Archives for January 2014

దిసమొల: నిశ్శబ్ధంగా వినిపించే ఒక సంకీర్ణ దృశ్యం!

drushya drushyam-17
ఫొటోగ్రఫీకి సంబంధించి ఏది ముఖ్యం, ఏది కాదు – అన్న చర్చ కాదుగానీ, నా వరకు నాకు దృశ్యం, అదృశ్యం రెండూ ముఖ్యమే అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ చిత్రం…నిజం.
అర్థవంతమైన లేదా అవతలి వారికి అర్థమయ్యేట్టు ఒక ప్రధాన దృశ్యం ఉంటుంది.
అలాగే, అగుపించీ అగుపించని అప్రధాన అదృశ్యమూ ఉంటుంది చిత్రంలో.
ఈ రెండింటి సమాసమే ఈ దృశ్యం.

+++

నిజానికి ఈ చిత్రం తీసి చాలా రోజులే అయింది. కానీ, ఎప్పుడూ ఆశ్చర్యానికి గురిచేస్తుంది!
పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యం కలగక మానదు.

అయితే, నా ఆశ్చర్యం నాది. అవతలి వారికి మల్లే ఆ బొమ్మను నేనే చిత్రీకరించినప్పటికీ నాకూ మరో వ్యాఖ్యానం ఉంటుంది. అది అవతలి వాళ్లు తమ వ్యాఖ్యానాన్ని విన్పించినప్పుడు గుర్తొచ్చి ఆశ్చర్యపోతూ ఉంటాను.
‘ఇటువంటిది నాకూ ఒకటి ఉంది’ అని చెప్పకుండానే కాలం గడచిపోతుంది! నావే ఎన్నో చిత్రాలు ప్రచురితమై, దానికి ఎందరెందరో వివిధ వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటే నా వ్యాఖ్యానం నా చిత్రం ముందే అదృశ్యంగా ఉంటుంది.
అదే సిసలైన ఆశ్చర్యం నా వరకు నాకు!

నాకే అని కాదు, కళ ముందు ఏ మనిషైనా ఇలాగే ఆశ్చర్యచకితులు అవుతూ ఉంటారు కాబోలు!
అయినా సరే, అవతలి వ్యాఖ్యానాలతో చిత్రం మొదలుపెడతాను.

+++

ఒకరంటారు ఇది ‘క్రాంక్రీట్ జంగల్’ అని!
‘నగర జీవనంలో మనిషి అమానుషత్వానికి  సజీవ దృశ్యం’ అనీ!

ఇంకొకరంటారు ‘ప్రేమ’ అని!
అది స్త్రీపురుషులను ఎట్లా ఒకటిగా ఎట్లా కట్టిపడేసి, ఒకే ప్రపంచానికి ఇద్దర్నీ వేలాడదీసి, ఇక నిదానంగా పెంచే ఆ తీయటి బాధ ఉంటుంది చూడండి. అదీ ఈ బాధనట!  ఎడబాటు, విరహమూ కూడా నట!
వాళ్లు ఎంతో ప్రేమతో చెప్పారా మాటలు.
ఆశ్చర్యమే,  ఈ బొమ్మ ప్రేమకు ప్రతిబింబం అంటే ఆశ్చర్యం కాక మరేమిటిఝ

సరే, ఇంకొకరంటారు…ఇద్దరి మధ్య అకస్మాత్తుగా పరుచుకునే దూరం, అడ్డుగోడ అని!
అది క్రమంగా ఆ ఇద్దరి మనసుల్ని గాయపర్చే గునపమై తీవ్రమైన బాధకు గురిచేస్తుందని!

చూసిన వారికి చూసినంత…
ఇవన్నీ చెబుతుందీ పిక్చర్!

కానీ, నేనైతే హైదరాబాద్ లోని ‘సాక్షి’ కార్యాలయం వద్ద ఉన్న ఫుట్ పాత్ పై ఒక టీ బంకు ఉంది. అక్కడ తీశాను దీన్ని.
అక్కడకు వెళ్లి ముందు నిలబడ్డాను. టీ తాగుతూ ఉన్నాను. ఇంతలో అక్కడొక చెట్టు, దానికి కొట్టిన మొలను(మేకు) చూశాను. వెంటనే కెమెరాను చేతుల్లోకి తీసుకుని దాన్ని ‘క్లిక్’ మనిపించాను.
ఆ క్షణాన అప్పుడొక మొలను మాత్రమే చూశాను.

ఆ తర్వాత మెల్లగా వ్యూఫైండర్ లోంచి కన్నుతో చూడసాగాను.
మొలను అలాగే వుంచి ఆ చెట్టును దాని బెరడును క్లియర్ చేసుకుని మరో చిత్రాన్ని చిత్రించాను.
ఆ చిత్రం మాత్రం వేరుగా ఉంది. బహుశా అదేం చెబుతుంతో తెలియదు!

ఆ తర్వాత అలాగే చూస్తూ ఉన్నాను.
వ్యూ ఫైండర్ నుంచి చూస్తూ ఉండగా బ్యాగ్రౌండ్ లో మనుషులు…వాళ్లు వేళ్లేదీ వచ్చేదీ కనిపించసాగింది.
చూడసాగాను.

సడెన్ గా ఒక పిచ్చితల్లి వచ్చింది వ్యూ లోకి!
కెమెరాలోంచి కళ్లెత్తక తప్పలేదు.

+++

ఆమె లావుగా ఉంది. బొద్దుగా ఉంది. జుత్తు రేగి ఉంది.
అది కాదు ఆశ్చర్యం…. ఆమె ఒంటిపై దుస్తులు సరిగా లేవు. సరిగా అనేకంటే పైన వక్షం ఓపెన్గా ఉంది. ఆమెను కళ్లారా చూడలేం. మన పేదరికం నిర్లక్ష్యం నిర్లజ్జగా కనబడుతోంది మరి!
పైన అలా ఉండగా కింద మాత్రం ఒట్టి లంగా ఉంది.
దిసమొలగా ఆ లంగా ఒక్కటే… అది కూడా చిన్నది…అది కూడా కాదు… ఆ లంగా పూర్తిగా రక్తంతో తడిసి ఉన్నది.

ఆమె అలా నడుస్తూ నడుస్తూ ఈ మొలదాకా వచ్చేసరికి హఠాత్తుగా కెమెరా వ్యూ ఫైండర్ గుండా నా కంట పడీపడగానే వెంటనే భయమేసి కెమెరాలోంచి తలెత్తి చూశాను. కనిపించిన నిజం ఇది.

ఆమె లంగా… మెన్సెస్ కారణంగా అనుకుంటాను, పూర్తిగా తడిసిపోయి ఉంది.
ఆమె ఏదో గొణుక్కుంటూ ఉన్నది. ఆ రణగొణ ధ్వనుల్లో గొణుక్కుంటూ ఆమె అట్లా నడుచుకుంటూ వచ్చేసరికి..అంటే అక్కడ ఆ క్షణాల్లో ఒక దృశ్యం అట్లా ఆమె నడుచుకుంటూ వచ్చేది ఉందన్నమాట.
ఇటువైపు దృశ్యం ఏమిటంటే, అది నేను….అప్పటిదాకా మొలను, చెట్టు బెరడును, వెనకాలి బ్యాక్ గ్రౌండును చూస్తూ నేను. ఈ దృశ్యాల మధ్య కెమెరా వ్యూఫైండర్లో ఒక దృశ్యం. అందులో  మొలా ఆ చెట్టు బెరడు…వెనకాలి బ్యాగ్రౌండ్లో కొంత ఆవరణ… ఆమె ‘ఆ ఆవరణ’ను దాటేసి వెళ్లిపోవడమూ ఉంది.
ఆము “ఆ ఆవరణను’ దాటేయడం క్లిక్ మన్పించనందున అది దృశ్యంగా కెమెరాలో రికార్డుకాలేదు.
ఆ తర్వాతి దృశ్యం నేను తల పైకెత్తడం…ఆమెను నేరుగా చూస్తూ ఒకట్రెండు ఫొటోలు తీసుకోవడం.

ఇవీ దృశ్యాదృశ్యాలు, ఈ చిత్రానికి సంబంధించి!

+++

చిత్రమేమిటంటే, ఇక అప్పట్నుంచీ నాకు ఈ ఫొటోను చూడగానే చెట్టు బెరడుకు దిగిన “ఆ మొల’ కనిపించడం మానేసి ‘ఆమె’ కనిపించడం మొదలౌతుంది. అప్పుడు గుండె లయతప్పిన సంగతి నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది.

ఆమె వెళ్లిపోయేదాకా చూసి కెమెరాను సవరించుకుని మళ్లీ వ్యూ ఫైండర్లోకి చూశాను.
మళ్లీ ఆ మొలను చూశాను. నిజానికి ఎప్పుడైతే ఒక కదలని మెదలని వస్తువునో రూపాన్నో చిత్రిస్తున్నప్పుడు దానికి మరింత జీవితం ఇవ్వడానికి వెనకాల కదిలే బ్యాగ్రౌండ్ ను చిత్రించడం అలవాటులోకి తెచ్చుకుని చాలా రోజులే అయింది.
ఈ సారి కూడా అట్లా తీయాలా అనిపించింది. ఎందుకంటే, ఇంతకుముందే చెప్పినట్టు, ఆ మొల నాకు గుచ్చుకుంది. ఇంతకుముందరి అర్థనగ్న స్త్రీ మూర్తిని చూశాక ఇక ఆ మొల గునపమే!

కానీ, ఎంతైనా నేను అనుకున్నదే ఫొటో కాదు. ఫొటో ఎవరి అనుభవాన్ని వారికి పంచుతుంది కదా!  అనుకుని మళ్లీ నా నుంచి దూరం జరిగి మరొక ఫొటో చేయాలని ప్రయత్నించసాగాను. మెల్లగా వ్యూ ఫైండర్ లోంచి చూడసాగాను. ఇంతలో ఒక మగమనిషి ఇటు పోయాడు. మరో ఆడమనిషి అటు పోయింది.
అప్పుడు తట్టింది. కాసేపు వేచి ఉండి ఆ అధోజగత్ స్త్రీ వంటి వారు మన మధ్య, మన వీధుల్లో, మన రోడ్ల మీదే తారాడుతున్నప్పటికీ జీవితంలో మనం ఎవరి అవసరాలతో వాళ్లం వెళ్లిపోతూనే ఉంటాం కదా! దాన్ని చిత్రిద్ధాం అనుకున్నాను.

అలా అనుకున్నానో లేదో ఒక యువకుడు వచ్చి ఆ చెట్టును ఆనుకుని టీ త్రాగుతూ ఉన్నాడు.
అతడికి ఆ స్త్రీ అలా ఇదే ఆవరణలోంచి నడిచి వెళ్లిన సంగతి తెలుసో లేదో!
ఆ ఆలోచనను అదిమేసి మళ్లీ చూడసాగాను, వ్యూ ఫైండర్లోంచి!

ఇంతలో ఒక యువతి వచ్చింది ఫ్రేంలోకి…
ఇటు మగా ఇటు ఆడా ఇద్దరినీ ఒకే ఫ్రేంలో ఉండేలా ఆ మొలను క్లియర్ చేసుకుని క్లిక్ మనిపించాను.
ఇదే ఆ చిత్రం.

+++

నిజానికి ఇది మొల కావచ్చు…
కానీ, నా వరకు నాకు దిసమొల అంతా రక్తసిక్తమైన చిత్రం.
నిశ్శబ్ధంగా వినిపించే ఒక సంకీర్ణ దృశ్యం.

~ కందుకూరి రమేష్ బాబు

వీలునామా -27 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

రాజకీయం
(కిందటి వారం  తరువాయి)

“ఫ్రాన్సిస్! నువు ఎనికల్లో నిలబడితే నెగ్గగలవా?” ఉత్సాహంగా అడిగింది జేన్.

“మావయ్య ఆ వూళ్ళో లిబరల్ పార్టీకే వోట్లెక్కువ పడతాయనే వాడు. టాం అయితే నీకెదురే లేనట్టు మాట్లాడాడనుకో!”

“టోరీ పార్టీ అభ్యర్థీ, విగ్ పార్టీ అభ్యర్థి ఇద్దరూ సంపన్న కుటుంబాల నించి వచ్చిన వారే. అయితే ఇద్దరికీ గెలుపు దక్కకపోవచ్చనీ, స్వతంత్రంగా పోటీ చేసే అభ్యర్థి ఎవరైనా నెగ్గొచ్చనీ అనుకుంటున్నారు. ” ఒప్పుకున్నాడు ఫ్రాన్సిస్.

“నువ్వంటే అందరికీ ఊళ్ళో ఇష్టమే కదా? ”

“చెప్పలేం జేన్! భూస్వాములకి నేనంటే కొంచెం కోపం. పాలేర్ల కోసం భూమి ఇవ్వడం, చిన్న ఇళ్ళూ కట్టించి ఇవ్వడం వంటివి ముందు ముందు పెద్ద సమస్యలౌతాయని వాళ్ళ అభిప్రాయం. పాలేర్లూ, కూలి వాళ్ళకి సహజంగానే నేను చేసిన పనులు నచ్చుతాయి కానీ, వాళ్ళకసలు వోటు హక్కే లేదు కదా? ”

“పోటీ చేస్తే ఏదో ఒక పార్టీ అభ్యర్థి గా చేస్తావా లేక స్వతంత్రంగా చేస్తావా? ”

“ఒకవేళ పోటీ చేస్తే మాత్రం, స్వతంత్రంగా నిలబడాలనే అనుకుంటున్నాను. అయితే ఏ పార్టీ మద్దతూ వుండకపోవడం తో గెలిచే అవకాశాలు తగ్గొచ్చు.”

“రెండు పార్టీల వోట్లూ చీలిపోతాయన్నమాట.”

“అదే సమస్య. ఏదో ఓక పార్టీతో చేరితే గెలుపు తథ్యమే కానీ, నా ఆశయాలూ, అభిప్రాయాలూ నీరు గారిపోతాయి. స్వతంత్రంగా పోటీ చేద్దామంటే గెలుపు కొంచెం సంశయం.”

“ఏదేమైనా, లిబరల్ పార్టీతో కలిసి నువ్వు పని చేయలేవేమో ఫ్రాన్సిస్. అందులోనూ ఆ పార్టీ మనుషులు పదవుల్లో వున్నప్పుడు, ప్రభుత్వంలో వునా, అప్పోజిషన్లో వున్నా, వాళ్ళతో నెగ్గలేం.. గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు చేసేవన్నీ, స్వప్రయోజనాలకే తప్ప ప్రజలకి పనికొచ్చేవేమీ లేవు. ఆ మాట కొస్తే టోరీ పార్టీ యే కొంచెం నయం. ఎలాగైనా సరే, నీలాటి వాళ్ళు పార్లమెంటు మెట్లెక్కడం మంచిది. రెండు పార్టీల మెంబర్ల మీదా కన్నేసి వుండాల్సిన అవసరం సాధారణ పౌరులకెంతైనా వుందిప్పుడు. అందుకే నువ్వసలు ఏ పార్టీతోనూ చేరకుండా వుండడం మంచిదేమోననిపిస్తుంది నాకు. అలా అసలే గెలవలేనంటావా?” ఆశగా అడిగింది జేన్.

veelunama11

“ఏమో మరి. ప్రయత్నిస్తే కానీ తెలియదు. అందులోనూ అదంతా ఖర్చుతో కూడుకొన్న వ్యవహారం.”

“ఎంత వింత కదా! ప్రజలకీ, దేశానికీ ఏదైనా మంచి చేద్దామనుకుంటే అందుకు ముందుగా డబ్బుండాలన్నమాట. అసలు నువ్వు ముందుగా దాన్ని మార్చటానికి కృషి చేయాలోయ్!” ఆవేశంగా అంది జేన్.

“పిచ్చి జేన్! పార్లమెంటు సభ్యులూ, రాజకీయ నేతలూ ఎప్పుడూ రాజకీయాన్నీ, ప్రభుత్వాన్నీ డబ్బున్న వాళ్ళ చేతుల్లోనే వుండేటట్టు చూసుకుంటారు. ఎలాగనుకున్నావు? ఇదిగో, ఇలా రాజకీయాన్నీ చాలా ఖరీదైన వ్యవహారం చేయడం ద్వారా. అందుకే సామాన్య ప్రజానీకానికీ, ప్రభుత్వాలకీ అంత దూరం.”

“మరందుకే కదా నిన్ను ఎన్నికల్లో పోటీ చేయమనేది. రైతుల సాధక బాధకాలూ, పేదవారి కష్టాలూ తెలిసిన నీలాంటి వాడు పార్లమెంటులో వుండడం ఎంతైనా అవసరం ఈనాడు.

ఎన్నికలలో పోటీ చేయడానికి నీదగ్గర సరిపడా డబ్బు లేకపోవడం ఏమిటి? వెయ్యీ, రెండు వేల పౌండ్లు లేవా నీ దగ్గర? ఇంతకీ నీ నామినేషను పత్రం ఏదీ? తీసుకొచ్చావా?”

“ఓ! ఇదిగో, నా దగ్గరే వుంది. చూస్తావా? ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు లండన్ లోని ఫ్రీమాన్ గారితో మాట్లాడడం మంచిదని నా కనిపిస్తూంది. ఆయన ప్రభుత్వ పార్టీకి ఎన్నికల అభ్యర్థులని ఎంపిక చేస్తూ వుంటారట. నాలాటి అభిప్రాయాలున్న అభ్యర్థికి గెలిచే అవకాశం ఎంతుందో ఆయనైతే సరిగ్గా అంచనా వేయగలడు. నేనైతే ఇప్పుడు ఊళ్ళో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులందరితోనూ మాట్లాడుతున్నా.”

“ఎన్నికల్లో పోటీ చేయడమంటే ఎంతో శ్రమ తో కూడుకున్న విషయం మరి.”

“ఆ శ్రమంతా నిజాయితీ పరులకూ, కష్టపడి ఏదైనా మేలు చేద్దామనుకునేవారికి మాత్రమే.”

“అలాంటి వాళ్ళే రాజకీయాల్లోకి రావాలి మరి.”

“అని నువ్వనుకూంటే సరిపోదు. రాజకీయ పార్టీలనుకోవాలి.”

“అదంతా పక్కన పెట్టు. నువ్వు నెగ్గి తీరతావు. నువ్వైతే ముందు స్పీచీ సాధన చేయి,” నవ్వుతూ అంది జేన్.

“మరే! కోడిగుడ్లతో కొట్టినా, నా పుట్టుకని గురించి హేళన చేసినా, మా అమ్మని గురించి గుచ్చి గుచ్చి అడిగినా, అలాగే ఆగకుండా ప్రసంగిస్తాను. ఆ సోదంతా వినడానికి ప్రజలకి ఓపికుంటుందో ఉండదో కానీ!”

“అంతా బానే అవుతుందిలే. పదేళ్ళ కిందట మనూళ్ళో భూస్వాములంతా కలిసి మావయ్యని ఎన్నికల్లో పోటీ చేయమన్నారు. మావయ్య పది మందిలో మాట్లాడడానికి భయపడి వెనకడుగు వేసారు. అందుకే నువ్వు సభాప్రసంగాలకి ముందునించే సిధ్ధపడి వుండాలి.”

“ అది సరే కానీ, జేన్, ఈ మధ్య మిస్ థాంసన్ గారింట్లో నాకు తరచూ ఒక పెద్ద మనిషి కనపడుతూన్నాడు. బహుశా పార్లమెంటు సభ్యుడై వుండొచ్చు. బానే డబ్బు సంపాదించాడంటారు. కుటుంబమూ, వ్యాపారమూ లాటి బాదరబందీలేవీ లేవు. మన వూళ్ళో ఆయన మాట బానే చెల్లుబడి అవుతుంది. ఆయనే నన్ను ఈ ఎన్నికల్లో నిలబడమనీ, తాను సాయం చేస్తాననీ ప్రోత్సహిస్తున్నాడు. ఆయన సహాయమూ, నువ్వు పక్కనుంటే వచ్చే బలమూ వుంటే నేనీ ఎన్నికల్లో నిలబడొచ్చేమో!”

“తప్పకుండా. నువ్వు వెంటనే ఫ్రీమాన్ గారితో మాట్లాడు. రేపు రాగానే ఏ సంగతీ నాతో చెప్పు.”

 

 

ఫ్రాన్సిస్ ఫ్రీమాన్ గారిని కలవడానికి వెళ్ళిపోయాడు.

అదృష్టవశాత్తూ అప్పుడు పార్టీ పెద్ద ఆందోళనలూ, సమస్యలూ లేక శాంతియుతంగానే వుంది. విగ్గుల పార్టీ కానీ, టోరీ పార్టీ కానీ వాదించుకొని విభేదించుకునే అంశాలు జన జీవనంలో పెద్దగా ఏమీ లేవు. వోట్లు సమంగా పడతాయి రెండు పార్టీల అభ్యర్థులకీ. ఇలాటి పరిస్థితులలో ఒక స్వతంత్ర అభ్యర్థిని బల పర్చడం తమకి ప్రయోజనకరంగా వుంటుందేమోననిపించింది ఫ్రీమాన్ గారికి. ఫ్రాన్సిస్ భూస్వామి కావడం వల్ల డబ్బున్న వాళ్ళ వోట్లూ పడొచ్చు, రైతు కూలీలకెంతో మంచి చేసాడు కాబట్టి వారి వోట్లూ పడొచ్చు. ప్రభుత్వాన్ని అతను పెద్దగా నిగ్గదీసే సందర్భాలూ రాకపోవచ్చు.

“మీ ఎస్టేటులో పనిచేసే రైతు కూలీలు మీరెటు వేయమంటే అటే వోట్లేస్తారు కదా?” ఫ్రీమాన్ అడిగాడు ఫ్రాన్సిస్ ని.

“అదెలా చెప్పగలమండీ? మా ఎస్టేటులో పని చేసే రైతులని నేను చెప్పినట్టే వినమని నేనెప్పటికీ నిర్బంధించను. వాళ్ళ ఇష్టప్రకారమే వాళ్ళని వోట్లు వేయమంటాను. రైతులూ, ఎస్టేటు పని వాళ్ళూ వాళ్ళకి ఇష్టం వచ్చిన పార్టీకీ వేసుకుంటారు. లిబరల్ పార్టీకి చెందిన మీరు ఇలా మాట్లాడుతున్నారే?”

“అవుననుకోండి. కానీ మనకి అందరి మద్దతూ వుండాలి కదా, అప్పుడే ఎన్నికలు నెగ్గగలుగుతాం.”

“అందుకని నీతి మాలిన పన్లు చేయలేం కదా? నేను నా చేతులు శుభ్రంగా వుండాలనుకునే మనిషిని.”

“అయ్యొయ్యో, అందరూ అంతేనండి. ఈ వెధవ రాజకీయాల్లో చేతులు శుభ్రంగా వుండాలంటే అయ్యే మాట కాదనుకోండి….”

“అదేం లేదు ఫ్రీమాన్ గారూ! నేను రాజకీయాల్లో కూడా నీతి తప్పకుండా వుంటాను.”

“అలా వుండగలిగితే అంతకంటే కావలసిందేముందండీ! రండి, మిమ్మలని మా పార్టీ అభ్యర్థికి పరిచయం చేస్తాను.”

లిబరల్ పార్టీ అభ్యర్థి వున్నత కుటుంబానికి చెందిన వ్యక్తి. అయితే అతను కూడా వేరే ఏ ప్రయోజనాలకూ ఆశించకుండా ఒక కొత్త స్వతంత్ర అభ్యర్థికి మద్దతివ్వాలన్న ఆలోచనకి అడ్డు చెప్పలేదు. అతనికి ఫ్రాన్సిస్ నిర్మొహమాటమూ, ఖచ్చితమైన అభిప్రాయాలూ నచ్చినట్టున్నాయి. వాళ్ళ ఇంటికి ఒక సారి భోజనానికి రమ్మనీ, అక్కడ ఇంకొందరు రాజకీయ మిత్రులని కలుసుకొని ఎన్నికల వ్యూహం గురించి ఆలోచించుకోవచ్చనీ ఆహ్వానించాడు.

ఈ సంగతి ఫిలిప్స్ ఇంటికెళ్ళి ఫ్రాన్సిస్ చెప్పగానే హేరియట్ ఫిలిప్స్ దృష్టిలో ఫ్రాన్సిస్ చాలా ఎత్తుకెదిగాడు. లిల్లీ ఫిలిప్స్ ఈ సంగతి వినగానే ఇక పైన జేన్, ఎల్సీలిద్దరితో చాలా మర్యాదగా, ఆప్యాయంగా వుండాలని నిర్ణయించుకొంది. ఒక వారం లండన్ నగరంలో గడిపి ఫ్రాన్సిస్ తిరిగి తన ఎస్టేటు చేరుకున్నాడు. ఈ లోగా బ్రాండన్ అంటే ఎవరో గుర్తు కూడా రానంతగా బ్రాండన్ హేరియట్ మనసులోంచీ, ఆలోచనల్లోంచీ జారిపోయాడు.

 ***

(సశేషం)

కోసల, మగధ…ఓ సినిమా కథ!

ఓ రోజున టీవీలో అలెగ్జాండర్ సినిమా వస్తోంది. ఆ సినిమా చూస్తుంటే,  అలెగ్జాండర్-పురురాజుల యుద్ధం గురించి    ప్లూటార్క్ ను ఉటంకిస్తూ కొశాంబీ రాసిన వివరాలు గుర్తొచ్చాయి. వాటిని సినిమాలో వాడుకుని ఉంటారనిపించి ఆసక్తిగా చూశాను. అయితే, నిరాశే మిగిలింది. ఆ యుద్ధాన్ని ఒకటి రెండు దృశ్యాలతోనే  తేల్చేశారు. గడ్డంతో ఉన్న పురురాజు ఏనుగు మీద యుద్ధానికి వస్తున్నట్టు మాత్రం చూపించారు.

అలెగ్జాండర్-పురురాజుల యుద్ధాన్ని అలా తేల్చివేయడం కూడా ఒక కోణంలో అర్థం చేసుకోదగినదే. అలెగ్జాండర్ ప్రధానంగా కథ చెబుతున్న ఒక పాశ్చాత్యుడికి భారతీయచారిత్రక వివరాలపై మరీ అంత ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. భారతదేశానికి సంబంధించిన అంశాలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సూచించే అనేక పాశ్చాత్యరచనల్లో కూడా భారతీయకోణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టకపోవడం నేను గమనించాను. భారతీయులు రాసినప్పుడే భారతీయకోణం ఎక్కువ ప్రస్ఫుటం అవుతుందన్నమాట.

సరే, ఈ తేడాను అలా ఉంచుదాం. నేను అలెగ్జాండర్ సినిమాను ఎత్తుకోడానికి వేరే కారణముంది. మిగతావాళ్ళ సంగతి ఎలా ఉన్నా మనకు మాత్రం చరిత్ర కిటికీ తెరచుకున్నది అలెగ్జాండర్ తోనే. అలెగ్జాండర్ ప్రధానంగా కాకపోయినా ఆ పాత్రతో కొన్ని చారిత్రక సినిమాలు మనవాళ్లు తీశారు. అవి చరిత్రకు ఎంత దగ్గరగా ఉన్నాయనేది వేరే విషయం. అలాగే, బుద్ధుడి కథతో తీసిన కొన్నింటిని వదిలేస్తే, నేను గమనించినంతవరకు మన చారిత్రక సినిమా మగధను, చాణక్యుని, చంద్రగుప్తుని, అశోకుని దాటి ఎప్పుడూ వెనక్కి వెళ్లలేదు. ఒకవేళ నా అభిప్రాయం తప్పని విజ్ఞులెవరైనా సోదాహరణంగా చెబితే సవరించుకోడానికి సిద్ధమే. కనీసం, మగధ ఒక మహాసామ్రాజ్యంగా అవతరించడానికి పూర్వరంగంలో ఏం జరిగిందో చెప్పే సినిమాలు మాత్రం రాలేదు. మగధ ఒక మహాసామ్రాజ్యంగా అవతరించడానికి ముందు కోసల అనే రాజ్యంతో పోటీ పడిన సంగతిని చెప్పే సినిమా రాలేదు.

నాకు సినిమా పరిజ్ఞానం తక్కువ. అయినాసరే, మగధ ఒక మహాసామ్రాజ్యం కావడానికి పూర్వరంగంలో సినిమాకు పనికొచ్చే కథ ఒకటి ఉందని నాకు అనిపించింది. పైగా నా సొమ్మేం పోయింది, అది హాలీవుడ్ స్థాయిలో భారీవ్యయంతో తీయదగిన సినిమా అని కూడా అనిపించింది. ఒక సినిమా విజయవంతం కావాలంటే కథకు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలో, అందులో ఎలాంటి దినుసులు ఉండాలో నాకు తెలియవన్న సంగతిని ఒప్పుకుంటూనే ఆ కథను ఒక సినిమా కథగా మలచే ప్రయత్నం చేశాను.  మరేం లేదు, నేను కూడా సినిమా కథ రాశానోచ్ అని నాకు నేను చెప్పుకోడానికే తప్ప ఎవరో సినిమా తీస్తారని కాదు. ఆ కథంతా విన్న తర్వాత మీకూ అది సినిమాకు తగిన కథే ననిపించితీరాలని నేను అనను. ఒకవేళ ఎవరికైనా అలా అనిపిస్తే, అది నిజంగా అద్భుతమే.

తప్పనిసరి అనిపించిన ఈ కాస్త ఉపోద్ఘాతంతో కథలోకి వెడతాను…

***

BattleofIssus333BC-mosaic-detail1

అంతకంటే ముందు, కథకు ఒక నేపథ్యం ఉండాలి కనుక, కొశాంబీ వెలుగులో అప్పటి ప్రాంతాలు-జనాల అమరిక గురించి చెప్పుకుందాం.

అది క్రీ.పూ. 6వ శతాబ్ది. శాక్య తెగకు చెందిన బుద్ధుడు అప్పటికి జన్మించాడు. శాక్యులు హిమాలయ పాదాలవద్ద, భారత్-నేపాల్ సరిహద్దులలో, నేటి ఉత్తరప్రదేశ్ లోని బస్తీ, గోరఖ్ పూర్ జిల్లాలలో భాగంగా ఉన్న ప్రాంతంలో జీవించారు. అప్పట్లో నేపాల్ నుంచి గంగానది దిగువున చంపారన్ (నేటి బీహార్) జిల్లావరకు; అక్కడినుంచి నదిని దాటి ఇనుము, రాగి నిక్షేపాలు ఉన్న ప్రాంతం వరకు ఉత్తరాపథ వర్తకమార్గం విస్తరించి ఉండేది. ఏకచ్ఛత్రాధికారం కోసం చివరి పెనుగులాట జరగబోతున్న ఈ కాలానికి పదహారు జనపదాలలోనూ ఎంతోకొంత ప్రాముఖ్యం నిలుపుకున్నవి నాలుగు మాత్రమే. వాటిలో ఒకటి లిచ్ఛవీ లేదా వజ్జీ తెగ. రెండోది, మల్లుల తెగ. ఈ రెండూ అప్పటికి అత్యంత శక్తిమంతమైన తెగల సమాఖ్యలు. ఈ తెగలవారు సర్వస్వతంత్రులు. ఏకవ్యక్తి పాలనకు తల ఒగ్గేవారు కాదు. ఒక సమితి (అసెంబ్లీ) ద్వారా తమ వ్యవహారాలను నడుపుకునేవారు. నిరంతరం సైనిక శిక్షణలో ఉండేవారు. ఇవి సైనిక గణరాజ్యాలు. న్యాయ, సమానత్వాలకు ప్రాధాన్యమిచ్చే తెగల రాజ్యాంగాన్ని వీరు అనుసరించేవారు. అయితే, వీరిలోనూ తెగల స్వభావం అప్పటికే శిథిలమవడం ప్రారంభించింది. వీరు వ్యవసాయజనాలను(వీరిలో అందరూ తెగ సభ్యులు కారు) సేవకులుగా చేసుకుని వారిపై ఆధిపత్యం చెలాయించేవారు. వ్యక్తిగత ఆస్తి అడుగుపెట్టడంతో సమాఖ్యలు చీలిపోవడమూ అప్పటికే మొదలైంది.

లిచ్ఛవుల ప్రధాన పట్టణం, వారి సమావేశస్థలం వైశాలి (నేటి బస్రా). మల్లుల ముఖ్య కేంద్రాలు పావ, కుశినార అనే చిన్న పట్టణాలు. ఈ రెండు తెగల సమాఖ్యలూ ఎప్పుడనుకుంటే అప్పుడు భారీ సైన్యాన్ని మోహరించగలిగిన స్థితిలో ఉండేవి. యుద్ధోత్సాహం వీరిలో ఉరకలెత్తుతూ ఉండేది. ఇతర భూభాగాలను ఆక్రమించుకోవడం లేదా స్వాతంత్ర్యాన్ని కోల్పోవడం ఈ రెండు హద్దుల మధ్యే వీరి జీవనం. ఈ రెండు తెగల వాళ్ళు పైన చెప్పిన ఉత్తరాపథ వర్తకమార్గంలో కొంతభాగాన్ని దిగ్బంధం చేశారు.

వీరికి వాయవ్యంగా కోసల ఉంది. దక్షిణ, ఆగ్నేయాలుగా మగధ ఉంది. అంతవరకూ ఇవి కూడా మిగిలిన పదహారు జనపదాల మాదిరిగా తెగల జీవితంలో ఉన్నవే. కోసలులు, మాగధులు అనే తెగల పేర్లే ఆ తర్వాత వీరి ప్రాంతాల పేర్లు అయ్యాయి. ‘మాగధ’ అనే మాటకు మొదట్లో స్తోత్రపాఠకుడు లేదా కవి (వందిమాగధస్తోత్రాలు అనే మాట నేటికీ ప్రయోగంలో ఉంది); వర్తకుడు అనే అర్థాలు ఉండేవి. అంటే ఇవి ఒకే తెగలో జరిగిన వృత్తి విభజనను సూచిస్తాయి. కోసల, మగధలు రెండూ మన కథాకాలానికి తెగలస్వభావాన్ని కోల్పోయి ఏకవ్యక్తి పాలన కిందికి వచ్చాయి.

కోసల, మగధలు రెండింటిలోనూ కోసల పాతది. అంతేకాదు, క్రీ.పూ. 6వ శతాబ్ది ప్రారంభం నాటికి అదే శక్తిమంతం కూడా. మన కథాకాలానికి కోసల రాజధాని శావత్తి(శ్రావస్తి) అయినా, అంతకుముందు ముఖ్యనగరం, శ్రావస్తికి దక్షిణంగా ఉన్న సాకేత. అదే అయోధ్య, రాముడి జన్మస్థానం. ‘అయోధ్య’ అనే మాటకు భేదించలేనిది అని అర్థం. అక్కడికి వెళ్లాలంటే ఓ దుర్గమారణ్యాన్ని దాటాలి. అందుకే అయోధ్యకు ఆ పేరు వచ్చిందేమో తెలియదు. ఆ దుర్గమారణ్యంలోంచి రాముడు వనవాసానికి బయలుదేరాడు. బహుశా ఈ వనవాస మార్గమే దక్షిణాపథ వర్తకమార్గాన్ని అభివృద్ధి చేసింది, లేదా ఆ వైపు విస్తరించింది. ఆధునిక కాలంలో దక్కన్ అనే పేరు దానినుంచే వచ్చింది. క్రీ.పూ. 6వ శతాబ్దిలోని ఉత్తరాపథ, దక్షిణాపథ వర్తకమార్గాలు రెండూ కలిసే కూడలిలో శ్రావస్తి ఉంది. దాంతోపాటు, కోసల అనేక యుద్ధాల తర్వాత కాశీని చేజిక్కించుకోవడంతో గంగపై కూడా దానికి ఆధిపత్యం లభించింది. అప్పటినుంచీ ఆ రాజ్యాన్ని కాశీ-కోసల అని చెప్పుకోవడం మొదలైంది. కాశీ నదీ రేవు పట్టణం. అప్పటికే సాహసవంతులైన నావికులు కాశీనుంచి సముద్రానికీ చేరుకుంటున్నారు. ఒక్కోసారి డెల్టా దాటి వర్తకం సాగిస్తున్నారు. మొదట్లో ఉప్పు నిలకడగా లాభాలు తెచ్చిపెట్టిన వ్యాపారవస్తువు. కాశీలో నూలు, పట్టువస్త్రాలు, ఇతర వస్తుతయారీదారులు అప్పటికే ప్రసిద్ధి చెందారు. కాషాయవస్త్రం కాశీనుంచే వచ్చింది. బౌద్ధుల వస్త్రాలకు రంగు నిచ్చింది కాషాయమే. ఇప్పటికీ ఈ రంగు వస్త్రాలకు కాశీ ప్రసిద్ధమే.

నదికి అవతల ఉన్న మగధ, వర్తకుల రాకపోకలకు ఏమాత్రం పనికిరాని చోట ఉన్నట్టు కనిపిస్తుంది. అక్కడితో బాట ఆగిపోయి ఓ కీకారణ్యంలోకి అదృశ్యమైపోతుంది. అయితే, వర్తకమార్గం కంటే ముఖ్యమైన విలువైన లోహసంపద మగధ అధీనంలో ఉంది. అప్పటి మగధ రాజధాని రాజగృహం(రాజ్ గిర్). అది, గంగకు దక్షిణంగా విసిరేసినట్టు ఒంటరిగా ఉన్న ఓ పురాతన ఆర్య జనావాసం. అక్కడ రాజధానిని ఏర్పరచుకోడానికి ఒక కారణం ఉంది. రాజ్ గిర్ కు ఉత్తరంగా ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన ధార్వార్ గుట్టలు ఉన్నాయి. ఆ గుట్టల్లో ఎక్కడ చేయిపెట్టినా ఇనుము దొరుకుతుంది. తవ్వి తీయాల్సిన అవసరమే లేదు. పలకలు పలకలుగా రాతికి అతుక్కుని ఉన్న ముడి ఇనుమును వేరుచేసి, నిప్పుల్లో కాల్చి, శుద్ధి చేసి అప్పటికప్పుడు పాత్రలను, పరికరాలను తయారుచేసుకోవచ్చు. రాజ్ గిర్ కు అదనపు సౌలభ్యం, చుట్టూ ఉన్న కొండలు. అవి పెట్టని కోటల్లా రాజధానికి రక్షణ కల్పిస్తూ ఉంటాయి. ఆవికాక, వాటిలోపల పాతిక మైళ్ళకు విస్తరించిన వెలుపలి ప్రాకారం ఉంది. దానికి కూడా లోపల మరో ప్రాకారం ఉంది. ఇలా రాజ్ గిర్ మూడంచెల రక్షణలో ఉండేది. లోపల పశువుల్ని మేపుకోడానికి కావలసినంత పచ్చిక. దానికితోడు పరిసరాలలో వేడి నీటి బుగ్గలూ, చల్ల నీటి బుగ్గలూ రెండూ ఉండేవి. దాంతో నీటి సరఫరా పుష్కలం. ఇలాంటి అనుకూల పరిస్థితులు అన్నీ శత్రువును ఎంతకాలమైనా నిలవరించగలిగిన వెసులుబాటును మగధ రాజులకు కల్పించాయి. విశేషమేమిటంటే, మగధ అజేయస్థితిని చాటే ఉదంతాలు మహాభారతంలోనే ఉండడం! దాని గురించి మరెప్పుడైనా…

మగధకు ఆగ్నేయంగా గయ ఉంది. అది, మగధుల  తొలి వలస. గయ దాటితే అంతా మహారణ్యం. అయితే, గయకు ఆగ్నేయంగా ఉన్న కొండల్లోనూ ఇనుము, రాగి నిక్షేపాలు ఉన్నాయి. భారతదేశంలోనే భారీ నిక్షేపాలు అవి. గుండె దిటవు ఉన్నవాళ్ళు మాత్రమే ఆ అరణ్యంలోకి వెళ్ళి వాటిని వెలికితీసేవారు. వర్తకులు వాటిని మధ్య గంగా ప్రాంతానికి తెచ్చి అమ్మేవారు. ఆ ప్రాంతంలో వ్యవసాయం లాభసాటి కాదు కనుక ఈ లోహాల వెలికితీత, విక్రయాలే ప్రధానవ్యాపకం అయ్యాయి.  అయితే, మగధరాజులు ఒక పద్ధతిగా అరణ్యాలను నరకి, నాగలి వ్యవసాయం కిందికి తేవడానికి క్రమంగా ఈ లోహసంపద ఉపయోగపడింది.

పదహారు జనపదాలలో అన్నీ జనాభా రీత్యా చెప్పుకోదగినవి కావు. ఎక్కువ భాగం అరణ్యమయం. ఆ అరణ్యాలలో పలచ పలచగా ఆటవిక తెగలు ఉన్నాయి. వాళ్ళు అప్పటికింకా రాతి గొడ్డళ్లే వాడుతున్నారు. కాకపోతే బళ్ళ మీద సరకుతో వెళ్ళే వర్తకులకు (బిడారు)లకు ప్రమాదకరంగా మారుతున్నారు. రెండు ప్రధాన వర్తక మార్గాలకు దగ్గరలో ఉన్న జనపదాల మధ్య కూడా అంతులేనంత అరణ్యం వ్యాపించి వాటి మధ్య దూరాన్ని పెంచింది. కనుక అడవిగుండా వెళ్లాలంటే వర్తకులకు ఎంతో జాగ్రత్త, బందోబస్తు అవసరం.

కొన్ని జనపదాల పేర్లు మిగిలాయి కానీ వాటి తెగలు అంతరిస్తున్నాయి. ఉదాహరణకు మిథిల ఒక నగరం పేరూ, జనపదం పేరూ నని కోశాంబీ అంటారు. మిథిల రామాయణప్రసిద్ధంకూడా. సీత మిథిలను పాలించిన జనకుని కూతురు, అందుకే మైథిలి అయింది. మిథిల తెగ క్రీ.పూ. 6వ శతాబ్ది నాటికి అంతరించింది. నేరుగా ఇక్ష్వాకు వంశానికి చెందిన మిథిల ఆఖరి రాజు పేరు సుమిత్రుడు. బుద్ధుడు పుట్టినప్పుడే అతడు చనిపోయాడు. మిథిలతోపాటు చెప్పుకునే పేరు విదేహ. సీతకు వైదేహి అనే పేరు కూడా ఉంది. విదేహ మిథిలలో కలసిపోయింది. మిథిల, విదేహలు రెండూ ఆ తర్వాత కోసలలో కలిశాయి. క్రమంగా వర్తకులకు వైదేహికులనే పేరు కూడా వచ్చింది. బహుశా విదేహ తెగకు చెందినవాళ్లు కూడా వర్తకం చేపట్టడంతో వర్తకులకు ఆ పేరు వచ్చి ఉండచ్చని కోశాంబీ అంటారు. బిడారులు ఆ రోజుల్లో అటు తక్షశిలనుంచి ఇటు మగధ చివరి వరకు ప్రయాణించేవారు. వాళ్ళలో మరింత సాహసవంతులు దక్షిణాపథ మార్గంలోనూ వెళ్ళేవారు. మిథిల, విదేహలు కోసలలో కలసిపోయినట్టే; చంపానగరం(నేటి బీహార్ లోని భాగల్ పూర్)రాజధానిగా ఉన్న అంగ, మగధలో కలసిపోయింది. అప్పటికది ఓ సాధారణ గ్రామంగా మారిపోయింది. మగధరాజు బింబిసారుడు దానిని ఒక ఋత్విక్కుకు దానమిచ్చాడు.

ఈ కాలానికి వచ్చేసరికి ఒక తెగమనిషి కన్నా వర్తకుడు ప్రధానుడిగా మారాడు. ప్రత్యేకంగా ఒక తెగకో, జనపదానికొ చెందని ఈ వర్తకులే ఒక తెగగా అవతరించారు.  నాణేల ముద్రణ, వాడకం మొదలయ్యాయి. వస్తూత్పత్తి బాగా పెరిగిందనడానికి ఇది సూచన.  నాణేల బరువులో సింధు సంస్కృతి నాటి ప్రమాణాలనే పాటించడం విశేషం. అనేక గ్రామాలలో, ముఖ్యంగా కాశీ చుట్టుపక్కల బుట్టలు అల్లేవారు, కుండలు చేసేవారు, కమ్మరులు, నేతపనిచేసేవారు వగైరాలు స్థిరపడ్డారు. ఈ చేతివృత్తుల వాళ్ళు సాధారణంగా ఒకే తెగకు చెందిన రక్తసబంధీకులు. శ్రేణుల పేరుతో వీరు తెగ స్వభావం కలిగిన వ్యవస్థను ఏర్పరచుకునేవారు. ఇది వారి వెనకటి తెగ లేదా గణజీవిత వారసత్వం. శ్రేణుల దగ్గర చెప్పుకోదగిన సంపద ఉంటుంది. అయితే, అది ఉమ్మడి సంపదే తప్ప వ్యక్తిగత సంపద కాదు.  వీరి ఉత్పత్తుల నన్నింటినీ దగ్గరలోని ఒక్క పట్నంలోనే అమ్ముకునే అవకాశం లేదు. ఎందుకంటే, క్రీ.పూ. 7,6 శతాబ్దాలనాటికి కూడా నగరాలు పెద్దసైజు గ్రామాలుగానే ఉన్నాయి. కనుక ఉత్పత్తులు దూర దూర ప్రాంతాలకు రవాణా చేసేవారు. గంధపు చెక్కకు మంచి డిమాండ్ ఉండేది. సబ్బులు లేవు కనుక స్నానం చేసేటప్పుడు గంధంతో నలుగు పెట్టుకునేవారు. ఉష్ణ వాతావరణంలో గంధం నిత్యావసరమే కానీ, విలాస వస్తువు కాదు. ఉత్పత్తులను తీసుకుని ఒకేసారి అయిదువందలకు పైగా ఎడ్ల వేగన్లు బారులు కట్టి ప్రయాణించేవి.  బళ్ళకు, మధ్యలో కడ్డీలు ఉన్న చక్రాలు, ముడిచర్మపు టైర్లు ఉండేవి.

అటవీ ప్రాంతాలలో తెగ ముఖ్యుని ద్వారా వ్యాపారం జరిగేది. అతడే వర్తకుడికి కావలసిన మిగులును సేకరించేవాడు. ఆ క్రమంలో తెగ ముఖ్యుని దగ్గర వ్యక్తిగత ఆస్తి పోగుబడుతూ వచ్చింది. ఈ నూతన ఆస్తి ద్వారా మిగిలిన తెగసభ్యులనుంచి స్వతంత్రించే సౌలభ్యం కూడా అతనికి దక్కింది. ఆవిధంగా కూడా గణసమాజం పట్టు సడలిపోవడం ప్రారంభించింది. గుర్రం విలువైన వ్యాపార వస్తువులలో ఒకటయింది. అంతవరకూ రథానికి పూన్చుతూ వచ్చిన గుర్రాన్ని ఇప్పుడు అధిరోహిస్తున్నారు. ఏనుగు అంతకంటే విలువైనది. అయితే, అది రాచరిక, సైనిక వినియోగానికే తప్ప వ్యాపార వస్తువు కాదు. ఆనాటికి సమాజం, కులవిభజన కరడుగట్టిన, నిస్సహాయ, నిర్లిప్త గ్రామీణ వ్యవస్థకు ఇంకా చాలా దూరంగానే ఉంది. అలాంటి వ్యవస్థ ఏర్పడడానికి ఇంకో పన్నెండు వందల సంవత్సరాలు గడవాలి.

వ్యాపార వస్తువుల తరలింపు నిర్నిరోధంగా సాగడానికి, తగిన అధికార కేంద్రమూ, దానికింద ఒక శక్తిమంతమైన, సుశిక్షితమైన వృత్తి సైన్యమూ అవసరమయ్యాయి. అది శాశ్వతప్రాతిపదికపై పనిచేసేది అయుండాలి. అందులోకి జరిపే నియామకాలకు, దాని సైనిక చర్యలకు తెగల విశేషాధికారాలు, చట్టాలు, విధేయతలూ అడ్డురాకూడదు. అది తెగలను దాటి విస్తృత సమాజాన్ని లక్ష్యం చేసుకోవాలి. ఆ సమాజం తెగల ప్రత్యేక  జీవనవిధానాన్ని, హక్కులను గుర్తించదు.  గణముఖ్యుడు యుద్ధాలకు అవసరమైనప్పుడు మాత్రమే సమీకరించే వెనకటి తెగల సైన్యం లాంటిది కాదు ఇది. ఎంతో జాగ్రత్తగా శిక్షణ ఇస్తూ, నిరంతరం యుద్ధసన్నద్ధతలో ఉంచుతూ, జీతం చెల్లిస్తూ, వ్యూహాత్మక ప్రాంతాలలో ఉంచుతూ ప్రభుత్వం ఖర్చుతో పోషించవలసిన సైన్యం. ఇవన్నీ సాధ్యం కావాలంటే పన్నులు వసూలు చేయకతప్పదు. అయితే, గణసమాఖ్యలు ఇందుకు సాధారణంగా ఒప్పుకోవు. జీతాలు ఇస్తూ శాశ్వతప్రాతిపదికపై పోషించే ఇలాంటి సైన్యాన్ని లిచ్ఛవీలు, మల్లులు ఎన్నడూ ఎరగరు. విస్తృత సమాజంలో భాగం కాకుండా దేనికవిగా ఉన్న వివిధ తెగల రూపంలోని అడ్డుగోడలను కూలగొట్టడం పైన చెప్పిన సైనిక బలం కలిగి, ప్రజలపై సంపూర్ణ అధికారాలను చేజిక్కించుకున్న నిరంకుశరాచరికానికే సాధ్యమవుతుంది.

***

క్రీ. పూ. 6వ శతాబ్దిలో కోసల, మగధరాజులకు ఇందుకు అవసరమైన సాధనాలు అన్నీ సమకూడాయి!

ఇక్కడినుంచి అసలు కథలోకి వెడతాం. అది వచ్చే వారం…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)-కల్లూరి భాస్కరం

 

 

 

 

 

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 9 వ భాగం

( గత వారం తరువాయి)

9

ఒక స్వరం కావాలిప్పుడు..ఒక గొంతు కావాలిప్పుడు. ఒక అంతర్ఘర్షణతో నిత్యం కుతకుత ఉడికిపోయే మనిషి తన అంతఃచేతనలో నుండి, తన ప్రజ్వలిత అంతర్లోకాల్లోనుండి భువి నుండి దివికి ఒక నభోపర్యంత కాంతిస్తంభమై ప్రకాశించగల వ్యక్తిత్వంతో భాసిల్లే ఒక ఆత్మధ్వని కావాలిప్పుడు.
కాలానికి ఒక ధర్మం ఉంది..ఒకే ఒక ధర్మం…దేన్నయినా సరే వృద్ధిపరచడం, క్షయింపజేయడం..యివి భౌతికంగా బయటికి కనిపించేవి.. చెట్టు చిగురించడం..మళ్ళీ ఆకులు రాలడం..కాలం గడుస్తున్నకొద్దీ ఏదైనా ఉదయించడం..ఒక నియమితకాలం గడవగానే అస్తమించడం..ఐతే అభౌతికంగా, అదృశ్యంగా నిరంతరం కాలం ప్రకృతి ధర్మాలకనుగుణంగా సకల చరాచర స్పష్టినంతా నియంత్రిస్తూ పోతూండడం..ఈ అతి ప్రధానమైన క్రియ అసలే కంటికి కనబడకుండా పూర్తి  ఒక అజ్ఞాత జీవచర్యగా కొనసాగుతూండడం..లేకుంటే..సరిగ్గా..కోడిగ్రుడ్డును పొదిగిన ఇరవై ఒకటవ రోజునే ఎందుకు కోడిపిల్ల  జీవాన్ని పోసుకుని కళ్ళుతెరుస్తుంది..ఇరవైయవ రోజో, ఇరవై రెండవ రోజో ఎందుకు ఈ జననం సంభవం కాదు. కాలం..కాలం.. విలువైన, శక్తివంతమైన, ఎవరికీ ఎప్పుడూ బోధపడని అతి విచిత్రమైన ఒక మితి..డైమెన్షన్‌..సర్వ సృష్టినీ శాసించే శక్తి.
రెండు కార్లు పోతున్నాయి..ఒక దానివెంట ఒకటి. ముందు రామం కారు. వెనుక క్యాథీ ఆడి కారు..బయట కుండపోతగా వర్షం. జర్మన్‌టౌన్‌ సెంటర్‌ బార్నెస్‌ అండ్‌ నోబుల్‌ నుండి ఓవల్‌నెస్ట్‌ సర్కిల్‌లో ఉన్న రామం ఇంటికి డ్రైవ్‌.. ఎదురుగా ఎర్రగా సిగ్నల్‌..
”ఆగుము..వేచి చూడుము..పొమ్ము”
‘దారి తెలుసుకుని..దారి స్పృహ కలిగి..నియమిత వేగంతో..ఆగి..చూచి..వేచి..సాగి..పొమ్ము..’
కావడి కొయ్యేనోయ్‌..కుండలు మన్నేనోయ్‌..కనుగొంటే సత్యమింతేనోయి,’
అసలీ కనుగొనడమేమిటి..జీవితాన్ని కనుగొనడం, దారిని కనుగొనడం, చీకటిని కనుగొనడం, వెలుగును కనుగొనడం.. చివరికి ఎవరివారు తనను తాను కనుగొనడం.. కనుగొనలేకపోవడం..కనుగొనలేక దుఃఖించడం.,
బుద్దుడు, అశోకుడు..సోక్రటీస్‌, ప్లేటో..పైథాగరస్‌..గెలీలియో..కోపర్నికస్‌..మహాత్మాగాంధీ..అందరూ ఎన్నోసార్లు.. ఎన్నో సందర్భాల్లో అరచి అరచి నినదించి అనేకానేక పరమసత్యాలను చెప్పినా..ఎవరూ వినకుండా..ఎవరిదారిన వాళ్ళు విముఖులై పారలౌకిక ప్రపంచం నిషాలో నిద్రిస్తున్నపుడు..మేల్కొలిపి..మేల్కొలిపి..అలసి.,
దుఃఖించడం..నిస్సహాయంగా, నిరామయంగా, అనివార్యమై దుఃఖించడం ఏమిటిది.. ?
మళ్ళీ మేనేజ్‌మెంట్‌ గురు స్టీపెన్‌ కోవె జ్ఞాపకమొచ్చాడు క్యాథీకి..అద్భుతమైన పుస్తకం ‘ఎనిమిదవ అలవాటు’ – ది ఎయిత్‌ హాబిట్‌..ఏమంటాడంటే..తనను తాను తెలుసుకోమంటాడు మనిషిని. ఐతే కోవె చెప్పిన కొత్త విషయాలేవీ కావివి.. అన్ని యిదివరకు తెలిసినవే..అన్నీ ఇదివరకు చెప్పబడ్డవే. అన్నీ జ్ఞానులైన మహానుభావులు ఇదివరకే గ్రంథస్థంచేసి ఒక ఆధ్యాత్మిక సంపదగా మనకందించి ఉంచినవే.
ఐతే.. పాతవాటినే..మళ్ళీ జ్ఞాపకంచేసి, మళ్ళీ తవ్వితీసి..మళ్ళీ వ్యాఖ్యానించి..మళ్ళీ మెరుగుపరిచి…రిటోల్డ్‌.. రీసర్చ్‌.. రీ కామెంట్‌..రి…రి….రీ పెయిర్‌.,
మనుషులందరూ దుఃఖిస్తున్నారు.. ఔనా, దుఃఖమునకు మూలం కోరిక..’ అనికదా బుద్ధుడు చెప్పింది..
ఇప్పుడు..ఎవరినడిగినా.,
‘నేను సంతోషంగాలేను..నాకు ఉద్యోగం లేదు.’
‘నాకు చాలినంత డబ్బులేదు’
‘నాకు అధికారం లేదు’
‘నేను చేస్తున్న వృత్తి నేను చేయదగిందికాదు. కాని విధిలేక చేస్తున్నాను.. షిట్‌’
‘నేను ఎంతో ప్రతిభావంతున్ని-కాని నన్నెవరూ గుర్తించట్లేదు’
‘అబ్బా నేను అలసిపోయాను-నా జీవితమంతా ధ్వంసమైపోయింది. ఇప్పుడెలా’
‘నాకవకాశాలు లేవు.. ఉంటే నా ప్రతాపం చూపించేవాణ్ణి’
‘నా భార్య నా మాట వినదు-నా ఇల్లొక నరకం’
‘నా పిల్లలు దరిద్రులు-ఎంతో కష్టపడి పెంచితే విశ్వాసఘాతకులై మిగిలారు’
‘అన్నీ ఒట్టి కలలే..అవి సాకారమయ్యే అవకాశాలే లేవు’
‘ఈ అవినీతికర భారతదేశంలో హాయిగా అందరూ చేతికందినంత మేరకు దోచుకుంటూ, తప్పించుకు తిరుగుతూ రాజాలా బ్రతుకుతున్నారు.. నేనేమిటి ఈ దరిద్రం’
అన్నీ ఇవే.. ఎక్కడ విన్నా యివే గొంతులు..యిటువంటివే అందరి అసంతృప్తి స్వరాలు.. యివే ఆరోపణలు.. యివే ఆత్మఘోషలు.
వీటన్నిటికీ మూలం..నొప్పి..పెయిన్‌..వేదన..అసంతృప్తత..ఫలితం అశాంతి..దుఃఖం
ఈ దుఃఖాన్ని అధిగమించి మనిషికి శాశ్వతమైన స్వాంతనను చేకూర్చగల శాంతికావాలి..ఎక్కడుందది..ఎలా దొరుకుతుందది.
అన్వేషణ..ఎడతెగని అన్వేషణ..నిరంతరాన్వేషణ.
కోవె అంటాడు ‘ఇప్పుడొక గొంతుకావాలి..మనిషి తనను..తన ఆత్మికమైన అంతరంగాన్ని, హృదయాన్ని తెలుసుకుని తననుతాను వ్యక్తీకరించుకోగలిగే ఒక స్వరం కావాలి..ది ఎయిత్‌ హాబిట్‌..తనను తాను నిరంతరం స్పృహలో ఉంచుకుంటూ, సచేతనంగా పదునుపెట్టుకుంటూ కొనసాగుతూనే..ఆత్మను ఒక స్వరంగా వ్యక్తీకరించుకోగల అద్భుతమైన అలవాటును మనిషి నేర్చుకోవాలి..ఒక తన స్వరాన్నే కాదు ఎదుటి మనిషి హృదయాన్ని కూడా స్వరంగా వినగల సహనంతో కూడిన సంస్కారంకావాలి.’
ఆకుపచ్చలైటు వెలుగుతూండగా..కార్లు దూసుకుపోతూ..క్యామ్‌ ఫ్రీ..రాయల్‌ క్రౌన్‌..మైల్‌స్టోన్‌ డ్రైవ్‌..
ఎదురుగా బ్రూక్‌ ఫీల్డ్‌..ఓవల్‌ నెస్ట్‌ సర్కిల్‌.,
పెద్ద.. విశాలమైన..అట్టహాసాలేవీ లేని ఒక ఇంటిముందు..గ్యారేజ్‌ ఎదుట రెండు కార్లు ఆగి.,
‘నిరాడంబరత అనేది మనిషి తనను తాను పరిత్యాగించుకోవడానికి మొదటి సాధనం క్యాథీ’ అని ఎన్నోసార్లు రామం చెప్పిన వాక్యం జ్ఞాపకమొచ్చిందామెకు.
క్రమక్రమంగా దేన్నైయితే మనిషి మక్కువపడి మోహంతో, ఒక అలవాటును స్వంతంచేసుకున్నాడో దాన్ని ఉద్దేశ్యపూర్వకంగా వదులుకోవడమే పరిత్యాగమైతే..దేన్నయినా పరిత్యాగించడం అంత సుళువైన విషయమేమి కాదు. సుఖాలు, ఆడంబరాలు, అలంకారాలు, ధన, కామ, జిహ్వసంబంధ సర్వకామనలన్నీ మనిషిపై రాక్షస సమూహంలా దాడిచేసి ఆవహించిన తర్వాత లొంగి వివశమైపోవడంతప్ప ఒక్కోదాన్ని త్యజించి బయటపడడం దుర్లభం.
రామం. దేనికీ ఆధీనుడైపోయినట్టుగానీ, వశుడై లొంగిపోయినట్టుగానీ, బానిసైపోయినట్టుగానీ ఏనాడూ కనిపించలేదు సరికదా.. అన్నింటికీ అతీతుడై స్థిరపడినట్టే అనిపిస్తుందెప్పటికప్పుడు.
కారు దిగి.. తలుపులు తెరిచి..లైట్లు వేసి..క్యాథీకోసం స్వింగు డోర్‌ను ఇంకా తెరిచి పట్టుకున్నాడు.
క్యాథీ ప్రక్కనున్న ఎగ్జిక్యూటివ్‌ బ్రీఫ్‌ను చటుక్కున తీసుకుని..క్షణకాలంలో ఒత్తుగా కురుస్తున్న వర్షపు చినుకుల్లోనుండి లోపలికొచ్చేసింది.
రామంది విశాలమైన యిల్లు..ఎంతో యిష్టపడి..తను చేసే ప్రతిపనికి ఉత్తేజాన్నందించే వాతావరణాన్ని సమకూర్చేటట్టుగాపెద్ద హాల్‌లోని ప్రతి వస్తువునూ అమర్చుకున్నాడు.
అంటాడు..”మనకు తెలియకుండానే మనం పనిచేస్తున్న ప్రాంత వాతావరణయొక్క ప్రభావం మన మీద చాలా గణనీయంగా ఉంటుంది క్యాథీ. మంచి సాధకుడెప్పుడూ తన పరిసరాల్ని తను చేయబోయే పనికి అనుగుణంగా రూపొందించుకోవాలి.” అని.
ఏదో చిత్రమైన మోహకమైన పరిమళం అనుభవంలోకొచ్చింది. అన్నింటికంటే శక్తివంతమైన నిశ్శబ్దం.. సన్నని వానచినుకుల చప్పుడు.. పల్చని లేత వెలుగు.. హాయిగా ఉంది.. అంతా.
తెగిపోయిన ఒక ఎగ్జిక్యూటివ్‌కు ఉండవలసిన ఎనిమిదవ అలవాటు ‘మనిషికి ఉండవలసిన స్వంతగొంతు’ గురించి మళ్ళీ జ్ఞాపకమొచ్చిందామెకు. నిజానికి ప్రతి మనిషియొక్క వేలిముద్ర, ప్రతి జీవియొక్క నాడీస్పందన తాలూకు తరంగం భిన్నభిన్నంగా ఉన్నట్లే ప్రతి మనిషి యొక్క స్వరం కూడా భిన్నంగా ఉంటుందనీ, ఏ ఇద్దరి స్వరాలూ ఒకేరకంగా ఉండవనీ, స్వరం ఎవరిదైనా వాని అనివార్యతతోకూడిన అవసరం, ప్రతిభ, కాంక్షాతీవ్రత మరియు ఆత్మలయొక్క సమీకృత సంకేతంగా వెలువడ్తుందని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. స్వరం, స్వభావం, తీవ్రత, ప్రభావం సందర్భాన్నిబట్టి మారుతాయి కాని మూల లక్షణం మారదు. దాని మాడ్యులేషన్‌ మారదు.
చాలా ఉద్విగ్నంగా ఉంది క్యాథీకి.
రామం ఎదురుగా ఉన్న సింగిల్‌సీటర్‌ సోఫాలో కూర్చున్నాడు. కూర్చున్న మరుక్షణమే చేతికిందున్న స్విచ్‌ను ఆన్‌ చేయడంవల్ల హాల్లో ఒకేసారి రెండుమూడు లైట్లు వెలిగాయి. వాతావరణం కూడా చిక్కని, తెల్లని పాలనురుగువంటి కాంతితోనిండి  జీవవంతమైంది.
సరిగ్గా అతనికి ఎదురుగా ఉన్న మరో విలువైన సింగిల్‌ సీటర్‌ సోఫాపై క్యాథీ కూర్చుని మోకాళ్ళపై తన బ్రీఫ్‌ను పెట్టుకుని తెరిచింది.
ఎంతో ప్రధానమైతే తప్పితే రామం ఎవరినీ యింటికి ఆహ్వానించడు. తనకు తెలిసి ఒకసారి లయన్‌బ్రిడ్జ్‌ సిఇఓ పీటర్స్‌ రాండ్‌, కాగ్నిజెంట్‌ విపి విలియం చుఫ్‌ను ఒక్కోసారి విడివిడిగా పిలిచాడు. అతి విలువైన వ్యక్తులు అతి ఖరీదైన కార్లలో తెగిన చుక్కల్లా అప్పుడప్పుడు రామం ఇంటికి వస్తూండడం, ఆ కాలనీ వాసులను ఆశ్చర్యపర్చడం క్యాథీకి తెలుసు.
”క్యాథీ.. ఈ వర్షంకురుస్తున్న రాత్రి నీకూ, నాకూ..మనిద్దరి భవిష్యత్తుకూ ఎంతో ప్రధానమైంది. చారిత్రాత్మకమైంది. నీకు ఇప్పటికే నేనిచ్చిన ఎజెండా ప్రకారం మనం చర్చించబోయే అంశాలు ఎంతో విలువైనవి. కీలకమైనవీ.. ఒక దేశానికి చెందిన కోట్ల ప్రజల జీవితాలను సమూలంగా ప్రభావితం చేసేవి. ఇప్పుడు నువ్వు జీవానివి.. ప్రాణానివి.. చేతనవు.. నడిపే మార్గదర్శివి..నేను శ్రోతను. శరీరాన్ని..ఆయుధాన్ని..కర్తను..నీవు పూర్ణ స్ఫూర్తివి..ఊఁ..కానీ..”అన్నాడు.
ఆ క్షణం రామం ముఖం అప్పుడే ఉదయిస్తున్న శిశుసూర్యునిలా ఉంది.
సరిగ్గా అప్పుడు ఎనమిది గంటల పన్నెండు నిముషాలైంది. ఒకగంట తమ సమాగమం. క్యాథీ ఒక ప్లాస్టిక్‌ ఫైల్‌ను బయటికితీసి మోకాళ్ళపై పెట్టుకుని..తెరిచి…కొన్ని కాగితాలను చదివేందుకు అనువుగా సర్దుకుని అంది…
అప్పుడు తెల్లని కాంతితో ఎదురుగా నిర్మలహృదయంవల్ల వెలిగిపోతున్న క్యాథీ ముఖాన్ని ఓ లిప్తకాలం చూచి.. రామం గంభీరంగా కనురెప్పలను మూసుకున్నాడు. ఆ క్షణం అతనిలో ఏదో వెలుగు పొటమరించి..మొలకై…విప్పారి.. విస్తరించి.,
యోగ సూత్రాలను ప్రవచించిన పతంజలి ఏమన్నాడంటే..’ఒక అసాధారణమై సాధించవలసిన లక్ష్యం గొప్ప బాధ్యతగా మనను ఉత్తేజపరుస్తున్నప్పుడు మనిషియొక్క సర్వచింతనలూ శకలాలు శకలాలుగా విడిపోయి హద్దులనధిగమించి మగ్నమైన మనసు సమస్తావధులను అతిక్రమిస్తుంది. అప్పుడు ఆత్మ బహుముఖమైన అన్ని దిశల్లో విస్తరించి ఒక కొత్త మహోన్నతమైన అద్భుతప్రపంచాన్ని కనుగొనేలా మనిషిని ఉద్యుక్తుణ్ణిచేస్తుంది. అని..ఇప్పుడు మనకు ఈ ప్రాణతుల్యమైన ప్రవచనమే మార్గదర్శి రామం’ అంది ఒక అశరీర వ్యవస్థ మాట్లాడ్తున్నట్టుగా.
రామం సమాధిలో ఉన్న వ్యక్తిలా ”అవును” అన్నాడు.
”ఇంకో ప్రధానమైన విషయాన్ని చెబుతాను రామం..మనలో కొద్దిమంది మాత్రమే గొప్ప పనులు చేయగలరు. కాని మనందరం గొప్పవికాని ఎన్నో మామూలు పనులను తప్పకుండా చేయగలం..గొప్ప ప్రేమతో..అంది మదర్‌ తెరేసా. ఇది మన భవిష్యత్‌ కార్యకలాపాలకు ప్రాతిపదిక..”
‘అవును..”
”నువ్వు అమెరికాకు టిసిఎస్‌ ఉద్యోగిగా వచ్చి ఈ నేలపై అడుగుపెట్టింది జూన్‌ ఇరవై ఆరు పందొమ్మిదివందల తొంభైఏడు. మొదట మేరీల్యాండ్‌ ఆఫీస్‌లో రిపోర్ట్‌చేసి కార్యకలాపాలను ప్రారంభించావు. నువ్వు అతిగోపనీయమైన కొన్ని నాసా ప్రొడక్ట్స్‌ను, అప్పుడే ఎస్‌ఎపీతో అద్భుతాలు ప్రదర్శిస్తూ వాల్‌మార్ట్‌ సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహణను పర్యవేక్షిస్తూండేవాడివి. నాన్న..నేను అమెరికా వ్యాపారవ్యవస్థను శాసించే వాల్‌మార్ట్‌, కాట్స్‌కో, టార్గెట్‌, హోమ్‌ డిపోవంటి సంస్థలకు కొన్ని ఉత్పత్తులను సరఫరా చేసేవాళ్ళం..ఆ క్రమంలో మొట్టమొదటిసారిగా నాన్న జేమ్స్‌కోవె, నేను మీ రాక్‌విల్లే ఆఫీస్‌కువచ్చాం. అది అగస్ట్‌ ఇరవైరెండు..ఉదయం పదకొండుగంటల ఇరవై ఒక్క నిమిషం. ఆ క్షణమే నేను నిన్ను చూశాను. పలకరించాను. పరిచయం చేసుకున్నాను. భారతీయ ముహూర్తశాస్త్రం మీద విశ్వాసం గల వ్యక్తిగా ఆ మహత్తర క్షణాల్ని నాకు ప్రసాదించినందుకు కాలానికి నా ధన్యవాదాలు..”
”ఊఁ …”రామం మౌనంగా వింటున్నాడు కళ్ళుమూసుకునే.
”ఒక ఏడాది కాలంలో మనం పదకొండుసార్లు కలుసుకున్నాం. కలుసుకున్న ప్రతిసారీ మన మధ్య ఒక మౌన సంభాషణ జరిగేది. నాకైతే గత ఎన్నో జన్మల నుంచి మన మధ్య ఓ అపూర్వమైన, ఈ సైన్స్‌కు అందని అదృశ్య అజ్ఞాత బంధముందని అనిపించేది. మొట్టమొదటిసారి ఎంతో ధైర్యంచేసి, భయంభయంగా నిన్ను ఓ రోజు రాత్రి ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు డిన్నర్‌కు ఆహ్వానించాను. అది జూలై ఎనిమిదవ తేది. నేను తెలుగు నేర్చుకునేందుకు కొన్ని పుస్తకాలు కావాలని అడిగాను. నువ్వు నవ్వి తెలుగు నేర్చుకోవడం అంత అవసరమా అని అన్నావు..నేను ఔనన్నాను. ఆశ్చర్యంగా మూడురోజుల్లో ఇరవై ఎనిమిది తెలుగు పుస్తకాలను భారతదేశంనుండి తెప్పించి ఇచ్చావు. తద్వారా నా పట్ల నీకున్న శ్రద్ధ అర్థమైంది.”
వింటున్న రామం పెదవులపై చిరునవ్వు వెలిగి మాయమైంది.
”ఆగస్ట్‌ పన్నెండవతేది, తొంభై ఎనిమిదిన అనూహ్యంగా డాడీ హార్ట్‌ ఎటాక్‌తో కన్ను మూసారు. అది ఒక పెద్ద షాక్‌ నా జీవితంలో. అకస్మాత్తుగా ఈ ప్రపంచంలో ఒంటరినైపోయాను. నా ఇరవై ఎనిమిదేళ్ళ జీవితంలో ఒక తండ్రిగానే తెలిసిన వ్యక్తి ఓ స్నేహితునిగా, సహచరునిగా, శ్రేయోభిలాషిగా, ఆత్మీయునిగా అనేక రూపాల్లో ఎంత బలంగా నాలోనాన్న ముద్రించుకుపోయాడో అప్పుడు ఏర్పడ్డ శూన్యం తెలిపింది. యిక నేను శూన్యం గురించీ, శూన్యానికి ముందు శూన్యం, తర్వాతి శూన్యం గురించీ ఆలోచించడం మొదలుపెట్టాను. సున్నా ఒంటరిగా ఉన్నంతసేపు దాని విలువ సున్నాయే కాని దానికి అటో ఇటో ఒక ఒక్కటి చేరితే అది తప్పకుండా ఒక సంఖ్యయి కొత్త విలువను పొందుతుంది. అందుకే నా సంఖ్య ఒక అంకెగా చేరి నాకు విలువను సంపాదింపజేయగల వ్యక్తిగురించి అన్వేషించడం ప్రారంభించాను.”
”……”
”ఎందుకో భగవంతడు నిన్ను స్ఫురింపజేశాడు.. ఐ బిలీవ్‌ ఇన్‌ గాడ్‌. అనేక సిద్ధాంతాలు, వాదనలు ఘర్షణలతో వాదులాడుకునే అనేక ప్రపంచదేశాలు.. ఇండియాతో సహా ఎక్కడా భగవంతుడున్నాడని బహిరంగంగా.. రాజ్యాంగబద్దంగా ప్రకటించలేని వర్తమానంలో.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో, సైనిక మరియు యుద్ధ పాటవాల్లో అగ్రదేశమైన అమెరికా  మాత్రం రాజ్యాంగబద్ధంగా కరెన్సీపైనా, ప్రమాణ పత్రాల్లో సహా..ఇన్‌ గాడ్‌ వియ్‌ ట్రస్ట్‌’ అంటుంది. ఇది ఒకరకంగా మనిషి ఒట్టి నిమిత్తమాత్రుడనే పరమసత్యాన్ని అంగీకరించడమే..సరే..ఐతే, ఆ భగవంతుడే మనమధ్య ఓ వారధిగా ప్రవేశించి సంధానం చేశాడని నేను నమ్ముతాను మనస్పూర్తిగా..మూడు పెద్ద ఫ్యాక్టరీలు, విస్తృతమైన వ్యాపార సామ్రాజ్యం, దాదాపు పది బిలియన్‌ డాలర్ల అసెట్‌ వాల్యూ ఉన్న నేపథ్యం నాదప్పటికి. వాటి నిర్వహణ, రక్షణ, భవిష్యత్తు..ఇవన్నీ నన్ను ఎంతో కలవరపెట్టేవి. కొద్దికాలం..’కిం కర్తవ్యం’ అనే ఆత్మశోధనతో గడిపాను. పిచ్చిగా, నిరామయంగా..నిర్వ్యాపారంగా..దేశమంతా తిరిగాను. ఈ విశాల దేశంలో నాకు తెలిసిన ప్రశాంతతను కలిగించే ఎన్నో ప్రదేశాల్లో శాంతికోసం వెదికాను. ఫిలడల్ఫియా, న్యూయార్క్‌, టెక్సాస్‌, ఫ్లోరిడా.. కొలరాడో..ఒరెగాన్‌, ఫిట్స్‌బర్గ్‌.. ఇంగ్లాండ్‌, భారతదేశం, సింగపూర్‌..ఎన్నో ప్రాంతాలను సందర్శించాను. ఐతే.. మనిషి ఎప్పుడూ తన బయటఉన్న ప్రపంచంలో అన్వేషిస్తాడు తప్ప..తనలోనే నిక్షిప్తమైఉన్న అంతరిక ప్రపంచాన్ని గుర్తించడు.. ఈ క్రమంలో ఎన్నెన్నో ప్రసిద్ధ పుస్తకాలను అధ్యయనం చేశాను. ఉహు.. బయట ఏమీ లేదని అర్థమైంది. ఏదైనా ఉందంటే అది జీవిలోపలేఉందనీ, అంతిమంగా మనిషి తనకోసం కాకుండా తనులేని ఇతర ప్రపంచాన్ని ప్రేమించగలిగినప్పుడే బోధపడ్తుందనీ తెలిసింది. అందుకే…ఇఫ్‌ యు రిమెంబర్‌, మూడు నెలలు నీకు కనిపించకుండా అప్పుడు నేనుమరుగైపోయాను..అప్పుడు నీతో పాటు రాక్‌విల్లేకు దగ్గర్లోనే ఉన్న ఇన్‌ఫోసిస్‌లో పనిచేసే హెచ్బార్‌ మేనేజర్‌ లీల నీతో సన్నిహితంగా ఉండేది. లీల తెలివికి, చొరవకు, చొచ్చుకుపోయే తత్వానికీ నేను ఎంతో అశ్చర్యపోయేదాన్ని. తమ క్లెయింట్స్‌తో ఆమె ఇంటరాక్టయ్యే పద్ధతికూడా ఎంతో విలక్షణంగా, ప్రత్యేకంగా ఉండేది. సడెన్‌గా..ఒక ప్రత్యేకమైన సందర్భంలో వాల్‌మార్ట్‌ డీలింగులో ఏర్పడ్డ స్టాగ్నేషన్‌ వల్ల నీవద్దకు టిసిఎస్‌కు వచ్చాను. కాని నువ్వు లేవు. ఉద్యోగానికి రాజీనామా చేశావని చెప్పారు..ఇదంతా మననం చేసుకోవడం ఇప్పుడెందుకంటే..స్పష్టమైన భవిష్యత్తును నిర్మించుకోవాలనుకుంటే స్పష్టంగా ఒకసారి గతంలోకి తొంగి చూచుకొమ్మని శాస్త్రం చెబుతోంది.”
”……..” రామం నిగ్రహంగా వింటున్నాడు కళ్ళుమూసుకునే.
”పోలీస్‌లా నా మనుషులతో నీ గురించి పూర్తి వాకబు చేయించి డెట్రాయిట్‌లో నిన్ను కలిశాను మళ్ళీ. అప్పుడు ఉద్యోగి స్థితినుండి ఒక ఎంటర్‌ప్రున్యూర్‌్‌గా ఎదుగుతున్నావు నువ్వు. రిస్క్‌ తీసుకోకుండా ఒక డిపెండెంట్‌గా పనిచేసి జీతం తీసుకుని ఆనందంగా వెళ్ళిపోయేవాడు ఉద్యోగి. ఒక నిర్దుష్ట లక్ష్యాన్ని చేరే క్రమంలో రిస్క్‌ను, చాలెంజ్‌స్‌ను స్వీకరిస్తూ అవరోధాలను ఎదుర్కుంటూ ముందుకు సాగేవాడు ఔత్సాహికుడు.. నీలో అప్పటికి పరిణతి చెందుతున్న ఎంటర్‌ప్రున్యుర్‌ కనిపించాడు నాకు. జ్ఞాపకముందా..ఆ రోజు మనం డెట్రాయిట్‌ మారియట్‌్‌ హోటల్‌లో కలిశాం.”
”ఊఁ …”
బయట వర్షం ఉధృతి పెరిగినట్లు కురుస్తున్న చినుకుల పెరిగే ధ్వని చెప్తోంది.

10
”అప్పటికి లీల అమెరికాలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియాకు వెళ్ళిపోయింది…ఆమె గురించి నువ్వు నాకు అప్పుడు చెప్పిన రెండు వాక్యాలు బాగా గుర్తున్నాయి. ఆమె…’ఈ అమెరికా ఉద్యోగం..ఈ చిన్నచిన్న లావాదేవీలు నాకు తృప్తి నివ్వడం లేదు రామం..తిమింగలం  మహాసముద్రంలో ఉండాలిగాని చెరువులోకాదు అని అన్నట్లు నువ్వు నాకు చెప్పావు. ఐతే తిమింగలానికి చెరువనేది ఒకటుంటుందనే విషయమే తెలియదనే విషయం ఆమెకు తెలియదని తెలిసి ఆమెపై నాకు జాలి కల్గింది. మనిషి తనను తాను అతిగా అంచనా వేసుకోవడం పతనానికి మొదటి థ.. సరే.. ఆ రాత్రి నిజానికి మనం.. కాదు నేను నిన్ను నీవేమిటో తెలుసుకున్నాను. నువ్వు నా ఊహకందని ఒక కొత్త నీ  మనోప్రపంచం గురించీ,  నీ  మూలాలు ఎక్కడైతే..ఆంధ్రదేశంలో ఉన్నాయో అక్కడి ప్రజల గురించిన తపనా..అక్కడి పతనమౌతున్న మానవతా నైతిక విలువల గురించీ, అరాచకంగా ప్రబలుతున్న విచ్చలవిడితనం గురించే, హింసాత్మక ఉద్యమాల గురించీ, జనంలో వెర్రి తలలు వేస్తూ విజృంభిస్తున్న దోపిడిగురించీ చర్చించావు. ఒక మానవ సమాజంలో తేవలసిన సామాజిక పెనుమార్పులను నీ వ్యూహాత్మక కార్యాచరణతో ఎలా సాధించాలనుకుంటున్నావో కూడా చెప్పావు.. అక్కడ పడింది బీజం..”
”ఊఁ..”
”సరే..అదలా పెడ్తే..ఒక రోజు మనం పిట్స్‌బర్గ్‌లో కావాలని ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని, గుళ్ళో ప్రత్యేక పూజలు జరిపించి..ఒక లగ్జరీ రిక్రియేషన్‌ వెహికిల్‌ను తీసుకుని రెండు రోజులు అవగాహన యాత్ర చేశాం..పిచ్చి పిచ్చిగా, స్వేచ్ఛగా అమెరికా అంతా తిరుగుతూ..నిజమైన నిన్ను నేను..అసలైన నన్ను నువ్వు స్పష్టంగా తెలుసుకున్నాం..జ్ఞాపకముందా ఆరోజు పెన్సెల్వేనియాలో వన్‌ ఫిప్టీ నైన్‌ ఎగ్జిట్‌ వద్ద ఉన్న రెస్ట్‌ ప్లాజా పార్కింగు ఏరియాలో..ఆ రాత్రి.. ఇదేవిధంగా ఒక భోరుమని వర్షం కురుస్తున్న రాత్రి..ఆర్‌విలో..బెడ్‌పై నువ్వు పడుకున్నావు..నేను ఎదురుగా కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుని.. సమాధిలో ఉన్న మనిషిలా ధ్యానముద్రలో..అప్పుడు మన మధ్య ఒక గాఢ గంభీర నిశ్శబ్దం మాత్రమే ఉంది.. మనిషి అప్పుడప్పుడు ఏదో ఒక అంతర్‌కల్లోలంలో మునిగిఉన్నపుడు..శరీరం ఒట్టి నిమిత్తమై చుట్టూ ప్రపంచం ఒక హేతువుగా మిగిలి అంతా మిథ్యాగత వస్తువుగా గోచరిస్తుంది..ఆ స్థితిలో..నువ్వు అంతర్లోకాల్లోనుండి..మహాభాగవతంలోనుండి ఒక పద్యాన్ని స్వగతంలోలా చదివావు..అది ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు భగవంతుడెక్కడున్నాడని గుచ్చిగుచ్చి ప్రశ్నించినపుడు.. తండ్రిని పిచ్చివాడా..భగవంతుడు ఇక్కడ..ఇక్కడ..అని ఎక్కడ చూపించగలను..ఎక్కడ వెదికితే అక్కడ..ఎక్కడ దర్శించగలిగితే అక్కడే ఉన్నాడు..అని చెప్పిన అద్భుతమైన పద్యం..”కలడు అంభోధి, కలండు గాలి, కలడు ఆకాశంబునన్‌, కుంభినిన్‌ గలడు, అగ్నిన్‌ దిశలన్‌..”చదివావు. పోతన రాసిన ఆ ధారాపాతమూ, ఆపాత మధురమూ ఐన ఆ పద్యాన్ని ధ్యాన ముద్రలో ఉండి విన్న నేను..నువ్వు ఆ పద్యాన్ని చదవడం పూర్తి చేయగానే..ఒక పారవశ్యమాధుర్యంలో సమాధియై ఆ పద్యాన్ని ఉన్నదున్నట్టుగా మొదటి అక్షరంనుండి చివరదాకా గడగడా రాగయుక్తంగా చదివి వినిపించాను.
నువ్వు ఆశ్చర్యంతో కొయ్యబారిపోయావు..అసలేం జరిగిందో నీకర్థం కాలేదు..పోతన అసాధారణమైన, ప్రాణప్రదమైన పదాల కూర్పుతో రాసిన, పలకడానికే కష్టమైన ఆ పద్యాన్ని..అసలు తెలుగు భాషే రాని నేను ఒట్టిగా ఒక్కసారే విని ఉన్నదున్నట్లుగా పునరుత్పత్తి చేయడం నిన్ను అప్రతిభుణ్ణి చేసింది. అప్పుడు మొదటిసారిగా నాలో ఉన్న అసమాన జ్ఞాపక శక్తిగురించి తెలిసింది నీకు. నా మెదడు ఒక టేప్‌రికార్డర్‌ వంటిది..ఒకసారి దానికి ‘రికార్డ్‌’ కమాండ్‌ ఇస్తే అర్థం చేసుకోవడంతో నిమిత్తం లేకుండా మెదడులో అంతా ముద్రించబడ్తుంది. ఒక మిగిలింది రివైండ్‌ అండ్‌ ప్లే..మళ్ళీ చదువు క్యాథీ అని అడిగావు నువ్వు ఆ షాక్‌లోనుండి కోలుకుంటూ..నేను మారు మాట్లాడకుండా ఆ పద్యాన్ని మళ్ళీ మొదట్నుండి చివరిదాకా చదివి వినిపించాను. ఉక్కిరిబిక్కిరైన నువ్వు చటుక్కున నీ బెడ్‌పైనుండి లేచివచ్చి నన్ను గట్టిగా ఆలింగనం చేసుకుని పెదవులపై గట్టిగా ముద్దుపెట్టుకున్నావు. అది మన మధ్య మొదటి..పవిత్రమైన చుంబనం.” ఆగి..మాట తడబడి..గద్గదమైపోయి.. చలించిపోతూ,
అప్పటిదాకా కళ్ళుమూసుకుని వింటున్న రామం..ఆమె చెబ్తున్న దృశ్యాన్ని మననం చేసుకుని..ఆనాటి జ్ఞాపకంలో తడిచి.,
మధ్య ఒక మాటలులేని మౌనం పెల్లుబికింది.
”తెలుగు బాషపట్ల ఎందుకో నాకు వ్యామోహం కలిగింది. నాన్న పోయిన తర్వాత ఆ దుఃఖాన్ని మరిచిపోయేందుకో, నన్ను నేను సంభాళించుకునేందుకో, లేక నన్ను నేను మరిచిపోయేందుకోగాని నేను చేసిన అతి ప్రయోజనకరమైన పని తెలుగును సమగ్రంగా నేర్చుకోవడం, తెలుగు వారసత్వ సాహిత్యాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకోవడం. ఆముక్తమాల్యద వంటి మహాకావ్యాన్ని స్వయంగా చదివి అర్థంచేసుకునే స్థితిని సాధించడం మామూలు విషయంకాదు. మనిషికి భగవంతుడు ప్రసాధించిన ప్రజ్ఞ ఒక వరమైతే దాన్ని ఎప్పటికప్పుడు పదునుపెట్టుకుంటూ నిర్మాణాత్మకంగా ఉపయోగించుకోవడం అదృష్టం. నేను అదృష్టవంతురాలిని. అందుకే ఎప్పుడూ సానుకూలధోరణే నన్ను నడిపిస్తూంటుంది. తెలుగు సాహిత్యంలో నన్ను వహ్వాయిది ఎంత అద్భుతం అని అనిపించిన వచనం మహాభాగవతంలో నరసింహావతార అవిర్భావ సందర్భంలో.. విష్ణుమూర్తి స్తంభాన్ని చీల్చుకుని వెలువడే మహాభీకర సందర్భాన్ని వర్ణించిన రెండున్నర పేజీల ఎవరైనా ఏకబిగిన చదువలేని వచనధార ఉంది.. అది ఒక అద్భుతం. దేశంలో ఏ ఒకటోరెండో శాతం అక్షరాస్యత ఉన్న కాలంలో పామరజనం కేవలం మౌఖికంగా విని అర్థంచేసుకుని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ధారణచేయగల అతిసాధారణ అలతి అలతి పదాలతో జీవితసత్యాలను సజీవ ఉపమానాలతో ఆటవెలదులుగా తెలుగుజాతికీ, ప్రపంచానికీ అందించిన ఏకైక తెలుగు మహాకవి యోగి వేమన. యిందరు మహానుభావులను కన్న పవిత్రనేలపై రామం అనబడే ఈ వ్యక్తి కూడా జన్మించడం ఎంత అదృష్టమో అని పరవశించిపోతాన్నేను.. రామం నువ్వు నా దృష్టిలో కారణజన్ముడవు..నువ్వు మాత్రమే నిర్వర్తించవలసిన కొన్ని ఘనకార్యాలు నీకోసం వేచి ఎదురుచూస్తున్నాయి. యిక సమయం ఆసన్నమైంది. ఒక సువర్ణ ఆధ్యాయానికి తెరలేవబోతోంది..ఒక కొత్త చరిత్రకు అంకురార్పణ జరుగబోతోంది..అందుకు ముహూర్తం నిర్ణయించాను రామం. అందుకు సర్వరంగాలనూ సన్నద్ధం చేశాను. సకల శక్తులనూ సమీకరించి ఉంచాను..యిక నువ్వు శంఖాన్ని పూరించడమే తరువాయి..”
రామంకు ఆ ముహూర్తం సంగతీ..కార్యక్రమ రూపకల్పన సంగతీ..అన్నీ తెలుసు. కాని..అన్నాడు..”ఎప్పుడు క్యాథీ” అని.
”ఈ రోజు ఆగస్ట్‌ పది..మనం యుఎస్‌ఎలో ఉన్న మన అన్ని లావాదేవీలనూ జీరో చేయడమో, కొన్నింటిని మనం మళ్ళీ యిక్కడికి ఫిజికల్‌గా తిరిగివచ్చి నిర్వహించవలసిన అవసరం లేకుండా రీషేప్‌ చేయడమో చేశాను. వాటి వివరాలు చెప్పనా.”
”ఊఁ..”
”నువ్విక్కడికి వచ్చి భవిష్యత్తులో ఆంధ్రదేశంలో నువ్వు నిర్వర్తించవలసిన భావికార్యక్రమాల నిర్వహణ దృష్ట్యా కొన్ని నిధులు అవసరమనే వాస్తవిక సత్యాన్ని గ్రహించి పదేళ్ళ కాలంలో మెరుగైన ఫలితాలనివ్వగల కొన్ని కంపెనీలను స్థాపించావు. అవి ఆర్‌వి కన్‌స్ట్రక్షన్స్‌, న్యూ ల్యాండ్‌స్కేపింగు పీపుల్‌, రామం రియల్‌ రిఆల్టర్స్‌, ఎబిసి లాగిస్టిక్స్‌, సిన్సియర్‌ కన్‌సల్టెంట్స్‌, రామం సిస్టమ్స్‌. ఇవి కాక ఎనిమిది రాష్ట్రాల్లో ఎనిమిది ఇండియన్‌ స్టోర్స్‌ అటాచ్డ్‌విత్‌ ఇండియన్‌ రెస్టారెంట్స్‌.. చెయిన్‌. వీటి విలువ ఎస్టాబ్లిష్‌మెంట్‌ టైంలో ఇరవై మిలియన్‌ డాలర్లు. దీంతో నువ్వు నీ స్నేహితులద్వారా నీకున్న మేనేజ్‌మెంట్‌ స్కిల్సన్నీ ఉపయోగించి పెట్టుబడి పెట్టిన క్యాపిటల్‌ మూడు బిలియన్‌ డాలర్స్‌. మిగతావన్నీ వివిధ బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలు.మనకు ఎక్కువగా సహకరించి డబ్బును సమకూర్చిన బ్యాంక్స్‌ బ్యాంకాఫ్‌ అమెరికా, సిటిగ్రూప్‌, మోర్గాన్‌ స్టేన్లే, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, సన్‌ట్రస్ట్‌, క్యాపిటల్‌ వన్‌ ఫిన్‌.. వీటితో చాలా బ్యాంకులకు నాన్నకు చెందిన హోల్డింగ్సును మొదట సెక్యూరిటీగా చూపాం. తర్వాత బెస్ట్‌ పర్‌ఫార్మింగు కంపెనీస్‌ క్రింద మన సంస్థలకన్నింటికీ ఈ పైనాన్సియల్‌ ఇన్‌స్టిట్యూషన్లలో పరపతి పెరిగింది.
మన ప్రణాళిక పకడ్బందీగా ఉంది కాబట్టి డెడ్‌లైన్‌ను దృష్టిలో పెట్టుకుని కార్యకలాపాలనను నిర్వహిస్తూ వచ్చాం. మొన్నటి మార్చి ఫైనాన్షియల్‌ ఇయర్‌ నాటికి మన సంస్థల పర్‌ఫార్మెన్స్‌ను ఖచ్చితంగా మదింపుచేశాను. యిప్పుడు మన నెట్‌ అసెట్‌ వ్యాల్యూ ఇరవైరెండు బిలియన్‌ డాలర్స్‌. నా తరపున ఉన్న హోల్డింగ్సు విలువ ఎనిమిది బిలియన్‌ డాలర్స్‌. మనం చెల్లించవలసిన లయబిలిటీస్‌ మొత్తం ఆరు బిలియన్‌ డాలర్స్‌. మన ఆర్థికస్థితిగతులు ఎంతో ఆరోగ్యంగానే ఉన్నట్టు లెక్క”.
రామం తదేకంగా క్యాథీవైపు చూస్తున్నాడు.
ఒక పెద్ద ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ తన బోర్డాఫ్‌ డైరెక్టర్స్‌ మీటింగును జరుపుతున్నప్పుడు జరిగే ప్రధాన తతంగాన్నంతా క్యాథీ ఒక్కతే ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తోందీ..అనుకున్నాడు..ఈ ఒక్క మనిషి పదిమంది సమర్థులైన మేనేజర్లతో సమానం అనికూడా అనుకున్నాడు. కాగా విశ్వసనీయత సంగతో..ఆమెను నమ్మడమంటే తనను తాను, తన నీడనుతాను, తన ఆత్మనుతాను విశ్వసించినట్టే.
ఒకసారి క్యాథీతో తను చర్చించిన చిత్రమైన విషయం జ్ఞాపకమొచ్చింది రామంకు.
”క్యాథీ..ఒక మనిషి ఒక జీవితకాలంలో రెండు మూడు జీవితాలను జీవించడం, ఒక మనిషి యాభై ఏండ్లకాలంలో వందేళ్ళకాలం జీవించడం, మనిషి ఎన్నేండ్లయినా జీవిస్తూకూడా మరణిస్తూనే ఉండడం తెలుసా నీకు”. అన్నాడొకసారి తామిద్దరూ ఒక కంపెనీతో ప్రధాన వ్యాపార విషయాలను చర్చించడానికి, ఒక అగ్రిమెంట్‌ను సంతకం చేయడానికి డల్లెస్‌ వెళ్తున్నపుడు కార్లో.
”చెప్పు” అంది ఆసక్తిగా.
”ఒకతను ఉద్యోగరీత్యా ఒక ఉపాధ్యాయుడు..ఉపాధ్యాయునిగా అద్భుతంగా పాఠాలు చెప్పడం, ఉద్యోగానికి న్యాయం చేయడం..దాన్ని అలాగే నియమితకాలం వరకు కొనసాగించడం ఒక జీవితాన్ని జీవించడం. ఐతే ఆ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూనే ఒక రచయితగా, ఒక పెయింటర్‌గా లేదా ఇంకేదోరంగంలో నిపుణునిగా తనను తాను మలచుకుని రాణించడం..అంటే మనిషి ఏకకాలంలో ఒకటికంటే ఎక్కువ జీవితాలను జీవించడం. కాగా మనిషి తన జీవితకాలంలో యిరవై ఐదేండ్లవరకు చదువు, తర్వాత ముప్పయి ఏండ్లు ఉద్యోగం చేస్తూ కొంత డబ్బు సంపాదించి కొన్ని బాధ్యతలు నిర్వర్తించి, కొన్ని విజయాలు సాధించి..మొత్తం సమగ్రతను ఎనభైఏండ్లలో పూర్తిచేయగలిగినట్టయితే..అవే పనులను దాదాపు నలభై ఏండ్లలో సాధ్యంచేసినట్టయితే అది ఏభై ఏండ్లలో వందేండ్ల జీవితాన్ని జీవించడం వంటిది. ఒకడు అరవై ఏండ్లకు మంత్రికాగలిగితే మరొకడు ముప్పయ్యేండ్లకే మంత్రి ఐనట్టు..ఒకడు పుట్టి ఏ రంగంలోనూ రాణించక, దేన్నీ సాధించలేక ఒక ప్రాణమున్న వ్యర్థ పదార్థంగా మిగిలిపోవడం అంటే జీవిస్తూకూడా మరణిస్తూండడం..ఐతే మనం ఏ రకంగా జీవిద్దాం అనేదాన్ని మనిషి ఎవరికివారు ముందే నిర్వచించుకొని ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతే బాగుండేది. కాని యిప్పటికీ అరవై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలోని ముప్పావుకన్న ఎక్కువ జనాభా. జీవిస్తున్నామంటే..బస్‌ అంతే.. అలా జీవిస్తున్నాం..అని ఉబుసుపోకకోసమే జీవిస్తున్నారు. చాలామంది దురదృష్టవశాత్తు సాధ్యమైనంత ఎక్కువ డబ్బును సంపాదిస్తే అంత బాగా జీవిస్తున్నట్లుగా భావిస్తున్నారు. ముఖ్యంగా చదువుకున్న మూర్ఖులు. ఈ భావనే భారతదేశాన్ని కకావికలు చేసి అస్థిరపరుస్తూ ఎదగకుండా చేస్తోంది..”
”ఔను…ఈ విషయాన్ని నేను గ్రహించాను రామం” అంది క్యాథీ.
క్యాథీ ఏ విషయాన్నైనా సూక్ష్మస్థాయిలో అర్థంచేసుకుని తొందరగా ప్రతిస్పందించడంలో ఎంతో చురుకైంది. అదొక అసాధారణ ప్రతిభ.
”మనం సెప్టెంబర్‌ ఐదవతేదీన భారతదేశంలో ఉండేట్టుగా..అంటే మూడవతేదీ రాత్రి పది గంటల యాభై నిముషాల కతార్‌ ఏర్‌వేస్‌ ప్లయిట్‌ క్యుఆర్‌ టుఫిఫ్టీలో హైద్రాబాద్‌ బయలుదేరబోతున్నాం. మన భావి నిరాడంబర కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఈ పర్యటనతో యిక ముందు ఎకానమీ తరగతుల్లోనే మన ప్రయాణం. ఆ రోజు మన ఇద్దరితోపాటు యిక్కడమనం తయారుచేసిన పదిమంది యువతీయువకుల బృందంకూడా యిక అమెరికాలో తమ కార్యకలాపాలను మూసేసి మన భావి రాజకీయ కార్యకర్తలుగా మనవెంట ఉంటారు. వీళ్ళందరూ గత మూడేళ్ళుగా మనతో భవిష్యత్తుగురించి లోతుగా చర్చిస్తూ, మన ఆలోచనలతో, మన లక్ష్యాలతో పూర్తిగా ఏకీభవించే వాళ్ళు. ఏడ్గురు యువకులు. ముగ్గురు యువతులు. యువకుల గ్రూప్‌కు శివ నాయకత్వం వహిస్తారు. కౌస్తుభ యువతులకు నాయకత్వం వహిస్తుంది. వీళ్ళు మన ప్రధానాంగాలు. యిప్పటికే ఈ మధ్య నువ్వు అనేక సార్లు హైద్రాబాద్‌ వెళ్ళి గోపీనాథ్‌ గారితో చర్చించావుగదా. కాగా ఆయనకూడా రెండుసార్లు యిక్కడికి స్టేట్స్‌ వచ్చి మనతో విపులంగా మనం చేపట్టవలసిన పంథా గురించి ఆలోచనలను పంచుకున్నారు. చాలాలోతుగా విశ్లేషించి మన భావి కార్యక్రమాలకు డాక్టర్‌ గోపీనాథ్‌ గారిని మన సిద్ధాంతకర్తగా, గురువుగా స్థిరీకరించాం. మనం స్థాపించబోయే సంస్థపేరు ‘జనసేన’. ఇది ఒక సామాజిక సంస్థ. రాజకీయ పార్టీకాదు. యిప్పటికే దీన్ని మనం హైద్రాబాద్‌లో రిజిష్టర్‌ చేశాం. నంబర్‌ 2305 అబ్లిక్‌ టు జీరో జీరోనైన్‌. గోపీనాథ్‌గారు దాదాపు ఆరు పేజీలుగల జనసేన మానిఫెస్టోను రాసి మనకు సబ్‌మిట్‌ చేస్తే మనం దాన్ని అంగీకరించి ప్రచురించి మన సభ్యులందరికీ పంపిణీ చేశాం. తర్వాత దానికి విపులమైన వివరణాత్మక పాఠాలను మరో పుస్తకంగా ప్రచురించాం. అది నూటా నలభైపేజీలు ఉంది. అది ‘జనసేన లక్ష్యాలు-కార్యాచరణ’ అనే పేరుతో మన మిత్రులందరికీ అందింది.”
రామంకు తను అనేక సందర్భాలలో క్యాథీతో చర్చించిన భవిష్యత్‌ కార్యాచరణ పథకాలను, సంస్కరణ తాలూకు చింతనను, తేవలసిన నిశ్శబ్ద విప్లవం తాలూకు పెనుమార్పుల మూలాలను చర్చించడం..ఆమె వాటిని ఒక క్రమంలో కూర్చడం..ఒక రూపురేఖనిచ్చి డాక్టర్‌ గోపీనాథ్‌ ద్వారా దానికి సిద్ధాంత స్వరూపాలను కల్పించడం..ఇదంతా ఒక పవిత్రమైన గురుతర బాధ్యతగా జ్ఞాపకమొచ్చి.,
”చెప్పు క్యాథీ..నువ్వు అసలైన మన కార్యరంగం గురించి చెబుతూంటే..నాకు నాలోకి నేను చూచుకుంటున్న అనుభూతి కలుగుతోంది. కాగా కార్యోత్సాహంకూడా ఉరకలేస్తోంది. నువ్వన్నట్టు ఇక మన శక్తివంతమైన ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. ప్రాతఃసమయం ఆసన్నమౌతున్నప్పుడు సూర్యోదయాన్ని ఎవడాపగలడు..ప్లీజ్‌ కంటిన్యూ..మనం ఇంత విపులంగా మనల్నిమనం సమీక్షించుకోవడం మున్ముందు సాధ్యంకాకపోవచ్చుకూడా..ఈ సన్నివేశం యిప్పుడెంతో ప్రధానమైంది..”
క్యాథీ సాలోచనగా రామం ముఖంలోకి చూచింది. అతను యోగముద్రలో ఉన్న ఋషిలా నిర్మలంగా ఉన్నాడు.
ఆమెకు ఎందుకో పుచ్చలపల్లి సుందరయ్య జ్ఞాపకమొచ్చాడు. ఒక బనారస్‌ హిందూ యూనివర్సీటీ స్థాపించిన మదన్‌మోహన్‌ మాలవీయ జ్ఞాపకమొచ్చాడు.
”మన కార్యక్షేత్రం వరంగల్లు. మనం ఏది చేసినా ప్రజలు మనను మొదట స్కాన్‌ చేస్తారు. త్యాగాల గురించీ సిద్ధాంతాల గురించీ, ఆదర్శాల గురించీ నీతులు చెప్పే నాయకులు తమ నిజజీవితంలో ఎంతవరకు వాటిని పాటిస్తున్నారు, ఆచరిస్తున్నారు..అని ప్రశ్నించుకుంటారు. ప్రశ్నిస్తారుకూడా. అందుకని.. మనం వరంగల్లు నగరంలో..కాశిబుగ్గ నుండి మొగిలిచెర్ల పోయే రోడ్డుకు అనుకుని రెండు ఎకరాల స్థలంలో..బాలసంత గూడేనికి  యివతల..ఒక ఆశ్రమంవంటి కుటీరాన్ని నిర్మిస్తున్నాను. అందుకోసం భూసేకరణ, నిర్మాణం కూడా ప్రారంభమైంది..నీతో పాటు ప్రక్కనున్న చిన్న కుటీరంలోనీ అనుచరిగా.. సహచరిగా కాదు..”చటుక్కున ఆగింది క్యాథీ.,
”ఊ.. ఈ రెండూ వేర్వేరు కదా..కాని నా దృష్టిలో..మనిద్దరికి సంబంధించి ఈ రెండూ ఒక్కటే.. క్యాథీ.. శరీరం ఆత్మ వేర్వేరుగా మనలేవు. ఆ రెండూ తమ సంయుక్తతను విడిచిపెట్టడాన్నే మరణం అంటారు.” అన్నాడు రామం.
బయట వర్షం ఇంకా ఉధృతంగా కురుస్తూనే ఉంది.
”పక్క కుటీరంలో అహర్నిశలు శరీరంవెంట ఆత్మలా, వస్తువు వెంట నీడలా నేను నివాసముంటాను”
”ఊఁ..”
”భారతదేశంలో..ప్రధానంగా ఆంధ్రదేశంలో గత యాభై సంవత్సరాల రాజకీయ నేపథ్యాన్ని అనేక రాత్రులకు రాత్రులు మేల్కొని సమగ్రంగా అధ్యయనం చేశాను రామం. బ్రిటిష్‌ పరిపాలనలో ఉన్న కోస్తా జిల్లాలకు అధికారిగా వచ్చిన సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ గోదావరి నది సంస్పర్శతో ఎంత పులకించి అపర భగీరథునిగా నాల్గు జిల్లాలకు శాశ్వత సాగునీటి వసతిని ప్రసాదించి ఒక దేవునిగా మిగిలిపోయాడు, చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ ఒక బ్రిటిష్‌ అధికారిగా తెలుగు భాషపట్ల నావలెనే మోహావేశంతో కడపకేంద్రంగా తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశాడు..తెలంగాణా జిల్లాలు నిజాం దుర్మార్గ దురహంకార పాలన క్రిందఅమానుషంగా ఎలా దోచుకోబడ్డాయి..తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం..తదనంతర కమ్యూనిస్ట్‌ ఉద్యమ విఫలం..చీలికలు..రజాకార్లు..తర్వాత భూస్వాములే కాంగ్రెస్‌ నాయకులుగా రూపాంతరంచెంది..దాశరధి రంగాచార్య చిల్లర దేవుళ్ళు, మోదుగుపూలలో చెప్పినట్టు ప్యూడల్‌ వ్యవస్థ ఎలా ప్రజాస్వామిక ముసుగులోకి మారిందీ..ఇవన్నీ సవివరంగా అధ్యయనం చేశాను రామం. కాలం ఉరుముకుంటూ, గర్జించుకుంటూ ఆంధ్రదేశాన్ని ఒక కుదుపు కుదిపి విడిచిపెట్టింది భారత స్వాతంత్య్ర ప్రకటన నాటికి.. ఐతే అసలు నిజమైన విషాదమంతా ఆగస్ట్‌, 15-1947 తర్వాతనే ప్రారంభమైంది. ఒక విషయం చెబుతే నువ్వు ఆశ్చర్యపోతావ్‌ రామం. 1955లో జవహర్‌లాల్‌ నెహ్రూచే శంకుస్థాపన చేయబడ్డ అతిపెద్ద మాసనరీ డామ్‌ ఐన నాగార్జునసాగర్‌ అప్పటి ప్లానింగు కమీషన్‌ చేత 80 కోట్ల రూపాయల ప్రాజెక్టుగా ప్రారంభించబడి చివరికి 1967లో ఇందిరాగాంధీచే ప్రారంభించబడ్డప్పుడు 91 కోట్ల రూపాయల నిధులతో పూర్తిచేయబడింది. అదే ప్రాజెక్టును యిప్పుడైతే నలభై వేల కోట్ల రూపాయలతో యిప్పటి దుర్మార్గులైన ఇంజినీర్లు నిర్మిస్తారు.. అందులో కనీసం పదిహేను వేల కోట్ల రూపాయలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపిటీసిలు, కార్పొరేటర్లు, చీఫ్‌ ఇంజినీర్లు, ఇఇలు, డియిలు, ఎయిలు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు.. ఇలా అందరూ వాటాలు వేసుకుని పంచుకు తింటారు. ప్రాజెక్ట్‌ పదిసంవత్సరాలు కాకుండానే తప్పకుండా కొట్టుకుపోతుంది. ఏమిటీ మార్పు. ఈ నిర్లజ్జతనానికి ప్రతీకలైన ఈ ప్రభుత్వాల, ప్రజల నీతిహీనత ఏ శాస్త్రానికీ అంతుబట్టడంలేదు. ఐతే ప్రజల ప్రవర్తన విషయంగా ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త అరిస్టాటిల్‌ ఏమన్నాడంటే..”
”…..” రామం వింటున్నాడు..ఓ పాఠాన్ని ఆసక్తిగా వింటున్న విద్యార్థిలా.
”ప్రజలెప్పుడూ అవకాశవాదులు. ఒక చిన్న పిల్లవాన్ని ఏ కాపలాలేని మిఠాయి దుకాన్లో కూర్చోబెడితే అవకాశముంది కాబట్టి జిహ్వాచాపల్యంతో దొంగతనంగా మిఠాయి తింటాడు. ఏదైనా నిఘా ఉంటే దొంగతనానికి శిక్ష తప్పనిసరిగా ఉంటుందంటే అదే పిల్లవాడు మిఠాయి స్వాహా చేయడు సరికదా తనూ ఓ కాపలాదారుడుగా వ్యవహరిస్తాడు. ఈ అతి సున్నితమైన తేడాను ప్రజాపరిపాలనతో సంబంధమున్న ప్రతివ్యక్తీ ప్రాథమికంగా గమనించాలని చెప్పాడాయన.. అందుకే యధా రాజా తధా ప్రజా నానుడి పుట్టింది. యిప్పుడు ఈ సామెతను యథా ప్రజా తథా రాజాగా మార్చి విచ్చలవిడి దౌర్జన్యాన్ని కొనసాగిస్తున్నారు. ఈ దౌర్జన్యం యిక భరించలేని గరిష్ఠస్తాయికి చేరింది. దీన్ని ధ్వంసం చేయాలి. లేకుంటే యిక వ్యవస్థ ఎవరూ బాగుచేయలేని అథమాథమ స్థితికి చేరుకుంటుంది.”
”…..” రామం కళ్ళు ఆమెను నిశితంగా అధ్యయిస్తున్నాయి. ఆమె అప్పుడు మహాభారత రణక్షేత్రంలో అర్జునునికి తత్వబోధను చేస్తున్న కృష్ణుని ముఖంలా ఉంది పరిపూర్ణంగా.
”యిక్కడ పరిపాలనకు సంబంధించిన ఒక ప్రధాన విషయాన్ని మనం కూలంకశంగా పరిశీలించాలి రామం. దేశం ఏదైనా.. ప్రజలు..ఆమాటకొస్తే మనుషులు ఏ పరిస్థితుల్లో తప్పకుండా చెప్పినమాట వింటారు..అంటే జవాబు..దేశభక్తి.. దేశంపట్ల ప్రేమ..మనిషికి మనిషి పట్ల గౌరవం..మానవత్వం..మానవతా విలువలు..గాడిద గుడ్డు..ఇలా కోటి సమాధానాలొస్తాయి – కాని సత్యమేమిటంటే..భయం. నేను ఈ చేయకూడని పనిచేస్తే ఎవరో తప్పకుండా తనను శిక్షించి కష్టమో, నష్టమో కలుగజేస్తాడని గ్యారంటీ ఉన్నప్పుడు మాత్రమే మనిషి తప్పకుండా ఎదుటి మనిషి చెప్పినమాట వింటాడు. అంతిమంగా మనిషిని ఋజుమార్గంలో పెట్టేదీ, సరియైన మార్గంలో నడిపించేదీ ‘భయం’ ఒక్కటే. ఏదో ఒక భయం లేనిది మనిషి చెప్పినమాట వినడు. ఒకసారి ‘భయం’ పేరుతో మనిషిని సరియైన దారిలో పెట్టగలిగితే, తర్వాత కౌన్సిలింగు చేసి, బుజ్జగించి, బుద్దిచెప్పి, నిజమైన నీతి వాక్యాలను, విలువలను బోధపరిచి యిక వ్యక్తిని ఉత్తమునిగా, ఉన్నతునిగా మార్చవచ్చు. యిది ఒక సంక్లిష్టమైన సందిగ్థ స్థితి.. పాలకులకు తెలియాల్సిన పరిపాలనా రహస్యం.
మనిషిలో పాదుకొల్పాల్సిన భయానికి మారుపేరు ‘బ్లాక్‌మెయిలింగు’ పరిపాలనలో, రాజకీయాల్లో, అధికారిక వ్యవహారాల్లో, కార్పొరేట్‌ కల్చర్‌లో ‘బ్లాక్‌మెయిలింగు’ అనేది అతిశక్తివంతమైన ఒక టూల్‌. వెనుకటి భారత రాజకీయాల్లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఒక తిరుగులేని నియంతను తలపింపే పటిష్టమైన పాలనను కొనసాగిస్తున్న కాలంలో ఒక ప్రచారం బలంగా వినిపించేది. అమె గురించిన పాలనాపరమైన పుస్తకాలను చదివినా ఈ విషయం తెలుస్తుంది..ఏమిటంటే ఎవరైనా తనకు ఎదురుతిరిగినప్పుడు, తోక జాడించినపుడు, నక్‌రాలు చేసినప్పుడు ఒంటరిగా తన చాంబర్‌లోకి పిలిపించుకుని వాని చరిత్రభూగోళాన్ని విప్పే ఫైల్స్‌ను ముందుంచేదని. యికవాడు కిక్కురుమనకుండా నోరు మూసుకుని ‘కింనాస్తి’ అయ్యేవాడని.. యిది ఒక అతిప్రధానమైన అంశం. కాబట్టి ఒక ఉద్యమాన్నిగానీ, పరిపాలననుగానీ కొనసాగిస్తున్న ప్రతి సమర్థవంతుడైననాయకుడు తన ప్రధాన శత్రువు యొక్క , తన ఆంతరంగికుల యొక్క, అతి సన్నిహిత మిత్రులయొక్క ఆంతరంగిక ప్రవర్తనల రికార్డును ఎప్పటికప్పుడు తయారుచేసుకుని పెట్టుకోవాలి. ఎప్పుడుకూడా ఎదురుతిరిగేవాడెవడయ్యా అంటే మన రహస్యాలను ఎక్కువగా తెలుసుకోగలిగే మన దగ్గరి మిత్రులే. వాళ్ళే ద్రోహులుగా, కోవర్టులుగా మారుతారు. పురాణాల్లో యింటిదొంగ విభీషణుడు కోవర్ట్‌గా మారాడు, మహాభారత యుద్ధంలో శల్యుడు ఇన్‌ఫార్మర్‌గా మారాడు. శకుడు మిత్రుని రూపంలో ఉన్న శత్రువుగా ప్రవర్తించాడు. వీళ్ళ గురించి తగు జాగ్రత వహించకపోతే అసలు లక్ష్యాలు దెబ్బతిని అంతా మిస్‌ఫైర్‌ ఔతుంది. ఐతే ఈ మనుషులను సరిగ్గా గుర్తించే వ్యవహారాన్ని అత్యంత విశ్వసనీయమైన వ్యక్తిమాత్రమే నిర్వహించాలి. అందుకే దీన్ని.. పరిశీలన.. నివేదన.. చర్య.. అనే ప్రధానమైన భాగాలుగా గల ఇంటెలిజెన్స్‌ బాధ్యతను నీకు ప్రథమ వలయ రక్షకులుగా ఉండే నేనూ, శివ తీసుకుంటాం. అత్యంత గోపనీయంగా ఈ మాడ్యూల్‌ ఉంటుంది. డైరెక్ట్‌ రిపోర్టింగు టు యు ఓన్లీ”…ఒక క్షణం ఆగి.,
”క్యాథీ మన జనసేన సంస్థ నిర్మాణ వివరాల్లోకి పోయేముందు..ఒకసారి స్థూలంగా ఈ అరవై సంవత్సరాల భారత రాజకీయ వ్యవస్థ యొక్క రూపురేఖలను మననం చేద్దాం..నువ్వన్నట్టు ఒక కీలకమైన గతం యొక్క చరిత్రను పునశ్చరణ చేసుకుంటే భవిష్యత్‌ ప్రణాళిక స్పష్టంగా మన కళ్ళముందు రూపుకడ్తుంది. ఐతే..ఏ కాలంలోనైనా ఎప్పుడూ దేశక్షేమం గురించి తీవ్రంగా స్పందిస్తూ ఆలోచించిన ఒక మేధోవర్గం ఉంటూనే వచ్చింది. వాళ్ళకు అధికారవ్యామోహం లేదు. స్పృహమాత్రమే ఉంది. ప్రగతికాంక్ష మాత్రమే ఉంది..” ఆగాడు రామం..ఎక్కడోతనను తాను కోల్పోతూ.
”భారత స్వాతంత్య్రం ప్రకటించబడ్డ కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే సంఘ స్వార్థపరశక్తులు విషకోరలతో విజృంభించడాన్ని శుద్ధ జాతీయవాదులందరూ గమనించారు. అప్పుడు ఓ వేయి పేజీల గ్రంథం చెప్పగల సారాంశాన్ని మహాకవి శ్రీశ్రీ ఒక్క పాటతో ప్రజానీకానికి నిద్రమత్తు విదివిస్తూ గర్జించాడు. అంటాడు.
‘స్వాతంత్రంవచ్చెననీ సభలే చేసి
సంబరపడగానే సరిపోదోయీ
సాధించినదానికి సంతృప్తిని పొందీ
అదే విజయమనుకుంటే పొరపాటోయీ’ అని  కర్తవ్యబోధను చేస్తూనే అప్పటికే విజృంభించిన రుగ్మతలను ఏకరువుపెట్టి ఒక హెచ్చరికను చేశాడు..చూడు
”ఆకాశం అందుకునే ధరలొకవైపు
అంతులేని నిరుద్యోగమింకొక వైపు
అవినీతి, బంధుప్రీతి, చీకటిబజారు
అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు” అని వాపోయాడు. ఈ స్థితి ఈ అరవై ఏళ్ళలో ఏకొంచెమైనా మెరుగుపడలేదు సరికాదా యింకా యింకా కుళ్ళిపోయి, క్షీణించి శుభ్రంచేయలేనంత మురుగుగా నరనరాన వ్యాపించింది. అప్పుడే జాతీయ, రాష్ట్రస్థాయిలో దేశానికి భంగం కలిగించే పాలసీలనూ, విధానాలనూ ఎండగడ్తూ కామ్రేడ్‌ తరిమెల నాగిరెడ్డి 1978లో ‘ఇండియా మార్టిగేజ్డ్‌’ పుస్తకాన్ని వెలువరించి ఒక షాక్‌ ట్రీట్‌మెంటిచ్చాడు. ఏం జరిగింది..ఒంటరిగా ఒకే ఒక యోధుని ప్రతిఘటన.. పుస్తక నిషేదం. ఎన్నో సార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డ వ్యక్తి ఈ దుర్మార్గ సూడో ప్రజాస్వామిక వ్యవస్థలో ఇమడలేక మార్సిస్ట్‌-లెనినిస్ట్‌ కానూసన్యాల్‌ విభాగం పేరుతో పోరాటం చేసీచేసీ..యిక్కడ ఓ విషయం జాగ్రత్తగా గమనించాలి రామం.. పాలకుల దమనకాండకు, అణచివేతకు, విచ్చలవిడి దోపిడీకి వ్యతిరేకంగా గత నలభై ఏండ్లకు పైగా తెలుగు నేలపై జరుగుతున్న తీవ్రవాద ఉద్యమాలన్నీకూడా ఎందుకు విఫలమైపోయాయంటే..వాటిలో మెజారిటీ సందర్భాల్లో సామాన్య ప్రజల భాగస్వామ్యం లేకపోవడమే. నక్సల్‌బరీలో ఓ భూపోరాట శక్తిగా..చిన్న మొక్కగా పొటమరించి నక్సలైట్‌ ఉద్యమంగా విస్తరించి, ఎదిగి శ్రీకాకుళ సాయుధ పోరాటంగా వెంపటాపు సత్యం, పంచాది నిర్మల, అధిభట్ల కైలాసం..వంటి అమరవీరుల నేతృత్వంలో అంటుకున్న అగ్నిలా ఉత్తర తెలంగా జిల్లాల గుండెల్లోకి విప్లవాగ్నియై విజృంభించినా..మొదట్లో మెడికల్‌, ఇంజనీరింగు విద్యార్థుల సామూహిక ప్రవేశంతో విద్యుత్తులా అడవుల్లోకి ప్రవహించినా..పీపుల్స్‌వార్‌గా మారి..అటు తర్వాత మావోయిస్ట్‌లుగా పేరుమార్చుకుని అనేక అంతర్గత కుమ్ములాటతో వర్గపోరాటంపేరుతో శత్రునిర్మూలనను చేపట్టి చివరికి పార్టీలోని వ్యక్తిగత కక్షలసాధింపు యంత్రాంగంగా పరిణమించి, అర్థంపర్థంలేని హింసలతో, హింసాత్మక చర్యలతో.. నిజంగా ద్రోహులుగాహిరంగంగా ముద్రపడ్డ ఏ ఒక్క రాజకీయ నాయకున్నీ, ఏ ఒక్క లంచగొండి ప్రభుత్వ అధికారినీ చంపకుండా చివరికి మావోయిస్ట్‌ ఉద్యమమంటే పోలీసులకూ, అడవుల్లో ఉండే ఎవరికో నడుమ జరిగే పాశవిక పరస్పర నిర్మూలనచర్యగా సామాన్యజనం అర్థంచేసుకునే స్థితికి చేరింది. ఐనా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టబడిన ఏ సిద్దాంతమైనా ఓ నలభై ఐదేండ్ల సుదీర్ఘకాలంలో తనముద్రను ప్రజల్లో వేయలేకపోయిందీ, జనాదరణను పొందలేకపోయిందీ, ప్రజల ఆమోదాన్ని పొందలేకపోయిందీ అంటే అది ఒక విఫలంకిందే లెక్క. ప్రతి ప్రయోగానికీ కొంత కాల అవధి ఉంటుంది… యిప్పుడు ప్రపంచీకరణ నేపథ్యంలో గిరిజనులు ఆదివాసీలు అరణ్యవనరుల దోపిడీకి ప్రతిఘటన పేరుతో అర్ధవంతమైన ఉద్యమాలు మధ్య భారతంలో జరుగుతున్నా..అవి ప్రధానంగా ప్రజాబాహుళ్యంలో నైతికపరమైన పరివర్తననూ, విచ్చలవిడిగా పెరిగిపోతున్న అవినీతి, లంచగొండితనం నిర్మూలన దిశగా ఆలోచిస్తూ పనిచేయడం లేదు. అవి దారి తప్పాయి. అందుకే విద్యావంతులూ, అభ్యుదయవాదులెవ్వరూ ఈ ఉద్యమాలపట్ల ఆసక్తి చూపడంలేదు. కాడర్‌ రిక్రూట్‌మెంట్స్‌ బాగా తగ్గిపోయాయి. గత నెల నేను చత్తీస్‌గడ్‌, ఒరిస్సా లోతట్టు ప్రాంతాల అనేక గ్రామాల్లో పర్యటించినపుడు కొన్ని వందలమంది ఆదివాసీ పౌరులతో మాట్లాడాను. వాళ్ళు నిజానికి ఒకవైపు ప్రభుత్వ అనధికార ఏజన్సీ సాల్వజుడుం, పోలీసులు, సిఆర్‌పిఎఫ్‌ దళాలు మారోవైపు అజ్ఞాత మావోయిస్ట్‌ దళాలమధ్య మింగలేక చావలేక నలిగిపోతున్నారు. వాళ్ళిప్పుడు అందరూ తమను విడిచిపెట్టి వెళ్ళి యిదివరకటిలా తమదారిన తమను ప్రశాంతంగా అడవిలో బ్రతకనిస్తే చాలు మహాప్రభో అన్న దుఃఖంనిండిన విసుగుదలతో ఉన్నారు. వాళ్ళకు ఈ దిక్కుమాలిన దోపిడీ రాజకీయాలపట్ల, రక్తపాతంపట్ల, పరస్పర హింసపట్ల, తనవాళ్ళను తామే నిర్మూలించుకోవడం పట్ల ఏమాత్రం ఆసక్తిలేదు. ఈ ‘హిట్‌ అండ్‌ మిస్‌’ సిద్ధాంతానికి కాలం చెల్లింది. యిప్పుడు ‘స్టే అండ్‌ హిట్‌’ సూత్రం కావాలి. ప్రజల్లోకివెళ్ళి ప్రజలతో కలిసి జీవిస్తూ ప్రజలతో మమేకమై, ప్రజలను విద్యావంతులను కాకుండా నైతికవంతులను చేసే ఒక వినూత్న నిశ్శబ్ధ విప్లవ పంథా యిప్పుడు కావాలి. ఈ ప్రభుత్వాలు అవినీతి, అధికారం, డబ్బు, లంచగొండితనం, మద్యం, మీడియా, వ్యామోహల సరఫరా అనే అదృశ్య ఉచ్చును ప్రజలపై విసిరి వాళ్ళను నిద్రబుచ్చి, బందీలను చేసి దుర్మార్గమైన పాలనను కొనసాగిస్తున్నాయి. దీనిని పునాదితో సహా పెకిలించి సమూలంగా నిర్మూలించాలి.. అలా చేయడం అసాధ్యంకాదు. ఈ స్థితి కుళ్ళి కుళ్ళి, ఆ దుర్వాసన చుట్టు ప్రక్కకు వ్యాపించి యిక భరించలేని స్థాయికి క్షీణించిపోయింది. పీతికంపులో ఎవరైనా ఎంతకాలం ఉండగల్గుతారు. నిజమైన ప్రజలు విసిగి విసిగి, అలసి అలసి ఏదో ఒక నిజాయితీగా సంస్కరించ సంకల్పించే ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. స్వతంత్రం అరాచకత్వంగా, స్వేచ్ఛ విశృంఖలత్వంగా మారి గుండాయిజం, నేరం, మాఫియా చట్టసభల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, శాసనకర్తలుగా మారి రాక్షస హాహాకారాలు చేస్తున్న వర్తమానం ఎంత చెడిపోయిందో..ఈ రోజు దినపత్రికలోని ఈ న్యూస్‌ ఐటం చదివితే తెలుస్తుంది.
‘ఇక కిక్కేకిక్కు…మద్యం ఆదాయం ఏడువేల కోట్లు. ఈ సంవత్సరం తాజా మద్యం టెండర్ల ద్వారా నలభై ఎనిమిది కోట్లు ప్రభుత్వానికి లభించాయి. దీనికి లైసెన్స్‌ ఫీజుమొత్తాన్ని కలిపితే మద్యం టెండర్లపై లభించిన ఆదాయం మొత్తం రూ|| 7 వేల కోట్లకు చేరుకుంది. రాష్ట్రం మొత్తం మీద 650  మద్యం దుకాణాలకు 48,602 టెండర్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు జిల్లా దాచేపల్లి, నడికుడి గ్రామం రూ|| 5,21,11,111 షాపు ధర పలికింది కాగా ఈ సంవత్సరం
యిదివరకు మద్యం వ్యాపారంలో ఉన్న వ్యక్తులకు గాక కొత్తగా ఈ వ్యాపారంలోకి వచ్చిన 60 శాతం మందికి కొత్త షాపులు దక్కాయి. కోస్తా జిల్లాలలో మద్యం వ్యాపారంలోకి మంత్రులు, శాసనసభ్యులు కూడా రంగప్రవేశం చేసి షాపులు దక్కించుకున్నారు.. ఐతే కొసమెరుపేమిటంటే.. మొన్నెన్నడూ కనీవిని ఎరుగని విధంగా వేలం పాటలో వందమంది మహిళలకు మద్యం షాపులు దక్కడం.
క్రిందనే ఇంకో న్యూస్‌ ఐటం ఉంది.
‘ఆదాయంకోసం ప్రభుత్వం వ్యభిచార గృహాలనుకూడా నడుపుతుందా’ అని హెడ్డింగు.
‘రాత్రి ఏడుగంటలు దాటిందంటే మహిళలు రోడ్లమీద నడచి క్షేమంగా ఇంటికి చేరలేకపోతున్నారు. రోడ్‌కు యిరువైపులా బహిరంగంగా నిస్సిగ్గుగా తాగుతూ దారినపోతున్న ఆడవాళ్ళపై నానా కారుకూతలు కూస్తున్నారు. దుర్‌వ్యాఖ్యలతో బూతులు మాట్లాడ్తున్నారు. ప్రభుత్వమే స్వయంగా కాలేజీల ప్రక్కన, దేవాలయాల పక్కన బార్లకు, బ్రాందీషాపులకు పర్మిషన్‌ యిచ్చి విద్యార్థులనుకూడా తాగుబోతులుగా, అసాంఘికశక్తులుగా మారుస్తోంది. మహిళలను, యువతరానికి రక్షణ కల్పించి భాద్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దవలసిన ప్రభుత్వమే పూర్తిగా అనైతికంగామారి వెనుకటి పురాణకాలం నాటి రాక్షస పాలనను తలపిస్తోంది’ అని అల్వాల్‌ ప్రాంతంలోని పలుమహిళలు వాపోయారు. ఒకరైతే ఆగ్రహవేశాలతో ఊగిపోతూ ఈ ప్రభుత్వానికి పోయేకాలం దాపురించింది..ఆదాయమే ప్రధానమైతే ప్రభుత్వమే వ్యభిచార గృహాలనూ, జూదగృహాలనుకూడా నడపొచ్చుగదా అని వ్యాఖ్యానించారు’.
”వింటున్నావా రామం..స్త్రీ శక్తి స్వరూపిణీ అనీ, ఆదిశక్తి అనీ భారతదేశంలో భావిస్తారు గదా. అటువంటి పుణ్య భూమిపై ప్రభుత్వాలచేతనే స్త్రీ అవమానించబడి, అగౌరవపరచబడి ప్రవర్తిస్తూంటే..మంత్రులూ, శాసన సభ్యులూ మద్యం వ్యాపారంలో మునిగిపోతే..అసలు ఏం జరుగుతోంది. ఎవరు ఎక్కడ్నుండి ఎక్కడికి పతనమైపోతున్నారు. యింత జరుగుతూంటే ప్రజాసంఘాలు, మేధావులు, ఉద్యమకారులు, నక్సలైట్లు..మహిళాసంఘాలు..ఏంజేస్తున్నాయి. ప్రతిఘటించవలసిన వీరనారి మహిళ కూడా వంద బ్రాండీషాపులను నడుపడానికి సిద్ధపడ్తే…కనీసం సుమోటో కేస్‌గా స్వీకరించన్నా ఏ హైకోర్ట్‌ న్యాయమూర్తయినా ఈ దురాగతాలను ఆపవచ్చుగదా.” అంది క్యాథీ ఆవేశంగా, బాధగా.
”ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే ప్రభుత్వపరమైన అకృత్యాలలో ఇది ఒకటి మాత్రమే క్యాథీ. ఇలాంటి అకృత్యాలు ఇంకెన్నో కోకొల్లలున్నాయి. ఐతే అవి మద్యంవలె నేరుగా ప్రజాసంబంధాన్ని కలిగి ఉన్న వ్యవహారాలు కావు. నైన్త్‌క్లాస్‌, ఊర్మిళ టీచర్‌.. చెబుతుంది, ఆంటీ ఐ లౌయు వంటి బాలల మనసులను విషపూరితంచేసే సినిమాలకు అనుమతి, బ్లూ వెబ్‌సైట్లతో యువతను దోపిడీచేసే ఇంటర్‌నెట్‌ పార్లర్లు, రాత్రి పదకొండున్నర దాటితే మిడ్‌నైట్‌ మాసాలాలతో దాదాపు బూతు ఛానల్స్‌గా మారే అన్నీ టి.వి.ఛానళ్ళు, విచ్చలవిడి క్లబ్బులు, పబ్బులు…యివన్నీ సమాజం శరీరంమీద వెలసిన పుట్టకురుపులే. కేన్సర్‌రోగం బహుముఖీన దిశల్లో ఎంతోవేగంగా విస్తరిస్తోంది. దీనికి అతి త్వరలో భరించలేని నొప్పి కలిగినా సరే ఒక శాశ్వత శస్త్రచికిత్స జరగాలి.” రామం స్థిరంగా, నిశ్చలంగానే అన్నాడు.
ఇద్దరి మధ్య ఒట్టి నిశ్శబ్దం నెలకొంది కాస్సేపు..భాషలేని దుఃఖం ఎప్పుడూ మౌనంగానే పొగిలిపోతుంది.
బయట వర్షం కురుస్తూనే ఉంది.
”చాలా దుఃఖంగా, ఆందోళనగా…వేదనగా ఉంది క్యాథీ..సరే ఒకసారి ఫైనల్‌గా మన ‘జనసేన’ సంస్థాగత నిర్మాణ స్వరూపం, వివిధ అంగాలు, మూల విధానాలు..వీటి గురించి చెప్పు..నన్ను నేను ఒకసారి ట్యూన్‌ చేసుకుంటా చివరగా.. లెట్‌ ద ఫైనల్‌ పిక్చర్‌ ఎమర్జవుట్‌..”అన్నాడు రామం యోగనిద్రలో ఉన్నట్టు.
”యస్‌.. నేనూ అదే అనుకుంటున్నా రామం. మన సంస్థకు శిఖరాయనూనమైనవ్యక్తి సిద్ధాంతకర్త.. ఆయనను మనం ఆచార్య అని పిలుస్తాం. చంద్రగుప్తమౌర్యునికి చాణక్యునివలె, ప్రతాపరుద్రునికి యుగంధర మంత్రివలె, రాయలకు తిమ్మరుసువలె అతనే సంస్థకు అంతిమ మార్గదర్శి. మనకు ఆ స్థానంలో డాక్టర్‌ గోపీనాథ్‌ ఉంటారు. అతను జీవితాంతం ఒక కరుణార్థ్ర హృదయుడైన డాక్టర్‌గా, మెడికల్‌ కాలేజి ప్రొఫెసర్‌గా ఆదర్శ జీవితాన్ని జీవించారు. ఎక్కడా మచ్చలేని చరిత్ర అతనిది. సమాజం గురించీ, మానవ సమాజ వికాసం గురించీ ఎన్నో పుస్తకాలు రాశారు. ఎన్నో ప్రజాసంఘాల్లో చురుకైన పాత్రపోషించారు. ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని నాయకత్వం వహించారు. గంభీరమైన వ్యక్తి. ఎంతో దీర్ఘమైన, లోతైన అధ్యయనంచేసి నువ్వే రెండున్నర సంవత్సరాల క్రితం ఆయనను ఎంపిక చేశావు. మొట్టమొదట అతన్ని వరంగల్లులో కలిసి ఒక రోజంతా విపులంగా చర్చించి.. తర్వాత్తర్వాత దాదాపు ఇరవై రెండుసార్లు గోపీనాథ్‌గారు నీకు కలిశారు. సంస్థయొక్క మానిఫెస్టో రాసేందుకు రెండు దఫాలుగా రెండు నెలలు అమెరికా వచ్చి మనతో గడిపారు. చర్చించారు.. ఆలోచనలను కాగితంపై అక్షరబద్ధం చేశారు. ఐతే ప్రధానంగా మనది ఒక రాజకీయ పార్టీ కాదు. ఇది ఎన్నికల్లో పోటీచేయదు. రాజకీయ అధికారంకోసం ప్రాకులాడదు. కాని అతి శక్తివంతమైన ఒక ప్రజావేదికగా అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వచర్యనైనా వాచ్‌ డాగువలె గమనిస్తూ, పరిశీలిస్తూ ఒక ఇన్‌స్పెక్టర్‌వలె ప్రవర్తిస్తుంది. ఈ రకమైన పరిశీలకునిగా మన సంస్థ పనిచేయడానికి మనకున్న అధికారాలేమిటి.. అన్నది ఒక ప్రాథమిక ప్రశ్న…దానికి జవాబేమిటంటే ..భారత రాజ్యాంగం ప్రసాదించిన పౌర హక్కులు. ఈ దేశంలో శాసనబద్ధమైన ఎన్నో హక్కులు, బాధ్యతలు, విధులు, విధానాలూ అన్నీ సక్రమంగానే ఉన్నాయి. తప్పు జరుగుతున్నపుడు ఏ రాజకీయ చర్యనైనా, ఏ నాయకున్నైనా నిలదీసి ప్రశ్నించే అధికారం ప్రతి ఓటర్‌కు, పౌరునికే ఉంది. ఐతే యిప్పుడు ఏ ఓటరూ ఎవర్నీ ప్రశ్నించడం లేదు. ఎందుకంటే వ్యక్తి ఒంటరిగా బలహీనుడు. నిస్సహాయుడు. ప్రశ్నించడానికి భయపడ్తాడు. యిప్పుడు ప్రశ్నించడం మనిషికి నేర్పి వాడి వెనుక ‘జనసేన’ నిలబడి బలమైన గొంతుతో ప్రశ్నింపజేస్తుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతిపనికీ అకౌంటబిలిటీ.. అంటే జవాబుదారీతనం క్రింద ఏ పౌరుడడిగినా సరియైన సమాచారాన్నందించాలని ‘సమాచార చట్టం – 2005’ ఘోషిస్తోంది. అసలు మన ప్రజా ఉద్యమానికి ఈ ఒక్క సమాచార చట్టం దన్ను చాలు. ఇటీజ్‌ ఎ పవర్‌పుల్‌ టూల్‌.. విచీజ్‌ నాటెటాల్‌ యూజ్డ్‌ ప్రాపర్లీ బై ఎనీవన్‌, ఎనీటైం, ఎట్‌ ఎనీ ఇన్‌స్టెన్స్‌. ఉదాహరణకు ఒక యంపీ తనకు వచ్చిన రెండుకోట్ల రూపాయల యంపీ ల్యాడ్స్‌ ఫండ్స్‌ సంగతేమిటి, అవి ఎప్పుడు ఏ విధంగా ఏఏ పనులకు ఖర్చుచేయబడ్డాయో చెప్పమని ఒక ఓటరు..ఒక పౌరుడు యంపీని అడిగితే.. అతను తప్పకుండా వివరాలను కాగితంపై లిఖితపూర్వకంగా చెప్పాలి. చెప్పకపోవడం, చెప్పననడం శాసనోల్లంఘన. ఒక కాంట్రాక్టర్‌ ఓ రోడ్డును వేస్తున్నపుడు దాని ఎస్టిమేటెడ్‌ కాస్ట్‌, అలాటెడ్‌ కాస్ట్‌, నిర్మాణం పూర్తిచేయవలసిన కాలం, ప్రమాణాల వివరాలు ఇతరేతర అమలుచేయవలసిన వివరాలన్నీ ఒక బోర్డుపై రాసిపెట్టి ప్రజల సమాచార నిమిత్తం పనిజరుగుతున్నచోట ఉంచాలి. దాన్ని ధైర్యంగా ఏ పౌరుడు ప్రశ్నించినా కాంట్రాక్టర్‌ సమాధానం చెప్పాలి…కాని యిప్పుడెవరూ ఎక్కడా అటువంటి బోర్డు పెట్టడంలేదు.. ఎవరూ అడగడం లేదు. ఎవడూ ప్రశ్నించడం ఏదు..ప్రశ్నింపబడడమూ లేదు.
అన్నీ ఉల్లంఘనలే. విస్మరణలు దబాయింపులు..బలుపు ఎక్కువైన గుండాలు, అధికారులు, మాఫియాలు అన్నీ కలిసి ప్రజాప్రయోజన చట్టాలను పీకపిసికి ఉల్లంఘించి బహిరంగంగా దౌర్జన్యం చేస్తున్నారు..ప్చ్‌…మనకెందుకులే అని ప్రతి పౌరుడూ లోలోపల ఎంత కుతకుతలాడి కుమిలిపోతున్నా ఎదిరించలేక భయంతో ఎక్కడా ధైర్యం చేసి ప్రశ్నించడం లేదు.
మనిషిని ఒక బలమైన, సజీవమైన బాధ్యతాయుతమైన ప్రశ్నగా మార్చడమే మన ఉద్యమం. మన లక్ష్యం. మన గమ్యం.
మనం ముందే ప్రకటిస్తాం..మనకు వ్యక్తిగతమైన ఆస్తులు లేవని..మున్ముందుకూడా ఉండవని. ఇప్పుడు సమకూర్చుకున్న ఆస్తులనే సంస్థను నడపడానికి నిర్మాణాత్మకంగా పనిచేస్తున్న వ్యక్తుల పోషణకోసం, నిర్వహణకు మాత్రమే ఖర్చుచేస్తాం. యిక్కడ ప్రజలకు మనం ‘నిస్వార్థం’గా పనిచేస్తున్నామని చాలా విశ్వసనీయంగా చెప్పడమే మన నిజాయితీతో కూడిన ఉద్దేశ్యం. ఎటువంటి ఆడంబరమూలేని అతిసాధారణ జీవితాన్ని గడిపి చూపడం, దిక్కుమాలిన మండలాధ్యకక్షుని స్థాయిలోకూడా గన్‌మెన్‌ను ఫ్యాషన్‌గా పెట్టుకుని అట్టహాసంగా తిరగడం ఒక ఆనవాయితీఐన వర్తమాన సందర్భంలో మనం ఎప్పుడూ ఏ ప్రత్యేక భద్రతనూ అంగీకరించం. ఐతే రేపు మనకు ఎంతమంది అభిమానులూ, అనుచరులూ ఏర్పడ్డా కొంతమంది శత్రువులుకూడా తప్పకుండా తయారవుతారు కాబట్టి రహస్యంగా డేగకళ్ళతో నిన్నూ, నన్నూ, డాక్టర్‌ గోపీనాథ్‌నూ కనుపాపలకంటే పదిలంగా కాపాడే ఒక రహస్య, మనదే ఐన ప్రత్యేక రక్షక దళం ఒకటుంటుంది. అదెప్పుడూ మనవెంటే మనతోనే కదుల్తూంటుంది అదృశ్యంగా…నిరంతరంగా.
ఐతే..ఒక యంత్రంగానీ, ఒక వ్యవస్థగానీ, ఏదీ వంథాతం దక్షత కలిగి ఆదర్శంకానట్టే ఏ వ్యవస్థగానీ పూర్తిగా సున్నా శాతం దక్షతతో, పూర్తిగా నిరర్థకంకూడా కాదు..ఈ కోణంలో ప్రస్తుతం సమాజంలోని చాలామంది జనం ఈ దుర్మార్గ, నీతిహీన రాజకీయ నాయకులు పెట్టే ప్రలోభాలకు లొంగి తాగుబోతులుగా, సోమరిపోతులుగా, పనిదొంగలుగా  మారుతున్నారో..ఆ మూలాలను విశ్లేషించుకుంటూ అయ్యో ఈ దుస్థితి నుండి ఎలా బయటపడాలి, ఈ వ్యవస్థ మళ్ళీ ఎలా  ఆరోగ్యదాయకమౌతుంది..అని తపిస్తూ, క్షోభపడ్తూ, నిజాయితీగా, బాధ్యతగా ఆలోచిస్తున్న ఒక వర్గంకూడా సమాజంలో ప్రచ్చన్నంగా ఉంది. వాళ్ళలో స్పృహ ఉంది. స్పందన ఉంది. కసిఉంది. ముందు మనం వాళ్ళను గుర్తించి మనలో కలుపుకోవాలి. లేదా మనమే వాళ్ళలో కలిసిపోవాలి.
ఈ క్రమంలో ముందు నువ్వు యుఎస్‌ఎలో ఉన్నప్పుడూ, నీతో సహ విద్యార్థులుగా నీ తత్వం తెలిసిన వాళ్ళలో ఎనిమిదిమంది మెరికల్లాంటి సహచరులను తయారుచేశావు. తర్వాత అనేక సార్లు ఇండియా వెళ్తు, ఆంధ్రదేశం విస్తృతంగా పర్యటిస్తూ ఒక స్పేడ్‌వర్క్‌వలె డాక్టర్‌ గోపీనాథ్‌గారి సంపర్కంతో మేధోసంపన్నులైన దాదాపు ఋషులవంటి నూటా ఎనభైరెండు మంది రిటైర్డ్‌ ప్రొఫెసర్లు, డాక్టర్లు, లాయర్లు, రచయితలు, కళాకారులనుండి సీనియర్‌ సిటిజన్లను తయారుచేశారు. వీళ్ళందరూ ఒక్కొకరు ఒక జ్ఞాననిధి. జీవితాన్ని ఎంతో లోతుగా చూచినవాళ్ళు. సమాజంపట్ల అవగాహన కలిగిన వాళ్ళు. స్వాతంత్య్ర పూర్వ కాలంలో భారత సమాజంలో నెలకొని ఉన్న ఉన్నత మానవ విలువలు, అప్పటి నైతిక ఉజ్జ్వలత తెలిసిన వాళ్ళు. వీళ్ళందరూ మన డ్రైవింగు ఫోర్స్‌. కాగా యువతలో సరియైన ఆటిట్యూడ్‌, సమాజంపట్ల బాధ్యత ఉండాలి తప్పకుండా అన్న తత్వంగల దాదాపు ఎనిమిది వందలపైచిలుకు యువకులను మనం వివిధ విశ్వవిద్యాలయాలు, కాలేజిలు, కార్పొరేట్‌విద్యాసంస్థలు. వీటినుంచి ఎంపిక చేశాం. యిది మన కోర్‌ గ్రూప్‌. వీళ్ళందరూ బంగారం లోహం వంటివారు. వీళ్ళకు నువ్వు మన సీనియర్‌ సిటిజన్స్‌ ఫోర్స్‌ను జోడించి లోహాన్ని అగ్ని స్పర్శతో, సుత్తిదెబ్బతో ఆభరణంగా మార్చినట్టు ఒక శక్తివంతమైన మానవ సంపదగా మార్చాలి. తర్వాత వీళ్ళందరూ అతి సాధారణ జనాన్ని చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని భారీ ఎత్తున ఉద్యమంగా చేపడ్తారు. ఈ కార్యమ్రం ఒక అగ్నిజలవలె అంటుకుని విస్తరిస్తున్న థలో నువ్వు మన కార్యాచరణ ప్రణాళికలో అనుకున్నట్టుగా మీడియా..ప్రభుత్వంలో కూడా మనం ఈలోగా గుర్తించగలిగిన నిజాయితీగల ఆఫీసర్స్‌, అధికారులతో కలిసి యిక ‘ప్రక్షాళన’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. యింతవరకు ప్రభుత్వ యంత్రాంగంలో ఐఎఎస్‌ స్థాయిలో పూర్తిగా పారదర్శకత, నీతి నిజాయితీ కలిగిన అధికారులు ఒక్క ముప్పదిరెండుమంది మాత్రమే ఉన్నారు. ఎస్పీలు పన్నెండుమంది మాత్రమే. ప్రభుత్వ యంత్రాంగంలో కరప్షన్‌ తారాస్థాయికి చేరిఉంది. ప్రతిరోజూ టి.విలో చూస్తున్నట్టు ఏ ఒక్క పట్టుబడ్డ అధికారిపై దాడిచేస్తేనో కోట్లు దొరుకుతున్నాయి. పట్టుబడకుండా, దాడికి గురికాకుండా తప్పించుకు తిరుగుతున్న లంచగొండి మహానుభావులు దేశంనిండా అన్ని ప్రభుత్వ శాఖల్లో కిక్కిరిసి ఉన్నారు. యిక ప్రక్షాళన ప్రారంభంకావాలి.
ఐతే.. యిక్కడ అతి ప్రధానమైన అంశం స్త్రీ, పురుష లింగ భేదం లేకుండా ఏ పౌరుడైనా లంచం తీసుకోవడం ‘తప్పు’ అనే స్పృహ లేకపోవడం. ఒకర్ని చూచి ఒకరు ఎటువంటి భయమూ లేక అవకాశముంటే చాలా తెగబడి దోచుకోవడమే. దానికి ప్రజాప్రతినిధుల అండ నిండుగా, దండిగా ఉంది. ఎందుకంటే వీడికి వాడు వానికి వీడు పరస్పరం అండ. ఒక రెసిడెన్షియల్‌ కాలేజి మహిళా ప్రిన్స్‌పాల్‌ లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్తుంది. ఒక మహిళా ఉద్యోగి నకిలీ పోస్టల్‌ స్టాంపులమ్ముతూ పట్టుబడ్తుంది. సరసాదేవి కోట్లకు కోట్లుస్కాం చేసి పట్టుబడ్తుంది. రోడ్లు భవనాల శాఖ క్వాలిటీ కంట్రోల్‌ చేయవలసిన ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఇష్టమొచ్చినట్టు నాసిరకం పనులు చేసినా లక్షలకు లక్షల లంచాలు మెక్కి పెండ్లాం పేర తనే బినామీ కాంట్రాక్టులు చేస్తూ, బార్లు నడుపుతూ పట్టుబడ్తాడు, ఎసిబిలో పనిచేసే ఉద్యోగే అవినీతితో లంచంతీసుకుంటూ దొరికిపోతాడు. హైకోర్టు జడ్జీలు కొందరు మ్యామ్యా తిని ఎవనికైనా బెయిల్‌ మంజూరు చేస్తారు..న్యాయరక్షకులుగా ఉండవలసిన కొందరు జడ్జీలను రెడ్‌హ్యాండ్‌గా పట్టుకుని సుప్రీంకోర్టు ఆదేశించిన ఉదంతాలు కోకొల్లలు.. యిన్ని కేసులు ప్రతిదినమూ వెలుగులోకి వస్తూంటే ప్రభుత్వం మొద్దునిదురలో ఉందిగాని..చట్టం తనపని తాను చేసుకుపోతుందనే బుద్దిహీనమైన ఒక మాట చెప్పడం తప్పితే ఎప్పుడూ కఠినమైన క్రమశిక్షణాచర్యలు చేపట్టిన ఉదంతాలు లేనేలేవు. ఈ ఉదాసీనత వల్ల.. ప్రభుత్వంకూడా ఈ లంచగొండితనంలో భాగం కావడంవల్ల వ్యవస్థ అంతా నిర్వీర్యమై, అసమర్థమై, ఒట్టి శవప్రాయమై మిగిలిపోయింది. ఈరకంగా పట్టుబడ్డ వాళ్ళంతా తర్వాతర్వాత గుట్టుచప్పుడు కాకుండా మళ్ళీ విధుల్లోచేరి ఏరియర్స్‌తో సహా జీతాలను పొంది మళ్ళీ మళ్ళీ లంచాలు మెక్కుతున్నారు. అలా మళ్ళీ విధుల్లోచేరి తిరిగి రేచుకుక్కల్లా ఎగబడి దోచుకుతింటున్నవాళ్ళ వివరాలు తెలిస్తే గుండెలవిసిపోతాయి. యంత్రాంగమంతా పూర్తిగా చెదలుపట్టిపోయింది రామం.. ప్రజాధనమంతా ఈ పందికొక్కులపాలై వ్యవస్థ రోగగ్రస్తమైంది. యుద్ధప్రాతిపదికన ఈ అవినీతినీ, లంచగొండితనాన్నీ
రూపుమాపేందుకు ఒక ఉద్యమాన్ని అత్యవసరంగా నిర్మించాలి. ప్రభుత్వాలకు ఫండ్స్‌ ఎక్కడినుండి ఎన్నివచ్చినా దొంగలు దొంగలు పంచుకుని దండుకున్నట్టే మరుక్షణంలో మటుమాయం..ఇలా ఐతే ఎలా అని బుద్ది జీవులందరూ హడలిపోయి అవాక్కయిపోతున్నారు. లక్షలకోట్ల రూపాయలను ప్రపంచబ్యాంక్‌, ఐఎమ్‌ఎఫ్‌ వంటి సంస్థలనుండి అనేకానేక అభివృద్ధి పనులకోసమని అప్పుచేసి వాటాల వారిగా పంచుకోవడమే నిస్సిగుగా అర్థంచేసుకుంటూనే.. దేశాన్నంతా పర్యటిస్తూ ప్రజల స్థితిగతులను అధ్యయనం చేస్తున్న రాహుల్‌గాంధీకూడా ఒక సందర్భంలో ఈ దరిద్రపు లంచగొండితనపు తీవ్రతను గ్రహించి ప్రభుత్వ పథకాలనుండి ఒక రూపాయి విడుదలైతే అది ఐదు పైసలుగా లబ్దిదారులకు చేరుతోందని వాపోయాడు. ఇది ఈనాటి అడ్డూ అదుపూ లేని అవినీతి సామ్రాజ్యపు ముఖచిత్రం. యిక చదువుకున్న పౌరులు చేస్తున్న అకృత్యాలకైతే లెక్కేలేదు. ఎవడైనా టాక్స్‌లు ఎగ్గొట్టేవాడే. ప్రభుత్వరూల్స్‌లో ఉండే లొసుగులను వాడుకుని బొక్కసాన్ని ఖాళీచేసేవాడే. వ్యాపారాల్లో నిస్సిగ్గుగా ప్రభుత్వాన్నీ, ప్రజలనూ దగా చేసేవాడే. దేశంలో వాటర్‌ప్రైస్‌ కూపర్‌వంటి అంతర్జాతీయ ఆడిటర్ల నుండి మొదలుపెడ్తే స్థానిక ఆడిటర్లందరూ ప్రభుత్వ అధికారులకు బ్రోకర్లే తప్ప నిజాయితీగా లెక్కలను అప్పజెప్పేవారేలేరు. ‘ఆరోగ్యశ్రీ’ వంటి పథకాలద్వారా డాక్టర్లందరూ ప్రజాధనాన్ని భోంచేసేవారే.. వీడు వాడని, స్త్రీ పురుషుడని తేడా లేకుండా దేశాన్ని ప్రతివాడూ దోచుకుతినడమే. ఇదొక విరాట్‌స్వరూపమై వికృత విలయతాండవం చేస్తోంది. దీన్ని అర్జంటుగా అరికట్టాలి. ఫస్ట్‌ ప్రయారిటీ మనకిదే.” క్యాథీ చెబుతున్నప్పుడు గొంతులో ఆవేశం, బాధ, దుఃఖం..అన్నీ కలగలిసి ఆదోరకమైన జీర స్పష్టంగావినబడ్తోంది..పాపం, పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయి గిలగిల్లాడుతున్న భారత వ్యవస్థపట్ల వేదన ధ్వనిస్తోందామెలో.
రామం అన్నాడు..”నువ్వన్నట్టు యిది ఒక మహాపర్వతంలా పెరిగి వ్యాపించిన రుగ్మత క్యాథీ.. దీన్ని తెలుసుకుని నిర్మూలించేందుకు ఒక సుళువైన మార్గముంది..యిక్కడ ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రజలకు జవాబుదారీ ఐన ప్రభుత్వ ప్రతినిధి.. ప్రజాప్రతినిధి అంటే ప్రజలపక్షాన ప్రభుత్వాన్నీ, ప్రభుత్వాధికారులనూ న్యాయంకోసం, ప్రజావసరాలకోసం ప్రశ్నించి ప్రజోపయోగమైన సంక్షేమ కార్యక్రమాలను చేయించవలసినవాడు. ఈ రెండు వ్యవస్థలూ ఇంటర్‌ డిపెండెంట్‌గా కలిసి ముందుకు సాగాలి న్యాయంగా ఒకరిని ఒకరు చెక్‌ చేసుకుంటూ ప్రజల ప్రగతికోసం పాటుబడాలి. కాని వాస్తవంలో అలాకాకుండా ఈ ఇద్దరూ ఇద్దరు కుమ్మక్కయిన దొంగల్లా కంచే భూమీ ఒకటై చేనును తిన్నట్టు తెగబడ్డారు. ది ఈజీ ఫార్ములా ఈజ్‌.. ఒక వ్యక్తి.. ఒక ప్రభుత్వ అధికారి లేదా ఒక ప్రజా ప్రతినిధి, లేదా ఒక ఆడిటర్‌, డాక్టర్‌, ఐఎఎస్‌, ఐపిఎస్‌ ఉద్యోగి వంటి వ్యక్తి..వీళ్ళ ఒక పదిసంవత్సరాల కాలాన్ని తీసుకుని..మొదట్లో వాళ్ళ ఆస్తిపాస్తులెన్ని..వీళ్ళు ప్రతిసంవత్సరం ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు సబ్‌మిట్‌ చేస్తున్న రిటర్న్‌లో ఎంత ఆదాయం చూపుతున్నారు..ప్రస్తుతం వీళ్ళ దగ్గర అనధికారికంగా పోగుపడ్డ ఆస్తుల విలువెంత..వీటి తేడాఎంత..ఆ తేడాను ప్రభుత్వం ఏక్షణాన్నైనా స్వాధీనం చేసుకోవచ్చు.. అని అనుకుంటే.. యిక ఆలోచించు..ఎన్ని..ఎన్ని లక్షల కోట్ల రూపాయలు బైటికొస్తాయో. ప్రభుత్వం నిజాయితీగా ఉండి జనానికి..ఐచ్ఛికంగా మీరే మీ నల్లడబ్బును డిక్లేర్‌ చేయండి లేకుంటే కఠినాతి కఠినమైన శిక్ష ఉంటుందని ఒకరోజును డెడ్‌లైన్‌గా ప్రకటిస్తే బయటికొచ్చే డబ్బుతో ఈ దేశపు రోడ్లన్నీ నిండిపోతాయి. డబ్బు వెల్లువై పారుతుంది. ఐతే ఇది సాధ్యంకాదు. దీన్నే మనం సాధ్యం చేయాలి. ఏ పొలిటికల్‌ గవర్నమెంట్‌కూడా ఈ రకంగా ప్రవర్తించదు. ఎందుకంటే యిక్కడి రాజకీయవ్యవస్థ ‘ఇంటర్‌ డిపెండెంట్‌’. ముఖ్యమంత్రిని పార్టీ నామినేట్‌ చేస్తుంది. ప్రధానమంత్రిని పార్టీ నియమిస్తుంది. పార్టీ ఎమ్యెల్యేలను, ఎంపీలను తృప్తిపర్చేందుకు దిక్కుమాలిన సహాయాలపేరుతో దోపిడీకి పర్మిషనిస్తుంది. యిక విషప్రవాహం ప్రారంభమై దేశాన్ని ముంచెత్తుతుంది. అందుకే కీలక పదవులకు అంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రివంటి స్థానాలకు ప్రజలచే ప్రత్యక్షెన్నిక జరిగితే వెనుకఉండి కీలుబొమ్మను ఆడించే తరహా రాజకీయాలుండవు. స్థిరత్వముంటుంది. దేశగతి అటో ఇటో తేలిపోతుంది”. అని సాలోచనగా ఓ క్షణమాగి..”చూద్దాం..మనమేమి చేయగలమో..” అన్నాడు.
”ఇంకో విషయముంది రామం..అమెరికానుండి మొదలుకొని ఏ యితర దేశాల న్యూస్‌ ఛానల్స్‌నైనా గమనించు.. కొద్ది రాజకీయాలు ఉంటాయి. మిగతా అంతా రిపోర్టింగు ఉంటుంది. ఎడ్యూకేటివ్‌ ప్రసారాలు ఉంటాయి తప్ప.. ఈ తెలుగు ఛానల్స్‌లో ఉన్నట్టు ఇరవై నాల్గుగంటలు రాజకీయాలే ఉండవు. మీడియా కూడా అనవసరంగా పొద్దస్తమానం కుక్కల కొట్లాటను తలపించే చర్చలపేరుతో, వేదికలపేరుతో, ప్రతిస్పందనలపేరుతో, లైవ్‌ టెలికాస్ట్‌పేరుతో రాజకీయాలు..రాజకీయాలు. రాజకీయాలగురించే ఊదరగొట్టీ అదరగొట్టే ప్రజాజీవితాలను ధ్వంసం చేస్తున్నాయి. ప్రజలను ప్రయోజకులుగా తీర్చిదిద్దే దిశలో శక్తివంతమైన మీడియా ప్రయత్నంచేయడంలేదు సరికదా అనవసరంగా మామూలు జనజీవితాల్లోకి చొరబడి మానసిక అనారోగ్యకారకాలైన ప్రసారాలతో కాలుష్యం స్పష్టిస్తోంది.. ఒకసారి మీడియాతో జనం తరపున మాట్లాడి బ్రహ్మస్త్రాన్ని బ్రహ్మస్తంగానే వాడాలన్న స్పృహను కల్గించవలసిన అవసరముంది. లేకుంటే ప్రజోపయోగమైన న్యూస్‌ ఛానల్‌ ఎలా ఉండాలో చూపించేందుకు ఒక నమూనాగా మనమే ఒక వార్త ఛానల్‌ను ప్రారంభించాలి.. అది అవసరమేమో అనిపిస్తోంది.” అంది క్యాథీ.
”ఔను..”
”ఇక మన ఈనాటి సమావేశం ముగింపుకొచ్చింది రామం..ఈ సందర్భంగా రెండు ముఖ్య విషయాలు..ఒక మేనేజ్‌మెంట్‌ వ్యక్తిగా చెప్పాలి..”అంది క్యాథీ గంభీరంగా..కొద్దిగా ప్రకంపిస్తూ పూర్తిగా వ్యక్తిగతమైన సంస్పందనతో.
”చెప్పు క్యాథీ..”
”ఎందుకు కలిశామో మనం తెలియదు. ఈ భూమిపై ఎక్కడెక్కడో భిన్న ఖండాల్లో జన్మించిన మనం చాలా యాదృచ్ఛికంగా తటస్థపడి ఒకరి హృదయాన్ని ఒకరం అర్థం చేసుకుంటూ ఏకరీతి ఆలోచనా ధోరణివల్ల..బహుశా అనుకుంటూ..మార్క్స్‌ అండ్‌ ఎంగెల్స్‌ వలె..సన్నిహితమై, ఒకరికోసమొకరిమై, ఇద్దరమూ ఒకరేమోకూడా ఐ ప్రేయసీ ప్రియుడు, భార్యాభర్త, స్నేహితులు, ఆత్మీయులు, ఆత్మబంధువులువంటి పదనిర్వచనాలన్నింటికీ అతీతంగా ఎదిగి ఒక అపూర్వబంధంలో ఒదిగి జీవితాన్ని ఓ మహత్తర అనుభవంగా మలచుచున్నాం..ఐతే దీనికి సామాజిక నియమాల అంగీకారం లేదు. ఉండదు. నా దృష్టిలో అవసరంకూడా లేదు. యిది కేవలం నీకూ, నాకూ మాత్రమే సంబంధించిన హృదయానుగత బాంధవ్యం. దాన్ని మనం ఎంత పవిత్రంగాపదిలంగా కాపాడుకుంటాం, పరిరక్షించుకుంటాం అనేది మన వివేకంపై ఆధారపడి ఉంటుంది. నా తరపున సహజమైన స్త్రీ సహనశీలతతో భూమిలా నేను ప్రవర్తిస్తా. నువ్వు విశాల హృదయంతో భూమినికూడా రక్షణకవచంలా అవరించిఉండే ఆకాశంలా నన్ను నీలో దాచుకోవాలి. నిజానికి పంచభూతాత్మకమైన ఈ చరాచర విశ్వంలో స్థూలంగా భూమీ, ఆకాశం వేర్వేరు కావచ్చు.. కాని సూక్ష్మంగా అవన్నీ ఒకటే.. అదే జీవితం..”
”……” శూన్యంగా ఆమెవంక చూస్తున్నాడు రామం.
”……” ఆమెకూడా శూన్యంగానే అతన్ని చూస్తోంది
‘పూర్ణమదః పూర్ణమిదః’.. ఎక్కడ్నో యిద్దరి ఆత్మల్లో ధ్వనిస్తోంది.
కలయిక నిమిత్తం..జీవితం సత్యం.
నడవడం సత్యం..దూరం మిథ్య
ఉదయం జననం..అస్తమయం మరణం
విచ్ఛిత్తి, సమ్మేళనం..స్థిరఅస్థిరాలు..అన్నీ జీవవ్యాపారాలు
విముక్తి అంతిమం.
”క్యాథీ నువ్వు ఆత్మవు..నేను శరీరాన్ని” అన్నాడు రామం.
”నాకు తెలుసు..కాని నీ నోట వినాలని పిచ్చికోరిక”
వర్షం బయట ఇంకా కురుస్తూనే ఉంది. ఫెళాఫెళార్భటులతో ఎక్కడో చటుక్కున పిడుగు పడింది. ఉలిక్కిపడ్డారిద్దరూ.
క్యాథీ బ్రీఫ్‌కేసును సర్దుకుని..లేచి నిలబడి..టైం చూచుకుంది.
పదీ పది.
”సి యు.. సి యు రామం” బయటికి నడిచిందామె.
యిక ఈ గదినుండి వెలుగు నిష్క్రమిస్తోంది..తర్వాతంతా ఒక వెలితి విస్తరిస్తుంది అనుకున్నాడు. కాని బయటికేమీ అనలేదు. నిండుగా, లిప్తంగా నవ్వాడు.
ఆమె చినుకుల్లో గబగబా నడచి వెళ్లి తన ఆడి కార్లో కూర్చుని స్టార్ట్‌ చేసింది.
కారు కదుల్తూండగా..రామం చేయూపాడు. కాని అది ఆమెకు కనిపించలేదు. వర్షం చినుకులు అడ్డొచ్చాయి.
కారు వీధిమలుపు తిరుగుతూండగా..రిక్తమైన హృదయంతో నిట్టూర్చి..ఎందుకో కళ్ళనిండా నిండిన సన్నటి నీటిపొరను స్పృహించకుండానే..ఆమె మనసునిండా పరుచుకున్న రామం స్మరణలో నిమీలితయై ఎక్కడనుండో..అంతరాంతరంగాల్లోకి వినిపిస్తున్నట్టుగా.,
‘రామం నిశాచర వినాశకరం..’
కారు వేగంగా ఫ్రెడరిక్‌ రోడ్‌పై ఇంటర్‌స్టేట్‌ 249పై వెళ్తూ వేగాన్నందుకుంది.

***

(సశేషం)

ramachandramouli–రామా చంద్రమౌళి

కూరలబ్బాయి

sanjay_kumar
మూల రచయిత శ్రీ సంజయ్ కుమార్  9 ఆగస్టు 1987 నాడు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‍లో జన్మించారు. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు.  వృత్తి ప్రైవేటు సంస్థలో ఐటి మానేజర్ మరియు సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌. ప్రవృత్తి రచనలు.  ప్రింట్ పత్రికలలోనూ, వెబ్ పత్రికలలోనూ అనేక రచనలు ప్రచురించారు.
# #
సాయంకాలం. పిల్లలు వీధిలో ఆడుకుంటున్నారు. కొందరు టైర్లు దొర్లిస్తుంటే, మరికొందరు సైకిల్ళు తొక్కుతున్నారు. ఇంకొందరు గిల్లీదండా ఆడుతున్నారు. కొందరేమో గాలిపటాలు ఎగరేస్తున్నారు. నేను ఇంట్లో కూర్చుని, ఈమధ్యే కొన్న కథా సంకలనం చదువుతున్నాను. “కూరలమ్మా…. కూరలు…” అనే పిలువు నా చెవుల్లో ప్రతిధ్వనించింది.
కూరలమ్మేవాళ్ళ మాములు కేకల్లా లేదది, ఆ గొంతులో ఏదో తేడా ఉంది. నేను పుస్తకాన్ని పక్కనబెట్టి కిందకి దిగివచ్చాను. ఆ గొంతు ఎవరిదా అని చూస్తున్నాను. నా దృష్టి ముందుకు సాగింది. ఓ చిన్న పిల్లాడు కూరల బండిని తోస్తూ నా వైపు వస్తున్నాడు. “కూరలమ్మా…. కూరలు…” అని మధ్యమధ్యలో అరుస్తున్నాడు. అతడి వయసు పన్నెండు లేదా పదమూడు సంవత్సరాలకు మించి ఉండదు. చూడడానికి ఎంతో అందంగా ఉన్నాడు, ముఖంలో అమాయకత్వం గోచరిస్తోంది. అతన్ని చూస్తుంటే నా మనసులో లెక్కలేనన్ని పశ్నలు… పడగ విప్పిన పాములా తలెత్తున్నాయి. ఇంకా చిన్నపిల్లాడే కాబట్టి, బండిని పూర్తిగా లాగలేకపోతున్నాడు. బండిని లాగడానికి వాడి శక్తి సరిపోవడం లేదు. తోపుడుబండిని ఓ వైపు తిప్పాలంటే, దాన్ని ఎత్తడానికి పూర్తిగా వంగిపోయి, అతి కష్టం మీద ఎత్తి తిప్పుతున్నాడు.
ఆ కుర్రాడు నా సమీపంలోకి వచ్చి, కూరలు తీసుకోమంటూ గట్టిగా అరుస్తున్నాడు. అతడి వంటి మీద అతి పల్చటి చొక్కా ఉంది, దానికెన్నో చిల్లులు! గుండీల స్థానంలో మచ్చలు. అతని ప్యాంటు బాగా మాసిపోయిన, మురికిగా ఉంది. వెనుకవైపు చిరిగి ఉంది. బండిని తోస్తున్నప్పుడు, ప్యాంటు వెనుక చిరుగులోంచి పిరుదు బయటకి కనబడుతోంది. నేను అతని కాళ్ళవైపు చూసాను. అతను ధరించిన చెప్పులు బాగా చిన్నవి. పాదాలు బయటకి వచ్చేస్తున్నాయి. చెప్పులు కూడా అరిగిపోయి, చిల్లులు పడి ఉన్నాయి. ఆ చిల్లుల్లోంచి దుమ్ము, మట్టి, నీళ్ళు బయటకు పోతాయేమో. బండి తోసుకుంటూ ఆ కుర్రాడు నా ముందు నుంచే వెళ్ళిపోయాడు. నిజానికి ఆ కుర్రాడిని చూస్తే నాకు నా బాల్యం గుర్తొచ్చింది. నేను కూడా ఆ వయసులో బండి తోసాను. ఆ పిల్లాడి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించగలను. మర్నాడు నేను ఆ కుర్రాడి కోసం ఎదురుచూసాను. కొద్ది సేపయ్యాక, వస్తూ కనపడ్డాడు. వచ్చి నా ముందు ఆగాడు.
నాకేసి చూస్తూ, అమాయకత్వం నిండిన స్వరంతో, “కూరలేమయినా కావాలా సార్…” అని అడిగాడు.
నాకు కూరలు అక్కర్లేదు, కానీ ఆ కుర్రాడితో మాటలు కలపడానికి అదో అవకాశంగా భావించాను.
“ఇంత చిన్న వయసులో ఈ పనెందుకు చేస్తున్నావు?” అడిగాను.
“మా నాన్న చనిపోయాడు…” డొంకతిరుగుడు లేకుండా సూటిగా జవాబిచ్చాడా కుర్రాడు.
“అయ్యో… మరి మీ అమ్మ ఎక్కడుంది”
“అమ్మకి ఒంట్లో బాలేదు. ఏ పని చేయలేదు. అందుకే నేను పని చేస్తున్నా…”
“సరే, సార్, నేను వెళ్ళొస్తా. లేకపోతే ఆలస్యం అయిపోతుంది…”
బేరం ఏమీ చేయకుండానే, కూరలు తీసుకున్నాను. ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు.
ఆడేపాడే వయసులోని ఈ కుర్రాడు ఎదిగిన మగాడిలా మారాడు, మంచీ చెడూ తెలుసుకున్నాడు. ఈ వయసులో మాములు పిల్లలు అయిదు కిలోల బరువు కూడా ఎత్తలేరు, ఈ అబ్బాయి మాత్రం యాభై కిలోల బండి లాగుతాడు. అవసరం ఆ కుర్రాణ్ణి ఎంత దృఢంగానూ, తెలివిగానూ తయారు చేసిందో… నా మనసులో ఆ పిల్లాడి పట్ల సానుభూతి కలిగింది. ఆ పిల్లాడిని నా స్నేహితుడిగా భావించసాగాను. ప్రతీరోజూ, బేరం చేయకుండానే కూరలు కొంటున్నాను. నేను ఏదో పనిబడి బజారుకి వెళ్ళడంవల్ల  ఓ రోజు సాయంత్రం ఆ కుర్రాడిని కలవలేకపోయాను. రాత్రి ఇంటికి తిరిగొస్తుంటే, నా దృష్టి ఆ కుర్రాడిపై పడింది. రోడ్డు వారగా, ఓ మూల కూర్చుని ఒళ్ళో తలపెట్టుకుని ఏడుస్తున్నాడు.
Akkadi-MeghamFeatured-300x146
“ఏమైంది?”
“అయ్యగారు, ఇవాళ కూరగాయలు అమ్ముడుపోలేదు…”
“దానికి ఏడవడం ఎందుకు, రేపు అమ్ముడుపోతాయిగా….”
“ఈరోజు నాకు డబ్బు దొరక్కపోతే, అమ్మ మందులు కొనలేను…”
ఈ మాట వినగానే, జేబులోంచి వందరూపాయల నోట్లు రెండు తీసి ఇచ్చాను.
“నేను బిచ్చం అడుక్కోడం లేదు బాబుగారు…” అన్నాడు స్వాభిమానంతో.
వెంటనే నా తప్పు నాకు తెలిసింది. నేను ఇంటికి వెళ్ళిపోయాను. సంచి పట్టుకుని మళ్ళీ ఆ కుర్రాడి దగ్గరికి వచ్చాను. నన్ను చూస్తూనే ఆ కుర్రాడు లేచి నిలుచున్నాడు.
“ఇంట్లో కూరలు లేవు.. ఏమైనా ఇవ్వు…” అన్నాను. నా మాటలు వినగానే అతని ముఖంపై నవ్వు కదలాడింది.  నేను నా పెద్ద సంచీ తీసుకుని కూరలు అందులో వేసుకోసాగాను. సంచీ పూర్తిగా నిండిపోయింది.
“ఎంతయ్యింది?” అని అడిగాను.
ఆ కుర్రాడేమీ జవాబు చెప్పలేదు. అతని కళ్ళు చెమర్చాయి. నా ఎత్తుగడ అతనికి అర్థమైంది. అతన్నిఊరడించి, కూరలకి ఎంతైందో చెప్పమన్నాను.
“మూడు వందల నలభై రూపాయలు సార్…” అన్నాడు.
అతనికి డబ్బులిచ్చేసాను. “కూరలు కొన్నే ఉన్నాయిగా, ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపో…” అన్నాను. ఆ పిల్లాడు నాకు ధన్యవాదాలు చెప్పి, ఇంటికి వెళ్ళిపోయాడు. నేను కూడా సంతోషంతో ఇంటిముఖం పట్టాను.
***
రోజులు గడిచేకొద్దీ మా ఇద్దరి మధ్య పరిచయం బాగా పెరిగింది. నేనా కుర్రాడి దగ్గర కూరలు తీసుకుంటూనే ఉన్నాను. “ఏంటి, కూరల కొట్టు ఏమైనా పెడుతున్నావా? రోజూ సంచి నిండా కూరలు తెస్తున్నావు…..”అని మా అమ్మ నామీద అరుస్తోంది.
ఓ రోజు సాయంత్రం నేనా కుర్రాడి కోసం ఎదురు చూస్తున్నాను. రాత్రి అయిపోతోంది, కానీ ఆ అబ్బాయి రాలేదు. రెండో రోజు కూడా ఆ కుర్రాడు రాలేదు. మరో నాలుగు రోజులు గడిచిపోయాయి. నా మనసులో లెక్కలేనన్ని అపశకునాలు. ఆ కుర్రాడిని వెదకాలని నిర్ణయించుకున్నాను. కానీ ఎలా? ఈ రోజు వరకూ ఆ కుర్రాడి పేరే అడగలేదు. ఎక్కడుంటాడో అడగలేదు. ఇవన్నీ అడగడం పెద్ద కష్టం కాదు కానీ, ఎందుకో…. వీటి ప్రస్తావనే రాలేదు మా మధ్య. వెదకడానికి బయల్దేరాను. మొదటగా రాత్రిళ్ళు ఆ అబ్బాయి నిల్చునే వీధి చివరకి వెళ్ళాను. కనపడలేదు. అక్కడున్న మిగతా కూరలమ్మే వాళ్ళని భోగట్టా చేసాను. మూడు నాలుగు రోజులుగా అసలా కుర్రాడు బజారులోకే రావడం లేదట! ఆ కుర్రాడు ఎక్కడుంటాడో, ఇల్లెక్కడో తెలుసా అని ఒకతన్ని అడిగాను. బదులుగా తెలీదన్నట్లు తల అడ్డంగా ఊపాడతను. నిరాశగా ఇల్లు చేరాను. ఇంటికొచ్చి ఆలోచనల్లో లోనమైపోయాను.
“ఏమైంది?” అడిగింది అమ్మ.
“ఏం లేదు…”
రెండు క్షణాల నిశ్శబ్దం తర్వాత, “ఆ కుర్రాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు…” అంది అమ్మ.
ఈ మాటలు వినగానే నేను లేచి నిలుచున్నాను. కానీ నేనా కుర్రాడి గురించి బెంగ పడుతున్నట్లు అమ్మకి ఎలా తెలుసు? అమ్మ దైవంతో సమానమని మహాత్ములు నిజమే చెప్పారు. దైవానికి తెలియని విషయం ఉంటుందా?  వెంటనే అమ్మ దగ్గర ఆ కుర్రాడి ఇంటి జాడ తెలుసుకుని, అక్కడికి బయల్దేరాను. కాస్త వెతుకులాట అయ్యాక, ఆ కుర్రాడి ఇల్లు పట్టుకోగలిగాను. పేరుకే ఇల్లుగానీ, నిజానికది పూరిగుడిసె. పైన వేసిన గడ్డిని చూస్తుంటే, ఏదో పల్లెటూరి ఇల్లు ఉన్నట్లే ఉంది. ఆ కుర్రాడు ఇంటి బయటే కనపడ్డాడు, నన్ను చూసి ఉలిక్కిపడ్డాడు.
“మీరేంటి సార్ ఇక్కడ…”అన్నాడు ఆశ్చర్యంగా.
“నిన్ను కలవాలనే వచ్చాను…”
“కొన్ని రోజులు నుంచి ఎందుకు రావడం లేదు?”
“అమ్మకి అస్సలు బాగాలేదు….”
“ఇప్పుడు మీ అమ్మ ఎక్కడుంది?”
ఆ కుర్రాడు నన్ను లోపలికి తీసుకువెళ్ళాడు. లోపల మురికి చీరలో నేల మీద పడుకుని ఉంది. ఆ చీర కూడా అక్కడక్కడా చిరుగులు పట్టి ఉంది. బట్టల పేరుతో, ఆవిడ చిరుగులని కట్టుకున్నట్లుంది. ఏదో తీవ్రమైన జబ్బుతో ఉన్నట్లుంది. ఏమీ మాట్లాడలేకపోతోంది. బయటకి వచ్చేసాను. కుర్రాడు కూడా నాతో పాటు బయటకు వచ్చాడు.
“నీ దగ్గర డబ్బులేమయినా ఉన్నాయా..?”
ఉన్నాయంటూ తలూపాడు. నేను ఇంటికి వచ్చేసాను. అతని దుర్భర పరిస్థితులను తలచుకుంటూ, అతడి గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాను. అర్థరాత్రి వరకూ అతని ఆలోచనల్లోనే లీనమయ్యాయి. ఆ కుర్రాడు చదువు, ఆటలు మానేసి కూరల బండి ఎందుకు తోస్తున్నాడో నాకిప్పుడు అర్థం అయ్యింది.
***
ఆ పిల్లాడు మరికొన్ని రోజులు రాలేదు.  ఆదివారం మధ్యాహ్న సమయం. బయట ఎంత ఎండగా ఉందంటే… గోధుమ పిండిని ఎండలో ఉంచితే, క్షణాల్లో అది రొట్టెలా మారిపోయేంత! ఇంతలో ఆ కుర్రాడి గొంతు వినిపించింది.  బయటకి వచ్చాను. ఎండ మండిపోతోంది. వాళ్లమ్మకి ఇప్పుడు ఎలా ఉందని అడిగాను. అంతా సర్దుకుందని చెప్పాడు. నాకు సంతోషం కలిగింది.
ఏవో మాట్లాడుతూ, ఆ కుర్రాడి పాదాల కేసి చూసాను. అతనికి చెప్పులు లేవు.
“నీ చెప్పులేమయ్యాయి…?” కాస్త కోపంగా అడిగాను.
“విరిగిపోయాయి బాబుగారు….” అన్నాడు కాస్త భయంగా.
“అయితే ఇలాగే వీధుల్లోకి వచ్చేస్తావా…?”
“మరి ఏం చేయను సార్, ఇంట్లో డబ్బులు లేవు…”
నేనేమీ మాట్లాడలేకపోయాను.
కుర్రాడు కదిలాడు. ఒట్టి కాళ్ళతోనే కూరలు అమ్ముకుంటున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. కానీ నేను ఆ ఒట్టి కాళ్ళను మర్చిపోలేకపోతున్నాను. మండుటెండలో, ఒట్టికాళ్ళతో కూరలమ్ముతున్న ఆ కుర్రాడిపై నాకు జాలి కలిగింది. ఓ జత చెప్పులు కొనిద్దామని అనుకున్నను. కానీ, గతంలో ఒకసారి డబ్బులిస్తే ఆ అబ్బాయి తిరస్కరించిన సంగతి గుర్తొచ్చింది. మరి చెప్పులు కూడా తీసుకోనంటే?
బాగా ఆలోచించిన మీదట ఆ అబ్బాయికి చెప్పులు కొనివ్వాలనే నిర్ణయించుకున్నాను. గబగబా తయారై బజారుకి వెళ్ళాను. రెండు లేక మూడు వందల రూపాయలలో ఆ కుర్రాడికి చెప్పులు కొనాలనున్నాను. అయితే ఆ అబ్బాయి తిరుగుడికి ఆ చెప్పులు రెండు మూడు నెలలకన్నా ఎక్కువ రోజులు రావని గ్రహించాను.  దగ్గర్లోనే ఉన్న ఓ పెద్ద చెప్పుల కొట్టుకి వెళ్ళాను. కొండలెక్కేందుకు ఉపయోగపడే చెప్పులు ఉంటే చూపించమని సేల్స్‌మాన్‌ని అడిగాను. చెప్పులు నాకేనా అని అడిగాడు. కాదు, ఓ పన్నెండేళ్ళ కుర్రాడికి అన్నాను. అతను వెంటనే, మెరుస్తున్న ఓ చెప్పుల జతని బయటకు తీసాడు. అవి చాలా దృఢంగా ఉన్నాయి. ఆ కుర్రాడి సరిగ్గా సరిపోతాయి, బాగా మన్నుతాయి కూడా. డబ్బులిచ్చి, ఆ చెప్పులు తీసుకుని ఇంటికి వచ్చాను.
సాయంకాలమైంది. నేను ఆ కుర్రాడి రాక కోసం ఎదురుచూస్తున్నాను. కానీ రాత్రయినా ఆ కుర్రాడు రాలేదు. ఒకవేళ ఈరోజు ముందే వచ్చి వెళ్ళిపోలేదు కదా?  వెంటనే వీధి చివరకు వెళ్ళి చూసాను. ఆ కుర్రాడు అక్కడే కూర్చుని ఉన్నాడు. నన్ను చూస్తూనే లేచి నిలబడ్డాడు. ఆ అబ్బాయి పాదాలకి ఇప్పుడు కూడా చెప్పుల్లేవు. చెప్పుల కవర్ నా చేతికి వేలాడుతోంది. ఆ కుర్రాడు సూటిగా దానినే చూస్తున్నాడు. ఆ అబ్బాయి ఈ కవర్ ఏంటని అడుగుతాడేమోనని అనిపించింది. కానీ ఆ అబ్బాయి కనీసం ఒక్కసారైనా దాని గురించి అడగలేదు. నేనే ఉండబట్టలేక, “నో కోసం ఏం తెచ్చానో చెప్పుకో చూద్దాం… ” అని అంటూనే, “చెప్పులు…” అని చెప్పేశాను. నాకేసి తిరస్కారంగా చూసాడు.
“మన్నించండి బాబుగారు. నాకు వద్దు…” అన్నాడు.
ఎంతగానో నచ్చజెబితే గానీ తీసుకోడానికి అంగీకరించలేదు. వెంటనే నేను కవర్ తెరిచి చెప్పులు బయటకు తీసాను. అతడి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. కానీ అంతలోనే కళ్ళల్లో నీళ్ళు! చాలా సేపు ఓదారిస్తే గానీ అతడి ఏడుపు ఆగలేదు. నాకు ధన్యవాదాలు చెబుతునే ఉన్నాడు. కనీసం పదిసార్లకు పైగా చెప్పి ఉంటాడు. ఆ పిల్లాడు చెప్పులు తీసుకున్నాడు. నేను ఇంటికి వచ్చేసాను.  ఇక మీదట ఆ అబ్బాయి ఒట్టి కాళ్ళతో తిరగాల్సిన బాధ తప్పినందుకు నేను ఆనందించాను. ఈ సంఘటన జరిగాకా, ఏవో కారణాల వల్ల నేను మూడు రోజులపాటు ఆ అబ్బాయిని కలవలేకపోయాను. నాల్గవ రోజు మిట్టమధ్యాహ్నం పూట కూరలమ్మా… కూరలు అని అరుస్తూ వచ్చాడు. అతడిని చూడడానికి బయటకి రాగానే, నేను చేసిన మొదటిపని అతని పాదలకేసి దృష్టి సారించడం. అతని పాదాలకి చెప్పుల్లేవు.
“చెప్పులేవి?”
ఆ అబ్బాయి మౌనంగా ఉండిపోయాడు.  కోపంతో నేను నా ప్రశ్నని మళ్ళీ రెట్టించాను.
పిల్లాడు భయంతో వెనక్కి జరిగాడు, తల దించుకున్నాడు.
“అమ్మేసానయ్యా…” అన్నాడు.
ఇది వింటూనే నేను కోపం పట్టలేకపోయాను. నానామాటలూ అన్నాను.
“అసలు చెప్పులు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది?” అడిగాను.
“అయ్యగారూ, మా అమ్మ చీర పూర్తిగా చిరిగిపోయింది. అందుకే, చెప్పులమ్మేసి అమ్మకి చీర కొన్నాను. నేను ఒట్టి కాళ్ళతో తిరగగలను, కానీ అమ్మని చిరిగిన చీరలో చూడాలంటే కష్టంగా ఉంది. పైగా అమ్మ చీరతో పోలిస్తే, నాకు చెప్పులు పెద్ద అవసరం కాదు…”
అతని జవాబు వినగానే, నా కోపం మీద చన్నీళ్ళు గుమ్మరించినట్లయింది. ఆ అబ్బాయి ముందు నేనెంతో చిన్నవాడిలా అనిపించింది. అంత చిన్న పిల్లాడి నోట్లోంచి అటువంటి పెద్ద పెద్ద మాటలు వింటూ నేను విస్మయానికి గురయ్యాను. ఆ అబ్బాయిని చూస్తుంటే గర్వంగా అనిపించింది. ఆ కుర్రాడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. అతని ముఖంలో నేను మునుపెన్నడూ చూడని ఓ చిరునవ్వు ఉంది. ఒట్టి కాళ్ళతోనే అతను బండిని తోసుకుంటూ కదిలాడు. నేను ఇంటి వైపు తిరిగాను, రెండు అడుగులు వేసి మళ్ళీ వెనక్కి మళ్ళాను…
“ఇంతకీ నీ పేరేంటో చెప్పలేదు…”
ఆ అబ్బాయి నవ్వుతూ తన పేరు చెప్పాడు. నాదీ అదే పేరు.
హిందీ మూలం: సంజయ్ కుమార్

కొల్లూరి సోమశంకర్

అనువాదం: కొల్లూరి సోమ శంకర్

 

 

మట్టి మీది గట్టి నమ్మకం: మంటిదివ్వ

 

    ఏకాలానికి ఆ కాలం సాహిత్యంలో ప్రతిబింబిస్తుంది. కవిత్వమవ్వొచ్చు. కథవ్వొచ్చు. మనిషి జీవితాన్ని  ఉన్నతీకరించడానికి దోహదపడేవి – ముఖ్యంగా తక్షణమే వొక సంఘటనకు లేదా వొక దృశ్యానికి గొప్ప స్పందనగా వెలువడేది కవిత్వం మాత్రమే. కాలాన్ని పట్టి యిచ్చే మేలిమి మెరుపులాంటి అద్దం కవిత్వమని నిరూపించుకుంది. చరిత్రను కళగా ప్రకటించే అత్యద్భుతమైన కర్తవ్యాన్ని కవిత్వం నెరవేరుస్తుంది. ఈనాటి సంక్లిష్ట వర్తమాన ప్రపంచ నేపథ్యంలో నుంచి – కవిత్వం – మనిషి వ్యక్తిత్వాన్ని -తద్వారా – సామాజిక పరిణామశీలతను గొప్ప సాంస్కృతిక దృష్టితో ప్రభావితం చేయడం జరుగుతుంది.

యిప్పుడు కవిత్వాన్ని నిర్వచించడానికి కూడా అద్భుతమైన దశ వచ్చింది. వర్తమాన సామాజిక సాంస్కృతిక స్థితిగతులు – మంచి కవిత్వం రావడానికి ప్రేరణోపకరణాలుగా వున్నాయి. కవిత్వమిపుడు – దుఃఖమవుతుంది. దుఃఖంలోంచి పుట్టుకొచ్చిన ఉద్యమమవుతుంది. యుద్ధమవుతుంది. సామూహిక ఆగ్రహంలోంచి జనించే కరుణవుతుంది.

సకలం ధ్వంసమవుతున్న వర్తమానం – చీకటి ఊడలు భయంకరంగా అల్లుకున్న భవిష్యత్తు – కళ్ల ముందు యివే తప్ప యింకోటి కనిపించని – ఈ స్థితిలో – కవిత్వం మరింత శక్తిని కూడగట్టుకోవాల్సిన అవసరం వుంది. కవిత్వం అత్యంత అవసరమైన – ప్రాణభూతమైన – వొక సృజనకారుని చూపు.

కవులు ఆ చూపుని పోగొట్టుకోకూడదు.

కవిత్వం – సమస్యను మూలాల నుంచి చర్చించి వదిలేయడమే కాదు. సమస్యకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించాల్సిన పరమోత్కృష్టమైన బాధ్యత దానిది.

కవికి – సామాజిక చలనాన్ని సరైన దృష్టితో పరీక్షించి… సమీకృతం చేసి – వొక దగ్గరకు చేర్చాల్సిన ఉత్కృష్టమైన ధర్మం వుంది. అలా సామాజిక చలనాన్ని రికార్డ్ చేసిన కవితా సంపుటి – ‘మంటిదివ్వ’. కవి – సిరికి స్వామినాయుడు. నేపథ్యం – ఉత్తరాంధ్రా.

siriki1

స్వామినాయుడుని గానీ, మిగతా ఉత్తరాంధ్రా కవులను గానీ చదివిన వాళ్లకిది అర్థమవుతుందనుకుంటాను – నాలుగైదేళ్లుగా ఉత్తరాంధ్రాలో జరుగుతున్న కల్లోలం సంగతి – దాని రాక్షస రూపం సంగతి – ప్రజల జీవన కాంక్షపై అది మోపిన ఉక్కుపాదాల సంగతి – సరిగ్గా అక్కడే సిరికి స్వామినాయుడు కవిత్వఖడ్గాన్ని చేతబూని యుద్ధవీరుడిలా కనిపిస్తాడు..

‘మంటిదివ్వ’ చదివాక – వొకసారి కాదు – మళ్లీ మళ్లీ చదివాక – ఉత్తరాంధ్రా దుఃఖపు స్థితి కళ్ల ముందు నెత్తుటి చారికలా మిగిలిపోతుంది. దేశంలో ఏ ప్రాంతాన్ని తీసుకున్నా యించుమించు యిదే స్థితి. యివే గాయాలు. ఆ గాయాల నెత్తురును తుడిచే మృదుహస్తమే కవిత్వం . గాయపడిన వాళ్ల వెన్నంటి వుండి ధైర్యాన్ని యిచ్చే ఖడ్గమే కవిత్వం. ‘మంటిదివ్వ’ – అలాంటి బరోసాను యిస్తుంది.

స్వామినాయుడు అంటాడు –

ఈ మట్టిపొరల్ని కొల్లగొట్టే
ఒకానొక ఉత్పాతాన్నెవడు కోరుకుంటాడు ?
భూమిని చాపలా చుట్టుకుపోయే
హిరణ్యాక్షుడు తప్ప !
మళ్లీ నేల మీద వాలే చోటు లేక మరణం వేపు సాగే
కష్టజీవుల కన్నీటి విషాదాన్నెవడు కలగంటాడు ?
తునాతునకలైన బతుకు శకలాన్ని
కాసుల కాటాలో తూనిక పట్టేవాడు తప్ప !
( కంచే చేను మేస్తే.. ! )

రహస్యాన్ని శోధించేవాడే కవి. సమస్త అంశాలను మార్కెటైజ్ చేస్తున్న అభివృద్ధి విధానాల ముసుగు వ్యవహారాన్ని బట్టబయలు చేసి ప్రజల ముందు నిలబెట్టేవాడే నిజమైన ప్రజావాది. ఈ కవి – ఆ పనే చేసాడు.

‘మంట’, ‘తూరుపు ఒక నెత్తుటి పొద్దు’ – ఈ రెండూ.. కళింగాంధ్రాలో థర్మల్ పవర్ ప్లాంట్స్ నేపథ్యంలో రాసినవి. ప్రజల అభీష్టమేదైతే వుందో దానినే వ్యక్తం చేసాయి ఈ కవితలు. కాలమే కవిని, కవిత్వాన్ని తయారీచేస్తుంది. అవును. ఈ కవి గానీ, ఈయన రాసిన కవిత్వం గానీ కాలం గర్భకుహరం నుంచి – వేదన నుంచి – తన ప్రజల మీద తనకు గల వొకానొక గొప్ప ప్రేమ నుంచి జనించిన భౌతిక పదార్థాంశాలే. ప్రజల సామూహిక ఆస్తిని వొక్కరే వొచ్చి నొల్లుకుపోతుంటే ఆగ్రహించాడు ( ‘కళ్లం’ కవిత ). ‘పొద్దు’ లాంటి కవితల ద్వారా తిరుగుబాటును ప్రవచించాడు. ఫ్యాక్టరీలు సృష్టిస్తున్న కాలుష్యానికి మత్స్యకారులు నానా అవస్థలు పడుతుంటే వాళ్లతో పాటూ దుఃఖించాడు.
అందుకే..

పల్లెవాళ్ల ఆల్చిప్పల కళ్లలోంచి
కురిసే కన్నీళ్లు – సముద్రం !
చందమామ – వాళ్ల సామూహిక సమాధి మీద దీపం !!
( సముద్రం మీద చందమామ )
అన్నాడు.

siriki
అడవిని గురించి – అడవి ఆసరాగా నూతన సామాజిక ప్రజాతంత్ర వ్యవస్థ కోసం పని చేస్తున్న ‘ఎర్రమందారాల’ త్యాగాల గురించి – సానుభూతితో రాసాడు. భూమి అంగడి సరుకవ్వడాన్ని చింతించాడు. పల్లెల్లో అశ్లీల నృత్యాలనుఒప్పుకోలేదు.

కవి సమాజానికి కన్నులాంటివాడు. కాపలాదారుడు. వెలుగుబావుటా. ‘మంటిదివ్వ’తో ప్రజలకు గొప్ప ప్రామిస్ చేసిన కవి – స్వామినాయుడు మరింత గొప్ప కవిత్వం సృజించాలని కోరతున్నాను.

    ( 09.02.2014 తేదీన – సిరిసిల్లలో ‘రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం’ స్వీకరించబోతున్న సందర్భంగా…..  )

-బాలసుధాకర్ మౌళి

బాల సుధాకర్

ఆమె

Katha ku Bomma (1)

రాత్రి  ఎనిమిదింటప్పుడు రావడంరావడంతోనే తన గదిలోకి వెళ్లిపోయి..
‘డామిట్‌.. ఐ కాంట్‌’ కసిగా అంటూ స్టడీ  వస్తువులన్నీ విసిరేయసాగాడు పద్దెనిమిదేళ్ల ప్రణవ్‌!
ప్రణవ్‌.. వాట్‌ ద హెల్‌ ఆర్‌ j­ డూయింగ్‌! స్టాపిట్‌!’ అంటూ కొడుకుని ఆపే ప్రయత్నం చేస్తోంది వసుధ.
‘నో..’ అరుస్తూ తల్లిని తోసేయసాగాడు. వాడిబలాన్ని నియంతించలేక అక్కడేఉన్న కుర్చీలో చతికిలబడింది. పిచ్చిపట్టినవాడిలా చేతికందిన వస్తువునల్లా విసిరేస్తున్న కొడుకుని చూసి భయపడిపోయింది. వాడిని ఆపడం తన ఒక్కదానివల్ల కాక ‘అస్త్రా…’ అని ఇరవైళ్ల కూతురిని కేకేసింది సాయం కోసం.
‘అమ్మా…’ అంటూ కంగారుగా పరిగెత్తుకొచ్చింది తల్లిపిలుపు వినిపించిన గదిలోకి. అల్లకల్లోలంగా ఉన్న ఆ చోటుని చూసి బిత్తరపోయింది అస్త్ర. వెర్రివాడిలా పవర్తిస్తున్న తమ్ముడ్ని  పట్టలేక తల్లిపడుతున్న అవస్థ చూసింది. వెళ్లి తమ్ముడిని  లాగి చెంపమీదొక్కట్టిచ్చింది. ఆ దెబ్బకు ఈ లోకంలోకొచ్చాడు ప్రణవ్‌.
‘ఆర్‌ యు మ్యాడ్‌? ఏంటిదంతా?’ బెదిరించింది తమ్ముడిని.
‘సాయంతం మాల్‌లో ఆమె కనిపించిందీ….!’ మళ్లీ అరిచాడు.
‘ఎవరు?’ ఏదో అనుమానం వసుధ పశ్నలో.
ప్రణవ్‌ ఏదో చెప్పబోతున్నంతలో ఆ మాటకు అడ్డుతగులుతూ ‘ఆ కనిపిస్తే.. ఇంటికొచ్చి నువ్విలా హంగామా చేస్తావా? బీ గ్రోనప్‌! నువ్వేం చిన్నపిల్లాడివి కాదు. కిందపడేసినవన్నీ తీసి ఎక్కడివక్కడ నీట్‌గా సర్దెయ్‌!’ అని తమ్ముడిని ఆజ్ఞాపించి ‘నువ్‌ రా అమ్మా..!’ అంటూ తల్లి భుజం చుట్టూ చెయ్యివేసి ఆమెను హాల్లోకి తీసుకెళ్లింది. తల్లిని సోఫాలో కూర్చోబెట్టి  ఫ్రిజ్ లోంచి వాటర్‌ బాటిల్‌ తీసుకొని మళ్లీ తమ్ముడి  గదిలోకి వెళ్లింది అస్త్ర. లోపలికెళుతూనే గది తలుపేసి వాటర్‌ బాటిల్‌ ప్రణవ్ కందించింది. బాటిల్‌ ఎత్తి గటగటా నీళ్లు తాగి భుజంతో మూతి  తుడుచుకుంటుండగా అంది అస్త్ర..‘రేయ్‌.. నీకెన్నిసార్లు చెప్పానా అంత ఎమోషనల్  అవొద్దని!  ఎంత సీరియస్‌ విషయాలనైనా మాములుగా  చూడ్డం నేర్చుకోరా…! దట్‌ టూ నువ్‌ ఆవేశపడిపోతున్నదంత సీరియస్‌ థింగ్‌ కాదు!’ వాడి తలనిమురుతూ  అనునయిస్తున్నట్టుగా!
అస్త్ర చేయిని విసురుగా తోసేశాడు. ‘నీకు సీరియస్‌ కాకపోవచ్చు… నాకు సీరియసే! అమ్మ ఎన్ని రోజులు బాధపడిందో నువ్వు మర్చిపోయావేమో … బట్‌ ఐ డోంట్‌!’ అన్నాడు నోరు పెంచి!
‘ష్‌… నెమ్మదిగా!’ అంది గాభరాగా.. హాల్లో ఉన్న తల్లికి వాడి మాటలు  వినపడతాయేమో  అని!
‘మన హ్యాపీనెస్‌ను దూరంచేసి ఆవిడ మాత్రం  నవ్వుతూ తెగహ్యాపీగా తిరుగుతోంది. నాకసలూ…!’ అంటూ ముక్కు పుటాలెగరేస్తూ పిడికిలి బిగించాడు ప్రణవ్‌!
‘సర్లే.. ముందు  కిందపడ్డవన్నీ తియ్‌!’ అంది వాడి సీరియస్‌నెస్‌ను చెదరగొడుతూ! ప్రణవ్‌ చేతిలో ఉన్న బాటిల్‌ తీసుకొని గదిలోంచి హాల్లోకొచ్చింది అస్త్ర. అక్కడ సోఫాలో తల్లికనిపించలేదు. బాటిల్‌ డైనింగ్‌  మీద పెడుతూ హాల్లోని బాల్కనీలోకి చూసింది. తల్లి కనిపించింది. నెమ్మదిగా వెళ్లి వెనకనుంచి వాటేసుకుంది ‘అమ్మా..!’ అంటూ ఆమె మూడ్ ని  తేలికచేయాలని.
అస్త్ర చేతుల్లోంచి తనను విడిపించుకుంటూ అలాగే కూతురు రెండు చేతులను పట్టుకొని తనకెదురుగా నిల్చోబెట్టుకుంది..‘వాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు?’ అంది కూతురు కళ్లల్లోకి సూటిగా చూస్తూ!
విషయాన్ని దాచడం అనవసరం అని గ్రహించిన అస్త్ర ‘అపర్ణ ఆంటీ గురించి’ అంది అంతే స్పష్టంగా!
దీర్ఘంగా నిట్టూర్చిన వసుధ అలాగే నిలబడిపోయింది.

‘శ్రీరామ్  … ఈవినింగ్‌ షాపింగ్‌మాల్లో ప్రణవ్‌ కనిపించాడు!’ బెడ్‌రూమ్ లోకి వస్తూ చెప్పింది అపర్ణ.
‘ఊ….!’ విన్నాడు శ్రీరామ్ ల్యాప్‌లోంచి తలెత్తకుండానే!
‘వాడేంటో నన్ను శతువును చూసినట్టు చూస్తాడు!’ అంది మంచమ్మీద అవతలివైపు కూర్చుంటూ!
శ్రీరామ్ ఏకాగ్రత చెదిరింది. దాన్ని అపర్ణ గుర్తించకుండా ఉండేందుకు ల్యాప్‌టాప్‌ కీ బోర్డ్‌ మీద వేళ్లు కదిపాడు నటించడానికి.
‘అస్త్ర బాగానే మాట్లాడుతుంది… ప్రణవే ఎందుకలా ఉంటాడు?’ అంది శ్రీరాం జవాబును ఆశిస్తున్నట్టుగా!
‘లైట్‌ తీస్కో అపర్ణా!’ జవాబైతే చెప్పాడు కాని అపర్ణకు అది సంతృప్తినివ్వదని అతనికి తెలుసు.
‘ఎంతకాలమని? అయినా.. నేనెప్పుడైనా వాడిని తక్కువ చూశానా? ఎంత కలుపుకుపోవాలని ట్రై చేసినా.. వాడి బిహేవియర్‌తో ఇన్‌సల్ట్‌ చేస్తుంటాడు!’  ఆ విషయమ్మీద ఎలాగైనా డిస్కషన్‌ పెట్టాలనే ఉద్దేశంలో అపర్ణ.
సీన్‌ అర్థమైంది శ్రీరామ్ కి. ఇంకెంతోసేపు నటించడం కుదరదు అనుకొని ల్యాప్‌టాప్‌ షట్‌డౌన్‌ చేసి ఒళ్లోంచి తీసి మంచమ్మీద పెట్టాడు.
‘నీ బాధేంటి?’ ఇప్పుడు చెప్పు విషయమేంటి అన్నట్టుగా శ్రీరామ్!
‘ఈ విషయంలో నేనోసారి వసుధతో మాట్లాడాలనుకుంటున్నాను!’ స్థిరంగా చెప్పింది అపర్ణ.
‘అంటే వసుధే ప్రణవ్‌తో అలా చేయిస్తోం…!’ శ్రీరామ్ మాటపూర్తికాకముందే అడ్డుపడిరది అపర్ణ ‘ఛఛ…!’ అని.
‘ప్రణవ్‌కి నామీదున్న మిస్‌అండర్‌స్టాండింగ్ను దూరంచేయడానికి!’ తేల్చింది అపర్ణ!
జవాబేమీ ఇవ్వకుండా మంచం పక్కనే ఉన్న టీపాయ్‌ మీది మ్యాగజైన్‌తీసుకుని  అందులో తలదూర్చాడు శ్రీరామ్.

‘నన్నెందుకు రమ్మన్నారు?’ రెస్టారెంట్లో శ్రీరామ్ కెదురుగా ఇబ్బందిగా కూర్చున్న ప్రణవ్‌ సూటిగా అడిగిన మాట!
‘ఏం తీసుకుంటావ్‌?’ ఇబ్బందిని అనుకూలంగా మార్చేప్రయత్నంలో శ్రీరామ్.
‘నన్నెందుకు పిలిచారో చెప్పండి డాడ్‌!’ అదే ప్రశ్న ఇంకొంచెం తీవ్రంగా ప్రణవ్  నుంచి.
బేరర్‌ని పిలిచి రెండు ఫ్రూట్‌పంచ్‌లు ఆర్డరిచ్చి సంభాషణ మొదలెట్టడానికి గొంతు సవరించుకున్నాడు శ్రీరామ్.
‘చిన్నా…’ అంటూ ప్రణవ్‌ చేయినొక్కాడు సున్నితంగా శ్రీరామ్ తను మాట్లాడబోయేమాటలకు నాందిగా..
‘చెప్పండి’ అంటూ మెల్లగా తన చేయిని వెనక్కి లాక్కున్నాడు ప్రణవ్‌!
‘రేయ్‌.. నేను ఇదివరకే నీతో మాట్లాడాల్సింది!’ శ్రీరామ్
‘దేనిగురించి డాడీ…!’ అప్పుడే బేరర్‌ తెచ్చిన ఫ్రూట్‌పంచ్‌ గ్లాస్‌ను తనవైపు లాక్కుంటూ అన్నాడు ప్రణవ్‌.
‘అపర్ణ గురించి!’ కొంచెం ఇబ్బంది ధ్వనించిన గొంతుతో శ్రీరామ్.
ప్రణవ్‌ సైలెంట్‌గా ఫ్రూట్‌పంచ్‌లోని స్టాను గమనిస్తూ ఉండిపోయాడు.
‘నువ్విప్పుడు అన్ని విషయాలూ ఆలోచించే ఏజ్‌కొచ్చావ్‌. ఐ మీన్‌ నౌ ఆర్ యూ  మెచ్యూర్డ్‌ గై! అపర్ణను, ఆమె నా లైఫ్‌లోకొచ్చిన సిట్యుయేషన్‌నూ నువ్‌ అర్థం చేసుకుంటావనే అనుకుంటున్నాను..’ అని ప్రణవ్‌ వంక చూశాడు శ్రీరామ్!
ఎలాంటి ఫీలింగ్‌ లేకుండా అలాగే స్టాతో ఆడుకుంటున్నాడు ప్రణవ్‌!
‘ప్రణవ్‌.. ఆర్‌ యు ­ లిజనింగ్‌ టు మి?’ కొంచెం గట్టిగా శ్రీరామ్.
తలపైకెత్తి కళ్లతోనే ‘యెస్‌’ అన్నట్టు సైగ చేశాడు ప్రణవ్‌.
‘అపర్ణ నా లైఫ్‌లోకి రావడం.. ఇట్స్‌ యాన్‌ యాక్సిడెంటల్‌ థింగ్‌!’ అసహనంగా అన్నాడు శ్రీరామ్.
‘యాక్సిడెంటల్‌ అయినా… వాటెండ్‌ అయినా  అమ్మ ఫేస్‌ చేసిన బాధ,  నేను, అక్క మిమ్మల్ని మిస్‌ అయిన మూమెంట్స్‌ అయితే నిజమే కదా!’ నిర్లక్ష్యంగా అన్నాడు ప్రణవ్‌.
‘అఫ్‌కోర్స్‌రా… కాదనడంలేదు. కాని మీ అమ్మ నా సిట్యుయేషన్‌ అర్థంచేసుకుంది… మీరు నన్నెంత మిస్‌ అవుతున్నారో..నేనూ మిమ్మల్ని అంతే మిస్‌ అవుతున్నా..! అయినా నేనేం మిమ్మల్ని కాదని.. మీకు అందకుండా వెళ్లిపోలేదు కదా… మీతో ఉండకపోయినా… కలుస్తూనే ఉన్నా.. మీ అవసరాలు తీరుస్తూనే ఉన్నా!’ సమర్థించుకునే ప్రయత్నంగా శ్రీరామ్!
‘అకేషన్స్‌కి బట్టలు కొనిపెట్టి, వీకెండ్స్‌ మాతో గడిపితే మాకు దగ్గరగా ఉన్నట్టా డాడీ…! ఆవిడే లేకపోతే మిమ్మల్నిలా  వీకెండ్స్‌కి కల్సుకోవాల్సిన అవసరమేంటి మాకు?’  మీద పిడికిలితో చిన్నగా గుద్దుతూ అన్నాడు ప్రణవ్‌!
‘డాడీ… మీరంటే నాకు కోపంలేదు.. ఆవిడంటే కోపం… మిమ్మల్ని మానుంచి తీసుకెళ్లిపోయినందుకు కోపం.. అమ్మ ఎన్ని రోజులు ఏడ్చిందో నాకు తెలుసు. ఐ నెవర్‌ ఫర్‌గెట్‌ దోస్‌ డేస్‌! దానికి రీజన్‌ ఆమే…ఆమే.. ఆమే..!’ దాదాపుగా అరిచేస్తూ ప్రణవ్‌!
బిత్తరపోయాడు శ్రీరామ్. కాసేపటిదాకా నోటమాటరాలేదు అతనికి.
‘నో.. చిన్నా! ఇందులో అపర్ణ తప్పులేదు. ఆమె నాలైఫ్‌లోకి తనంతట తాను రాలేదు నేను ఇన్వైట్‌ చేశాను.  ఆమెను ఇష్టపడ్డాను. నీకు పదేళ్ల వయసప్పుడు.. కంపెనీ అసైన్‌మెంట్‌ మీద సింగపూర్‌ వెళ్లాను. సెవెన్‌మంత్స్‌ ఉన్నానక్కడ. ఆ టైం లో  అపర్ణతో ఫెండ్‌షిప్‌ అయింది. ఆమె లవ్‌చేశాను. తనతో నా లైఫ్‌ షేర్‌ చేసుకోవాలనుకున్నాను. ఈ విషయం మీ అమ్మకు చెప్పి డైవోర్స్‌ తీసుకున్నాకే తనని పెళ్లిచేసుకున్నాను. నువ్వనుకున్నట్టు తప్పు ఆమెది కాదురా.. నాది. నన్ను వదిలి తననెందుకు ఓ ఎనిమీలా చూస్తావ్‌! మిస్టేక్‌ వజ్‌ మైన్‌!’ శ్రీరామ్ ఆవేశంగానే చెప్పాడు. అంతలోకే స్వరం తగ్గించి
‘చిన్నా… అపర్ణను మీ అమ్మలా చూడమని చెప్పట్లేదు. బట్‌ ఓ ఉమన్‌గా j­ హావ్‌ టు రెస్పెక్ట్‌ హర్‌! ఐ కెన్‌ అండర్‌స్టాండ్‌ యు­వర్‌ ఎగోని. కాని నేను మీ పట్లెప్పుడూ ఇర్రెస్‌పాన్స్‌బుల్‌గా లేను నాన్నా…! నాకు మీరు కావాలి, అపర్ణా కావాలి! అమ్మను చాలా బాధపెట్టాను.. ఒప్పుకుంటా! ఒకవేళ అమ్మ ఇట్లాంటి పనిచేస్తే నేను క్షమించేవాడిని కాదేమో … కాని అమ్మ నన్ను ఫర్‌గివ్‌ చేసింది! అపర్ణను ఓ ఫ్రెండ్ లా  రిసీవ్‌ చేసుకుంది. రెస్పెక్ట్‌ ఇస్తోంది.  ఈవిషయంలో వసుధ హుందాతనాన్ని చూసి సిగ్గుతో చితికిపోయిన రోజులు నాకూ ఉన్నాయ్‌రా! మీ అమ్మనెంత క్షోభపెట్టానో అని కుమిలిపోయిన రాత్రుళ్లు  ఎన్నో!  తనని ఒంటిరిని చేశానే అని చిత్రవధ  అనుభవించిన సందర్భాలు బోలెడు! ఆ తప్పులన్నీ నావిరా! అపర్ణవి కావు! షి ఈజ్‌ ఇన్నోసెంట్‌ ఇన్‌ దిస్‌ మ్యాటర్స్‌! షి నీడ్స్‌ ది సేం రెస్పెక్ట్‌  ఫ్రం యు రా చిన్నా…!’ అంటూ ప్రణవ్‌ చేయి పట్టుకున్నాడు.
తండి కళ్లల్లోని సన్నని నీటి పొర కొడుకు దృష్టినుంచి తప్పించుకోలేకపోయింది!

‘ప్రణవ్‌… యోయో హానీసింగ్‌ షోకి పాస్‌లు వచ్చాయ్‌రా!’ అప్పుడే వచ్చి గదిలోకి దూరి తలుపేసుకున్న కొడుకు వినేలా గట్టిగా చెప్పింది వసుధ.
కొన్ని క్షణాలకు డోర్‌ తీసుకొని టవల్‌తో మొహం తుడుచుకుంటూ  బయటకు వచ్చిన ప్రణవ్‌ ‘హౌ కం?’ అని అడిగాడు.
‘అ..ప..ర్ణ.. ఆంటీ.. తెచ్చిచ్చింది!’ కొంచెం నసుగుతూ చెప్పింది వసుధ.
‘నాకు హానీసింగ్‌ అంటే ఇష్టమని ఆమెకెవరు చెప్పారు?’ డైనింగ్‌  డబ్బాలో ఉన్న బిస్కట్స్‌ తీసుకుంటూ ప్రణవ్‌.
‘అక్క చెప్పి ఉంటదిలే! ఎవరు చెప్తే ఏంరా.. షోకి పాసెస్‌ దొరికాయ్‌ మీ ఫ్రెండ్స్‌తో వెళ్లు!’ ఫ్రిజ్‌మీదున్న పుస్తకంలోంచి పాస్‌లు తీసిస్తూ అన్నది వసుధ.
వాటివైపు చూడకుండా మౌనంగా బిస్కట్స్‌ తింటున్న కొడుకు దగ్గరకి ఇంకో చైర్‌ జరుపుకొని కూర్చుంటూ ‘అపర్ణ ఆంటీ! ఆమె, ఈమె కాదు! పెద్దవాళ్లకు రెస్పెక్ట్‌ ఇవ్వడం నేర్చుకో!’ చిన్నగా మందలిస్తున్నట్టుగా అంది వసుధ.
అలాగే నేల చూపులు చూశాడు కాని స్పందించలేదు ప్రణవ్‌.
‘డాడీ.. కలిశాడా?’ అడిగింది.
‘అపర్ణాం..’ అని నాలుక్కర్చుకున్నట్టుగా వెంటనే ‘ఆమె నిన్ను కలిసిందా?’ అన్నాడు వసుధ మొహంలోకి చూస్తూ!
‘ప్రశ్నకుపశ్న సమాధానం కాదు!’ కటువుగా వసుధ.
‘కలిశాడు!’ తలవంచుకుని చెప్పాడు.
ప్రణవ్‌ జుట్టును ఆప్యాయంగా చెదురుస్తూ ‘అపర్ణ అంటే నాకెప్పుడూ కోపంలేదు. అపర్ణ విషయం మీడాడీ నాతో చెప్పినప్పుడు కోపమొచ్చింది, పోట్లాడాను, చెంపచెళ్లుమనిపించాను.. నీ మొహం చూపించకుపో అని ఇంట్లోంచి గెంటేశాను. తర్వాత మీ కోసం ఆ కోపాన్నీ అణచుకున్నాను. అర్థంచేసుకోవడం స్టార్ట్‌చేశాను. అప్పుడు మీ డాడీపట్ల జాలేయడం మొదలైంది. జరిగింది మర్చిపోలేనురా… అలాగని రాచిరంపానా పెట్టలేను. అపర్ణను మన ఫ్యామిలీలోకి ఇన్వైట్‌ చేయడానికి రీజనైన మీ డాడీనే జాలిపడి ఎక్స్‌క్యూజ్‌ చేసినప్పుడు ఎవరో తెలియని అపర్ణని సాధించి ఏంచేయగలను? మన లైవ్స్‌ని హెల్‌లోకి తోసుకోవడం తప్ప! నా ఫ్రెండ్స్‌ సౌజన్యాంటీ, జయాంటీ, కరుణాంటీని ఎలాగో అపర్ణ కూడా అలాగే అనుకో! ఇగ్నోర్‌ చేయలేని ఇంపార్టెంట్‌ పర్సన్‌! ఆమెకు డాడీ ఎంతో మనమూ  అంతే! షి ఈజ్‌ నాట్‌ అవర్‌ ఎనిమీ! షి ఈజ్‌ అవర్‌ ఫ్రెండ్‌! గౌరవించడం నేర్చుకో… అలవాటు చేసుకో! మీ డాడీ వల్ల నేను ఇబ్బంది పడ్డం నీకెంత బాధనిపించిందో.. నీ వల్ల ఆమె ఇబ్బంది పడ్డం నాకూ అంతే బాధగా ఉంటుంది! ఐ థింక్‌ యు­ గాట్‌ వాట్‌ ఐ సెడ్‌!’ అంటూ  అక్కడి నుంచి వెళ్లిపోయింది వసుధ!
మీదున్న పాస్‌లను తీసుకొని వాళ్లమ్మ ఫోన్‌లోంచి అపర్ణకు కాల్‌ కలిపాడు.
‘హలో ఆంటీ దిస్‌ ఈజ్‌ ప్రణవ్‌! థాంక్యూ ఫర్‌ పాసెస్‌!’ చెప్పాడు!

రమా సరస్వతి

రమా సరస్వతి

–రమా సరస్వతి

 

నాకు నచ్చిన చాసో కథ: “ఎందుకు పారేస్తాను నాన్నా?”

images

చాసోని కథకుల కథకుడుగా వర్ణించారు కొకు. ఆ మాటేమో నిజమే. కానీ అందుకు నిదర్శనం? చాసో ఏ కథ తీసుకున్నా అందుకు నిదర్శనం కనపడుతుంది. ముఖ్యంగా ఆయన శిల్పాన్ని గమనిస్తే అందుకు తార్కాణాలు కథ కథలోను కనిపిస్తాయి. “వాయులీనం”, “ఏలూరెళ్ళాలి”, “బొండుమల్లెలు”, “ఎంపు”, “కుంకుడాకు” ఇంకా ఎన్నో…! ప్రతి కథలో ఓ వైవిధ్యమైన కథా వస్తువు, అలవోకగా సాగిపోయే నడక, అమాంతంగా వచ్చి మీదపడే ముగింపు. ఇవన్నీ గమనించుకుంటూ చదివితే ప్రతి కథకుడూ ఓ మెట్టు పైకెక్కడం ఖాయం. అలా ఎదిగిన ప్రతి కథకుడూ మళ్ళీ అదే మాట అంటాడు – “చాసో కథకుల కథకుడు” అని.

చాసో కథలలో బాగా నచ్చిన కథ ఏది అంటే చెప్పటం చాలా కష్టం. “ఎంపు” నేను మొట్టమొదట చదివిన చాసో కథ. అందులో నిష్కర్షగా, కఠోరంగా ఓ చెప్పిన జీవిత పాఠాన్ని ఆకళింపు చేసుకోడానికి గడిపిన ఒంటరి రాత్రి గుర్తొస్తుంది. “వాయులోనం” కథ చదవడం అయిపోయినా అందులో లీనమై బయటపడలేక గిలగిలలాడిన సందర్భం గుర్తుకొస్తుంది. కనీసం పది కథలు గుర్తొస్తాయి. అయితే ఇవన్నీ పాఠకుడిగా. ఈ మధ్యకాలంలో ఓ కథకుడిగా ఆయన్ని మళ్ళీ చదివినప్పుడు నాకు చాసోలో కనపడ్డవి జీవిత పాఠాలే కాదు, కథా రచన పాఠాలు కూడా. ఆ దృష్టికోణంలో చూస్తే నాకు చాలా బాగా నచ్చినది, ప్రభావితం చేసినది “ఎందుకు పారేస్తాను నాన్నా” అనే కథ.

(కథ చదవనివారుంటే ఆ కథని చదివి ఈ వ్యాసం కొనసాగించగలరు. ఇక్కడినుంచి తొలిపఠనానుభూతిని తగ్గించే సంగతులు వుండగలవు)

కృష్ణుడనే కుర్రవాడు. చదవాలని ఆశ. పేదరికం వాడి చదువుని మింగేసిన భూతం. తండ్రి చుట్టలు తెమ్మంటాడు. బడిమీదుగా పోక తప్పదు. నామోషీగా అటు వైపు వెళ్తాడు. నరిశింహం, శకుంతల అనే సహాధ్యాయులతో మాట్లాడతాడు. బడి మొదలైనా అక్కడి వరండాలో స్తంభానికి జేరబడి వుండిపోతాడు. తండ్రి వెతుక్కుంటూ వస్తాడు. కొడుకు బాధని తెలుసుకుంటాడు. కొడుకు బాధని తనూ పడతాడు. చుట్టాలు తెమ్మని ఇచ్చిన డబ్బులు వున్నాయా పారేశావా అంటాడు. – “ప… ప్ప… ప్పారీలేదు. జేబులో ఉన్నాయి… ఎందుకు పారేస్తాను నాన్నా?” అంటాడు కృష్ణుడు.

ఆ వాక్యంతో కథ అయిపోయింది. అదే వాక్యంలో మాట కథకి శీర్షిక అయ్యింది.

అదలా పక్కనపెడదాం. ఏమిటీ కథలో గొప్పదనం? చెప్పాలనుకున్న విషయం చిన్నదే. స్పష్టంగా చెప్పేడు కూడా. “ఎందుకు పారేస్తాను నాన్నా?” అన్న ఒక్క ప్రశ్న ఎన్ని ప్రశ్నలు పుట్టిస్తుంది? “ఎందుకు పారేస్తాను? ఎలా పారేస్తాను? నాకు బాధ్యత తెలుసు కదా నాన్నా. నా చదువాపేసిన పేదరికం గురించి కూడా తెలుసు కదా నాన్నా. ప్రతి రూపాయినీ పారేయకుండా ఉంచుకుంటే అవి నా పుస్తకాలకు పనికొస్తాయనీ తెలుసు కదా నాన్నా..” అంటూ పిల్లాడు అడిగనట్లు అనిపిస్తుంది. అంతకు ముందే పుస్తకం కొంటానని మాట ఇచ్చిన నాన్న, చుట్టలు మానేస్తే కృష్ణుడి జీతానికి సరిపోతుందనుకున్న నాన్నా, పిల్లాడు పారేయకుండా వుంచిన డబ్బుతో అప్పటికప్పుడు ఇంగ్లీషు పుస్తకం కొన్నాడా? ఎమో తెలియదు. కానీ తెలుసుకోవాలనిపిస్తుంది. కథ అయిపోయిన తరువాత ఏం జరిగుంటుందో అన్న ఆలోచనపుడుతుంది. ఇలా జరిగి వుంటే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చేదాకా వెంటాడుతుంది. అదీ గొప్ప ముగింపు లక్షణం. చాసొ ప్రతి కథలో, (ప్రత్యేకించి ఈ కథలో) ఇలాంటి ముగింపులే వుంటాయి. తెలుగు కథలలో వచ్చిన అత్యుత్తమ ముగింపు వాక్యాలు రాస్తే అందులో పదింట అయిదు చాసోవి వుండితీరాల్సిందే..!

ముగింపుకు అంత బలం ఎక్కడ్నుంచి వచ్చింది? కథ మొదటి ముగింపుకి బలాన్ని ఇస్తూనే వుంటాడు చాసో. వాతావరణ చిత్రణ, పాత్ర చిత్రణ అన్నీ క్రమంగా ఈ సొరంగం తొవ్వుతున్నట్లు నిర్దేశించిన ముగింపు వైపు వెళుతూనే వుంటాయి. పాఠకుడి గమనించినా గమనించకపోయినా.

(కేవలం ఆరు పేజీల కథ ఇది. నేను పూర్తిగా విశ్లేషిస్తే అంతకన్నా ఎక్కువే అవుతుందేమో)

chaganti somayajulu copy

కృష్ణుడి పాత్రని తీసుకుందాం –

మూడో వాక్యంలోనే అనేస్తాడు – “కృష్ణుడి వీధి ముఖం చూడకుండా, మొగుడు చచ్చిన విధవలాగ ఇంట్లో దూరి కూచుంటున్నాడు” అని. చదువు మానేయడం వల్ల కలిగిన నామోషి కారణంగా బయటికి వెళ్ళని కుర్రాడు. ఇది కథ మొదలౌతూనే పాఠకుడి తెలిసేలా చెప్పేశాడు కథకుడు. తరువాత కథలో కృష్ణుడి మానసిక స్థితిని వర్ణిస్తాడు -కళకళలాడుతున్న “బడి చూడగానే బెంగ పట్టుకుంది”. ఒక చోట “నామోషి” అయితే మరో చోట “నామర్దా” అంటాడు. “చదువుతున్న కుర్రాళ్ళమీద ఈర్ష, తనకి చదువులేకుండా పోయిందన్న దుఃఖము – రెండూ రెండు లేడిక పాములై అతని బుర్రని కరకర లాడిస్తున్నాయి” అంటాడు. “తనకు చదువుపోయింది కదా అని కుమిలిపోతున్నాడు”. “(డిస్కంటిన్యూడ్ అన్న..) పదం జ్ఞాపకం రాగానే అతనికి దుఃఖము పొర్లుకుంటూ వచ్చింది…” ఇలా అడుగడుగునా కృష్ణుడి బాధని మన బాధ చేసేస్తాడు కథకుడు.

నరిశింహంతో మాట్లాడినప్పుడు కృష్ణుడు వాడి ముందు ఎంత అల్పుడో చెప్తాడు. నరిశింహం వేసుకునే డబుల్ కప్పు చెక్కా, హవానా పేంటు గురించి చెప్పి కృష్ణుడి నిక్కరులో వున్న పోస్టాఫీసు, చినిగిపోతే కుట్టగా బుట్టలా భుజాలు పైకి లేచే చొక్కా గురించి చెప్తాడు. అక్కడితో ఆగకుండా – “పేంటుకైతే బట్ట ఎక్కువ పడుతుంది. బట్ట ఎక్కువైతే డబ్బు ఎక్కువవుతుందని వాడికి తెలుసు” అంటాడు. ఈ వాక్యాన్ని కథ ముగింపు వాక్యంతో కలిపి చదవండి. ఆర్థిక అవసరాలు, డబ్బుల విలువ తెలుసుకున్న పిల్లాడు కృష్ణుడు. కాదూ పేదరికం నేర్పించిన పాఠాలను ఆకళింపు చేసుకున్నవాడు. వీడు కథానాయకుడు.

మరో నాలుగు వాక్యాలు ప్రయాణించగానే నరిశింహం ముందు అల్పుడిలా కనపడ్డ కృష్ణుడ్ని వెంటనే వామనావతారంలా పెంచేస్తాడు. “కృష్ణుడు మార్కుల గొడవ తేగానే గొప్పవాడైపోయాడు. తెలివైనవాడు కాబట్టే నలుగురూ గౌరవిస్తున్నారు” అంటాడు. తెలివితేటలు వుండి చదువుకోలేని అశక్తత ప్రదర్శించడం వల్ల ఆ పాత్ర మీద సింపతీ పెరుగుతుంది కదా..! అక్కడ్నుంచి కథంతా అదే ప్రదర్శన కొనసాగుతుంది.

enduku

శకుంతల కూడా తెలివైనదే. ఆ పిల్ల ఇంగ్లీషులో ఫస్టు. కృష్ణుడు తెలుగులో, లెక్కల్లో ఫస్ట్. గమనించండి లెక్కల్లో ఫస్ట్. డబ్బుకి లెక్కలకి వున్న సంబంధం డబ్బు పట్ల వుండే జాగ్రత్తే కదా..!! లెక్కలు బాగా వచ్చిన పిల్లాడికి డబ్బు విలువ తెలియకుండా ఎలా వుంటుంది. కలిసిన ఇద్దరు పిల్లలూ బడిలోకి రమ్మంటారు. కృష్ణుడి రానని చెప్పడు. అప్పటికే తన తల్లి తండ్రికి నచ్చజెప్పినా, తండ్రిమాటే నెగ్గుతుందనీ “చదువుకి స్వస్తి చెప్పడమే ఖాయమనీ” అప్పటికే నిర్థారించుకోని వుంటాడు. అయినా కలిసిన పిల్లలతో (ఒకటికి రెండుసార్లు) సోమవారం నుంచి బళ్ళో చెరుతానని చెప్తాడు. తన మనసులో వున్న ఆశని వాళ్ళ మీద ప్రొజెక్ట్ చేస్తాడు. ఓ క్షణం శకుంతలని వెనక్కి పిలిచి చెప్పేయబోతాడు కానీ తమాయించుకుంటాడు.

బళ్ళో వొంటరిగా స్తంభానికి జేరిబడి కూర్చోని తాను లేకుండా జరిగిపోతున్న క్లాసులను వింటాడు. గత సంవత్సరం జరిగిన క్లాసుల్లో తన ప్రతిభను గుర్తుచేసుకుంటాడు. స్కూలు మానేసిన మరో కుర్రవాడి పేరు కొట్టేసి “డిస్కంటిన్యూడ్” అని రిజిస్టర్లో రాసిన సంగతి గుర్తు చేసుకుంటాడు. తన భవిష్యత్తు ఏమిటా అని ఆలోచిస్తాడు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది.. మూడింటిని కలిపితే “దుఃఖం పొర్లుకుంటూ” వస్తుంది.

“నేను ఇంటికి వెళ్ళను” అని అనుకుంటాడు. ముక్కు దిబ్బడేసిపోతుంది. “ముక్కుని ఎగబీల్చుకుంటూ పొంగుకొస్తున్న దుఃఖానికి ఆనకట్టలు” వేస్తాడే తప్ప ఏడవడు. మరెప్పుడు ఏడుస్తాడు? వాళ్ళ నాన్న వచ్చాక.

“వాళ్ళంతా బడికెళ్ళారు!”

“వెర్రి నాగమ్మా. అదిరా” అన్నాడు తండ్రి.

అప్పుడు ఏడ్చాడు. “వెక్కి వెక్కి చుట్టుకుపోతూ ఏడుపు మొదలెట్టాడు. కొడుకు బాధంతా తండ్రికి బోధపడ్డాది. కొడుకు బాధంతా తండ్రి పడ్డాడు.” అంటాడు చాసో. ఒక్క వాక్యం. ఆ ఒక్క వాక్యంతో కృష్ణుడు ఆపుకున్న ఏడుపుకి ఓ ప్రయోజనం చేకూరుస్తాడు.

ఈ కథలో విలన్ ఎవరు? మనకి బాధ కలుగుతుంది నిజమే. కోపం కూడా వస్తుంది. ఎవరి మీద? తెలియదు. పరిస్థితులా? పేదరికమా? అసమానతలా? ప్రభుత్వమా? తెలియదు. కోపం ఎవరి మీదో తెలియక అది కూడా దుఃఖంగా మారుతుంది.

తండ్రి మీద కోప్పడగలమా?

“చదువు మానిపించానని అంత బాధపడుతున్నావా? బడి వరండాలు పట్టుకుని దేవుళ్ళాడుతున్నావా నాయనా? పద ఇంటికి” అన్న తండ్రి మీద మీకు కోపం వస్తోందా?

“(పుస్తకాలు) కొందాం, పద. ఏడవకు నాయనా, నే చచ్చిపోయాను, ఏడవకు!” అని తండ్రిని చూస్తే మీకు ఏడుపొస్తుందా కోపం కలుగుతుందా?

అదే తండ్రి తాగుబోతు అయ్యింటే? కొడుకు అత్తెసరు విద్యార్థి అయితే? ఏ పాత్ర ఎలా వుండాలో. ఏ వాక్యం ఎంత వుండాలో. ఏ పదం ఎక్కడ వెయ్యాలో. ఏ అక్షరం ఏ భావాన్ని కలిగిస్తుందో – తూకం వేసినట్లు రాయటమే చాసో గొప్పదనం.

ఇలా లెక్కలు వేసి కథలు రాయవచ్చు. ఆలోచించి కథని అల్లవచ్చు. కానీ చాసో లెక్కలు వెయ్యలేదు. ఆలోచించి రాయలేదు. వాటంతట అవే వచ్చి అలా కూర్చున్నాయి. ఇప్పుడు మనం వాటినికి “బైసెక్ట్” చేసి వాటిని ఫార్ములా కనిపెట్టుకోడానికి వాడుకుంటున్నాం. అంచేత, చాసో కథకుల కథకుడే కాదు. కథకుల పాలిటి ఓ లైబ్రరీ, ఓ లాబరేటరీ కూడా.

– అరిపిరాల సత్యప్రసాద్

aripirala

గృహ హింస – కొలకలూరి ఇనాక్ కథ

(ఆచార్య కొలకూరి ఇనాక్ కు పద్మశ్రీ లభించిన సందర్భంగా ఆయన రాసిన ” గృహహింస” కథ ను పునర్ముద్రిస్తున్నాము.)

 సాయంకాలం పెందలాడే ఇంటికి వస్తూ డజను అందమైన పార్శిల్ ప్యాకెట్లు తెచ్చి డబుల్‌కాట్ నిండా పరచిపెట్టాడు కృష్ణమూర్తి. అంతకు ముందే నిద్రలేచిన సరళ ముఖం కడుక్కొని వచ్చి వాటిని చూసి కంపెనీనుంచి భర్త ముందుగా వచ్చినందుకు మురిసిపోతూ “ఇవ్వి?” అంది.

“నీకే!” అన్నాడు.

ఒక పార్శిల్ విప్పింది. కోతి బొమ్మ. ఊలుది. తోక మూరెడు. ముందు కాళ్ళు పొడుగు,వెనక్కాళ్లు కురచ. ఇటువంటి బొమ్మే తాని అత్తవారింటికి వ తెచ్చుకుంది. రెండు ముంగాళ్ళు మెడచుట్టూ, తోక నడుం చుట్టూ చుట్టుకుని కోతిని వీపుమీద కూర్చోబెడితే, అది ముఖంపెట్టి ముద్దిస్తూ ఉంది.

మిగతా పార్శిళ్ళు విప్పింది సరళ. టెడ్డీబేర్! ఎంత బాగుందో! స్కూలుకెళ్ళే పాప గాజుబొమ్మ! ముచ్చటగా వుంది. పల్లెపడుచు! ప్లాస్టిక్ బొమ్మ! కళ్లెంత చక్కగా ఆర్చుతుంది! మూస్తూ తెరుస్తూ వుంది.

ఆనందంగా వాటి వంక చూస్తూ –

“ఎందుకివన్నీ?”     “నువ్వాడుకోవడానికి!”     “నువ్వున్నప్పుడు నీతోనే ఆడుకోవడం!”     “నేను కంపెనీకి పోయినప్పుడు?”

“మీ బొమ్మలతో ఆడుకుంటా! అయినా ఒకేసారి ఇన్ని బొమ్మలెందుకు” అంటూ షోకేసులో సర్దింది.

 

* * *

 

ఆ రోజు సాయంకాలం త్వరగా వచ్చి మంచమంతా పాకెట్లు పెట్టి సరళను నిద్రలేపాడు కృష్ణమూర్తి.

ఆమె కళ్లు నులుముకుంటూ, ఆవులిస్తూ చీర సరిచేసుకొంటూ, తల సవరించుకొంటూ, కళ్ళూ మూస్తూ తెరుస్తూ భర్తను “వచ్చేశారా” అంటూ వాటేసుకొంది. ఆమెను వాష్‌బేసిన్ దగ్గరకు తీసుకుపోయి, ముఖం కడిగి, తల జుట్టు వెనక్కు పెట్టి టవలు ముఖం, చేతులుల్, మెడ తుడిచి, మంచం దగ్గరకు తీసుకువచ్చి, వాటిని చూపించాడు కృష్ణమూర్తి.

“ఏవిటీ?” అంది.

 

“చూడు” అన్నాడు.

విప్పసాగింది. మైసూర్‌పాక్! మెత్తగా తన పెదవిలాగా వుంది. కొరికింది. కొరికించింది. హల్వా! బుగ్గలాగా వుంది. రుచి చూసింది. చూపించింది.

బందరు లడ్డు! జవజవలాడుతూ వుంది. పట్టుకొంటే పగులుతుందా అనిపించింది. పగిలి కిందపడకుండా కొరికింది. భర్తకు ఎంగిలి తినిపించింది.

“ఇంక తినలేను” అంది.

“తినాల్సిందే” అన్నాడు.     “కష్టం బాబూ!”     “ఇద్దరం కష్టపడదాం!”     అన్ని పాకెట్లు విప్పింది. మిగతావి రుచి కూడా చూడలేదు. “ఇన్నా? ఒకేసారా? ముఖం మొత్తదా?” అంది.     “నీకు స్వీట్లు ఇష్టం కదా!”     “ఇష్టమని – ఇన్నా?”     “రోజంతా తింటూ వుండు”    “కడుపా? చెరువా?” అనడిగి “కడుఫే!” అని నవ్వింది.     ఆమె నవ్వుకి వంత నవ్వాడు కృష్ణమూర్తి.

* * *

 

ఆరోజు మధ్యాహ్నమే ఇంటికొచ్చాడు కృష్ణమూర్తి. వస్తూ అయిదుగురు ఆడవాళ్ళను తీసుకొచ్చాడు. ఒక్కక్కరు ఒక్కొక్క గోనెసంచి తెచ్చారు. ప్రతి గోనె తడిగా వుంది. నీటిబొట్లు పడుతున్నాయి.

ఆడవాళ్ళు గోనెసంచులు బెడ్‌రూంలో దించి నిలబడ్డారు. భోజనం చేసి ఆవులిస్తూ పడుకోబోతున్న సరళ భర్తను, బస్తాలనూ, స్త్రీలనూ చూసి అడిగింది.

“ఏమిటి?”         “చూడు!” అన్నాడు.         ఆడవాళ్ళు బస్తాల్లో ఉన్నవాటిని అయిదు సిరిచాపల మీద కుమ్మరించి వాటి ముందు కూర్చున్నారు.

మల్లెలు! బొండుమల్లెలు! సన్నజాజులు! గులాబీలు! సరళ చప్పున మల్లెలు దోసిళ్ళతో ఎత్తుకుంది. బొండుమల్లెలు గుండెలకు హత్తుకుంది. సన్నజాజులు చెక్కిళ్ళకు తాకించుకుంది. కనకాంబరాలు స్వర్ణాంబరాలు లాగ తీసి చూసింది. గులాబీలు చూస్తూ కూర్చుండిపోయింది. కృష్ణమూర్తి ఆమెనే చూస్తున్నాడు. పూలు తెచ్చిన స్త్రీలు పూలు మాలలు కడుతున్నారు. చెండులు, దండలు కడుతున్నారు.

“ఏం ఫంక్షనూ?” దీర్ఘం తీసింది.

“శ్రీమతి సంతోష ఫంక్షన్”

 

“అంటే?”

“అవన్నీ నీకే!”         “నాకా?”         “ఊ నీకే!”         “ఇన్నా?”         “అన్నీను!”         “ఏం చేసుకోను”         “తల్లో పెట్టుకో! మెళ్ళో వేసుకో! మంచం మీద పరుచుకో! దేవుళ్ళకు వేసుకో! ఇంకా మిగిలితే-”         “ఆ మిగిలితే?”         “ఫ్రిజ్‌లో పెట్టుకో”         “పూలు – ఫ్రిజ్‌లోనా?”

సరళ నవ్వుతూ వుంది. ఎంత చక్కగానో నవ్వింది. పూలులాంటి నవ్వు. పరిమళం లాంటి నవ్వు. పరవశం లాంటి నవ్వు. గదంతా వ్యాపించిన నవ్వు. సరళ కరిగిపోతున్న మంచుముక్కలా, మంచి ముత్యంలా, మధుర దృశ్యంలా నిలబడింది. కృష్ణమూర్తి తనివితీరా సరళ సుందర రూపం చూస్తూ పులకించిపోయాడు.

* * *

 

కృష్ణమూర్తి తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. కోట్ల వ్యాపారం. కోటానుకోట్లు లాభం. లెక్క తెలియనంత ఆస్తి. పిచ్చిపట్టే సంపద. ఏం చేసుకొంటారు?         ఎం.బి.ఏ. తర్వాత వ్యాపారం చూసుకుంటూ క్షణం తీరిక లేకుండా వుంటున్నాడు. పెళ్ళయి సంవత్సరమైనా ఇంటి ముఖం చూడకుండా కంపెనీ పనులతో తలమునకలై వుండేవాడు కృష్ణమూర్తి. తల్లిదండ్రులకు కొడుకులో వచ్చిన ఈ మార్పు అర్థం కావటం లేదు.

* * *

 

        మర్నాడు కంపెనీకి పోయి గంట కూడా ఉండకుండా ఇంటికి తిరిగి వచ్చాడు కృష్ణమూర్తి. అతడి కారుతో పాటు వ్యాను వచ్చింది. వ్యానులోంచి నలుగురు సేల్స్మేన్లు ఇద్దరు స్త్రీలు వచ్చారు. వ్యాన్లోని ప్యాకెట్లు దించి ఇంట్లోకి తెచ్చి ఒక్కొక్కటిగా పడకగదిలో చాపలమీద పరిచారు. 

            అన్నీ చీరలు! జాకెట్ గుడ్డముక్కలు! 

                సరళ చూసి మురిసిపోయింది. చీరలు విప్పింది. కొన్ని తీసి పక్కన పెట్టింది. కొన్ని ఎదమీద వేసుకుని చూసింది. మంచిరంగులు. చాలా వెరైటీలు. 

       “ఎవరికి?” 

 

       “నీకే!” 

 

       “బంధువులకు పంచాలా?” 

 

       “నువ్వే కట్టుకోవాలి!” 

 

       “అన్నీనా?” 

 

       “అన్నీ!” 

 

       “కొన్ని సెలక్ట్ చేసుకొంటాను!” 

 

       “అన్నీ సెలక్ట్ చేశాను!” 

 

       “ఇన్నా!” 

 

       “ఆ! ఒక్కొక్క రంగు, ఒక్కొక్క వెరైటీ చొప్పున తెచ్చాను. ఏ రంగు, ఏ వెరైటీ రెండోది ఉండదు” 

 

       “మీ టేస్ట్ గ్రేట్”

 

“థాంక్స్!”

“రంగులు బాగున్నాయి”        “థాంక్స్!”        “పల్లు ఎక్సలెంట్!”        “థాంక్స్!”        “వెరైటీలు సుపర్బ్”        “థాంక్స్!”        “అసలు మీరే నచ్చారు”        “థాంక్స్!”        “వీళ్ళు?”        “సేల్స్ మేన్లు!” వాళ్ళు వెళ్ళిపోయారు.        “వీళ్ళు?”        “టైలర్స్!” వాళ్ళు నిలబడిపోయారు.        “కుట్టుమిషన్లు తెచ్చుకొన్నారు”        “ఎందుకు?”        “ఇక్కడే కుడతారు. ఇష్టమైనట్లుగా కుట్టించుకో!”        “ఎప్పుడు వేసుకోవాలి?”        “రోజూ!”        “ఎన్ని?”        “రోజుకు నాలుగైదు!”        “సరా?”        “సరే!”        “ఒకదానిమీద మరొకటి – ఒక చీరమీద మరొకటి, అంతేనా?”        “సరే!”        “ఎందుకూ?”        “సంతోషం కోసం!”        “నువ్వు కట్టుకోవాలి సరళా నా ఆనందం కోసం”        “నాకోసం కాదా?”        “నీకోసం కూడా – నీకోసమే! నీకే!”

 

* * *

 

మర్నాడు పొద్దుపోయేదాకా కృష్ణమూర్తి ఇంటికి రాలేదు. ఆత్రంగా ఎదురుచూస్తున్న సరళ అతడి కారు హారను వినబడగానే గబగబ మెట్లుదిగి కృష్ణమూర్తికి ఎదురు వెళ్ళి పోర్టికోలో దిగుతున్న అతని బ్రీఫ్‌కేసు తీసుకుంది.         “ఇవాళ ఏమీతేలేదా?”         “రా”         “రా”         “ఎందుకింతసేపు?”         “రా”         వాళ్ళు బెడ్‌రూంలో చేరగానే జ్యూయలరీ షాపు వాళ్ళు నలుగురు మోయగలిగినన్ని బాక్సులు తెచ్చి మంచమ్మీద విడివిడిగా పెట్టారు. వాళ్ళు వెళ్ళిపోగానే ఏమిటివన్నీ అన్నట్లు నొసలు ఎగరేసింది.

 

“నగలు!” అన్నాడు.         చకచకా విప్పింది. ఒక్కొక్కటీ చూసింది. అన్నీ మంచం మీద పేర్చి తదేకంగా పరికించింది. బంగారు ఆభరణాలు. వజ్రాలు పొదిగినవి. ముత్యాలు, రత్నాలు కలిపి చేసినవి – మెడకు, ముక్కుకు, చెవికి, తలకు, చేతులకు, నడుముకు అలంకరించుకొనే ఆభరణాలు. అవన్నీ వేసుకొంటే అందమైన సరళ ఒంగిపోయి గూనిది అవుతుంది. వాటి బరువు గ్రాముల్లో కానీ, వాటి విలువ వేలల్లో కానీ చెప్పడం కుదరదు.         “ఎన్ని కేజీలు?”         “ఇంచుమించుగా వంద!”         నగలు వేసి చూసుకోసాగింది సరళ. మెడ – అద్దం, ముక్కు – అద్దం, చెవి – అద్దం, తల – అద్దం, మూతి – అద్దం, శరీరమంతా – అద్దం, ఆభరణాలన్నీ – అద్దం, వేసుకొని, చూసుకొని, అద్దంలో చూసుకుని, అటు తిరిగి, ఇటు తిరిగి, అలసి పోయి, మంచం మీద కూలబడి రొప్పడం మొదలు పెట్టింది సరళ.

 

“ఎందుకండీ ఇన్ని?”         “అలంకరించుకో”         “ఎన్నని?”         “కొన్ని కొన్ని!”         “ఎప్పుడెప్పుడు?”         “బుద్ధి పుట్టినప్పుడు”         “ఇన్ని నగలతో వీధిలోకి రాలేను”         “ఇంట్లోనే ఉండు”         “ఇంట్లో ఉండటానికి ఇన్ని నగలా?”              “ఇష్టమైతే వేసుకో, లేకుంటే దాచుకో”         “దాయడానికి నగలెందుకు?”         “వేసుకో!”         “ఎన్నని?”         “అన్నీ!”         “ఎప్పుడు?”         “ఎల్లప్పుడూ!”         “నేనూ మనిషినే!”         “దేవతవు!”

* * *

 

సరళ పొద్దున్నే లేస్తుంది. రోజుకొకలా చీర కట్టుకుంటుంది. బుద్ధి పుట్టినన్ని నగలు అలంకన్రించుకుని భర్తను ఆదరంగా కంపెనీకి పంపుతుంది. వెంటనే నగలు తీసివేస్తుంది. చీర మారుస్తుంది. సుఖంగా ఉండే నూలు చీర కట్టుకొంటుంది.

సాయంకాలం భర్త వచ్చే సమయానికి పట్టుచీర కట్టుకొంటుంది. అలమారాడు నగలు పెట్టుకొంటుంది. తల నిండా పూలు పెట్టుకొంటుంది. ఇంటినిండా స్వీట్లు వుంచుతుంది. మంచం దగ్గర పండ్లు వుంచుతుంది. పడకగది నిండా బొమ్మలు షోకేసులో ఉంచి, గోడలమీద విలువైన పెయింటింగులు అలంకరిస్తుంది.         వీళ్ళిద్దరి పరిస్థితి చూసి కృష్ణమూర్తి తల్లిదండ్రులు శుభవార్త చెబుతారని ఎదురుచూశారు. ఎంతకీ చెప్పడం లేదు. వాళ్ళు ఉండబట్టలేక అడగనే అడిగారు. కోడలు సిగ్గుపడింది. సిగ్గుపడింది కాబట్టి శుభమే అనుకొన్నారు.         “పిల్లల తల్లివి కాబోతున్నదానివి మెట్ల మీద ఎగురుతూ, దూకుతూ దిగొద్దు, ఎక్కొద్దు” అన్నారు.         నవ్వింది. ఐనా అలాగే మెట్లెక్కుతూ దిగుతూ వుంది.         “అదేం?” అంటే         “అదేం లేదు” అంది.         “అదేం?” అంటే         “అదేమో” అంది.         “పెళ్ళయి సంవత్సరం దాటింది. ఇంకా అదేమో అంటావేంటి?” అని అత్తామామలు సరళని నిలదీశారు. అప్పుడే వచ్చాడు కృష్ణమూర్తి.         “ఇంతదాకా నన్నుగురించి ఆయన ఆలోచించలేదు. పదిరోజుల్నుంచి ఇలా నన్ను ఆనందింపజేస్తున్నారు. పాపం ఆయనకు తీరుబడేది?” అంది.

అత్తా మామలే కాదు, భర్త కూడా బిత్తర పోయారు.

 

* * *

 

        ఆ రోజు నుంచి కృష్ణమూర్తి కంపెనీకి పోలేదు. సరళ చెంగు వదల్లేదు. రాత్రంతా గదిలో మాటలు, పాటలు. నిద్రలేదు. పగలు భర్త బయటికి పోయినప్పుడే సరళకు నిద్ర. పగటి నిద్రకోసం అతనౌఅ ఆఫీసుకు పోతున్నాడు. కంపెనీలో ఎమ్.డి నిద్రపోవడం ఏమిటని వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు.

చీరలు, నగలు సింగారించుకొని సరళ, భర్తతో వీధిలోకి పోతుంది. అవీ ఇవీ కొనే నెపంతో రోడ్లన్నీ నడచీ, ఎక్కీ దిగీ అలిసిపోయి ఇల్లు చేరుతున్నారు. అది లాకీగా లేదని మానేసి, ఇద్దరూ కార్లో పోయి చైనీస్ హోటల్లో తిని, తేనుస్తూ ఇంటికి చేరి ఆయాసపడుతున్నారు. అదీ కాదంటే ఫష్టు షో లేదా సెకండ్‌షో సినిమా చూసి ఇంటికొచ్చి పడుకుంటున్నారు.

ఇవేవీ బాగాలేవని ఇంటిపట్టునే వుండి సరళకు తినిపిస్తూ పళ్ళరసాలు తాగిస్తూ వున్నాడు కృష్ణమూర్తి.         “నా ఆరోగ్యం బాగుంది” అంది సరళ.         “నువ్వు సుఖంగా ఉండాలి” అన్నాడు కృష్ణమూర్తి.         పెళ్ళయిన మొదటిరోజుల్లో హనీమూన్‌కు పొమ్మంటే కంపెనీ పనుల తొందర వల్ల భార్యను తీసుకుపోలేక పోయాడు, కృష్ణమూర్తి. అందుకు బదులుగా హనీమూన్‌కు పోదామని భార్యతో అంటే “ఇప్పుడొద్దు బాగుండదు” అంది. సరే తీర్థాలు, పుణ్యక్షేత్రాలు, గుళ్ళు, గోపురాలు అని తిరుపతి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, భద్రాచలం తీసుకెళ్ళి తిప్పి తీసుకువచ్చాడు.         పూరి, కాశీ, ప్రయాగ, హరిద్వార్, బదరీనాథ్,కేదారనాథ్ చూపించి తీసుకొచ్చాడు.         అంతటితో ఆగకుండా సింగపూర్, మలేషియా, బర్మా, సిలోన్, థాయ్‌లాండ్, రష్యా, చైనా, కెనెడా, అమెరికా, ఆస్ట్రేలియా తిప్పి తీసుకువచ్చాడు.         “ఇన్ని ప్రయాణాలు, ఇంత వేగంగా, ఇంత దూరం, ఇన్ని విధాలుగా, ఇంత నిర్విరామంగా నేను చేయలేను”         అలసి పోయి ఇంటికి వచ్చారు. మర్నాడు పొద్దున్నే భార్యను చూసి బిత్తరపోయాడు కృష్ణమూర్తి.

 

“ఇన్ని చీరలు నేను కట్టను!”         “ఏం?”         “ఇన్ని నగలు నేను పెట్టుకోను”         “అంటే”         “ఇన్ని స్వీట్లు నేను తినలేను. ఇంత ప్రయాణం నేను చేయలేను. ఇన్ని సినిమాలు నేను చూడలేను. ఇన్ని బొమ్మలతో నేను ఆడుకోలేను. ఇన్ని పేయింటింగులు నేను గోళ్ళమీద పెట్టలేను. ఇంత మెలకువ నాకు వద్దు. నేను నిద్రపోవాలి”         కృష్ణమూర్తి బిత్తర పోయి చూశాడు.

 

“ఒక బొమ్మ ఇస్తే ఆనందం. అన్ని బొమ్మలు ఒకేసారి ఎందుకు? ఒక స్వీటు తినిపిస్తే ముచ్చట. అన్నా? అజీర్ణం కాదూ! ఒక పూవో, మాలో తెచ్చి తలలో పెడితే సంతోషం. గోతాలకొద్దీ పూలా? తృప్తిగా ఒక చీర! ఒక జాకెట్టు సంతోషం. అన్నా? వెగటు కాదూ! ఒక నగ – ప్రేమ. ఒక ఊరు, ఒక తీర్థం, ఒక క్షేత్రం. సంతృప్తి! అన్ని చోట్లా! అంత ప్రయాణమా? అంత తిరుగుడా! అలిసిపోమూ! విసుగు కాదూ! పిచ్చి పట్టదూ! నాకేమీ వద్దు!”

 

“మరేం కావాలి?”

“నా ఇష్టం వచ్చినట్లు పదిరోజులు నన్నిట్లా వుండనివ్వండి. పాటలు వద్దు. సినిమాలు వద్దు. చీరలొద్దు. నగలొద్దు. పదిరోజులు నిద్రపోనివ్వండి. మీరు నా ప్రక్కనే వుండండి.”         “తిండి, తీర్థం?”

“నాకేమీ ఇవ్వద్దు. మీరేమీ కల్పించుకోవద్దు. నా ఇష్టం వచ్చినట్లు నన్ను ఉండనివ్వండి”

 

“మరి నేను?”         “నా వెంట వుండండి. నేను కోరినట్లు నేను చెప్పినట్లు చేయండి. నాకు నిశ్శబ్దం, ప్రశాంతత, ఏకాంతం కావాలి. నాకు శూన్యం కావాలి. ఏమీ వద్దు. ఏమీ లేని తనం కావాలి. ఏమీ లేకుండా వుండాలి”         కృష్ణమూర్తి భయం భయంగా చూశాడు.

సరళ ఏమీ తినలేదు. తాగలేదు. పాటల్లేవు. మాటల్లేవు. శబ్దం లేదు. శూన్యం. నిద్రపోయింది.

 

రెండు రోజులు మూసిన కన్ను తెరవకుండా పడుకున్న మనిషి లెవకుండా నిద్రపోయింది సరళ. బుద్ధి పుట్టినప్పుడు లేచి రెండు బిస్కెట్లు తిని, మీళ్ళుతాగి మళ్ళీ పడక. మళ్ళీ నిద్ర. ఏ సుఖాలూ కోరుకోవడంలేదు. ఏ సంతోషమూ పొందడం లేదు. ఏ చీరలు, ఏ నగలు, ఏ పూలూ ఏమీ వద్దు.         నిముషంలో పళ్ళు తోముకుంటుంది. అర్థ నిమిషంలో నీళ్ళు పోసుకొంటుంది. పావు నిమిషంలో మంచం మీద పడుతుంది. మరి రోజంతా లేవదు. లేపినా లేవదు. కూర్చోబెట్టినా కూర్చోదు. బట్టలు మార్చుకోదు. నూనె పెట్టుకోదు. ముఖం కడుక్కోదు. పౌడరు రాసుకోదు. అలంకరించుకోదు. కూర్చోదు. పడుకొనే వుంటుంది. నిద్రపోతూనే వుంటుంది.         “ఇది ఏమైనా జబ్బా?” కృష్ణమూర్తి భయం.         ఫామిలీ లేడీ డాక్టర్ని పిలిపించారు. వచ్చి పరీక్షించింది. అంతా నార్మల్, ఏమీ లేదని వెళ్ళిపోయింది.         స్త్రీల స్పెషలిస్టును పిలిపించాడు. పరీక్షలు అన్నీ చేసి “ఆమెను స్వేచ్చగా ఉండనివ్వండి” అంది.

సైకియాట్రిస్టును రప్పించి పరీక్షలు చేయించాడు. సమస్య ఏమీ లేదని వెళ్ళిపోయాడు.

 

మళ్ళీ ఫ్యామిలీ లేడీ డాక్టరును అర్థించాడు. ఆమె వచ్చి చూసి, “కొందరంతే!” అని అంది.

కృష్ణమూర్తికి కోపం వస్తూ ఉంది. తల్లి దండ్రులు కూడా సరళ గురించి పట్టించుకోవడం లేదు. రెండు వారాల తర్వాత ఒక రోజు నిద్ర లేచి భర్తను చూస్తూ “దగ్గరే ఉన్నారు కదా! అంతే చాలు” అంది.         కృష్ణమూర్తి వొళ్ళు మండింది. “ఎంత చాలు?”         సరళ నవ్వింది. సరళంగా, సరసంగా నవ్వింది.         ఉండబట్టలేక అడిగాడు. “ఎందుకిట్లా ఉన్నావు?”

ఆమె బదులుచెప్పకుండా “మీరు ఎందుకట్లా ఉన్నారు?” అని ప్రశ్నించింది.

 

“ఏమీంది నీకు?”

“మీకేమైంది?”         “ఈ రెండు వారాలు నన్నేడిపించావు”         “నాలుగు నెలల నుంచి మీరు నన్నేడిపించారు”         కృష్ణమూర్తి శూన్యంగా సరళ వైపు చూశాడు.         “పెళ్ళయిన సంవత్సరమంతా మీరు బాగానే వున్నారు. ఈ నాలుగు నేలలనుంచి మీరెందుకింత గందరగోళంగా ప్రవర్తించారు?” అడిగింది.         అతను ఆలోచించుకోసాగాడు.         “ఈ మధ్య గృహహింస చట్టం వచ్చింది. తెల్సా?”         “తెలుసు. అందుకే సంతోష పెడదామని”         “అంతకు ముందు సంవత్సరమంతా?”         “సుఖంగా లేవు!”         “అంటే?”         “కష్టంగా వున్నావు!”         “అంటే?”         “నేను నిన్ను పట్టించుకునే వాణ్ణి కాదు. కంపెనీ పనులతో తలబద్దలు కొట్టుకొంటూ, నువ్వు వున్నా లేనట్లుగానే నా తలనొప్పులు నేను పడుతూ నిన్ను అశ్రద్ధ చేస్తూ వచ్చాను. నీపట్ల తగిన శ్రద్ధ చూపించక పోవడం గృహహింసే! నువ్వు నాది గృహహింస అని పోలీసులకు చెబితే, నన్ను వాళ్ళు అరెస్టు చేయవచ్చు”         “అందుకని?”

“నీకిష్టమని బొమ్మలు, స్వీట్లు, పూలు, బట్టలు, నగలు కొని ఇచ్చాను. పుణ్యక్షేత్రాలు, తీర్థాలు తీసుకుపోయాను. దేశవిదేశాలు అన్నీ తిప్పి చూపించాను. నీకు కావలసినవన్నీ సమకూర్చాను. కొట్టక, తిట్టక వేధించక కట్నం డబ్బు ఇంకా తెమ్మని సతాయించకపోతే గృహహింస లేనట్లే! కిరసనాయిలు పోసి కాల్చి చంపకపోతే గృహహింస లేనట్లే కదా!” అన్నాడు కృష్ణమూర్తి. “కష్టాలు తీరకపోవడమే కాదు, సుఖాలు, సరదాలు కొత్తకోడలికి ముఖ్యం. అవి లేకపోతే గృహహింసే!” అన్నాడు.

 

“పెళ్ళయిన సంవత్సరమంతా నేను సుఖంగానే వున్నాను. ఇటీవలే నాకు గృహహింస ప్రారంభమైంది. ఇప్పుడు పోలీసులకు రిపోర్టు ఇవ్వాలి” అంది.

“అయ్యో అదేమిటి సరళా?”         “మీరు నాకు ఏమి ఇస్తే సుఖంగా వుంటానని అనుకున్నారో అవన్నీ ఇచ్చారు. అవి నాకు కావాలో వద్దో మీరు ఆలోచించలేదు. వాటిని నేను భరించలేకపోయాను. భరించలేకపోతే బాధే! బాధ కలిగితే హింసే! తేనె స్పూనుతో చప్పరిస్తే రుచి. తేనెతో స్నానం రోత! నాకు మీ ప్రేమ రోతగా మారింది. మీరు పెట్టిన ఈ గృహహింస మీద పోలీసులకు రిపోర్టు ఇస్తాను”         “వద్దు సరళా! నువ్వేం చేయమంటే అది చేస్తాను” కృష్ణమూర్తి అదోలా నవ్వాడు.         సరళ పకపకా నవ్వింది.         అత్తా మామలు పైకి వచ్చి “సరళా నీ ఆరోగ్యం భద్రం! డాక్టర్లు అందరిదీ అదేమాట” అన్నారు.         “మెట్లమీద ఎగురుతూ, దూకుతూ ఎక్కనూ, దిగనూ సరేనా?” అంది నవ్వుతూ.         “సరేగాని, అదేకదా?” అడిగారు వాళ్ళు.         “అదే!” అంది సరళ.

“అదే అంటే?” కృష్ణమూర్తి అడిగాడు. అదేమిటో తల్లిదండ్రులుకానీ, భార్యకానీ చెప్పలేదు. చెప్పమని భార్యను బతిమాలుతున్నాడు కృష్ణమూర్తి.

 

 

 

ఆ రచనల్ని, ఆ వ్యక్తిత్వాల్ని గుర్తు చేసుకుందాం..!

puttapartichasoTIRUMALA-RAMACHANDRA

పుట్టపర్తి, చాసో, తిరుమల రామచంద్ర ….గత ఏడాది, ఈ ఏడాది ఈ ముగ్గురు మహారచయితల శతజయంతి సంవత్సరాలు! వారి రచనలూ, వారి వ్యక్తిత్వాలు మన సాంస్కృతిక జీవితాల్లో తరిగిపోని వెన్నెల వీచికలు. ఆ వెలుగుని ఈ తరానికీ అందిద్దాం, వారి రచనల్ని, వ్యక్తిత్వాల్ని తలచుకుంటూ!

వారి రచనలే కాదు, వారి వ్యక్తిత్వ విశేషాల్ని తలపోసుకునేట్టుగా వారి స్మృతుల్ని కూడా అక్షరబద్ధం చేయండి.

మీ రచనలు editor@saarangabooks.com కి పంపండి.

 

నిష్క్రమణ అంటే…

 ఎల్. ఆర్. స్వామి

ఎల్. ఆర్. స్వామి

ఒక రోజు ,

ఇంటి తలుపులు తెరిచేవుంటాయి

చిరు జల్లు కురిస్తూ ఉంటుంది .

కొలువు మూసిన సూర్యుడు

ఒక సారి తొంగి చూసి నిష్క్రమిస్తాడు

యెర్ర మబ్బుల గాయాలతో ,

పొగమంచుల స్వేద బిందువులతో ,

మరో ఉదయం కోసం ,మరునాటి యుద్ధం కోసం ,

కొత్త వెలుగు నింపుకోవటం కోసం .

నా  మిత్రుడు ,అల్లరి గాలి

ఇంటి లోపకి చొరబడుతాడు

లోలోపల ఇర్రుకు పోతాడు

ఇంటిలో నేను ఉండను –

కాని నా ప్రపంచం ఉంటుంది

అక్షరాల ప్రపంచం ఉంటుంది

నా చూపులుంటాయి ,కళ్ళద్దాలుగా

నా ఇంటి గొడలూ వుంటాయి

కాని వాటికి నేను పామిన రంగులుండవు

ప్రపంచపు రంగులుంటాయి

మా ఇంటి గోడ రంగు

ప్రపంచపు రంగు వైనప్పుడు

ఇక నేనుండను –నిష్క్రమిస్తాను

నిష్క్రమణ అంటే ఒక విస్తరణ

నూతనత్వం కోసం వేసే తొలి అడుగు .

-ఎల్. ఆర్.స్వామి

రెప్పతెరిచేలోగా…

జాన్ హైడ్ కనుమూరి

జాన్ హైడ్ కనుమూరి

మబ్బుకమ్మిన ఆకాశంలో ఎటో తప్పిపోయిన గాలిపటమై
గాలిపటం – చేతిలోని చరకాల మధ్య
తెగిన దారమైనప్పుడు
ఏది ఆత్మహత్య చేసుకున్నట్టు?
***
వినీలాకాశంలోకి
గాలిపటాలను రంగుల్లో ఎగురవేయడం
దారాలను మాంజాలుగా మార్చడం
తెగిన దారానికి విలవిలలాడే గాలిపటాన్ని
కేరింతలతో వినోదించడం జీవితపరమార్థం అనుకుంటాం
***
రోషాన్నో పౌరుషాన్నో
కళ్ళలోంచి కాళ్లలోకి తెచ్చి
ఎగిరిపడ్డ కత్తివేటుకు
రక్తమోడిన నేల
విలవిలలాడే దేహాలమధ్య
వినోదమెవరిది? జూదమెవరిది?
***
అంతా ఎదురుగానే ఉంటుంది
సూర్యాస్తమయానికి వెలుగుపై చీకటికమ్మిట్టు
ఒక భ్రమ ఒకభ్రాంతి
వెలుగురేఖను కత్తిరిస్తుంది
రెప్పతెరిచేలోగా
ఒకదేహం జీవశ్చవమౌతుంది
ఒకదేహం కన్నీరుమున్నీరౌతుంది
***
ఆత్మను ఎవ్వరూ హత్యచేయలేరు
మెలిపెట్టీ  మెలిపెట్టీ
నొక్కేసేచేతులమధ్య స్వరాన్ని కోల్పోతుంది
ఇక శరీరం
తన్నుతాను హత్యకావించుకుంటుంది
గొంతును నులిమిన చెయ్యి కనబడకుండా
“ఆత్మహత్య”  అరుపులు కోలాహలమౌతాయి
***
చెమర్చిన కన్నేదీ
నిర్జీవదేహానికి జీవాన్నివ్వలేదు
***
ఎక్కడో
ఒక తీతువు గొంతును
ఒక రాబందు రెక్కలను సరిచేసుకుంటాయి
****
తెగిన గాలిపటం ఏ కొమ్మకో చిక్కుకుంటుంది
రక్తమోడ్చిన పందెపు పుంజు మషాలాలతో ఎవ్వరికో విందు చేస్తుంది
ఇది ఆత్మహత్యేనా అని చెవులు కొరుక్కుంటూనే ఉంటాం

వీలునామా – 26 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.Hogarth’s Will కి అనుసృజన : శారద )

    (గత వారం తరువాయి )

ఆధ్యాత్మికత,  ప్రేమా,  రాజకీయం

బ్రాండన్ ఇంగ్లండు వదిలి మళ్ళీ ఆస్ట్రేలియాకెళ్తాడని తెలియగానే చిన్నారి ఎమిలీ బావురుమంది. మళ్ళీ తిరిగి రావడానికి చాలా కాలం పట్టొచ్చన్న ఆలోచనతో బ్రాండన్ ఇంగ్లండులో తనుండబోయే ఇంకొద్ది రోజులూ తల్లితో చెల్లేళ్ళతో గడపడానికి లండన్ వదిలి ఏష్ ఫీల్డ్ వెళ్ళాడు. ఆ రోజంతా మొహం చిన్నబుచ్చుకోనే వుంది ఎమిలీ. ఎమిలీతో,  హేరియట్ తో వేగి విసిగిపోయిన జేన్ కి ఆ రోజు తన కొరకు ఫ్రాన్సిస్ వచ్చి కూర్చున్నాడన్న మాట సేద దీర్చింది. అందులోనూ తనూ అతనికి ఆతృతగా ఒక వార్త చెప్పాలని ఉవ్విళ్ళూరుతుంది.

అసలు తనారోజు రావాలనుకుంటున్నట్టు ఫ్రాన్సిస్ లిలీ ఫిలిప్స్ కి చెప్పాడు కూడా. ఆవిడ జేన్ తో ఆ సంగతి చెప్పడమే మర్చిపోయింది. బయట కూర్చున్న ఫ్రాన్సిస్ జేన్ చెల్లెల్ని తోడు తెచ్చుకోకుండా ఒంటరిగా వస్తే బాగుండు, అని ఆశ పడ్డాడు.

తను రాగానే, లేచి నిలబడి, చెల్లెల్ని పిలిచే అవకాశం ఇవ్వకుండా బయటికి దారి తీసిన ఫ్రాన్సిస్ ని చూసి జేన్ ఆశ్చర్యపోయింది. అయితే ఏదైనా ముఖ్య విషయం మాట్లాడాలేమోననుకుని సరిపెట్టుకుంది.

తను అంతకు ముందురోజు తన తండ్రి ఆత్మతో మాట్లాడిన ఉదంతం మొత్తం జేన్ కి వివరించాడు. జేన్ ఏ వ్యాఖ్యానాలూ చేయకుండా,అడ్డు ప్రశ్నలు వేయకుండా శ్రధ్ధగా విన్నది. తన మన్సులోని గాఢమైన కోరిక గురించిన ప్రశ్నని ఫ్రాన్సిస్ దాట వేసాడు. తరవాత తనకి తన తల్లి నని చెప్పుకుంటూ మెల్బోర్న్ నించి వచ్చిన వుత్తరం గురించిన ప్రశ్నా, దానికి తనకొచ్చిన జవాబూ వివరించాడు.

“చెప్పు జేన్! నీ అభిప్రాయమేమిటి? ఇదంతా నమ్మొచ్చంటావా?”

“నిజంగా నమ్మలేకుండా వున్నాను. అయితే మనకొచ్చిన జవాబులని ఎలా అర్థం చేసుకోవాలో కూడా కొంచెం అయోమయంగా వుంది.”

“ఆయన ఆత్మ ఇచ్చిన సలహాలు పాటించొచ్చంటావా?”

“ఇంతకు ముందు నన్ను సలహాలడిగావు. ఇప్పుడు ఆత్మలనడుగుతున్నావు. నన్నడిగితే, బ్రతికున్న వాళ్ళనైనా, లేని వాళ్ళనైనా సలహా అడిగేకంటే, నీ మనసుకి నచ్చినట్టు చేసుకుంటూ పోవడం మంచిది. నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత నీదే కదా? అసలు నువ్వు నా వల్లనే ఫిలిప్స్ గారి సలహా పాటించడం నన్నెంతో బాధ పెడుతూంది. ఆయన సలహాకి అంత విలువ ఇవ్వకపోయి వుంటే నువ్వు మీ అమ్మ వుత్తరానికి జవాబిచ్చి వుండే వాడివి. ఇప్పటికే నేను నీ నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్నా కదా?”

veelunama11

“ఆ మాటకొస్తే మా నాన్నగారి ఆత్మ కూడా, ఆవిడ నా తల్లే అయినప్పటికీ ఆవిడకి దూరంగా వుండమనే కదా అన్నది. ఇందులో ఫిలిప్స్ గారొచ్చి పాడు చేసింది ఏముంది? అయినా, జేన్, నాకామెని చూడాలనీ, మాట్లాడాలనీ, ఉత్తరం రాయాలనీ ఏమాత్రం అనిపించడం లేదు.నాకు జన్మనివ్వడం అంటావా? అసలు నా జన్మలో సంతోషించాల్సిన విషయం, కనీసం ఒక్కటైనా వుందా చెప్పు? ఇలాటి జన్మనిచ్చినందుకా నేనావిడకి ఋణపడి వుండడం?”

“ఫ్రాన్సిస్! అంత నిరాశ పనికి రాదు. నిజంగా నీ బ్రతుకులో, ఆ మాటకొస్తే నా బ్రతుకులో సంతోషమేదీ లేదా? మనకైన అనుభవాలను తప్పు పట్టకు. ఆ అనుభవాలే లేకపోతే మనకి ఇంత ఙ్ఞానం కలిగేదా? జీవితం నించీ, మనిద్దరం ఒకరినించొకరం, నేర్చుకున్నదేదీ లేదా? దానికి విలువేమీ లేదా?”

” ఈ ఙ్ఞాన విఙ్ఞానాల సంగతీ, అనుభవ సారాల సంగతీ కాదు నేను మాట్లాడేది. నాక్కావల్సింది మామూలు మనుషులకుండే సంతోషాలు. చిన్నవీ, పెద్దవీ!”

అతని ఆవేశాన్నీ కోపాన్నీ చూసి జేన్ ఆత్మీయంగా నవ్వింది. ఆమె కళ్ళల్లో ప్రేమ బదులు, కేవలం స్నేహమూ ఆప్యాయతా వుండడం చూసి ఫ్రాన్సిస్ నిరాశ ఎక్కువైంది. తనని ఆమె ఎప్పటికీ ఒక స్త్రీ పురుషుణ్ణి ప్రేమించినట్టు ప్రేమించలేదేమో. తనన్నా, తన ఒంటరితనమన్నా ఆమెకి కేవలం జాలి! ఫ్రాన్సిస్ కి మనసంతా కృంగిపోతున్నట్టనిపించింది. ఇంకేదైనా మాట్లాడాలనుకున్నాడు.

“అదలా వుంచు? బ్రాండన్ ఏం చేస్తున్నాడు? అతనికి ఎల్సీ అంటే చాలా ఇష్టమని గుడ్డి వాళ్ళక్కూడా అర్థమవుతూంది. ఇంకా దేనికోసం ఎదురుచూస్తున్నాడు? ఎల్సీ పెళ్ళైపోతే నీకొక బాధ్యతైనా తిరుతుంది కదా?” అసహనంగా అన్నాడు.

నవ్వింది జేన్.

“ఇంతకు ముందే నీకు చెప్పాను ఫ్రాన్సిస్. బ్రాండన్ ఇదివరకే ఎల్సీని వివాహం గురించి కదిపాడు. అప్పుడది ఒద్దంది. ఇప్పుడు మళ్ళీ అడగాలంటే మొహమాటంగా వుంటుంది,  పైగా వాళ్ళిద్దరికీ ఒంటరిగా మాట్లాడుకునే సమయమూ సందర్భమూ కూడా వుండవు.”

“నేనైతే నా కిష్టమైన అమ్మాయి ఎదురుగా వుంటే చచ్చినా వదలను. ఎన్ని సార్లైతే అన్ని సార్లు ఎలాగో అలా వీలు చూసుకుని మాట్లాడతాను.”

“మళ్ళీ అడిగినా అది వొద్దంటుందని భయ పడుతున్నాడేమో! ఇప్పుడది ఒప్ప్పుకుంటుంది, కానీ ఆ సంగతి అతనికి తెలియదే!”

“ఓ పని చేయి! అతనడగడమే ఆలస్యం అని నువ్వు సూచన ప్రాయంగా తెలియచేయి. అర్థంలేని భయాలతో, మొహమాటాలతో చెల్లెలి భవిష్యత్తు పాడు చేయకు జేన్!”

“నువ్వన్నది నిజమే ఫ్రాన్సిస్. ఈ పరిస్థితిలో నేను పెద్దరికంగా  బాధ్యత వహించకపోతే దానికున్న ఒక్క అవకాశమూ పోతుంది. అయినా ఏదో సంకోచం నన్ను వెనక్కి లాగుతోంది. అదీ గాక అందరూ బ్రాండన్ హేరియట్ ని పెళ్ళాడతారని అనుకుంటున్నారు. ఇప్పుడు నేను ఎల్సీ గురించి ప్రస్తావిస్తే తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్టు వుండదూ?”

“నన్నడిగితే బుద్ధున్న వాడెవడూ హేరియట్ ని పెళ్ళాడడు. మొహం కుదురుగానే వున్నా, అంతా కలిపి చూస్తే ఆమెలో ఎలాంటి సౌందర్యమూ కనబడదు నాకు. ఇంకా ఆవిడ వదిన గారు, లిలీ ఫిలిప్స్ చాలా అందంగా అనిపిస్తారు. ఆవిడ ఎప్పుడూ అలాగే వుంటుందా?” కుతూహలంగా అడిగాడు ఫ్రాన్సిస్.

నవ్వేసింది జేన్.

“ముఖ సౌందర్యం మాటెలా వున్నా, లిలీ ఫిలిప్స్ ప్రవర్తన నాతోనూ ఎల్సీతోనూ చాలా సార్లు అంద వికారంగా వుంటుంది. అది సరే, నిన్నొక విషయం అడగాలనుకున్నాను. ఇవాళ పొద్దున్నే పెగ్గీ అక్క కొడుకు, నా శిష్యుడూ, టాం లౌరీ దగ్గర్నించి ఉత్తరం వచ్చింది. వూళ్ళో అందరూ నిన్ను ఎన్నికల్లో పోటీ చేయమంటున్నారట కదా? నాకు నువ్వు చెప్పనేలేదీ సంగతి!””

“అదా! అసలు నాకా సంగతే గుర్తు లేదు. మెల్బోర్న్ నించి వచ్చిన వుత్తరమూ, దాని గురించి ఆలోచనా, డెంస్టర్ ఇంటికెళ్ళడమూ, వీటన్నిటి ధ్యాసలో పడిమరిచేపోయాను,” చిన్న పిల్లాడిలా నవ్వుతూ అన్నాడు ఫ్రాన్సిస్.

ఆ రోజుల్లో ఆడవాళ్ళకి పెద్దగా రాజకీయాల్లో ప్రవేశం వుండేది కాదు. అయితే జేన్ లా కొంచెం ఆసక్తి వున్న స్త్రీలందరూ, రాజకీయాల్లో భవిష్యత్తుని వున్నదానికంటే పెద్దదిగా వూహించుకునేవారు. జేన్ కూడా అలాగే ఫ్రాన్సిస్ పెద్ద రాజకీయ వేత్త అయిపోయినట్టూ, తమ వూరినీ, ఎస్టేటునీ ఆదర్శవంతంగా తీర్చి దిద్దినట్టూ, అందరూ అతనికి జేజేలు పలుకుతున్నట్టూ ఊహించేసుకుంది. తమ కుటుంబానికి చెందిన వాడూ, విద్యాధికుడూ, పది మందికీ మంచి చేసే ఆలోచనలున్నవాడూ, ఎన్నికల్లో పోటీ చేసి పార్లిమెంటులో అడుగుపెడితే, అంతకంటే కావలసిందేముంది, అనుకున్నదామె అమాయకంగా.

స్వతంత్రంగా ఏదీ సాధించలేని స్త్రీలందరి లాగే, ఆమె తన కలలన్నీ నిజం చేసుకోవడానికి శిష్యుడు టాం లౌరీనీ, స్నేహితుడు ఫ్రాన్సిస్ నీ ఎన్నుకుంది. తన ఆశయాలకీ, ఆదర్సాలకీ ప్రాణం పోసి నిలబెట్టగలిగే వారు వాళ్ళిద్దరే అనుకుంది. అందుకే ఫ్రాన్సిస్ రాజకీయ ప్రవేశం గురించి అంత ఉత్సాహపడింది. డబ్బూ, చదువూ, సంఘంలో హోదా వున్న మగవాడు రాజకీయాల్లో ప్రవేశించి మనుషుల జీవితాలు మార్చెయ్యాలిగానీ, మామూలు మగవాళ్ళలా పెళ్ళీ, ఇల్లూ, పిల్లలూ లాటి మామూలు ప్రలోభాలకు లోను కాకూడదన్నది జేన్ నిశ్చితాభిప్రాయం. అందుకే ఫ్రాన్సిస్ చూపులూ, మాటలూ, కళ్ళల్లో తన పట్ల ఇష్టమూ అన్నీ అర్థమయినా, వాటిని పట్టించుకోదలచుకోలేదు. అవి ఆమె కన్నె మనసుని ఎంత గిలిగింతలు పెట్టినా, ఏమీ తెలియనట్టే వుండాలని నిర్ణయించుకుంది జేన్.

     ***

(సశేషం)

మహాభారతం నుంచి మగధకు…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)నా ఎదురుగా ఇప్పుడు ఓ పెద్ద దారపు ఉండ ఉంది. దానికి విచిత్రంగా ఒకటి కాదు; నాలుగైదు కొసలు వేలాడుతున్నాయి. ఏ కొసను పట్టుకుని లాగినా మొత్తం ఉండ కదులుతుంది. ఏ కొసను పట్టుకోవాలనేది ఈ క్షణాన నా ముందున్న ప్రశ్న. దీనినే కృత్యాద్యవస్థ అంటారు కాబోలు. ఈ వ్యాసపరంపర సందర్భంలో ఈ అవస్థ నాకు తరచు ఎదురవుతోంది. అయినా చేయగలిగింది లేదు.

మొదటి కొస, మనకు పురాణ కథగా, myth గా కనిపించే కథకూ, చరిత్రకూ మధ్య విభజనరేఖను చెరిపేసి; ఆశ్చర్యకరంగా ఆ కథను చరిత్రలోకి ప్రవహింపజేసేది.  రెండో కొస, ఆ ప్రవాహంలో భాగంగా జరుగుతున్న గణవిచ్ఛిత్తి గురించీ, గణాలు జనాలుగా మారడం గురించీ చెప్పేది. మూడో కొస, గణరాజ్యాల స్థానంలో మనం ఇప్పుడు చెప్పుకునే రాజ్యాలు, సామ్రాజ్యాలు ఏర్పడడం గురించి చెప్పేది. నాలుగో కొస, అధికారం- పై వర్ణాల చేతుల్లోంచి కింది వర్ణాల చేతుల్లోకి మారడం గురించి చెప్పేది. అయిదో కొస, వ్యవసాయ విస్తరణ గురించి చెప్పేది…

kosambiకొశాంబీ రచించిన AN INTRODUCTION TO THE STUDY OF INDIAN HISTORY లో, THE RISE OF MAGADHA అనే ఆరవ అధ్యాయం ఇలా ప్రారంభమవుతుంది:

ఆర్యులు పట్టణ సంబంధమైన పురాతన సింధునాగరికతను తుడిచిపెట్టడానికి ఏ వ్యవస్థ అయితే సాయపడిందో, అదే వ్యవస్థ వారు తూర్పువైపు అరణ్యాలలోకి చొచ్చుకు వెళ్లడానికీ సాయపడింది. రెండు ప్రధాన వర్ణాలతో తిరిగి కూర్చిన నూతన సమాజం వారికి శూద్రుడనే శ్రామికశక్తిని ఇచ్చింది. అదే కనుక లేకపోతే, పచ్చిక భూముల కోసమైనా, వ్యవసాయం కోసమైనా అరణ్యాలను ఛేదించడం లాభసాటి అయుండేది కాదు. అగ్రవర్ణాలలో వర్ణ-వర్గ రూపంలో జరిగిన ఆ తదుపరి విభజన; గ్రీకు, రోమన్ బానిస సమాజాలలో మాదిరిగా బలప్రయోగమూ, నిఘా అవసరం లేకుండానే మిగులు ఉత్పత్తిని పెంచింది. క్రీ. పూ. 7వ శతాబ్ది నాటికి భారతదేశంలో జనావాసాలు భిన్న భిన్న తెగలకు, భిన్న భిన్న అభివృద్ధి దశలకు చెందిన జనాభాతో,  పంజాబ్ నుంచి బీహార్ వరకు మిట్ట పల్లాల భూఖండం మీదుగా విస్తరించాయి. అంత వైవిధ్యంలోనూ, తగినంత వర్తకానికీ, సాంస్కృతిక సంబంధాలకూ సరిపోయినంత ఉమ్మడి భాషా, ఉమ్మడి సంప్రదాయమూ ఏర్పడ్డాయి. కాకపోతే, తొలి జనావాసాల ఏర్పాటుకు సాయపడిన గణ సమాజ సంబంధాలు ఈ దశకు వచ్చేసరికి సంకెళ్లుగా మారిపోయాయి. సమాజం మరింత అభివృద్ధి దశకు చేరాలంటే ఈ సంకెళ్ళను తెగ్గొట్టడం అవసరం. ఈ నూతన నమూనా సమాజం దిశగా అవసరమైన అడుగులు ఉజ్జాయింపుగా క్రీ. పూ. 520(బింబిసారుడు అంగను జయించడం)-360(మహాపద్మనందుడు ఆర్యగణాలను తుడిచిపెట్టడం)ల మధ్య పడ్డాయి. ఈ గమనంలో మరింత కీలకమైన అడుగు మగధ(బీహార్)లో పడింది…

kosambi book

కోశాంబీ అనుసరించిన కాలనిర్ణయం ప్రకారం, క్రీ. పూ. 3000కు చెంది, వెయ్యేళ్ళపాటు కొనసాగిన సింధునాగరికతను అలా ఉంచితే;  పై పేరా దాదాపు పదమూడు వందల సంవత్సరాల చరిత్రను చుట్టబెడుతోంది. ఎలాగంటే, క్రీ. పూ. 1750లో భారతదేశంపై ఆర్యుల తొలి ఆక్రమణ జరిగింది. (అది, మెసపొటేమియా(ప్రాచీన ఇరాక్)లో హమ్మురాబి పాలన సాగుతున్న కాలం కూడా. హమ్మురాబి మన మనుస్మృతి లాంటి స్మృతిని అప్పుడే తయారుచేసి శిలపై చెక్కించాడు)  క్రీ.పూ. 1500 ప్రధాన ఋగ్వేదకాలం. మరో విడత ఆర్యుల రాక క్రీ. పూ. 1100లో జరిగింది. క్రీ. పూ. 800 నాటికి యజుర్వేదం పూర్తి కాగా, క్రీ.పూ. 600లో శతపథబ్రాహ్మణం అవతరించింది. క్రీ.పూ. 7వ శతాబ్దంలో కోసల, మగధలలో వెండి నాణేలు వాడుతున్నారు. బుద్ధుడు, కోసలరాజు ప్రసేనజిత్తు(పసనేది) క్రీ. పూ. 468లో, తమ 80వ ఏట మరణించారు. మగధలో క్రీ.పూ. 540లో బింబిసారుని పాలన, క్రీ.పూ. 492లో అతని కుమారుడు అజాతశత్రు పాలన, క్రీ.పూ. 350కి కొంత ముందు మహాపద్మనందుడి పాలన మొదలయ్యాయి. ఆ తర్వాత క్రీ.పూ. 327లో అలెగ్జాండర్ దాడి…

మరి మహాభారత, రామాయణాల కాలం ఎప్పుడనే ప్రశ్న వస్తుంది. వీటి గురించి వేర్వేరు లెక్కల మీదే కాక, విశ్వాసం మీద కూడా ఆధారపడిన కాలనిర్ణయాలు చాలా కనిపిస్తాయి. శ్రీ రామ్ సాఠె అనే పండితుడు రామాయణ కాలం గురించి రాస్తూ, ప్రస్తుతం నడుస్తున్నది వైవస్వత మన్వంతరం కాగా, ఇంతకుముందు అనేక మన్వంతరాలు గడిచాయనీ; ప్రతిమన్వంతరంలోనూ నాలుగు యుగాలు వస్తుంటాయనీ, రామాయణం జరిగింది వేరొక మన్వంతరంలోని త్రేతాయుగంలోననీ అంటూ రామాయణ కథను లక్షల సంవత్సరాల వెనక్కి జరిపిన సంగతి ఎప్పుడో చదివిన గుర్తు.

మహాభారతకాలం మీద కూడా రకరకాల ప్రతిపాదనలు ఉన్నాయి. మరీ మన్వంతరాలలోకి వెళ్లకుండా మన సాధారణ బుద్ధికి అందేమేరకు చూస్తే, కోశాంబీ అనుసరించిన కాలనిర్ణయం ప్రకారం, మహాభారతం జరిగి ఉంటే అది క్రీ.పూ. 1000లో జరిగింది. అలాగే, భాతం ముందా, రామాయణం ముందా అనే ప్రశ్న కూడా వస్తుంది.  రాముడు కోసలకు చెందిన కౌసల్య కొడుకు కనుక; వాయవ్య, పశ్చిమాలనుంచి తూర్పు దిశగా, హస్తినాపురం మీదుగా వలసలు జరిగాయనుకుంటే, కోసల తూర్పున చాలా చివర ఉంది కనుక మహాభారతం తర్వాతే రామాయణం అనిపిస్తుంది.

ఇంకో కోణం నుంచి చూసినా మహాభారతం తర్వాతే రామాయణం అనే అభిప్రాయం కలుగుతుంది. అది; చంద్ర, సూర్యవంశ రాజులకు సంబంధించిన కోణం. మహాభారత రాజులు చాలావరకూ చంద్రవంశీయులు. రాముడు సూర్యవంశీకుడైన ఇక్ష్వాకు రాజు.  జోసెఫ్ క్యాంప్ బెల్  రాసిన Occidental Mythology లో ఈ చంద్ర, సూర్యవంశాలకు సంబంధించి ఆసక్తికరమైన వివరణ ఉంది. అది ప్రత్యేకంగా, చాలా వివరంగా చెప్పుకోవలసిన అంశం కనుక వాయిదా వేయక తప్పదు.

పైన చెప్పుకున్న తేదీల ప్రకారం, అంతవరకు అజ్ఞాతగా ఉన్న పౌరాణిక భారతదేశంపై క్రీ.పూ. 7వ శతాబ్ది నుంఛీ చరిత్ర వెలుగులు ప్రసరించడం ప్రారంభమైనదనుకుంటే; చరిత్రకూ, పురాణానికీ మధ్య మూడు వందల సంవత్సరాల అంతరం ఉందన్న మాట. అలాగే, బుద్ధుడికీ, మహాభారతానికీ మధ్య అయిదువందల సంవత్సరాల పై చిలుకు తేడా ఉంది. ఒకింత చారిత్రక రాజులుగా పరిచయమవుతున్న బింబిసారునికీ, అతని కొడుకు అజాతశత్రునికీ, మహాభారతానికీ మధ్య ఆరు వందల సంవత్సరాలకు పైగా ఎడముంది.

పురాణకాలాన్నీ, చరిత్రకాలాన్నీ మనం ఎంత  వేర్వేరు విషయాలుగా చూస్తామంటే; వాటి మధ్య ఎటువంటి అతుకునూ ఊహించలేనంత! అసలు అలాంటి ఆలోచనే రానంత! ఒక వేళ  వచ్చినా వాటి మధ్య అంతరం మానవకాలమానానికి అందనంతగా ఉంటుంది. ఈ పరిస్థితిలో పురాణానికీ, చరిత్రకీ మధ్య కాలపు సరిహద్దు ఇలా కొన్ని వందల ఏళ్ళకు కుదించుకుపోవడం ఎంత అద్భుతం!  పురాణకథ చరిత్రలోకి నేరుగా ప్రవహించడమంటే, పౌరాణిక సమాజ అవశేషాలు, అసంపూర్ణ అజెండాలు, అపరిష్కృత సమస్యలూ కూడా చరిత్రలోకి నేరుగా ప్రవహించడమే. కాలాల మధ్య హద్దులు ఎలా ఊహారేఖలు అవుతాయో, అలాగే సమాజాల మధ్య హద్దులు కూడా.

magadha

పౌరాణిక సమాజం చరిత్రలోకి ఎలా ప్రవహించిందో ఇప్పటికే అనేక వ్యాసాలలో చెప్పాను. ఇకముందు కూడా చెప్పబోతున్నాను. పైన ఉదహరించిన కోశాంబీ వాక్యాలలో అందుకు సంబంధించిన సూచనలు అనేకం ఉన్నాయి. అవి ఒక పెద్ద దారపు ఉండకు వేలాడుతున్న అనేక కొసలు లాంటి వాక్యాలు. అవి తూర్పు దిశగా సాగిన వలసల గురించి చెబుతున్నాయి.  వ్యవసాయవిస్తరణకు అందివచ్చిన శ్రామికశక్తి గురించి చెబుతున్నాయి. వర్ణవిభజన గురించి చెబుతున్నాయి. వ్యవసాయవిస్తరణకు అడ్డుపడుతున్న గణసమాజం గురించీ, గణ సమాజపు సంకెళ్ళను తెగ్గొట్టవలసిన అవసరం ఏర్పడడం గురించీ చెబుతున్నాయి. అందులో భాగంగా రాజ్యాల పుట్టుక గురించి చెబుతున్నాయి. పురాణ కాలాన్ని మనకు తెలియకుండానే చరిత్రకాలానికి తీసుకొస్తున్నాయి. చెప్పొచ్చేదేమిటంటే, వీటి అన్నిటి మూలాలు మహాభారతంలో ఉన్నాయి. అందుకే నేను మహాభారతాన్ని చరిత్రగా చదువుకుంటాను.

దారపు ఉండను వేలాడుతున్న అయిదు కొసలలో దేనిని పట్టుకోవాలన్న విచికిత్సనుంచి ఇక నేను బయటపడక తప్పదు. వ్యవసాయ విస్తరణ అనే కొసను పట్టుకుంటే ఎలా ఉంటుంది?!

మనిషి చరిత్రలో కొన్ని వేల సంవత్సరాలనుంచి నేటివరకూ, ఏకైకం కాకపోయినా ఏకైక ప్రాధాన్యంగల నిర్విరామచర్య ఏదైనా ఉందంటే, అది వ్యవసాయం. వ్యవసాయం మనిషి విశ్వాసాలకు విస్తృతినిచ్చింది. మనిషికి మతాలనిచ్చింది,  జనాభాను ఇచ్చింది, రాజ్యాలనిచ్చింది. కలలూ, కన్నీళ్లూ కూడా ఇచ్చింది. ప్రపంచమంతటికీ ఒకే విధమైన వ్యవసాయసంస్కృతిని ఇచ్చింది. మనిషిని హింసావాదిని చేసిందీ, అహింసావాదిని చేసిందీ కూడా వ్యవసాయమే. బతుకు తెరువు సాధనంగా పచ్చని తరువుపై వేటు వేసే గొడ్డలినీ చేతికిచ్చింది. వేల సంవత్సరాల వ్యవసాయ అస్తిత్వంలో ఎన్ని లక్షలు, కోట్ల ఎకరాల అరణ్యాలు దగ్ధమయ్యాయో, ఏమేరకు ఊచకోతకు గురయ్యాయో, ఎన్ని జీవితాలు శిథిలమయ్యాయో. ఎంతటి రక్తం ప్రవహించిందో, ఎందరు స్థానభ్రంశం చెందారో, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కల్లోలాలు, ఎన్ని తిరుగుబాట్లు, ఎన్ని విప్లవాలు కాలగర్భంలో నిశ్శబ్దంగా కరిగిపోయాయో ఊహకు అందదు. ప్రపంచ వ్యవసాయచరిత్ర మొత్తాన్నే రాసుకుంటూ వెడితే ,దానికదే, వెలుగు, చీకట్లు నిండిన మానవమహేతిహాసంగా మారిపోతుంది.

మానవజీవన ప్రస్థానంలో అప్పటికీ, ఇప్పటికీ కూడా ముఖ్య భూమిక పోషిస్తున్న వ్యవసాయం గురించి పై అయిదారు వాక్యాలలో సమర్థంగా, సమగ్రంగా చెప్పలేకపోయానని నాకు తెలుసు. అదలా ఉంచి, ప్రస్తుతానికి క్లుప్తంగా చెప్పుకుంటే,  తూర్పు దిశగా వలసలు సాగుతూ వ్యవసాయ ప్రాధాన్యం పెరిగి, అంతవరకూ గోపతిగా ఉన్న రాజు కాస్తా భూపతిగా మారుతున్న వైనం మనకు మహాభారతంలోనే అక్కడక్కడ స్పష్టంగానూ, బీజప్రాయంగానూ కూడా కనిపిస్తుంది. అలాగే, వ్యవసాయ విస్తరణ దాహంతో అడవుల్లోకి చొచ్చుకువస్తున్న క్షత్రియుల కత్తికి తలవంచి ఆదివాసీ తెగలు నలుదిక్కులకూ చెదిరిపోతున్న వైనాన్నీ అది చెబుతుంది.  వ్యవసాయ సంస్కృతులు అంతటా జరిగినట్టే, వ్యవసాయబలిమి అందించిన నూతనోత్సాహంతో భారతదేశంలోనూ గణనిర్బంధాలనుంచి బయటపడి సరికొత్త ‘నరుడు’ ఆవిర్భవించిన సంగతినీ చెబుతుంది. ఇంకా విశేషంగా రాజ్యాధికారం పైనుంచి కిందికి చేతులు మారుతున్న విషయాన్నీ చెబుతుంది. మహాభారతంలోని ఈ అంశాలే చరిత్రకాలానికి వస్తున్న కొద్దీ మరింత నిర్ణయాత్మక రూపం ధరిస్తూ వచ్చాయి. విచిత్రం ఏమిటంటే, నేటి కాలానికి కూడా ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడం. అందుకే, ఇప్పటికీ మనం మహాభారత సమాజంలోనే ఉన్నామని నేను అంటాను.

చరిత్ర కాలంలో, లేదా చరిత్రకు కొద్ది సమీపకాలంలో మొట్ట మొదటగా రెండు రాజ్యాలు  మహాభారతం తాలూకు అసంపూర్ణ అజెండాను ముందుకు తీసుకువెళ్ళాయి. అవి: కోసల, మగధరాజ్యాలు!

గణసమాజపు శృంఖలాలనుంచి బయటపడి నూతన సమాజం దిశగా కీలకమైన అడుగుపడింది మగధలో నని పైనచెప్పుకున్నాం. మగధతో కోసలను కూడా కలిపి చెప్పుకోవాలి.   క్రీ.పూ. 7వ శతాబ్ది నాటికి గంగా నదీ లోయ చరిత్రకు కేంద్రబిందువుగా మారిపోయిందని కొశాంబీ అంటారు.  అప్పటికి పశ్చిమ పంజాబ్; నాడు కాంభోజ, గాంధారలుగా పిలవబడిన ప్రాంతాలు కలిగిన నేటి అఫ్ఘానిస్తాన్ పర్షియన్ చక్రవర్తి డరియస్ ఏలుబడిలోకి వెళ్ళాయి.  మిగిలిన పంజాబ్ వేదకాలపు స్థితిలోనే ఉంది. కాకపోతే, పురులు వంటి కొన్ని తెగలు ఆ ప్రాంతంలో విస్తరించి అలెగ్జాండర్ వచ్చేనాటికి రాజ్యాలు ఏర్పరచుకున్నాయి.  పశ్చిమ పంజాబ్ లోని యోధులు మాత్రం డరియస్ , గ్జెరెక్సెస్ ల సైన్యంలో భాగమై గ్రీకులతో జరిగిన యుద్ధాలలో పాల్గొన్నారు. పర్షియన్ సామ్రాజ్యం, అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న మగధ రాజ్యం అనే రెండు ఆర్థిక శక్తుల మధ్య అప్పటికి పెద్ద భూమార్గ వర్తక కేంద్రంగా తక్షశిల ఉంది. మిగిలిన నగరాలు పెద్ద గ్రామాలుగా చెప్పదగిన తెగల ముఖ్యకేంద్రాలు మాత్రమే. వీటికి పరిమాణంలోనూ, ప్రణాళికలోనూ మొహెంజదారో-హరప్పాలతో ఎలాంటి పోలికా లేదు. ఈ కాలానికి వచ్చేసరికి సింధులోయ జనం మెరుగైన ఆయుధబలాన్ని సంపాదించుకున్నారు. నాగలి వ్యవసాయం, పశుపోషణ; వాటికి అనుబంధంగా వర్తకంతో బలమైన ఆర్థిక పునాదిని ఏర్పరచుకుంటున్నారు. అప్పటికి దక్షిణభారతం గురించి పెద్దగా తెలియదు. అలాగే, పంజాబ్ ప్రాంతం గురించి కూడా. ఎక్కువగా తెలిసింది గంగా లోయలోని పరిణామాల గురించే. ఈ ప్రాంతంలోనే త్వరలో మౌర్యులు తొలి మహాసామ్రాజ్యాన్ని నిర్మించబోతున్నారు!

క్రీ.పూ. 600 నాటి గంగా లోయలో భిన్న భిన్న సామాజిక వర్గాల వాళ్ళు సహజీవనం చేస్తున్నారు. వీరు వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నారు. బెంగాల్ అప్పటికి కీకారణ్యమయం. నేటి బీహార్, ఉత్తర్ ప్రదేశ్ లలో ఇప్పటికీ అక్కడక్కడ, ఆర్యులతో ఎలాంటి సంపర్కమూ లేని, ఆర్యభాష మాట్లాడని తెగలజనం ఉంటున్నారు. వీరికి పైన అభివృద్ధి చెందిన తెగల జనం ఉన్నారు. వీరు ఆర్యులతో ఘర్షణ పడుతున్నారు. ఒకింత ఉన్నతస్థాయికి చెందిన ఈ అనార్య తెగలను నాగజాతీయులుగా గుర్తిస్తున్నారు. ఈ రెండు రకాల తెగల జనమూ వ్యవసాయ జనావాసాలు ఏర్పడని ప్రాంతాలలో చెల్లా చెదురుగా జీవిస్తున్నారు. నాగుల కంటే ఉన్నత స్థాయికి చెందిన ఆర్య తెగలవారు నదీ తీరాల వెంబడి, వర్తక మార్గాలలోనూ స్థిరపడ్డారు. వీరంతా ఏదో ఒక ఆర్యభాష మాట్లాడుతున్నారు. చాలామంది కులాల కింద, తరగతుల కింద చీలిపోయి ఉన్నారు. వీళ్లలోనూ మళ్ళీ రెండు రకాల వాళ్ళు ఉన్నారు: ఉన్నతస్థాయికి చెందినవారు, నిమ్నస్థాయికి చెందినవారు. నిమ్నస్థాయికి చెందినవారు బ్రాహ్మణఆచారాలు, కర్మకాండకు దూరంగా ఉన్నారు. ఆర్య తెగల వాళ్ళు గణరాజ్యాలుగా ఏర్పడి, శూద్రుని నుంచి సేవలు పొందుతున్నారు. తెగలు, వ్యక్తుల పేర్లను బట్టి, వీరు అంతవరకు అనార్యులుగా ఉండి ఇటీవలే ఆర్యత్వం పొందారా అన్నది స్పష్టంగా తెలియదు. వీరి ప్రస్తావన వేదాలలోగానీ, బ్రాహ్మణాలలో గానీ లేకపోవడం ఈ ఊహకు కారణం. కొంతమంది మాత్రం కొత్తగా ఆర్యభాషకు, వ్యవసాయానికి మళ్లినట్టు కనిపిస్తుంది. వీరు వైదిక క్రతువులను పాటించేవారు కూడా కాదు. మిగిలిన బ్రాహ్మణీయ తెగలవారు నాలుగువర్ణాలుగా, ఉన్నత, నిమ్న తరగతులుగా చీలిపోయిన కారణంగా తెగలస్వభావాన్ని కోల్పోతున్నారు. ఈ తెగల ముఖ్యులు సంపూర్ణ అధికారాన్ని చెలాయిస్తూ బలప్రయోగానికి పూనుకుంటున్నారు. వర్తకం తమను ముడివేస్తున్నా, వివిధ సమూహాలు పరస్పర ఘర్షణలలో మునిగితేలుతున్నాయి. ఆర్య రాజ్యాలమధ్య కూడా ఎడతెగని యుద్ధాలు జరుగుతున్నాయి. అయితే, బలప్రయోగంతో ఒక సమూహం ఇంకో సమూహాన్ని లొంగదీసుకోవడం ఈ వైరుధ్యాలను పరిష్కరించే అవకాశం లేదు.  ఎందుకంటే, దాస్యాన్ని ఒక లాభసాటి వ్యవస్థగా మార్చడానికి తగినంత మిగులు కానీ, వస్తూత్పత్తి కానీ అప్పటికి లేదు. భౌగోళిక పరిస్థితి కూడా అందుకు అవకాశం ఇవ్వదు. అసలే దుర్గమ దేశం. దూర దూరంగా విసిరేసినట్టు ఉన్న జనావాసాలు. ఆయా తెగలవాళ్లు ఆధిపత్యశక్తుల కత్తి వేటును తప్పించుకుని వెనక్కు వెళ్లడానికి, నాగలి వ్యవసాయాన్ని విస్తరించడానికి  కావలసినంత జాగా. గ్రీస్, ఇటలీలలో పరిస్థితి ఇందుకు భిన్నం. అక్కడ వినియోగపడే భూమి పరిమితం.

క్రీ.పూ. 7వ శతాబ్ది నాటికే పదహారు జనపదాల(షోడశ జనపదాలు) ప్రస్తావనలు కనిపిస్తాయి. వాటిలో రెండు అప్పటికి ఇంకా స్వతంత్రంగా, శక్తిమంతంగా ఉన్న సైనిక గణరాజ్యాలు. అవి, మల్లులు, లిచ్ఛవులు లేదా వజ్జీలకు చెందినవి. ఇప్పుడు మనం క్రమంగా కోసల, మగధల దగ్గరికి వస్తున్నాం…

ఈ చారిత్రక వివరాల ప్రస్తావన చరిత్రపాఠం లా కనిపించి విసుగు పుట్టించవచ్చు. అయితే, ఇందులో మహాభారత సమాజానికీ, చారిత్రక సమాజానికీ మధ్యనున్న లింకును పోల్చుకుంటూ వెళ్లారనుకోండి…అప్పుడు బహుశా ఈ వివరాలు మీకు విసుగు పుట్టించకపోవచ్చు…

 –కల్లూరి భాస్కరం

 

 

 

 

“అది కాలిబాట కాదు, నా ఇల్లు!”

drushya drushyam -17కాలి బాట మీది జీవితం గురించి నాకెప్పట్నుంచో ఒక జీవగ్రంథం వెలువరించాలని ఉంది.
ఎప్పట్నుంచీ అంటే ఐదేళ్ల క్రితం కుమారిని కలిసినప్పటినుంచి…ఆమెకు చేతులు లేవు. కానీ, కాళ్లతోనే ముంగురులు సర్దుకుంటుంది. తల దువ్వుకుంటుంది. కళ్లకు కాటుకా పెట్టుకుంటుంది. బట్టలు ఉతుక్కుంటుంది. ఒక్కమాటలో తనకు చెయ్యెంతో కాలంత!

అందరూ ఉండీ అనాధగా మారినాక ఆమెకు కాలిబాటే ఇల్లయింది.
ఫుట్పాత్ ను ఆశ్రయించి బతుకుతున్న ఆమె జీవన సమరం ఒక జ్ఞానపీఠం!

+++
ఒకానొక శుభరోజు ఆ మనిషి తెలియజెప్పింది, ఫుట్ పాత్ మీది జీవితం తనదని, కింది జీవితం మనదని!

దెబ్బతిన్నాను.అప్పటిదాకా తలకిందులుగా ఉన్న నా అవగాహనను ఆమె సరిచేయడంతో పెద్ద ఆశ్చర్యం, ఆనందమూ…
ఆ మధ్యన పాత అవగాహన పగులు పెట్టడంతో లోపలి ఇల్లు కూలిపోవడంతో ఒకలాంటి అనారోగ్యం కూడా…ఏదైనా తెలియగానే లోపల చాలా నశిస్తుంది. దాంతో వచ్చే సిక్ నెస్.
కోలుకున్నాక అర్థమైంది.అవును. మనం రోడ్డుపై నుంచి పయణించే మనుషులం. రోడ్డు మన జీవన సరళి. అది మన జీవన స్థాయిని చెబుతుంది. మన మూస ధోరణిని చెబుతుంది. భద్ర జీవితాన్నీ సూచిస్తుంది.

నేనూ రొడ్డును వాడుకునే మనిషినే గనుక…ఇంట్లోంచి బయటకు వచ్చాక రోడ్డు…పనిచేసుకోవడానికి రోడ్డు…మళ్లీ ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లడానికి రోడ్డు…మొత్తంగా రోడ్డు నాకు జీవన వాహిక…రోడ్డు లేకపోతే నేను ఏమైతానో నాకే తెలియదు!
అటువంటి రోడ్డుమీది బతుకు గురించి ఆమె అన్యాపదేశంగా అంది, ‘మీరున్నది దిగువన కదా!’ అని!

లోవెలుపలి ప్రధాన స్రవంతి అప్పుడు దెబ్బతిన్నది.

+++
అప్పటిదాకా ఫుట్ పాత్ జీవితం అన్నది నాకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న జీవితంగా తెలుసు.
లేదంటే రోడ్డుకు దిగువ జీవితంగా గుర్తు. కానీ ఆమె అంది ‘మేం పైన ఉన్నం. నువ్వు కింద ఉన్నవు’ అని!
అలా, రోడ్డుమీది జీవితాలపై ఉన్న భ్రమనుంచి నన్ను రోడ్డుమీదికి తెచ్చింది కుమారి. ఇక అప్పట్నుంచీ నాలోపల ఒక జీవగ్రంథపు రచన సాగుతూ ఉన్నది అక్షరాలా, ఛాయల్లోనూ…

+++
నిజానికి ఆమె అపూర్వ. కాళ్లతోనే సూదిలో దూరం ఎక్కించే కుమారమ్మ…
ఆమె తర్వాత విమలమ్మ.. అంధురాలు. ధర్మం అడిగి సేకరించిన డబ్బులతో పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పి ప్రయోజకులను చేసిన ధీర వనిత. ఇంకా శంకర్….పదో తరగతి ఫేలయ్యాక ఇంట్లో ఒప్పుకోరని బయటపడ్డ మనిషి…ఇలా ఇంకొందరు…కొందరు అసలు సిసలు నేలమాలిగ గురించి వవరించారు…

ఇక అప్పట్నుంచీ నాకు ఫుట్ పాత్ అన్నది అధోలోక సహోదరులు నివసించే ఆవాసం అన్న భ్రమంలోంచి అదొక ఊర్ధ్వ లోకం అనీ, అదే పదిలమనీ తెలియజెప్పారు. దాన్ని హైలైట్ చెయ్యడం అని కాదుగానీ అది మన సంఘ జీవనంలో… హిపోక్రటిక్ జీవనంలోంచే ఉద్భవించిందనీ వివరించారు..నిజానికి మనల్ని మనం కుదించుకున్నందున పుట్టిందే అది అని రుజువుగా చెప్పారు వారు… వాళ్ల అనుభవాల నుంచి నన్ను మేల్కొలిపారు.

అందుకే, అప్పట్నుంచీ ఫుట్ పాత్ పై ఉన్న మనుషులను ఫొటో తీసేటప్పుడు వాళ్లను పై నుంచి కాకుండా కిందినుంచి, ఒళ్లొలంచి, ఒంగి ఫొటో తీయడానికి ప్రయత్నిస్తుంటాను. కనీసం సమానంగా నైనా చూసుకుని వాళ్లను ఛాయాచిత్రాల్లో నిమగ్నం చేస్తుంటాను. ఈ ఫొటో అటువంటిదే.

+++

ఆయన ఎవరో…ఏమో…అనుకునేరు.
ఆయనకూ పేరుంది. ఊరుంది. నివాస స్థలం ఉంది.
ప్రస్తుతానికి తనకంటూ ఒక దగ్గర ఫుట్ పాత్ ఉంది.
దానిపక్కనుంచి హాయిగా వెళ్లే రోడ్డు…అందులోని జనమూ ఉన్నారు.
కానీ తానొక్కడే.

ఒక్కడే తాను…విశ్వమంతా ఈ పిట్టగోడే అన్నట్టు హాయిగా విశ్రమించి ఉండగా తీసిన ఫొటో ఇది.
తన పక్కనుంచి వేగంగా దూసుకుపోతున్న రోడ్డు….సారీ కారు…
అది కిందే ఉంది కదా!
హమ్మయ్య! థాంక్స్!

+++
మరేం లేదు. కుమారమ్మ చెప్పింది, విమలమ్మా విడమర్చింది.
గోడలన్నవి అసలే లేని ప్రపంచంలో మేం బతుకుతున్నాం అని!

వాళ్లంటారు…
”అది కాలిబాట ఎట్లయితది? నిజానికి అది మీకు కాలిబాట…రోడ్డు ఉండగా వెళ్లే మీకు మాత్రం మేం నివసిస్తున్నది కాలిబాట! మాకు మటుకు అది ఇల్లే” అన్నరు.

“గోడలన్నవి లేనే లేని ఇల్లు…ఇదే అందరి ఆదర్శం కావాలి. అప్పుడే కొందిరికి ఇండ్లు..ఇంకొందరికి రోడ్డు…దాని పైన ఉన్న ఫుట్ పాత్ ఇంకొదరికి…ఇన్ని తేడాలుండవు. అప్పుడు జగమంత విశ్వం ఒకే మాదిరి ఇల్లు అవుతుంది. అంతదాకా కాలిబాట మీద జీవిస్తున్న వాళ్లను, దిగంబరులుగా లేదా తమకంటూ ఏమీ లేకుండా జీవిస్తున్న మహాజనులెందరినో..

నేనైతే ఎత్తుమీదే ఫొటో తీయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను.
ఈ మనిషి మాదిరి.

~ కందుకూరి రమేష్ బాబు

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 8 వ భాగం

( గత వారం తరువాయి)

8

9

కతార్‌ ఎయిర్‌వేస్‌ విమానం క్యూఆర్‌ 51లో..మొదటి తరగతి విశాలమైన, సౌకర్యవంతమైన క్యాబిన్‌లో..కుర్చీని బెడ్‌వలె అడ్జస్ట్‌ చేసుకుని..వెనక్కి వాలి, కళ్ళు మూసుకుని గంభీరంగా అలా మౌనంగా, ధ్యానంలో సమాధి ఐపోయిన స్థితిలో అలా ఒరిగి.,
లీల మనసులో ఒక గర్జిస్తున్న సముద్రముంది.
దూసుకుపోతున్న విమానం కింద ప్రళయిస్తున్న అట్లాంటిక్‌ మహాసముద్రముంది.
ఏ మహా సముద్రమైనా మనిషి హృదయంకంటే విశాలమైంది కాదు..లోతైందీకాదు అని తన అభిమాన కవి రాబర్ట్‌ ఫ్రాస్ట్‌ చెప్పిన కవిత్వపాదాలు స్ఫురించాయెందుకో అప్పుడామెకు.
తను గాయపడిందా…పడితే ఎందువల్ల..రామం వల్లనా.
అసలు రామం తనను ఏమీ అనలేదు కదా.
అతను తనను ఏమీ అనకపోవడమే గాయపర్చడమేమో..అప్రత్యక్షంగా తను అతన్నుండి ఒక రసస్పర్శనూ, రవ్వంత  ప్రేమనూ, ఓ అనునయింపునూ కోరుకుంటోందా. కోరుకోకుంటే అతని స్మరణరాగానే మనసు ఎందుకింత శూన్యంగా మారి ఎడారి తుఫానులా సుళ్ళు తిరుగుతూ క్షోభిస్తోంది.
ఆమెకు చటుక్కున ఒడ్డునపడి గిలగిలా తన్నుకుంటున్న చేప జ్ఞాపకమొచ్చింది. తన స్థితి యిప్పుడదేనా. రామం విషయం రాగానే తను సాధించిన అపూర్వ విజయాలు, డబ్బు దర్పం, అహం…అన్నీ ఎక్కడివక్కడ మటుమాయమైపోయి.. ఒట్టి బేలగా, నిస్సహాయంగా అతి సాధారణ స్త్రీగా కుమిలిపోతోందెందుకు..ఏమిటీ అనిమిత్తత.
‘లెర్న్‌ టు బి సైలెంట్‌
లెట్‌ యువర్‌ ్వయట్‌ మైండ్‌
విజన్‌ అండ్‌ అబ్జార్బ్‌..’అని పైథాగరస్‌ నిశ్శబ్దం గురించి ఎంత అద్బుతంగా చెప్పాడు. ప్రతిరోజు ఆరువేల ఆలోచనలు చేసే మనిషి మెదడు రెండు ఆలోచనల నడుమ ఖాళీ లేకుండా సాగుతూ నిరంతరం సముద్ర కెరటాలవలె మనిషిని బాదుతూఉంటే నూతన మేధో జవసత్వాలను పొందేందుకు సాధ్యమైనంత ధ్యాన నిశ్శబ్ధాన్ని పాటించి ఉత్తేజాన్ని సాధించమని పాస్కల్‌ చెప్పాడు.
నిశ్శబ్దం.. నిశ్శబ్దం.,
చాలాసేపటినుండి లీల నిశ్శబ్దంగా ఉంది..కళ్ళుమూసుకుని. తనకు రామం అర్థం కావడంలేదా..లేక రామం గురించి అర్థం కావడం లేదా. ఆత్మసంబంధం అనేది భగవంతుని గురించి తెలుసుకోవడానికీ, భగవంతున్ని తెలుసుకోవడానికీ మధ్య ఉన్న తేడా అనికదా మహాత్మాగాంధీ చెప్పింది.
తనకు రామం గురించి తెలియడం లేదా..అసలు రామమే తెవియడం లేదా.
ఒక్క విమానం వేగంగా వెళ్తున్న శృతివంటి మోత తప్పితే విమానంలో అంతా బహుప్రశాంతంగా ఉంది. కొద్ది చలిగాకూడా ఉంది. తను గాడ నిద్రలో ఉందనుకుందేమో ఏర్‌ హోస్టెస్‌  అలికిడి లేకుండా మెల్లగా వచ్చి సుతారంగా పైనున్న పింక్‌కలర్‌ ఊలు శాలువాను మెడల వరకు సర్థి వెనక్కి వెళ్ళిపోవడం లీలకు లీలామాత్రంగా తెలుస్తోంది.
అరగంట క్రితం కొద్దిగా…అరపెగ్గు..సోడాతో కలపి సిప్‌ చేసిన గ్రీన్‌ లేబుల్‌ విస్కీ..ఎక్కడో గుండెల్లో నీలిమంటలా వ్యాపిస్తోంది.
మంట..మంట..మంట కనిపించకుండానే..అదృశ్యంగా ఉంటూనే కూడా మనిషిని దహిస్తుందికదా.
అన్నీ జ్ఞాపకమొస్తున్నాయి ఆక్షణం లీలకు ఎందుకో..లోలోపల ఎక్కడో వడగళ్ళవాన కురుస్తున్నట్టు
నిర్మల..ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన తన నెట్‌వర్క్‌..దాదాపు ఎనభై ఎనిమిదిమంది సుశిక్షితులైన సైనికులవంటి ప్రజ్ఞావంతులైన తన అనుచరులు..సాధారణ వ్యక్తులనెవ్వరికీ సాధ్యంకాని వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్‌..ఎందరెందరో ఎన్నెన్ని రంగాలకో చెందిన క్లెయింట్స్‌…ఒక చూపుతో ఏ కార్పొరేట్‌ సంస్థనైనా తన పాదాక్రాంతం చేసుకోగల ప్రతిభ.. గుప్తంగా తనపై దాడికి ప్రయత్నించే శత్రువర్గం..తన రక్షణను నిరంతరం పర్యవేక్షించే తన రహస్య సెక్యూరిటీ..నెలకు దాదాపు ఆరుకోట్ల రూపాయల ఖర్చుతో మనగలిగే తన సిబ్బంది..అంతా వర్చువల్‌..అంతిమంగా వర్చువల్‌ రియాలిటీ.
” యువర్‌ అటెన్షన్‌ ప్లీజ్‌..”విమానంలో ప్రకటన ప్రారంభమైంది.
ఇంకో పావుగంటలో విమానం డిస్టినేషన్‌..వాషింగ్టన్‌ డి.సి. డల్లెస్‌ ఏర్‌పోర్ట్‌లో దిగబోతోంది…అదీ సారాంశం.  మెల్లగా కనురెప్పలను విప్పి..ప్రశాంతంగానే.. ఒంటిపైనున్న శాలువాను సరిచేసుకుని..నెమ్మదిగా లాప్‌టాప్‌ను ఒళ్ళోపెట్టుకుని బూట్‌చేసి.. మెయిల్‌ తెరిచింది.
నిర్మలనుండి మూడు మెసేజెసున్నాయి.
ఒకటి..యిదివరకు చెప్పిందే..అన్నెపోలిస్‌ దగ్గరి లోఎస్‌ ఫైవ్‌స్టార్‌ ఇంటర్‌ కాంటినెంటల్‌ హోటల్‌లో తొంభై ఒకటో నంబర్‌ డీలక్స్‌ కింగు సూట్‌ ఏర్పాటు.
తమ మేరీల్యాండ్‌ అపరేటర్‌, డిల్లయిట్‌ కంపెనీ లావాదేవీలు చూచే రాబర్ట్‌ కోవె ఏర్‌పోర్ట్‌కొచ్చి రిసీవ్‌ చేసుకుంటాడని రెండవది.
రాబర్ట్‌కు తెలియకుండా సెక్యూరిటీని ఇన్‌విజిబుల్‌ మోడ్‌లో మెక్సికన్‌ టీంకు చెందిన ముగాబే చూసుకుంటాడనీ, ఒక పావుగంటతర్వాత ముగాబే ఎక్స్‌ఎక్స్‌ఫైల్‌ టు టు నంబర్‌తో కాంటాక్ట్‌లోకొస్తాడని సూచన.. మూడవది.
ఈ మెసేజెస్‌తో నిర్మల స్కిప్పయిపోతోంది. తననుండి యిక ఆమెకు సెలవు. ఆమె డ్యూటీ ఐపోతుంది. గంట విరామం తర్వాత ఢిల్లీనుండి అఫ్జల్‌ తన సర్వీస్‌ గురించి డ్యూటీలోకొస్తాడు.
చటుక్కున దోహానుండి తను బయల్దేరుతున్నప్పుడు మెక్సికన్‌…కంపెనీ మనుషుల నుండి తనకు ప్రమాదంఉందని నిర్మల చేసిన హెచ్చరిక  జ్ఞాపకమొచ్చింది.
నవ్వుకుని..మళ్ళీ మెయిల్‌లోకి చూచింది. అరగంట క్రితం తను రామంకు చేసిన మెయిల్‌కు జవాబేమైనా వచ్చిందా అని వెదుకులాట..ఎదురుచూపు. ఆమె ఊహించినట్టుగానే రామం నుండి జవాబులేదు. రాదని ఆమెకు తెలుసు.
ఎందుకో ఆమెకు క్యాథీ జ్ఞాపకమొచ్చింది.
తామిద్దరిదీ ఒకటే వయసు..ఇద్దరూ అసాధారణ ప్రజ్ఞావంతులే. ఇద్దరూ డిస్టింక్షన్‌లో ప్రంపంచలోనే ప్రసిద్ధిచెందిన ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లోనుండి ఎంబిఎ పట్టాలు పొందినవాళ్ళే..ఇద్దరూ ఒకరిని మించి ఒకరు అందగత్తెలే. ఇద్దరూ దైర్యశాలులుకూడా. నిశ్శబ్దంగా వ్యూహాత్మక కదలికలతో జీవితాన్ని చదరంగం ఆటలా కొనసాగించగల ప్రతిభాశీలులు.. కాగా డబ్బుక్కూడా కొదువలేని సంపన్నులే ప్రస్తుతం.
ఐతే క్యాథీ తనకు పోటీయా.. తనకు స్నేహితురాలా..తనకు శత్రువా..ఆమె తన దారికి ఒక అడ్డంకా..లేక ఏమీ కాదా..?
విమానం ఆగి..కారియర్‌ బస్‌ వచ్చి షంట్‌ఐ..విమానంలోని జనం, కదలికల్తో సంచలనం మొదలై ఫస్ట్‌క్లాస్‌లో ఉన్నదే యిద్దరు ప్రయాణీకులు. తను, యింకో అమెరికన్‌ కాన్సలేట్‌ ఆఫీస్‌ ఉద్యోగి. హాస్టెస్‌ వచ్చి ఎదుట వినమ్రంగా నిలబడి..’వెల్‌కం మేం’ అంది బస్‌లోకి..యిద్దరు ప్రవేశించగానే కదిలి.. రెండు నిముషాల్లో ఏర్‌పోర్ట్‌ చేరి..ఇమ్రిగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగి ఎవరో ఎదురొచ్చి ఫింగర్‌ ప్రింట్‌, ఐ బాల్‌ ఫోటోగ్రాఫింగు..అంతా ఓ ఐదునిమిషాల్లో కానిచ్చి.
డబ్బు..డబ్బు..డబ్బుతో హోదా..హోదాతో గౌరవం..గౌరవంతో మనిషిలో పొంగే ఉత్తేజం, ఉత్సాహం..దర్పం.. అహం…పర్వతం దగ్గరికి మనిషి …మనిషి దగ్గరికే పర్వతం.. అదీ తంతు,
బయటికి నడిచింది లీల.
ఎగ్జిట్‌ దగ్గర రాబర్ట్‌ కోవె రెడీగా ఉన్నాడు. తెల్లనివాడు, రాగి వెంట్రుకలవాడు. వినయము ఉట్టిపడువాడు..తమ భృత్యుడు
”వెల్‌కం మేం..”చేతుల్లో ఓ పెద్ద అందమైన పుష్పగుచ్ఛం,
”థ్యాంక్యూ”
సరిగ్గా అప్పుడే కనిపించాడు…మెరుపులా…అప్పుడెప్పుడో బాగ్దాద్‌లో మెక్సికోకు చెందిన జెన్‌రోవర్‌ కంపెనీ బిడ్‌ ఆఫర్‌ దగ్గర ఓ లిప్తకాలం చూచిన ఓ ముఖం..నల్లనిది. క్రూరమైంది…వికృతమైంది.
కార్పోరేట్‌ ప్రపంచంలో కత్తిమొనపై జీవించే ప్రతి ఉన్నత వ్యక్తి అనుక్షణం డేగకళ్ళతో పరిసరాలను గమనిస్తూ ముందుకు సాగుతాడు అనుక్షణం…రక్షణ.. ఆత్మరక్షణ..ప్రాణరక్షణ లేకుంటే ప్రాణహరణ.
ప్రాణం కోల్పోవడానికీ, ప్రాణం తీయడానికీ నడుమ తేడా ఒక సన్నని కంటికి కన్పించని గీత .. అది ఎప్పుడు చెదిరిపోతుందో ఎవరికీ తెలియదు.
ఆ నల్లని ముఖం కన్పించిన మరుక్షణమే ఆమె సెల్‌ఫోన్‌లో ఓ ఎస్సెమ్మెస్‌ ప్రత్యక్షమైంది. þþ522 నంబర్‌. నల్లని ముఖాన్ని తోసుకుంటూ వెళ్తున్నట్టే ఇద్దరు దృఢమైన వ్యక్తులు వాని పైపైకి చొచ్చుకొస్తూ.. ఓవర్‌ ర్యాపింగు.
రెండు క్షణాల్లో స్పెషల్‌ ఎగ్జిట్‌ దగ్గర సుతిమెత్తగా నల్లని పొడవాటి ఇరవైరెండు ఫీట్ల బెంజ్‌  లిమో కారు వచ్చి ఆగింది. రాబర్ట్‌ వినయంగా ఒక తెరుచుకుంటున్న డోర్‌ వద్ద నిలబడి స్వాగతించి..లీల లోనికి ఎక్కగానే..మెరుపు వేగంతో తనూ ఎక్కి.. కారు మెరుపులా కదిలి.
లిమో కారును చూస్తూ చుట్టూ ఉన్న జనం..కొద్దిగా షాక్‌ ఔతూండగా.,ఐదు నిముషాల్లో..లిమోలో రాబర్ట్‌ కాన్ఫరెన్సింగు ప్రారంభించాడు.
గత రెండు నెలలుగా డిల్లయిట్‌ కంపెనీతో జరిపిన లావాదేవీలు, ఐబియంతో వాల్‌మార్ట్స్‌ సప్లయ్‌ చెయిన్‌ ప్రాజెక్ట్‌ విషయాలు, నాసాతో ఉన్న మోస్ట్‌ కాన్ఫిడెన్షియల్‌ ఆపరేషన్స్‌..కొత్తగా డిఫెన్స్‌ ఆపరేషన్స్‌కు సంబంధించిన మిలియన్‌ డాలర్ల ప్రాజెక్ట్‌ ప్రయత్నాలు, రిట్జ్‌-కార్టన్‌ హోటల్‌ కంపెనీతో ఒప్పందాలు..చెప్పుకుపోతున్నాడు.
లీల కళ్ళు మూసుకుని మౌనంగా వింటోంది.
మాట్లాడ్తున్నప్పటికంటే మాట్లాడవలసినప్పుడు మాట్లాడకుండా మనిషి పాటించే మౌనం ఎదుటి మనిషిని భయంకరంగా భయపెడ్తుంది. ఆ విషయం లీలకు తెలుసు.
లిమో కార్‌ ఇంటర్‌స్టేట్‌ 395 ద్వారా జోహాన్సన్‌ హైవేపై నుండి పరోల్‌ దిక్కు పరుగెడ్తోంది. మూడు సంవత్సరాలు తను అమెరికాలో ఉన్నప్పుడు ఎంతో సుపరిచితమైన రోడ్లే అవన్నీ. ఎదురుగా స్క్రీన్‌పై జిపియస్‌ రూట్‌ మ్యాప్‌ కదుత్తోంది.. సరిగ్గా యిరవై ఎనిమిది నిముషాల తర్వాత బెంజ్‌ లిమో హోటల్‌ లోయిస్‌ విశాలమైన అవరణలోకి ప్రవేశించింది.
కారుడోర్‌ తెరుచుకోగానే డ్రైవర్‌, రాబర్ట్‌..ఇద్దరూ తలపంకించి వినయంగా నిలబడి ఉండగా లీల దిగి..రిసిప్షన్‌ కౌంటర్‌ వైపు నడుస్తూండగా..
ఆమె మొబైల్‌ ఫోన్‌ మ్రోగింది.
స్క్రీన్‌పై రామం నంబర్‌.
అప్పటినుండీ ఒక మృత వాహకంగా ఉన్న రాగితీగలోకి చటుక్కున విద్యుత్తు ప్రవేశించనట్లయి.. ఆమె ముఖం వేయి వాట్స్‌ బల్బులా వెలిగి…
”హలో రామం” అంది చిన్నపిల్లలా..హుషారుగా..అప్పుడే రెక్కలు మొలిచి మొట్టమొదటిసారి ఎగుర్తున్న పక్షిపిల్లలా.
అట్నుంచి రామం ”హలో..”అన్నాడు.

(సశేషం)

–రామా చంద్రమౌళి

అవసరం

bhuvanachandra (5)

“అదేమిటే? తల్లోంచి పువ్వులు తీయమనడం ఏమిటి?”

“పెళ్ళాంగా కనిపించటానికట!”

“ఏం పెళ్ళాలు పువ్వులు పెట్టుకోరా … లేక పెట్టుకుంటే పెళ్ళాంలాగా కనిపించరా?”

“ఆ విషయం వాడ్నే అడుగుదామనుకున్నా – అయినా పెళ్ళాల విషయం మనకెలా తెలుస్తుందీ?”

“ఏం? మనం పెళ్ళాలం కామా? మనమూ ఆడవాళ్ళమేగా?”

“ఆడవాళ్ళమైనంత మాత్రాన పెళ్ళాలుగా మారడానికి మనకి ఆస్తులున్నయ్యా అంతస్తులున్నాయా? పెళ్ళి చేయడానికి తల్లీ తండ్రీ అన్నా వదినా ఉన్నారా?”

“సరేలే వీడికిదేం పిచ్చీ! పూలు తీయమనడం ఎందుకూ?”

“రోడ్డు మీద నన్ను చూశాడు…. మెల్లగా పక్కన చేరాడు వస్తావా అన్నాడు… తల ఊపాను. పమిట చెంగు భుజాల మీదుగా కప్పుకుని ‘పక్కా’ పెళ్ళాం లాగా వాడి పక్కన నడిచాను. సినిమాకి వెళ్దామన్నాడు. సరసానికి ఇబ్బంది ఉండని చోటు అదేగా! సరే అన్నాను. టిక్కెట్ల క్యూలో నిలబడ్డప్పుడు అన్నాడా మాట ‘పూలు తీసెయ్’ అని. ఎందుకన్నట్లుగా చూశా.

“భార్యగా సహజంగా కనపడాలంటే పూలు పెట్టుకోకూడదంట అంతేనా సినిమా జరుగుతున్నంత సేపూ ఆబగా వాడి చేష్టలు పైగా ఇలాంటి సోది ….. ఒళ్ళు నెప్పి, తలనొప్పి వచ్చాయనుకో”

“పెళ్ళాలతో సినిమా హాళ్ళల్లో అలా సరసాలాడతారా? దానికి లేని సిగ్గు పూలు పెట్టకుంటే వచ్చిందా?”

“సిగ్గా పాడా – నేనలాంటి దాన్నని జనం అనుకుంటే వాడి హోదాకి భంగం కాదూ”

“ఇంతకీ తీసేశావా?”

“తియ్యనా మరి?”

“నేను రాను నీ దారి నువ్వు చూసుకో అని చెప్పొచ్చుగా?”

“చెప్పొచ్చు కాని అవసరం ఎవరిదీ?”

“వాడు కాకపోతే వాడి అబ్బ …. వాడి తాత…”

“సరే – నేను కాకపోతే వాడికి మరోతి”

“ఊఁ ఆ తరవాత?”

“ఎందుకులే!”

“చెబుదూ..”

“వాడేనాడూ ఇలా ఎవర్నీ పిలిచి ఎరగడట. నన్ను చూడగానే నేను బాగా తెలిసిన దానిలా కనిపించానట. తను మొదటి సారి ప్రేమించిన అమ్మాయి నాలాగే ఉండేదట”

“ఆహా! ఎవతో పుణ్యం చేసుకున్నది?”

“వాళ్ళ ఆఫీసులో అమ్మాయిలు వీడంటే పడి ఛస్తారట. ఈ నాటి వరకూ ఏ ఆడదానికీ లొంగలేదట”

“ఓరి వీడి ప్రవరాఖ్యతనం తగలెయ్యా”

“అంతేనా ఇంకా చాలా చెప్పాడు. పెళ్ళి కూడా అయిందట పెళ్ళాం లక్షాధికారట వీడి మాట జవదాటదట”

“మరి ఆ ఏడిచేదేదో పెళ్ళాం దగ్గరే ఏడవొచ్చుగా?”

“అదీ అడిగాను – ఆవిడ సంసారానికి పనికి వచ్చేదేకాని సరసారనికి పనికి రాదట. ఎప్పుడూ పూజలు, వ్రతాలు అట”

“పిల్లలు….”

“ఉన్నారట”

“వీడు సరసం చెయ్యకుండానే పిల్లలెలా పుట్టారూ!!?”

 

 

 

 

“అది నేను అడగ్గూడదుగా!”

“ఇంకా…’

“మాటలు తగ్గించి చేతలకి దిగాడు”

“ఏం చేశాడేమిటి?”

“అక్కడా ఇక్కడా తడిమాడు – ఆహా! ఓహో అన్నాడు. మాట్లాడుతూనే సడెన్ గా లేచి ‘ఇక బయటకి పోదాం’ అన్నాడు”

“ఓరినీ! అదేమిటే!”

“నన్ను చూడగానే దగ్గరగా ఉండాలనిపించిదటగానీ దగ్గరకొచ్చాక మనసులో ఏదో పాపం చేస్తున్నట్లు అనిపించిందట. అందుకే ఏ తప్పూ జరగకముందే వెళ్ళిపోదామన్నాడు”

“ఓహో! జ్ఞానచక్షువులు తెరుచుకున్నాయి కాబోలు…”

“జ్ఞానచక్షువులా వాడి బొందా! నాకు అర్థం కావలసింది నాకు అర్థం అయింది”

“హ! హ! నువ్వు భలే చెప్తావే…. ఇంతకీ ఒట్టి బేరమేనా?”

“లేదులే… కొన్ని పచ్చనోట్లు నా చేతిలో కుక్కి ‘నేను ముందు వెళ్ళిపోతా నువ్వు కాసేపయ్యాక వెళ్లు’ అన్నాడు”

“వచ్చేటపుడు కలిసే వచ్చారుగా సినిమానించి వెళ్ళేప్ఫుడు విడిగా ఎందుకూ వెళ్ళడం?”

“అప్పుడు కోరికతో కూడిన వేడి! ఇప్పుడు చల్లబడిన నాడి”

“ఊఁ ఆ తరవాత?”

“ఇంకేముంటుంది …. కాసేపు ఆ చెత్త సినిమా చూసి నా దారిన నేనొచ్చా”

“ఇంతకీ ఏం చేస్తుంటాడో తెలుసా?”

“ ఆ వివరాలు మనకెందుకూ? అతని అవసరం అతనిది….. మన అవసరం మనదీ!”

“అబ్బ ఎన్నాళ్ళే ఇలా?”

“ఏం చేస్తాం? మనకి అందం ఆరోగ్యంతో పాటు చదువూ ఉంది. లేనిదొకటే…. మగతోడు. ఆ తోడు కావాలంటే లక్షల కట్నం పోయాలి. మనకొచ్చే జీతం బెత్తెడే ….. దాన్ని మూరడు చేస్తే గాని మంగళసూత్రం మెడలో పడదు. అది పడిందాకా మనకీ తిప్పలు తప్పవు”

“అదేనే బాధ. మగవాడికి ఆడది అవసరం…. ఆడదానికి మగవాడు అవసరం. సృష్టిలో జంతువులూ పక్షులూ సహజంగా బ్రతుకుతాయి – మనకే – ఈ మనుషులకే….. సహజమైన అవసరం కూడా డబ్బులు చల్లితే గానీ తీరదు. మగవాడికి మగువతో పాటు అది తెచ్చే డబ్బు కూడా కావాలి”

“చూశావా! ఒక్క అవసరం ఎన్ని పనులు చేయిస్తుందో”

“అవును. రేపు మనకొచ్చేవాడు ఎలాంటి వాడో!?”

“ఇప్పుడు నీకు తగిలిన వాడి లాంటోడైతే పువ్వులు తీయమంటాడు… మంచివాడైతే పువ్వులు కొని తీసుకొస్తాడు….. ఇంతవరకు గ్యారంటీగా చెప్పగలను”

“హ్హ! హ్హ! హ్హ! హ్హ!!!

 

 

*********

 

  • ఇది నేను బెంగుళూరులో ఉండగా నా చెవులతో విన్న ఇద్దరు యువతుల సంభాషణ. నేను హిందీ పేపర్ చదువుకోవడం చూసి నాకు తెలుగు రాదని వాళ్ళు యదేచ్ఛగా మాట్లాడుకున్నారు. సంభాషణ విన్నాక నా మనసంతా ఒక వేదనతో మూగబోయింది…. ఆ రాత్రి కూర్చుని వాళ్ళ సంభాషణని యధాతధంగా రాసుకున్నాను.

మళ్ళీ నా డైరీలు తిరగేస్తుంటే ఈ నాలుగు పేజీలు బయటపడ్డాయి. చదివి ఇదీ ఓ చరిత్రకెక్కని కథ కనుక ‘సారంగ’ కి పంపుతున్నాను.

కాలం మారిందని అంటున్నాం గదా……. మారిందా?

 -భువనచంద్ర

 

అమ్మాయిలూ ఆలోచించండి !

శైలా! శైలా! మీ ఎంకమ్మత్త నిన్ను రమ్మంటంది”  ప్రహరీ గోడకి ఆనుకుని ఉన్న అరుగుమీదకెక్కి కేకలు వేస్తూ నన్ను  పిలిచి చెప్పింది నాగరత్నమ్మ.

“ఎందుకంటా? సిగ్గూ, ఎగ్గూ లేకుండా అది నా కూతురిని పిలవమంటే నువ్వెట్టా పిలుస్తున్నావు?  పైగా అరిచి చెప్తుంది చూడు నలుగురూ వినలేదని”  అంది మా అమ్మ ఈసడింపుగా.

 “నాకెందుకులే తల్లా మీ మద్దెన.  ‘పాలు పిండుకు రావడానికి కొట్టం సాయ పోతున్నావు గదా!  అట్టా మా శైలజని  రమ్మని చెప్పు నాగరత్తమ్మా’  అంటే వచ్చా.  ఏందో అమెరికా దేశం నుండి కోడలు వచ్చిందంటే చూడాలని ఉండదా?  చిన్నప్పుడు ఎత్తుకుని పెంచిన మురిపం ఎక్కడకు పోద్దీ”  అనుకుంటా అరుగు దిగి వెళ్ళిపోయింది నాగరత్నమ్మ.

“మురిపం అంటా మురిపం.  లేచిపోయింది పోయినట్లుండక ఆస్తి కోసం  పుట్టింటి పైనే కేసు వేసింది.  మొగుడ్ని వదిలేసి లేచిపోయిన దానికి ఆస్తి ఎట్టా వచ్చిద్దని కోర్టు బాగా బుద్ధి చెప్పింది.  అయినా దరిద్రం వదల్లా.  కూతురు సక్కరంగా కాపరం చేసిద్దని ఊళ్ళో ఇల్లు కట్టి పోయిందిగా ఆ మహాతల్లి.  ఇన్నాళ్ళకి మళ్ళీ ఆ ఇంటికి చేరింది.  తూరుప్పక్క బజారుకి పోదామంటే సిగ్గేత్తంది దీని మొకం చూడలేక”  అంది అమ్మ మజ్జిగ చిలుక్కుంటూ.

 అమ్మ మాటలకి నాకు బాధ కలిగింది.  అమ్మ ఆవేదనలో కూడా అర్థం ఉంది.  మామని వద్దని లేచిపోయిన ఎంకమ్మత్త ఎవరి ప్రోద్బలంతో మా మీద కేసు వేసిందో, ఎందుకు వేసిందో నాకు అర్థం కాని ప్రశ్న.  తాతని ఫోన్లో అడిగాను కాని ‘నువ్వు ఇండియాకి వచ్చినపుడు మాట్లాడుకుందాంలే తల్లీ’ అన్నాడు.  అత్తని కలిసినపుడు తప్పకుండా అడగాలి.  ‘అమ్మకి తెలియకుండా అత్త దగ్గరకి వెళ్ళాలి ఈరోజు’ అని  అనుకున్నాను. 

అత్త జ్ఞాపకాలు నా మనస్సు నిండా

                 Kadha-Saranga-2-300x268                         

  ***

మోకాళ్ళ పైదాకా బుట్టబొమ్మ లాంటి గౌనులు కుట్టేది నాకు అత్త.  అవి వేసుకుని స్టీలు పెట్టెలో పుస్తకాలు, పలక పెట్టుకుని స్కూలుకి వెళ్ళే నన్ను చూసి ‘నువ్వెవరి పిల్లవే’ అని అడిగే వారు నాకు మామ వరస అయ్యే వారు.  ‘ఎంకమ్మత్త కోడలిని’  అనేదాన్ని.  ఎప్పుడూ కూడా మా నాన్న పేరో, అమ్మ పేరో చెప్పేదాన్ని కాదు. ‘బాగా చదువుకుని పెద్ద డాక్టర్ వి అవ్వాలి బంగారూ! అమెరికాకి వెళ్ళి పై చదువులు చదవాలి అనేది అత్త.

 అత్త భలే బాగుండేది.  సినిమాల్లోని భానుమతి లాగామోచేతి దాకా ఉండే జాకెట్టూ జాకెట్టుకి మెడ చుట్టూ అంచూ, పూసలూ వేసి కుట్ట్టుకునేది.  ఒంటిపొర పైట వేసుకుని పిన్ను పెట్టుకునేది.  అంత అందమైన అత్తని పన్నెండేళ్ళప్పుడే తనకంటే ఇరవై ఏళ్ళు పెద్దవాడైన మామకిచ్చి పెళ్ళి చేశారు.  అత్తేమో రాణి లాగా పొడవుపొడవుకి తగ్గ అందమూమామేమో పొట్టి.  బుడ్డోడులాగా ఉండేవాడు.  అయినా నాయనమ్మకి మనసు ఎట్లా ఒప్పిందో అంత అందమైన కూతురిని అనాకారి తమ్ముడికిచ్చి కట్టపెట్టడానికితన పుట్టింటి ఆస్తిని కూడా తనింట్లోనే కలుపుకోవచ్చనో, కూతుర్ని తన దగ్గరే ఉంచుకోవచ్చు అనో చేసి ఉంటుంది.  రోజుకో రకంగా అలంకరించుకుని పొగాకు గ్రేడింగ్ కి పోయేది అత్త.  అక్కడ ఒక పొగాకు బయ్యర్ తో స్నేహం చేసింది.  నాన్నకి, తాతకి తెలిసి, కట్టడి చేసి ఇంట్లో కూర్చో పెట్టారుకొన్నాళ్ళు బాగానే ఉన్నట్లు నటించి తన నగలన్నీ తీసుకుని పొగాకు బయ్యర్ తో లేచి పోయింది. 

 అతడైనా సరైన వాడా అంటే అదీ లేదు.  అతనికి అప్పటికే పెళ్ళాం, కూతురు ఉన్నారు.  ఊళ్ళో అందరూ తాత నాయనమ్మల ముఖం ఎదుటే తుపుక్కు తుపుక్కు మని ఊశారు.  నాన్న అయితే చాలా రోజులు బయటికి రాలేకపోయాడు.  మామకివేమీ పట్టలేదు.  ఆయనకి మొదటినుండీ కూడా పొలమే పెళ్ళాం, గొడ్లే బిడ్డలు. 

 చాన్నాళ్ళ తర్వాత నేను ఏడో తరగతిలో ఉండగా స్కూలు నుండి వస్తున్న నన్ను దారిలో జువ్వి చెట్టు కింద కలుసుకుంది మా నాయనమ్మ. “మీ అత్తొచ్చిందేదానికి నిన్ను చూడాలని ఉందంట దా”  అని నన్ను చెరువు కట్ట దగ్గరకి తీసుకెళ్ళింది.  అబ్బో! ఎంకమ్మత్త ఎంత బాగుందోఅచ్చం పట్నం దొరసాని లాగా ఉంది.  మిన్నాగు చర్మం లా ఆమె చర్మం   సాయంత్రపు ఎండలో మిల మిలా మెరుస్తుంది.  అత్తని చూస్తే అప్పుడు నాకు భలే గర్వం కలిగింది.  అత్త తన హాండ్ బ్యాగ్ లో నుండి బంగారు కాగితపు అట్టలో పెట్టిన హల్వా, చేగోడీలు ఇచ్చింది.  నన్ను ఎత్తుకుని ముద్దు పెట్టుకుని కన్నీళ్ళు కారుస్తూ వెళ్ళిపోయింది.  ఇంటికి వచ్చేప్పుడు నాయనమ్మఎవరికీ చెప్పొద్దేయ్. మీ అమ్మకి అస్సలు చెప్పబాక తిట్టిద్ది”  అంది.  చెప్పనని అడ్డంగా తలూపాను.

 నేను ఏడునుంచి పదో తరగతికి వచ్చిందాకా అప్పుడప్పుడూ నాయనమ్మతో వెళ్ళి అత్తని కలుస్తూనే ఉన్నాను.  అత్త ఎందుకో చాలా దిగులుగా ఉన్నట్లు నాకు తెలుస్తోంది.  నాయనమ్మ అత్త వచ్చినప్పుడంతా చక్రాలో, పులిబొంగరాలో, అరెసెలో చేసి నీళ్ళ బిందెలో పెట్టుకుని  తెచ్చి కూతురికి పెట్టేది.  అమ్మకి నాన్నకి తెలిసినా తెలియనట్లు ఉండేవారు.  తాత కూడా మాతో వచ్చి చెరువు కట్టకింద అత్తని కలుసుకునేవాడు.  రోజుల్లో అతని గురించో లేక మరేం బాధలో తెలియదు కాని తాతకి,  నాయనమ్మకి ఏదో చెప్పి అత్త  ఏడుస్తూ ఉండేది.  ఒకసారి అత్త ఒక రెండు జళ్ళ పిల్లని వెంటబెట్టుకుని వచ్చింది.  అతని కూతురట. పది పన్నెండేళ్ళుంటాయేమోఎంత బాగుందో పిల్ల.  మూతి బిగించుకుని మా వైపు చూస్తున్న పిల్ల చాలా తెలివైనదని అనిపించింది నాకు.  అక్కడ ఉన్న కొద్దిసేపులో అమ్మాయి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.  ‘రోజా! వదినతో ఆడుకోఅంది అత్త నావైపు చూపిస్తూ. పిల్ల నా వైపు కూడా చూడకుండా కింద పడ్డ చింతకాయలను ఏరుతుంది.  వెళ్ళేటప్పుడు మాత్రం అత్తటాటా చెప్పుఅంటే యాంత్రికంగా చెయ్యి ఊపిందిఅంతే తర్వాత నేను అత్తని చూడలేదు.  

 నా పదవ తరగతి తర్వాత అత్త ఇక మా ఊరికి రాలేదు.  నాయనమ్మ కూతురి మీద బాగా దిగులేసుకుంది. పొగాకు నారుకి వెళ్ళేవారో, మా ఊరి బయ్యర్లో అత్తని ఒకసారి రాజమండ్రిలో చూశామని, మరోసారి కాకినాడలో చూశామని చెప్పేవారు.  చనిపోయే ముందు రాదని తెలిసీ నాయనమ్మ కూతురిని చూసుకోవాలని ఆఖరి నిమిషంలో కూడా ఎదురు చూసింది.

 కాలప్రవాహం  అత్తని గురించి పూర్తిగా మరిచేట్లు చేసింది.  నేను ఎం. ఫైనల్ లో ఉండగా మాకు అత్త నుండి లాయర్ నోటీసు వచ్చింది.  ఇంట్లో రోజు తాత మీద, నాన్న మీద అమ్మ అరిచిన అరుపులు ఇప్పటికీ నా చెవుల్లో మోగుతున్నాయిపుట్ట్టింటి ఆస్తిలో తనకూ హక్కు ఉందనీ, తన భర్త ఆస్తి కూడా తనకే రావాలనీ ఆ నోటీసు సారాంశం.   భర్తతో కాపురం చేయకుండా లేచిపోయిందని చెప్పడానికి బోలెడంత మంది సాక్షులు బయలుదేరారు అత్త నోటీసు అయితే ఇచ్చింది కాని వాయిదాలకి రానే లేదుటకోర్టు ఆమెకి ఆస్తిలో హక్కు లేదని తీర్పు ఇచ్చింది  

 నాకు పెళ్ళి సంబంధం వచ్చిందిఅత్తకు రావలసిన ఎనిమిదెకరాలూ నాకు కట్నంగా ఇచ్చి నా పెళ్ళి చేశారు. నేను డాక్టర్ ని అవ్వాలనే అత్త కోరిక  తీర్చలేకపోయినా నాకు అమెరికాలో పనిచేసే డాక్టర్ మొగుడే దొరికాడుపెళ్ళయ్యాక నేను అమెరికాకి వెళ్ళిపోయానురెండేళ్ళ క్రితం తాతకి ఫోన్ చేసినపుడు అత్త మనూరికి వచ్చిందమ్మా! అని చెప్పాడు.  నాకు చెప్పాలని నా ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడని ఆయన కంఠంలోని ఆతృత వల్ల అర్థం చేసుకున్నాను.  “అత్తకి కట్టించిన ఇంట్లో ఉంటుందిఅత్త పరిస్తితి ఏమీ బాగా లేదువ్యవసాయం చేసేటప్పుడు నా చేతుల్లో డబ్బు ఆడేదిపొలం కౌలుకి ఇచ్చాం గా అమ్మా!  దాన్ని డాక్టరుకి చూపిద్దామన్నా నా దగ్గర డబ్బు లేదుతినడానికి మాత్రం బియ్యం మీ అమ్మకి తెలియకుండా ఇస్తున్నా”  అన్నాడుకళ్ళ నీళ్ళు తిరిగాయివెంటనే గుంటూరులో ఉండే నా స్నేహితురాలు విజ్జికి ఫోన్ చేసి దాని ద్వారా తాతకి బ్యాంక్ అక్కౌంట్ ఓపెన్ చేయించి డబ్బు పంపానుచాలానే పంపాను ఆయన ఏ బాధా పడకుండా.  ఈ రెండేళ్ళలో అత్త ఆరోగ్యం బాగయిందిసరియైన తిండి లేకనో, దిగులుతోనో శుష్కించిపోయిన ఆమె తేరుకుంది

 ఊళ్ళో అందరూ అమ్మతో సహా అత్తని లేవదీసుకుపోయినతను  అత్తకి బాగా డబ్బు మిగిల్చి చనిపోయాడని అనుకుంటున్నారనీఅత్త చేతిలో నాలుగు డబ్బులున్నాయని తెలియడంతో పలకరించే వాళ్ళు ఎక్కువయారనీ తాత సంతోషంగా చెప్పాడు.   తాత కూడా ఎవరికీ భయపడకుండా కూతురికీ మంచీ చెడ్డా చూసుకుంటున్నాడంటమామ మాత్రం తన మేనకోడలి మీద ప్రేమతో అత్త ఎదురైతే పలకరిస్తాడంట.

     ***                 

  పది గంటలప్పుడు అమ్మ పొలం వెళ్ళాక తాత,  నేను అత్త దగ్గరకి వెళ్ళాం.  అత్త నన్ను వాటేసుకుని ఏడ్చింది.  నాకు ఆమె ఎవరో అనిపించింది.  ఈమె మా అత్తేనా అనిపించేట్లుగా మారిపోయింది.  నేను ఆమెకి కొత్తగా అనిపించకపోవడానికి కారణం – ఆమె నా ఫొటో చూసి ఉంటుంది.  కాని నాకు మా అత్తని చూస్తే చెప్పలేని ఏదో భావం.  తెల్లజుట్టుని పీట ముడేసుకుని ఉంది.  ఏమయింది ఆ భానుమతి అంత అందం?  అందం ఇంత అశాశ్వతమా అనిపించింది.

“ఏంటత్తా! ఇలా అయిపోయావు? ” అన్నాను.  అత్త నిర్లిప్తంగా నవ్వింది. 

డాక్టర్ దగ్గరకి తీసికెళ్ళకూడదా తాతా”  అన్నాను. 

రాకపోతే నేనేం చేసేదిఎందుకులే బాగానే ఉన్నాను అంటుంది ఎన్ని సార్లు రమ్మన్నా” అనుకుంటా బయటికి వెళ్ళిపోయాడు తాత.  నేను అత్త జీవితాన్ని గురించి అడుగుతానని ఊహించి మమ్మల్నిద్దరినీ అలా వదిలేసి వెళ్ళిపోయాడని అత్త, నేను గ్రహించాము.

ఎట్టుండేదానివి ఎట్లా అయిపోయావత్తా”  అన్నాను. 

అత్త కళ్ళల్లో ఆగకుండా కన్నీరు.  “ఊరుకో అత్తా! అన్నాను.

ఏడుపు ఆపుకుని పైటతో కళ్ళు తుడుచుకుంటూమీ ఆయన బాగున్నారా? నీతో రాలేదే? చాలా మంచి వాడంటగా అమ్మాతాత చెప్పాడు  అంది.

“ఔనత్తా! బాగా చూసుకుంటాడు నన్ను.  చాలా బిజీఅమెరికాలో డాక్టరు గదా మరి. నేను నిన్ను చూడాలని  ఒక్కదాన్నే వచ్చానత్తా”  అన్నాను.  నా మాటలకి అత్త కళ్ళల్లో అమిత సంతోషం కదలాడింది.  తనకంటూ ఎవరూ ఉండరని భావం కొంత, ఆత్మ న్యూనతా భావం కొంతా ఉన్న వాళ్ళల్లోతన కోసం ఒకరున్నారని తెలిస్తే కలిగే సంతోషమా అది అనిపించింది.  ఏమో!?  అత్త గురించి నాకు  తెలిస్తే నా మాటలకి ఆమెకెందుకంత సంతోషం కలిగిందో చెప్పగలనేమో!

పిల్లల గురించి ఏమీ ఆలోచించలేదా? అంది.

పెళ్ళయి మూడేళ్ళేగా అత్తావచ్చే సంవత్సరం చూద్దాంలేనాకు అమ్మాయి పుడితే చిన్నప్పుడు నాకు కుట్టిచ్చినట్లు బుట్ట బొమ్మ గౌన్లు కుట్టియ్యాలత్తా నువ్వూ!” అన్నాను.

నేను నిన్ను మర్చిపోయానురా బంగారూకాని నువ్వు నన్ను మర్చిపోలేదు.  నీ మీద ఉండే ప్రేమ నంతా రోజా మీద చూపించాలనుకున్నాను.  ‘నువ్వొద్దునీ ప్రేమా వద్దూ‘  అంటూ అది నన్ను అసహ్యంచుకునేది.  అది అసహ్యించుకునే కొద్దీ నాకు దాని ప్రేమను సంపాదించుకోవాలని పట్టుదల కలిగేది.  ఆఖరికి అది నన్ను బానిసను చేసి ఆడించినా ఏమీ అనలేని స్థితిలో పడ్డాను.  బహుశా దాని తండ్రిని తల్లిని విడదీశానన్న బాధ దానికన్నా నాకు ఎక్కువగా ఉండటం వల్లనే నేను అది ఆడించినట్లుగా ఆడానేమో!

 అత్త ఇంకా ఏదో చెప్పబోతుంది కాని రోజా ఎవరాఅని ఆలోచిస్తున్న నాకు అత్త చెప్పిన చివరి వాక్యం వినగానే రెండు జళ్ళ క్లవర్ గర్ల్ రోజా గుర్తొచ్చిఇప్పుడెక్కడుందత్తా అమ్మాయి?  అన్నాను ఆతృతగాఅరె! ఇన్ని రోజులూ అమ్మాయి అస్సలు గుర్తుకు రాలేదే అనుకుంటూవేటగాడి బాణం గుండెల్లో గుచ్చుకున్నప్పుడు పక్షి కళ్ళల్లో కనపడే వేదనకాదు నిస్సహాయత కాదు కాదు నేను వర్ణించలేను నాకు మాటలు రావుఅలాంటి చూపుతో అత్త నన్ను నిశ్చేష్టపరిచింది.  నేను గొంతు పెగుల్చుకుని మాట్లాడబోయేంతలో అత్త లేచి వెళ్ళి మంచం క్రింద నుండి సూట్ కేస్ బయటకి లాగింది.  లోపల జిప్ లో నుండి ఒక కవర్ తీసి  “చదువునీకు అన్ని విషయాలూ తెలుస్తాయి”  అంది ఏడుస్తూ ఏడుపు హృదయ విదారకంగా ఉంది.  ఆతృతగా కవర్ లో నుండి కాగితాలు బయటకి లాగాను.

 

                                   ***

 ఎంకీ

ఎలా ఉన్నావు? నిజానికి నువ్వు ఎలా ఉన్నావు అని అడగాలని లేదు నాకు.  నువ్వు అంటే నాకు అసహ్యంఇన్నాళ్ళ తర్వాత కూడానా జీవితం  నాశనం అవడానికి కారణం నువ్వు కాదునేనేకేవలం నేనేఅని తెలిసే వయసు, అనుభవం వచ్చాక కూడా నువ్వంటే నాకు అసహ్యం తగ్గకపోగా పెరిగింది.  మా నాన్న నన్ను, అమ్మని వదిలి వెళ్ళే నాటికి నాకు ఏడేళ్ళు.  నాకు పన్నెండేళ్ళప్పుడు మా అమ్మ చనిపోయింది.  ఐదేళ్ళలో మా అమ్మ ఏడవని రోజు లేదు అంటే నమ్ముతావాదానికి కారణం అయిన నీ దగ్గరకి నాన్న నన్ను తీసుకొచ్చాడు.  నిన్నుఅమ్మా! అని పిలవాలట. నిన్ను ప్రేమగా మాట్లాడాలని నాన్న కట్టడి చేశాడు.  నీ వల్ల మా అమ్మ చనిపోయిందని తెలిసిన దాన్ని నేను నిన్ను అమ్మా అని పిలవడమా? ప్రేమించడమా? ఛీ! ఛీ –  నేను అసహ్యించుకుంటున్నానని తెలిసీ నువ్వు నన్ను ఎంతో ప్రేమగా చూశావు.  మా అమ్మ కంటే ఎక్కువగా ప్రేమించావేమో కూడా. కాని  నాకు మీ దగ్గరున్నంత కాలం జైల్లో ఉన్నట్లుగా ఉండేది.  బయటికి వెళ్ళలేని వయసుఏం చేయాలో తెలియని  నిస్సహాయత.   కసి నాన్న లేనప్పుడు నీ మీద చూపించేదాన్ని. మీ దగ్గర నుండి స్వేచ్ఛగా  ఎగిరిపోవడానికి త్వరగా పెద్ద దాన్ని అవాలని కోరుకునే దాన్ని.  నా కోరిక తీరింది ఎంకీచాలా పెద్ద దాన్నయిపోయాను.  త్వరలో లోకం నుండే శాశ్వతంగా వదిలి పోయేంతగా.

మీ గురించి హీనంగా మాట్లాడి స్నేహితుల దగ్గ్గర అభిమానం సంపాదించాను అనుకున్నాను కాని నా జీవితాన్ని గోప్యత లేకుండా ఆరబోసుకుంటున్నానని గ్రహించలేకపోయాను. పిచ్చి పిచ్చి ఆలోచనలతో నా చుట్టూ  భ్రమా వలయాలు ఏర్పరుచుకున్న నన్ను వంచించడానికి శరత్ కి ఎక్కువ సమయం పట్టలేదు. వాడికి దుబాయ్ వెళ్ళాలని కోరిక.  ప్రేమించానని, పెళ్ళి చేసుకుంటానని, నన్ను కూడా తనతో మీకు దూరంగా దుబాయ్ కి తీసుకెళతానని నన్ను నమ్మించాడునమ్మాను ఎంకీ.  జంతువులు అమ్మే అంగడి నుండి ఒక పిల్లవాడు వచ్చి పక్షిని కొనుక్కుపోతుంటే ఆ పక్షికెంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలిగింది నాకుపక్షి మళ్ళీ మరో పంజరంలోకి వెళ్ళబోతుందని ఊహించదు కదా!

 నన్ను వాడి మోహం తీరేవరకు అనుభవించి ఈ కంపెనీ వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బుతో దుబాయ్ వెళ్ళిపోయాడు. అయితే వీడు మా నాన్న కంటే చాలా నయం ఎంకీ.  వీడికి పెళ్ళాం లేదునా లాంటి కూతురూ లేదునన్నే మోసం చేశాడునా పట్ల కూడా నాకు జాలి కలగడం లేదు. ఎందుకంటే నీలా నేను మరో ఆడదాని జీవితాన్ని, మరో చిన్నపిల్ల జీవితాన్ని నాశనం చేయలేదుదానికి నేను భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

 ఎంకీ నా ఒళ్ళు హూనం అయిందిజబ్బు ముదిరిపోయి ఆఖరి దశకు చేరుకున్నాక నేడో రేపో కుప్పతొట్టి దగ్గరకు విసిరివేయబడతానుఇప్పుడు ఈ ఉత్తరం రాయడానికి కారణం నన్ను మీ దగ్గరకి తీసికెళ్ళమని చెప్పడానికి రాయడం లేదునువ్వు నాకేమీ చేయక్కర్లేదుమనిద్దరి జీవితాల గురించి పదిమందికీ తెలియచెయ్యిపెద్దలు తప్పులు చేసినా మనం మన జీవితాన్ని సరియైన విధంగా మలుచుకోవాలి కాని వాళ్ళు తప్పు చేశారని వాళ్ళ మీద ద్వేషం పెంచుకుని అదే తప్పు మనం చేయడం, మన జీవితాలని నాశనం చేసుకోవడం  సబబా అని ఈ అమ్మాయిలను ఆలోచించుకోమంటున్నానని చెప్పుమీరు ఇప్పుడు చేసే పనుల  వల్ల రేపు మీ పిల్లల జీవితాలు ఏమవుతాయో తెలుసుకోమని‘  నువ్వూ నీ జీవితాన్ని విప్పి చెప్పు

 అంతే ఎంకీ,  నాలా మరో ఆడపిల్ల జీవితం నాశనం అవకూడదనే ఆవేదనతో ఈ ఉత్తరం రాశా.  నిన్ను క్షమించి మాత్రం కాదునిన్ను అసహ్యించుకుంటూనే మరణిస్తా.

 మరణించాక కూడా నిన్ను క్షమించలేని

నీ రోజా.

ఉత్తరం పట్టుకుని దాని వైపే చూస్తూ మంచంలో కూలబడ్డాను నిస్సత్తువగా.  ఎందుకింత అమాయకంగా ఉన్నారు ఈ అమ్మాయిలుప్రేమిస్తున్నాను,  పెళ్ళిచేసుకుంటాను అని అంటే నమ్మవచ్చు అంతకంటే మంచి వాళ్ళు దొరకరు అని అనుకుంటే పెళ్ళి చేసుకోవచ్చు. తప్పులేదు.  ఎందుకంటే పెళ్ళి తర్వాత ఎక్కువ శాతం మందిలో ప్రేమ కలుగుతుందని, బంధం ఏర్పడుతుందనీ నమ్ముతాం కనుక. కాని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వాళ్ళని నమ్మి ఎలా వెళ్ళిపోతున్నారుసమాజంలో సాటి స్త్రీలకి జరుగుతున్న అన్యాయాలని చూసి కూడా స్త్రీ మళ్ళీ మళ్ళీ ఎలా మోసపోతుంది?  అయినా మనల్ని ఇంతగా నమ్మి వచ్చిన స్త్రీని మోసం చేయడానికి, వంచించడానికి మగవాడికి మనసెలా ఒప్పుతుందో!!?

 ఉత్తరం వల్లో, జెట్ లాగ్ వల్లో తెలియలేదు కడుపుని ఎవరో కెలికినట్లుగా వాంతిదొడ్లోకి పరిగెత్తి వాంతి చేసుకున్నానుదొడ్డి వాకిట్లో వీరడి సహాయంతో తాళ్ళు పేనుతున్న తాత, ఇంట్లో నుండి అత్త ఇద్దరూ నా దగ్గరకి పరిగెత్తారు.  “ఏమయింది తల్లీ!” అన్నాడు తాత ఆందోళనగా.  అత్తకి ఏడ్చీ ఏడ్చీ  మాట పెగలడంలేదువీరడిని పంపి ఫకీరు షాపులో కాఫీ తెప్పించు తాతా!  తలనొప్పిగా ఉందిఅమెరికా నుండి వస్తే వారం రోజులు ఇలాగే ఉంటుందని నీకు తెలుసుగా.  కంగారేం లేదు”  అన్నాను.  వీరడు నీళ్ళు తెచ్చి ఇచ్చాడుశుభ్రం చేసుకుని అత్త, నేను లోపలకి వెళ్ళాం.  ఉత్తరం అత్త చేతికిస్తూ తర్వాతేమయింది అన్నట్లుగా ఆమె వైపు చూశాను.

ఉత్తరం వచ్చాక పోస్టల్ అడ్రస్ పట్టుకుని  రోజాని అతి కష్టం మీద ఇంటికి తీసుకొచ్చాం.  చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చిందిఅది ఇంటికి వచ్చిన నాలుగు రోజులకే వాళ్ళ నాన్న గుండె ఆగిపోయింది దాన్ని  గురించిన ఆలోచనలతో.  దాన్నైనా బ్రతికించుకోవాలని డబ్బు కోసం తాతకి, మీ నాన్నకి చాలా ఉత్తరాలు రాశానుఆఖరికి సిగ్గు విడిచి మీ అమ్మకి కూడా రాశానుసమాధానం లేకపోతే నేను నేరుగా మన ఇంటికి రావలసిందిఅది చేయకుండా ఆవేశంతో –  అది చచ్చిపోతుందన్న భయంతో –  లాయరు నోటీసు ఇస్తే డబ్బు పంపుతారని నోటీసు పంపానుమళ్ళీ మరో తప్పు చేశానునా పుట్టింటి వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు నన్ను మొదటిసారి కంటే ఎక్కువగా అసహ్యించుకున్నారు.  ‘ఎంకీ!  నాకు బ్రతకాలనుంది‘  అని అది అంటుంటే ఏమీ చేయలేక తల బాదుకుని ఏడ్చానువాళ్ళ నాన్న పోయిన కొన్ని రోజులకే అదినన్ను ఎక్కువ బాధించకుండానే – రోజా చనిపోయింది.

 బంగారూ! అది కోరిన కోరిక నేను తీర్చలేనునాకు ఆ శక్తి లేదునువ్వే మా ఇద్దరి జీవితాలని గురించి స్త్రీ జాతికి తెలియచేయిమరో ఆడది మాలా బాధ పడకూడదనే నేను నిన్ను ఈ పని చేయమంటున్నానురా బంగారూ!”  అంది అత్త.

అత్త మాట్లాడుతుండగానే ఏం చేయాలా అనే నా ఆలోచనలు ఒక రూపు దిద్దుకున్నాయి.  “తప్పకుండా తెలియచేస్తానత్తా.  కాని అదేంటో మరి  కథలు చదివీ,  ఇంకొకరి జీవిత అనుభవాలు తెలిసీ కూడా స్త్రీ మోసపోతూనే ఉందివంచింపబడుతూనే ఉందితెలియచేయడం సంగతి కన్నా ముఖ్యంగా మనం కొంత మందికైనా మన పరిథిలో సహాయం చేద్దామత్తా.  నీ పొలానికి చాలా విలువ వచ్చిందిపొలాన్ని అమ్మి తక్కువ ధర ఉన్న చోట స్థలం కొని స్త్రీ సదనం కడదాం అభాగ్యులని చేరదీసి నీ జీవితాన్ని సార్థకత చేసుకుందువుగాని”  అన్నాను.

 మెరుస్తున్న కళ్ళతో అత్త నన్ను వాటేసుకుని కిందకు నా కాళ్ళ మీదకు జారింది.  “తప్పు అత్తా! పెద్దవాళ్ళు పిల్లల కాళ్ళు పట్టుకోకూడదు”  అంటూ అత్తని లేవదీశాను.

  మా అమ్మకీ,  మా ఊరి వాళ్ళకీ నా పొలాన్ని అత్తకి ఎక్కువ ధరకి అమ్మినట్లుగా చెప్పానుఅత్త ఇప్పుడు స్త్రీ సదనంలోని వారందరికీ తల్లిఇప్పుడు అమ్మ కూడా అత్తని బాగా పలకరిస్తుందటఅత్త నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఆమె గొంతులోని సంతోషం వల్ల ఆమె అణువణువులో వెలుగుతున్న మెరుపుని చూడగలుగుతున్నాను.

 మా అత్త ఎప్పుడూ మెరుస్తూనే ఉండాలినాకు గర్వాన్ని కలిగించాలి –   ఇది నా కోరిక.

 

              ***

 

radhamanduva1—-మండువ రాధ

అర్థసత్యాల చిత్కళ- స్వప్నలిపి

“నేను శోధన నాళికలలో జీవిస్తున్నాను. భ్రమ విభ్రమాలలో జీవిస్తున్నాను.” అని కనుల గాజుబుడ్లలో కలల రసాయనాన్ని నింపుకుని కవిత్వపు ఔషధాన్ని వెలువరించే చిత్కళ అజంతా- స్వప్నలిపి లోని కవిత్వం. బాధాగ్ని కుసుమాల పరిమళం, స్వప్నఖచిత శరీరాల రహదారి పాట, వేళ్లపై ప్రజ్వరిల్లే వైశ్వానర గోళాలు కలిసి నగ్నాక్షరాలుగా మారే క్రమంలో నా పద్యాలన్నీ చిత్తుప్రతులే  అనుకునే తుదిలేనితనం ఈ కవిత్వ లక్షణం. రాళ్ళు రువ్వితే గాయపడ్డ నీళ్ళు ఉవ్వెత్తున ఒళ్ళు విరుచుకుని ఊరిమీద పడ్డాయనే విశేషాన్ని చెప్పి కూడా “సుదీర్ఘంగా సాగుతున్న వాక్యం మీద ఒక వైపు రివాల్వర్, మరో వైపు పూలమాల/ నా చేతులు అవేనా?” అని అనుమానపడతాడు కవి.”శబ్ధ శరీరం మీది ఆఛ్ఛాదనల్ని విసర్జించి”  అందాకా దాగిన ఉమ్మెత్త చెట్లను, ఊసర క్షేత్రాలను/ఉద్రేకవంతమైన సరస్సులను, ఉరితీయబడుతున్న అక్షరాలను ఆవిష్కరించేందుకు వాస్తవానంతర ఊహాపత్రాలపై రాసుకున్న స్వప్నలిపి ఇది.

PQAAAJ9573n0A4gC1sSCu1EDVSXaXFx_88MLNtPyURkLyqs34FwYHhPWWUJ_x7KoX90nE_U-XyPUDEQVkg3Z1t7faJQAm1T1UH5aj_8VLErZ7mIBLlRS08t4SXK_

  నీ గదిగోడలపై అగ్నిచక్షువు నేనే

 

ఘూర్ణిల్లుతున్న విషాద వృక్షచ్ఛాయలలో అదృశ్యలోకాలను ఆవిష్కరిస్తున్న స్వాప్నికుడా

నేను నీలోనే ఉన్నాను, నీ కన్నీళ్లలోనే ఉన్నాను

నిషిద్ధ నగరంలో నీ ఆక్రందన ఎన్నోసార్లు విన్నానుకదా

నీ గది గోడలపై అగ్నిచక్షువు నేనే

 

నడిరాత్రి, నడివీధి స్వప్నకవాటాలు తెరుస్తున్నారు ఎవరో

నవ్వుతున్న పెద్దపులి కావచ్చు

వధ్యశిలలపై అరణ్య కుసుమాలు వెదజల్లుతున్న పరివ్రాజకుడు కావచ్చు

అజ్ఞాత యోధులను ఆశీర్వదిస్తున్న వనదేవత కావచ్చు

కాలమేఘాంచలాలపై వస్తున్న మృత్యు రధచోదకుడు కావచ్చు

 

నడిరాత్రి, నడివీధి అలజడి సృష్టిస్తున్నారు ఎవరో

నడుస్తున్న శిలా విగ్రహాలు కావచ్చు

చీకటి సోపానాలపై సాలభంజిక హెచ్చరిక కావచ్చు

జీవన సంకేతాలను కలుష భూయిష్టం చేస్తున్న విద్రోహి క్షుద్ర విన్యాసం కావచ్చు

 

నడిరాత్రి, నడివీధి మృత్యురేఖపై నగ్నతాండవం చేస్తున్న స్వాప్నికుడా

జ్వలిస్తున్న కన్నీళ్లలో ప్రతిఫలిస్తున్న ఆకారం నీదేనా?

మృత్యువు కలతనిద్ర క్షణమాత్రమే సుమా!

 

రాక్షసుని వెన్నెముకపై ప్రతిష్ఠించిన నగరంలో మనిషి చిత్రవధ ప్రత్యేక కళ

కలలలో సైతం అతడు శృంఖలుడే.

—***—-

వ్యాఖ్యానం:

 

కలలు నిషేధించబడిన ఛాయాలోకంలో తిరుగుతూ, వాస్తవాల వలువల్ని జార్చేసిన ఊహా శరీరాల్ని స్వప్నిస్తాడు ఒకడు. మొదలు తెగి విరిపడిన ఆశా విషాదాల అరకొర నీడల్లో  తన అంతర్లోకాలను పరచుకుంటాడు. అజ్ఞాతంగా, అనామకంగా అతని మారుమూల గదిలో ఆర్తారవాల్ని ఆలకించి జ్వలించే నిప్పుకళ్ళు మాత్రం ఒక్క కవివే.

 

ఆ స్వాప్నికుడి చుట్టూ లోకం పరిచే భ్రమలు, వెంట పరిగెట్టించుకుని నీరివ్వక నీరుగార్చే ఎండమావులు. అతని గది నుండి బయటికి ఆకర్షిస్తూ తెరుచుకున్న స్వప్నకవాటల అవతల పొంచి చూస్తున్నది “నవ్వుతున్న పెద్దపులి కావచ్చు”.  అక్కడ నుండి కనపడే దారుల్లో అప్పటివరకూ నడిచి వెళ్ళి ఆవేశపు అడవుల్లో అదృశ్యమైన వాళ్ల అడుగుజాడలు కాస్త గజిబిజిగానే ఉండొచ్చు. బహుశా అవి ఏ ఎదురుదాడుల మోతల్లోనో చిందర వందరగా చెరిపోయాయేమో! ఆ యుద్ధాల అంతంలో శాంతిని కూర్చుకుని దారిపొడవునా పూలనో మేఘాలనో పరచుకుంటూ నడిచెళ్తూ ఉన్నది ఒక పరివ్రాజకుడో ఒక మృత్యు రధచోదకుడో!

 

స్వప్నాల సెగకు తాళలేక , ఎంత నియంత్రించుకున్నా తనలోంచి వెలికొచ్చే ఆక్రందనలకు ఆగలేక తన నిద్రా సౌఖ్యం లోంచి, భద్రగదిలోంచి తెగించి బయటికొచ్చాడతను. నడివీధిలో నడిచెళ్ళే అతనికోసం ఆ నడిరేయి ఒక అమ్ములపొదిలా చీకటి చాటున ఎదురుచూస్తుండొచ్చు. దారిలో కనపడని ప్రతి ఎదుర్రాయి అతని తెగువపై ఎక్కు పెట్టబడిన ఒక ఆయుధమే. అతని చుట్టూరా రొదపెట్టే  అలజడికి కారణం “నడుస్తున్న శిలా విగ్రహాలు కావచ్చు/చీకటి సోపానాలపై సాలభంజిక హెచ్చరిక కావచ్చు.”

 

బహుశా ఆ ప్రయాణం నడక కాదు. రగిలే జ్వాలపైన నక్షత్రాల కళ్లతో వెలిగే ఆకాశం కింద సన్నటి తాడు పైన దిగంబర నాట్యంలాటి విన్యాసం. ఏమాత్రం ఏమారినా “మృత్యువు కలతనిద్ర క్షణమాత్రమే సుమా!” అనే హెచ్చరిక అతని నాట్యానికి నేపథ్య సంగీతంలా వినిపిస్తుంది.

 

సాంఘికంగా, సామాజికంగా బందీగా బ్రతికే మనిషి వాటి నియమాలను, అలవాట్లను కాదని, ఊహల్లో సైతం స్వేచ్ఛనివ్వని శృంఖలాలను తెంచుకునే రాపిడిలోని గాయాలను, విముక్తికో, నవీనతకో చేసే మార్గాన్వేషణలోని అనుక్షణ జరామరణాలను  హృదయానుకంపనతో స్పృశించిదీ కవిత.

 1swatikumari-226x300–బండ్లమూడి స్వాతికుమారి

అందం, ప్రతిభా, వ్యక్తిత్వం = సుచిత్రా సేన్!

 suchitra-sen-best-bengali-bollywood-movies-list

మొన్న శుక్రవారము 17 జనవరి 2014 బెంగాలీ చిత్రతార ఒకటి అస్తమించినది.  82 ఏళ్లు నిండిన సుచిత్రా సేన్ ఇక లేరు. ఆమె నేటి బంగ్లాదేశ్‌లోని పాబ్నాలో 1931లో రొమా (రమ) దాస్‌గుప్తాగా జన్మించినది. ఎనిమిది పిల్లలలో (మూడు మగ, ఐదు ఆడ) ఆమె ఐదవది. ఆమె అసలు పేరు కృష్ణ, కాని బడిలో చేర్పించేటప్పుడు, వాళ్ల నాన్నగారు రమ అని పేరిచ్చారట. కొందరు ఆమె శాంతినికేతనములో విద్యాభ్యాసము చేసినదంటారు.

 

అతి రూపవతియైన ఆమెకు పదహారవ ఏడే పెళ్లయినది.  ఆమెకు సంగీతమంటే యిష్టము.  చలనచిత్రాలలో పాడాలని ఆమె కోరిక.  కాని ఆమె అదృష్టము మరొక విధముగా పరిణమించినది.  వెండి తెర మరుగున గాక, వెండితెర మీదనే ఆమెకు అవకాశము లభించినది. ఆమె మొదటి చిత్రము 1953లో విడుదల అయినది.  ఆమెకు దర్శకుడు నితీశ్ రాయ్ సుచిత్ర అని పేరు నిచ్చాడట. తరువాత ఆమె వెండితెరపైన సుచిత్రా అనే పేరుతో స్థిరపడినది. ఆమె తన నాన్నమ్మను నటనవిద్యలో గురువుగా భావించింది. ఆమె సుచిత్ర నటనను ప్రోత్సహించడము మాత్రమే కాక విమర్శించేది కూడ. ఆమెతో నాయకుడుగా ఉత్తం కుమార్ నటించాడు.  ఉత్తం, సుచిత్రాల జోడీ అలా 1953లో ఆరంభమైనది.  వాళ్లిద్దరు తరువాత ఎన్నో చిత్రాలలో కలిసి నటించారు.  పెళ్లికి పిదప నటన ప్రారంభించి కొనసాగించిన నాయికలు అరుదు.  అట్టి అరుదైన నాయికలలో ఆమె ఒకతె, మరొకరు గడచిన వారము మరణించిన తెలుగు నటి అంజలీదేవి.

 

సుచిత్రా సేన్ బెంగాలీ చిత్రములో వహించిన పాత్రలను తెలుగులో సావిత్రి, హిందీలో వహీదా రహ్మాన్ పోషించారు. దీనిని బట్టి మనము బెంగాలీ చిత్రాలను చూడకపోయినా ఆమె నటనను గురించి ఊహించుకోవడానికి అవకాశము ఉంటుంది.  ఉత్తంకుమారుతో ఆమె జోడీ హిందీలో రాజ్‌కపూర్-నర్గీస్, తెలుగులో నాగేశ్వరరావు-సావిత్రి లాటిది. వారిరువురు నటించిన చిత్రాలను ప్రేక్షకులు అమితముగా ఆదరించారు.  ఏ కళాకారులకైనా ఆ కళను అనుభవించే రసికులు ఆదరిస్తే అంతకన్న కావలసినదేముంది?

 

ఆమె 52 బెంగాలి, ఏడు హిందీ చిత్రాలలో నటించింది. అందులో 30 చిత్రాలలో ఆమెతో కూడ ఉత్తంకుమార్ నటించాడు. అలా వారిరువురు నటించిన మొదటి చిత్రము సారే చూయతర్, చివరి చిత్రము ప్రియ బాంధవి.  ఆమె నటించిన కొన్ని గొప్ప చిత్రాలు – అగ్నిపరీక్ష (తెలుగులో మాంగల్యబలం), ఉత్తర్ ఫల్గుని (హిందీలో మమత), దీప్ జ్వేలే జాయ్ (హిందీలో ఖామోషీ, తెలుగులో చివరకు మిగిలేది), సాత్ పా కే బంధా, హిందీ చిత్రములు దేవదాస్, ఆంధీ. ఇందులో సాత్ పా కే బంధా చిత్రములోని నటనకు ఉత్తమ నటి పురస్కారము మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవములో దొరికింది.  అంతర్జాతీయ రంగములో అలాటి ఉత్తమ నటనా పురస్కారమును నర్గీస్ తరువాత అందుకొన్న భారతీయ మహిళ ఆమెయే.

 

ఆమె కుమార్తె మూన్ మూన్ సేన్, మనుమరాళ్లు రైమా, రియా. ఆమెకు పద్మశ్రీ, బంగభూషణ్ పురస్కారములు ఇవ్వబడినవి. చిత్రజగత్తునుండి విరమించిన పిదప హాలీవూడ్ నటి గ్రెటా గార్బోవలె ఆమె ఎవరి కళ్లకు కనబడక ఏ కొద్దిమందితో మాత్రమే సంబంధము నుంచుకొని రామకృష్ణ ఆశ్రమపు కార్యక్రమాలలో కాలము గడిపినది. బంగభూషణ్ బహుమతిని ఆమె తరఫున ఆమె కుమార్తె మూన్ మూన్ అందుకొన్నది.  ఢిల్లీలో బహుమతిని అందుకొనవలసి వస్తుందని భారత చిత్ర జగత్తులో అతి ప్రశస్తమయిన దాదాసాహేబ్ ఫాల్కే బహుమతిని కూడ నిరాకరించినదట.

 

ఆంగ్లేయ చిత్ర విమర్శకుడు Derek Malcolm అంటాడు – ” ఆమె నిజంగా చాల అందగత్తె, ఆమెలో ఒక స్థిర చిత్రములాటి భంగిమ ఉన్నది, ఆమె ఎక్కువగా నటించ నక్కర లేదు.”  సుచిత్రా సేన్‌ను ఒక గొప్ప “మహానాయిక”గా అందరు ఎందుకు పరిగణిస్తున్నారు?  దీనికి గల కొన్ని కారణములను మనము తెలిసికోవాలి.  ఆమె సౌందర్యవతి, అందులో సందేహము ఏమీ లేదు.  కానీ చలన చిత్ర నాయికలు చాల మంది అందగత్తెలే, కుందనపు బొమ్మలే. అందమొక్కటే చాలదు, నటనాకౌశల్యము కూడ కావాలి.  ఆ నటన సంభాషణలను హావభావములతో వల్లించుట మాత్రమే కాదు.  ఒక చూపుతో, ఒక శిరఃకంపనముతో, ఒక సైగతో, ఒక నిట్టూర్పుతో, ఒక చిన్న పెదవి విరుపుతో గుండె లోతులలో ఉండే అనుభూతులను బయటికి తేవాలి. రచయిత కల్పించిన పాత్రలో మమైకము కావాలి. దర్శకుని భావాలను అర్థము చేసికొని వాటికి తన ముఖమునే అద్దముగా పెట్టాలి.  సుచిత్ర గ్లిసరిన్ వాడదని చెబుతారు.  సెట్టుపైన వెళ్లినప్పుడు కన్నీళ్లు తనంతట వచ్చేవట.

ఆమెకు ఆత్మవిశ్వాసము ఎక్కువ.  అందుకే నాయకుల ఆధిక్యత ఉండే చిత్రరంగములో తన పేరును నాయకునికి సమానముగా ప్రదర్శించమని దర్శకులను, నిర్మాతలను అడిగి వారిని ఒప్పించినది.  అందుకే చిత్రములలో సుచిత్రా సేన్, ఉత్తం కుమార్ అని నాయకీనాయకుల పేరులను చూపేవారు, ఉత్తం కుమార్, సుచిత్రా సేన్‌లని కాదు. సత్యజిత్ రాయ్ ఆమెను తాను తీయాలనుకొన్న ఛౌధురాణి చిత్రములో నాయికగా ఎన్నుకొన్నాడు. కాని రాయ్ తన చిత్రములోతప్ప మిగిలిన వాటిలో ఆ చిత్రము పూర్తి అయ్యేవరకు నటించరాదన్నాడట. మిగిలిన దర్శకనిర్మాతల చిత్ర నిర్మాణమునకు అది అడ్డవుతుంది కనుక అందుకు సుచిత్ర ఒప్పుకోలేదు. ఒక వేళ అలా సత్యజిత్ రాయ్ చిత్రములో ఆమె నటించి ఉంటే అది ఎలా ఉండి ఉంటుందో అన్నది ఇప్పుడు ఊహాతీతమయినది. రాజ కపూర్ చిత్రములో నటించడానికి కూడ ఆమె నిరాకరించినదట.

Suchitra-sen6-400-x-300

ఆమె నటించిన కొన్ని చిత్రములను సంక్షిప్తముగా పరిశిలిస్తే ఆమెను ఎందుకు గొప్ప నటి అంటారో మనకు తెలుస్తుంది,  కథా పాత్రల వైవిధ్యమును మనము అర్థము చేసికొనవచ్చును. ఇందులో ఎన్నో చలన చిత్రాలు యూట్యూబులో చూచి ఆనందించవచ్చును.

 

అగ్నిపరీక్ష (1954) – మాంగల్యబలం తెలుగు చిత్రము చూసిన వారికి ఈ కథ విదితమే. చిన్నప్పుడు బొమ్మల పెళ్లిలా జరిగినదానిని తండ్రి నిరాకరించాడు.  పెద్దైన తరువాత ఒక యువకుడిని చూసి ప్రేమించింది తపసి.  అతనిని పెండ్లాడుట సరియా కాదా అనే సందిగ్ధములో నున్నప్పుడు, ఆమె నాన్నమ్మ ఆమెకు సీతలా నీవు కూడ నీ అగ్ని పరీక్షలో కృతార్థురాలవుతావు అని చెప్పింది. చిన్నప్పటి గ్రామానికి వెళ్లగా అక్కడ తన ప్రేమికుడినే చూసింది.

 

దేవదాస్ (1955) – దేవదాసు కథ అందరికీ తెలిసినదే. ఇందులో పార్వతి పాత్రకు జీవం పోసింది సుచిత్ర. ఆ పాత్రలోని గాంభీర్యము, ఔన్నత్యము, ప్రేమ, ఆవేదన చక్కగా తన నటనలో  ప్రతిబింబము చేసినది. నాయకుడు దిలీప్ కుమార్‌తో సరిసమానముగా నటించి అతని ప్రశంసలు మాత్రమే కాక దర్శకుడు బిమల్ రాయ్‌చేత కూడ మన్ననలను అందుకొన్నది. ఉత్తమ నటిగా ఆమెకు బహుమతి దొరికినది.  చంద్రముఖిగా నటించిన వైజయంతిమాలకు ఉత్తమ సహాయనటిగా బహుమతి లభించినా, ఆమె తనకు కూడ ఉత్తమ నటి బహుమతి ఇవ్వలేదని తన బహుమతిని నిరాకరించినది.

 

రాజలక్ష్మి శ్రీకాంత (1958) – దీని కథ శరత్ వ్రాసిన శ్రీకాంత్ నవలలోని ఒక భాగము.  ఈ శ్రీకాంత్ నవల కొందరు శరత్ ఆత్మకథపైన ఆధారపడినదని చెబుతారు.  శ్రీకాంత్ నవలను నాలుగు భాగములుగా విడదీయవచ్చును.  శ్రీకాంత్ నవల అందులోని కథానాయకుడు తన జీవితములో ఎదుర్కొన్న నాలుగు స్త్రీలను గురించిన కథ.  వాళ్లు – అన్నదా, రాజలక్ష్మి, అభయ, కమలలత.  ఇందులో రాజలక్ష్మిని గురించిన ఉదంతము ఈ చిత్రము. శ్రీకాంత్ ఒక చోట నిలకడగా ఉండడు, ఒక విధముగా దేశదిమ్మరి. అలా ప్రయాణం చేసేటప్పుడు ప్యారిబాయి రూపములో తన చిన్ననాటి స్నేహితురాలైన రాజలక్ష్మిని మళ్లీ చూస్తాడు. వారి రాగద్వేషాలు ఈ చిత్రపు కథ.  ఇందులో రాజలక్ష్మి తపన, ఆసక్తి, ప్రేమానురాగలను సుచిత్ర చాల చక్కగా తన నటనలో చూపినది.

 

దీప్ జ్వేలే జాయ్ (1959) – ఈ చిత్రము తెలుగులో చివరకు మిగిలేది, హిందీలో ఖామోషీ అనే పేరుతో విడుదల అయినది. మానసిక రోగముతో బాధపడే ఒక వ్యక్తిని కాపాడబోయి అతనికి ప్రేమికురాలుగా నటించి నిజముగా ప్రేమలో పడినది ఒక నర్సు.  అతడు చికిత్స పొంది వెళ్లిపోయిన తరువాత అలాగే ఇంకొక రోగితో నటించినప్పుడు మళ్లీ ప్రేమలో పడి తాను కూడ చిత్త భ్రమను పొందుతుంది.  ఖామోషిలో నటించిన వహీదా తన నటన సుచిత్రా సేన్ నటనకు సరి తూగదని తానే చెప్పినదంటే సుచిత్ర ఎంత గొప్పగా నటించినదో ఈ చిత్రములో!

 

ఉత్తర్ ఫల్గుని (1963), మమతా (1966) – ప్రేమికుడు విదేశాలకు వెళ్లగా, పరిస్థితులవల్ల తండ్రి మరొకనితో పెళ్లి జరుపుతాడు. ఆ భర్త త్రాగుబోతు, తన భార్యనే అమ్మడానికి సందేహించడు, వాడిని వదలి పారిపోయి పన్నాబాయిగా మారుతుంది. తన కూతురిని ఒక క్రైస్తవ మొనాస్టరీలో వదలి వెల్లిపోతుంది. విదేశాలకు వెళ్లిన ప్రేమికుడు ఆమెను ఒక రోజు చూస్తాడు.  ఆమెను తన యింటికి పిలిపించుకొని పాట పాడిస్తాడు, కాని తన ముఖము చూపడు. పారితోషికాన్ని అతని కార్యదర్శి ఇవ్వబోగా ముఖముచూపని వారిచే పారితోషికము గ్రహించనని చెప్పుతుంది. తరువాత అతడే ఆమె కూతురు సుపర్ణ బాధ్యతలు వహించి ఆమెను విదేశాలకు పంపుతాడు. ఆమె కూడ బారిస్టరుగా తిరిగి వస్తుంది. తన మాజీ త్రాగుబోతు భర్త బ్ల్యాక్మెయిల్ చేస్తుంటాడు, అప్పుడు తన కూతురి భవిష్యత్తు పాడవ కూడదని వాడిని హత్య చేస్తుంది. ఆమెను తప్పించడానికి ఆమె ప్రేమికుడే వాదిస్తాడు, అప్పుడు ఆమె కూతురు ఆమె అపరాధి ఆమె శిక్షార్హురాలు అని చెప్పగా, అతడు ముద్దాయి ఎవరోకాదు, సుపర్ణ తల్లి అని చెబుతాడు.  తల్లిగా, కూతురిగా రెండు పాత్రలను సుచిత్ర ఈ చిత్రములో పోషించింది. తల్లి పాత్రలోని ఆవేదన, కూతురి పాత్రలోని చలాకీదనము రెంటిని బింబప్రతిబింబాలుగా ప్రదర్శించింది ఇందులో.

 

ఉత్తమ్ కుమార్ తో సుచిత్ర

ఉత్తమ్ కుమార్ తో సుచిత్ర

సాత్‌పాకే బంధా (1963)  (హిందీలో కోరా కాగజ్) – పెళ్లి అనేది ఏడడుగుల బంధమే కదా? దానినిగురించిన కథ ఇది.  తండ్రి ఒక విద్యాధికారి, తల్లి మామూలు మనిషి, కూతురు అర్చనకు ఒక కళాశాల ప్రాధ్యాపకుడు సుఖేందుతో ప్రేమ. తండ్రి ఒప్పుకొంటాడు, తల్లికి ఇష్టము లేదు. పెళ్లి అవుతుంది. అర్చన తన భర్త సుఖేందును సంతృప్తిపరచడానికి ఎంతో కష్టపడుతుంది. కాని సుఖేందుకు భార్యను అర్థము చేసికోలేక పోయాడు.  వాళ్లిద్దరి మధ్య దూరము పెరుగుతుంది. తల్లి తన కూతురు ఒక పేద అధ్యాపకునితో కష్టపడుతుందని తాను వాళ్లిద్దరి మధ్య జోక్యము కలుగజేసికొంటుంది. చివరకు ఇద్దరు ఒకరినొకరు ఇంకా ప్రేమించుకొంటున్నా కూడ విడాకులు తీసికొంటారు. ఐనా సుఖేందు రాకకోసం అర్చన ఎదురుచూస్తూనే ఉంటుంది.

 

ఆంధీ (1975) – సుచిత్రా సేన్ ఆఖరి చిత్రాలలో ఇదొకటి. ఇందులో ఆమె పాత్రకు, ఇందిరా గాంధీ జీవితానికి లంకె ఉన్నదని ఒక ప్రచారము ఉండేది. ఇందులో ఆమె వస్త్రాలంకారము, కేశాలంకారము మున్నగునవి కూడ దీనిని బలపరిచింది. ఇరవై వారాల తరువాత ఈ చిత్ర ప్రదర్శనను ఆపారు. అవి ఎమర్జెన్సీ రోజులు, ఈ తరము వారికి ఆ విషయాలు తెలియవు. కొద్దిగా సందేహము కలిగినా ఇలాటివి సర్వసామాన్యము ఆ కాలములో. కిశోర్ కుమార్ కాంగ్రెస్ మహాసభలో పాడడానికి నిరాకరించాడని అతని పాటల ప్రసారమునే ఆకాశవాణిలో ఆపిన దినాలు అవి!  తనకు  ఆదర్శవంతురాలైన నాయకురాలు ఇందిరా గాంధి అని సుచిత్ర పాత్ర ఇందిరా గాంధి చిత్రపటము ముందు చెప్పిన మాటలను చిత్రముతో జత చేసిన తరువాత మళ్లీ చిత్రాన్ని విడుదల చేయుటకు అనుమతించారు. తన తండ్రిచే ప్రోత్సహించబడి రాజకీయాలలో చేరి ఎన్నికలలో పోటి చేస్తున్న ఒక రాజకీయవాదిగా సుచిత్ర ఇందులో నటించినది. విడాకులు పొందిన భర్తను మళ్లీ కలిసినప్పుడు పాత జ్ఞాపకాలు ప్రేమ మళ్లీ చిగిరింది. ఇందులోని ఆరతీదేవి పాత్ర నెరసిన వెండ్రుకలు, ఆమె కట్టుకొన్న చీరలు ఇందిరా గాంధీకి సరిపోయేటట్లు ఉండడము ఒక విశేషము.

 

ఆమె నటించిన చిత్రములలో నాకు నచ్చిన రెండు పాటలను మీకు జ్ఞాపకము చేస్తున్నాను –

 

(1) అగ్నిపరీక్ష చిత్రములోని కే తుమి ఆమారే డాకో అనే పాట ( – http://www.youtube.com/watch?v=xR6OllPrZ_U&list=PLE0072797BFB1F116 ). మాంగల్యబలములోలోని పెనుచీకటాయె లోకం పాట ఈపాటపై ఆధార పడినదే.

 

(2) మమత చిత్రములోని ఛుపాలో దిల్ మే యూఁ ప్యార్ మేరా (  http://www.youtube.com/watch?v=lZCHYFkED5M ). ఈ పాట పారసీక ఛందస్సు ముతకారిబ్ ముసమ్మన్ ముజాఫ్ మక్బూజ్ అస్లం ముజాయిఫ్ పైన ఆధారపడినది.  దీనిని గురించి అంతర్జాల పత్రికయైన మాలికలో నేను చర్చించియున్నాను.

 

ఒక తార భూమిపైన అస్తమయమై ఆకాశములో ఉదయించింది.  మరో ప్రపంచము అనేది ఉంటే అక్కడ దివంగతుడైన ఉత్తం కుమార్‌తో మళ్లీ నటించడానికి నాందీవాక్యమును సుచిత్రా సేన్ పలుకవచ్చును.

– జెజ్జాల కృష్ణ మోహన రావు

222121_10150170989267886_3694186_n

వేదనలోంచి ఒక వేకువ నాదం: అమిరి బరాకా!

barakaweb1-master675

 

ఏప్రిల్ 16, 2009. మా యింటి దగ్గరి లాబిరింథ్ బుక్స్ నుండి ఈ-మేల్ వచ్చింది. తెరిచి చూడగానే  నా కళ్ళు మెరిసాయి. వావ్ అనుకున్నాను. అమిరి బరాకా తో సమావేశం. ఆ రోజు సాయంత్రమే! యెంత గొప్ప అవకాశం. యెన్నాళ్ళకు చూడబోతున్నాను బరాకా ను!

కొన్ని దశాబ్దాలుగా అమెరికన్ సమాజాన్ని, సాహిత్యాన్ని అత్యంత ప్రభావితం చేసిన గొప్ప కవీ, విప్లవకారుడూ బరాకా ను కలిసే  అవకాశం కలుగుతోంది. అమిరి బరాకా అమెరికన్ సమాజాన్ని, సాహిత్యాన్నే కాదు ప్రపంచవ్యాప్తంగా సాహిత్యం పై ప్రభావం చాలానే నెరపారు. ఒక రెండేళ్ళ కింద నిఖిలేశ్వర్ ఇక్కడికి వచ్చినప్పుడు ‘ప్రాణహిత’ సాహిత్య పత్రికకు ముఖాముఖి సందర్భంగా చాలా సేపు మాట్లాడుకున్నాం. దిగంబర కవుల పై అలెన్ గింస్ బర్గ్ ప్రభావం గురించి అడిగినప్పుడు ‘ నిజానిక్ గింస్ బర్గ్ కంటే మాపై అమిరి బరాకా ప్రభావం యెక్కువ వుంది’ అన్నారాయన. అంతకు ముందు వినడమే కానీ అమిరి బరాకా గురించి యెక్కువ చదవలేదు.

నిఖిల్ చెప్పాక  అమిరి బరాకా కవిత్వాన్ని జీవితాన్ని చదివి,  యితన్ని యిన్ని రోజులూ యెందుకు కనుక్కోలేదా అని ఆశ్చర్యపోయాను. అట్లా లాబిరింథ్ కు అమిరి బరాకా వస్తున్నాదని తెలియగానే ఎగిరి గంతేసి బయలుదేరా. దాదాపు ఒక 100 మంది దాకా వచ్చారా సమావేశానికి అమెరికా లో అది చాలా పెద్ద సంఖ్యే! అదీ గురువారం సాయంత్రం. సభను ప్రారంభిస్తూ నిర్వాహకులు బరాకాను మాట్లాడమని ఆహ్వానించారు. మాలో ఒకరుగా కూర్చున్న బరాకా (అప్పటి దాకా నేను గమనించనే లేదు) లేచి వెళ్ళి మాట్లాడడం మొదలు పెట్టారు.

సాధారణంగా నల్ల వాళ్ళు ఒడ్డూ , పొడుగూ పెద్దగా ఉండి భారీ శరీరాలతో, కొంత ప్రత్యేకంగా వుంటారు. కానీ ఈయన చూస్తే చిన్న శరీరంతో, వయసుతో కొంచెం వంగిన శరీరంతో చాలా సాదా సీదాగా ఉన్నారు. కొన్ని దశాబ్దాల అలుపు లేని పోరాటం, ఉద్యమాలూ, అకుంఠిత దీక్షా, అసమాన సమాజం పట్ల ఆయన ఆగ్రహమూ – అనీ ఆయన ముఖ వర్ఛస్సు లో స్పష్టంగా కనబడుతున్నాయి. చాలా మామూలుగా మొదలైన ప్రసంగం మెల్ల మెల్లగా ఒక ప్రవాహంగా మారి అలుపెరుగని ఆవేశపు మాటల జలపాతమై ఒక గంట సేపు సభికుల ని తీవ్ర ఉద్విగ్నతకు గురి చేసింది.

ప్రస్తుత సమాజమూ, సాహిత్యమూ, ప్రపంచవ్యాప్తంగా 9/11 తర్వాత పరిస్థితులూ, పోరాటాలూ, సామ్రాజ్యవాదమూ, వీటన్నింటి నేపథ్యం లో మార్క్సిజం ప్రాసంగికత (అంతకు ముందు సంవత్సరమే ప్రపంచాన్ని సామ్రాజ్యవాద ఆర్థిక సంక్షోభం తీవ్రంగా కుదిపేసి కోట్లాది ప్రజానీకం జీవితాలని అతలాకుతలం చేసింది) – బరాకా ప్రసంగంలో  అనేక అంశాలని తడుముతూ చివరగా “ఈ సంక్షోభాలకూ, అసమానతలకూ, దుర్భరమైన దోపిడీ పీడనలకూ మార్క్సిజమే సరైన మార్గం” అంటూ ముగించారు. ఆయన మాట్లాడిన తర్వాత అనేక ప్రశ్నలు సభికులనుండి – ఆయన ప్రసంగం గురించీ , ఆయన 9/11 తర్వాత రాసిన పద్యం గురించీ – చాలా ఓపికగా సమధానాలు చెప్పాడు.

ప్రశ్నలన్నీ అయ్యాక నేనాయన దగ్గరికి వెళ్ళాను. ముందు నన్ను నేను పరిచయం చేసుకుని, మన తెలుగు సమాజం గురించీ, సాహిత్యం గురించీ, పోరాటాల గురించీ, కవిత్వం మీద ఆయన ప్రభావం గురించీ చెప్పాను. ఆయన ముఖంలో ఒక గొప్ప వెలుగు, కరచాలనం చేయడానికి చెయ్యి జాపాను. ఆయన ఆనందాన్ని ఉద్వేగాన్ని పట్టలేక నన్ను కౌగలించుకున్నారు. ‘ అద్భుతం. చాలా సంతోషం. ఈ విషయాలు వింటుంటే నాకు ఇంకో నూరేళ్ల జీవితం  జీవించాలనిపిస్తుంది’ అన్నారాయన. ఆయన పుస్తకం ‘బ్లూస్ పీపుల్ ‘ పైన  ‘ For Swami – Unite & Struggle’  అని రాసి సంతకం చేసి ఇచ్చారు. ‘మళ్ళీ కలవాలి మనం’ అనుకుంటూ వెళ్ళిపోయారాయన.

కార్పోరేట్ పని గంటల చక్రాల్లో నిరంతరం నలిగిపోయే అమెరికా జీవితం లో ఆయన్ని మళ్ళీ కలవడం కుదరలేదు. యిప్పుడు కలుద్దామనుకున్నా ఆయన లేరు. జనవరి 9 న ఆయన కనుమూసారు. ఈ మధ్య కాలంలో ఒకటి రెండు సార్లు ఆయన ఆరోగ్యం బాగా లేదని విన్నాను. యిప్పుడనిపిస్తోంది ‘యెట్లా అయినా వీలు చేసుకుని ఒక్క సారి కలిసి వుంటే బాగుండేదని’. ఆయన్ని కలిసి, మాట్లాడి, కౌగలించుకున్న ఆ సాయంత్రమే పదే పదే గుర్తుకొచ్చి కళ్ళల్లో సన్నటి నీటి తెర. కోల్పోతే గానీ విలువ తెలిసిరానివి అనేకం జీవితంలో .

2ea12e92479c089aad5256bcd3207ccf

డిప్రెషన్ తరవాతి తరం

అమిరి బరాకా , 1930 ల తీవ్ర ఆర్థిక మాంద్యం కాలం లో (Great Depression) 1934 లో నూవార్క్ , న్యూ జెర్సీ లో ఎవెరెట్  లీ రాయి జోన్స్ గా ఒక దిగువ మధ్య తరగతి కుటుంబలో పుట్టారు.  నాన్న కోయెట్ లీ రాయి జోన్స్ పోస్టల్ కార్మికుడు, లిఫ్ట్ ఆపరేటర్ గా చిన్నా చితకా పనులు చేసి కుటుంబాన్ని పోషించేవాడు. అమ్మ ఆన్నా లోయిస్ ఒక సామాజిక కార్యకర్త. బాల్యం నూవార్క్ లో, బారింగర్ హై స్కూల్ లో చదువు తర్వాత రట్గర్స్ యూనివర్సిటీ లో స్కాలర్ షిప్ తో ప్రవేశం దొరికినా, అక్కడి సామాజిక, సాంస్కృతిక వివక్షల్ని చూసి వాషింగ్టన్ లోని హోవార్డ్ యూనివర్సిటీ లో చేరారు. అక్కడ తత్వ శాస్త్రం, మతం ప్రదాన అంశాలుగా ఉన్నత విద్యను ప్రారంభించినా,  పట్టా తీసుకోలేదు. తర్వాత న్యూ యార్క్ లోని కొలంబియా లో తిరిగి ఉన్నత విద్యను కొనసాగించినా అక్కడా పట్టా తీసుకోలేదు.

కమ్యూనిస్టు అనే నెపం తో

1954 లో అమెరికా వైమానిక దళం లో చేరిన బరాకాను  కమ్యూనిస్టు అనే నెపం తో కమాండింగ్ ఆఫీసర్ బహిష్కరించాడు. (అది అమెరికా లో కమ్యూనిస్టు వ్యతిరేక మెక్ – కార్థీ దుష్ట కాలం). US Airforce నుండి బహిష్కరించబడడమే బరాకా కు మంచిదైంది. తర్వాత ఆయన న్యూ యార్క్ గ్రీన్ విచ్ విలేజి కి మకాం మార్చారు. ఆ రోజుల్లో గ్రీన్ విచ్ విలేజి అమెరికాలో అత్యంత ప్రగతిశీలమైన ప్రాంతం. ఉన్న స్థితి  ని ధిక్కరించి, సామాజిక మార్పు కోరే సాహిత్యం, కళలూ, సామాజిక పోరాటాలూ అలలలుగా కెరటాలుగా వెల్లివిరిసిన ప్రాంతం. బరాకాకు అక్కడ బీట్ తరం కవులు, కళాకారులు , బ్లాక్ మౌంటేన్ కవులు, న్యూ యార్క్ స్కూల్ కవులు పరిచయమయ్యారు. జాజ్ సంగీతం పరిచయమైంది.

మార్పు కోరే సాహిత్యమూ, రాజకీయాలూ పరిచయమయ్యాయి. అంతే ఆయన ఇంక వెనక్కి తిరిగి చూసింది లేదు. హెట్టీ కోహెన్ తో పెళ్ళీ ఇద్దరు అమ్మాయిలూ … హెట్టీ తో కలిసి ఒక ప్రచురణశాల స్థాపించారు. బీట్ కవులు అలెన్ గింస్ బర్గ్ , జాక్ కెరాక్ ల రచనలు ప్రచురించారు. బీట్ కవులతో ‘యూగెన్’ అనే త్రైమాసిక పత్రిక ప్రారంభించారు. తానూ బీట్ కవుల్లో ఒకడై కవిత్వం రాసారు. ‘కల్చర్ ‘ (kulchur) అనే సాహిత్య, కళ ల పత్రికకు సంపాదకీయం వహించారు. అమెరికా చరిత్రలో మొట్టమొదటి సారి నల్లవారి సంగీతం గురించి, వేర్ల నుండి చరిత్రను వివరిస్తూ, అద్భుతమైన సామాజిక విశ్లేషణ తో బరాకా రాసిన ‘బ్లూస్ పీపుల్ : నీగ్రో మ్యూసిక్ ఇన్ అమెరికా’ అనే పుస్తకం అత్యంత విలువైనది. అది రాసేటప్పటికి ఆయన ఇంకా లీ రాయి జోన్స్ గానే అందరికీ తెలుసు.

లీ రాయి జోన్స్ గా ఆయన రాసిన డచ్ మన్ అనే నాటకం గొప్ప నాటకంగా పేరు తెచ్చుకుంది. అమెరికా అంతటా సుప్రసిద్ధమైంది. న్యూ యార్క్  సబ్ వే లో ఒక తెల్లజాతి స్త్రీ , నల్ల జాతి పురుషుడి మధ్య  దూషణ లతో సాగే సంభాషణ ను,  సందర్భాన్ని, దచ్ మన్ లో  బరాకా అద్భుతంగా నాటకీకరించారు. శ్వేత జాత్యహంకార సమాజం బోను లో చిక్కుకు పోయిన ఆ ఇద్దరి పరిస్థితి ని బరాకా అద్భుతంగా సామాజిక కోణం లో విశ్లేషిస్తూ నాటకీకరించారు. , ఆ కాలంలో ఇతర నాటక రచయితలు ‘సహజవాదం’ తో రాస్తుంటే బరాకా సింబాలిజం వాడుతూ  తన నాటకంలో ఉద్వేగాన్ని పలికించడం కోసం అనేక ప్రయోగాల్ని చేసి తన కాలం కన్నా తాను ముందున్నానని నిరూపించారు.

1959-60 లో క్యూబా ప్రయాణం బరాకా జీవితంలో పెను మార్పు తీసికొచ్చింది. ఆయన సాహిత్య సామాజిక జీవితం లో అదొక మైలు రాయి. క్యూబా లో ఇతర దేశాల రచయితలతో, ముఖ్యంగా పేదరికానికీ, దోపిడీ పీడనల వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మూడవ ప్రపంచ దేశాల రచయితలతో ఆయన సమావేశమయ్యారు. ఆయా రచయితల రచనలు, వారి దేశాల్లో ఉన్న సామాజిక స్థితిగతులూ తెల్సుకున్నారు. అక్కడ పరిచయమైన జేమ్  షెల్లీ అనే మెక్సికన్ రచయిత బరాకా ను ఒక సూటి ప్రశ్న వేసారు ‘ నీ చుట్టూ సమాజం లో కోట్లాది మంది ప్రజలు ఆకలితో తిండి లేక మాడుతూ ఉంటే నీకు ఇంకా రాయడానిక్ వేరే వస్తువు కావాలా?’ – బరాకా తన సాహిత్యం గురించీ , కవిత్వం గురించీ పునరాలోచనలో పడ్డారు. అక్కడి నుండీ ఆయన మౌలిక దృక్పథం మారింది.

BARAKA

బ్లాక్ పాంథర్స్ ఉద్యమం

సామాజిక స్పృహా రాజకీయ దృక్పథమూ ఆయన సాహిత్యం లో ప్రదానమయ్యాయి. అప్పటిదాకా రూపం మీద విపరీతమైన శ్రద్ద పెట్టి శిల్పం లా చెక్కుతూ రాసిన బరాకా తన రాతలని ఎక్కుపెట్టిన రాజకీయ అస్త్రాల్ని చేసారు. డైనమైట్లు పేల్చారు. డచ్ మన్ నాటకంలో,  అమెరికా తెల్ల సమాజం పట్ల  పెరుగుతున్న తన అసంతృప్తినీ , అవిశ్వాసాన్నీ ప్రకటించిన బరాకా తన తర్వాత సాహిత్యంలో ఆ సమాజం పట్ల తిరుగుబాటు ప్రకటించారు. తనదైన ఒక కొత్త సమాజాన్ని కలలు కని దాన్ని నిర్మించేందుకు తాపత్రయపడ్డారు. అప్పుడు ఉధృతంగా జరుగుతున్న నల్ల జాతీయవాద ఉద్యమమూ, బ్లాక్ పాంథర్స్ ఉద్యమం తో ప్రభావితమై న్యూ యార్క్ లోని హార్లెం కు మకాం మార్చారు.

తనదైన అస్తిత్వం, సమాజ నిర్మాణం కోసం బరాకా,  క్రమేణా బ్లాక్ నేషనలిస్టు (నల్ల జాతీయవాద) ఉద్యమంలో భాగమయ్యారు. నల్ల జాతీయవాద సాహిత్య కళా సాస్కృతిక నిర్మాణం కోసం నడుం కట్టారు. అప్పటికే తీవ్రమైన బ్లాక్ పాంథర్స్ (నల్ల చిరుతల) ఉద్యమం తో మమేకమయ్యారు. మాల్కం ఎక్స్ తో సన్నిహిత సంబంధాలు యేర్పర్చుకున్నారు. నల్ల జాతీయుల ప్రదర్శనలో పాల్గొన్న బరాకాను FBI పోలీసులు తీవ్రంగా హింసించారు. దాదాపు చనిపోతారనే అనుకున్నారంతా! కానీ ఆ సంఘటన తర్వాత కోలుకున్న బరాకాలో పోరాట పటిమ ఇంకా తీవ్రమైంది. మరింత రాటుదేలారాయన.

1965 లో మాల్కం ఎక్స్ తో జరిపిన ఒక సుదీర్ఘ సంభాషణలో బరాకా తన కొత్త రాజకీయ సాహిత్య సాంస్కృతిక అస్తిత్వాన్ని కనుక్కొన్నారు. మాల్కం ఎక్స్ తో బరాకా తో  సమావేశం తర్వాత కొన్ని వారాలకే మాల్కం ఎక్స్ హత్య జరిగింది. మాల్కం అంతిమయాత్రలో ఒక ముస్లిం ప్రీస్ట్ లీ రాయి జోన్స్ కు అమిర్ బరకత్ అని పేరు పెట్టాడు. తర్వాత ఆ అరబ్ పేరును ఆఫ్రికనైజ్ చేసి స్వాహిలి భాషలో దాన్ని అమిరి బరాకా కా మార్చుకున్నారు. నల్ల జాతీయవాద సాహిత్య సాంస్కృతిక సైనికుడిగా మారిపోయారు. నల్ల జాతి కళలకు సాహిత్యానికి, సంస్కృతికీ ఒక కొత్త అస్తిత్వాన్ని , తమని బానిసలుగా మార్చిన అమెరికా శ్వేతజాతి సంకెళ్ళ నుండి బయటపడి ఒక నిజమైన ఆఫ్రికన్ నల్ల జాతి అస్తిత్వాన్ని, రాజకీయంగానూ, aesthetical గానూ, నిర్మించేందుకు ఉద్యమించారు.

బీట్ తరం కవుల నుండి తనని తాను వేరు పడేందుకు, నల్ల జాతీయత తన కొత్త అస్తిత్వంగా మలుచుకునేందుకు తీవ్రమైన కృషి చేసారు. బ్లాక్ ఆర్ట్స్ నేషనల్ మూవ్ మెంట్ కు నాయకత్వం వహించారు. కవిత్వమూ, నవలలూ, కథలూ, నాటకాలూ, సంగీత విమర్శా, ఇట్లా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసారు. ఒక సాహిత్య కారుడిగానే కాదు రాజకీయ సాంస్కృతిక ఉద్యమకారుడిగా బరాకా అలుపెరుగని పోరాటం చేసారు. ఈ క్రమంలో FBI బరాకా ను అమెరికా లో ఒక ఎదుగుతున్న నాయకుడిగా, నల్ల జాతి తీవ్ర శక్తిగా అంచనా వేసింది.

అయితే క్రమంగా బరాకా నల్ల జాతీయవాద ఉద్యమానికున్న పరిమితులని అర్థం చేసుకోవడం ప్రారంభించారు. కేవలం నల్ల జాతీయులే కాదు ప్రపంచవ్యాప్తంగా అశేషప్రజానీకం పేదరికంలో మగ్గిపోతూ దుర్భరమైన దోపిడీ పీడనలకు గురవుతున్నదని, వీటన్నింటికీ శ్వేతజాత్యహంకారం కన్న పెద్ద శత్రువేదో ప్రపంచ ప్రజలని వెంటాడి వేటాడుతున్నదని బరాకా గుర్తించారు. ఆ శత్రువు పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాదమనీ, దానికి విరుగుడు మార్క్సిజం లో ఉన్నదని గుర్తెరిగారు. 1970 ల నుండీ బరాకా కేవలం నల్ల జాతీయులతోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పీడిత ప్రజలతో తనను తాను గుర్తించుకున్నారు. మమేకమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ముఖ్యంగా మూడవ ప్రపంచ దేశాల్లో జరుగుతున్న పీడిత ప్రజల పోరాటాలతో identify అయ్యారు. సంఘీభావం ప్రకటించారు. సాహిత్యాన్ని సృష్టించారు. క్రియాశీలకంగా కూడా తనవంతు పాత్ర నిర్వహించారు. నూవర్క్ నగరంలోనూ , హార్లెం లోనూ, అమెరికా లోని ఇతర నగరాల లోనూ రాజకీయ ఉద్యమాల్లోనూ, హక్కుల ఉద్యమాల్లోనూ,  చివరి ఊపిరి దాకా క్రియాశీలమైన ప్రాత్ర నిర్వహించారు. మార్క్సిజం పట్ల, మూడవ ప్రపంచ దేశాల్లోని పీడిత ప్రజల పోరాటాల పట్లా తన మమేకతను చివరి ఊపిరి దాకా వీడలేదు..

న్యూ జెర్సీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్థాన కవి పదవిని యేర్పాటు చేసి, ఆయనను 2002 లో ఆస్థాన కవిగా నియమించింది. అయితే ఆయన 9/11 దాడుల మీద రాసిన ఒక పద్యం పెద్ద దుమారాన్ని సృష్టించింది. ‘యెవడొ అమెరికా ను పేల్చేసాడు’ అనే శీర్షిక తో ఆయన రాసిన పద్యం ఇలా సాగుతుంది:

 

యెవడో అమెరికాను పేల్చేసాడు

                   ఆఫ్ఘనిస్థాన్ లో యెవడొ అనాగరిక అరబ్
పేల్చేసాడు అన్నారు …

                       …..

                 యెవడు అందరికనా పెద్ద టెరరిస్టు

                యెవడు బైబిల్ ను మార్చాడు

                యెవడు అందరికన్నా యెక్కువమందిని హత్య చేసాడు

                యెవర్నీ పట్టించుకోకుండా తన స్వార్థం కోసం
యెవడు అందరికన్నా దుర్మార్గాలు చెయ్యగలడు

                యెవడికి సామంత రాజ్యాలున్నయి

                యెవడు ప్రపంచం లో అందరికన్నా
యెక్కువ భూమిని దొంగిలించాడు

                యెవడు ప్రపంచాన్ని క్రూరంగా పాలిస్తూ
అంతా మంచే  చేస్తున్నానంటూ పాపాలు మాత్రమే చేస్తాడు

                యెవడు యెవడు యెవడు
ఆ ముష్కరుడెవ్వడు…

 

అయితే ఈ పద్యం లో ఒక చోట ఆయన రాసిన వాక్యాలు ఇజ్రాయీల్ కు వ్యతిరేకంగా ఉన్నాయంటూ ఆయనను ‘anti-semitist’ అని దూషించారు. న్యూ జెర్సీ ప్రభుత్వం ఆయన పదవిని రద్దు చేసింది. అయితే ఆయన తాను రాసిందాన్ని వెనక్కి తీసుకోలేదు. 9/11 అమెరికా దాడుల వెనక కుట్ర ఉన్నదని తాను అనుకుంటున్నాననే అన్నారు. తన మీద ఎన్ని అభాండాలు మోపినా, యెన్ని వివాదాల్లో ఇరికించినా, అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడంలో , పోరాడడంలో కించిత్తైనా రాజీ పడలేదు. తాను నమ్మిన పీడిత ప్రజల విముక్తినీ , అందుకు మార్గదర్శీ కరదీపికా ఐన మార్క్సిజాన్ని జీవితాంతమూ విడిచిపెట్టలేదు.

ఆయన్ని కలిసింది ఒక్క సారే అయినా, నాకు  ఒక జీవితకాలం జ్ఞాపకాన్ని మిగిల్చి వెళ్ళారు. తన వెచ్చని కరస్పర్శలో, ఆత్మీయ  ఆలింగనం లో తన జీవితాంతం పడ్డ తపననూ, ఆరాటాన్నీ అందించిపోయారాయన. అమెరికా కూ,  మొత్తంగా ప్రపంచ పీడిత ప్రజలకూ ఒక అపురూపమైన వేదనాభరితమైన సౌందర్య సంపద అమిరి బరాకా! జీవితాంతమూ, చివరి ఊపిరి దాకా  అవిశ్రాంతంగా పోరాడిన ఆయన కనుమూసాక మాత్రం,  ప్రశాంతంగా యెలా వుండగలరు? పీడిత ప్రజలకు నిజమైన విముక్తి కలిగి, అసమాన సమాజం అంతమయ్యేదాక ఆయనకు శాంతి కలుగుతుందనుకోను – జీవితంలోనైనా మృత్యువులోనైనా !

నారాయణ స్వామి వెంకట యోగి

నారాయణస్వామి వెంకట యోగి

ఎదురెదురుగా…

పూర్ణిమా సిరి

పూర్ణిమా సిరి

ఒకే దారిలో నడుస్తున్నాం
ఒకరికొకరం తారసపడాలంటే
ఎదురెదురుగా నడవాల్సిందే
ఎవరికి వారు ముందుకు సాగిపోవాల్సిందే..
కనపడిన దారిలోనే
కనుమరుగు కాకూడదనుకుంటే
ఒకే వైపుకు నడవాల్సిందే
దగ్గరి దూరాలనూ చవి చూడాల్సిందే
dc1d71e1661ed1922996aa8f5d364479
ఎప్పటికప్పుడు  పలకరించుకుంటూనే
పరిచయాలని పదిలపరుచుకుంటూ
అడుగుల్లో దూరాలను
లెక్కల్లో జీవితాలను
సరిచూసుకుంటూ
ఒకే రేఖకి రెండు చివర్లలా మిగిలిపోవాల్సిందే
ఎంతోకొంత దూరం వచ్చాక
మనం చేయగల్గిందల్లా ఒక్కటే
అపరిచితుల్లా విడిపోవడమో
ఆనందక్షణాలుగా మిగిలిపోవటమో
ఎదురెదురుగా కదలటమో
ఎటు కదిలినా యదలో నిలవటమో..
– పూర్ణిమా సిరి

కల


కల గనడం అధ్బుత ప్రక్రియే

పుల్లా పుడకలతో పక్షి గూడల్లినట్టు-

అలల మీద వెలుగు నురగ తేలిపోతున్నట్టు-


నిదురంటని సుదీర్ఘ రాత్రుల ఘర్షణలో

పొడుచుకొచ్చే వేగుచుక్క కల


పాదాలరిగిన ప్రయాణంలో

అలుపు సొలుపుల పోరాట పటిమలో

కల  పరిఢవిల్లుతది


కల ఎవరి సొంతమూ కాదు

పేటేంట్ హక్కుల్లేనిది


ఒకరి కలలోకి ఒకరం

నిరాటంకంగా దూరిపోవచ్చు

కలల కాపురంలో ఓలలాడవచ్చు


ఏమీ లేకున్నా

కలా స్పృహతో వున్నావనుకో

నీ రుజాగ్రస్త శరీరం

కలా కాంతులీనుతది


కలకు పునర్జన్మ లుంటయి

ఆరాటపడే ఆఖరిశ్వాస నుండి

పురిటి శ్వాస పీల్చుకుంటది


ఏ పూర్వీకుని కలో

నీలో నాలో  మనలో

మొగిలిపువ్వై విచ్చుకుంటది


కల గనడం ఈవలి ఒడ్డు

కల నెరవేరడం ఆవలి ఒడ్డు


రెండు ఒడ్డుల మధ్య

మనిషి జీవన పయనమొక

పవిత్ర యుద్దం…



—దాసరాజు రామారావు

దళిత అస్తిత్వ పతాక నామ్ దేవ్ ధాసల్!

 art-culture-dalit-poet-namdeo-dhasal-dead.jpg itok=MkqHycCs

1970 ల్లో మరాఠీ సాహిత్యాన్ని, మొత్తం భారతీయ సాహిత్య రంగాన్నే  తీవ్ర సంచలనానికి గురిచేసి ఒక్క కుదుపు కుదిపిన ప్రముఖ కవి నామ్ దేవ్ ధాసల్ కనుమూసారు. ఆంగ్లం, జర్మన్ , ఫ్రెంచ్ , ఇటాలియన్ తదితర భాషల్లోకి అనువదింపబడి దళిత అస్తిత్వానికీ , పోరాటాలకూ ప్రతీకకగా నిలిచిన నామ్ దేవ్ ధాసల్ కవిత్వం చాలా పదునైనది. తీవ్రమైన భావవేశంతో, పదజాలంతో, అప్పటి దాకా తన మాటను, ఆలోచననూ, మొత్తంగా మరాఠీ సాహిత్యాన్ని నియంత్రించిన బ్రాహ్మణ మను వాద భావజాలాన్ని, భాషనూ తుత్తునియలు చేసి కొత్త భాష, కొత్త డిక్షన్ , కొత్త ఆలొచనల పద సామగ్రి కనుక్కొన్నారు ధాసల్ .

అమెరికా లో బ్లాక్ పాంథర్స్ ఉద్యమం ప్రేరణతో,  మహరాష్ట్రలో 1972 లో  దళిత పులుల ఉద్యమాన్ని   (dalit panthers movement)       ప్రారంభించి, ప్రదాన పాత్ర వహించారు. దళిత పులుల ఉద్యమం రాడికల్ రాజకీయాలని కార్యాచరణనూ సమర్థించి ఆచరించింది. 1973 లో గొల్పిత కవితా సంకలనం తో మరాఠీ సాహిత్యరంగం లో  ఒక కెరటమై విరుచుకుపడి , పెను ప్రభంజనమై వీచారు. ఆయన రాసిన ఒక్కో పద్యం ఒక్కో డైనమైటై పేలింది. బ్రాహ్మణ వాద, మను వాద సంప్రదాయాల్ని, సంకెళ్ళనీ , కట్టుబాట్లనీ ధిక్కరించి దళితుల విముక్తి కోసం తన ప్రతి పద్యాన్ని అతి తీవ్రమైన పదజాలంతో, ఆగ్రహ భావావేశాల్తో ఆయుధాల్లా సంధించారు నామ్ దేవ్ ధాసల్. బొంబాయి నగరం లోని అట్టడుగు ప్రజానీకం కోసం నామ్ దేవ్ ధాసల్ తన కవిత్వాన్నీ రాజకీయ కార్యాచరణనూ అంకితం చేసారు.

కామాటిపురా రెడ్ లైట్ ఏరియా లోని వేశ్యల హక్కుల కోసం, జీవితం తమని శపిస్తే రోడ్డు పక్క ఫుట్ పాత్ లపై, రైల్వే స్టేషన్ లలో, చింపేసిన విస్తరాకుల్లా, ఆకలీ, పేదరికమూ, మాదక పదార్థాలకు అలవాటు పడిన బాల్యాన్ని అక్కున చేర్చుకున్నారు.  నోరు లేని వారికి నోరిచ్చారు. ఆత్మలు అణచివేయబడి దోచుకోబడ్డ వారికి తన కవిత్వంతో ధిక్కార ఆత్మలనిచ్చారు. మరాఠీ మధ్యతరగతి వెసులుబాటు సుఖలాలసతకు, భద్రలోక జీవితపు విలువలకూ, అభిప్రాయాలకూ పెద్ద షాక్ ట్రీట్ మెంటు ఇచ్చారు నామ్ దేవ్ . మావోయిస్టు భావాలతోనూ కవిత్వం రాసారు. తన కవిత్వంతో దళిత సాహిత్యం లో వినూత్న సంతకం చేసారు. అనేక కవితా సంకలనాలను ప్రచురించారు ఆయన కవిత్వం ఆంగ్లం లో “Poet of the Underworld” అనే పేరు తో ప్రచురితమైంది.

అయితే దళిత పులుల ఉద్యమం యెక్కువ రోజులు కొనసాగలేకపోయింది.. 1980 ల కల్లా దళిత పులుల ఉద్యమంలో పగుళ్ళు ప్రారంభమైనయి. నామ్ దేవ్ దళిత ఉద్యమాన్ని ఇంకా విశాలం చేసి పీడిత ప్రజలందరినీ  అందులో భాగస్వామ్యం చేయాలని ఆశించాడు. తన రాజకీయ కార్యాచరణ అట్లా ప్రకటించాడు కానీ అది మిగతా వారికి నచ్చలేదు. తమ ఉద్యమం కేవలం దళితులకే పరిమితం చేయాలి అని పట్టు బట్టారు. రాజకీయంగా చైతన్యమై విప్లవాత్మక ధిక్కారం ప్రకటించిన దళితులని మనువాద బ్రాహ్మణవాద పార్టీలు అనేక ప్రలోభాలకు లోను చేసినయి. ఒక తాత్విక, రాజకీయ యేక సూత్రత లేని దళిత పులుల ఉద్యమకారులు రాజకీయ పార్టీల అనేక కుట్రలకు బలై పోయారు. చెట్టుకొకరూ పుట్ట కొకరూ అయి పోయారు. నామ్ దేవ్ క్రమంగా మద్యానికి అలవాటు పడ్డాడు.  ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. 1990 ల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ నామ్ దేవ్ కరుడు గట్టిన మనువాద బ్రాహ్మణ వాద పార్టే శివసేన లో చేరాడు. అందులోనూ ఇమడలేదు. అయితే యెప్పటికప్పుడు తన రాజకీయ తప్పిదాలను , మెరుపుల్లాంటి తన కవిత్వంతో , పిడుగుల్లాంటి తన రాతలతో మరిపించే వాడు. క్రమంగా అనారోగ్యం బారిన పడ్డాడు. 2007 లో చికిత్సకైన ఖర్చు భరించడానికి ఇల్లు అమ్మబోతే సినీ నటులు అమితాబ్ బచ్చన్ సల్మాన్ ఖాన్ నిధులు సమకూర్చి నామ్ దేవ్ కు సాయపడ్డారు. . చివరి రోజుల్లో కాన్సర్ తొ బాధ పడుతూ ఆసుపత్రిలో కనుమూసారు.

రాజకీయంగా కొన్ని తప్పిదాలుగా చేసినా నామ్ దేవ్ సాహిత్యంలో చేసిన కృషీ , సాధించిన విజయాలూ అసమానమైనవి.  కరుడు గట్టిన బ్రాహ్మణవాద మనువాద చాందస భావజాలాన్ని, దుర్మార్గాలని , సంకెళ్ళని సవాలు చేస్తూ ధికరిస్తూ అవి చిరకాలం నిలిచే ఉంటాయి. దళితుల విముక్తి కోసం నిరంతరం కలలు గని దళిత అస్తిత్వం కొరకు పోరాడిన గొప్ప విప్లవకవి నామ్ దేవ్  చిరస్మరణీయుడు!  శ్రీ శ్రీ గురించి కాళోజీ  “నువు రాసి పారేసిన కవితలు గుబాళిస్తుంటే నువు తాగి పారేసిన సారా సీసాల కంపు మాకెందుకు” అని అన్నారు. అది ఈ రోజు నామ్ దేవ్ ధాసల్ కి సరిగ్గా సరిపోతుంది.

nanded

పంజరమంత బలంగా యేమీ లేదు.

పంజరం లో పిట్ట ఆశ కోల్పోయి

ఆలోచనల్లో మునిగిపోయింది.

బయట గుంపులోంచి ఒక పావురం

పంజరంలోని పిట్టతో అందిలా ..

మేము నిన్ను తప్పక చెర విడిపిస్తాం.
విధిలిఖితం అని చింతించకు
యెన్నడైనా విధి బందీ ఐన   వారిని విడిపించిందా?

సిద్దంగా ఉండు –
నీ రెక్కలకు తుప్పు పట్టనీయకు
రేపు అనంతాకాశంలో అంతెత్తున రివ్వున యెగరాలి నువ్వు!

 


—————————

ఆట

 

చూసాను అతన్ని

యెన్నో సార్లు తిరస్కరించాను

ఊరూరా తిరిగే నా శవం

ఈ సాయంత్రం వెలుగులో నిశ్చలంగా ఎదిరిచూస్తోంది

 

యెవడో తాగుబోతు దేవునికి ఫోన్ చేస్తున్నాడు

కుళ్ళి కృశించే జాలీ సానుభూతీ చూపకు నాపైన

బహుశా మన సంబంధం ముగిసిపోయిందేమో

బుజాల్ని విదిలించేయి దాన్ని వదిలించుకో

అట్లైనా, 
ఈ నీళ్ళని
గొడ్డలి తో నరకగలుగుతావేమో!

 —————————

కామాటి పురా

ఒక నిశాచర ముళ్ళపంది విశ్రమిస్తోందిక్కడ

ప్రలోభపెట్టే  బూడిద పుష్పగుచ్చం లా!

వంటినిండా శతాబ్దాల సిఫిలిస్ పొక్కులతో …
తన కలల్లో తానే కోల్పోయి
కాలాన్ని క్రూరంగా తరిమేస్తుంది.
మనిషి నోటి మాట పడిపోయింది.

తన దేవుడు బేదులు పెట్టిన అస్తిపంజరం.

ఈ శూన్యానికో గొంతు దొరుకుతుందా ,
ఒక మాటవుతుందా ఎప్పుడైనా?

నీక్కావాలనిపిస్తే దానిమీద ఒక ఇనుప కన్ను వేసి చూడు
దానిలో కన్నీటి చుక్క ఉంటే దాన్ని గడ్డకట్టించు!  కాపాడు!!

దాని చూపులు నిన్ను సమ్మోహనం చేసి
పిచ్చి ఉన్మాదం లోకి నెట్టేస్తాయి

ముళ్ళపంది హఠాత్తుగా నిద్రలేచి

నిన్ను యెక్కుపెట్టిన పదునైన ముళ్ళతో వెంటాడి
వొళ్ళంతా తూట్లు పొడిచి గాయపరుస్తుంది.

రాత్రి తన పెళ్ళికొడుకు కోసం సిద్ధమవుతూంటే

గాయాలు పుష్పిస్తాయి

అనంత పుష్ప సముద్రాలు పొంగిపొర్లుతాయి

నెమళ్ళు నాట్యం చేస్తాయి
ఇది నరకం

ఇది సుళ్ళు తిరిగే భయంకర మృత్యుగుండం

ఇది వికారమైన వేదన

ఇది గజ్జెలు కట్టి నాట్యమాడే  నొప్పి.

 

నీ చర్మాన్ని వదిలేయి.

వేర్ల నుండీ నీ చర్మాన్ని వలిచేయి.

ఈ విషపూరితమైన శాశ్వత  గర్భాలు విచ్చిన్నం కానీ!

ఈ స్పర్శ కోల్పోయిన మాంసపు ముద్దకు  అంగాల్ని మొలకెత్తనీకు!!
ఇదిగో దీన్ని రుచి చూడు

పొటాస్సియమ్ సయనైడ్ !

నువ్వు మరణిస్తున్నప్పటు క్షణంలో
వెయ్యోవంతు లిప్తలో
పాతాళంలోకి కుంగిపొతున్న నీ ప్రాణపు రుచిని  రాయి!
రాండ్రి!

మృత్య్వుని రుచి చూడాలనుకున్న వాళ్ళంతా
విషపు రుచి ఉప్పనో పుల్లనో తెలుసుకోవడాని
ఇక్కడ క్యూ కట్టుండ్రి!

మృత్యువు  ఆవృతమౌతుందిక్కడ
కవిత్వపు పదాల్లాగే …..
కొంచెం సేపట్లో కుంభవృష్టి కుర్వబోతోంది!

ఓ కామాటిపురా!

అన్ని రుతువులని నీ చంకలో బంధించి

బురదలో

కూలబడి ఉంటావలా!

నా వ్యభిచారాల సుఖాల్నన్నింటినీ దాటి

యెదిరిచూస్తాను
ఈ బురదలో
నీ పద్మం వికసించడం కోసం!

నారాయణస్వామి వెంకట యోగి

–నారాయణ స్వామి వెంకట యోగి

కొలకలూరి విశ్రాంతమ్మ, భాగీరథి పురస్కారాలకు నవలలు, కథాసంపుటాల ఆహ్వానం

Awards Cover
కొలకలూరి విశ్రాంతమ్మ  పురస్కారం కోసం 2011-13 మధ్య ముద్రితమైన నవలల మూడేసి ప్రతులను ఈ నెల 20లోగా ఆశాజ్యోతి, బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగుళూరు-56 చిరునామాకు; కొలకలూరి భాగీరథీ పురస్కారంకోసం 2011-13 మధ్య ముద్రితమైన కథా సంపుటుల మూడేసి ప్రతులను ఈ నెల 20లోగా కొలకలూరి మధుజ్యోతి, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి-2 చిరునామాకు పంపించాలి. ఫిబ్రవరి 26 న  హైదరాబాద్‌లో పురస్కార ప్రదాన సభ జరుగుతుందని కొలకలూరి ఆశాజ్యోతి, మధుజ్యోతి తెలియచేసారు.  కొలకలూరి విశ్రాంతమ్మ , భాగీరథి పురస్కారాలను 2008 వ సంవత్సరం నుంచి అందచేస్తున్నారు. ఒకొక్క ఏడాది రెండేసి ప్రక్రియలను ఎంపిక చేస్తారు. ఈ ఏడాది కథ, నవల ప్రక్రియల కింద ఈ పురస్కారాలను అందచేస్తారు. గత సంవత్సరాల్లో నాటకం, కవిత్వం, విమర్శ, పరిశోధన ప్రక్రియల కింద పురస్కారాలు అందచేసారు.

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 7 వ భాగం

(గత వారం తరువాయి)

7

బయట వర్షం కురుస్తూనే ఉంది…ఎడతెగకుండా
రామం గబగబా వచ్చి ఎప్పట్నుండో బార్నెస్‌ అండ్‌ నోబుల్స్‌ బుక్స్‌లో ఎదురుచూస్తున్న క్యాథీ ఎదురుగా కూర్చుని.. ”ఎక్స్‌ట్రీమ్లీ సారీ…ఫర్‌ లేట్‌..”అని గొడుగును ప్రక్కన డస్ట్‌బిన్‌పైపెట్టి.. అమె ముఖంలోకి చూచి.,
”ఎగ్జిక్యూటివ్స్‌ ఎప్పుడూ సమయపాలన చేస్తారుగదా” అంది..అని ”ఎప్పుడో కాఫీ చెప్పా..అరగంటయింది. తెస్తానుండు” అని లేచి కాఫీ కౌంటర్‌వద్దకు నడిచిపోయింది.

క్యాథీని చూస్తే వర్తమాన తరంలో సాధారణ అమెరికన్‌ యువతులు చేసే వెర్రిమొర్రి లక్షణాలేవీ కన్పించవెప్పుడూ. రోజురోజూకూ ప్రపంచవ్యాప్తంగా వెర్రితలలు వేస్తున్న విషసంస్కృతికి కొనసాగింపుగా అమెరికన్‌ విద్యార్థుల్లో కూడా విచ్చలవిడితనం విపరీతంగా పెరిగిపోయింది. శరీరాన్ని గరిష్టంగా బహిరంగపర్చే వస్త్రధారణ…అసలు ఒంటిపై వస్త్రాలే లేనట్టు..బికినీకంటే కొద్డిగా మెరుగైన కురుచ నిక్కర్‌, పైన ఒక బ్రాను తలపించే అప్పర్‌.. మిగతా అంతా బహిరంగమే. ఎండాకాలమైతే మరీ నగ్నవిహారం. ఒంటిపై టట్టూలు శరీరంపై అక్కఅక్కడా  మెరిసే హాంగింగ్సు, ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన నఖ సౌందర్యం., ఐతే ఇదంతా విద్యావిషయంగా ఉండవలసినంత శ్రద్దలేని ఎక్కువమంది స్థానిక అమెరికన్లలో. మరీ హద్దులు మీరి నల్ల అమెరికన్‌ యువతలో, ఎందుకో వీళ్ళలో చదువుపట్ల సహజంగానే ఆసక్తి తక్కువ. పాఠశాలలోకూడా విద్యా విషయక అంశాలకంటే నాన్‌ కర్రికులర్‌ యాక్టివిటీస్‌…పెయింటింగు, ఫీల్డ్‌ విజిట్స్‌, లెర్నింగు త్రూ లైబ్రరీ, అర్ట్‌ అండ్‌ మ్యూజిక్‌, వాచ్‌ అండ్‌ లెర్న్‌ విధానాలే ఎక్కువ. ఎకడమిక్‌ పాఠ్యాంశాల సాంద్రత, లోతు తక్కువ. తను పరిశీలించినంతవరకు యిక్కడ తయారవుతున్న విద్యార్థుల్లో ఎనభైశాతం సగటుకన్నా తక్కువ ప్రమాణాలు, మిగతావాళ్ళలో ఐదు నుండి పదిశాతం నాణ్యమైన పిల్లలు కనిపిస్తున్నారు. వీళ్ళది స్లో అండ్‌ స్టడీ ప్రాసెస్‌. భారతదేశంలో క్విక్‌ అండ్‌ రన్‌ విధానం. అమెరికా జనాభాలో ఒక శాతం ఉన్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తుల్లో బాలలు యిక్కడి అనేక విద్యా విషయక రంగాల్లో ప్రతిభావంతులుగా రాణిస్తూండడం ఒక చిత్రమైన విశేషం…ఉదాహరణకు ప్రతి సంవత్సరం జాతీయస్థాయిలో యిక్కడ నలభైవేల డాలర్ల నగదు, జ్ఞాపికతో గౌరవిస్తూ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘నేషనల్‌ స్పెల్లింగు బీ అవార్డు’ పోటీల్లో గత పన్నెండేండ్ల కాలంలో ఎనిమిదిసార్లు భారతీయ బాలలే విజేతలు కావడం ఎంతో ప్రతిభావంతమైన సాధనగా అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది.
ఐతే భారతదేశంలో అనుకుంటున్నట్టు యిక్కడి సంస్కారవంతులైన యువతులెవ్వరూ అర్థనగ్న వస్త్రధారణ చేయరు. మోకాళ్ళదాకా స్కర్ట్‌, పైన బుష్‌షర్ట్‌పై ఓవర్‌కోట్‌..అలా చూడ్డానికి గంభీరంగా, గౌరవనీయంగా ఉండే పద్ధతిలోనే కనిపిస్తారు.
క్యాథీ తనకు మొట్టమొదట పరిచయమైననాటినుండి ఎప్పుడూ పరిపూర్ణమైన వస్త్రధారణతోనే కనిపించింది..అంటుంది… రామం పాత అమెరికా సినిమాలు చూడు గాడ్‌ ఫాదర్‌, గాన్‌ విత్‌ ద విండ్‌, సౌండాఫ్‌ మ్యూజిక్‌..అమెరికన్‌ స్త్రీ వేషభాషలు ఎంత ముచ్చగా ఉంటాయో..ఐ లైకిట్‌…అని.
నిజంగానే ప్రత్యేకమైన అభిరుచి, తత్వంగల స్త్రీ ఈమె. రెండు చేతుల్లో రెండు పొడవాటి కాఫీ కప్స్‌తో, రాపర్స్‌తో, నాప్‌కిన్స్‌తో సహా తీసుకుని వస్తూ,”ఏయ్‌” వై డోన్ట్‌ యు హెల్ప్‌ మీ..”అంది దగ్గరగా వస్తూ,
ఉలిక్కిపడ్డ రామం ”సారీ..”అంటూ ఆమె చేతిలోని సరంజామాను అందుకుంటూండగా,
”నువ్వు అబ్సెంట్‌మైండెడ్‌గా ఉన్నావెందుకో’ ఈరోజు” అందామె.
”ఔను క్యాథీ..ఐ లాస్ట్‌ మైసెల్ఫ్‌ టుడే..హైలీ డిస్టార్టెడ్‌..ఎందుకో నా గతం ప్రొద్దట్నుండీ నన్ను వెంటాడ్తోంది.
”అది తుపానుముందటి అలజడి…ఎ గేల్‌ బిఫోర్‌ ది హర్రికేన్‌”
”ఔననిపిస్తోంది నాక్కూడా”..ఎంత ఖచ్చింగా మనిషిని చదువుతుందీమె అనిపించింది రామంకు.
”అమృతం కురిసిన రాత్రి జ్ఞాపకముందా..”
”ఊఁ…తిలక్‌ కవిత్వంకదా..”
”ఔను..వెన్నెల్లో….”
‘వసుధైక గీతం’ లో అంటాడు,
‘భూమధ్యరేఖ నా గుండెలోంచి పోతోంది
భ్రుకుటి లోపల నక్షత్రగోళం తిరుగుతోంది
ఈ వేళ నన్నానవాలు పట్టలేవు నువ్వు
సూర్యుడుని చూడు నా తలమీద పువ్వు
అట్లాంటిక్‌ కల్లోల తరంగాల మేను వాల్చింది నేను
పసిఫిక్‌ లోతులలో రత్నాల్ని వెదికి తీసింది నేను
ఉత్తర ధృవాన ఒక పాదం దక్షిణ ధృవాన మరోపాదం
సర్వంసహా చక్రవర్తి పదవి సంపాదించుకున్నాను నేను-‘
”…వలె మన జీవితంలో కూడా ఎంతో ప్రధానమైందీ వర్షం కురుస్తున్న రాత్రి..జ్ఞాపకముందా..మనం మొట్టమొదట కలుసుకున్నది వర్షం కురుస్తున్న రాత్రే..మనం తర్వాత సన్నిహితంగా దగ్గరైన ప్రతి కలయికా వర్షం కురుస్తున్న సందర్భమే.. హైద్రాబాద్‌లో మన ‘రామం’ కంపెనీని ప్రారంభించిందీ ఎడతెగని వర్షం కురుస్తున్న రోజే..యిప్పుడు అత్యంత కీలకమైన మనిద్దరి జీవితాల దిశను నిర్ణయించుకుందామనుకుని సమావేశమైన ఈ రాత్రి..ఇప్పుడుకూడా వర్షం కురుస్తున్న రాత్రే.. ఐ లైక్‌ రెయి..చిన్నప్పుడు రైన్‌ రైన్‌ గో ఎవే అనే పాటను రైన్‌ రైన్‌ కంకం, డోన్ట్‌ గో ఎవే బట్‌ అల్వేస్‌ స్టే అని పాడేదాన్ని..”

8
”ఊఁ…”    నిజంగా రామంకు కూడా చాలా ఉద్వేగంగా ఉంది..ఈ రాత్రి తామిద్దరూ కలిసి తమ భవిష్యత్తును, సాధించవలసిన కఠోరమైన యాత్ర తాలూకు పథకాల రూపకల్పననూ పూర్తి చేయాల్సిఉంది. అందుకే గతవారంనుండి క్యాథీకి ఈనాటి ఈ కలయిక గురించి ప్రత్యేకంగా చెబుతూ వస్తున్నాడు. తను తన మనసులో ఉన్న ఆలోచనలన్నింటినీ క్యాథీ సమగ్రంగా చదివింది. నిజానికి తన గురించి తనకంటే ఎక్కువ క్యాథీకే తెలుసు. అందుకే ఒక అనుచరురాలిగా ప్రణాళికారచన బాధ్యతను ఆమెకే అప్పగించాడు.
ఐతే.. జరుగవలసిన చర్చకు…లోతుగా ఆలోచించి తీసుకొనవలసిన నిర్ణయాల తాలుకు తుది రూపమివ్వడానికి ఈ బార్నెస్‌ పుస్తకశాల వేదిక  కాదు..కలుసుకోడానికి మాత్రమే క్యాథీని యిక్కడికి రమ్మన్నాడు రామం..ఐతే..డిస్టర్బయి.. మనసంతా వికలమై.,
రామం ఎంత దాచుకుందామన్నా..యిక సాధ్యంకాక బయటికి తన్నుకొచ్చే జీవిస్తున్న ”లీల” తాలూకు జ్ఞాపకం మనసుతెరపై ప్రత్యక్షమైంది.
వద్దు..వద్దు..వద్దు..లీల బాపతు ఏ జ్ఞాపకాలూ వద్దు..ఆమెకు సంబంధించిన ఏ సంఘటనలూ స్మతిపథంలో వద్దు.. తను భరించలేడు..లీలయొక్క ఏ ప్రస్థావన హృదయంలో పొటమరించినా ఎందుకో శరీరమంతా ఒక కల్లోల సముద్రమై కంపిస్తోంది. చలించిపోతున్నాడు తను. బలవంతంగా లీల జ్ఞాపకాల్ని పక్కకు జరిపి.. నెట్టి.. మూసేసి,
”క్యాథీ..మనింటికి పోదాంపద ”
”… ఎందుకలా డిస్టర్బ్‌గా ఉన్నావ్‌ రామం..యువార్‌ నాట్‌ స్టేబుల్‌”
”యువార్‌ రైట్‌..ఎట్‌ లెటజ్‌ గో..” లేచాడు రామం ఆమె జవాబు కోసం ఎదురుచూడకుండా…అప్పటికి వాళ్ళు కాఫీ టబ్స్‌లోనుండి సగంకూడా తాగలేదు. అతనికి క్యాథీ కాఫీ తాగుతోందా..తాగిందా అన్న గమనింపుకూడా లేదు చకచకా తెచ్చుకున్న గొడుగును కూడా అక్కడే వదిలి బయటికి నడిచాడు. క్యాథీ అతనివైపు చిత్రంగా, కొద్ది ఆందోళనగా చూచి.. ఏమైందితనికివ్వాళ అనుకుంది. రామం గొడుగును ఆమె చేతిలోకి తీసుకుని బయటికి…అతని వెనకాల నడిచింది.

(సశేషం)

వీలునామా – 25 వ భాగం

శారద

శారద

 

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం  తరువాయి)

ఆత్మలతో సంభాషణ

       ఆత్మలతో జరిపే సంభాషణకి తానొస్తానని డెంస్టర్ కిచ్చిన మాట ఫ్రాన్సిస్ మరచిపోలేదు. అన్నట్టే ఒకరోజు ఆ కార్యక్రమం చూడడానికి డెంస్టర్ ఇంటికెళ్ళాడు. అక్కడ అప్పటికే ఇంకొందరు స్నేహితులు వచ్చి వున్నారు. కొందరు చూడాలన్న కుతూహలంతోటైతే, కొందరు పాలు పంచుకోవాలన్న ఉత్సాహంతో. ఆత్మలతో మాట్లాడబోయే అబ్బాయి (అతన్ని మీడియం అని పిలుస్తారట)  లేతగా వున్న పంతొమ్మిదేళ్ళ కుర్రాడు. కొంచెం బిడియంగా, బెరుగ్గా వున్నాడు. మనిషి మాత్రం చాలా నమ్మకస్తుడనీ, ఎట్టి పరిస్థితిలోనూ అబధ్ధాలాడడనీ అన్నాడు డెంస్టర్.

తన చుట్టూ జరుగుతున్న ఏర్పాట్లనీ, హడావిడినీ చూసి ఫ్రాన్సిస్ విస్తుపోయేడు. ఆత్మలు కొన్ని కుర్చీలూ బల్లలూ పడవేయడం చూసి అతనికి ఒకింత చిరాకు కూడా కలిగింది. అయితే అతనికి తన చుట్టూ వున్న వాళ్ళ గాఢ విశ్వాసం చూసి కలిగిన ఆశ్చర్యం ఇంతా అంతా కాదు. ‘ఇలాటివన్నీ ఇంత గట్టిగా నమ్మగలిగే వాళ్ళుంటారా?’ అనుకున్నాడతను విస్మయంగా. వాళ్ళందరూ ఎవరో ఒకరిని పోగొట్టుకున్నవారే అవడం అతనికి పట్టిచ్చినట్టయింది. అనంతమైన అపనమ్మకమనే సముద్రం మీద ప్రయాణిస్తూ, మృత్యువనే చేదు నిజాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు వారంతా.

అయితే ఆత్మలు ఆ మీడియం ద్వారా చెప్పిన విషయాలతనికేమీ ఉత్సాహకరంగా అనిపించలేదు. అన్ని ఆత్మలూ తాము సంతోషంగానే వున్నామన్నాయి. అతనికి చిన్నతనం నించీ మరణించిన తర్వాత మనిషికి ఉనికీ, అస్తిత్వమూ వుండివుండొచ్చన్న ఆలోచనలో పెద్ద నమ్మకం లేదు. అందువల్ల ఆ ఆత్మలూ, అవి చెప్తున్న విషయాలూ అన్నీ పెద్ద వేళాకోళంగా అనిపించాయి. దానికి తోడు అతను ఏ ఆత్మీయులనూ కోల్పోలేదు. అందువల్ల అతనికి ఏ ఆత్మతోనూ సంభాషించడంలో ఆసక్తి లేదు.

నిజానికతడు బ్రతికి వున్న మనుషుల గురించీ, అందులోనూ తన మేనత్త కూతుర్లయిన జేన్, ఎల్సీల గురించీ ఆలోచిస్తున్నాడు. వారికేరకంగా సహాయం చేయలేని తన నిస్సహాయ స్థితి గురించి ఆలొచిస్తున్నాడు. బ్రతుకులో ఇంత కష్టమూ, బాధా వుందగా అందరూ మృత్యువు గురించే ఎందుకు ఆలో చిస్తారో, అనుకున్నాడతను. ఒకవేళ నాన్నగారికి ఇంకా వునికి వుండి వుంటే తను రాసిన విల్లుని గురించి పశ్చాత్తాప పడివుండేవారా, అన్న ఆలోచనలో అతను కొట్టుకుపోతూండగా, వున్నట్టుండి ఎవరో అతనితో, “ఇప్పుడిక్కడికి మీ తండ్రిగారి ఆత్మ వొచ్చి వుంది,” అన్నారు.

ఫ్రాన్సిస్ నమ్మలేకపోయాడు. “ఆ ఆత్మ ఆయనదేనని ఏమిటి నమ్మకం?” అన్నాడు ఆ చెప్పిన అతని వంక వింతగా చూస్తూ.

డెంస్టర్ కలగజేసుకుని, “ఆయన మాట్లాడతారా, లేక సంకేతాలు పంపుతారా?” అడిగాడు అతని తరఫున.

“బల్ల మీద సంకేతాలు ఇస్తారట,” అన్నాడు ఆ చెప్పిన వ్యక్తి.

“సరే, అయితే మనం అక్షరాలు రాసి వున్న బల్ల దగ్గరకి వెళ్దాం రా!” ఫ్రాన్సిస్ చేయి పట్టుకుని బల్ల దగ్గరకి తీసికెళ్ళాడు డెంస్టర్.

“ఆ అక్షరాల మీద చేయి పెట్టు. ఆ ఆత్మే నీ చేయిని కదులుస్తూ నువ్వడిగే ప్రశ్నలకి జవాబిస్తుంది,” అన్నాడు డెంస్టర్ ఫ్రాన్సిస్ తో.

ఫ్రాన్సిస్ ఇంకా అపనమ్మకంగా చూస్తూ, బల్ల మీద వున్న అక్షరాల మీద చేయి పెట్టాడు. పెట్టి, ఆత్మని పేరు చెప్పమని అడిగి తన వేళ్ళవంక చూసుకున్నాడు.

“చేయి వరసగా అక్షరాల మీద కదల్చు. సరియైన అక్షరం మీదకొచ్చాక ఆత్మ చేయి కదలనివ్వదు,” చెప్పాడు డెంస్టర్.

అతని చెప్పినట్టే చేసి చూసాడు ఫ్రాన్సిస్. ఒక్కో అక్షరం దగ్గరా అతని చేయి ఆగిపోయింది. ఆఖరికి వచ్చిన అక్షరాలన్నీ పేర్చుకుని చూస్తే, “హెన్రీ హొగార్త్” అయింది.

వెంటనే, “మీరు నాతో మాట్లాడాలనుకుంటున్నారా?” అని అడిగాడు.

“అవును,” అనే సమాధానం వచ్చింది.

“నేను ఎస్టేటు లో చేసిన మార్పులు మీకు నచ్చుతున్నాయా?”

“చాలా!”

“మీరు రాసిన విల్లు తలచుకుని బాధపడుతున్నారా?”

“అంతా మన మంచికే!”

“మీ మేనకోడళ్ళకి అన్యాయం చేసినందుకు ఎప్పుడైనా బాధ పడ్డారా?”

“అదంతా వాళ్ళకి అనుభవాన్నిస్తుంది. నీక్కూడా.”

“నా జేబులో వున్న ఉత్తరం రాసింది నిజంగా మా అమ్మేనా?”

“అవును.”

“ఆవిడకి మీరు డబ్బిస్తూ వున్నారా?”

“లేదు.”

“మరి ఆవిడ నన్నెలా వొదులుకుంది?”

“ఒకేసారి బోలెడు డబ్బిచ్చాను.”

ఫ్రాన్సిస్ కి ఇదంతా విచిత్రమైన అనుభవం లాగుంది.

“ఒక్క సంగతి చెప్పండి నాన్నా! ఈ ఉత్తరం రాసిన ఆవిడకి నేను సాయం చేయాలా?”

“వద్దు!”

“పోనీ ఉత్తరం రాయనా?”

“అవసరం లేదు. ఆవిడ జోలికెళ్ళకు.”

“నా మనసులో వున్న ఆశ నెరవేరుతుందా?” ఆత్రంగా అడిగాడు ఫ్రాన్సిస్.

“ఓపిక పట్టు. నేనెప్పుడూ నిన్ను కనిపెట్టే వుంటాను.”

“మీరిప్పుడక్కడ ఏం చేస్తున్నారు?”

“నేనెంతో ప్రేమించిన వ్యక్తి నుంచి జీవితం గురించి తెలుసుకుంటున్నాను.”

“ఆవిడ పేరేమిటి?”

తన మనసులోని మాటలే జవాబుల రూపంలో వస్తున్నాయేమోనన్న అనుమానం వుంది ఫ్రాన్సిస్ కి. అందుకే తను వూహించిన స్త్రీ పేరు మనసులోంచి చెరిపే ప్రయత్నం చేసాడు. అయినా అతని చేయి ఆ పేర్లోని అక్షరాల మీదే ఆగిపోయింది.

“మార్గరెట్.”

“ఆవిడేనని అనుకున్నా. మీకిష్టమైన మనిషి మీకు పై లోకంలో కనిపించింది కదూ, ఇహ అంతా మన మంచికే అనిపిస్తుంది. కానీ నాకు జేన్ ని పై లోకంలో కాదు, ఈ లోకంలోనే కలుసుకోవాలని వుంది,” అక్కసుగా అనుకున్నాడు ఫ్రాన్సిస్.

“అది జరిగే సమయానికి అవుతుంది.”

“ఓహో! మీకు మనసులో అనుకున్న మాటలు కూడా వినపడతాయన్నమాట. అది సరే, ఫిలిప్స్ గారికీ, ఈ ఉత్తరం రాసిన ఎలిజబెత్ కీ ఏమిటి సంబంధం?” మళ్ళీ మనసులోనే అనుకున్నాడు.

ఏ జవాబూ రాలేదు.

“ఇప్పటికైనా నమ్ముతారా, ఆత్మలుంటాయని?” ఆత్రంగా అడిగాడు డెంస్టర్.

“తప్పకుండా! కొన్ని పేర్లు ఆయనకీ నాకూ తప్ప మూడో మనిషికి తెలిసే ప్రసక్తి లేదు.”

“అవును, పేర్లు చెప్పగానే చాలా మంది ఆత్మలని నమ్మడం మొదలు పెడతారు,” సంబరంగా అన్నాడు డెంస్టర్.

“అది సరే, ఆత్మలకి భవిష్యత్తు గురించి తెలుస్తుందా? నేను భవిష్యత్తు గురించి కొన్ని ప్రశ్నలడిగాను మరి!”

“తప్పకుండా తెలుస్తాయి.”

“అదెలా సాధ్యం? భవిష్యత్తు గురించి భగవంతుడికి తప్ప ఇనెకెవరికీ తెలిసే అవకాశం లేదు. భగవంతుడి మనసులో ఏముందో తెలుసుకోవడం తరం కాదు కదా?” అనుమానంగా అన్నాడు ఫ్రాన్సిస్.

“మన భౌతిక ప్రపంచంలో వుండే అడ్డుగోడలు ఆధ్యాత్మిక ప్రపంచంలో వుండవు కాబోలు. అందువల్ల ఆత్మలు ఇతరుల మనసుల్లోకి తొంగి చూడగలుగుతాయి. దాని వల్ల భవిష్యత్తుని కొంతవరకు ఊహించగలవేమో!”

“అంతే కాని, ఇలా జరిగి తీరుతుందని చెప్పలేవు కదా?”

“అవును.”

“కానీ, వర్తమానం గురించి మాత్రం చెప్పగలవు.”

“అబధ్ధాలాడని ఆత్మలైతే!”

“అబధ్ధాలాడే ఆత్మలుంటాయా?” ఇంకా ఆశ్చర్యపోయాడు ఫ్రాన్సిస్.

“వుంటాయి. అయితే మంచి ఆత్మలు అనైతికమైన పని చేయలేవు.”

“ఆగాగు! మంచీ చెడూ, నీతీ అవినీతికి కొలమానాలు భౌతిక ప్రపంచానికి వర్తిస్తాయి. వాటిని ఆత్మలకి ఎలా వర్తింప జేస్తావు?”

“కాదు! నీతీ, అవినీతీ, మంచీ చెడూల నిర్వచనాలు విశ్వమంతటా ఒకటే. భగవంతుడు కూడా మంచిని చెడు లా, చెడుని మంచిలా మార్చలేడు!”

ఇంతలో ఎవరో డెంస్టర్ ని పిలవడంతో అటు వెళ్ళాడు.

ఫ్రాన్సిస్ లేచి చల్ల గాలిలో నడుస్తూ ఇంటి దారి పట్టాడు. అతనికంతా కలలా వుంది. అందరూ కలిసి తనని మోసం చేస్తున్నారనుకోవడానికి వీల్లేదు. తను మనసులో అనుకున్న ప్రశ్నలకి కూడా సరైన సమాధానం వచ్చింది.

“రేపు జేన్ తో దీన్ని గురించి మాట్లాడాలి. నేను రాకుండా ఇదంతా నాతో ఎవరైనా చెప్పి వుంటే నేను నమ్మే వాణ్ణి కాదు. రేపు జేన్ నా మాట నమ్ముతుందో నమ్మదో!”

 ***

(సశేషం)

చరిత్ర చట్రంలో యయాతి కథ

yayati1

యజ్ఞం, దానం, అధ్యయనం, దస్యుహింస, జనరంజకపాలన, యుద్ధంలో శౌర్యం రాజధర్మాలు. వీటన్నిటిలోనూ యుద్ధం మరింత ఉత్తమధర్మం

(శ్రీమదాంధ్రమహాభారతం, శాంతిపర్వం, ద్వితీయాశ్వాసం)

ధర్మరాజుకు రాజనీతిని బోధిస్తూ భీష్ముడు ఏమంటున్నాడో చూడండి… యజ్ఞం, దానం, జనరంజకపాలన, యుద్ధంలానే ‘దస్యు హింస’ కూడా రాజు(లేదా యజమాని) నిర్వర్తించవలసిన ధర్మాలలో ఒకటి అంటున్నాడు. దస్యులు-దాసులు అనే రెండు మాటలకు ఏదో సంబంధం ఉన్నట్టు కనిపిస్తుందని రాంభట్ల(జనకథ) అంటారు. దస్యులు ఆలమందలను, వాటిని కాచుకునే మనుషులను అపహరించేవారనీ; మందలను, మనుషులనూ కూడా వ్యవసాయదారులకు అమ్మేసేవారనీ, అలా కొనుక్కున్న మనుషులను దాసులు అనేవారనీ ఆయన వివరణ. వ్యవసాయం పనులకు మంద-మంది ఎప్పుడూ అవసరమే.  ఆవిధంగా వ్యవసాయం పనులకు సహకరించే పశువుకూ, మనిషికీ పోలిక కుదిరింది. అందుకే పని చేసిన తర్వాత  వారికి ‘కూలి’ రూపంలో ఇచ్చే తిండికీ  పోలిక కుదిరింది. దాని పేరు: గ్రాసం. గ్రాసం అంటే గడ్డి, లేదా తృణసంబంధమైన ఆహారం. విశేషమేమిటంటే, ‘గ్రాసం’ అనే మాట నిన్నమొన్నటి వరకు ‘జీతం’ అనే అర్థంలో వాడుకలో ఉంది.

దస్యు-దాస శబ్దాలకు మళ్ళీ వస్తే, వైదిక పద సూచి(Vedic Index) ప్రకారం వీటిని పర్యాయపదాలుగా వాడడమూ ఒకటి, రెండు చోట్ల కనిపిస్తుంది. ఆర్యులకు భిన్నమైన ఆచారవ్యవహారాలు, ఆరాధనాపద్ధతులు, వేషభాషలు, రంగు వగైరాలు కలిగిన దస్యులు లేదా దాసులను ఆర్యులు శత్రువులుగా చూడడం సహజమే. వీళ్ళ మధ్య ఘర్షణలు జరగడమూ సహజమే. కొనుక్కున్న దాసులే కాక, యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు కూడా దాసులే అవుతారు కనుక ఆవిధంగా దస్యులు కూడా దాసులే. అలాగే, దాసుల్లో పుట్టించిన దాసులు, అంటే గర్భ దాసులు ఉండేవారని కూడా చెప్పుకున్నాం. దాసులు ఎవరైనా సరే దండనకు అర్హులే. భీష్ముడు దస్యుహింస అనడంలో ఆ సూచన కూడా  ఉండచ్చు.

ఎందుకంటే, దాసులు ఒక్కోసారి ఠలాయిస్తారు. పని చేయడంలో ఒళ్ళు దాచుకుంటారు. పారిపోడానికి ప్రయత్నిస్తారు. లేదా జట్టుకట్టి యజమానిపై తిరుగుబాటు చేసే ప్రమాదమూ ఉంది. అలా తిరుగుబాటు చేసిన ఉదాహరణలనూ కొన్నింటిని ‘వేదభూమి’లో రాంభట్ల ఇచ్చారు. కనుక దాసులను ఎప్పుడూ ఓ కంట కనిపెట్టి ఉండాలి. ఏదో ఒక కారణాన్ని కల్పించుకుని మధ్య మధ్య దేహశుద్ధి చేస్తూ ఉండాలి. ఎప్పుడూ భయభక్తులలో ఉంచాలి.  ఓ పాత సినిమాలో ఓ స్కూలు మాస్టరు తప్పు చేసిన  కుర్రాడికే కాకుండా, పనిలో పనిగా మిగతా కుర్రాళ్ళకు కూడా నాలుగు తగిలిస్తాడు. మొదటి కుర్రాడు తప్పు చేసినందుకు, మిగతా కుర్రాళ్ళు తప్పు చేయకుండా ఉండేందుకు అన్నమాట.  గ్రీకు, రోమన్; ఇటీవలి అమెరికన్ బానిసవ్యవస్థలలో బానిసల దండన ఎలా ఉండేదో చూస్తే, భీష్ముడన్న ‘దస్యు హింసా’ రూపం కొంత ఊహకు అందచ్చు.  అయితే, దేశాకాలాలను బట్టి వాటి తీవ్రతలో తేడాలు ఉంటే ఉండచ్చు. ‘రూట్స్’ నవలలో కుంటా కింటే పారిపోవడానికి రెండు, మూడుసార్లు విఫలయత్నం చేస్తాడనీ, చివరికి అతని యజమాని అతని పాదం ఒకదానిని సగానికి నరికించేస్తాడనీ ఇంతకుముందు చెప్పుకున్నాం.

వ్యవసాయానికి మంది అవసరం చరిత్రపూర్వకాలం నుంచి, చరిత్రకాలం మీదుగా ఆధునిక కాలం వరకూ నిరంతరం ఉంటూనే ఉంది. వ్యవసాయవిస్తరణను భారీ ఎత్తున చేపట్టిన మౌర్య రాజు అశోకుడు అందుకోసం జనాలను తరలించి కొత్త కొత్త జనావాసా(settlements) లను ఏర్పాటు చేయడం, ఆ జనాలు తమున్న జనావాసం నుంచి పారిపోయే వీలు లేకుండా తగిన బందోబస్తు చేయడం గురించి కోశాంబీ విపులంగా రాశారు. అంతే విపులంగా చెప్పుకోవలసిన ఆ ఘట్టంలోకి ఇప్పుడు వెళ్లలేము కనుక ప్రస్తుతానికి వద్దాం.

వర్ణవ్యవస్థకు చెందిన శిక్షాస్మృతిలోని ఒక అంశాన్నే ఇక్కడ భీష్ముడు బోధిస్తున్నాడు. ఈ బోధ ఇంకా చాలా చోట్ల కనిపిస్తుంది. వర్ణవ్యవస్థలో శిక్షాస్మృతి కూడా వర్ణాల హెచ్చుతగ్గులను బట్టే ఉంటుంది. ఎలాగంటే,  పై రెండు వర్ణాలకూ శిక్ష ఉండదు. ఉన్నా సరళంగా ఉంటుంది. కానీ,  మూడో వర్ణాన్ని అణచిపెట్టి ఉంచాలి, ఇక నాలుగోవర్ణంవారిని కొట్టినా, చంపినా తప్పులేదు.  మహాభారతం మేరకు ఐదో వర్ణం ప్రస్తావన దాదాపు కనిపించదనే చెప్పవచ్చు. మూడో వర్ణం అంటే వైశ్యులు. ధర్మరాజు రాజసూయం చేసినప్పుడు, ‘ప్రసిద్ధులైన రాజులందరూ అతనికి భయపడి వైశ్యులలా దాసోహమై ఏమాత్రం ఆలస్యం చేయకుండా ధనరాశులను తెచ్చి కప్పంగా చెల్లించారనీ, దాంతో ధర్మరాజుకు రాజత్వం సిద్ధించిందనీ’ శకునితో దుర్యోధనుడు అంటాడు.

ఇది నాలుగువర్ణాల వ్యవస్థ స్థిరపడిన లేదా,  స్థిరపడుతున్న దశకు చెందిన ముచ్చట. అప్పటినుంచీ దాస-దాసీల గురించిన ప్రస్తావన చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎక్కువమంది దాస-దాసీలు ఉండడం, సత్కారరూపంలోనో, కప్పంగానో దాస-దాసీలను ఇవ్వడం, కూతురికి పుట్టింటి అరణంగా దాస-దాసీలను ఇచ్చి పంపడం- ఇలా అనేక విధాలుగా దాస-దాసీలు ఒక హోదా చిహ్నంగా మారడం కనిపిస్తుంది.  ధర్మరాజు జూదంలో ఒడ్డబోయే తన సంపద జాబితా చెబుతూ అందులో వేలాదిమంది దాస-దాసీలను కూడా కలుపుతాడు.  ఈ దాస-దాసీ వ్యవస్థకు అవకాశమిచ్చిన గృహ ఆర్థికత (household economy), దానికి జతగా వర్ణవ్యవస్థ ఎలా అభివృద్ధి చెందాయో రొమీలా థాపర్ From Lineage to State లో చర్చించారు.

అదలా ఉంచితే, మనం చెప్పుకుంటున్న యయాతి కథ అంతకంటే పురాతనం. ఎంత పురాతనం అంటే, అది దాస-దాసీ వ్యవస్థకు ప్రారంభకాలం కావచ్చు.

అసుర, దాస శబ్దాలు మొదట్లో జాతి, లేదా తెగ వాచకాలే తప్ప నిందార్ధకాలు కావని చెప్పుకున్నాం. అసురులు వ్యవసాయనిపుణులనీ; దాసుల్లో కూడా సంపన్నులు, బలవంతులు ఉండేవారనీ అనుకున్నాం. ఈ సందర్భంలోనే ‘శూద్ర’ అనే మాట గురించి కూడా చెప్పుకోవాలి. రొమీలా థాపర్ ప్రకారం దాస, శూద్ర అనే శబ్దాలు గణవాచకాలు. వారు స్వతంత్ర జీవులు, కృష్ణవర్ణులు, అంటే నల్లని వాళ్ళు. ఋగ్వేదం ప్రకారం మొదట్లో ఉన్నవి రెండు వర్ణాలే. అవి: ఆర్యవర్ణం, దాసవర్ణం. ఈ దాసులు, శూద్రులలో కొందరు పేదలైతే కావచ్చు కానీ, మొదట్లో వారు సేవకవృత్తిలో లేరు.  వీరు, ఆర్యులు పక్క పక్కనే ఉండేవారు. పైగా ప్రారంభంలో దాస్యానికి పేదరికమే కారణం తప్ప వర్ణం కాదు. ఆవిధంగా దాసులు, శూద్రుల్లోని పేదల లానే ఆర్యుల్లోని పేదలు కూడా దాస్యం లోకి జారిపోయేవారు. ఆ తర్వాత సొమ్ము చెల్లించో, మరో విధంగానో దాస్యం నుంచి బయటపడే వెసులుబాటు ఉండేది. అందుకే భారతదేశంలో ప్రామాణిక బానిసవ్యవస్థ ఎప్పుడూ లేదని చరిత్రకారులు అంటారు. మరి వర్ణవ్యవస్థ సంగతేమిటనే ప్రశ్న వస్తుంది. వర్ణవ్యవస్థలో హెచ్చుతగ్గుల తేడాలకు పుట్టుకే కొలమానం తప్ప, ఆర్థికతారతమ్యాలు కావు. అది ఒకరకంగా సామాజిక బానిసత్వ రూపం. ఈ వర్ణవ్యవస్థకు మెసపొటేమియాలోని ఒకనాటి బానిసరూపంతో పోలిక ఉన్నట్టు కనిపిస్తుంది. చాలా వివరంగా చెప్పుకోవలసిన ఈ అంశాన్ని ప్రస్తుతానికి అలా ఉంచుదాం .

‘శూద్ర’ శబ్దానికి వస్తే, ఆ మాట సంస్కృత పదం కాదనీ, ఇతర ఆర్యభాషలకు చెందిన పదం కూడా కాదనీ, సుమేరు పదమనీ రాంభట్ల ‘జనకథ’లో అంటారు. ఆ మాటకు రక్షకుడు అని అర్థంచెప్పారు. రక్షకుడు అనగానే మనకు రాక్షస శబ్దం గుర్తొస్తుంది. సుమేరుల జలప్రళయగాథలో నాయకుని పేరు ‘జీవశూద్ర’. సుమేరులు వ్యవసాయదారులు కనుక ‘జీవశూద్ర’ పంటపండించేవాడు, లేదా పంటకు రక్షణగా ఉండేవాడు అన్నమాట. అసురులు, అంటే రాక్షసులు కూడా వ్యవసాయదారులే నని చెప్పుకున్నాం. ఈ శూద్ర లేదా రక్షక శబ్దంలాంటిదే తెలుగులో ‘కాపు’ అనే మాట. ‘కాపు’ అనే మాటకు పంట రక్షకుడు, జనరక్షకుడు అనే అర్థాలు ఉన్నాయి.

ఈ వివరణకు పూర్వరంగంలో వేద ఋషులు వ్యవసాయానికి మళ్లడం గురించి చాలా విషయాలను రాంభట్ల గారు చర్చించారు కానీ ఇప్పుడు అందులోకి వెళ్లకుండా క్లుప్తంగా చెప్పుకుంటే, వ్యవసాయప్రాధాన్యాన్ని గుర్తించిన ఆర్యులలోని భరతగణంవారు వ్యవసాయవిస్తరణలో అసురుల సహకారం తీసుకున్నారు. అందుకే, అసుర భావనను వ్యక్తం చేసే నారాయణ, నాసదీయ, ‘క’బ్రహ్మ సూక్తాలు ఋగ్వేదం ప్రథమమండలంలోకి ప్రవేశించాయని రాంభట్ల అంటారు. ఆయన ప్రకారం, నారాయణసూక్తం సుమేరుల సృష్టిగాథే. చాలాకాలం తర్వాత ఈ కథనే బైబిలు కొన్ని మార్పులతో స్వీకరించింది. ‘శూద్ర’ పదం ఈ నారాయణ సూక్తంలో తప్ప ఇంకెక్కడా కనిపించదు.  ఇక నాసదీయసూక్తంలోని తొలి వాక్యం అసురసృష్టిగాథ ‘ఎనూమాఎలిక్ష’కు అనువాదం. ‘క’బ్రహ్మసూక్తం ఈజిప్టు భావనకు సంస్కృత రూపం. సుమేరుకు చెందిన సుక్కూరులోని పురోహితుని ‘బరు’ అంటారు. ఈ ‘బరు’యే ‘బరురాంగిరస’ పేరుతో మంత్రద్రష్టగా వేదంలోకి ఎక్కాడు. ఈ పేరులోని ‘అంగిరస’ అనే పదం కూడా సుమేరుకు చెందినదే. సుమేరులు తమ దేశాన్ని ‘ఎంగి’ అనీ, తమ జనాన్ని ‘ఎంగిర్లు’ అనీ అనేవారు.

నారాయణసూక్తమూ-దానికి గల ‘శూద్ర’, సుమేరు సంబంధాల గురించి చెప్పుకుంటూ వెడితే, ఈ గొలుసుకట్టు ఎక్కడిదాకా పోతుందో తెలియదు. మహాభారత కథను వ్యవసాయ విస్తరణ కోణం నుంచి పరిశీలిస్తూ, ‘నర-నారాయణ రహస్యం’ పేరుతో నేను ఇప్పటికే ఒక పెద్ద వ్యాసం(అముద్రితం) రాశాను. దాని గురించి ఈ వ్యాసపరంపరలో చెప్పుకునే సందర్భం ఎప్పటికి వస్తుందో చెప్పలేను.

ఇంతకీ దాస శబ్దం (అలాగే శూద్ర శబ్దం కూడా) నిందార్థకం ఎందుకైంది, ఎప్పుడైంది అనే ప్రశ్నలకు పరిస్థితుల సంబంధమైన సాక్ష్యాలపై ఆధారపడి జవాబు చెప్పుకోవలసిందే తప్ప, కచ్చితమైన స్థలకాలాలను గుర్తించడం కష్టం.  దాస (అలాగే శూద్ర) శబ్దానికీ, అసుర శబ్దానికీ కొంత తేడా ఉంది. దాస శబ్దానికి నిందార్థంతోపాటు న్యూనార్థం కూడా ఉంది. ‘దాస’ అనే, గణ లేదా తెగ వాచకం దాసులనే న్యూనార్థాన్ని తెచ్చుకునే క్రమంలో యయాతి-శర్మిష్టల సంబంధాన్ని ఎక్కడ ఇమడ్చవచ్చు?!

పురావస్తు ఆధారంగా రొమీలా థాపర్ చేసిన పరిశీలన ప్రకారం ఒక భౌగోళిక సన్నివేశం ఇలా ఉంటుంది:

యయాతి-శర్మిష్టల చివరి కొడుకు పూరుడి సంతతి మొదట్లో సరస్వతీ నదీతీరంలో పచ్చిక భూముల వెంబడి జీవించారని ఋగ్వేదం చెబుతోంది. అయితే ఆ తర్వాత ఎంతకాలానికో తెలియదు కానీ, ఒక కీలక పరిణామం జరిగింది. ఉత్తర రాజస్తాన్, దక్షిణ పంజాబ్ ప్రాంతంలోని నదుల గమనంలో మార్పులు సంభవించాయి. ఉత్తర రాజస్తాన్ లో వాతావరణం మారి వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. క్రీ.వె. 2000 ద్వితీయార్థంలో ఈ మార్పులు సంభవించాయని అంచనా. సట్లెజ్ నదీ గమనం తరచు మారిపోయేదనడానికి వేదానంతర సాహిత్యం ఆ నదిని ‘శతద్రు’, అంటే వంద కాలువలు కలిగినదిగా పేర్కొనడం ఒక నిదర్శనం. ఇక, అనేక సరస్సులు కలిగినది అనే అర్థం ఇచ్చే సరస్వతీ నది సిర్సా అనే చోట ఎడారిలో అదృశ్యమైంది. యమునా నదీ గమనంలో వచ్చిన మార్పులు సరస్వతీ, సింధు, గంగా ప్రాంతంలోని ఇతర నదుల జలాలను ఆకర్షించాయనే వాదం ఉంది. ఈ విధమైన పర్యావరణ అనిశ్చితికితోడు, చిత్రిత మృణ్మయ సంస్కృతికి చెందిన వైదికార్యుల నివసించే ప్రాంతాల పరిమాణమూ పెరిగింది. అంటే, వారి జనాభా పెరిగిందన్న మాట. దాంతో వారు కొత్త వ్యవసాయక్షేత్రాలను, పచ్చిక భూములను వెతుక్కుంటూ పశ్చిమ గంగా లోయవైపు కదిలారు. అయితే, పురులలో ఒక శాఖ, బహుశా ప్రధాన శాఖ పంజాబ్ చుట్టుపక్కలే ఉండిపోగా, ఉప శాఖలు పశ్చిమ గంగా లోయ వైపు పయనించాయి. భరతులు వారికి తోడయ్యారు. ఈ పురు-భరత సమాఖ్య నుంచే కురులు అవతరించారు. ఇంకోవైపు, మరో అయిదు తెగలు కలసిపోయి పాంచాలురుగా ఆవిర్భవించారు. ఈ కురు-పాంచాల ప్రాంతమే మధ్యదేశంగా, ఆర్యావర్తంగా ముందు ముందు గుర్తింపు పొందబోతోంది. జనాభా పెరగడం, దాంతో కొత్త జనావాసాలను ఏర్పాటు చేయవలసి రావడం, కొన్ని యుద్ధ విజయాలు, ఓడిపోయిన వారి లొంగుబాటు మొదలైనవి తెగల ఏకీకరణకు, పునర్వ్యవస్థీకరణకు దారి తీయించి ఉండచ్చు.

పురులు, భరతులు పశ్చిమ గంగా లోయలోకి వలస వెళ్లడానికి ముందు మరో ముఖ్య పరిణామం జరిగింది. అది, దశరాజయుద్ధం. ఇంతకుముందు ఒకసారి ప్రస్తావించుకున్న ఈ యుద్ధం గురించి క్లుప్తంగా చెప్పుకుంటే, సుదాస్ నాయకత్వంలోని భరతులతో పది తెగల వారు పోరాడారు. వారిలో యదులు, లేదా యక్సులు, తుర్వసులు, ద్రుహ్యులు, అనులు ఉన్నారు. వీరు యయాతి వృద్ధాప్యాన్ని స్వీకరించడానికి నిరాకరించి శాపగ్రస్తులైన అతని నలుగురు పెద్ద కొడుకులు, లేదా వారి సంతతి. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు నదీ గమనంలో వచ్చిన మార్పుల వల్ల పురులు నేటి హర్యానావైపు, గంగా-యమునా ఎగువ ప్రాంతానికి  వలసపోయినప్పుడే యదులు(మిగిలినవారి సమాచారం లేదు) సౌరాష్ట్ర, మధురల వైపు వెళ్లారని ఒక సూచన. వైదిక సాహిత్యంలో ‘పంచజను’ల ప్రస్తావన తరచు వస్తుంది. ఈ పంచజనులు ఎవరు, యయాతి కొడుకుల సంతతా  అనేది తెలియదు. యయాతి పెద్దకొడుకును కాదని చిన్నకొడుకు పూరునికి పట్టం కట్టడం పశుపాలన స్థానంలో వ్యవసాయ ప్రాధాన్యం పెరిగిన సంగతిని సూచిస్తూ ఉండచ్చని అనుకున్నాం. భరతులలానే పురులు వ్యవసాయదారులు.

పురులలో కొందరు, భరతులు గంగా-యమునా మధ్యప్రాంతానికి వెడుతున్న కొద్దీ వ్యవసాయ ప్రాధాన్యం కూడా పెరుగుతూ, మరిన్ని నైపుణ్యాలు కలిగిన వ్యవసాయకార్యక్రమాలు పుంజుకున్నట్టు పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయి. వ్యవసాయ జనావాసాలు కూడా ఏర్పడుతూ వచ్చాయి. అయితే ఆ పరివర్తన మందగతిలో సాగింది. వెనకటికి ఇప్పటికీ తేడా ఏమిటంటే, ఇప్పుడు పురులు, భరతుల దగ్గర గుర్రమనే కొత్త జంతువు ఉంది. వీరు క్రీ.వె. 1000 తొలి శతకాల నాటికే ఆయుధాలకు పరిమితమై ఇనుము వాడుతున్నారు. సింధు-గంగా మధ్యప్రాంతంలో హరప్పా మలిదశకు చెందిన జనాలు ఉన్నట్టే; వీరు పశ్చిమ గంగా లోయలోకి వెళ్ళేనాటికి అక్కడ కూడా ముందునుంచీ ఉంటున్న కాషాయవర్ణ మృణ్మయ పాత్రల సంస్కృతికి, రాగి సాధనాల సంస్కృతికి చెందినవారు ఉన్నారు. వీరివి చిన్న చిన్న జనావాసాలు. వీరిలో వ్యవసాయదారులు కూడా ఉన్నారు.

పై వలసక్రమమూ, తేదీలూ యయాతి కథను అతిపూర్వానికి తీసుకువెడుతున్నాయి. అది, ఆర్యగణాలలో పశుపాలన ప్రాధాన్యం వ్యవసాయ ప్రాధాన్యానికి మళ్ళుతున్న సంధి దశ కావచ్చు. వారు భారతదేశంలోకి అడుగుపెట్టే నాటికి ఇక్కడ కాషాయవర్ణ మృణ్మయ పాత్రల సంస్కృతికి చెందినవారు ఉన్నారనీ, వారు మలి హరప్పా సంస్కృతికి చెందిన వ్యవసాయదారులు కావచ్చుననీ చెప్పుకున్నాం. వాళ్ళలో దాసులు, అసురులు ఉన్నారు. ఆర్యులు వ్యవసాయదారులను శత్రువులుగా చూసి అసురులుగా పేర్కొనేవారు కనుక దాసులను కూడా అసురులనే అనేవారు కాబోలు. అయితే, పశుపాలన-వ్యవసాయాల సంధి దశలో ఒకటి జరగడానికి అవకాశముంది. అది, ఉభయ వృత్తుల మధ్య ఒక మాదిరి సహజీవనం. ఎలాగంటే, వ్యవసాయదారులు పంట కోసుకున్న తర్వాత పొలాలలో పశువులను మేపుకోనివ్వడమో, పశుగ్రాసం సమకూర్చడమో చేయవచ్చు. అందుకు ప్రతిఫలంగా ఆర్యగణాలు వ్యవసాయదారులకు రక్షణ కల్పించవచ్చు. అదీగాక, స్థిరజీవితానికి అలవాటుపడిన వ్యవసాయదారులు సాగుకు అనుకూలమైన భూముల్ని విడిచిపెట్టి వెళ్లడానికి సాధారణంగా ఇష్టపడరు. ఇతరుల ఆధిపత్యాన్ని అంగీకరించి అయినా భూముల్ని కాపాడుకోడానికి ప్రయత్నిస్తారు. కనుక నాటి సింధు-గంగా ప్రాంతంలో ఆ సంధి దశలో ఉభయవృత్తిదారుల మధ్య సహజీవనం సాధ్యమై ఉండవచ్చు. అందుకు ఋగ్వేదంలో సాక్ష్యాలు ఉన్నాయని రొమీలా థాపర్ అంటారు. ఉదాహరణకు, ఋగ్వేదం చివరి మండలాలలో నాగలి వ్యవసాయం గురించిన ప్రస్తావనలు కనిపిస్తాయి. అంతేగాక, కొన్ని వ్యవసాయపరికరాల పేర్లు ఆర్యేతర భాషలకు చెందినవిగా ధ్వనిస్తాయి. ‘లాంగల’ అనే మాట అలాంటిదే. వైదిక సంస్కృతంలో మూల ద్రావిడ, ఆష్ట్రో-ఏషియాటిక్  పదజాలం ప్రవేశించడానికి మూలం ఈ కాలంలోనే ఉండవచ్చు. అయితే, ఆర్యగణాలు వ్యవసాయప్రాధాన్యం వైపు మళ్ళుతున్న కొద్దీ ఈ సహజీవన సంబంధాలు శత్రుసంబంధాలుగా మారడానికి అవకాశముంది.

యయాతి-శర్మిష్టల సంబంధం సహజీవన దశకు చెందినదా, శత్రుపూరిత దశకు చెందినదా అన్నది కచ్చితంగా చెప్పడం కష్టం. రెండింటికీ అవకాశముంది. శర్మిష్ట తండ్రి వృషపర్వుడు కాషాయవర్ణ మృణ్మయపాత్రల సంస్కృతికి, దాస తెగకు  చెందిన అనార్య వ్యవసాయదారుడు కావచ్చు. వ్యవసాయదారుడు కనుక అతనిని అసురునిగా పేర్కొని ఉండచ్చు. యయాతి-శర్మిష్టల సంబంధం సహజీవన దశకు చెందినది అనుకుంటే, దాస స్త్రీ అయిన శర్మిష్టను యయాతి సహజగతిలోనే వరించాడు. ఆర్యులకు అప్పటికి జాతిస్వచ్ఛత గురించి పట్టింపులేదు. వాస్తవంగా ఆ కథ కూర్చేనాటికి దాస శబ్దం న్యూనార్థం తెచ్చుకుంది కనుక కథకుడు శర్మిష్టకు దాస్యం ఆపాదించి దాసిగా కథను మలచి ఉండవచ్చు. యయాతి-శర్మిష్టల సంబంధం శత్రుపూరిత దశకు చెందినది అనుకుంటే, దాస స్త్రీ అయిన శర్మిష్ట దాసిగా మారిపోయి ఉండచ్చు. ఆమె కంటే ముందు వృషపర్వుడే దాసుడుగా మారిపోయి ఉండాలి…

యయాతి కథా పరిశీలనలో ప్రస్తుతానికి ఇవే చివరి వాక్యాలు. అయితే, ఇంత పరిశీలనా చేసి ఏం తేల్చినట్టు అనే ప్రశ్న పాఠకులకు కలగచ్చు. ఏమీ తేల్చలేకపోవడమే మన పురాణ, ఇతిహాసకథలలో ఉన్న బ్యూటీ. నా మటుకు నాకు పురాణ ఇతిహాసకథలలో చారిత్రకతను అన్వేషించడమే గొప్ప ఉత్తేజకర వ్యాసంగం. ఈ అన్వేషణలో నేను పొందిన మజాను పాఠకులలో ఏ కొందరు పొందినా నా ప్రయత్నం సఫలమైనట్టే.

 – కల్లూరి భాస్కరం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)

 –

 

 

అనువాదం ఒక బిందువు…అంతే!

mukunda cover final

సాలెగూడుని ఒకచోట నుండి తీసి, మరొకచోట వేలాడ దీయడం, అనువాదం. ఎంత జాగ్రత్త పడ్డా అది మొదటి సాలిగూడు కానే కాదు. దాని అందం ఆకారం ఎంత పోతుందో, చూస్తే చాలు ఏవరికైనా తెలుస్తుంది. పైపైన ఎంత నష్టం జరుగుతున్నా, కేంద్రం చెడనంతవరకూ అది జీవంతో ఉన్నట్టే.  కవిత్వానువాదమూ అంతే. సాలెపురుగు తన గూడుని అవసరంకొద్దీ మళ్లీ సరిచేసుకున్నట్టు, ఫలితం ఎప్పుడూ సమగ్రంగా ఉండకపోయినా, శతాబ్దాల తరబడి, అనువాదకుడు అనువాదాలు చేస్తూనే ఉన్నాడు. 

 

ప్రేమ, విశ్వాసం, దుఃఖం, అహంకారం లాంటి భావావేశాలు చాలా వరకూ అన్ని భాషల్లోనూ ఒకటే కావడంతో అవి అనువాదానికి సులువు. దేశభక్తి మూల్యాలు, రాజభక్తి అనుసరణలు లాంటివి ఆయా సంస్కృతుల్లోనే అర్ధం చేసులోగలం. అంత లోతుగా వాటిని అర్ధం చేసులోలేకపోయినా, అనుభూతులు స్థలాలు ఊహించుకుని అనుభవంలోకి తెచ్చుకోవచ్చు.  ఎక్కడివైనా, ఎలా ఉన్నా, ఏ భాషలోనైనా, రంగు వాసన ఆకరాలు వేరైనా,  పూలు పూలే.  కవిత్వమూ అంతే! నాకు నచ్చినవి , అనువాదం చేయగలను అనుకున్నవి , విశ్వజనీనమైనవి, నాకు తెలిసి అంతకుముందు తెలుగులో అనువాదం కానివి, ప్రాముఖ్యం పొందినవి మాత్రమే నేను అనువాదానికి తీసుకున్నాను. అనువాదం చేసిన కవితలన్నీ ఆంగ్లానువాదాలనుండి తీసుకున్నవే. ఎవరో ఒకరు ఏదో ఒక కవిత ఇచ్చి నన్ను అనువాదం చేయమంటే నేనది నా సంతృప్త్తి మేర బహుశా నేను చేయలేక పోవచ్చు. ఆ కారణంగానే నా ప్రణళికలో దొరికిన కవితల్ని మాత్రమే చేస్తున్నాను. అవి చాలావరకు నాకు సంతృప్తిని సంతోషాన్ని ఇస్తున్నాయి.

 

మూలానికి విధేయుడిగా ఉండే ప్రయత్నమే ఎక్కువ చేసాను. భావాన్ని అనుసరించి స్వేచ్ఛ తీసుకున్నవి చాలా తక్కువ. అనువాదమే అయినా దాదాపు మన కవిత్వమే అనిపించే ప్రయత్నం మాత్రం ఉద్దేశపూర్వకంగానే చేసాను. అలాగే అందరికీ అర్ధమయే రీతిలో  ఉండాలనుకున్నది మరొకటి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనువాదం అనువాదమే. అందులోనూ కవిత్వ అనువాదం, కవి తన కవిత్వాన్ని తానే చేసుకున్నా, స్వయానా ఆ కవికే అంత సంతృప్తి నివ్వక పోవచ్చు. అలా అని అనువాదాలు చేసుకోకపోతే, ఇతర భాషల్లోని గొప్పతనాలు ఆ కాసింతైనా మనకు తెలియకుండా పోతాయి.

 

అయితే ఏ అనువాదమూ సర్వ సమగ్రం కాదు. ఏ అనువాదమూ అందరినీ సంతృప్తి పరచలేవు. మూల భాషనుండి వచ్చిన అనువాదాల్లో కూడా అనేక భాషాంతరాలున్నాయి. ఒకే కవిత అనువాదం వివిధ అనువాదకులు చేసింది, ఆశ్చర్యంగా వేటికవే భిన్నంగా ఉన్నాయి. చేసిన వారందరూ ప్రసిద్ధ కవులూ, అనువాదకులే అయినా, ఎవరి అనువాదం సరైనది, ఎవరిది కాదు అన్న సందిగ్ధం నన్ను ఒక్కోమారు ఇబ్బందుల్లోకి నెట్టేది. వాటన్నింటిలో ఉన్న భావార్ధం చాలా వరకూ ఒకటే ఉండటంతో ఆ కవిత ఆత్మని అవి పట్టిచ్చేవి. అది ఆధారంగా చేసుకుని అనువాదం చేసినవీ ఉన్నాయి. చెప్పొచ్చేదేమిటంటే భావార్ధం చెడనంతవరకూ ఏ అనువాదమయినా భరించగలమన్నదే. మూల భాషనుండి ఆంగ్లంలోకి, ఆంగ్లం నుండి తెలుగులోకి వచ్చిన అనువాదాలు రెండు వంతెనల్ని దాటొచ్చినవి.మొదటి వంతెనలో లోపాలతో బాటు (ఏమన్నా ఉంటే) రెండవ వంతెనలో లోపాలు కాడా తోడయితే, ఆ అనువాదం ఎంత లోపభూయిష్టంగా ఉంటుందో ఎవరైనా ఊహించుకోవచ్చు.   మూలంలో లేనిది అనువాదంలో కనిపించినపుడు అది మూల రచయితకే కాదు, ఆ మూలం తెలిసిన ఎవరినైనా ఇబ్బందిపెడుతుంది.

 

ఎవరెంత అద్భుతంగా చేసినా, మూల భాషలోని సౌందర్యాన్ని సంగీతాన్ని అనువాదంలో తేలేకపోవడమే అనువాద ప్రక్రియలోని అతి పెద్ద విషాదం.

 

చేయాలనుకుంటే సముద్రమంత సాహిత్యం అనువాదకుడి ముందుంటుంది. ఎంత చేసినా అందులో కొన్ని బింధువుల్ని మాత్రమే స్పృశించగలుగుతాడు. వాటిల్లో నచ్చినవి కొన్నయితే, నచ్చనివి ఇంకొన్ని. నచ్చనంత మాత్రాన అవి మంచి కవితలు కావని చెప్పలేము. అలాగే అనువాదం చేయగలిగినవి కొన్నయితే, అనువాదం చెయలేనివి ఇంకొన్ని. కవుల, ఆంగ్ల కవిత్వానువాదాలు సంపాదించగలగడం ఒక కష్టమయితే, చదివిన వాటిల్లో కవితల్ని ఏరుకోవటం మరొకటి. అనువాద కష్టాలు ఎలాగూ తప్పనివి. తీరా ఇంతా చేసాక సంతృప్తి నిచ్చిన వాటినే నలుగురితో పంచుకోగలం కదా! అనువాదం చేసినా అలా ఏదో కొంత అసంతృప్తి మూలాన వదిలేసిన కవితల సంఖ్య కూడా తక్కువేమీ కాదు.

 

మంచి సాహిత్యం ఎక్కడైనా అర్ధవంతమైనదే. అలా కాని పక్షంలో రూమీ, హఫీజ్, లీపో, వాంగ్ వెయి, హూ షీ, పాబ్లో నెరూడా, యెహూదా అమీహాయి, షేక్స్ పియర్, చెస్వ మిలోజ్, ఎమిలీ డికిన్సన్, ఖలీల్ జీబ్రాన్ లాంటి వారి కవిత్వాల్ని ప్రపంచవ్యాప్తంగా అనువాదంలోనైనా ఎందుకు చదువుతారు. గొప్ప సాహిత్యానికున్న విశ్వజనీనత మూలంగా, అవి సమయానికి, స్థానికతకు, భాషకు, సిద్ధాంతాలకు అధిగమించి మొదట ప్రచురించబడ్డ దగరనుంచి శతాబ్దాలతరబడి నిలబడగలుగుతాయి. అస్పష్టతగా ఉన్న కవితలే అనువాదాల్లో ఎక్కువ ఇబ్బంది పెట్టేవి. నైఘంటుక నిర్మాణాత్మక విషయాల్లోను ఒక సందిగ్ధ స్థితి ఎదుర్కోవల్సి వచ్చేది. జాతీయాలు, సహసంబంధమున్న పదాల అనువాదంలోను సరైన సమజోడీలు దొరకనపుడు, తట్టనపుడు పడ్డ ఇబ్బందులు ఇన్నీ అన్నీ కావు.

 

ఏ కవితైనా మనసులో ఇంకేవరకూ అనువాదానికి లొంగేది కాదు. సాంస్కృతిక, భాషాపరమైన, రసజ్ఞాన సంబంధమైన విషయాలపట్ల ఇబ్బందులతో బాటు, భాషా పరిజ్ఞానం లాంటి పరిమితుల మూలంగా కూడా కొన్ని కవితలు నెలలతరబడి తీసుకున్నవీ ఉన్నాయి. అనువాదమైనాక ఆ కవితలోని అందం కవిత్వం మరింత ఆనంద పరిచిన సన్నివేశాలూ ఎక్కువే. అనువాదం ఒకవిధంగా లోతుగా అతి సన్నిహితంగా చదవడం లేదా ఆ మూలానికి లొంగిపోవడం లాంటిది. అందుకే బహుశా మామూలుగా చదివినప్పటికంటే అనువాదం చేసినపుడు ఆ కవిత అర్ధమైన విధానం ఆశ్చర్యపరుస్తుంది.

 

అనేకమంది కవుల్ని విస్తృతంగా చదివి ఆనందించడం నా అదృష్టంగానే నేను భావిస్తున్నాను. ఆ అదృష్టాన్ని అందరితో పంచుకోవాలన్న ప్రయత్నమే అనువాదం. నేను లాభ పడిన దానిలో ఏకొద్దిగానైనా అందరితో నేను పంచుకోగలిగితే, అదే నాకు ఆనందాన్ని కలగజేసే అంశం.

 

మనం రాస్తున్న మాటాడుతున్న  ప్రతీదీ అనువాదమే, ఔనన్నా కాదన్నా అన్ని అనువాదాలూ ఒక విధంగా సృజనే. ఎన్ని కష్టాలు పడ్డా, అందరినీ సంతృప్తి పర్చలేకపోయినా,  అనువాదకుడు తన అనువాదాలను చూసి, అందుకే స్వీయ రచన చేసినంత సంబరపడతాడు.

 

ఏది ఏమైనా అనువాదకుడు ఎరువుతెచ్చుకున్న కాంతిని అందరికీ ఆనందంగా పంచుతున్న చంద్రుడని నేను భావిస్తాను.

 

–          ముకుంద రామారావు

వర్తమాన కథకి ఒక వరం!

         వరలక్ష్మి మంచి  కథకురాలు  ( story writer ) మాత్రమే కాదు.. ఆమె ఉత్తమశ్రేణికి చెందిన కథాకారిణి ( story teller )కూడా. కథను రూపవంతంగా,సౌందర్యవంతంగా ,ఆలోచనాత్మకంగా అందివ్వడమొక్కటే కాకుండా పఠిత హృదయంలోకి పూవులోనికి పరిమళాన్ని ప్రవేశపెట్టినట్టు కథయొక్క ప్రాణప్రదమైన కథనాన్నీ, ఆత్మనూ విభ్రమపూర్వకమైన సంలీనతతో గ్రాహ్యపర్చడం ఒక మంచి కథాకారుడు చేయగల పని. అలా చేయగల్గితే కథ శ్రోత/పాఠకుడి హృదయంలో ఒక ముద్రగా స్థిరపడి, జ్ఞాపకమై శాశ్వతమైపోతుంది చిరకాలం. కథను సరళంగా, ఆసక్తికరంగా చెప్పగల్గడం ఒక గొప్ప కళ. అది కొద్దిమందికిమాత్రమే సాధ్యమయ్యే రసవిద్య. శైలి,శిల్పం,యితరేతరమైన సాంకేతిక రూప విన్యాసాలను అక్షరాలకూ , వాక్యాలకూ, అలంకారాలుగా కూర్చి , ‘కథ ‘ను ఒక భారీ సాహిత్యభూషణంగా అందివ్వడంకూడా ఒకరకమైన విలక్షణతే కావచ్ఛు.

varalaxmi

కాని నిరలంకారమైన వచనం, నడక, ప్రస్తావనలతో,కథాంశంతో ఒట్టి కొబ్బరినీళ్ళ స్వచ్ఛతవలె కథను పఠితకందివ్వడం అంత సులభమైన పనికాదు. కాగా అది కేవలం కొద్దిమంది, కొంతకాలమే.. కొన్ని సందర్భాలలోమాత్రమే చేయగల మార్మిక నైపుణ్యం. ఒక పెద్దిభొట్ల సుబ్బరామయ్య, ఒక సి. రామచంద్రరావ్ (వేలు పిళ్ళై )కొంతకాలం మంచి కథాకారులుగా   పాఠకుల్లో  ‘ ఇంకిపోయే’రీతిలో కొన్నికథలను రాశారు. కాని వాళ్ళే అంత అందంగా,జీవవంతంగా యిప్పుడు  కథలను  చెప్పలేకపోతున్నారు.  కాబట్టి మంచి కథను సరియైన సరళ సౌందర్యంతో,జిగితో, బిగువుతో కొందరు మాత్రమే,కొంతకాలమే నిర్మించి అందిస్తారని భావించవచ్చనిపిస్తోంది. ఐతే  ఉత్తమ కథా నిర్మాతలైన కొందరు సఫల తెలుగు కథకుల రచనలను అనుశీలించినపుడు అత్యధిక పాఠకుల మన్ననలు పొందిన కథలన్నీకూడా సమాజంలోని అధిక సంఖ్యాకులైన పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు,వాళ్ళ నిశ్శబ్ద వేదనలు,పోరాటాలు,నిస్సహాయతలు, అనివార్యతల్లోనుండి మాత్రమే నీటిఊటవలె పుట్టుకొచ్ఛినట్టు  స్పష్టమౌతోంది. ఐతే రచయిత తన టార్గెట్ ( లక్ష్య ) పాత్రల జీవితాల్లోకి అధ్యయనాత్మక దృష్టితో స్వయంగా ప్రవేశించి తరచి తరచి పరిశీలించినపుడు మాత్రమే శరీరంలోకి జీవంవలె.. కథలో ప్రాణం ప్రేరితమౌతుంది.

 

అప్పుడే కథ సార్వత్రికతను పొంది స్ఫోరకమై పాఠకుల హృదయాలను జయించడం మొదలెట్టి శాశ్వతమౌతుంది . ఐతే ,కథయొక్క అతి గోప్యమైన ఈ నిర్మాణ రహస్యం వరలక్ష్మికి బాగా తెలుసు. ఇది ఆమెకు అత్యంత సహజసిద్దంగా సంక్రమించిన విద్య. ఈ విషయం వరలక్ష్మియొక్క ఏ కథను చదివినా ఇట్టే సులభంగా తెలుస్తుంది ఎవరికైనా. ఇంతవరకు కేవలం మూడు కథా సంపుటాలను మాత్రమే వెలువరించి రసజ్ఞులైన కథాప్రియులకందించిన వరలక్ష్మికథలు మంత్రసాని.,ప్రత్యామ్నాయం,చిన్నమామయ్య,బాంధవ్యం,గమనం,ఖాళీ సంచులు,మట్టి-బంగారం,గాజు పళ్ళెం ..ఇలా ఒకటా రెండా..ఎన్నో ఉత్తమ కథల పరంపరం. తొంభైల్లోనుండి .. రెండువేల ఏడువరకు వరలక్ష్మి తెలుగు కథా రంగంలో  ‘ స్టార్ రచయిత్రి’ . క్రికెట్లో సచిన్,కోహ్లీ వలె తెలుగు కథారచనా క్షేత్రంలో..బ్యాట్ పట్టుకుంటే సెంచరీలవలె..ఈమె ఏదైనా కథల పోటీకి కథ రాసిందంటే తప్పనిసరిగా ఏదో ఒక బహుమతే. తన మూడు కథా సంపుటాల్లోని నలభై ఏడు కథల్లో ముప్ఫై రెండు కథలు పోటీల్లో బహుమతులు సాధించినవేనని తెలుసుకుంటే ఆశ్చర్యంతో పాటు విభ్రమం కల్గుతుంది.

ఐతే..  ఈ విద్య వరలక్ష్మికి ఎలా అబ్బింది,ఈ కథా సృష్టి నైపుణ్యం ఎలా ఈమె హస్తగతమైందీ.. అంటే.. ఆమె మాటల్లోనే —

పుట్టినప్పట్నుంచీ ఇప్పటివరకూ కేవలం పల్లెటూరి జీవిత సౌందర్యాన్నిఅనుభవిస్తూ, సాధారణ మనిషియొక్క మూలాల్లోకి తొంగిచూస్తూ..పొలంలో ఉన్న నాన్నకు అన్నం పట్టుకెళ్ళి దారితప్పి గట్లన్నీ తిరిగి తిరిగి ఎక్కెక్కి ఏడ్చి, నాన్న గొంతెత్తి పాడిన పద్యం మార్గం చూపించగా గమ్యాన్ని చేరి నాన్న భుజంమీద వాలిపోయిన ఆనందాలు.. అమ్మ ఎప్పుడూ సన్నని గొంతుతో పాడే ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ‘పాటలు.. కన్పించిన ప్రతి చెట్టునూ,పుట్టనూ ప్రేమించి పరవశించి రాసుకున్న కవిత్వాలు, ఊరి మార్గాలన్నింటా విరిసి మురిసిన తురాయి చెట్ల ఎర్రని అటవీ సౌందర్యాలు. . అక్కడ్నుండి ఎదుగుతున్నకొద్దీ అవగాహనలోకొచ్చిన , రక్త సంబందీకుల్లోనే కొరవడిన ప్రేమలు,ఆ ప్రేమలకు దూరమై విలపించే స్త్రీలు, విలాపంలోనూ మానవత్వాన్నీ,క్షమనూ వదలలేని స్త్రీల బలహీనతలు..కూడు పెట్టని కులవృత్తులు,సామాన్యుని బతుకుతెరువుని లాక్కుంటున్న ఆర్ధిక విధానాలు,ప్రపంచీకరణ పెనుతుపానులో పల్లెలు నిర్వీర్యమౌతున్న విధ్వంసకర దృశ్యాలు.. హింసతో ప్రజ్వరిల్లుతున్న ప్రపంచ రాజకీయాలు కంటనీరు తెప్పిస్తూండగా … అని రచయిత్రి రాసుకున్న ‘ నా మాట’ లోని..ఈ సందర్భాలన్నీ.. వరలక్ష్మి కథలకు వస్తువులుగా , ప్రాణవాయువులుగా రూపొందాయి. అందుకే ఆమె కథలన్నీ.. దాదాపు విషాద జీవిత శకలాలను విడమర్చి చూపి కంటతడిపెట్టించేవీ,హృదయాన్ని విలవిల్లాడించేవీ.. అంతిమంగా  దుఃఖోద్విగ్న మహా దివ్యానుభూతిని సిద్దింపజేసేవీ.

pho-3

‘ ప్రత్యామ్నాయం’ కథలో కోతినాడించి జీవించే సిద్దప్ప, ఒక అవిటి శిష్యుడు..శవప్రాయపు మనసున్న భార్య ఈరి,అంగవైకల్యంగల రెండు ఫీట్ల ఎత్తున్న అనాకారి కొడుకు..ఒక కోతి..ద్రిమ్మరి జీవితం..ఇదీ నేపథ్యం.

ఈ బడుగుజీవుల జీవవంతమైన పలుకుబడుల భాషను పట్టుకుంది వరలక్ష్మి. ఈ సంభాషణ చూడండి.

‘ థూ నీయమ్మ.. సూసి సూసి కోతి నా కొడుకుని కన్నావుకదే..ఈడికి పదారేళ్ళు ముడ్డికిందికొచ్చాయంటే ఎవడైనా నమ్ముతాడా అసలు.?’ అన్నాడు సిద్దయ్య.

‘ సాల్లే నీ తాగుబోతు మొకానికి ఇంతకన్నా అందమైన కొడుకు పుట్టేత్తాడేటి.? తెల్లారి లేత్తే నీ మొకం,నువ్వాడించే కోతి మొకమేకదా దర్సినాలు..ఇంకేటవుద్దిమరి !’ అని తిప్పికొట్టింది ఈరి.

ఐదు పేజీల ఈ చిన్న కథ ‘ ప్రత్యామ్నాయం’లో తాగుబోతు సిద్ధయ్య అనూహ్యంగా చచ్చిపోయి ,కోతిని ఎవరో దొంగిలించుకుపోతే..బతుకుతెరువు ఎలాగో అని దుఃఖంతో  విలవిల్లాడ్తున్న ఈరి  ముందు అంగవికలుడైన కొడుకు కోతి గొలుసును తన మెడలో ధరించి ఒక కొసను తల్లి చేతికిచ్చి ‘ నన్ను కోతిలా ఆడించి బతుకమ్మా’ అని సంజ్ఞ చేసినపుడు.. ముగింపు పాఠకుని గుండెను పిండేస్తుంది. దుఃఖం సముద్రమై పోటెత్తుతుంది

‘ బాంధవ్యం’ కథలో.. మరణంకు సమీపంలో ఉన్న తండ్రి .. కూతురు శ్యామల.. వృద్ధాప్యం..నిస్సహాయత,అనివార్యత. ..అంతిమంగా  ఒక దీర్ఘనిట్టూర్పును మిగిల్చే ముగింపు.

‘ చిన్న మామయ్య’ కథలో.. చిన్నప్పట్నుండీ తనను ఆడించి, స్నేహించి,తోడుగా పెరిగి.. పెళ్ళి చేసుకోవాలని తలచి గాఢంగా.. అజ్ఞాతంగా ప్రేమించి..బీదరికంవల్ల  పెళ్ళి సాధ్యం కాక..వనజను కోల్పోయిన చిన్నమామయ్య జీవితమంతా పేదరికంలో,దరిద్రంలో,బతుకు పోరాటంలో ఓడి ఓడి..కడకు మురికివాడలోని కాలువప్రక్క దీనాతిదీనంగా చచ్చిపోతే..కేవలం మానవత్వంతో.. ఎక్కడో ఓ  మూల దాగిఉన్న రవ్వంత తడితో శవాన్ని చూడ్డానికి వెళ్ళిన వనజ..దుఃఖంతో  తిరిగొస్తూంటే..ఎవరో బిచ్చగానివంటి పిల్లవాడు ఒకడు పరుగెత్తుకొచ్చి చిన్నమామయ్య బాపతు చిన్న కాంపస్ బాక్స్ అంతటి పాత ప్లాస్టిక్ పెట్టెనందిస్తే.. దాంట్లో..ఎప్పుడో.. ఎవర్నో అడిగి తెచ్చిన డబ్బా కెమెరాతో తీసి..   ఫోటో రాలేదని తనతో చెప్పి.. జీవితాంతం పదిలంగా దాచుకున్న తన పాత    ఫోటో.. అప్పుడప్పుడు తనను కలిసినప్పుడు దారిఖర్చులకని యిచ్చిన చిల్లర డబ్బులు..పాత నోట్లు ..నాణేలు..

ఎందుకో హృదయం కరిగి..  మనసు  పగిలి  దుఃఖంతో నిండిపోతుంది.

‘ ఈ జీవితాలు ఇలా ఎందుకున్నాయి’ అని నిశ్శబ్ద రోదన ఆవహిస్తుంది.

matti bangaaram

అలాగే..’ మల్లెపువ్వు’ కథలో..  మల్లెపువ్వువంటి మణిరత్నం.. విధికృతంగా ప్రాప్తించిన మొగుడు యాకూబ్.. ఇద్దరు పిల్లలు డేవిడ్,రోజీ.. దిక్కుమాలిన మొగుడితో వేగలేక వదిలేసి   నర్స్ గా   ఒంటరి జీవితం.. పిల్లలను పెంచుతూ.. డేవిడ్ ను ఇంజనీర్ , రోజీని డాక్టర్ చేసి.. చివరికి యిద్దరిచేతా ఈసడింపబడి,గాయపడి..  దుఃఖితగా   మిగిలి.. రచయిత్రి మణిరత్నంను.. వాడి నలిగినా మల్లెపువ్వుతో పోల్చి చెబుతూ.. ముగింపు గాఢ దుఖంతో తల్లడిల్లజేస్తుంది.

‘ ఖాళీ సంచులు’ కథలోకూడా అంతే..దుర్గ,తమ్ముడు వెంకటేష్, మరదలు శారద,జీవితంలో కలిసి విడిపోయిన కుప్పుసామి..  అన్నీ మనముందు కదలాడే,మనకు బాగా తెలిసిన మనుషులే పాత్రలై.. చివరికి.. ‘ ఈ జీవితాలు ఇలా కాకుండా.. ఇంకోలా ఉంటే ఎంత బాగుండు..’ అన్న ఏదో ఒక భాషకందని  మౌనక్షోభ.. గాఢ విషాదం.

అలా అని .. వరలక్ష్మి ఏ కథలోనూ పలాయనాన్నీ, ఓటమినీ, నిస్సహాయమైన లొంగుబాటునూ సమర్థించి చెప్పలేదు.  అన్ని కథల్లోనూ ‘ మన జీవితం మన చేతుల్లోనే ఉంది.. సరిగ్గా గుర్తించి నిన్ను నువ్వు పునర్నిర్మించుకో ‘ అనే ఉదాత్తమైన సందేశాన్నే అందించింది బాధ్యతతో. ఈమె కథల్లో చాలావరకు తన ముగింపు తామే వెదుక్కుని గమ్యాన్ని చేరుతాయి పాత్రలు.. ధైర్యంగా,ప్రతిఘటిస్తూ, సచైతన్యంగా.

వరలక్ష్మి కథల్లోని ప్రత్యేకతలను ఉల్లేఖిస్తే.. అవి.,

1. ఉత్తమశ్రేణి కథకు ప్రధాన లక్షణమైన ఉత్కంఠభరిత ఆరంభం.

2.గోదావరి జిల్లాలల్లోని ప్రజల జీవిత విధానం,నుడికారం,ముఖ్యంగా బడుగు వర్గాల్లోని అలవాట్లు ..బతుకు..వీటిపట్ల  సమగ్రమైన అవగాహన.

3.ఒట్టి ఊహ కాకుండా.. వాస్తవ జీవితాల్లోకి రచయిత్రి ప్రవేశించి ,అధ్యయించి చేసిన జీవవంతమైన సృజన.

4.నిపుణుడైన శ్యాం బెనిగల్,గోవింద్ నిహలాని,సంతోష్ శివన్ వంటి చేయి తిరిగిన చిత్ర దర్శకులవలె..కథా సన్నివేశాలను పఠితముందు రూపుకట్టించడంలో అద్భుతమైన ప్రతిభ.

5.కథలకు నిరలంకార రూప సౌందర్యాన్ని కూరుస్తూనే కథలు బహిర్ అంతర్ వర్చస్సుతో వర్ధిల్లేట్లు నిర్మించి పాఠకుడికి వివేచనార్థం కొంత ఖాళీ ( space )ను వదిలి ‘ open ended ‘ గా ముగించి తన కథలకు ‘ఉత్తమ’ స్థాయిని సాధించి పెట్టడం.

.        6. అన్నింటినీ మించి..నిర్మలాకాశం  మహా సౌందర్యవంతమైనట్టు ..నిరాడంబరతతో కథను నడిపించి ..క్లుప్తతతో , సరళతతో ఉన్నతిని చేకూర్చడం.,

ఇవీ వరలక్ష్మి విశిష్టతలు.

అరవై ఎనిమిది కవితలతో 2003 లో వరలక్ష్మిది ఒక కవితా సంపుటి వెలువడింది. అది ‘ ఆమె’.ఇందులోని కవితలన్నీకూడా ఈమెను మంచి భావుకురాలిగా మనకు పరిచయం చేస్తాయి.

‘ కొబ్బరి   చెట్ల ఆకులు / నీడల  కళ్ళతో ఎదురుచూపులు చూస్తూ /చిరుగాలి అలికిడైనా/ఉలికులికిపడ్తున్నాయి. ‘…యిలా ఉంటుంది నడక. ప్రకృతిని  అక్షరాల్లో ప్రతిక్షేపించడం ఇది.

ప్రస్తుతం ‘ విహంగ’ వెబ్ పత్రికలో ‘ జ్ఞాపకాలు’ రాస్తున్న వరలక్ష్మిని చదువుతున్నవారికి భిన్న బాల్య స్మృతుల్లో కరిగిపొతూండడం అనుభవమే.

ఇప్పటికే ‘ చాసో’ పురస్కారం,’ రంగవల్లి’ పురస్కారం,అజో-విభో అవార్డ్, తానా, ఆటా బహుమతులు, తెలుగు విశ్వవిద్యాలయ కథా పురస్కారం వంటి ఎన్నో అవార్డ్ లను పొంది ప్రసిద్దురాలైన కె.వరలక్ష్మికి ఇప్పుడీ ప్రతిష్టాత్మకమైన ‘ సుశీలా నారాయణరెడ్డి సాహితీ ( జీవిత సాఫల్య ) పురస్కారం ‘ విలక్షణమైన కథకురాలికి విశిష్ట  గౌరవమే. అభినందనలు.

కారణాలు తెలియదుగాని.. ఈ మధ్య వరలక్ష్మి కథలు ఎక్కువగా రాస్తున్నట్టు లేదు. మంచి కథకులు రాయకపోవడం కథాప్రియులైన పాఠకులను నిరాశపర్చడమౌతుందేమో . అలసట కల్గినపుడు విరామం కొద్దిగా అవసరమే..  కాని విరమణ తగదు. ఆమె ఆలోచించాలి..     మళ్లీ   మంచి కథలు రావాలి వరలక్ష్మినుండి.

 

( 17 జనవరి,2014 న రవీంద్రభారతి, హైదరాబాద్ లో  ప్రతిష్టాత్మక ‘ సుశీలా నారాయణరెడ్డి సాహితీ పురస్కారం ‘ స్వీకరించబోతున్న సందర్భంగా..,)

 

                                                                                                                                                                                         – రామా చంద్రమౌళి