యెనకటి రావ్ ముందుచూపు

 

 

ఎప్పుడూ ఏదో ట్రెండ్ కావాలని కోరుకునే ఎడిటర్ యెనకట్రావ్ కి … ‘ఈ ఉగాదికి  ‘అశ్లీల కథల పోటీ’ ఓటి పెట్టి పారేస్తే ఎలగుంటది’ …. అనిపించింది! దాన్ని ‘తక్షణమే అమలుపరచెదవుగాక’ అంటూ సబ్బెడిటరు సంకటరావ్ కి పైనించి  కిందకి పామేశాడు సదరు ఆలోచన్ని! ఎప్పుడూ ఏదో ఒహటి మూసుక్కూచ్చుని ఉండటం అలవాటయిపోయున్న సంకట్రావ్,  చేసేదేంలేక అప్పటికి  నోరు  మూసుకుని ఆ వెంఠనే ఓ పత్రికా ప్రకటన వేసిపారేశాడు,  కాల్చిన సిగరెట్టు పీక కారులోంచి వెనక జనమ్మీదకి  విసిరిపారేసినట్టు!

పత్రికా  ప్రకటన చూసిన జనం  పలు పలు విధాలా స్పందించారు. కాపీని తప్పక ముందస్తుగా బుక్ చేసుకోవాలనే చిత్త  చాపల్యం  పెరిగిన క్షణం నుంచి  రసిక  జనాలకి వంటిమీద కౌపీనం నిలవలేదు! ఖానా పీనా  తెలవలేదు!!

“ఏమ్మాయరోగం ఆ ఎడిటరుకి?“ సరాసరి అశ్లీలాన్ని పోటీకి నిలుపుతాడా? “  అంటూ అంతా కూర్చుని ఆయనగార్ని  నిలేశారు మహిళా మండలివాళ్లు. “విషయమ్మీద అంతా కలిసికట్టుగా  ‘సమరం’  చేయుటకొరకు  ఆయత్తమవందే   ముద్దలోకి ‘లవణం’ కూడా తీసుకోవద్దని”  పెసిడెంటు పేరమ్మ ఆధ్వర్యంలో కాలనీలోని అంగనలంతా అంగీకరించి ఆనక  తీర్మానించారు.

మేధావి వర్గం వారైతే ‘కాదేదీ కవితకనర్హం’ లాగా ‘కాదేఅంశం  పోటీకి  అనర్హం’ అన్న నినాదాన్ని సునాదంగా మార్చి గొంతుకొక్కటి విచ్చి మ్రోశారు. ఇంతింత రాజ్యాంగం రాసుకుని,  ఆమాత్రం స్వాతంత్రం లేకపోతే బతుకులెలా వెళ్లమారుస్తాం అంటూ వాళ్ళకు వాళ్ళే బుజాలు చరుచుకున్నారు. వాపసివ్వడానికి తమ వద్ద ఏమేమి అవార్డులున్నాయో రాత్రికి రాత్రే అంతా అటకెక్కి  ట్రంకుపెట్టె వెతుక్కోండని మరో మీటింగులో పిలుపిచ్చారు సభ్యులందరికీ.

ఓ దయ్యాల సినిమా డైరెక్టరు వచ్చి ‘అశ్లీలాన్ని’ మానుంచి దూరం చేసి మా ‘వంట్లో’  భావజాలాల్ని,  ఇంట్లో దూలాల్ని తీసేసినంత వీజీగా తీసేస్తారా? ఎక్కడికి తీసుకెళుతున్నారు ఈ దేశాన్ని? కామి గానివాడు మోక్షగామి కాలేడు! అశ్లీలాన్ని చూడలేనివాడు శీలాన్ని ఇనుమడింపజేసుకోలేడు”  అంటూ స్వీటు చప్పరించినంత  వీజీగా  ట్వీటు చేశాడు! పెద్దోళ్ళకి విరుద్దంగా యేవైనా ట్వీటు చేస్తే ఐటీ ఆక్టు ప్రకారం బొక్కలో యేస్తారెమో అని పామరజనానికే భయంగానీ …ఇలాటి  తింగరిబుచ్చి గాళ్ళకి ఏమీ ఉండదు  అని స్వామీ పవిత్రానందలవంటి వారికి బాగా తెలుసు. పైపెచ్చు  అలా వాకృచ్చిన వారిని ‘మగధీరుడు’,  ‘దమ్మున్నోడు’, ‘పరమ తేడా శిరోమణి’ లాంటి అవార్డులు ఇచ్చి సముచిత రీతిన సత్కరిస్తారు కూడాన్నూ… అంటాడు పవిత్రానంద! అదే ట్వీటు తను చేస్తే ‘నిత్య అశ్లీలానంద’ అని బిరుదిచ్చి ఉద్ధరించేవాళ్లు అని అప్పుడప్పుడూ వాపోతుంటాడు ఏ ఆటోలోనో అటుగా  పోతున్నప్పుడాయనగారు.

“మేము ఎక్డా భాయీ భాయీ కాదు గానీ … బేఅశ్లీలతా కీ బాత్ మే మేమూ భాయీ భాయీ. ఎవరైనా  సౌందర్యం లోప్టా పెట్టుకోవాల్ – బైటా ఓపెన్లో కాదూ”  గట్టి పట్టు పట్టాడు పక్కింటి బాబూ మియా!

అదేం పట్టించుకోకుండా – “ఎందుకూ పెట్కోవాలే? అసల్ కీ ఈ అశ్లీల్ తా అంటే క్యాహై? కౌన్ నిర్వచనం ఇస్తారూ హై?” అన్నాడు కించిత్ వెటకారంగా   రకుల్ కోబాల్ –‘ స్మార్ట్ ‘ ఫోన్ లో ‘స్మార్ట్’ వీడియో చూస్తూ!

ఆ పక్కనే ఉన్న మన్మధ రావ్ “ బొడ్డు మీద ఆపిల్ పెట్టి చూపిస్తే .. బొడ్డు ని చూస్తామా? ఆపిల్ ని చూస్తామా? ఆపిల్ ని అడ్డం పెట్టుకుని బొడ్డుని చూపించే కుట్ర కి మనం తేలిగ్గా లొంగి పోవలసిందేనా? అయినా అనుకుంటాంగానీ ఎర్రటి  ఆపిల్తో అంతర్యామివంటి అశ్లీలాన్ని ఆపలేరు గాక ఆపలేరు. అంచేత అశ్లీలాన్నిఇదమిద్ధంగా  నిర్వచించలేమ్” అన్నాడు నిర్వచనం చెప్పలేక … ‘ఎర్రని సూర్యకాంతిని  అరచేత్తో ఆపలేమ్ గాక ఆపలేమ్’ అన్న చందంగా  !

“నిర్వచనం లేక పోవడమేంటి? ఐపీసీలో ఏనాడో చెప్పారు వెయ్యి సంవత్సరాల కన్నా ముందే” అన్నాడు రకుల్ కోబాల్!

“అదేంటి వోయ్ ? ప్రాధమిక హక్కులకు వ్యతిరేకంగా తగలడ్డ ఆ  పాత చింతకాయ్ పచ్చడి  సెక్షన్నే తీసిపారేసేయ్ మంటుంటే ఇప్పుడున్న  పండితాగ్రేసరులు…..?”  కల్పించుకున్నాడు కస్తూరీ తిలకం బట్టతల నిమురుకుంటూ!

“ నాయనా! ఇప్పుడు నేను ఆ మూడో తలకాయ వారి  ధూర్త అప్రాకృతిక  అనైచ్య అలౌల్య అసందర్భ ఆంగిక  లైంగిక వికటీకృత వైపరీత్య చర్మచాపల్య  చర్య గురించి మాట్లాడటం లేదు! ఆ అంశం వేరు. ఈ అంశం వేరు” పిచ్చ పిచ్చగా ఖండించాడు కోబాల్!

“ ఇందాకటి నుంచి చూస్తున్నాను. మీరూ మీరూ  ఖండించుకుంటున్నారు సరే! నేను చెప్పేది వింటారా….” మధ్యలో వచ్చింది బాడీమీద  నిండు వస్త్రాలు నిండుకున్న  వస్త్రలత!

ఉలిక్కి పడి తమ తమ  అధో వస్త్రాలు వాటి వాటి స్థానాల్లో పొందికగా ఉన్నాయో లేవో అని పరిశీలించుకుని తృప్తినొందిన పిమ్మట –

“చెప్పండి వింటాం” అన్నారు కస్తూరీ కోబాలుర ద్వయం.

“ అశ్లీలత నిర్వచనం  గురించి మీరు ఏదైనా  చించే ముందు, ‘మా దేహం-మా యిష్టం’  అనే ప్రాధమిక అంశాన్ని మీరు మరువరాదు. ‘వాక్స్వాతంత్ర్యం’ లాంటి ప్రాధమిక హక్కు  ఉందీ అన్నప్పుడు ‘దేహస్వాతంత్ర్యం’ ఉంది అనే ప్రాధమిక హక్కుల  అంశం అందులో ఇమిడి ఉంది. దేహాలకీ, దాహాలకీ అడ్డుకట్ట వేయడం ఫాసిస్టు వికృత చర్య! సృష్టి సహజాతాన్ని పాతరేసే పైశాచిక చర్య! ప్రాకృతిక  రాజ్యాంగం ప్రసాదించిన అంగాంగ వైభోగాన్ని అణగదొక్కే కాముక ఆటవిక చర్య “ అంటూ ఆయాసపడి మధ్యలో ‘ఊపిరి’ తీసుకోడానికి ఆగింది వస్త్రలత.

2016-03-18 23.43.59

“వామ్మో వీరి  పదజాలమే జలఫిరంగుల్ని ఫేస్ చేస్తున్నట్టు  ఉన్నాయి. ‘ఊపిరి’ తీస్కుని మళ్ళీ మొదలెట్టారంటే  భాష్పవాయువు ప్రయోగం చేయించుకున్నట్టే …ఎందుకొచ్చిన గోల … బతికుంటే బూతు సినిమా చూడొచ్చు ” అనుకుంటూ ఇద్దరూ మెల్లగా అక్కడినుంచి తప్పుకున్నారు.

ఈ చర్చ అంతా పక్కన బడ్డీ కొట్టు దగ్గర చాయ్ తాగుతున్న ఇద్దరు ఛానల్ మిత్రులు  ‘అరె… వీటిని కొన్ని ‘బైట్స్’ గా తీసుకుంటే ‘జంగ్లీ  నైట్స్’ ప్రోగ్రామ్ లో పెట్టుకుంటే బాగుండేదే” అనుకున్నారు. ఈ రాత్రే ప్రోగ్రామ్ ఎడిటర్ తో మాట్లాడి,  రేపే కెమెరామాన్ తో గంగని పంపించి ‘స్త్రీ పురుషుల  మధ్య అశ్లీలతా వైవిధ్యం’ అనే చర్చనీయాంశాన్ని షూట్ చేయిద్దాం అనుకున్నారు ఇద్దరూ.

గిర్రున ఓ మూణ్ణెల్లు  తిరిగిపోయాయి. ఎడిటర్  యెనకట్రావ్ ఆనందగా ఉన్నాడు. తన స్కీమ్ ప్రకారం వదిలిన అశ్లీల కథల  పోటీకి కథలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. జడ్జస్ అంతా కలిసి ‘నీ యబ్బ!’ అనే కథ ఉత్తమ అశ్లీల కథగానూ, ‘తోక్కేం కాదూ…’ అనే కథని ద్వితీయ బహుమతి కిందా, ‘జింతాతా చితాచితా” అనే కథని తృతీయంగానూ ఎంపిక చేశారు. పెగ్గు పెగ్గుకూ మధ్య నంజుకునే పచ్చడి పూర్తిగా నాకేశాక – ‘కథల సబ్జక్టు ఒకడబ్బ సొమ్ముకాదు. వైవిధ్యంతో రాసిందేదైనా కథే! దానికి కథకుల నుంచి వచ్చిన ఈ స్పందనే దాఖలా’ అన్నాడు సబ్బెడిటర్ సంకట రావ్ తో యెనకటి రావ్  తబ్బిబ్బైపోతూ.

“ఎంతైనా మన ప్రింట్ మాధ్యమం తాబేలే సార్! ఎలక్ట్రానిక్ మాధ్యమం అయితే సూపర్ ఫాస్ట్గా రిసీవ్ చేస్కుంటారు ప్రజానీకం. అక్కడ ‘జంగ్లీ నైట్స్’ ప్రోగ్రామ్ కి టీయార్పీ  రేటింగే రేటింగు. అటు చూడండి ” అంటూ రిమోట్ నోక్కాడు సంకట్.

“మరి నేవెళ్లొస్తా! మన పత్రిక్కి సన్నీ లియోన్ ఆత్మ కథ ఏమన్నా మన పాఠక దేవుళ్ళకోసం రాసిస్తుందేమో కనుక్కోమన్నారుగా…” అన్నాడు సంకట్రావ్! అతగాణ్ణి పంపించి తలుపేసొచ్చి, ఇంతలో బయట కోలాహలంగా ఉంటే అవతల బాల్కనీ  లోంచి తల ముందుకు చాచి చూచాడు యెనకటి రావ్.

“కావాలీ .. కావాలీ….బూతుకు బంగరు భవితవ్యం కావాలి!! అశ్లీలతా జిందాబాద్!!!” అంటూ కొన్ని గుంపులు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనగా వెడుతున్నారు.

యెనకటిరావ్ ఏదో తెలీని సంపృప్తితోనూ, మరేదో తెలీని విజయగర్వంతోనూ ఆ పూటకి లుంగీ లోకి దిగిపోయి, నెక్స్ట్ కథల పోటీ ఏంటా అని వైవిధ్యంతో ఆలోచించడం మొదలెట్టాడు.

*

మీ మాటలు

  1. శ్రీనివాసుడు says:

    వర్ఛస్వి గారూ!
    కడుపుబ్బ నవ్వించిందండీ. అయితే, అశ్లీలం కోరుకునేది మగవాళ్ళేననుకుంటాను. ఎందుకంటే, స్త్రీల నేటి, నాటి వస్త్రవైవిధ్యానికి డిజైనింగ్ అంతా మగ దర్జీలేనని, వారు ఎం.సి.పి. ల్లాగే ఆలోచించారని నా ఊహ. ఆ వైవిధ్యాన్ని, పురోగమనాన్ని అంగీకరించి, అవలంబించడంలో స్త్రీల పొరబాటు కూడా ఎంతో ఉందేమో!
    ఇక దృశ్యమాధ్యమాలు, మాటలు — అలాంటి కార్యక్రమాల్లో, సంభాషణలలో పాలుపంచుకోకుండా ఉండవలసిన బాధ్యత స్త్రీలదే. ఎందుకంటే, ప్రతి మగవాడూ ఏదో ఒక స్థాయిలో ఎం.సి.పి. యే.

    • వర్చస్వి says:

      కచ్చితంగా మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను శ్రీనివాసుడు గారు. వ్యంగ్యం నచ్చినందుకు ధన్యవాదాలు.

  2. Vaadhoolasa says:

    ఏమీ రాయ లేనంత బాగుంది .హాస్యంలో వ్యంగ్యం కూరారా,వ్యంగ్యం లో హాస్యం
    కూర్చారా తెలియడం లేదు.బాగుంది.

    • వర్చస్వి says:

      హ..హా..హాస్య వ్యంగ్య సమ్మేళనం వాధూలస గారు. .ధన్యవాదాలు!

  3. AR Sudhakar says:

    హహహ్హా..ఈ ఆర్టికల్ చదవగానే మొట్టమొదట గుర్తొచ్చింది మన జానారెడ్డిగారే…సూపర్ సాటైర్ సర్ వర్చస్విగారూ…!

  4. శ్రీనాథ్.బి.వి...అనంతపురం says:

    చాలా బాగుంది..

మీ మాటలు

*