Archives for April 2016

బుజ్జిగాడి లాజిక్ నా ఆదర్శం: యాసీన్

 

-యాకూబ్ పాషా

~

 

సైన్స్ కాక్‌టెయిల్ నుంచి హ్యూమర్ కిక్ ఎలా? నా వరకు యాసీన్ అంటే…

‘రాతతో నవ్వించువాడు.

మాటతో నవ్వించువాడు.

మౌనంతో కూడా నవ్వించువాడు’

లోప్రొఫైల్, ఆఫీసు ఫైల్ తప్ప…‘ఇలా ఎదగాలి’ అనే స్కీమ్  ఫైల్లేవీ యాసీన్ దగ్గర లేకపోవడం వల్ల…

‘మీ ఇంటర్వ్యూ కావాలి?’ అని అడిగితే…

ఆయన సమాధానంగా నవ్వారు. నవ్వుతూనే ఉన్నారు. ఊహకందని విచిత్ర థీసీస్‌లలో భాగంగా కొన్ని బయో తిక్కల్ సూత్రాలను ఆవిష్కరించిన తీర్లు… కొన్ని సంప్రదాయాల వేర్లు… ఆ రెండీటి  కాక్‌టెయిల్‌తో  పేజీలోకి ఎలా వడబోసారంటూ అడిగితే తాను హ్యూమర్ కిక్‌ను ఫీలయిన విషయాలు కొన్ని చెప్పారు.

‘నవ్వు’ తప్ప ఏమీ తెలియని యాసీన్…  ఎన్నో మెలికలు తిరుగుతూ తన గురించి తాను చెప్పుకున్న కొన్ని విషయాలు ఈ ఇంటర్వ్యూలో…

 

 బాల్యంలో తర్వాత మీరు ఇష్టపడ్డ వీర శూర హాస్యకారులు

 నా చిన్నప్పుడు మా ఇంటికి ఆంధ్రసచిత్ర వార పత్రిక, ఆంధ్రప్రభ వీక్లీ వస్తుండేవి. అవి రావడం ఆలస్యం అయినా నేను తెచ్చుకుంటూ ఉండేవాణ్ణి. అప్పుడు ‘రాము-శ్యాము’ కార్టూన్ స్ట్రిప్స్, రాగతి పండరి వంటి వారి కార్టూన్స్ ఇష్టంగా చూస్తుండేవాణ్ణి. ఆ తర్వాత కాస్త పెద్దయ్యాక యర్రంశెట్టి శాయి రచనలు చదువుతుండేవాణ్ణి. అప్పటికి ఉన్న పాపులర్ రచన కంటే హాస్యరచనలే నాకు ఇష్టంగా ఉండేవి. ఆ తర్వాత నండూరి పార్థసారథి లాంటి పెద్దల రచనలనూ ఇష్టంగా చదివేవాణ్ణి.

 

 రాయాలన్న కోరిక, తొలి హాస్యరచన

కోక్విల్ హాస్యప్రియలో 1985-86 ప్రాంతాల్లో నా మొదటి కథ ప్రచురితమైంది. ఆ తర్వాత నేను కాలేజీ రోజుల్లో పల్లకి అనే మ్యాగజైన్ వచ్చేది. అందులో ‘శాంపిల్ స్టుడెంట్ అనే తెలుగు దోహాలు’ అనే శీర్షికతో 1986లో మరొక రచన ప్రచురిమైంది.అప్పట్నుంచి రాస్తూనే ఉన్నాను.

సైన్స్‌నుంచి హాస్యం పుట్టించడం మీరు చేస్తుంటారు. సాధారణంగా అండర్ కరెంట్‌గా సైన్స్‌ను మీ హ్యూమర్‌కు ఆసరా చేసుకుంటూ ఉంటారు. ప్రముఖ కార్టూనిస్ట్, ఆర్టిస్ మోహన్ గారు కూడా మీ పుస్తకం ‘హాహాకారాలు’కు తాను రాసిన ముందుమాటలో ఇదో పాపులర్ సైన్స్ అన్నారు.

 

సైన్స్ అండ్ హ్యూమర్ కాక్టెయిల్ ఎలా?

ఆ… నిజమే. హ్యూమర్ పుట్టించడానికి సైన్స్‌ను బాగా ఆశ్రయిస్తుంటా. డార్విన్‌నూ, న్యూటన్‌నూ వాడుకుంటూ ఉంటా. నిజానికి నేను కాలేజీ చదువుల్లో ముఖ్యంగా సైన్స్ చదువుకునే సమయంలో అంత బ్రైట్ స్టుడెంట్‌ను కాదు. కానీ ఇంటర్మీడియట్ నుంచి సైన్స్ చదువుతున్నప్పుడు నేను సబ్జెక్ట్‌ను చాలా డిఫరెంట్‌గా చూసేవాణ్ణి. అంటే ఉదాహరణకు… ‘‘ఒక ఆదర్శ వాయువు ఎలా ప్రవర్తించాలి? ఏయే సూత్రాలు అనుసరించాలి. ఎలా అనుసరిస్తాయి… అన్న అంశాలన్నింటినీ క్రోడికరిస్తారు. చివరగా ఈ ప్రపంచంలో ఆదర్శవాయువు ఏదీ లేదని నిర్ధారణ చేస్తారు. అంతేకాదు ఐడియల్ గ్యాస్ అంటూ అన్ని సూత్రాలూ చెబుతారు కదా. తీరా చివరకు ‘దేర్ ఈజ్ నో ఐడియల్ గ్యాస్…  బట్ ఆల్ ఆర్ రియల్ గ్యాసెస్’ అని కరాఖండీగా తేల్చేస్తారు. అప్పుడు నాకు నవ్వు వచ్చేది. అలాగే కాకి గూట్లో కోకిల గుడ్డు పెడుతుంది. వాటిని కాకి గుర్తు పట్టకుండా పొదిగేస్తుంది. దీంతో మనకు తెలిసేదేమిటీ అని నన్ను నేను ప్రశ్నించుకుంటా. కాకికి మ్యాథ్స్ రావు కానీ తెలివైంది కుండలో రాళ్లు వేసి పైమట్టం పెంచుకుంటుంది. అంటే… కాకి మాథ్స్‌లో పూర్‌గానీ సైన్స్‌లో జెమ్ అని చెప్పుకుంటా. ఇలా నాకు తోచినవీ… నేను ఆ టైమ్‌కు డిఫరెంట్‌గా చూసేవన్నీ ఐటమ్స్ అవుతాయి.

చిత్రం: అన్వర్

చిత్రం: అన్వర్

 కన్యాశుల్కం గురించి ఎప్పుడూ ప్రస్తావిస్తుంటారు. వాటి గురించే ఏవైనా

అవును… మొదట్నుంచీ హాస్యం అంటే ఇష్టపడే నేను కన్యాశుల్కాన్ని తరచూ చదువుకుంటూ ఉండేవాణ్ణి. మేం ఫ్రెండ్స్ కలిసినప్పుడల్లా, కన్యాశుల్కం లేకపోయినా అందులోని మానవ స్వభావాల గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. మా ఫ్రెండ్స్ అభిప్రాయాలు ఒకేలా ఉండేది. అందుకే సమస్య లేకపోయినా ఆ పుస్తకం రెలవెన్స్ అందరిలాగే మేమూ బాగా ఫీలయ్యాం. అయితే నా ప్రత్యేక అభిమానం చాటుకోడానికి ఒక చిన్న పాయింట్ దొరికింది. దాని ఆధారంగా గురజాడను నేను పైలోకంలో కలిసినట్లుగా చెబుతూ ఒక కథ రాశాను. ‘‘కోడిగుడ్డుకు ఈకలు పెరుకుట (లేదా) రంధ్రాన్వేషణ అనే గొప్ప సస్పెన్సు కథ’’ అంటూ ఒక కథ కూడా రాశాను. 2008 మే 4 సాక్షి ఫన్ డేలో ‘హాస్య కథ’ అనే ట్యాగ్ కింద ఇది ప్రచురితం అయ్యింది. ఇక హ్యూమర్ రాయడం ఎంతటి మహామహులు చేసిందో తెలిసి కూడా ‘హాస్యం’ అనే ట్యాగ్ లైన్ పెట్టుకొని రాయడానికి ఎంత ధైర్యం అని ఎవరైనా అనుకోవచ్చేమో. కానీ… నిత్యజీవితంలో పెద్దగా ధైర్యస్వభావం లేకపోయినా ఇలా నన్ను నేను ట్యాగ్ చేసుకోవడం మాత్రం ఒక అజ్ఞానంతో చేస్తుంటా. ఎవరైనా ఎంత ‘ధైర్యం’ అనే మాటకు పర్యాయపదంగా నా ‘అజ్ఞానం’ అనే మాటను ఈక్వలైజ్ చేసుకోవచ్చు.

 

 అలాగే మీరు బూదరాజు రాధాకృష్ణ గారిపై కూడా మీ అభిమానాన్ని దాచుకోరు. మీపైన ఆయన ప్రభావం

అభిమానాన్ని దాచుకోని ఎందరో మహామహుల్లో నేను వెల్లడించేది అణుమాత్రమేనని అనుమానం. దాంతో నా అభిమానాన్ని తగినంతగా వెల్లడించడం లేదన్న అభిప్రాయం కలిగినప్పుడల్లా మళ్లీ మళ్లీ మాట్లాడుతుంటా. చాలా యాక్సిడెంటల్‌గా ఆయన క్లాసులకు వెళ్ళే  అదృష్టం, నాకు వృత్తిపరిజ్ఞానం నేర్చుకునే భాగ్యం ఆయన వల్ల నాకు కలిగాయి. ఆయన క్లాసులన్నీ చాలా ఉల్లాసంగా ఉండాయి. నేను ఏ ఆలోచన ధోరణిని ఇష్టపడుతుంటానో అది నాకు అసంకల్పితంగా అందడంతో ఆయన క్లాస్‌లో ప్రస్తావించే ధోరణిని రచనల్లోనూ చూపడానికి విఫలయత్నం చేస్తుంటాను. అది విఫలయత్నమైనప్పటికీ యత్నం వల్లనే నాకు అప్రయత్నంగా చాలా సిద్ధిస్తుంటాయి. అలాంటి మహానుభావుడి దగ్గర చదువుకోవడం నా అదృష్టం.

 

 మీ బుజ్జిగాడి కథలకు ఇన్స్పిరేషన్ నిజంగా మీ బుజ్జిగాడేనా?

కొన్ని విషయాల్లో అవును. వాడితోపాటు మీలోని, నాలోని… ఇంకా ఎందరిలోనో ఉన్న పిల్లధోరణులు నాకు ఇష్టం. అలాగే లోకంలోని అనేకమంది బుజ్జిగాళ్ల లాజిక్ నాకు నచ్చుతుంది. అయితే పెరిగే క్రమంలో సామాజిక అంశాలను నేర్చుకుంటూ వాళ్లు తమ క్రియేటివ్ ధోరణులు వదిలేస్తుంటారని నా నమ్మకం. ఉదాహరణకు… మొన్ననే ఎండల తీవ్రతను మావాడు చెబుతూ వాడు అన్న మాట…‘‘నాన్నా… సూర్యుడికీ, భూమికీ మధ్య దూరం పొరబాట్న ఏమైనా  తగ్గుతోందా?’’ అని అడిగాడు. అంతేకాదు… నేనెప్పుడూ గుర్తు చేసుకొని ఆనందించే లాజికల్ ప్రశ్న మరొకటి ఉంది. వాడు సూసూ పోసుకుంటూ… నేను పోస్తేనే ఎంత సూసూ వచ్చిందికదా… మరి డైనోసార్ పోస్తేనో?’’ అని ఒకసారి అడిగాడు. నాకు తెలిసి వాడొక్కడే కాదు… ఇంచుమించు పిల్లల మాటలన్నీ ఇలాగే ఉంటాయి. కాలక్రమంలో సోషియో లింగ్విస్టిక్స్, సోషియలాజికల్‌నెస్ ఎక్కువైపోయి అసలు లాజిక్‌లను కన్వీనియంట్‌గా విస్మరిస్తుంటారు. అయితే పెరుగుతున్నా తమ లాజిక్‌ను కోల్పోకుండా ఉంటూనే… తమ సోషియల్ బిహేవియర్‌తో సమన్వయం చేసుకుంటూ ఉంటారు కొందరు పిల్లల. ఇలా పై రెండు అంశాలనూ బ్యాలెన్స్ చేసి పిల్లలెందరో నాకు ఇన్స్‌పిరేషన్.

 

 మీరు మాటిమాటికీ చదివి ఆనందించే పుస్తకాలు

ఎవర్ గ్రీన్ పుస్తకం కన్యాశుల్కం. అలాగే మార్క్‌ట్వైన్  అనువాదాలు, ఆస్కార్‌వైల్డ్ కథలు. అన్నట్టు… ఆస్కార్ వైల్డ్ అలవోకగా ‘ప్రతి ఇంటికీ ఒక ఫ్యామిలీ దెయ్యం ఉండాలి’ అన్న మాట పట్టుకొని దెయ్యాలను సైతం నా హ్యూమర్‌కు వస్తువులా చేసుకుంటూ ఉంటా. వాటిని నమ్ముకున్నప్పుడు ఎప్పుడూ అవి నన్ను నిరాశ పరచలేదు.

 

 మీ రచనలు ఎలా ఉండాలని మీరు అనుకుంటూ ఉంటారు?

ఇలా బుజ్జిగాడి లాజిక్‌తో అత్యంత సాధారణంగా కనిపించే ప్రశ్నల్లో ఎంత అసాధారణత ఉందో తెలుసుకొని, నేను ఫీలైన అదే థ్రిల్‌ను మిగతా వారికి అందించడం నాకు ఇష్టం. మామూలుగా మనం చూసే సమోసా త్రిభుజాకారం ఉందనీ, పూరీ లేదా చపాతీ వృత్తమనీ, కేక్ చతుర్భుజమనీ… ఇలా జామెట్రీకీ, తిండికీ లింక్ కలుపుతుంటా. దాంతో కొంత హాస్యం పుడుతుంది. ఇలా బుద్ధిమాంద్యతతో చేస్తున్నట్లు కనిపిస్తున్నా అందులోని ఇంటెలిజెన్స్‌ను అసంకల్పితంగానే ప్రదర్శించడం వంటి అంశాలు నాకు ఇష్టం. అది మరెవరికో ఆ బుద్ధిమాంద్యతను ఆపాదించడం ఇష్టం లేక దాన్ని నేనే ఆపాదించుకుంటూ ఉంటా. ఇదే కంటిన్యూ కావాలని కోరుకుంటా.

*

yaseen

 

 

 

 

అంబేద్కర్‌ విగ్రహానికి వాస్తు పరిశీలన!

 

 

-జి ఎస్‌ రామ్మోహన్‌

~

 

అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుకోసం తెలంగాణ ప్రభుత్వ వాస్తు సలహాదారు స్థల పరిశీలన చేస్తున్న చిత్రం పత్రికల్లో వచ్చింది. వాస్తు హిందూ మతానికున్న అనేక అంగాల్లో ఒకటి. అందులో కూడా మూర్ఖత్వానికి పరాకాష్ట అనదగిన ఆచారం. అంబేద్కర్‌ హిందూ మత ఆచారాలకు సంప్రదాయాలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన వాడు. అది మతం కాదు, వ్యాధి అని చెప్పినవాడు. ఎవరికి పట్టింది ఈ విషాదం?

రెండు రాష్ట్రాల్లోనూ పోటాపోటీగా అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అంబేద్కర్‌ని విగ్రహమాత్రుడిని  చేసి స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం బలంగా జరుగుతున్నది. 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం కన్నా హైస్కూల్‌నుంచి  పీజీదాకా కులనిర్మూలనను పాఠ్యాంశంగా చేరిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. విగ్రహాల వల్ల కూడా చైతన్యం వచ్చిన దశ ఉండింది. మనం ఇపుడా దశ దాటాం.

అంతకంటే ముందుకు వెళ్లాలంటే ఆయన రచనలను జనంలోకి తీసికెళ్లడం ముఖ్యం. ఆయన పేరు ప్రచారమైనంతగా ఆయన రచనలు ప్రచారం కాలేదు. కనీసం కులనిర్మూలన అయినా జనంలోకి తీసికెళ్లడం ఇవాల్టి అవసరం. అంబేద్కర్‌ ఏ ఆధునిక మానవీయ విలువల కోసం తపన పడ్డాడో ఆ విలువలకు బద్ద శత్రువైన మనిషిని ఆంధ్రప్రభుత్వం  సలహాదారుగా నియమించుకుంది. భర్త లోదుస్తులు భార్య ఉతికితేనే ఐశ్వర్యం ఆరోగ్యం, తానే ఉతుక్కుంటే దరిద్రం అని ప్రవచించిన భయానకమైన అనాగరికుడిని అక్కడ సలహాదారుగా నియమించి ఉన్నారు. రెండు రాష్ర్టాల్లోనూ రాజ్యాంగాన్ని అంబేద్కర్‌ ప్రవచించిన ఆధునిక విలువలను అపహాస్యం చేసే పనులు అనేకం సాగుతున్నాయి.

samvedana logo copy(1)

రాజుగారి ఆస్థానాలు, అందులో సలహాదారులు, పురోహితులకు సత్కార సన్మానాలు చాలా ఎన్టీఆర్‌ సినిమాల్లో చూసి ఉన్నాం. ఆ ఎన్టీఆర్‌కు ఒకనాడు వీరాభిమానిగా ఉన్న చంద్రశేఖరుల వారు, అల్లుడు అయినటువంటి చంద్రబాబునాయుడుగారు  తమని తాము రాజులుగానే భావించుకున్నట్టు అర్థమవుతున్నది. తాము ఆధునిక సెక్యులర్‌ సోషలిస్ట్‌ ప్రజాస్వామ్య రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ముఖ్యమంత్రులం అనే సోయి ఉన్నట్టు కనిపించడం లేదు. పట్టాభిషేకం జరిగ్గానే తెలంగాణకు ఒక తిరుమల, ఆంధ్రకు ఒక భద్రాచలం అవసరం అని తీర్మానించేసుకున్నారు. విభజన జరగ్గానే వారికి కనిపించిన ప్రధాన లోటు అది. యాదాద్రి ఒంటిమిట్టలు ఆగమేఘాల మీద ముందుకు తోసుకొచ్చాయి.

యాదగిరి గుట్ట అనే అందమైన తెలుగుపేరు సంస్కృతంలోకి మళ్లి యాదాద్రి అయిపోయింది. వందలకోట్ల ఖర్చుతో ప్రణాళికలు సిద్ధమైపోయాయి. వైష్ణవ పండితులకు రెక్కలొచ్చాయి.  రాజసూయ యాగాలను మించిన యాగాలు మొదలయ్యాయి. మనిషి పొడ తగిలితేనే మలినమైపోయినట్టు మొకం పెట్టే ఒక వైష్ణవ సోములోరు, పాదం మోపడానికి లక్షల్లో ప్రసాదం స్వీకరించే సోములోరు రాజగురువుగా వ్యవహరిస్తున్నారు. చంద్రశేఖరుల వారు పదే పదే ఆయన పాదాలపై పడి ప్రణమిల్లడం విమానాల్లో వినయంగా తిప్పుతూ ఆయన సలహాల మేరకు వ్యవహరించడం చూస్తూనే ఉన్నాం. దీన్ని మించి ఐదుకోట్ల రూపాయలతో తిరుమలకు కానుకలు సమర్పించేందుకు  ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అది సొంత సొమ్ము కాదు. ప్రభుత్వ ఖజానా. అంటే ప్రజల సొమ్ము.  ప్రజల్లో విశ్వాసులు ఉంటారు. అవిశ్వాసులు ఉంటారు. విశ్వాసుల్లో కూడా రకరకాల విశ్వాసాలు ఉన్నవారుంటారు.. వ్యక్తిగతమైన విశ్వాసానికి ప్రజాధనాన్ని ఎలా ఖర్చుపెడతావు అని అడిగేవారేరీ! సైంటిఫిక్‌ టెంపర్‌మెంట్‌ సంగతి సరేసరి! అంత దూరం పోకపోయినా కనీసం పాలకుడు వ్యక్తిగత మొక్కు కోసం ప్రజాధనం ఖర్చుపెట్టకూడదు అని గట్టిగా అడిగే గొంతులు ఎక్కడ?

ఏమాట కామాటే చెప్పుకోవాలి. రాజుగారి మాటలాగే ఇక్కడంతా ఖుల్లం ఖుల్లా. వైష్ణవాన్ని రాజధర్మంగా అధికారికంగా ప్రకటించడానికి రాజ్యాంగం అంగీకరిస్తుందో లేదో అనే సంశయం ఉండబట్టి కానీ లేకపోతే ఆ పని కూడా బాహాటంగా చేయగలరు. కానీ ఆంధ్రరాజ్యంలో అక్కడి పాలకుడికే తనకి తాను ఏమిటో తెలియని గందరగోళం. నాయుడుగారు విశ్వాసో అవిశ్వాసో తెలీదు. అది విశ్వాసమో ఎత్తుగడో కూడా తెలీదు. మామూలుగా ఆయన మాట్లాడేది భయానకమైన పెట్టుబడిదారీ భాష. అన్ని పాత నమూనాలను విశ్వాసాలను అభివృద్ధి రథచక్రాల కింద నలిపేసుకుంటూ వెళ్లిపోయే భాష అది. దానికి తగ్గట్టే ఆయన సెంటిమెంట్లను ఎగతాళి చేస్తా ఉంటారు. భూమి గురించి ఎవరైనా బెంగ వ్యక్తం చేస్తే అది కమోడిటీగా మారడం వల్ల రైతుకు ఎంత లాభమో చెప్తారు. పాత సెంటిమెంట్లను కడిగేసుకోవాలని చెపుతారు. సెంటిమెంట్లు చాదస్తాలు అభివృద్ధికి వ్యతిరేకం అని చెప్తారు. వ్యవసాయంలో సాంకేతికత అయినా సెల్‌ టవర్ సిగ్నల్స్‌ అయినా ఏ విషయం ముందుకు వచ్చినా ఆయన పాత విశ్వాసాలను పాతరేసేట్టు మాట్లాడతారు.

కానీ ఆయన పట్టాభిషేకం దగ్గర్నుంచి రాజధాని శంకుస్థాపనల దాకా అన్నీ ముహూర్తాల ప్రకారం, వాస్తు ప్రకారం నడిపిస్తున్నారు.. మనం చేస్తే సెంటిమెంట్‌, అవతలివారు చేస్తే చాదస్తం అన్నమాట. తరతమ బేధాలు ఎక్కడ పాటించాలో బాగా వంటపట్టిచ్చుకున్న మనిషి నాయుడుగారు.. చాగంటి కోటేశ్వరరావు అనే పురాణ కాలపు మనుధర్మపు పెద్దమనిషి ఉన్నారు. ఆడవాళ్లను మాత్రమే కాదు, అన్ని బాధిత సమూహాలను అవమానించేట్టు మాట్లాడతా ఉంటారు. అమానవీయతను అనాగరికతను ప్రబోధిస్తా ఉంటారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. మానవహక్కులకు విరుద్ధం. ఇంకో నాగరక దేశంలో అయితే కటకటాల వెనక్కు నెట్టేవాళ్లు. ఇక్కడ బారాఖూన్‌ మాఫ్‌. అలాంటి ఒక సామాజిక నేరస్తుడికి పద్మశ్రీ పురస్కారం ఇప్పించి ఆస్థానంలో సలహాదారుగా పెట్టుకుని సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నట్టు? మనుధర్మాన్ని విశ్వసించే కులఅహంకార పురుష అహంకార అనాగరక మనిషిని సలహాదారుగా పెట్టుకున్న రాజ్యం ఎలాంటి విలువలకు నిలబడుతుందని  అనుకోవాలి? మళ్లీ వీళ్లు అంబేద్కర్‌ -పూలే జయంతులకు వర్థంతులకు రావడం దళితులకు బిసిలకు ఏమేం చేశారో ఏకరువు పెట్టడం చూస్తే ఏమిటీ అబ్సర్డిటీ అనిపిస్తుంది.

విభజనతో పాటే మధ్యతరగతిలో గొంతున్న వర్గాలకు తక్షణ ప్రయోజనం చేకూరింది. పదవులు పెరిగాయి. గొంతున్న వారిని కోఆప్ట్‌ చేసుకోవడం సులభమైంది. ఇక కులసంఘాల్లో నాయకులు ఎవరైనా మిగిలి ఉంటే వారికోసం అడిగిందే తడవుగా నిధులు ఒక భవంతి వగైరా మంజూరు అవుతున్నాయి. తెలంగాణ పాలకులు అలనాటి విజయభాస్కరుల వారి విధానాన్ని కులసంఘాల విషయంలో పాటిస్తున్నట్టు అర్థం అవుతున్నది.

ఆంధ్రలో లెక్కల ప్రకారం అన్ని కులాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ గొంతున్న నాయకులను తన దగ్గరే పోగేసుకుని ఉండడం వల్ల ఆయనకు ఆ ఇబ్బంది కూడా లేదు. ప్రశ్నించే గొంతులు కరువు. కొందరికి తమ పుట్టలో వేలు పెట్టినపుడు తప్ప ఇతరత్రా చురుకు తగలదు. ప్రజాస్వామ్య లిబరల్‌ గొంతులకోసం దుర్భిణీ వేసి వెతుక్కోవాల్సిన స్థితి. ఎబిసిడి న్యాయమైన డిమాండే కానీ ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల దళితుల్లో ఐక్యత దెబ్బతింది. అక్కడా గొంతున్న వారికి సంతర్పణలు  ఏదో రూపంలో ఏర్పాటు చేసి పెట్టారు. ఇవి వ్యక్తిగత విశ్వాసాలు, పట్టించుకోకూడదు,  వదిలేయాలి అని కొందరు లౌక్యంగా కృతజ్ఞతా పూర్వకంగా అనగలరు.

కానీ సాంస్కృతిక రంగం ప్రభావం చిన్నదేమీ కాదు. దానిమీద దృష్టిపెట్టకుండా  దాన్ని ఎదుర్కోకుండా సాధించేదేమీ ఉండదు. అంబేద్కర్‌ అందుకే అంత ప్రాధాన్యమిచ్చారు.. పైగా పాలనలో ఉన్నవాళ్లు అంత బాహాటంగా సమాజాన్ని వెనక్కు తీసికెళ్లే ఆచారాలను ప్రదర్శిస్తూ ఉంటే దాని ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉంటుంది. అంబేద్కర్‌ ఆశించిన ఆధునిక మానవీయ సమాజం సంగతేమో కానీ రెండు రాష్ర్టాల్లోనూ పూర్తిగా దానికి భిన్నమైన రాజరికపు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.

పదే పదే చొక్కా విప్పి జంధ్యాన్ని ప్రదర్శించే గవర్నర్‌ కనుసన్నల్లో రెండు రాష్ర్టాల్లోనూ  ఆధునికత వెనక్కు నడుస్తోంది. అనేక ఉద్యమాలకు నెలవైన తెలుగు రాష్ర్టాల్లో ఇంత దుస్థితిఎన్నడూ లేదు. వాస్తు సలహాదారులు, పౌరాణిక సలహాదారుల  రాజ్యం ఇంత నిస్సిగ్గుగా ఎన్నడూ సాగింది లేదు.  రాజ్యాంగం, ఆధునిక ప్రజాస్వామ్య విలువల గురించి  పాలకులకు గుర్తు చేయాలా, వద్దా!

*

నువ్వు నేను తప్ప..

 

 

 

చిత్రం/ పదాలు: ప్రవీణ కొల్లి

~

 

చివరాఖరకు ఎవరూ ఉండరు నువ్వు నేను తప్ప

నువ్వు నేను వేరేముందిలే

నాలో ఎదిగే నువ్వు

నీలో వెతుక్కునే నేను

అల్లితే కధలవుతాయి

జీవితం ఎప్పటికీ కధ కాదుగా!

 

కొన్ని సంఘటనలు, మరికొన్ని సంభాషణలు

కొన్ని కౌగిలింతలు, మరికొన్ని విదిలింపులు..అంతేగా!

అల్లగలిగితే నిన్ను చేరనివ్వననేమో

సవ్వడన్నా చెయ్యకుండా నా గమనంలో కలిసిపోయావు

అడుగడుక్కీ నీతో పడలేక సంధి చేసుకుందామనుకున్నాను

 

కానీ ఎక్కడ?

నువ్వొక మాయల ఫకీరువి

ఒక్క క్షణం అసలక్కడ లేనట్టే ఉంటావ్

మరో క్షణం విస్పోటకమై విశ్వాంతరాలలో వ్యాపిస్తావ్

నేనేమో ఒక్కోసారి బేలగానూ, మరోమారు అబ్బురంగానూ చూస్తూ ఉండిపోతాను

 

కొందరంటారు నువ్వొక దుఃఖానివని

నేనొప్పుకోను

నువ్వొక ఉనికివి

అనేకానేక భావోద్వేకాల అంతిమ గమ్యానివి

మరికొందరంటారు నువ్వొక బడబాగ్నివని

నేననుకుంటాను నువ్వొక జ్వాలవని

నీ సెగలో బూడిదై ఎగిరిపోగా

మిగిలిన వెలుగే నేనని

ఎప్పుడూ తోడుందే ఓ నా ఒంటరితనమా

నువ్వు ఏడిపిస్తావ్, నేర్పిస్తావ్
ఓ నా ఏకాంతమా

నీ రూపాంతరాల చాయలలోనే నా ప్రతిచ్ఛాయ

*

   పెట్టుబడి ఊసెత్తని ఉద్యమ సినిమా!

 

 

-శివలక్ష్మి 

~

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  గోతె జెంత్రం (Goethe Zentrum-German film Club) లో నాలుగు సినిమాలు ప్రదర్శించారు. అందులో మార్చ్ 9 న ప్రదర్శించిన రెండు సినిమాలు మాత్రమే నేను చూశాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల్లోని మహిళల, బాలికల దారుణమైన పరిస్థితుల్ని ఈ రెండు సినిమాలు కళ్ళముందుంచాయి. అందులో మొదటి సినిమా: From Fear to Freedom ending violence against women 35 నిమిషాల నిడివి కల ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ఇది. దీనిని ఉమెన్స్ లెర్నింగ్ పార్ట్ నర్ షిప్ (Women’s Learning Partnership) వారు నిర్మించారు.

 

ప్రపంచవ్యాప్తంగా, ప్రతి ముగ్గురు మహిళల్లో కనీసం ఒకరు అతికౄరమైన హింస బారిన పడుతున్నారు. ప్రతి దేశంలో, ప్రతి సంస్కృతిలో, ప్రతి మతంలో, వర్గాల కతీతంగా ఉన్నత, మధ్య, అట్టడుగు తరగతుల్లోని మహిళలందరూ మానవ హక్కుల ఉల్లంఘనకు గురవుతున్నారు. మహిళలపై జరుగుతున్నఅన్ని రకాల హింసలు అంతం కావాలంటూ, భయాలనుండి స్వేచ్చ కోసం చేసే ప్రయాణమే సినిమా ఇతివృత్తం

 ఐక్య రాజ్య సమితి గణాంకాల ప్రకారం 87% ఆఫ్ఘన్ మహిళలు  గృహ హింస బాధితులు.   కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ లో రోజువారీ 1100 కంటే ఎక్కువమంది  మహిళలు,  బాలికలు అత్యాచారానికి  గురవుతున్నారు. ప్రపంచం లోని 137 దేశాల్లో మానవ రవాణా  అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీని బారిన పడే 80% మంది స్త్రీలే!

ఈ చిత్రంలో పురుషుల్ని ఒక్కొక్కరినీ “నువ్వెంతమందిని అత్యాచారం చేశావు? అనడగడం కనిపిస్తుంది.ఆ పురుషులు ధీమాగా సిగ్గూ శరం లేకుండా 5, 10, 20 మంది అని చెప్తారు.గ్రామాలు తిరుగుతున్న కొద్దీ ఇంకా ఎక్కువమందిని అత్యాచారం చేస్తామని కూడా నిర్భయంగా చెప్తారు. పరువు కోసం చెల్లెల్ని చంపేశానని చెప్తాడొకడు. ప్రతి ఏటా దాదాపు 5000 మందిని పరువు, మర్యాదల పేరిట సొంత కుటుంబ సభ్యులే హత్యలు చేస్తున్నారు.

ఏడేళ్ళ పాపకి పెళ్ళి చేస్తే, ఆమె 15 ఏళ్ళకి ఇద్దరు బిడ్డల తల్లవుతుంది.బాల్య వివాహాలు, గర్భ ధారణలతో చిన్న పిల్లలైన తల్లులు, పసిబిడ్డలు కూడా  ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యలు దాదాపు చాలా దేశాల్లో చిత్రీకరించడం కనిపిస్తుంది.

“ప్రపంచవ్యాప్తంగా మహిళలు బృందాలుగా ఏర్పడి హింస లేని సమాజం కోసం,స్త్రీల హక్కుల్ని సమర్ధించే మెరుగైన కొత్త చట్టాల కోసం పోరాడుతున్నారు. బలమైన వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ మహిళల హక్కులు కూడా మానవ హక్కులే అనే ప్రజాస్వామ్య భావనలు నెలకొల్పడానికీ, హింసా సంస్కృతిని అంతం చేయడానికి కొత్తమార్గాలు అన్వేషిస్తున్నారు”- అని అంటారు యునైటెడ్ నేషన్స్ మాజీ సెక్రటరీ జనరల్ గా పని చేసి ప్రస్తుతం ‘ఉమెన్స్ లెర్నింగ్ పార్ట్ నర్ షిప్’ బోర్డ్ చైర్మన్ గా ఉన్న తొరయా ఒబైడ్ (Thoraya Obaid)

ఇరాన్, అమెరికాలలో ‘ఉమెన్స్  లెర్నింగ్ పార్ట్నర్ షిప్’ వ్యవస్థాపక సభ్యురాలైన మెహ్ నాజ్ అఫ్ కామీ (Mahnaz Afkhami) “మా సంస్థ లింగ వివక్ష మూల కారణాలను అన్వేషిస్తుంద”ని అంటారు. దేశ దేశాల్లో పని చేసే వీరందరూ ఉమెన్స్  లెర్నింగ్ పార్ట్నర్ షిప్ భాగస్వాములే!

సింధి మేదర్ గౌల్డ్ (Sindi Medar Gould) నాయకత్వంలో నైజీరియాలో పనిచేస్తున్న ఒక సంస్థ మహిళలపై హింసను నమోదు చేస్తుంది.

నైజీరియా నుంచి బాయోబాబ్ అనే సంస్థలో పని చేసే షిబోగూ ఓబెన్వా (Shibogu Obinwa) మహిళలకు జరిగే శరీర హింస నుండి తమను తాము రక్షించుకునే హక్కుల గురించి “నా శరీరం, నా ఇష్టం” అని చెప్పే అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్తారు.

హఫ్సాత్ ఆబియోలా (Hafsat Abiola) నైజీరియాలో ప్రజాస్వామ్య స్థాపనే తమ ధ్యేయమంటుంది.

టర్కీలో పని చేసే యాకిన్ ఎర్టర్క్ (Yakin Erturk)  మహిళల మీద అమలవుతున్న హింస గురించి ప్రస్తావిస్తారు.

అమెరికా నుంచి ఫ్రాన్సెస్ కిస్లింగ్ (Frances Kisling) మహిళలు లైంగిక పరమైన దుర్గార్గపు ఆలోచనలను ప్రేరేపించేవారుగా, పురుషులు దానికి బలవుతున్న వారుగా సమాజపు నరనరాన ఎందుకు ఇంకిపోయిందో అనేదాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తుంది.

అమెరికా రట్జర్స్ విశ్వవిద్యాలయం నుంచి కరీమా బెన్నౌన్ (Karima Bennoune) అమెరికాలో చట్టాల అమలు గురించి మాట్లాడతారు.

జాక్వెలిన్ పీటాంగ్వై (Jacqueline Pitanguy ) బ్రెజిల్ నుంచి తమ సంస్థ సమాజంలోని స్త్రీ-పురుష అసమానతల గురించి పనిచేస్తుందని చెప్తారు.

బహ్రెయిన్ నుంచి వాజీహా అల్ బహార్న (Wajihaa Albarna) తమ సంస్థ పురుషాధిపత్యాన్ని ప్రశ్నిస్తుందని చెప్తారు.

మలేషియా నుంచి బెట్టీ యో (Betty Yeoh) పని ప్రదేశంలో వేధింపుల మీద తమ సంస్థ గురి పెడుతుందంటారు.శక్తివంతమైన అంతర్జాతీయ చట్టాల నుపయోగించి సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తుందని చెప్తారు.

మలేషియా లోని మ్యూస్ వా నుంచి జైనా అన్వర్ (Zainah Anwar) ముస్లిం పురుషులు స్త్రీలను కొట్టి, రకరకాల హింసలకు గురి చేస్తున్నారనే విషయాన్ని ప్రచారం చేసి ప్రజల మద్దత్తుని కూడగట్టడానికి తమ సంస్థ కృషి చేస్తుందని చెప్తారు.

జోర్డాన్ నుంచి అస్మా ఖాదర్ (Asma Khader) కొత్త సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో స్త్రీల సమస్యల మీద ప్రజల్లో అవగాహన పెంచడానికి తమ సంస్థ కృషి చేస్తుందంటారు. పరువు కోసం తన చెల్లెల్ని హత్య చేసిన కేసులో మహిళల నిరసన ఫలితంగా, ఆమె సోదరుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. ఇలాంటి ముఖ్యమైన సందేశం ప్రజల్లో మార్పు తెస్తుందంటారు అస్మా.

లెబనాన్ నుంచి పని చేసే లిన హబీబ్ (Lina Habib) తమ సంస్థ పురుషాధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తుందని చెప్తారు.

ఐర్లండ్ నుంచి మేరీ రాబిన్సన్ (MARY ROBINSON) వారి సంస్థ మహిళల హక్కులు కూడా మానవ హక్కులే అని నినదిస్తూ ప్రజల్లో అవగాహన పెంచడానికి దోహదం చేస్తుందంటారు.

పాకిస్తాన్ నుంచి రబియా హది (Rabia HAdi) స్త్రీల పట్ల హింస అంతం కావాలంటే విద్య ద్వారా సాధికారత సాధించాలంటారు.

1993 డిసెంబర్ 20న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా మహిళలపై హింస నిర్మూలన గురించి ఒక ప్రకటన వెలువడింది. అందులో కార్యాచరణ ప్రణాళికను నిర్దేశిస్తూ “స్త్రీల సమానత్వం, భద్రత, స్వేచ్ఛ, గౌరవం మొ.న హక్కుల పట్ల హామీ పడుతూ స్త్రీల పట్ల వివక్ష తగదని హెచ్చరించింది. మహిళల హక్కులు కూడా మానవ సార్వత్రిక హక్కులలో భాగమేనని ప్రకటించింది.

ఈ హక్కులు అమలు కావడానికి పితృస్వామ్యం పెద్ద అడ్డంకిగా నిలుస్తుందని చెప్తారు ఈ ఉమెన్స్ లెర్నింగ్ పార్ట్ నర్ షిప్ నాయకులు.

ఒక సంస్థ నుంచి మిగిలిన అన్ని సంస్థలూ సమాచారాన్ని,కష్ట-నష్టాలను పంచుకోవడం, ఒకరినుండి మరొకరు నేర్చుకోవడం ద్వారా వారి మధ్య కొన్ని భావ సారూప్యతలూ – కొన్ని తేడాలు ఉన్నప్పటికీ వారి వారి లక్ష్యాల దిశగా పని చేస్తూ భవిష్యత్తులో ప్రజాస్వామ్య సమాజాన్ని సాధిస్తామని చెప్పుకొచ్చారు.

అన్ని సంస్కృతుల, అన్ని తరగతుల, అన్ని తరాల లింగ పరిధుల్లో సంభాషణ నడుపుతూ మేము సంఘటితమై మా భాగస్వామ్య సామర్థ్యాన్ని పటిష్టపరచుకుంటూ మరింత విస్తరణకు ప్రయత్నిస్తున్నా మంటారు దీని నాయకులు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చివరికి 1800 సంవత్సరం నుంచి మొదలై 1910 వరకూ కొనసాగి తమ రాజీ లేని పోరాటాలతో, చివరికి 140 మంది చికాగో దుస్తుల తయారీ ఫ్యాక్టరీలోని మహిళా కార్మికుల ప్రాణత్యాగాలతో అంతర్జాతీయ మహిళా ఉద్యమాలు సాధించిన ముఖ్యమైన మైలురాళ్ళ ఫలితంగా “అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం” ఏర్పడింది. ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధిని సమీక్షించుకుని,సాధించుకోవలసిన సమస్యల కోసం భావి పోరాటాలకు సిద్ధం కావడం “అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం” లక్ష్యం. పండగల్లాగా పట్టు చీరల బహుమతులతో,ముగ్గుల పోటీలతో జరుపుకుంటారు “ అంతర్జాతీయ మహిళా దినోత్సవం” – ఈ రెండిటికీ స్పష్టమైన తేడా ఉంది. అందరూ ఈ భేదాన్ని తెలుసుకోవాలి!

మహిళల మీద అమలవుతున్న హింసను ఎంతో హృద్యంగా  దృశ్యీకరించిన ఈ నాయకత్వం అసలు దీనికంతకూ మూలకారణమైన పెట్టుబడిని రవ్వంతైనా ఎక్కడైనా చెప్తారేమోనని వళ్ళంతా కళ్ళు చేసుకుని కళ్ళార్పకుండా శ్రద్ధగా సినిమా చూశాను.పొరపాటున కూడా పెట్టుబడి ప్రస్తావన రానివ్వలేదు. అసలు జబ్బేమిటో తెలుసుకోకుండా బస్తాలు బస్తాలు మందులు మింగించినట్లుంది. ప్రభుత్వాలను ప్రశ్నించకుండా సన్నాయి నొక్కుల ఉద్యమాల వల్ల ఉపయోగం ఉండదు.

ఎన్ని చట్టాలు వచ్చినా అవి అమలు కావు.మహిళల మీద హింస ఆగదు.దీనికి కారణం ప్రభుత్వాలను తమ పెట్టుబడితో వెనకుండి నడిపే కార్పొరేట్ శక్తులు.

” పెట్టుబడి అనే బండ రాయి కింద నలిగిపోతున్న చీమలు మన శ్రామికులు. పెట్టుబడి రాక్షసికి ఆహారం జంతువు ల్లాంటి మన శ్రామికులు “అని 16 వ శతాబ్దం లోనే తన “అన్నా కరేనినా నవల్లో నికొలాయ్ అనే పాత్రతో చెప్పిస్తారు టాల్ స్టాయ్. శ్రామికులవే బానిస బతుకులైతే, ఇక బానిసకు బానిసలైన స్త్రీల పరిస్తితి ఎంత హీనంగా ఉంటుందో చెప్పనే అక్కరలేదు !

“బీద వారినే కాదు,ఈ భాగ్యవంతుల్నీ వాళ్ళ గొప్ప తనాల భారాల నించీ, ఊపిరాడని గర్వాల నించీ,మర్యాదల నించీ,ఈర్ష్యల నించీ, చికాకుల నించీ తప్పించి, శాంతినీ, సంతోషాన్నీ, తృప్తినీ ఇచ్చి కాపాడే కమ్యూనిజం రావాల”ని కాంక్షించాడు చలం. అంతో ఇంతో సామాజికంగా,ఆర్ధికంగా మెరుగైన స్థితిలో ఉన్న స్త్రీలకైనా స్వేచ్చ రావాలంటే ఈ అణచివేతలకు మూలకారణాలను అన్వేషించాలి!

*

ఇంత నిద్రెందుకో మనకి!

 

 

-నిశీధి

~

మతం తర్వాత  ఈ ప్రపంచానికి పట్టిన భయంకరమయిన జబ్బు , నిజానికి అంటువ్యాధి అనే చెప్పుకొనేది ఏమయినా ఉంటే అది ఖచ్చితంగా అవనీతి మాత్రమే . ఆ జబ్బు మనలో ఎంత  ముదిరిందో తెలుసుకోవడానికి  , అధికారం జనాన్ని కరప్ట్  చేయదు ,  జనమే అధికారాన్ని కరప్ట్ చేస్తారు  అనడానికి ప్రస్తుత  భారతదేశం ప్రపంచ దేశాలకే ఒక నెగటివ్ మోడల్ ఐకాన్ గా మారుతుందని అర్ధం కావడానికి మనలో మన చుట్టూ కొన్ని వందల ఉదాహరణలు దొరుకుతున్నాయి .

ఇందుకు అతి పెద్ద  ఉదాహరణగా , నిజానికి దేశభక్తులు ఎవరు దేశద్రోహులు ఎవరు అన్న చర్చ అటు కార్పోరేట్ కనుసన్నలలో నడిచే మీడియాలోనే కాక స్వీయ అభిప్రాయ ప్రకటన అవకాశాలు  హెచ్చుగా ఉన్న సోషల్ మీడియాలో లో సైతం  పెద్ద ఎత్తున సాగుతున్న ఈ తరుణంలో ఒక పక్క   పనామా  పేపర్స్లో ఇండియా కీర్తి పతాకాలు రెపరెపలాడించి మరో పక్క ఇడియట్ బాక్సుల ముందు కూర్చునే ఇడియట్స్ కోసం చాలా జాగ్రత్తగా కాసుల గలగలలు స్పష్టంగా వినిపించేలా  తయారు చేసిన క్రికెట్ ఆటల ముందో వెనకో చేతిలో ఇండియన్ ఫ్లాగ్ అందరికి కనపడేలా బేస్ వాయిస్ లో జనగణమన పాడి వీర దేశభక్తుల దిల్  కా దడ్కన్ తో పాటు వళ్ళంతా  వద్దన్నా  కరుచుకోచ్చే గూస్బంప్స్ పెంచిన ఆరడుగుల దేశభక్తిని రేపొద్దున్న మన ఖర్మ కాలితే భారత దేశ మొదటి పౌరుడుగా  చూడాల్సోస్తుందేమో అన్న ఆలోచనే వెన్నులో వణుకు పుట్టిస్తుంది . ప్రెసిడెంట్ పదవి ఆషామాషీ ఆటేమి కాదు “ దేశంలో  అతున్నత స్థాయి రబ్బర్ స్టాంప్  ఉద్యోగమే “ అని గల్లీలలో క్రికెట్ ఆడే పిల్లలకి సైతం విదితమే  అయినా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పెరిగిపోతున్న అర గుంట ఆస్తుల్లో పంటలు పండించుకోడానికి అప్పులు  తీసుకోని , కట్టలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుభారతం ఒక పక్క లక్షల కోట్లు ఎగేసి రంజుగా విమానాలేసుకొని దేశాలు దాటి పోతున్న మోడీలు మాల్యాలు ఇంకో పక్క , అదే సమయంలో కోట్లు వెనకేసుకొని విలాసంగా నవ్వుతూ  దేశంలో కౌన్ బనేగా  కరోడ్పతి అంటూ ఈజీ మనీ గేమ్స్  తో పాటు మనీ ల్యాండరింగ్  కేసుల్లో ప్రముఖంగా  వినబడే  బచ్చన్లు దేశభక్తులుగా  కీర్తించబడుతున్న ఈ   టైమ్లో నిజమే ఈ దేశంలో  ఉండాలంటే  భయమే మరి . అదే మాట పైకి చెప్పిన పాపానికి అమీర్ఖాన్ పై  సహన ప్రియులంతా  ఎంత అసహనాన్ని  చూపారో ఇంక్రేడిబుల్ ఇండియా బ్రాండ్  అంబాసిడర్గా అమీర్ ని పక్కన పెట్టినప్పుడే  తెలిసిపోయింది మనం అంతా  ఎలాంటి సమాజాన్ని  సృస్టించడంలో  నిమగ్నమై  ఉన్నామో .

ఒక సామాన్యుడికి పేట్రియాటిజం అంటే తిరంగా ఝండాలు భుజాన మొయ్యడం , భారత మాతాకి జై  చెప్పడమేనా  ? లేదా  దేశాన్ని  దేశ భవిష్యత్తుని నిర్మించుకొనే పునాది ఇటుకల్లో భాగస్వామ్యం కావడమా ?  ప్రతి వ్యక్తిని , పూర్తి వ్యవస్థని వ్రేళ్ళతో సహా కుళ్ళబెట్టి మొత్తం దేశపు నదుల్లో , భూసారంలో కూడా  కలిసిపోయినంతగా  మనల్ని పెనవేసుకుపోతున్న  పెనుబాము అవనీతికి  ఎదురు నిలబడే శక్తి మనలో నశించిందా ? లేక ఎదురు తిరిగే సామర్థ్యం ఉన్నా నిద్ర నటిస్తూనే  ఉంటామా  ? పనామా  పేపర్స్  నిండా మనదేశ  హేమాహేమిల పేర్లు  బయటికొస్తున్న సమయంలో నిజంగా  స్పందించాల్సిన రీతిలోనే  మనం  స్పందిస్తున్నామా ? అక్కడో ఇక్కడో  సోషల్ మీడియాలో చెణుకులు వినిపిస్తున్నా మాతాజీలు బాబాజీ ల అభ్యంతరకరమైన వాక్యాల  మీదనో , పాపులర్ నినాదాల మీదనో  జరుగుతున్న  చర్చలు , ప్రతి సామాన్యుడి రక్తం ఉడికిపోవాల్సిన సిట్యువేషన్స్ ఏమి  ఈ రోజు ఎందుకు కనిపించడంలేదు ? ఈ ప్రశ్నలకి సమాధానమేది ?  లేదా  మనమొక వెయ్యి  తింటాం పక్కనోడు పదివేలు ,  ఆ పై వాడు పదివేల  కోట్లు తింటాడు  అన్నంత  సింపుల్గా  కణాల్లో  జీర్నించుకుపోయిన కరప్షన్ జీభూతాలని  వదిలించుకోవడానికి ఇష్టపడటం లేదా ?

ఇంత మౌనం పాటిస్తున్న  సభ్యసమాజం కోసం  నిజానికి  సరయిన నిర్వచనాలలో దేశభక్తి అంటే ఏమిటో ఒక పెద్ద డిబేట్  జరగాల్సిన  ఈ సందర్భంలో మత్తు  వదలరా  నిద్దుర మత్తు వదలరా  అని  మన కొసరాజు  1966 లోనే  రాసినా  , ఇపుడు మాత్రం అన్నా హజారే యాంటి  కరప్షన్  మూమెంట్ సమయంలో బాలివుడ్ లిరిసిస్ట్ ప్రసూన్ జోషి రాసి గళమెత్తిన ఒక చిన్న కవిత ఈ  సారి  మనకోసం . గవర్నమెంటులు మారినా , అధికారపు పార్టీల జెండా  రంగులు  ఏవయినా మనలో మార్పు  రానంత వరకూ మన దేశభక్తి నాటకాలు అన్ని హుళిక్కి అని తేల్చి  చెప్పే  సర్వకాల సకల జనుల గీతం  తెలుగు లో  ఇలా

 

ఇంత నిద్రెందుకో  మనకి

ఇంత దీర్ఘమైన ఇంత ఘాడమయిన నిద్రెందుకో మనకి

అలికిడి లేకుండా నల్లని రాత్రులు వచ్చిపోతూనే  ఉంటాయి

అలికిడి లేకుండానే ఏ క్షణమయినా గుండె చప్పుడు ఆగిపోతుంది

అయినా మరోసారి వత్తిగిలి పడుకొని  అన్నీ మర్చిపోతాం మనం

ఇంత నిద్రెందుకో  మనకి

మగతా లేక  మరేదయినా మత్తా ఇది

నెమ్మది నెమ్మదిగా ఇంతగా  అలవాటు పడిపోతూ

 

అబద్ధాల వర్షపు వెల్లువలో

నిజాల వేణుగానమేదో

ఒకే ఒక గాలి వీచిక కోసం ఎదురు చూస్తూనే కృశిస్తుంది

తర్వాతెందుకో దుఃఖిస్తాం మనం

మరీ ఇంత నిద్రెందుకో మనకి

 

నారు మనదే  నాట్లు  మనవే

ఆశ్చర్యం ఏమిటో  ఇలా ఎదిగిన పంటలు చూసాక

నరికేయాలి నశింపచేయాలి

ఈ రోజు మనముందు పెద్ద సవాలే  నిలబడి ఉన్నపుడు

ముళ్ళనెందుకు విత్తుతున్నాం మనం

ఇంతగా ఎందుకు  నిద్రిస్తున్నాం  మనం

 

ఆట అందరిదే

ఓటమీ అందరిదే

అదేమిటో అనూహ్యమైన విచిత్రపు  ఆట

ఇంజను  నలుపే

డబ్బాలు నలుపే

నిండు భారంగా నడిచే పాత ట్రైనే ఇది

మరి ఈ రైలే ఎక్కిపోవాలని కోరికేమిటో మనకి

 

జోలపాటలు కాదిప్పుడు

లాగిపెట్టి చెంపదెబ్బలు కొట్టండిప్పుడు

ఒక చిన్న బ్రతుకాశ ఇవ్వండిప్పుడు

లేదంటే  మళ్ళీ  నిద్రిస్తాం

కలల్లో మళ్ళీ మునిగిపోతాం

రండి ఇలా  పాపాలు కడుక్కుందాం

 

ఇంత నిద్రేందుకో  మనకి

ఇంత దీర్ఘమైన ఇంత ఘాడమయిన నిద్రెందుకో మనకి!

 

 

~

ఇంకొంచం ఓపిక ఉన్నవారికోసం ప్రసూన్ జోషి ఒరిజినల్  కవిత యూట్యూబ్ లింక్

 

 

 

 

 

ఏ సౌందర్యరాశి కోసం ఈ కథ …!

 

 

రాముల వారు.

శ్రీరాముల వారు.

సీతాసమేత రాముల వారు.

వాళ్ల నాన్న ఎవరు ?

దశరథుడు.

దశరథుడి నాన్న ఎవరు ?

అజుడు.

ఈయన నాన్న ఎవరు ?

రఘు మహారాజు.

రఘు మహారాజు ఎక్కడుండేవాడు ?

కోసలపురంలో.

అయోధ్య రాజధాని.

బోల్డంత మంచోడు.

జపతపాలు బాగా చేసినవాడు.

తపస్సులు కూడా చేసినవాడు.

ఓ రోజు సభలో కూర్చోనున్నాడు.

సభ అన్నాక బోల్డంత మంది.

ఆటపాటలు, చర్చలు దేనికవే నడుస్తున్నై.

ఎవరిక్కావలసినవి వాళ్ళు చూసుకుంటున్నారు.

ఇంతలో ఒక వార్తాహరుడు వొచ్చాడు.

చేతులు కట్టుకొని, అయ్యా దణ్ణం అన్నాడు.

ఎవరి దగ్గర ?

రఘు మహారాజు దగ్గర.

ఏవిటి ఆ చేతులు, ఏవిట్రా సంగతీ అన్నాడాయన.

మరేనండి, విదర్భ నుంచి సందేశం వచ్చిందండి అన్నాడు.

ఆ కాలంలో ఈ సందేశాలు అవీ మనుషులే అందించేవాళ్ళు.

మాటలు మనుషుల మధ్య ఉండేవి.

మరల మధ్య కాకుండా.

మరల ద్వారా కాకుండా.

ఎంత అదృష్టవంతులో.

ఏవిటా సందేశం అన్నాడీయన.

పురోహితుల వారు వచ్చారండి, ఆయన చెపుతాడు అన్నాడు వార్తాహరుడు.

పిల్చుకురా ఆయన్నిటు అన్నాడీయన.

ఆ వార్తాహరుడు పరుగున పోయినాడు పిలుచుకొని రావటానికి.

ఇంతలో మంత్రులందరికీ అనుమానాలు.

పురోహితుడు రావటమేవిటి ?

పెళ్ళికేవన్నా వచ్చాడా?

రాజుగారికి ఆల్రెడీ పెళ్లైపోయింది.

మరెందుకు వచ్చాడు?

రాయబారానికి వచ్చాడా?

రాయబారానికి మనమధ్య పెద్ద గొడవలేవీ లేవే, అక్కడక్కడా అరుణాచల్ప్రదేశు, చైనా లాటి చిన్న చిన్న ఆక్యుపేషన్లు తప్ప.

ఆ ఆక్యుపేషన్లు మనమూ చేస్తున్నాం. అవి చెయ్యొద్దని చెప్పడానికి వొచ్చాడా?

ఇలా నానారకాలుగా మాటాడుకుంటున్నారు.

ఇంతలో నుదురు మీద ఈలావున ఓ పెద్ద వీభూతి, మెళ్ళో రుద్రాక్షలు, ధగధగ మెరిసిపోతూ తెల్లగా ఉన్న ఒహాయన వచ్చాడు.

ఆయనే ఆ పురోహితుడు.

నవ్వుతున్నాడాయన.

మంత్రుల మనసు స్థిమిత పడింది.

ఇదేదో మంచి వార్తలానే ఉంది అనుకున్నారు.

గుసగుసలు తగ్గినై.

రాజుగారన్నారు ఆయనకో కుర్చీ ఇవ్వండి అని.

కుర్చీలేవీ ఖాళీ లేవయ్యె.

రాజుగారి నోటి వెంట మాట రావటం, అది కాకపోటమే?

విదర్భుడు అని ఒహ మంత్రిగారు లేచి ఆయన కుర్చీ ఈయంకిచ్చాడు.

రాజుగారు మంత్రిగారికి ఒహ 500 పరగణాలు బహుమానంగా ఇచ్చాడు.

అది చూసి మిగిలిన మంత్రులంతా కుతకుతలాడారు.

సరే ఆ కుతకుతల సంగతి తర్వాత, పురోహితుడు కూర్చున్న తర్వాత ఏమయ్యింది ?

రాజు గారు ఆ పురోహితుణ్ణి పట్టుకొని, అంతా బాగేనా? తమరి రాకకు కారణమేవిటి ? విదర్భలో అంతా బాగున్నారా? మీ ఇంటో అంతా బాగున్నారా ? అని నానారకాల కుశల ప్రశ్నలు వేశాడు.

ఆ కాలంలో కుశల ప్రశ్నలు అవీ చాలా సామన్యం.

మనుషుల్లో మంచి మానవత్వం ఉండేది.

మా సభలో సంభారాలు ఇలాగున్నై, అలాగున్నై అని గొప్పలు గప్పాలు రాజుగారి దగ్గర ఉండేవి కావు.

ఇంటికి వచ్చినవాణ్ణి నెత్తి మీద కూర్చోబెట్టుకొని వాడు సంతొషపడిపొయ్యేదాకా వదిలేవాళ్ళు కాదు.

ఈరోజు ఇంటో ఉన్న అత్తగారికీ, మావగారికే దిక్కులేకుండా పోతుంది. బయటివాళ్ళ సంగతి, బంధువుల సంగతి బెమ్మ దేవుడికెరుక.

సరే అదలా పక్కనబెడితే, రాజుగారు అడగ్గానే పురోహితుడు పులకించిపొయ్యాడు.

పెద్దాయన కాఫీలు, టీలు, ఆల్కహాలు ఖాకుండగా చల్లని కరివేపాకు నిమ్మ మజ్జిగ కూడా ఇప్పించటంతో పురోహితుడు కళ్ళనీళ్ల పర్యంతం కూడా అయిపోయినాడు.

అంతా బానే ఉంది సార్! అన్నాడు ఆ సత్కారాలకు పొంగిపోతూ.

మరి అంతా బాగుంటే మమ్మల్ని చూసిపోటానికి వచ్చారా మీరు అన్నాడీయన నవ్వుతూ.

మజ్జిగిచ్చాక ఈ మాటతో మోతమోగించడంతో పురోహితుడన్నాడు, కాదండి మా రాజుగారి అమ్మాయికి పెళ్ళి చేద్దామనుకుంటున్నారు అని.

అప్పుడు వెలిగింది పెద్దాయనకు, మంత్రులకు వెలక్కపోయినా.

అజుడు ఉన్నాడుగా, ఆ యువరాజు గారికోసం సంబంధం కలుపుకుందామని మాటలు మాట్టాడదామని వచ్చాడాని అనుకున్నాడాయన.

చిరునవ్వు నవ్వాడు అప్పుడు రఘుమహారాజు.

ఏమాటకామాటే చెప్పుకోవాలె. రఘు మహారాజు చాలా అందగాడు.

రాజసంగా ఉన్నాడేమో, ఇంకా వెలిగిపోతున్నాడు.

అందులోనూ నవ్వితే బుగ్గలు సొట్టపడతయ్యిట.

సూర్యుడి వంశం వాళ్ళైనా సొట్టబుగ్గలు కనపడతవి, అంత సూర్యుడి వెలుగులోనూ.

సభంతా వెలిగిపొయ్యింది. సమ్మోహనమైపోయింది ఆ నవ్వుతో.

ఆ చిరునవ్వుతో.

అందరి కళ్ళు ఇటేపు తిరిగినై.

అయినా పురోహితుణ్ణి కొద్దిగా ఉడికిద్దామని, ఏవిటయ్యా పెద్దాయనా, ఆ చిన్న పిల్లతో నాకు పెళ్ళేవిటీ అన్నాడు.

అమ్మమ్మా, ఎంత మాటన్నారు, మీక్కాదండి మీవాడికి అని బయటపడ్డాడు ఆ పురోహితుడు.

అదీ ఇప్పుడు దారిలోకొచ్చావ్. సంగతి పుర్తిగా చెప్పు అన్నాడాయన.

మీకు తెలీందేముందండి, ఈ కాలంలో అందరూ స్వయంవరాలు ఏర్పాటు చేస్తున్నారు. తండ్రి నేనైతే అబ్బాయికి డైరెక్టుగా ఇచ్చేద్దును. కానీ రాజ్యధర్మం పాటించాలె కదా. కాబట్టి స్వయంవరానికి మీ వాణ్ణి రమ్మని చెప్పడానికి వచ్చాను అన్నాడు పురోహితుడు.

అది విని రఘు మహారాజు ఆనందపడ్డాడు. ఏ భేషజం లేకుండా చక్కగా సంగతి చెప్పినందుకు ఆ పురోహితుడికి ఓ మూడువేల ఆవులు, ముప్ఫై గ్రామాలు ఇచ్చి పంపించేసాడు.

సభలో అంతా ఆనందం. కలకలం. రాజు గారి కొడుకు పెళ్ళి అని.

సాయంత్రం అజుణ్ణి పిలిచాడు పెద్దాయన.

నీకు పెళ్ళి అన్నాడీయన.

అదేంటి, నాకు చెప్పకుండా పెళ్ళేవిటి, నువ్వెవరు అని అడక్కుండా సరే నాన్నగారూ అంటూ సెలవు తీసుకోబోతుంటే అప్పుడన్నాడాయన.

పెళ్ళంటే పెళ్ళి కాదు, ఇప్పటికి స్వయంవరం. అందులో నువ్వు ఆ అమ్మాయి మనసుని గెల్చుకొని కోడలిగా తీసుకొచ్చెయ్ నా ఇంటికి అన్నాడు పెద్దాయన.

పెద్దవాళ్ల మాట శిరస్సున ధరించడమే తెలుసుకానీ, రెబెల్ మనస్తత్త్వాలు లేకపోడంతో అంటా శాంతంగా. ప్రశాంతంగా గడిచిపోయింది.

ఆ రోజొచ్చింది. బయల్దేరాడాయన.

ఎవరు ?

అజుడు. బోల్డు మంది పరివారన్నెంటబెట్టుకొని.

ఎక్కడికి?

విదర్భకు.

రథాలు సాగుతున్నై, పరుగులు తీస్తున్నై గుర్రాలు.

ఇంతలో ఓ పేద్ద అడవి వచ్చింది.

ఆ అడవంతా దట్టంగా ఉన్నది.

అడవిలోంచి వెళుతుంటే బోల్డన్ని జంతువుల అరుపులు.

ఇంతలో హృదయవిదారకమైన కేకలు వినపడ్డై.

చూస్తే ఒక పెద్ద బెబ్బులి, ఒక లేడిని కసుక్కున ఏసేసి తీసుకుపోతోంది.

అది చూశాడు అజుడు.

ఇంతవరకూ చెప్పుకోలేదు కానీ, మనవాడు చాలా గొప్ప వీరుడు.

విల్లు పట్టుకున్నాడంటే ఇహ ఆయన్ని ఓడించటం ఆ బ్రహ్మ తరం కూడా కాదన్నమాటే.

rama1

అలాటి వీరుడికి బెబ్బులి ఎదురు పడింది.

ఇహనేం ?

బెబ్బులి కూడా అజుణ్ణి చూసింది.

ఎవర్రా నువ్వు, నా అడవిలోకొచ్చి నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తావా అన్నట్టు చూస్తోంది.

దాని కళ్ళు చింతనిప్పుల్లా వున్నవి.

అంత దట్టమైన అడవిలో, దాని కళ్ళు ధగధగా మెరిసిపోతున్నై.

ఇద్దరూ కళ్ళు దించకుండా ఒకళ్ళొంక ఒకళ్ళు చూసుకున్నారు.

ఉన్నట్టుండి భూమి ఆకాశం బద్దలయ్యేట్టు బొబ్బలు పెట్టింది ఆ పులి.

మరి బెబ్బులి కదా.

బొబ్బలు పెట్టాల్సిందే.

మనవాడు ఊరకుంటాడు ?

అసలే యువరాజు.

దబ్బపండులా మెరిసిపోతున్నాడు.

అసలే సింహం నడుం మనవాడిది.

దానికి పచ్చలతో బిగినిచిన పటకా.

దానికొక కత్తి వేళాడుతోంది.

మనవాడు బొబ్బలకు ప్రతిగా సింహనాదం చేశాడు.

ఆ నాదానికి నెత్తినున్న వజ్రపు తురాయి ఊగింది.

అది ఊగిందంటే మూడిందన్నమాటే.

బెబ్బులికి బాణం ఎందుకనుకున్నాడో ఏమో, పక్కనున్న బల్లాన్ని అందుకున్నాడు.

దక్షిణ హస్తంతో అందుకున్నాడు.

ఎంత సుందరంగా అందుకున్నాడో.

ఆయుధాలు పట్టుకోటం కూడా ఒక కళేనండి.

మాడ్రిడ్డు నగరంలో పోతుపోట్లాటల్లో మాటడోరు ఎంత వొడుపుగా దిగేస్తాడు బల్లేన్ని?

జీవహింసే అయినా ఆయుధాన్ని వొడుపుగా ఎలా ప్రయోగించాలె అన్నదానికి అదో గొప్ప ఉదాహరణ.

అది పక్కనబెడితే, మనవాడు అందుకున్న బల్లాన్ని అంతే వొడుపుగా విసిరాడు దాని మీదకు.

ఓస్ ఇలాటి బల్లాలు చాలా చూసా నేనన్నట్టు నిర్లక్ష్యంగా ఒక అడుగు పక్కకేసింది ఆ బెబ్బులి.

బల్లెప్పోటు తప్పిపోయింది.

మనవాడి మొహం ఎర్రబడిపోయింది.

రోషం వచ్చేసింది.

మామూలువాడికి రోషం వస్తే పక్కనబెట్టొచ్చు కానీ వీరుడికి రోషం వస్తే పట్టుకోగలమూ?

గుర్రాణ్ణి లార్డ్ ఆఫ్ ద రింగ్సులో నాజ్గుల్ రాజులు నల్లగుర్రాలను దుంకించినట్టు దుమికించాడు.

పోతే ఈయనది తెల్ల గుర్రం.

అంత గుయ్యారంలోనూ మెరిసిపోతోంది.

అరబ్బీ గుర్రాలని ఇప్పటి వాళ్ళకు తెలుసుకానీ, అసలు ఆ అరబ్బీ గుర్రాలు అనే మాట మన రబ్బు నుంచి వచ్చింది.

రబ్బంటే ఏవిటీ ?

కాంతి. ధగధగలాడిపోయ్యే కాంతి.

ఒగిప్రబ్బు బిగిరబ్బు నగుమబ్బు జిగినుబ్బులను ద్రొబ్బుగ….అంటూ ఒకానొక శాస్త్రంలో ఒకానొక పద్యం కూదా ఉన్నది.

కాంతితో సమానంగా పరుగులుపెడతవి కాబట్టి వాటికి రబ్బులని పేరు ఆ కాలంలో.

అలటి మన రబ్బు గుర్రాలని ఆ అరబ్ వాళ్ళు తీసుకునిపొయ్యి అరబ్బీ గుర్రాలుగా మార్చేసారు.

అది మనవాళ్లకు తెలీక అరబ్బీ గుర్రాలు వాళ్ళవే అనుకుంటున్నారు.

సరే గుర్రాల పుట్టుపూర్వోత్తరాలు అవీ వొదిలేస్తే, మనవాడి గుర్రం దుంకింది.

రౌతు రోషం రత్యానికి తెలియకపోతే ఎట్లా? (రత్యము అంటే గుర్రము నాయనా!)

అందుకని అదీ యజమానంత రోషంగానూ దూకింది.

బెబ్బులి కళ్ళు జిగేల్ జిగేల్ మన్నాయి ఆ తెలుపుకి.

అలా జిగేల్ జిగేల్ మనటంతో గుడ్డిదైపోయింది ఒహ నిముషం.

ఇంతలో మనవాడు ఇంకో బల్లెం అందిపుచ్చుకున్నాడు.

అంత పరుగులోనూ, దుంకులాటల్లోనూ.

అదీ నైపుణ్యం అంటే.

అదీ వీరుడంటే.

అందుకోటమేవిటి, విసరటమేవిటి అన్నీ కన్నుమూసి తెరిచేలోపల జరిగిపోయింది.

ఆ ఒక్క పోటుకు బెబ్బులి బజ్జుండిపోయింది.

బొబ్బలూ లేవు. బెబ్బులీ లేదు.

బెబ్బులి శాస్వతంగా బజ్జుంది కాబట్టి మనవాడు మళ్ళీ ఒక సింహనాదం చేసినాడు.

దాంతో అప్పటిదాకా బెబ్బులికి భయపడి దూరంగా చెట్ల వెనకాల దాక్కుని చూస్తున్నవాళ్ళంతా బయటకొచ్చారు.

జయజయధ్వానాలు చేసారు.

అలా దక్కునేవాళ్ళను ఈరోజుల్లోనూ చూడొచ్చు మనం.

మాట్టాడేవాణ్ణి ఒకణ్ణి ముందుకు తొయ్యటం, చోద్యం చూట్టం, మనకనుకూలంగా వచ్చేసిందనుకుంటే జయజయధ్వానాలు చెయ్యటం.

అదీ లోకం పోకడ.

మనవాడికి ఆ సంగతి తెలుసు కాబట్టి ఆ జయజ్యధ్వానాలు అవీ పట్టించుకోకండా, ఇహ పొద్దు గుంకిపోతోంది, అడవిలోనే గుడారాలేర్పాటు చెయ్యమని ఆర్డరిచ్చి పక్కనే ఉన్న ఏరు దగ్గరికి స్నానానికెళ్ళిపోయాడు.

అప్పుడు గ్యాపకం వచ్చింది మనవాడికి, అది నర్మదా నదీ తీరం అని.

అంటే విదర్భ ఇంకొంత దూరంలోనే ఉన్నదన్నమాట.

స్నానం అవీ చేసి, భోంచేసి సుబ్బరంగా నిద్దరోయి పొద్దున్నే ఫ్రెష్హుగా పోవచ్చులేనని ఆయన నదిలోకి దిగాడు.

నింపాదిగా స్నానం చేస్తున్నాడు.

అప్పుడు జరిగిందయ్యా ఇంకో సంఘటన..

ఒక మదగజం వచ్చింది.

నీళ్ళు తాగాలనో ఏమో.

కానీ మదంలో ఉందిగా, అందుకూ దార్లో ఉన్నవాటన్నిటినీ తొక్కి పారేస్తోంది.

చెరుకుతోటలో పడ్డట్టు నాశనం చేసేస్తోంది.

అది చూసి భటుల్లో కొంతమంది వీరులు పరిగెత్తుకుంటూ వచ్చారు.

ఎవడొస్తే ఏవిటి నాకు అని వాళ్ళను కూడా తొక్కి పారేసింది ఆ మత్తగజం.

దాని కాళ్ళ కింద పడి పచ్చడి పచ్చడీపోయారు చాలా మంది.

ఇది చూసి ఆయన ఒడ్డుకు వచ్చేసాడు.

ఒడ్డున వదిలిన విల్లు, బాణం అందుకున్నాడు.

గజానికి గురిపెట్టాడు.

అంతే ఆశ్చర్యంగా గజం కిందపడిపోయింది.

మత్తొచ్చినట్టే, కిందపడిపొయ్యింది.

పడిపోటమేవిటి, ఆ స్థానంలో తెల్ల పొగలు రావటమేమిటి, ఆ పొగల్లోంచి ఒక దివ్యపురుషుడు రావటమేమిటి, అన్నీ వరసాగ్గా జరిగిపోయినై.

ఎవరు బాబూ నువ్వు, ఆ పొగలేవిటీ, ఏవిటి నీ సంగతి అని అడిగాడు ఈయన.

పొగల్లోంచి వచ్చిన నా పేరు ప్రియంవదుడు సార్! గంధర్వుణ్ణి. ఓ రోజు తాగిన మైకంలో ఒళ్ళు పై తెలీకుండా మతంగ మునిని ఏదేదో మాటలన్నాను. ఆయన నీకు మదమెక్కిందిరా, నువ్వు మదగజమైపో అని శాపమిచ్చాడు. మత్తు దిగిపోయి నేను భోరుమన్నా. అప్పుడు ఆయన, మీరొచ్చి మీ దివ్యమైన విల్లు పట్టుకుని నా మీదకు గురిపెడతారనిన్నీ, అప్పుడు ఆ బాణాన్ని ఆపడం ఎవరి వల్లా కాదు కాబట్టి అప్పుడే నీకు శాపవిమోచనమని శలవిచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరొచ్చారు. విల్లెక్కుపెట్టారు. పొగలొచ్చినై. నేను బయటకొచ్చాను అని అన్నాడు.

సరే ఈ కథంతా బాగుంది కానీ, ఇప్పుడు ఏవిటి చెయ్యాలి నేను అన్నాడీయన.

మీరేం చెయ్యక్ఖరలేదు సార్, నేనే మీకు ఒక అస్త్రం బహూకరిస్తా కానుకగా. ఇదిగో తీస్కోండి అని ఒక అస్త్రం ఇచ్చాడు.

ఆ అస్త్ర విశేషాలు ఏవిటి అని అడిగాడు ఈయన.

అప్పుడన్నాడు ఆ ప్రియంవదుడు.

అయ్యా ఇది సమ్మోహనాస్త్రం.

ఒకసారి ఎక్కుపెట్టి వదిలారంటే ఇందులోంచి సమ్మోహనం అనే గాసొస్తుంది. అందరూ మూర్చలో పడిపోతారు. ఎవరూ లేవను కూడా లేవలేరు చాలా సేపటిదాకా. ఇహ నాకు శలవు అని మాయమైపోయాడు..

వీరుడికి ఇట్లాటివన్నీ ఇస్తాడేమిటి ఈయన అని అజుడు ఆశ్చర్యపోతునే ఉన్నాడు.

ఎందుకా ?

వీరుడన్న వాడికి, ఎదురైనవాడితో స్వంతంగా పోట్టాడాలని ఉంటుంది కానీ ఈ సమ్మోహనాలు, మూర్చలు అవీ ప్రయోగించటానికి ఇష్టం ఉండదు.

అందుకూ.

అయినా సరే ఇచ్చాడు కదాని తీసుకున్నాడు.

అప్పుడు….

ప్రియంవదుడు మాయమైపోయాడు. పొగలు మాయమైపోయినాయ్. గజమూ మాయమైపోయింది.

పొదిలో కొత్త అస్త్రం వచ్చి చేరింది.

వీరుడికి, విలుకాడుకి కొత్త అమ్ము వచ్చి చేరితే ఆనందమే. అది బయటకు చెప్పుకోకపోయినా.

ఆ ఆనందంలో గుడారానికి వెళ్ళిపోయాడు. చక్కగా అందరూ నిద్దరోయారు.

పొద్దున్నయ్యింది. పైగా వసంత ఋతువు.

వసంత ఋతువులో అరుణకిరణాలు ఎంత బాగుంటవో ఆ సమయానికి చూస్తేనే కానీ తెలియదు.

భానుడు బాలుడైపోతాడు. కేరింతల కిరణాలు అలా అలా భూమ్మీదకు వచ్చేస్తుంటే ఎవడి మనసు పులకించదు.

దానికితోడు కోయిలలు. మావిచిగుళ్ళు తింటున్నవి పొద్దున పొద్దున్నే బ్రేక్ఫాష్టుకు.

చిగుళ్ళు తినగానే బోల్డంత శక్తి. బోల్డంత తీపి వగరు కలగలుపు. దాంతో పరవశం. దాంతో ఫాటలు.

ఇవన్నీ చూసి వాయుదేవుడికి ఆనందం. ఆయనా పిల్లవాడిగా మారిపోయి, పిల్లలగాలులు వీస్తూ ఉంటాడు.

ప్రకృతి అంతా శాంతం. ప్రశాంతం.

చుట్టుపక్కల ప్రశాంతంగా ఉన్నప్పుడు మనమూ ప్రశాంతమే, మన మనసూ ప్రశాంతమే.

అలా ఆ ప్రశాంతతలో కాలకృత్యాలు అవీ అయిపోయాక, తిపినీలు అవీ అయ్యాక బయల్దేరారు.

నర్మద దాటగానే విదర్భ.

ఈయన వెంట బోల్డంత పరివారం ఉందని చెప్పుకున్నాంగా.

అంత పరివారం ఎందుకు అని అనుమానం రావొచ్చు.

స్వయంవరాలంటే మాటలా.

అంతమంది ఉండగా ఆడపిల్ల ఒకడి మీదే మనసు పారేసుకుని మెళ్ళో మాల వేస్తే మీసాలు తిప్పుతున్న వేరే కుర్రరాజులకు కాలదూ?

అలా కాలిన కుర్రాళ్ళు యుద్ధాలకు దిగిపోరూ? అందులోనూ వీరులు, యువరాజులు, ఉడుకురక్తాలు.

ఆ ఉడుకురక్తాల వల్ల అవి, చినుకుగా మొదలై గాలివానగా మారిపోయే అవకాశాలు బాగా ఎక్కువ.

అందువల్ల వెంట పెద్ద పరివారం, దానికితోడు సైన్యం ఉన్నదనుకో అన్నీ చక్కబెట్టుకోవచ్చు.

అలా కొన్ని కొన్ని సార్లు ఇలా మాల పట్టమేవిటి, అలా పెళ్ళి అవటమేవిటి – యుద్ధం మొదలు.

పెళ్ళాంతో కాదండోయ్. ఆ పెళ్ళామ్మీద పోట్టాటకొచ్చిన వాళ్ళతో. విరగదియ్యటమే.

సరే పరివారం అంతా దిగారుగా విదర్భలో ? అక్కడంతా పెళ్ళి సందడి.

పెళ్ళి సందడంటే రాఘవేందర్రావు తీసిన ఆ పిచ్చి సినిమా కాదు.

నిజమైన పెళ్ళి సందడి.

ఎట్లా ఉందిట అక్కడ ?

అంత ఎత్తున ప్రాకారాలు.

వాటి మీద దివిటీలు.

పగలు కూడా ధగధగా వెలుగుతున్నయ్యిట.

ఆ ప్రాకారాలకు పాకుతున్న లతలు.

ఆ లతలకు సువాసనొచ్చే చిన్న చిన్నపువ్వులు.

ఆ ప్రాకారాల్లోపల విడిగా వనాలు. వాటికలు.

విశాలమైన వీధులు.

అంత పెద్ద వీధుల్లో ఇంకా పెద్ద పందిళ్ళు.

ఒక్కటేవిటి, అన్నీ కళ్ళు చెదిరిపొయ్యేలా ఉన్నవి.

బోల్డంత మంది జనాలు. చిన్నా పెద్దా ముసలీ ముతక.

విసవిసగా అధికారులు.

పకపకగా ఆడపిల్లలు.

తైతకలుగా నాట్యాలు.

వికవికలుగా చెలికత్తెలు.

ఆటపాటలు. చిందులు. సందోహాలు.

ఇక స్వయమవరం మంటపం.

ఇంద్రుడికున్న వెయ్యి కళ్ళు ఎందుకు పనికొస్తై చూట్టానికి. ?

అంతలా ధగధగ మెరిసిపోతోంది.

మద్దెలలు మోగుతున్నై.

సన్నాయిలు సాగుతున్నై.

అరిటాకులు ఊగుతున్నై.

వాయుదేవుడు సన్నగా ఈలలు వేస్తున్నాడు.

ఇహ స్వయంవర సమయం వొచ్చింది.

అమ్మాయీమణి వారు వచ్చారు.

రా.కు లంతా ఆవిడను చూశారు.

అంతే. కళ్ళల్లో చక్రాలు తిరిగినై.

వశీకరణం జరిగిపొయ్యింది.

రాజకుమారులకు మూర్చలొక్కటే తక్కువ.

మాటలసలే లేవు.

అంతందంగా ఉన్నది ఆ అమ్మాయి.

జగదేక సుందరి.

ఆణిముత్యాలన్నీ పోగుచేసి ఒక కుప్ప చేసి రూపు కల్పిస్తే ఎట్లా ఉంటుందీ ?

అంతందంగా ఉన్నది.

ఇంత అందమైన అమ్మాయి ఎవరి మెళ్ళో మాల వేస్తుందో?

ఎవరిని ఎంచుకుంటుందో?

అందరి గుండెలు గుబగుబలాట్టం మొదలుపెట్టినై.

నాకు దక్కితే బాగుండు, నాకు దక్కితే బాగుండునని ప్రతి రాజకుమారుడు కలలు కంటున్నాడు.

వాళ్ళలా కలల్లో ఉండగానే, ఆ అమ్మాయి దండ తీసుకుని బయలుదేరింది.

అందరి మనసుల్లోనూ ఒకే కోరిక.

“ఈ భువనైకం నన్నే వరించాలి!” అని ఆత్రపడిపోతున్నారు.

అమ్మాయి యువరాణి. కాబోయే రాణి. అప్పట్లో యువరాణులకు చెలులు ఉండేవారు.

చెలులందు నెచ్చెలులు వేరయా అని వేమన తన ఐదువేల పూర్వజన్మల వెనకాల చెప్పాడు.

ఆ ఐదువేల జన్మల కితం, ఆయన, ఆ వేమన పేరేవిటో ఆయనకి తప్ప ఎవరికీ తెలియదని లోకంలో కథ.

సరే వేమన సంగతి పక్కనబెడితే, అలాటి నెచ్చెలి ఒకావిడ.

ఆవిడ పేరు సునంద. యువరాణి వారి దగ్గరున్న నెచ్చెలులులందరిలోనూ సునంద అంటే బాగా ఇష్టం ఆ అమ్మాయికి.

యువరాణి గారి మనస్సు, రహస్యం, ఇష్టం, అయిష్టం అన్నీ తెలిసిన్న చెలి ఈ సునంద.

అలాటి సునంద వెంటరాగా వరమాలను సుకుమారమైన చేతులతో పట్టుకొని ఒక్కొక్క రాజునే చూస్తూ ముందుకు నడుస్తున్నది.

సునంద ఆ ఆమాయి పక్కనే నడుస్తూ ఆ రాజ కుమారుడిను గురించి యువరాణివారికి పరిచయం చేస్తోంది.

పరిచయం అంటే పరిచయం కాదది.

ఏడేడు జనమల తాతముత్తాతల దగ్గరినుంచి వంశ చరిత్ర, ఆ కుమారుడి చరిత్ర ఒక్క మాటలో చెప్పేస్తోంది.

ఒక్కోసారి ఎన్నో మాటలని ఒక్కమాటలో చెప్పొచ్చు. సైగతో చెప్పొచ్చు.

అది అందరికీ సాధ్యం కాదు కానీ నెచ్చెలులకు సాధ్యం.

అది వారికే ప్రత్యేకం.

సునంద చెప్పటం, సైగ చెయ్యటం, యువరాణివారు ఒక్క క్షణం ఆ రాజకుమారుడి ముఖాన్ని కళ్ళు విప్పారించి నిశితంగా చూట్టం.

అసలే చేపల్లాంటి కళ్ళేమో, విప్పారించేప్పటికి ఆ కళ్ళను చూస్తున్న, చూసిన రాకుమారుడికి అమ్మా తమ్ముడు మన్ను తినేను పాట తర్వాత యశోదా దేవి ఆ నోట్లోకి చూసి పడ్డ పరిస్థితిలా అయిపోతోంది.

మనసంతా కకావికలం. సత్వ గుణం అయిపూ అజా లేకుండా పోతోంది. దానిస్థానే తమోగుణం రెచ్చిపోతోంది.

అంత రెచ్చిపోతలోనూ, ఆ అమ్మాయి చూసిన క్షణాన ఆ రాజు ముఖం వెలిగిపోతున్నది

“ చూసింది నన్నే చూసింది. నావంకే చూసింది. నన్నే చూస్తోంది! అంతే! ఇక ఆ మాల నా మెళ్ళో పట్టమే మిగిలింది” అనుకుంటూ అష్ట వొంకరలూ తిరిగిపోతున్నారు. అసలు ఆ అమ్మాయి చూస్తోందన్న ఊహకే వాళ్ళ ముఖాలన్ని పెట్రోమాక్సు బల్బుల్లా వెలిగిపోతున్నై.

ఆ పెట్రోమాక్సు లైటు చూసిన యువరాణికి ఆ లైటు నచ్చకపోవటం వల్ల తల త్రిప్పేసి ముందుకు వెళ్ళి పోతోంది.

ఎంతో ఆశ పెట్టుకున్న రాకుమారుడు నీరసపడిపోతున్నాడు.

మొహం నల్లగా అయిపోతోంది.

అవమానం పాలైనట్టు.

అలా వరుసలోని వారందరిదీ ఇదే పరిస్థితి.

దీన్ని కాళిదాసు వర్ణించాడు, బ్రహ్మాండంగా ఇలా

సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ
యం యం వ్యతీయాయ పతింవరా సా ల్
నరేంద్ర మార్గాట్ట ఇవ ప్రపేదే
వివర్ణ భావం స స భూమిపాలః

మా చిన్నప్పుడు దివిటీలు ఉండేవి.

ఆ దివిటీలు ఇప్పటివీ అప్పటివీ కావు.

ఎప్పటివో!

రాముడి కన్నా ముందు కాలం నాటివి.

ఆ కాలంలో రాత్రిపుట నడిచేటప్పుడు దివిటీలు తీసుకువెళ్ళేవారు.

ఎప్పుడైనా సరే లైటు పడ్డంతసేపే వెలుగు.

కదా?

అలా ఆ దివిటీ కాంతి బిల్డింగుల మీద పడ్డప్పుడు అవి కాంతివంతాలయ్యేవి. దివిటీని ముందుకు తీసుకువెళ్ళిన తరువాత వెనుకనున్న భవంతులు వెలవెల తెలతెల.

అలా ఆ రాకుమారుల ముఖాలు వెలాతెలా పోతున్నాయని కాళిదాసు ఉవాచించాడు.

సునంద అట్లా రాకుమారి చెయ్యి పట్టుకొని తీసుకొనిపోతోంది ముందుకు, ఒక్కొక్కరిని వర్ణిస్తూ.

అమ్మాయీమణివారు చూట్టం, ముందుకు నడవటం.

రాజుల, రాకుమారుల మొహాలు ఎర్రబట్టం.

ఆ కోపమంతా సునంద మీదకు తిరగటం.

సునంద సరిగ్గా చెప్పలేదేమో నాగురించి, అందుకే ఆ సుందరి అలా వెళ్ళిపోయింది.

సునందకు నేను నచ్చలేదేమో, ఏదో చెడు చెప్పుంటుంది చెవిలో, అందుకే ఆ సుందరి అలా వెళ్ళిపోయింది.

సునంద, సునంద, సునంద అని అందరి మనస్సుల్లో సునంద పేరే.

రాకుమారి అట్లా దాటటం, అందరి మనస్సుల్లో సునంద మీద కోపం పెల్లుబికటం.

ఉరుము ఉరిమి మంగలం మీద పడటం అంటే ఇదేనేమో.

మంగలం అంటే వేపుడు చట్టి. మాంసం అవీ పెట్టుకుని తినే పెద్ద చిల్లపెంకు ముక్క.

పెంకునొదిలి చట్టి గురించి మాట్టాడుకుందాం కాసేపు.

చట్టి అంటే కుండ.

ఆ కుండకొకపక్క చిల్లెట్టి అందులో మిరపకాయలు పడేసి అగ్గి మీద కుమ్ముతారు.

అలాగే పేలాలు కూడా వేయించుకోవచ్చు.

అసలే ఓటి కుండ. దానికో చిల్లు. పైగా కింద అగ్గి.దాని బాధలో అది.

ఉరుముడు దేవుడు బలం ఉంది కదాని ఉరుము ఉరిమి దాని మీద పడ్డాట్ట.

మిరపకాయలు, పేలాలు కాచుకునే ఓటికుండకు విలువ ఏమి ?

అది కాపోతే ఇంకోటి. అంతేగా!

అలాటి మంగలమ్మీద ఉరుము పడితే ఏమి, బరువు పడితేనేమి.

పోయేది ఉత్త ఓటికుండేగా? అంతకుమించి పోయేదేమీ లేదు.

అద్దానికోసం ఉరుముకున్న బలం అంతా నష్టమయ్యిందని చెప్పటమన్నమాట.

సరే చట్టినొదిలి చిల్లపెంకు దగ్గరకొద్దాం.

దీన్ని గురించి ధూర్జటి కాలంలోనే ప్రస్తావన ఉన్నది.

“ఎంగిలి మంగలంబులగు దొప్పల్ రా గతంబేమి?” అని తిన్నడి కతలో చెప్పిస్తాడు ధూర్జటిగారు.

ధూర్జటంత ఆయనచేత పద్యాల్లో ఇరికించబడే విలువ కూడా వున్నది మంగలానికి.

సరే అదలా పక్కనబెడితే, రాకుమారి మీద కోపం సునంద మీదకు తిరగటం అందరికీ అనుభూతికి వస్తోంది.

మరి ఆవిడ అలా అందరినీ కాదనుకుని వెళ్లిపోతే ఎట్లా ?

దాటిపోయిన ఒక్క రాజకుమారుడి ఛస్, ఎంత అవమానం అనుకుంటో చెయ్యి కత్తి మీదకు వెళ్ళిపోతోంది.

అలా వెళ్ళిపోయి వెళ్ళిపోయి వెయ్యిస్థంభాల్లా నుంచొన్న రాకుమారులనందరినీ వద్దనుకొని ఇక చివరివాడి దగ్గరకొచ్చింది.

ఆ చివరాయన ఎవరో కాదయ్యా!

మహావీరుడు, నాన్నగారి ఆజ్ఞ మీద నర్మదను దాటి వచ్చేసిన సుందరుడు మన అజుడు.

ఈయన మంటపానికి వచ్చేప్పటికి సొల్లు కార్చుకుంటూ ముందే వచ్చేసి ముందు సీట్లాక్రమించుకున్న రాకుమారులతో నిండిపోటంతో ఈయన సివరాఖరికి నుంచున్నాడు.

ఆయన్ని చూసి ముందు సునందకు కళ్ళు తిరిగినయ్.

సంభాళించుకున్నది. ఆతర్వాత అమ్మాయి గారి చెయ్యి సుతారంగా నొక్కింది.

అంతే అమ్మాయిగారికి అర్థమైపోయింది. నాకు నచ్చిందేదో దీనికి దొరికింది అని తల పైకెత్తింది.

అంతే! సునంద నోటినుంచి మాట కూడ రాకముందే, ఈవిడ చేతిలో మాల మనవాడి మెళ్ళో పడిపోయింది.

“లలాటలేఖానపున:ప్రయాతి” అని ప్రమాణవాక్యం.

దాన్ని అధిగమించేది ఈ భూప్రపంచకంలోనే లేదు.

ఏ శక్తీ దాన్నడ్డగించలేదు.

ఏ శక్తి దాన్నోడించలేదు.

సాక్షాత్ పరమేశ్వర ప్రసాదం.

ఈ లోకానికి ఆ దేవదేవుడు ప్రసాదించిన వరం.

ఆయన ఆ పనికి బ్రహ్మను నియోగించినాడు.

అంత శక్తిమంతం.

అందరి కళ్ళూ అటువైపు తిరిగినాయ్.

కొంత మంది కళ్ళల్లో చింతనిప్పులు.

కొంతమంది కళ్ళల్లో భాష్పపరిపూర్ణలోచనం.

కొంతమంది కళ్ళల్లో ఆశ్చర్యజనకం.

కొంతమంది కళ్ళల్లో విభ్రమం.

అలా నవరసాలు కురిసినాయ్ ఆ సభలో.

ఆ స్వయంవర మంటపంలో.

అజుడిని అంతవరకూ చూడనివారు, నగరప్రజలు ఆయన సౌందర్యానికి ముగ్ధులైపోయినారు.

త్రిలోక మోహినికి జగదేకసుందర వీరుడు దొరికినాడని జేజేలు పలికినారు.

మాల పడటమేమి ? కల్యాణమగుటమేమి ? అన్నీ వరసాగ్గా జరిగిపోయినాయ్.

అమ్మాయీమణివారికి చీరలు, సారెలు, నగలు, మణిమాణిక్యాలు, రతంఖచితాలు, ఏనుగులు, అంబారీలు – అబ్బో ఒకటా రెండా అన్ని ఇచ్చి అజుడి వెంట పంపించారు.

అప్పుడు జరిగిందయ్యా ఒక సంఘటన.

జరిగిన సంఘటనకు కారణం మత్సరం.

మత్సరం అంటే అసూయ.

తనకులేనిది వాడికున్నదేనని అసూయ.

తను చేజిక్కించుకోలేనిది వాడి పరం అయ్యిందేనన్న అసూయ.

పెళ్ళి అయ్యేంతవరకూ మౌనంగా వున్నవారు, అజుడు అమ్మాయిని, భార్యను తోడ్కునిపోతుంటే ప్రయాణం పెటాకులు చేద్దామని నిశ్చయించుకొనినారు.

దానికంతటికీ కారణం మత్సరం.

మానవుడికి బయటి శత్రువుల పీడ ఉన్నా లేకున్నా, అంత:శ్శత్రువుల పీడ తప్పక ఉంటుంది.

వాటికి అరిషడ్వర్గాలని పేరు.

అవే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు.

మాత్సర్యం అన్నిటికన్నా చివరిది.

అన్నిటికన్నా చివరిదానికి పవరెక్కువ.

అసలు కన్నా కొసరెక్కువ కదా, అలాగన్నమాట.

మాత్సర్యంతో ఉడికిపోయేవాడికి విచక్షణ వుండదు.

మునిపల్లె సుబ్రహ్మణ్య కవిగారు తన ఆధ్యాత్మ రామయణ కీర్తనల్లో చెప్పిస్తారు

పావనులై యీ క్రమ మెఱిగిన మ, ద్భక్తులు మత్సరము జెందుదు
రీ వసుధను భక్తివిహీనులుగ, గర్హితులై దుర్మతులై
కేవలమును శాస్త్రగర్తములబడి, కెరలిభవశతములు, నొందుచు
భావము చెడి సుజ్ఞానదూరులయి, పోవుట నిశ్చయము…..

అలాగే త్యాగరాజులవారు తెర తీయగ రాదాలో ఈ విధంగా అనిపిస్తారు.

తెర తీయగ రాదా లోని
తిరుపతి వేంకట రమణ మత్సరమను (తెర)
పరమ పురుష ధర్మాది మోక్షముల
పార-దోలుచున్నది నా లోని (తెర)

సరే అదలా పక్కనబెట్టి అసూయాగ్రస్తులైన రాజకుమారుల దగ్గరకొద్దాం.

పెటాకులు చేసి అమ్మాయీమణిని తీసుకొని పోవాలని వారి ప్లాను.

అలాటి ప్లానులు ఆ కాలంలో సర్వసాధారణం.

అయితే పెటాకులకు విస్తరాకులకు భయపడే వీరులా మన సైన్యం ?

ఆ సైన్యానికి నాయకుడెవరు ? అజుడు! మహావీరుడు. వీరాధివీరుడు.

చుట్టుముట్తారు. నాదాలు, నినాదాలు అవీ వినపడుతున్నాయ్.

రథాల పరుగుల చప్పుడు.

దుమ్ము రేగిపోతోంది.

ఆకాశమంతా దుమ్ముతో కప్పబడిపొయ్యింది.

ఎర్రగా జేగురు రంగు.

సూర్యుడు అస్తమించే సమయం కావొస్తోంది కూడాను.

ఇదంతా చూసి ఇక సమయం వ్యర్థం ఎందుకు చక్కగా సూర్యుడు పొద్దుగుంకేలోపల అటో ఇటో తేల్చేద్దాం అని రంగంలోకి దిగిపోయాడు మనవాడు.

అలాగ్గా శత్రుసేనల్ని చెండాడేస్తున్నాడు.

విల్లు పట్టుకుంటే తిరుగే లేదని చెప్పుకున్నాంగా!

ఆ విల్లు పట్టుకుని రణరంగంలో నుంచుంటే ఎట్లా వున్నాడయ్యా అంటే వందమంది కోదండధారుల సమానంగా వెయ్యి దిక్కులనుంచి లక్షల బాణాలు విసిరే తేజంతో వున్నాడు.

అయితే అవతలి కలగాపులగ సైన్యం తక్కువదేమీ కాదు.

అజుడి రథాశ్వాలపై నాలుగొందల బాణాలు.

రథసారథిపై ఆరొందల బాణాలు.

ధ్వజం మీద యాభై, అజుడిపై అరవైవందల బాణాలు వేసారు.

వాటినన్నింటినీ ఎడమచేత్తో గాల్లోనే ఖండించి అవతల పారేసాడు మన వాడు.

ఆ తర్వాత ఉగ్రరూపం దాల్చాడు.

అంతే ఆకాశం ఫెటిల్లుమని పగిలింది.

అమ్ములతో నిండిపోయింది.

వాళ్ళందరి శిరస్సుల మీద, లలాటాల మీద, మెడల మీద, బాహువులమీద, వక్షస్థలాల మీద ఉరుములు పిడుగులు పడ్డట్లుగా బాణాలు కురిపించే సరికి భీతిల్లిపోయి పరుగులు పెట్టారు

అందరూ కకావికలు. పరుగులు. ఉరకలు.

రక్తాలు. గాయాలు. శరీరాలు.

అటూ ఇటూ కేకలు.

రక్షించు రక్షించుమని కేకలు.

వీరుడు ఒకసారి శత్రువు మీద విల్లు ఎత్తాడంటే దించటం సామాన్యం కాదు.

కానీ ఎప్పుడైతే రక్షించండి అని వినపడిందో అప్పుడు విల్లు దించేసాడు.

బాణాల శరపరంపర ఆపేశాడు.

అవతలి సైన్యం కాస్త కోలుకుంది.

ఆహా ! ఇంత వీరుణ్ణి చిరకాలానికి చూసాం అని ఒకడు

ఓహో ఏమా బాహుబలం ఏమా ఆకారం అని ఇంకొకడు

యువరాజుగా ఉన్నప్పుడే చక్రవర్తిలా వున్నాడు, చక్రవర్తయ్యాక ఎట్లా వుంటాడో అని ఒకడు.

ఇన్ని యుద్ధాలు, ఇంతమందితో చేసాం కానీ, ఇంత వీరుణ్ణి ఎక్కడా చూడలేదయ్యోయ్ అని ఒకడు.

ఇలా అవతలి పక్క సైన్యంలో మాటలు వినిపిస్తున్నాయ్.

ఇంతలో ఇదే అదను అనుకొని విశ్రవసుడనేవాడు ఆ వెయ్యిస్థంభాల్లా నుంచొనున్న రాకుమారుల్లో నాలుగొందల స్థంభాలను తీస్కొని ఒక్కుమ్మడిగా మీద పడ్డాడు.

అజుడి చెయ్యి అమ్ములపొదిలోకి వెళ్ళింది.

చేతికి సమ్మోహనాస్త్రం తగిలింది.

దాని సంగతే మరచిపోయినాడు ఆయన.

ఇలాటి ఆపత్సమయంలో ఉపయోగానికొచ్చేందుకే చేతికి తగిలిందిలే అనుకొని దాన్ని సంధించాడు.

అంతే సమ్మోహనం గాసు రావటం, ఆ నాలుగొందల రాకుమారులు, వాళ్ల సైన్యం అంతా మూర్చ పోవటం జరిగిపోయింది.

అంతమంది అలా శలభాల్లా పడిపోవటం చూసి, మిగిలినవారు కూడా కింద పడిపోయారు దణ్ణాలు పెడుతూ

అలా విజయం ఆ వీరుణ్ణి వరించింది

సరే, ఈ పెళ్ళి సంగతులు అవీ రఘు మహారాజుకు చేరిపోయినాయ్

పెళ్ళి సంగతి చెప్పినవారు యుద్ధం సంగతి కూడా చెప్పారు

అందరు తండ్రుల్లా ఆయన, ఆ రఘు మహారాజు ఖంగారు పడలా

అన్నాడు, ఈ పాటి యుద్ధాలు ఇంకో వంద చేసి, గెలిచి ఇంటికొస్తాడు మావాడు అని మీసమ్మెలేసి చెప్పాడు

అంత నమ్మకం పిల్లలంటే ఆ రోజుల్లో

పిల్లలూ ఆ పెద్దల నమ్మకాలను వమ్ము చేయకుండా నూటికి వెయ్యి సాటం ప్రయత్నిచేవారు ఈ జమానా వారిలా కాకుండా

కోడలు వచ్చేసింది ఇంటికి

కనీవినీ ఎరగని రీతిలో ఉత్సవాలు జరిపినాడాయన

సాక్షాత్ మహాలక్ష్మే ఇంటికొచ్చేసింది అన్నంత ఇదిగా జరిగిపోయినాయ్ ఆ ఉత్సవాలు

కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇక సమయం వచ్చింది పెద్దాయనకు

ఏం సమయం ?

రిటైరుమెంటు సమయం

అదేనండీ వానప్రస్థ సమయం

చక్కగా తపాలు, జపాలు చేసుకుంటూ శేష జీవితం గడుపుతానని చెప్పి రాజ్యాన్ని అజుడి చేతిలో పెట్టి వెళ్ళిపోయినాడాయన

ఈ వానప్రస్థం గురించి భాగవతంలో ఒక మాంచి పద్యం ఉన్నది

దృష్టిపూతం న్యసేత్పాదం వస్త్రపూతం పిబేజ్జలం
సత్యపూతాం వదేద్వాచం మనఃపూతం సమాచరేత్ – 16

(శ్రీమద్భాగవతం 11-18-16)

అలా చక్కగా, సౌఖ్యంగా గడపాలని రూలు

వయసొచ్చాక అంతకన్నా కావలసిందేముంది ?

అందువల్లా ఆయన శేష జీవితం చక్కగా గడిచిపోయింది

ఆ పైన అజుడు ఎన్నో ఏళ్ళు పెద్దాయన బాటలోనే రాజ్యాన్ని పరిపాలిస్తూ గడిపాడు

అరివీర భయంకరుడు దశరథుణ్ణి కన్నాడు

ఆ తర్వాత ఆయన కథ, రాములవారి కథ మనకు తెలిసిందే!

బతికితే అజుడిలా, వీలైతే ఇంకా బ్రహ్మాండంగా రఘు మహారాజులా బతకాలి

ధర్మంగా బతకాలి, వీరత్వంతో బతకాలి, జనరంజకంగా బతకాలి, పరిపాలనాదక్షుడిగా బతకాలి, మనిషిగా బతకాలి, మానవత్వంతో బతకాలి

ఇంతకీ అజుడి భార్య పేరేమిటో తెలుసునా ?

ఏ సుకుమారి కోసం ఇంత కథ జరిగిందో తెలుసునా?

ఏ సౌందర్యరాశి కోసం ఈ కథ జరిగిందో తెలుసునా?

ఆవిడే ఇందుమతీదేవి

ఈ కథను కాళిదాసు ఎంతందంగా వర్ణిస్తాడని?

అందుకు కాదు ఆ కథలు, ఆ ఇతిహాసాలు మనలో నిలిచిపోయింది

అవును అందుకే!

*

కవిత పూర్తికాలేదు

 

-సుపర్ణ మహి
~

 
చలిగాలేదో పేరు పెట్టి
మరీ పిలిచినట్లనిపించింది…
 

రాస్తున్న పుస్తకంలోంచి
తల వాగువైఫుకు తిప్పి చూసాను…
కొలనులో స్నానిస్తున్న చందమామ
అప్పటికే నావైపు చూస్తుండటం కనిపించింది…
 

ఏరోజున ఏం పోగొట్టుకున్నాయో
పగళ్ళంతా వొదిలేసి ఈ మిణుగురులు రోజూ రాత్రిలో వెతుకుతుంటాయి
 

పొద్దున్న కనిపించిన సీతాకోకచిలుక
ఇప్పుడెక్కడుందో,
ఉదయం సరిగా గమనించలేదు
ఇప్పుడు మళ్ళీ వొస్తే బావుండనిపిస్తుంది
 

దూరంగా ఎక్కడనుంచో విన్నపాటే,
అవును బాగా తెల్సిన పాటే,
 

కాసేపు కొలను దగ్గర్నుంచి నన్ను మాయంచేసింది
 

అదెంత చక్కని పాటో!
‘కాలం’ ఓ పేరు చెప్పని ప్రేయసి,
అనుభవం మిగల్చని అనుభూతి
 

ఆలోచిస్తుండగానే బాగా చీకటి ముసిరేసింది.
ప్చ్…
ఇవ్వాళ కూడా
 
కవిత పూర్తికాలేదు.*

ఇల్లంతా..

 

 

-పాలపర్తి జ్యోతిష్మతి
~

ఇల్లంతా గందరగోళంగా ఉంది
నిద్ర కుపక్రమించినప్పుడు వెలిగించుకున్న చిన్న దీపాలు
పగలంతా వెలుగుతూనే ఉన్నాయి
రాత్రంతా కప్పుకున్న దుప్పట్లు
మడతలకు నోచుకోక గుట్టలుగా పడి ఉన్నాయి
ఎవరూ లేకపోయినా
గదుల్లో ఫాన్లు తిరుగుతూనే ఉన్నాయి
ఖాళీ కాఫీగ్లాసులు
ఎక్కడివక్కడే దొర్లుతున్నాయి
విడిచిన బట్టలు అస్తవ్యస్తంగా
దండాలమీద వేళ్ళాడుతున్నాయి
తడితువ్వాళ్ళు ఆరేసే నాథుడికోసం
కుప్పలు కుప్పలుగా ఎదురుచూస్తున్నాయి
వార్తాపత్రికల కాగితాలు
చిందరవందరగా నేలమీద పొర్లుతున్నాయి
భోజనాల బల్లమీది ఎంగిలి మెతుకులు
తీసి అవతల పారేసేవాళ్ళు లేక ఎండిపోతున్నాయి
స్నానాలగదిలో పూర్తిగా కట్టకుండా వదిలేసిన కుళాయిలోంచి
నీళ్ళు రోజంతా కారిపోతూనే ఉన్నాయి
ఇల్లాంతా గందరగోళంగా ఉంది
జ్వరమొచ్చి అమ్మ పడకేసినవేళ
ఇల్లంతా ఎట్లా ఉంటే మాత్రం ఏం?

*

విజాతి మనుషులు 

 

                                                                                          

                                                                    – రామా చంద్రమౌళి

 

Ramachandramouli“అసలు అందం అంటే ఏమిటి శివరావ్ “.. అంది మనోరమ ఆరోజు రాత్రి..తమ పెళ్ళై అప్పటికి ఒక పదిరోజులైందో లేదో.  అంతే.

కొత్తగా.. హైదరాబాద్లో.. కిరాయి అపార్ట్ మెంట్ లో కాపురం పెట్టిన తొలి దినాలు. శీతాకాలం రాత్రి.. పదిగంటలు.. డిసెంబర్ నెల.. సన్నగా చలి.. కిటికీలోనుండి చూస్తే.. అప్పుడప్పుడే మంచుదుప్పటి కప్పుకుంటున్న నగరం.. దూరంగా నిప్పుల కణికల్లా కరెంట్ దీపాల కుప్పలు..మిణుకు మిణుకు.

అప్పుడు మనోరమ తను రీసర్చ్ స్కాలర్ గా పని చేస్తున్న సిసిఎంబి నుండి ఒక గంటక్రితమే వచ్చి..వంట చేసి..ఇద్దరూ తిన్న తర్వాత..యధాలాపంగా పక్కను సర్దుతూ..దుప్పటిని సరిచేస్తూ.,

శివరావు..డాక్టరేట్ పూర్తి చేసి..ఉస్మానియా లో కొత్తగా లెక్చరర్ గా చేరి..ఒక ఏడాది.,

శివరావు..కిటికీలో నుండి బయటికి..వెన్నెలనిండిన నిర్మలాకాశంలోకి చూస్తూన్నాడు.శివరావుకు ప్రతిరోజూ కనీసం ఓ  ఐదారుసార్లన్నా ఊర్కే అలా ఆకాశంలోకి చూడ్డం అలవాటు. అతనికి ఆకాశంలోకి చూస్తున్నప్పుడల్లా సముద్రంలోకి చూస్తున్నట్టో.. తన ఆత్మలోకి తనే తొంగి చూసుకుంటున్నట్టో..మనిషికి యుగయుగాలుగా ఈనాటికీ అర్థంకాని ఏదో ఒక మహా రహస్యాన్ని చిన్నపిల్లాడిలా గమనిస్తున్నట్టో అనిపిస్తుంది.నిజానికి ఆకాశం.. అంతరిక్షం  మనిషి పుట్టిన నాటినుండీ ఇంతవరకూ ఎవరికీ అర్థంకాని ఒక ప్రశ్న.

“నువ్వు చెప్పు” అన్నాడు శివరావు.

“అందమంటే..ఒక విద్యుత్ తీగలో బయటికి కనబడకుండా ప్రవహిస్తూ మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే కరంట్ వంటిది..వెలిగిస్తుంది..కాలుస్తుంది..షాక్ ఇస్తుంది..గిలిగింతలు పెడుతుంది” అంది అలా పక్కపై వాలిపోటూ..శివరావువంక అభావంగానే చూస్తూ.

శివరావు మాట్లాడలేదు.. కొద్దిసేపు మౌనం తర్వాత కిటికీలోనుండి నిద్రకుపక్రమిస్తున్న నగరాన్ని చూస్తూనే.. వెనుకున్న మనోరమ దిక్కు చూడకుండానే అన్నాడు..” మనోరమా..అందమంటే..ఎప్పటికైనా తప్పకుండా నశించిపోయేది అని అర్థం..” అని.

మనోరమ షాక్ ఐంది. ఆమె అతని నుండి అలాంటి సమాధానాన్ని ఊహించలేదు. నిజానికి మనోరమది మగవాణ్ణి పిచ్చివాన్ని చేయగల అత్యంత ఆకర్షణీయమైన శరీర సౌందర్యం. ఆమె వెన్నెల విగ్రహంలా ఉంటుంది. ఆమెకు వీలుచిక్కినప్పుడల్లా తననుతానే అద్దంలో చూసుకుని మురిసిపోవడం అలవాటు. తన అందాన్ని తన ప్రాణకన్నా మిన్నగా.. జాగ్రత్తగా.. పదిలంగా చూచుకోవడం.. అందాన్ని దాచుకోవడం ఇష్టం.

శివరావుకూడా చాలా అందంగా, ఆకర్షణీయంగా.. గ్రీక్ యోధునిలా ఉంటాడు. ఆరడుగులపైబడ్డ ఎత్తు అతనిది. నిజానికి మనోరమ అతని అందాన్ని చూచే పెళ్ళి చేసుకుంది. అతని అద్భుతమైన మేధా సంపత్తినిగానీ.. మానవీయ పరిమళంతో నిండిన అతని ఆదర్శ భావాలనుగానీ.. సమున్నతమైన అతని వ్యక్తిత్వాన్నిగానీ  ఆమె ఏనాడూ గమనించలేదు.

ఒకే ట్రాక్ పై పయనిస్తున్న రెండు రైళ్ళు ఒక జంక్షన్ నుండి రెండు భిన్న దిశల్లోకి మారుతున్న దృశ్యం ఎందుకో ఆమె కళ్ళలో మెరిసింది చటుక్కున.

ఇద్దరి మధ్యా భిన్నత. ఆలోచనల్లో.. అభిరుచుల్లో.. ఆకాంక్షల్లో.. లక్ష్యాల్లో.. జీవితం గురించిన భావనలో.

ఆమె ఊహించని రీతిలో శివరావన్నాడు.. “మనోరమా.. నువ్వడిగిన భౌతికమైన అందం గురించి చెప్పాను నేను.. ఆ అందం గురించయితే నేను చెప్పిందే పరమ సత్యం. కొద్దిగా వాస్తవిక దృష్టితో చూస్తే నీకే తెలుస్తుందది. ఐతే.. ఎప్పటికీ వాడిపోనిదీ.. శాశ్వతమై నిలిచేదీ.. పైగా రోజురోజుకూ ఇంకా ఇంకా భాసించే అందం ఒకటుంది..” అంటూండగానే,

ఆమె అంది ..” అది హృదయ సౌందర్యం కదా.. అంతా ట్రాష్.. ఒట్టి చెత్త.ఎంజాయ్ ద బ్యూటీ ఫరెవర్.. యవ్వనాన్నీ.. అందాన్నీ.. పరమ సుఖాలనూ అనుభవించలేనివాళ్ళు చెప్పే చెత్త మాటలివన్నీ.. ఐ హేట్ ఆల్ దిస్ నాన్సెన్స్ ” అంది ఉక్రోషంగా. అని మంచంపై అటువేపు తిరిగి పడుకుంది .. మూతి ముడుచుకుని.

“మనుషులకు అందమైన శరీరాలతోపాటు దేవుడు అందమైన మనస్సునూ బుద్దినీ ఇస్తే బాగుండేది.. కాని అలా ఉండదు  సృష్టిలో.. చాలామంది అందమైన మనుషులకు వికారమైన మనస్సుంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.. తెలుసా. మనిషికి ఏదైనా శారీరక జబ్బు చేస్తే సరిచేసుకోడానికి డాక్టర్ల దగ్గరికెళ్ళి చికిత్స చేయించుకుంటాం.ఎందుకంటే ఆ డిజార్డర్ మనకు వెంటనే తెలుస్తుంది కాబట్టి..అసౌకర్యంగా కూడా ఉంటుంది కాబట్టి.కాని మనిషి మనస్సుకు జబ్బు చేస్తే మనకు వెంటనే తెలియదు.దానికి చికిత్స చేయించుకుని మనస్సును ఆరోగ్యవంతం చేసుకోవాలనికూడా మనం అనుకోము. మానవీయ లక్షణాలతో తనను తానూ.. చుట్టూ ఉన్న సమాజ  సంక్షేమాన్నీ.. సాటి మనుషుల పట్ల సహానుభూతినీ.. కొంత త్యాగాన్నీ అలవర్చుకోని మనస్తత్వం రుజగ్రస్తమైనట్టు లెక్క.”

“ఆపండిక లెక్చర్ ఇక..నిద్రస్తోంది నాకు” దుప్పటికప్పుకుంది తలపైదాకా చిటపటలాడ్తూ..గదినిండా మల్లెపూల పరిమళం.

ఆ పరిమళాన్ని ఆస్వాదించే ఆసక్తీ.. యవ్వన జ్వలన.. అన్నీ శివరావుకు ఉన్నాయి.. వెళ్ళి మంచంపై కూర్చుంటూ .,

తర్వాత్తర్వాత.,

ఈ యేడాది కాపురంలో . . అభిరుచుల వైరుధ్యాలతో. . భిన్నతలతో..విభిన్న తత్వాలతో..ఏదో ఎక్కడో.. బీటలు వారుతున్నట్టు ..చీలిక ఏర్పడుతున్నట్టు.. రేఖలు రేఖలుగా విడిపోతున్నట్టు .. తాడుపురులువిప్పుకుపోతున్నట్టు .. తెలుస్తోంది ఇద్దరికీ.,

నిజానికి.. ఈ భిన్నత ప్రతి భార్యాభర్తల విషయంగా.. పెళ్ళైన కొత్తలో ఎవరికి వారికి అనుభవంలోకి వచ్చేదే.

పెళ్ళికి ముందు.. పెళ్ళి చూపుల హాస్యపూరిత తతంగంలో.. మనుషులు చూడగలిగేది ఏమిటి.. ఒట్టి శరీరాల ఆకృతినీ..రంగునూ.. చదువూ.. ఉద్యోగం.. ఆర్థిక నేపథ్యం.. వీటినేగదా. అసలైన మనస్సునూ.. హృదయాన్నీ.. తత్వాన్నీ అంచనా వేసే వీలు ఎక్కడ.? . . తీరా పెళ్ళి జరిగి.. కాపురం మొదలైన తర్వాత..ఆరంభమౌతుంది అసలు విషయం.. ఆమె ఆశించినదానికి భిన్నంగా  వీడు.. తాగుడు.. తిరుగుడు.. లంచాలు తీసుకునుడు.. స్నేహితులతో నానా బీభత్సమైన వ్యవహారాలు.. అవినీతి..అనైతికత..డబ్బుకోసం ఏదైనా చేయగల దుర్మార్గం..ఇవన్నీ,

ఈమె నేపథ్యానికీ..అభిరుచులకూ..ఏవైనా కళాత్మక అభిరుచులుంటే..గానమో..నృత్యమో..రచనో..సామాజిక సేవా గుణమో..ఉంటే..అంతా” నోర్ముయ్” కింద సమాధి.

అంతా రాజీ పడడాలు.. సర్దుకుపోవడాలు..పట్టు చీరలకింద.. కొన్ని నగల భారంకింద.. హూంకరింపులకింద.. అప్పుడప్పుడు.. దేహ హింసకింద.. బెదిరింపులకింద.. సమాధి ఐపోయి.,

‘ నా బతుకింతే. దేవుడు ఇంతే రాసిపెట్టాడు నా ఖర్మ.’  అని ఒక స్వయం ఓదార్పు.ఎవరికి వారూ..అటు భర్తా..ఇటు భార్యా.

ఒక్క కుదుపు కుదిపినట్టనిపించి.ఉలిక్కిపడి..కళ్ళు తెరిచి,

శివరావు ఈ లోకంలోకొచ్చాడు. తను పయనిస్తున్న రైలు ఎందుకో అకస్మాతుగా వేసిన బ్రేక్ తో కీచుమని ఆగినట్టుంది.

ఏదో స్టేషన్ ఔటర్ యార్డ్. కిటికీ ప్రక్కన కూర్చున్నవాడు తొంగి చూస్తే..చిక్కగా చీకటి.సిగ్నల్ క్లియరెన్స్ కోసం నిరీక్షణ.

ఎప్పటి జ్ఞాపకం ఇది..ఎప్పటిదో..ముప్పది ఏళ్ళనాటి ఘటన.

శివరావు మనసులో మనోరమ రూపం, జ్ఞాపకం కదిలి ఎందుకో ఒక వికారమైన అనుభూతి కలిగి.,పెళ్లయి.. రెండేళ్ళు గడిచి..ఒక పాప పుట్టిన తర్వాత..ఆమెకు తను పి హెచ్ డి చేసిన అదే సి సి ఎం బి లోపలే సైంటిస్ట్ ఉద్యోగం వచ్చి స్థిరపడిపోయింది.

ఇటు తను..తన సహజమైన ఆసక్తితో విప్లవ ఉద్యమాలు.. మానవ హక్కుల పోరాటాలు.. మారుమూల గిరిజన హక్కుల పరిరక్షణ కార్యక్రమాలు.. వీటిలో దాదాపు పూర్తి స్థాయిలో మమేకమై.,

తనకు ఉద్యోగం సెకండరీ..ఇప్పుడు ఈ దేశంలోని అనేకమంది దీనజనుల సముద్ధరణకై సకల ఐహిక సుఖాలను త్యాగం చేస్తూ దిక్కు మొక్కు లేని  జనానికి ప్రతిఘటననూ, ప్రశ్నించడాన్ని నేర్పడమే  ప్రైమరీ ఐన దశ..స్పృహ..యూనివర్సిటీకి అవసరాన్ని బట్టి చాలా సెలవులు పెడ్తూ.. జీతం కోతలతో కురుచైపోతూండగా.. దాదాపు తన జీతం ఎనభై వేలైతే ఏ ముప్పై వేలుకూడా చేతికి రాని పరిస్థితి. ఐనా ఏ ఒక్కనాడూ డబ్బు గురించీ , రాబడి గురించీ  ఆలోచించింది లేదు. డబ్బుతో తనకు అంత పెద్దగా అవసరాలూ లేవు. అతి నిరాడంబరమైన జీవితం తనది. అంతా రెండు మూదు అంగీలు..రెండు ప్యాంట్ లు..భుజానికి ఒక బట్ట సంచీ..కాళ్లకు ఒక స్లిప్పర్ల జత.

జీవితమంతా.. గణితం..చిన్నప్పుడు ప్రాథమిక గణితం..తర్వాత ఉన్నత గణితం…కాలేజ్ లో హయ్యర్ ఇంజనీరింగ్ గణితం..అటు తర్వాత అడ్వాన్స డ్  గణితం.. లాప్లాస్ ట్రాన్స్ ఫార్మేషన్స్.. ఫ్యూరియర్ సీరీస్.. టైం థియరీ.. చివరికి ప్యూర్ మాథమేటిక్స్.. శుద్ధ గణితం..విశుద్ధ గణితం..ఒకటి బై సున్నా .. సున్నా బై ఒకటి ల మీమాంస.. అంత అనంతాలగురించిన  చింతన. అనంత ఆకాశాన్నీ.. అనంతానంత అంతరిక్షాన్నీ..దిగంతాల అవతల ఉన్న శూన్యం గురించీ.. ఏమీలేనట్టే అనిపిస్తూ.. అన్నీ ఉన్న అభేద్య రహస్యాన్నీ తెలుసుకుంటూనే.. ఈ మనుషులు ఎందుకిలా జాతులు జాతులుగా.. బీదలు ధనికులుగా.. కులాలు కులాలుగా.. మతాలు మతాలుగా.. విభజింపబడి.. భాగింపబడి.. విచ్ఛిన్నపర్చబడి.,

చివరికి అన్ని గణితాలనూ పరిత్యజిస్తూ.. జీవిత గణితం గురించిన విపులాధ్యయనం.

అడవుల్లోకి పయనం.. అడవుల్లో అన్వేషణ.. అడవుల్లో అల్లాడుతున్న లక్షల మంది నిరక్షరాస్య జన దుఃఖ మూలాలను తెలుసుకునే వెదుకులాట.

గిరిజనులు సుఖంగా లేరు. వాళ్లకు కనీస సౌకర్యాలు లేవు..అని ఈ చిత్తశుద్ధిలేని ప్రభుత్వాలు చెబుతూ.. ఊదరకొడ్తూ..వాళ్ళ  ఉద్ధరణ పేరు మీద గత అనేక దశాబ్దాలుగా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్న ప్రభుత్వ అధికారులు.. రాజకీయ నాయకులు.. మధ్య దళారులు.. ‘ ప్రకృతిలో లీనమై,భాగమై జీవించే మేము సుఖంగానే ఉన్నాము. మమ్మల్ని మా మానాన విడిచి పెట్టండి మహాప్రభో ‘ అని మొత్తుకుంటూంటే వినకుండా వాళ్ల జీవితాల్లోకి దుర్మార్గంగా ప్రవేశిస్తూ.. కాంట్రాక్టర్ లు.. బహుళజాతి కంపనీలూ.. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ ధనిక వర్గపు ప్రయోజనాలకోసం విద్యుత్ ప్రాజెక్ట్ లు.. మైనింగ్ తవ్వకాలు.. అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా ఖనిజ నిక్షేపాల  తరలింపు.. గ్రానైట్ ఎగుమతుల పేరుతో గుట్టలకు గుట్టల విధ్వంసం.. అంతా బీభత్స భయానకం.

ఇదంతా.. ఈ నగరాల.. ఈ స్మార్ట్ సిటీల  మాయజలతారు మెరుపుల అవతల అడవుల్లో మరో అనాగరిక లోకంగా ఈ దేశంలోనే వర్థిల్లుతున్న  మరో చీకటి ప్రపంచపు ఆర్తనాద ధ్వని.

లోతుగా.. ఇంకా ఇంకా లోతుగా ఈ గుప్త.. అజ్ఞాత విధ్వంసక జీవన బీభత్సాలను అధ్యయనం చేస్తున్నకొద్దీ అన్నీ గాయాలే.. రక్తాలోడే గాయాలు.

అసలు ఈ స్థితికి  నిష్కృతీ .. వీళ్ళుకు చేయూతా.. ఈ సమస్యలకు పరిష్కారం. . ఏమిటి.

చదువు.. జ్ఞానం.. తమను తాము తెలుసుకోగలిగి ఎదుటి మనుషులు చేస్తున్న మోసాలను పసిగట్టగలిగే స్పృహ.. లోకంపోకడగురించిన ఎరుక.. ఇవి వాళ్ళలో పాదుకొల్పాల్సిన బీజాలు.  ఎవరు చేయాలి ఈ పనులు.. నాలాంటి వాళ్లం కాక.

మెల్ల మెల్లగా ‘మానవ చైతన్య వేదిక ‘ తో అనుసంధానమై.. అటువేపు జరుగుతున్నకొద్దీ,

ఒక రోజు.,

అప్పటికే సి సి ఎం బి నుండి ఒక ప్రత్యేకమైన డెవలప్ మెంట్ ప్రోగ్రాం కింద మూడేళ్ళ పోస్ట్ డాక్టోరల్ కోర్స్ ను పూర్తి చేసేందుకు పాప నిర్మల ను తన వెంట తీసుకుని అమెరికా వెళ్ళిన మనోరమ..అకస్మాత్తుగా తను వెళ్ళిన ఓ ఏడాది తర్వాత ఒక ఈ-మెయిల్ పెట్టింది..” శివరావ్..సారీ..ఐ యాం నో మోర్ ఇన్ లవ్ విత్ యు..నేను నీనుండి విడిపోతూ విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను. బహుశా నేనిక తిరిగి ఇండియాకు రాక పోవచ్చు. శాశ్వతంగా నేను ఇక్కడే స్థిరపడాలని నిశ్చయించుకున్నాను. పాపకూడా నాతోనే ఉంటుంది. నువ్వు ఎప్పుడూ అంటూంటావు కదా.. మన అభిరుచులూ.. ఆలోచనలూ.. లక్ష్యాలూ.. తత్వాలూ ఒకటికావని. అది నిజమే.. ఎంత చేసినా ఇనుముతో  రాగీ.. ఇత్తడీ అతకవు. రెండు పదార్థాలు సమగ్రంగా కలిసిపోవాలంటే.. హోమోజినిటీ.. ఏక రూపత కావాలి. కాని అవి మన మధ్య లేవు.

నాలాంటి వాళ్లం సామాన్యులం..  అంటే అందరిలా సకల వ్యామోహాలకూ క్షణక్షణం లొంగిపోతూ.. భౌతిక వాంఛలకోసం పరితపిస్తూ.. అంతిమంగా కోటిలో ఒకరమై ఏ ప్రత్యేకతా లేకుండా అనామకంగా చచ్చిపోతాం. నువ్వలాకాదు. నీకు నీ జీవిత లక్ష్యం స్పష్టంగా తెలుసు.. నీ దారి.. గమనం.. గమ్యం.. నడక అన్నీ నువ్వు ఉద్దేశ్యించుకున్నట్టుగానే నీ ముందు పరుచుకుని ఉంటాయి. ఒకరంగా చెప్పాలంటే  నువ్వొక ఋషివి.

నువ్వు సరే అంటే ఇక్కడి ఒక లాయర్ ద్వారా మన విడాకుల పత్రం పంపుతాను కొరియర్ లో. నువ్వు సంతకం చేసి తిరిగి పంపు.

లేకుంటే కోర్ట్ ద్వారా తీసుకుందామన్నా నేను సిద్ధమే.

కాని.. నువ్వు నేను పంపదలుచుకున్న విడాకుల పత్రం పై సంతకం చేసి సహకరిస్తావనే నా అంచనా.. విశ్వాసం.

నీ విడాకుల అంగీకార పత్రం రాగానే ఇక్కడి ఒక అమెరికన్ మల్టీ బిలియనీర్ ను నేను పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను.

మన పాప నిర్మల బాగుంది. అప్పుడప్పుడు నిన్ను చాలా జ్ఞాపకం చేస్తూంటుంది.

 

– మనోరమ

 

ఆ మెయిల్ కు తను వెంటనే జవాబిస్తే.. అదే రోజు రాత్రి మనోరమ  తిరుగు మెయిల్ లో తన అడ్వకేట్ ద్వారా విడాకుల పత్రం పంపింది.. ఒకటి కొరియర్ లో కూడా.

నిట్టూర్చి.. మొత్తం తమ మూడున్నర సంవత్సరాల కాలం కాపురాన్ని ఒక్క క్షణం మననం చేసుకుని  సంతకం చేసి..కాగితాలను కొరియర్ చేసి.. తనను తాను విముక్తం చేసుకున్నాడు.. ఎందుకో ఆ క్షణం పాప నిర్మల జ్ఞాపకమొచ్చి.. ఒక కన్నీటి బొట్టు.

ఇక తను ఒంటరి. స్వేచ్ఛా జీవి. బంధాలన్నీ తెగిపోయాయి.

తర్వాత మిగిలింది .. ఉద్యోగం.. నెలకు లక్షా ఇరవై వేలొచ్చే అసిస్టెంట్ ప్రొఫెసర్ కొలువు.

ఆ డబ్బుతో తనకు అవసరమే లేదు. పైగా తను అనుకున్నట్టు నిరాడంబరంగా జీవించడానికి అదొక ప్రతిబంధకం.

రిజైన్ చేశాడు.

ప్రయాణం మొదలు .. పూర్తికాల ఉద్యమకారుడిక తను. అడవిలోకి ప్రస్థానం .  తపస్సు కాదుగాని.. ఆత్మావలోకనం. ఆత్మాన్వేషణ . . భవిష్యత్ రూపకల్పన.

ఎక్కడ మనుషులు తమ గొంతును వినిపించలేరో.. అక్కడ తను వాళ్ళ గొంతుకావాలి. ఎక్కడ ప్రజలు సంఘటిలుగా లేరో.. అక్కడకు తను చేరి గడ్డిపోచలతో బలమైన తాడును పేనినట్టు సంఘటితం చేయాలి. ఎక్కడ  బలవంతులు బలహీనులను దోపిడీ చేస్తున్నారో.. అక్కడ తను ప్రత్యక్షమై ‘జనానికి ‘ ప్రతిఘటన విద్యను నేర్పాలి.. ఇదీ.

మూడే పనులు..పొద్దంతా ప్రజల్లో ఒకడిగా పర్యటన..ఎవరు ఏమి పెడితే అదే తినుట.రాత్రంతా పుస్తకాలు చదువుట.. అడవిని చిన్న నిప్పురవ్వ పూర్తిగా దహించి నిశ్శేషం చేస్తుందనే సత్యాన్ని తెలియజేసే పుస్తకాలను రాయుట.వాటిని ఆయుధాలుగా దిక్కుమొక్కు లేని జనాల చేతులకు అందించుట.

అదే జరుగుతూ వస్తోంది .. గత ఇరవై ఎనిమిది సంవత్సరాలనుండి.

శివరావు పేరు ఇప్పుడు.. ఉద్యమ మిత్రులందరికీ శివం గా పరిచయం.

శివం అంటే.. మీడియాలో ఒక చైతన్య జ్వాల. ప్రభుత్వాలకూ.. వాళ్ల తాబేదార్లకూ..శివం సింహ స్వప్నం. కలలో మృత్యువు. ప్రజలకు అతను ఋషి.

ఒక రిపోర్ట్ పంపించాడు ప్రపంచ బ్యాంక్ కు.. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఎన్ని లక్షల కోట్ల రూపాయలను ఋణంగా తీసుకుంది.. ఇప్పుడు మళ్ళీ ఎన్ని లక్షల డబ్బును అప్పుగా అడుగుతోంది.. ఈ డబ్బును ఎలా నాయకులూ,ప్రభుత్వ అధికారులూ  పంచుకుని తినబోతున్నారు.. చివరికి ఈ ఋణాన్ని చెల్లించాల్సిన సామాన్య జనం పై  మనిషికి ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలఅప్పు.. ఇలా సాగింది.. మర్నాడు పత్రికల్లో.. ఈ లేఖ విడుదల. పెట్రోల్ బావి అంటుకున్నట్టు ప్రజల ప్రతిఘటన .. ప్రభుత్వ గూడుపుఠానీ బట్ట బయలు.

 

*                                                               *                                                                *

 

ఏడూ నలభై ఐదు.. కాని అప్పటికే.. రైలుఈ మొదటి స్టాప్ లోనే అరగంట లేట్.

ఈ దేశంలో ఎవడికీ  తన వృత్తిపట్ల ధర్మబద్ధమైన నిబద్దత లేదు.. పై వాడంటే భయమూ లేదు.నిర్లక్ష్యమూ.. ఉదాసీనతా.. ఉపేక్షలకు కొదువే లేదు. జనానికిప్పుడు కావాల్సింది క్రమశిక్షణతో కూడిన జవాబుదారీతనంతో నిండిన జీవన సంస్కృతి. కాని దాన్ని నేర్పే ప్రభుత్వాలు ఈ దేశంలో లేనే లేవు.

రైలు..బొంది వాగు.. రైల్వే గేట్.. క్రిష్ణా కాలనీ.. అండర్ బ్రిడ్జ్ .. వరంగల్లుచేరుతూండగా.. సిగ్నల్ లేదు. మళ్ళీ ఆపుడు రైల్ ను ఔటర్ యార్డ్ లో. ఉండీ ఉండీ చటుక్కున  కరంట్ పోయింది.. నగరమంతా చీకటి. మేఘాలు గర్జిస్తూ.. చెప్పా చేయకుండా.. గాలి దుమారం.. పెద్ద పెద్ద చినుకులతో వాన. ఒక్క క్షణంలో.. అంతా వాతావరణం తారుమారు.

పది నిముషాల తర్వాత.. మెల్లగా కొండ చిలువలా కదులుతూ.. పొడుగాటి రైలు.

వరంగల్ స్టేషన్ ప్లాట్ ఫాం  పైకి ప్రవేశిస్తూండగా.. కరెంట్ వచ్చింది భళ్ళున. జనం క్రిక్కిరిసి.. పరుగులు ఉరుకులు. అంతా హడావిడి.

శివరావు దిగాడు.. ఎస్ 10 బోగీ నుండి భుజాన సంచీతో. వరంగల్ లో రైలు నిలిచే సమయం రెండు నిముషాలే.

చూస్తూండగానే.. అనౌన్స్ మెంట్.. వర్షం ఒకవైపు కుండపోతగా.. రైలు కదుల్తోంది.. మెల్లగా,

అప్పుడు చూశాడు శివరావు.. తన ఎదురుగా ఎస్ 8 బోగీ దగ్గరనుండి ఒక చేతిలో సూట్ కేస్ తో.. మరో చేత్తో పట్టుకుని భుజంపై చిన్న పాపతో.. ఒక గర్భిణీ స్త్రీ.. పరుగెత్తుకుంటూ వస్తూండడం.. వర్షంలో.. రైలు వేగాన్ని అందుకుంటోంది.ఆమె వచ్చీ వచ్చీ.. ప్లాట్ ఫాం పై చటుక్కున బోర్లా పడింది దభేలున.. “ఆమ్మా..” అని దద్ధరిల్లేలా అరుస్తూ.ఆమె భుజం పైనున్న రెండేళ్ళ పాప ఎగిరి దూరంగా.. విరుచుకు పడింది.. కెవ్వున ఏడుస్తూ.. బోర్లా తూలిపడ్డ ఆమె తన గర్భంపై పడిపోయి.. క్షణాల్లో అపస్మారక స్థితి లోకి వెళ్తూ..శివరావు  పరుగెత్తాడు.. ఆమె  దగ్గరకు.. ఇంకొందరు సహ ప్రయాణీకులు కూడా.

“అయ్యా..ఈ ముండాకొడుకులు కోచ్ పొజిషన్ బోర్డ్ లు పెట్టరయ్యా.. రెండేండ్లయ్యింది.. ఎన్నిసార్లు చెప్పానో.. నాల్గు బోగీల అవతలినుండి  పరుగెత్తుకొస్తున్నా.. వీళ్ళ బాడ్ కౌ ఉద్యోగాలు పాడుగాను. అయ్యో నా గర్భం.. నా కొడుకు.. నా బిడ్డ”  అరుస్తూనే ఆమె  అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆమె నొసలు కూడా చిట్లి రక్తం కారుతోంది.

శివరావుకు అంతా అర్థమైంది .వరంగల్లంటే.. హెరిటేజ్ సిటీ.. అమృత్ సిటీ.. స్మార్ట్ సిటీ.. గ్రేటర్ వరంగల్లు హోదా.

రెండేళ్ల క్రితం రాత్రి ఇదే గోదావరిలో.. హైదరాబాద్ వెల్తూ.. తనుకూడా ప్లాట్ ఫాం పై కోచ్ పొజిషన్ డిస్ ప్లే లేక.. స్టేషన్ మాస్టర్ తో చాలా గొడవ పడ్డాడు.. వ్రాత పూర్వక కంప్లెయింట్ కూడా ఇచ్చాడు.. రెండేండ్ల కాలం గడిచినా.. ఇంకా అదే దరిద్రం. మొద్దు నిద్ర. పాలకులదీ.. అధికారులదీ.. ఛీ ఛీ.

పురమాయించి.. తోటి మనుషుల సహాయంతో.. ఆమెను స్టేషన్ మాస్టర్ గది దాకా మోసుకెళ్ళి.. చుట్టూ వందల మంది గుమికూడి.,

స్టేషన్ మాస్టర్ పరుగెత్తుకొచ్చాడు.. తాపీగా.. నత్తలా.

శివరావు.. తన మొబైల్ ఫోన్ తో.. చక చకా మాట్లాడాడు ఇద్దరితో.

” సర్.. రెండేళ్లయింది ఈ మహా నగరంలో.. ప్లాట్ ఫాంలపై.కోచ్ పొసిషన్ దిస్ ప్లే లేక. జనం ఎలా రెందు నిముషాలే ఆగే రైళ్ళ కోచ్ ను ఎలా వెదుక్కోవాలి.. పాపం ఉరికి ఉరికి ఈమె ఏమైందో చూడండి.. గర్భం  చితికి పోయింది.. ఈమె ప్రాణం ప్రమాదంలో ఉండి.. దీనికి మీరే బాధ్యులు.. ఈమే మీ కూతురైతే ఏం చేస్తారు మీరు.. మేమిప్పుదు మీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం ..మూడుసార్లు వరంగల్లుకు మీ జి ఎం వచ్చాడు  ఇన్స్ పెక్ షన్ కు.. మీరు ప్రజల సొమ్ము తింటూ.. మా ప్రాణాలనే తీస్తారా.. ” శివరావు గర్జిస్తున్నాడు. ఈ లోగా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది.. నలువైపుల నుండి కెమెరాలతో.. చిలికి చిలికి.. ప్లాట్ ఫాంపై.. నాల్గయిదు వందల మంది.. కేకలు.. నినాదాలు.. పడిపోయిన స్త్రీని ఆస్పత్రికి హుటాహుటిన తరలింపు.. ఒక యుద్ధ వాతావరణం.

పది నిముషాల్లోఅన్ని టి వి చానెళ్లలో.. ప్రసారం ..” వరంగల్లు రైల్వే ప్లాట్ ఫాం పై… ”

అందరూ కూర్చున్నారు నేలపై.. బైఠాయింపు.

కదలిక.. అత్యవసర కదలిక.. ఫోన్ల మీద ఫోన్లు.. ప్రజల సమీకరణ.. ప్రజా శక్తి నిర్మాణం.. బిగించిన పిడికిళ్ల నినదింపు.

వర్షం.. వర్షం.,

తెలతెల వారుతూండగా సికింద్రాబాద్ నుండి ఎ జి ఎం.. ఇతర అధికారుల హుటాహుటి ఆగమనం.

” రెండు రోజుల్లో కోచ్ పొజిషన్ డిస్ ప్లే చేయకుంటే.. ” అని లిఖిత పూర్వక హామీ.

సూర్యోదయమౌతూండగా.. స్టేషన్  బయటకు వస్తూ.. శివరావు.. వెంట వందల మంది జనం.

*                                                                        *                                                                    *

ఐదేళ్ల తర్వాత,

శంషాబాద్ ఏర్ పోర్ట్ నుండి రేడియో క్యాబ్ లో బయల్దేరి.. సి సి ఎం బి లో ఒక ముఖ్యమైన సర్టిఫికేట్  ను తీసుకుని పోయేందుకు..వీసా స్టాంపింగ్ కోసం.. రెండు రోజుల సుడిగాలి పర్యటనకు వస్తోంది మనోరమ అమెరికానుండి.

సాయంత్రం నాలుగున్నర .. మేఘాలు ఆకాశం నిండా.. వర్షం ఏ క్షణమైనా మొదలవ్వొచ్చు.

కార్ సిటీలోకి రాగానే ఒకచోట ఆపించుకుని రెండుమూడు తెలుగు పత్రికలు కొంది మనోరమ.. దిన పత్రికలు. వార పత్రికలు కూడా.ఎన్నాళ్ళయిందో తెలుగు పత్రికలను చూచి. ఈనాడు.. అంధ్రజ్యోతి.. నవ్య.,

పత్రికలను తిరగేస్తూండగా.. లోపలి అనుబంధ పేజీల్లో కనిపించింది ఒకచోట.. శివరావు ఫోటో.. ‘ఎడిటర్ తో ముఖాముఖి.’

‘దిక్కు మొక్కు లేని జనం వెంట జీవితాంతం నడుస్తూ.. వాళ్ళకు చిటికెన వ్రేలునిచ్చి నడిపిస్తూ.. బూర్జువాలకూ.. దోపిడీ దార్లకూ గుండెల్లో తుపాకి గుండై.. ఎందరో అసాంఘిక వ్యక్తులతో నిత్యం తలపడ్తూ.. పలువురిపై ప్రభుత్వాలకూ, కోర్టులకూ బహిరంగంగా పిర్యాదుచేసి.. వాళ్ళను జైలుపాలు చేసిన నిజమైన హీరో.. డాక్టర్ మెతుకు శివరావుతో ఈ రోజు ముఖాముఖి. ‘. ఒక పూర్తి పేజి ఇంటర్వ్యూ.

“సర్.. మీరు గణితంలో డాక్టరేట్ చేసి.. అందరిలా హాయిగా ఉద్యోగం చేసుకుంటూ భార్యా పిల్లలతో సుఖంగా గడపక.. ఈ ఉద్యమాలనీ.. ప్రజా చైతన్యమనీ.. ఈ గొడవల్లో..” అని ప్రశ్న.

“మీరన్న సుఖం..నాకు ప్రజలను చైతన్య పర్చడంలోనూ..ఈ సమాజానికి హాని కలిగిస్తున్న ద్రోహులను ఏరివేయడంలోనూ ఉంది. సుఖం అన్న పదానికి ఎవరి నిర్వచనం వాళ్ళది..”

“ఇప్పటికే.. ఐదారు తిమింగలాలను లీగల్ గా తగు ఆధారాలతో జైల్లోకి తరలించారు మీరు.. మరి మీ వ్యక్తిగత భద్రత గురించి మీరు తీసుకునే జాగ్రత్తలేమిటి”

” ప్రజలకోసం పనిచేస్తున్న వ్యక్తులెప్పుడూ ప్రజలయొక్క భౌతిక సంపద. వాళ్ళ సంపదను వాళ్ళే కంటికి రెప్పలా కాపాడుకుంటారు.”

“పేద ప్రజల్లో.. గిరిజన ప్రాంతాల్లో మీకు అసంఖ్యాకమైన అనుచరులూ, అభిమానులూ ఉన్నట్టే మీరు విరోధిస్తున్న సోకాల్డ్ నియో-రిచ్ బూర్జువాలనుండి శత్రువులూ, బెదిరింపుదార్లూ ఉంటారుగదా.. మరి వాళ్లనుండి.. మీకు రక్షణ..”

“జీవితమంటేనే.. ఒక నిరంతర పోరాటం. భయపడేవాడు పోరాటాలు చేయలేడు. నేను భయాన్ని కాలేజ్ లో చదువుకుంటున్నప్పుడే జయించాను..”

ఇలా సాగుతోంది సంభాషణ.

శివరావు గొంతులో నిఖ్ఖచ్చితనం.. స్పష్టత.. గురితప్పని విశ్వాసం.. కళ్ళనిండా విద్యుత్ బల్బ్ లోనుండి విరజిమ్మే కాంతిలా వెలుగు.

శివరావు కొన్ని దశాబ్దాలక్రితం..తనతో మనిషి అందం గురించిన చెప్పిన ‘ నిజమైన అందం’ ఈ కళ్ళలో కాంతేనేమో.

అప్రయత్నంగానే.. మనోరమ చటుక్కున తన హ్యాండ్ బ్యాగ్ లోనుండి మిర్రర్ ను బయటకు తీసుకుని తన ముఖాన్ని తానే పరిశీలనగా చూచుకుంది. ముఖంలోగానీ.. కళ్ళలోగానీ ఎటువంటి మెరుపూ.. కాంతీ..జీవమూ లేదు. ఒక అందమైన నిర్జీవ..తెల్లగా వెల్లవేసిన శుభ్రమైన గోడలా ఉంది.

ఎ బల్బ్ విత్ కరెంట్..వితౌట్ కరెంట్.

మనోరమ దీర్ఘంగా నిట్టూర్చి..తలెత్తేసరికి.,

సాయంత్రం..ఐదు గంటలు..అమీర్ పేట్ చౌరాస్తా దాటి..నింస్ దగ్గరకు రాగానే.  ‘ తప్’ మని ఏదో గన్ కాల్చిన చప్పుడు.క్షణం లో.. జనం కకావికలై.. పరుగులు రోడ్ పై.. గుంపులు గుంపులుగా.

” ఏమైంది..”

” ఏమైంది “..ప్రశ్నలు.

” ఎవరో..ఒక మనిషిని గన్ తో కాల్చి  పరారయ్యాడిప్పుడే..అంతా రక్తం.. మనిషి అక్కడికక్కడే చనిపోయాడు”

” ఎవరో పాపం”

” తెలియదండీ”

పొలీస్ వ్యాన్ చప్పుడు.. ఈలలు.. హడావిడి.. పరుగులు.. కుక్కలతోపోలీస్లహడావిడి.

మనోరమ క్యాబ్ కు పదడుగుల దూరంలోనే.. అంతా. .రక్తపు మడుగు కనబడ్తూనే ఉంది.

‘ఎవరో చూస్తే బాగుండు ‘ అని..ఉత్సుకత.

ఇంకా జనం ప్రోగౌతూనే ఉన్నారు. “మేడం..ఇటునుండి కార్ ను వెనక్కితిప్పుతాను..” అని డ్రైవర్ ఏదో అంటూనే ఉన్నాడు..మనోరమ కార్ ను దిగి ఆ గుంపులోకి నడిచింది.

దగ్గరగా వెళ్ళి..ఇంకా జనాన్ని తోసుకుంటూ..లోపలికి.,

ఎదురుగా..తడి రక్తపు మడుగులో..శివరావు.

” శివరావు చచ్చిపోయాడు..తన ఎదురుగానే.”

” కాదు..శివరావు..చంపబడ్డాడు”

వేలమంది గుండెల్లో దేవునిలా కొలువై ఉండే శివరావుకు కూడా శత్రువులుంటారా.

ప్రపంచంలో.. తనలాంటి.. అందగత్తెలూ.. బిలియనీర్లూ కోకొల్లలు.. కాని శివరావులాంటి ప్రజోపయోగ లక్ష్యం తోనే జీవించే.. చావును ప్రతినిత్యం ఎదుర్కుంటూ పోరాడే త్యాగమూర్తులు.. ఎందరు.

‘ఎప్పటికైనా తప్పకుండా నశించిపోయేది భౌతికమైన అందం. రోజులూ.. వయసూ గడుస్తున్న కొద్దీ.. ఇంకా ఇంకా సౌందర్యవంతమయ్యే అందం..మనం నిర్మల పర్చుకునే..మన మనసు..హృదయం..ఆత్మ..’

శివరావు.. తమ పెళ్ళైన కొత్తలో అన్న మాటలు జ్ఞాపకాల పొరల్లోనుండి ధ్వనిస్తూ.,

మనోరమ కళ్ళలోనుండి.. వెచ్చని కన్నీళ్ళు.. ధారలు ధారలుగా.,

కన్నీళ్ళకు హృదయముంటుందా.?

*

 

 

 

 

 

 

 

 

ఒకానొక రూఫ్‌ గార్డెన్‌ కథ

 

– ఒమ్మి రమేష్‌బాబు

~

ఇటీవల ఒక ఉదయంపూట తుమ్మేటి రఘోత్తమరెడ్డిగారి ఇంటికి వెళ్లాను. చాన్నాళ్ల తర్వాత ఆయన కరస్పర్శ… స్నేహపూర్వక స్వాగతం పలికింది. ఆత్మీయ పలుకరింపు ఆతిథ్యపు మర్యాదలు చేసింది. ఆయన సామీప్యంలో నా మానసం కొత్త చివుర్లు తొడిగింది. కొన్ని కుశల ప్రశ్నలు. మరికొన్ని తేరిపార పరామర్శించుకునే చూపులు. తదేకంగా ఆయన్ని చూస్తున్నంత సేపు తొలి పరిచయం నాటి గురుతులు… జ్ఞాపకాల దొంతరలు. రెండు దశాబ్ధాల కాలచక్రం తెచ్చిన మార్పులను పోల్చుకునే ప్రయత్నం చేశాను. చెట్టులాంటి మనిషి కనుక ఎదుగుదల సహజమే. నా కనుల గ్రహణశక్తికి హరిత సొబగుల అందమేదో లీలగా మెదిలింది కూడా. అది భ్రమ కాదు కదా అని ప్రశ్నించుకున్నాను. ఆ ప్రశ్నని నేను అడగకపోయినా దానికాయన ఆచరణాత్మక శైలితో బదులిచ్చారు.

హైదరాబాద్‌లో కొత్త చిరునామాని చేరుకోవడం కొంత కష్టమే. కానీ రఘోత్తమరెడ్డిగారి విషయంలో ఆ సమస్య రాలేదు. నారపల్లె… నల్లమల్లారెడ్డి కాలేజి రోడ్డులో సుమారు కిలోమీటరు సాగింది ప్రయాణం. రోడ్డుకి కుడివైపున ఎర్రటి సున్నం వేసిన ఇల్లు. మిద్దె మీద ఆకుపచ్చటి కుచ్చుటోపీ. ఆ ఇల్లే ఆ ప్రాంతపు కొండగురుతు. ఎవరికైనా సరే తొలి చూపులోనే ఆకట్టుకనే తీరు. నేను ఆ ఇంట ప్రవేశించగానే మనసు నెమ్మదించింది. వాతావరణంలో చల్లదనం నాలోకి కూడా ప్రవహించింది. ఆ అనుభూతి గొప్ప కథ చదివినప్పుడు కలిగే అనుభూతికి సరిసాటి అనే చెప్పాలి.

రఘోత్తమరెడ్డిగారి నట్టింట కూర్చుని పలహారం తింటూ నలు మూలలూ పరికించాను. అంతటా నిరాడంబరత పరివేష్టించి ఉంది. దరహాస వదనంతో ఎదురుగా ఆయన జీవిత సహచరి రూప. ఆ ఇంట కుటుంబ సభ్యుడిగా మారిపోయిన గూఫీ అనే కుక్క కూడా పరిచితగా మారిపోయింది. ఇల్లు బాగుంది అన్నాను అభినందనపూర్వకంగా. “అప్పుడే ఏమైంది.. ఇంకా చూడాల్సింది చాలా ఉంది” అన్నారు రఘోత్తమ్‌. ఆయనకి ఇష్టమైన పుస్తకాలో, సంగీతం సీడీలో చూపిస్తారనుకున్నాను. రఘోత్తమ్‌ తమ వాకిట్లో మెట్ల దారివైపు నడిచారు. నేను అనుసరించాను. ఒక్కో మెట్టు ఎక్కుతూ మొదటి అంతస్తులోకి చేరుకోగానే అక్కడ అకుపచ్చనిలోకం పలుకరించింది. అదొక చిట్టి వనం. రూఫ్‌ గార్డెన్‌! అందులోనే కూరగాయల పెరడు. పందిళ్లకు పాకిన రకరకాల పాదులు. అక్కడక్కడ పూల మొక్కలు. ఏపుగా పెరిగిన పళ్ల చెట్లు. మధ్యమధ్యలో ఆకుకూరల మడులు. ఒక్క మాటలో చెప్పాలంటే అదొక అందమైన పార్క్‌. చెట్ల మధ్య కూర్చోవడానికి వీలుగా చిన్న ఏర్పాటు. ఆకర్షణ కోసం పెట్టిన టెర్రకోట బొమ్మల కొలువులు. చూపు ఎటు తిప్పినా చిత్రవర్ణాల కూర్పులు!

raghu1

రఘోత్తమరెడ్డిగారి రూఫ్‌గార్డెన్‌లో జామ, పంపరపనస, బొప్పాయి, సపోటా, సీతాఫలం, బత్తాయి, దానిమ్మ, నిమ్మ వంటి చెట్లను చూస్తే చకితులమైపోతాం. ఆకాశపు నిచ్చెనమెట్లు ఎక్కినట్టుగా కొన్ని చెట్లు నిటారుగా ఎదిగిపోయాయి. నేల విడిచి చేసే సాగులో ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తే… రఘోత్తమ్‌ నవ్వారు. చేయాలనుకుంటే సాధ్యంకానిదేముంది అన్న అర్థముంది ఆయన నవ్వులో. రోజూ ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట మొక్కలతో గడుపుతారు. నీరు పెడతారు. వాటిని పరిశీలించి బాగోగులు తెలుసుకుంటారు. ఇదీ ఆయన తన మాటల ద్వారా చెప్పిన దినచర్య. కానీ ఆ క్షణాన నాకు ఆయన “మొక్కల నాడి చూడగల వైద్యుడిలా” అనిపించారు. అంతేకాదు.. ఆ తోట అంతటి హరితశోభని సంతరించుకోవడానికి ఆయన పంచే ప్రేమ కూడా కారణమని అనిపించింది.

మిద్దెపైన రఘోత్తమ్‌ సృష్టించిన ఈ తోట.. ఆయన అభిరుచికి ఆవిష్కరణ. నిజానికి ఈ వర్ణన బట్టి ఇదంతా విశాలమైన జాగాలో పెంచిన తోట అని మీరనుకుంటే పొరపాటే. నారపల్లెలో ఆయనకున్నది సుమారు 170 గజాల స్థలమే. అక్కడే ఇల్లు కట్టుకుని, అందులోనే చిరకాల స్వప్నమైన సాగుపనులు చేసుకోవడం కొంత కష్టతరమే. కానీ రఘోత్తమ్‌ తన ఆలోచనకి పదునుపెట్టి… రూఫ్‌ గార్డెన్‌ ఏర్పాటుతో తన కల నెరవేర్చుకోవచ్చునని భావించారు. ఐదేళ్ల క్రితంనాటి ఆయన పూనికే ఇప్పుడు హరిత సౌందర్యానికి నిలయంగా మారింది. తోటల్లో ఎంత చేవగా పెరుగుతాయో అంతే మిసమిసతో, ఆరోగ్యంతో పెరిగాయి ఈ రూఫ్‌గార్డెన్‌లో చెట్లు, మొక్కలు..!

పాడైపోయిన కూలర్ల కింద ఉండే ఇనుప చట్రాలే కొన్ని మడులకు ఆధారం. శ్లాబ్‌ మీద బండరాళ్లు పేర్చి.. వాటిపై ఇటుకల కూర్పుతో కొన్ని మడులు తయారుచేశారు. వాటిలో మట్టి నింపారు. విత్తు నాటారు. పెద్దపెద్ద కుండీల్లో చెట్లను నాటారు. రెక్కల కష్టంతోనే అన్నీ చేశారు. నీటికి లోటు రాకుండా తగిన జాగ్రత్తలు పాటించారు. అవసరమైన కాలువలు ఏర్పాటుచేశారు. ఇలా నగరపు నడిమధ్యన రైతుగా మారి సాగుబడితో జీవితానందం పొందుతున్నారు. ఇప్పుడు వారు తమ అవసరాల కోసం కూరగాయలు, ఆకుకూరలు కొనడం లేదు. (దుంప కూరలు ఒక్కటే ప్రస్తుతానికి మినహాయింపు) వారి పంట దిగుబడే ఇంటి అవసరాలకు మించి వస్తోందని చెప్పారు. అప్పుడప్పుడు ఇతరులకూ పంచుతున్నారు. పెరటి మొక్క వైద్యానికీ, కూరకీ కూడా పనికొస్తుందని ఆచరణపూర్వకంగా నిరూపించారు. 30 శాతం వరకూ పళ్లు తమ తోటలోనే పండుతున్నాయట. మరికొన్ని పళ్ల చెట్లు కాపుకి వస్తే.. ఆ లోటు కూడా పూడుతుందని నమ్మకంగా చెప్పారు రఘోత్తమ్‌. ప్రతిచెట్టునీ ఆయన బిడ్డ మాదిరే పరిపోషిస్తున్నారు. ఆ చిట్టి వనాన్ని చూసి మురిసిపోయి పిట్టలు అక్కడక్కడే సందడి చేస్తున్నాయి. సీతాకోకచిలుకలు పూవ్వుపువ్వునీ పలుకరిస్తూ సంబరపడుతున్నాయి. తేనెలూరు ఆ దృశ్యాలు కన్న కనులకి అంతకంటే ఏముంటుంది సార్ధక్యం..!?

ఎడాపెడా పురుగుమందులు వాడటం, కృత్రిమంగా నేల సారాన్ని పెంచాలన్న యావతో యద్ధేచ్చగా ఎరువులు వెదజల్లడం వంటివి రఘోత్తమ్‌కి నచ్చవని ఆయన సాగు పద్ధతిని చూస్తే అర్థమవుతుంది. అలాంటి ఆహార పంటల వల్ల ఆరోగ్యం ఎంతగా కలుషితమవుతుందో ఆయనకు తెలుసు. గతంలో అనారోగ్య చీడపీడల బారిన పడినవారే ఆయన కూడా. అందుకే ప్రకృతికి చేరువగా ఉండే సహజ సాగుపద్ధతులనే తన రూఫ్‌గార్డెన్‌కి పెట్టుబడిగా మార్చుకున్నారు. ఒక రచన చేసేటప్పుడు ఎంత దీక్ష, ఒడుపు, నిబద్దత, నిజాయితీ పాటించేవారో రూఫ్‌గార్డెన్‌ విషయంలోనూ రఘోత్తమరెడ్డి ఇదే పంథాని అనుసరిస్తున్నారు. ఆయన ముఖంలో తాండవిస్తున్న ప్రశాంతతకీ, ఆ ఇంట పరుచుకున్న చల్లదనానికీ కారణం ఏమిటో నాకప్పుడే బోధపడింది. ఒకానొకనాడు సాహితీ సేద్యం చేసిన ఆయన ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. అంతే తేడా! ఇల్లు పీకి పందిరేసినట్టు అన్న ఎత్తిపొడుపుని తిరగరాసి… ఇల్లు కట్టి, ఆ పైన పందిరి కూడా వేశారు.

raghu2

వ్యవసాయం చేయాలన్న కోరిక రఘోత్తమ్‌కి ఈనాటిది కాదు. చిన్ననాటిది. చదువుకునే రోజుల్లోనే తమ పెరటిలో కూరగాయలు పండించేవారు. అయితే ఆనాడది ఆటవిడపు వ్యాపకం మాత్రమే. హైదరాబాద్‌ వచ్చి ఇల్లు కట్టుకున్న తర్వాత సాగుని పూర్తికాల విధిగా మార్చుకున్నారు. ఇందులో ఉన్న ఆనందం, ఆరోగ్యం మరెక్కడా దొరకదని చెబుతున్నారు. అంతేకాదు.. హైదరాబాద్‌ వంటి నగరాల్లో వాతావరణం చక్కబడాలంటే… రూఫ్‌గార్డెన్‌ల ఏర్పాటును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిబంధన విధిస్తే మేలని రఘోత్తమరెడ్డి సలహా ఇస్తున్నారు. ఆకుపచ్చదనం మనసుని ఆహ్లాదపరుస్తుంది. హరిత సంపదే కాలుష్యానికి నిజమైన విరుగుడుమంత్రం. ఈ సూత్రం కూడా రఘోత్తమ్‌ మాటల్లో అంతర్లయగా ధ్వనించింది.

ఐదేళ్లుగా రూఫ్‌గార్డెన్‌ వ్యవసాయం ద్వారా రఘోత్తమ్‌ మంచి ఉపాధ్యాయుడిలా మారారు. అందులో ఉన్న సాధకబాథకాలను తేలిక మాటల్లోనే ఆయన ఇతరలతో పంచుతున్నారు. ఇలాంటి విషయాలను ప్రోత్సహించే విషయాల్లో మన వ్యవసాయశాఖకి ఆయన వేసింది సున్నా మార్కులే. “మనది వ్యవసాయిక దేశం కదా.. ఇన్నేళ్ల బట్టి వ్యవసాయం చేస్తున్నాం కదా…? తమ తమ భూముల లక్షణాలను కొలిచే చిన్నపాటి పరికరం కూడా రైతులకు తయారుచేసి ఇవ్వలేకపోయాం..” అని రఘోత్తమ్‌ అన్నారు. నేల సారం కొలిచే పరికరం ఉంటే రైతులకు తమ పొలంలో ఏ పంట వేస్తే మంచిదో గ్రహించగలుగుతారు. తద్వారా అనవసరపు ఖర్చులు, జంజాటాలు, నష్టాలు తప్పుతాయి అన్నది ఆయన భావన. ప్రభుత్వాలు, వ్యవసాయరంగ నిపుణులు తలుచుకుంటే ఇదేమంత కష్టమైన ఆవిష్కరణ కాదు. కానీ తలుచుకోరు అంతే!

తమ ఇంటికొచ్చే మిత్రులు, బంధువులకు తన రూఫ్‌గార్డెన్‌ని చూపిస్తున్నప్పుడు ఆయన ముఖంలో తొంగిచూసే ఆనందం వర్ణనాతీతం. చివరిగా వారి అభిప్రాయం రాయడానికి ఒక నోటుబుక్కు అందిస్తారు. ఆ పుస్తకం పుటలు తెరిస్తే అపురూప స్పందనలెన్నో! గ్రామసీమలు స్వయంపోషకత్వం సాధిస్తేనే దేశం సుభిక్షమవుతుందని పాలకులు చెబుతారు. నిజానికి ఎవరికి వారు కూడా స్వయంపోషకత్వం సాధించాలన్నది ప్రస్తుతం రఘోత్తమ్‌ తన జీవితాచరణ ద్వారా చాటిచెబుతున్న సిద్ధాంతం. “ఎటువంటి ఆహారం భుజిస్తే సుఖ విరేచనం అవుతుందో అదే నీ ఆహారం” అన్న ఆయన మాట కూడా అక్షర సత్యం! నిజానికి రఘోత్తమ్‌గారి ఇంటినీ, సాగునీ దర్శించక ముందు వరకూ నాతో సహా చాలామందికి ఆయన కేవలం సాహిత్యకారుడిగానే సుపరిచితులు. రైతుగా మారిన రఘోత్తమ్‌ని కూడా చూస్తేనే ఆయన సంపూర్ణ వ్యక్తిత్వ దర్శనం అవుతుందేమోనని ఇప్పుడు నాకనిపిస్తోంది.

ఇక రఘోత్తమరెడ్డి సాహిత్య జీవిత విశేషాలకు వస్తే… తెలుగు కథాసాహిత్యం గర్వకారణంగా భావించే విలక్షణ రచయితలలో ఆయనొకరు. పరిచయం అక్కరలేనంత దొడ్డవారు. రాసినవి ఇరవై మూడు కథలు. అందులో పనిపిల్ల కథమీద సుదీర్ఘ చర్చ జరిగింది. నల్లవజ్రం అనే నవలిక రాశారు. కొత్త తరానికి కథలపై మక్కువ పెంచే ప్రయోగంగా “తుమ్మేటి రఘోత్తమరెడ్డి చెప్పిన ఏడు ఆశు కథలు” పేరుతో ఒక డీవీడీ వెలువరించారు. అందులో ఉన్న సెజ్‌ కథ మీదకూడా చర్చోపచర్చలు సాగాయి. అల్లం రాజయ్య, తుమ్మెటి రఘోత్తమరెడ్డి సృజించిన సాహిత్యాన్ని చదువుకుని పెరిగిన ఒక తరం ఉంది తెలుగునాట. వారుగానీ, వీరుగానీ ఒప్పినా ఒప్పకున్నా ఈ మాట నిజం. అంతటి చేవకలిగిన, చేయి తిరిగిన రచయిత ఈ మధ్య ఏమీ రాయడం లేదు. అదీ నా లోపల గూడుకట్టి ఉన్న బెంగ. ఎప్పుడేనా ఆయన ఎదురుపడితే తప్పక అడగాలనుకున్న ప్రశ్న. నిజంగానే ఈ రోజున ఆయన ముందు నేను.. నా ఎదుట ఆయన ఉన్నాం. అయినా అడగటానికి ఎక్కడో నాలో బెరుకు. తోటలో ఆహ్లాదంగా గడిపి వచ్చిన తర్వాత ఆ మహిమ వల్ల కాబోలు- నాలో బెరుకుపోయింది. “ఈ మధ్య ఏమీ రాయడంలేదెందుకు..?” అని అస్త్రం సంధించా.

raghu3మితభాషి కనుక తన తాజా వ్యాసంగం గురించి క్లుప్తంగా వివరించారు. పుస్తక రూపం దాల్చిన ఆ రచనలు నాచేతికిచ్చారు. అవి చూసిన తర్వాత నా ఆనందానికి అవధులు లేవు. జీవన తరుశాఖల నుంచి ఫలసేకరణ చేస్తున్న వనమాలిలా నా కనులకు కనిపించారు. తన జీవితాన్ని మధించి… వచ్చిన సారాన్ని… మహావాక్యాలుగా తీర్చి సూక్తులు రచిస్తున్నారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి స్వతంత్ర కోట్స్‌ రచన చేపట్టి… దానిని ఒక యజ్ఞంలా కొనసాగిస్తున్నారు. “జీవించు- నేర్చుకో- అందించు” శీర్షికన 2011లో తొలి పుస్తకం విడుదల చేశారు. దరిమిలా రెండవ సంపుటి వెలువడింది. మరో నాలుగు సంపుటాలకు సరిపడా కొటేషన్స్‌ తయారుచేశారు. గత నాలుగేళ్లుగా తొమ్మిదివేలకు పైగా కొటేషన్స్‌ రాశారు. ఆయన నిరాడంబరుడు కావడం వల్ల ఈ ప్రయోగానికి రావాల్సినంత ప్రచారం రాలేదేమో అనిపించింది.

గోదావరిఖని బొగ్గుగనుల్లో కూలీగా చేరి సూపర్‌వైజర్‌ ర్యాంకులో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు రఘోత్తమరెడ్డి. అది కూడా పదమూడేళ్ల సర్వీసు ఉండగానే. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేసిన కొడుకు సీషెల్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం రఘోత్తమ్‌, రూప దంపతులు నారపల్లిలోని సొంత ఇంటిలో సొంత వ్యవసాయం చేసుకుంటూ ఉన్నంతలో హాయిగా, ఆనందంగా బతుకుతున్నారు. ఉన్న దానితో తృప్తిపడే విశాల మనసు ఉంటే అనవసరపు ఆరాటాలకు తావుండదని నిరూపిస్తున్నారు.

ఆయనని ఉపాధ్యాయుడు అని మధ్యలో ఎందుకు సంబోధించానంటే రఘోత్తమ్‌ మాటల నుంచీ, చేతల నుంచీ నేర్చుకోవలసింది ఎంతో ఉందని తెలియచెప్పడానికే!

*

 

తుమ్మేటి రఘోత్తమరెడ్డి రచయితగా సాహిత్య వ్యవసాయం చేస్తుంటారు. వ్యవసాయం కూడా ఎంత సౌందర్యవంతంగా, ఈస్టటికల్‌గా చేస్తారో ఈ డాబా (రూఫ్‌గార్డెన్‌) చూస్తే తెలుస్తుంది. ఒక ఎకరంలో ఎంత వైవిధ్యంగా పెంచవచ్చో… ఇంత చిన్న స్థలంలో చేసి చూపిస్తున్నారు… ప్రకృతి వ్యవసాయం…. ప్రకృతితో సహజీవనం… ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా సేదదీరడం… ఎంత చల్లని నీడో..! ఇందుకు పడే కష్టంలో ఎంత ఆనందం ఉంటుందో అభిరుచి ఉన్నప్పుడే తెలుస్తుంది…
– బి.ఎస్‌. రాములు
(రూఫ్‌ గార్డెన్‌పై స్పందన)

నను చూడలేని దృశ్యాలేవో నాలో..

 

 

-పఠాన్ మస్తాన్ ఖాన్

~
1.
మండే దీపపు మెత్తని శబ్దంలో
సరసర పాకి పారిపోతున్న సన్నని చీకట్లో
వర్ణాలు వర్షించే రంగుల సవ్వడిలో
రెపరెపలాడే పచ్చని ఆకుల కదలికల్లో
సూర్యతాపం మండుతున్న
వర్ణ రహిత దారిలో …
గబ్బిలపు వింత చర్మపువాపు నేనై…

 

2.
మట్టి పాత్ర నింపుకున్న శూన్యంలో
యింపైన ఆత్మీయ అనుంగత్వంలో
చివరి వరకూ చూసీ తరచిన నృత్తంలో
లోహ నిర్వహణపు నిర్మాణంలో
ముందే ముదుసలౌతున్న గతిలో
జలచుక్కల మబ్బు కణాల
కణతులను తరుముకుంటూ…నేను

 

3.
కఠిన శీతల గోళమేదో
నన్ను కరిగించలేక
అనాత్మిక అంకెలా
ముంపుడు కంచెలలో
ఝంఝాటపు వుచ్చులలో
యే క్రిమియో లోలోనే
తొలిచేసే గుజ్జును …నేనై

 

4.
విసర్జించిన అమలిన జ్ఞానం
ముక్తించలేని సంతోష వదనం
నిర్మోహించే దుఃఖ పటాలాలు
స్వేదజలంలోని యెరుపు ఘాఢత
దహనమూ ఖననమూ కాలేనంత
నిగుడుతనమేదో శిల్పతోరణమై
నెత్తిన మోయలేనంత బరువును మోస్తూ..

 

5.
యిక్కడా…. యెప్పుడూ…
నీలో కురవని తారజువ్వలేవో
కురిపించే వెలుగుల లిపులను లిఖించలేక
పరుగెడుతూ పరుగెడుతూనే
గ్రహాంతరయానంలోకి యెగిరి
వలస వెళుతూ వుంటానూ   ..

*

గురి తప్పిన కథన బాణాలు!

 

-టి.చంద్ర శేఖర రెడ్డి 

~

అనిల్ ఎస్. రాయల్  రాసిన కథాయణం-వ్యాససంకలనంలో దృక్కోణం-1, దృక్కోణం-2 అని రెండు అధ్యాయాలున్నాయి. ఈ అధ్యాయాల్లో,  రాసే కథని ఎవరి పరంగా చెప్పాలి అనే దానిమీద ఒక వర్గీకరణ ఉంది.

అందులో మొదటిది ‘ఉత్తమ పురుష’.

ఉత్తమపురుష కథనంలో కథకుడే స్వయంగా ఒక పాత్ర ధరించి కథ చెబుతాడు. అది ఒకటే పాత్రయితే ‘నేను’ కథ చెబుతాడు/చెబుతుంది. పాత్రలు అంతకన్నా ఎక్కువైతే ‘మేము’ కథ చెబుతారు.

దృక్కోణం-1 అనే అధ్యాయంలో ‘ఉత్తమపురుష’ కథనం ఎలా సాగాలి అన్న విషయం మీద కొన్ని సూచనలున్నాయి. ఈ సూచనలు ఇతర రచయితలు/రచయిత్రులు రాసిన కొన్ని తెలుగు కథల్లో ఎలా అమలయ్యాయి, ఎంతవరకు అమలయ్యాయి అన్నది తెలుసుకోవటానికి నేను-కథ 2014 అనే కథల సంపుటిని పరిశీలనకు ఎన్నుకున్నాను.

ఈ కథల సంపుటిలో మొత్తం 14 కథలు ఉన్నాయి. వీటిలో ఉత్తమపురుషలో చెప్పబడ్డ కథలు ఆరు.  అవి చావుదేవర-రచయిత్రి బత్తుల రమాసుందరి, గోధుమరంగు ఆట- రచయిత భగవంతం, నూనె సుక్క-రచయిత కొట్టం రామకృష్ణా రెడ్డి, భీష్మా…నాతో పోరాడు-రచయిత్రి రాధిక, ఐ హేట్ మై లైఫ్-రచయిత సాయి బ్రహ్మానందం గొర్తి.

నూనె సుక్క కథలో కొంత భాగం, అమ్మ చెపుతుంది. కాని, అమ్మ చెప్పిన కథాభాగం, కొడుక్కి  సంభాషణ రూపంలో చెప్పినట్లు ఉంటుంది. అంతే కాని ఆమె తనంతట తాను ‘నేను’ అని కథని చెప్పదు. మిగిలిన కథంతా, కొడుకు ‘నేను’ అని చెపుతాడు. కథలో సింహభాగం ఈ కథనమే ఆక్రమించింది.  అందుకని, అమ్మ మాటల తాలూకు భాగాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఈ కథలో కథనాన్ని ఉత్తమపురుష కథనంగానే  స్వీకరించటం జరిగింది.

‘థూ’ కథని రెండు పాత్రలు; బసివిరెడ్డి నాయుడు, జోసెఫ్- ‘నేను’ అంటూ చెప్పాయి.   అందుకని దీన్ని ఉత్తమపురుష లోనే బహుళ దృక్కోణ (Multiple Point of View) కథనంగా తీసుకోవడం జరిగింది. ఉత్తమపురుషలోఇది కథాయణంలో ప్రస్తావించబడని ఇంకో రకమైన ధోరణి.

పైన ఉదహరించిన ఆరు కథల్లో ఏ కథ కూడా, ‘మేం’ పరంగా చెప్పబడలేదు.

ఈ ఆరు కథల్లో-కథాయణంలో చెప్పబడ్డ సూచనలు ఎలా పాటించబడ్డాయో చూస్తే ఇదీ ఫలితం.

సూచన 1:

ఉత్తమపురుషలో కథ చెప్పేప్పుడు ‘నేను’ అనబడే కథకుడు, తన గురించి తాను వర్ణించుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఆ పాత్ర ఆకార విశేషాల, వేషభాషల వివరణ కథనానికి అత్యంత అవసరమైతే తప్ప చేయకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో పరోక్షవర్ణనకి దిగటం మెరుగు (వేరే పాత్ర ద్వారా సంభాషణలో చెప్పించటం, అద్దంలో పరికించి చూసుకోవటం, వగైరా).

ఎలా పాటించబడింది:

ఈ ఆరు కథల్లో, ఏ కథలో కూడా ‘నేను’ తనని తాను వర్ణించుకోలేదు.

సూచన 2:

ప్రధానపాత్రకి తెలిసిన విషయాలు, కథకి కీలకమైనవి, సస్పెన్స్ పోషించటానికో లేక ముగింపు దాకా పాఠకుల్ని మభ్యపెట్టటానికో ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టకూడదు.

ఎలా పాటించబడింది:

అలా తొక్కిపెట్టటం, ఏ కథలోనూ జరగలేదు.

సూచన 3:

కథ చెబుతున్న ‘నేను’ అనబడే వ్యక్తి పురుషుడా, మహిళా, చిన్నపిల్లవాడా, ముదుసలా… ఇటువంటి వివరాలు వీలైనంత త్వరగా పాఠకులకి చేరవేయాలి(ఆ వివరం దాచటం కథకి కీలకమైతే తప్ప).

ఎలా పాటించబడింది:

చావుదేవర,  ఐ హేట్ మై లైఫ్ కథల్లో; ‘నేను’ స్త్రీ అనే విషయం తో పాటు చిన్న పిల్లలనే విషయం కూడా  “పిల్ల భయపడింది’ అనే వాక్యం ద్వారా, “పరువు తీస్తున్నావు కదే?” అనే పదాల ద్వారా తెలుస్తుంది.

గోధుమరంగు ఆట, నూనె సుక్క కథల్లో; ‘నేను’ పురుషుడు అనే విషయం “ఈ ఎదురుగా ఉన్నవాడు తొందరగా వెళ్లిపోతే బాగుండును.” అనే వాక్యం ద్వారా,  “అమ్మ తాన కూకున్నోడ్ని”అనే పదాల ద్వారా  తెలుస్తుంది. ఇవే పదాలు, నూనె సుక్క కథలో ‘నేను’ చిన్నపిల్లాడు అనే విషయం కూడా చెపుతాయి.

భీష్మా…నాతో పోరాడు కథలో ‘నేను’ పేడి అనే విషయం 117 వ పేజీలో ఉన్న “మగ పిల్లవాడు పుట్టటం” అనే పదాలూ, అది ‘పాక్షికంగా నిజం’ అన్న విషయాన్ని 118 వ పేజీలో ఆ పాత్ర ప్రవర్తనా తెలుపుతాయి. ఆ తర్వాతి కథనం, ‘నేను’ పెరిగి పెద్దవాడయ్యాడనే విషయం చెపుతుంది.

ఈ వివరం చెప్పటానికి ‘గోధుమరంగు ఆట’ కథారచయిత అవసరమైనదానికన్నా ఎక్కువ సమయం తీసుకున్నట్లు కనపడ్తోంది. అయితే, అది, పాఠకుడు కథను అనుసరించడానికి ఆటంకంగా పరిణమించలేదు.

థూ- కథని చెప్పిన రెండు పాత్రలు; బసివిరెడ్డి నాయుడు, జోసెఫ్ గురించిన వివరాలని ఆ పేర్లే చెప్పాయి.

 

 

సూచన 4:

కథ చెపుతున్న పాత్రకి తెలిసే అవకాశం లేని విషయాలు (ఇతరుల ఆలోచనలు, తాను లేని సన్నివేశాల్లో సంఘటనలు, వగైరా) ప్రస్తావించకూడదు.

ఎలా పాటించబడింది:

చావుదేవర, గోధుమ రంగు ఆట, ఐ హేట్ మై లైఫ్ కథల్లో ఈ సూచన ఖచ్చితంగా అమలైంది. నూనె సుక్క కథ ముందుకు నడవాలంటే, ‘నేను’ కి తాను లేని కొన్ని విషయాలు గతంలోవి తెలియాలి. కాని, అలా తెలియడం కథనానికి ఎన్నుకున్న ధోరణికి సరిపడదు. అందుకనే, కథకుడు అమ్మ మాటల ద్వారా ‘నేను’ కి ఆ విషయాలు తెలిసేలా చేశాడు. ఉత్తమ పురుష కథనానికి ఈ వెసులుబాటు లేదు. అయినా, కథలో సింహభాగం ఉత్తమపురుష కథన ధోరణికి లోబడి ఉంది కనక ఈ వైరుధ్యం ప్రశ్నార్థకంగా అనిపించలేదు.

భీష్మా…నాతో పోరాడు కథలో మాత్రం; ఒక్క చోట, 121 పేజీలో కుంతి తన కుమారులను సంస్కారవంతులుగా పెంచింది…దగ్గరనుంచి, ద్రౌపదిని అయిదుగురికి భార్యగా చేసింది-అనే పదాల వరకు; కథలో ’నేను’ తాను లేని చోట ఏం జరిగిందో తెలియపరుస్తుంది. ఈ భాగం ఒక్కటే, ఈ కథలో ఉత్తమపురుష కథనధోరణికి వ్యతిరేకంగా నడిచింది.

దృక్కోణం-2 అధ్యాయం మిగిలిన రెండు రకాల కథనం గురించి వివరిస్తుంది.

దాంట్లో ఒకటి  మధ్యమపురుష.

మధ్యమపురుష

ఉత్తమపురుష కథనంలో కథ ‘నా’ కోణం నుండి నడిస్తే, మధ్యమ పురుషంలో అది ‘నీ’ కోణంలో నడుస్తుంది. అలాంటి కథలు అరుదుగా కాని కనిపించవు. తెలుగు కథల్లో ఆ పద్ధతిలో చెప్పబడ్డ కథ వి. ప్రతిమ గారు రాసిన ‘విత్తనం’ కథ. ప్రాతినిధ్య- కథ-2014 సంకలనంలో ఉంది. సంకలనంలో చేరటానికి ముందు ఈ కథ చినుకు మార్చి 2014 సంచికలో, ‘మనిషి విత్తనం’ పేరుతో ప్రచురితమైంది. కథనంలో; నీ, నువ్వు, నిన్ను, నీకు-అనే పదాలే కాకుండా, ప్రధాన పాత్ర భర్తని మీరెడ్డి-మీ ఆయన, మీ అత్తగారు, మీ మామగారు, మీ అత్తగారి తల్లి, మీ అత్తమామలు అనటం కథ పఠనీయతని కొంచెం దెబ్బతీసింది. ఈ సందర్భాల్లో కూడా ‘నీ’ అని రచయిత్రి రాసి ఉండొచ్చును. కాని, అలా జరగలేదు.

మధ్యమ పురుష ధోరణిలో కథ చెప్పినపుడు; కథని చెపుతున్న వ్యక్తి తప్పనిసరిగా కథలో సంఘటనలకి సాక్షి అయి ఉండాలి. అది రచయిత/రచయిత్రి లేదా మరే ఇతర వ్యక్తి అయి ఉండాలి.  కాని, ఈ కథ ఇతివృత్తం దృష్ట్యా ఈ కథలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు బయటి వ్యక్తికి తెలిసే అవకాశం లేనివి. అందువల్ల ఈ కథనధోరణి ఈ కథకి పూర్తిగా నప్పిందని అనిపించలేదు.

 

ప్రథమపురుష

మిగిలిన మూడో పద్ధతి కథనం-ప్రథమ పురుష. నా వర్గీకరణ ప్రకారం కథ 2014 కథాసంకలనంలో ఉన్న-ఆకులు రాల్చిన కాలం-రచయిత పాలగిరి విశ్వప్రసాద్, రోహిణి-తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి, ఇస్సాకు చిలక-అద్దేపల్లి ప్రభు, నిశ్శబ్దపు చప్పుడు-మధురాంతకం నరేంద్ర, ప్రవల్లిక నిర్ణయం-యాజి, పాంచాలమ్మ పాట-స.వెం. రమేశ్, ది కప్లెట్-కల్పనా రెంటాల, వాళ్లు ముగ్గురేనా?-విమల; ఈ ఎనిమిది కథలూ ఈ పద్ధతి కథనంలో చెప్పినవి.

ఈ కథలు, ‘ప్రథమ పురుష’ కథనానికి ఎలా, ఎంతవరకు లోబడి ఉన్నాయి- అన్న విషయం మీద పరిశీలన మరో సారి.

-o)O(o-

 

‘నాలా మరో కోడలా… !!’

maro-kodalaa


-రేఖా జ్యోతి
~

” చందూ, నిన్ను ఎప్పుడూ మరిదిగా చూడలేదు నా పెద్ద కొడుకుగా తప్ప, నా మీద నీకున్న గౌరవం తెలుసు కనుక, నీకు అర్ధమయ్యేలాగా చెప్పాలని ప్రయత్నం, నా మాట విను, ఇంకొక్కసారి ఆలోచించు. నీ ఆరాధన నాకు అర్ధమయ్యింది. నిజంగానే ‘సంధ్య’ మంచి పిల్ల, బాగా పాడుతుంది, స్థిరపడిన గాయని, చూడడానికీ చక్కగా ఉంటుంది, అన్నింటికీ మించి మనమంటే అభిమానమున్న పిల్ల. మహాలక్ష్మే ! అలాగని ప్రేమా, పెళ్ళి పేరుతో తెచ్చి మన గాట్లో కట్టేస్తామా? మన ఇంటి పరిస్థితులూ చూసుకోవద్దూ!

నిన్ను కనిపెట్టుకొని కనిపెట్టుకొని చదివించినా, ఉన్న ఊరు వదిలితే తిండికి ఇబ్బంది పడతావని, మధ్యాహ్నం కంప్యూటర్ క్లాస్ కి వెళ్తే నల్లబడిపోతావని మీ అమ్మగారు నిన్ను గంపకిందే ఉంచి పెంచారు. ఇప్పుడేదో ‘ఖాళీగా ఉన్నాడు’ అని మాట రాకుండా చిన్న ఉద్యోగంలో నిలబడ్దావు, మీ అన్నయ్యల లాగే! ఆర్భాటాలకీ .. ఆడంబరాలకీ పోగా .. నెలతిరిగితే పచారీకి, కరెంటు బిల్లుకీ, చాకలికి, పైపనివాళ్ళకీ డబ్బులు వెదుక్కునే మనం.. అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి ఏం చేస్తాం?

నాతోపాటూ పొద్దున్నే బావి దగ్గర అంట్లు తోమడానికి సాయం చేస్తుంది, బట్టలు పిండుతుంది, మోటారు పనిచేస్తే సరే.. లేకపోతే పక్కింటి రామయ్య వాళ్ళింట్లో నుంచి నీళ్ళు మోస్తుంది, ఉప్మాలోకి కూరలు తరుగుతుంది, చెట్నీలు రుబ్బుతుంది. హడావిడిగా తన పొట్ట పోసుకోవడానికో మనకు సాయం చెయ్యడానికో ఎక్కడో సంగీతం టీచరుగా చేరుతుంది. మళ్ళీ సాయంత్రం ఈ సంతలో కాఫీ గ్లాసులు, టిఫిన్ ప్లేట్లు పంచుతుంది. రాత్రి పదకొండు దాకా కూర్చొని చేయించుకొనే పదిమందికోసం గరగరా తిరిగే నాకూ, మీ చిన్నవదినకూ తోడు మరొకరు వస్తారు, అంతే కదా !!

పాటను చూసి ప్రేమించాను అనకు, పాటనే ప్రేమించు… పాడే వ్యక్తిని కాదు. విన్నామా.. బాగుంది అనుకున్నామా! మరీ నచ్చితే మరోసారి.. మరోసారి విను, అది ‘నా సొంతం’ అని నువ్వు అనుకున్నరోజే అపశృతులు మొదలవుతాయ్, అదీ ఖచ్చితంగా మనవల్లే జరగడం మరింత బాధ కదూ !! ”
ఎవరి జీవితం వారి చేతుల్లోనే ఉంచి ఆరాధించే అంత ఎదిగామా మనం? లేదు కదా!

అంతదాకా ఎందుకు, మీరంతా కళారాధకులు, మీ పెద్దన్నయ్య నన్ను ఏమి చూసి చేసుకున్నారో అడుగు… , పదహారేళ్ళకే ‘వీణ’ కచేరీలు చేసేదాన్ని. విశాఖపట్నం ‘కళాభారతి’ లో చూసి మా ఇంటికి వచ్చి మాట్లాడారు. మీ ఇంటిపేరు చూసి మా తాతగారు మురిసిపోయి పెళ్ళికి ఒప్పుకున్నారు. నువ్వు ఇదంతా నమ్మలేవు కదా, ఎందుకంటే నేను మీ ఇంటికి వచ్చిన 14 యేళ్ళలో వీణ వాయించడం నువ్వు చూడలేదు కనుక. ఇక మీ చిన్న వదిన సంగతి నీకు తెలుసు, తెలుగు యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ డిప్లొమా పూర్తి చేసింది, మనతో సర్దుకుపోవడానికి డ్రాయింగ్ టీచర్ అయ్యింది. ఆ తర్వాత తన జీతంతో తను బి.ఎఫ్.ఎ. చదువుకోవడానికి కూడా మనం వెసులుబాటు ఇవ్వలేకపోతున్నాం. ఆర్ధికంగానూ సహకరించలేము … కాస్త తనకు తీరికా కల్పించలేము, బొమ్మల్లో మనసు పెట్టేంత ప్రశాంతత ఈ దైనందిన కాలపట్టికలో అసాధ్యం. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చందూ !!

అవన్నీ వదిలేసినా , ‘పోనీ విడిగా ఉండి చూసుకుంటాను’ అంటావా? నువ్వూ ఈ ఇంట్లో మగవాళ్ళ లాగే ఇక్కడి పుల్ల తీసి అక్కడ పెట్టవు. పొద్దున్న టిఫిన్లు, రెండు చెట్నీలు … మధ్యాహ్నం భోజనంలోకి రెండుకూరలు, పప్పు సాంబారు … రుబ్బిన పచ్చడి, నిల్వపచ్చడి, అన్నంలోపొడి … ఏ ఒక్కటిలేకపోయినా వీరంగం చేసే నువ్వు … ‘ఆ అమ్మాయి బాగా పాడుతుంది’ కనుక, పెళ్ళి మాటలు మాట్లాడమంటే ఎలా? రేపు ఆ అమ్మాయి 20 యేళ్ళు నేర్చుకున్న సంగీతం వదిలేసి పోద్దునకేం వండాలి ? రాత్రికేం వండాలి .. అని హైరానా పడిపోవాలిసిందే ! నీ జీవితంలో.. నీ దినచర్యలో, అలవాట్లలో గొప్ప మార్పులు చేసుకోకుండా .. త్యాగం చెయ్యకుండా ఆమెను ఆమెగా ఉంచలేవు చందూ ! ఇది నీ లాంటి వాడికి సాహసం, నువ్వు సిద్ధమా?

ఏ కళని ఆరాధిస్తున్నావో ఆ కళకి, ఆమెకీ జీవితాంతం నువ్వు పోషకుడిగా .. రక్షకుడిగా ఉండగలనన్న నమ్మకం నీకుంటే .. అలాగే వెళ్ళి అమ్మాయిని ఇవ్వమని అడుగుదాం, నిజాయితీగా తూకం వేసుకో !!

ప్రేమించడం అంటే ఏం లేదురా.. వారు కోరుకున్న జీవితాన్ని మనం కలగనడమే ! ‘ఏమో మనం కాకుండా మరెవరైనా అయిఉంటే ఆమె జీవితం బాగుండేదేమో!’ అని భవిష్యత్తులో మనం బాధపడకూడదు. మాలాగా ‘పెళ్ళికి ముందు వీణ వాయించేదాన్ని’, ‘ పెళ్ళికి ముందు నేను బొమ్మలు వేసేదాన్ని’ అని తను చెప్పుకోకూడదు. ” పెళ్ళికి ముందు నేను కచేరీలు చేసేదాన్ని ” అని మరో అమ్మాయి బాధ పడడం తోడికోడళ్ళుగా మేము ఊహించుకోలేమురా!

“చందూ .. అంత రిస్క్ ఎందుకురా, నువ్వేమిటో మాకు తెలుసు నీకూ తెలుసు … ! గౌరీ అక్క కూతురు ‘హోం సైన్స్’ చేసిందట, చిన్నప్పటి నుంచీ మన ఇంటి పరిస్థితులూ పద్ధతులూ తెలిసిన పిల్ల .. వంట భాగా చేస్తుంది. కళలూ కాకరకాయలూ అని బుగ్గకి చెయ్యిపెట్టుకొని ఊహల్లో బ్రతికే పిల్ల కాదు. పైగా ‘స్త్రీ’ కి సొంతసమయం అని పోరాడే పిల్ల కాదు .. నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు. రేపే వెళ్ళి మాట్లాడుతాం, ఈ కాలంలో అలాంటి అమ్మాయి దొరకడం కూడా కష్టం రా!”

కాలం మారిపోయిందని మొత్తుకొనేవాళ్ళకి మన ఇల్లూ .. మన పద్ధతులూ మారలేదని, తెలీదు కదా, దాన్ని అలానే ఉండనీ గుట్టుగా, ఎప్పటికీ !!”

*

   కసబ్.గాంధీ @ యారవాడ.ఇన్

 

 

 మూలం: పంకజ్ సుబీర్                         అనువాదం : శాంత సుందరి రామవరపు

~

pankaj

 

పంకజ్ సుబీర్ – 2 కథా సంపుటులూ , 2 నవలలూ  ప్రచురించారు . ‘ యే వో సహర్ తో నహీం ‘ అనే నవలకి 2009 లో జ్ఞాన్ పీఠ్ వారి ‘యువపురస్కారం ‘ లభించింది. ఇవి కాక ఎన్నో కథా సంకలనాలకి సంపాదకత్వ బాధ్యత నిర్వహించారు .ఇండియా నుంచీ కెనడా నుంచీ వచ్చే హిందీ  పత్రికలకి  సంపాదక సభ్యులుగా పనిచేస్తున్నారు. వీరి కథలను ఆడియో ,వీడియోలుగా విడుదల చేశారు . ఒక కథ సినిమాగా విడుదలకి సిద్ధంగా ఉంది. 

peepal-leaves-2013

 

గాలి బరువెక్కింది. ఈ గోడలకి అలా గాలి బరువెక్కడం అలవాటే. అలవాటు ఎందుకంటే ఈ గోడల్లో తరచు ఒత్తిడి ఉంటూ ఉంటుంది. ఇవాళ కూడా ఒత్తిడి ఉంది. దానికి కారణం సీ-7096. అది నవంబర్ నెలలో ఒక రాత్రి. సరిగ్గా ఒక వారం రోజుల క్రితం దేశం నలుమూలలా ఎక్కడ చూసినా విస్ఫోటనాలే, అవి దీపావళి టపాకాయల పేలుళ్ళు.

ఇవాళ మళ్ళీ మంగళవారం. మళ్ళీ పేలుళ్ళకి సిద్ధం అవుతున్నారు. పేల్చేందుకే సీ-7096 ని ఇక్కడికి తీసుకొచ్చారు. పాతికేళ్ళ సీ-7096 వల్లే ఇక్కడ గాలి ఇంత బరువుగా ఉంది.

సీ-7096 మౌనంగా ఉన్నాడు. ఇక అతనికి మౌనం తప్ప ఇంకేమీ మిగల్లేదు. బుర్రలో ఆలోచనలు మాత్రం సుళ్ళు తిరుగుతున్నాయి. కానీ వాటిని పంచుకునేందుకు అక్కడెవరూ లేరు.రాత్రి చిక్కబడుతోంది. మెలకువగా ఉన్న సీ-7096 వేకువ శబ్దాలని వినేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ వేకువ అతనికోసం అనంతమైన రాత్రిని మోసుకు రాబోతోంది.

ఇక్కడికి వచ్చే ముందు సీ-7096 సత్యం అనే విషయాన్ని తీసుకుని  ఒక వ్యక్తి చేసిన ప్రయోగాల గురించి చదివాడు. ఆ ప్రయోగాలు అతన్ని ఆశ్చర్యపరిచాయి. అతనికి వాళ్ళు చెప్పిన సత్యానికీ దానికీ ఎక్కడా పోలికే లేదు. ఆ సత్యం పూర్తిగా కొత్త రూపంలో అతనికి సాక్షాత్కరించింది. ఇప్పుడు అంతిమ సత్యాన్ని ఎదుర్కోబోతున్నాడతను. అతనికి తెలిసిన సత్యాలు గుర్తుకు రాసాగాయి. భయకంపితులై, హడిలిపోయి పరిగెత్తే జనం. వాళ్ళలో స్త్రీలూ, పిల్లలూ, వృద్ధులూ కూడా ఉన్నారు. కలాష్నికోవ్ లోంచి పేలిన మందుగుండు దెబ్బకి నేల మీద గుట్టలు గుట్టలుగా ఒరిగిపోయారు. ఇంకో రోజు బతికేందుకు బైటికి వచ్చిన జనం…వాళ్ళతో తను కూడా చనిపోదామనుకునే వచ్చాడు, కానీ అలా ఎక్కడ జరిగింది? బతికిపోయాడు. ఈ నాలుగేళ్ళు గడపడం కోసమే ప్రాణాలతో బైటపడ్డాడు.

ఈరోజు తనని తెచ్చి ఉంచిన చోట ఎనభైయేళ్ళ క్రితం సత్యంతో ప్రయోగం చేసిన ఆ వ్యక్తి కూడా ఉండేవాడని అతనికి తెలుసు. ఈ గోడలు అందర్నీ చూశాయి. సత్యం తో ప్రయోగాలు చేసే వాళ్ళనే కాక అసత్యంతో ప్రయోగాలు చేసేవాళ్ళని కూడా చూశాయి. అర్ధరాత్రి కావచ్చింది. సీ-7096 గోడలని తాకి వాళ్ళ స్పర్శని పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు. వీటిలో ఒకటి ఆ స్పర్శ కూడా ఉండచ్చు!

గోడ మీద ఒక నీడ కనిపించింది. అతను ఉలిక్కిపడ్డాడు. ఆ నీడ నెమ్మదిగా నడుచుకుంటూ అతని దగ్గరకి వచ్చింది. అతనికి ఇంకా భయం వేసింది. నీడ సరిగ్గా అతని ముందు వచ్చి నిలబడింది. ఈ నీడని అతను ఫొటోల్లో చూశాడు. దీనికి కొన్ని గుర్తులున్నాయి, వాటిని బట్టి ఎవరైనా ఆ నీడని గుర్తుపట్టగలరు. సీ-7096 కూడా వాటిని బట్టే ఆ నీడని గుర్తించాడు. కానీ ఏం చెయ్యాలో అతనికి పాలుపోలేదు. ఆ నీడ మొహం ఇప్పుడు అతనికి స్పష్టంగా కనిపిస్తోంది. దాన్నిప్పుడు నీడ అని కూడా అనలేడు. గుండ్రటి ఫ్రేమున్న కళ్ళద్దాల్లోంచి వయసుమళ్ళిన ఆ నీడ కళ్ళు తననే చూస్తున్నాయి. ఈరోజు ఆ నీడ దుస్తులు విచిత్రంగా ఉన్నాయి. కింద అదే అందరికీ చిరపరిచితమైన పంచెకట్టు, కానీ పైన ముతక ఖద్దరుతో నేసిన ఖైదీలు వేసుకునే మురికి చొక్కా. దానిమీద తోలుతో చేసిన చిన్న బిళ్ల వేలాడుతోంది. ఆ బిళ్ళమీద 189 అనే అంకె ఉంది. మొహాన అదే చిరునవ్వు…అది ఆయన ట్రేడ్ మార్కు! సీ-7096 కళ్ళూ కళ్ళజోడులోంచి చూస్తున్న ఆయన కళ్ళూ కలుసుకున్నాయి. సీ-7096 కి చాలా ఇబ్బందిగా అనిపించింది.

“ఎలా ఉన్నావు?”అంటూ నవ్వే పెదవుల్లోంచి ఒక ప్రశ్న వినిపించింది. సీ 7096 అయోమయంలో పడ్డాడు.

“మీరు నన్నేనా అడుగుతున్నది?”అని ప్రశ్నకి ప్రశ్న బదులిచ్చాడతను.

“ఇక్కడున్నది మనమిద్దరమే కదా? మరి నిన్ను తప్ప ఇంకెవర్ని అడుగుతాను?” 189 శాంతంగా నవ్వుతూ అన్నాడు.

“అదికాదు, ఈ రాత్రివేళ ఇక్కడ  నన్నా ప్రశ్న అడగడం గురించి అంటున్నాను.ఏం జరిగిందో మీకు తెలీదా?”అన్నాడు సీ 7096 పొడిగా. అది వినగానే 189 మొహం మీది నవ్వు వెలిసినట్టయింది. నక్షత్రాల్లా మెరుస్తున్న కళ్ళు కూడా మెరుపు తగ్గాయి. 189 బోసి నోటితో గాలి నెమరేస్తూ, చేతిలోని కర్రని గోడకి ఆనించి కింద కూర్చునేందుకు సిద్ధమయాడు. అది చూసి సీ 7096 సాయం చేసేందుకు ముందుకెళ్ళాడు.

“అక్కర్లేదు,నేను కూర్చోగలను, ఇంకా అంత ముసలితనం రాలేదులే,”అని నేలమీద కాళ్ళు ఒక పక్కకి ముడుచుకుని అందరికీ బాగా పరిచయమున్న పోజులో కూర్చున్నాడు 189. మోకాళ్ళకి పైకి ఉన్న ధోవతిలోంచి అస్థిపంజరాల్లా ఉన్న రెండు కాళ్ళు కనిపిస్తున్నాయి. 189 సూటిగా సీ 7096 కళ్ళలోకి చూసి నవ్వాడు. అంతవరకూ ఆయన్నే చూస్తున్న అతను ఆయన అలా చూసేసరికి తడబడ్డాడు. అతని తడబాటుకి ఆయనకి ఇంకా నవ్వొచ్చింది.

“ఎలా ఉన్నావని ఇవాళే అడగాలి,”అన్నాడు 189, ఇవాళే అనే మాటని ఒత్తి పలుకుతూ. సీ 7096 జవాబు చెప్పకుండా ఊరుకున్నాడు. 189 మొలలో ఉన్న గడియారాన్ని తీసి టైమ్ చూశాడు. టైమ్ చూడగానే ఆయన కళ్ళలో కలవరపాటు కనిపించింది. తనలో తాను ఏదో గొణుక్కున్నాడు. అది సీ 7096కి వినిపించలేదు.

“ఎలా ఉన్నావో చెప్పనేలేదు నువ్వు?” అన్నాడు. బోసినోట్లోంచి మాటలు స్పష్టంగా రావడం లేదు.

“బాగానే ఉన్నాను,” అన్నాడతను నిర్లిప్తంగా “బాగున్నావా? నిజంగానా?” అన్నాడాయన. అతన్ని ఎగతాళి చేసే ఉద్దేశం 189 కి లేకపోయినప్పటికీ అతనికి అలాగే అనిపించింది.

“ఏం…ఎందుకు బాగుండకూడదు? ఏం జరుగుతోందని నేను ఆనందంగా ఉండకూడదు?” అన్నాడు అతను కొంచెం కోపంగా.

“అబ్బే,నా ఉద్దేశం అది కాదు, నేను అన్నది…”అని 189 ఏదో సంజాయిషీ ఇవ్వబోయే లోపల అతను అడ్డొచ్చి,”ఏమిటి? ఏమనాలనుకున్నారసలు? నేను భయపడాలా? బెదిరిపోయి ప్రాణభిక్ష పెట్టమని బతిమాలాలా? నా మొహంలో చావు భయం కనిపించడం లేదనా? చూడండీ, ఇదంతా ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అన్నీ తెలిసే ఇక్కడికి వచ్చాను. అసలు నేను  నాలుగేళ్ళు ఆలస్యంగా వచ్చాను. నా మిత్రులు నాలుగేళ్ళ క్రితమే స్వర్గం చేరుకున్నారు!” అన్నాడు అతను అరుస్తున్నట్టుగా. గొంతులో ఉక్రోషం తొంగిచూసింది.

ఇలాంటి మాటలు వినడం 189కి అలవాటే. ఇంతకు ముందు ఎన్నోసార్లు ఉక్రోషం వెళ్ళగక్కే మాటలు విన్న అనుభవం ఉంది. వాటిని మౌనం అనే ఆయుధంతోనే ఎదుర్కొన్నాడు. ఆ తరవాత ఎవరూ మాట్లాడలేదు. సీ 7096 ఆయన జవాబు కోసం ఎదురుచూడసాగాడు.

పది నిమిషాలు,పదిహేను నిమిషాలు గడిచాయి…గడియారం ముళ్ళు ముందుకి కదుల్తున్నాయి,కానీ 189 నోరు విప్పలేదు. సీ 7096 కి ఆయన మౌనం భయం పుట్టించడం మొదలెట్టింది. గోడలమీదా, నేలమీదా కేవలం మౌనం! మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు మౌనం అతనికి హాయినిస్తుంది, కానీ ఇద్దరు మనుషులున్నప్పుడు వాళ్ళ మధ్య మౌనం భయపెడుతుంది. ఎంత త్వరగా ఈ మౌనం వీడితే అంత బావుంటుందని అనిపిస్తుంది. 189 కావాలనే మౌనంగా ఉన్నాడు. ఆయనకి ఇంకోళ్ళని భయపెట్టడమంటే మహా ఇష్టం. అలా భయపెట్టేందుకు ఆయన ఎన్నో మార్గాలు అనుసరిస్తాడు, మౌనవ్రతం చేపట్టడం, నిరాహారదీక్ష చెయ్యడం లాంటివి. ఒక్కోసారి ఆయన చిరునవ్వు కూడా అవతలివారిని భయపెడుతుంది.

సీ 7096 అలజడికి గురవుతున్నాడు. లోలోపల ఆ అలజడి క్షణం క్షణం పెరిగిపోతోంది.

దాన్నించి తప్పించుకునేందుకు ఏదో ఒకటి మాట్లాడాలనిపించి,” మీరు వేసుకున్న జైలు దుస్తులు ఇక్కడివి కానట్టుందే?” అన్నాడు.

“ఇదా?”అంటూ 189 తన చొక్కాని చేత్తో తడుముతూ దానికున్న నంబరు బిళ్ళని వేళ్ళతో పట్టుకుని, “ఇది ఇక్కడిది కాదు, సౌత్ ఆఫ్రికాది. నేను మొదటిసారి జైలుకెళ్ళినప్పుడు ఇచ్చారు దీన్ని”అన్నాడు.

“మరి ఇక్కడ ఈ దుస్తులు…?”అన్నాడు సీ 7096.

“జైళ్ళు మారతాయి కానీ దుస్తులు ఎక్కడైనా అవే, జైళ్ళన్నీ ఒకేలా ఉంటాయి. మొదటిసారి ఈ దుస్తులు వేసుకున్నామంటే ఇక జీవితాంతం ఒంటికి అతుక్కుపోయి వదలవు. జైల్లో ఉండడం నీకు అవస్థగా ఉందేమో కాని నిజం చెప్పాలంటే ఇదొక వ్యవస్థ. ఈ అవస్థనీ, వ్యవస్థనీ అర్థం చేసుకున్నావనుకో, ఇక నా సౌత్ ఆఫ్రికా దుస్తులు కూడా నీకు అర్థమవుతాయి”అన్నాడు 189 ఇంకా గూఢంగా నవ్వుతూ.

ఆ నవ్వు చూస్తే సీ 7096 కి చెప్పలేనంత ఇబ్బందిగా ఉంది. అతనికి ఇలాంటి నవ్వు చూడడం అలవాటు లేదు.

“అసలు మీరిక్కడికి ఎలా…నా ఉద్దేశం, మీరిక్కడే ఉంటున్నారా? రాజధానిలో ఉంటారని విన్నానే?” 189 మళ్ళీ మౌనం దాలుస్తాడేమో అనే భయంతో సీ 7096 ఏదో ఒకటి మాట్లాడాలని తడబాటుకి గురవసాగాడు. ఆయనతో వ్యక్తిగత విషయాలు చనువుగా మాట్లాడాలని ప్రయత్నించడం మొదలెట్టాడు. ఆయన ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండకపోతే తనకి మతిపోయేట్టుంది.

అదే భంగిమలో కూర్చుని 189 తలెత్తి సీ 7096 వైపు చూశాడు. ఎన్నో ఏళ్ళ అనుభవంతో ఇక మౌనం వహించాల్సిన అవసరం తీరిపోయిందని గ్రహించాడు.

“ఎంతసేపని నిలబడే ఉంటావు,కూర్చో,” అంటూ కుడిచేత్తో కూర్చోమని సైగ చేశాడు. ఎవరో కీ ఇచ్చినట్టు సీ 7096 ఎదురుగా ఉన్న గోడకి ఆనుకుని కూర్చున్నాడు. మౌనం అనే మంత్రం ఫలించింది. 189 ఎప్పుడూ అవతలివాళ్ళు తన మాట వినేట్టు చేసేందుకూ, అన్నీ తన పక్షం ఉండేట్టు చూసేందుకూ ఈ మంత్రాన్నే ఉపయోగించేవాడు. ఒకటి రెండు సందర్భాల్లో తప్ప అది ఎప్పుడూ తన ప్రభావాన్ని చూపించకుండా ఉండలేదు. కర్ణుడి శాపంలా విచిత్రంగా అన్నిటికన్నా ఎక్కువ అవసరం ఉన్నప్పుడే ఈ మంత్రం పనిచెయ్యకుండా పోయింది!

ప్రస్తుతం వాళ్ళిద్దరూ ఎదురు బొదురుగా కూర్చున్నారు. 189 మౌనాన్ని వీడాడు, కానీ ఆ సంగతి సీ 7096 కి తెలియకూడదనీ, అతన్ని ఇంకా తన మౌనంతో భయపెట్టాలనీ ఆయన అనుకున్నాడు. ఎప్పుడైనా ఆ మౌనాన్ని మళ్ళీ కొనసాగించే అవకాశం ఉంటుందని అతనికి తెలియాలన్నది ఆయన ప్రయత్నం.

“నేనిక్కడే ఉన్నానే…అప్పట్నించీ ఇక్కడే ఉన్నాను, రాజధానిలో నాకు ఇంకేం మిగిలిందని? నీలాగే నేను కూడా నాలుగేళ్ళనుంచీ ఇక్కడికి రావాలనుకుంటున్నాను. వాళ్ళిద్దర్నీ పోగొట్టుకుని వెనక్కి వచ్చి నాలుగేళ్ళయింది. అప్పట్నించీ ఇక్కడికి రావాలనే అనుకుంటూ ఉన్నాను. వాళ్ళిద్దరూ ఇక్కడే నిద్రపోతున్నారు, వాళ్ళని వదిలి ఎలా వెళ్ళగలను? కానీ పని పూర్తి కాలేదు. ఇక అయిపోతుందనుకునే సమయానికి మరెవరికో నా అవసరం పడింది. అయినా ఇప్పుడు కాకపోతే తరవాతైనా నేనిక్కడికి రావలసినవాణ్ణే” అన్నాడు 189. ఆ మాటల్లో ఏదో గూఢార్థం ఉన్నట్టు అనిపించింది సీ 7096 కి.

“జైల్లో ఉన్నాను, కానీ రెండోసారి నన్ను మహల్ లో ఉంచారు…ఆగాఖాన్ మహల్ లో. రెండూ ఇక్కడే యారవాడ లోనే ఉన్నాయి. ఇక్కడికి దగ్గర్లోనే ఉంది ఆ మహల్. అందుకే ఇక్కడికీ అక్కడికీ తిరుగుతూ ఉంటాను”

“నేనేమో 2012 లో వచ్చాను, విచిత్రంగా ఉంది కదూ…32,42,12…” అన్నాడు సీ 7096 ఏదో కొత్తవిషయం కనిపెట్టినట్టు.

“అవును విచిత్రమే, కానీ నేను రావడం, నువ్వు రావడం ఒకటి కాదు. ఒకటే అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ తేడా ఉంది…చాలా పెద్ద తేడా. నువ్వింకా చిన్నవాడివి. పాతికేళ్ళు నీకు. అందుకే ఆ తేడా ఎలాటిదో అప్పుడే నీకు అర్థం కాదు,” అన్నాడు 189 తనమాటకి తిరుగులేదన్నట్టు. సీ 7096 జవాబు చెప్పలేదు.

“నలభైరెండులో వచ్చినప్పుడు బా, మహాదేవ్ ఇద్దరూ నావెంట ఉన్నారు. మహాదేవ్ ఆరు రోజులు మాత్రమే ఉండి వెళ్ళిపోయాడు”అంటూ ఉంటే 189 గొంతు గద్గదమైంది. నలభైరెండు,ఆగస్టు పదిహేనో తేదీన వెళ్ళిపోయాడు మహాదేవ్. నేను అతన్ని ఎన్నిసార్లు పిలిచినా లాభం లేకపోయింది. మామూలుగా అతను నామాట జవదాటడు…కానీ ఆరోజు అతన్ని ఆగాఖాన్ మహల్ లోనే పడుకోబెట్టేశారు” తనగొంతులో ఎలాంటి భావోద్రేకమూ పలకకుండా 189 జాగ్రత్త పడ్డాడు.

“ఆ తరవాత రెండేళ్ళకి ఫిబ్రవరి ౨౨ న బా కూడా…ఇద్దరూ ఒకరి తరవాత ఒకరు వెళ్ళిపోయారు. నేను ఒంటరిగా మిగిలాను. బా కూడా ఆ మహల్లోనే శాశ్వతంగా నిద్రపోయింది. నా రెండు చేతులూ అక్కడ నిద్రపోతున్నాయి. ఇద్దరి జ్ఞాపకంగా అక్కడ ఒక ఆలయం లాంటిది కట్టించారు. నేను జైల్లోంచి విడుదలైనప్పుడు నాకు చేతుల్లేవు! ఆసరికి బైటి ప్రపంచం కూడా చాలా మారిపోయింది. నలభై నాలుగులో ఇక్కణ్ణించి విడుదల పొంది రాజధానికి వెళ్ళాను, నలభై ఎనిమిదిలో అక్కణ్ణించి బైటపడి మళ్ళీ ఇక్కడికే వచ్చేశాను. రాజధానిలో ఇక చెయ్యవలసిన పనులేవీ లేవనిపించింది. పైగా నావల్ల రాజధానికి కూడా ఎటువంటి ప్రయోజనమూ లేదని అనుకున్నాను. అందుకే వెనక్కి వచ్చేశాను. వీళ్ళిద్దరికోసమే నేనిక్కడ ఉంటున్నాను. ఇంకెక్కడికీ వెళ్ళేది లేదు!” 189 చివరి వాక్యం గొణిగినట్టు అన్నాడు.

“ఆవిడ పోయాకే మీకు ఆవిడ విలువ తెలిసొచ్చిందా?” చాలాసేపటికి సీ 7096 నోటినుంచి ఈ చిన్న వాక్యం వచ్చింది. ముసలి కళ్ళజోడుకి ఆ ప్రశ్నలోని సెగ తగిలి కళ్ళు పైకి లేచాయి. ఆ కళ్ళు సూటిగా సీ 7096 కళ్ళలోకి చూశాయి. ఈసారి సీ 7096 మొహం మామూలుగా ఉంది. 189 వ్యక్తిత్వం ప్రస్తుతం అతన్ని ప్రభావితం చెయ్యడం మానేసింది. 189 కి సీ 7096 కళ్ళలో నిప్పు సెగ కనిపించింది. ఎన్నో ఏళ్ళ క్రితం ఒక కంటికి మాత్రమే లెన్స్ పెట్టుకున్న ఒక వ్యక్తి కళ్ళలో ఇదే సెగ చూశాడు 189. కానీ ఆయనకి ఇలాంటివి అలవాటే.

“అదేం లేదు, నాకు బా విలువ ఎప్పట్నుంచో తెలుసు. అందుకే నేను కూడా ఆవిణ్ణి బా అనే పిలిచేవాణ్ణి”189 గొంతు విచిత్రంగా వణికింది. అది మరీ వినీ వినిపించనట్టుండి సీ 7096 కి తెలియలేదు.

“అందుకేలాగుంది జీవితాంతం ఆవిణ్ణి పట్టించుకోలేదు మీరు!”వాక్యం చిన్నదే అయినా సీ 7096 అన్న మాటల్లో లోతైన అర్థమే ఉంది.

“అదేం కాదు.ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే నువ్వు ఎంతో చదావాలి. గొప్ప పనులు చెయ్యాలని నడుం కట్టుకున్నప్పుడు కుటుంబాన్ని కొంత వదులుకోవలసి వస్తుంది. తమ కుటుంబం ఇక విస్తృతమైపోయిందనీ, ఇతరులకి కూడా సమయం కేటాయించవలసిన అవసరం ఉందనీ వాళ్ళు తెలుసుకోవాలి. బుద్ధుడైనా,రాముడైనా,కృష్ణుడైనా, ఏసుక్రీస్తయినా, చివరికి మహమ్మద్ ప్రవక్తైనా సరే కుటుంబం మీద వ్యామోహం వదులుకోవలసిందే!”189 తన వాదనని సమర్థించుకునేందుకు జవాబు చెప్పాడు.

గోడలకవతల రాత్రయింది కానీ నిశ్శబ్దంగా లేదు. ఇక్కడ రాత్రి నిశ్శబ్దంగా ఉండదు. ఈ రోజూ అంతే. అసలు అదంతా జరగబోయే ముందటి రాత్రి నిశ్శబ్దంగా ఎలా ఉంటుంది?

“కుటుంబ సభ్యులు కూడా మనమీద మమకారం చంపుకోవలసిందే. లేకపోతే అర్ధరాత్రి, నిద్రపోతున్న భార్యని వదిలి సత్యాన్ని తెలుసుకోవడం కోసం అడవుల్లోకి వెళ్ళేవాడిని ఎవరు సమర్థిస్తారు …?” 189 గొంతు బాగా తగ్గించి ఈ మాటలు అన్నాడు. ఆ తరవాత ఇద్దరి మధ్యా మౌనం రాజ్యమేలింది. సీ 7096 తదేకంగా 189 చేతుల వైపే చూడసాగాడు… ’ఆజానుబాహువు!’ అనుకున్నాడు.

“నేను కూడా నా కుటుంబాన్ని వదిలి ఈ అడవిలోకి వచ్చేశాను…!”అన్నాడు సీ 7096 తలెత్తకుండా. మళ్ళీ “అమ్మనీ, నాన్ననీ, చెల్లినీ, ఇద్దరు తమ్ముళ్ళనీ వదిలి… శాశ్వతంగా…నేనిక్కడ ఉన్నానని మా అమ్మకి తెలియనుకూడా…” అతను వాక్యాన్ని అసంపూర్ణంగా వదిలేశాడు.

“తేడా ఉంది. నువ్వు నీ కుటుంబానికి ఏదో చెయ్యాలని వాళ్ళని వదిలి వచ్చావు. దేశం కోసమో సమాజం కోసమో కాదు. అలాటిదేదైనా చేసి ఉంటే విషయం వేరుగా ఉండేది” అన్నాడు 189 కొంచెం కోపంగా.

“మీరు పేదరికాన్ని చూడలేదు, అనుభవించలేదు. అందుకే ఇలాటి మాటలు మీరు సులభంగా అనేస్తున్నారు. ఇంట్లో మీ తోడబుట్టినవాళ్ళు ఆకలితో అలమటిస్తూ ఉంటే, మీ తలిదండ్రులు పేదరికం కోరల్లో చిక్కి క్రమంగా మృత్యువుకి చేరువవుతూ ఉండడం చూస్తూ ఉంటే, అప్పుడిక దేశం, సమాజం లాటివి గుర్తుండవు. అప్పుడు గుర్తుండేది ఒక్కటే…ఆకలి…ఆకలి…ఆకలి”అన్నాడు సీ 7096 ఆవేశంగా.

“మా కుటుంబంలో మొత్తం ఆరుగురం. సంపాదించేది మాత్రం ఒక్కరే.అది కూడా నికరంగా చేతికి వచ్చే నెలజీతం కాదు. చేతికి డబ్బులు ఎప్పుడొస్తాయో ఎప్పుడు రావో తెలీని పరిస్థితి. నాలుగో తరగతి దాకా చదివాక చదువు మానెయ్యాల్సి వచ్చింది. ఆ తరవాత చేసేందుకేమీ లేకుండా పోయింది. ఏం చేస్తాను?ఇలాటి పని చెయ్యకపోతే…?”189  అతని బాధని అర్థం చేసుకుని మళ్ళీ మౌనంగా ఉండిపోయాడు. సీ 7096 పిడికిళ్ళు బిగిశాయి. బహుశా ఏడుస్తున్నట్టున్నాడు. కానీ 189 కి అతని ఏడుపు వినపడడం లేదు.

“మీరు చెప్పిన మహనీయులందరూ మహళ్లలో ఉండేవారు. వాళ్ళలో ఎవరూ పేద కుటుంబానికి చెందినవాళ్ళు కారు. పేద ఇంట్లో పుట్టి ఉంటే సత్యాన్ని వెతుకుతూ అడవుల్లోకి వెళ్ళవలసిన అగత్యం ఉండేది కాదు, ఇంట్లోనే సత్యం సాక్షాత్కరించి ఉండేది” సీ 7096 ఏడవడం లేదు. అతని గొంతు స్పష్టంగా ఉంది.

“మా నాన్నే స్వయంగా నన్ను ఈ మనుషులకి అప్పగించాడు. ఏ తండ్రైనా తన పిల్లల్ని మృత్యువు ఒడిలోకి పంపుతాడా? పంపడు కదా? కానీ అలాటిది నాకే జరిగింది. మా నాన్నే ’వీళ్ళ వెంట వెళ్ళు, మంచి బట్టలూ, మంచి తిండీ ఇస్తారు. నువ్వు వీళ్ళతో వెళ్తే మాకు కూడా డబ్బులు దొరుకుతాయి. డబ్బుంటే నీ తోడబుట్టినవాళ్ళు సుఖంగా బతకగలుగుతారు. పెళ్ళిళ్ళు కూడా సవ్యంగా జరుగుతాయి’ అని నచ్చజెప్పి పంపించాడు.”

189 తన పొడవాటి చేతిని జాపి సీ 7096 భుజం మీద ఉంచాడు. ఆ స్పర్శ ఏదో వింత ఓదార్పునీ, ఉపశమనాన్నీ ఇచ్చినట్టు అనిపించిందతనికి. తలెత్తి 189 వైపు చూశాడు. అలవాటు ప్రకారం బోసినోటితో గాలి నములుతున్నట్టు దవడలాడిస్తూ 189 చిన్నగా నవ్వాడు.

“నాలుగో తరగతి దాకా చదివి,వెంటనే నువ్వు వీళ్ళతో చేరిపోయావా?” 189 మెత్తగా అడిగాడు.

“లేదు, కొన్నాళ్ళు ఊళ్ళోనే కూలి పని చేశాను. కానీ సంపాదన అంతంతమాత్రంగానే ఉండేది.తరవాత పని వెతుక్కుంటూ పట్నం వెళ్ళాను. కానీ అక్కడా పని దొరక్క మళ్ళీ ఉన్న ఊరికే రావలసివచ్చింది”అన్నాడు 7096. 189 చేత్తో అతని భుజాన్ని రెండు సార్లు చరిచి మళ్ళీ తన ఒళ్ళో పెట్టేసుకున్నాడు.

“అందుకే నేను ఎప్పుడూ అనేవాణ్ణి, పల్లెల్లో అభివృద్ధి వెలుగులు ప్రసరించనంత కాలం పూర్తి స్వాతంత్ర్యం వచ్చినట్టు కాదని.ఒకరి అధీనంలో ఉన్నా, స్వతంత్రంగా ఉన్నా నగరాల్లో పెద్ద తేడా ఏమీ రాదు. నిజమైన బానిసత్వం ఉండేది పల్లెటూళ్ళలోనే. ఆ బానిసత్వం ఈనాటికీ అలాగే ఉంది. స్వాతంత్ర్యం వస్తే అసమానతల అగాధం పూడుకుంటుందని అనుకున్నాను”అన్నాడు 189. బోసినోటితో మాట్లాడుతూంటే ఉచ్చారణ తమాషాగా ఉందనిపించింది సీ 7096కి.

“ఏ స్వాతంత్ర్యం గురించి చెపుతున్నారండీ మీరు? స్వాతంత్ర్యం ఎక్కడొచ్చింది? మీ దేశంలో స్వాతంత్ర్యం ఎలా వచ్చిందో అందరికీ తెలుసు. మీ దేశంలోనే ఒక ధనవంతుడు ఐదువేల కోట్ల ఖర్చుతో ఒక భవనం కట్టించి తన భార్యకి కానుకగా ఇస్తున్నాడు. ఐదువేల కోట్లు!!! ఐదువేల కోట్లంటే ఎంతో తెలుసుకదా మీకు? అయినా మీకెందుకు తెలీదు, అన్ని నోట్లమీదా మీ ఫొటోనే కదా అచ్చు వేస్తారు? ప్రస్తుతం కరెన్సీ అంటే మీరే. ఐదువేల కోట్లతో ఎన్ని కుంపట్లు, ఎన్ని రోజులపాటు వెలుగుతాయో కాస్త లెక్క కట్టండి. అగాధం గురించి మాట్లాడుతున్నారు మహానుభావా! ప్రస్తుతం అగాధం లేదూ ఏమీ లేదు, ఆకాశానికీ నేలకీ ఉన్నంత తేడా ఉంది. అగాధమైతే పూడ్చడం సాధ్యమౌతుంది. ఆకాశానికీ నేలకీ ఉన్న దూరాన్ని దేంతో పూడుస్తారు?” సీ 7096 కి ఆవేశం ఎక్కువై 189 మీది మీదికి రాసాగాడు.

189 ని కరెన్సీ అని అవమానించాలనుకున్నాడు. కానీ 189 ఏమీ జవాబు చెప్పకుండా అతని కళ్ళలోకి లోతుగా చూసి ఊరుకున్నాడు. మళ్ళీ ఒకసారి తన జేబు గడియారాన్ని తీసి టైమ్ చూశాడు.

“మానాన్న నన్ను వాళ్ళతో పంపించేప్పుడు నా వైపు చూడకుండా, ‘బాబూ,నువ్వు వీళ్ళ వెంట వెళ్తే మాకు తిండీ బట్టా దొరుకుతాయి’ అన్నాడు,” 189 మౌనంగా ఉండడం చూసి సీ 7096 అన్నాడు.

“మరి మీ అమ్మ? ఆవిడ ఏమంది?” 189 అడిగాడు.

“నిరుపేదల ఇళ్ళలో అమ్మలు ఏమీ అనరు, ఊరికే ఏడుస్తారంతే. విషయం ఏదైనా వాళ్ళకి తెలిసింది ఏడవడం ఒక్కటే. మా అమ్మ కూడా ఏడ్చి ఊరుకుంది”అన్నాడు సీ 7096 వణికే గొంతుతో. మళ్ళీ 189 అతని భుజం తట్టి ఓదార్చాడు. గోడలు మౌనంగా అంతా చూస్తున్నాయి.

“నన్ను చంపేస్తే ఇదంతా ముగిసిపోతుందా? నాలాంటి వాళ్ళందరూ ఇక లేకుండా పోతారా? అక్కడ చాలా పేదరికం ఉంది. నిరుపేద తండ్రులు ఒక ముద్ద అన్నం కోసం ,జానెడు గుడ్డముక్క కోసం నాలాంటివాళ్ళని వీళ్ళకి అప్పగిస్తూనే ఉంటారు. అలాంటి తండ్రులు చాలా మందే ఉన్నారక్కడ. నన్ను చంపినంత మాత్రాన కథ ముగుసిపోదు. నేను ఒక చిన్న పావుని మాత్రమే. నా చావు పెద్ద లెక్కలోకి రాదు. ఒక్క పిసరు కూడా మార్పు రాదు,”అన్నాడు కసిగా సీ 7096. అతని గొంతులోని కసి 189 కి తెలిసింది.

“అందుకే విభజన వద్దని మొత్తుకున్నాను. నా శవం లేచాకే విభజన జరగాలని కూడా అన్నాను. నేను శవంగా మారినా పరవాలేదు , విభజన మాత్రం జరిగి తీరవలసిందే అన్నారు వాళ్ళు. చిరకాల స్నేహితుడే అందరికన్నా పెద్ద శత్రువుగా మారతాడని నాకు తెలుసు. విభజన జరిగాక కూడా ఇంటి గోడలు కలిసే ఉంటే అన్నదమ్ముల మధ్య అయినా ఒక్కొక్క అంగుళం కోసమూ గొడవలు రాక మానవు. ఈనాడు రెండు ముక్కలైన ఈ భాగాలు రేపు అతి పెద్ద శత్రువులై ఇద్దరి ముందూ నిలబడతాయని నాకు అప్పుడే తెలుసు. చూడు, ఇప్పుడు జరిగింది అదే కదా? నువ్వే దానికి అన్నిటికన్నా పెద్ద నిదర్శనం!” అన్నాడు 189 గొంతు తగ్గించి.

“విభజన జరగకుండా ఆపాలని చూశారా మీరు?” అని అడిగాడు సీ 7096

“శతవిధాల ప్రయత్నించాను,కానీ నామాట ఎప్పుడూ,ఎవరూ వినలేదు” అన్నాడు 189.

“ధృతరాష్ట్రుడు కూడా మహాభారత యుద్ధం జరగకుండా ఆపాలనే చూశానన్నాడు. కానీ ఆయన మాటా ఎవరూ వినిపించుకోలేదు కదా? దుర్యోధనుణ్ణి హస్తినాపురానికి రాజు చెయ్యాలనుకున్నాడనుకోండి, అది వేరే విషయం. ఆ విషయంలో మొండిపట్టు సడలించలేదు కానీ యుద్ధం మాత్రం కూడదన్నాడు. మీరు ఇంతకు ముందన్నారు, మమకారం వదులుకోవాలని, కానీ మీ కొడుకు మీద మమకారం వదులుకోలేకపోయారేం?”అన్నాడు సీ 7096.

“నాకు కొడుకు మీద మమకారమా? అసలు నన్ను బోనులో నిలబెట్టిందే నా సంతానాన్ని సరిగ్గా పెంచలేదని కదా?”అన్నాడు 189.

గోడలకి అవతల ఏదో హడావిడి వినిపిస్తోంది. ఏవో ఏర్పాట్లు చేస్తున్న చప్పుళ్ళు,గొంతు తగ్గించి ఎవరో మాట్లాడుతున్నారు. జనం హడావిడిగా అటూ ఇటూ తిరగడం వినిపిస్తోంది. ఆ చప్పుళ్ళకి సీ 7096 గాభరా పడుతున్నాడు. అతని కళ్ళు మాటిమాటికీ ఆ చప్పుళ్ళు వినవస్తున్నవైపు భయంగా చూస్తున్నాయి.

“నేను చెప్పేది మీ కన్నకొడుకు గురించి కాదు, మీరు మమకారం వదులుకోలేని కొడుకు ఒక్కడే, అతని గురించి అంటున్నాను. అధికార పీఠం మీద అతనే కూర్చోవాలని కోరుకున్నారు. ఇంకెవరూ ఆ పదవి చేపట్టడం మీకిష్టం లేకపోయింది. అలా కాకుండా మీరు మీ పట్టు విడిచిపెట్టి ఉంటే విభజన జరిగేదే కాదు. మీరు కూడా మహాభారతం జరగకూడదనీ అయినా మీ కొడుకే పదవిని అలంకరించాలనీ కోరుకున్నారు” బైటివైపు చూస్తూ నిర్లక్ష్యంగా అన్నాడు సీ 7096

” నేనా…? విభజన జరగకూడదని, దాన్ని ఆపాలని నేను ప్రయత్నించలేదా? నేను శాయశక్తులా ప్రయత్నించాను. ఒక ఉత్తరం కూడా తీసుకెళ్ళి ఇచ్చాను. ‘అధికారం కావలసినవాళ్ళకి ఇచ్చెయ్యండి, కానీ విభజన మాత్రం జరగనీయద్దు’ అని రాసి మరీ ఇచ్చాను. నా మాట ఎవరైనా వింటే కదా? ఓడిపోయి ఆ ఉత్తరం పట్టుకుని వెనక్కి వచ్చేశాను. విషయం నా చెయ్యిదాటిపోయింది. వాళ్ళు స్వాతంత్ర్యం కోసం ఎటువంటి మూల్యం చెల్లించటానికైనా సిద్ధపడ్డారు. విభజన కూడా ఆ మూల్యంలో ఒక భాగమే” అన్నాడు 189 అలసిన గొంతుతో.

7096 కళ్ళార్పకుండా ఆయన్నే చూస్తున్నాడు. అతనికి 189 మొహంలో ఒక విచిత్రమైన దిగులుతో నిండిన భావం కనిపించింది. ఈనాటివరకూ అతను చూసిన ఆయన ఫొటోలు వేటిలోనూ అలాంటి దిగులు కనబడలేదు. ఎప్పుడూ ఆ బోసి నవ్వే చూశాడు.పేరు తెచ్చుకుని గొప్పవారైపోతే ఇదొక ప్రమాదం, ఎప్పుడూ అందరికీ మీరు నవ్వుతూ కనిపించాలి! దిగులు ఉంటే దాన్ని కప్పిపుచ్చుకోవాల్సిందే.

మహాత్ములు, అవతార పురుషులు ఎక్కడైనా దిగులుగా ఉంటారా? వాళ్ళే దిగులు పడితే మామూలు మనుషులకి వాళ్ళమీదున్న భ్రమ తొలగిపోతుంది కదా! మామూలు మనుషులు తమ దిగులుకి పరిష్కారాలని వీళ్ళ దగ్గరే వెతుక్కుంటారు. వీళ్ళే దిగులు పడితే వీళ్ళని ఎవరు పట్టింగహుకుంటారు? సీ 7096 ఆయన అన్న మాటలకి ఘాటైన సమాధానం చెప్పాలని అనుకున్నాడు. అతని దగ్గర అలాంటి సమాధానం ఉంది. కానీ 189 మొహంలో దిగులు అతన్ని ఇబ్బంది పెట్టింది. ఎందుకో గాని ఆయన్ని మరింత బాధ పెట్టేందుకు అతని మనసు ఒప్పుకోలేదు.

” కానీ…కానీ మీరు తల్చుకుంటే అది సాధించటం సాధ్యమయేదే. మొత్తం మీ చెయ్యి దాటిపోయిందనటం సరికాదు. జనం మీ వెంటే ఉన్నారు. మీ మాటలు విన్నారు, మీ మాటకి విలువిచ్చారు. ఆ ఉత్తరం పట్టుకుని రోడ్డుమీదికొచ్చి, జనానికి నచ్చజెప్పి ఉంటే, వాళ్ళు మీ మాట వినేవాళ్ళు కారూ? తప్పకుండా వినేవాళ్ళే. కానీ మీరు పుత్ర వాత్సల్యంలో…మీ మానస పుత్రుడి మీది మమకారంలో పడి అన్నీ వదిలేశారు. మీ శవం మీదే విభజన జరగాలి అన్నప్పుడు విభజనకి ముందు మీరు శవంగా మారలేదేం? లేదు, మీరు నిజంగా అడ్డుకోవాలనుకుంటే విభజన జరక్కుండా చూసేవారే. మీ పుత్త్ర ప్రేమ అడ్డొచ్చింది. అప్పుడు మొదలైన ఆ మహాభారతం ఈనాటివరకూ కొనసాగుతూనే ఉంది” కటువైన మాటలు అనకూడదని సీ 7096 చాలా ప్రయత్నించాడు, కానీ వేగంగా గడిచిపోతున్న సమయం ఇక కాలం తన చేతిలోంచి ఇసుకలా జారిపోతోందని చెపుతున్నట్టు అనిపించింది. ప్రవహించే కాలం అతనికి మిగిలిఉన్న క్షణాలని దోచుకుంటున్నట్టు అనిపించింది. ఇంక ఎక్కువ సమయం లేదేమో! అందుకే మనసులో ఉన్నదంతా కక్కేస్తున్నాడు. ఈ సారి 189 అతని మాటలకి జవాబు చెప్పలేదు.

“మీరు దాన్ని ఆపి ఉండచ్చు. జనం మీ మాట వినేవారు,”అంటూ మళ్ళీ గొణిగాడు సీ 7096.

“ఆ ఉత్తరంలో నేను రాసినదానికి వాళ్ళు ఒప్పుకున్నట్టయితే నేను దేశమంతటా తిరిగి జనాలని ఒప్పిస్తానని చెప్పాను. కానీ ముందు నావాళ్ళు అందులోని విషయాలని ఒప్పుకోవాలి. వాళ్ళే కాదన్నాక నాకింక వేరే దారి లేకపోయింది. ఇక దాన్ని తీసుకెళ్ళి లూయిస్ కి ఇచ్చెయ్యాల్సి వచ్చింది. నేను అనుకున్నది సాధించలేక పోయానని ఓటమిని అంగీకరించటం తప్ప చేసేదేమీ లేకపోయింది. నా చేతిలో ఏమీ లేదనీ, మీరు ఎలా కావలిస్తే అలా చెయ్యండనీ అన్నాను. అసలు నా నా చేతిలో ఏమైనా ఎలా ఉంటుంది? వాళ్ళ పార్టీని నేను వదిలిపెట్టి ముప్ఫైనాలుగేళ్ళయింది. వాళ్ళ ధోరణి బొత్తిగా నచ్చక వదిలేశాను,” అన్నాడు 189. ఆయన తనలో తనే మాట్లాడుకుంటున్నంత నెమ్మదిగా మాట్లాడాడు.

“మాకు మావాళ్ళు ఏం చెపుతారో తెలుసా? విభజన జరిగినప్పుడు అటువైపువాళ్ళు మా హక్కులన్నిటినీ కాజేశారని అంటారు. అందుకే మా దేశంలో అంత పేదరికం ఉందని చెపుతారు. మమ్మల్ని వెళ్ళి మా హక్కుల్ని సాధించుకు రమ్మని పంపిస్తారు. నాకూ అదే చెప్పారు”అన్నాడు సీ 7096.

“ఈనాటి వరకూ ఎప్పుడు ఏ విభజన జరిగినా పెద్దవాడే నిందని భరిస్తున్నాడు. తమ్ముడి వాటాని దోచుకున్నాడని అన్ననే దోషిగా నిలబెడతారు. తమ్ముడు అన్నకి అన్యాయం చేశాడని ఎప్పుడూ అనరు. అన్న అవడంలో ఇది కూడా ఒక సమస్యే. సాఫల్యం సాధించలేని ప్రతి సమాజమూ తన ఓటమికి కారణాలని బైటే వెతుక్కుంటుంది. మనం తయారుచేసిన ఈ సమాజం అసమానతలమీద నిలబడి ఉంది. ధనవంతుడు రోజు రోజుకీ మరింత ధనవంతుడైపోతూ ఉంటాడు, పేదవాడు మరింత అధోగతికి దిగజారిపోతూ ఉంటాడు.

“నువ్వు చెప్పే పేదరికం ఇక్కడా ఉంది. అంతే ఉందో ఇంకా ఎక్కువే ఉందో! నీకు ఆట్టే సమయం లేదు లేకపోతే తీసుకెళ్ళి చూపించేవాణ్ణి. నేను దేశమంతా తిరిగి చూసిన పేదరికాన్ని నీకూ చూపించేవాణ్ణి. బైటికి ప్రదర్శించేట్టు అంత గొప్పగా ఏం లేదు ఈ దేశం. నగరాల్లోని వెలుగులు చిమ్మే రహదారులనే చూపిస్తారు, చీకటి సందులూ, గొందులూ, ఆకలితో అలమటించే పల్లెల్లోని మట్టి కాలిబాటలూ ఎవరు చూపిస్తున్నారు? స్వాతంత్ర్యం మొత్తంగా పెద్ద పెద్ద ఇనప్పెట్టెలు నింపుకోవడానికే పనికివచ్చింది. అంత పెద్ద పోరాటమూ వ్యర్థమైపోయింది…ఏమీ సాధించలేదు…ఇప్పుడనిపిస్తుంది…అనవసరంగా అంత శ్రమపడ్డామేమోనని…అంతా వృథా…వృథా అయింది…” అని 189 తన చేతితో సీ 7096 వేళ్ళని తాకాడు.

“కావాలంటే నన్ను మీవెంట తీసుకెళ్ళి మీ దేశం చూపించండి. మీమాట ఎవరు కాదంటారు? రేపు జరగవలసినది కొన్ని రోజులకివాయిదా వేస్తారు, అంతే. మీతో వచ్చి మీ దేశం చూశాక మళ్ళీఇక్కడికే వచ్చేస్తాను. నాకు జరగబోయేదాన్ని గురించి నేనుభయపడటం లేదు.కానీ ఈ లోపల నేను చూసి, అనుభవించివచ్చిన పేదరికం లాంటిదే ఇక్కడ కూడా ఉందా అని తెలుసుకోవాలనుకుంటున్నాను. ముందు మనిద్దరం ఇక్కడి పేదరికాన్ని చూద్దాం. తరవాత మీరు నావెంట వచ్చి అక్కడ ఉన్నపేదరికాన్నీ, ఆకలినీ చూద్దురుగాని. స్వాతంత్ర్యం రాకముందు అక్కడిపరిస్థితి మీరు చూసే ఉంటారు, కానీ తరవాత ఎలా ఉందోచూడాలిగా!” ఇంకా ఆయన వేళ్ళమీద తన వేళ్ళు అలాగే ఉంచిఅన్నాడు సీ 7096.

“నా మాట ఎవరు వింటారు? ఎప్పుడో మానేశారు. అప్పుడే వినకపోతే ఇప్పుడిక ఎవరు వింటారు?ఒక విషయం చెప్తాను విను, ఈ లోకం ఒకవ్యక్తి పటాన్ని పూజించినప్పటికీ అతని మాట వింటుందనేమీగ్యారంటీ లేదు. పటం ఫ్యాషన్ కోసం కూడాపెట్టుకుంటారు!” అన్నాడు 189.

“అయినా మీరెందుకు మాట్లాడతారు? నేను మర్చిపోవడం నాదేతప్పు. ౨౩ మార్చి ౧౯౩౧ రోజున కూడా లాహోర్ సెంట్రల్ జైల్లోఉదయం ఏడు గంటలకి ఆ ఉరితాడు వేస్తూంటే దాన్ని ఆపగలిగి కూడా మీరేమీ అనలేదు. మీరు సైగ చేసినా ఆ ఉరి ఆగిపోయేదే. కానీమీరు దాన్ని ఆమోదిస్తున్నట్టు తలవంచుకుని ఊరుకున్నారు. ఆ ఘోరాన్ని జరగనిచ్చారు!” మొదటిసారి సీ7096 గొంతులో వెటకారం ధ్వనించింది.

“వాళ్ళు హింసకి పాల్పడ్డారు. వాళ్ళని కాపాడి ఉంటే  దేశమంతటాహింస విజృంభించి ఉండేది.ఏ రకమైన హింసనీ నేను సమర్థించను. హింసవల్ల దేన్నీ సాధించలేం. ఒకవేళ సాధించినాదాన్ని నేను ఆమోదించను. నేను నా అహింసామార్గాన్ని వదులుకోదలచలేదు. 189 గొంతు మళ్ళీ దృఢంగా మారింది.

“అహింసా? అదెక్కడుంది? అన్నివైపులా హింసే రాజ్యమేలుతోంది. అడవిలో సింహం జింకలని చంపుతోంది, ఆకాశంలోడేగ పిచుకలని చంపుతోంది, సముద్రంలో పెద్దచేప చిన్నచేపలనిమింగుతోంది, అంతటా హింసే ఉంది. అడవిలో అమలయే న్యాయమే అంతటా చెల్లుతోంది మహాశయా! మీరు చంపేవాళ్ళలో కాకపోతేచనిపోయేవాళ్లలో ఉంటారు. ఏవైపు ఉండడానికి ఇష్టపడతారో మీరే నిర్ణయించుకోవాలి. ఈ లోకాన్ని కూడా అడవిని నిర్మించినట్టే నిర్మించారు. ఇక్కడ ప్రాణాలతో ఉండాలంటే హింస చెయ్యకతప్పదు” ఇంకా సీ 7096 గొంతులో వెటకారం అలాగే ఉంది.

“సరే, కానీ నాకు కొన్ని సిద్ధాంతాలున్నాయి. నేను హింసని ఎంతమాత్రం సమర్థించలేదు, సమర్థించను. వాళ్ళు చేసిన పనికి శిక్ష అనుభవించాల్సిందే కదా? నేనెందుకు జోక్యం చేసుకుంటాను? అయినా నేను అడ్డుపడితే వాళ్ళు చావు తప్పించుకునేవాళ్ళా?” సీ 7096 తనని వెటకారం చేస్తున్నాడని గ్రహించి 189 మరింత దృఢంగా అన్నాడు.

“అందుకే ఆ శిక్ష పడడానికి సరిగ్గా 18 రోజుల ముందు, మార్చి 5 న మీరు ఆ ఒడంబడిక చేసుకున్నారు. సరిగ్గా 18 రోజుల ముందు! అది మీరు వేసిన ఎత్తు కాదా? ఆ ఒడంబడికలో రాజకీయ ఖైదీలందరినీ విడుదల చెయ్యాలన్న అంశం ఉన్నప్పుడు దాన్ని అలాగే ఉండనివ్వాల్సింది! అందులో ‘హింసాయుతమైన పనులు చేసినవారిని తప్ప’ అనే వాక్యాన్ని ఎందుకు జోడించాల్సి వచ్చింది? హింస చేసేవాళ్ళెవరు? ఆ దోషులు మీ అభిప్రాయాలని అంగీకరించని వారే కదా? మిమ్మల్ని సమర్థించినవారందరూ అహింసావాదులేనాయె. ఈ ఒడంబడిక చేసుకుని మిమ్మల్ని సమర్థించేవారందరినీ రక్షించారు, కానీ మిమ్మల్ని ఎదిరించి, మీ అభిప్రాయాలతో ఏకీభవించని వారందరినీ ఉరికంబానికి వేలాడదీయించారు. ఆ ఒడంబడికవల్ల లాభం చేకూరింది మీకే. మీ పార్టీ మీద నిషేధాన్ని ఎత్తేశారు. మీవాళ్ళ ఆస్తులన్నీ వెనక్కిచ్చేశారు. మీరు చాలా యుక్తిపరులని జనం ఊరికే అనలేదు,” సీ 7096 పెద్ద ఉపన్యాసమే ఇచ్చాడు.

బైటి గోల ఎక్కువైంది. జనం పెద్దగా మాట్లాడుకుంటున్నారు. ఇటూఅటూ హడావిడిగా నడిచే కాళ్ళ బూట్ల చప్పుడు కూడా ఉండుండివినిపిస్తోంది.

” అహింస నా సిద్ధాంతమనీ, ఎపుటికీ దాన్నే నమ్ముతాననీ, హింసని సమర్థించే పనులేవీ అన్నటికీ చెయ్యననీ చెప్పా కదా?ఎవరైనా, ఎప్పుడైనా, ఎటువంటి హింసకి పాల్పడినా దాని పరిణామాలని ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాల్సిందే!” 7096 ఇచ్చిన అంతదీర్ఘోపన్యాసమూ 189 మీద ఎలాంటి ప్రభావమూ చూపలేదు. ఆయన అదే ధోరణి ప్రదర్శించాడు.

“ఎప్పుడూ మీ నోట వినిపించే రామనామం, చనిపోయేప్పుడు కూడా చివరిగా మీ నోటి వెంట వినిపించినది అదే, ఆ రాముడు కూడా హింసనే సమర్థించాడే? ఆయన అహింసని నమ్మనే లేదు. మీ రాముడుఎంత భీకరమైన యుద్ధం చేశాడు! అలాంటప్పుడు అహింసామంత్రాన్ని జపించే మీ నోట ఎప్పుడూ ఆయన పేరే వినిపిస్తుందేమిటి? ఆయన చేసిన హింస మీకు హింసలా కనిపించదా? ఇక ఎప్పుడూ మీవెంటే ఉండే భగవద్గీతలో ఏముంది?అతి పెద్ద హింస జరిగే ముందు ఇచ్చిన ఉపన్యాసం అది. ఒక యోధుడు అహింసా మార్గాన్ని అనుసరించాలనుకుని తన ఆయుధాలని పారేస్తూఉంటే, అతన్ని మళ్ళీ హింసవైపు ఉసికొల్పడానికి అన్న మాటలే కదా భగవద్గీత?మానవ చరిత్రలో అన్నిటి కన్నాఅతి ఘోరమైన హింస జరిగినది ఆ యుద్ధంలోనే అనేది మీకూ తెలుసు. ఆ హింస జరగడానికి సరిగ్గా ముందు, దాన్ని ప్రారంభించేందుకు చెప్పిన మాటలన్నిటినీ మీరు ఎప్పుడూ వెంట ఉంచుకుంటారు, కానీ అహింస గురించి మాట్లాడతారు!” అన్నాడు సీ 7096 మరింత ఉద్రేకంగా. 189 జవాబేమీ చెప్పలేదు.ఒకసారి గాలిని నమిలాడు. ఇబ్బందికరమైన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా ఉండేందుకు అదే ఆయన వాడే ఉపాయం.

“విభజన కారణంగా రెండు దేశాలలోనూ పది లక్షలకి పైగా ప్రాణాలు కోల్పోయినప్పుడు మీరు మాత్రం ఎక్కడ ఆపగలిగారు? ఇంకాఎంతమంది ఇళ్ళూ వాకిళ్ళూ కోల్పోయారో, ఎంతమంది ఆచూకీ తెలీకుండా మాయమయారో వాళ్ళ లెక్కే తేలలేదు.అంత హింస తరవాత లభించిన స్వాతంత్ర్యాన్ని మీరందరూ స్వీకరించారు కదా? టపాకాయలు కాల్చారు, డప్పులు వాయించి ఆ స్వాతంత్ర్యానికి స్వాగతం పలికారు!” 189 గాలి నమలడం చూసి సీ 7096 కిఆవేశం హెచ్చింది. గొంతులో కోపాన్ని ప్రదర్శించాడు. మళ్ళీ అతనికి మౌనమే సమాధానమయింది. వంచిన మోకాలి మీది చెయ్యి కొద్దిగా కదిలిందంతే.

మళ్ళీ సీ 7096 మౌనాన్ని ఛేదిస్తూ,” ఆ… కొన్ని వేలమంది అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న ఆ హంతకుడు, ఆయుధాల దళారి, వాడు చేసిన హింస మీకు కనబడలేదు. ఆ రక్తం రుచి మరిగిన తోడేలు ఆరేళ్ళ క్రితం మీ దేశానికి వచ్చినప్పుడు, రక్తసిక్తమైన తన పంజాలతో, మాంసం ముక్కలు అతుక్కున్న పళ్లతో మీ సమాధి దగ్గరకి కూడా వచ్చాడు. వాడిప్పుడు ఈ ప్రపంచానికే రాజు కాబట్టి వాడు చేసిన హింస న్యాయమేనా? వాడి రక్తంతో నిండిన పంజాలకి స్వాగతం పలికేందుకు మీ దేశమే రెడ్ కార్పెట్ అవుతుందా? మీరు ఆ సమాధిలో నిద్రపోతూ వాడు సమర్పించిన రక్తం అంటిన పువ్వులని స్వీకరించి, చూస్తూ ఊరుకున్నారు కదూ? వాడు ఈ కాలపు అతి పెద్ద యుద్ధ నేరస్థుడు. వాణ్ణి మీ సమాధి దగ్గరకి మీదేశమే ఆహ్వానించింది. మార్చి ౨,౨౦౦౬ నాటి ఆ బ్లాక్ థర్స్ డే న మీ సమాధీ, మీ అహింసా, మీ సిద్ధాంతాలూ అన్నీ, ఆ నేరస్థుడిచ్చిన పువ్వులు స్వీకరించగానే, అపవిత్రమైపోయాయి. మీరు గర్వించేందుకు ఇంకేమీ మిగల్లేదు…” సీ 7096 కోపంగా మాట్లాడుతూనే ఉన్నాడు, 189 అతని మాటలన్నీ మౌనంగా విన్నాడు. కోపంగా అనే మాటలు వినడం ఆయనకి బాగా అలవాటే.

“కనీసం వాణ్ణి రాకుండా చెయ్యాల్సింది. వాడు హత్య చేసి నెత్తుటిధారలు ప్రవహింపజేసింది ఆ పెద్ద భూభాగానికి చెందినవాళ్ళనే కదా! అదంతా ఒకే జాతికి చెందినవాళ్ళ రక్తం…వాళ్లని మీరు ఆర్యులంటారు. ఇక్కణ్ణించి అక్కడిదాకా పరుచుకున్నది ఆరక్తమే. వాడి రక్తం వేరు, కనీసం మీరైనా మీవాళ్ళ పక్షం మాట్లాడి ఉండవలసింది. అప్పుడు మీ అహింసా సిద్ధాంతాన్ని వాడి చెవులు చిల్లులు పడేట్టు గొంతు చించుకుని మరీ అరవాల్సింది. కానీ ఎవరూ మాట్లాడలేదు, ఏమీ మాట్లాడలేదు. మౌనం అంగీకారమనే మాట మీకే బాగ తెలిసుండాలి. మౌనంగా ఉండి మీరు కూడా వాడి హింసని సమర్థించారు. అందుచేత అహింస గురించి ఇప్పుడు మాట్లాడే హక్కు మీకు గాని ఇంకొకరికి గాని లేదు. వాడు ప్రపంచంలో ఏ మూలకి కావాలంటే ఆ మూలకి సైన్యాన్ని పంపించగలడు. ఎవరికైనా మరణదండన విధించెయ్యగలడు. వాడి నాన్న ఒక తోడేలైతే వీడూ తోడేలే. చాలాకాలం క్రితం వాడి నాన్న సైన్యంతో వచ్చాడు. లక్షమందిని హతమార్చి మరీ వెళ్ళాడు. పాలస్తీనా నుంచి ఇరాక్ దాకా ఈ తోడేళ్ళ గోళ్ళ, వాడైన కోరల గుర్తులే. కానీ మీకవి కనిపించవు!” సీ 7096 గొంతు కాస్త తగ్గించి అన్నాడు. ఆ తరవాత కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. 189 తను ఏమీ మాట్లాడకుండా అతనికి తన ధోరణిలో మాట్లాడేందుకు ఎక్కువ అవకాశం ఇచ్చాడు. ఇక సీ 7096 చెప్పేందుకేమీ లేదని ఆయన గ్రహించాడు. తను కూర్చున్న భంగిమ మార్చుకుని మోకాళ్ళు మరోవైపుకి మడుచుకున్నాడు. బైట చప్పుళ్ళు ఎక్కువయాయి.

“కొంచెం నీళ్ళు…”అన్నాడు 189 నెమ్మదిగా. వెంటనే సీ 7096 గ్లాసులో నీళ్ళు నింపి ఆయనకి అందించాడు. 189 నెమ్మదిగా ఒక్కొక్క గుక్కే తాగి గ్లాసు అతనికి అందించి, “రాత్రిపూట సామాన్యంగా గోరువెచ్చని నీళ్ళే తాగుతాను. కానీ ఇప్పుడు ఎలాంటినీళ్ళైనా ఏమీ తేడా తెలీదు” అని 189 ధోవతి కింది అంచుని సాఫీచేశాడు.

మళ్ళీ”అప్పటి సంగతి వేరు. అంతా పద్ధతి ప్రకారం చేసే అలావాటుండేది. కానీ మంచి అలవాట్లని జీవితాంతం పాటించడం అంత సులభం కాదు” అని బోసి నోటితో నవ్వాడు. ఆ నవ్వు పేలవంగా ఉంది.

“నీ తమ్ముళ్ళు ఏం చేస్తూంటారు?” బైటి చప్పుళ్ళు ఎక్కువవడం గమనించి 189 మాట మార్చాడు.

“ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలీదు, ఐదేళ్ళ క్రితం, నేను ఇల్లు వదిలి వచ్చినప్పుడు పెద్ద తమ్ముడు పొలంలో కూలీ పని చేసేవాడు, చిన్నవాడు స్కూల్లో చదువుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలీదు” అన్నాడు సీ 7096. అతని గొంతు గద్గదమైంది. తల వంచుకుని “నేను చేసిన ఈ పనికి ఫలితంగా వాళ్ళకి ఏమైనా దక్కిందో లేదో కూడా తెలీదు” అన్నాడు.

“మీ నాన్న ఏం చేసేవాడు?” సీ 7096 మెత్తబడడం చూసి 189 మరో ప్రశ్న వేశాడు.

“పెరుగ్గారెలు అమ్మేవాడు. ఇంటింటికీ తిరిగేవాడు. కొన్నిసార్లు ఊళ్ళోనే అమ్మితే కొన్నిసార్లు బైటికి వెళ్ళి అమ్మేవాడు. కానీ పెద్దగా సంపాదనేమీ ఉండేది కాదు, గడిచిపోయేది అంతే”ఇంకా తలవంచుకునే సమాధానం చెప్పాడతను.

“ఇల్లు విడిచి నువ్వు వచ్చిందెప్పుడు?” అంటూ 189 తన చెతిని మళ్ళీ అతని భుజం మీద ఉంచాడు.

“ఐదేళ్ళయిపోయింది అప్పుడే. నేను ఇల్లు వదిలినప్పుడే మా ఊళ్ళో పూరబ్ అనే అమ్మాయి హత్యకి గురైంది. అది చలికాలం, డిసెంబర్ అనుకుంటా,” అంటూ సీ 7096 తన భుజం మీదున్న 189 చేతిమీద తన చేతిని ఉంచాడు. కానీ తల మాత్రం ఎత్తలేదు.

“ఎవరి వెంట వెళ్ళావు?”అన్నాడు 189.

“మా చిన్నాన్న వెంట. ఆయన ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళమనీ, ఆయన వెంటే ఉండమనీ చెప్పాడు మా నాన్న. ఏమీ అడక్కుండా ఆయనవెంట వెళ్ళిపోయాను”అన్నాడు సీ7096 కాస్త దిగులుగా. 189 చేతిమీదున్న తన చేతిని తీసి నేలమీద ఆనించాడు. ఆ తరవాత 189 ఇంకేమీ అడగలేదు. ఇద్దరూ అలా మౌనంగా కూర్చుని ఉండిపోయారు.

“నాకు మా అమ్మంటే…చాలా…చాలా ఇష్టం…ప్రేమ. అమ్మ నాతో చాలా సన్నిహితంగా ఉండేది. అమ్మ నా కోసం…” ఆతరవాత సీ 7096 గొంతు పెగల్లేదు. 189 అతని భుజాన్ని చేత్తో గట్టిగా నొక్కాడు.

“అందరూ అమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తారు, అందరూ. ఈ ప్రపంచం మొత్తాన్ని అమ్మల చేతుల్లో పెడితే, ఈ రక్తపాతం, హింసా మొత్తం ఆగిపోతుంది. కానీ మనం అలా ఎన్నటికీ జరగనివ్వం. ఎందుకంటే అమ్మలు ఈ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తారు. ప్రపంచపటం మీదున్న గీతల్ని ఊడ్చి చెరిపేస్తారు. ఈ చివర్నించి ఆ చివరి దాకా అంతా ఒకేలా ఉండేట్టు చేసేస్తారు. చీపురుతో మందుగుండు సామాన్లని చిమ్మి చెత్తబుట్టలో పారేసి వస్తారు. మందుగుండు ఎప్పుడూ తల్లుల గర్భాలనే కాల్చివేస్తుందని వాళ్లకి తెలుసు. ఈ లోకాన్ని వాళ్లకి గనక అప్పజెపితే దీన్ని హాయిగా బతికేందుకు వీలుగా మార్చేస్తారు వాళ్ళు. మనం లోకాన్ని ప్రియురాళ్లకి అప్పజెప్పాం, భార్యలకి అప్పజెప్పాం, ఉంపుడుగత్తెలకి అప్పజెప్పాం, కానీ ఎప్పుడూ ఏ తల్లికీ అప్పజెప్పలేదు. మనకి భయం…ఒకవేళ తల్లులు ప్రపంచమంతటా ప్రేమ నింపేస్తే మనం ఎక్కడికి పోతాం, ప్రేమ నిండిన ఆ ప్రపంచంలో ఎలా బతుకుతాం, అనే భయం! మనకి అలా బతకడం అలవాటే లేదే!” అన్నాడు 189 ప్రేమ నిండిన గొంతుతో. సీ 7096 అలాగే తలవంచుకుని కూర్చున్నాడు. ఇద్దరూ ఒకరి మనసులో ఏముందో ఇంకొకరు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ మౌనంగా ఉండిపోయారు.

“మందుగుండు పేలినప్పుడు మొట్టమొదటి కేక ఎవరో ఒక తల్లి గొంతులోంచే వస్తుంది.అది ఎక్కడైనా కావచ్చు, ఆ తల్లి ఎవరైనా కావచ్చు. ప్రపంచంలోని తల్లులందరూ మందుగుండుని ఎంత అసహ్యించుకుంటారో నువ్వు ఊహించలేవు” 189 గొంతు ఖంగుమని పలికింది.

“తెలుసు, నాకు బాగా తెలుసు. మా అమ్మకి కూడా మందుగుండంటే పరమ అసహ్యం. కానీ అసహ్యించుకున్నంత మాత్రాన ఏదీ ముగిసిపోదు కదా! అది అక్కడే అలాగే ఉంటుంది. మీరు ఎంత అసహ్యించుకున్నప్పటికీ” సీ 7096 గొంతులో దిగులు పెరిగిపోయింది.

“నిన్ను అక్కడికి పంపినప్పుడు నువ్వెందుకు ఎదురుతిరగలేదు? అప్పటికి నీకు ఇరవైయేళ్ళు. మంచీ చెడూ తెలుసుకునే జ్ఞానం ఉంది. నాకు వెళ్ళాలని లేదని అనుండచ్చే?” 189 సరైన అదను చూసి అడిగాడు.

“నేను పదమూడేళ్ళకే స్కూలు మానేశానని మీకు తెలుసు కదా? ఆ తరవాత ఏమీ చెయ్యకుండా ఉండిపోయాను. చేసేందుకు ఏమీ లేకపోయింది. ఎప్పుడైనా ఒకటి రెండు రోజులు కూలీ పనికి పోయేవాణ్ణి. అలాంటి సమయంలో ఎవరైనా వెళ్లనని ఎలా అనగలరో మీరే చెప్పండి?” ప్రశ్నకి ప్రశ్నే బదులు చెప్పాడు సీ 7096.

అక్కడికెళ్ళకైనా ఈ పని చెయ్యకూడదు, వెనక్కి వెళ్ళిపోవాలని నీకు అనిపించలేదా?” 189 గొంతులో ఇప్పుడు మృదుత్వం లేదు.

“అనిపించింది, ఇలాంటి పనులు నేను చెయ్యలేనని కూడా చెప్పాను. కానీ నా మాట వినిపించుకున్నదెవరు? చెప్పడం, వినడం లాంటివి అక్కడ ఉండవు. వెనక్కి వచ్చే మార్గం లేకపోయింది. వాళ్ళు చెప్పే మార్గం ,స్వర్గానికి తీసుకెళ్ళే మార్గం ఒక్కటే మిగిలింది నాకు. అక్కడ ఆ కొండ ప్రాంతాల్లో నేను కాక నాలాంటివాళ్ళు మరో పాతికమంది దాకా కుర్రవాళ్ళు ఉండేవారు. అందరూ తిండికి కూడా గతిలేని నిరుపేదలే. నా లాగే వాళ్ళు కూడా నరకంలాంటి జీవితాన్ని స్వర్గం చేసుకునేందుకు అక్కడికి వచ్చారు. దాన్ని సాధించాలంటే మేమే స్వయంగా స్వర్గానికెళ్ళాలని మాకందరికీ తెలుసు. ఆ కొండల్లోనే మాకు మందుగుండు సామానుతో ఆడుకోడం నేర్పారు. మందుగుండు సామాన్లలోఅన్ని రకాలూ, రంగులూ అక్కడే చూశాం. దాన్ని ఎలా అదుపు చెయ్యాలో, అదుపులో ఉంచుకుని మా లక్ష్యం కోసం దాన్ని ఎలా వాడుకోవాలో నేర్చుకున్నాం,” సీ 7096 గొంతు మామూలు స్థితికి రావడం మొదలెట్టింది. ఒక్క క్షణం ఆగి గొణుగుతున్నట్టు ” నేనా పని చెయ్యలేను, నా వల్లకాదని చెప్పాను, నిజంగా చెప్పాను!” అన్నాడతను.

“ఊ…ఇక నిన్నిక్కడికి పంపించినప్పుడు ఎందుకు పంపించారో నీకు తెలిసే వచ్చావా?” 189 కొంచెం మెత్తబడినట్టు అడిగాడు.

“తెలుసు,మాకందరికీ తెలుసు. ఇక్కడ మనుషులని చంపేందుకు పంపారు… ఇంకా…ఇంకా…మేం చనిపోయేందుకు కూడా…మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పంపించారో మాకందరికీ బాగా తెలుసు. అసలు మాకు శిక్షణ ఇచ్చిందే అందుకు. మా కుటుంబాలకి డబ్బులిచ్చింది కూడా అందుకే. ఇవాళ కాకపోతే ఏదో ఒక రోజు ఇక్కడికి వచ్చి హత్యలు చెయ్యడమే మా పని,” అన్నాడు సీ 7096.

“ఎవర్ని చంపడానికి?”189 అడిగాడు.

“ఎవర్నైనా సరే,కనబడిన వాళ్లందర్నీ…” సీ 7096 గొంతు అణగారిపోతోంది.

“ఎందర్ని చంపావు…ఆ స్టేషన్ లో?” అతని గొంతుని మరింత అణిచేందుకు 189 ఆ ప్రశ్న వేశాడు.

“తెలీదు…కానీ…రెండున్నర మేగజైన్లు ఖాళీ చేసేశాను. నేను…అలా కాలుస్తూ పోయానంతే. వాళ్లని చంపు, అప్పుడే మనం బతికి ఉండగలం అని చెప్పారు నాకు…అందుకే చంపుతూ పోయాను…ఎందర్ని చంపానో నాకే తెలీదు…” సీ 7096 ఆగి ఆగి మాట్లాడసాగాడు, అతని గొంతు చాలా నీరసంగా ఉంది.

“నువ్వు చేసిన ఈ పనికి అసలు అర్థమేమిటో తెలుసా నీకు? మీ చేత ఇలాంటి పనులు ఎందుకు చేయిస్తున్నారో ఏమైనా అవగాహన ఉందా?”189 నెమ్మదిగా అడిగాడు.

“తెలీదు,” అని క్లుప్తంగా జవాబు చెప్పాడు సీ 7096.

“మరి?” అన్నాడు 189.

డబ్బున్న కుటుంబాల్లోని వాళ్ళెవరైనా ఇలాంటి పనులెందుకు చేస్తారు? నాలాంటివాళ్ళే డబ్బులకాశపడి చేస్తారు కానీ!”ఈసారి సీ 7096 తలెత్తి సమాధానం చెప్పాడు. సూటిగా 189 కళ్ళలోకి చూస్తూ ఈ మాటన్నాక అలా చూస్తూనే ఉండిపోయాడు. 189 కూడా చూపులు మరల్చుకోలేదు. ఇద్దరూ కొంతసేపలా ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ఉండిపోయారు. కొంతసేపేమిటి, చాలాసేపు అలాగే కళ్ళతో మాట్లాడుకున్నారు. చాలా సేపటితరవాత 189 తన చేతిని సీ 7096 భుజం మీంచి తొలగించి,అతని ఒక చేతిని తన రెండు చేతుల్లోకీ తీసుకుని నొక్కాడు. సీ 7096 కి ఆ చేతుల్లో వెచ్చదనం ఉన్నట్టు తోచింది. ఆ వెచ్చదనాన్ని ఒకప్పుడు ప్రపంచం మొత్తం అనుభవించింది!

“మీకు…మీకు నన్ను చూస్తే అసహ్యం వెయ్యడం లేదా?”అన్నాడు సీ 7096 చాలాసేపటికి నోరు విప్పి.

“లేదు…అసలు నేను ఎప్పుడూ  పాపాన్ని ద్వేషించు, పాపిని కాదు, అనేవాణ్ణి. నేరాన్ని అసహ్యించుకోవాలి గాని నేరస్థుణ్ణి కాదు! అపరాధాన్ని అంతమొందించమనే ఎప్పుడూ చెప్పాను, అపరాధిని మట్టుపెట్టమని ఎప్పుడూ అనలేదు. నువ్వనే కాదు, ఆ అపరాధి ఎవరైనా నేనలాగే చేస్తాను. హింసకి సమాధానం హింస కాకూడదు. ద్వేషాన్ని ద్వేషంతో ఎదుర్కోకూడదు. ఒకవేళ తను చేసిన నేరాన్ని ఆ నేరస్థుడే అసహ్యించుకుంటే నేనతన్ని ప్రేమిస్తాను. ఎందుకో తెలుసా?అలాంటి సమయంలో అతనికి ఎక్కువ అవసరమైనది ప్రేమే” 189 చాలా తియ్యగా, సీ 7096 చేతిని తన చేత్తో మృదువుగా తడుతూ అన్నాడు. సీ 7096 ఏమీ జవాబు చెప్పకుండా ఆ కళ్ళ్జజోడులోంచి తనవైపు చూస్తున్న కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు.

“ఇందాక హింసని సమర్థిస్తూ నువ్వేమేమో అన్నావు. నేను మాట్లాడకుండా నువ్వు చెప్పింది విన్నాను. నువ్వు చెప్పిన దానితో ఏకీభవించకపోయినా నిన్ను ఆపలేదు. ఎందుకో తెలుసా? నా ఉద్దేశం ఈ లోకంలో ఉన్న ఎటువంటి అభిప్రాయమైనా సరే, దానితోపాటే దాన్ని ఏకీభవించకపోవడమనే అంశం కూడా దాని వెంటే ఉంటుంది. ఎటువంటి అభిప్రాయమూ కూడా సర్వసమ్మతమై ఉండదు. అలా ఉంటే అది అసలు అభిప్రాయమే కాదనాలి. నువ్వు వెలిబుచ్చిన అభిప్రాయాలలో కొన్నిటిని తప్ప మిగతా వేటినీ నేను ఒప్పుకోను. అయినా అలాగని నీతో అనలేదు. అవతలి వ్యక్తి భిన్నాభిప్రాయాన్ని తీసిపారెయ్యడం కూడా ఒక రకంగా హింసే అంటాను. అసలు ఆరోగ్యకరమైన ఏ సమాజానికైనా ఇదే, అన్నిటికన్నా పెద్ద హింస అంటాను” అని 189 ఒక్క క్షణం ఆగి తొడమీద ఉన్న జేబు గడియారంలో టైమ్ చూశాడు.

“ఇంక నేను అడగదల్చుకున్న ఆ ఒక్క ప్రశ్నా అడిగే సమయం వచ్చిందనుకుంటా. అక్కడిదాకా వచ్చేందుకే ఇంతసేపూ ఏవేవో ప్రశ్నలు వేస్తూ వచ్చాను,” అని ఆయన మళ్ళీ కాసేపు మౌనం వహించాడు. ఆ నిశ్శబ్దంలో బైటి చప్పుళ్ళు మరీ గట్టిగా వినిపించసాగాయి.

“ఇప్పుడు నా ఈ ప్రశ్నకి నువ్వు జవాబు చెప్పు. హింసని సమర్థిస్తూ నువ్వు చాలానే మాట్లాడావు. ఎన్నో ఉదాహరణలు ఇచ్చావు. కానీ ఇంకెవరి ఉదాహరణో కాకుండా నీ ఉదాహరణ ఆధారంగా నేనడిగే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. నువ్వు చేసిన హింస నీకు సమ్మతమేనా? అప్పుడు అక్కడ జరిపిన హింసాకాండని ఈరోజు, ఇక్కడ నువ్వు సమర్థిస్తావా? ఇప్పుడు దాన్ని ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడమే అన్నిటికన్నా ముఖ్యం, ఎందుకంటే ఇదే అంతిమ సత్యం. ఇంతకు ముందుగాని,తరవాత గాని జరిగేదేదీ సత్యం కాదు!” 189 గొంతు స్పష్టంగా, గట్టిగా పలికింది. ఒక్కొక్క మాటా ఆ గదిలో ప్రతిధ్వనిస్తున్నట్టు మారుమోగింది. దాని ప్రభావం సీ 7096 ని కొంతసేపు కమ్మేసింది. అతను 189 కళ్లలోకి ఒక్క క్షణం చూసి తల దించుకున్నాడు.

“నేనొప్పుకోను…లేదు, మీ మాటలు అస్సలు ఒప్పుకోనే ఒప్పుకోను” అన్నాడు 7096 తలవంచుకునే.

“ఇదే శాశ్వత సత్యం. దీన్ని గుర్తుంచుకో. నువ్వు చేసిన పని హింస అనీ, దాన్ని వ్యతిరేకిస్తున్నాననీ నువ్వు  ఒప్పుకుంటే, ఇక రేపు జరగబోయేదాన్ని నువ్వు ప్రశాంతమైన మనసుతో అంగీకరించగలుగుతావు. పరిపూర్ణమైన శాంతి అనుభవిస్తావు”అన్నాడు 189 ఎంతో తియ్యగా, ప్రేమగా. సీ 7096 ఆయన మాట అంగీకరించినట్టు మౌనంగా తల పంకించాడు.

“ఇంకొక మాట, ఈ ఆకలీ, పేదరికం ఎక్కువకాలం ఉండవు. ఒకరోజు జనం మళ్ళీ వెనక్కి వస్తారు…ఆ రోజు, ఇదే చేతికర్రతో ఆ ఐదువేల కోట్లు ఖరీదు చేసే భవనాన్ని ధ్వంసం చేస్తాను. అలాంటి భవనాలన్నిటినీ కూల్చేస్తాను. ఆ విరిగిన ముక్కలన్నిటినీ ఈ దేశమంతటా వెదజల్లుతాను. మీ ఇల్లు ఉన్నంత దూరం, మరీ మాట్లాడితే ఇంకా దూరం వాటిని విసురుతాను. ఈ నరభక్షక భవనాలు కూలిపోవాలి. కొన్ని లక్షలమందికి అందవలసిన వాటాలని పీల్చి పీల్చి తమలో నింపుకుంటున్నాయివి. నీ లాంటి ఇంకా ఎంతోమందిని సృష్టిస్తున్నవి ఇవే. ఇవి నేలమట్టమైన రోజున అన్నీ సర్దుకుంటాయి. నా మాట నమ్ము, అలాంటి రోజు తప్పక వస్తుంది, ఈ నా చేతికర్రతోనే ఒక్కొక్క భవనాన్నీ ముక్కలు ముక్కలుగా కూల్చేస్తాను”అంటూ తన పక్కనున్న కర్రని ఎత్తి గాల్లో గిరగిరా తిప్పాడు 189. మాట్లాదేకొద్దీ ఆయన గొంతు మరింత దృఢంగా అయింది. బైటి మాటలు ఇంకా గట్టిగా వినిపిస్తున్నాయి .తెల్లవారిపోయినట్టుంది. 189 తనని తాను సంబాళించుకుంటూ లేవడానికి ఉద్యుక్తుడయాడు. సీ 7096 గబగబా వెళ్ళి ఆయన్ని పట్టుకుని లేవదీశాడు. ఇద్దరూ ఎదురెదురుగా నిలబడ్డారు.

“ఇప్పుడు నీకింక భయం వెయ్యడంలేదు కదా?” అన్నాడు 189 అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ.

“లేదు, కానీ…అమ్మ గురించే భయం!” అన్నాడు సీ 7096 ఆయన వైపే చూస్తూ.

“అమ్మ గురించా, ఎందుకు?”

“నామీద అమ్మకి కోపం వస్తుంది”అన్నాడతను దిగులుగా.

“ఊ…అయితే ఈ భయం మంచిదే…చాలా మంచిది,”అన్నాడు 189, సీ 7096 భుజం తట్టి చిరునవ్వు నవ్వుతూ. సీ 7096 సమాధానమేమీ చెప్పలేదు కానీ మొదటిసారి అతని మొహంలో పల్చని చిరునవ్వు కనిపించింది.

“నీ మరణం గురించి నాకూ ఒక భయం ఉంది. నువ్వు చనిపోయాక అక్కడ జనం నిన్నొక హీరోని చేసేస్తారు. నీ గురించి కథలు కథలుగా చెప్పి, నీలాంటి అమాయకులని భావోద్రేకంతో నింపి అదే మార్గాన నడిపిస్తారు. నీ మరణాన్ని బలిదానం, వీర మరణం అంటారు. చనిపోయాక కూడా నువ్వు వాళ్లకి ఉపయోగపడుతూ ఉంటావు. ఇది అన్నిటికన్నా పెద్ద నష్టం అనిపించుకుంటుంది. అదే నా భయం. హింసని బలిదానం అనడం అన్ని ప్రమాణాలనీ మార్చేస్తుంది. సమాజానికి దానివల్లే అన్నిటికన్నా ఎక్కువ చెరుపు. హింస తాలూకు ఈ దుష్పరిణామాన్ని చూస్తేనే అన్నిటికన్నా నాకెక్కువ భయం. హింసా మార్గాన్ని అనుసరించేవాళ్ళని వీరులని ఆకాశానికెత్తితే, ఇక సమాజం మొత్తం అదే దారిన నడుస్తుంది,” 189 గొంతులో అలసట ధ్వనించింది.

“రేపు నువ్వు చనిపోయాక దేశమంతటా టపాకాయలు పేల్తాయి. కూడళ్ళలో మిఠాయిలు పంచుతారు, ఆనందంతో డప్పులూ,డోళ్ళూ వాయిస్తారు. నీ దిష్టి బొమ్మల్ని తగలబెడతారు” అన్నాడు 189 అతని కళ్లలోకి లోతుగా చూస్తూ.

“తెలుసు, కానీ మీరు చనిపోయినప్పుడు కూడా ఇవన్నీ చేశారు కదూ? తక్కువమందే కావచ్చు, కానీ కొందరైనా చేశారు” చూపు మరల్చుకోకుండా అన్నాడు సీ 7096.

” ఊ…నిజం చెప్పావు. నేను చనిపోయినప్పుడు కూడా కొందరు మిఠాయిలు పంచారు” 189 గొంతులో అపహాస్యం కనిపించింది, ఆ వెటకారం తనపట్లే . సీ 7096 ఆయన బోసినోటి నవ్వు చూస్తూ ఉండిపోయాడు.

“సరే , నేనిక వెళ్తాను ప్రార్థనకి వేళయింది. బా ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక నీకు కూడా సమయం ఆసన్నమైందనుకుంటా, బైట హడావిడి ఎక్కువైంది” అంటూ 189 చేతులు జోడించి నమస్కారం చేశాడు. సీ 7096 అవాక్కయి అయోమయంగా చూస్తూ నిలబడ్డాడు.

“ఇక వెళ్తాను”అంటూ 189 అడుగు ముందుకేశాడు.

“ఒక్క మాట…!” ఆయన వెళ్ళిపోతూంటే వెనకనించి సీ 7096 పిలిచాడు. అప్పటికి ఆయన గది ఆ కొసకి చేరుకున్నాడు. అతను పిలవగానే ఆయన ఆగి వెనక్కి తిరిగి చూశాడు.

“మా అమ్మకి చెప్పండి…” అన్నాడు సీ 7096 బొంగురుపోయిన గొంతుతో.

ఇద్దరూ గదికి చెరో కొసనా నిలబడిపోయారు. ఇద్దరిమధ్యా చిమ్మచీకటి పరుచుకుంది. బైటినుంచి ఎందరో నడిచివస్తున్న చప్పుడు…వాళ్ళ కాళ్ళకున్న జోళ్ళ చప్పుడు…జోళ్ళకి కొట్టిన మేకులు నేలకి తగుల్తున్న టకటకమనే చప్పుడు. అవి నెమ్మది నెమ్మదిగా దగ్గరవసాగాయి. అతనున్న గదివైపుకే రాసాగాయి. నడుస్తూ ఇంకా ఇంకా దగ్గరకి రాసాగాయి.

***

 

 

 

 

ప్రాంతీయభాష -తెలంగాణ కవిత

 

 

జీవితం చిత్రించబడకుండా ఒక ప్రాంత సంస్కృతి పరిపూర్ణంగా చిత్రించబడుతుందా అంటే కాదనే అనాలి.చరిత్రలో సాంస్కృతిక పునరుజ్జీవనం భాషవల్ల వ్యక్తమయిన సందర్భాలు చాలాఉన్నాయి.కాని ఒక ప్రాంతీయ సంస్కృతికి అనుబంధంగా ఉండే భాష తనపరిమితులకు లోబడే వ్యక్తమౌతుంది.తెలంగాణా ప్రాంతీయ ముద్రలో ప్రాంతీయభాష ,సంస్కృతి , వ్యక్తులు, వ్యక్తిత్వాలు వెలిగక్కిన కవిత రావడానికి ప్రాంతీయ కవిత కొన్ని మైలురాళ్ళు దాటింది.

Local color or regional literature is fiction and poetry that focuses on the characters, dialect, customs, topography, and other features particular to a specific region.

(స్థానీయవర్ణం లేదా ప్రాదేశిక సాహిత్యం అది కథ, కవిత ఏదైనా పాత్రలు, ప్రజా వ్యవహారంలోని భాష,వేష ధారణ,అయా నైసర్గిక ప్రకృతి చిత్రణ మొదలైన వాటిపై ప్రత్యేక ప్రాదేశిక పరిధిలో దృష్టి పెడుతుంది.)

ప్రాంతీయ కవిత్వం ఉత్పన్నమవడానికి సాంస్కృతిక మూలాలు ఎంత అవసరమో అక్కడి అణచివేతలుకూడా  అంతే కారణం.19వ శతాబ్దం మధ్య భాగాల్లో 20 వ శతాబ్దం మొదటిభాగాల్లో అమెరికాలో ప్రాదేశిక కవిత్వం వచ్చింది.” Donna M. Campbell లాంటి విశ్లేషకులు ఈ సాహిత్యాన్ని అనుశీలన చేసారు. సివిల్ వార్  తరువాత వచిన సాహిత్యంగా దీనిని చెప్పుకుంటారు. ఫిలిప్పిన్స్ సాహిత్యంలోనూ ఇంగ్లీష్ భాష ఆధిపత్యాన్ని తిరస్కరిస్తూ ప్రాదేశిక సాహిత్యం వచ్చింది.. ఈ మార్గంలో తెలంగాణా సాహిత్యం,కవిత్వం మినహాయింపుకాదు.

సాంస్కృతిక ,రాజకీయ అణచివేతల తరువాత బలమైన ప్రాదేశిక కవిత్వం రావడం సాహిత్యంలో కనిపిస్తుంది. ఈ మార్గంలో మొదటి పరికరం భాష.ప్రాతిపదికంగా వర్తమానంలో ప్రవహంలో ఉన్న భాషను రూపగతంగా తిరస్కరించే పరికరం భాష మాత్రమే.తెలంగాణా కవులు కూడా భాషపై తొలిదశలోనే దృష్టి పెట్టారు. తమ ఉనికి వ్యక్తం చేయడానికి భాష ఒక ప్రధానపరికరం అన్న జ్ఞానం ఆనాడే కనిపిస్తుంది.అయితే ఈ కవిత్వం ఆనాటికి శబ్దముఖంగా ఉనికి వ్యక్తం చేసే ప్రయత్నం చేసింది.

వస్తుగతంగా పల్లెను తీసుకుని అక్కడి వాతావరణాన్ని చిత్రించే ప్రయత్నం చేసింది.తొలి ఉద్యమ సందర్భంలో దేవరాజు మహారాజు “గుండె గుడిసె”, డా.ఎన్.గోపి “తంగేడు పూలు” ఇందుకు నిదర్శనం.

వైద్యుడు  ఉత్త పుణ్యానికిచ్చిన మందు

బతికి నట్టే జేస్తది “/”జలగ గునాలు బెట్కోని ఓఅ మన్శి/దేవతోలె మాటలిడుస్తడు“-(పే.35)

పేమ పజ్యాల వాయిజ్యాలు ఊకెవాగకు“-(పే.34)

ఈ కాలానికి తెలంగాణా ప్రాంతీయ కవితకు కొన్ని ప్రాతిపదికలైతే ఏర్పడ్దాయి. కాని పరిపూర్ణంగా రూపుదిద్దుకుందని అనలేం.దానికి కొన్ని కారణాలున్నాయి. భాషను పరికరంగా ఉపయోగించుకోవడంతో పాటు వస్తువును,అందులోని అంశాలను అనిర్దిష్టంగా ,ఊహాత్మకంగా ప్రతిపాదించడం.భాషా ముఖంగా తెలంగాణా ప్రాంతీయ ముద్ర ఈ పదాల్లో కనిపించినా “వైద్గుడు””పజ్యం””వాయిజ్యాలు”వంటి పదాల ఉనికి సృజనాత్మకమూ ఊహాత్మకమైందే.భాషా ముఖంగా వాడిన క్రియలు”జేస్తది””ఇస్తరు”వాటిలో ప్రాంతీయ ఉచ్చారణారూపం(Local oral form) దగ్గరగా ఉన్నది. డా. గోపి “తంగేడు పువ్వు”లాంటివి సాంస్కృతిక ప్రాతినిధ్యాన్ని(Cultural representation) ఇచ్చాయి. ఈ కవితలో ప్రాంతీయ ముద్ర(Local signet)ఉంది కాని కవితానిర్మాణంలో సాధారణ కవిత రూపమే కనిపిస్తుంది. డా.గోపి రాసిన “పల్లెల్లో మన పల్లెల్లో”కవితలో ప్రాంతీయభాష సజీవంగా కనిపిస్తుంది.అయితే ఈకోవవన్నీ పల్లీయకవిత్వం(Idyllic poetry)కి చెందుతాయి.ఈముద్రనుంచే కొన్ని కవితా శీర్శికలు,కొన్ని చోట్ల నామవాచకాలు. క్రియలు ఉపయోగించుకోవడం రెండవమలుపు. ఇవి ఊహాత్మకనుంచి, సాoస్కృతికత నుంచి వాస్తవికత దాకా ప్రాంతీయకవిత ప్రవహించిన ఆనవాళ్ళు.కాని వస్తు రూపంలో “ప్రాంతం”ప్రధానంగా వ్యక్త మవటం తక్కువ.

తొలిదశ తెలంగాణా ఉద్యమం మలిదశకు మధ్య కాలంలో తెలంగాణా  కవులు వివిధ సామాజిక,రాజకీయ ఉద్యమాలను మోయవలసి రావడం అందువల్ల వస్తువుగా తెలంగాణాను  ప్రధానంగా వ్యక్తం చేయవలసిన అవసరాన్నుంచి దూరం చేసింది.ఎమర్జెన్సీ,సాయుధ పోరాటాలు,రైతాంగ పోరాటాలు,తొలిదశ రాజకీయ ఆకాంక్ష ఇవన్నీ వస్తువులుగా తెలంగాణా  కవుల కవితలను ఆక్రమించాయి.మలిదశకు కొంత ముందుభాగాల్లో ఉన్న ప్రపంచీకరణ, పారిశ్రామిక విధానాలు,పట్టనీకరణ మొదలైనవీ ఇందుకు మినహాయింపు కాదు.

ఈ సమయంలోనే అస్తిత్వ ఉద్యమాలు పెరిగి తెలంగాణా ప్రాంతీయకవిత (Topographical poem)రావడానికి మార్గాలేర్పడ్దాయి.దళిత కవిత,బహుజన కవిత,ముస్లిం మైనారిటీ కవిత అందుకు దోహద పడ్దాయి.ముద్రనుంచి జీవితాన్ని చిత్రించడం ఇక్కడినుండే ప్రారంభమయింది.అందువల్ల సాంస్కృతిక క్షేత్రం,వ్యక్తులు,వ్యక్తిత్వాలు,భాష నిర్దిష్టంగా వెలుగులోకి వచ్చింది.ఈ పై వాదాల కాలంలో కవిత్వం ,కవితలు ప్రాంతీయ లక్షాన్ని కలిగి లేవు.అస్తిత్వ ప్రశ్నలను లక్షంగాచేసుకున్నవి.

తెలంగాణా మలిదశ ఉద్యమ సందర్భంలో ఈ మార్గాలన్నిటినీ కూర్చుకొని బలమైన ప్రాంతీయ కవిత ముందుకొచ్చింది. తెలంగాణా వచన కవిత్వంలో వేముల ఎల్లయ్య,గ్యార యాదయ్య,చిత్తం ప్రసాద్,ఎం.వెంకట్,భూతం ముత్యాలు,అన్నవరం దేవేందర్,పొన్నాల బాలయ్య,జూపాక సుభద్ర,జాజుల గౌరి,సిద్ధార్థ మొదలైన అనేకమంది కవులు దళిత,బహుజన జీవితాలను వ్యక్తం చేసారు. “మేమే'”బహువచనం”లాంటి సంకలనాలు.కొన్ని కవుల వ్యక్తిగత సంపుటాలు.ఇలాంటి కవిత్వానికి అద్దం పడుతాయి. వీటిలో వస్తువు,జీవితం,భాష అన్ని సమగ్రంగా తెలంగాణా ప్రాంతీయ కవితను వ్యక్తం చేసాయి.ఈ తాత్వికతనే మలిదశ ఉద్యమకవితలో వ్యక్తమయింది. కేవలం ఉద్యమ సంబంధమైన గొంతును కూర్చుకుని జీవితం,సంస్కృతి,ఆచారాలు మొదలైన వాటినుంచి కవిత్వం  వచ్చింది. ఈ కాలంలోనూ తెలంగాణా నుంచి వచ్చిన మొత్తం కవిత్వం అంతా ప్రాంతీయ  ముద్ర ఉన్న కవిత్వం కాదు. ప్రాంతీయోద్యమ కవిత్వం కూడా ఆధునిక రూపంలో వచ్చింది.కాని భాషను మూల పరికరంగా ఉపయోగించుకున్న కవిత గతానికంటే చాలా ఎక్కువ.

నిజానికి ఈ కాలంలో తెలంగాణా కవిత రెండు మార్గాల్లో వ్యక్తమయింది.1.ఆధునిక వచన రూపంలో ఆధునిక కవితా రూపాలతో వర్తమాన వ్యవహారంలో ఉండే భాష తో తెలంగాణ  సంస్కృతి,వ్యక్తులు,వ్యక్తిత్వాలతో వ్యక్తమైన కవిత.2.ప్రాంతీయ సంస్కృతి, భాష, వ్యక్తులు వ్యక్తిత్వాలతో వ్యక్తమైన కవిత.వర్తమానంలోనూ ఈరెండు మార్గాలు కనిపిస్తాయి. ఈ క్రమంలో నే ఆధునిక  తెలంగాణా కవితా రూపాన్ని,తెలంగాణా ప్రాంతీయ కవితా రూపాన్ని రెంటినీ వేర్వేరుగా గుర్తించవచ్చు.

 

1.”మావ్వ దిగూట్లె దీపం గాదు/ఆకాశం గొంగట్ల ఆగమైనపొద్దు/నేలమ్మ కొంగున అంగిటబుట్టిన ఆకలి

   -(దుక్కాల్ని దున్ని పోసుకున్న తొక్కుడుబండ మా అవ్వజూపాక సుభద్ర)

2.”ముని మబ్బులలేసే/తల్లికోడిలెక్క /అడవిల తిరుగాడే/మినుగురులెక్క

అరిచేతిల ముగ్గునుబట్టి/పంచలకు అదునుగ జారిడిసి/సరళరేఖలు గీసే మాయమ్మ/అయ్యలేసిన యాల/తూర్పుదిక్కువెలుగులువిరజిమ్మే తొలిపొద్దుపొడుపైతది

      -(మాయమ్మజాజులగౌరి)

3.ఇరిగిన బండిగీర విలవిలకొట్టుకుంటూ/మొండిగా మొట్టుకారుమీదిమొర/చుట్ట ఆరెలు కమ్మలు సొప్పబెండ్లరథమోలెకూలినయి“-(ఔగోలిత్తున్నంపొన్నాలబాలయ్య)

4.”గలగల నదులనిండా నీళ్లదోప్కం

  ముల్లెమూటల మీన్నే మానిగురాన్

 “మనోళ్లకొలువులల్ల మన్ను దుబ్బ

మారు మాట్లాడకుండ నోటినిండా బెల్లం గడ్ద

        -(అన్నవరం దేవేందర్పదవి)

 

మొదటి రెండు వాక్యాలు వరుసగా ప్రాంతీయ పాత్రలను,వ్యక్తిత్వాలను చిత్రిస్తాయి.రెండు ఖండికాభాగాలుకూడా తల్లిపాత్రను చిత్రించినవే.ఇందులో దలిత ఈస్తటిక్స్ కనిపిస్తాయి.ప్రతీకలను తమదైన జీవితంలోంచి తీసుకుని సృజించడం ఈ వాక్యాల్లో కనిపిస్తుంది.దళిత బహుజన జీవితాలతోపాటుగా ఆవాదాల స్ఫూర్తితో బాటుగా ఇందులో స్త్రీవాద గొంతుక కూడా కనిపిస్తుంది. మూడో వాక్యం ప్రపంచీకరణ సందర్భంలో కుదేలైన కులవృత్తులను చిత్రించినవాక్యాలు.నాలుగో ఖండికాభాగం రాజకీయాంశది. మొదటి రెండు వాక్యాల్లో  ఈస్తటిక్స్ ఉన్నట్లుగానే చివరి రెండు వాక్యాల్లో వ్యంగ్యం కనిపిస్తుంది.ఒక ఉద్వేగ పరిస్థితుల్లో తెలంగాణాభాషలో నిసర్గమైన వ్యంగ్యం ధ్వనిస్తుంది.వాక్యాల్లో ఉండే సమవృత్తి సూత్రం ఈ అంశాలను పటం కడుతుంది కూడా. వరుసగా వీటిని గమనిస్తే ఈనాలుగు దశల్లో సమగ్రమైన ప్రాంతీయ కవిత ఎలా రూపుదిద్దుకుందో అర్థమవుతుంది.

ఈవాక్యాలన్నీ రాజకీయ స్పృహను,సాంస్కృతిక స్పృహను,ఆర్థికస్పృహను కలిగిఉంటూనే ప్రాంతీయభాషను పరికరంగా తీసుకొచ్చాయి.కళాత్మక వాక్యాలనిర్మాణాన్ని చేయగలిగాయి.ఇవన్నీ తెలంగాణా ప్రాంతీయకవిత బలపడిన సందర్భాలను ప్రతిబింబిస్తాయి.నిజానికి ఉద్యమ సందర్భంలో వచ్చిన కవితలు కొన్ని ప్రత్యేకమైన వ్యక్తీకరణ సంప్రదాయాలను కవిత్వంలో నిర్మించాయి.వీటిని గూర్చిన విశ్లేషణలు ఇంకా రావాల్సిఉంది.

*

బ్యూటీషియన్

 

ఆరోజు క్లాసులో అశోక్ అల్లరి శ్రుతిమించడంతో వాడిని గట్టిగా మందలించేను. ప్రక్క బెంచీలో కూర్చున్న మాలతి తన పుస్తకాలు పదేపదే తీసి దాస్తున్నాడని ఫిర్యాదు చేసింది. చదువులో చురుగ్గా ఉంటాడని వాడి అల్లరిని ఇష్టంగానే భరిస్తూ ఉంటాను. కానీ ఒక్కోసారి అది హద్దులు దాటుతోందనిపిస్తోంది.

‘ చదువుకుందుకు స్కూలుకి రండి, ఇలాటి పిచ్చిపనులు కోసం అయితే స్కూలుకి రావడం అనవసరం. ఇంట్లో అమ్మానాన్నలు మంచి చెడు ఏమీ చెప్పరా మీకు’ కోపంగా అన్నాను. ఏమనుకున్నాడో వాడు తలవంచుకుని నిలబడ్డాడు కాని మాట్లాడలేదు. తెలివైన వాడు, వాడిని సరైన దారిలోకి మళ్లించాలి.

స్టాఫ్ రూమ్లో అశోక్ ప్రస్తావన తెస్తే, వాడి గురించి ఎంత తక్కువ పట్టించుకుంటే అంత మంచిది అని చెప్పేరు. వాడికి ఇంట్లో చెప్పేవాళ్లు ఎవరూ లేరు, వాడు చేసే అల్లరికి హద్దూ లేదు. వాడిని ఎవ్వరూ బాగు చెయ్యలేరని, ఏడాదిగా వాడు ఆ స్కూల్లో జేరిందగ్గర నుంచి వాడి ఇంటినుండి ఇప్పటి వరకూ ఎవ్వరూ వచ్చి వాడి మంచిచెడ్డలు అడగలేదని అందరూ ఏకగ్రీవంగా చెప్పేసేరు. వాడంతట వాడే ఎలాగూ స్కూలు మానేసేరోజు ఒకటి వస్తుందని తేల్చేసేరు. వాడి ఇంటికి వెళ్లి పెద్దవాళ్లతో మాట్లాడాలని అనుకున్నాను .

సాయంకాలం గూడెంలో క్లాసు ముగించి వస్తుంటే మేరీ ఎదురైంది. పలకరింపుగా నవ్వాను. ఆమెను అప్పుడప్పుడు అక్కడ చూస్తూనే ఉంటాను. నాతో ఏదో మాట్లాడాలన్నట్టు గబగబా నాదగ్గరకి వచ్చింది.

‘ టీచరుగారూ, కొన్ని ప్రత్యేక కులాలలోని ఆడవాళ్లకి ప్రభుత్వం బ్యూటీషియన్ కోర్సు ఉచితంగా నేర్పిస్తోంది. పదోక్లాసు ప్యాసైనా, ఫెయిలైనా అర్హత ఉంది. బస్సుపాస్ కూడా ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుంది. ఒక్క ఆరువారాలు కోర్సు నేర్పి ఒక ఉద్యోగం కూడా చూబెడుతుంది. ఒక్కో గ్రామం నుంచీ ముగ్గురుకి అవకాశం ఇస్తున్నారు. ప్రొద్దున్నుంచీ గూడెంలో తిరుగుతున్నాను. ఒక్కరు కూడా నేర్చుకుందుకు ముందుకు రాలేదు. ఇక ఈ రోజుకి వెళ్లిపోతున్నాను. రేపు మళ్లీ రావాలి. ఈ గూడెంలో అలాటి వారెవరైనా మీకు తెలుసా టీచరుగారూ?’ అంది అలసటతో ముఖం అద్దుకుంటూ.

గూడెంలో ముగ్గురు నలుగురు అమ్మాయిలు పదోక్లాసు వరకు చదివి మానేసిన వాళ్లున్నారు. వాళ్ల పేర్లు చెప్పాను.

మేరీ నిస్పృహగా చూసింది, ‘వాళ్లని కలిసేను టీచరుగారూ, ‘మావోళ్లు పెళ్ళి చేస్తారు’ అంటూ సిగ్గుపడి పోయారు ఆ పిల్లలు, తాము ఏమీ నేర్చుకోవలసిన అవసరం లేదని చెప్పేసేరు. పెళ్ళిళ్లైనా, ఎక్కడున్నా చేతిలో పని ఉంటుంది, అవసరానికి కుటుంబాన్ని ఆదుకుంటుంది అని చెప్పినా వినలేదు. మీరు కూడా చెప్పిచూడండి కాస్త. పేర్లు ఇచ్చేందుకు టైమెంతో లేదు.’ అంటూ ఆలస్యమవుతోందని వెళ్లిపోయింది.

మేరీ మాటలకి ఆశ్చర్యం వేసింది. తమకంటూ ఒక వృత్తి ఉచితంగా నేర్పిస్తామంటే వద్దంటున్నారే. వీధిలో అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకునే ఆ అమ్మాయిలు కళ్లముందు కదిలారు. నేను చెప్పి చూస్తాను అని మేరీ కి మాట ఇచ్చాను.

మర్నాడు క్లాసుకి కాస్త ముందుగానే బయలు దేరేను. భవాని, సుజాత, లావణ్య ….అందరినీ కలిసాను. ఎవ్వరూ బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుందుకు ముందుకు రాలేదు. ఎవరి కారణాలు వారికున్నాయి. ముఖ్య కారణం మాత్రం పెళ్ళి! ఎప్పుడు కుదురుతుందో తెలియదు, కుదిరినా ఒక విద్య నేర్చుకుందుకు ఏవిధంగా అది అడ్డమో నాకు అర్థం కాలేదు. కానీ నలుగురూ చక్కగా వాళ్లకు వచ్చినంతలో తమ అందాలకి మెరుగులు దిద్దుకున్నారు.

ఆ విషయం గురించి వాళ్లని అభినందించి,  ‘అదే పని మరింత నైపుణ్యంతో చెయ్యచ్చు. అది జీవనోపాధిని కూడా ఇస్తుంది’ అని చెప్పినా ససేమిరా అన్నారు.

సుజాత ఇంటి దగ్గర మాత్రం ఆమె మేనమామ భార్య ఇంట్లోంచి బయటకు వచ్చి చెప్పింది,

‘ టీచరుగారూ, నిన్న ఒకామె వచ్చి ఇయన్నీ చెప్పింది. మీరు కూడా ఇట్టాంటియన్నీ చెప్పబోకండి. ఇప్పటికే మేం చాలా బాథలు పడ్డాం. మా వోళ్ళ పిల్ల ఇలాగే ఏదో నేర్సుకుంటానంటూ మొదలెట్టి, ఆనక ఎవరినో ప్రేమించానంటూ చెప్పాపెట్టకుండా ఇల్లిడిచి పోయింది. పరువుతక్కువ పనులు……ఇదిగో ఈ సుజాత, దీని తమ్ముడు అశోకు మా ఆడపడుచు బిడ్డలు. ఈళ్ల బాధ్యత మామీద ఉంది. అశోకు మీ బళ్ళో చదువు కుంటున్నాడు లెండి. ఈ పిల్లకి పెళ్ళి చేసి పంపేస్తే మా బరువు తగ్గుతుంది. ఇప్పుడీ పిల్ల సంపాదించి మాకు పెట్టక్కర్లేదు. మీరెళ్లిపొండి టీచరుగారూ, మా ఇంటాయనొస్తే గొడవ చేస్తాడు, ఇట్టాంటియన్నీ ఆయనకి గిట్టవ్.’ అంది.

ఎంత చెప్పినా వాళ్ల తీరు వాళ్లదే. ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలు ఇలా వృధా అయిపోతున్నాయని బాథనిపించినా, చేసేదేమీలేక వెనక్కి తిరిగాను. అశోక్ గుర్తొచ్చాడు. వాడు తల్లిదండ్రుల దగ్గర ఉండడన్న విషయం ఇప్పటిదాకా తెలియదే. వాడి విషయం మాట్లాడేందుకు ఇది సమయం కాదనిపించింది.

దసరా శెలవులు ముగిసి స్కూలు మొదలైంది. అటెండెన్స్ తీసుకుంటుంటే అశోక్ రాలేదని గమనించాను. వాడే కాదు చాలామంది శెలవులు అయిపోయాక కూడా నాలుగురోజులు వరకూ గైర్హాజరు అవటం మామూలే. మెల్లిగా ఒక్కక్కరే వస్తున్నారు. వాడి గురించి అడిగితే ‘స్కూలుకి రానన్నా’డని కబురు చెప్పేరు తోటి పిల్లలు. మరునాడు తప్పక రమ్మన్నానని చెప్పి పంపినా వాడు రానేలేదు. ఆ నాలుగు రోజులూ గూడెంలోనూ కనపడలేదు వాడు. విషయం ఏమిటో కనుక్కోవాలి.

ఆరోజు ప్రొద్దున్నే స్కూల్ కి బయలుదేరుతుంటే మా వీధిలో క్రొత్తగా కడుతున్న ఇంటి దగ్గర తాపీ పనివాళ్లతో అశోక్ కనిపించాడు. గబగబా దగ్గరకి వెళ్లి, ‘స్కూలు మానేసి ఇదేం పని అశోక్’ అన్నాను.

‘ మా మామయ్య కి రోడ్ ప్రమాదంలో కాళ్లకి బాగా దెబ్బలు తగిలేయి టీచర్. నిన్ననే హాస్పటల్ నుండి ఇంటికి తీసుకొచ్చేం. ఆయన ఇంక పనిలోకి వెళ్లలేడు. అందుకే నేను పనిలోకి వచ్చేను.’ సీరియస్ గా చెప్పేడు.

అశోక్ ప్రక్కన ఉన్న అతను చెబుతున్నాడు,

‘ ఏడాది క్రితం వీడి అమ్మానాన్న లారీ ప్రమాదంలో చనిపోయారు. మేనమామ వీడినీ, వీడి అక్కనీ తీసుకొచ్చేడు. కానీ ఇంతలో ఇట్టాంటి పరిస్థితి దాపురించింది.’ అశోక్ తలమీద ఇటుకల బరువుతో పనుల్లోకి జొరబడుతున్నాడు. వాడి వెనకే పని అందుకుంటున్న సుజాత………….

అశోక్ కి తల్లిదండ్రులు లేరన్న విషయం జీర్ణించుకోలేక పోయాను. వాడూ ఎన్నడూ చెప్పనే లేదు. మేన మామ కుటుంబం బాధ్యత ఇక వీడిదేనా? అప్రయత్నంగా కళ్లు తడి బారాయి. ఆరోజు నేను కోప్పడి నప్పుడు వాడి తల్లిదండ్రుల ప్రస్తావన తెచ్చేను. ఆనాటి వాడి మౌనం ఇప్పుడు అర్థమవుతోంది. వాడి అల్లరి, చిలిపితనం వెనుక ఇంత వేదన!

క్లాసులో చెప్పిన పాఠాలు అల్లరి మధ్య కూడా విని జవాబులు చెప్పే అశోక్ కళ్లముందు కదిలేడు. ఇంక పైన ఆ దృశ్యం కనిపించదా? వాడి చదువు సంగతి ఏమవుతుంది?

నెల క్రితం మేరీ చెప్పిన ప్రభుత్వ పథకంలో ఇప్పుడు సుజాతకి అవకాశం దొరికేలా చూడాలి. ఆ అమ్మాయి నీడ పట్టున పని చేసుకుని ఆర్థికంగా తన కాళ్లపైన తను నిలబడే అవకాశం అని అప్పుడు ఒప్పించ లేకపోయాను. ఇంటి జరుగుబాటుకి, తమ్ముడి చదువుకి ఆధారమవుతుందన్నవిషయం ఇప్పుడైనా నచ్చ జెప్పాలి అనుకుంటూ స్కూలు వైపు దారితీశాను.

 

పురాతన మైసీనియాలో అమ్మవారి స్వర్ణముద్ర!

 

స్లీమన్ కథ-27

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)-కల్లూరి భాస్కరం

~

 

మైసీనియాలో స్లీమన్ చేపట్టిన పని పూర్తయింది. నవంబర్ చివరిలో గ్రీస్ రాజుకు ఒక తంతి పంపించాడు. తవ్వకాలలో తను కనుగొన్న స్వర్ణసంపదతోపాటు, ఇతర విశేషాలను అందులో వివరించాడు. ఒక్క స్వర్ణ సంపదతోనే పెద్ద మ్యూజియాన్ని ఏర్పాటు చేయచ్చనీ, అది ప్రపంచంలోనే ఒక అద్భుత మ్యూజియం అవుతుందనీ, దానిని దర్శించడానికి కొన్ని శతాబ్దాలపాటు విదేశీ పర్యాటకులు గ్రీస్ కు బారులు కడతారనీ అన్నాడు. తను కేవలం శాస్త్రవిజ్ఞానం మీద మక్కువతోనే పని చేశాననీ, ఈ స్వర్ణసంపదపై ఎలాంటి హక్కునూ ప్రకటించబోననీ నొక్కి చెప్పాడు. ఆ ముల్లెను ఎంతో భద్రంగా గ్రీస్ కు అప్పజెబుతున్నాననీ,  భగవంతుడి దయవల్ల అది జాతీయ సంపదకు అపారమైన మూలనిధి కావాలని ఆకాంక్షిస్తున్నాననీ అన్నాడు.

తీరా రాజుగారి కార్యదర్శినుంచి వచ్చిన జవాబు చూసి నీరుగారిపోయాడు. అది చాలా క్లుప్తంగా ఉంది. అతను జరిపిన ముఖ్యమైన పరిశోధనలకు, అందులో చూపించిన ఉత్సాహానికీ, శాస్త్రవిజ్ఞానం పట్ల మక్కువకు రాజు అభినందనలు తెలిపాడు. భవిష్యత్తులో జరపబోయే తవ్వకాలు కూడా ఇలాంటి విజయాన్నే చేకూర్చగలవన్న ఆశాభావాన్ని ప్రకటించాడు.

స్లీమన్ తను తవ్వకాలు జరిపిన చోటునుంచి మొదటిసారి వట్టి చేతులతో తిరిగి వెడుతున్నాడు. మైసీనియాలో అతను కనుగొన్నవన్నీ గ్రీకు ప్రభుత్వం ఆస్తిగా మారబోతున్నాయి. తవ్వకాలు జరిగినంత కాలం తనకు పక్కలో బల్లెంలా ఉంటూవచ్చిన స్టెమటేక్స్ తనకంటే ముందే పరిశోధనాంశాలను బహిర్గతం చేయడం ప్రారంభించాడు. దాంతో ఆగ్రహించిన స్లీమన్, అతన్ని నిరోధించాలనీ, పరిశోధనాంశాలను వెల్లడించే హక్కు తనకే ఉంది తప్ప ప్రభుత్వానికి కాదనీ స్పష్టం చేస్తూ ప్రభుత్వానికి తంతి పంపించాడు.

ఆవిధంగా ప్రభుత్వంతో అతనికి మళ్ళీ యుద్ధం మొదలైంది. ఈమధ్యలో నాప్లియో పట్టణ పాలకవ్యవస్థ జోక్యం చేసుకుని అక్కడ దొరికిన నిక్షేపాలను అక్కడే భద్రపరచాలని డిమాండ్ చేసింది. అది పట్టణానికి చెందిన ఆస్తి అనీ, దానివల్ల పట్టణానికి మేలు జరుగుతుందనీ నొక్కి చెప్పింది. ఇది తెలిసి స్లీమన్ రగిలిపోయాడు. ఇంకోవైపు, తన పరిశోధనాంశాలపై ప్రసిద్ధ పురావస్తు సొసైటీలు అన్నింటికీ తంతి పంపుతూ;  తవ్వకాలు జరిపిన ప్రదేశంలో  భారీ సంఖ్యలో తీసిన ఛాయాచిత్రాల కూర్పుపై ఆలోచన చేస్తూ, నోట్సు, డైరీలు రాసుకుంటూ గడిపాడు. యథావిధిగా జర్మన్లు అతని నిర్ధారణలను ఎద్దేవా చేస్తూ కొట్టి పారేశారు. ఫ్రాన్స్ ఆసక్తి చూపించలేదు. ఒక్క ఇంగ్లండ్ మాత్రమే అతని ఉత్సాహంలో పాలుపంచుకుంది.

శీతాకాలాన్ని ఎథెన్స్ లో గడిపాడు. తన రికార్డులకోసం ఆగొరా పూర్తి రేఖాచిత్రం గీసి తెమ్మని మైసీనియాలో తన దగ్గర పనిచేసిన యువ ఇంజనీర్ వసీలియోస్ డ్రొసినోస్ ను పంపించాడు. ఆగొరాకు దక్షిణంగా పాక్షికంగా తవ్వకాలు జరిగిన చోట అతనికి పైపైన చెక్కిన రాళ్ళు కనిపించాయి. అవి సమాధి మందిరంలో కనిపించిన రాళ్లలా ఉన్నాయి. అదే రోజున మైసీనియాకు వచ్చిన స్టెమటేక్స్ తో వాటి గురించి చర్చించాడు. ఒక పనివాణ్ణి రప్పించి అక్కడ తవ్వించారు. ఒక స్వర్ణపాత్ర బయటపడింది. ఆ తర్వాత మరో అయిదు బంగారు పాత్రలు బయటపడ్డాయి. వాటిలో నాలుగింటికి కుక్క తల ఆకారంలో సున్నితంగా మలచిన కాడలు ఉన్నాయి. ఒకటి ఏ అలంకారమూ లేకుండా సాదాగా ఉంది. ఆపైన బంగారు తీగనుంచి మలచిన ఎన్నో ఉంగరాలు, రెండు స్వర్ణముద్రలు బయటపడ్డాయి. వాటిలో ఒకదాని మీద కొన్ని జంతువుల తలలు, మొక్కజొన్న కంకులు చిత్రితమై ఉన్నాయి. రెండోది మాత్రం కళాఖండమని చెప్పవచ్చు.

అది అమ్మ(Mother Goddess)వారికి చెందిన స్వర్ణముద్ర. మొదటి సమాధిలో దొరికిన బంగారు ముసుగులానే ఇది కూడా మైసీనియా ప్రజల ప్రగాఢ మతవిశ్వాసానికి అద్దంపడుతోంది. దాని మీద  అమ్మవారికి  నైవేద్యం ఇస్తున్నట్టు సూచించే చిత్రం ఉంది. అది కూడా అతి నిరాడంబరంగా ఉంది. దేవాలయం, పీఠం, తెరలు, తంతులు మొదలైనవి లేవు. అమ్మవారు ఒక పవిత్రవృక్షం కింద కూర్చుని ఉంది. తలపై పువ్వులు తురుముకుంది. ఆమె చేతిలో కూడా పువ్వులు ఉన్నాయి. కులీనతను చాటే ఇద్దరు యువతులనుంచి పువ్వులు స్వీకరిస్తోంది. బహుశా వాళ్ళు పూజారిణులు కావచ్చు. అమ్మవారి ఎదురుగా నిలబడిన ఒక పరిచారిక ఆ ఇద్దరినీ అమ్మవారికి చూపుతోంది. ఇంకొక పరిచారిక చిన్న రాతిగుట్టను ఎక్కి పవిత్రవృక్షఫలాన్ని తెంపుతోంది. అది అమ్మవారికి నివేదన చేయడానికి కావచ్చు. ముడతలు, ముడతలుగా ఉండి, మంచి అల్లికపని చేసిన జోడులంగాలను అందరూ ధరించారు. వీరుల యుగానికి చెందిన మైసీనియా సంస్కృతిలో అలాంటి జోడు లంగాలనే ధరించేవారు. అమ్మవారిలానే అందరూ నగ్నవక్షాలతోనూ, తలపై పువ్వులు, ఇతర అలంకారాలతోనూ ఉన్నారు.

పూజారిణులకు, అమ్మవారికి మధ్యలో రెండు జంట గొడ్డళ్ళు ఉన్నాయి. వాటిలో ఒకటి పెద్దది, ఇంకోటి చిన్నది. ఈ జంట గొడ్డళ్ళు బహుశా లౌకిక, పారలౌకిక శక్తులను రెంటినీ సూచిస్తూ ఉండచ్చు. పూజారిణులకు పైన; శిరస్త్రాణామూ, చేతిలో ఖడ్గమూ ధరించిన ఒక యువతి గాలిలో తేలుతున్నట్టు ఉంది. ఆమెను ఎనిమిది(8)అంకె ఆకారంలో ఉన్న ఒక డాలు కప్పి ఉంది. మనకు తెలిసినంతవరకు ఒక సాయుధ దేవతను చిత్రిస్తున్న తొలిచిత్రం ఇదే. ఈమెకు ఒక పక్కన ఉజ్వలంగా ప్రకాశిస్తున్న సూర్యుడు, చంద్రవంక చిత్రాలు ఉన్నాయి. అవి మధ్యాహ్నాన్నీ, రాత్రినీ కూడా సూచిస్తున్నాయి.

ఈ చిత్రంలోని వ్యక్తులందరిలో ప్రశాంతత, పవిత్రత ఉట్టిపడుతున్నాయి. అప్పటి జనం, జీవితంపట్ల ధీమాతో ఎంతో ప్రశాంతజీవనం సాగిస్తున్న సంగతిని ఈ స్వర్ణముద్రలోని ప్రతి వివరం సూచిస్తోంది. ఈ ముద్ర ఎంత చిన్నదంటే, ఒక అంగుళం వెడల్పును మించిలేదు. కళాకారుడు అంత చిన్న ముద్రలోనే శతాబ్దాలుగా సంతరించుకున్న మతవిజ్ఞానాన్ని అంతటినీ అద్భుతంగా రంగరించాడు. స్వర్గశక్తి కాంతి రూపంలో వలయాలు వలయాలుగా కిందికి ప్రవహిస్తోంది. పవిత్రమైన తోపులో కూర్చుని ఉన్న అమ్మవారి నుంచి అదే శక్తి పొంగిపొరలుతోంది. పూజారిణులలో వినయవిధేయతలకు బదులు,  ఒక హక్కుగా తాము అమ్మవారి దగ్గర ఉన్నామన్న భావన కనిపిస్తోంది.  అమ్మకు నివేదన చేయడంలో ప్రేమాభిమానాలు తొంగిచూస్తున్నాయి. ఈజిప్టు చిత్రాలలో దేవతలకు నివేదన చేసేటప్పుడు భక్తులలో కనిపించే దాస్యభావన వీరిలో కనిపించడంలేదు. వీరిలో ఒక మానవీయమైన ఆత్మగౌరవం, హుందాతనం వ్యక్తమవుతున్నాయి. సూర్య, చంద్ర కాంతులలో స్నానమాడుతూ స్వేచ్ఛగా సంచరించేవారిలా కనిపిస్తున్నారు.

ఈ స్వర్ణముద్ర సంకేతించే పూర్తి అర్థమేమిటో తెలియదు. చిత్రానికి ఒక పక్కన ఆరు విచిత్రమైన వస్తువులు కనిపిస్తున్నాయి. అవి బంగారు ముసుగులో, కపాలాలో, శిరస్త్రాణాలో, పవిత్రపుష్పాలో లేక మరొకటో తెలియదు. ఆ పవిత్రవృక్షం దేనిని సూచిస్తోందో కూడా చెప్పలేం. స్టెమటేక్స్ నుంచి అతి కష్టం మీద ఈ స్వర్ణముద్ర ఫోటో ను సంపాదించి పరిశీలించిన స్లీమన్, అందులోని చెట్టు ఫలాలు అనాసలో లేదా మధ్య అమెరికాలో తను చూసిన పనస తరహా పండ్లో కావచ్చు ననుకున్నాడు.  అందులోని స్త్రీలు శిరస్త్రాణం లాంటిది ధరించారనుకున్నాడు. వాళ్ళలో కనిపించే పురుషలక్షణాలు అతనికి విస్తుగొలిపాయి. వాళ్ళ లంగాలకు ఉన్న పట్టీలు చంద్రవంక ఆకారంలో ఉన్నాయనుకున్న స్లీమన్, అలాంటి చంద్రవంక రూపాలే స్వర్ణముద్ర అంతటా ఉన్నాయని అనుకున్నాడు. సూర్య, చంద్రుల కింద అలలు అలలుగా ఉన్న గీతలు సముద్రాన్ని సంకేతిస్తున్నాయని ఊహించాడు. అవి స్వర్గకాంతి వలయాలనూ, లేదా పాలపుంతనూ కూడా సూచిస్తూ ఉండచ్చు.

అఖిలెస్ కోసం ఈఫెస్టస్ (లోహపు పని చేసే గ్రీకు దేవుడు) అయిదు వలయాలు కలిగిన ఓ పెద్ద డాలును ఎలా తయారు చేశాడో ఇలియడ్ లో హోమర్ వర్ణించాడు.  మొదటి వలయం భూమి, ఆకాశం, సముద్రం, అలుపనేది ఎరగని సూర్యుడు, పూర్ణచంద్రుడు, నక్షత్రమండలాలను సూచిస్తుంది. స్లీమన్ మొదటిసారి అమ్మవారి స్వర్ణముద్రను చూసినప్పుడు ఉత్తేజితుడయ్యాడు. “అఖిలెస్ డాలుకు ఈఫెస్టస్ ఎలాంటి మహిమలు కల్పించాడో వర్ణించిన హోమర్, బహుశా ఈ స్వర్ణముద్రను చూసి ఉంటా”డని తన పక్కనే ఉన్న సోఫియాతో అన్నాడు. అంతటి విశిష్టమైన స్వర్ణముద్ర మొదట తన కంట పడనందుకు ఎంతో విచారించాడు. అయితే, తను కనుక ఇంజనీర్ ను పంపి ఉండకపోతే అది ఎప్పటికీ బయటపడేదే కాదనుకుని ఊరడిల్లాడు.

మైసీనియాలో తను కనుగొన్న విశేషాలకు పుస్తకరూపమిస్తూ ఎనిమిది వారాలు గడిపాడు. వెంటనే దానిని ఫ్రెంచ్, ఇంగ్లీష్ లలోకి అనువదించడం ప్రారంభించాడు. ఆ తర్వాత, తన పుస్తకానికి పరిచయవ్యాసం రాయవలసిందిగా బ్రిటిష్ రాజకీయ కురువృద్ధుడు, గొప్ప హోమర్ అధ్యయనవేత్త అయిన  గ్లాడ్ స్టన్ ను కోరాడు. తన ప్రశంసకు అపార్థాలు కల్పించవచ్చునని భయపడి గ్లాడ్ స్టన్ అందుకు వెనకాడాడు. వేసవిలో లండన్ సందర్శించిన స్లీమన్ తనతో ట్రాయ్ నిక్షేపాలను తీసుకువెళ్లి, సౌత్ కెన్సింగ్టన్ మ్యూజియంలో వాటిని ప్రదర్శింపజేశాడు. గ్లాడ్ స్టన్ కు అవి నిజంగానే ట్రాయ్ నిక్షేపాలన్న నమ్మకం చిక్కకపోయినా, స్లీమన్ పాండిత్యానికి ముగ్ధుడై చివరికి నలభై పుటల పరిచయవ్యాసం రాసి ఇచ్చాడు.

అమ్మవారి స్వర్ణముద్ర ప్రత్యేకించి గ్లాడ్ స్టన్ ను ఆకట్టుకుంది. తొలి సమాధిలో కనిపించిన కళేబరం అగమెమ్నన్ దే కావచ్చని స్లీమన్ లానే ఆయనా అనుకున్నాడు. రూపురేఖలు పదిలంగా ఉన్నాయి కనుక, దానిని భద్రపరచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారనీ, మృతుడు ఒక విశిష్ట వ్యక్తి అయినప్పుడే అలా జరుగుతుందనీ భావించాడు. అగమెమ్నన్ వెంట ఎప్పుడూ ఇద్దరు పురోహితులు ఉండి హెచ్చరికుల పాత్ర నిర్వహిస్తూ ఉంటారని ఇలియడ్  చెబుతోంది కనుక, సమాధిలో ఈ కళేబరం పక్కనే కనిపించిన రెండు కళేబరాలూ నిస్సందేహంగా వాళ్ళవే అయుంటాయని గ్లాడ్ స్టన్ అనుకున్నాడు.

లండన్ లో తను పొందిన గౌరవాదరాలకు స్లీమన్ పొంగిపోయాడు. గ్లాడ్ స్టన్ తో కలసి విందుభోజనం చేశాడు. ఎథెన్స్ లో అస్వస్థతతో ఉన్న సోఫియాకు తంతి మీద తంతి పంపించాడు. ఆమె పక్కన లేకుండా అతను ఎక్కువ రోజులు గడపలేడు. ఎట్టకేలకు, రాయల్ ఆర్కియలాజికల్ సొసైటీ సభ్యులు ఆమెను ప్రసంగానికి ఆహ్వానించడంతో వెంటనే లండన్ వచ్చి భర్త పక్కనే వేదికను అలంకరించింది. ఇరవై అయిదు రోజుల పాటు, సమాధులలోని పురాతన మైసీనియా రాజులు, రాణుల కళేబరాల మధ్య మోకాళ్ళ మీద కూర్చుని వాటిని కప్పిన మట్టి పొరలను తను ఎంత జాగ్రత్తగా తొలగించిందో సరళమైన ఇంగ్లీష్ లో వివరించింది. కరతాళధ్వనులు మిన్నుముట్టాయి. ప్రశంసాసూచకంగా స్లీమన్ చిరునవ్వు చిందించాడు. ఆమె ప్రసంగ పాఠాన్ని తనే రాసి ఇచ్చాడు. ఒక్క తప్పు కూడా  లేకుండా లేకుండా రాసింది రాసినట్టు ఆమె అప్పగించినందుకు సంతోషించాడు. అంతకు మించిన సంతోషం అతన్ని త్వరలోనే ముంచెత్తబోతోంది. అప్పుడామె గర్భవతి. కొడుకు పుట్టబోతున్నాడు. పేరు కూడా స్లీమన్ ముందే నిర్ణయించేశాడు: అగమెమ్నన్!

పద్దెనిమిది మాసాలపాటు ప్రశంసల జల్లులో పులకరిస్తూ గడిపిన తర్వాత, 1878 వేసవిలో తిరిగి తవ్వకాలను చేపట్టాడు. ఈసారి ఇథకాలోని ఒడీసియస్ ప్రాసాదాన్ని కనుక్కోగలననుకున్నాడు. మౌంట్ అయోటిస్ పైన జూలైలో రెండు వారాలపాటు తవ్వకాలు జరిపించాడు. 190 ఇళ్ల శిథిలాలు తప్ప విలువైన వేవీ కనిపించలేదు. దాంతో తవ్వకాలు విరమించాడు.

మరోసారి ట్రాయ్ వైపు గాలి మళ్ళింది.  అక్కడ తవ్వకాలను కొనసాగించడానికి  టర్కీ ప్రభుత్వం నుంచి ఫర్మానా పొందడంలో ఈసారి గ్లాడ్ స్టన్ సాయంతోపాటు, కాన్ స్టాంట్ నోపిల్ లో బ్రిటిష్ రాయబారిగా ఉన్న ఆస్టెన్ లేయర్డ్ సాయం కూడా లభించింది. అసీరియన్ల నగరం నినవే(Nineveh)ను కనుగొన్న పురావస్తు నిపుణుడిగా లేయర్డ్ ప్రసిద్ధుడు. టర్కీ ప్రభుత్వం ఫర్మానా ఇస్తూనే ముందు జాగ్రత్తగా తవ్వకాల పర్యవేక్షణకు ఒక స్పెషల్ కమిషనర్ ను, పదిమంది పోలీసులను నియమించింది.

హిస్సాలిక్ కు వెళ్ళడం స్లీమన్ కు ఇది ఆరోసారి. సెప్టెంబర్ లో పని ప్రారంభించాడు. రెండు మాసాలవరకూ విలువైనవేవీ దొరకలేదు. 1878 అక్టోబర్ 21న, బ్రిటిష్ యుద్ధనౌకకు చెందిన కొందరు అధికారుల సమక్షంలో ప్రియామ్ ప్రాసాదం తాలూకు ఈశాన్య ప్రదేశాన్ని కనుగొన్నాడు. తనకు మొదటి ట్రోజన్ నిక్షేపాలు దొరికిన ప్రదేశానికి ఇది ఆట్టే దూరంలో లేదు. ఇక్కడ 20 బంగారు కర్ణాభరణాలు, పెద్ద సంఖ్యలో బంగారు ఉంగరాలు, బంగారు-వెండి మిశ్రమంతో చేసిన రెండు పెద్ద కంకణాలు, 11 వెండి చెవిపోగులు, 158 వెండి ఉంగరాలు, లెక్కలేనన్ని బంగారు పూసలు బయటపడ్డాయి. మరికొన్ని రోజుల తర్వాత కొన్ని బంగారపు కడ్డీలు, బంగారు గుళ్ళు, ఒక స్వర్ణకంకణం, ఒక వెండి బాకు కనిపించాయి. నవంబర్ 26న తవ్వకాలు నిలిపివేశారు. ఈసారి మూడో వంతు నిక్షేపాలను మాత్రమే తన వద్ద ఉంచుకోడానికి స్లీమన్ ను అనుమతించారు. మిగిలివాటిని కాన్ స్టాంట్ నోపిల్ లోని ఇంపీరియల్ మ్యూజియం కు పంపించారు.

అంతవరకూ అతన్ని వరిస్తూ వచ్చిన అదృష్టం తదుపరి వసంతంలో ఆఖరి అంకానికి చేరబోతోంది. ఫిబ్రవరిలో ట్రాయ్ కు చేరుకుని ఎమిలీ బర్నాఫ్, రుడాల్ఫ్ ఫిర్కోల సాయంతో ట్రాయ్ లో తవ్వకాలు కొనసాగించాడు. నగర ప్రాకారాన్ని తవ్వి తీసి, హోమర్ ట్రాయ్ కు చెందిన పూర్తి రేఖాపటాన్ని తయారు చేయాలన్నది అతని ఆలోచన. ఏప్రిల్ లో కొన్ని బంగారు చక్రాలు, గొలుసులు, చెవిపోగులు, కంకణాలు బయటపడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ అతనికి ఎలాంటి నిక్షేపాలూ కనిపించలేదు. ఒకప్పుడు అపార స్వర్ణసంపదతో అలరారే మూడు పట్టణాలు ఉండేవని హోమర్ చెప్పాడు. అవి: ట్రాయ్, మైసీనియా; బియోషా (Boeotia)లోని ఒకప్పటి గొప్ప నగరమైన అర్కమెనోస్. హోమర్ ను పరమప్రమాణంగా భావించే స్లీమన్, మరుసటి సంవత్సరం  అర్కమెనోస్ లో తవ్వకాలకు పూనుకున్నాడు. కానీ అతను ఆశించినట్టు స్వర్ణనిక్షేపాలు బయటపడలేదు.

అతని అదృష్టాధ్యాయం అంతటితో ముగిసింది!

(సశేషం)

 

 

కొంచెం గెడ్దపునురగ, ఒక కత్తి గాటు..

 

 

-ఉణుదుర్తి సుధాకర్

~

 

Sudhakar_Marine Linkసుమారు ఏభై ఏళ్ల క్రిందటి మాట. అప్పట్లో వాటిని మంగలి షాపులనే అనేవాళ్ళు. అలా అనడం సరైన రాజకీయ పరిభాషాప్రయోగం కాదనే అవగాహన ఇంకా ఏర్పడలేదు. బార్బర్, హెయిర్ డ్రేసర్, సెలూన్, బుటీక్, పార్లర్  – ఈ మాటలు లేవు. క్షౌరశాల అని బోర్డుమీద రాయడమే గానీ పలికిన వాడు లేడు. మంగలి భూలోకం పెద్దకొడుకు వైకుంఠానికి చదువు అబ్బలేదు. స్కూలు తెరిచే కాలంలో కాసే నేరేడుపళ్ళతో మొదలుపెట్టి, రేగుపళ్ళూ, ఉసిరికాయలూ, సీతాఫలాలూ, చెరుకుగడలూ,  ఫైనల్ పరీక్షలనాటికి మామిడికాయలూ – ఇవికాక  ఏడుపెంకులాట, జురాబాలు, గోలీలాట, జీడిపిక్కలాట వీటన్నిటి మధ్య ఏర్పడ్డ దొమ్మీలో పదోతరగతి పరీక్ష చెట్టెక్కిపోయింది. చదివింది చాల్లే అని వాళ్ళ నాన్న తనకి సాయంగా దుకాణానికి రమ్మన్నాడు.

మొదట ఓ ఆరునెలలు – కత్తిరించగా కిందపడిన వెంట్రుకలు ఊడవడం, గెడ్డం చేయడానికి సరంజామా సిద్ధంచేసి ఉంచడం, మంచినీళ్ళ కూజా మోసుకురావడం, మొహాలమీద నీళ్ళు చిలకరించే సీసాలు నింపిపెడుతూండడం, తోలుపట్టీ మీద కత్తుల్ని సానపట్టడం, మధ్యమధ్య  శిల్లావెంకన్న హోటల్ కి పరుగెత్తి ఫ్లాస్కులో టీలు, విస్తరాకుల్లో కట్టిన కరకర పూరీలు, వాటికి తోడుగా బొంబాయికూర తెచ్చిపెట్టడం (ఎవరూ చూడనప్పుడు విజయలలిత, జ్యోతిలక్ష్మిల కేలెండర్ల వైపు దృష్టిసారించడం, షాపు అంతటాఉన్న అద్దాలముందు జుత్తు పరపరా దువ్వి ‘సైడుపోజులో హరనాథ్ లా ఉన్నాను’ అనుకోవడం), ఇవన్నీచేసి తండ్రి దగ్గర మన్ననలు, ఇతర బర్బరులనుండి గుర్తింపు పొందాడు.

ఇన్నాళ్ళూ అనవసరంగా స్కూలికి వెళ్ళి ఎందుకు దెబ్బలు తిన్నానా అని బాధ పడుతూనే ఆ దుర్దినాలకు శాశ్వతంగా స్వస్తి పలికినందుకు మురిసిపోయాడు. తండ్రి పర్యవేక్షణలో పదహారేళ్ళకే కత్తి చేతపట్టి  రంగంలోకి దూకాడు. ప్రయోగాత్మకంగా పేద గిరాకీల గెడ్డాలు ఎడాపెడా గీయడం మొదలుపెట్టాడు. మొదట్లో కొంత రక్తపాతం జరిగింది. స్ఫటిక వాడకం పెరిగిపోయింది. డెట్టాలు, పలాస్త్రీల అవసరం కలిగింది. షాపులో ఊదొత్తుల సువాసనలకు బదులు ఆస్పత్రివాసన పెరగడంతో తండ్రి భూలోకం ఉద్రిక్తతకు లోనయ్యాడు. అయితే మరికొద్ది వారాల్లోనే వైకుంఠానికి అహింసామార్గం దొరికిపోయింది. కాస్త పొడుగూపొట్టీ అయినా జుత్తు కత్తిరించడం కూడా పట్టుబడింది. కొడుకు ప్రయోజకుడై అందివచ్చినందుకు తండ్రి ఆనందానికి అవధులు లేవు.

అన్నయ్య వైకుంఠం తమ వృత్తిరంగంలో రోజురోజుకీ ఎదిగిపోతూ తన అనుభవాల్నీ, విజయాల్నీ వివరించినప్పుడల్లా కైలసానికి దిగులు కలగసాగింది. చదువులో ఉంచి తండ్రి తనకి తీరని అన్యాయం చేసాడని మరీమరీ అనిపించసాగింది. చిక్కల్లా ఒక్కటే. కైలాసానికి చదువు బ్రహ్మాండంగా వస్తోంది. పెద్ద ప్రయత్నం లేకుండానే మంచి మార్కులు వస్తున్నాయి. చిన్నకొడుకు గవర్నమెంటు ఆఫీసరు అవుతాడనే భూలోకం నమ్మకం ప్రతీ ఏడూ మరింత బలపడుతోంది. క్షవరం చేయించుకోవడానికి వచ్చే మాస్టార్లందరూ కైలాసాన్ని పెద్ద చదువులు చదివించమనే అంటారు. కైలాసం ఇంగ్లీషులో కాస్త వెనకబడ్డా, తెలుగు పద్యాలు చదివేడంటే మాత్రం పెద్దపంతులుగారు కూడా డంగైపోతారు. కొత్తగా వచ్చిన లెక్కలమాస్టారు మధుసూదనంగారైతే జీతం తీసుకోకుండా ప్రైవేటు చెప్పి తన సబ్జెక్టులో ఫస్టుమార్కు వచ్చేలా చేసాడు. అంతేకాక రెన్ అండ్ మార్టిన్ లోంచి ఎక్సెర్సైజులు చేయించి ఇంగ్లీషంటే భయం లేకుండాచేసాడు. ‘ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీ’ అంటే గనక అది ముమ్మాటికీ  తప్పే అనిన్నీ, ‘ఐ ప్రిఫర్ కాఫీ టు టీ’ అన్నదే కరెక్ట్ అనీ కైలాసం ఇప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఆక్టివ్ వాయిస్ లో ‘రామా కిల్డ్ రావణా’ అని ఉంటే అది పాసివ్ లో ‘రావణా వాస్ కిల్డ్ బై రామా’ అవుతుందని తెలుసుకున్నాడు. మొదటే తెలుగు బాగా వచ్చి ఉండడంవల్ల ఇంగ్లీషు తొందరగా పట్టుబడింది.  ఇప్పుడు సెలవుచీటీ ఇంగ్లీషులో రాయగలడు. నిజానికి వీపీపీ ద్వారా పుస్తకాలు పంపిచమని కొంతమంది విజయవాడ పబ్లిషర్స్ కి కూడా ఇంగ్లీషులోనే రాశాడు. ఆయా పుస్తకాలు టంచన్ గా వచ్చేశాయి కూడా.

మధుసూదనం మాస్టారింటికి ట్యూషన్ కి వెళ్ళినప్పుడు ఆయన వద్దనున్న తెలుగు, ఇంగ్లీషు పుస్తకభండారాన్ని చూసి కైలాసం అదిరిపోయాడు. చాలా తెలుగు పుస్తకాలు, కొద్దిపాటి ఇంగ్లీషు పుస్తకాలు తెచ్చుకొని చదివేశాడు. కొన్ని బోధపడ్డాయి; కొన్ని పడలేదు. కాని అవి అతనికి ఒక కొత్త ప్రపంచానికి దారి చూపించాయి.  ఆగష్టు పదిహేను నాడు జరిగిన తెలుగు వ్యాసరచన పోటీలో స్కూలు మొత్తానికి మొదటి బహుమతిగా గాంధీగారి ఆత్మకథ చేతికి రావడంతో కైలాసంలో ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. ఇన్ని సాధిస్తున్నప్పటికీ అసలు మజా అంతా అన్నకే దక్కుతున్నదని అతని ఆక్రోశం మాత్రం అలాగే మిగిలిపోయింది. పోరగాపోరగా పదకొండో తరగతి సెలవరోజుల్లో దుకాణానికి వచ్చి పని నేర్చుకోవడానికి తండ్రి అయిష్టంగా అంగీకరించాడు. అయితే మరుసటేడు – అంటే పన్నెండో తరగతిలో మాత్రం చదువు తప్ప మరో వ్యాపకం ఉండరాదని షరతు పెట్టాడు. కైలాసం ఉత్సాహంగా దుకాణంలో అడుగుపెట్టాడు.

 

మొదట్లో తమ్ముడి మీద పెత్తనం చెయ్యాలని వైకుంఠం చాలా ప్రయత్నించాడుగాని అది అట్టేకాలం సాగలేదు. గెడ్డాలు చేయడంలో ఇద్దరికిద్దరూ సరిసమానం అయిపోయారు. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఏర్పడింది. షాపు తమదే అన్న ధీమా తలకెక్కింది. ఖాతాదారులతో సత్సంబంధాలు పెంచుకున్నారు. వాళ్ళు మోసుకొచ్చే వార్తల్లో వాళ్లకి ఆసక్తి పెరిగిపోయింది.  క్షౌరశాల అంటే నేటి భాషలో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫాం, పేస్ బుక్, ట్విట్టర్.  వినగావినగా అన్నదమ్ములిద్దరికీ ఒక కొత్త సంగతి బోధపడింది. చుట్టుపక్క ప్రాంతాల్లో నక్సలైట్లు అనబడే వాళ్ళు సంచరిస్తున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారుగాని వాళ్ళు పట్టుబడడం లేదు. వాళ్ళు పరమ కిరాతకులని కొందరూ డబ్బున్న వాళ్ళని దోచుకొని పేదలకి పంచిపెడతారని కొందరూ అంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే – ఈ నక్సలైట్లంటే ఊళ్ళోఉన్న వ్యాపారులంతా హడిలిచస్తున్నారు. వీళ్ళకీ సంగతులు తెలుస్తున్న రోజుల్లోనే పాటలు పాడుకుంటూ ఒక ఎర్రజెండా బృందం షాపు ముందుకొచ్చి నిలబడింది. వాళ్ళేవో కేకలు వేశారు, కరపత్రాలు పంచారు, చందాలు అడిగారు. భూలోకం ఐదురూపాయిలిచ్చి పంపించేశాడు. ‘అదుగో, వాళ్ళే నక్సలైట్లు’ అన్నారెవరో. అన్నదమ్ములిద్దరూ కరపత్రం శ్రద్ధగా చదివారు.

సరిగ్గా అప్పుడే వైకుంఠం బుర్రలో ఆ ఆలోచన పుట్టింది. సెలవురోజున అంటే మంగళవారంనాడు షాపులో ఒక్కడూ కూర్చొని  కరపత్రంలోని భాషని వాడుకుంటూ, వాక్యాల్ని అటూఇటూ తిప్పి ఊరికల్లా పెద్ద కిరాణా వ్యాపారి సుంకాల కాశీనాథాన్ని సంబోధిస్తూ ఒక బెదిరింపు లేఖ తయారుచేశాడు. “ఖబడ్దార్! ప్రజా శత్రువులారా! ఎర్రసేన కదిలింది! మీ అంతు చూస్తుంది!” కరపత్రంలోని ఈ వాక్యంతో తన లేఖలోని ఆఖరి పేరాని ముగించి చివరిగా తన సొంత కవిత్వం చేర్చాడు: “మంగళవారం నాడు సాయింత్రం ఆరో గంటకల్లా జగద్ధాత్రి గుడి ఎదురుగా ఉన్న బంద పక్కన మర్రిచెట్టు మొదట్లో పదివేల రూపాయిలు ఒక బాగ్ లో పెట్టి వెళ్ళాలి”. ఎందుకేనా మంచిదని మరో వాక్యం చేర్చాడు “లేకపోతే ఎర్రసేన నిన్నూ నీ కుటుంబాన్నీ సర్వనాశనం చేస్తుంది ”. “ఇట్లు, కామ్రేడ్ జిల్లా నాయకుడు” అని ముగించాడు. పదివేలు చేతిలోపడితే మద్రాసువెళ్లి సినీమాల్లో హీరో అవ్వాలని వైకుంఠానికి మహా దురదగా ఉంది.

సుంకాల కాశీనాథం లబోదిబోమంటూ పోలీసు స్టేషన్ కి పరుగెత్తాడు. ఉత్తరం చదవగానే అది నకిలీదని పోలీసులకి అర్థం అయిపోయింది. వలవేసి వైకుంఠాన్ని పట్టుకొని నాలుగు తగల్నిచ్చి వెనకాతల ఇంకెవరూలేరని తేల్చుకున్నారు. కొడుకుని విడిపించడానికి భూలోకం కులపెద్దల సహాయం కోరితే వాళ్ళు చేతులెత్తేశారు; ఇది మామూలు తగువు కాదన్నారు. మరో మార్గంలేక సబ్ ఇన్స్పెక్టర్ సూర్యారావు కాళ్ళమీద పడ్డాడు. ‘ఊరికే వదిలేస్తామా?’ అన్నాడు సూర్యారావు. ఏమీ  ఇచ్చుకోలేనని భూలోకం మొర. ఇప్పుడంటే నక్సలైట్లని పట్టుకోలేక నానా పాట్లూ పడుతున్నాడుగాని, బుల్లెట్ మోటార్ సైకిల్ మీద బడబడమని తన రాజ్యమంతటా యదేచ్ఛగా పర్యటించే సూర్యారావంటే ఊళ్ళో అందరికీ భయమే. ‘పోలీసాఫీసరంటే అలా ఉండాలి’ అన్న వాళ్ళూ ఉన్నారు. అతని ఠీవిని చూసి మురిసిపోయే వాళ్ళల్లో ముఖ్యుడు సుంకాల కాశీనాథం. కానీ వైకుంఠంకేసులో ఇద్దరికీ కొంచెం తేడావచ్చింది. తగిన శిక్ష వెయ్యకుండా నేరస్తుడిని విడిచిపెట్టడం ధర్మవిరుద్ధం, ఇలాంటి అల్లరచిల్లరగాళ్ళే రేప్పొద్దున్న నిజం నక్సలైట్లు అవుతారు, ఏదో ఒకటి చెయ్యాల్సిందే అని కాశీనాధం పట్టుబట్టాడు. ‘మీకెందుకు సార్? నేను చూసుకుంటాను, నాకొదిలెయ్యండి. పోలీసుడిపార్టుమెంటు ఉన్నదెందుకు?’ అన్నాడు ఇన్స్పెక్టర్.

అన్నట్టుగానే రేపు విదిచిపెడతారనగా ముందురోజురాత్రి రైఫిల్ బట్ తో బలంగా మోది వైకుంఠం కుడిచెయ్యి విరగ్గొట్టాడు – ‘రేప్పొద్దున్న తుపాకీ పట్టుకోవాలనుకున్నా నీవల్ల కాదురా’ అంటూ. ‘మీవాడు బాత్రూంలో జారిపడి చెయ్యి విరగ్గొట్టుకున్నాడు’ అని భూలోకానికి అప్పజేప్పేడు.  విరిగిన చెయ్యి అతుక్కుందిగాని వంకర ఉండిపోయింది. ఇప్పుడు వైకుంఠం ఫుల్ హ్యాండ్ చొక్కాలే వేసుకుంటాడు. అవిటి చేత్తో కటింగ్ చేస్తాడు గాని మునపటి జోరు లేదు. ‘హరనాథ్ లా ఉన్నాను’ అనుకోవడం మానేశాడు.

***

కొడుకులిద్దర్నీ షాపులో ఉంచి భూలోకం భోజనానికి వెళ్ళాడు. షాపంతా ఖాళీ. బయట ఎండ మండిపోతోంది. ఎదురుగుండా మెడికల్ షాపులో కూడా ఓనరుతప్ప ఎవరూ లేరు. రోడ్డుమీద అలికిడి తగ్గిపోయింది. మధుసూదనం మాస్టారి దగ్గర తీసుకొచ్చి అద్దం వెనకాతల దాచిన పుస్తకం తీసి చదవుతున్నాడు కైలాసం. కూజాలోని చల్లటి నీటిని చేతిలోకి తీసుకొని మొహమ్మీద కొట్టుకున్నాడు వైకుంఠం. సరిగ్గా అప్పుడే బుల్లెట్ బడబడ వినబడింది. శబ్దం దగ్గరవుతోంది. పుస్తకంలోంచి చటుక్కున తలెత్తి అన్నకేసి చూశాడు కైలాసం. ‘ఇక్కడికే వస్తున్నాడా?’ అన్నట్టు చూశాడు వైకుంఠం. శబ్దం బాగా దగ్గర్నించి వినిపిస్తోంది; గుమ్మం ముందుకొచ్చి ఆగిపోయింది. పెరటి గుమ్మంలోంచి వైకుంఠం జారుకున్నాడు. చదువుతున్న పుస్తకాన్ని గభాలున అద్దం వెనక పడేశాడు కైలాసం.

లోపలి వస్తూనే, “ఏరా, ఎవరూ లేరా?” అన్నాడు ఇన్స్పెక్టర్ సూర్యా రావు.

“నాన్న, అన్న భోజనానికి వెళ్ళారు”

పిస్తోలుతో ఉన్న తోలు పటకా, బులెట్ లతో ఉన్న క్రాస్ బెల్టునీ విప్పేసి ఒక ఖాళీ కుర్చీ మీద పడేశాడు.

“ఎప్పుడొచ్చినా మీ అన్న కనబడ్డు. ఏంటి సంగతి? మళ్ళా ఏమైనా వేషాలేస్తున్నాడా?”

georgia

“అలాటిది ఏమీ లేదు సార్”

“గెడ్డం చెయ్యడం చేతనవునా?” కుర్చీలో కూర్చుంటూ.

“కిందటిసారి నేనే కద సార్ చేసింది?” అని టేబిల్ ఫ్యాన్ ఆన్ చేశాడు.

నాలుగు రోజుల గెడ్డం. నక్సలైట్ల వేటలో నిద్రాహారాలు లేకుండా తిరుగుతున్నాడని సోషల్ మీడియా ద్వారా కైలాసానికి తెలుసు.

“నీకు తెలిసిందా? రాత్రి ముగ్గుర్ని లేపేశాం”

ముగ్గురు నక్సలైట్లని మొన్న పట్టుకొని నిన్న రాత్రే చంపారని, వాళ్ళల్లో ఇద్దరు నాయకులున్నారనీ అరవ వైర్లెస్ ఆపరేటర్ పొద్దున్న గెడ్డం చేయించుకోవడానికి వచ్చినప్పుడు చెప్పాడు. తెలుగు రాకపోవడం వలన అంతకు మించి చెప్పలేకపోయాడు.

పరుగెత్తుకెళ్ళి మధుసూదనం మేష్టారికి ఈ సంగతి తెలియజేస్తే ఆయన వెంటనే మార్చురీకి బయిల్దేరాడు.

“తెలీదు సార్” అంటూ గుడ్డ కప్పి బొందులు ముడేశాడు.

నీళ్ళు చిలకరించే సీసా తీసి ఇన్స్పెక్టర్ మొహంమీద నీళ్ళు కొట్టాడు. తుడిచి మళ్ళీ కొట్టాడు. సూర్యారావు రిలాక్సైపోయాడు.

బ్రష్ తో సబ్బు బాగా కలిపాడు. బాగా నురగ వచ్చాక గెడ్డానికి అద్దాడు. గెడ్డం మీద బ్రష్ ఆడుతోంది. నురగ గెడ్డం అంతటా వ్యాపిస్తోంది. సబ్బు వాసన షాపులో అలముకుంది.

“మీసం ముట్టుకోకు…. మీసం సంగతి నేను చూసుకుంటాను”. కిందటి సారీ ఇదే మాటన్నాడు.

“అలాగే సార్”

బేరాల్లేక అన్నదమ్ములిద్దరూ పొద్దుట్నించీ అదేపనిగా కత్తులకు సానపెట్టారు. అవన్నీ ఇప్పుడు మహావాడిగా మెరిసిపోతున్నాయి. అన్నిట్లోకీ వాడిగా ఉన్న కత్తిని ఎంచుకున్నాడు కైలాసం. బొటనవేలు మీద నెమ్మదిగా నొక్కి చూశాడు.

‘నా సామి రంగా, ధారు అదిరిపోయింది’ అనుకున్నాడు.

“వచ్చే నెల నుంచీ మన ఊళ్ళో కూడా స్పెషల్ పోలీస్ కేంపు పెడుతున్నారు. వీళ్ళ ఆటలు ఇంక సాగవు”.

కొత్తవిషయం తెలిసింది. ఈ సంగతిని నమోదు చేసుకున్నాడు. మేష్టారికి చెప్పాలి.

తోలు పట్టీ మీద కత్తిని ఇంకా సాన పడుతూ కొత్తలో తండ్రి భూలోకం నేర్పిన పాఠాలు గుర్తు చేసుకున్నాడు.

“ఒరేయ్, కత్తి ధారుగా ఉంటేనే అది మన మాట వింటుంది. ఎంత మొండి గెడ్డమైనా లొంగిపోతుంది. కాని గెడ్డం చేసేవాడు మూడే మూడు విషయాలు గుర్తు పెట్టుకోవాలి. చర్మాన్ని సాగదీసి కత్తికి దారి చూపించాలి. కత్తిని కిందకి లాగాలి. ఎగ్గొరగ కూడదు. అందుకే ‘మంగలాడెంత మంచోడైనా ఎగ్గొరిగితే మంటే’ అన్నారు. తేలిగ్గా లాగి చివర్లో తేల్చాలి. లోపలికి  నొక్క కూడదు. తేల్చు. అద్గదీ, అలా తేల్చు”.

ఎడమ బొటన వేలుతో చర్మాన్ని లాగి పట్టి, దారిచేసి, కుడి చేత్తో కత్తిని నడిపిస్తున్నాడు. తండ్రి చెప్పినట్టే కత్తి మహాసున్నితంగా తన పని చేసుకుంటూ పోతోంది.‘ఇప్పుడు గాని కత్తి కిందకి దించి గొంతుకమీద ఒక్క నొక్కు నొక్కేనంటేనా! వీడి పని అయిపోతుంది. ఇవాళ నా చేతిలో చస్తాడు’ అనుకున్నాడు.

షట్టర్ మూసిన శబ్దం. ఎదురుగుండా మెడికల్ షాపు కోమటాయన ఇం’టికి వెళ్ళిపోతున్నాడు. సాయింత్రం అయిదైతేగాని రాడు. గడియారంలో రెండవుతోంది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. కైలాసానికి చెమటలు పడుతున్నాయి. గుండె కొట్టుకోవడం వినిపిస్తోంది.

పెదవికింద కత్తి లాగుతున్నాడు. మీసానికి అటూ, ఇటూ. పైన కూడా.

“మీ నాన్న కన్నా నువ్వే బాగా చేస్తున్నావు రా”

“అదేం లేదు సార్”

ఫైనల్ గా ఎక్కడా గరుకు మిగలకుండా మొత్తంగా కత్తి లాగుతున్నాడు. గొంతుక దగ్గర ఒక్క క్షణం కత్తి నిలిచి పోయింది, దానంతట అదే. మళ్ళీ కదిలింది.

ఆలోచనలు ముందుకి పరుగెడుతున్నాయి. వీడ్ని చంపితే మాత్రం ఏమొస్తుంది? ఊరంతా ఈ వార్త గుప్పుమంటుంది. నెలయ్యాక అంతా మర్చిపోతారు. మరో ఇన్స్పెక్టర్ వస్తాడు. నన్ను తీసుకెళ్ళి జైల్లో వేస్తారు.  పదేళ్లో, ఇరవై ఏళ్లో శిక్ష పడుతుంది. ఒట్టి పిరికిపంద, గెడ్డంచేస్తూ చంపేసాడు అంటారు కొందరు. విప్లవకారుల మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాడని కొందరనవచ్చు. మధుసూదనం మేష్టారు ఏమంటారో?

“తొందరగా కానీ, స్టేషన్ కి వెళ్ళాలి” అని ఇన్స్పెక్టర్ అనడంతో ఉలిక్కి పడి నిలుపుచేసాడు. నున్నగా మెరిసిపోతోంది గెడ్డం. ఎక్కడా ఒక్క గాటు గాని రక్తపు ఛాయలు గాని లేవు. ఈ పనితనం తండ్రి చూస్తే సంతోషించే వాడు. ఇన్స్పెక్టర్ మొహాన్ని తడిచేసి,  తువ్వాలుతో తుడిచి, పైన వేసిన గుడ్డ విప్పి తీసేసాడు. ఇప్పుడింక సబ్బు మరకలు కూడా లేవు.

పిస్తోలుబెల్టు, తూటాలపటకా తగిలించుకుంటూ, ఇన్స్పెక్టర్ అన్నాడు: “మనుషుల్ని చంపడం అంత తేలికేమీ కాదు. కసి ఒక్కటే సరిపోదు. నిర్దాక్షిణ్యంగా ఉండాలి. మీ వాళ్ళు ఇప్పుడిప్పుడే మాదగ్గర నేర్చుకుంటున్నారు. ఇంకా చాలా కాలం పడుతుంది”.

కైలాసం నిర్ఘాంతపోయాడు. గొంతుక ఆర్చుకు పోయింది. నోరు పెగల్లేదు. చెవుల్లోంచి ఆవిర్లు. పది రూపాయిలు చేతిలో పెట్టి బయటకు నడిచాడు ఇన్స్పెక్టర్.

‘మీ వాళ్ళు అన్నాడు….అంటే?… తెలిసిపోయిందా?’ కైలాసం బుర్ర పనిచెయ్యడం లేదు. మోటార్ సైకిల్ బయిల్దేరింది. పెద్ద బజారు మీదుగా చర్చి పక్కన పోలీస్ స్టేషన్ దారిలోకి మళ్లే వరకూ బడబడ వినిపిస్తూనే ఉంది.

[కొలంబియన్ రచయత హెర్నాండో తెల్లెజ్ (1908-1966) రాసిన సుప్రసిద్ధ కథ ‘Just Lather, That’s All’ అందిచ్చిన ప్రేరణతో, కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా – రచయత].

 

 

 అడవి పిలిచింది

 

                      

 

నేను మట్టి కావడం కంటే బూడిద కావడానికే ఇష్ట పడతాను . కుళ్ళి కృశించి నశించడానికి బదులు నాలోని ప్రతి అణువూ భగ భగ మండే మంటల్లో ఆహుతవాలనుకుంటాను !మందకొడి గా ఒక శాశ్వతమైన గ్రహంగా ఉండటం కంటే దేదీప్యమానం గా వెలిగి పతనమయ్యే అద్భుతమైన ఉల్క గా మారాలనుకుంటాను ! మనిషన్న వాడు జీవించాలి . బతుకీడ్చడం కాదుజాక్ లండన్

ఈ మాటలు చదువుతుంటేనే రక్తం పరుగులు పెడుతుంది ! ఇలా బతకడం ఎంతమందికి సాధ్యం అవుతుంది ? జాక్ లండన్ అలాగే బతికాడు . జీవితంలోని ప్రతి క్షణాన్ని అద్భుతమైన అనుభవంగా మార్చుకుంటూ , వాటిని పోగు చేసుకుంటూ మంట లా మండుతూ వెలుగుతూ బతికాడు !

jack london2

జీవితాన్ని ఒక మహోధృత తరంగం లా జీవించి ప్రతి క్షణాన్నీ అనుభూతి చెంది, ఇక చివరి క్షణాల్లో “అప్పుడలా చేసుంటే బాగుండేది, ఆ నెల్లో అలా చేయకుండా ఉండుంటే బాగుండేది” అని పశ్చాత్తాపాలు, నెమరేసుకోడాలూ లేకుండా బతికినన్నాళ్ళూ జీవించడం మాత్రమే తెల్సిన వ్యక్తులు లోకంలో ఎంతమంది ఉంటారో గానీ సరిగ్గా అలాటి మనిషే జాక్ లండన్ ! బోల్డు పుస్తకాలు రాశాడని అందరికీ తెల్సిందే!

వాటిలో అన్నిటికంటే నాకు బాగా నచ్చింది “కాల్ ఆఫ్ ది వైల్డ్”! దీన్ని మొదటి సారి నేను పీకాక్ క్లాసిక్స్ వాళ్ళు వేసింది “అడవి పిలిచింది” గా చదివాను. అది చదివాక వైట్ ఫాంగ్, సీ వుల్ఫ్, ( ఇలా కుక్కలు తోడేళ్ళ మీద పుస్తకాలు రాసినందుకే ఆయన్ని ఆక్స్ స్నేహితుడు “ఉల్ఫ్ మాన్” అని పిలిచేవాడట )  To build a fire ఇంకా Star Rover చదివాను. వైట్ ఫాంగ్, సీ వుల్ఫ్ కూడా వైల్డ్ లైఫ్ కి సంబంధించే సాగుతాయి, కాల్ ఆఫ్ ది వైల్డ్ లాగే! టు బిల్డ్ ఎ  ఫైర్, మొత్తం పూర్తి చేసి గానీ కదిలే పుస్తకం కాదు. నిజానికి, అతి మామూలు సంఘటనల్ని కూడా ఉత్కంఠ  రేకెత్తించేలా జాక్ లండన్ మాజిక్ చేయగలడు. ఆ కథలోకి మనల్ని తీసుకు పోయి అక్కడ పారేస్తాడు ! ఇహ మన ఖర్మ , తర్వాత వెనక్కి రావాలంటే దారి మనమే వెదుక్కోవాలి !

జాక్ లండన్ తెలుగు పుస్తకం తో నాకు పరిచయం ఐనా, మిగతా పుస్తకాలు కూడా చదివించాడు. ఈ తెలుగు “అడవి పిలిచింది” చదువుతుంటే మనల్ని పిచ్చిగా ప్రేమించి, మన మీద అంతటి మమకారం పెంచుకుని మన కోసం ప్రాణాలైనా ఇవ్వగలిగేంత ప్రేమను పంచే బక్ లాంటి కుక్కను, మన జోలికి ఎవరైనా వస్తే వాళ్ల రక్తం కళ్ల జూసే బక్ లాంటి కుక్కని.. పెంచుకోవాలనే కోరిక బలీయంగా కలుగుతుంది ఎవరికైనా !  విశ్వాసం, ప్రేమ చూపడం ఒక్కటే బక్ లక్షణం కాదు !  సాహసం, జీవితం మీద ప్రేమ, ఉత్సాహం ఇవన్నీ దాని ప్రత్యేక లక్షణాలు ! ఇది తోడేలు జాతికి చెందిన బలిష్టమైన కుక్క!

విధి వశాత్తూ రాజా లాంటి విలాసమైన బతుకు లోంచి అతి హీనమైన బతుకు లోకి జారి పడ్డ దగా పడిన కుక్క ఇది

అమెరికాలొని కాలిఫోర్నియా లో  నివసించే ఒక  జడ్జి గారింట్లో సకల రాజ భోగాలనుభవిస్తూ పెరిగే బక్ అనే ఈ కుక్కే ఈ నవల్లో హీరో! జాక్ లండన్ ఇతర నవలల్లాగే, మొదలు పెట్టాక ఏక బిగిన చదివించే ఈ నవల్లో బక్ జీవితం మొత్తం ఆవిష్కృతమవుతుంది.

Buck

“బక్ పత్రికలు చూడదు ” అంటూ నవల ప్రారంభం అవుతుంది . ఒక గొప్ప ప్రారంభం ఇది !

విలాసవంత మైన జీవితం, దాని వల్ల అయాచితంగా వచ్చి పడ్డ దర్పం తో బక్ రాజ ఠీవి తో జడ్జి గారింట్లో ఉంటుంది. ఎంతో గంభీరంగా, గర్వంగా బతుకుతున్న బక్,  ఏదో జడ్జి గారి మనవలు కాబట్టి వాళ్లని తన జూలు తో ఆడుకోనిస్తుంది. కానీ అది పత్రికలు చూడక పోవడం వల్ల దానికి రాబోతున్న కష్టం అది గ్రహించలేక పోతుంది.

ఆ సమయం లో  అలాస్కా ప్రాంతం  లో బంగారు గనుల్లో బోల్డంత బంగారం దొరుకుతోందనీ, అందువల్ల  జనం అంతా కట్టలు గట్టుకుని అక్కడికి పోతున్నారనీ, మంచు తప్ప మరేమీ లేని ఆ ప్రాంతం లో ప్రయాణించడానికి  స్లెడ్జ్ బళ్ళు కావాలనీ, వాటిని ఈడ్చడానికి  మంచు ని తట్టుకునే జూలు కల్గిన  బలమైన కుక్కలు అవసరమనీ పత్రికల్లో వచ్చుండచ్చు, వస్తుండచ్చు గానీ పత్రికలు చూడక పోవడం వల్ల మనిషికి ఆ పచ్చని లోహం మీద ఉన్న ప్రేమానురాగాలు దానికి తెలీవు.  అంతే కాక జడ్జి ముల్లర్ ఇంట్లో పని చేసే మాన్యూల్  కి ఉన్న చైనా లాటరీ జూదం వ్యసనం గురించి దానికేమీ అవగాహన లేదు.  ఇవన్నీ బక్ పత్రికలు చూడక పోవడం వల్ల దానికి తెలీవు. కాబట్టి, మాన్యూలు గాడు తనని ఒక పరాయి మనిషికి అమ్మబోతున్నాడని గ్రహించలేకపోయింది. వాడిని నమ్మి వాడితో బయటికి ఎప్పట్లాగే వెళ్ళి, వేరే వాడికి అమ్ముడై పోతుంది.

మాన్యూలు తన మెడ పట్టీని అపరిచితుడికి అప్పగిస్తుంటే కూడా , ఆ పరాయి వాడు మాన్యూలు కి తెలిసిన వాడే గదాని కాస్త గుర్రుమన్నా ఆమోదిస్తుంది! వాడు గోనె సంచిలో మూటగట్టి తీసుకుపోతుంటే “ఏదో జరిగింది” అని తప్ప ఏం జరిగిందో దాని కుక్క బుర్రకి తట్టదు. ఎన్నడూ ఆలోచించాల్సిన అవసరమే రాని బుర్రాయె!

అలా తీసుకుబోబడ్డ బక్ తన జీవితంలో ఎన్నడూ ఎదురు చూడని భయంకరమైన జీవితాన్ని చూస్తుంది. ఒక బోనులో పడేసి బొత్తిగా బక్ అంటే మర్యాద లేకుండా ప్రవర్తిస్తూ రైల్లో తీసుకు పోతారు.

అక్కడి నుంచి అది చాలా మంది చేతులు మారి , సుదీర్ఘ ప్రయాణాలు చేసీ దానికి జీవితంలో “దుడ్డు కర్ర న్యాయాన్ని” పరిచయం చేసిన ఎర్ర స్వెటర్ వ్యక్తి చేతికి వస్తుంది. ఈ మధ్యలో ఎదురైన ప్రతి మనిషి పైనా బక్ ,చంపాలన్నంత కోపంతో తిరగబడి కరిచి రక్తం కళ్ల జూస్తుంది. రచయిత మాటల్లో చెప్పాలంటే “బందీ అయిన రాజుగారికి” వచ్చే కోపాన్ని చూపిస్తుంది. చివరికి బక్ ఎర్ర స్వెట్టర్ వాడి చేతిలో పడ్డాక వాడు “మాట వినడం, వినయంగా ఉండటం” అనేవి ఎలా సాధ్య పడతాయో దానికి రుచి చూపిస్తాడు, దుడ్డు కర్రతో!

తన దర్పాన్నీ, శౌర్యాన్నీ, బలాన్నీ మాత్రమే నమ్ముతూ వాటిని ప్రదర్శించాలని చూసిన బక్ కి ఎర్ర స్వెట్టర్ వాడి దుడ్డు కర్ర మాడు పగల గొట్టి, ఒక్క కుదుపు ఇస్తుంది. బక్ శరీరమే కాక, అభిమానం కూడా తిన్న మొదటి దెబ్బ అది!  దెబ్బ తిన్న బక్ అంత బాధని మొదటి సారి చవి చూసినా, తిరిగి వాడి మీద తిరగబడాలనే చూసి పన్నెండు సార్లు అతడి మీద దాడికి ప్రయత్నించి పదమూడో సారి కొట్టిన అతి బలమైన దెబ్బకి , తల వంచి శక్తి చచ్చి నిస్సహాయురాలై పోతుంది. వాడంటాడు ఏం బిడ్డా బక్? మన సంఘర్షణ అయిపోయింది. నీ స్థానం నువ్వు తెలుసుకుంటే మంచిది. నాది నేనెరుగుదును. ఇంతటితో పోనివ్వడం మంచిది

బక్ కి తన స్థానమేంటో తెలిసి వస్తుంది మొదటి సారి! తాను ఓడిపోయిందని గ్రహిస్తుంది గానీ లొంగి పోదల్చదు . అక్కడి నుంచీ బక్ “ఎదురు తిరిగితే” , తన తిరుగుబాటు న్యాయమైనదైనా  సరే, దెబ్బలు తినక తప్పదని అర్థం చేసుకుంటుంది. ఎర్ర స్వెటర్ వాడి నుంచి చేతులు మారి కెనడా దేశపు అధికారిక ఉత్తరాల బట్వాడా కోసం ప్రాన్సోయ్, పెరాల్ట్ అనే ఇద్దరు వ్యక్తుల వద్దకు చేరుతుంది బక్.నిత్యం కష్టమే,నిత్యమూ శ్రమే ! కానీ బతకాలంటే వాటికి తల వంచాలి !

ఇక్కడి నుంచీ బక్ కి అసలైన జీవితం మొదలవుతుంది. జీవితం మామూలుగా నడిచి పోవాలంటే ఎన్ని జిత్తులు చేయాలో, ఎన్ని కుట్రలు చేయాలో,  ఎలా చేయాలో , ఎలా చేస్తారో అన్నీ తెలుస్తాయి. బతకడం కోసం అది అన్నీ నేర్చుకుంటుంది. మంచంటే తెలీని బక్ కి మంచు లో మైళ్ళ కొద్దీ స్లెడ్జ్ బండి లాగడం, మంచులో గుంట తవ్వుకుని పడుకోడం అన్నీ అలవాటు అవుతాయి. జీవితం లాగి పెట్టి  తన్ని మరీ నేర్పిస్తుంది. ఒకరి నాయకత్వం కింద పని చేయడమూ, పని సరిగా చేయలేనపుడు నోర్మూసుకుని భరించడమూ, ఇవన్నీ బక్ అంగీకరిస్తుంది.

ఎస్కిమో కుక్కలు వచ్చి పడితే వాటిని ఎదుర్కోవడమూ, తోటి కుక్కలు మోసం చేస్తే బుద్ధి చెప్పడమూ అలవాటు చేసుకుంటుంది. దాని జీవితం సినిమాల్లో మాదిరిగా క్షణాల్లో సింహాసనం మీది నుంచి పాతాళం లోకి జారి పడ్డట్టు అయినా, బక్ దాన్నుంచి తేరుకుని దొరికిన జీవితాన్ని అంగీకరిస్తుంది.

పని చేయడానికే తనను అక్కడికి తెచ్చారని  అర్థం చేసుకుని బతుకు దెరువు కోసమన్నట్టుగా అది త్వరగానే పని నేర్చుకుని స్లెడ్జ్ బళ్ళు లాఘవంగా లాగుతుంది.

కలలోనైనా ఊహించని కష్ట జీవితం!

ఉత్తరాల బట్వాడా పన్లు చూసే ప్రాన్సోయ్, పెరాల్ట్ బక్ ని బాగా మెచ్చుకుంటారు ఒళ్లు దాచుకోదని!

కష్ట జీవితం అలవాటయ్యాక బక్ లోని సున్నితత్వమూ, పెంపుడు జంతువుకు ఉండే నాగరికతా, మొహంలో ప్రశాంతతా అన్నీ ఒక్కొక్కటీ మాయమై పోతాయి.అది జీవితం మీద పగ బట్టినట్టు ప్రవర్తిస్తుంది. తనపై ఆధిపత్యాన్ని చూపబోయే స్పిట్జ్ కుక్క రక్తం కళ్ల జూస్తుంది. మోసం, దొంగతనం నేర్చుకుంటుంది. అదను చూసి దాడి చేసే విద్య నేరుస్తుంది. నిజాంకి ఇవన్నీ అక్కడ బతకాలంటే ఉండాల్సిన కనీస అర్హతలనుకోవచ్చు! అది రాక్షసి లాగా మారినా, ఆ రాక్షసత్వాన్ని కప్పి పైకి మామూలుగా కనిపించే యుక్తిని కూడా నేర్చుకుంటుంది.

కొన్నాళ్లు గడిచాక ,  ఉత్తరాల బట్వాడా పని పూర్తయ్యాక అది మరొకరి చేతిలో పడి, అక్కడి నుంచి అదృష్ట వశాత్తూ జాన్ టారంటన్ (Thornton )ఆశ్రయాన చేరుతుంది. అతడు దాన్ని చావగొడ్తున్న వాడిని బెదిరించి కాపాడతాడు ! టారంటన్ ని  చూస్తుంటే జాక్ లండనే తన పాత్రను పెట్టాడేమో అనిపిస్తుంది. అతని వద్దకు చేరాక నిరంతర శ్రమ కారణంగా  డస్సి పోయున్న బక్ తనకు అనుకోకుండా లభించిన ఈ అవకాశానికి ఆశ్చర్య పోతూనే కొంతకాలం పాటు తిండి,మంచి విశ్రాంతి, ప్రకృతి విహారం వీటితో కోలుకుని పోయిన తన శక్తిని కూడగట్టుకుంటుంది. ఈ బ్రేక్ లో దానికి ముందెన్నడూ లేని అనుభవం .. అవధులు లేని ప్రేమ జాన్ టారంటన్ తో కలుగుతుంది. జడ్జి మిల్లర్ ఇంట్లో రాజభోగాలు వెలగబెట్టినపుడు పది కుక్కల్లో బక్ ఒక ప్రత్యేక ఠీవీ తో ఉండటం, దాన్ని పని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోడం తప్ప ఇలాటి ప్రేమను పంచిన వాళ్లెవరూ లేరు. అది అతన్ని ఎంతగా ప్రేమించేదంటే జాన్ దాన్ని ముద్దు చేస్తుంటే గుండె వేగం పెరిగి పోతుంది.  పిచ్చి మమకారం పెంచుకుంటుంది!

అలాగని అది మిగతా కుక్కలా లాగా ఎగబడి ఆ ప్రేమను చూపించదు! పైకి పెద్దగా తేలకుండానే మూగగా ఆరాధిస్తుంది ! ప్రేమలో బెట్టుసరి గా ఉంటుంది . తన మమకారాన్ని జాన్ గ్రహిస్తున్నాడని తెల్సు ! కానీ ఎగబడితే కొంత చులకనై పోతానని బెట్టు ! దటీజ్ బక్ !

Call of the wild cover pageజాన్ ని అంటిపెట్టుకుని అహర్నిశలూ ఉంటూ, అతన్ని కాపాడ్డం తన విధిగా భావిస్తుంది.రెండు సార్లు అతన్ని ప్రమాదాల నుంచి కాపాడి ప్రాణ దానం చేస్తుంది. అతన్ని పందెం లో గెలిపించడానికి స్లెడ్జి బండితో సహా వెయ్యి పౌన్లు బరువు లాగుతుంది. జాన్ కోసం ప్రాణమిస్తుంది.

అయితే జడ్జి మిల్లర్ ఇంట్లోంచి కిడ్నాప్ అయింది లగాయతూ బక్ కి దొరికింది స్వేచ్చ మాత్రమే కాదు.దాని లోని ఆటవిక శక్తులేవో నెమ్మది నెమ్మదిగా జూలు విదిల్చి నిద్ర లేస్తాయి. అందుకే అది స్లెడ్జ్ బళ్లు లాగే ఇతర కుక్కల దగ్గర అతి సులువుగా వేగంగా కుయుక్తులు, కుట్రలు నేర్చుకుంటుంది. చివరికి అది మిగతా కుక్కల కన్న శక్తివంతంగా తయారై వాటన్నిటి మీదా ఆధిపత్యం సంపాదిస్తుంది. ఇవన్నీ చేస్తున్నపుడే దాన్లోని ఏదో ఒక ప్రవృత్తి దాన్ని కొంత ఉద్వేగానికి గురి చేస్తూ, ఎక్కడికో వెళ్ళి పోవాలన్న భావోద్రేకాన్ని కల్గిస్తూ ఉంటుంది.

తెల్లని మంచు లోంచి పచ్చని అడవిలోకి వచ్చి పడ్డాక, టారంటన్ వద్ద ఉంటున్నపుడు ఈ ప్రవృత్తి మరింతగా ప్రకోపిస్తుంది! ఏ గత జన్మ జ్ఞాపకాలో వేధిస్తుంటాయి. ప్రకృతి నుంచి ఏవో పిలుపులు అందుతుంటాయి. ఆ పిలుపులు విన్నపుడు వెర్రి ఆవేశం దాన్ని ఆవహిస్తుంది. అది వినగానే బక్ అడవిలోకి పోయి తిరిగి తిరిగి తను కూడా మొరిగి, అడవి పాట పాడి వస్తుంది.

ఒక అర్థరాత్రి నాడు అడవి నుంచి వినిపించిన పిలుపుకు స్పందించిన బక్ అడవిలోకి పరుగు తీసి ఆ పిలుపు ఎక్కడి నుంచి వస్తుందీ తెలుసుకుంటుంది. ఆ తోడేలుని తన బంధువు గా గుర్తించినట్టుగా ,  బక్ దాంతో పోట్లాడక స్నేహం చేస్తుంది.దానితో పాటు అడవిలో పిచ్చిగా తిరిగి ఆడుతుంటే, దానికి గత జన్మ గుర్తొచ్చినంత పనవుతుంది. ఈ తోడేళ్ళ స్నేహం కోసమే తాను వచ్చినట్టు అనుభూతి చెందుతుంది ! ఇలాటి ఉద్రేకంలోనూ అది టారంటన్ ని మర్చి పోక వెనక్కి తిరిగొస్తుంది.బక్ కి ఈ అడవి పిలుపు , అది సాగించే వేటా ఇవన్నీ ఎక్కడో ఇంతకు ముందు తనకు జరిగినవే, తనకు అనుభవం లోకి వచ్చినవే అని తోస్తుంది (దేజా వు అన్నమాట )! అది తన తోడేలు జాతి రక్తం లో నుంచి మరుగుతున్న జ్ఞాపకాల మంట గా అది గుర్తించలేదు గానీ అనుభవానికి తోస్తుంది !

ఈ క్రమంలో అది రాక్షసం గా ఆటవిక తత్వాన్ని అలవర్చుకుంటుంది. ఎలుగు బంట్లను కూడా వేటాడుతుంది. డజన్ల కొద్దీ తోడేళ్ళను అవలీలగా ఎదుర్కొని రక్తం కళ్ల జూస్తుంది. ఒక గొప్ప అతిశయమూ, దాని వల్ల సమకురిన ఆటవిక సౌందర్యం వల్ల బక్ సౌందర్యం, ఠీవీ ఇనుమడిస్తాయి.ముట్టె మీదా, కళ్ళ పైనా ఉన్న నల్లని మచ్చలతో అది దాదాపూ ఒక బలమైన తోడేలు వలే కనిపిస్తుంది. పొంచు వేయడం,నిశ్శబ్దంగా పాములా పాకి దెబ్బ కొట్టడం ఇలాటివన్నీ బక్ నేర్చుకుని గొప్ప జీవ శక్తి తో అత్యంత శక్తివంతమైన ఆటవిక మృగం గా రూపొందుతుంది.

ఈ సమయంలోనే టారంటన్ బృందం బంగారు గనుల నుంచి చాలా బంగారాన్ని సాధిస్తారు.ఒక దుర్దినాన బక్ ఒక దుప్పిని  మహోత్సాహం తో వేటాడుతూ ఉన్నపుడు  ఈహాట్ తెగకు చెందిన రెడ్ ఇండియన్లు టారంటన్ శిబిరం మీద పడి అందర్నీ చంపి బంగారం దోచుకుంటారు. అందర్నీ చంపాక వాళ్లు ఆనందంతో నృత్యం చేస్తున్న సమయంలో బక్ అక్కడికి వచ్చి జరిగిన ఘోరాన్ని గుర్తించి, వీరావేశంతో విధ్వంసం సృష్టించి కన పడ్డ వాళ్లందర్నీ చంపి పారేస్తుంది. అదొక కుక్క అని కూడా గ్రహించే టైము వాళ్ళకి ఇవ్వదు !  భయం తో వాళ్ళంతా కకావికలైపోతారు. ఒక పెద్ద భూతం వచ్చి పడిందనుకుంటారు

జాన్ టారంటన్ నీళ్ళ మడుగు వరకూ పరిగెత్తి అక్కడ చని పోయాడని బక్ అర్థం చేసుకుంటుంది.బక్ ఆ సంఘటన జరిగినపుడు అక్కడ ఉండుంటే అంత జరిగేది కాదు. టారంటన్ మరిక లేడనే విషయాన్ని అర్థం చేసుకుంటున్న కొద్దీ దాని కడుపులో గుండెలో దుఖం తో  ఒక డొల్ల తనం ఏర్పడుతుంది. ఆ ఖాళీ మరిక పూడేది కాదు ఎన్నటికీ ! అది బాధను దిగమింగుతుంది.

కానీ పగను కాదు!

బక్ వెళ్ళి తోడేళ్ళ గుంపులో చేరి వాటన్నిటి మీదా ఆధిపత్యం సంపాదిస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి అడవి తోడేళ్ళ సంతానం లో ముట్టెమీదా నెత్తి మీదా కపిల వర్ణపు మచ్చలు గల వాటిని ఈహాట్లు గుర్తిస్తారు.వాళ్లకు ఆ దెయ్యం కుక్క అంటే దడ. వాళ్ళ శిబిరాల్ని అది ఆ తర్వాత కూడా ధ్వంసం చేస్తుంది, శిబిరాల్లోంచి వెళ్ళిన వేట గాళ్ళు తిరిగి శిబిరం చేరకుండా దొరికిన వాళ్లను దొరికినట్టు చంపేస్తుంది. వాళ్ల శవాల పక్కన బక్ పాదాల గుర్తులు! వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ వేటాడి చంపుతుంది

ఇంత రాక్షసి గా మారిన బక్ ప్రతి వేసవి లోనూ ఆ లోయలోకి వచ్చి అక్కడ బంగారం నేలలోకి ఇంకి పోయి గడ్డి మొలిచిన ఆ ప్రాంతాల్లో ఎవర్నో గుర్తు చేసుకుని సుదీర్ఘంగా ఏడ్చి వెళ్ళి పోతుంది.

Prakriti pilupu_Jack London,(Tr)Kodavatiganti -19591

నవల ఆది మధ్యం అంతం మొత్తం బక్ దే! జాక్ లండన్ ఎంతటి ఉద్వేగ భరిత శైలి లో రాశాడో, అది ఏ మాత్రం లుప్తం కాకుండా దీన్ని కొడవటి గంటి కుటుంబ రావు అనువదించారు. నవల మొత్తం బక్ విశ్వరూపాన్ని, దాని జీవన వైవిధ్యాన్ని, భావోద్వేగాలని అత్యద్భుతంగా చిత్రీకరించారు.

అసలు బక్ ని ఒక మనిషి పాయింటాఫ్ వ్యూలో అర్థం చేసుకొవాలనిపిస్తుంది. ఈ మాట డోనాల్డ్ పైజర్ అనేసాహిత్య కారుడు కూడా నొక్కి వక్కాణిస్తాడు. బక్ అనుభవించి, మనం చదివేదంతా మానవ జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులే! పరిస్థితులకు అనుగుణంగా దర్జా వెలగబెట్టడమూ, హీన దశలో గతి లేక లొంగి ఉండాల్సి రావడమూ, తర్వాత ఆటవికంగా ప్రవర్తించాల్సి వచ్చి, ఆధిపత్యం చూపించే అవకాశం వచ్చినపుడు దాన్ని అంది పుచ్చుకునే స్వభావమూ ఇది మొత్తం అట్టర్ హ్యూమన్ నేచర్! బక్ తన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తూ ఈ మధ్య అదేదో సినిమాలో చెప్పినట్టు ఎక్కడతగ్గాలో  అక్కడ తగ్గి ప్రవర్తిస్తుంది.చిత్రంగా నవల మొదటి సారి చదువుతున్నపుడు నాకు సీతారామా రావు గుర్తొచ్చాడు. అతను కూడా డబ్బు చేతిలో ఉన్నపుడు తన్ను తాను మహరాజు గా భావించుకుంటూ దర్పంగా ఉంటాడు. బోల్డు కబుర్లు చెపుతాడు. బక్ నుంచి సీతారామా రావులు చాలా నేర్చుకోవాలి! పరిస్థితి చేజారగానే చతికిల బడి డిప్రెషన్ లోకి పోయి తనను తాను చంపుకుంటాడు. బక్ అలా చేయదు. గడ్డి పోచలా తుఫాన్ వచ్చినపుడు వంగి, అది పోగానే తలెత్తుతుంది. ఈ క్రమంలో అది తన స్వాభిమానాన్ని, సహజ విశ్వాస స్వభావాన్ని,అంతకు మించి అనువంశికంగా ప్రాప్తించిన ఆటవికత్వాన్ని ఏ మాత్రమూ వదులుకోదు!సమయం కోసం వేచి చూస్తుందంతే!

ఎర్ర స్వెటర్ వాడు పరిచయం చేసిన దుడ్డు కర్ర న్యాయాన్ని అది చిటికె లో గ్రహించి ఆ పాఠాన్ని చివరి వరకూ గుర్తు పెట్టుకుంటుంది. అధికారం చేతిలో ఉన్నవాడిదే రాజ్యం!వాడి చేతిలో కర్ర ఉన్నంత వరకూ, మనకు ప్రాణం మీద ఆశ ఉన్నంత వరకూ దుడ్డుకర్రను గౌరవించక తప్పదు. ఈ పాఠాన్ని మనుషులు అందరూ నేర్చుకోలేరు. నేర్చుకున్నా మానవ సహజమైన ఉద్వేగాలతో అనువు గాని చోట సామెత లా ప్రవర్తించి, భంగ పడతుంటాం మనం, అది సహజం కూడానూ! కానీ గెలవాలంటే వేచి చూడక తప్పదని, నెగ్గాలంటే తగ్గక తప్పదని బక్ చెప్తుంది.అలాగే బక్ కొన్ని జీవిత సత్యాలు తన శ్రామిక జీవితంలో నేర్చుకుంటుంది. బలమున్న వాడిదే రాజ్యం అనే ఎర్ర స్వెటర్ వాడి పాఠమే దీనికి కూడా మూలం! ప్రాణాలు నిలబెట్టుకుని తీరాల్సిన పరిస్థితిలో మోసం తప్పదు! తీరీ తీరని ఆకలి తీరాలన్నా దొంగ తనం చేయక తప్పదు. బక్ లో ఉత్తమ లక్షణం అదే! నేర్చుకున్న పాఠాల్ని మర్చే పోదు! తనకు పోటి గా తయారైన స్పిట్జ్ అనే కుక్క దాష్టీకాన్ని అది చాలా రోజులు భరిస్తుంది . దాని నాయకత్వం లో పని చేస్తుంది !గాయ పడుతుంది . మొదట్లో చాలా సహనం వహిస్తుంది . కాల క్రమేణా అది దాని సహజ ఆటవిక ప్రవృత్తిని  స్వీకరించాక , స్పిట్జో తనో తేలి పోవాల్సి వచ్చిన రోజు, ఉగ్ర రూపం ధరించి దాని అంతు చూసేస్తుంది ! ఎవరో ఒకరు గెలాల్సిన రేసులో ప్రాణాలు పోగొట్టుకోడానికి కూడ సిద్ధమై ప్రాణాలు తీయడానికి  తెగబడుతుంది ! తెగబడక పొతే స్పిట్జ్ ఆ చాన్స్ తీసుకుంటుంది మరి !

బ్రాహ్మణీకం లో చలం ఒక మాటంటాడు “ఔన్నత్యంలో ఉన్నన్నాళ్ళూ, మనుషులు తమ స్వభావంలోనూ ఔన్నత్యం ఉందనుకుంటారు” అని! బక్ కూడా జడ్జి గారింట్లో ఉన్నన్నాళ్ళూ తానొక రాజ వంశానికి చెందిన దాన్నని ఊహించుకుంటూ దర్పం చూపిస్తుంది. కానీ వాస్తవం మరో లోకం లో పడేసి ఈడ్చి తన్నే సరికి, ముందు నిర్ఘాంత పోయినా త్వరలోనే తేరుకుని జీవితంతో రాజీ పడుతుంది. ఒళ్ళు దాచుకోక పని చేస్తుంది.అలా దాచుకునే ఇతర స్లెడ్జ్ కుక్కల్ని సహించదు.అడవిలోకి వచ్చాక, సహజ గుణం ప్రకారం ఆహారం కోసం మాత్రమే వేటాడుతుంది. వినోదం కోసం కాదు! ఇలా ఎక్కడికక్కడ బక్ నీళ్ళు అది పోసిన పాత్రను బట్టి తన స్వరూపాన్ని మార్చుకున్నట్టు ప్రకృతికి అనుగుణంగా, జీవితానికి అనుగుణంగా అడ్జస్ట్ అవుతూ, ఎలా జీవించాలో సహజం గా చెప్తుంది మనకి . “నాగరికత నుంచి తిరిగి ప్రకృతికి ప్రయాణం ” అనే కాన్సెప్ట్ అమెరికా సాహిత్యం లో ఒక ప్రత్యేక ప్రక్రియ గా చెప్పవచ్చు . మార్క్ ట్వైన్ హకెల్ బరీ ఫిన్ కూడా ఈ కోవకు చెందిందే !

Prakriti pilupu_Jack London,(Tr)Kodavatiganti -195997

బక్  స్వామి భక్తి కూడా విశేషం! టారంటన్ జోలికి ఎవడు వచ్చినా రక్తం కళ్ల జూస్తుంది. వాళ్లిద్దరి బంధాన్ని, మమకారాన్ని జాక్ లండన్ చాలా ప్రత్యేకించి వివరిస్తాడు. టారంటన్ దాని తల మొరటు గా పట్టుకుని వూపుతూ దాన్ని నానా తిట్లూ తిడతాడు. అవన్నీ ముద్దు మాటలని దానికి తెలుసు! అతనలా ప్రేమ చూపిస్తుంటే ఆనందంతో దాని గుండె బయటికి వచ్చేస్తుందన్నంత గాఢంగా దాన్ని అనుభవిస్తుంది. అంత ఉద్రేకం!

పైగా బక్, హచి లాంటిదో (అదీ గొప్పదే)మరోటో కాదు! అది ఎక్కడైనా సరే సంరక్షణ బాధ్యత తీసుకునే రకం!తనను ప్రేమించిన వారిని అంతకంటే పిచ్చిగా ప్రేమించే రకం!

దాని వేటను రచయిత ఎంత ఉద్వేగ భరితంగానో వర్ణిస్తాడు. గడ్డ గట్టిన మంచు మీద తేలిక పాటి అడుగులతో పారిపోయే ఒక నీటి కుందేలును అది వేటాడే తీరు అద్భుతం! అది ఎంతటి ఉన్నతమైన enthusiasm తో వేటాడుతుందో రచయిత కళ్లకు కడతాడు.

జీవితపు అత్యున్నత స్థాయిని  అందుకుని, మళ్ళీ అలాటి దశ జీవితంలో రాదేమో అన్నపుడు గొప్ప ఆవేశం కలుగుతుందిజీవితపు ఉచ్చదశలో కలిగే ఆవేశం అదేం చిత్రమో జీవితాన్నే విస్మరింప జేస్తుంది. తాను జీవించి ఉన్నట్టు కూడా తెలియనివ్వని ఆవేశం కళాకారుడికి అనుభవమైనపుడు ఒక మహా జ్వాలతో పైకి లేస్తాడు.సైనికుడికి ఆవేశం వచ్చినపుడు యుద్ధోన్మాదానికి వశుడై ప్రాణాలకు తెగించి పొరాడతాడు.బక్ సరిగ్గా ఇప్పుడు అలాటి ఆవేశానికి చిక్కింది. జీవితోద్వేగం దాన్ని ఆవహించింది. దాని నర నరానా ఆనందం ఉబుకుతున్నదిఒక కుక్క వేట దృశ్యం ఇది!

ప్రకృతి గురించి, వైల్డ్ లైఫ్ గురించి తీరిగ్గా ఆలోచించే సమయం, కోరిక, తీరిక మనకు ఉండక పోవచ్చు గానీ, దానితో మమేకమై తిరిగితే, గడిపితే ఎన్నెన్ని రహస్యాలు ఆవిష్కృతమవుతాయో! ఎన్ని జంతు హృదయాలు మనతో మాట్లాడతాయో! పశువులు మనుషులకంటే నయమని ఎంతగా అర్థమవుతుందో ! అన్ కండిషనల్ గా ప్రేమించగలిగేది జంతువులు మాత్రమేనని అందరమూ ఒప్పేసుకుంటామేమో!

జాక్ లండన్ అలా , విచ్చలవిడి నగ్న ప్రకృతి లో, జంతువులని చూస్తూ, చెట్లతో, సముద్రం తో మాట్లాడుతూ బతికాడు,  గడిపాడు. ఈ నవల, ఇంకా మరి కొన్ని అతని నవలలు అలా పుట్టినవే! తోడేళ్లనీ కుక్కల్నీ, ఎస్కిమోలనీ, రెడ్ ఇండియన్లనీ గమనిస్తూ, చదువుతూ మంచు గుట్టలు పేరుకునే స్థలాల్లో తిరిగాడు. అక్కడ గుడారం వేసుకుని, పుస్తకాలు చదువుతూ  గడిపాడు! అతని జీవితంలో తిండి, నిద్ర , డబ్బు వంటి వాటికి ఎలాటి ప్రాముఖ్యం లేదు!  అవన్నీ తాత్కాలిక అవసరాలంతే ! సాహసం , గొప్ప ప్రేమ , తీవ్రమైన పాషన్ , వ్యామోహం , ప్రయాణం , ప్రకృతి, సముద్రం , అడవి ఇవన్నీ కలిస్తే జాక్ లండన్ జీవితం! ఆయన ఇదంటూ ఒక వృత్తి ని ఎంచుకోలేదు . ఓడ కూలి, చాకలి,ముత్యప్పు చిప్పల్ని దొంగిలించడం ,చిన్నా చితకా కూలి పన్లు చేశాడు ! అట్లాంటిక్ మంత్లీ లో రాతలు రాశాడు! చిన్న తనంలోనే సాహసాలూ సముద్ర యాత్రలూ, అన్వేషణలూ వర్ణించే పుస్తకాలు చదివి జీవితం అంటే సాహసం, రొమాంటిసిజం అని నిర్వచించేసుకున్నాడు! ఆ నిర్వచనం ప్రకారమే బతికాడు! తెప్ప కట్టుకుని శాన్ ఫ్రాన్సిస్కో సముద్రం లో పడి తిరిగే వాడు.చిల్లర నేరస్తులంతా స్నేహితులు! దొంగతనాలు మొహం మొత్తాక దొంగల్ని పట్టుకునే ఉజ్జోగం కూడా చేశాడు. రెండూ ఎలా ఉంటాయో చూద్దామని “కిక్” కోసం చేసిన పన్లే!

Prakriti pilupu_Jack London,(Tr)Kodavatiganti -1959189

సాహసాన్ని మనసు తీరా అనుభవించేందుకు  అప్పట్లో (1896-1899) అలాస్కా ప్రాంతంలో జరిగిన బంగారం అన్వేషణ కి బయలు దేరాడాయన . జీవితానుభవాన్ని పొందిన సమయం అది. “It was in the Klondike, I found myself” అంటాడు.మంచు తప్ప ఏమీ లేని చోట ఒక ఏడాది పాటు నివసించాడు. ఎండ మొహం చూడక పోవడం వల్ల స్కర్వీ రోగం వచ్చి, బంగారం అన్వేషణ మొదలయ్యే సమయానికి ఆ స్థలం వదిలి తిరిగి కాలిఫోర్నియా రావాల్సి కూడా వచ్చింది !నిజానికి లండన్ అన్వేషణ బంగారం కోసం కాదు కాబట్టి అతనికి పోయిందేమీ లేదు, ఆరోగ్యం తప్ప! ఈ అలాస్కా జీవితంలోనే అతనికి ఈ నవలకు కావలసిన ముడి సరుకు దొరికింది! స్లెడ్జ్ బళ్ళు లాగే ఎన్నో కుక్కల్ని చూసివాటి లోంచే ఆయన బక్ ని సృష్టించాడు !

అతనికొక ఉద్రేక పూరితమైన  జీవితం కావాలెపుడూ! బంగారం అన్వేషణ లో జబ్బు పడి వచ్చాక ఆ అనుభవాల డైరీ తోనే పూర్తి స్థాయి రచయితగా మారాడు  ! అందుకే అతని ప్రతి రచనా చదువర్లను కూడా ఉద్వేగం అంచున నడిపిస్తుంది

ఈ నవల చదివాక అనిపిస్తుంది, “లండన్ నిజంగానే బక్ అనే కుక్కని ఊహించుకుని ఎక్కడో ఒక చోట బక్ నిజంగానే ఉందని నమ్మి ఉంటాడా?” అని!

ఈ నవలను 1959 లో కొడవటి గంటి కుటుంబరావు గారు ప్రకృతి పిలుపు అనే పేరుతో అనువదించగా దేశీ కవితా మండలి విజయవాడ వాళ్లు వేశారు. చాలా రోజులకు అది అందుబాటు లో లేకుండా పోయింది. మంచి పుస్తకాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే పీకాక్ క్లాసిక్స్ ఈ పుస్తకాన్ని మళ్ళీ 2003 లో “అడవి పిలిచింది” పేరుతో అందుబాటు లోకి తెచ్చింది . కాపీ రైట్ సమస్యల వల్ల కుటుంబరావు  గారి అనువాదాన్నే గాంధీ కొంత సంక్షిప్తం చేసి ప్రచురించారు. 2003 నుంచి పది  సార్లు ముద్రణకు వచ్చింది. మొదటి ప్రచురణ లో ఇది కొడవటి గంటి కుటుంబరావు గారి అనువాదానికి సంక్షిప్తం అనే విషయం ముందుమాట లో ప్రస్తావించారు (గాంధీ గార్ని కనుక్కున్నాను) గానీ తర్వాత తర్వాత ప్రచురణల్లో ఈ విషయం లేక పోవడం వల్ల ఈ మధ్య కాలంలో కుటుంబరావు గారి అనువాదం అందరికీ అందుబాటులోకి వచ్చే దాకా నేను అది గాంధీ గారు చేసిన అనువాదమనే అనుకున్నాను. ఒరిజినల్ నవలను సంక్షిప్తం చేసి గాంధీ అనువదించారని భావించాను.

 

పైగా “కొ కు అనువదిస్తే అచ్చం ఇలాగే ఉండేది. ఎంత సజీవమైన భాష వాడారో” అనుకున్నాను కూడా :-) ! ఒక చోట కుక్క ధర మాట్లాడే విషయంలో “నూరుకు ఠోలీ తక్కువైతే వీలు కాదు పొమ్మన్నాడు” అనే వాక్యం లో “ఠోలీ” అనే మాట విని అసలు ఎన్నాళ్ళయిందో అనిపించింది !

గాంధీ ఇంకో మంచి పని కూడా చేశారు. ఈ పుస్తకాన్ని పిల్లల కోసం  బొమ్మలు చేర్చి “బక్” అనే పేరుతో మరో ఎడిషన్ వేశారు!

పీకాక్ క్లాసిక్స్ కి ఈ విషయంలో ఎన్ని కృతజ్ఞతలు  చెప్పినా చాలదు. జాక్ లండన్ అనేవాడొకడున్నాడని, జీవితాన్ని అత్యద్భుతంగా దాని దారిన దాన్ని నదిలో వదిలేసిన పడవలా పోనిస్తూ, ఆయన అనుభవాలన్నీ నవలలుగా లోకానికి అందించాడని నాకు పీకాక్ క్లాసిక్స్ ద్వారానే తెల్సిందని చెప్పడానికి ఇష్టపడుతున్నాను, ప్రఖ్యాత రచయిత నాకు అప్పటి వరకూ పరిచయం కాలేదని చెప్పడానికి సిగ్గు పడటం లేదు.

gandhi

“పీకాక్” ప్రచురణల గాంధి

కొన్ని పుస్తకాల ప్రభావం బలంగా ఉంటుంది. రచయిత మీద మమకారమో ప్రేమో, హద్దులు దాటిన అభిమానమో పెంచుకునేలా చేస్తుంది. శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళినపుడు ఆ అగాథ జలాల్లో బోటు మీద తిరుగుతూ “జాక్ లండన్ తిరిగిన ఈ నీళ్ళలోనే నేను కూడా షైర్లు కొడుతున్నా” అనుకుని సంతోష పడ్డాను! కట్టుకుంటున్నపుడే తగలబడి శిధిలాలుగా మిగిలిన అతని ఇల్లు ఒక సజీవ జ్ఞాపకం!

ఉద్వేగపుటలల్లో సాహసాల దారిలో లాక్కుపోయే ఈ నవల ఇంగ్లీష్ లో ఉచితంగానే డౌన్లోడ్ కి దొరుకుతుంది! తెలుగు వెర్షన్ కుటుంబరావు గారిది కూడా నెట్ లో ఉంది. వెదికి కనుక్కొని చదవండి :-)

ప్రకృతి తో బతకాలి, ప్రకృతి లో బతకాలి ! ప్రకృతి తో మమేకమై బతకాలి !

ప్రకృతి ఆహ్వానిస్తే తప్పక బయలు దేరాలి ! ఇదే జాక్ లండన్ జీవితం , రచనలూ !

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

రెండు సంఘటనలూ రెండు పాత్రలూ వొక నిరసన : థూ

 

 

-ఎ.కె. ప్రభాకర్ 

~

 

‘అందరూ నిర్దోషులైతే మరి చుండూరు దళితుల్ని చంపిందెవరు?’

చుండూరు దళితులపై అగ్రవర్ణాల మారణకాండ జరిగిన (1991 ఆగస్ట్ 6) యిరవై మూడేళ్ళకి హైకోర్ట్ డివిజినల్ బెంచ్ ఆ కేసులో యిచ్చిన తీర్పు ( 2014 ఏప్రిల్ 22) ని ప్రశ్నిస్తూ దళిత – హక్కుల – ప్రజా సంఘాలు వేసిన పెను కేక యిది. ఈ ప్రశ్నకి యింకా సమాధానం లభించాల్సే వుంది కానీ ఆ తీర్పుపై బలమైన నిరసనగా వెలువడ్డ సంచలనాత్మక కథ

( విశాలాంధ్ర – ఆదివారం, జూన్ 15 , 2014). రచయితగా పి వి సునీల్ కుమార్ తక్షణ స్పందన సాహిత్య లోకంలో చిన్నపాటి దుమారం లేపింది. కథ లోపలి , బయటి విషయాల మీదా చర్చలు జరిగాయి. కథలో ప్రస్తావితమైన సామాజికాంశాల గురించి సంఘటన పూర్వ పరాల గురించి రచయిత దృక్పథం గురించి దాన్ని కథలోకి తీసుకురావడంలో సాఫల్య వైఫల్యాల గురించి కళావిలువల గురించి రచనా శిల్పం గురించి కథ చదివాకా చదువరుల్లో కలగాల్సిన క్రియాశీల స్పందన గురించి స్థూలంగా సాహిత్య ప్రయోజనం గురించి వొక్క ఫేస్ బుక్ లోనే దాదాపుగా పాతిక పేజీల వరకు చర్చ జరిగింది. కథ యెంత ఆలోచింపజేసిందో ఆ చర్చలు కూడా అంతే తీవ్రంగా బుర్రకి పనిబెట్టాయి.

రచయిత కథలో తన దృక్పథాన్ని ఆవిష్కరించడానికి భిన్న పద్ధతుల్ని పాటిస్తాడు. సర్వసాక్షి దృష్టి కోణంలో కథ నడిపిపేటప్పుడు  కథనంలోనో ముగింపులోనో రచయితే తన ఆలోచనల్ని స్వయంగా ప్రకటిస్తాడు. ఆ తరహా కథల్లో పాఠకులకి పెద్ద పనేం వుండదు.  సర్వసాక్షి కథనాన్ని రచయితా పాఠకుల మధ్య జరిగే సంభాషణ అనుకొంటే అటువంటి  కథలు యేకముఖ సంభాషణల్లాంటివి. అప్పుడు పాఠకుడు కేవలం శ్రోతగా మిగిలిపోయే ప్రమాదం వుంది. దాన్నుంచీ తప్పించుకొని పాఠకుల ఆలోచనకి చోటూ వెసులుబాటూ వ్యవధి యివ్వడానికి తన దృక్పథాన్ని వ్యక్తం చేయడానికి కథకుడు  అనుకూలమైన పాత్రల్ని – కంఠ స్వరాన్ని యెన్నుకొంటాడు. చాలా సార్లు సంభాషణల ద్వారా చెప్పిస్తాడు. లేదా పాత్రల బాహ్య అంతరంగ ప్రవృత్తుల ద్వారా  ఆవిష్కరిస్తాడు. అందుకు అనుగుణమైన సంఘటనల్ని సృష్టిస్తాడు. సంఘర్షణని చిత్రిస్తాడు. ఆ యా సందర్భాల్లో అవసరాన్నిబట్టీ ఆత్మాశ్రయ కథనాన్ని ఆశ్రయిస్తాడు. ప్రతీకలని నిర్మిస్తాడు. అన్యాపదేశాల్ని అడ్డం పెట్టుకుంటాడు. ఒక్కోసారి టెక్నిక్ పరంగా సరైన జాగరూకత లేకుంటే కథనంలో పాత్రల్లో రచయిత  చొరబాటు జరగొచ్చు. ప్రతిభా నైపుణ్యాలున్న రచయిత మాత్రమే స్వీకరించిన కథా వస్తువు డిమాండ్ చేసిన శిల్పంతో  పాఠకుడికి దగ్గరవుతాడు.

సునీల్ కుమార్ చుండూరు మారణకాండనీ దానిమీద పెద్ద  కోర్టులో వెలువడ్డ జడ్జిమెంట్ నీ కథలో ప్రధాన సంఘటనలుగా – కథాంశాలుగా తీసుకొన్నాడు. కులాలు కాలాలు మార్చలేదు గానీ స్థలాలు మార్చాడు. పాత్రల పేర్లు మార్చాడు. తణుకు ప్రాంతంలో జరిగినట్టు పేర్కొన్నాడు. స్థానికత కోసం  అయితంపూడి లాకులు దగ్గర శవాలు దొరికినట్టు వొకటి రెండు మార్పులు జోడించాడు. కామందు పేరుకి ప్రతీకాత్మకంగా రెడ్డీ నాయుడూ రెండూ తగిలించాడు. మిగిలిన కథంతా అదే.

దళిత కులానికి చెందిన జోసఫ్ కొడుకు సాల్మన్  రాజు అతన్తో పాటు తణుకు కాలేజీలో చదువుకొనే వూరి  ‘కామందుల ఆడపిల్లని యిష్టపడ్డాడు. ఆ పిల్లా ఆడ్ని ఇష్టపడింది… కామందులకి ఇది గిట్టలేదు.’ అది గొడవకి దారితీసింది. కామందుల కుర్రాళ్ళకి మండి ‘ఏరా మాలనాకొడకా’ అని కులం పేరుతో ఘర్షణకి దిగారు.

దీన్ని వూరి కామందు బసివిరెడ్డి నాయుడి మాటల్లో చూద్దాం:

‘మాటా మాటా పెరిగింది . అక్కడితో ఆగాలా ? ఆ రాజుగాడు ఆడికి తోడు మిగిలిన మాలమాదిగ కుర్రనాయాళ్ళు కలిసి కామందుల పిల్లల్ని, కనీసం పెద్ద ఇళ్ళ పిల్లలే అన్న ఇంగితం లేకుండా , పెద్దంతరం , చిన్నంతరం లేకుండా చేయ్యిచేసుకున్నారండి… ఎంత దారుణం.

రామరాజ్యం కోసం కలలు కన్న గాంధీగారు, ఇప్పుడు కలలు కంటున్న మోడీగారూ ఈ సంగత్తెలిస్తే ఎంత కుమిలిపోతారు?

ధర్మం ఇప్పటికే ఒంటికాలి మీద కుంటుతుంది. ఇలా వదిలేస్తే ఇంకేమీ మిగలదు కాబట్టి, ఈ కాస్త ధర్మాన్నన్నా నిలబెట్టడానికి ఈ కడజాతి కుక్కలకి బెత్తం దెబ్బ చూపిద్దాం అని పెద్దలంతా అనుకుని ఓ తీర్మానం చేసుకున్నామండి. అది కాస్త మోతాదు ఎక్కువైంది.’  

మోతాదు ఎంత యెక్కువైందో జోసఫ్ మాటల్లో చూద్దాం:

‘ ఆ రోజు రాత్రి చూడాలి బాబూ. రాములోరి రథ యాత్ర జరిగినట్టు మా మీద దండెత్తేరు. కత్తులు, కటార్లు, ఈటెలు, బళ్ళేలు పట్టుకుని వచ్చేరు… మా గుడిసెలకి నిప్పెట్టేరు. మా అమ్మల్ని మానాల మీద తన్నేరు. మా ఆడబిడ్డల్ని మళ్ళా పాడుచేసేరు. దొరికినోడ్ని దొరికినట్టు నరికేరు. ఎంటపడ్డారు. ఎగబడ్డారు. నరికేశారు. కిందేసి తొక్కేశారు. గోనెసంచుల్లో కుక్కేశారు. పంట కాలవలో పడేశారు.’

ఆ దాడిలో ఇరవై ఏళ్ళు అత్తారబత్తంగా పెంచుకున్న జోసఫ్ కొడుకు (రాజు)తో సహా మొత్తం పదిమందిని చంపేశారు. ఒక కుంటోడు జోసఫ్ కాలిరగ్గొట్టి అతన్ని కుంటి జోసఫ్ చేసాడు.

అదిగో … అప్పుడు … ఆ పాశవిక దాడిలోనే  ఇగిరిపోయింది జోసఫ్ నోట్లో తడి. అతనికి యెన్నోసార్లు  ‘ఉయ్యాలనుంది… దేవుళ్ళ మీదా … మమ్మల్ని మనుషులు కాదన్న వాళ్ళమీదా … కడజాతివాళ్ళని అన్నవాళ్ళమీదా …’ ఉయ్యాలన్నా ఉయ్యలేడు.

అలా ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి. మధ్యలో కింది కోర్టులో దాడిచేసినవారికి శిక్షలు పడ్డాయి(చుండూరు కేసులో విచారణకి సంఘటనా స్థలిలోనే స్పెషల్ కోర్టు యేర్పాటైంది – దళితులపై దమనకాండని  విచారించడం కోసం వొక ప్రత్యేక కోర్టు యేర్పడడం దేశంలో అదే తొలిసారి. సంఘటన జరిగిన పదహారేళ్ళకి  2007 లో యాభై ఆరు మందిని దోషులుగా నిర్ధారించి ఆ కోర్టు శిక్ష విధించింది).

కానీ పై కోర్టులో రెడ్డి తోక తగిలించుకొన్న జడ్జి యిచ్చిన తీర్పు దేశంలో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెట్టుకొన్న వారికి అశనిపాత విస్మయం కల్గించింది.

న్యాయమూర్తి అందరూ నిర్దోషులే అని తీర్పు చెబుతూ ‘ఇంకా కులాలెక్కడున్నాయి?’  అన్నాడు.

‘దొంగ కేసు’ అని తేల్చేసాడు.

జోసఫ్ ‘నోట్లోంచి మాట రాలే … మాట బదులు ఉమ్మొచ్చింది…’

‘ముంతలో పడాల్సింది పొరపాట్న ఆయన మొగాన పడింది …

థూ …’

అదీ కథకి ముగింపు.

p v sunil kumar

కథలో వాస్తవానికి రెండు దాడులు జరిగాయి. మొదటిది దళితులపై భౌతికంగా జరిగిన దాడి. రెండోది – దాని వ్యవస్థీకృత రూపం.  కులమే  రెండుచోట్లా కారణం. బాధితుడి నోట్లో తడి ఆరిపోయి ఉమ్మి రాకుండా నోరెండిపోయి నెరళ్ళు విచ్చుకున్న బీడు పొలంలా తయారయ్యే పరిస్థితికి కారణమైన సంఘటన మొదటిది. అది తరాలుగా అమలౌతున్న సామాజిక క్రౌర్యాన్ని ఆవిష్కరించిన భయావహ సంఘటన. అది ఆంధ్రప్రదేశ్, తమిళ్నాడు , బీహార్ , మహారాష్ట్ర, రాజస్తాన్ – దేశంలో యే మూలైనా దాడి చేసేది రెడ్డినాయుళ్ళు, భూమిహారుల రణవీర్ సేన , కుంబీలు , జాట్ లు వంటి ‘కులీను’లైతే   వేటాడబడేది బలయ్యేది మాత్రం ‘కులహీను’లైన దళితులే. రాజ్యాంగ బద్ధమైన సామాజిక న్యాయం కోరడమే ఆత్మగౌరవంతో పీడన లేకుండా బతకాలనుకోవడమే  వేటకి కారణం. మూడేళ్ళ పసి బిడ్డా    డెబ్భై యేళ్ళ వృద్ధులా – ఆడా మగా అని చూడకుండా విచక్షణా రహితంగా చంపేసిన  కిలవేన్మణి (1968) మొదలుకొని – బథానీ టోలా (1996)లో రణవీర్ సేన సాగించిన మారణహోమం , ఖైర్లాంజీ దురాగతాల  మీదుగా నిన్న మొన్నటి లక్షింపేట , యివాల్టి వేముల రోహిత్  హత్యల వరకూ అన్ని దారుణాలలో నేరస్తులంతా శిక్షలు లేకుండానే బయటపడతారు. హతులు వుంటారు – హంతకులుండరు.  హంతకుల కులం పాలకుల కులం న్యాయమూర్తుల కులం వొకటే కావడం యెంత చక్కటి రాజకీయ నీతి?

ఈ వ్యవస్థీకృత దుర్నయం పట్ల తీవ్రమైన అసహ్యాన్ని వ్యక్తంచేయడానికి ఛీత్కారాన్ని ప్రకటించడానికి జోసఫ్ నోట్లో  వుమ్మడానికి మళ్ళీ నోట్లో నీరూరాయి. ‘థూ …’ ఆ విధంగా రచయిత ధర్మాగ్రహ ప్రకటన రాజకీయ – సామాజిక  నిరసన.

వాస్తవ సంఘటనలు వాటికవే కథలు కావని కొందరు , బసివిరెడ్డి నాయుడు కుంటి జోసఫ్ యీ రెండు పాత్రల్ని తీసేస్తే యిది కేవలం వొక వార్త మాత్రమేననీ మహా అయితే వార్తాకథనం కావొచ్చేమోనని కొందరూ, సంఘటనలు జరిగిన సందర్భాల్లో తత్క్షణ ప్రతిస్పందనలుగా వచ్చే యిటువంటి రాతలకు సాహిత్య విలువని ఆపాదించలేమని  మరికొందరూ, బసివిరెడ్డి నాయుడి పాత్ర చిత్రణలో శిల్ప విషయికంగా జరిగిన పొరపాటు వల్ల మంచికథ కాలేకపోయిందని , ఆ విధంగా రచయిత ఆశించిన ప్రయోజనం నెరవేరలేదని యింకొందరూ విమర్శపెట్టారు. కథని బాధితుల పక్షం నుంచి చూడాలన్న వాదాన్ని కూడా యెద్దేవ చేసారు. జరిగిన ప్రతి సంఘటనా సాహిత్య వేషం ధరించి విసువు పుట్టిస్తుందని కొత్తదనం వుండడం లేదని అందువల్ల మూస కథలు మాత్రమే వస్తున్నాయని  కథా ప్రేమికులు బాధపడ్డారు. సున్నితమైన  సమకాలీన  సంఘటనల్ని వర్ణించినంత మాత్రాన కథని మెచ్చుకొని తీరాలా అని వాదించారు. శిల్పాన్ని ముందుకు తెచ్చి కథలో  స్వీకరించిన  వస్తువుపట్ల కూడా అసహనం వ్యక్తం చేసారు  (అట్రాసిటీ గురించి గాక అట్రాసిటీ చట్టాల దుర్వినియోగం గురించి కథ రాస్తే ఆహ్వానించడానికి వారికి అభ్యంతరం లేదు).

ముందుగా గుర్తించాల్సిన విషయం – సమకాలీన సామాజిక సంఘటనలు సాహిత్యంలోకి యెక్కకూడదని గిరిగీసుకోవాల్సిన అవసరం లేదు. అలా గీసుకొంటే చివరికి మనకి మిగిలేవి అలౌకికమైన దెయ్యాలు – భూతాల హారర్ కథలూ గ్రహాంతరవాసుల సూడో సైన్స్ ఫిక్షన్ కథలూ అభూతకల్పనా ప్రపంచపు కథలేనేమో!  [కిలవేన్మణి దళితుల వూచకోత – యథార్థ సంఘటన నేపథ్యం చేసుకొని  ఇందిరా పార్థసారథి రాసిన ‘కురుతిప్పునల్’ నవలకి ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డు (1977) వచ్చింది. ఆ తర్వాత అది సినిమాగా కూడా గొప్ప ప్రశంసలు పొందింది – వాస్తవాలు కళలై చరిత్రలోకెక్కడానికి యిదొక ఉదాహరణ మాత్రమే]

వాస్తవాన్ని కళగా రూపొందించడంలో శిల్ప వస్తువుల ప్రాధాన్యతల గురించి మాట్లాడుకోవాల్సిన అనివార్యమైన అవసరాన్ని మరోసారి ‘థూ…’ కథ కల్పించింది అనడంలో యెటువంటి సందేహం లేదు. నిజమే కథ వుపన్యాసంలానో వ్యాసంలానో వుండకూడదు. వస్తువుని వున్నతీకరించడానికి అవసరమైన శిల్పాన్ని సమకూర్చుకోవాలి. అది రచయిత దృక్పథాన్ని ఆవిష్కరించడానికి దోహదం చెయ్యాలే గానీ ఆటంకంగా పరిణమించ కూడదు. కథకి ఆత్మ దృక్పథమే. అది యే మేరకు  పాఠకులకి చేరింది అన్నదాన్ని బట్టీ కథ మంచి చెడ్డలని నిర్ధారించాలి.

థూ… కథలో కథ చెప్పిన రెండు పాత్రలు – బసివిరెడ్డి నాయుడు , జోసఫ్  భౌతికంగానే కాదు  గ్రామంలో సామాజికంగా ఆర్థికంగా సాంస్కృతికంగా కూడా   సంఘర్షించుకొనేపాత్రలు. ఒక సామాజిక భీభాత్సానికి భిన్న దృక్పథాలకు ప్రాతినిధ్యం వహించే ప్రతిద్వంద్వి పాత్రలు. రెండు వైపుల అటు చివర యిటు చివర వైరి శిబిరాల్లో  నిలబడ్డ భిన్న పాత్రలు. వాటి గొంతు వేరు , భాష వేరు , జీవితానుభవాలు వేరు. వాటి సారం వేరు. వీటి మాధ్యమంగా కథ చెప్పదల్చుకొన్నప్పుడు సాంప్రదాయిక రచనా పద్ధతులననుసరించి  రచయిత యేదో ఒక వైపు వుండాలి ; ఒక నిర్దిష్ట కంఠ స్వరాన్ని  యెన్నుకోవాలి. కానీ ఈ కథలో రచయిత పాటించిన టెక్నిక్ ఇద్దరి ద్వారా కూడా తను చెప్పదల్చుకొన్న భావజాలాన్ని ప్రకటించడం. అదే విమర్శకి కారణమైంది. బసివిరెడ్డి నాయుడి సంభాషణలకి వ్యంగ్యాన్ని ఆశ్రయించడం  నప్పలేదనీ  , పాత్రౌచిత్యం దెబ్బతిందనీ  విమర్శకులు భావించారు.

అయితే యీ విమర్శలన్నిటికీ సమాధానమా అన్నట్టున్న రచయిత చెప్పిన మాటలు గమనార్హాలు :

‘బాణం గుండెలో దిగితే బాధలా ఉంటుంది. అదే బాణం గుండెలో దింపినవాడికి వినోదంలా ఉంటుంది. వస్తువు అదే, కానీ అది ఒకడికి సంతోషాన్ని, మరొకడికి చావుని ఇస్తోంది. వ్యవస్థ అయినా సంఘటన అయినా బలిసినవాడికి ఒకలా , బక్కోడికి మరోలా కనబడతాయి. వ్యవస్థలో ఏ ఒక్క సంఘటనా కారణం లేకుండా జరగదు. సామాన్యుడికి సత్యం తెలిస్తే వాడు వ్యవస్థని ఎలా సమ్మానిస్తాడో అదే … ఈ థూ…. ఇది కథ కాదు, వ్యవస్థ ఎక్స్ రే, సి.టి.స్కాన్ …’ (కథ 2014 , కథాసాహితి)

అవును కదా – ఎక్స్ రే, సి.టి.స్కాన్ పిల్మ్ లు కలర్ ఫొటోగ్రాఫ్ లంత అందంగా కనపడకపోతే టెక్నీషియన్ని తప్పుపట్టలేం.

నిజానికి సవర్ణులు మనసు లోపల అనుకొనే మాటల్నే రెడ్డినాయుడు బయటికి అన్నాడు. న్యాయాన్ని బలిమితో చెరబట్టినవాడు కోర్టు మెట్ల మీదే బసివిరెడ్డి నాయుడులా మాట్లాడగలడు. పాఠకులు ఆ మాటల వెనక వున్న అగ్రకుల అహంకారాన్నీ ఆధిపత్య స్వభావాన్నీ  రాజకీయ అధికారం ఇచ్చిన పొగరుమోతుతనాన్నీ చట్టాల్ని గుప్పిట్లో పెట్టుకోగలిగిన నిర్లక్ష్యాన్నీ  న్యాయవ్యవస్థ మొత్తం తమ కనుసన్నల్లోనే నడుస్తుందన్న  ధీమానీ స్పష్టంగా చూడగలరు. ఒకటి రెండు చోట్ల అవి అతిశయించిన దాఖలాలు యెత్తిచూపగలమేమో గానీ రెడ్డినాయుడి మాటలు అసహజాలు కావు ; ప్రస్తావితమైన అంశాలు అసత్యాలైతే అసలు కానే కావు.

ఇటీవల పాటియాలా కోర్టు ఆవరణలోనే కన్హయ్య మీద లాయర్లు దాడి చేయడం  , మళ్ళీ మళ్ళీ చేస్తామని ప్రకటించడం , అందుకు సన్మానాలు చేయించుకోవడం , జైలుకెళ్ళి అక్కడకూడా అతన్ని కొడతామనీ అంతుచూస్తామనీ బహిరంగంగా మీడియా ముందు హెచ్చరించడం , కన్హయ్య నాలుక కోసినవాడికి లక్షల రూపాయల బహుమతి ఇస్తామని ఫత్వాలు జారీ చేయడం యివన్నీ చూసినపుడు బసివిరెడ్డి నాయుడు మాటల్లో అహంకారం గానీ వ్యంగ్యంగానీ కృత్రిమంగానో అనుచితంగానో అనిపించవు. తన ఫ్యూడల్ ఆలోచనలకి ఆచరణకీ ప్రజాస్వామ్యం ముసుగు వేసుకోవాల్సిన అవసరం సందర్భం అతనికి కనిపించలేదు. సమాజంలో రెడ్డినాయుళ్ళు బోరవిరుచుకొని తిరుగుతూ సాహిత్యంలోకి జబర్దస్తీగా తోసుకురావడంలో వైపరీత్యం యేమీ లేదు.

అందుకే  వర్ణ ధర్మ పరిరక్షణ అవసరం గురించి రామరాజ్య స్థాపన గురించి అందుకు పాలక వర్గాలు పడుతున్న కష్టాల గురించి స్వాతంత్ర్యం తర్వాత కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ రాజకీయాధికార బాధ్యతలతో ప్రజా పాలన భారంతో పై కులాల ప్రభువులు చేస్తున్న త్యాగాల గురించి తాము దయతో జాలితో అమలు జేస్తున్న యస్సీ యస్టీ రిజర్వేషన్ల గురించి వోటేసి తమకు అధికారం కట్టబెట్టినందుకు ఔదార్యంతో తాము ప్రవేశపెట్టిన  మాల మాదిగల సంక్షేమ పథకాల గురించి    రెడ్డి నాయుడు తన దృష్టికోణం నుంచి చాలా విస్తృతంగానే యేకరువు పెట్టాడు. కథలో యివన్నీ యిమడతాయో లేదోనన్న ప్రశ్నని  కాసేపు పక్కనబెడితే బసివిరెడ్డినాయుడి ముఖత: వెలువడ్డ మాటల్ని  పదే పదే చదవగా అతడి portrait ని చిత్రించడం రచయిత వుద్దేశం కాదనీ –  అగ్రకుల పెత్తందారీ తనానినికి archetypical caricature గా అతణ్ణి బ్లాక్ అండ్ వైట్ లో గీయడమేననీ నాకు బోధపడింది. ఆ గీతల్ని పతంజలి వ్యంగ్యచిత్రాల్తో పోల్చడం సాహసమే గానీ , రాజు గారి బామ్మర్ది అయిన కారణంగా న్యాయస్థానంలో న్యాయాన్ని తిమ్మిని బమ్మి చేయడానికి పూనుకొన్న శూద్రకుడి శకారుడితో కొంతవరకు పోల్చవచ్చు.  అందువల్ల రెడ్డినాయుడి మాటల్లో ఆధునిక మనువాదం వికృతంగా వినిపించడం అసంగతమేం కాదు. శిల్పానికొచ్చిన లోటేం లేదు. ఆధునిక కథా నిర్మాణ సూత్రాలూ కొలతలూ పక్కనబెట్టి సంప్రదాయ దేశీయ కథా రీతుల వెలుగులో చూస్తే రచయితగా సునీల్ కుమార్ నడిచిన దారి తెల్లమౌతుంది.

చిందు కళాకారులు ప్రదర్శించే జాంబ పురాణం దాదాపు యీ టెక్నిక్ లోనే నడుస్తుంది. చిందు జాంబ పురాణం సంవాద రూపంలో వుంటుంది. రెండే పాత్రలు – వొకరు  బ్రాహ్మణుడు మరొకరు మాదిగ ఆదిజాంబవుడు. అందులో బ్రాహ్మణుడు వర్ణ దురహంకారానికీ  ఆది జాంబవుడు ఆత్మగౌరవానికీ ప్రతీకలు. అక్కడ కూడా బ్రాహ్మణుడు అచ్చు బసివిరెడ్డి నాయుడిలానే ప్రవర్తిస్తాడు. ఆది జాంబవుడు తార్కికంగా జవాబులు చెబుతాడు.  అయితే రెండు పాత్రలూ నటించేది చిందు మాదిగలే కాబట్టి బ్రాహ్మణుడి ఆలోచనల్లోకి సంభాషణల్లోకి అహంకార ప్రకటనల్లోకి ఆ కళాకారుడు తన జీవన నేపథ్యంతో సహా చొరబడతాడు. అప్పుడు అతని మాటల్లోకి వ్యంగ్యం హాస్యం అధిక్షేపం అసహనం అవహేళన  అన్నీ వచ్చి చేరతాయి. అవన్నీ ప్రదర్శన రక్తి కడటానికే దోహదం చేస్తాయి తప్ప ప్రేక్షకులకి యెబ్బెట్టుగా తోచవు. చిందు ప్రదర్శన జాంబవుడి విజయంతో అంతమైతే ‘థూ…’ కథ కుంటి జోసఫ్ నిరసనతో ముగుస్తుంది.

చిందు జాంబ పురాణంలో బ్రాహ్మణ జాంబవుల పాత్రలు రంగం మీదకి రావడానికి వొక ప్రవేశిక ( prologue ) వుంటుంది. దాన్ని సూత్రధారుడిలాంటి వారు నిర్వహిస్తారు. ‘థూ…’ కథ లో రచయిత పాత్ర కూడా రెడ్డి నాయున్ని , జోసఫ్ ని అలాగే ప్రవేశపెట్టి నిష్క్రమిస్తుంది. అయితే కథలో రచయిత – కథా రచయితా వొకరు కాదు. కథలో రచయిత వొక పాత్ర. అతడు కూడా  వొక వర్గానికి ప్రతినిధి. పేదల ఏడుపులూ పెడబొబ్బల కథలు అతనికి నచ్చవ్ , ప్రేమకతలు కావాలి. ఈ పాత్రని నెపం చేసుకొని సాహిత్యంలో పాతుకుపోయిన విలువల పైన నిలవ యీస్తటిక్స్ పైన కూడా సునీల్ కుమార్ వ్యంగ్యాన్ని గుప్పించాడు (కథలోని ఈ పొర కూడా కొందరికి వూపిరాడనివ్వలేదేమో!). తను ప్రతిపాదించే వస్తువు పట్లా వాడిన టెక్నిక్ పట్లా సాహిత్యకారుల ప్రతికూల స్పందనని అతను ముందుగానే వూహించినట్లున్నాడు.

తరతరాలుగా అనేక సామూహిక బృందాల గూడుకట్టుకొన్న దు:ఖానికీ ఆగ్రహానికీ అక్షరావిష్కరణ ‘థూ…’ . సంవత్సరాల తరబడి న్యాయం కోసం యెదురుచూసి భంగపడ్డ వారి క్రోధాక్రందన అది. ఏడుపు అందంగా లేదనో ఆలంకారికంగా లేదనో కళాత్మకంగా లేదనో యింకాస్త బాగా యేడవొచ్చుగదా అనో ఫిర్యాదు చేసేవాళ్ళకి యేదైనా అనుభవంలోకి వస్తేగానీ తత్త్వం బోధపడదు.

జోసఫ్ తాత మూతికి ముంత కట్టుకొని వుమ్మొస్తే నేల మీద వుయ్యకుండా ముంతలో వూసేవాడు. ముడ్డికి యేలాడే తాడూ దాని చివర తాటాకు – అతను నడిచించోట అది తుడిచేసేది. అంటరానివాడొత్తన్నాడు తొలగండని చేతిలో గంట వాయిస్తూ  బేపనవారికి హెచ్చరిక చేసేవాడు. జోసఫ్ కొడుకు తరానికి వచ్చేసరికి ఆ ‘మర్యాద’ నుంచీ బయటపడి ముడ్డి మీద మంచి గుడ్డ కట్టుకొని బడికెళ్ళి నాలుగక్షరాలు నేర్చుకొని మనిషిలా బతకాలని కోరుకోవడం  నేరమైంది. చావుకి కారణమైంది. దళితుల అటువంటి చావులు దేశంలో సగటున రోజుకి రెండు జరుగుతూ వుండగా అందుకు వ్యవస్థీకృతమైన మద్దతు ఆమోదం లభిస్తున్నప్పుడు ఆ సామాజిక విషాదాన్ని దురన్యాయాన్ని యిన్ సైడర్ గా వొక దళిత రచయిత మాత్రమే బలంగా ఆవిష్కరించగలడని చెప్పడానికి  ‘థూ …’ మంచి వుదాహరణ. సరైన సమయంలో అవసరమైన కథని యింత నిర్దిష్టంగా నిజాయితీగా  రాసినందుకు సునీల్ కుమార్ కి అభినందనలు.

తాజాకలం  : బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూనే పాలకులు ఆయన 125 సంవత్సరాల జయంతి వేడుకలు జరపడం గొప్ప ఐరనీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జాతీయ సమైక్యత గురించి అంబేద్కర్ ఆలోచనల గురించి  కరీంనగర్ బార్  అసోసియేషన్  ఏర్పాటుచేసిన సభలో చుండూరు కేసులో తీర్పు యిచ్చిన జడ్జి వుపన్యాసాన్ని కొందరు న్యాయవాదులు అడ్డుకొన్నారు(చూ. http://indiatoday.intoday.in/story/ex-hc-judge-faces-lawyers-protest-over-dalit-murder-verdict/1/593897.html). మర్నాడు అందుకు బాధ్యులైన నలుగురు  లాయర్లని బార్ అసోసియేషన్  సస్పెండ్ చేయడం జరిగింది. ఈ వార్తకీ ఈ కథకీ చుట్టరికం వుండడం వల్ల యిక్కడ నమోదు చేయడమైంది తప్ప యిప్పుడు మనం చేయవలసిన పని వొక్కటే అత్యున్నత న్యాయస్థానం తీర్పు కోసం యెదురుచూడటం లేదా కుంటి జోసఫ్ లోని తడిని ఫీలై అతని చేతికర్రగా మారడం.

*

ఆ తర్వాత మళ్ళీ…

 

 

చిత్రం: ప్రవీణ కొల్లి

పదాలు: సాంత్వన చీమలమర్రి

~

 

ఇదిగో అయిపోయాయి ఇరవై నాలుగు గంటలూ!

అతి కష్టం మీద నీకే సందేశమూ పంపకుండా గడిపినవి. ఊహించగలవా?

ఎన్ని సార్లు వేళ్ళకొనల్లో మాటలు అక్షరాల్లోకి పొంగిపోకుండా అక్కడే కూర్చుని ఏడ్చుకున్నాయో?

అసలు నువ్వెవరివోయ్ నన్ను మాట్లాడకుండా ఉండమంటానికి?

మాటల్లో Immediacy ఎక్కువైపోయిందని ఊర్లో అందరినీ అనొచ్చు. నన్ను కూడానా?

నేనెంత కోప్పడ్డా మాట్లాడకుండా ఉండననేగా నీ తెగింపు. పూర్తయ్యిందిగా నీ ప్రయోగం. ఉక్కిరి బిక్కిరి చేసే పూల పరిమళాల మధ్య తేడా తెలుసుకునేందుకు ఒక్కో సారి కాఫీ గింజలు వాసన చూడాలని చెప్తావా నాకు? ఇప్పుడు తెలుసుకోవాలనిపించాలిగా నాకసలు. కాలం పాడే ఈ తెలుపూ నలుపూ స్వరాల refrain యేమంత మారుతుందట? But for those capricious notes of love our entwined words strew upon it…

నిన్న వేడిగాలికి తూగుతూన్న మధ్యాహ్ననిశ్శబ్దం లోంచి ఎవరిదో సందేశం మోగింది. అదే piano glissando. గుండె కొంచెమాగింది. నువ్వేనేమో అని చూసా. రాక్షసుడా! అంత ప్రేముండీ ఇంత కఠినంగా ఎలా ఉంటావ్? సరేలే పో… నాకూ మళ్ళీ స్పృహ తెలుస్తుంది ఎప్పుడో ఒకప్పుడు. కాలంతో సంబంధం లేదు నాకు అని ప్రేమ అనుకున్నా హృదయం bitter-sweet గా లెక్కేస్తునే ఉంటుందిగా క్షణాల్నీ, గంటల్నీ, రోజుల్నీ…

అప్పుడు ఈ ప్రవాహంలో పాదాలు మాత్రమే మునిగేట్టు కూర్చుని శాంతంగా ఊపిరి పీల్చుకుంటూ చూడగలనేమో నిన్ను.

ఇదిగో ఈ సూర్యోదయంతో క్షణక్షణం మారుతూన్న లోకాన్ని చూస్తున్నట్టు.

ఈ ఆకాశంలో ఉన్నన్ని రంగులు మన ప్రేమకి.

ఇప్పటికి దాని రంగు ఈ కారబ్బంతిపూరేకుల ఎరుపు.

తర్వాత దిగంతాల్లోంచి నిర్మలంగా నవ్వే నీలం. ఆ తర్వాత మళ్ళీ…

ప్రకృతి – మనుషులు – అండమాన్లు!

 

Andaman Diary Front Page

 

-కొల్లూరి సోమశంకర్

~

వాక్యాల వెంట పాఠకులను పరుగులు తీయించే రాయడం ఫిక్షన్‌ని విజయవంతం చేస్తే, రచయిత చేసే యాత్రలలో పాఠకులను తన వెంటే తీసుకువెళ్ళి వాళ్ళు కూడా మానసికంగా ఆయా ప్రాంతాలలో తిరుగాడినట్లుగా వ్రాయడం – యాత్రారచనలు ఎక్కువమందిని ఆకట్టుకునేందుకు దోహదం చేస్తుంది. ఈ కోవలోకొచ్చే యాత్రా కథనం – దాసరి అమరేంద్ర గారి “అండమాన్ డైరీ”.

అమరేంద్ర గారికన్నా ముందు ఎంతో మంది అండమాన్ దీవులను చూసుంటారు, ఎంతో కొంత రాసుంటారు. భవిష్యత్తులో కూడా మరెందరో అక్కడికి వెడతారు, వాటి గురించి రాస్తారు కూడా. దర్శనీయ స్థలాలు మారవు… ఏం చూసాం, ఎలా చూసాం, ఎలా తిరిగాం అన్నవి వ్యక్తుల దృక్కోణాన్ని బట్టి మారుతాయి. అందువల్ల యాత్రాకథనాలు కూడా విభిన్నంగా ఉంటాయి. అండమాన్ యాత్రల గురించి గతంలో ఎక్కడైనా ఎప్పుడైనా చదివినా, ఈ పుస్తకం మళ్ళీ చదివిస్తుంది.

ఎవరైనా యాత్రలెందుకు చేస్తారు? ప్రదేశాలని, మనుషులనీ తెలుసుకోడానికి! తెలుసుకుని ఏం చేస్తారు? నేర్చుకుంటారు. కొంతమందికి కేవలం సందర్శనా స్థలాలను దర్శించితేనే తృప్తి కలుగుతుంది. మరికొందరికి ఆయా ప్రాంతాలలోని స్థానికుల జీవితాలను తెలుసుకోడంలో ఆసక్తి ఉంటుంది. తెలుసుకోడం – నేర్చుకోవడం – జీవితాన్ని మెరుగుపరిచే అంశాలు! జాగ్రత్తగా వింటే ప్రకృతి మౌనంగానే ఎంతో చెబుతుంది; ఆసక్తిగా వింటే మనుషులు తమ జీవితాల్ని వివరిస్తారు. వాళ్ళకుండి మనకి లేనివేవిటో లేదా మనకు ఉండీ వాళ్ళకి లేనివేవిటో అర్థమవుతుంది. పై పై మెరుగుల కోసం జీవితాన్ని సంక్లిష్టం చేసుకునే బదులు… జీవితాన్ని సరళంగా ఉంచుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అర్థమవుతుంది.

ఈ పుస్తకంలో – సముద్రం ఉంది, దీవులున్నాయి, కోరల్స్ ఉన్నాయి, అందమైన ప్రకృతి ఉంది. వీటన్నిటిని మించి మంచి మనుషులు ఉన్నారు. మెయిన్‌లాండర్స్‌ జీవన విధానాలకూ ఐలాండర్ల బతుకుతీరుకి ఉండే వ్యత్యాసంపై స్పష్టమైన అవగాహన ఉన్న మనుషులు వీళ్ళు. స్థానికులుంటారు; దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఉంటారు.

ఇక ప్రకృతి విషయానికొస్తే, పుస్తకం ఉపశీర్షికలోనే చెప్పేసారు రచయిత – పచ్చల ద్వీపాలూ.. పగడాల సంద్రాలూ.. అని. రాస్ ద్వీపం గురించి,  సీతానగర్ బీచి రచయిత చేసిన వర్ణన – పాఠకుల మనస్సుల్లో కూడా అండమాన్స్ వెళ్ళిరావాలనే కోరికని నాటుతుంది. ఎలిఫెంట్ బీచ్‌లో స్నోర్‌కెలింగ్ చేసిన సందర్భంగా సముద్రం లోపల విహరించడం ఎలా ఉంటుందో చెబుతారు రచయిత. మనం కూడా స్నోర్‌కెలింగ్‌లో పాల్గొన్నట్లుగా అనిపిస్తుంది చదువుతూంటే. నీల్ ద్వీపం గురించి, బారాటాంగ్‌లోని మాన్‌గ్రోవ్‌ కెనోపీ వాక్‌ గురించి చదువుతుంటే ఉన్నపళాన అక్కడ వాలిపోతే బాగుంటుందని అనిపిస్తుంది. మానసిక విహారం చేసి, అక్కడి అందాల్ని ఆస్వాదిస్తాం.

ఈ పుస్తకం మరో విశేషం… సంతృప్తికరమైన జీవితాన్ని గడిపే వ్యక్తులను పరిచయం చేయడం.. వీళ్ళ గురించి చదివినప్పుడు మనం అబ్బురపడతాం. వారి ఆలోచనా విధానానికీ, మానసిక పరిపక్వతకీ జోహార్లంటాం. కాస్తో కూస్తో వారి నుంచి నేర్చుకుంటాం.

తనకంటూ ఒక ఉనికి లేకపోవడమే మంచిదని భావించే ఓ గెస్ట్‌హౌస్ యజమానురాలు తన ఇంటినీ, జీవితాన్ని తీర్చిదిద్దుకున్న వైనం పాఠకులకి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. వీళ్ళే నావాళ్ళు అనుకోకుండా ఎవరైనా నా మనుషులే అనుకునే ఆవిడ పట్ల గౌరవభావం కలుగుతుంది.

తాగుడికి బానిసై భర్త చనిపోతే, నలుగురు పిల్లలతో జీవనం సాగిస్తూ చిన్నపాటి హోటల్ నడుపుతూ ఉన్నంతలో గొప్పగా బ్రతుకుతున్న ఓ మహిళది స్ఫూర్తిదాయక గాథ. ప్రపంచం మీద భరోసా ఉన్న వ్యక్తి. బతుకు భయం లేని మనిషావిడ..

లక్ష్మణపూర్ అనే ఊరిలో రెండో బీచ్‌కి సమీపంలో ఓ కొబ్బరిబోండాల దుకాణం నడుపుతున్న పెద్దావిడది బంగ్లాదేశ్ మూలాలున్న కుటుంబం. భారత ప్రభుత్వం పునరావాసంపై వీళ్ళని ఇక్కడకి తరలించింది. ఈవిడ కొడుకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మెడిసిన్‌ పీజీ చేస్తున్నాడు. కూతురు బెంగుళూరులో ఐ.టి. ఉద్యోగం.. ‘ఇంకా ఈ కొట్టెందుకూ. మూసెయ్యి’ అంటారట పిల్లలు. ఆవిడేమో ‘ఇది నాకు అలవాటయిన జీవన రీతి. ఎలా వదిలిపెట్టాలీ! అసలు ఎందుకు వదిలిపెట్టాలీ’ అని బదులిస్తారు. ఎంత మానసిక దృఢత్వం కావాలి ఈ నిర్ణయం తీసుకోడానికి?

కాలాపత్థర్ అనే చోట బంగ్లాదేశీ మూలాలున్న మొండల్ అనే వ్యక్తితో మాటలు కలిపిన రచయిత అతని కుటుంబపు జీవన సరళి, ఆర్థిక వనరులు, స్నేహితులు, బంధువులు… గురించి ఎంతో తెలుసుకుంటారు.

కర్తవ్యపాలనని మించిన ఆర్తి కనబరుస్తాడో డ్రైవర్. అండమాన్ దీవుల జాతీయ పక్షులను యాత్రికులకు చూపిస్తూ వాటి సంఖ్య తగ్గిపోతోందని బాధ పడతాడు. ఇదే డ్రైవర్ తన వాహనంలో వచ్చిన యాత్రికులకిచ్చే బ్రేక్‌ఫాస్ట్ పాడయిపోయిందని తెలుసుకున్నాక స్పందించిన తీరు అతని నిబద్ధతని చాటుతుంది.

కొత్త జవసత్వాలతో నిండిన గ్రామీణ భారతానికి అసలు సిసలు ప్రతీకగా కనిపించే ఓ కుర్రాడు – రచయితకి ఆతిథ్యం ఇస్తాడు. ప్రపంచమంటే పట్టలేని ఆసక్తి అతనికి. చదువుకోవాలన్న తపన… ముంబయి, ఢిల్లీ, కలకత్తా, చెన్నై లాంటి మహా నగరాలు చూడాలన్న అభిలాష అతని మాటల్లో వ్యక్తమవుతుంది. సంస్కారవంతమైన వ్యక్తిత్వం!

రచయితకి ఆతిథ్యం ఇచ్చిన నౌకాదళం అధికారి ప్రకాష్‌ గారిది మరో కథ. డెహ్రాడూన్ మిలటరీ కాలేజి, నేషనల్ డిఫెన్స్ అకాడెమీలలో చదివి – కావాలానే నేవీని ఎంచుకున్నారాయన. పోటీ విపరీతంగా ఉండే రక్షణ రంగంలో వడపోత ఎక్కువనీ, ఎన్నికైన మెరికలంతా పదవీకాలమంతా పోటీ పడుతూనే ఉంటారని; ఒక్కోసారి మంచి ప్రతిభావంతులైనా వెనుకబడిపోక తప్పదనీ, అది జీవనసూత్రమని చెబుతారాయన. భవిష్యత్తుపై భయమూ, బెంగ లేకుండా – వ్యవస్థని గౌరవించే వ్యక్తి ఆయన. భావి జీవితం గురించి ఉద్వేగం లేకుండా ఆయన చెప్పిన తీరు బావుంది.

ఇంకా ఎందరెందరో మనుషులు… అందమైన వాతావరణంలో జీవిస్తూ… బ్రతుకుని శోభాయమానం చేసుకుంటున్న తీరు మనకీ జీవితంపై కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. జీవన సరళిలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే జీవితం ఎంత బాగుంటుందో అర్థమవుతుంది.

అండమాన్ దీవుల గురించి, స్థానిక తెగల గురించి, సెల్యులర్ జైలు గురించి, పురాతన సామిల్ గురించి, మ్యూజియంల గురించి, ఇతర దర్శనీయ స్థలాల గురించి తగినంత వివరణ ఉందీ పుస్తకంలో.

ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ, కినిగెలోను లబిస్తుంది. 104 పేజీల ఈ పుస్తకం వెల రూ. 100/-.

InvitationAD1

 

యిదీ మొదలు …..

 

-నారాయణస్వామి వెంకట యోగి 

~

 

యెలా ఉంటమో,

యేమై పోతమో,  

ఊహించుకోని క్షణాలవి

యెక్కడికి వెళ్తమో

యెవరెక్కడుంటమో 

యేదీ  అస్పష్టంగానే
ఉన్న రోజులవి

పెనుగాలులమై వీచినమో,

జడివానలమై కురిసినమో,

నల్లమబ్బులమై విరిసినమో

కాలం కనికరించని క్షణాలెన్నిటినో

దోసిళ్ళలో పట్టుకుని 

యెదురీదినమో

 

ఇప్పుడంతా,  

భోరుమనే ఆనందమూ ,  

కేరింతల దుఃఖమూ

కలగలిసిన 
ఒక తలపోత.

యెందరిని పోగొట్టుకున్నం,

యెన్ని సార్లు కాటగలిసినం

యెన్ని కన్నీళ్ళు 

మూటగట్టుకున్నం

 

యెన్ని క్షణాలు
యెన్ని నిమిషాలు 

యెన్ని యేడాదులెన్ని యుగాలు

కనుపాపలమీద స్మృతులు 
పూల ముళ్లై,  

విరబూసిన అనుభవాలు 

కవిత్వాక్షరాలై,

చివరికి మనమిప్పుడు 

సముద్రపుటొడ్డున నత్తగుల్లలతో ఆడుకునే

చిన్న పిల్లలం.

 

కలిసి అనుకునే నడిచినం

కలిసిన ప్రతిసారీ
కొంగ్రొత్త  నడకలతో 

కూడబలుక్కునే ప్రయాణించినం.

నెత్తురోడుతూ  రాలిన పూల రెమ్మలను 

మృదువుగా స్పృశించి

చెంపల మీద యెండిన నీటిచారికలకు

హత్తుకున్నం.

కంకర రాళ్ళూ,  పల్లేర్లూ గుచ్చుకుని 

చిట్లిన పాదాలకు 

చిరునవ్వుల లేపనాలు పూసుకున్నం.

అలసిపోయిన ప్రతిసారీ

ఇదే మొదటాఖరి మెట్టు అనుకున్నం.

గమ్యం కనబడని ప్రతిసారీ

పుస్తకాల్లో దాచుకున్న 
బంతిపూల రిక్కల్ని 

తడిమి చూసుకున్నం.

చాలాదూరం వచ్చేసామా మనం?  

లేదూ నీకు,  నాకూ,  మనకూ 

ఇదేనా మొదటి అడుగు?

ఇప్పటికీఇన్నేళ్లకీ 

మనం కలిసే నడుస్తున్నాం కద

ఇదీ,  నిజమైన ప్రారంభం.

రా,
మరో సారి
సరికొత్తగా మొదలు పెడదమా

మన అలుపులేని 

ప్రాచీన ప్రయాణం

 

(సుధాకిరణ్ కి ఆత్మీయంగా)

ప్రవక్త చెప్పుకున్న కథ!

 

-శ్రీరాం కన్నన్

~

ఓ టీనేజీ కుర్రాడు పారీస్ జైల్లోకి పంపబడి అక్కడ ఒక మాఫియా డాన్ లా ఎలా ఎదిగాడో చూపిన సినిమా. గాడ్ ఫాథర్ సినిమా చాయలు కనబడకపోయినా డ్రగ్ రాకెటింగ్, గాంగ్ వార్స్, యూరప్ లో తగాదా పడే అనేక ముఠాలు మళ్ళీ వాటికి సంబంధించిన తెగలూ వాటి ఆనుపానులు, చరిత్ర, వ్యవస్థాగతంగా పేరుకుపోయిన నేరాలు వాటిని పెంచి పోషించే రాజకీయాలు ఇవన్నీ చాలా తక్కువ నిడివిలో చూపిన సినిమా. రాటెన్ టొమేటోస్ 97% ఫ్రెష్నెస్ రేటింగూ, లెక్కలేనన్ని అవార్డులూ సొంతం చేసుకున్న సినిమా. చాలా సాధారణంగా కనిపించే తాహర్ రహీం ఈ సినిమా ఆద్యంతం మెస్మరైజ్ చేయడం విశేషం. ఇలాటి జానర్ లు ఇష్టపడే వారు తప్పనిసరిగా చూడాల్సిన సినిమా. ఆద్యంతం ఫ్రెంచ్ లో నడిచిన ఈ సినిమా సబ్ టైటిల్స్ లేకుంటే చూడడం కష్టం.  

“ ‘Don’t judge the book by its cover  ‘ అని ఇంగ్లీషులో సామెత. నా ఫోటో చూసి నేనేదో హుమానిటీస్ పరీక్షలకు సీరియస్ గా ప్రిపేర్ అయిపోయి గోల్డ్ మెడల్ కొట్టేస్తున్నానని అనుకునేరు. మీరు నా గురించి ఏవేవో ఊహించుకునేలోగా నేనే నా కథ చెప్పేస్తా. కాస్త ఆగండి, అడిషనల్ షీట్లు అడిగా, ఆ ఇన్విజిలేటరేమో మల్టిపుల్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్లుండగా అడిషనల్ షీట్లడిగే వాణ్ణి మొదటిసారి నిన్నొక్కణ్ణే చూస్తున్నాఅనుకుంటూ నోరు తెరిచి అని ఏదో చెప్పబోయేంతలో ఆయనకు క్లారిఫై చేశా, అది ఎగ్జాం కోసం కాదు, నా కథ సారంగలో వేయడానికి అని. ఆడికర్థం కాలా. ఫ్రెంచోడు కదా మరి, తెలుగులో చెప్తే అర్థం కాదు.  Je veux écrire ma biographie , je veux des livres blancs అని చెప్పా. తలూపుతూ కొన్ని నా మొహాన పారేసి పోయాడు. అవును మరి, జైలు ఖైదీలకు ఆత్మ కథ ఒకటి కూడా ఏడ్చిందా. ఆ ఇన్విజిలేటర్ గాడికి తెలీదు ఇండియాలో గొప్ప గొప్పోళ్ళంతా ఆత్మకథలూ, ఎకనామిక్సు పుస్తకాలూ,తత్వ దర్శనాలూ రాసింది జైల్లోనే అని. పోనీలే, ఆయన్ని వదిలేసి కథలోకొచ్చేస్తా.

నా వయసిప్పుడు ఇరవై ఆరేళ్ళు. పంతొమ్మిది ఉండగా జైల్లోకొచ్చా. చిన్న తప్పే, పోలీసోళ్ళమీద దాడి. లాయర్లూ, మందీ మార్బలమూ లేక ఏవో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాణ్ణి. ఆ పని వాళ్ళు చట్టసమ్మతం కాదన్నారు. నాకర్థం కాలే. నా పన్లో తలదూర్చి నన్ను పట్టుకోవాలనుకున్నారు. లొంగలేదు. కొట్టారు. తిరగబడ్డా. లోపలేశారు. కోర్టులో ఆరేళ్ళు పడింది. జైల్లోకి వచ్చిన మొదటిరోజు అన్ని సినిమాల్లో చూపించేటట్లే, నన్నూ బట్టలూడదీసి నిలువెల్లా సోదా చేసి జైలు బట్టలిచ్చి సెల్లోకి తోశారు. దాచుకున్న వంద యూరోల్ని కూడా లాక్కుని, బయటికెళ్ళేటప్పుడిస్తామన్నారు. ఒక్క సెంటూ లేదు చేతిలో.

నాకంతవరకూ తెలీదు, అక్కడ అధికారులతో సహా ఒక సమాంతర ప్రభుత్వాన్ని ఒక పెద్ద ఖైదీ నడిపిస్తున్నాడని. ఆయన పేరు Cesar Luciani. ఫ్రాన్సులో ఉన్న అతిపెద్ద ముఠాకు సంబంధించిన వ్యక్తి. వాళ్ళది అదేదో Corsican తెగ అంటారు. ఎక్కడో సార్డీనియానుంచి వలసొచ్చి, ఫ్రాన్స్లోలో పారిస్ తరువాత అతిపెద్ద పట్టణమైన Marseille లో రెండు లక్షల దాకా ఉన్న పెద్ద తెగ. వాళ్ళంతా చేసేది నాలాటివారి పనే. కాకపోతే, పెద్ద స్థాయిలో చేస్తూ పెద్ద మనుషులని కొనేస్తూ దొరక్కుండా తిరుగుతూ నేర ప్రపంచాన్ని ఏలుతూంటారు. ఈ Cesar Lucianiఎలా దొరికాడో ఏమో, జైల్లోకొచ్చి పడ్డాడు. ఊరికే ఏం కూర్చోకుండా work from prison చాలా సిన్సియర్ గా చేస్తున్న పెద్ద మనిషి. ఆయన చుట్టూ అనుక్షణం కాపలాగా ఉంటూ, జైల్లో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న  ఓ పది మంది Corsican Gang కూడా. వీళ్ళతో ఎవరూ పెట్టుకోరు, జైల్లో సెంట్రీలనుంచి పెద్ద డైరెక్టరు వరకూ కూడా. వీరికి వ్యతిరేకంగా ఓ పెద్ద అరబ్బు ముఠా కూడా నడుస్తోంది. కాకపోతే వారికి ఈ Corsican తెగకున్నంత బలం ఉండదు. అధికారులంతా వీరి మనుషులే కాబట్టి అరబ్బులు సమయం కోసం వేచి చూస్తూ ఉండడం తప్ప చేయగలిగేదేం ఉండదు.

poster art

ఇలా ఉండగా, ఓ రోజు నా ప్రాణానికో పెద్ద సంకటం వచ్చి పడింది. ఈ Corsican తెగకు బయట ఉన్న ఒక కేసులో సాక్ష్యంగా ఉన్న ఓ అరబ్బు జైల్లోకి వచ్చాడు. వాడి పేరు Reyeb. వీణ్ణి లేపేయడానికి Corsicans నన్ను వాడుకుందామనుకున్నారు . నాకు దిక్కూ మొక్కూ లేదా, ఎంత గింజుకున్నా నన్ను వదల్లేదు వాళ్ళు. జైలు అధికారికి చెప్పా, వీళ్ళొచ్చి నా సెల్లోనే నన్ను కుక్కని కొట్టినట్లు కొట్టి చివరి వార్నింగిచ్చి వెళ్ళిపోయారు. చంపు లేదా చావు. ఇవే నా ముందున్న పరిష్కారాలు. ఓ రోజు అనుకోకుండా Reyeb గాడికి ఏం బుద్ది పుట్టిందో ఏమో, నన్ను రూములోకి రమ్మంటూ ప్రలోభపెట్టాడు. ప్రతిఫలంగా గంజాయి కొద్దిగా ఇస్తానని కూడా ఆశ పెట్టాడు. ఆశ్చర్యపోతున్నారా? ‘Prison life is not a fairy tale’ అని Morgan Freeman అనలేదా? ఇవన్నీ మామూలే. నేను వప్పుకోలేదు. అది పసిగట్టే ఆ Corsican gang నన్ను ఉచ్చులోకి దింపాలని ఆలోచించింది. ఆడి దరిద్రం కొద్దీ Reyab గాడు  నేనూ ఒకే బారక్ లో ఉండడం కూడా అందుకు సహకరించింది వాళ్ళకి.

చాలా మామూలుగా ఎలా చంపాలో నేర్పారు. నాకు అనుభవం లేదుగా మరి. ఏమీ లేదు. బ్లేడ్ ను నోట్లో దాచుకుని, వాడికి సహకరిస్తున్నట్లు కనిపిస్తూ ఉన్నఫళాన వాడి మెడ కుడి నరాన్ని తెగ్గోయాలి. కష్టమే. నోట్లోంచి రక్తం ఓడుతూంటే, కష్టపడి నేర్చుకునేసా. Reyab గాడికీ బాత్రూములో చెప్పా. నేను రెడీ అని. ఆడు ఎగిరి గంతేసి రూం లోకి ఎప్పుడు రావాలో చెప్పాడు. వెళ్ళా. కాఫీ ఇచ్చాడు. వాడు తీరిగ్గా ఎక్కడ్నుంచి మొదలు పెట్టాలో చెప్తూంటే అటు తిరిగి ఉన్న నేను ఇక ఓపిక పట్టలేక వాడి రెక్కలు వెనక్కి కట్టి బలంగా మెడను అదిమేసి బ్లేడుతో రెండూ గాట్లేశా. రూమంతా రక్తం రక్తం. బ్లేడును కడిగేసి బాగా తుడిచేసి వాడిచేతిలోనే పెట్టేశా. బయటికొచ్చి బనీను కడిగి కిటికీలోంచి చూస్తే అరబ్బుల బారక్ లోంచి  ఒకటే అరుపులు. అర్థమయ్యింది Reyeb గాడు అల్లాను చేరుకున్నాడని.

ఆ తర్వాత శరవేగంగా నా పరిస్థితి మారిపోయింది. Cesar Luciani నాకు బట్టలూ, సిగరెట్ పాకెట్లూ పంపాడు. ఆయనున్న బారక్ లోకి నన్ను మార్పించుకుని నా చేత ఆయన వ్యక్తిగత పనులు చేసి పెట్టే మనిషిని చేసుకున్నాడు. నాకు తెలిసిందేమో అరబ్బు ఒక్కటే. వాళ్ళు మాట్లాడే కోర్సికన్ నాకు తెలీదు. కొద్ది కొద్దిగా వాళ్ళకు తెలీకుండా నేర్చుకోవడం మొదలెట్టా. చంపేస్తారు మరి, తెలిస్తే. ఇలా ఉండగా Ryad అని ఒక అరబ్బు జైల్లో కలిశాడు. నాకు చదవడమూ రాయడమూ కొద్ది కొద్దిగా జైల్లో ఉన్న స్కూల్లో నేర్పుతూ నాకు బాగా దగ్గరయ్యాడు. నాకు మూడేళ్ళ సర్వీసు అయిపోయిందని తెలిసి నేను అప్పుడప్పుడు  పెరోల్ మీద ఒక్కరోజు మాత్రం బయటకు వెళ్ళిరావడానికి ఉన్న అవకాశాన్ని వాడుకోవాలని చూశాడు Cesar.  కానీ నేను ఇంకా తెలివిగా బయట ఆయన పనులు చేస్తూనే జైల్లో గంజాయి అమ్మడానికి నా స్వంత వ్యాపారమూ మొదలెట్టా.  కాన్సర్ ఉన్న కారణం మీద జైల్లోంచి బయటికి వెళ్ళిపోయిన Ryad సహాయంతో నా వ్యాపారం పెంచడం చేస్తూ వస్తున్న ఒక రోజు, ఓ ఈజిప్షియన్ అరబ్ గాంగ్ మా మనుషుల మీద దాడి చేసింది.  జైల్లో ఉన్న నేను ఆ గాంగ్ మనిషొకడు జైల్లోనే ఉన్నాడని తెలుసుకుని, వాడి అడ్రసు పట్టుకుని వాళ్ళ ఫేమిలో మొత్తాన్ని Ryad తో కిడ్నాప్ చేయించా. ఈజిప్టు గాంగుకీ మెసేజీ పెట్టా. దోచుకున్న సరుకంతా విడిచి పెట్టమని. వాళ్ళూ బెదిరిపోయి చెప్పినట్లు చచ్చినట్లు చేశారు.

 

” నేనంటే బొత్తిగా భయం లేకపోయింది నాయాళ్ళకి. లేకపోతే నా వ్యాపారం మీదే పడతారా? ఆ? ”

Luciani మనుషులందర్నీ ఫ్రాన్సులో ఇంకో మూలకు బదిలీ చేయడంతో వంటరి వాడైపోయి, జైల్లో అధికారం తగ్గి అతను నామమాత్రం గా మిగిలిపోతున్న సమయంలో నా వ్యాపారం మూడు కేజీల గంజాయిగా, ఆరు లక్షల యూరోలుగా వర్థిల్లుతోంది.ఓ రోజు  మామూలుగానే బయటకు వెళ్ళి Brahim Lattrache ను కలవాలన్నాడు. వాడెక్కడో  Marseille లో ఉంటాడని చెప్తే, ఒక్క రోజులో వెళ్ళి రావడం కుదరన్నాను. ఆయన తలూపి వెళ్తావులే, దానిగురించి ఆలోచించకు అని వదిలాడు. విషయమేమంటే, ఆ Brahim గాడు, Luciani తో గొడవలున్న ఇంకో ఇటాలియన్ గాంగ్ కి  మధ్య డీల్  మేకర్ అన్నమాట. పరమ కిరాతకుడు. ఈజిప్షియన్ అరబ్బు.

Luciani  చెప్పినట్లే, వెళ్ళా. కాకపోతే, ఈసారి ఫ్లైట్లో. ఎయిర్ పోర్టు దగ్గర నన్ను పికప్ చేసుకుని తీసుకెళ్తుంటే, వెనుక మోటారు బైకు మీద ఒక ఎస్కార్టు. కొంత దూరం పోయాక బండి ఆగింది. లోపలికొచ్చి కూర్చున్నాడు Brahim. నా మీద అనుమానం వచ్చి మొదలు పెట్టాడు నన్ను ఇంటరాగేషన్ చెయ్యడం. గన్ మొహం మీద పెట్టి, నా సంగతంతా రాబట్టాడు. భయం లేదు కానీ, ఇలా కుక్కలా చావకూడదన్నదే నా ఫిలాసఫీ. ధైర్యంగా చెప్పా, మొదట్లో  తన  మనిషైన Reyeb ను చంపిందీ నేనేనని నిబ్బరంగా చెప్పా. వాడు వెనక్కి తగ్గాడు. ఇంతలో నడుస్తున్న కారు ఓ దుప్పుల మందని ఢీ కొడుతూందంటూ ‘ ట్రాన్స్’ లో అరిచా. అలాగే అయ్యింది. కారు కుదుపులో నా మీద పెట్టిన గన్ను గుచ్చుకుని నా మొహమంతా రక్తం. నేనేమైనా భవిష్యత్తు చెప్పే Prophet నా? నాకు తెలీదు. కానీ Brahim గాడు నన్ను అదోలా చూస్తూ వాడి స్థావరానికి తీసుకెళ్ళాడు.

అక్కడ చెప్పా, నా వ్యాపారం సంగతి. ఈజిప్టు గాంగ్ నుంచి సమస్య ఉండదని హామీ ఇచ్చాడు. వాడెందుకు నాతో డీల్ కు వప్పుకున్నాడో మీకు ఇప్పుడు తెలీదు. చివర్లో చెప్తా. Luciani డీల్ గాలికొదిలేశాం ఇద్దరం. జైల్లో వెనక్కొచ్చేసరికి బాగా ఆలస్యం కావడంతో, శిక్ష కింద నన్ను పదిహేను రోజుల్ డార్క్ రూం లో పడేశారు. బయటికొచ్చా. తెలిసింది Ryad, నా ప్రాణ మిత్రుడు చనిపోయాడని.వాడికో భార్య, కూతురు. ఏం చేయాలో అర్థమయ్యింది.జైలు బయట ఎండలో నడుస్తూంటే Luciani  పిలిచాడు. నేను చూడనట్లుండిపోయా. వెనక ఒకరొకరుగా వస్తున్న అరబ్బులు నాతో షేక్ హాండివ్వడమూ, నాతో పరాచికాలు ఆడడమూ చూశాడు. ఆయనకి వళ్ళు మండి నా దగ్గరకు వచ్చి ఏదో అనబోతూంటే, పిడికిలి బిగించి పొత్తి కడుపుమీద ఒక్కటిచ్చా. కుప్పకూలిపోయాడు. నా మనుషులు అతన్ని తీసుకెళ్ళి ఓ మూల పడేశారు.

కొన్ని నెలలకు జైలు నుంచి విడుదలయ్యాను. నా వంద యూరోలూ చేతికొచ్చింది. బయటికొచ్చి ఘట్టిగా ఊపిరి పీల్చుకున్నా. జైలు కాంపౌండు బయట నేను పెళ్ళి చేసుకోబోతున్న అమ్మాయి తన కూతురితో నిలబడి చేయి ఊపింది. ఇంకో మూలన నా మనుషులు వాహనాలతో నిలబడి నా కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు. వారికి సైగ చేసి నా కాబోయే భార్య దగ్గరికెళ్ళి కౌగిలించుకుని ఏడ్చా. తనూ ఏడుస్తూండగా మా మధ్యలో పాప బెంగపడిపోతూంటే,  అధైర్యపడొద్దని అనునయిస్తూ నడిపించుకుని బయటకొస్తూండగా నా వెనుకే నా బలగం మొత్తం నెమ్మదిగా, శబ్ధం చేయకుండా కాన్వాయ్ గా వస్తూ……

ఆగండాగండి. నా పేరు చెప్పనేలేదు కదూ. ….”

“El Djebena. నేనొక అరబ్బుని ! ”

*

తెలంగాణాపై రచనలకు ఆహ్వానం

telangana

What can a poem do?

Art: Rafi Haque

Art: Rafi Haque

 

-లాలస

~

 

ఏదో నకలు లాంటి రాత్రి తన నక్షతాలతో మెప్పించనూ లేదు

కళ్లెదుటే ఉంటుంది

కానీ జీవితం గింగిరాలు తిరుగుతుంటుంది

ఎవరి నీడనైనా వారి నుంచి కత్తిరించే సాధనమెక్కడ

నిర్వేదాల. నిర్విరామాల, అలసటల ప్రతిబింబాల నడుమ

పగటితో మాత్రం ఏం లాభం

 

లేదా? సరే

 

ఒక విరహ వేదన పలుకుదామని గొంతు సవరించుకుంటుంటే పాట గబుక్కున పెదాల నుంచి అమాంతం కిందకు జారిపోయింది. ఏమనుకోవాలి ప్రియా.. ఇవాళ రాత్రి ఇక్కడ వాన కురిస్తే. ఒక్క వాన చుక్క నా కణంగా మారదూ? మధ్నాహ్నం దాటింది. ఆకాశంలో నీరెండను దాటి మళ్ళీ మరో తోటలోకి వాన ఒకటి నెమ్మదిగా బయలు దేరింది పెత్తనానికి. ఉత్తినేగా..  ఈ సారైనా వేనవేల సంవత్సరాల జ్ఞాపకాల జడివానై చుట్టుముట్టేస్తుందా లేదా?.

జీవితానికి ప్రేమలేఖ రాసిన సంబరం చేయడానికి మహా కవులున్నారా.. ఉత్తరంతో పంపేందుకు  తోటలో సరిపోయినన్ని పూలూ ఉండవు. ఇంకా చెప్పాలంటే..

హృదయమొక పరాయి గడ్డ

అక్కడేమో

దీర్ఘరాత్రి పున్నమి చంద్రుడు రకరకాలుగా ఉంటాడు.

నగరానికి కనిపించని సిరివెన్నెల కనిపించని పర్వతాల మీద పడుతుందేమో.

ముభావ వెన్నెల చిగురు గాయం మీద

సొగసైన వెన్నెల పూల మీద

అధునాతన వెన్నెల ఆలోచనల మీద పడుతుందేమో

 

కానీ

తనకు తానే పరిచయం కాలేని పరాయి గడ్డ హృదయం మీద

పడేది వేదనల వెన్నలే

 

అపుడెలా ఉంటుందంటే

మధుర గళాలు మరణిస్తే నెమరువేసే జ్ఞాపకమైన సంగీతంలా.ఆ సంగీతం విగతజీవులైన గులాబీ పూవులే మృతుల కంఠమాలలుగా మారినట్లే ధ్వనిస్తుంది.  కళ తడారిపోయినపుడు ఆత్మలు మగత నిద్ర పోతాయి. పూలూ, వానలూ, కడలీ, గాలీ ఏమున్నా అవి పుడమి గీతాలను శ్వాసించలేవు.

 

మధ్యలో సగం చందమామలను వదిలేస్తూ తెల్లకాగితం మీద నడుస్తుంటుంది కవిత. దానిని నదిలోకి ఒలకబోసి గుర్తుంచుకుంటానని చెప్పాలి.

ps

లైఫ్ .. నీ టచ్ స్ర్కీన్ నా రింగ్ టోన్ హృదయం

Because i am writing you my dear  poem will you go to life to bring back LIFE?

*

‘రూఢి’ని తోసిరాజనే రౌడీ!

 

 

– చింతలపల్లి అనంతు
~

పదైదేళ్ళుగా ఊరించిన అద్దం మనముందు ప్రత్యక్షమైందని పసిపిల్లల్లా కేరింతలు కొట్టాలా?
తీరా అది గాలిఅద్దం అయి కూర్చున్నందుకు బెంబేలెత్తిపోవాలా?
అలవాటయిన బింబాలనే చూపే అద్దాల ముందు నిలబడే మన అలవాటుపైన పెనుకాటు వేసాడు కదా ముసనం సుబ్బయ్యనాయుడు aka ఎమ్మెస్ నాయ్డు.
*
All these poems appear on the surface as illogical and disjointed emotions camouflaged in worldly words. Known word here is a subterfuge to the unknown. And a familiar womb surrogates an unfamiliar embryo.
*
అందుకే ఇవన్నీ అర్థంపర్థం లేని పదాలు/మాటలు/వాక్యాలు. తలాతోకా లేని రాతలు. తలలూ, తోకలు తెగిన కవితలు. మనం అలవోకగా గుర్తుపట్టే వీలుకల్పించే ఆనవాళ్ళయిన ఆ తలా, ఆ తోకలను అదేపనిగా కత్తిరించిన కవన కవాతు ఇది.
మనకింకా మచ్చిక కాని వన్యమృగాల వంటి మాటలు, భావాలు, ఉద్వేగాలు, పదచిత్రాలు, పదబంధాలు, ప్రతీకలతో విన్యాసం సలిపే రింగ్ మాస్టర్ కేళి ఎమ్మెస్ నాయుడి గాలిఅద్దం.
చట్రమే తన అస్తిత్వమయిన అద్దానికి, చట్రంలో అస్సలు ఇమడని గాలిని జతగాడిని చేయడంలోనే వుంది కదా ఆ కేళి.
అందుకే ‘రూఢి’ ని వ్యతిరేకించే రౌడీయిజంలా అగుపిస్తుంది నాయుడి కవిత్వం.
*
ఈ కవితా సంకలనానికి ఒక అంచున అద్దం-కిటికి కవితా, చివరన గాలిఅద్దం అనే కవితా వుండటం కేవల యాధృచ్చికత కాదు.
కిటికి – అది సామర్ల కోటదయినా, సాన్ ఫ్రాన్సిస్కో దయినా బయటి నుంచి దాని సౌష్టవం సుమారుగా ఒక్కటే.
చిత్రికలో, సామాగ్రిలో, కొలతల్లో, పటాటోపంలో చిరు తేడాలుండొచ్చు మహా అయితే.
బయటినుంచి చూస్తే కిటికీ అనే ఊహ మూసరీతే.
చూడాల్సింది కిటికీ అటువైపునుంచి కదా?
అయినా మనం కిటికీలకేసే చూస్తూ వుంటాం.
ఇంతలో నాయుడు మాత్రం కిటికీల నుంచి బయటికి.
అలా ఆ కిటికీల్లోంచి బయటికి తొంగిచూడటమే బాల్యం.
అది కోల్పోతేనే కవిత్వం రాయలేం. చదవలేం. నచ్చలేం. ఒప్పలేం.
ఆ కిటికీల్లోంచి బయటికి చూసి భిన్న స్థలాల, భిన్న కాలాల, భిన్న ఉద్వేగాల ను ఆఘ్రాణించి అంతే విభిన్న స్థలాల, విభిన్న కాలాల, విభిన్న ఉద్వేగాలను అందదిపుచ్చుకునే నిరత నవ శిశువు నాయుడు.
వాటినే మాల కడతాడు; అవి తన దారంలో ఇమడకపోయినా ఓపికగా.
విరాటపర్వంలో తన అస్థిత్వం మరో అస్తిత్వాన్ని తొడుక్కున్నప్పుడు సైరంధ్రి కట్టే మాల లాంటి మాటలమాల సతతం గుదిగుచ్చుతూవుంటాడు వీడు.
*
నాయుడు వాడే లెన్స్…. వైడూ కాదు, టెలీ కాదు. అది సూపర్ మెగా మైక్రో లెన్స్ విత్ నైట్ విజన్.
ఈ కటకం వల్లే రక్తమాంసాలను, రాగద్వేషాలను సునాయసంగా దర్శించగలుగుతాడు నాయుడు. ఇలా దర్శించి diagnose చేస్తాడు, prescription రాస్తాడు.
మాటలకు స్వస్థత చేకూర్చే వెటర్నీరీ వెజ్జు కదా నాయుడు.
ఆ Diagnosis కీ, ఆ prescription కీ మధ్య ఎలాంటి సంబంధం వుండదు. వాటి మధ్య హేతుబద్ధంగా వుండవలసిన బొడ్డుపేగును కత్తిరించిన మంత్రసాని నాయుడే కదా మరి.
Independently profound అయిన వాడి diagnosis, వాడి prescription ల మధ్య connectivity ని వెతుక్కోవడం మన మూస మూర్ఖత్వం అని నవ్విపోతాడు తుంటరిగా, ధీమాగా.
అందుకే ఈ గాలిఅద్దం ముందు మనం నిలుచున్నప్పుడు మనకు మనదో, లేదా అసలేదైనా తెలిసిన (లౌకిక)బింబమో కనిపిస్తుందన్న భరోసా అస్సలు వుండదు. అసలు తెలియనిదేదోనయినా ఎపుడైనా ఎదురవుతుందన్నహామీ కూడా వుండదు. ఈ కఠిన నిరాకరణలకు మనం సంసిద్ధమైతేగానీ, మన లోపలి ఇదివరకటి తెలివిడిని రద్దుచేసుకునే అనహంకార చొరవ చేయగలిగితే తప్ప గాలిఅద్దం ముందు నిలిచి అందులోకి తొంగి చూసే సాహసం చేయలేం.
చందమామ కతల్లోలాగా దక్షిణం దిక్కుకు వెళ్ళొద్దని పేదరాసి పెద్దమ్మ ఎంత చెప్పినా అదే దిక్కుకు తన గుర్రం కళ్ళెం విదిలించే రాకుమారుడి దుస్సాహసం చేసే నవనవయవ్వనోత్సవ ఉబలాట, పసితనోత్సుకత వుంటే మాత్రం ప్రస్ఫుటంగా గాలిఅద్దం దర్శనమిస్తుంది.
అప్పుడు, అప్పుడు మాత్రమే ఆ అద్దంలోపలి మైదానాల్లో, లోయల్లో నాయుడు దృశ్యస్వరచించిన బింబోత్సవంలో కనీసం పాల్గొనగలం మనమూ.

*

naidu

అన్నమయ్య చెప్పిన వ్యక్తిత్వ వికాస పాఠం!

 

-ఫణీంద్ర

~

 

ఉగాది కొత్త ఆశలకీ, శుభకామనలకీ ప్రతీక. మనని మనం సంస్కరించుకోవడం కంటే శుభకరమైనది ఏముంటుంది? అందుకే మనలోని జడత్వాన్ని పారద్రోలి కార్యోన్ముఖుల్ని చేసే “మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు” అన్న అన్నమయ్య గీతంతో ఉగాదికి స్వాగతం పలుకుదాం.

మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు
సహజి వలె నుండి ఏమి సాధింపలేడు!

“ఈ లోకంలో మనిషన్నవాడు ఉద్యోగి కావాలి” అంటున్నాడు అన్నమయ్య. “ఉద్యోగి” అంటే నేటి అర్థంలో “ఉద్యోగం చేసేవాడు” అనుకుని “హమ్మయ్య! అన్నమయ్య ప్రాతిపదికకి సరితూగాను!” అని సంబరపడిపోకండి! అంత తేలిగ్గా మనని వదలడు అన్నమయ్య! ఇక్కడ “ఉద్యోగి” అంటే “ఉద్యమించే వాడు” (ప్రయత్నించే వాడు, పాటుపడే వాడు) అని అర్థం. నాకు చప్పున గుర్తొచ్చేది చిన్నప్పుడు సంస్కృత సుభాషితాల్లో నేర్చుకున్న శ్లోకం –

ఉద్యమేనహి సిద్ధ్యంతి కార్యాణి, న మనోరథైః
నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః

“ఉద్యమిస్తేనే పనులౌతాయి, కేవలం కోరిక ఉంటే సరిపోదు! సింహం నిద్రిస్తూ ఉంటే జింక నోట్లోకి వచ్చి వాలదు కదా!” ఆని భావం. ఎంత సింహమైనా వేటాడక తప్పదు, ఎంతటి ప్రతిభాసంపన్నుడైనా పరిశ్రమించక తప్పదు. శ్రీశ్రీ “తెలుగువీర లేవరా” పాటలో అన్నది కొంచెం మార్చుకుని “ప్రతి మనిషీ ఉద్యోగై, బద్ధకాన్ని తరిమికొట్టి సింహంలా గర్జించాలి” అని పాడుకుని ఉత్తేజం పొందాలి!

“సహజి లాగ ఉంటే ఏమీ సాధించలేడు” అని కూడా అంటున్నాడు అన్నమయ్య. “నేనింతేనండీ, నా నేచర్ అది” అంటూ ఉంటాం, సాధారణంగా ఓ సాకుగా! “మార్పు” అన్నది చాలా కష్టమైన విషయం ఎవరికైనా. “నేను మారను” అనే బదులు, “నా వల్ల కాదండీ! నేనిలాగే పుట్టాను” అనడం ఎంతైనా గౌరవప్రదంగా ఉంటుంది! ఈ ధోరణినే అన్నమయ్య తప్పుపడుతున్నాడు!

“నాకు సహజంగా పాడే టాలెంటు లేకపోతే నేను ఎంత ప్రయత్నించినా ఎస్పీబీని కాలేను కదా? నాకు సహజంగా ఉన్న ప్రతిభ పైనే దృష్టి పెట్టాలి కదా?” అనే ప్రశ్న పుట్టొచ్చు ఇక్కడ. ఇది నిజమే! “మీకున్న సహజమైన బలాలపైనే దృష్టి కేంద్రీకరించండి, బలహీనతలపై కాదు!” అని పదేపదే నొక్కి వక్కాణించిన మేనేజ్మెంట్ గురువు “పీటర్ డ్రకర్” కూడా, “మీ సహజమైన బలాలు సార్థకమవ్వాలంటే మీరు కష్టపడాలి, ఆ బలాలని ఉపయోగించుకోవాలి” అని చెప్పాడు! ఇదే అన్నమయ్య చెప్తున్నది కూడా!

వెదకి తలచుకుంటే విష్ణుడు కానవచ్చు
చెదరి మరచితే సృష్టి చీకటౌ!
పొదలి నడిచితేను భూమెల్లా మెట్టి రావచ్చు
నిదిరించితే కాలము నిమిషమై తోచు!

నిజానికి ఇదొక ఆధ్యాత్మిక గీతం, పల్లవిలో తెలియట్లేదు కానీ. ఆధ్యాత్మిక సాధకుడికి “తనని తాను గెలుచుకోవడం” లక్షమైతే, ప్రాపంచిక సాధకుడికి “ప్రపంచాన్ని గెలవడం లక్ష్యం”. కాబట్టి అన్నమయ్య ఆధ్యాత్మిక సాధుకుడికి చేసిన ఉపదేశం ప్రపంచంలో మన విజయానికీ దోహదపడుతుంది.

“వెతికి తలుచుకుంటే విష్ణువుని చూడొచ్చు, చెదరి మరిచేవా అంతా అంధకారమే!” అంటున్నాడు. “చెదరి పోవడం” (losing focus) అన్నది ఆధునిక జీవితంలో చాలా మంది ఎదుర్కొనే సమస్య. మన ఎటెన్షన్ కోసం సెల్ఫోన్లూ, సవాలక్ష విషయాలూ ప్రయత్నిస్తూనే ఉంటాయి, మనని గెలుస్తూనే ఉంటాయ్! ఒక లక్ష్యాన్ని మనసులో ప్రతిష్ఠించుకుని, అప్పుడప్పుడు కాస్త చలించినా చలనాన్ని మాత్రం ఆపకుండా, దారి తప్పకుండా, సాగే నేర్పరితనం మనదైతే కోరుకున్నది పొందడంలో కష్టమేముంది?

గొప్ప లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నా, ఎంతో సంకల్పం ఉన్నా, బండి ముందుకి కదలకపోవడం మనకి అనుభవమే. ఆలోచనని ఆచరణలోకి పెట్టడానికి ఎంతో శ్రమించాలి. బద్ధకం వదిలించుకోవాలి. కోరుకున్న గమ్యం ఎంత సుదూరంగా ఉన్నా కనీసం ఒక అడుగైనా వెయ్యగలగాలి. ఆ అడుగుని నడకగా, తర్వాత గమనంగా మలచుకోవాలి. అందుకే అన్నమయ్య. “పొదలి నడిస్తే మొత్తం భూమినే చుట్టిరావొచ్చు!” అంటున్నాడు (పొదలి అంటే పెరిగి, వర్ధిల్లి అని అర్థం).

“చాలా టైం ఉందిలే!” అనుకున్నవాడికి తొందరా తాపత్రయం ఉండవు. ఒక “అర్జెన్సీ” రావాలి అంటే కాలాన్ని ఆషామాషీగా తీసుకోవడం మానెయ్యాలి. మనం ఏమరపాటుగా ఉంటే తెలియకుండానే జీవితం మొత్తం చేజారిపోతుంది. “నిదురిస్తూ ఉంటే కాలం ఓ నిమిషంలా మాయమైపోతుంది” అన్న అన్నమయ్య మాటలు సమయం విలువని తెలియజెప్పే స్ఫూర్తిదాయకమైన ప్రబోధాలు!

వేడుకతో చదివితే వేదశాస్త్ర సంపన్నుడౌ
జాడతో నూరకుండితే జడుడౌను!
ఓడక తపసియైతే ఉన్నతోన్నతుడౌ
కూడక సోమరి ఐతే గుణహీనుడౌను!

లక్ష్యాన్ని చేరడానికి మనని మనం ప్రేరేపించుకున్నాక, అడుగు ముందుకేశాక, ఆ లక్ష్యసాధనలో మనకి కావలసింది జ్ఞానం (knowledge). దీంతో పాటూ నైపుణ్యం కూడా. ఇవి శ్రద్ధగా, కుతూహలంతో సమకూర్చుకోవలసినవి కానీ కేవలం మొక్కుబడిగా ప్రయత్నిస్తే దక్కేవి కావు. అన్నమయ్య చెప్తున్నది ఇదే! వేడుక అంటే ఇక్కడ “కుతూహలం” అని అర్థం, “జాడ” అంటే “కేవలం నామమాత్రంగా” అని. “శ్రద్ధగా చదివితే వేదశాస్త్ర పారంగతుడివి అవుతావు, నామమాత్రంగా చదివితే మూర్ఖుడిగా మిగులుతావు” అంటున్నాడు.

అలాగే లక్ష్యసాధనలో కావలసిన ఇంకో ముఖ్యమైన లక్షణం ఓటములకి తల్లడిల్లకుండా ఉండగలగడం! ఉన్నతమైన శిఖరాలను అధిరోహించేటప్పుడు ఎప్పుడూ పైపైకి ఎగబాకుతూనే ఉండడం కుదరక పోవచ్చు. అప్పుడప్పుడు కొంత కిందకి పడొచ్చు, కొన్ని సార్లు కిందకి దిగాల్సి రావొచ్చు కూడా. ఇలా కిందకి దిగినా మళ్ళీ పైకి చేర్చే మార్గాన్ని చూసుకుంటూ సాగడమే తెలివంటే. అన్నమయ్య “ఓటములకి తలవంచని తపసివైతే మహోన్నతుడివౌతావు” అంటున్నాడు. “తపస్సు” అనే మాటలో కష్టనష్టాలని తట్టుకునే స్థైర్యం, సడలని ఏకాగ్రత వంటి లక్షణాలు దాగి ఉన్నాయి. ఈ తపస్సు సాధ్యపడాలంటే మనలోని శక్తియుక్తులన్నీ “కూడబెట్టి” పరిశ్రమించాలి. సోమరులకి దక్కేది కాదిది. అందుకే “సోమరిగా ఉంటే గుణహీనుడివి అవుతావు” అంటున్నాడు!

మురహరు గొలిచితే మోక్షము సాధించవచ్చు
వెరవెరగక ఉండితే వీరిడియౌను!
శరణంటే శ్రీవేంకటేశ్వరుడు రక్షించును
పరగ సంశయించితే పాషండుడౌను!

ఎంత పరితపించినా, ఎంత పరిశ్రమించినా కొన్నిసార్లు “ఫలితాలు” మన చేతిలో ఉండవు. గాఢంగా కోరుకున్నది దక్కనప్పుడు తీవ్ర నిరాశకి గురవుతాము. ఓటమి మన అసమర్థతనీ, అల్పత్వాన్నీ గుర్తుచేస్తుంది. అందుకే అన్నమయ్య మనకో చిట్కా (వెరవు) చెప్తున్నాడు. “నీ వంతు కర్తవ్యం నిర్వర్తించు, మిగిలినది దైవనిర్ణయం! బరువంతా నువ్వే మొయ్యడం ఎందుకు, నీ బండలని ఆ ఏడుకొండల వాడికి అర్పించు” అంటున్నాడు. ఇదే కర్మసిద్ధాంతం. ఇదే మోక్షాన్ని సాధించే మార్గం కూడా. “మోక్షసాధనకి నీ ప్రయత్నమే సరిపోదు, ఆ మురహరుని కరుణ ఉండాలి. ఈ ఉపాయం తెలియకపోతే నువ్వు ఒట్టి అవివేకిగా (వీరిడిగా) మిగులుతావు” అన్న అన్నమయ్య మాట ప్రాపంచిక సాధకులకి కూడా శిరోధార్యం.

ఆఖరుగా ఆణిముత్యం లాంటి వాక్యంతో ముగిస్తాడు అన్నమయ్య. “పరగ” అంటే “ఒప్పుకోలుగా” (agreeably) అని అర్థం. మన ప్రశ్నలు, సంశయాలు అన్నీ నిజాయితీ నిండినవైతే సత్యాన్ని చూపించే వెలుగురేఖలౌతాయి. కానీ చాలా సార్లు మన సంశయాలు మనం ముందుగా ఏర్పరుకున్న అభిప్రాయాలకీ, మన అహంకారానికీ దర్పణాలు మాత్రమే! . “ఇది సాధ్యమేనా?” అన్న ప్రశ్న నిజానికి “ఇది అసాధ్యం!” అని చెప్పడం మాత్రమే, నిజాయితీతో శోధించుకున్నది కాదు. దీనినే “ఒప్పుకోలుగా సంశయించడం” (పరగ సంశయించడం) అన్నాడు అన్నమయ్య. అలా సంశయించే వాడు సత్యాన్ని తెలుసుకోలేడు కానీ ప్రయత్నించానన్న భ్రమలో తనని తానే మోసం చేసుకుంటూ ఉంటాడు. అలాంటివాడు ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకోలేని పాషండుడు (వేదాలు చెప్పిన సత్యాన్ని అంగీకరించని వాడు) అవుతాడు. తన అహంకారాన్నీ, అభిప్రాయాలనీ విడిచి సత్యాన్ని శరణు కోరిన నిజమైన సత్యశోధకుడైనవాడు, వేదాలని కాదన్నా సత్యాన్ని పొందుతాడు! గెలుపుని కోరుకున్న వాడు ముందు తన మది తలుపులని తెరవాలి, పాతని పారద్రోలి కొత్తదనాన్ని ఆహ్వానించాలి!

ఈ అద్భుతమైన గీతాన్ని శోభారాజు గారు చాలా చక్కగా స్వరపరిచి గానం చేశారు. అది యూట్యూబులో ఇక్కడ వినొచ్చు.

*

గమనమే గమ్యం

 

volgaదుర్గాబాయి ఎన్నికల్లో ఓడిపోయింది. రెండువందల కంటే తక్కువ ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి గెలిచాడు. శారద దుర్గాబాయికి ఉత్తరం రాసింది. కమ్యూనిస్టు అభ్యర్థులు ఎక్కువమంది గెలిచినందుకు ఆనందపడింది. రోజులు వేగంగా గడుస్తున్నాయి. పగలూ రాత్రీ తేడా లేకుండా ఊపిరాడని పనులతో శారద పరుగిడుతోంది. దుర్గాబాయి ఓటమి కలిగించిన నిరాశ మనసులోంచి పూర్తిగా పోకముందే దుర్గాబాయి చింతామణి దేశ్ ముఖ్ ల వివాహ వార్త వచ్చింది, అన్నపూర్ణ, స్వరాజ్యం ఆ ఆనందాన్ని మోసుకుంటూ బెజవాడ వచ్చారు. స్వరాజ్యం ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్.ఎస్.సి లో చేరటానికి  వెళ్తోంది. వెళ్ళేముందు శారద పెద్దమ్మతో నాలుగు రోజులు గడపాలని ప్రయాణమైతే ఒక్కరోజుకి నేనూ మీ పెద్దమ్మతో మాట్లాడుకోటానికి వస్తానంది అన్నపూర్ణ. “నువ్వొస్తే మీరిద్దరే మాట్లాడుకుంటారు. నేనొకదాన్నే వెళ్తానంది స్వరాజ్యం. ఆ విషయం మీద కాసేపు తగవు పడిన తల్లీ కూతుళ్లను అబ్బయ్య సమాధాన పరిచాడు. “అన్నపూర్ణ ఒక్క పూట మాత్రమే ఉండి వచ్చేస్తుంది, స్వరాజ్యం నాలుగు రోజులుంటుంది” అన్న తండ్రి మాటను గొణుక్కుంటూనైనా ఒప్పకోక తప్పలేదు స్వరాజ్యానికి,

“నాకంటే నీకు శారద పెద్దమ్మ ఎక్కువైంది” నిష్టూరమాడింది తల్లి, “కాదమ్మా నువ్వూ పెద్దమ్మా చిన్నప్పటి నుంచీ స్నేహితులు. నాకు మొన్న మొన్ననే గదా పెద్దమ్మ దగ్గర చనువు. ఆమె పూర్తిగా నాకే కావాలనిపిస్తుంది, అందరికంటే నన్నే ప్రేమించాలనిపిస్తుంది. నాకు పెద్దమ్మంటే ఉన్న ప్రేమ ఎవరికీ ఉండదు – ”

తన ఉద్వేగాన్ని అణుచుకోలేక అక్కడి నుంచీ వెళ్ళిపోయింది. అన్నపూర్ణ, అబ్బయ్య ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.

“ఏంటంత ఆవేశపడుతుంది” అన్నపూర్ణ ఆశ్చర్యపడింది.

“ఈ వయసులో పిల్లలకు కొందరిపట్ల విపరీతమైన ఆరాధన ఏర్పడుతుంది – అది మామూలే – మనకా వయసులో గాంధీ గారు ఆరాధ్యుడు కదూ – అలాగే -”

“ఇది కమ్యూనిస్టు అవదు గదా”

“ఆ భయం నాకూ ఉంది – ” నవ్వాడు అబ్బయ్య,

సాయంత్రానికి బెజవాడ చేరారు. ఆ రాత్రి మాత్రమే అన్నపూర్ణ ఉండి మర్నాడు ఉదయం వెళ్ళిపోతుంది.

రాత్రి భోజనాలయ్యాక అందరూ కూచుని కబుర్లాడుకునేటపుడు “దుర్గాబాయి గారు పెళ్ళీ చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది’

అంది అన్నపూర్ణ

“ఎందుకంత ఆనందం, పెళ్ళే జీవిత పరమార్థమా?” నవ్వింది శారద,

“పరమార్థమని కాదు. ఒక మంచి తోడు దొరికింది. చేసే పని మరింత బాగా చెయ్యటానికి మరింత బలం”,

“దుర్గకి ఎవరి బలమూ అరువుగా అకర్లేదు. తన బలం తనకు చాలు”.

“దుర్గ సంగతి పక్కన బెడదాం. ఆమె అసామాన్యురాలు. మిగిలిన వాళ్ళకు ఒకరికొక తోడు అక్కర్లేదా?

‘అది మనకు అలవాటైపోయింది అన్నపూర్ణా, ఒక పెళ్ళి – భార్యా భర్త. భర్త మంచివాడైతే ఫరవాలేదు. ఎందరు ఆడవాళ్ళకు వాళ్ళ భర్తలు బలమిస్తున్నారు చెప్పవోయ్, భార్యలలోని సర్వశక్తులూ లాగేసే వాళ్ళే ఎక్కువ. మనం కూడా పెళ్ళిళ్ళకు ఆనందపడటం, పిల్లలకు పెళ్ళీ తప్పనిసరిగా చెయ్యాలనుకోవటంతో ఆ ఆచారమునూ, మరొకటనూ బలపడుతుంది. దాన్ని బలపడనివ్వకూడదు. అది ఎంత బలహీనపడితే ఆడవాళ్ళకంత మంచిదోయ్”,

“చలం గారిలా మాట్లాడుతున్నావు”,

“ఆయన మూటలు నిజమని నాకనిపించినపుడు నా మాటలకు ఆయన మూటలకూ తేడా ఉండదుకదోయ్’,

స్వరాజ్యం ఎదుట ఆ మాటలు పొడిగించాలనిపించలేదు అన్నపూర్ణకు, కానీ శారద ఆపలేదు.

“స్త్రి పురుషుల మధ్య స్నేహం, ప్రేమ, సాంగత్యం, సెక్సు ఇవి ఆనందాన్నివ్వవని నేననటం లేదు. మనుషులకు సెక్సు అవసరమని తెలియని దాన్ని కాదు – కానీ పెళ్ళి తప్ప సెక్సుకి ఇంకోదారి లేకపోవటం, స్త్రీ పురుషుల స్నేహానికి వీలు లేకపోవటం ఎంత దుర్మార్గమోయ్, దానివల్ల చచ్చినట్లు పెళ్ళి చేసుకోవాలి. ఇక ఆ పెళ్ళీ ఇద్దర్నీ కుంగదీస్తుంది. ఇక ఆ పెళ్ళి నుంచి బైటపడే దారీ ఉండదు”.

‘హిందూకోడ్ బిల్లు ఒస్తోందిగా”

“బిల్లులతో చట్టాలతో పోయేంత బలహీనమైంది కాదోయ్ పెళ్ళి, కొండచిలవలా చుట్టుకుని బిగుసుకొని ఉంది.

“శుభమా అని దుర్గ పెళ్ళి గురించి మాట్లాడుతుంటే –”

“పెళ్ళి శుభం అనుకోవటంతోనే నా పేచీ – దుర్గ పెళ్ళితో కాదు. వాళ్ళిద్దరి

సంగతి గురించి కాదు – మొత్తం పెళ్ళీ అనే తప్పనిసరి చెరసాల గురించి చెబుతున్నాను”.

“ఆడవాళ్ళందరం అందులో బందీలంటావు”

olga title

“ఆడవాళ్ళనే కాదు – మగవాళ్ళు కూడా – మానవుల్ని అమానుషంగా చేస్తుందోయ్ పెళ్ళి

“మరీ దారుణంగా మాట్లాడకు శారదా”

“దారుణం నా మాటలు కాదు. పెళ్ళీ – అందులో పెత్తనం, అధికారం ఉందోయ్ – అది చాలా దారుణం”,

“దాన్నించి బైటపడేదెట్లా పెద్దమ్మా – బైటపడి ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రేమగా కలవటం ఎట్లా”

“ఎట్లా అంటే ఇట్లా అని చెప్పటానికి నా దగ్గర రెడీమేడ్ సమాధానం లేదమ్మా – ఇది దారుణం అని గుర్తించటం ఒక ముందడుగని నాకనిపిస్తుంది. తర్వాతి అడుగులు చాలా ఉన్నాయి – కులం, మతం, డబ్బు – వీటి ప్రభావాల నుంచి తప్పించుకుని ప్రేమించగలిగేందుకు చేసే పోరాటాలూ – ఇలా అడుగులు వేసుకుంటూ ఆ దారిలో నడుస్తూ వెళ్ళటమే – పెళ్ళి దారుణమని సన్యాసులవటం కాదు పరిష్కారం. ప్రేమ కోసం, ఉన్నతమైన స్త్రీ పురుష సంబంధాల కోసం అన్వేషించటంలోనే ఆనందాన్ని పొందటం నేర్చుకోవాలి”

శారద వంక ఆరాధనగా చూస్తున్న స్వరాజ్యాన్ని చూస్తుంటే అన్నపూర్ణకేదో ఆందోళన.

“నాకు నిద్రోస్తోంది పడుకుందాంరా ”అని లేచింది.

“నువ్వు పడుకోమ్మా నాకు నిద్రరాటంలా” స్వరాజ్యం లేవలేదు. చేసేది లేక అన్నపూర్ణ వెళ్ళింది. స్వరాజ్యం శారదకు మరింత దగ్గర చేరి తన సందేహాలన్నీ అడగటం మొదలుపెట్టింది. శారద చెబుతుంటే శ్రద్ధగా వింటూ –

ఆ రాత్రే కాదు మిగిలిన నాలుగు రోజులూ శారదను ఒక్క క్షణం ఒదలలేదు స్వరాజ్యం. ఆమెతో పాటు ఆస్పత్రికి వెళ్ళింది. రోగుల ఇళ్ళకు వెళ్ళింది. సరస్వతీ గోరాల దగ్గరకూ, మెల్లీ లక్ష్మణరావుల దగ్గరకూ వెళ్ళింది. అదంతా కొత్త ప్రపంచంలా ఉందా అమ్మాయికి.

“ఇన్నాళ్ళూ నేనిదంతా మిస్సయ్యాను పెద్దమ్మా. అమ్మా నాన్నా ఎంత చెప్పినా

బెజవాడ వచ్చేదాన్ని కాదు. ముందే వచ్చుంటే ఎంత బాగుండేది” అంటే శారద నవ్వింది,

“ముందే వస్తే ఇంత నచ్చేది కాదేమో. ప్రతి దానికీ ఒక టైముంటుంది. కోడిగుడ్డు పిల్లవటానికున్నట్టు”

“పెద్దమ్మా – నేను ఉత్తరాలు రాస్తే సమాధానం ఇస్తావా?” “ఎందుకివ్వను పిచ్చిపిల్లా – నేను మీ పెద్దమ్మను” అని స్వరాజ్యాన్ని దగ్గరకు తీసుకుంది.

స్వరాజ్యం విశాఖపట్నంలో హాస్టల్లో ఉన్నా శలవు రోజుల్లో తమ బంధువుల ఇళ్ళకు వెళ్ళి ఇష్టమైనవన్నీ వండించుకుని తినమని శారద వాళ్ళ అడ్రసులన్నీ ఇచ్చి వాళ్ళకు ఉత్తరాలు రాసింది.

: ; ; :

“మీ వాళ్ళు చూడు ఏం చేశారో. మూడేళ్ళు తిరగకుండా ఎన్నికలు తెచ్చిపెట్టారు. మొన్నటివరకూ సాయుధ విప్లవం ద్వారా నెహ్రూ ప్రభుత్వాన్ని పడగొడతామన్నారు ఇప్పుడు — ”

“ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా పడగొట్టారు. మంచిదే గదా – అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టటంలో తప్పేమీ లేదోయ్”,

“నిన్ను వాళ్ళు శత్రువులా చూస్తున్నారు. నువ్వు మాత్రం వాళ్ళను సమర్ధించటం మానవు”,

“వాళ్ళు చేసింది సరైనది కాదని వ్యతిరేకిస్తేనే కదా వాళ్ళు నేనూ అని మాట్లాడే అవకాశం వచ్చింది. ఎన్నికల రాజకీయాలలో వాళ్ళు చేసింది కరక్టేనోయ్”

అన్నపూర్ణకు మరి మాట్లాడేందుకేమీ లేకపోయింది, ఒంట్లో బాగోలేదని శారద దగ్గర పరీక్ష చేయించుకోటానికి వచ్చింది అన్నపూర్ణ పరీక్ష చేసి మందులిచ్చాక రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు మధ్య మధ్యలో గర్భిణీ స్త్రీలు పరీక్షల కోసం వస్తున్నారు.

శారద వాళ్ళను పరీక్షిస్తూ, జాగ్రత్తలు చెప్తూ అన్నపూర్ణతో మాట్లాడుతూ ఉంది.

ఆ సమయంలో తెల్లగా సన్నగా పొడవుగా ఉన్న ఓ యువతి వచ్చింది. పక్కనే కాస్త పొట్టిగా తెల్లగా ఉన్న కుర్రవాడు. వాళ్ళిద్దరినీ చూస్తూనే శారద ముఖం విప్పారింది.

“రావోయ్ – రా – విశేషమా – అన్నపూర్ణా, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? చలసాని శ్రీనివాసరావు చెల్లెలు. వీడు తమ్ముడు ప్రసాదు. హేమలత కదూ నీ పేరు”.

డాక్టర్ గారికి తామంతా గుర్తున్నందుకు ఆ అక్కాతమ్ముళ్ళు సంతోషపడ్డారు. ఔనండి. నాకిప్పుడు మూడోనెల, పరీక్ష చేయించుకుందామని వచ్చాను”.

“మీ పెళ్ళి గోరాగారు చేశారు కదూ – నే రాలేదులే – సరస్వతి చెప్పింది. మీ అన్నయ్య శ్రీనివాసరావంటే నాకెంతో అభిమానం. ఇప్పటికీ కళ్ళల్లో మెదుల్లున్నట్టే ఉంటాడు. అన్నపూర్ణా – మీ పార్టీనే పొట్టన బెట్టుకుంది. పదమ్మా పరీక్ష చేస్తాను” అంటూ పక్కకు తీసికెళ్ళి కర్టెను వేసి కబుర్లు చెబుతూ పరీక్ష చేసింది.

“శ్రీనివాసరావు ఒకరోజు మీ అందరి గురించీ చెప్పాడు. మీ నాన్నగారు బసవయ్యగారు బాగున్నారా? ఈ ప్రసాదుని చూస్తుంటే ముచ్చటేస్తోందోయ్. బాగా చదివించండి. శ్రీనివాసరావు గుర్తోస్తే మాత్రం బాధగా ఉంటుంది. గర్వంగా ఉంటుంది”,

పరీక్ష పూర్తి చేసి జాగ్రత్తలు చెప్పి మందులు తనే ఇచ్చి “క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకో. నీ పురుడు చులాగ్గా అవుతుంది” అని వాళ్ళను పంపింది గానీ శ్రీనివాసరావుని తల్చుకుంటూ కంటనీరు పెట్టింది.

అన్నపూర్ణ ఏదో చెప్పబోయేంతలో మరో గర్భిణీ స్త్రీ రావటం శారద ఆమెను పరీక్ష చేయటం – ఇలా మధ్యాహ్నం వరకూ గడిపి ఇద్దరూ భోజనానికి ఇంటికి వెళ్ళారు. ఇంటి దగ్గర మళ్ళీ రాజకీయ చర్చలు వేడి వేడిగా సాగాయి. చూస్తుండగానే ఎన్నికలు దగ్గరకొచ్చాయి, కమ్యూనిస్టుల విజయం మీద ఎవరికీ సందేహం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడుతుందని అందరూ నమ్మారు,

అందరి నమ్మకాలనూ ఎన్నికలు దెబ్బతీశాయి. కమ్యూనిస్టులకు అదివరకున్న బలం కూడా లేకుండాపోయింది.ఘోరంగా ఓడిపోయారు. కారణాలనేకం. అవి ఫలితాన్ని మార్చలేవు. శారద, మూర్తీ ఆశ్చర్యపడి ఏవేవో విశ్లేషణలు చేశారు. శారదకు ఇప్పడు పార్టీతో ఏ సంబంధమూ లేదు. నాయకులెవరూ ఆమెతో మాట్లాడరు. కోటేశ్వరమ్మ, రాజమ్మ వంటివాళ్ళు ఎప్పడైనా ఎకడైనా కనపడితే ప్రాణం లేచొచ్చినట్లు పలకరిస్తారు. అంతే – ఐనా కమ్యూనిస్టు పార్టీ ఓడిందంటే శారదకు గుండె కలుక్కుమంది. బాధపడుతూ కూర్చునే తీరిక లేకపోవటమే శారదను రక్షించింది. శారద ప్రాక్టీసు విపరీతంగా పెరిగింది. హాస్పిటల్కి వచ్చేవారిని చూసి ఊరుకోదు శారద. సాయంత్రం నాలుగు నుంచీ జట్కాబండిలో బీదవాళ్ళుండే పేటలకు

వెళ్తుంది. ఇంటింటికీ వెళ్ళి యోగక్షేమాలడిగి, ఆరోగ్య సూత్రాలు చెప్పి, అవసరమైన వాళ్ళకు తనవెంట తెచ్చిన మందులిచ్చి వస్తుంది. ఏడింటి నుంచీ మళ్ళీ హాస్పిటల్, పురుళ్ళకు ఒక సమయమంటూ ఉండదు – తిండికి, నిద్రకూ కూడా సమయం లేకుండా పనిచేసే రోజులు చాలానే ఉంటాయి. బెజవాడ ప్రజలకు శారద ప్రత్యక్ష దేవత అనే భావం కలిగిందంటే అందులో ఆశ్చర్యపడటానికేమీ లేదు. ఒకరోజు మధ్యాహ్నం పనంతా పూర్తి చేసుకుని ఇక భోజనానికి ఇంటికి వెళ్దామనుకుంటూ లేస్తుంటే గదిలోకి వచ్చిన ఉమాదేవిని చూసి ఆశ్చర్యపోయింది. ఆరేళ్ళక్రితం తనను ద్రోహిగా చూసిన ఉమాదేవి – ఎవరినీ తనతో మాట్లాడనివ్వకుండా చూసిన ఉమాదేవి,

“రావోయ్ రా – ఒంట్లో ఎలా ఉంది?” నిష్కల్మషంగా నవ్వింది శారద,

“బాగానే ఉంది డాక్టర్ గారు. మీతో పనుండి వచ్చాను” ఉమాదేవి కూడా ఏమీ జరగనట్లే మాట్లాడింది,

“చెప్పు ఏమిటి పని? ఏం కావాలి?

“ఉద్యోగం డాక్టర్ గారు”

“ఉద్యోగమా?

“ఔను డాక్టర్ గారు. ఉద్యోగం చేస్తే కాస్త మా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.

మీకు చాలా పలుకుబడి ఉంది. ఎవరితోనైనా చెప్పి ఏదైనా ఉద్యోగంలో వేయిస్తే – ఉమాదేవి బిడియంగా తలదించుకుంది.

“దాన్టేముందోయ్ – అలాగే చేద్దాం. నేను ప్రయత్నిస్తాను. ఏదో ఒకటి దొరకపోదు. నువ్వు బెంగపెట్టుకోకు. ఏదీ నాలుక చూపించు. ఎనీమిక్గా ఉన్నావు, రక్తం తక్కువగా ఉంది. మందులిస్తాను. వాటిని వాడుతూ ఆకు కూరలు బాగా తిను.”

జాగ్రత్తలు చెబుతూ మందులిచ్చింది. కుటుంబ యోగక్షేమాలడిగింది.

ఉమాదేవి శారదకు మంచి స్నేహితురాలనుకునేవారు తెలియని వారెవరన్నా అక్కడుంటే,

మరొక వారం రోజుల్లో ఉమాదేవి ఉద్యోగంలో చేరింది. శారద ఆ క్షణంలో సంతోషపడి ఆ సంగతి మర్చిపోయింది,

ఐతే హేమలత నిండు గర్భిణిగా ప్రసవానికి వచ్చినపుడు చెప్పిన మాటలు ఆమెను కాస్త బాధపెట్టకపోలేదు.

فـ

హేమలతని పార్టీ వాళ్ళంతా శారద దగ్గర పురుడు పోసుకోవద్దని బలవంతం చేశారట. ఆపాలని ప్రయత్నించారట.

“నేను మొదట్నించీ ఆమె దగ్గర చూపించుకున్నాను. ఆమె మంచి డాక్టరు. మీ రాజకీయాలతో నన్నిప్పడు వెళ్ళొద్దంటే నేనెలా మానేస్తాను. నేనావిడ దగ్గరకే వెళ్తాను” అని ఎదిరించి వచ్చానని చెబితే శారదకు చాలా చిరాకనిపించింది.

“ఇంత ఎదగని మనుషులు ఏం సాధిస్తారు?” అనిపించింది. హేమలతకు ఆడపిల్ల పుట్టింది.

‘&)

“బంగారు బొమ్మలా ఉందోయ్ నీ కూతురు’ అంటూ నవ్వుతూ, పాపను నవ్వించింది.

“నీకు కొడుకు పుడితే శ్రీనివాసరావని పేరు పెట్టుకున్నావు. పాపకేం పేరు పెడతావు. మంచి పేరు పెట్టు.”

తన దగ్గరకు వచ్చిన ప్రతివారితో స్నేహంగా మాట్లాడి తమ కష్టసుఖాలు పంచుకోటానికి, ఏ అవసరమైనా వస్తే ఆదుకోటానికీ డాక్టర్ శారదాంబ ఉందనే నమ్మకం వాళ్ళలో కలిగిస్తుంది శారద, చాలాసార్లు ఆ నమ్మకాలు నిజమవుతాయి, నా సమస్య ఇదమ్మా అంటూ వచ్చిన వాళ్ళు శారద దగ్గర నుంచి సహాయం పొందకుండా వెళ్ళరు.

వీటన్నిటితో ఇరవై నాలుగు గంటలూ చాలవన్నట్టు పనిచేస్తున్నా శారదకు మనసులో ఏదో వెలితి.

తను విడివిడి వ్యక్తులకు తన చేతిలో ఉన్న సహాయమేదో చేయగలుగుతోంది. కానీ ఎంతమందికి చేయగలుగుతుంది? ఎన్నాళ్ళు చేయగలుగుతుంది? వ్యవస్థలలో, సాగుతున్న ఆచారాలు, విధానాలలో మార్పులు రాకుండా వ్యక్తులుగా చేసే పనులకు వాటికున్న పరిమితులకూ తేడా తెలియనిది కాకామె. ఆ తేడా బాగా తెలిసే రాజకీయాలకు, జన్మనిచ్చి అభివృద్ధి చేసిన వ్యక్తి ఆమె. అందువల్ల రాజకీయ జీవితం లేని లోటు ఆమెను వేధిస్తూనే ఉంది. ఆంధ్ర రాష్ట్రం వచ్చి గుంటూరులో హైకోర్డు ఏర్పడిన తర్వాత మూర్తి కొంత నిలకడగా ప్రాక్టీసు గురించి ఆలోచించటంతో అతని అశాంతి కొంత పోయింది. ఇద్దరూ తమ తమ పనులలో మునిగిపోయారు. నటాషా చదువు, తన స్నేహితులు, బంధువులతో సంతోషంగానే ఉంది. స్వరాజ్యం శలవలకు విశాఖపట్నం నుంచి వచ్చినపుడు మాత్రం ముగ్గురినీ ఒకచోట కలుపుతుంది. పాటలు

పాడుకుంటారు విడివిడిగా – కలిసి, మూర్తీ, శారద షేక్స్పియర్, షా, ఇబ్సన్ నాటకాల నుంచి కొంత భాగమైనా చదివేదాకా ఊరుకోదు స్వరాజ్యం. ఇబ్సన్ “డాత్స్ హౌస్” లో చివరి ఘట్టం భావయుక్తంగా మూర్తి, శారదలు చదువుతుంటే స్వరాజ్యం ఉత్తేజితు రాలయ్యేది. నటాషా స్వరాజ్యం ఎప్పడొస్తుందా అని ఎదురు చూస్తుండేది. స్వరాజ్యం శలవులన్నీ బెజవాడలోనే గడుపుతోందని అన్నపూర్ణ విసుకున్నా లెక్కజేసేది కాదు. తమ్ముడున్నాడు గదమ్మా – వాడు చాలు మిమ్మల్ని సతాయించటానికి, నేను కూడా ఎందుకు” అని హాస్యంలోకి దించేది.

“వాడు మా దగ్గరే ఉండీ, నువ్వు లేకుండానూ మమ్మల్ని సతాయిస్తున్నారే తల్లీ ఏం పిల్లలో మీరు” అని అన్నపూర్ణ కోపం తెచ్చుకుంటుంటే అబ్బయ్య ఆమెను ఓదార్చి శాంతింపజేసేవాడు.

ఎన్నికల రాజకీయాలలో అన్నపూర్ణ వంటి స్త్రీలను ప్రవేశించనిచ్చే ఉద్దేశం కాంగ్రెస్ నాయకులకు లేదు. ఎన్నికల రాజకీయాలు కాక మరో రాజకీయ కార్యక్రమమూ లేదు. ఆంధ్రరాష్ట్రం వచ్చేవరకూ ఏదో ఒక పని కల్పించుకునేది. ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత శారదా నికేతన్కి వెళ్ళటం, లక్ష్మీబాయమ్మ గారి ఆరోగ్యం చూసుకోవడం, ఖద్దరు అమ్మటం, వినోబా మొదలెడుతున్న సర్వోదయా ఉద్యమం గురించి తెలుసుకోవటం తప్ప పెద్ద పనులేవీ లేవు. అందువల్ల అన్నపూర్ణకు ఇంటి ధ్యాస, కుటుంబం గురించిన ఆలోచన ఎక్కువయ్యాయి. కానీ స్వరాజ్యం ఆమె చేతికి అందటం లేదు.

“స్వరాజ్యానికి పెళ్ళీ చెయ్యొద్దా అని అబ్బయ్య నడిగితే –

“డాక్టర్ గారి నడిగిరా మంచి సంబంధాలున్నాయేమో” అని నవ్వేవాడు.

“ఈ శారద ఇన్నాళ్ళకు నన్ను అశాంతిపాలు చేస్తోంది చూడండి చిత్రం” అనేది అన్నపూర్ణ

నువ్వూ నీ కూతురూ చెరో విధంగా మారారు. దానికి డాక్టర్ గారిని ఆడిపోసుకోకు’ అని మందలించేవాడు అబ్బయ్య. మళ్ళీ శారదను కలిసినపుడు

ఇద్దరూ అతుకుపోయేవారు. రాజకీయ జీవితం లేకుండా బతకటం బాగోలేదని, దాన్నించి బైటపడటం ఎట్లాగనీ చర్చించుకునేవారు, *

బెజవాడ, కృష్ణాజిల్లా నుంచి కవులు, కళాకారులు 1950 నుంచే మద్రాసు వెళ్ళటం మొదలైనా 55 నాటికి బాగా పెరిగింది. జనరల్గా జరిగే సాహిత్య

కార్యక్రమాలు బాగా తగ్గాయి. మొత్తం మీద ఒక ఉత్తేజ రహిత వాతావరణం కమ్ముకుంది. లక్ష్మణరావు మెల్లీ కూడా బెజవాడ నుండి వెళ్ళిపోతున్నారనే వార్త శారదను కలవరపరిచింది. వాళ్ళు మాస్కో వెళ్తున్నారు. సరస్వతి ఒకతే బెజవాడలో శారదలా స్థిర నివాసం – గోరాగారి నాస్తికోద్యమం, ఇతర రాజకీయ కార్యక్రమాలు సాగుతూనే ఉన్నాయి. కమ్యూనిస్టులు కొందరు పార్టీ ఒదిలి కాంగ్రెస్లో చేరారు. వారిలో నారాయణరాజు ఒకడు. అతను శారదను కూడా చేరమని చెప్తూ వస్తున్నాడు.

“ఇదేం కొత్త గాదు గదా డాక్టర్ గారు. ఎన్నిసార్లు గతంలో మనం ప్రచ్ఛన్నంగా కాంగ్రెస్లో పనిచేసి మన తీర్మానాలు అక్కడ నెగ్గించుకోలేదు. మన కార్యక్రమాలకు దేశవ్యాప్త ఆమోదం సంపాదించలేదు. ఆలోచించండి” అంటూ చెప్తుండేవాడు.

1956లో ఆంధ్రరాష్ట్రం కాస్తా ఆంధ్రప్రదేశ్ అవటంతో హైకోర్టు హైదరాబాద్ కు మారుతుందని అందరికీ అర్థమైంది. మూర్తికి ఇంకా త్వరగా అర్థమైంది. హైదరాబాదుకు మారితే మంచిదని అతనికి అనిపించింది. బెజవాడనుంచి తను కదిలేది లేదని శారద తెగేసి చెప్పాక మూర్తి తను హైదరాబాదులో తన న్యాయవాద వృత్తి కొత్తగా మొదలు పెడతానన్నాడు. మద్రాసు నుంచి కుటుంబాన్ని కూడా హైదరాబాదు మార్చాలనుకుంటున్నానంటే శారద అలాగే చెయ్యమంది. దానికి కావలసిన ఏర్పాట్లు చేసింది. మూర్తి కూతురు కల్యాణి అప్పుడప్పుడు మద్రాసునుంచి బెజవాడ వచ్చి శారద ప్రేమను పొంది వెళ్తుండేది. శారద ఆ అమ్మాయినంత ఆదరించటం, స్వంత కూతురిలా ప్రేమించటం చుట్టుపక్కల వాళ్ళకు అర్థమయ్యేది కాదు. ఒకరిద్దరు లోపలి ఆరాటం ఆపుకోలేక ఏదో ఒకటి అనేవారు –

శారద నవ్వి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకు మనుషులెలా ఉండాలి కుటుంబ సంబంధాలు ఎంత సంకుచితంగా ఉన్నాయి, అవి ఎలా మారాలి అని ఓపికగా చెప్పేది.

వాళ్ళలో కమ్యూనిస్టు పార్టీ వాళ్ళో సానుభూతి పరులో ఉన్నారా వాళ్ళకు మరింత లోతుగా మానవ సంబంధాల గురించి వివరించేది,

కాలం నెమ్మదిగా గడుస్తోంది. సుబ్బమ్మ ఆరోగ్యం మందగించి నీరసంగా ఉంటోంది. ఈ ఒకటి రెండేళ్ళలో జరిగిన సంఘటనలు ఆమెను ఎక్కువగానే కుంగదీశాయి. శారద కూడా నటాషా గురించి, సుబ్బమ్మ గురించి శ్రద్ధ తీసుకుంటోంది. అలాంటి రోజుల్లో శారద మద్రాసు ప్రయాణం తలపెట్టాల్సి వచ్చింది. కోటేశ్వరికి ఆరోగ్యం బొత్తిగా బాగోలేదనీ, శారదను తప్పకుండా రమ్మని పదేపదే

అడుగుతోందని ఫోన్ వచ్చింది. ప్రాక్టీసు బాగా పుంజుకుంటున్న రోజులు. నాలుగు రోజులు ఊళ్ళో లేకపోవటం అంటే అంత తేలిక కాదు. కాన్పు కేసులు ఒదిలి వెళ్ళలేదు. మొదటినుంచీ శారద దగ్గర చూపించుకున్నవాళ్ళు సమయానికి శారద లేకపోతే భరించలేరు. ఎన్నో సర్దుబాట్లు చేసుకుంటే గాని శారదకు మద్రాసు ప్రయాణం కుదరలేదు. అప్పటికి ఫోను వచ్చి నెల దాటింది. కోటేశ్వరి జీవించే ఉందనే నమ్మకంతోనే వెళ్ళింది శారద, శారద నమ్మకం నిజమే గానీ కోటేశ్వరిని చూడగానే రోజులలో ఉంది అని అర్థమైంది శారదకు, తను ఇప్పటికైనా వచ్చి మంచిపని చేశాననుకుంది. కోటేశ్వరి జబ్బు, జరుగుతున్న వైద్యం అన్నీ వివరంగా తెలుసుకుంది. అంతా బాగానే ఉంది గానీ జబ్బు తగ్గేది కాదు.

కోటేశ్వరి పక్కనే కూచుని “విశాలాక్షికి కబురు పంపారా?” అని అడిగింది.

ఎవరూ సమాధానం చెప్పలేదు. “ఏం అమ్మా – విశాలాక్షికి కబురు పంపనా?” అనడిగింది. కోటేశ్వరి ఒద్దన్నట్లు తల అడ్డంగా ఊపింది.

“నన్నూ నా వృత్తినీ, తన పుటకనూ చీదరించుకు పోయింది. ఏంటమ్మా దాంతో నాకు సంబంధం – ఇన్నాళ్ళు లేనిది చచ్చేముందు కావలించుకుంటే ఒస్తుందా? మా బతుకులిట్టా ఎళ్ళమారిపోవాల్సిందే – ఒదు గానీ – నేనప్పడు చెప్పానే నా డబ్బు మంచి పనులకు పంచిపెట్టాలని – ఆ టైమొచ్చింది. డబ్బు నీ చేతికిస్తాను. నువ్వు నాగరత్నమ్మకీ, దుర్గమ్మకూ ఇచ్చిరా. తల్లీ – ఈ పుణ్యం కట్టుకో – నీ చేతులు మీదుగా ఇప్పించాలనే నిన్ను పిలిపించమని వీళ్ళ ప్రాణాలు తీశాను. బంగారు తల్లివి – ఒచ్చావు. ఈ పని ఒక్కటీ చెయ్యమ్మా” అని శారద చేతులు పట్టుకుంది.

“మంచిపని చెయ్యమంటూ ఇంత బతిమాలతావేంటమ్మా ఈ పని నా చేతుల మీదుగా జరగటం నా అదృష్టం. వెంటనే ఆ పని చేస్తాను. దుర్గాబాయి దేముంది. ఆంధ్ర మహిళా సభకు వెళ్ళి ఇచ్చి రావటమే.

నాగరత్నమ్మ గారి దగ్గరకు వెళ్ళటమే కష్టం. దూరం కదా – రైలు టిక్కెట్టు దొరకాలి – •

“ఎందుకు రెండు కార్లున్నాయి. దర్జాగా కార్లో వెళ్ళమ్మా” అని ఎవరినో పిల్చి “కారూ డ్రైవరూ సిద్ధంగా ఉన్నారా” అని అడిగింది.

మరో గంటలో కారులో దుర్గాబాయి దగ్గరకు వెళ్ళి కోటేశ్వరి ఇచ్చిన డబ్బు ఇచ్చి రసీదు తీసుకుంది.

ఆంధ్ర మహిళా సభ అంతా ఒకసారి కలయదిప్పింది దుర్గాబాయి, దుర్గాబాయికున్న

ముందు చూపును ఆ సంస్థ మీద ఆమెకున్న ప్రేమనూ ఆ సంస్థ నడుస్తున్న తీరునూ శారద మనస్ఫూర్తిగా ఆనందించింది.

“ఇదుగో – మీ ఏలూరు నుంచే వచ్చిందీ అమ్మాయి. మహా తెలివైనది. చురుకైనది”, చురుకుదనంతో మెరిసిపోతున్న ఒక యువతిని చూపింది దుర్గ, “మా ఏలూరేంటి?” “నువ్వు పోటీ చేశావుగా – ఓడిపోయావనుకో – మాలతీ శారదాంబ గారు తెలుసా? అప్పటికి నీకు ఓటు లేదేమో ”- అంది దుర్గ.

“శారదాంబ గారిని చూశానండి. ఎన్నికలప్పుడే. నేనప్పడు స్కూల్ ఫైనల్లో ఉ న్నాను. నమస్కారమండి” అంది ఆ యువతి,

“చాలా మంచి అమ్మాయి – వీళ్ళాయన నాగేశ్వరరావు అని రచయిత, జర్నలిస్టు, వీళ్ళిద్దరూ భవిష్యత్తులో చరిత్ర సృష్టిస్తారు” అంది దుర్గ మాలతి భుజం తడుతూ,

“అదంతా దుర్గాబాయమ్మ గారి అభిమానం. కొన్ని విలువలతో బతకగలిగితే చాలనుకుంటున్నాం” అంది మాలతి వినయంగా నవ్వుతూ. ఆ అమ్మాయి భుజం తట్టి ముందుకు నడిచింది శారద.

మర్నాడు తెల్లవారుఝామునే శారద తంజావూరు దగ్గర తిరువాయూరుకి ప్రయాణమైంది. సాయంత్రమవుతుండగా ఆ ఊరు చేరింది. కావేరీ నది ఒడ్డున ఉన్న త్యాగరాజస్వామి ఆలయంలోనే ఆ సమయంలో ఆవిడ ఉంటుందని తెలుసుకుని సరాసరి అక్కడికే వెళ్ళింది. ఆ ఊరు చిన్నదే గాని ముచ్చటగా ఉంది, నదికి దగ్గరగా అంత విశాలమైన స్థలంలో చిన్న ఆలయం నిర్మించటానికి ఒంటిచేత్తో పని చేసిన నాగరత్నమ్మ గారి పట్టుదలకూ, త్యాగరాజస్వామి మీద ఆమెకున్న ప్రేమకూ శారద నిండు మనసుతో చేతులెత్తి నమస్కరించింది.

తనను తాను పరిచయం చేసుకుని వచ్చిన పని చెప్పింది. నాగరత్నమ్మ సంతోషంతో శారదను దీవించింది.

త్యాగరాజస్వామి దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేసింది. అక్కడే కూచున్నారు

కాసేపు ఇద్దరూ,

నాగరత్నమ్మ గారు అప్రయత్నంగా గొంతెత్తి రాగాలాపన అందుకున్నారు.

“ఏ పనికో జన్మించి తినని నన్నెంచవలదు, శ్రీరామ! నే నే పనికో జన్మించితినని.

శ్రీపతి! శ్రీరామచంద్ర! చిత్తమునకు తెలియదా? ఏ పనికో జన్మించితినని నన్నెంచవలదు”

ఆవిడ పాడుతుంటే శారద తన అదృష్ణాన్ని నమ్మలేకపోయింది. తన ఒక్కదాని ఎదుట, త్యాగరాజాలయంలో, కావేరీ ఒడ్డున ఆ సంగీత నిధి పాడుతుంటే శారద మనసు పులకించిపోయింది. కళ్ళవెంట నీళ్ళు కారాయి. మనసులో ఆ కీర్తననూ, ఆ వాతావరణాన్ని ఆ కావేరిని గాఢంగా ముద్రించుకుంది.

శారదాంబ వివరాలన్నీ ఒక్కొక్కటే ఓపికగా అడిగి తెలుసుకుంది నాగరత్నమ్మ శారదకు కూడా ఎంతో సంతోషంగా తన గురించి ఆమెకు చెబుతుంటే తనేమేమిటి, ఎవరు ఏం చేస్తోంది? అనే విషయాలు కొత్తగా తను కూడా తెలుసుకుంటు న్నట్లనిపించింది, అదొక వింత అనుభూతి అయింది.

“ఈ రాత్రికి మా ఇంట్లో ఉండి రేపు వెళ్దువు గాని రా” అని అక్కడి నుంచి శారదను ఇంటికి తీసుకెళ్ళింది.

ఇంటికి వెళ్ళాక శారద స్నానం, భోజనం చేసి కూర్చున్న తర్వాత “ఈ పుస్తకం చూశావా” అంటూ “రాధికా స్వాంతనము” అనే కావ్యాన్ని శారద చేతిలో పెట్టింది. ముద్దు పళని రాసిన కావ్యం అది. పుస్తకం తెరిచి ముందుమాట చదివింది.

చాలా అలజడి, ఆనందం, కలవరం –

ముడు పళని వేశ్య కాబట్టి వీరేశలింగం గారు ఆమె రాసిన కావ్యం నిండా పచ్చి శృంగారముందని విమర్శిస్తే – దానికి నాగరత్నమ్మ గారిచ్చిన సమాధానం ఆ ముందుమాటలో ఉంది.

ఆ మాటలలో ఎంతో అర్థముంది. ఆలోచించటానికెంతో ఉంది. అది పక్కన బెడితే నాగరత్నమ్మ ధీరత్వానికి ఆశ్చర్యపోయింది శారద – సాహసవంతురాలని అందరూ చెప్పకునే శారద.

వీరేశలింగం గారి వంటి పండితుడిని, సంస్కర్తను, ప్రజాభిమానం ఎంతగానో పొందినవాడిని అట్లా పది వాక్యాలలో కడిగివేయటానికి ఎంత సాహసం, ఎంత పాండిత్యం కావాలి? నాగరత్నమ్మ గాయకురాలనే ఇన్నాళ్ళూ అనుకుంది శారద, ఆమె మేధస్సు, విద్య, విమర్శనా శక్తి, సాహసం తెలియదు. స్త్రీలను మేధావులుగా గుర్తించరని బాధపడే తనెంత గుర్తిస్తోంది?

కోటేశ్వరి, విశాలాక్షి గుర్తొచ్చారు. కులం, కుల వృత్తులు, వీటి ఆవిర్భావం వీటి

గురించి ఆలోచించటానికి ఎంతో ఉందనిపించింది శారదకు, కులాలు పోవాలనటం తప్ప కుల అస్తిత్వం గురించి ఆలోచించటం లేదు. ఆ దిశగా ఆలోచించటానికెంతో ఉంది. కోటేశ్వరి, విశాలాక్షి నిశ్శబ్ద యుద్ధం చేశారు. నాగరత్నమ్మ, ముత్తు లక్ష్మీరెడ్డి బహిరంగంగానే పని చేశారు. ఐనా ఇంకా తేలాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. జాతి, కులం మామూలు విషయాలు కాదు. కుల నిర్మూలన అంటున్న అంబేద్కర్ రాసిన విషయాల గురించి జరగాల్సిన చర్చ జరగటం లేదు. కమ్యూనిస్టులూ పట్టించుకోవటం లేదు. ఎలా ఎక్కడ నుంచి – ఆర్థికమా, సాంఘికమూ, సంస్కృతా, వృత్తులా – శారద మనసు ఆ రాత్రి అనేక విషయాలతో అల్లకల్లోలమయింది. నిద్ర పట్టలేదు. తెల్లవారి ఎర్రని కళ్ళతో నిద్రలేచి స్నానం చేసి తల దువ్వకుంటుంటే నాగరత్నమ్మ గారి కీర్తన మధురంగా శాంతంగా వినిపించింది.

శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన

దాంతునికైన వే – దాంతునికైన

శాంతము లేక సౌఖ్యము లేదు

దార సుతులు ధన ధాన్యములుండిన

సారెకు జప తప సంపద గల్గిన

శాంతము లేక సౌఖ్యము లేదు

ఆగమ శాస్త్రములన్నియు జదివిన

బాగుగ సకల హృద్భావము దెలిసిన

శాంతము లేక సౌఖ్యము లేదు

శారద నాగరత్నమ్మ గారి పక్కన జేరి తాళం వేస్తూ తనూ మెల్లిగా గొంతు కలిపింది.

యాగాధికర్మము లన్నియు జేసిన

భాగవతులనుచు బాగుగ బేరైన

శాంతము లేక సౌఖ్యము లేదు

రాజాధిరాజ ! శ్రీ రాఘవ త్యాగ

రాజ వినుత సాధురక్షక తనకుప

శాంతము లేక సౌఖ్యము లేదు –

కీర్తన పూర్తయ్యేసరికి శారద మనసు ప్రశాంత మయింది. ఆమెకు నమస్కారం చేసి బయల్దేరింది.

దారంతా కోటేశ్వరికి నమస్కారాలు చెప్పకుంటూనే ఉంది ఈ అనుభవాన్ని తనకిచ్చినందుకు,

కోటేశ్వరికి రెండు రసీదులూ ఇచ్చి ఆ సాయంత్రమే బెజవాడ రైలెక్కింది.

బెజవాడ చేరిన రెండు రోజులకే కోటేశ్వరి చనిపోయిందని ఫోను వచ్చింది.

తను సరైన సమయానికి వెళ్ళగలిగినందుకు సంతృప్తిగా అనిపించింది. విశాలక్షికి ఫోను చేద్దామా ఒద్దా అని ఆలోచించి చివరికి రాత్రికి ఫోను చేసి చెప్పింది.

“అలాగా – జబ్బేమిటి” పొడిపొడిగా వివరాలడిగి తెలుసుకుంది విశాలాక్షి ఆ ఫోన్ పెట్టేశాక విశాలాక్షి యేడ్చిన యేడుపు శారద ఊహించనిది.

***************************

ఎమ్మెస్సీ పూర్తవుతూనే స్వరాజ్యం విశాఖపట్నం ఎ.వి.యన్ కాలేజీలో ఉద్యోగం సంపాదించింది. ఉద్యోగంలో చేరటానికి ముందు ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళమని అన్నపూర్ణ ఉత్తరాలు తీవ్రంగా రాసీ రాసీ విసుగెత్తిన తర్వాత ముందు బెజవాడ వచ్చి పెద్దమ్మను, పెదనాన్ననూ, నటాషానూ చూసి ఆ తర్వాత గుంటూరు వస్తానని స్వరాజ్యం నుండీ సమాధానం వచ్చింది. అన్నపూర్ణకు ఏదో అనుమానం తోచింది గానీ అది అబ్బయ్యతో కూడా పంచుకోలేదు. “స్వరాజ్యాన్ని నాలుగు రోజుల్లో పంపు తల్లీ అని నిష్టూరంగా శారదకో ఉత్తరం రాసి ఊరుకుంది.

స్వరాజ్యం వస్తుందంటే ఇంట్లో అందరికీ ఆనందమే. స్వరాజ్యానికి ఎవరితో ఉండే పనులు వారితో ఉంటాయి, వచ్చి ఒకరోజు అలసట తీర్చుకున్న తర్వాత శారద ఒంటరిగా ఉన్నపుడు తన మనసులో మాట బైట పెట్టింది.

పెద్దమ్మా నేను పెళ్ళీ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను”

“ఔనా – మరి రాగానే చెప్పలేదేం. మీ అమ్మానాన్నకు చెప్పావా? ఎవరతను? ఏం చేస్తాడు? స్వరాజ్యం అనుకున్నంత ఆనందమూ ప్రకటించలేదు. హడావుడీ చెయ్యలేదు శారద,

“నాకు సీనియర్ యూనివర్సిటీలో, విశాఖ పోర్టు కార్మికుల సంఘంలో పని చేస్తున్నాడు. కమ్యూనిస్టు, మా కులం కాదు. మా పెళ్ళి నువ్వే చెయ్యాలి”.

శారద ముఖంలో ఇప్పడు ఆనందం నిండిపోయింది. స్వరాజ్యాన్ని దగ్గరకు లాక్కుని,

నీ పెళ్ళి నేనెందుకు చేస్తాను. మీ అమ్మ నన్ను బతకనిస్తుందా? మీ అమ్మా నాన్నలను అంత తక్కువగా అంచనా వెయ్యకు, కమ్యూనిస్టనీ, కులాంతరమనీ వాళ్ళేమీ అభ్యంతరం పెట్టరు. ఇవాళ సాయంత్రం మనిద్దరం గుంటూరు వెళ్దాం పద. అసలు నువ్వొకదానివే వెళ్లి చెస్తే మంచిది. నా మీద నా కూతురు నమ్మకం ఉంచిందని మీ అమ్మ సంతోషపడుతుంది, వెళ్ళరాదు?”

స్వరాజ్యం ఆలోచనలో పడింది.

వెళ్తాను. కానీ రేపు సాయంత్రానికి మీరు రావాలి అంది స్వరాజ్యం,

“అలాగేవస్తా ముందు నువ్వు వెళ్ళి మూట విప్పెయ్” అని ప్రేమగా నవ్వింది. స్వరాజ్యాన్ని గుంటూరు పంపి తల్లితో ఈ కబురు చెప్పి ఆ తర్వాత సరస్వతికి, … కబురు పంపి, మర్నాడు అందరూ కలిసి గుంటూరు వెళ్ళాలని మనసులో అనుకుంది. ఇంతలో ఆస్పత్రి నుంచి కబురొచ్చింది అర్జెంటు కేసని. ఇలా వెళ్తున్నానని ఒక కేకైనా వేయకుండా చెప్పలు వేసుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంటికి వచ్చే సరికి రాత్రి పదయింది. స్వరాజ్యం వెళ్ళిపోయినట్లుంది. లేకపోతే శారద కోసం ఎదురు చూస్తూ వరండాలో కూచుని ఉండేది. శారద తల్లి నిద్రపోతూ ఉంటుందనుకుంటూనే సుబ్బమ్మ గదిలోకి వెళ్ళింది. ఆమె నిద్రపోతోంది. నిద్రలో అమాయకంగా, నవ్వు ముఖంతో ప్రశాంతంగా ఉన్న తల్లిని చూస్తే శారదకు ప్రేమ గుండెల్లో నుంచి పొంగుకువచ్చింది. నెమ్మదిగా ఆమె మీదికి వంగి నుదుటి మీద మెల్లిగా పెదవుల్లాన్చింది. శారద పెదవులు ఒక్క క్షణం ఆ నుదుటి మీదే గట్టిగా అడ్డుకున్నాయి. శారద చటుక్కున లేచింది. ఒకక్షణం భయ సందేహాలతో అలాగే చూసింది. చేయి పట్టుకునే సరికి అర్ధమైపోయింది. తల్లి పక్కనే కూలబడి పోయింది శారద. మనసంతా నిరామయమయింది.

“నాకు చెప్పకుండా ఏ చిన్న పనీ చేసేదానివి కాదు. ఇంత పెద్ద పని చేశావేమి టమ్మా అనుకుంది మనసులో –

కళ్ళవెంట నీళ్ళు కారుతున్నాయి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. శారదకు ఎవరినీ పిలవాలనిపించలేదు. తల్లి ముఖం చూస్తూ, ఆమె చేతిని తన చేతితో నిమురుతూ అలాగే కూచుండిపోయింది.

తల్లి బోళా మనిషనీ, అంత సమర్థురాలు కాదనీ అందరూ అనుకుంటారు. కానీ చాలా తెలివైనదని తనకొక్కదానికే తెలుసు. సమాజంలో, ఇంట్లో వచ్చే మార్పులను

366 • ఓల్లా

చివరివరకూ అర్థం చేసుకుని ఆనందంగా వాటితో సహజీవనం చేసింది. తన చిన్న చిన్న ఆచార వ్యవహారాలకు కాస్త చోటుంచుకుంది. దేనికీ రొష్టు పడలేదు. కష్టాలు వస్తాయి పోతాయి అనుకుంది. జీవించటంలో అంతకంటే తెలివైన మార్గం ఏముంటుంది? ఎన్నెన్నో జ్ఞాపకాలు శారదకు,

తనమీద తల్లికున్న నమ్మకం ప్రేమ ఎన్ని సందర్భాల్లో అర్థమై గుండె తడయిందో అవన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి.

రేపటి నుంచీ అమ్మ కనిపించదు. తనివిదీరా తల్లి ముఖం చూస్తూ, అడ్డం పడుతున్న కన్నీళ్ళను తుడుచుకుంటూ అక్కడే కూచుంది.

రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో రోజూ సుబ్బమ్మను దొడ్లోకి తీసుకుపోయే ఆయా వచ్చి శారద నక్కడ చూసి

“అమ్మా – ఏమైంది అంది కంగారుగా.

“అమ్మ వెళ్ళిపోయింది దుర్గా అంటూ లేచి ఆ కబురు చెప్పవలసిన వాళ్ళకు చెప్పే పనిలో పడింది.

మర్నాడు ఉదయం నుంచీ ఎందరో వచ్చి సుబ్బమ్మను చూసి, నమస్కరించి శారదను పలకరించి వెళ్తున్నారు. సాయంత్రం వరకూ బంధువులు, స్నేహితులు వస్తూనే ఉన్నారు. కానీ ఆపదలో, అవసరంలో వేళ కాని వేళల్లో వచ్చి సుబ్బమ్మ చేతి కింద నడిచే వంటగదిలో నిప్ప ఆరకుండా చేసిన ఎందరో రాలేదు. శారద కొందరు వస్తారని ఎదురు చూసింది, యువకులుగా ఉన్నప్పటి నుంచీ అమ్మా అంటూ పిల్చి ఆమె ఆప్యాయతను పంచుకున్న కొందరు చివరిసారిగా ఆమెను చూడటానికి వస్తారని చూసింది. రాలేదు. అన్నపూర్ణ, సరస్వతి శారదను ఒదలకుండా కూర్చున్నారు, ఆ తల్లీ కూతుళ్ళ అనుబంధం వీరిద్దరికి బాగా తెలుసు. ఒక వైద్యురాలిగా మృత్యువుని అర్థం చేసుకోగలిగినా కూతురిగా ఆ వాస్తవాన్ని మింగటం శారదకైనా కష్టమేనని చాలామంది అనుకున్నారు.

ఆనాటి సూర్యాస్తమయంలో కలిసిపోయింది సుబ్బమ్మ,

శారద మనసింకా పచ్చిగా ఉన్నా స్వరాజ్యం పెళ్ళీ గురించి అన్నపూర్ణతో మాట్లాడాలని తల్లిపోయిన వారం రోజుల్లోనే గుంటూరు వెళ్ళింది.

అన్నపూర్ణకు శారద వచ్చిన పని తెలుసు. కానీ తెలియనట్లే వేరే సంగతులు చెప్తూ పోయింది,

“అవన్నీ ఆపవోయ్ – స్వరాజ్యం పెళ్ళి సంగతేమిటి? మీరేమనుకుంటున్నారు? అన్నపూర్ణ ముఖం వివర్ణమైంది,

“నాకిష్టం లేదు శారదా, అబ్బయ్య అమ్మాయి ఇష్టం. నాదేం లేదంటున్నాడు. నాకు కులం గురించి పట్టింపు లేదు. కానీ అలవాట్లలో, ఆచారాల్లో తేడాల వల్ల తర్వాత్తర్వాత సమస్యలొస్తాయి అని భయంగా ఉంది”

ఏ పెళ్ళీలోనైనా సమస్యలొస్తాయి. ఒస్తే ఎదిరిస్తాం గానీ సమస్యలొస్తాయని చేతులు ముడుచుకు కూచుంటామా?”

‘నాకెలా చెప్పాలో అర్థం కావటం లేదు – హరిజనుల బాగు కోసం నేనూ పని చేశా. కానీ ఒక హరిజనుడు అల్లడవుతాడంటే ఒప్పకోలేకపోతున్నా

“వాళ్ళూ నువ్వూ వేరు వేరనుకుని – వాళ్ళు నీకంటే తక్కువని, వాళ్ళను ఉద్ధరించటం మంచిపని, వాళ్ళకు మేలు చేస్తున్నాననీ నువ్వు హరిజనోద్యమంలో పని చేశావు, వాళ్ళను నీతో సమానమని అనుకోలేదన్న మాట – అదేంటోయ్ – నువ్విలా ఉండటం ఏమీ బాగోలేదోయ్ – అంది శారద.

అన్నపూర్ణ తలదించుకు కూచుంది.

స్వరాజ్యం తల్లి గురించి అవమానపడుతూ ముఖం ఎర్రగా చేసుకుంది. అబ్బయ్య సమస్య తనది కానట్లు ఏదో పుస్తకం తిరగేస్తూ కూచున్నాడు, “సరస్వతి కూతురు మనోరమ పెళ్ళీ గుర్తులేదా? గాంధీ గారే చేయాలనుకున్నారు. ఆయన మరణించాక గాని అది కుదరలేదు. గాంధీ ఆశ్రమంలో నెహ్రూ చేతుల మీద జరిగింది. వాళ్ళిద్దరూ ఎంత బాగుంటారు. నాకు తెలిసి వాళ్ళకే సమస్యలూ లేవు. ఇప్పడు లవణానికి జాషువా గారమ్మాయితో పెళ్ళీ ఎంత ప్రేమగా సంతోషంగా ఉన్నారు వాళ్ళు, అసలు – ఎప్పట్నించి నువ్వు గాంధీగారి శిష్యురాలివి – నువ్వనాల్సిన మాట లేనా ఇవి?

“మనోరమ సంజీవరావుల పెళ్ళికి గాంధీగారు ఎంత ఆలోచించారు. వాళ్ళిద్దరూ గాంధీ ఆశ్రమంలో ఏడాదిపైగా కలిసి పనిచేసి ఒకర్నొకరు అర్ధం చేసుకున్నారు, హేమలత జాషువాగారి సంస్కారం పంచుకుని పెరిగిన పిల్ల –

“అమ్మా – నేనూ సుందర్రావూ రెండేళ్ళ నుంచీ ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. సుందర్రావు నీకంటే చాలా సంస్కారవంతుడు.” ఆవేశంగా అంది స్వరాజ్యం,

“ఔను. నేనే సంస్కారం లేనిదాన్ని హీనురాల్ని అంటూ ఏడుపు మొదలెట్టింది అన్నపూర్ణ

“ఈ ఇంట్లో జరగవలసిన మాటలు కావివి. అన్నపూర్ణా – నాకసలు అర్థం కావటం లేదోయ్ – ఆ అబ్బాయి బాగా చదువుకున్నవాడు. ఆ చదువుతో సంపాదించుకుని తానొకడే ఎదిగిపోవాలనుకోకుండా అందరి బాగు కోసం పని చేస్తున్నాడు, కులం కారణంగా నువ్వు – అన్నపూర్ణవి – కూతురి ప్రేమను ఒప్పకోవటోయ్ – ”

“ఆదర్శాల కోసం పెళ్ళీళ్ళు చేసుకోకూడదు” కఠినంగా అంది అన్నపూర్ణ

పెద్దమ్మా – నేను ఆదర్శాల కోసం చేసుకోవటం లేదు. సుందరం మా దరిద్రపు కమ్మ కులంలో పుట్టినా, బ్రాహ్మణ కులంలో పుట్టినా అతని సంస్కారం ఇదే అయితే నేనతన్ని ప్రేమించేదాన్ని – అతను హరిజనుడనీ, మా పెళ్ళి ఆదర్శమనీ నేను అనుకోవటం లేదు. అమ్మని అది నమ్మమనండి. స్వరాజ్యం తీవ్రతకు అందరూ భయపడ్డారు.

పెద్దమ్మా – ఈ కాంగ్రెస్ హరిజనోద్ధరణ ఒట్టి బూటకం, అందులో ఈ కమ్మ, రెడ్డి కాంగ్రెస్ వాళ్ళది మరీ బూటకం. నేను అమ్మమ్మ గారి ఊరెళ్ళినపుడు చూశానుగా – వీళ్ళు కుర్చీలలో మంచాల మీదా దర్జాగా కూర్చుంటారు. హరిజనులొచ్చి కింద కూచోవాలి. ఇళ్ళల్లోకి రానివ్వరు. మళ్ళీ బ్రాహ్మలు తమని వంటిళ్ళలోకి రానివ్వరని ఏడుస్తారు. వీళ్ళేమో అంటరానితనం పాటిస్తారు. మీరు కమ్యూనిస్టులు గాబట్టి మీరట్లా ఉండరేమో – కమ్మ బ్రాహ్మలు పెద్దమ్మా ఈ కాంగ్రెస్ వాళ్ళంతా –

అందరూ కాసేపు నిశ్శబ్దమై పోయారు. స్వరాజ్యం మాటల్లో నిజం అందరికీ తెలుసు,

శారద అంటరానితనం పాటించకూడదనే ప్రత్యేకమైన స్పృహతో ఉంటుంది. మహిళా సంఘంలో పదే పదే చెప్పింది. ఆచరింపచేసింది. ఐనా కొందరు కులాన్ని అధిగమించలేదనీ, స్వరాజ్యం చెప్పినవి కమ్యూనిస్టుల ఇళ్ళల్లో కూడా జరుగుతాయని శారదకు తెలుసు. కానీ అన్నపూర్ణ ఇంత సంకుచితంగా ఆలోచిస్తుందని అసలు అనుకోలేదు.

“అన్నపూర్ణా – అంబేద్కర్ రైటనిపిస్తోంది. కుల నిర్మూలనే జరగవలసిన మొదటి పని – తర్వాతే మిగిలిన విషయాలు, కులాంతర వివాహాల వల్లనే కులం లేకుండా

పోతుందని ఆయన చెప్పిన మాటల్లో ఎంత నిజం ఉందో నాకివాళ అర్థమవుతోంది. నీకే ఇంత వ్యతిరేకత ఉంటే ఇక మామూలు వాళ్ళ సంగతేంటి?”

నాకిప్పుడు దేశోద్ధరణ గురించి ఉపన్యాసం ఇవ్వకు శారదా – నా కూతురి భవిష్యత్తు నాకు ముఖ్యం.”

“నీ కూతురి భవిష్యత్తు, దేశ భవిష్యత్తు వేరని ఎందుకనుకుంటావు?” అబ్బయ్య కలగజేసుకున్నాడు.

“ఇది మాటలతో, వాదనలతో పరిష్కారమయ్యే సమస్య కాదు డాక్టర్ గారు. ఇవన్నీ అనవసరం, స్వరాజ్యం మేజరు, స్వతంత్రురాలు, అది వెళ్ళి దానిష్టం వచ్చిన పెళ్ళీ చేసుకోవచ్చు.

“థాంక్స్ నాన్నా తేల్చి చెప్పావు, పెద్దమ్మా – నేను నీతో వస్తాను ఉండు” అని బట్టలు మార్చుకుని వచ్చింది.

అన్నపూర్ణ మాట్లాడకుండా కూర్చుంది, వారించలేదు.

పద పెద్దమ్మా” అని స్వరాజ్యం తొందర చేస్తోంది.

“ఏంటోయ్ ఇది – ఈ పిచ్చి, మూర్ఖత్వం ఏంటి నీకు? స్వరాజ్యాన్ని దగ్గరకు తీసుకో – మీ ఇద్దరూ ఆనందంగా కూతురి పెళ్ళి చెయ్యండి. ఆనందంగా జరగాల్సిన పనిని అశాంతిమయం చేసుకోకండి”,

ఎంత చెప్పినా అన్నపూర్ణ కరగలేదు.

చివరికి కట్టుబట్టలతో స్వరాజ్యం శారద వెంట ఆమె ఇంటికి వచ్చింది. శారద ఎన్నో కులాంతర వివాహాలు, దండల పెళ్ళిళ్ళు తన ఇంట్లో చేయించింది. కానీ అన్నపూర్ణ కూతురి పెళ్ళీ ఇట్లా తన ఇంట్లో జరుగుతుందని అనుకోలేదు. అన్నపూర్ణ, అబ్బయ్య, శారద కుటుంబంలో వారేనని అందరూ అనుకుంటారు. వాళ్ళిద్దరూ రాకుండా వాళ్ళ కూతురి పెళ్ళి శారద ఇంట్లో జరగటం అందరికీ ఆశ్చర్యమే. తల్లి రాని లోటు తెలియకుండా స్వరాజ్యానికి తనే తల్లయింది శారద, సరస్వతి, గోరా, మెల్లీ, లక్ష్మణరావుల సహాయం ఉంది. సుందర్రావు కుటుంబం కూడా శారద ఇంట్లోనే దిగారు, సుందర్రావు తల్లిదండ్రులు సంకోచంతో దూరదూరంగా ఉంటే శారద వాళ్ళకు బెజవాడంతా తిప్పి చూపి, అందరి ఇళ్ళకూ తీసికెళ్ళి, వాళ్ళందరి వద్దా వీళ్ళను గౌరవించి మొత్తానికి వాళ్ళ బెరుకు పోగొట్టింది.

సుందర్రావు బంధువులు పాతికమంది దాకా వచ్చారు. మరో పాతికమంది బెజవాడ మిత్రులు. గోరా గారి అధ్యక్షతన, శారద నిర్వహణలో ఆనందంగా జరిగిపోయింది.

పెళ్ళయిన మర్నాడే స్వరాజ్యం, సుందర్రావులు విశాఖపట్నం వెళ్ళిపోయారు. అన్నపూర్ణ గురించి ఆలోచిస్తూంటే శారదకు కులం ఎంత పెద్ద సమస్యో అర్థమయింది. “ఇన్నాళ్ళూ ఆడవాళ్ళే అన్నిటిలో అధమస్థానంలో ఉన్నారనుకున్నాను. మాల మూదిగలు, వృత్తి కులాల వాళ్ళు, అక్కడ స్త్రీలూ — అసలు జరగవలసిన పనంతా అక్కడే ఉంది. కులాలు లేనట్టు నటించటమే స్వతంత్రోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమాలూ నేర్పాయా? అంబేద్కర్ని మళ్ళీ చదవాలి” అనుకుంది శారద.

************

విశాఖపట్నం వెళ్ళి స్వరాజ్యాన్ని చూడాలి అనుకుంటూనే అయిదు నెలలు గడిచి పోయాయి. వెళ్ళి వాళ్ళకు కావలసిన సామాను కొనిచ్చి రావాలనేది శారద ఆరాటం. శారద రేపా మాపా అని ఆలోచిస్తుండగానే స్వరాజ్యం వచ్చేసింది. ఉత్తరమన్నా రాయకుండా దిగిన ఆ పిల్లను చూస్తే శారదకు విషయం అర్థమయింది. ఐనా పైకేమీ మాట్లాడకుండా

“ఎప్పటికప్పుడు విశాఖపట్నం రావాలనుకుంటూనే ఆలస్యమైంది” అంది.

స్వరాజ్యం నవ్వి పర్లేదులే పెద్దమ్మా మేం బాగానే ఉన్నాం.

ఏ అవసరం వచ్చినా నీకు ఉంతరం రాయనా?” అంది శారద హాస్పిటల్కి బయలు దేరుతుంటే నేనూ వస్తాను పెద్దమ్మా అంది తప్పు

చేసినట్లు,

“ఇద్దరూ హాస్పిటల్కి వెళ్ళారు. శారద ఇన్ పేషెంట్స్ని చూసి వస్తానని వెళ్ళింది.

ఓ గంటలో కన్సల్టింగ్ రూంకి వచ్చేసరికి స్వరాజ్యం దిగులుగా కూచుని ఉంది.

“ఎన్నో నెల? శారద కుర్చీలో కూచుంటూ అడిగింది.

“మూడో నెల అనుకుంటా”

“అనుకుంటా బుద్ధిలేదూ? ఎమ్.ఎస్.సి. చదివావు. కాస్త జాగ్రత్త పడలేక పోయావా??

“ఎబార్షన్ కుదరదా పెద్దమ్మా

 

జీవితంపై ప్రేమను పెంచే జయకాంతన్

 

 

– సి.ఎస్. రాంబాబు

~

ఈ మధ్య కాలంలో హైదరాబాద్ మహానగరంలో సాహిత్య సభలే కాకుండా ప్రతి ఆదివారం ఒక సాహిత్య సమావేశాన్ని జరుపుకునే ఒక సత్సాంప్రదాయం ఒకటి మొదలయింది. అదొక శుభ పరిణామం. గత పదకొండు నెలలుగా ‘ఛాయ’ సంస్థ ప్రతినెలా మొదటి ఆదివారం సాయంత్రం 5 గంటల 30 నిముషాలకు నిర్వహిస్తున్న సాహిత్య సమావేశాలు కొత్త తరహాలో ఉంటూ కొత్త ఒరవడికి నాంది పలుకుతున్నాయి. అంటే అతిశయోక్తి కాదేమో ! సమావేశానికి వారెంచుకునే అంశాలే దానికో ప్రాతిపదికను కల్పిస్తున్నాయి.

ఈ నెల 3వ తేదీన హైదరాబాద్ స్టడీ సర్కిల్ లో తమిళ రచయిత ‘జయకాంతన్’ కధలపై సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ఎవరు సమర్ధులు అంటే జయకాంతన్ గారితో సన్నిహిత సంబంధం కలిగిన సాహితీవేత్త మధురాంతకం నరేంద్రని మించిన ఛాయిస్ మరొకరుండరేమో ! ఎప్పటిలాగే సమావేశానికి సబంధించి ఒక చక్కటి పోస్టర్ ని డిజైన్ చేయించారు ‘ఛాయ’ సంస్థ వారు. చర్చనీయాంశమెంత ఆసక్తిగా ఉందో చూడండి … నేనేం చేయను చెప్పండి … మరికొన్ని విశేషాలు’

కధను సీరియస్ గా తీసుకునే వాళ్ళందరూ ఏదో ఒక సమయంలో జయకాంతన్ ను ఏదో ఒక రకంగా వంట పట్టించుకున్నవారే. ఇతర భాషలలో కూడా ఎంతో గౌరవాన్ని పొందిన రచయిత జయకాంతన్.

జయకాంతన్ గారి కధలను తొలిసారిగా తెలుగులో అనువదించిన వ్యక్తి మా నాన్న మధురాంతకం రాజారాం అంటూ తమ ప్రసంగాన్ని మొదలుపెట్టారు మధురాంతకం నరేంద్ర. 1975 ప్రాంతంలో నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ఆ పనిని మా నాన్న కప్పగించారు. అప్పటికే వారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. ఒక విధంగా జయకాంతన్ అనువాదానికి అంత తొందరగా లొంగని వ్యక్తి. అలాంటి వ్యక్తిని మా నాన్న అనువదించారు. మా నాన్న తొలి అనువాదకుడయితే నేను తెలుగులో జయకాంతన్ రచనల తొలి పాఠకుడిని. అప్పటికి నా వయస్సు పద్దెనిమిదేళ్ళు. ఆ పద్దెనిమిదేళ్ళ నవ యువకుడిని ఉత్కంఠంతో మరో ప్రపంచంలోకి లాక్కుపోయిన కధలివి.

ఒక విధంగా నాకు బాల్య స్మృతి వారి రచనలు చదవటం.

200 కధలు, 40 నవలలు, 4 సాహిత్య వ్యాసాల సంకలనాలతో జయకాంతన్ సాటి రచయితలందరూ అసూయపడేంతగా రాసిన వ్యక్తి. 1932వ సంవత్సరంలో కడలూర్ లో పుట్టిన జయకాంతన్ ని ఒక సందర్భంలో కలుసుకోవడం జరిగింది. ఈ ఒక్క మాట మీకు చెప్పి వారి కధలను కొన్ని మీకు పరిచయం చేస్తాను.

జయకాంతన్ గారి నవలలు కొన్నింటిని సినిమాలుగా చేయటం జరిగింది. అలాంటి ఒక నవల ‘ఒరు నడిగ్తే నాడిగం పాకులాం’. ఇది సినిమాగా వచ్చిన వారి నవల. ఐదు నిముషాల నిడివి వున్న ఒక దృశ్యం చూడగానే నవలే చదువుదామనిపించింది. ఆ నవలను ఒక మిత్రుడు అనువాదం చేశాడు. తెలుగులో దాని పేరు “కళ్యాణి వెడ్స్ దివాకరం”. వారి నవలకు వారు పెట్టిన పేరును తెలుగులో చెప్పాలంటే ‘ఒక నటి నాటకం చూస్తోంది’ ఎంత బావుందో చూడండి.

ఆ అనువాద మిత్రునితో కలసి నేను కూడా మద్రాసు (చెన్నై) వెళ్లి జయకాంతన్ గారిని కలవడం జరిగింది. మా ప్రయత్నం వారిని ఇంటర్వ్యూ చేయాలని. వారిదో మధ్యతరగతి ఇల్లు. పైన ఒక చిన్న పాక వేసుకుని వున్నారు వారు. ఆయన అక్కడే కూర్చుని రాసే వారు. ఒక్క మాటలో చెప్పాలంటే రోడ్డు పక్కన టీ కొట్టులా వుంది వారిల్లు. దేన్నీ దాచుకోవడం వారి జీవితంలో లేదు. మాడు గంటల సేపు వారితో గడిపాం.

వారితో అలా అంత సేపు మాట్లాడిన తర్వాత వారి కథల మీద గౌరవం పెరిగింది. గళ్ళ చొక్కా, లుంగీ ఇదీ వారి డ్రెస్ కోడ్. అరమరికలు లేకుండా మాతో ఎన్నో విషయాలు మాట్లాడాడాయన. మాతో మాట్లాడినంత సేపూ మీసాన్ని తిప్పుతూనే ఉన్నాడాయన. మీసమున్న కధా వీరుడనిపించాడు నాకు.

నాలుగు నెలల క్రితం కృష్ణమోహన్ గారు, అనిల్ బత్తుల గారు ఫోన్ చేసి మీరు ‘ఛాయ’ సంస్థలో జయకాంతన్ గారి గురించి మాట్లాడాలి అన్నప్పుడు మళ్ళీ రీ-రీడింగ్  చెయ్యగలిగే అవకాశం వచ్చిందని ఆనందపడ్డాను. వారి కధల్ని చదువుకోవటమంటే మనల్ని మనం చదువుకోవటమే. ఆయనొక సార్వజనీన రచయిత. ఈ పుస్తకంలో 16 కధలున్నాయి. అన్నీ మోడరన్ ఉపనిషత్తు కధల్లా వుంటాయి.

ఇలా జయకాంతన్ కధల గురించి వారితో పరిచయం గురించి కొన్ని పరిచయ వాక్యాలు మాట్లాడి మధురాంతకం నరేంద్ర వారి ప్రసంగాన్ని రెండు భాగాలుగా కొనసాగించారు. మొదటి భాగంలో వారు కధలని విశ్లేషిస్తూ వెళ్లారు. ఆ తర్వాతి భాగం జయకాంతన్ కధలకు సంబంధించి కొన్ని అబ్జర్వేషన్స్ లేదా పరిశీలనలతో సాగింది. ఒక స్రష్ట చూసిన ప్రపంచం తెలియాలంటే జయకాంతన్ పుస్తకాలు చదవాలంటారు నరేంద్ర.

వారు విశ్లేషించిన కధలలో మొదటిది ‘గురుపీఠం’. ఒక సత్రంలో ఒక బిక్షగాడు. పశుప్రాయుడు. నిత్యం ఎవరు ఏది పెడతారా అని ఆశగా చూసేవాడు. పాచిపోయిన ఆహారం తప్పితే మరొకటి తెలియని వాడు. నిత్యం పుసులు గట్టిన కళ్ళతో వుండే వాడికి ఒకరోజొక ఆకారం నమస్కారం చేస్తుంది. మీరేనా గురువంటుంది. అలా ఆ ఆకారం నేను మీ శిష్యుడిని అని ఈ బిచ్చగాడు ఏది చెప్పినా దాన్నో అధ్బుతంగా భావిస్తూ ఉంటాడు. బిచ్కగాడు ఆకాశంకేసి చూస్తూ వుంటే ఆకాశం శూన్యమని ఎంతబాగా సెలవిచ్చారంటాడు. పాచిపోయిన ఆహారం తినేవాడికి పులిహోర, దద్దోజనం పట్టుకొస్తాడు. క్రమంగా గురువు ఖ్యాతిని పెంచుతాడు. ఎవరు ఎవరికి శిష్యుడు అన్న అనుమానం ఈ బిచ్చగాడికి వస్తుంది. గురుస్థానంలో కూర్చొన్న బిచ్చగాడికి ఒకరోజున శిష్యుడు కనిపించటం మానేస్తాడు. గురు స్థానంలో తనని కూర్చోపెట్టిన ఆ శిష్యుడి పేరేమిటో తెలియదు. వాడి కోసం వెతుకుతూ ఉంటాడు.

ఇలా గురుపీఠం కోసం మనం ఎలా సిద్ధంగా చెబుతాడు జయకాంతన్.

అగ్నిప్రవేశం : సీత పేరు తీసుకురాకుండా ఆధునిక స్త్రీ రోజూ చేసే అగ్నిప్రవేశం గురించి చెబుతాడు జయకాంతన్. ఒక విధంగా చెప్పాలంటే జయకాంతన్ వన్నీ నవలికల్లాంటి కధలు. ఒక స్త్రీ బస్సు కోసం ఎదురుచూస్తోంది. భోరున వర్షం. సడన్ గా ఒక కారొచ్చి ఆగుతుంది. ఒక అపరిచితుడు ఆమెను కారులో తీసుకువెళతాడు. ఆ కారంటే ఆమెకు ఎంతో ఆకర్షణ కలుగుతుంది. అక్కడేం జరుగుతుందో జయకాంతన్ స్పష్టంగా చెప్పడు. కానీ జరగకూడనిదేదో జరిగిందని మనకు అర్ధమవుతుంది. ఆ వ్యక్తే ఆమెను ఇంటికి దూరంగా దింపేసి వెళ్లిపోతాడు. ఇంటికి చేరుకోగానే తల్లి మీద పడి ఏడుస్తుంది. తల్లి ఏమీ మాట్లాడకుండా బాత్రూంకు తీసుకెళ్ళి నాలుగు బకెట్ల నీరు కూతురిపై కుమ్మరిస్తుంది. నీకేం జరగలేదంటుంది.

జయకాంతన్ గొప్పదనం ఎక్కడుంటుందంటే ఒక కధలో చెప్పకుండా దాచిన విషయాలుంటాయి, తెలిసే చెప్పకుండా దాచిన విషయాలుంటాయి, సార్వజనీన విషయాలుంటాయి అన్న భావన మనకు స్ఫురింపచేస్తాడు. ఈ కధలో నయాసంపన్న వర్గం పై మనకున్న మోజును పరిచయం చేస్తాడు.

ఎవరి ఆంతర్యం వారిదే : ఈ కధలో ఒక ప్రొఫెసర్, ఆయన భార్య పల్లెటూరిలో తాతా, నాయనమ్మల దగ్గర పెరిగే వారబ్బాయి మనకు తారసపడతారు. పెద్దయిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరకు వస్తాడు ఆ కొడుకు. తండ్రి ఎవరో ఒక స్త్రీతో తిరగడం చూస్తాడు. కొంత నిఘా పెట్టి రెడ్ హాండెడ్ గా పట్టుకుంటాడు. నువ్వు చేసేది తప్పని తండ్రికి హితబోధ చేస్తాడు. విషయాన్ని తల్లికి చెబుతాడు. అప్పుడా తల్లి మీ నాన్న జీవితం మీ నాన్నది, నా జీవితం నాది, ఎవరి ఆంతర్యం వాళ్ళది, నువ్విక్కడినుంచి వెళ్లిపో అంటుంది. సంప్రదాయం, విలువలు గురించి చెప్పబోయిన ఆ కుర్రవాడు ఒక ఉత్తరం రాసి వెళ్లిపోతాడు.

భార్యా, భర్త ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. ఆయన సిగ్గుగా నవ్వుతాడు. ఆ తర్వాత జరిగిన విషయాలు వారి ఆంతరంగిక విషయాలు అంటాడు జయకాంతన్. ఇలా ఒక చిన్న ముగింపు వాక్యంతో మనల్ని ఆలోచనల్లో పడేస్తాడు జయకాంతన్.

ఆత్మదర్శనం : 70 – 80 ఏళ్ల సాంప్రదాయ బ్రాహ్మణ తండ్రి ఒకరోజు ఇంట్లోంచి మాయమయిపోతాడు. సరే తండ్రి కోసం కొడుకు వెతకటం మొదలు పెడతాడు. ఈలోగా తండ్రొక ఉత్తరం రాస్తాడు నువ్వు చెప్పే మంత్రాలకు అర్ధం నీకు తెలుసా అని మా గురువు గారు బజారులో నన్ను నిలదీశాడు అని. అవమానం ఫీలయి జంధ్యం తీసేసి ఆ ముసలాయన వెళ్లిపోతాడు. ఇది మన చేత జయకాంతన్ చేయించే ‘ఆత్మ దర్శనం’

పొరపాట్లు నేరాలు కావు : నాగరాజు అనే ధనవంతుడి దగ్గర కేథరిన్ అనే స్టెనో పనిచేస్తూ వుంటుంది. నాగరాజు ఇంట్లోనే కన్నయ్య అనే మిత్రుడు ఉంటూ ఉంటాడు. కేథరిన్ చనువును అపార్ధం చేసుకుంటాడు నాగరాజు. ఆ ఆమ్మాయి ఏడుస్తూ వెళ్లిపోతుంది. ఇంటికి వెళ్లి ఆ అమ్మాయిని క్షమించమంటాడు. మీలో మా నాన్నను చూసుకున్నాను అంటుందా అమ్మాయి. ఈలోగా కన్నయ్య ఒక ఐదువందల రూపాయలు కొట్టేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత తిరిగొచ్చేసి ఆ డబ్బు కూడా ఇచ్చేసి నేనెందుకు ఈ పని చేశానో తెలీదు, క్షమించు అంటాడు. స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్ అయిన ఆ ధనవంతుడు ‘క్షమింపబడిన వాళ్లే క్షమిస్తారు’ అని అన్నాడని కధను ముగిస్తాడు జయకాంతన్. ఇలా ముగింపు వాక్యంతో కధను నిలబెడతాడు జయకాంతన్.

మూతబడిన ఇల్లు : తను ఏం చూసినా కధగా మలచగలిగే శక్తి జయకాంతన్ ది. ఒక ఆల్కెమీ ఏదో ఆయనకు తెలుసు. ఒక పాత ఖైదీ శిక్ష అనుభవించిన అనంతరం ఒక ఇల్లు కొనుక్కుంటాడు కానీ ఎవరూ అతన్ని ఆదరించరు. ఒక నాలుగేళ్ల పిల్ల మాత్రం అతనితో కబుర్లు చెబుతూ ఉంటుంది. ఆ పిల్లకి అతను చాక్లెట్లు అవి కొనిపెడుతూ ఉంటాడు. చివరికి అతను ఈ నిరాదరణ భరించలేక అక్కడ్నించి వెళ్లిపోతాడు. ఇప్పుడు కూడా ఆ పిల్ల ఆ ఇంట్లోకి తొంగి చూస్తూ వుంటుంది అని జయకాంతన్ కధని ముగిస్తాడు.

మౌనం ఒక భాష : ఇదో చదివితీరవలసిన కధ. అరవై ఏళ్ల వయసులో గర్భం దాల్చుతుందో స్త్రీ. పిల్లలకి పిల్లలు వచ్చే ఈ వయసులో ఈ ఖర్మేమిటి అని బాధపడుతూ వుంటుంది. అప్పుడు కొడుకు తల్లిని ఇంట్లో ఉన్న పనసచెట్టు దగ్గరకు తీసుకు వెళతాడు. పనస చెట్టు మొదళ్ళ దగ్గర కూడా కాయలు కాస్తుంది అని ఓదారుస్తాడు. నువ్వు సిగ్గుపడాల్సిన విషయం కాదమ్మా అంటాడు.

కొత్త చెప్పులు కరుస్తాయి : అతనికి కొత్త భార్య వచ్చింది. కానీ ఆ భార్య అనుకూలంగా లేదు. పెళ్ళయి ఆర్నెల్లు కాలేదు పెడముఖంగా ఉంటుంది. అతను వెళ్ళిపోతే హాయిగా ఫీలవుతూ ఉంటుంది. అతనది అవమానంగా భావిస్తాడు. పాత స్నేహితురాలు గుర్తుకు వస్తుంది. పెళ్ళికి ముందు ఆ స్నేహితురాలుతో కాలం కలిసి ఉంటాడు పెళ్లి మీద ప్రేమ పుట్టిస్తుందావిడ. మళ్ళీ ఆవిడని చూద్దామని వెళతాడు. తన గోడు చెప్పుకుంటాడు. నీ భార్యకు సంసారానికి అనుభవం లేదు నాకనుభవం వుంది అంటుంది. కొత్త చెప్పులు కరుస్తాయని పాత చెప్పులే వేసుకుంటామా అంటుంది. ఆవిడ వంక చూసి అతను భోరుమని ఏడుస్తాడు. ఎందుకు ఏడ్చాడో ఆలోచించమంటాడు జయకాంతన్. మానసిక సంఘర్షణలను ఒక్క మాటలో రాస్తాడు జయకాంతన్ అంటాడు నరేంద్ర.

ఇలా కధలను విశ్లేషించి జయకాంతన్ కధలకు సంబంధించి కొన్ని అబ్జర్వేషన్స్ ఆ రోజు సభలో సభికుల ముందుంచారు. కొన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను.

జయకాంతన్ తనదయిన శైలిలో traditional పధ్ధతిలో కధలు చెబుతాడు. వారి కధలలో విశ్వాసాలుండవు. చిన్న విషయాన్ని కూడా పెంచుతూ రాయటం ఆయనకలవాటు. ఆయనో ప్రొఫెషనల్ రైటర్. కధని నవలగా, నవల నుంచి మరో నవలను సునాయాసంగా మలిచేవాడు.

ఎక్కడ దృశ్యమానం చేయాలో తెలిసినవాడు. కధలో కధ చెప్పే వ్యక్తి tone మాత్రమే విన్పిస్తాడు. అయితే 60, 70 దశకాలలో రాసినవి కాబట్టి నిడివి ఎక్కువే ఉంటుంది. అలంకారాలేవీ లేకుండా లిరికల్ గా కధలు రాస్తాడు జయకాంతన్. కధలోని ముగింపుతో ఒక effect సాధించడం ఒక్క జయకాంతన్ కే సాధ్యం.

హృదయాన్ని, మేధస్సును సమన్వయపరుస్తూ రాయటంలో జయకాంతన్ సిద్ధహస్తుడు. ఆయన కధలన్నింటిలో మనిషే కేంద్రకం. అణగారిన జీవితాలు, జీవితాల్లో వుండే చీకటి కోణాలపై టార్చి లైట్ లా కధను ఫోకస్ చేయటం ఆయన ప్రత్యేకత. ఈ రోజుకీ చెన్నై రైల్వే స్టేషన్ లోనూ, బస్ స్టాండుల్లోనూ ఆయన పాత్రలు సజీవ సాక్ష్యాలుగా మనకు సాక్షాత్కరిస్తాయి.

కధలను స్టోరీస్ ఆఫ్ ఐడియాస్, స్టోరీస్ ఆఫ్ ఆర్ట్ పద్ధతిలో చెబుతారు. జయకాంతన్ ది రెండవ పద్ధతి. ఒక ఆదర్శాన్ని తీసుకుని దానికి పాత్రలు తయారుచేసి కధలు రాయటం ఆయనకి అలవాటు.

అయితే ఆయన కధలలో కొంచెం కృత్రిమత్వం ఉందేమో అని ఇప్పుడు తోస్తోంది. స్టోరీస్ ఆఫ్ ఐడియాస్ పద్ధతిలో రాసేవారిలో ఆ సమస్య ఉంటుంది. కొన్నిచోట్ల పునరుక్తులు కూడా ఉంటాయి.

ఐతే జయకాంతన్ వ్యక్తిత్వ ముద్ర ఆయన కధల్లోని ముగింపులో ఉంటుంది. ఆ కధల్లో ఒక నిశబ్ధం ఉంటుంది. అది కధల వైశాల్యాన్ని మరింత విస్తృత పరుస్తుంది. రెండోసారి ఈ కధలను చదివినప్పుడు జయకాంతన్ మరింత స్పష్టాస్పష్టంగా అర్ధమయ్యాడు. ఆయన కధలు పెద్దవి అవడం వలన అనువాదాలలో వుండే క్లుప్తత ఒకోసారి ఆత్మను మింగేసింది. ఓహెన్రీ కూడా అలాంటి దురదృషవంతుడే.

విస్తృతంగా రాసినప్పుడు తనను తానే imitate చేసుకునే దుస్థితి ఎప్పుడూ ఆయనకు ఎదురవ్వలేదు. ఒక structural unity ఎప్పుడూ ఆయన రచనలో కనిపిస్తుంది. ఐతే అన్వయములేని పెద్ద పెద్ద వాక్యాలు జయకాంతన్ రాస్తారన్న అభిప్రాయం ఒకటుంది. అందువలన అనువాదానికి అంత తొందరగా లొంగడాయన.

*