Archives for April 2016

సారీ ! కమలినిని క్షమించలేను !!

 

మబ్బులతో నిండి ఉన్న ఆకాశం ఇక ఒక్క క్షణం కూడా ఆగలేనట్లు వర్షాన్ని పూల రేకుల్లా వెదజల్లుతూ ఉంటే , ఎక్కడి నుంచో ఓ శహన రాగం మనసు ని ముద్దాడి లోపలెక్కడో దాక్కున్న ప్రేమ ను ఒక్క సారి తీసుకొచ్చి ముందు నిలబెడితే…జీవితం మీద మళ్ళీ ఇష్టం మొదలవుతుంది. ఓ మంచి పుస్తకం చదవాలని ఆరాటం కలుగుతుంది. గొడుగులతో ఆపలేని వర్షం, ఆపకుండా చదివించే పుస్తకం, ఇంకేమీ అక్కరలేదని పించే నిలువ నీయలేని ప్రేమ, అతనినో, అతని అక్షరాన్నో చూస్తె చాలు మళ్ళీ మళ్ళీ ఆ ప్రేమ కోసమైనా జీవించాలని పించే క్షణాలు, ఒక కప్పు తాగితే కళ్ళ ముందు కవ్వించే కాఫీ తోటలు…. జీవితం గురించి ఎన్ని కలలున్నాయో….కథల గురించి కూడా అన్ని కలలున్నాయి. ఫేస్ బుక్ లైక్ లకు దూరంగా, వాట్స్ అప్ మేసేజీలకు నిర్లిప్తంగా…..సామాన్య తీసుకెళ్ళే పుష్ప వర్ణ మాసం లోకో, సింధు మాధురి చూపించే విభిన్న వింత లోకపు కలాపి సమక్షం లోకో ఒక్క సారి నిజంగా వెళ్లి చూసి రావాలని అనిపిస్తూ ఉంటుంది. సన్న జాజి పువ్వులా కురిసే వర్షాన్ని చూసినప్పుడో,  ప్రేమికుడి సున్నితమైన ముద్దు లా మురిపించే మంచుపువ్వుల కౌగిలింత ను వెచ్చగా అనుభవిస్తున్నప్పుడో, ఎడారి లా దుఃఖపెడుతున్న జీవితాన్ని మళ్ళీ ప్రేమతో ఆనందంగా జీవించమని ప్రపంచం లో ఏ మూలనో ఎవరో ఒకరికి ఓదార్పు భుజాన్నిచ్చే ఓ మంచి పుస్తకాన్ని చదివినప్పుడో, నా లోపలి మేఘమల్హార్ రాగాల సోయగాలు పోతూ ఉంటుంది. జీవితం పట్ల, సాహిత్యం పట్ల అంత ప్రేమ పెంచుకొన్నాక, ఇటీవల వచ్చిన ఓ కథ చదివితే దిగులేసింది . ప్రతి కథ రాయటానికి ( ఎంత చెత్త కథ అయినా సరే) రచయిత కు ఒక కారణం తప్పనిసరిగా ఉంటుంది . రీడర్ కి నచ్చటానికి, నచ్చక పోవటానికి ఒక్కటి కాదు, వంద కారణాలుంటాయి. ఈ కాలమ్ లో నేను రాసేది అందులో ఒకటి అయి ఉండొచ్చు.

kalpan profile photo-1(1) నాకిష్టమైన సమకాలీన  రచయితలలో సామాన్య ఒకరు. ఆమె ఏం రాసినా ఆసక్తి గా చదువుతాను. ఇటీవలి కథ ”

“ని కూడా అంతే ఇష్టం గా చదివాను. తన శైలి నాకు ఇష్టం. ప్రతి వాక్యం లో గుప్పున పరిమళించే కవిత్వం మరింత ఇష్టం. ఈ కథ లో కూడా ఆ రెండు పుష్కలం గా ఉన్నాయి కాబట్టి ఆ మేరకు   నచ్చింది. నచ్చనిదల్లా కథలోని అంశాలు.  కేవలం ఒకరికి నచ్చటం, మరొకరికి నచ్చకపోవటం లాంటి చిన్న అంశమే అయితే  “మేఘమల్హార్” లో రాయకనే పోదును. ఆడవాళ్ళ ఆత్మగౌరవాన్నే పణం గా పెట్టి సామాన్య లాంటి రచయిత్రి  ఈ కథ రాసిందని బాధ కలిగింది.కథ   రాయటానికి ప్రతి రచయిత కి లాగానే సామాన్య కి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. నాకు ఆ కారణం తో నిమిత్తం లేదు కానీ నా ” కథానుభవం” చెప్తాను.

కమలిని ఒక శారీరక తప్పు ( ఆమె దృష్టి లో)   చేస్తుంది. పడక గది లో కూర్చొని ఆమె ఈ అపరాధ ఉత్తరం రాస్తుంటే యువ సామాజిక నాయకుడు, శాస్త్రవేత్త అయిన దీపూ అనబడే భర్త, భార్య కు ఇష్టమైన వంట వండుతూ ఉంటాడు. ఈ ఒక్క వూహ తప్ప కథ లో ఇంకేమీ కొత్తదనం లేదు. వివాహ బంధానికి  బయట మరో  అనుభవం పొందిన కమలిని ఇంటికొచ్చి పితృస్వామ్య వ్యవస్థ ప్రతినిధి గా మాట్లాడుతుంది, ప్రవర్తిస్తుంది, ఉత్తరం రాస్తుంది . ప్రతి దానికీ కార్య కారణ సంబంధాలు ఉంటాయా? అని అమాయకంగా అడుగుతూనే ఓ అనుభవాన్ని పాతివ్రత్యం, తప్పు, అనైతికత లాంటి భావజాలపు త్రాసు లో వేసి తూచి మాట్లాడుతుంది.

s1

తస్లీమా గురించి గౌరవం తో మాట్లాడే కమలిని కి తన పట్ల తనకు గౌరవం లేకపోవటమేమిటో మనకు అర్థం కాదు. తను ఎవరితో అనుభవం పంచుకుందో ఆ మనిషి మీద ప్రేమ కానీ, ఇష్టం కానీ ,గౌరవం కానీ లేకుండా “ అతనొట్టి స్త్రీ లోలుడు” అని చెప్తుంది. కమలిని పదహారేళ్ళ పడుచు కాదు. నడి వయసు ప్రౌడ. అతను ప్రేమోన్మాదం చూపించి ఆమె కోసం వల వేసి ఆమె చాంచల్యాన్ని బయటకు లాగాడు. కళ్ళు మూసుకొని భర్త పేరు నే కలవరిస్తూ ఆమె అతనితో ఓ అనుభవాన్ని పంచుకొని చీకటి తప్పు చేసి  భర్త దగ్గరకొచ్చి నన్ను క్షమించు. నేనిప్పుడు నెలసరి తో శుభ్ర పడ్డాను. నీ ముందు తప్పు ఒప్పుకుంటున్నాను. ఇంకెప్పుడూ ఈ తప్పు చేయను, నన్ను క్షమించు అని కాళ్ళా వేళ్ళా పడుతూ ఉత్తరం రాస్తుంది. ఓ భార్య మరొకరితో ఒక రాత్రి గడిపిన తప్పిదానికి భర్త క్షమించి ఆమె ను ఏలుకోవాలంటే తిక్కన కాఆల్సి వచ్చాడు. గురజాడ కావాల్సి వచ్చాడు. ఏ తప్పు చేయని సీత ను వదిలిన రాముడి ప్రస్తావన తెస్తుంది. తస్లీమా భర్త వైవాహికేతర సంబంధాల పట్ల తస్లీమా ఎంత బాధ పడిందో గుర్తు చేస్తుంది.

s2 (1)

ఒక స్త్రీ పర పురుషుడి తో ఓ అనుభవాన్ని పొంది భర్త దగ్గరకెళ్ళి  తానూ చేసిన తప్పును  ఒప్పుకోవటం మాత్రం అయితే ఇంత చర్చ లేకపోను. అది ఆ ఇద్దరికి , లేదా ముగ్గురికి, లేదా నలుగురికి సంబంధించి వ్యవహారం గా ఉండేది. కానీ కమలిని భావజాలం, వాడిన పదజాలం…ఆమె ఆలోచనలు అన్నీ  ఏ యుగాల నాటివో. నిజానికి అది కూడా నిజం కాదు. యుగాల నాడు కూడా ఎవరూ ఇలా ఇంత దీనం గా భర్త కాళ్ళు పట్టుకొని అడిగి ఉండరు. అహల్య కూడా గౌతముడి ముందు,  చేసినది తప్పని కానీ, చేయలేదని అబద్ధం కానీ ఆడలేదు. తాను చేసిన పని ని గౌతముడి ముందు గర్వం గానే ఒప్పుకుంది. ఆ అనుభవాన్ని మనసారా అనుభవించింది. కమలిని కి అటు అనుభవం పంచి ఇచ్చిన పురుషుడి మీద గౌరవం లేదు. అతని సమక్షం లో కళ్ళు మూసుకొని భర్త పేరు ని ఉచ్చరిస్తూ, అతనినే తలుస్తూ అతనిని అవమానించింది. పైగా భర్త కు అతని గురించి చెపుతూ అతనొట్టి స్త్రీ లోలుడని నిరసన చేస్తుంది.  తననే ప్రేమించే, గౌరవించే, అనుక్షణం తనతోనే మనసా, వాచా కర్మణా ప్రవర్తించే భర్త ను కూడా తప్పు చేసి బాధ పెట్టింది. గురజాడ దిద్దుబాటు లో ని కమలిని భర్త ను తెలివిగా మార్చుకున్నట్లు, ఈ రోజు నన్ను నువ్వు నా పొరపాటు కు క్షమించు అని అడుగుతుంది నాటకీయంగా.

కమలిని ఏం చేసిందో, ఎలా చేసిందో చెప్పే ఈ మాటలు ఏవీ నావి కాదు. కమలిని ఉత్తరం నుంచి ఆమె ను అర్థం చేసుకునే క్రమం లో ఆమె వాడిన పదాలతోనే ఆమె గురించి, ఆమె అనుభవం గురించి, ఆమె జీవితం గురించి నాకు కథ ద్వారా అర్థమయినది నేనిక్కడ చెప్తున్నాను.

మొత్తం ఈ కాలం స్త్రీల  తరఫున కమలిని పేరుతో, కథ పేరుతో  సామాన్య మాట్లాడింది. ఇవాళ ఈ ఫేస్ బుక్ లు, వాట్స్ అప్ లు, స్కైప్ లు, ఒంటరి విదేశీ ప్రయాణాలు …వీటన్నింటి లౌల్యాల మధ్య ఇలా జరగక తప్పటం లేదని కమలిని చేత వాపోయెలా చేసింది.  ఆడవాళ్ళ పొట్టి బట్టల వల్లే వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయని అంటున్న సమాజం లోని కొందరి మాటలకు , సామాన్య ఈ కథ లో మాట్లాడిన ఈ మాటలకు తేడా కనిపించటం లేదు కదా !? రెండూ ఒకే స్వరం నుంచి వచ్చినట్లు లేదూ!?

 

గత వందేళ్ళ  తెలుగు సాహిత్యం లో ఎన్నో మంచి కథలు, విశ్వ సాహిత్యం లో మరిన్ని మంచి కథలు ఇలాంటి సన్నివేశాల్లో, సంఘటనల్లో  ఆడవాళ్ళు ఎంత ఆత్మ విశ్వాసం తో ప్రవర్తించారో, ప్రవర్తించ వచ్చో చర్చిస్తే సామాన్య ఇంత అమాయకంగా కమలిని కథ ఎలా రాసిందా? అని నాకు ఆశ్చర్య మేసింది. పుష్పవర్ణ మాసం లోనూ, మొన్నటి దేవస్మిత లోనూ ఇంకొంచెం ఆధునికంగా ఆలోచించిన సామాన్య ఈ కమలిని పాతివ్రత్యపు భావజాలం లో ఎలా ఇరుక్కుపోయిందో మరి !

సారీ సామాన్య, నేనే కాదు తమ మీద తమకు గౌరవం ఉన్న ఏ ఆడపిల్లా నీ కమలిని మాటలను క్షమిస్తుందనుకోను.

*

(రేఖా చిత్రాలు: అక్బర్ , “ఆంధ్ర జ్యోతి” నుంచి)

 

1930 తరవాతనే తెలంగాణా ఆధునికత

 

 

 

(ఛాయ 12 వ సమావేశం 1 మే, ఆదివారం సాయంత్రం 6 గంటలకి హైదరబాద్ స్టడీ సర్కిల్, దోమలగూడ, హైదరబాద్ లో జరగబోతోంది.  ప్రఖ్యాత రచయిత, విమర్శకుడు, పాత్రికేయుడు, సంపాదకుడు,    కె. శ్రీనివాస్ “సాహిత్య చరిత్రలో ఖాళీలు “ అనే విషయం మీద మాట్లాడుతారు.  ఈ సంధర్భంగా ప్రఖ్యాత రచయిత, విమర్శకుడు,  సంగిశెట్టి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నలకి,  కె. శ్రీనివాస్ యిచ్చిన వివరణలు.)

  • తెలంగాణలో ఆధునిక సాహిత్యం ఎప్పటి నుండి ప్రారంభమైంది?

ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించేముందు, అనేక అంశాలను స్పష్టం చేసుకోవాలి. ఆధునిక సాహిత్యం అంటే ఏమిటి? ఆధునికత అంటే ఏమిటి? తెలంగాణలోనే కాదు, తెలుగులో ఆధునిక సాహిత్యం ఎప్పటినుంచి మొదలయింది? –  చాలా మాటలను మనం నిర్దిష్ట నిర్వచనాలు లేకుండా ఉపయోగిస్తూ ఉండడం వల్ల కొంత అస్పష్టత  ఉన్నది. పాతవి ముగిసిపోవడం, కొత్తవి మొదలుకావడం- ఇవి కొన్ని తేదీలకో సంవత్సరాలకో ముడిపెట్టగలిగిన సంఘటనలు అనుకోవడం కూడా పొరపాటు. 1900-1940 మధ్య కాలాన్ని నేను నా పుస్తకం( తెలంగాణ సాహిత్య వికాసం)లో ఆధునికతలోకి తెలంగాణ సొంత అడుగులు వేసిన కాలంగా చెప్పాను.  ఆధునికత ప్రవేశించని భౌగోళిక ప్రాంతాలు, భావప్రాంతాలు ఇప్పటికీ తెలంగాణలో ఉన్నాయి. అయినంత మాత్రాన తెలంగాణ ఇంకా ఆధునిక పూర్వ దశలో ఉన్నదని అనలేము. భారతదేశంలో అయినా, బ్రిటిష్‌ ఆంధ్రలో అయినా ఆధునికతలోకి జరిగింది ప్రయాణమే. ఆ ప్రయాణం ఇంకా సాగుతూనే ఉన్నది. ముగిసిపోలేదు.

హేతుబద్ధమైన ఆలోచనలు, సంస్కార దృష్టి, సార్వత్రిక విద్యాకాంక్ష,  సార్వజనీన విలువల వక్కాణింపు, వ్యక్తుల స్వేచ్ఛాభావనలు, బృందాల హక్కులు- ఇవన్నీ సమాజంలో కనిపిస్తున్నాయంటే, ఆ సమాజంలో ఆధునికత బలంగానే ఉన్నదన్న మాట. ఆధునికత గుణవాచి. అటువంటి గుణాలు ఒకానొక నిర్దిష్టకాలంలోనే సాధ్యమైనప్పుడు కాలవాచి కూడా. అయితే, అసమాన ప్రపంచంలో ఒక్కొక్క సమాజం ఒక్కో దశలో ఉంటుంది కాబట్టి,  వాస్తవార్థంలో సమకాలికమైనవన్నీ కూడా సమకాలికమైనవి కావు. దశలు అంటున్నామంటే, అనివార్యంగా ఒకదాని తరువాత మరో దశ వచ్చి తీరాలని, పారంపరిక దశలని కాదు. నైజాము పాలనలో ఉన్న తెలంగాణ, బ్రిటిష్‌ పాలనలో ఉన్న ఆంధ్ర ప్రాంతాలు 1900-1940 మధ్య కాలంలో ఒకే రకంగా లేవు. ఆధునికత లోకి ప్రవేశించిన తీరు, సమయం ఒకటే కాదు. తెలంగాణ ఆలస్యంగా ఆధునికతలోకి రావడమే కాక, భిన్నంగా కూడా వచ్చింది. ఒక ప్రతిపాదనగా చెబుతున్నది ఏమిటంటే, వలసవాదంతో ముడిపడిన ఆధునికత, దాని బౌద్ధిక చట్రం తెలంగాణలో బలంగా లేదు.

  • స్థూలంగా ఆధునికత తెలంగాణలో ఫలానా కాలంలో ప్రవేశించిందని చెప్పలేమా?

మన సదుపాయం కోసం చెప్పుకోవచ్చు. 1930ల తరువాతనే ఆధునిక సాహిత్యం అని చెప్పదగ్గది తెలంగాణలో వచ్చింది. అంతకు ముందు కాలంలో కొందరు వ్యక్తుల రచనలలో ఆధునిక భావాలు, వ్యక్తీకరణ రీతులు లేవని కాదు. ఆధునికతకు కావలసిన సన్నాహాలలోనే 1940 దాకా తెలంగాణ ఉద్యమసమాజం తలమునకలయింది. 1920లు, 1930లు అందులో క్రియాశీల కాలం.

తెలంగాణ నుంచి వచ్చిన మొదటి పత్రిక  శేద్యచంద్రిక (1887), అది అనువాద పత్రిక, ప్రభుత్వ పత్రిక అయినప్పటికీ, వివిధ రంగాలలో హైదరాబాద్‌ తలపెట్టిన ఆధునిక వ్యవస్థల నిర్మాణాల పురోగతిని నమోదు చేసింది. ముఖ్యంగా వ్యవసాయరంగంలో ఆధునిక పద్ధతులను ప్రచారం చేయడానికి ఉద్దేశించిన ఆ పత్రికలో,  టెలికమ్యూనికేషన్‌, రోడ్లు వంటి ఇతర ఆధునిక వ్యవస్థల గురించి కూడా ప్రస్తావనలు ఉన్నాయి.  దానిని సాహిత్యేతర పత్రిక అని పరిగణనలోకి తీసుకోకపోయినా,  సాహిత్యాంశాలు కలిగిన మొదటి తెలంగాణ పత్రిక హితబోధిని (1913) లో కూడా ఆధునిక భావాలను పుష్కలంగా చూడవచ్చు. సంస్థానాధీశులలో నూతన భావాలు కలిగిన సంస్కారిగా నాడు పేరు పొందిన బరోడా రాజు ప్రసంగాలను పునర్ముద్రించింది కూడా ఆ పత్రిక.  తెలంగాణ నుంచి మొదటి మహిళాకవి రచన కూడా ఆ పత్రికలోనే ఉన్నది. ఆధునికమనదగ్గ రీతిలో రాసిన కథనాలున్నాయి.  అయినప్పటికీ, 1915 నాటికి తెలంగాణ సమాజం ఆధునికతలోకి ప్రవేశించిందని చెప్పలేము. వ్యావహారిక భాషా రచనలు 1930లోపే వచ్చాయి. మాండలికంలో కథారచన  1930లలో నే చురుకుగా మొదలయింది. గోలకొండ కవుల సంచిక  లో ఆధునిక సాహిత్యం తక్కువే అయినప్పటికీ, ఆ ప్రయత్నమే ఆధునికమయినది.

1930 దశాబ్దారంభంలో ఆంధ్రమహాసభ ప్రారంభమయింది.  ఆధునిక విద్యావంతుల వర్గం ఒకటి చిన్నగా అయినప్పటికీ ఏర్పడింది. పత్రికల సంఖ్య పెరిగింది. వివిధ సామాజిక, కుల సంఘాలు క్రియాశీలంగా పనిచేయసాగాయి. గ్రంథాలయాలు విస్తృతంగా వ్యాపించి, ఊరూరా మార్పును కోరే యువతరం ఒకటి రూపుదిద్దుకున్నది. ఇవన్నీ సాహిత్యంలో ఆధునికత కు తోడ్పడ్డాయి. తెలంగాణ సమాజ వికాసానికి సాహిత్యంలో ఆ మార్పులు అవసరమయ్యే పరిస్థితి వచ్చింది.

  • తెలంగాణ అస్తిత్వ ఉద్యమ సాహిత్యం ఎప్పటి నుంచి ప్రారంభమైందని చెప్పవచ్చు?

తెలంగాణవాద సాహిత్యం లేదా తెలంగాణ అస్తిత్వ ఉద్యమసాహిత్యం 1995 తరువాతనే మొదలయిందని చెప్పాలి. 1969 ఉద్యమ సందర్భంగా వచ్చిన సాహిత్యం తెలంగాణవాద సాహిత్యం కాదా? అన్న సందేహం వస్తుంది.జాషువా కవిత్వాన్ని దళిత వాద కవిత్వం గా అనడం సాంకేతికంగా ఎట్లా పొరపాటు అవుతుందో, 1970ల నాటి కవిత్వాన్ని తెలంగాణ వాద కవిత్వం అని అనడం కూడా పొరపాటు అవుతుంది. 1969 ఉద్యమానికి  కూడా సైద్ధాంతికత లేదని కాదు. చైనా సాంస్కృతిక విప్లవం ప్రతిఫలనంగా తెలంగాణ ఉద్యమాన్ని చెప్పినవారు, భాషాప్రయుక్త రాష్ట్రాల పునర్విభజన దశగా నాటి కాలాన్ని నిర్వచించినవారు ఉన్నారు. లోతుగా నాటి ఆకాంక్షల మూలాన్ని వెదికిన వారున్నారు. కానీ, ఆ సైద్ధాంతికత ఒక బలమైన, సమగ్రమైన రూపం తీసుకోలేదు. ప్రాంతీయ వివక్షను తీవ్రంగా ఖండించడం, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఉద్వేగపూరితంగా వ్యక్తం చేయడం, సాంస్కృతిక భేదాలను ప్రస్తావించడం నాటి సాహిత్యంలో, ముఖ్యంగా కవిత్వంలో కనిపిస్తుంది కానీ, దాన్ని 1990ల నాటి తెలంగాణవాదంతో సమానం చేయలేము. నాటి ఉద్యమానికి ఉండిన పరిమితులు సాహిత్యంలోనూ ఉన్నాయి.

మలిదశ తెలంగాణ ఉద్యమం- ఉద్యోగ, విద్యావకాశాలతో పాటు, వనరుల పరిరక్షణ, మనుగడల సంరక్షణలను ప్రధానంగా తీసుకున్నది. సాగునీటి సమస్య, గ్రామీణ సంక్షోభం- నేపథ్యంలో, ప్రజలను ఏకత్రితం చేసేవిధంగా సాగిన సాంస్కృతిక సాహిత్యోద్యమాలు ఉద్యమానికి చోదకాలుగా ఉన్నాయి. మాది మాకు కావాలె- అన్న నినాదం- ప్రపంచీకరణ నేపథ్యంలోనూ, అస్తిత్వవాదాల ప్రభంజనంలోనూ భాగంగా వచ్చినది. ఆ రెండు పరిస్థితులూ 1970 నాటికి లేవు.

  • తెలంగాణలో మధ్యతరగతి ఏర్పడిందా? ఏర్పడితే ఎప్పటినుంచి?

తెలంగాణలో మధ్యతరగతి ఉనికి గురించి గతంలో నేను వ్యాఖ్యానించినప్పుడు మిత్రులు కొందరు సందేహం వ్యక్తం చేశారు. మధ్యతరగతి- ఒక  నిర్దిష్ట ఆర్థికవర్గాన్ని సూచించే వాడుక పదం. పట్టణజీవితంలోని వేతనజీవులు, వృత్తినిపుణులు, చిన్నవ్యాపారులు- వీరితో కూడిన వర్గం అది. గ్రామీణమూలాలతో నామమాత్రపు సంబంధాలు మిగలడమో, పూర్తి తెగదెంపులో జరిగిన వర్గం అది.  దాని ఆలోచనావిధానం భిన్నంగా ఉంటుంది. సమాజంలో విలువల ఘర్షణకు ఆ వర్గం వేదికగా ఉంటుంది.  బ్రిటిష్‌ ఆంధ్రలో తొలిదశల్లో బ్రాహ్మణవిద్యావంతులతో ప్రాథమికంగా ఈ వర్గం ఏర్పడింది. అక్కడి ఆధునిక సాహిత్యం ఈ వర్గం నుంచి అధికంగా వచ్చింది. తెలంగాణలో మధ్యతరగతి సాహిత్యం తక్కువ.  కథలు, నవలలు వంటి ఆధునిక ప్రక్రియలలో కూడా ఈ వర్గ జీవితం ఉన్నవి తక్కువే.

ఇందుకు కారణమేమిటి?

1913 నాటికి తెలంగాణలో చదువుకున్నవారే 3 శాతం ఉన్నారట. అందులో తెలుగువారు పది శాతం కూడా లేరు. నిజాం ప్రభుత్వంలో పనిచేసిన తెలుగువారు స్వల్పం. ఉర్దూ చదువుకుని న్యాయవాద వృత్తిలో ఉన్నవారు అక్కడక్కడా కనిపించేవారు. వారు కాక ఉపాధ్యాయులు. అంతే. ఆ పరిస్థితి 1948 నాటికి కూడా విప్లవాత్మకంగా ఏమీ మారలేదు. ఇప్పటికయినా, ఆంధ్రప్రదేశ్‌తో పోల్చదగ్గరీతిలో తెలంగాణలో మధ్యతరగతి లేదు. ఆ కాలంలో  హైదరాబాద్‌, వరంగల్‌ తప్ప పట్టణాలని చె ప్పదగ్గవే లేవు. ఈ మధ్యకాలంలో మాత్రం తెలంగాణలో మధ్యతరగతి వేగంగా ఏర్పడుతున్నది. అయితే వారిలో మధ్యతరగతి స్వభావం ప్రస్ఫుటంగా వ్యక్తం కావడానికి ఇంకా సమయం పడుతుంది.   తెలంగాణ ప్రాంతం వివక్షకు లోనయిందని చెబుతున్న రంగాలలో విద్యా, ఉద్యోగరంగాలు ముఖ్యమయినవి. ఆ అంతరమే మధ్యతరగతి నామమాత్రం కావడానికి, మధ్యతరగతి కేంద్రిత  సాహిత్యం రాకపోవడానికి కారణాలని చెప్పుకోవచ్చు.

 

  • తెలంగాణ సాహిత్యంపై మార్క్సిజం ప్రభావం ఏ మేరకు ఉన్నది?

వికాసోద్యమకాలంలో ఉన్నదని చెప్పలేము. 1930 ద్వితీయార్థం నుంచి మొదలుపెట్టి, మార్క్సిస్టు భావాల ప్రత్యక్ష, పరోక్ష ప్రస్తావనలు కనిపిస్తాయి. సమకాలంలోని వివిధ రాజకీయ సిద్ధాంతాల గురించిన ఆసక్తితో, వాటిని ప్రజలకు తెలియజెప్పాలన్న సంకల్పంతో  కెసి గుప్త, వట్టికోట ఆళ్వారుస్వామి  పనిచేశారు. 1940ల ఆరంభం నుంచి కమ్యూనిస్టుపార్టీ తెలంగాణలో క్రియాశీలంగా విస్తరిస్తూ వచ్చింది. ప్రపంచపటం మీద తెలంగాణను ఆవిష్కరించిన  తెలంగాణ సాయుధపోరాటంమీద, పోరాట సాహిత్యం మీద మార్క్సిజం ప్రభావం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. స్తబ్దంగా ఉన్నదని అనుకున్న 1960లలో కూడా ప్రగతిశీల సాహిత్యం, కవిత్వం, కథలు రెండూ తెలంగాణ నుంచి వచ్చాయి.  1965 తరువాత విప్లవోద్యమం ప్రభావం గురించి కూడా తెలిసిందే. 1990 దాకా విప్లవసాహిత్యోద్యమ ప్రభావం గణనీయంగా ఉన్నది.  తరవాత కాలంలో కూడా  ఒక ప్రధాన కోవగా కొనసాగుతూనే ఉన్నది.  తొలి, మలి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలలో పార్లమెంటరీ కమ్యూనిస్టుల వైఖరులు ఎలాగ ఉన్నా, విప్లవ కమ్యూనిస్టులు క్రియాశీలంగా పాలుపంచుకున్నారు.  అందువల్ల 1995 తరువాతి తెలంగాణవాద సాహిత్యంపై కూడా మార్క్సిజం ప్రభావం స్పష్టంగా చూడవచ్చు.

  • మార్క్సిజం వరమా, శాపమా?

వరాలు ఇవ్వడానికి అది దైవమూ కాదు, శపించడానికి దెయ్యమూ కాదు. అది ఒక సైద్ధాంతిక సాధనం, ఆచరణ మార్గం.   కమ్యూనిస్టు పార్టీలతో మనకు సమస్యలు ఉండవచ్చు, వారి ఆచరణ విధానాలతో విభేదాలు ఉండవచ్చు. కానీ, చరిత్రను, వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తును నిర్మించుకోవడానికి పనికివచ్చే  శాస్త్రీయమైన సిద్ధాంతం గా  విలువైనది మార్క్సిజం.  భౌతికవాద ఆలోచనలకు భారతీయ గతంలో కూడా మూలాలున్నాయి. మార్క్సిజం ఇప్పటికే అనేక కొత్త వ్యాఖ్యానాలకు, జోడింపులకు, విస్తరణలకు గురిఅయింది.  వర్తమాన భారతానికి అవసరమైన అన్వయాలను, సవరణలను చేసుకోవడం ఇక్కడి మార్క్సిస్టుల పని. వారికి ఆ తెలివిడి  కలగడానికి లోపలినుంచి, బయటినుంచి కూడా ఒత్తిడులు పెరుగుతున్నాయని మనకు తెలుసు.

  • సమాజంలో వివిధ డైమన్షన్లలో ఉండే ఖాళీలను సాహిత్యం ఎప్పటికైనా పరిపూర్ణంగా పూరించగలదా?

బాలగోపాల్‌ చెప్పినదాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు అడుగుతున్నట్టున్నారు. ప్రామాణికతా భావనలకూ నిజజీవితాని కీ మధ్య ఉండే అంతరం గురించి చెబుతూ, ఆ అంతరం వల్ల ఏర్పడే ఖాళీ కారణంగా ఏర్పడే దాహం గొప్ప సాహిత్య సృష్టికి దోహదకారి అవుతుందని ఆయన అన్నారు.  విస్మృతి వల్ల, అజ్ఞానం వల్ల, పాక్షికత వల్ల చూడలేకపోయిన వాస్తవికతలు కూడా ఖాళీలేనని, మంచి సాహిత్యం వాటిని భర్తీచేసి, అగోచరాలను కూడా గోచరం చేస్తుందని బాలగోపాల్‌ అన్నారు. మనం చూడలేకపోయిన వాస్తవికతలను కళ్లముందుకు లాక్కురాగలిగే సాహిత్యం సమాజంలోని ఖాళీలను పూరించే ప్రయత్నాలకు దోహదకారి అవుతుంది.  పరిపూర్ణత అనేది సాపేక్షం. భర్తీచేసుకుంటూ పోవడం ఒక ప్రక్రియ.

  • తెలంగాణ భాషను పూర్తిస్థాయిలో, కనీసం పాలన, విద్య, పత్రికారంగాలలో, అమలులోకి తీసుకురావడానికి తీసుకోవలసిన చర్యలేమిటి?

ఈ విషయంలో నావి ఉద్యమకారులు అంతగా మెచ్చని అభిప్రాయాలు. తెలంగాణ భాష అనడం పొరపాటు. దేన్ని భాష అనాలి, దేన్ని మాండలికం అనాలి – నిర్ణయించడానికి భాషాశాస్త్రం ఉన్నది. మాండలికం ( అది కూడా పరిభాషాపదమే) అన్న మాట నచ్చకపోతే, మరో మాట పెట్టుకోవచ్చు.

మనం చేయగలిగింది, తెలుగుభాషలో తెలంగాణ పదజాలం ప్రాతినిధ్యం పెంచడం. తెలంగాణ వ్యక్తీకరణలను, జాతీయాలను, సామెతలను మెయిన్‌స్ట్రీమ్‌లోకి తీసుకురావడం. సాహిత్యకారులు ఇప్పటికే విస్తృతమైన స్థానిక పదజాలాన్ని తమ రచనల ద్వారా ఆవిష్కరించారు. ఏది తెలంగాణ పదం, ఏది కాదు అని నిర్ణయించడం నిఘంటుకారులు చేయవలసిన పని. సమగ్ర తెలంగాణ పదకోశం ఒకటి రూపొందాలి. అప్పటికి కూడా అందులోని పదజాలం ఇతర తెలుగు ప్రాంతాల్లో ఎక్కడా వాడుకలో ఉండదని చెప్పలేము. తెలంగాణ లోని వివిధ వృత్తులవారు, కులాల వారు ఉపయోగించే పదజాలాన్ని మొత్తం సేకరించాలి. సాహిత్యంలోని పదప్రయోగాలను క్రోడీకరించాలి. సాంకేతిక పరిభాషా నిర్ణయంలో స్థానిక పదజలాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయాలి.  అచ్చమైన తెలంగాణ స్థానిక వాడుకను సృజనాత్మక రచనల్లో మిగుల్చుకోవచ్చు. కానీ ఆధునిక వినియోగం కోసం, మాధ్యమాల వినియోగం కోసం ప్రమాణీకరణ అవసరం. యంత్ర భాషగా వాడడానికి కూడా ప్రమాణీకరణ కావాలి. తెలుగును యంత్రానువాదం కోసం, కంప్యూటర్‌ వినియోగం కోసం ప్రమాణీకరించే ప్రయత్నాలు మునుపే మొదలయ్యాయి, ఒకమేరకు పూర్తయ్యాయి కూడా. వారు వినియోగించే పదజాలంలో  స్థానిక పదజాలం ఎంత ఉన్నదో పరిశీలించి, తెలంగాణ పాఠాంతరాలను, వాడుకను కూడా అందులో చేర్చాలి.

  • పరిశోధన అనేది థ్యాంక్‌ లెస్‌ జాబేనా?

ఎవరి కృతజ్ఞతలూ  మనకు అవసరం లేదు కానీ, ఇదొక అనాకర్షణీయమైన వ్యాసంగం. ఎంతో కష్టపడాలి. ఫలితం ఏమీ ఉండదు. మనకు మాత్రమే ఎక్సైటింగ్‌గా ఉంటుంది, ఎదుటివారికి చాదస్తంగా ఉంటుంది. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు, ముఖ్యంగా సాహిత్యరంగ పరిశోధనలు, చాలా వరకు మొక్కుబడిగా సాగుతుంటాయి. సామగ్రి సిద్ధంగా ఉన్న అంశాన్నే ఎంచుకొమ్మని గురువులూ చెబుతుంటారు, లఘువులూ అదే చేస్తుంటారు. మౌలిక సమాచారం సేకరించవలసి వచ్చే పని తీసుకోవడంలో ఎవరికీ ఆసక్తి ఉండదు.  స్వచ్ఛంద పరిశోధకులలో ఉండే తపన, డిగ్రీల పరిశోధకులలో లేదేమో అనిపిస్తుంది, ఏ డిగ్రీ కోసమని మీరు అంత పరిశోధన చేశారు?

*

మొదటి శ్లోకం…

 

 

-హెచ్చార్కె 

~

 

  1. మాలో ఒకరు ఎప్పుడైనా విసిగిపోయి

ఆత్మహత్యించుకుని వార్త అవుతారు

మిగిలినోళ్లం మాత్రం మరణించమా?

అందరం చనిపోతాం

అకాలంగా సకాలంగా

అందాక ధిక్కరించి బతుకుతాం

బతికి వుండటమే మా నిరసన

మమ్మల్ని అసుంటా వుండమనే నిన్ను

ఆసుంటా వుండమనడం ద్వేషం కదూ?

మా స్త్రీలు మీ చెరబడినప్పుడు మా

నొప్పి నొప్పిగా వున్నంతవరకు సరే

అదొక ‘మా నిషాద….’ శోకం కూడా

శోకం ఏ మాత్రం క్రోధంగా మారినా

గల్లీ గల్లీ కి గాంధీ కర్రల రౌడీల్ రెడీ

 

  1. రుతువులు మారుతాయి

ఎండలు వానలవుతాయి

వానలు శీతగాలులవుతాయి

వెలుగును ప్రేమించి ఒక సారి

చీకటిని భరించే శక్తికై ఓ సారి

మమ్మల్ని మేం కూడదీసుకునే

ఆనందాలు మాకు పండుగలు

అవి మెలిపెట్టే మా దుఃఖాలకు

ఒక్క రోజు చిరు విరామాలు

మేము కూడా గొంతెత్తి మావైన

రెండు పద్యాల్ రెండు భక్ష్యాలు

అక్కడ కూడా మీరు తయారు

మేము మొక్కడానికి మీ పాదాలు

విని తరించడానికి మీ వీరగాథలు

 

  1. మేము దేన్ని ప్రేమించాలో

మేము దేన్ని ద్వేషించాలో

ఏం తినాలో ఏమి అనాలో

ఎవరి పేరిట పానకం పంచాలో

ఎవరి బొమ్మల్ని మంటల్లో వేసి

ఎలా కాల్చి చిందులేయాలో

వ్రత నియమాలు నువ్వు రాసి వుంటావు

దాన్ని కాదన్న వాడినెలాగైనా హతమార్చి

హత్య ఎంతటి పుణ్యకార్యమెంత

మహిమాన్వితమో వాడి పిల్లలకు

నప్పి వుంటావు. పూర్వస్మృతులు

వదలని మా దుఃఖ ధిక్కారాల స్వరాల్ని

వధించడానికి

నీ కర్మాగారంలో యుగానికొక జంటగా

రామలక్ష్మణులు తయారవుతుంటారు

 

 

 

  1. నేను ఎప్పుడూ మా నొప్పిని మరవని

మీ పంక్తిలో భక్ష్యం అడగని వాల్మీకిని

నన్ను దగ్దం చేసే మంటల్లో

కణం కణం దగ్ధమవుతూ

మంటల నాలుకలు సాచి

నా  వాళ్లకు చెప్పుకోవలసింది

చెప్పుకుంటూనే వుంటాను

చెప్పడం కోసం మంటలతో పాటు

మళ్లీ మళ్లీ మళ్లీ పుడుతుంటాను.

*

అపుడు నేనొక శ్రోతను…

 

 

 

చిత్రం: ప్రవీణ కొల్లి

పదాలు: సాషా 

~

 

చెట్టు నీడొచ్చి

మనసు మీద పడుతున్నట్లు

వయసు మీద పడిన మనసుకేదో

వసంతమొచ్చినట్లు

ఒక్క నీరెండ

 

నీలి రంగు

పలచని చీర బోర్డర్ కు ఆకుల వరస బోర్డర్

కంట్లో తళుక్కుమనే ఛాయాచిత్రం

గ్నాపకాల పతాక చిత్రం

వచ్చీ పోయే వసంతమూ..

ఎక్కడ నేను ..

 

ఎక్కడ

నేను గాలికి రాలే

జలజల రాలే

ఆకుల సవ్వడి కలుక్కుమంటుంది

పూచే పువ్వుల

నిశ్శబ్ద గీతం రికార్డొకటి మోగుతోంది

వచ్చే వసంతానికి

బేక్ గ్రౌండ్ లా

అపుడు

నేనొక శ్రోతను

నేనొక శ్రోతను.

అవును నిజమే… స్వప్నమే కావాలి!

 

 శివలెంక రాజేశ్వరీదేవి  రాసిన కవితల పుస్తకం “సత్యం వద్దు స్వప్నం కావాలి” ప్రచురణని గురించిన వార్త  కనిపించిన ప్రతి సారి తప్పకుండ ఆ బుక్ చదివి తీరాలన్న కోరిక బలం గా పాతుకుంది. అలాగే సాయంకాలపు వడగాలుల్ని మహా నగరపు దూరాభారాల్నీ దాటి తార్నాక నుండి  అబిడ్స్ లోని  గోల్డెన్ థ్రెషోల్డ్ లో అడుగు పెట్టి బుక్ కొన్న తర్వాత గానీ ఆ లోలోపలి అశాంతి తగ్గలేదు. ఏదో అపురూపమైంది చదవడానికి దొరుకుతుందన్న నమ్మకం.  అప్పటికి అక్కడ వీర లక్ష్మి గారి ఉపన్యాసం వినిపిస్తోంది. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి ఉపన్యాసం ముగిసిందీ. అక్కడి వక్తల ప్రసంగాలేవీ చెవికెక్కలేదు. అప్పటికి ఒక పాతిక పుస్తకాల దాకా సేల్ అయినట్టున్నాయి. తెలిసిన వారందరికి హెల్లోలూ హాయ్ లు చెప్పేసి ఇంటికి వచ్చేసి, డిన్నరయ్యాక, స్థిమితంగా వెనక పరిచయాల వివరణల నుంచీ మొదలు పెట్టాను చదవడం. ముట్టుకుంటే చిట్లిపోతుందేమో అనిపించే గాజు బొమ్మ, రాత్రిని పగలు గా పగటిని రాత్రిగా మలుచుకున్న స్వాప్నిక, ప్రేమార్త హృదయం – ఇవీ అందులో అందరూ కామన్ గా రాజేశ్వరి గురించి ఉదహరించిన విశ్లేషణలు. మొదటి కవిత “ఊరికెనే” చదవడం మొదలు పెట్టాను.

 

ఎంతో మామూలుగా సామాన్య ధోరణిలో తేలికగా ఉపయోగించే పదం అది. చిన్న సంభాషణా పూర్వక దృశ్యాన్ని ఆవిష్కరించిన కవిత అది. వాక్యం తర్వాత వాక్యం చదివే సరికి, నా చుట్టూ ప్రపంచపు కోటి గొంతులు ప్రతిధ్వనించాయి. ప్రతి వాక్యమూ ప్రపంచపు కఠినత్వపు ధోరణి, మూగగా స్పందించే కవితాత్మక సుకుమారత్వమూ, కొంత బేలతనమూ, ఒక హృదయపు కోమలత్వమూ సాక్షాత్కరించాయి. మొదటి కవిత చదవడం పూర్తయ్యే సరికి, తెలియని గుండె భారం కళ్ళకు కమ్మి, పేజీలని ముందుకు కదలనివ్వలేదు.
 
ఈ కవితకి యే వ్యాఖ్యానమూ అక్కరలేదు. ప్రపంచపు పోకడలకీ కవయిత్రి పసి మనసుకి జరిగిన సంవాదమిది. అతి సులభంగా ప్రతి సున్నిత హృదయమూ తనని తాను చూసుకునే అద్దం. అందుకే యే వివరణ ఇవ్వకుండా – సూటిగా కవితనే ఇక్కడ పొందు పరుస్తున్నాను. అద్దం లో నెలవంక శీర్షికని తిరిగి మొదలు పెడదామని గత మూడు నెలలుగా చాలా ప్రయత్నిస్తున్నాను. రఫ్ స్కెచెస్ రాసుకున్న కవితలున్నాయి. కానీ తనను తాను గా ప్రవహింప చేసుకున్న చిక్కని భావాన్ని, తేట దనపు ప్రవాహాన్నీ ఒకే చోట చూసిన యీ కవిత చదవాక యీ కవితా సంపుటి గురించి తప్పక రాయాలి అనిపించింది. పరిమళానికి చిరునామాలు అవసరం లేదు. వ్యాపించడమే దాని పని. రాజేశ్వరి పరుచుకుంటూ వెళ్ళీన అక్షరాల వెంటా మన కళ్ళు పరుగెత్తిస్తే చాలు, అనేక అమూర్త భావాల మల్లెల పారిజాతాల పరిచయాలవుతాయి, నైట్ క్వీన్ డాఫోడిల్స్ ఆమె వెన్నెల ఏకాంతాల రహదారుల్లో సాక్షాత్కరిస్తాయి. వేదనా భరితమైనా, ఏకాంతమే స్వాంతన ఆ కవితాత్మక మూర్తికి!  ఆలస్యం గా నైనా ఆమె కవితలు ఇలా ఒక సంకలనంగా చదువరుల చేతికి అందించిన విషయమై  తెలుగు కవితాత్మక ప్రేమికులు నామాడి శ్రీధర్ గారికి ఋణపడివుంటారు!
 
అక్షరాల నిండా పరుచుకున్న రాజేశ్వరీదేవి వేదనాత్మక ప్రణయ పూరిత భావాల గాలుల్ని మనస్ఫూర్తిగా శ్వాసించిన మనసులన్నీ  ఆమెతో యీ విషయంలో ఏకీభవిస్తాయి…
  అవును నిజమే… సత్యం వద్దు, స్వప్నమే కావాలి!

 
“ఊరికేనే”

 
కవితా సంకలనం: సత్యం వద్దు స్వప్నమే కావాలి
కవయిత్రి: శివలెంక రాజేశ్వరీదేవి
ఎందుకలా వర్షం లో
డాబా మీదకి వెళతావ్ పాపా?
“ఊరికేనే”
ఎందుకలా పని ఆపేసి
పాట వింటావ్ పాపా
“ఊరికేనే”
ఎందుకనవసరంగా
వాళ్ళ దిగులు నీకు పాపా
“ఊరికేనే”
ఎందుకా టెలిఫోన్ టాక్ పాపా
“ఊరికేనే ఆ స్వరం తీయగా వుంటేను”
ఇక్కడ ఆగి అక్కడ ఆగి పనేమైనా వుందా?
“ఊరికెనే, పనేం లేదూ పలకరించి పోదామని”
ఇదిగో ఇదే చెపుతున్నా గుర్తుంచుకో పాపాయ్
పనేం లేకపోతే
ఊరికేనే పలుకరించకూడదు ఎవరినీ-
ఆ అలా చూడకు నా కళ్ళలోకి “ఊరికేనే”
అదో ప్రశ్నార్థకమై నన్ను భయపెడుతుంది
***

చీకటి అరలు

 

     

 -మేడి చైతన్య

~

కిటికి సందుల్లోంచి సన్నగా సూర్యకాంతి  గడిచిన నిశిరాతిరి జ్ఞాపకాల దొంతరల పొరలను చీల్చుకుంటూ నా మొహం మీద పడింది. పిడచగట్టుకుపోయిన పెదాలను నడి జామంతా నికోటిన్ తో కలహపడిన నాలుకతో హత్తుకున్నా.

ఉప్పో, వగరో వర్ణించలేని నిర్జీవ ”వాసన” లోపలికిమల్లే.

సీసాదొర్లి అడుగంటిన మందు చుక్కల ప్రవాహంలో కొట్టుమిట్టాడుతున్న కుంటిచీమోకటి నన్ను ఈ లోకంలోకి నిశ్శబ్ధంగా ఆహ్వానించింది. ఆనకట్టలు కట్టి కాపడదామనుకునే నా అభావ ఆలోచనలకు, రాజీపడని పోరాటపటిమే నా జీవితానికి పరమార్దమని అర్ధంచేసుకొలేని చిన్న వయస్సునాదని చూసే దాని చులకన చూపు, ఆ నడ్డి విరుపు నడక తట్టుకోలేక పెళుసులూడోచ్చిన బ్రష్ పట్టుకున్నా. దోమలంతా గుంపులు గుంపులుగా గొడవపడి ఎటూతేల్చుకోలేక జాలిపడి వదిలేసిన రక్తాన్నంతా వేళ్ళ కొనలలోకి లాగి కుత్తుక పిసికితే రెండు నురగలు తెల్లటి పెంటకక్కి, తల గిరాటేసింది టూత్ పేస్ట్ గొట్టం నా జీవితంతో తనకేమి ఇక సంబంధం పట్టనట్టు. తనగోడు ఆలకించమని ఫోను వైబ్రేట్ అవుతూనేఉంది. నిరాసక్తిగా ఒక చూపు చూసి, అద్దంలో మానని  గాయాలను చూస్తూ తడుముతున్నా వెలుపల, లోపల, “ఆవల.”

మాటిమాటికి  గోలచేయొద్దని పేగులను బెదిరించి, డొక్కలో కాళ్ళు మునగతీసుకొని పడుకున్నాడు వాడు. నాన్న సారా కుళ్ళు కంపు  మాటలు, అమ్మ ముక్కు  చీదడాలు, ఆకలేస్తుందని  చైతుగాడి ఆర్తనాదాలు. నాన్న మగతనానికి గుర్తుగా నల్లగా కమిలిన అమ్మ వీపు, చింకిపోయిన అమ్మ  రొమ్మువైపు ఆబగా చైతుగాడి చూపు. నిస్సత్తువుగా చొంగకార్చుతూ చైతుగాడు వాడి దగ్గరకొచ్చాడు. ఆకలి నీరసం ఆవహించకుండా ఒకరికొకరు గాడంగా హత్తుకొని పడుకొని, గుచ్చుకుంటున్న పక్కటెముకలను లెక్కబెట్టుకుంటున్నారు అన్నదమ్ములిద్దరు.

తాటాకు కప్పు కన్నాల్లోంచి కారుతున్న వానచుక్కల్లో, సంసారపు పంజరానికి చిక్కుకుని రెక్కలు విప్పుకోలేని అమ్మ దైన్యస్తితి, తడిచినకట్టెల మంటల్లో పొగచూరిన వాడి కళ్ళల్లో, తనకర్ధంకాని భావాలతో తరుముకొస్తున్న నాన్న!
ఆదరణలేని బాల్యం అడుగడుగునా అడ్డుపడుతుంది రోజులు గడిసేకొద్ది. ఓ పీడకలలాగ మస్తిష్కపు చీకటి అరలలోకి తోసేద్దామనుకున్నా, వీడని నీడలా ఎదురవుతూనే ఉంది. మరువలేని ఆ మాసినకాలం మదికొచ్చినప్పుడల్లా పరుగు, నేను వాడుకాదని మర్చిపోయేంత దూరంవరకు, మరొక కాలంలోకి! బహుశా వాడు ” నిన్ను” చూసి జాలిపడతాడేమో!

మధ్యాన్నం వరకు కాలేజి, దాని ఫీజుల కోసం రోజుకో అవతారం. టికెట్టు కౌంటర్ దగ్గరా, సెంట్రింగ్ మేస్త్రీగా, ఉదయాన్ని “మేలుకొలిపే” పేపరుబాయ్ గా. ఒక్కసారైన క్లాస్ లో వెనక్కితిరిగి చూస్తుందేమోనని “అతను” తపనబడ్డ “ఆమె”.  వెంటే నడూస్తూ ఎన్నటికైనా పక్కన నడచే సమయం రాదా? అని అతడాలోచించినా ఆమె. ఆమెగొంతు వినబడేసరికి అప్రయత్నంగా కాలుజారింది(ఆమెకు అతడి అవతారం కానరాకూడదనే ఆత్రం). గోడ గుద్దుకుని  రక్తంవస్తోంది అతడికి. మీద ఒలికిన నల్ల పెయింటింగు చూసుకుని బిగ్గరగా నవ్వాడు. మరల ఎన్నటికోఒక రోజున మరొక వేషంలో తలవాల్చి బెరుకు చూపుతో వడ్డిస్తున్న అతడి చేతికి ఇంకొక చేయితగిలితే ఖాళీపళ్ళెంలో “విషపు నవ్వొకటి మధురంగా” నవ్వుతూ ఆమె కనిపించింది. ప్రేమ కూడా కుళ్ళుకంపు కొట్టింది బాల్యానికిమల్లే అతడికి. ప్రేమ విఫలమైందనే గుర్తుగా క్యాటరింగ్ కాంట్రాక్టరికి ఆరోజు జీతం అతడు మిగిల్చివెళ్ళాడు. పరిపక్వతలేని తలంపులకు పక్కన నెట్టేసి చదువుపై మనసులగ్నం చేసిన అతడికి కూడా “నేను” దూరంగా పరుగెడుతున్నా.
ఎండిపోతున్న అతడి జీవితంలో నేల నెమ్మదిగా బీటలువార్చడం మొదలెట్టింది. గూడుకట్టుకున్న సంశయాలను చిదిమేస్తూ రూపమేదో తెలియని నిజమొకటి దరిచేరింది. ఎక్కడో దొరికితే పెంచుకున్నారట పిల్లలులేరని తన అమ్మని. తీరా పిల్లలుపుట్టేసరికి వంటిళ్ళుకి, వాకిలూడవడానికే పొద్దు తెల్లారింది అమ్మకి. భారం వదిలించుకోవడానికి బాధ్యతే తెలియని భర్తనంటగట్టింది అమ్మమ్మ. గొడ్డును బాదినట్టుబాది, గూట్లోంచి తరిమేస్తె తల్లిగా చేరదిసి “అమ్మగోరు”లాగ పనుల మీద పనులప్పగించేది. అతడి ఊహలన్నీ గుండెగోడలు చిత్రవదలుచేస్తున్నాయి. క్షణకాలం బ్రతుకుమీదనే అసహ్యం, మరుక్షణమే ఏదో కసి మనిషిగా ఎలా బ్రతకాలో అమ్మగోరు “అమ్మమ్మ”కు చూపించాలని.!

పట్టుదలగా చదివి విశ్వవిద్యాలయలంలోకి ఒపేన్ గా ఎంటరయ్యాను. భావజాల ఆవేశాల్లో పురుగుల్లా కొట్టుకోవడం, ధ్యేయం ఒక్కటైనా మన మార్గాలు వేరని వాదించడం. దేశభక్తి జబ్బొచ్చి “కాషాయాన్ని” కషాయములా తాగినోల్లకి “ఎరుపు” విరుగుడు విచికిత్స. ఎరుపులో కూడా నాది “నల్లనైన” ఎరుపని వేలెత్తిచూపెడితే ఊడలు తెగిన మ్రానులా పుడమికంటుకుంటే “నీలైన అంబరం” నన్ను తల నిమిరి గుండెలకద్దుకుంది.

తరుముకొస్తున్న నాన్నలో తక్కువకులం దాన్ని అంటగట్టారనే ఆయన అ “న్యాయ” ఆక్రంధన,
అమ్మమ్మని “అమ్మగోరు” అని పిలవడంలో “దత్తత”తీసుకోలేని కులాల ఆంతర్యం,
అనామకుడిననా లేక అన్యుడని ఆమె నన్ను వదిలేసిందా అనే వీశెడంత సందేహం పుట్టుకొచ్చింది!
ప్రేమకు కులాలంటుగడుతున్నానని తిడతారేమో!

artwork: Mandira Bhaduri

artwork: Mandira Bhaduri

 

ఒళ్ళు తెలియకుండ నిద్రపోయాననుకుంటా తెల్లని చారికలా చొంగ చెపమీద. అపరచిత స్థలంలో ఉన్నానని తెలియగానే, బద్దకంగా లేచా. ఎంతోకాలంగా నేనెరిగినట్టు నవ్వుతూ నా నుదుటిమీద చెయ్యేసి ఎలా ఉందని మెల్లగా అడిగింది “తను”. గడ్డకట్టిన రక్తాన్ని చూడగానే గత రాత్రి  క్షణాలు దృశ్యాలుగా మెదలాడాయి. కర్రలతో కాషాయి దేశభక్తి చాటుకోవడం, డొక్కలో గుద్ది భారతమాతని స్తుతించడం. తర్వాతఎవరో ఆడగగొంతు. ఏమి మాట్లాడాలో తెలియక వానపాములా మెల్లగా ప్రాకూతూ వెళ్తుంటే వెనిక్కిపిలిచింది మాత్రలేసుకొమ్మని. జమలమ్మ అంటే మీ అమ్మేనా? అని అడిగేసరికి పొరపడినట్టుగా నీళ్ళన్నీ మాత్రతో సహ బయటకు కక్కితే, నెత్తిమీద నిమురుతూ నా కాలేజి ఐడెంటి కార్డు చేతికిచ్చింది. పదినిముషాలు రుబ్బుడుబండ కింద నలిగి డబ్బులు లెక్కపెట్టుకుంటే పీలగోంతు వినపడి నా “పూల ఫ్రాక్” అనుకొని వచ్చి చూస్తే తీరా అది నువ్వు. నీ నుదుటనుండి రాలిన రక్తానికి, రుబ్బురోలు డబ్బులకు లెక్కసరిపొయింది దవాఖానాలో. ఎందుకిదంతా చేశారంటే అంటే మీ అమ్మ పేరు కారణమంది. జమలమ్మపెద్దమ్మ నన్ను అమ్మి అమ్మి అని పిలుస్తూ ఉండేది. ఒకసారి సరుకారు కంపకు నా ఫ్రాక్ పట్టుకుని చిరిగితే తనే కుట్టింది. నాన్న తనకే భయపడేవాడు. అమ్మికి  నీ  ఎంగిలి యవ్వారాలు తెలియనియ్యొద్దని నాన్నని తిడూతూ ఉండేది. ఆ పెద్దమ్మ పేరు మీ అమ్మ పేరు ఒకటే.
సరైన  దెబ్బలు కూడ తట్టుకోలేని నీ కాయానికి ఎందుకంత కష్టం కలిగిస్తావని తనడిగితే,
ఆకలి అని ఏడిస్తే పుణ్యవేదభూమిలో ప్రతిఘటించకుండా చనిపోవాలన్నారు.
కుళ్ళు సమాజం చేసిన గాయాలు చూపెడితే, ఆధ్యాత్మికంలో తేలియాడలంటా.
నేరం అని ఎలుగెత్తితే విద్రోహశక్తులని నోరు మూయిస్తారు.
న్యాయం కావాలంటే, దేశద్రోహుడిముద్రవేస్తున్నారు అని చెప్పా.
ఏమని పిలవాలో తెలియక తటపాయిస్తున్న నన్ను, రాతిరి రాతిరికి పేరు మార్చుకునేదానిని ఏ పేరు పిలిచినా పలకడం నేర్చుకున్నాఅని విషాదంగా నవ్వింది. తత్తరపాటుగా కృతజ్ఞతలుచెప్పి బయటకెల్తుంటే ఎక్కడకనే తన చూపుకి సమాధానంగా బాల్యపు “వాడికి”, యవ్వనపు “అతడికి” దూరంగా అని చెప్పేసి వచ్చేశా.
ఆదర్శాల రొచ్చులో ఆకాశంవైపే చూస్తూ, నేలమీద పాకుతున్న నిజాలను చూడలేకపోయా. వడ్డించిన విస్తరిలా కొందరి జీవితాలలో ఉద్యమాలు కాలక్షేపాలని, తమ సౌఖ్యానికి భంగం కలిగితే తాబేలు డొప్ప లోపలికి మూసుకుంటారని జ్ఞానోదయమయింది. కాలం తెచ్చిన కొత్త సంకెళ్ళతో కాళ్ళీడ్చుకుంటూ ఎన్నో ఆఫీసులకు తిరిగా, పని కోసం అన్నం పెట్టని సిద్దాంతాలనువదిలిపెట్టి. షరామాములుగా కొన్ని నెలల నిరాశయమయజీవితం.
నీళ్ళతో పొట్టనింపుకోవడమే రెండురోజుల నుండి. పెంటకుప్పలమీద ఎంగిలివిస్తరాకులు తింటున్న కుక్కకేసి అసూయగా చుస్తుంటే భుజాన్నెవరో తట్టారు. ఎండతో ఎక్కువ సహవాసం చేయడంవల్ల కళ్ళ మసకలలో తన రూపం పోల్చుకోలే. నువ్వంటనే ప్రశ్నకు చినిగిన ఫైలులో సర్టిఫికెట్లు చూపించా నా అప్రతిహత దండయాత్రలకు చిహ్నంగా. తనతో రమ్మని కళ్ళతో సైగ చేయగానే మారు మాట్లడకుండా హత్యచేయబడ్డ శవంక్రింద రక్తంలా, మెల్లగా, నిశ్శబ్దంగా వెంటవెళ్ళా. కడుపునిండా అన్నం పెట్టింది. నా అమ్మవాళ్ళు ఎక్కడని అడిగిన తన ప్రశ్నకి నా మొహంలో వచ్చిన కవలికలు కనుక్కొని తనెవరో చెప్పడం మొదలెట్టింది.
నాలుగోదికూడా ఆడబిడ్డైన నెత్తినెక్కించుకొని పెంచాడట తన నాన్న. చింకి లంగాలు, చిల్లుల గౌనుల గుడిసెల నడుమ వాడిపోని “పూలఫ్రాక్” లాంటి బాల్య జీవితం! ఎల్లిపాయకారాల సందిట్ల ఎద్దుకూరమాపటన్నెం. రంకుతనపు రొచ్చుముండల చెమట కంపు సొమ్ముసోయగాలని మా మీద అమ్మలక్కల చీదరింపులు.
నాన్నని పల్లెత్తుమాటంటే, లంగాలుదోపి “మగోళ్ళలా” మంది మీదకు దూకేవాల్లం నలుగురం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. మబ్బులకంటిన ఆశలు ఒక్కసారే అఖాతంలోకి నెట్టబడ్డాయి.

ఎముకలగూళ్ళు, గుంటలపడిన కళ్ళు, సన్నని వెదురు కర్రల్లాంటికాళ్ళు, ఒకటే ఎగశోస. ”తాతేంటి” పిన్నినా లాగా నత్తినత్తిగా మాట్లడుతున్నాడంటే తల ఎత్తి చూడలేనంతగా కళ్ళలో నీళ్ళు. పెబుగుడిలో చావుకి దగ్గరపడిన సైతాను మోష. నలిగిన తన జీవితం నేర్పిన మాటేదో చెప్పాలని వణుకుతున్న బైబిలుతో నాన్న పిచ్చిమాటలు. పదాలకు అర్ధాలేమి అందకపోయినా విరిగిన నాన్న గాజుముఖంలో పశ్చాత్తాప ప్రతిబింబాలను లీలగా చూస్తున్నారు “గొర్రెలమందంతా”.

యవ్వనంలో నీరెండలో మెరిసే ముఖవర్చస్సు, నల్లని కండలు తిరిగిన దేహం. జీతమున్న కమ్మోరి పశువులకొట్టంలో దొరసాని “వేడిలో” చలికాగటం, ఆమె ఆనందానికి కానుకగా పాకలో నలుగురపిల్లల కడుపులో అంతముద్ద చల్లటన్నం. ”తప్పు” కాదు “తప్పదనిపించింది” ఆ సమయంలో.
నాగలి వరస గాడితప్పి అడ్డదిడ్డంగా సాలెరువాల్ల దుక్కి. కండకావరమెక్కి వంగిన చెట్టుకాయల్లా వలచడం, ఎన్ని పంటలు నాశనం చేశాడో ఆ మత్తులో.తురకోడి పొలంలో పరిగ ఏరడం అని చెప్పి గడ్డివామంతా తగలబెట్టాడు కదా. చివరకు తనపొలం గట్టుమీదున్న పిచ్చి బెండుతీగలను కూడా వదలలేదుకదా! నయంకాని మాయరోగం వస్తే, చెదలుపట్టిన గుండె అరుపులను  పెబుకాడ మొరపెట్టుకుంటున్నాడు నాన్న. పగుల్లిచ్చిన నాన్న సమాదిలోంచి పుట్టుకొచ్చిన చెట్టుకు నీళ్ళుబోసి, మంచంలోఉన్న అమ్మ ఏరుక్కుంటే డబ్బాకోసం గాబుకాడికి పోతే, పెళ్ళెప్పుడు చేసుకుంటావని పక్కింటి తుమ్మెద  పెడాల్న మొహమ్మీదంది.  పీతిచేతిని కడుక్కుంటూ “మురుకిగుంట ప్రవాహాన్ని” ఎగాదిగా చూశా! పెద్దక్క 12 సంవత్సరాల వీపువాతలు చూడలేక చిన్నిగాడు పొట్టలోంచి బయటకొచ్చాడుఅప్పుడే. నడిపక్క బొట్టుబిళ్ళను కబళించిన పనిచేయని లారీ బ్రేకులు. అత్తింటి కిరసనాయిల వాసన పసిగట్టలేక సగంకాలిన చిన్నక్క. లోకంచూడలేక కళ్ళుమూసుకుని కుక్కిన మంచంలో అమ్మ. నాన్న జీవీతం శాపంలా వెంటాడుతుందేమో కుటుంబాన్ని అంతా! నన్నెవరింకా పట్టించుకుంటారనే బాధేలేకుండా, చారులో చెంపలమీదనుండి కారుతున్న కన్నీళ్ళను ముంచుకొని  అన్నం తిన్నా.
ఏటిదగ్గర  వాడిపోని  నా ”పూలఫ్రాక్”  మరీచికలా వేలాడుతుంటే అన్నీ వదిలేసి వచ్చేసా. పెద్దక్క, నడిపక్క ఎవడితోనే లేచిపోయిందని మిగిలిన ఇల్లు, మంచం అమ్మ మౌనరోద సాక్షిగా పంచుకున్నారు. వాడిపోని ఆ పూల ఫ్రాక్ కోసమే ఈ ఊరొచ్చా. మనిషిలో దాగిన రంగులన్నీ చూపించింది ఈ పట్నం.
ఆకలి, మోసం, నేరం, క్షణికావేశం, కామం, క్షామం, జబ్బు, జల్సా.
చీకటి రైలుపట్టాల మాటున ఎదమీద సిగరెట్తో కాల్చిన గుర్తులు, పోలిసోడి మీసాల చాటున నలిగిన నా కాళ్ళు, బాధగా మూలిగే మంచం కిర్రు కిర్రులు. ఈ జీవితం ఇంతకంటే నాకు ఒనగూర్చినదేమిలేదు అని ముగిచ్చింది తన కథ. నిన్ను చూస్తే ఆ పెద్దమ్మకి కొడుకుంటే నీలాగే ఉండేవాడనిపించి నీతో చెప్పుకున్నా. నేను మరువలేని బాల్యంకోసం వెడుతుంటే, నువ్వేమో కోరి వస్తున్న దానిని అసహ్యించుకుంటున్నావు.
తనవైపు తదేకంగా చూస్తూ అక్కా…….అని పిలిచా.
నల్లనైన మేఘంలో చుక్క మెరసినట్టు, నింపాదిగా నవ్వింది నన్ను నుదుటిమీద ముద్దాడుతూ! తన గుండెలోతుల్లోంచి పొంగిన అల ఏదో అశ్రుబిందువై నన్ను అశనిపాతంలా తాకింది. తలుపు చప్పుడైతే తన శరీరానికి గాయమయ్యే తరుణంమొచ్చిందని చెప్పి నన్ను పంపించివేసింది.
తను, నేను  భిన్న ధృవాలం.శిధిలమైన బాల్యంవైపు తను, ఎంతకు ఘనీభవించని “వాడికి”, ఆవిరయిపోని” అతడికి” నేను దూరంగా పరుగెడుతున్నాం. “నా”లోంచి “నేను” వేరు పడాలని నేను, తన లో,లోపలికి కుచించుకుపోవాలని తను.
చాలరోజులయింది అక్క కనిపించి. ఒక రోజు నడుచూకుంటూ వెళ్తుంటే రోడ్డుకు ఆవల పూల ఫ్రాక్ అమ్మాయికి ఐసుక్రీం కొనిపెడుతూ నా వైపు చూపిస్తూ ఏదో చెప్తుంది ఆ పిల్లకు. ఎక్కడ కారిపోతుందనే ఆత్రతతో దాన్ని తింటూ వచ్చి నా చేతిలో ఒక కవరు పెట్టిందిఆ పెంకి పిల్ల.
“ఎన్నాళ్ళని నీకు నువ్వు దూరంగా పారిపోతావ్? నువ్వంటే అతడు, వాడు కూడా కదా !?.
నా “నిజానికి” దగ్గరగా నే వెళ్ళిపోతున్నా. నీలాంటి తమ్ముడికి ఉండాల్సిన అక్కని కాదు నేను. జమలమ్మ పెద్దమ్మని జాగ్రత్తగా చూస్కో. చీటితో పాటు తన చెమటతో తడిచిన కొన్ని నోట్లు కనిపించాయి ఆ కవర్లో.”
అకస్మాత్తుగా వచ్చిన ఈదురుగాలికి ఆ కాగితం కొట్టుకుపోతే తను ఎటువెళ్ళిందో అని తలెత్తి చూశా. పూల ఫ్రాక్ లేదూ, తనూ లేదూ.

ఆ రోజు నుండి వెదుకుతూనే ఉన్నాం “అక్క” కోసమే కాదు,  “మా” అక్కే అని చెప్పుకోలేని అక్కలందరి కోసం నేను, వాడూ, అతడు “ముగ్గురం” కలసి.

 

ప్రపంచం బతికున్నంత కాలం

 

-నందిని సిధారెడ్డి

~

 

పడి ఉండడానికి
కాసులా?
పెంకాసులా?

అక్షరాలవి.
ఎగసిపడే మంటలు,
విరిగిపడే ఆకాశాలు.

మూసుకొమ్మంటే మూసుకోవడానికి
లాలి పాపా?
లాప్ టాపా?

కవి ప్రపంచ జీవనాడి.
ప్రకృతి లెక్క పలుకుతనే ఉంటడు,
పరిమళిస్తనే ఉంటడు.
నువ్వేమిటి?
డబ్బులు పోసి
మాటలు పోగేసి
గెలిచిన పార్లమెంటు సీటువు

జీవితం పణం పెట్టి
హృదయాలు గెలిచిన
ప్రపంచసభ నేను.

కవిని కాల్చగలవు
కవిత్వాన్ని కాల్చగలవా?

అధికారముందనేనా?
చట్టం చేయగలవనేనా?

చూపు జిగేల్ మనిపించే
మెరుపును శాసించు!
పువ్వు పరిమళం మోసుకెళ్ళే గాలిని
ఆపు జరసేపు!!

కలం మూయించగలవా?
ఎందరు నియంతలను చూసిందీ కలం,
జమాన జమానాల అఖండజ్వాల కలం.
ఫత్వాలకు వెరవని
నిరంతర స్వరం కవి.

నువ్వెంత?

అధికారం ‌‌—— ఎన్నుకున్నంత కాలం,
అక్షరం    —— ప్రపంచం బతికున్నంత కాలం.

*

అమ్మ ఆరాధనలో కమ్మగా జీవించిన ట్రోజన్లు

 

స్లీమన్ కథ-30

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

ఈజిప్టు పూజారుల ద్వారా హెరోడొటస్ తెలుసుకున్న సమాచారం ప్రకారం, ట్రోజన్ యుద్ధం పూర్తిగా అర్థరహితం. ఎందుకంటే,  ట్రాయ్ పై గ్రీకులు దాడి చేసిన సమయంలో హెలెన్ కానీ, ఆమెను ఎత్తుకువెళ్లిన పారిస్ కానీ అసలు ట్రాయ్ లోనే లేరు. పారిస్ ఆమెను తీసుకుని ఈజిప్టు రాజధాని మెంఫిస్ కు పారిపోయాడు. వారిద్దరినీ నిర్బంధంలోకి తీసుకోమని ఫారో(ఈజిప్టు చక్రవర్తి)ఆదేశించాడు. పారిస్ ను విచారిస్తూ, నీ పక్కనున్న ఈ యువతికీ నీకూ ఏమిటి సంబంధమని ప్రశ్నించారు. పారిస్ ఆ ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయాడు. దాంతో అతన్ని దేశం నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత హెలెన్ భర్త మెనెలాస్ మెంఫిస్ కు వచ్చి, హెలెన్ ను తన భార్యగా నిరూపించుకుని ఆమెతో కలసి గ్రీస్ కు తిరిగివెళ్ళాడు.

హెరోడొటస్ ఇలా అంటాడు:

ట్రాయ్ లో ఏం జరిగిందో చెప్పే గ్రీకుల కథనం నమ్మదగినదేనా అని పూజారులను అడిగాను. దానికి సమాధానంగా,  మెనెలాస్ స్వయంగా చెప్పినదంటూ వాళ్ళు కొంత సమాచారం ఇచ్చారు. దాని ప్రకారం, హెలెన్ ను ఎత్తుకువెళ్లినట్టు తెలిసిన గ్రీకులు, మెనెలాస్ కు మద్దతుగా పెద్ద సైన్యాన్ని పంపించారు. అది ట్రోజన్ గడ్డమీద అడుగుపెట్టి కుదురుకున్న తర్వాత రాచనగరుకు కొందరు దూతలను పంపించారు. వారిలో మెనెలాస్ కూడా ఒకడు. ట్రోజన్ల స్వాగతం అందుకున్న ఆ బృందం, హెలెన్ ను, పారిస్ అపహరించిన సొత్తును, తగిన పరిహారంతో సహా అప్పగించవలసిందిగా కోరింది.* హెలెన్ తమ వద్ద లేదనీ, ఆ సొత్తు కూడా తమ స్వాధీనంలో లేదనీ, హెలెన్ తప్పించుకుని ఈజిప్టుకు వెళ్ళగా అక్కడి రాజు ఆమెను నిర్బంధంలోకి తీసుకున్నాడనీ ట్రోజన్లు వారికి చెప్పారు. తమ అధీనంలో లేనివాటిని కోరుతూ తమను శిక్షించబోవడం అన్యాయమని వారు వాదించారు.

సత్యప్రమాణంగా ఇదీ జరిగింది అంటూ ట్రోజన్లు మొదటినుంచీ ఈ కథనానికే కట్టుబడి ఉంటూ వచ్చారు.  గ్రీకులు మాత్రం దీనిని కట్టుకథగా తోసిపుచ్చారు. నగరాన్ని ముట్టడించి అది కుప్పకూలేవరకూ పోరాటం సాగించారు. అయినా హెలెన్ జాడ వాళ్ళకు కనిపించలేదు. ఓడిపోయిన దశలో కూడా ట్రోజన్లు తమ మొదటి కథనాన్నే నొక్కి చెప్పారు. వాళ్ళ మాటల్లో నిజముందని గ్రీకులు ఎట్టకేలకు తెలుసుకున్నారు. మెనెలాస్ ను ఈజిప్టు చక్రవర్తి వద్దకు పంపించారు. మెనెలాస్ నదీమార్గంలో మెంఫిస్ కు చేరుకుని అసలు కథను వినిపించిన తర్వాత ఈజిప్టు అతన్ని ఆదరించి ఇతర సొత్తుతో సహా హెలెన్ ను అప్పగించింది.

అయితే, ఈజిప్టు అంత ఆదరించినా మెనెలాస్ ఆ దేశంపట్ల కృతఘ్నతను చాటుకున్నాడు. తిరుగు ప్రయాణంలో ప్రతికూల పవనాలు వీస్తుండడంతో కొన్ని వారాలపాటు అతను ఈజిప్టులోనే ఆగిపోవాల్సి వచ్చింది. పవనాలను తనకు అనుకూలంగా మార్చుకోడానికి ఇద్దరు ఈజిప్టు బాలులను పట్టుకుని దేవతలకు బలి ఇచ్చాడు. ఈ దారుణం గురించి తెలిసిన ఈజిప్టువాసులు పగద్వేషాలలో రగిలిపోతూ అతన్ని వెంటాడారు. మెనెలాస్ ఎలాగో తప్పించుకుని లిబియాకు పారిపోయాడు. ఆ తర్వాత అతను ఏమయ్యాడో ఈజిప్టుకు తెలియదు.

ట్రోజన్ యుద్ధం గురించిన హెరోడొటస్ కథనం ఇలా సాగుతుంది. అయితే దీనిని బొత్తిగా నిరాధారమని అనలేం. విచిత్రంగా హోమర్ పద్యాలలోనే ఇందుకు సంబంధించిన ప్రస్తావనలు కనిపిస్తున్నాయి. ఫినీషియా లోని సైదున్(Sidon)కు పారిస్, ఈజిప్టుకు మెనెలాస్ ప్రయాణం చేసినట్టు అవి చెబుతున్నాయి. హోమర్ పై తనకు ఎంత ఆరాధనాభావం ఉన్నా; కేవలం హెలెన్ ను పారిస్ సొంతం చేసుకోవడం కోసం మొత్తం ట్రాయ్ నీ, ట్రోజన్లనూ బలిపెట్టేంత ఉన్మాదిగా రాజు ప్రియామ్ ను హెరోడొటస్ భావించలేకపోయాడు. “ఒకవేళ ప్రియామ్ స్వయంగా హెలెన్ ను వివాహమాడి ఉన్నా, అది ఇంతటి విధ్వంసానికి దారితీస్తున్నప్పుడు కూడా ఆమెను అప్పగించకుండా ఉంటాడంటే నేను నమ్మలేను” అని అతను రాశాడు. మొత్తానికి వాస్తవంగా ఏం జరిగిందో హెరోడొటస్ తో సహా ఎవరికీ తెలియదు. ఒకటి మాత్రం నిశ్చయం: ఊహించడానికి కూడా వీలులేనంత అర్థరహిత యుద్ధం అది. అదే సమయంలో, మిగతా యుద్ధాలను మించిన అర్థరహితం మాత్రం కాదు.**

ట్రోజన్ యుద్ధానికి దారి తీయించిన కారణాలు మనకు స్పష్టంగా తెలియకపోయినా, అందులో పాల్గొన్న వీరుల గురించి మాత్రం బాగా తెలుసు. ట్రోజన్ సమాధులేవీ బయటపడలేదు. మైసీనియాలో బయటపడిన సమాధుల విషయానికి వస్తే, అవి యుద్ధానికి ముందు కాలానికి చెందినవి. కానీ, నాటి సైనికుల గురించి మనకు బాగా తెలుస్తోంది. హోమర్ చిత్రణలు, తవ్వకాలలో బయటపడిన సాక్ష్యాలు ఒకేవిధంగా వారిని మనకు పరిచయం చేస్తున్నాయి. మైసీనియా తవ్వకాలలో స్లీమన్ గుర్తించిన కొందరు అజ్ఞాత రాజులు జీవించిన కాలానికీ, ట్రోజన్ యుద్ధం జరిగిన కాలానికీ మధ్య పెద్దగా మార్పు ఏమీ సంభవించలేదు. సైనికుల ఆహార్యం, ఆయుధాలు, యుద్ధం సాగించే తీరు, ప్రజలు ధరించే దుస్తులు, అలంకరణ, సాంఘిక ఆచారాలు, వ్యవసాయవిధానాలు, ఆహారపు అలవాట్లు, దేవతల కొలుపులు-అన్నీ ఇంచుమించు ఒకలాంటివే.

వారి జుట్టు బుజాల వరకూ వేళ్లాడుతూ ఉండేది. బంగారు, వెండి సూత్రాలతో దానిని ముడేసుకునేవారు. వేసవిలో మగవారు చేతులున్న చొక్కాలను మోకాళ్ళ వరకూ ధరించేవారు. శీతాకాలంలో చేతులు లేని పెద్ద పెద్ద అంగరఖాల్లాంటివి ధరించి మెడ దగ్గర ముడేసుకునేవారు. అవి పడకమీద పరిచిన దుప్పట్లలా కూడా పనికొచ్చేవి. నడుములకు అలంకృత పట్టీలను(వడ్డాణాల లాంటివి), కర్ణాభరణాలను, మెడలో గొలుసులను, స్వర్ణహారకిరీటాలను, జడకట్టులను ధరించేవారు. అరచేతులకు తొడుగులు వేసుకునేవారు. వారికి ఉన్ని వాడకం తెలుసు. పూజారిణులు, సంపన్న మహిళలు మంచి కుట్టుపని చేసిన రంగురంగుల అంచులున్న కటివస్త్రాన్ని ధరించేవారు. ఒక్కోసారి కటివస్త్రం, అమ్మవారి స్వర్ణముద్రపై ఉన్న చిత్రంలో స్త్రీలు ధరించిన విధంగా విభజితమై ఉండేది. సైనికులు పంది దంతాలతో చేసిన శిరస్త్రాణాన్ని ధరించేవారు. మైసీనియాలో దొరికిన వంపుతిరిగిన పంది దంతాలు అచ్చం హోమర్ వర్ణించినట్టే ఉన్నాయి.

కుర్చీలు, బల్లలు ఉపయోగించేవారు. కానీ కంచాలలో భోజనం చేసేవారు కాదు. బల్ల మీదే పదార్థాలను పరచుకుని తినేవారు. ఆ తర్వాత బల్లను శుద్ధి చేసేవారు. మేక మాంసం, పంది మాంసం, చాలా అరుదుగా గొడ్డు మాంసం తినేవారు. వీటితోపాటు పెరట్లో కోళ్ళ పెంపకం ఉండేది. ఇళ్ళల్లో బాతులు తిరుగుతూ ఉండేవి. జింకలను, అడవి పందులను, అడవి మేకలను, కుందేళ్ళను, తోడేళ్లను వేటాడేవారు. చేపలు తినేవారు, నత్తగుల్లలను మరింత మక్కువతో తినేవారు. గోధుమ, బార్లీ, సజ్జలు, చిక్కుడు, బటానీ, కాయధాన్యాలను పండించేవారు. ద్రాక్షను, ఆలివ్ చెట్లను సాగుచేసేవారు. మద్యంలో తేనె కలుపుకుని సేవించేవారు.  తోటల్లో బేరి, అత్తి, యాపిల్, దానిమ్మ వగైరా పండ్లను పండించి ఇష్టంగా తినేవారు. పిల్లలు మాంసం, మజ్జ, వెన్న తినేవారు. పాల వాడకం తెలియదు. చీజ్ ను పేదలకు కూడా అందుబాటులో ఉండే పదార్థంగా భావించేవారు. పిల్లులు ఉండేవి కావు. క్రీ.పూ. 6వశతాబ్దిలోనే పిల్లి గ్రీస్ లో అడుగుపెట్టింది. వేటకుక్కలు, కాపలాకుక్కలు ఉండేవి.

తాము దైవసమానుడుగా భావించే రాజు చుట్టూ అల్లుకున్న నిరాడంబర, ఆదిమ సామాజికవ్యవస్థ వారిది. దాదాపు పరిశ్రమలంటూ ఏవీ లేవు. నాణేల వాడకం తెలియదు. ప్రతి తెగా విపరీతమైన స్వాభిమానంతో ఉండేది. ఇతర తెగలపట్ల అదే స్థాయిలో శత్రుత్వం వహించేది. అయితే, ఒక్కోసారి ఇతర తెగలతో మైత్రిని కల్పించుకుని శాంతి, సామరస్యాలతో జీవించడమూ వారికి తెలుసు.*** సర్ వాల్టర్ లీఫ్**** మాటల్లో చెప్పాలంటే, “అప్పటి వారి వ్యవస్థలు, మనుషుల గుంపులను బానిసలుగా మార్చుకుని చెప్పు చేతల్లో ఉంచుకోగలిగినంత బలమైనవి కావు”. ఇప్పటి జనసమూహాలతో పోల్చవలసివస్తే, వారు నేటి ఇండొనేసియాలోని బలిద్వీపవాసులకు దగ్గరగా ఉంటారు. ఈ ద్వీపవాసులు కూడా చండశాసనులైన రాజుల ఏలుబడిలో దేవతలు, రుతువుల పట్ల సామరస్యంతో నిరంతర శ్రమజీవనం గడుపుతూ ఉంటారు.

ట్రోజన్లు దేవతలను, పితృదేవతలను ఆరాధించేవారు. వారి ఆరాధనలో ఆనందం వెల్లివిరుస్తూ ఉండేది. వారికి ఉపవాసాలు, పాపపరిహారాలు, ప్రాయశ్చిత్తాలు తెలియవు. వారిలో అపరాధభావన లేదు. అనాదికాలంలో ఒకానొక తోటలోని నిషిద్ధ ఫలాన్ని తిన్న నేరానికి తమకు ఏదో వినాశనం దాపురించబోతోందన్న భావన వారికి తెలియదు. వారిలో యవ్వనోత్సాహం, తాజాదనం తొణికిసలాడుతూ ఉండేవి. సూర్యకాంతి నిండిన ఒక ప్రాకృతిక ప్రపంచంలో వారు జీవించేవారు. అప్పటికింకా వారి దేహతంత్రులు పాలు గారుతూ సరికొత్తగా ఉండేవి. వారి చుట్టూ దివ్యత్వం తాండవిస్తూ ఉండేది. ***** దేవతలకు సొంతంగా ఒక హోదా, వారిలో తమవైన ఒక తారతమ్యక్రమం ఉండడం నాటి జనానికి పెద్ద విశేషంగా  కనిపించేది కాదు; వెండి విల్లు ధరించిన అపోలో “దేవతలందరిలోనూ బలవత్తరుడు”, అయితే, జియస్ కూడా అంతే బలవత్తరుడు. వారి దృష్టిలో దేవతలందరూ దాదాపు మర్త్యులే; అలాగే మనుషులందరూ దాదాపు దివ్యులే. మానవ జీవితపు అత్యున్నత సాఫల్యం దేవతల ప్రపంచంలోకి అడుగుపెట్టగలగడమే. మర్త్యుడైన దియోమెదెస్****** కూడా దేవత అఫ్రోడైట్ ను గాయపరచగలడు. దేవతలు సైతం విపణివీథిలో సంచరిస్తారు. మనుషుల్లానే వారు కూడా ప్రాకృతిక శక్తులముందు తలవంచుతారు. “మృత్యువు పాలించే చీకటి సామ్రాజ్యా”న్ని తలచుకుని వణకిపోతారు.

ట్రోజన్లు కాంతిని ప్రేమించేవారు, చీకటికి భయపడేవారు. దివ్యత్వం వారికి దాదాపు చేతికి అందేటంత దూరంలో ఉండేది. గాలిలో, స్పర్శలో, రాత్రిళ్ళు వేసుకునే చలిమంటలో, కంచు తళతళలలో, ప్రకాశించే ఆలివ్ చెట్లలో, మనుషుల ముఖాల్లో వారికి దివ్యత్వం గోచరించేది. జంటగొడ్డలి, చక్రాకార స్వస్తిక, అమ్మవారికి చెందిన చిన్న చిన్న మట్టిబొమ్మలు, చిత్రమైన బొంగరం ఆకృతులు వారికి దివ్యత్వ చిహ్నాలు. సాధారణంగా నీలిరంగు రాళ్ళతో మలచిన ఈ బొంగరం ఆకృతులు స్త్రీగర్భానికి, అంతుబట్టని సృష్టి ప్రారంభానికి ప్రతీకలు. ప్రతి చిన్న ప్రవాహాన్నీ అంటిపెట్టుకుని అప్సరసలు(nymphs)ఉంటారు. *******ప్రతి ఉరుములోనూ వారికి ఒక అదృశ్యదేవత వాణి వినిపిస్తుంది. నదులు, సముద్రపు నురగ, పర్వతాలు, చెట్లు సహా అన్నింటిలోనూ దివ్యత్వం నిండి ఉంటుంది. అయితే అంత దివ్యత్వమూ మృత్యువు ముందు ఓడిపోతుంది. దేవతలు కూడా మృత్యువుకు తలవంచుతారు.  మనుషులు మృత్యువును తలచుకుని అంతులేనంతగా భయపడతారు. మృత్యువు, ప్రపంచపు ముఖాన లిఖించిన ఒక వక్రరేఖ. హోమర్ మృత్యుభయాన్ని చిత్రించినంత గాఢంగా, ప్రస్ఫుటంగా మరి దేనినీ చిత్రించలేదు.  ట్రోజన్ల ప్రత్యేక లక్షణమా అన్నట్టుగా దానిని వర్ణించాడు. అయితే ఆ మృత్యుభయాన్ని అంటిపెట్టుకుని ఒకవిధమైన గర్వమూ ఉంటుంది. భయపడుతూ, ద్వేషిస్తూనే మృత్యువును మెరిసే కళ్ళతో వారు పరిహసించనూగలరు.

హోమర్ ప్రకారం, ట్రోజన్లు, అఖియన్లు మృతులను దహనం చేసేవారు. బలిద్వీపవాసుల్లా చితిమంట చుట్టూ నృత్యం చేసేవారు. తన ఆప్తమిత్రుడు పెట్రోక్లస్ చనిపోయినప్పుడు చితిమీద అతని మృతదేహంతోపాటు గొర్రెలను, ఎద్దులను, గుర్రాలను, శునకాలనే కాక; పన్నెండుగురు ట్రోజన్ యువకులను కూడా ఉంచి అఖిలెస్ దహనం చేయించాడు. అయితే, ఇది ప్రాణమిత్రుడి గౌరవార్థం జరిగిన అరుదైన తంతే తప్ప తరచు జరిగేదిగా భావించలేము.  దేవుడు అపోలో జోక్యం చేసుకుని నివారించేవరకూ  పన్నెండు రోజులపాటు హెక్టర్ మృతదేహాన్ని అఖిలెస్ నానారకాలుగా అపవిత్రపరచడం కూడా ఇలాంటి అరుదైన సందర్భమే. మనకు అందుబాటులో ఉన్న ఇతర అనేక సాక్ష్యాల ప్రకారం, హోమర్ చిత్రించిన గ్రీకులు మృతులపట్ల అత్యంత భక్తిగౌరవాలను చాటుకునేవారు.********

హోమర్ చిత్రించిన చితిమంటలకూ, మైసీనియాలో బయటపడిన సమాధుల తీరుకూ ఎలాంటి పోలికా లేకపోవడాన్ని పండితులు ఎత్తిచూపారు. ట్రోజన్ యుద్ధానికి చాలా ముందునాటి నాగరికతకు చెందిన అంత్యక్రియల ఆచారాలకు అవి అద్దంపడుతున్నాయని వారు వాదించారు. స్వర్ణారాశులతో నిండిన ఆ సమాధులు ట్రోజన్ యుద్ధానికి ముందునాటివనడంలో సందేహం లేదు. అయితే, బంగారం దానికదే ఒక మంట లాంటిది. దహనం తర్వాత మాత్రమే మృతుల ఆత్మలను పితృదేవతల లోకంలోకి అనుమతిస్తారని హోమర్ నొక్కి చెప్పాడు. దానికి అనుగుణంగా బంగారపు ముసుగులనే ఒకవిధమైన చితిమంటకు చిహ్నంగా భావించడంలో తప్పులేదు. బంగారు ముసుగులతో మృతదేహాలను పాతిపెట్టడాన్ని దహనానికి ప్రత్యామ్నాయంగా గ్రీకులు భావించి ఉంటారు.

(సశేషం)

****

అథోజ్ఞాపికలు

*యుద్ధానికి ముందు శత్రువు వద్దకు దూతను పంపడం, ఆ దూతను గౌరవంగా చూడడం అనే పద్ధతీ, సంప్రదాయమూ రామాయణ, మహాభారతాలలో కూడా కనిపిస్తాయి.

**క్రీ.పూ. 4వ శతాబ్దికి చెందిన హెరోడొటస్ కూడా యుద్ధాలను ఇలా లాభ, నష్టాలు; హేతు, నిర్హేతుకల కోణంనుంచి చూడడం; ట్రోజన్ యుద్ధాన్ని అర్థరహితంగా భావించడం ఆశ్చర్యం గొలుపుతుంది. గణవ్యవస్థలోనూ, దానికి అతి సమీపంలోని ఇతిహాసకాలంలోనూ శత్రువు పట్ల పగప్రతీకారాలను తీర్చుకోవడం కంటే, అందుకు యుద్ధాలకు దిగడం కంటే ఏదీ ఎక్కువ కాదు. ఏ లాభ, నష్టాల మీమాంసా, ఎలాంటి హేతు, నిర్హేతుకల పరిశీలనా అక్కడ పనిచేయదు. యుద్ధం చేయడం, ప్రాణత్యాగం చేయడం దానికదే ఒక ఉన్నతమైన విలువ. క్షత్రియుడిగా పుట్టినవాడికి యుద్ధం చేయడం, యుద్ధంలో చావడం ఎంతటి పుణ్యకార్యాలో మహాభారతం అడుగడుగునా చెబుతుంది. అర్జునుడు కానీ, ఇలియడ్ లోని హెక్టర్ కానీ యుద్ధానంతర విధ్వంసాన్ని తలచుకుని విషాదానికి లోనవడం మినహాయింపులు మాత్రమే. ఒకవైపు విషాదానికి లోనవుతూనే, మరోవైపు యుద్ధమూ, అది కలిగించే సర్వనాశనమూ అనివార్యాలన్న స్పృహా వారిలో ఉంది. వారు ఒకవిధంగా యుద్ధ అనుకూల-వ్యతిరేకతల సంధి దశను ప్రతిబింబిస్తూ ఉండచ్చు.

***అంతవరకూ ఒంటరిగా జీవించిన తెగలు, భిన్నమైన తెగలు తారసపడినప్పుడు వాటిపట్ల శత్రువైఖరి కనబరచేవి. యుద్ధాలకు దిగేవి. ఈ విధంగా చూసినప్పుడు యుద్ధమనస్తత్వానికి మూలాలు గణవ్యవస్థలో ఉన్నట్టు అర్థమవుతుంది. భిన్న తెగలతో మైత్రిని, సామరస్యాన్ని పెంచుకోడానికి గణవ్యవస్థలో సహజంగానే కొంత వ్యవధి పట్టి ఉంటుంది. గణవ్యవస్థ అంతరించిందని అనుకునే నేటి కాలంలోనూ ఆ ప్రక్రియ పూర్తి అయిందని చెప్పలేం.

****సర్ వాల్టర్ లీఫ్(1852-1927): ఇంగ్లండ్ కు చెందిన ఒక బ్యాంకర్. వెస్ట్ మినిస్టర్ బ్యాంక్ కు చాలా ఏళ్లపాటు డైరక్టర్ గా ఉన్నాడు. గ్రీకు ఇతిహాసాలలో పండితుడు, ఇలియడ్ ప్రామాణిక ముద్రణను తేవడంలో ముఖ్యపాత్ర పోషించాడు.

*****క్రైస్తవం, ఇస్లాంల ముందుకాలానికి చెందిన ట్రోజన్ల ఆరాధనావిధానాలలో, దేవీ, దేవుళ్ళలో, మతవిశ్వాసాలలో నేటి మన హైందవ లక్షణాలు కనిపిస్తాయి. మనకు ఇప్పుడు సైతం ఉన్నట్టే, వారిలోనూ అమ్మవారి ఆరాధన ఉండేది. దీని గురించి నా వెనకటి ‘పురా’గమన వ్యాసాలలో విస్తారంగా ప్రస్తావించాను. ఆసక్తిగలవారు చూడగలరు.

****** దియోమెదెస్: ట్రోజన్ యుద్ధంలో పాల్గొన్న ఒక గ్రీకువీరుడు.

*******మన పురాణ ఇతిహాసాలలోనూ  నదులను అంటిపెట్టుకుని అప్సరసలు(nymphs) ఉండడం తెలిసినదే.

********మహాభారతంలో తొడలు విరిగి పడి ఉన్న దుర్యోధనుని శిరస్సును భీముడు కాలితో తన్నినప్పుడు. అది సహించని ధర్మరాజు భీముని మందలిస్తాడు. రామాయణంలో రావణుడు చనిపోయిన తర్వాత కూడా  తమ్ముడు విభీషణుడు అతనిని తూలనాడినప్పుడు. “మరణాంతాని వైరాని” అంటూ రాముడు అతన్ని మందలించి రావణుడి మృతదేహానికి అంత్యక్రియలు జరపమని కోరతాడు.

 

 

 

 

 

కొత్త తొవ్వల్లో తెలంగాణా చరిత్ర!

THRC-group

తెలంగాణ చరిత్ర, సాహిత్యం, సంస్కృతిపై లోతైన పరిశోధన జరిగి మరుగున పడ్డ, వివక్షకు, విస్మరణకు, వక్రీకరణకు గురైన అసలు  సిసలైన తెలంగాణ చరిత్రను సాక్ష్యాలు, ఆధారాలతో సహా రికార్డు చేయాలనే ఉద్దేశ్యంతో ‘తెలంగాణ చరిత్ర పరిశోధన కేంద్రం’ హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్తు కేంద్రంలో  ఏప్రిల్‌ 10వ తేదీనాడు ఏర్పాటయింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత నాణేల విశ్లేషకులు, సేకర్త, పరిష్కర్త దేమె రాజారెడ్డి ఈ సంస్థకు గౌరవాధ్యక్షులుగా ఉంటారు. అలాగే సహాదారులుగా బి.నరసింగరావు,  అనురాధారెడ్డి, అయూబ్‌ అలీ, కొల్లూరి చిరంజీవి, వి. ప్రకాశ్ లు వ్యవహరిస్తారు. అలాగే ఉపాధ్యక్షులుగా ముదిగంటి సుజాతారెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్‌లు, సహాయ కార్యదర్శుగా సంగనభట్ల నరసయ్య, జగన్‌ రెడ్డిలు, కార్యనిర్వాహక కార్యదర్శిగా కటికనేని విమల, కోశాధికారిగా ద్యావనపల్లి సత్యనారాయణ వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా  సంస్థ అధ్యక్ష కార్యదర్శులుగా అడపా సత్యనారాయణ, సుంకిరెడ్డి నారాయణరెడ్డి ఎన్నికయ్యారు.

అడపా సత్యనారాయణ గారి ఇంటర్వ్యూ ….

సారంగ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలోనే తెంగాణ హిస్టరీ కాంగ్రెస్‌, తెంగాణ హిస్టరీ సొసైటీ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయి కదా! మళ్ళీ ఈ సంస్థ పుట్టవలసిన  అవసరం ఏంటి?
అడపా: ఈ సంస్థలు  పుట్టి కొంత పని చేసినా ఇప్పుడు   అవి అంత చురుకుగా పని చేయటం లేదు. పైగా తెలంగాణ చరిత్ర సమగ్రంగా నిర్మాణం కావలసి ఉంది. కాబట్టి చరిత్రకారులతో పాటు సాహితీవేత్తలు, కళా రంగాల్లో నిపుణులు తదితర మేధావులు కూడా తెలంగాణ చరిత్ర నిర్మాణంలో పాలు పంచుకోవాలని వారందరి భాగస్వామ్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశాము.

సారంగ: సంస్థ ప్రధానంగా ఏయే కార్యకలాపాలు నిర్వహించబోతున్నది? దాని లక్ష్యాలను కొంచెం వివరంగా చెప్పండి.

అడపా: మా సంస్థ ప్రధాన లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సమగ్ర చరిత్రను అనేక కోణాల్లో పరిశోదించి ప్రామాణిక ఆధారాలతో పు సంపుటాలుగా ప్రచురించడం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1959లో తెలుగు  భాషా సమితి ఏర్పాటై తెలుగు  వారి చరిత్రను ఒక సమగ్ర సంపుటంగా తెచ్చిందో అలాగే ఇంకా అంతకన్నా మెరుగ్గా తెలంగాణ చరిత్రను రచించి జన సామాన్యానికి అందుబాటులోకి తేవాలని కృషి చేస్తున్నాము.
సంస్థ ఇతర లక్ష్యాల విషయానికి వస్తే… క్లుప్తంగా చెప్పాలంటే… పరిశోధన, డాక్యుమెంటేషన్‌, డిజిటలైజేషన్‌, రచన, ప్రచురణ, త్రైమాసిక పత్రికా నిర్వాహణ, వార్షిక సమావేశాలు,, సదస్సు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో సంప్రదింపులు, చారిత్రక సంపద పరిరక్షణ, అభివృద్ధి వంటి బృహత్తర లక్ష్యాలు మా సంస్థకున్నాయి.

సారంగ: తెంగాణ సమగ్ర చరిత్ర నిర్మాణ, ప్రచురణకు కొంత సమయం పట్టవచ్చు, త్రైమాసిక పత్రిక మాత్రం  రెగ్యుర్‌గా వస్తుంది కదా! దాని బాధ్యతలు  ఎవరికి అప్పగించారు?
అడపా: త్రైమాసిక పత్రికకు సంగిశెట్టి శ్రీనివాస్‌ సంపాదకులుగా వ్యవహరిస్తారు. సంపాదక మండలిలో  ద్యావనపల్లి సత్యనారాయణ, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సంగనభట్ల నరసయ్య, జయధీర్‌ తిరుమరావు వంటి నిష్ణాతులున్నారు.

సారంగ: త్రైమాసిక పత్రిక ప్రత్యేకతలేమైనా ఉన్నాయా?
అడనా: ఉన్నాయి. గతంలో తెలుగు దేశంలో వచ్చిన భారతి అనే మాస పత్రిక విశిష్టత గురించి పరిశోధకులందరికీ తెలిసిందే! అదిప్పుడు రావడం లేదు. మా త్రైమాసిక పత్రికలో వివిధ  ప్రాంతాలో వెలుగులోకి వచ్చిన, వస్తున్న ప్రాథమిక చారిత్రక అంశాలపై లోతైన ప్రామాణిక వ్యాసాలు, విశ్లేషణలు ఉంటాయి. తెలుగు, ఆంగ్ల భాషాల్లో రాసిన వ్యాసాలను విషయ నిపుణులు సరి చూశాకే ప్రచురిస్తాం. దీనితో పాటు పత్రికకు ఐఎస్‌ఎస్‌ఎన్‌ నంబరు తెప్పిస్తాం. కాబట్టి పత్రికలో  అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలుంటాయి.

సారంగ: వార్షిక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. వాటి గురించి కొంచెం వివరిస్తారా?
అడపా: మన దేశంలో ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌, ఆంధ్రప్రదేశ్‌లో ఎపి హిస్టరీ కాంగ్రెస్‌ లాగా మా సంస్థ కూడా తెలంగాణలో ఉన్న చరిత్ర అధ్యాపకులు, ఉపన్యాసకులు, విద్యార్థులు, విషయ నిపుణులు, ఔత్సాహికులు తదితరులందరిని ఆహ్వానించి సంవత్సరానికి ఒకసారి ఒక్కో చోట వారి పరిశోధన పత్రాల సమర్పణతో వార్షిక సమావేశాలు నిర్వహిస్తుంది. ఎంపికైన పత్రాలను ప్రచురిస్తుంది.
సారంగ: ప్రభుత్వంతో మీ సంస్థ వైఖరి ఎలా ఉంటుంది?
అడపా: ప్రభుత్వంతో మా సంస్థ వైఖరి సామరస్యంగా, సమన్వయంగా, సహకారిగా ఉంటుంది. అనేక కారణా వల్ల రాష్ట్ర పురావస్తు శాఖలో విషయ నిపుణుల కొరత ఉంది. అందువల్ల  అనేక చారిత్రక స్థలాల్లో తవ్వకాలు చేపట్టలేక పోతున్నారు. వందలాది శాసనాలను చదివించి ప్రచురించలేక పోతున్నారు. మా సంస్థ కొంత మంది విద్యార్థులను ముంబయి, నాసిక్‌, పూనా వంటి నగరాలకు శాసనాలు, నాణాలు, పురావస్తు  శాస్త్రం వంటి సబ్జెక్టుల అధ్యయనానికి పంపించి సంపాదించిన విషయ పరిజ్ఞానంతో పురావస్తు శాఖ సమన్వయంతో అనేక చారిత్రక విషయాలను వెలువరించేందుకు కృషి చేస్తుంది.
సారంగ: మీ సంస్థ ద్వారా తెలంగాణ సమాజానికి ఒనగూరే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా?
అడపా: తప్పకుండా ఉంటాయి. మేము తెలంగాణ గత చరిత్ర వైభవాన్ని వెలికి తీస్తాము. తెలంగాణ ప్రజల్లో తమ ఘన వారసత్వం పట్ల గౌరవాన్ని ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తాము. మా సంస్థ ప్రచురించే, వెలుగులోకి తెచ్చే  తెలంగాణ సాంస్కృతిక, కళలు, తెలంగాణ ప్రజలకు గర్వకారణమవుతాయి. మా సంస్థ గుర్తించే పెద్ద  పెద్ద చారిత్రక స్థలాలు సమీప భవిష్యత్తులో పర్యాటక స్థలాలై అలరిస్తాయి.

చరిత్ర రచనకు  సామూహిక  స్వరం: సుంకిరెడ్డి

 

తెలంగాణాలోని చరిత్రకారులు , పరిశోధకులు ఇటీవల  హైదరాబాద్ లోని ఆంధ్రసారస్వత పరిషత్తులో సమావేశమై ‘తెలంగాణా చరిత్ర పరిశోధక కేంద్రం’ (తెలంగాణ హిస్టారికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌) ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డ  డా॥ సుంకిరెడ్డి నారాయణరెడ్డి గారితో  ఏశాల  శ్రీనివాస్‌ ఇంటర్యూ…..

ప్రశ్న: తెంగాణ చరిత్ర పరిశోదక కేంద్రం ఏర్పాటు గురించి చెబుతారా?

బవాబు: నిజానికి ఈ సంస్థ ఎప్పుడో ఏర్పడాల్సి ఉండింది. మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైన వెంటనే సాహిత్య సాంస్కృతిక రంగాలో ఉద్యమోన్ముఖమైన కదలికలు ప్రారంభమైనవి. అట్లా 1998 నవంబర్‌ 1న ‘‘తెలంగాణా సాంస్కృతిక వేదిక’’ ఆరంభమైంది. మన చరిత్రను మనమే రాసుకోవాలని తీర్మానం చేసింది. ‘తెలంగాణా తోవలు’, ‘మత్తడి’ పుస్తకాలను వెలువరించడం ద్వారా తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్రను నిర్మించే పని కొంత చేసింది.

   కొంత ఆలస్యమైనా 2006లో ‘‘తెలంగాణా హిస్టరీ సొసైటీ’’ ఏర్పడింది  ‘1857 తిరుగుబాటు’, ‘17 సెప్టంబర్‌`భిన్న దృక్కోణాలు’, ‘ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పాటు విద్రోహ చర్య’, ‘1969 ఉద్యమ కరపత్రాలు’, ‘1969 చారిత్రక పత్రాలు’ లాంటి గొప్ప పుస్తకాల్ని మెవరించిన ఆ సంస్థ ఎందువల్లనో ఆగిపోయింది. ఆ తరువాత ‘‘తెలంగాణా హిస్టరీ కాంగ్రెస్‌’ ఏర్పడింది . రెండు సమావేశాలు నిర్వహించి అదికూడా ఆగిపోయింది. అందువల్ల ఈ సంస్థను ఏర్పాటు చేయవలసిన అవసరం ఏర్పడింది.

   ఈలోగా సంస్థాగతంగా కాకుండా వ్యక్తిగతంగా సంగిశెట్టి శ్రీనివాస్‌, కె.శ్రీనివాస్‌, ముదిగంటి సుజాతారెడ్డిలాంటి వాళ్ళు తెంగాణా ఆధునిక సాహిత్య చరిత్రను నిర్మించే విడివిడి ప్రయత్నాలు చేసినారు. అందులో భాగంగా తెలుగు కథ గురజాడతో కాకుండా భండారు అచ్చమాంబతో మొదలైందని తేల్చినారు.  అయినా ఇంకా గురజాడతోనే అని ఆంధ్ర చరిత్రకారులు రాస్తున్నారు.

   2005లో ప్రొ. అడప సత్యనారాయణ సంపాదకత్వంలో ‘ History and  culture of telangana’,  డా.రాజారెడ్డి గారి ‘‘చరిత్ర ఖజానా’’ నేను రాసిన ‘‘ముంగిలి`తెంగాణ సాహిత్య చరిత్ర’’ `2009, ‘‘తెలంగాణా చరిత్ర’’`2011 మొదలైన పుస్తకాలు తెలంగాణా కేంద్ర దృక్కోణంతో వచ్చినవి. ఇంకా సంగనభట్ల నరసయ్య, ద్యావనవల్లి సత్యనారాయణ మొదలైన వారు ఈ దృక్కోణంతోనే పరిశోధన చేసినారు. అయినప్పటికీ ఇంకా ఆంధ్ర చరిత్రకారులు కోస్తాంధ్ర కేంద్రంగానే సాహిత్య చరిత్రను, తెలంగాణ చరిత్రను రాస్తున్నారు.

అంటే తెలంగాణా అస్తిత్వవాదాన్ని స్థిరీకరించడానికి చేసే వ్యక్తిగత ప్రయత్నాలు  వారికి ఆనడంలేదని అర్థమవుతున్నది. అందువల్ల ఒక సామూహిక స్వరం అవసరం అనిపించిది. అందుకే ఈ సంస్థ ఆవిర్భవించింది.

   తెలంగాణ మలిదశ ఉద్యమం అస్తిత్వ వేదనతో నడుస్తున్నప్పుడే ఆ ఉద్యమ స్పిరిట్‌ను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా A P History congress ‘‘ఆంధ్ర ప్రదేశ్‌ సమగ్ర చరిత్ర`సంస్కృతి’’ పేరుతో కొన్ని సంపుటాల్ని వెలువరించింది. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా కొన్ని సంపుటాల్ని వెలువరించింది. వి.వి.కృష్ణ శాస్త్రి, పి.వి.బరబ్రహ్మ శాస్త్రిలాంటి వాళ్ళు తెలంగాణా చరిత్రకు సంబంధించిన కొత్త విషయాను ఆవిష్కరించినప్పటికీ ఈ సంపుటాలు కోస్తాంధ్ర కేంద్రంగానే వెలువడినవి. సహజంగానే అవి తెలంగాణ కేంద్రంగా వెలువడలేదు. శాతవాహన పూర్వ తెంగాణ చరిత్ర విషయంలో అలసత్వాన్ని ప్రదర్శించినారు.

   ప్రశ్న: ఈ సంస్థ తరపున ఎలాంటి కార్యకలాపాలు చేపట్టనున్నారు?

   జవాబు: ముందుగా ఒక త్రైమాసిక పత్రికని తేవాలనుకున్నాం. ఈ పత్రికను  తెలంగాణ చరిత్ర, సాహిత్య చరిత్ర, పరిశోధనాంశాలకు వేదికగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాం. పరిశోధక బృందంతో తెలంగాణా సమగ్ర చరిత్రను సంపుటాలుగా రాయించి అచ్చువేయానుకుంటున్నాం.

ప్రశ్న: ఇతర రాష్ట్రాలో వున్న అరుదైన సమాచారాన్ని ఏ విధంగా సేకరిస్తారు?

   జవాబు: మద్రాసు, తంజావూరు, తిరుపతి, డిల్లీ, కొల్‌కతాలో వున్న తెలంగాణకు  సంబంధించిన తాళపత్రాను, రాతప్రతులను, పుస్తకాలను యదాతథంగా కాని, నకలు రూపంలో గాని లేదా డిజిటలైజ్‌ రూపంలో కాని తెప్పించాలి. ఈ పని మన రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ప్రభుత్వం ద్వారానే తెప్పించాలె.

   ప్రశ్న: పురావస్తు సంపదను రక్షించడం`చరిత్ర పునర్‌నిర్మాణంలో భాగంగా ఏవిధమైన కార్యాచరణ వుంటుంది?

   జవాబు: తెలంగాణాలో అనంతమైన పురావస్తు సంపద వుంది. సీమాంధ్ర ప్రభుత్వ వివక్ష వలన పురావస్తు తవ్వకాలు పదిశాతం కూడా జరుగలేదు. ఒక్క కోటి లింగాల ఉదాహరణ తీసుకొంటే ప్రముఖ నాణాల  అధ్యయన వేత్త డా.రాజారెడ్డిగారి అభిప్రాయం ప్రకారం అక్కడ పదిశాతం కూడా తవ్వకాలు జరగలేదు. తవ్వకాలు సాగినట్లయితే ఏంతో  చరిత్ర బయటపడే అవకాశం వుంది.

   ప్రశ్న: ఇప్పటి వరకు పరిష్కరింపబడని తాళపత్ర గ్రంథాల  పరిష్కరణ, ముద్రణ కోసం ఎలాంటి చర్యలు తీసుకొంటారు?

   జవాబు: తాళపత్ర గ్రంథా పరిష్కరణ ముద్రణ కూడ బృహత్‌ కార్యమే. ప్రాచ్యలిఖిత భాండాగారం (ఓరియంటల్‌ మాన్యుస్క్రిప్ట్‌ లైబ్రరీ) ద్వారా పరిష్కరణ ముద్రణ జరిగేటట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తం. గతంలో వ్యక్తుగా మానవల్లి రామకృష్ణ కవి, శేషాద్రి రమణ కవులు, గడియారం రామకృష్ణ కవి, బిరుదురాజు రామరాజు, వల్లపురెడ్డి బుచ్చారెడ్డి, కపిలవాయి లింగమూర్తి, రవ్వా శ్రీహరి, శ్రీరంగా చార్య, జయధీర్‌ తిరుమలరావు, సంగనభట్ల నరసయ్యలాంటి వాళ్ళు గ్రంథ పరిష్కరణ చేసినారు. అట్టే ఈ పనిని చేసే వ్యక్తులకు అండదండగా ఉంటాం.

   ప్రశ్న: సంస్థకు వున్న తక్షణ కర్తవ్యం ఏమిటి? ప్రాధాన్యతా క్రమం ఏమిటి?

   జవాబు: ప్రభుత్వంతో సంప్రదించి, అమరావతి బౌద్ద ఉత్సవాల  సందర్భంగా తెలంగాణా నుంచి తీసుకెళ్ళిన పురావస్తు సంపదను వెనక్కు తెప్పించడం, పురావస్తు శాఖ, ఆర్కైవ్స్‌ శాఖ, ప్రాచ్యలిఖిత భాండాగార శాఖ విభజన సందర్భంగా తెంగాణ వాటా సరిగ్గా దక్కేలా జాగ్రత్త వహించడం, కొన్ని కార్యక్రమాల  గురించి రెండవ ప్రశ్నకు చెప్పిన సమాధానంలో ఉన్నవి.

   ప్రశ్న: యూనివర్సిటీలో జరుగుతున్న పరిశోధనను ఎలా సమన్వయం చేసుకొంటారు?

   జవాబు: యూనివర్సిటీల్లోని చరిత్ర శాఖలో, తెలుగు  శాఖలో ఆయా శాఖ అధ్యక్షులతో సంప్రదించి 80శాతం పరిశోధన తెలంగాణ అంశా మీద జరిగేటట్లు చూడవలసి వుంటుంది.

   ప్రశ్న: ప్రభుత్వానికి చరిత్ర, సంస్కృతి పాలసీకి సంబంధించిన సూచనలు సహాలు ఏమైనా ఇస్తారా?

   జవాబు: తప్పకుండా, త్వరలో సంస్థ విస్త్రృత సమావేశం ఏర్పాటు చేసి సమగ్రమైన పాల సీ రూపొందిస్తుంది.

   ప్రశ్న: సంస్థకు నిధుల  సేకరణ ఏవిధంగా చేయగలరు?

   జవాబు: సంస్థ సభ్యుల  నుంచి జీవిత సభ్యత్వ రుసుం సేకరించడం, వివిధ ప్రభుత్వ సంస్థల నుండి గ్రాంట్స్‌ వచ్చేలా చూడడం, వ్యక్తులనుండి విరాళాలు  పోగు చేయడంలాంటి పద్దతుల  ద్వారా నిధులను సమకూర్చుకుంటాం.

అనంతం అంతు చూసిన వాడు..

 

-అరుణ పప్పు

~

 

కుంభకోణం నుంచి విజయనగరం దాకా దసరా సమయంలో పని నుంచి దొరికిన కొద్దిరోజుల ఆటవిడుపులో తమిళనాడులోని ప్రసిద్ధ దేవాలయాలను చూసి వద్దామని బయల్దేరాం. ‘టెంపుల్ టూరిజం’ తప్ప మరేదీ అంత ప్రముఖం కాని మన పరిస్థితుల పట్ల విసుగు నాకు. అయినాగాని, ఆ సందర్శనలో మతాన్నీ సైన్సునీ మించిన విశాలత్వమేదో నా అనుభవంలోకి రావడం అత్యంత సుందరమైన భావనగా అనిపించింది.శరత్కాలపు లేత ఎండ మమ్మల్ని దారి పొడుగునా ఎక్కడా ఇబ్బంది కలక్కుండా కాపాడింది.

పాండిచేరి అరవిందాశ్రమం, చిదంబరంలోని నటరాజ దేవాలయం తర్వాత మా మజిలీ కుంభకోణం.కుంభకోణంలో ప్రసిద్ధ దేవాలయమేదో ముందుగా మాకేం తెలియదు. కాని ఇంటి నుంచి బయల్దేరే ముందే, ‘కుంభకోణం మనకు అత్యంత పుణ్యక్షేత్రం’ అన్నారు మా నాన్నగారు. ఎందుకంటే ప్రపంచ ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మస్థలమదే. ఆయన ఇల్లు చూద్దామని, ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలేమైనా ఉంటాయేమోనన్న ఆసక్తితో మేం కుంభకోణం ప్రయాణం కట్టాం.
మనం పోగొట్టుకున్న మేథావిగణితం తప్ప మరేదీ పట్టని రామానుజన్ ఇక్కడ ఎఫ్ఏ కూడా పాసవలేకపోయాడు. కాని జి. హెచ్. హార్డీ చొరవతో 1914లో లండన్‌కి ప్రయాణం కట్టిన ఆయన కాంపోజిట్ నంబర్స్ మీద చేసిన పరిశోధనలకు పట్టా లభించింది, లండన్ మేథమెటికల్ సొసైటీ, రాయల్ సొసైటీల్లో సభ్యుయ్యాడు. 1918లో కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజీ ఫెలో అయిన తొట్టతొలి భారతీయుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. శాకాహారం దొరకక, విటమిన్ లోపంతో ఆయన వ్యాధినిరోధక శక్తి క్షీణించి టీబీ బారిన పడి భారతదేశానికి తిరిగి వచ్చి 32 ఏళ్ల వయసుకే (1920లో) చనిపోయాడు రామానుజన్. ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి 1957లో రెండు సంకలనాలుగా ఆయన రచనల్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆయన 125 జయంతి సందర్భంగా కలెక్టర్స్ వాల్యూమ్స్ వేసింది. తమిళనాడు డిసెంబరు 22ను ‘స్టేట్ ఐటీ డే’గా జరుపుకొంటోంది. ఆయన 75 జయంతి సందర్భంగా ప్రభుత్వం ఒక తపాలాబిళ్లను విడుదల చేసింది. ప్రస్తుతానికి మనం ఆయన పుట్టిన రోజు డిసెంబరు 22ను ‘నేషనల్ మేథమెటిక్స్ డే’గా జరుపుకొంటున్నాం. రామానుజన్ కృషి నంబర్ థియరీలో, ఫిజిక్స్‌లో, స్ట్రింగ్ థియరీలో చాలా విలువైనదంటారు

మేథమెటీషియన్ చిదంబరం నుంచి కుంభకోణం వరకూ – చిన్నాపెద్దా పల్లెటూళ్లు, పచ్చని వరిపైరుతో నిండిన పొలాలు, పెద్ద ముగ్గులు తీర్చిన ఇళ్ల ముంగిళ్ల మీదుగా మా ప్రయాణం సాగింది.కావేరి, అరసలార్ నదుల మధ్యలో ఉండే కుంభకోణం తెలుగులో ఒక జాతీయంగా ఎలా స్థిరపడిందో తెలియదుకాని, ప్రళయకాలంలో అమృతం ఉన్న కుంభం (కుండ) కొట్టుకుపోతూ ఉంటే బ్రహ్మ దాన్ని తెచ్చి రహస్యంగా ఇక్కడ దాచిపెట్టాడట. అందువల్ల ఇది కుంభకోణం అయింది.కుంభకోణంలోని దేవాలయాలతో పాటు
మహామహమ్ పుష్కరిణి చాలా ప్రసిద్ధమైనది. మన పుష్కరాల్లాగా పన్నెండేళ్లకోసారి మాఘ పున్నమినాడు జరిగే ‘మహామహమ్’లో మునకలెయ్యడానికి లక్షలకొద్దీ భక్తులు వస్తారు. ఇది మొన్నీమధ్యే జరిగింది.
బ్రిటిష్‌వాళ్ల కాలంలో విద్యాకేంద్రాలు విరివిగా ఏర్పడటంతో కుంభకోణం ‘కేంబ్రిడ్జ్ ఆఫ్ సౌత్ ఇండియా’గా పేరు పొందింది. ఈ ఊరు తమలపాకులు, వక్కలకీ, ప్రశస్థమైన కాఫీకీ ప్రసిద్ధి. వాటితో పాటు ఇత్తడి, కంచు విగ్రహాలు పూజాసామగ్రి తయారీకీ ప్రసిద్ధి. మన దగ్గర దుకాణదారులెక్కువమంది అక్కడినుంచే వాటిని దిగుమతి చేసుకుంటారు. అలాగే కుంభకోణంలో పట్టు పరిశ్రమ పెద్దది. ప్రసిద్ధి చెందిన త్రిభువనం చీరల తయారీలో ఈ పట్టును ఉపయోగిస్తారు. ఈమధ్యే కుంభకోణం ఎరువుల తయారీ కేంద్రంగా కూడా విస్తరిస్తోంది. 2004లో జరిగిన అగ్నిప్రమాదంలో తొంభైమందికి పైగా చిన్నారులు చనిపోయిన సంఘటన కుంభకోణం చరిత్రలో చెరిగిపోని మచ్చ.

మేమక్కడకు చేరేప్పటికల్లా విశాలమైన ఆది కుంభేశ్వర దేవాలయంలో దసరా జాతర జరుగుతోంది. ప్రాకారం లోపం కనీసం లక్షమంది ఉన్నారంటేనే అదెంత పెద్ద ఆలయమో అర్థమవుతుంది. ఆ జనసందోహంలో తప్పిపోకుండా అనుకున్న చోటికి తిరిగి రావడానికి మాకు విశ్వప్రయత్నమయింది.కుంభకోణంలో అడుగుపెడుతూనే మా నాన్నగారి ఆతృత రెట్టింపయ్యింది. ప్రయాణ బడలిక ఎంతున్నా, ఆకలి విపరీతంగా ఉన్నా కూడా ఆయన శ్రీనివాస రామానుజన్ ఇల్లెక్కడో అప్పటికప్పుడే అడిగి కనుక్కోవడానికి నిశ్చయించుకున్నారు. తిరిగి వస్తూనే ఆయన చెప్పిన సంగతిదీ.
‘నీకు తెలుసా? ఎవరో ఒక పెద్దాయనను రామానుజన్ ఇంటి గురించి అడిగాను. అది చూడటానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారా అని ఆశ్చర్యపోయాడాయన. ఒక లెక్కల మేస్టారిననే గౌరవానికే ఆయన నాకు కాఫీ ఇప్పించి ఆ ఇల్లు చూపెట్టి మళ్లీ ఇక్కడ తీసుకొచ్చి దిగపెట్టి వెళ్లారు! ‘ అని.

మర్నాడుదయమే మేం సారంగపాణి దేవాలయం వీధిలోని ఆ ఇంటికి వెళ్లాం.కృష్ణనీలపు రంగు వేసిన గుమ్మం, కిటికీతో పాతకాలపు పెంకుటిల్లు. మధ్యన వసారా, చివరన వంటిల్లు, పెరడు, బావి. అంతే. రోడ్డు వైపునుండే పడకింట్లో ఉన్న చెక్క మంచం, వసారాలో ప్రతిష్టించిన రామానుజన్ విగ్రహం, వెనక ఆయన గురించిన పాత ఫోటోలు. అంతే మరేమీ లేదక్కడ.

పుస్తకాల్లోనో, ఇంటర్నెట్లోనో లభ్యం కాని కొత్త వివరాలూ లేవు. శాస్త్ర యూనివర్సిటీ వాళ్లు ఉన్నంతలో బాగు చేసి నిర్వహిస్తున్న ఆ ఇంటి కి పర్యాటకులంటూ నిత్యం వచ్చిపోయేదెవరూ ఉండరు. అందువల్ల దుమ్ము కాస్త పేరుకునే ఉంటుంది. ఆ ఇంట్లో అడుగుపెట్టగానే అదొక రకమైన చిత్రమైన భావనేదో కలిగింది. పాదరసం వంటి మేథగల గణిత శాస్త్రవేత్తను అతి చిన్నవయసులోనే పోగొట్టుకున్న దేశ కాల పరిస్థితులను తలచుకుని మనసు దుఃఖమయమైంది.

ఆ అరుగు మీదే కూర్చుని రామానుజన్ అత్యంత కఠినమైన ఈక్వేషన్లను సాధించేవాడని, దాదాపు 3900 ఈక్వేషన్లను ప్రతిపాదించాడని గుర్తు చేసుకున్నప్పుడు శరీరం ఒకలాంటి వివశత్వానికి లోనైంది. ఎదురుగా సుమారు 150 అడుగుల ఎత్తు, 12 అంతస్తులతో ఆకాశాన్ని తాకుతూ కనిపిస్తున్న సారంగపాణి దేవాలయ గోపురం ఆయనకు స్ఫూర్తినిచ్చేదని, ఆ ప్రాకారాల్లోని గచ్చు మీద సుద్దముక్కతో ఆయన లెక్కలు చేసేవాడని గుర్తుచేసుకుంటే కళ్లు చెమర్చాయి.’దైవాన్ని గురించిన ఆలోచన ఇవ్వలేని ఏ గణిత సూత్రమూ నాకు అర్థవంతంగా అనిపించదు. ఆ కోవెల్లోని కోమలవల్లి (మహాలక్ష్మి )అమ్మవారే తనకు స్ఫూర్తి ‘ అన్న రామానుజన్ మాటలు జ్ఞాపకమొచ్చాక ఆ తల్లిని దర్శిస్తుంటే మనసు ఆ్రర్దమైపోయింది.

సారంగపాణి దేవాలయం వెనకాలే పెద్ద బజారు. గులాబి పువ్వులు, పూజా సామగ్రి హోల్‌సేల్‌గా అమ్మే చోటది.ఒకవైపు నుంచి దట్టంగా మేఘాలు కమ్ముతున్న మధ్యాహ్నపుటాకాశం తల మీద. కంటికెదురుగా గులాబీల రంగు, గాఢమైన వాటి పరిమళం, అరటినారలతో పాటు తమ మాటలనూ నవ్వులనూ కలిపి గులాబీలను పొడవాటి దండలుగా చకచకా అల్లుతున్న శ్రామికులు.. ఇవన్నీ కలిసి ఒక్క క్షణం నేను విజయనగరం గంటస్తంభం బజారులో ఉన్నానేమో అన్న భ్రాంతిలోకి నెట్టేశాయి.అదెందుకంటే కుంభకోణం రావడానికి ముందే నేను విజయనగరంలో యు.ఎ.నరసింహమూర్తిగారింటికి వెళ్లాను.

అప్పటికి కొద్ది నెలలైంది ఆయన మరణించి. కన్యాశుల్కం మీద అథారిటీగా, సంప్రదాయ సాహిత్య విమర్శకుడిగా ఆయన ఎక్కువమందికి తెలిసిన పెద్దమనిషి. నాకాయన పెదనాన్నగారవుతారు.సాహితీలోకానికి ఆయన కృషి ఆయన రాసిన విమర్శనాత్మక పుస్తకాల మేరకే తెలుసు. మాకు ఆయన సాహితీవ్యాసంగాన్ని మించిన నిండైన వ్యక్తిత్వం, ఆ పుస్తకాల్లో కనిపించని జీవిత దృక్పథం, కఠిన పదజాలంతో నిండిన విమర్శలను సైతం స్థిమితంగా స్వీకరించగలిగిన నెమ్మదితనం – ఇవన్నీ తెలుసు. ఆయన లేని ఇంట్లోకి అడుగుపెడుతున్నానన్న భావనకే ఒళ్లు జల్లుమంది. ఆయన చెబుతుంటే పుస్తకాలను రాసి పెట్టేవారు ఆయన భార్య రవణ. నాకు దొడ్డమ్మ. ఆయన పుస్తకాల గదిని చూపిస్తూ ఆమె కూడా అదే అన్నారు ‘మనుషులు శాశ్వతం కాకపోవచ్చు కాని, వాళ్ల పనిలోని స్ఫూర్తి మనల్ని అంత త్వరగా వదిలిపోదు కదా’ అని.
విజయనగరం – కుంభకోణం : ఈ రెండు ప్రాంతాల సందర్శనా వెన్వెంటనే జరిగినది కావడం పూర్తిగా యాదృచ్ఛికమే. కాని వాటి నుంచి అందిన స్ఫూర్తి నన్ను రోజువారీ పేరుకునే దుమ్ము నుంచి శుభ్రం చేసింది. నా హృదయాన్ని తేటపరిచింది. అటు శ్రీనివాస రామానుజన్ – ఇటు యూఏ నరసింహమూర్తిగార్ల జీవితాలు, నెమ్మదైన స్వభావాలు, నిరంతర అధ్యయనశీలురైన వాళ్ల వ్యక్తిత్వాలు నాలోని ఏ చైతన్యాన్ని, ఏ వివేకాన్ని మేల్కొల్పాయో మాటల్లో చెప్పలేను.

 

ఈ తలపోత ఎందుకంటే రెండు కారణాలు.

మొన్నొకరొచ్చి ‘విశాఖపట్నంలో శ్రీశ్రీ, రావిశాస్త్రి ఇళ్లెక్కడున్నాయో తెలుసా, మనం చూడటానికి వీలుందా?’ అని అడిగితే తెల్లముఖం వెయ్యవలసి వచ్చింది. ఏవైనా జ్ఞాపకాలు భద్రంగా ఉంటే కద, ఏ రంగంలోనైనా గొప్పవాళ్ల గుర్తులు ఎన్నో కొన్ని తర్వాతి తరాలకు అందడానికి? రెండోది – శ్రీనివాస రామానుజన్ జీవితం ఆధారంగా హాలీవుడ్ కిందటేడు ‘ద మేన్ హూ న్యూ ఇన్ఫినిటీ’ అనే చిత్రాన్ని నిర్మించింది. రాబర్ట్ కనిగెల్ రాసిన జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఈ చిత్రంలో దేవ్ పటేల్ రామానుజన్‌గా నటించాడు. టొరంటో, గోవా లాంటి చోట్ల అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమయి, ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న ఈ చిత్రం ఈ నెల 29న భారతదేశంలో విడుదలవుతోంది. అందుకని.

 

=========
ఈ సినిమా ట్రెయిలర్ లింకు

.
యూఏ నరసింహమూర్తిగారి గురించి విశాఖపట్నం సాహితీప్రేమి రామతీర్థ రాసిన వ్యాసం
శ్రీమతి రవణ గురించి జగద్ధాత్రి రాసిన కవిత ఇక్కడ.

అక్షరాంగి

 

అర్ధరాత్రి తెలియకుండా వదిలి వెళ్ళిన

సిద్ధార్ధుని యశోధర ధు:ఖం కాదు ఆమెది

మురిపించి మైమరపించి కొంగు పట్టుకు తిరిగి

సకల సాహిత్య భువనాలు తిప్పి

అకస్మాత్తుగా రేపల్లె వీడి వెళ్ళిన

బాల కృష్ణుని యశోదా విలాపం ఆమెది

ఆమె మాటల్లో అర్ధ శతాబ్దపు దాంపత్యం

గూర్చిన మరపు రాని ముచ్చట్లు

ముత్యాల సరాల్లా దొరలి పోతున్నాయ్

మధ్య మధ్యలో ఆగలేని కన్నీటి ముత్యాలూ

చెక్కిళ్ల పై జారి కొంగులో ఇంకి పోతున్నాయి

ఏడు పదుల వయసులోనూ చంటి పిల్లాడికి మల్లే

తనతోడిదే లోకమని తిరిగిన వాడు

హఠాత్తుగా ఒంటరిని చేసి వెళ్ళి పోయాడన్నతలపు

ఆమెను నిలవనీయడం లేదు

అయినా జన్మ సంస్కారం తో అందరినీ

ఆత్మీయంగా పలకరిస్తోంది

మీరు లేనిదే వారి అక్షారాలు లేవమ్మా అన్నాం

ఆయనా అలాగే అనేవారు ప్రతి క్షణం

చుట్టుముట్టాయేమో ఆతని స్మృతులు

పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి

కళ్ళు రెండూ నీటి కుండలవుతున్నా …

అంతటి సాహితీ మూర్తికి

కలమూ , కళత్రమూ కాగలిగిన ఆమె ధన్యురాలు

భావాలన్నీ సమ్మిళితమయిన  ఆమె మాటలలో

ఎన్నెన్ని అనుభూతుల ఉద్విగ్నతలను దాచిందో

వారి ఇరువురి జ్ఞాపకాల మల్లెల పరిమళాలను

మాతో ఆప్యాయంగా పంచుకుంది

అహరహము అక్షరం తోనే సహవాసం చేసినా

సాహిత్యాన్నెప్పుడూ సవతిగా భావించలేదు ఆమె

వారి భౌతిక దాంపత్యానికి కొడుకు ఆనవాలు

వారి అలౌకిక సాహిత్యానురాగానికి

ఆయన రచనలు ప్రత్యక్ష ప్రమాణాలు

చూడటానికి వెళ్లింది ఒక కలం మూగ బోయిందని

చూసి వచ్చింది తెగిన వీణ తంత్రులతో

నిరుత్తర అయి విలపిస్తున్న సరస్వతిని

మహాభారత రచన చేస్తున్న వినాయకుడి కలాన్ని

హఠాత్తుగా విధి లాగేసుకున్నట్టు

మూగబోయిన ఆమె కలం చిందిస్తోంది కన్నీరు

సాహితీ  లోకాన అతను చిరంజీవి

ఆతని భావాలను అక్షరీకరించిన ఆమె

అనునిత్యం స్మరణీయురాలు

తల్లీ! సరస్వతి ! అని ఆమెకు

మొక్కి, ఆమె కరణాలను

కళ్ళకు అద్దుకుని

సాహిత్య క్రౌంచ ద్వయానికి ప్రణమిల్లాను

సాష్టాంగ ప్రమాణం చేసుకుని వెనుతిరిగాను

 

 

(కీ.శే. యు. ఏ. నరసింహ మూర్తి గారి భౌతిక కాయాన్ని చూడటానికి వెళ్లినప్పుడు ఆతని భార్య శ్రీమతి రమణమ్మ గారితో కాస్త సమయం గడిపాక హృది కదిలి…ఇలా …ప్రేమతో జగద్ధాత్రి ) 8.30 (రాత్రి) 1/5/2015 శుక్రవారం

  ప్రపంచ శ్రమజీవుల సినిమా “స్ట్రైక్”

strike

 

-శివలక్ష్మి 

 ~

1925 లో సోవియట్ యూనియన్ నుంచి వచ్చిన అత్యద్భుతమైన ఆవిష్కరణస్ట్రైక్. ఈ సినిమా డైరెక్టర్ ప్రపంచ ప్రఖ్యాత సోవియట్ చిత్ర నిర్మాత “సెర్గీ మిఖాయ్లోవిచ్ ఐసెన్ స్టీన్. ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలనే సమైక్యవాదం గురించి బలమైన ప్రకటనలు చేసిన  రాజకీయ చిత్రం. దీని నిడివి ఒక గంటా,ఇరవై రెండు నిమిషాలు.

కథలోకి వెళ్ళి క్లుప్తంగా చెప్పుకోవాలంటే – ఒక మెటల్ ఫ్యాక్టరీలో 25 రూబిళ్లు ఖరీదు చేసే ఒక మైక్రోమీటర్  మాయమవుతుంది. ఆ నేరాన్ని యాజమాన్యం యాకోవ్అనే కార్మికుడి మీదకు నెడుతుంది. అవమానభారంతో అతను ఉరి వేసుకుని మరణిస్తాడు. యాకోవ్ ఉరి తీసుకునే ముందు తనకు జరిగిన అన్యాయం గురించి తన సహ కార్మిక సోదరులకు వాస్తవాలను వివరిస్తూ రాసిన ఒక లేఖను వదిలి వెళ్తాడు. ఆ లేఖతో పాటు, యాకోవ్ వేళ్ళాడుతున్న శవాన్ని చూసిన కార్మికులు పట్టరాని ఆగ్రహంతో పని అక్కడికక్కడే ఆపేసి, మిల్లింగ్ గది వదిలేసి మెరుపు సమ్మెకు దిగుతారు. స్ట్రైకర్స్ వదులుగా ఉన్న మెటల్ ని, రాళ్ళని కొలిమి కిటికీల నుంచి విసురుతూ ఫ్యాక్టరీ పనికి ఆటంకం కలిగిస్తారు. అప్పుడు యాజమాన్యం మండిపడుతూ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ గేట్ల లోపల కార్మికులందర్నీ నిర్భందిస్తుంది. కోపించిన శ్రామికులు కార్యాలయాన్ని ఆక్రమించి ఒక అధికారిని బలవంతంగా ఒక బండి చక్రానికి గట్టి కొండ పక్కనున్న వాగు నీటిలో ముంచుతారు. ఆ రోజు నుంచి కార్మికులు పనిని స్తంభింపచేయడం వల్ల ఫ్యాక్టరీ ఖాళీగా ఉండి, కళావిహీనమై పోతుంది. రాబడి ఆగిపోయినందువల్ల యాజమాన్యం ఆగ్రహం రోజు రోజుకీ   పెరిగిపోతూ ఉంటుంది. శ్రామికులు ఐక్యంగా ఉండి, సమిష్టి ఆలోచనలతో తమ డిమాండ్లు రూపొందిస్తారు. అవి

1) కార్మికులందరికీ 8 గంటల పని దినం కావాలి

2) యాజమన్యం శ్రామికులను మర్యాదగా,సాటి మనుషులుగా చూడాలి.

3) 30% వేతనం పెంచాలి.

4) బాల కార్మికులకు 6 గంటలకు మించి పని ఉండరాదు.

ఈ నాలుగు ముఖ్యమైన డిమాండ్లతో తయారైన ఒక రాత ప్రతిని  కార్మికులు యాజమాన్యం ముందుంచుతారు. ఈ దరఖాస్తును యాజమాన్యం – పెట్టుబడి పెట్టిన వాటాదారులు కలిసి కూర్చుని సిగార్ల ధూమపానం పీలుస్తూ, రకరకాల  పానీయాలు సేవిస్తూ మహా విలాసంగా తమ సమావేశంలో చర్చిస్తారు.

ఇంతకీ చర్చల అనంతరం ఏం సెలవిచ్చారనుకున్నారు?

8 గంటల పని దినం చట్ట విరుద్ధమైనదన్నారు!

బాల కార్మికులకు 6 గంటల పని దినం అడగడం అన్యాయమన్నారు!

30% వేతన పెంపకం, తోటి మనిషిని మనిషిగా మర్యాదగా చూడడ మనే మిగిలిన డిమాండ్ కూడా న్యాయ సమ్మతమైనది కాదని నిర్ద్వద్వంగా తిరస్కరిస్తారు!!

ఇదంతా  వాటాదారుల ఆదేశాలతోనే, వాళ్ళ ఆజ్ఞానుసారం ప్రకారమే జరుగుతుంది.

ఆగ్రహించిన కార్మికులు సమ్మెకు దిగుతారు. రోజుల తరబడి సమ్మె కొనసాగుతుంది.రెక్కాడితేగాని డొక్కాడని శ్రామికుల కుటుంబాలు  పసిబిడ్డలతో సహా ఆకలి బాధలకు అల్లాడిపోతుంటారు. యాజమాన్యం కార్మికుల పట్ల ఏమాత్రం సానుభూతి లేకుండా తాను పట్టిన పట్టు వీడదు. శ్రామికుల నిరసన తీవ్రరూపం దాలుస్తుంది. పోలీసులు పురికొల్పడంతో శ్రామిక వర్గంలోనే ఉన్న దుష్ట కార్మికులు పోలీసులతో కుమ్మక్కై సోదర కార్మికులకు అన్యాయం చేసి వెన్నుపోటు పొడిచే భ్రష్టాత్వనికి పాల్పడతారు. యాజమాన్యపు గూఢచారులు జరుగుతున్న పరిణామాలన్నిటినీ జాగ్రత్తగా గమనిస్తూ అప్రమత్తంగా కాపలా కాస్తుంటారు. వీళ్ళందరూ కలిసి – ఆకలి మంటలను సహిస్తూ ,సర్వ శక్తులూ కేంద్రీకరించి సమ్మె చేస్తున్న కార్మికులపై అగ్నిమాపక విభాగంతో, పోలీసులతో దాడి చేయిస్తారు. ఇంతలో సైనిక సిబ్బంది నలువైపులా చుట్టు ముట్టడంతో కార్మిక శక్తి చెల్లాచెదురవుతుంది.

“మాలో పిరికి వాళ్ళు లేరు. దేశద్రోహులు లేరు. మా చివరి రక్తపు బొట్టు వరకూ మేము మా డిమాండ్లను సాధించు కోవడానికి శాయశక్తులా పాటు పడతాం” – అని నినదించిన శ్రమ జీవులందరూ అమరులవుతారు.  ఆ ఆవరణమంతా శ్రమ జీవుల శవాల గుట్టలతో నిండిపోతుంది. సినిమా ఒక విషాద నెత్తుటి టోన్ లో ముగుస్తుంది.

స్థూలంగా ఇదీ కథ. కానీ ఈ సినిమాని ఐసెన్ స్టీన్ దృశ్యకావ్యంగా మలిచిన విధానం చెప్పాలంటే అదొక గొప్ప వచన కావ్యమవుతుందని సినీ విమర్శకులూ, మేధావులూ అన్నారు.

ప్రస్తుతం నాకర్ధ మైనంత మేరకు మే డే సందర్భానికి వర్తించే విషయాలు ప్రస్తావించుకుందాం!

అప్పటికింకా టాకీలు రాలేదు. అదొక నిశ్శబ్ద యుగం. ఈ ‘స్ట్రైక్’ అనే నిశ్శబ్ద సినిమాకి ప్రధానంగా మూడు గొప్ప  లక్షణాలున్నాయి .

మొదటిది ముందు తరాల విప్లవ చరిత్ర,

రెండోది సమూహాల కథ,

మూడోది మాంటేజ్ తాకిడి అంటే రెండు విరుద్ధ సంఘటనల ఘర్షణ సృష్టించి తాను చెప్పదలచుకున్న కొత్త విషయాన్ని చెప్పడం.

ఐసెన్ స్టీన్ ముందు తరాల కార్మికులు రోజంతా పని, అంతులేని పనిగంటలు, వెట్టి చాకిరీతో విసిగిపోయారు. పని వేళలకోసం, పని స్థలంలో కనీస సౌకర్యాలకోసం, చేసిన చాకిరికి సరైన కూలికోసం, మరీ ముఖ్యంగా 8  గంటల పని దినం కోసం ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఎక్కడివారక్కడ ఆందోళనలు, ఉద్యమాలు,సమ్మెలు చేశారు. ఫలితంగా  చిలికి చిలికి ఉధృతమైన వడగళ్ళవానగా రూపుదిద్దుకుని 1886 మే 3 న చికాగోలో  బద్దలైంది. ఆరోజు 25000 మందితో కార్మికులు గొప్ప ఊరేగింపులో పరిసరాలు హోరెత్తేలా కదం తొక్కారు. తర్వాత రోజు హే మార్కెట్లో జరుగుతున్న కార్మిక సభపై పోలీసులు అతి కౄరమైన వికృత వీరంగం చేశారు. “మతియాస్ డేగన్” అనే ఒక పోలీసు అధికారిని గుర్తు తెలియని వ్యక్తి పేల్చినందుకు, దుర్మార్గంగా అనేకమంది కార్మికుల్ని పోలీసులు కాల్చి చంపారు. అమెరికా ప్రభుత్వం ఒక బూటకపు ఎన్ కౌంటర్ జరిపి ఆనాటి కార్మిక నాయకులు పార్సన్స్, స్పైజ్, ఎంగెల్స్ లను ఉరి తీసింది.దీని ఫలితంగా 1890  లో పారిస్ లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్టుల సమావేశం  మే 1 తేదీనిఅంతర్జాతీయ కార్మిక పోరాటదినంగా పాటించాలని తీర్మానించింది.అప్పటినుంచి ప్రపంచవ్యప్తంగా ఉన్న కార్మికులు చికాగో వీరుల బలిదానాన్ని స్మరించుకుంటూ మేడేని తమ విముక్తి పోరాటాలదినంగా జరుపుకుంటున్నారు.

మహత్తరమైన ఈ మే డే పోరాటాలతో పాటు 1917 లో రష్యన్ కార్మిక వర్గం దేశంలోని జాతులన్నిటినీ ఏకం చేసి జరిపిన అక్టోబర్ విప్లవం అంతర్జాతీయంగా వ్యాపించి ఉన్న కార్మిక ప్రపంచానికి ఒక గొప్ప విస్ఫోటనం లాగా, అద్భుతమైన వర్గపోరాటంగా రూపుదిద్దుకుంది.

తనకు  గొప్ప ప్రేరణ నిచ్చిన  19 వ శతాబ్దంలోని తన ముందు తరాల ఉద్యమాల నన్నిటినీ, విప్లవ పోరాట ప్రభావాలనన్నిటినీ  ఈ సినిమాలో అపురూపంగా ఆవిష్కరించారు ఐసెన్ స్టీన్.

ఇక ఈ సినిమా రెండో లక్షణం-సమూహాల కథ. కార్మిక సమూహాల కథ. ఇది ఏ ఒక్కరి కథా కాదు. ప్రాంతం రష్యా కావచ్చు గానీ ప్రపంచమంతా వ్యాపించి ఉన్న కోట్లాది శ్రమజీవుల కథ. వస్తువు విశ్వజనీన మైనది. సినిమా ప్రారంభమే వ్లాదిమిర్ లెనిన్  కొటేషన్ – “The strength of the working class is organization. Without organization of the masses, the proletarian is nothing. Organized it is everything. Being organized means unity of action, unity of practical activity” తో మొదలవుతుంది. తర్వాత బాతులు, బాతు పిల్లలు, పిల్లి పిల్లలు, పందిపిల్లలు, మొదలైన జంతువుల యొక్క ఫుటేజ్  కనిపిస్తుంది. యాజమాన్యం-పెట్టుబడి పెట్టిన వాటాదారుల సమావేశంలో ఒక నిమ్మకాయను రసం తీసే మెషీన్ లో పెట్టి పీల్చి పిప్పి చేస్తుంటాడొక వాటాదారుడు.అంటే శ్రమిస్తున్న మనుషులమీద అపరిమితమైన ఒత్తిడి ఉందని, వాళ్ళను సాటి మనుషులుగా కాక జంతువుల కంటే హీనాతిహీనంగా చూస్తున్నారని దీనర్ధం. కార్మికులు ఐక్యంగా ఉండి వళ్ళంతా కళ్ళు చేసుకుని, ఎంతో శ్రద్ధాసక్తులతో తమ డిమాండ్లను ఒక రాతప్రతి లో రూపొందిస్తారు.యాజమాన్యం-వాటాదారులు అసలు వర్కర్స్ ని ఏమాత్రం ఖాతరు చెయ్యకుండా ఆ దరఖాస్తు ఫారం గురించి అసలు సీరియస్ గా తీసుకోకుండా దానితోనే టేబిల్ మీద చిందిన మత్తుపానీయాలను తుడుస్తారు. కార్మికులు ప్రాణాలుగ్గబట్టి రాసిన దరఖాస్తులోని విషయాలు శ్రమ జీవులకు జీవన్మరణ సమస్యలు. అవే సమస్యలు యాజమాన్యాలకు పనికిమాలినవిగా, అసంబద్ధంగా కనిపిస్తాయి. వేళ్ళతో లెక్కించదగినంత మంది, వేలాది మంది జీవితాలను నిరంకుశంగా శాసిస్తున్న విధానాన్ని (అచ్చం ఇప్పటి కార్పొరేట్ శక్తులు శాసిస్తున్నట్లే) ప్రేక్షకులకందించి ఆలోచించమంటారు ఐసెన్ స్టీన్. ఉద్రిక్తతలు, కష్టాలు, శ్రామికవర్గ త్యాగం మొదలైన ఉద్విగ్న సందర్భాలను తన కథనం ద్వారా ఏకైక దృశ్య భాష మూకీలో ప్రదర్శించడంలో ఒక అద్భుతమైన అవగాహన, మేధావితనం స్పష్టమవుతుంది. వందల మంది తారాగణంతో సినిమా ఆద్యంతం అద్భుతమైన వివరాలు అందిస్తూ, శ్రామికవర్గ విలువల్ని పటిష్టం చేస్తూ  శ్రామికవర్గ ప్రచారాన్ని  చిత్రీకరించడంలో వల్లమాలిన నేర్పరితనం చూపిస్తారు ఐసెన్ స్టీన్.ఇది చాలా ప్రతిభావంతమైన సమూహాల కథా కథనం.

ఇక మూడోది మాంటేజ్ ఆవిష్కరణ. మాంటేజ్ అంటే ఫ్రెంచ్ లో ఆకర్షణ అని అర్ధం .ప్రతి చిత్రం ఓ పుట్టుక.ఓ కొత్త జన్మ ఎత్తడం అన్న ఐసెన్ స్టీన్ రెండు పరస్పర విరుద్ధ శక్తుల సంఘర్షణలో ఓ నూతన శక్తి ఆవిర్భవిస్తుందనే మార్క్స్ గతి తార్కిక భౌతికవాదాన్ని ఆధారంగా చేసుకుని “మాంటేజ్” కి అన్వయించారు. దీనికి ఆయనే ఆద్యుడు. ఇంతకుముందు మాంటేజ్  దర్శకులు వెర్టోవ్, పుడోవ్ కిన్ లాంటి వారున్నప్పటికీ ఐసెన్ స్టీన్ వాళ్ళకి భిన్నమైనవారు. ఐసెన్ స్టీన్ ఈ సినిమా తీస్తున్న సమయానికి రష్యా ప్రజలు 80% నిరక్షరాస్యులు. రోజు రోజుకీ, క్షణ క్షణానికీ ఉధృతమవుతున్న విప్లవోద్యమంతో ప్రేక్షకుణ్ణి మమేకం చెయ్యడాని కీ, రాజకీయ ఆలోచనలు చెప్పడానికీ  మాంటేజ్ ని ఎన్నుకున్నారు ఐసెన్ స్టీన్. దృశ్య భాష ద్వారా రాజకీయ సందేశాలను తెలియజేసేందుకు మాంటేజ్ లోని విస్తారమైన అవకాశాలను వాడుకుని ప్రజలకు అవగాహన కలిగించి, చైతన్య పరచడానికి ప్రయత్నించారు. విభిన్న భాషల, జాతుల ప్రజలను చైతన్య పరచడానికి సినిమాకు మించిన కళారూపం మరొకటి లేదనిఅన్న లెనిన్ సూత్రీకరణను నూటికి నూరుపాళ్ళూ వాడుకున్నారు.

మాంటేజ్ ని అర్ధం చేసుకోవడానికి ప్రేక్షకుల్ని సంసిద్ధం చేసుకుంటారు ఐసెన్ స్టీన్.ఉదాహరణకి సైన్యం చేతిలో కార్మికులు చనిపోతున్న కౄరదృశ్యాన్ని  పశువుల వధ జరుగుతున్నట్లు  గ్రాఫిక్ చిత్రాలతో చూపించి ప్రేక్షకుల దిమ్మ తిరిగేట్లు చేస్తారు. యాకోవ్ మీద దొంగతనం ఆపాదిస్తున్న సీన్ లో యాకోవ్ క్లోజ్ అప్,మేనేజర్ క్లోజ్ అప్ రెండూ కనిపిస్తాయి.రెండు షాట్స్ ఒకదానితో ఒకటి ఘర్షణ పడతాయి. యాకోవ్ ని చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు అతని పట్ల సహానుభూతితో ఐడింటిఫై అవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు ఐసెన్ స్టీన్ . మేనేజర్ క్లోజ్ అప్ షాట్ చూస్తున్నప్పుడు మేనేజర్ నేరుగా తనమీదే దొంగతనం నేరారోపణ చేస్తున్నట్లు ప్రేక్షకుడు ఫీలవుతాడు. ఈ రెండు షాట్లనుంచి ఐసెన్ స్టీన్ సాధించదలచుకున్న మూడో ప్రయోజనం-దొంగైనందుకు మేనేజర్ యాకోవ్ ని తిట్టడమే కాదు,తాను దొంగగా భావిస్తున్న యాకోవ్ పక్షం వహిస్తున్న ప్రేక్షకుణ్ణి కూడా తిడుతున్నట్లు ప్రేక్షకుడు ఫీలయ్యేలా చెయ్యడం. ఇది ఒక అత్యద్భుతమైన ప్రయోగం.తెలుగులో మన మహాకవి శ్రీ శ్రీ కూడా తన రచనల్లోని చరమరాత్రి కథల్లోనూ,”గుమస్తా కల”మొదలైన రేడియో నాటికల్లోనూ మాంటేజ్ ని ప్రయోగాత్మకంగా శక్తివంతంగా వాడి విజయం సాధించారు.

విప్లవ కాలంలో ఇంజనీరింగ్ చదువు మాని రెడ్ ఆర్మిలో పని చేసిన చైతన్యశీలి ఐసెన్ స్టీన్. 27 ఏళ్ల వయసులో (స్ట్రైక్ సినిమాకి ముందు) 1925 లోనే దృశ్యీకరించిన బాటిల్ షిప్ పొటోంకిన్ ఒక సృజనాత్మక విస్ఫోటనం. ప్రపంచ సినిమా ప్రేక్షకుణ్ణి దిగ్భ్రాంతికి గురి చేసింది. సోవియట్ యూనియన్ లో సోషలిస్టు రాజ్య స్థాపన గురించి తీసిన ఈ సినిమా సృష్టించిన విప్లవ ప్రకంపనాలకు కంపించిన బెర్లిన్, బ్రిటన్ దేశాలు చిత్రాన్ని నిషేధించాయి.అమెరికా కూడా భయంతో చిత్రంలోని కొన్ని భాగాలు కత్తిరించింది. స్ట్రైక్ సినిమా తర్వాత వచ్చిన అక్టోబర్ చిత్రంలో కూడా జార్ చక్రవర్తి “వింటర్ ప్యాలెస్” పై విప్లవ వీరుల దాడిని అమోఘంగా దృశ్యీకరించారు. ప్రపంచాన్ని గజ గజలాడించిన పది రోజులు అనే జాన్ రీడ్ రచన ఆధారంగా ఈ సినిమాని చిత్రీకరించారు. ఇదంతా గమనించినప్పుడు ఐసెన్ స్టీన్ వ్యక్తిత్వం లోనే కార్మిక రాజ్యం రావాలనే ఆకాంక్ష ఉందనీ, శ్రమజీవుల పట్ల అపూర్వమైన ప్రేమాభిమానాలున్నాయనీ అర్ధమవుతుంది.తన ముందు తరాల విప్లవ పోరాట ప్రభావాలన్నీ ఈ సినిమాలో అపురూపంగా ఆవిష్కరించారు. ఆయన ఎవరి మెప్పు కోసం ఈ సినిమా తియ్యలేదు.సమాజంలోని అట్టడుగు మనుషులు, జంతువులకంటే హీనంగా చూడబడుతున్న మనుషుల పక్షం వహించి, వారి పట్ల ఆయనకున్న నిజాయితీ, నిబద్ధతలను చాటి చెప్పారు!

చూడగానే మనసు చలించే   గొప్ప దృశ్యాలు చాలా ఉన్నాయీ సినిమాలో!

ఒక నెత్తుటి ముఖం, ఒక మండే ఆయుధం ఉపయోగించి, సాధించదలచుకున్న మూడో ప్రయోజనాన్ని స్ఫురింపజేస్తారు!!

సైన్యం సమ్మెను విధ్వంసకరంగా అణిచివేస్తుంది. అసలు సైన్యం ప్రజలకు సేవ చెయ్యాలి.కానీ ధనస్వామ్యానికీ బూర్జువా, కులీన వర్గాలకు సేవ చేస్తుందని చెప్పకనే చెప్తారు ఐసెన్ స్టీన్.

యాజమాన్యం-వాటాదారుల విలాసవంతమైన జీవితాలనూ వాళ్ళకి కార్మికుల పట్ల ఉన్న ఏహ్య భావాన్నీ తెలిపే దృశ్యాన్ని ప్రతిమనిషీ చూచి తీరాలి! యాజమాన్యం-వాటాదారుల సమావేశంలో ఒక నిమ్మకాయను జూస్ తీసే మెషీన్ లో పెట్టి పీల్చి పిప్పి చేస్తుంటాడొక వాటాదారుడు.అంటే శ్రమిస్తున్న మనుషులమీద అపరిమితమైన ఒత్తిడి ఉందని, వాళ్ళను సాటి మనుషులుగా కాక జంతువుల కంటే హీనాతిహీనంగా చూస్తున్నారని దీనర్ధం.

కార్మికుడు తన కుటుంబ పోషణ కోసం పని చెయ్యాల్సింది 6 గంటలు మాత్రమే నంటారు మార్క్స్. కార్మికునికి చెందవలసిన భోజన విరామ సమయాన్ని, ఇతర విశ్రాంతిని కొద్ది కొద్దిగా తగ్గించి తన లాభాలు పెంచుకుంటూ వచ్చాయి యాజమాన్యాలు. ప్రతిరోజూ భోజన విరామ సమయాన్ని పది నిమిషాలు తగ్గించడం ద్వారా ఏడాదికి వెయ్యి పౌండ్లు లాభం వచ్చిందని ఆనందంగా వికటాట్టహాసం చేశాడట ఒక యజమాని. ఇదే స్త్రీల విషయంలో నైతే ఇంకా శ్రమ దోపిడీ చేస్తారు.నేను పని చేసిన ఫెమినైజ్డ్ టెలిఫోన్ ఏక్చేంజి లలో నైతే గంట ఉండాల్సిన భోజన విరామ సమయాన్ని తగ్గించి 10 నిమిషాలే ఇచ్చేవారు! కలుపుకొచ్చుకున్న బాక్స్ల లోని  అన్నాన్ని చార్లీ చాప్లిన్ “మోడరన్ టైమ్స్ ” సినిమాలో యంత్రం ఒక్కొక్క కార్మికుడి దగ్గరకొచ్చి తినిపించినట్లే మేము గుక్కతిప్పుకోకుండా గుటకలు వేస్తూ తినడం ముగించేవాళ్ళం. అరగంట టీ సమయం తగ్గించి 5 నిమిషాలే ఇచ్చేవారు! మధ్యలో అర్జెంట్ గా బాత్రూం అవసరాలొస్తే “ఒన్ మినిట్ ప్లీజ్” అని అడుక్కుని వెళ్ళేవాళ్ళం1!

“తొమ్మిది, పదేళ్ళ పిల్లల్ని, అర్ధరాత్రి రెండు, మూడు, నాలుగు గంటలకు నిద్ర లేపి తెల్లవారి పది, పదకొండు, పన్నెండు దాకా పని చేయిస్తారు.ఆ పరిస్థితిలో వాళ్లు జీవచ్చవాల కన్నా ఎక్కువేమీ కాదు” అని నాటింగాం లోని లేసు పరిశ్రమ గురించి ఆ రోజుల్లో రిపోర్ట్ చేసింది డెయిలీ టెలిగ్రాఫ్ పత్రిక (మార్క్స్ పెట్టుబడి-రచనా క్రమం,ఫ్రాన్సిస్ వీన్, అనువాదం-ముక్తవరం పార్ధసారధి అరుణ తార,ఏప్రిల్ 2016)

వాస్తవాలిలా ఉంటే పెద్దలకు 8 గంటలు, పసివారికి 6 గంటలు కావాలని డిమాండ్ చెయ్యడం చట్టబద్దం కాదట! సాటి మనిషిని మనిషిగా చూడడమనే విషయం  సమాజ నాగరికతలో భాగమవ్వాలి. కానీ అది కూడా ఒక   డిమాండ్ గా పెట్టవలసి రావడం ఎంత విషాదం! పైగా అది న్యాయసమ్మతం కాదట! ఎన్నెన్ని గడ్డుకాలాల్ని దాటి మనకిప్పుడున్న సౌకర్యాలనందించారు మన పూర్వులు? మన ముందు తరాలవారి ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న 8 గంటల పనిదినం ఇవాళ కార్పొరేట్ శక్తుల చేతుల్లో హరించుకుపోయి మళ్ళీ మన తరాలు, మన భావి తరాలు గంటలతరబడి పని చేసే స్థితిలోకి నెట్టబడ్డారు.ఇంకా విచిత్రమేమిటంటే ఇంటి నుంచి పని చెయ్యడం ఒక సౌకర్యంగా చిత్రిస్తున్నారు.దానివల్ల యాజమాన్యం కార్మికులకు సమకూర్చవలసిన సౌకర్యాల నుంచి, కార్మికులు హక్కులుగా పొందవలసినవాటి నుంచి  యాజమాన్యం ఏ మాత్రం బాద్యత వహించకుండా  హాయిగా తప్పించుకుంటుందని కార్మికులు కూడా గమనించడం లేదు. మార్క్స్ చాలా లోతుగా విశ్లేషించి చెప్పిన శ్రమదోపిడీకి ఇదొక పరాకాష్ట!

పరిశ్రమల యాజమాన్యాలు వారి స్వంత సాయుధ బలగాల నేర్పరచుకొని, గూఢచార వ్యవస్థ ద్వారా చైతన్యవంతులైన కార్మికుల గురించీ, వారి నాయకుల గురించీ రహస్య సమాచార సేకరణ చేసేవారు. అలా కనిపెట్టిన సమాచారాన్ని బట్టి యాజమాన్యాలు వారి స్వంత సాయుధ బలగాల ద్వారా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేసేవారు. నాయకులను జైళ్ళ పాలు చేసేవారు.

ఎంతో శ్రమకోర్చి ఎన్నో అద్భుతమైన సీన్లను ఈ చిత్రంలో కార్మికుల పక్షం వహించి ఎంతో హృద్యంగా దృశ్యీకరించారు ఐసెన్ స్టీన్.

కార్మికులందరికీ, శ్రామిక సమూహాలన్నీటికీ, ఆ మాటకొస్తే సామాన్య ప్రజలందరికీ విశ్వ వ్యాప్తంగా వర్తించే సామాజిక ఇతివృత్తంతో, మాంటేజ్ టెక్నిక్ ని సమర్థవంతంగా ఉపయోగించి, ఈనాటికీ వర్తించేలా స్ట్రైక్ సినిమాని రూపొందించి చలన చిత్ర చరిత్రలో  తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు ఐసెన్ స్టీన్.

ఇప్పటి యూనియన్ నాయకులూ, వారి కపట నాయకత్వాలను తలచుకుంటే  నిరాశా, నిస్పృహలు ముంచుకొస్తున్నాయి. కార్మికుల పక్షం వహించిన ఇంత అద్భుతమైన వ్యక్తి ఈ భూమి మీద ఒకప్పుడు సంచరించారంటేనే మనసు సంతోషంతో నిండిపోతుంది.

ఇంకో వెయ్యి సంవత్సరాలకైనా మనదేశంలో ఇటువంటి సినిమాని ఆశించలేము!ప్రేక్షకుల హృదయాలలో లేని జుగుప్సాకరమైన అభిరుచులను వెలికితీసి రెచ్చగొట్టే మన దర్శక నిర్మాతలు కళ ప్రజలకోసం అని గుర్తించి ఎప్పటికైనా ఇంతటి ఉత్తమ విలువలను పోషించే చిత్ర నిర్మాణం చెయ్యగలరా?

శ్రమజీవుల గురించి తపించే వారందరూ ఈ సినిమాని తప్పనిసరిగా చూడాలి! కూలిపోతున్న జీవితాలను నిలబెట్టడానికే కాదు, మనల్ని మనం నిలబేట్టుకోవడానికి కూడా ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి తీరాలి!!

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

అదే… ఆకాశంలో ఇంద్రధనస్సు!

 

అనగనగా ఒక ఊరు.

ఊరంటే మామూలు ఊరు కాదు.

అందమైన ఊరు.

అంతకన్నా అందమైన మనుషులు.

ఆ అందమైన మనుషులకు ప్రకృతి అంటే ప్రాణం.

అందువల్ల ఆ ఊళ్ళో పచ్చ పచ్చటి చెట్లు.

ఆ పచ్చా పచ్చాని చెట్లను చూసి వనదేవత తెల్ల తెల్లని చెరువులు, పొంగిపొర్లే చెరువులు ఇచ్చింది.

ఓసోస్ వనదేవతేనా పులకించిపోయేదని, వరాలిచ్చేదని భూమాత ఆ ఊరికి నీలి నీలపు కొండలు ఇచ్చింది.

గరుత్మంతుడు ఎర్రగా బుర్రగా ఉండే పిట్టలు పంపించాడు.

ఎన్ని రంగుల పిట్టలో? రంగురంగుల పిట్టలు.

నీలి నీలి నెమళ్ళు.

ఆకుపచ్చని చిలకలు.

ఎర్ర ఎర్రని లకుముకిపిట్టలు .

వంగపండు వడ్రంగిపిట్టలు.

పసుప్పచ్చని పైడికంటిపిట్టలు.

నారింజరంగు జీనువాయిపిట్టలు.

ఇల్లా ఒకటి కాదు రెండు కాదు బోల్డు బోల్డు పిట్టలు.

ఆ ఊరు చూసి అందరూ అసూయపడేవారు.

చివరికి దేవతలు కూడా.

వంగపండు వడ్రంగి పిట్టలు టకటక తకధిమి అని తలలతో సంగీతం వాయించేవి

అరెవా! అంత సంగీతానికి తగ్గట్టు నాట్యం ఉండొద్దూ అంటూ నీలి నెమళ్ళు రోజూ బయట పురులు విప్పి నిలబడేవి.

ఆ పురులు, ఆ అందాలు, ఆ సంగీతాలు చూసి పిట్టలన్నీ కేరింతలు.

కేరింతలంటే ఏమిటి?

సంతోషంతొ చేసే గోల, ఆర్భాటం.

సంతోషం ఎక్కువైన చోట పిల్ల పిట్టల ఆటలు, పాటలు తప్పకుండా ఉంటవి.

పిల్లల ఆటలంటే ఉరకలు, పరుగులు.

ఈ ప్రపంచకంతో సంబంధం లేనట్టుండే ఉరకలు, పరుగులు, పాటలు, సంగీతాలు

ఓ రోజు ఆకాశంలో దేవతలంతా, రాజుగారైన ఇంద్రుడితో పాటు కైలాసానికి వెడుతూ ఈ ఊరిని దాటుతున్నారు

కిందంతా గోల గోలగా ఉన్నది

ఇంత గోలగా ఉన్నదేమిరానని తల వంచి చూసినారు

అందరితోపాటు ఆ ఆటలు పాటలు తాను కూడా చూసాడు ఇంద్రుడు.

ఆయనకు ఆ ఆటల ఐడియా నచ్చింది

ఆ వెంటనే ఒక ఆలోచన వచ్చింది

ఆలోచన, అది కూడా ఇంద్రుడికి వచ్చింది.

ఇంద్రుడంటే ఎవరు ?

ఇంద్రుడంటే రాజుగారు.

దేవతలకు రాజుగారు.

రాజుగారంటే మాటలా?

రాజుగారు ఏది చెపితే, ఏదనుకుంటే అది అయిపోవాల్సిందే

దేవతలందర్నీ పిలిచాడు.

మనం కూడా ఆటలాడుకుందాం అన్నాడు.

అంతే, గుసగుసలు మొదలైనాయి.

కొంతమంది వింతగా చూసారు.

కొంతమంది మా వల్ల కాదన్నారు.

కొంతమంది మమ్మల్నొదిలెయ్ నాయనా అన్నారు.

ఎప్పుడూ రాక్షసులతో యుద్ధాలు, అప్సరసల నాట్యాలు ఏవిటి చూస్తాం అనుకున్న కొంతమంది సంబరపడ్డారు.

తర్జనభర్జన పడుతున్నారు.

తర్జనతోనూ భర్జనతోనూ ఏమిటొస్తుందీ?

ఇహ ఇలా లాభం లేదని అష్టదిక్పాలకుల్ని పిలిచాడు.

ఆడుకుందాం పదండన్నాడు.

ఎవరికి తప్పినా వాళ్ళకు తప్పదుగా!

రాజు గారి దగ్గర కొలువులో ఉన్నారయ్యె.

ఆజ్ఞ ధిక్కరిస్తే తల తీసి ఆకాశగుమ్మానికి వేళ్ళాడదీస్తాడేమో!

ఏమో మరి, అంత పని చేస్తాడు, చెయ్యగలడు ఆయన.

అదీ భయం. ఆ పవరు అంటే భయం

అవతలివాడికి పవరున్నవాడంటే, ఏం చేస్తాడో తెలియని భయం.

అందువల్లే ఆ పవరుకోసం పోట్లాటలు

ఈ లోకంలో అందరూ అర్రులు చాచేది దానికోసమే

ఆ గొడవంతా పట్టం ఎందుకని సరేనన్నారు వాళ్ళు.

ఏ ఆట ఆడడం సార్ అనడిగారు.

ఎలా ఆడతామన్నారు ? మరి రూల్సు రాళ్ళు రప్పలు ఏమిటన్నారు ?

అలా రూల్సు గట్రా ఏమిటని అడగ్గానే ఇంద్రుడు తలగోక్కొని  ఆలోచించాడు.

మళ్ళీ ఓ సారి కిందకు చూచాడు.

ఆ కింద, రూల్సు రప్పలు ఏవీ ఉన్నట్టు కనపడని ఉరకలు పరుగులు కనపడ్డాయ్.

రూల్సు గట్రా ఏమీ లేవు , అందరం పరుగులెత్తుదాం పదండి అన్నాడు.

ఇదేమి ఆటండీ ? ఆయినా ఆకాశంలో ఎక్కడ పరుగులు పెడతాం అన్నారు దిక్పాలకులు ?

ఏవండీ అంటే అన్నానంటారు, ఆ తెల్ల మబ్బులున్నవి ఎందుకు, వాటి మీద పెట్టండి అన్నాడు ఇంద్రుడు.

తెల్ల మబ్బులు ఖంగారు పడ్డాయ్.

కొన్ని మబ్బులు ఈ రాజుగారి ఆట మా ప్రాణానికొచ్చిందిరా అనుకున్నాయ్.

పొరపాటున బయటకే అనేసాయ్.

అది చూశాడు ఇంద్రుడు. అది విన్నాడు ఇంద్రుడు.

ఛస్! నా ఆజ్ఞకు ముహం మాడుచుకుంటారా? ఆ మాడ్పు లానే మీరు కూడా మొత్తం నల్లగా అయిపోయి జీవితమ్మొత్తం అలాగే గడపండి అని శాపం పెట్టిపారేశాడు.

మొహం మాడ్చుకున్న మబ్బులన్నీ నల్లగా అయిపోయినై.

ఏడుస్తున్నాయ్.

వాటి ఏడుపే వాన అయిపోయింది.

ఆరోజునుంచి, పైనుంచి పడే వానకు ఆ నల్ల మబ్బుల ఏడుపే కారణం

ఇంద్రుడికి ఇంకా కోపం తీరక, మిగిలిన తెల్ల మబ్బులన్నీ ప్రేక్షకులుగా ఉండమని ఈ నల్లమబ్బుల మీద ఆట మొదలుపెట్టాడు.

ఆట మొదలయ్యింది. దేవతల పరుగులాట మొదలయ్యింది

కొంతసేపు అందరూ అటూ ఇటూ పరుగెత్తాక, గందరగోళంగా ఉండటంతో, అందరూ ఓ చోటికి చేరి తూర్పు చివరి నుంచి మొదలుపెట్టి పశ్చిమం చివరి దాకా ఎవరు ఫాష్టుగా పరుగెత్తుతారో వాళ్ళు గెలిచినట్టు అని తీర్మానించారు

సరే, ఈ రూల్సు లంపటం నాకు పెట్టకుండా వాళ్ళే తీర్మానించారుగానని చంకలు గుద్దుకొని ఇంద్రుడు పరిగెత్తటం మొదలెట్టాడు.

వాయువు, ఓస్ ఇంతేనా! రాజుగారండీ, మీరు మీ పరుగూ ఓ లెక్కా నాకు అని, మాజ్డా కారులా జూం జూం అని ఇంజను దడదడలాడించి పరుగెత్తటం మొదలుపెట్టినాడు.

అది చూసాడు ఆదిత్యుడు. వార్నీ కొంపలంటుకుపోతాయ్ ఈ వాయువుగాడు రాజుగార్ని ఓడించాడంటేనని ఏడు గుర్రాల బండెక్కి పరిగెత్తిపోయి వాయువుని – ఒరే నెమ్మదిరా నాయనా, రాజుగార్ని గెలవనియ్యమని ఒప్పించి ఆ వేగం తగ్గించాడు.

అలా ఇంద్రుడు గెలిచాడు.

కేరింతలు కొట్టాడు.

ఆ సంతోషంలో ఓడిపోయినవాళ్ళందరి మబ్బుల మీద వజ్రాయుధంతో ఓ దెబ్బా వేశాడు.

మెరుపులు పుట్టినై.

ఆ మెరుపులే మనం చూసే మెరుపులు

ఇంకోసారి పరిగెత్తుదాం అన్నాడు.

ఇష్హో, అష్హో అని అనుకుంటూ , కాళ్ళీడ్చుకుంటూ దిక్పాలకులు పరుగులెట్టారు.

రాజుగారు కాబట్టి ఆయన్నే మళ్ళీ గెలవనిచ్చారు.

నాలుగు రవుండ్లయినై.

నాలుగు సార్లూ ఇంద్రుడే గెలిచాడు, మబ్బుల మీద దెబ్బలు వేసి మెరుపులు తెప్పిస్తూనే ఉన్నాడు.

ఐదో రవుండ్లో కూడా గెలిచి మబ్బుల మీద కొడుతుంటే వజ్రాయుధం సర్రున చేతిలోంచి జారిపోయింది.

ఆ ఊళ్ళో పడిపోయింది.

భూమి లోపలికంటా వెళ్ళిపోయింది.

భూమాతకు కోపం వచ్చేసిందయ్యోయ్.

ఆవిడ కాళికా మాత అయిపోయింది.

ఒరోరి ఇంద్రా, నీ వజ్రాయుధంతో నాకు నొప్పి పుట్టిస్తావా? ఇక నువ్వది తీసుకోలేవ్ ఫో అని ఆ ఆయుధాన్ని పొడి పొడి చేసేసి వజ్రాలుగా మార్చేసింది.

ఇంద్రుడు బిక్కమొహం వేసాడు.

ఇదేమిట్రా ఇలాగయ్యిందని.

ఇప్పటిదాకా ఆడుకున్నాం. పాడుకున్నాం. గెలిచాం. ఓడాం. ఇంతలో ఈ విపరీతం ఏమిటి, చేతిలో ఉన్న ఒక్క గొప్ప ఆయుధం పోయిందేనని దిగాలుగా కూర్చున్నాడు.

రాజుగారు దిగాలుగా కూర్చోటం చూసి కొంతమంది కష్టపడ్డారు, కొంతమంది ఇష్టపడ్డారు

మనసు కష్టపెట్టుకున్నవాళ్లలో సూర్యుడు ఒకడు.

ఎప్పుడు కానీ, అప్పుడప్పుడు కాని దిగాలుగా కూర్చునే వాళ్ళంటే సూర్యుడికి పడదు.

అందుకు ఆయన ఉరుకులు పరుగుల మీద వొచ్చేసి ఓ రాజరాజ నీకు ఆయుధం కావాలి అంతేగా! నేనిస్తా, ఇంత పెద్దదిస్తా, అన్నిటికన్నా పెద్దదిస్తా తీసుకో అన్నాడు.

ఇంద్రుడి ముహం వెలిగిపోయింది.

సరే ఇవ్వు అన్నాడు సూర్యుడి చేతులు పట్టుకొని తబ్బిబ్బైపోతూ!

సూర్యుడు ఉండు ఒక్క నిమిషం, తెచ్చిస్తా అని కింద ఉన్న ఊళ్ళోకి వచ్చేశాడు.

పిట్టల్ని పిలిచాడు. మీ ఈకల్లో కొన్ని నాకిచ్చెయ్యండి అన్నాడు.

అన్ని పిట్టలు సూర్యుడొచ్చాడని ఊగిపోతూ ఈకలిచ్చేసినై.

అవన్నీ కుప్ప చేసుకుని పొయ్యాడు సూర్యుడు.

అందులో వెలిగిపోతున్న రంగుల్ని కొన్ని తీసుకున్నాడు.

చకచకా ఒక ఆయుధం తయారు చేసాడు.

తీసుకెళ్ళి ఇంద్రుడికిచ్చాడు.

ఇంద్రుడు దాన్ని పట్టుకోలేక సతమతమైపోయినాడు.

చేతులు పట్టనంత పెద్దదైపోయింది అది.

మొత్తానికి కష్టపడి చేతుల్లోకి తెచ్చుకున్నాడు.

దీన్ని పెట్టుకోవాలంటే దేవేంద్రలోకం సరిపోదు. ఎక్కడ దాచిపెట్టాలన్నాడు.

ఇప్పటిదాకా ఆడుకున్నావుగా రాజా మారాజా, ఆకాశం ఉందిగా అక్కడ పెట్టుకో అన్నాడు సూర్యుడు.

సరే, మళ్ళీ ఓ సారి పరుగులాట ఆడదాం అని ఆట మొదలుపెట్టాడు.

షరా మామూలుగా గెలిచాడు.

గెలిచిన ఆనందంలో చేతిలో ఉన్న ఆయుధాన్ని మబ్బుల మీద తాటించాడు.

ముసిముసిగా నవ్వుకుంటూ సూర్యుడు దాక్కున్నాడు, ఆ నవ్వు ఎక్కడ కనపడుతుందోనని.

ఆకాశం అంతా ధగధగా మెరిసిపోయింది ఉన్నట్టుండి.

ఆ రంగులతో. ఆ ప్రకాశవంతమైన రంగులతో. ఏడు రంగులతో!

ఇంద్రుడు ఆటాడినప్పుడల్లా, గెలిచినప్పుడల్లా, నల్ల మబ్బులు ఏడ్చినప్పుడల్లా, ఆయుధం తాకించినప్పుడల్లా ఆకాశం మెరిసిపోతూనే ఉంది.

సూర్యుడు ముసిముసిగా నవ్వుతూనే ఉన్నాడు.

అదే ఆకాశంలో ఇంద్రధనస్సు అయ్యిందయ్యా!

అలా ఇంద్రధనస్సు పుట్టిందయ్యా!

అయ్యా అదీ ఇంద్రధనస్సు సంగతి….

ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఒక బల్గేరియన్ కథలో ఒక అబ్బాయి రంగు పిట్టల ఈకలు చూసి ఇంద్రధనసు ప్రస్తావన తీసుకొని రావటం చదివాక వచ్చిన ఆలోచనతో రాసుకున్న పిట్ట కథ ఇది…పిట్టల కథ ఇది…ఇంద్రధనస్సు కథ ఇది…

*

ప్రేమకి చిరునామా శివలెంక రాజేశ్వరి!

Satyam Vaddu Swapname Kavali Title copy

-కొండేపూడి నిర్మల

~

భావుకత విషయ౦లో మరో రేవతీ దేవి మన శివలెంక రాజేశ్వరి .

మామూలు అంచనాలతో రాజేశ్వరిని  నిర్వచీంచడం చాలా కష్టం . కొంచెం కొత్త చూపు తెచ్చుకోవాలి.  ఆ చూపు బాహ్యా చర్మాన్ని దాటి మనసులోకి ప్రయాణించగలిగి వుండాలి. అ౦త ప్రయత్నం చెయ్యడానికి ఎవరికేం పని ?కాబట్టి పనిలేని వాళ్ళ౦దరూ ఆమెను పజిల్ గానే భావిస్తారు. నా దృష్టిలో రాజేశ్వరి   కొన్ని అక్షరాలు చదివి,అక్షరాలు రాసి, అక్షరాల్ని శ్వాసించి, అక్షరాలా ఈ ప్రపంచం నిరక్షరంగా , నిర్ధాక్షిణ్యంగా  కనిపించి తట్టుకోలేక వెళ్ళిపోయింది.. అసలంత భావుకతని ఏం చేసుకుంటాం కూర వండుకుంటామా, చారు కాచుకు౦టామా అని వాదించే వాళ్ళ మధ్య  అరవై వసంతాలు జీవించింది.  ఇంతకంటే విజయమూ వీర మరణమూ  ఇంకోటి వుందని కూడా నేను అనుకోవడంలేదు. ఎవడో ఒక  గొట్టాం గాడ్ని  తప్పనిసరిగా  పెళ్లి చేసుకోవడం , ఎలాగోలా కాపుర౦ చేసి  , ఎందర్నో అందర్ని కనడం , జీవితాన్ని ఈ రకంగా మూడు ముక్కలు చేసి ఒక్కో  ముక్కనీ ఒక మగవాడి నీడన  బతికేయ్యడం లాంటి  మూసకి భిన్నంగా బతకాలనుకుంది. ఎందుకంటే ఇ౦దులో మనసుకెక్కడ చోటుంది.  గంగిరెద్దు వేషం తప్ప అంటుంది రాజేశ్వరి.

నిజమే కదా జీవితం ఒక సూపర్ బజార్ అయితే ఆక్కడ వున్న వాటిలోనే ఏదో ఒకటి ఎంచుకోవడం అనే పని తను చెయ్యలేకపోయింది. అందుకు భారీ మూల్యమే చెల్లించి౦ది.

గమనించారో  లేదో ఇవే మాటలు ఒక మగవాడు చెబితే గొప్ప అనార్కిస్టుగా గౌరవిస్తా౦. ఆడదానిక౦త భావ చైతన్యం వుండటం ఎవరూ సహించరు.  కుటుంబమూ  సమాజము ఒక్కటై గగ్గోలు పెట్టేస్తాయి.

జ్ణాన సముపార్జన కోసం ఇల్లు విడిచిన గౌతముడు ఒక ఆడదిగా పుట్టే అవకాశం ఎప్పుడూ లేదు.

రాజేశ్వరిని మొదటి సారి ఆ౦టే 1980 ప్రాంతాల్లో విజయవాడ రేడియో స్టేషన్లో చూసినట్టు గుర్తు. మధ్యతరగతి ఆడపిల్లలు పబ్లిగ్గా స్వేచ్చ గురించి   మాట్లాడ్డానికే భయపడే  ఎనభయ్యోదశకంలో  రాజేశ్వరి జగ్గయ్యపేట నుంచి ఒక స్నేహం కోసమా ,  కవి పరిచయం కోసమో వచ్చేసి , ఆఖరి బస్సు దాటిపోయి ఏ స్నేహితురాలి ఇంట్లోనో వుండిపోయేది. ఎదుటి మనిషిని తూకంవెయ్యడాలూ , అనుమానించడాలూ తన నిఘంటువులో లేవు. రాజేశ్వరి పసి మనసుకి అద్దం పట్టే ఈ కవిత చూడండి.

“వాళ్ళు గొప్పవాళ్లు సుమా

రుణాలూ వుండవు, ఋణ బ౦ధాలూ  వుండవు ,

అక్ఢరాలా కాపలాలు వుంటాయి.

మనకి మనల్నే   కాపలా పెడతారు

వాళ్ళకి కుటుంబం ఆ౦టే మొగుడు, ఇల్లూ , పిల్లలు

 స్నేహితులు శాశ్వతంగా వుంటారుటండీ అనేస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే,

మనకేమో ఆటోచ్చి ఒక సంతోషం, ఇటోచ్చి ఒక దిగులు ,

 మిణుగురు నుంచీ  కూడా వెలుగు తీసుకోవాల౦టే  నవ్వి పోతారమ్మా.

ఇన్నోసెన్స్ పోగొట్టుకుని ఇ౦టెలిజెట్స్  అయిపోతే ,

చిన్ని నాపొట్టకి శ్రీరామ రక్ష అయిపోతే ,

ఆ ముదిరిపోయిన గిడసబారిన ఇ౦టెలిజెన్స్  మనకోద్దులే తల్లీ ,

ఏదో మన  మానాన మనం  రాత్రి వర్షాన రాలిన పున్నాగ పూలని చేతిలోకి తీసుకొందాం

-చాలామ౦దిలాగా  రాజేశ్వరికి కవిత్వం  ఎంబ్రాయిడరీ కాదు . సరాసరి జీవితమే  

1987 అనుకుంటా నేను నందిగామలో వున్నప్పుడు రెండుసార్లొచ్చి నాలుగేసిరోజులపాటు వుండి వెళ్ళింది.  ఇ౦ట్లో వాళ్ళు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారని, అదృష్ట వశాత్తూ తను ఎవరికీ  నచ్చడం లేదని  చెప్పి నవ్వింది. నిజం చెప్పు  నీకే ఎవరూ నచ్చడంలేదు కదా  అంటే, మళ్ళీ నవ్వింది.

“ … అయినా వాళ్ళ పిచ్చి కానీ, మానవ సంబ౦ధాలు సహజంగా ఏర్పడాలి తప్ప ఒకరు వెతికి చూసిపెట్టడమేమిటి అని  విసుక్కుంది. ఇంటికొక అడ్డగడియ వున్నట్టు మెడకొక తాళి వుండాలల్సిందేనంటావా  అని నిలదీసింది. అన్నీ ప్రశ్నలే.

అమ్మాయిలు ఎంత స్పష్టంగా మాట్లాడితే అంత పిచ్చి వాళ్లకింద జమకడతారు కదా, తను అలాగే కనిపించేది.

 “అసలు తనకి ఏం కావాలో తనకే తెలీదండి  మనల్ని కూడా కన్ ఫ్యూజ్ చేసేస్తుంది. “ అన్నాడు రాజేశ్వరి ఎంతగానో ఆరాధించే ఒక కవి ఆమె పరోక్షంలో . భద్రమైన ఇళ్ళు, ఇల్లాళ్ళు, బ్యాకు లెక్కలూ, షేర్ మార్కెట్ నాలెడ్జీ వున్నవాళ్లకి తనగురించి ఇంతకంటే ఎక్కువ అర్ధంచేసుకునేదేమీలేదు.

1990 లో నేను హైద్రాబాదు వచ్చేశాక అప్పుడో ఫోనూ, అప్పుడో ఫోనూ తప్ప మళ్ళీ కలవడం కుదరలేదు. చివరికి ఆ మబ్బు విడిచి మన్ను చిమ్ముకుని ఒక ఇంటికి అంకితం అవడానిక్కూడా రాజేశ్వరి సిధ్దపడి౦ది

“ వంటిళ్లూ అవసరమే మాసిగుడ్డా అవసరమే , ఎవరి సొంత వంటిల్లు వాళ్ళకి కావాల్సిందే  , సామూహిక వంటశాల కూలినప్పుడు , ఒకానొక కాల్పనికక సిద్ధాంతపు క్రేజీలో వాస్తవం స్పప్నమవుతుంది.

ఆ కాపుర౦లో  ఆవకాయ పచ్చడి కలుపుతున్న వేళ్ళు కళాత్మకంగా , మనోహరంగా కనిపిస్తున్నాయి. అలా చాతకాన౦దుకు  నేనివేళ సిగ్గుపడి చస్తున్నాను. ఎవరయినా అనూచానంగా మింగుతున్న చేదుమాత్రని సుగర్ కోటేడ్ అని చెప్పడమెందుకు , ఇవాళ నాకంటూ ఒక సొంత వొ౦టిల్లు  లేకపోవడం అవమానకరమే, ఇందుకే మొన్న ఒకమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. నేను కవిత్వం చదివి కరడు కట్టి వున్నను కాబట్టి బతికిపోయాను “

మనుషుల్ని విపరీత౦గా ప్రేమిస్తుంది రాజేశ్వరి.  ఎవరి వల్ల అయినా తను గాయపడినా సరే అంతక్రితం వరకూ వారితో వున్న మ౦చి జ్నాపకాలతో బతికేస్తాను అంటుంది.

“………..భావ సారూప్యతలేనే లేని / నీవింత పరిమళ స్నేహంకోసం /మనం మన స్వప్నాలను పోగొట్టుకున్నాం/ ఎలా జరిగిందిది /మాటల మీంచి హృదయం నిండదు /నాకు చాలు ఒక మాట ఒక చూపు, ఒక నవ్వు, ఒక స్పర్శ /పొదరిల్లు కింద దొరికిన ఆ దొంగ చిరునవ్వునేం చేసావు ?/అది వెన్నెలయింది కదా /ఈ మిట్ట మధ్యాహ్నం నువ్వు చూడలేదా …….”

ఇంత కల్తీ లోకంలో, కెరీర్ తప్ప ఇంకేదీ అక్కర్లేని ,  ప్రతిఫలం వుంటే తప్ప చిరునవ్వు అయినా ఖర్చుపెట్టని మనుషుల మధ్య రాజేశ్వరి ఒక మినహాయింపు .

రాజేశ్వరి గురి౦చి  ఇప్పుడు మాట్లాడుతుంటే చాలా గిల్టీగా వుంది. నేను రాసిన “ఇల్లు ఖాళీ చేసినప్పుడు….”  కవిత చదివి,  మరి ప్రపంచాన్ని ఖాళీ చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుందో కదా అది రాస్తాను కానీ అస్సలు అనుభ౦లోకి రానివి ఊహించడం కష్టం కదా అంది . మరి ఇన్నేళ్ల తర్వాత అయినా దానిమీద రాసిందో లేదో తెలీదు. నామాడి శ్రీధర్ సేకరించి పంపిన వాటిలో అలాంటి శీర్షికతో ఏదీ కనిపించలేదు కానీ తీవ్రంగా ఆశాభంగం చెందిన ఒక సందర్భాన్ని గురించి మనసు కలచి వేసే కొన్ని వాక్యాలు ఎలా రాసిందో చూడండి..

“ హెలో వున్నారా / ఆహా వున్నాను వున్నాను/మాట్లాడరేం/ మాట్లాడుతున్నాను/ ఇప్పటి నా మాట వినిపించడంలేదేమో / నేను రానా, వద్దు/ మీరు వస్తారా , రాను/ నేను ఖాళీగా వున్నాను ఈవేళ / ఆత్మ చైతన్యమవుతున్నవేళలో నీ ఖాళీ సమయాన్ని నే పూరించలేను/ నీ చిరునవ్వుని నేను కాలేను/ i don’t want tobe fill in the blank please/ సరే ఏం చేస్తున్నారు / పక్షుల ఆశల్ని పాములు మింగేసే హింసాత్మక అసహ్యాన్ని చూస్తున్నాను /ఏమర్ధమయిందేమిటి ? / రేపటి సీతాకొక చిలుకలకోసం /ఈ వేళ అరచేతిలో గొంగళి పురుగుల్నీ సాకడం /

ఉత్తరానికీ ఎలిజీకి పెద్ద తేడా ఏముంది.

మనుషులుగా ఏ ఇద్దరయినా ఏళ్లతరబడి ఎవరి నదుల్లో వాళ్ళూ కొట్టుకు పోతున్నప్పుడు,

కెరటానికి పైన ఉన్నామా , అడుగున వున్నామా అనేది తప్ప ,

ఎవరి జీవన ఘోష అయినా ఈ భీభత్స శబ్దాల మధ్య ఎలా  వినిపిస్తుంది చెప్పు

-ఇది నువ్వు చదవలేని ఉత్తరం . చదివితే పోస్టులో మళ్ళీ కొన్ని పరిమళాలు నాకు అంది వుండేవి.

రాజేశ్వరీ , ఇవాళ నీ కవిత్వం చదివి నిన్ను తలచుకుంటుంటే ఏదో బాధగా వుంది.

తెలుగు హాస్యానికి కొత్త లెవెలు!

?

?

 -కొల్లూరి సోమశంకర్ 

~

 

తెలుగులో వ్యంగ్య రచనల ప్రాభవం కాస్త తగ్గుతోందని అనిపిస్తున్న సమయంలోనే ప్రసన్నకుమార్ సర్రాజు గారి కథల సంకలనం వెలువడి ఆ లోటుని కాస్త అయినా తీర్చింది.

ప్రస్తుత కాలంలో వ్యంగ్యం తగ్గడానికి కారణమేమిటో ముందుమాట వ్రాసిన ప్రముఖ హాస్య రచయిత శ్రీరమణగారు వెల్లడించారు. “వ్యంగ్యం అంటే సత్యానికి ఆమడ దూరంలో ఉండి నవ్వు పుట్టించేది. ఇప్పుడు అంత దూరాన్ని సృష్టించడం కష్టమై వ్యంగ్యం తేలిపోతోంది” అన్నారాయాన.

మరో ముందుమాట వ్రాసిన ప్రముఖ కార్టూనిస్ట్ మోహన్ గారు ఈ పుస్తకం గురించి చెబుతూ, “తెలుగు సినిమా లాంటి వల్గారిటీకీ, మీలో (పాఠకులలో) చక్కని సంస్కారానికి అప్పీల్ చేసే హాస్యానికీ తేడా ఉంటుంది. ప్రసన్న కథలీ పని చేస్తాయి” అన్నారు.

ప్రతీ మాటలో, పనిలో, జీవితాల వివిధ కోణాల్లో, ఏది తాకితే నవ్వొస్తుందో కొంతమందికే తెలుసు” అంటూ ఆ కొద్దిమందిలో సర్రాజు ఒకరు అంటారు డా. మాచిరాజు రామచంద్రరావు.

వీరి మాటలు, ఈ అభిప్రాయాలు చదివితే, ఓ మంచి పుస్తకం చదవబోతున్న నమ్మకం కలుగుతుంది. నిజమే… ఆ నమ్మకం వమ్ము కాదు.

ఈ పుస్తకంలో పన్నెండు కథలున్నాయి. అన్ని కథల్లోనూ హాస్యమూ, వ్యంగ్యమూ బాగా పండాయి. రాజకీయాలు, సినిమా, కార్పోరేట్ విద్య, పత్రికలు, టీవీ తదితర రంగాల తీరుతెన్నులపై పంచ్‌లు వేసిన కథలివి.

అనైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా” కథ దేశంలోని రాజకీయాలపై గొప్ప సెటైర్. ఒకప్పటి రాష్ట్రాలన్నీ చిన్న చిన్న రాష్ట్రాలుగా విడిపోతే ఎలా ఉంటుందో ఈ కథలో హాస్యంగా వివరించారు. విజయవాడ నగరమే ఈ కథలో అనేక చిన్న రాష్ట్రాలుగా విడిపోయింది. కాలువల జలాల పంపకాలపై విబేధాలు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్ళడానికి వీసాలు, బోలెడుమంది గవర్నర్లు, వాళ్ళ పిఎలు, ప్రతిపక్ష నేతలు… కథ రంజుగా ఉంటుంది. ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి పక్క రాష్ట్రానికి వెళ్ళి వైద్యం చేయించుకుంటాడు. “ఆపరేషన్‌కి పక్క రాష్ట్రానికెళ్ళడం మన రాష్ట్ర వైద్యులను అవమానించడమే. విరాష్ట్రీ మారక ద్రవ్యాన్ని వృధా చేసే హక్కు మీకెవరిచ్చారు?” అంటూ ప్రతిపక్ష నాయకుడు గొడవ చేస్తాడు. ఇలా పదే పదే ఏదో కారణం మీద గొడవలు చేసి, అరెస్టయి, బెయిల్ పై విడుదలయితే గానీ తోచదట ఆయనకి. పైగా ఇదొక యోగాట. పేరు ధర్నాయోగ లేదా యాగీయోగ. దాంతో ఆయనకున్న షుగరు, కీళ్ళవాతాలు అన్నీ పోయి చక్కగా రక్తప్రసరణ అయి, పదికాలాల పాటు అరెస్టయి బ్రతకొచ్చట!! చదువుతున్నంత సేపూ నవ్వుతూనే ఉంటాం.

రాజకీయాలపైనే మరో వ్యంగ్య కథ “ఇండిపెండెంట్స్ డే“. స్వతంత్ర్య అభ్యర్థులు ఎన్నికల్లో గెలవడం ఎంత అపరాధమో చెబుతుందీ కథ. ఓ ఇండిపెండెంట్‌ని తమ పార్టీల్లోకి లాగేసుకోడానికి జాతీయపార్టీలు ప్రయత్నిస్తాయి. హై కమాండ్‌తో ఇక్కడి ఛోటా మోటా నాయకులు తెలుగు హిందీ కలగలసిన భాషలో మాట్లాడడం నవ్విస్తుంది. ‘పాత సూట్‍కేస్‌లకు కొత్త సూట్‌కేసులిస్తాం’ అంటూ ఇండిపెండెంట్ ఇంటిముందు తచ్చట్లాడిన రాజకీయ బ్రోకర్ “ఏ సూట్‌కేసులో ఎంతుందో ఎవరు చెప్పగలరు?” అని అనడం; లాబీలో మాట్లాడితే లాబీయింగ్ అనడం సరదాగా ఉన్నాయి.

దేవదాసు వెడ్స్ పార్వతి” కథ సినీరంగంపై చక్కని వ్యంగ్యాత్మక విమర్శ. మనవాళ్ళు తీసిన కథలనే అటూ ఇటూ మార్చి మళ్ళీ మళ్ళీ ఎందుకు తీస్తుంటారో చెప్తారు రచయిత. “మన జనాలకి చెప్పిందే చెప్పడం, చేసిందే చెయ్యడం, చూసిందే చూడడం అలవాటయ్యా. అవి జీవితాలు గానీ, రాజకీయాలు గాణీ, సినిమాలు గానీ… కథలు కొత్తగా చెప్పాలి గాని కొత్తవి చెప్పకూడదు. ఓ పట్టాన అరిగించుకోలేరు” అంటాడో నిర్మాత కథా రచయితతో. దేవదాసు పార్వతి కథనే మళ్ళీ తీస్తూ, దానికి బీభత్సమైన పబ్లిసిటీ ఎలా ఇవ్వాలో చెబుతుంటే నవ్వూ వస్తూందీ, నిజంగానే కొంతమంది నిర్మాతలు ఇలా ప్రయత్నిస్తున్నారు కదా అని గుర్తొచ్చి కించిత్ బాధా కలుగుతుంది. ఈ కథలో హాస్యం కన్నా వ్యంగ్యం పాలే ఎక్కువ.

సొంత పేరుతో సినిమాలు తీస్తే అచ్చిరావడం లేదని, బెంగాలీ డైరక్టర్ సత్యజిత్‌‌రాయిలా గంభీరంగా ఉండాలనుకొని, ‘విశ్వజిత్ రప్పా’గా పేరు మార్చుకుంటాడు ఓ నిర్మాత. సినీ నిర్మాణానికి డాన్‌లే తెరవెనుకగా నిధులందిస్తున్నారని నమ్మి, తన సినిమాకి నిధులు అందించవలసిందిగా డాన్‍లకు బహిరంగ ప్రకటన జారీ చేస్తాడు “డాన్‌ల భూగర్భ శత్రుత్వం” కథలో. తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. అండర్‌గ్రౌండ్ డాన్‌లు తమ వ్యవహారాలను భూగర్భంలో జరుపుతారని చెబుతూ, డాన్‍ డెన్‌లో ప్రవేశించడానికి వాడే కోడ్ సాంగ్ ఏమిటో చెప్పినప్పుడు నవ్వకుండా ఉండలేం.

తన కొడుకుని హీరోని చేయాలనుకుంటాడు ఓ నిర్మాత. “అదేంటి బావా, మనోడికి ఏవీ రావు కదా?” అంటాడు అతని బావమరిది. బావమరిది లేవనెత్తిన ప్రతీ ప్రశ్నకి జవాబిచ్చి అతని నోరు మూయిస్తాడు. అంతే… తెలుగు సినీ కళామాతల్లికి మరో నట వారసుడి సేవలు మొదలవుతాయి. ఇదే నిర్మాత ఓ డబ్బింగ్ సినిమా తీయాలని చెన్నై బయల్దేరుతాడు. బొంబాయి ముంబయిగా, మద్రాసు చెన్నై గారి మారకా, హైదరబాద్‌కు కూడా పేరు మారిస్తే, ఏం పేరు పెట్టాలో ఈ నిర్మాత సూచిస్తాడు. నవ్వాగదు ఆ పేరు వింటే. డబ్బింగ్ చిత్రాల ప్రహసనాన్ని చదివి నవ్వుకుంటాం “ఏకె97” అనే ఈ కథలో.

సినిమారంగాన్ని పరిశ్రమగా గుర్తించమని సినీరంగం పెద్దలు ప్రభుత్వానికి పెట్టుకున్న అర్జీని ఆమోదించి సినిమా రంగాన్ని పరిశ్రమగా గుర్తిస్తుంది ప్రభుత్వం “ఏ టేల్ ఆఫ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ” అనే కథలో. పరిశ్రమ కాబట్టి ఫ్యాక్టరీ గొట్టం ఉండాలని ఓ స్టూడియోలో భారీ పొగ గొట్టాన్ని ఏర్పాటు చేస్తారు. సినిమా బడ్జెట్ పై ఆంక్షలు విధిస్తుంది ప్రభుత్వం. చేసే ప్రతీ ఖర్చుకి ఆడిట్ ఉండాలంటుంది. సినిమా నిర్మాణానికి జాతీయ బ్యాంకులు లోన్‌లు ఇస్తాయి. లోన్ శాంక్షన్ అవ్వాలంటే ఏమేం చెయ్యాలో ఓ బ్యాంక్ మేనేజర్ చెబుతాడు. సినిమా తీయడం అంటే ఓ డ్యూటీగా మారిపోయిన ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం అయిదు వరకు ఏదో ఆఫీసుకెళ్ళొచ్చినట్లుగా సినిమా తీయడం తన వల్ల కాదని సినిమా నిర్మాణాన్ని విరమించుకుంటాడో నిర్మాత.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలకి ఆధార్ కార్డుని తప్పనిసరి చేయడం జనాల కొంప ఎలా ముంచుతోందో హాస్యంగా చెబుతారు రచయిత. ఉరి తీయబోతున్న ఓ ఖైదీకి ఆఖరి క్షణంలో మరణశిక్ష వాయిదా పడుతుంది.. ఏ రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టడం వల్లో కాదట. ఉరితీసే ఖైదీలకి తప్పనిసరిగా ఆధార్ కార్డ్ ఉండాలనే నిబంధన కొద్ది సేపటి క్రితమే అమల్లోకి రావడం వల్లట. ఆధార్ కార్డ్ లేనందువల్ల ఆ ఖైదీ ఉరి నుంచి తప్పించుకున్నాడట. ఓ పెళ్ళిలో పిలిచిన అతిథులకంటే రెండు రెట్ల కన్నా ఎక్కువమంది వచ్చి విందు తిని పోయారట. ముష్టోళ్ళు కూడా కాస్త మంచి బట్టలేసుకొచ్చి తినేసి వెళ్ళారని ఆ కుటుంబం అనుమానపడింది. అందుకని ఆ కుటుంబంలో జరుగుతున్న తర్వాతి వివాహానికి శుభలేఖ పంపుతూ… ‘ప్రవేశం ఆధార్ కార్డ్ ఉన్నవారికి మాత్రమే’ అని వ్రాయిస్తారు దాని మీద. సబలాదేవి అనే ఉద్యోగినిని ఎత్తుకెళ్ళి అత్యాచారానికి ప్రయత్నిస్తారు నలుగురు దుండగులు. “మీరు మగాళ్ళయితే మీ ఆధార్ కార్డులు చూపించండి” అంతే…. ఆ నలుగురు తమ ప్రయత్నాన్ని విరమించుకుని సబలాదేవిని సగౌరవంగా – అటుగా వచ్చిన బస్‌లో ఎక్కిస్తారు. హస్యం, వ్యంగ్యం కలగలసిన కథ “నీవే నా మదిలో…“.

ఇప్పుడంటే ‘సెల్ఫీ’ల కాలం కాని, ఒకప్పుడు ‘సెల్ఫ్’ల కాలం! తమకి విపరీతమైన పలుకుబడి ఉందని, ఫలానావాడికి నేనెంత చెబితే అంతేనని తమ గురించి ఘనంగా – ఎదుటివారికి అనుమానమే కలగకుండా సొంతడబ్బా కొట్టుకునే డబ్బారాయుళ్ళు అప్పుడూ ఉండేవారూ, ఇప్పుడూ ఉన్నారు. అలాంటివారి కథే “వెంకీ! ఎక్కడున్నావ్‌రా ఇంతకాలం?“.

విద్య వ్యాపారం అయిపోయాకా, విద్యార్థులు ప్రాడక్ట్స్ అయిపోయారు. విద్యార్థుల కలల్ని తాము అమ్ముకొంటున్న కొన్ని కార్పోరేట్ కాలేజీల పైత్యాన్ని చెబుతుంది “డ్రీమ్ మర్చంట్స్“. హాస్యంగా చెప్పినా, ఈ కథలో ప్రస్తావించిన విద్యార్థుల సమస్యలు, ఒత్తిడి నిజంగానే ఉన్నాయని అర్థమవుతుంది, బాధ కలుగుతుంది.

టీవీ చూడడం ఓ నిత్యావసరంగా మారిపోయిన ఓ ఇంట్లో, ఇంటాయన టీవీ ముందు కూర్చుంటాడు “స్త్రీ ఛానల్” కథలో. పెద్ద టీవీ ‘నిమిత్తమాత్రురాలిగా’ ఆయన్ను చూస్తుంది. ఈయన మాత్రం ఏదో మైకంలో ఉన్నవాడిలా ‘నిమత్తు మాత్రుడిగా’ ఆన్ చేస్తాడు. ఒక్కో ఛానెల్ మార్చుకుంటూ పోతూంటాడు. ఉన్నట్లుండి ఓ కొత్త ఛానల్ కనబడుతుంది. ఆ ప్రోగ్రామ్‌ చేస్తున్న యాంకర్‌కీ కొత్తేమో –  మాట తడబడి – ‘అంతరంగిక మధనం’ అనే పదాన్ని తప్పుగా పలికిన వైనం నవ్వు తెప్పిస్తుంది. ఇంటాయన చాలాసేపు ఈ ఛానల్ కార్యక్రమాలు చూస్తూంటాడు. చివరికి ఇంత కలుపుగోలు ఛానల్‌ని చూడడం ఇదే మొదటిసారి అనుకుంటూ టీవీ కట్టేసి పడుకుంటాడు. బాగా నవ్విస్తుందీ కథ.

పాఠకుల కాలక్షేపం కోసం ఓ రచయిత ఒక కథ రాస్తే, ఆ కథ చదివిన పాఠకులు పత్రికకి ఉత్తరాలు వ్రాస్తారు. ఆ కథ వల్ల ఫైనాన్స్ సమస్యలు చెలరేగి, జెండర్ రాజకీయాలు పెట్రేగి విదేశీ సమస్యలు పెచ్చరిల్లే పరిస్థితి వస్తుందని రచయిత భయపడేలా చేస్తారు “పాఠకుల తోకకు నిప్పు” కథలో.

ప్రైవేటు ఎయిర్‌లైన్స్ విపరీతంగా పెరిగాకా, అవి అందిసున్న సేవల తీరుతెన్నులను హాస్యంగా చెప్పిన కథ “విమాన సంచరరే…“.

అన్ని కథలలో ఆరోగ్యకరమైన హాస్యం ఉంది, సున్నితమైన వ్యంగ్యం ఉంది. ఈ కథలలో “గొప్ప సందేశాలు లేవుగానీ, హాయిగా చదివిస్తాయి” అనే శ్రీరమణ గారి అభిప్రాయంతో నిరభ్యంతరంగా ఏకీభవించవచ్చు.

మిహిర పబ్లికేషన్స్ వారు జనవరి 2016లో ప్రచురించిన ఈ 137 పేజీల పుస్తకం వెల రూ.100/-. విదేశాలలో ఉండే తెలుగువారికి $10. నవోదయా బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్ వారు సోల్ డిస్ట్రిబ్యూటర్స్.

~ కొల్లూరి సోమ శంకర్

 

ఇల్లాలి అసహనం

 

-వనజ తాతినేని

~

 

మేమెలాగూ నిద్ర పోలేదు, మిమ్మల్ని మాత్రం ప్రశాంతంగా నిద్ర పోనిస్తామా  అన్నట్టు ఊరంతా మేల్కొనేలా సినిమా పాట పాడుకుంటూ వెళ్ళే వాహనం, దాని వెనుకనే  రోడ్డు మీద దబుక్కుమన్న శబ్దం. ఉలికిపడి లేచాను.  ఇంటద్దె  ఇరవై శాతం పెంచానని ఓనరమ్మ చెప్పినప్పుడు ఉలికి పడ్డట్టుగా.  అన్యాయం!  చానల్ సాక్షిగా తాడిగడపలో ఇంతిల్లు  పదివేలే అంటున్నారన్నా ! చానల్స్ లో ఎవరూ నిజం చెప్పరని మీకు తెలియదా అంది. నిజమే కదా! అనుకున్నాను వీలైనంత ఏడుపు గొంతుని సరి చేసుకుని. అన్నీ పెరుగుతున్నాయి. ఆయుష్షు కూడా పెంచి ఇక్కడ నరకమెందుకు చూపిస్తావ్ దేవుడా !? మనసులో తిట్టుకున్నాను.

రాత్రంతా నిద్ర లేదు. కలలకి కూడా పొంతన లేదు  ఆలోచనలాగానే ఎడ్డె మంటే తెడ్డె మంటున్నాయి. కాసేపు  నాలుగు రింగుల కారు, కలర్ ఫుల్ పోలీ వీవెన్ చీరలు, కొంకణ్తీర్  డైమండ్ నగలు, ఇవే కనబడతాయి. కాసేపాగాక   ప్రకృతంతా  వసంతగానం చేస్తుంటే  ఎండలేమో తొందరపడి ముందే సచిన్ బాదినట్టు  బాదుతున్నాయి.  ఒంట్లో  నుండి చెమట చుక్క బయటకి రానీయమని కంకణం కట్టుకున్నవారు వర్సెస్  తాగడానికి చుక్క నీళ్ళ కోసం అలమటించేవారు.ఇదీ భారతం. భవతు భారతం. అక్షరాల అరవై ఎనిమిది సంవత్సరాల నుండి ఆకలి, నిరుద్యోగం, అవినీతి, లంచగొండితనం  వగైరా వగైరా లన్నింటికి ఒకే ఒకే విశ్వసనీయమైన  మందు దేశభక్తి. అసలా ప్లేవర్ కి ఏ ప్లేవర్ పోటీ  రాదు.   అందులో పడి మునిగిపోవాలని రాసి పెట్టి ఉందని తెలుస్తూనే ఉంది. ఆకలి ఉంటే  సరిపోయిందా దేశభక్తి ఉండొద్దూ … అడుక్కుని పరువు తీయకు పో … దూరంగా పో ! లాంటి నిజాలు చెప్పే కలలు వచ్చినందుకూ  అసహనంగా ఉంది.

వాకింగ్ పేరుచెప్పుకుని  మగవాళ్ళు ప్యాంట్ జేబులో క్యారీ బేగ్  ని వేసుకొస్తున్నారు.  పరులు  పెంచుకున్న మొక్కల, చెట్ల పూలతో పూజ చేస్తే మంచిదని దేవుడు చెప్పాడు కాబోల్సు. శ్రద్దగా తెగ పాటించేస్తున్నారు. కామన్ ప్లేస్ లో కుండీలలో పెట్టిన మొక్కలకి కూడా ఒక్క పూవ్వు మిగల్లేదు. నా హృదయపుష్ఫం ఎవరూ దోచుకోలేరులే అనుకున్నా అంతకన్నా వేరే దారిలేక. ఉపన్యాస చక్రవర్తి భర్త పాదాలు  పిసికి, మొల మీద గుడ్డ ఉతికి ఆరేసి పుణ్యం తెచ్చుకోండి అని సెలవిస్తున్నాడు. అర్ధభాగంకి ఆయనెప్పుడైనా అలా చేసాడో లేదో ! అమ్మ కన్నా చేసాడో లేదో ! ఒరేయ్ ఒరేయ్ ..కాస్తైనా మారండి రా ..బాబూ!  ఈ శతాబ్దపు ఆడవాళ్ళకి ఎందుకసహనం తెప్పిస్తారు ?

బిల్డింగ్ లో ఉన్నవాళ్ళందరి పైనా పెత్తనం చెలాయించే సుధీర్  ” నా  పట్టు చొక్కా అంతా కాల్చేసావ్ ! ఇస్త్రీ చేయడం కొత్తని చెప్పొచ్చుగా. పొలాల్లో పనిచేసుకుని బతికినవాళ్ళు టౌన్ లోకి వచ్చి దోబీ అవతారమెత్తితే ఇదిగో ఇలాగే  ఉంటుంది. మూడేలు రూపాయల కొత్త షర్ట్. ఈ షర్ట్ నువ్వే ఉంచుకో ..డబ్బులు నీ జీతంలో కట్ చేసుకుంటా !  ఉదార అసహనం ఒలికిస్తున్నాడు. పాపం! కళ్ళ నిండా నీళ్ళు నింపుకుని చిందులు తొక్కుతున్న ఆయన్ని చూస్తూ నిలుచున్నాడు కొత్తగా వచ్చిన వాచ్మెన్ నాగేశ్వరరావు.

 

పొద్దుటి నుండి ఒకటే మెసేజ్ పదిసార్లు.  ఎవరో అన్నయ్య  యు వీ ప్యాలెస్ కి వస్తున్నాడట. అందులో ప్రత్యేకత ఏముందీ ? జనాలు  వీసా లేకుండా ఎన్నో దేశాలకి వెళ్లి వస్తున్నారు . స్వదేశంలో ఎక్కడ తిరిగితే ఏమైంది? ఎవరి పనులు వారివి. దానికంత ప్రాధాన్యం ఎందుకివ్వాలి? అనుకూలంగా కొన్ని, వ్యతిరేకంగా కొన్నీ.  డబ్బులు పుచ్చుకుని మీటింగ్ కెళ్ళే వాళ్లకి అలాంటి మెసేజ్ వెళ్ళినా ఫలితం భారీగా దక్కును. నాకెందుకంటా!  పదకొండో మెసేజ్. అసహనం రాదుమరి. ఇక ఒర్చుకోవడం నావల్ల కాలేదు.ఆ నంబర్ బ్లాక్ చేసి పడేసాను.

 

హాల్లో టీవి , బెడ్ మీద లాప్ టాప్. డైనింగ్ టేబుల్ మీద ఎడమ చేతిలో మొబైల్. మనుషులు మనుషులతో మాట్లాడుకోరు.  తెరమీద మాట్లాడుకోవడం, పోట్లాడుకోవడం ఎక్కువైపోయింది.తెరల మీద చూసి చూసి ఈ మధ్య మా ఇంట్లో కూడా శాంతి సామరస్యం అస్సలు కుదిరి చావడంలేదు. ప్రతి దానికి అసహనం ప్రదర్శించడం అలవాటైపోయింది. రోజూ వంట చేసినట్టే,రోజూ ఇంటి పని చేసినట్టే రోజూ టీవి సీరియల్స్ చూసినట్టే రోజూ అసహనం ప్రదర్శించకపోతే ఏమీ బాగోలేదు.   మొన్నట్టాగే అత్తగారు చుట్టంలా వచ్చింది వచ్చినట్టు ఊరుకోకుండా..  ఎందుకా సీరియల్స్ అదే పనిగా చూస్తావ్ ! పిల్లలతో హోం వర్క్ చేయించవచ్చు కదా అంది. మా ఆయన్ని వరించినందుకు భరించక తప్పదని ఊరుకుంటున్నా కానీ  పక్కింటి వాళ్ళ కోడలు వేసినట్టు ఏ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ నో వేసేస్తే  పీడా పోద్ది  అనుకున్నాను

అమ్మ గారు డస్ట్ బిన్, అమ్మ గారు పోస్ట్, అమ్మగారు కరంట్ బిల్, అమ్మగారూ నెట్ బిల్, అమ్మాయి గారు సపోటాలు బాగున్నాయి రండి …  డజను నలబై రూపాయలే ! అయ్యని ఎవరూ పిలిచే  అలవాటులేదు, పాపం ఆర్ధిక భారం ఆయనకేమి తెలుసని జాలి కాబోలు.

పక్కింటమ్మాయికి పెళ్ళైతే నీకెందుకు  కొత్త పట్టు చీర, డిజైనర్ బ్లౌజ్ !? చంపుతున్నావ్ కదే ! ఎదురింటాయన ఆక్రోశం.  ఆ మైనా వాడి దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ నగలమ్మినట్టు చీరలు బ్లౌజ్ లు కూడా అద్దెకిచ్చే వాళ్ళుంటే  ఎంత బావుండునో ! మగాడికి అధిక సంపాదన కోసం బల్ల క్రింద చేయి పెట్టడమో,  హార్ట్ ఎటాక్ రిస్క్ రెండూ తప్పుతుంది. అరెరే ! ఇదేదో మంచి ఐడియానే ! మనమే  అలాంటి షాప్ పెట్టేసుకుంటే పోలా ఇలా ఖాళీగా కూర్చునే బదులు!

 

మేడమ్!  ఉదయం సార్  తో మాట్లాడాను హవా టెల్ లో మంచి ప్లాన్స్, ఆఫర్స్ ఉన్నాయి పోర్టబిలిటీ చేయించుకుంటానన్నారు అంది కంఠంలో బహుతీపిని ఒలకబోస్తూ ఓ పిల్ల .   ఎవరమ్మా .. ఆ సార్ !? ఏ సార్ తో మాట్లాడావో నువ్వు?  ఈ నెంబర్ గల  ఫోన్  ఎప్పుడూ నాదగ్గరే ఉంటుంది . ఇంకో విషయం తల్లీ ఈ నెంబర్ మీ హవా  టెల్ లోకి మారి రెండేళ్ళు అయింది  కదా ! అన్నాను టక్కున పెట్టేసింది.  మా ఆయన మొన్నెప్పుడో ఇలాంటి కాల్  అటెండ్ అయి   వేషాలు బాగానే వేస్తున్నారు   ఫ్యాన్సీ నెంబర్లని ఎన్నుకుని  ఇదోరకం వ్యాపారం !  సిగ్గు లేదూ..  చావండహే! అన్నది గుర్తుకొచ్చింది.

అక్కా!  అక్కా !! పక్క అపార్ట్మెంట్ అమ్మాయి పిలిచింది నన్నేనా ..? నేను అక్కనెప్పుడయ్యా నబ్బా ! పెళ్ళైన మర్నాటి నుండే అందరికీ ఆంటీ నే కదా ! అలా పిలవద్దని స్మూత్ గా చెప్పి కూడా  అందరితోనూ యాంటీ అయిపోయా ! ఓపికపోయి మూలుగుతూ కూర్చున్న నాకు ఈ  అక్కా అన్న పిలుపు కవితా కృష్ణమూర్తి భైరవి రాగంలా  తోచింది . గబుక్కున బయటకెళ్ళి ఏంటమ్మా ..సత్యా అనడిగా! ఒక కరిపాకు రెమ్ముంటే ఇవ్వక్కా ! అయ్యో ! కూరలో కరివేపాకులా మనుషులని తీసి పారేస్తున్నారని మనుషులకి కోపం వచ్చి కరివేపాకు తోటలని  పెంచడం మానేసారటమ్మా!  కావాలంటే కొత్తిమీర కట్ట ఇస్తా ! మాడిన కూరని కూడా గార్నిష్ చేసి మీ ఆయనతో లొట్టలేసుకుంటూ తినేటట్టు చేయొచ్చు అన్నాను. నవ్వి సరేనంది. ఇలాగే అక్కా అని పిలుస్తూ..  నీకేమి కావాల్సినా అడగమ్మా ! మొహమాటపడకు. పక్క పక్క బిల్డింగ్ లలో ఉన్నాం, మనం మనం  సాయం చేసుకోకపోతే ఎలా !  అంటూ కాస్త అతిగానే స్పందించాను.  మా చిన్నోడికి అర్ధమయ్యిందనుకుంటా.. ముసి ముసిగా నవ్వుకుంటున్నాడు. పిల్లలు పెద్ద ముదుర్లు అయిపోయారు.వాళ్లకీ అన్ని విషయాలు   తెలుస్తున్నాయి.  ఆ సంగతి మొన్నెవడో కథల గ్రూప్ లలో  పోర్న్ వీడియో పోస్ట్ చేసి  మరీ చూపిచ్చాడు. ఝడుసుకుని చచ్చాను. ప్చ్ ..

raja

లోకం  తెగ పాడై పోయింది. నేను పాడవకుండా ఏదన్నా రహస్యముంటే ..చెప్పరా..  భగవంతుడా ! ఆ రహస్యాన్ని కడుపులో పెట్టుకుని దాచుకుంటా, ఎంత కడుపు నొప్పి వచ్చినా సరే ! మాటిస్తున్నానుగా, నమ్మొచ్చు కదా !అసలు ఆడాళ్ళకి కడుపు నొప్పి ఎందుకొస్తుందో తెలుసా !  అవునులే … హ్యాపీ బ్లీడ్ సంగతి నీకేం  తెలుసు ..నీకు అమ్మున్టేగా?  అమ్మతోడు ! అవకాశం కోసం నేను మతం మార్చుకోలేదు గనుక నువ్వు  అమ్మ లేని భగవంతుడని గుర్తుకొచ్చిందంతే! నిన్నిలా తిట్టడం ఎవరైనా వింటే మా దేవుడికి అమ్మ ఉంది అని యుద్దానికొచ్చే మిత్రులున్నారు. సైలెన్స్ సైలెన్స్ .అదివరకంటే మాటలని ముంతలో పెట్టి దాపెడితే సరిపోయేది ఇప్పుడు  నోట్లో మాట నోట్లోనే దాచి  పెదవులు కుట్టేసుకోవాలని అనుభవాలు చెబుతున్నాయి.బయటకి పొక్కాయా ..బ్లాక్ చేసి పడేస్తారు.  భావ స్వేచ్ఛ జిందాబాద్ !

పెద్దోడిని స్కూల్ లో దించడానికెళ్ళా ! ఆ ఎర్ర చీర మిస్ మీ క్యాస్ట్ ఏమిటీ అనడిగిందమ్మా,  క్యాస్ట్ అంటే ఏమిటమ్మా అన్నాడు వాడు.  కడుపు రగిలిపోయింది . ఆమె పక్కనే బండి ఆపాను . గుడ్ మార్నింగ్ మేడం ! మీ బాబు సో చీట్ అంది. స్వీట్ అందా చీట్ అందా ఇంటర్నెట్ భాష జనంలోకి వరదలా వచ్చేసాక ప్రతి చోటా  కన్ప్యూజే ! ఛీ… దీనెమ్మ జీవితం అనబోయి గబుక్కున ఆపుకున్నా ! ఒక నవ్వు నవ్వేసి ఊరుకున్నా ! మీరేం కేస్ట్ మేడం అడిగింది నన్ను. కోపమొచ్చి నాలుగు పీకుదామనుకున్నా ! ఎలాగో తమాయించుకుని నేనేమీ రాజకీయ నాయకురాలిని కాదమ్మా ! ఏదో ప్రయోజనం ఆశించి సడన్ గా నా కులమేమిటో ప్రకటించుకోడానికి. కాస్త ప్రశాంతంగా బ్రతకనీయండి తల్లీ  అంటూ దణ్ణం పెట్టా ! మీ ఫీలింగ్స్ దెబ్బతీయాలని కాదండీ  జస్ట్  తెలుసుకోవాలని అడిగానంతే! మోహంలో అసంతృప్తి దాచుకుని వెళ్ళిపోయింది.

ఈ విషయం అర్జంట్ గా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసేసి కుల నిర్మూలన కోసం పోరాడాలి . ఒక నాలుగువందల లైక్ లు, ఎనబై షేర్ లు గ్యారంటీ ! లైక్ లంటే గుర్తొచ్చింది .. ఆ పెద్ద రచయిత్రి పోస్ట్ కి లైక్ కొడితే ఇంకో పెద్ద రచయిత్రికి కోపం . ఈ రచయిత్రి పోస్ట్ కి లైక్ కొడితే ఆ  రచయిత్రికి కోపం . భగవంతుడా ఈ పెద్ద పెద్ద వాళ్ళ మధ్య నన్నెందుకు ఇరికించావయ్యా ! నా మనసు చెప్పినట్టే వింటానని నీకు తెలియదూ ! నారీనారీ నడుమ మురారి నీది నాది వేరే దారి ఏఎన్నార్ డాన్స్, ఇరువురి భామల కౌగిలిలో అంటున్న  యువరత్నవేడుకోలు ఒకేసారి గుర్తొచ్చాయి మరి. స్నేహం చేద్దామంటే ఒక్క మంచి మనిషి దొరకరు. బోల్డ్ కాంటెంపరరీ  స్టైల్స్ షాప్ లలో అయితే దొరుకుతాయి కానీ మనుషుల్లో మంచి మనిషి భూతద్దం పెట్టి వెదికినా దొరకరు. అన్నీ ఆ తానులో ముక్కలే ! దొరికే దాకా వెతుకు వెతుకు .. వెతకవమ్మా . కష్టపడనిదే ఎవరికీ దొరకదని చెపుతున్నాగా! చత్!! అంతరాత్మ హిత బోధ ఎక్కువైపోయింది.

మన్ కీ బాత్.  మన్ కీ బాత్ . వినలేక చచ్చిపోతున్నా. అసలు మనసుంది ఎందరికీ ? కళ్ళముందు భగ భగ మంటలు, కస కస కోస్తున్న కత్తులు, టన్నులు కొద్దీ కన్నీరు.  ముందు  మన్ తీసేసి మాట్లాడటం నేర్చుకోవాలి.  నేర్పేందుకు ఎవరైనా ఉండారో లేదో అన్న సందేహం అసలొలదు. కోచింగ్ సెంటర్స్ కోసం కాళ్ళరిగేలా తిరిగే కష్టం కూడా వద్దు.  ఇప్పుడందరూ ఆ విద్యలో అవధానం చేసినవాళ్ళే  కదా ! ఓ చిలిపి పంజేయాలని బుద్దిపుట్టి   అనవసరంగా పృచ్ఛక  అవతారమెత్తితే అసహనానికి గురికాగలరు. జాగ్రత్తగా ఉండాలి పెద్దోళ్ళతో మాటలుకాదు మరి.

 

మధ్యాహ్నం 12:55 అయింది ప్రియా కూతేసింది కాకి అలవాటుగా గోడమీద వచ్చి కూర్చుని  కావ్ కావ్  మంటుంది . ఎదురింటి తలుపు తప్పనిసరై తెరుచుకుంది. గుప్పిట్లో తెచ్చిన ముద్దని గోడమీద పెట్టి వెళ్ళిపోయింది కాకి అత్తమామ ఆరగించడానికి రెడీ అయిపొయింది. బతికి ఉన్నప్పుడు పెట్టారో లేదో కాని కళ్ళు మెరుస్తుండగా తృప్తిగా చూసుకుంటూ వెళ్లి ఠపీమని తలుపేసుకుంది . కాకి తిన్నంత తిని నేలమీద పడ్డ మెతుకులని  వదిలేసిపోయింది.ముక్కుతో ఏరేరుకుని తినే శ్రమ ఈ కాకికి లేదు కాబట్టి  హాయిగా ఎగిరి పోయింది గానీ  పాటు నాకొచ్చి పడింది.   గేటులోకి వచ్చి పడ్డ అన్నం మెతుకులని తొక్క కూడదనే సెంటిమెంట్ ఏడ్చింది కాబట్టి చీపురు తీసుకుని బర బరా ఊడ్చి పారేసా ! ప్రక్కనే పక్కిన్టామె  పెట్టిన కుండీలో తులసి మొక్కకి  చీపురు తగిలిందేమో! పుణ్యం వాళ్లకీ  పాపం నాకు.

మధ్యాహ్నం భోజనం చేసాక టీవి తదేకంగా చూస్తూ “దొండపండు పెదవులేసుకుని ఆ కాప్రా చూడు ఎంత బావుందో … నువ్వు ఉన్నావ్ ఎందుకూ !? సిటీకొచ్చి ఆరేల్లైంది,గోరింటాకు మానేసి నెయిల్ పాలిష్ వేయించలేకపోతున్నా. ఎంతైనా ఊళ్లోళ్ళు  మారరని రుజువుచేసుకున్నావ్” అన్నాడు మా ఆయన. కడుపు మండిపోయింది. ఊళ్లోళ్ళు అని గడ్డిపరక లెక్క తీసేస్తున్నాడు. వాళ్ళు లేకపోతే తింటానికి గడ్డి కూడా దొరకదని తెలియదు.ఏంటో పెద్ద పట్నం గొప్ప? నీళ్ళు కూడా కొనుక్కుంటూ అని లోలోపలే తిట్టుకుంటుండగానే ఒక ఆలోచన పుటుక్కుమని పుట్టింది, ఆయన్ని ఏడిపించాలని.  బాగుంది కానీ…  మరీ తొమ్మిది గజాల గుడ్డ నేలపై జీరాడడమే అస్సలు బాగోలేదు అన్నా.  అది అంతర్జాతీయ  ఫ్యాషనే పిచ్చిమొహమా  అన్నారు.  వాళ్ళ ఒంటి నిండా కట్టినా డబ్బులే, కట్టకపోయినా డబ్బులే అంట,  నాక్కూడా అలాంటి అంతర్జాతీయ  ఉద్యోగమేమన్నా దొరికితే బావుండును అన్నాను అమాయకంగా. రిమోట్ విసిరి పడేసి  బెడ్ రూమ్ లోకి వెళ్లి పడుకున్నాడు పిచ్చి నా మొగుడు. సినిమా వాళ్ళతో పెళ్ళాన్ని పోల్చడం మొగుడికి తెలిసినట్టు పెళ్ళానికి తెలియదనే అజ్ఞానమైతే ఎట్టాగబ్బా  మరి.

 

ఇలా రాసేసాక చాలామందిని  టార్గెట్ చేసినట్టు రాసేవేమో బంగారూ అంది అంతరాత్మ.  బాబోయ్ నేనేమన్నా నల్లకళ్ళద్దాల వృద్దనారీ రచయితనా ఏమిటీ ఇప్పటిదాకా జనాల్లో ఉన్న గౌరవం పోగొట్టుకోవడానికి. ఒక అక్షరం ఎగర గొట్టేసిన  పేరుతో కథ రాసేసి విషం కక్కినట్టు ఇంక్ కక్కడానికి. రాసే ప్రతిదీ నిజమని ఏ పాఠక వెధవాయ్ నమ్మడని తెలిసినట్టు లేదు. అంత వయసొచ్చాక  కాస్త ఇంగితం ఉండాలి తల్లోయ్ !  అభిమానిస్తున్నారు కదా అని చెవుల్లో  ఇంగ్లీష్ కాలీ  ప్లవర్ పువ్వెట్టకుమాతా ! చెప్పులో రాయి గుచ్చుకున్నట్టు ఫీల్ అవుతారు కొందరు అని చెప్పాలనుకుంటున్నా ! అయినా నా మాట వినడానికి ఆమెకి తీరిక ఉందో  లేదో !  చెవులు సరిగా పని చేస్తున్నాయో లేదో !

 

టీపాయ్ మీద పెట్టిన  మా ఆయన ఫోన్ కి ఏదో మెసేజ్ కూత.  యధాలాపంగా చూసా. బి ఎఫ్/జి ఎఫ్ కావాలా? కాంటాక్ట్ నెంబర్ పదంకెలు !ఇన్బాక్స్ లో బోలెడు ప్రేమ రుతువుల పైత్యాలు పచ్చిగా వార్మప్ చేసేవిగా ఉన్నాయి. ఇలాంటి వాటితో కాపురాలు కూలిపోమ్మంటే కూలి పోవూ ! అసహనం హద్దులు దాటింది. మా ఆయన ఫోన్ బాల్కనీ  గోడకెళ్లి టప్పున కొట్టుకుంటుంది. టీవీ,మొబైల్,ఇంటర్నెట్ ఇవన్నీ లేనప్పుడు అమ్మల కాలం ఇప్పటికన్నా కొద్దిగా బాగుండేదేమో! అప్పుడు  ఇన్ని విచ్చలవిడితనాలు లేవు. అయినా ఈ మాత్రం దానికే అంత అభద్రతాభావం ఎందుకో ? అంతరాత్మ మళ్ళీ  ఎదురుగా నిలబడి చెప్పింది  “ఎందుకంటే పెంపుడు కుక్కని నమ్మినట్టు, కొట్టంలో పశువుని నమ్మినట్టు మొగుడిని నమ్మడానికి వీలులేదే పిచ్చిదానా “అని. పోదూ …ఎల్లకాలం మోసం చెయ్యాలనుకున్న వాడికి ఎప్పుడైనా బై బై చెప్పే తెంపరితనం కూడా ఉందిలే నాలో అని సముదాయించుకున్నా.

 

కోపం తగ్గాక మొబైల్ ముక్కలేరి చెత్త కుప్పలో పోద్దామని బయటకొచ్చా.  పుస్తకాలు ముందేసుకుని కూడబలుక్కుని చదువుకుంటున్న లక్ష్మిని చూసి ముచ్చటేసింది. పగలల్లా పదిళ్ళల్లో పాచి పని, అంట్ల పని చేసుకుని, ఇల్లు సర్దుకుని పుస్తకాలు ముందేసుకుని కూర్చోవడం, చదువుకోవడం. అలా ఉండటం  అస్సలు నచ్చలేదట లక్ష్మి మొగుడికి.  ఆమె పుస్తకాల్ని  చించి  పోగులు పెడుతుంటే  లక్ష్మి రాక్షసిలా మొగుడి మీద తిరగబడింది. నీ యబ్బ ! నీకేంటిరా నచ్చాల్సింది, నా సదువు నా ఇట్టం.  నోరు మూసుకుని ఇంటో  ఉంటే ఉండు, దొబ్బితే దొబ్బు అంది . నోరు తెరచుకుని ఆశ్చర్యంగా చూస్తూ లక్స్ నా సౌందర్య రహస్యం, బికినీ వేసుకుని బీచ్ లలో పరిగెత్తడం లాంటివే  కాదమ్మా  స్వేచ్చంటే .. అచ్చమైన  స్త్రీ స్వేచ్చంటే ఇది గదా ! అనుకున్నాను. లక్ష్మీ సెహబాష్ .

లక్ష్మిలా ఇలా తనని తానూ కాపాడుకోకపోతే అసలాడవాళ్ళని బ్రతకనిచ్చేటట్టు ఉన్నారా ! పిండంగా ఉండగానే ముక్కలు ముక్కలు చేసి   డ్రైనేజీలో గుమ్మరించేయడం లేదా   వావి వరుస వయసు చూడకుండా అత్యాచారం చేయడం.  అయితే అటు కాకపొతే ఇటూ … బేటీ బచావో, ఔరత్ బచావో … గొంతు పగిలిపోతుంది ఎవరికీ చెప్పాలి, యేమని చెప్పాలి ?  వినే నాధుడే లేడాయే !  ఏమి శిక్షరా … బాబూ ! పొగిలి పొగిలి  ఏడ్వక ఏం మిగిలింది ? నెట్ న్యూస్ లో కూడా  అప్డేట్  చేసినప్పుడల్లా  ప్రపంచ దేశాలలో  ఎక్కడైనా సరే .. ఎప్పుడు., ఎలా రేప్ జరిగిందో వివరంగా చెప్పే కథనాలు ఎక్కువైపోయాయి.   మొన్నెప్పుడో కలలో రెండు కాళ్ళ మధ్య భూగోళాన్ని ప్రసవిస్తున్న స్త్రీ కనబడింది. ఏమిటో దానర్ధం? ఈ  అవాంఛితాల వార్తలు కళ్ళబడటం, వినబడటం వల్ల స్పందించే గుణం కూడా పోయింది. సున్నితత్వం కూడా పోతుంది. మెదడు మొద్దుబారిపోతుంది.

 

చీకటి పడబోతుండగా మధ్యాహ్నం నిద్ర నుండి మా ఆయన మేలుకున్నాడు.  రోడ్డు పక్కనే ఉన్న కల్యాణ మండపంలో పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది … చెవులు బద్దలయ్యే మేళం మోగుతుంది.  పెళ్లి కొడుకు గుర్రం మీద ఊరేగుతూ నిన్నా కుట్టేసినాది, మొన్నా కుట్టేసినాది గండు చీమ అనే పాటకి తెగ ఎంజాయ్ చేస్తూ మండపానికి వెళుతున్నాడు. అతనుకూడా యువరాజులాగానే ఉన్నాడు.పెద్దలు కుదిర్చిన పెళ్ళంట.  భారీ కట్నం,పుత్తడిబొమ్మ అమ్మాయి. మా ఆయనకి దక్కినట్టే !  అంతకి ముందు ఎన్ని చీమలు కుడితే  కంగారుగా దులిపేసుకున్నాడో అమ్మా అయ్యా   ఏడుపు ముఖాలు చూడలేక.

నా ఫోనేది … ఆయన ప్రశ్న. ఏమో నాకేం తెలుసూ … అన్నా అమాయకంగా ముఖం పెట్టి. ఆయన ముఖంలో అసహనం. నాకది చాలా సింపుల్ గా అనిపించింది.  చూస్తున్నారుగా . వేకువఝాము నుండి   నేనెన్ని అసహనాలు భరించాను. ఆయనా ఒక్క అబద్దాన్ని సహించకపొతే ఎట్టాగబ్బా!

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు

 

-బొల్లోజు బాబా

~

 

ఆధునిక ప్రపంచంలో నువ్వెవరవో ఎవరికీ అక్కరలేదు.  నువ్వేం చెపుతున్నావన్నదే ముఖ్యం.  ఆ చెప్పేది “వారికి” ఏ మేరకు మేలుచేస్తుందన్న దానిబట్టే నీ మనుగడ, నీ భద్రజీవితం.  ఇదొక అదృశ్య ఆధిపత్య పోరు.

ప్రముఖ కవయిత్రి,  మీనా కందసామి వ్రాసిన ఈ కవిత ఈనాటి రాజకీయ సామాజిక వాస్తవికతకు అద్దంపడుతుంది. కేరళ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు, అక్కడి వాసితులను బలవంతంగా తొలగించటానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్న ఇద్దరు యువకులను, జనవరి 2015 లో అరెష్టు చేసింది ప్రభుత్వం.

అదీ ఈ కవితకు నేపథ్యం.

ఈ కవితలో ‘నిన్ను’ అన్న సంభోధనలోనే ఈ ప్రపంచంతో నీ మనుగడ ప్రశ్నార్ధకమైందన్న అంశం దాగిఉంది.  ఆ ‘నువ్వు’  లో ‘నేను’  లేను అనుకోవటం మనల్ని మనం మోసగించుకోవటమే. చివర్లో  నిశ్శబ్దమా వర్ధిల్లు అనటం ఈ సమాజం ప్రదర్శిస్తున్న నిర్లిప్తతపై గొప్ప వక్రోక్తి.

 

*******

 

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  నీ ఇంట్లో ఏదో సమస్యాత్మక పుస్తకం ఉందని ఆధారం చూపుతారు

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  పోలీసులు చెప్పారని ప్రసారమాధ్యమాలన్నీ నిన్ను తీవ్రవాది అనటాన్ని నీ మిత్రులు టివిలో చూస్తారు.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. లాయర్లందరినీ భయపెడతారు.  నీ కేసు తీసుకొన్న లాయర్ ఆ పైవారం అరెష్టు చేయబడతాడు

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  ఆ మర్నాడు నిన్ను ఫేస్ బుక్ లో చూస్తారు నీ మిత్రులు.  పోలీసులే నీ పేరుతో ప్రవేశిస్తారు

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  పిటిషన్ పై  వెయ్యి సంతకాలు తీసుకోవటానికి నాలుగురోజులు పడుతుంది నీ మిత్రులకు

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  నీ చిట్టితల్లి UAPA  అంటే ఏమిటో తెలుసుకొంటుంది.  నీ మిత్రులకు సెక్షన్-13 అర్ధమౌతుంది.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  ప్రజలకు నువ్వు ఒక లెఫ్టిస్ట్ వి,  లెఫ్టిస్ట్ లకు నువ్వు ఒక అతి-లెఫ్టిస్ట్ వి.  ఎవరూ మాట్లాడరు.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  ఇకపై జీవితాంతం నీవు తీవ్రవాదిగానే పరిగణించబడతావు.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  వాళ్ళు ఒక జాబితా తయారుచేస్తారు.  ఖండించినవారి పేర్లు అందులోకి చేరుతూంటాయి.

 

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  నిన్ను హెచ్చరిస్తారు.  నీవే ప్రతిఒక్కరికీ ఒక హెచ్చరిక అవుతావు-  కార్పొరేట్ సాలెగూటిలో వేలుపెట్టినందుకు.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  ఈ రాత్రి నీ ఇల్లు సోదాచేస్తారు.  నిన్ను ప్రశ్నించటానికి తీసుకెళతారు.  మాట్లాడకు.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  కోర్టు ఓ అరుదైన చర్యగా నీకు బెయిలిస్తుంది.  మరో కేసులో నువ్వు మళ్ళా అరెష్టు చేయబడతావు

రేపు  ఎవరో నీ పిల్లల్ని అరెష్టు చేస్తారు.  నీవు అజ్ఞాతంలోకి వెళిపోతావు.  ప్రజాస్వామ్యాన్ని బతికించటానికి కొన్ని జాగ్రత్తలు తప్పవు.

 

నిశ్శబ్దమా వర్ధిల్లు!

 

 

మూలం: మీనా కందసామి ( The End of Tomorrow)     – తెలుగు అనువాదం: బొల్లోజు బాబా

ట్రోజన్ యుద్ధంలోనూ ఒక ‘అర్జున విషాదయోగం’

 

స్లీమన్ కథ-29

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

కల్లూరి భాస్కరం

యుద్ధ సందర్భంలో భార్యతో మాట్లాడుతూ హెక్టర్ అంటాడు:

ఆ రోజు వస్తుంది,  నా అంతరాత్మ చెబుతోంది,

మన పవిత్రనగరం ట్రాయ్ ధూళిధూసరితమైపోతుంది,

ట్రాయ్, ధైర్యశాలి అయిన రాజు, అతని రాచపరివారం, అంతా సర్వనాశనమైపోతారు.

ట్రోజన్ల దుఃఖం నన్ను అంతగా కదిలించడంలేదు సుమా-

దుఃఖం అనివార్యం- హెక్యూబా* దుఃఖం, నా తండ్రి దుఃఖం,

శత్రు పాదాల దగ్గర రక్తధూళిలో పడిఉన్న ఎందరో ఉత్తముల దుఃఖం- అనివార్యం.

నా మృత్యువును నేను తలపోస్తున్నాను, నా చావు నీకు కలిగించబోయే శోకం నన్ను చిత్రవధచేస్తోంది:

కంచు కవచం ధరించిన శత్రువు నిన్ను బానిసత్వంలోకి ఈడ్చుకు వెడుతుంటే నువ్వు పెట్టే ఆర్తారావం నా గుండెల్ని పిండుతోంది.

ఆర్గోస్ లోని ఎవరి మగ్గం దగ్గరో వాళ్ళు నీ చేత పని చేయిస్తారు

లేదా ఎక్కడో ఏ మారుమూల ఊరికో వెళ్ళి కడవతో నీళ్ళు మోస్తావు,

ఏం చేసినా నీ ఇష్టానికి విరుద్ధంగానే, నువ్వు బందీవి.

దుఃఖిస్తున్న నీతో వాళ్ళు అంటారు:

“ తమ నగరం కోసం పోరాడుతున్న రోజుల్లో ట్రాయ్ ఆశ్వికసేనకు నాయకత్వం వహించిన ఘన సేనాని హెక్టర్  ఇల్లాలా! ఇటు చూడు”

ఆ మాటలకు, నిన్ను దాస్యం నుంచి విముక్తం చేసే నాలాంటి వాడు ఎవరూ లేనందుకు,

నీ దుఖం మరింత పొంగి పొర్లుతుంది.

నీ దుర్భరశోకం, నిన్ను బానిసగా మార్చిన వైనం నా చెవిన పడకముందే

నాకు చావు రావాలి, భూమి నా మీద విరుచుకుపడి నన్ను పాతాళానికి తొక్కేయాలి.

దేదీప్యమానుడైన ఆ వీరుడు అలా మాట్లాడుతూ కొడుకువైపు చేతులు చాచాడు,

తండ్రి దేహంపై లోహపు మెరుపులూ, శిరస్త్రాణంపై గుర్రపువెంట్రుకల తురాయీ చూసి భయపడిన బాలుడు-

చక్కని మొలనూలు ధరించిన దాది వైపు ఏడుస్తూ పరుగెత్తాడు.

తల్లిదండ్రుల ముఖాల్లో నవ్వులు విరబూసాయి,

ఉజ్వలుడైన  హెక్టర్ ధగద్ధగాయమానమైన శిరస్త్రాణాన్నితీసి నేల మీద ఉంచి తన గారాల పట్టిని చేతుల్లోకి తీసుకుని లాలించాడు.

తను సృష్టించిన పాత్రపై ప్రేమ పెల్లుబికితే తప్ప ఇలాంటి సన్నివేశాలను ఇంత దుస్సహ గాఢతతో, ఇంత ఆర్ద్రంగా ఎవరూ రాయలేరు. ఇలియడ్  మొత్తాన్ని హెక్టర్ పక్షాన చెబుతున్నట్టు అనిపిస్తుంది. ఇతిహాసం పొడవునా అతను మాట్లాడుతూనే ఉంటాడు. ఒక్కోసారి ధిక్కారపూర్వకంగా గర్జిస్తూ, ఇంకోసారి కోపంతో వణకుతూ, మరోసారి ప్రసన్నతనూ, నిగ్రహాన్నీ పలికిస్తూ అతని గొంతు ఇతిహాసమంతటా బిగ్గరగా  వినిపిస్తూ ఉంటుంది. “ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ విధ్వంసం మన మీద వచ్చిపడింది. దానిపై తిరగబడుతూ, గడచిపోయే ప్రతి ఒక్క క్షణం నుంచీ మనకు దక్కే అల్ప సంతోషాన్ని జుర్రుకుందాం” అంటాడతను. విచిత్రంగా ఈ మాటలు ఆధునికతకు సమాధానాలుగా ధ్వనిస్తాయి. హోమర్ ను చదువుతున్నకొద్దీ మనం ఆధునిక ప్రపంచంతో ముఖాముఖీ తలపడుతున్నామన్న ఒక విచిత్ర స్ఫురణ నిరంతరాయంగా కలుగుతూ ఉంటుంది.

మానవ అంతఃకరణలోని అరాచకరాక్షసుని హింసాత్మక స్వైరవిహారానికి అఖిలెస్ ప్రాతినిధ్యం వహిస్తాడు. అతను కేవలం చంపడం కోసమే చంపుతాడు. అందులోనే వెర్రి ఆనందాన్ని ఆస్వాదిస్తాడు. అతని దృష్టిలో విధ్వంసం ఒక  ఉత్తమోత్తమ పుణ్యకార్యం . అతనిది రాతిగుండె అనో; పగ, ప్రతీకారం మూర్తీభవించినవాడనో అనడం, అతని భయానకప్రవృత్తిని తక్కువ చేసి చూపడమే. అతని సంహారకాండకు ఒక లక్ష్యం ఉండదు. ఒక వేటగాడిలా వెంటాడి వెంటాడి మరీ చంపుతాడు. అందులో పిల్లలు, వృద్ధులు అన్న విచక్షణ లేదు.  అపరాధభావన లేదు. ప్రపంచాన్ని అమితంగా ద్వేషిస్తాడు. దానిని నిర్ధూమధామం చేయడంలో తను పొందే తృప్తి కన్నా అతనికి మరేవీ ఎక్కువ కావు. శత్రుగృహంలో ఉన్న హెలెన్ ను విడిపించడం కోసం అతను  యుద్ధంలో పాల్గొనలేదు; చంపడంలో ఉండే సంతోషాన్ని పిండుకోవడం కోసం, ట్రాయ్ మొత్తాన్ని బూడిదకుప్పగా మార్చడం కోసం పాల్గొన్నాడు.

achilles_dragging_hector_s_body_in_front_of_troy__by_jacktzekov-d82vnjg

అందరికంటే ఎక్కువగా  హెక్టర్ మన ఆలోచనలకు దగ్గరగా ఉంటాడు. అతనిలో ఎలాంటి భ్రమలూ లేవు. అతని చేతిలో ఎలాంటి మంత్రదండమూ లేదు. నేటి మన కాలపు ఛాయలు అతనిలో ప్రతిఫలిస్తూ ఉంటాయి. శకునాలను ధిక్కరిస్తాడు. విధిని తప్పించుకోడానికి మానవసాధ్యమైన అన్ని ప్రయత్నాలూ చేస్తాడు, అదే సమయంలో, అది తప్పించుకోలేనిదనీ అతనికి తెలుస్తూ ఉంటుంది. ఎలాంటి పరిస్థితిలోనైనా హుందాగా, గౌరవప్రదంగా నడచుకుంటాడు; అయితే గౌరవమర్యాదలు యుద్ధాలను గెలవలేవనీ అతనికి తెలుసు. హోమర్ చెప్పినట్టుగా అతని ముఖంలో నిశీథి తాండవిస్తూ ఉంటుంది. మరోవైపు, అతను ఎంతటి వీరుడంటే, “కోటగుమ్మంలోంచి రివ్వున యుద్ధానికి దూసుకువెడుతుంటే దేవతలు కూడా అతన్ని పట్టుకోలేరు”. చివరికి, తన కవచాన్ని కోల్పోయిన స్థితిలో, కంఠంలో దిగబడిన ఒక కత్తిపోటుతో అతని జీవితం అంతమవుతుంది. అప్పటికీ కసి తీరని శత్రువు అతని మృతదేహాన్ని దుమ్ములోంచి ఈడ్చుకువెళ్ళాడు.  దేవతలు తనను త్యజించి శత్రుపక్షం వహించడమే అతని పతన,పరాభవాలకు కారణం. విచిత్రం ఏమిటంటే, తన జీవితం ఇలాగే ముగుస్తుందని అతనికి ముందునుంచీ తెలుసు. **

ప్రతి కాలంలోనూ జనం హోమర్ ను చదువుకున్నారు. కానీ నేటి కాలంలో చదువుతున్నంత విస్తృతంగా, శ్రద్ధగా ఎప్పుడూ చదవలేదు. అందుకు తగిన కారణమే ఉంది. హోమర్ ప్రకృతికి అద్దం పట్టాడు. అతను వర్ణించిన ప్రపంచం సరిగ్గా నేటి ప్రపంచమే. ట్రాయ్ దగ్ధమైన తర్వాత ఈ మూడువేల సంవత్సరాలలో ప్రపంచం పెద్దగా మారింది లేదు. నాటి ఆ మంట ఇంకా రగులుతూనే ఉంది. అందులో చిక్కుకున్నవారు బయటపడడానికి పంటిబిగువు పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రతిచోటా విధ్వంసగ్రస్తుల ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. మనందరం ట్రోజన్లమే.*** అంధుడైన హోమర్ పురాతన ద్వీపాల వెంబడి సంచరిస్తూ నేటి మన దురవస్థను విస్తారమైన కాంతిమంతతతో వర్ణించాడు. అలాగని అతను ప్రవక్త ఏమీ కాదు; మానవావస్థను అతనంత నగ్నంగా, ఘనంగా వర్ణించినవారు లేరు.

పాశ్చాత్య నాగరికత మూలాలు వెతికే ప్రయత్నంలో స్లీమన్ ట్రాయ్ అన్వేషణకు వెళ్ళాడు. అతనూ ఆధునికత ఆవహించినవాడే. అశాంతి, అభద్రత, నీడల మధ్య సంచారం సహా విక్టోరియన్ల జాడ్యాలన్నీ అతనికీ ఉన్నాయి. అదే సమయంలో, ఈ సంకీర్ణ ఆధునిక నాగరికత గుప్పించే ప్రలోభాలనుంచి తప్పించుకోవాలన్న దృఢనిశ్చయమూ అతనిలో అసాధారణస్థాయిలో ఉంది. తనవైన మూలాల నుంచి తను దూరమయ్యాడన్న ఎరుక అతనికుంది. అందుకే తన మూలాలను అన్వేషించాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో అతిపురాతన గతంలోకి… ఎలాంటి దారి గుర్తులూ లేని ప్రదేశాలకు సైతం వెళ్లాలనుకున్నాడు. ****

విచిత్రం ఏమిటంటే, ఆధారాలను పట్టించుకోకుండా సిద్ధాంతాలను అల్లే పండితులపట్ల ఆధునికులలో ఉండే తిరస్కారభావం స్లీమన్ లోనూ ఉంది.  అందుకే, హోమర్ కల్పితవ్యక్తి కాడనీ, ఇప్పటికీ జనం జ్ఞాపకాలలో వెచ్చగా ఉన్న యుద్ధాల గురించి రాసిన ఒకనాటి సజీవవ్యక్తి అనీ తిరుగులేని ఆధారాలతో నిరూపించాలనుకున్నాడు. ఆ సంకల్పాన్ని హద్దులు దాటిస్తూ, తను అగమెమ్నన్ ముఖాన్ని గుర్తుపట్టానని అతను అన్నప్పుడూ; ‘హెలెన్ స్వర్ణహారకిరీటాన్ని’ భార్య నుదుట అలంకరించినప్పుడూ అందరూ వెక్కిరింపుగా నవ్వారు. అయితే, అతని భావన నిజమైనా కాకపోయినా కనీసం అది అసాధ్యమని మాత్రం ఎవరూ అనలేరు.

హోమర్ లో అంతవరకూ పాఠకుల దృష్టిని పెద్దగా ఆకర్షించని ఛాయామాత్ర ఉల్లేఖలు కొన్నింటికి రక్తమాంసాలను కల్పించి, ముందులేని ప్రాధాన్యతను వాటికి సంతరించడం స్లీమన్ చేసిన గొప్ప దోహదాలలో ఒకటి. తను జరిపిన తవ్వకాలలో అతనికి గట్టి లిఖిత ఆధారాలు ఏవీ కనిపించకపోయినా; అతను బయటపెట్టినవాటిలో అనేకం హోమర్ చిత్రణలకు అనుగుణంగా ఉండి, అతని పద్యాలను అప్పుడే తవ్వి తీసి అపనమ్మక ప్రపంచం ముందు పెట్టాడా అన్న భావన కలిగిస్తాయి. ఏమైతేనేం, తను పాశ్చాత్యనాగరికత మూలస్థానాన్ని కనిపెట్టాడు, అంతే! ఇంతకు మించి చెప్పుకోవడం అనవసరం.

అసలు ట్రాయ్ లో ఏం జరిగింది, యుద్ధం ఎందుకు చేయవలసివచ్చిందన్నది ఈ రోజుకీ మనకు తెలియదు. హోమర్ నిజంగా ట్రాయ్ ను సందర్శించాడా అన్నది కూడా తెలియదు. కానీ ట్రాయ్ పతనగాథ ఏమాత్రం సందేహించడానికి వీలులేనంత ప్రామాణిక వివరాలతో, పటిష్టమైన చట్రంతో మన ముందుకు వచ్చింది.*****  హోమర్ ఒక కవిగా తన అభిరుచికి అనుగుణంగా వీరులను తీర్చిదిద్దాడు. కొందరిని ఉన్నతీకరించాడు, కొందరిని వక్రీకరించాడు. తన సానుభూతులన్నిటినీ హెక్టర్ లో గాఢంగా రంగరించాడు. హెలెన్ ను పారిస్ ఎత్తుకువెళ్లడం వల్లనే ట్రోజన్ యుద్ధం జరిగిందని అతను నమ్మాడు. అయితే, ఆర్థిక కారణాలతో కాకుండా అర్థరహిత కారణాలతో కూడా తరచు యుద్ధాలు జరిగాయన్న సంగతిని విస్మరించిన ఆధునిక పండితులు మాత్రం, దర్దనెల్లెస్ పై ఆధిపత్యం కోసమే ట్రోజన్ యుద్ధం జరిగిందని భావించారు.

ఇక, ట్రోజన్ యుద్ధం గురించి గ్రీకు పురాతన చరిత్రకారుడు హెరోడొటస్ (క్రీ.పూ. 484-425)కథనం మరోవిధంగా ఉంది.

(సశేషం)

****

అథోజ్ఞాపికలు

*హెక్యూబా: రాజు ప్రియామ్ భార్య.

**హెక్టర్ లో విచిత్రంగా మహాభారతంలోని అర్జునుడి పోలికలు, కర్ణుడి పోలికలూ కూడా కనిపిస్తాయి. అతను మనం తేలిగ్గా పోల్చుకోగలిగిన మానవమాత్రుడిలానే వ్యవహరిస్తాడు. విధికి ఎదురు తిరగలేని మానవనిస్సహాయతను అంగీకరిస్తూనే, మానవప్రయత్నంతో ధైర్యంగా దానిని ఎదుర్కోడానికి సిద్ధమవుతాడు. మనిషిలోని దుఃఖం, వేదన, ఆనందం, ఆశ, నిరాశ మొదలైన అన్ని రకాల అవస్థలను ప్రతిబింబిస్తాడు. మహాభారతంలోని అర్జునుడు కూడా ఈ మానవస్వభావానికి ప్రతినిధిగా కనిపిస్తాడు. ‘నరుడు’ అన్న అతని మరో పేరే దీనిని సూచిస్తూ ఉండచ్చు. హెక్టర్ లానే అర్జునుడు కూడా యుద్ధఘట్టంలో సందేహాలు, సందిగ్ధాల మధ్య నలుగుతాడు. విషాదానికి లోనవుతాడు. హెక్టర్ లానే యుద్ధానంతర విధ్వంసాన్ని పదే పదే ఎత్తి చూపుతాడు.

ఇంకోవైపు, హెక్టర్ అంతమైన తీరు కర్ణుని గుర్తుచేస్తుంది. అతను కవచాన్ని కోల్పోవడం, ఆ స్థితిలో కంఠంలో శత్రువు కత్తి దిగబడడం కర్ణుని అంతిమక్షణాలకు కొంచెం దగ్గరగా ఉన్నాయి.  దేవతలు హెక్టర్ కు ప్రతికూలంగా మారి శత్రుపక్షం వహించి అతని చావుకు కారణమైనట్టే, దేవతల రాజైన ఇంద్రుడు కర్ణుని కవచకుండలాలను హరించి అతని చావుకి ఒక కారణమయ్యాడు.

***ఇక్కడ కూడా మహాభారతంతో ఇలియడ్ కు పోలిక కుదురుతున్నట్టుంది. పాశ్చాత్యులందరూ ట్రోజన్లు అయితే, మనం భారతీయులం కురుక్షేత్రయుద్ధ వారసులం. ట్రోజన్ యుద్ధం పాశ్చాత్య సమాజాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పిందనుకుంటే, కురుక్షేత్రయుద్ధం భారతీయసమాజాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పింది. నా విస్తృత అధ్యయనంలో ఈ చర్చ ఒక భాగం కాబోతోంది.

****మనకులానే పాశ్చాత్యులకు కూడా ఆధునికత ఒక సమస్య కావడం ఇక్కడ ఆసక్తికరం.

*****ఇక్కడా మహాభారతంతో పోలిక కుదురుతోంది. మహాభారతయుద్ధం నిజంగా జరిగిందో లేదో మనకీ తెలియదు. కానీ యుద్ధ చిత్రణ మాత్రం నిజంగా జరిగిందన్న భావన కలిగిస్తుంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఆ తర్వాత

 

-మహమూద్

~

ఎన్ని కాలాల తర్వాత
నువ్వోచ్చావ్

తోవ మరిచిన గాలి పరుగులా

రాకేం చేస్తావ్ లే
ఇక్కడ గాయపడిన మనో నెత్తుటి స్రవంతి
నీ పాదాల దాకా పాకే ఉంటుంది

ఈ ఊపిరి బుడ్డని ఊదింది నీవే కదా
నీ ఊపిర్లతో

నా కోసం నేను లేననీ
నువ్వు నడవడానికి పరుచుకున్న
మార్గాన్ననీ
నీకు తెలుసు కదా

నీ పాదముద్రల పంటతో పచ్చగా ఉన్న ఈ దారి
నువ్వెళ్ళాక కళావిహీనమైపోయింది

కవితలిక్కడ చిరుమొలకల్లా
పడిఉండేవి

ప్రేమ నిండిన ఊహల గాలిపటాలతో
అలలారే పుడమి కన్నులో
నీ ముద్దుల అచ్చరలు తళతళలాడేవి

మనల్ని మనం మరిచిపోయినపుడు
మీరు మీరని గుర్తుచేసే వాన చినుకులు గుర్తున్నాయా

నా చేతిలో నీ అరచేయి విడిచిన
నీ గుండెలయల కాగితపు పడవలు గుర్తున్నాయా

వర్షంలో నేను తడిచి నా తడి దేహంపై
నిలిచిన వానచినుకుల పడవల్లో వళ్ళంతా ప్రయాణించిన నీ చిలిపి చూపు గుర్తుందా

నీ పరదేశ ప్రయాణం నా ప్రాణంమ్మీదికొచ్చిందని
ప్రణమిల్లేలోగా పయనమైపోయావ్

ఈ వేదనకి నిరీక్షణ అని ఎవరు పేరు పెట్టారో
తెలియదు కాని
ఈ నిరీక్షణ కోసం ఎన్ని వేదనలు పడ్డానో నీకు
తెలుస్తుందా ఎప్పటికైన

ఇలా వాలు గులాబీ మీద భ్రమరంలా
ఎదపైన
కొన్ని గాయాల గజళ్ళు
ఇంకుతాయి నీ ఎదలోన

కవిత్వంలో “మెటానమీ” !

 

metonymy_cover

-పెన్నా శివరామకృష్ణ

~

 

–“Chess is a play – activity,  yet it is play only because the players deliberately make the game difficult in order to overcome the difficulties. The equation is simple: no difficulty no fun. No Chess player finds

any real pleasure in playing an obviously inferior opponent. Every game ever invented by mankind is

a way of making things hard look easy…….Learning to experience poetry is not a radically different

process from that of learning any other kind of play.”

–John Ciardi   (How Does a Poem Mean, pg. 669)

 

క్లుప్తతనూ, గుప్తతనూ సాధించడం కోసం కవిత్వంలో ఉపయోగింపబడే అనేక పద్ధతులలో మెటానమీ (Metonymy), సినెక్^డకీ (Synecdoche) కూడ ప్రధానమైనవి. ఇవి నిశ్చయంగా అలంకారాలు కాకపోయినా అలంకారాల వంటివే. మెటఫర్ (రూపకానికీ)కు దగ్గరి సంబంధం కలిగినవి మెటానమీ, సినెక్^డకీ.  మెటానమీకి దగ్గరి పోలిక కలిగినది సినెక్^డకీ.

–“In metonymy (Greek for “a change of name) the literal term for one thing is applied to another with

Which it has become closely associated because of a recurrent relation in common experience.

Thus “the crown” or “the scepter” can be used to stand for a king and “Hollywood” for the film

Industry. ……….In synecdoche (Greek for “taking together), a part of something is used to signify

the whole, or (more rarely) the whole is used to signify a part. We use “ten hands” for

“ten workers”, in current slang “wheels” to stand for an automobile

–M.H. Abrams (A Glossary of Literary Terms, pg. 103)

ఒక వస్తువుకు లేదా అంశానికి విడదీయరాని సంబంధం కలిగిన లేదా సన్నిహిత సంబంధం కలిగిన అంశాన్ని మాత్రమే పేర్కొనడం ద్వారా, ఆ వస్తువును (లేదా ఆ అంశాన్ని) అంతటినీ సూచించడాన్ని మెటానమీ అంటారు. ఒక వస్తువులోని ఒక భాగాన్ని మాత్రమే పేర్కొని, ఆ వస్తువునంతటినీ సూచించడాన్ని సినెక్ డకీ అంటారు. ‘శకలం’ ద్వారా ‘సకలం’ స్ఫురింపజేయడం వీటిలో ప్రత్యేకత.

మెటానమీ, సినెక్^డకీ అనేవి ఆంగ్ల అలంకార శాస్త్ర పారిభాషిక పదాలే అయినప్పటికీ, తెలుగు నుడికారాలలో, జాతీయాలలో, సామెతలలో గుప్తంగా ఒదిగి ఉన్నవే. “పొయ్యిలో పిల్లి లేవలేదు” అనే జాతీయంలోని  ‘పొయ్యి’ అనే ప్రధాన సాధనం ద్వారా ‘వంట’ సూచింపబడింది. “కత్తి కంటే కలం గొప్పది” అనే వాక్యం కూడ ఇలాంటిదే. ఇక్కడ ‘కత్తి’ యుధ్ధానికీ, ‘కలం’ ప్రబోధాత్మకమైన రచనలకూ ప్రతినిధులు. ఇలాంటివన్నీ మెటానమీకి ఉదాహరణలే. “నోరు మంచిదైతే, ఊరు మంచిదవుతుంది” అనే వాక్యంలో,వ్యక్తి యొక్క మాటతీరు, నడవడిక, వ్యవహార జ్ఞానం మొదలైన వాటికన్నిటికీ నోరు సంకేతం. “తలా ఒకటి ఇవ్వడం..” అనే వాక్యంలోని ‘తల’ వ్యక్తి సూచకం. ఇలాంటివి సినెక్^డకీ కి నిదర్శనాలు.

లక్ష్యార్థంతోపాటు ముఖ్యార్థం కూడ అన్వయిస్తున్నప్పుడు, దానిని భారతీయ అలంకారశాస్త్ర పరిభాషలో ‘ఉపాదాన లక్షణ’ అంటారు. దీనికే ‘అర్థాంతర సంక్రమిత వాచ్యం’, ‘అజహల్లక్షణ’, ‘అజహదభిదేయ’ అనే నామాంతరాలున్నాయి. ఒకరకంగా మెటానమీ, సినెక్ డకీలు ‘ఉపాదాన లక్షణ’లో అంతర్భాగాలే. ఒక వాక్యంలో వాచ్యార్థం పోసగనప్పుడు, రూఢిని బట్టి కానీ, ప్రయోజనాన్ని బట్టి కానీ, మరొక అర్థాన్ని స్ఫురింపజేసే శబ్దశక్తిని “లక్షణ” అన్నారు. ‘ప్రాణి లక్షణారోపణ’, ‘మానవ లక్షణారోపణ’, ‘ప్రతీక’, మెటానమీ, సినెక్^డకీ లాంటి విభజనలనూ, అంతర్విభజనలనూ చెప్పకపోయినా, ఇలాంటివన్నీ వివిధ ధ్వని భేదాలలో అంతర్భాగాలే.

ప్రపంచంలో ఎక్కడైనా అలంకారశాస్త్ర పరమ లక్ష్యం కావ్యసౌందర్య అన్వేషణమే. కావ్యసౌందర్య సాధనాలను రకరకాలుగా సూత్రీకరించి, విభజించి, రకరకాల పేర్లు పెట్టారు. ఈ విభజనలలో, నామకరణాలలో కొన్ని భేదాలున్నప్పటికీ, సంఖ్యాధికమైన సామ్యాలూ ఉన్నాయి.

—“వర్తమాన తెలుగు కవిత్వాభివ్యక్తికి వైవిధ్యం ప్రధానంగా నాలుగు అభివ్యక్తి విధానాల ద్వారా వస్తున్నది. అవి వరుసగా 1. Metaphor, 2. Metonymy, 3. Synecdoche, 4. Paradox. వీటిని  వీటిని ‘tropes’గా వ్యవహరిస్తున్నారు విమర్శకులు. అంటే, భాషను సాధారణ అర్థాల నుంచి   విశేష అర్థాలకు మార్చే సాధనాలు. ఒక కోణంలో అలంకారాలే కానీ ఖచ్చితంగా అలంకారాలు కావు.   భాషలోని పదాలకుండే అర్థాలను సందర్భానుగుణంగా మార్చి నూతనార్థాలను సృష్టించే పనిని ఇవి   నిర్వహిస్తాయి. ఈ సాధనాలు లేకుండా కవిత్వం ఉండే వీలు లేదు.” (“అదే పుట” సాహిత్య వ్యాసాలు  పు. 17)

పై సీతారాంగారి పరిశీలన సమంజసమైనదే. కాని, వర్తమాన వచనకవిత్వంలో, పర్సానిఫికేషన్, ఐరనీ, సానుకూల లేదా ప్రతికూల సమాధానాలను ఆశించే ప్రశ్నలతో కూడిన (రిటారిక్) సంభాషణాత్మకత లాంటి వ్యక్తీకరణ పద్ధతులు కూడ ప్రముఖ భూమిక పోషిస్తున్నాయి.

***

—“ఓల్గా ఘనీభవించెను / యంగ్సీ నది పొంగెను / రుతుగీతికి పరవశించి/గంగ కూడ పొంగెను”

“రుతుసంగీతం” అనే శివసాగర్ గేయంలోని పై వాక్యాలు ప్రసిద్ధమైనవే. ఇక్కడ ‘ఓల్గా’, ‘యంగ్సీ’, ‘గంగ’లు క్రమంగా సోవియట్ రష్యా, చైనా, భారత దేశాలను గుర్తు చేస్తాయి. సోషలిజం సాధనలో రష్యామార్గం గడ్డకట్టుకుపోయింది, మార్క్సిస్టు లెనినిస్టు పంథాను మావో ఆలోచనావిధానం ద్వారా చైనా కాపాడుకుంటున్నది, చైనా స్ఫూర్తితో భారతదేశంలో విప్లవోద్యమం విస్తరిస్తున్నది అనేది లక్ష్యార్థం. నదుల పేర్ల ద్వారా దేశాలూ, దేశాల పేర్ల ద్వారా విప్లవోద్యమాలూ స్ఫురింపజేయబడినాయి. ముఖ్యార్థ సంబంధం సాక్షాత్ సంబంధంగా కాక పరంపరా సంబంధంగా అభివ్యక్తమైతే కనుక, దానిని భారతీయ ఆలంకారిక పరిభాషలో ‘లక్షితలక్షణ’గా చెప్పవచ్చు.

—“నేను జేబుల్లో కోకిలల్ని వేసుకురాలేదు

                                      పిడికిళ్ళలో బాంబుల్ని బిగించుకుని వచ్చాను”  (ఆధునిక మహాభారతం, పు. 332)

 

ఇవి శేషేంద్ర వాక్యాలు. ఇవి వాచ్యార్థాలు పొసగని వాక్యాలని తెలుస్తూనే ఉంది. ఇక్కడ ‘కోకిలలు’ వసంత రుతు సూచకాలు. ‘బాంబులు’ ఆధునిక ఉపకరణాలలో ప్రధానమైనవి. వసంత రుతువు, ఆనందదాయక జీవనస్థితినీ, భోగప్రవృత్తినీ (శృంగారాన్నీ) తెలుపుతుంది. యధాతథ స్థితిని కాంక్షించే వారికీ, సంతుష్ఠ భద్రలోక జీవులకూ తన కవిత్వం ఆనందం కలిగించేది కాదనేదీ, సామాజిక చైతన్యాన్ని కలిగిస్తూ పీడితులను పోరాటాలకు ఉసిగొల్పుతుందనేదీ పై వాక్యాల భావం.

గుండె పగిలిన తమసా తీరం, ఘూర్ణిల్లింది శోకచ్చందంగా” (విశ్వంభర, పు. 27),  తమసా నదీ తీరంలోనే వాల్మీకి ఆశ్రమం ఉండేదట. ‘శోకచ్చందం’ అనే కొత్త పదబంధం, ‘శ్లోకం శోకత్వమాగచ్చతి’ అనే సాంప్రదాయిక భావనకు సూచకం. ‘గుండె పగలడానికి’ కారణం పక్షుల జంటలో ఒక పక్షిని ఒక బోయవాడు చంపడం. దానిని చూసిన వాల్మీకి నోట అప్రయత్నంగా “మానిషాద ప్రతిష్ఠాంత్వమ్…” ఇత్యాది శ్లోకం వెలువడడం…అదే రామాయణ రచనకు నాందీవాచకం కావడం అనే అంశాలన్నిటినీ అతి తక్కువ మాటలలో కవి ధ్వనించాడు. మానవ లక్షణారోపణతో కూడిన, ‘తమసాతీరం” అనే మెటానమీ ఈ క్లుప్తతకు ప్రధాన కారణం.  –“ప్రతి మకుటం తన కాలిగోటిలో ప్రతిఫలించాలని…” (విశ్వంభర, పు. 50) ఇక్కడ మకుటం అంటే మకుటధారులని లక్ష్యార్థం. లక్ష్యార్థంలో ముఖ్యార్థం కూడ ఇమిడి ఉన్నది. ప్రయోజనం దృష్ట్యా అర్థాంతరాన్ని చెప్పుకుంటున్నాం. లక్ష్యార్థం తోపాటు ముఖ్యార్థం కూడ వాక్యార్థంలో అన్వయిస్తూ ఉంటే దానిని ’ఉపాదాన లక్షణ’ అంటారు. ఇది సినెక్^డకీకి ఒక ఉదాహరణ.

–“నా గూడు బాణసంచా అవుతుంది

                             నా గూడు భోగిమంటవుతుంది

                             నా గూడు నరకాసురుని చితాభస్మమవుతుంది”

 

ఖాదర్ మొహియుద్దీన్ గారి “పుట్టుమచ్చ” (దీర్ఘ కవిత”)లోనివి ఈ వాక్యాలు. ఇక్కడ దీపావళికీ, సంక్రాంతికీ, దసరాకీ అవినాభావాలైన ‘బాణసంచా’, ‘భోగిమంట’, ‘నరకాసురుని చితాభస్మం’ అనే ప్రయోగాలు గమనించండి. ఈ మూడు పండుగలనూ ప్రస్తావించి, హిందూ ఆధిక్యతాభావాగ్నికి ముస్లింల ఆత్మగౌరవం భస్మమవుతున్నదన్న భావాన్ని వ్యంగ్యం చేశారు. ఇదే కవితలో “త్రిశూలాల మొనల మీదా / పి. ఏ. సి. తుపాకుల కోనల మీదా / బాలెట్ బాక్స్ ల కొనల మీదా/ నెత్తురోడుతున్న నా పుట్టుమచ్చను గురించి ప్రశ్నించలేను” అన్నారు. హిందూ మతోన్మాదమూ, సైనిక (పోలీసు)వ్యవస్థా, ‘ప్రజాస్వామ్యమూ’ ముస్లిం సమాజాన్ని వంచిస్తున్న తీరును ధ్వనించడానికి,  ‘త్రిశూలాలు’, ‘తుపాకులు’, బాలెట్ బాక్స్’ అనే మాటలను కవి ఎంతో సమర్థంగా ఉపయోగించుకున్నాడు.

జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వారి కష్టనష్టాలను చెబుతూ “బతకవోయిన చోట / ఇంటి తుఫాన్లు ఇసుక తుఫాన్లు తట్టుకోవలసిందే / ఎన్నాళ్ళయినా కట్టెను మోసుకుంటూ బతక వలసిందే” (ఇక్కడి చెట్ల గాలి, పు. 12) అన్నారు నందిని సిధారెడ్డి. ‘ఇంటితుఫాన్ల’ ద్వారా, స్వగ్రామంలోనే ఉన్న కుటుంబ సభ్యుల కష్టనష్టాలనూ, ‘ఇసుకతుఫాన్ల’ ద్వారా అక్కడి వృత్తిపరమైన, వ్యక్తిపరమైన ఒత్తిడులనూ దుఃఖాలనూ స్ఫురింపజేశారు. “నడి ఎండలో పడి పడి పాదయాత్ర చేస్తే / మనిషిని నమ్మాలె గద / నమ్మిన / పాదాలకు కండ్లుంటయంటరు / పాదయాత్ర చూపంతా / భూముల ఆక్రమణ వ్యూహమని గుర్తించలేదు” (ఇక్కడి చెట్ల గాలి”, పు. 43) అంటూ, ‘పాదయాత్ర’ అనే మాట ద్వారా, ఆనాడు పాదయాత్ర చేసే గద్దెనెక్కిన ఒకానొక ముఖ్యమంత్రి నిర్వాకాలను గుర్తు చేశారు. “సింహాసనాలూ, సినిమా హోర్డింగులూ వియ్యమందుకుంటాయి” అనే చోట, ‘సింహాసనాలు’, అధికారం అనుభవిస్తున్న ‘పెద్దల’కూ, ‘సినిమా హోర్డింగులు’ సినిమా రంగంలోని ‘పెద్దల’కూ సంకేతాలు.

“నల్లతల్లి” అనే కవితలో “బొట్టులేని నీ కాటుకరంగు నుదురు చూస్తే / కుంకుమ భరిణెలు నెత్తురు కక్కుకుంటాయి” అన్నారు ఎండ్లూరి సుధాకర్. హిందూ (ఐదువ) స్త్రీలకు సంబంధమున్నవి ‘కుంకుమ భరిణెలు’. తద్ద్వారా హిందూభావజాల ప్రతినిధులు. దళితులనూ, అందులోనూ దళితక్రైస్తవులనూ కొందరు హిందువులు న్యూనంగా చూసే ధోరణిని ధ్వనించడానికి, కవి మెటానమీని చక్కగా వాడుకున్నారు.

సానుకూల (లేదా ధనాత్మక) ఫలితానికి దారి తీసే “అనూహ్యత” (“అపూర్వత” కూడ) జీవితంలో అయినా, కవిత్వంలో అయినా అమిత ఆనందదాయకమే. ఉపమానం, ఉత్ప్రేక్ష, ప్రతీక లాంటి ఆలంకారిక రీతులలో కానీ, సంపూర్ణంగా అభివ్యక్తి రూపంలో కానీ పాఠకుడు ఊహించని ప్రయోగాలు ఎదురైనప్పుడు, ఆ ప్రయోగాలు వక్తవ్యాంశాన్ని గుప్తంగా వెల్లడించి నప్పుడు, ఆ రచన పాఠకుడిని గొప్పగా ఆహ్లాదపరుస్తుంది. ( ‘పారదర్శకం’ కాని ‘గుప్తత’, ‘నిగూఢత’గా పరిణమిస్తుంది. ఎవరు అన్ని సిద్ధాంతాలను అడ్డుపెట్టుకొని సమర్థించుకున్నా, అలాంటి రచనలు ‘భావాలను బట్వాడా చేయలేక’ అర్థరహితమైనవిగానే మిగిలిపోతాయి, క్రమంగా కాలగర్భంలో కలిసిపోతాయి. గత మూడు, నాలుగు దశాబ్దుల తెలుగు కవిత్వంలోనే ఇందుకు ఉదాహరణ ప్రాయమైన ‘రచన’లు ఎన్నో ఉన్నాయి.)  అలాంటి రచనలలోని వస్తువుకు వన్నె సమకూరుతుంది; కవి దృష్టికోణాన్ని పాఠకుడు తేలికగా అందుకొన గలుగుతాడు. అదను ఎరిగి ప్రయోగింపబడే పదునైన మెటానమీలూ, సినెక్^డకీలూ చదువరికి అనూహ్య ఉదాత్త ఆనంద ప్రదాయకాలై, కవి లక్ష్యసిద్ధికి తోడ్పడుతాయి.

కవిత్వం రెండు రకాలుగా ఉంటుంది. ఆలంకారికంగా నయితే. ఒకటి synecdoche, మరొకటి metonymy . ముఖ్యంగా ఆధునిక కవిత్వం మెటనామిక్ గా, మిథో పోయిక్ (mytho – poeic) గా ప్రవర్తిల్లుతోంది.” అన్నారు వేగుంట మోహన్ ప్రసాద్. (రహస్తంత్రి, పు. ii)

 

***

 

 

 

 

 

 

 

 

 

 

 

రాతిరి కన్న ఇన కవనం!

 

-అంబటి సురేంద్రరాజు

~

 

 

We love life, not because we are used to living, but because we are used to loving

– Nietzsche

ఎవడడుగు పెడతాడెపుడెపుడోనని

ఎదురు చూస్తానెపుడూనూ 

–      ఒంగిన గగనం

 

సోమాలియాలో సోఫియా లారెన్‌’ జగ్గయ్యపేటలో శివలెంక రాజేశ్వరీదేవి. దూరాభారం ఎంత వున్నా ఇద్దరి మధ్య సామ్యం ఏదో వుంది. అందుకే ప్రపంచానికి నిప్పు పెడదామని అంటున్నారు యుగళంగా. అనంతాకాశాన్ని ముక్కుగా విడగొట్టడం ఇద్దరికీ ఇష్టంలేదు. అందుకే వాక్యం తెగడం లేదు. ‘వాక్యం తెగదుగాక తెగదు’  అంటున్నది వారి ముక్త కంఠం.

శివలెంక రాజేశ్వరీదేవి ఒంటరి. ఒంటరి కాదు. ఒకరు మనిషి, వేరొకరు కవి. ఒంటిగా మనిషి ఊయలూగడం ఎంత నిజమో, కవిగా లోకపు వాకిట ఇష్టులతో జతకట్టడం అంతే నిజం. రావు బాలసరస్వతీదేవి నుంచి సోఫియాలారెన్‌ దాకా, కృష్ణశాస్త్రి, ‘రజని’, మోహన్‌ప్రసాద్‌లనుంచి  శరత్‌, చలం, వడ్డెరచండీదాసు దాకా అందరూ చెలులే, చెలికాండ్రే.

రాజేశ్వరీదేవి అండర్‌గ్రౌండ్‌ కవి. కవిగానే కాదు మనిషిగా కూడా అండర్‌గ్రౌండ్‌ జీవితాన్ని ఎంచుకున్నందున అందుకు అడ్డుగా నిలిచే ఉద్యోగ జీవితాన్ని, వైవాహిక జీవితాన్ని తోసిరాజన్నారు. ఫ్రెంచి కవి, విమర్శకుడు మలార్మే లాగా »»The world exists in order to end up in a bookµµ అని నమ్మి తన ప్రపంచాన్ని పుస్తక రూపంలో మనకు కానుకగా ఇచ్చి సెలవంటూ వెళ్ళిపోయారు.

‘‘నా రాత్రి సుదీర్ఘమయినది’’ అంటూ తెలియని రాత్రిలోకి మనల్ని తీసుకువెళతారు. ఏ నమూనాలోనూ లేనందున రాత్రిని పగలు, పగటిని రాత్రిని చేసే శక్తి ఆమె సొత్తు. ‘‘ఉన్న కాస్త సమయం ప్రేమించడానికే చాలడం లేదు. ఇక ద్వేషానికి తావెక్కడ?’’ అనే సూఫీ కవయిత్రి రూబియా తలపుల్లో మెరుస్తుంది శివలెంక కవిత్వం చదువుతుంటే. ఒక్క రూబియానే కాదు మార్మిక కవులు మీరా, అక్కమహాదేవి గుర్తుకువస్తారు.

దోస్తవిస్కీ ‘నేరము శిక్ష’ నవలలో మన హృదయానికి చేరువై మనను అచ్చెరువొందించే సోనియాను మీరు శివలెంకలో చూడవచ్చు. రాస్కల్నికొవ్‌ను సన్మార్గంలో పెట్టే సోనియానే కాదు రాస్కల్నికొవ్‌ను కూడా మీరు ఆమెలో చూస్తారు. పరస్పర విరుద్ధ అస్తిత్వాలను కలిగివున్న భిన్న ధృవాలు ఒకే మనిషిలో అన్యోన్యంగా వుండటం అరుదుగా తప్ప జరగదు. రాజేశ్వరీదేవి ఇందుమూలాన్నే అరుదయిన కవిగా, మనిషిగా నిలుస్తారు. ‘తోవ ఎక్కడ సోనియా?’ అని కలవరించి పలవరించిన ‘నూతిలో గొంతుక’ బైరాగి కవిత్వ ప్రభావం ఆమెపై వుందంటే అది స్వాభావికమే.

“Despair has its own calms” అంటాడు డ్రాకులా, బ్రామ్‌ స్టోకర్‌ నవలో. అలాగే “It is necessary to work, if not from inclination, at least from despair.” అంటాడు ఫ్రెంచి మహాకవి బోదలేర్‌. రాజేశ్వరీదేవి కవిత్వం ఆమూలాగ్రం despair (నిరాశ) నుంచే జనించింది. కుటుంబ పోషణకుగాను వేతన కూలీగా ఇష్టంలేని పని చేయాల్సిన దురవస్థను సులువుగా తప్పించుకుని కవితా వ్యాసంగాన్ని ఇష్టమైన వ్యాపకంగా ఒక పనిగా పెట్టుకున్న ధీరజ శివలెంక. నిరాశ తాత్విక ప్రాతిపదికగా బోదలేర్‌ మార్గంలో పనిచేస్తూ కవిత్వం సృజిస్తూ ఆమె సాంత్వన పొందారు. నిరాశ ఒక ఆంతరిక  సాంస్కృతిక స్థితి. ఒక సంస్కారంగా దానికదే ప్రశాంతిని చేకూర్చే నిరాశ, కవితా సృష్టి ద్వారా ఆమెకు మరింత లోతైన శాంతిని, స్థిమితాన్ని ప్రసాదించింది.

«««

 

ఆజ్‌ సజన్‌ మొహె అంగ్‌ గాలో

జనమ్‌ సఫల్‌ హోజాయే

హృదయ్‌ కీ పీడా దేహ్ కి అగ్ని

సబ్‌ శీతల్‌ హోజాయే

 

గురుదత్‌ ప్యాసా(1957) సినిమా కోసం సాహిర్‌ లుధియాన్వీ రాసిన ఈ వైష్ణవ భజనగీతం రాజేశ్వరీదేవి వంటి స్త్రీతత్వ కవుల ఆర్తికి ఆరని మోహస్పర్శకి సంకేతంగా నిలుస్తుంది. భారతీయ శైవ వైష్ణవ సంప్రదాయాలలో ఇట్టి మోహార్తి ప్రకటనకు తార్కాణాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ‘‘కవిత్వం రాయవలసిన అగత్యం, రాయక తప్పని అశాంతి  స్త్రీలకు సైతం ఏర్పడటం విషాదం.’’ అని ఇస్మాయిల్‌  దాదాపు రెండు దశాబ్దాల క్రితం వ్యాఖ్యానించారు. స్త్రీవాద కవిత్వం తెలుగునాట విజృంభిస్తున్న సందర్భం అది. ఇతర సామాజిక, రాజకీయ సాహితీపరులకు మాదిరిగానే స్త్రీవాద కవులకు కూడా సిద్ధాంతరాద్ధాంతం ఎక్కువ. జీవన లాలస తక్కువ. ఫలితంగా అది రాశిలోనే తప్ప వాసిలో ఎదగలేదు. అనుభవాన్ని అనుభూతిగా సాంద్రతరం చేసుకునే సహనం, స్తిమితం కొరవడినందున వారిలో హెచ్చుమందికి నినాదాలను పుక్కిటపట్టక తప్పని స్థితి ఎదురైంది. రాజేశ్వరీదేవి ఇందుకు మినహాయింపు. ఇస్మాయిల్‌ వ్యాఖ్యకు సముచిత రీతిలో సంతృప్తికరమైన సమాధానం చెప్పగల సత్తా ఆమె కవిత్వానికి సమృద్ధిగా ఉంది. ఆమెకు ముందు రేవతీదేవి అటూ ఇటూగా జయప్రభ తర్వాత ఊర్మిళ వంటి కవులు వాదానికి అతీతంగా స్ర్తీలుగా(ఫెమినైన్‌) కవిత్వం రాశారు. వాదం ఛాయలు వారి కవిత్వంలో కూడా పొడచూపినా, స్వానుభవం నుంచి స్వబుద్ధితో రాయడం వలన అవి శుష్క ప్రేలాపనలు కాలేదు. క్షయం అంతకన్నా కాలేదు. కేవలవాద కవులు కనుమరుగై అప్పుడే సుమారు 15ఏళ్ళు గడచిపోయాయి.

స్త్రీలు కేవం ఉదాసీన కాల్పనిక కవిత్వానికే పరిమితమవుతారని, పురుషులైతేనే క్రియాశీల కాల్పనిక కవిత్వానికి పట్టం కడతారని ఒక అపప్రద తెలుగు కవితాలోకంలో బహుళ వ్యాప్తిలో ఉంది. గోర్కీ ఒక యువ రష్యన్‌ కవయిత్రి కవిత్వాన్ని చూసి చేసిన వ్యాఖ్యలను స్థల కాలాలకు అతీతంగా అన్వయించడం వలన ఈ వికారం షికార్లు చేస్తున్నది. రాజేశ్వరీదేవి కవిత్వంలో మనం ఉభయ (ఉదాసీన, క్రియాశీ) కాల్పనికతను చవిచూస్తాం. ఆత్మాశ్రయ కవిత్వం వస్తువును ఆశ్రయించడం అసాధ్యమని మార్క్సిస్టు మహోపాధ్యాయులు చేసిన సూత్రీకరణకు కాలదోషం పట్టిందని చెప్పడానికి ఈ కవిత్వం తిరుగులేని సాక్ష్యాధారం. (కేవల) వస్త్వాశ్రయ కవులకు ఆత్మను ఆశ్రయించడం సాధ్యపడదనే కఠోర వాస్తవాన్ని మరుగు పరచడానికి ఈ విధమైన పాక్షిక ఆవిష్కరణకు పాల్పడటం తెలుగు సాహిత్య పెద్దలకు వెన్నతో పెట్టిన విద్య.

ఇంతటి ఉత్తమశ్రేణి కవితలు రాసి మనకందించిన రాజేశ్వరీదేవి కవిత్వం ఇంతకాలం పాఠకలోకానికి అందకపోవడం అన్యాయం. తెలుగు సాహితీ ప్రపంచానికి విలువలు లేవని, ‘మ్యూచువల్‌ అడ్మిరేషన్‌ సొసైటీ’గా మారి సొంత ముఠా సభ్యుల సంకలనాలను మార్కెట్‌లోకి వదలడానికి ‘సెలబ్రిటీ’ కవులు పరిమితమయ్యారని చెప్పడానికి ఎవరూ సంకోచించవలసిన అవసరం లేదు.

కాని, యేంలేదు!/ఎప్పటిమల్లే/వుత్త నిస్సారంగా/అవే రాత్రులు/వుదయాలు, అవే బాధలు, బలహీనాలు/

ఎప్పటిమల్లే/నిర్దయగా/మా కంఠాలపైనించి/కఱకు విధి/రథ చక్రాలు

– (నిరాశ-ఎచటికి పోతావీ రాత్రి`వజీర్‌ రహ్మాన్‌)

వజీర్‌ సుమారు ఏభైఏళ్ళ క్రితమే రాజేశ్వరీదేవి ఆత్మబంధువుగా ఆమె హృదయార్తిని ఆవిష్కరించారు. అందుకు నాడు ఆధిపత్య స్థానంలో వున్న తెలుగు విమర్శక మేధావులు ఆయనపై క్షీణ యుగ కవిగా ముద్ర వేశారు. రాజేశ్వరీదేవిపై కూడా అదే ముద్ర వేయడానికి వారి వారసులు వెనుకాడబోరు. కానీ కాలగతి వారిని బుట్టదాఖలా చేసింది.

మనసు మనసు పెనగి మనసు ఏకము చేసి మనసు మర్మము గన్న దెరుక -అని కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మం చెప్పిన ఎరుకను తన జీవితంలో, కవిత్వంలో అత్యంత అలవోకగా సాధించిన మర్మజ్ఞురాలు, పండితారాధ్య వంశజ, ఆరాధ్య తనయ శివలెంక రాజేశ్వరీదేవి.

సత్యం వద్దు స్వప్నమే కావాలి అన్నారు కవి. ‘సత్యం’ రుజా జరా మృత్యు అవస్థకు ఎలా దారితీస్తుందో సహజసిద్ధంగా ఎరిగిన అభిజ్ఞ కావడంవల్లే ఆమె స్వప్నావస్థను కోరుకున్నారు. ఆధునికతానంతర సౌందర్య శాస్త్రానికి మూలవిరాట్టు నీషేకి రాజేశ్వరీదేవితో ఏకాభిప్రాయం ఉంది. ఆయనా ఆ మాటే అన్నారు తనదైన రీతిలో We have art in order not to die of the truth. (సత్యం బారిన పడి చనిపోకుండా రక్షించేందుకే మనకు కళలున్నాయి.)

***

How free I am,

how wonderfully free

from kitchen drudgery 

free from the harsh grip of hunger

and from empty cooking pots

free too of that unscrupulous man

the weaver of sun shades

calm now and serene I am

all lust and greed purged

to the shade of spreading tree I go

and contemplate my happiness

– Therigatha

(2-3rd century BC)

 

«««

అంతరంగంలో ఆమె బుద్దిస్ట్‌ కావడం వల్లే మన మధ్యా బౌద్ధ సన్యాసివలె ఆమె జీవించారు.

«

peepal-leaves-2013

rajeswari1

శివలెంక రాజేశ్వరీదేవి చిరపరిచితమైన కవి. స్వస్థలం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. జననం 1954 జనవరి 16. తల్లిదండ్రులు కీ.శే. వరలక్ష్మి, సుబ్రహ్మణ్యం. ఏడుగురు సంతానంలో ఆమె పెద్ద. ఏలూరులో బి.ఎస్‌.సి. చదివారు.  

బాల్యం నుంచీ సంగీత, సాహిత్యాలను ప్రాణాధికంగా ప్రేమించారు.  1970లో రచనావ్యాసంగం ఆరంభిం చారు. కడవరకు కొనసాగించారు. అద్భుతమైన కవితలు రాశారు. అరుదైన కవిగా ఆదరణ పొందారు. గత నలభై ఏళ్ళలో ఆమె రచనలు కొన్ని రేడియోలో ప్రసారం కాగా పత్రికల్లో అనేకం అచ్చయ్యాయి.

రాజేశ్వరీదేవి గుంపున ఎపుడూ లేరు. జీవితంతో ఏకాకిగానే తలపడ్డారు. చంద్రుడికి జతగా జాగరణ చేశారు. ఆ కత, కవరింతలే ఆమె కవిత్వం.

స్వప్నం మీంచి కోకిలవలె పాడుతో పాడుతో 2015 ఏప్రిల్‌ 25న నక్షత్ర లోకంలోకి ఎగిరిపోయారు.

 

నామాడి శ్రీధర్.

సంపాదకుడు

సత్యం వద్దు స్వప్నమే కావాలి

ప్రేమలేఖ ప్రచురణ

నా రాత్రి సుదీర్ఘమయినది..

sivalenka10

-శివలెంక రాజేశ్వరీ దేవి

~

 

‘‘రాత్రి చదివేందుకు అట్టేపెట్టాను

ఆ నోబెల్‌ప్రైజ్‌ పొందిన కవిని గురించి రాసిన సంగతి’’

అని నీకు చెప్పినపుడు

‘‘ఇదే కదా రాత్రి ఇంకా రాత్రి ఏమిటీ’’ అని కదా అడిగావు

పదిగంటల సమయంలో

 

నా రాత్రి సుదీర్ఘమయినది

ఇలా నా వెంటరా

నీకు తెలీని రాత్రిలోకి తీసుకువెళతాను

అర్ధరాత్రి దాటిన తర్వాత

ఒకసారి గదిలోంచి బయటికి వొచ్చి

అదేపనిగా ఆకాశాన్ని సంభ్రమంగా చూస్తానా

ఆ తర్వాత కొమ్మలు కొట్టేసినందుకు దిగులుపడుతున్న

ఆ రాత్రిపూలచెట్టుని పలకరించి స్పృశించి

మళ్ళీ చిగురిస్తావు, అపుడు నీ దేహమంతా నక్షత్రపుష్పాల

కాంతితో మళ్ళీ మెరుస్తుంటుంది చూడు అని సాంత్వనపరిచి

ఎవరో దయగా నాటిన

ఆ పారిజాతపరిమళాన్ని లోపలికి తీసుకుని

అంతేనా

 

నా రాత్రి సుదీర్ఘమయినది

నా హృదయం ఆ సమయంలోనే మెలకువతో వుంటుంది

ఆ సంగీత సమ్రాట్‌ స్వరలయలు

మదిలో మెరిసాయా ఇక చెప్పపని లేదు

మన ప్రేమ సత్య సౌందర్య సీమలో ప్రభవించి… ప్రభవించి…

కాల గాఢాగ్ని కీలలో తపియించి… తపియించి

దగ్ధ తరుకాండమగునో అని నిరాశగా

గోపారత్నం పాడుతూ సందేహాన్ని వ్యక్తం చేస్తుంటే

ముగ్ధ మధు భాండమగునో అని పాడగనే

ప్రాణాలు ఎటో వెళ్ళిపోతాయి

 

ఇక ఎందరో కళాకారుల గాన మాధుర్యంలో

రాత్రి వొరిగిపోతుంటుంది

చిత్తరంజన్‌ తలత్‌ బాలసరస్వతీదేవి పాటులు

నెమరువేసే రాత్రి

 

ఇక ఆమె

ఆమె అంటే కేవలం ఆమేనా

ఎన్నెన్నో పాత్రలను తన గళాన పలికించిన

ఒక కళావరణం

కళాత్మక కాంతి మెరుస్తున్న ఒక వలయం

ఊర్వశి పాత్రని తన స్వరంలో

అజరామరం చేసిన ప్రతిభాశాలిని

 

ఇక మరొకరూ

ఆమె మహానటి మాత్రమేనా

దయాస్వరూపిణి

వెన్నెలకాంతిని నింపుకున్న ఆ కళ్లు చివరికి వెలవెలపోయినా

నిజమైన కళాకారుల జీవితాలు

రాలని కన్నీటిబిందువులు అవటానికి

ఆమె ఆ పాత్రల్లో నటించిందా

జీవించిందా అనే సరిహద్దు లేవు

 

నా రాత్రి సుదీర్ఘమయినది

అంతర గంగా ప్రవాహాల్లో మునకలేస్తున్న రాత్రి

నన్ను అపనిందల పాలుచేసే రాత్రి

ఒక రొటీన్‌ అనేది లేకుండా చేసిన రాత్రి

అపహాస్యాలపాలుచేసిన రాత్రి

తమ తమ పాత్రలకు

రూపకల్పనన చేసిన రచయితల పాత్రలతో పాటు

నేనూ ఒక పాత్రనై వాళ్ళవెంట వెళ్ళే రాత్రి

శ్రీకాంత్‌ రాజ్యలక్ష్మి కమలలత సవిత కోమలి అమృతం

వెంటాడుతూ పలకరిస్తారు

అంతర్వేదిలోని వేదనను పాట ఆసరాగా తీసుకుని

కన్నీటితో స్వచ్ఛపరిచే కన్నీటిరాత్రి

కళాత్మక కలలరాత్రి

 

నా సుదీర్ఘ రాత్రి వల్ల నేను పగలు మెలకువగా వుండలేను

ఈ రాత్రిని ఇవాళ వెన్నెల వెలిగిస్తోంది

ఆ వెలుగులో నేను వెలిగి పగటిని చీకటిని చేసి

నేను వెలవెలపోతాను

 

నా రాత్రి సుదీర్ఘమయిన రాత్రి

జాగరణరాత్రి

స్నేహరాత్రి

స్నిగ్ధరాత్రి

స్వప్నాలు పూలలా రాలిపోయిన రాత్రికూడా

ధాత్రిపై దయగా వెన్నెల పాడుతోంది

ఇది వెన్నెల వేళైనా ఇది చల్లని రేయయినా

నిదుర రాదు కనుకు శాంతిలేదు మనసుకు

అందుకే రాత్రి కవితనీ

పగటిపూట వినిపించమని అడగకు నాన్నా

ఇష్టంలేని వాళ్ళు గబ్బిలం అన్నా

ఇష్టంవున్న వాళ్ళు రాత్రిపక్షి అన్నా

పెద్దగా తేడా ఏమీలేదు

నేనే నమూనాలోనూ లేను కనుక

అందుకే రాత్రిని పగలు చేస్తాను

పగటిని రాత్రి చేస్తాను

 

(12.10.2011 శరత్‌ పూర్ణిమ)

వెతకాలి

 

 

చిత్రం: ప్రవీణ కొల్లి

పదాలు: బాల సుధాకర్ మౌళి 

~

ఎక్కడో

ఏ మూలనో ప్రవహిస్తున్న నిశ్శబ్దనదిలా

ఆకాశం

 

ఎక్కడో ఏ మూలనో

నెమ్మదిగా కదులుతున్న అలలా ఊరు

 

ఊర్లో ఇళ్లగుమ్మాల మీద

యింత వెలుతురును పరిచే దయామూర్తిలా సూర్యుడు
మా వూరు గుర్తుకొస్తుంది

రెక్కలు కట్టుకుని ఎగిరిన బాల్యం గుర్తుకొస్తుంది
బాల్యం కొమ్మకు వేళ్లాడి

ఎక్కడో పోగొట్టుకున్న పిచుక గూడు కళ్లల్లో కదలాడుతుంది

 

ఈ వూళ్లోనైనా దొరుకుతుందేమో-

వెతకాలి

నిర్మలంగా పసికూనలా వున్న ఈ వూరిని

దేహమ్మీద వేసుకుని జోకొట్టాలి
తూనీగలా

సందు సందూ వూపిరి ఆగేట్టు తిరగాలి
మా వూరిని

మళ్లొక్కసారి దేహం దేహమంతా ధరించాలి నేను –

మా వూరు అవ్వాలి

*

ఏది నేరం ?! హజారీబాగ్ కథలు

hajaribagh

 

బి. అనూరాధ పుస్తకం “ఏది నేరం ?! హజారీబాగ్ కథలు” మీద డిట్రాయట్ తెలుగు లిటరరీ క్లబ్ సభ్యులు ఫిబ్రవరి 2016 లో జరిపిన చర్చాసారాంశం. పాల్గొన్నవారు: మద్దిపాటి కృష్ణారావు, పిన్నమనేని శ్రీనివాస్, వేములపల్లి రాఘవేంద్ర చౌదరి, నర్రా వెంకటేశ్వరరావు, భూపతి రాజు ఉష, రుద్రరాజు సుధ, వేములపల్లి పద్మ, ఆరి సీతారామయ్య.

చర్చా సమీక్ష: ఆరి సీతారామయ్య

విరసం ప్రచురించిన ఈ పుస్తకంలో 16 కథలున్నాయి. “కథల వెనుక కథ” అనే శీర్షికతో కథల నేపథ్యం గురించి రచయిత్రి వివరంగా రాశారు. ముందు ఈ నేపథ్యం గురించి మాట్లాడుకుందాం.

డిగ్రీ వరకూ చదివిన అనూరాధ కొంతకాలం  బాంక్ లో ఉద్యోగం చేశారు. 1990 లో పౌరహక్కుల సంఘంలో చేరి కార్యకర్తగా పనిచేశారు. 1993 నుండి మహిళా సమస్యలపై పనిచెయ్యడం మొదలుపెట్టారు. చైతన్య మహిళా సమాఖ్య / సంఘం లో రాష్ట్ర స్థాయిలో పనిచేశారు. 2006 నుండి బీహార్ ఝార్ఖండ్ రాష్ట్రాల్లో నారీ విముక్తి సంఘ్ వారితో పనిచేశారు. ఝార్ఖండ్ లో ఆదివాసీలు “మావోయిస్టు సిద్ధాంత మార్గదర్శకత్వంలో” మైనింగ్ కి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో పాల్గొన్నారు.

ఏపిఎస్‌ఐబి వారు 2009 అక్టోబర్లో రచయిత్రిని పాట్నాలో అరెస్ట్ చేసి, నాలుగు రోజులు  అజ్ఞాతంగా నిర్బంధించి, తర్వాత ఝార్ఖండ్లో అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. అప్పటినుండి ఆగస్ట్ 2013 వరకూ ఆమెను ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ కేంద్ర కారాగారంలో ఉంచారు. తను రాజకీయ ఖైదీనని రచయిత్రి రాసుకున్నారు.

మన సమాజంలో “సంపన్నులు చెప్పిందే న్యాయం”. “దానిని  కాపాడేది రాజ్యం.” ప్రజాస్వామ్యం పేరిట ధనస్వామ్యం చలామణీ అవుతుంది.” “దోపిడీ సమాజంలో ఏ వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలూ విడిగా ఉండవు. ఈ సమాజాన్ని ప్రస్తుతం పీడిస్తున్న భూస్వామ్యానికి, సామ్రాజ్యవాదానికి, వారికి ఊడిగం చేస్తున్న దళారీ నిరంకుశ పెట్టుబడిదారులకి వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడిన నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగం కావడానికి నేను ఎంచుకున్న రంగం మహిళారంగం. దానికే పరిమితం కావాలని కూడా అనుకోలేదు. అంతిమంగా కమ్యూనిస్టు సమాజంలోనే మనిషిని మనిషి దోచుకోగలిగే పరిస్థితి అంతరిస్తుందనేదే నా స్పష్టమైన అవగాహన.” ఇవి అనూరాధ రాజకీయాభిప్రాయాలు.

మన సమాజం ప్రజాస్వామ్యం పేరుతో సాగుతున్న ధనస్వామ్యం అనేది నిస్సందేహం. రచయిత్రితో మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం. మన రాజ్యాంగాలు, న్యాయస్థానాలు, పొలీసు వ్యవస్థలు ధనికులకు అనుకూలంగా ఉంటాయి. వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచెయ్యవచ్చు, కాని వారి అధికారానికి ప్రమాదం లేనంతవరకు మాత్రమే. ప్రమాదం రావచ్చు అనుకుంటే వ్యవస్థ ఎన్‌కౌంటర్లు జరిపిస్తుంది. ప్రాణాలు తీస్తుంది. ముమ్మాటికీ నిజం.

కానీ, దీనికంతటికీ విరుగుడు కమ్యూనిజం అని రాశారు రచయిత్రి. వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల్లో మావోఇస్టు మార్గాన్ని ఎంచుకున్నారు కూడా. కమ్యూనిస్టు సమాజాల్లో, మావోఇస్టు మార్గంలో ప్రజాస్వామ్యం ఉందా? లెనిన్‌, మావో, స్టాలిన్‌, పోల్ పాట్‌లు వారి వ్యతిరేకులను ఏం  చేశారు?   అంటే ధనస్వామ్యంలోనైనా కమ్యూనిజంలోనైనా అధికారానికి ప్రమాదం వస్తే పాలకులు సహించరనే కదా పాఠం. వారికి వ్యతిరేకంగా నిలబడ్డ వారిని మావోఇస్టులు ఏం చేశారు? అధికారం కోసం ప్రయత్నం చేస్తున్న మావోఇస్టులు ఇప్పుడే అధికారంలో ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇక అధికారంలోకి వస్తే వారు ప్రజాస్వామికంగా ప్రవర్తిస్తారా?

కుల, మత, వర్గ భేదాలు లేకుండా అందరికీ సమానావకాశాలు ఉండేలా చూడడం ప్రజాస్వామ్య లక్షం. ఆ గమ్యానికి చేరడానికి మిలిటెంట్ మార్గాలు చేపట్టిన వారు (రష్యా, చైనా) చాలా సాధించారు. కాని సాధించిన మార్పులను ఆ సమాజాలే తిరస్కరించాయి. సోవియట్ యూనియన్‌, చైనాల్లో జరిగిన దాన్నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఏమీ నేర్చుకోకుండా అదే దారిన మళ్ళా ప్రయాణం చేద్దామనడం అవివేకం కాదా?

“సంఘటితంగా చేసే ఈ పోరాటాలు ప్రజలలో మిలిటెన్సీని, చైతన్యాన్నీ పెంచుతాయి” అని రాశారు రచయిత్రి. చైతన్యాన్నీ, మిలిటెన్సీనీ పెంచుతాయని రాస్తే కొంత సబబుగా ఉండేదేమో. అయినా సంఘటితంగా చేసే పోరాటాలు మిలిటెంట్ గా ఉండనవసరం లేదు. స్త్రీవాద ఉద్యమం ఉదాహరణగా తీసుకుందాం. చైతన్య  వంతులైన  స్త్రీలు  వోటింగ్ హక్కుకోసం, కుటుంబ నియంత్రణ కోసం, సమాన జీతాల కోసం పోరాడారు. పోరాడుతున్నారు. ఈ  పోరాటాలు మిలిటెంట్ గా జరగలేదు, జరగడం లేదు. కానీ ఎంతో మార్పును తేగలిగాయి. అంటే చైతన్య వంతులైన వారంతా మిలిటెంట్ లు కానవసరం లేదు అనే కదా? మావోఇస్టులు మిలిటెన్సీని  చైతన్యం గా  భ్రమపెడుతున్నారు. దూరంగా ఆలోచించలేనివారు నమ్మేస్తున్నారు.

ఈ పుస్తకానికి శీర్షిక “ఏది నేరం?!” వ్యవస్థ చేస్తుంది నేరమా? దానికి వ్యతిరేకంగా పోరాడటం నేరమా?  రచయిత్రి దృష్టిలోలాగే మా దృష్టిలో కూడా వ్యవస్థదే నేరం, నిస్సందేహంగా. ఎలెక్షన్లు  జరుగుతున్నా  మన  ప్రభుత్వాలు  (ఇండియాలోనూ,  అమెరికాలోనూ) ప్రజల  చేతుల్లో  లేవనేది  నిస్సందేహం. కానీ వాటికి  వ్యతిరేకంగా  ప్రజాస్వామ్యం  కోసం  జరిగే  పోరాటాలు  ప్రజాస్వామికంగా, పోరాట  ఫలితాలు నాలుగు కాలాలపాటు నిలిచేవిగా జరగాలి. ప్రజాస్వామ్య పోరాట  మార్గాలమీద అన్వేషణ జరగాలి. ఇది వరకు జరిగిన తప్పులు మళ్ళా జరక్కుండా చూసుకోవాలి.  అలా కాకుండా ఊరికే  “ప్రజాస్వామ్య”  అని  పేరు  పెట్టుకున్నంత  మాత్రాన ఏ అప్రజాస్వామ్య  సంస్థనూ నమ్మే దశలో లేరు ప్రజలు.

*

ఇక కథల గురించి.

కథా, కథనం, భాషా, అన్ని విధాలా ఈ పుస్తకంలోని  కథలు మంచి కథలని చెప్పుకోవచ్చు. సులభంగా చదివించిన కథలు. తల్లులతోబాటు జైల్లో ఉంటున్న చిన్న పిల్లల గురించి రాసిన రెండు కథలు, “బేబీస్‌ డే అవుట్”, “చందమామని చూడని వెన్నెల,” మా అందరికీ ఎంతగానో నచ్చాయి. బయటి ప్రపంచం గురించి ఏమీ తెలియకుండా పెరుగుతున్న ఈ పిల్లల గురించి ఎంతగానో విచారిస్తూ రాసినా, పిల్లల సహజ ప్రవర్తనను, మాటల స్థాయినీ, అనుభవాలనూ చక్కగా ఆవిష్కరించారు రచయిత్రి.

“చందమామని చూడని వెన్నెల” కథలో “కానిచోట కాసావే వెన్నెలా, కారడవుల కాసావే వెన్నెలా,” పాట గురించి రాస్తూ, “అడివిలోనే పుట్టి పెరిగి అడివినే ఇళ్ళుగా చేసుకున్న వాళ్ళు”  కూడా  ఉన్నారన్న విషయాన్ని మరిచో, పట్టించుకోకనో, “అడవి కాచిన వెన్నెల” లాంటి సామెతలను వాడే వారిని సున్నితంగా ఖండించారు. “మనుషులు లేని అడవిలోనయినా ఎన్నో జీవాలూ, జంతువులు వెన్నెలని ఎంత ఆస్వాదిస్తాయి! వెన్నెలలో తడిసిపోతూ మిలమిలలాడిపోయే ఆకుపచ్చని చెట్లని చూస్తే వాటికి ఎంత గర్వంగా అనిపిస్తుండొచ్చు! సమస్త భూమండలాన్ని తన వెన్నెలతో గుబులు పుట్టించి, అశాంతిని రేపి, మళ్ళీ తానే సాంత్వన కలగజెసే చందమామ మీద హక్కు ఎ ఒక్కరిదో ఎలా అవుతుంది?” అని గొప్ప భావుకతతో ప్రశ్నించారు రచయిత్రి.

మంచి కథ రాయడానికి సూక్ష్మమైన పరిశీలనా స్వభావం సహకరిస్తుంది. “మున్నీ బద్‌నామ్‌ హుయీ” కథలో ఈ సన్నివేశం చూడండి. “నాకేం అర్థం కాలేదు. ఎందుకంత భావోద్వేగం కలిగిందామెకు? అని ఆశ్చర్య పోయాను. నా ఆశ్చర్యం గుర్తించి, చెప్తాను అనబోయింది కానీ, గొంతు గాద్గదికంగా అయిపోయింది. దానిని దగ్గు వెనక దాచేసి, గబుక్కున నవ్వేసింది. అయినా ఒక కంటినుండి బుగ్గమీదకు సగం వరకు ఒక కన్నీటి చుక్క జారిపడింది. జుట్టు వెనక్కి తోసుకుంటూ దానిని రెప్పపాటులో తుడిచేసింది. నేనుకూడా గమనించనట్టే ఊరుకొన్నాను. మంచినీళ్ళ సీసా తీసి నేను ఒక గుక్క తాగి, యథాలాపంగా అందించాను. తాను ఒక గుక్క తాగి, గలగల నవ్వేసి అంతకు కొన్ని క్షణాల ముందు ఉన్న మున్నీ ఆమేనా కాదా అని నాకే అనుమానం వచ్చేలా ఉత్సాహంగా మాట్లాడటం మొదలుపెట్టింది.” ఎంత  అద్భుతంగా రాసారో కదా! మనుషుల మానసిక స్థితిని అంత సూక్ష్మంగా పరిశీలించి రాయగలగడం గొప్ప విషయం.

ఈ కథలు “భారతీయ జైళ్ళలో ఉన్న అమానవీయ పరిస్థితి” ని అందరి దృష్టికీ తీసుకురావాలనే ఉద్దేశంతో  రాసినవి. “జైలును నేను బయటనుంచీ లోపల నుంచీకూడా చూశాను. ఆ బయటా – లోపలికీ మధ్య ఉన్న దూరం మాత్రం అనంతం. ఆ దూరాన్ని తగ్గించగలిగితే అప్పుడు ఏ దేశంలో అయినా ప్రజాస్వామ్యం ఉందని చెప్పవచ్చు,” అనీ రాశారు. ఈ కథల్లో ఒక్క హజారీబాగ్ జైలు గురించి మాత్రమే రాశారు కాబట్టి దేశంలోని ఇతర జైళ్ళలో పరిస్థితుల గురించి పాఠకులకు తెలిసే అవకాశం లేదు. కానీ రచయిత్రి ఆవిష్కరించిన జైలు జీవితం ఆధారంగా హజారీబాగ్‌లో పరిస్థితులు అమానవీయంగా ఉన్నాయనిపించదు. దీని గురించి తర్వాత మరోసారి ప్రస్తావిస్తాను. బయటికీ జైలు లోపలికీ ఉన్న దూరాన్ని తగ్గించ గలిగితే సమాజంలో ప్రజాస్వామ్యం ఉన్నట్లే అన్నారు రచయిత్రి. అంటే జైలుని బయటి సమాజం స్థాయికి పైకితీసుకురావాలనేకదా? అంటే బయటి సమాజంలో ప్రజాస్వామ్యం ఉన్నదనే కదా? అలా అయితే సమాజంలో ప్రజాస్వామ్యం లేదు, కమ్యూనిజం మావో ఇజం రావాలి అని ఇంతకు ముందు చెప్పిన అభిప్రాయాలు మర్చిపోయినట్లున్నారు రచయిత్రి.

ఇవి  జైల్లో స్త్రీల విభాగంలో ఉన్న వారి కథలు.  ఒక స్త్రీ జైల్లో ఉందంటే ముందు ఆమె నేరం చేసి ఉండాలి. లేక ఆమె మీద నేరారోపణ జరిగి ఉండాలి. పొలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. న్యాయ వ్యవస్థ దాని మీద విచారణ జరిపి,  ఆమె నేరం చేసిందని నిర్ణయించి శిక్ష వేసింది. ఇప్పుడు ఆమె జైల్లో ఉంది.  అంటే సమాజం, పొలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థ, జైలు – ఈ నాలుగు వ్యవస్థలకూ ప్రతి కేసులోనూ కొంత బాధ్యత ఉంటుంది. అనూరాధ కథల్లో ఉన్న పాత్రలను తీసుకుని ఈ నాలుగు వ్యవస్థలు వీళ్ళ విషయంలో ఎలా ప్రవర్తించాయో చూద్దాం.

మొదట సమాజం ఎలావుందో చూద్దాం. ఈ కథల్లో ఒక 14, 15 సంవత్సరాల అమ్మాయిమీద అత్యాచారం జరిగింది. ఆమె గార్డియన్లు ఆమెకు అండగా నిలబడలేదు. ఒకమ్మాయికి బాల్య వివాహం జరిగింది. భర్త ఆమెను తాగొచ్చి చితగ్గొట్టేవాడు. మరోమార్గం లేని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. బలవంతులు బలహీనుల మీదా, పేదలమీదా నేరారోపణ చేసి కేసులు పెట్టిన సందర్భాలు రెండుమూడు కథల్లో ఉన్నాయి. కొన్ని కుటుంబాల్లో స్త్రీలకు ఎలాంటి మానవహక్కులూ ఉండవు. వాళ్ళకు సమాజంలోకంటే జైల్లోనే ఎక్కువ స్వేచ్ఛగా ఉంటుంది. ఒంటరిగా సమాజంలో బ్రతకటంకంటే జైల్లోనే భద్రత ఎక్కువ కాబట్టి బెయిల్ వచ్చినా జైల్లో ఉంటుంది ఒకామె. దేశంలో ఒకచోట ఉన్న ఆచారాలు (భర్త చనిపోయిన స్త్రీ మరిదిని పెళ్ళి చేసుకోవడం లాంటివి) మరోచోట నేరాలుగా పరిగణించబడతాయి.

న్యాయ వ్యవస్థ ప్రవర్తన: ఈ కథల్లో ఉన్నంత వరకూ న్యాయ వ్యవస్థలో ఉన్న ముఖ్యలోపం కేసులను విచారించడంలో జరుగుతున్న జాప్యం. ఈ కారణంగా నేరం చెయ్యని వారు కూడా చాలా  సంవత్సరాలు జైల్లో ఉండడం జరుగుతుంది.

పొలీసు వ్యవస్థ: అకారణంగా అరెస్ట్ చెయ్యడం, అరెస్ట్ చేసిన వారిని సకాలంలో మేజిస్ట్రేట్ ముందుకు తీసుకు రాకపోవడం, లంచాలు తిని నేరస్తులను అరెస్ట్ చెయ్యకపోవడం, ఇవీ ఈ కథల్లో ఉన్న వివరాలు.

ఇక జైల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. కథలన్నీ జైలు గురించి రాసినవి కాబట్టి ఈ వ్యవస్థ గురించి ఎక్కువ వివరాలున్నాయి.

ఖైదీలు పగలంతా  జైలు ఆవరణలో ఎక్కడైనా ఉండవచ్చు. ఎవరితోనైనా మాట్లాడవచ్చు. సాయంత్రం అందరినీ లెక్కపెట్టి లాకప్లో ఉంచుతారు.

జైలు శుభ్రంగా ఉంటుంది.

ఖైదీలు వారికి చేతనయిన పనులు చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. ఒకావిడ స్వెట్టర్లు అల్లి అమ్ముకుంటుంది.

బయటి సమాజంలోకంటే “ఇక్కడ చాలామంది స్త్రీలు స్వేచ్ఛగా ఉంటారు.”

నియమాల ప్రకారం జైల్లో వంటా మంటా నిషేధం. కాని రెండూ జరుగుతూనే ఉంటాయి. అధికారులు చూసీచూడనట్లు పోతుంటారు.

ఐదు సంవత్సరాలలోపు వయసున్న పిల్లలు తల్లితో జైల్లో ఉండవచ్చు. ఆ తర్వాత బయట బంధువులదగ్గరో, శిశు సంక్షేమ శాఖవారి ఆధ్వర్యంలోనో ఉండాలి. కాని పది సంవత్సారాలు దాటిన పిల్లలుకూడా జైల్లో ఉన్నారు. అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తూంటారు.

జైల్లో పరిస్థితుల గురించి ఆలోచిస్తుంటే, రచయిత్రి కథల నేపథ్యంలో  ఆరోపించిన అమానవీయత మాకు కనపడలేదు. రచయిత్రి చెప్పినదానికీ, చూపించినదానికీ పొంతన లేదు.

మా అందరినీ ఆశ్చర్య పరిచిన సంఘటన “పేదింటిపొగ” కథలో జరిగింది. ఉష, ఆశ జైల్లో పడకముందు ఉద్యోగాలకోసం (డి ఆర్ డి ఎ లో) ఒక పరిక్ష రాశారు. జైల్లో పడిన తర్వాత ఒక రోజు వారి తమ్ముడు ఫలితాలు వచ్చాయనీ, ఇద్దరూ పాసయ్యారనీ, ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎల్లుండనీ కబురు పంపాడు. ఇంటర్వ్యూలు టౌన్లో. పరిక్షల ఫలితాలుగానీ, ఇంటర్వ్యూకు కావాల్సిన సర్టిఫికేట్లుగానీ ఆ అమ్మాయిలదగ్గర లేవు. ఇంటర్వ్యూకు వెళ్ళాలంటే, జైలు అధికారి ఒప్పుకోవాలి, కోర్టు  అనుమతికి దరఖాస్తుపెట్టుకోవాలి, పొలీసువారు ఎస్కార్టు ఏర్పాటు చెయ్యడానికి ఒప్పుకోవాలి. ఇదంతా ఎల్లుండిలోగా జరగాలి. ఇదంతా బయటి సమాజంలో జరగడమే ఎంతో మందికి లంచాలుపెడితేగాని జరగని పని. కాని జైల్లో ఉన్న ఈ అమ్మాయిలు ఇంటర్వ్యూలకు వెళ్ళారు, వారికి ఉద్యోగాలు వచ్చాయి, సమయానికి బెయిల్ మంజూరయి ఆ అమ్మాయిలు ఉద్యోగాల్లో చేరారు. ఇదంతా వీలయ్యేట్లు చేసిన జైలర్‌ని అభినందించకపోగా, అంతా సక్రమంగా జరగడానికి కారణం జైలర్ కి ఉన్న కీర్తి కండూతి అని అభిప్రాయపడ్డారు రచయిత్రి.

ఈ జైల్లో 100-125 మంది స్త్రీలు ఖైదీలుగా ఉన్నారు. ఇక్కడి కథల్లో పరిచయమైన పదిమందిలో ఎక్కువభాగం నేరాలు చేసినవారు కాదు, నేరం మోపబడి అన్యాయంగా జైల్లో ఉన్నవారు. ఈ పదిమందీ కాక మిగతా వారిలో నేరం చేసి శిక్ష అనుభవిస్తున్న వారు ఎంత శాతం ఉంటారో చెప్పలేము. రచయిత్రి  ఎక్కడా వారి గురించి చెప్పలేదు. అందువల్ల జైల్లో ఉన్న స్త్రీలలో ఎక్కువభాగం అమాయకులు అనే అభిప్రాయం పాఠకులకు కలగవచ్చు. నిజానిజాలు ఈ పుస్తకం ద్వారా తెలిసే అవకాశం లేదు.

ఖైదీలు మాట్లాడేటప్పుడు వారి భాష అనుకోకుండా మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకు శకున్‌ మాటలు చూడండి (పేజీలు 30-31):  “మా అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయింది. మా చాచా, చాచీ నా పెళ్ళి చేసేశారు. ఎంత కాలం పోషిస్తారు? పెళ్లయితే ఇంక ఆళ్ళే చూసుకొంటారు కదా!” ఇలా మాట్లాడిన శకున్‌ వెంటనే మరో భాషలో మాట్లాడటం మొదలు పెడుతుంది: “మస్తు తాగుతడు. నన్ను చాలా కొట్టేది. — రోజూ తాగేది. నాకు ఇద్దరు పిల్లలయ్యింరు.” ఆ వరుసలో అన్న మాటల్లో,  “కొట్టేవాడు”, “కొట్టిండు”, “చచ్చిపోయిన్రు”  అంటుంది. ఈ ఉత్తరదేశం స్త్రీ మాటలకు తెలుగు మాండలీకాల అతుకులు ఎందుకు పెట్టారో, అదీ నిలకడగా ఒక భాషో యాసో కాకుండా ఒక యాసమాలిక ఎందుకు ఎల్లారో తెలియదు. ఇది ఒక్క శకున్‌ విషయంలోనే కాదు, మిగతా పాత్రల విషయంలోకూడా ఇలాగే చేశారు.

ఈ పుస్తకం శీర్షిక “ఏది నేరం?!”, ఉప శీర్షిక “జైలు కథలు”. జైల్లో ఉన్న వారు నేరం చేశారో లేదో నిర్ణయించేది జైలు వ్యవస్థ కాదు, న్యాయ వ్యవస్థ. పైగా ఈ కథల్లో జైలు వ్యవస్థ సమాజం కంటే, న్యాయవ్యవస్థ కంటే, పొలీసు వ్యవస్థకంటే మెరుగ్గా పనిచేస్తుందనిపిస్తుంది. రచయిత్రి చూపించదల్చుకున్న అమానవీయత నిష్కారణంగా, చట్ట విరుద్ధంగా అరెస్త్ చేస్తున్న పొలీసు వ్యవస్థలో,   సంవత్సరాలతరబడి విచారణ జరపకుండా జైల్లో ఉంచుతున్న న్యాయవ్యవస్థలో, అయినదానికీ కానిదానికీ బలహీనులమీద కేసులు పెడుతున్న సమాజంలో ఉన్నంతగా జైలు వ్యవస్థలో కనబడదు.

*

తమకమూ + తాత్వికత = గాలి అద్దం!

 

-నిశీధి

~

కాలం కాసేపు కదలకుండా కవిత్వం అవ్వడం అంటే గాలి అద్దంలో మనల్ని చూసుకోవడం కాబోలు అనిపించేలా , ఎన్ని ఊహాలు  ఎన్ని ఊసులు .

చదువరికి ఒకో పేజి తిప్పుతున్నప్పుడు ఒకో పాదం గుండా పదాల సరిగమల్లో సాహితీకరణ చెందుతున్నప్పుడు ప్రతి అనుభూతి తనదే అనిపించాలి , భవిష్యత్తు వర్తమానం కన్నా కూడా ఎదో జ్ఞాపకాల వీచికలో బలంగా కొట్టుకుపోతున్న భావనలో కాసేపు నలిగి కరగాలి . అపుడది కవిత్వం అవుతుంది ఇంకా  సరిగ్గా చెప్పాలంటే  గాలి అద్దం అవుతుంది .

 

విప్పేసిన జ్ఞాపకాలనే

తిరిగి తిరిగి తొడుక్కుని

మరణ ప్రవాహంలో ఈదుతావు

నిశ్శబ్దాన్ని నిశ్శబ్దంతో వింటూ తేలిపోతుంటావు

కవిత్వమేనా  ఇదంతా  కాదేమో ,కవి ఆత్మ కవితాత్మతో ముడిపడి సున్నితంగా గుండెకోత జరిపే క్షణాల అనుభవమేమో . నమ్మకం  కలగలేదా  అయితే

“ ఈ రాత్రినే

దాచిపెట్టు నేలవంకకి తెలియకుండా “

ఈ వాక్యంలో నిన్నోమారయిన పోగొట్టుకున్నావా నేస్తం ? లేదంటే  ఇలా చూడు

“పాడుబడ్డ పదాల పేద గూటిలో

పెంచుకున్న వాక్య పక్షి ఎగరదు

దిగంతాల దుఃఖమేది అందదు .

Hmmm కాసేపో  విషాదం కమ్ముకున్న మేఘంలో ఒంటరి ప్రయాణం .

 

సోషల్ మీడియాలో అక్కడక్కడా సత్యంగా  చెప్పుకోవాలంటే చాలా అరుదుగా  మెరిసే మెరుపులా చమక్కులా మాత్రమే ఎం ఎస్ నాయుడు గారు తెలిసిన నాలాంటి చదువరులు “ గాలి అద్దం”  పుస్తకాన్ని చేతుల్లోకి  తీసుకోగానే ముందు కవర్పేజీల  నలుపు తెలుపు రంగుల్లో రమణజీవి , శంకర్ పామర్తి గారి గీతలలో  మిస్టిక్ వాసనలకి మైమరిచిపోయి కాసేపలా ఆగిపోవడం  ఒక వంతయితే  పేజీలు తిప్పడం  మొదలు పెట్టగానే నెమ్మదిగా  మొదలయ్యే ఉద్వేగం , ప్రాణం ఎక్కడ ఆగుతుందో , కవిత యే జ్ఞాపకాల పరదాలు చీల్చుకొని  ఏ కణంలో సున్నితంగానే  అయినా  కస్సుమని దిగుతుందో  చెప్పడం  అంత  సులువేం కాదు .

నిజానికి  గాలి అద్దంలో ప్రతి కవిత  ఒక రోలర్ కోస్టర్ రైడ్గానే చెప్పుకోవాలి

మనసొక శోకవాయువు అని మొదలు పెట్టి ఇపుడైనా గెంతెయ్యాలి మనసు మట్టి మీద నుంచి అని రాసుకోగలిగే  కవులు  ఎంత మంది  ఉంటారు , ఆ కవితా సముద్రంలో కాసేపు ఉక్కిరిబిక్కిరికాకుండా మనం ఎలా  ఉండగలం .

టాగోర్ ఆరాధన నుండి భయటికి రావడానికి ఇష్టపడని సాహితీప్రియులు “ విసిరేసిన వక్షోజాలు జారుడుబల్లలో ఆగిపోయి కలలు కంటున్నాయి “ లాంటి వాక్యాలకి ఎంతగా ఉలిక్కి పడతారో తెలియదుగాని , ఈ పుస్తకంలో “ డాలీనందుకోలేక “ కవితలాంటివి అలాగే స్థలంకై స్తనంకై లాంటి టైటిల్స్ ,  ఎం ఎస్ గారి పదాల్లో బోల్డ్ నేచర్కి న్యూ ఏజ్ కవులు ఒక సలాం  కొట్టాల్సిందే . పుస్తకం మొదట్లో కంటే కూడా లోలోపలకి చేరేకొద్దీ కవితో పాటు రీడర్ తనలోకి తానూ చేసే ఏకాంత ప్రయాణమొక నిజ అనుభవం . కొన్ని క్షణాల స్టిల్  లైఫ్ . అందుకే అన్నది ప్రాణమెక్కడ  ఆగిందో  పదమెక్కడ గుచ్చుకుందో చెప్పడం అంత సులువేం కాదు .

Thomas Gray ప్రఖ్యాత వాక్యం చెప్పినట్లు Poetry is thought that breathe and words that burn అని సెగలు , శ్వాసలు , శ్వాసల సెగలలో సగం సగం కాలిపోయి నిలబడటం గాలి అద్దం స్పెషాలిటీ ఖచ్చితంగా . జీవితపు తమకానికి తాత్వికత అద్దితే అదే ఎం ఎస్ నాయుడి గారి గాలి అద్దం . సాహితీవ్రణాలకో అవసరమైన మలాం .

*

 

   సూఫీ నెచ్చెలి రాబియా

 

 

ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది..!

 Abstract-creative-lamp-concept

                                                      -బమ్మిడి జగదీశ్వరరావు

పూజ్యులైన అత్తమామలకు

నమస్కారం!

ఆగండి! చదవకుండా చించేస్తే నాగురించి మీరు తెలుసుకొనే అవకాశాన్ని కోల్పోతారు! అందువల్ల మీ అమ్మాయికి మంచి మొగుణ్ణి కూడా కోల్పోతారు! అంతకన్నా వొక గొప్ప ఆవిష్కరణలో మీరు భాగం కాకుండా పోతారు! మనీ లేనప్పుడు మెనూ చూడడమెందుకు అనుకోవద్దు! మనీ అనేది యెప్పుడూ జేబులు మారుతుంది! నిండుగా వున్న జేబు ఖాళీ కావచ్చు! ఖాళీగా వున్న జేబు నిండవచ్చు! అంచేత మీ ఐశ్వర్యం అలాగే వుండిపోదు! నిన్న లేదు, యివాళ వుంది, రేపు?

నేను కోట్లు సంపాదిస్తానని అంటే “ఏం.. మీవాడు ‘మీలో యెవరు కోటీశ్వరుడు?’ నాగార్జున షోకి గాని వెళుతున్నాడా?” అని మా అమ్మా నాన్నతో అన్నారట! మీ వెటకారం నాకు నచ్చింది! కారం రాసినట్టయింది! పట్టుదల పెరిగింది! నేను కోటీశ్వరుడు అవ్వడమే కాదు.. మీకు కోటీశ్వరుడు అయ్యే అవకాశం యివ్వాలనిపించింది!

యస్.. రేపు నాదే! మీ దగ్గర ఐశ్వర్యం వుండొచ్చు! మరి నా దగ్గర? ఆ ఐశ్వర్యాన్ని సృష్టించే ఐడియాస్ వున్నాయ్! ఔను.. ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది! ఎగ్జాంపుల్ గా వొక ఐడియా వొదులుతాను! కాసుకోండి! మీలాంటివాళ్ళు పెట్టుబడి పెట్టడానికి పోటీ పడతారు! కాని నాకు పెట్టుబడి పెట్టే ఛాన్సు మొదట మీకే యిస్తాను! మీరు కాదంటేనే వేరే వాళ్ళకి అదృష్టవంతులయ్యే అవకాశం వస్తుంది!

సొసైటీకి యేది రిక్వైర్మెంటో అది మనం కనిపెట్టాలి! యిన్నోవేట్ చేయాలి! యిదీ మీ రిక్వైర్మెంటు అని మనం పీపుల్ కి చూపించాలి! అంటే.. రిక్వైర్మెంటూ మనమే సృష్టించాలి.. సొల్యూషనూ మనమే చూపించాలి! దానికి సేవాభావం అనే కలరివ్వాలి! అప్పుడది సేవారంగం కేటగిరీ కిందికి వచ్చి సర్వీస్ వోరియంటేషన్ గా అనిపించాలి! సర్వీసు ప్రొవైడ్ చేయడంలో అంతవరకూ లేని మార్కెట్ స్పేస్ ని క్రియేట్ చేయాలి! అంటే.. అసలు మార్కెట్టే లేదని అనుకుంటే మార్కెట్టుని మనమే సృష్టించాలి! దానికదో మార్కెట్ గా ఆక్యుపై చేయాలి! మార్కెట్ కు డిమాండ్ క్రియేట్ చేయాలి! క్రియేట్ చేశాక అది బేసిక్ నీడ్ అవ్వాలి! నీడ్ ఈజ్ డీడ్!

అర్థమయ్యిందా? అర్థం కాకపోతే మరోసారి కేర్ ఫుల్ గా చదువుకోండి.. అర్ధం చేసుకోండి.. యింతకంటే బేసిక్ లెవెల్లో యెవడూ చెప్పలేడు.. మార్కెట్ మర్మం అర్థమయితేనే మార్కెట్లో రాణిస్తాం! మార్కెట్ మహారాజాలమవుతాం! మాయాజాల యింద్రజాలాలను మించిందీ మార్కెట్ మాయాజాలం! అర్థం చేసుకొనుటయే అర్థం! ‘అర్థం’ అంటే తెలుసుగా ధనం!

మీరు నా ఐడియా కోసం ఆవురావురు మంటున్నారని అర్థమయ్యింది.. యింక వూరించను.. పూరిస్తాను!

ప్రతిమనిషికి విద్య వైద్యం మస్ట్! మస్ట్ అండ్ షుడ్! విద్య వైద్యం ఆల్రెడీ ఆక్యుపైడ్ అని మీరంటారు! నిజమే! ఛాన్సు లేదు అంటారు! అదీ నిజమే! ఫుల్లీ ఫిల్లుడ్! బట్ స్పేస్ ఈజ్ దేర్! ఎందరు యెక్కినా చూసేవాడికి యింకా స్పేస్ వుంటుంది.. పుష్పకవిమానంలోనే కాదు, యిన్నోవేషన్లో కూడా! సో ఆ స్పేస్ మనం క్రియేట్ చెయ్యాలి! చేస్తే స్పేస్ యెప్పుడూ వుంటుంది! ఎడ్యుకేషన్ సిస్టంలో యెక్కడ వుంది?

యస్.. అన్ని యూనివర్సిటీల్లో గొడవలు అవుతున్నాయా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. ఢిల్లీ జేయెన్యూ.. కాశ్మీర్లో.. అంతకు ముందు పూణే ఫిలిం యినిస్ట్యూట్ లో.. యిక్కడా అక్కడా అని కాదు, దేశ వ్యాప్తంగా గొడవలు జరుగుతూనే వున్నాయా? పోలీసులు లాఠీఛార్జీలు చేస్తూనే వున్నారా? స్టూడెంట్స్ ని చితక్కొడుతూనే వున్నారా? యస్.. యస్.. యస్స్ .. యిక్కడ స్పేస్ వుంది.. మన మార్కెట్ కి కావలసినంత స్పేస్ వుంది..

పరీక్షలకి ప్రిపేర్ అవడం అందరికీ వస్తుంది! మరి దెబ్బలకి ప్రిపేర్ అవడం అందరికీ రాదు! పరీక్షలకి వో సిలబస్ యేడ్చి చస్తుంది! లాఠీఛార్జీలకి వో సిలబస్ యేడ్చి చావదు! ఏ క్వశ్చన్ కైనా యెవడైనా ఆన్సర్ చేస్తాడు.. కాని యే దెబ్బకైనా యెవడైనా బేర్ చేస్తాడా? చెయ్యలేడు! అంచేత దెబ్బలని తప్పించుకోవడానికో తట్టుకోవడానికో శిక్షణ తప్పనిసరి అవసరం! దటీజ్ యెసన్షియల్! దటీజ్ స్పేస్!

అలాగే టియర్ గ్యాస్.. రబ్బర్ బుల్లెట్స్.. వాటర్ ఫైరింగ్.. ఫైరింగ్.. యే క్షణాన యేదన్నా జరగొచ్చు.. జరిగినప్పుడు జడిసి పోకుండా జంప్ అవాలి! దేశ సరిహద్దుల్లో శత్రు శిబిరం నుండి కాల్పులు జరిగినప్పుడు మన త్రివిధ దళాలు అన్ని ఆయుధాలు వున్నప్పటికీ ముందు వొడుపుగా తప్పించుకుంటాయి.. తరువాతే తిప్పికొడతాయి! త్రివిధ దళాలకి ప్రభుత్వం కోట్లు వెచ్చించి అను నిత్యం శిక్షణని యిస్తోందే.. అలాంటిది భావి విధాతలైన విద్యార్ధులకి వద్దా? సో.. ‘మీ పిల్లల ప్రాణ రక్షణ కోసం మా ప్రాణ సమాన ప్రయత్నం..’ అని మనం పిలుపు యివ్వాలి.. జనం పొలో మని వొచ్చి మన ట్రైనింగ్ సెంటర్లో చేరిపోవాలి!

హై జంప్.. లాంగ్ జంప్.. చిన్నప్పటి నుండి నేర్చుకున్నవే! బట్.. బార్బడు వైర్ మీది నుండి జంప్ చేయడం రావాలి! గేట్లు మూసేస్తే దూకడం రావాలి! అబ్బో వో మిలటరీ శిక్షణా సంస్థ యిచ్చినన్ని శిక్షణలు యివ్వడానికి మనకి స్పేస్ వుంది!

అయిదు నిముషాలు అన్నం లేటయితే ఆకలి అంటారు మన పిల్లలు. అరగంట లేటయితే కళ్ళు తిరిగి పడిపోతారు. అలాంటి వాళ్లకి ఆకలికి తట్టుకోవడం నేర్పాలి! పస్తులు వుండడానికి వీలుగా వుపవాసాలు నేర్పాలి! మెస్సులు మూసేసినా అప్పడే మేనేజ్ అవుతారు! సో.. యోగా గీగా చేసి గాలిపీల్చి గాలితాగి గాలితిని గాలికి బతికెయ్యాలి! ఆక్సిజనూ ఆహారమే అనే నినాదాన్ని హెల్త్ కాన్సియస్ తో విద్యార్థులలోకి వారి తలిదండ్రులలోకి తీసుకువెళ్ళాలి! పెట్టుబడిలేని బడి!

చిన్న మాటకే చివుక్కుమనిపోయే తరం! అందునా ఆడపిల్లలు వో మాటంటే వురిపోసుకుంటున్నారు! అలాంటిది యూనివర్సిటీల్లో పోలీసులూ సెక్యూరిటీ సిబ్బంది అమ్మాయిల్ని అమ్మనా బూతులు తిడితే తట్టుకోవాలి గదా? మిమ్మల్ని చెరిచేస్తాం.. రేప్ చేసి పడేస్తాం.. లంజా లమ్డీ అని అన్నాసరే.. యేమీ అననట్టు.. యేమీ విననట్టు.. నిమ్మకు నీరెత్తినట్టు వుండాలి కదా? ఈ చెవిన విని ఆ చెవిన వొదిలేయడం కాదు, అసలు చెవికి యెక్కకుండా వుండేలా శిక్షణని యివ్వడానికి కూడా చాలా స్కోప్ వుంది!

వీసీల నుండి ప్రొఫెసర్ల దాక కులం పేరు పెట్టి తిట్టినా దీవించినా- అనుమానించినా అవమానించినా- ఆటపట్టించినా ఆర్డర్లీలుగా మార్చినా.. వివక్షత చూపించినా విచక్షణ మరిచినా- మనిషిగా చూడకపోయినా- మొద్దులా.. యెద్దులా.. తుమ్మ మొద్దులా.. బుద్దిగా నాలుకని మడిచి పెట్టుకొనేలా మనం ట్రైనింగ్ యిస్తాం! సూదీ దారంతో నోళ్ళు కుట్టుకోవడమెలాగో నేర్పిస్తాం.. శాంతి భద్రతల్ని కాపాడుకుందాం!

పక్కనే పిడుగు పడినా పట్టించుకోనట్టు పిల్లలుండాలి! ప్రతీ పేరెంటూ కోరుకొనేదదే! సో.. పిల్లలతో శవాసనం వేయించెయ్యాలి! ప్రాక్టీస్ చేయించెయ్యాలి! పీస్ ఆఫ్ మైండ్! ఓం శాంతి శాంతి శాంతి హి! ప్రభుత్వం కూడా భారతీయమని.. మన సంస్కృతీ చచ్చుబండని.. మనకి యెంతో సపోర్టు చేస్తుంది! రాయితీలు యిస్తుంది! మనకి అవార్డులు యిచ్చినా యివ్వొచ్చు! వాళ్ళకి హెల్తూ.. మనకి వెల్తూ!

అలాగే పోలీసులు కేసులు పెడితే.. నాన్ బెయిలబుల్ కేసులు పెడితే.. యెలా బయటకు రావాలో.. బెయిల్లూ జెయిల్లూ యెలా దాటాలో.. యెలా లాయర్లని పెట్టుకోవాలో.. కింది కోర్టులో వీగితే పై కోర్టుకు యెలా పోవాలో.. లా యేమిటో.. సెక్షన్లు యేమిటో.. ఫనిష్మెంట్లు యేమిటో.. ప్రాధమిక హక్కులు యేమిటో.. సివిలేదో.. క్రిమినల్ యేదో.. ద్రోహానికి దేశ ద్రోహానికి వున్న తేడా యేమిటో.. దేశ ద్రోహిగా యెప్పుడు యెవరు ముద్ర వేస్తారో.. తెలీదు! అంచేత విద్యార్థులు వాళ్ళని వాళ్ళు కాపాడుకొనే లా’ని.. అవేర్నెస్ ని అందివ్వాలి! అవన్నీ మనం యిస్తాం! అదే స్పేస్!

యింకా స్టూడెంట్స్ కు రావలసిన స్కాలర్ షిప్పులని ఆపితే.. స్టయిఫండులని ఆపితే.. యెలా అప్పు చెయ్యాలో.. అప్పు  చేసుకు పప్పుకూడు వొండి యెలా బతకాలో.. మనం తర్ఫీదు యిస్తాం!

అన్నీ యూనివర్సిటీలో చదివే పెద్ద వాళ్ళకే అనుకోవద్దు! ఆ మాటకొస్తే యల్కేజీ నుండి పిల్లలు పుస్తకాల బస్తాలూ బరువులూ మొయ్యడంలోనూ మనం తర్ఫీదు యిద్దాం!

అన్నీ వేదాల్లో వుండొచ్చు! కాని అన్నీ పాఠాల్లో వుండవ్! వున్నా బోధ పడవ్! కొత్త సందర్భాలకి కొత్త స్కిల్స్ తాలూకా అవసరం యెంతో వుంది! వుంటుంది! ఈ స్పేస్ ని మనం ఫుల్ ఫిల్ చేద్దాం! బిజినెస్ గా చూద్దాం!

బిజినెస్ మెన్ మొదట నమ్మేది థాట్ ని! థాట్ కింగ్ లా ప్రవోకింగ్ లా వుండి కాన్ఫిడెన్సుని యివ్వాలి! ఆ పై సొసైటి అందుకు అనుకూలంగా వుండాలి! పదునుగా యెలా వుండాలో యిప్పుడు అచ్చం అలానే వుంది!

యిది పక్కా బిజినెస్ ప్లాన్! పక్కవాళ్ళకి చెప్పకండి! చర్చించకండి! మాట జారితే మార్కెట్ జారుతుంది! కాచుకొని వున్న కార్పోరేట్ శక్తులు యీ స్పేస్ లోకి కూడా వచ్చేస్తాయని నా సిక్స్త్ సెన్సు చెబుతోంది!

ఇప్పటికైనా నా తెలివిని నమ్మి మీ అమ్మాయిని నాకు యిస్తారని నమ్ముతున్నాను! రేపటి యీ కోటీశ్వరున్ని యివాలే దీవించండి! కోటీశ్వరులు కండి! ఆలసించిన ఆశా భంగము.. తక్షణం నన్నూ నా ఐడియాని మీదిగా చేసుకోండి!

ఆల్ ది బెస్ట్.. మై పార్టనర్స్ ..

ఆలోచించండి.. ఆచరించండి.. ఆనందించండి!

అభిమానంతో-

మీ

అల్లుడు!

నేను..!

 shajahana cover
– షాజహానా
~
”నీతో మాట్లాడ్డానికేం లేదు. ఒక్క దేహభాషతో మాత్రమే నీతో మాట్లాడగలను. నీ దేహం అంతిష్టం నాకు. దేహమే మొదలు దేహమే అంతిమం. ఒబామా గురించి మాట్లాడ్డానికి నాకు చాలా మంది మిత్రులున్నారు. నాకు త్వరగా సమాధానం కావాలి. నేను నువ్వనుకున్నట్లు నిన్ను ప్రేమించడం లేదు. నాకు ప్రేమంటే శరీరంలో ఒక భాగం మాత్రమే. శరీరమే ముఖ్యం. నీ మాట కోసం చూస్తుంటాను.”
***
”ఎందుకు వేరే మాట్లాడకూడదు? నేను శరీరం తప్ప ఏమి లేనిదాన్నా? అవయవ సౌష్ఠవం ఉన్నంత మాత్రాన, ముఖవర్చస్సు ఉన్నంత మాత్రాన నేనేమి మాట్లాడ కూడదా? నాకు నీతో ఈ ప్రపంచంలోని విషయాలన్ని మాట్లాడాలని కదా ఉంటుంది? నిన్ను నేను మనసా వాచా కర్మణా ఒక మనిషిని ఎంత ప్రేమించాలో అంతా ప్రేమించాను కదా; నాలో రేగే భావాలన్నింటిని శరీరం మాటున దాచి నీతో నేను… ఎలా?”
***
”అవును.. నువ్వు నాతో పడుకోవడాన్ని మాత్రమే నేను కోరుకుంటున్నాను. మన మధ్య ఏ బంధాలు అనుబంధాలు ఉండవు. నాకు నువ్వు నచ్చావు. అలా అని దాన్ని ప్రేమనుకోకు. ప్రపంచం అందమైంది. నువ్వు దాన్ని కోల్పోతున్నావు. నేను దగ్గరుండి చూపించాలనుకుంటున్నాను. ఎప్పుడు నన్ను రమ్మంటావు?”
***
”ఇలాంటి స్నేహితుడు నాకు దొరుకుతాడని కలలో కూడా ఊహించ లేదు. శరీరమే ముఖ్యమైతే ప్రపంచంలో ఏదో ఒక శరీరంతో సంతృప్తి చెందొచ్చు కదా! అయినా ఒక్కసారికే దేహదాహం తీరుతుందా? ఇలాంటి విషయాల్లో నేను ఎలా రియాక్ట్‌ అవుతానో కూడా అవసరం లేదా? నువ్వు బంధాలు కోరుకోవు, ప్రపంచం అందమైందని నాకు ఎలా చూపిస్తావు?”
***
”నీలాంటమ్మాయిలకు జీవితం గురించి తెలీదు. ఎలా లైఫ్‌ని ఎంజాయ్‌ చెయ్యాలో తెలీదు. ప్రంపంచంలో నేనొక్కడినే మగాడిని కాదు, నాకు నువ్వొక్కదానివే ఆడదానివి కాదు. అందుకే అన్నాను ప్రపంచం అందమైందని. ఇంకా విడమరచి చెప్పాలంటే నీకు చాలా మంది మగ స్నేహితులు ఉండాలి అని నా ఉద్దేశం. కొన్ని రోజుల తర్వాత ఏం చెయ్యాలన్నా ఈ దేహం సహకరించదు. నాకు నువ్వు నీకు నేను నచ్చాక చర్చ లనవసరం, నన్నెపుడు రమ్మంటావ్‌? లేదా ఈ విశాల ప్రపంచంలోకి నువ్వు రా!”
***
”నువ్వు ఎలా పెరిగావో నాకు తెలీదు కాని నేను కనపడని కత్తులు మెరిసే చూపుల మధ్య పెరిగాను. ఏం చేయాలన్నా, ఏం చదవాలన్నా ఆఖరికి ఏం కట్టుకోవాలన్నా ఏం తినాలన్నా అమ్మా నాన్న, నానమ్మ, తాతయ్య, అన్నయ్య, ఇంటి పక్కవాళ్ళు, ఇంటెదురువాళ్ళు, వీధివాళ్ళు… ఇన్నిన్ని ఆంక్షల మధ్య నేను పొందే ఉపశమనం ఒక్క ఈ లైబ్రరీ మాత్రమే. ఇక్కడా నువ్వెదురై మనశ్శాంతి లేకుండా చేస్తున్నావ్‌? నువ్వలా అడిగిన దగ్గర్నించి నాకు నిద్ర దూరమైంది.. అన్నం సహించడం లేదు.. ఎప్పుడూ ఎదురుగా నువ్వొచ్చి పదేపదే అడుగుతుంటావ్‌. నేన్నీతో కలిసి నడుస్తాను, మాట్లాడతాను, నవ్వుతాను, బోలెడంత ప్రేమిస్తాను… అంతే, తప్ప నువ్వడిగింది నేనివ్వలేను. ఈ విశాల ప్రపంచం నాది కాదు… నేను ధైర్యంగా బయటికి రావడానికి. ఇక్కడ నేల మీద నా పేరున్నా నా అధికారం ఉండదు. నేను కన్న ప్రపంచం మీద నాకే హక్కు ఉండదు. స్కూళ్ళల్లో బస్సుల్లో ఇంట్లో ఆఫీసుల్లో కాలేజిల్లో  ఎక్కడన్నా నేను ధైర్యంగా ఉండగలిగానా? పుస్తకాల్లో తప్ప. నేను నీకోసం ప్రపంచంలో కొచ్చిన మరుక్షణం నాకిచ్చే ఇరుకుపదం ఏంటో కూడా నాకు తెలుసు? ఏది విశాల ప్రపంచం? ఏది అందమైన ప్రపంచం? నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? నీలో నామీద కోరికుంది, దానికి సంబంధించి దాపరికం లేదు ఒప్పుకుంటాను, కాని ప్రేమిస్తే అది బాధ్యతవుతుందనే కదా ప్రేమించడం లేదని అంటున్నావు. ప్రేమ లేని దేన్నీ నేనంగీకరించను.”
***
”నేన్నీకు ముందునుంచి చెప్తూనే వస్తున్నాను. ప్రేమించట్లేదని, అలా అని మోసం చేస్తున్నానని అనుకోకు. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీమీద కలిగిన ఫీలింగ్స్‌ని ఉన్నదున్నట్లు నీకు చెప్పాను. నేన్నీ మేధస్సునో, ఓదార్పునో కోరుకోవడంలేదు. ఈ శరీరాన్ని నీ శరీరంలోకి ఒంపుకోవాలనుకుంటున్నాను. దానికి నువ్వింత మధనపడాల్సిన అవసరం లేదు. నీకు బాధ కలిగించే ఉద్దేశ్యం నాకు లేదు. ఇంకెప్పుడు నీకు ఎదురుపడను. మాట్లాడను, డిస్ట్రబ్‌ చేయను. ఎప్పుడయినా ఎవరిపైనైనా ఇలాంటి ఫీలింగ్స్‌ కలిగితే దాచుకోకు. నా గురించి ఆలోచించకు. నన్ను అనవసరంగా ప్రేమించకు.”
***
”నీకు ప్రేమంటే తెలీదు. మనుషుల విలువ మనసుల విలువ అంతకంటే తెలీదు. నువ్వు సమాజంలోనే పెరిగావా? అర్ధం కావట్లేదు. నీ నిజాయితీ చూస్తే అపురూపం అనిపిస్తుంది, కాని ప్రేమ లేకుండా కామం ఉంటుందంటే నేనంగీకరించను.. నేను ప్రేమించకుండా ఉండలేను, కాని మరచి పోకుండా కూడా ఉండలేను. మరపు నాకు నన్ను పెంచిన సమాజం నేర్పించింది. నేను పెంచి పెద్ద చేసిన పూలతీగలు, మేకపిల్లలు.. పిల్లి పిల్లలు, నన్ను పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్న, మా ఇల్లు ఇదే అని పరిచయం చేసిన ఇల్లు… ఎందుకూ పనికి రాని చదివిన చదువు అన్నింటిని మరచి పోయేలా చేసిన సౌకర్యవంతమైన సమాజం మనది.. ఇన్నింటిని మరచిపోయిన నేను నిన్ను మరచిపోలేనా? ఇంకెప్పుడూ ఏ అమ్మాయిని ఇలా మాత్రం అడక్కు. ఇంకెప్పుడు నాకు కనిపించకపోవడం నాకు మేలే? నీ లాంటి స్నేహితుడున్నాడని కొంత ఉపశమనాన్ని ఆనందాన్ని పొందేదాన్ని.. ఎప్పుడు తప్పిపోతాడో,  దూరమవుతాడో, ఎవరివల్ల దూరమవుతాడో అన్న బాధ నుంచి విముక్తం అవుతాను.”
***
-ఏం మనిషి? మగవాడిగా ఆలోచిస్తాడే తప్ప నా గురించి ఎందుకాలోచించడు? నాన్న అన్నాడు డిగ్రీ దాకా చాలమ్మ, పిజి చదివితే మళ్ళీ ఎక్కువ చదివిన వాడిని తేవాలి కదా; ఆలోచించు; కాబట్టి ఇక్కడికి చదువునాపెయ్యి. ఇంక నేను ఫీజులు కట్టలేను. కట్నం ఇవ్వాలి కదా? నాన్న మాటలకి తలొంచాలి ఎన్ని ఆలోచనలున్నా బుర్రలో. నేను కాసేపు నాన్నలా మారి నిజమే నిజమేననుకుని ఒప్పేసుకున్నాను కదా పెళ్ళికి, ఇక నాలో నేనెక్కడున్నాను? అమ్మకి ఎప్పుడయినా స్వేచ్ఛ ఉంటే కదా నా గురించి పట్టించుకోవడానికి; నాన్న చెప్పిందే వేదం. కొన్నాళ్ళు కలిసున్నందుకు అమ్మ కూడా మరో నాన్నే !
జీవితమంటే ఏం లేదు ఎదుటివాళ్ళని ఆక్రమించడమేనని అర్ధమై, మౌనమే భాషగా బతుకుతున్న మూగజీవితానికి పరిచయమైన లైబ్రరీ దోస్తు అతడు. ప్రపంచం మొత్తం అతడి మెదడులో నిక్షిపమై ఉందా అని అనుమానం వచ్చేది ఒకోసారి. అతడితో మాట్లాడితే కోల్పోయిందేదో దొరికినట్టనిపించేది, తడారిన మనసుకు జీవం వచ్చేది. అతడే నా కోల్పోయిన జీవన మాధుర్యాల చిరునామా అనుకున్నాను. మంచి స్నేహితుడనుకున్నాను. నాలో ఉన్న నాన్న మీంచి,  భర్త మీంచి, కొడుకు మీంచి తొంగి చూస్తుంటాడు, ఎంత ధైర్యం? క్రమంగా అతడి రూపం కూడా నాలో ఎవరూ తుడిపేయలేనంతగా తీర్చిదిద్దుకుంది. ఎంతమందిని మోయాలి నేను? వీళ్ళల్లో ఒక్కరిలో నైనా నేనున్నానా? ఎంత పరిమితితో ఉండి ఉంటాను?
అతడికి అంతే నేను అఖ్ఖర్లేదు. కావలసింది మనసు కాదు దేహం. కాకపోతే కక్కుర్తి లేదు, మోసం లేదు. అదొక్కటే కాదు కదా నన్ను నేను అర్పించుకోవటానికి, నన్ను నన్నుగా చూడలేకపోవటానికి అతడికి సవాలక్ష కారణాలు ఉండనీ. నా మనసుకు, కన్నీళ్ళకు, చిరునవ్వులకు నా ఆలోచనలకు దేనికీ ప్రాధాన్యం ఇవ్వని అహంకారి. నేను ఎలా అంగీకరించగలను? నేను అతడిని పూర్తిగా కొద్దిగా కొద్దిగా మర్చిపోతున్నాను… ఇప్పుడు నాకు లైబ్రరీ కూడా లేదు.. అతడు కూడా లేడు… ఇప్పుడు నేను ఖాళీగా కనపడుతున్నాను.
నన్ను పూరించుకోడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేను. పూరించుకోగలనో లేదో కూడా చెప్పలేను. కాని నన్ను నేను గుర్తించుకున్నందుకు ఆనందంగా ఉంది, నన్ను నేను పూర్తిగా ఖాళి చేసుకున్న ఆనందం అది!
shajahana invitation

చెప్పొద్దులే..!

 

-సాంత్వన చీమలమర్రి

~

ఉహూ నువ్వయ్యుండవులే. ఎర్రటి సాయంకాలాల్ని చల్లార్చే ఆ పొడుగాటి నీడల్లో యేదీ నీది కాదని నచ్చజెప్పుకునే అవసరం పడట్లేదిప్పుడు.

చెవులు రిక్కించటమూ మానేశాను… కొమ్మలు రాసుకున్న అరక్షణం తర్వాత నీ ఇంకొక పాదం చేసే శబ్దం కోసం.

సెలయేరు మోగని చీకటికి అలవాటుపడి బూడిదరంగులో బాగానే ఉంది ఇప్పుడంతా. ఆ మలుపు చివర్నించి ఎగిరొస్తూ ఓ నారింజ జలతారు రెక్కల పక్షి ఎదురైతే అది నువ్వెందుకవుతావూ?

ఒక మాట చెప్పెయ్యనా? వయోలా తీగల్లోంచి వగరు తేనె తెచ్చి, నీ టీకప్పులో కలిపేసి, పొద్దుటికి పారబోస్తూనే ఉంటాను ఇంకా.

నీ పాటనొకదాన్ని సన్నగా చుట్టేసి, అప్పుడు వాడిపోయిన కొన్ని పూలతో కలిపి వాసన చూసుకోవటమూ మానలేకపోయా. ప్రశ్నలు గుచ్చి తెస్తే తెంపేశావుగా. యే పాటో గుర్తుందా అని ఎలా అడగటం?

అడవిలో దారి తప్పి ఎడారిలోకొచ్చి పడ్డాను. ఇపుడక్కడ యే ఋతువో చెప్పొద్దులే నాకు.

నా గాజుపూసలు మాత్రం మొక్కలయ్యాయో లేదో నీ రెక్కల్లో గాలినడిగి ఏం చెప్తుందో వినకుండానే వెళ్ళిపోతానిప్పటికి.

*

యెనకటి రావ్ ముందుచూపు

 

 

ఎప్పుడూ ఏదో ట్రెండ్ కావాలని కోరుకునే ఎడిటర్ యెనకట్రావ్ కి … ‘ఈ ఉగాదికి  ‘అశ్లీల కథల పోటీ’ ఓటి పెట్టి పారేస్తే ఎలగుంటది’ …. అనిపించింది! దాన్ని ‘తక్షణమే అమలుపరచెదవుగాక’ అంటూ సబ్బెడిటరు సంకటరావ్ కి పైనించి  కిందకి పామేశాడు సదరు ఆలోచన్ని! ఎప్పుడూ ఏదో ఒహటి మూసుక్కూచ్చుని ఉండటం అలవాటయిపోయున్న సంకట్రావ్,  చేసేదేంలేక అప్పటికి  నోరు  మూసుకుని ఆ వెంఠనే ఓ పత్రికా ప్రకటన వేసిపారేశాడు,  కాల్చిన సిగరెట్టు పీక కారులోంచి వెనక జనమ్మీదకి  విసిరిపారేసినట్టు!

పత్రికా  ప్రకటన చూసిన జనం  పలు పలు విధాలా స్పందించారు. కాపీని తప్పక ముందస్తుగా బుక్ చేసుకోవాలనే చిత్త  చాపల్యం  పెరిగిన క్షణం నుంచి  రసిక  జనాలకి వంటిమీద కౌపీనం నిలవలేదు! ఖానా పీనా  తెలవలేదు!!

“ఏమ్మాయరోగం ఆ ఎడిటరుకి?“ సరాసరి అశ్లీలాన్ని పోటీకి నిలుపుతాడా? “  అంటూ అంతా కూర్చుని ఆయనగార్ని  నిలేశారు మహిళా మండలివాళ్లు. “విషయమ్మీద అంతా కలిసికట్టుగా  ‘సమరం’  చేయుటకొరకు  ఆయత్తమవందే   ముద్దలోకి ‘లవణం’ కూడా తీసుకోవద్దని”  పెసిడెంటు పేరమ్మ ఆధ్వర్యంలో కాలనీలోని అంగనలంతా అంగీకరించి ఆనక  తీర్మానించారు.

మేధావి వర్గం వారైతే ‘కాదేదీ కవితకనర్హం’ లాగా ‘కాదేఅంశం  పోటీకి  అనర్హం’ అన్న నినాదాన్ని సునాదంగా మార్చి గొంతుకొక్కటి విచ్చి మ్రోశారు. ఇంతింత రాజ్యాంగం రాసుకుని,  ఆమాత్రం స్వాతంత్రం లేకపోతే బతుకులెలా వెళ్లమారుస్తాం అంటూ వాళ్ళకు వాళ్ళే బుజాలు చరుచుకున్నారు. వాపసివ్వడానికి తమ వద్ద ఏమేమి అవార్డులున్నాయో రాత్రికి రాత్రే అంతా అటకెక్కి  ట్రంకుపెట్టె వెతుక్కోండని మరో మీటింగులో పిలుపిచ్చారు సభ్యులందరికీ.

ఓ దయ్యాల సినిమా డైరెక్టరు వచ్చి ‘అశ్లీలాన్ని’ మానుంచి దూరం చేసి మా ‘వంట్లో’  భావజాలాల్ని,  ఇంట్లో దూలాల్ని తీసేసినంత వీజీగా తీసేస్తారా? ఎక్కడికి తీసుకెళుతున్నారు ఈ దేశాన్ని? కామి గానివాడు మోక్షగామి కాలేడు! అశ్లీలాన్ని చూడలేనివాడు శీలాన్ని ఇనుమడింపజేసుకోలేడు”  అంటూ స్వీటు చప్పరించినంత  వీజీగా  ట్వీటు చేశాడు! పెద్దోళ్ళకి విరుద్దంగా యేవైనా ట్వీటు చేస్తే ఐటీ ఆక్టు ప్రకారం బొక్కలో యేస్తారెమో అని పామరజనానికే భయంగానీ …ఇలాటి  తింగరిబుచ్చి గాళ్ళకి ఏమీ ఉండదు  అని స్వామీ పవిత్రానందలవంటి వారికి బాగా తెలుసు. పైపెచ్చు  అలా వాకృచ్చిన వారిని ‘మగధీరుడు’,  ‘దమ్మున్నోడు’, ‘పరమ తేడా శిరోమణి’ లాంటి అవార్డులు ఇచ్చి సముచిత రీతిన సత్కరిస్తారు కూడాన్నూ… అంటాడు పవిత్రానంద! అదే ట్వీటు తను చేస్తే ‘నిత్య అశ్లీలానంద’ అని బిరుదిచ్చి ఉద్ధరించేవాళ్లు అని అప్పుడప్పుడూ వాపోతుంటాడు ఏ ఆటోలోనో అటుగా  పోతున్నప్పుడాయనగారు.

“మేము ఎక్డా భాయీ భాయీ కాదు గానీ … బేఅశ్లీలతా కీ బాత్ మే మేమూ భాయీ భాయీ. ఎవరైనా  సౌందర్యం లోప్టా పెట్టుకోవాల్ – బైటా ఓపెన్లో కాదూ”  గట్టి పట్టు పట్టాడు పక్కింటి బాబూ మియా!

అదేం పట్టించుకోకుండా – “ఎందుకూ పెట్కోవాలే? అసల్ కీ ఈ అశ్లీల్ తా అంటే క్యాహై? కౌన్ నిర్వచనం ఇస్తారూ హై?” అన్నాడు కించిత్ వెటకారంగా   రకుల్ కోబాల్ –‘ స్మార్ట్ ‘ ఫోన్ లో ‘స్మార్ట్’ వీడియో చూస్తూ!

ఆ పక్కనే ఉన్న మన్మధ రావ్ “ బొడ్డు మీద ఆపిల్ పెట్టి చూపిస్తే .. బొడ్డు ని చూస్తామా? ఆపిల్ ని చూస్తామా? ఆపిల్ ని అడ్డం పెట్టుకుని బొడ్డుని చూపించే కుట్ర కి మనం తేలిగ్గా లొంగి పోవలసిందేనా? అయినా అనుకుంటాంగానీ ఎర్రటి  ఆపిల్తో అంతర్యామివంటి అశ్లీలాన్ని ఆపలేరు గాక ఆపలేరు. అంచేత అశ్లీలాన్నిఇదమిద్ధంగా  నిర్వచించలేమ్” అన్నాడు నిర్వచనం చెప్పలేక … ‘ఎర్రని సూర్యకాంతిని  అరచేత్తో ఆపలేమ్ గాక ఆపలేమ్’ అన్న చందంగా  !

“నిర్వచనం లేక పోవడమేంటి? ఐపీసీలో ఏనాడో చెప్పారు వెయ్యి సంవత్సరాల కన్నా ముందే” అన్నాడు రకుల్ కోబాల్!

“అదేంటి వోయ్ ? ప్రాధమిక హక్కులకు వ్యతిరేకంగా తగలడ్డ ఆ  పాత చింతకాయ్ పచ్చడి  సెక్షన్నే తీసిపారేసేయ్ మంటుంటే ఇప్పుడున్న  పండితాగ్రేసరులు…..?”  కల్పించుకున్నాడు కస్తూరీ తిలకం బట్టతల నిమురుకుంటూ!

“ నాయనా! ఇప్పుడు నేను ఆ మూడో తలకాయ వారి  ధూర్త అప్రాకృతిక  అనైచ్య అలౌల్య అసందర్భ ఆంగిక  లైంగిక వికటీకృత వైపరీత్య చర్మచాపల్య  చర్య గురించి మాట్లాడటం లేదు! ఆ అంశం వేరు. ఈ అంశం వేరు” పిచ్చ పిచ్చగా ఖండించాడు కోబాల్!

“ ఇందాకటి నుంచి చూస్తున్నాను. మీరూ మీరూ  ఖండించుకుంటున్నారు సరే! నేను చెప్పేది వింటారా….” మధ్యలో వచ్చింది బాడీమీద  నిండు వస్త్రాలు నిండుకున్న  వస్త్రలత!

ఉలిక్కి పడి తమ తమ  అధో వస్త్రాలు వాటి వాటి స్థానాల్లో పొందికగా ఉన్నాయో లేవో అని పరిశీలించుకుని తృప్తినొందిన పిమ్మట –

“చెప్పండి వింటాం” అన్నారు కస్తూరీ కోబాలుర ద్వయం.

“ అశ్లీలత నిర్వచనం  గురించి మీరు ఏదైనా  చించే ముందు, ‘మా దేహం-మా యిష్టం’  అనే ప్రాధమిక అంశాన్ని మీరు మరువరాదు. ‘వాక్స్వాతంత్ర్యం’ లాంటి ప్రాధమిక హక్కు  ఉందీ అన్నప్పుడు ‘దేహస్వాతంత్ర్యం’ ఉంది అనే ప్రాధమిక హక్కుల  అంశం అందులో ఇమిడి ఉంది. దేహాలకీ, దాహాలకీ అడ్డుకట్ట వేయడం ఫాసిస్టు వికృత చర్య! సృష్టి సహజాతాన్ని పాతరేసే పైశాచిక చర్య! ప్రాకృతిక  రాజ్యాంగం ప్రసాదించిన అంగాంగ వైభోగాన్ని అణగదొక్కే కాముక ఆటవిక చర్య “ అంటూ ఆయాసపడి మధ్యలో ‘ఊపిరి’ తీసుకోడానికి ఆగింది వస్త్రలత.

2016-03-18 23.43.59

“వామ్మో వీరి  పదజాలమే జలఫిరంగుల్ని ఫేస్ చేస్తున్నట్టు  ఉన్నాయి. ‘ఊపిరి’ తీస్కుని మళ్ళీ మొదలెట్టారంటే  భాష్పవాయువు ప్రయోగం చేయించుకున్నట్టే …ఎందుకొచ్చిన గోల … బతికుంటే బూతు సినిమా చూడొచ్చు ” అనుకుంటూ ఇద్దరూ మెల్లగా అక్కడినుంచి తప్పుకున్నారు.

ఈ చర్చ అంతా పక్కన బడ్డీ కొట్టు దగ్గర చాయ్ తాగుతున్న ఇద్దరు ఛానల్ మిత్రులు  ‘అరె… వీటిని కొన్ని ‘బైట్స్’ గా తీసుకుంటే ‘జంగ్లీ  నైట్స్’ ప్రోగ్రామ్ లో పెట్టుకుంటే బాగుండేదే” అనుకున్నారు. ఈ రాత్రే ప్రోగ్రామ్ ఎడిటర్ తో మాట్లాడి,  రేపే కెమెరామాన్ తో గంగని పంపించి ‘స్త్రీ పురుషుల  మధ్య అశ్లీలతా వైవిధ్యం’ అనే చర్చనీయాంశాన్ని షూట్ చేయిద్దాం అనుకున్నారు ఇద్దరూ.

గిర్రున ఓ మూణ్ణెల్లు  తిరిగిపోయాయి. ఎడిటర్  యెనకట్రావ్ ఆనందగా ఉన్నాడు. తన స్కీమ్ ప్రకారం వదిలిన అశ్లీల కథల  పోటీకి కథలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. జడ్జస్ అంతా కలిసి ‘నీ యబ్బ!’ అనే కథ ఉత్తమ అశ్లీల కథగానూ, ‘తోక్కేం కాదూ…’ అనే కథని ద్వితీయ బహుమతి కిందా, ‘జింతాతా చితాచితా” అనే కథని తృతీయంగానూ ఎంపిక చేశారు. పెగ్గు పెగ్గుకూ మధ్య నంజుకునే పచ్చడి పూర్తిగా నాకేశాక – ‘కథల సబ్జక్టు ఒకడబ్బ సొమ్ముకాదు. వైవిధ్యంతో రాసిందేదైనా కథే! దానికి కథకుల నుంచి వచ్చిన ఈ స్పందనే దాఖలా’ అన్నాడు సబ్బెడిటర్ సంకట రావ్ తో యెనకటి రావ్  తబ్బిబ్బైపోతూ.

“ఎంతైనా మన ప్రింట్ మాధ్యమం తాబేలే సార్! ఎలక్ట్రానిక్ మాధ్యమం అయితే సూపర్ ఫాస్ట్గా రిసీవ్ చేస్కుంటారు ప్రజానీకం. అక్కడ ‘జంగ్లీ నైట్స్’ ప్రోగ్రామ్ కి టీయార్పీ  రేటింగే రేటింగు. అటు చూడండి ” అంటూ రిమోట్ నోక్కాడు సంకట్.

“మరి నేవెళ్లొస్తా! మన పత్రిక్కి సన్నీ లియోన్ ఆత్మ కథ ఏమన్నా మన పాఠక దేవుళ్ళకోసం రాసిస్తుందేమో కనుక్కోమన్నారుగా…” అన్నాడు సంకట్రావ్! అతగాణ్ణి పంపించి తలుపేసొచ్చి, ఇంతలో బయట కోలాహలంగా ఉంటే అవతల బాల్కనీ  లోంచి తల ముందుకు చాచి చూచాడు యెనకటి రావ్.

“కావాలీ .. కావాలీ….బూతుకు బంగరు భవితవ్యం కావాలి!! అశ్లీలతా జిందాబాద్!!!” అంటూ కొన్ని గుంపులు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనగా వెడుతున్నారు.

యెనకటిరావ్ ఏదో తెలీని సంపృప్తితోనూ, మరేదో తెలీని విజయగర్వంతోనూ ఆ పూటకి లుంగీ లోకి దిగిపోయి, నెక్స్ట్ కథల పోటీ ఏంటా అని వైవిధ్యంతో ఆలోచించడం మొదలెట్టాడు.

*

గ్రీకుల ‘మహాభారతం’ ఇలియడ్

 

స్లీమన్ కథ-28

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

కల్లూరి భాస్కరం

స్లీమన్ తన జీవితకాలంలోని చివరి పదేళ్లూ మరెక్కడైనా స్వర్ణనిక్షేపాలు బయటపడతాయా అని గాలిస్తూనే గడిపాడు. కానీ అతని ఆశ ఫలించలేదు. తనలో ఒక బాలుడిలో ఉండే కుతూహలం, ఒక యువకుడిలో ఉండే ఉత్సాహం ఇప్పటికీ ఉన్నా శరీరాన్ని వృద్ధాప్యం ఆవహించింది. ఎక్కడో ఒకచోట తను స్థిరంగా కుదురుకోవాలనిపించింది. ఎథెన్స్ తనకెంతో ఇష్టాన్నీ, మనశ్శాంతినీ కలిగించడంతో ఆ నగరం నడిమధ్యలో తన స్థాయికి తగినట్టు ఒక నివాసాన్ని నిర్మించుకోవాలని నిశ్చయించుకున్నాడు.

ట్రాయ్, మైసీనియాలలో తను కనుగొన్న రాజప్రాసాదాల నమూనాలో తన సౌధానికి తనే రూపకల్పన చేసుకున్నాడు. దానికి Iliou Melathron (‘ట్రాయ్ ప్రాసాదం’) అని పేరుపెట్టాడు. అది లైకాబిటిస్ కొండ పాదాల దగ్గర రాజుగారి గుర్రపుశాలకు ఎగువన ఉంది. అదొక భారీ నిర్మాణం. రంగురాళ్ల నేలతో, పాలరాతి మెట్లతో లోపల చలి చలిగా ఉంటుంది.  ట్రాయ్ లో తను కనుగొన్న స్వర్ణపాత్రలు, కలశాల నమూనాలు వాటి మీద చిత్రితమై ఉన్నాయి. గోడల మీద ప్రాచీనతను ప్రతిబింబించే ప్రకృతి దృశ్యాలు, హోమర్ నుంచి తగిన ఉటంకింపులతో గ్రీకు వీరుల చిత్రాలు ఉన్నాయి.

కింది అంతస్థులలో తను కనుగొన్న నిక్షేపాలను ప్రదర్శించాడు. పై అంతస్థును తన అధ్యయనానికి కేటాయించుకున్నాడు. “క్షేత్రగణితాన్ని అధ్యయనం చేయనివారు బయటే ఉండండి” అనే హెచ్చరికను తలుపుకు అతికించాడు. గదినిండా పుస్తకాలు. తను సేకరించిన అతి విలువైన సామగ్రిని కూడా అందులోనే ఉంచాడు. గోడల మీద, తను ఎంతగానో అభిమానించే న్యూయార్క్, ఇండియానాపోలిస్ తాలూకు దృశ్యాలను అలంకరించాడు. మందంగా తోలు తాపడం చేసిన ఓ పెద్ద కుర్చీలో కూర్చుని రోజంతా ప్రాచీన గ్రీకు గ్రంథాలను చదువుతూ గడిపేవాడు. పక్కనే ఒక చిన్న కుర్చీ ఉండేది. దానిమీద, రోజూ ఉదయమే పారిస్, లండన్, బెర్లిన్ ల నుంచి వచ్చే స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాల దొంతర ఉండేది. టెలిగ్రాఫ్ ఫారాలు ఎప్పుడూ అందుబాటులో ఉండేవి. ఇప్పటికీ అతను వ్యాపారప్రముఖుడే. దాదాపు ప్రపంచమంతా విస్తరించిన తన ఆర్థిక లావాదేవీల పర్యవేక్షణకు రోజూ కొన్ని గంటలు కేటాయించుకునేవాడు.

తన నివాసంలో అతను హోమర్ వర్ణించిన రాజుల్లానే ఒక నియంతలా వ్యవహరించేవాడు. తన మాట శిలాశాసనం. తనకు పంపే వర్తమానాలను అన్నింటినీ ప్రాచీన గ్రీకు భాషలో పంపి తీరవలసిందే. ఇంట్లో భోజనాల దగ్గర, ఇతర నిత్యకృత్యాలలో గ్రీకు మాట్లాడవలసిందే. తన పనివాళ్లు అందరికీ గ్రీకు పేర్లు పెట్టాడు. ఒక పనివాడి పేరు, బెల్లర్ ఫాన్. ఇంకొకతని పేరు, టెలమాన్. కూతురు అంద్రోమకీ ఆయా పేరు, దనాయి.  కొడుకు అగమెమ్నన్ నర్సు పేరు పోలిక్సీనా. ముసలి తోటమాలి పేరు కల్ఫాస్. భవిష్యత్తును చెప్పగలిగిన కల్ఫాస్ శాపవాక్యాలతోనే ఇలియడ్ మొదలవుతుంది. ప్రాచీన గ్రీకులు ఇళ్ళలో ఎక్కువ గృహోపకరణాలను పేర్చేవారు కాదు కనుక, తను కూడా వారినే అనుసరించాడు. ఓ మూల కొన్నిపాటి కుర్చీలతో, సోఫాలతో గదులన్నీ బోసిపోయినట్టు ఉండేవి.  అలాగే, ఇంట్లో ఎక్కడా తెరలు ఉండకూడదు.  అతని ఉద్దేశంలో, అఖిలెస్ తెరలు వేలాడదీసిన నివాసంలో ఉన్నాడన్నది అసలు ఊహించడానికే వీలులేని విషయం. తన భారీ భవంతిని పురాతన గ్రీకు రాజప్రాసాదాల నమూనాలో నిర్మించడానికి, పాంపే(పురాతన రోమన్ నగరం) శిథిలాలు అతన్ని ప్రత్యేకించి ఆకట్టుకోవడం కూడా ఒక కారణం. పాంపే భవంతులలోని నాట్యశాలల తరహాలోనే తన నివాసంలో నాట్యశాలను నిర్మించాడు. దాని గోడల మీద నీలం, తెలుపు రంగుల్లో పిల్లల నగ్నచిత్రాలను ప్రదర్శించాడు. వాటిలో తన పరిచయస్తులు, ప్రయాణాలలో తనకు తారసపడిన వ్యక్తుల కవళికలు ఉండేలా చూశాడు. వాటి మధ్యలో కళ్ళద్దాలు ధరించిన తన చిత్రాన్ని ఉంచాడు.

జీవితం పొద్దువాలుతున్న దశలో తనకు రక్షగానూ, తనలో ఉత్సాహం నింపడానికా అన్నట్టూ భవనం పై కప్పు నేల మీద జియస్, అఫ్రొడైట్, అపోలో, ఎథెనా సహా ఇరవైనాలుగు మంది దేవీ దేవుళ్ళ పాలరాతి విగ్రహాలను ఉంచాడు.

***

pura1

స్లీమన్ తన జీవితంలో చివరి ముప్పై నాలుగేళ్లూ ఇలియడ్ ను ఎంతో తమకంతో పఠిస్తూనే వచ్చాడు. అదే అతని బైబిల్. రోజులో ఎన్నోసార్లు ఆ పుస్తకాన్ని తిరగేసేవాడు. దాదాపు అతని ఆలోచనల కన్నిటికీ అదే ఊటబావి.  అందులో, ఏ భాగం గొప్పదీ, ఏది నీకు ఎక్కువ ఇష్టం అన్న ప్రశ్నకు అతని దగ్గర అవకాశమే లేదు. అది ఆమూలాగ్రమూ గొప్పదే,  ప్రీతి కలిగించేదే. అందుబాటులో ఉన్న ఇలియడ్ ప్రతి ఒక్క ముద్రణా అతని లైబ్రరీలో ఉండేది. వాటిలో అనేకం మందమైన మొరాకో తోలుతో బైండ్ చేసినవి. అవిగాక,  చవకగా లభించే పేపర్ బౌండ్ చాజ్నిట్స్ [Tauchnitz- జర్మనీకి చెందిన బెర్న్ హార్డ్ చాజ్నిట్స్ అనే అతను నెలకొల్పిన సంస్థ 1842-1950ల మధ్యకాలంలో పేపర్ బౌండ్ చవక ముద్రణలను వ్యాప్తిలోకి తెచ్చింది. అవి చాజ్నిట్స్ ముద్రణలుగా ప్రసిద్ధి చెందాయి]ముద్రణలను ప్రయాణాలలో వెంటబెట్టుకుని వెళ్ళేవాడు. వాటి పుటలను తన వ్యాఖ్యానంతో నింపేసేవాడు.

ఇలియడ్ ను అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉందని ఓసారి ఒక మిత్రుడు ఉత్తరం రాశాడు. అందులో కష్టమేమీ లేదనీ, అది కాస్టలియన్[గ్రీస్ లో డెల్ఫీ సమీపంలోని] ఊటజలాలంత తేటగా ఉంటుందనీ, ఒక ఆధునిక నవలలా దానిని చదువుకోవచ్చనీ స్లీమన్ జవాబిచ్చాడు. అతని దృష్టిలో ఇలియడ్, ఒడిస్సే లు రెండూ దివ్యశాసనాలు. భగవదాశీస్సులతో రూపొందినవి. మానవమాత్రుడికి సాధ్యం కాని ఉదాత్తతా, సొగసూ వాటిలో ఉట్టిపడుతుంటాయి. ఈ గ్రంథాలను ఎవరైనాసరే కూర్చుని శ్రద్ధగా పఠిస్తే తన జన్మ సార్ధకమైందన్న భావనా, ఒక అలౌకికానందమూ అతన్ని ముప్పిరిగొంటాయి. మనిషి తాలూకు అంతటి విషాదాన్నీ అవి ప్రతిఫలిస్తాయి. అవి, ఒక పరిపూర్ణ కవి చెప్పిన పరిపూర్ణ కథలు. ఇంతకు మించి చెప్పడం అనవసరం.

ఇలియడ్ లో అన్నిటి కన్నా ఫలానా భాగం గొప్పదని చెప్పడం కష్టమనీ, అన్నీ సమానంగా రంజకమైనవే నని స్లీమన్ పదే పదే నొక్కి చెప్పినా; ఒక సందర్భంలో మాత్రం తన ఈ నిర్ధారణను తనే ఉల్లంఘించాడు.  అన్నిటిలోనూ  ప్రత్యేకించి మరింత అద్భుతమైనదిగా ఒక ఘట్టాన్ని ఎత్తిచూపాడు. అది, హెలెన్ ఒక వస్త్రంపై అల్లిక పని చేస్తూ స్కియన్ గేటు వైపు నడిచి వెడుతున్న ఘట్టం. ఆమె నేస్తున్న అలంకరణవస్త్రంపై ట్రోజన్లు, అఖియన్లు ఒకరి పీక ఒకరు పట్టుకున్న చిత్రాలు ఉన్నాయి.  ఆ సమయంలో, చెట్టు కొమ్మల మీద ఆనందంగా కిచకిచలాడే పక్షుల్లా  రాజు ప్రియామ్, నగర పెద్దలూ  సమీపంలోని ఒక బురుజు మీద సమావేశమై మాట్లాడుకుంటూ ఉంటారు.

యుద్ధం ఆగిపోయిందన్న వార్త వస్తుంది. దానికి బదులు హెలెన్ భర్త మెనెలాస్, ఆమెను అపహరించుకుని వచ్చిన పారిస్ ద్వంద్వయుద్ధం చేయాలని తీర్మానించారు. హెలెన్ భవితవ్యాన్ని ఆ యుద్ధం నిర్ణయించబోతోంది. హెలెన్ శ్వేతవస్త్రం ధరించి, చెలికత్తెలు వెంటరాగా ప్రియామ్ ఉన్న బురుజును సమీపిస్తుంది. ఆమె రాకను గమనించిన పెద్దలు అప్రయత్నంగా గొంతులు తగ్గించి, ఆమె అద్భుత సౌందర్యాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. ఇంకోవైపు, సుదీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధం అంతం కాబోతోందన్న సంతోషం వాళ్ళలో వెల్లివిరుస్తోంది. ప్రియామ్ ఆమెను తన దగ్గరకు పిలిచి శత్రుసేనలోని ఒక వ్యక్తిని చూపించి, “అందరికంటే ఆజానుబాహువుగా, ధీరోదాత్తుడిలా కనిపిస్తున్న ఆ వ్యక్తి ఎవరు?” అని అడుగుతాడు.

pura3

“అతను అగమెమ్నన్, నా భర్తకు అన్నగారు” అని హెలెన్ చెబుతుంది. ఆ తర్వాత, తన కవచాన్ని నేల మీదికి జారవిడిచిన ఇంకో వ్యక్తిని చూపించి, తగుమాత్రం ఎత్తుగా, లోతైన ఛాతీతో ఉన్న అతను ఎవరని అడుగుతాడు. “అతను ఒడీసియస్” అని చెబుతుంది. ఈసారి, ఎత్తుగా, అందంగా ఉన్న ఇంకో వ్యక్తిని చూపించి, ఎవరని అడుగుతాడు. “అతను ఎజాక్స్” అని చెబుతుంది. క్రీటు రాజు ఇడోమెనెస్ ను కూడా ఆమె గుర్తుపడుతుంది. అగమెమ్నన్ సేనానులందరిలో అతనే పెద్దవాడు.  ఇంతలో ఇద్దరి కోసం ఆమె కళ్ళు ఆత్రుతతో గాలించాయి. వారు, కాస్టరస్, పోలీడూసెస్ లు. వాళ్ళిద్దరూ ఆమె సోదరులు. ఒకతను మంచి అశ్వశిక్షకుడు, ఇంకొకతను ప్రసిద్ధ మల్లయోధుడు. వాళ్ళు కనిపించకపోయేసరికి కీడును శంకించి, పట్టలేని దుఃఖంతో ఆమె మూగవోయింది. హోమర్ అంటాడు:

ఫలవంతమైన భూమి ఇప్పటికే వారిని తన ఒడిలోకి తీసుకుంది

దూరంగా, తాము ఎంతో ప్రేమించే లాసిడిమోనియా*కు వారు చేరుకున్నారు

దుఃఖం నగ్నంగా నర్తించే ఇలాంటి ఘట్టాలు హోమర్ లో ఏడెనిమిది కనిపిస్తాయి. దుఃఖం-మనిషి ఎదుర్కొనే దుఃఖం- ఇదే ఈ కథలో ప్రధాన ఇతివృత్తం. అఖిలెస్ ఆగ్రహోదగ్రతా, ఎందరో ఉత్తముల చావుకు కారణమైన అతని విలయ తాండవం-ఇవే తన ప్రధానవస్తువులని హోమర్ ఇతిహాస ప్రారంభంలోనే చెబుతాడు. అఖిలెస్ రూపంలో మృత్యుశక్తి పట్టపగ్గాలు లేకుండా విస్ఫోటించింది. తన దారికి అడ్డువచ్చిన ప్రతిదానినీ ధ్వంసం చేస్తూ, ప్రతి ఒకరితో ఘర్షణపడుతూ; శత్రువీరుడైన హెక్టర్ ను చంపి అతని మృతదేహాన్ని గుర్తుపట్టలేనంతగా ఛిద్రం చేసేవరకూ ఎత్తిన కత్తి దించని అఖిలెస్ విజృంభణను ఊపిరి బిగబట్టి చూస్తూ ఉండిపోతాం. ఎట్టకేలకు మృతదేహాన్ని రాజు ప్రియామ్ కు అతను అప్పగించినప్పుడు, ఆ యువవీరుడైన హెక్టర్ రూపురేఖల్లో  మానవీయంగా, లేదా దైవత్వంగా చెప్పదగినదేదీ మిగలదు. అతను, నలిపి చంపేసిన ఒక పురుగు!

అఖిలెస్సే ఇందులో నాయకుడు. అయితే, అతను మృత్యువును ప్రేమించిన నాయకుడు. ఇందుకు భిన్నంగా ఈ కథను వినే శ్రోతలందరూ జీవితాన్ని ప్రేమించేవారు. ఇంత అందమైన భూమిని సృష్టించి కూడా, దానిని ఇంతటి విషాదంతో నింపిన దేవతల విధ్వంసశక్తికి వారు నివ్వెరపోతారు. మెరిసే కవచాలు, ధైర్యం ఉట్టిపడే చూపులు, వంగే మానవదేహాలు, స్వర్ణహారాల ధగధగలు-అన్నీ చివరికి ఇన్ని కన్నీళ్లుగా మిగిలిపోతాయి. ఒక విధంగా చెప్పాలంటే, యువవీరుల విషాదాంతాన్ని పురస్కరించుకుని భగవంతుని ఉద్దేశించి చేసే సుదీర్ఘ ప్రార్థన, ఇలియడ్.**

ఇలియడ్ లో అడుగడుగునా  బాధాగ్రస్తుల ఆర్తనాదాలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఇంతటి ధ్వంసకాండకు గ్రీకులు ఎందుకు పూనుకున్నారు? అందులో వాళ్ళు ఎలాంటి ఆనందాన్ని పొందారు?  హెక్టర్ మృతదేహాన్ని ట్రాయ్ ప్రాకారాల వెంట ఈడ్చుకువెడతారనీ, అఖిలెస్ విజయం సాధిస్తాడనీ, తళుక్కు మనే శ్వేతవస్త్రాలతో ప్రేతదేవతలా హెలెన్ కథ అంతటా ఆవరించి ఉంటుందనీ ప్రారంభంనుంచీ మనకు తెలుస్తూనే ఉంటుంది. గొప్ప సౌందర్యారాశిగా, అందరానిదిగా తోచే హెలెన్, తన అందానికి తనే భయభ్రాంతమవుతూ జీవించే ఒక భూతాన్ని తలపిస్తుంది. ఈ భూతం కోసమే వీరులంతా కలసి ఈ మహాయుద్ధం సాగించారు; ఈ భూతం కోసమే సర్వనాశనాన్ని కొని తెచ్చుకున్నారు. పురుషులు చావవలసిందే; స్త్రీలు దుఃఖించవలసిందే; రక్తం చిందవలసిందే; చివరికి అంతా నిష్ఫలం. ఒక భయానకమైన, నిర్హేతుకమైన విధి ఆద్యంతం పరచుకున్నట్టు ఉంటుంది.***

జీవితం నిరర్థకం, అర్థరహితమన్న ఎరుక హోమర్ లో ధ్వనిస్తూ ఉంటుంది. అతనికి యుద్ధాల గురించి తెలుసు.  మృతులు, క్షతగాత్రుల దేహాలు నేలకొరిగిన దృశ్యం ఎలా ఉంటుందో తెలుసు. సంప్రదాయం అతన్ని అంధుడిగా చెబుతుంది. అందుకే కాబోలు, ప్రతిదానిలో ఉజ్వలతను పదే పదే ఎత్తి చూపుతాడు. అతన్ని ఏజియన్ దీవులకు చెందిన ఒక ద్వీపవాసిగా కూడా సంప్రదాయం చెబుతుంది.**** బహుశా అందుకే గ్రీకులు, ట్రోజన్ల ఉభయుల పట్లా అతనిలో ఒక విచిత్రమైన నిర్మమత్వమూ; అర్థరహితమైన యుద్ధంలో చిక్కుకున్న వ్యక్తుల పట్ల మమత్వమూ కనిపిస్తాయి.

ఇలియడ్ లో ముగ్గురు వ్యక్తులు విశిష్టంగా కనిపిస్తారు: అల్లకల్లోలం సాగించే అఖిలెస్, జిత్తులమారి ఒడీసియస్, విధివంచితుడు హెక్టర్! ఒడిస్సే చివరి అధ్యాయాలలో ఒడీసియస్, అఖిలెస్ లక్షణాలను అన్నిటినీ పుణికి పుచ్చుకుంటాడు. ఇలియడ్ లో హెక్టర్ ఆంతరంగిక నాయకుడు అయితే, అఖిలెస్ బహిరంగ నాయకుడు. ఆర్ద్రతా, ఆత్మీయతా నిండిన దాదాపు అన్ని ఘట్టాలూ హెక్టర్ కు సంబంధించి ఉంటాయి. ఇంచుమించు అతను హేమ్లెట్ లాంటివాడు. సాలెగూడులో ఇరుక్కున్న అతను దాని నుంచి బయటపడే ప్రయత్నంలో ఆశ, నిరాశల మధ్య ఊగిసలాడతాడు. అందమైన కలలు పేర్చుకుంటాడు, అంతలోనే వాటిని కుప్పకూల్చుతాడు. తన నాశనానికి తనే అసహనంతో ఎదురుచూసేవాడిలా కనిపిస్తాడు. ఒక్కోసారి బాల్యస్మృతులలోకి జారిపోతాడు.  జీవితం గాలిబుడగ లాంటిదన్న భావనకూ, బాధ్యతాస్పృహకూ మధ్య నలుగుతూ ఉంటాడు.

(సశేషం)

******

అథోజ్ఞాపికలు

*లాసిడిమోనియా: గ్రీసు పురాతన నగరాలలో ఒకటైన స్పార్టాకు మరో పేరు.

** మహాభారతానికి, ఇలియడ్ కు పోలికలు అడుగడుగునా కనిపించి ఆశ్చర్యం గొలుపుతాయి. ఇది ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసిన ఆసక్తికరమైన అంశం.

***ఈ వివరణ కూడా మహాభారతాన్ని, అందులోని స్త్రీపర్వాన్ని గుర్తుచేస్తుంది. అలాగే, రామాయణాన్ని కూడా.  ట్రోజన్ యుద్ధం హెలెన్ కోసం జరిగితే, ఒక కోణం లోంచి చూసినప్పుడు మహాభారతయుద్ధానికి కేంద్రబిందువు ద్రౌపది. రామ, రావణయుద్ధానికి కేంద్రబిందువు సీత.

****మహాభారతకర్త వ్యాసుడు కూడా ద్వీపంలోనే జన్మించాడు. అందుకే ఆయనకు కృష్ణ ద్వైపాయనుడు(కృష్ణ=నల్లనివాడు, ద్వైపాయనుడు=ద్వీపంలో జన్మించినవాడు) అనే పేరు వచ్చింది.  హోమర్ కు, ఆయనకు మరికొన్ని పోలికలు ఉన్నాయి.