Archives for October 2014

పాటను తూటాగా మలిచిన సుద్దాల

kaifiyath

sangisetti- bharath bhushan photoఆనాటి తెలంగాణ సాయుధ రైతాంగ సమరంలోనూ, తర్వాతి ప్రజా పోరాటాల్లోనూ, నేటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ ‘దూమ్‌ ధామ్‌’ చేసి ప్రజల గొంతులో నిలిచిపోయిన ఆయుధం పాట. మౌఖిక సంప్రదాయంలో మాట, ముచ్చట, ఉపన్యాసం ఏవీ చేయలేని పని పాట చేసింది. ఈ పాటతో ఉద్యమాలను పదునెక్కించడమే గాకుండా పోరాట స్ఫూర్తిని ప్రజల హృదయాల్లో నింపింది సుద్దాల హనుమంతు. ఆనాటి ఉద్యమంలో పాటను రాసి, బాణిలు కూర్చి, పాడిన వారిలో సుద్దాల హనుమంతు అగ్రగణ్యులు. ఆయనతో పాటు తిరునగరి రామాంజనేయులు, రాజారాం, యాదగిరి లాంటి ఎందరో వాగ్గేయకారులు తమ పాటలను కైగట్టిండ్రు. బండి యాదగిరి అయితే పాట పాడుతూ పాడుతూనే ‘రాజ్యం’ తుపాకి తూటాలకు అమరుడయ్యిండు. నేటి తరం పాటకవులు/గాయకవులు/గాయకులు-కవులకు దక్కిన ఖ్యాతి గౌరవం వారికి దక్కలేదు. తెలంగాణలో పాటను ప్రజల వద్దకు, ప్రజల్ని ఉద్యమాల దారి వైపు మళ్లించి తన జీవిత కాలంలో ఎలాంటి గౌరవానికి నోచుకోకుండా అంతర్ధానమైన మనీషి సుద్దాల హనుమంతు.

ఆర్యసమాజమిచ్చిన ‘చైతన్యం’తో ఆంధ్రమహాసభ ఉద్యమాల్లో, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఒకవైపు ఆయుధం ఎక్కుపెట్టి, మరోవైపు  కలాన్ని కదంతొక్కించి, గళాన్ని వినిపించిన యోధుడు సుద్దాల హనుమంతు. గజ్జెగట్టి జానపద కళా రూపాలను జనజాగృతికి వినియోగించాడు. బుర్రకథల ద్వారా జనాన్ని ఉర్రూత లూగించాడు. పాటను తూటాగా చేసి దోపిడి వ్యవస్థపై పేల్చిన ప్రజాకవి. ప్రజల పదాలనే పాటలుగా మలిచి వారి బాణిలోనే వాటికి శాశ్వతత్వాన్ని చేకూర్చిన ప్రజ్ఞాశాలి. ప్రజాకళల్లోనే పోరాట సాహిత్యాన్ని ప్రచారం చేసి ఉద్యమానికి ఊపిరి పోసిండు. కళను ప్రజలకు అంకితమిచ్చి తాను నిశ్శబ్దంగా, నిషీధిలోకి జారుకుండు. వందల సంఖ్యలో వెలువరించిన గేయాలు, పాటలు తన జీవిత కాలంలో పుస్తకంగా అచ్చుకు నోచుకోలేదు. తెలంగాణ సాయుధ పోరాట సమరంలో కళా రంగంలో ముందుండి ప్రజలను పోరాట పథం వైపు నడిపించిన మార్గదర్శి. మాభూమి సినిమా ద్వారా ‘పల్లెటూరి పిల్లగాడా, పసుల గాచె మొనగాడ’ పాటతో ఎనుకటి తెలంగాణను సాక్షాత్కరించిండు.

తెలంగాణలో ఆంధ్రమహాసభకన్నా ముందు ప్రజల్లో చైతన్య జ్యోతులు వెలిగించింది ఆర్యసమాజం. కాళోజి, పి.వి.నరసింహారావు, కేశవరావు కోరట్కర్‌, వినాయకరావు విద్యాలంకార్‌ మొదలైన వారంతా మొదట ఆర్యసమాజీయులే. ఈ ఆర్యసమాజ ప్రభావం తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా బాగానే ఉండిరది. హైదరాబాద్‌లో నిజాం నవాబుల ఆస్థాన వైద్యుడిగా పనిచేసిన హకీమ్‌ నారాయణదాసు తెలంగాణలో పద్మశాలీయులు ఆయుర్వేద వైద్యాన్ని వృత్తిగా స్వీకరించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈయన ప్రోత్సాహంతోనే తెలంగాణలోని దాదాపు ప్రతి గ్రామంలో పద్మశాలీయులు 1956కి ముందు ఆయుర్వేద వైద్యులుగా ఉండేవారు. అలాగే నల్లగొండ జిల్లా రామన్నపేట తాలూకా పాలడుగు గ్రామానికి చెందిన హనుమంతు తండ్రి కూడా ఆయుర్వేద వైద్యుడిగా పనిచేసేవారు. హనుమంతు తర్వాతి కాలంలో భువనగిరికి దగ్గరలోని సుద్దాల గ్రామంలో స్థిరపడ్డాడు. చిన్ననాటి నుంచే హరికథలు, పాటలు, నాటకాలంటే ఆయనకు చాలా ఇష్టం. హరికథలు చెప్పే అంజనదాసు శిష్యుడై, ఆయన బృందంలో చేరిండు. మరోవైపు ప్రాణాయామం, యోగాభ్యాసాలు కూడా అలవాటు చేసుకుండు. అలాగే భువనగిరిలో ఉండే ఉత్పల వెంకటరావు అచలబోధ ఒక వైపు, ఆర్యసమాజ బోధనలు మరోవైపు చేస్తూ ఉండేవాడు. ఉత్పల శిష్యుడిగా మారిన హనుమంతు ఆర్యసమాజ ప్రభావానికి లోనయి దయానంద సరస్వతి జీవిత చరిత్ర, సత్యార్థ ప్రకాశ మొదలైన గ్రంథాలు చదువుకున్నాడు. ఆర్యసమాజ్వారు నిజాం ప్రభుత్వ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడం బాగా నచ్చింది. దాంతో తాను చిన్నప్పటి నుంచీ చూస్తూ వస్తున్న దుర్మార్గాలపై తిరగబడేందుకు గుండె ధైర్యాన్నిచ్చింది. తన చిన్నతనంలో ఊర్లో భూస్వాములు, ప్రభుత్వాధికారులు వెనుకబడిన వర్గాలు, మాల, మాదిగల చేత నిర్బంధ వెట్టిని చేయించడం కండ్లార చూసిన వాడు కావడంతో వారి పట్ల సానుభూతితో, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా, దళితులకు అండగా నిలిచాడు. విధవా వివాహాలను కూడా జరిపించిండు. ఆర్యసమాజం ప్రభావంతో తాను స్వయంగా ఒక దళిత యువతిని పెండ్లి చేసుకుండు. రెండేండ్లు దళితులకు చదువు చెబుతూ వరంగల్లులో గడిపిండు. అయితే హనుమంతు సామాజిక, రాజకీయ రంగాల్లో ఉండి కుటుంబానికి తగినంత సమయం కేటాయించలేక పోవడం, సమాజం నుంచి సూటి పోటీ మాటలు భరించలేక ఆమె దూరమయింది. కొన్ని రోజులు హైదరాబాద్లోని బుద్వేల్లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో అటెండర్ఉద్యోగం చేసిండు.

untitled

కాని స్వతంత్ర భావాలు గల హనుమంతుకు ఆ ఉద్యోగం నచ్చక దానికి రాజినామా ఇచ్చిండు. ఆధ్యాత్మికం మీద హనుమంతుకు ఎక్కువ మక్కువుండేది. మిత్రుడు ఆంజనేయులుతో కలిసి మన్నెంకొండలో కొన్ని రోజులు తపస్సు చేసిండు. భజనలు, కీర్తనల ద్వారా భక్తి రసాన్ని పంచిండు.

ఆర్యసమాజమిచ్చిన చైతన్యంతోనే 1944లో భువనగిరిలో జరిగిన ఆంధ్రమహాసభ సమావేశాల్లో క్రియాశీల కార్యకర్తగా వ్యవహరించిండు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, వట్టికోట ఆళ్వారుస్వామి, పెండెం వాసుదేవ్‌ లాంటి పెద్దల ఉపన్యాసాలతో ప్రభావితుడై తోటి ప్రజల బాగోగుల కోసం ఆయుధం చేతపట్టిండు. ఉద్యమారంభ దశలో కార్యకర్తగా సుద్దాల చుట్టుపక్కల గ్రామాల్లో సంఘాలు స్థాపించి, సభలు సమావేశాలు నిర్వహించేవారు. ఒక చేత్తో ఎర్రజెండా మరో చేత్తో కాంగ్రెస్‌ జండాలు ఊరూరా ఎగరేసేవారు. క్రమంగా ఆంధ్రమహాసభ ఆధిపత్యం మొత్తం కమ్యూనిస్టుల అధీనంలోకి వెళ్లడంతో సుద్దాల కూడా కమ్యూనిస్టుగా మారాడు. ఈ దశలో కమ్యూనిస్టు పార్టీ కూడా ఆయనకు కళారంగాన్నే అప్పగించింది. అప్పటి నుంచి  ప్రజలకు సుపరిచితమైన ప్రక్రియల్లో ప్రదర్శనలు ప్రారంభించాడు. విచిత్ర వేషాలు, ‘గొల్లసుద్దులు’, ‘లత్కోరుసాబ్‌’, ‘బుడబుక్కలు’, ‘ఫకీరు వేషం’, ‘సాధువు’ మొదలైన కళా రూపాల ద్వారా పీడిత వర్గాల బాధల్ని, భావాల్ని వ్యక్తీకరించాడు. ప్రజారంజకమైన బాణీల్లో పాటలు కైగట్టి జనాన్ని ఉర్రూతలూగించాడు. సమస్యల్ని అన్ని కోణాల్నుంచి పరిశీలించి ప్రజల హృదయాలకు అత్తుకునేలా, విన్న వారు గుత్పందుకునేలా ఆయన పాటలుండేవి. ఎవరో రాసిన పాటలకన్నా స్థానిక  అవసరాన్ని బట్టి అందుకు అనుగుణంగా మనమే పాటలు రాసి దాన్ని ప్రజలకు హత్తుకునే ప్రక్రియల్లో ప్రదర్శించడం మేళని తలచి ఆచరణలో పెట్టిన ప్రజాకవి, కళాకారుడు సుద్దాల. వివిధ కళా రూపాల్లో ఎంతో మందికి శిక్షణనిచ్చాడు. వారిని సాంస్కృతిక దళాలుగా ఏర్పాటు చేసిండు. ‘బండెన్క బండి కట్టి’ పాట రచయిత యాదగిరి కూడా హనుమంతు బృందంలోని వాడే. సుద్దాల గ్రామసంఘం కార్యదర్శిగా పనిచేస్తూ గంగుల శాయిరెడ్డి, గవ్వా సోదరులు, దాశరథిల గేయాల్ని పాడుకునేవాడు. ఈ దశలో భూమికొలతల్లో భూస్వాములు చేస్తున్న మోసాన్ని గ్రహించి క్షేత్రగణితాన్ని నేర్చుకొని ఊళ్లలో భూమికొలిచే పనులు తానే చేపట్టే వాడు. దీంతో అప్పటి వరకు అన్యాయానికి గురైన పేద వర్గాలకు హనుమంతు న్యాయదేవతలా కనిపించాడు.

గ్రామం నుంచి సాంస్కృతిక ప్రదర్శనలిచ్చేందుకు వివిధ ప్రదేశాలు తిరగాల్సి రావడం, ఒక్కోసారి ప్రదర్శనకు కాపలగా సాయుధ దళం పనిచేసేది. దళాలు కూడా చేయలేని పనిని తన కలం, గళం ద్వారా సుద్దాల చేసేవాడు. ఈ దశలో హనుమంతుకు ‘ఎర్రబోళ్లు’ అడవిలో సాయుధ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆనాటి నుంచి గన్నూ, పెన్నూ రెండింటి ద్వారా ప్రజా యుద్ధంలో నిలిచిండు. 1948లో హైదరాబాద్‌పై పోలీసు యాక్షన్‌ తర్వాత అనారోగ్య కారణాల వల్ల బొంబాయిలో కొద్దికాలం గడిపిండు. తిరిగి 1952 ఎన్నికల ముందు తెలంగాణకు చేరుకున్న హనుమంతు తమ నియోజకవర్గానికే చెందిన నాయకుడు రావి నారాయణరెడ్డి, సుంకం అచ్చాలు  గెలుపు కోసం ఊరూరా సభలు, సమావేశాలు నిర్వహించి తన పాటల ద్వారా ఎన్నికల ప్రచారం చేసిండు. రావి నారాయణరెడ్డి దేశంలోనే అత్యధిక మెజార్టీతో పార్లమెంటుకు ఎన్నికయిన విషయం తెలిసిందే. 1952 తర్వాత కేవలం ఎన్నికల పాటలకే పరిమితమై మునుపటి లాగా గొప్ప సాహిత్యాన్ని సృజించ లేక పోయాడు. దేశంలో అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగం కూడు, గూడు దక్కాలని, అలాంటి వ్యవస్థ కోసం ప్రజాకవులు, ఉద్యమకారులు కదం తొక్కాలని ఆయన అభిప్రాయ పడేవారు.

హనుమంతు పాటల్లో యతిప్రాసలు అచేతనంగా పడేవి. పల్లెటూరి పిల్లగాడ, రణభేరి మ్రోగింది తెలుగోడ, వేయ్‌ వేయ్‌ దెబ్బ, ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, కన్నులో భగా భగా కడ్పుల్లో ధడా ధడా, భళిరె తెలంగాణ వహరె తెలంగాణ ఇలా ఎన్నో పాటలు ఆయనకు పేరు తెచ్చాయి. హనుమంతు రాసిన 22 పాటల పుస్తకం సాహితీ సర్కిల్‌ వారు ప్రచురించిండ్రు. వాటినిప్పుడు క్యాసెట్‌ రూపంలో తీసుకొచ్చినట్లయితే అందరికీ అందుబాటులోకి ఆయన పాటలు రావడమే గాకుండా, 1945-50ల నాటి పోరాటాన్ని కూడా అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది. తెలంగాణ కళారూపాలకు జీవంపోసి సాంస్కృతిక పునరుజ్జీవనానికి దారులు వేసిన హనుమంతు, 1982 అక్టోబర్‌ 10న క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ ‘సుద్దాల’ గ్రామంలో తుది శ్వాస విడిచాడు. అప్పుడాయన వయసు సుమారు 74 ఏండ్లు.

‘‘……… సుద్దాల హనుమంతుగారికి నాటి అరసంలో గాని, ప్రజానాట్యమండలిలో గాని కవిగా అంత గుర్తింపు రాకపోయినా తన కలాన్ని, గళాన్ని నడిపించాడు. పేరు ప్రఖ్యాతుల కోసం కాకుండా తన చుట్టూ ఉన్న ప్రజల అవసరాల కోసం మాత్రమే సాహిత్యాన్ని సృష్టించాడు’’. అని సుద్దాల హనుమంతు రచనలపై అధ్యయనం చేసిన ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమలరావు తాను సంకలనం చేసిన ‘సుద్దాల హనుమంతు పాటలు’ పుస్తకంలో పేర్కొన్నాడు. ‘‘ప్రజలు కవిగా గుర్తించినా పార్టీ గుర్తించలేదని’ సుద్దాల ఒక ఇంటర్వ్యూలో వాపోయిండు. ఈ మాటలు నూటికి నూరు పాళ్లు నిజం. తన పాటలు, గానం ద్వారా తెలంగాణ రైతాంగ ఉద్యమానికి ఊపిరులూదిన సుద్దాలను ఆ తర్వాత ‘విశాలాంధ్ర వాదులు’ విస్మరించారు. అభ్యుదయ రచయితల సంఘం వారికి ఆయన బ్రతికున్నప్పుడు జీవిత చరిత్ర రాయడానికి గానీ, ఆయన రచనలు సేకరించి ప్రచురించాలనే సోయి గానీ లేదు. సుద్దాల తెలంగాణ వాడయినందుకు మాత్రమే వారు ఆయన రచనలపై శ్రద్ధపెట్టలేదని నేటి తరం తెలంగాణ వాదులు గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పటికీ ఆయన లేఖలు, అసంపూర్ణ రచనలు, అముద్రిత రచనలు కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికైనా ఆయన రచనలన్నీ సంకలనంగా తీసుకు రావాల్సిన అవసరముంది. వివిధ విశ్వవిద్యాలయాల వారు ఆయనపై పరిశోధనకు ఉత్సాహం చూపిస్తున్నా అవి ఒకడుగు ముందుకి రెండడుగులు వెనక్కి అన్న చందంగా ఉన్నాయి. అలా కాకుండా ఆయన సమగ్ర రచనలు-జీవితంపై సమర్ధులైన వారు పరిశోధన చేయాల్సిన అవసరముంది. అలాగే తెలుగు విశ్వవిద్యాలయంలో ఆయన పేరిట ఒక పీఠాన్ని ఏర్పాటు చేయించేందుకు తెలం‘గానా’భిమానులు, సుద్దాల ఆత్మీయులు అందరూ వత్తిడి తీసుకురావాలి.

(అక్టోబర్‌ 10, సుద్దాల 32వ వర్ధంతి)

 

-సంగిశెట్టి శ్రీనివాస్‌

‘‘……… సుద్దాల హనుమంతుగారికి నాటి అరసంలో గాని, ప్రజానాట్యమండలిలో గాని కవిగా అంత గుర్తింపు రాకపోయినా తన కలాన్ని, గళాన్ని నడిపించాడు. పేరు ప్రఖ్యాతుల కోసం కాకుండా తన చుట్టూ ఉన్న ప్రజల అవసరాల కోసం మాత్రమే సాహిత్యాన్ని సృష్టించాడు’’. అని సుద్దాల హనుమంతు రచనలపై అధ్యయనం చేసిన ప్రొఫెసర్‌ జయధీర్‌

పెద్రో పారమొ-4

pedro1-1
నీటి చుక్కలు నిలకడగా రాతి దోనె మీద పడుతున్నాయి. తేట నీరు రాతిమీదినుంచి తప్పించుకుని కలశంలోకి పడుతున్న చప్పుడును గాలి మోసుకొస్తూంది. అతనికి చప్పుళ్లన్నీ వినిపిస్తున్నాయి. నేలను రాపాడుతున్న పాదాలు, ముందుకూ వెనక్కూ, ముందుకూ వెనక్కూ. విడుపులేకుండా బొట్లు బొట్లుగా జారడం. కలశం నిండి నీరు తడినేలమీదికి పొంగడం.
“లే!” ఎవరో లేపుతున్నారు.
అతనికి ఆ గొంతు వినిపిస్తూంది. గుర్తు పట్టడానికి ప్రయత్నిస్తూనే నిద్రమత్తు బరువుకు మునిగిపోతూ ఉన్నాడు.దుప్పటి వేడిలో కుదురుగా ముణగదీసుకున్నాడు.
“లే!” మళ్ళీ ఎవరో పిలుస్తున్నారు.
ఆ ఎవరో భుజాలు పట్టుకు కుదుపుతున్నారు. అతన్ని లేపి కూచోబెడుతున్నారు. అతను కళ్ళు సగం తెరిచాడు. రాతి మీద నుంచి పొంగుతూ కలశంలోకి పడుతున్న నీటి చప్పుడు అతను మళ్లీ విన్నాడు. అటూ ఇటూ పడుతున్న అడుగుల చప్పుడు. ఇంకా ఏడుపు.
అప్పుడు అతను ఎవరో ఏడవడం విన్నాడు. అతన్ని లేపింది అదే – మెత్తగా ఉన్నా చొచ్చుకునిపొయే ఏడుపు- అంత పదునుగా ఉండబట్టే అతని నిద్ర కంచె దాటుకుని అతని లోలోపలి భయాన్ని తట్టి లేపగలిగింది.
నెమ్మదిగా పక్కమీదినుంచి లేచాడు. ద్వారానికి ఆనించి ఉన్న ఒక స్త్రీ ముఖం కనిపించింది. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూంది.
“ఎందుకమ్మా ఏడుస్తున్నావు?” అతను అడిగాడు. నేలమీద అడుగు పెట్టగానే తల్లి మొహం గుర్తు పట్టాడు.
“మీ నాన్న చనిపోయాడు.” ఆమె అంది.
అప్పుడు చుట్టలు చుట్టుకున్న ఆమె దుఃఖం ఒక్కసారిగా విప్పుకుంది .తట్టుకోలేక ఆమె గుండ్రం గుండ్రంగా అక్కడక్కడే తిరిగింది. చేతులతో భుజాలు పట్టుకుని ఆ వ్యధిత దేహం తిరగడం ఆపేదాకా.
వాకిలిగుండా ఉదయ సంధ్య కనిపిస్తూంది. పైన చుక్కలేమీ లేవు. ఇంకా రవికిరణాలు సోకని బూడిద రంగు ఆకాశం ఒక్కటే. పొద్దుపొడుపు కంటే పొద్దుగూకడాన్నే సూచిస్తున్నట్టు మసక చీకటి.
బయట వరండాలో అడుగుల చప్పుడు మనుషులు అక్కడికక్కడే గుండ్రంగాతిరుగుతున్నట్టు. మెత్తటి చప్పుడు. లోపల వాకిలికడ్డంగా ఆమె రాబోయే రోజును ఆపేస్తున్నట్టు. ఆమె చేతుల సందుల్లోంచి ఆకాశం ముక్కలూ, పాదాల కిందనుంచి స్రవిస్తున్న వెలుతురు. తడి వెలుతురు, కింద నేలంతా ఆమె కన్నీటి వరద ముంచేసినట్టు. ఆపైన వెక్కిళ్ళ ఏడుపు. మళ్ళీ అదే మెత్తటి కోసుకుపోయే ఏడుపు. ఆమె శరీరాన్ని మెలికలు తిప్పుతున్న బాధ.
“వాళ్ళు మీ నాన్నను చంపేశారు.”
మరి నిన్నో అమ్మా? నిన్నెవరు చంపేశారు?
గాలీ, పొద్దూ ఉన్నాయి, మబ్బులూ ఉన్నాయి. పైపైన నీలాకాశం, ఆపైన పాటలున్నాయేమో, తీయటి గొంతుకలు. ఒక్కమాటలో, ఆశ. మనందరికీ ఆశ,ఉంది, మన బాధలు తీర్చే ఆశ.
“కానీ నీకు కాదు మిగెల్ పారమొ! నీకు క్షమాపణ దొరక్కుండానే చనిపోయావు. దైవకృప నీకెన్నటికీ తెలియదు.”
ఫాదర్ రెంటెరియ మృతజీవుల ప్రార్థన చేస్తూ శవం చుట్టూ తిరిగాడు.తొందరగా ముగించేసి, చర్చి నిండా చేరిన వాళ్లకి చివరి దీవెన అందించకుండానే వెళ్ళిపోయాడు.
“ఫాదర్, మీరు అతన్ని దీవించాలని మా కోరిక.”
“లేదు!” గట్టిగాతలూపుతూ చెప్పాడు. “నేను దీవెన ఇవ్వను. అతను దురాత్ముడు. ప్రభువు రాజ్యం చేరడానికి వీల్లేదు. అందుకు నేను పాల్పడితే ప్రభువు నాపట్ల దయచూపడు.”
మాట్లాడుతూ, చేతులు గట్టిగా కట్టుకున్నాడు వణుకుతున్నట్టు తెలియకుండా ఉండాలని. కుదరలేదు.
ఆ శవం అక్కడున్న వారందరి ఆత్మల మీదా పెద్ద బరువై నిలిచింది. చర్చి మధ్యలో వేదికపైన ఉందది చుట్టూ కొవ్వొత్తులూ, పూలతో. తండ్రి అక్కడే నిల్చున్నాడు, వొంటరిగా, ప్రార్ధన అయ్యేదాకా.
ఫాదర్ రెంటెరియ పేద్రో పారమొ ని దాటుకుని వెళ్ళాడు, అతన్ని తాకకుండా జాగ్రత్తపడుతూ. పరిశుద్ధజలాన్నుంచిన పాత్రను నెమ్మదిగా పైకెత్తి శవపేటిక పైనుంచి కింద దాకా చిలకరించాడు పెదాలనుంచి ప్రార్థనలాంటిదేదో గొణుగుతూ. అతను మోకరిల్లగానే అందరూ మోకరిల్లారు.
“భగవంతుడా, ఈ నీ సేవకుడి మీద దయ చూపు!”
“అతని ఆత్మకు శాంతి కలుగు గాక! తధాస్తు!” అందరి గొంతులూ ఒక్కటై పలికాయి.
మళ్ళీ అతని లోపలి క్రోధం రేగుతూంది. మిగెల్ పారమొ శవాన్ని మోసుకుంటూ అందరూ చర్చి బయటికి వెళుతున్నారు.

pedro_paramo1
పేద్రో పారమొ అతని వద్దకు వచ్చి పక్కనే మోకరిల్లాడు.
“మీరు వాడిని అసహ్యించుకుంటున్నారని తెలుసు ఫాదర్! దానికి కారణమూ ఉందనుకోండి. మీ అన్నని మావాడు చంపాడన్న వదంతి ఉంది. మీ అన్న కూతురిని వాడు చెరిచాడనీ మీరు నమ్ముతున్నారు. ఆపైన వాడు చేసిన అవమానాలూ, ఎవరినీ లెక్కచేయకపోవడమూ. ఆ కారణాలు ఎవరయినా అర్థం చేసుకుంటారు. కానీ అవన్నీ మరచిపొండి ఫాదర్! అతన్ని క్షమించండి, బహుశా దేవుడు క్షమించినట్టుగానే!”
గుప్పెడు బంగారు నాణేలు అక్కడ ఉంచి పైకి లేచాడు. “మీ చర్చికి వీటిని బహుమతిగా తీసుకోండి.”
చర్చి ఖాళీ అయింది అప్పటికి. వాకిలి దగ్గర ఇద్దరు పేద్రో పారమొ కోసం ఎదురు చూస్తున్నారు. అతను వాళ్ళతో కలవగానే అంతా కలిసి అప్పటిదాకా వాళ్ళ కోసం ఆగి ఉన్న శవపేటిక వెంట నడిచారు. మెదియా లూనాకి చెందిన నలుగురు పనివాళ్లు మోస్తున్నారు దాన్ని. ఫాదర్ రెంటెరియ ఆ నాణేలు ఒక్కొక్కటే ఏరుకుని దైవపీఠం వైపు నడిచాడు.
“ఇవి నీవి.” అతను చెప్పాడు. “అతను విముక్తిని కొనుక్కోగలడు. ఇది సరయిన ధర అవునో కాదో నీకే తెలియాలి. నావరకూ, దేవా, నీపాదాల మీద పడి న్యాయమో అన్యాయమో వేడుకుంటాను అందరిలాగే… వాణ్ణి నరకంలో తోసేయి!”
ప్రార్థనామందిరాన్ని మూశాడు.
పాతసామాన్ల గదిలోకి వెళ్ళి ఒక మూలన కూలబడ్డాడు. బాధతో, వ్యధతో కన్నీరు ఇంకిందాకా అక్కడే కూచుని ఏడ్చాడు.
“సరే ప్రభూ, నువ్వే గెలిచావు!”

భోజనాల సమయానికి, ప్రతి రాత్రీ తాగినట్టుగానే వేడి చాకొలేట్ తాగాడు. మనసు నెమ్మదించింది.
“అనీతా, ఇవాళ ఎవరిని పూడ్చారో తెలుసా నీకు?”
“తెలియదు బాబాయ్!”
“మిగెల్ పారమొ గుర్తున్నాడా?”
“ఆఁ”
“వాణ్ణే!”
అనీత తల వేలాడేసింది.
“కచ్చితంగా వాడేననని నీకు నమ్మకమేగా?”
“ఏమో బాబాయ్! అతని మొహం నేను చూడలేదు. ఒక్కసారిగా మీద పడ్డాడు. చీకటి.”
“మరి అది మిగెల్ పారమొ అని నీకెలా తెలుసు?”
“ఎట్లా అంటే అతను చెప్పాడు: ‘అనా నేను మిగెల్ పారమొని. భయపడకు.’ అదీ అతను చెప్పింది.”
“ కానీ వాడే మీ నాన్న చావుకు కారణమని తెలుసు కదూ?”
“తెలుసు బాబాయ్!”
“మరి నువ్వేం చేశావు వాణ్ణి వెళ్లగొట్టడానికి?”
“నేనేమీ చేయలేదు.”
ఇద్దరూ మాట్లాడకుండా ఉండిపోయారు. మర్టిల్ ఆకుల్ని కదుపుతున్న వేడి గాలి చప్పుడు ఇద్దరి చెవులా పడుతూంది.
“అతనందుకే వచ్చానని చెప్పాడు – అందుకు సారీ చెప్పి నన్ను క్షమించమని అడగడానికి. నేను మంచం మీద కదలకుండా పడుకునే కిటికీ తెరిచే ఉందని చెప్పాను. అతను లోపలికి వచ్చాడు. ముందుగా నా చుట్టూ చేతులు వేశాడు, అతను చేసిన తప్పుకు క్షమాపణ అడగడానికి అదే అతని పద్ధతి అన్నట్టు. నేను అతని వంక చూసి చిరునవ్వు నవ్వాను. మనం ఎవరినీ అసహ్యించుకోకూడదని నువు చెప్పింది నాకు బాగా గుర్తుంది. అందుకే, ఆ విషయం అతనికి తెలియడానికే నవ్వాను కానీ ఆ చీకటిలో అది అతనికి కనపడదని వెంటనే తెలియలేదు. అతని శరీరం నామీద పడటం, చీదర పనులు చేయడం మాత్రమే తెలుస్తూంది.”
“నన్ను చంపబోతున్నాడని అనుకున్నాను. అదే గట్టిగా అనుకున్నాను బాబాయ్! ఆ తర్వాత ఆలోచించడం మానేశాను అతను చంపేలోగానే చనిపోదామని. అంత ధైర్యం చేయలేకపోయాడనుకుంటాను.”
“అతను చంపలేదని నేను కళ్ళు తెరిచి పొద్దుటెండ కిటికీలోంచి పడటం చూసినప్పుడు తెలిసింది. అప్పటిదాకా నేను నిజంగానే చనిపోయాననుకున్నాను.”
“ఏదో రకంగా నీకు కచ్చితంగా తెలిసే ఉండాలి. అతని గొంతు. అతని గొంతు బట్టి గుర్తు పట్టలేదా?’”
“నేనతన్ని అసలు గుర్తు పట్టలేదు. అతని గురించి నాకు తెలిసిందల్లా నాన్నను చంపాడనే. అతన్ని అదివరకెన్నడూ చూడలేదు, ఆ తర్వాతా చూడలేదు. అతని ఎదురుపడగలిగేదాన్నా బాబాయ్?”
“కానీ అతనెవరో నీకు తెలుసు.”
“అవును. అతనేమిటో కూడా. ఇప్పుడు నరకబాధలు అనుభవిస్తుంటాడని కూడా తెలుసు. సెయింట్స్ అందరినీ నా మనసుతో, ఆత్మతో ప్రార్థించాను.”
“అంత నమ్మకం పెట్టుకోకు అమ్మాయ్! అతనికోసం ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారో ఎవరికి తెలుసు? నువ్వొక్క దానివే. వేల ప్రార్థనలకు ఎదురుగా ఒక్క ప్రార్థన. అందులోనూ కొన్ని నీ ప్రార్థన కంటే తీవ్రమైనవి, అతని తండ్రి ప్రార్థనలాంటివి.
“ఏమయినా నేను అతన్ని క్షమించేశాను.” అనబోయాడు. కేవలం అనుకున్నాడు. ఛిద్రమయిన ఆ అమ్మాయి ఆత్మను మరింత బాధకు గురి చేయడం ఇష్టం లేకపోయింది. అందుకు బదులు ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని చెప్పాడు “ప్రభువైన మన దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుందాం ఇంత కీడు చేసిన వాణ్ణి ఈ భూమ్మీదనుంచి తీసుకు పోయినందుకు. తన స్వర్గానికి తీసుకుపోయాడో లేదో మనకెందుకు?”
కోంట్లా రోడ్డును పెద్ద బజారు కలిసేదగ్గర ఒక గుర్రం పరుగులు తీస్తూ ఉంది. దాన్నెవరూ చూడలేదు. అయితే ఊరి బయట దేనికోసమో ఎదురుచూస్తూన్న ఒక స్త్రీ ఆ గుర్రాని చూచాననీ, అది బొక్కబోర్లా దొర్లబోయినట్టు దాని ముంగాళ్లు వంగబడిపోయాయనీ చెప్పింది. అది మిగెల్ పారమొ టేకుమాను రంగు గుర్రం అని గుర్తుపట్టిందామె. అది తన మెడ విరగ్గొట్టుకుంటుందేమోనన్న ఆలోచన ఆమె మనసులో మెదిలింది. తరవాత అది దాని కాళ్లమీద నిలబడి కింద వదిలేసినదాన్నేదో చూసి భయపడుతూ ఉన్నట్టు మెడ మాత్రం వంచి మామూలుగానే పరుగులు తీయడం మొదలుపెట్టింది.
ఖననం జరిగిన రాత్రి శ్మశానాన్నించి అంత దూరమూ నడిచివచ్చి మగవారంతా విశ్రాంతి తీసుంటూ ఉండగా ఈ కథ మెదియాలూనా చేరింది. జనాలు పడుకునేముందు కబుర్లు చెప్పుకునేట్టు వాళ్ళూ మాట్లాడుకుంటూ ఉన్నారు. “ఈ చావు నన్ను నాలుగు రకాలుగా బాధిస్తూంది.” టెరెన్సియో లుబియానెస్ అన్నాడు “ నా భుజాలింకా తీపులు పుడుతూనే ఉన్నాయి.”
“నావి కూడా!” అన్నాడు అతని అన్న ఉబియాడో. “నా మడమలు అంగుళమన్నా వాచి ఉంటాయి.ఇదేదో పవిత్ర దినంఅయినట్టు ఆ పెద్దాయన మనల్ని బూట్లు వేసుకోమనబట్టే, కదా టోరిబియో?”
“నన్నేం చెప్పమంటావు? ఇంత తొందరగా పైకి పోవడమే నయం!”
ఇంకొన్ని రోజులకు కోంట్లా నుంచి ఇంకో వార్త వచ్చింది. అది ఒక ఎడ్ల బండితో.
“అతని ఆత్మ అక్కడే తిరుగుతుందని చెప్పుకుంటున్నారు. ఒక స్నేహితురాలి కిటికీ తట్టడం చూశారు. అంతా అతని లాగే ఉంది.”
“కొడుకు అట్లా ఆడోళ్ళ కిటికీలు తడుతూంటే డాన్ పేద్రో వదిలేస్తాడనుకున్నావా? అతనికి తెలిస్తే – ‘సరే నువ్వు చనిపోయావు, నీ సమాధిలో నువ్వుండు. ఇవన్నీ మాకు వదిలేయి.’ అనడూ! అట్లా తిరిగేప్పుడు పట్టుకుంటే సమాధిలోంచి మళ్ళీ లేవకుండా పూడ్చిపెట్టడూ?”
“నువు చెప్పేది నిజమే ఇసయ్యస్. ఆ ముసలాయన దేన్నీ భరించలేడు”
బండి తోలే అతను తన దారిన తను వెళ్ళిపోయాడు “నేను విన్నదే మీకు చెపుతున్నాను” అంటూ.
తారాజువ్వలు. ఆకాశాన్నుండి నిప్పుల వాన కురుస్తున్నట్టు.
“అటు చూడండి.” టెరెన్సియో అరిచాడు “ మనకోసం ఆట మొదలుపెట్టారు చూడండి!”
“మిగెలిటో తిరిగొచ్చాడని సంబరాలు చేసుకుంటున్నట్టున్నారు.” జీసస్ అన్నాడు. “అపశకునం కాదా అది?”
“ఎవరికి?”
“మీ చెల్లి ఒంటరిగా ఉందేమో, అతను తిరిగి రావాలని కోరుకుంటుందేమో!”
“ఎవరితో మాట్లాడుతున్నావు?”
“నీ తోటే!”
“ఇక పదండి, పొద్దుపోయింది. ఇవాళ్టి తిరుగుడుకి సాలిపోయింది. మళ్ళీ రేపు పొద్దున్నే లేవాలి.”
చీకట్లో నీడల్లా కలిసిపోయారు వాళ్ళు.
తారా జువ్వలు. ఒక్కటొక్కటిగా కోమలాలో దీపాలు ఆరిపోయాయి.
ఇక రాత్రిని అకాశం ఆక్రమించుకుంది.
ఫాదర్ రెంటెరియా నిద్రపట్టక పక్క మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు.
అది నా తప్పే అనుకున్నాడు. జరిగేదంతా. నా బాగోగులు చూసే వాళ్ళను బాధించాలంటే కలిగే భయం వల్ల. అది నిజమే, నా జీవనాధారానికి వాళ్ళకి రుణపడి ఉన్నాను. పేదవాళ్ళనుంచి చిల్లిగవ్వ రాదు, ప్రార్థనలు పొట్ట నింపవని ఆ పైవాడికీ తెలుసు. ఇప్పటిదా అట్లాగే గడిచింది. దాని పర్యవసానం ఇప్పుడు తెలుస్తూంది. అంతా నా తప్పే. నన్ను ప్రేమించినవారికీ, నాపై నమ్మకముంచి తమ తరఫున దేవుడిని ప్రార్థించమని అడగవచ్చిన వారికీ ద్రోహం చేశాను. నమ్మకం ఏం సాధించింది వాళ్ళకి? స్వర్గమా? వాళ్ల ఆత్మల పారిశుధ్ధ్యమా? వాళ్ళ ఆత్మలను పరిశుద్ధం మాత్రం చేయడమెందుకు చివరి క్షణాల్లో.. వాళ్ల చెల్లి ఎదువిజస్ ను కాపాడమని వచ్చిన మరియా ద్యాడ మొహాన్ని ఎప్పటికీ మరవలేను.
“ఆమె ఎప్పుడూ తోటివాళ్ళకి సాయం చేస్తూ ఉండేది. వాళ్ళకి తనకున్నదంతా ఇచ్చింది. వాళ్ళకు కొడుకుల్నీ ఇచ్చింది. అందరికీ. పసిపాపలని వాళ్ళ తండ్రుల దగ్గరకు గుర్తుపట్టడానికి తీసుకు వెళ్ళింది. ఎవరూ పట్టించుకోలేదు. ‘అయితే వాళ్ళకి తండ్రినీ నేనే అవుతాను, తల్లివి కమ్మని విధి రాసినా.’ అని చెప్పిందామె వాళ్ళకి. ఆమె మంచితనాన్నీ, ఆదర స్వభావాన్నీ ప్రతివాళ్ళూ వాడుకున్నవారే. ఆమె ఎవరినీ బాధించాలనుకోలేదు, ఎవరితో గొడవా పెట్టుకోదలచలేదు.”

“కానీ ఆమె తన ప్రాణం తనే తీసుకుంది. దైవాజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తించింది.”
“అంతకంటే ఏం చేయగలదు? అది కూడా ఆమె మంచితనం వల్లే చేసింది.”
“చివరి గడియలో ఆమె పుణ్యం చాలకపోయింది.” మరియా ద్యాడతో చెప్పాను.
“చివరి క్షణంలో. ముక్తి కోసం అన్ని మంచిపనులూ చేసి అంత పుణ్యమూ మూటగట్టుకుని అంతా ఒక్కసారిగా ఎట్లా పోగొట్టుకుంటుంది?”
“అదంతా ఎక్కడికీ పోదు. ఆమె దుఃఖం వల్ల మరణించింది. ఆ దుఃఖం… దుఃఖం గురించి నువ్వెప్పుడో నాకు చెప్పావు గానీ నాకు గుర్తు రావడం లేదు. ఆమె దుఃఖం వల్ల ఆమె పోయింది. ఆమె రక్తమే గొంతుకడ్డం పడి ఊపిరాడక చనిపోయింది. ఆమె ఎట్లా అగపడేదో ఇంకా కళ్ళకు కట్టినట్టే ఉంది.అంత విషాదగ్రస్తమయిన మొహం నేనెప్పుడూ చూడలేదు.”
“కాస్త ఎక్కువ ప్రార్థనలు చేస్తే ఏమన్నా..”
“మేము చాలా ప్రార్థనలు చేస్తూనే ఉన్నాము ఫాదర్!”
“పోనీ, బహుశా, గ్రెగోరియన్ ప్రార్థనలు. కానీ అవి చేయాలంటే మన వల్ల కాదు. ఇంకా మతాచార్యులని పిలిపించాలి. దానికి ఖర్చవుతుంది.”
నా కళ్ళ ఎదుట, పిల్లలతో పండి పేదదయిన మరియా ద్యాడ మొహం.
“నాదగ్గర చిల్లి గవ్వ లేదు. ఆ సంగతి నీకు తెలియదా ఫాదర్!”
“సరే ఇట్లాగే వదిలేద్దాం. భగవంతుని యందు విశ్వాసాన్ని ఉంచుదాం.”
“సరే ఫాదర్!”
అలా వదులుకోవడంలోనూ ఆమె ఎందుకంత ధైర్యంగా కనిపించింది? సునాయాసంగా ఒకటో అరో మాట – ఒక ఆత్మను కాపాడడానికి వంద అవసరమయితే వంద – చెప్పడంలో, క్షమాభిక్ష ప్రసాదించడంలో తనకి పోయిందేముంది? స్వర్గనరకాల గురించి తనకేం తెలుసు? ఒక పేరులేని ఊళ్ళో ఒక ముసలి మతగురువుకు కూడా స్వర్గానికెవరు అర్హులో తెలుసు. ఆ వరస అంతా తనకి తెలుసు. క్రిస్టియన్ సెయింట్స్ పట్టికలో కేలెండర్లో ప్రతిరోజుకూ ఉండే సెయింట్స్ తో మొదలు పెట్టాడు – సెయింట్ నునిలోన, కన్య,వీర మరణం పొందినది, అనెర్సియో పెద్ద మతాధికారి, సలోమి, విధవ, అలోదీ, నులీన కన్యలు, కోర్డుల, దోనాటొ” అదే వరసలో ఇంకా కిందికి. అతను నిద్రలోకి జారుకోబోతూ లేచి తిన్నగా పక్క మీద కూచున్నాడు. “నిద్ర పట్టడానికి గొర్రెల్ని లెక్క పెడుతున్నట్టు నేను సెయింట్స్ పేర్లు అప్పచెబుతున్నాను.”
అతను బయటికి వెళ్ళి ఆకాశం వంక చూశాడు. చుక్కలు కురుస్తున్నాయి. ఆకాశం ప్రశాంతంగా కనపడక అతను విచారించాడు. రాత్రి దుప్పటి భూమిని కప్పుతున్నట్టు అనిపించింది. “నరక కూపం” ఈ భూమి.

ఒక నీనా చెప్పిన సీత కథ “Sita Sings The Blues”

 

1

కారణం కూడా చెప్పకుండా రాముడు సీతను అడవుల్లో విడిచిపెట్టాడు.

కారణం కూడా చెప్పకుండా నీనా పేలీ ని భర్త విడిచిపెట్టాడు.

సీతమ్మ, తల్లి భూదేవిలో కలిసిపోయి ఓదార్పు పొందింది.

నీనా పేలీ రామాయణం చదివి, చక్కగా ఒక ఏనిమేషన్ ఫిల్మ్ తీసేసింది.

ఇంతకూ నీనా పేలీ ఒక అమెరికన్. పడమటి వాళ్ళు మన పురాణాలమీద పుస్తకాలు రాసినా, సినిమాలు తీసినా మనకీమధ్య అనుమానంగా ఉంటోంది. మనల్నీ, మన గ్రంధాల్నీ ఎద్దేవా చేస్తున్నారేమో, కనిపించని అజెండాలతో మన సంస్కృతిని భ్రష్టం చెయ్యటానికి తయారౌతున్నారేమో అని!   నీనా పేలీ పండితురాలు గానీ, ఇండాలజిస్ట్ గానీ, స్వచ్ఛంద సంస్థల్లోని మనిషి గానీ కాదు కాబట్టి ఆమె ఫిల్మ్ లో కుట్రలేవీ లేవనే అనుకోవచ్చు. కారణం చెప్పకుండా జీవిత సహచరుడని అనుకున్నవాడు తన పక్కన నడవటం ఆపేస్తే, ఏడ్చి బెంగ పెట్టుకుని, తరువాత కాస్త తేరుకుని, ఇలాంటి కేసులు ఇంకెక్కడ ఉన్నాయా అని చూస్తే ఆమెకు మన సీతమ్మ కనిపించింది.

రామాయణం చదివాక ‘అంత గొప్ప దేవతలకే ఎడబాటు తప్పనప్పుడు, మానవమాత్రురాల్ని నాదేముందిలే’ అనిపించి, ఆ దేవతలు తనకు చాలా దగ్గరివాళ్ళలా కనిపించారట నీనాకు. కష్టం వచ్చినప్పుడు ప్రపంచంలో ఎక్కడున్నా అంతా ఇంచుమించు ఒకేరకంగా స్పందిస్తాం. ‘సీతకే కష్టాలు తప్పలేదమ్మా, మనవెంత?’ అని కష్ట సఖిని ఇష్ట సఖులూ, పెద్దమ్మలూ ఓదార్చడం మనకు మామూలే.

2

“Sita Sings The Blues” నీనా పేలే సొంత కథతో కలిపి అల్లిన సీత కథ. సీత లాగే ఈమెక్కూడా జీవితంలో దొరికినవి ప్రేమ, విరహం, అవమానం… చివరకు సీత అమ్మవడి చేరితే, నీనా తను చేసే పనిలో స్వేచ్ఛా సంతోషాలను వెదుక్కుంది. ఇదీ “Sita Sings The Blues” కథ. ఎందరో మళ్ళీ మళ్ళీ చెప్పిన ఇలాటి కథను సరికొత్తగా ఎలా చెప్పాలి? ఇందుకోసం ఈమె బోలెడన్ని రకాల ఏనిమేషన్ రేఖల్ని కలగలిపి, వాటి కదలికల్లో ప్రేమనూ, హాస్యాన్నీ, వ్యంగ్యాన్నీ, బాధనూ ఎంత చక్కగా ఒలకబోసిందంటే ఫిల్మ్ చూస్తూ ఒక్క క్షణం కూడా చూపు తిప్పుకోలేం.

ఈ ఫిల్మ్ కోసం ఏనిమేషన్ బొమ్మలు తనే స్వయంగా వేసింది నీనా. ఇందులో సీత మూడు రకాలుగా కనిపిస్తుంది. రాజస్తానీ పెయింటింగ్స్ లోని స్త్రీలా ఉండే సీత, క్యాలెండర్ ఆర్ట్ లో కనిపించే సీతాదేవి, తన మనస్థితికి తగ్గట్టుగా పాటలు పాడుకునే ఆధునిక సీత. సీతలాగే రాముడూ, మిగతా పాత్రలు కూడా మూడు శైలుల్లో ఉంటారు. ఇవి గాక రామాయణం గురించి మూడు తోలుబొమ్మలు సూత్రధారుల్లా చర్చించుకుంటూ ఉంటే కథ నడుస్తుంది. ఇలా నీనా పేలే మన చిత్రకళను చాలా వరకూ తెలుసుకున్నాకనే బొమ్మలు వేసుకున్నట్టు అర్ధమౌతుంది. 1920 ల్లో Annette Hanshaw అనే జాజ్ గాయని పాడిన పాటల్ని ఈ సినిమాలో సీత నోటినుంచి వింటాం. భానుమతి పాటల్లా మంచి పాత వాసన వేసే ఆ పాటల్ని ఆధునిక సీత తన పరిస్థితికీ భావోద్వేగాలకూ తగ్గట్టు పాడుకుంటూ ఉంటుంది. ఈ పాటల సీత బొమ్మ అమెరికన్ కానీ, ఇండియన్ కానీ కాకుండా కొంచెం Mario Miranda కార్టూన్ లోని సొసైటీ లేడీలా కనిపిస్తుంది. సీత అంటే మనం చూసిన బొమ్మలూ, ఊహించుకునే పద్ధతీ మన సాంప్రదాయానికి అనుగుణంగా ఉంటాయి గానీ విదేశీయుల సృష్టికి ఈ రకమైన భారతీయ దృష్టి ఒక అడ్డంకి కాదు కదా! ఈమె ఏనిమేషన్ లో తూర్పూపడమరల నడకలు కలిసి, ఒక వింతైన ఫ్యూజన్ సాధ్యపడింది. మునులూ, ఆశ్రమ వాసులూ, అగ్నిదేవుడు, భూదేవి, శివుడు, సూర్యుడు, చంద్రుడు ఎవరికి వారే ప్రత్యేకంగా వెలిగిపోతుంటారు. Squiggle vision animation (బొమ్మలు వణుకుతున్నట్టుగా ఉండటం) లో కదులుతూ నీనా సొంత కథ కూడా ఈ సీతాయణంతో సమాంతరంగా నడుస్తుంది.   నీనా కథకు వేసిన బొమ్మలు చూస్తుంటే Roald Dahl (పిల్లల సాహిత్యం రాసిన బ్రిటిష్ రచయిత) కథలకు Quentin Blake వేసిన బొమ్మల ఛాయ కూడా కొంచెం కానవస్తుంది. మొత్తానికీమె రేఖల్లో మేరియో, రాజస్తానీ చిత్రాల ఛాయలు సొగసుగా ఒదిగాయి.

3

4

ఇన్ని రకాల గీతల్లో చాలా స్పష్టంగా కథను నడిపించటం మహా నేర్పుగా చేసేసింది నీనా పేలే. ఈ బొమ్మలకు ఏమాత్రం తీసిపోని ఫ్యూజన్ సంగీతం కథలో సరిగ్గా అమరిపోయి, ఫిల్మ్ అయిపోయాక కూడా చెవుల్లో ధ్వనిస్తూ ఉంటుంది. ఈమె బాలీవుడ్ నాట్యాన్ని కూడా వదిలిపెట్టలేదు. మంటల్లో నిలబడ్డ సీత వ్యధ మన శాస్త్రీయ నాట్యంలాగానూ, బాలీవుడ్ డాన్స్ లాగానూ బైటకొస్తుంది.

హాస్యం, చతురత, సున్నితత్వంతో అలరించే “Sita Sings The Blues” ఎన్నో తరాల సీతల వారసత్వపు ఆర్తిని కాసేపు తీవ్రంగా, కాసేపు మంద్రంగా వినిపిస్తుంది. బొమ్మల రంగులూ, కదలికలూ, నాట్యాలూ సీత పాటలతో కలిసి గమకాలు పోతాయి. కొన్ని దృశ్యాలివీ … సీత రాముడి గురించి ఓ ప్రేమ గీతం పాడేస్తూ తిరిగేస్తుంటే అతను ఓ చేత్తో రాక్షసుల తలలు ఎగరగొడుతూ మరో చేత్తో సీతను పట్టుకుని నాట్యం చేస్తుంటాడు. రావణుడు ఎత్తుకుపోయే ముందు, కుటీరంలో సీత రాముడిని తలచుకుంటూ పాట పాడుతుంటే సీతాకోక చిలుకలు కిటికీలో ముద్దుగా అడుగులు వేస్తుంటాయి. వాల్మీకి ఆశ్రమంలో నెమలి, కొంగ, కప్పలు ఆడా మగా జంటలుగా హాయిగా ఆడుతూ కనిపిస్తాయి. ఇంతలోనే మగవి ఆడవాటిని ఓ తన్ను తన్ని పారేయటంతో ఆడవన్నీ నిండు గర్భిణి సీత చుట్టూ కన్నీళ్ళతో, సహానుభూతితో చేరుతాయి. రాముడి గొప్పతనాన్ని ఏ భావం లేని మొహాలతో లవకుశులు, ఆశ్రమ వాసులూ పాడుతుంటారు. భూదేవిలో కలిసిపోయేముందు సీత తన చుట్టూ ఉన్నవాళ్ళను లెక్క చెయ్యకుండా గాలిలో తేలిపోతూ, అంతర్ముఖురాలైపోతూ పాడుకుంటుంది. హనుమంతుడి గంతుల నాట్యం మరో కొసరు.

 

ఈ కథను లక్ష్మీ దేవి ఓ గ్రామఫోన్ రికార్డు ద్వారా మొదలు పెట్టి మనకు చెప్తుంది. కథ పూర్తయాక, చివరి దృశ్యంలో పాల సముద్రం మీది బొమ్మ తిరగబడి, లక్ష్మీదేవి శేషతల్పం మీద శయనిస్తే, విష్ణువుగారు ఆమె పాదాలు ఒత్తుతూ ఉంటాడు5. లక్ష్మి కొంటెగా కన్ను కొట్టడంతో ఫిల్మ్ పూర్తవుతుంది. తీసినది స్త్రీ కాబట్టి ఇలా ముగిసింది. అదే బాపు సినిమా ‘మిస్టర్ పెళ్ళాం’లో అయితే, విష్ణుమూర్తి, లక్ష్మీదేవిల వైకుంఠపు దృశ్యం తిరగబడటం వేరుగా ఉంటుంది. ‘ఇద్దరం సమానమే కదా కాసేపు మన స్థానాలు మార్చుకుందామ’ని లక్ష్మి అడిగితే విష్ణువు సరేనంటాడు. ఇంకేముంది వెంటనే పతిదేవుడు తన పాదాలు ఒత్తుతున్నట్టుగా లక్ష్మి ఊహించేసుకుంటుంది. ఆవిడ ఊహలోంచి బయటకు వచ్చి చూడబోతే, తాను భర్త పాదాల దగ్గరే ఉంది. విష్ణువు విలాసంగా శయనించే ఉన్నాడు. కాకపోతే తన స్థానం కుడి వైపునుండి ఎడమపైపుకి మారిపోతుందంతే! ఇంత కుటిలంగా మగవాడు అటుదిటు చేస్తాడని సరదాగా చెప్పి వదిలేస్తాడు బాపు. ఇలా మన సినిమాల రెఫరెన్సులు చాలానే ఉన్నాయి “Sita Sings The Blues” లో. సొంత ప్రతిభతో వాటిని కలిపి కథ చక్కగా చెప్పి ఒప్పించగలిగింది కాబట్టి అవి రెఫరెన్సులయాయి.  చేతగాని ఫిల్మ్ మేకర్ వాడితే “సీన్లు అలాగే దించేశాడు” అంటాం.

6

 

Annette Hanshaw పాటలు తన సినిమాకి వాడుకున్నందుకు రాయల్టీల చిక్కుల్లో పడింది నీనా పేలీ. రెండు లక్షల డాలర్ల పైనే అడిగిన కాపీరైట్ హక్కుదారులతో ఒక ఒప్పందానికి వచ్చి, యాభై వేల డాలర్లు చెల్లించింది. తరువాత ఓ కొత్త పధ్ధతి మార్కెటింగ్ మొదలు పెట్టింది. డీవీడీలుగా కొన్ని కాపీలు మాత్రం అమ్మకానికి పెట్టింది. 2009 లో ఈ చిత్రాన్ని యూ ట్యూబ్ లో పెట్టేసింది. రామాయణం ఎలా అయితే హాయిగా ప్రజల మధ్య ప్రయాణం చేసిందో, తన ఫిల్మ్ కూడా అంతే స్వేచ్ఛగా తిరుగుతూ ఆ ప్రజల చెంతకే ఏ అడ్డంకులూ లేకుండా చేరాలని అనుకుంది నీనా. ఈ చిత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా ప్రదర్శించుకోవచ్చు. డీవీడీలుగా అమ్ముకోవచ్చు. కానీ పాటలకు సంబంధించిన రాయల్టీని మాత్రం డీవీడీ అమ్మకందారులు మ్యూజిక్ కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. చందాల రూపంలో, బొమ్మల టీ షర్టుల అమ్మకాల్లో డబ్బు వచ్చింది. చానెల్ 13లో ఇంకా ధియేటర్లలో ప్రదర్శించినవాళ్ళు ఎంతో కొంత మొత్తాలు ఇచ్చారట. ఈ విధంగా మంచి లాభాలే వచ్చాయని చెప్తుంది నీనా పేలే. చక్కని చిత్రం తియ్యటమే కాకుండా దాన్ని అందరికీ అందుబాటులో ఉంచుతూనే డబ్బు కూడా సంపాదించొచ్చని చెప్తూ తన వెబ్ సైట్ లో మొత్తం వివరాలు అందించింది..

“సీత” పేరుతో బొమ్మల రామాయణం రాసిన దేవదత్త పట్నాయక్ వంటి వాళ్ళు, సీతకు అన్యాయం జరిగిందని బాధపడేవాళ్లకు రామాయణంలోని ఇంకో కోణాన్ని చూపించటానికి ప్రయత్నిస్తారు. ‘నిజానికి రాముడు మాత్రం ఏం సుఖపడ్డాడు? మళ్ళీ పెళ్లి చేసుకోలేదు కదా, సీతారాములిద్దరూ కొన్ని ఆదర్శాల చట్రాలలో బందీలే’ అనేది కూడా ఒక గట్టి విశ్వాసానికి సంబంధించిన వాదనే. సీత అవతారంలో లక్ష్మీదేవి దుష్ట రావణ సంహారం కోసం నిబ్బరంగా అన్ని బాధలూ భరించింది గానీ ఆమె అబల కాదని చెప్తారు వీళ్ళు. వాల్మీకి రామాయణాన్ని చదివే ఓపిక, అవకాశం లేని నేటి తరం ‘Sita Sings The Blues’ వంటి చిత్రాలు సులువుగా చూసేసి, సీతను ఒట్టి బాధితురాలుగా, రాముడినేమో భార్యను హింస పెట్టేవాడిగా అర్ధం చేసుకుంటారని, అంతేకాక హిందువులు భార్యను హింసించేవాడిని పూజిస్తారని కూడా పాశ్చాత్యులు అనుకుంటారని పట్నాయక్ ఉద్దేశ్యం. “వాల్మీకి సీతను ఒక నాయికగా చూశాడు. తులసీదాసు రాముడి దైవత్వానికి ఒక సంపూర్ణత్వాన్ని చేకూర్చిన వ్యక్తిగా సీతను చూశాడు. అద్భుత రామాయణంలో ఆమె కాళీ అవతారంగా కనిపిస్తుంది.” అంటాడు. రాజకీయనాయకులు, ఒక అసహాయురాలిని దుష్ట రాక్షసుల బారినుండి రక్షించిన వీరుడిగా రాముడి గురించి చెప్తే, స్త్రీవాదులు భార్యను హింస పెట్టిన మగవాడిగానే రాముడిని వర్ణిస్తారని చెప్తూ, ఎవరి ఎజెండాలు వారికి ఉన్నాయంటాడు పట్నాయక్.

జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ తన కంటిలో పొంగ మనసు కరగంగా (వేటూరి) వాల్మీకి రామాయణ కావ్యగానం చేశాడంటారు. స్థూలంగా చూస్తే, ఎడబాసిన పక్షి జంట వంటి సీతా రాముల కష్టాల కథే రామాయణం. మిగతా ఎజెండా లన్నీ పక్కన పెట్టి అంతవరకే ఆ కథను తీసుకున్నా, భర్త వదిలేసినప్పుడు పడే బాధలో ఆడవాళ్ళకు సీత గుర్తుకు రావటం, ‘ప్రియసతియా లేక రాజ్యమా అని తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినపుడు రాముడు రాజ్యాన్ని వదిలి, సీత వెంట ఉండవచ్చుకదా, అదీ ఒక ధర్మమే కదా’ అనుకోవటం సహజం.

ఎన్నో రామాయణాలు, ఎన్నో వాదాలు, ఛీత్కారాలు, ఉదాత్తీకరణలు, మనశ్శాంతి పొందటాలు …. వీటన్నిటికీ వాల్మీకి రామాయణం ఇచ్చినంత అవకాశం ఇంకే కావ్యమూ ఇచ్చి ఉండదు. ఎన్నో తరాలుగా ఆడవాళ్ళు మాత్రం ఒకపక్క రాముడిని దేవుడిగా పూజిస్తూనే మరోపక్క సీత కష్టాలకు విచారిస్తూ, సీతంటే సహనానికీ బాధకూ ప్రతిరూపంగానే గుర్తిస్తూ, చెప్పుకుంటూ వస్తున్నారు. రామాయణం ఉన్నంతకాలం సీతాయణం కూడా ఉంటుంది. ఈ రోజుల్లో, అదీ స్త్రీలు చెప్పేటప్పుడు, నీరు పల్లానికి ప్రవహించినంత తేలిగ్గా స్త్రీవాద ఆలోచనా ధారలోకి వెళ్ళే అవకాశం రామాయణానికి బాగా ఉంది. ఇప్పటి సందర్భంలో ‘Sita Sings The Blues’ నీనా పేలే చేసిన ఒక చక్కని ఆధునిక సీతాయణ గానం.

 

ల.లి.త.

 

 

 

 

 

 

‘ఎగిరే పావురమా!’ – 14

egire-pavuramaa14-banner

డాక్టర్ తో మాట్లాడి, పది నిముషాల్లో తిరిగొచ్చాడు జేమ్స్…

“అంతా సెటిల్ అయింది, నీ కొత్తకాలు కూడా రెండు వారాల్లో వచ్చేస్తుందట. మన ‘అనాధాశ్రమం’ నర్సుతో కూడా మాట్లాడింది డాక్టరమ్మ. నీతో రోజూ వ్యాయామం చేయించమని, అవసరాన్ని బట్టి కట్టు మార్చమని చెప్పింది,” అన్నాడు.

 

“అన్నీ హ్యాపీ న్యూసులే,” నవ్వుతూ తను తెచ్చిన జిలేబి ప్లేట్లో పేర్చాడు.

ఆ ప్లేటు నాకందిస్తూ, “మంచి అవకాశం – కరెక్ట్ సమయం నీతో మాట్లాడ్డానికి,” అంటూ కుర్చీ మంచానికి దగ్గరగా లాక్కొని కూచున్నాడు.

 

“చూడు గాయత్రి, నువ్వంటే నాకు ఇష్టం, పిచ్చి కోరిక. మొదట్లో తెలీకుండానే, నీకు కిచన్ లో పనిచ్చి, ఆకలిదప్పుల నుండి కాపాడాను.   లేదంటే, నిన్ను రైల్వే స్టేషన్లోనో, గుడిమెట్ల పైనో ఓ బోర్డ్ పెట్టి బిక్షాటన చేయించేది కమలమ్మ.

తరువాత కూడా నిన్ను ఎన్నో మార్లు ఎన్నో రకాలుగా కాపాడాను. ఎలా అంటే విను.

నీకు ఆ   దద్దమ్మ గోవిందుతో పెళ్ళి చేస్తానంటే, పద్దెనిమిదేళ్ళు నిండని పిల్లకి పెళ్ళి చేసి కష్టాల పాలవ్వద్దని కమలమ్మకి చెప్పి ఆ పెళ్ళి ఆపించానని   నీకూ తెలుసుగా.

మీ తాత నుండి ఆస్తిపై హక్కుకి గాని, పెళ్ళికి గాని మేజర్ అయి ఉండాలన్న విషయం ఆమెకలా చెప్పి, భయపెట్టి, నిన్ను మూడేళ్ళు కాపాడుకున్నాను.

ఇక మూడోది. నాకు ‘మదర్ తెరెసా’ వాళ్ళ పర్మనెంట్ కాంట్రాక్ట్ వచ్చాక కూడా, నిన్ను నా కళ్ళెదుట ఉంచుకోడానికనే మీ అందరికీ క్యాంటీన్ లో కొలువులిచ్చి,   నాకాడే పెట్టుకున్నా,” క్షణం ఆగాడు.

 

నా మీదకి వంగి, నా గడ్డం పట్టుకుని ముఖం పైకెత్తాడు. నా కళ్ళలోకి చూస్తూ, “వింటున్నావా? నువ్వంటే నాకెంత ఇష్టమో అర్ధమయిందా? ఇంకా చెప్పాలా?” అడిగాడు.

 

దుఖాన్నిఆపుకోవడానికి ప్రయత్నిస్తూ తల వంచుకున్నాను.

నడవలేను, పలకలేను. అలాంటి నాకు ఏమిటీ గోల??? నాకంటే సరయిన ఆడపిల్లే దొరకలేదా వీడికి? వీడి బుద్ధి వక్రించింది.   మామూలు ఆలోచన కాదు వీడిది, అని భయము, గుబులు కలిగాయి….

గొంతు సవరించి మళ్ళీ మొదలెట్టాడు.

“ముఖ్యంగా నీ కాళ్ళకి చికిత్స గురించి   ఆలోచన చేసాను. మనం పనిచేస్తున్నది ధార్మిక సంస్థ కాబట్టి, ముందుగానే, అర్జీ పెట్టి నీ విషయం చర్ఛ్ ఫాదర్లతో మాట్లాడాను. నువ్వు నా సొంత మనిషివని, నేను తప్ప నీకు ఆసరా లేదనీ   వాళ్ళకి చెప్పాను. నీకు కాళ్ళకి వైద్యం అవసరమని విన్నవించాను…

నువ్వు మతం పుచ్చుకొని, నామమాత్రపు జీతానికి రెండేళ్లు పనిచేస్తావని వాళ్ళకి నేను హామీ ఇచ్చాను. వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకొని ఈ కాడికి తెచ్చాను,” అంటూ   మళ్ళీ నా వంక చూసాడు.

 

“ఇకపోతే, అతి ముఖ్యమైన విషయం… నాకు రాబడుంది. ఊళ్ళో రెండు క్యాంటీన్ల అద్దెలొస్తాయి. నేవేసుకున్న నగలు నీకు క్షణంలో ఇచ్చేస్తా. నీకిప్పుడు పద్దెనిమిదేళ్ళు. నువ్వు నా సొంతమవ్వాలి. నిన్ను నాకాడ ఉంచుకొని రాత్రింబవళ్ళు ప్రేమిస్తా, కామిస్తా.

నీవు కుంటివి, మూగవి అయినా పర్వాలేదు. నిన్ను ఉద్దరిస్తాను. నన్ను ప్రేమించి ‘సరే’ అను. చాలు,”   అంటూ ముగించాడు.

లేచి మంచం చుట్టూ పచార్లు చేయసాగాడు…….

 

తమ తమ స్వార్ధాల కోసం కమలమ్మ, జేమ్స్ – వారి ఇష్టానుసారంగా నన్ను బంధించాలని చూడ్డం ఏమిటి…ఈ రకమైన ఇక్కట్లతో బతకాలని కూడా అనిపించడంలేదు.

 

“ఎల్లుండి నేను మళ్ళీ రావాలి ఇక్కడికి. నీ బిల్లు సెటిల్ చేయడానికి జలజ మేడమ్ నన్నే పంపుతారు. ఈ లోగా, నేను చెప్పే మరో సంగతి కూడా విని, మన విషయంగా నీ నిర్ణయం తీసుకో…” అన్నాడు జేమ్స్ మంచానికి దిగువున నిలబడి….

 

చుట్టూ చూశాను. ఎవ్వరూ లేరు.. మూలనున్న ఇద్దరు ముసలి రోగులు కదలకుండా అటు తిరిగి పడుకునున్నారు.

‘ఇంకా ఏమి సంగతని’ వింటున్నాను….

 

తిరిగొచ్చి, జేమ్స్ మళ్ళీ నా మంచం పక్కన కుర్చీలో కూచున్నాడు.

“నీవు ఇక్కడ ఆసుపత్రిలో చేరిన రెండోరోజు, మీ రాంబాబాయి ఈ ఊరొచ్చాడు. కమలమ్మతో గొడవ పెట్టుకొన్నాడు. చిన్నపిల్లవైన నిన్ను తప్పుడు దోవ పట్టించిందని కేకలేశాడు.

మీ తాత పొలం, కొట్టాం స్వార్జితమంట. కాబట్టి   పోట్లాడి దక్కించుకునే అవకాశం నీకైనా లేదని,   ఏదేమైనా నిన్ను వెంటబెట్టుకొని ఇంటికి తీసుకెళతానని ఆమెతో బాగా గొడవపడి గాని ఈడనుండి వెళ్లలేదు,” చెప్పడం ఆపి నా చేయి తన చేతిలోకి తీసుకోబోయాడు.

చేయి వెనక్కి లాక్కున్నాను.

 

ఓ క్షణం మౌనం తరువాత నా వంక సూటిగా చూసాడు….

“అంటే, నీ ముందు మూడే దారులున్నాయి…మార్పే లేకుండా – మీ తాతతో అదే పాత బికారి జీవితం. లేదా నా కింద నౌకరీ చేస్తున్న ఆ దద్దమ్మ గోవిందుని పెళ్ళాడి, బతుకుతెరువు కోసం నా క్యాంటీన్ లో చాకిరీ కొనసాగింపు. ఈ రెండూ కాదని, తెగించి నాకాడ నా ప్రియురాలిగా మంచి రంజైన జీవితం… ఏది కావాలో ఎన్నుకో,” అన్నాడు వికారంగా నవ్వుతూ వాడు.

“పోతే, మీ బాబాయికి నీ కాలు-చికిత్స గురించి వివరించి, మళ్ళీ నాలుగు వారాలకి రమ్మన్నాను. సర్దిచెప్పి నేనే ఆ రోజు బస్ స్టాండు వరకు దింపానతన్ని. లేదంటే ఇక్కడే తిష్టేసి కమలమ్మతో యుద్దానికి సిద్దమయ్యాడు,” చెప్పడం ముగించి, మళ్ళీ ఎల్లుండి కనబడుతానంటూ వెళ్ళిపోయాడు… జేమ్స్ గాడు….

 

నా మనస్థితి అల్లకల్లోలమయ్యింది…రాంబాబాయి రాక, జేమ్స్ పోకడ – అంతా అయోమయం. … తాత ఎలా ఉన్నాడో? ఎవరు చెబుతారు? కమలమ్మతో బాబాయి గొడవపడ్డాడా? ఏమన్నాడో? నెల రోజులకి తిరిగి మళ్ళీ వస్తాడా బాబాయి?

తాతదంతా స్వార్జితమంటే? చెప్పుడు మాటలు నమ్మి, అప్పట్లో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానా? నా జీవితాన్ని నేనే చేతులారా నాశనం చేసుకున్నానా?

‘తాత నుండి మళ్ళీ కబురు’ అంటూ మొన్న గోవిందు ఏదో అనబోయాడు … అని గుర్తొచ్చింది.

గోవిందు ఏమన్నా చెబుతాడేమో…. అడగాలి… ఆగి చూడాలి ఏమి జరుగుతుందో?

వళ్ళంతా చెమటలు పట్టేసింది…

egire-pavuramaa-14

“ఇదిగో పట్టమ్మాయి, కాస్త నీ అంతట నువ్వు పక్కకి తిరగ్గలవేమో చూడు, కాఫీ తాగి మందేసుకో,” అంటూ వచ్చింది ఆయమ్మ.

**

వారం రోజులుగా మళ్ళీ క్యాంటీన్ పనిలోకొచ్చాను.   కాలు నొప్పి తగ్గింది. మరో వారమో రెండో గడిస్తే, నాకు కొత్తకాలు కూడా వస్తుంది.

రోజూ మార్కెట్ నుండి కూరలు, వెచ్చాలు దింపి వెళ్ళిపోయే గోవిందు, ఇప్పుడు కిచెన్లో నా కాడికొచ్చి, ఎలా ఉన్నానని కనుక్కుని పోతున్నాడు.

అనాధాశ్రమం నర్స్ వచ్చి రోజూ నా కాలు ఓ మారు చూసి, డాక్టరమ్మ సూచనలందుకొని బ్యాండేజీ మార్చి వెళుతుంది.

జేమ్స్ మాత్రం రెండు రోజులుకోసారి దగ్గరగా వచ్చి, నా భుజం మీద చేయి వేసి, “ఎలా ఉంది కాలు నొప్పి,” అంటూ నా కాలు, పాదాలు వొత్తి పళ్ళికిలించి వెళ్తున్నాడు.

నేనేదో తన సొంత ఆస్థినన్నట్టు మాట్లాడి కళ్ళెగరేసి పోతాడు.

 

ఓ మధాహ్నం గోవిందుని దగ్గరికి రమ్మని పిలిచాను…వచ్చి పక్కనే నిలుచున్నాడు.

“తాతనుండి ఏదన్నా జవాబు వచ్చిందా? బాబాయి ఓ సారి వచ్చెళ్ళాడని తెలుసు… మళ్ళీ కబురేమన్నా అందిందా?” సైగలతో వాకబు చేసాను.

 

“ఇదిగో, సూడు, నీవేమీ బెంగెట్టుకోకు. మీ బాబాయి మళ్ళీ తప్పక   వస్తాడు.   అన్నీ సర్దుకుంటాయి,” అనగానే ఒక్కసారిగా ఏడ్చేసాను.

నన్ను ఓదార్చడానికి చాలా కష్టపడ్డాడు గోవిందు….

“ఏడవమాకు గాయత్రీ.   అన్నీ బాగానే ఉంటాయిలే. నేను సెపుతున్నాగా. నా మాట ఇని కళ్ళు తుడుచుకో,” అంటూ సముదాయించాడు గోవిందు.

**

నాకు కొత్త కాలు పెట్టే రోజు.

కమలమ్మని తోడు తీసుకొని, ‘అనాధాశ్రమం’ వారి వాన్ లో ఆసుపత్రికి బయలుదేరాను. ‘మదర్ తెరెసా’ వారి ఇతరత్రా పనులు కూడా ఉన్నాయంటూ జేమ్స్ కూడా ఆఖరి నిముషంలో వాన్ ఎక్కాడు.

కొంత దూరం వెళ్ళాక మాటలు మొదలు పెట్టింది కమలమ్మ.

 

“చూడు గాయత్రీ, నీవు రాసిన ఉత్తరం అందుకొని మీ బాబాయిని పంపాడు మీ తాత. నీవు ఆపరేషనయి ఆసుపత్రిలో ఉన్నప్పుడు వచ్చి సచ్చాడులే మీ రాంబాబాయి.   కల్లు తాగిన కోతిలాగా నానా యాగీ చేసి నా మీద రంకలేసి పోయాడు. నీ తాత ముసలాడు నీకు ఒక్క కానీపైసా కూడా ఇచ్చేది లేదంట,” కోపంతో ఊగిపోయింది కమలమ్మ.

 

మంచినీళ్ళు సీసా అందించి, ఆమెని నెమ్మది పరిచే ప్రయత్నం చేసాడు జేమ్స్…నీళ్ళ సీసాలో నుండి గుక్కెడు తాగిందామె.

 

“వాడట్టా అన్నంతమాత్రాన ఏంకాదు… నువ్విప్పుడు మేజర్ కాదా…నివ్వు గట్టిగా నీ మాట మీద నిలబడితే, ఆ దిక్కుమాలిన పొలం, కొట్టాం నీకొచ్చి తీరుతాది… నువ్వు గాక ఎవరున్నారు వాడికి?” క్షణమాగింది..

 

“అయినా గాయత్రి, ఇదంతా ఒకెత్తైతే – నేను, గోవిందు ఎంత త్యాగం సేసి నిన్ను ఈ కాడికి తెచ్చామో నువ్వు గుర్తెట్టుకోడం మరో ఎత్తనుకో….నీ డబ్బు, దస్కం వచ్చాక కూడా నీ కాడ ఊడిగం సేస్తాం మేము. ఇప్పటి వరకు మేము సేసిన కష్టం మరిసిపోమాకు.

మళ్ళీ ఎప్పుడో దాపురిస్తాడు నీ బాబాయి.   గట్టిగా తిప్పికొట్టి రానని నిక్కచ్చిగా సెప్పేయి. నీ డబ్బు ఇప్పించుకో,” అని ముగించింది…

అలిసిపోయి వెనక్కి వాలింది.

 

“ఆ అమ్మాయికి అన్నీ అర్ధమవుతాయిలే కమలం.   సరయిన నిర్ణయం తీసుకుంటుంది,”   నా వంక చూసి కన్ను గీటి ఇకిలించాడు జేమ్స్.

నేనూ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను.

 

కమలమ్మ మాటలు చెవుల్లో గింగిర్లు తిరుగుతున్నాయి.

‘నాకన్నీ గుర్తే కమలమ్మా’ అనుకున్నాను.   మరువలేని సంఘటనలు ఒకటా రెండా?’ ఈ ఊరు చేరిన మొదటి వారం, ఎప్పటికైనా మరువగలనా?

కొత్తూళ్ళో రైలు దిగి సత్రంలో చేరాక,   మొదటి రెండు రోజులు మాత్రమే నాతో మామూలుగా మసిలారు అక్కాతముళ్ళు. తరువాత నా పాటికి నన్నొదిలి రోజంతా వెళ్ళిపోయేవారు….

వారం పాటు ఆకలితో మాడిపోయాను…గది బయట ఉన్న నీళ్ళకుండ నుండి తాగునీరుతో దప్పిక, ఆకలి కూడా తీర్చుకున్నాను.

 

వారమయ్యాకే నోరు విప్పి నాతో మాట్లాడింది కమలమ్మ.

నాకు మేలు చేయాలని ఉన్నట్టుండి అన్నీ వదిలి ఊరు మారడంతో, తమ జీవనం దిక్కులేకుండా అయిందని, అందుకే బతకుతెరువు వెతుక్కోడానికి తిరుగుతున్నామని, ఎడంగా కూచుని పెద్ద గొంతుతో   చెప్పింది.

 

నీరిసించిపోయున్న నన్ను, ఆ రోజు గోవిందే దగ్గరగా వచ్చి పలకరించాడు. తనకి సత్రంలోనే ఏదో పని దొరికేలా ఉందని చెప్పి, తన వద్దున్న అరడజను అరటిపళ్ళ నుండి రెండు నాకిచ్చాడు.

నాకు తెలిసి వారంపాటు తిండిలేకుండా ఉన్నది అదే మొదటి సారి..

 

ఆ రాత్రి పడుకునే ముందు నా పక్కన చేరింది కమలమ్మ…

”ఇదో సూడు గాయత్రీ, వాడా ఏదో సంపాదిస్తాడు. నేను పక్కనే ఉన్న అమ్మగార్ల కాన్వెంట్ లో స్వీపర్ గా సేరాను. నన్నాడ కొలువులో పెట్టినాయన ప్రహ్లాద జేమ్స్. ఆయన ఈడ సత్రం కాంటీన్ తో పాటు ఎదురుగా ఉన్న టీ బడ్డీ కూడా నడుపుతాడు. అతనే సొంతదారు, వంటవాడు కూడా.

అతని కాడ వంటింట్లో నీవు పని సేస్తావని ఒప్పుకున్నాను. అలాగైతే, మనకి రెండు పూటలా తిండి ఆడనుండే ఇస్తాన్నాడు. కాఫీలు టిఫిన్లు అన్నీ ఫ్రీ. రేపు పొద్దున్న ఐదు గంటలనుండే పప్పులు రుబ్బడంతో నీపని మొదలని అన్నాడు.   ఇక పడుకో,” అంటూ నా పక్కనే అటు తిరిగి పడుకొంది.

అట్లా ప్రహ్లాద్ జేమ్స్ మా జీవితాల్లో ప్రవేశించాడు….

 

శబ్దం చేస్తూ వాన్ ఆసుపత్రి ముందు ఆగడంతో నా ఆలోచనల నుండి బయట పడ్డాను.

**                                                                          (ఇంకా ఉంది)

 

 

నీ ఉనికి ఏ రంగు?!

drushya druhyam-52

ఒక ఛాయా చిత్రం చేస్తున్నప్పుడు ‘తొలుత ఏది ఆకర్షిస్తుందీ’ అంటే చెప్పలేం. దీనత్వమా ధీరత్వమా అంటే, నలుపా ఎరుపా అంటే ఏమని చెబుతాం?

కష్టమేగానీ, ఒకటి సత్యం. ప్రధానంగా ‘మనిషి ఉనికి’ అని చెప్పాలి. అయితే, ఆ మనిషి ఉనికిలో వర్ణమూ ఉంటుంది. అది ముదురు వన్నెలతో వెలుగుతున్నప్పుడు ‘ఆ ఛాయ’ ధీరత్వానికి, నిబ్బరానికి సూచికే అవుతుంది. ఎరుపు ‘వర్ణమే’ అవుతుంది.

అయితే, అందరికీ తెలుసు, ఛాయా చిత్రలేఖనంలో రంగుకూడా చిత్రాన్ని ప్రధానం చేస్తుందీ అని! కానీ, అది మరింత చక్కగా ఫొటోగ్రఫీ చేసేలా దానంతటదే సూచనలు ఇస్తుందని తెలుసా? తెలిసింది. అదే ఈ చిత్రం.

+++

నిజానికి మనిషి స్థితీ గతీ ఎటువంటిదైనా జీవితానికి రంగు, రుచీ, వాసనా… వీటన్నిటితో కూడిన ‘ఉనికి’ ఉన్నది. సాహిత్యంలో శ్రీశ్రీ కాబోలు, ‘రసన’ అన్నట్టు, ఛాయాచిత్రలేఖనంలో కూడా ఈ ‘రసన’ ఉన్నది. అదే ఈ చిత్రం.

జీవితం ప్రకాశవంతంగా ఉంటుందని, మనిషి ఎక్కడున్నా, ఎలా జీవిస్తున్నాచీమూ నెత్తురూ ఉన్నంత వరకూ కళను పోగొట్టుకోడని…ఆ ‘రసన’ అన్న దానిని అడుగడుగునా, అణువణువునా ఛాయాచిత్రం రికార్డు చేసినంత వాస్తవికంగా చిత్రలేఖనం కూడా చేయదని ఒక నమ్మిక కలుగుతున్నది. ఈ చిత్రమూ ఆ నమ్మికకు దాఖలు.

ముఖ్యంగా మహిళ. ఆమె చీర సింగారమే, ఆమె ఉనికి బంగారమే. ఎక్కడున్నా ఒక శోభ. తృప్తి.

అయితే, తనను తాను రక్షించుకోవడానికి ఆమె ధరింపు అంతా కూడా ఒక చిత్రం. అదే ఈ చిత్రం.

నిజానికి ఫ్లెక్సీపై విశ్రమిస్తున్నఈ మహిళా, అమె పరిసర జీవితమూ అంతా కూడా ఒక దీనావస్థకు ప్రతిబింబమే. అట్లని మనిషిని వారి ఈస్తటిక్స్ ను పేదరికం కారణంగా విస్మరించడం కూడదనే ఈ చిత్రం. అదే ఈ దృశ్యం.

ఆమె తనను తాను అనువుగా మలుచుకున్నది. అంతా కూడా ఆ చీరలోనే, అట్లే, ఆ ఫ్లెక్సీపై. ఆ అనుభవం ఈ చిత్రం.

ఎక్కడున్నా తనకు అనువైన పరిసరాలలో, వీలైనంత భద్రంగా, శాంతిని ఎరిగి, కాసింత విశ్రాంతిని కళాత్మకంగా అసుసంధానం చేసుకోవడమూ ఈ చిత్ర విశేషం. లైఫ్@ఆర్ట్ – ఈ చిత్రం.

తానే అని కాదు, ఎందరినో చిత్రిస్తుండగా బతుకు ఎక్కడున్నా దివ్యంగా శోభిల్లడం చిత్రమేమీ కాదు. అది సహజత్వం. ముఖ్యంగా వీధుల్లో జీవించే వారెందరినో చిత్రిస్తూ ఉండగా ఇంకొక విశేషమూ గమనంలోకి రావడం అదృష్టం.

భరించలేని దుర్గంధం వస్తున్న చోట కూడా ఎన్నోజీవితాలు స్థిరంగా నిలబడటం విశేషమే. అటువంటి ఒకానొక చోట, ఒక వృద్ధ మహిళ అగర్ బత్తీలు వెలిగించుకుని ఉండటం ఒక గమనింపు. ఆ చిత్రం చేసి పెట్టాను కూడా. దీనర్థం మనిషి అనివార్యమైన జీవన ప్రస్థానంలో ఓడిపోలేదని! గుబాళింపు కోసం కాదు, సహజంగా జీవించలేని నిస్సహాయతలో ఒక వెలుగింపు. నిరాశ్రయంలో కూడా ఒక ఆశ్రయం. అంతే. అటువంటిదే ఈ చిత్రం. ఆమెను చూడండి.

ఒకరని కాదు, వందలు, వేలు, లక్షలు కూడానేమో! మహానగరంలో ఎందరో సామాన్యులు. అందరికీ వందనాలు.

+++

ఆమె, ఇంకా ఎందరో, వాళ్లంతా లతలూ, పూవులూ అన్నిటినీ దగ్గరే వుంచుకోవడం…ఫలమూ, పుష్ఫమూ జాగ్రత్త చేసుకోవడం… నగరంలో వీధి మనిషి జీవితం… ఒక రంగుల కళ. చూడండి, ఆర్ట్@స్ట్రీట్. అదే ఈ చిత్రం.

+++

ఆమె వరకైతే అది చీర కొంగు డిజైన్ కావచ్చు, ఎర్రటి గాజుల గలగలలు కావచ్చు. వేపాకు రంగు జాకెట్టూ కావచ్చు. ముందరి పేపర్ ప్లేట్ కావచ్చు.ఆమెది జీవకళ. అందునా కళ అన్నది జీవితంలో సహజాతం అన్నట్లు తాను జీవితాన్ని కళాత్మకంగా ధరిస్తుంది. ఆ ఫ్లెక్సీ కూడా అదే. అది కూడా తన ఎంపిక. ధరింపు,.

అందులోనూ మనుషులున్నరు. అది కూడా చిత్రం.

తానే కాదు, ముఖ్యంగా శ్రామిక జనం… ఎర్రెర్రటి, పచ్చపచ్చటి, ముదురు ముదురు రంగుల్లో జీవితాన్ని పచ్చగా గడుపుతూ ఉంటారు. చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు. ముల్లు గుచ్చుకున్నా బాధపడతారు. కడుపు నొచ్చినా చెప్పుకుంటారు. శోఖాలు పెట్టి ఏడుస్తారు. రాగాలు తీసి దుఃఖిస్తారు. నవ్వినా అంతే. జీవితాన్నిజీవిస్తారు. అందుకే వారి చుట్టూ ఒక శాంతి వలయం ఉంటుంది. అదే వారిని భద్రంగా కాపాడుతుంది. మళ్లీ రంగులు…వారి చుట్టూరా ఇంధ్ర ధనుస్సుగా విరుస్తయి. అదే వాళ్ల మహత్యం.

ఈ చిత్రం ఇవన్నీ గుర్తు చేస్తున్నది.

ఆమె ఎర్రని చీర, ఈగలు ముసరకుండా తలను కప్పేసిన ఆ అందమైన కొంగు, ఆమె ధరించిన ఎర్ర గాజులూ, పడుకోవడానికి ఆమె ఎంచుకున్నఅందమైన రంగురంగుల జాతీయజెండా వంటి ఆ ఫ్లెక్సీ,

అందులోని మనుషుల కళ, ఆమె వెనకాలి గోడమీద జాజు చిత్రణమూ….ఇంకా వైడ్ షాట్ ఉంది. అందులో మరింత అందమైన, గాఢమైన వర్ణలేఖనమూ ఉన్నది. ఇది, ఇవన్నీ అంతా కూడా ఆ పరిసర

సౌందర్యాత్మను పట్టిస్తుంది. ఆ ఆడ మనిషిలోని ‘రసన’ తాలూకు చిద్విలాసాన్ని దృశ్యమానం చేస్తున్నది.

అజంతా మృత్యువు హాస్య ప్రియత్వం ఒక బొరుసు. ఇది బొమ్మ .జీవితపు అనివార్య ప్రస్థానాన్నిహుందాగా అంగీకరించిన ‘రసన’

ఆమె, ఇంకా ఎందరో, వాళ్లంతా లతలూ, పూవులూ అన్నిటినీ దగ్గరే వుంచుకోవడం…ఫలమూ, పుష్ఫమూ జాగ్రత్త చేసుకోవడం… నగరంలో వీధి మనిషి జీవితం… ఒక రంగుల కళ. చూడండి, ఆర్ట్@స్ట్రీట్. అదే ఈ చిత్రం.

+++

చిత్రమేమిటంటే, ఇదంతా కూడా జీవితంపట్ల గొప్ప అనురక్తి ఉన్నదని చెప్పకనే చెప్పే చిత్రం. చిత్రణమూ. అదే దృశ్యాదృశ్యం.

మరి ధన్యవాదం.

 ~ కందుకూరి రమేష్ బాబు

 ramesh

రోజ్ మేరీ

MythiliScaled

ఒకానొకప్పుడు ఒక తండ్రీ కూతురూ ఉండేవారు. వాళ్ళకి కొంచెం పొలం ఉండేది. అమ్మాయి కి రోజ్ మేరీ మొక్క  సువాసన చాలా ఇష్టం. తన గౌన్ లో ఎప్పుడూ  ఆ రెమ్మలు దాచుకునేది. అవి వాడిపోతే మళ్ళీ తెచ్చుకునేది. అసలు పేరు ఏదో కాని అంతా తనని అదే పేరు తో పిలిచేవారు. కష్టపడి ఇంటి పని అంతా చేసేది. ఒక సాయంత్రం పని ముగిసిన తర్వాత తండ్రి ఆమెని అడవి లోకి వెళ్ళి చితుకులు ఏరుకు రమ్మని పంపించాడు, మర్నాడు పొయ్యిలో పెట్టటానికని. తను వెళ్ళి కట్టె పుల్లలు ఏరి పెద్ద మోపుగా కట్టింది. పక్కనే  రోజ్ మేరీ మొక్క కనిపించింది. దాన్ని పెకలించి ఇంటికి తీసుకువెళదామనుకుంటే  అది అంత తేలికగా  రాలేదు. బాగా బలంగా లాగేసరికి ఊడి వచ్చింది.

ఒక అందమైన యువకుడు ప్రత్యక్షమై ” నా కట్టెలు  దొంగిలిస్తున్నావెందుకు ? ” అని గద్దించి అడిగాడు.

అమ్మాయికి భయం వేసింది. వాళ్ళ నాన్న తెమ్మన్నాడని మెల్లిగా గొణిగింది.

రోజ్ మేరీ మొక్క ఉన్న చోట భూమిలో ఒక సొరంగం ఏర్పడింది. ” సరే అయితే. నాతో రా ఇలాగ ” అని యువకుడు పిలిచాడు. అమ్మాయి భయం భయంగా అతని వెంట వెళ్ళింది. సొరంగం లోకి దిగి  చాలా దూరం నడిచాక ఒక  గొప్ప భవంతి  వచ్చింది. లోపల చాలా వైభవంగా ఉంది.  చుట్టూ అందమైన తోట. ఇద్దరూ లోపలికి వెళ్ళాక అతను ” నీ అంత సొగసైనదాన్ని ఎప్పుడూ చూడనేలేదు. నన్ను పెళ్ళాడి నాతో ఉండిపోతావా ? ” అని అడిగాడు.

తనకీ అతను నచ్చాడు. ఆనందంగా ఒప్పుకుంది. వాళ్ళు పెళ్ళి చేసుకుని అక్కడ కొంతకాలం హాయిగా ఉన్నారు.

 

moon

పక్కనే పెద్ద రోజ్ మేరీ పొద ఉంది. ఒక రెమ్మని   తుంచుకుని వాసన చూసింది. ఇంకొన్ని గౌన్  జేబులో పెట్టుకుంది

ఆ ఇంటి బాగోగులు చూసేందుకు ఒక పెద్దావిడ ఉంది. ఆవిడ పెద్ద తాళం చెవుల గుత్తిని రోజ్ మేరీ కి ఇచ్చింది. వాటిలో ఒక్క తాళం చెవిని మాత్రం ఎప్పుడూ ఉపయోగించకూడదనీ అలా చేస్తే ఆ భవనం కూలిపోతుందనీ  తన భర్త తనని మరచిపోతాడనీ హెచ్చరించింది. రోజ్ మేరీ సరేనంది. కాని ఆ మాటలని అంతగా నమ్మలేదు

ఏ పని చేయకూడంటారో అదే చేయబుద్ధి వేస్తూ ఉంటుంది. ఆ తాళం చెవి దేనికి సంబంధించినదా అని వెతికితే అదొక పెద్ద భోషాణానిది అని తెలిసింది.అందులో ఏముందా అని ఆరాటం. ఒక రోజు తోచీ తోచకుండా ఉండి ఆ భోషాణాన్ని ఆమె తెరవనే తెరిచింది. లోపల  ఏమీ లేదు. కాని ఆ వెంటనే తన కాళ్ళ కిందన  నేల దడదడలాడింది .భవనం ఒక్కసారిగా మాయమైంది. ఏమవుతోందో తెలిసేసరికి ఒక పొలం మధ్యలో నిలబడి ఉంది. ఎక్కడుందో ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. ఆమె పెద్ద పెట్టున ఏడ్చింది- తప్పు చేశానని, తను ఎంతో ప్రేమించే భర్త కనిపించడని.

కాసేపటికి తేరుకుని అతన్ని ఎలా అయినా సరే వెతికాలని నిశ్చయించుకుంది.. కనబడిన దారిలో చాలా దూరం నడిచింది. ఎవరిదో  ఒక పెద్ద ఇల్లు వచ్చింది. తిండి దొరికేందుకు అక్కడ పనిచేయటానికి కుదిరింది.

ఇంటావిడ అమ్మాయిని బాగా చూసుకునేది. తను విచారంగా ఉండటం గమనించి పదే పదే కారణం అడిగింది. రోజ్ మేరీ తన కథ అంతా చెప్పుకొచ్చింది. తన భర్త ని ఎలా వెతకాలో తెలియటం లేదని దిగులుపడింది.

ఇంటావిడ అంది ” సూర్యుడూ చంద్రుడూ గాలీ- వీళ్ళని అడగచ్చు నువ్వు. వాళ్ళు అన్ని చోట్లకీ వెళ్ళగలరు కదా ”

సరే అనుకుని అమ్మాయి సూర్యుడు ఉండే బంగారపు కోటకి దారి అడిగి తెలుసుకుని వెళ్ళింది.

” సూర్యుడా, తప్పు చేశాను. దయ చేసి నా భర్త ఎక్కడో చెప్పు . నీకెంతైనా ఋణపడి ఉంటాను ” అని ప్రాధేయపడింది. సూర్యుడికి ఆమె సంగతి విని జాలేసింది.

” అతను ఎక్కడో మాత్రం తెలియదు. దీన్ని నీ దగ్గర ఉంచుకో. పెద్ద ప్రమాదం ఏమైనా వస్తే  పగలగొట్టు , మేలు జరుగుతుంది ” అని బంగారు రంగులో ఉన్న ఒక కాయని ఆమెకి ఇచ్చాడు. ఆమె సూర్యుడికి దణ్ణం పెట్టి  కృతజ్ఞతలు  చెప్పుకుని మళ్ళీ బయలుదేరింది.

పోగా పోగా ఇంకొక కోట . తలుపు తట్టింది. ఒక ముసలావిడ తలుపు తీసింది.

” దయచేసి నాకు సహాయం చేయండి ” అని  రోజ్ మేరీ వేడుకుంది.

rosemary

పక్కనే పెద్ద రోజ్ మేరీ పొద ఉంది. ఒక రెమ్మని   తుంచుకుని వాసన చూసింది. ఇంకొన్ని గౌన్  జేబులో పెట్టుకుంది కాసేపటికి తేరుకుని అతన్ని ఎలా అయినా సరే వెతికాలని నిశ్చయించుకుంది.. కనబడిన దారిలో చాలా దూరం నడిచింది. ఎవరిదో  ఒక పెద్ద ఇల్లు వచ్చింది. తిండి దొరికేందుకు అక్కడ పనిచేయటానికి కుదిరింది.

ఇంటావిడ అమ్మాయిని బాగా చూసుకునేది. తను విచారంగా ఉండటం గమనించి పదే పదే కారణం అడిగింది. రోజ్ మేరీ తన కథ అంతా చెప్పుకొచ్చింది. తన భర్త ని ఎలా వెతకాలో తెలియటం లేదని దిగులుపడింది.

ఇంటావిడ అంది ” సూర్యుడూ చంద్రుడూ గాలీ- వీళ్ళని అడగచ్చు నువ్వు. వాళ్ళు అన్ని చోట్లకీ వెళ్ళగలరు కదా ”

సరే అనుకుని అమ్మాయి సూర్యుడు ఉండే బంగారపు కోటకి దారి అడిగి తెలుసుకుని వెళ్ళింది.

” సూర్యుడా, తప్పు చేశాను. దయ చేసి నా భర్త ఎక్కడో చెప్పు . నీకెంతైనా ఋణపడి ఉంటాను ” అని ప్రాధేయపడింది. సూర్యుడికి ఆమె సంగతి విని జాలేసింది.

” అతను ఎక్కడో మాత్రం తెలియదు. దీన్ని నీ దగ్గర ఉంచుకో. పెద్ద ప్రమాదం ఏమైనా వస్తే  పగలగొట్టు , మేలు జరుగుతుంది ” అని బంగారు రంగులో ఉన్న ఒక కాయని ఆమెకి ఇచ్చాడు. ఆమె సూర్యుడికి దణ్ణం పెట్టి  కృతజ్ఞతలు  చెప్పుకుని మళ్ళీ బయలుదేరింది.

పోగా పోగా ఇంకొక కోట . తలుపు తట్టింది. ఒక ముసలావిడ తలుపు తీసింది.

” దయచేసి నాకు సహాయం చేయండి ” అని  రోజ్ మేరీ వేడుకుంది.

” మా యజమాని చంద్రుడు. ఆయనకి చెబుతాను ఉండు ” అని ముసలావిడ చంద్రుడిని పిలుచుకొచ్చింది. చంద్రుడికీ ఆమె భర్త సంగతి తెలియదు. అతనూ ఇంకొక కాయని ఆమెకి ఇచ్చి ఆపద కలిగినప్పుడు బద్దలు కొట్టమన్నాడు. అది తెల్లగా పాలరాయిలా ఉంది.

ధన్యవాదాలు చెప్పుకుని ఆమె మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టింది. ఈ సారి గాలి దేవుడు ఉండే కోటకి చేరుకుంది. గాలి దేవుడు  తనకీ ఆమె భర్త ఆచూకీ తెలియదనే అన్నాడు. మట్టి రంగులో ఉన్న  అక్రూట్ కాయని ఇచ్చి సూర్యుడూ చంద్రుడూ చెప్పినట్లే చెప్పాడు.

అయితే ఈ సారి ఆమె కదలలేదు. విపరీతంగా అలిసిపోయి ఉంది. పైగా పట్టలేనంత దుఃఖం వచ్చింది. ఆ కోట మెట్ల దగ్గరే కూలబడి వెక్కి వెక్కి ఏడ్చింది.

గాలి దేవుడికి పాపం అనిపించింది. ” భయపడకు. ప్రయత్నం చేస్తాను. మళ్ళీ ఒకసారి అంతా వెతుకుతాను. ” అని పెద్ద శబ్దం చేసుకుంటూ తేలి వెళ్ళాడు, తిరిగి వచ్చాడు.

” తెలిసిందమ్మా అంతను ఎక్కడున్నాడో. ఒక రాజు గారి దగ్గర బంధించి ఉంచారు. ఆ రాజు కూతురికి ఇతను నచ్చాడట. ఇతను వద్దన్నా బలవంతంగారేపు పెళ్ళి చేయబోతున్నారు

” అని ఆ రాజ్యం ఎక్కడో చెప్పాడు.

అమ్మాయికి చాలా నిరాశ. ధైర్యం తెచ్చుకుని గాలి దేవుడిని అడిగింది ” ఒక్క రెండు మూడు రోజులు ఆ పెళ్ళిని ఆపగలరా ? నేను అక్కడికి వెళ్ళేందుకు అంత సమయం పడుతుంది కదా ‘’

” ఓ. అదెంత పని ! ” అని గాలి వెళ్ళాడు.

పెళ్ళికూతురు బట్టలు కుట్టే పనివాళ్ళ దగ్గరికి వెళ్ళి మహా విసురుగా వీచాడు. ఆ గౌన్ ల లేస్ లూ అంచులకి కుట్టే  ముత్యాలూ రత్నాలూ చెల్లా చెదురై పోయాయి- చెట్ల మీదికి, నది లోకి, పొలాల్లోకి. కుట్టుపనివాళ్ళు హడావిడిగా వాటిని పట్టుకునేందుకు ఎంతగా  కిందా మీదా పడ్డా ఏమీ లాభం లేకపోయింది. లేస్ లు చిరిగి  పోయాయి. పట్టు బట్టలన్నీ బురద కొట్టుకు పోయాయి. ముత్యాలూ రత్నాలూ గుప్పెడు  కూడా దొరకలేదు. మళ్ళీ బజారుకు వెళ్ళి కొత్తవి కొనుక్కు రావాలి అంతే. రాజు చిరాకు పడ్డాడు.” ఏదయితే అదే అయింది. ఆ గౌన్ లోనే అలంకరించండి ” అని ఉత్తరువు ఇచ్చాడు. దర్జీ లు కూర్చుని  ఏదో కుట్టారు. కాని కూతురిని ఆ చిరిగి మాసికలు వేసిన , మాసిపోయిన  గౌన్ లో చూసేసరికి ” బాగాలేదు, వద్దులే ” అనిపించింది రాజుకి.

కొద్ది గంటలలో అంతా మళ్ళీ సిద్ధం చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ రోజు గడిచిపోయింది.

చాలా వేగంగా నడిచిన  రోజ్ మేరీ తెల్లారేసరికి రాజభవనం వాకిట్లోకి వచ్చింది.

సూర్యుడు ఇచ్చిన కాయని  పగలగొట్టింది . అందులోంచి తళతళలాడుతూ లాడుతూ తెల్లటి పొడుగాటి శాలువా  వచ్చింది. దాన్ని పెళ్ళప్పుడు భుజాల మీదినుంచి వెనక్కి జారేటట్లు వేస్తారు.

అది తీసుకుని రాకుమారి చెలికత్తెలకి చూపించి ” మీ రాకుమారికి ఇది కావాలా ? ఆమె పెళ్ళి ట కదా ? ” అని అడిగింది.

రాకుమారి కి విషయం తెలిసి బయటికి వచ్చింది. పిడికెడు బంగారు కాసులు ఇచ్చి ఆ శాలువా కొనుక్కుంది. రాకుమారి అటు తిరగగానే చంద్రుడు ఇచ్చిన పాలరాయి కాయని రోజ్ మేరీ  పగలగొట్టింది. ఈ సారి  మిలమిలలాడుతూ వజ్రాలు  కుట్టిన మేలి ముసుగు వచ్చింది.  రాకుమారి ఇంకా ఎక్కువ బంగారం ఇచ్చి దాన్నీ  కొనుక్కుంది. రెండుసార్లూ ఇచ్చిన బంగారు కాసులని రోజ్ మేరీ జాగ్రత్త గా దాచుకుంది .

మెట్లుదిగి పక్కకి వెళ్ళి రోజ్ మేరీ అక్రూట్ కాయని కూడా బద్దలు కొట్టింది. పొరలు పొరలుగా ,గాలి అలల లాగా కదిలే చక్కని పెళ్ళి గౌన్ వచ్చింది.రాకుమారి అదీ కావాలంది. దర్జీలు కొత్త గౌన్ ని ఇప్పట్లో తయారు చేయలేరని ఆమెకి తెలుసు.

ఈ సారి రోజ్ మేరీ బంగారం వద్దంది. ” ఒక్కసారి నేను పెళ్ళికొడుకుని చూడాలి. అలా అయితేనే ఈ గౌన్ ఇస్తాను మీకు ”

ఇది రాకుమారికి పెద్ద నచ్చలేదు. అయినా చూసినంత మాత్రాన ఏం మునిగిపోతుందిలే అని ఒప్పుకుంది.

రోజ్ మేరీ ని ఆమె భర్త ఉన్న చోటికి తీసుకు వెళ్ళారు. అతను ఆమెని గుర్తు పట్టలేదు.  ఆమె దగ్గరగా వెళ్ళి తన దగ్గర ఉన్న రోజ్ మేరీ రెమ్మ తో అతన్ని తాకింది. అతనికి మొత్తం జ్ఞాపకం వచ్చింది. ఆనందంగా ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. ఆమె కళ్ళనీళ్ళతో తన తప్పుకి  క్షమాపణ అడిగింది. అతను ” కలుసుకున్నాము గా. ఏమీ పర్వాలేదు ” అని ఓదార్చాడు.

అక్కడికి వచ్చిన  రాజుతో ” నాకు ఇదివరకే పెళ్ళైంది. ఈమె నా భార్య. నేను మీ అమ్మాయిని పెళ్ళి చేసుకోలేను ” అని చెప్పాడు. రాజుకి కోపం వచ్చి ఆమె ని చంపేయాలనుకుని బంధించబోయాడు.

ఈ లోపు గాలి దేవుడు భార్యా భర్తలిద్దరినీ ఆకాశం లోకి ఎగరేసి రోజ్ మేరీ ఇంటికి చేర్చాడు. వాళ్ళ నాన్న ఇద్దరినీ చూసి చాలా సంతోషించాడు దుస్తులు అమ్మితే వచ్చిన బంగారు కాసులతో ఇంకొంత పొలం కొనుక్కుని, ఇల్లు బాగు చేసుకున్నారు. ఇదివరకులా వైభవంగా కాకపోయినా  వాళ్ళిద్దరూ  జీవితాంతం సుఖంగా గడిపారు.

[ రోజ్ మేరీ అనేది మూలిక వంటి మొక్క. వంటలలో, సుగంధద్రవ్యం గా, వైద్యం లో దీన్ని ఉపయోగిస్తారు.  Shakespeare రచించిన Hamlet నాటకం లో Ophelia కి మతి స్థిరంగా లేనప్పుడు ఆమె అన్న“There’s rosemary, that’s for remembrance; pray, love, remember.” ’’ అంటాడు. “Rosemary for remembrance’’ .అనేది నానుడిగా ఉండిపోయింది. జ్ఞాపకశక్తిని రోజ్ మేరీ నిజంగానే మెరుగు పరుస్తుంది, మనశ్శాంతిని కూడా ఇస్తుంది]

 

     స్పానిష్ జానపద కథ. సేకరణ -Dr. D. Francisco de S. Maspons y Labros , Andrew Lang

 అనువాదం: మైథిలీ సుబ్బరాజు

చిరిగిన ఆకాశాన్ని కుట్టే కవి ఇదిగో!

 

బాలసుధాకర్ మౌళి

బాలసుధాకర్ మౌళి

 

[ఈ నెలలో విడుదల అయిన బాల సుధాకర్ మౌళి కవిత్వ సంపుటి ‘ఎగరాల్సిన సమయం’ ముందు మాట ఇది]

 

చిన్న విషయం చెప్పాలి, బాల సుధాకర్ కవిత్వంలోకి వెళ్ళే ముందు-

ఫ్రెంచ్ ప్రతీకవాదపు ఆఖరి కిరణం Paul Valery ని ఎవరో అడిగారట – “అసలు దేన్ని మంచి రచన అనాలి?” – అని.

ప్రతీకలలో మాట్లాడడానికి ఏ మాత్రం తడుముకోని Valery అన్నాడట: “వొక రచన చదివాక ఎవరైనా I am a page of literature అనుకుంటే అదీ మంచి రచన.”

నిజమే అనిపిస్తుంది చాలా సార్లు; వొకప్పుడు రావిశాస్త్రి, యింకోప్పుడు శ్రీశ్రీ, యిప్పుడు ఉత్తరాంధ్ర నించి వీస్తున్న ఉత్తమ సాహిత్య పవనాలు కొంచెమైనా తాకినప్పుడు – మరీ ముఖ్యంగా – యెక్కడో వున్న నెల్లిమర్ల నించి వొక స్వరం గట్టిగా వినిపిస్తున్నపుడు literary pages ఎంత వేగంగా మారిపోతున్నాయో కదా అనిపిస్తుంది.

మారుమూల ఏ అంతర్జాల మాయాప్రపంచపు మరీచికలూ తాకీ తాకని చోట, కరెంటు వుండే వేళల కంటే లేని వేళలే యెక్కువగా వుండే చోట జీవితం వీధి లాంతరు గుడ్డి దీపం కన్నా బలహీనమైన వెలుగు ప్రసరిస్తున్న చోట – ఈ బాలసుధాకర్ మౌళి అనే కవి ఈ సాహిత్య పుటలు ఎలా తిప్పేస్తూ వుంటాడా అనే వూహ నన్ను యెప్పుడూ లోపల్నించి బాధగా మెలిపెడుతూ వుంటుంది.

చాలా కష్టం, అనేక మార్పులు ప్రపంచాన్ని చుట్టి వస్తున్నప్పుడు వొక చిన్న వూరి నించి ప్రయాణం మొదలెట్టడం! ప్రపంచ పటం మీద తన వూరినీ తననీ కనీసం చిన్ని చుక్కగా చూసుకోడానికైనా ఆ కవికి చాలా భరోసా కావాలి. “నేను ఈ ప్రపంచంలోనే వున్నానా?” అన్న ఉనికి వేదన అతన్ని వూపిరాడనివ్వదు. “I am a page of literature,” అనుకోడానికి కావాల్సిన ambience దొరకదు.

అలాంటప్పుడు Paul Valery చెప్పింది కొంత వరకే నిజం! ఎందుకంటే, ప్రపంచ పటం మీద వుండే వాళ్లు చాలా మంది వొకే పేజీ మీద వుండరు. సాంకేతికంగా సరే, మానసికంగా అది అంతగా సాధ్యపడదు. అలాంటప్పుడు నెల్లిమర్ల కవి వొక్కడూ – వొక మూల ఎదో బడిలో పాఠాలు చెప్పుకుంటూ బతికే కవి – ఏం చేస్తాడు ఈ ప్రపంచ పటం మీద?!

ఈ ప్రశ్నకి కనీసం వొక సమాధానం దొరికితే చాలు, బాలసుధాకర్ కవిత్వంలోకి మనకి వొక ఎంట్రీ దొరికినట్టే.  నాకు దొరికిన సమాధానం ఏమిటంటే ముఖ్యంగా అతను తాను సాహిత్యంలో పేజీని అనుకోవడం లేదు. కేవలం సాహిత్యమే పేజీ అనుకోవడమూ లేదు. అతనికీ యీ లోకానికీ యింకా పెద్ద పేచీనే వుంది. అసలు అతని కవిత్వానికీ, కథలకీ, వ్యాసాలకీ, అతని క్షణచర్యల్ని రికార్డు చేస్తున్న ముఖపుస్తకపు అనుదిన క్షతగాత్ర వదనంమీద అతను విసిరే శకలాలకీ ఈ పేచీలోనే key వుంది.

అతన్ని సింబాలిస్ట్ Paul Valery కాదు, అతనికి తెలీకుండానే Rolland Barthes అనే విప్లవోన్మాది ఆవహించి వున్నాడు. వొక్క బాలసుధాకర్ ని మాత్రమే కాదు, 1968 మే లో ఫ్రాన్సులో పెట్టుబడిని గజగజ వణికించిన ప్రజా వుద్యమ పంథాలో నిలబడి, Rolland Barthes సాహిత్యం కేవలం సాహిత్యం కాదు అని సింహగర్జన చేయడం ప్రపంచమంతా వినిపించింది. అతను అన్న మాట: I am not a page of literature. ఆ వాక్యం ప్రపంచ సాహిత్య చరిత్రలో historical discourse అన్న భావనకి తొలి పునాది. సాహిత్యంలోని విపరీత కాల్పనికతని ధిక్కరించిన భావన.

సరే, I am not a page of literature అన్న రచయితలూ కవులూ ఏం చేస్తారు? వాళ్ళు యింకో చరిత్ర కోసం కలలు కంటారు, కళల్ని కంటారు. బాలసుధాకర్ కవి కాబట్టి, అతని కలలన్నీ కవిత్వంలో వుంటాయి. అతను కల కంటున్న కొత్త చరిత్ర సమస్తం కవిత్వ వాక్యాల్లోకి బట్వాడా అవుతుంది.

1968 ని బాల సుధాకర్ చూసి వుండడు. కాని, అతను పుట్టిన వూరూ, ఆ చుట్టుపక్కల యింకా మిగిలి వున్న శ్రీకాకుళం విప్లవాగ్నుల కొలిమి సెగల్ని దాచుకునే వుంది. ఆ చరిత్ర లేకుండా బాలసుధాకర్ లేడు. అతని ప్రతి కలవరింతా పలవరింతా ఆ అనుభవం చుట్టూనే కాబట్టి, అతని కవిత్వం – historical discourse- అని నా ప్రతిపాదన. అతను రాస్తున్న పేజీలు  కేవలం సాహిత్య పుటలు కావు. Rolland Barthes చెప్పిన reality effect ని పొదువుకున్న సామాన్యుడి దస్తావేజులు. పీడితుల కైఫియత్తులు.

Paul Valery మాదిరిగా ప్రతీకల మీద బతికే కవి తన కవిత్వాన్ని పీడితుల కైఫియత్తుగా మార్చగలడా? తన దగ్గిర వున్న అరకొర సాధనాలని చరిత్రకారుడిలాగా చాకిరీ చేయించగలడా?చేయగలడా?

అవును, ముమ్మాటికీ చేయగలడు అని నిరూపిస్తూ వెళ్తున్నాడు బాలసుధాకర్.

Layout 1

1

బాలసుధాకర్ కవిత్వం చదివేటప్పుడు నన్ను బాగా ఆకట్టుకునేది అతను కవిత్వాన్నీ, వాస్తవికతనీ juxtapose చేసే పధ్ధతి. ఈ “ఎగరాల్సిన సమయం” సంపుటిలో మొదటి కవితలోనే సుధాకర్ ఆ రెండీటి మధ్యా వంతెన కట్టుకునే పనికి దిగుతాడు ఈ వాక్యంలో-

కల్లోల దేశాన్ని

కవిత్వం చేస్తున్నప్పుడు

కవిత్వం పసిపిల్లలా వుండాలనుకోవడంలో

                               తప్పేముంది?

అంటూ-

 

కాని, ఆ కవిత అసలు రహస్యం ఆ తరవాతి పంక్తిలో వుంది.

పసిపిల్లలాంటి నిర్మలమైన, నిర్భయమైన

పద్యాన్ని సృజించే వరకూ

       రాత్రుళ్ళు యిలానే-

అటు ప్రపంచ సాహిత్యంలోనూ ఇటు భారతీయ సాహిత్యంలోనూ యుద్ధానంతర వాస్తవికతని చెప్పిన కవులూ రచయితలూ పసిపిల్లల కళ్ళతో వాటిని దృశ్యం చేయడం కనిపిస్తుంది, యుద్ధ కల్లోలంలోని కరకుదనం, పసి కళ్ళ నిర్మలత్వాన్ని ఎదురెదురుగా చూపిస్తూ-

బాలసుధాకర్ కి ఆ నిర్మలత్వమే కాదు, నిర్భయమూ కావాలి. వొక మంచి పద్యం ఎంత నిర్మలంగా వుంటుందో, అంత నిర్భయంగానూ వుంటుంది. మొదటి కవితలోనే తన కవిత్వమార్గానికి తానే అలా నిర్వచనం చెప్పుకున్నాడా సుధాకర్?!

ఆ తరవాతి కవితలో అవును నిజమే అని ఖాయం చేస్తున్నాడు ఇలా –

కవులూ

పిల్లలూ

ఏ దేశానికైనా ప్రాణ వీచికలు.

ఆ తరవాత ఎన్ని కవితల్లో పిల్లలు ఎగురుకుంటూ వస్తారో మీరే చూడండి. నిజానికి, ఈ కవిత్వ సంపుటి శీర్షిక “ఎగరాల్సిన సమయం” అలా పిల్లల్లా ఎగిరే నిర్మల నిర్భయ సమయ సందర్భాల్ని సూచిస్తోందేమో!

కాని, అవి కేవలం నైరూప్య సమయ సందర్భాలు కావు.

బాలసుధాకర్ కేవలం కవి మాత్రమే అయి వుంటే, అతనికి నైరూప్యత చాలా అవసరమయ్యేది. కవి మాత్రమే కాకుండా, భవిష్యత్తుని రోజూ కళ్ళారా చూస్తూ వుండే ఉపాధ్యాయుడు కూడా అవడం వల్ల అతని నైరూప్య వూహలూ, కవిసమయాలూ రోజూ కొంత కొంత విచ్చిన్నమైపోతూ వుంటాయి. తరగతి గది అతని సమయసందర్భాల్ని redefine చేస్తూ వుంటుంది. అతని బలాల్నీ, బలహీనతల్నీ రోజూ కొంత కొంత ఎండగడుతూ వుంటుంది. అతను గతమ్మీద బతికే వీలు లేకుండా భవిష్యత్తుని దర్శించి తీరాల్సిన చరిత్రభారాన్ని అతని మీద పెడుతూ వుంటుంది. ఆ భారాన్ని మోసుకుంటూ ఎలా కలల్లోకి ఎగురుతున్నాడన్నదే బలసుధాకర్ కవిత్వ ప్రయాణం. అనేక ప్రతికూలతల మధ్య తన సమయాన్ని తను నిర్దిష్టంగా reinvent చేసుకోవడం ద్వారా ఈ ప్రయాణానికి వొక తాత్విక సారాంశాన్ని జోడిస్తున్నాడని నేను అనుకుంటున్నా.

2

సమయసందర్భాలు చరిత్రకారుడికి అక్కరకొచ్చే పనిముట్లు. కవి సుధాకర్ కి కూడా!

కవికి భాష ముఖ్యమైన సాధనం. తన సందర్భాన్ని reinvent చేసుకునే కవి- భాషనీ reinvent చేసుకోవాలి. అంటే, భాషకి అంతకు ముందు వున్న నిర్మాణ వ్యవస్థని కవి ప్రశ్నించాలి, వీలయితే అందులో ధ్వంస రచనకి దిగాలి. అంటే, Writing అనే ప్రక్రియ ఏదైతే వుందో దాన్ని కొత్తగా నిర్మించుకోవాలి.   మళ్ళీ Rolland Barthes దగ్గిరకే వద్దాం. కొత్త చారిత్రక సందర్భంలో Writing ని నిర్వచిస్తూ ఇలా అంటాడు:

Writing is integrally “what is to be invented,” the dizzying break with the old symbolic system, the mutation of a whole range of language.

ఈ రెండేళ్ళ తెలుగు కవిత్వ సందర్భంలో సుధాకర్ ప్రవేశం వొక ఆశ్చర్యం చాలా మందికి! మొదటి కొన్ని కవితలతోనే సుధాకర్ వొక విస్మయ వలయాన్ని తన చుట్టూ నిర్మించుకున్నాడు. ఇతని భాష, ఇతని వాక్యం కొత్తగా వుందన్న talk వచ్చేసింది. దానికి ప్రదాన కారణం: సుధాకర్ కవిత్వ భాషలో తెచ్చుకున్న మార్పులు. కవిత్వ భాష అనగానే అందులోని ప్రతీకలు, పదచిత్రాలూ. సుధాకర్ కవిత్వంలో అవేవీ పాత వాసన వేయవు. ఆ పాతదనాన్ని వదిలించుకోవాలన్న బలమైన ప్రయత్నం సుధాకర్ కవిత్వ భాషలో కనిపిస్తుంది. అయితే, ప్రయోగం పేరుతో యెక్కడికో పలాయనం చిత్తగించకపోవడం అతని శిల్ప ఆరోగ్యానికి, వస్తు నిబద్ధతకీ సంకేతం. శిల్పంలో సుధాకర్ ఎన్ని కొత్త పోకడలు పోతాడంటే, ఆ పోకడ చాలా subtle గా వుంటుంది. ఈ సంపుటిలోని ప్రతి కవితా దీనికి వేర్వేరు కోణాల నించి వొక ఉదాహరణగా నిలుస్తుంది.

అయితే, శిల్పం కంటే కూడా సుధాకర్ వస్తు విస్తృతి నాకు ప్రత్యేక ఆకర్షణ. బహుశా, అతికొద్ది కాలంలో సుధాకర్ ఎక్కువ మంది అభిమానుల్నీ, నిరంతర చదువరుల్నీ సంపాదించుకోడానికి ఈ వస్తు వైశాల్యమే ముఖ్య కారణం అని అనుకుంటున్నాను. సుధాకర్ ఎన్ని రకాల కవిత్వ వస్తువుల్ని తడుముకుంటూ వెళ్ళాడో! స్త్రీలూ, పిల్లలూ, ఊళ్ళూ, బళ్ళూ, నీళ్ళూ, క్యూబాలూ, నియంతలూ, నిరాశలూ, ఆశలూ – ఇలా ఈ వరస ఎక్కడ అంతమవుతుందో తెలీదు. కాని, వీటన్నిటి వెనకా సుధాకర్ ని నడిపించే శక్తి వుందే, అది బలవత్తరమైంది.

సుధాకర్ ఉత్తమ చదువరి. వొక రచయిత పేరు వింటే, అది వెంటనే అతని మనసుని వెంటాడడం మొదలెడుతుంది. అతని చేతులు ఆ పుస్తకాన్ని చేరుకునే దాకా నిద్రపోవు. కారణాలేమైనప్పటికీ, ఈ మధ్య కాలంలో చదువు పట్ల ఇంత దాహం వున్నవాణ్ని నేను చూడలేదు. తన కవిత్వం మీద తనకి శ్రద్ధ ఉండడంలో ఎవరికైనా ఆశ్చర్యం లేదు. కాని, సుధాకర్ ఇతరుల కవిత్వాల్ని కూడా అంతే ప్రేమగా చదువుకుంటాడు. బహుశా, వొక ఉత్తమ అధ్యాపకుడికి వుండాల్సిన ప్రేమ అది. కాని, అదే ప్రేమ వొక కవికి కూడా వుంటే, ఆ కవి దిగంతం ఎప్పుడూ కొత్తగా వొక హరివిల్లుని పూస్తుంది. ఈ సంపుటిలోని కవితలూ, వాటి ప్రేరణలూ, ప్రభావాలూ గమనిస్తే, సుధాకర్ ఎక్కడెక్కడి నించి పరిగెత్తుకుంటూ వస్తున్నాడా అనిపిస్తుంది. “ప్రేమతో ఆలింగనం చేసుకోడానికి/ సరిహద్దులు అడ్డం కావు” అని వొక కవితలో అన్న వాక్యం సుధాకర్ వ్యక్తిత్వానికి tagline లాంటిదే.

అంటే, వొక కవి తన సమయాన్నీ, సందర్భాన్నీ పునర్నిర్మించుకునే బలాన్ని ఎక్కడి నించి తీసుకుంటాడో చెప్పడం కోసం సుధాకర్ లోని ఈ వ్యక్తిత్వ విశేషాన్ని వివరించాను. ఇలా చెప్తున్నప్పుడు కూడా సుధాకర్ లో వున్న ఆ చరిత్ర కోణమే నేను నొక్కి చెప్తున్నాను. ఆ చరిత్ర కూడా వొక subjective slant వున్న వర్తమాన కోణం. ఇలాంటిది మనకి తెలుగు కవిత్వంలో వొక వరవరరావులోనో, శివసాగర్ లోనో మాత్రమే కనిపిస్తుంది. మనకి తెలిసిన black poets – Langston Hughes, Amiri Baraka లోనూ, మనకి అంతగా తెలియని కాశ్మీరీ దీప కళిక Agha Shahid Ali లోనూ బలంగా కనిపిస్తుంది. వ్యక్తులూ దేశ చరిత్రలూ జాతుల చరిత్రలూ ఎప్పుడూ విడివిడి ద్వీపాలు కావనీ, అవి కలిపి కుట్టిన బొంత దుప్పటి వంటివనీ వీళ్ళ కవిత్వం వల్ల అర్థమవుతుంది. సమకాలీన తెలుగు కవిత్వంలో సుధాకర్ లో ఈ అంతర్జాతీయ ప్రగతిశీల సాహిత్య దృక్కోణ వారసత్వం నెల్లిమర్ల నేల భాషలో localize అవ్వడం ఈ సంపుటిలో చూస్తాం.

కచ్చితంగా ఇదే సమయంలో నేను మన సుధాకర్ లాంటి ఇంకో అమెరికన్ black poet ని చదువుతున్నాను. అతని పేరు Jamaal May. ఇతనూ సుధాకర్ వొకే ఈడు వాళ్ళు అయి వుండాలి. వొకే ఈడులో వున్న కవులూ రచయితలూ ప్రపంచ పటంమీద భిన్న బిందువుల మీద నిలబడి ఏం మాట్లాడుతూ వుంటారా అని మనసు రిక్కించి చదువుతూ వుంటాను. వొకరు నెల్లిమర్లలో యింకొకరు డిట్రాయిట్ యంత్ర నగరిలో! కాని, ఇద్దరి కవిత్వ వాక్యాలూ వొకే రకమైన mechanization ని సవాల్ చేస్తున్నాయి. Jamaal గురించి నాకు ఇష్టమైన మరో కవి Natasha Trethewey అంటోంది: Jamaal has a fine ear, acutely attuned to the sonic textures of everyday experience. ఇవే మాటలు సుధాకర్ కి కూడా చక్కగా వొదుగుతాయి.

వొక కవితలో అతను అంటున్నాడు:

I have come

to stitch all

this torn sky back together.

ఈ పూట సుధాకర్ కవిత్వాన్ని పరిచయం చేయడానికి అంత కంటే ఇంకో మంచి వాక్యం దొరకడం లేదు నాకు! మీలోపలా బయటా చీలిపోతున్న ఆకాశపు పోగులు అతికించి ఈ చలి రాతిరి మీ కోసం వెచ్చని దుప్పటి కుట్టే కవిత్వం ఇదిగో!

  • -అఫ్సర్

ఆస్టిన్,

ఆగస్టు 15, 2014.

 

 

 

 

 

అతడు ఈ నేల మీది వాడల ఆస్తి!

10527627_758258257546728_5310203278332013818_n

 

‘ తెరేష్ ఈస్ నో మోర్ ‘ …. మొన్న సెప్టెంబర్ 29 న కవి మోహన్ రుషి పంపిన మెసేజ్ చూడగానే లోపలెక్కడో కాస్త అపనమ్మకంగానే కట్టుకున్న చిన్న ఆశ ఏదో ఒక్కసారిగా కుప్పకూలి పోయిన బాధ ! వార్త తెలిసిన వెంటనే  ఆఫీస్ నుండి సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రికి వెళ్ళడం అయితే వెళ్లాను గానీ తెరేష్ అన్నని ఒక విగత జీవిగా దగ్గరనుండి చూసే ధైర్యం లేకపోయింది. బహుశా, తెరేష్ అన్నని కాస్తో కూస్తో సమీపంగా తెలిసిన ఎవరికైనా ఇదే అనుభవం ఎదురై వుంటుంది. ఎప్పుడు కలిసినా గొప్ప జీవకళతో వెలిగిపోతూ, మనుషుల్ని ఆలింగనం చేసుకునే మనిషిని ఒక్కసారిగా అట్లా చూడవలసి రావడం మనసుకి ఎంత కష్టం !

 

అంతకు క్రితమే నేను పాల్వంచలో ఉద్యోగం చేసే కాలంలో కవి మిత్రుడు ఖాజా ద్వారా తెరేష్ కవిత్వం గురించి విని వున్నప్పటికీ, 1996 లో తన ‘అల్పపీడనం ‘ కవితాసంకలనం విడుదల సందర్భంలో తెరేష్ అన్నతో నా తొలి పరిచయం. తెలుగు కవిత్వంలో నాకు పరిచయమైన కవులలో తొలి పరిచయ కాలంలోనే నేను ‘అన్నా ‘ అని పిలిచిన అతి కొద్దిమంది కవులలో తెరేష్ ఒకడు! … తను కూడా ఎట్లాంటి అనవసర మర్యాదలు లేకుండా ‘విజయ్ ‘ అనే పిలిచాడు.  పరిచయమైన కొద్దికాలం లోనే మనుషులు దగ్గరి వాళ్లై పోయే గొప్ప మానవాంశ ఏదో తెరేష్ అన్నలో వుండేది !

తెలుగు కవిత్వం నిండా దళిత కవిత్వం పరుచుకున్న కాలంలో ఆ దళిత కవిత్వ జెండాని రెప రెప లాడించిన ఇద్దరు బాబుల్లో ఒకరు తెరేష్ బాబు అయితే మరొకరు మద్దూరి నగేష్ బాబు. అప్పుడప్పుడే హైదరాబాద్ కి వొచ్చి కవిత్వాన్ని సీరియస్ గా చదువుకుంటూ వున్న నాకు ఆ ఇద్దరి కవితలు, దళిత జీవితంలోని అవమానాలనీ, దళితులు సవర్ణ వ్యవస్థ పైన ప్రదర్శించే ధర్మాగ్రహం వెనుక వున్న నిత్య గాయాల పుళ్లనీ చిత్రిక కట్టాయి.  ముఖ్యంగా, తెరేష్ ఎంచుకున్న మార్గం కొంత విభిన్నం! …. కొన్ని తరాల పాటు తనని అవమానాల పాలు చేసిన ఈ సవర్ణ వ్యవస్థ సిగ్గుతో చితికి బిక్క చచ్చి పోయేలా చేయడానికి ఉపయోగించవలసిన సాధనం ‘తిట్లూ – శాపనార్థాలూ ‘ కాదనీ, పోలీసు దెబ్బల్లా పైకి మరకలేవీ కనిపించకుండా కొట్టాలంటే అందుకు పదునైన వ్యంగ్యమే సరైనదని అతడు భావించినట్టు తోస్తుంది. అతడి చాలా కవితలు ఎంతో కసితో రాసినట్టు తెలిసిపోతూ వుంటుంది.  ఎవరో గాట్టిగా తంతే పెద్ద సింహాసనం ముక్కలు ముక్కలై గాల్లోకి ఎగిరిపోతున్నట్టుగా వుండే ‘అల్పపీడనం‘ కవర్ పేజి ఇందుకు మంచి ఉదాహరణ! తన ‘నిశానీ’ కవితా సంకలనం లో బూతులు యధేచ్చగా దోర్లాయని ఫిర్యాదులు వొస్తే, ‘కమలా కుచ చూచుకాల్లో / వేంకటపతికి అన్నమయ్య పట్టించిన సురతపు చెమటల్లో / నీకు బూతు అగుపడదు ‘ అని దూకుడుగా జవాబు చెప్పిన కవి తెరేష్ !

తెరేష్, తెలుగు భాష పైనే కాదు – ఉర్దూ పైన కూడా మంచి పట్టు వున్న కవి. ముఖ్యంగా పాత హిందీ సినిమా పాటలు, గజల్స్ అంటే తనకు ఎంతో యిష్టం. తనదైన శైలిలో అద్భుతమైన దళిత కవిత్వం మాత్రమే కాదు – సగటు టి వి ప్రేక్షకులని ఉర్రూతలూగించిన సీరియల్స్ కూడా రాసాడు. అంతేగాక గొప్ప గాయకుడు. తెలుగులో తాను రాసిన గజల్స్ లో ‘నీ ప్రేమలేఖ చూసా – నే గాయపడిన చోటా ‘ కి వున్న అసంఖ్యాకమైన అభిమానులలో నేనూ ఒకడిని! … ఆ మధ్యన ఎక్కడో కలిసినపుడు ఆ గజల్ టెక్స్ట్ కావాలని అడిగితే గుర్తు పెట్టుకుని మరీ పేస్ బుక్ లో ‘విజయ్ – ఇది నీకోసం’ అని పోస్ట్ చేసాడు.

మరీ ముఖ్యంగా, తెలంగాణ ఉద్యమానికి తెరేష్ తన కవితల ద్వారా యిచ్చిన సపోర్ట్ మరిచిపోలేనిది. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా సీమాంధ్ర కవులు తెచ్చిన కవితా సంకలనానికి పెట్టిన పేరు ‘కావడి కుండలు‘, తెరేష్ రాసిన కవిత శీర్షిక నుండి స్వీకరించినదే ! …. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ముందుకు సాగే క్రమంలో తెలంగాణ కు వ్యతిరేకంగా జరిగిన కుట్రలను హేళన చేస్తూ పేస్ బుక్ లో క్రమం తప్పకుండా ‘విభజన గీత’ శీర్షికతో తెరేష్ పోస్ట్ చేసిన పద్యాలు / వ్యాఖ్యానాలు పెద్ద హిట్ ! చాలా మంది తెలంగాణ కవులలో కూడా లుప్తమైన గొప్ప రాజకీయ పరిజ్ఞానంతో అప్పుడు జరిగిన సంఘటనల వెనుక దాగిన కుతంత్రాలని తన విభజన గీత పద్యాలలో విప్పి చెప్పాడు!

కొంతకాలంగా తెలుగు కవిత్వంలో ‘దళిత కవిత్వం ఎక్కడుంది ?’ అని ఒక ఫిర్యాదు వుంది. నగేష్ , తెరేష్ , యువక లాంటి కవులని అభిమాంచిన నా లాంటి వాడికి కూడా ‘ఉధృతంగా సాగిన దళిత కవిత్వం పూర్తిగా మందగించింది. అచ్చమైన దళిత కవిత్వం రాయగలిగిన తెరేష్ లాంటి కవులు విస్తృతంగా రాయడం లేదు’ అన్న ఒక ఫిర్యాదు వుంది. తనకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి, ఐదు నెలల క్రితం ఇంటికి వెళ్లి పలకరించినపుడు… ఈ ఫిర్యాదుని తన ముందు పెడితే, ‘నేను మళ్ళీ విజ్రుంభిస్తా!’ అని తనదైన శైలిలో గొప్ప ఆత్మ విశ్వాసంతో చెప్పాడు. అతడే కాదు … నా లాంటి మిత్రులు చాలా మందిమి విశ్వసించాము … కాదంటే, ఆశపడ్డామేమో ?! …. ఇంతలోనే ఇట్లా జరిగిపోయింది !

ఈ నేల మీది కొన్ని లక్షల మంది దళిత వాడల తల్లులు ఎన్నెన్ని పురిటి నొప్పులు పడితే, ఆ వాడల అవమానాల గాయాలని గానం చేసే, వాడలలో సృష్టించే అల్ప పీడనంతో ఊళ్ళ లోని సింహాసనాలని కూల్చి వేసే,  ఒక తెరేష్ లాంటి కవి జన్మిస్తాడు. ఆ దళిత వాడల అపురూప ఆస్తి కదా అతడు! ….ఇంకా చేయవలసిన యుద్ధాలు ఇన్నేసి మిగిలే వున్నా, ఇట్లా తొందర పడి, ఈ నేలని విడిచి వెళ్ళిపోయే హక్కుని ఆ కవికి ఎవరిచ్చారు ?

కోడూరి విజయకుమార్    

ఫోటో: కాశిరాజు   

 

నో రిగ్రెట్స్

mohan“సాధనా ! ఇది నాలుగో పెగ్గు ! రోజు రెండు పెగ్గులే తాగుతానన్నావు “ సిగిరేట్ పడేస్తూ అడిగాను

“ Dont stop me for the day ! ఈ రోజు నిన్ను కలిసిన సంతోషంలో ఎన్ని పెగ్గులు అయినా తాగొచ్చు ! అస్సలు మత్తు రాదు “ నవ్వుతూ చెప్పింది సాధన

“ love you ! సాధి “ ఎందుకో తెలియదు సాధన చాలా ముద్దు వచ్చింది , ఒకసారి వంగి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాను

“ఏంట్రా ! ముద్దు వచ్చానా “ చిలిపిగా అడిగింది సాధన .

సాధన నాకు పరిచయం అయ్యి దాదాపు 9 నెలలు కావస్తుంది . ఫేస్ బుక్ లో పరిచయం అయిన ఒక యువతి కి నేను ఇంత దగ్గరవుతానని కలలో కూడా ఊహించలేదు, ఈ 9 నెలల కాలంలో ఎన్ని గంటలు ఫోన్ లో మాట్లాడుకున్నామో , very bold girl . ఏ విషయం అయినా చాలా లోతుగా ఆలోచిస్తుంది. ఎవ్వరి ఆసరా లేకుండా ఒక MNC bank కి వైస్ ప్రెసిడెంట్ గా ఎదిగింది . 35 సంవత్సరాలు కూడా లేకుండా ఈ స్థాయి కి ఎదగటం అంత ఈజీ కాదు, నాకు నలభై దగ్గర పడుతున్నా, నేను పని చేస్తున్న బ్యాంక్ లో నేను ఇప్పటికీ మేనేజర్ గానే ఉన్నా, మహా అయితే నలభై వచ్చే సరికి సీనియర్, మేనేజర్ స్థాయి లోకి వస్తానేమో, అదే వైస్ ప్రెసిడెంట్ కావాలంటేమరో ఐదేళ్ళు ఆగాల్సిందే.

సెక్టార్ -34 లో విలాసవంతమైన ఆపార్ట్మెంట్స్ , టెర్రాస్ ఫ్లోర్ , అక్కడనుండి చూస్తే చండీగడ్ రంగు రంగుల్లో మెరిసి పోతుంది .

గ్లాస్ లో మరో పెగ్ ఫిక్స్ చేసుకొని అలా పిట్ట గోడ వైపు కి నడిచాను, దూరంగా కనిపిస్తున్న హోర్డింగ్ లో ప్రియాంక నడుము వైపు చూస్తూ నుంచున్నాను .

“నడుము బాగుందా ! “ వెనకనుండి ఎప్పుడు వచ్చిందో సాధన, కట్టుకున్న బ్లాక్ శారీ కొంచెం పక్కకు తొలిగి నడుము వంపు అందంగా కనిపిస్తుంది,.ఒక్క నిమిషం పాటు నా చూపు నిలిచి పోయింది.

Kadha-Saranga-2-300x268

“ఓయ్ ! చూసింది చాల్లే ! చూపు మార్చు “ పెద్దగా నవ్వుతూ నా చేతిని తన చేతిలోకి తీసుకొని ముద్దు పెట్టుకుని భుజం మీద తల పెట్టి నా పక్కనే నుంచుంది, నిజమే, సాధన ముఖంలో ఎప్పుడూ లేని ఒక వెలుగు కనిపిస్తుంది, సాధన ను నేను కలవటం ఇదే మొదటి సారి అయినా గత 9 నెలలుగా కొన్ని వందల ఫోటోస్ లో , కామ్ లో ఎన్ని సార్లు చూశానో , కాబట్టి ఆమె లో చిన్న తేడా కూడా గుర్తించగలను , ఎప్పుడూ లేని ఒక సంతోషం లో ఎందుకు ఉంది అది నా భ్రమా ! సాధన ను కలవటం నాకు సంతోషం కాబట్టి సాధన నాకు సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తుందా ! లేక నిజంగానే సంతోషంగా ఉందా !! ఏమో అసలు నేను ఆమె సంతోషం కోరుకుంటున్నానా ! ఆమె ద్వారా నా సంతోషం కోరుకుంటున్నానా ! ఏమో నాకే తెలియటం లేదు .

ఎప్పుడో 9 నెలల క్రితం ఒక చిన్న ప్రవాహం లా మొదలైనా మా స్నేహం ఇలా సముద్రం లా మారటానికి చాలా కారణాలున్నాయి . చక్కని రూపం, సమ్మోహనమైన స్వరం ఎందుకో మొదటి చూపులోనే ఆమె తో నన్ను ఆకర్షణ లో పడేశాయి. అదే ఆమె తో రోజు మాట్లాడటానికి నన్ను తొందర పెట్టాయి.క్రమ క్రమంగా ఆమె వ్యక్తిత్వం, ఆమె గురించి తెలిశాక, ఆకర్షణ కన్నా బలమైన మరో కారణం ఆమెను నాకు సన్నిహితురాలిని చేసింది .మరి నన్ను ఆమెకు సన్నిహితుడిగా చేసిన కారణం ఏమిటో మాత్రం నాకు అర్ధం కాలేదు, ఎవరి దగ్గరైనా గంభీరంగా ఉండే సాధన నా దగ్గర మాత్రం చిన్నపిల్లలా ఉంటుంది . అప్పటికి ఒకసారి అడిగాను “ప్రపంచంలో ఎవరిదగ్గరైనా గుంభనంగా ఉండే వారు కూడా ఒకే ఒకరి దగ్గర మాత్రం అన్నీ మర్చిపోయి , అసలు ఒక మనిషననే విషయం కూడా మర్చిపోతారు, నాకు ఆ మనిషి వి నువ్వే “ , ఇది తాత్వికత్వమో, ప్రేమ తత్వమో నాకు అర్ధం కాదు .ఏమైనా సాధన మాత్రం నాకు అపురూపమే .

ఎక్కడో నెల్లూరు జిల్లాలోని ఒక పల్లెటూరు నుండి డిల్లీ మీదుగా చండీగడ్ చేరిన సాధన ప్రయాణం నాకు ఎప్పుడూ ఆశ్చర్యమే. మొదట్లో ఒక్కోసారి అనుమానం వచ్చేది నేను వింటున్నది సినిమా కథ కాదు కదా అని ! అన్ని మలుపులు ఎలా ఉంటాయా ఒక జీవితంలో అనే అనుమానం కలిగేది

నెల్లూరు లో ఒక మామూలు డిగ్రీ చదివిన అమ్మాయి సాధన , దిగువ మధ్య తరగతి కుటుంబం , తిండి కి లోటు లేక పోయినా, పెళ్ళికి మాత్రం లోటు ఉన్నంత కుటుంబం, డిగ్రీ చివరి సంవత్సరం అయిపోగానే కిషోర్ తో రెండో పెళ్ళికి సిద్దపడవలసి వచ్చిన నేపధ్యం. కిషోర్ ది కూడా ఒక బాదాకర జ్ఞాపకమే , పెళ్ళి అయి ఒక ఏడాది కాగానే, యాక్సిడెంట్ లో భార్య ను పోగొట్టుకోవాల్సి రావటం . ఆ యాక్సిడెంట్ లో తన భార్యతో పాటు, వదిన కూడా చనిపోవటం , తను కూడా నడుము కు దెబ్బ తగిలి ఆరు నెలల పాటు బెడ్ మీదే ఉండటం ఇవన్నీ దిగమింగలేని చేదు జ్ఞాపకాలే. పిల్లలు లేకపోవటం డిల్లీ లో మంచి హోదాలో ఉండటం , సాధన అందం చూసి వారంతట వాళ్ళే పెళ్ళి ప్రస్తావన తేవటం , అభ్యంతరం చెప్పటానికి పెద్ద కారణాలు కనపడలేదు , సాధన కి కూడా పెద్దగా కారణాలు కనిపించలేదు . కెనడా లో ఉంటున్న కిషోర్ తల్లిదండ్రులు చకచకా పెళ్ళి ఏర్పాట్లు చెయ్యటం , పెళ్ళి కావటం అన్నీ పదిహేను రోజుల్లో అయిపోయాయి . ఇప్పటికీ తనకి గుర్తే ఆ రోజు చెన్నై ఎయిర్ పోర్ట్ లో అత్తగారు సాధన కి కిషోర్ గురించి చెప్తూ “now ! its your responsibility to lead this house “ అని చెప్తున్నప్పుడు తోటమాలి పూల మొక్క చేతికిచ్చినట్లు కాక, నర్సరీ లో పూల మొక్కకొన్నాక చేతికిచ్చినట్లనిపించింది.

డిల్లీ లో పెద్ద ఇల్లు , కోరుకున్న సౌకర్యాలు, కిషోర్ అప్పటికే యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పని చేస్తూ ఉండేవాడు, బావ శేఖర్ మిలిటరీ లో కల్నల్ హోదా లో ఉండే వాడు . బావ గారికి ఒకతే పాప, స్నేహ, ఐదేళ్ల వయసులోనే తల్లి ని పోగొట్టుకుంది . డిల్లీ వచ్చిన మొదటి రోజు రాత్రే తెలిసింది ,యాక్సిడెంట్ లో కిషోర్ కి నడుము కి దెబ్బ తగలటం వల్ల అతను సంసారానికి పనికి రాడని, ఒక వారం పాటు మనిషి కాలేక పోయింది, కానీ ఆ విషయంలో తప్ప మిగతా ఏ విషయంలోనూ కిషోర్ లో తప్పు పట్టాల్సింది ఏమి లేదు . మిగతావాటిలో తనకు సంపూర్ణ స్వేచ్చ ఇచ్చాడు . తన మోటివేషన్ తోనే PG చేసింది ,బ్యాంక్ లో మేనేజర్ గా జాయిన్ అయ్యింది, చూస్తుండగానే ఐదేళ్లు గడిచిపోయాయి . కిషోర్ కి Kingston university లో ప్రొఫెసర్ గా పోస్టింగ్ రావటం , ఉద్యోగం కోసం ఇంగ్లాండ వెళ్ళటం వెంట వెంటనే జరిగిపోయాయి, తిరిగి ఒంటరి తనం, స్నేహ ఇప్పుడిప్పుడే తల్లి జ్ఞాపకాలనుండి కోలుకుంటుంది , రోజు బ్యాంక్ నుండి రాగానే స్నేహ తోనే కాలక్షేపం. బావ శేఖర్ గారు పోస్టింగ్ ఆగ్రా కి మారటం అప్పుడప్పుడు మాత్రమే ఇక్కడకు వచ్చి వెళ్తుండే వాడు.

శేఖర్ ఈ మధ్య ఇంటికి రావటం ఎక్కువయ్యింది, దాదాపుగా ప్రతి వారం వస్తున్నాడు, ఆ రోజు సాధన కి బాగా గుర్తుంది , ఆ రోజు స్నేహ ఎందుకో 8 కే నిద్ర పోయింది, శేఖర్ బాల్కనీ లో కూర్చొని త్రాగుతూ ఉన్నాడు, శేఖర్ ఇక్కడకు వచ్చినప్పుడల్లా త్రాగటం అలవాటే, కిషోర్ ఉన్నప్పుడు కూడా ఇద్దరూ కలిసే తాగే వారు , కానీ ఈ రోజు మరీ ఎక్కువగా డ్రింక్ చేసినట్లున్నాడు , అడుగు తడబడుతుంది , సాధన లేచి చెయ్యందించింది, ఏదో లోకంలో ఉన్నట్లుంది శేఖర్ ప్రవర్తన, ఆసరా కోసం భుజం మీద వేసిన చెయ్యి క్రిందకు జారింది , ఒక్కసారిగా ఏదో ప్రకంపనలు, ఒంటరి తనాన్ని, నిర్లిప్తతని, జడత్వాన్ని బద్దలు కొట్టే అంత ప్రకంపన, బహుశా సాధన కి కూడా ఎక్కడో అంతరాలలోఆ కోరిక ఉందేమో, అభ్యంతరం చెప్పలేదు , ఇద్దరూ కలిసే బెడ్ రూమ్ వైపు నడిచారు

అప్పటి నుండి శేఖర్ రాకపోకలు ఎక్కువయ్యాయి, సాధన కి కూడా అభ్యంతరం చెప్పాల్సిన అవసరం కనిపించలేదు. కెరీర్ లో కూడా పైకి ఎదుగుతూనే ఉంది, కిషోర్ ఎప్పుడైనా వచ్చి ఒక పది రోజులు ఉండి వెళ్తున్నాడు, కిషోర్ ఉన్న రోజుల్లో శేఖర్ రాకపోకలు కొంచెం తగ్గేవి .అంత కన్నా పెద్ద తేడా ఏమి లేదు, ఈ విషయం కిషోర్ కి తెలుసు అని సాధన్ కి ఎక్కడో చిన్న అనుమానం ఉన్నా ఎప్పుడూ బయట పడలేదు . స్నేహ పెద్దదవుతున్న కొద్ది ఇద్దరూ మరింత జాగ్రత్త పడే వాళ్ళు . తర్వాతర్వాత సాధనకు ఛండీగడ్ కు ట్రాన్స్ ఫర్ అయ్యాక , స్నేహ డిల్లీ లోనే హాస్టల్లో ఉంటున్నా, శేఖర్ స్నేహ కన్నా సాధన కోసమే ఎక్కువ వచ్చే వాడు . ఇప్పటికీ వస్తూనే ఉన్నాడు .

అసలు ఒక అమ్మాయి ఇలాంటి విషయాలు కూడా bold గా చెప్పటం నాకు ఆశ్చరంగానే ఉంది. ఈ 9 నెలలలో ఎప్పుడైనా నాకు సాధన దగ్గర నుండి పోన్ రాకపోతే ఆ రోజు శేఖర్ వచ్చినట్లు లెక్క, బహుశా అలాంటి సంధార్భాలు ఒక 10-12 సార్లు వచ్చాయేమో . మరుసటి రోజు శేఖర్ వచ్చి వెళ్ళిన సంగతి సాధనే చెప్తుంది . సాధారణంగా నాకు తెలిసి ఇలాంటి విషయాలు ఎవ్వరూ బయటకు చెప్పరు,. ఒక వేళ చెప్పినా అది బావ ట్రాప్ చేశాడు అనో మరో రకంగానో తన వ్యక్తిత్వానికి దెబ్బ తగలకుండా చెప్తారు , కానీ సాధన ఎప్పుడూ శేఖర్ గురించి చెడుగా చెప్పలేదు, కానీ ఈ మధ్య అతని ప్రవర్తన లో మార్పు వస్తుందని, నేను పరిచయం అయ్యకా, ఆరాలు తీయటం, అనుమానం పెంచుకోవటం చేస్తున్నాడని చెప్పేది, అప్పటికి ఒకసారి అడిగాను

“ అలా అనుమానం ఎందుకు వస్తుంది దాదాపు 5 సంవత్సరాలుగా మీ మధ్య అనుబంధం ఉంది కదా”

“ఆరేయ్ ! బుద్దూ ! మా మధ్య ఉంది అనుబంధం కాదు, అక్రమ సంబంధం , నేను ఎప్పుడైతే అతనికి లొంగిపోయానో, అప్పుడే తర్వాత ఎప్పుడైనా ఎవరికైనా లొంగిపోతాను అని అతను ఫిక్స్ అయిపోయాడు ! అందుకే అనుమానం “

“మరి ! నీకు అతని మీద కోపం రావటం లేదా ! ఏ అధికారం తో అతను నిన్ను అనుమానిస్తున్నాడు”

“ అనుమానించటానికి అధికారం తో పనేముంది అనుమానం ఉంటే చాలు”

saranga

“ నువ్వు నాకు అర్ధం కావు సాధనా”

ఈ సంభాషణ మా మధ్య కనీసం ఒక పది సార్లు వచ్చి ఉంటుంది

ఇక్కడ, నాకు సాధన ఒక పజిల్ లా కనిపించేది . అనుమానిస్తున్నా అతన్ని ఎందుకు అభిమానిస్తుంది, అది అభిమానమేనా ! మరేదైనా ఉందా ! నాకు అర్ధం అయ్యేది కాదు .

గత నెల రోజులుగా ఎందుకో సాధన ని చూడాలని బలంగా అనిపిస్తుంది . అదే అడిగాను సాధన ని, “అవునా ! అయితే వచ్చేయ్యి చండీగడ్” అని సరదాగా అన్న మాటలను నేను సీరియస్ గా తీసుకొని, చండీగడ్ వచ్చాను, ముందు ఆశ్చర్య పోయినా తర్వాత చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంది . ఇప్పుడు ఇలా నా భుజం మీద తన తల, ఆమె చేతిలో నా చెయ్యి, చల్లగా తగులుతున్న గాలి, జీవితం చాలా రోమాంటిక్ కదూ ! నా ఆలోచనను నాకే నవ్వొచ్చింది ! ఇప్పటిదాకా సాధన కథ గుర్తొచ్చి ఉద్వేగానికి గురైన నేను వెంటనే రొమాన్స్ గురించి ఆలోచించటం విచిత్రంగా లేదూ !

సాధన నడుము చుట్టూ చెయ్యి వేసి అడిగాను

“ ఒకటి అడుగుతాను చెప్తావా సాధనా ! “

“ నువ్వు ఒకటి అడిగితే నేను రెండు ఇస్తా , అడుగురా “

“ నీ భర్త కిషోర్ మీద నీకు కోపం లేదా “

“ఎందుకు కోపం ! అతను ఏమి చెయ్యగలడో అది చేశాడు, చేయలేని దాని గురించి ఎందుకు కోప్పడాలి “

“ మరి ! శేఖర్ మీద…..”

“ శేఖర్ మీద కూడా ఎందుకుండాలి “

“ అదే ! అతను నిన్ను లోబర్చుకోవటం, ఇప్పుడు అనుమానించటం . అతను నీ నుండి సెక్స్ కోరుకుంటున్నాడు ….. వీటన్నిటివల్ల “

“ శేఖర్ మీద కోపం ఉంటే నీ మీద కూడా కోపం ఉండాలి “”

“ నా మీదా !! ఎందుకు !!!!! “

“శేఖర్ కి నాకు ఉంది అక్రమ సంబంధం అని నీకు తెలియబట్టే నువ్వు హైదరబాద్ నుండి నన్ను వెతుక్కుంటూ చందీగడ్ వరకు రాగలిగావు, అదే శేఖర్ నా భర్త అయితే నువ్వు ఇక్కడికి రాగలిగే వాడివా ! ఇప్పుడు నీకు శేఖర్ మీద కోపం ఎందుకుంది ? ఆ అనుమానం వల్లే కదా ! నీకు శేఖర్ కి తేడా ఏముంది ! ఒకటి చెప్పు ! నీకు నామీద కోరిక లేదా ! కోరిక లేకుండా కేవలం ప్రేమతోనే ఇంతవరకు వచ్చావా ! .. అందుకే నాకు శేఖర్ మీదా కోపం లేదు, నీ మీదా కోపం లేదు “

నా చేతిలో గ్లాస్ కొంచెం వణికింది , అవును నిజమే నాకు శేఖర్ మీద కోపం ఎందుకుంది ?? సాధన కి నాకు మధ్య అతను ఉన్నాడు అనే కదా ! మరి శేఖర్ కి ఉండటం లో తప్పేముంది . నాకు సాధన మీద కేవలం కోరిక మాత్రమే ఉందా ! ప్రేమ లేదా ! రెండు కలిసి ఉన్నాయా ! ఉంటే ప్రేమ ఎక్కువుందా ! కోరిక ఎక్కువుందా !! ఏమో నాకే కన్ఫ్యూజ్ గా ఉంది, బహుశా నాకు సాధన అర్ధం కావాలంటే ముందు వీటన్నిటికి సమాధానాలు నాకు తెలియాలి . అయినా సాధన అంత తేలికగా అర్ధం కాదు. అసలు సాధన చేస్తుంది కరెక్టేనా, ఆమె కోసం నేను ఇక్కడివరకు రావటం కరెక్టేనా !

“ ok ! ok ! forget it ! ఇంకా ఏంటీ “ ఇంకొంచెం దగ్గరకు జరిగింది సాధన

“ సాధనా ! మరొకటి అడుగుతాను ఏమి అనుకోవుగా “

“ అడగటానికి డిసైడ్ అయ్యాక, ఆగకూడదు, అడుగు “

“ పోనీ ! శేఖర్ తప్పు చేస్తుంది తప్పు అని అయినా అనిపించిందా “

ఒక అడుగు దూరం జరిగి, గ్లాస్ లో విస్కీ ని సిప్ చేసింది సాధన

“ నన్ను ఆడగాలి అనుకున్న ప్రశ్న శేఖర్ పేరుతో అడుగుతున్నావా ! తప్పు అనిపిస్తే ఆ ఒక్క రోజు అనిపించిందేమో ! ఆ తర్వాత అది తప్పా ! కాదా ! అని ఆలోచింఛం, . నువ్వు అడగబోయే తర్వాత ప్రశ్న కూడా నేనే చెప్తాను, నన్ను ఇష్టపడటం కరెక్టా కాదా అనే డౌట్ నీకుంది . let me clear that my sweet ! నా జీవితంలో నేను ప్రేమించిన ఏకైక వ్యక్తివి నువ్వు. మరి శేఖర్ తో సంబంధం అంటావా ! దానికి ప్రేమతో పని లేదు. అలా అని అది యాంత్రికంగా జరుగుతుందనో అనలేను , లేదా నేనేదో ట్రాప్ లో పడ్డాను అనే self pity నో నాకు లేదు . అది అలా జరగాలి, జరిగిపోయింది. No regrets. ఇప్పుడు నీతో కూడా నేనేమీ కలిసి జీవించాలి అనుకోవటం లేదు . నువ్వంటే నాకు చాలా ఇష్టం కాదు అనను, నేను నీతో కోరుకుంటుంది మానసికమైన బంధం . అలా అని నాతో ఎలాంటి శారీరక సంబంధం పెట్టుకోవద్దు, పవిత్రంగా ఉందాం అనే కబుర్లు చెప్పను, అసలు ప్రేమ లేకుండా సెక్స్ ఉంటుందేమో కానీ, సెక్స్ లేకుండా ప్రేమ ఉండదు, నేను ఈరోజు మొదటిసారిగా సెక్స్ కోసం మానసికంగా కూడా prepare అయ్యాను. నువ్వు నన్ను ఎలా అనుకున్నా , ఈ రాత్రి తర్వాత మనం మళ్ళీ ఎప్పటికీ కలవం. మన మధ్య ఎలాంటి రిలేషన్ ఉన్నా, అది ఈ రాత్రి తో ఎండ్ అవుతుంది . “ స్థిరంగా చెప్పింది

Now decision is in my hands. నా చేతిలో గ్లాస్ ఖాళీ అయ్యింది, let me fix another peg.

*

చిత్రరచన: రాజు

మాండొలిన్ గురించి మరికొంచెం

1

క్రితంసారి మాండొలిన్ శ్రీనివాస్ గురించి రాసినదానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలను తెలియజెప్పాలనే కోరికే నాచేత మళ్లీ యిలా రాయిస్తున్నది.

మాండొలిన్ శ్రీనివాస్ సెప్టెంబర్ 19 నాడు యీ లోకాన్ని వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే. రెండు రోజుల తర్వాత – అంటే సెప్టెంబర్ 21 ఆదివారం రోజున – రాత్రి తొమ్మిదిన్నర నుండి పదకొండు గంటల వరకు గంటన్నర సేపు ఆకాశవాణి జాతీయ సంగీత కార్యక్రమంలో మాండొలిన్ శ్రీనివాస్ సంగీతాన్ని ప్రసారం చేశారు. ప్రతి శని ఆది వారాల్లో దేశంలోని అన్ని ప్రధాన రేడియో కేంద్రాల ద్వారా యిలా సంగీతాన్ని ప్రసారం చేస్తారు ఆకాశవాణి వాళ్లు. అయితే you tube, raaga.com, gaana.com, music India online, surgyan.com మొదలైన ఎన్నో వెబ్ సైట్లలో సాధారణంగా దొరకని కొన్ని రాగాలను – శ్రీనివాస్ వాయించినవాటిని – ఆనాటి కార్యక్రమంలో వినగలిగారు రసికులైన శ్రోతలు.

అందులోని రెండు ప్రత్యేక రాగాలు చాలా మనోహరంగా, ఆకర్షించే విధంగా ఉన్నాయి ఆ రోజున. ఆ రెండింటిలో మొదటిది స్వరరంజని రాగంలోనిది. కర్ణాటక సంగీతంలో వున్న రంజని, శ్రీరంజని రాగాలే తప్ప ఈ కొత్త రాగాన్ని నేను అంతకు ముందెప్పుడూ విని ఉండలేదు. కర్ణాటక సంగీతంలో 72 మేళకర్త రాగాలు లేక జనక రాగాలు వున్నాయి. మళ్లీ ఒక్కొక్కదాంట్లోంచి మరికొన్ని రాగాలు ఉద్భవిస్తాయి. కాని వాటన్నిటిలోంచి చాలా తక్కువ రాగాలను మాత్రమే కచేరీల్లో గానం చేస్తారు లేక వాదనం చేస్తారు. ఈ కారణంవల్ల సంగీత రసికులకు కొన్ని రాగాలే తెలుస్తాయి. హిందుస్తానీ సంగీతంలో పది రకాల ఠాట్ లు (జనక రాగాలు) మాత్రమే వుండటం చేతా, వాటిలోని చాలా రాగాలను కచేరీల్లో వినటం చేతా, సాధారణ శ్రోతలకు తెలియని రాగాల సంఖ్యతక్కువే అని చెప్పవచ్చు. మళ్లీ వెనక్కి వస్తే, ఈ స్వరరంజని రాగం అచ్చం కదన కుతూహలం రాగంలాగానే ఉన్నది. స్వరాల స్వభావాన్ని బట్టి రాగాలను గుర్తించగలిగేటంత సంగీత జ్ఞానం నాకు లేదు. ఉదాహరణకు ఇదిగో ఇది శుద్ధగాంధార స్వరం, ఇది చతుశ్రుతి దైవతం, ఇది కాకలి నిషాదం అంటూ గుర్తు పట్టలేను.

ఎన్నోసార్లు చూసిన ఒక ముఖాన్ని పోలిన మరో ముఖాన్ని మనం యెలా గుర్తించగలుగుతామో అలానే పోల్చుకోవటం అన్న మాట. ఇట్లా పోల్చుకోవటానికి రెండు అంశాలు బాగా ఉపకరిస్తాయి. మొదటిది ఆ రాగపు నడక. దీన్నే హిందుస్తానీ సంగీత పరిభాషలో ‘చలన్’ అంటారు. ఇక రెండవ అంశం ఆ రాగంలోని కొన్ని ప్రధాన స్వరాల ప్రత్యేకమైన మేళవింపు. దీన్ని ‘పకడ్’ అంటారు. ఈ రెండింటి మధ్య వుండే భేదం అతి స్వల్పమైనది కావటంచేత, వీటిని ఒకదానికి మరొకదాన్ని పర్యాయ పదాలుగా వాడుతారు. స్వరరంజని రాగం కదన కుతూహలం లాగా వుంటుందన్నాం కదా. ఈ రాగంలో పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ అనే వాగ్గేయకారుడు స్వరపరచిన ‘రఘువంశ సుధాంబుధి’ చాలా ప్రసిద్ధమైనది. ‘చూడాలని వుంది’ సినిమాలోని యమహా నగరి కలకత్తా పురీ అన్న పాట రఘువంశ సుధాంబుధికి అచ్చు గుద్దినట్టుగా వుంటుంది. ఆ సినిమా పాట కదన కుతూహలం రాగంలోనే వున్నది. అయితే అందులో పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ పేరును సూచించకుండా ‘చిరు త్యాగరాజు’ అన్నారు గీత రచయిత – త్యాగరాజంతటి సంగీత నైపుణ్యాన్ని కలిగిన మన హీరో చిరంజీవి అనే అర్థంలో, సరదాగా. అది సముచితంగానే వుంది. పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ అంటే చాలా మంది ప్రేక్షకులకు తెలియదు కదా.

ఇక ఆనాటి రేడియో కార్యక్రమంలోని రెండవ అరుదైన ‘కృతి’ స్వర సమ్మోదిని రాగంలో వుంది. ఈ రాగాన్ని కూడా చాలా మంది సాధారణ శ్రోతలలాగా నేనూ మొదటిసారిగానే విన్నాను. ఇది జనసమ్మోహిని అనే మరో రాగానికి దాదాపు అచ్చు గుద్దినట్టుగా వుంది. జనసమ్మోహిని రాగం హిందుస్తానీ సంగీతంలో కూడా ఉన్నది. అయితే అందులో దానికి జన్ సమ్మోహిని అని పేరు. ఈ జన్ సమ్మోహిని అద్భుతమైన, అతి మధురమైన, సమ్మోహహకరమైన రాగం. పండిత్ వసంతరావు దేశ్ పాండే ఈ రాగం లో గానం చేసిన ‘నిసే దిన్ హరికా గుణ్ గా’ ఖయాల్ అద్భుతంగా వుంటుంది. మొదట్లో అయితే దాన్ని వినప్పుడల్లా నాకు పారవశ్యంతో ఒళ్లు జలదరించి, కళ్లలో నీళ్లు తిరిగేవి.

కాని ఆ కన్నీళ్లకు కారణం దుఃఖం కాదు, ఆపుకోలేని మానసిక ఉద్వేగం మాత్రమే. సరోద్ వాదకురాలు విదుషి జరీన్ దారూవాలా కూడా ఈ రాగాన్ని ఎంతో మనోహరంగా వాయించింది. మన దురదృష్టంకొద్దీ జన్ సమ్మోహిని రాగాన్ని రేడియో మీద కాని, ఇంటర్నెట్ మీద కాని, కచేరీల్లో కాని చాలా అరుదుగా మాత్రమే వినగలుగుతాం. కారణం తెలియదు. కారణం చెప్పగలిగేటంత సంగీత జ్ఞానం, అవగాహన, ఆకళింపు నాకు లేవు. ఒకవేళ అది క్లిష్టమైన రాగం అయి, అందువల్ల దాన్ని పాడటానికి చాలా మంది సాహసించరా? ఏమో. జన్ సమ్మోహిని రాగం కళావతి అనే మరో హిందుస్తానీ రాగానికి అతి దగ్గరగా వుంటుంది. కళావతి రాగంలో విదుషి ప్రభా అత్రే పాడిన ‘తనా మన ధన తోపె వారు’ ఖయాల్, ఆమెదే మారూ బిహాగ్ రాగంలోని మరొక ఖయాల్ – ఈ రెండూ నేను పాతికేళ్ల క్రితం హిందుస్తానీ సంగీతంలో మొట్టమొదటి సారిగా విన్న సంగీత ఖండికలు. ఇట్లా చెప్తూ పోతుంటే తీగలాగా ఎటెటో పోతూనే వుంటుంది. కనుక యిక్కడే ఆపేద్దాం.

-ఎలనాగ

శిలాక్షరం

Popuri1

అక్షరం   నన్ను    కుదిపేస్తోంది
కన్ను అక్కడే    అతుక్కుపోయినా..
ఆలోచన    స్తంభించిపోయినా –
అంతరంగపు  ఆవేదనను
అంతర్లోకపు   అనుభూతిని
అక్షరాలు   అనుభవించమంటున్నాయి.
ప్రస్తుతించిన    గతం     భవిష్యత్తులో
వర్తమానమై   ఘనీభవించినా
అక్షరాలున్నాయే     అవి
పుస్తకాల    అతుకుల్లో     ఎక్కడో     ఒక చోట     నిర్లిప్తమై      వుంటాయి    కదా,
మనసు గదిలోని   మానవత్వపు  గోడల్ని  తడుముతూనే
మంచితనపు   పొరల్ని  తాకుతూనే
కదలిక     లేని     కఠినమైన    గుండె     తాలూకూ స్పందనను
ఏకాంతం లో      వున్నప్పుడు  ఒంటరి  కన్నీరుగా  మారుస్తూనే-

-పోపూరి సురేష్ బాబు

వాళ్ళకు నా అక్షరాలిస్తాను..

 

రాఘవ రెడ్డి

రాఘవ రెడ్డి

ఎందుకో మరణం గుర్తొచ్చిందివాళ

ఇటీవల కాస్త అనారోగ్యం చేసింది

ఏదో ఒకనాడు చనిపోతాను గదూ-

 

చెప్పో చెప్పకుండానో కాస్త ముందుగానో వెనగ్గానో

తాపీగానో తొందరగానో మొత్తానికి చనిపోతాను

అయితే బ్రతికి చనిపోవడం నాకిష్టం

బ్రతుకుతూ చనిపోవడం నాకిష్టం

 

కొంచెం కొంచెం చనిపోతూ మిగిలుండడం

అప్పుడెప్పుడో చనిపోయీ ఇంకా ఇక్కడే

చూరుపట్టుకు వేలాడటం

చనిపోవడం కోసమే బ్రతికుండటం..

అసలిష్టం లేదు నాకు

 

***

ఎప్పుడు ఎలా చనిపోయామన్నది ముఖ్యం కాదు

ఎప్పుడు ఎలా బ్రతికామన్నది ముఖ్యం

చావుకంటే బ్రతుకు ముఖ్యం

 

***

ఎవడి పొలానికి వాడు గెనాలు వేసుకుని

ఎవడి స్థలానికి వాడు తెట్టెలు కట్టుకుని

ఎవడి పెట్టెకు వాడు తాళాలు వేసుకుని

ఎవడి పశువుకు వాడు పలుపు గట్టుకుని

ఎవడి చావు వాడు చస్తున్నప్పుడు

ఎవడి ఏడుపు వాడేడవాల్సిందే-

 

***

కానీ

వాళ్ళ చావులకు నాకేడుపువస్తున్నది

చంపబడుతున్న వాళ్ళకోసం ఏడుపు వస్తున్నది

గెనాలను దున్నేసే వాళ్ళ కోసం

తెట్టెలు కొట్టేసే వాళ్ళకోసం

యుద్ధాన్నొక పాటగా హమ్ చేస్తున్నవాళ్ళకోసం

కళ్ళు సజలమవుతున్నవి

-కానీ ఒట్టి రోదనలతో ఏమిటి ప్రయోజనం..

 

దుఃఖించడం నాకిష్టం లేదు

ఏడుస్తూ ఏడుస్తూ చనిపోతూ బ్రతకడం

ఇష్టం లేదని ముందే చెప్పానుగా-

 

బ్రతుకుతాన్నేను

బ్రతకడం కొంత తెలుసు నాకు

మాటలే చెబుతానో

పాటలే కడతానో

కధలే అల్లుతానో

వాళ్ళకోసం దారులేస్తాను

వాళ్ళను ప్రేమించేవాళ్ళను ప్రోది చేస్తాను

వాళ్ళకు నా అక్షరాలిస్తాను-

వెదురువనం పాడుతోన్న అరుణారుణ గేయానికి

సంపూర్ణ హృదయం తో ఒక వంతనవుతాను.

 

-ఆర్. రాఘవ రెడ్డి

జీవితంలోంచి పుట్టిన కామెడీ…ఇదిగో ఇలా తెర మీదికి నేరుగా!

శ్రీరాం కన్నన్

శ్రీరాం కణ్ణన్

జీవితంలో హాస్యం జీవితంలోంచే పుడుతుంది. గ్రహించే మెళకువా, దాన్ని సెల్యులాయిడ్ మీదికి ఎక్కించే నేర్పూ ఉండాలి. దాన్ని ఆస్వాదించే ప్రేక్షకులూ ఉండాలనుకోండి 

 

” You had to learn at a certain age what sarcasm is ” అంటుంది పెన్నీ మార్షల్ అనే మహిళా దర్శకురాలు. ఫ్రెంచ్ సినిమాల్లో కొట్టొచ్చినట్లు కనిపించే ఈ వ్యంగ్యం చైనీస్ సినిమాల్లోనూ చూడొచ్చు. మన సినిమా విషయానికొద్దాం.

1947 ప్రాంతం. ఓ తెల్లాయన దేశం విడిచిపోతూ దక్షిణ దేశమంతా తిరుగుతూ ఫోటోలు తీస్తూ ‘ ముండాసుపట్టి ‘ అనే గ్రామానికి వస్తాడు. అక్కడ ఉన్న జనాన్ని ఫోటోలు తీస్తూంటాడు. గ్రామంలో కలరా వ్యాపిస్తుంది. కొంతమంది చనిపోతారు. జనాలు చనిపోవడం ఈ ఫోటోలు తీయడం వల్లనే అనే నమ్మకం బాగా ప్రబలి గ్రామ దేవతైన మునేశ్వరుని దగ్గర మొర పెట్టుకోవడానికొచ్చే సంధర్భంలో ఆ గ్రామదేవత విగ్రహం నవపాషాణం ( ‘ రహస్యం ‘ సీరియల్ చూడని వారు బెంచీ మీద ఎక్కండి ) తో తయారయ్యిందని ఆసరికే దాన్ని దొంగలించడానికొస్తారు కొంతమంది బందిపోట్లు. వీళ్ళు కాళ్ళా వేళ్ళా పడి బతిమాలుతుండగా అప్పుడే ఓ ఉల్కాపాతం సంభవించి ఈ దొంగల్లో కొంతమీద పడి ఆ శిల దొర్లుకుంటూ వెళ్ళి సరిగ్గా విగ్రహం తీసేసిన స్థలంలోకెళ్ళి కూర్చుంటుంది. మిగిలిన దొంగలూ పారిపోతారు.

అసలు విగ్రహాన్ని తీసుకుని. ఈ గ్రామస్థులు ఆశ్చర్యానందాలతో ఆ కొత్త రాయికి ప్రణమిల్లి ఆ మునేశ్వరుడే కొత్తరూపంలో గ్రామాన్ని రక్షించడానికొచ్చాడని భావించి పూజలు చేయడం, గ్రామంలో ప్రబలిన వ్యాధి అకస్మాత్తుగా మాయమైపోవడమూ జరుగుతుంది. ఈ తెల్లాయన మళ్ళి వచ్చి ఆ ఉల్కాపాతం జరిగిన స్థలంలో కొన్ని చిన్న చిన్న శిలాజాల్ని పరిశీలిస్తుండగా గ్రామస్థులు ఆ తెల్లాయన్ని వెళ్ళగొడ్తారు. ఆయన ఇంగ్లాండు వెళ్ళిపోయి పరీక్ష చేస్తే అది చాలా విలువైన లోహానికి చెందినదని తేలుతుంది. దాన్ని అక్కణ్ణుంచి తీసుకొచ్చే ప్రయత్నమూ మానుకుంటాడు గ్రామస్థులు ఎలా తిరగబడతారో అప్పటికే తెలుసుంటుంది కాబట్టి.

ప్రస్తుత కాలం 1982 ( సినిమాలో ఈ చిన్న డీటైలును కూడా ఎక్కడా మర్చిపోకుండా విలన్లు ఒకచోట క్రికెట్ కామెంటరీ వింటూ ఉండే సన్నివేశం చూపిస్తాడు దర్శకుడు. అప్పట్లో క్రికెట్ ఎందుకు అని అడిగే వాళ్ళు ఇంతకుముంది బెంచీ ఎక్కినవాళ్ళతో కలవండి ). మన హీరో ఓ ఫోటో గ్రాఫర్ . పేరు గోపి. అతనికో అసిస్టెంటూ ఉంటాడు.పేరు అళగు మణి. ఇతనికో ఫోటో స్టూడియో. ఓ రోజు పొద్దున్నే ఒక గ్రామీణుడొచ్చి స్టూడియో బోర్డ్ చూసి ఎదురుగా ఉండే ఫోన్ బూత్ నుంచి కాల్ చేస్తాడు. ఇక అక్కడ మొదలయ్యే సన్నివేశాలుమనం దొర్లి దొర్లి నవ్వడం ఒకటే తక్కువగా నవ్విస్తాయి.

సినిమా హీరో అవ్వాలని ఇంట్లోంచి పారిపోయి ప్రయత్నాలు చేస్తూ ఉన్న ఒకతను. పేరు మునీస్ కాంత్. ( రజనీకాంత్ ను ఇమిటేట్ చెయ్యడం అన్నమాట ) ఎనిమిదణాలకోసం రిక్షా అతనితో గొడవ పెట్టుకునే పరిస్థితి. చేతిలో ‘ ముప్పై రోజుల్లో గొప్ప నటుడవ్వడం ఎలా ‘ అనే పుస్తకం. నవ్వకండి. మద్రాసులో ఇప్పటికీ కోడంబాక్కంలో ఇలాంటి శాల్తీలు దొరుకుతారు. తాను నటించిన సినిమా నూర్రోజులు ఆడేంతవరకూ ఊళ్ళో అడుగు పెట్టను అని ఒట్టుపెట్టుకుని తిరుగుతున్న వ్యక్తి. అందుకే కొన్ని స్టిల్ ఫోటోలు తీసి తన జీవితంలో దీపాన్ని వెలిగించమని అడుగుతాడు. దానికి డబ్బులు కావాలని అయిదు కాపీలు అయిదు రూపాయలు అవుతుందంటాడు. మునీస్ కాంత్ కాసేపు ఆలోచించి రూపాయికి ఎన్నొస్తాయంటాడు. నెగటివ్ మాత్రమే వస్తుందంటే పరవాలేదు నా బొమ్మ తెలుస్తుంది కదా అంటాడు. ” అందంగా ఉండే వాళ్ళే నెగటివ్ లో దెయ్యాల్లా ఉంటే మరి దెయ్యం లా ఉండే నువ్వు నెగటివ్ లో ఎలా కనిపిస్తావో తెలుసా? ఫో, పోయి అయిదు రూపాయలు పట్రా ” అని వెళ్ళగొడ్తారు. మునీస్ కూడా అయిదురూపాయల్తో వస్తానని శపథం చేసి వెళ్ళిపోతాడు.

ఇలా ఉంటే ఓ రోజు ఓ సెకండరీ స్కూల్లో గ్రూప్ ఫోటో కు పిలుపొస్తుంది. గోపి వెళ్ళి ఫోటొ తీయడానికి ఏర్పాట్లు చేస్తూంటే, ఓ అమ్మాయి క్లాసులోంచి కదలదు. ఫోటోకూ రానంటుంది. జ్వరంగా ఉందని చెప్పి ఫోటొ దిగదు. గోపి వెళ్ళి చూస్తాడు.లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఆ అమ్మాయి ఇతన్ని నోట్స్ లో బొమ్మ గీసేసి ఉంటుంది ఇంతలోనే. గోపీ కూడ రెండ్రోజులకు ఫోటో కాపీలు రెడీ చేసి అందరికీ ఇద్దామని స్వయంగా స్కూలుకొస్తాడు. ఓ ఫోటో ప్రత్యేకంగా అట్టమీద అతికించి బాగా కనిపించేలా కూడా తెస్తాడు. అప్పుడే తెలుస్తుంది ఆ అమ్మాయికి పెళ్ళి నిశ్చయమైపోయి స్కూలు మానేసిందని. మనోడు తల వేళ్ళాడేసుకుని వెనక్కొచ్చేస్తాడు. ఓ రోజు ఓ పెద్దాయన వచ్చి ఓ ఫోటో తీయాలంటాడు. ( ట్రైలర్ లో చూడండి :https://www.youtube.com/watch?v=NjwnL6jrtuw ) ఊరు మనం చెప్పుకున్న ముందాసుపట్టి.ఊళ్ళో ఒకాయన చావు బతుకుల్లో ఉన్నాడు చనిపోయాక తీయాలంటాడు. బైక్ మీద వెళ్తూ ఫోటో అంటే ఊళ్ళో ఉన్న భయం గురించి చెప్తూ ప్రపంచాన్నే ఫోటో తీస్తున్న శాటిలైట్లు ఉన్న కాలంలో ఈ భయాలేమిటి అని ప్రశ్నిస్తే అందుకే మా ఊళ్ళో వర్షాలు పడ్డం లేదంటాడు ఆ పెద్దాయన ! వీళ్ళూ బయలు దేరి వెళ్తే అక్కడ పెద్దమనిషి ఇంకా పోలేదు. ఆశ్చర్యంగా మన హీరోయిను చనిపోతూన్న వాళ్ళ తాతకి సపర్యలు చేస్తూ కనిపిస్తుంది. పేరు చెప్పలేదు కదా, కలైవాణి. మనోడి ఆనందానికి పట్టపగ్గాలుండవు. పెద్దాయన పరిస్థితి మూలంగా పెళ్ళి వాయిదా పడి ఉంటుంది. మనోడి హుషారు చూడాలి.

పెద్దాయనా పోడు. వీళ్ళనూ ఊళ్ళోనే ఉండేలా ఏర్పాట్లు చేస్తారు పిలిచిన కలైవాణి ఇంట్లో వాళ్ళు. పెంపుడు మేకను ( దాని పేరు సుబ్రమణి ) తీసుకొచ్చి ఫోటో తీయించాలని అడిగే సీను, మొగుణ్ణి ఫోటో తీసి లేపెయ్యమని పెళ్ళామూ, పెళ్ళాన్ని ఫోటో తీసి పంపించే పని చెయ్యమని మొగుడు ఒకరికి తెలియకుండా ఒకరు గోపి ని అడిగే సీన్లు, మేకను బలిచ్చేసిన తర్వాత భోజనంలో ఓ ముక్క తీసుకుని సుబ్రమణి అస్సలు గుర్తుపట్టడానికి వీలు కావట్లేదు అని జోకులేసే సీన్లూ, ప్రసాదం కోసం అసలు సంగతి తెలియకుండా టెంకాయలు తలపై కొట్టించుకునే సీన్లు,పాటలో ఫోటో తీయడానికి కేమెరా బయటికి తీస్తుంటే జనాలు ఇల్లొదిలి బయటకు పారిపోయే సన్నివేశాలు, నవ్వులే నవ్వులు. ఊళ్ళోవాళ్ళు ఏవో నమ్మకాల్తో పాడు పెట్టిన ఓ స్కూలు ఉంటుంది. దాని సంగతి తర్వాత. కలైవాణికి గోపి తన ప్రేమ సంగతి మాటల్లో చెప్పేస్తాడు. ఐ లవ్ యూ అని. ఆ అమ్మాయి షాక్. అప్పుడే అరుపులు వినిపిస్తాయి ఇంట్లోంచి పెద్దాయన పోయాడని. అప్పుడే సినిమాలో సూపర్ హిట్ సాంగ్ ” రాసా మగరాసా ఎన్నయ్యా.” ( ఇక్కడ వింటూ చూడండి : http://www.youtube.com/watch?v=o4Tv8BvEccc ). శవ దహనానికి ఏర్పాట్లు చేస్తూంటే బాక్ గ్రౌండ్ లో ఈ పాట సంగీతమూ, నేపథ్యమూ అస్సలు చూసి తీరాలి. నవ్వకండి. నిజంగానే బావుంటుంది. వ్యంగ్యం కాదు. నిజమే.

పెద్దాయన చివరి ( మొదటిది కూడా  ) ఫోటొ తీసుకుని గోపి, అళగుమణి వచ్చేస్తారు. అప్పటికే ఆ ఫోటో మీద ఎన్నో కలల మిద్దెలూ మేడలూ కట్టేసుకుని ఉంటాడు గోపి. ఫోటో చూపి కలైవాణి నాన్నను మెప్పించినట్లు, కలైవాణిని తనకిచ్చి పెళ్ళి చేసేలా వప్పించినట్లు … ఇలా అన్నమాట! కలల్లోంచి ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు గోపి ఒక్కసారిగా డార్క్ రూంలోంచి అరుపులు వినిపిస్తే. లోపల అళగుమణి పాడైపోయిన నెగటివ్ ను చూపిస్తాడు. ఫోటో కలలు ఉన్నఫళాన కల్లలైపోయాయి మన గోపీకి. ఏం చెయ్యాలి. ఫోటో లేదంటే ‘ముండాసుపట్టి’ జనం చంపేస్తారు. ఫోటో రావడానికి ఇంకో మార్గమూ లేదు. అళగుమణి ఓ సలహా ఇస్తాడు. స్టూడియో కాల్చెయ్యమని. అప్పుడు జనం స్టూడియోతో బాటు నెగటివ్ కూడా కాలిపోయిందని చెప్తే నమ్మి వదిలేస్తారు కదా అని. దానికి తగ్గట్లు వీళ్ళూ ప్లాన్ చేసి కొవ్వొత్తిని కాగితాలకట్ట దగ్గర వెలిగించి స్టూడియో మూసేసి సినిమాకెళ్ళిపోతారు. సినిమా మధ్యలో ఓ పిల్లవాడు అగ్నిప్రమాదం గురించి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తాడు. వీళ్ళూ గంతులేసుకుంటూ, పైకి మాత్రం బాధ నటిస్తూ వెళ్తే వీరిది తప్ప మిగతా పక్కనున్న దుకాణాల్లో మంట రేగి ఉంటుంది.వీళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. అప్పుడు ఊడిపడతాడు మన మునీస్ కాంత్ చేతిలో అయిదు రూపాయలతో.

స్టిల్ ఫోటోలు తియ్యడానికి లోపలికెళ్ళిన అళగుమణి కి అప్పటికప్పుడు మెరుపులాంటి ఆలోచన వస్తుంది. బయటికొచ్చి గోపి కి చెప్తాడు. మనోడి మొహంలో వెయ్యివోల్టుల వెలుగు. మునీస్ కాంత్ తో మాటలు కలుపుతూ ఉంటే అళగుమణి బయటికెళ్ళి ఓ సినిమా వ్యక్తిలాగా గోపి కి ఫోన్ చేస్తాడు. ఇలా భారతీరాజా మన ఊరి చుట్టుపక్కల సినిమా షూటింగ్ చేయబోతున్నాడని, ఓ చావు సన్నివేశం షూట్ చేస్తున్నాడని, ఆ శవంలా నటించడానికి ఓ కొత్త మొహం కోసం ఎదురుచూస్తున్నాడని మాట్లాడుతూ ఉంటాడు ఫోన్ లో. మన మునీస్ ఇక బతిమాలడం మొదలెడతాడు. వీళ్ళు చాలా కష్టపడుతూ ఒప్పుకున్నట్లు నటించి చివరికి కొన్ని ఫోటోలు శవంలా స్టిల్స్ తీయించి అతన్ని ఆశలపల్లకిలో ఊరేగించి పంపేస్తారు.

10711274_732677873434030_923886551_n

మన గోపి, అళగు మణి ఊళ్ళోకెళ్ళి ఫోటో అప్పగిస్తారు భద్రంగా. వీళ్ళకు ఆ పూట అక్కడే భోజనం. ఇంతలో అకస్మాత్తుగా అరుచుకుంటూ వచ్చి ఊడిపడతాడు మునీస్ కాంత్ ఆ ఇంటికి. చిన్నాన్నా అంటూ. చనిపోయిన పెద్ద మనిషి మన మునీస్ చిన్నాన్న. ఇంట్లోవాళ్ళు అతన్ని వదిలేసి ఉంటారు సినిమాల్లోకి ట్రై చేస్తున్నాడని. ఫోటో అంటేనే భయపడే వాళ్ళు సినిమా అంటే చెప్పేదేముంది. దగ్గరకొచ్చి చూస్తాడు కదా అది తన ఫోటోనే ! తిరిగి చూస్తే వీళ్ళిద్దరు తోడు దొంగలు. అరచి గీ పెట్టి నానా యాగీ చేసి అందరికీ చెప్పేస్తాడు అది తన ఫోటోనే అని. అసలు ఫోటో పోగొట్టినందుకు ఊళ్ళో వాళ్ళు వీళ్ళని తరుముకుంటారు. వీళ్ళు బండి మీద పారిపోతుండగా పట్టేసుకుంటారు. ఊళ్ళో గుడి దగ్గర అదే, సినిమా మొదట్లో ఉల్కాపాతంలో పడ్డ రాయి దేవుడుగా ఉండే చోట పంచాయితీ. మామూలుగా ఆ సమయంలో శిక్షను నిర్ణయం చేసే గుడి గంట ఎంతకీ మోగదు. వాళ్ళకి అదంటేనే గురి. దానికి తోడు ఓ పూజారి. ఇక శిక్ష నిర్ణయం కాకపోయే సరికి వీళ్ళకు శిక్షగా ఓ బావి తవ్వమని తీర్పిచ్చి వీళ్ళకు కాపలాగా మునీస్ కాంత్ నే పెట్టి పని పూర్తి చేయించే బాధ్యత అప్పగిస్తారు.

ఇక అప్పటినుంచి బావి తవ్వుతున్నప్పుడు బయటపడే ఓ మనిషి ఎముకలగూడు చూపించి అది ఇంతకు ముందు బావి తవ్వమని శిక్ష పడ్డతను అని చెప్పే సన్నివేశం, ఇంట్లో పెద్దాయన పటానికి నైవేద్యాలు పెట్టడాలు, దాన్ని తినడానికి ట్రై చేస్తే మునీస్ ను పెద్దలు వారించే విధానం, ” ఫోటో నాది కానీ ఫోటో లో ఉన్నతను మాత్రం చిన్నాన్నా? ” అని ఇతను ఆవేశంగా గొడవపడే సన్నివేశం, బావి తవ్వే సాకులో కలైవాణి ని సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేలా గోపి వాళ్ళు పన్నే పన్నాగాలు చూడాలి. మొత్తానికి కలైవాణి గోపి కి పడిపోతుంది. ఇంతలో వాయిదా పడ్డ పెళ్ళి పనులు తిరిగి ప్రారంభం అవుతాయి. కలైవాణికి ఇష్టం ఉండదు. నాన్నతో అంటుంది పెళ్ళి వద్దు అని. మామూలే,నాన్న చెంప పగలగొడతాడు. వారంలో పెళ్ళి ఖాయం చేస్తాడు. గోపి ఆలోచిస్తూంటాడు ఏం చేయాలా అని.

ఊళ్ళో రాయి గ్రామనికంతా దేవుడు కాబట్టి, దేవుడు లేకుండా పెళ్ళి జరగదు కాబట్టి ఆ రాయిని మాయం చేస్తే అన్న ఆలోచన వస్తుంది గోపి కి. కలైవాణికో తమ్ముడు. వాడు అక్క బాధ చూళ్ళేక గోపి దగ్గరకొచ్చి ఓ ఐడియా ఇస్తాడు. గుడీ తలుపుల తాళాల గుత్తి తను నాన్న దగ్గర్ణుంచి తెచ్చేట్లు, వాళ్ళు రాయిని మాయం చేసి, దాచిపెట్టి తిరిగి వాళ్ళే రాయిని వెతికి తెచ్చి అప్పగించేట్లు, అంత ప్రాణప్రదమైన దేవుణ్ణి తిరిగి తెచ్చినందుకు ఏం కావాలన్నా కలైవాణి వాళ్ళ నాన్న ఇస్తాడని గురి కుదురుతుంది. అనుకున్నట్లుగానే రాయిని దొంగిలించి ఊళ్ళో పాడుబడ్డ స్కూల్లో దాచేస్తారు. సరిగ్గా పెళ్ళిలో మంగళసూత్రం కట్టే సమయానికి వార్త తెలుస్తుంది. దేవుడి రాయిని ఎవరో మాయం చేసేశారని. పెళ్ళి మళ్ళీ ఆగిపోతుంది. కలైవాణి నాన్న అందర్నీ నాలుగు దిక్కులకూ పంపిస్తాడు. గోపి వాళ్ళు ముందే అనుకున్నట్లుగా పాడుపడ్డ స్కూలు వైపు నడుస్తారు గంపెడు ఆశలతో.

ఆల్రెడీ ఓ విలన్ ఉంటాడు. మన పాత సినిమాల్లో ఆనందరాజ్. అతనికి నలుగురు భార్యలు. అందరూ ….ఒక్కొరొక్కరుగా ఇతని పరిస్థితి చూసి పారిపోయుంటారు ఇంకొకర్తో. పర్యవసానంగా అతను తన లైంగిక పటుత్వం పెంచుకోవడానికి ఎవరో చెప్పారని పిల్లుల మాంసంతో చేసిన సూప్ సేవిస్తూ ఉంటాడు. సినిమా మొదట్లో ఇంగ్లాండు వెళ్ళిపోయిన తెల్లవాని కొడుకు తండ్రి డైరీ చాలా కాలం తర్వాత చూసి ఆ గుళ్ళో రాయిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని విలన్ తో ఒప్పందం చేసుకుని ఉంటాడు. అలా ఆ రాయిని దొంగతనం చేయడానికి యత్నాలు సాగిస్తూ ఉంటాడు. అందులో భాగంగా కలైవాణి ఇంట్లో తన మనిషిని పనివానిగా కూడా అప్పటికే ఉంచి ఉంటాడు. ఇలా పాడు బడ్డ స్కూల్లోంచి రాయిని తిరిగి దొంగతనం చేయిస్తాడు విలన్ తన మనిషి చేత.

దేవుని రాయికోసం వెళ్ళిన గోపి వాళ్ళు రాయి లేకుండడం చూసి నిశ్చేష్టులై కాసేపు ధీర్ఘంగా ఆలోచించి తెలుసుకుంటారు ఇంట్లో పనివాడే ఈ పని చేసినట్ళు. వీళ్ళతో బాటు వచ్చిన మునీస్ కాంత్ కూడా రాయి కోసం గోపి వాళ్ళతో బాటు విలన్ ఇంటికి పరిగెత్తుతాడు . విలన్ ఇంటికి వెళ్ళడం, చేజింగులూ, పారిపోవడాలూ తర్వాత రాయిని తీసుకొచ్చి భద్రంగా అప్పగిస్తారు. ఈ సందట్లో విషయం పూర్తిగా అర్థమైన మునీస్ కాంత్ ఆ చేజింగులు జరిగే సంధర్భంలో పైకొచ్చే దారిలేని ఓ బావిలో పడిపోతాడు. ఈలోగా ముందే గుళ్ళో పూజారిని అతని గతమూ, వర్తమానమూ తెలుసుకుని అతన్ని లొంగదీసుకుని గోపి దేవుణ్ణి తెచ్చాడు కాబట్టి అతను ఏమడిగినా ఇచ్చేలా అతన్ని తృప్తి పరచమని పూనకంలో చెప్పిస్తారు. సరేనంటాడు కలైవాణి నాన్న. గోపి తడుముకోకుండా ముందే అనుకున్నట్లు కలైవాణిని తనకిచ్చి పెళ్ళి చెయ్యమని అడుగుతాడు. సరేనంటాడు కాబోయే మామగారు.

పెళ్ళీ అయిపోతుంది. శుభం అనుకుంటాం. అప్పుడు మళ్ళీ ఊడిపడతాడు మునీస్ కాంత్ అసలు సంగతి లబలబ కొట్టుకుంటూ చెప్తూ. పరిస్థితి చూసి హీరోయిన్, హీరో చెయ్యి పట్టుకుని పారిపోతుంటుంది. వీళ్ళతో హనుమంతుడు అళగుమణి కూడా.అర్థమైన ఊళ్ళో జనం కత్తుల్తో వీళ్ళ వెంట పడతారు.. పారిపోతుండగా మధ్యలో బైక్ ఆగిపోతుంది. కత్తులు ఎగురుతూ వస్త్తూంటాయి. ఊరికి ఊరు మొత్తం దగ్గరికొచ్చేస్తుంటుంది. కలైవాణి, అళగు మణి చేష్టలుడిగి చూస్తూ ఉంటారు. అప్పుడు గోపి చెప్తాడు అళగుమణి తో ” దాన్ని” బయటకు తీయరా ఊరి జనం సంగతి చూస్తాను. అని – శుభం.

ఈ సినిమా తీసింది రాం కుమార్ అనే కొత్త దర్శకుడు. విజయ్ టీవీ వాళ్ల ‘నాళయ ఇయక్కునర్’ ( Tomorrow’s Director ) అనే ప్రోగ్రాములో దాదాపు పది దాకా షార్ట్ ఫిలింస్ తీసినతను. సన్నివేశాల చిత్రీకరణలో కొత్తదనంలో నోస్టాల్జిక్ గుభాళింపులు మేళవించడం చూడచ్చు. సంగీతం సూపర్. రెండు పాటల్లో ” రాసా మగరాసా ” పాటైతే కేక. ఫోటోగ్రఫీ బావుంది. భారతీ రాజా సినిమాల ప్రభావం నుంచి తమిళ సినిమా ఇంకో వందేళ్ళైనా పోదు. ఆయనది అలాంటి మార్క్. నటీ నటులు – నందిని,విష్ణు విషాల్ బాగా నటించారు. అళగు మణి గా కాళి వెంకట్, మునీస్ కాంత్ గా రాందాస్ . ఇక అందరూ కొత్తోళ్ళే. అందరూ బాగా జీవించారు

తెలుగులో తీస్తే మాత్రం మనోళ్ళు అడాప్టేషన్ పేరుతో కథను చంపేసి పంచింగులూ, ఫైలింగులూ మీద దృష్టి పెట్టి సినిమాను చంపెయ్యడం మాత్రం తథ్యం. ఇక్కడ గమనించాల్సిందేమంటే కథలో నటీనటులకన్నా సన్నివేశాల ప్రాధాన్యమే ఎక్కువగా కనిపించింది. కథ నడిచే తీరు ఎక్కడా బోరు కొట్టకుండా, సరైన వేగంతో నడిచి ట్విస్టుల పేరుతో జనాల్ని కంఫ్యూజ్ చెయ్యకుండా  కూల్ గా నడుస్తుంటుంది.కథలో భాగంగా మన ఇంటెలిజెన్సుని చాలెంజ్ చేసేలా మాత్రం ఉండదు. తమిళం తెలిసిన వాళ్ళు తప్పని సరిగా చూడాల్సిన సినిమా.

I want to thank Mr. Chandru Muthu for suggesting this movie. Thank you Sir, its a wonderful movie !

  -శ్రీరాం కణ్ణన్

కా. రా మాస్టారి కథలు చెప్పే జీవితప్పాఠాలు..

karalogo

నిర్వహణ: రమాసుందరి బత్తుల

 

సమాజ గమనంలోని అంతర సూత్రాలు, దాని పొరల్లోని నిత్యయుద్ధాలను సూక్ష్మంగా గ్రహించగలిగిన వ్యక్తి, తన గ్రహింపును వీలైనంత సరళంగా పాఠకులకు అర్ధం చేయించగలిగితే అతడే జనం గుర్తు పెట్టుకొనే సాహితీకారుడు అవుతాడు. ఇక్కడ రచయిత బతికిన కాలాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే తప్పు నిర్ధారణ చేసినట్లవుతుంది. ఆ కాలంలో, ఆ ప్రాంతాన్ని ఆవహించిన సంక్షోభాలు, రణాలు అతని వ్యక్తిత్వం మీద, రచనల మీద తప్పక ప్రభావం చూపుతాయి.

మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కాళీపట్నం రామారావు మాష్టారి సాహితీ ప్రయాణం ఆ పరిమితిని శైశవ దశలోనే దాటి సామాజికోద్రేకాలను అద్దుకొంటూ సాగి, ఆనాడు ఉత్తరాంధ్రలోని కొనసాగుతున్న ఉద్యమాలకు అనుసంధానమయ్యి పరిపక్వతను సంతరించుకొంది.

“మధ్యతరగతి మానసిక రుగ్మతలను ఎక్కువ చేసి చూపించిన” కధలుగా ఆయనే స్వయంగా చెప్పుకొన్న 48-55 మధ్య కధల్లో కూడా అంతర్లీనంగా ప్రాభవం కోల్పోతున్న బ్రాహ్మణ మధ్య తరగతి కుటుంబాల బంధాలను శాసిస్తున్న ఆర్ధిక సంబంధాల విశ్లేషణ ఉంది. ఈ కాలంలో ఈయన రాసిన “పెంపకపు  మమకారం”, “అభిమానాలు” లాంటి కధలలో ఆయన బీజ రూపంలో తడిమిన అంశాలు తరువాత కాలంలో ఆయన రాసిన కధల్లో వేయి ఊడల మహా వృక్షాల్లాగా విజృంభించాయి.

62-72 మధ్య కాలంలో ఉత్తరాంధ్రలో వచ్చిన ఉడుకు రామారావు గారి కలాన్ని పదును పెట్టినట్లుగా తోస్తుంది. ఉద్యమాలు ఈ కలాన్ని ఆవహించాయా లేక ఇలాంటి కధలు ఉద్యమాలను ఉత్తేజపరిచాయా అన్నంతగా పెనవేసుకొని ఆయన సాహిత్యప్రయాణం సాగినట్లు అనిపిస్తుంది. ఈ కాలంలో ఈయన రాసిన కధల్లో గాఢత బాగా చిక్కబడింది. వ్యక్తి నుండి వ్యవస్థకు ఈయన సాహిత్య ప్రయాణం ఈ కాలంలోనే జరిగింది. ‘ఆదివారం’, ‘చావు’, ‘ఆర్తి’, ‘కుట్ర’, ‘శాంతి’, ‘జీవధార’, ‘భయం’, ‘నో రూమ్’ కధలు ఈ కాలంలోనే వెలువడ్డాయి.

రామారావుగారి కధల్లో ఎక్కువ కధల ముగింపులు పరిష్కారాన్ని ప్రత్యక్షంగా సూచించవు. పరిష్కారం చెప్పక పోయినా సమాజంలో ఉన్న దరిద్రం, ఆకలి ఇంకా చాలా సామాజిక రుగ్మతల పట్ల ద్వేషాన్ని కలిగించే పని చేయటం ప్రజా సాహిత్యకారుల కనీస కర్తవ్యం. కధలకు ఉండాల్సిన ఈ సామాజిక ప్రయోజనం కారాగారి చివరి కధల్లో వంద శాతం నెరవేరిందని నిర్ద్వంద్వం గా చెప్పవచ్చు. తమవి కాని జీవితాల్లోకి వెళ్ళి కధను పండించటం అంత చిన్న విషయమేమీ కాదు. రచయితలు డీక్లాసిఫై అవ్వాలని ఆ నాడు విరసం ఇచ్చిన పిలుపును స్వాగతించారు రామారావుగారు.

72 తరువాత ఆయన కధలు రాయటం మానేశారు. (92 లో సంకల్పం కధ రాశారు) ఎందుకు రాయలేదు అన్న ప్రశ్నకు ఒక దగ్గర “వూరికే కధ రాయటం ఎంతసేపు? కానీ ప్రయోజనం ఏమిటి? అని ప్రశ్నించుకొంటే అలవోకగా రాయలేక పోతున్నాను” అన్నారు. పదుల్లో గొప్ప కధలు రాసిన వ్యక్తికి కలం సాగక పోవటానికి చాలా సహేతుకమైన సందిగ్ధత ఇది. ప్రయోజనం లేని బఠానీ కధలు రాయలేక పోవటం వలన, వర్తమాన సమాజంలోని రాజకీయ సంక్లిష్టతను సరిగ్గా అర్ధం చేసుకోలేక పోవటం వలన .. ప్రజల కోసం నిజాయితీగా రాయాలనుకొన్న రచయితలు అందరూ ఎక్కడో అక్కడ ఆగిపోయే పరిస్థితే సహజమే అయినప్పటికీ ఈ విరామం సుధీర్ఘం. అయితే ఆయన కాలం కంటే కూడా ముందుకు వెళ్ళి తన చుట్టూ ఆవహించిన సమాజాన్ని అంచనా వేయగలిగారు అనిపిస్తుంది. చూసిన సంఘటనల నుండి తనకు గల స్థిరమైన ప్రాపంచిక దృక్పధం వలన కలిగే చైతన్యం.. ఆ చైతన్యం అంతస్సారంగా స్రవించిన కధలివి. పాత్రల నమూనాల్లోనూ, సంఘటనల్లోనూ, ఆలోచనా రీతుల్లోనూ, వైరుధ్యాల్లోనూ, ఘర్షణలలోనూ ఆయన కలం ఇప్పటి పరిస్థితులకు సారూప్యత ఉన్న సృజనను అందించింది. అది ఆనాటి తరానికే కాదు, ఈ తరం చదువరుల వ్యక్తిత్వ నిర్మాణానికి కూడా రక్తమాంసాలు ఇచ్చిందని అనటానికి ఏ మాత్రం సందేహించనవసరం లేదు. తరువాత ఇంకొన్ని తరాల రచనల మీద ఈయన ముద్ర గాఢంగా పడింది.

రామారావు గారి కధలకు పరిచయం రాయమని నేను అడిగిన ప్రతి రచయిత, రచయిత్రి వెంటనే సంతోషంగా ఒప్పుకొన్నారు. కాళీపట్నం రామారావు గారి కధలకు ఇప్పుడు మళ్ళీ పరిచయం అవసరమా అనే ప్రశ్న సహజం. ఈ నవంబర్ లో తొంభైయ్యవ పుట్టిన రోజు జరుపుకొంటున్న కా.రా గారి కధలను మళ్ళీ ఒక సారి మననం చేసుకోవడం పాత తరానికి సంతోషకరంగానూ, కొత్త తరానికి ఉపయుక్తంగానూ ఉంటుందని భావిస్తూ ఈ శీర్షిక మొదలు పెడుతున్నాము. నేటికీ సమకాలీనం, సార్వజనీయం అయిన ఈ కధాంశాలను ఈ తరం పాఠకులకు అందించే ముందు సీనియర్ రచయిత(త్రు)లు ‘ఆ పాత మధురాల’ నెమరివేత, కొత్త రచయిత(త్రు)లు కారాగారి తాత్వికతను అర్ధం చేసుకొన్న ఇష్టం.. కలగలిపి పాఠకులకు అందించాలనేదే ఈ ప్రయత్నం.

ramasundari

ఎడిటర్ నోట్

ఈ శీర్షికని నిర్వహిస్తున్నందుకు రమాసుందరి గారికి ‘సారంగ’ కృతజ్ఞతలు. ఈ శీర్షికకి మీ  వ్యాసాలు నేరుగా రమాసుందరి గారికి manavi.battula303@gmail.com పంపండి. ఒక కాపీ సారంగ ఈమెయిలు కి కూడా పెట్టండి.

శ్రీమన్నారాయణ అడ్రస్!

10723444_4746887767225_696947694_n

మృత్యుంజయ్

మృత్యుంజయ్

కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్-2014

తెలుగు నెటిజనుల అభిమాన పుస్తక ప్రపంచం కినిగె.కామ్ నిర్వహిస్తున్న

కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్-2014 కు ఇదే మా ఆహ్వానం!

మీరు 28 సంవత్సరములు లోపు వారా? మీ సృజనాత్మకత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి తెలియాలనుకుంటున్నారా? అయితే ఈ స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ మీ కోసమే! 750 పదాలు మించకుండా ఒక చక్కని కథను వ్రాయండి! రూ. 20,000 విలువైన బహుమతులను గెలుచుకోండి! మీరు చేయవలసినదల్లా మీ కథను యూనీకోడులో టైపు చేసి editor@kinige.com కు 31 అక్టోబరు 2014 లోపు ఈ-మెయిల్ చేయడమే.

పోటీ పూర్తి వివరాల కోసం patrika.kinige.com సందర్శించండి.

మీకు మరింత సమాచారం కావాలన్నా లేక సందేహాలున్నా editor@kinige.com కు

ఈ-మెయిల్ చేయండి (లేదా) 94404 09160 నెంబరుకు కాల్ చేయండి.

 

కినిగె.కామ్ గురించి

వందలాది రచయితలు, వేలాది పుస్తకాలు, అసంఖ్యాక పాఠకులతో తెలుగు ఆన్‌లైన్ పుస్తక రంగంలో నెం.1 స్థానంలో ఉన్న సంస్థ Kinige.com. పుస్తకాలు చదవడాన్ని సులభతరం చేయడం ద్వారా పాఠకులకు, రచయితలకు మధ్య వారధిలా నిలిచింది. తెలుగువారి విశ్వసనీయతను, అభిమానాన్ని పుష్కలంగా పొందిన కినిగె.కామ్ ఇప్పుడు నాలుగు సంవత్సరాలు పూర్తిచేసుకొని 5వ సంవత్సరం లోనికి అడుగు పెట్టబోతోంది www.kinige.com

 

పెద్రో పారమొ-౩

pedro1-1

“.. నేను

చెపుతున్నాయన మెదియా లూనా కొట్టం దగ్గర గుర్రాలను మాలిమి చేసి దారికి తెస్తుండేవాడు. తన పేరు ఇనొసెంసియో ఒజారియో అని చెప్పేవాడు. గుర్రమెక్కితే దానికి అతుక్కుపోతాడంతే. అందరూ చికిలింతగాడనే పిలిచేవాళ్ళు. అతను గుర్రాల్ని లొంగదీసేందుకే పుట్టాడనేవాడు మా పేద్రో. అసలు సంగతేమిటంటే అతని దగ్గర ఇంకో విద్య ఉంది: మంత్రాలేయడం. కలల్ని మంత్రించేవాడు. నిజానికి అతని అసలు పని అదే. మీ అమ్మకూ వేశాడు చాలా మందికి వేసినట్టే. నాక్కూడా. నాకు వొంట్లో బాలేనప్పుడు ఒకసారి వచ్చి ‘నీకు నయం చేయడానికి వచ్చాను ‘ అని చెప్పాడు. దానికర్థం ఏమిటంటే మొదట రుద్దడమూ, మర్దనా చేయడమూ: ముందు నీ వేళ్లకొసలూ, తర్వాత నీ అరిచేతులూ, ఆపైన చేతులూ. నీకు తెలిసేలోగా నీ కాళ్ళ మీద మొదలెడతాడు గట్టిగా రుద్దుతూ. కాసేపట్లో వొళ్ళంతా వేడి పుడుతుంది. అలా రుద్దుతూ తోముతూ దువ్వుతున్నంతసేపూ నీకు నీ జాతకం చెపుతూ ఉంటాడు. మైకంలో పడిపోయి గుడ్లు తిప్పుతూ ఉమ్మి తుంపర్లు చుట్టూ చిందేట్టు ఆవాహన చేస్తూ, శాపనార్థాలు పెడుతూ – చూస్తే ఏ సంచారజాతి మంత్రగాడో అనుకుంటావు. కొన్నిసార్లు చివరికి దిసమొలతో మిగిలిపోతాడు; అట్లా కావాలనే చేశాననేవాడు. కొన్నిసార్లు అతను చెప్పేవి నిజమయ్యేవి. గుప్పెడు రాళ్లు విసిరితే ఒకప్పటికయినా ఏదో ఒకటి తగలకపోదు.
“ఇంతకీ ఏమయిందంటే మీ అమ్మ ఆ రోజు ఈ ఒజారియోని చూడబోయింది. చంద్రుడు సరియైన స్థానంలో లేడు కాబట్టి ఆ రాత్రి ఆమె మగాడితో కలవడం కూడదని అతను చెప్పాడు.
“ఏం చేయాలో తెలియక డలోరిస్ వచ్చి నాకు అంతా చెప్పింది. పేద్రోతో పడుకునే ప్రశ్నే లేదని చెప్పింది. అది అమె శోభనం రాత్రి. నేనేమో ఆ మోసకారి, అబద్ధాలకోరు ఒజారియో మాటలు పట్టించుకోవద్దని నచ్చచెప్పచూశాను.
“ ‘నా వల్లకాదు.’ చెప్పిందామె. ‘నా బదులు నువ్వెళ్లు. అతనికి తెలియదులే!’
“ఆమె కంటే నేను చాలా చిన్నదాన్నే అనుకో! ఆమె అంత రంగు తక్కువా కాదు. అయినా చీకటిలో నీకు ఏం కనిపిస్తుంది?
“‘అది కుదిరేపని కాదు డలోరిస్, నువు వెళ్లక తప్పదు.’
“‘నాకీ ఒక్క సాయం చేయి. నీకు ఎప్పటికీ ఋణపడి ఉంటాను.’
“ఆ రోజుల్లో మీ అమ్మకు సిగ్గులొలికే చక్కటి కళ్లుండేవి. ఆమెను చూడగానే కొట్టొచ్చినట్టు కనిపించేది ఆమె కళ్లే. అవి నిన్ను పూర్తిగా జయించేయగలవు.
“‘నా బదులు నువ్వెళ్ళు ‘ అని అడుగుతూనే ఉంది.
“అందుకని నేను వెళ్లాను.
“చీకటి కొంత ఊతమిచ్చింది, ఇంకొంత మరొకటి – మీ అమ్మకి తెలియనిది ఏమిటంటే పేద్రో పారమొ అంటే మీ అమ్మకొక్కదానికే కాదు ఇష్టం.
“అతని పక్కలో దూరాను. సంతోషంగా, ఇష్టంగానే. అతన్ని వాటేసుకుని పడుకున్నా. కానీ ఆ సంబరాల బడలికతో ఆ రాత్రంతా గుర్రుపెట్టి పడుకున్నాడు. నా కాళ్ల మధ్య తన కాళ్లు జొనపడం తప్ప ఏం చేయలేదతను.
“పొద్దు పొడిచేలోగానే లేచి డలోరిస్ దగ్గరకు వెళ్ళాను. ఆమెకి చెప్పాను ‘ఇప్పుడు నువ్వెళ్ళు. ఇది మలిరోజు కదా!’
” ‘ఏం చేశాడు నిన్ను?’ ఆమె నన్నడిగింది.
“’నాకింకా తెలియడం లేదు.’ చెప్పాను.
“మరుసటి ఏడు నువ్వు పుట్టావు కానీ మీ అమ్మను నేను కాదు, వెంట్రుక వాసిలో తప్పిపోయావు.
“మీ అమ్మ సిగ్గుపడిందేమో ఈ సంగతి నీకు చెప్పడానికి”
పచ్చటి మైదానాలు. వంపు తిరిగే రేఖల్లా కురుస్తున్న వానతో అలలవుతున్న మధ్యాహ్నం గోధుమ పొలాల్లో గాలి సుడి తిరుగుతుండగా దిగంతం లేస్తూ పడుతూ ఉంటే చూస్తూ. నేల రంగూ, అల్ఫాల్ఫా, రొట్టె వాసనా. తొణికిన తేనెల వాసనొచ్చే ఊరు…
“ఆమెకి పేద్రో పారమొ అంటే ఎప్పుడూ గిట్టేది కాదు. ‘డలోరిటస్! నాకు నాస్తా పెట్టమని వాళ్ళకి చెప్పావా?’ ప్రతి రోజూ తెల్లారకముందే లేచేది మీ అమ్మ. బొగ్గులు రాజేసేది, ఆ వాసనకి పిల్లులు లేచేవి. వెనకే పిల్లుల్నేసుకుని ఇల్లంతా అటూ ఇటూ తిరుగుతూ. ‘దోన డలోరిటస్!’
“ఆ పిలుపు ఎన్ని సార్లు విందో లెక్కలేదు. ‘దోన డలోరిటస్, ఇది ఆరిపోయింది. తీసెయ్!’ ఎన్ని సార్లు! గడ్డుకాలానికి అలవాటు పడి, ఆమె సిగ్గు పడే కళ్లు కుదురుకున్నాయి.
వేసవి వేడిమిలో నారింజ పూత వాసనలు కాక మరేదీ చవి చూడకపోవడం.
“అప్పుడు నిట్టూర్పులు విడవడం మొదలు పెట్టింది.
“’ఆ నిట్టూర్పులెందుకు డలోరిటస్?’
“ఒక మధ్యాహ్నం వాళ్ళతో వెళ్ళాను. పొలం మధ్యలో ఉన్నాం పిట్టలబారును చూస్తూ. రాబందు ఒకటి బద్ధకంగా ఆకాశంలో ముందుకీ వెనక్కీ ఎగురుతుంది.
“’ఎందుకు నిట్టూరుస్తున్నావు డలోరిటస్?’
“’నేనూ రాబందునయితే ఎగిరి మా అక్క దగ్గరికి వెళ్ళేదాన్ని.’
“’ఇక చాలించు దోన డలోరిటస్! సరే, మీ అక్కని చూస్తావు, ఇప్పుడే. మనమిప్పుడు ఇంటికి వెళదాం, నువు నీ పెట్టెలు సర్దుకో. ఇంక నావల్ల కాదు.’
“మీ అమ్మ వెళ్లిపోయింది. ‘నిన్ను త్వరలో చూస్తాను డాన్ పేద్రో!’
“’గుడ్ బై, డలోరిటస్!’
“ఆమె మళ్ళీ మెదియా లూనాకి తిరిగి రాలేదు. కొన్ని మాసాలయ్యాక పేద్రో పారమొని ఆమె గురించి అడిగాను.
“’ ఆమెకి నాకంటే వాళ్ళక్క అంటేనే ఇష్టం. అక్కడే హాయిగా ఉన్నట్టుంది. అదీ కాక ఆమె అంటేనే విసుగు పుడుతూ ఉండింది. ఆమెని తిరిగి రమ్మనే ఉద్దేశమేదీ లేదు నాకు – నువ్వడగాలనుకున్నది అదేగా?’
“’ఎట్లా గడుస్తుంది వాళ్లకి?’
“’ఆ దేవుణ్ణే చూసుకోనీ!’
..బదులు చెల్లించనీ, కొడుకా, ఇన్నేళ్ళూ మన పేరుగూడా తలవనందుకు.
“నువ్వు నన్ను చూడడానికి వస్తున్నావని ఆమె నాకు చెప్పిందాకా అంతే. ఆమె సంగతేమీ తెలియలేదు ఆ తర్వాత.
“చాలా జరిగింది ఆ తర్వాత.” ఎదువిజస్ కి చెప్పాను. “కొలీమ లో ఉండేవాళ్లం. మా పెద్దమ్మ హెర్త్రూడిస్ వాళ్ళ ఇంట్లో ఉండనిచ్చింది కానీ మేము తనకెంత భారమో చెపుతూనే ఉండేది. మా అమ్మనెప్పుడూ అడిగేది ‘మీ ఆయన దగ్గరకెందుకు వెళ్లవు?’
” ‘తీసుకురమ్మని ఎవర్నయినా పంపాడా? నన్ను అడిగిందాకా వెళ్లను. నిన్ను చూడాలని వచ్చాను. నువ్వంటే ప్రేమ కనుక. అందుకు వచ్చాను.’
” ‘అది నాకు తెలుసు. కానీ నువ్వు వెళ్ళే సమయమొచ్చింది. ‘
“’అది నా చేతుల్లోనే ఉంటే….’”
ఎదువిజస్ నా మాటలు వింటుందనుకున్నాను. కానీ ఆమె ఎక్కడి మాటలో ఆలకిస్తున్నట్టు తల వంచి ఉండడం గమనించాను. అప్పుడామె అంది:
“ఇంకెప్పుడు శాంతి కలిగేను నీకు?”

నువు వెళ్లిపోయిన రోజే నాకు తెలుసు మళ్ళీ నువ్వెప్పటికీ కనపడవని. సంధ్య ఆకసాన్ని నెత్తుటితో నింపుతుంటే నీపై ఎరుపు మరకలు పడుతున్నాయి. నువు నవ్వుతున్నావు. నువు వదిలిపోతున్న ఆ ఊరి గురించి నువు తరచుగా అనేదానివి “నీ వల్లే ఇష్టపడ్డాను దీన్ని. మిగతాదంతా చీదర ఇక్కడ-ఇక్కడ పుట్టడం కూడా.” నాకనిపించింది – ఈమె తిరిగి రాదు; ఈమెని ఇక ఎప్పటికీ చూడబోను.
“ఈ వేళలో ఏం చేస్తున్నావిక్కడ? పని చేయడం లేదా?”
” లేదు నానమ్మా! రొహెలియో వాళ్ల చిన్నబ్బాయిని చూడమని చెప్పాడు. వీణ్ణి అటూ ఇటూ నడిపిస్తున్నాను. ఈ పిల్లాడూ, టెలిగ్రాఫూ – రెండు పనులూ చేయలేను. ఆయనేమో ఆ పూల్ రూంలో బీరు తాగుతూ కూచుంటాడు. ఇంతా చేసి మళ్ళీ నాకేమీ ఇవ్వడు.”
“సంపాదించడానిక్కాదు నువ్విక్కడుంది, నేర్చుకోవడానికి. ఒకసారి ఏదయినా నేర్చుకుంటే అప్పుడు ఏమనా డిమాండ్ చేయడానికన్నా ఉంటుంది. ఇప్పుడు నువ్వొక పని నేర్చుకునేవాడివి. ఒక రోజు నువ్వే యజమాని కావచ్చు. కానీ దానికి ఎంతో ఓపిక కావాలి, వినమ్రంగా ఉండాలి. వాళ్లు పిల్లాడిని నడిపించమంటే ఆ పని చేయి. వోపిగా ఉండడం నేర్చుకో!”
“ఇంకెవర్నయినా నేర్చుకోమను నాయనమ్మా వోపిగ్గా ఉండడం! నా వల్ల కాదు.”
“నువ్వూ నీ తలతిక్క ఆలోచనలూ! నీకు ముందు ముందు కష్టాలు తప్పవురా పేద్రో పారమొ!”

“ఇప్పుడు నేను విన్నదేమిటి దోన ఎదువిజస్?”
కలలోంచి మేలుకుంటున్నట్టు తల విదిలించిందామె.
“అది మిగెల్ పారమొ గుర్రం, మెదియా లూనాకి వెళ్ళే దారిలో దవుడు తీస్తూంది.”
“అయితే అక్కడ ఎవరయినా ఉంటున్నారా?”
“లేదు, ఎవరూ ఉండడం లేదు అక్కడ.”
“మరి?”
“అది అతని గుర్రమొక్కటే. వస్తూ పోతూంటుంది. అదీ, మిగెల్ ఎప్పుడూ విడిగా కనపడేవారు కాదు. ఊళ్ళ వెంటబడి తిరుగుతూ ఉంటుంది అతని కోసం చూస్తూ. ఈ వేళకి తిరిగి వస్తుంది. ఆ వెర్రి జీవి పశ్చాత్తాపంతో బతకలేకపోతుందేమో! జంతువులకీ తెలుస్తుంది కాదూ తాము ఏదయినా తప్పు చేస్తే?”
“నాకర్థం కావడం లేదు. గుర్రం చేసే చప్పుళ్ళేవీ వినపడలేదు నాకు.”
“లేదా?”
“లేదు.”
“అయితే నాకు అతీంద్రియ శక్తి ఉండి ఉండాలి. దేవుడిచ్చిన వరం – లేక శాపమో! నాకు తెలిసిందల్లా దాని మూలాన బాధలు పడటమే.”

Pedro_Páramo
కాసేపటి దాకా ఏమీ అనలేదు. మళ్ళీ చెప్పింది:
“అదంతా మిగెల్ పారమొతో మొదలయింది. అతను చనిపోయిన రాత్రి జరిగిందంతా నాకొక్కదానికే తెలుసు. అతని గుర్రం మెదియా లూనా వైపు దవుడు తీస్తున్న చప్పుడు వినపడేసరికి నేను పక్క ఎక్కాను. నాకు ఆశ్చర్యమేసింది, ఎందుకంటే మిగెల్ ఆ వేళకి ఎప్పుడూ వచ్చేవాడు కాదు. అతనొచ్చేసరికి ఎప్పుడూ వేకువజాము అయ్యేది. ప్రతి రాత్రీ అతను కాస్త దూరంలోనే ఉన్న కోంట్ల వెళ్ళేవాడు తన ప్రేయసి కోసం. తొందరగా వెళ్లి ఆలస్యంగా వచ్చేవాడు. కానీ ఆ రాత్రి అతను తిరిగి రాలేదు..నీకు వినిపిస్తుందా ఇప్పుడు? నీకు వినిపిస్తుందిలే! అది అతని గుర్రం; తిరిగి వస్తుంది.”
“నాకు ఏమీ వినపడటం లేదు.”
“అయితే అది నాకే వినిపిస్తుందేమో! సరే, నేను చెపుతున్నట్టు అతను రాకపోవడం కాదు అసలు కథ. అతని గుర్రం అటు వెళ్ళిందో లేదో ఎవరో నా కిటికీ తట్టడం వినిపించింది. నువ్వే చెప్పు అది నా భ్రమో కాదో! నాకు తెలిసిందల్లా ఎవరా అని చూడడానికి లేచి వెళ్లడమే. అది అతనే. మిగెల్ పారమొ. అతన్ని చూసినందుకు ఆశ్చర్యమేదీ కలగలేదు నాకు. ఎందుకంటే ఒకప్పుడు ప్రతి రాత్రీ నా ఇంట్లోనే గడిపేవాడు నాతో పడుకుని – అతని నెత్తురు తాగిన ఆ పిల్లని అతను కలిసిందాకా.
” ‘ఏమయింది?’ మిగెల్ పారమొని అడిగాను. ‘ఆ పిల్ల తన్ని తరిమేసిందా నిన్ను?’
“’లేదు, నన్నింకా ప్రేమిస్తూనే ఉంది.’ అతను చెప్పాడు. ‘సమస్య ఏమిటంటే ఆమె ఎక్కడుందో తెలియడం లేదు. ఆ ఊరికి వెళ్లడానికి దారి దొరకడం లేదు. అంతా పొగో, మంచో ఇంకేదో ఉంది. కోంట్ల ఇక అక్కడ లేదన్నది మాత్రం తెలుస్తుంది నాకు. అదెక్కడ ఉండాలో దాని మీదుగా వెళ్లాను కానీ అది కనపడలేదు. నువు అర్థం చేసుకుంటావని తెలుసు కనక నీకు చెప్పటానికి వచ్చాను. కోమలలో ఇంకెవరికయినా చెప్తే నన్ను పిచ్చాడని అంటారు – ఎప్పటిలానే.’
“’లేదు, పిచ్చి కాదు మిగెల్. నువు చచ్చిపోయి ఉండాలి. గుర్తుందా, ఆ గుర్రం వల్లే నీకు మూడుతుందని అనేవాళ్లంతా. గుర్తు చేసుకో మిగెల్. నువ్వేమన్నా పిచ్చి పని చేశావేమో కానీ, అది కాదు విషయమిప్పుడు..’
“’నేను చేసిందల్లా మా నాన్న కొత్తగా కట్టిన రాతి చుట్టుగోడ దూకించడమే. రోడ్డుమీదికి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్లవలసి వస్తుందని ఎల్ కొలొరాడోని దూకమన్నాను. దూకిన గుర్తుంది, తర్వాత స్వారి చేయడం కూడా. కానీ నీకు చెప్పినట్టు అంతా పొగ, పొగ, పొగ.’
“’రేపు పొద్దున మీ నాన్న దిగులుతో ఏమవుతాడో!.’ నేను అతనితో చెప్పాను. ’పాపం! ఇక వెళ్ళు ప్రశాంతంగా సేదదీరు మిగెల్. నాకు వీడ్కోలు చెప్పడానికి వచ్చినందుకు ధన్యవాదాలు.’
“కిటికీ మూశాను. తెల్లారకముందే మెదియా లూనా నుంచి జీతగాడొకడు వచ్చి చెప్పాడు ‘పెద్దాయన నీకోసం అడుగుతున్నాడు. మిగెల్ చచ్చిపోయాడు. డాన్ పేద్రోకి తోడు కావాలి.’
“’నాకు ముందే తెలుసు.’ అతనికి చెప్పాను. ‘నీకు ఏడవమని చెప్పారా?’
“’అవును, నీకు చెప్పేప్పుడు ఏడవమని డాన్ ఫుల్గోర్ చెప్పాడు.’
“’సరే, నువు డాన్ పేద్రోకి చెప్పు నేనొస్తున్నానని. అతన్ని తీసుకొచ్చి ఎంతసేపయింది?’
“’అరగంట కూడా కావడం లేదు. అతన్ని చూసిన డాక్టర్ చనిపోయి చాలాసేపయిందని చెప్పాడు కానీ కొంచెం ముందయితే బతికి ఉండేవాడేమో! ఎల్ కొలొరాడో ఖాలీ జీనుతో వచ్చి ఎవర్నీ నిద్రపోనీయకుండా ఒకటే కదం తొక్కుతూంటే తెలిసింది మాకు. డాన్ పేద్రో కంటే గుర్రమే ఎక్కువ బాధపడుతుందనిపిస్తుంది, నీకు తెలుసుగా అదీ అతనూ ఒకర్నొకరు ఎంత ప్రేమగా చూసుకునేవారో! అది తినదు, నిద్రపోదు. కల్లం తిరుగుతూ ఉంది. లోలోపల అంతా విరగ్గొట్టి, నమిలేసినట్టు దానికి అనిపిస్తుందేమో!’
“’వెళ్ళేప్పుడు మర్చిపోకుండా తలుపు వేయి.’
“మెదియా లూనా జీతగాడు వెళ్ళిపోయాడు.”
“చచ్చిపోయినవాడి మూలుగు ఎప్పుడయినా విన్నావా?” ఆమె నన్నడిగింది.
“లేదు, ఎదువిజస్.”
“అదృష్టవంతుడివి.”

అడవిలో ఇల్లు

MythiliScaled

అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవి అంచున చిన్న  గుడిసెలో  ఒక కట్టెలుకొట్టుకునేవాడు  తన భార్యా ముగ్గురు కూతుళ్ళతో ఉంటుండేవాడు. ఒక రోజు పొద్దున్నే  అతను అడవిలో ఎక్కువ దూరం ఎండుకట్టెల కోసం వెళ్ళాల్సివచ్చింది. వెళ్తూ వెళ్తూ భార్యతో చెప్పాడు ” ఇవాళ మన పెద్దమ్మాయితో నాకు భోజనం పంపించు. తను దారి తప్పకుండా గుప్పెడు జొన్నలు తీసుకుని దోవంతా జల్లుకుంటూ వెళతాను ”

బాగా ఎండెక్కాక అలాగే ఆ అమ్మాయి తండ్రికి భోజనం తీసుకుని బయల్దేరింది. అయితే వాళ్ళ నాన్న జల్లిన జొన్నలన్నీ పిట్టలు తినేశాయి. దారి తెలియలేదు. అలా అడవిలో నడుచుకుని పోగా పోగా చీకటి పడిపోయింది, చలేస్తోంది. అమ్మాయికి భయం వేసింది. అంతలో చెట్లమధ్యలోంచి  మినుకు మినుకు మంటూ  దూరంగా ఒక దీపం వెలుతురు కనిపించింది. తనకి ప్రాణం లేచివచ్చి అటువైపు పరుగెత్తింది. నిజంగానే అక్కడొక పాత పెంకుటిల్లు , కిటికీలనిండా దీపాలు. తలుపు తట్టింది ” లోపలికి రా ” ఒక బొంగురుగొంతు పలికింది. వెళ్తే అక్కడ ఒక బల్ల మీద  చేతుల్లో మొహం దాచుకుని  ముసలివాడు ఒకడు . అతని జుట్టంతా నెరిసిపోయింది. పొడుగాటి  గడ్డం నేలదాకా పాకుతోంది. వెచ్చగా ఉన్న పొయ్యి పక్కనే ఒక కోడి పెట్ట, కోడిపుంజు, ఒక మచ్చల  ఆవు.

అమ్మాయి తన కథంతా చెప్పి ఆ రాత్రికి ఉండనిమ్మని అడిగింది. అతను ఆ మూడు ప్రాణులనీ అడిగాడు ” ఏం చేద్దాం ? ” అని. అవి అన్నాయి కదా, ” మాకిష్టమే ” అని. అతను చెప్పాడు , ” సరేనమ్మాయ్. వెనకాలే  వంటిల్లుంది. నిండుగా సరుకులున్నాయి ”

ఆమె చక్కగా వంట చేసి రెండు కంచాలలో ముసలివాడికీ తనకూ వడ్డించింది. మూడు ప్రాణుల గురించి ఆలోచించనేలేదు. ఆకలి తీరేవరకూ తినేసి ” ఎక్కడ పడుకోను ? ” అని అడిగింది. అతను ” మేడమీద పడక గది ఉంది. ఆ మంచాన్ని బాగా కదిపి ఉతికిన దుప్పట్లు వేసుకో, నిద్రపో ” అన్నాడు. అమ్మాయి అలాగే చేసింది. ఆమె నిద్రపోయాక ముసలివాడు ఒక కొవ్వొత్తి తీసుకుని అక్కడికి వెళ్ళాడు. ఆ వెలుగులో ఆమె మొహం ఒకసారి చూశాడు. ” ఊహూ ” అనుకుని మంచం కింద రహస్యంగా అమర్చిన తలుపు తెరిచాడు. ఆమె మంచంతో సహా నేలమాళిగలోకి పడిపోయింది.

ఇక్కడ కట్టెలుకొట్టేవాడు బాగా పొద్దుపోయాక ఇంటికి వచ్చి తనకి రోజంతా తిండి లేనందుకు భార్యని చీవాట్లు పెట్టాడు. ఆమె అసలు సంగతి చెప్పింది. ఇంకా  అమ్మాయి ఇంటికి రాలేదే అని ఇద్దరూ కాసేపు బాధపడి ” అడవిలో దారి తప్పి ఉంటుంది , తెల్లారగానే వచ్చేస్తుందిలే ” అనుకున్నారు.

images

తెల్లారింది. ఈసారి రెండో కూతురుని పంపించమనీ, దోవంతా కందిపప్పు జల్లుతూ వెళాతాననీ తండ్రి చెప్పాడు. రెండో పిల్ల బయల్దేరేసరికి ముందురోజులానే పప్పులన్నీ పిట్టలు తినేశాయి. తనూ దారి తప్పి అదే ఇంటికి వచ్చింది. అలాగే రాత్రికి ఉంటానని అడిగింది. ముసలివాడు మూడు ప్రాణులనీ అడిగి అలాగేనన్నాడు. తన అక్కలాగే తనూ ప్రాణుల గురించి పట్టించుకోలేదు. వంటా, భోజనం, పడకా- ఆ తర్వాత అతను ఈ పిల్లనీ నేలమాళిగలోకి పడేశాడు.

ఇద్దరు పిల్లలూ ఇంటికి తిరిగి వెళ్ళలేదు. అయినా వాళ్ళ నాన్న మూడోరోజున ఆఖరి కూతురుతో అన్నం పంపించమనే చెప్పాడు . తక్కిన ఇద్దరూ ఇంటికి రాకపోయినా తండ్రి మూడో అమ్మాయిని ఎందుకు పంపించమన్నాడో అతనికే తెలియాలి. ఆమె అక్కలిద్దరినీ  వెనక్కి తీసుకు రాగలదని నమ్మకమో ఏమో. వాళ్ళ అమ్మ ఏడ్చింది ” అయ్యో, నా ముద్దులతల్లినీ పోగొట్టుకోవాలా ? ” అని

తండ్రి అన్నాడు ” భయపడకు. ఇది చాలా తెలివిగలది, దారి తప్పదు. ఈసారి బఠానీ గింజలు జల్లుకుంటూ వెళతాను. అవి పెద్దగా ఉంటాయి కాబట్టి బాగా కనిపిస్తాయి ” అయినా లాభం లేకపోయింది. మూడో పిల్ల వెళ్ళేసరికి అక్కడ ఒక్క బఠానీ గింజా మిగలకుండా పిట్టలు ఖాళీ చేశాయి. ఎంత తెలివిగలదైతే మాత్రం ఎటువెళ్ళాలో ఎలా తెలుస్తుంది ? అక్కలలాగే తనూ రాత్రయేసరికి అడవి మధ్య ఇంటికే చేరింది. మూడు ప్రాణులూ ఇదివరకులాగే  ముసలివాడు అడగగానే ఆమెకి ఆశ్రయం ఇచ్చేందుకు ఒప్పుకున్నాయి. అమ్మాయికి సంతోషం వేసింది. కోడి పెట్టనీ కోడిపుంజునీ వీపు రాసి ముద్దు చేసి ఆవుని గంగడోలు మీద నిమిరింది. వంటింట్లో ఎప్పటిలాగే బోలెడంత ఆహారం. ఆమె వంట చేస్తూ అనుకుంది ” నా కడుపు నిండితే చాలా ? వాటికీ ఆకలేయదూ పాపం ” దోసిళ్ళనిండా బియ్యపుగింజలు పట్టుకెళ్ళి కోడిపెట్టకీ కోడిపుంజుకీ పెట్టింది. ఆ పక్కనే ఉన్న మోపు విప్పి నుంచి ఆవుకి తాజాగా ఉన్న పచ్చగడ్డి తినిపించింది. అవి తృప్తిగా తిన్నాక వెడల్పాటి పెద్ద గిన్నెలో నీళ్ళు నింపి ఉంచింది. అవన్నీ ముక్కులూ మూతులు ముంచి  హాయిగా  తాగాయి.

అప్పుడు ముసలివాడూ తనూ కలిసి భోజనం ముగించారు.

” ఎక్కడ పడుకోను ? ” అని అడిగితే మూడు ప్రాణులూ  ఒకే గొంతుతో ” మమ్మల్ని బాగా చూసుకున్నావమ్మా. కమ్మగా నిద్రపో ” అన్నాయి.

ఆమె మేడ మీదికి వెళ్ళి పక్కవేసుకుని అర్థరాత్రిదాకా కలత లేకుండా నిద్ర పోయింది. అప్పుడు ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. ఇల్లంతా కూలిపోయేంతగా ఊగిపోయింది. కోళ్ళూ ఆవూ నిద్రలేచి బెదిరిపోయి గోడకేసి తలలు గుద్దుకున్నాయి. కాసే పటికి అంతా సద్దుమణిగింది. అమ్మాయి సర్దుకుని మళ్ళీ నిద్రపోయింది.

20110411_Korzukhin

ఆమెకి మెలకువ వచ్చేసరికి ఆ గది గొప్ప వైభవంగా కనిపించింది. పాలరాతి గోడలంతా బంగారుపూలు చెక్కి ఉన్నాయి. తను పడుకున్న మంచం వెండితో చేసి ఉంది. మెత్తటి పట్టు దుప్పటి పరచి ఉంది. కిందని ఒక చిన్న పీట మీద ముత్యాలు పొదిగిన చెప్పులు. ఖచ్చితంగా అదంతా కలేననుకుంది తను. చాలా మంచి బట్టలు వేసుకుని ముగ్గురు వచ్చారు ” ఏమి ఆజ్ఞ ? ” అని అడిగారు. ” నాకేమీ వద్దు. వెళ్ళండి, వెళ్ళండి. నేను లేచి వంట చేసి పెద్దాయనకి తినిపించాలి. కోళ్ళకీ ఆవుకీ మేత వేయాలి ” అని హడావిడిగా జవాబు ఇచ్చింది ఆమె.

అంతలో ఇంకో వైపు  తలుపు తెరుచుకుని ఒక అందమైన యువకుడు వచ్చి  అన్నాడు ” నేనొక రాకుమారుడిని. ఈ అడవి మధ్య ఒక సరస్సూ దాని చుట్టూ ఉన్న పచ్చిక  మైదానమూ ఒక ఫెయిరీవి. ఆమె సరదాకి జంతువుల రూపాలను ధరించి తిరుగుతూ ఉండేది. ఇదంతా నాకు అప్పుడు తెలియదు.

ఒక రోజు వేటాడుతూ దూరంగా గడ్డి మేస్తూన్న జింక ను బాణం తో కొట్టబోయాను.నా బాణం తగలకపోగా ఆ జింక ధగ ధగా మెరిసిపోయే అమ్మాయిగా యి ఇలా అంది-

” నువ్వు ఆకలితో, ఆహారం కోసం నన్ను చంపబోలేదు, నేను క్రూరమృగాన్ని కాదు…నీకు ఏ హానీ చేయలేదు, నా చిన్న పొట్టని నింపుకుంటూ ఉన్నాను అంతే ”

నన్నూ నా అనుచరులనూ శపించింది.     ముసలివాడుగా అయిపోయాను .    అడవిలో నా విశ్రాంతి భవనం ఇది – నువ్వు చూసిన ఇల్లుగా మారిపోయింది. నాతోబాటు ఉన్న  ముగ్గురు సేవకులూ శాపం వల్లే  కోడిపెట్ట, పుంజు, మచ్చలావు గా నాకు ఇన్ని రోజులూ తోడున్నారు. మనుషులమీద  ఉన్నంత దయనీ పశువుల, పక్షుల పట్ల చూపగల అమ్మాయి మాత్రమే మా శాపాన్ని పోగొట్టగలదు. నువ్వే ఆ అమ్మాయివి. మధ్యరాత్రిలో మాకు విముక్తి దొరికింది. నన్ను పెళ్ళి చేసుకుంటావా ? ”

అమ్మాయి ఆనందంగా ఒప్పుకుంది. అంతా రాజధానికి వెళ్ళారు. రాజూ రాణీ కొడుకుని చూసి సంతోషం లో తలమునకలయారు. అతని శాపం విడిపించిన అమ్మాయిని ఆప్యాయంగా చూశారు. సేవకులు వెళ్ళి పిలుచుకొస్తే  అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నా పెళ్ళి విందుకి వచ్చారు. ” మరి మా అక్కల సంగతి ? ”

” ఇక్కడి పశువులశాలలో, కోళ్ళగూటిలో  వాళ్ళు కొన్నాళ్ళు పనిచేయాలి . వాటన్నిటికీ తిండిపెట్టాకే తినాలి. జంతువులకీ ఆకలి వేస్తుందని వాళ్ళకి అర్థం కావాలి కదా . త్వరలో తెలిసివస్తుందిలే. అప్పుడు కనబడదాం ‘’

                                                           -జర్మన్ జానపద కథ కి స్వేచ్ఛానువాదం , సేకరణ – Andrew Lang

 అనువాదం: మైథిలి అబ్బరాజు

 

ఎగిరే పావురమా! – 13

egire-pavuramaa13-banner

ఆలోచిస్తూ ఆయమ్మ పెట్టెళ్ళిన బన్ను తిని నీళ్ళు తాగాక వెనక్కి జారిగిల బడ్డాను…

 

మొదటినుండీ నా పట్ల ఈ అక్కాతమ్ముళ్ల వైఖరి తలుచుకొని మనసంతా హైరానాగా అయిపొయింది….

పాలెం వదిలేసి, రైలెక్కి అరపూట ప్రయాణం చేసాక, ‘రాణీపురం’ అనే ఈ ఊళ్ళో దిగిన దగ్గరినుండి…వారి పోట్లాటలు, వాదులాటలతో మనసుకి శాంతన్నది లేకపోవడం ఒకెత్తయితే, నేనెదుర్కున్న ఇబ్బందులు, నిస్సహాయతలు మరో ఎత్తు.

గుర్తు చేసుకోగానే, కన్నీళ్లు ఆగలేదు……

 

“ఏమ్మాయి చాలా నొప్పిగా ఉందా కాలు? ఏడ్చేస్తున్నావు,” అంటూ మందులందించింది ఆయా.

 

‘డాక్టరమ్మ వచ్చే టైం’ అంటూ నా కాలి కట్టు మార్చి వెళ్ళిందామె.

**

పొద్దున్న తొమ్మిదవుతుండగా, నన్ను డాక్టరమ్మ పరీక్ష చేసేప్పుడు వచ్చారు కమలమ్మ, గోవిందు. కాస్త ఎడంగా బెంచీ మీద కూచున్నారు.

 

తను రాసిన కొత్త మందులు వెంటనే మొదలెట్టమని నర్సుకి చెప్పి,

“మీ పెద్దవాళ్ళెవరన్నా వచ్చారా?” అనడిగింది డాక్టరమ్మ.

అది విన్న కమలమ్మ లేచి గబగబా మంచం కాడికొచ్చింది….

 

“చూడండమ్మా, అమ్మాయి ఆరోగ్యంగా ఉంది కాబట్టి బాగానే కోలుకుంటుంది.. ఎల్లుండి ఇంటికి వెళ్ళవచ్చు… మళ్ళీ వారానికి తీసుకు రండి. చూస్తాను. ఆ పై వారానికి కొత్తకాలు కూడా వచ్చేస్తుంది… అంతా బాగుంటే, దాన్ని అమర్చే విషయం చూడవచ్చు,” అందామె కమలమ్మతో…..

 

“పోతే గాయత్రి, కూర్చుని ఏ పనైనా ఎంత సేపైనా చేయవచ్చు.   అప్పుడప్పుడు మాత్రం నీ క్రచ్చస్ తోనే కాస్త తేలిగ్గా అటు ఇటూ మెసలాలి. మందులు   మాత్రం ఇంకా వేసుకోవాలి. నీకు సాయం చేయడానికి ఎవరైనా ఉంటారుగా!” అడిగిందామె నన్ను.

 

“ఎందుకుండమూ? ఎవరో ఒకరు కంటికి రెప్పలా కాసుకునుంటామమ్మా,” పలికింది కమలమ్మ.

డాక్టరమ్మ వెళ్ళాక నా దగ్గరగా వచ్చాడు గోవిందు.

“ఈడ ఉన్నన్నాళ్ళు నీకు పొద్దుపోతదని ఈ పుస్తకాలు తెచ్చా,” అంటూ రెండు పత్రికలందించాడు.

 

ఎదురుగా కూచుని నా చేయి తన చేతిలోకి తీసుకొంది కమలమ్మ…

“ఇదో గాయత్రి, రెండు రోజులు కాస్త నిమ్మళంగా ఈడనే ఉంటావుగా!

బాగయిపోతావుగా! నువ్వు క్యాంటీన్ లో పనికి లేవని, పాపం జేమ్స్ ఇబ్బంది పడుతున్నాడు…

ఇయ్యాల జేమ్స్ అసలు మాతో రావాల్సింది. నిన్ను చూడలేదని చాలా ఆతృత పడుతున్నాడు.   ఏదో పని తగిలిందంట. తనకోసం ఆగొద్దని మమ్మల్ని పంపాడు.   మేము తిరిగెళ్ళి   అతనికి వాన్ అప్పజెప్పాక, ఏదో ఒక టైంకి వస్తాన్నాడు,” అంది.

 

….ప్రహ్లాద్ జేమ్స్… నన్ను చూడ్డానికి ఒక్కడే వస్తాడనగానే, నాకు కడుపులో తిప్పేసింది…

అందరితో కలిసి ఎందుకు రాలేదు? అట్లా రాడు. శని లాగా ఒక్కడే వస్తాడు. అవకాశం దొరికితే వెకిలి వాగుడుతో నరకం చూపిస్తాడు కూడా అని తలుచుకోగానే మనసంతా అసహ్యంతో నిండిపోయింది…

‘నేను ఒంటరిగా దొరికితే, వాడి వెటకారం నుండి, వాడి అసభ్యకర మాటల నుండి ఎలా తప్పించుకోవాలి?… నాలాంటి అవిటిని కూడా వేధించే వాడిది ఎంతటి దిగజారిన మనస్థితి!!…

కోపంతో నా పిడికిళ్ళు బిగుసుకున్నాయి.

 

“ఏందాలోచిస్తుండావు? ఏమన్నా తింటావా?” అడిగాడు గోవిందు మంచం ఎదురుగా నిలబడి..

ఏమొద్దని సైగ చేసాను…

అయినా, ఇప్పుడే వస్తానని బయటకి పోయాడు గోవిందు.

కాస్త అవతలికి పోయి, చుట్టూ ఉన్న వాళ్ళతో కబుర్లల్లో పడ్డది కమలమ్మ. ఆమె గొంతు బిగ్గరగా వినబడుతూనే ఉంది.

నన్ను జేమ్స్ కాడ పనికి పెట్టిన ఆమెకి గాని, టెంపోలో కూరలు, సామగ్రి తెచ్చాక, రోజూ క్యాంటీన్ లోనే తినెళ్ళే గోవిందుకి గాని – జేమ్స్ మాటలతో నన్ను వేధిస్తాడని – తెలీదు..

రోజూ సాయంత్రం ఏడింటికి, అతికష్టంగా పని ముగించి, మా ముగ్గురికి రాత్రికి సరిపడా తిండి తీసుకొని బయటపడేదాన్ని మొదట్లో, సత్రం క్యాంటీన్ లో పని చేసినన్నాళ్ళూ.

 

సాగుతున్న ఆలోచనలు గోవిందు పిలుపుతో ఆగాయి…. ఎదురుగా చేతిలో తిండి పోట్లాలతో నిలబడి ఉన్నాడు…

పక్కనే ఉన్న గుడి నుండి పులిహోర, దద్దోజనం ప్రసాదాల ప్యాకట్లంట, మంచం పక్కన స్టాండ్   మీదెట్టాడు.

వాటితోపాటు తెచ్చిన కుంకుమ వీభూతి పొట్లాలు మాత్రం నాచేతుల్లో పెట్టాడు.

ఎంతో అపురూపంగా అనిపించింది దేవుని కుంకుమ బొట్టు.

 

క్రైస్తవ మతం పుచ్చుకొని, ‘మదర్ తెరెసాలో’ పని చేయడం మొదలైనాక మొహాన బొట్టు పెట్టనే లేదు.

కుంకుమ నుదిటిపై   పెడుతూ తాతని గుర్తు చేసుకున్నాను….

నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి….

“మీ తాతకి ఉత్తరం రాసావుగా! నీ కొత్తకాలు పెట్టే లోగా ఆడనుండి మళ్ళీ ఏదో ఒకటి తెలుస్తాదిలే…,” అంటూ గోవిందు ఇంకా ఏదో చెప్పేలోగా కమలమ్మ వచ్చింది.

 

“ఇక పోవాలిరా గోవిందూ,” అంటూ దగ్గరగా వచ్చి నా పక్కన కూచుంది. కమలమ్మ…

 

నా వంక చూస్తూ, ”ఇదో గాయత్రీ, జేమ్స్ వచ్చినప్పుడు, ఇక మూడు రోజులకి పనిలోకొస్తాని అతనికి భరోసా ఇవ్వు…. సైగలతోనే మంచిగా సెప్పు. మేము మళ్ళీ రేపో ఎల్లుండో కనబడతాము,” ఒకింత ఆగి, నా వంక తేరిపార చూసింది.

“బొట్టెడితే మునపటి గాయత్రిలాగే ఉన్నావు. ఇక్కడున్న ఈ రెండురోజులు సక్కగా పెట్టుకో,” అంటూ లేచి గోవిందుతో పాటు వెనుతిరిగింది కమలమ్మ.

 

ఆమైతే, ఏనాడూ బొట్టు, పూలు పెట్టదు. గుళ్ళో కొలువుకొచ్చాకే, చిన్న నల్ల బొట్టెడం మొదలెట్టానంది అప్పట్లో.

ఊరు దాటగానే అదీ తీసేసింది. తనకసలు బొట్టు, పూలు, పెళ్ళి, పిల్లలు, సంసారం అంటే గిట్టదని ఓ మారు మాటల్లో అన్నది కూడా….

 

అన్నీ ఎడమతం చేష్టలు, వింత పోకడలే కమలమ్మవి. అందుకే జేమ్స్ కి నేను మంచిగా భరోసా ఇవ్వాలని చెప్పి మరీ వెళుతుంది. అవసరమా? తెలిసిందేగా నేను వెంటనే ఆ కిచెన్లో వంట-వార్పు – చాకిరీ మొదలెట్టాల్సిందేనని…మళ్ళీ భరోసా ఇచ్చేదేముంది!

 

గుండెలు, కడుపు రగిలిపోతుంటే గబగబా గుడి పులిహోర తిని, నర్సు ఇచ్చిన నీళ్ళ కాఫీతో కొత్త మందు వేసుకుని వాకిలి వైపుగా తలగడ మీదకి ఒరిగాను.

 

జేమ్స్ మీద అసహ్యం, వాడు ఎప్పుడొస్తాడో అన్న భయంతో అయోమయంగా అనిపించింది.

అసలతను మా జీవితాల్లోకి ఎలా వచ్చాడని గుర్తు చేసుకున్నాను.

సత్రంలో క్యాంటీన్ వోనర్ అయిన జేమ్స్ కాడికెళ్ళి, ఊరికి కొత్తగా వచ్చిన మాకు దారి చూపెట్టమని కమలమ్మ మొర పెట్టుకోడం, లేదనకుండా అతను ముగ్గురికీ బతుకుతెరువు చూపించడంతో మొదలైంది, అతనితో సంబంధం.

egire-pavurama-13

ఇంకేముంది….నా గురించిన సంగుతులన్నీ కమలమ్మ నుండి విన్నాక, జేమ్స్ మా అందరి బలహీనతలు తెలుసుకుని చనువు తీసుకున్నాడు. మొదట్లో జాలిగా ఉన్నా, నాపట్ల వైఖరి మారింది. చెప్పుకోలేని ఇబ్బందులు మొదలయ్యాయి.

టైం దొరికితే పుస్తకాలు-పత్రికలూ చదవాలనుకునే నాకు, పక్కన చేరి, తను భార్యని ఎందుకు వదిలేసాడో, మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదో చెప్పడం మొదలెట్టాడు. అతని సొంత విషయాలు వినడానికి విసుగ్గా ఉండేది.

జేమ్స్ చేయి తిరిగిన వంటవాడే. కొత్తల్లో నాకు వంట నేర్పించే సాకుతో అవసరానికి మించి చేరువగా ఉండేవాడు.

నాతో పాటు పనిచేసే ‘జాన్వి’ టిఫిన్ పొట్లాలు టీ బడ్డీకి జారవేసే సమయాల్లో నాతో బాతాఖానీ వేసేవాడు…. చేతులు, మెడలు పడతానని వెంట పడేవాడు. నా రంగు, నా జుట్టు, నా తేనె రంగు కళ్ళని పొగిడేవాడు.

కొత్తపత్రికల మధ్యలో అసభ్యకరమైన బూతు పుస్తకాలు పెట్టి చదువుకోమని ఇచ్చేవాడు.

ఇలాంటివన్నీ వార్తల్లో, పత్రికల్లో చదువుతూనే ఉన్నాను.   నా పట్ల అతడి వెకిలితనం అర్ధమయిపోయింది…

 

ఇట్లాంటి అడ్డమైన పన్లు   చేస్తున్నా, వాడిని ఏమీ చేయలేక పోయాను. ఎవరికి ఎలా చెప్పగలను. నేను చెప్పినా కమలమ్మ నమ్మదు. కమలమ్మకి జేమ్స్ దేవుడుతో సమానం.

అతడు నా భుజం మీద చేయి వేస్తే, ఒకటి రెండు సార్లు విదిలించాను. దూరంగానే ఉండమని తెలియజెప్పాను. అంతకంటే ఏమి చేయలేని దుస్థితి నాది…

పైగా ఆ కొలువు చేయకపోతే, నా గతేంటి?.. ఆ కొలువు వల్లే మాకు తిండి ఖర్చు లేకపోగా, మొదట్లో ఏడాదిపాటు టీ బడ్డీ వెనకాతల ఉన్న ఓ రేకుల గది, వంటిల్లు బాత్ర్రూం సహా మాకు ఉండడానికి ఇచ్చాడు. …..

 

వాడి ఆగడాల్ని ఎదుర్కోవాల్సిన దుస్థితి, సత్రం కొలువుతో మొదలైంది.

రెండేళ్లగా మాత్రం ‘మదర్ తెరెసా’ కిచెన్లో, హెల్పర్స్ ఉండడంతో, వాడికి నన్ను వేధించే అవకాశాలు తగ్గాయి.

 

ఇలా ఆలోచనలు సాగుతున్నా, కళ్ళు మూసుకుపోతున్నాయి..కాలు నొప్పి కాస్త తగ్గినట్టే అనిపించింది. మెల్లగా నిద్రలోకి జారుకున్నాను…

**

“గాయత్రీ, ఇక లే మరి. చాలా సేపయిందట నీవు నిద్రకి పడి,” అంటూ నా చెవిదగ్గరగా వినిపించడంతో, మెల్లగా కళ్ళు తెరిచాను. నా భుజంపై చేయి వేసి రాస్తూ మంచానికి దగ్గరగా నిలబడి ఉన్నాడు జేమ్స్…

ఒక్కసారిగా కుంచించుకుపోయాను.

భుజం మీద చేయి తీసేసి, లేచి కూచోవాలని ప్రయత్నించాను. కుదరలేదు.   ఆయమ్మ కోసం, చేతికందిన సత్తు గ్లాసుతో బల్లమీద నాలుగు సార్లు శబ్దం వచ్చేలా గట్టిగా కొట్టాను.

నా చేతి నుండి గ్లాసందుకొని, “చూడు, లంచ్ చేసి రమ్మని నేనే ఆయాని పంపాను. నేనొచ్చి ఇరవై నిముషాలయింది. పక్కకొదిగి, ముద్దుగా గువ్వపిట్టల్లే పడుకున్న నిన్ను   చూస్తూ కూర్చున్నాను. బొట్టు పెట్టుకొని చాలా కళగా ఉంది నీ ఫేస్.

ఈ రోజున, మన అసిస్టెంట్ కి డ్యూటీ అప్పజెప్పి సెలవు తీసుకున్నా. ఆయమ్మ రాగానే నిన్ను కూర్చోబెట్టి, లంచ్ తినిపిస్తూ కబుర్లు చెబుతా కూడా,” జేమ్స్ అంటుండగానే వచ్చింది ఆయా.

 

చేతిలో నోట్లు అతినికందించి, “ఏం చేయమంటారు సారూ,” అడిగింది.

ఇద్దరూ కలిసి నన్ను పైకి లేపి కూర్చోబెట్టారు..చుట్టూ కలియజూసాను. గది సగానికి పైగానే ఖాళీ అయింది. దూరంగా ఇద్దరు ముసలాళ్ళు పడుకునున్నారు. మిగతా రోగులు డిస్చార్జ్ అయ్యారేమో!

 

“తిని మందేసుకున్నాక, ఆయాని నీ పక్క మార్చమంటావా లేక ఇప్పుడే సర్దమంటావా? నేను పక్కకెల్తాలే,” అన్నాడు జేమ్స్….

 

‘లేదు తిని మందేసుకుంటానని’ సైగ చేసాను. నేను తినేస్తే, వాడు త్వరగా పోతాడేమోనని..

 

“సరే అయితే. గాయత్రికి నేను తినిపిస్తాలే, నువెళ్ళి పక్కనే ఉండు,” అన్నాడు ఆయాతో.

తెచ్చిన క్యారేజీ విప్పాడు. ప్లేట్, గ్లాస్, ఫ్లాస్క్ బ్యాగ్ నుండి తీసాడు.

 

“సేమియా ఉప్మా, పెరుగువడ, జిలేబి…నీకోసం…స్వహస్తాలతో పోద్దుటినుండి నేనే చేశా,” అంటూ ప్లేట్లో సర్డాడు.

నాకు దగ్గరగా చేరి, తినిపించసాగాడు. రెండు సార్లు అయ్యాక, నేనే తింటానని పళ్ళెం లాక్కున్నాను.

“సరే, అంతా తింటే గాని ఒప్పుకోను,” అన్నాడు జేమ్స్ నవ్వుతూ నా ఎదురుగా కూచుని.

 

వాడెందుకలా మెడలో లావుపాటి బంగారు గొలుసు, పది వేళ్ళకి బంగారు ఉంగరాలు, ఓ చేతికి బంగారు కడియం, మరో చేతికి బంగారు రంగు రిస్ట్ వాచి అలంకరించాడో తెలియడం లేదు.   తెల్లటి సిల్క్ లాల్చీ వేసాడు. వాడి దగ్గర ఘాటుగా అత్తర్ల వాసనలు…

పెద్ద పొట్ట, వెకిలి నవ్వు, బట్టతల, చెంప మీద కత్తి గాటు. పెద్ద రౌడీలా ఉంటాడు.

వాడి రూపం, వేషం కడుపులో తిప్పేస్తుంది.

ఎలాగో తినడం ముగించాను…

 

“నే వెళ్ళి డాక్టర్ని కలిసొస్తాను, నీవీలోగా మందేసుకొని పక్క మార్పించుకో,” అని ఆయాని పిలిచాడు వాడు.

**                                                                 (ఇంకా ఉంది)

 

ఒక్కేసి పువ్వేసి చందమామ

DRUSHYA DRUSHYAM -51

జీవితం ఎంత గమ్మత్తయిందో చెప్పలేం.
అదొక పాట. ఆట.

కళ్ల ముందే ఆడనక్కర్లేదు.
వినిపించేంత దూరంలోనే పాడనక్కరా లేదు.

లోపలంతా ఆటే.
బయటంతా పాటే.అదృశ్యంగా ఉన్నా సన్నిహిత దృశ్యమే.
వినిపించకపోయినా సరాగాలాపనే.ఒక సాంసృతిక పరాగ సంపర్కం.
పండుగలో ప్రతి మనిషీ పువ్వవడం.

ఒక్కేసి పువ్వేసి చందమామ
ఒక్క జాము ఆయె చందమామ

వినీ వినిపించని రాగం.
జ్ఞప్తికి వచ్చీ రానీ తంగేడి పువ్వు పరిమళం.

ఎక్కడ కూచున్నాఒక పిలుపు.
పువ్వు ముడుచుకున్నట్లు, విచ్చుకున్నట్లు ఆటా, పాటా

అది దృశ్యాదృశ్యం. మదిలో పావనమైతున్నది.
సిద్దార్థ కవిత్వంలా బిడ్డ తన్మయమైతున్నడు.

ఒక్కేసి  పూవేసి చందమామ…
శివుడు రాకపాయె చందమామ

విరాగం.
రాగం.

ఒక చోట అని కాదు.
ఊరూ వాడా ఇల్లూ వాకిలీ టీవీ అంతాటా రాగరాజ్యం.
పాట పవనం.

ఒకరిద్దరు కాదు, బృందం.
ఒక జపమాల వంటి కంఠమాల పవిత్రమైన లీల ఏదో మెలమెల్లగా సమీపించి హృదయాన్ని బతుకమ్మ పేరుస్తున్నట్టు పేరుస్తున్నది.

స్త్రీ మహత్యం. గౌరమ్మ
ఇక ఏది చూసినా గౌరవం.

నేననే కాదు, అది ఎవరైనా, కాగితాల మీద పెరిగే జీవితం ఎవరిదైనా
పాత్రికేయుడైనా, ఫొటోగ్రాఫరైనా
పాఠకుడైనా లేదా ఫొటో జాగ్రత్త చేసుకునే ప్రేమికుడికైనా
ఎవరికైనా కాగితం ఒక అద్భుతమైన బతుకమ్మే.

చివరాఖరికి ఇది కూడా.
నేలపై పేపర్ ప్లేట్.

ఇదీ నాకు గౌరవమే. బతుకమ్మే.
నాకివ్వాళ బతుకమ్మ.

పండుగ కదా!
ప్రతి ఛాయా బతుకమ్మే!

సమస్త జీవితం బతుకమ్మే.
సెలబ్రేషన్.
సమస్త జీవితం బతుకమ్మే.
సెలబ్రేషన్.

చిత్రం.
నా ప్రతి చిత్రం ఒక లయ. జోల. ఉయ్యాల.
అందులో మీరు చందమామ.వినాలె.ఒక్కేసి పూవేసి చందమామ..
ఒక్క జాము ఆయె చందమామ.

-కందుకూరి రమేష్ బాబు

పుస్తకాలు గతమా, వర్తమానమా, భవిష్యత్తా?

venu

అనేకానేక వ్యక్తిగత, సామాజిక కారణాలవల్ల రెండు మూడు నెలలు నా ఈ శీర్షికకు అంతరాయం ఏర్పడింది గాని ఇటు ‘సారంగ’ ఒత్తిడి వల్లా, ఈ శీర్షికలో రాయదలచిన విషయం పట్ల అభినివేశం వల్లా ఇది రాయవలసి ఉందని ఏ ఒక్కరోజూ మరచిపోలేదు. ఈ శీర్షికలో రాయదగినవీ, ఆలోచించదగినవీ ఎన్నెన్నో తట్టాయి, కనిపించాయి. అలా తోసుకొస్తున్నవాటిలో మిగిలినవాటిని పక్కనపెట్టి ఈసారి పుస్తకాల గురించి రాయదలిచాను. ఒక పుస్తకం అంటే గతంలో రాసినదో, గతం గురించి రాసినదో, గతంలో అచ్చయినదో, గతంలో ఈ కళ్లమీద ప్రవహించి, ఈ మునివేళ్లను ముద్దాడి, ఈ మనసులో స్థిరపడినదో గాని అది గతమేనా? గతమైనా వర్తమానమా? అసలు ఎన్నటికీ తుడిచివెయ్యలేని నిగూఢ భవిష్యత్తా?

‘ఇంతకాలమూ కాయితాల్తోనే గడిచిపోయింది, కన్నీటి కాయితాల్తోనే గడిచిపోయింది’ అని మో అన్నట్టు ఒకసారి పట్టుకున్నదంటే పుస్తకం మనిషిని జీవితపర్యంతం శాసిస్తుంది, ఆ మనిషి తననే శ్వాసించేలా చేస్తుంది. మనిషిని నడిపిస్తుంది, మనిషి వెంట నడుస్తుంది. అటువంటి పుస్తకానుభవాల గురించి ఎన్నోసార్లు రాశాను గాని అనిల్ బత్తుల అనే ఒక కొత్త పుస్తక ప్రేమికుడు వచ్చి నా పుస్తకాల జ్ఞాపకాల కందిరీగల తుట్టెను భూకంప సదృశంగా కదిలించాడు. మూడు వారాల కింద తాను ఏర్పాటు చేసిన పుస్తక జ్ఞాపకాల సభలో మాట్లాడమని నాలుగైదు వారాల కింద అడిగినప్పుడు, ఆ నిప్పురవ్వ నా మనసులో ఇంత దావానలమవుతుందని నేను ఊహించలేదు.

ఇంతకూ అసలు పుస్తక జ్ఞాపకాల సభ ఏర్పాటు చేయడమే ఒక విశిష్ట ఆలోచన. అది సోవియట్ యూనియన్ లో ప్రచురితమైన తెలుగు పుస్తకాల గురించి తలచుకునే సభ. సోవియట్ యూనియన్ అనేది భూగోళం మీది నుంచి చెరిగిపోయి నిండా ఇరవై ఐదు సంవత్సరాలు గడిచింది. అంటే ఒక కొత్త తరం పుట్టుకొచ్చింది. బహుశా ఆ తరంలో కూడ పుట్టుకొస్తున్న పుస్తక పాఠకులు ఎప్పుడూ ఎక్కడా ఏ దుకాణంలోనూ ఈ పుస్తకాలు చూసి ఉండరు. అనిల్ బత్తుల కొద్ది ముందుగా పుట్టాడేమో గాని ప్రధానంగా ఆ తరానికి చెందినవాడే. సహజంగానే ఆయన మిత్ర బృందమూ అలా ఈ పుస్తకాలు దుకాణాలలో చూసి ఉండినవాళ్లు కారు.

అక్కడ మాట్లాడడానికి ఆలోచిస్తూ ఉంటే సోవియట్ పుస్తకాలు నా పఠనం లోకీ, అధ్యయనం లోకీ, అవగాహనల లోకీ, జీవితం లోకీ వచ్చిన నాలుగున్నర దశాబ్దాల కిందటి పురాస్మృతుల సుప్తాస్ఠికలు ‘బతికిన దినాల తలపోత బరువుచేత’ కదిలాయి. నేను సోవియట్ పుస్తకం మొదటిసారి ఎప్పుడు చూశాను, ఎప్పుడు ముట్టుకున్నాను, ఎప్పుడు చదివాను, ఆ పుస్తకాలు ఎట్లా పోగేసుకున్నాను, ఆ పుస్తకాలు మాత్రమే కాదు, ఆ పుస్తకాలకు జన్మనిచ్చిన ఒక అద్భుతమైన సామాజిక ప్రయోగం ఎట్లా కుప్పకూలి పోయింది, ఒక పావుశతాబ్ది గడిచాక ఇప్పుడు ఆ చితాభస్మం లోంచి ఏమి ఏరుకుంటాము, అటువంటి లాభాపేక్ష లేని, చైతన్య విస్తరణ కాంక్షతో మాత్రమే పుస్తక ప్రచురణ అంత పెద్ద ఎత్తున సాగే మరో ప్రపంచం మళ్లీ వస్తుందా…. ఎన్నెన్నో ప్రశ్నలు, ఆలోచనలు.

పుస్తకం గురించి తలచుకోవడమంటే, పుస్తకం రూపురేఖల గురించీ, రచయిత గురించీ, పుస్తకంలోని విషయం గురించీ తలచుకోవడం మాత్రమే కాదు. ఆ పుస్తకం ఉండిన చెక్కబీరువానూ, ఇనుపబీరువానూ, అటువంటి మరెన్నో బీరువాలు నిండిన గదినీ, ఆ గదిలో తలుపు పక్కన నిరామయంగా కూచుని కునికిపాట్లు పడుతూనో, ప్రేమపూర్వకంగా పుస్తకాలను పరిచయం చేస్తూ చెవిలా జోరీగలా వెంట తిరుగుతూనో ఉండే దుకాణదారు గుమస్తానూ, ఆ పుస్తకాలు పట్టుకుని తెరిచి లోపల వాసన చూసి, ఆ తర్వాత దాని విషయ సూచికా, అట్ట మీద వ్యాఖ్యలూ, ధరా చూసినప్పటి సంభ్రమాన్నీ, అంత తక్కువ ఖరీదైనా కొనుక్కోలేని నిస్సహాయ దైన్యాన్నీ, ఎలాగో ఒకలాగ కొనుక్కున్న సంతోషాన్నీ, ఆ పుస్తకాల దుకాణంలోకి మీతోపాటు నడిచి వచ్చిన మిత్రులనూ, ఆ పుస్తకం చదివినప్పటి అనుభూతులనూ, ఆ పుస్తకం గురించి ఇతరులతో మాట్లాడినప్పుడు పొందిన ఉత్సాహాన్నీ… ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పుస్తకాన్ని గురించి తలచుకోవడమంటే ఒక జీవిత శకలాన్ని మళ్లీ అరచేతుల్లోకి తీసుకుని నాలుగువేపుల నుంచీ దర్శించడం.

అలా సోవియట్ పుస్తకాల గురించి తలచుకోవడమంటే బహుశా నా తరానికీ, నా ముందరి తరానికీ ఆత్మకథాత్మక సామాజిక చరిత్ర మననం చేసుకోవడమే.

IMG_20141002_174238

ఊహ తెలిసినప్పటి నుంచీ పుస్తకాలు చూస్తూ వచ్చాను. మా బాపు కొనుక్కున్న ఆధ్యాత్మిక పుస్తకాలు, పురాణాలు, కావ్యాలు మాత్రమే కాదు, సృజనకు సమీక్షకు వచ్చిన పుస్తకాలు, వరవరరావు గారి పుస్తకాలు కొన్నయినా మా రాజారం ఇంటికి చేరుతుండేవి. అలా హనుమకొండ చదువుకు రాకముందే సోవియట్ పుస్తకాలు చూసి ఉంటాను గాని మొట్టమొదట చూసిన సోవియట్ పుస్తకం ఇమాన్యువల్ కజకేవిచ్ ‘మిత్రుని హృదయం’ అని గుర్తు. వరవరరావు గారికీ, మా అక్కయ్య హేమలతకూ పెళ్లి జరిగిన సందర్భంగా 1964లో అది ఎవరో మిత్రులు కానుకగా ఇచ్చినట్టు గుర్తు. దాదాపు మూడు వందల పేజీల నీలి రంగు క్యాలికో బౌండు పుస్తకం. దాని మీద బంగారు రంగులో ఉబ్బెత్తుగా పుస్తకం పేరు, రచయిత పేరు. నలభై సంవత్సరాలు గడిచిపోయాక కూడ ఇప్పటికీ కళ్ల ముందు ఆడుతున్నాయి.

1973లో చదువుకు హనుమకొండ వచ్చాను, ఆ సంవత్సరమే విరసం మొదటి సాహిత్య పాఠశాల జరిగింది. ఆనాటికి కొన్ని పుస్తకాలు ప్రచురించడం కోసం డా. రామనాథం గారి ప్రోత్సాహంతో శ్రామికవర్గ ప్రచురణలు అనే చిన్న ప్రచురణ సంస్థ ప్రారంభమయింది. రామనాథం గారి ప్రోత్సాహంతోనే శ్రామికవర్గ ప్రచురణలు పేరుతో ఒక ప్రత్యామ్నాయ పుస్తకాల దుకాణం వరంగల్ లో ప్రారంభమయింది. ఆ దుకాణం నిర్వహణ బాధ్యత మా అన్నయ్య రాంగోపాల్ ది. నేనూ సాయంకాలం వేళల్లో ఆ దుకాణంలో ఎక్కువ రోజులే కూచోవలసి వచ్చేది. వరంగల్ లో సోవియట్ పుస్తకాలు అమ్మిన మొదటి దుకాణం అదేననుకుంటాను. అక్కడ ఆ పుస్తకాలు చెక్క బీరువాల్లో పేర్చి పెట్టడం నుంచి, తిరగేయడం, చదవడం దాకా సోవియట్ పుస్తకాలతో నా దోస్తీ మొదలయింది. ఎమర్జెన్సీతో ఆ దుకాణం మూతబడిపోయింది.

ఎమర్జెన్సీలోనో, ఎమర్జెన్సీ తర్వాతనో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్ దుకాణం వరంగల్ మండీబజార్ లో మొదలయింది. సృజన ప్రూఫులు దిద్దడానికి ప్రెస్ కు వెళ్లి, ఆ పని అయిపోయినతర్వాత మండీబజార్ దాకా నడిచి విశాలాంధ్రలో కాసేపు పుస్తకాలు చూసి, తిరగేసి, కళ్లనిండా మనసు నిండా నింపుకుని ఇంటికి రావడం అలవాటుగా మారింది. ఆ మండీ బజార్ విశాలాంధ్ర దుకాణం రెండు మడిగెల ఇల్లు. లోపల ఎన్నెన్నో సోవియట్ పుస్తకాలు. కొన్ని పాత ఫారిన్ లాంగ్వేజెస్ పబ్లిషింగ్ హౌజ్ పుస్తకాలతో పాటు గుట్టలుగా ప్రొగ్రెస్ పబ్లిషర్స్. ప్రగతి ప్రచురణాలయం, మిర్ పబ్లిషర్స్ పుస్తకాలు. అప్పటికింకా రాదుగ ప్రచురణలు ప్రారంభం కాలేదు. దాదాపు అన్నీ క్యాలికో బౌండ్ పుస్తకాలే. మార్క్స్ ఎంగెల్స్ రచనలు, ముఖ్యంగా లెనిన్ రచనలు పేపర్ బ్యాక్ లు ఉండేవి. లోపల దళసరి తెల్లని తెలుపు కాగితం. సన్నని అక్షరాలు. పిల్లల పుస్తకాలైతే చెప్పనక్కరలేదు. రంగురంగుల బొమ్మలు. పెద్ద పెద్ద అక్షరాలు. చదువుతుంటే భాష కొంచెం చిత్రంగా ఉన్నట్టుండేది గాని దానిలోనూ ఒక సొగసు, ఒక ఆకర్షణ ఉండేవి.

ఆ తర్వాత విశాలాంధ్ర వరంగల్ మండీబజార్ నుంచి హనుమకొండ అశోకా కాంప్లెక్స్ లోకి వచ్చింది. అప్పటికి ఇంటర్మీడియట్ ఒకసారి తప్పి పూర్తి రికామీగా పుస్తకాలే ప్రపంచంగా ఉన్నాను. ఆ తర్వాత బిఎ లో చేరినా, సృజన, రాడికల్ విద్యార్థి సంఘం, సభల దగ్గర పుస్తకాల దుకాణం పెట్టడం లాంటి పనులెన్ని ఉన్నా సోవియట్ పుస్తకాల మైకం ఒకటి ఎప్పుడూ కమ్మి ఉండేది. సోషల్ సామ్రాజ్యవాదం అని విమర్శిస్తూనే, వాళ్లు పుస్తక ప్రచురణ ద్వారా ప్రపంచానికి చేస్తున్న మేలును అంగీకరిస్తుండేవాణ్ని. అక్కా అని పిలిచే ఒక కుటుంబ మిత్రురాలి దగ్గర నెలకు వంద రూపాయల దానాన్ని వరంగా పొంది అదంతా విశాలాంధ్రలో ఖర్చు పెడుతుండేవాణ్ని. (ఆరోజుల్లో అది ఎంత పెద్ద మొత్తమో, సోవియట్ పుస్తకాల ధరలతో పోలిస్తే అది మరెంత పెద్దమొత్తమో!)

Aelita_Puppala Lakshmanarao(ed)_001

పేదజనం – శ్వేత రాత్రులు, అజేయ సైనికుడు – ప్రశాంత ప్రత్యూషాలు, అమ్మ, జమీల్యా, అయిలీత, అన్నా కెరెనీనా, తండ్రులూ కొడుకులూ…. మొదటిసారి రాక్ లోంచి తీసి, అటూ ఇటూ ప్రేమగా తడిమి, తెరిచి వాసన చూసి, అతి భద్రంగా అప్పటి మేనేజర్ విజయప్రసాద్ బల్ల మీద పెట్టి…. ముప్పై ఐదు సంవత్సరాలు దాటిపోయినా ప్రతి క్షణమూ ఇప్పుడే అనుభవిస్తున్నట్టుగా ఉంది. పుష్కిన్ కవిత్వం, మరీ ముఖ్యంగా వాట్ మీన్స్ మై నేమ్ టు యు, ఇట్ విల్ డై ఆజ్ డజ్ ది మెలాంకలీ మర్మర్ ఆఫ్ డిస్టాంట్ వేవ్స్ అని గొంతిత్తి చదువుకుంటూ, ఆ పద్దెనిమిదో, పందొమ్మిదో ఏట, అది పుష్కిన్ నాకోసమే రాశాడనుకున్న గుండె సవ్వడి ఇంకా చెవుల్లో మోగుతూనే ఉంది. బాలసాహిత్యమో, కవిత్వమో, కథో, నవలో, జానపద గాథలో, సాహిత్య విమర్శో, తాత్విక, రాజకీయార్థిక విషయాలో మాత్రమే కాదు, ఏదైనా సరే అసలు అది ప్రపంచానికి తెరిచిపెట్టిన ఒక కిటికీ. హృదయాన్ని వెలిగించిన ఒక మెరుపు. మనశ్శరీరాలను ముద్దాడి అలౌకిక అనుభూతిని అందించిన వెన్నెల. ఆ ప్రచురణలే లేకపోతే టాల్ స్టాయ్, డాస్టవిస్కీ, గోగోల్, కుప్రిన్, గోర్కీ, షొలఖోవ్, పుష్కిన్, గమ్జతోవ్, కజకేవిచ్, మయకోవస్కీ, లూనషార్స్కీ, సుఖోమ్లిన్స్కీ, మకరెంకో, క్రుపస్కయా, కొల్లోంటాయ్ లాంటి వందలాది పేర్లు మన కుటుంబ సభ్యుల పేర్లంత సన్నిహితమై ఉండేవేనా?

కేవలం రష్యన్ రచయితలు మాత్రమే కాదు, ఎందరో యూరపియన్ రచయితలు కూడ నాకు మొదట తెలిసింది ప్రొగ్రెస్ పబ్లిషర్స్ పుస్తకాల ద్వారానే. షేక్స్పియర్ మాక్ బెత్, ఆస్కార్ వైల్డ్ కథలు, లూయి కారొల్ ఆలిస్ ఇన్ వండర్ లాండ్ మాస్కో మీదుగానే నా కళ్లకు చేరాయి. యూరీ బోరెవ్ ఈస్ఠటిక్స్, యూరీ ఖారిన్, థియొడర్ ఒయిజర్మన్ ల తత్వశాస్త్రం, చేగువేరాతో సహా ఎందరివో జీవితచరిత్రలు, రాజకీయార్థిక శాస్త్రం, విద్యా ప్రయోగాలు, రెండో ప్రపంచ యుద్ధ అనుభవాలు… ఎన్ని జ్ఞాపకాలు….

ఇక నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం, రసాయన మూలకాల రహస్యాలు, చక్షువు-జగచ్చక్షువు లాంటి విజ్ఞాన శాస్త్రాల పుస్తకాలు, గణిత శాస్త్ర పుస్తకాలు, చివరికి చదరంగం మీద పుస్తకాలూ… ఆ పుస్తకాలే లేకుంటే ఏమయ్యేవాళ్లం? ఇట్లా ఉండేవాళ్లమేనా?

తన చరిత్ర పట్ల ఎంత మాత్రమూ స్పృహ లేని, తన చరిత్రను తాను నమోదు చేసుకోవాలనే స్పృహలేని తెలుగు జాతి స్వభావం గురించి ఇదివరకు రాశాను గాని, అనిల్ ఈ సోవియట్ తెలుగు పుస్తకాల గురించి మాట్లాడమన్న తర్వాత తారీఖులు, దస్తావేజుల కోసం తవ్వకం మొదలుపెడితే యాభై సంవత్సరాలకు మించని చరిత్ర కూడ మనకు ఖాళీలు లేకుండా, గందరగోళం లేకుండా, సవ్యంగా, స్పష్టంగా నమోదై లేదని మరొకసారి తెలిసివచ్చింది.

ప్రగతి ప్రచురణాలయం మాస్కో ప్రచురణలు ఎప్పుడు మొదలయ్యాయి, మొదటి పుస్తకం ఏమిటి, సోవియట్ యూనియన్ పతనం తర్వాత ప్రగతి ప్రచురణాలయం వెంటనే మూతపడిందా, చివరి పుస్తకం ఏమిటి, నిలువ ఉండిన పుస్తకాలు ఏమయ్యాయి…. ప్రశ్నలే ప్రశ్నలు, సంతృప్తికరమైన సమాధానాలు లేవు.

ప్రగతి ప్రచురణాలయంలో అనువాదకులుగా గిడుతూరి సూర్యం, జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి, కొండేపూడి లక్ష్మీనారాయణ, ఉప్పల లక్ష్మణ రావు, రాచమల్లు రామచంద్రారెడ్డి, నిడమర్తి ఉమారాజేశ్వరరావు, ఆర్ వెంకటేశ్వర రావు (ఆర్వియార్) పని చేశారు. వీరిలో లక్ష్మణరావు గారు తప్ప మిగిలినవారెవరూ తమ ఆత్మకథలు రాసుకున్నట్టు లేరు. కనీసం సోవియట్ అనుభవాలు రాసుకున్నట్టు నా దృష్టికి రాలేదు. లక్ష్మణరావు గారి బతుకు పుస్తకంలో ప్రగతి ప్రచురణాలయం, మాస్కో తెలుగు ప్రచురణలు ప్రారంభమైన సంవత్సరం 1967 అని ఒకచోట అచ్చయింది. అది కచ్చితంగా అచ్చుతప్పు కావచ్చు. ఎందుకంటే మరికొన్ని పేజీల తర్వాత ఆయనే తాను తెలుగు అనువాదకుడిగా ప్రగతి ప్రచురణాలయంలో 1958లో చేరానని రాశారు. ఇంటర్నెట్ మీద కొంచెం పరిశోధిస్తే ప్రోగ్రెస్ పబ్లిషర్స్ మలయాళ విభాగం 1956లో మొదలయిందని ఒక లీలామాత్ర సమాచారం దొరికింది. మొత్తానికి తెలుగు విభాగం కూడ 1950ల మధ్యలో మొదలై ఉంటుందనుకుని ఆ కాలంలో కమ్యూనిస్టుపార్టీలో క్రియాశీలంగా ఉండినవారిని అడిగితే వారూ కచ్చితంగా చెప్పలేకపోయారు.

విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్ తోనూ, పీపుల్స్ పబ్లిషింగ్ హౌజ్ తోనూ చిరకాలం గడిపిన పిపిసి జోషి గారిని అడిగితే ఆయన కూడ, ‘నేనూ కచ్చితంగా చెప్పలేను గాని, కొన్నేళ్ల కింద నేను స్వెత్లానా వ్యాసం ఒకటి అనువాదం చేశాను. స్వెత్లానా అంటే అప్పటి ప్రగతి ప్రచురణాలయం బాధ్యురాలు. విశాలాంధ్ర వజ్రోత్సవాల సందర్భంగా ఆమెను వ్యాసం రాయమంటే, ఆమె ఇంగ్లిషులో పంపిన వ్యాసంలో కొన్ని తేదీలు, పేర్లు పొరపాటు ఉన్నాయని, అవి దిద్ది అనువాదం చేయమని నాకిచ్చారు. నేను కాపీ కూడ పెట్టుకోకుండా అనువాదం, అసలు వ్యాసం వారికిచ్చేశాను. ఏ కారణం వల్లనో ఆ వజ్రోత్సవ సావనీర్ వెలువడలేదు. ఆ వ్యాసం ఏటుకూరి ప్రసాద్ దగ్గర ఉండవచ్చు. అడిగి తీసుకో’ అన్నారు.

నిజంగా ఆ వ్యాసం మన సామాజిక చరిత్రకు, సోవియట్ తెలుగు పుస్తకాల చరిత్రకు సంబంధించి ఒక విలువైన దస్తావేజు. దాని ప్రకారం సోవియట్ తెలుగు ప్రచురణలు 1956 డిసెంబర్ లో మొదలయ్యాయి. మొదటి పుస్తకం సుతయేవ్ రాసిన ‘ఎవరు మ్యావ్ అన్నారు’ అనే పిల్లల పుస్తకం.

అప్పటి నుంచి 1989 దాకా మాస్కో నుంచి తెలుగులో మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ రచనల అనువాదాలతో సహా కనీసం మూడు వందల పుస్తకాలైనా వెలువడి ఉంటాయని నా అంచనా. అవన్నీ ఎక్కడైనా ఒక్కచోట ఉన్నాయా? అసలు జాబితా అయినా దొరుకుతుందా? ఆ మూడువందల పుస్తకాలు కొన్ని లక్షల ప్రతులు అచ్చయి ఉంటాయి. వాటిని ముట్టుకున్న, చదివిన, పంచుకున్న, వాటితో కదిలిపోయిన లక్షలాది మంది అనుభవాలన్నీ ఏమవుతాయి? అదంతా పతనమైపోయిన సోవియట్ యూనియన్ లాగ భూతకాలంలో కలిసిపోయిందా? అది విషాద వర్తమానమా? ఉజ్వల భవిష్యత్తా? అనిల్ బత్తుల వంటి ఔత్సాహికుల వల్ల, అపార అవకాశాలు ఇస్తున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల అవన్నీ మళ్లీ ఈ అంతర్జాలం మీద కనబడతాయా? ఆ మాయాజాలం మళ్లీ వికసిస్తుందా?

సోవియట్ యూనియన్ కూలిపోయి ఉండవచ్చు కాని తన వనరులలో గణనీయమైన భాగాన్ని వెచ్చించి ప్రపంచానికంతా ఇంత జ్ఞానదానం చేసిన స్ఫూర్తి సంగతి ఏమిటి? వందలాది భాషలలో కోట్లాది పుస్తకాలు ప్రచురించి దేశదేశాల పాఠకుల అవసరాలను తీర్చడానికి, వారి కొనుగోలుశక్తిని దృష్టిలో పెట్టుకుని కారుచవకగా అందించడానికి, సోవియట్ ప్రజానీకం తమ శ్రమ ఎంత వెచ్చించి ఉంటారు? ఆ స్వార్థత్యాగం గతమా, వర్తమానమా, భవిష్యత్తా? రెండు కోట్ల మందిని బలిపెట్టి హిట్లర్ దుర్మార్గం నుంచి ప్రపంచాన్ని కాపాడిన ఆ మహాత్యాగ శక్తిని అప్పటి కవి ‘కోటి గొంతులు నిన్ను కోరి రమ్మన్నాయి’ అని పిలిచాడు. ఆ పుస్తకప్రచురణ స్ఫూర్తినైనా మళ్లీ కోరి రమ్మనడానికి కోటిగొంతులు పలకవలసిన అవసరం లేదా?

-ఎన్ వేణుగోపాల్

పర్షియన్ రాముడు, గ్రీకు హనుమంతుడు!

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)మనిషికీ, కాలానికీ మధ్య కనిపించని పెనుగులాట నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది కాబోలు…

మనిషి అనే చిన్నపిల్లవాడు ఇసుక గూళ్ళు కట్టుకుంటూ ఉంటాడు. అదిప్పుడు సైకతశిల్పాలనే ఒక కళారూపంగా కూడా ఎదిగి ఉండచ్చు, అది వేరే విషయం. ఇసుక గూడు కట్టినంతసేపూ స్థిరంగానూ, నిజంగానూ అనిపిస్తుంది. కానీ కాలం ఆ వెంటనే, లేదా మరునాడో దానిని కూల్చివేస్తుంది. అలాగే కాలగతిలో మనిషి తను ఉండే ప్రాంతానికీ, దేశానికీ సరిహద్దులూ, తనకు కొన్ని రకాల గుర్తింపులూ(identities) కల్పించుకుంటూ ఉంటాడు. కానీ కాలం వాటిని చెరిపివేస్తూ ఉంటుంది. కొత్త సరిహద్దులు, గుర్తింపులు ఏర్పడుతూ ఉంటాయి.

సారాంశం…కాలం దేనినీ స్థిరంగా ఉండనివ్వదు!

కాలం దేనినీ స్థిరంగా ఉండనివ్వదన్న సంగతిని గ్రహించడమే మనిషి పరిణతికి ఒక కొలమానం కావచ్చు. లేదా, ఎప్పటికప్పుడు కొత్త సరిహద్దులను, గుర్తింపులను కల్పించుకుంటూ సాగడమే మనిషి పరిణతికి నిజమైన కొలమానం అని కూడా ఎవరైనా భావిస్తూ ఉండచ్చు. వీటిలో ఏది కరెక్టు అన్న వివాదంలోకి దిగడం నా ఉద్దేశం కాదు. ఒకవేళ మొదటిదే కరెక్టు అనుకుంటే పురాచరిత్రలోకి వెళ్ళడం ఆ పరిణతికి ఏ కొంచెమైనా దోహదపడుతుందా…?

నేను ఇంతకు ముందు ఒకసారి నా అనుభవాన్ని రాశాను. అది, ఒక టీవీ చానెల్ లో కొందరు కాశ్మీరీ యువతీ యువకులు రెండు పక్షాలుగా విడిపోయి ఒక చర్చలో పాల్గొన్న సందర్భం. మొదటినుంచీ ఆ కార్యక్రమాన్ని చూడకపోవడంతో ఎవరు ఏ పక్షమో వెంటనే తెలియలేదు. ఎందుకుంటే, వారి రూపురేఖలు, ఆహార్యమూ ఒక్కలానే ఉన్నాయి. క్రమంగా వారిలో ఒక పక్షంవారు ముస్లింలనీ, ఇంకో పక్షంవారు కాశ్మీరీ పండిట్లనీ తెలిసింది. ఆ క్షణంలో నాకు ఆశ్చర్యం కలిగింది. ఒక జ్ఞానశకలమూ మెరుపులా నా మెదడును తాకింది. దాంతోపాటు అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేమిటంటే, కాశ్మీరీలను కాశ్మీరీలుగానే తప్ప ముస్లింలుగానో, పండిట్లుగానో గుర్తించకూడదని! ఎవరేమనుకున్నా నా నిర్ణయస్వేచ్ఛ నాది.

రెండు పక్షాలవారూ రక్తసంబంధీకులని వారి రూపురేఖలే చెబుతున్నాయి. చర్చ సందర్భంలో వాళ్ళలో కొందరు ఆ మాట అన్నారు కూడా. కానీ మధ్యలో వాళ్ళలో కొందరు మతపరమైన కొత్త గుర్తింపు తెచ్చుకున్నారు. మతపరమైన వేర్వేరు గుర్తింపులతో వారిద్దరి ప్రపంచాలూ వేరై పోయాయి. భౌగోళికంగానూ, మనుషుల పరంగానూ వారికి పరస్పర భిన్నమైన భావాలు, బంధాలు, విశ్వాసాలు ఏర్పడ్డాయి. అయితే, గుర్తింపులు వేరయ్యాయి కానీ, ఉనికి మారలేదు. ఫలితంగా… ఘర్షణ!

ఇంతకీ ఈ గుర్తింపుల ప్రస్తావన దేనికంటే…

బైబిల్ లో ఒక ప్రసిద్ధమైన కథ ఉంది. అది, డేవిడ్ అండ్ గోలియత్. డేవిడ్ ఒక యూదు. బలంలోనూ, ఆకారంలోనూ సామాన్యుడు. గోలియత్ ఒక ఫిలిస్తీన్. బలంలోనూ ఆకారంలోనూ అసామాన్యుడు. పన్నెండు అడుగులవాడు. ఇప్పుడు ఇజ్రాయిల్, పాలస్తీనా అని పిలుచుకునే ప్రాంతాలపై ఆధిపత్యం కోసం ఫిలిస్తీన్లు, యూదులు పోరాడారు. ఉభయ సైన్యాలూ ఎదురెదురుగా నిలిచాయి. ఫిలిస్తీన్ సైన్యంలో అతి భీకరంగా ఉన్న గోలియత్ ముందుకు వచ్చాడు. అతన్ని చూడగానే యూదులు బెదిరిపోయి వెనకడుగు వేశారు. ఇలా గోలియత్ ముందుకురావడం, యూదు సేనలు భయపడి తోకముడవడం నలభై రోజులు సాగింది. అప్పుడు యూదురాకుమారుడు డేవిడ్ ధైర్యం చేసి గోలియత్ తో తలపడడానికి ముందుకొచ్చాడు. గోలియత్ ది భుజబలం అయితే, డేవిడ్ ది బుద్ధిబలం. ఒడిసెల్లోంచి రాళ్ళు విసరడంలో అతను నిపుణుడు కూడా. డేవిడ్ ఒక గులకరాయిని ఒడిసెల్లో పెట్టి గోలియత్ కణతకు తగిలేలా విసిరాడు. అంతే, గోలియత్ మొదలు తెగిన చెట్టులా కూలిపోయాడు.

untitled

ఈ కథ వినగానే మనకు రామాయణంలో కుంభకర్ణుడు గుర్తుకొస్తాడు. అతనిది కూడా భీకరమైన ఆకారం. అతను యుద్ధరంగంలోకి అడుగుపెట్టగానే వానరులు భయంతో తలోవైపుకీ చెదిరిపోతారు. వారు కూడా అప్పుడు రాళ్ళతోనూ, చెట్లతోనూ యుద్ధం చేశారు. చివరికి రాముడు బాణప్రయోగంతో కుంభకర్ణుని చంపేశాడు.

రాంభట్ల వెర్షన్ (వేదభూమి)ప్రకారం, ఫిలిస్తీన్లు మొదట క్రీటు దీవిలో ఉండేవారు. ఆవిధంగా వారు ఏజియన్లు. భూకంపం, అగ్నిప్రమాదం, గ్రీకు దాడుల ఫలితంగా వారు అప్పట్లోనే నేటి ఇజ్రాయిల్-పాలస్తీనా ప్రాంతంలోకి వచ్చి స్థిరపడ్డారు. వారిని ‘పులిసేతు’ లనేవారు. అదే ఫిలిస్తీన్ అయింది. మన దగ్గర మ్లేచ్చులు, అప్రాచ్యులు అనే మాటల్లానే, ఫిలస్తీన్ కూడా తిట్టుపదంగా మారింది.

హెచ్. జి. వెల్స్ ప్రకారం కూడా ఫిలిస్తీన్లు ఆసియా మైనర్ కు పశ్చిమంగా ఉన్న ఏజియన్ ప్రాంతం నుంచి మధ్యధరా సముద్రపు ఆగ్నేయ తీరంలోకి వలస వచ్చి నగరాలు కట్టుకున్నారు. వీరి వలసకు కారణం, ఇంతకుముందు వ్యాసంలో చెప్పుకున్న మూడు ముఖ్యరకాలకు చెందిన సంచారజీవులలో ఒకరైన ఆటవిక నోర్డిక్ జాతివారు వచ్చి పడడం. ఇది క్రీ.పూ. 1200, లేదా ఒకింత ముందు జరిగింది. వీరితో పురాతన రేఖాపటం మీదికి కొత్త పేర్లు వచ్చాయి. వీరి చేతుల్లో ఇనప ఆయుధాలు ఉన్నాయి. వీరు గుర్రాలు పూన్చిన రథాలు వాడుతున్నారు. ఉత్తర సరిహద్దులలో వీరు ఏజియన్, సెమెటిక్ నాగరికతలకు ముప్పుగా మారారు. వీరే మీదులు, పర్షియన్లు, కిమ్మెరియన్లు, ఆర్మేనియన్లు, ఫ్రిజియన్లు, గ్రీకులు, తదితరులుగా చరిత్రకు పరిచయమయ్యారు. వేర్వేరు పేర్లతో ఉన్నా వీరంతా ఆర్యులు. ఒకే మూలభాషనుంచి చీలిపోయిన వేర్వేరు ఆర్యభాషలు మాట్లాడేవారు. వీరు ఒకవైపు పశువులను కాచుకుంటూ, ఇంకోవైపు నగరాల మీద దాడులకు, దోపిడీలకు పాల్పడేవారు. క్రమంగా మరింత బలపడి పశ్చిమాన ఉన్న నాగరికులైన ఏజియన్ల నగరాలను ఆక్రమించుకుని వారిని తరిమివేయడం ప్రారంభించారు. దాంతో ఏజియన్లు కొత్త ప్రదేశాలు వెతుక్కున్నారు. కొంతమంది నైలు నదీ డెల్టాలో స్థిరపడాలని చూశారు కానీ ఈజిప్షియన్లు వాళ్ళను తరిమేశారు. ఎట్రూస్కన్లు గా పరిచయమైన కొందరు ఆసియామైనర్ నుంచి జలమార్గంలో ఇటలీ మధ్యభాగంలోని అడవుల్లోకి వచ్చి స్థిరపడ్డారు. ఈ వలసల్లో భాగంగా మధ్యధరా ఆగ్నేయ తీరానికి వచ్చినవారే ఫిలిస్తీన్లు.

ఈ చారిత్రక సమాచారం విసుగు పుట్టించచ్చు కానీ, ఎంతో అవసరమయ్యే ఈ వివరాలను ఇక్కడ ఇవ్వాల్సివస్తోంది. ఎందుకంటే, పైన చెప్పుకున్న అనేక పేర్లతో భారత దేశపురాచరిత్రకు కూడా సంబంధముంది. ఈ పేర్లు భిన్న ఉచ్చారణతో మన పురాణ, ఇతిహాసాలకు కూడా ఎక్కాయి. దీని గురించి ముందు ముందు చెప్పుకోవలసి రావచ్చు.

ప్రస్తుతానికి వస్తే, రాంభట్ల ఉద్దేశంలో పులిసేతులు లేదా ఫిలిస్తీన్లు ఆర్యులే! అంటే, వారు ఏజియన్ ప్రాంతంలోకి ముందే వచ్చి స్థిరపడినవారై ఉండాలి. చరిత్రకాలంలో వాళ్ళు ఇస్లాంలోకి మారారు. వారే కాదు, పురాకాలంలో మధ్య ఆసియా, పశ్చిమాసియాలకు చెందిన ఆర్యతెగలు అనేకం ఇస్లాంలోకి మారాయి. ఫిలిస్తీన్ల విషయానికే వస్తే, ఆర్యులుగా వారు పాశ్చాత్యప్రపంచానికీ, కొంతవరకు మనకూ యూదుల కంటే ఎక్కువ దగ్గర కావాలి. కానీ ఇస్లాం మతస్తులుగా వారు పాశ్చాత్యప్రపంచానికి విరోధులయ్యారు. పాశ్చాత్య క్రైస్తవ ప్రపంచానికీ, ఇస్లామిక్ ప్రపంచానికీ క్రూసేడ్ల కాలంనుంచి, ఇప్పటివరకు జరుగుతున్న ఘర్షణలను ‘సంస్కృతుల మధ్య ఘర్షణ’ గా చెప్పుకుంటున్నాం. ప్రపంచ స్థాయిలో నేడు జరుగుతున్న అతి పెద్ద ఘర్షణ ఇదే కూడా.

అంతమాత్రాన పాశ్చాత్యప్రపంచానికి యూదులు నెత్తి మీది దేవుళ్లేమీ కారు. ‘ఆర్యత్వం’ ఒక ఉన్మాదంగా ప్రకోపించి హిట్లర్ యూదులపై సాగించిన ఊచకోత ఇటీవలి చరిత్రే. అయితే, ముస్లింలు అనే ‘పెద్ద శత్రువు’తో పోల్చితే యూదులు ‘చిన్న శత్రువు’ కనుకా; ‘శత్రువుకు శత్రువు మిత్రుడు’ అనే సూత్రరీత్యా పాశ్చాత్యులకు యూదులు ఇప్పుడు మిత్రవర్గం అయ్యారు.

మన విషయానికి వస్తే, ఇస్లాం ప్రపంచం వెలుపల ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్న దేశం కావడంవల్ల; మొదటి నుంచీ జాతుల విముక్తి పోరాటాలను సమర్థించే విధానం వల్ల మన దేశం పాలస్తీనా పక్షం వహిస్తూ వచ్చింది. కానీ క్రమంగా దేశీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ తొంభై దశకం నుంచే యూదుల దేశమైన ఇజ్రాయెల్ కు దగ్గరవడం ప్రారంభించింది. కాంగ్రెస్ అనుసరిస్తూ వచ్చిన ముస్లిం అనుకూలతా, దేశీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చే వైఖరీ—రెండూ కలసివచ్చి, బీజేపీ మొదటినుంచీ ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపుతూ వచ్చింది. ఈ మధ్య పాలస్తీనా ప్రాంతాలపై ఇజ్రాయెల్ పెద్దయెత్తున దాడులు జరిపి వందల సంఖ్యలో పౌరులను చంపడాన్ని ఖండిస్తూ తీర్మానం చేయాలని పార్లమెంటులో ప్రతిపక్షాలు పట్టుబట్టడం; ఎన్డీయే ప్రభుత్వం అందుకు తిరస్కరించడం తెలిసినదే.

కాలగమనంలో పాత గుర్తింపులు పోయి కొత్త గుర్తింపులు ఎలా ఏర్పడుతూ ఉంటాయో; దాంతోపాటే మిత్రత్వశత్రుత్వాలు జాతిభేదాలను, ప్రాంత భేదాలను ఎలా అధిగమిస్తాయో చెప్పడానికే ఈ వివరణ. అదలా ఉంచితే, కాలం కల్పించిన అన్ని రకాల హద్దులను ముంచేస్తూ పురాచరిత్ర వర్తమానంలోకి ఎలా ప్రవహిస్తుందో గ్రహించడానికి చక్కని ఉదాహరణ—నేటికీ కొనసాగుతున్న పాలస్తీనా-ఇజ్రాయెల్ ఘర్షణ. అలాగే, అతిపురాతన కాలం నుంచి నేటివరకు నిరంతర ఘర్షణకేంద్రంగా కొనసాగుతూ కాలానికి సవాలుగా నిలిచిన ఏకైక ప్రాంతం, బహుశా పశ్చిమాసియా.

ఫొనీషియన్ల గురించి చెప్పుకుంటూ యూదుల దాకా వచ్చాం. ఫొనీషియన్లు, యూదుల మిత్రత్వంతోపాటు ప్రత్యేకంగా యూదుల గురించే చెప్పుకోవలసింది ఉంది. అందులోకి వెళ్ళే ముందు…

***

ఇంతకుముందు వ్యాసంలో సుమేరుకు చెందిన గిల్గమేశ ఇతిహాసం(Epic of Gilgamesh)లోని ఎంకిడు పాత్రతో మన రామాయణ, భారతాలలోని ఋష్యశృంగుడికి పోలిక ఉందని చెప్పాను. పైన చెప్పిన గోలియత్, కుంభకర్ణుని గుర్తు తెస్తాడన్నాను. ఈ సందర్భంలో రామాయణ సంబంధమైన మరికొన్ని పోలికలూ గొలుసుకట్టుగా గుర్తొస్తున్నాయి. విషయం పక్కదారి పట్టే మాట నిజమే కానీ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ చెప్పుకునే అవకాశం రాదన్న శంకతో ఇప్పుడే చెప్పాలనిపిస్తోంది.

చరిత్రకు తెలిసినంతవరకు తొలి అతిపెద్ద సామ్రాజ్యం(క్రీ.పూ. 500 ప్రాంతం) పర్షియన్లది. పర్షియన్లు కూడా ఆర్యులేనని పైన చెప్పుకున్నాం. వారిది జొరాష్ట్రియన్ మతం. భారత్ సరిహద్దులవరకు విస్తరించిన పర్షియన్ సామ్రాజ్యంలో మధ్యాసియా, పశ్చిమాసియాలు కూడా అంతర్భాగాలు. అంతటి మహాసామ్రాజ్య పాలకుల మతం నేడు భారత్ లోని కొద్దిమంది పార్శీలకు మాత్రమే పరిమితమవడం కాలవైచిత్రులలో ఒకటి. ఆనాడు పర్షియన్ ఆధిపత్యాన్ని ఎదిరించి నిలబడింది చిన్నదేశమైన గ్రీస్ ఒక్కటే. పర్షియన్లలానే గ్రీకులు కూడా ఆర్యులే. పర్షియన్ చక్రవర్తి డరియస్ ‘ది గ్రేట్’ 1200 యుద్ధనౌకలతో పర్షియాను ఒక సముద్రశక్తిగా మార్చాడు. అందుకు ఫొనీషియన్ల సహకారం తీసుకున్నాడు. 300 నౌకలు ఫొనీషియన్లు సమకూర్చినవే.

అంతటి బలవత్తరుడైన డరియస్ కూడా గ్రీసును లొంగదీసుకోడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. హెరడోటస్ అనే చరిత్రకారుడు రాసిన ఆ వివరాలు ఎంతో ఆసక్తిగొలిపేవే కానీ ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేం. డరియస్ కొడుకు క్జెరెక్సెస్ ఎట్టకేలకు గ్రీసును జయించగలిగాడు. కానీ అది తాత్కాలిక విజయమే అయింది. చివరికి గ్రీకులే పర్షియన్ సామ్రాజ్యానికి చరమ గీతం పాడారు. అప్పటినుంచే అలెగ్జాండర్ ‘ది గ్రేట్’ చరిత్రలోకి వచ్చాడు.

సృష్టిలో రెండు విరుద్ధశక్తులు ఆధిపత్యం కోసం సంఘర్షిస్తూ ఉంటాయనీ, వాటిలో ఎటువైపు ఉండాలో మనుషులు నిర్ణయించుకోవాలనీ జొరాష్ట్రియన్ మతం చెబుతుంది. మొదటిది, మంచితోనూ, వెలుగుతోనూ నిండినదైతే; రెండోది, చెడుతోనూ, చీకటితోనూ నిండినది. అలాగే, ప్రతి కర్మకూ ఫలితం తప్పదన్న కర్మసిద్ధాంతాన్ని కూడా ఈ మతం చెబుతుంది. పర్షియన్లు మిత్రుని, అంటే సూర్యుని ఆరాధించేవారు. సూర్యుడు వెలుగుకు ప్రతీక.

రామాయణానికి వస్తే, రాముడు సూర్యవంశ క్షత్రియుడు.

పర్షియన్ల గురించి H.A. Davies అనే చరిత్రకారుడు (AN OUTLINE HISTORY OF THE WORLD) ఇంకా ఇలా అంటాడు: The Persians were, in many ways, a highly civilized people, and they had many admirable qualities, of which perhaps the most striking were their love of truth, their belief that it was disgraceful to fall into debt, and their courage.

రామాయణంలో, మొదటి సర్గ లోని రెండవ శ్లోకం (కో న్వస్మిన్ సాంప్రతం లొకే గుణవాన్ కశ్చ వీర్యవాన్/ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః) ప్రకారం రాముడు గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, సత్యవాక్కు, దృఢవ్రతుడు. గమనించండి…సూర్య సంబంధంతోపాటు; గుణగణాలలోనూ రాముడికీ, పర్షియన్లకూ మధ్య పోలికలు అచ్చుగుద్దినట్టు ఎలా ఉన్నాయో! ఇవి యాదృచ్ఛికం అనుకుంటారేమో, కాదు. పర్షియన్లకు, రామునికే కాక; రాజ్యస్థాపకులైన సారగాన్, హమ్మురాబీలకు కూడా ఇవే గుణగణాలనూ, సూర్యసంబంధాన్ని ఆపాదించారు. ప్రస్తుతం ఇందులోకి లోతుగా వెళ్లలేం.

untitled

ఇంతకంటే స్పష్టమైన ఇంకో పోలిక చూద్దాం. రాముడు రావణ సంహారం కోసం వానరసైన్యంతో కలసి లంకకు బయలుదేరితే, క్జెరెక్సెస్ గ్రీకుల మీదికి యుద్ధానికి బయలుదేరాడు. ఇద్దరికీ సముద్రం అడ్డు వచ్చింది. సముద్రంలో వారధి నిర్మించి లంకకు వెళ్లాలని రాముడు అనుకున్నాడు. వారధి నిర్మాణానికి సహకరించమని కోరుతూ మూడురోజుల పాటు సముద్రుని ప్రార్థించాడు. ఆ మూడు రోజులూ దర్భలు పరచుకుని సముద్రతీరంలోనే పడుకున్నాడు. అయినా సముద్రుడు ప్రసన్నుడు కాలేదు. అప్పుడు రాముడికి ఆగ్రహం కలిగింది. భయంకరులైన దానవులతో నిండిన ఈ సముద్రాన్ని అల్లకల్లోలం చేసేస్తాను అంటూ విల్లు అందుకుని ధనుష్టంకారం చేసి సముద్రునికి గురిపెట్టి బాణాలు ప్రయోగించాడు. అయినా సముద్రుడు లొంగలేదు. దాంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించదానికి సిద్ధమయ్యాడు. అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై వారధి నిర్మాణానికి దారి ఇచ్చాడు.

ఇక హెరడోటస్ నమోదు చేసిన చరిత్ర ప్రకారం, క్జెరెక్సెస్ గ్రీకుల మీదికి యుద్ధానికి వెడుతూ సముద్రానికి అడ్డంగా వారధి నిర్మింపజేశాడు. దానికి మద్దతుగా కొన్ని నౌకలను ఉంచారు. అంతలో పెద్ద తుపాను సంభవించి ఆ నౌకలను చెదరగొట్టేసింది. దాంతో క్జెరెక్సెస్ కు సముద్రం మీద కోపమొచ్చింది. పర్షియన్ చక్రవర్తినైన తనను ఇలా అవమానించడానికి సముద్రానికి ఎంత ధైర్యం అనుకున్నాడు. సముద్రుని బంధించినట్టుగా కొన్ని సంకెళ్ళను సముద్రంలోకి వేయించి, దానికి మూడు వందల కొరడా దెబ్బలు తినిపించవలసిందిగా ఆదేశించాడు.

పర్షియన్లకు, గ్రీకులకు జరిగిన యుద్ధాల చరిత్రలో మన హనుమంతుడి లాంటి పాత్ర కూడా ఒకటి ఉంది. అతని పేరు, ఫిలిప్పైడ్స్. గ్రీసు దేశస్థుడు. మారథాన్ అనే చోట పర్షియన్లకు, గ్రీకులకు జరిగిన తొలి యుద్ధంలో అతనొక ముఖ్యపాత్ర పోషించాడు. ఒలింపిక్స్ తో పరిచయమున్నవారికి మారథాన్ అనే పేరు పరిచితమే. పరుగుపోటీకి అది పర్యాయపదమైంది. హనుమంతుడికి మారుతి అనే పేరు ఉంది. అత్యంత వేగంగా ప్రయాణించగలవాడిగా హనుమంతుడు ప్రసిద్ధుడు. అతడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళాడు. సీతను చూసిన తర్వాత రావణుని కూడా చూసి, రాముని సందేశం అందించాడు.

ఇప్పుడు ఫిలిప్పైడ్స్ ఏం చేశాడో చూద్దాం. గ్రీసులో స్పార్టా, ఏథెన్స్ అనే రెండు ప్రాంతాలు ఉన్నాయి. స్పార్టాన్లు భూయుద్ధంలో నిపుణులు. ఏథేనియన్లు నౌకాయుద్ధంలో నిపుణులు. పర్షియన్ల దాడి గురించిన భోగట్టా అందడంతో సాయం కోరుతూ స్పార్టాన్లకు ఏథేనియన్లు కబురు పంపించారు. సమయం తక్కువగా ఉండడంతో అత్యంత వేగంగా వెళ్లగలిగినవాడు కావాలి. ఎక్కువ దూరం పరుగెత్తడంలో శిక్షణ పొందిన ఫిలిప్పైడ్స్ ను అందుకు నియోగించారు. అతను ఏథెన్స్ లో బయలుదేరాడు. స్పార్టా అక్కడికి 150 మైళ్ళ దూరం. పైగా దారి అంతా కొండలు, గుట్టలు, సెలయేళ్ల మయం. ఫిలిప్పైడ్స్ మరునాటికల్లా స్పార్టా చేరుకుని కబురు అందించాడు. సాయం అందించడానికి సిద్ధమే కానీ, పౌర్ణమి తర్వాత, అంటే ఆరురోజులకు కానీ తాము బయలుదేరలేమని వారు చెప్పారు. ఆ సమాచారం అందుకుని ఫిలిప్పైడ్స్ అంతే వేగంగా తిరుగు ప్రయాణం సాగించి ఏథెన్స్ చేరుకున్నాడు. దారిలో పార్థెనియాస్ అనే కొండ దగ్గర పాన్ అనే దేవుడు అతనికి కనిపించి మీకు విజయం కలుగుతుందని చెప్పాడట. ఆ తర్వాత ఫిలిప్పైడ్స్ మారథాన్ చేరుకుని యుద్ధంలో కూడా పాల్గొన్నాడు. ఆ యుద్ధంలో ఏథేనియన్లు గెలిచారు. స్పార్టాన్లు ఆరు రోజుల తర్వాత బయలుదేరి వచ్చేసరికే యుద్ధం అయిపోయింది.

గెలుపు వార్తను కూడా ఫిలిప్పైడ్సే ఏథెన్స్ కు పరుగు పరుగున మోసుకెళ్ళాడు. ఏథెన్స్ చేరుతూనే తీవ్ర ఉద్వేగానికి లోనై చేతిలోని డాలు విసిరేసి, “మనం గెలిచాం” అంటూ ఆనందంతో ఒక్క గావుకేక పెట్టి, అప్పటికప్పుడు గుండె ఆగి కుప్పకూలి పోయాడు.