Archives for May 2016

కీర్తి శిఖరాగ్రంపై స్లీమన్

 

స్లీమన్ కథ-32

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

ట్రాయ్ నిక్షేపాలను జర్మనీకి అప్పగించడానికి స్లీమన్ ఆమోదం తెలిపిన తర్వాత, విర్కో వెంటనే రంగంలోకి దిగాడు. సంబంధితులు అందరితో మాట్లాడాడు. చివరగా జర్మనీ ఛాన్సలర్ బిస్మార్క్ తో మాట్లాడినప్పుడు ఆయన ఎంతో ఉత్సాహం చూపించాడు. ఆ నిక్షేపాలను బెర్లిన్ లో శాశ్వత ప్రదర్శనకు ఉంచడంకోసం ఏమైనా చేయడానికి సంసిద్ధత చూపిన బిస్మార్క్, ఇంతకీ స్లీమన్ ఎటువంటి గౌరవసత్కారాలను ఆశిస్తున్నారని అడిగాడు. అత్యున్నత వర్గాలనుంచి గుర్తింపును మాత్రమే స్లీమన్ కోరుకుంటున్నారని అప్పటికి సమాధానం చెప్పిన విర్కో, ఆ తర్వాత స్లీమన్ ను సంప్రదించాడు.  కైజర్(జర్మన్ చక్రవర్తి)నుంచి ప్రత్యేక ప్రశంసాపత్రాన్ని; సైనిక, పౌర ప్రముఖులకు ఇచ్చే అత్యున్నత పురస్కారా(Pour le merite)న్ని, బెర్లిన్ గౌరవపౌరసత్వాన్ని, ప్రష్యన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ లో సభ్యత్వాన్ని తను కోరుకుంటున్నాననీ; నిక్షేపాలను ఉంచే ప్రదర్శనశాలకు శాశ్వతంగా తన పేరు పెట్టాలనీ చెప్పిన స్లీమన్; బిరుదు కూడా ఇస్తే సంతోషమే కానీ దానికోసం పట్టుబట్టబోనని అన్నాడు. ఒక్క Pour le merite మినహా మిగిలినవన్నీ నెరవేరేలా విర్కో ఒంటిచేత్తో కృషిచేశాడు. సోఫియాకు మాత్రం ఈ ఏర్పాటు నచ్చలేదు. ట్రాయ్ నిక్షేపాలు గ్రీస్ కు చెందాలని ఆమె ఆశిస్తోంది. కానీ అప్పటికే నిర్ణయం తీసేసుకున్న భర్తకు ఎదురుచెప్పలేకపోయింది. కైజర్ స్వహస్తాలతో రాసిన ప్రశంసాపత్రంలో తన పేరు కూడా చేర్చడం చూసి సంతృప్తి చెందింది.

అంతవరకూ లండన్ లో ప్రదర్శనకు ఉంచిన నిక్షేపాలను ఎట్టకేలకు 1880 డిసెంబర్ లో బెర్లిన్ కు తరలించారు. ఆరునెలల తర్వాత, 1881 జులై 7న, ఆ నిక్షేపాలను జర్మనీకి లాంఛనంగా అప్పగించి స్లీమన్ బెర్లిన్ లో రాజసత్కారాన్ని అందుకున్నాడు. వోల్కకుండా మ్యూజియంలోని ఒక విభాగంలో వాటిని ఉంచి ద్వారబంధం పైన స్లీమన్ పేరును స్వర్ణాక్షరాలతో లిఖించారు. అప్పటికి యువరాజుగా ఉండి, ఆ తర్వాత కైజర్ పదవిని అధిష్ఠించిన విల్హెమ్-II  స్వయంగా సోఫియాను విందుకు తోడ్కొనివెళ్ళాడు. అప్పటికామె వయసు 28 ఏళ్ళు, స్లీమన్ మరో ఆరునెలలకు 60వ ఏట అడుగుపెట్టబోతున్నాడు.

ఆ రోజున స్లీమన్ ప్రతిష్ట శిఖరాగ్రానికి చేరింది. చక్రవర్తి, మహారాజ్ఞి, యువరాజులు, యువరాణులు, మొత్తం రాజాస్థానం అతన్ని ఘనంగా ప్రస్తుతించింది. వీటన్నటికన్నా బెర్లిన్ గౌరవపౌరసత్వాన్నే అత్యున్నత సత్కారంగా స్లీమన్ భావించాడు. అంతవరకూ అలాంటి గౌరవం ఇద్దరికే లభించింది: ఒకరు బిస్మార్క్, ఇంకొకరు ఫీల్డ్ మార్షల్ కౌంట్ హెల్మత్ వాన్ మోత్కా. జర్మనీ పునరుజ్జీవనానికి వీరిద్దరూ బాధ్యులు. ఒక అనామక చర్చిలో కిటికీకి అతుక్కుపోయి బాహ్య పౌరాణిక ప్రపంచాన్ని విప్పారిన కళ్ళతో చూసి పరవశించిన  బాలుడు, ఇప్పుడు ఆ పౌరాణిక ప్రపంచం సజీవం కావడాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాడు. అత్యంత పురాతన రాజులనే కాదు, నేటి సజీవులైన రాజులను కూడా తన వద్దకు రప్పించుకున్నాడు. ఒకసారి తన జీవితాన్ని వెనుదిరిగి చూసుకుంటూ, తను చేసిన వీరోచిత కార్యాలను, ఇతర సాఫల్యాలను తలచుకుని అతను అమితమైన సంతృప్తిని చెందాడు.

ట్రాయ్ నిక్షేపాలు రెండో ప్రపంచయుద్ధం చివరివరకూ బెర్లిన్ లోనే ఉన్నాయి. యుద్ధం మొదలైన తర్వాత బెర్లిన్ జంతుప్రదర్శనశాలలో లోతుగా తవ్విన ఒక రహస్య కందకంలో వాటిని భద్రపరిచారు. 1945 వసంతంలో అవి రష్యన్ సేనల కంటబడ్డాయి. వాటిని వారు రష్యాకు తరలించారు.1

ట్రాయ్ అతన్ని వెంటాడుతూనే ఉంది. తను చనిపోయేలోగా ట్రోజన్ రాజుల సమాధులను బయటపెట్టాలనుకున్నాడు. ట్రాయ్ కి చెందిన అన్ని నగరాల సవివర రేఖాపటాలను తయారుచేసుకున్నాడు. 1882 మార్చి 1న హిస్సాలిక్ దిబ్బ మీద తొమ్మిదో సారి తవ్వకాలు ప్రారంభించాడు. మొదటిసారి తవ్వకాలకూ, ఇప్పటికీ మధ్య పద్నాలుగేళ్ల కాలం దొర్లినా అతనిలో వెనకటి ఉత్సాహం అలాగే ఉంది. తలనొప్పి, చెవినొప్పి తగ్గాయి. అప్పటికీ ఇప్పటికీ ఒక తేడా ఏమిటంటే, అప్పట్లో చాలావరకూ ప్రాథమిక పరికరాల మీద ఆధారపడ్డాడు. ఆహారపదార్థాలు, ఇతర నిత్యావసరాల సరఫరా తగినంత ఉండేదికాదు. కానీ ఈసారి అతనికి మహారాజపోషణ లభించింది. లండన్ కు చెందిన మెస్సర్స్ ష్రోడర్స్ పెద్ద ఎత్తున ఆహారాన్ని కానుకగా పంపించింది. వాటిలో చికాగో గొడ్డుమాంసం, నిలవ పండ్లు, ఇంగ్లీష్ చీజు, ఎద్దు నాలుక మొదలైనవి ఉన్నాయి. ఒకవిధమైన తృణధాన్యంతో చేసిన 240 సీసాల బీరు(pale ale) కూడా పంపించింది. అన్ని సీసాలనూ అయిదుమాసాలలో స్లీమన్ ఒక్కడే ఖాళీ చేసేశాడు. “నేను ముప్పై ఏళ్లుగా మలబద్ధకంతో బాధపడుతున్నాను. ఈ బీరు (pale ale) నాకు ఎంతో ఉపశమనం ఇచ్చింది. ఈ సమస్యకు ఇంతకు మించిన దివ్యౌషధం లేదు” అని ప్రకటించాడు.

ఈసారి యువపురావస్తు శాస్త్రవేత్త, సమర్థుడు విల్హెమ్ దార్ఫెల్త్ సహాయకుడిగా ఉన్నాడు. టర్కీ ప్రభుత్వం నుంచి తలనొప్పులు మాత్రం తప్పలేదు. విద్యామంత్రిత్వశాఖకు చెందిన బేదర్ ఎదీన్ ఎఫెన్డీని పర్యవేక్షకుడిగా పంపింది. షరా మామూలుగా అతని ఆంక్షలు, అభ్యంతరాలు స్లీమన్ సహనాన్ని పరీక్షిస్తూనే వచ్చాయి. అతని నిత్యకృత్యాలకు వస్తే, మొదటిసారికీ, ఇప్పటికీ వాటిలో కూడా ఎలాంటి మార్పూ లేదు.  సూర్యోదయానికి ముందే లేచి గుర్రం మీద సముద్రస్నానానికి హేల్స్ ఫాంట్ కు వెళ్ళేవాడు. ముగ్గురు సాయుధ అంగరక్షకులు అతని వెంట ఉండేవారు. ఎండనుంచి రక్షణకోసం, బాగా పాతబడిన అదే శిరస్త్రాణాన్ని, పెద్ద పెద్ద కళ్ళద్దాలను, భారీ కోటును ధరించి ఇప్పటికీ రోజుకు 150 మందితో పని చేయిస్తున్నాడు. కోటు జేబులోంచి ఎర్రటి సిల్కు రుమాలు వేలాడుతూ ఉండేది.  ఇప్పటికీ నికొలస్ జెఫిరోస్ జానకిస్ అనే ఆ గ్రీకుజాతీయుడే వేతనాల చెల్లింపుతో సహా అతని పనులన్నీ చక్కబెడుతున్నాడు. అతనే స్టోర్ కీపర్ గా కూడా ఉంటూ పనివాళ్ళకు రొట్టె, పొగాకు, బ్రాందీ వగైరాలను అధికధరలకు అమ్మి బాగా సొమ్ము చేసుకునేవాడు.

జూన్ వచ్చేసరికి మిడతల దండు దాడి చేయడం ప్రారంభించింది. దానికితోడు ఎదీన్ ఎఫెన్డీ నసా పెరిగిపోయింది. సహనం పూర్తిగా నశించిన స్లీమన్ టర్కీ ప్రభుత్వంనుంచి తనకు రక్షణ కల్పించవలసిందని కోరుతూ బిస్మార్క్ కు అత్యవసర తంతి పంపించాడు. కానీ ఆవైపునుంచి ఉలుకూపలుకూ లేదు. తవ్వకాలను చూద్దామంటే, ఏవో చిన్నచిన్న కంచు, రాగి సామగ్రి తప్ప విశేషంగా చెప్పదగినవేవీ బయటపడలేదు. దాంతో తవ్వకాలు ఆపేయాలని జులై చివరిలో స్లీమన్ నిర్ణయం తీసుకున్నాడు.

మరుసటి సంవత్సరం Troja అనే పేరుతో ట్రాయ్ తవ్వకాలమీద తన మూడో పుస్తకం తీసుకొచ్చాడు. అతని పుస్తకాలన్నిటిలో అదే పేలవం. పెద్దగా కలసిరాని 1881-82 తవ్వకాల వివరాలు తప్ప అందులో ఏమీలేదు. కాకపోతే అప్పటివరకూ జరిపిన  ట్రాయ్ తవ్వకాల సమాచారం మొత్తాన్నిఅందులో పొందుపరిచాడు. మరికొన్ని పురాతన ప్రదేశాలలో కూడా తవ్వకాలు జరిపించాలన్న ఆలోచన అప్పటికి చాలా కాలంగా చేస్తూనే వచ్చాడు. తను నౌకా ప్రమాదాన్ని ఎదుర్కొన్న తేరా(Thera)2, సముద్రపు నురగనుంచి అఫ్రోడైట్ పైకి వచ్చినట్టు చెప్పే సితేరా(Cythera)3, తూసడడీస్(Thucydides)4 వర్ణించిన గొప్ప యుద్ధస్థలి అయిన పెలపనీసస్(Peloponnesus)కు పశ్చిమతీరంలోని పీలోస్(Pylos) వాటిలో ఉన్నాయి.

the-peloponnesian-war-syracuse-naval-battle

ఒక అదృష్టక్షణంలో అతని దృష్టి క్రీటు(Crete)ద్వీపం వైపు కూడా మళ్ళింది. అది అప్పటికింకా టర్కీ ఆధిపత్యంలోనే ఉంది. 1878లో, మినోస్5 కలొకైరినోస్  అనే పౌరాణికనామం కలిగిన కాండియా6 వర్తకుడు, కెఫలా త్సెలంపే అనే కొండ మీద కొద్దిపాటి తవ్వకాలు జరిపించాడు. ఆ కొండ ఉన్న చోటే క్రీటు పురాతన రాజధాని నోసస్ ఉండేదని చెబుతారు. అయితే, అప్పటికి పురావస్తుశాస్త్రజ్ఞుల దృష్టి గ్రీసు ప్రధానభూభాగం మీద ఉన్నంతగా  క్రీటుమీదలేదు. మినోస్ కలొకైరినోస్ జరిపిన తవ్వకాల వివరాలు తెలుసుకున్న స్లీమన్, అక్కడ గొప్ప పురావస్తుసంపద బయటపడవచ్చన్న నిర్ణయానికి వచ్చాడు. దార్ఫెల్త్ కూడా ఆ అభిప్రాయాన్ని బలపరిచాడు. ఇద్దరూ కలసి 1886లో నోసస్ ను సందర్శించి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ దిబ్బ ఒక టర్కు యాజమాన్యంలో ఉంది. అతని అంగీకారం తీసుకునే షరతు మీద తవ్వకాలు జరపడానికి ఆ దీవి గవర్నర్ నుంచి ఫర్మానా సంపాదించిన స్లీమన్, బేరసారాలు మొదలుపెట్టాడు. అది సుదీర్ఘంగా సాగింది. ఆ యజమాని కూడా వ్యాపారపు మెళకువలలో స్లీమన్ కు సాటివచ్చేవాడే. 5వేల పౌండ్లకు కొంచెమైనా తగ్గేదిలేదని అతను కరాఖండిగా చెప్పాడు. అది చాలా ఎక్కువ అనుకున్న స్లీమన్ మండిపడ్డాడు. ఏదోవిధంగా దారికి వస్తాడులే అనుకున్న స్లీమన్ ఎథెన్స్ కు వెళ్లిపోయాడు. కానీ అది సానుకూలం కాలేదు.

ఆ తర్వాత చాలా ఏళ్ళకు నోసస్ వద్ద తవ్వకాలు జరిపి ఆర్ధర్ ఎవాన్స్7 ఎన్నో గొప్ప విశేషాలను బయటపెట్టాడు. స్లీమన్ అప్పుడే కనుక ఆ పని చేసి ఉంటే ఎవాన్స్ కు దక్కిన ప్రతిష్ట అతనికే దక్కి ఉండేది.

తనకు ఆసక్తి గొలిపే పురాతనప్రదేశాలు అనేకం ఉండడంతో అతను మొదటిసారి తన జీవితచరమాంకంలో  సందిగ్ధాన్ని ఎదుర్కొంటూ వచ్చాడు. చివరికి, తనకు కూతవేటు దూరంలో, ఎథెన్స్ కు దగ్గరలో ఉన్న మారథాన్ 8లో తవ్వకాలు జరపడానికి నిర్ణయించుకున్నాడు. అక్కడ ఉన్న ఒక చిన్నపాటి దిబ్బ పురాతనప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. గ్రీకులకు, పర్షియన్లకు(క్రీ.పూ. 499-449) జరిగిన యుద్ధాలలో మరణించిన 192 మంది ఎథెన్స్ సైనికులను అక్కడ పూడ్చిపెట్టారని సాంప్రదాయిక విశ్వాసం. పసన్నియస్ రాతలు కూడా అందుకు సాక్ష్యామిస్తున్నాయి. 1884 ఫిబ్రవరిలో తవ్వకాలకు అనుమతి సంపాదించుకున్నాడు.  ఆ దిబ్బకు అడ్డంగా ఒక కందకం తవ్వించాడు. అయితే, ఆ తవ్వకాలు కొన్ని రోజుల్లోనే ముగిశాయి. ఎథెన్స్ సైనికుల అవశేషాలేవీ కనిపించలేదు. బల్లేలూ, కత్తులూ, శిరస్త్రాణాలూ, వక్షస్త్రాణాలవంటి యుద్ధసామగ్రి అయినా కనిపిస్తుందని అతను ఆశపడ్డాడు. కానీ అదీ నెరవేరలేదు. పర్షియన్లు గ్రీకు గడ్డ మీద అడుగుపెట్టడానికి ముందే ఆ దిబ్బ మీద జనం నివసించేవారనడానికి సాక్ష్యంగా కొన్ని కుండపెంకులు మాత్రం దొరికాయి.

Voelkerkundemuseum-HA-Hamburg-Berlin

Voelkerkundemuseum-HA-Hamburg-Berlin

ఇక టిర్యిన్స్ (Tiryns) మిగిలింది. ఆర్గోస్ మైదానంలో ఉన్న గొప్ప దుర్గం అది. మొదటిసారి గ్రీసు వెళ్లినప్పుడు స్లీమన్ దానిని సందర్శించాడు.  మైసీనియా తవ్వకాలకు ముందు ఇక్కడ కొద్దిపాటి తవ్వకాలు జరిపించి ఆపేశాడు. మైసీనియా కన్నా టిర్యిన్స్ పురాతనం. గ్రీకు పురాణాల ప్రకారం, హెర్క్యులెస్ అక్కడే జన్మించాడు. కనకవర్షం రూపంలో జియస్ ఈ నగరాన్ని సందర్శించాడు. దానై ద్వారా ఒక కూతురును కని ఆమెనొక బురుజులో బంధించాడు. ఆమె ద్వారా అతనికి పెర్సియస్ అనే కొడుకు పుట్టాడు. ఆర్గోస్ కు చెందిన ఈ వీరుడే మెడూసా తల నరికాడు. ప్రాచీన గ్రీకులు కూడా టిర్యిన్స్ ను భయభక్తులతో చూశారు. “మనకు టిర్యిన్స్ ఉండగా అంతదూరం వెళ్ళి పిరమిడ్ల(ఈజిప్టు)ను సందర్శించే శ్రమ దేనికి?” అని పసన్నియస్ రాశాడు.

స్లీమన్ 1884 మార్చి 14న నాప్లియో చేరుకున్నాడు. విల్హెమ్ దార్ఫెల్త్ అతని వెంట ఉన్నాడు. ఈసారి ఎక్కువ పనిభారాన్ని అతనే మోశాడు. ఇప్పుడు కూడా లండన్ కు చెందిన మెస్సర్స్ ష్రోడర్స్ పెద్ద ఎత్తున ఆహారపదార్థాలను, ఇతర నిత్యావసర సామగ్రిని కానుకగా పంపింది. స్లీమన్ 70 మందిని పనిలోకి తీసుకున్నాడు. 40 ఇంగ్లీష్ తోపుడు బళ్ళను, 20 భారీ గునపాలను, 25 భారీ గొడ్డళ్లను, 50 చిన్నపాటి గొడ్డళ్లను బరిలోకి దింపాడు.  ఈసారి, ఇంతకు ముందెప్పుడూ  లేనంత శాస్త్రీయప్రణాళికతో అతను తవ్వకాలకు సిద్ధమయ్యాడు. అతనూ, దార్ఫెల్త్ బాధ్యతలను పంచుకున్నారు. ఎక్కడ గోడలను కూల్చాలో, ఎక్కడ తవ్వకాలు జరపాలో సూచించడం స్లీమన్ బాధ్యత. పనులను పర్యవేక్షించడం; ఇంజనీర్ ను, రేఖాపటాల నిపుణుని, ప్రధాన కాంట్రాక్టర్ ను సంప్రదించడం దార్ఫెల్త్ బాధ్యత. అంటే,  స్లీమన్ పురావస్తువులకు, నిక్షేపాలకు బాధ్యత వహిస్తే; దార్ఫెల్త్ పురాతన కట్టడాలకు బాధ్యత వహించాడన్నమాట.

                                                      (సశేషం)

 

 

***

అథోజ్ఞాపికలు

  • In fact, the treasure had been secretly removed to theSoviet Union by the Red Army. During the Cold War, the government of the Soviet Union denied any knowledge of the fate of Priam’s Treasure. However, in September 1993 the treasure turned up at the Pushkin Museum in Moscow.[4][5] The return of items taken from museums has been arranged in a treaty with Germany[6] but, as of January 2010, is being blocked by museum directors in Russia.[6] They are keeping the looted art, they say, as compensation for the destruction of Russian cities and looting of Russian museums by Nazi Germany in World War II. A 1998 Russian law, the Federal Law on Cultural Valuables Displaced to the USSR as a Result of the Second World War and Located on the Territory of the Russian Federation, legalizes the looting in Germany as compensation and prevents Russian authorities from proceeding to restitutions.         (వికీపీడియా సమాచారం)
  • తేరా: గ్రీకు పురాతన నగరం. ఏజియన్ సముద్రంలో శాంటొరీన్ అనే దీవిలో ఉంది.
  • సీతేరా: గ్రీసులోని ఒక దీవి. గ్రీకు దేవత అఫ్రోడైట్ సముద్రపు నురగ నుంచి అవతరించిందని గ్రీకు పురాణాలు చెప్పడం ఆసక్తికరం. అఫ్రోడైట్ సుఖసంతోషాలను ప్రసాదించే సౌభాగ్యదేవత. మన పురాణాల ప్రకారం సిరిసంపదలను ఇచ్చే లక్ష్మీదేవి కూడా పాలసముద్రంలో ఉద్భవిస్తుంది.
  • తూసడడీస్(క్రీ.పూ. 460-395): గ్రీకు చరిత్రకారుడు, సైన్యాధికారి. క్రీ.పూ. 5వ శతాబ్దంలో స్పార్టా, ఎథెన్స్ ల మధ్య జరిగిన పెలపనీసస్ యుద్ధసమాచారాన్ని గ్రంథస్థం చేశాడు.
  • మినోస్: పురాతన క్రీటును పాలించిన తొలిరాజు ఇతనేనని గ్రీకు పురాణాలు చెబుతాయి. తూసడడీస్ ప్రకారం, ఇతను ట్రోజన్ యుద్ధానికి మూడు తరాల వెనకటివాడు. ఏజియన్ సముద్రంపై ఆధిపత్యం నెరిపిన మినోస్ నౌకానిర్మాణం ఎరిగినవాడనీ, నౌకాయానం చేశాడనీ, క్రీటు రాజ్యాంగాన్నీ, ధర్మశాస్త్రాన్నీ నిర్దేశించాడనీ అంటారు. విశేషమేమిటంటే మినోస్ కు, మన పురాణాలలోని మనువుకు నామసామ్యమే కాక, నౌకానిర్మాణం, ధర్మశాస్త్రనిర్దేశం వగైరాలలో కూడా పోలికలు ఉన్నాయి. రాంభట్ల కృష్ణమూర్తిగారి పుస్తకాలలో మినోస్-మనువుల పోలికల గురించి మరికొన్ని వివరాలు చూడవచ్చు.
  • కాండియా: క్రీ.శ. 1205-1212 మధ్యకాలంలో క్రీటు ద్వీపం ఇటలీ ఏలుబడిలో ఉన్నప్పుడు దాని అధికారనామం.
  • ఆర్థర్ ఎవాన్స్(1851-1941): ప్రముఖ బ్రిటిష్ పురావస్తునిపుణుడు. కంచుయుగానికి చెందిన ఏజియన్ నాగరికతను బాగా అధ్యయనం చేసినవాడు.
  • మారథాన్: ఒలింపిక్ క్రీడల్లో ఎక్కువదూరం పరుగు పోటీకి ఈ మాట పర్యాయపదంగా మారిన సంగతి తెలిసినదే. దాని పూర్వచరిత్రను నా ‘పురా’గమన వ్యాసాలలో ‘పర్షియన్ రాముడు, గ్రీకు హనుమంతుడు’ అనే వ్యాసం(అక్టోబర్ 2, 2014)లో ఇచ్చాను. చూడగలరు.

 

 

మార్కెట్…..ఓ మహాసర్పం

 

 

-మొయిద శ్రీనివాస రావు
~

ఓ కవిమిత్రుడన్నాడు

మడిగట్టు నా సింహాసనమని

అవును నిజమే…మడిగట్టు నా సింహాసనమే

నేను రాజునే

పొలం నా రాజ్యమే

ఆరుగాలం సాగు సాగనప్పుడు

బారెడు భూమిలో

మూరడు పంట పండే కాలంలో

ఊరులోని మిగులు చేతులన్నీ

నాకు వ్యవ ‘సాయం’ చేసాయి

కుండ, బండ

బట్ట, బుట్ట

కత్తి, కత్తెర

తలో చెయ్యి వేసాయి

నా ముంగిట చేతులు చాచి

నన్ను మారాజును చేసాయి

పట్నంకు… పల్లెకు బంధం బలపడినాక

ఊరిలో మార్కెట్ మహాసర్పం బుసలుకొట్టింది

మిగులు చేతులను బయటికి పంపి

వలస చీమలగా మార్చేసింది

నా క్షేత్రంలో ఏమి పండాలో శాసించింది

‘మదుపు ‘ మోటరు పంపులోని నీరై

నిత్యం పొలంలోనికి పారింది

చివరకి….నా బతుకే ‘ఎరువు’ అయినాక

మూరడు నేలలో పండిన

బారెడు పంటను

చిరు ‘ధర ‘హాసంతో మింగేసింది

నన్ను మడిసెక్కకు బానిసను చేసింది

మహాసర్పపు ఆకలి కేకలకి

అరిచేతులను అరగదీసుకున్నాను

కడుపును కుదించుకున్నాను

మిగులు సమయాలలో నేతొడుక్కున్న

అదనపుచేతులను సైతం అర్పించుకున్నాను

మూరడు మడిసెక్క వ్యాపారక్షేత్రమైన చోట

మార్కెట్ మహాసర్పంతో యుద్దమంటే మాటలా!

కడవరకు బానిసగానైన బతకాలి!

లేదా మారాజుగానైనా చావాలి!!

చివరికి మిగిలిన మడిసెక్కను

అది మింగినాక

మహాసర్పాన్ని మట్టుపెట్టగల

పట్నపు శ్రమచీమల సైన్యంలోనైనా చేరాలి! !!

* * *

(karl kautsky పుస్తకం ‘on agraarian question’ చదివిన స్పూర్తితో)

విరించి వెతుక్కున్న కొత్త దారి!

 

 padam.1575x580 (2)

 

సాహిత్యం ప్రస్తుతం అస్తిత్వ ప్రశ్నలదిశలో ఉంది.వేరువేరు కేంద్రాలు లక్ష్యాలతో ప్రవహిస్తున్నా వీటన్నిటి వాహకశక్తి ప్రశ్నలే. స్థూల లక్ష్యం సమసమాజ నిర్మాణం. కాని ప్రాతి పదికలక్ష్యాల వైపు ప్రాథమికంగా వెళ్లడం వలన సంఘర్షణలు కనిపిస్తాయి. నిజానికి ఈ సంఘర్షణలకు మూలమైన అస్తిత్వ ప్రశ్నలకు సమాధానాలు దొరకకుండా స్థూల లక్ష్యం గురించి ఊహ చేయటం కూడా కష్టమే.

ఇన్నాళ్ల కవిత్వగమనంలో ప్రశ్నలు వేస్తున్న వర్గాలకు సంఘీభావంగా రాసిన కవిత్వం ఇతరేతర వర్గాలనుంచి వచ్చింది గాని, ఒక ప్రాతిపదిక సమాధానం కనిపించదు.స్థూల లక్ష్యానికిసంబంధించిన ప్రేరణ వినిపించదు.అలాంటి లక్ష్యాన్ని ఒకదాన్ని సూచిస్తూ “రెండవ అధ్యాయానికి ముందుమాట”ను విరించి విరివింటి ఆవిష్కరిస్తున్నారు.సాధారణంగా కొత్తగారాస్తున్నవాళ్లు ప్రధానస్రవంతి మార్గాల్లో పడి నడుస్తారు.పూర్వలక్ష్యాలు గమనం ఈ కవిత్వంలో కనిపిస్తాయి.విరించి కవిత్వం దీనికి భిన్నం ఈ కవిత్వంలో కనిపించే ప్రతిపాదన,లక్ష్యం కొత్తవి. గమనం అంతే నిర్దిష్టమైంది.

ఒక రెండు మూడు సంవత్సరాల కాలం మధ్య కవిత్వం కాబట్టి ఇందులో భిన్నమైన వస్తువులున్నాయి.ప్రధానంగా స్త్రీలు మొదలైన వస్తువులపై రాసిన కవితలు ఎక్కువ.కాని పైన చెప్పిన అస్తిత్వమూలాలపై సమాధానంగా వచ్చిన కవితలు సుమారు పది కనిపిస్తాయి.  కంకర రాళ్ళు(31పే)మేలుకొలుపు(43(పే)పిడికిలి(47పే)చీకటి గుహ(49పే)పది అక్షరాలు(64పే)మూగ జంతువు(70పే.)మేలి మలుపు(73పే)రెండో అధ్యాయానికి ముందు మాట(143 పే)మొదలైన కవితలు ఇలాంటివి.

1.” ఇన్షా అల్లాహ్ అనుకుంటూ నీవు నేను బాగుం డాలని /రాముడిగుడిలో చేతులుజోడించి నేను నీవుబాగుం డాలని /కొరుకోవటమొకటే మనకు దేవుడిచ్చి ఉండకూడదనీ మనం కోరుకుందాం/మనరోజొకటి మనకోసం మనముందు వేచిఉంటుందని ఆశపడదాం“-(33 పే)

 virinci1

2.”నీ వసుధైక జీవనానికీ/విశ్వ ప్రళయానికీ నీ చైతన్యమే తేడా“-(పే.430

3.భయంకర స్వప్నాల మధ్య ఊగిసలాడే/నడిరాతిరి నిదురను ప్రేమించేమనం/మనుషులందరూ కలిసిమెలిసి జీవించే/ఒక సుందర స్వప్నాన్నెందుకో ప్రేమించనేలేదు“-(47.పే)

4.మనమానవాత్మని మేల్కొల్పే/కొత్త చూపొకటి అక్కడ ఇరుక్కుని ఉంది/పలుగూ పారల్లాగా మనమిద్దరమూ ఇక పనిచెయ్యాలి“-(73.పే)

మొదటి వాక్యాంశం మనుషులమధ్య ఐక్యతను గూర్చి మాట్లాడుతుంది.రెండవది మనిషిలోని ఆవేశానికి,చైతన్యానికి మధ్య వైరుధ్యాన్ని చర్చిస్తుంది.స్వప్నం, ఉనికి అనే భావనలు ప్రయాణంలోని నిర్దిష్టతను చెబుతాయి.వీటన్నిటిలో సంఘర్షణ నుంచి బయటికి వచ్చి ఒక వైపుకు నడవాలనే ఆశంస కనిపిస్తుంది.

virinchi

వసుధైక జీవనమనే విశ్వభావన ప్రాచీనకాలం నాటిది.నారాయణ పండితుడు” ఉదార చరితాణాం తు వసుధైక కుటుంబకం”అన్నాడు.దిగంబర కవులు కూడా “జాతి మత దురహంకారాలను త్యజించి,నగర విసర్జనం చేసి,గంగా సింధూ నదీతీరాల్లో,వోల్గా నైలూనదుల సమీపాల్లో మానవులంతా కుటుంబాలుగా ఏర్పడాలని”ప్రకటించారు.ఈ భావనే అంచెలంచెలుగా ఈ కవిత్వం మోస్తుంది.విరించి కవిత్వం లో కొన్ని లక్షణాలున్నాయి.ఒక ఆకస్మిక ప్రారంభం ఉంటుంది.సాధారణంగా కవిత్వంలో వస్తువును, దృష్టిని ప్రతిపాదించే ప్రతిపాదక వాక్యాలతో కవిత మొదలవుతుది.ఈ కవిత్వంలో ప్రారంభవాక్యం నుంచే కవిత్వాంశాన్ని చర్చించడం కనిపిస్తుంది.విషయాన్ని,దాన్నానుకున్న వస్తువుగా గాకుండా అది మనసు మీద పడే ప్రభావాన్ని విరించి కవిత్వం చేస్తారు.వాక్యాన్ని గమనిస్తే తనలో తాను సంభాషించుకున్నట్టుగా ఉంటుంది.

నిర్మాణ దృష్ట్యా గమనిస్తే విరించి సాధన వాక్యాల్లో కనిపిస్తుంది.సమకాలీనత ఎక్కువగా కనిపిస్తుంది.ప్రతికవికి ప్రధానంగా కొత్తగా రాసేవాళ్లకు సమకాలీన వాక్యనిర్మాణాన్ని ,వ్యక్తీకరణలను గమనించడం అవసరం కూడా.ఇది కూడా సాధనలో ఒక భాగమే.వాక్యాల్లో సాధారనంగా కనిపించే సమవృత్తి సూత్రం విరించి కవిత్వంలో ఒక భావాంశం (Unit)రూపంలో కనిపిస్తుంది.కిటికీ(పే.50)కవిత అందుకు ఒక నిదర్శనం. కాదు,చేయాల్సింది,ఎగరాల్సింది,తేలాల్సింది లాంటి క్రియల్ని తీసుకుని ఈ కవితను నిర్మించడం కనిపిస్తుంది.కవిత్వపుటద్దం(పే.52)Equality condemned(పే.54)వంటి మరిన్ని కవితలు ఇలాంటి నిర్మాణంలో కనిపిస్తాయి.కవిత్వ రూపాన్ని సాధించడంలో ఉండే అవగాహన,శ్రద్ధ ఇందులో కనిపిస్తాయి.ఎక్కువగా వాక్య విన్యాసం మీద విరించి కవిత ఆధారపడుతుంది.సఫిర్ భాషను రూప సంబంధి,విన్యాస సంబంధి గా చెప్పారు.విరించిలో రెండవ పార్శ్వమే ఎక్కువ.నిజానికి కథానాత్మక కవితలో ఈ మార్గం ఎక్కువ.

చీకటివరం(పే.86)లాంటి కవితలు కొన్ని విరించి ప్రతీకలను,రూపాలను వాడుకునే విధానాన్ని చూపుతాయి.

పగలంతా ఎండలో దాగుడుమూతలాడి/అలసిపోయిన నక్షత్రాలపుడు/ముఖం కడుక్కుని/అలంకరించుకోవడం మొదలెడతాయి.”

విడిపోతున్న ప్రియురాలు వెనక్కితిరిగి చూస్తున్నట్లు/సూర్యుడొకదిగులుచూపు చూస్తుంటాడు

నా గదినంతా పరికించి చూసే/సాయంత్రపు నీరెండచూపులకు/గోడల చెక్కిళ్లమీద ఎర్రటి సిగ్గువాలి ఉంటుంది

ఈవాక్యాల్లోవాడుకున్న అంశం మానవ గుణారోపణ. సాయంకాలమవడాన్ని మొదటిరెండు భావాంశాలు చిత్రిస్తే,చివరిభాగం సమాగమంలో జరిగే మానసిక వికారాలను చిత్రిస్తుంది.”గోడలచెక్కిళ్ల మీద ఎర్రటి సిగ్గువాలి ఉంటుంది”అలసిన నక్షత్రాలపుడు ముఖం కడుక్కుని అలంకరించుకుంటాయి.”అనే వాక్యాలు ధ్వని మాత్రంగా కొన్ని సన్నాహాలను వ్యక్తం చేస్తాయి.రెండవభావాంశం మంచి భావ చిత్రం కూడా.

కెంపులు జారే పెదవులు/సీతాకోక చిలుకలు ఎగిరే నవ్వులు

ఈ వాక్యాల్లో దృశ్యాన్ని చిత్రించడం ఉంది.-ఈ కవితలో నిజానికి రెండు వస్తువులున్నాయి.ఒకటి జీవిత సంబంధమైన సౌందర్య స్పృహ,రెండవది సామాజికం.కవి సామాజికుడవ్వాలన్న ఆలోచన చివరివాక్యాలను రాయించి ఉంటుంది.

యాసిడ్ దాడిలో కాలిపోయిన ముఖంలోకి/బంగారు తల్లీ చిట్టితల్లి వరాల తల్లీ అని/అమ్మ పిలిచే ముద్దు పేర్లు/అమాయకంగా అద్దంలోంచి చీకట్లోకి తొంగి చూస్తాయి

ఈ వాక్యాలు సామాజికమైనవి.కవిత ఒక విషాద భావనతో ముగుస్తుంది.కొత్తగా కవిత్వలోకానికి పరిచయమైనా విరించికి తనదైన దృష్టి ఒకటుంది.సృజనలోనూ గమనించాల్సిన పరిణతిఉంది.మరింతచిక్కగా రెండో అధ్యాయం మనముందుకు వస్తుందన్న వాగ్దానమూ ఈ “ రెండోఅధ్యాయానికి ముందు మాటే” చేస్తుంది.

*

చెరువు – చింతచెట్టు

 

 

-స్వాతి కుమారి బండ్లమూడి

~

 

మరి- బాగా ఎండల్లో, నడి వేసవిలో ఎండిపోయిన చెరువులో సాయంత్రాలు పిల్లలంతా చేరి ఈలేస్తే అంటుకునే ఆట, చప్పట్లు కొట్టి పరిగెత్తే ఆట ఆడుకుంటారు కదా, ఇంట్లో తిడతారనే భయమున్న పిల్లొకత్తి పీచుపీచుగా మసక రాగానే తొందరగా ఇంటికి బయల్దేరుతుంది కదా, దాదాపు ఆ వేళప్పుడే వచ్చాడు వాడు. దుబ్బు గడ్దం, ఒత్తు జుట్టు, మురికి బట్టలూ, ఆ అవతారమూ; ఏ దిక్కునుండి, ఏ వూరి నుంచి వచ్చాడో ఎవరూ చూడలేదు. పాతగుడ్దతో కట్టిన మూటొకటి చంకన పెట్టుకుని ఆడుకునే పిల్లల మధ్యకి ఈలలేసుకుంటూ చప్పట్లు కొడుతూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. మట్టిదిబ్బ మీద మూట విసిరేసి “రండ్రా! నన్నంటుకోండి చూద్దాం” అని వాళ్ల మధ్య వడగాలిలా అటూ ఇటూ గెంతాడు. “అమ్మో! పిచ్చోడు” అని గట్టుమీదకి పారిపోయారు వాళ్ళు. “పోరా పిచ్చెదవా” అనరిచాడు ఒక పెద్ద పిల్లాడు కాస్త ధైర్యంగా. “ఓయ్, ఉరేయ్… నా పేరెవడు చెప్పాడ్రా నీకు? బలే, బలే” అని పెద్దగా నవ్వాడు పిచ్చాడు, బయమేసేలా కాదు నవ్వొచ్చేలా నవ్వుతాడు వాడు, కితకితలు పెడితే మెలికలు తిరిగినట్టు వంకర్లు పోతూ ఇహ్హిహ్హి అని. నవ్వితే వాడి కళ్ళ పక్కన వదులుగా ఉన్న చర్మం గీతలుగా ముడతలు  పడుతుంది. “మళ్లీ రేపు రండి. రారూ? హిహి” అనుకుంటూ తలకింద మూట వొత్తుగా పెట్టుకుని కాలిమీద వేసుకున్న కాలు ఊపుతూ ఆ ఎండిన చెరువులో పైకి చూస్తూ పడుకున్నాడు. పిల్లలు బెదిరిపోయి ఎటు వాళ్లటు ఇళ్లకెళ్ళిపోయారు.

అది మొదలు వాడా చెరువుని వదల్లేదు. మిట్టమధ్యాహ్నం రాళ్ళు రాజుకునే ఎండప్పుడు మాత్రం చెరువొడ్డున చింతచెట్టు కిందకి చేరేవాడు. ఎవర్నీ ఏమీ అనడు, పొమ్మంటే పోడు, తిడితే నవ్వుతాడు, గట్టిగా బెదిరించి పొమ్మని కర్ర చూపిస్తే ఇంకా పెద్దగా నవ్వుతాడు. మెల్లగా పిల్లలు అలవాటు పడిపోయారు, నాల్రోజులకి వాళ్ల ఆటల్లో చేర్చుకున్నారు కూడా. పిచ్చోడిది చువ్వలాంటి ఒళ్ళు, చురుకైన నడక, తూనిగలాగా ఎటైనా దూరిపోయి పరిగెడతాడు కానీ చచ్చినా అంటుకోడానికి చిక్కడు. జట్టులుగా ఆడేటప్పుడు వాణ్ణి తమలో చేర్చుకోడానికి రెండు జట్ల పిల్లలూ పోటీ పడేవాళ్ళు. పిల్లలకిష్టంగా ఉన్నాడు కదాని పెద్దాళ్ళు కూడా వాణ్ణేం అనలేదు. ఆ చెట్టుకింద వాడే పడుంటాడులెమ్మని వదిలేశారు.

పిల్లలు లేనంతసేపూ వాడేం చెయ్యడు, అట్లా ఖాళీగా చెరువులోనో చెట్టు కిందో తిరుగుతూనో పడుకునో ఉంటాడు. చింతచెట్టు పక్కన పసుపురాయికి ఎవరైనా బొట్టుపెట్టి ఒక కొబ్బరిముక్కో, అరటి పండో అక్కడ పెట్టెళ్తే తింటాడు. పిల్లలు  ఆటలకొచ్చినప్పుడు అటుకులో, మరమరాలో తెచ్చిస్తే ఆకుల్లో పొట్లాం కట్టుకుని రాత్రికి దాచుకుంటాడు. “పిచ్చోడా! ఏం తిని బతుకుతావురా? పనిస్తా చేస్తావా” అని ఎవరైనా జాలిగా అడిగితే “పోరా! పనికిమాలినోడా, పని చెప్తే తంతా, తంతే నవ్వుతా” అని మళ్లీ కితకితలుగా నవ్వుతాడు.  రాత్రైతే మాత్రం హుషారుగా గొంతెత్తి పాడుకుంటాడు చాలాసేపు. ఏమాటకామాట, వాడిగొంతు భలే సన్నగా, కాస్త ఆడగొంతులా మెత్తగా ఉంటుంది. వినసొంపుగా ఉంటుంది కానీ ఆ పదాలకి అర్థం పాడూ ఏముండదు. ఏ మాట గుర్తొస్తే, ఎదురుగా ఏది కనిపిస్తే ఆ పేర్లన్నీ కలిపేసి, ఒక్కోసారి మధ్యలో ఆపి “ఊహుహు,  రాళ్ళురప్పలు కాదు, మొద్దురాచిప్పలు, బాగుంది.”అని కళ్ళు మూసుకుని మళ్ళీ పాడతాడు. అప్పటికి ఊరు సద్దుమణిగి సగంనిద్రలో ఉంటుంది. ఐనా పాటలెవరిక్కావాలి. దొంగలొస్తే కాపలాకుక్క అరుపులాగా, రావిచెట్లూ, వేపచెట్లూ ఊగినప్పుడు అర్దరాత్రి వాడి పాటలు కూడా.

***

Art: Rafi Haque

Art: Rafi Haque

ఆ ఏడాది మొదటి వానొచ్చింది. చెరువునొదిలి పిచ్చోడు అచ్చంగా చింతచెట్టు కిందే ఉంటున్నాడు. మళ్ళీ వానొచ్చింది. చెరువు నిండింది. బిందెలతో, కావిళ్లతో చెరువు నీళ్లకి వచ్చే జనంతో బాగా పొద్దుపోతుంది. వాన వెలిసిన ఒక రాత్రి వాడు ఎప్పటికన్నా ఎక్కువ సరదాగా రాత్రంతా పాడుకుని ఆగి ఆగి నవ్వుకుని ఎప్పటికో నిద్రపోయాడు.

అప్పటికింకా తెల్లారలేదు. ఎక్కడా ఏ చప్పుడూ లేదు. ఆ పొద్దుటి చీకటిలో పిచ్చోడెందుకో చప్పున లేచి చూశాడు. అనుకోకుండానే వాడి పాతబట్టల మూటని గట్టిగా గుండెకి అదుముకున్నాడు. ఎవరదీ అని కర్రపుల్ల తీసీ అటూ ఇటూ గాల్లో ఆడించాడు. కర్రకి మెత్తగా ఏదో తగిలింది. “బ్బా…” అనొక ఆడ గొంతుతో పాటు గజ్జెల చప్పుడూ గబగబా దూరమయ్యింది. అట్లా పోయేటప్పుడు వెళ్తున్న మనిషి బిందెలోంచి నీళ్ళు ఒలికిపోయి వాడు తడిసిపోయాడు. పిచ్చోడు నవ్వాడు. “బిందె వాన, గజ్జెల వాన” అని మళ్లీ మళ్ళీ అనుకుని మూట తలకింద సర్దుకుని మళ్ళీ పడుకున్నాడు.

రోజూ తెల్లారకముందే ఇదే వరస. ఎట్లానో నిద్రాపుకుని ఒకరోజు పట్టుకున్నాడు. “ఎవరే నువ్వు? నీ పేరేంటే?” అన్నాడు. ఆ పిల్ల భయంగా చూసింది. ఎంతడిగినా ఏం చెప్పదు. అది మూగదని తెలిసింది వాడికి. దానికో పేరు కూడా ఏం లేదు. ఐనా మూగదానికి పేరెందుకని ఎవరూ దానికి పేరు పెట్టలేదు. బిందెలో నీళ్ళు వాడి మొహం మీద చల్లి నవ్వేసి పోయింది. ఎవరూ లేవకముందే నీళ్లకోసమో, నీళ్లవంకనో కానీ వచ్చేదా పిల్ల. కాసేపు అక్కడ కూర్చునేది. వాడూ సరిగ్గా ఆ వేళకి ముందే లేచేవాడు. చాలా మాటలు చెప్పేవాడు. కొన్నిసార్లు ఏదైనా పాడేవాడు. ఆ పిల్ల చద్దన్నం తెచ్చి పెడితే పొద్దెక్కాక తినడానికి దాచుకునేవాడు. ఒక్కోసారెందుకో ఇద్దరూ కలిసి బాగా నవ్వుకునేవాళ్ళు, ఒకళ్ల మీదొకళ్ళు నీళ్లు చల్లుకునే వాళ్ళు. రాత్రి పూట చెట్లకింద రాలిన పూలేరి ఆమె రాగానే నీళ్ల బిందెలో వేసేవాడు. మిగతా వాళ్లలా మూగదానా అని పిలవటానికి వాడికి మనసు రాలేదు. “నువ్వు మంజులవి కదూ? “ అనేవాడు. దానికి నోరుంటే మిగతా వాళ్లలా వాడిని పిచ్చోడా అని పిలవదని వాడికి ఎట్లా తెలుసో కానీ తెలుసు.

ఒక్కోసారి మంజుల వాడి మూటని చూపించి అదేంటని సైగ చేసేది. వాడిక్కోపమొచ్చి కర్రపుల్ల తీసుకు విసిరేసేవాడు. నొప్పుట్టి ఏడ్చి వెళ్ళిపోయేది. అలా అలిగితే ఓ రెండ్రోజులు వాడికి కనపడకుండా ఎటునుంచో చెరువుకి వచ్చి వెళ్ళిపోయేది. కానీ ఉండబట్టలేక మళ్ళీ వచ్చేది. అట్లా అలిగి మళ్ళీ వచ్చినప్పుడల్లా పసుపురాయి దగ్గర పళ్ళు, పొట్లాల్లో అటుకులు చీమలు పట్టి ఉండేవి. కళ్లనీళ్ళు పెట్టుకునేది, వాడి భుజం మీద తట్టి నిద్రలేపేది. వాడు “కొట్టన్లే, రాకుండా ఉండకే మంజులా, ఆకలెయ్యట్లేదు” అని నవ్వేవాడు.

తెల్లారుతుంటే బిందెత్తుకుని బయల్దేరేది. ఒక్కోసారి చెయ్యి పట్టుకు ఆపేసేవాడు. “ఇంటికెందుకూ? ఉండిక్కడే” అనడుగుతాడు. ఇంట్లో తాత ఉన్నాడని, తాతకెవరూ లేరని , లేచి నడవలేడని సైగ చేసి చెప్తుంది. “సరే! ఫో, ఛీ, పనికిమాలినదానా, ఫో, మళ్లీ ఇటొచ్చావా కొడతా” అని చెయ్యొదిలేవాడు. అటూఇటూ తిరిగే జనాల్ని చూసి అది గబగబా వెనక్కి తిరక్కుండా వెళ్లిపోయేది. అలా వెళ్ళేప్పుడు కాలిపట్టీలు భలే గలగలమనేవి.

ఎన్నిసార్లో అట్లా. ఇంకెప్పుడూ రావద్దనడం, రాకపోతే కడుపు మాడ్చుకు పడుకోవడం, మళ్ళీ అదొచ్చాకా “ఏమనను, కొట్టను. తాత దగ్గరికే పో, నాతో ఉండొద్దులే, ఏడవకు. చద్దన్నం తినేదాకా ఉండిపో” అని బతిమాలడమూ. వాళ్లకదంతా ఒక ఆటలాగా, అలవాటులాగా అయింది.

ఒకరోజు పిచ్చోడికి హుషారెక్కువైంది. పెంకితనం ముదిరింది. ఎప్పట్లాగే వెళ్లొద్దని చెయ్యి పట్టుకు ఆపాడు. మంజుల ఆగలేదు, చెయ్యి విదిల్చుకుంది. వాడికి పంతం వచ్చింది. బిందె లాక్కుని నీళ్లన్ని దాని మీద కుమ్మరించాడు. దానికెందుకో చాలా ఎడుపొచ్చింది. కోపమొచ్చింది. వాడేమో ఏం చేసినా నవ్వుతాడాయె, వీణ్ణెట్లా ఎడిపించాలా అని అటూ ఇటూ చూసింది. వాడి మూట కనపడింది. గబుక్కున ఆ మూట తీసుకు అటూ ఇటూ పరిగెత్తింది. వాడసలే పరుగులో చురుకుకదా వెంటపడ్దాడు, మీదపడి కలబడ్డాడు. మూట ఊడిపోయింది. అందులోని వస్తువులన్నీ కింద పడిపోయాయి; కొన్ని రంగుల మట్టి గాజులు, ఒక పాత చీర, ఒక పూసల దండా, ఇంకా అట్లాంటివే ఏవో. మంజుల ఏం మాట్లాడలేదు. ఏమడగలేదు. నిదానంగా మళ్లీ    చెరువుకెళ్ళి నీళ్ళు ముంచుకుని వెళ్ళిపోయింది. పిచ్చోడూ ఏం మాట్లాడలేదు. ఏం తెలీనట్టు అలా చింతచెట్టుకింద అటు పక్కకి తిరిగి పడుకున్నాడు. చెదిరిపోయిన సామానంతా అలాగే వదిలేశాడు.

గొడవైతే కొన్నిరోజులు రాదుగా ఆ పిల్ల, కానీ ఈసారి వచ్చింది. తెల్లారేదాకా నీళ్లకోసం ఆగలేదు. ఆ రాత్రే, చీకట్లో తడుముకుంటూ చెట్టు వెతుక్కుంటూ వచ్చింది. వాడెప్పట్లాగే నవ్వుకుంటూ, పదాలు మార్చి మార్చి పాడుకుంటూ, చెట్టు మాను మీద దరువేసుకుంటూ ఉన్నాడు. “ఓ మంజులోయ్! దా దా, ఈ పూట బాగా తిన్నా, చుశావా? చీమలకి పస్తే” అని పెద్దగా నవ్వాడు. మళ్ళీ కాస్త ఆగాడు. “ఇదిగో చెప్తున్నా! ఎందుకొచ్చావో వచ్చావు. ఈ పూట వెళ్లావా, ఇక అంతే” అని అరిచాడు. అది కాసేపేం అనలేదు. తర్వాత సైగ చేసింది మణికట్టు చూపించి మెడ చూపించీ, చిరిగిన మూట చూపించీ.. అవన్నీ ఎవరివని అడిగింది. “ఎవరేంటే? పనికిమాలినదానా? ఈ ఊరికి రాకముందు ఎన్ని ఊర్లు తిరాగాను. నీకెందుకే మూగదానా?” అని మళ్ళీ జోరుగా పాటందుకున్నాడు. ఆ పిల్ల వెళ్ళిపోడానికి లేచింది. “ఇదిగో! చెప్పాను. ఈపూట వెళ్లావా! ఇక..” వాడి మాట పూర్తికాలేదు, వాడి రెండు చెంపలమీదా బలం కొద్దీ చాచికొట్టింది. చీకట్లో తడుముకోకుండానే పరిగెత్తి ఇంటికెళ్ళిపోయింది.

ఆ రాత్రి తెల్లారాక నీళ్ళకెళ్ళిన వాళ్ళెవరికీ చింతచెట్టు కింద పిచ్చోడు కనపడలేదు. మూగది నిద్రలేచి చూసుకుంటే దాని  కాలిపట్టీలు కూడా కనపడలేదు. అసలు సంగతేంటంటే- కొట్టినా తిట్టినా ఎప్పుడూ నవ్వే పిచ్చోడు ఆ రాత్రంతా ఎక్కెక్కి ఏడ్చాడనీ, ఆ తర్వాతెప్పుడు నీళ్లకెళ్ళినా మూగది ఒక బిందెడు నీళ్ళు పసుపురాయి మీద కుమ్మరించి పోతుందనీ చింతచెట్టుకీ చెరువుకీ తప్ప ఇంకెవరికీ తెలీదు.

-*-

వెన్నెల రాత్రి

 

   –  రెహానా

~
చీకటంతా ఒక్కచోటే పోగయ్యింది…
వెన్నెల రాత్రుల్లోని
ఆ వెలుగంతా ఎటు వెళ్లిందో…
ఒక దాని పై ఒకటి పేర్చుకుంటూ వెళ్లిన
నా ఆశల సౌధాలన్నీ ఎక్కడ
కుప్పకూలిపోయాయో…

నేను వెదుకుతూనే ఉన్నాను
ఆ చీకట్లో…
నా వేలి కొనలతో చూస్తూ,
తచ్చాడుతూనే ఉన్నాను..

నేను ఇష్టపడే రాత్రి- ఊసులాడే రాత్రి
నేను స్వప్నించే రాత్రి- శ్వాసించే రాత్రి
నేను నేనుగా జీవించే రాత్రి
దోసిలి నిండా తీసుకుని ముద్దాడే రాతిరి

గుమ్మానికి గుత్తులు గుత్తులుగా
వెళ్లాడే కబుర్ల జాజులు
ఎక్కడ రాలిపోయాయో

చీకట్లో వెతుకుతూనే ఉన్నాను.
నా వేలి కొనలతో చూస్తూ,
తచ్చాడుతూనే ఉన్నాను..

*

ప్రశ్నల లాంతరు

 

 

-చల్లపల్లి స్వరూప రాణి

~

 

అవును రోహిత్!
నువ్వన్నది నిజమే!
పుట్టుకతో నేరస్తులమౌతున్న చోట
మన పుట్టుక ఎంత వేదనా భరితం!
అవును!
ఇది ఒంటరి అలగా బాల్యం
పచ్చితనాలను
నులివెచ్చదనలాను
నరికి పాతరేసుకున్న బాల్యం
ఒనుకులదాకా తరుముకొచ్చే
వెలివేతల బాల్యం
ఎంత గెల్చినా
ఏ మన్ననకి నోచుకోని బతుకులు
ఇక్కడ ప్రేమ నిషిద్ధం!
ప్రశ్న నిషిద్ధం!
మననమ్మకాలకు రంగులద్దుతారు
నలుగురు నడిచే దారినే నడవలేక పోవడం
ఎంత నేరం!
రాజు గారికి బట్టలు లేవనడం
ఎంత పాతకం!
ఇక్కడ బతకడం అంటే
కుయ్యో మొర్రోమని
కాళ్ళీడ్చుకుంటూ నెట్టుకు రావడమని
తెలుసుకోలేక పోవడం
ఎంత తప్పు!
రాముడు మంచి బాలుడెందుకయ్యాడని,
ఈ దేశంలో ఎక్కడ చూసినా
సీతమ్మోరు స్నానమాడిన
గుంటలే ఎందుకున్నాయని
అడగడం ఎంత ఘోరం!
ఇక్కడ కలలు కనమంటారు
కానీ నిద్ర పట్టనివ్వరు
ఇక్కడ బడులుంటాయి, గుడులుంటాయి
కానీ జ్ఞానార్జన నిషిద్ధం
రోహిత్!
చదువంటే ప్రశ్న కదా!
మనుషులని వస్తువులుగా
డబ్బులుగా, ఓట్లుగా
కాదంటే బంగారంగా చూసే కళ్ళకి
మనిషంటే మెదడని
మనిషంటే చలనమని
మనిషంటే ప్రేమని చెప్పడానికే
నువ్వొచ్చి వెళ్ళావా రోహిత్!

త‌ల‌కాయో ర‌క్షిత ర‌క్షితః

 

 

-శ్రీ చమన్

~

 

ప‌ది త‌ల‌లు రావ‌ణుడు..ఒక్క ఇమామీ మెంతోప్ల‌స్‌… ప‌దిత‌ల‌ల‌కూ ఒకేసారి గాయ‌బ్‌. త‌గ్గిపోయింది. పోయిందే ఇట్స్‌గాన్‌!

ఇక్క‌డ ల‌క్ష‌లాది త‌ల‌కాయ‌లు. ఇవి పిందెల ద‌శ‌ నుంచి కాయ‌లుగా మారి, ముదిరి పండై  రాలిపోయే ద‌శ వ‌ర‌కూ ఈ త‌ల‌కాయ‌ల్ని కాపాడుకోవాల్సిన బాధ్య‌త ఎవ‌రిది వారిదే. అయిన‌ప్ప‌టికీ   ప్ర‌జాస్వామ్యానికి పెద్ద‌త‌ల‌కాయ‌ల్లాంటి ప్ర‌భుత్వం, న్యాయ‌స్థానాలు, ర‌క్ష‌క భ‌ట నిల‌యాలు, కొన్ని సంస్థ‌లు ..త‌ల‌కాయ‌ల‌న్నీ స‌మాన‌మ‌ని భావించి స్వ‌చ్ఛందంగా కాప‌లా కాస్తుంటాయి. జుట్టురాలిన బ‌ట్ట త‌లైనా, నూనె జిడ్డు కారుతున్న త‌లైనా,  హెడ్ అండ్ షోల్డ‌ర్ వారి హెయిర్ కేర్ కార‌ణంగా నిగ‌నిగ‌లాడుతున్న త‌ల‌కాయ అయినా ఈ పెద్ద‌త‌ల‌కాయ‌ల‌కు స‌మాన‌మ‌ని ఎలుగెత్తి చాటుతున్నాయి.

సామాన్యంగా ఇందులో కొన్ని త‌ల‌కాయ‌లు ఎక్కువ స‌మాన‌మ‌న్న‌ది ఆఫ్ ది రికార్డ్‌. ఏది ఏమైన‌ప్ప‌టికిన్నూ, గో ఎ హెడ్. అలా ముందుకు పోదాం అని నిర్ణ‌యించేస్కున్నారు. వీరి బాధ జ‌నం బాధ‌. వీరి తాప‌త్ర‌యం ప్ర‌జా క్షేమం.  కాలుష్య‌పు పొర‌లు చీల్చుకుంటూ, కారుతున్న ముక్కు చీదుకుంటూ ద్విచ‌క్ర వాహ‌నాల‌పై దూసుకొస్తున్న కొన్ని ల‌క్ష‌ల‌ త‌ల‌ల‌కు నొప్పి లేని బాధా నివారిణి అందుబాటులోకి తెచ్చారు. శిరోభారమ‌ని భావిస్తే చేతి చ‌మురు వ‌దిలిపోద్ది.  ప్ర‌జ‌ల ధ‌న‌, మాన ప్రాణాలు కాపాడే ప‌నిలో 24/7 న్యూస్ చాన‌ల్‌లా ప‌నిచేస్తున్న వారి మైండ్‌లో మెరిసిన మెరుపే ఈ శిర‌స్ర్తాణం. మ‌ర‌కా మంచిదే!

జేబుకు చిల్లు, బుర్ర‌కు బ‌రువూ అయినా.. హెల్మెట్టూ మంచిదే.  కోర్టు అక్షింత‌ల‌తో, స‌ర్కారు త‌ప్ప‌నిస‌రై జారీ చేసిన ఉత్త‌ర్వుల‌తో, ఉన్న‌తాధికారుల ఆదేశాల వంటి ఇత్యాది కార‌ణాల‌తో ప్ర‌జాసంక్షేమ సైన్యం రంగంలోకి దిగింది. పైన శాంతికి చిహ్న‌మైన‌ ధ‌వ‌ళ‌వ‌ర్ణ చొక్కా, క‌నిపించ‌ని నాలుగో సింహానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌లాంటి ఖాకీ పంట్లాం వేసుకున్న బృందాలు మ‌హాన‌గ‌ర దారుల్లో అడుగ‌డుగునా చ‌లానా కొర‌డాల‌తో, ఎల‌క్ర్టానిక్ జ‌రిమానా మిష‌న్ల‌తో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. వీరికి తార‌స‌ప‌డ్డాడు న‌ర్సిమ్మ‌. న‌ర్సిమ్మ‌ ఎవుడ‌ని అడిగేరు! యాద్గిరి గాడి బామ్మ‌ర్ది. యాద్గిరి గురించి మ‌నం అడ‌గ్గూడ‌దు. గ‌ల్లీలోని ఆ అడ్డాలో  ఏ పార్టీ అయినా ఆడే నాయ‌కుడు. ఏ కుల‌మైనా ఆడే పెద్ద‌.  ఏ మ‌తానికైనా యాద్గిరే దేముడు. ఎన‌క‌మాల ఇంత‌టి ద‌న్నున్న న‌ర్సిమ్మ‌ గారు.. సాయంత్రం కిష్న‌కాంత్ పార్కులో న‌డుస్తాడు.

న‌ర్సిమ్మ‌కి న‌డ‌వ‌డం కొత్త కాదు. కానీ ఇప్పుడు న‌డ‌వ‌డం కొత్తొక వింత‌. గుడుంబా మూట నెత్తికెత్తుకుని దొంగ‌చాటుగా ఎన్ని ఊర్లు దాటి సిటీలోకి ఎంచ‌క్కా ఎంట‌రిచ్చేవోడు. ఇది జ‌మానాలోని మాట‌. న‌ర్సిమ్మ న‌డిచిన తోవ లెక్కేత్తే వైఎస్ పాద‌యాత్ర కంటే ఎక్కువ కిలోమీట‌ర్ల లెక్కొస్త‌ది.  ఇప్పుడు ఆ బాధ‌లేదు. బామ్మ‌ర్ది యాద్గిరి రూపంలో న‌ర్సిమ్మ వైన్ సిండికేట్‌లోకి దూరాడు. డ‌బ్బుతోపాటు షుగ‌ర్ జ‌బ్బు వ‌చ్చిన పెద్దోళ్లంతా న‌డిచిన దారినే ప‌ట్టాడు న‌ర్సిమ్మ‌. అలాగ కిష్న‌కాంత్ పార్కులో పెద్దోళ్ల‌తో దోస్తాన న‌డ‌క త‌ప్పించి..మామూలు న‌డ‌క త‌ప్పిపోయింది. ఎండ పొడ‌గిట్ట‌ని సుకుమార సౌంద‌ర్య తేజోవిలాస న‌ర్సిమ్మ‌గారికి ఒకానొక సాయంత్రాన పాన్ న‌మ‌లాలి అనిపించింది. త‌న ఇంటిప‌క్క‌నే మెయిన్‌రోడ్డుకు ఆనుకుని ఉన్న కిల్లీ బంక్ ద‌గ్గ‌ర‌కు న‌డిచెళితే నామోషీ అనుకుని  ద్విచ‌క్ర‌వాహ‌నం తీశారు.  మెయిన్‌రోడ్‌కు ఎంట‌ర‌వుతూనే న‌ర్సిమ్మ బండి ఆగింది. లేదు ట్రాఫిక్ పోలీసోళ్లు ఆపారు.  మ‌న క్షేమ  ధైర్య‌, స్థైర్య అభ‌య ఆయురారోగ్యాల కోసం వారాపుతున్నార‌నే నిజం న‌ర్సిమ్మ‌కు తెలుసు. అందుకే ఆపాడు.

హెల్మెట్ లేదు. జ‌రిమానా క‌ట్ట‌మ‌న్నారు. యాద్గిరి బామ్మ‌ర్దిన‌ని చెప్పాడు. ఇప్పుడే క‌ట్ట‌క్క‌ర్లేదు. చ‌లానా వ‌స్తుంద‌న్నారు. ప‌ది రూపాయ‌ల పాన్ కోసం వ‌స్తే ప‌రేషాన్ చేస్తున్నారా అని మండిప‌డ్డాడు. మీరు పాన్ తినొచ్చు..వెయ్యి క‌క్కండి సారీ క‌ట్టండ‌న్నారు. చ‌లానా తీసుకుని చ‌ల్ల‌గా జారుకున్న న‌ర్సిమ్మ బామ్మ‌ర్ది చెవిలో త‌న‌కు జ‌రిగిన ప‌రాభ‌వం ఊదాడు. యాద్గిరి స్విచ్ నొక్కాడు. శిర‌స్ర్తాణం-శిరోభార‌మ‌నే అంశంపై సెమినార్లు, హెల్మెట్ దాని వ‌ల్ల లాభ‌న‌ష్టాల‌పై స‌మీక్ష‌లు మొద‌ల‌య్యాయి. పోలీసు, ట్రాఫిక్‌, ఆర్టీఏ, ఫైర్ అండ్ సేఫ్టీ, వాణిజ్య‌ప‌న్నుల‌శాఖ అధికారుల‌తో రివ్యూ ప్రారంభ‌మైంది. న‌ర్సిమ్మ గారికి క‌లిగిన అసౌక‌ర్యానికి చింతిస్తున్నామ‌ని మొద‌లుపెడుతూనే ..న‌ర్సిమ్మ‌గారి త‌ల‌కాయ‌ను కాపాడాల్సిన బాధ్య‌త త‌మ‌పై ఉంద‌న్నారు ఆర్టీఏ వారు. ఇదిగాకుండా కోర్టు వారి ఆదేశాలు శిర‌సావ‌హించి, త‌మ‌శాఖ‌కు..వాహ‌న‌చోద‌కుల‌కు శిరోభార‌మైనా, శిర‌స్ర్తాణ  ధార‌ణ త‌ప్ప‌నిస‌రిగా అమ‌ల‌య్యేలా చూస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు.

హెల్మెట్ లేక‌పోతే వెయ్యి జ‌రిమానా వేసే బ‌దులు అదే వెయ్యి తీసుకుని ఓ హెల్మెట్ అక్క‌డే ఇవ్వొచ్చు క‌దా! అని ఓ ట్రైనీ అధికారి అందామ‌నుకున్నాడు. మ‌న‌సులోనే తొక్కి పెట్టేశాడు. ఇంత‌లో పోలీస్ అధికారి లేచాడు. “మీకేమి పోయింది? అంద‌రికీ హెల్మెట్ త‌ప్ప‌నిస‌రి చేశారు. మా ప‌నే ఘోరంగా త‌యారైంది. దొంగ‌నా కొడుకులంతా హెల్మెట్లు పెట్టేసి దొరికిన‌ది దొరికిన‌ట్టు దోచుకెళ్తున్నారు. అన్ని హెల్మెట్లు ఒకేలా ఉంటున్నాయి. సీసీ ఫుటేజీకి దొంగ‌లు దొర‌క‌డంలేదు హెల్మెట్ ముఖాల‌తో ఏ ఒక్క కేసు ద‌ర్యాప్తు ముందుకు సాగ‌డంలేదు. చోరీ సొత్తు రిక‌వ‌రీలు కాక ఆఫీస‌ర్స్ మా ఉద్యోగ జీవితాల‌తో ఆడుకుంటున్నారు. చైన్‌స్నాచ‌ర్లు హెల్మెట్‌ల మాటున త‌ప్పించుకుంటున్నారు. సూది సైకోలకు హెల్మెట్టే ర‌క్ష‌ణ‌. మా బాధ ఎవ‌రితో చెప్పుకోం“ అంటూ ల‌బోదిబోమ‌న్నాడు.

ఆదేశాలిచ్చేది కోర్టు, అమ‌లు చేయాల‌ని స‌తాయించేది ఆర్టీఏ వాళ్లు..మ‌ధ్య‌లో వాహ‌న‌చోద‌కుల‌తో తిట్లు, నాయ‌కుల‌తో చీవాట్లు తినేది మేమంటూ వాపోయారు ట్రాఫిక్ పోలీసులు. మ‌ధ్య‌లో క‌ల్పించుకున్న వాణిజ్య ప‌న్నుల‌శాఖాధికారులు.. మ‌హాన‌గ‌రంలో 25 ల‌క్ష‌ల ద్విచ‌క్ర‌వాహ‌నాలున్నాయ‌ని, వీరంతా హెల్మెట్లు కొంటే.. 25 ల‌క్ష‌ల హెల్మెట్లు అమ్మ‌కం అయి ఉంటాయ‌ని. ఓ 5 ల‌క్ష‌ల మంది కొన‌క‌పోయినా 20 ల‌క్ష‌ల ఖాయ‌మ‌ని, కానీ త‌మ‌శాఖకు హెల్మెట్ల అమ్మ‌కాల నుంచి ఆ స్థాయి ప‌న్నులు జ‌మ కాలేద‌ని వాపోయారు. ఇదే స‌మావేశానికి “ ప్ర‌జ‌ల ప్రాణాలు-ప్ర‌మాదాలు-ప్ర‌భుత్వ బాధ్య‌త“ అనే అంశంపై పోరాడుతున్న స్వ‌చ్ఛంద సంస్థ ప్ర‌తినిధులు కూడా హాజ‌ర‌య్యారు. ప్ర‌జాస్వామ్య దేశంలో ప్ర‌జ‌ల కోసం ప్ర‌జ‌ల చేత ఎన్నికైన ప్ర‌భుత్వానికి  ప్ర‌జ‌ల త‌ల‌కాయ‌ల్ని కాపాడాల్సిన బాధ్య‌త లేదా అని ప్ర‌శ్నించారు.  దీని కోసం తాము హైకోర్టులో పోరాడామ‌ని, ఇంకా సుప్రీంకోర్టుకు వెళ్ల‌డానికైనా సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించారు.

బైక్ పై వెళ్లేవాడొక్క‌డే హెల్మెట్ పెడితే చాల‌ద‌ని, వాడి వెనుకున్న వాడికి కూడా శిర‌స్ర్తాణం త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని చెప్పారు. ద్విచ‌క్ర‌వాహ‌నంపై వెళ్లేవాళ్లు మాత్ర‌మే హెల్మెట్ పెట్టుకుంటే స‌రిపోద‌ని, న‌డిచి వెళుతున్న వాళ్ల‌ను వీళ్లు గుద్దితే వాళ్ల త‌ల‌కాయ పుచ్చ‌కాయ‌లా ప‌గిలిపోతుంద‌ని, అప్పుడు వారి ప్రాణాల్ని ఎవ‌రు తిరిగి తెస్తార‌ని లాజిక్ తీశారు.  బైకుల‌ను ఆపి త‌నిఖీ చేసే పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల‌ను.. కొంద‌రు నేర‌స్తులు, అగంత‌కులు గుద్ది వెళ్లే ప్ర‌మాదం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. హెల్మెట్ వేసుకుని  బైక్లు దూసుకుపోయి కారు అద్దాలు ప‌గిలి అందులో వారి త‌ల‌కాయ కూడా ప‌గిలే అవ‌కాశం ఉంద‌న్నారు. ఓవ‌రాల్‌గా ఇంట్లో ఉన్న‌ప్పుడు త‌ప్పించి..విమానాల్లో వెళ్లే వారిని మిన‌హాయించి..అంద‌రికీ హెల్మెట్ త‌ప్ప‌నిస‌రి చేయాలని డిమాండ్ చేశారు.

చివ‌రికి న‌ర్సిమ్మ పాన్ కోరిక‌కు రోడ్డుపై న‌డిచెళ్లే వాళ్ల‌కూ శిరోభారం త‌ప్ప‌ని స‌ర‌య్యే ప్ర‌మాదం ఏర్ప‌డింది. త‌ల‌కాయో ర‌క్షిత ర‌క్షితః నినాదాలు మిన్నంటుతున్నాయి.  చిన్న‌పిల్ల‌ల‌తో ప్ల‌కార్డులు ప‌ట్టుకుని లైసెన్సు ఉండి సెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా న్యూసెన్స్ చేస్తున్న వాళ్ల‌ను చైత‌న్యం చేసేందుకు భారీ ర్యాలీ తీస్తున్నారు.
*

అవినీతిని అంతం చేసేద్దాం!

 

Bribery

-రమణ యడవల్లి 

~

‘ఈ సమాజానికి పట్టిన చీడ అవినీతి, ఇది అంతరించిపోవాలి.’ సినిమా డైలాగులాంటి ఈ స్లోగన్ ఎంతందంగా వుంది! నా చిన్నప్పట్నుండీ గొంతు పగలేసుకుంటూ ఈ స్లోగన్ని అరిచేవాళ్ళు అరుస్తూనే వున్నారు. అవినీతి మాత్రం కులాసాగా, హాయిగా తన మానాన తను పెరిగిపోతూనే వుంది. అంచేత ముందుగా ఈ స్లోగనీర్స్‌కి నా సానుభూతి తెలియజేసుకుంటున్నాను.

ఇవ్వాళ నీతి అడ్రెస్ లేకుండా అంతరించిపోయింది. అడ్రెస్ లేనివాటి గూర్చి చర్చ అనవసరం, టైం వేస్ట్! కానీ, అవినీతి గూర్చి ఎంతైనా రాయొచ్చు – ఎందుకంటే అదిప్పుడు సినీతారల సౌందర్య రహస్యంలా తళతళా మెరిసిపోతుంది కనుక. అవినీతి కొంత కష్టమైనది, మరెంతో క్లిష్టమైనది! అందుకే ఈ అవినీతిలో ఎప్పుడూ రాజకీయ నాయకులు, బ్యూరాక్రసీ, పారిశ్రామికవేత్తలు.. ఇంకా చాలామంది పార్ట్నర్లుగా వుంటారు. వాళ్ళంతా అలా భాగస్వామ్యం కలిస్తేనే, అవినీతి అదేదో సిమెంటుతో కట్టిన గోడలాగా మన్నికగా, ధృఢంగా వుంటుంది.

గవర్నమెంటు ఆఫీసుల్లో వాడే గుండుసూదుల దగ్గర్నుండీ, సాంఘిక సంక్షేమ హాస్టళ్ళల్లో పసిపిల్లల తినే తిండి దాకా కమీషన్లు లేకుండా ఉద్యోగులు పని చెయ్యరు (ఇది వారి ఉద్యోగ ధర్మం). ప్రభుత్వాసుపత్రుల్లో మందులు, దుప్పట్ల కొనుగోళ్ళల్లో కమీషన్ ఫస్ట్, క్వాలిటీ లాస్ట్ (ఇది వారి వృత్తిధర్మం). ఈ అవినీతి మునిసిపాలిటీ చెత్తలాగా అందరికీ కనబడుతుంటుంది కాబట్టి – మధ్యతరగతి మేధావులు తీవ్రంగా ఖండిస్తుంటారు (వీళ్ళకోసమే ‘భారతీయుడు’ సినిమా తీశారు).

ఇప్పుడు ఇదే అవినీతి మోడల్ని దేశస్థాయిలోకి తీసుకెళ్దాం. దేశం అన్నాక దానికో రక్షణ వ్యవస్థ అవసరం. ఈ రక్షణ వ్యవస్థ కోసం గన్నులు, యుద్ధ ట్యాంకులు, ఓడలు, విమానాలు, హెలీకాప్టర్లు.. ఇలా చాలా సామాగ్రి కావాలి. కళ్ళముందు జరిగే అవినీతి గూర్చి సామాన్య ప్రజలకి తెలుస్తుంది కానీ రక్షణ వ్యవస్థ – దాని అవసరాలు, కొనుగోళ్ళ గూర్చి తెలీదు.

అందువల్ల యే దేశప్రభుత్వాలకైనా రక్షణ సామాగ్రి కొనుగోళ్ళల్లో రిస్కు తక్కువ, సేఫ్టీ ఎక్కువ! ఇంకోకారణం – రక్షణ సామాగ్రికి ఇడ్లీ, అట్టు రేట్లలాగా పారదర్శకత వుండదు, బిస్కెట్ పేకెట్లకున్నట్లు ఎమ్మార్పీ వుండదు. ఒక వస్తువు ఉత్పత్తి ఖర్చు వందరూపాయిలైతే – దాన్ని లక్షకి అమ్ముకోవచ్చు, కోటికీ అమ్ముకోవచ్చు. రేటు అనేది ఆయా దేశాల రాజకీయ నాయకత్వాల అవసరం (కక్కుర్తి) బట్టి వుంటుంది.

‘కన్ఫెషన్స్ ఆఫ్ ఏన్ ఎకనామిక్ హిట్ మేన్’ (తెలుగులో ‘ఒక దళారి ఆత్మకథ’) అనే పుస్తకంలో జాన్ పెర్కిన్స్ అనే ఆయన బయటకి గౌరవంగా, మర్యాదగా కనిపిస్తూనే అనేక దేశాలు ఈ వ్యవహారాల్ని ఎలా చక్కబెట్టుకుంటాయో, వాటి మోడస్ ఒపరాండై ఏవిఁటో చక్కగా వివరించాడు. అభివృద్ధి చెందిన దేశాలకి ఉప్పుపప్పూ వ్యాపారాల మీద మోజుండదు – ఆ రంగాల్లో కిరాణాకొట్టులాగా పరిమిత లాభాలు మాత్రమే వుంటాయి కనుక. అంచేత అవి ఆయుధాల వ్యాపారం ఎంచుకుని, ఈ వ్యాపారాన్ని నిరాటంకంగా చేస్తుంటాయి (ఆయుధాల టెక్నాలజీ వారికి మాత్రమే సొంతం, ఇంకెవడైనా ఆయుధాలు తయారు చెయ్యాలని ప్రయత్నిస్తే వాడికి సద్దాం హుస్సేన్‌కి పట్టిన గతే పడుతుంది).

ప్రజలు తమ అవసరాల నిమిత్తం కొన్నిచోట్లకి వెళ్ళి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు – బట్టలకొట్టు, చెప్పులషాపు.. ఇలాగా. అలా కొనేవాళ్ళని అయా వ్యాపారస్తులు ‘కస్టమర్లు’గా పరిగణిస్తారు. మరైతే ఆయుధాలు ఎవరికి అవసరం? అవి కొనడానికి కస్టమర్లు ఎక్కణ్నుండి వస్తారు? ఒక వస్తువుని అమ్ముకోవాలంటే ఆ వస్తువుకి డిమాండ్ వచ్చేలా చేసుకోవటం వ్యాపారంలో ప్రాధమిక సూత్రం. కావున రక్షణ సామాగ్రి అమ్ముకునేవాళ్ళు తమ కస్టమర్లని తామే సృష్టించుకుంటారు. అందుకోసం తాము ఆయుధాలు అమ్మాలనుకునే దేశాల్లో అంతర్గతంగా అశాంతి, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు వుండేట్లు ఆయుధ వ్యాపారులు తీవ్రంగా శ్రమిస్తారు (ఇందుకయ్యే ఖర్చులు ఫైనల్ బిల్లులో రాబడతార్లేండి).

ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల్లో తిరుగుబాటుదార్ల దగ్గర ఇబ్బడిముబ్బడిగా ఆయుధాలుంటాయి (అవి ఎక్కణ్నుండి వచ్చాయని అడక్కండి), వారి నుండి తమ ప్రభుత్వాల్ని రక్షించుకోడానికి ఆ ప్రభుత్వాలు ఆయుధాలు కొనుక్కోవాలి. అమ్మయ్య, ఇక్కడ పనైపోయింది! మరి మిడిల్ ఈస్ట్ సంగతేంటి? అక్కడ ఇజ్రాయిల్ పుణ్యామని యుద్ధం రావణ కాష్టంలా మండుతూనే వుందిగా! వాళ్ళు తమ సహజ సంపదైన చముర్ని అమ్ముకుంటూ, ఆయుధాలు కొనుక్కుంటూ, జాతి విద్వేషాల్తో ఒకళ్ళనొకళ్ళని చంపుకుంటూ కులాసాగా జీవనం కొనసాగిస్తున్నారు. అంటే పేకాటలో డబ్బు ఎవరు పోగొట్టుకున్నా వాళ్ళందరికీ అప్పిచ్చేది మాత్రం ఒక్కడే!

ఇక మన విషయానికొస్తే – మనకీ, పాకిస్తాన్‌కీ మధ్య ఇంచక్కా కాశ్మీర్ ‘సమస్య’ వుండనే వుంది. ఈ రెండుదేశాల సాధారణ ప్రజానీకం మాత్రం మలేరియా, టైఫాయిడ్‌లాంటి సింపుల్ రోగాల్తో చస్తుంటారు. వడదెబ్బకీ, చలిక్కూడా చస్తుంటారు. పంటలు పండకా, పండినా గిట్టూబాటు ధరల్లేకా రైతులు ఆత్మహత్యలు చేసుకు చస్తుంటారు. దిక్కులేనివాళ్ళు ఆకలి చావులు చస్తుంటారు. ఇంకా చెప్పుకోడానికి సిగ్గుపడే అనేక కారణాలతో రోజువారీ కుక్కచావులు చస్తూనే వుంటారు.

‘ప్రజలారా! కలత చెందకండి, భయపడకండి. కాశ్మీరు మనది, అక్కడ ప్రతి అంగుళం మనదే, ఒక్క అంగుళం కూడా అవతలవారికి చెందనియ్యం.’ ఈ తరహా ప్రచారం ఇటు ఇండియాలో, అటు పాకిస్తాన్‌లోనూ నిరంతరంగా కొనసాగుతుంటుంది. ‘కాశ్మీరు సంగతి సరే! మరి మా సంగతేంటి?’ అనడిగితే మనం అర్జంటుగా దేశద్రోహులైపోతాం, మనని అరిచి మందలించి భయపెట్టడానికి అర్నబ్ గోస్వామి వంటి భీభత్సమైన దేశభక్తులు వుండనే వున్నారు!

అయ్యా ఆయుధాలమ్మే అగ్రరాజ్యంగారు! నమస్తే. మాది శాంతికాముక దేశం సార్! కానీ మా సరిహద్దు దేశంగాడున్నాడే, వాడొట్టి దొంగాముండావాడండీ! ఆ దుర్మార్గుణ్నించి మమ్మల్ని మేం రక్షించుకోవాలి కదండీ? అంచేత అర్జంటుగా మాకిప్పుడు ఆయుధాలు కావాలి. కానీ మాదగ్గర ఈడ్చి తన్నినా పైసా లేదు. ఇప్పుడెలా? ఎలా? ఎలా?

డోంట్ వర్రీ! మై హూనా? అప్పుగా ఆయుధాలు ఎన్నైనా తీసుకోండి. వడ్డీలు, చక్రవడ్డీలు, ఈయమ్మైలు.. మొత్తం మేమే నిర్ణయిస్తాం. మీరు నిదానంగా కట్టండి. ఈలోపు అంతర్జాతీయంగా మేం తీసుకునే ప్రతి నిర్ణయానికీ మీరు కిక్కురుమనకుండా, గుడ్డిగా మద్దతు పలకాలి. లేదా, మా అప్పు వసూలుకి విజయవాడ కాల్ మనీ టైపు పద్ధతులు అమలు చేస్తాం. ఇంకో ముఖ్యవిషయం – మా మార్కెట్ రంగాన్ని మీ దేశంలోకి తలుపులు బార్లా తెరిచి ఆహ్వానించాలి.

తలుపులు మరీ బార్లా తెరిస్తే మాకు రాజకీయంగా ఇబ్బంది.

నిజమే కదూ! అయితే ఓ పన్జెయ్యండి, తలుపులు కొద్దిగా తెరవండి చాలు. వేలుపెట్టే సందు దొరికితే కాలు పెట్టడం మా ప్రత్యేకత! అయినా – ఒక ఇంట్లోకి ప్రవేశించాలంటే మాకు అనేక మార్గాలున్నాయి. సమయానుకూలంగా దొడ్డిదోవన వొస్తాం, వంటింటి కిటికీలోంచి దూరి వొస్తాం, పక్కింటిగోడ దూకి వొస్తాం.

ఇప్పుడు మనం అలనాటి బోఫోర్సు నుండి నేటి అగస్టావెస్ట్‌లేండ్ (ఈ హవాలా దివాలా పేర్లు భలే సెక్సీగా వుంటాయి) దాకా తెర వెనుక కథ తెలుసుకున్నాం. ఇవన్నీ చాలా సాధారణ విషయాలు, పవిత్ర గంగానదిలాగా నిరంతరం అలా పారుతూనే వుంటాయి. ఈ వ్యాసం రాస్తున్న సమయంలో ప్రపంచంలో యేదోకచోట ఒక డీల్ కుదురుకుంటూ వుంటుంది.

నోనో, ఇలా స్వీపింగ్ జెనరలైజేషన్ చెయ్యకూడదు. మా ప్రభుత్వం గత ప్రభుత్వం కుంభకోణాన్ని బయటపెట్టింది, మా పార్టీ నిప్పు.

సరే! కుంభకోణాల్ని బయటపెడుతున్నారు. మరప్పుడు బోఫోర్స్ కుంభకోణంలో ఎందరు జైలుకెళ్ళారు? కార్గిల్ శవపేటిక కుంభకోణంలో ఎందరు శిక్షించబడ్డారు? సమాధానం చెప్పి మమ్మానందింపజేయ ప్రార్ధన. ఈ కుంభకోణాల వెలికితీత వెనుక రాజకీయ ప్రయోజనాలకి మించి ప్రజల సంక్షేమం ఎంత మాత్రం లేదని మరీ బల్ల కాకపోయినా టీపాయ్ గుద్ది చెప్పొచ్చు.

‘పార్ధా! ప్రభుత్వ పక్షమేమిటి? ప్రతిపక్షమేమిటి? అన్నిపక్షాలు నేనే! నువ్వు యే పక్షమైనా డీల్ కుదుర్చువాడను నేనే! ప్రజలకి ఫలానా పార్టీకి చెందిన ప్రభుత్వంపై మొహం మొత్తంగాన్లే పాతపార్టీల్తో కొత్తపక్షాన్ని సృష్టించి గద్దె నెక్కించువాడను నేనే! చదరంగంలో ఇవ్వాళ తెల్లపావుల్తో ఆడినవాడు రేపు నల్లపావుల్తో ఆడతాడు. ఒక దేశంలో ప్రభుత్వ ప్రతిపక్షాలన్నియూ ప్రజల భ్రాంతేనని వికిలీక్స్ సాక్షిగా నీవు గ్రహించగలవు. కావున నీవు నిస్సందేహముగా అవినీతికి పాల్గొనుము. ఇదే కలియుగ ధర్మం, వినకపోతే నీ ఖర్మం.”

తెలుగు సినిమా ప్రేక్షకులు హీరోలకి వీరాభిమానులు. మా హీరో గొప్పంటే మా హీరో గొప్పని తన్నుకు చస్తుంటారు. ఈ హీరోలతో సినిమాలు తీసేవాళ్ళు మాత్రం తెర వెనక ఐకమత్యంగా వుంటారు. డబ్బు సంపాదనే తమ ధ్యేయమనీ, మీరు కొట్టుకు చావకండని హీరోలు చచ్చినా చెప్పరు, చెబితే అది బ్యాడ్ బిజినెస్ స్ట్రేటజీ అవుతుంది. ఎందుకంటే – తమలో తమకి పడదని సాధారణ ప్రేక్షకుడు భావించడం కూడా హీరోల వ్యాపారంలో భాగమే కాబట్టి.

తెలుగువాళ్ళకి సినిమా ట్రాజెడీగా ముగిస్తే నచ్చదు. ఈ నచ్చకపోవడం అనేది ఇలాంటి వ్యాసాలక్కూడా అప్లై అవుతుందని నా అనుమానం. అందువల్ల ఈ వ్యాసాన్ని పాజిటివ్ నోట్‌తో ముగిస్తాను. భవిష్యత్తులో ఈ అవినీతి చీడ / భూతం (యేదైతేనేం) అంతరించిపోవాలని, నీతి అనేది నిజాయితీగా తలెత్తుకు నిలబడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. కొంచెం పొయిటిక్‌గా, పచ్చిఅబద్దంలా అనిపిస్తుంది కదూ! నేనేం జెయ్యనూ? అబద్దాలంతే, అవలాగే వుంటాయి!

*

లడ్డూ కావాలా నాయనా..!?!

A_Tirupathi_laddu

 

 

  -బమ్మిడి జగదీశ్వరరావు

~

 

ప్రియమైన భక్తులకి..

భగవంతుడు పంచుకోవాల్సింది వొకటుంది.. అది లడ్డు.. మహా ప్రసాదం!

నాకు తెలుసు, నాకులాగే మీకూ ‘తిరుపతి’ లడ్దంటే మహా యిష్టం కదూ.. లడ్డూ ప్రసాదం కళ్ళకి అద్దుకోనే లోపలే నోట్లో నీళ్లూరుతాయి.. తప్పు కాదు.. ఆ రుచి అటువంటిది.. మీరే కాదు.. నేనయినా అంతే!

నన్ను చెయ్యెత్తి మొక్కనివాళ్ళు కూడా నాలడ్డూని యిష్టంగా అపురూపంగా తింటారు.. అంత కమ్మగా వుంటుంది. యెంతో జిమ్మగా వుంటుంది. అమృతమంత రుచిగా వుంటుంది. ఆమాటకొస్తే అమృతానిది యేమి రుచి? అమృతాన్ని తలదన్నే రుచి కదూ లడ్దూది..?

అందుకే సుప్రభాతం సమయాన వెన్నతో మొదలుపెట్టి యేకాంతసేవ లోపు లడ్డూ వడా చెక్కెర పొంగలీ బెల్లం పొంగలీ పులిహోరా దద్దోజనమూ వడపప్పూ చిన్నలడ్డూ మిరియాల అన్నమూ కలకండా యింకా నేతి మురుకూ జిలేబీ ఫోళీ సమోసా పాయసమూ పెద్దవడా సిరా బెల్లం దోశా మురుగన్నమూ అప్పమూ.. అన్నీ అర్పించినా సమర్పించినా.. నాకు ఆ లడ్డూయే వేరప్పా.. దాని రుచి దేనికీ రాదు గాక రాదు!

అంతెందుకు?, నాదర్శనం కానప్పుడు కూడా లేని నిరాశ లడ్డూ దొరకనప్పుడు వొస్తుంది.. ఔనా..?

లడ్డూ పదార్థమే కాదు పదం విన్నా నోట్లో నాలుక మునిగిపోతుంది! ఎంత కమ్మటి వాసన. అమ్మ దగ్గర వొచ్చే వాసన. ఆలి దగ్గర వచ్చే వాసనకు పోటీ పడదూ సువాసన..? ఆస్థానం లడ్డూ.. కల్యాణం లడ్డూ.. ప్రోక్తం లడ్డూ.. దేనికదే సాటి గదూ..?

మా యిద్దరు దేవేరులూ కలిసి యింత శనగపిండి తెచ్చి నలుగు పెడతారా? నాకు వొళ్ళు మంటగా వుంటుంది! అర్ధాంగీలే గాని అర్థం చేసుకోరూ?! ‘వొంటికి గట్టిగా గంపలకొద్దీ శనగపిండి పెట్టకపోతే రంగు యేడ నుంచి వచ్చుద్ది’ అంటారేగాని ‘అయ్యో శనగపిండి.. లడ్ల లోకి పనికొస్తాదే..’ అంటే వింటారా.. వినరు! క పోగా ‘యింత లడ్డులపిచ్చి యేమయ్యా నీకు’ అని మురిపెంగా తిట్టిపోసి తినబెడతారు!

లడ్డూలో వుండేది శనగపిండేనా? బూందీతోటి పటికబెల్లముతోటి పచ్చకర్పూరముతోటి.. నెయ్యేసి ముంతమామిడి పువ్వేసి కుంకుమపువ్వేసి.. కలకండా జీడిపప్పూ యాలకులూ యెoడుద్రాక్షా చెక్కెరా.. యెన్నెన్నో యేసి.. అబ్బా యేమి సేస్తిరి యేమి సేస్తిరి..

‘తేనెని మించిన తీయందనము.. మధువును మించిన మధురసము.. ఆహా.. ఆహాహా.. వోహో.. వోహోహో..’ యీ తిరుమల శ్రీవారు లడ్డూ కోసం తపిస్తూ పరితపిస్తూ అమ్మ వెంట పడ్డ పిల్లాడిలా గుమ్మలవెంటపడి పరిగెత్తుతూ రెండు చేతులూ చాస్తే- నాసామిరంగా.. కౌగిలికంటే తీయగుండదూ..?! ఆమాటే అంటే యిక ఆడంగులతో అగ్నిగుండం తొక్కడమే! యెందుకని.. ఆ పెదవులు అందుకొని.. లడ్డూలా వున్నాయి.. అంటే మురిసిపోయారే గాని లడ్డూ ‘అగ్రస్థానం’ అందనేలేదు!

‘లడ్డూ కావాలా నాయనా..’ అని అటు అలమేలు మంగమ్మా యిటు పద్మావతమ్మా యిద్దరూ చెరో లడ్డూ చేత పట్టుకు తెచ్చారు.. ఆవురావురు మన్నాను. ఆబగా అందుకున్నాను. ఆత్రంగా తినబోయి ప్రయత్నించి ఆగి.. నిమిరి ఆఘ్రాణిస్తూ వుండగా ‘యీ పతి.. మన శ్రీపతి.. యేనాడైనా మనల నిమిరి యింత పరవశించినాడా..?’ అలిగినారు భామలు. మూతులు మూడొంకర్లు పెట్టినారు. ‘వశమయ్యాక.. పరవశము యేడ నుండి వస్తుందే..!’ అని గొణిగినాను. అంతకన్న సణిగిన సమరమని నాకు అనుభవపూర్వకముగా తెలుసును! ముందు తిన్నాక ఆపైన అలక తీర్చవచ్చుననుకున్నాను!

‘అబ్బా యేమి సేస్తిరి యేమి సేస్తిరి..’ అనుకొనగా ‘నీ నామమెంతో రుచిరా..’ భక్తుల పాటలు నన్ను తాకాయి. ‘ఈ లడ్డూ యెంతో రుచి యెంతోరుచిరా’ సందర్భోచితంగా నా పలుకులు పల్లవించాయి. గొల్లపిల్లవాడిని అమ్మ నోరు తెరవరా అంటే తెరిచినట్టు ‘ఆ..’ అని తెరిచాను. ఔను మరి.. నోరు పట్టని లడ్డూ ఆయే! లాలాజలము యేడు సముద్రాల తీరున యెగసి పడుతోంది! లడ్డూ కొరకబోతే నా పన్నూడింది. నాది కాదు. భూలోకంలో భక్తుడిది. భక్తుని భక్తిని స్వీకరించినట్టే నొప్పినీ స్వీకరించినాను.

గుమ్మలిద్దరూ గమ్మున అలకని అవతలికి విసిరికొట్టి నన్ను వొక్క వురుకున చేరినారు. అర్ధ భాగాలు కదా? రెండు అర్ధ భాగాలు.. సగమూ సగమూ కలిపి నా జగము మొత్తం వాళ్ళే! ఏదీ నాకేదీ చోటు? నేను లేను! మొత్తం వాళ్ళే. వాళ్ళకే నొప్పి. వాళ్ళదే బాధ. వాళ్ళకి నేను బందీ!

నేను నవ్వాను. వాళ్ళు యేడ్చారు. యెద పోసుకున్నారు. నా విరిగిన పన్ను చూసి వొరిగిపోయారు. వలవల కన్నీరుగ కరిగారు. ‘గుమ్మలే కాదు అమ్మలు మీరు’ అనుకున్నాను. కన్నీటి పొరలు కమ్మగ మసక కళ్ళతో ‘యేమయింది..?’ అడిగారు. ‘శనగ గింజ’ అన్నాను. కమ్మిన మసక కరిగింది. ‘కాదు’ అన్నారు. ‘పచ్చ కర్పూరం.. పంటికి తగిలింది’ అన్నాను. ‘పటిక బెల్లం..’ అన్నాను. ‘కుంకుమ పువ్వు కొమ్మ’ అన్నాను. యేదన్నా నమ్మలేదు. యెనక్కి పెట్టిన చెయ్యిని ముందుకు లాగారు. మూసిన గుప్పిట దాచాను. గుమ్మలిద్దరూ వొక్కటైనా సుమబాలల సుకుమారిలు కదా.. పిడికిటిని తెరవలేకపోయారు. చెరో పక్క చేరి చక్కిలిగిలి పెట్టారు. నా పిడికిలి దానికదే తెరచుకుంది!

బోల్టు.. యినుప బోల్టు..!

‘మునుపు దొరికిన నట్టు తీసుకురా’ అన్నాను. ‘యెందుకు యెంకటేశా?’ అన్నట్టు చూసారు. ‘దీందో కాదో..?’ అన్నాను. తెచ్చిస్తే అమిర్చి చూసి ‘దీందే’ అన్నాను. ‘సిగ్గులేదూ..?’ అన్నారు. నా సిగ్గుకు సమతూకంగా.. లడ్డూల్లో రోజూ దొరికిన యినుప మేకులూ బొందులూ తాళాలూ నాణేలూ చాలక రాళ్ళూ రప్పలూ పిన్నులూ పెన్నులూ గుండు సూదులూ గుండీలూ.. వొకటి కాదు..!

‘యిందు దొరకనిదేదీ లేదు దేవీ..’ అన్నాను. ‘అవన్నీ యెందుకు..?’ దేవేరులు యేరులెత్తారు. ‘నా భక్తుల గాయాల గురుతులు’గా దాచుకున్నాను. కొట్టుగది నిండిపోయింది. ‘అవేమన్నా తులసీదళాలు అనుకున్నారా..?’ మంగమ్మ మండిపడింది. పద్మావతమ్మ కోపం పట్టనట్టే వుంది!

పంటి నొప్పికి నాకంట తిరిగిన నీరు సతులకంట జారింది!

కళ్ళు వొత్తుకొని మా ఆవిళ్ళిద్దరూ మళ్ళీ చెరో లడ్డూ తెచ్చి నా చేతిలో పెట్టారు. ఆబగా ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకొని యెప్పటిలా లడ్డూ కొరకలేకపోయాను. ‘భగవంతుణ్ణి కూడా భయపెట్టేసారు కదరా’ అనుకుంటూ వొక లడ్డూ విప్పాను. అందులో నల్లజెర్రి. మరో లడ్డూ రెండు భాగాలు చేసాను. మధ్యలో తెల్ల తేలు. నా చూపు ప్రాణవాయువుగా సోకిందేమో.. యెండిన నల్లజెర్రీ.. వెల్లకిలా తిరగబడింది.. తెల్లతేలూ.. బొమ్మాల్లా పడింది.. ప్రాణం పోసుకున్నందుకు సాక్ష్యంగా! అవి రెండూ అరచేతుల్లోంచి నేలమీదపడి.. పోయిన ప్రాణం వొచ్చిందని తెలీక ప్రాణభయంతో లడ్డూల్లో దొరికిన యినుప సామాన్ల కొట్టుగదిలోకి దూరిపోయినాయి!

అలమేలు మేలు కోలేదు. పద్మావతి కోలుకోలేదు. బుంగమూతి బుజ్జాయిల్ని చెరో చెంక కిందికి తీసుకొని ఆలనగా పాలనగా అక్కున చేర్చుకున్నాను. నా చూపులయితే నేలమీద వాలాయి. నా సహచరులవి కూడా!

అదే లడ్డూలు.. యిద్దరు భక్తుల చేతుల్లో.. వొక లడ్డూలో నల్లజెర్రి దేహం.. మరో లడ్డూలో తెల్లతేలు దేహం.. భక్తులు కొయ్యబారి చూస్తున్నారు. వాళ్ళ పిల్లలు విస్తుపోయి వింతగా చూస్తూ ‘లాడ్దూల్లో తేలూ జెర్రీ వున్నాయి కదా.. పాములు కూడా వుంటాయా..?’ అమాయకంగా అడుగుతున్నారు. ‘వుండవమ్మా.. పాములు వుండవు..’ తల్లులు నచ్చజెప్పుతున్నారు. ‘యెందుకు..?’ పిల్లలు అడగడం ఆపలేదు. ‘యెందుకంటే.. పాములు పెద్దగా పొడావుగా వుంటాయి కదా.. లడ్డూలో పట్టవు కదా..?!’ తర్కం బోధపడేలా తత్వం బోధపడేలా చెప్పాడో పెద్ద మనిషి! అంతా నవ్వారు!

నేను కూడా నవ్వుకున్నాను. గుమ్మలు నవ్వలేదు. ‘అపకీర్తి కాదా మీకు..?’ అన్నారు వుమ్మడిగా. ‘పాపభీతి లేదా..?’ నేనేదో చేసినట్టు నన్ను నిలదీశారు. ‘ఫలమూ పుష్పమూ తోయమూ మాత్రమేనా? యినుమూ ఘనమూ స్టిక్కూ ప్లాస్టిక్కూ జీవీ నిర్జీవీ.. అన్నిటినీ సమంగా చూడాలి కదా..?’ అన్నాను. యెంతయినా చేసినవారి చేతి రుచిని నిదించ నా తిన్న నోటికి మాట రాలేదు!

‘మీరు మాత్రం యేమి చేస్తారు.. బాగానే సరిపెట్టుకుంటున్నారు.. భక్తిని యుక్తిగా..’ అర్ధాంగులిద్దరూ నిందిస్తూనే నిట్టూర్చారు!

‘నాకు భక్తుల పోటు కన్నా- అధికారులకూ సిబ్బందికీ వీఐపీల పోటు యెక్కువైంది.. వారి సేవలు అటు మళ్ళించారు.. వారు నిమిత్తమాత్రులు..’ అన్నాను. ‘లడ్డూ..’ అని చెయ్యి చాపాను. లడ్డూ అందుకొని చేతిలో పెట్టింది మా పద్దూ అదే పద్మ. నోటికి అందించింది మా మంగ. తిన్నాను. కాని నా ముఖంలో మునుపటి అనుభూతిలేకపోవడం యిద్దరూ కనిపెట్టారు. అర్థమయ్యింది. నవ్వాను. ‘నకిలీ లడ్డు..’ అన్నాను. ‘భక్తుడు యిచ్చిందల్లా స్వీకరించాలిగా.. నోరు చూసుకుంటే అవుతుందా?, భగవంతుడి పాట్లు భగవంతుడివి..!’ అన్నాను. సతులు నకిలీ లడ్డూ లాక్కోబోతే వారికి అవకాశం యివ్వకుండా బాధ్యతగా మింగేసాను! నైవేద్యం వద్దనరాదు కదా..?

‘దళారుల్ని పెంచి పోషిస్తున్నారు కదా..?’ మంగమ్మ గంగవెర్రులెత్తి చూసింది!

‘వాళ్ళు అడుపు లేదు, వీళ్ళు తుడుపు లేదు, అందరి పోషణ భారము నాదే కదా..?’ అన్నాను.

‘మరి.. లడ్డూ.. ప్రత్యేక లడ్డూ.. విశిష్ట లడ్డూ.. యిన్ని తేడా లెందుకు..?’ పద్మమ్మ పరాకున అడగలేదు, పట్టించే అడిగింది!

‘భక్తీ వ్యాపారమయ్యే కొద్దే.. భగవంతుడికి విలువ!’ అని నవ్వాను. నవ్వడం మరచినట్టు నా సతులు. ‘నన్ను ధనిక దేవుణ్ణి చేసారు’ దీర్ఘంగా ఆలోచిస్తూ అన్నాను!

‘మనకొచ్చే ఆదాయం వల్లే మిగాతా దేవుళ్ళ గుడుల్లో గూట్లో దీపాలు వెలుగుతున్నాయి!’ అన్నారు మంగావతీ పద్మావతీ!

నా మౌనం చూసి యేమనుకున్నారో సతులిద్దరూ లడ్డూ నా చేతిలో పెడదామని చూస్తే వొక్క లడ్డూ కూడా లేదు! బిడ్డికిలు, అట్టికలు, దాకలు, దోకిలు, కడవలు, గూనలు, అండీలు సరి.. అండాలూ డేక్సాలూ బోనుపెట్టే కాదు, గదులన్నీ గాలించారు! వుట్టిమీది సట్టిలన్నీ వెతికారు! పళ్ళేలన్నీ బోర్లించారు! రుచి మరిగిన పెద్దలు వెనక ద్వారం ద్వారా లడ్డూలు సంచులకి సంచులు మోసుకు వెళ్తుంటే ముగ్గురం మూగవాళ్ళలా చూసాం! చూస్తే అనామక భక్తులకి లడ్డూలు లేవు! అదీసంగతి.. అందుకే నాకూ లడ్డూలు లేవు! భక్తుడికి లేనిదేదీ భగవంతుడికీ వుండదని భాగస్వామినులు యిద్దరూ అర్థం చేసుకున్నట్టే వున్నారు!

‘రోజుకు లక్షన్నర లడ్లు చేసినా దొరక్కపోవడమేమిటి?’ భక్తులు మనసులో అనుకున్నమాటలు మా చెవుల్లో పడ్డాయి! మా చూపులు భక్త జనంలోకి వారి యిల్లలోకి చొరబడ్డాయి!

సంచులకొద్దీ లడ్డూలు పట్టుకుపోయిన వాళ్ళు నాలుగేసి లడ్డూలు పంచుతున్నారు. వొక్క లడ్డూ దొరికిన వాళ్ళు అదే చిదిపి ముక్కలు చేసి పంచుతున్నారు. కొద్దిమంది నాలుగేసి లడ్డూలు వొక్కడే తింటూ వుంటే.. మరికొద్దిమంది నాలుగు రవ్వలూ పిసర్లూ నలుగురూ పంచుకు తింటూ వున్నారు!

మర్మమేమిటి అన్నట్టు చూసారు మా మగువలు!

అడక్క పోయినా అర్థం చేసుకున్న వాణ్ని! అందుకే అడగకనే చెప్పాను!

‘లడ్డూ మహా ప్రసాదం! ప్రసాదమేదయినా మహా ప్రసాదమే! ప్రసాదం ప్రజలందరికీ సమానమే! అందుకే అందరూ సమంగా పంచుకు తినేది! వొకరికి యెక్కువ మరొకరికి తక్కువ లేకుండా వుండేది! పెద్దవాళ్ళకి యెక్కువ చిన్నవాళ్ళకి తక్కువ అనేదే లేదు! లింగ భేదం లేదు! జాతి భేదమూ లేదు! అలా చేస్తే.. అది గుడి కాదు! ఆ గుడిలో దేవుడు వుండడు!’

మగువలిద్దరూ మౌనం వీడ లేదు!

‘నేనప్పుడూ యిప్పుడూ యెప్పుడూ రాయినే!’

నా మాటకు నా అమ్మలిద్దరూ కళ్ళలో కడివెడేసి నీళ్ళు నింపుకున్నారు.. నన్ను గట్టిగా పట్టుకున్నారు..!

‘ప్రసాదం అందరిదీ. ప్రసాదం అంటే లడ్డూ కాదు. ప్రసాదం అంటే గాలీ నీరూ నేలా. గింజా గంజీ. అన్నమూ వస్త్రమూ. పండూ కాయా. వసతీ వనరూ. సంపదా సకలమూ. సమస్తమూ. అన్నీ అంతా. సమంగా సమ సమంగా పంచుకోవాలి. అప్పుడే ప్రసాదం రుచి! ప్రసాదం తిన్న బతుకూ మెతుకూ రుచి! లేదంటే కాదంటే అదెప్పటికైనా అరుచే!’

‘మరి లడ్డూ అందరిదీ అవుతుందా..?’ పద్మావతి అంటే, ‘లడ్డూ అందరూ అందుకుంటారా..?’ మంగావతి అంది.

‘లడ్డూ మీద హక్కు అందరిదీ. దక్కని వాళ్ళు మొదట బతిమాలుతారు. దక్కకపోతే కొన్నాళ్ళకి తిరగబడి బలవంతంగా లాక్కుంటారు. లడ్డూ లేకుండా అయితే వుండనే వుండరు..!’

నా మాటలకు మా ముద్దుగుమ్మలిద్దరూ ముచ్చట పడ్డారు! అందరికీ లడ్డూలు దొరకాలని ఆశ పడ్డారు! అలాగని దీవించేసారు కూడా! యిక మీదే ఆలశ్యం! చేరుకోండి మీ లక్ష్యం!

మా యింట్లో జరిగిన యీ లడ్డూల కథ మీకు చెపితే – మీరు మీ యింటింటా కథలు కథలుగా చెప్పుకుంటే – చెయ్యాల్సిందేదో చేస్తే – మీ కథ మారుతుందని చెప్పాను! అయ్యో లేదుకదా అని దయతో జాలితో యెవరూ లడ్డూ యివ్వరు. ఎవరి లడ్డూ వాళ్ళే సంపాదించుకోవాలి!

భక్తులారా.. మీకు లడ్డూలు పంచలేకపోతున్నందుకు ఈ భగవంతుణ్ణి క్షమించండి!

యిట్లు

మీ

ఏడుకొండల వెంకటేశ్వరస్వామి

  మహేష్ బాబు

 

 

ఆరోజు సాయంకాలం క్లాసుకి వెళ్ళేసరికి రోజూ కంటే క్లాసు ఎక్కువ సందడిగా ఉంది. నాకు అర్థం అయింది, క్లాసులోకి మరో క్రొత్త విద్యార్థి వచ్చిచేరినట్టు. అది మామూలే. ఎవరైనా క్రొత్తగా క్లాసుకి రావటం మొదలుపెడితే అప్పటికే క్లాసుకి వస్తున్న వాళ్లు క్రొత్త వాళ్లని తమలోకి ఆహ్వానిస్తూ, వాళ్లని అనేక ప్రశ్నలతో ఊదరగొట్టేస్తారు. తమ సీనియారిటీని వాళ్లకి అర్థం అయ్యేలా చేసే ప్రయత్నం చేస్తారు. ఒక రకంగా మన ప్రొఫెషనల్ కాలేజీల్లో ‘ర్యాగింగ్’ హడావుడి లాటిదే. కాకపోతే అది ప్రమాదకరమూ, ఇబ్బందికరమూ కాకుండా అమాయకమైన అల్లరే ఎక్కువ కనిపిస్తుంది వాళ్ల వయసుకు తగినట్టుగా.

అటెండెన్స్ తీసుకుంటూ, క్రొత్త కుర్రాడిని ‘ నీ పేరేమిటి?’ అని అడిగాను. ఆ పిల్లవాడు చెప్పేలోపు మిగిలిన వాళ్లు ఒక గుంపుగా కలిసి చెప్పేసారు,’ మహేష్ బాబు టీచర్’ అంటూ. ఆ పిల్లవాడు నవ్వుతూ నిలబడ్డాడు. నాకూ నవ్వొచ్చింది.

తెలుగు సినిమా హీరోల పేర్లు చాలానే వినిపిస్తున్నాయి ఈ పిల్లల్లో. కొందరైతే ఒక్కోసారి , ‘టీచర్ , నేను పేరు మార్చుకున్నాను’ అంటూ ఒక హీరో పేరు చెబుతుంటారు.

‘ అలా ఎప్పుడుపడితే అప్పుడు మార్చుకోకూడాదు. స్కూల్లో ఒక పేరు ఉంది కదా’ అంటే ‘అయితే ఇంటి దగ్గర, ట్యూషన్ లోనూ ఈ పేరు పెట్టుకుంటాను టీచర్ ‘ అంటుంటారు.

ఆ పిల్లవాడికి ఒక పదమూడేళ్లు ఉంటాయేమో! ‘ ఏం చదువుతున్నావ్?’ నాప్రశ్నకి,

‘ ఐదు’ అన్నాడు వాడు. వాడి ముఖకవళికలు కొంచెం ప్రత్యేకంగా ఉన్నాయి. కళ్లు విశాలంగా ఉండి, ఆ ముఖానికి నోరు, ముక్కు, చెవులూ కూడా పెద్దగానే ఉన్నట్టున్నాయి. మహేష్ బాబుకి  రెండుచేతులకీ ఆరు, ఆరు వేళ్లు ఉన్నాయని అప్పటికే అందరూ నాకు చెప్పేసారు.

వాడు స్కూల్లో ఈ మధ్యే కొత్తగా చేరిన పిల్లాడని గుర్తుపట్టాను. స్కూల్లో వారం రోజులుగా జరుగుతున్న ఆటల పోటీల్లో అన్నింటిలోనూ వాడే ముందున్నాడు. స్టాఫ్ రూమ్ లో వాడి గురించిన చర్చ జరిగింది కూడాను నిన్న లంచ్ సమయంలో. ఈ సంవత్సరం జిల్లాలో జరిగే అన్ని ఆటల్లోనూ స్కూల్ తరఫున వాడు బోలెడు బహుమతులు గెలవటం ఖాయమని అందరూ అన్నారు.

ఒకరిద్దరు టీచర్లు చెబుతున్నారు వాడు నిరంతరం నవ్వుతూనే ఉంటాడని. వాడిదొక ప్రత్యేక లోకం అన్నట్టు , అందులో ఏదో ఒక ఆనందం అనుభవిస్తున్నవాడిలా నవ్వు కుంటూనే ఉంటాడనీ. ఎక్కడో మారుమూల పల్లె నుంచి వచ్చాడని తెలిసింది.

‘తెలుగు అక్షరాలు చదువుతావా?’ అని అడిగితే ‘చదువుతాను ‘ అన్నాడు.

‘ ఇంగ్లీషు అక్షరాలు చదువుతావా” అంటే ‘చదువుతాను’ అన్నాడు. వాడు జవాబు చెబుతున్నప్పుడూ నవ్వుతూనే ఉన్నాడు. వాడి నవ్వులో అమాయకత్వం చూస్తున్నాను. వాడి నవ్వు చూసి పిల్లలందరూ నవ్వటం మొదలు పెట్టారు.

అక్కడికొచ్చే పిల్లల్లో చాలామంది తెలుగు అక్షరాలు గుర్తు పట్టలేరు. వాళ్లు చదువు తున్నది  ఎనిమిదో తరగతి అయినా, తొమ్మిదో తరగతి అయినా ఇదే పరిస్థితి. ఇంగ్లీషు అంటే చాలా భయం అని ముందే చెప్పేస్తారు. రోజూ స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ అని చెప్పి అచ్చుపుస్తకంలోంచి నోట్ పుస్తకంలోకి ఒకటి, రెండు పేజీలు రాస్తుంటారు. రాసేది చదవ మంటే చదవలేమని స్పష్టంగా చెప్పేస్తారు.

అందుకే ముందు వాళ్లకి అక్షరాలు, గుణింతాలు నేర్పే పని పెట్టుకున్నాను. వాళ్లని తప్పులు లేకుండా తెలుగు, ఇంగ్లీషు చదివేలా తయారు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.

రోజూ క్లాసు మొదలు పెడుతూనే కొన్ని తెలుగు మాటలు, ఇంగ్లీషు మాటలు డిక్టేషను ఇచ్చి రాయించే అలవాటు చేసేను. ఆ తర్వాతే క్రొత్త పాఠం, ఎక్కాలు, కొన్ని బేసిక్ లెక్కలు చెప్పి చేయిస్తుంటాను.

‘ డిక్టేషన్ రాద్దురుగాని, పుస్తకాలు తియ్యండి ‘అన్నాను.

‘ మహేష్ బాబూ, నువ్వు కూడా డిక్టేషన్ రాయాలి. పుస్తకం తియ్యి’ అంటూ మిగిలిన పిల్లలు వాడిని తొందర చేసేరు.

అందరూ పుస్తకాలు తీసేరు.

గుమ్మం బయట ఎవరో నిలబడినట్టు కనిపించి బయటకొచ్చి ‘ ఎవరంటూ’ వివరం అడిగాను. ఆమె ని చూస్తుంటేనే అర్థమైంది మహేష్ బాబు తల్లి అయిఉంటుందని.

ఆమె చెబుతోంది, ‘క్రొత్తగా గూడెం లోకి వచ్చామనీ, మహేష్ బాబు చదువులో వెనక పడ్డాడనీ, ఆ పిల్లవాడిని కాస్త శ్రధ్ధ తీసుకుని చదివించమని’ చెప్పింది. ‘ అమ్మా, తండ్రి లేని పిల్లడమ్మా. ఆయన లారీ ప్రమాదంలో చనిపోయిన తర్వాత చాలా బెంగ పెట్టుకున్నాడు. అయితే హుషారుగానే ఉంటాడు. ఏదీ బుర్రకి ఎక్కనట్టు ఉంటాడు. బెంగ చెప్పుకోలేక ఇలా తయారయాడని అనిపిస్తాంది. అందుకే ఆ ఊరొదిలి ఇక్కడికి తీసుకుని వచ్చేసాను’. ఆమె దీనగాథ మనసుని చెమర్చింది.

నేను ‘ సరే’ అనటంతో, ‘నమస్కారం అమ్మా’ అంటూ వెనక్కి తిరిగింది.

క్లాసులోకి వచ్చి డిక్టేషన్ ఇవ్వటం మొదలు పెట్టేను. ముందు కొన్ని తేలిక మాటలు చెప్పి , ఆఖరున నాలుగైదు కొంచెం కష్టమైన పదాలు ఇస్తుంటాను. క్లాసు మొత్తం తిరుగుతూ చూస్తున్నాను. అందరూ రాస్తున్నట్టే కనిపించారు. కాని ఎంతవరకూ తప్పుల్లేకుండా రాస్తారనేది చెప్పటం కష్టమే. ఇదివరకటి కంటే కాస్త మెరుగైన ఫలితం కనిపిస్తోంది కాని అది కొద్ది మందిలో మాత్రమే చూస్తున్నాను. ఇంకా చాలా కష్టపడాలి పిల్లలు, నేను కూడా.

ఇంకా ఒకటి, రెండు పదాలు చెబితే పూర్తవుతుంది. మహేష్ బాబు వైపు చూస్తున్నాను. వాడు ఏమీ రాస్తున్నట్టు లేదు. వాడి పక్కనున్న పిల్లలు ‘ఏదీ రాస్తున్నావా? చూబించు’ అంటూ వాడి మీద పెత్తనం చేస్తూ, వాడి పుస్తకంలోకి చూసే ప్రయత్నం చేస్తున్నారు. వాడు మాత్రం అదే నవ్వు ముఖంతో ఉన్నాడు, కాని తన పుస్తకాన్ని వాళ్లెవరికీ అందనియ్యటం లేదు.

నాకు అనుమానం వచ్చింది వాడు రాస్తున్నాడా లేదా అని. ఏదో చెప్పటం అయితే చెప్పేసాడు, చదవటం వచ్చనీ, రాయటం వచ్చనీ. డిక్టేషను పూర్తి చేస్తూనే,

‘ మహేష్ బాబూ, నువ్వు రాసేవా? ఇలా పట్రా నీ పుస్తకం’ అన్నాను

వాడు నవ్వుతూ లేచి నిలబడి ‘ లేదు టీచర్. నాకు రాయటం రాదుగా ‘ అన్నాడు.

నాకు కాస్త అసహనం కలిగిన మాట నిజమే కాని అతని గురించి తల్లి చెప్పిన వివరం మనసులో మెదులుతోంది. అడిగితే చదవటం వచ్చని చక్కగా చెప్పాడు, ఇప్పుడేమో రాయటం రాదని చెబుతున్నాడు.

ఒక్క అక్షరం రాయలేదు. అతని పక్కన కూర్చున్న కిషోర్ చెబుతున్నాడు, ‘ నేను చూసేను టీచర్, వాడు ఏం రాయలేదు’ కిషోర్ని ఆగమని చెప్పాను.

నిరీష పెద్దగా చెప్పింది, ‘చూడండి టీచర్ , ఏమీ రాయకపోయినా ఎలా నవ్వుతున్నాడో ‘

మహేష్ బాబు నిరీష కేసి చూస్తున్నాడు. ఏమీ రాయకపోతే నవ్వకూడదా? అన్నట్టు న్నాయి వాడి చూపులు.

నిరీష మాటలకి, అప్పుడనిపించింది నా అసహనం న్యాయమైనది కాదని. వాడి అమాయకమైన ముఖం చూస్తే నాకే ఎందుకో తప్పు చేసినట్టనిపించింది. వాడు రాయలేకపోవటానికి, వాడి నవ్వుకీ సంబంధం ఏమిటి?

ప్రపంచంలోని ఏ సమస్యా అంటనట్టు వాడుంటే నిరీషకి కానీ, నాకు కానీ సమస్య ఏమిటి? ఆ నవ్వు వాడి చుట్టూ ఒక స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టిస్తోంది. అశాంతి, అరాచ కాల మధ్య జీవిస్తున్నఈ ప్రపంచానికి ఒక సానుకూల వైఖరిని నేర్పిస్తున్నట్టున్న వాడికి కృతజ్ఞత చెప్పద్దూ?

వాడిలో ఘనీభవించిన దుఃఖం నుండి వాడిని ముందు బయట పడెయ్యాలి. ఆ నవ్వు

పూసే వెలుగు దారులతోనే ప్రపంచాన్ని గెలిచేందుకు వాడిని సిధ్ధం చెయ్యాలి అనుకున్నాను.

 

***************

 

 

 

 

కేవలం సింపతి?!

 

– చైతన్య పింగళి

~

                రోహిత్ మీద రాసిన ఈ కథ కేవలం సింపతి ఉన్న కథ!

సాక్షి కథల పోటీలో వెంకట్‌సిద్ధారెడ్డి రాసిన ‘

’  కథ మొదటి బహుమతి గెలుచుకుంది. అందుకు అభినందనలు. ఈ కథని ఆదివారం ప్రత్యేక సంచిక కవర్‌పేజిగా కూడా వేశారు. అందుకు కూడా అభినందనలు.

రోహిత్‌వేములకి సంబంధించిన కథ అవటం వల్లా, ఆదివారం ప్రత్యేక సంచిక కవర్‌పేజిగా ఈ కథ వేయటం వల్ల,  చాలా మంది అగ్రకులస్థులతో పాటుగా ఒకరిద్దరు ఉద్యమకారులు కూడా దీన్ని గురించి ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టుల  వల్ల.. ఈ కథ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది. కథని నడిపించిన తీరు, శైలికి చాలా ప్రశంసలే వచ్చాయి. ఒక యాక్టివిస్ట్‌గా, రచయితగానీ, వ్యాసకర్తగానీ.. ‘ఇంతకీ ఏం చెబుతున్నారు?’ అని చూస్తాను కాబట్టి–వాటి జోలికి నేను పోవటం లేదు. వ్యక్తిగా వెంకట్‌గారి మీద చేస్తున్న విమర్శ కాదు ఇది. ‘రోహిత్‌’ విషయాన్ని చాలా మంది అర్ధం చేసుకుంటున్న తీరు గురించి.. ఈ కథ నేపధ్యంలో మనం చర్చించాల్సిన అవసరం ఉంది.

రోహిత్‌వేముల కంటే ముందు, ఆ తర్వాత కూడా అగ్రకుల  ఆధిపత్యం కిందా, పెత్తనం కిందా ఎందరో దళితులు¬ దిక్కు మొక్కు లేకుండా నలిగి నాశనమయ్యారు. అవుతున్నారు. చంపబడ్డారు. దళిత వాడలు ఊచకోత కోయబడ్డాయి. ఎందరో దళిత స్త్రీలు రేప్‌కి గురికాబడ్డారు. అదే సెంట్రల్  యూనివర్సిటీ లో చాలా మంది దళితులు ఆత్మహత్య చేసుకున్నారు. మాటల్లో చెప్పలేని పైశాచిక, వికృత హింసని ఎదుర్కొన్నారు, ఎదుర్కొంటున్నారు.

ఇవి ఏవీ కూడా- అగ్రకులాలని రోహిత్‌వేముల ఆత్మ‘హత్య’ కదిలించినంతగా కదిలించలేదు. కారణం– ఆ ఉత్తరంలో ప్రతిఫలించిన అతని మేథస్సు, అంతకంటే ముఖ్య కారణం– రోహిత్‌తన చివరి లేఖలో ఎవరీనీ తన చావుకు బాధ్యుల్ని చేయకపోవటం. విసి అప్పారావుని కానీ, దత్తాత్రేయను కానీ, స్మృతి ఇరానీని కానీ, చివరికి సుశీల్‌కుమార్‌పేరును అయినా సరే.. అతని ఉత్తరంలో రాసి ఉంటే– రోహిత్‌కి సవర్ణుల నుండి ఏమాత్రం మద్దతు వచ్చేదో మనం ఊహించగలిగేదే.

ఈ కథలో కూడా సరిగ్గా ఇదే ప్రతిధ్వనించింది. ఇందులో నాయకుడు సినిమా హీరోలా డెనిమ్‌జీన్స్,  రౌండ్‌నెక్‌టీ షర్టు వేసుకుని లైబ్రరిలోకి ఉత్సుకతతో వస్తుంటాడు. స్కాలర్‌షిప్‌డబ్బుని ఇల్లు గడపటానికి పంపిన రోహిత్‌ని రొమాంటిసైజ్  చేసి చూపించటంలో ఇబ్బంది ఉన్నా సరే, తప్పేం లేదు కాబట్టి ఏమీ అనలేం. కానీ కథ చివర్లో.. రోహిత్ చనిపోటానికి వెళ్తున్నప్పుడు.. భారతి అతన్ని ఆపటానికి ప్రయత్నిస్తుంది. వారి మధ్య జరిగిన సంభాషణలో.. మూడు ముఖ్యమైన ప్రశ్నలు ఆమె అడుగుతుంది.

res

మొదటిది– ‘బర్త్ సర్టిఫికెట్‌నుండి కులం తీసేస్తే..?’ అని. ‘దాని వల్ల ఉపయోగం లేదు, మనుషుల మనసుల్లో నుండి కులం పోవాలి’ అని అతను సమాధానం ఇస్తాడు.

సర్టిఫికెట్ల నుండి కులం తీసేయటం అనేది కథలోనే కాదు.. బయట ఉన్న చాలా మంది ‘మంచి’ సవర్ణులు కుల నిర్మూలన కోసం చెప్పే ఒక చిట్కా. ‘నీకు చొక్కా ఉంది, నాకు చొక్కా లేదు కాబట్టి, మనం ఇక చొక్కా గురించి మాట్లాడుకోవద్దు’ అన్నట్టు ఉంటుంది ఈ మాట.

సర్టిఫికెట్లలో కులం ఉండేదే, కుల నిర్మూలన  దిశగా ఒక అడుగు అనే అవగాహన ఉండదు. ఈ కథలో భారతి కూడా అమాయకంగా అలాగే అడిగింది. ఆమె అలా అడగటం పట్ల నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈ భారతి సోకాల్డ్  అగ్రకుల ‘భారతమాత’లా చిత్రీకరించారు కాబట్టి ఆమె అలా అడగటం సహజమే.

కానీ.. రోహిత్‌తో చెప్పించిన సమాధానం.. అసలు సమస్య. నీరు ఆవిరి అయినంత సహజంగా, మనుషుల మనసుల్లో నుండి పోయేదా కులం? దీన్ని అంగీకరిస్తే.. స్త్రీ రిజర్వేషన్లు, సమాన వేతనాలు, నియమిత పనిగంటలు.. అసలు ఒకటేంటి.. దేని గురించి ఎవరు ప్రశ్నించినా.. సరే, రోడ్డు మీదకొచ్చినా సరే.. ముందు మనుషులు  మారాలి అని ఒక తాత్విక స్టేట్‌మెంట్‌ఇస్తే సరిపోతుంది. ఈ మనషులు  మారాలి, మనసు తేటపడాలిలాంటి మాటలు.. వ్యక్తిని కార్యాచరణ నుండి దూరం చేసే మాటలు. హ్యూమన్‌డిగ్నిటి, గౌరవం లేకపోవటం.. అనే రెండు హార్డ్‌రియాలిటిస్‌కి.. ‘మనసుల్లో నుండి పోవాలి’ అనే  ఒక అభౌతికమైన సమాధానం చెప్పటం న్యాయమా? పైగా ఈ మాట అనిపిస్తోంది.. ‘బర్త్ సర్టిఫికెట్‌నుండి కులం తీసేస్తే..?’ అనే భావజలం మీద సంవత్సరాలు పొరాడిన ఒక ఫైటర్‌అయిన రోహిత్‌తో! అదే అసలు సమస్య.

‘మనస్సు నుండి కులం  పోవాలి’ అని సాధారణంగా ఎవరు అంటారు? కుల వ్యవస్థ వల్ల ప్రయోజనాలు, ఆధిపత్యాలు, అవకాశాలు పొందుతున్న అగ్రకులస్థులు అంటారు. కారంచేడులో, చుండూరులో దళితుల్ని నరికేసిన విషయం గుర్తు చేస్తే.. ‘ఈ కులం అనేదే పోవాలండి’ అంటారు. అంతకుదాటి, కార్యాచరణలోకి కానీ, ఆ విషయాల మీద పోరాడుతున్న వారికి సంఫీుభావం తెలపటంలోకానీ.. ముందుండరు. ఎందుకు? సవర్ణులకి  అంతవరకే కన్వీనియంట్‌కాబట్టి. చివరికి రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్న మనిషిని అడిగి చూడండి.. ‘మనుషుల మనసుల్లో నుండి కులం  పోవాలి’ అని చక్కగా ఒప్పేసుకుంటాడు. కులం  ఎలా పోవాలి? కులనిర్మూలనకి మనం చేయాల్సిన పని ఏంటి? కార్యాచరణ ఏంటి? లాంటి సీరియస్‌ప్రశ్నల  జోలికి వెళ్తే.. ఆ మనిషి ‘గాయబ్‌’. అనుమానం ఉంటే.. ‘మంచి సవర్ణుల’ మీద టెస్ట్ చేసి చూడండి.

మనుషుల మనస్సులో నుండి కులం పోవాలి అని  ఏ పాత్రతో అయినా, చెప్పిచ్చి ఉంటే.. అభ్యంతరం ఉండేది కాదు. కానీ.. ఈ  మాట  చెబుతోంది.. రోహిత్‌! కులనిర్మూలన కోసం కులసంఘలుగా సంఘటితమవ్వాల్సిన అవసరన్ని.. తెలిసి.. అంబేడ్కర్ పేరు మీద ఉన్న, ‘అంబేడ్కర్ యువజన సంఘం’ లో  పని చేసిన రోహిత్ అంటాడు! వెలివేత అనే అబ్సోల్యూట్  రియాలిటికి గురి అయిన, ఒక కుర్రాడు అంటూన్నాడు! పైగా మామూలు కుర్రాడు కాదు.. కులనిర్మూలనా పోరాటానికి ఇప్పుడు ఒక చిహ్నంగా మారిన కుర్రాడు అంటున్నాడు!!

ఇక భారతి అడిగిన రెండో ప్రశ్న. ‘అంబేద్కర్‌తో ఎనిహిలేషన్‌ఆఫ్‌క్యాస్ట్‌స్పీచ్‌ని మళ్ళీ ఇప్పిస్తే.. అది విని అందరూ మారిపోతే..’ అని. అప్పుడు రోహిత్‌చెప్పే సమాధానం.. ఆయన ఒక్కడి వల్లే అయ్యుంటే.. ఇప్పుడీ పరిస్థితి ఉండేది కాదు అని. ఇది రోహిత్‌ సమాధానం!

కుల నిర్మూలన మీద అంబేద్కర్‌ఉపన్యాసాన్ని రద్దు చేసింది.. దానిలో ఉన్న కంటెంట్‌వల్ల. వేదాలు, పురాణాలు, ఇతిహాసాల మూలాల్లోకి వెళ్ళి, కుల ఆధిపత్యాన్ని ప్రశ్నించటం వల్ల. ముఖ్యంగా.. కులం  పునాదుల  మీద నిర్మాణం జరిగి, ఆ పునాదులు  లేకపోతే రూపాన్ని కోల్పోయే హిందూ మతాన్ని వదిలేస్తాను అని అంబేద్కర్  తేల్చి చెప్పటం వల్ల. ఆ ఉపన్యాసాన్ని ఇప్పుడు ఇప్పించే పరిస్థితి ఉందా అసలు. ‘దమ్ముందా?’ అని అడగటం నిజానికి సరైన ప్రశ్న. మన విద్యా పీఠాల్లో, సిలబస్‌నిర్దేశించే కమిటీల్లో.. ‘మంచి’ బ్రాహ్మణులు, ‘మంచి’ సవర్ణులు  కాక, కుల వ్యతిరేకత ఉన్న మనుషులు ఉండి ఉంటే.. అంబేద్కర్‌కి మంచి నీళ్ళివ్వని జాలి కధ బదులు.. ‘కుల నిర్మూలన’ పాఠ్యాంశం అయి ఉండేది. ‘ఇది’ కథలోని భారతికి కూడా అవగాహన లేదు కాబట్టి.. పాపం సాదా సీదాగా, ఏం కుట్రకుతంత్రం లేకుండా.. ఈ ప్రశ్న అడిగింది అనుకోవచ్చు.

ఇక్కడ మళ్ళీ సమస్య.. రోహిత్ తో  చెప్పించిన సమాధానం. ‘ఆయన ఒక్కడి వల్లే అయ్యుంటే.. ఇప్పుడీ పరిస్థితి వచ్చుండేది కాదు’. హమ్‌మ్‌. రోహిత్‌ని దగ్గరగా కాదు, అతని ఫేస్‌బుక్‌పోస్టుని చూసిన వారు కూడా.. ఇటువంటి సమాధానం అతను చెప్పడని చాలా ఈజీగా చెప్పేయగలరు. గాంధీ ఒక్కరి వల్లే స్వతంత్రం రాలేదు అని పోట్లాడే వాళ్ళలాగా.. ‘అంబేద్కర్‌ఒక్కడి వల్లే, కులం మీద అవగాహన రాలేదు. కులం ఎప్పుడు పుట్టిందో, కుల నిర్మూలన  పోరాటం కూడా అప్పటి నుండే పుట్టింది’ అనే ‘లిబరల్స్‌’ని చిన్నప్పటి నుండి చూస్తున్నాను.

సమసమాజాన్ని సాధించటానికి శాస్త్రీయ పద్థతిలో ఒక దారిని చెప్పింది మార్క్స్‌ఒక్కరే. అలాగే  అంబేద్కర్‌కూడా ఒక్కరే. మశూచి అనే రోగం వచ్చినప్పుడే, కాల్చి వాత పెట్టటం దాని మందు.. అనే విధానం కూడా రోగ నివారణ పద్ధతిగా ఉండేది. ఆ తర్వాత తర్వాతే దానికి వ్యాక్సిన్‌ని కనుగొన్నారు. కులం ఏర్పడినప్పటి నుండే, కుల నిర్మూలనా పద్ధతులు ఉన్నాయి అనేది కూడా.. ఈ నాటు వైద్యం లాంటిదే. కులాన్ని ఒక శాస్త్రీయ విధానంలో అధ్యయనం చేసి, ఆ రోగానికి మందు కుదర్చటానికి ఏం చేయాలో చెప్పింది.. అంబేద్కర్‌ఒక్కరే. అంబేద్కర్‌ని దేవుడిని చేసి, అయన విమర్శకు అతీతుడు  అని నేను అనటం లేదు. కుల అసమానతలు అనేవి ఎంత లోతుగా వేళ్ళూనాయో, సమాజానికి అవెంత అపాయమో.. శాస్త్రీయ పద్ధతిలో చెప్పింది.. అంబేద్కర్‌ఒక్కరే అంటున్నాను. ఆయన ఆ పని చేయబట్టి, ‘బండి’ ఇక్కడి దాకా వచ్చింది అంటున్నాను. అంబేద్కర్‌పట్ల అయిష్టత ఉన్న సవర్ణులు, ఆయనకి ధీటుగా చాలా మందే ఉన్నారు అని గుచ్చి గుచ్చి చెబుతుంటారు. అది నిజమే కూడా. కానీ ఒక ఎలాబరేటడ్‌సమాధానంలో ఉండాల్సిన విషయాన్ని, కుదించి ఒక్క మాటలో ఆయన ఒక్కరి వల్లే కాదు అని తేల్చి చెప్పటం అభ్యంతరకరం. కథ బ్రివిటి కోసమయినంత మాత్రాన.. సిద్ధాంత విషయంలో అక్షరం తూలకూడదు.

ఇక భారతి అడిగే మూడో మాట.. వేదాలు , పురాణా ల మూలాల్లోకి వెళ్తాను అని. ‘కులనిర్మూలన’ అధ్యయనం చేసి ఉంటే, మూడో మాట వచ్చేదే కాదు. వేదాలు, పురాణాల  విషయాల్ని అంబేద్కర్‌కూలంకషంగా ‘కులనిర్మూన’లో చర్చించాడు.

చివర్లో.. ఈ కథకి ఇది ముగింపు కాదు అని భారతి, చనిపోటానికి వెళ్తున్న రోహిత్‌తో అంటే.. ‘నాది కథ కాదు, జీవితం’ అంటాడు. డెభ్భైు, ఎనభై దశకాల్లో అన్యాయానికి గురి అయిన సినిమా హీరోయిన్‌డైలాగ్‌లా ఉంది ఈ మాట.

ఒక మనిషిని.. తింటానికి తిండి, ఉంటానికి చోటు లేకుండా చేసి.. అనాగరికంగా వెలివేసి.. ఊపిరి ఆడనీయకుండా చేసి.. రక్తం అంటకుండా చేసిన హత్య ఇది. ఆత్మహత్య రూపంలో జరిగిన ఇన్‌స్టిట్యూషనల్‌మర్డర్‌అని అంతర్జాతీయంగా అందరూ మొత్తుకుంటోంది.. ఇందుకే. క్రైమ్‌ని గుర్తించాలని. కానీ.. ఈ కథలో ఆ ఆగ్రహాన్ని, ఆవేశాన్ని, అన్యాయాన్ని.. ఎస్టాబ్లిష్‌చేయకుండానే.. రోహిత్‌పేలవంగా, ఏ కులానికి నొప్పి కలిగించని డైలాగులు చెప్పి ‘వెళ్ళిపోయాడు’! కానీ.. వాస్తవంలో రోహిత్‌అలా లేడు. పోరాటం చేశాడు. ఖాళీ కడుపుతో ఆ యూనివర్సిటి నేల మీద పడుకుని.. ఆకాశం చూస్తూ.. ఆ దుర్మార్గాన్ని ఎదుర్కొన్నాడు. అగ్రకుల ఆధిపత్యాన్ని కాలరు పట్టుకుని గుంజి మరీ, అడిగాడు. చివరి అస్త్రంగా, తన శరీరాన్ని వాడాడు.

రోహిత్‌బతికి ఉండి.. ఈ పోరాటాన్ని చేసుంటే.. సవర్ణుల  నుండి ఇంతటి మద్దతు వచ్చేది కాదు. ఈ కథలో కూడా మనసుల్లో నుండి కులం పోవాలి అని కాకుండా, కాస్త గట్టిగా.. కాస్తంత గట్టిగా.. ‘నువ్వు నా సమానత్వం గుర్తించటం లేదు కాబట్టి.. అనో.. నువ్వే నా హత్యకు బాధ్యుడివి అనో.. ’ ఇలాంటి ఫీలింగ్‌ఏమన్నా.. పాఠకునికి తగిలి ఉంటే.. ఈ కథని.. అచ్చొచ్చొ అని అంతమంది అగ్రకులం  వాళ్ళు నెత్తికెత్తుకునే వాళ్ళు కాదు.

కులం అనేది జలగలా ఎలా రక్తాన్ని పీలుస్తుందో తెలిస్తే చాదు.. చందమామ కథల్లో దెయ్యాల  మాదిరి ఎన్ని మారు వేషాల్లో రాగలదో.. ఎంత సోఫిస్టికేటడ్‌లెవల్స్‌లో పని చేయగలదో.. గుర్తించగలగాలి. ఈ సమస్యని గుర్తించకపోటమే పెద్ద సమస్య. కులం మీద పోరాటం ఎంత కన్వీనియంట్‌గా ఉంటే సవర్ణులు అంత ఎక్కువ గుర్తిస్తారు. ఇష్టపడతారు. ఈ కథలో అదే జరిగింది. రోహిత్ మీద కథ వచ్చిన ఆనందం లో .. రోహిత్ నోట  అగ్రకుల భావజాలన్ని చెప్పించటాన్ని.. నిర్లక్ష్యం చేయకుడదు. ఇది రోహిత్‌విషయంలో ఒక సింపతి కలిగిన కథ మాత్రమే. రోహిత్‌మీదా , అతను ఎదుర్కొన్న సవాళ్ళ మీద, అతను ప్రాతినిధ్యం వహిస్తున్న అంశాల మీదా.. ఎంపతి కాని, రెప్రజంటేషన్ కాని కలిగిన కథ కాదు. దళితులు, దళిత సాహిత్యము.. సింపతి కోరుకోటాన్ని దశాబ్దాల  క్రితమె దాటారు.  ఇప్పుడు సమానాత్వాన్ని గుర్తించమని అడగటం అనే  పరిధిని కూడా దాటి సమానాత్వాన్ని అంగీకరించమని చెప్పే  స్థాయికి  వచ్చారని సాహిత్యకారులు అర్ధం చేసుకోవాలి.

– చైతన్య పింగళి

 

 

 

*

(చిత్రాలు: అన్వర్ – సాక్షి సౌజన్యంతో)

మంచి పుస్తకానికి తోడూ నీడా!

 

 

-సుజాత 

~

 

నవోదయ షట్టర్లు దించేశారనే వార్త “ది హిందూ” లో చూసి అక్కడ పుస్తకాలు కొని ఉన్న వాళ్లమంతా ఉలిక్కి పడి విషాదంలో మునిగి పోయి ఫేస్బుక్ గోడల మీద విచారాలు వ్యక్తం చేశాం మూకుమ్మడిగా !

వార్తలో చివరి లైన్లోని ముక్కలు (షాపు వెనక సందులో చిన్న షాపు తీసుకుంటున్నామనీ, అక్కడ పుస్తక విక్రయం కొనసాగుతుందనీ) కాస్త సందేహాన్ని మిగల్చడం తో ,దాన్ని నివృత్తి చేసుకునే దాకా నిద్ర పట్టక నవోదయ రామ్మోహన రావు గారికి, వాళ్లబ్బాయి సుధాకర్ గారికి ఫోన్ చేశాను.

అమ్మయ్య, రామ్మోహనరావు గారి నోటి వెంట “ఏం, కంగారు పడద్దు, నవోదయ మూత పడలేదు. మూత పడింది రిటెయిల్ సేల్స్ షాపు మాత్రమే” అన్న మాట వినపడింది.

ఆయన మాటల్లోనే “కొత్త పుస్తకాలు వేయడం మానేసి చాలా రోజులైందిగా? కేవలం అమ్మకాలు మాత్రమే సాగిస్తున్నాం కదా! ఇప్పుడు మూసేసింది రిటెయిల్ సేల్స్ కౌంటర్ మాత్రమే! నవోదయ ఇంకా ఉంది. వెనక షాపు తీసుకున్నాం కదా! ఎవరికి ఏ తెలుగు పుస్తకం కావాలన్నా, ఈ మెయిల్ ద్వారా ఆర్డర్ పంపినా సరే, మా దగ్గర లేక పోతే సేకరించైనా సరే అందించడానికి సిద్ధంగా ఉన్నాను. త్వరలో మాదిరెడ్డి సులోచనవి 60, 70 పుస్తకాలు కొత్తవి వేయాలనే ఆలోచన కూడా ఉంది! ఏం చేద్దాం, పుస్తకాలు చదివే అలవాటు చాలా వరకూ తగ్గి పోయింది జనంలో! ఆన్ లైన్లో పుస్తకాలు అందుబాటులో ఉండటం, ఈ బుక్స్ రావడం ఇవన్నీ కూడా ఇలాటి పరిస్థితికి కారణాలే! దేన్నీ కాదనలేం”

షాపు మూసేసినట్లు అద్దె షాపు తాలూకు తాళాలు కూడా ఓనర్ కి ఇచ్చేసినట్టు చెప్పిన సుధాకర్ “నాన్నగారికి పుస్తకమే జీవితం. అందుకే ఆయన దీన్ని కొనసాగిస్తారు, కాక పోతే వెనక చిన్న షాపులో” అని చెప్పారు.

ఇదంతా అలా ఉంచితే,

పూలమ్మిన చోటే కట్టెలు అమ్మడమనే సామెత పబ్లిషర్ , పుస్తకాలు వేయడం మాని కేవలం పుస్తక విక్రేత గా మిగిలి పోవడానికి కూడా వర్తిస్తుందేమో! ఏ వ్యాపారమైనా ఏదో ఒకనాటికి మూత పడటానికి దాని కారణాలు దానికి ఉంటాయి. పాఠకుల పఠనాభిరుచి మీద ఆధారపడి నడిచే పుస్తక ప్రచురణ మూత పడటానికి ఆర్థిక కారణాలెన్నున్నా, వాటికి దారి తీసేవి మాత్రం సాంస్కృతిక కారణాలే! గత పదిహేను, ఇరవయ్యేళ్ళుగా పుస్తకాలు చదవడం అనేక కారణాల వల్ల గణనీయంగానే పడి పోయింది.   సిలబస్ తప్ప వేరే పుస్తకాలు ముట్టడానికి సమయం లేని టెక్నికల్ చదువుల్లో విద్యార్థులు మునిగి పోవాల్సి రావడం,మధ్య  తరగతి లివింగ్ రూములోకి టీవీ ప్రవేశించి పఠనాభిరుచిని హత్య చేయడం, ఆక్టోపస్ లా చుట్టూ అల్లుకున్న సోషల్ నెట్ వర్క్ .. కారణం ఏదైనా కానివ్వండి పుస్తకాల సంఖ్య జీవితంలోంచి నెమ్మది నెమ్మదిగా తగ్గి పోవడానికి వీటన్నిటి ప్రమేయం ఉంది!

నవోదయ విశాలాంధ్ర లాంటి గట్టి సంస్థలు కొన్ని తప్పించి అనేక ప్రచురణ సంస్థలు ఏ నాడో మూత పడ్డాయి.

విజయవాడ ఏలూరు రోడ్ లో పుస్తకాల షాపులన్నీ చూసుకుంటూ తిరగడం నవోదయలోనో విశాలాంధ్రలోనో గంటల కొద్దీ పుస్తకాలు తిరగేస్తూ, ఏ పుస్తకం కొనుక్కోవాలో తేల్చుకోలేక, అన్నీ కొనాలని ఉన్నా, డబ్బులు చాలవని దిగులు పడిన రోజులు మన గత చరిత్రలో ఉండటం ఒక గొప్ప గౌరవమూ గర్వకారణమూ! స్మార్ట్ ఫోన్లు లేక ఎన్ని సెల్ఫీలు మిస్ అయి పోయామో ఆ రోడ్డులో!

ఎమెస్కో పాఠకుల కోసం “ఇంటింటా గ్రంథాలయం” పేరుతో బుక్ క్లబ్ నడిపింది చాలా యేళ్ళు. అందులో స్కూలు రోజుల నుంచీ సభ్యత్వం, ఎన్నో పుస్తకాలను నా లైబ్రరీలో చేర్చింది. నెల నెలా 20 లేక 30 రూపాయలు కడితే ప్రతి నెలా ఇంటికో పుస్తకం వచ్చేది పోస్టులో .(నా సభ్యత్వ నంబర్ EBC 7463) వాళ్లెంత మంచి వాళ్లంటే, నెల నెలా వాళ్ళు వేసే పుస్తకం మనకి నచ్చకపోతే వేరే పబ్లిషర్ వేసిన పుస్తకం కావాలంటే తెప్పించి మరీ పంపే వాళ్ళు. ఆ అవకాశాన్ని వాడి అరుణా పబ్లిషింగ్ హౌస్ నుంచి చలం, రంగనాయకమ్మ గారి పుస్తకాలన్నీ ఎమెస్కో బుక్ క్లబ్ నుంచి కొన్నవే!

బుక్ క్లబ్ లే కాదు, చాలా చాలా వార పత్రికలు, మాస పత్రికలు కూడా అంతర్థానమై పోయాయి. యువ, జ్యోతి, వనిత,విజయ, పల్లకి, ఈ మధ్య నాటిదే హాసం, బాల్యపు అద్దం చందమామ, మరెన్నో!

పుస్తకాలని వ్యసనంగా మార్చిన లెండింగ్ లైబ్రరీలు, సర్క్యులేషన్ కాన్సెప్టూ మాయం! వర్తమానం లోంచి జ్ఞాపకాలు గా మారి చరిత్రలో కల్సి పోయాయి. శాఖా గ్రంథాలయాల్లో కొత్త పుస్తకాలు శూన్యం!

మార్పు ఏ సమాజంలో అయినా అనివార్యం! ఐతే అది అభివృద్ధికి దార్లు వేస్తుందా, సాంస్కృతికి విషాదానికి దారులు తీస్తుందా  అనేది అది ప్రయాణించే మార్గం నిర్ణయిస్తుందేమో బహుశా! ఆర్ట్సు గ్రూపులు పనికి రానివి గా ముద్ర వేసుకుని చదువుల్లోంచి దాదాపుగా అంతర్థానం అయ్యాయి! బుర్ర కథ, హరికథ వంటి కళారూపాలు వాస్తవం లోంచి జారి పాఠ్యాంశాల్లో ప్రస్తావనలు గా మారాయి. తోలు బొమ్మలాట అంతరించి తోలు బొమ్మలు వాల్ డెకార్లు గా, టేబుల్ లాంపులు గా అవతరించాయి,   కళల్ని, సంస్కృతిని చంపుకునే వాళ్లని ఎవరు బాగు చేస్తారు? రేపటి రోజున పత్రికలు ఆగి పోయినా, పుస్తక ప్రచురణ సంస్థలు మూత పడినా ఆశ్చర్యపోకుండా ఆమోదించే స్థాయికి మనమే చేరాలి!

కానీ పుస్తకం మాత్రం చావకూడదు. రూపం మారినా , అది పాఠకుల చేతిలోనే ఉండాలెప్పుడూ! పబ్లిషర్స్ అందరికీ ఆశ కల్గించేది ఏటా జరిగే బుక్ ఫెయిర్లే! ఒక పుస్తక విక్రేత హాస్యానికిలా అన్నారు నాతో “చదువుతారో లేదో తెలీదు కానీ, ఫేస్బుక్ లో ఫోటో పెట్టడానికైనా సరే, కొంటున్నారు పుస్తకాలు” ఇది వినోదమో విషాదమో గానీ పుస్తకాల అమ్మకాలకి ఆ రోజుల్లో ఢోకా లేదు

మధ్య తరగతి జీవితంలోంచి పుస్తక పఠనం నిష్క్రమిస్తోందని బాధ పడ్డా, పుస్తకానికెప్పుడూ మంచి రోజులే అని భరోసాగా రామ్మోహనరావు గారు మాట్లాడ్డం చాలా రిలీఫ్ ని ఇచ్చింది.  కానీ ఇకపై దుమ్ముతో రద్దీతో కిట కిట లాడే ఆ ఏలూరు రోడ్ లో ఇక నవోదయ బోర్డు కనిపించదు. ఎక్స్ ప్రెస్ బస్సు ఎక్కక పోతే ఆదా చేయగలిగే పధ్నాలుగు రూపాయలతో ఏ పుస్తకం అదనంగా కొనచ్చనే ఆలోచనలతో స్నేహితులతో పాసెంజర్ ట్రైన్ ఎక్కి పుస్తకాల కోసం విజయవాడకు చేసిన ప్రయాణాలే ఇక జ్ఞాపకాల్లో మిగిలేవి!

నవోదయ వెనక సందులోకి మారినా, ఆ బొర్డు కనిపించక పోయినా, రేపో మాపో అసలు మూత బడే పోయినా, ఎవరు మాత్రమేం చేయగలం? చూస్తూ “ఎటు పోతున్నాం” అని రొటీన్ ప్రశ్న వేసుకోడం తప్పించి!

 

*

 

స్వేచ్ఛకీ సముద్రానికీ మధ్య…

 

 

” ఇదిగో, ఇక్కడివరకే వెళ్ళాలి – దాటి నడిస్తే నాశనమే ” అన్న కట్టు ఉన్నంతవరకు తెంపుకు పోవాలనే అనిపిస్తుంది. ‘’నీకు పూర్తి స్వేచ్ఛ ఉంది, ఏమైనా చేసుకోవచ్చు ‘’ నంటే దాన్ని ఉపయోగించుకోవాలని చాలా మందికి ఉండదు. మానవ స్వభావం లోని ఇలాంటి ఒక వైచిత్రి కి ఆవిష్కారం ఇబ్సన్ నాటకం Lady from the Sea లో. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా తీగలు  అక్కడ కదులుతాయి.

ఇబ్సన్ నాటకాలలో చాలా భాగం సమస్యలతో అంతమవుతాయి. ప్రసిద్ధికెక్కిన A Doll’s House  అటువంటిదే. ఎక్కువ వెలుగులోకి రాని విషయమేమిటంటే ఆ నాటకానికి మరొక ఆశాజనకమైన ముగింపు ని కూడా తర్వాతి కాలం లో ఇచ్చి రాశారు . ఈ నాటకాన్నీ దాన్నీ కలిపి ఇబ్సన్ తిరోగమనం గా వర్ణించేవారున్నారు. ఆయన  చివరి నాటకాలలో ఇది ఒకటి .

గోథె ఇట్లా అన్నారట – ” తొలి రోజుల్లో రాగినాణాలో వెండి ముక్కలో  పోగుచేసుకుంటాము, పక్వత వస్తూన్న కొద్దీ వాటిని మారకం చేసి బంగారాన్ని సంపాదించుకోబోతాము ” .  తొలినాళ్ళ సమస్యల కు తాను చెప్పుకున్న సమాధానాల కన్న మెరుగైనవాటిని – ఎదుగుతూన్న కొద్దీ రచయిత అన్వేషిస్తారు – తప్పదు. ఒకరి సృష్టి లో ఒకేలాంటి ఇతివృత్తాలూ   పాత్రలూ పునరావృత్తం అవుతూండటం మనకి తెలిసిందే – రచయిత ప్రశ్నలు తృప్తి పడి  తీరాన్ని దాటేవరకూ ఇది సంభవిస్తూనే ఉంటుంది.

మనిషి – తన లోపలి ప్రేరణలు ఏవైనా గాని, ఆత్మనాశనం వైపుకే వెళ్ళనక్కర్లేదని ఈ నాటకం లో ఇబ్సన్ ప్రతిపాదించారని అంటారు. ఎంత తీవ్రస్వభావానికైనా ప్రపంచం తో లయ కల్పించుకోగల శక్తి ఉండవచ్చుననే భరోసా ఇవ్వదలుస్తారని కూడా [Stephen Unwin ] . ఆత్మనాశనం అన్నది సాపేక్షమే. సాధారణమైన దృష్టి తోనే ఈ మాటలు – మనం ఎంతమందిమి అంత అసాధారణులం నిజానికి ?  మరింకొక స్థాయి లో ,  పరస్పర గౌరవమూ స్వేచ్ఛా ఉన్న పరిస్థితులలో వివాహవ్యవస్థ కొనసాగటం సాధ్యమేనని  ఈ దశ లో ఇబ్సన్ అనుకుని, మనకీ చెప్తారు.

సముద్రాన్ని స్వేచ్ఛకూ నేల మీది జీవనాన్ని నియమబద్ధులై ఉండటానికీ ప్రతీక లుగా తీసు కుంటారు .  ఈ నాటకం లో కొన్ని అతి మానుషాంశాలు ఛాయామాత్రంగా ఉంటాయి,  ఇబ్సన్ ప్రధానంగా వాస్తవిక రచయిత అయినప్పటికీ. తక్కిన ఇబ్సన్ నాటకాల శిల్పానికి ఇందులోది కొంత తగ్గుతుందని విమర్శకులు అంటారు , కాని సత్యదర్శనం లో మరింకే నాటకానికీ ఇది తీసిపోదు – ఒక మెట్టు పైనే ఉంటుంది.

నార్వీజియన్ అయిన ఇబ్సన్  ఈ నాటకానికి ప్రేరణ ని అక్కడి జానపద గాథ ల నుంచి తీసుకున్నారు. హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ Mermaid గాథ ని చిత్రిస్తారు. సగం మనిషీ సగం చేపా అయిన అమ్మాయి ఒకరిని ప్రేమించి పెళ్ళి చేసుకునీ హాయిగా  ఉండలేక , మరణిస్తుంది. Mermen కూడా అక్కడి గాథలలో ఉంటారు – మానవ స్త్రీలని వశం చేసుకోగలవారు. ఈ వైరుధ్యాల కలయికలలో అశాంతీ అంతమూ మటుకే ఉండాలా ? అక్కర్లేదేమోనని ఇక్కడ ఒక సూచన. తర్వాత ఆలోచించవలసిన విషయం-  అంత స్పష్టమైన వైరుధ్యాలు నిత్యమూ భార్యాభర్త ల మధ్యన ఉంటున్నాయా లేదా అనేది.  సున్నితత్వం కొంత ఎక్కువగా ఉందనిపించే ప్రతి స్త్రీ mermaid కాదు .

ibsen

Ellida సముద్ర తీరం లో పుట్టి పెరుగుతుంది. సముద్రమే  ఆమె ఉనికి, సర్వస్వం. పేరు స్పష్టం గా ఉండని ఒక అపరిచితుడు – సాగరమే మానవుడైనట్లు కనిపించేవాడు , వచ్చి ఆమెతో స్నేహం చేస్తాడు. చాలా ఆదిమమూ ప్రాకృతమూ అయిన ప్రేమ వారి మధ్య పుడుతుంది. ఇద్దరి ఉంగరాలూ కలిపి నదిలో వేసి పెళ్ళైపోయిందని ప్రకటిస్తాడు అతను. ఈ లోపు , తన వైయక్తిక న్యాయం ప్రకారం ఒకరిని హత్య చేస్తాడు. ఈ లోకపు మర్యాదలనూ నియమాలనూ చట్టాలనూ పట్టించుకోని వాడు అతను . ఆ తర్వాత నౌకలో సముద్రం మీదికి వెళుతూ ఎదురు చూస్తూండమని ఆదేశం ఇస్తాడు.. ..ఎన్నాళ్ళకీ

రాడు .అక్కడికి వచ్చిన Dr  Wangel  కోరితే వారిద్దరికీ  ప్రాపంచికమైన వివాహం జరుగుతుంది.Wangel  ఒక పల్లెటూరి వైద్యుడు. రెండో పెళ్ళి, ఇద్దరు కూతుళ్ళు. ఆ ఇంట్లో Ellida  కి ఊపిరాడదు. సముద్రపు అనంతత్వం అలవాటయిన ఆమె కి అది ఇరుకైన పరిమితి. రోజూ వెళ్ళి  దగ్గర్లోని చిన్న రేవులో మునిగివస్తుందే గాని, సముద్రాన్ని ఇంటికి తెచ్చుకోలేదు. ఆ పరిస్థితి గురించి రచయిత ఒక సంభాషణ నడిపిస్తారు –

” ఏమిటీ బొమ్మ ? ”

” mermaid ”

” అలా కృశించిపోయి ఉందేం ? ”

” సముద్రానికి దూరంగా బ్రతకలేదు కదా”

” అవును, చేపల సంగతి అంతే. మనుషులు వేరు. వారు అలవాటు పడగలరు ”

అతి ప్రాథమికమైన భావోద్వేగాలకు మనుషులు అస్తమానమూ లోబడిపోనవసరం లేదని రచయిత అభిప్రాయపడతారు.   దారి తప్పిపోయామనుకోవటం    అంత అనివార్యమైనది కాదు.

”  జీవ పరిణామ శాస్త్రం లో మన పాత బంధువులు చేపలూ పక్షులూ. ఆ అంతఃప్రేరణలు కొందరిని సముద్రానికీ ఇంకొందరినీ గాలికీ ఆకాశానికీ ఆకర్షించబడేలా చేస్తాయి – కాని ఆ దశలను మనం దాటివచ్చేశామని తెలుసుకోవలసి ఉంది ” – అంటారు ఆయన. ఇబ్సన్ మార్క్సిజం ప్రభావం ఉన్నవారు, భౌతిక వాది . మానవుడి సార్వభౌమత్వాన్ని ఆయన అంగీకరిస్తారు. ఆ ఆధిపత్యం ప్రకృతి పైనా, తన మీద పని చేసే ప్రకృతి శక్తుల మీదా కూడా – ఈ నాటకం లో.

[ ఇలా అంటే ఆశ్చర్యం గా అనిపించవచ్చు. సనాతన హిందూ ధర్మం లోనూ Victorian morality లోనూ conventional communism లోనూ కూడా ఉద్వేగాలకి విలువ తక్కువ , వివిధ స్థాయిలలో. ]

Ellida ఎవరినీ దేన్నీ పట్టించుకోకుండా కుములుతుంటుంది.  బిడ్డ పుట్టి మరణిస్తాడు – అదీ ఆమెని భయపెడుతుంది, అపరాధ భావన తో. ఒక దశలో భర్త తో ” మన ఇద్దరం బేరం కుదుర్చుకున్నాం అంతే, మనకి జరిగింది పెళ్ళే కాదు ” అనేస్తుంది. ఆ భర్త లౌకికుడైనా సజ్జనుడు, సహృదయుడు.

” అవును, క్రమక్రమం గా నువ్వు మారిపోతున్నావు – తెలుస్తోంది నాకు ” –  తన ఇంటినీ వృత్తినీ వదిలేసి ఆమె ని సముద్రానికి దగ్గరగా వెళ్ళి స్థిరపడదామంటాడు . ఈ లోపు ‘ అతను ‘ వస్తాడు. Ellida తన  భార్యే అతని దృష్టిలో. వెళ్ళిపోదాం రమ్మని, ఆమె వెనుకాడితే రెండు రోజుల వ్యవధి ఇస్తాడు.

మొదట భర్త భరించలేకపోతాడు. తర్వాత , అంచెలంచెలు గా – నిబ్బరించుకుంటాడు.

” నీకు పూర్తి స్వాతంత్ర్యం ఉంది ఇప్పుడు- ఏ నిర్ణయం తీసుకునేందుకైనా ” – అని ప్రకటిస్తాడు చివరికి. దాన్ని ఆమె ఉపయోగించుకోబోతోందనే అనిపిస్తుంది.

తీరా ఆ రోజు మొదలయాక ” నన్ను ‘ అతని ‘ నుంచి రక్షించు ” అంటుంది భర్త తో. ఊహించకుండా వచ్చిపడిన ఆ స్వేఛ్చ ఆమెని కలవరపెడుతుంది. అనంతర పరిణామాలను ఊహించుకుందుకు ధైర్యం చాలదు. భర్త కీ సవతి కూతుళ్ళకీ తన అవసరం ఉందనిపిస్తుంది , ఆ బాధ్యతని తీసుకోవటం ఒక సార్థకత అనుకుని, ఉండిపోతుంది.

స్వాతంత్ర్యం కొత్తగా వచ్చిన ఎవరికీ దాన్ని ఏం చేసుకోవాలో తెలియదు. ఆమె ఆ risk  తీసుకుని అతనితో ఎందుకు వెళ్ళిపోలేదు ? ఆమె సమస్య  తీరలేదనీ ఈ ముగింపు సుఖాంతం అవదనీ వాదించేవారు ఉన్నారు.

నాకు ఇలా అనిపిస్తుంది – ఆమె లో ‘ భద్రత ‘ ని కోరుకునే లక్షణం కూడా ఒకటి ఉంది. లేదంటే నిరంతరమూ ‘ అతని ‘ కోసం ఎదురు చూస్తూ ఉండిపోవలసిన మనిషి – ఏ కబురూ అందకపోతే మాత్రం , Wangel ని ఎందుకని పెళ్ళాడాలి ? అట్లాంటప్పుడు అతని మీద అంత విపరీతమైన ప్రేమ ఉన్నట్లూ కాదు .  పెళ్ళి ఒక లక్ష్మణ రేఖ  అనిపించినన్నాళ్ళూ ఆమె విలవిలాడింది. దాటరాదు  అన్నంతవరకూ చెలియలికట్టని బద్దలు కొట్టాలనుకుంది.

‘ కాదు ‘ అన్న తర్వాత – అనిశ్చితత్వాన్ని ఎంచుకోలేకపోయింది. ‘ అతని’తో జీవితం ఎంత ఆటవికం గా అరాచకం గా ఉండబోతోందో ఆమెకి స్పష్టంగా తెలుసు, దానికి ఇప్పుడు సిద్ధంగా లేదు . తను మరొకరికి ఉపయోగపడగలను అన్నది మనిషికి చాలా సద్గర్వాన్ని ఇస్తుంది , ఆ  వైపు కి వెళ్ళిపోయింది. ఆమె తత్వం అది –  మనుషులూ పరిస్థితులూ పలువిధాలు . A Doll’s House  లో డోరా ఇల్లు వదిలి వెళ్ళిపోవటాన్ని ఎట్లా సార్వత్రికం గా తీసుకోకూడదో దీన్నీ అంతే. రచయిత నొక్కి చెప్పే ఒక విషయం ‘ఆత్మగౌరవం .

అవును, ఇంతటి contrast ఉంది కనుక ఇక్కడి ఎంపిక సులభమవుతుంది- ఇది నాటకం కదా మరి. ఆ  contrast తగ్గుతూన్న కొద్దీ తేల్చుకోవటం భారమవుతుంది, అదీ నిజమే. సరిగ్గా ఇక్కడే , కళ్ళు తెరుచుకుని ఉంటే , సాహిత్యప్రయోజనం మనకి కనిపిస్తుంది.  కొత్త నియమాలను సిద్ధం చేయటం సాహిత్యం బాధ్యత ఎంత మాత్రమూ కాదు , అది చేయ గలిగినది సహాయమూ  సూచనా మాత్రమే- సందర్భానికి అనుగుణంగా.

కొంచెం పక్కకి వెళితే – అరేబియన్ నైట్స్ లో ఒక కథ – పక్షి తొడుగు తో ఎగిరే గంధర్వ రాజకుమారి , ఆ తొడుగు దొంగిలించిన వాడిని తప్పనిసరై పెళ్ళాడి బిడ్డలను కంటుంది .  తొడుగు ను సంగ్రహించగల అవకాశం రాగానే ఎగిరి వెళ్ళిపోతుంది. అతను అష్టకష్టాలూ పడి ఆమె కోసం వెళితే వెనకాలే వచ్చేస్తుంది – అంతలో ఉంటుందన్నమాట,  కనీసం కొన్నిసార్లు.

చలం గారి ‘ జీవితాదర్శం ‘ ముగింపు ని ఇక్కడ తలచుకోవటం అసందర్భం కాదు. ఏదీ కట్టి పడేయలేని లాలస దేశికాచారి ‘  ఇచ్చిన ‘ స్వేచ్ఛ కి లోబడిపోతుంది. జీవితాదర్శం శాంతి అనిపిస్తారు చలం .

” స్వేచ్ఛ కి ఉండే లక్షణం ఇది – దాన్ని అన్వేషించేకొద్దీ అది చేతికి అందదు – విస్తృతమవుతుంది. ఒక సంఘర్షణ  మధ్యన నిలుచుని ‘ నేను సాధించాను ‘ అన్న మనిషి దాన్ని ఆ క్షణాన్నే పోగొట్టుకుంటున్నాడని అనాలి ”  అని ఇబ్సన్ అంటున్నారు. జీవితపు హద్దులకి ఉన్న చలనశీలతను ఇంత బాగా చెప్పినవారు అరుదు.

*

ఇలియడ్ చెప్పిందీ ‘కలికాలం’ గురించే!

 

స్లీమన్ కథ-31

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

అనేక గొప్ప ఇతిహాసాలలానే ఇలియడ్ కూడా ఒక దుష్టకాలంలో, వీరోచితంగా ఎదుర్కొన్న ఒకానొక ఓటమి గురించి చెబుతుంది. ఉత్తములు నాశనమవుతారు, చెడు వర్ధిల్లుతుంది.1 అయితే దేవతల తీర్పు వ్యక్తులు చేసిన మంచి పనులపైనో, చెడ్డ పనులపైనో ఆధారపడి ఉండదు. మనిషి భవితవ్యంతో వారికి నిమిత్తం లేదు. అంతిమంగా దేవతలు మనిషిలోని పచ్చి తెగింపునకే ప్రాధాన్యం ఇస్తారు. తమను కూడా ధిక్కరించి ప్రమాదభూయిష్ఠమార్గంలో మనిషి ఎంత ధైర్యంగా, ఎంత హుందాగా అడుగువేశాడన్నదే చూస్తారు. ఆ ధైర్యమూ, ధిక్కారమే మనిషిలోని ఉన్నతోన్నత సుగుణం. మనిషిని దేవుడితో సమానం చేసేది అదే. అదే సమయంలో, అతనిలోని మార్దవం అతన్ని మానవీకరిస్తుంది.

అపార ధైర్యసాహసాలు, మానవీయత అనే ఈ రెండుప్రపంచాల మధ్య హోమర్ అనాయాసంగా సంచరించాడు.     అప్పటికింకా మనిషి అమాయకతనూ, నరాలలో స్వచ్ఛంగా జ్వలించే అగ్నినీ నింపుకున్నప్పటి ప్రపంచాన్ని తన కృతుల్లో ప్రతిఫలించాడు. అపరాధభావనతోనూ, నిరంతరాయమైన విషాద పునరావృతితోనూ భయభీతుడు కావడం నాటి మనిషికి తెలియదు.  నాలుగు దిక్కుల నడవలో సహజమైన ఇంద్రియస్పందనలతో  సరళజీవితం గడిపిన ఫ్రాక్చరిత్ర కాలపు జీవి అతను. ముదిమి పైబడిన దశలో, తనకు రెండు వందల ఏళ్ల క్రితం జరిగిన ఘటనలను హోమర్ చిత్రించాడు. పారంపరికంగా అందుతూ వచ్చిన కథలకు తన యవ్వనస్మృతులను మేళవిస్తూ; ఆయా పాత్రలను ఉన్నదానికంటే ఎక్కువ ఉజ్వలంగానూ, ఆకర్షకంగానూ అతను చిత్రించి ఉండవచ్చు.

అయితే, అతనిలో ఒక వృద్ధుడిలోని సహజమైన శాంతీ, స్వచ్ఛతా ద్యోతకమవుతాయి. గతించిన యవ్వనకాలపు జవసత్వాలపై  ఒక వృద్ధుడికి ఉండే మమకారం ఉట్టిపడుతుంది. తన ఒడిస్సే చివరి అధ్యాయంలో చిత్రించిన మారణకాండలాంటిది అతనికి స్వయంగా తెలుసు. ఆ కృతిలో, ఒడీసియెస్ అర్థాంగి పెనలోపి పునస్వయంవరానికి వచ్చిన రాజులను నరికి పోగులు పెడతారు. పనికత్తెలను ఉరితీస్తారు. తన రోజుల్లో ఒక యువసామంతరాజును చంపి, రక్తం ఓడుతున్న మృతదేహాన్ని ఒక రథానికి కట్టి శిథిల నగర ప్రాకారాల చుట్టూ ఈడ్చుకు వెళ్ళిన ఘటన అతనికి తెలుసు. తను రాజుల గుడారంలో కూర్చుని ఉండగా, యుద్ధంలో పట్టుబడిన స్త్రీలను విజేతలు పంచుకోవడం తెలుసు.  ఊరూరా తిరుగుతూ తంత్రీవాద్యాన్ని మోగిస్తూ, ఇలాంటి అనేక అనుభవాల మేళవింపుతో కథలు చెప్పుకుంటూ వెళ్లాడాయన. ఆ తర్వాత ఆయన శిష్యులు ఈ కథలను గానం చేశారు. అనంతరకాలంలో ఇవి గ్రంథస్థమయ్యాయి.2

ఎన్నో తరాలు గడిచిపోయాయి; అయినా ఈ కథలు పెద్దగా మారింది లేదు. కథన దాహార్తి తీరని ఆ గొంతు మూగవోయింది లేదు. ఆ గొంతు ఎంత శక్తిమంతమూ, ఎంత అనర్గళమూ అంటే; ఒకానొక నాగరికత మొత్తానికి అది ఆకృతినిచ్చి, రంగులద్ది తనతో మోసుకెళ్లింది. ఆ తర్వాత అలాంటిది మరెప్పుడూ జరగలేదు. హోమర్ చిత్రించిన ఆ నాగరికత సుసంపన్నమైనది, సుసుందరమైనది, ఇంద్రియస్పందనలను ఎంతో ఉదాత్తంగా వ్యక్తీకరించినది. ఇంకా అది ఎలాంటిదంటే, ఒక స్వాప్నిక అంశను ధరించినదిగా దానిని జనం విశ్వసిస్తూ వచ్చారు. అయితే, స్లీమన్ దానిని మెలకువలో స్వప్నంగా నిరూపించి ప్రపంచాన్ని ఆశ్చర్యచకితం చేశాడు. 3

***

ఇన్నేళ్లలోనూ అతనిలో పెద్ద మార్పేమీ లేదు, అదే మంకుతనం, అవే అలవాట్లు. తన జీవితం పొడవునా పుంఖాను పుంఖంగా ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు, గ్రంథరచన చేస్తూనే ఉన్నాడు. తనెంత సంపన్నుడు, ప్రసిద్ధుడు అయినా తన రాతకోతలకోసం సహాయకుని నియమించుకోలేదు. ఆ అవసరం అతనికి కనిపించలేదు.  మధ్య మధ్య ఒక భాషలోంచి ఇంకో భాషలోకి దూకుతూ తన ఉత్తరాలు తనే రాసుకునేవాడు,

అతని సంపద పెరుగుతూనే వచ్చింది. స్టాక్ మార్కెట్ మీదా; పారిస్, బెర్లిన్, ఎథెన్స్ లలోని తన నివాసాల పైనా ఎప్పుడూ ఒక చూపు ఉంచేవాడు. తను కిరాయికి ఇచ్చిన ఇళ్ళలో ఏ ఒక్కటైనా ఖాళీగా ఉంటే, అందుకు రెండు నిద్రలేని రాత్రుళ్ళను మూల్యంగా చెల్లించేవాణ్ణని చెప్పుకున్నాడు. అలాగని మనిషిలో అసలే మార్పు లేదనీ చెప్పలేం. ఇంతకుముందు దుస్తులపై పెద్ద శ్రద్ధపెట్టేవాడు కాదు, ఇప్పుడు దుస్తులపైనా, టోపీల పైనా  కాస్త అభిరుచిని చూపిస్తున్నాడు.  కోటు జేబులోంచి ఒక ఎర్రటి సిల్కు జేబురుమాలు వేలాడదీసే అలవాటు ఒకటి అతనికి కొత్తగా వచ్చింది. నలుగురిలో ఉన్నప్పుడు సాధారణంగా నిశ్శబ్దం పాటించేవాడు, చాలా అరుదుగా నోరువిప్పేవాడు. తన తవ్వకాలపై చర్చలు అతనికి ఇష్టముండేవి కావు. అడుగు బడుగు జనాలపై ఆదరణ చూపించేవాడు. ఏదో సాధించాలన్న తపన ఇప్పటికీ అతనిలో అలాగే ఉంది. స్వర్ణనిక్షేపాల దాహమూ తగ్గలేదు.

125446-004-0C269211

ఎప్పుడూ ఏదో తొందరలో ఉన్నట్టూ, అస్థిమితంగానూ గడిపేవాడు. గడచిపోయే కాలం పట్ల విపరీతమైన స్పృహతో ఉండేవాడు. ఒక్క క్షణం వృథా అయినా సహించేవాడు కాదు. రోజులో ఇన్నిగంటల చొప్పున ప్రతి పనికీ కేటాయించుకునేవాడు. వేసవిలో ఉదయం మూడు గంటలకే లేచి భార్యతో కలసి గుర్రం మీద సముద్రస్నానానికి వెళ్ళేవాడు. ఉప్పునీటిలో గొప్ప ఔషధగుణాలు ఉన్నాయనీ, సముద్రస్నానం అన్ని రకాల రోగాలనూ నయం చేస్తుందనీ నమ్మాడు. వయసు మీదపడిన కొద్దీ మరింత నియమబద్ధమైన జీవితం వైపు మొగ్గుతూ వచ్చాడు. తన అరవై నాలుగవ ఏట, పెదవిపై ఏర్పడిన కణితిని మత్తుమందు తీసుకోకుండా కోయించుకున్నాడు. అంతకు కొన్ని మాసాల ముందు గుర్రం మీంచి పడి, కళ్ళద్దాల తునకలు చెక్కిళ్లలో గుచ్చుకున్నప్పుడు కూడా వాటంతట అవే బయటికి వచ్చేవరకూ ఓపికతో ఎదురుచూశాడు తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్లలేదు.

అయితే, శరీరానికి ఎంతో మంచిదని తను నమ్ముతూ వచ్చిన సముద్రస్నానమే నెమ్మదిగా అతని ఆరోగ్యాన్ని హరించడం ప్రారంభించింది. 1877లో, తన మైసీనియా (Mycenae) గ్రంథానికి గ్లాడ్ స్టన్ ప్రసిద్ధమైన ముందుమాట రాస్తున్న తరుణంలో మొదటిసారి స్లీమన్ వినుకలి సమస్యకూ, అస్వస్థతకూ లోనయ్యాడు. సముద్రజలం చెవుల్లోకి ప్రవేశించి విపరీతమైన చెవిపోటుకూ, తలనొప్పికి దారితీయించింది.  తన జీవితంలోని చివరి పదమూడేళ్లూ ఈ రెండు సమస్యలతో అతను బాధపడుతూనే ఉన్నాడు.

తనకు అత్యంత ప్రతిష్ఠను కట్టబెట్టిన ట్రాయ్ ఇప్పటికీ అతని బుద్ధికి పని చెబుతూనే ఉంది. హిస్సాలిక్ లో తను జరిపిన తవ్వకాల పూర్తి వివరాలను పొందుపరుస్తూ, ఆత్మకథాంశాలను జోడిస్తూ, అనంతర పరిశోధనల వెలుగులో కొన్ని వెనకటి సూత్రీకరణలను సవరించుకుంటూ 1879లో ఇలియోస్ (Ilios) అనే పుస్తకాన్ని తీసుకొచ్చాడు.

ఆ తర్వాత కూడా కొన్ని ప్రశ్నలు అతన్ని వేధిస్తూనే ఉన్నాయి. ఇంతకీ ట్రాయ్ ఉనికి హిస్సాలిక్ దగ్గరేనా? ఆ చిన్న దిబ్బను హోమర్ చిత్రించిన సువిశాల నగరంగా ఊహించుకోగలమా? ఆ దిబ్బే ట్రాయ్ అయుంటే అందులో అయిదువేలమంది జనమూ, అయిదు వందలమంది సైన్యమూ మించి ఉండగల అవకాశం లేదని అంచనావేశాడు. అప్పుడు హోమర్ వర్ణించిన అరవై నాలుగు గదుల విశాల ప్రాసాదాలు ఎక్కడున్నట్టు? పైగా ట్రాయ్ గిరిదుర్గం మైసీనియా గిరిదుర్గం కన్నా కూడా చిన్నది.

హిస్సాలిక్ గురించి ఆలోచించినకొద్దీ అతన్ని సందేహాలు అలముకుంటూనే ఉన్నాయి. బహుశా ట్రాయ్ హోమర్ ఊహాజనితం కావచ్చుననుకున్న క్షణాలూ ఉన్నాయి. హిస్సాలిక్ దిబ్బే హోమర్ చిత్రించిన ట్రాయ్ అన్న సంగతిని నిస్సందేహంగా నిరూపించే ఏ పురాతన లిఖిత ఆధారమో, లేదా మరో స్వర్ణకోశాగారమో కనిపిస్తుందన్న ఆశతో అతను తన జీవితాంతమూ ట్రాయ్ లో తవ్వకాలు కొనసాగిస్తూనే వచ్చాడు. ఇంతవరకు ట్రాయ్ గురించిన అతని పరిజ్ఞానం హిస్సాలిక్, బునర్ బషీ, స్కామందరస్ లోయ, దాని దగ్గర ఉన్న చిన్న చిన్న ఊళ్ళకు పరిమితమైంది. ఈసారి వాటిని దాటి వెళ్ళి పరిశీలిస్తే తన సమస్యకు పరిష్కారం దొరకచ్చేమో ననుకుని 1881 మే నెలలో గుర్రం మీద ట్రాయ్ అంతటా సుదీర్ఘపర్యటన చేశాడు. అందువల్ల అతను ఆశించిన ఫలితం దక్కలేదు కానీ, ఈదా(Mount Ida)పర్వతాన్ని ఎక్కగలిగాడు. హోమర్ ప్రకారం ఆ పర్వతం మీద దేవతలు నివసిస్తారు.4 అక్కడినుంచి ట్రాయ్ లో జరిగే యుద్ధాలను వీక్షిస్తారు. అక్కడ అడవి మృగాలు సంచరిస్తూ ఉంటాయి. అయితే, ట్రాయ్ అంతటా సర్వసామాన్యంగా కనిపించే ఒక్క కోకిల తప్ప ఆ పర్వతం మీద మరే జీవీ కనిపించలేదు. ఒక కొన మీద ఒక అజ్ఞాత పశువుల కాపరికి చెందిన ఒకే ఒక సమాధి కనిపించింది. ఇంకో కొన మీద ఒక పాలరాతి పలక కనిపించింది. అది దేవతల రాజు అయిన జియస్ సింహాసన అవశేషం కాబోలని స్లీమన్ అనుకున్నాడు. ఆ కొండ మీదనుంచి చూస్తే హిస్సాలిక్ దిబ్బ కోటు బొత్తమంత చిన్నదిగా కనిపించింది. అంతదూరం నుంచి కింద  సైన్యాల కదలికలను జియస్ ఎలా చూడగలిగాడోనని స్లీమన్ అనుకున్నాడు.

అదే సంవత్సరంలో హిస్సాలిక్ మీద చిన్నపాటి తవ్వకాలు జరిపించాడు కానీ అవి నిరుపయోగమయ్యాయి. అవే రోజుల్లో మరో ముఖ్యసమస్య అతని బుర్రను తొలుస్తూవచ్చింది. అది, ట్రాయ్ నిక్షేపాలను ఎక్కడ ఉంచాలన్నది. గ్రీస్, ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్ లు అతని ఆలోచనల్లో నానుతూ వచ్చాయి. ఒక దశలో స్వర్ణహారాలను రష్యాకు విక్రయించాలని కూడా అనుకున్నాడు. నిక్షేపాలను హెర్మిటేజ్ మ్యూజియంకు అప్పగించే పక్షంలో మంచి ప్రతిఫలం లభించేలా చూస్తానని వాగ్దానం చేసిన ఒక రష్యన్ ఏజెంటుతో కొన్ని వారాలపాటు ఉత్తరప్రత్యుత్తరాలు జరిపాడు. అయితే, నిక్షేపాలను అమ్మాలన్న బలమైన కోరిక స్లీమన్ కు లేదు. అవి ఎంతటి ధనంతోనూ తూచలేని అమూల్యాలన్న సంగతి అతనికి తెలుసు. సిస్టైన్ చాపెల్ కు 5 ఎంత ధర కట్టగలరు? ఆయా ఘటనలు జరిగేవరకూ ఓపికగా ఎదురుచూస్తూనే, నిరంతర సందిగ్ధాల మధ్య నలగడం అతని స్వభావంలోనే ఉంది. తన పరిశోధనలను ఎన్నడూ గుర్తించి హర్షించని జర్మనీకి ట్రాయ్ నిక్షేపాలను అప్పగించే ప్రశ్నలేనేలేదని, 1878 చివరిలో ఒక బెర్లిన్ వర్తకుడికి కరాఖండిగా లేఖ రాశాడు. అయితే, ఆరునెలలు తిరిగేలోపల తను నిక్షేపాలను జర్మనీకే అప్పగించబోతున్న సంగతి అతనికి తెలియదు. అందుకు ఒక నల్లని ముళ్లచెట్టు తాలూకు పూల కొమ్మ కారణం. అదెలాగంటే…

స్లీమన్ జీవితకాలం మొత్తంలో తనకు స్నేహితులంటూ చెప్పదగిన వారు ఇద్దరే.  ఒకరు, యువపురావస్తు శాస్త్రవేత్త విల్హెమ్ దార్ఫెల్త్. ఒలింపియాలో స్లీమన్ చేపట్టిన తవ్వకాలకు సహకరించడానికి ప్రష్యన్ ప్రభుత్వం అతన్ని పంపించింది. ఇంకొకరు, ప్రసిద్ధ వైద్యుడు రుడాల్ఫ్ విర్కో. విచిత్రం ఏమిటంటే, స్లీమన్,అతనూ స్వభావంలో ఉత్తర, దక్షిణాలు. విర్కో నెమ్మదస్తుడు, పద్ధతిగా తూచినట్టు వ్యవహరించేవాడు, ఉపాయశీలి, తర్కబద్ధంగా మాట్లాడేవాడు, ధనదాహం, కీర్తిదాహం బొత్తిగా లేనివాడు.  తన శక్తియుక్తులను ఏక కాలంలో వంద వేర్వేరు పనులకు మళ్ళిస్తూనే నిదానంగానూ, పద్ధతిగానూ వ్యవహరించగల అతి కొద్దిమందిలో ఒకడు. స్లీమన్ అతన్ని చూసి ఒకవిధంగా అసూయ చెందేవాడు, అతని స్నేహాన్ని కోరుకునేవాడు, వైద్యసంబంధమైన ప్రశ్నలను అదేపనిగా గుప్పించేవాడు. చివరికి, సత్కారాలకు వెళ్ళేటప్పుడు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో, పసిపిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో అతన్నే అడిగేవాడు.

heinrich-schliemann-1822-1890-german-traveler-and-archeologist-schliemann-addressing-a-scientific-group-in-london-england-wood-engraving-from-an-english-newspaper-of-1877-granger

1879 వసంతంలో, హిస్సాలిక్ తవ్వకాలలో కొద్ది విరామం దొరికినప్పుడు, స్కామందరస్ లోయ వెంబడి విహారయాత్రకు వెడదామని స్లీమన్ అతనితో అన్నాడు. స్లీమన్ వెంట వెళ్ళే అవకాశం దొరికినందుకు విర్కో సంతోషించాడు. ఇద్దరూ ఈదా పర్వతపాదాల దగ్గరికి చేరుకున్నారు. స్లీమన్ తన స్వభావానికి భిన్నంగా, ఏవో ఆలోచనలతో సతమతమవుతూ మౌనంగా ఉండిపోయాడు. ఏమిటి విషయమని విర్కో అడిగాడు. “రకరకాల విషయాలుంటాయి, ఏదని చెప్పను?” అని స్లీమన్ అన్నాడు.

కాసేపటి తర్వాత, ఇద్దరూ ఒక నల్ల ముళ్లచెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, విర్కో అదే ప్రశ్న మరోసారి అడిగాడు. “తను మరణించిన తర్వాత ట్రాయ్ నిక్షేపాల పరిస్థితి ఏమిటన్న ఆలోచన నన్ను తొలుస్తోం”దని స్లీమన్ జవాబు చెప్పాడు. హఠాత్తుగా విర్కో పూలు చిగురుస్తున్న ఆ చెట్టు కొమ్మ ఒకటి విరిచి స్లీమన్ కు ఇచ్చి, “ఇదిగో అంకెర్షాగెన్ 6 పూలచెండు” అన్నాడు.

తను ఆ మాట ఎందుకు అన్నాడో అతనికే తెలియదు. అప్రయత్నంగా వచ్చిన మాట అది. అది చెవినబడగానే స్లీమన్ ముఖకవళికలు మారిపోవడం విర్కో గమనించాడు. అతని మీంచి ఓ పెద్ద బరువు దిగిపోయిన ఛాయలు వాటిలో కనిపించాయి. ఆ కొమ్మను అందుకున్న స్లీమన్, “అవును, అంకెర్షాగెన్ పూల చెండే” అన్నాడు. అంతకు మించి మాటలేవీ జరగకుండానే నిర్ణయం జరిగిపోయింది. ఆ సంగతి ఇద్దరికీ తెలుసు.

కొన్ని గంటల తర్వాత విహారయాత్రనుంచి తిరిగి వస్తున్నప్పుడు విర్కో యథాలాపంగా అన్నాడు, “ ఆ నిక్షేపాలు జర్మనీకి చేరవలసిందే. వాటినక్కడ భద్రంగా చూస్తారు. మీకు సముచిత సత్కారం లభిస్తుంది. అంతా సాఫీగా జరిగిపోతుంది. మీరు సరే నంటే యువరాజు బిస్మార్క్ తో మాట్లాడతాను”.

స్లీమన్ తల ఊపాడు. ఏడేళ్లుగా తనను వేధిస్తున్న ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానం దొరికింది. ఆ వసంత దినాన ఆ పూల కొమ్మను చూడగానే చిన్నప్పుడు అంకెర్షాగెన్ తోటలో తను చూసిన పెద్ద పెద్ద పూల రాశులు అతని స్మృతిపథంలో మెదిలాయి. అంతే, అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాడు.

(సశేషం)

***

అథోజ్ఞాపికలు

  1. ‘దుష్టకాలం’ అన్న భావన మన పురాణ ఇతిహాసాలలోనూ ఉంది. ఉదాహరణకు, కలియుగం, లేదా కలికాలం. మహాభారతంలో ఈ కలియుగం ప్రస్తావన చాలాచోట్ల వస్తుంది. ఉత్తములు నశిస్తారు, చెడు వర్ధిల్లుతుందన్న భావనా అందులో అడుగడుగునా వ్యక్తమవుతుంది. పాండురాజు మరణించిన తర్వాత వ్యాసుడు సత్యవతికి చేసిన బోధలో “గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్” అనే వాక్యం సుప్రసిద్ధం.
  2. మహాభారతం విషయంలోనూ ఇదే జరిగింది. హోమర్ తర్వాత ఆయన కృతులను శిష్యులు గానం చేస్తూ ప్రచారం చేసినట్టే, వ్యాసుని శిష్యులు మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ప్రచారం చేశారు. పండిత నిర్ధారణ ప్రకారం, వ్యాసుడు చెప్పిన మహాభారత కథ ఎనిమిది వేల శ్లోకాలే. ఆ తర్వాత ఆయన శిష్యులు రెండు అంచెలలో దానిని లక్ష శ్లోకాలకు పెంచారు. విచిత్రమేమిటంటే, ఇలాంటి విస్తరణ క్రమమే ఇలియడ్ కూ ఉంది. తంత్రీవాద్యం, గానం పోలిక రామాయణానికి మరింత దగ్గరగా వర్తిస్తుంది. రామాయణం “తంత్రీలయ సమన్వితం”. దానిని వాల్మీకి శిష్యులు కుశలవులు గానం చేశారు.
  3. ఈ అభివర్ణన THE GOLD OF TROY రచించిన Robert Payne ది.
  4. గ్రీకు దేవతలు ఈదా పర్వతం మీద నివసించినట్టే, మన పురాణాల ప్రకారం మన దేవతలు మేరు పర్వతం మీద నివసిస్తారు.
  5. సిస్టైన్ చాపెల్: వాటికన్ సిటీలోని పోప్ అధికారనివాసం.
  6. అంకెర్షాగెన్: జర్మనీలోని ఒక గ్రామం. స్లీమన్ తన బాల్యాన్ని ఈ గ్రామంలోనే గడిపాడు.

 

 

తక్షణ క్రియాశీలత కోరే ‘అసందిగ్ధ కర్తవ్యం’

 

  

-ఏ.కె. ప్రభాకర్

~

 

 “మనది దేశంలో అతి పెద్ద రసాయనిక కర్మాగారం. మనవి అత్యంత కీలకమైన ఉత్పత్తులు … కికెట్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు గెలిస్తే ఆనందంతో కేరింతలు కొట్టి మిఠాయిలు పంచుకొనే ‘వాళ్ళ’ ను కీలక స్థానాల్లో కూర్చుండబెట్టి నిశ్చింతగా కునుకు తీయగలమా? … పై పదవుల్లో ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు అనధికారికంగా , దేశభక్తి అనే అంశాన్ని కూడా గుర్తించాలి”

  • -అసందిగ్ధ కర్తవ్యం (ఆడెపు లక్ష్మీపతి)

రాజ్యాంగంలో పొందుపరచిన సమాన హోదా , సమాన అవకాశాలు (Equality of status and opportunity) అన్న  ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించే పై విధమైన ఆలోచన మన సమాజంలో యెప్పుడు మొదలైందో తారీఖులు దస్తావేజుల్తో చెప్పలేక పోవచ్చుగానీ , అది యివ్వాళ వ్యవస్థాగతంగా ఆధికారికంగానే అమలౌతుంది. మనువాద పాలకులకి సెక్యులరిజం బూతుమాటయి ‘అసహనం’ కలగజేస్తుంది.

మతతత్త్వం దేశభక్తి ముసుగేసుకొని చట్టసభల నేలమీద వికృతంగా నాట్యం చేస్తున్న ప్రత్యక్ష రాజకీయ సందర్భంలో మనం జీవిస్తున్నాం. ఫాసిస్టు శక్తులు హిందూ రాజ్య స్థాపన నినాదంతో  జాతీయవాదాన్ని భుజానికెత్తుకొని లౌకిక ప్రజాస్వామ్య సమత్వ భావనల్ని రూపుమాపడానికి ప్రణాళికా బద్ధంగా  ప్రయత్నిస్తున్నాయి. దేశాధ్యక్ష యెంపికల్లో  రాజకీయ కుట్రలు జరగడం , మతం అందుకు సాధనంగా మారడం మనకు కొత్త కాదు కానీ ప్రభుత్వ యంత్రాంగంలో పాలనా వ్యవహారాల ప్రధాన శాఖల్లో విశ్వవిద్యాలయాల్లో కీలక పదవుల్లో ‘సొంత మనుషుల్ని’ నియమించుకొని  ‘దేశద్రోహుల్ని’ యేరిపారేసే ‘ప్రక్షాళన’ కార్యక్రమం యిటీవల వూపందుకొంది. ఈ వ్యూహం మతవాద హంతకుల చేతికి బాహాటంగానే ఆయుధాలు అందిస్తుంది.

గుజరాత్ ప్రయోగాన్ని దేశమంతటా అమలు చేసే యీ తతంగానికి వొక నిర్దిష్టమైన  ఆధిపత్య ఫిలాసఫీ వుందని ప్రగతిశీలవాదులు గ్రహించి అప్రమత్తమయ్యే లోపు జరగాల్సిన నష్టం జరుగుతూనే వుంది. కేవలం సంఘటన జరిగినప్పుడే కాకుండా వ్యక్తులూ సమూహాలూ  నిరంతర స్వీయ చైతన్యంతో వున్నప్పుడు మాత్రమే లౌకిక ప్రజాస్వామ్య సంస్కృతిని కాపాడుకోగలం. సామాజిక దైనందిన జీవితాల్లోకి చాపకింద నీరులా చొచ్చుకొచ్చిన మతవాదుల ప్రమేయాల గురించి హెచ్చరిస్తూ నిర్దిష్టంగా  స్పష్టమైన అవగాహనతో ఆడెపు లక్ష్మీపతి రాసిన విశిష్టమైన కథ

’( ఈ వారం జనవార్త , 24 ఫిబ్రవరి , 2 మార్చి 2008 – కథాసాహితి ,కథ 2008 లో పునర్ముద్రితం ).

తెలంగాణా కథా రచయితల్లో విలక్షణమైన శైలి లక్ష్మీపతిది. డెబ్భై యెనభైల్లో అల్లం రాజయ్య , బి యస్ రాములు , తుమ్మేటి రఘోత్తం రెడ్డి , పి చంద్ మొదలైన రచయితలు నాగేటి చాళ్ళలో రగిలిన రైతాంగ పోరాటాన్నీ అడవిలో వెన్నెలలా విరగ పూసిన గిరిజన గూడేల చైతన్యాన్నీ బొగ్గుగుట్టల్లో కార్మిక వాడల్లో రగిలిన అగ్గికణాల్నీ కథలుగా మలిచిన రోజుల్లోనే  కరీంనగర్ కల్లోల పొత్తిళ్ళలోనే కలం తెరచిన రచయిత ఆడెపు లక్ష్మీపతి. అయితే రాకాసి బొగ్గుగనుల నేపథ్యం నుంచీ , గల్లీదాదాగిరీ స్వైరవిహారం చేసే పారిశ్రామిక వీథుల్లోంచీ , సెమీ అర్బన్ సంస్కృతిలో నెలకొన్న అరాచక స్నేహాలనుంచీ , జేమ్స్ జాయిస్ , వర్జీనియా వుల్ఫ్ , టాల్ స్టాయ్ , మామ్ , కుష్వంత్ సింగ్ , అబ్బాస్ , ముల్కరాజ్ ఆనంద్ మొ. విదేశీ – స్వదేశీ కలాల మీదుగా నడిచి రావడం మూలాన లక్ష్మీపతి కథారచనలో తనదైన ప్రత్యేకతని సాధించుకోగలిగాడు. జీవన్మృతుడు , తిర్యగ్రేఖ , ముసల్దాని ముల్లె , వ్యభిచారం , నాలుగు దృశ్యాలు, విధ్వంస దృశ్యం , త్రిభుజానికి నాలుగో కోణం , అసందిగ్ధ కర్తవ్యం వంటి కథలు వస్తు స్వీకరణలో – శిల్ప నిర్మాణంలో –  కథన సంవిధాన రీతిలో లక్ష్మీపతి చూపించిన వైవిధ్యం తక్కిన సమకాలీన రచయితల నుంచీ అతణ్ణి వేరుచేసి చూడడానికి కారణమౌతుంది.

తెలంగాణాలో  అప్పుడప్పుడే రూపొందుతోన్న ఆధునికానంతర సమాజంలో చోటుచేసుకొంటున్న సంక్లిష్టతల్ని లక్ష్మీపతి పట్టుకొన్నంత వొడుపుగా అతని సమకాలికులెవరూ పట్టుకోలేదంటే తప్పు కాదేమో! ఆ సంక్లిష్టతల్ని ఆవిష్కరించడానికే అతను కావాలనే విభిన్న శిల్పరీతుల్ని వుపయోగించి కథలు అల్లాడు. వస్తురూపాల్లో కొత్తదనం కోసం నిరంతరం తపించాడు. ఇమాన్యుయేల్ కాంట్ ఖలీల్ జిబ్రాన్ సీల్ గ్రాంట్ వంటి రచయితల కథనరీతుల్ని అధ్యయనం చేసిన నేపథ్యం నుంచీ రూపొందినదని విమర్శకుల మెప్పు పొందిన అరుదైన కథ  ‘అసందిగ్ధ కర్తవ్యం’ .

లక్ష్మీపతి యీ కథ రాసింది 2008 లో .  కానీ అప్పటికంటే యిప్పుడు  – సమాజపు ప్రధాన స్రవంతి ఆలోచనల్లో సైతం హిందూ – ముస్లిం అనే ద్విజాతి సిద్ధాంతాన్ని వేళ్ళూనికునేలా , పాలకుకులే ప్రధాన రాజకీయ యెజెండాగా పెట్టుకొని వొక పూనికతో పనిగట్టుకుని ప్రచారం చేస్తున్న సందర్భంలో – ఆ కథ  అవసరం యెక్కువగా వుంది. దాని ప్రాసంగికతను తెలుసుకోడానికి ముందు కథలోని వస్తువు క్లుప్తంగా :

కథ యెంత సరళమైందో అంతక్లిష్టమైంది. పబ్లిక్ రంగానికి చెందిన రసాయన కర్మాగారంలో ఇంజనీర్ గా అంకిత భావంతో పనిచేసే  మౌళి అనే ప్రధాన పాత్ర  అంతరంగ సంక్షోభంగా వుత్తమపురుష దృక్కోణంలో కథ నడుస్తుంది. అతని మానసిక క్షోభకి కారణం వొక వుద్యోగి ప్రమోషన్ విషయమై  పై అధికారులతో యేర్పడ్డ వివాదం.

‘సమయపాలన , విధేయత , విషయపరిజ్ఞానం , విశ్లేషణాపటిమ , రిస్క్ తీసుకొనే చొరవ , నాయకత్వ లక్షణాలు … వగైరా అంశాల్లో మామూలు ‘సంతృప్తికరం’ కన్నా మరింత ఉన్నతమైన రిమార్కులు పొంది వెరసి ‘చాలా మెరుగైన’ అభ్యర్థిని’ ఫోర్ మెన్ స్థానం నుంచి మెరిట్ కేటగరీలో యింజనీర్ గా ప్రమోట్ చేయాలని మౌళి చేసిన సిఫారసు అతని పై అధికారులు చీఫ్ డిప్యూటీ చీఫ్ ఇండస్ట్రియల్ యింజినీర్లకి , పర్సనల్ మేనేజర్ కి నచ్చలేదు. కారణం ఆ అభ్యర్థి అబ్బాసలీ అనే ముస్లిం.

అబ్బాసలీ ముస్లిం అయిన వొకే వొక్క కారణంగా  ప్రమోషన్ కి అనర్హుడై పోయాడు. మతం  ‘పుట్టుమచ్చ’తో దేశద్రోహి అయిపోయాడు. తమకి అనుకూలమైన ‘టెంపుల్ కమిటీ మెంబర్’ని ‘నమ్మకస్తుడిగా’ అందలమెక్కించాలంటే , అబ్బాసలీని చీడపురుగులా చూపాలంటే – చూపి యేరిపారేయాలంటే యేదో వొక కేసు అతని మీద బనాయించాలి. ఉద్యోగ విధుల్ని సరిగా నిర్వర్తించడం లేదని నిరూపించి క్రమశిక్షణ చర్య తీసుకోవాలి. లేదా దేశద్రోహి ముద్ర వేయాలి. వృత్తి పట్ల అతని నిబద్ధతని బద్నాం చేయాలి   ( జె యెన్ యూ లోనూ హెచ్ సి యూ లోనూ  యిటీవలి వ్యవహారాలు గుర్తు రావడం లేదూ!). నిఘా షురూ. వేట మొదలు. అబ్బాసలీ డ్యూటీలో వుండగా లెబనీస్ ఫిలాసఫర్ రాసిన పుస్తకం అతని టేబిల్ మీద కనిపించిందని  (చదువుతున్నాడని కాదు) వింత ఆరోపణ. అందులో యే ఫండమెంటల్ సిద్ధాంతాలున్నాయోనని  విచిత్రమైన అనుమానం. అతనికి వ్యతిరేకంగా డిపార్ట్ మెంటల్ స్థాయిలో డిసిప్లీనరీ యాక్షన్ మౌళియే తీసుకోవాలి. కాదంటే మౌళిని యిరుకున పెట్టడానికి ఫ్యాక్టరీ వ్యర్థాలని వూరి చెరువులోకి వదిలిన కారణంగా జరిగిన ప్రమాదానికి సంబంధించిన పాత కేసును వెలికి తీస్తారు. అందుకు అతణ్ణి బాధ్యుణ్ణి చేసే వ్యూహాన్ని రచిస్తారు. దీన్నుంచీ బయట పడాలంటే అతను తన సిఫారసుల్ని వెనక్కి తీసుకోవాలి. అబ్బాసలీ కెరీర్ ని నాశనం చేయాలి.

ఈ సందర్భంలో సెక్యులరిజం గురించి దేశభద్రత గురించి అంతర్జాతీయ ‘ఉగ్రవాదం’ గురించి ప్రతిభ గురించి ప్రమాణాల గురించి ముస్లింల ప్రొఫైలింగ్ విషయమై దేశంలో ‘చాప కింద నీరులా అమలవుతున్న విధానాల’ గురించి గ్లోబల్ సందర్భం గురించి పై అధికారుల ముఖత: రచయిత పలికించిన మాటలు రాజ్యాంగం దేశ పౌరులకిచ్చిన హక్కుల్ని పాలక వర్గాలు యెంత బేఖాతర్ చేస్తున్నాయో స్ఫుటంగా తెలియజేస్తాయి.

ఆబాల్యం నమ్మిన – అమ్మ శిక్షణలో నేర్చుకొన్న విలువలకీ వుద్యోగంలో యెదురైన ధర్మసంకట పరిస్థితికీ మధ్య నలిగే మౌళి ‘పంటి నొప్పి’ కారణంగా మెడికల్ లీవ్ పెడతాడు. దాన్ని కూడా తమకి అనుకూలంగా మార్చుకోడానికి అధికారులు శాంక్షన్ చేస్తారు. కానీ చివరికి మౌళి అబ్బాసలీకి న్యాయం చేయడానికే నిశ్చయించుకొని యుద్ధానికి సన్నద్ధుడౌతాడు. అయితే అతనా నిర్ణయానికి రావడానికి కారణమైన చిన్ననాటి సంఘటనే కథకి ఆయువుపట్టు. ఆ సంఘటనకీ పంటి నొప్పికీ వున్న సంబంధాన్ని విప్పి చెప్పడానికీ , ఆ సంఘటనని కథలోకి అన్ ఫోల్డ్ చేయడానికీ లక్ష్మీపతి యెన్నుకొన్న టెక్నిక్కే కథని వుత్తమ కళాఖండంగా రూపొందడానికి దోహదం చేసింది.

సెలవులో వున్న మౌళి టౌన్ షిప్ సంక్షేమ సమితి నిర్వహించే ఉగాది వారోత్సవాల్లో అతని కూతురు నటిస్తున్న ‘చిట్టచివరి యుద్ధం’ నాటికని చూడ్డానికి వెళ్తాడు. ‘ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం గనుక సంభవించి పరస్పర మత, జాతి విద్వేషాలతో వివిధ దేశాలు ఒకదానిపై మరొకటి వినాశకర అణ్వస్త్రాలు , జీవ రసాయనిక ఆయుధాలు ప్రయోగించుకున్నట్లయితే …’ అన్నది నాటిక వస్తువు. స్టేజి మీద యుద్ధరంగాన్ని మౌళి మనసులో ఆశలకూ ఆశయాలకూ నడుమ , అంతరాత్మ ప్రబోధానికీ కెరీరిస్టు ప్రలోభానికీ మధ్య జరిగే సంకుల సమరాన్ని , పంటి నొప్పిని కొల్లేజ్ చేస్తూ గత వర్తమానాల మధ్య కథని ముందుకీ వెనక్కీ స్వింగ్ చేస్తూ చెప్పిన తీరు అమోఘం.

స్టేజి మీద ప్రదర్శన జరుగుతూండగా మౌళికి ‘ఎవరైనా బలంగా కొట్టారా మిమ్మల్ని?’ అని డెంటిస్ట్ అడిగిన ప్రశ్న గుర్తొస్తుంది. కంపినీలో ప్రమాదం సంభవించినప్పుడు అబ్బాసలి ప్రాణాలకి తెగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చిన సంఘటన కళ్ళ ముందు కనిపిస్తుంది. అతని ప్రమోషన్ని అడ్డుకొనేందుకు పై అధికార్లు పన్నుతోన్న కుట్రలు , వాళ్ళతో తన ఆర్గ్యుమెంట్లూ జ్ఞప్తికొస్తాయి. ప్రదర్శనలో కోతి పాత్రలో యెంతో చురుగ్గా అద్భుతంగా నటిస్తున్నబాలనటుణ్ని చూస్తే చదువులో ఆట పాటల్లో అందరికన్నా ముందుండే తన బాల్యమిత్రుడు సలీం గుర్తొచ్చాడు. ఈర్ష్యతో తను అతనికి చేసిన ద్రోహం , అందుకు అమ్మ తనని బలంగా మూతి మీద కొట్టిన దెబ్బ ‘మస్తిష్కంలో తుఫానులా’ అలజడి చేశాయి. అలాంటి ‘తప్పు ఇంకెప్పుడూ చేయకు’ అన్న అమ్మ హెచ్చరిక తాను నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని నిర్దేశించింది. నాటికలో థియేటర్లో ముందువరసలో కూర్చొన్న చీఫ్ యింజినీర్ కళ్ళలోకి నిర్భయంగా చూపులు కలిపి  సెలవు కేన్సిల్ చేసుకొన్నట్టు భార్యకి చెబుతాడు.

స్టేజి పై పిల్లల నాటక ప్రదర్శన  , ప్రేక్షక స్థానంలో కూర్చొన్న మౌళి అంతరంగ శోధన , బాల్యంలో  ముస్లిం స్నేహితుడు సలీం జ్ఞాపకాలు , అతని పట్ల తన ప్రవర్తన , అమ్మ బోధించిన జీవితపు విలువలు వాటిని పాటించలేకపోతున్న అపరాధ భావన , చేసిన తప్పుని దిద్దుకోవాలనే తపన … కథకి అవసరమైన వాతావరణాన్ని, మౌళి  అంతరంగ సంక్షోభ చిత్రణకి కావాల్సిన సంఘర్షణని , యేకకాలంలో మనశ్శరీరాలనుభవించే వేదననీ  కథలోకి తీసుకురావడంలో , వొకేసారి నాలుగు స్థల కాలాల్లో గత వర్తమానాల మధ్య వూయలూగే కథన నిర్మాణంలో లక్ష్మీపతి చూపిన నేర్పు అబ్బురపరుస్తుంది.

వస్తువు రచయిత స్వీయ వుద్యోగ జీవితానుభవం నుంచీ తీసుకున్నందువల్ల , యిన్ సైడర్ కథనం కావడం వల్ల  కథకుడి విషయ పరిజ్ఞానం పట్ల పాఠకుల్లో విశ్వసనీయత కలుగుతుంది. ఫ్యాక్టరీ పాలనా వ్యవహారాలన్నీ ఆధిపత్య మత కుల శక్తుల అధీనంలో వున్నాయని చెప్పడానికి ప్రతి సూక్ష్మాంశాన్నీ రచయిత పరిగణనలోకి తీసుకొన్నాడు( అధికార్లకి పెట్టిన భార్గవ కాశ్యప్ వర్మ వామనరావు వంటి పేర్ల దగ్గర్నుంచీ ).

స్టేజిపై జరిగే ప్రదర్శనని  సమాంతరంగా నడపడం వల్ల అందులోని సన్నివేశాల్ని పాత్రల్ని మౌళి అంతరంగ సంక్షోభానికి కారణమైన సంఘటల్ని వ్యక్తుల్నీ పోల్చి చూసుకొనే అవకాశం రచయితే కల్పించాడు. స్టేజి మీద యుద్ధం మౌళి లోపల యుద్ధం అన్నంత వరకూ , ఏంజిల్ పాత్రలో అనుపమని (మౌళి కూతురు) చూసినపుడు అమ్మ గుర్తుకురావడం , నాటిక పోటీలో ప్రతిభకి గుర్తింపుని అబ్బాసలీ ప్రమోషన్ తో ముడిపెట్టడం వరకూ   బాగానే వుంది కానీ …. నాటికలో  సూక్ష్మ క్రిమి గుర్రం పాము సింహం చివరి మనిషి  వంటి పాత్రలు యేవి యెవరికి ప్రతీకలుగా వున్నాయో తెలుసుకోవడంలో కొంత గందరగోళం యేర్పడి పాఠకుడికి మానసిక శ్రమ కలుగుతుంది. అయితే మౌళి ఆలోచనల్లో సుదూర – సమీప గత వర్తమానాల మధ్య వారధిలా , మరీ ముఖ్యంగా సలీం జ్ఞాపకాలని తవ్వడానికి , ప్రదర్శన చక్కగా వుపయోగపడింది. అంతిమంగా మనిషి మానవీయ విలువల్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని బోధించింది. కథలోనూ కథ లోపలి కథలోనూ అంతస్సూత్రంగా వున్న యీ సారాన్ని ముడివేయడానికి లక్ష్మీపతి అడుగడుగునా మెలకువతో వర్తించాడు.

సలీం మౌళిల మధ్య చోటుచేసుకొన్న వైరుధ్యంలోని సామాజిక కోణాన్ని ఆవిష్కరించడంలో సైతం రచయిత గొప్ప కౌశలం చూపాడు. సలీం ‘చదువులోనూ ఫస్టు. ఆటల్లోనూ ఫస్టు’. వాడికన్ని శక్తి సామర్థ్యాలు యెక్కడివంటే – వాడి ‘ఇంట్లో ఎద్దు మాంసం తింటార’ ని మౌళి మిత్రులకి  చెబుతాడు. అదే విధంగా మౌళి  మిత్రులంతా కోతికొమ్మచ్చి ఆడడానికి ‘తెల్లగున్నోడు దొరా , నల్లగున్నోడు దొంగ’ అని చప్పట్లు వేసినప్పుడు ‘సలీంది తెల్లనిదీ మిగతా ముగ్గురివీ నల్లనివీ’ వస్తాయి. ఆట నీతి ప్రకారం సలీం దొంగ కాకూడదు. కానీ ఆటలోని సహజ న్యాయాన్ని ‘మెజార్టీ’ బలంతో రద్దుచేసి మౌళి సలీంని దొంగగా తీర్మానిస్తాడు. పాపం సలీం మౌనంగా అంగీకరిస్తాడు. అలా సమకాలీన సమస్యలుగా పరిణమించిన బీఫ్ తినడం , మెజార్టీ ఆధిపత్యం వంటి విషయాలు కథలోకి అలవోకగా వచ్చి చేరాయి.

ఈ కథ యిప్పుడు రాసి వుంటే యీ విషయాల్ని రచయిత కథలో పనిగట్టుకు చొప్పించినట్టు భావించడానికి అవకాశముండేది. కానీ 2008 లోనే యింత లోతైన అంశాల్ని కథలో ప్రస్తావించిన లక్ష్మీపతి క్రాంతదర్శిత్వాన్ని మెచ్చుకోకుండా వుండలేం. అడ్డగోలు పారిశ్రామికీకరణ కారణంగా జీవితాలు విచ్ఛిన్నమైన తన ప్రాంత  ప్రజల  తీరని వెతల్ని స్టోరీగా రిపోర్ట్ చేసిన కడప గ్రామీణ విలేకరి ముస్లిం అయిన కారణంగా (ఇస్మాయిల్) వార్తా పత్రిక ఎడిటర్ అతణ్ణి ‘హిందూ సంపద’కి వ్యతిరేకిగా ముద్రవేసి పత్రికలో న్యూస్ స్టోరీని తిరస్కరించడాన్ని అద్భుతంగా చిత్రించిన కేతు విశ్వనాథ రెడ్డి ‘విరూపం’ కథ (2002) కూడా నాకీ సందర్భంలో  గుర్తుకొస్తుంది. పాఠకులు పాఠ్యం లోతుల్ని అర్థం చేసుకొని రచయిత దృక్పథాన్ని అందుకోడానికి  అవసరమైన పరికరాలు కథ బయటకన్నా కథలోనే ప్రత్యక్షంగానో పరోక్షంగానో మిళితమై వుంటాయని  చెప్పడానికి ఆడెపు లక్ష్మీపతి ‘అసందిగ్ధ కర్తవ్యం’ గొప్ప వుదాహరణ. శిల్పం వస్తువుని వున్నతీకరించడానికి యెలా దోహదం చేయగలదో  తెలుసుకోడానికి లక్ష్మీపతి కథలు పాఠ్య గ్రంథాల్లా వుపయోగపడతాయని చెప్పడం యే మాత్రం అతిశయోక్తి కాదు.

తిండిని సంస్కృతిలో భాగంగా భావించిన బుద్ధిజీవులు బీఫ్ ని నిషేధించడం దళితుల మైనార్టీల సాంస్కృతిక అస్తిత్వంపై జరుగుతున్న దాడిగా , భారతీయ సమాజంలోని బహుళత్వాన్ని నాశనం చేసే యెత్తుగడగా  అభివర్ణిస్తూ వ్యాఖ్యానించడం తరచుగా వింటున్న కోణమే. అయితే నా మట్టుకు నాకు లక్ష్మీపతి రాసిన  ‘అసందిగ్ధ కర్తవ్యం’  చదివాకా యిటువంటి నిషేధం ప్రత్యేకంగా కొన్ని సెక్షన్ల పౌరుల్ని శారీరికంగా బౌద్ధికంగా బలహీనులుగా మార్చడానికి రహస్యంగా నిర్మించుకొన్న అజెండానేమో అన్న అనుమానం సైతం కలుగుతుంది. అంతే కాదు కథలో ఆటలో సలీంని ‘సీసాపెంకుల్లోకి తోసేయాలన్న పాడు ఆలోచన’ మౌళికి కలిగినందుకు అతని అమ్మ యెంతో నొచ్చుకొంటుంది. సలీం తల్లిదండ్రుల్ని ‘రసూల్ మామ బీబీ అత్త’ అని పేర్కొని వాళ్ళ పట్ల సహానుభూతినీ ప్రకటిస్తుంది. తెలిసో తెలీకో కొడుకు చేసిన తప్పుని భవిష్యత్తులో తిరిగి చెయ్యొద్దని శాసించింది.

మౌళి చిన్నతనంలో మన సమాజంలో వుండిన యీ స్నేహ బాంధవ్యాల్ని మాయం చేసి విభజన రేఖలు సృష్టిస్తున్న ‘అసాంఘిక’ శక్తులు యివాళ రెచ్చిపోతున్నాయి. వాటిని  అణచివేయాల్సింది పోయి  వాటికి పాలకులే వత్తాసు పల్కుతున్న సందర్భంలో అబ్బాసలీకి అండగా నిలవడానికి మౌళి నిశ్చయించుకొన్నాడన్న ముగింపు గొప్ప భరోసానిస్తుంది. ‘ద్వేషంతో ఏకపక్ష కోణంలోంచి ఆలోచించకండి’ అని నాటక ప్రదర్శనలో హితవు పల్కిన ఏంజిల్ వేషం కట్టిన కన్నకూతురిలో కన్నతల్లిని చూసుకొని తప్పు దిద్దుకొని ‘మనిషిని కాపాడడానికి’  సిన్సియర్ వుద్యోగిగా తనకున్న సమస్త శక్తులూ –  అస్త్ర శస్త్రాలు -వుపయోగించడానికి వెనుకంజ వేయని మౌళిలోని క్రియా శీలతని అందిపుచ్చుకోవడమే యివ్వాళ మనముందున్న అసందిగ్ధ కర్తవ్యం.

 

*

 

 

 

హద్దుల్లేని అద్దమై …

 

 

చిత్రం: ప్రవీణా కొల్లి

పదాలు: ప్రసాద్ బోలిమేరు

~

 

నువ్వు విచ్చినప్పుడల్లా
గుండె  జ్ఞాపకాలనెందుకు స్రవిస్తుందో
నీ ఆత్మవికాసానికి తెలిసేవుందాలి
ఎవరికైనా రహస్య ప్రణాళిక ఎందుకుండాలి?
అక్షరమై
మనసుగంధాన్నిమోసుకెళ్ళాలనే
ఆరాటం తప్ప.

ముళ్ళపానుపు పై సైతం
స్వప్నసౌకుమార్యాన్ని నిర్మించుకొనే
నీ యోగనిద్ర
సప్తవర్ణాల రెక్కల్ని సాధించిన గొంగళిపురుగు
ఆరాటమే కదా .

అక్షరంలా
నువ్వు పుటలుపుటలుగా విప్పారేది
జీవన ప్రహేళికను పరిష్కరించటానికే కదా .

సుమమే అక్షరమై
అక్షరమే ఆరాటమై
ఆరాటమే అడివై
అడివే హద్దుల్లేని అద్దమై
విచ్చినప్పుడల్లా స్రవిస్తుంది — ఓ ఆశ .

ఓ మై గాడ్!

 

                                                                     -బమ్మిడి జగదీశ్వరరావు

 

దక్షిణాఫ్రికాలో చర్చిలు వున్నట్టే సఫారీ పార్కులు కూడా వున్నాయి! చర్చిలో పాస్టర్లు వున్నట్టే సఫారీ పార్కులో సింహాలు కూడా వున్నాయి! జియాన్ క్రిస్టియన్ చర్చి పాస్టర్లంతా సింహాలు వుండే క్రూగర్ నేషనల్ సఫారి పార్క్ కు వెళ్ళారు! సింహాల తరుపున పాస్టర్లు దేవుణ్ణి ప్రార్థిస్తారేమోనని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు!

ఇటు చూస్తే పాస్టర్ల గుంపు! అటు చూస్తే సింహాల గుంపు!

పాస్టర్ అలెక్ ఎండివాన్ ను తోటి పాస్టర్లు ఆపినా ఆగకుండా సింహాలవైపు నడిచాడు! దేవుడు తనయందు వున్నాడన్నాడు! సింహాలయందు కూడా దేవుడు వుంటాడని మిగతా పాస్టర్లు చెప్పిచూసారు! నేను దేవుని ప్రతినిధిని అని ఎండివాన్ యెంతో గర్వంగా చూసాడు! దేవుడు నన్ను సింహాల నుండి రక్షిస్తాడు అనికూడా అంతే నమ్మకంగా చెప్పాడు!

పాస్టర్లంతా దేవుణ్ణి ప్రార్ధించడం మాని ఎండిమాన్ ని ప్రార్ధించారు! అవి సింహాలని.. దేవుడు చెప్పినా వినవని.. మొత్తుకున్నారు! దేవుడు చెపితే యెవరన్నా వినవలసిందే.. సింహాల్లారా! మీరయినా వినవలసిందే.. అని సింహాలకు అరిచి మరీ చెప్పాడు ఎండిమాన్! అరుపులు విన్న సింహాలు- మాంసము తినడం మాని- తోకూపుతూ ఎండిమాన్ ను చూసాయి! దేవుని వాక్యము మీరు కాదనగలరా? అని మరోమారు అరిచాడు ఎండిమాన్! సింహాలు లేచి నిలబడ్డాయి! అదీ గౌరమంటే అని మురిసిపోయాడు ఎండిమాన్! దేవుణ్ణి ప్రార్ధిస్తూ సింహాలకు యెదురెళ్ళాడు!

ఎండిమాన్ ని మిగతా పాస్టర్లు వేన్లోకి రమ్మని ప్రాధేయపడ్డారు! దేవుణ్ణి అవమానించొద్దన్నాడు ఎండిమాన్! దేవుడు గొప్పో సింహాలు గొప్పో తేలిపోతుంది అని గంతులువేసాడు! నాది దేవుని త్రోవ అన్నాడు! సింహాలు త్రోవకు దగ్గరగా వచ్చేస్తున్నాయి! దేవుని త్రోవను అనుసరించలేక తోటి పాస్టర్లు వెంటనే వెనక్కి వచ్చి వేనెక్కారు! ఎండిమాన్ కూ సింహాలకూ వున్న మధ్య దూరం క్షణాల్లో తగ్గుతోంది!

దేవుడా.. నువ్వే గనక వుంటే సింహాల గుంపు నన్నేమీ చెయ్యబోవు గాక.. అని నినదించాడు ఎండిమాన్! సింహాలు జూలుదులుపుకు పరిగెత్తుకువచ్చాయి! అంతవరకూ వున్న సింహాలు సింహాలుగా కాక, వొక్కసారిగా మీదకోస్తున్న సైతానుల్లా కనిపించాయి! అంతే-

దేవుడా.. అని ఎండిమాన్ వెనక్కి తిరిగి పరిగెత్తాడు! సింహాలు ఆగిపోలేదు.. పరిగెత్తుతూ వచ్చేసాయి! సింహాలకన్నా వేగంగా పరిగెత్తలేకపోయాడు! సింహాల పంజా దెబ్బలకు రక్తంతో అతని పిరుదులు వరదలు గట్టాయి! సమయానికి సఫారీ పార్క్  సిబ్బంది వచ్చి సింహాల బారినుండి ఎండిమాన్ ను కాపాడారు!

ఎండిమాన్ ని పరామర్శించడానికి చాలా మంది భక్తులూ తోటి పాస్టర్లు వచ్చారు!

ఆసుపత్రిలో కోలుకుంటున్న ఎండిమాన్ ‘బహుశా.. జంతువులపై తన ఆధిపత్యాన్ని చాటిచెప్పేందుకే దేవుడు నన్ను వాడుకొని వుంటాడు’ అని తనని తాను సమర్ధించుకున్నాడు! తోటి పాస్టర్లు ఎండిమాన్ కు తలమీద కూడా దెబ్బ తగిలిందేమోనని కలవరపడి డాక్టర్లని చూడమన్నారు! అలాంటిదేమీ లేదని డాక్టర్లు చెప్పారు!

ఈ ఆందోళనలతో సంబంధం లేకుండా- సింహాల ఆధిపత్యానికి అవకాశం లేదు, వాటిని నిలువరించి తన ఆదిపత్యాన్ని దేవుడు నిరూపించుకున్నాడు, అందుకు నన్ను వాడుకోవడం నాకెంతో గర్వంగా కూడా వుంది- అని నొప్పిగా కూడా వుంది అన్నట్టు మూలిగాడు ఎండిమాన్!

అలా దేవుని నిర్ణయము మీదికి మళ్ళాయి మాటలు!

“దేవుడు వచ్చేవాడు.. కానీ ఎండిమాన్ దేవుడికోసం నిరీక్షించలేదు.. సింహాలను చూసి వెనుతిరిగిపోయారు.. దేవుని తోవన నిలువగలిగి వుంటే దేవుడు తప్పక రక్షించేవాడు..!” వణుకుతున్న స్వరంతో అన్నాడు అందర్లోకీ ముదర పాస్టరు!

ఎండిమాన్ ఆమాట విని అవాక్కయాడు! ఆలోచనలో పడ్డాడు! తనను పరామర్శించడానికి వచ్చారో విమర్శించడానికి వచ్చారో అతనికి అర్థం కాకుండా వుంది!

“అసలు ఆ దేవుడే సింహాల రూపములో వొచ్చాడని యెందుకు భావించకూడదు..?” మరో లేత పాస్టరు ప్రశ్నించాడు! “విశ్వ వ్యాప్తమైన దేవుడు సింహాలలో మాత్రం లేడని యెట్లు భావించగలం..?” అని తన మాటకు తనే మద్దతుగా మాట్లాడాడు ఆ పాస్టరు!

“కాదు.. కాదు! ‘దేవుడా.. నువ్వే గనక వుంటే సింహాల గుంపు నన్నేమీ చెయ్యబోవు గాక..’ అని ఎండిమాన్ అన్నాడు! ఆమాటను పరీక్షించి పరిశీలించండి! ‘దేవుడా నువ్వే గనుక వుంటే’ అంటే అని ప్రేయర్ చేయడం తప్పు! ‘నువ్వున్నావ్.. నన్ను తప్పక రక్షిస్తావ్..’ అనికదా ప్రార్థించాలి! ‘వుంటే’ అనడంలో ‘లేకుంటే’ అనే ధ్వని వున్నది! నాస్తిక ధ్వని వున్నది! యిది అపచారము! పైగా ‘నన్నేమీ చెయ్యబోవుగాక..!’ అని అనుటలో దైవాన్ని ఆదేశించడము అగుపించు చున్నది! పాపవాక్యం.. పరిశుద్ధమగుగాక..!” ఎండిమాన్ కు పోటీదారుగా వున్న మరో పాస్టరు యింకా మాట్లాడేవాడే-

“దేవుడు గొప్పో – సింహాలు గొప్పో తేలిపోతుంది’ అని దేవుడిని సింహాలను నీవు సమానం చేయడం దేవుడికి నచ్చలేదు..!” అని మరో నడివయసు పాస్టరు అంటే- “సింహాలకు కూడా నచ్చలేదు, అందుకే నీ పిరుదులు చీల్చాయి..!” అని మధ్య వయసు పాస్టరు మధ్యలో అన్నాడు! “దేవుడే సింహాలను ఆదేశించి ఆపని చేయించాడు..!” అన్నాడు యింకో పాస్టరు!

“అయితే సింహాలకు ఆ కార్యముతో సంబంధము లేదు.. అవి నిమిత్తమాత్రమైనవి..!” యింకో పాస్టరు అన్నాడు! ఎండిమాన్ కు శరీరం మీది గాయాల నొప్పి తగ్గింది! అంటే మనసులో నొప్పి తీవ్రమైంది! కంట నీరు పెట్టుకున్నాడు!

“నిన్ను రక్షించే అవకాశం నీవే దేవునికి యివ్వలేదు..! అక్కడే నీవు నిలిచి వున్నచో పరిగెత్తుకు వచ్చిన సింహాలు ప్రభువు చేత నిమరబడిన గొర్రిపిల్లలు అయ్యేవేమో..?! దేవుని ఆజ్ఞ లేకుండా సింహాలు నీ మీద దాడికి వచ్చునా? ఈ నిజవాక్యమును నీవు విస్మరించినావు..!” వణుకు తోనికే స్వరంతో అన్నాడు ముదర పాస్టరు!

“నీవాక్యముపట్ల నీకు నమ్మకము లేదు..! నీ నమ్మకముపై నీకు విశ్వాసము లేదు..!” ఎండిమాన్ కు పోటీదారుడైన పాస్టరు పలికాడు! “యిది మన పాస్టర్లను అవమానపరచడమే..!” అనికూడా అన్నాడు! అతని వాక్యము ఆప్తవాక్యమైనట్టు అందరూ మౌనం పాటించారు!

“అంతకంటే సింహాలకు ఆకలి తీర్చిన వాడవైతే.. నీ జీవితమూ చరితార్ధమయ్యేది..” పోటీ పాస్టరు మౌనాన్ని భగ్నం చేసాడు!

అవమానంతో తల తిప్పుకున్నాడు ఎండిమాన్! దేవుని పట్ల తన ప్రవర్తన అపచారంగా భావించి విచారంగా కన్నీళ్లు కార్చాడు ఎండిమాన్! కుమిలిపోయాడు!

కాసేపటికి తేరుకొని, కళ్ళు తుడుచుకొని “దేవుని శిక్షకు నేను అర్హుడని..!” వొప్పుకుంటున్నట్టుగా తనలో తాను అనుకుంటున్నట్టు పైకే అన్నాడు. అని, “మరి దేవునికి అవకాశమీయక మీరెందుకు వెనక్కి పరిగెత్తుకు వెళ్ళి వేనెక్కినట్టు..?” తల యిటు తిప్పి అడిగాడు ఎండిమాన్!

అప్పటికే తోటి పాస్టర్లు అక్కడలేరు! అవతలికి నడిచి డాక్టర్లతో మాట్లాడుతున్నారు!

మధనపడ్డ ఎండిమాన్ మధించి మధించి అనుభవాన్ని శోధించాడు! సత్యాన్ని తెలుసుకున్నాడు! వొక సత్యవాక్య తీర్మానమూ చేసుకున్నాడు! “దేవుని విశ్వసించ వలెను! కాని ఆ విశ్వాసము నెగ్గుట కొరకు బరిలోకి దైవాన్ని దింపరాదు.. మనమూ దిగరాదు.. దిగినచో దేవుడు కూడా రక్షించలేడు..!” అని!

“దేవుడు దయామయుడు.. దయామయుడు అయినచో నన్ను యెందులకు రక్షించలేదు..? అలా రక్షించనిచో దేవుని వునికి యెటుల తెలియును..? దేవుని వునికి విస్తరింప జేయుటయే పాస్టర్ల ప్రాధమిక బాధ్యత కదా? ఆ బాధ్యతకు ప్రభువే ప్రతిబంధకంగా నిలుచుటలోని పరిహాసమేమి? అంతరార్దమేమి? నేను దైవం పక్షం వుండినాను, దైవము నాపక్షము యేల లేదు..? నేను రేపు దైవము అస్తిత్వాన్ని అందించిన జనులు అందుకుంటారా? మీ యెడల లేని దైవము మా యెడల యెటుల వుండును.. అని ప్రశ్నించిన యేమి కర్తవ్యము? మీ అస్తిత్వం లేకుండా నా అస్తిత్వం వుండునా? నా అస్తిత్వం లేకుండా మీ అస్తిత్వం వుండునా..?”

లెంపలేసుకున్నాడు ఎండిమాన్! దేవుని అస్తిత్వం.. తన అస్తిత్వం సమం చేసి ఆలోచిస్తున్ననా? అని మళ్ళీ భయం వేసింది! ఆలోచనలు ఆగడం లేదు.. తెగడం లేదు..

“నా మనసు పాప పంకిలమగుచున్నది.. అయినా పాపులను రక్షించుటకే కదా ప్రభువు పుట్టినాడు.. నన్ను రక్షించలేదు అంటే నేను పాపిని కాను! పరిశుద్దుడను! పరిశుద్దమే దైవము! అటులైన నేనే దైవము! దైవము వేరుగా లేదు! లేదు దైవమే లేదా?..”

మళ్ళీ లెంపలేసుకున్నాడు ఎండిమాన్! దైవాన్ని.. తన్ని సమం చేసి ఆలోచిస్తున్ననా? అని మళ్ళీ భయం వేసింది! ఆలోచనలు ఆగడం లేదు.. తెగడం లేదు..

“డాక్టర్..” పెద్దగా అరిచాడు ఎండిమాన్! భరించలేని తనం గొంతులో కనిపించింది! డాక్టర్లూ సిస్టర్లూ పాస్టర్లూ పరిగెత్తుకు వచ్చారు! ఏమయింది అన్నారు! తనని రక్షించమన్నాడు! ‘దేవుడు నిన్ను రక్షించుగాక’ పాస్టర్లు దీవించి ప్రార్ధించబోయారు! ‘దైవం నుండి రక్షించుగాక..’ అనుకున్నాడు ఎండిమాన్! ఆలోచనల్ని అదుపు చేసుకోలేకపోయాడు! పాప భయంతో మళ్ళీ లెంపలేసుకున్నాడు! భయంతో వణికాడు! ఆ భయం సింహాలు వెంటపడ్డప్పటి భయాన్ని మించిపోయింది!

ఎండిమాన్ చేష్టలన్నీ ప్రాయశ్చిత్తపు వుపసంహారంగా భావించారు పాస్టర్లు! నీవు పరిశుద్దుడవి అన్నారు! కాదన్నట్టు అడ్డంగా తలూపాడు ఎండిమాన్! దేవుడు మన్నించాడు అనుకున్నారు పాస్టర్లు! ఎండిమాన్ లో వొచ్చిన మార్పుకు మురిసిపోయారు!

విలవిలలాడిన ఎండిమాన్ యెటువంటి ఆలోచనలు రాకుండా ప్రశాంతత కోసం మత్తు యింజక్షన్ యివ్వమన్నాడు! డాక్టరు చేతుల్ని పట్టి వదల్లేదు! దైవం కన్నా ప్రశాంతత, వుపశమనం వుంటుందా? తోటి పాస్టర్లు అనేసరికి తలయెత్తి దబా దబా వెనక్కి కొట్టుకున్నాడు! డాక్టర్లూ సిస్టర్లూ ఎండిమాన్ ఆపుతూ అతని తలని గట్టిగా పట్టుకున్నారు!

దైవ ప్రార్ధనలు చేసారు చుట్టూ చేరిన పాస్టర్లు!

 

కరువు కాలం

 

 

-ప్రసాదమూర్తి

~

 

ఒక బావురు కప్ప

మనిషిని చూసి బావురుమంది

గుక్కెడు నీళ్ళు దొరకడం లేదని కాదు

గుండెలో చుక్క నీరు కూడా నీకెందుకు కరువైందిరా అని

కప్ప చకచకా బెకబెకామంది

 

ఎంత కరువొచ్చి పడిందిరా బాబాయ్

కూటికీ నీటికీ మాత్రమేనా !

అంతా కరువేరా

మాటల్లో మాటకి కరువు

నవ్వుల్లో నవ్వుకి కరువు

స్పర్శల్లో స్పర్శకి

మనుషుల్లో మనిషికి కరువు
ఎంత కరువొచ్చి చచ్చిందిరా

ఏం కాలమొచ్చిందిరా అబ్బాయ్

ఒక పశువు మనిషిని తిట్టింది

మేం తినాల్సిన గడ్డి నువ్వు తింటున్నావ్

అందుకే మేత కరువై మేం కబేళాలకు పోతున్నామంటూ

పశువు ఖాళీ నోటితో నెమరేస్తూ కసురుకుంది
ఏం కరువు కాలంరా అబ్బిగా

మాయదారి కరువు..మహమ్మారి కరువు

చట్టసభల్లో చట్టానికి కరువు

న్యాయాలయాల్లో న్యాయానికి కరువు

నేతల్లో నీతికి..

పాలకుల్లో పాపభీతికీ కరువొచ్చి చచ్చిందే
రాళ్ళు బద్దలవుతున్నాయి

ఊళ్ళు దగ్ధమవుతున్నాయి

పొలాలు హలాల్ అవుతున్నాయి

జలాలు ఆకాశ ఫలాలవుతున్నాయి

కరువురా కరువు.. పైనా కిందా చుట్టూ అంతా

ఎంత కరువొచ్చి వాలిందిరా నాయనా

చెట్టు మనిషిని ఛీత్కరించుకుంది
ఉద్గారాలు ఊదుతున్నాడని కాదు

కడుపులో కాసింత పచ్చదనానికే

ఎందుకు కరువొచ్చి కొట్టుకుంటున్నావురా అని

నీడల చేతులతో చెట్టు మనిషి చెంప ఛెళ్ళుమనిపించింది

కరువే..కష్టకాలమే..కోరల చారల దెయ్యం కాలమే
ఆపమనండిరా వాళ్ళని ఆ చావులెక్కలు ఆపమనండి

లెక్కించాల్సింది ఆత్మహత్యలనో ఆకలి చావులనో కాదు

హంతకులను లెక్కపెట్టమని చెప్పండ్రా

గుర్తించాల్సింది కరువు పీడిత ప్రాంతాలను కాదు

వాటి మహారాజ పోషకులను పోల్చుకోమనండ్రా
పాడుకాలం..చేటుకాలం

కరువు కరువు కరువు కరువు కాలం..

త్రేన్పు

 

-ధీరజ్ కాశ్యప్

~

 

పాత ఇంటి అపార్ట్ మెంట్ ప్రతి ఫ్లాట్ నుంచి ఒక్కొక్కరు వస్తూ వెళ్తున్నారు .

వాళ్ళు వెళ్ళాక, వెక్కి వెక్కి  ఏడ్చిన  కన్నీళ్ళు ఆరాక గాని వచ్చి వెళ్లారు అని ఒక్క క్షణం నాలో గుర్తుండి పోవట్లేదు పేరు మాత్రానికి.

వస్తూ వస్తూ గంపెడు బాధను ఇంతకు ముందే చిందర వందరైన పూల మధ్యలో ఉన్న ఖాళీలను పూడ్చడానికి అన్నట్టు వచ్చి తెచ్చి నా చుట్టూ పారబోసి పోతున్నారు.

 

ప్రతి మనిషి తో నా భాష ఏడుపే.

ప్రతి పరామర్శ లో నా భావం బాధే.

తేడా ఏమి లేదు.

గుక్కెడు నీళ్ళు తాగనిచ్చే రెండు  నిమిషాలు తప్ప .

 

బాధ తో ఉన్న గుండె చెదిరింది నాలో నేను అనుకున్న భావాలు మాటలై వినబడుతుంటే, ” పదేళ్ళు సుఖ పెట్టి వచ్చే జీవితం మొత్తం కష్టాల్లో ముంచి వెళ్ళిపోయాడు ” అని.

”మేము”, ”మాది”  అనే స్వార్ధం ఇక ”నేను”, ”నాది” అనే బాధ్యత గా మార్చి వెళ్లిపోయారు.

నేను ఆయన పక్కన.

పిల్లల్ని నా పక్కన ఉండనివ్వట్లేదు ఎవ్వరు.

 

బతకడానికి బలం ఇవ్వాల్సిన భగవత్ గీత బాధలో నిండా ముంచుతుంది నన్ను.

మాటి మాటికి చాలా సార్లు ” మరణించిన వారికి జననం తప్పదు. . .” అని తాత్పర్యం మాత్రం వినపడుతుంది.

ఆయన లేరు ఇక రారు అని గుర్తు చేస్తూ. . .

 

అందరు రావడం ఎక్కువవుతుండడం తో అడగరాని ప్రశ్నలు మౌనాలై వినపడ్తున్నాయి.

” ఎలా”, ”ఎందుకు”, ” ఎప్పుడు జరిగింది” అని.

”మందు”, ”అలవాట్లు”, ”కోపం” , ”గుట్కా కూడా కావొచ్చు” . . ఏది  ఏమైనా అన్నీ ఎక్కువే అని సమాధానాలు.

ప్రేమ కూడా ఎక్కువేనని చాలా తక్కువ మందికి తెలిసిన సమాధానం.

 

నా భర్తని – పోయిన ఆయనని- నేను వెనకేసుకు రావాల్సిన సమయం.

సమాజం- కట్టుబాట్ల కంచెలు ” లైఫ్ స్టైల్” అని అనడం తో నాకు నోరు తెరవాల్సిన అవసరం తప్పి పోయింది.

 

పెద్దోడి  ముఖం లో అయోమయం .

చిన్నదాని ముఖం లో అమాయకత్వం.

అయోమయాన్ని నిజం తో తుడిచేయోచ్చు అనిపించి

ఆయన నాతో అన్న చివరి మాటలే వాడికి చెప్పా.

”నాన్న కి వాళ్ళ నాన్న గురుతొచ్చాడు అంట. వెళ్ళిపోయారు. ఇంక రారు ” అని.

వాడి ముఖం లో అమాయకత్వం. ఆ అమాయకత్వం పెట్టె బాధ ఒర్చుకోలేనిది.

 

నలుగురు  నాలుగు దిక్కులా భూజాల పైకి ఎత్తుకుంటున్నారు ఆయనని.

చిన్నోడికి చలి నీళ్ళ స్నానం చేయించి తడిగా ముందు నడిపిస్తారట.

నాకు బాధతో వణుకు వాడు చలిలో వణకడం చూసి.

ఆయన పడుకున్న చోట తెల్లని బట్ట ఒకటి పరిచారు ఆయనని ఎత్తుకోగానే.

ఆయన వెళ్ళిపోవడం తో ఆయన ఫోటో ఒకటి కొత్త గా వచ్చింది ఇంట్లోకి.

నేను పిల్లలు లేనిది. ఆయన మాత్రమే ఉన్నది.

విడిపోయాం అని తెలిసి శోకం తన్నుకొచ్చింది.

” డాడీ నవ్వట్లేదు అమ. . . సీరియస్ గా ఉన్నాడు. పాత డాడీ ని రమ్మను ” అని చిన్నది. ఆ ఫోటో ని చూస్తూ .

నాలుగు గదుల మధ్యలో నరకం ఆ మాటలు వినడం.

చిన్నోడు వాడి చెల్లెలి మాటలకి సమాధానం చెప్పే రోజు ఎప్పుడు వస్తుందో . . .

 

కర్మ కి వెళ్లి ఆయన్ని వదిలేసిన  నిజాన్ని మోసుకుంటూ  వస్తాడు .

వాళ్ళ నాన్న చివరి చూపు కి వెళ్లి అది చివరి చూపు అని తెలియనంత అమాయకత్వం.

 

కుండ పట్టుకు నడిచి, తడి బట్టలతో తడిసి ఎప్పుడో అలసి నిద్రపోయాడంట .

భూజాల పై పడుకోబెట్టుకొని తెచ్చారు వాడిని. నా వొళ్లోకి వాణ్ణి దించుతుంటే నిద్ర లేచాడు.

 

మన ఆచారాలు ఆడడానికి చాలా దూరం చేసాయి. కావాల్సిన వాళ్ళ  చివరి .చూపులా.

చాలా తక్కువ మిగిల్చాయి . కర్మ చేసొచ్చిన చిన్నోడికి నేను అన్నం తినిపియడం ఇప్పుడు, ఇక్కడ  వాటిల్లో ఒకటి.

చెక్కర కలిపిన  పెరుగన్నం పెట్టాను.

ఆచారం అని వాడి కడుపు నిండింది.

నా కడుపులో నుంచి ఒక త్రేన్పు.

లోపల ఉన్న  శూన్యాన్ని బయటకి తోసే లాగా.

నిజం తెలియని వాడు మళ్ళి నిద్రపోయాడు.

 

ఎల్లుండో ఆ పైనో వాడి బర్త్ డే .

వాళ్ళ నాన్న పెద్ద కారు గిఫ్ట్ ఇస్తా అన్నారట.

ఆ రోజు అది ఆయనే ఇచ్చారని ఇచ్చి చెక్కర పెరుగన్నం తో వాడి నోరు తీపి చేస్తే

మళ్ళి నా కడుపు లో నుంచి ఇలా ఒక శున్యపు త్రేన్పు వస్తే . .

ఆ త్రేన్పే చిన్నోడి కి వాడి చెల్లలి జీవితానికి వాటి కల్యాణానికి ఒక ఆరంభం.

నా జీవితానికి ఆధారం.

— త్రేన్పు

*

జ్ఞాపకాలు రాలిపోయిన ప్రపంచంలోకి ….

 

 

 

–      నారాయణస్వామి వెంకట యోగి

~

 

 

ఒక కవిని నాకు చాలా యేండ్ల నుండీ  తెలుసు అనుకోవడం కంటే, తొలి యవ్వన రోజులప్పటి నుండీ  తెలుసు అనుకోవడం ఒక గొప్ప విషయం. అట్లా తెలవడంలో ఒక ఆనందమున్నది. సాధారణంగా కవిత్వం రాసేవాళ్ళు తొలియవ్వన రోజుల్లోనే మొదలు పెడతారు. అట్లా అని వేరే దశల్లో రాయడం మొదలు పెట్టిన కవులు లేరా అంటే చాలా మందే ఉన్నరు కూడా. కానీ తొలియవ్వన రోజుల్లో రాయడం ప్రారంభించిన కవుల్లో మనం వేరు వేరు దశలను చూస్తాం. ఒక యెదుగుదలను, ఒక క్రమబద్ధ పరిణామాన్ని చూస్తాం. కవి వయసులో యెదుగుతున్న కొద్దీ కవిత్వంలోనూ పరిపక్వత (మెచూరిటీ) కనబడుతుంది. ఇదీ అందరి విషయం లో  నిజం కావాల్సిన అవసరమూ లేదు. యెన్నేండ్లు రాసినా యే యెదుగుదలా లేని కవులూ ఉన్నరు.

తొలియవ్వనం లో కనబడే ఒక ఆవేశమూ,విసురూ, ఉద్వేగమూ అప్పుడు రాసే కవిత్వం లో సహజంగానే కనబడుతుంది.  తర్వాత,  తర్వాత,  జీవితంలో అనేక ఒడి దుడుకులు సంభవించినంక,అనుభవం అనేక పాఠాలు నేర్పినంక కవిత్వం లో ఒక సాంద్రత వస్తుంది. చిక్కదనం వస్తుంది. వయసు తాలూకు పుస్తకాల్లో చిక్కిన అనేక క్షణాలు పూల రిక్కలై, నెమలీకలై కవిత్వంలో పరుచుకుంటాయి. కవిత్వానికి ఒక గొప్ప అందం వస్తుంది. కవితలో ఒక్కొక వాక్యం ఒక అద్భుత సౌందర్యం తో అలరారుతుంది. అయితే ఆ సౌందర్యం ఊరికే తళుక్కుమని మెరిసి మాయమయేది కాదు. గొప్ప పరిపక్వత తో వచ్చే సౌందర్యం. మనల్ని ఒకటికి పది సార్లు ఆగి ఆలోచించేటట్టు చేసే బాధతో కూడిన సౌందర్యం. కవికి అనుభవం నేర్పిన జ్ఞానమూ, తాత్వికతా, భావ పరిపక్వత కవిత్వం లో ప్రతిఫలించి మన అనుభవాన్ని మరింత సాంద్రంగా చేస్తుంది. సంపద్వంతం చేస్తుంది. ఒక కవిత మొత్తం చదివాక అందులో కవి చెప్పినదే కాకుండా చెప్పనివి కూడా మనకు గోచరించి మన ప్రపంచం మరింత విశాలమవుతుంది. మన ఊహా శక్తి కొత్త ప్రపంచాలకు ప్రయాణం  చేసి కొంగ్రొత్త ఆకాశాలను స్పృశిస్తూ విస్తరిస్తుంది. కవి చదువరి,  ఐతే అధ్యయన శీలి ఐతే, ప్రజా ఉద్యమకారుడైతే, తన కవిత్వం లో మనం ఆనందించేదే కాదు, ఆస్వాదించేదే కాదు నేర్చుకోవల్సిందీ చాలా ఉంటుంది.

అట్లా నాకు తొలియవ్వన రోజుల్లో పరిచయమైన కవి సుధాకిరణ్. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం లో జే యన్ టీ యూ ఇంజనీరింగ్ కాలేజీ  హైద్రాబాదు లో మా తొలి పరిచయం. ఇద్దరం ఒకటే అభిప్రాయాలని పంచుకున్నం . ఒకే రాజకీయ కార్యాచరణలో భాగమైనం. నేను సాహిత్యం లోనుండి రాజకీయాలలోనికి వస్తే తను రాజకీయాలనుండి సాహిత్యం లోనికి కవిత్వం లోనికి వచ్చిండని చెప్పవచ్చు – కొంచెం అటూ ఇటూ గా! కిరణ్ ఒక గొప్పకమిట్మెంటు తో కవిత్వం రాసిండు. రాస్తున్నడు. ఇన్నేండ్ల తర్వాత మేము యెవరి జీవితాల్లో వాళ్ళం పడినంక, క్రియాశీలక రాజకీయాచరణ నుండి ఒకింత దూరమై కనీసం సాహిత్యం లో నైన క్రియాశీలకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నం ఇద్దరమూ బహుశా నాకంటే యెక్కువగా కిరణ్! కవిత్వాన్ని జీవితంలో భాగం చేసుకుని కవిత్వమే జీవితంగా తపిస్తూ, మనం కలలు కన్న కొత్త సమాజం కోసం కవిత్వం యేదో మేరకు తోడ్పడుతుందని నమ్మి కవిత్వ సృజన చేస్తున్నడు కిరణ్.

కిరణ్ ఒక నిర్దిష్ట సామాజిక లక్ష్యంతో కవిత్వం రాసినట్టనిపించినా ప్రతి కవితలోనూ ఒక వైయక్తిక అనుభవం అనుభూతి ఉంటుంది. కవిత వైయక్తిక అనుభవం తోనే ఆ నిర్దిష్ట అనుభూతి తోనే ప్రారంభమైనా (అది విప్లవోద్యమం గురించి రాస్తున్నప్పుడు కావచ్చు అమరుల కోసం రాస్తున్నప్పుడు కావచ్చు బాబన్న, మల్లారెడ్డి లాంటి అన్ సంగ్ హీరో లగురించి వారి అమరత్వం గురించి రాస్తున్నప్పుడు కానీ ముందు గుండెల్ని కదిలించే వైయక్తిక అనుభూతితో ప్రారంభమౌతుంది కవిత. అట్లా యెత్తుకుని ఆ అనుభూతిని విశ్వజనీనం చేస్తాడు, తాత్వీకరిస్తాడు. అయితే ఇప్పుడు కిరణ్ రాసిన ఒక వైయక్తిక కవిత గురించి చెప్పబోతున్నాను. రాజకీయ అభిప్రాయాలను కవిత్వం లో ప్రకటించి, ఒక స్పష్టమైన సామాజిక లక్ష్యం తో కవిత్వం రాసే కవుల పైన ఒక దురభిప్రాయం ప్రచారంలో ఉన్నది. అదేమంటే వీరికి సహజమైన వైయక్తిక అనుభూతులుండవు – అన్నీ రాజకీయ అభిప్రాయాలనే నల్ల కళ్ళద్దాలనుండి చూస్తరు. అసహజంగా రాస్తరు అని. ఈ దుష్ప్రచారాన్ని చాలా మంది కవులు గతంలో అన్ని అంశాల గురించీ అద్భుతమైన కవిత్వం రాసి తిప్పికొట్టినరు. ఆ కోవలోకే కిరణ్ రాసిన‘విస్మృతి’  కూడా వస్తుంది. సామాజిక బాధ్యతతో రాస్తున్న కవుల కవిత్వం పట్ల ఇది ఒక దురభిప్రాయమే అని మరో సారి శక్తివంతంగా నిరూపించినడు కిరణ్ ఈ కవితలో. అల్జైమర్స్ కు గురై తన కళ్ళ ముందే క్రమ క్రమంగా క్షీణించి శిథిలమై పోతున్న తన అమ్మ గురించి రాసిన ఈ కవిత గుండె తలుపులు తట్టి యెక్కడో లోలోపలి పొరలను కదిలిస్తుంది.

 

జ్ఞాపకాలకీ, గుర్తు తెలియని తనానికీ మధ్య

దిగంత రేఖలా చెరిగిపోయిన

సన్నటి కన్నీటి పొరలాంటి గీత.

 

జ్ఞాపకాలు

ఒక్కొక్కటిగా ఆకులవలె రాలిపోతూ

ఎన్నటికీ తిరిగి చిగురించని

శిథిల శిశిరపు కరకు జాడలు.

 

అని ప్ర్రారంభమైన కవిత మనల్ని జ్ఞాపకాలు నెమ్మదిగా  చెదిరిపోతూ,  మెల్ల మెల్లగా ఒక రకమైన మసక వెలుతులాంటి చీకటిలోకి మాయమైపోతున్న  అమ్మ ప్రపంచంలోనికి తీసికుపోతుంది. అట్లా చెపుతూ యెందుకు జ్ఞాపకాలు యెందుకు రాలిపోతున్నయో మరింత కవితాత్మకంగా చెప్తాడిలా ….

 

జ్ఞాపకాలు..

చినుకులు చినుకులుగా

నిస్సహాయంగా నేలకు జారిపోగా

గాలి ముందు దీపంలా దీనంగా

మోకరిల్లిన ముదిమి మేఘం

అలలు అలలుగా విస్మృతి విస్తరించిన

సముద్రమొకటి.

తలపుల కెరటాలు తరలిపోగా
దిగులు దీపస్తంభంలా నిలిచిన

కడపటి తీరమొకటి..

 

గాలిముందు దీపంలా దీనంగా మొకరిల్లిన ముదిమి మేఘమని వృధ్ధాప్యాన్ని అద్భుతంగా చెప్తూ రెండు ఉత్రేక్షలలో అమ్మ పరిస్థితిని చెప్తున్నాడు కవి – ఒకటి అలలు అలలు గా విస్మృతి విస్తరించిన సముద్రమనీ, మరొకటి తలపుల కెరటాలు తరలిపోగా మిగిలిన దీపస్థంభం లాంటి తీరమనీ. కవి ఇక్కడ,  సముద్రాన్నీ తీరాన్నీ,  విస్తరించే అలలనీ  తరలి పోయే కెరటాలనీ,  ఒకే అర్థాన్ని శక్తివంతంగా చెప్పడం కోసం వైరుధ్యంలా కనిపించే ఉత్ప్రేక్షలను వాడుతూ ఒకే ఒక విరోధాభాసతో మన ముందు అల్జైమర్స్ బారిన పడ్డ తన అమ్మ చిత్రాన్ని చాలా శక్తివంతంగా కళ్ళకు గట్టినట్టుగా గీసి మనల్ని ఆ ప్రపంచంలోనికి పూర్తిగా తీసుకుపోతడు. ఇక మనం పూర్తిగా కవితతో కట్టివేయబడి కవితో అమ్మ ప్రపంచంలో ప్రవేశిస్తం.

 

 

 

జ్ఞాపకాల వెలుతురు

కొద్ది కొద్దిగా కుదించుకుపోతుందో

విస్మృతి చీకటి

మెలమెల్లగా విస్తరిస్తుందో

జ్ఞాపకాలు

జడివానలో కొట్టుకుపోతాయో

జ్ఞాపకాలు..

కరిగి, యిగిరి, ఆవిరై, ఎగిరి పోతాయో

 

మళ్ళీ ఇందులోనూ వెలుతురు కుదించుకుపోవడం చీకటి విస్తరించడం (రెండూ ఒకటే అర్థమైనపటికీ) రెండు వ్యతిరేకార్థాలతో సమానార్థాన్ని వెలుతురు చీకటీ జ్ఞాపకాలూ విస్మృతులతో సూచిస్తూ ఒక భావైక్యతను సాధిస్తున్నాడు కవితలో.

 

అట్లా ఈ కవితలో ఒకే భావాన్ని సూచించడానికి  వైరుధ్యాల్లా కనిపించే ప్రతీకలు ఉత్ప్రేక్షలూ వాడుతూ కవి గొప్ప విజయాన్ని సాధించిండు. చెప్పదలుచుకున్న భావాన్ని మరింత శక్తివంతంగా చెప్పిండు.

 

చివరగా కవిత ముగిస్తూ ….

చీకటిలో కదలాడే నిశ్శబ్దపు

నీడలకై వెదుకులాట.

వెలుగులో  కనిపించని నక్షత్రాలకై

శూన్యాకాశంలో అన్వేషణ.

వూడలుదిగిన మర్రిచెట్టులాంటి రాత్రి

ఋతువులు లేని కాలమొకటి.

కాలం కాటేసిన తలపుల వాకిలిలో,  

తలుపులు మూసుకుపోయిన

మలిసంధ్య జీవితమొకటి…

 

ముందు చెప్పిన కుదించుకుపోయిన వెలుతురు చీకటిగా, చీకటిలో కదిలే నిశ్శబ్దపు నీడల్లా మారిపోతే, చీకటేమో  వెలుతుర్లో కనిపించని నక్షత్రాలైపోయి , మర్రిచెట్టు లాంటి ఊడలు దిగిన రాత్రిలో రుతువులు లేని కాలంలా వృధ్ధాప్యం మిగిలిపోయిందని భిన్నమైన పొరలు  పొరలుగా చిత్రాలని గీస్తాడు. చివరికి ‘కాలం కాటేసిన తలపుల వాకిలి’ అని మతిమరపు వ్యాధి (అల్జైమర్స్) కాటేసిన తన తల్లి మలిసంధ్య జీవితాన్ని తన తల్లిలాంటిపరిస్థితినే యెదుర్కొంటున్న వారి జీవితాన్ని అద్భుతంగా మనముందుంచుతడు. తన వైయక్తిక వేదనకు పరిస్థితికీ ఒక విశ్వజనీనతను తీసుకొస్తడు. అటువంటి పరిస్థితినెదుర్కొంటున్న వారిని మనకు పరిచయం చేసి మన కంటనీరు బెట్టిస్తడు. తలుచుకుని దుఃఖింపజేస్తడు.

కవి ముఖ్యంగా కవితలో సాధించినది,   వైయక్తికతను విశ్వజనీనం చేయడం – అదీ పరస్పరం విభిన్నాలనిపించే ప్రతీకలతో ఉత్ప్రేక్షలతో సమానార్థాన్ని సాదిస్తూ  మన ముందు ఒక భిన్న పొరలు గల చిత్రాన్ని ఆవిష్కరించడం. హృదయాన్ని మెలితిప్పే అనుభవాన్ని కవితగా  మనలో  భాగం చేసిన కవి  సుధాకిరణ్ ను అభినందించకుండా ఉండలేము. ఈ కవితలో కవి చెప్పిన దానికన్నా యెక్కువగా చెప్పనిదే ఉన్నది – చెప్పని, మనకు తెలియని ఒక కొత్త ప్రపంచమూ దాని అనుభూతుల పొరలూ ఇంకా అనేకం ఉన్నయి. మనం కవితను నిదానంగా మన ఆలోచనల్లోకి ఇంకించుకున్నప్పుడు మన అనుభూతిలోకి వస్తుందా కొత్తప్రపంచం. కాలం కాటేసిన తలపుల ప్రపంచం –జ్ఞాపకాలు రాలిపోయిన యెండు మోడుల ప్రపంచం.

పరవశం

 

-మమత కె.

 

గుక్కపట్టి  నువ్వు రాల్చిన పదాలకు దోసిలి పట్టి

మెరుగులు దిద్దుతూ అక్షరాలుగా విడగొట్టుకుంటాను

పదాలు, పల్లవై కోస్తాయని భయం

వాటి మధ్య పిడికెడు మట్టి కూరుతాను – నీవు నువ్వుగా నిలబడాలని సర్దిచెప్పబోతాను

నీకూ తెలుసు, అదంతా గడ్డిపువ్వుల మధ్యనుంచి తొంగిచూసే ఆమెను దాచిపెట్టాలనే

కంట్లో చిక్కుకున్న పదాలలోంచి ఆమె నవ్వుతుంది. దయగా.

ఆఖరికి

పద్యానికీ పద్యానికీ మధ్య ఖాళీలో నన్ను నిలబెట్టుకుంటాను. ఆమెనూ హత్తుకుంటాను.

అప్పుడు

కాసింత మట్టి మృదువుగా అంటుకుంటుంది నన్ను

నాన్న పిచ్చుక ఒకటి

నన్ను ముక్కున కరుచుకుని వెళ్లి గూడుకి అద్దుకుంటుంది

త్వరలోనే పిచ్చుక పాపాయిలు

అమ్మ పిచ్చుక తెచ్చిన బువ్వ తిని

వెచ్చగా నిద్రపోతారు

నన్ను ఆనుకుని

ఆనక

అమ్మలై నాన్నలై

సాగిపోతారు ఆకాశంలో

వాళ్ల రెక్కల్లో నన్ను ఇముడ్చుకుని

నేనే..ఓ పోయెం

 

 

 

-కొనకంచి
~

నా హ్రుదయంలో దాక్కున్న సూక్ష్మ హ్రుదయం
కొత్త రెక్కలొచ్చివెళ్ళిపోగానే
నేను..ఎండిపోయిన ఒంటరి చెట్టుమీద
విక్రుతంగా మిగిలిపోయిన
విషాదపు..నిస్సహాయపు..నిర్జీవపు
పక్షి గూడుగా మారిపోతాను.

రెండోసారి మళ్ళీ జన్మించిన నేను
ఆత్మోద్భవనంలో
నన్ను నేనే ప్రేమించుకుంటూ
నేను పుట్టిన ఏకాంతపు పక్షి గూటిని
కొత్తగా ప్రేమించుకుంటూ..
సరికొత్త కొత్త గుడ్డుగా మారిపోయాను

ఆ.. నన్ను కన్నతల్లి పక్షి
కవిత్వం…
గుడ్డు గా మారిన ఆ పిల్ల పక్షిని
ఆ..నేనే..ఓ పోయెం

2
ఇప్పుడిక మాటలుండవు.
ఇప్పుడిక చేష్టలుండవు
దూరాలు భారాలు కూలిపోయిన చోట
ద్రుశ్యాలు..కన్నెపిల్లల అందెల శబ్దాన్ని
కొత్త కొత్తగా ధ్వనిస్తాయి.

శబ్దాలు ఎక్కడెక్కడో వెన్నెలకుప్పలై
కొత్త కొత్తగా కనిపించని చీకట్లలో
మట్టి పూలై పూస్తాయి.

సరికొత్త స్వరాలు రాగాలు
కళ్ళముందు నదీమ తీరాల్లో
వలస పక్షులుగా మారి..
ఈకలని..కోర్కెలని ..ఇక్కడే వదిలేసి వెళ్ళినట్టు
ప్రతి ఒక్కళ్ళదీ..ఎవరికి వాళ్ళు
ఏవరూ గుర్తించని ఎండమావుల్లో నీటికోసం వెదుకులాటే.

స్వర్గం నించి దిగివచ్చిన దేవతలు
వినువీధుల్లో వదిలి వెళ్ళిన పాదముద్రల జాడల్లో
పరిచిత..అపరిచితమయిన నువ్వు
ఇక ఎంతమాత్రమూ కనిపించవు.

సముద్రం మీద పరుగెత్తిన చేప అడుగు జాడల్లో
ఎడారుల్లో పరుగెత్తిన మనిషి అడుగు ముద్రల్లో
కలిసిపోయిన
నీ అడుగుజాడలు ఎక్కడా కనిపించవు.

నా లోంచి నన్ను..నాలోంచి నిన్ను
పోగొట్టుకున్నచోట బూడిద కుప్పగా మిగిలిన
ఆ నేనులో మిగిలిన నువ్వే
నా కవిత్వం.
ఆ మిగిలిన నేనే ఓ పోయెం.
3

శబ్దాన్ని..ద్రుశ్యంలా చూద్దామని
ద్రుశ్యాన్ని..శబ్దంలా విందామని
ఎంత ప్రయత్నించినా కూడా
చిన్నపాటి శబ్దం కూడా ఎక్కడా కనిపించదు.

నా చుట్టూ ఉన్న ప్రపంచం
కార్చిచ్చులో కాలిపోయాక..
మిగిలిపొయిన తాటాకుల వనంగా మారిపోయి ఉంటుంది.

అంతు తెలీని కాంతి సంవచ్చరాల కావలనించి
వినవస్తున్న స్వప్న గానమాధుర్యంలో మునిగిపోయి
నన్ను నేను..నిర్లక్ష్యం చేసుకున్నప్పుడు
బతుకు ఓడ తెరచాపతో
సుడిగాలి చేసే జీవిత పోరాటంలో
ఆసలు జీవితం తనకు తానే కలలు కంటున్న
నకిలీ జీవితం గా మారిపోతుంది.
పాట పాటగా..తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి
కోరస్ గా మిగిలిపోతుంది
తన జీవితానికి అప్పుడే కొత్త అర్ధం తెలిసిన
సగం చిట్లిన గాలి బుడగ..
పూర్తిగా చిట్లిన గాలి బుడగను చూసి
“అయ్యో” అనిబాధపడటమే ఎవ్వరూ గుర్తించని
అసలు జీవిత విచిత్రం.

ఈ భూమ్మీద ఏదీ తనది కాదనుకుంటూనే
ఇక్కడున్నదంతా మనిషి..
నిర్లజ్జగా పోగేసుకుంటున్నప్పుడు
ఉద్యానవనాలుగా విరబూయాలనుకుంటున్న అక్షరాలన్నీ
గజిబిజిగా సాలెగూళ్ళల్లో చిక్కుకోని
అర్ధాంతరంగా ప్రాణాలు పోగొట్టుకోని
విరహ గీతాలుగానో.. విలాపగీతాలుగానో
మిగిలిపోవటమే అసలు కవిత్వం.
ఆ మిగిలిపోయిన నేనే ఓ కవిత్వం ..
ఆ నేనే ఓ పొయెం..
4

నిప్పు..ఎవరిదయితేనేం?నిప్పు ఎక్కడ..ఎవరు జ్వలింపజెస్తేనేం?
నిప్పుకు..కులం లేదు.
నిప్పుకు మతంలేదు.
అపరిమిత ..అపరిచిత హ్రుదయ విధ్వంసంలో
కాళ్ళకింద బద్దలవుతున్న అగ్నిగుండంలో
తనువుల్ని కాల్చిన మాంసపు ధూళిలో
దాచేస్తే దాగని.. సత్యం..
ఆర్పేస్తే ఆరని…నిజం..
కవిత్వం ఒక్కటే ..

అందుకే

వ్రుద్ధాప్యం లేని అక్షరాలకు యజమాని
కవి.. బ్రతికినంతకాలం చిరంజీవుడే ..
అతని కవిత్వానికి ఎప్పుడూ నిత్య యవ్వనమే
*

త్వరలో విడుదల అవుతున్న
“”నేనేమీ మాట్లాడను”” కవితా సంపుటిలోంచి

ఇంతకీ ఎవరు గెలిచినట్లు ?

 

 

 

 

ఖాన్
అబ్బూఖాన్
మేకల అబ్బూఖాన్
ఆ ఊళ్ళో అబ్బూఖాన్ అంటే తెలియందెవరికి ?
ఎన్నో మేకలుండేవి అబ్బూఖాన్ దగ్గర
కావలసినవాళ్ళు అబ్బూఖాన్ దగ్గరికొచ్చి కొనుక్కుపోయేవాళ్ళు
వేట కోసం, జాతర కోసం, నోట్లో తగలాల్సిన ముక్క కోసం
కొనుక్కోటానికి వచ్చే రకరకాల జనాలు, వాళ్ళ మాటలు
చాలా కాలక్షేపంగా ఉండేది అబ్బూఖానుకు
పనిలో పనిగా పైకం కూడా
ఇహనేం ? ఇల్లు కట్టాడు, దాన్ని బంగళా చేశాడు
ఇంకా ఎన్నో ఎన్నో చేశాడు ఆ పైకంతో
 

అయితే అన్ని రోజులూ ఒకలా ఉండవుగా
ఎక్కడినుంచో ఒక తోడేలు వచ్చింది
అబ్బూఖాన్ ఇంటి పక్కనే ఉన్న కొండమీద ఉన్న కొండగుహలో కాపరం పెట్టిందయ్యోయ్
అబ్బూఖాన్ మేకలు, రోజూ ఈయన పెట్టేవి చాలక కొండగాలి తిరిగింది అని పాటలు పాడుకుంటూ కొండ మీదకెళ్ళిపోదామని చూస్తూ ఉండేవి
కట్టిన తాళ్ళు తెంచుకుని కొన్ని పోయేవి కూడాను
ఉన్నదాంతో సుఖంగా ఉండాలని లేకపోతే తాళ్ళు ఒక లెక్కా డొక్కా?
అంతే మరి , అలా పోయిన వాటిని చూసి మిగతావాటికి ఉబలాటం
ఒకటి అరా రెండూ మూడు నాలుగు ఇలాగలాగ కొన్ని రోజులకి మేకలన్నీ ఖాళీ
అబ్బూఖాను కానీ, ఆ ఊళ్ళో జనాలు కానీ ఆ తోడేలుని ఏమీ చెయ్యలేకపోయారు
తోడేలు రాజ్యంలో తోడేలు చెప్పినట్టే అన్నీ
సరే చివరిగా మిగిలున్న మేకలకు చెప్పి చూసాడు అబ్బూఖాన్
అటువైపు వెళ్ళబాకండి పోతారు అని
అయినా వింటేగా మేకల మంద
సందు చూసుకోవటం, స్వాతంత్రం లభించిందని పరుగెత్తుకుంటూ కొండమీదకు వెళ్ళిపోవటం
సందు మేకలకు, పసందు తోడేలుకి
అలా జీవితార్పణం చేసుకునేవి
కేవలం పచ్చని పచ్చగడ్డి కోసం, దూరపు కొండల నునుపు కోసం, బంధాల వంటి తాళ్ళ నుంచి స్వాతంత్రం కోసం
అబ్బూఖానుకు అర్థమయ్యేది కాదు
బాధపడుతూ ఉండేవాడు
చివరకు ఒకే ఒక్క మేకపిల్ల మిగిలింది
ఇదంతా చూసి అబ్బూఖానుకు ఓ రోజు చిరాకొచ్చింది
 

ఇక మేకలూ లేవు ఏమీ లేవు అని కూర్చున్నాడు
ఉన్న ఒక్క మేక పిల్లను అమ్మేద్దామనుకొన్నాడు
కానీ అలవాటైపోయిన ప్రాణం వల్ల చేతులు రాలా
ఏం చేస్తాడు ?
ఆలోచించి ఆలోచింది మొత్తానికి ఒక ఉపాయం చేశాడు
ఈ మేకపిల్ల కొండమీదకు పారిపోకుండా ఒక దొడ్డి ఏర్పాటు చేశాడు
దొడ్డి నిండా గడ్డి ఏర్పాటు చేశాడు
దొడ్డి నిండా తొట్లు పెట్టించాడు
దొడ్డి నిండా చెట్లు నాటించాడు
ఇక ఎటు నుంచి చూసినా కొండ కనపడితేగా
అన్నీ అయ్యాక ఒక బలమైన గుంజ కట్టాడు
ఆ గుంజకు ఇంకా బలమైన తాడు కట్టాడు
ఈ చివరన మేకపిల్లను తగిలించాడు
మేకపిల్ల చాలా అందంగా ఉండటంతో దానికో పేరూ పెట్టాడు
ఏమని ?
 

చాందినీ అని
చాందినీ అంటే ఏమిటి ?
చాందినీ అంటే మేలుకట్టు
చాందినీ అంటే చంద్రోదయం
అంతందంగా ఉన్నదీ మేకపిల్ల
ఒకసారి పేరు పెట్టామంటే అనుబంధం మరింత బలపడినట్టే
అది వస్తువు కావొచ్చు, జంతువు కావొచ్చు
ఇక ప్రాణాలన్నీ దానితో పెనవేసుకుపోయినట్టే
ప్రాణాలు పెనవేసి పెంచుతున్న మేకపిల్ల పెద్దదవుతున్నది
 

ఈయన తాడు పొడవు పెంచుతూనే ఉన్నాడు
కాసంత దూరపు గడ్డి అందుబాటుకు రావాలని
నోటికి పట్టాలని
పొట్టకు పట్టాలని
చిన్ని పొట్టకు శ్రీరామరక్ష అవ్వాలని
అయితే స్వాతంత్ర తృష్ణ ఉన్నది చూసారూ ?
దాని ముందు బంధాలు ఎంత?
ఆ అగ్గికి ఊతంగా జన్యువుల పాత్ర ఒకటి
పిల్ల వాళ్ళమ్మ కూడా స్వాతంత్రాభిలాషతో కొండ మీదకెక్కేసింది ఒకప్పుడు
పిల్ల వాళ్ల నాయన కూడా అదే అభిలాషతో కొండకు ఆహారమైపోయినాడు
అదే! కొండ మీద తోడేలుకు ఆహారమైపోయినాడు
ఆ జీవులు ఉత్పత్తి చేసిన ఈ చాందినీకి కూడా లోపల ఎక్కడో ఆ జన్యువు సలపరం ఉన్నది
అదే జీవోత్పత్తి క్రమం
అదే జీవన్యాయం
అదే ప్రకృతిన్యాయం
ఆ న్యాయం హృదయాల్లో ప్రతిష్టితమైపోతుంది
అది తప్పించుకోవటం ఎవరి వల్లా కాదు కదా
పెద్దదవుతున్న కొద్దీ ఆ తృష్ణా పెద్దదైపోయింది
తాడు తెంచుకోవాలని చూసింది
ఉహూ కుదరలా
ఇక ఇలాక్కాదని సత్యాగ్రహం మొదలుపెట్టింది
తిండి తినటం మానేసింది
అబ్బూఖానుకు అర్థం కాలా
అరే ఇదేమిటి ఇలా చిక్కిపోతున్నదని డాక్తర్లను పిలిపించాడు
వాళ్ళన్నారూ – నాయనా అబ్బూ, దీనికి మనోవ్యాధి పట్టుకున్నది, దానికి మందు లేదన్నారు
అది విని దిగాలుగా చాందినీ పక్కన కూర్చున్నాడు
నీక్కావలసినవన్నీ చేస్తున్నాం ఇంకా ఏమిటి నీ బాధ అన్నాడు
ఇదే సందు అని, కొండ మీదకు వెళ్ళాలి నేను అంటూ మనసులో మాట బయటపెట్టింది చాందిని
అవాక్కయ్యాడు అబ్బూఖాను
అరెరే, ఆ ఆలోచన ఎట్లా వచ్చిందే నీకు,

అక్కడ తోడేలు ఉన్నది అక్కడకు వెళితే అనవసరంగా చచ్చూరుకుంటావు అని చెప్పచూశాడు
వినలా, అసలు విననే వినలా
పైగా, సమర్థనగా –
అబ్బూజాన్, నువ్వెన్నా చెప్పు ఇక్కడ అంతా బందిఖానాగా ఉన్నది నాకు,
ఇక్కడ ఉండలేను, అయినా చూశావా దేవుడు నాకు రెండు కొమ్ములిచ్చాడు,
వాటితో ఆ తోడేలు పని కట్టేస్తానని బీరాలు పలికింది
ఇక ఇలా లాభం లేదని గుంజ నుంచి వేరు చేసి, గదిలో బంధించేశాడు
అయితే తెలివైన వాళ్ళు కూడా ఎక్కడో ఒకచోట తప్పు చేస్తారు
ఆ తప్పు అబ్బూఖాను, ఆ గదికి ఉన్న కిటికీ మూయకపోవటం
అంతే! పొద్దున్న వచ్చి చూసేసరికి మేకపిల్ల మాయం
ఆ తెరిచి ఉన్న కిటికీ లోనుంచి పారిపోయింది చాందినీ
అబ్బూఖాను లబోదిబో
చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభమేమి?
ఇదీ అంతే!
 

ఆ కిటికీ వంక చూశాడు అబ్బూఖాను
నోరంతా తెరుచుకొని పగలబడి నవ్వుతున్నట్లనిపించింది
దైన్యంగా చూస్తూ నిలబడిపోయినాడు
అక్కడ మేకపిల్ల కొండ ఎక్కేసింది
చెంగు చెంగున దూకుకుంటూ
అక్కడ ఉన్న చెట్లూ చేమలూ, పచ్చగడ్డీ, పూలమొక్కలు అన్నీ తన కోసమే అనుకున్నది
గంతులు వేస్తూనే ఉన్నది
వేస్తూ వేస్తూ కొండ చివరకు వచ్చేసింది
అక్కడినుంచి ప్రపంచం మొత్తం కనపడుతోంది
కింద ఉన్న అబ్బూఖాన్ ఇంటివంక చూసి నవ్వుకుంది
ఇల్లు, దొడ్డి అంతా చిన్నగా కనపడ్డవి
 

అంత చిన్న ఇంట్లోనేనా నేనున్నది అనుకొన్నది
అంత చిన్న దొడ్డిలోనేనా నన్ను బంధించింది అనుకొన్నది
ఇప్పుడు చూడు నేనెక్కడ ఉన్నానో అని మరల చిందు వేసింది
ఇప్పుడు నేనెంత ఎత్తున ఉన్నానో అని మరల మరల చిందు వేసింది
చిందులు వేస్తూనే ఉన్నది
ఇంతలో సాయంత్రం
సూరీడు సాబు గారు దిగిపోతున్నాడు
చాందినీ చిందులు వేస్తున్న ఆ కొండనానుకునే దిగిపోతున్నాడు
ఏకాంతం, స్వేచ్ఛ అంటూ ఆ మేకపిల్ల పడిన సంతోషం కూడా ఆ కొండ అంచునుంచి దిగిపోవటం మొదలయ్యింది
ఇంతలో ఎక్కడో దూరంగా కొంకికర్ర చప్పుడు
దానివెంటే అబ్బూఖాన్ పిలుపు
చాందినీ చాందినీ చాందినీ అంటూ గొంతు పగిలేలా అరుపు
సంతోషం ఆవిరైపోతున్న చాందినీకి ఆ పిలుపు ఆశ పుట్టించింది
అంతలోనే మళ్ళీ నిరాశ ఆవరించుకొన్నది
అయ్యో, మళ్ళీ బందిఖానాలోకి పోవాలానని సంకటంలో పడ్డది
ఇంతలో మరో అరుపు
అలాటిలాటి అరుపు కాదది
ప్రాణాలు తోడేసే అరుపు
తోడేలు అరుపు
 

కొండపైనుంచి, అటుపక్కగా
భయం, ఆశ్చర్యం కలిగినాయ్ మేకపిల్లకు
అప్పటిదాకా లేని ఆలోచనలు హఠాత్తుగా చుట్టుముట్టాయి
ఏమో అబ్బూఖాన్ చెప్పినట్టు తినేస్తుందేమో
ఏమో అబ్బూఖాన్ చెప్పినట్టు చంపేస్తుందేమో
అబ్బూఖానుతో వెళ్ళిపోదామా వద్దానని ఊగిసలాడిన సంకటం
కాస్త ఇప్పుడు తోడేలు రాకతో ప్రాణసంకటంగా మారిపోయింది
ఒకసారి చుట్టూ చూసింది,
అటూ ఇటూ అంతా పచ్చదనం, ఆహారం,
బంధాలు లేని స్వేచ్ఛ
అప్పుడనిపించింది ఆ మేకపిల్లకు, చాందినీకి –
అక్కడ బానిసగా బతకటం కంటె ఇక్కడ తోడేలుకు ఆహారమైపోవటమే మంచిదని
అబ్బూఖాను పిలుపు ఆగిపోయింది
దబ్ అని చప్పుడు పక్కనే
ఉలికిపడి ఇటు చూచింది
ఇంకేముంది ?
రానే వచ్చింది
ఎవరు ?
 

ఇంకెవరు తోడేలు
ఎర్రగా మెరిసిపోతున్న కళ్ళు, వికృతమైన పళ్ళు – ఆ తోడేలుకు ఆభరణాలు
అవన్నీ చూసి మొదట్లో భయపడినా, చచ్చిపోయేప్పుడు వెంటవచ్చే తెగువతో, ఆ తెగువ ఆసరాతో కొమ్ములు విదిల్చింది
తోడేలు ఒకడుగు వెనకడుగు వేసింది
అంతే! మేకపిల్లకు దమ్ము ధైర్యం వచ్చేసినాయ్
హోరాహోరీ మొదలయ్యింది
ఆ హోరాహోరీ మేకపిల్లకే, మేకపిల్ల మనసుకే
తోడేలుకు అది ఒక ఆట
మేకలు ఏమీ చెయ్యలేవని తోడేలుకు తెలుసు
అయినా ఆడుకుంటోంది మేకపిల్లతో
మేకపిల్ల మధ్య మధ్యలో ఆకాశం వంక చూస్తోంది
ఆ మిణుకు మిణుకు నక్షత్రాల వంక చూస్తోంది
ఆ దేవుణ్ణి వేడుకుంటోంది
కొమ్ములు విదిలిస్తోంది
 

ఉదయం దాకా ఇలా యుద్ధం జరగనిస్తే, ఎవరో ఒకరిని ఆ దేవుడు సాయానికి పంపిస్తాడని ఆశగా ఎదురుచూస్తోంది
నెమ్మదిగా నక్షత్రాలు మాయమైపోయినాయి
తొలివెలుతురు కిరణాలు
తొలికోడి కూత
మేకపిల్ల ఉన్న శక్తంతా కూడగట్టుకొని పోట్లాడుతోంది
చివరిగా మిగిలున్న శక్తంతా కూడదీసేసుకుని మరీ పోట్లాడేస్తోంది
తోడేలుకు ఆశ్చర్యం, ఒకింత భయం కూడా కలగటం మొదలుపెట్టింది
కిందనున్న మసీదులోనుంచి నమాజు వాణి – తెరలు తెరలుగా
అల్లాహో అక్బర్ అని తలుచుకుంటుండగానే రాయి తగిలి కిందపడిపోయింది
తోడేలు వెయ్యాల్సిన దెబ్బ వేసేసి …………

కొండ మీద పక్షులు మాట్లాడుకుంటున్నాయి
చాందినీ ఓడిపోయిందని అనుకుంటున్నాయి
ఒక ముసలి పక్షి మాత్రం చాందినీ గెలిచిందని పొలికేక పెట్టింది

ఇంతకీ ఎవరు గెలిచినట్లు ?

పుస్తకాలంటే ప్రాణం పెట్టే మన రాష్ట్రపతి, మూడవ రాష్ట్రపతి డాక్టర్ జాకిర్ హుస్సైన్ గారి రచన “అబ్బూఖాన్ కి బక్రీ” చదివినాక, 2009లో నాకొచ్చిన మాటల్లో స్వేచ్ఛానువాదంగా రాసుకున్న ఒక చిన్న కథ….

కన్నీటి కవితలో జీవితప్రహేళిక

 

-ఏల్చూరి మురళీధర  రావు 

~

 

కంఠంలో శోకవిషాదాల దుర్భరవిషాన్ని దిగమ్రింగి మానవాళి మనుగడకోసం తన వేదనానివేదనను అజరామరమైన అశ్రుగీతిగా మలచిన ఛు యువాన్ ప్రపంచ మహాకవులలో మహనీయుడైన మహాత్మకవి. చైనీయ సాహిత్యమహీభరం మొత్తాన్ని మోస్తున్న మహోన్నత మహీధరం ఆయన. వాఙ్మయసరస్సుకంతటికీ అందాలను అలవరిస్తూ వేయిరేకులతో పూచిన పుండరీక పుష్పం. సారస్వతవ్రతుల అంతరంగ తేజోమయలోకానికి నిండువెలుగును ప్రసాదిస్తున్న ప్రకృష్ట ప్రభామండలం. చిరంతన మధురకవితావాయువులు కొనివచ్చిన సురభిళ పరిమళం. సాహిత్యాకాశంలో సర్వోపరిగా వెలుగొందే ధ్రువతార.

ఛు యువాన్ క్రీస్తుకు పూర్వం 340-వ సంవత్సరంలో జన్మించాడు. రక్తసిక్తమైన చైనా రాజకీయచరిత్రలో పెనుగడ్డుకాలం అది. అప్పటికి చైనీయ పంచకావ్యాలలో చివరిదైన వాసంత శరత్సమాపన సంచికల(Spring and Autumn Annals) సంపుటీకరణ పూర్తయింది. ల్యు దేశపాలకులైన ఝావో రాజవంశీయుల విక్రమలీలలు, ఆనాటి వీరుల విశ్వవిజిగీష, విశాల రాజ్యవిస్తరణ గాథలు, అర్హపూజాదులలో సాంప్రదాయిక బలిసమర్పణవిధానం, జానపదుల ఆచారవ్యవహారాలు, వివిధ దేవతారాధనప్రక్రియలు, స్వర్గమర్త్యలోకాలలోని స్త్రీపురుషసంబంధాలను సజాతీయంగా ప్రతిబింబించే ప్రభావశీలి కథాచిత్రణలతోపాటు ప్రకృతివైపరీత్యాలతో సతమతమై, సంకులసమరాలతో తల్లడిల్లి కాందిశీకులైన సామాన్యుల జీవితం అల్లకల్లోలమైనప్పటి దుఃఖానుభవపరంపర సార్వజనీనంగా నిరూపితమైన మహారచనమది. భూస్వామ్యమదోన్మత్తుల నిర్విరామ యుద్ధోన్మాదం పట్ల వైముఖ్యాన్ని కలిగించే ఆ సంపుటి వల్ల ప్రభావితుడైన ఛు యువాన్ పెరిగి పెద్దయాక తననాటి ప్రభుసమాజంలోని ఒక్కొక్కరిచేత తిరుగులేని శాంతిపత్రం మీద సంతకం చేయించాలని ఆరాటపడటం సహజమే.

అప్పటికి – అంటే క్రీస్తుకు పూర్వం 770-403 మధ్య అని ఒకనాటి చరిత్రకారులు, 771-476 అని ఆధునికులు నమ్ముతున్న తరుణానికి – ఒకప్పుడు తీవ్రభయావహమైన చైనీయ ద్వాదశ రాజ్యాల ప్రాబల్యం క్రమక్రమంగా అంతరించిపోయింది. ఎడతెరిపి లేక సాగిన ఆనాటి మారణహోమాల ఫలితంగా క్రీస్తుపూర్వం 403-221 సంవత్సరాల నడిమికాలంలో మునుపటి ఆ రాజ్యాలు పన్నెండూ – మళ్ళీ పెద్దచేపలు చిన్నచేపలను మింగటం పూర్తయాక పునర్విభక్తాలై – మొత్తం ఏడు రాజ్యాలయ్యాయి. పశ్చిమ సరిహద్దులో వీ ద్వీపకల్పం చుట్టూ చీన్ మండలం నెలకొన్నది. దానికి ఈశాన్యాన ద్వాదశ రాజ్యాల కాలంలో ప్రముఖమైన ఒకనాటి త్సిన్ రాజ్యమే హాన్, ఛావో, వీ అన్న మూడు రాజ్యాలుగా ముక్కలయింది. తూర్పున ఛి; దక్షిణాన ఛు; ఇంకా యెన్ మండల ప్రాంతం వెలిశాయి. ఈ ఏడింటిలో చీన్ రాజ్యం అన్నింటికంటె శక్తిమంతమైనది. యాంగ్ త్సె నదీలోయలోని ఛు రాజ్యం అతివిశాలమైనదే కాని, ఛి రాజ్యం షాన్‌టుంగ్ ద్వీపకల్పానికి చేరువలో ఉండటం వల్ల మత్స్యసంపదకు, లవణోత్పాదనకు పేరుపొంది వాణిజ్యమూలకంగా బలపడింది. వీటన్నిటికీ ఆధిపత్యపోరు మొదలై నానాటికీ ఘోరం కాసాగింది. ఆస్తినష్టానికి, జననష్టానికి దారితీస్తున్న ఆ యుద్ధాల ఫలస్వరూపంగా రాజ్యాలన్నింటిని ఒక్క గొడుగు పాలన క్రిందికి తెచ్చి అవిభాజ్య చైనా మహాసామ్రాజ్యాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. చరిత్రలో ‘పోరాట రాజ్య యుగం’ అని చెప్పబడే దుష్కాలం అది.

చైనీయ నాగరికతకు పుట్టినిల్లయిన హ్వాంగ్ హ నదీపరీవాహకప్రాంతంలో జనసమ్మర్దం అధికంగా ఉండేది. నీటిచాళ్ళ వద్ద కొంగలు బారుతీరినట్లు దగ్గర దగ్గరగా తీర్చిదిద్దినట్లుండే ఇళ్ళు, అంతకంటె సన్నిహితంగా మనుషుల మనస్సులు, శ్రేయోరూపకమైన సహజీవనం, ఆత్మీయతలూ ఆప్యాయనాలకు పెట్టింది పేరయిన ప్రాంతమది. ఛు రాజవంశీయుడైన ఛు యువాన్ జన్మించేనాటికి యెన్ రాజ్యం సరిహద్దున లియాఓటుంగ్ ద్వీపకల్పం, కొంత వరకు ఉత్తర కొరియా ఈ పోరాట రాజ్య యుగపు యుద్ధవాతావరణానికి దూరంగా ఉండేవి. మానవాళికి అభ్యుదయానందోల్లాసకరాలైన సంగీత సాహిత్య చిత్ర శిల్ప గానకళలు వెల్లివిరిసిన చోట్లవి. చదువుసాములకు పుట్టినిళ్ళు. అక్షరాస్యులు ప్రాచీనకావ్యసంపదను కాపాడుతుండేవారు. పట్టణవాసపు కృత్రిమ నాగరికత ప్రభావం, అస్తిత్వపు పెనగులాటలు లేక ఇంద్రియశాంతికి పట్టుగొమ్మలయిన ఆ పరిసరాల మట్టివాసన ముక్కుపచ్చలారని వయసులో ఆయన ఊహలకు రెక్కలు తొడిగింది.

రాజవంశానికి చెందినవాడని ఛు యువాన్ అంటే రాజు హ్యూవాయ్ కి మక్కువ కలిగింది. లోకజ్ఞుడు, విద్యావంతుడు కాబట్టి సమస్యలు తలయెత్తినపుడు వివేకంతో వ్యవహరింపగలడని నమ్మకం కుదిరింది. మంత్రివర్గంలో ఉన్నతపదవిని అప్పగించి రాజ్యతంత్రాన్ని నడపమన్నాడు. ఛు యువాన్ విశ్వాసపాత్రుడై మెలగుతూ ప్రభువుకు సన్నిహితుడయ్యాడు. రాజ్యంలో శాంతిభద్రతల రక్షణ నిమిత్తం కృషిచేశాడు. ప్రజోపయోగకర చట్టాలను రూపొందించటంలోనూ, ప్రభుత్వ విదేశాంగవిధానాన్ని తీర్చిదిద్దటంలోనూ తోడ్పడ్డాడు. సమర్థుడని పేరుతెచ్చుకొన్నాడు.

image1 (1)

అప్పటికే ఛు రాజ్యం పతనావస్థలో ఉన్నది. అవినీతిపరుడు, పరమక్రూరుడు అయిన హ్యూవాయ్, అతని చుట్టూ చేరిన స్వార్థపరులైన దళారీలు – ఛు యువాన్ ప్రగతిశీలభావాలను చూసి ఆందోళన చెందారు. ప్రజల సంక్షేమంకోసం పాటుపడుతూ ఎప్పటికప్పుడు రూపొందిస్తున్న వినూత్నపథకాల వల్ల ఆయనకు కలుగుతున్న ఆదరణను చూసి సహింపలేక – అడుగడుగున అడ్డుపడుతూ, లేనిపోని అవరోధాలను కల్పిస్తూ జీవితాన్ని నరకప్రాయం చేశారు. తను ఎదురుచూస్తున్న కాలపు కొత్తకెరటం తీరాన్ని చేరలేకపోతున్నదని తెలిసినా, జాతి భవితవ్యం మీది నమ్మకంతో ఛు యువాన్ రానున్న మంచిరోజులకోసం ప్రతీక్షిస్తూనే ఉన్నాడు.

చీన్ రాజ్యం నుంచి తమకు ప్రమాదం పొంచి ఉన్నదని ముందుగానే గుర్తించి, దానితో పొత్తు కుదుర్చుకోవటం మంచిదని ఛు యువాన్ భావించాడు. రాజు చుట్టూ చేరిన దళారీలకు, స్వప్రయోజనపరులకు ఆయన సూచన నచ్చలేదు. రాజుకు సలహాదారుగా ఉన్నతోద్యోగంలో ఉన్న త్జె ఛియావో, ఛు యువాన్ రాజకీయప్రత్యర్థి అయిన రౌతు నాయకుడు చీన్ షాంగ్, పట్టపు రాణి ఛెంగ్ హ్సీయు వంటివాళ్ళు శాంతి రాయబారాలు సాగకుండా ముందుకాళ్ళకు బంధం వేశారు. చీన్ దౌత్యాధికారి చాంగ్ యీ నుంచి లంచాలు మరిగి అధికారులు ఛు యువాన్ పలుకులను పెడచెవిని పెట్టారు. ఊహల పల్లకీలో పట్టుబాలీసులమీద పడుకొని ఎల్లకాలం స్వప్నలోకంలో సంచరించే మాటలమారికి ప్రత్యక్ష రాజకీయాలతో పనేమిటని రాజు చెవిలో ఇల్లుకట్టుకొని నూరిపోశారు. రాజు మనసు మారింది. వాళ్ళ కల్లబొల్లి మాటలు నమ్మి ప్రాణం మీదికి తెచ్చుకొన్నాడు. చేతిలో చేయివేసి చెలిమిచేస్తారని చీన్ దేశానికి స్వయంగా బయలుదేరి శత్రుకూటమి వద్ద బందీ అయ్యాడు.

చీన్ రాజ్యంలో హ్యూవాయ్ రాజకీయఖైదీగా ఉన్నప్పుడు ఉత్తరాధికారిగా వచ్చిన అతని కొడుకు చీంగ్ హ్సీయాంగ్ తండ్రికంటె అసమర్థుడైన రాజు. తిరుగుబాటు జరిగినపుడల్లా ఒక్కో సరిహద్దులో ఓడిపోయి ఎంతోకొంత భూమిఖండాన్ని పోగొట్టుకోవటమే తప్పించి ఎన్నడూ యుద్ధరంగంలో గెలిచి యెరుగడు. అతను రాచరికం చేపట్టిన ఇరవైఒక్క సంవత్సరాల కల్లోలకాలం తర్వాత – అంటే క్రీస్తుపూర్వం 278లో ఉన్నట్లుండి చీన్ సైన్యాధ్యక్షుడు పాయ్ చీ సాక్షాన్మరణదూత లాగా దక్షిణపు సరిహద్దు నుంచి విరుచుకుపడ్డాడు. దారుణమైన ప్రాణనష్టం జరిగింది. పంటపొలాలు ధ్వంసమయ్యాయి. ఛు రాజ్యం ఆ చావుదెబ్బ నుంచి తేరుకోలేకపోయింది. మరో అర్ధశతాబ్ది నాటికి రూపనామాల అవశేషాలు లేకుండా అంతరించిపోయింది.

ఛు యువాన్ కవితలలో అధికభాగం ఆయన ప్రతిపాదించిన ప్రజాసంక్షేమవిధానాలు రాజతిరస్కృతాలైన తర్వాత మనసు చెదిరి చింతాక్రాంతుడైనప్పటి చీకటిరోజులలో రచింపబడినవి. పాయ్ చీ దేశరాజధానిలో ఘోరకలిని సృష్టించిన రోజులలో ఆయన అజరామరమైన తన కన్నీటి కవిత ‘ఆక్రోశము’ (లి సావో) ను వ్రాశాడు. అప్పటికాయన వయస్సు అరవైరెండేళ్ళు. పదవీవిరమణ చేసి రెండు దశాబ్దాలు దాటినా మనసుకు సరైన విశ్రాంతి సమకూడలేదు. తన కళ్ళతో దేశాభివృద్ధిని చూడగల మంచిరోజులు రాగలవని ఆయనకు అనిపించలేదు. ఏదో తెలియని అలజడితో ఉక్కిరిబిక్కిరయాడు. శాంతి లేకపోయింది. తన శక్తియుక్తులతో అగతికమైన లోకానికి మార్గదీపనం చేసిన మేధావితల్లజుడు, పాలనావ్యవస్థలో ఎన్నో ఒడిదుడుకుల సారవిచారం చేసిన రాజనీతివిశారదుడు, స్వానుభవంలో సుఖదుఃఖాల కడపటి అంచులను చూసిన దార్శనికుడు – రాజ్యంలో అధర్మం తాండవించి, జీవితంలో అగమ్యగోచరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు కర్తవ్యాకర్తవ్యాల అంతస్సంఘర్షణను తట్టుకోలేక – క్రీస్తుకు పూర్వం 278 నాటి డ్రాగన్ సంవత్సరం ఐదవ నెల, ఐదవ రోజున హ్యూనాన్ లోని మీలో నదిలో దూకి జీవయాత్రను చాలించాడు.

2

ఛు యువాన్ జీవితమంతా విషాదమయంగానే గడిచింది. రాజకీయవేత్తగా భరింపరాని ఓటమిని చవిచూసినవాడు అక్షరజగత్తులో తిరుగులేని గెలుపును సాధించాడు. కష్టజీవులకోసం కాలాతీతకావ్యశిల్పానికి ప్రాణంపోసిన కవిగా ప్రజల ఆత్మీయతకు నోచుకొన్నాడు. చరిత్ర పుటలలో చిరంజీవి కాగలిగాడు. ఛు రాజ్య ప్రజానీకమే గాక చైనా దేశీయులందరూ మేదురమైన ఆదరం చూపి మెప్పుల కుప్పలలో ముంచెత్తారు. రెండున్నరవేల యేండ్ల సుదీర్ఘమైన కాలపు గీటురాయిమీద ఆ ఆదరాభిమానాలు అణుమాత్రమూ తరుగులేక మెరుగులీనుతూనే ఉన్నాయి. ప్రతియేటా చాంద్రమానానుసారం ఐదవ నెలలో ఐదవ రోజున ఛు రాజ్యవాసులు ఆయన నీటిలో తన భౌతికజీవితాన్ని చాలించినందుకు గుర్తుగా దేశమంతటా డ్రాగన్ పడవ పోటీలను నిర్వహించి నివాళులను అర్పిస్తారు. నిడుపైన వెదురాకుజొంపంలో కట్టిన నమీ ఫాయీఁ అనబడే బియ్యపు పిండిని నీళ్ళలో ఉడకబెట్టి, ఉండ్రాళ్ళ వంటి వంటకంతో నైవేద్యాన్ని సిద్ధంచేసి – డ్రాగన్లు, గండుచేపలు ఛు యువాన్ దేహాన్ని ఆహారంగా స్వీకరింపరాదని ప్రార్థనలు చేస్తూ – జలచరాలకు అర్పణగా నదిలోకి విడిచిపెడతారు. ఆ తర్వాత బంధుమిత్రులతో కొలువుతీరి విందుభోజనం చేస్తారు. చైనీయుల ఈ సత్సంప్రదాయం క్రమంగా కొరియా, జపాన్, వియత్నాం, మలయా దేశాలకు కూడా వ్యాపించింది.

లోకంలో ఎవరికీ దక్కని ఈ అరుదైన గౌరవం ఛు యువాన్ తన ప్రజల పట్ల చూపిన ప్రేమాతిశయం మూలాన, దేశభవితవ్యం కోసం తపించిన అంకితభావపు లోతుపరపుల వల్ల సంప్రాప్తించింది. రాజవంశీయుడైనప్పటికీ ఆయన సామాన్యప్రజానీకపు కష్టసుఖాలతో మమేకం అయ్యాడు. రెండువేలయేళ్ళ క్రితం ఫ్రాక్తన చైనీయభాషలో ఆయన ప్రకాశింపజేసిన భావాలివి:

దుఃఖమున వంగి, కష్టసందోహ నిత్య

భయముచేఁ గ్రుంగియున్న నా ప్రజలఁ గాంచి

నేత్రయుగళినిఁ దొలఁకు కన్నీరు దుడిచి,

పేర్చిన యనుతాపమున నిట్టూర్చినాఁడ.                  (‘ఆక్రోశము’)

కదలిపోయితి నా వారి కష్టములకుఁ;

గదలఁబో నిఁక నీ జన్మపదము విడిచి.              (‘చెదురుమదురు ఆలోచనలు’)

అని. ఏ మహాత్ముడు తమ అభ్యుదయంకోసం నితాంతదుఃఖోద్విగ్నుడై యావజ్జీవం పరితపించాడో, ఆ మహాత్ముని ప్రజలు కృతజ్ఞతతో గుర్తుంచుకొన్నారు. ఆయన కవిత్వం తరతరాల పాఠకులకు లక్షణశాస్త్రం కాగలిగింది.

ఛు యువాన్ కవితలలో నిండైన నిజాయితీ ఉన్నది. తాను మనఃపూర్వకంగా ఆదర్శమని దేనిని నమ్మాడో, ఆ ఆదర్శాన్ని అత్యంతనిష్ఠతో ఆచరించి నిజానిజాలను నిర్ధారించుకొన్న తర్వాతనే జనాళికి అవశ్యకర్తవ్యంగా మలిచి చెప్పాడు. కొలువునుంచి బహిష్కరింపబడి ఇరవైయేళ్ళ పైచిలుకు కాలం అజ్ఞాతవాసంలో గడిపినప్పటికీ – ఎట్టి పరిస్థితిలోనూ జన్మభూమిని విడనాడకూడదన్న కృతనిశ్చయంతో ఉన్నాడు. “కదలిపోయితి నా వారి కష్టములకుఁ, గదలఁబో నిఁక నీ జన్మపదము విడిచి” అని  ప్రకటించాడు. తన దేశమంటేనూ, దేశప్రజలంటేనూ ఆయనకు గల భావబంధం అటువంటిది. అవ్యక్తుల మూలాన కలిగిన అవమానాలను సైరించి ఆత్మత్యాగానికైనా సిద్ధమయ్యాడే కాని తన ప్రజలనూ, ఛు రాజ్యాన్నీ విడిచిపెట్టడం మేలన్న ఆలోచన ఆయనకు రాలేదు. అంతగా ప్రజల గౌరవాభిమానాలను ఎట్లా పొందగలిగాడో అర్థం చేసుకోవటం సులభమే.

ప్రజల పట్ల పెంచుకొన్న గాఢమైన ఆ ప్రేమాతిశయమే ఛు యువాన్ కవిత్వంలో దీప్తమైన అభివ్యక్తిని పొందింది. ఆయన పేరుమీదుగా మొత్తం ఇరవైఅయిదు కవితలు లభిస్తున్నాయి. అందులో పదకొండు కవితలు ఓడ్ ఛందస్సులో వివిధ దైవతాలకు సమర్పితమైనవి. ఆధునిక సాహిత్యవేత్తలు కొందరు ఈ కవితలన్నీ వేర్వేరు కాలాలలో వెలసిన జానపద గీతికలు కావచ్చునని, ఏ ఒక్క కవీశ్వరుడో తన హృదయవీణపై శబ్దపు తంత్రులను మ్రోగిస్తూ పలికిన మధురస్వరసంగతులు కాకపోవచ్చునని వివదించారు కాని, ఛు యువాన్ కు సమీపోత్తరకాలికులైన హాన్ రాజవంశీయుల పరిపాలన కాలం నాటినుంచి మహాకవులను ప్రభావితం చేసిన రచనలుగా ఇవి ఆయన పేరిట పేరెన్నిక గన్నాయి. విమర్శకులు వీటిని పరిపరివిధాల వర్గీకరించారు. ‘ప్రాచీదిశా మహాచక్రవర్తి’, ‘అంతిమ క్రతువు’ వంటివాటిలో సాంప్రదాయికమైన చైనీయుల క్రతువిధానమే ప్రధానేతివృత్తం. ‘మేఘాంగన’, ‘యౌవన భాగ్యము’ కవితలలో సూత్రధారకృత్యాన్ని నిర్వహిస్తున్న గాయకుడో (లేక) క్రతుకృత్యానికి కూర్చొన్న ఋత్విజుడో మేఘమండలస్థితురాలై ఉన్న దేవతయెడ తనకు గల ప్రేమను వెల్లడించడమే వస్తువు. దేవతలకోసం క్రతువులను నిర్వహిస్తున్న తరుణంలో అతిమానుషవ్యక్తులతో ఈ భౌతికమైన వాంఛానివేశం ఏమిటంటే, మానవ మనోభావాల లీలాఖేలనవిలాసం అది. ప్రకృతిశక్తులతో భావుకులకేర్పడిన భావబంధానికి ప్రతీక. చైనీయ మహాకావ్యమైన ‘సంగీతికా సంకలనము’ (Book of Songs) లో చిత్రితమైనట్లు ఈ క్రతుకృత్యాలన్నీ కేవలం దైవతారాధనలకు మాత్రమే నిమిత్తీకరింపబడినవి కావు. మానవ మనస్సులో ఎల్లకాలం వ్యక్తావ్యక్తంగా నిబిరీసంగా ఉండే భావసంపుటులే క్రతుకృత్యవేళ మంత్రరూపంలో వ్యక్తరూపాన్ని పొందుతాయి. సర్వరసాశ్రయమైన ప్రేమభావం అందుకు అతీతమేమీ కాదు. ‘మహాభాగ్యము’ కవితలో మేఘమండలంలోని ఆ అతిలోకసౌందర్యరాశి మనస్సుకు నచ్చిన మనస్వినిగా సంబోధింపబడుతుంది. ‘పసుపువన్నె జాలు వేలుపు’ కవితలో యల్లో రివర్ అనబడే హ్సియాంగ్ నదీకాంత ప్రేమాధిదేవతగా, కవికి ప్రేయసిగా భావింపబడటం కనబడుతుంది. ‘హ్సియాంగ్ నదీ కాంత’, ‘హ్సియాంగ్ నదీ దేవత’, ‘పర్వతాత్మ’ కవితలలో ఆ నదీకాంత పర్వతరాజుపై తన మనస్సులో వెల్లివిరిసిన అనురక్తిని వెల్లడించడమే కథాసంగతి అయినప్పటికీ మొదటి రెండింటిలోనూ ఒక ఉదాత్తమైన నాటకీయసంవిధానం ఉట్టిపడుతుంటుంది. అవి సుదీర్ఘమైన వేరొక రచనకు నాందీప్రాయములేమో తెలియదు. ‘పర్వతాత్మ’ కవితలో కానవచ్చే కమనీయమైన కవనధోరణి మెచ్చదగినది. ‘సూర్యదేవుడు’ కవితలో సూర్యుని దైవత్వవిషయాన్ని స్తుతించటం గాక – జగత్ప్రీతిదాయంగా నిర్వహిస్తున్న క్రతువుయొక్క దర్శనీయశోభను చూసి కవి మైమరపు చెందటమే వస్తువు. దృశ్యమానమైన చరాచరలోకంలోని సౌందర్యానికీ, అవాఙ్మానసగోచరమైన అతిమానుషతత్త్వానికీ ముగ్ధుడు కావటమే తప్పించి, కవికి అలౌకికశక్తులంటే అణుమాత్రమైనా భక్తితాత్పర్యం లేకపోవటం ఈ కవితలలోని అంతస్సూత్రం. ఈ లౌకికతాభిమానం వల్లనే విమర్శకులు కొందరు ఇవన్నీ దేవతలను ఉద్దేశించినవి కావని, రాజును ఉద్దేశించి చెప్పివుండవచ్చునని భావించారు కాని, పదాల పోహళింపును బట్టి ఆ అన్వయం సరికాదని యాంగ్ హ్సియెన్-యీ, గ్లాడిస్ యాంగ్ వంటి ప్రామాణికవిద్వాంసుల అభిప్రాయం. ఇవిగాక, దేశంకోసం నిహతులైనవారిని సన్నుతిస్తున్న స్మృతిగీతం ‘రణరంగంలో నేలకొరిగిన వీరులకోసం’ ఒక్కటే ఈ ఓడ్ కవితల కూర్పులో విలక్షణంగా ఉన్నది. ఈ ఒక్కదానిలోనే తక్కిన కవితలలో వలె భావుక ప్రియంభావుకమైన ప్రేమభావం చిత్రవర్ణకిర్మీరాలతో మనస్సమ్మోహకంగా శబలితం కాలేదు. రణాంగణాన్ని ప్రత్యక్షీకరిస్తున్న కవి శబ్దశక్తి ఇందులో సర్వతోముఖంగా సాక్షాత్కరిస్తుంది. తెగిన మొండెం నేలపై గిలగిల కొట్టుకుంటున్నా శత్రుసంహారానికై ఉత్సవించే యోధాగ్రేసరుల ఆత్మశక్తికి నీరాజనం పడుతున్న ఈ కవితకు దేశభక్తి గీతాలలో ఉత్తమస్థానం లభించింది.

image2ప్రౌఢవయస్సులో జీవితం ఆనందోల్లాసాలతో హాయిగా గడిచిపోతున్న రోజులలో ఛు యువాన్ పధ్నాలుగు కవితలను రచించాడు. గ్రీష్మవేళాదక్షిణానిలవీచికలు నిదాఘతాపతప్తమైన తనువును తాకి తాదాత్మ్యాన్ని కలిగించినట్లు యుగయుగాంతరానుగతకర్కశసమస్యలతో సంతప్తమై సమ్యక్పరిష్కారంకోసం విలవిలలాడుతున్న మనస్సును మెత్తగా స్పృశించి, మైమరపింపజేసే ఒక చల్లదనం ఈ కవితలలో నిండి ఉంటుంది. ఒక సహజత్వం, ఒక సరళత్వం, ఒక సౌగంధ్యం, ఒక మాధుర్యం, ఒక గంభీరిమ, ఒక ఉద్వేజనం, ఒక సంగీతభంగి, ఒక సమతా గుణం, ఒక మాటలకందని వింత అందం మిరుమిట్లు గొలుపుతుంటాయి. తక్కిన కవితలన్నీ ఆయన కలలు కల్లలైన నైరాశ్యపు రోజులలో కూర్చినవి. పెనుతుఫాను వీచేముందు కమ్ముకొన్న కారుచీకటి లాగానో, కారుచీకటి కమ్ముకొన్న తర్వాత వచ్చిన పెనుతుఫాను లాగానో ఉక్కిరిబిక్కిరిచేస్తాయి. తీవ్రమైన ఆగ్రహావేశం, మనసు లోతులను తాకే భావతీవ్రత, శోకవ్యాకులత, చింతావిలీనత, దుఃఖనిర్భరత నిండి ఉంటాయి. సమానహృదయంతో భావన చేయగల సహృదయులకు ఆ మహాప్రభావం నుంచి తప్పించుకోవటం సులభసాధ్యం కాదు. ఆ కవితలలో తొమ్మిది స్మృతిగీతాలు. వాటిలో ‘నారింజకు నివాళి’ అన్నది కూడా ఓడ్ ఛందస్సులోనే ఉన్నది. ఇవి ఏకకాలంలో కూర్పబడిన కృతులు కావని, హాన్ రాజవంశీయుల కాలంలో విద్వాంసులు ఈ కవితలను వేర్వేరు ఆకరాల నుంచి సంపాదించి ఛు యువాన్ రచనలుగా నామకరణం చేశారని – స్యూంగ్ రాజవంశపు ఐతిహాసికుడైన ఛు హ్సీ పండితుడు అభిప్రాయపడ్డాడు. బర్టన్ వాట్సన్, జేమ్స్ లెగ్గీ వంటి సుప్రసిద్ధ చరిత్రకారులు ఈ వాదాన్ని అంగీకరింపలేదు. ప్రామాణిక సంకలనాలన్నిటిలో ఇవి ఛు యువాన్ రచనలుగానే ప్రచురింపబడుతున్నాయి. వాక్యబంధాన్ని అనుసరించి చూస్తే ‘నారింజకు నివాళి’ని ఆయన కవిత్వాభ్యాసం మొదలుపెట్టిన తొలిరోజులలో వ్రాసి ఉండవచ్చునని ఊహించటానికి వీలున్నది. ఇందులోని ప్రథమార్ధం నారింజ గుణోత్కర్షను ప్రశంసిస్తుండగా ద్వితీయార్ధంలో ఎవరో ఒక అజ్ఞాతవ్యక్తి మెచ్చుకోలున్నది. ఆ వ్యక్తి నవయౌవనుడని తెలుస్తూనే ఉన్నప్పటికీ – అది ఛు యువాన్ కావచ్చుననీ, కాకపోవచ్చుననీ నిర్ణయించేందుకు వీలులేకుండా ఉన్నది.

ప్రపంచ సాహిత్యంలోని స్మృతిగీతావళిలో ఛు యువాన్ స్మృతిగీతాలు ప్రథమగణ్యాలని భావింపవచ్చును. వీటి రచనాకాలం ఎప్పటిదో నిర్ధారించేందుకు ఆధారాలు లేవు. అయితే, ‘విషాదకర పంక్తులు’ అన్న గీతంలోని పశ్చాత్తప్తవాక్యాల తీవ్రతను బట్టి కవి దీనిని రాజతిరస్కృతుడైన తొలిరోజులలో చెప్పి ఉండవచ్చునని ఒక ఊహ. పరిస్థితుల ఒత్తిడి వల్ల ఇంద్రియోద్వేజనకు లోనైనప్పుడు కవి స్థితప్రజ్ఞతకోసం ఉవ్విళ్ళూరుతాడు. వైరశుద్ధికోసం ప్రయత్నాలు చెయ్యడు. ఆత్మసంయమాన్ని పాటించడం ఎంతో కష్టమవుతుంది. హృదయానికి, బుద్ధికి ఏర్పడిన నిశితమైన ఘర్షణకు తట్టుకొనలేక శరీరం అలసిపోతుంది. మనోలయం సిద్ధించినప్పటి నిర్వికల్పస్థితి అది. ఆ చిత్తావస్థలో స్వయంవ్యక్తాలైన దుర్భరవిషాదకర పంక్తులవి.

ప్రాక్చికీర్షితం బెల్ల నిష్ఫలతఁ జెంది

దుఃఖభాజన మయ్యె; సంతుష్టి దొఱఁగె;

మెట్టుమెట్టుగ నెక్కుచు మేడపైకి 

నిచ్చెనను నేలఁద్రోచితి నిలువకుండ.          

అని కథావ్యక్తి తన గతాన్ని, స్వయంకృతాన్ని నెమరువేసుకొంటాడు. ‘ప్రతికూల ఝంఝ’, ‘ప్రేమోత్కలిక’లు కూడా ఆనాటివే. క్రీస్తుకు పూర్వం 300 – 295 (±) నాటి ఆయన మనఃస్థితికి అద్దంపడతాయి.‘గతకాలపు నెమరువేత’, ‘రాజధానిని విడిచిపెడుతూ’ కవితలు పాయ్ చీ దక్షిణపు సరిహద్దునుంచి దేశరాజధానిపైకి దండెత్తి, కోటను సర్వనాశనం చేస్తున్న రోజులలో చెప్పినవి. రాచరికపు వ్యవస్థ తన శక్తియుక్తులను సంకుచిత స్వార్థప్రయోజనాలకోసం అన్వయించుకోవటం మొదలుపెట్టినప్పుడు సామాన్యుల జీవితం ఏ తీరున అల్లకల్లోలమై ధర్మానికి నిలువనీడ లేకుండాపోతుందో పరిపరివిధాల పదచిత్రాలతో వర్ణించటం ఆయన అన్ని కవితలలో గోచరించే దృగ్విషయమే. అదే కాలంలో ఆయన ‘నదీతరణం’ అన్న అమోఘమైన కవితను చెప్పాడు. విజ్ఞానపు

నిండైన వెలుగును అజ్ఞానాంధకారం ఆవరించి ధర్మం అధర్మం గానూ, అధర్మం ఆచరణీయంగానూ మారిన రోజులలోని నైతికపతనాన్ని చూడలేక తలవంచి తప్పుకొనిపోవటమే కర్తవ్యమని నిర్ణయించుకొన్నాక కాలస్రవంతిపై ఆయన ప్రయాణాన్ని వర్ణించే అద్భుతావహమైన సువర్ణరూపచిత్రం ఇది. తనను సుదూరమైన ఆవలి తీరానికి తీసికొనివెళ్ళగల పడవలోకి అడుగుపెట్టేముందు కూడా ఆయన మనస్సు రాచరికపు ఇనుప పాదాలకింద నలిగిపోతున్న నోరులేని బానిసల దుఃస్థితి పైనే మగ్నమై ఉన్నది. ఆ వెంటనే ‘చెదురు మదురు ఆలోచనలు’, ‘మునుక వేసే మునుపు’ కవితలను చెప్పినట్లుంది. అవే ఆయన పార్యంతికరచనలై ఉంటాయి.

ఛు యువాన్ కావ్యశిల్పానికి ప్రాణశక్తి అనర్ఘమైన కన్ఫ్యూషియస్ తత్త్వదర్శనాన్ని అధ్యయనించిన పుణ్యఫలంగా సమకూడింది. రాజకీయాలలోకి అడుగుపెట్టి ప్రజాజీవితంతో అనుబంధాన్ని పెంచుకొన్నవాడు కనుక ఆ మహోపాధ్యాయుని ప్రభావం ఆయనపై ప్రసరించటం సహజమే. పాలనావ్యవస్థలో అవినీతికి చోటుండకూడదని, సామాజికన్యాయకల్పనే రాచరికపు బాధ్యత అని విశ్వసించినవాడు కనుక జీవితంలో నైతికవిలువలను నెలకొల్పేందుకు తన కవిత్వమూలకంగా కృషిచేశాడు. అయితే అతిస్వతంత్రుడైన దార్శనికుడు కనుక ఆయన మేధావిత ఏ సమసామయిక భావజాలపు సంకుచితపరిధిలోనో ఇమిడిపోలేదు. ‘ప్రతికూల ఝంఝ’ కవితలో భవ్యమైన టావో దర్శనపు మార్గదీపనం, ఝువాంగ్జి బోధనల సారనవనీతం అగుపిస్తాయి. ‘గతకాలపు నెమరువేత’ కూర్పులో చైనీయ ఫా-జియా దర్శనపు ప్రభావం ఉన్నది. రాజు సర్వజనహితభావంతో సామాజికరాజనీతిని, పాలనావ్యవస్థను తీర్చిదిద్ది, పేదలయెడ దయగలిగి ప్రవర్తించాలన్న ఆలోచన ఈ ఫా-జియా న్యాయదర్శనఫలమే.

చరిత్రప్రసిద్ధమైన ‘లి సావో’ రచనకు పూర్వం ఛు యువాన్ ‘భవితవ్యబోధకుడు’ (జోస్యం చెప్పేవాడు), ‘జాలరివాడు’, ‘మృతులకై శ్రద్ధాంజలి’, ‘ప్రహేళికలు’ అన్న నాలుగు కవితలను వ్రాశాడు. అజరామరమైన ఆయన సాహిత్యప్రశస్తికి మూలకందాలివి. వీటిలో మొదటి రెండూ ఆయనవి కావని, రెండవదైన ‘జాలరివాడు’ కవితను హాన్ రాజవంశం పాలనకు వచ్చేనాటికే ఛు రాజ్యంలో త్సాంగ్ లాంగ్ నదీతీరవాసులెవరో ఛు యువాన్ శైలిని అనుకరిస్తూ చెప్పినది కావచ్చునని విమర్శకులు భావించారు. ఛు యువాన్ ఒక పాత్రగా ఇది ప్రథమ పురుషలో రచితమైంది. ప్రజాజీవితం కలుషితమైందని, జనసమ్మర్దం ఎక్కువై నదీతీరమూ,నదీజలాలూ కలుషితం కాసాగాయని, నది చెంతకు రాకపోవటమే మంచిదని – ఒక జాలరి వృద్ధునితో అంటూ ఛు యువాన్ బాధపడతాడు. ప్రపంచం పాడవుతోందని మనం ప్రపంచానికి దూరంగా బతుకుతామా?ఇక్కడే ఉంటూ ఇక్కడి కష్టసుఖాలలో పాలుపంచుకోవద్దూ? మార్పు తెచ్చేది మనమే కదా! అంటాడు ఆ ముసలి జాలరి. ఇక్కడ తలస్నానం చేస్తే ఆ మురికితో తలపాగా పాడవకుండా శుభ్రం చేసుకోవాలి. మునకవేస్తే దుస్తులనుంచి దుమ్ము దులుపుకోవటం ఒక పని. ఇంతటి కల్మషవాతావరణంలో పరిశుద్ధదేహాన్ని పాడుచేసుకొంటారా? ప్రపంచంలోని కాలుష్యమంతా ఇక్కడే ఉన్నది. ప్రపంచం పాడయేకొద్దీ ఈ చోటూ పాడవుతున్నది. ఈ నీళ్ళలో మునిగే కంటె దూకి ఏ చేపకడుపులోనో తలదాచుకోవటం మంచిది – అంటాడు ఛు యువాన్. మత్స్యోపజీవి అయిన ఆ జ్ఞానవృద్ధుడు చిరునవ్వు నవ్వుతూ, “నాకేమీ అట్లా అనిపించదయ్యా, నది నీళ్ళు బాగున్నాయనిపించినప్పుడు గిన్నెలు కడుక్కొని, స్నానంచేసి వెళ్ళిపోతాను. మరీ బాగాలేదనిపిస్తే పైపైనే కాళ్ళు మాత్రం కడుక్కొని వెళ్ళిపోతుంటాను” అని జవాబిస్తాడు. లయాత్మకమైన గద్యబంధంలో సాగిన కవిత ఇది. జీవయాత్రను ముగించే ముందు కర్తవ్యాకర్తవ్యాలు డోలాయమానంగా ఉన్నప్పటి మనఃస్థితిలో వ్రాశాడని ఊహింపవచ్చును.

‘మృతులకై శ్రద్ధాంజలి’ ఒక లోకోత్తరమైన కవితాఖండం. ఆనాటి చైనాలో ఎవరైనా జబ్బున పడ్డప్పుడు బంధువులందరూ రాత్రిపూట గుమిగూడి, రోగి ఆత్మను వెంటనే తిరిగి వచ్చెయ్యమని మౌనప్రార్థనలు చేసేవారట. జానపద రాగధోరణిలో పాఠ్యే గేయే చ మధురంగా కూర్చిన రచన ఇది. జన్మభూమి అంటే ఛు యువాన్ మనస్సులో ఉన్న అనుబంధానికి అక్షర రూపం. జగన్మోహనమైన కల్పనాశిల్పంతో,ఇంద్రధనుస్సులోని రంగులను విరజిమ్ముతున్న శబ్దసంపుటితో ఆయన దీనినొక రామణీయకనివేశంగా తీర్చిదిద్దాడు. గీతికాంతంలో యాంగ్ హ్సీయెన్-యీ గారి ఆంగ్లానువాదంలోని ఉపసంహారవాక్యావళి అపూర్వభావనిర్భరమై ఇందులోని ప్రతిపాదితాంశాన్ని సహజగంభీరిమతో  ప్రకాశింపజేస్తున్నది:

And once in early spring, in days gone by,

I rode to hunt beneath a southern sky.

Angelica and dogwood sprouted green,

My way stretched far across the stream was seen.

Then leftward o’er the lakes and woods I glanced;

Proudly my four black chargers stamped and pranced.

With thousand chariots thundering around,

They burnt the woods and passed the torches round.

The sky grew red, the slaves pursued my steed;

So on I rode and let the slaves succeed.

I curbed my steed and turned him toward the right

To join the king. My sov’reign came in sight.

I urged the slaves; my sov’reign drove ahead;

The fierce rhinoc’ros at one shaft fell dead.

 

The fiery orb arose, the night star waned,

The years went past, no hour could be detained.

Now hidden is the path where orchids teem;

Still stands the maple by the limpid stream.

A thousand miles away my heart doth yearn,

Beyond the Wailing stream, O soul, return!

ఛు యువాన్ తన రాగద్వేషాలన్నింటిని ఈ రెఖ్వియమ్ కవితలో ప్రస్ఫుటింపజేశాడని విమర్శకులంటారు. క్రీస్తుకు పూర్వం రెండవ శతాబ్ది నాటి సుప్రసిద్ధ చరిత్రకారుడు స్సూమా చీయెన్ దీనిని ఛు యువాన్ రచనగానే అభిమానించాడు. ఇందులోని ప్రసంగసంగతిని బట్టి కవి దీనిలో తన దేశపు రాజు ఆత్మను ఉద్దేశించాడని కొందరు; కాదు, కవి తనను తానే సంబోధించుకొన్నాడని కొందరు; స్యూంగ్ యు అనే కవి దీనిని రచించి, ఛు యువాన్ ను సంబోధిస్తున్నాడని కొందరు భావించారు. ఛు యువాన్ సాహిత్య పరిశోధకులలో అనేకులు రాజ్యబహిష్కృతుడైన తర్వాత ఛు యువాన్ దీనిని హ్యూవాయ్ రాజు చీన్ రాజ్యంలో బంధితుడై ఉన్నప్పుడు చెప్పాడని విశ్వసిస్తున్నారు.

జానపదకవిత్వపు భంగీభణితి ప్రాతిపదికగా ఛు యువాన్ తన కవితారూపాలను తీర్చిదిద్దాడు. పల్లెపట్టులలో ప్రవహిల్లుతున్న దేశి పలుకుబడులను జాతీయజనజీవనస్రవంతిలో ప్రవేశపెట్టి ఎన్నడూ లేని కావ్యత్వగౌరవాన్ని కల్పించాడు. అనూచానమైన చైనీయకవిత్వంలో ఒక నవవిప్లవాన్ని తీసుకొనివచ్చి, ఒక వినూత్నశకాన్ని మొదలుపెట్టాడు. రెండువేలయేండ్లు గతించినా ఆ విప్లవకాంతి ఈనాటికీ తరిగిపోలేదు. ఆయన కవితాదీక్ష చాలా గొప్పది. ప్రజలు ఆ మహాకవిత్వదీక్షను మనసారా మెచ్చుకొన్నారు. అభిమానంతో గుండెలకు హత్తుకొన్నారు. ప్రశంసల పుష్పవృష్టిని కురిపించారు. ఆనాటి పలుకుబడి తీరు మారి భాషలో చెప్పలేనన్ని పరిణామాలు వచ్చినా ఆధునిక చైనీస్ భాషలోకి, వివిధ విదేశీయభాషలలోనికి పరివర్తించినపుడు దాని ప్రభావశీలితలో మార్పేమీ రాలేదు. పాఠకహృదయాలను పరవశింపజేయటమూ మానలేదు.

సాహిత్యచరిత్రలో మహాకవులందరి విషయంలో లాగానే ఛు యువాన్ ఉనికిని గురించి, రచనలను గురించి, కర్తృత్వాదికాన్ని గురించి అనేక వాదవివాదాలున్నాయి. క్రీస్తుకు పూర్వం 206లో సామ్రాజ్యపాలన మొదలుపెట్టి, ఎన్నడూ లేని విధంగా చైనీయ భాషాసాహిత్యాల వ్యాప్తికి పూనుకొన్న హాన్ రాజవంశీయుల కాలం నాటికే ఛు యువాన్ కీర్తివల్లి దిగంతాలకు పాకుతున్నది. అందుకు సాహిత్యాధారాలనేకం ఉన్నాయి. రెండవ హ్యువాయీ చక్రవర్తి ఆస్థానంలోని విద్వాంసులు ఛు యువాన్ దివ్యానుగ్రహసంపన్నుడని భావించేవారు. క్రీస్తుశకం 1638లో ఛు యువాన్ కవితల తొలి సంకలనం లాయీ చీంగ్-చీహ్ వ్యాఖ్యానంతో రూపుదిద్దుకొన్నది. మీంగ్ రాజవంశీయుల ఆస్థాన దారుశిల్పి, ప్రముఖ చిత్రకారుడు అయిన ఛెన్ హంగ్-షావ్ (1599-1652) తన కాలంలో లభిస్తుండిన చిత్రం ఆధారంగా ఛు యువాన్ వర్ణచిత్రానికి జీవకళ ఉట్టిపడుతున్న ఒక ప్రతికృతిని కల్పించాడు. ఆజానుబాహు దీర్ఘ శరీరయష్టితో, సముజ్జ్వలమైన కాంతిపరివేషంతో, చైనీయ సంప్రదాయానుసారం పెద్దలయెడ గౌరవానికి నిదర్శకంగా కేశపాశం అగ్రభాగాన ముడివేసి – ఆ కేశబంధం చుట్టూ అలంకరించికొన్న స్వర్ణాభరణంతో, తెలివితేటలను సూచిస్తున్న విశాలమైన నెన్నుదురుతో, నిడుపైన ముఖరేఖతో, జీవితంలో తారసిల్లిన నిమ్నోన్నతాల చింతాక్రాంతి ఫలంగా ముడివడిన కనుబొమలతో, ఆకర్ణాయతనేత్రాలతో, కవులకు సహజమైన ఆవేశాన్ని, భావతీవ్రతను ప్రదర్శించే పలుచని పెదవులతో, ఆపాదభుజాగ్రం విస్తరించిన నానావర్ణమనోహరమైన ఛాంగ్ షాన్ కూర్పాసంతో,వీపున ఉన్నత రాజకీయోద్యోగులకు లాంఛనమైన కెంపులు పొదిగిన ఖడ్గలాంఛనంతో మహాపురుషలక్షణాలు ఉట్టిపడుతున్న చిత్రం అది. ఆయన చారిత్రికవ్యక్తి కాడని, పురావృత్తాలలోని కాల్పనికమూర్తి అని భావించటం సమంజసం కాదు.

3

ఛు యువాన్ భావుకత్వం, రూపశిల్పీకరణకౌశలం నిరుపమానమైనవి. ఆయన రచనావళిలో మహోదాత్తమని చెప్పదగిన ‘లి సావో’ (ఆక్రోశము) కవితలో మానవుడు స్వార్థపరుడై ప్రకృతిశక్తుల జీవశక్తిని,సత్త్వసంపదను స్వత్వానికి ఏ విధంగా మలచుకొన్నాడో చిత్రించటం కనుపిస్తుంది. అంతులేని అతని ఆశకు పగ్గాలుండవు. గాలి, వాన, ఉరుము, మెరుపు, మబ్బులు, చంద్రుడు మొదలైన ప్రకృతిశక్తులన్నీ అతనికి అనుచరగణమూ, పరివారమూ, రథచోదకులూ అయ్యారు. ఫీనిక్స్ పక్షి, డ్రాగన్ పక్షి అతని రథాన్ని నడుపుతాయి. తన సత్త్వసంపదతో వాటిని ఆకసానికి ఉరకలువేయించి, పరుగులు తీయించి, స్వర్గద్వారం మీదుగా భువనకోశపు పైకప్పు మీదికెక్కి అతను భూ పరిక్రమణకు ఉపక్రమిస్తాడు. అనంతానికి ఆవలి తీరాన ఉన్న అదృశ్య క్షితిజరేఖలపై అడుగుమోపేదాకా అతని అన్వేషణ కొనసాగుతుంది. అంతులేని ఆ ప్రయాణంలో అతనికి విశ్రాంతి దొరకదు. అంతాన్ని చవిచూసేంతవరకు అతని యాత్రకు ముగింపు ఉండదు.

ఛు యువాన్ తన భావుకతకు సనాతన సంప్రదాయం తొడిగిన సంకెళ్ళను తొలగించివేశాడు. సంప్రదాయ రూపచిత్రాలలోని స్వర్గాన్ని, నరకాన్ని, ఆత్మలను అభివర్ణించినా ఆయన వాటిని విశ్వసనీయ దృగ్విషయాలుగా విశ్వసింపలేదు. సర్వసుఖాలకు గమ్యస్థానమైన స్వర్గంలోనూ, పాపులకు శిక్షానిలయమైన నరకంలోనూ కూడా ఆ ఆత్మపదార్థం స్వస్థంగా ఉండటం సాధ్యం కాదని అన్నాడు. ‘ద రెఖ్వియమ్’(మృతులకై శ్రద్ధాంజలి) కవితలో ఆయన ఆత్మను ఉద్దేశించి,

వలదు స్వర్గమ్ము, నరకమ్ము వలదు నీకు,

దశదిశల వెదుకాడు దుర్దశకుఁ బోకు;   

వాంఛనీయమ్ము లే దెట్టి వలను నందు

క్షణము నివసింపలేవు సౌఖ్యముగ నెందు!

అని ఉద్బోధిస్తాడు. ఎండమావులలో దాహం తీర్చుకోవాలనుకొనేవారి సుఖభ్రాంతిని నిరసించే వాక్యమిది. ఆత్మ అంటూ నిజంగా ఒకటుంటే, జీవి మరణానంతరం శరీరం నుంచి బైటపడిన తర్వాత కూడా దానికి సుఖానికోసం వెతుకులాట తప్పకపోవటాన్ని విమర్శించటం ఇందులో కనబడుతుంది. ‘లి సావో’ కవితలో ఒక చిత్రమైన సన్నివేశం: అతను ఆత్మరూపంలో స్వర్గాన్ని చేరుకొని, అక్కడ గుమ్మానికి ఆనుకొని చిద్విలాసంగా నిలబడి ఉన్న ద్వారపాలకుణ్ణి లోపలికి వెళ్ళనివ్వమ్మని అర్థిస్తాడు. ఎంతో కష్టం మీద అనుమతి సంపాదించి లోపలికి వెళ్ళిన తర్వాత – అక్కడ సుఖభోగాలను అనుభవిస్తున్న జీవులు ఎవరెవరో గుర్తుపట్టాక – పెదవి విరిచి, “ఈ స్వర్గంలోనూ మంచివాళ్ళున్నట్లు లేదు” అనుకొంటాడు!

సంవిధానశిల్పం రీత్యా ఛు యువాన్ రచించిన అద్భుతావహమైన కవిత ‘తీయెన్ వెన్’ (ప్రహేళికలు) గురించి చెప్పుకోవాలి. ప్రకృతిని, మానవజాతి చరిత్రను మతాతీతమైన హేతువాద దృష్టితో అధ్యయనం చేసి, తన దర్శనసారాన్ని ఇంత గంభీరంగా కవిత్వీకరించినవారు విశ్వసాహిత్యంలో వేరొకరు లేరంటే అది అతిశయోక్తి అనుకోకూడదు. ఈ విశ్వోత్పత్తికి పూర్వం సృష్టిస్వరూపం ఎలా ఉండేది? ఆ సర్వశూన్యంలో ఏమేమి జరిగి ఏయే పరిణామాలు సంభవించాయో తెలుసుకోవటానికి ఏ శాస్త్రం ఉపకరిస్తుంది? మహనీయుడైన ఏ కళాకారుని అంతర్దార్శనికత తోడ్పడుతుంది? ఏ చిమ్మచీకటిలో రాత్రి కడుపున పగటి వెలుగు పురుడుపోసుకోవటం జరిగింది? తొమ్మిది ద్వీపాలతో విలసిల్లుతున్న ఈ భూమిఖండముయొక్క నిర్మాణం ఎట్లా జరిగింది? ఏ అదృశ్యశక్తి యొక్క కుశల కరాంగుళులు భువిలోనూ, దివిలోనూ నివసించే జీవరాశిని పోతపోశాయి? అన్న విచికిత్సతో ఈ ప్రహేళికాపరంపర ఉత్తరోత్తరానుసంధానపూర్వకంగా కొనసాగుతుంది. పురాగాథలను గురించి, పూర్వమహావ్యక్తులకు సంబంధించి, చారిత్రిక ఘటనలను అధికరించి కవి ప్రశ్నలను సంధిస్తాడు. నూటడెబ్భైకి మించిన ప్రహేళికలే గాని ఒక్కదానికీ సమాధేయరీతిలో సమాధానం కనుపింపదు. ఒకప్పుడు చరిత్రకు గుర్తులు తెలియని కాలంలో వెలసిన ఏవో కొన్ని పురాగాథల స్వరూపం ఈ ప్రహేళికలను బట్టి ఊహింపవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. వీటిలో ప్రసక్తులైన కొందరు మహనీయుల కథావిశేషాలు బహుశః ఒకప్పుడు ప్రచారంలో ఉండి, ఈనాడు ఏ వివరాలూ తెలియనందువల్ల ఈ ప్రహేళికలలోని కొన్ని ప్రశ్నలను అర్థం చేసుకోవటం కష్టం. ఈ ప్రశ్నలన్నీ వేర్వేరు కాలాలలో వేర్వేరు రూపాలను సంతరించికొని ప్రహేళికలుగా రూపొందేనాటికి వీటి స్వరూపం పరిపరివిధాల మారి ఉండవచ్చును. ప్రహేళికల క్రమసంఖ్యలోనూ మార్పులు జరిగి ఉంటాయి. కొన్నింటి పూర్వాపరస్థానాల వ్యత్యయం వల్ల తర్కసంగతి లోపించి, అర్థాంతరసంక్రమణం జరిగినట్లు కనబడుతుంది. పైగా ‘తీయెన్ వెన్’ కు ఉన్న అనువాదాల సంఖ్యకూడా తక్కువేమీ కాదు. వీటిలో క్యూవో మో-జో గారి అనువాదం భాషాశాస్త్రరీత్యా ప్రామాణికమని ఆధునిక చరిత్రకారులు నమ్ముతున్నారు.

ఆధిభౌతిక శక్తులను గూర్చిన, గ్రహనక్షత్త్రతారకాదులను గురించిన విజిజ్ఞాస ఇందులో ఎంతో ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఈ ఆకాశాన్ని నిర్మించినదెవరు? ఆకాశం ఎక్కడి వరకు వ్యాపించి ఉంటుంది?ఆకాశానికి ఆధారభూమిక ఏమిటి? జ్యోతిర్విజ్ఞానంలో పన్నెండు రాశిచిహ్నాల విభాగానికి కారణం ఏమిటి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్త్రాలు క్రిందికి రాలకుండా తమతమ స్థానాలలో ఎలా ఉండగలుగుతున్నాయి?ఒక రోజులో సూర్యుడు ఎన్ని మైళ్ళ దూరం ప్రయాణిస్తాడు? నెలలో చంద్రుని వృద్ధిక్షయాలకు కారణం ఏమిటి? ప్రాతస్సంధ్యకు మునుపు సూర్యుడు ఎక్కడ దాగివుంటాడు? ఇత్యాదిగా ఈ అడుగుతున్న ప్రశ్నలన్నీ తర్కబద్ధమైనవని వేరే చెప్పనక్కరలేదు. ప్రకృతిని ఛు యువాన్ ఎంత సూక్ష్మదృష్టితో పరిశీలించాడో, ఆయన భావనాశక్తి ఎంత పుష్కలమో మనము చూడవచ్చును.

Li_sao_illustré_(crop)

ప్రపంచ సంస్కృతివిశేషాల తులనాత్మక అధ్యయనం పట్ల ఆసక్తి కలవారికి, భారతీయ – చైనీయ సంస్కృతుల సాజాత్యాన్ని తెలుసుకోవాలనుకొనేవారికి ఈ ‘తీయెన్ వెన్’ ఒక తరగని గని వంటిది. కృతి ప్రారంభంలోనే భూమిని ఎనిమిది స్తంభాల వలె మోస్తున్న దిగ్గజాల ప్రసక్తి వస్తుంది. “భూమిని ఎనిమిది ఏనుగులు మోయటం” అన్నది ఎంతటి విశ్వజనీనమైన భావుకతావిశేషమో! అన్న ఆశ్చర్యం కలుగుతుంది. చంద్రునిలోని మచ్చ కథ; ఛావోస్ చక్రవర్తికి పౌర్వికుడైన ఝి రాజును ప్రసవించిన వెంటనే తల్లి అతనిని మంచుపై విడిచిపెట్టగా పక్షులు తమ రెక్కలతో కప్పి కాపాడిన సన్నివేశం; మునుపు పర్వతాలకు రెక్కలుండిన రోజుల్లో చూంగ్ పర్వతపుత్త్రుడైన కు రాజుకు రెక్కలు వచ్చి, అతను ప్రజావాసాలపై వాలుతూ లోకకంటకుడు కావటం; హ్సీయా రాజవంశానికి మూలపురుషుడైన యు రాజు త్యు పర్వతం వద్ద నది పొంగును అరికట్టటానికి వెళ్ళి, అక్కడొక వనితను చూసి ఆకర్షితుడై ఆమెతో సంగమించటం, ఆమె భర్త కోపించి ఆమెను రాయిగా మారమని శపించటం, శాపావధి ముగిసిన తర్వాత ఆమె చీ రాజును కనటం;పూర్వం గగనసీమలో తొమ్మిదిమంది సూర్యులుండటం, హ్సీయా రాజవంశానికి చెందిన మహాధానుష్కుడు యీ అనే రాజు వారిలో ఎనిమిది మందిని కూల్చివేసి ఒక్క సూర్యుని మిగల్చటం వంటివి పాఠకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతాయి. ఒకప్పుడు యుద్ధంలో మహావీరుడైన కావో యాంగ్ చక్రవర్తి చేతిలో ఓటమి పాలైన కుంగ్ కుంగ్ అన్న డ్రాగన్ పక్షి క్రోధంకొద్దీ పూఛావ్ పర్వతం కేసి తలను మోది, భూమిని మోస్తున్న ఆగ్నేయస్తంభాన్ని కూలద్రోసిందట. అందువల్ల అప్పటి వరకు చదరంగా ఉండిన నేల దక్షిణానికి ఒరిగి, సముద్రపు నీటిని తాకిందట. ఈ ఘటన అంతరార్థం ఏమిటి? అని ‘తీయెన్ వెన్’ చిత్రంగా వితర్కిస్తుంది. భూ ఉపరితలం పైని గొడుగు పైకప్పు వంటి అర్ధగోళాకృతిలో తొమ్మిదివేల తొమ్మిదివందల తొంభైతొమ్మిది చిన్ని చిన్ని స్వర్గాలుంటాయట. వీటి ఉనికి పరమార్థాన్ని తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఇహపరాలకు మధ్యనున్న సూక్ష్మమైన విభాజకరేఖ పైని నిలబడి, అజ్ఞేయమైన పరాన్ని విడిచి సుజ్ఞేయమైన ఇహం కేసి మొగ్గుచూపుతున్న ఛు యువాన్ మనస్తత్త్వాన్ని పట్టిచూపుతుంది. విశ్వజయాని కంటె ఆత్మజయం మేలన్న నిశ్చయానికి వచ్చిన రోజులవి.

రత్నగర్భ నేకాతపత్రంబు గాఁగ  

నేలు నరపాలమౌళి నిర్వేలమైన 

భ్రాంతి విడలేక దేనినిఁ బడయఁగోరుఁ?      

గాంక్షను జయించు కాంక్షంబు గలుగదేల?

అని. ఛు యువాన్ కాలానికి చైనాలో విజ్ఞానశాస్త్రం మహోన్నతస్థితికి చేరుకొన్నది. ఖగోళశాస్త్రంలోనూ, కాలవిజ్ఞానంలోనూ, గణితశాస్త్రంలోనూ గణనీయమైన కృషి జరిగింది. సాధ్యనిర్దేశం మొదలుకొని నిగమనం దాకా వాదవిధానంలో నవీన సిద్ధాంతాలు రూపొంది, సప్రమాణంగా తర్కశాస్త్రం పరిణతిని పొందింది. ఛు యువాన్ కు కొద్దిరోజుల ముందు దాక్షిణాత్య తత్త్వవేత్తలలో పేరెన్నిక గన్న హ్యూవాంగ్ ఔత్తరాహులలో సుప్రసిద్ధ తార్కికుడైన హ్యూయీ షీహ్ వద్దకు వెళ్ళి అంతరిక్షంలోని గ్రహనక్షత్త్రాదులు నేలకు రాలకుండా ఉండటానికి శాస్త్రీయకారణం ఏమిటనీ, గాలినీ వాననూ ఉరుమునూ మెరుపునూ సృష్టించిన భౌతికశక్తి ఏదనీ సుదీర్ఘంగా చర్చించాడట. హ్యూయీ షీహ్ ఆయనకు సహేతుకంగా సమాధానాలను చెప్పాడట. దీనిని బట్టి ఆ కాలంలో విశ్వవిజ్ఞానాన్ని గురించిన మేధావుల ఆసక్తి ఏ విధంగా ఉండేదో వెల్లడవుతుంది.

చైనీయ నాగరికత సముజ్జ్వలంగా వెలుగొందిననాటి స్వర్ణయుగంలో ఛు యువాన్ ఉన్నాడు. సహజంగానే మేధాసంపన్నుడైనందున తనచుట్టూ జరుగుతున్న సామాజికపరిణామాలను పరిశీలించాడు. ప్రజాసమస్యలను లోతుగా అధ్యయన చేశాడు. వివిధవ్యక్తుల మనస్తత్త్వాలను అవగాహన చేసుకొన్నాడు. రాజకీయోద్యోగంలో ఉండటం వల్ల అన్ని వర్గాల జనులతో గాఢమైన సంబంధం ఏర్పడి సమకాలిక భావధారయొక్క సమగ్ర స్వరూప స్వభావాలు ఆకళింపుకు వచ్చాయి. అందువల్ల ఆయన ప్రతిభ సర్వతోముఖంగా వికసించింది. అయితే, ఆయన ప్రధానంగా కవి. కవిత్వం ఆయన జీవలక్షణం. ప్రతిభ సముజ్జ్వలమైనది. చిత్రకర్మకౌశలం సాటిలేనిది. అంకితభావంతో అక్షరవరివస్య చేశాడు. పట్టుమని పాతిక కవితలు లేకపోయినా పదికాలాలకు సరిపడే కీర్తిని పండించాడు. అహర్నిశం తన దేశప్రజలకోసం జీవించాడు. నిర్వికల్పమనస్సుతో ప్రజాసేవకే అంకితమయ్యాడు. కష్టజీవుల న్యాయసాధనకోసం ఆయనంతటి శక్తివిలాసంతోనూ, చైత్యచోదనతోనూ, శ్రేయోభిలాషతోనూ, అంతర్లీనపాండిత్యంతోనూ,ప్రకాశవిమర్శతోనూ గంభీరమైన భావసంపుటిని మనోహరమైన శబ్దసంపుటిగా పోహళింపగల కవులు ఎక్కడో కాని కనుపింపరు. వైదుష్యవిలసనానికి గాక కేవలం శ్రమజీవుల స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకోసం కవితలను రచించాడు. ప్రజాహృదయాలలో శాశ్వతనివాసం ఏర్పరచుకొన్నాడు.

*

స్థిర కల్లోలిత

 

 

నిశీధి 

~

 

ప్రాణమా !

ఈ అర్ధరాత్రి నిదుర మరిచిన కళ్ళనిండా నీ జ్ఞాపకాలు నిండుతున్నపుడు మబ్బుల అలజడికి తాళలేని చినుకేదో ఆకాశాన్ని వీడి వెన్నెల్లో ఇంకిపోయినట్టు రెప్పల నిండా ఉలిక్కిపాటు . ఇప్పటికిప్పుడు కలలరెక్కలు తగిలించుకొని నీ కౌగిలి వెచ్చదనంలో గువ్వలా ముడుచుకుపోవాలనుకునేంత ఉద్వేగం . రోజంతా  నీ మృదుహాసం కోసం , మంద్ర స్వరంలో నువ్వందించే ఆ చిగురంత ధైర్యం కోసం , నీ  మాట వినగానే  సంతోషంగా  వెలిగే  నా మోహంలో కాంతికోసం ఎదురుచూస్తూనే ఉంటాను . వచ్చెయ్యి ! గుండె నొప్పులు కళ్ళలో  దాచుకొని ఎంతకాలం ఇలా , నేనున్నానుగా జీవితం పరుస్తాను , మనసు తలుపులు తెరచే ఉంచుతున్నాను అంటావు . సముద్రాల కవతల నీ గూడులో నాకింత చోటిస్తానని ప్రతిరోజూ బ్రతిమిలాడతావు . ఒక్క క్షణం స్వార్ధపు వలయం చుట్టుముడుతుంది , నాకోసమే  ఎదురుచూసే చినుకులలో తడిచి కొత్త సెలయేళ్ళు కట్టుకోవాలనిపిస్తుంది . ఉప్పు నీటి సముద్రాల్ని వదిలి తిమింగలపు హృదయానికో మంచి నీటి కొలను బహుమతిగా  ఇచ్చుకోవాలనిపిస్తుంది .

పక్కగదిలో పండుటాకులేవో ఊపిరిసలపక సతమవుతున్న అలికిడి , ఉలికిపాటులో నిన్ను  నీజ్ఞాపకాలని కలంతో మూతేసి కాసేపు గందరగోళం . రోజు ఉండేదే అయినా  సెకను పాటు వళ్ళంతా ప్రవహించే  భయం , రేపుదయం మా ముగ్గురికీ శుభోదయమేనా లేక ఈ  చీకటి  రాత్రి మరో కాళరాత్రవుతుందా అన్న ఊహ వెన్నులో జలదరిస్తూ గుండె చేరే సన్నని  నొప్పి . మన యవ్వనపు మొదటి పడిలో ఒకర్నొకరం  చేరి ఉంటే , బహుశ ఈ క్షణం నువ్వు ఊహలో కాకుండా  నన్నింకా హత్తుకొని పడుకుంటూ ఏం కాదులే అన్న ధైర్యపు ముద్దు మెడ వంపుకో స్థిరత్వాన్ని ఇచ్చేదేమో ? కాలం  ప్రవాహంలో ఇన్నేళ్ళ  వంటరితనాలు అలవాటయ్యాక , ఇపుడిలా  చుక్కలు కరువయిన  చీకటి ఆకాశాన్ని నెలవంక  వెలుతురులో మురిపిస్తున్నావు . ఎంత దోసిళ్ళు  నింపుకున్నా,  తనివి తీరదు. ఎపుడే మేఘం  ఆ ఆనందాన్ని  తన్నుకుపోతుందోనన్న గగుర్పాటు  కునుకు పడనివ్వదు .

~

నీకు టీం స్పిరిట్ లేదు , అందర్ని కలుపుకుపోవడం రాదు , నువ్వెప్పటికీ ప్రొఫెషనల్ నిర్ణయాలు సమయానికి  తీసుకోలేవు ఇలా అయితే  నీతో  కలిసి పనిచేయడం  కష్టం ముందు ముందు  అధికారపు పింక్ స్లిప్ బెదిరింపులు చివుక్కుమంటాయి . రాత్రింబగళ్ళు శ్రమ ఇంకొకరి చేతిలో  అవార్డుగానో , అతను మెచ్చిన  లలనామణి చేతిలో  రివార్డుగానో కనిపించినపుడు కూడా రాని నిస్పృహ కలుపుకుపోవడం  రాదు  అన్నప్పుడు  కళ్ళ వెంట  కారుతుంది .

ఎలా  చెప్పను పెద్ద సంఖ్య  నిండిన  కుటుంబాలలో మొదటి వారిగా  పుట్టకపోయినా బాధ్యతలెత్తుకొని సిబిలింగ్స్  అందరి జీవితాలకో కేర్ ఆఫ్  అడ్రెస్గా మారి , ఉద్యోగ హింసలు , ఆర్ధిక కష్టాలు , మానసిక వేదనలు వాళ్లై నిలబడి క్రుంగిపోయాక  ఐసియు బెడ్ల మీద మరణపు  అంచులలో లోపల వాళ్ళిద్దరూ , మసక వెలుతుర్ల హాస్పెటల్ కారిడార్లలో బయట వంటరితనపు నిర్ణాయాధికారాలలో మిగిలిన నేను .

మీకు  తెలియంది  ఏముంది  స్టంట్ వేయటం లాంటివి చాలా  ఖర్చుతో  కూడుకున్నవి , తర్వాత  మందులు కాస్ట్లీనే , చాల కాలంగా  డైయాబిటిస్ ఒకో కణాన్ని  తినేయడం  పైకి తెలియకుండా  కళ్ళ తో సహా  చాలా  నష్టం  జరిగింది . బ్రెయిన్ స్కాన్స్ కూడా చిన్న చిన్న క్లాట్స్ చూపిస్తున్నాయి , ఇమిడియట్గా  పెద్ద నష్టం  లేకపోవచ్చుకాని ముందు ముందు పసి పిల్లలని  చూసుకున్నట్టు చూసుకోవాలి . నిర్ణయం  మీదే అని తెల్ల కోట్లు  ఏసీ రూముల్లో కూర్చోబెట్టి  చెమటలు  పట్టించే  మాటలు చెప్పినప్పుడు . ఏడవడానికి కూడా  టైం లేదు . అప్పటి దాక  నవ్వుల్లో  వెంటాడిన చుట్టాలు పక్కాలు  ముఖ్యంగా స్నేహితులు తుఫానేదో మింగేసినట్లు మాయం అయ్యాక  చుట్టూ  మిగిలిన  నిశబ్దంలో నేను ఏ  టీం తో సంప్రదించి నిర్ణయాలు  తీసుకోవాలో అర్ధం కాకా మొదలయిన  ప్రయాణం  ఇప్పటికీ  ఎడేమెంట్ డెసిషన్లా సాగుతుంటే కలుపుకుపోవడం  ఎలానో ఇప్పటికీ  నేర్చుకోలేకపోతున్నాను . దెబ్బ ఒకసారి తగిలితే కదా . పడే పదే తగులుతున్నపుడు ఎలా  లేచి  ఎలా  నడవాలో బలవంతంగా  ప్రాక్టిస్ చేసిన వ్యాయామంగా మారక  . ఇపుడు నిన్ను నువ్వు మార్చుకోకపోతే స్నేహితులు మిగలరు లాంటి వాక్యాలు నిర్లిప్తతే తప్ప  బాధగా  ఏమి ఉండటం  లేదని

ఎవరికీ  చెప్పుకోలేనితనం .

~

ఇదంతా  నీకు  తెలుసుగా , ఎవరికీ  చోటివ్వని  మనసులో నిన్ను  దాచి , అక్కడ అదిమిపెట్టిన  ఎన్ని రహస్యాలు నీతో పంచుకున్నాను ? నువ్వుంటావన్న నమ్మకమేగా  అంత సాహసం నాతో  చేయించింది లేకపోతే పెదవి విప్పి నేనేమిటో  చెప్పిందేవరికి ఈ పదేళ్ళలో . కానిప్పుడు నువ్వో  కొత్త  విపత్తు పాతుకుపోయిన  కాళ్ళని తవ్వుకొని కొండలు దాటుదామంటావు , అలిసిపోయినప్పుడుల్లా  చెయ్యందిస్తానంటావు , ముందుకు వెల్దాం పదమంటూ ముద్దులు పెడతావు . నీకెలా చెప్పడం విత్తనాలు బ్రతుకుతాయి కాని మహావృక్షాలు వేర్లతో పెకిలించి  కొత్త చోట  నాటడం సాధ్యం కాదని , బలవంతంగా సాధించినా మన చేతుల్లో వాటి మరణానికి రోజులు  లెక్కెయ్యాలని  ఎలా  చెప్పడం  నీకు . మనిద్దరిలో  ప్రాక్టికల్  మనిషివి  నువ్వు కదా , అసలలా ఎలా  అడిగావు అని ఎంత మదనో , మళ్ళీ  అదంతా  నా పై ప్రేమగా అన్న ఓదార్పు . నా కలవరం , కల వరం  ఇహ నువ్వేగా .

ప్రవాస బాధల్లో సైతం బంధాలు  మర్చిపోలేని కొడుకు తనకోసం తనకి వండి వార్చి , ముందు పుట్టే వారసులకో ఆయా అవసరాలకి పైసా  ఖర్చులేని అమ్మ తనాన్ని  వాడుకోవడానికో ఏమో ముందు కాళ్ళకి బంధంలా విమానమెక్కబోతున్న తల్లి కోసం  చింత ఎలాగైనా కిటికీ  పక్క సీట్ ఇవ్వమని అక్కడనుండి పాపం  విడియో కాల్  చేసి మరీ ఫ్లైట్ అధికారులనో కోరిక కోరుతున్నాడు . మా అబ్బాయి మీతో మాట్లాడాలంట ఇదుగో  ఒకసారి  ప్లీజ్ అని నవ్వుమొహంతో ఫోన్ అందించిన అమ్మతనం నిండా ఇలాంటివి ఎన్నో చూసిన అనుభవం . కాన్వర్జేషన్ పూర్తి అవ్వగానే చివరగా మల్లెలు అన్ని  కుప్పపోసినట్లు చిరునవ్వుల శబ్దంలో  “ ఐ  నో  ఎవరీథింగ్ , బట్ వాట్ టు డు , మై  సన్ ఐజ్ లైక్  దట్ “ పుత్రోత్సాహపు మెరుపులు .  పదే పదే అదే పాట వినిపించి కనిపించి హిప్నటైజ్ చేసే అడ్వర్టైజ్మెంట్ కనికట్టు,  మనుష్యుల మధ్య  అనుభందాలని ఎత్తి చూపి అలా కనిపించకపోతే , ప్రవర్తించకపోతే అసలు మీ  బ్రతుక్కో అర్ధమేలేదని  మాటికి మాటికి నిరూపించే మాయాజాలం నింపుకున్న ఇడియట్ బాక్స్లో నిన్నో కొత్త యాడ్ , సెల్ ఫోన్ కంపెనీ సూపర్ కొడుకులు నాన్నలు  ఎలా కావాలో నయా మోడల్ సిద్ధం చేసి  జనం మీదకి  వదులుతుంది . మాములుగా  చిరాకే కాని  ప్రస్తుతం  నా మనస్థితి సరిగ్గా అలాగే  ఉండటం వలనో ఏమో మనసుకి హత్తుకుపోయింది అచ్చం  నీ  నవ్వులా .

ఏదో కలుక్కుమంటుంది లోపలెక్కడో . ఇంకొంత వయసు మిగిలే ఉందన్న నమ్మకంలో వదిలేయడం  సులువే . కాని వద్దన్నా  నాకిబ్బంది అని  వొంటిగా దగ్గరలో కూరల మార్కెట్లు వెతుకుతూ ఇల్లెక్కడో మర్చిపోయిన అల్జీమర్స్ ఈగలా ఎవర్ని అడగాలో అసలేమి అడగాలో కొద్ది సెకనుల  తడబాటు సిగ్గులో చితికిపోయే పెద్దరికాలని . ప్రతి రోజు గుర్తు చేస్తే  తప్ప మందులు కూడా  వేసుకోలేని  నిస్సహాయతలని , వివాహ వ్యవస్థ మీద నమ్మకంలేక పోయినా  వయసు వేడిలో  విసిగిపోయి వదిలేల్లిపోతుందేమో అన్న అపనమ్మకంలో చిన్న చిన్న అసహన యుద్ధాలు . టెక్నాలజీ అరచేతిలో  ఇమిడిన రోజుల్లో  సైతం మాకెందుకులే బంగారం నువ్వున్నావుగా , ఆ మెసేజీలు  అవి చూసుకోవడం కుదరదుకాని ల్యాండ్లైన్తోనే మా పని కానిద్దు అంటూ కొత్తగా నేర్చుకోవడాల వెనక నిరాసక్తతతో పాటు నేర్చేసుకుంటే దూరంఅవుతామేమొనన్న అనవసరపు బెంగలు .  నా వర్క్  టైం ముగిసిన  మరుక్షణం  నుండి వాకిళ్ళు నిండిపోయే ఎదురుచూపులు . ఇవన్నీ  వదిలి ఎలా రావడం నిన్ను  హత్తుకోవడం . ఒకవేళ స్వార్ధపు అతిపెద్ద  కుట్రలో సైతం కొన్నాళ్ళు నీ కోసం  ఎగిరొచ్చినా , అక్కడ తృప్తిగా  నీతో గడపగలనా . కలయిక లో మనం  ఏకమయ్యే  క్షణాన సైతం ఏ రింగ్ టోన్ ఏ వార్త మోస్తుందో దిగులేగా .

నిజం చెప్పనా  నువ్వు లేవన్న  దిగులు  తప్ప నిన్ను చేరలేనన్న బెంగ తప్ప నేను బాగున్నాను , చేపలు సముద్రంలో పక్షులు ఆకాశంలో నేను అమ్మ వడిలో భద్రంగా  ఉన్నాము . అప్పటి స్నేహితులు ఎవరన్నా  ఎలా   ఉన్నావు  అని అడిగినప్పుడు ఇప్పుడు ఇద్దరు పిల్లలు  నాకు , ప్రస్తుతం ఎల్కేజీ కొచ్చారు  త్వరలో డైపర్లు మార్చేంత ఎదుగుతారు . నాసాయం లేకుండా హాస్పేటల్ వెంటిలేటర్లు దాటలేరు  ముందు ముందు , అని పెదవుల నిండా  నవ్వుతో కళ్ళు  నిండిన కన్నీటితో గుండె నిండిన భారం దాచడం సులువేం కాదు .

ఎపుడో ఇంకోన్ని శిశిరాల వచ్చిపోయాక ,మనిద్దరిలో ఒకరం మరణపు మంచాల మీద చివరి శ్వాసలు  పీలుస్తూ ఉంటే మాత్రం  ఇంకొకరం బయట దిగులు మొహంతో పాత ఉత్తరాలు  చదువుకుంటూ ఉంటామన్న  నమ్మకం మాత్రమే ఇప్పుడిక మిగిలిన  ధైర్యం .

ఎప్పటికయినా  తిరిగొస్తావన్న ఆశ తో !

 

  • వోడాఫోన్ సూపర్ సన్ యాడ్ లో హుందాగా నవ్వుతూ ఒక్కసారయినా కలిసి  హత్తుకోవాలన్న వ్యక్తిత్వం మోమునిండిన ఓ వెన్నెల తల్లికి . మదర్స్ డే డెడికేషన్ .

కథలకు కొత్త వేకువ – లద్దాఫ్ని

 

   kaifiyath

 

   ‘హిజ్‌ మాస్టర్స్‌ వాయిస్‌’లా గాకుండా గొంతు సరాయించుకొని ధిక్కార స్వరాన్ని, తన సొంత అస్తిత్వాన్ని అంతర్జాతీయ వేదికపై సైతం ఆలాపన చేస్తుంటే అగ్రకుల, బ్రాహ్మణాధిపత్య భావజాల ఆనకొండలు ఎప్పటికప్పుడూ ఆమెను మింగెయ్యాలని చూసినై. అనకొండల నుంచి తప్పించుకుంటూ దిగ్గజాలను ఢీకొంటూ తన సాహిత్యానికి సానబెడుతూ ఉంటే మరోవైపు పితృస్వామ్యం, పురుషాధిపత్యం ఫత్వాలను జారీ చేసింది. కలానికి సంకెళ్ళు వేయజూసింది. ఆంక్షలు విధించింది. స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు, స్వీయ ఉనికిని చాటుతున్న పూల విహంగాన్ని సైలెంట్‌ మిస్సైళ్లతో కూల్చాలని ప్రయత్నం చేసినారు. అయినా తన రేజర్‌ ఎడ్జ్‌ లాంటి షార్ప్‌నెస్‌తో అటు కవిత్వంలోనూ, ఇటు కథల్లోనూ షాజహానా తమ జీవితాల్ని  చిత్రిక గట్టింది. దూదేకుల బతుకుల్ని బాధిత, పీడిత మహిళా దృక్కోణంలో ఆవిష్కరించారు. ముఖ్యంగా దూదేకుల మహిళ దయనీయ స్థితిని రికార్డు చేసింది. నిజానికి తెలుగు సాహిత్యంలో కుటుంబ, ప్రేమ, రాజకీయ కథలు వచ్చినంతగా పేదరికాన్ని అంత బలంగా చిత్రించిన కథలు ఎక్కువగా రాలేదు. షాజహానా మాత్రం అణగారిన పేద బతుకులకు అక్షరాలద్దింది. బ్రాహ్మణాధిపత్యాన్ని బరిబత్తల చేసింది. కొందరు ఎనుకముందాడుతుంటే ఆమె ‘బిల్లి’మెడలో గంట కట్టి ఊరేగించింది. ‘నాన్‌ వెజ్‌’ని తినిపించింది. చైతన్య స్రవంతి పద్ధతిలో కవితాత్మకంగా కథలల్లింది. ‘మనిషి పగిలిన రాత్రి’లో ‘మంచిరాయి’ని వెతుకుతానని ‘వాదా’ చేసింది. తెలుగు సాహిత్యంలో నెలకొన్న ఖాళీలను కొంత పూరించింది.

తాజాగా వెలువడ్డ ‘లద్దాఫ్ని’ కథల సంపుటిలో వేదనాభరితమైన ముస్లిం/దూదేకుల మహిళల పేదరికాన్ని, దుర్భర జీవితాల్ని, అవిద్య, గుర్తింపుకు నోచుకోని అవిశ్రాంత శ్రమను, ఆచార వ్యవహారాలు, తాగుడు వ్యసనం, తినేతిండి, ప్రేమల్ని కథల్లో చర్చించింది. లైంగిక దోపిడీని నాలుగ్గోడల మధ్య నుంచి నడి రోడ్డు మీదికి తెచ్చింది. సన్నాయి ఊదింది. నిద్ర నటిస్తున్న  వారిని మేల్కొల్పింది. సోయిమాలినోళ్ళ మీద కొరడా ఝులిపించింది. ముసుగులో గుద్దులాట కాదు. తన మనసులో ఏముందో చెప్పింది. మెదడుకు పని పెట్టింది. తన చుట్టూ ఉన్న జీవితాల్ని పెద్దమ్మ, అమ్మమ్మ, అత్తగారిల్లు, పనిచేసే చోటు, కళ్ళముందరి సమాజాన్ని అక్షరీకరించారు. ఇవన్నీ బురఖాల్లో, చీకట్లో, పురుషాధిపత్య సర్పపరిష్వంగంలో ఇప్పటి వరకు కప్పివేయబడి ఉన్నాయి. వాటన్నింటినీ నఖాబ్‌ తొలగించి వెన్నెల్లో ఆరబోసింది. బంధనాలు తెంచుకొని అక్షరాలను తెలుగు వాకిట అలికింది. ‘సితారే జమీ పర్‌ బిఛాతే రహు’ అంటూ ఉంది.

   గతంలో నఖాబ్‌, దర్దీ కవితా సంపుటాలు, స్కైబాబతో కలిసి చాంద్‌తారల్ని పూయించిన షాజహానా కవిగా జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తన కవితల్ని వినిపించారు. ముస్లిం స్త్రీవాద కవిగా తనదైన ముద్ర ఏసిండ్రు. ఇప్పుడు తాజా పుస్తకం ‘లద్దాఫ్ని’తో ముందుకొచ్చింది. వెల్‌కమ్‌ టు లద్దాఫ్ని. నిజానికి ఇంతరకూ ‘ప్యూర్‌ ముస్లింలు’ తమ తోటి దూదేకుల వారిని హేళన చేస్తూ ‘లద్దాఫ్‌’ అని పిలిచేందుకు వాడేవారు. అదే విషయాన్ని దూదేకుల స్త్రీకి అన్వయిస్తూ షాజహానా 1998లో తన స్వీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు, అవహేళనగా మారిన, అబ్యూజ్‌ అయిన పదానికి ఆత్మగౌరవాన్ని అద్దేందుకు

    ‘‘అబ్‌ సౌబార్‌ సబ్‌కే సామ్‌నే చిల్లావుంగీ

    హా… మై లద్దాఫ్నీ…హు!

           లద్దాఫ్నీ హీ రహూంగీ…’’ అని నినదించింది. తెలుగు అక్షరాల్లో ఉర్దూలో నినదించిందంటే ‘ప్యూర్‌ ముస్లిం’ని టార్గెట్‌ చెయ్యడమే ఉద్దేశ్యం. అందులో ఆమె సఫలీకృతమయింది. ఇప్పుడు ‘లద్దాఫ్ని’ పేరు తన కథల పుస్తకానికి పెట్టుకోవడమంటేనే తన స్వీయ అస్తిత్వాన్ని చాటుకోవడమే గాకుండా, సమాజంలో గౌరవాన్ని సాధించుకోవడంగా చూడాలి. తెంగాణలో ఇంకా చెప్పాలంటే మొత్తం తెలుగు సాహిత్యంలో (ఖాదర్‌ని మినహాయిస్తే) ముస్లిం జీవితాలు రికార్డు కావడానికి గట్టి పునాదులు ఖాజా, స్కైబాబ, అఫ్సర్‌, యాకూబ్‌, షాజహానాలు వేశారంటే అతిశయోక్తి కాదు. వీళ్ళంతా బాబ్రీ, గోద్రా, దాద్రీ, గుజరాత్‌, ముజఫర్‌ నగర్‌, హైదరాబాద్‌ను అతి దగ్గరగా చూడడమే గాకుండా నిరసన గళమెత్తిన దారిదీపాలు. తమ శక్తినంతా  చమురుగా చేసి సాహిత్య కాగడాలుగా వెలిగిస్తున్నారు. దీనికి తోడు షాజహానా తెలంగాణలో ‘మట్టిపూలు’ పూయిస్తున్నారు. స్త్రీ వాదం ముసుగులో కొనసాగుతున్న కోస్తాంధ్ర మనువాదాన్ని నిలదీశారు. నమ్మిన భావాజాలాన్ని నిక్కచ్చిగా, నిజాయితీగా ఆచరిస్తున్నారు.

sha

    ఇవ్వాళ ముస్లింల దుస్థితిని మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరముంది. ముస్లింల హక్కుల గురించి మాట్లాడితే, ధిక్కార స్వరాన్ని వినిపిస్తే దేశద్రోహిగా ముద్రవేసే దుర్మార్గమైన పరిస్థితి ప్రస్తుతం దేశమంతటా నెలకొంది. ఢిల్లీ జెఎన్‌యూ ప్రధాన కార్యదర్శి షెహ్లా రషీద్‌ ప్రభుత్వ దమనకాండను, హక్కుల అణచివేతను నిలదీసినందుకు హిందూత్వ వాదులు హతమారుస్తామని ఆమెను బెదిరిస్తున్నారు. అదే వర్సిటీ విద్యార్థి ఉమర్‌పై దేశద్రోహం కేసు నమోదు చేసిండ్రు. ఆయన చేసిన ‘నేర’మల్లా ఉరిశిక్ష రద్దు కోరడమే! ఈ దేశంలో ఉండాలంటే మేము చెప్పినట్లు వినాలే లేదంటే పాకిస్తాన్‌కు పోవాలె అని బిజెపి ఎంపీలే ఉగ్రోపన్యాసాలిస్తున్నారు. కాషాయ మూక ప్రవచించేదే దేశభక్తి. వీళ్ల ఉన్మాద నినాదాలకు కోరస్‌ ఇవ్వనట్లయితే కుత్తుకలు ఉత్తరిస్తామని బరితెగిస్తున్నారు. ఆవు మూత్రానికి ఉన్న విలువ మనిషి ప్రాణానికి లేకుండా పోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ముస్లింలుగా, ముస్లిం స్త్రీలుగా మరింత లోతుగా జీవితాల్ని సాహిత్యీకరించాల్సిన అవసరముంది. ఖాళీలను పూరించాలి. అగ్రకుల సాహిత్య సంస్థలు, మీడియా సైలెంట్‌గా ఉన్న అంశాల్ని ఎజెండా మీదికి తీసుకురావాలి.

    నిజానికి దేశ విభజన, హైదరాబాద్‌ రాజ్యం బలవంతపు విలీనం నుంచి బాబ్రీ మసీదు మీదుగా తెలంగాణ ఏర్పాటు వరకూ ఆ తర్వాతి పరిస్థితుల్లో ముస్లిం/దూదేకుల జీవితాల్లో వచ్చిన, వస్తూ ఉన్న మార్పును కొంచెం సామాజిక స్పృహతో చూసినట్లయితే ముస్లిం సమస్యను మరింత సులువుగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. గల్ఫ్‌ వాకిళ్లలో షాదీ పేరిట షేక్‌ల చెరలో చిక్కుకున్న చిన్నారుల జీవితాలు, అత్యాచారాలు అన్నీ సాహిత్యం లోకి రావాలి. ఇవ్వాళ తెలుగులో రాస్తున్న ముస్లిం మహిళల్ని ఒక్క చేతి వేళ్ళమీద లెక్కబెట్టొచ్చు. అలాగే ఉర్దూలో రాస్తున్న హైదరాబాదీలు మహా అంటే ఇంతకు రెండింతలు ఉండొచ్చు.  అయితే వీళ్లలో ‘ఇస్లాం స్వీకరించినా ‘దూదేకుల’, ‘లద్దాఫ్‌’, ‘పింజారి’ ‘నూర్‌భాష్‌’ లాంటి పేర్లతో పిలువబడుతూ.. అవహేళన చేయబడుతూ..ఇస్లాం స్ఫూర్తికి విరుద్ధంగా న ఘర్‌ కా న ఘాట్‌ కా’ గా మారిన వారి జీవితాల గురించి కన్సిస్టెంట్‌గా రాస్తున్నది ఒక్క షాజహానానే అంటే అతిశయోక్తి కాదు.

    ‘‘నువ్వు ఎలా పెరిగావో నాకు తెలీదు. కాని నేను కనపడని కత్తులు మెరిసే చూపుల మధ్య పెరిగాను. ఏం చేయాలన్నా, ఏం చదవాలన్నా ఆఖరికి ఏం కట్టుకోవాలన్నా ఏం తినాలన్నా అమ్మా నాన్న, నానమ్మ తాతయ్య, అన్నయ్య ఇంటి పక్కవాళ్ళు, ఇంటెదురువాళ్ళు, వీధి వాళ్ళు… ఇన్నిన్ని ఆంక్షల మధ్య నేను పొందే ఉపశమనం ఒక్క ఈ లైబ్రరీ మాత్రమే’’ అని ముస్లిం స్త్రీలపై ఉన్న ఆంక్షల్ని ఎత్తి చూపింది.

    షాజాహానా సంప్రదాయ వ్యతిరేకి. పక్కా ప్రజాస్వామిక వాది. సంప్రదాయాన్ని వ్యతిరేకించినందువల్ల మైనారిటీల్లో మెజారిటీ వర్గం ఆగ్రహానికి గురయింది. దూదేకుల మహిళ కావడంతో సహజంగానే హిందూ ఫండమెంటలిస్టులకు కూడా  ఆమె వైఖరి నచ్చలేదు. దీంతో అటు ముస్లిం, ఇటు హిందూ అతివాదులను ఎదుర్కొంటూ సాహితీ సృజన చేశారు. మతోన్మాదులనే కాదు కులాన్ని అర్థం చేసుకోవడంలో విఫమయిన లెఫ్టిస్టులూ  ఆమెపై కన్నెర్ర జేసిండ్రు. లెఫ్టిస్టులు కులాన్ని అర్థం చేసుకోవడంలో ఎలా విఫలమయ్యారో ముస్లింలను అర్థం చేసుకోవడంలో కూడా అలాగే విఫలమయ్యారు.  ఎంత సేపు ఆర్థిక దృష్టితోనే సమాజాన్ని చూశారు. కొలిచారు. అరచేతిలో స్వర్గం చూపిచ్చిండ్రు. ఆర్థిక అసమానతలు  తొలగితే సమసమాజం ఏర్పడుతుందనే థియరీనే చెప్పారు తప్ప ప్రాక్టికల్స్‌ని పరిగణనలోకి తీసుకోలేదు. అందుకే కుల, మత సమస్యలు వామపక్షీయుల ఎజెండా మీదికి రాలేదు.

    నిజానికి ప్రపంచీకరణే ప్రధాన శత్రువు అని కొత్తతరానికి దిశానిర్దేశం చేసిన వామపక్షీయులు కన్వీనియెంట్‌గా  బాబ్రీమసీదుని ‘కూల్చడం’పై నిశ్శబ్దంగా ఉన్నారు. ముస్లింలను చైతన్య పరిచేందుకు వీరికి అనుబంధంగా పనిచేస్తున్న సాహితీ సంస్థలు, సాహితీ వేత్తలు ఎలాంటి చొరవ చూపలేదు. అన్ని ఎన్‌కౌంటర్లూ స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు వ్యతిరేకమయినవే! అయితే కొంత మంది మేధావులు మావోయిస్టు ఎన్‌కౌంటర్లను మాత్రమే ఖండిరచి ‘ఆలేరు’ ఎన్‌కౌంటర్‌పై నిశ్శబ్దాన్ని పాటించారు.  చావులో కూడా ముస్లింలపై వివక్ష ఇంకా కొనసాగుతోంది. తెలుగు ప్రాంతాల్లో కారంచేడు, చుండూరు సంఘటనలు దళితోద్యమానికి దిశా నిర్దేశం చేశాయి. అలాగే బాబ్రీ మసీదు షహీద్‌ కావడం, బొంబాయి అల్లర్లు, ఉరితీతలు సాహిత్యంలో స్థానం సంపాదించుకోలేక పోయాయి. కనీసం బహిరంగంగా మాట్లాడుకునేందుకు చర్చనీయాంశాలు కాకుండా పోయాయి. వామపక్ష పార్టీలు, సాహితీవేత్తలు, వారి అనుబంధ సాహిత్య సంస్థలు దాన్నొక ఉద్యమంగా తీర్చి దిద్దడంలో విఫమయ్యారు. గుజరాత్‌ గాయం నుంచి మాత్రమే ముస్లిం సాధకబాధకాలు తెలుగు సమాజానికి తెలియ వచ్చింది. అది కూడా హైదరాబాద్‌ నుంచి గుజరాత్‌ రిహాబిలిటేషన్‌లో పాల్గొన్న ముస్లిం కవుల పుణ్యమా అని ఆ విషయం చర్చనీయాంశమైంది. మొత్తం తెలుగు సమాజాన్ని వీళ్ళు కదిలించగలిగారు. బాధితుల పట్ల సానుభూతిని, వారి పోరాటానికి సంఫీుభావాన్ని సాధించగలిగారు.

    బాబ్రీ మసీదు సంఘటన ఒక కట్టడం కూల్చివేతగా కాకుండా ఒక నమ్మక ద్రోహంగా, గంగా`జమునా తెహజీబ్‌లో దరార్ గాచూడాలి. ఆనాటి నుంచే తెలుగు సమాజం కూడా హిందూ`ముస్లింలుగా చీలిపోవడం ప్రారంభమయింది. ఈ చీలిక జిల్లాల్లో కూడా కనిపించింది. ఈ చీలిక నేపథ్యంలో బిజేపీ, దాని అనుబంధ సంస్థల ఆగడాలు గుజరాత్‌లో గాయాలు చేశాయి. దేశమంతటా చిచ్చు బెడుతున్నాయి. గ్రామాల్లో ముస్లింలు బతకలేని దుర్భరమైన పరిస్థితి నెలకొంది.  పీర్ల పండుగ చేసుకోలేని స్థితి. అట్లనే దర్గాకు పొయ్యెటోళ్ల మీద ఆంక్షలు. వీటన్నింటి నేపథ్యంలో షాజహానా కథల్ని (కవిత్వాన్ని కూడా) పరిశీలించాలి. విశ్లేషించాలి. కథలన్నీ ఒకదానికొకటి సంబంధం లేనివిగా పైకి కనిపిస్తున్నప్పటికీ అత: సూత్రంగా ముస్లిం మహిళా దృక్కోణం కనిపిస్తుంది. అంతేకాదు చైతన్య స్రవంతి పద్ధతిలో కథలు రాసి తన ప్రతిభను చాటుకున్నారు.

    సిల్‌సిలా కథ దుర్భర పేదరికాన్ని రికార్డు చేసింది. తాగుడు వ్యసనాన్ని, అవిద్య, గ్రామాల్లో ఎన్ని పనులు చేసినా రెండు పూటల తినడానికి తిండిదొరకని దయనీయ స్థితి. మాదిగ వాడలకు ఆనుకొని ఉన్న దూదేకుల కరీంబీ ఎన్ని ఢక్కామొక్కీలు తింటూ జీవితాన్ని గడుపుతున్నది షాజహానా హృద్యంగా చిత్రించింది. ‘‘ఇంగ మీ బడెబాపు ఎండా కాలం వాయించబోతడు, కతం, బిడ్డా! గా వాయించబోయినపుడు దెచ్చిన పైసలే పైసలు! ఇంగ పైసా సంపాయించడు. మీంచి దినామూ తాగుడు గావాలె. గా మూన్నెల్ల సంపాదన ఎన్నాలొస్తది నువ్వే చెప్పు బిడ్డా. నిఖా అయిన  కాణ్ణుంచి ఇప్పటిదాంక సుఖమంటేందో ఎర్కలేకపాయె! నాట్లకు, కలుపుకు, కోతకు బోవుడు.. అయినంక పెసలేర, దూదేర, మీర్చేర బోవుడు. ఏ పని దొర్కితే దానికి బొయ్యి పుట్టెడు పుట్టెడు గింజలు దెచ్చి ఇంట్ల బోస్తుంటే సంసారం నడుస్తుండె’’ అంటూ గ్రామీణ ప్రాంతాల్లో దూదేకుల స్త్రీలు పడుతున్న కష్టాలను, తెచ్చిన గింజలు తీస్కపోయి తాగుడుకు అలవాటయిన భర్తల్ని భరిస్తున్న భార్యల్ని షాజహానా కళ్ళకు కట్టిండ్రు. ఏడాదిలో కేవలం మూన్నెళ్ళు మాత్రం పనిదొరికే స్థితిలో మగవాళ్ళు, అందుకు తాగుడు తోడు కావడం మహిళపై భారం ఎంత పడుతుందో ఈ కథ తెలియజెప్పుతుంది. కరీంబీ ఒక్క షాజహాన పెద్దమ్మే కాదు. కింది కులాల వారి ప్రతి ఇంట్లో ఇట్లాంటి పెద్దమ్మో, చిన్నమ్మో కనిపిస్తారు. పేదరికమెంత దుర్భరంగా ఉన్నా ప్రేమ, ఆప్యాయతలకు, కమ్మని కాయి బువ్వకు ఎక్కడా లోటు రాదు.

    ‘సండాస్‌’ పూర్తిగా ముస్లిం స్త్రీ కథ. గ్రామాల్లో కింది కులాల వారందరూ చెంబట్కొని ఊరవుతలికి బహిర్భూమికెల్తరు. అయితే ముస్లిం స్త్రీలు  ఇంట్లోనే సండాస్‌కెల్తరు. పురుగులు జిబజిబలాడే సండాస్‌ కథ సదువుతుంటే ముక్కుకు వాసన పట్టేస్తదంటే కథ శక్తి అర్థం చేసుకోవొచ్చు. అనివార్యంగా కర్చీఫ్‌ని ముక్కుకు అడ్డం పెట్టుకొని కథ చదివేలా ఉంటది. పెండ్లికి ఇల్లు అమ్మి కిరాయింటికి మారే తల్లి, చెల్లి దీనగాథ కూడా ‘సండాస్‌’లో ఉంది. పాయఖాన సాఫ్‌గ ఉన్న తన ఇంటికే భర్తను తోడుకొని వచ్చి కాపురం పెట్టాలని ఆలోచిస్తున్న దశలో తల్లి పెళ్ళి కర్సు కింద యిల్లు అమ్మి రేకుల యింటికీ అదీ సండాస్‌ మాత్రమే ఉన్న ఇంటికే కిరాయికి మారడంతో కథ ముగుస్తుంది. స్త్రీ దృష్టి కోణంలో బహిర్భూమిని కూడా కథాంశంగా చేయడమే గాకుండా ప్రస్తుతమున్న భారీ స్వచ్ఛభారత్‌ పథకాలు, ప్రచారార్భాటాలు లేని కాలం లోనే పేదరికం దాని ద్వారా అంటిన అపరిశుభ్రతని ఆంగ్ల పుస్తకాల్లోకి కూడా ఎక్కించింది. కవితాత్మకంగా చైతన్య స్రవంతి పద్ధతిలో రాసిన మంచిరాయి నిజంగా ఫిలాసాఫికల్‌ అప్రోచ్‌తో సాగుతుంది. అట్లాంటిదే మరో కథ ‘మనిషి పగిలిన రాత్రి’. పెళ్ళుబుకుతున్న దు:ఖ సముద్రాలను, ఎంత అణచుకున్న అణగారని హృదయాంతరాల్లోని అలల్ని అక్షరీకరించారు. ‘వాదా’ ‘నేను’ కథల్ని ప్రేమకు ప్రతిరూపాలుగా ఆవిష్కరించారు. రంది కథా సంకనంలో బిల్లి కథ తీసుకున్నప్పుడు కొంతమంది శైలీ, శిల్పాలను లెక్కబెట్టిండ్రు. ఈ లెక్కబెట్టినోళ్ళంతా అగ్రకుల బాపనోళ్ళే. ‘బిల్లి’ కథలో అలెగరీ పద్ధతిలో బ్రాహ్మణిజాన్ని దోషిగా నిలబెట్టింది. టిఫిన్‌ బాక్స్‌ కథలో కూడా అంటు పాటించే అగ్రకులాల వారికి బుద్ధి చెప్పింది. అలాగే దివారే కథ తాత్విక చింతనను ఒక గైడ్‌, ఫిలాసఫర్‌ లాగా మెదళ్లలోకి ఎక్కేలా చెప్పింది. ఖతీజ గఫూరి కథలో లైంగిక దోపిడీకి గురవుతున్న ముస్లిం సమాజాన్ని ఆర్ద్రంగా చిత్రించింది. కంచెకాకర కథలో ఇంకా మనుషుల్లో మిగిలి ఉన్న మంచిని తెలియ జెప్పింది.

    ఒక దూదేకుల మహిళ చదువుకోవడమే గొప్ప. అలాంటిది పిహెచ్‌డీ చేసి డాక్టరేట్‌ అందుకున్న విద్యావంతురాలు షాజహాన. చదువుకున్న కాలం నుంచి పనిచేస్తున్న కాలం వరకూ తాను అనుభవించిన, చూసిన జీవితాల్ని అక్షర బద్దం చేసింది. అంబేద్కర్‌ కృషి వల్ల  ‘హిందూ కోడ్‌ బిల్లు’ వచ్చి హిందూ స్త్రీలకు విడాకులు తీసుకోవడానికి వీలు ఏర్పడింది. అయితే ఇందుకు భిన్నంగా ముస్లిం సమాజంలో ఉన్న తలాక్‌ పద్ధతిని వ్యతిరేకిస్తూ కవిత్వమల్లింది. ఈ విషయం ఇప్పుడు మళ్ళీ   రంగం మీదికి వచ్చింది. దేశభక్తి వర్సెస్‌ దేశద్రోహం చర్చలు కొనసాగుతున్నాయి. అధికారంలో ఉన్న వాళ్ళు హేట్‌ పాలిటిక్స్‌ని, హేట్రెడ్‌ను  ప్రచారం చేస్తున్నారు. సహనానికి తావు లేకుండా అసహనంతో ఊగిపోతున్నారు. క్రికెట్‌లో పాకిస్తాన్‌ ఓడిపోవాలని ప్రార్థించడం దేశభక్తికి గీటురాయిగా మారింది. ఎవ్వరు బాగా ఆడితే వాళ్ళు గెలవాలె అంటే దేశద్రోహిగా ముద్ర వేస్తున్నారు. నిజానికి ముస్లింలంటేనే పాకిస్తాన్‌కు పంపించేయాల్సిన వాళ్ళు అని సంఫీుయుల ఉవాచ. పాకిస్తాన్‌లో ఏమో గానీ ఇండియాల మాత్రం ‘దాయాది’ని సాకుగా చూపిస్తూ ప్రజలు ఆకలితో చస్తున్నా అణ్వస్త్రాల స్టాకును పెంచుతున్నారు. దేశ ప్రజల మధ్య చిచ్చు రేపే ప్రకటనలే తప్ప ప్రేమ, ఆప్యాయతలకు ప్రభుత్వ చర్యల్లో తావుండదు. ఇట్లాంటి పరిస్థితుల్లో షాజహానా రచనలు అటు బురఖాను, తలాక్‌ని ఎదిరించినందుకు ముస్లింలకు, బ్రాహ్మణీయ భావజాలాన్ని, హిందూ అగ్రకుల మతోన్మాదాన్ని నిరసించినందుకు ‘హిందువుకు’ కంటగింపుగా మారాయి. ఇప్పుడు కంటగింపుగా మారినా భవిష్యత్‌లో అందరికీ సమానమైన విలువ దక్కే సమాజ నిర్మాణానికి ‘లద్దాఫ్ని’ కథలు  ఖాళీలు పూరించే ప్రయత్నంలో భాగంగా చూడాలి. మరిన్ని ఖాళీల పూరింపుకు మరిన్ని కథల్ని ఆమె నుండి ఆశిస్తూ…

*

ఇంకేం రాయనూ ?

 

 

11 ఏళ్ల క్రితం మా అమ్మ (వైజాగ్ లో) చనిపోయినప్పుడు ఈ ఉత్తరాన్ని కృష్ణాబాయిగారు హైదరాబాద్ నుండి నన్ను ఓదారుస్తూ రాశారు . మళ్లీ ఇన్నాళ్ళకు ఈ ఉత్తరాన్ని టైప్ చేస్తుంటే గుండె బరువెక్కి , అమ్మ మరణం కళ్ళలో మెదిలి మెదడు మొద్దుబారి పోయింది. బహుశా అప్పట్లో వర్మ, మధు (ఆకాశవాణి ) వంటి మిత్రుల తోడు , కృష్ణాబాయి, రంగనాయకమ్మ , కె. వరలక్ష్మి , ప్రతిమ గార్ల ఉత్తరాలే నన్ను ఆ బాధనుండి కొంత విముక్తుణ్ణి చేసాయనుకుంటా. కృష్ణాబాయిగారికి ప్రణమిల్లుతూ – గొరుసు
………………………….

Date: 26.02.05

జగదీశ్వర రెడ్డికి ,

బాగున్నావా అని ఎలా అడగను? ఇంత vaccum కష్టమే .
 

నిన్ను పొగడ్డానికి రాయడం లేదని నీకూ తెలుసు. తల్లి మాత్రమే బిడ్డకి చేయగలిగినట్టు , అనితరసాధ్యంగా , అమ్మని చూసుకున్నావ్ . ఎవరితో పోల్చడానికీ లేదు . నీకెంతో ఇష్టమయిన పనుల్నీ, అభిరుచుల్నీ పక్కకి పెట్టి మరీ చూసుకున్నావ్ . తల్లీ బిడ్డా సంబంధమే కాదు, మానవతా దృక్పధమ్ తో , గొప్ప మనసుతో అమ్మని చూసుకున్నావ్ . నీకు చేతులెత్తి నమస్కరిస్తా నెప్పుడూ మనసులోనే . ఒకటి రెండుసార్లు పద్మినితో అన్నాను కూడా – చేపల కూర చేసి ఆ అమ్మ దగ్గరకు వెళ్ళాలమ్మా ఎప్పుడో అని . ఆమె “ఆ వాసనున్నా చాలురా ” అన్న మాట నన్ను కుదిపేసింది , కాని మేం చేప వండనూ లేదు, నేను తేనూ లేదు .
ఒక్క ఊరిలో ఉండి , అనుకుని కూడా ఆమెని ఒక్క సారన్నా చూడని నా మీద నాకే చికాగ్గా ఉంది .
 

“60 ఏళ్ళు దాటిన వాళ్ళెవరి నైనా చూడాలను కుంటే వెంటనే వెళ్లి చూడాలి, ఆలస్యం చేయ కూడదు” అనేవాడు ప్రసాదు – BN రెడ్డి గారిని చూద్దామనీ వెళ్ళలేక పోయినందుకు . దిక్కుమాలిన ఒత్తిడీ, టైమ్ సెట్ చేసుకోలేక పోవడమూ ఫలితం ఇది .
ఇది నిన్ను ఓదార్చడానికి కాదు, నన్ను నేను మందలించు కోడానికే .
 

రాత్రి గాంధీ చెప్పాడు – వర్మ చేసాడని . ప్రతిమతో మాట్లాడా .
 

ఎలా ఉన్నావో నిన్ను ఒక్కసారి చూడాలి . మన మిత్రులందరూ నీ చుట్టూ ఉన్నారనుకో . నేను ఓదార్చ గలిగింది మాత్రం – ఇంత దూరాన్నుంచీ – ఏముంది?
అమ్మ – ఘోరమైన హింసనుంచి విముక్తు రాలయింది . అది తృప్తిగా మిగలాలి నీకు .
 

ఇంకేం రాయనూ ?
 

– కృష్ణాబాయి