపడింది. నువ్వూ వున్నావెందుకూ ? నన్నాడిపోసుకోడానికి ? అని బుంగమూతి పెట్టేడు అతను ! టీ.వీ చూస్తోన్న తల్లి బదులివ్వలేదు. అతని ఒడలంతటినీ స్పర్శించింది. కౌగిలించుకుంది. జుత్తులోకి వేళ్లు జొనిపి, జుత్తు గట్టిగా పీకింది. అతను హాయిగా నవ్వి ఆమె కౌగిలిలో ఇమిడిపోయేడు.

ఇంతలోనర్శిం వచ్చేడు. ఒక క్షణం మౌనంగా కూచున్నాడు. ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచి – నక్షత్ర చావుకి ఒకరు గాదమ్మా.. నీచే, నాచే, వరమడిగిన కుంతిచేతన్… అలాగ ఆరుగురేటి బతికున్న మనందరమూ కారకులమే అనన్నాడు. తల్లి గతుక్కుమంది. కొడుకు- సైగ చేసేడు, నాలుకను బయటకు పెట్టి నర్శిం మామ చెప్పేది నిజంకాదన్నట్టు. అతనే నక్షత్ర ! ఆమె నక్షత్రను పొదివి పట్టుకుంది.

నక్షత్ర చనిపోయేడంటే యిప్పటికీ నమ్మలేకపోతున్నాను., కాలిబూడిదయి నాల్రోజులయినా- అనన్నాడు నర్శిం. నక్షత్ర మరణ వార్తను నర్శిమ్మే తెచ్చేడు. పోలీసుల నుంచి ఫోన్ వచ్చిందని చెప్పేడు. చీకటి, చిట్టడవీ, భోరున గాలీవానా  – చిందువ యెత్తుకెళిపోయిన జింక పిల్ల తల్లిలా ఒణికిపోతూ, నిలువెల్లా నీరయి… తల్లి కూలబడిపోయింది. నర్శిం యేడుస్తూ –

నక్షత్రలాంటివాళ్లు తమ వాడలోనే కాదు, భూమ్మీదనే యెక్కువమంది పుట్టరు. చిత్రమయిన పిల్లాడు. బతుకు గురించి అందరమూ యేదో అనుకుంటాంగానీ నక్షత్ర భవిష్యత్ బతుకు గురించి మాటాడేవాడెపుడూ. రేపేంజేద్దామ్మామా అనడిగేవాడు. గడనీయిరా… ఈరోజేనేవాడు నర్శిం. కాదు, మామా ఈరోజు గడవడం రేపటికోసమే అననేవాడు. రేపటికోసమే జీవించేవాడు. ఊరుకి దూరంగానున్న స్కూలుకి నడిచివెళ్లేవాడు. పెద్ద రైతుల, ధనికుల పిల్లలు నక్షత్రను యెందుకో ఒకందుకు అవమానపరిచేవారు. తల్లీదండ్రులు కులభ్రష్టులనో, కులహీనులనో.. ! ములకోల పోట్లతో దుక్కిపశువు నాగేటిచాళ్లు పోసినట్లుగా హైస్కూల్, కాలేజీ చదువుల్ని సాగించేడు రేపటి మీద ఆశతో !

లేదు మామా, నేనింకా బతుకు ఆరంభించకముందరే ముగింపుకొచ్చేసాను. దుక్కిపశువు నాగేటిచాళ్ల మీదే ఆఖరి శ్వాస తీసింది- సూసైడ్ నోట్ లో ఈ వాక్యం లేదుగానీ, నర్శింకి లేఖ సారాంశమంతా యీ వాక్యరూపంలో అర్ధమైంది. అందుకే… బతికున్న అందరమూ  దోషులమంటున్నాడు.

ఇందిరమ్మకోలనీ కోసం, బంజరభూములకోసం, రిజర్వేషన్లకోసం, దేవాలయప్రవేశాల కోసం – నర్శిం ఆందోళనలూ, ఉద్యమాలూ ! మామా, వీటి కోసమేనా మన జన్మలు ? వాళ్లూ, మనం అంతా కూడా మనుషులమే కదా ? వాళ్ల కలలూ, మన కలలూ ఒకటే కాజాలవా అనేవాడు. నక్షత్రకు ఆశయాలున్నవిగానీ, అవెలా తీరతాయో, వాట్నెవరు అడ్డుకుంటున్నారో యెరుక లేదు. నర్శింకి కూడా వివరించే శక్తి లేదు. నక్షత్ర ఓ రోజు నర్శిం భుజమ్మీది ఎర్రతువ్వాలుని తీసేసి, నీలి రంగు తువ్వాలు కప్పేడు. ఏవేవో విషయాలు మాటాడేడు. యూనివర్షిటీలో తోటి విద్యార్ధుల ఆశలు, ఆవేదనలు, రేపటి కోసం కార్యాచరణలు… ! ఏడాదిగా యెపుడు కలిసినా యివే ఊసులు !

అపుడే – ఊరిలో ఏదో బహుళజాతి కంపెనీ ధర్మల్ విద్యుత్ కర్మాగారానికి శ్రీకారం చుట్టింది. డిపట్టా భూమలయిన తమ భూముల్ని అప్పగించమని కలెక్టర్ ఉత్తర్వులు. తాము ఉద్యమం చేయటం. కోర్టు నుంచి స్టే తేవడం ! కలకలంగా ఉంది వాడంతా !

యేమనుకున్నాడో నక్షత్ర – పండీ, యెండని భూములెందుకు మామా, వొదిలేయండి, ఉద్యోగాలిప్పించమనండన్నాడు.

నక్షత్రా – పండీ, యెండనివి కాదు. అలా చేసేరు, రైతు బతుకుని. మట్టిలోన సాముదప్పా మాకేమి తెలుసు నక్షత్రా ? మట్టిని లాక్కున్నోడు మమ్మల్ని ఉద్దరిస్తాడంటే నమ్మమంటావా అని గదా అడిగేడు నర్శిం.

నక్షత్ర చాలాసేపు మాటాడలేదు. ఒక దీర్ఘనిట్టూర్పు విడిచి – యేం చెప్పాలో బోధపడడంలేదుమామా అని ఆకాశంవేపు చూస్తూ వెళిపోయేడు ఇంటికి !

picasso_cubism

మళ్లీ యిదిగో పదిపదిహేను రోజుల కిందట ఓ రాత్రి ఫోను చేసేడు – మామా ఊళ్లల్లో  వెలిని దాటి వచ్చేంగానీ మేమిక్కడ వెలిని దాటలేకపోయేం. వెలివాడలోవున్నామని – తమ పనిష్మెంటూ, దాన్ని యెత్తివేయడానికి చేసిన పోరాటం, సహచరుల నిరాశలూ, నిస్తబ్దతలూ… ఎన్నాళ్లీ చీకట్లు మామా అనడిగేడు ! అపుడు, నర్శిం ఆకాశం వేపు చూసేడు !

నర్శింకి అన్నీ కదలాడి -ఆకాశంలో యేమి బోధపడింది నక్షత్రా ? అని కుమిలిపోసాగేడు.

కూలబడిన తల్లి  స్పృహ కోల్పోయింది. నర్శిం ఆందోళనతో ఇంట్లోకెళ్లి మంచినీళ్లు తెచ్చి, ఆమె మొహమ్మీద చల్లేడు. ఇరుగూ పొరుగూ కోసం కేకలు పెట్టేడు. ఇరుగుపొరుగూ చేరేరు. యేవేవో సపర్యలు చేస్తున్నారు. ఆ రోజే సాయాంత్రానికి యూనివర్సిటీకి చేరేరు. నక్షత్ర శవం చుట్టూ పోలీసులు దడిగట్టేరు. విద్యార్ధులెవర్నీ దరిచేరనీయటంలేదు. నర్శింనీ, తల్లినీ రానిచ్చేరు. వారితో యేమీ మాటాడకుండా నక్షత్ర శవాన్ని వేనెక్కించి స్మశానానికి తీసుకువెళ్లేరు. పోలీసులు కాటికాపరులయ్యేరు. కన్నపేగులు కాలుతున్న బాధతో కూలిపోయింది.. ఆ తల్లి ! నర్శిం తీసుకొచ్చేసాడు. గొడవలూ, ఆందోళనలూ… కన్నీళ్లూ, ఎగజిమ్మిన ఆక్రోశాలూ ! తల్లి ఇంటికొచ్చేసింది.

రెండో రోజు… నక్షత్ర తల్లి దగ్గరకు వచ్చేడు. అమ్మా అని పిలిచేడు. ఇటు చూడన్నాడు. తల్లి చూసింది. నక్షత్రమండలానికీ, భూమండలానికీ మధ్య కన్పించేడు. ఎర్రెర్రగా, నీలినీలిగా వున్నాడు. మొహం కాంతివంతంగా వుంది. ఏ కొత్త బతుకునో అందుకోబోతున్న వాడిలా వున్నాడు. నవ్వేడు. ఆ నవ్వే ఆమెకిష్టం. చిన్నప్పటి నుంచీ యెలా వచ్చిందోగానీ వాడికి ఆ నవ్వు – పున్నమిచంద్రుడిలా ముచ్చటేస్తుంది. ఆమె కూడా నవ్వింది. యేడ్వకన్నాడు. నీ దగ్గర నుంచి అమ్మమ్మ దగ్గరకు వచ్చేనంతే. కాదు, కాదు. అమ్మమ్మ దగ్గరకు యింకా చేరలేదు. పదకొండోరోజు మీరేదో క్రతువు చేస్తేగానీ ఆత్మ బయటపడదని బేమ్మర్లంటారుగదా అన్నాడు.

బ్రాహ్మణ్లను అలా బేమ్మలనీ, బాపన్లనీ పల్లెవాళ్ల పలుకు బడిలో పలుకుతాడు నక్షత్ర ! నక్షత్రకు ఓ బ్రాహ్మణ స్నేహితుడున్నాడు. అతణ్ణి మాత్రం – నువ్వు బ్రాహ్మల్లో తప్ప బుట్టేవయ్యా అంటాడు.

” … అతను కూడా యేడుస్తున్నాడమ్మా. యిపుడే అతనికి యేడ్వద్దని చెప్పొచ్చా. మరోజన్మలో నువ్వు మా కులం లోనా, నేను నీ కులంలోనా పుట్టి ఒకరి రుణం మరొకరం తీర్చేసుకుందాంలే అనన్నానమ్మా ” అని చెప్పేడు.

ఆ తల్లికంతా అయోమయంగా వుంది. నక్షత్ర మళ్లీ తల్లితో –

” … ఈ పదకొండు రోజులూ నీతోనే వుంటానమ్మా. పదకొండు జన్మలకు సరిపోయే ఊసులాడుకుందాం, పదకొండుజన్మల అనుభూతిని మూటగట్టుకుందాం… లే.. ” అన్నాడు. లేచింది తల్లి. నాల్రోజులుగా ఊసులే ఊసులు…

ఇందిరమ్మకోలనీ ట్విన్ను ఒక భాగంలో వుంటుందామె. ఇద్దరు కూతుళ్లు, మరో అబ్బాయీ సంతానం. ఉదయం పదిన్నరవేళ. ట్టిన్ను ముందరి గడపలో శీతకాలపు ఎండ పడే చోట కూచుంది. కూతుళ్లూ, కొడుకూ బయటకు వెళిపోయేరు. సెలవులకు ఇంటికొచ్చిన నక్షత్ర రాత్రి బాగా లేటుగా పడుకున్నాడేమో ఎండవేళకి లేచేడు. కళ్లు పులుముకుంటూ గడపలోకి వచ్చేడు. తల్లి ఎండపట్టున దిగాలుగా కూచోడం చూసేడు. ఆమెకు దగ్గరగా వచ్చి కూచుని –

” రాత్రి మంచి కల వచ్చిందమ్మా. అమ్మమ్మ దేవుడిని బతిమాలుకొని కిందకి వచ్చి నన్ను తీసుకెళ్లింది. దేవుడేమో నన్ను చూసి పలకరించేడు. మీ అమ్మమ్మ యెప్పుడూ నీ గురించే మాటాడుతుంటుంది. నీ ధ్యాసే ఆమెకు. నువ్వు వచ్చేయగూడదూ అమ్మమ్మ దగ్గరకూ అనన్నాడు. నేనాయన అడిగినదానికి బదులివ్వకుండా – ఇక్కడేమేమి వున్నాయీ అనడిగేను. దేవుడికి బోధపడలే. అమ్మమ్మే జవాబిచ్చింది. అన్నీ వున్నాయనీ, నక్షత్ర మండలం చూడచక్కగా వుంటాదనీ చెప్పింది. ఒకో నక్షత్రం ఒక దేశంలా వుంటాదట. మన భూమండలంలో వున్నంత మంది కాదుగానీ మోస్తరుగా వుంటారట మొత్తం నక్షత్ర మండలమంతా కలిపితే ! అందరూ బాగుంటారట. ఎవరికీ యే బాధా వుండదట. పనిచేయడం, తినడం, పాటలు పాడుకోవడం, ఆటలాడుకోవడం, నృత్యాలూ – ఒవ్వో అనంది. అందరూ ఉమ్మడిగా వుంటారట. స్వంతమనేదేదీ ఎవరికీ వుండదట, గానీ అందరికీ అన్నీ స్వంతమట…. ” అనన్నాడు. ఆ మాటలు తల్లికి అర్ధంకాలేదు. ప్రశ్నించబోయింది. కానీ నక్షత్ర తన ధోరణిలో తాను –

” … దేవుడు ఒక్కోరోజు ఒక్కో మండలంలో వుంటాడట. అమ్మమ్మ వాళ్ల మండలానికి దేవుడు  వచ్చిన నాడు పర్మిషన్ అడిగిందట, నన్ను తీసుకురాడానికి ! మళ్లీ నేను వెళ్లే రోజుకి దేవుడు వచ్చేడు. మరి ఇక్కడ చదువుకొనే స్కూల్లూ, కాలేజీలూ, యూనివర్సిటీలూ వుంటాయా అనడిగేను. నక్షత్రమండలమ్మీద పరిశోధనకి నాకు అవకాశమిస్తారా – అనడిగేను. దేవుడు యెందుకో నవ్వేడు. మా వీసీ కూడా అలాగే నవ్వుతాడు. పరిశోధనకు వచ్చేం సార్ అని భక్తిగా నమస్కరించి చెపుతామా, యిలగే నవ్వుతాడు. ఆ నవ్వు మా వెన్నుపూసల ఇల్లు కట్టేసుకొని వుండిపోయిందమ్మా.

ఎస్, ఆ రోజు యిలాగే నవ్వి, ఆ తర్వాత ప్రతీవాడూ పరిశోధకుడే. గోంగూర కంటే చవకయిపోయింది పరిశోధనన్నాడు వీ.సీ. అపుడు, గోంగూర కంటే చవకయితే మాలాంటోళ్లెంతమందో పరిశోధకులయిపోయుండాలి కదా ? అన్పించింది. ఆ మాటే అన్నాను వీసీతో. కళ్లెర్రజేసి, వేలు చూపి అక్కడికి ఫో అనన్నాడు. వెళ్లేను. అక్కడ ఒకాయన వున్నాడు. తెల్లగా వున్నాడు. షర్టూ, ఫ్యేంటూ వేసుకున్నాడు గానీ – అవి పంచే, లాల్చీల్లా వున్నాయి. మనూరి బేమ్మడిలా నుదుటన బొట్టూ, మండకి ఎర్రని దారాల కట్టా… ! నా మీదకి చూపు విసిరి, కొద్దిగా యెడంగా జరిగి చేయి చాపాడు. నా సర్టిఫికేట్ల  ఫైలిచ్చాను. చూసేడు. నోటి నిండా కిల్లీ ! సర్టిఫికేట్ లు చూడగానే ఉమ్మొచ్చిందేమో, అవతలకి నడిచి ఉమ్మేడు. చేత్తో నోరు తుడుచుకొని, ఆచేత్తో నా  ఫైలు పట్టుకున్నాడు. కిల్లీ మరక నా ఫైలుకి అంటుకుంది. అదోలా అన్పించింది.. ఆ మరక నాకే అంటినట్టు. ఫరవాలేదు, మరక పోయిందిగా అడ్వర్టయిజ్ మెంటు అప్పుడే గుర్తొచ్చి, నవ్వొచ్చింది. ఆయనకి కోపమొచ్చింది. ఇది, మీ వాడ కాదు. ఎవడు బడితే వాడు, ఎపుడుబడితే అపుడు, ఎలాబడితే అలా నవ్వీడానికి అనన్నాడు. నవ్వడానికి కూడా సమయాలూ, అర్హతలూ వుంటాయని రూల్స్ చూపించేడాయన తన కోపంతో ! అప్పుడు చుట్టూ చూస్తే  నవ్వడం తెలీని జీవుల్లాగ ఆ ప్రాంతంలో చాలామంది కుర్రాళ్లు కన్పించేరు. వెళ్లూ – అని దీర్ఘం తీసి వేలు చూపించేడా పంచెకట్టు ఫేంటాయన. ఎటు వెళ్లాలో తెలీక నిల్చుంటే  ఫైలు విసరబోయేడు, చేను మీద పడే పిట్టల మీదకి రాళ్లు విసిరేట్టు ! నేను ఎగిరిపోయేను, కాదు యెవరో కుర్రాడొచ్చి హాస్టల్ కి తీసుకుపోయేడు….

తల్లి కళ్లల్లో నీళ్లు తిరిగేయి…. కొడుకు కల చెప్తున్నాడా, తన రోజువారీ అనుభవాలు చెప్తున్నాడా ? కల చెప్పరా, నాయనా అనందామనుకుంది. కల ఆమెకు గూడా బాగుంది. దేవుడు, నక్షత్రమండలం, తన తల్లీ… వినడానికి సంతోషంగా వున్నాయి.

అంతలో ఆమెకిదంతా గతంలో నక్షత్ర చెప్పిన కల అనీ గ్యాపకమొచ్చింది. దుఖం పొంగుకు వచ్చింది.

నర్శిం అప్పటికి తేరుకున్నాడు. కాసేపు ఆమెతో యేమేమో మాటాడేడు. సంస్మరణ సభలూ, ధర్నాకార్యక్రమాలూ యేవేవో జరుగబోతున్నాయనీ… ఆమె వీటిల్లో పాల్గొనాలనీ, కొడుకు కోసమే కాదు, అలాంటి మరికొందరు కొడుకుల్లాంటి వాళ్ల బతుకుల కొరకు దుఖాన్ని దిగమింగుకోవాలనీ చెప్పేడు. ఆమె విన్నది. పక్కనే వున్న నక్షత్ర తల్లి మొహంలోకి చూసేడు – యేమనుకుంటున్నాదోనని. ఆమె మొహంలో యే భావమూ కనబడలేదు. ఇపుడే కాదు, యెపుడూ ఆమె మొహంలో యే భావమూ కనబడదు. గుండ్రటి మొహం, విశాలమయిన నుదురు, ఆవుకళ్లల్లా నల్లకళ్లూ… !

అప్పటికామె తెరిపిన పడినట్టుంది. నర్శిం కూడా వెళ్తానని లేచేడు. ప్రక్క టౌనులో అంబేద్కర్ సంఘం వారు సంస్మరణ సభ పెడతారట, రమ్మన్నారు. తయారయి వుండమనీ, అరగంటలో వస్తానని చెప్పి నర్శిం వెళిపోయేడు. ఆమె కూడా లేచింది.

అప్పుడే టీ.వీ. లో నక్షత్రఫోటో, తనగురించిన వార్తలూ వస్తున్నాయి… ఒక నాయకుడు, యేదో సభలో ఉపన్యసిస్తూ… దేశమాత ఒక బిడ్డను కోల్పోయిందనన్నాడు. నక్షత్రకు నవ్వాగలేదు. చప్పట్లు కొడుతూ, గెంతుతూ నవ్వుతూ -అమ్మా, నువ్వు కాదట, దేశమాత ఒక బిడ్డని కోల్పోయిందట ! నువ్వేమో నీ బిడ్డని కోల్పోయేవని యేడుస్తావు. అదేంటమ్మా. తప్పు, తప్పు అనన్నాడు. ఆమె టీ.వీ. వేపు చూసి, ఒక నిట్టూర్పు విడిచి స్నానానికి వెళిపోయింది.

నక్షత్ర కాసేపు తన ఇంట్లో తిరిగేడు. తండ్రి తమను వదిలేసి వెళిపోయిన తర్వాత బతకడానికి తల్లి కూలీనాలీ పనులకు వెళ్లడం, అలసి, సొలసి యింటికి చేరడం… భూమి కంపించినట్టుగా… రాత్రుళ్లు ఒకోసారి తల్లి కుమిలికుమిలి యేడ్వడం. మెలకువ వచ్చేది. తల్లిని కరచుకొని పడుకొనేవాడు. ఇక్కడే, యీ అరుగు మీదే, యీ తుంగచాప మీదనే ! కాసేపు వాలేడు దానిమీద.

ఆ తర్వాత పక్కింటి వేపు చూసేడు. అది జానేసు ఇల్లు. జానేసెపుడూ రాత్రివేళ మంచిపదాలు పాడేవాడు. అది గెడ్డా, యిది గెడ్డా – నడిమిన పడిందిరా నాయుడోరి పడ్డా అనే పాటా ; రాక రాక వచ్చేనమ్మా గోంగూరకీ… గోంగూరకీ… పాటా, యిలాటివే యేవేవో పాటలు ! జానేసు భార్య – తొంగోరాదా, రాత్రేళ యీ పాటలేటి, అని కేకేసేది. ఆ పాటలెందుకు మానేసాడో మానేసి… ఒత్తన్నాడొత్తన్నాడు, ఆ భూములున్న బుగతోడు, సూడు సూడు పోలీసులతోడు తోడు… పాటలకి మారేడు. ఆ పాటలు  పాడుతున్నాడని పోలీసులొచ్చేరు, పట్టుకుపోయేరు. తర్వాత యేమయ్యేడో తెలీదు. జానేసు భార్య నిద్రరాక యిపుడు… నీ దయలేదా యేసా, పాడతోంది.

నక్షత్రకు మళ్లీ యనివర్సిటీ కేంపస్ గుర్తొచ్చింది. నాలుగురోజులుగా ఆత్మ అక్కడా, యిక్కడా తిరుగుతోంది. విశాల భవంతులు, ఇరుకిరుకు గుండెల ఆచార్యులు. ఆచార్యులన్న పదానికి నవ్వుకున్నాడు. ద్రోణాచార్యులవారి వారసత్వమింకా దిగ్విజయంగా కొనసాగుతోంది. హుం…

బొటనవేళిని వెనక్కి మడచి, ఎర్రని గుడ్డ కట్టి… వెలివాడలో తిరుగుతున్నాడు… ధృవ. అతణ్ణి అనుసరించుతూ… అరుంధతి, భాగ్య మరో యిద్దరూ బొటనవేళికి ఎర్రనిగుడ్డ చుట్టుకున్నారు. నక్షత్రకు వాళ్ల వేళ్లను స్పర్శించాలన్పించింది. తన స్మారకస్తూపం ముందర శోకమూర్తులై… వందలాది సహచరులు… జోహార్ నక్షత్ర…. జోహార్ ; మనువాదం నశించాలి… నినాదాలు ! నక్షత్రకు నినాదమివ్వాలన్పించింది. పిడికిలి బిగించబోతే వేళ్లు మడతబడడం లేదు. నోరు పెగలడం లేదు. సహచర సమూహమంతా రంగభూమిలో వీరుల్లా కన్పిస్తుంటే – కళ్లల్లో నీళ్లు తిరిగేయి నక్షత్రకు. బతికుండాల్సిందన్పించింది… నక్షత్రకప్పుడు !

హుం… బతుకూ, చావూ కేవలం నా చేతిలో లేదు… అననుకున్నాడు నక్షత్ర ! చాలా సేపు దుఖించేడు. బతకడానికి యెన్నెన్ని కష్టాలు అనుభవించేను ? నా కంటే నా తల్లి యింకా కష్టాలు అనుభవించింది. ఇన్ని కష్టాల తర్వాత, యింత శ్రమ తర్వాత గూడా భవిష్యత్ చీకటి, చీకటిగా.. !? అమ్మా, నీ గర్భకుహరంలోకి మళ్లీ వెళ్లే అవకాశం వుంటే యెంతబాగుణ్ను ! కాదు, చనిపోతే నక్షత్రమండలం చూడొచ్చు… నక్షత్రా అని ఇందుకేనా అమ్మా నాకు పేరుపెట్టేవు ? నక్షత్ర మనసులో అనేక విషయాలొక్కసారిగా ఆకాశంలో రెక్కలుగొట్టుకు యెగిరే పిట్టల్లా యెగురుతున్నాయి.

రోజూ యెందుకో ఒకందుకు మేమే దోషులుగా వీసీకి, మిగిలిన ఆచార్యులకూ కనబడతాం. రేషన్ కట్, స్కాలర్ షిప్ కట్, క్లాస్ కట్, డిగ్రీ కట్ ! ఒరేయ్, మీ ఫ్యూచర్ కట్ రా… యూనివర్సిటీ గోడల్లో ప్రతిధ్వనిస్తుంటాయి ! ఏలికలారా, మా బతుకుల పాలకులారా… ఎన్నెన్ని ఆయుధాలున్నాయి మీదగ్గర ? మా దగ్గర పిడికిళ్లు మాత్రమే వున్నాయి. అవే మీ కళ్లకు.. ఫిరంగులో, పిడుగులో !

గురుద్రోహులని పూర్వం శిక్షించేవాళ్లు, యిపుడు రాజద్రోహులని శిక్షిస్తున్నారమ్మా – అనన్నాడు తల్లితో ! అప్పుడే ఆమె చీరకట్టుకొని, బయటకు వెళ్లటానికి సిద్ధమై వచ్చింది.

అమ్మా, కొంచెం విచారంగా వున్నట్టు కన్పించమ్మా.. అన్నాడు నక్షత్ర.. ఆశ్చర్యపోయింది తల్లి. నేనలా కన్పించటంలేదా ? నాయినా, విచారం లేని క్షణమేది నా జీవితంలో ? నీకెలా కన్పించానోగానీ, పాడుబడిన ఇల్లులా వుంటావంటారంతా నన్ను ! అనగూడదుగానీ, అందుకనే నా కోసం మగపురుగేనాడూ రాలేదు అనంది. నక్షత్ర నొచ్చుకున్నాడు. అనవసర వ్యాఖ్యతో తల్లిని బాధపెట్టేననుకున్నాడు. నిజమే, అమ్మ.. దుఖపుమూటలా వుంది.

అప్పుడే నర్శిం తిరిగొచ్చేడు – దళితసంఘాలవారు సభ అన్నారుగానీ, మళ్లీ యెందుకో రద్దు చేసుకున్నారు. ప్రెస్ మీట్ మాత్రమే పెడతన్నారట. దానికి మనమెందుకు ? అని ప్రశ్నించేడు నర్శిం. తల్లికేమి చెప్పాలో బోధపడలేదు. నక్షత్రకు ఆ వార్త యేదో సంశయాన్ని కలిగించింది. అంతలోనే.. ఛఛా అనుకున్నాడు. తానెప్పుడూ అన్నింటినీ సంశయించడం వలననే యిలా… అని ఆత్మవిమర్శ చేసుకున్నాడు.

అప్పుడు నక్షత్ర చెంప ఛెళ్లు మన్పించింది… ఆత్మ ! నేనెన్నడూ విమర్శ చేసుకోలేదు. నువ్వెవడివిరా ఆత్మవిమర్శ అనడానికని అడిగింది. నక్షత్ర చెంప తడుముకున్నాడు. ఓహో… నా కిపుడు స్వవిమర్శ చేసుకునే అవకాశంగూడా లేదన్నమాట ! జీవించినపుడు… పరవిమర్శ చేయగూడదు. మరణించేక ఆత్మవిమర్శ చేయగూడదు అననుకున్నాడు మనసులో. ఆత్మ దానికీ ఒప్పుకోలేదు. ఆత్మ విమర్శ యెపుడూ చేసుకోవచ్చు. ఎవరయినా చేసుకోవచ్చు. గానీ నీకు ఆ అవకాశం లేదు. నువ్వు చనిపోవాలనుకున్నపుడు ఆత్మను అడిగేవా ? అడక్కుండా ఉరిబోసుకు చచ్చేవు. దమ్ముంటే నిన్ను యిబ్బంది పెట్టినోడ్ని చంపవొల్సింది. నన్ను చంపావెందుకురా ? ఎవడ్రా యీ చావుకి ఆత్మహత్య అని పేరుపెట్టింది. ఆత్మను హత్య చేసిన హంతకుడివి నువ్వు… ఆత్మ రెచ్చిపోసాగింది. నక్షత్ర మరణించి కూడా దోషిగా కనబడుతున్నందుకు చింతించసాగేడు… అప్పుడే, వీ.సీ. గారి మాటలు గుర్తొచ్చేయి…

” … చదువుకోసం రాలేదండీ. హాస్టల్ భోజనం, స్కాలర్ షిప్, బేఖాతర్ తిరుగులూ… వీటి కోసం వచ్చేరు. వీళ్లింతేనండీ. ఆ కుర్రాళ్లు చూడండి, చక్కగా భరతమాత భజన చేస్తారు. రామాయణం పారాయణం చేస్తారు. గురుపూజలు చేస్తారు. ద్రోణాచార్యుల పీఠానికి మాలలు వేస్తారు. స్వామీజీలని రప్పించి సభలు పెడతారు. ముద్దొస్తారు… ముండాకొడుకులు.. ” అని మురిపెంగా వీసీ యెవరితోనో చెప్తున్నాడు.

ముద్దొచ్చినా ముండ కొడుకులేనా- నీ నోట్లో మూత్రం పొయ్యా… మనసులో అనుకున్నాడు నక్షత్ర.. కాసేపు గదిద్వారం దగ్గర నిల్చున్నాడు. ఆ మధ్య  -దళిత విద్యార్ధులూ, బహుజన విద్యార్ధులూ కలిసి ‘ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ‘ పెట్టుకున్నారు. అసోసియేషన్ వివరాలను రాసిచ్చి -ఇక నుంచీ విద్యార్ధుల సమస్యలేవేనా అసోసియేషన్ రిప్రజెంట్ చేస్తుందని చెప్పి వద్దామని వెళ్లేరు. రిప్రజెంటేషన్ తీసుకున్నాక వీ.సీ…. ఎదురుగా వున్నాయనతో అవీ మాటలు.

మళ్లీ నిల్చున్న నక్షత్రావాళ్ల వేపు వేళ్లు చూపి, ఎదుటవ్యక్తితో –

” ..వీళ్లో… రాజకీయాలు మాటాడతారు ? రాజ్యాంగమూ, హక్కులూ అంటారండీ ! ఎందుకండీ అవన్నీ ? అసలీ ప్రశ్నలేమిటండీ ఆచార్యుల మీద శిష్యులు ? ఎక్కడేనా వుందా ? వ్రేళడిగితే వ్రేళూ, శిరసడిగితే శిరసూ యిచ్చేయలేదండీ పురాణకాలం శిష్యులు ? పోయే కాలం, పిదపబుద్ధులూ ! ” కులపతి సెలవిచ్చుతున్నారు. ఎదుటివ్యక్తి – కాదు కాదు, పిదపబుద్ధులు కావు, విదేశీబుద్ధులు ! దేశద్రోహబుద్ధులు అని సవరించేడు. నక్షత్రకు యిపుడు తను సాధారణ నేరస్తుడు కాడనీ, దేశద్రోహి నేరస్తుడనీ అర్ధమవుతోంది…..

తల్లి గడపలో ఒక మూలకు చేరబడి కూచుంది. నర్శిం – ప్రెస్ మీట్ కోసం అంత కష్టపడి వెళ్లొద్దులే ! నాకో పని వుంది, చూసుకొని సాయంత్రం వస్తాను. ఒకటి మాత్రం ఖాయం -నక్షత్ర చావుకి కారణమయిన వారిని శిక్షించాకగానీ, నక్షత్ర అస్తికల నిమజ్జనం చేయొద్దని కరాఖండిగా ఒక ప్రకటనలాగా చెప్పి వెళిపోయేడు.

తల్లి- నక్షత్రను వదిలేది లేదు, నా గర్భంలో దాచేసుకుంటానని మనసులో గట్టిగా అనుకున్నది. సరిగ్గా అప్పుడే నక్షత్ర – అమ్మా, నీ ఒడిలో బజ్జుంతా, వొక జోలపాట పాడవా అనడిగేడు. తల్లి ఒడిలో బజ్జున్నాడు. తల్లి జోకొడుతూ – జోముకుందా, జోజోముకుందా… లాలి పరమానంద… లోగొంతుకతో పాడగా, నక్షత్ర ఒడిలోంచి లేచి – ముకుందుడూ లేడు పరమానందుడూ లేడు. మన పాట పాడే తల్లీ అనన్నాడు ! రావనాసెందునాలో యెన్నెలా, రాజా నీకొందనాలో… యెన్నెలా యెత్తుకుంది తల్లి ! నక్షత్రకు మెల్లగా నిద్ర కమ్ముకుంటోంది.

కొంతసేపటికి… వీధిలో ఒక పెద్ద ఊరేగింపు – నీలిసలాం, లాల్ సలాం… నీలాల్ సలాం నినాదాల్తో వస్తోంది ! నర్శిం గొంతునరాలు బిగించి నినదిస్తున్నాడు. తల్లి గభాల్న లేచి వీధిలోకి నడచింది. తమ ఊరి యువకులూ, పొరుగూరి యువకులూ యెందరో పిడికిల్లు బిగించి నినదిస్తున్నారు… పరికించి చూడగా అందరూ నక్షత్ర లాగే కనిపిస్తున్నారు. కళ్లు పులుముకొని మళ్లీ చూసింది… నక్షత్రలే కన్పించేరు. ఆ తల్లికి వాళ్లంతా తన బిడ్డలే అన్పించి కళ్లు తుడుచుకుంది… భ్రమలోంచీ, కలలోంచీ బయటపడి, వాస్తవంలోకి వచ్చి సమూహంలో కలిసింది !

*

చావు వెల

 

-బాలసుధాకర్ మౌళి

~

 

వానకి
వొరిగిన చేలు లెక్కనే
తలవాల్చి
ప్రశాంతంగా నిద్రిస్తున్న
దేహమెవరిదో..
చావుని
పిలిచి మరీ
కౌగిలించుకున్న ఆ ధీశాలెవరో..
తల్లీ- బిడ్డలను
ఎవరి మానాన వాళ్లనొదిలేసి
వుత్తచేతులతో కదిలిపోడానికి
నమ్మకమెక్కడినుంచొచ్చిందో..
ఎవరో
ఏ ప్రాంతమో
ఏ కన్నీళ్ల కథానాయకుడో –

నెత్తురు
గంగవెర్రులెత్తుతుంది
రైతు
ఆత్మహత్య చేసుకున్నాడంటున్నావా
నిజమేనా
నమ్ముతావా
– రైతు కాదురా
తరాల శోకాన్నీ దిగుళ్లనీ కన్నీళ్లనీ
మోసి మోసి
బరువెక్కి – తేలికయి
ఆనందనేత్రాలతో
పారవశ్యం చెంది
అలసి అలసి – తిరిగి శక్తివంతమయి
నిలబడిన
నేలరా –
బువ్వపెట్టిన నేలరా
నేలరా
ఆత్మహత్య చేసుకుంది
కోటానుకోట్ల
కాంతిపుంజాల చేతులతో
నోటి ముందు ఇంత అన్నం ముద్దనుంచిన
తల్లినేలరా
నేలరా- ఆత్మహత్య చేసుకుంది

పాట పాడే నేల
ఆత్మహత్య చేసుకుంది
పాదం కదిపే నేల
ఆత్మహత్య చేసుకుంది
మనిషి మనిషంతా నేలగా మారి
నేలే మనిషై ఆత్మహత్య చేసుకుంది

నేల చుట్టూ
చేరి
పిచ్చిచూపులు చూస్తున్న
ఆ పసివాళ్ల సంగతో
పసివాళ్ల జీవితాలను ప్రాణంపెట్టి సాకాల్సిన
ఆ తల్లి సంగతో
పోనీ
డేగలా
నెత్తిన కూర్చున్న అప్పుసంగతైనా
చెప్పగలవా –
పోనీ
వాడు కట్టిన
‘చావు వెల’ సంగతి ?

*

మానవ హృదయం చేసిన తిరుగుబాట్లు!

-అవ్వారి నాగరాజు
~

చేర రాజు పెరుమాళ్‍కు ఒక చిత్రమైన కల వొచ్చిందట.
ఆ కలలో అర్థచంద్రాకృతిలో ఉన్న  చంద్రుడు రెండుగా చీలిపోయినదట. ఆ కలకు భావమేమిటొ కనుగొనాలని రాజు తన ఆస్థానంలోని పండితులందరినీ అడిగి చూసాడట. కానీ వారు ఇచ్చిన వివరణలేవీ అతనికి సంతృప్తినివ్వలేదట. అంతలో అతని సమాచార బృందం అతనికి, ఒక అరబ్ నావికుల బృందం తమ తీరం మీదుగా ప్రయాణిస్తున్నదనీ, ఆ ఓడలో అనేక మంది వర్తకులతో పాటుగా మత ధార్మికవేత్తలు కూడా ఉన్నారని ఆయనకు సమాచారమిచ్చిందట. రాజుకు అంతకు ముందే ఇస్లాం మత ధార్మిక వేత్తల పాండిత్యం గురించి పరిచయం ఉన్నది కాబట్టి, వారిని కూడా అడిగి చూతామని ఆలోచన కలిగిందట. రాజు తలిచినదే తడవుగా ఆ పండితులను ఆయన ముందర హాజరు పరిచారట.

అపుడు వారు రాజు చెప్పిన కలను సావధానంగా విని అది ఒక మార్మికమైన వృత్తాంత్తంగా, మహ్మద్ ప్రవక్త పిలుపుగా ఆయనకు తెలియ జేసి వెళ్ళిపోయారట. అపుడు రాజు ఏకాంత మందిరంలో తన ఆంతరంగికులతో చింతన చేసి, తన రాజ్యాన్ని కొన్ని  భాగాలుగా చేసి,  అర్హులైన వారి నాయకత్వం కింద అప్పగించి మహ్మద్ ప్రవక్తను కలిసేందుకు మదీనాకు తరలిపోయాడట. మహ్మద్ ప్రవక్త సాంగత్యంలో ఆయన అక్కడే ఇస్లాంను స్వీకరించాడట. అటు తర్వాత అక్కడ కొంత కాలం గడిపి, తిరిగి వస్తూ ఉండగా అనారోగ్యంతో ఒమన్‍లోని సలాలహ్ వద్ద దేహాన్ని విడిచాడట.

భారత దేశ తాత్విక చింతనలో ఇస్లాం ప్రభావాన్ని తెలిపే గాధలలో ఇది ఒకటి. చేరమాన్ రాజు ఉనికి, అతని కాలమూ, అతను కాంచిన అద్భుతమైన కల, అతను చేసిన ప్రయాణము – మొదలైన వాటిపై చరిత్రకారులలో వాదవివాదాలు ఉన్న మాట వాస్తవమే. రాజు మదీన వెళ్లిన మాట నిజమే కానీ ఆ ప్రయాణం పక్కా వ్యాపార లావాదేవీలకు సంబంధించిందిలెమ్మని చెప్పే వాళ్ళూ ఉన్నారు. కానీ అతని రాజధాని కొడంగుళ్ళూరు (కేరళ)లో మాత్రం అతని పేరు మీద ఒక మసీదు వెలసింది. ఇది భారత దేశంలోనే అత్యంత ప్రాచీనమైన మసీదులలో ఒకటిగా గుర్తింపబడింది. క్రీశ 629నుండీ ఇది ఇక్కడి నేల మీద ఒక చారిత్రక సంగమంగా సమున్నతంగా నిలబడి ఉంది.

ఈ నేలమీదకు ఇస్లాం రాక నిజంగా చారిత్రక సంగమమే. అది మనకు పరిచయంలేని నియో ప్లాటినిజం, యూదు, క్రైస్తవ వంటి అనేక  తాత్విక భావధారలనూ, మత సాంప్రదాయాలనూ, ఆచారాలనూ, ధిక్కారాలనూ తనలో కలగలుపుకొని ఈ నేలమీదకు మోసుకొని వచ్చింది. ఇస్లాం, సూఫీల  రూపంలో ఆయా తాత్విక భావ దారలు ఇక్కడ పాదుకొని, నేల నాలుగు చెరుగులా ప్రవహించి, ఇక్కడి మట్టిలోనికి ఇంకి “సంగమం” అనే మాటకు విన సొంపయిన అర్థాన్ని తెచ్చిపెట్టాయి. సరిగ్గా ఈ అర్థం నుండే, సహజీవన విలువలను ప్రస్తుతిస్తూ  తాత్వికుడూ, కవీ అయిన షాజాహాన్ కుమారుడు దారాషికోహ్ తన సూఫీ తాత్విక గ్రంథానికి “రెండు సముద్రాల సంగమం” అని పేరు పెట్టాడు.

రాబియా గురించి మార్గరేట్ స్మిత్ అనే మతతాత్విక విమర్శకురాలి విమర్శను పూర్వ పక్షం చేస్తూ, లూయిస్ మాసింగ్సన్ “సంగమం” (కాన్ఫ్లుయెన్స్) అనే మాటను ఉపయోగించాడు. ఏదైనా ఒక కొత్త ధోరణి లేదా విశ్వాసం ఉనికిలోకి వచ్చినపుడు దానిని  ఒక మతానికీ మరో మతానికీ అంటుకట్టకుండా(హైబ్రిడైజేషన్), ఆయా మత భావాల పుట్ట్టుక, పరిణామాలతో పాటుగా ఆయా స్థల కాలాల నాటికి  ఉనికిలో ఉన్న ఇతర ప్రాభావికమైన అంశాలను కూడా పరిగణనలో తీసుకోవాలని చెబుతూ, ఈ విషయాలను  సూఫీయిజం పుట్టుకకు అన్వయించి చెబుతాడు. మన దేశంలోని మత సాంప్రదాయాలతో సూఫీ, ఇస్లాంల పారస్పరిక ప్రభావాలను పరిగణనలోకి తీసుకునేటప్పుడు కూడా ఇదే పద్ధతిని పాటించాల్సి ఉంటుంది.

భారత దేశంలో ముస్లీం పాలన ఏర్పడక ముందునుండే దేశ దక్షణ కోస్తాకు అరబ్, పర్షియా, ఈజిప్టు, ఇతర మధ్యప్రాచ్య ప్రాంతాలకు చెందిన ముస్లీంలతో సంబంధ బాంధవ్యాలున్నాయి. భారత దేశానికి ఇస్లాంతో ఏర్పడిన సంబంధాలను చరిత్రకారులు మూడు రకాలుగా వివరిస్తున్నారు. దేశ దక్షణ కోస్తా పశ్చిమ ప్రాంతానికి ఇస్లాం ఆవిర్భావానికి ముందు నుండే ఆయా దేశాల వర్తకులు రాకపోకలు సాగించేవారు. ఇస్లాం ఉనికిలోకి వచ్చాక వర్తకులతో పాటుగా మిషనరీలు కూడా ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలతో సంబంధాలను ఏర్పరుచుకున్నారు. స్థానిక ప్రజలలో భాగంగా కలిసిపోయారు. మోపిల్లాలు దీనికి ఉదాహరణ. దీనికి తోడుగా ఉమయ్యాడ్‍ల కాలంలో సింధ్ ప్రాంతంమీదకు చేసిన దాడులు, ఆక్రమణలు స్థానిక ప్రజలకు ఇస్లాంను, సూఫీలను పరిచయం చేసాయి. ఈ రెంటితో పాటుగా క్రమ పద్ధతిలో  పదవ శతాబ్ధం నుండి చేసిన దాడులు, వలసలు, రాజ్యాల స్థాపన, వీటికి తోడుగా పదమూడవ శతాబ్ధంలో మంగోలుల దండయాత్రల వల్ల ముస్లీం ప్రాభల్య ప్రాంతాలు స్థిరత్వాన్ని కోల్పోయి అనేకమంది ఇస్లాం పండితులు, సూఫీలు ఢిల్లీ సుల్తానుల ఆశ్రమాన్ని కోరి ఢిల్లీని చేరడం, ఆక్కడ నుండీ వివిధ ప్రాంతాలలో స్థిర పడడ-. ఈ సంఘటనను చరిత్రకారులు కాన్‍స్టాంట్‍నోపిల్ పతనంతో పోలుస్తున్నారు.

దేశ దక్షణ కోస్తా పశ్చిమ ప్రాంతం మిగిలిన అన్ని ప్రాంతాల కన్నా ముందుగా ఇస్లాం ప్రభావానికి గురి  కావడం వల్ల దాని మతతాత్విక వ్యక్తీకరణలలో అది  గొప్ప కుదుపుకు లోనయ్యింది. ఇది భక్తి ఉద్యమం రూపంలో ఇక్కడ వ్యక్తమయ్యింది. మధ్య యుగాల సామాజికమార్పులకు ఈ ప్రాంతం వేగుచుక్కగా నిలిచింది.
ఈ ప్రాంతంలో ఇస్లాం వచ్చే నాటికి వివిధ తెగల, జాతుల సాంస్కృతిక మతపర సంకేతాలు ఒక దానితో మరొకటి ఘర్షణ, ఐక్యతలను పొంది సరికొత్త దేవుళ్ళూ, మత సంకేతాలూ ఏర్పడ్డాయి. కుల వ్యవస్థ స్థిరపడింది. మతాలు వ్యవస్థీకరణ రూపాన్నిపొంది బ్రాహ్మణీకరింపబడ్డాయి. బౌద్ధ, జైన మతాలు అనేక చీలికలుగా మారి తమ ప్రభావాన్ని చూపెడుతున్నాయి. అయితే ఏకేశ్వరారాధన ఇంకా బలపడలేదు. ఒకే దేవుని కింద మత విశ్వాసాలు బలాన్ని పుంజుకోలేదు. ఒకే దేవుడి గురించిన భావనలు ఉపనిషత్తులలోనూ, వేదానంతర సాహిత్యంలోనూ కనిపించినప్పటికీ అవి తాత్విక పరిభాషలోనూ, తర్కపరమైన చర్చల్లోనూ ఉంటూ,  సమాజంలోని పైస్థాయి పండిత చర్చలుగానే ఉండిపోయాయి. అంతేగానీ సామాన్య ప్రజల వ్యక్తీకరణలుగా అవి పాదుకోనలేదు. ఈ అంతరం సమాజంలోని ప్రజల మధ్య ఉన్న సామాజికార్ధిక విభనను సూచిస్తున్నది. వేదకాలపు కర్మకాండకు వ్యతిరేకంగా వచ్చిన బౌద్ధ, జైన మతాలు నాస్తిక మతాలుగా ప్రజలకు పరిచయమయ్యాయి. బౌద్ధం అటు తర్వాత మహాయాన బౌద్ధంగా మార్పు చెంది, బుద్ధున్ని దేవునిగా మార్చినప్పటికీ అది వేడుకలు, ఉత్సవాలకు ఆలవాలమై కేవలం విగ్రహారాధానను మాత్రమే మిగుల్చుకున్నది. అందువల్ల అప్పటి సామాన్య ప్రజల ఆధ్యాత్మిక అవసరాలకు సరిపోయేదిగా కాలేక పోయింది. ఇస్లాం ఈ లోటును పూరించేందుకు తగిన దన్నును అందించగలిగింది.

ఇస్లాం సాధారణ ప్రజల వ్యక్తీకరణకు ఒక అంతఃస్రవంతిగా ఇక్కడ పని చేయగలగడానికి ఇక్కడి సామాజిక రాజకీయ పరిస్థితులు కూడా దోహదపడ్డాయి. హర్ష సామ్రాజ్య పతనానంతరం దేశ మొత్తం మీద ఇక్కడే సుస్థిరత కలిగిన రాజ్యాలు ఏర్పడ్డాయి. చేతి వృత్తులు, వాణిజ్యం వృద్ధిచెందాయి. వృత్తినిపుణులు, చిన్న చిన్న వర్తకులు సమాజంలో తమ స్థానాలను తాము గుర్తించగలిగే స్థితికి చేరుకున్నారు.  ఈ స్థితిలో వారి వ్యక్తీకరణకు సరిపోయే మతం కావలిసి వచ్చింది. ఇది భక్తి ఉద్యమ రూపంలో ముందుకు వచ్చింది.

భక్తి ఉద్యమం శూద్రుల వ్యక్తీకరణ. అది బ్రాహ్మణియ వ్యక్తీకరణలకు పూర్తిగా భిన్నమైనది. భక్తి అనే భావన భగవద్గీతలోనూ, శ్వేతాశ్వతరోపనిషత్తులోనూ, మహాయాన బౌద్ధంలోనూ అప్పటికే ఉన్నప్పటికీ సారంలో భక్తి ఉద్యమ కాలపు భక్తికీ దీనికీ చాలా అంతరం ఉంది. భక్తి భావన వేదాలలోనూ, ఉపనిషత్తులలోనూ కూడా ఉందని కొందరు అంటుంటారు. కానీ వేదాలలోని భక్తి కర్మకాండనుంచీ వేరు చేయలేనిది. కాగా భక్తిఉద్యమ కాలపు భక్తి ఏకేశ్వరారాధనతో ముడిపడి ఉన్నది. అది కర్మకాండ ప్రధానమైనది కాదు. ఉపనిషత్తులలోనూ, వేదానంతర సాహిత్యంలోనూ ఉన్న భక్తి ఙ్ఞానంతో ముడి పడి ఉంటుంది. అది అవ్యక్తిగతంగానూ, భావోధ్వేగరహితంగానూ, తాత్విక పదబంధాలతోనూ ఉంటుంది.

భక్తి ఉద్యమం ప్రతిపాదించిన భక్తి దేవుని ముందర భక్తులందరినీ సమానం చేసింది. ఇది బౌద్ద్ధ, జైనాలలో కూడా ఉన్నప్పటికీ కుల అసమానతలను తుడిచివేయగలగిన తీవ్రమైన ఆవేశిత మిలిటెంట్ స్వభావం ఇస్లాం ప్రభావం నుండే భక్తి ఉద్యమం పొందింది. ఆరవ శతాబ్ధం నుండీ ఎనిమిదవ శతాబ్ధం వరకూ సమాజాన్ని అమితంగా ప్రభావితం చేసిన నయనార్లలో స్త్రీలు, శూద్రులు, దళితులూ ఉన్నారు. బ్రాహ్మణుడైన సుందరమూర్తి నయనార్ అబ్రాహ్మణ స్త్రీలను వివాహమాడాడు. ఆళ్వార్లు కూడా  కులం పట్ల ఇదే విధానాన్ని అవలంబించారు. రామానుజుడు కులాలకు అతీతంగా వ్యవహరించాడు. మార్గ నిర్ధేశకులుగా, గురువులుగా, దైవానుగ్రహాన్ని పొందిన వారిగా, భగవంతునితో సంధాన కర్తలుగా ఉంటూ కుల, లింగ వివక్షతలు  లేకుండా పాటించి చూపారు. నయనార్లలోకంటే ఆళ్వార్లలో, రామానుజునిలోనూ ఇస్లాం ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. రామానుజుడు అనుసరించిన “ప్రపత్తి” ( సెల్ఫ్ సరెండర్) ఇస్లాం నుండి వచ్చినదే. భండార్కర్ ఇది క్రైస్తవ ప్రభావం నుండి వచ్చినదని అభిప్రాయపడ్డాడు. కానీ ఆ కాలంలో దక్షణ భారతదేశంలో   క్రైస్తవ ప్రభావం ఇస్లాంతో పోలిస్తే చాలా తక్కువ.
భక్తి ఉద్యమం ముందుకు తెచ్చిన భగవంతుడు అద్వితీయుడు. అతను తప్ప మరొకరు భగవంతుడు కాలేరు. శైవులకు శివుడు, వైష్ణవులకు విష్ణువు, శాక్తేయులకు శక్తి తప్ప మరొకరెవరూ దైవంగా ఉండజాలరు. అయితే భగవంతుడొక్కరే కానీ ఆయన సూఫీలు అనుభూతి పొందిన మాదిరిగానే,  వైయక్తికంగా ఒక్కొక్కరికీ ఒక స్వరూపంగా గోచరిస్తాడు. ఒకరికి ఆయన గురువు, మరొకరికి స్నేహితుడు, ఇంకొకరికి ప్రియుడు. భగవంతుడు ఇంతలా వివిధ వైయక్తిక భావనలతో అత్యంత సన్నిహితునిగా మారడం మనం భక్తి ఉద్యమంలో మాత్రమే చూడగలం .అందుకే భక్తి ఉద్యమ కాలపు భక్తి సూఫీల వలే అత్యంత వైయక్తికమైనదీ, భావోద్వేగపూరితమైనది.

ఆళ్వార్లు, నయనార్లు, ఆ తర్వాత వచ్చిన భక్తి ఉద్యమ కవులు గురువులూ, మార్గ నిర్దేశకులూ కూడా. భగవంతునితో అనుసంధానం చేసే వాళ్ళు కాబట్టీ వీరు అత్యంత గౌరవనీయులూ, పూజనీయులు. గురువులుగా వీరు పొందిన స్థానం సూఫీ పీర్‍లను  పోలి ఉంటుంది. సూఫీ గురువు భగవంతునిచే ఎంపిక చేయబడ్డవాడు. మార్గ నిర్ధేశకుడు. దివ్యానుగ్రహం పొందిన వాడు. పూజనీయుడు. అతను తనను అనుసరించే వారిని ముక్తి మార్గంలో నడిచేలా చేస్తాడు. బౌద్ధ, జైనాలలో కూడా ఈ రకమైన గురుశిష్య సంబంధం ఉంటుంది. అయితే భక్తి ఉద్యమం దీనిని సూఫీల దారిలో మరింత ముందుకు తీసుకొని పోయింది. సూఫీ ఫీర్‍ల వలెనే భక్తి  ఉద్యమ కాలపు గురువులు దివ్యత్వాన్ని పొందినవారు. ఈ దివ్యత్వం వారిని దేవునితో  సమం చేస్తుంది. నయనార్లు సాక్షాత్ శివ స్వరూపులు.  శంకరాచార్యులు శివుని స్వరూపం. సరిగ్గా ఇలాంటి దివ్యత్వం ఆళ్వార్లలో కూడా ఉంటుంది.  భక్తి ఉద్యమం దీనిని అంతటితో ఆపక సూఫీలలో వలెనే  గురు స్థానాన్ని  దేవుని అధిగమించి ముందుకు తీసుకొని పోతుంది. వీర శైవులలో భగవంతుని కన్నా గురువు స్థానం ముందుంటుంది.

ఏకేశ్వరారాధనతో కూడిన భక్తి,ప్రపత్తులు, గురువుకున్నప్రత్యేక  స్థానంతో పాటుగా భక్తి ఉద్యమం ఆచరించిన మరొక గొప్ప విలువ కుల, లింగ సమానత్వాలను పాటించడం. ఇది బసవని కాలంలో తీవ్రరూపాన్ని తీసుకున్నది.
” బలులను అర్పించవలసిన పని లేదు. ఉపవాసాలు, విందులను పాటించనవసం లేదు. తీర్ధయాత్రలతో పని లేదు. శుద్ధి పొందేందుకు ఏ నదిలోనూ మునగవలసిన పని లేదు. కులం లేదు. కడజాతివారయినా శైవునిగా మారిన తర్వాత అతడు బ్రాహ్మణుని కంటే ఏ మాత్రమూ తక్కువ కాదు. పుట్టుక, లింగం కారణంగా ఎవరూ ఎవరికీ తక్కువ కాదు,. మనుషులందరూ పరమాత్ముడు నివశించే దేవాలయాలే.”

 

“వివాహం ఐచ్చికం. దానికి వధువు అంగీకారం తప్పనిసరి. బాల్య వివాహాలు చేయరాదు. విధవలు గౌరవనీయులు. వారిని  వివాహం చేసుకొనేందుకు అంగీకరించాలి.  మరణించిన వారికి శ్రాద్ధకర్మలు అవసరంలేదు. పునర్జన్మలనేవి లేవు. లింగాయతులందరూ కలిసి భుజిస్తారు. కలిసి జీవిస్తారు.”

 

ఆరవ శతాబ్ధం నుండి పదమూడవ శతాబ్ధం వరకూ దక్షణ భారత దేశంలో సామాజిక మార్పును సూచించిన భక్తి ఉద్యమం అసమానతలపై సూఫీలు చేసిన తిరుగుబాటు వంటిది. ఈ రెండూ మానవ హృదయం చేసిన తిరుగుబాట్లు. సూఫీలు, భక్తి ఉద్యమ కవులు చేసిన సామాజిక తిరుగుబాట్లను ప్రస్తావించకుండా సూఫీల ప్రేమ తత్వం, భక్తి ఉద్యమ కవుల గొప్పదనం  గురించి మాటాడబోవడం ఒక రకమైన వంచనే అవుతుంది.
ఇస్లాం, సూఫీల ప్రభావం,   భారతీయ తాత్విక చింతనను ఆరవ శతాబ్ధం నుండీ పదిహేడవ శతాబ్ధం వరకూ ఇక్కడి సామాజిక చలనాలకు అనుగుణంగా తమవైన వ్యక్తీకరణలను ఎంచుకునేందుకు అవసరమైన తాత్విక తోడ్పాటునందించి, ఎంతగానో దోహద పడ్డాయి. ఇస్లాం, సూఫీల ప్రభావంలేకుండా వీటిని మనం  ఊహించలేము.

*
.

చంద్రవంకల ఆత్మఘోష గురించి…. 

 

cover page of mudava manishi
-అరణ్య కృష్ణ
~
మనుషులెన్ని రకాలంటే రెండు రకాలని, అది ఆడా మగా అని చెప్పే దురహంకారం మనది.  సంసారం ఈతి బాధలు మోస్తూ మగాడు, పురుషాహంకారానికి బలైపోయే స్త్రీల వెతలే మనకు తెలుసు. వాటికే సాహిత్య గౌరవాన్ని ఇచ్చే సంకుచిత్వం మనది.  ఈ రెండు రకాల మనుషుల బాధలకి స్పందించే మనం, కళ్ళనీళ్ళు పెట్టుకునే మనం, కారాలు మిరియాలు నూరే మనం, తిరుగుబాట్లు ప్రబోధించే మనం, సమానత్వం గురించి ఘోషించే మనం మనుషుల్లో మనలాగే పుట్టిన మూడోరకం మనుషుల పట్ల మాత్రం అమానుషంగా వ్యవహరిస్తాం. విలన్లుగా ప్రవర్తిస్తాం.  అజ్ఞానమూ, దురహంకారమూ, అశాస్త్రీయమూ కలగలిసిన విచిత్ర వికృత ప్రవృత్తితో వారిని చూసి ఫక్కున నవ్వుతాము, హేళన చేస్తాము, అనుమానిస్తాము, అవమానిస్తాము కూడా. కడుపున పుట్టినా, తోడపుట్టినా కూడా కనికరించము. నిజంగానే పలుకాకుల్లా పొడుచుకు తింటాం.  తరిమేస్తాం.  వాళ్ళను చూడగానే నవ్వటానికి ఏం వాళ్ళు మన వినోదం కోసం పుట్టారా?  వాళ్ళను అనుమానంగా చూడటానికి, అవమానించటానికీ  వాళ్ళేమన్నా మన కట్టు బానిసలా? జాత్యహంకార చరిత్రలో కూడా ఏ తెల్లవాడూ మరో నల్లవాడ్ని చూడనంత ఘోరంగా మనమెందుకు చూస్తాం?  జననాంగాల చలనశీలతే కదా తేడా వాళ్ళకీ మనకు?  మనం పేద్ద పోటుగాళ్ళం, పోటుగత్తెలమై పునరుత్పత్తి కార్యక్రమానికి దోహదం చేస్తున్నామనేగా మన మిడిసిపాటు.  మిగతా అంతా వాళ్ళూ, మనమూ ఒకటే కదా! మనసు, హృదయం, స్పందన ఒక్కటే కదా! మనకైనా, వారికైనా చర్మాన్ని గాటు పెడితే వచ్చేది నెత్తుటి బొట్లే కదా. కడుపుకి వేసే ఆకలొక్కటే కదా! గాయపడ్డ గుండె కార్చే ఉప్పటి కన్నీరు ఒక్కటే కదా!  ఎందుకు సాటి మనుషుల్ని గౌరవించలేక పోతున్నాం? సాటి మనుషుల్ని చూసి ఏమిటా కుసంస్కారపు గగుర్పాటు? నిజానికి ఒక గొప్ప విషయం ఏమిటంటే థర్డ్ జెండర్ వారు ప్రధానంగా తమని తాము స్త్రీలుగా ప్రకటించుకుంటారు.  బహుశ కష్టాల్ని, కన్నీటిని, ప్రేమరాహిత్యాన్ని, ఎడబాటుని తాము స్త్రీలైతేనే భరించగలమేమొ అన్న అసంకల్పిత ఆలోచనే అందుకు కారణమేమో! వారో ప్రత్యేక సమూహంగా కదులుతారు. తమదైన లోకాన్ని, బంధాల్ని, బంధనాల్ని సృష్ఠించుకుంటారు.
రేవతి అనే హిజ్రా ఈ సమాజానికి పెద్ద ఝలక్ ఇచ్చారు.  ఆమె తన జీవిత చరిత్రని “ఒక హిజ్రా ఆత్మ కథ”గా మన ముందుకు తెచ్చారు.     ప్రకృతి పరంగానే ఒక మనిషిలో రెండు అస్తిత్వాల మనుగడ, రెండు లింగాల వైవిధ్య సమ్మేళనం వలన కలిగిన ఇబ్బందుల్ని ఆమె మనతో పంచుకున్నారు.  అతడుగా మొదలైన ప్రయాణం మధ్యలో ఆమె గా మారి, ఇంక ఎప్పటికీ ఆమెగానే కొనసాగే సాహసిక ప్రయాణంలో తన అనుభవాల్ని ఆమె మనతో పంచుకున్నారు.  ఆ ప్రయాణాన్ని చదివి, స్పందించి రేణుక అయోల “మూడవ మనిషి” అనే ఒక దీర్ఘకవిత రాసారు.  తెలుగులో అనే కాదు, ఏ భాషలో అయినా థర్డ్ జెండర్ మీద వచ్చిన సాహిత్యం అతి తక్కువ. అందుకుగాను రేణుక అయోల గార్ని ముందుగా అభినందించాలి.  నిజానికి దీర్ఘ కవిత ఒక క్లిష్టతరమైన కవ్విత్వ ప్రక్రియ.  పాఠకుడి ఆసక్తి ఎంతమాత్రం దెబ్బతినకుండా కవ్వితని నిర్వహించాలి.  వాక్యనిర్మాణం, నడకలతో కూడిన శిల్పంలో పరిపక్వత కనిపించాలి.  ఎక్కడా ఫీల్ చెడకూడదు.  భావోద్వేగ ప్రవాహం నిరంతరాయంగా కొనసాగాలి. దాన్లో చిన్న తేడా వచ్చినా యాంత్రిక వ్యక్తీకరణ ప్రస్ఫుటంగా కనిపించి, ఆసక్తి నీరసించి కవిత పఠనం కుంటుపడుతుంది.  అందుకే ఇదో చాలెంజ్.  అందుకే శివారెడ్డి గారు దీర్ఘ కవిత ఒక సవాలని, మంచి కవులు ఆ సవాలుని స్వీకరించాలని చెబుతుంటారు.  ఈ సవాలుని రేణుక స్వ్వీకరించారు.  స్వీకరించి పరకాయ ప్రవేశం చేసారు.  మొత్తం పదిహేను భాగాలుగా సాగిన ఈ 53 పేజీల కవిత మొత్తాన్ని ప్రధమ పురుషలోనే  నడిపించారు.  ఇదేం చిన్న విషయమేం కాదు.  ఇక్కడ సవాలు రెండు రకాలు. ఒకటి దీర్ఘ కవితే ఒక సవాలు కాగా, రెండోది ఎంచుకున్న వస్తువు.  అందరూ ముఖం తిప్పేసుకునే వస్తువు. ఇదేం చోద్యం అని బుగ్గలు నొక్కుకునే వస్తువు.  ఈ రెండూ కష్టమైన సవాళ్ళే.    ఇటువంటి కవిత రాయటానికి కేవలం సానుభూతి మాత్రమే కాక చాలా అవగాహన కావాలి.  ఒక మామూలు మనిషి ఒక వయసు వచ్చాక హిజ్రాగా మారే పరిస్తితుల పట్ల అవగాహన వుండాలి.  సాంఘీక పరిస్తితుల మీద, జెండర్ అంశాల మీద, దైహిక ప్రక్రియల మీద పూర్తి అవగాహన కావాలి.  ఇది వైద్యపరమైన సబ్జెక్ట్. సాంకేతికమైన సబ్జెక్ట్.  మనో వైజ్ఞానిక సబ్జెక్ట్.  అందుకనే ఇది కత్తిమీద సాము.  ఈ విషయంలో రేణుక గారు చాలావరకు సఫలమయ్యారు.
“రూపాన్ని వ్యక్త పరచలేని
ఒక దేహ చరిత్ర రాసుకోవాలనుకున్నప్పుడు
అక్షరాల గాయాలు రహిదారిలో నిలబడి
దిక్కులు చూస్తున్నాయి”
నిజమే సందిగ్దతే హిజ్రా అస్థిత్వం.  ఎందుకంటే “ఒక శరీరం రెండు రూపాలతో కొట్టుమిట్టాడు”తుంది కనుక.  ఆ కొట్టుమిట్టాడినతనాన్ని ఎలా చెప్పారంటే:
“కొన్నిసార్లు మరణించి
కొన్నిసార్లు జీవించి
ఆ రెంటి పొలిమేరల్లో బతుకుని ఒడొసిపట్టుకుని
ఈ కాగితం మధ్యలో నిలబడి
బతుకు గోడు చెప్పుకోవాలనుకున్నప్పుడు
ఒక నిశ్శబ్దపు నీలివర్ణం
నా చుట్టూ పేరుకుంది”
ఎదిగాకే మూడవ మనిషి. కానీ పుట్టినప్పుడు అందరూ మొగ పిల్లాడనే అనుకున్నారు.  సంబరపడ్డారు. అమ్మకి మాత్రం సందేహమే.
“చీరబొంతలో తమలపాకు కట్టలా నన్ను దాచి
సందేహంలో  పడిపోయిన అమ్మ
ఎన్నిసార్లో నా పసి దేహన్ని పట్టి చూసుకుందో”
మగపిల్లాడిగా పుట్టి ఆడతనపు ప్రవర్తనతో ఎన్నో ఇబ్బందులు పడ్డ ఆ జీవన ప్రస్థానాన్ని వివిధ దశల్లోని క్రూర ఘోర అనుభవాల్ని కళ్ళకు కట్టినట్లు చెబుతారు కవి.   ఆమె జీవితంలోని ప్రతి భావోద్వేగ సందర్భాన్ని  రేణుకగారి సహానుభూతి కవితాత్మకం చేసింది.  ప్రకృతిపరంగా తన ఆత్మ బంధువుల్ని కలిసినప్పుడు, చీర కట్టుకున్నప్పుడు, స్త్రీగా మారిపోవటానికి పురుషాంగం తీయించేసుకున్న ఆపరేషన్ చేయించుకున్నప్పుడు, ఇంటికి తిరిగివస్తే వెలివేయబడ్డప్పుడు, ఆకలి తీర్చటం కోసం వ్యభిచారం చేసినప్పుడు…ఇలా ప్రతిసందర్భంలోనూ మంచి వాక్యాలు రాసారు.  మచ్చుకి కొన్ని పంక్తుల్ని కింద ఇస్తున్నాను. చూడండి.
“ఒంటిని విడవని చీరకట్టు
కవచంలో కాపాడే చీరకట్టు
కలలో మెలకువలో వెంటపడ్డ ఆనందం
మెత్తని పక్షి ఈక ఒంటిని నిమురుతూ
జీవించటానికి తాగుతున్న అమృతం
మెడచుట్టూ గిల్టు నగలు
అద్దం కాంతికి మెరిసే తెల్లటి రాళ్ళు”
“నా చేతినిండా ఆకలి చుట్టూతా ఆకలి
ఆకలి చల్లార్చడానికి బజారున పడ్డ శరీరాలు
చప్పట్లు చరుస్తూ మీద మీద పడుతూ
దండుకునే రూపాయల నిండా దుఖం”
“గాయపడ్డ నరం చిట్లినప్పుడు
లోలోపల ప్రవహించే నెత్తురు చప్పుడు
కళ్ళ కొసలలో ఆగిపోయేది”
“శరీరం చెట్టు నుండి
కొమ్మలు నరకాలి అనుకున్నప్పుడు
కూకటివేళ్ళతో సహా పెకిలించబడింది
శరీరం నుండి చిన్న అంగం తెగిపడింది
చుట్టూతా నిశ్శబ్దం
జీర్ణం కాని జడత్వం
చల్లారిన అగ్నిపర్వతం”
“ఇప్పుడు నేను స్త్రీని
అదమైన జీవితంతో
నీలినదిలో పడవలో తేలుతున్న చంద్రవంకని
రేపటి వెలుగులోకి తొంగి చూస్తున్న
ఒంటరి నక్షత్రాన్ని”
“రోడ్డు మీద గోడవారగా
రేకు తలుపులు ఆనుకొని
దేహాన్ని అమ్మకానికి పరిచిన ప్రతిసారి
ఒక నొప్పి పేగులు తెంచుకొని
రక్తాన్ని బైటకి తెస్తుంది”
“ఈ శరీరాలకి వెల వుంది
ప్రేమకి వెల లేదు
దాహానికి నోటు వుంది
ఆప్యాయతకి ఆసరా లేదు
చేతినిండా దాహపు పాత్రలే”
ఇలా గుర్తించదగ్గ, గుర్తుపెట్టుకోదగ్గ పంక్తులు ఈ దీర్ఘ కవితలో కనిపిస్తాయి.  ఈ భూమ్మీదకి మనందరిలాగానే వచ్చి ఒక తీవ్ర అంతర్ అన్వేషణతో తన అస్తిత్వాన్ని నిర్ధారించుకునే “మూడవ మనుషులు” గురించి వేదనాత్మకంగా రాసిన అర్ధవంతమైన కవిత ఇది.  మొదటి నుండి చివరి వరకు చదివించగల సరళవంతమైన నడక, నిర్వహణ కనబడుతుంది.  అక్కడక్కడా కొంత వాచ్యంగా అనిపించొచ్చు.  కొంత ఎడిట్ చేసుకోతగ్గ పంక్తులూ లేకపోలేదు. అయినా మొత్తం మీద వస్తువు, రూపం, నిర్వహించిన తీరుతో ఒక విలువైన కవితగా రూపొందించారు. అభినందనలు రేణుక గారూ!
(“మూడవ మనిషి” దీర్ఘ కవిత. రచన రేణుక అయోల, 8-3-677/ఎ/2, యూకో ఆర్కేడ్, ఫ్లాట్ నం.2, నవోదయ కాలని, యెల్లారెడ్డిగూడ, హైదరబాద్-500037. వెల రూ.50. ప్రచురణ జె.వి.పబ్లికేషన్స్.)

ఎందుకు?

 

 

-విజయ జ్యోతి

~

 

క్షమించండి

ఇది తప్పొప్పుల పట్టిక కాదు

ఆరోపణల జాబితా అంతకన్నా కాదు

భంగపడిన విశ్వాసం

భగ్నమైన ఆశ్వాసం

వేరే కనులెందుకు అంటో

చూపులేకుండా చేశావేమని అడగబోవడం లేదు

వేరే రెక్కలెందుకంటూ

జటాయువుని చేశావెందుకని ప్రశ్నించబోవడం లేదు

ఒక నదిలో అనేక సార్లు స్నానం చేయొచ్చంటూ హెరాక్లిటస్‌ని ఎగతాళి చేసి

ఎడారిగా ఎందుకు మార్చావని  నిలదీయబోవడం లేదు

అలలపై విహరిద్దామని చెప్పి

కల్లోల కడలిలో ఎందుకు తోశావని సంజాయిషీ కోరబోవడం లేదు

ఆశకు ఆచరణకు మధ్య అంతరం తెలిసొచ్చాక

గుర్రానికి కళ్లేలు వేయాలనే దుగ్ధ మరెంత మాత్రం లేదు

అద్దం పగిలేది అబద్ధం తోనే అని గుర్తు చేయదల్చుకున్నా

సంజాయిషీ బంధానికి ఆఖరి మెట్టు అని అరిచి చెప్పదల్చుకున్నా

వీరేమి చేయుచున్నారో వీరెరుగుదురా అని ఎవర్నీ అడగలేను

ఎందుకనే ప్రశ్నకు

ఎప్పటికైనా సమాధానం దొరుకుతుందంటావా మిత్రమా!

*

రచనలకు ఆటా ఆహ్వానం

Ata

ఈ వాననిలా కురవనీ..

 

              – రవి బడుగు

                                            ~

టప్…..

టప్..  టప్..

రాత్రంతా కురిసిన వాన వెలిసింది. దాని జ్ఞాపకాలింకా ఇంటి పైనుంచి రాలుతున్నాయి. టప్..

బాల్కనీ నిండా నీళ్లు. తలుపు తెరిచే ఉండడంతో గదిలోపల సగందాకా తడిచి ఉంది. తడిచిన చాపమీదే మునగదీసుకుని పడుకుని ఉన్నాడు భాను. ఒకటే వాన వాసన.

తలుపు చప్పుడైంది. ఒకట్రెండు సార్లు చప్పుడయ్యాక ఆగిపోయింది. భాను పక్కనున్న ఫోన్ మోగడంతో.. వెంటనే లేచి ముందుగదిలోకెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా విహారి. మళ్లీ వచ్చి పడుకున్నాడు.

‘లంజా కొడుకు.. రాత్రి ఆరు ప్యాక్లు కొట్టించాడు డార్లింగ్. అరగంట కూడా పడుకోలేదు.’

విహారి మాట్లాడుతుంటే పడుకునే వింటున్నాడు. చేతిలో ఉన్న క్యారీబ్యాగ్ షెల్ఫ్లో పెట్టాడు విహారి.

అవునూ రాత్రి అడగడం మర్చిపోయా.. ఢిల్లీవాలాకి హైదరాబాద్లో పనేంటబ్బా.?

కొద్ది సేపు గదిలో మౌనం.

ఓ ‘ఫ్రెండ్’ ని కలవాలి.. భాను లేచి బాత్ రూమ్లో దూరాడు.

అటువైపే ఓ క్షణం చూసి.. షెల్ఫ్లో పెట్టిన క్యారీబ్యాగ్ లోంచి ఓ ప్యాకెట్ తీసుకున్నాడు. రెండు నిమిషాల్లో ఇడ్లీ తినడం పూర్తిచేసి.. తడిచిన చాపని చుట్టి ఓ మూలకి ఆనించాడు. ముందు గదిలో బెడ్షీట్ పరుచుకుంటుంటే.. బాత్రూమ్ నుంచి భాను బైటకొచ్చాడు.

‘క్యారీబ్యాగ్ లో టిఫిన్ ఉంది. బైటకెళ్లే పనయితే బండి కీస్ అక్కడే ఉన్నాయి. నన్ను డిస్ట్రబ్ చెయ్యకే..’ విహారి ముసుగు తన్నేశాడు.

అద్దం ముందు నిల్చున్నాడు భాను. రఫ్ గా పెరిగిన గడ్డం తడుముతూ.. తన కళ్లలోకి తనే ఒకసారి చూసుకున్నాడు. వెంటనే తల దువ్వుకుని అద్దంలోంచి బైటపడ్డాడు. టవల్ తీసేసి హ్యాంగర్ పై ఉన్న జీన్స్ పాంట్ తగిలించుకున్నాడు. టీ షర్ట్ మార్చాల్సిన అవసరం లేదనిపించింది. క్యారీ బ్యాగ్ పక్కనే బండి తాళాలు.. తీసుకుందామా.. వద్దా..? ఆఖరిక్షణంలో వాటిని తీసుకుని తలుపు దగ్గరగా వేసి బైటకొచ్చేశాడు. మెట్లు దిగి మొబైల్లో టైమ్ చూసుకుంటే ఏడు దాటింది. గోడ పక్కనున్న బైక్ స్టార్ట్ చేసి రెండు సందులు తిరిగి నేరెడ్మెట్ బస్టాప్ చేరుకున్నాడు.

 

గాల్లో వాన వాసన ఇంకా పోలేదు. గుండెల్నిండా గాలి పీల్చుకుని బస్టాప్ బెంచ్ మీద కూర్చున్నాడు.

కాసేపటికి సిక్స్ టీన్-ఏ వచ్చింది. పదిమంది దిగారు. పాతికమంది ఎక్కారు.

అవతల వైపున్న బస్టాప్ లో థర్టీ సెవెన్-డి ఆగినట్టే ఆగి వెళ్లిపోయింది. కొంతమంది ఎక్కారు. ఇంకొందరు సగమే ఎక్కారు. మెట్లమీద నిలబడలేని కొన్ని కాళ్లు దిగిపోయాయి.

సమ్ ఏంజిల్స్.. సమ్ హార్సెస్..

అటు థర్టీఫోర్.. ఇటు ట్వంటీ ఫోర్-ఈ..

సెకన్లు.. నిమిషాలు.. గంటలు..

వచ్చీపోయే ప్రతి బస్సునీ చూస్తున్నాడు.

“మధు జాడ లేదు.”  తనని ఇక్కడే కలిశానని పావని చెప్పింది.

పన్నెండు దాటింది. బస్సుల రష్ తగ్గిపోయింది. పక్కనున్న కేఫ్లోకి వెళ్లినా బస్టాప్ వైపే చూపు ఉంచాడు. రెండు టీలు తాగి వచ్చి పాత బెంచీపైనే చేరాడు. మళ్లీ సెకన్లు.. నిమిషాలు.. గంటలు.. ‘అనుకుంటాంగానీ కాలం కొన్నిసార్లు మరీ మొండికేస్తుంది. ఆ క్షణాలు నరకం.’ ఏడాదిన్నరగా ఇలాంటి క్షణాలతోనే గడుపుతున్నాడు తను.

 

*       *       *

 

“మూడేళ్ల కిందట ఓ న్యూస్‌చానెల్‌లో జర్నలిస్టుగా చేరాడు భాను. తర్వాత ఏడాదికి మధు గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్లోకి వచ్చింది. తనని చూశాక భాను జీవితంలో ఓ కొత్త జోష్.  మధు మౌనం అతన్ని కట్టిపడేసింది. ఆమె చూపుల్లో లోతులు తెలియని లోకాలేవో కనిపించేవి. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. అసలెవర్నీ దగ్గరికి రానిచ్చేది కాదు. ఎవరితో అయినా పనివరకే మాట్లాడేది. పావని ఒక్కదానితో అప్పుడప్పుడూ కనిపించేది. చేరిన ఆర్నెళ్లలోనే బెస్ట్ గ్రాఫిక్ డిజైనర్ గా పేరు తెచ్చుకుంది.

మధుని మాటల్లోకి దించేందుకు చాలా కష్టపడ్డాడు. ఆర్నెళ్ల కష్టం తర్వాత… భాను ఓయ్ అంటే, తను ఊ అనేది. క్రమంగా మధులో ఉన్న ఆడపిల్ల బైటపడింది. భానుతో కల్సి ఉన్నంతసేపు తను చిన్నపిల్లలా మారిపోయేది. పావనికి పెళ్లి అయి ఆఫీస్ నుంచి వెళ్లిపోయాక.. ఇద్దరూ మరింత దగ్గరయ్యారు. మధుతో ఉంటే గంటలు క్షణాల్లా గడిచిపోయేవి. చివరికి తన ప్రేమ విషయం చెప్పెయ్యాలనుకున్నాడు. ఓ రోజు ఈవెనింగ్ పార్క్కు రమ్మని ఫోన్ చేశాడు. గిఫ్ట్ షాప్‌కెళ్లి గంటసేపు వెదికి ఓ బహుమతి తీసుకున్నాడు. ప్యాక్ మీద తనే స్వయంగా.. ‘విత్ లవ్.. నీ భాను’. అని రాసుకున్నాడు.

దేవతలా వచ్చింది మధు. పార్కులో ముసురుకుంటున్న చీకట్లలోనూ మెరిసిపోతూ కనిపించింది. తనని చూసి మాటలు మర్చిపోయాడు. గిఫ్ట్ ప్యాక్ ని ఎడంచేత్తో వెనుక దాచాడు. పార్కులో ఓ బెంచ్‌పై కూర్చున్నాక.. ఎందుకు పిలిచావో చెప్పమంది. తెలిసిన విషయాన్ని తన నోటి నుంచి వినాలన్న ఆతృత ఆమె మాటల్లో ఉంది. కానీ ఏదో తెలియని భావం కూడా అందులో దాగుంది. భాను వెనకాడుతుంటే తనే అందుకుంది. ఆ స్వరంలో అంతకుముందున్నఅల్లరి స్థానాన్ని ఇప్పుడు ఒకరకమైన గాంభీర్యం ఆక్రమించుకుంది. చల్లటి గాలి చీకటిని కోస్తుంటే… ” నువ్వెప్పుడూ అంటూ ఉంటావే… నా మౌనం నీకు నచ్చుతుందని, ఆ మౌనం వెనుక కారణాలు నీకు తెలియవురా..!” చీకట్లో మధు ముఖం అస్పష్టంగా కనిపించినా… గొంతులో విషాదం స్పష్టంగా తెలుస్తోంది. ఏదో భయం భానులో చేరుతుంటే.. మధు మాట్లాడుతూ పోతోంది. నమ్మిన స్నేహితుడు, మరో ఇద్దరితో కల్సి తనపై చేసిన అత్యాచారాన్ని చెప్తుంటే.. భాను కాళ్లకింద భూమి బద్దలవలేదు కానీ, ఎడమచేతిలో ఉన్న గిఫ్ట్ ప్యాక్ జారి పడిపోయింది. చీకటి దాన్ని దాచేసింది. చెప్పాల్సినదంతా చెప్పాక కిందికి చూస్తూ ఉండిపోయింది మధు. భాను తలదించుకుని ఆలోచిస్తున్నాడు. చేతిలోంచి జారిపడిన గిఫ్ట్ ప్యాక్ మళ్లీ తీసుకోవాలనుకోలేదు. కాసేపటి తర్వాత వెళ్దాం అన్నట్టు లేచి నిలుచున్నాడు. మధు ఇంకా గతం తాలూకు విషాదంలోనే ఉంది. కొన్ని క్షణాలు అలాగే కూర్చున్నాక లేచింది. మౌనంగా మధు ముందు నడుస్తుంటే.. కొన్ని అడుగులు వెనగ్గా నడుస్తున్నాడు భాను”

 

*       *       *

 

హారన్ మోతతో ఈ లోకంలోకి వచ్చాడు భాను. బస్టాప్ కి కాస్త దూరంలో యాక్సిడెంట్. దెబ్బలు తగిలినా తగలనట్టే నటిస్తున్నారు. కానిస్టేబుల్ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాడు. పక్కన ఎవరో కూర్చున్నట్టు అనిపించింది భానుకి. చూస్తే విహారి. టీ తాగడానికి వచ్చినట్టున్నాడు.

ఫ్రెండ్ ని కలిశావా..?

‘————–‘  సమాధానం చెప్పకుండా నవ్వుతూ చూశాడు తనవైపు.

రూమ్ కి వెళ్దామా?..  భాను నుంచి సమాధానం లేదు.

‘ఎవరి కోసమో వెదుకుతున్నట్టున్నావ్.?’

‘వెదకడం లేదు.. ఎదురుచూస్తున్నా..’ విహారి కళ్లలోకి చూస్తూ చెప్పాడు భాను.

సరే చావు.. నే వెళ్తున్నా.

వెళ్లిపోయాడు విహారి.

రాత్రి పదయింది. రూమ్ కి చేరుకున్నాడు భాను. తనకోసమే ఎదురు చూస్తున్నట్టున్నాడు విహారి. ఎదురుగా టీచర్స్ ని పెట్టుకుని.. అప్పటికే ఒకరౌండ్ వేసినట్టున్నాడు. తను వెళ్లి పక్కనే కూర్చున్నాడు. గ్లాసులోకి బాటిల్ ఒంపి భానుకివ్వబోయాడు. కళ్లతోనే వద్దన్నాడు.

‘నీ కోసమే ఇవాళ వీక్ ఆఫ్ తీసుకున్నా.. ఫాలో ది టీచర్స్ డార్లింగ్. పాత ప్రపంచాలన్నీ బద్దలుకొట్టి.. సరికొత్త జీవితంలోకి దారి చూపిస్తారు’.

‘ఐ హేట్ టీచర్స్’ సూటిగా చూస్తూ చెప్పాడు భాను. నవ్వుతూ ఒక్క గుక్కలో గ్లాసు ఖాళీచేశాడు విహారి.

‘ప్రేమించుకున్నంత మాత్రాన.. ఇద్దరు ఎప్పటికీ కలిసి ఉండలేకపోవచ్చు. అదే జీవితం.’ మూతికంటిన విస్కీని నాలికతో  తుడుచుకున్నాడు.

‘అఫ్ కోర్స్.. కానీ నేను తనతోనే ఉన్నా… అందుకే ఎదురుచూస్తున్నా..’

అసలు వదిలేయడం ఎందుకు.. ఎదురుచూడటం ఎందుకు..?

‘తనతో కల్సి బతకడం భయమేసింది అప్పుడు.. ఇప్పుడు తను లేకుండా బతకడం భయమేస్తోంది. నేను ఎదురుచూస్తోంది, వెదుకుతోంది నా కోసమే. తనకోసం కాదు’.

ఈ మాటలు చెప్పేటప్పుడు భాను కళ్లలో సన్నటి నీటిపొర. కొంచెం ఆగి అన్నాడు.. అయామ్ ఏ ‘మిడిల్ క్లాస్ లవర్’ విహారీ.

కాసేపటి తర్వాత విహారి నిద్రలోకి జారుకున్నాడు. బాల్కనీలోంచి శూన్యంలోకి చూస్తూ నిల్చున్నాడు భాను..

 

*       *       *

 

“మధు గతం విన్నాక, ఇద్దరూ పార్క్ నుంచి బైటకొచ్చి బైక్ ఎక్కారు. హాస్టల్ దగ్గర మధు దిగాక.. బై చెప్పాడు. తను మాట్లాడలేదు.

రేపు ఆఫీస్ కి వస్తున్నావా అంటే.. ‘తను నవ్వింది. ఏదో చెప్తున్నట్టు’. భానుకి అర్ధం కాలేదు.

వెంటనే హాస్టల్ లోపలికి వెళ్లిపోయింది మధు. రాత్రి పడుకునే ముందు గుడ్‌నైట్ మెసేజ్ పెట్టాడు.  రిప్లయి లేదు. ఆఫీసుకి వెళ్లాక మాట్లాడొచ్చు అనుకున్నాడు. మరుసటిరోజు మధు ఆఫీసుకి రాలేదు. వాళ్ల ఇంచార్జ్‌ని అడిగితే తెలియదన్నాడు. తనూ ఫోన్లో ట్రై చేస్తున్నానని చెప్పాడు. మెయిల్ ఓపెన్ చేసి చూశాడు భాను.. నో మెసేజ్. తన ఆఖరి మెసేజ్.. తనకర్ధం కాని ఆ నవ్వేనని భానుకి తెలిసేసరికి ఆలస్యమయింది.

“ఆ తర్వాత అతనిలో చాలా మార్పొచ్చింది. అప్పుడప్పుడూ నిద్రలో ఉలిక్కిపడి లేచేవాడు. ఎప్పుడూ పరధ్యానంగా.. ఏ పనీ కరెక్టుగా చేయలేకపోయేవాడు. కారణం.. ఓటమి అలాంటిది. మనిషిని కృంగదీస్తుంది. మానసికంగా చంపుతుంటుంది. ఓటమి గురించి భానుకి స్పష్టంగా తెలుసు. కానీ ఎందులో, ఎలా ఓడిపోయానన్నదే అర్ధం కాలేదతనికి. తనని తాను ఎన్నోసార్లు ఈ ప్రశ్న వేసుకున్నాడు. అర్ధరాత్రుల్లో ఉలిక్కిపడి లేచినప్పుడూ, నిద్రపోకుండా గడిపిన సమయాల్లో ఈ ప్రశ్న మరీ బాధించేది. ఒక నిద్రలేని వేకువలో తన ప్రశ్నకు సమాధానం దొరికింది. ‘తను మనిషిగా ఓడిపోయాడు’. ఆ క్షణం స్వచ్ఛంగా ఏడ్చాడు భాను.”

తర్వాత రోజే హెచ్ఆర్ దగ్గరకెళ్లి మధు వాళ్ల ఊరి అడ్రస్ సంపాదించాడు. ఊరిచివర పాడుబడ్డ బడిలో మధు వాళ్ల నాన్నని కలిశాడు. తనపై అఘాయిత్యం చేసిన రాక్షసుల్ని మధు ఎలా ధైర్యంగా జైల్లో వేయించిందో చెప్పాడు. కానీ ఇంట్లో వదినల వేధింపులు, చుట్టుపక్కలవాళ్ల మాటలు తట్టుకోలేక ఇంట్లోంచి బైటకు వెళ్లిపోతుంటే నిస్సహాయంగా ఉండిపోయానన్నాడు.

తర్వాత ఆయనకు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా వైజాగ్ వెళ్లి వెతికాడు భాను. కానీ మధుని కలుసుకోలేకపోయాడు. తన పరిస్థితి గమనించే ఆరునెలల క్రితం ఢిల్లీ పంపించారు ఆఫీస్ వాళ్లు. అక్కడే అనుకోకుండా పావని కలిసింది. మూడు నెలల క్రితం మధుని.. హైదరాబాద్, నేరెడ్ మెట్ లో కలిశానని పావనే చెప్పింది. అంతకుమించి వివరాలేమీ తెలియదంది.”

*       *       *

 

రోజు మారింది. అదే బస్టాప్. నిన్న ఉన్నంత హుషారు ఇవాళ లేదు భానులో. రేపు ఢిల్లీ వెళ్లిపోవాలి. ఉదయం నుంచీ బస్సులు వస్తున్నాయి పోతున్నాయి. మధు జాడ లేదు. సాయంత్రమైంది. కేఫ్ లోకి వెళ్లాడు. దో ఛాయ్.. ఆర్డరిచ్చాడు. ఎదురుగా ఉన్న పెద్దాయన నవ్వుతూ చూశాడు. రెండు టీలు తాగినా ఎందుకో నీరసంగా ఉంది. మళ్లీ బెంచీపైకి చేరాడు. మరో గంట గడిచింది. చీకటి పడుతోంది. నిన్నటినుంచి చూసిన వందలకొద్దీ ముఖాలు తనని చూసి నవ్వుతున్నట్టు ఫీలయ్యాడు భాను. ఇందాక నవ్విన పెద్దాయన కూడా గుర్తొచ్చాడు.

ఒక్కసారిగా అలర్టయ్యాడు. ఆయన్ని ఎక్కడో చూసినట్టుంది. ‘ఎక్కడ చూశాను..?’  పరిగెత్తుకుంటూ కేఫ్ లోకి వెళ్లాడు. అప్పటికే వెళ్లిపోయినట్టున్నాడు. ఎక్కడ చూశాను తనని.. మెదడు పగిలిపోయేలా ఆలోచించాడు. చాలా సేపటి తర్వాత స్ట్రయిక్ అయింది. ఓ సోషల్ అవేర్ నెస్ ప్రోగ్రామ్ కోసం.. మధుతో కల్సి అతనోసారి ఆఫీస్కి వచ్చినట్టు గుర్తొచ్చింది. నేరెడ్మెట్లోనే ఓ అనాధాశ్రమం నడుపుతున్నాడు. వెంటనే బైక్ స్టార్ట్ చేసి నిమిషాల్లో ఆశ్రమం చేరాడు. ఇందాకటి పెద్దాయన్ని కలిశాడు. మధు గురించి విన్నాక.. తమకు విరాళాలిచ్చే వాళ్ల రిజిస్టర్‌లు తీసి ఇద్దరూ పరిశీలించారు. పావని చెప్పిన తేదీన మాధవి పేరుతో పదివేలు రాసి ఉంది. అడ్రస్ కాలమ్ మాత్రం వదిలేసి కనిపించింది. తనకీ ఆ అమ్మాయి వివరాలు తెలియదన్న పెద్దాయన… అంతకుముందు కూడా తన పేరుతో ఏవైనా విరాళాలు వచ్చాయేమో చూసే పనిలో పడ్డాడు.

నిలువునా నిరాశ కమ్ముకుంటుండగా బైటకొచ్చి బెంచ్‌పై కూర్చున్నాడు భాను. అప్పుడే చీకట్లు కమ్ముకుంటున్నాయి. లేచివస్తుంటే వెనక నుంచి ఎవరో పిలిచారు. బండి కీస్ మర్చిపోలేదు కదా అని జేబులు తడుముకుంటుంటే ఆయనే దగ్గరకొచ్చాడు. ‘ఆ అమ్మాయి గురించి పార్వతమ్మ గారికి తెలిసుండొచ్చేమో.. ఈ విరాళాల వ్యవహారాలు  ఆవిడే చూసుకుంటుంది. హెల్త్ సరిగాలేక నెలరోజుల్నించీ రావడం లేదు’. అంటూ ఆమె అడ్రస్ ఇచ్చాడు. అరగంటలో ఆ అడ్రస్ కు చేరుకున్నాడు భాను. పెద్దగా కష్టపడకుండానే పార్వతమ్మ ఇళ్లు కనుక్కున్నాడు. ఆవిడే తలుపుతెరిచింది. వయస్సు అరవై పైనే ఉండొచ్చు. మధు గురించి చెప్పగానే… ఎవరు, ఏమిటీ అని అడక్కుండానే భానుని లోపలికి రమ్మంటూ తీసుకెళ్లింది. సోఫాలో కూర్చున్నాక మధు గురించి చెప్తూ వెళ్లింది. ‘చాలా మంచి పిల్లయ్యా. తను సంపాదిస్తున్నదాంట్లో ఎంతోకొంత సాయం చేయాలనుకుంటుంది. ఎందుకో మనుషుల మీద పెద్దగా ఆసక్తి చూపించదు. నాలో ఏంచూసిందో కానీ ఆప్యాయంగా మాట్లాడేది. తన గురించిన వివరాలు చెప్పేది కాదు గానీ, చాలా విషయాల గురించి మాట్లాడేది. ఆశ్రమానికి అప్పుడప్పుడూ వచ్చేది. ఇంతకు ముందోసారి నా కార్లోనే దించా తనని’ అని ఆగింది. అప్పటివరకూ శూన్యంలో మధుని ఊహించుకుంటున్న భాను… ఒక్కసారిగా ముందుకు ఒంగాడు. పార్వతమ్మ ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుని మళ్లీ మాట్లాడ్డం మొదలుపెట్టింది. ‘ఇక్కడే మధురానగర్‌, వోరా టవర్స్ పక్క సందులో ఐదో ఇళ్లో, ఆరో ఇళ్లో..  తను అక్కడే అద్దెకుంటున్నానని చెప్పింది.’ లేచి పార్వతమ్మ పాదాల్ని చేత్తో తాకి వస్తానని చెప్పి బయలుదేరాడు భాను. క్షణాల్లో ఆమె చెప్పిన అడ్రస్ పట్టుకున్నాడు. మధు రూమ్ కి తాళం వేసి ఉంది.

‘ఆ అమ్మాయి పదింటికి కానీ రాదు..’ ఇంటి ఓనర్ మాటతో, టైమ్ చూశాడు. రాత్రి తొమ్మిదవుతోంది. ఇంకా గంట..

వర్షం వచ్చేలా ఉంది. మెయిన్ రోడ్ పైకొచ్చి దగ్గర్లో ఉన్న హోటల్ కెళ్లాడు. మూడు రోజుల తర్వాత ప్రశాంతంగా భోజనం చేశాడు. వెయిటర్ ని అడిగి ఓ పేపర్ తీసుకున్నాడు. ఏవేవో రాస్తూ కొట్టేస్తూ పోయాడు. చివరకు నలిపి పడేయబోయి.. ఎందుకో దాన్ని మడిచి జేబులో పెట్టుకున్నాడు.

రాత్రి 10:10

బైట సన్నటి జల్లు మొదలైంది. ఆ గది తలుపు దగ్గర ఒక్క క్షణం ఆగాడు భాను. ఏదో తెలియని అనుభూతి. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తోంది. తలుపు కొడదామని చెయ్యి వేశాడు. లోపల గడియ పెట్టకపోవడంతో దానంతటదే వెళ్లిపోయింది. ఎదురుగా మధు. నేలమీద కూర్చుని  ఏవో పేపర్స్ చూస్తూ ఉంది. తలుపు చప్పడుకి తలెత్తిచూసింది. ఒక్కక్షణం ఆమె కళ్లలో ఏదో వెలుగు కనిపించినట్టే కనిపించి మాయమైంది. మౌనంగా  లోపలికి వచ్చి కింద కూర్చున్నాడు తను. వర్షం పెద్దదవుతోంది.

కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత… “ఎలా ఉన్నావు” ప్రశ్నలో ఎలాంటి భావం కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నించింది మధు. వానకి తోడు గాలి పెరిగింది. తలుపు కొట్టుకుంటుంటే.. కొక్కేన్ని కిందకు దించి కదలకుండా చేసింది. గాలితో పాటు చినుకులూ గది లోపలకు కొడ్తున్నాయి.

సమాధానం చెప్పకుండా చేత్తో నుదురునీ, ముఖాన్నీ రుద్దుకున్నాడు.

ఇంతలో తనే “ఎందుకొచ్చావు భానూ..?

దూరంగా ఎక్కడో పిడుగు పడ్డట్టుంది. భయంకరంగా ఉరిమింది ఆకాశం.

“నేనిక్కడ ప్రశాంతంగా బతుకుతున్నాను” లేని కర్కశత్వాన్ని బలవంతంగా గొంతులోకి తెచ్చుకుని పలికింది.

“వెళ్లిపో భాను” అంటూ తనవైపు చూసింది. భాను ముఖంలో ఎలాంటి భావమూ లేదు. గాలివాన హోరు పెరిగింది. ఒకటిన్నర సంవత్సరం నుంచి తనకు చెప్పాలనుకున్న వేలవేల మాటలు మౌనంగా మారిపోయాయి. మధు కళ్లలోకి చూస్తూ మౌనంగా అయినా సంభాషించాలనుకున్నాడు. కానీ చూపుల్ని పక్కకి తప్పించి.. కిటీకీలోంచి వర్షాన్ని చూస్తోంది తను. జేబులో మడిచిపెట్టిన పేపర్ తీసి తన ముందుంచాడు.  తనలో ఏ మార్పూ లేదు. కొన్ని క్షణాల తర్వాత భాను లేచాడు. మరోసారి మధుని చూశాడు. తను నిశ్చలంగా వర్షాన్ని చూస్తోంది. కదల్లేక కదులుతూ గదిలోంచి బైటకు వెళ్లిపోయాడు.

తను వెళ్లిన కొద్ది సేపటి తర్వాత.. పేపరు మడత విప్పింది. దాన్నిండా కొట్టివేతలు.

ఆఖరి వాక్యం మాత్రం అలాగే ఉంచాడు.

‘ఐ లవ్యూ మధు’.

కాగితంపై మధు కన్నీళ్లు పరుచుకుంటున్నాయి.

కంటి నరం తెగినట్టుంది. కన్నీరు కాలువ కట్టింది. ఏళ్లుగా గుండెళ్లో గూడుకట్టుకుపోయిన బాధంతా కళ్లలోంచి బైటకొస్తోంది. భాను గుర్తొచ్చి వెంటనే లేచింది. వెనుక గదిలోకి వెళ్లి వెంటనే బైటకొచ్చింది. చెప్పులు వేసుకోవడం కూడా మర్చిపోయింది. ఒక్క ఉదుటున బిల్డింగ్ పైనుంచి దిగి వీధిలోకి పరిగెత్తుకుంటూ వచ్చి చూసింది. వీధి చివరెక్కడో మలుపు తిరుగుతున్నాడు భాను. వర్షంలో మసగ్గా కనిపించాడు. భానూ… వెర్రిగా అరిచింది. వాన హోరులో ఆమె అరుపు కలిసిపోయింది. పరిగెత్తుకుంటూ రోడ్డుపైకొచ్చింది. భాను కనిపించలేదు.

కుంభవృష్టి దెబ్బకు రోడ్డుపై ఎవరూ లేరు. ఒకటీ అరా వాహనాలు తిరుగుతున్నాయి. వీధి లైట్లు ఎప్పుడు ఆరిపోతాయో అన్నట్టు వెలుగుతున్నాయి. కాస్త దూరంలో ఉన్న బస్టాప్ కు పిచ్చిదానిలా పరిగెత్తింది. అక్కడా అతను లేడు. వర్షంలో కన్నీళ్లు కనిపించకున్నా ఎగసిపడుతున్న గుండెలు.. ఆమె దుఃఖాన్ని దాచలేకపోతున్నాయి. హోరున కురుస్తున్న వర్షంలో కొద్దిసేపు అలాగే నిలుచుంది. ఇక తనని కలుసుకోలేనన్న బాధతో వెనక్కి తిరిగింది. కాస్త దూరంలో రోడ్డు పక్కన ఉన్నఓ షెడ్ కింద భాను. వణుకుతూ నిలుచుని ఉన్నాడు. రోడ్డుకీ తనకీ మధ్య గోడ ఉండడంతో.. అంతకుముందు కనిపించలేదు తను.   ఎదురుగా నడిచివస్తున్న మధుని భాను చూశాడు. ఆమె కళ్లలోంచి కన్నీళ్లింకా కారుతున్నాయి. దగ్గర కొచ్చాక నవ్వుతూ కుడిచేయి ముందుకు చాచింది తను. మధు చేతిలో గిఫ్ట్ ప్యాక్. పార్క్ లో భాను చేతినుంచి జారిపడ్డ గిఫ్ట్ ప్యాక్. దానిపై రేపర్ పాతబడినట్టుంది కానీ అక్షరాలు అలాగే ఉన్నాయి. ‘విత్ లవ్.. నీ భాను’.

ఫ్యాక్ తీసుకుని కొద్దిసేపు అలాగే చూశాడు. కళ్లలో నీళ్లు తిరుగుతుంటే.. మధుని దగ్గరకు తీసుకున్నాడు. ఇంకెప్పటికీ విడిచిపెట్టనన్నంత దగ్గరగా..!

వాన ఇంకా కురుస్తోంది.

కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ తేరుకున్నారు.

పద.. అంటూ కదిలాడు భాను.

వర్షం తగ్గనీ.. గడ్డం మీదుగా కారుతున్న నీటిచుక్కని తుడుచుకుంటూ అంది మధు.

తగ్గేదాకా ఉండాలంటే, ఇక్కడే ఆగిపోతామేమో.. చేయందించాడు భాను.

ఇద్దరూ నడుస్తూ.. హోరున కురుస్తున్న వర్షంలో కలిసిపోయారు.

 

– రవి బడుగు

వెతుకులాట

may4

 

 

చిత్రం: ప్రవీణ కొల్లి 

పదాలు: స్వేచ్ఛ

~
వెతుకులాట
మనుషుల కోసం
కొండల చివరా ..
చెట్ల పొదల్లో
చిక్కుకుపోయి
అడవి దొండ తీగలకు
వేలాడుతూ

అడివంతా సవ్వడి చేస్తున్నట్టు
గలగలా నవ్వే
పసిపిల్లలకోసం …

గుట్టలెక్కుతూ
లోయల్లోకి జారుతూ
మెరిసే
స్వచ్చమైన
నీటి బిందువుల కోసం

వెతుకుతూ ఉంటే
ఒక్కో చేయికి మరో చేయి తగిలి …
కలిసి
జతకూడి

ఆకాశం వంపిన చినుకులై
పసితనపు సంద్రంలోకి
జలజలా
ప్రయాణం.

దైవాన్ని దర్శించే కారుణ్యం!

 

 

-ఫణీంద్ర 

~

 

దేవుడే మనిషిగా అవతరించి మానవులని దగ్గరగా చూస్తే ఏమనుకుంటాడు? ఆశ్చర్యపోతాడా? జాలి పడతాడా? బాధ పడతాడా? బహుశా ఈ భావాలన్నీ కలగలిపిన ఒక మౌనస్థితికి చేరుకుంటాడేమో! అప్పుడు దేవుడి అంతరంగం మనిషికి ఏమని చెప్పాలనుకుంటుంది? “గోపాలా గోపాలా” చిత్రంలో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు గేయ రచయిత సిరివెన్నెల తానే గీతాచార్యుడై మనందరికీ ఓ అద్భుతమైన గీతాన్ని అందించారు. మే 20 సిరివెన్నెల పుట్టినరోజు సందర్భంగా ఈ పాటని చర్చించుకుని, ఆకళింపు చేసుకుని, అంతో ఇంతో ఆచరణలో పెట్టడమే ఆయనకి అభిమానులు ఇవ్వగలిగే కానుక.

చిత్ర కథాపరంగా దేవుడైన కృష్ణుడు ఓ మామూలు మనిషై మూఢనమ్మకాలనీ, దేవుడి పేరు మీద లోకంలో చలామణీ అవుతున్న కొన్ని ఆచారాలనీ ప్రశ్నించిన ఓ వ్యాపారికి తోడ్పాటునందిస్తాడు. నిజానికి ఆ వ్యాపారి తన “భక్తుడు” కాకపోయినా, తన “భక్తులుగా” చెప్పుకుంటున్న వాళ్ళని వ్యతిరేకిస్తున్నా కృషుడు అతని పక్షమే వహిస్తాడు! అతనికీ, అతనితో పాటూ మనుషులందరికీ దైవత్వపు అసలు లక్షణాలని వివరిస్తున్నట్టుగా సాగుతుంది ఈ పాట.

బ్రహ్మలా నేనే నిన్ను సృష్టించాననుకోనా?

బొమ్మలా నువ్వే నన్ను పుట్టించావనుకోనా?

నమ్ముకుంటుందో నవ్వుకుంటుందో

ఏమి అంటుందో నీ భావన!

 

నీదే నీదే ప్రశ్నా నీదే!

నీదే నీదే బదులూ నీదే!!

 

మనిషి సాక్షాత్తూ భూలోక బ్రహ్మే! మనసులో మెదిలిన ఊహలని తన మేధస్సుతో శక్తి సామర్ధ్యాలతో సాకారం చేసుకుంటాడు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తాడు. భూమండలాన్ని ఏలుతున్నాడు, మిగతా గ్రహాలపైనా కన్నేశాడు! ఇంత గొప్ప మనిషి దేవుడి గురించి చేసిన భావన ఏమిటి? దేవుడు కేవలం కోరిన వరాలిచ్చే గుడిలో ప్రతిమా? “నమ్ముకుంటే” చాలు అన్నీ ఆయనే చూసుకుంటాడు అని కొందరు, రాతిబొమ్మనో, రూపం లేని శక్తిస్వరూపాన్నో నమ్ముకోవడం ఎంత అజ్ఞానం అని నవ్వుకునే వాళ్ళు ఇంకొందరు! మరి దేవుడెవరనే నిజాన్ని ఎలా తెలుసుకోవడం? ప్రశ్నించడం వల్ల. ఇక్కడ “ప్రశ్న” అంటే కేవలం కుతూహలం కాదు, తెలివితేటల ప్రదర్శన కాదు, ఏర్పరుచున్న అభిప్రాయాల వ్యక్తీకరణ కాదు, ఎవరినో/దేనినో వ్యతిరేకిస్తూ అడిగేది కాదు. ఎంతో నిజాయితీగా చేసే ఒక తీవ్రమైన అన్వేషణ, అంతఃశోధన. అలాంటి “ప్రశ్న” నీదైనప్పుడు, బదులూ నీలోంచే వస్తుంది. బయటనుంచి కాదు. దేవుడంటే ఎవరన్నది ఎవరో చెప్పేది కాదు, మతగ్రంధాలు చదివితే తెలిసేది కాదు, నీకు నువ్వు అనుభవించాల్సింది.

 

నీ దేహంలో ప్రాణంలా వెలిగే కాంతి నా నవ్వే అని

నీ గుండెల్లో పలికే నాదం నా పెదవిపై మురళిదని

తెలుసుకోగలిగే తెలివి నీకుందే

తెరలు తొలగిస్తే వెలుగు వస్తుందే!

 

నీదే నీదే స్వప్నం నీదే!

నీదే నీదే సత్యం నీదే!

 

దేవుడు కేవలం ఒక భావనే అయితే ఆ భావన ఎంత గొప్పదైనా దాని వల్ల పెద్ద ప్రయోజనం లేదు. పైగా ఆ భావజాలాల్లో ఫిలాసఫీల్లో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది కూడా. దేవుడు ఎక్కడో ఆకాశంలో ఉంటూ మనని పర్యవేక్షిస్తున్నాడంటే ఆయన మననుంచీ మన జీవితాలనుండీ విడివడి ఉన్నాడని అనుకోవాల్సి వస్తుంది. దేవుడంటే ఇంతేనా? వివేకానందుడు రామకృష్ణ పరమహంసని మొదటిసారి కలిసినప్పుడు, “మీరు దేవుణ్ణి చూశారా?” అని అడిగితే, ఆయన “అవును! నేను ఉపనిషత్తులు క్షుణ్ణంగా చదివి దేవుణ్ణి దర్శించాను. దేవుడంటే ఎవరో తెలుసా?” అంటూ గొప్పగా ధ్వనించే విశేషణాలతో దేవుణ్ణి వర్ణించలేదు. “అవును! నేను చూశాను. నా ఎదురుగా ఉన్న నిన్ను చూసినట్టే, కానీ ఇంకా స్పష్టంగా! దేవుణ్ణి చూడొచ్చు, దేవుడితో మాట్లాడొచ్చు. కానీ ఆయన ఎవరికి కావాలి? భార్యపిల్లల కోసం, ఆస్తిపాస్తుల కోసం వెంపర్లాడే వాళ్ళు ఉన్నారు కానీ దేవుడు కోసం కనీళ్ళు పెట్టుకునే వాళ్ళు ఎక్కడున్నారు? ఆర్తిగా వేడుకుంటే ఆయన తప్పక దర్శనమిస్తాడు!” అని చెప్పారు. ఇదీ నిజమైన భక్తంటే, ఇదీ దేవుణ్ణి దర్శించే తీరంటే!

“నీలో నిజాయితీ ఉంటే, ప్రశ్నించే తపనుంటే, నీ ప్రాణజ్యోతి ఆ దేవుడి నవ్వుగా గ్రహిస్తావు. నీ గుండెల్లో నాదం సాక్షాత్తూ ఆ కృష్ణుడి మురళీగానం అవుతుంది. నీకు దేవుడి నిజస్వరూపాన్ని తెలుసుకునే తెలివుంది. నీకు నువ్వే ఏర్పరుచుకున్న స్వప్నాల తెరలను తొలగించు, సత్యం సూర్యప్రకాశంతో కనిపిస్తుంది” అని సిరివెన్నెల మనకి  ప్రబోధిస్తున్నది ఇదే!

 

ఎక్కడెక్కడని  దిక్కులన్ని తిరిగితే  నిన్ను నువ్వు  చూడగలవా?

కరుణతో కరిగిన మది మందిరమున  కొలువై  నువ్వు  లేవా?

అక్కడక్కడని  నీలి నింగి తడిమితే నిన్ను నువ్వు తాకగలవా?

చెలిమిని పంచగా చాచిన చేయివైతే  దైవం నువ్వు కావా?

 

నీదే నీదే ధర్మం  నీదే!

నీదే నీదే మర్మం నీదే!

 

లోకంలో భౌతికవాదులు (materialists), ఆధ్యాత్మికవాదులు (spiritualists) అనే తేడా కనిపిస్తూ ఉంటుంది. స్థూలంగా చూస్తే ఈ ఇద్దరూ వేర్వేరుగా కనిపిస్తున్నా సూక్ష్మంగా చూస్తే ఇద్దరూ ఒకే “ఆనందాన్ని” వెతుకుతున్నారని జ్ఞానులు చెబుతూ ఉంటారు. మన ప్రస్తుతపు ఉనికిలో ఉన్న ఒక లోటుని అధిగమించడానికే కదా మన తపనంతా! ఆ లోటు సామజికమైనది అనిపిస్తే సమాజసేవో, సమాజోద్ధరణో, లేదో సామజికవిప్లవమో మన లక్ష్యమౌతుంది. వ్యక్తిగతమైనదైతే జీవితాన్ని గెలవడమో, డబ్బు సంపాదించడమో, సంఘంలో గౌరవమో మన లక్ష్యమౌతుంది. ఆత్మికమైనదైతే భక్తో, యోగమో, వేదాంతమో సాధనామార్గమౌతుంది. అంతే తేడా! కానీ లోటున్నది నీలో, నీ వెతుకులాటంతా బయట! ఎంత సాధించినా సంతృప్తిలేక తిరిగితిరిగి అలసిసొలసి చివరికి నీలోకి నువ్వే చూసుకున్నప్పుడు, నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నాన్ని చేసినప్పుడు, నువ్వు దైవానికి చేరువవుతావు!

ఎందరో మహాగురువులు పదే పదే చెప్పిన ఈ విషయాన్నే సిరివెన్నెల ఎంతో సులభంగా వివరిస్తూ కొన్ని “ప్రాక్టికల్ టిప్స్” కూడా చెప్పారు. “నిన్ను నువ్వు వెతుకుతూ అలజడితో దిక్కులన్నీ తిరగకు, నీ మనసు కరుణకి కొలువైతే నీలోనే నిన్ను కనుగొనలేవా?” అన్నారు. “కరుణ” ప్రేమకి పరాకాష్ట. ప్రేమలో ఇంకా కొంత కోరుకోవడం ఉంటుంది, కరుణ సంపూర్ణమైన నిండుదనమై ఏమీ కోరుకోక ఇవ్వడంలోనే ఆనందపడుతుంది. కరుణతో నిండిన హృదయం దైవనిలయం కాదూ? “నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఆకాశానికి నిచ్చెన వెయ్యకు, ప్రేమతో సాటి మనిషి హృదయానికి వంతెన వెయ్యి” అన్నారు. ఆధ్యాత్మికత అంటే సాటి మనిషినీ, సమాజాన్ని విస్మరించే స్వార్థం కాకూడదు. సమస్తాన్ని తనలో ఇముడ్చుకునే ఔదార్యం కావాలి. అప్పుడు దైవభక్తి లోకకళ్యాణ కారకమౌతుంది. “ధర్మ”మంటే ఇలాంటి ప్రవర్తనమే. ఇదే దేవుణ్ణి చేరుకోవడానికి సులభమైన రహస్యం! ఈ మర్మాన్ని తెలుసుకున్న వారు ధన్యులు!

సిరివెన్నెల గారికి ముమ్మారు మొక్కుతూ, జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను!

 

(ఈ పాటని యూట్యూబులో ఇక్కడ వీక్షించొచ్చు)

 

 

 

 

 

చూడదగ్గ వి’చిత్రం’ 24

 

 భవాని ఫణి
~

కనీస అవసరాలన్నీ అలవోకగా తీరిపోతుంటే అప్పుడు మనిషికి కలిగే తరవాతి ఆశ ఏమిటి? ఆరోగ్యంగా ఎక్కువకాలం, కుదిరితే కలకాలం జీవించి ఉండాలనేగా. ఈ ఆశని తీర్చగల అతి సులువైన ఊహల్లో  కాలంలోకి ప్రయాణించడం కూడా ఒకటి. అంతేకాక కాలంలో ప్రయాణించగలిగితే పొందగల మిగతా లాభాలు అంకెలతో లెక్కించలేనన్ని. అటువంటప్పుడు అలా కాలం గుండా మనల్ని విహరింపచేయగల యంత్రమేదైనా మనకే, మనకి మాత్రమే దొరికితే ఎంత బాగుంటుందో కదా. ఎన్ని అద్భుతాలు చెయ్యచ్చు! ఎంత గొప్పవాళ్ళం అయిపోవచ్చు! ఒక వేళ అదే యంత్రం ఒక దురాశాపరుడి లేదా దుర్మార్గుడి చేతిలో పడినట్లయితే జరిగే అనర్థాల్ని కూడా మనం సులభంగానే ఊహించగలం. ఇటువంటి ఆలోచనకే దృశ్యరూపం “24” చలన చిత్రం.

మన దక్షిణాదిన నిర్మితమయ్యే  చలన చిత్ర కళా ప్రక్రియ( జెనెరె)ల్లో సైన్స్ ఫిక్షన్ చాలా అరుదు. విచిత్రంగా మన తెలుగులో అయితే ఆదిత్య 369 ఒక్కటి మాత్రమే అటువంటి చలనచిత్రంగా కనిపిస్తోంది. ( డబ్బింగ్ చిత్రాలని మినహాయిస్తే). నిజానికి ఈ అంశంపై హాలీవుడ్ లో లెక్కలేనన్ని కథలూ, సినిమాలూ సృష్టించబడ్డాయి. మన దేశంలో కూడా హిందీ, బెంగాలీ,తమిళ భాషల్లో ఇటువంటి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఆలోచనలు పాతవే అయినా వాటి వ్యక్తీకరణ జరిగిన విధానాన్ని బట్టి చలన చిత్రపు విజయం ఆధారపడి ఉంటుంది . అటువంటి చెప్పుకోదగ్గ సై. ఫి. చిత్రంగా 24 మిగిలిపోతుందని చెప్పచ్చు.
సైన్స్ పరంగా పెద్దగా తర్కానికి అందని కథైనప్పటికీ ఈ సినిమాలో మనం గమనించాల్సింది దర్శకుడు కథని ప్రజెంట్ చేసిన విధానాన్ని . జరిగిన ప్రతి సన్నివేశానికీ, సంభాషణకీ ఒక అంతరార్థాన్ని కల్పిస్తూ అల్లబడిన బిగువైన దృశ్య ప్రదర్శనగా ’24’ని పేర్కొనవచ్చు. మధ్యలో కమర్షియల్ అంశాలనీ, హాస్యాన్నీ, ప్రాంతీయతనీ చొప్పించినప్పటికీ అవి ఎబ్బెట్టుగా అనిపించని విధంగా జాగ్రత్తపడ్డాడు దర్శకుడు విక్రం కుమార్.
కథ టూకీగా చెప్పాలంటే సైంటిస్ట్ అయిన డాక్టర్ సీతారాం, కాలం గుండా ప్రయాణించగలిగే ఒక చేతి గడియారాన్ని తయారుచేస్తాడు. ఇక్కడ కాలం గుండా ప్రయాణం అంటే భౌతికంగా కాదు. కేవలం మానసికంగా మాత్రమే. అంటే ఈ వాచ్ ని ఉపయోగించి మన ఆలోచనల్నీ అనుభవాల్నీ వెనక్కి గానీ ముందుకు గానీ పంపవచ్చు. ఉదాహరణకి మనం ఈ వాచ్ సహాయంతో పది సంవత్సరాలు కాలంలో  వెనక్కి ప్రయాణం చేసామనుకోండి. గతంలో  ఉన్న మనకి, తర్వాతి పది సంవత్సరాల కాలానికి చెందిన జ్ఞాపకాలూ, అనుభూతులూ కలుగుతాయి. అక్కడినించి ఆ జ్ఞానాన్నిఉపయోగించి మనం చేసే చర్యల ఫలితంగా మరో కొత్త భవిష్యత్తు సృష్టింపబడుతుంది. అలాగే కాలాన్ని కొంతసేపు నిలిపి వేయవచ్చు కూడా .
సీతారాం, ఇటువంటి ఒక గొప్ప కాల గడియారాన్ని సృష్టించిన ఆనందంలో ఉండగానే దుర్మార్గుడైన అతని కవల సోదరుడు ఆత్రేయ,  ఆ వాచ్ ని చేజిక్కుంచుకుని, కాలాన్ని జయించాలన్న కోరికతో చేసిన కొన్ని దుష్ట కార్యాల కారణంగా ఆ అన్నదమ్ముల జీవితాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి.
అటుపైన ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత సీతారాం కుమారుడైన మణి, ఆత్రేయ ఆట కట్టించి పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దాడనేది కథాంశం. కథ గురించి ఇంతకుమించిన వివరాలూ, సినిమాకి 24 అనే పేరు ఎందుకు పెట్టారన్న విషయానికి చెందిన సమాచారమూ సినిమా చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది. మొత్తం కథలో, ఏడాది లోపు వయసున్న పసి పిల్లవాడు, ఇరవై ఆరేళ్ళ మానసికమైన వయసుతో,  అనుభవాలతో, ఆలోచనలతో ఉండిపోవడమనే ఊహ చాలా కొత్తగా అనిపించింది.
ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది స్క్రీన్ ప్లే గురించి. దాన్ని ఎంతో ఆసక్తికరంగా తీర్చిదిద్దడంతో పాటుగా, అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో తయారుచేసేందుకు
దర్శకుడు చాలా కృషి చేసాడు. ముందు కనిపించే ఒక దృశ్యాన్ని లేదా సన్నివేశాన్ని తర్వాతెప్పుడో జస్టిఫై చేసి జతకూర్చిన తీరు చాలా బావుంది. లాజిక్ చెడకుండా ఉండేందుకు దర్శకుడు తీసుకున్న శ్రద్ధ సినిమా ఆద్యంతమూ కనిపిస్తుంది.
సాధారణంగా సై.ఫి చిత్రాలలో మానవ సంబంధిత భావోద్వేగాలకి చెందిన అంశాల లోపం స్పష్టంగా కనిపిస్తుంటుంది. కొన్ని కథల్లో అయితే కనీసం స్త్రీ పాత్ర ఉండను కూడా ఉండదు. కానీ 24 లో ఉన్న మెచ్చుకోదగ్గ అంశం ఏమిటంటే, మనుషుల మధ్య ఉండే అనుబంధ బాంధవ్యాలని, ప్రేమాభిమానాల్ని ఈ సినిమా చాలా సహజంగా ఆవిష్కరిస్తుంది. మణికీ, అతన్ని పెంచిన తల్లి సత్య భామకీ మధ్య నడిచిన కథ, సినిమాని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది.  సినిమాలో అరవై శాతం వరకు ఉపయోగించిన విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా సహజంగా ఇమిడిపోయాయి. సూర్య నటన గురించి ఇక్కడ తప్పనిసరిగా చెప్పుకోవాలి. అతను ధరించిన మూడు పాత్రల్లో నటనకి అవకాశం ఉన్న మణి, ఆత్రేయ పాత్రలకి అతను పూర్తి న్యాయం చేకూర్చాడు. హీరోయిన్స్ నిత్యా మీనన్, సమంతాలు  సాంప్రదాయబద్ధమైన తీరులో అందంగా కనిపించారు. విభిన్నమైన కోణాల్లో కెమెరాని ఉపయోగించి సినిమాటోగ్రాఫర్ “తిరు” సినిమాకి తన వంతు సహాయాన్ని అందించారు  రెహమాన్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం మాత్రం తీసికట్టుగా ఉన్నా వాటి మీద పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపించదు.
మామూలు వాచ్ మేకర్ అయిన మణి, అతని సైంటిస్ట్ తండ్రి సీతారామ్ తయారుచేసిన కాల గడియారంలో సులభంగా మార్పులు చెయ్యగలగడం వంటి చిన్న చిన్న లోపాలూ, వాన చినుకుల్ని ఫ్రీజ్ చేసి చెదరగొట్టడం వంటి  అసంభవమైన అతిశయోక్తులూ కొన్ని కొన్ని ఉన్నప్పటికీ  24 ని ఒక  తెలివైన ప్రయోగంగా పేర్కొనవచ్చు.
*

గమనమే గమ్యం

 

-ఓల్గా 

~

 

(గత సంచికలు తరువాయి)

“మీరిద్దరూ కలిసి ఆ నిర్ణయానికొచ్చారా?

“ఊ-” అంది

నేను అబార్షన్ని వ్యతిరేకం కాదు. చెయ్యటం కష్టమూ కాదు, కానీ ఒక ఆలోచన వచ్చింది. నువ్వు కొడుకునో, కూతుర్నో కంటే మీ అమ్మా నాన్నల మనసు మారుతుందేమో – అట్లా జరిగిన కేసులు చాలా చూశాను. శారద స్వరాజ్యాన్ని పరిశీలనగా చూస్తూ చెప్పింది.

“ఒద్దు పెద్దమ్మా నేను పిల్లల్ని కనటం నా కోసం, నా ఇష్టంతో జరగాలి, మా అమ్మానాన్నల కోసం కాదు. అసలు నా కోసమో, నాకు పుట్టేవాళ్ళకోసమో కాదు మా అమ్మ కులాంతర వివాహాన్ని ఒప్పకోవాల్సింది. కుల విభజన తప్పనీ, మనుషులంతా సమానమనే నమ్మకం ఉండాలి మా అమ్మకు, ఆ నమ్మకం లేకుండా ఏదో కూతురనో, మనవడనో మమ్మల్ని దగ్గరకు తీస్తే అది మాకు ఏం గౌరవం? ముఖ్యంగా సుందర్రావుకి ఎంత అవమానం?”

శారదకు స్వరాజ్యం మనసు అర్థమైంది. ఆ పిల్ల మీద ప్రేమ, అన్నపూర్ణ మీద కోపం, జాలి వీటితో కాసేపు ఏం మాట్లాడకుండా కూచుంది. స్వరాజ్యాన్ని పరీక్ష చేసి

“నాలుగో నెల సగం పడినట్లుంది. అబార్షన్ అంత మంచిది కాదు. అజ్ఞానంగా ఉన్నందుకు కనాల్సిందే – తప్పదు. నాదీ తప్పేలే – నీ పెళ్ళి అవగానే ఒక క్లాసు తీసుకోవాల్సింది. ఇద్దరూ చదువుతున్నారు గదా అని నిర్లక్ష్యం చేశాను. ఏమంటావు?” “అనేందుకేముంది – నువ్వు చెప్పాక. ఈ ఒక్కర్ని కని చెంపలేసుకుని ఆపరేషన్ చేయించుకుంటా” అంది స్వరాజ్యం చీరె సరి చేసుకుంటూ,

“గుడ్” అని రక్త పరీక్ష చేయించుకోమని పంపింది. ఈ సంగతి అన్నపూర్ణకు చెబుదామని మనసు కొట్టుకుంటోంది. కానీ స్వరాజ్యం మాటలూ తీసివేయాల్సినవి కావు.

అన్నపూర్ణ విషయంలో తనకింత ధర్మసంకటం రావాలా? జాతీయ, అంతర్జాతీయ రాజకీయ బేధాలున్న స్నేహానికి అడ్డం రానిది వ్యక్తిగత విషయంలో ఇంత గొడవ అయింది – మాటలు లేక ముఖాలు చూసుకోలేని పరిస్థితి వచ్చిందేంటి – వ్యక్తిగతం అనుకుంటున్నాం గానీ ఇది పెద్ద సామాజిక విషయం. కులం అన్నిటికంటే ముఖ్యమైన

రాజకీయ విషయమేమో – స్వరాజ్యం మాటలు రాజకీయ పరిణితి ఉంటే తప్ప మాట్లాడలేనివి –

కాంపౌండర్ వచ్చి పేషెంట్లు చాలామంది ఉన్నారని చెప్పాక ఆ ఆలోచనలు పక్కన బెట్టి పనిలో పడింది.

స్వరాజ్యం నాలుగు రోజులుండి విశాఖపట్నం వెళ్ళింది. ఆ తర్వాత వారం లోపలే అన్నపూర్ణ అబ్బయ్య వచ్చారు. ఇద్దరూ పెద్ద జబ్బు చేసిన వాళ్ళలా ఉన్నారు.

శారదను చూడగానే అన్నపూర్ణ ఏడుపు మొదలెట్టింది. శారద ఆమెను సముదాయించి వివరం కనుకుంటే – అన్నపూర్ణ తన మూర్ఖత్వానికి పశ్చాత్తాప పడుతోంది – కూతురు దగ్గరకు వెళ్ళాలనుకుంటోంది. స్వరాజ్యం రానిస్తుందా – శారద సలహా కోసం వచ్చారు.

శారద మనసులోంచి పెద్ద భారం దిగింది.

“తప్పకుండా విశాఖ వెళ్ళండి. ఐతే సరాసరి వెళ్ళి స్వరాజ్యాన్ని కావలించుకోవాలనుకోకుండా ముందు ఎక్కడైనా దిగి — సుందర్రావుని కలిసి మీ మూర్ఖత్వానికి క్షమాపణ అడిగి అతను పెద్ద మనసుతో మిమ్మల్ని క్షమిస్తే అప్పడు అతని వెంట వెళ్ళండి, ఘర్షణ జరిగింది నీకూ నీ కూతురికీ గాని అందులో మీరు అవమానించింది సుందర్రావుని. అతని కుటుంబాన్ని వాళ్ళని కావలించుకునే సంస్కారమనూ, మరొకటనూ – అది మీకుందనుకుంటేనే వెళ్ళండి. అలా కాకుండా అయితే స్వరాజ్యం మిమ్మల్ని తన ఇంటికి రానివ్వదు”.

కూతుర్నివిడిచి ఉండలేక రాజీపడుతున్నారా? కులం గురించి మీ అభిప్రాయాలు మారాయా? తేల్చుకుని వెళ్ళాల్సిన అవసరం గురించి పదే పదే శారద చెప్పాక వాళ్ళిద్దరికీ అసలు సమస్య ఎక్కడుందో అర్థమైంది.

సుందర్రావుని క్షమాపణ అడుగుతామన్నారు. విశాఖపట్నం వెళ్ళారు. అన్నపూర్ణతో స్నేహం కొనసాగే పరిస్థితి వచ్చినందుకు శారదకు చాలా తెరిపిగా ఉంది. విశాఖపట్నంలో అంతా సవ్యంగా జరగాలని మనసారా కోరుకుంది. శారద కోరుకున్నట్లే జరిగింది. సుందర్రావు పెద్ద మనసుతో అన్నపూర్ణను అబ్బయ్యను ఇంటికి తీసికెళ్ళాడు.

స్వరాజ్యం శారదకు అర్జంట్ కాల్ బుక్ చేసి మరీ తెలుసుకుంది తన గర్భం విషయం తల్లికి తెలియదని – శారద చెప్పలేదని.

మొత్తానికి ఐదారు నెలల్లో అంతా సర్దుకుని మళ్ళీ శారదా అన్నపూర్ణలు మామూలయ్యారు.

ఆ వేసవి శలవులకు బంధువుల, స్నేహితుల పిల్లలందరినీ ఒక పదిరోజులు తన ఇంట్లో చేర్చి ఆటపాటలతో ఆనందంగా ఉంచాలనీ, ఆనందంతో పాటు వాళ్ల బుర్రల్లో తగుమాత్రం రాజకీయాలు నింపాలనీ అనుకుంది శారద. నటాషా బియస్సీ పూర్తి కావొస్తోంది. బంధువుల్లో, స్నేహితుల్లో నటాషాకు పదేళ్ళు అటూ పదేళ్ళు ఇటూ ఉన్న పిల్లలు పాతికమంది దాకా ఉన్నారు. వాళ్ళందరినీ రమ్మని కబురు చేసింది. కబురు వెళ్ళటం ఆలస్యం చాలామంది వచ్చారు. నటాషా కంటే పెద్ద వయసు వాళ్ళు ఎక్కువమంది రాలేదు. వాళ్ళకు పెళ్ళిళ్ళయి పోయాయి. అత్తవారిళ్ళకో, పుట్టిళ్ళకో, పురుళ్ళకో పరిమితమై పోయారు.

వచ్చిన వాళ్ళందరి చేతా రకరకాల కార్యక్రమాలు చేయాలని శారద అన్నపూర్ణ, సరస్వతి ముందుగానే ఆలోచించారు. డాన్సులు, నాటకాలు, తమకు నచ్చిన పుస్తకాల గురించి మాట్లాడటం, పాట కచ్చేరిలు, దగ్గర తోటలకు వెళ్ళీ వంటలు చేసుకుని తినటం, ఒకటి రెండు సినిమాలు చూడటం ఇలాంటి వాటితో పాటు శారద, అన్నపూర్ణ, సరస్వతి వాళ్ళకు చరిత్ర గురించి, సంస్కరణోద్యమం గురించీ, స్వాతంత్రోద్యమం గురించి, తెలంగాణా సాయుధ పోరాటం గురించి పాఠాలు చెప్పాలని కూడా అనుకున్నారు.

స్వరాజ్యం, సరస్వతి కూతుళ్ళు మనోరమ, విద్య రెండో తరం నాయకురాళ్ళుగా బాధ్యతలు తీసుకున్నారు. స్వరాజ్యం తన కూతురిని చంకనేసుకునే ఇల్లంతా గిరగిరా తిరుగుతోంది. ఇంతలో ఎవరో ఒకరు ఆ పిల్లలను ముద్దు చేస్తూ ఎత్తుకుంటారు. ఒకరి చేతుల్లోంచి ఇంకొకరి చేతుల్లోకి మారుతూ బుల్లి అరుణ కూడా సంతోషంతో కేరింతలు కొడుతోంది.

ఒక్కోరోజూ గడుస్తున్న కొద్దీ అందరికీ దిగులు పదిరోజులయితే ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవాలి గదా అని,

పగలూ, సాయంత్రాలు కోలాహలంగా గడుస్తున్నాయి. రాత్రిళ్లు శారద, అన్నపూర్ణ, సరస్వతి రాజకీయ పాఠాలాగా తమ అనుభవాలు చెబుతున్నారు. పిల్లలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సతమతమవుతున్నారు.

“ఎంతైనా తరానికీ, తరానికీ మధ్య అంతరం ఉంటుందోయ్ – వాళ్ళ తెలివి,

చురుకు మనకు లేదోయ్” అని శారదే అనాల్సి వచ్చింది.

“అన్నపూర్ణా, నీ కూతురు స్వరాజ్యం ఉందే అది వజ్రమే” అంది సరస్వతి. అప్పడు అనిపించింది శారదకు నటాషా మిగిలిన వాళ్ళున్నంత చురుకుగా లేదని. మామూలుగా ఉండే చురుకుదనం ఏమైపోయింది? అనుకుని మర్నాడు నటాషా మీద ఓ కన్ను వేసి ఉంచింది. తేడా స్పష్టంగా తెలుస్తోంది. పరధ్యానంగా, అనాసక్తంగా ఉంటున్నదనిపించింది. అందరితో కలిసి ఆడుతూ పాడుతూనే ఏదో ఆలోచనలో పడిపోతోంది. ఎవరన్నా పిలిస్తే ఉలిక్కిపడుతోంది. అపుడపుడూ ముఖంలోకి దిగులు వచ్చి కూచుంటోంది. రెండు రోజులు గమనించాక శారదాంబ నటాషాను ఉదయాన్నే తన గదికి పిలిపించుకుంది, నిద్రకళ్ళతో వచ్చిన నటషా కళ్ళూ ముఖమూ తుడిచి, వేడి కాఫీ అందించింది.

“నటూ చెప్పమ్మా- ఏంటోగా ఉంటున్నావు. దిగులు పడుతున్నావు దేని గురించో – నాతో చెబితే ఆ దిగులు తగ్గదా?” అని అనునయంగా తల్లి అడుగుతుంటే నటాషా కళ్ళ నుండి బొటబొటా కన్నీళ్ళు కారాయి.

శారద కూతుర్ని దగ్గరకు తీసుకుని హత్తుకుని “పిచ్చిపిల్లా, ఏడుస్తావెందుకు. ఎవరినన్నా ప్రేమిస్తున్నావా?”

తల్లి అడిగిన ప్రశ్నకు బావురుమంది నటాషా

ఆ ఏడుపుని ఆపి విషయం రాబట్టేసరికి శారదాంబకే అలుపు వచ్చింది. శారదాంబ సందేహించింది నిజమైంది. నటాషా ప్రేమలో పడింది. ఆ కుర్రాడు ఎమ్మెస్సీ

ఈ ఏడాదే పూర్తిచేశాడు. ఉద్యోగం దొరికేలా ఉంది. వెంటనే పెళ్ళి చేసుకుందా మంటున్నాడు.

“వాళ్ళింట్లో ఒప్పకుంటారు. మనదీ వాళ్ళదీ ఒకే కులం’ అని నటాషా చెప్తుంటే శారద పేలవంగా నవ్వింది. కులం ప్రసక్తి తన ఇంట్లోకి కూడా వచ్చేసింది.

“మరి నీ చదువు? బియస్సీ తర్వాత మెడిసిన్ చదవవా?”

“లేదమ్మా – నాకింక చదవాలని లేదు – పెళ్ళీ చేసుకుని సెటిల్ అవాలని ఉంది నటాషాకి ఇప్పుడు ఉత్సాహం వచ్చింది. బరువు దిగిపోయింది.

“సరే – నీ ఇష్టం వచ్చినట్టే చెయ్యి వెళ్ళి హాయిగా అందరితో సంతోషంగా ఉండు. నేను నాన్నతో చెప్పి వాళ్ళ వాళ్ళతో మాట్లాడమంటాను.”

నటాషా రెక్కలొచ్చిన పిట్టలా తుర్రుమని అక్కడ్నించి ఎగిరిపోయింది.

శారద వెంటనే మూర్తికి ఫోన్ చేసి శనాదివారాల్లో రమ్మంటూ విషయం కూడా చెప్పింది, మూర్తి ఆశ్చర్యపడి “దానికప్పుడే పెళ్ళేంటి” అంటే శారదకు కళ్ళవెంట నీళ్ళొచ్చాయి.

ఆ సాయంత్రం అన్నపూర్ణతో ఆ సంగతి చెప్పి దిగులుపడుతూ కూచుంది శారద.

“నా జీవిత విధానం నా కూతురికి నచ్చలేదోయ్ – కారణం నేనేననుకుంటా. నటాషా చడువుకి ఇబ్బంది కలగకూడదని నాకు దూరం చేసుకున్నాను. నా విలువలు నేర్పలేకపోయాను. ఇప్పుడు చేయగలిగింది లేదు. నటాషా తన జీవితాన్ని తనే జీవించాలి. తన ఇష్టప్రకారం జీవించాలి. డాక్టర్ అవుతుందనుకున్నా – నా ప్రాక్టీస్ తీసుకుంటుందనుకున్నా నా రాజకీయాలను ముందుకు తీసుకుపోతుందనుకున్నా పోనీ – కూతుళ్ళూ కొడుకులే మనకు వారసులనుకోకూడదు. మన ఆశయాల వారసులు ఎక్కడో పుట్టి పెరుగుతుంటారు.

అన్నపూర్ణకు చెబుతున్న ఆ మాటలు శారద తనకు తానే చెప్పకున్నట్లు ఉన్నాయి.

మూర్తి రెండు రోజుల్లో వచ్చి నటాషా నడిగి వివరాలన్నీ కనుకోని విశాఖపట్నం వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వచ్చాడు.

“అంతా బాగానే ఉంది గానీ వాళ్ళు పెళ్ళి శాస్త్రోక్తంగా జరగాలంటున్నారు. కన్యాదానం చెయ్యాలట”,

శారద నవ్వేసి కన్యాదానం ప్రసక్తే లేదు” అంది.

“లేదు. వాళ్ళు చాలా పట్టుగా ఉన్నారు. మనం ఏదో మార్గం ఆలోచించాలి”.

“ఏం మార్గం ఉంటుంది. నువ్వూ నేనూ పీటల మీద కూచుని నటాషాని వాళ్ళకి కన్యాదానం చేద్దామా? నా వల్ల కాదు”.

“మనం చెయ్యాలని కాదు, మన బంధువులెవరైనా ఆ పని చెయ్యొచ్చు”, “మీ లాయర్ల తెలివి తేటలే వేరేం – చిరాకు పడింది శారద.

“అంతకంటే మరో మార్గం లేదు. ఇదో తతంగం. దానికంత ప్రాముఖ్యం అనవసరం. కుర్రాడు చాలా మంచివాడు. నటాషాకు అతనంటే ప్రాణం. వాళ్ళిద్దరి ప్రేమనూ ఈ తతంగం కోసం కాదంటామా? ఏదో ఒక ఉపాయం చూసి పెళ్ళి

376 & ఓల్లా

జరిపిస్తామా?” శారదకు నిరుత్సాహం, నీరసం కమ్ముకొచ్చాయి.

“సరే – నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని హాస్పిటల్కి వెళ్ళిపోయింది. ఆ రోజంతా మనసు మనసులో లేదు.

ఎంతమందికి తను దండలు మార్పించి, టీ పార్టీ ఇచ్చి పెళ్ళిళ్ళు చేసిందో లెక్కలేదు. ఇప్పడు తన కూతురు పురోహితుడి మంత్రాలతో, మంగళసూత్ర ధారణతో కన్యాదానంతో శాస్తోక్తంగా పెళ్ళి చేసుకుంటానంటుంది. ఎక్కడ జరిగింది లోపం?

అన్నపూర్ణ కూతురి పెళ్ళి తను చేసింది.

తన కూతురి పెళ్ళి ఇంకెవరో చేస్తారు.

సమాజంలో సంక్లిష్టత్వం పెరుగుతోంది. సరైన దిశగా వెళ్ళటం లేదు – స్వీయ జీవితాన్ని సామాజిక సందర్భాలతో సరిచూసుకునే సామర్థ్యం ఉంది గనుక శారద

తప్పంతా తనమీద వేసుకుని బాధపడలేదు. కూతురి పెళ్ళీ జరిపించే బంధువులెవరా అని ఆలోచిస్తూ – ఇక ఆ పెళ్ళి పనులలో పడిపోయింది.

నటాషా వివాహం జరిగిపోయింది. బంధువులు స్నేహితులు సందడిగా ఇల్లంతా తిరుగుతుంటే తన ఇంట్లో తనే పరాయిదానిలా అనిపించింది శారదకు, పెళ్ళి తంతు జరుగుతుంటే శారద, అన్నపూర్ణ, సరస్వతి మండపానికి కాస్త దూరంగా కూర్చున్నారు. సరస్వతి “మీరిద్దరూ మీ కూతుళ్ళ పెళ్ళి మీరు చెయ్యలేకపొయ్యారు. ఎవరో చేస్తున్నారు. ఏంటిది – అర్ధం లేకుండాను’ అంది ఆలోచిస్తూ, అన్నపూర్ణ టక్కున “ఆధునిక స్త్రీలం గదా – అందుకు – ” అనేసరికి శారద పెద్దగా నవ్వేసింది. గలగలా నవ్వుతున్న శారద నవ్వులో అన్నపూర్ణా జతగలిపింది.

సరస్వతి “ఊరుకోండి అందరూ ఇటే చూస్తున్నారు” అంది తనూ నవ్వాపుకోలేక సతమతమవుతూ, ఒకవైపు మంత్రోచ్ఛారణల మధ్య మాంగల్యధారణ జరుగుతుంటే ఈ ముగ్గురు తల్లలూ నవ్వాపుకోలేక పగలబడి నవ్వుతున్నారు.

వీళ్ళకు దగ్గరగా ఉన్నవారంతా వింతగా చూస్తుంటే మరింత నవ్వొచ్చింది ముగ్గురికి,

****************

నటాషా పెళ్ళి జరిగాక రాజకీయ శూన్యత్వాన్ని భరించలేననిపించింది శారదకు. ప్రాక్టీసు ఎంత సమయాన్ని తీసుకున్నా డాక్టర్గా ఎంత సేవ చేసినా తృప్తి కలగటం లేదు. సరస్వతి, అన్నపూర్ణల స్నేహం ఎంత సేద తీర్చినా ఏదో అశాంతి మనసును

తొలిచేస్తోంది. ప్రజా రాజకీయాలు లేకుండా జీవించటం కష్టంగా ఉంది. డబ్బు సంపాదించింది. మంచి హాస్పిటల్, ఇల్లు, కళ్ళముందు ఆనందంగా తిరుగుతున్న కూతురు, స్నేహితులు, పేరు, ప్రతిష్టా – కానీ ఒక మూల శూన్యం, రైతు కూలీలతో, వెనుకబడిన వర్గాల వారితో కలిసి వారికోసం పని చేయాలనే తపన – ఆడవాళ్ళ అభివృద్ధి కోసం చేయవలసిన, తీసుకురావాల్సిన చట్టాల గురించి ఆలోచన – ఆరోగ్యపరమైన పాలసీల కోసం ఉద్యమించాలనే ఆతృత – ఇవన్నీ శారదాంబ మనసుని తొలిచేస్తున్నాయి. ప్రతి విషయం గురించి నోట్సు రాసుకుంటోంది. రావాల్సిన మార్పుల గురించి స్నేహితులతో మాట్లాడుతోంది.

****************

రోజులిలా గడుస్తుండగా శారద బంధువు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఉన్నత విద్యావంతుడు అయిన రావుగారు శారదను కాంగ్రెస్లో చేరమని గట్టిగా అభ్యర్థించటానికి వచ్చాడు.

ఆయన మాటలు విని శారద తేలిగ్గా తీసిపారేయలేదు. సూర్యం కూడా అక్కడే ఉన్నాడు.

తమ్ముడూ – నువ్వు అడగటంలో పొరపాటులేదు. కానీ కాంగ్రెస్కు సర్వస్వం ధారపోసి పనిచేసిన మా అన్నపూర్ణ, అబ్బయ్యలు స్థానిక రాజకీయ ధోరణుల గురించి నాకు చెప్తుంటారు. వాళ్ళే క్రమంగా దూరమవుతున్నారు. నేను కాంగ్రెస్లో చేరి ఏం చెయ్యాలి? నా స్వభావం నీకు తెలుసు, అవినీతి అక్రమాలు సహించను, ఎవరి అధికారానికి తలవంచను. రాజీపడను. నాకు రాజకీయాలంటే ఆసక్తి ఉంది. కానీ నేను వాటిలో ఇమడలేను. దుర్గాబాయిని ఓడించిన పార్టీలో నా స్థానమేంటి? నేనేం చెయ్యగలుగుతాను?

రావు నిదానంగా ఆచితూచి మాట్లాడాడు.

“నువ్వన్నదంతా కరెక్టేనక్కా కానీ నేను నిన్ను కాంగ్రెస్లోకి రమ్మన్న కారణం వేరు. ఇప్పుడు పరిస్థితులు నీకు తెలుసు. రాజ్యాంగం రాసుకుని పదేళ్ళు కాలేదు. దేశ నిర్మాణమనే పెద్ద బాధ్యత అందరి మీదా ఉంది. అది సక్రమంగా జరగాలంటే కేంద్రంలో మేధావులు, నిజాయితీపరులూ శాయశక్తులా పని చెయ్యాలి. అన్ని రంగాల నుంచీ విద్యావేత్తలు, సోషలిస్టు భావాలు గలవారు, దేశ నిర్మాಣಂ మీద ఆసక్తి గలవారూ

వచ్చి పనిచేస్తే తప్ప అభివృద్ధి జరగదు. అందుకని నువ్వు కాంగ్రెస్ తరపున పోటీచేసి పార్లమెంట్ కి రావాలి. ఇది నా ఆశ మాత్రమే కాదు. నెహ్రూ గారి కోరిక కూడా, ఎన్నికలు దగ్గరకొచ్చాయి. నువ్వు నిర్ణయం తీసుకోవాలి?

“నేను ఎన్నికల్లో పోటీ చేయటమా? దుర్గాబాయి సంగతి తెలియదా?”

తెలుసక్కా – కానీ నాకు నమ్మకం ఉంది. బెజవాడ ప్రజలు నిన్ను ఎన్నుకుంటారు. పార్లమెంటుకెళితే నీకోసం చాలా పనులున్నాయి. హిందూ కోడ్బిల్లు ఇంకా సంస్కరించబడాలి, హెల్త్ పాలసీలు రూపొందించాలి. స్త్రీ శిశు సంక్షేమ పథకాలు ఒక అవగాహనతో ఏర్పడాలి. వీటన్నిటికీ నీ మేధస్సు, నీ విజ్ఞానం, నీ చట్ట పరిజ్ఞానం సోషలిస్టు ఆలోచనా ధోరణీ అన్నీ దోహదం చేస్తాయి. అందుకే నీ గురించి అంతా తెలిసీ నేను ఈ మాట అడిగే సాహసం చెయ్యటానికి సిద్ధపడ్డాను. ఆలోచించు. ఎన్నికలలో గెలుపోటముల గురించి ఎవరూ చెప్పలేరు. కానీ నువ్వు పాలసీలు రూపొందించే కమిటీలలో పని చేయటానికి ఎమ్.పి. వే కానవసరం లేదు. కాంగ్రెస్ సభ్యురాలివైతే చాలు. సభ్యురాలివి కాకున్న ఫరవాలేదు. కానీ చాలా ఆటంకాలు, చికాకులు ఎదుర్కోవాలి. అసలు నువ్వు ఎం.పి. గా గెలుస్తావనే నమ్మకం నాకుంది. ఆలోచించు ప్రజలకు నీ మీద ఉన్న అభిమానం సామాన్యమైంది కాదు. అది నీకు తెలియదేమో కానీ అందరికీ తెలుసు. శారదను ఒప్పించేందుకు ఓపికగా మాట్లాడుతున్నాడు రావు.

“బెజవాడ కమ్యునిస్టుల కంచు కోట. నేను కమ్యునిస్టు పార్టీ నుంచి బైటికి వచ్చినదాన్ని – వాళ్ళ దృష్టిలో బహిష్కరించబడిన దాన్ని నేనెలా గెలుస్తాను.”

గెలుస్తావు. మాకందరికీ నమ్మకం ఉంది. గెలవవు – నీకు ఎంపి అవటం ముఖ్యం కాదుగదా

శారదకు ఎటూ పాలుబోలేదు.

“నేను ఆలోచించి చెబుతాలే అని రావు గారిని పంపించింది. సూర్యంతో ఎప్పటికప్పుడు తన మనసులోని మాటలు చెపుతూనే ఉంది, రావుగారు వెళ్ళాక సూర్యం “రాజకీయ జీవితం లేకుండా నువ్వు శాంతిగా ఉండలేవు అక్కా ఎన్నికల్లో పోటీ చెయ్యి” అన్నాడు,

“ఎన్నికలంటే మాటలా? డబ్బూ ప్రచారం.

“అదంతా నేను చూసుకుంటాను గదా. ఆ విషయాలు నాకు ఒదిలెయ్” అన్నాడు. ఎంత ఆలోచించినా ఒక నిర్ణయానికి రావటం కష్టంగానే ఉంది. మూర్తితో మాట్లాడితే అతనూ ఏమీ చెప్పలేక పోయాడు.

‘నువ్వే ఆలోచించుకో – బెజవాడ నంతా ఎర్రదనంతో నింపిన ఇల్లు మూడు రంగులకు మారటం – చాలా ఐరనీ – ” అని నవ్వేశాడు.

నాకు రాజకీయ జీవితం లేకుండా బతకటం చాలా వెలితిగా ఉంది”

వెలితి గురించి నాతో చెప్తున్నావా? అది నీకంటే వందరెట్లు నేను అనుభ విస్తున్నాను”

“ఏదో ఒకటి చేయాలి మూర్తి నేను కాంగ్రెస్ పార్టీలో చేరతాను. ఎన్నికలలో పోటీ చేస్తాను. అది పొరపాటనిపిస్తే దిద్దుకుంటాను. ఏ పనీ చెయ్యనివాళ్ళు పొరపాట్లు చెయ్యకుండా పరిశుద్ధంగా ఉంటారు. నాకు ప్రవహించాలని ఉంది. నిలవనీరులా ఉండాలని లేదు. ప్రవాహంలో చెత్తాచెదారం ఒక్కోసారి చేరుతుంది. దానిని పక్కకు నెట్టి ప్రవహించకపోతే నిలవనీరు మురికినీరవుతుంది. పార్లమెంటుకి వెళ్తాను. ఏమైనా చెయ్యగలనేమో చూస్తాను.”

మూర్తితో మాట్లాడుతూనే ఒక నిర్ణయానికి వచ్చింది శారద,

నాలుగు రోజుల్లో శారదాంబ కాంగ్రెస్ పార్టీలో చేరిందనే వార్త బెజవాడలో సంచలనం సృష్టించింది.

“చూశావా? శారదాంబ ఎంతపని చేసిందో, శత్రుశిబిరంలోకి వెళ్ళి చేరింది” అన్నారు కొందరు.

“మనం ఆమెను శత్రువులా చూస్తే లేనిది ఆమె కాంగ్రెస్లో చేరితే వచ్చిందా తప్పు, మనం ఆమెను దూరం చేసుకున్నాం, వాళ్ళు తెలివిగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఆమె తెలివి, మంచితనం అన్నిటినీ కాదనుకున్నాం, ఇప్పుడావిడ ఏం చేస్తే మనకెందుకు” అన్నారు కొందరు. ఎవరేమనుకున్నా ఆగని కాలం ఎన్నికలను తరుముకుంటూ వచ్చింది.

అన్నపూర్ణ, అబ్బయ్య బెజవాడ వచ్చారు. స్వరాజ్యం పదిరోజుల ముందు వస్తానని ఉత్తరం రాసింది గానీ ఆ ఉత్తరంలో ఏదో అసంతృప్తి ఉంది. “స్వరాజ్యానికి నే చేసిన పని నచ్చలేదనుకుంటానోయ్’ అంది శారద. “చిన్నపిల్ల – దానికేం తెలుసు అంది అన్నపూర్ణ

‘అది కమ్యూనిజం వైపు వెళ్తుంటే మీరు అటునుండి ఇటు వచ్చారు. స్వరాజ్యం కొంత గందరగోళపడి ఉంటుంది” అన్నాడు అబ్బయ్య

రామస్వామి గారు శారద ఎన్నికల్లో పోటీ చేస్తోందని తెలిసి తన పనులన్నీ పక్కనబెట్టి ప్రచారం చెయ్యటానికి వచ్చారు.

“మన వాళ్ళందరికీ మీ మీద కోపం పెరుగుతుందండీ”, అంది శారద నవ్వుతూ

పెరగనివ్వవమ్మా- దానివల్ల ఎవరికి నష్టం? మంచి మనుషుల్ని దూరం చేసుకుని వారిమీద కోపం తెచ్చుకునే సంప్రదాయం మనవాళ్ళు నేర్చుకుంటూనే ఉన్నారు. నువ్వు పార్లమెంటుకి వెళ్ళి ఏదో మంచిపని చేస్తావు. మా శారదాంబ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే నేను ఊరికే ఇంట్లో కూచోనా? బెజవాడలో నాకూ అంతో ఇంతో పేరూ ప్రతిష్ణా ఉన్నాయి, నా మాటకూ విలువ ఉంది. అది నీకు ఉపయోగపడితే చాలని వచ్చేశాను” అన్నాడాయన.

బెజవాడలో ఎన్నికల వేడి వేసవి కాలాన్ని ముందే తెచ్చింది. సరస్వతి, అన్నపూర్ణల ఆధ్వర్యంలో మహిళా బృందాలు పని చేస్తున్నాయి, సూర్యం అందరినీ ఆర్గనైజు చేసి నడిపించే పనిలో క్షణం తీరిక లేకుండా తిరుగుతున్నాడు. శారదకు ప్రత్యర్థి కమ్యూనిస్టుపార్టీ నుంచి తమ్మిన పోతరాజు, అతనంటే శారదకు మొదటి నుంచీ ప్రత్యేకాభిమానం. అతనికీ శారదంటే గౌరవం. కానీ రాజకీయాలు ఇద్దరినీ ఎదురెదురుగా నిలబెట్టాయి. ఒకరోజు వారిద్దరూ ఎదురు పడ్డారు. మామూలుగా మాట్లాడుకుని ఒకరినొకరు అభినందించుకుని ఎవరిదారిన వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నాలుగురోజులకు అబ్బయ్య, సూర్యం కొన్ని కరపత్రాలు పట్టుకొచ్చారు. అన్నపూర్ణకిచ్చారు, అవి చదివి అన్నపూర్ణ ముఖం పాలిపోయింది. పద్మ భీత్కారం చేస్తూ వాటిని నలిపేసింది.

“ఇవి శారద కంటపడకుండా చూడాలి. చాలా బాధపడుతుంది”. అంది అన్నపూర్ణ కంగారుగా “ఆవిడ బాధ పడుతుందో, నవ్వుకుంటుందో ఏం చేస్తుందో – ఈ కరపత్రాలు ఎలాగైనా ఆవిడ కంటపడతాయి. ఏ సభలోనో హఠాత్తుగా వీటి గురించి తెలిసే బదులు స్థిమితంగా వీటి గురించి తెలుసుకుని పబ్లిక్లో వీటి గురించి ఎట్లా రియాక్ట్ అవాలో ఆలోచించుకోవటం తెలివైన పని” అన్నాడు అబ్బయ్య

అతనే శారద దగ్గర కవి తీసుకెళ్ళి

“డాక్టర్ గారూ – ఇవి చూడండి. మీరొకసారి చూస్తే నేను చింపి అవతల పారేస్తాను” అని వాటిని అందించాడు.

శారద అవి తీసుకుని చూసింది.

కమ్యూనిస్టు పార్టీ ప్రచార కరపత్రాలవి. దానిలోని సమాచారం మాత్ర శారద “కాంట్రాక్టు పెళ్ళి” గురించిన పిచ్చిరాతలే – 1946 ఎన్నికలలో కాంగ్రెస్ శారదపై బురద జల్లుతూ వేసిన కరపత్రాలకేమీ తీసుపోకుండా ఉన్నాయి.

శారద వాటిని చదివి పెద్దగా నవ్వేసింది. దూరం నుంచి చూస్తున్న అన్నపూర్ణ పద్మ దగ్గరకొచ్చారు.

“ఇప్పటి వరకూ నాలో ఏమూలో కాస్త అశాంతి ఉండేది. అది కాస్తా పోయింది. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఒకటే ఆడవాళ్ళ విషయంలో, చాలా పెద్ద మార్పులు రావాలి. స్త్రీల సమానత్వాన్ని గౌరవించటం ఈ దేశంలో తేలిక కాదు. మనం చాలా పోరాడాలి దానికోసం. ఈ కరపత్రాలు నా విలువను తగ్గించలేవు ప్రజల్లో – ప్రజల్లో మార్పు వచ్చింది. రాజకీయ పార్టీలలోనే రావాలి.”

సరిగ్గా అప్పడే రామస్వామి గారు ఆ కరపత్రాలను పట్టుకుని వచ్చాడు. ఆయన ముఖం బాధ, కోపం కలిసి ఎర్రబడింది.

శారద ఆయన్ని కూచోబెట్టి ఆ కర పత్రాలను చేతిలో నుండి తీసి అవతల పడేసింది “నువ్వింత స్థిమితంగా ఎలా ఉన్నావమ్మా అన్నాడాయన కంటనీరొక్కటే తక్కువగా, వాళ్ళేదో కోతిపని చేశారని మనం కొండముచ్చులమవుదామా చెప్పండి అంది శారద నవ్వుతూ,

“ఇది కోతిపని – అల్లరి చిల్లర పని కాదమ్మా అమానుషమైనపని.” “మనుషులుగా ఉండటం చాలా కష్టమైన పని. గాలిబ్ అనే కవి ఎంత బాగా చెప్పాడనుకున్నారు – శారద మాటలు ఆయన చెవికెక్కటం లేదు.

“నీ మీద వాళ్ళకింత కోపం ఎందుకో నాకు తెలుసమ్మా నువ్వు మేధావివి, మేధావి అయిన మహిళను మగవాళ్ళు సహించలేరు. ఎట్లాగయినా ఆమెను అల్లరి పాలు చేసి, చిల్లర కింద తీసి పారేసి, విలువ లేకుండా చేస్తేగాని వాళ్ళ కంటే అందివచ్చేది ఏముందమ్మా, ఆ రోజు కాంగ్రెస్ వాళ్లు చేసిన పని ఇవ్వాళ వీళ్ళు చేశారు. అప్పడూ కొంతమంది నీ గురించి తక్కువగా మాట్లాడటం నాకు తెలుసు?

వాళ్ళను అప్పడు చివాటు పెట్టగలిగిన స్థితిలో ఉన్నాను. ఇప్పడు అసహ్యించుకుంటున్నాను. మనసులోదంతా కక్కేస్తే గాని ఆయన శాంతించేలా లేదు.

“ఒద్దు రామస్వామి గారూ – అసహ్యించుకోవద్దు. జాలి పడదాం. ఇన్నాళ్ళ కమ్యూనిస్టు ఉద్యమంలో వాళ్ళు అతి చిన్న విషయాలు కూడా నేర్చుకోలేదే అని జాలి పడదాం, నవ్వగలిగితే మరీ మంచిది, ఇది చాలా అల్లరి చిల్లర విషయం, దీనిని మనసులోకి తీసుకుని బాధపడేంత ప్రాముఖ్యత ఇవ్వకండి.”

“ఇది నీ వ్యక్తిగత విషయం గాబట్టి దాన్నలా తీసిపారెయ్యకపోతే లాభం లేదనుకుంటున్నావు. మంచిదే. కానీ తోటి మనుషులుగా మేమెట్లా ఊరు కోవాలమ్మా ఊరుకుంటే మేం మనుషులమని పించుకుంటామా?

“ఇప్పడు మనకు ఊపిరాడని పనులున్నాయి. ఈ విషయంతో ఊపిరాడ కుండా చెయ్యాలనే, మనల్ని దెబ్బకొట్టాలనే వాళ్ళిలా చేశారు. మనం మరీ అంత బలహీనులం కాదని చెప్పటమే మంచిది, దీన్నింతటితో ఒదిలేద్దాం.

“అక్కయ్య చెప్పినట్లు చెయ్యండి రామస్వామి గారు, పదండి చాలా పనులున్నాయి. ఈ పిచ్చి మాటలకు సమయం లేదు మన దగ్గర అన్నాడు సూర్యం,

శారద ఆ కరపత్రాలను అవతల విసిరేసి ఎన్నికల ప్రచారానికి బయలుదేరటంతో అన్నపూర్ణ గుండెల మీద నుంచి పెద్ద బరువు దిగింది. పద్మ కూడా కాస్త చల్లబడింది.

కానీ శారదను పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేసి, అది పార్టీకి మంచిదని బలవంతపెట్టి ఇవాళ ఆ పెళ్ళిని అడ్డంపెట్టి శారద మీద దుష్ర్పచారం చేస్తున్న కమ్యూనిస్టులపై అన్నపూర్ణకు వచ్చిన కోపానికి అంతులేదు, ఎన్నికలైనన్ని రోజులూ “కమ్యూనిస్టులలా ఎలా చేస్తారు?” అని సతాయిస్తూనే ఉంది.

“కమ్యూనిస్టులు పై నుంచి దిగొచ్చారా? వాళ్ళూ మనుషులే. వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు.”

“కానీ మరీ ఇంత అన్యాయమా?”

“ఇంత అన్యాయం కమ్యూనిస్టులు చెయ్యగూడదని నీ కోరిక కదూ అన్నపూర్ణా మనందరికీ తెలిసో తెలియకో కమ్యూనిజం మీద ఆశ ఉంది. కమ్యూనిస్టులంటే ఇలా ఉండాలనే ఊహ ఉంది. వాళ్ళు ఆదర్శాలను పాటిస్తారనే నమ్మకం ఉంది.

కానీ విషయవేుమిటంటే కమ్యూనిజం సామాన్యమైన సంగతి కాదు. ఈ కమ్యూనిస్టులంతా భూస్వామ్య భావజాలం నుంచి వచ్చిన వారే. దానితోనే వారి యుద్ధం. కానీ అది వాళ్ళకే తెలియకుండా వాళ్ళను చుట్టేసుకుంటుంది. దాన్ని ఒదిలించుకోవటం తేలిక కాదు. వాళ్ళ నుంచి మరీ ఎక్కువ ఆశించలేం ఇప్పుడే – భవిష్యత్తు సంగతి తెలియదు” అబ్బయ్య ఎంత చెప్పినా అన్నపూర్ణ మనసులోంచి “మరీ ఇంత అన్యాయమా” అన్న ప్రశ్న పోలేదు.

రెండు పార్టీల ప్రచారాలు ఒకదానికొకటి తీసిపోకుండా జరుగుతున్నాయి. ఎన్నికల తేదీ వచ్చేసింది, వెళ్ళి పోయింది.

దుర్గాబాయి కొన్ని వందల ఓట్ల తేడాతో ఓడిపోతే శారదాంబ కొన్ని వందల ఓట్లు తేడాతో గెలిచింది.

కమ్యూనిస్టుల కంచుకోట పగలగొట్టామని, కాంగ్రెస్ సంబరపడింది. కాంగ్రెస్ సంబరానికి కమ్యూనిస్టు పార్టీ నిర్మాత అయిన తను కారణమవటంలోని విచిత్రాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నంలో అలిసిపోయింది శారద, పార్లమెంటు సభ్యురాలిగా వెళ్తున్న జెజవాడ మహిళగా ఎంతోమంది ఆమెను గౌరవించారు.

*******

ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ వెళ్ళింది శారద, 30 వ దశాబ్దంలో కలిసి పని చేసిన భారత జాతీయ మహిళ సంఘం నాయకులు చాలా సంవత్సరాల తర్వాత శారదను చూసి సంతోషించారు.

విశాలాక్షి కుటుంబం అంతా వచ్చి శారదను అభినందించారు.

“నువ్వు కొంపదీసి మంత్రివై మా డిపార్ట్మెంట్ కొచ్చి పెత్తనం చేస్తావేంటి? అంది విశాలాక్షి నవ్వుతూ,

“ఆ ప్రమాదం లేదులేవోయ్ – పార్లమెంటులో అనుభవం లేకుండా ఒక్కసారే మంత్రినెలా అవుతాను? చూద్దాం – ఏం చేద్దామో -” నిష్కల్మషంగా అంది శారద,

బెజవాడ తిరిగి వచ్చిన శారదను పనులు ముంచెత్తాయి.

ప్రాక్టీసు, నియోజకవర్గ సభ్యులను తెలుసుకోవటం, వచ్చిన వాళ్ళతో మాట్లాడి పంపటం, తన ఆఫీసు నుంచి జరగాల్సిన పనులు జరిగేలా చూడటం – వీటన్నిటితో ఒక్క క్షణం తీరటం లేదు.

మూర్తి హైదరాబాదులో తన ప్రాక్టీసు పెంచుకునే పనిలో పడిపోయాడు.

పార్లమెంటులో హిందుకోడ్ బిల్లు పాస్ అయినా దాని గురించి చేయాల్సింది చాలా ఉంది. దుర్గాబాయి, శారద ఆ కమిటీలో ఉండి దానికి మెరుగులు దిద్దే పనిలో పడ్డారు.

ప్రజారోగ్యం గురించిన పాలసీలను సమీక్షించి వాటిని మరింత

ప్రజోపయోగకరంగా రూపొందించే కమిటీలో కూడా శారద మనసంతా పెట్టి పనిచేస్తోంది.

పని ఎంత చేసినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండటం మొదట్లో శారదకు మింగుడు పడలేదు.

హిందూకోడ్ బిల్లు చట్టం చేయటానికి ఏర్పడ్డ కమిటీలో సనాతనవాదుల సంగతలా ఉంచి అంతో ఇంతో ఆధునికంగా ఆలోచిస్తారనుకున్నవారు కూడా ఎంతగా సంప్రదాయాలలో కూరుకుపోయూరో చూస్తుంటే శారదకు మతిపోయేది.

ఏ చిన్న సవరణ స్త్రీలకు మరింత వెసులుబాటు కల్పించేది ప్రతిపాదించినా అందరూ హాహాకారాలన్నా చేసేవారు. లేదా మౌనమన్నా పాటించేవారు.

బిల్లుని వివాహం, విడాకుల విషయాల్లో స్త్రీలకు, పురుషులకు స్వేచ్ఛనిచ్చేలా చేయటానికి శారద చేసిన ప్రతి ప్రతిపాదననూ తిరస్కరించారు.

ఆ చట్టం వల్ల స్త్రీలకు ఒనగూడే ప్రయోజనం అతి తక్కువని శారదకు అర్థమైంది. అది దుర్గాబాయితో తప్ప ఎవరితో చెప్పినా కనీసం సానుభూతి కూడా దొరకలేదు.

విశాలాక్షి ఒకరోజు శారదను తన ఇంట్లో భోజనానికి పిల్చింది. శారదకు వెళ్ళాలనిపించలేదు గానీ విశాలాక్షి ఒదల్లేదు.

విశాలాక్షి తన ఆడంబరాన్నీ అతిశయాన్నీ చూపించే తీరు శారదకు నచ్చదు. చిరాకు తెప్పిస్తుంది. ఐనా చిన్ననాటి స్నేహం ఒక రకంగా రక్త సంబంధం లాంటిదే – విశాలాక్షిని చివాట్లు పెట్టగలదు శారద. చివరకు వెళ్ళింది – భోజనాలయ్యాక శారద ఇక వెళ్తానంటే.

“ఉండు. నీతో మాట్లాడాలనే పిల్చానివాళ – నువ్వేంటి హిందూకోడ్ బిల్లు విషయంలో మరీ విచ్చలవిడిగా మాట్లాడుతున్నావట. సెక్రటేరియెట్ దాకా వచ్చాయా మాటలు. నువ్వు ఉన్నట్లే అందరూ ఉండాలంటే కుదురుతుందా? అందరినీ నీలా మూరమంటూవా?”

“నాలా ఒకరు కూడా మారరు విశాలా – అసలు నీ సమస్య ఏంటి చెప్పు? “నా సమస్యా? పెళ్ళీ మీద కనీస గౌరవం లేని నిన్ను ఆ కమిటీలో వెయ్యటం.

నువ్వందులో మీ చలంగారి సిద్ధాంతాలన్నీ చొప్పించాలని ప్రయత్నించటం” శారదకు విశాలను చూస్తే జాలనిపించింది. చిరాకు పిచ్చింది.

పెళ్ళి అతి పవిత్రం. జన్మజన్మల బంధం, స్వర్గంలో నిర్ణయింపబడతాయని నమ్మేవాళ్ళకు ఈ కమిటీలు ఎందుకు? స్వర్గాన్ని నమ్మకుని ఉండొచ్చుగా, పెళ్ళీ – స్త్రీ పురుషుల సంబంధం మానవ సమాజం ఏర్పడిన నాటి నుండీ మానవుల చేత ఎన్నో రకాలుగా మార్చబడింది. ఆ సంగతి నీకు తెలియకపోతే తెలుసుకో – మార్పులు – కొత్త మార్పులు వస్తాయి. రావాలి. అందరికీ అన్ని అవకాశాలూ అందుబాటులో ఉండాలి. విశాలా మార్పు అనేది లేకపోతే స్త్రీల గురించిన ఆలోచనలో, పెళ్ళి గురించిన ఆలోచనలో ఎన్నో మార్పులు రాకపోతే నువ్వివాళ ఇలా ఉండేదానివేనా ఆలోచించు. నీకు అనుకూలమైన మార్పుల్ని ఆహ్వానిస్తావు. అవి నీకు అర్థమవుతాయి – నీకు అనుభవంలోకి వస్తాయి, కానీ మిగిలిన స్త్రీల విషయంలో రావాల్సిన మార్పులు గురించి కనీసం తెలుసుకుందామనుకోవు. నువ్వు చాలా మారాలోయ్ – నువ్వు చాలా గట్టిదానివి – పట్టుదల గల దానివి. కావలసినవి సాధించుకున్నావు. కానీ అందరూ అలా ఉండరు. బలహీనులు, నీకున్న అవకాశాలు లేనివాళ్ళు ఉంటూరు, వాళ్ళ గురించి తెలుసుకో. తెలుసుకోకపోతే నీ తెలివి, నీ ఉద్యోగం అన్నీ వృధా – వృధా – వృధా. ” విశాలక్షి ముఖం చిన్నబోయింది,

“సరేలే – ఆ సంగతులు ఒదిలేద్దాం. మీ అమ్మాయి ఏం చేస్తోంది? అంది విశాలాక్షి

“నువ్వు పెద్ద తేనెతుట్టను కదిలించి – మళ్ళీ మెడకు గంధం రాస్తానంటే ఎట్లా విశాలా – మన అభిప్రాయాలు కలవవు. ఏం చేద్దాం? ఆ సంగతి గ్రహిద్దాం. నేను మాట్లాడే విషయాలు గురించి నువ్వు సీరియస్గా ఆలోచించు అప్పడు మనమింకా

మంచి స్నేహితులమవుతాం. నీ వల్ల దేశానికి కూడా మేలు జరుగుతుంది.” అంటూ లేచింది శారద.

ఇంటికి వెళ్ళే దారంతా విశాల తనకు చెప్పదల్చుకున్న విషయం మనసులో జోరీగలా రోద చేస్తూనే ఉంది.

సెక్రటేరియేట్లో తన గురించి గౌరవం లేదు. పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

386 • ఓల్లా

అందులో విశాల పాత్ర కూడా ఉండి ఉండొచ్చు.

దేశ రాజధాని ఢిల్లీ, విశాలమైన రోడ్లు, భవనాలు పార్లమెంటు దేశ భవిష్యత్తుని నిర్ణయించి శాసించగల కేంద్రం. కానీ ఇది ఒక కుగ్రామం. శాసనాలు మనుధర్మ శాస్త్ర జననాలు – మార్పు సహించని అధికారులు.

ప్రజాస్వామ్య అర్థం తెలియని వాతావరణం. చట్టాలలోనే కాదు – అవే కాస్త నయం, అవినీతి చాపకింద నీరులా పాకుతోంది. దీని నిలాగే సాగనిస్తే ఏదో ఒకనాటికి ఆ అవినీతి చెదలు పార్లమెంటుని తినేస్తుంది. కుప్పకూల్చేస్తుంది. దీనిని ఆపేదెట్టా

ఒక సారి నెహ్రూతో మాట్లాడి తన అసంతృప్తి అంతా చెబితే –

ఆయనకు తెలియదా? కానీ తనూ అంతా తెలుసుకున్నదని ఆయనకు చెప్పటం మంచిది. ఈ పార్లమెంటులో ఎన్నో చేయాలనుకుంది. కనీసపు పనులు కూడా జరగటం లేదు. అవినీతిని ఆపలేకపోవటం దుర్భరంగా ఉంది. దీనికంటే తన పరిధిలో తను డాక్టరుగా, చిన్న చిన్న సంస్కరణల కోసం పని చేసినా ప్రయోజనం ఎక్కువ ఉంటుందనిపిస్తుంది. ఇక్కడకు రాకముందు నెహ్రూ సోషలిస్టు విధానాల మీద చిన్నపాటి నమ్మకం ఉండేది. అది కూడా పోతోంది. అది ఆయనతో చెప్పటం నిజాయితీగా ఉంటుంది.

శారద పార్లమెంటు సభ్యురాలై నాలుగేళ్ళయింది. తన నియోజకవర్గంలో ప్రజలకు కావలసిన పనులు కొన్ని చేయగలిగింది గానీ ఎంతో తేలికగా జరిగే ఆ పనులకు కూడా స్థానిక నాయకుల నుండి ఏవో అభ్యంతరాలు వచ్చేవి. వాళ్ళు కల్పించే ఆటంకాలను దాటటానికే ఎక్కువ సమయం, శక్తి ఖర్చవుతున్నాయి. మగవాళ్ళు అహంకారాలు, ఎంత డాక్టరయినా ఒక ఆడదాని మాట వినాల్సి రావటానికి వాళ్ళు పడే అవస్థలూ చూస్తుంటే శారదకు ఒకవైపు కోపం, మరోవైపు నిరుత్సాహం, తాను ప్రతి విషయాన్నీ చట్ట ప్రకారం రూల్సు అన్నీ వివరించి చెప్పి ఒప్పించ గలుగుతోంది. కానీ రాజకీయాలలో ఆసక్తి ఉండి, పెద్దగా విషయ పరిజ్ఞానం లేని ఆడవాళ్ళను వీళ్ళు బతకనిస్తారా? అసలు రాజకీయాలలోకే రానివ్వరు. నాయకులుగా ఎదగనివ్వరు. అధికారం అసలు ఇవ్వరు. తనకే ఇంత కష్టంగా ఉంటే మామూలు స్త్రీలకింకెంత కష్టం? హైదరాబాద్లో సదాలక్ష్మి అసెంబ్లీలో చేసే పోరాటాలు తెలుస్తున్నాయి. ఈశ్వరీబాయి రిపబ్లికన్ పార్టీ నాయకురాలిగా ఎదుగుతున్న తీరు కూడా గమనిస్తోంది. నాయకులుగా ఇలాంటి వాళ్ళు వందల సంఖ్యలో రావాలి. అట్లా వస్తే తప్ప మంచి మార్పులు రావనేది అర్థమవుతోంది. ఇంకొక్క సంవత్సరం

తర్వాత రాబోయే ఎన్నికలలో పోటీ చేయాలని శారదకు అనిపించలేదు. పార్లమెంటులో చేయగలిగింది ఎంత స్వల్పమో అర్ధమైంది. పాలసీలు చేయటంలో స్త్రీల పరంగా ఆలోచించే వాతావరణమే లేదు. ఎగతాళి, వ్యంగ్యం తప్ప స్త్రీల సమస్యలను అర్థం చేసుకునే వారే లేరక్కడ. నెహ్రూకి అర్థమయినా ఆయనొక్కడివల్లా ఏమీ జరగదనేది కూడా శారదకు ఈ నాలుగేళ్ళలో తెలిసి వచ్చింది. ఐనా ఒకసారి తన అసంతృప్తిని నెహ్రూతో పంచుకోవాలనిపించింది శారదకు. సమయం కోసం అడిగితే ఆయన కాదనకుండా ఇచ్చాడు,

“స్త్రీలకు రాజకీయాలలో ఇపుడున్న చోటు చాలదు. దానికోసం మీరేం చేయబోతున్నారు? ప్రభుత్వపరంగా పారిశ్రామిక అభివృద్ధికి జరగాల్సిన పనులు నత్తనడక నడుస్తున్నాయి ఎందుకు? మిశ్రమ ఆర్థిక విధానంలో ఇంతవరకూ చెప్పకోదగిన ప్రభుత్వరంగ సంస్థలు రావటం లేదు. ఏ శక్తులు దానికి అడ్డుపడుతున్నాయో మీకు తెలుసు. ఎందుకలా జరగనిస్తున్నారు? ఇలా ప్రశ్న తర్వాత ప్రశ్న అడుగుతూ పోయింది శారద. నెహ్రూ సమాధానాలు ఇస్తూనే ఉన్నాడు ఒక రాజకీయవేత్తలా –

“అన్నీ జరుగుతాయి. సమయం పడుతుంది. స్వతంత్రం వచ్చిన పన్నెండేళ్ళలోనే అంతా మారిపోవటం జరగదు. ప్రభుత్వరంగ సంస్థలు ఇపుడిపుడే అన్ని రాష్ట్రాల్లో ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చాం కదా – నిధులు మెల్లిగా వెళ్తాయి. స్త్రీలకు రాజకీయాలలో చోటు తప్పకుండా దొరుకుతుంది”,

“మిస్టర్ నెహ్రూ – మీరు కాసేపు ప్రధానమంత్రినని మర్చిపొండి. ఒక మామూలు మనిషిగా మారండి. పార్లమెంటులో జరుగుతున్న రాజకీయ విధానం మీకు సంతృప్తి నిస్తోందా? పెరిగిపోతున్న అవినీతిని చూస్తుంటే మీకు నిద్ర పడుతోందా? దీనిని ఎవరైనా కంట్రోలు చేయగలరని మీరు నమ్ముతున్నారా? ఈ ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుందని అనుకుంటున్నారా?”

వెల్ – డాక్టర్. ప్రశ్నలడగటం తేలిక. అడిగారు. నన్ను మామూలు మనిషిగా సమాధానం ఇమ్మన్నారు. కానీ నేను ప్రధానమంత్రిని, ప్రధానమంత్రిగా నేను మీకు చెప్పదల్చుకున్నదేమిటంటే నేను నిస్సహాయుడిని. నిజంగా నిస్సహాయుడిని. నేను ఇంత నిస్సహాయత్వంలోనూ ఏదో చేస్తున్నాను. ఇంతకంటే చేయలేకపోతున్నాను. రాజకీయాల సంగతి మనం ఒకరికొకరం చెప్పకోనవసరం లేదు. వీటిని మార్చాలి. ఎలాగో తెలియదు. తోచినది చేసుకుంటూ పోవటం తప్ప మరో మార్గం లేదు.

ఒకోసారి నాకూ నిరాశ కమ్ముకొస్తుంది. కానీ దేశ నిర్మాణ బాధ్యతను ఒదులుకోలేను. వీటన్నిటిలోంచే మనం పైకి లేవాలి. ఇంతకంటే నేనేం చెప్పలేను.

“యస్. ప్రైమ్మినిష్టర్. మీరు ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు. పురుషులు. అందువల్ల మీకు ఎంత నిరాశలోనూ ఆశ కన్పించటం సహజం. ఒక స్త్రీగా, పార్లమెంటు సభ్యురాలిగా చెబుతున్నాను. నాకు స్త్రీల పరంగా ఏ ఆశా కనిపించటం లేదు, వెనుకబడిన వర్గాల పరంగా అసలే కనిపించటం లేదు, దుర్గాబాయి రాజకీయాలకు దూరంగా సంస్థలను నిర్మించుకుంటూ ఎందుకు పనిచేస్తోందో నాకిప్పడు బాగా అర్థమవుతోంది. అలాంటి వ్యక్తులకూ, సంస్థలకూ మీరు సహకరిస్తున్నారు. మంచి పని చేస్తున్నారు. ఒకటి నేనూ ఒప్పకుంటాను. మీరు మరి కొద్దిమంది తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నడిపించాలి. మీరు మీ నిస్సహాయత్వాన్నించి బయట పడాలి అని కోరుకుంటున్నాను – ”

నెహ్రూ గారికి నమస్కారం చేసి వచ్చేసింది శారద,

మళ్ళీ ఎన్నికలొచ్చాయి. శారద వాటికి సాధ్యమైనంత దూరంగా ఉంది. స్త్రీలకు రాజకీయాలలో పాల్గొనే శిక్షణ అవసరం అనే అభిప్రాయం శారదలో బలపడింది. సంఖ్యలో కూడా స్త్రీలు శాసనసభల్లో, పార్లమెంటులో బలపడితే గాని వారి పరిస్థితి మెరుగు పడదు అన్న తన అభిప్రాయాన్ని అన్నపూర్ణతో, సరస్వతితో చర్చించింది. వారూ అంగీకరించారు.

ఇంతలో చైనా భారత్ల సరిహద్దు సమస్య, యుద్ధం వచ్చి పడ్డాయి. కమ్యూనిస్టులు చైనాను బలపరుస్తున్నారంటూ ప్రభుత్వం కమ్యూనిస్టు నాయకులను అరెస్టు చేయటం మొదలుపెట్టింది.

శారద ఆందోళన పడటం తప్ప ఏమీ చేయలేని తన పరిస్థితికి విచారపడుతూనే అవసరంలో ఉన్న కమ్యూనిస్టు కుటుంబాలకు తను చేయగలిగిన సాయం చేస్తూ వచ్చింది.

కమ్యూనిస్టు పార్టీలో పెరుగుతున్న విభేదాలను గురించి ఎవరో ఒకరు చెబుతూ ఉండేవారు.

ప్రజల సమస్యల పట్ల కాకుండా రష్యా, చైనా మార్గాలంటూ అంతంత విభేదాలు సృష్టించుకోవటం వల్ల పార్టీ చాలా నష్టపోతుందనిపించేది.

నాయకులందరి స్వభావాలూ శారదకు బాగా తెలుసు. అందువల్ల ఇదంతా ఎక్కడికి

దారి తీస్తుందోననే ఆందోళన కూడా ఆమె మనసులో పెరుగుతోంది. అన్నపూర్ణ శారద ఆందోళనను చాలా తేలిగ్గా తీసివేసేది.

“వాళ్ళు నిన్ను ఒద్దనుకున్నారు. నువ్వూ వాళ్ళను ఒదిలేశావు, ఇంకా ఆ పార్టీ గురించి ఇంత ఆందోళన పడతావెందుకు? అని విసుకునేది.

నేనేమిటి అనేది కాడు అన్నపూర్ణా – దేశ భవిష్యత్తు గురించి మనం నిరంతరం ఆలోచిస్తూనే ఉండాలి. కమ్యూనిస్టు పార్టీ పొరపాటు చెయ్యొచ్చు. పని చేసే వాళ్ళే గదా పొరపాట్లు చేస్తారు. కానీ కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉంటేనే దేశం బాగుపడుతుంది. ఇవాళ కాకపోతే రేపు – మరొక రోజు ప్రజలు కమ్యూనిజంలోని మంచి గ్రహిస్తారు. కానీ పార్టీ బలహీనమైతే, గందరగోళపడితే చాలా నష్టం దేశానికి ప్రజాస్వామ్యానికి బలమైన ప్రతిపక్షమే కదా అసలైన ఆక్సిజన్. కమ్యూనిస్టులు బలమైన ప్రతిపక్షంగా ఉండాలి. హిందూకోడ్బిలు ఈ మాత్రంగా వచ్చిందంటే అది కమ్యూనిస్టుల వల్లే ప్రజా అనుకూల చట్టాలు వస్తున్నపుడు వాటిని మరింత అనుకూలంగా మార్చే పని ఎవరు చేస్తారు? ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గొంతులు ఎవరు విప్పుతారు? కమ్యూనిస్టులు తప్ప – వాళ్ళలో వాళ్ళు తగవులు పడుతూ ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా, ఉద్యమాలు నిర్మించకుండా పోతే ఎట్లా – నాకు చాలా ఆందోళనగా ఉంది. బి.పి. పెరిగిపోతోంది. ఇంకోవైపు నెహ్రూ గారి ఆరోగ్యం సున్నితంగా ఉంది. చైనా యుద్ధం ఆయనను కుంగదీస్తోంది”,

“అదంతా నిన్ను కుంగదీస్తోంది. శారదా – మరీ ఎక్కువ ఆలోచించకు –

“ఆలోచించకుండా ఎట్లా – అసలు సాధ్యమా, ఆలోచించటం కాదు సమస్య ఆలోచించి దానిని కార్యరూపంలో పెట్టలేకపోవటం – చాలా ఒంటరిగా అనిపిస్తోంది అన్నపూర్ణా –

శారద ఆవేదన అర్థం చేసుకోగలిగేది అన్నపూర్ణ, సరస్వతులే –

ఒకోసారి వాళ్ళూ నిరాశలో కూరుకుపోయేవారు.

“ఏంటో – స్వాతంత్రం రాకముందు ఎన్నికలలు కన్నాం. ఇపుడు కలలు కూడా లేకుండా పోయాయి” అనేది అన్నపూర్ణ

అపుడు శారద ఉత్సాహం తెచ్చుకునేది.

“నాకు బోలెడు కలలున్నాయి. ఆ కలల కోసమే ఈ జీవిత ప్రయాణం – ప్రయాణం చేస్తున్నంతసేపూ దిగులుపడటానికేమీ లేదోయ్. ఏం సాధించామంటే ఇంత దూరం

ప్రయాణించటమే –

“గమ్యం అంటూ లేకుండా – ?

“గమ్యం ఒకటుండి అక్కడికి చేరుకోవటంతో ప్రయాణం ఆగిపోతుందనుకుంటే పొరపాటోయ్ – గమ్యాలు అనంతాలు – ఒకటి చేరుకుంటే మరొకటి ఎదురు చూస్తుంటుంది మనకోసం, మనం నడుస్తూనే ఉండాలి. ఆగిపోకూడదు. ఆగిపోయామా – ఇంకేముంది – ” అనేది శారద,

దేశ విభజన చేసి సరిహద్దులలో, రెండు దేశాల ప్రజలలో ఒక ఆరని చిచ్చు రగిల్చి వెళ్ళిన బ్రిటీష్ వారి దుర్మార్గాన్ని అర్ధం చేసుకోగలం. కానీ చైనా, భారత్ సరిహద్దుల మధ్య యుద్ధాన్ని అర్ధం చేసుకోవటం ఎలాగో చాలామందికి అర్ధం కాలేదు. ఒక సోషలిస్టు దేశం దురాక్రమణ చెయ్యదనే వాదంతో కొందరు కమ్యూనిస్టులు ముందుకు వచ్చారు. మరికొందరు దానిని అంగీకరించలేకపోయారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో విబేధించేవారు, ఏకీభవించే వారు దాదాపు రెండు గ్రూపులుగా విడిపోయాయి.

యుద్ధ ప్రపంచంలో దేశభక్తి ఉప్పొంగటం సహజం. కొందరిని దేశద్రోహులుగా ముద్ర వేసినపుడు దేశభక్తి మరింత నిరూపితమవుతుంది. అనేక మంది కమ్యూనిస్టులు దేశద్రోహులుగా, జైళ్ళ పాలయ్యారు.

స్వరాజ్యం భర్త అరెస్టు అయ్యాడు, స్వరాజ్యం ఉద్యోగం కూడా ప్రమాదంలో పడింది. కాలేజీలో శలవు పెట్టి పిల్లను తీసుకుని బెజవాడ వచ్చేసింది స్వరాజ్యం, ఈ యుద్ధం, ఈ అలజడి, ఈ అరెస్టులు స్వరాజ్యానికంతగా అర్థం కాలేదు. శారదాంబ స్వరాజ్యాన్ని ఓదార్చింది గానీ ఆమె మనసూ అలజడితో అశాంతితో నిండిపోయాయి.

సోవియట్ యూనియన్, చైనా రెండు సోషలిస్టు శిబిరాలుగా ఏర్పడి ప్రపంచ ప్రజలను మంచికో చెడ్డకో ప్రభావితం చేయబోతున్నాయని ఆమెకు అర్థం అయింది గానీ అది మింగుడు పడలేదు. అంధకారంలోని ప్రజలకు ఆశాదీపాలనుకున్నవి ఇలా మారిపోవటం ఏమిటన్న ప్రశ్నకు ప్రపంచ రాజకీయ అధ్యయన వేత్తలు ఏవో విశ్లేషణలు చేసి సమాధానాలు చెప్పవచ్చు. కానీ ప్రపంచాధిపత్యపు పోరు తో సామాన్య ప్రజలు ఏమవుతారో పట్టించుకునేవారు లేకపోవటం విషాదం. ఆ విషాదం శారదాంబ మనసునిండా ముసురులా పట్టేసింది. సోషలిస్టు శిబిరంలో ఆధిపత్యం కోసం పోరులో సోషలిస్టు, కమ్యూనిస్టు విలువలన్నిటినీ కోల్పోతే – ఈ ఆధిపత్యం దేని కోసం? ఇన్ని ఉద్యమాలు ఇన్ని యుద్ధాలు, ఇన్ని బలిదానాలు ఏ ప్రపంచం కోసం చేశారో

ప్రజలు – ఆ ప్రపంచం కేవలం ఒక కల అనే చేదు నిజం మింగడం ఎలా? ఆశ దేనిపైన పెట్టుకోవాలి? నిరాశ నుంచి ఎలా తప్పుకోవాలి. నిరాశలో మునిగిపోకుండా ఏ ఆధారాన్ని పట్టుకోవాలి? దీన్నంతా తట్టుకునే గుండె నిబ్బరం ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి?

శారదాంబ కమ్యూనిస్టు పార్టీలో లేకపోయినా జాతీయంగా, అంతర్జాతీయంగా వారి సిద్ధాంతాలలో, కార్యాచరణలో వస్తున్న మార్పులను గమనిస్తూనే ఉంది. స్టాలిన్ మరణించిన తర్వాత కృశ్చెవ్ అధికారంలోకి వచ్చి స్టాలిన్ పై చేసిన ఆరోపణలు, శాంతియుత పరివర్తన ద్వారా కొన్ని దేశాల్లో సోషలిజం రావచ్చంటూ సోవియట్ పార్టీ చేసిన తీర్మానం అన్నిటినీ శారద ఆసక్తితో గమనిస్తూనే ఉంది. రెండవ ప్రపంచ యుద్ధంలో అనుభవించిన కష్టాలు, నష్టాలు మొత్తం దేశం తల్లకిందులై మళ్ళీ కుదురుకోటానికి ప్రజలు చేసిన చేయవలసి వచ్చిన త్యాగాలు వీటన్నిటి ప్రభావం కావొచ్చు సోవియట్ యూనియన్ ప్రపంచశాంతి మీద ప్రధానంగా కేంద్రీకరించి మాట్లాడుతూ, మిలటరీ పరంగా బలపడుతూ వస్తోంది. చైనా పార్టీ దీనినంగీకరించటానికి సిద్ధంగా లేదు. దేశాలకు స్వతంత్రం, జాతులకు విముక్తి కలగకుండా శాంతి ఎలా సాధ్యమని వాదిస్తున్నది. సామ్రాజ్యవాద దేశాలపై యుద్ధం తప్ప సామరస్యం ఎలా కుదురుతుందంటుంది? స్వరాజ్యానికి ఈ రాజకీయాలను వివరించే క్రమంలో శారదకు అసలు సమస్య ఆధిపత్యం అని తోచింది. ఆధిపత్యానికి ఎవరూ, కమ్యూనిస్టులతో సహా ఎవరూ మినహాయింపు కాదని లీలగా అనిపించే సరికి భయమెరుగని శారదకు ఏదో భయం ఆవహించింది. తాత్వికంగా ఈ ఆధిపత్య భావన గురించి భయం కలిగినపుడే, భౌతిక ప్రపంచంలో శారద ఏ రెండు విషయాల గురించీ భయపడుతుందో ఆ రెండూ జరిగిపోయాయి.

మే నెలలో నెహ్రూ మరణించాడు. జులై నెలలో కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలటం ఖాయమైంది.

జీవితంలో ఎన్నో ఆటుపోట్లను అవలీలగా తట్టుకున్న శారద ఈ రెండు పరిణామాలనూ తట్టుకోలేకపోయింది.

ఆమె హృదయం మీద నేరుగా పనిచేశాయీ సంఘటనలు. ఈ చీలికలింతటితో ఆగవని కూడా ఆమెకు అర్థమవుతోంది.

భర్త జైలు పాలవటంతో స్వరాజ్యం పూర్తిగా నిరాశపడుతూ, డిప్రెషన్లోకి వెళుతుందేమో అన్న భయంతో అన్నపూర్ణ మనవరాలు అరుణజ్యోతిని తన దగ్గర

ఉంచుకుని స్వరాజ్యాన్ని శారద దగ్గరకు పంపింది. శారద ఆమెకు హాస్పిటల్లో చిన్నచిన్నపనులు అప్పగించేది. భర్తలు జైలు పాలై ఆర్థికంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కమ్యూనిస్టు కుటుంబాలను ఆదుకోటానికి తాను ఎవరికీ తెలియకుండా చేసే సహాయాలను ఇప్పుడు స్వరాజ్యం ద్వారా చేయిస్తోంది. ఇద్దరూ కలిసి పుస్తకాలు చదువుకునే సమయం ఎలాగూ ఉంది. ఏం చేసినా స్వరాజ్యం ప్రశ్నలకు సమాధానం దొరకటం లేదు.

శారదలో అప్పడే మొలకెత్తుతున్న ఆధిపత్యం అనే తాత్త్విక భావనను అందుకోవటం స్వరాజ్యానికి కష్టమే అవుతోంది.

“నిన్ను నువ్వు ఆధిపత్యాన్ని అమలు చేసే పరికరంగా వాడుకుంటావా? ఆధిపత్యం సృష్టించిన ఒక వ్యక్తిగానో శక్తిగానో పనిచేస్తావా? లేక దాని నుంచి స్వేచ్ఛ కోసం స్ట్రగుల్ అవుతూ, ఆ స్ట్రగుల్ జీవితమంతా చేస్తూ, నిరంతరం దానికోసమే జీవిస్తూ, ప్రతిక్షణం నిన్ను నువ్వు బతికించుకోటానికి, వికసింపచేసుకోటానికి చేసే ఆ పోరాటమే జీవిత గమ్యమనుకుంటావా?” శారద తనను తాను రాపిడి పెట్టుకుంటూ, మెదడుని మండించుకుంటూ మాట్లాడే మాటలు విని

పెద్దమ్మా – నాకేం అర్ధం కావటం లేదు. ఆధిపత్య పరికరాన్నా నేను? అదేంటి” అని అడిగేది నిస్సహాయంగా,

“నీకు వివరంగా చెప్పలేకపోతున్నా గానీ మానవులందరిలో ఈ ఆధిపత్యమనే క్రిమి చేరిపోయిందమ్మా – ఇన్ని వేల సంవత్సరాల మానవ పరిణామంలో, రాజ్య విస్తరణ కాంక్షలలో వర్ణ, వర్గ సంరక్షణ విధానాలలో, స్త్రీల అణచివేతలో ఈ ఆధిపత్యం కరడుగట్టి మానవులలో ప్రవేశించిందనిపిస్తోంది, ఇతరుల మీద ఒక ఆధిపత్యం నెరపకపోతే మనుషులు బతకలేరా?

ఆధిపత్యం సాగించాలంటే స్వేచ్ఛ కోరే మనుషులుండాలి కదా? స్వేచ్ఛను కోరకుండా బానిసలైన వాళ్ళ మీద అమలు చేసే ఆధిపత్యం మళ్ళీ తృప్తినివ్వదు. స్వేచ్ఛాకాంక్ష రగులుతుంది. ఆ కాంక్ష ఉధృతమై పోరాటాలూ, ఆ పోరాటాలలో మళ్ళీ ఆధిపత్య సంస్కృతి – దాని మీద తిరుగుబాటు – బైటి శత్రువు, లోపలి శత్రువు – కానీ బైటి శత్రువుని గుర్తించటం తేలిక, లోపలి శత్రువుని గుర్తించటం కష్టం – ”

శారద ఆలోచనల ధాటికి ఆమె గుండె తట్టుకోలేక పోతోంది.

స్వరాజ్యం తన నిరాశను మర్చిపోయి శారద శరీరంతో, మెదడుతో చేస్తున్న కఠోర పరిశ్రమను తగ్గించాలని చూసేది.

పెద్దమ్మా నువ్వు చాలా అశాంతి పడుతున్నావు. అది మంచిది కాదు నీ ఆరోగ్యానికి?

“నా అశాంతి వేరు. కానీ నీ అశాంతి నిన్ను తినేస్తోంది పెద్దమ్మా అంత ఆలోచించకు సినిమాకు వెళ్దామా ఇవాళ?”

“పలాయనం వైపు ప్రయాణం కాదు నాది” అంటూనే ఆలోచనల్లో మునిగిపోయేది. ఆమెను ఆ ఆలోచనల నుండి రక్షిస్తున్నది సామాన్య ప్రజలు, తమ సమస్యలు చెప్పుకోటానికి వచ్చే మామూలు స్త్రీలు, విద్యార్థులు, ఉద్యోగార్డులు, రకరకాల బాధల్లో ఉన్నవారు, వారి సమస్యలు ఎలాగైనా పరిష్కరించి వాళ్ళ ముఖాల్లో సంతోషం చూడాలనే కాంక్ష ఆమె జీవన తత్త్వ కాంక్ష ఆ పనులలో ఈ ఆలోచనలకు కొంత అంతరాయం కలిగేది. రాత్రుళ్ళు మాత్రం పుస్తకాలు, చర్చలు, ఆవేశాలు, అశాంతులు,

అలసటలు.

సూర్యం కూడా అక్కను చూసి భయపడుతున్నాడు.

“మా నాన్నకూడా చరిత్రకు సంబంధించిన పరిశోధనలో మునిగి, ఆ ఆలోచనల తీవ్రతతోనే అనారోగ్యం పాలయ్యాడు. ఆయన గుండె బలహీనమయింది. మళ్ళీ ఇప్పడు అక్కను చూస్తుంటే భయంగా ఉంది, స్వరాజ్యం నువ్వు మీ అమ్మాయిని తీసుకురా – పిల్లలతో ఆటలతో కాలం గడిపితేనన్నా ఇవన్నీ కాస్త వెనకపడతాయేమో అనటంతో అరుణజ్యోతి భవిష్యత్ దీపంలా ఆ ఇల్లు వెలిగింది. శారద, స్వరాజ్యం మళ్ళీ నవ్వుతున్నారు. సూర్యం శారద ఇంట్లో ఉన్నంతసేపూ ఆమె కళ్ళముందు పిల్లలుండేలా చేస్తున్నాడు.

ఆ రోజు ఎవరో విద్యార్థి శారద కోసం వచ్చాడు. శారద ఆ పిల్లవాడు చెప్పేది ఓపికగా విన్నది. కాలేజీ ఫీజు కట్టటానికి ఆ కుర్రాడికి సమయానికి ఫీజు అందలేదు. డబ్బు సమకూర్చుకుని వెళ్ళేసరికి సీటు లేదన్నారు. సంవత్సరం వృధా అవుతుందనే వ్యధతో ఏడుస్తున్న ఆ కుర్రవాడికి ఎవరో డాక్టర్ శారదాంబ దగ్గరకు వెళ్ళమని సలహా ఇచ్చారు. ఆ అబ్బాయిని తీసుకుని ప్రిన్సిపాల్తో మాట్లాడదామని వెళ్లింది శారద,

“డబ్బు అందటంలో ఒక్కరోజు ఆలస్యానికి ఒక సంవత్సరం వృధా కావటం

ఏమిటి – ఈ అబ్బాయిని కాలేజీలో చేర్చుకోండి” అని అడిగింది శారద, ప్రిన్సిపాల్ ససేమిరా వీలుకాదన్నాడు. ఆ అనటంలో అతను కనపరిచిన అహంభావం, అధికార దర్పం, అమానుషత్వం శారద హృదయాన్ని కలిచివేశాయి. బాధ, అవమానం, కోపంతో ఆమె బైటికి నడిచింది.

“మరో కాలేజీలో సీటు దొరకక పోదు. ప్రయత్నిద్దాం. రేపు రా” అని తను ఇంటికి వెళ్ళింది.

రూల్సు, వాటిని దాటకూడని కంట్రోళ్ళు, వాటి అమలుపై అధికారం, అది ఆధిపత్యంగా మారి మానవత్వాన్ని సంహరించటం – ఒక చిన్న ఘటన ఎంత తాత్త్విక భావననైనా రగిలించవచ్చు.

తప్పులు, నేరాలు, క్రమశిక్షణలు, శిక్షలు, ఆధిపత్యం ఆ కళాశాల అధికారి మాటల్లో శారదకు విశ్వరూపంలో కనిపించింది.

మనిషిపై మనిషి చేసే, అమలు చేయాలని చూసే ఆధిపత్యం కూడా యుద్ధమే. ఈ యుద్ధానికి ఆయుధాలు, సైన్యాలు, టాంకర్లు, బాంబులు, విమానాలూ ఆకర్లేదు. ఇది యుద్ధమని ఎవరికీ తెలియదు. ఎవరూ చర్చించరు యుద్ధపు తీరుల గురించి, యుద్ధ విన్యాసాల గురించి, యుద్ధ ఫలితాల గురించి, నిశ్శబ్దంగా, రహస్యంగా జరిగే యుద్ధం సమాజం లోలోపల దాగిన ఈ ఆధిపత్యం. ఐతే ఆ నిశ్శబ్దం అప్పుడప్పుడూ బద్దలై అనేక చోట్ల సంఘర్షణలు రేపుతుంది. సాంఘిక వ్యవస్థల్లో, ఆర్థిక అసమానతల్లో, జాతుల్లో, మతాల్లో రంగుల్లో రూపుల్లో భాషల్లో ప్రాంతాల్లో మన లోపలి లోతుల్లో ఆ సంఘర్షణ బద్దలై, ఆ రహస్య నిశ్శబ్ద యుద్ధం ఒకనాడు బహిరంగమవుతుంది. విస్ఫోటనం. విలయం, మనిషి మరింతగా చచ్చి, అమానవులు మరింత బలవంతులై, ఆధిపత్యం మళ్ళీ రహస్యమై – ” స్వరాజ్యం ఆ రోజు శారదను ఆపలేకపోయింది. ఎంతోసేపు ఆ విషయం మాట్లాడుతూనే ఉంది.

శారదాంబ ఆ రోజు భోజనం చేయలేకపోయింది. సూర్యం, నటాషా స్వరాజ్యంలు బలవంతంగా కూర్చోబెట్టారు. పద్మ పక్కనే కూచుని తినిపించింది. కాసేపు అవీ ఇవీ మాట్లాడుకుని అందరూ తమ గదుల్లోకి వెళ్ళీ పడుకున్నారు. స్వరాజ్యం శారద దగ్గరకు వచ్చింది.

పెద్దమ్మా నువ్వివాళ చాలా అన్రెస్ట్గా ఉన్నావు” అంది పక్కన కూచుంటూ, నవ్వింది శారద,

“ఊ – నిజమే. ఆ ప్రిన్సిపాల్ వ్యవహారం ఎన్నో ఆలోచనలు రేపింది” “ఆధిపత్యం గురించేనా?”

“ఔను. నా ఆధిపత్యం గురించి కూడా – చాలా ఆలోచించాను. కానీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది స్వరాజ్యం, ఈ మధ్య కాలంలో ఎన్నో సందేహాలు సమాజం గురించి, మార్పు గురించి, మన జీవిత ప్రయాణాల గురించీ – ఇప్పుడు నాకంతా స్పష్టంగా ఉంది – ఆధిపత్యాన్ని గుర్తించి పోరాడే ప్రతి క్షణము సజీవంగా మనతోనే ఉంటుంది. మనం పోరాడుతామా, బానిసత్వంలోకి జారిపోతామా అనేది మనం మనుషులుగా ఉన్నామా లేదా అనే దానికి గుర్తు. స్వరాజ్యం – ఆధిపత్యం ఒక్కచోట ఒక్కరూపంలో లేదమ్మా – అన్నిటినీ గుర్తించాలి మనం – మనతో సహా – ”

వెలుగుతున్న శారదాంబ కళ్ళు చూస్తుంటే స్వరాజ్యానికి ఆ తేజస్సు చూసి భయం వేసింది.

పెద్దమ్మా – నువ్వింక నిద్రపో – నాకూ నిద్రౌస్తోంది” అంటూ తడబడే అడుగులతో తన గదిలోకి వెళ్ళింది.

సూర్యంతో ఏదో చెప్పాలనిపించింది గానీ ఎందుకో ఒద్దనుకుని, పడుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది.

మర్నాడు ఉదయం నెమ్మదిగా స్నానం ముగించి “నిద్రలేని రాత్రి వల్ల వచ్చిందా ఇంత బలహీనత, ఈ నీరసం” అనుకుంటూ నాలుగడుగులు వేసిన శారదాంబ కుప్పకూలిపోయింది. సూర్యం, నటాషా పరిగెత్తుకు వచ్చి లేపుతుంటే సూర్యానికి అర్థమైంది అక్క ఇక లేదని, అతనికి సృహ తప్పింది. స్వరాజ్యానికి అంతా అయోమయంగా ఉంది. నటాషా, పద్మలకేమీ అర్ధం కాలేదు.

క్షణాల్లో బెజవాడంతా శారదాంబ ఇంటి ముందు ఉందా అన్నట్లయింది. అందరి కళ్ళూ కన్నీళ్ళతో మసకబారాయి. ఆధునిక స్త్రీనని గర్వించిన కళ్ళు ఆధునికతలోని ఆధిపత్యాన్ని అర్ధం చేసుకునే క్రమంలో మూతబడిపోయాయి.

(సమాప్తం)

ఆమె – మనము –  గుర్తుండని కాలం!

 

lakshmi

– సి.ఉమాదేవి

~

 

ఏదైనా కథ చదువుతున్నారా?ఆ సమయంలో ఎవరైనా మిమ్మల్ని పలకరిస్తున్నారా? ఆ…ఊ… మాత్రమే మీ సమాధానమా? అయితే అతను-ఆమె-కాలం చదువుతున్నారన్నమాటే! చదవడంలేదంటారా? అయితే ఈ విభిన్న కథారాగవిపంచిని మీటాల్సిందే! తప్పక చదవాల్సిన బహుమతి కథల మణిహారమే జి.యస్.లక్ష్మిగారి ‘ అతను-ఆమె-కాలం’ కథాసంపుటి. ఆమె రచించిన కథలు మనము చదవడం ప్రారంభించామా మరిక కాలం గుర్తుండదంటే అతిశయోక్తికాదు. చదివేకొలది మన మనసు పొత్తళ్లలో నిక్షిప్తమయేలా రచించిన కథలు ఓ వంక హాస్యలాలనగా,మరోవంక మానవతారాగాలాపనగా వెరసి సమకాలీన సమాజ గీతాలాపనగా మన ప్రక్కనే కూర్చుని మనిషి మనవలసిన విధమిదీ అని అనునయంగా చెప్తున్నట్లు కథనల్లడం లక్ష్మిగారికి వెన్నతోకాదు మనసుతో పెట్టిన విద్య.

ఉదాహరణకు వీరు రచించిన దాంపత్యం కథే తీసుకుందాం. ఎన్నో కుటుంబాలలో సాధారణంగా తారసపడే అంశం. అయితేనేం కథ నడిపిన తీరు మాత్రం అసాధారణం. అడుగడుగునా ఉత్సుకతలేపే సంభాషణా చాతుర్యం కథను పూర్తిగా చదివేదాకా కట్టిపడేస్తుంది. తరువాతయినా వదలిపెడుతుందా? ఊహూ! మనమెక్కడికెళ్తున్నా మనలోనే తిష్టవేసి మన మనసును చిలుకుతూనే ఉంటుంది. కథ వెంటాడటమంటే ఇదేమరి! భార్యంటే కేవలం అలంకరణతో నిండిన ఆహార్యానికే పరిమితమైన ఉత్సవవిగ్రహంలా భావించే భర్త రామేశం. భర్తలోని ఎంతటి కోపాన్నయినా,మాటల తూటాలనయినా భరించిన భార్య రాజేశ్వరి కాలక్రమేణా సహనం అసహనమై భర్తను విడిచి వెళ్లిపోతుంది. ఓదార్పు అందకపోతే శక్తికి మించిన ఓర్పు కూడా మున్ముందు  ప్రజ్వరిల్లే బడబాగ్నికి బీజమే! అయితే దాంపత్యబంధంలో గాలివాన కలకాలం నిలవకూడదు.పిల్లల పలకరింపు, సమర్థింపు ఇచ్చిన స్థైర్యంతో తన ఇంట మళ్లీ మహరాణిలా అడుగు పెడుతుంది రాజేశ్వరి.  భర్త మౌనంలో రాజీ ధోరణి ఆహ్వానించదగ్గ పరిణామమే. బంధంలోని అనుబంధానికి అద్దం పట్టిన కథ.

ఇక ‘చందమామ రావె’ కథ. ఒకనాటి బాల్యానికి చందమామ రావె అని అమ్మపాడే పాట నిత్యశ్రవణమే. కాని నేటి చిన్నారులకు అందివచ్చిన సాంకేతికత అనేక వరాలు కురిపిస్తూనే తెలియని శాపంగా కూడా పరిణమించడం బాధాకరం. అమ్మనాన్నలు ఆఫీసు పనులలో నిమగ్నమై బున్నీకి ఆశ అనే కేర్ టేకర్ ను నియమిస్తారు. బుర్రకే కాదు నోటికీ స్పూను ఫీడింగ్ చేసే ఆశ బున్నీలోని అసంతృప్తికి మరో భాష్యం చెప్తుంటుంది. బున్నీ చందమామ కావాలంటున్నడని ఆశ చెప్తే తమ బిడ్డ చంద్రుడిపై నడవాలనుకుంటున్నాడని సంబరపడతారు సాఫ్ట్ వేర్ తల్లిదండ్రులు. అయితే తమ బిడ్డకు చందమామ రావె అంటూ అమ్మ అందించే నోటిముద్దలు కావాలన్న నిజం తెలిసినపుడు వారికేకాదు మనకు మనసు చివుక్కుమంటుంది.

‘పాపం మాలతి’ అనే కథ అమెరికా జీవనవిధానంలో అగ్రభాగాన్ని ఆక్రమించుకున్న పెట్ పోషణకు సంబంధించినదే. పెట్స్ తో అనుబంధానికి అక్కడ పెద్దపీటే! నిజానికి పక్షులనుకాని పెంపుడు జంతువులను కాని పెంచుకోవడం సర్వసామాన్యమేయైనా అవసరార్థం వేరే ఎక్కడికైనా వెళ్లాల్సివస్తే పెంచుకున్నవాటి పోషణ కష్టమే. ఈ సన్నివేశంతో మాలతి పడ్డ అవస్థలను హాస్యస్ఫోరకంగా చిత్రీకరించిన కథ. తనకిష్టంలేకపోయినా ఇంటికి తెచ్చిన కుక్కపిల్లకు తోడు అనుకోకుండా హామ్ స్టర్స్ బాధ్యత మీదపడిన మాలతి వీటితోపడ్డ కష్టం ఆయాచితంగా వచ్చిన తకధిమే! బోనులోనే తలలు వేలాడేసిన హామ్ స్టర్స్ స్థానంలో వేరేవి వచ్చి చేరేవరకు మనకు గుబులే!

మనిషి ఆలోచనా సరళిలో ఎన్నో కోణాలుంటాయి.విభిన్నకోణాలలో జరిగే ఆలోచనా మథనం ఒకొక్కసారి అర్థవంతమైనా మరొక్కసారి అర్థరహితం కూడా అవుతుంటుంది. వృద్ధదంపతుల వ్యాహ్యాళికి వచ్చి పార్కులోనే గంటకు పైగా కూర్చుండిపోవడానికి  కారణం  కొడుకు కోడలి నిరాదరణే కారణమన్న నిర్ణయానికి వచ్చిన యువతి వారికి తాను అండగా నిలబడతానని, చేయూతనందిస్తానని తన వెనుకనున్న బలాన్ని వివరిస్తుంది. ఉద్యోగాలలో అలసి ఇంటికి వచ్చిన కొడుకు కోడలికి కాస్తయినా ఏకాంతం లేకపోతే పరస్పరం ఏదైనా ఎలా చర్చించుకుంటారన్న సహజమైన కారణాన్ని వివరించిన వృద్ధస్త్రీ మాటలు తానాలోచించిన కోణం ఎంత తప్పయిందో తెలుసుకుని ఆ వృద్ధులకు నమస్సులర్పిస్తుంది. ఇదే ‘నాణానికి మరోవైపు’ కథలో చెప్పినది.

కాస్త ఆలోచిస్తే కథ నిజంగా కాస్తకాదు, చాలా ఆలోచించాల్సిన కథ. అర్ధరాత్రయినా ఇంటికిరాక స్నేహితులతో బలాదూర్ తిరిగే కొడుకు చందును ఆవేశంతో చెంపపై కొట్టడమే కాదు ఇంట్లోకి రానివ్వనంటాడు తండ్రి . తండ్రి మాటలకు రోషం ఉవ్వెత్తున ఎగిసిన చందు ఇల్లు వదిలి వెళ్లిపోతాడు.ఇక్కడే అసలు కథ మొదలవుతుంది.స్నేహితుడు రాజారాం ఇంట్లో రెండు రోజులున్నా రాజారాం తల్లిదండ్రులు తననెలాగైనా ఇంటికి పంపించే ఆలోచనలో ఉన్నారని గ్రహించి చిన్నగా ఆ ఇంటినుండి కూడా తప్పుకుంటాడు. తదుపరి చదువెలా అన్న మీమాంస, బ్రతకడమెలా అనే బ్రతుకు భయం పొటమరించినా ఇంటికి మాత్రం వెళ్లకూడదనుకుంటాడు.  బ్రతుకు రహదారిలో తన బాటనెలా నిర్మించుకోవాలో తెలియని చందు అనుకోకుండా మామయ్య దృష్టిలో పడతాడు. నడిరోడ్డుపై దొంగసొత్తు తనకు వదలి దొంగలు పారిపోతే దెబ్బలు తింటున్న చందును మేనమామ కాపాడి చందు ఆకలి తీర్చి తానేమి ఆరా తీయకుండానే చందు ద్వారానే విషయం తెలుసుకుంటాడు. చందులో రగిలే ఆకలి తీర్చడమే కాదు ఆలోచనలను రగిలిస్తాడు అతడి మామయ్య. కొడుకు ఆచూకీ తెలియని తల్లిదండ్రులకు చందు మేనమామ చందు వివరాలనందిస్తాడు. తనకోసం వచ్చిన తల్లిని ఆప్యాయంగా చుట్టుకుపోతాడు చందు. ఆ దృశ్యాన్ని చూసిన సూర్యం ముఖం కాంతివంతమవుతుంది. పనిలో పనిగా సూర్యానికి ఆవేశం తగ్గించుకోవాలని సున్నితంగా చెప్తాడుచందు మేనమామ. ఈ కథకు బహుమతి రావడం ముదావహం.నిజానికి పాఠకులకే ఈ కథ ఓ చక్కని బహుమతి.

ఇంకా జయహో వదినా ,వెఱ్ఱిబాగుల వదిన వ్రతకథ,ఇస్తినమ్మ వాయనం,డిజైనర్ ఫుడ్ వంటి చక్కటి హాస్యకథలు అలరిస్తాయి. తప్పక చదివి తీరవలసిన పుస్తకం అనడంలో సందేహం లేదు.

“అతను – ఆమె – కాలం” అనే ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాలలోనూ  లభిస్తుంది. కినిగె.కామ్ లో ప్రింట్ బుక్, ఈ బుక్ కూడా లభిస్తాయి.

*

అవధరించరయ్యా… !

 

 

-ల.లి.త.

~

 

సినిమాగోల లేని రోజుల్లో వినోద ప్రదర్శనలు తీరుతీరులు. ఒగ్గుకథలూ బుర్రకథలూ భజనలూ తప్పెటగుళ్ళూ యక్షగానాలూ.. ఇంకెన్నో.  భాగవతులు వీర శృంగార కరుణ రసాలురికిస్తూ కథలు చెప్పి అందరినీ కూచోబెట్టేవాళ్ళు. సురభి నాటకకంపెనీ భారీగా సెట్స్ వేసి నాటకాలతో ఊరందరినీ ఏకం చేసేది. చందమామా చుక్కలూ కూడా చూపులిటే వేస్తూంటే, ఊళ్ళో జనమంతా చాపలు పరుచుకుని చెంబుల్లో నీళ్ళు తాగుతూ చల్లగా రాత్రంతా ఆ ప్రదర్శనలొక్కటే చూసేకాలంలో ఎందుకు పుట్టలేదా అని నాక్కొంచెం దిగులేస్తుంటుంది. ఆడీ పాడే మనుషుల్ని కళ్ళారా చూసే కాలం అయిపోయి, వాళ్ళ ఛాయల్ని గ్రహణం చేసి తెరమీద ఆడించే సినిమాలొచ్చాయి. అవే వినోదమైపోయాక స్నేహితుల్తో చుట్టాల్తో సినిమాలకు వెళ్లి, నేలమీదా బెంచీలమీదా కుర్చీల్లోనూ కూర్చుని సినిమా చూసి, ఇంట్రబెల్లుకి ‘గోల్డ్ స్పాట్ : ద జింగ్ తింగ్’ తాగి, సినేమాకతలు చెప్పుకు తిరిగేవాళ్ళు జనం. ఇప్పుడు సినిమాకి వెళ్ళటం ఇంకోరకం అనుభవం. చాలామందికది  స్నేహితుల్తో కలిసి మాల్స్ కి వెళ్లి, మెక్ డోనల్డ్స్ తిండి కోక్ తో లాగించి, విండో షాపింగ్ చేసి, ఓ రెండుగంటలు చల్లగా మల్టీప్లెక్స్ థియేటర్ లో కూచుని రావటం. లేదా ఏకాంతంగా టీవీలో చూడటం లేదా సెల్ ఫోన్లో ప్రతిక్షణం ఎక్కడో ఓచోట ఛాయలతో కనెక్ట్ అయిపోవటం.

సినిమాని థియేటర్ లో చూడకుండా టీవీల్లో చూస్తుంటేనే ‘అది reduced experience’ అని గోల పెట్టాడు అదూర్ గోపాలక్రిష్ణన్. మరి సెల్ ఫోన్లో సినిమాలు చూడటాన్ని ‘bonsai experience’ అనాలేమో. విదేశాల్లో ఇప్పుడు టీవీ చూడటం కూడా తగ్గిపోయి ఇంటర్నెట్ లోనే పాటలూ బొమ్మలూ సినిమాలూ అన్నీ చూస్తున్నారట జనం. కామెరా రికార్డు చేసిన ప్రతిదాన్నీ ఇంటర్నెట్ వేగంగా అందిస్తుండటంలో లాభం కూడా లేకపోలేదు.  అలా దొరికిన ఒక పాత సినిమాలోని నృత్యనాటకాన్ని గురించి ఇలా…

***

సినిమాలొచ్చిన కొత్తల్లో అవెలా తియ్యాలో చేతగాకపోవటంతో సినిమాలన్నీ నాటక ప్రదర్శనని మూవీ కామెరాతో చిత్రించినట్టు ఉండేవి. చాలా రోజులవరకూ సినిమాలు తీసేవాళ్ళకి కథలూ నాట్యరీతులూ చూసివున్న అనుభవం వొదలక, సెమీ శాస్త్రీయ, జానపద నాట్యాలను శ్రద్ధగా సినిమాల్లో చూపించేవాళ్ళు. సినిమాకథకి ముడిపెడుతూ హరికథాకాలక్షేపాన్ని చూపించేవారు.  ‘వాగ్దానం’ సినిమాలో రేలంగి ‘భక్తులారా .. ఇది సీతాకళ్యాణ సత్కథ. నలభై రోజులనుంచీ చెప్పినకథ చెప్పినచోట చెప్పకుండా చెప్పుకొస్తున్నా’నని చెప్పుకుంటూ పోతాడు.

 

“ఫెళ్ళుమనె విల్లు, గంటలు ఘల్లుమనె, గుభిల్లుమనె గుండె నృపులకు, ఝల్లుమనియె జానకీ దేహము, ఒక నిమేషమునందె,  నయము, జయమును, భయము, విస్మయము గదురా!  శ్రీమద్రమారమణ గోవిందో హరి…” – అని ‘వాగ్దానం’ హరికథలో శివధనుర్భంగాన్ని వర్ణిస్తాడు కవి. ఈ పద్యంలోని క్రమాలంకారపు సొబగు ఘంటసాల గొంతులో రెట్టింపవుతుంది.

‘రామా కనవేమిరా’ అంటూ సీతాకళ్యాణ హరికథని మరోసారి సొగసుగా చూపించారు ‘స్వాతిముత్యం’ సినిమాలో.  ‘ఇదెక్కడిన్యాయం?’ అనే సినిమాలో హీరోయిన్ హరికథ చెప్తూ జీవిస్తుంది. నాయికగా వేసిన ‘ప్రభ’ నిజజీవితంలో హరికథా కళాకారిణి కావటంతో హీరోయిన్ని ఇలాంటి కొత్తరకం ఉద్యోగంలో చూపించే ఆలోచన వచ్చింది దర్శకుడికి.

రానురానూ ఈ కళారూపాలు ప్రభుత్వ సాంస్కృతిక సంస్థల్లో విదేశాలవాళ్లకి చూపించుకోడానికీ, దూరదర్శన్ లోనూ  తప్ప జనంమధ్య పెద్దగా లేకుండాపోవటంతో  సినిమాల్లో కూడా అవి కనబడటం మానేశాయి.  ఇవి ఎక్కువగా పురాణకథలు, జానపద కథలు. వీటితో సమకాలీన సమస్యలూ హాస్యమూ కూడా కలిపి సరదాగా చెప్తూ అలరిస్తారు కళాకారులు. వాళ్లకి భాష, నుడికారం, సంస్క్రతుల మీద మంచి పట్టు ఉంటుంది. అచ్చతెలుగు చిందుతో కలిసి సంస్కృత పదాలు నాట్యం చేస్తాయి. కథ చెప్పటంలో లయ, సాగదీత అన్నిటిలోనూ ఉంటాయి. చాలాకథల్లో సృష్టి కథ, ఎల్లమ్మకథ, భారత, రామాయణ గాథలూ, ఇంకా బొబ్బిలియుద్ధం, పల్నాటియుద్ధం లాంటి స్థానిక వీరగాథలూ ఉంటాయి.

ఈ కళారూపాలను సినిమాలకంటే ఎక్కువగా జాతీయ ఉద్యమం, కమ్యూనిస్ట్ ఉద్యమం తమ ప్రచారంకోసం బాగా వాడుకున్నాయి. డబ్బు పెట్టగలిగేవాళ్ళే సినిమాలు తియ్యగలరు కాబట్టి వాళ్ళ అభిరుచుల ప్రకారమే మొదట్లో సంగీత నాట్యాలు సినిమాల్లోకి వచ్చాయి. అవి శాస్త్రీయ, జానపద ఛాయలతో ఉండేవి. సినిమాల్లో దళితులంటే సానుభూతి చూపిస్తూ వొట్టి బాధితులుగా చూపించటమే ఎక్కువ. వారి కళాభివ్యక్తి ఇంచుమించుగా సినిమాల్లోకి రాలేదు. అందుకే ఒక జాంబపురాణం ఏ సినిమాలోనూ కనిపించదు. పూర్తిగా ఎదగని తెలుగుసినిమా స్థాయి రానురానూ ఏ ఆసక్తీ లేనివాళ్ళు క్రమంగా ఆక్రమించటంతో పల్టీలు కొడుతూ పడిపోయింది.

తెలుగుదేశంలో ఇప్పుడు ఎటుచూసినా కనబడేవి రెండే. ఒకటి ఇంజనీర్లు. రెండు సినిమాలు. సినిమాదెబ్బకి నాటకరంగం నేలకంటుకుపోయుంది. నాటకం కంటే ముందటి కాలానికి చెందిన రకరకాల కతలు మాయం అవటానికి ముందుదశలో ఉన్నాయ్.

***

girija1

అరవైల్లో ఒక మల్టీస్టారర్ సినిమా వచ్చింది. పేరు ‘రహస్యం’. ఆ సినిమా ఏమీ నడవలేదుకానీ అందులోని  ‘గిరిజాకల్యాణం’ ఆలిండియా రేడియోలోంచీ అందరికీ చేరింది. రేడియోతో పాటు చిన్నప్పుడు “తగదిది తగదిది తగదిది ధరణీధరవర సుకుమారీ తగదిదీ.” అని అర్థం తెలీకపోయినా పాడేసుకుంటుంటే గొప్పగా గుర్రపుస్వారీ చేస్తున్నట్టనిపించేది. పిల్లల్ని కూడా ఆకర్షించగల శబ్దసౌందర్యంతో మల్లాది పాట రాస్తే, దానికి తగ్గ సంగీత ఝరీసౌందర్యంతో ఘంటసాల వరుస కట్టాడని అసలు తెలీదప్పుడు.

పురాణ ప్రేమకథలుగా రుక్మిణీ కల్యాణం, పార్వతీ కల్యాణం ప్రసిద్ధాలు. బ్రాహ్మణుడిద్వారా రుక్మిణి శ్రీకృష్ణుడికి ప్రేమవిన్నపం చెయ్యటం, ఆయన రుక్మిణిని రథంమీద ఎక్కించి తీసుకుపోవటం, అడ్డొచ్చిన రుక్మితో కృష్ణుడు పోరాడి అతన్ని అవమానం చెయ్యటం, ఇదంతా సాహసంతో కూడిన ప్రేమకథ.  పార్వతీ కల్యాణంలో శివపార్వతులకు అంత రొమాన్స్ లేకపోయినా మన్మధుడు పిలవని అతిథిలా వచ్చి శివుడిని రెచ్చగొట్టటమే ఈ కథలోని సాహసకార్యం. మన్మధుడే కలిగించుకోకపోతే పార్వతి అలా శివుడికోసం తపస్సు చేసుకుంటూ కూర్చుండిపోతే, అసలే విరాగి అయిన శివుడు ఎంతకాలానికి ఆమె వలపునూ భక్తినీ కన్నెత్తి చూడాలి? శివుడి ప్రత్యేకత ఇంకోటుంది. నటరాజు కదా, కోపం వొచ్చినా సంతోషం వొచ్చినా తాండవ నృత్య ప్రదర్శన చేస్తాడు. దీనివల్ల కూడా మన్మధ విలాసంతో కూడిన శివపార్వతుల కళ్యాణ సంరంభం డాన్స్ డ్రామాగా ఎక్కువ బాగుంటుంది. అది కూచిపూడి భాగవతుల ప్రదర్శనైతే ?

కృష్ణాజిల్లా మొవ్వ మండలంలో ఉన్న చిన్నవూరు కూచిపూడి. అక్కడ పుట్టిన కొన్ని వంశాలవారు ఇప్పటికీ ఆ నాట్యాన్ని కొనసాగిస్తున్నారు. ‘దేవదాస్’ సినిమా దర్శకుడు వేదాంతం రాఘవయ్యదీ కూచిపూడే.  నేర్చుకున్న నృత్యాన్ని ఎంతో మనసు పెట్టి తను తీసిన ‘రహస్యం’ సినిమాలో చూపించాడు.

‘తక్కధింతాం తకతధింతాం’ అంటూ అశ్వగమన లయతో మొదలుపెట్టి, మూలపుటమ్మకూ చదువులతల్లికీ పరాకులు చెప్తూ మొదలౌతుంది ‘గిరిజా కల్యాణం’. తరువాత వినాయకుడు, కుమారస్వాములను తలుచుకుంటారు. స్థానిక దేవతలైన మంగళగిరి నరసింహుడూ, బంగరుతల్లి కనకదుర్గా, కూచిపూడిలో నెలవైన వేణుగోపాలస్వామీ వరుసగా బహుపరాకులు అందుకుంటారు. ఆ తరువాత కథలోకి దిగుతారు కూచిపూడి భాగవతార్లు.

ఆ నృత్యరూపకాన్ని తయారు చేసిన వాళ్ళు సామాన్యులా?  “ప్రౌఢవాక్యాల, ముగ్ధభావాల.. వచనరచనకు మేస్త్రి” అని ముళ్ళపూడి వెంకటరమణ కీర్తించిన మల్లాది రామకృష్ణ శాస్త్రి చేసిన రచనను నృత్యనాటకంగా తీర్చిదిద్దినది వేదాంతం రాఘవయ్య. సినిమా పాటలకు మెత్తని పట్టుదారాల్లాంటి వరుసలెన్నో అల్లిన ఘనుడు ఘంటసాల ‘గిరిజా కల్యాణా’నికి సంగీతాన్ని కూర్చాడు. (సినిమాపాటల గాయకుడిగా కొన్ని శృంగార గీతాల్లోనూ కెరీర్ చివర్లోనూ కాస్తగా ఫెయిల్ అయాడేమో గానీ,  సంగీత దర్శకుడిగా ఎల్లప్పుడూ మంచిస్థాయి సంగీతాన్నే సినిమాపాటలకిచ్చాడు ఘంటసాల).

సినిమాసంగీతం భాషా భావసౌందర్యాలకు ఎక్కువ విలువ ఇస్తుంది. శాస్త్రీయసంగీతంలో రాగ, స్వర ప్రాధాన్యత ఎక్కువ. భావాన్ని వినసొంపుగా చేయటంకోసం శాస్త్రీయసంగీత లక్షణాన్ని తగ్గిస్తూ లలితసంగీత లక్షణాలను పట్టించుకుంటూ వచ్చింది సినిమాసంగీతం. భాష బాగావచ్చిన కవులూ రచయితలూ, రాగాలు నేర్చి పాటకు వరసలు కట్టే కంపోజర్స్ ఉన్న కాలంలో సినిమాపాట గొప్పవెలుగు వెలిగింది. ‘రావో రావో లోలంబాలక రావో’ అని మల్లాది రామకృష్ణశాస్త్రి రాస్తే మరో రచయిత (కొసరాజు కావచ్చు) ‘ఉంగరాల ముంగురూల రాజా’ అని జానపద గీతాలతో మనసు దొంగిలిస్తాడు.  ఇక కర్ణాటక సంగీతాన్ని ఎన్నోయేళ్ళు అభ్యాసంచేసి, బడేగులాంఅలీఖాన్ ని కూడా అంతే ఇష్టంతో విన్న ఘంటసాల కూర్చిన తెలుగు సినిమాసంగీతం వినసొంపుగా ఉంటూనే రాగాలకు చక్కగా కట్టుబడి ఉన్న సందర్భాలే ఎక్కువని చెప్తారు. చిత్తూర్ సుబ్రమణ్యం పిళ్ళై లాంటి సంప్రదాయవాది ‘రహస్యం’ కు  ఘంటసాల ఇచ్చిన సంగీతాన్ని మెచ్చుకున్నాడట (వి.ఏ.కె.రంగారావు).

అంబా పరాకు  దేవీ పరాకు  మమ్మేలు మా శారదంబా పరాకు.

ఉమా మహేశ్వర ప్రసాద లబ్ధ పూర్ణ జీవనా గజాననా బహుపరాక్ బహుపరాక్

చండ భుజామండల దోధూయమాన వైరిగణా షడాననా బహుపరాక్ బహుపరాక్

మంగళాద్రి నారసింహ బహుపరాక్ బహుపరాక్ బంగరుతల్లి కనకదుర్గ బహుపరాక్ బహుపరాక్

కృష్ణాతీర కూచనపూడి నిలయా గోపాలదేవ బహుపరాక్”.

 

అని తాళాలు వాయిస్తూ వేదాంతం రాఘవయ్య సూత్రధారిగా చేసే నృత్యమూ, సరిజోరుగా ఘంటసాల ఇచ్చిన ఆ లయా ఏ పాప్ సాంగ్ ఊపుకీ తక్కువకాదు.

అవధరించరయ్యా విద్యలనాదరించరయ్యా లలిత కళల విలువ తెలియు సరసులు పదింబదిగ పరవశులై”..

అని తమ విద్యను ఆస్వాదించి పరవశులయే వాళ్ళు లలితకళల విలువ తెలిసిన సరసులని గడుసుగా చెప్తూ

ఈశుని మ్రోల హిమగిరిబాల కన్నెతనము ధన్యమైన గాథ అవధరించరయ్యా విద్యలనాదరించరయ్యా అంటారు  సూత్రధారీ వంతపాటగాళ్ళూ.

కణకణలాడే తామసాన కాముని రూపము బాపి, అల కాముని రూపము బాపి, ఆ కోపి, కాకలు తీరి కను దెరచి, తను దెలసి, తన లలనను పరిణయమైన ప్రబంధము అవధరించరయ్యా అని కథను పరిచయం చేస్తారు.

ఇంతలో గిరిబాలా ఆమె చెలులూ ప్రవేశం…

రావో, రావో! లోలలోల లోలంబాలక రావో అని పార్వతిని ఆహ్వానిస్తూ

చెలువారు మోమున లేలేత నగవుల కలహంస గమనాన కలికీ ఎక్కడికే ?” అంటూ సఖులు ప్రశ్న వేస్తే

మానస సరసిని మణిపద్మదళముల రాణించు అల రాజహంస సన్నిధికే అని రాజహంసై వయ్యారం పోతుంది గిరిజ.

వావిలి పూవుల మాలలు కైజేసి, వయ్యారి నడలా బాలా ఎక్కడికే ?” అని నిలదీస్తే

కన్నారా నన్నేల కైలాస నిలయాన కొలువైన అల దేవదేవు సన్నిధికే” అని పరవశిస్తుంది.

ఇంతలో మధ్యవర్తి మన్మధుడు

తగదిది తగదిది తగదిది ధరణీధరవర సుకుమారీ తగదిది. అండగా మదనుడుండగా, మన విరిశరముల పదనుండగా, నిను బోలిన కులపావని తానై వరునరయగ పోవలెనా? ఆఁ ఆఁ ” 

కోరినవాడెవడైనా ఎంతటిఘనుడైనా కోలనేయనా సరసను కూలనేయనా, కనుగొనల ననమొనల గాసిజేసి నీ దాసు జేయనా! ఆఁ ఆఁ ఆఁ.

అంటూ ఆర్భాటం చేస్తూ వచ్చేస్తాడు.

ఈశుని దాసుని చేతువా అపసదా! అపచారము కాదా?  కోలల గూలెడి అలసుడు కాడు. ఆదిదేవుడే అతడు. సేవలు జేసి ప్రసన్నుని జేయ, నా స్వామి నన్నేలునోయీ. నీ సాయమే వలదోయీఅని పార్వతి  మదనుడిని వారిస్తే,

చిలుకతత్తడి రౌతా!  ఎందుకీ హుంకరింత ? వినక పోతివా ఇంతటితో నీ విరిశరముల పని సరి. కింకిణి పని సరి. తేజోపని సరి. చిగురుకు నీపని సరి మదనా అని ఆమె సఖులు కూడా హెచ్చరిస్తారు.

సామగ సాగమ సాధారా, శారద నీరద సాకారా, దీనాధీనా ధీసారా. ఇవే కైమోడ్పులు ఇవే సరిజోతలు  అని పార్వతి తపస్సు మొదలెడుతుంది. మన్మధుడు ఆత్రంగా పూలబాణాలు వేసేస్తాడు శివుడి మీద.

కళ్ళు తెరిచి శంకరుడు తాండవమాడగా మన్మధుడు కాలి బూడిదౌతాడు.

రతీదేవి పరుగెత్తుకొచ్చి విరులన్ నిను పూజసేయగా, విధిగా నిన్నొక గేస్తుజేయగా దొరకొన్న రసావతారు చిచ్చరకంటన్ పరిమార్తువా ప్రభూ.. పతిభిక్ష ప్రభూ”  అని ప్రాధేయ పడితే,

అంబా యని అసమశరుడు నను పిలిచెను వినవో, జనకుడవై ఆదరణతో తనయునిగా జేకొనవో, శరణంభవ శరణంభవ శరణంభవ స్వామిన్…”  అని పార్వతి శివుడిని వేడుతుంది.

మన్మధుడికి రూపు రావటంతో రతీదేవికి ఆనందం… ఇద్దరూ కలిసి పార్వతీ పరమేశ్వరులకిలా వందనం పాడతారు.

బిడియపడి భీష్మించి పెండ్లికొడుకైనట్టి జగమేలు తండ్రికీ జయవందనం జగమేలు తల్లికీ జయవందనం

సూత్రధారి కూడా మళ్ళీ ప్రవేశించి “కూచెన్నపూడి భాగవతుల సేవలందు దేవదేవా శ్రీ వేణుగోపాలా జయమంగళం, త్రైలోక్య మందారా శుభమంగళం అని మంగళం పలుకుతాడు.

సంస్కృతాన్నీ అచ్చతెలుగునీ సవ్యసాచిలా ప్రయోగించిన మల్లాది కవితానైపుణ్యాన్నీ శబ్దార్థసౌందర్యాన్నీ  వర్ణించటానికి నా భాష చాలదు. సినిమాపాటలను అంతెత్తున కూర్చోబెట్టేశాడాయన.

(లోలంబాలక=తుమ్మెదలవంటి ముంగురులు గలది. కోల=బాణం. గాసి=కష్టపెట్టు. అపసద=నీచుడా.  చిలుకతత్తడి రౌతు, అసమశరుడు, రసావతారుడు=మన్మధుడు.  కింకిణి=విల్లు.  గేస్తు=గృహస్థు)

***

ఈ పాట చెవులకి ఎంతగా పట్టేసినా, మల్లాది రవళికి దృశ్యాలను ఊహల్లో పేర్చుకోవటమే తప్ప సినిమా ఎక్కడా  దొరకలేదు. యుట్యూబ్ వచ్చాక ‘రహస్యం’ సినిమా దొరికింది. చక్కటి పాటలూ సంగీతం తప్పించి మిగతాదంతా చప్పగా, ఏవేవో రంగులేసిన భీకరమైన సెట్స్ తో ఉన్న ఆ సినిమాను రెండుగంటలపైగా భరిస్తే, ఈ గిరిజాకల్యాణ ఘట్టం లేనేలేదే! మొత్తానికి యుట్యూబ్ లోనే పాటకూడా రెండు భాగాలుగా కనబడింది. (యూట్యూబ్ లో పెట్టి, దీనిని చూడాలన్న నాలాంటివాళ్ళ చిరకాల వాంఛను తీర్చిన వసంత మాధవ గారికి కృతజ్ఞతలు) అరిగి రంగులుపోయి దీనావస్థలో ఉన్నా, ఈ నృత్యనాటకం చూస్తుంటే కూచిపూడి నాట్యరీతిని బాగానే పాటించినట్టుగా తోస్తుంది. సత్యభామ వేషంలో ఆరితేరిన కళాకారుడు వేదాంతం సత్యనారాయణశర్మ మన్మధుడుగా, కోరాడ నరసింహారావు శివుడిగా అభినయించటం వల్ల ఒక ప్రామాణికత వచ్చిన భావన. సూత్రధారి రాఘవయ్య, వంతపాటగాళ్ళు వేదాంతం రత్తయ్యశర్మ, భాగవతుల యజ్ఞనారాయణశర్మ. పార్వతిగా వేసిన బి.సరోజాదేవి, రతీదేవిగా వేసిన గీతాంజలి సినిమానటులు. మిగతా వేషాలలో కూచిపూడి భాగవతుల చేతనే నటింపజేస్తూ రాఘవయ్య తాను నేర్చిన కళపట్ల ఎంతో ప్రేమతో దీనికి నృత్యదర్శకత్వం చేశాడు. సినిమాసంకరం కాని కూచిపూడి శాస్త్రం దీనిలో ఎంతవరకూ ఉందో నాట్యశాస్త్ర విమర్శకులే చెప్పగలరు.

సంగీత సాహిత్య నృత్యాలు ముద్దుగా కుదురుకుని గర్వించదగ్గ తెలుగు సినిమాపాటగా ‘లలితకళల విలువతెలియు సరసులకు’ రసఝరీయోగాన్నిచ్చిన నృత్యనాటకం ‘గిరిజా కల్యాణం’. ఇది చక్కగా దక్కిన మనదైన తెలుగు వైభవం.

గిరిజా కల్యాణాన్ని ఇక్కడ వినండి.

http://www.allbestsongs.com/telugu_songs/Search-Telugu-Movie-Songs.php?st=Girija+Kalyanam&sa=Go%21

 

 

 

 

 

 

సైంటిఫిక్ మిస్టీరియస్ “అగ్నిగీతం”

 

 

 

పాత కాలపు మాస పత్రికలకు, ఒక మంచి అలవాటుండేది. ఇప్పుడూ ఉందేమో తెలీదు. బుల్లి బుల్లి అనుబంధ నవలలను పత్రికతో పాటు అందించడం. అప్పటి మాస పత్రికల్లో వినూత్నంగా చాలా యేళ్ళు నడిచింది విజయబాపినీడు సంపాదకత్వం లో “విజయ”! నాలుగు విభాగాలుగా (కథ, సినిమా,హాస్యం, అనుబంధ నవల) ఉండి, ఏ పార్టు కి ఆ పార్టి విడదీసి చదువుకోడానికి వీలుగా ఉండేది . ఎప్పుడు మూత పడిందో గుర్తు లేదు కానీ మా ఇంట్లో చాలా రోజులు పాత కాపీలు ఉండేవి. వాటిలో దొరికింది ఈ అగ్నిగీతం నవల అప్పట్లో! ఆ తర్వాత కాల క్రమేణా అది ఎవరో తీసుకుని ఇవ్వడం మర్చి పోయి వాళ్ల లైబ్రరీలో దాచుకున్నారని లేటుగా గ్రహించాము. డాక్టర్ ముదిగొండ శివ ప్రసాద్ రాసిన అనేక నవలలు మార్కెట్లో దొరుకుతున్నాయి గానీ ఇది మాత్రం దొరకలేదు. విజయ అనుబంధ నవలగా రెండు భాగాలు గా వచ్చాక, ఎప్పుడో మీనా పబ్లిషర్స్ అనే వాళ్ళు దీన్ని డైరెక్ట్ నవలగా వేశార్ట గానీ అది ప్రస్తుతం ఎక్కడా అందుబాటు లో లేదు. నిజానికి నాకు ఒక మూడేళ్ళ క్రితం ఈ నవల మిత్రుల సాయంతో PDF గా దొరికింది. ఒకసారి మళ్ళీ చదివితే, పరిచయం చేయదగిన మంచి పుస్తకమేననిపించింది.

ఈ నవల రెండు దారుల్లో నడుస్తుంది. ఆశయ సాధనకు మార్గం కూడా ఉత్తమంగా ఉండాలా లేక సాధనే గమ్యం కాబట్టి ఏ మార్గమైనా పర్లేదా అనే అంశం ఒక వైపూ, ధ్వని కాలుష్యం వల్ల మనుషులు చిత్త చాంచల్యానికి లోనై ప్రవరిస్తారనే సైంటిఫిక్ (అదే సమయంలో మిస్టీరియస్ కూడా) అంశాన్ని మరో వైపు చర్చిస్తూ కథ నడుస్తుంది.

కథ మొత్తం 70 ల్లోని హైద్రాబాద్ నగర వాతావరణం లో! వేణుగోపాల రావనే మామూలు ఉద్యోగి భార్య, అణకువ, అమాయకత్వాలే ఆభరణాలుగా కల అతని భార్య దమయంతి సడన్ గా ఒక చల్లని సాయంత్రం దెయ్యం పట్టిన  అవతారం ఎత్తడం తో నవల మొదలు!

సాయంత్రం సినిమాకెళ్దామనే ఊహల్లో ఇంటికొచ్చిన వేణు కి ఇదొక షాకు! కిటికీ ఎక్కి కూచుని నానా గోలా చేసిన దమయంతి సొమ్మసిల్లి నిద్ర పోతుంది. ఆ తర్వాత ఒక గంటకి లేచి కూచుని “కథ చెప్తా వింటావా వేణు గోపాల్రావ్?” అని అడగటం తో వణికి పోతాడు!

కథేంటి ? ఎవరి కథ ? వింటాననాలా వొద్దా ?

ఇతడి అవును, కాదులతో సంబంధం లేకుండా దమయంతి ఒక కథ చెప్పడం మొదలు పెడుతుంది. ఆ కథని ప్రతి రోజూ ఎపిసోడ్స్ వారీగా చెప్పడం కొనసాగిస్తుంది దమయంతి.

కథలో నాయిక కామేశ్వరి! కామేశ్వరి స్వీయ కథే అది !

అసలా కథ ఎవరిది, దమయంతికెలా తెలుసు? రోజంతా మామూలుగా ఉండే దమయంతి ఇలా రాత్రిళ్ళు ఇలా ట్రాన్స్ లోకి పోయి కథ చెప్పడమేంటో అంతు బట్టదు వేణుకి! దమయంతి అన్న డాక్టర్ త్రిమూర్తికి కబురంపి రమ్మంటాడు. త్రిమూర్తి ఈ కథలో లేక పోతే నవల సగానికి సగం చప్పబడి పోయేదేనేమో! అనుక్షణం ఛలోక్తులు చమత్కారాలు వేస్తూ త్రిమూర్తి నవల మొత్తం నవ్విస్తూ ఉంటాడు.

త్రిమూర్తి వచ్చాక అతనికీ ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఏమిటి ఇంతకీ?

ఏదైనా దెయ్యం పట్టుకుందా? దెయ్యాలున్నాయా నిజంగానే ? లేక దమయంతే కామేశ్వరా ? తన పూర్వకథనే చెప్తోందా అనే సందేహాలు వదలవు వేణుని

కథలో పాత్రలన్నీ నిజమా లేక కల్పితాలా? ఈ కథ దమయంతికెవరు చెప్పారు?

వేణుకీ , త్రిమూర్తికీ మనకీ కూడా సందేహాలే

Agni001

స్వయంగా త్రిమూర్తే డాక్టర్ కనుక వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలనే ఆలోచన మానుకుని తార్కికంగా ఆలోచించడానికి పూనుకుంటారు. మొత్తానికి దమయంతి మానసికారోగ్యం కొంత సంతులనం లేకుండా ఉంది,  విహార యాత్రలు చేసి వస్తే వాతావరణం లో మార్పు వల్ల ఏదైనా గుణం కనిపిస్తుందేమో అన్న ఆలోచనతో గుళ్ళూ గోపురాలే కాక ప్రకృతి రమణీయకత ఉండే ప్రాంతాలు తిరగడానికి బయలు దేరతారు. ఐతే అడపా దడపా దమయంతి ఆ యాత్రల్లో సైతం పగలు మామూలుగానే ఉన్నా రాత్రిళ్ళు మాత్రం అలౌకికావస్థకు గురై కథ చెప్తూనే ఉంటుంది.  నవలలో ఈ కథంతా ముక్కలు ముక్కలుగా నడుస్తుంది.నవలా గమనం కొంత వర్తమానం లోనూ, మరి కొంత దమయంతి చెప్పే కథలోనూ నడుస్తుంది.

దమయంతి చెప్పే కథ! కథ పేరు అగ్నిగీతమని దయమంతే చెప్తుంది.

తల్లి లేని కామేశ్వరిని తండ్రి గారాబంగా పెంచగలుగుతాడే తప్ప సంఘంలో ఉన్న పరిస్థితులని తనకు తోచిన విధంగా అవగాహన చేసుకునే తీరుని ప్రభావితం చెయ్యలేక పోతాడు. దానికి తోడు యుక్తవయసు కి వచ్చాక కామేశ్వరికి ఎదురైన పరిస్థితులు కూడా ఆమెను మరింత గందర గొళానికి గురి చేసేవే ! దగ్గరిగా చూసిన ఇద్దరు స్త్రీల జీవితాలు ఆమె కళ్ళ ముందే కాలి బూడిద అవుతాయి ! అందుకు వాళ్ల భర్తలే ప్రధాన కారణం. టాంక్ బండ్ మీదనుంచి దూకి ఆత్మ హత్య చేసుకోబోయిన జానకీ, స్త్రీలోలుడైన ప్రొఫెసర్ తీరుని సహించలేక ఆత్మ హత్య చేసుకున్న అతని భార్య నీరజా, కామేశ్వరిలో రేగే జ్వాలకు ఆజ్యం పోసిన వాళ్ళవుతారు ! పురుషుల పట్ల, సమాజం పట్లా కసిని పెంచుతారు. నీరజ మరణం తో కదిలి పోయిన కామేశ్వరి లో నీరజ మరణం ప్రతికారాన్ని రగిలిస్తుంది

ఎంత తీవ్రంగా అంటే నీరజ చితా భస్మాన్ని ధరించి నేటి నుంచీ మగ పశువు నా పాదాల వద్ద బానిస. నా కాళ్ల కింద నలిగే పురుగు!పతితుడు , ఇదే నా ప్రతిజ్ఞ ! నీకు ఆత్మ శాంతి కల్గించే ప్రతిజ్ఞ” అని ప్రతిజ్ఞ పూనుతుంది. తీవ్రమైన దుఃఖం , వేదన ఒత్తిడి నుంచి ఆమె  గమ్యాన్ని నిర్దేశించుకుంటుంది అందులో వివేచన తక్కువ.

మగవాళ్ల మీద పగబడుతుంది! పగ తీరాలంటే హై సొసైటీ తో పరిచయాలు పెంచుకుని, అక్కడి మగవాళ్ళను వీధికి ఈడ్చాలి! అందుకే పరిచయాలు పెంచుకోడానికి పేరున్న సంగీత కారుడు వైణికుడు పుండరీకాక్షుణ్ణి రిజిస్టర్ వివాహం చేసుకుంటుంది

కథలో మరో పాత్ర పుండరీకాక్షుడి తమ్ముడు దయానంద్! ఆర్య సమాజ్ సంప్రదాయాలకు ఆకర్షితుడై వాళ్ల గురుకులంలోనే చదువుకుంటాడు. సమాజంలో నేర ప్రవృత్తి, మనుషుల దృక్కోణాలు, ప్రవర్తన మారాలంటే ఆత్మ సంస్కారం అవసరమని, మూలాల నుంచి ప్రక్షాళన అవసరమనీ భావిస్తాడు ! అది సరైన విద్య ద్వారానూ, శారీరక మానసిక సంతులనం ద్వారానూ మాత్రమే సాధ్యమవుతుందని ఆ విధంగా సంఘం లో సత్ప్రవర్తనను పెంచి తద్వారా ప్రక్షాళన జరగాలని ఆకాంక్షిస్తూ విద్య పూర్తి చేసి, హైద్రాబాద్ నగరంలో అడుగు పెడతాడు.

సమాజంలో ఎటు చూసినా కుళ్ళు, దుర్మార్గం, అవినీతి, దౌర్జన్యం, హింస ! నిజానికివి ఎప్పటికపుడు సమాజంలో వివిధ స్థాయిల్లో ఉంటూనే ఉంటాయి కదా ! ఎలా వీటిని ఎదుర్కొని దారిలో పెట్టాలో తీవ్రంగా ఆలోచిస్తూ ఒక పార్కులో కూచుని ఉండగా అతనికి పరిచయమవుతాడు అగ్ని మిత్రుడు.

ఎలాగ? లంచం తీసుకోమని భర్తను వేధిస్తున్న ఒక స్త్రీ మీద దౌర్జన్యం చేసి చేయి,చేసుకుంటూ!

నివ్వెర పోయిన దయానంద్ అదేమని ప్రశ్నిస్తే, కురుపు లేస్తే దాన్ని కత్తిరించి తొలగించి పారేయాలనే జవాబు వస్తుంది.  ఆ తర్వాత సినిమా హాల్లో ఒక ఆడపిల్లను వేధిస్తున్న అబ్బాయిలను కూడా చితగ్గొడుతూ అగ్నిమిత్రుడు  దయానంద్ కళ్ళబడతాడు. అతడి గమ్యం ఏమిటో తెలుసుకోవాలని అతడిని కల్సి దయానంద్ తన ఇంటికి తీసుకెళ్తాడు

“ఆశయం ఉత్తమం కావొచ్చు, కానీ దాని ఆచరణ మార్గం మాత్రం ఇది కాకూడదు” అని ఎంత చెప్పినా అగ్నిమిత్రుడు నిర్లక్ష్యంతో ” నీ దారిన నువ్వు వెళ్ళు, నా దారిన నేను వెళ్తాను.” అంటాడే తప్ప దయానంద్ మార్గంలోకి రావడానికి ఇష్ట పడడు. “నీ హృదయాన్ని ప్రేమిస్తున్నాను! కానీ నీ మస్తిష్కాన్ని వ్యతిరేకిస్తున్నాను “అని స్నేహ హస్తాన్ని చాస్తాడు దయానంద్

“నాది అగ్ని ప్రకృతి! నన్ను నేను దహించుకుంటూ వేడినిస్తూ ఉంటాను” అని అగ్నిమిత్రుడంటే “నాది చందన ప్రకృతి. నన్ను నేను అరగదీసుకుంటూ ఉపయోగపడతాను” అంటాడు దయానంద్!

“నా దృష్టి లో మనుషులంటే శిలలు! కొన్ని కొండలలోని బండలు. కొన్ని గనులలోని రత్నాలు.మరి కొన్ని నదీ పరివాహక ప్రాంతాల సాలగ్రామాలు.దేని గౌరవం దానిదే! ఇలాటి గౌరవాలను పొందలేని గ్రానైట్ రాయి సైతం భవనాల పునాదుల్లో పడి భవనాన్ని నిలబెడుతోంది .రత్నం ఎంత గొప్పదో, గ్రానైట్ రాయి అంతకంటే లక్ష రెట్లు త్యాగమయమైందే.ఎవరూ జన్మిస్తూనే గొప్పవారు కాలేరు” ఇదీ దయానంద్ ఫిలాసఫీ

మార్గాలు వేరైనా గమ్యాలు ఒకటే కాబట్టి ఇద్దరికీ స్నేహం కలుస్తుంది.

మరిది దయానంద్ ని, అతని ఆశయ కార్యాచరణను చూసి కామేశ్వరి ఎద్దేవా చేస్తుంది. పాదాలకు నమస్కారం చేస్తే “మగ వెధవలు, ఆ వంకతో ఐనా ఎక్కడో ఒక చోట తాకొచ్చనే ఆశ” అని మండి పడుతుంది! కానీ అతనంటే చెప్పలేని ఆకర్షణ ఏదో ఆమె లోలోపల కలుగుతుందనే విషయాన్ని గ్రహించలేక పోతుంది.

స్త్రీలకు అనాదిగా జరుగుతున్న అన్యాయాల గురించి ఇద్దరికీ వాదోపవాదాలు జరుగుతాయి. కామేశ్వరి దయానంద్ మీద క్రోధం పెంచుకుంటుంది. ఆమె క్రోధాన్నిదయానంద్ శాంతం తో ఎప్పటికప్పుడు జయిస్తూ ఉండటం వల్ల కాబోలు ,ఆమె లోలోపల ఎక్కడో ఆ ఆకర్షణ ఎంత వద్దనుకున్నా పెరుగుతూ పోతుంది

హైద్రాబాద్ లో దయానంద్ తన ఆశయ సాధనకు విద్యా కేంద్రాలు నెలకొల్పుతాడు. “సమాజం నేడు చెట్టు కొమ్మల వంక చూసి పళ్ళు లేవే” అని నిరాశ చెందుతోంది. నేను చెట్టు కొమ్మల మీద గాక,వేళ్ళ మీద దృష్టి పెట్టాను. సమాజ వృక్షపు వేళ్లకు ఎరువులు వేస్తాను.ఫలాలు నేడు కాక పోతే రేపటి తరానికి అందుతాయి! కురుపు ఉన్న చోట మందు వేయడం కాదు, లోపలకి పడాలి మందు” అంటాడు దయానంద్!

యోగా, ప్రకృతి వైద్యం, మార్షల్ ఆర్ట్స్,వంటివి అతని విద్యా కేంద్రంలో కొన్ని బోధనాంశాలు!

రాను రాను అతని విద్యా కేంద్రానికి ఆదరణ పెరిగి ఆర్థికంగా కూడా సహాయం అందుతుంది.ఏ యే దేశాల నుంచో హైద్రాబాద్ వచ్చి యోగా, ధ్యానం వంటి వాటిని డబ్బు పోసి నేర్చుకుంటున్న వాళ్లెందరో దయానంద్ విద్యాకేంద్రం వైపు మళ్ళుతారు!

Agni222

నగరంలోని ఒక ప్రముఖ వ్యాపారి కోట్నీస్ ఇంటికి పాద పూజానంద స్వామి అనే స్వామీజీ వస్తాడు. అక్కడ కచేరీ కోసం పుండరీకాక్షుడూ, అతని ద్వారా గొప్ప వాళ్ల గోత్రాలు సేకరించాలని కామేశ్వరీ, అతడిని అల్లరి చేయాలని అగ్ని మిత్రుడూ, అతనేమి చెప్తాడో విందామని దయానందూ అంతా ఎవరి కారణాలతో వాళ్ళు వస్తారు. దయానంద్ కీ   పాద పుజానంద స్వామి కీ జరిగిన వాదం లో దయానంద్ ది పై చేయి అవుతుంది. దాంతో కోట్నీస్ అనుచరులు అతన్ని “నీకేం తెలీదు, కూచో !స్వామిజీ దేవుడు” అని దౌర్జన్యం చేయడానికి ప్రయత్నిస్తారు.అప్పటికే సభలో ప్రేక్షకుల రూపంలో ఉన్న తన అనుచరులతో అగ్నిమిత్రుడు అందర్నీ చితగ్గొట్టి భీతావహ పరిస్థితులు సృష్టిస్తాడు.ఆ తర్వాత కోట్నీస్ నల్ల వ్యాపారాల గురించీ, కళావని అనే సాంస్కృతిక సంస్థ ముసుగులో ఆడపిల్లని ఇతర దేశాలకు అతని సహకారంతో ఎగుమతి జరుగుతున్న సంగతినీ వివరిస్తాడు దయానంద్ కి!

మర్నాడు కామేశ్వరి కళావని మీటింగ్ కి వెళ్ళి దాన్ని నడిపే జాకబ్ తో కొద్ది పాటి చనువు వెలగబెట్టి, అతడికీ అతడి భార్య కీ గొడవ వచ్చేలా చేసి వాళ్లిద్దరి చేతా వాగించి అది మొత్తం ఆడియో రికార్డ్ చేస్తుంది. ఒక్కొక్కటిగా ఆ విషయాలన్నీ బయటకు వచ్చేలా చేయాలని ఆమె పథకం

కామేశ్వరి, దయానంద్, అగ్ని మిత్రుడు.. వీళ్ల ముగ్గురి ప్రయాణాలూ నిజానికి ఒక చోటికే అని ప్రారంభిస్తారు వేర్వేరు దారుల్లో! ఒకరి దారంటే ఒకరికి గిట్టదు. అసలు గమ్యాల పట్ల , దారుల పట్ల ఎవరికి స్పష్టమైన అవగాహన ఉందనే విషయం నవలలో చర్చనీయాంశం !

అనుకోని పరిస్థితుల్లో కోట్నీస్ ని హత్య చేస్తాడు అగ్నిమిత్రుడు! విషయం దయానంద్ కి చెప్పి తాను లొంగి పోదల్చలేదనీ, ఇంకా చేయాల్సిన పనులున్నాయనీ చెప్పి పారి పోతాడు! నేరం తన మీద వేసుకుని శిక్షకు సిద్ధమవుతాడు దయానంద్! చివర్లో అగ్నిమిత్రుడు వచ్చి నిజం చెప్పి తన నేరాన్ని అంగీకరించడం తో అతనికి ఉరి శిక్ష అమలవుతుంది.

ఆ తర్వాత కామేశ్వరి దయానంద్ ల జీవితాల్లో ఒక నాడు పెను మార్పు సంభవిస్తుంది. ఆ మార్పు పర్యవసనాలేమిటి? కామేశ్వరి ఏమైంది? దయానంద్ జీవితం ఏ మలుపు తిరిగిందనేది నవలలో చదివితేనే బావుటుంది.

వర్తమానానికి వస్తే, పుణ్య క్షేత్రాలన్నీ తిరుగుతున్న త్రిమూర్తి కామేశ్వరి ఆ కథ అంతా ఒక ప్రత్యేక వాతావరణ పరిస్థితిలో చెపుతున్నదని గ్రహిస్తాడు. గుడిలో భజనలూ, మంగళ వాద్యాలూ, డోళ్ళూ, దరువులూ లేదా రోడ్డు పక్కనే వెళ్తున్న రణ గొణ ధ్వనులూ ఇవన్నీ ఉన్న నేపథ్యంలోనే ఆమె ఈ కథ చెప్తున్నదని గ్రహిస్తాడు. అరగొండలోని ఒక స్నేహితుల ఇంటికి వెళ్ళినపుడు ఆ రాత్రిని వాళ్లు చల్లని పౌర్ణమి వెన్నెలను ఆస్వాదిస్తూ చెరకు తోటల మధ్య సన్నగా ప్రవహిస్తున్న నదీ తీరంలో ప్రశాంతంగా గడిపిన రాత్రి ఎంత ఎదురు చూసినా దమయంతి కథ చెప్పదు.

అప్పుడు అర్థమవుతుంది త్రిమూర్తిలోని డాక్టర్ కి , ఆమెకు శబ్ద కాలుష్యం వల్ల మెదడు మీద ఏర్పడిన వత్తిడి ఆమెలో ఎక్కడో దాగి ఉన్న భావాలను, అణచి పెట్టిన విషయాలను వెలికి తీసి బయటికి పంపేస్తోందని!

అప్పుడు గుర్తు చేసుకుంటారు, రామ నగర్ గుండు దగ్గర నివసించే వేణుగోపాల రావు ఇంటి ముందే మెయిన్ రోడ్డూ, వస్తూ పోతూ ఉండే వాహనాల ధ్వనులే కాక, ఇంటి పక్కనే ఉన్న కమ్మరి కొలిమి నుంచి నిరంతరం పరిమితి మించిన ధ్వనుల్ని, శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తూనే ఉంటాయని! 150 డెసిబెల్స్ దాటిన ఆ ధ్వనులు దమయంతి మెదడును బాగా డిస్టర్బ్ చేశాయని అర్థమవుతుంది వాళ్లకి

సరే, అంత వరకూ బాగానే ఉంది.మరి ఈ కామేశ్వరి ఎక్కడి నుంచి వచ్చింది?

దమయంతి చెప్పే కథలో చివర్లో చెప్తుంది “ఆ తర్వాత డైరీలో కొన్ని లైన్లు కొట్టి వేయబడి ఉన్నాయి. కొన్ని పేజీలు చింపేశారు! అంతా గజిబిజిగా ఉంది”

త్రిమూర్తి దీన్ని మొత్తం విశ్లేషించి ఆ డైరీ తన సవతి సోదరిదని గ్రహిస్తాడు. తన తండ్రి మొదటి భార్యకు పుట్టిన సంగీతే కామేశ్వరి అని, ఆమె డైరీని తండ్రి దమయంతికి ఇచ్చి ఉంటాడని వేణుతో చెప్తాడు.

తర్వాత వాళ్ళు కామేశ్వరి కి ప్రకృతి చికిత్స చేయించే ఉద్దేశంతో వికారాబాద్ సమీపంలోని అడవుల్లో ఉన్న ఒక ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ పెద్ద శబ్దాలన్నీ నిషిద్ధం! ఉన్నదల్లా మొక్కలూ చెట్లూ ప్రకృతీ, సేంద్రియ వ్యవసాయమూ, సంగీతంతో పెరిగే మొక్కలూ, ఆముదం దీపాలూ, చెరువులూ, కలువలూ బాతులూ ఇవే!

అక్కడ అందరూ ఎలాటి కల్మ్షమైన ఆలోచనలూ లేని సోదర సోదరీ బంధాలే . మానవత్వపు బంధాలు తప్ప ఇంకే రకమైన సంబంధాలూ లేని ఆశ్రమం అది! అక్కడ దమయంతికి ప్రకృతి వైద్యం జరుగుతుంది. కామేశ్వరి డైరీ గురించి అందులోని పాత్రల గురించి చెప్పినపుడు ఆ ఆశ్రమానికి పెద్దన్నయ్యగా వ్యవహరిస్తున్న వ్యక్తి నివ్వెర పోతాడు. తాను అగ్ని మిత్రుడి ప్రథమ అనుచరుడిగా ఎన్నో హత్యలు చేశాననీ,దొంగనని , అగ్ని మిత్రుడి ఉరి తర్వాత, గమ్యమే కాక మార్గం కూడా ఉత్తమంగా ఉండాలనే విషయం గ్రహించి అందరం దయానంద్ శిష్యులుగా మారి పోయామనీ చెప్తాడు.

ఆ ఆశ్రమాన్ని స్థాపించి నడిపిస్తున్నది కూడా కామేశ్వరి కథలోని ప్రధాన పాత్రే! ఆ పాత్ర ఎవరు, ఆ కథలో చివరికి జరిగిందేమిటి?

ఇవన్నీ నవలలో చదివి తెలుసుకుంటే కొంత ఉత్కంఠ గా ఉంటుంది.

ఈ నవల రెండు భాగాలుగా వచ్చినపుడు విజయ పాఠకులు ఉర్రూతలూగి పోయారట.

ఇక రచన విషయానికొస్తే నవల పూర్తిగా పాత్రల ప్రమేయంతోనే నడుస్తుంది తప్ప ఎలాటి స్థితి లోనూ రచయిత ఎక్కడా కథను తన చేతిలోకి తీసుకుని నడిపించడు. నవల్లో త్రిమూర్తి పాత్ర చాలా సహాయకారిగా ఉంటుంది. కథాగమనాన్ని కొంత వరకూ సపోర్ట్ చేసే పాత్ర ఇది. త్రిమూర్తి వాగుడూ జోకులూ అక్కడక్కడ చివరికి మిగిలేది లో జగన్నాధం పాత్రని తలపిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడూ తనలో తను మాట్లాడుకుంటూ ఉండటమూ,కొన్ని కల్పితాలను నిజ జీవితంలో జరిగినట్టు గా వేణుకి చెప్పడమూ  చేస్తుంటాడు. . నగరంలో ధనికురాలైన ముంతాజ్ బేగం వైద్యం కోసం తను వెళ్ళినపుడు ఆమె తనను ప్రేమించిందనీ, త్వరలో తామిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నామనీ చెప్తాడు వేణుకి. కానీ చివర్లో అదంతా కల్పితమని తేలుతుంది. ఇలాటి చిత్త చాంచల్యాలు అనువంశికంగా సంక్రమిస్తాయని ఆశ్రమంలో వైద్యులు వివరించినపుడు దయమంతి తాను చదివిన డైరీని కథగా చెప్పడానికీ, త్రిమూర్తి కథల్ని సృష్టించడానికీ మధ్య రక్త సంబంధపు లింకు దొరుకుతుంది.

దమయంతి చెప్పే కథ కు బ్రేక్ వచ్చి వర్తమానంలోకి నవల వచ్చినపుడల్లా పాఠకుడికి త్రిమూర్తి పాత్ర చాలా రిలీఫ్. అలవోకగా , ఆశువు గా వేసే  త్రిమూర్తి చలోక్తులు కథకు అడ్డు రాకపోగా కామేశ్వరి కథకు బ్రేక్ వచ్చిందనే విషయాన్ని గుర్తించకుండా చేస్తాయి. సంబంధం లేని సందర్భాలను, వ్యక్తులనూ కలేసి మాట్లాడే త్రిమూర్తి చమత్కారాలు మంచి ఎంటర్టైన్మెంట్

త్రిమూర్తి జోకుల్లో సమకాలీన పరిస్థితుల మీద సెటైర్లు బాగా పడతాయి. బాసర కు వెళ్ళినపుడు అక్కడి సరస్వతిని త్రిమూర్తి సమకాలీన కవిత్వం మీద మంటతో ఇలా ప్రార్తిస్తాడు

 

“అంత్య ప్రాసే కవిత

అని భ్రమించే నేటి

తెలుగు కవి గొర్రె తల

తొలగించు మా తల్లి

ఓ బాసరమ్మా ”

“సంబంధం లేకుండా మాట్లాడతావేం” అని విసుక్కుంటే “సంబంధం ఉండక్కర్లేదు. మాట్లాడే దానికి వ్యాకరణ సూత్రాలు కూడా ఏమీ ఉండక్కర్లేదు. బస్సులో కూచుని భగవంతుడిని గురించి, శోభనం గదిలో చార్వాకుడిని కూడా గురించి మాట్లాడవచ్చు. “సంభాషణా క్రమంలో ఒక్కొక్కప్పుడు కాంటాక్ట్స్ లేకుండా మాట్లాడ్డమే గొప్ప ఆర్ట్” అని నాట్యముని  భరతుడు తన వాత్సాయన కామ సూత్రాల్లో నిర్వచించాడు, కావాలంటే చూసుకో” అని వింత కాంబినేషన్స్ సృష్టిస్తాడు

“అన్నయ్యా ఇహ నీ కవిత్వాలూ అపుతావా” అని దమయంతి నవ్వితే “ఇది నాది కాదమ్మా, వేములవాడ భీమకవి తన క్రీడాభిరామం లో రాశాడు” అంటాడు నిర్వికారంగా!

కామేశ్వరి తీవ్ర స్వభావాన్ని కూడా ముదిగొండ అలవోకగా చిత్రిస్తూ పాఠకుడికి కొంత హింట్ కూడా ఇస్తారు. కామేశ్వరికి తల్లి చిన్నప్పుడే చనిపోయి, తండ్రి చేతుల్లో పెరుగుతుంది. అందువల్ల ప్రకృతి లోని , సమాజం లోని కొన్ని సున్నితమైన విషయాలను అర్థం చేసుకునే కోణం పూర్తిగా మారి పోయి, extremist గా మారుతుంది. తల్లి ఉండి ఉంటే “ఇది కాదు బతికే విధానం” అని ఇందిర ప్రకాశానికి చెప్పినట్టు మందలించి “ఇది కాదు ఆలోచించే విధానం, ఇది కాదు నువ్వు ఫలానా విషయాన్ని అర్థం చేసుకునే రీతి” అని అర్థమయ్యేలా చెప్పగలిగేదేమో అనిపిస్తుంది!

చిన్నపుడు తండ్రి ముద్దు పెట్టుకుని చాక్లెట్ ఇస్తే, తర్వాత స్కూల్లో ఒక కుర్రాడికి “పోనీ ముద్దు పెట్టుకుని చాక్లెట్ ఇవ్వు, మా నాన్న అలాగే చేస్తాడు”అంటుంది.  సెక్స్ కోసం మగాళ్ళు దేన్నైనా సరే ఎర వేసి సాధించుకుంటారనే ఆలోచన రాను రాను ఆమె లో పెరుగుతుంది. సినిమాలు చూసి బోల్డు ప్రశ్నలొస్తాయి కామేశ్వరికి చిన్నపుడు.అర్థ నగ్నంగా పొలాల్లో డ్యూయెట్లు పాడే హీరో హీరోయిన్లను చూసి ” వాళ్ళు రైతులా నాన్నా,ఎందుకు పొలాల్లో పరిగెడుతున్నారు?” అనడుగుతుంది. లాభం లేదని పౌరాణిక సినిమాలకు తీసుకు పోతే దేవతా స్త్రీలంతా వక్ష స్థలాలు ప్రదర్శిస్తూ వేష ధారణలు! వాటి మీద కామేశ్వరికి ప్రశ్నలు!!

కాలేజీ రోజుల్లో అష్ట విధ నాయికల గురించి పాఠం విని “ఈ నాయికలు చేసే పన్లని తెలుగులో చెప్తే మొరటుగా ఉంటుంది. సంస్కృతం లో చెప్తే కావ్యాలై కూచుంటాయి”అని తెలుగు మాష్టారిని ప్రశ్నలు వేస్తుంది.

“ఇదంతా రస సిద్ధాంతం, పవిత్రం” అని చెప్తే ” ఓహో ,సెక్స్ పరమ పవిత్రం” అనుకుంటుంది ఎదిగీ ఎదగని కామేశ్వరి.

ఎటూ కాని సందిగ్ధ పరిస్థితుల్లో కొట్టు మిట్టాడుతున్న ఆమెకు ఎదురైన మనుషులూ వాళ్ల కష్టాలూ కూడా ఆమెలో ఎక్కడో రగులుతున్న అశాంతిని ఎగదోసేవిగానే ఉంటాయి తప్ప సమాధాన పరిచేవిగా ఉండవు.

అందుకే కామేశ్వరి గమ్యమూ అస్పష్టమే , అందుకు ఆమె ఎంచుకున్న దారి కూడా అస్పష్టమూ ఆమోద యోగ్యమూ కానిదిగానే ఉంటుంది.

ఈ నవల గురించి విశేషాలేమైనా చెబుతారేమో అని రచయిత ముదిగొండ ని కదిలించాను. చాలా కాలం నాటి నవల కావడం తో ఆయన నవలకు దారి తీసిన నేపథ్యం గురించి ఏమీ గుర్తు చేసుకోలేక పోయారు. అయితే కామేశ్వరి పాత్ర గురించి ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

“కొందరికి ఆశయమూ గొప్పదే, ఆచరణా గొప్పదే అయి ఉంటాయి. మరి కొందరికి ఆశయం గొప్పదైనా, ఆచరణ మార్గం ఉత్తమమైంది ఎంచుకోరు. కొందరికి ఆశయం పట్లా స్పష్టత ఉండదు, అందుకు ఎంచుకునే మార్గం పట్లా స్పష్టత ఉండదు, ఉదాహరణ కామేశ్వరి” అన్నారు.

అప్పట్లో ఈ నవల బాగా ప్రజాదరణ పొందిందని చెపుతూ ఆ రోజుల్లో తాను ఆర్య సమాజ్ కార్య కలాపాల పట్ల కొంత ఆకర్షితుడిని కావడం వల్ల దయానంద్ పాత్రను ఆ ప్రేరణ తోనే సృష్టించానని వివరించారు.

దయానంద్ పాత్ర మాత్రం మొదటి నుంచీ ఒక స్పష్టతతో సాగుతుంది. ఆత్మ పరిశీలన, బుద్ధి వికాసం అనే రెండు లక్ష్యాలతో పని చేసే అతడు ఏ క్షణం లోనూ నియంత్రణ కోల్పోకుండా ప్రవర్తిస్తాడు. అగ్ని మిత్రుడు చేసిన హత్య  అమాయకత్వంతో తొందర పాటుతో చేసిందిగా భావించి ఆ నేరం తన మీద వేసుకోడానికి కూడా వెనుకాడనంత పరిణతి చూపిస్తాడు. చివరికి కామేశ్వరి వలన అతను ఆత్మ త్యాగం చేసి కామేశ్వరిలో సైతం పశ్చాత్తాపాన్ని రగిలిస్తాడు.

గమ్యం దాదాపుగా ఒకటే అయినా ముగ్గురు వ్యక్తుల జీవితాలు మూడు రకాలుగా ముడివడి చివరికి ఏమయ్యాయో ఉత్కంఠ భరితంగా చిత్రిస్తుందీ నవల.

శబ్ద కాలుష్యం , మనిషి మెదడు మీద అవి చూపించే ప్రభావం వంటి సైన్స్ కోణం పక్కన పెడితే,  కామేశ్వరి డైరీ చదివిన దమయంతి ఆ కథను ట్రాన్స్ లో ఉండి పాఠకుడికి చెప్పడం నవలను మిస్టీరియస్ గా  చివరి వరకూ ఉంచుతుంది. అయితే దమయంతి, త్రిమూర్తి,కామేశ్వరి ల మధ్య బంధాలు ఎలా ఉండేవి అనేది రచయిత ఎక్కడా చెప్పడు. కామేశ్వరి డైరీలో కూడా దమయంతి ప్రస్తావన గానీ, త్రిమూర్తి ప్రస్తావన గానీ ఉండదు.

ముదిగొండ శివ ప్రసాద్ గారు రాసిన చారిత్రక నవలలో కొన్ని చదివినా ఎందుకో ఈ నవల ప్రత్యేకత దీన్ని ఏళ్ళుగా గుర్తుండి పోయేలా చేసింది.

సామాజిక దృక్పథం తో సినిమాలు కొత్తగా పరిచయమవుతున్న ఆ రోజుల్లో మంచి దర్శకుడి చేతిలో పడితే ఇదొక మంచి సినిమా గా కూడా తయారైఉండేదేమో!

మంచి చర్చకు దారి తీసే టాపిక్ తో రాసిన మంచి నవల. ఆశయాలుండగానే సరి కాదు, వాటితో వాస్తవాలను బేరీజు వేసుకుని వాటికనుగుణంగా నడవలేక జీవితాలను నాశనం చేసుకున్న ముగ్గురు యువతీ యువకుల కథ గా ఈ నవల నాకు చాలా ఇష్టమైనది . చారిత్రక నవలా చక్రవర్తి గా పేరొందిన రచయిత రాసిన సైంటిఫిక్ మిస్టీరియస్ సాంఘిక నవలగా దీన్ని చెప్పడం బాగానే ఉంటుందనుకుంటాను

నవలలోని ప్రధాన పాత్రలు మూడింటిలోనూ ఉన్నది అగ్ని ప్రవృత్తే! వెలుగునివ్వడానికీ దహించి సర్వం బూడిద చేయడానికీ కూడా అగ్నే మూలం! ఈ అగ్నిలోనే వాళ్ల జీవితాలు ఎలా ఆహుతి అయిపోయాయో సూచించేందుకే అగ్నిగీతం అని ఈ నవలకు పేరు పెట్టి ఉంటారు బహుశా!

“మీ పుస్తకాలన్నీ మళ్లీ వేశారు కదా , ఇది మాత్రం ఎందుకు వేయలేదు ” అని అడిగితే డాక్టర్ ముదిగొండ “దానిదేముందమ్మా , ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయొచ్చు కొన్ని కాపీలు ” అన్నారు. శ్రీలేఖ, శ్రావణి వంటివి రీ ప్రింట్ అయ్యాయి గానీ ఇది మాత్రం 3 దశాబ్దాలుగా ప్రచురణకు రానే లేదు.

ఆయన ఎప్పుడు వేస్తారో తెలీదు కాబట్టి , అందుబాటులో ఉన్న సోర్స్ వెదకడం మంచిది. ఈ నవల దగ్గర ఉన్న వాళ్లలో నేనొకరిని :-)

 

peepal-leaves-2013