Archives for January 2014

“నేను”తో వొక కొత్త విమర్శ ప్రయోగం!

 

(ప్రతిష్టాత్మకమయిన లోక్ నాయక్ సాహిత్య పురస్కారం ఈ ఏడాది ప్రసిద్ధ రచయిత్రి ఓల్గా కి దక్కింది. ఈ సందర్భంగా ఓల్గా సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటి “సహిత” గురించి 2012 లో అఫ్సర్ రాసిన  వ్యాసం )

19BG_VOLGA_1336248e

నాకు చాలా ఇష్టమయిన పది పన్నెండు ప్రపంచ నవలల్లో వర్జీనియా వుల్ఫ్ రాసిన “టు ద లైట్ హౌస్” వొకటి. అది నేను నా తొలినాళ్లలో చదివిన నవల అవ్వడం వొక వ్యక్తిగత కారణం.   బీయ్యే ఇంగ్లీష్ చేసేటప్పుడు ఆధునిక ఇంగ్లీష్ నవల- సాహిత్య సిద్ధాంతాలు  స్పెషలైజేషన్ గా తీసుకుని, మొదట చదివి, విశ్లేషించిన పది ఆంగ్ల నవలల్లో ఇదీ వొకటి.  మిగిలిన ఆ తొమ్మిది నవలలు అంతగా మళ్ళీ మళ్ళీ చదివిందేమీ లేదు. కానీ  “టు ద లైట్ హౌస్”  నన్ను ఇప్పటికీ వెంటాడే నవల. నాలుగేళ్ళకోసారి నా చేతులు అప్రయత్నంగా ఆ నవలని తీసుకుంటాయి, ఆ చేతులు నొప్పెట్టినా సరే,  చివరి పేజీ దాకా చదవనిదే వదలనివ్వదు నవల .   

ఈ  నవలలో వొక స్త్రీ పాత్ర ఇంకో పురుష పాత్రని అడుగుతుంది,

“ఇంతకీ మీ నాన్నగారు రాసిన ఆ పుస్తకాలన్నీ దేన్ని గురించి?” అని-

అతను ఇంకే తడబాటూ లేక వెంటనే “subject, object and the nature of reality” అంటాడు.

“ఓర్నాయనో! ఏమిటదీ??” అని బిక్క మొహం వేస్తుంది ఆవిడ.

అప్పుడు పాపం, ఆమె  ఏ సాహిత్య కళా వాసనలూ లేని “వంటింటి కుందేలు” అన్న స్పృహ కలిగి,  ఆమెకి అర్థమయ్యే భాషలో చెప్పాలని అతను “ఈ కిచెన్ టేబులు గురించి ఆలోచించు, నువ్వు దాని దగ్గిర లేనప్పుడు!” అంటాడు, కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులు అంత తీవ్ర స్థాయిలో కాకపోయినా, “ఆడముండల్తోనా ఆలోచనా?” లాంటి ఏదో వొక భావంతో!

ఆమెకి ఆ ముక్క  అర్ధమయ్యిందా కాలేదా అన్నది వేరే సంగతి. నాకు మాత్రం చాలా కాలం అర్థం కాలేదు, కానీ, చాలా సందిగ్ధంలో పడి, తరవాత తరవాత శోధిస్తే తేలిందేమిటంటే ఇది నా బాధ కాదు, ప్రపంచం బాధ అనీ!

పాశ్చాత్య సాహిత్య విమర్శలో తల పండిన సాహిత్య విమర్శకులూ, సామాజిక  సిద్ధాంతకర్తలూ  పదే పదే  ఈ సంభాషణని ప్రస్తావిస్తూ వచ్చారు.  వివిధ కాలాల్లో వచ్చిన వీళ్ళంతా  కూడా ఆయా కాలాల్లో ఆయా రకాలుగా దీన్ని అర్థమో, అపార్థమో చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికీ ప్రతి నాలుగేళ్ళకి వొక సారి ఈ నవల నేను చదువుతూనే వున్నా, చదివిన ప్రతి సారీ ఈ సంభాషణ నాకు  వొక్కో కాలంలో వొక్కో  రకంగా అర్ధమయ్యింది. ఒక అర్ధానికీ ఇంకో అర్ధానికీ పొంతన లేదు. అలా పొంతన లేకపోవడానికి కారణం నేను ఆ సంభాషణ గురించి ఆలోచించే స్థితిలో, ధోరణిలో మార్పు రావడమే!

కాలానుగుణంగా మారుతున్న ఆలోచనలలో  మారుతూ వున్న ‘నేను” ముఖ్యమయిన పాత్ర తీసుకుంటోంది. ఆ “నేను” చుట్టూ మారే స్థల కాలాలు అంతకంటే గట్టి పాత్ర తీసుకుంటున్నాయి.  అటు నించి నరుక్కురావాలంటే, ఇప్పుడు  ఆ మగవాడి మాట అతనికే అప్పజెప్పాలి  స్త్రీత్వపు వైయక్తిక స్వరంతో – ‘విషయం, విషయి, వాస్తవికత స్వభావం’ ఎప్పటికప్పుడు మారిపోతాయి.  అంతే కాదు, ఆ మాటలు ఎవరు అంటున్నారు, ఎవరు వింటున్నారు అన్న ప్రశ్నని బట్టి కూడా వాటి అర్ధాలు మారిపోతాయి. అంటే, పఠనం అనేది కేవలం వొకే వైపు దూసుకెళ్లే ట్రాఫిక్ కాదనీ, అది చదువరి/ శ్రోత/ రచనలోని సాంస్కృతికత/ చదువరి, పఠిత సాంస్కృతికత మొదలయిన అంశాలు పఠనాన్ని ఒక performance గా మారుస్తున్నాయి. ఎవరు ఎవరికోసం చదువుతున్నారన్నది performativity కోణం నించి అడిగే ప్రశ్న. ఎవరు ఎవరి కోసం అన్న ప్రశ్నలో సమాధానాలు  “నేను” లోనే వున్నాయి.  వొక్కో సారి విషయం (subject) మారకపోయినా, విషయి మారకపోయినా, ఈ “నేను’ దాన్ని చూసే “subjective” దృష్టి వల్ల మొత్తం వాస్తవికత స్వభావమే మారిపోవచ్చు.

ఓల్గా గారి “సహిత” వ్యాసాలు చదువుతునప్పుడు ఆ మార్పు ఎట్లా వుంటుందో కళ్ళకి కట్టినట్టు తెలుస్తుంది. “సహిత”లో వొక రచయిత తన పఠనానుభవంలోకి తీసుకువెళ్లడం వొక ప్రధాన ప్రక్రియ. అయితే, అదే సమయంలో ఆ పఠనానుభవంలో “తను” ఏమిటి? ఆ “తను” ఎవరికోసం గొంతు విప్పుతోంది? అన్న ప్రశ్నలు కూడా ముఖ్యమవుతున్నాయి.

స్త్రీ వాదం చర్చలోకి వచ్చేంతవరకూ చాలా మంది విమర్శకులు  ఆ సంభాషన్లో “అతను” చెప్పిన ఆ ముక్కకే పరిమితమయి మాట్లాడారు, స్త్రీ వాదులు ఆ విమర్శనంతా తుంగలో తొక్కి, అప్పటి వరకూ ఎవరూ పట్టించుకోకుండా వదిలేసిన  ఆవిడ పక్షం తీసుకొని, అసలక్కడ “కిచెన్ టేబులు ఎందుకు ఉదాహరణ కావాలి?” అన్న కొత్త  సాంస్కృతిక వాస్తవిక ప్రశ్న లేవనెత్తారు. అది ఎలాంటి ప్రశ్న అంటే, ఆ నవల రాసిన కాలంలో అంటే 1927లో అలాంటి వొక ప్రశ్నని వర్జీనియా వుల్ఫ్ కూడా వూహించి వుండదు. అదే విధంగా, ఓల్గా “సహిత”లో వివిధ వ్యాసాలలో లేవనెత్తిన సాంస్కృతిక ప్రశ్నలన్నీ సమకాలీన/ దృక్పథ-కేంద్రిత స్పృహలోంచి మొలకెత్తినవి. వొక విధంగా ఈ ప్రశ్నలు ఇప్పుడు మొలకలయిన భావనల అప్పటి అంకురాల అన్వేషణ “సహిత.”

వర్జీనియా వుల్ఫ్ నవలానంతర  ప్రశ్నల  నేపధ్యంలో తలెత్తిన చర్చల్లో ఇంకా వేరే అంశాలు చాలా వున్నాయి, ఒక సామాజిక సిద్ధాంత చర్చే వుంది.  కానీ, నేను ఇప్పుడు ఓల్గా సాహిత్య వ్యాసాల సంపుటి “సహిత” విశ్లేషణలో ఆ చర్చలోని రెండు అంశాలని మాత్రమే ప్రధానంగా తీసుకుంటున్నాను -అందులో మొదటిది  స్త్రీవాద వైయక్తికత (subjectivity), రెండోది: స్త్రీవాద సాహిత్య/సాంస్కృతిక చరిత్ర నిర్మాణం (feminist historiography). ఈ రెండు మౌలిక భావనలకీ వొక దాంతో ఇంకో దానికి సంబంధం వుంది, అలాగే, ఈ రెండూ  ఓల్గా సాహిత్య వ్యాసాల ‘సహిత’ కీ పునాది అని నా అభిప్రాయం. వర్జీనియా వుల్ఫ్ రాసిన “టు ద లైట్ హౌస్” నవలకీ, ఓల్గా తెలుగు సాహిత్య రంగంలో చేస్తున్న పనికీ కూడా కొన్ని పోలికలు వున్నాయి. అది ఇంకా లోతయిన తులనాత్మక విశ్లేషణ జరగాల్సిన విషయం కాబట్టి, ఇప్పటికిప్పుడు  ఆ విషయం జోలికి నేను  పోవడం లేదు.

ఇక ఈ వ్యాసం ముగిసే లోగా నేను చాలా గట్టిగా  వాదించదలచుకున్న అతి ముఖ్యమయిన విషయం ఇంకోటి  వుంది – ఈ  ‘సహిత’ వ్యాస సంపుటి కేవలం సాహిత్య వ్యాసాల సంపుటి కాదనీ, ఇది  ఓల్గా మేధోజీవన ఆత్మ కథ (intellectual autobiography) అని. ఈ వాదన కొంచెం సంక్లిష్టమయింది అని నాకు తెలుసు. కానీ, అది ఈ సందర్భంలో ముఖ్యమయ్యిందని నాకు కచ్చితంగా తెలుసు, ఈ వ్యాసం చదివాక అది  మీకు కూడా తెలుస్తుంది.

1

      వైయక్తికత అనే మాటని కాస్త తేలిక పద్ధతిలో, ఇప్పుడు మరీ ఎక్కువగా ప్రాచుర్యంలో వున్న  వ్యక్తిగతం(పర్శనల్)   అందాం. కానీ, ఈ ‘వ్యక్తి’కేవలం  ‘నేను’ పరిధికి  కుంచించుకు పోయే వ్యక్తి కాదని చెప్పడం కోసం, దాన్ని వొక భావనగా చర్చించే వుద్దేశంతో ‘వైయక్తికత’ అని కొంచెం భిన్నమయిన పదాన్ని వాడుతున్నాం. కానీ, అన్నీ విధాలుగా వ్యక్తిగతం అనే మాట కింద వచ్చే విషయాలే ఇందులో చర్చకి వస్తాయన్నది వాస్తవం. ఇంకా కొంచెం స్పష్టంగా చెప్పాలంటే, ఇప్పుడు అస్తిత్వం అనే భావనకి ఒక రూపాంతరం   వైయక్తికత.

తత్వశాస్త్ర చరిత్ర చాలా కాలం పాటు అస్తిత్వం అనే భావనకి సామూహికత పునాది అంటూ వచ్చింది. అనేక మతాల దర్శనాల్లో కూడా సామూహిక అస్తిత్వానికే పెద్ద పీట వేశారు. దాని ప్రకారం, సామూహికంగా వొప్పుదల అయిన కొన్ని భావనల సమాహారమే వైయక్తికత లేదా అస్తిత్వం. ఆ అస్తిత్వ చర్చలో వ్యక్తికి విడిగా వొక స్థానం అంటూ లేదు. కానీ, ఆధునికత అనే భావనలో  వైయక్తికతని అస్తిత్వానికి వొకానొక ముఖ్యమయిన లక్షణంగా గుర్తించడం మొదలయ్యింది. ఆశ్చర్యంగా ఈ పదాన్ని వొక భావనగా వుపయోగించిన మొదటి  తాత్వికుడు వొక కాల్పనిక కవి కొల్రిడ్జ్. 1821 లో కొల్రిడ్జ్ చెప్పిన అర్ధం– consciousness of one’s perceived states- చాలా కాలం పాటు  అదే ప్రామాణికంగా వుంది.

కానీ, ఈ వైయక్తికత అనేది కేవలం వొక వ్యక్తి అవగాహనా, అనవగాహన మీద ఆధారపడిన స్థితి కాదనీ, ఈ వ్యక్తి అస్తిత్వ భావన అనేక అంతర్ బాహ్య పరిస్తితుల మీద కూడా ఆధారపడి వుంటుందని అత్యాధునిక  సామాజిక శాస్త్రవేత్తలు చెప్పడం మొదలు పెట్టారు. ఈ కొత్త భావన ప్రకారం సమూహం ఎంత ముఖ్యమో, వ్యక్తీ అంతే ముఖ్యం. కానీ, ఆ వ్యక్తికి ఎన్ని కోణాలు వుంటాయన్నది ఇప్పుడు ముఖ్యమయిన ప్రశ్న.  2001 లో ఆంథోనీ ఎలియట్ ఏమంటున్నాడో చూడండి:

…..the self is also shaped and defined against the backdrop of…..political and public forces; yet the fabrication of the self, psychologically and emotionally, is rightly understood to involve something more subjectivity, particularly in the ways in which desire, emotion and feeling influence the conscious and unconscious experience of sexuality, gender, race and ethnicity.

కొల్రిడ్జ్ నుంచి ఇటీవలి ఎలియట్ దాకా వైయక్తిక అస్తిత్వం వొక భావనగా సాగించిన ప్రయాణంలో మనం చూడాల్సిన మార్పు ఏమిటంటే, వైయక్తిక అస్తిత్వం అనేది మనం అనుకుంటున్నంత వైయక్తికం కాదు. అందులో ఆ అస్తిత్వాన్ని సృష్టించే పబ్లిక్ శక్తుల ప్రమేయం తప్పక వుంటుంది. అత్యాధునిక వాదం పర్సనల్ కీ, పోలిటికల్ కీ మధ్య వుండే పరస్పర బంధాన్ని చెప్పే దాకా వెళ్తుంది ఆ పునాది మీదనే. విశ్వజనీనత అనే భ్రమ నుంచి బయట పడి, చాలా నిర్దిష్టంగా, స్థానికంగా  మాట్లాడడం మొదలెడితే తప్ప ఈ అస్తిత్వ కోణాల్ని సమగ్రంగా చూడలేమని నా వాదన.

గత పాతికేళ్లుగా తెలుగు సాహిత్య/సామాజిక చరిత్రని శాసించిన రెండు మౌలిక భావనలు – నిర్దిష్టత, స్థానికత. ఎన్ని వాదాలు వచ్చినా, ఎని వివాదాలు జరిగినా, ఈ రెండు మౌలిక భావనల్ని అవి తప్పించుకోలేవని నా అభిప్రాయం. తెలుగు సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం అంటూ జరిగితే, అది ఈ భావనల పునాదిగా జరగాల్సిందే. కానీ, భిన్న వైయక్తికతలు వుండే కాలంలో సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం ఎలా జరుగుతుందీ, దానికి తగిన వనరులు, ఆధారాలూ, పరికరాలూ మనకి వున్నాయా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. వున్నాయని నా విశ్వాసం. అయితే, ఇప్పుడు వున్న సంకుచిత వైయక్తిక ధోరణుల నించి కాకుండా, వైయక్తికతని దాని నిజమయిన అర్ధంలో అర్ధం చేసుకుని, చర్చిస్తే, మన చుట్టూ వున్న రచయితలే సాంస్కృతిక చరిత్ర నిర్మాతలు అన్న విషయం కూడా మనకి అర్ధమవుతుంది. ఓల్గా సాహిత్య వ్యాసాల్ని ఆ దృష్టి కోణం నుంచి చదివినప్పుడు నేను ఇలాంటి కొన్ని సాంస్కృతిక తీగల్ని కలుపుకుంటూ వెళ్లగలిగాను. వాటన్నిటినీ కలిపి వొక చోటి నించి చూస్తే, సమకాలీన సాహిత్య సాంస్కృతిక చరిత్ర గురించి కొన్ని సాధారణ లక్షణాల్ని క్రోడీకరించే (classification), కోడీకరించే (codification)  అవకాశం కూడా వుంది. ఆ సాధారణ లక్షణాల సమ్మేళనమే కొత్త సాహిత్య చరిత్ర నిర్మాణానికి పునాది అని నేను వేరే చెప్పకర్లేదు కదా!

అంటే, ఈ వ్యాసాలలో చాలా బలమయిన అస్తిత్వ కోణాలు కనిపించినప్పటికీ, వాటి మూలాలు అన్నీ మొత్తం సాహిత్య చరిత్రలో వున్నాయి. అందుకే, ఈ వ్యాస సంపుటి గురజాడతో –  కాదు, కాదు, మధురవాణితో – మొదలవ్వడం కాకతాళీయం కాదనుకుంటా.  తెలుగు సాహిత్యంలో స్త్రీ చర్చకి మంచి ప్రారంభం వుంది కానీ, కొనసాగింపు లేదని నేను గతంలో ఒక సారి చెప్పాను. ఆ ప్రారంభం గురజాడతో జరిగింది. ఓల్గా సాహిత్య వ్యాసాలు ఇప్పుడు ఈ 2011 లో కూడా గురజాడతో ప్రారంభం అవ్వడం నాకు యాదృచ్ఛిక్కమూ అనిపించలేదు, ఆశ్చర్యమూ అనిపించలేదు, గురజాడ తీసుకువచ్చిన ఆధునికత లోతులు ఇంకా మనకు అంతు పట్టనే లేదు కనుక. వర్జీనియా వుల్ఫ్ నవలలో ఇటీవలి సాహిత్య సిద్ధాంత వేత్తలు ‘ఆమె’ పక్షం తీసుకోవడానికీ, ఓల్గా ఈ పుస్తకంలో మధురవాణి పక్షం తీసుకోవడానికీ ఆ సాహిత్య చరిత్రే కారణం. ఆ మాటకొస్తే, మధురవాణి గురించి ఇప్పటి వరకూ తెలుగు సాహిత్యకారులు మాట్లాడలేదా అంటే మాట్లాడారు.

మధురవాణిని తెలుగు సాహిత్యంలో ఇప్పటిదాకా బలంగా కాపాడుకుంటూ వస్తున్న లక్షణాలేమిటో ఇక్కడ ఏకరవు పెట్టక్కర్లేదు. కానీ, ఆమెని వాళ్ళు రొమాంటిసైజ్ కూడా చేశారన్నది నిజం. చాలా మందికి ఆమె అనేకానేక కాల్పనిక కావ్యకన్యల్లో వొకటిగా మిగిలిపోయింది తప్ప, ఆమె మాటల కింద ప్రవహిస్తున్న మూల భావనల జాడ వాళ్ళకి అంతుపట్టిందని అనుకోడానికి ఇప్పటివరకూ వున్న పురుష కేంద్రిత విమర్శ సాంప్రదాయంలో తగిన ఆధారాల్లేవు.  ఓల్గా ఇన్నేళ్ల తరవాత ఆమెని ఎందుకు భిన్నంగా చూడగలిగారు అన్న విషయం అర్ధం కావాలంటే నేను పైన ప్రస్తావించిన వైయక్తిక భావన చరిత్ర అర్ధం కావాలి. ఓల్గా చూసిన మధుర వాణికీ, గురజాడ ‘పాత్ర’కీ సంబంధం వుందా అంటే, ఆ విషయం ఇప్పటికిప్పుడు అప్రస్తుతమే అంటాను. ‘ప్రస్తుతం’లోకి  ఆ పాత్ర ఎట్లా అనువదించబడుతోందో అదే ముఖ్యమనీ అంటాను. ప్రతి రచనకీ, ప్రతి పాత్రకీ అనేక జన్మలు వుంటాయి. వొక్కో జన్మ ఆ కాలధర్మాన్ని బట్టి వుంటుంది. ‘ఒక్క నేనే నీకు, పెక్కు నీవులు నాకు” అని ఎంకి నాయుడు బావలు  ఎందుకనుకున్నారో  కచ్చితంగా అదే, వొక రచన విషయంలో కూడా జరుగుతుంది. ఒక్క రచనే, కానీ ‘పెక్కు నీవు’లుగా మారుతుంది. సాహిత్య చరిత్ర మూల మలుపుల్లో వున్నప్పుడు ఈ ‘పెక్కు నీవుల’ బహుళత్వం కొంత సంక్లిష్టంగా కూడా వుండవచ్చు.

మధురవాణి పాత్రని ఓల్గా కుటుంబ కేంద్రిత భావజాలంపై వొక ధిక్కార ప్రకటనగా చూశారు, ఇంటి శ్రమని గుర్తించిన గాఢమయిన వైయక్తికత వున్న ఆధునికవాదిగా విశ్లేషించారు. ఈ విధమయిన దృష్టి అంతకు ముందు లేదు. ఇంకో కోణం నించి అసిరిని విశ్లేషించడంలో ఈ కొత్త విమర్శనా పద్ధతికి విస్తృతి పెరిగింది.  నిజానికి మధురవాణి వ్యక్తిత్వానికి వ్యాఖ్యానం ఇవ్వగల పాత్ర ఆసిరి విశ్లేషణలో ఈ మొత్తం కుటుంబ, బ్రాహ్మణ కేంద్రిత మార్మికీకరణ రహస్యాలు బట్టబయలు చేస్తారు ఓల్గా. ఈ రెండు వ్యాసాలని వొక దాని వెంట వొకటి చదివితే, ఈ రెండీటీ విశ్లేషణకి ఓల్గా ఉపయోగించిన  లెన్స్ వొక్కటే అని అర్ధమవుతుంది. ఆ లెన్స్ ని నేను subjectivity అంటున్నాను.

2

       ఒక వ్యక్తి మనసూ, శరీరం చేసే వ్యాయామాల చరిత్ర ఆత్మకథ అయితే, ఆ వ్యక్తి మెదడు చేసే వ్యాయామాల చరిత్ర మేధో ఆత్మ కథ. అట్లా అని, శరీరానికీ, మెదడుకీ వైరుద్ధ్యం వుందని నేను అనడం లేదు. వాటి మేలు కలయికే మేధో ఆత్మకథ. ఈ వ్యాసం ప్రారంభంలో వర్జీనియా వుల్ఫ్ నవలలో స్త్రీ పాత్ర గురించి పురుషుడికి వున్న ‘సాంప్రదాయిక’ వంటింటికి పరిమితమయిన ఆలోచన ఎలాంటిదో తెలుస్తుంది. ఆ తరవాత ఆ ఆలోచనపై యుద్ధమే మిగతా నవల అంతా – ఒక వాస్తవికత ఎంత సంక్లిష్టంగా వుంటుందో, అది వొక వైయక్తిక కోణం (subjectivity)  వల్ల ఎంత భిన్నత్వాన్ని సంతరించుకుంటుందో చెప్పే ప్రయత్నమే నవల. నిజానికి, స్త్రీ ఆలోచనకి పురుషుడు ‘నిర్మించిన’ ఆ కిచెన్ టేబులు సాంస్కృతిక రాజకీయ వలయాన్ని ఛేదించడం అంతర్లీన ప్రయత్నంగా కనిపిస్తుంది. అయితే, ఈ నవలలో ఆత్మకథాత్మక లక్షణాలు కూడా అనేకం కనిపిస్తాయి.  ఏ రచయిత సృజనాత్మక రచనలో అయినా ఆత్మకథాత్మకత తప్పనిసరి లక్షణం. కానీ, సాహిత్య వ్యాసాలలోనో, సాహిత్యేతర వచనంలోనూ ఆత్మకథాత్మకత వుండే అవకాశం వుందా? అన్నది ప్రశ్న.

అలాంటి అవకాశం వుందనే “సహిత” నేపధ్యంగా మనకి అర్ధమవుతుంది. ఎందుకంటే, ఈ మొత్తం “సహిత” వ్యాసాలన్నీ ఆయా సాహిత్య సందర్భాలలోని ఆయా స్త్రీ పాత్రల వైయక్తిక అన్వేషణే కనుక. ఈ వైయక్తిక అన్వేషణ ముఖ్యంగా మూడు మార్గాలలో జరుగుతుంది. ఒకటి, ఆ రచయిత అధ్యయనం; రెండు, రచయితకి ఇతర రచయితలతో వుండే వ్యక్తిగత/ సైద్ధాంతిక అనుబంధం; మూడు, రచయిత వివిధ సాహిత్య సిద్ధాంతాల ద్వారానో, ఉద్యమాల ద్వారానో చేసే వ్యక్తిగత/ సైద్ధాంతిక ప్రయాణం. నిజానికి ఈ మూడు అంశాలు వొకదానితో వొకటి ముడిపడి వున్నవే. కానీ, వీటి పరిధుల్ని లోతుగా అర్ధం చేసుకోవడానికి వీలుగా వాటిని విడివిడిగా చూడడమూ అవసరమే. ఈ మూడింటి కలగలుపు  ప్రయాణమే ఒక రచయిత మేధోజీవన ఆత్మకథ అవుతుంది.

రచయిత అనుభవమూ అధ్యయనమూ ఎప్పుడూ కలగలిసి వుంటాయి. అనుభవాల్లో వైరుద్ధ్యమో,  సంఘర్షణో లేని రచయిత అధ్యయన పరిధి విస్తరించే అవకాశం తక్కువ. అయితే, అనుభవమనే కొలమానం తీసుకుంటే వైయక్తికతలో కొన్ని రాగద్వేషాలు కూడా బలంగానే వుండవచ్చు. అధ్యయనం వల్ల ఆ రాగద్వేషాల మధ్య కొంత సమతూకం సాధ్యపడవచ్చు. ఒక రచన చదువుతున్నప్పుడు రచయితకి  సామరస్యాల్ని బాగా చూసే అలవాటు అవుతుందని అందరం అనుకుంటాం. కానీ, సామరస్యం కంటే కూడా భిన్నత్వాన్ని చూసే అలవాటు బాగా పెరుగుతుంది. అలాంటి భిన్నత్వ దృష్టి ఆ రచయిత వైయక్తికతని బలంగా కుదుపుతుంది. ఓల్గా ఈ వ్యాసాలలో అలాంటి భిన్నత్వపు కుదుపులను చర్చకి తీసుకువస్తారు. అనుభవానికి వుండే  “తను” “ఇతర” అనే రెండు కోణాల నించి సాగే ఈ అధ్యయన ప్రయాణం ఈ వ్యాసాల్లో ప్రతి వాక్యంలోనూ కనిపించడం మొత్తంగా ఆమె ప్రతిపాదిస్తున్న/ సమర్ధిస్తున్న అస్తిత్వవాద రాజకీయాలకూ, వాటిని శరీర రాజకీయాల నించి చూసే తనదయిన ప్రత్యేకతకి సంకేతాలు. ఈ  అనుభవాన్ని చెప్పెటప్పుడు ఓల్గాలో మారుతున్న స్వరాన్ని గమనించినప్పుడు ఆ స్వరంలో ఉద్వేగం ఎంత వుందో, ఆ ఉద్వేగాన్ని ఆలోచనల భాషలోకి కుదించాలన్న తపన కూడా అంతే వుంది. తన వైయక్తికతని చెరుపుకోకుండా, తన స్వరాన్ని అణచుకోకుండా, తన తను ఇతరలోకి వొంపే సునిశితమయిన వొక సాంప్రదాయ విముక్త భాషని ఓల్గా ప్రతి వ్యాసంలోనూ ఉపయోగిస్తారు.

ఈ “ఇతర” ప్రపంచంలోకి ప్రయాణం ఆమెకి వున్న అనుభవ వైవిధ్యం వల్ల, బతుకు సంఘర్షణ వల్ల, వాటిని నడిపించే తాత్విక స్పష్టత వల్లా వివిధ రూపాలు తీసుకుంటుంది. ఒక రచనతో, ఆయా రచయితలతో తనకి ప్రత్యక్షంగా అనుబంధం వున్నప్పుడు – ఉదాహరణకి శ్రీశ్రీ, కొ.కు, చలం- లాంటి రచయితలని గురించి రాసిన వ్యాసాల్ని పఠిత రెండు సార్లు చదవాలి. మొదటి సారి  కేవలం ఆ రచయిత గురించి ఓల్గా ఏం అంటున్నారో వినడానికి చదవాలి. రెండోసారి, ఆ రచయిత లేదా రచనల వెలుగులో తన గురించి ఆమె ఏం అంటున్నారో వినడానికి చదవాలి. ఈ రెండు ప్రక్రియలూ వొకే మాదిరిగా అనిపిస్తాయి కానీ, నిజానికి కాదు. ముఖ్యంగా, శ్రీశ్రీ గురించి వ్యాసం చూడండి. మొదటి సారి చదివినప్పుడు శ్రీశ్రీ గురించి ఓల్గా కొత్తగా ఏం చెప్పారో నాకు అర్ధం కాలేదు. రెండో సారి చదువుతున్నప్పుడు శ్రీశ్రీ అనే కేంద్రాన్ని తొలగించుకొని, అక్కడ కాసేపు ఓల్గానో, నన్ను నేనో కేంద్రంగా తీసుకునో ఆ వ్యాసం చదివాను. అప్పుడు శ్రీశ్రీ గురించీ, అదే సమయంలో తన గురించీ, అదే అదే సమయంలో నా (నా అంటే నాలోని పఠిత) గురించీ ఓల్గా మాట్లాడుతున్నట్టు నాకు అర్ధమయ్యింది.

ఒక రచన గురించో, ఒక రచయిత గురించో మాట్లాడుతున్నప్పుడు – అది వ్యక్తిగత స్మృతి సందర్భం అయినప్పటికీ- మనం “తన” “ఇతర” మధ్య వొక వంతెన కట్టుకుంటాం. ఆ వంతెన మీద ఆ రచయితతో కలిసి కాసేపు జీవన “సంధ్యల” లోకి చూస్తాం (చలానికి కృతజ్నతలతో ఈ వాక్యం). అలా మనతో కలిసి ఎంతో సేపు సంభాషించలేని /వుండలేని రచయిత గానీ, రచన గానీ మన వైయక్తికతలో నించి అతి తేలికగా మనకి చెప్పా పెట్టకుండానే నిష్క్రమిస్తారు. ఆ తరవాత ఇక ఆ రచయిత గురించీ, ఆ రచన గురించీ మాట్లాడాల్సిందేమీ లేదనే అనుకుంటాను. (ఈ విధమయిన వైయక్తికతని reinforce చెయ్యడానికే చలం మ్యూజింగ్స్ రాసారేమో అనిపిస్తుంది ఈ మధ్య నాకు.) తన సంఘర్షణలో తనతో పాటు నిలిచిన రచయితలూ, రచనల ప్రస్తావన ద్వారా మనం నిజానికి మన లోపలి సంభాషణే వినిపిస్తాం. ఆ పని చలం గురించీ, కొ-కు గురించీ, శ్రీశ్రీ గురించీ రాసిన వ్యాసాలలో నైపుణ్యంతో చేశారు ఓల్గా.

ఈ లోపలి సంభాషణ ఏదయినా వొక విస్పష్టమయిన రూపం తీసుకోవాలంటే, తన బయటి లోకంతో  యుద్ధం కూడా వొక కొలిక్కి రావాలి రచయితకి- అది బయట వున్న ఉద్యమాల్ని ఆ రచయిత ఎంతగా internalize చేసుకోగలరన్న విషయం మీద ఆధారపడి వుంటుంది. ఈ దశలో రచయితలు  ఏ ఉద్యమాలతో, ఏ అస్తిత్వవాద చైతన్యంతో ఏ స్థాయిలో మమేకం అవుతున్నారన్న విషయం వాళ్ళ రచనల్లో బాహాటంగానే తెలుస్తుంది. అయితే, ఇదే సమయంలో ఆ రచయితలు ఆయా ఉద్యమాలతో, అస్తిత్వవాద చైతన్యాలతో ఎంత విమర్శ పెట్టగలరన్న విషయం కూడా ముఖ్యమే. ఓల్గా తన గురించి నేరుగా చెప్పుకున్న విషయాల్లోనూ, ఇతరులు వాహికగా తన గురించి పరోక్షంగా చెప్పిన విషయాల్లోనూ ఈ విమర్శనాత్మక ఆత్మశీలన (critical reflexivity) ని కొన్ని సార్లు ఎంత సున్నితంగా వ్యక్తం చేశారో, ఇంకా కొన్ని సార్లు అంతే ముక్కుసూటిగా నిక్కచ్చిగా critical distance గురించి కూడా  చెప్పారు. అంటే, వొక సైద్ధాంతిక క్రమశిక్షణ వున్న రచయితలు  తమ చుట్టూ వున్న ఉద్యమాల వాడినీ, వేడినీ ఎంత వేగంగా స్వీకరించగలరో, అంతే విమర్శనాత్మకంగా వొక ఆత్మీయమయిన “దూరాన్ని” కూడా స్వీకరించగలరు. అలా చెయ్యలేకపోతే, ఆ రచయితకి వున్న వైయక్తికత గాయపడుతుంది. అలా తన వైయక్తికత గాయపడిన సందర్భాల నించి ఓల్గా నేర్చుకున్న కొన్ని పాఠాలు “సహిత”లో వున్నాయి. ఆ పాఠాలు నిజానికి ఎవరికి వాళ్ళు తిరిగి అనుభవిస్తే తప్ప వాటి తీవ్రత తెలియదు, నిజమే, కానీ, ఆ పాఠాల నించి ఓల్గా తన ప్రయాణం నించి స్త్రీవాద చరిత్ర నిర్మాణ సాధనాల అన్వేషణకి బయలుదేరుతున్నారు, అడవిలో చిక్కుబడిన వొంటరి సీత తనలాంటి ఇతర సీతలతో కలిసి  ఇంకో కొత్త రామాయణం – కాదు సీతాయణం – తిరగరాస్తున్నట్టుగా.

3

       ఏక నలుపు అనే పదాన్ని “సహిత”లో ఓల్గా కొన్ని సందర్భాల్లో వాడడం చూస్తాం. అది ఇష్టంతో కాదు, అయిష్టంతో!

చరిత్ర అంటే ఏక నలుపో ఏక తెలుపో లేదా కేవలం తెలుపూ నలుపుల మిశ్రమం మాత్రమో కాదు. “ఆధునిక మహిళ చరిత్రని పునర్లిఖిస్తుంది” అన్న వాక్యం ఇటీవల చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ, ఈ పునర్లేఖన ప్రక్రియ ఎలా వుంటుందన్న అవగాహన కలగడానికీ, ఆ ప్రక్రియకి అవసరమయిన పనిముట్లని సాధించడానికి కొన్ని దశాబ్దాల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది తెలుగు సాహిత్యం.  చరిత్రని వొక మూసలోంచి కాకుండా అనేకత్వంలోంచి చూడాలన్న స్పృహ ప్రధానంగా జాతీయవాద అనంతర/ మార్క్సిస్టు అనంతర ధోరణి. ఒకే ఒక్క ప్రధాన ఆధిపత్య చరిత్ర అంటూ ఏదీ వుండదనీ, ఏక సమయంలో అనేక చరిత్రలు సమాంతరంగా, ప్రత్యామ్నాయంగా, జమిలిగా  పనిచేస్తుంటాయన్న విమర్శనాత్మక చైతన్యం మార్క్సిస్టు, జాతీయవాద చరిత్రల మహా కథనాలని ప్రశ్నించడంతో మొదలయ్యింది. కానీ, ఈ ప్రశ్నించడం అనే ప్రక్రియ సఫలమవ్వడానికి కొన్ని సాధనాలు కావాలి, కొంత సాధనా కావాలి. అలాంటి సాధనాల సాధన మన:కార్మికశాల  “సహిత.”

స్త్రీవాద విమర్శ సాధనాలను ఇంకా సమర్ధంగా వాడుకోలేకపోయామన్న విమర్శ చాలా మటుకు నిజమే. కానీ, ఆ సాధనాలు ఏమిటన్న అవగాహన లేకపోవడం, దానికి సంబంధించిన వచనం తెలుగులో తగినంతగా రూపొందకపోవడం దీనికి  ఒక కారణం.  ఆ ఖాళీని భర్తీ చెయ్యడానికి అన్నట్టుగా, “సహిత”లో ఓల్గా అలాంటి కొన్ని సాధనాలను అందుబాటులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. అలా అందుబాటులోకి తీసుకువచ్చే ముందు ఆమెకి స్వయంగా వాటి వాటి అలభ్యత గురించి స్పష్టత వుంది. 1986లో ఓల్గా “మనకి తెలియని మన చరిత్ర” ని సమీక్షిస్తూ అంటారు, “ తెలుగులో స్త్రీవాద దృక్పథం నుంచి రాసిన చరిత్రలు లేవు. చరిత్ర పుస్తకాలే కాదు, మిగిలిన సాహిత్యంలో కూడా స్త్రీ దృక్పథంతో మాత్రమే వచ్చినవి లేవు” ఈ వాక్యం ఇప్పటికీ నిజమే. “మనకి తెలియని మన చరిత్ర” “మహిళావరణం” లాంటి రచనలు ఎన్నో  వచ్చే అవకాశాలూ, భిన్న సందర్భాలూ  తెలుగు సాహిత్య/ సాంస్కృతిక చరిత్ర నిండా వున్నాయి. వాటి పునర్నిర్మాణం అనేక సందర్భాల్లో అనేక వినిర్మాణాలతో ముడిపడి వున్న విషయం కాబట్టి, ఆ వినిర్మాణ/పునర్నిర్మాణ ప్రక్రియలో వుండే వేదనా, శ్రమా రెండీటీని ఎదుర్కొనే శక్తి మన రచయితలకీ, ముఖ్యంగా విమర్శకులకి చాలా తక్కువ. అప్పుడప్పుడూ అరకొరగా సాగుతున్న కృషి వున్నా, అది సరిపోదు.   చరిత్ర నిర్మాణం పట్ల మనలో వున్న అలాంటి అంధత్వాన్ని గుర్తించి, కనువిప్పు కలిగించే సాధనాలు కొన్ని అయినా అందుబాటులోకి తేవాలన్న ప్రయత్నం “సహిత” లో కనిపిస్తుంది.

అలా ఓల్గా అందుబాటులోకి తీసుకువచ్చిన , మొదటి సాధనం – ఒక వాచకాన్ని దగ్గిరగా, విమర్శనాత్మకంగా, అంతర్దృష్టితో చదవడం (close, critical and reflexive reading). “సహిత”లో మొదటి  నాలుగు వ్యాసాలు గురజాడ కన్యాశుల్కం ని నాలుగు భిన్నమయిన సాధనలతో విశ్లేషిస్తాయి. మొదటి వ్యాసం మధురవాణిని కుటుంబ-కేంద్రిత కోణం నించి చూస్తుంది. రెండో వ్యాసం ఒక పురుష పాత్ర నించి మధురవాణిని ఆవిష్కరించడం, అదే సమయంలో ఆధిపత్య ధోరణిని ప్రశ్నించే సాధనాన్ని (de-heirarchization) ఉపయోగించారు. ఈ సాధనాల వాడకం దృష్టి నించి చూస్తే, మూడో వ్యాసం చాలా చర్చించదగింది. ఈ వ్యాసం ఫెమినిస్టులు చట్టాన్ని ఎట్లాచూడాలో, దాన్ని తిరిగి సాహిత్య దర్పణంలోంచి ఎట్లా వీక్షించాలో ఓల్గా తగిన ఆధారాలతో చూపిస్తారు. ఇదే వ్యాసంలో ఇంకో ముఖ్యమయిన సాధనాన్ని కూడా ఆమె బాగా వాడుకున్నారు. అది వలసవాదానంతర ధోరణి నించి రచనని చూడడం. బ్రిటిష్ వలస పాలన అనుసరించిన వ్యూహాల వినిర్మాణ ధోరణి  కనిపిస్తుంది.  ఇక నాలుగో వ్యాసం – domestic labor కోణం నుంచి కన్యాశుల్కం విశ్లేషణ. ఈ వ్యాసం ఒక social postmodernist కోణం నించి కూడా అర్ధం చేసుకోవచ్చు.  స్త్రీవాద విమర్శకోణం నించి వొక రచనని ఎట్లా దగ్గిరగా, విమర్శనాత్మకంగా చదవవచ్చో కొన్ని నమూనాల్ని ఓల్గా ఈ వ్యాసాల్లో చూపిస్తారు.

రెండో సాధనం ప్రతిఘటన  రాజకీయాలకి సంబంధించింది.  వొక స్త్రీవాదిగా ఏ రచనని స్వీకరించాలి, ఏ రచనని నిరాకరించాలి అన్నది ఎట్లా తేల్చుకోవడం?! సాధారణ  రచయితల కంటే భిన్నంగా  స్త్రీవాద రచయిత గానీ, అస్తిత్వవాద రచయిత గానీ  మూడు  రకాల అణచివేతల్ని ఎదుర్కోవాల్సి వుంటుంది. ఒకటి: నిజంగా సంప్రదాయ సాహిత్యం నించి, రెండు: ఆధునికంగా కనిపించే అంతర్గత సంప్రదాయం నించి, మూడు: అస్తిత్వాన్ని నిరాకరించే ఆధునికత నించి. వీటన్నిటినీ దాటుకొని వచ్చి స్త్రీ తన స్వరాన్ని ఎట్లా వినిపించాలన్నది తీవ్ర అన్వేషణ. ఇదే క్రమంలో ఇంకొక ముఖ్యమయిన వెతుకులాట కూడా వుంటుంది. అది తనదయిన స్మృతిని/ అనుభవాన్ని తిరిగి రాబట్టుకోవడం(retrieval of the personal memory).  ఇతర అనేక అంశాల మాదిరిగానే ఈ మూడు కూడా పరస్పరాధారిత కోణాలు. ఇక్కడ ఈ “వ్యక్తిగతం” రాజకీయాలకీ, పబ్లిక్ కి అతీతం కాదు. వాటన్నిటి కలయికలోంచి పుట్టిన subjectivity.

“సహిత” వ్యాసాల సారాంశాన్ని వొక వాక్యంలో చెప్పాలంటే, అదంతా ఈ నిరాకరణ-స్వీకరణ రాజకీయాల నుంచి ఓల్గా తనదయిన అనుభవ స్వరాన్ని వెతుక్కునే దారి. కాల పరిమితుల దృష్ట్యా ఓల్గా ఈ వ్యాసాలలో సంప్రదాయ సాహిత్యం జోలికి పోలేదు కానీ, గురజాడ కన్యాశుల్కం విశ్లేషణలో కొంత మేరకు ఆ సాంప్రదాయ అణచివేత ని విమర్శిస్తారు. అది కాక, మిగిలిన రెండు కోణాలు – ఆధునికంగా కనిపించే అంతర్గత సాంప్రదాయం, అస్తిత్వాన్ని నిరాకరించే ఆధునికత- ‘సహిత”లో ప్రధానమయిన ఇతివృత్తాలు. వాటి చుట్టూ జరిగే చర్చ కొంత మేరకు సంప్రదాయాన్ని కూడా ప్రశ్నించినా, వాటి యుద్ధ భూమి మాత్రం తక్షణ వర్తమాన  కురుక్షేత్రమే. ఆ కారణంగానే “సహిత” ఈ కాలపు స్త్రీవాదుల ఆత్మచరిత్ర కూడా!

-అఫ్సర్

2012

 

క్యూ

మడిపల్లి రాజ్‍కుమార్

మడిపల్లి రాజ్‍కుమార్

* * *

1

జన్మాంతరం లో

చీమనను కుంటాను

చిన్నప్పటినుంచి

ఎన్నిసార్లు ఎన్ని క్యూలో……

కాళ్ల వేళ్లకు వేళ్లు మొలిచి పాతుకు పోయి

ఏ మాత్రం కదలని క్యూలు

2

వాచిని చూచి చూచి

వాచి పోయిన కళ్ళతోనే

క్షణాలను మోసి మోసి

కూలబడి పోతున్న పిక్కలకు

అవసరాల కర్రలు మోపి నిలబెడుతూ

ఎన్నెన్నెన్నె…..న్ని క్యూలో….?

3

ఏ పనీ లేకుండా

మిగతావన్నీ వాయిదా వేసి

ఒకే ఒక్క అవసరానికో లక్ష్యానికో

సమస్తం నన్ను ముడివేసిన ఎదురుచూపు

నలిపి నలిపి ఎంత వడి పెట్టినా

ఎండి ఎడారిలా మారిన నాలోంచి

ఏం రాలుతుందని

4

నా వెనుక పెరిగిన

కొమ్ములు వొంకలు తిరిగిన వాళ్లు

నా భుజాలనెక్కి… తలనెక్కి…

వడివడిగా వాడిగా

మున్మున్ము…ముందుకే

నేను మాత్రం వెనక్కి వెనక్కి….. నక్కి….క్కి… నెట్టబడుతూ

5

పెరుగుతున్న

నా నావాళ్ల అవసరాలూ కోరికలనూ

ప్రాధాన్య క్రమంలో

క్యూలో నిలబెడుతూ

అప్పుడూ

నా అవసరాలను ప్రతి నిత్యమూ

వెనక్కి వెనక్కి….. నక్కి….క్కి… నెడుతూ

కోరికలను జన్మాంతరానికి

వాయిదా వేసుకుంటూ…

క్యూ లోనే

వెనక్కి వెనక్కి….. నక్కి….క్కి… నెట్టబడుతూ

మడిపల్లి రాజ్‍కుమార్

Fusion షాయరీ on a Lady in Lavender Saree!

మామిడి హరికృష్ణ

మామిడి హరికృష్ణ

1.వర్ణాలను పులుముకున్నందుకు ప్రకృతి అందంగా ఉంటుందా ? ప్రకృతి వల్ల వర్ణాలకు ఆ అందం వస్తుందా ? లోకం నిండా వర్ణాందాలా ? అందమైన వర్ణాలా ? ఆది ఏది ? ఏది తుది ? ప్రకృతి ఆకృతికి ప్రతి కృతి చేసిన వర్ణానికి ఆరాధకుడను, అనురక్తుడను  నేను..
నువ్వొక lavender వర్ణ సౌందర్యం ! సమ మేళిత సుమ స్ఖలిత సమ్మేళిత వర్ణం, ఏడు రంగులలో ఒదగని కొత్త వర్ణ సంచయమది.. పంచ భూత సమన్విత ఆశ్చర్యమిది… ఎనిమిదో అద్భుతమది…
ప్రియా, నువ్వు రచించిన వర్ణమిది.. సువర్ణమది !
2. నీలాకాశం ఓ అనంత వస్త్రం .  దాని ముక్కను కత్తిరించేసి ఒడుపుగానూ ఒద్దికగానూ చీరెలా చుట్టేసి కట్టేసుకున్న కనికట్టుల ఇంద్రజాలం నీది. చందమామ ముఖం నిండా నవ్వుల వెన్నెలలను ఆగి ఆగి తెరలుగా కురిపించి మురిపెంగా మరిపించే  ఆహ్లాదపు అధరాల మబ్బుల లోంచి దాగి దాగి ధ్వనిస్తున్న సిరి  మువ్వల మధుర నాదం నీది . ఎప్పుడూ చేతులు కట్టుకుని ఉండే నాలో, నీతో  కరచాలనం చేయాలనిపించే temptation కలిగించిన అలవి కాని ఆత్మీయత నీది.
విహ్వల వినోద విషాద బంధుర తటిల్లతల తాకిడికి తల్లడిల్లుతూ తన్హాయీ అనబడే ఒంటరితనపు solitudeని నా  attitudeగా మలుచుకున్న వాణ్ని. అనంత ఏకాంత హిమవత్ పర్వతమై ఘనీభవించి శిలా సద్రుశ్యున్నై, వికల సముద్రున్నై, హాలాహల విలయ నిలయున్నై, అంతర్ బహిర్ మధ్య ప్రపంచాల్లోని voyageని voyeuristic గా దర్శిస్తూ, కంటిలోకి చొరబడిన దృశ్య హర్మ్యాలని నిర్మోహంగానూ, నిర్లిప్తంగానూ స్పర్శిస్తూ, విస్మృత విరాగంలోని వియోగ విలాపానికి క్షణం క్రితం దాకా నేనే personified నిదర్శనం..
ప్రియా, నీ దర్శనం అయింది …  నిదర్శనం చెదిరింది…!
image(1)
3. Never never అనిపించే Netherlands Lavender తోటలలో విరగ్గాసిన పూలని లతలు లతలుగా అచ్చోసుకుని  నిశ్చల నిశ్చయంతో నిబ్బరంగా కూచొని నన్నుఅబ్బురపరిచిన కాలాతీత కల్లోలిత అనురాగం నీది. కంటి కొలుకుల వింటి చూపుల నారికి  కొంటె తనాల చిర్నవ్వు బాణాలను సంధించిన  అల్లరి తనం నీది. Space and Time ల విచక్షణను విస్మరింప చేసిన witchcraft నీది.
పైట సర్దుకుంటున్న  యెదల కన్నా, నీ కళ్ళలో  దోబూచులాడుతున్న ప్రేమని తడిమి, మాటల ప్రవాహాన్ని పెంచేసి సంభాషణల చేతులతో నిన్ను ఆసాంతం  మెత్తగా హత్తుకుంటూ French Impressionistic భావ దృశ్యాలను నీ ముందు bouquetగా సమర్పిస్తూ reasoning ని  మొత్తంగా zero చేసి కేవలం మనసు చెప్పే మాటలనే వింటూ వింటూ గుండెల నిండా నిన్నే నింపుకుంటూ, బిభూతి భూషణుడి వనవాసి కి సహవాసిని జత చేయాలనే స్వాప్నిక సంకల్పం లో గమ్మత్తుగా కూరుకు పోతూ నేను ..
ప్రియా , ఇది నీవిచ్చిన మత్తు.. నువ్వు మాత్రమే  చేసిన మహత్తు..!
4.  అక్షరాల  బగీచా లో కథా వృక్షాలనీ, కవితా పుష్పకాలనీ ఆఘ్రానిస్తూ ఆరోహిస్తూ, తడుముకుంటూ తెంపుకుంటూ వాటి సుగందాలని నీ సౌకుమార్యం తో mix చేసి, నా లోలోలోలోపలి నా లోకి అపురూపంగా వంపుకుంటూ ‘గాల్లో తేలినట్టుందే- గుండె పేలినట్టుందే’ పాటల్ని లోపలి స్వరం తో ఆలాపిస్తూ నేనో సరికొత్త కడక్ మనోచిత్రం అవుతాను..
ప్రియతమా, ఇపుడు నేను– నువ్వు వేసిన చిత్రం… ఇది నువ్వు మాత్రమే  చేసిన విచిత్రం… !
5.  నువ్వు – నేను ఇరు లోకాల సంచారులం. నిరంతర ప్రేమమూర్తులం. నిత్య ప్రేమ దాహార్తులం. దిగంతాల అంచుల వెంట ఎడారులలో సాగరాలలొ వన భూముల్లో మంచు లోయల్లో ఆరామమెరుగని విరామమివ్వని అన్వేషణ చేస్తున్నాం.  ఏ సంపూర్ణత లోని తటస్థత ఇచ్చే తాదాత్మ్యత వల్ల కలిగిన తన్మయత నుండి పుట్టిన తదేక ధ్యానం సానువుల్లో దొరికిన అద్వైత శాంతి కోసమో..  అవిశ్రాంత పాంధులమై అనాది కాలం నుంచి యానాదులమై అనాధులమై మనో ప్రపంచంలో అంతర్ యాగం చేస్తూనే ఉన్నాం…
ప్రియా, ఇది నీ అంతర్ గానం…  నా అంతర్యానం….!
ఈ అనవరత యాగం ఓ  గానయానం! నువ్వు-నేనులను పెళ్ళగించి కూకటి వేళ్ళతో పెరికి వేసి “నేనువ్వు “ను సృష్టించి, అనేకంలోంచి ద్వంద్వాన్ని వేరు చేసి ఏకత్వాన్ని-ఏకతత్వాన్ని ప్రత్యక్షం చేసి అనశ్వర అద్వైతమై, ఎనిమిదో రంగును సృజించి lavender అంటే love ender అనీ, నా love ends here at your feet అనీ background music లో 6 track stereo-phonic soundsతో వినిపిస్తుంది..
No doubt, ప్రేమ ఒక సత్కార్యం
 ప్రియా, ఇది నువ్వు చేసిన సత్కారం….!
-మామిడి హరికృష్ణ 

సంక్రాంతి, స్త్రీలూ, ముగ్గులూ…!

drushya drushyam-15...
చాలామంది అడుగుతున్నారు.
ముగ్గుల బొమ్మలు అన్నప్పుడు అందరూ అదే అడుగుతున్నారు…
ఎన్ని రకాల ముగ్గులు చిత్రించావూ అని!చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు, రంగవల్లులు…
ఈ మూడు రకాల ముగ్గులూ ఉంటాయి గనుక, ఒక్కొక్క రకంవి ఎన్ని ప్రదర్శిస్తున్నవూ అని!

కొంచెం భయంగానే ఉన్నది.
అయితే, వారు ఊహించినవి కాకుండా చూపి, ఇవీ ముగ్గులే కదా అంటే ఏమంటారో!
తిట్టినా కొట్టినా నేను మటుకు భయభక్తులతోనే ఉన్నాను గనుక భరోసా!

ఏమైనా ఒక కుతూహలం, సంబురం.
ముగ్గులు స్త్రీల చిత్రలిపిలు కనుక.
స్త్రీ అంటే ప్రకృతి కదా కనుక!

నాకైతే సూరీడు తన కిరణాలతో భూమాత హృదయంపై నర్తించడమే తొలి ముగ్గు.
అటు పిమ్మట పకృతి ఒడిలోంచి నిదానంగా నిద్రలేచిన ఓ మాత వొంగి చుక్కలు పెడుతుంటే…ముగ్గూ…ఆ తల్లీ….ముగ్గుబట్ట వంటి తన తలను ముగ్గులో వొంచి చిత్రిస్తుండటం మలి చిత్రం.
ఇంకా చాలా…

అయితే, అన్నీనూ ఒక ఛాయా చిత్రకారుడిగా వెలుగు నీడలను వాకిట్లో చూసుకుంటూ, వీధుల్లో అడుగులు వేసుకుంటూ పోవడమే నా చిత్రలిపి.

నిజమే. ఇంటికి శుభప్రదం అని ముగ్గులు వేస్తారు. దుష్టశక్తుల నివారణకూ ముగ్గులను గీస్తారు.
అవన్నీ చెప్పినా చెప్పక పోయినా, రాళ్లబండి గారు అన్నట్లు జీవితాన్ని ముగ్గులోకి దింపే ప్రయత్నమే నా చిత్రాలు.
ఎవరైనా చూసి ఆశీర్వదిస్తారని అభిలాష…

కందుకూరి రమేష్ బాబు

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? -6 వ భాగం

ekkadi-7

6

ఆ రోజు జూన్‌ 3వ తేదీ..గురువారం.
రామం మనసు ఉద్విగ్నంగా ఉంది. ఎందుకో దుఃఖంగా కూడా ఉంది. పొద్దటినుండీ మనసులో ఒక ప్రళయగర్జనై వినిపిస్తున్న పదం.. సిటిజన్‌షిప్‌..పౌరసత్వం. యిక కొద్దిసేపట్లో తను అమెరికా పౌరసత్వం స్వీకరించబోతున్నాడు..ఆరోజు.
మనిషి ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి..ఎక్కడికో ఉపాధికోసం వలసవచ్చి..ప్రాంతాలు, దేశాలు మారి..పుట్టినదేశం, పెరిగిన దేశం, బ్రతుకుతున్న దేశం.. కన్నతల్లి, పెంచిన తల్లి, ఏమీకాని దయామయియైన ప్రేమను పంచుతున్న తల్లి.. తల్లి.. తల్లి హృదయమున్న స్త్రీ ఎవరైన ఎంత అద్భుతమైన జీవి. మాతృప్రేమ ఎంతో పవిత్రమైంది. మాతృమూర్తి..మాతృస్పర్శ..మాతృ క్షమ-
”వై ఆర్‌ యు సో సైలెంట్‌..సో డీప్‌” అంది క్యాథీ..ప్రక్కసీట్లోనుండి. కారు అప్పుడు అమెరికా మొట్టమొదటి రాష్ట్రమైన డిలావర్‌ నగరంలో యూనివర్సిటీ ఆఫ్‌ డిలావర్‌ కాంపస్‌లో, క్లేటన్‌ హాల్‌ ముందు పార్కింగు ఏరియాలోకి ప్రవేశిస్తోంది.
ఎర్రగా ఎండ..పచ్చగా చెట్లు చుట్టూ..ఒంటిని తడుముతున్న లేత, పల్చని గాలి.
”ఎందుకో క్యాథీ..మనసు చాలా భారంగా ఉంది..”అన్నాడు రామం కారును పార్క్‌ చేస్తూ.
క్యాథీ తనతో ఈ ఆరేండ్ల సాంగత్యంలో పట్టుబట్టి ఎంతో శ్రద్ధతో తెలుగు నేర్చుకుంది. భారతదేశం నుండి ఇరవై ఒక్క రోజుల్లో తెలుగు, గాజుల సత్యనారాయణ పెద్దబాలశిక్ష నుండి మొదట బాలల బొమ్మల రామాయణం, మహాభారతం, మహాభాగవతం నుండి అనేక పుస్తకాలను అపోషన పట్టింది. క్యాథీ అంటే దీక్ష – క్యాథీ అంటే ఏకాగ్రత. క్యాథీ అంటే కఠోర సాధన. ఇప్పుడు క్యాథీ ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిపెరిగిన చాలామంది తెలుగు వాళ్ళకంటే శ్రేష్టమైన తెలుగు, అర్ధవంతమైన వ్యక్తీకరణ, మంచి భాష, ఉత్తమమైన ఉచ్ఛారణతో సంభాషించగలదు.
”నాకు తెలుసు.. ఒక భారతదేశ పౌరుడు ఈ అమెరికా గడ్డపై అనేక అర్హతలను సాధించి అమెరికా పౌరసత్వాన్ని స్వీకరిస్తున్న ఈ ఉద్విగ్న సందర్భంలో సున్నితమైన హృదయంగల నీవంటి మనిషి ఎంత తీవ్రంగా చలించిపోతాడో నాకు తెలుసు.. ఐనా అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించడమంటే భారత పౌరసత్వాన్ని కోల్పోతున్నట్లు కాదుగదా రామం.. ఒసిఐ కింద ఉభయ పౌరసత్వ చట్టానికి లోబడి భారత పౌరునిగా కూడా నువ్వు కొనసాగుతావు కదా రామం.’
”ఔననుకో క్యాథీ.. కానీ..”
రామం కార్లోనుండి కిందికి దిగి..క్యాథీ ఒక ప్లాస్టిక్‌ ఫోల్డర్‌లో ఉన్న రామం తాలుకు కాగితాలన్నింటినీ పొదివి పట్టుకుని వెంట నడుస్తూ,
మౌనమే ఇద్దరి నడుమ.
ఎదురుగా యిటు మారియట్‌ హోటల్‌..అటు క్లేటన్‌ హాల్‌..యూనివర్సిటీ ఆఫ్‌ డిలావర్‌. చెక్‌ ఇన్‌ కౌంటర్‌లో రిపోర్ట్‌ చేయగానే.. క్యూ ‘బి’ అని చెప్పిందొకామె. లోపల పెద్దహాల్లో ఎ,బి,సి,డి. నాల్గు పెద్ద వరుసలు..అప్పటికే జనం ఎప్పుడో చేరి వరుసల్లో నిలబడి ఉన్నారు. ఓత్‌ టేకింగు సెరిమొనీకి సరియైన వస్త్రధారణతో రావాలని ఒక నిబంధన ఉంది కాబట్టి దాదాపు అందరూ ‘జెంటిల్‌డ్రెస్‌’ లో ఉన్నారు. స్త్రీలు, పురుషులు, అక్కడక్కడ పిల్లలు. కొందరి వెంటవచ్చిన క్యాథీవంటి స్నేహితులు, తల్లిదండ్రులు. అంతా కోలాహలంగా ఉంది. ఐతే దాదాపు అందరి ముఖాల్లోనూ తృప్తితో కూడిన వెల్లివిరుస్తున్న ఆనందం. ఎందుకంటే ప్రపంచం మొత్తంమీద సంపన్నమైన, బలమైన, పటిష్టమైన సర్వసత్త్వాక సార్వభౌమాధికారంగల అమెరికా దేశ పౌరసత్వాన్ని పొందబోతున్న చారిత్రక సందర్భమది.
యు.ఎస్‌. డిపార్ట్‌మెంటాఫ్‌ హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ తరపున యుఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ వాళ్లు అతిక్రమశిక్షనాయుతంగా, దాదాపు నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణంలో కొత్తగా పౌరసత్వం స్వీకరించబోతున్న అందరికీ చకచకా ఒక ప్రోగ్రాం షీట్‌ను అందించారు.
రామం ‘బి’ క్యూలో కొద్ది నిముషాలు నిలబడగానే..కౌంటర్‌ చేరువైంది. కౌంటర్లో ఉన్న అమెరికన్‌ యువతి ఒకామె వినమ్రంగా ‘గుడ్మానింగు’ చెప్పి చేయి చాపింది.
రామం తన కాల్‌లెటర్‌, గ్రీన్‌కార్డ్‌ అని పిలవబడే పర్మనెంట్‌ రెసిడెంట్‌ కార్డ్‌ను ఆమెకందించాడు. ఆమె వెంటనే ఒక ప్లాస్టిక్‌ ఫోల్డర్‌ను. చేతికందించింది అందులో ఫిలడల్ఫియా డిస్ట్రిక్‌కు చెందిన న్యూట్రలైజేషన్‌ సెరిమొనీకి సంబంధించిన ఓత్‌ ఆఫ్‌ అల్లెజిఎన్స్‌ ప్లెడ్జ్‌ ఆఫ్‌ అల్లెజిఎన్స్‌. కాన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ యుఎస్‌ఎ వంటి కాగితాలన్నీ ఉన్నాయి.
దాదాపు రెండువందల యాభైమంది ఆ రోజు కొత్తగా అమెరికా పౌరసత్వం స్వీకరిస్తున్నారు. వివిధ దేశాలకు చెందినవాళ్ళు..చైనా, జపాన్‌, అరబ్‌ దేశాలు, భారతీయులు, కెనెడియన్స్‌, ఇంగ్లిష్‌, మెక్సికన్స్‌, ఆఫ్రికన్స్‌ ఎందరో. భిన్న దేశాలు, భిన్న మతాలు, భిన్న జాతులు, భిన్న వర్ణాలు,..విభిన్న తత్వాలు..ఏవేవో కారణాలవల్ల, దాదాపు ఎక్కువమంది జీవనోపాధి వెదుక్కుంటూ వచ్చినవాళ్ళు ఒక దేశపు గడ్డపై గత థాబ్దికాలం గడుపుతూ, యిక్కడి మనుషులతో, యిక్కడి జీవనవిధానంతో, సంస్కృతితో మమేకమై, లీనమై., ఇప్పుడిక..ఈ అగ్రరాజ్య వారసులు కాబోతున్న భావోద్విగ్న సందర్బం..,
ఒక గంటలో దాదాపు కొత్తగా ప్రతిజ్ఞ తీసుకునేవాళ్ళందరూ రిపోర్ట్‌ చేసిన తర్వాత..
అందర్ని సెంట్రల్‌హాల్‌లో కూర్చొమ్మని సూచన. రామం లోపలికి నడిచి ముందు నుండి మూడవ వరుసలో కూర్చున్నాడు. క్యాథీ ప్రక్కనున్న అతిథులకోసం ఉద్దేశించిన బ్లాక్‌లో కూర్చుంది. అంతా గంభీర నిశ్శబ్దం.
సరిగ్గా పదకొండు గంటల ముప్పది నిముషాలకు వెంట ఐదారుగురు వయసు మళ్ళిన వ్యక్తులు వెంటవస్తూండగా చీఫ్‌ జస్టిస్‌, యుఎస్‌ బ్యాంక్‌ రప్టసీ కోర్ట్‌ కెవిన్‌ జె. కారీ ప్రవేశించాడు. వేదికపైనున్న నియమిత కుర్చీల్లో అందరూ ఆసీనులు కాగానే..వాళ్ళ వెనుక ఉన్న విశాలమైన తెల్లని తెరపై..”ఫేసెస్‌ ఆఫ్‌ అమెరికా” పేరుతో ఒక వీడియో చిత్ర ప్రదర్శన ప్రారంభమైంది. వందల ఏండ్ల క్రిందటి అమెరికా, కాలంతో..జీవితంతో..పోరాటం..పారిశ్రామికాభివృద్ధి.. ఎదుగుదల..వందల వేలమంది అమెరికా దేశంపట్ల అంకితభావంతో చేసిన అకుంఠితమైన కృషి..చివరకు సగర్వంగా నీలి గగన వీధుల్లో రెపరెపలాడుతూ అమెరికా జాతీయపతాకం..పదమూడు ఎరుపు, నీలి పట్టీలు..యాభై నక్షత్రాలు..జెండా ధగధగలు.
చీఫ్‌ జస్టిస్‌చే కొత్తగా పౌరసత్వం స్వీకరిస్తున్న అందరికీ స్వాగతవచనాలు..సంక్షిప్తంగా పౌర ప్రాముఖ్యత..అభినందనలు. వెంటనే యుఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్రిగేషన్‌ సర్వీస్‌ అధికారిచే ”మోషన్‌ ఫర్‌ అడ్మిషన్‌”..తర్వాత సంప్రదాయంగా చీఫ్‌ జస్టిస్‌చే అంగీకారం, ఆమోదం..ఆ తర్వాత..అందరూ లేచినిలబడి, అప్పటికే అందరికీ అందజేయబడ్డ చిన్న అమెరికా జెండాలను చేతుల్లో ధరించి, చేతులను ముందుకు చాచి, జాతీయ పతాకానికి వందనం చేస్తూ..ప్రతిజ్ఞ..”అదృశ్యుడైన దేవుని సన్నిధిలో అందరికీ స్వేచ్ఛా, న్యాయము సంప్రాప్తించాలని వేడుకుంటూ సార్వభౌమ అదికారాలకు ప్రతీకఐన అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయపతాకం సాక్షిగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను..”ఇలా సాగుతోంది.
అంతా గంభీర వాతావరణం..అందరి హృదయాల్లో ఎవరికివారికే అనుభవమౌతున్న మౌన సంఘర్షణ..తన శరీరంలోనుండి ఏదో భాగం విడిపోతున్నట్టు..కొత్తగా తన దేహంలోకి  ఏదో లీనమైపోతున్నట్టు..ఏదో ఒక ప్రాణసమానమైన పరివర్తన జరుగుతున్నట్టు..,
నా దేశం..నా భారతదేశం..నా ప్రజలు..నా సోదరులు..నా మాతృభూమి..నా నేల..నా గాలి..నా నీరు..నా ఆత్మ.,
ఎందుకో దుఃఖం..ఎందుకో గొంతుపెగలని ఉద్వేగం..కళ్ళలో ఎవరికీ తెలియని సన్నని కన్నీటి పొర. లోపల చేతులతో కడుపులో ఎవరో దేవుతున్నట్టు బాధ.,
ఏమైందిప్పుడు..రెండు దేశాల్లోనూ పౌరసత్వమేగదా..,అని ఓ ఆత్మ సమాధానం. స్వ స్వాంతన. అమెరికా జెండావందనం కాగానే..జాతీయగీతం..అందరూ నిలబడిఉండగానే..లెఫ్ట్‌నెంట్‌ కెవిన్‌ పీర్స్‌, రిటైర్డ్‌ పెన్సిల్వేనియా స్టేట్‌ పోలీస్‌ అధికారిచే ఉచ్ఛైస్వరంలో మహోత్తేజంగా అమెరికా జాతీయగీతాలాపన..ప్రౌడ్‌ టుబి ఎన్‌ అమెరికన్‌..’
సమాంతరంగాఎక్కడో..గుండెల కొండల్లో..’జనగణమణ..జయ జయ జయహే’..’వందేమాతరం..వందేమాతరం..’
చటుక్కున కట్టలు తెంచుకుంటోంది దుఃఖం రామంలో, జాతీయ గీతాలాపన ముగియగానే అందరితోపాటు రామం కూడా కూర్చుని.,
మరొకసారి చీఫ్‌ జస్టిస్‌ నూతన పౌరసత్వం స్వీకరించిన వ్యక్తులందరికీ అభినందనలు తెలిపి.. ఒక ప్రకటన చేయగానే హాలంతా చీకటై..,
జార్జ్‌ డబ్ల్యు బుష్‌ వైట్‌హౌజ్‌నుండి అభినందనలు తెలియజేస్తూ ఉత్తేజకర వీడియో సందేశం..స్పష్టమైన గంభీర ప్రదర్శనతో..అంటాడు..”వియ్‌ ఎడ్మిట్‌ యు ఏజ్‌ ఎ న్యూ సిటిజన్‌ ఆఫ్‌ అవర్‌ మదర్‌ లాండ్‌ అండ్‌ వియ్‌ వెల్‌కం యు టు ది అమెరికా ఫామిలీ.”
లైట్లు వెలిగి..ఒక నిశ్శబ్ద గంభీరత చెదిరి..,
అందరూ బయటికి హాల్లోకి రాగానే..యిదివరకటి. బి వరుస క్యూలోనే..ఒక విలువైన ప్లాస్టిక్‌ ఫోల్డర్‌లో ఉంచి.. ‘సర్టిఫికేట్‌ ఆఫ్‌ నాచురలైజేషన్‌’ అందజేసి.,
అందరిలోనూ ఏదో తెలియని ఆనందం..వెల్లివెరిసే తృప్తి..ఏదో ఒక అద్భుతమైన స్థాయిని సాధించామనే విజయఛాయ.
నాచురలైజేషన్‌..సహజీకరణ..ఏది సహజం..జీవించే ప్రతి జీవికీ జీవించేహక్కు ఉండాలనీ, జీవించే స్వేచ్ఛ, సహజంగా, ప్రకృతిసిద్ధంగా ఎదిగే హక్కూ ఈ సృష్టినీ ప్రకృతినీ నియంత్రించే సర్వ భగవత్‌దత్త నియంత్రణలన్నింటినీ గౌరవిస్తూ, పాటిస్తూ.. ప్రకృతిలో ఒక భాగమై మాత్రమే కొనసాగుతానని..ఒక ధృవీకరణ..నాచురలైజేషన్‌.
అమెరికన్లలో అన్నింటికంటే గొప్పగా రామంకు నచ్చే సుగుణం..వాళ్ళ దేశంపట్ల వాళ్ళకున్న పవిత్రమైన ప్రేమ..భక్తి. దేశంకోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించగల త్యాగశీలత..మాతృభూమి పట్ల అపారమైన గౌరవం. అంకిత భావం. వాళ్ళ రక్తంలోనే దేశంపట్ల ప్రాణాలకంటే ఎక్కువగా ద్యోతకమయ్యే ఆత్మార్పణ తత్వం.
భారతదేశంలో..,
ఒకప్పుడు ప్రపంచాన్నే ఆశ్చర్యచకితుల్ని చేసిన స్వతంత్ర భారత పోరాట ఐక్యత. భారత భూభాగంపై ఎక్కడికక్కడ పొటమరించి, పెల్లుబికి, వెల్లువై నినందించిన బ్రిటిష్‌ వ్యతిరేక తిరుగుబాటు..జాతి, మత, వర్ణ, వర్గ, లింగ, వయో భేదాలు లేకుండా ఏక త్రాటిపై కొనసాగిన స్వతంత్ర యుద్ధం.,
ఇప్పుడు..ఈ అరవై మూడు సంవత్సరాల తర్వాత ఏమైపోయాయి ఆ బంగరు రోజులు..’ఒక్కనికోసం అందరు – అందరి కోసం ఒక్కడు’గా నింగికి పొంగి ఎగిసిన ఆ ఐక్యతా శక్తులిప్పుడేవి. అసలీ తరానికి దేశ స్పృహ, దేశభక్తి, దేశ స్వతంత్ర పోరాట ధ్యాస..దేశ బాధ్యతల పట్ల ఆలోచన..నిబద్ధత..ఇవేవైనా ఉన్నాయా..ఎందుకీ తరం..శ్రీశ్రీ అన్నట్టు కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు వలె పూర్తిగా నిర్వీర్యులై, పథభ్రష్టులై ఎందుకు మిగిలిపోతున్నారు. సమాజంలో దేశం గురించి ఆలోచింపజేసే విధానం ఈ తరానికి ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యార్జనలో.. ఏస్థాయిలోనూ లేక.. అంతా కాగితపు పువ్వు వికసించినచందంగా. మిథ్య.. నైరూప్యత..ఉందా అంటే ఉంది, లేదంటే లేదు రకం అనిమిత్తత ఏర్పడి, వ్యాపించి..అంతా అస్తవ్యస్తత..చిందరవందర.. రిక్తత..వెరసి..ఎవరికివారే యమునాతీరే,
ఇక ఇప్పుడు..ఏదో ఒక భారీస్థాయి పరివర్తన జరగాలి..ఒక షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలి ఎవరొఒకరు దారితప్పిపోతున్న ఈ తరాన్ని ఎవరో ఒకరు మళ్ళీ దారిలోకి మళ్ళించి పునస్సంధానం చేయాలి..లేకుంటే..ఒక నది..ఒక సముద్రం దారితప్పిపోయినట్టు..ఒక వ్యవస్థ. ఒక సమాజం, ఒక ఉజ్జ్వల వారసత్వంగల చరిత్ర భ్రష్టుపట్టిపోతుంది..ఐతే..
ఎలా..ఎలా..ఎలా..?

ekkadi-6
రామంకు గత కొన్నేళ్ళుగా భారతీయ వ్యవస్థ స్థితిగతులను అధ్యయనం చేస్తున్న బాపతు ఎన్నో జ్ఞాపకాలు కురుస్తున్న చినుకుల్లా మస్తిష్కంనిండా ఆవరించినై. అతనికి చాలా స్పష్టత ఉంది..గతం గురించి, వర్తమానం గురించి..సాధించి రూపుదిద్దవలసిన భవిష్యత్తు గురించి..అందుకే ఒకే సుదీర్ఘ యజ్ఞసదృశమైన ప్రణాళికాబద్ధ క్రతువును కొనసాగిస్తూ వస్తున్నాడు తను.
మౌనంగా యూనివర్సిటీ క్లేటన్‌ హాల్‌నుండి బయటికి నడుస్తున్న రామం వెంట అడుగులు వేస్తూ..అతని చేతిలోని ప్లాస్టిక్‌ ఫైల్‌ను తీసుకుని..సర్టిఫికేటాప్‌ నేచురలైజేషన్‌ను చూస్తూ అంది క్యాథీ..”బాధపడ్తున్నావా రామం..యుఎస్‌ఎ పౌరునిగా మారినందుకు” అని.
”ఉహుఁ..జన్మతః భారతదేశ పౌరున్నయి నా విధులను ఇదివరకు సక్రమంగా నిర్వహించనందుకు బాధపడ్తూనే .. భవిష్యత్తులోనైనా మనం అనుకుంటున్నట్టుగా నా మాతృభూమికోసం ఆ చారిత్రాత్మక కార్యక్రమాన్ని అమలు చేయగల్గుతానా అని ఓసారి ఆత్మవలోకన చేసుకుంటున్నాను క్యాథీ..”
”యుఆర్‌ డెఫ్‌నెట్లీ గోయింగు టు డు సంథింగు వండ్రఫుల్‌..”
”చేయాలి..ఏదో ఒకటి చేయాలి..”
కార్లో కూచున్నాక క్యాథీ అంది..”కారును..మహాలక్ష్మి టెంపుల్‌ దిక్కుపోనీ రామం..వుహావ్‌ టు డిస్కస్‌ సంథింగు సిగ్నిఫికెంట్‌..”
మౌనంగానే క్యాథీ దిక్కు చూశాడు రామం..కార్‌ను రివర్స్‌ చేసుకుంటూ. ఆమె అప్పుడు ఏ మేఘాలూలేని ఒట్టి నీలి ఆకాశంలా గంభీరంగా, గుంభనంగా ఉంది.
”ఏమిటో అది..”
”చెప్పాలా ఇప్పుడు”
”నీ యిష్టం”
”రామం..మన పరిచయమై, స్నేహితులమై ఎన్నేళ్ళవుతోందో జ్ఞాపకముందా”
‘ఉహు..చెప్పు నువ్వు”
”సరిగ్గా ఎనిమిది సంవత్సరాల నాల్గునెలల పదిరోజులైంది.”
”ఓ..సో ఆక్కురేట్‌”
”మరి..జీవితమంటేనే ఆక్కురేట్‌గా గడపవలసిన ఒక బృహత్కార్యం అనుకుంటాన్నేను.”
మళ్ళీ మధ్య మౌనం..అతని మనసు ఆ ఎనిమిదేళ్ళ సాంగత్యాన్ని స్కాన్‌ చేస్తూ వస్తోంది నిప్స్‌ వేగంతో..అంతిమంగా క్యాథీ దిక్కు అప్రయత్నంగా, ఆరాధనాపూర్వకంగా చూచి ‘ఒక అద్భుతమైన మనిషి’ అనుకున్నాడు లోలోపల.
”తామరతీగ నీట్లోనే పుట్టి నీట్లోనే పెరిగి నీటిలోనే అంతరించి పోతుంది. కదా..కాని జీవితాంతం నీరు తనను తాకకుండానే అతీతంగా ఉంటుంది. కలిసి ఉంటూకూడా ఏ సంబంధమూ లేక పరాయిగా జీవించడాన్ని ఏమంటారు రామం.” అంది.
కారు వేగాన్ని అందుకుని ఆటోమొబైల్‌ షోరూంలతో కిక్కిరిసి ఉన్న వాషింగ్టన్‌ రోడ్‌ మీదినుండి జారిపోతోంది.
”క్యాథీ.. వర్చువల్‌ లివింగు అండ్‌ రియల్‌ లివింగు..అని రెండు. ఏ సమాజంలోనైనా అది అమెరికాకానీ, భారతదేశంకానీ ఇంకేదైనా దేశంకానీ..మనుషులు కలిసి సుదీర్ఘకాలం జీవించినంత మాత్రాన నువ్వన్నట్టు నీరూ తామరాకులా వాళ్ళమధ్య అనుబంధమే ఏర్పడదు.ఎందరో ఉన్నారు నా అధ్యయనంలో..భార్యాభర్తలుగా కలిసి జీవితాంతం జీవించినా వాళ్ళు ఆత్మీయులు, స్నేహితులు కాదుకదా కనీసం పరిచయస్తులుకూడా కాలేకపోయినవాళ్ళు. నిజానికి పెళ్లి అనేది ఒక యాక్సిడెంట్‌. ఎవరో చెప్పినట్టు ఈ ప్రపంచంలో అన్నింటికంటే హాస్యపూరితమైన తతంగం పెళ్లిచూపుల పేరుతో ఒకమ్మాయి ఒకబ్బాయి ఎదురెదురుగా కూర్చుని ఒకర్నొకరు చూచుకోవడం. వాళ్ళు చూడగల్గింది. ఒట్టి బాహ్య రూపురేఖలనూ, చర్మసౌందర్యాన్నీ, వికారాలనేకదా. హృదయం ఎలా కనబడ్తుంది. యిక పెళ్ళి తతంగం పేరుతో ఒకటైన ఇద్దరు వాళ్ళవాళ్ళ వ్యక్తిగత తత్వాలు, అభిరుచులు, ప్రతిభావిశేషాలు, లక్ష్యాలు ఆధారంగా తమ తమ జీవితాలను ప్రారంభిస్తారు. అసలు అవగాహన యిక అప్పుడు బయటపడ్తుంది. ఆర్థిక పరమైన అంశాలు యిక ప్రతిభాశీలంగా పనిచేయడం మొదలౌతాయి. అతనుసంపాదిస్తున్నాడా, ఆమె సంపాదిస్తోందా. ఎవరు ఎంత సంపాదిస్తున్నారు. ఎవరు ఎవరిపై ఎంతవరకు ఆధారపడి జీవిస్తున్నారు..ఈ మీమాంస మొదలౌతుంది. ఆర్థిక స్పష్టత ఏర్పడ్డ తర్వాతనే మనుషుల అసలురంగు బయటపడ్తుంది. మౌన ఘర్షణ..అంతరంగ వైరుధ్యాలు, తత్వవైరుధ్యాలు.. అనివార్యతలు.. క్రమక్రమంగా ఒకరితో ఒకరు రాజీపడడాలు.. మొదలై..ఈ లోగా పిల్లలు.. పిల్లలపట్ల అనివార్యమై పొటమరించే బాధ్యతలు, సంరక్షణ..రాజీ..రాజీ..రాజీ..చాలా రాజీపడి..బస్‌ జీవితాన్ని జీవించడమే తప్ప అర్థవంతంగా బతకడం ఉండదు. ఓ వందమందిని సర్వేచేసి..నీ జీవితంలో ఏం సాధించావ్‌..అని ప్రశ్నిస్తే, పెరిగిపెద్దయిన..ఏదో ఓ ఉద్యోగం చేసిన..పెళ్ళి చేసుకున్న..పిల్లలను కన్న..సాధ్యమైనంత ఎక్కువ డబ్బు సంపాదించే ప్రయత్నం చేసిన, ముసలోన్నయి చచ్చిపోయిన. ఇంతే..ఇంతకన్న ఎక్కువ ఎవడూ చెప్పడు..ఈ రొటీన్‌కంటే తొంభైశాతం మంది అదనంగా ఏమీ చెప్పరు. ఎందుకంటే అంతకంటే ఎవరూ ఏమీ చేయరుకాబట్టి..ఐతే..జీవిత చరమథలో..నీ భార్య, నీ ప్లిలలు, నీ స్నేహితులు.. వీళ్ళతో నీ మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి అని ఎవరైనా ప్రశ్నిస్తే..వ్చ్‌..అని పెదవి విరిచి..అంతా మిథ్యవంటి శూన్యపూరిత జవాబే వస్తుంది కాని..ఓహో అని పొంగిపోయే స్ఫోరకమైన జవాబేదీ రాదు. ఈ నిర్లిప్తతకు కలిసి దాదాపు నలభై ఏభై ఏండ్లు జీవించిన భార్యాభర్తలుకూడా అతీతం కాకపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది..యిక్కడ బంధం సిమెంట్‌రోడ్‌పై ప్రవహించే నీరులా ముగుస్తుందిగాని..నగ్ననేలపై యింకే వానచినుకుల్లా మమేకం కాదు.
ఐతే.. ఏ పురుషునికి ఏ స్త్రీ భార్యగా లభించి వాళ్ళు జీవితరథానికి రెండు సమానమైన చక్రాల్లా గమనం సాగిస్తారో ముందుగా ఎవరికీ తెలియదు. పరస్పరం అనుకూలవతియైన భార్యో అనుకూలుడైన భర్తో లభించడం కేవలం వాళ్ల అదృష్టంగానే భావించవలసివస్తుందనే అన్ని అధ్యయనాలూ తెలియజేస్తున్నాయి. ఈ అనుకూలత అనేది ఒక హృదయ సంబంధమైన వ్యవహారం..అదే అంతిమంగా జీవితస్వరూప స్వభావాలనూ, సాఫల్యతనూ నిర్ధారిస్తుంది.” రామం ఏదో ఒక ఆంతరికలోకంనుండి మాట్లాడ్తున్నట్టుగా చెప్పుకుపోతున్నాడు.
చటుక్కున అంతరాయం కలిగిస్తూ..”సంగతించే ఇద్దరు స్త్రీ పురుషులు ఒకరి తత్వాన్ని మరొకరు పరిపూర్ణంగా అర్థంచేసుకుని ఒకరికోసం ఒకరు తమలో మార్పులను చేసుకోవచ్చుగదా. సర్దుబాటు, పరివర్తన, రీషేపింగు ఇవి మనుషులకు కొత్తజీవితాన్నీ, దాంపత్యంలో కొత్త స్ఫూర్తిని అందించగలవుగదా రామం..ఎందుకు మనుషులు తమ తత్వాన్నిపునరాకృతీకరించుకునే నిర్మాణంకోసం ప్రయత్నించరు. కలిసి నడవడం తప్పదని స్పష్టంగా తేలిపోయిన తర్వాత.. ఆ నడకను నిర్మాణాత్మకంగా, అర్ధవంతంగా మనుషులు మార్చుకుంటే బాగుంటుందిగదా..”అంది క్యాథీ.
”తప్పకుండా బాగుంటుంది. నిజానికి దాంపత్య వికాసం భార్యాభర్తల పరస్పర అవగాహన, ఎదుటి వ్యక్తిని భరించే సహనశీలత, త్యాగతత్వం, సర్దుబాటు.. వీటిపైన్నే ఆధారపడి ఉంటుంది క్యాథీ..ఇది మనిషి..ఇగో..అహంకు సంబంధించిన సున్నిత విషయం. ఎవరికోసంవారు కాకుండా ఒకరికోసం ఒకరం జీవిద్దాం, కలిసి నడుద్దాం, కలిసి సాధిద్దాం…కలిసి జీవితాన్ని సంయుక్తంగా పంచుకుందాం..కలిసే జీవితంలో విజయాలను సాక్షాత్కరింపజేసుకుందాం అన్న మూల భావన యిద్దరిలోగనుక ఉన్నట్టయితే యిక ఆ ప్రయాణం అద్భుతంగా సాగుతుంది. కాని ఎడ్లబండిని ఒక ఎద్దు ఒకవైపు ఇంకోఎద్దు మరోవైపు గనుక లాగుతున్నట్టయితే..బండి ముందుకు సాగదుసరికదా అక్కడే కూలబడి విరిగిపోతుంది కూడా..”
”ఎడ్లు ఏకశక్తిగా ఏర్పడి బండిని, అనుకున్న బాటలో సాఫీగా లాగడం నువ్వన్నట్టు అతి ప్రధాన విషయమైతే బండి రెండుచక్రాలూ ఒకే వ్యాసంతో అనుసంధానమై ఏకవేగంతో భ్రమించడం కూడా యింకో ముఖ్యమైన విషయంగా నువ్వు గుర్తిస్తున్నావా.”
యథాలాపంగా స్టీరింగు చేస్తున్న రామం ఉలిక్కిపడ్డట్టు క్యాథీ ముఖంలోకి చూశాడు. ఆమెయొక్క లోతైన దృష్టికి ఆశ్చర్యపోయాడు.
”అటువంటి పరస్పరానుకూలమైన రెండు చక్రాలు బండికి అమరడం ఆ బండియొక్క దక్షతకు దోహదపడ్తుంది. దాన్నే అదృష్టమందామా..”
”మే బీ..” నవ్వింది క్యాథీ గలగలా..ముత్యాలు రాలిపడ్డట్టు.
ఇంతకూ క్యాథీ ఎందుకిప్పుడు ఈ మహాలక్ష్మి గుడి ప్రోగ్రాం పెట్టినట్టు. కారు లైమ్‌స్టోన్‌ రోడ్‌పైనుండి వ్యాలీరోడ్‌లోకి ప్రవేశించింది. ఈ రోజు కారుకూడా క్యాథీదే. ఆడి. హైఎండ్‌. గాలిలో విడిచిన బాణంలా సర్రున..,
”వాటీద స్పెషాలిటీ టుడే క్యాథీ..వై డు యు అరేంజ్‌ దిస్‌ స్పెషల్‌ విజిట్‌..”
”జస్ట్‌ లైక్దట్‌’
ఏమై ఉంటుందబ్బా..ఉహు..ఊహకందట్లేదు..ఊర్కే ఆమెవైపు చూశాడు. చెరగని నవ్వు..అలసిపోని ముఖం. తాజా మల్లెపువ్వువలె..మెరిసే నీలికళ్లు నక్షత్రాల వలె.
ప్రతిష్టాత్మక హార్వర్డ్‌ యూనివర్సిటీనుండి ఎంబిఎ చేసిన ఈ పిల్ల యింత నిబ్బరంగా, వినమ్రంగా, ఆత్మవిశ్వాసం నిండిన పూర్ణత్వంతో ఎప్పుడూ స్థిరంగా ఎలా ఉండగలుగుతుందో అని రామం యిప్పటికి వేయిన్నొక్కసారి ఆశ్చర్యపడ్డాడు. అది గమనించి.
”వై..దట్‌ లుక్‌..”అంది చిలిపిగా.
”ఉహు..” అని చిన్నగా నవ్వి..కారు లంకాస్టర్‌ పైక్‌ పైకి వచ్చి..హాకిస్సిన్‌ హిల్‌ మార్గంలోకి ప్రవేశించి దూసుకుపోతోంది. కొండపైప్రాంతం కాబట్టి..చల్లగా, ఆహ్లాదంగా, ప్రశాంతంగా, గంభీరంగా కూడా ఉంది. కార్లో నిశ్శబ్దంగా పనిచేసే ఎ.సి.. అంతా ఏదో ఉత్సుకిస్తున్న పారవశ్యం.
క్యాథీ..అప్పుడప్పుడు చటుక్కున జీవితానికి అన్వయిస్తూ మేనేజ్‌మెంట్‌ విషయాలను అద్బుతంగా ఉటంకిస్తుంది. మొన్న మొన్న తనకిష్టమైన ప్రపంచ ప్రఖ్యాత మేనేజ్‌మెంట్‌ సైన్స్‌ రచయిత స్టీఫెన్‌ ఆర్‌.కోవె కొత్త పుస్తకం ”ఎనిమిదవ అలవాటు..ఫ్రమ్‌ ఎఫెక్టివ్‌నెస్‌ టు గ్రేట్‌నెస్‌” గురించి మహోద్వేగంతో చెప్తూ ఆ రచయిత ఎంతో స్ఫూర్తిని పొంది ఆ పుస్తకంలో ప్రస్తావించిన మహాత్మాగాంధీ కొటేషన్‌నొకదాన్ని చెప్పింది. ‘మనం చేస్తున్న పనికీ మనం చేయగల పనికీ గల తేడా దాదాపు ఈ ప్రపంచ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందేమో’ అన్నది ఆ సూక్తి.
నిజంగాఎంత అద్భుతమైన మేనేజ్‌మెంట్‌ పనిముట్టో అది.
”రామం.. నీకిది తెలుసా.. మనిషి అనే ఒక వస్తువుకాని ఈ జీవికి నాల్గు మితులు ..ఫోర్‌ డైమైన్షన్స్‌ ఉన్నాయి. ఒకటి మెదడు (మైండ్‌) రెండు శరీరం (బాడీ) మూడు హృదయం (హార్ట్‌.. గుండె కాదు) నాల్గు..వీటి సమిష్టి సమీకృత పదార్థమైన ఆత్మ (స్పిరిట్‌). ఎప్పుడూ ఏదో ఒకదాన్ని నేర్చుకోవడం మెదడు చేస్తే భౌతికంగా జీవింపజేసే ఉత్కృష్ట క్రియను శరీరం నిర్వహిస్తూంగా, ప్రేమతోనిండిన మానవ సంబంధాల నిర్వహణను హృదయం చేస్తూంటుంది. ఈ మూడు మహోన్నతమైనచర్యలను సమన్వయపరుస్తూ మనిషి ఆత్మ అర్థవంతమైన మానవపాత్రను నిర్దేశిస్తుంది. ఈ అవగాహన అద్భుతంగా ఉందిగదా రామం..” అంది క్యాథీ..కారు కొండపై నుండి మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి మెల్లగా ఆగుతూండగా.
రామం పులకించిపోయాడు. ఆమె చెబ్తున్న గాఢగంభీర విషయాన్ని వింటూ..ఈమెకు ఇంత లోతైన దృష్టి ఎలా అలవడిందో అని ఆశ్చర్యపోతూ..”ఊ” అన్నాడు కారును ఆఫ్‌చేసి..దిగుతూ.
అటువైపు నుండి క్యాథీకూడా కిందికి దిగింది.
చుట్టూ చాలా కార్లు పార్క్‌ చేసి ఉన్నాయి. అమెరికాలో నివాసముంటున్న భారతీయులు, తెలుగువాళ్లు రెండు మూడు రంగాల్లో గణనీయమైన తమదైన ముద్రను సామాజికంగా ఏర్పర్చారు. ఒకటి అనేక ప్రధాన నగరాల్లో దేవాలయాలను నిర్మించి నిర్వహిస్తూ అందర్నీ సంఘటితపర్చడం. రెండవది భారతీయ సంస్కృతిని శ్రద్ధగా కాపాడ్తూ కొండొకచో యితర దేశవాసులు ఆశ్చర్యపడే రీతిలో కళలను ప్రదర్శించడం, అనేక సందర్భాల్లో కూచిపూడి, కథక్‌, మణిపురివంటి నృత్యప్రదర్శనలు, సంగీత కచేరీలు. ప్రత్యేక పండుగరోజుల్లో ప్రవాస భారతీయులను ఎంతో విశేషంగా అలరిస్తూండడం. మూడవది.. తమ మూలప్రాంతాలకు దూరంగాఎక్కడో ఖండాంతరాల్లో జీవిస్తున్నామన్న స్పృహతో తమ పిల్లలకు ప్రత్యేక శ్రద్ధతో సంగీతం, నృత్యం వంటి ఏదో ఒక అదనపు కళారంగాల్లో శిక్షణనిప్పించడం..ఈ క్రమంలో అనేక తెలుగు కుటుంబాలు తరుచూ కలుసుకోవడం, అనుభవాలను పంచుకోవడం, చేరువకావడం, ఇదంతా ఒక సామాజిక ఐక్యతా సాధన.
రెండేళ్ళక్రితం ఈ మహాలక్ష్మి దేవాలయం స్థాపించబడ్డప్పటినుండి ఎందుకో క్యాథీ బాగా ఆకర్షితురాలైంది. ఈ దేవాలయాన్ని ఒక తెలుగువ్యక్తి శర్మ స్వయంగా పూనుకుని వనరులన్నింటినీ సమీకరించి నిర్మించడం ప్రారంభించి తర్వాత్తర్వాత ఇంకొందరి సహకారంతో పూర్తి చేశాడు. ఒక ట్రస్ట్‌ను ఏర్పరిచి ఆయనే చైర్మన్‌గా ఉండి పూర్తి అంకితభావంతో మందిరాన్ని నిర్వహిస్తున్నాడు. ట్రస్ట్‌లో క్యాథీకి కూడా ఒక ప్రముఖస్థానం ఉంది. ఆలయ నిర్మాణంలోకూడా ఆమె కాంట్రిబ్యూషన్‌ కొంత ఉంది. ధార్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఆమెకు ఎంతో ఇష్టమైన పని.
చకచకా గుడిలోకి నడిచింది. ఆ రోజు గుడిలోని మూర్తికి ‘సరస్వతీ’ అలంకారం చేసి ఒడిలో అందంగా వీణను అలంకరించారు. ఎందరో అప్పటికే కూర్చుని నిష్టగా థసహస్ర కుంకుమ నామార్చన చేస్తున్నారు. ఐదవ రౌండ్‌ కొనసాగుతోంది. గంభీరమైన సామూహిక పఠనంతో సర్వస్వతీ స్తుతి..స్తోత్రం.
ఇద్దరూ ప్రధాన ఆలయం ముందుకు నిశ్శబ్దంగా చేరి..అక్కడే ఉన్న దాదాపు అరవై ఏళ్ళ వయసున్న శర్మగారు క్యాథీని, రామంను గమనించి దగ్గరగా వచ్చి..సాదరంగా పలకరించి..మౌనంగానే ఆయన చేసిన సూచనమేరకు పూజారి.. విగ్రహానికి హారతిచ్చి, ఇద్దరికీ హారతిని అందించి శఠగోపంతో ఆశీర్వదించి..,
చుట్టూ.. సుగంధ ద్రవ్యాల పరిమళం..గాలినిండా సామూహిక పఠన పవిత్రత ..ఏదో మంగళకర వాతావరణం..,
క్యాథీ చేతిలో ఒక కొబ్బరిముక్కను, కొద్దిగా పూలను ఉంచి..ఘంటధ్వని..గణగణ.,
మరో రెండు మూడు నిముషాల్లో అంతా ముగిసి..ప్రక్కన హాల్లో క్రింద ఆడిటోరియంలో ఏవో కార్యక్రమాలు నడుస్తున్నాయి. శాస్త్రీయ సంగీతం తాలూకు ఏదో గాత్రం శ్రావ్యంగా, సన్నగా వినబడ్తోంది.
”రా..” అని మళ్ళీ బయటికి దారితీసింది క్యాథీ.
మొత్తంమీద ఏదో ఓ ప్రధాన విషయాన్ని తన ముందు ప్రస్తావించేందుకు క్యాథీ ప్రయత్నిస్తోందని తెలుస్తోంది రామంకు.
బయటికి రాగానే..పచ్చగా, విశాలంగా ఉన్న గడ్డిపై కూర్చుంటూ,
”రామం.. నీకు చెప్పకుండా ఒక బృహత్తర కార్యక్రమాన్ని గత మూడు నెలలుగా నిశ్శబ్దంగా నిర్వహిస్తూ వస్తున్నాను. సడెన్‌గా చెప్పి సర్‌ప్రైజ్‌ చేద్దామని ఓ పిచ్చికోరిక. అందుకు నువ్వు అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించిన ఈ రోజే సరియైందేమోనని ఈ టైంను ఎంచుకున్నా. సరిగ్గా నువ్వు భారత ఉపఖండంనుండి అమెరికాలోకి అధికారికంగా పౌరునివై ప్రవేశించిన, ఈరోజే .. నేను.. కాదు మనం యిటు ఈ అమెరికానుండి అధికారికంగా భారతదేశ వ్యాపారవ్యవస్థలోకి శక్తివంతంగా ప్రవేశిస్తున్నాం. ఈ రెండూ ఒకరోజే సంభవించడం యాదృచ్ఛికమే ఐనా చిత్రమే..”
”ఏమిటి క్యాథీ..వై యు ఆర్‌ సో ఎక్సైటెడ్‌”
”యస్‌..యామ్‌ రియల్లీ ఎక్సైటెడ్‌ టుడే..బికాజ్‌..వుయార్‌ నౌ రీచింగు టు స్టార్ట్‌ది మిషన్‌ విచ్‌ యు వర్‌ హిథర్‌ టు డ్రీమింగు.. ప్రపంచంలో అత్యున్నత అంతర్జాతీయ బహుళజాతి సంస్థల్లో ఒకటైన అసెంచుర్‌కు ఒక బిపిఓ ఔట్‌లెట్‌గాభారతదేశంనుండి ఆపరేషన్స్‌ నిర్వహించేందుకు నేను అధీకృత కంపెనీ ఒకదాన్ని స్థాపించి గత నాల్గునెలలుగా ఆ కంపెనీ సిఇవో.. విలియమ్‌ డి. గ్రీన్‌తో చర్చలు జరుపుతూ వస్తున్నాను. అవి ఫలించి ఒక అంగీకారం కుదిరింది. ఈరోజు అమెరికా టైం ప్రకారం సాయంత్రం మేరీల్యాండ్‌ హోటల్‌ మెరియట్‌లో ఎంఓయుపై సంతకాలు చేయాలి. మనకు యుఎస్‌ఎ కు చెందిన నాల్గు ప్రాజెక్ట్స్‌.. మొత్తం నాల్గు మిలియన్‌డాలర్స్‌ విలువగలవి అప్పజెప్పబడ్తాయి. వాటితో ఆర్థికంగా పదునైన ఖడ్గంవలె మనం తయారై కార్యరంగంలోకి ప్రవేశిస్తాం.. ది ఫస్ట్‌ స్టెప్‌ విల్‌బి ఫర్మ్‌, రిజిడ్‌, స్టర్డీ అండ్‌ సాలిడ్‌. దీంతో మనం ఆంధ్రదేశంలో తేవాలనుకుంటున్న పెనుమార్పుకు శ్రీకారం జరుగుతుంది. యుద్ధం జరపాలనుకుంటున్నప్పుడు ఒక సమర్థవంతమైన వాహనం కావాలి. అది గుర్రమా, ట్రక్కా, హెలికాప్టరా, ఎఫ్‌ సిక్స్‌టీన్‌ కంకార్డా.. ఏదో ఒకటి. కావాలి మొత్తానికి. సరంజామాను సమకూర్చుకుంటున్నాం..  కంపెనీ పేరు..” ఆగింది క్యాథీ. గాఢ తపస్సులో ట్రాన్స్‌లో ఉన్న మనిషి మాట్లాడ్తున్నట్టుగా ఉందామె అప్పుడు.
”….” రామం వింటున్నాడు అభావంగా.
”కంపెనీ పేరు..రామం..”అంది ఒక్కక్షణం ఆగి.,
మళ్ళీ ప్రారంభించింది.
”పూర్ణమదః పూర్ణమిదః పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే, పూర్ణస్య, పూర్ణమాదాయ, పూర్ణమేవావ శిష్యతే..” దటీజ్‌ అబ్‌సొల్యూట్‌  దిసీజ్‌ అబ్‌సొల్యూట్‌, అబ్‌సొల్యూట్‌ ఎరైజెస్‌ ఔటాఫ్‌ అబ్‌సొల్యూట్‌. ఇఫ్‌ అబ్‌సొల్యూట్‌ ఈజ్‌ టేకెనెవే ఫ్రమ్‌ అబ్‌సొల్యూట్‌.. ఆల్వేస్‌ అబ్‌సొల్యూట్‌ రిమైన్స్‌..అందుకే మన రామం కంపెనీ లోగో ఒట్టి శూన్యానికి ప్రతీకైన సున్నా..కాంతివంతంగా వెలుగుతూ ప్రజ్వలిస్తున్న సున్న..ఎ గ్లిట్టరింగు రింగు. ఇక స్లోగన్‌ టాగు..”చెప్పుకుపోతూనే ఉంది.
రామం ఆశ్చర్యపడ్తూ, ఆనందపడ్తూ, ఆమె దృష్టిలో తనే ఒక కేంద్రకమై కొనసాగుతున్నందుకు గర్విస్తూ.. పులకించిపోతూండగా.,
”ట్యాగు ఏంటంటే..”ఓ క్షణం ఆగి, అతనివంక చిలిపిగా, కవ్వింతగా చూచి
నిశ్శబ్దంగా సాధిస్తూపోయే నీ తత్వాన్ని ప్రతిబింబించే రెండే రెండు పదాలు..రేపు చరిత్రను సృష్టించబోతున్న రెండే రెండు బీజాక్షరాలతో కూడిన నినాదం..ప్రాణం, ప్రణవం..ప్రపంచం..”
”…” రామం ఆ క్షణం క్యాథీలో ప్రళయిస్తున్న స్త్రీ శక్తిని చూస్తున్నాడు.
ఏమిటీమెలో ఈ ఉద్ఘోష..అనుకున్నాడు
”చెప్పు” అన్నాడు అనూహ్యంగానే.
మళ్ళీ ఆమె వికసిస్తున్న పువ్వులా నవ్వి అంది..”జస్ట్‌ పర్‌ఫార్మింగు” అని..స్పష్టంగా, నిశ్చితంగా, స్థిరంగా చెప్పింది కంపెనీ తత్వాన్ని ప్రతిబింబించే ట్యాగులైన్‌ను.
ఔను.. జస్ట్‌ పర్‌ఫార్మింగు హియరాఫ్టర్‌..యిక సంచలనాత్మకంగా పనులను నిర్మాణాత్మక రీతిలో నిర్వహిస్తూ పోవడమే.. మడమ తిప్పకుండా, వెనక్కి తిరిగిచూడకుండా..ఏకోన్ముఖంగా,
ఐతే ఈ ‘రామం’ పేరేమిటి.. ఈమెకు తనపై ఈ అచంచలమైన విశ్వాసానీకీ, ఇష్టతకూ, ప్రేమకూ పునాది ఏమిటి.. నమ్మకం..ఒట్టి నమ్మకమేనా..అంతేనా.,
మనిషిపై మరో మనిషికి గట్టి నమ్మకం ఏర్పడ్డం మామూలు విషయము కాదు. మానవ సంబంధాలన్నీ వ్యాపారాత్మక ఆర్థిక సంబంధాలుగానే చెలామణి ఔతున్న స్వార్ధపూరిత వర్తమాన సందర్భంలో..మనిషిని మనిషి నమ్మడం.. అదీ ఈ స్థాయిలో నమ్మడం నిజంగా అపూర్వమే.
”రామం..నువ్వు స్వతహాగా లక్ష్యించిన గమ్యాలు గొప్పవి. ఒక అద్బుతమైన నూతన సమాజాన్ని సృష్టించాలని సంకల్పంచిన కాంక్ష గొప్పది…ఆ మహోన్నతమైన సాధనలో నీ వెంట ఒక స్నేహితురాలిగా పాలుపంచుకోవాలన్నది నా కోరిక..యిక్కడికి వచ్చిన్నాటినుండి నీ అన్ని సాహసోపేతమైన కార్యక్రమలూ నాకు తెలుసు..నీ వ్యూహాలు,  క్రమశిక్షణ, నిబద్ధత..నిర్వహణ..వీటన్నింటిలోనూ నీ నిజాయితీ..యివన్నీ యిన్నేళ్ళ నీ సాంగత్యంలో నాకు చాలా స్పష్టంగా తెలుసు.. అందుకే..యిక విమానం టేకాఫ్‌ కావలసిన సమయం ఆసన్నమైంది. నాకు తెలిసి ఒక మేనేజ్‌మెంట్‌ విద్యార్థిగా..ఈ ప్రపంచాన్ని ఎంతో ప్రభావితం చేసిన ఎందరో మహానుభావుల్లో ఉన్న అతి ప్రధానమైన జ్ఞానాలు నాల్గువిధాలు. ఒకటి మేధోసంబంధమైనదార్శనికత, రెండు శారీరక ప్రవర్తనను నియంత్రించే క్రమశిక్షణ, మూడు..హృదయ సంస్పందనలను కార్యోన్ముఖం చేసే కాంక్ష, నాల్గవది..అతి ప్రధానమైందీ ‘స్పృహ’ అనబడే ఆత్మ సంబంధియైన అంతఃచేతన. లూసియస్‌ సెనేకా అనే తత్త్వవేత్త ఏమన్నాడంటే..”మోస్ట్‌ పవర్‌ఫుల్‌ ఈజ్‌ హి హు హాజ్‌ హిమ్‌సెల్ఫ్‌ ఇన్‌ హిజ్‌ పవర్‌..’అని..మనిషి తనకున్న శక్తితో తనను తాను గుర్తించగలిగిననాడే నిజమైన శక్తిమంతుడు..”
క్యాథీ ఒక మనిషిగా ద్రవించి ప్రవహిస్తున్నప్పుడు రామం ఎప్పుడూ ఆమెను ఆపే ప్రయత్నం చేయలేదెన్నడూ. ఆమె ఓ జలపాతమౌతుంది అప్పుడప్పుడు.
”రామం.. అందరూ అడిగే ప్రశ్న ఒకటుంది..అది..నీవంటి లీడర్స్‌ పుడతారా లేక తయారుచేయబడ్తారా అని.. దీనిపైన ఎందరో విశ్లేషణాత్మక అధ్యయనాలను జరిపారు విపులంగా. ఐతే చివరికి చాలామంది అంగీకరించిన సత్యమేమిటంటే.. లీడర్స్‌ ఆర్‌ సెల్ఫ్‌ మేడ్‌ అని. ఒక నాయకుడు వాణ్ణివాడు మాత్రమే రూపొందించుకోవాలి. శిల ఉలితో తనను తానే చెక్కుకుని శిల్పంగా మలచుకొన్నట్టు. ఐతే యిక్కడ ఒక ప్రధానమైన విషయముంది రామం..లీడర్‌ ఎప్పుడు ఒకమేనేజర్‌ కాదు. నీకా విషయం తెలుసనుకో. ఐనా సందర్భం ఔచిత్యమైంది కాబట్టి మరోసారి చెబుతున్నా. డబ్ల్యు.బి. బెన్నిస్‌ ఏమన్నాడంటే ‘లీడర్సార్‌ పీపుల్‌ హు డు ది రైట్‌ థింగ్సు – మేనేజర్సార్‌ పీపుల్‌ హు డు థింగ్సు రైట్‌” సరియైన పనులనే చేయడం వేరు. పనులను సరిగా చేయడం వేరు…కదా” అని చటుక్కున ఆగి..నాలుక్కరుచుకుని., సిగ్గుపడ్తున్నట్టు తలవంచుకుని.,
”యువార్‌రైట్‌ క్యాథీ..” అన్నాడు రామం ప్రశంసాపూర్వకంగా.
”ఎనీ ఓవర్‌ యాక్షన్‌”
”నాటెటాల్‌..నెవర్‌ యువర్‌ ఓవర్‌”
”సో..రామం అనే కంపెనీకి సిఇఓ గారూ..యిక హైద్రాబాద్‌లో మన కంపెనీని స్థాపించే ప్రణాళికను యుద్ధప్రతిపాదికపై ప్రారంభిస్తారా. ఎట్‌ ది సేమ్‌ టైం..నా ఆఫర్‌ను అంగీకరించినందుకు ధన్యవాదాలు..” అంది ఆత్మీయత ఉట్టిపడ్తున్న స్వరంతో.
”థ్యాంక్యూ క్యాథీ..నిజానికి నువ్వు నా ఆత్మకు ఒక భౌతిక రూపానివి..ఈ ఒక వాక్యంకంటే ఇంక ఏమీ చెప్పలేను” అన్నాడు రామం కృతజ్ఞతాభావంతో పులకించిపోతూ అతనికాక్షణం  రెక్కలు మొలుస్తున్నప్పటి శిశుపక్షిలో కలిగే ఉద్వేగభరిత వివశత ఉండి.
”సాయంత్రం యిద్దరం మేరీల్యాండ్‌ మారియట్‌లో ఎంఒయుపై సంతకం చేద్దాం.. ఎ సెంచ్వుర్‌ సిఇఓ విలియమ్‌ డి. గ్రీన్‌తో…వెళ్దామా యిక…”
”దేవీగారి అజ్ఞమరి” నవ్వాడతడు ప్రసన్నంగా.
సరిగ్గా అప్పుడే మహాలక్ష్మి దేవాలయం నుండి  గుడిగంటలు మంగళప్రదంగా మ్రోగాయి..చుట్టూ గుంపులుగుంపులుగా ఉన్న ఎత్తైన చెట్లలోనుండి పకక్షుల గుంపులు నీలి ప్రశాంత ఆకాశంలోకి ఎగిరి నిష్క్రమించడం మొదలైంది. దార్శనికత, రెండు శారీరక ప్రవర్తనను నియంత్రించే క్రమశిక్షణ, మూడు..హృదయ సంస్పందనలను కార్యోన్ముఖం చేసే కాంక్ష, నాల్గవది..అతి ప్రధానమైందీ ‘స్పృహ’ అనబడే ఆత్మ సంబంధియైన అంతఃచేతన. లూసియస్‌ సెనేకా అనే తత్త్వవేత్త ఏమన్నాడంటే..”మోస్ట్‌ పవర్‌ఫుల్‌ ఈజ్‌ హి హు హాజ్‌ హిమ్‌సెల్ఫ్‌ ఇన్‌ హిజ్‌ పవర్‌..’అని..మనిషి తనకున్న శక్తితో తనను తాను గుర్తించగలిగిననాడే నిజమైన శక్తిమంతుడు..”
క్యాథీ ఒక మనిషిగా ద్రవించి ప్రవహిస్తున్నప్పుడు రామం ఎప్పుడూ ఆమెను ఆపే ప్రయత్నం చేయలేదెన్నడూ. ఆమె ఓ జలపాతమౌతుంది అప్పుడప్పుడు.
”రామం.. అందరూ అడిగే ప్రశ్న ఒకటుంది..అది..నీవంటి లీడర్స్‌ పుడతారా లేక తయారుచేయబడ్తారా అని.. దీనిపైన ఎందరో విశ్లేషణాత్మక అధ్యయనాలను జరిపారు విపులంగా. ఐతే చివరికి చాలామంది అంగీకరించిన సత్యమేమిటంటే.. లీడర్స్‌ ఆర్‌ సెల్ఫ్‌ మేడ్‌ అని. ఒక నాయకుడు వాణ్ణివాడు మాత్రమే రూపొందించుకోవాలి. శిల ఉలితో తనను తానే చెక్కుకుని శిల్పంగా మలచుకొన్నట్టు. ఐతే యిక్కడ ఒక ప్రధానమైన విషయముంది రామం..లీడర్‌ ఎప్పుడు ఒకమేనేజర్‌ కాదు. నీకా విషయం తెలుసనుకో. ఐనా సందర్భం ఔచిత్యమైంది కాబట్టి మరోసారి చెబుతున్నా. డబ్ల్యు.బి. బెన్నిస్‌ ఏమన్నాడంటే ‘లీడర్సార్‌ పీపుల్‌ హు డు ది రైట్‌ థింగ్సు – మేనేజర్సార్‌ పీపుల్‌ హు డు థింగ్సు రైట్‌” సరియైన పనులనే చేయడం వేరు. పనులను సరిగా చేయడం వేరు…కదా” అని చటుక్కున ఆగి..నాలుక్కరుచుకుని., సిగ్గుపడ్తున్నట్టు తలవంచుకుని.,
”యువార్‌రైట్‌ క్యాథీ..” అన్నాడు రామం ప్రశంసాపూర్వకంగా.
”ఎనీ ఓవర్‌ యాక్షన్‌”
”నాటెటాల్‌..నెవర్‌ యువర్‌ ఓవర్‌”
”సో..రామం అనే కంపెనీకి సిఇఓ గారూ..యిక హైద్రాబాద్‌లో మన కంపెనీని స్థాపించే ప్రణాళికను యుద్ధప్రతిపాదికపై ప్రారంభిస్తారా. ఎట్‌ ది సేమ్‌ టైం..నా ఆఫర్‌ను అంగీకరించినందుకు ధన్యవాదాలు..” అంది ఆత్మీయత ఉట్టిపడ్తున్న స్వరంతో.
”థ్యాంక్యూ క్యాథీ..నిజానికి నువ్వు నా ఆత్మకు ఒక భౌతిక రూపానివి..ఈ ఒక వాక్యంకంటే ఇంక ఏమీ చెప్పలేను” అన్నాడు రామం కృతజ్ఞతాభావంతో పులకించిపోతూ అతనికాక్షణం  రెక్కలు మొలుస్తున్నప్పటి శిశుపక్షిలో కలిగే ఉద్వేగభరిత వివశత ఉండి.
”సాయంత్రం యిద్దరం మేరీల్యాండ్‌ మారియట్‌లో ఎంఒయుపై సంతకం చేద్దాం.. ఎ సెంచ్వుర్‌ సిఇఓ విలియమ్‌ డి. గ్రీన్‌తో…వెళ్దామా యిక…”
”దేవీగారి అజ్ఞమరి” నవ్వాడతడు ప్రసన్నంగా.
సరిగ్గా అప్పుడే మహాలక్ష్మి దేవాలయం నుండి  గుడిగంటలు మంగళప్రదంగా మ్రోగాయి..చుట్టూ గుంపులుగుంపులుగా ఉన్న ఎత్తైన చెట్లలోనుండి పకక్షుల గుంపులు నీలి ప్రశాంత ఆకాశంలోకి ఎగిరి నిష్క్రమించడం మొదలైంది.

మా వంగూరి హౌస్, రేడియో సావిడి, సమ్మర్ హౌస్!

chitten raju

పుట్టిన ఇంట్లోనే గిట్టే దాకా ఉండడం పల్లెటూళ్ళలో మామూలే. ఉద్యోగాలలో బదిలీల మీద వేరే నగరాలకి పోవడం, ఒకే ఇంట్లో కొన్నేళ్ళు అద్దెకున్నా అనేక కారణాలకి ఇల్లు మారడం, సొంత ఇల్లు ఉన్నా చదువులకి పై ఊళ్ళు వెళ్ళవలసి రావడం వగైరా అనేక కారణాల వలన దశాబ్దాల కొద్దీ ఒకే ఇంట్లో ఉండడం పట్నం వాసులకి అరుదే అని అందరికీ తెలిసినదే. కానీ నా విషయంలో పుట్టిన ఇంట్లోనే పెరిగి, ఇంజనీరింగు డిగ్రీ చదువు పూర్తయే దాకా ..అంటే 21 సంవత్సరాలు కాకినాడలో మా “వంగూరి హౌస్” లోనే గడపడం నా అదృష్టమే!

1925 లో ఆ ఇల్లు ఆ నాటి ఇళ్ళ నమునాని తలపిస్తూ ముందు ఒక వరండా, నాలుగు స్తంభాలు, లోపల వాస్తు ప్రకారం ఆగ్నేయం మూల వంట గది, మరొక పక్కన రోజుకి ఇరవై నాలుగు గంటలూ బొగ్గుల మీద వేడిగా కాగుతున్న యాభై గేలన్ల పాల కుండ,   పక్కనే పూజ గది, ఆనుకుని ఆవకాయలు పెట్టుకునే అటక తో సహా ఊరగాయల గది, ఏడాదికి సరిపడా ధాన్యం నిలవ చేసుకునే కొట్టాం తో సహా పప్పులూ, వంట దినుసులూ అమర్చుకునే ఒక పెద్ద స్టోర్ రూమూ, వెనకాల భోజనాల వరండా, నాలుగు పడక గదులు, ఈ రోజుల్లో లివింగ్ రూమ్ అన దగ్గ మధ్య గది,  నగలు, నట్రా, వెండి కంచాలు  దాచుకునే భోషాణం గదీ, ముందు వరండాకి పక్కన ఒక అతిథి గది , వెరసి పది గదులతో ఆ “చిన్న” పెంకుటిల్లు తాత్కాలికంగా ఒక ఔట్ హౌస్ లా కట్టారు మా తాత గారు. అంత విశాలమైన స్థలంలో పెద్ద ఇంట్లో పుట్టి, పెరిగిన నాకు ఈ రోజుల్లో అందరూ “మేము త్రీ బెడ్ రూమ్ – త్రీ బాత్” ఫ్లాట్  కొనుక్కున్నాం అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటే “అదోలా” ఉంటుంది. 1980 లలో తీసిన ఆ ఇంటి ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను. ఎదురుగుండా పెద్ద గుండిగల వెనకాల కిటికీ మా గెస్ట్ బెడ్ రూమ్. ఆ గదిలోనే ఉండి మా బంధువులు (మా సూరీడు బాబయ్య గారు, చిట్టెన్ రాజు బాబయ్య, హనుమంత రావు బావ, అబ్బులు బావ..వగైరా) అనేక మంది చదువుకున్నారు. సరిగ్గా ఆ గదికి వరండా అవతలి వేపు ఉన్న గది మొదట్లో మా తాత గారి గది. ఆయన పోయాక అది “పురిటి గది” అయిపోయింది. మా అన్నదమ్ములు, అప్పచెల్లళ్లతో సహా  మా బంధువులలో కనీసం వంద మంది అయినా ఆ గదిలో పుట్టారు. ఈ ఫోటో లో అక్కడ గోడకి ఆనుకుని కూచున్నది మా అమ్మ.  ఇంటి ముందు ఠీవిగా ఉన్నది మా మామిడి చెట్టు అని వేరే చెప్పక్కర లేదు.

Kakinada Home

ఆ ఇల్లు కట్టిన ఏడాదికి మా నాన్న గారికి పెళ్లి అయింది. మరో నాలుగేళ్ళ తరువాత వరసగా పిల్లలు పుట్టుకు రావడంతో 3600 గజాల స్థలంలో ఉన్న ఆ పది గదుల ఇల్లు కూడా  సరిపోక పోవడంతో మా నాన్న గారు అదే ఔట్ హౌస్ పద్ధతి ని కొనసాగించి పురిటి గదికి అవతలి వేపు ఒక పెద్ద గది, దాని మీద పైన పెంకులని ఆనుకుని ఒక చిన్న డాబా వేయించారు. ఆ డాబా చిన్నదే కానీ సుమారు ఇరవై మంది పిల్లలం ఇరవై వేసవి కాలాలు ఆ డాబా మీద రొజాయిలు వేసుకుని, కబుర్లు చెప్పుకుంటూ, నక్షత్రాలు లెక్క పెట్టుకుంటూ గడించిన అనుభూతులు చాలా గొప్పవే! ఆ డాబా మీద పడుకునే నుంచే నేను ఒక నెల పాటు ఒక తోక చుక్క గమనాన్ని చూసాను.  ఇప్పటికీ, ఎప్పటికైనా అదృష్టవశాత్తూ చీకటి రాత్రి పూట ఆకాశం లోకి చూడగలిగితే  నక్షత్ర సమూహాల పేర్లు, కొన్ని గ్రహాలనీ గుర్తు పట్టగలను. ఆ డాబా మీదకి చొచ్చుకు వచ్చిన సీతా ఫలం చెట్ల నుంచి తాజాగా కోసుకున్న పళ్ళ రుచి నాకు యింకా జ్జాపకం వస్తూనే ఉంటుంది.  ఇక ఉన్న ఇంటికీ ఆనుకుని ప్రహరీ గోడ వెంబడి రెండు పడక గదులు, మధ్యలో హాలు కట్టించారు. ఇది ఎలాగా తాత్కాలికమే కదా, పెద్ద మేడ ఎలాగా కడతాం కదా అని పెంకుల బదులు ఈ నాలుగు గదులకీ పైన ఎస్బేస్టస్ రేకుల తో పై కప్పు వేయించారు. ఈ గదుల సమాహారానికి “రేడియో సావిడి” ని పేరు.

రేడియో సావిడిలో అక్క

రేడియో సావిడిలో అక్క

“రేడియో సావిడి” అనే పేరుకి కారణం స్పష్టంగానే తెలుస్తున్నా ఆ పేరు రావడానికి ఒక పిట్ట కథ ఏమిటంటే  నాకు సుమారు పదేళ్ళు వచ్చే దాకా మా జీవితం “అంధకారం” లోనే గడిచింది..అనగా మా పెద్ద చెల్లెలు భానుమతి పుట్టిన ఏడు మా ఇంటికి కరెంటు వచ్చింది. అంత వరకూ చీకటి పడేటప్పటికల్లా పదో, పదిహేనో కిరసనాయిలు లాంతర్లు, ఐదో, ఆరో పెట్రో మాక్స్ లైట్లూ ఆదరాబాదరాగా వెలిగించుకోవడం, వెలుగు ఉండగా చక్కబెట్టుకోవలసిన పనులు చేసేసుకోవడం మొదలైన హడావుడులు చాలానే ఉండేవి.  ఈ పెట్రోమాక్స్ లైట్లు టెక్నాలజీ తలచుకుంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం గానే ఉంటుంది.  Max Gratetz అనే జర్మన్ మహానుభావుడు ఒక మేంటిల్ అనే దీపం వత్తిని కొంచెం వేడి చేసి, పెరాఫిన్ అనే పదార్ధాన్ని కొంచెం పెట్రోల్ తో బాగా ప్రెషర్ వచ్చేలా పంపు కొట్టి దాన్ని వాయువు గా చేసి ఆ దీపానికి పంపిస్తే అది భగ్గుమని అంటుకుని దేదీప్యమానంగా వెలుగుతుంది. ఇందులో ఎంతో స్పీడుగా టక టక టకా ఆ పంపు కొట్టే డ్యూటీ అప్పుడప్పుడు నాకు పడేది. ఎవరింట్లో పెళ్లి అయినా పల్లకీలో ఊరేగింపుకీ, ముఖ్యంగా మేళం ఆడేటప్పుడు డజన్ల కొద్దీ పెట్రోమాక్స్ లైట్లతో పెళ్లి వారు మహానంద పడేవారేవారు.  ఆ చుట్టుపక్కల అటు రాజమండ్రి, సామర్లకోట లాటి  ఊళ్ళలో ఎన్ని మేళాలు ఉన్నా, పెద్దాపురం మేళానిదే అగ్రతాంబూలం. ఆ పెట్రోమాక్స్ లైట్లు లేకపొతే వాళ్ళ అందచందాలు ఆస్వాదించేదెలా?  తెలియని వారికి ఆ పెట్రోమాక్స్ లైట్ ఫోటో ఇక్కడ జతపరిచాను.

petromax1

మా ఇంటికి కరెంటు రాగానే మా నాన్న గారు చేసిన మొదటి పనులలో గిరి & కో కి వెళ్లి ‘నేషనల్ ఎక్కో” వారి రేడియో ఒకటీ, ఆ తరువాత ఒక “కుక్క”  గ్రామఫోనూ కొనుక్కొచ్చారు. మెయిన్ రోడ్ లో ఉండే ఈ గిరి & కొ కాకినాడ నగరానికి ఆ రోజుల్లో ఒక లాండ్ మార్క్ . నాకు తెలిసీ మొత్తం తూర్పు గోదావరి జిల్లాలో రేడియోలు, గ్రామఫోనులు మొదలైన అత్యాధునిక శ్రవణ పరికరాలు  అక్కడే దొరికేవి. దాని యజమానులు శేషగిరి రావు గారు కూడా మా గాంధీ నగరం లోనే ఉండే వారు. మా కుటుంబానికి సన్నిహితులు. ఆయన కొడుకులు వేంకటేశ్వర రావు (స్మైల్స్ ఫోటో స్టూడియో అధినేత), బాబ్జీ, భగవాన్ మా అన్నదమ్ములూ మేము చాలా మంచి మిత్రులం. అందులో భగవాన్ (ఇప్పుడు హైదరాబాద్ లో ఆడిటర్)  మంచి క్రికెట్ ఆటగాడిగా పేరు తెచ్చుకుని రంజీ ట్రోఫీ లో కూడా ఆడాడు. బాబ్జీ గారిని ఇటీవల మా హైస్కూల్ రజతోత్సవ సందర్భంగా కలుసుకున్నాను.

ఆ రేడియో, గ్రామఫోనూ కొన్న దగ్గర నుంచీ ..అంటే సుమారు 1950 నుంచీ మరో పదిహేనేళ్ళ తరువాత నేను కాకినాడ వదిలి బొంబాయి వెళ్ళేదాకా మా జీవితం అంతా ఆ రేడియో సావిట్లో ఆ రెండు శబ్ద శ్రవణ యంత్రాల చుట్టూనే తిరిగింది. ఆ రోజులలో మా అక్క ఆ రేడియో పెడుతున్న ఫోటో ఒకటి ఇక్కడ జతపరుస్తున్నాను.  అప్పటికి  టెలివిజన్ అనే మాట కూడా మాకు తెలియదు. కేవలం రేడియో లో అనేక రకాల కార్యక్రమాలు విని, గ్రామఫోనులో ఘంటసాల గారిని విని నా జీవితాన్ని ధన్యం చేసుకున్నాను.  అంతెందుకు….అప్పటి దాకా మా ఇంటిల్లి పాదీ పొద్దున్నే మొహం కడుక్కోడానికి కచిక (కాల్చిన బొగ్గు నుసి) , వేప పుల్ల, “కోతి మార్కు” పళ్ళ పొడి, తాటాకు వగైరాలు వాడే వాళ్ళం. రేడియో సిలోన్ లో ప్రతీ అద్దివారం పొద్దున్న అమీన్ సాయాని పరమాద్భుతమైన గొంతుకలో “బినాకా గీత మాలా” అనే హిందీ సినిమా పాటల కార్యక్రమం వినడం మొదలుపెట్టగానే ఆ కచికల లాంటి సామగ్రి అంతా బయట పారేసి బినాకా టూత్ పేస్ట్ వాడడం మొదలుపెట్టి, “నాగరికులు” గా చెలామణీ అవడం మొదలుపెట్టాం.

బినాకా గీత మాలా అనగానే మరొక పిట్ట కథ గుర్తుకొస్తొంది. అదేమిటంటే ..ఆ రోజుల్లో రేడియో లాంటి ఆధునిక యంత్రం మా స్నేహితులు ఎవరి ఇంట్లోనూ ఉండేది కాదు. ఉన్నది  కేవలం మా ఇంట్లోనే.   అందు చేత మా స్నేహితులందరూ..అంటే మా అక్క,  సుబ్బన్నయ్య, న్నేను, మా తమ్ముడు ..ఇలా అందరి స్నేహితులూ ఆది వారం పొద్దున్న ఎనిమిది అయ్యే సరికి మా ఇంటికి వచ్చేసే వారు ఈ బినాకా గీత్ మాలా వినడానికి. అందులో గురు మూర్తి అనే ఒక స్నేహితుడు …మా అక్క ఫ్రెండో, సుబ్బు ఫ్రెండో గుర్తు లేదు ప్రతీ ఆదివారం పొద్దున్న ఎనిమిది నుంచి పన్నెండు గంటలకి ఆ కార్యక్రమం పూర్తి అయ్యేవరకు మా రేడియో సావిట్లోనే ఉండే వాడు. ఆ తరువాత ఆ పాటల గురించి చర్చలు కొనసాగేవి. అలా ఎవరైనా స్నేహితులు వచ్చినప్పుడు అమర్యాదగా ఉంటుంది అని మేము ఎవరమూ మా అమ్మ ఎంత పిలిచినా మధ్యాహ్నం భోజనాలకి వంటింట్లోకి  వెళ్ళే వాళ్ళం కాదు.  ప్రతీ పది నిముషాలకీ మా అమ్మ పాపం “ఎంతకీ భోజనాలకి రారు వీళ్ళు” అని బాధ పడుతూ “వాళ్ళని పిల్చుకు రావే” అని మా మెయిన్ హౌస్ నుంచి రేడియో సావిడికి మా రెండో చెల్లెలు అన్నపూర్ణ ని పంపించేది. ఒక సారి మా నాన్న గారు ఈ తతంగం అంతా గమనించి విసుక్కున్నారు. అది విని మా పూర్ణ రేడియో సావిట్లోకి వచ్చి “ఈ వెధవ ఫ్రెండ్స్ అంతా పొద్దున్నే వచ్చేసి సాయంత్రం దాకా ఇక్కడే తగలడతారు. చచ్చు వెధవలు. వాళ్ళు భోజనం చెయ్యరు. వీళ్ళని చెయ్యనివ్వరు” అని మా నాన్న గారు విసుక్కుంటున్నారు” అని సాక్షాత్తూ ఆ గురుమూర్తి తోటే చెప్పేసింది.  అంతే సంగతులు. అప్పటి నుంచే, ఇప్పటి దాకా ఆనాటి ఆప్త మిత్రుడు గురు మూర్తి ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో నాకు ఇప్పటికీ తెలియదు.

Summer Savidi

ఇక మా జనాభాకి రేడియో సావిడీ, మరొక మూడు గదులూ కూడా చాలక ఎదురుగుండా ఒక 20’ x 30’ అడుగుల ..అంటే సుమారు 600 చదరపు అడుగుల హాలు కట్టించారు. దీని పేరు “సమ్మర్ హౌస్”. దీని మీద ముందు తాటాకులూ, ఆ తరువాత మా పొలం లో ఉన్న చెరువులో కుప్పలు, తెప్పలుగా పెరిగే రెల్లు గడ్డి తో పై కప్పు వేయించారు.  నా చిన్నప్పటి జీవితం చాలా మటుకు ఈ సమ్మర్ హౌస్ లోనే గడిచింది. అందులో ఒక టేబుల్ టెన్నిస్ టేబులు, కేరమ్స్  టేబుళ్లు, చదరంగం, పేకాట బల్లలు ..ఒకటేమిటి నేను, మా అన్నయ్యలు, మా తమ్ముడు , అన్ని వయసులలో ఉన్న మా స్నేహితులకీ కావలసిన ఆట సామగ్రి అంతా ఆ సమ్మర్ హౌస్ లోనే ఉండేది. అక్కడే మేము గంధకం, బొగ్గు, భాస్వరం లాంటి ముడి సరుకులు కొనుక్కుని, వాటిని నూరి, సరి అయిన పాళ్ళలో కలిపి కూరి టపాకాయలు, చిచ్చు బుడ్లూ, కాకర పువ్వొత్తులూ, తార జువ్వలూ మొదలైన దీపావళి సామాగ్రి అంతా అక్కడే రెండు నెలల ముందు నుంచీ తయారు చేసుకునే వాళ్ళం. అక్కడే మాకు ప్రవేటు మేష్టార్లు పాఠాలు చెప్పే వారు. వేసవి కాలం వస్తే ఆ సావిడికి నాలుగు పక్కలా వట్టి వేళ్ళ తడకలు కట్టి, వాటి మీద గంట కొక సారి  పిచి కారీ తో నీళ్ళు కొట్టి ఆ సమ్మర్ హౌస్ ని చల్లబరిచే వాళ్ళం. మా తమ్ముడు బుజ్జి (రాజమండ్రి సూరీడు బాబయ్య గారి కొడుకు రమణ మూర్తి, ఇప్పుడు సుప్రసిద్ధ న్యాయవాది) కాలు విరిగినప్పుడు ఆ సమ్మర్ హౌస్ లోనే మూడు నెలలు మంచం మీద ఉన్నాడు. మా దొడ్డమ్మ (రెండో మేనత్త హనుమాయమ్మ) అక్కడే పోయింది. ఆశ్చర్యం ఏమిటంటే , మేము అన్నేళ్ళు  అనేక రకాలుగా వాడుకున్న ఆ సమ్మర్ హౌస్ కి ఒక్కటయినా సరి అయిన ఫోటో లేదు. కానీ మా పెద్దన్నయ్య అక్కడ తీయించుకున్న ఒకే ఒక్క ఫోటో ఇందుతో జత పరుస్తున్నాను.

ఇక మా వంటింటి వెనకాల ఉండే  చిన్న నూతి దగ్గర స్నానాలకి ఇబ్బందిగా ఉంది అని ఈ సమ్మర్ హౌస్ పక్కనే చుట్టూ ఐదు అడుగుల వెడల్పు ఉన్న సిమెంటు చపటాతో ఒక పెద్ద నుయ్యి తవ్వించారు మా నాన్న గారు.  ధాన్యం, నువ్వులు, కంది పప్పు, గొల్లప్రోలు మిరప కాయలు వగైరాలు దంచుకుని ఆరబెట్టుకోవడం, పాలికాపులకి భోజనాలు పెట్టడం, వేసవి కాలంలో మడత మంచాలు వేసుకుని పడుకోవడం మొదలైన రకరకాల ఉపయోగాలకి ఇంటి ముందు పది స్తంభాలతో, మామిడి చెట్టుని ఆనుకుని  ఒక సిమెంటు ప్లాట్ ఫారం కూడా ఉండేది. ఇప్పుడు ఎందుకు మాయం అయిపోయాయో తెలియదు కానీ, మా చిన్నప్పుడు గొల్లప్రోలు మిరప కాయలు, వాటి రంగు, రుచి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవే.

నాకు ఊహ తెలిసే నాటికి ఆ ఇల్లు, మిగిలిన స్థలంలో మా తాత గారు కట్టదల్చుకున్న పెద్ద మేడకి ఐదు అడుగుల లోతుగా పెద్ద పెద్ద రాళ్ళతో భూమికి నాలుగు అడుగుల ఎత్తున పునాదులు ఉండేవి.  పైన చెప్పిన రేడియో సావిడి, సమ్మర్ హౌస్  తాత్కాలికంగానే కట్టినా, అవి పెర్మనెంట్ అయిపోయాక తరువాత మా నాన్న గారు ఆ పునాదులు తవ్వించేసి, మొత్తం స్థలం అంతా మొక్కలు, చెట్లతో నందన వనం లా తయారు చేశారు.

నా “జీవిత కాలమ్” లో ఇదంతా ఎందుకు వ్రాసుకుంటున్నాను అంటే…..నేను ఎప్పుడు ఇండియా వెళ్ళినా ఏదో రకంగా ప్రాధాన్యత  ఉన్న కొన్ని కట్టడాలని కానీ, ఇళ్ళు కానీ చూస్తూ ఉంటాను. ఉదాహరణకి ఇటీవల ఒక సారి విజయ నగరం వెళ్లి “గురజాడ” వారి ఇల్లు చూశాను. మాములుగా చూస్తే అది ఒక పాత కాలం నాటి ఇల్లే కదా! అదే సిమెంటు, అదే ఇటికెలే కదా! మరి అంత ప్రాధాన్యత ఎందుకూ? ఎందుకంటే….ఆ ఇంటి నేల, ఇటికెలు మాత్రమే గురజాడ వారి స్పర్శకి  నోచుకుని, ప్రాధాన్యత సంపాదించుకున్నాయి. అలాంటిదే నెల్లూరు వెళ్లినప్పుడు పెన్నా నది ఒడ్డున శిధిలావస్థలో ఉన్న చూసిన “మహాకవి తిక్కన మహాభారతము రచించిన మందిరము”.  ఇలాంటివి యావత్ తెలుగు జాతి చూసి తరించవలసిన ప్రదేశాలు అయితే నాకు వ్యక్తిగతంగా, కేవలం నాకు మాత్రమే నేను పుట్టిన ఇల్లు ఇప్పుడు లేక పోయినా, మా స్థలం ఉంది కదా…అక్కడ మా అన్నయ్యల ఇళ్ళు, మా తమ్ముడి ఇల్లు ఉన్నాయి కదా.  అందుచేత ఆ ఇంటిని, అప్పటి భౌతిక వాతావరణాన్నీ నెమరు వేసుకుంటున్నాను.  ఈ తరహాలో మిగిలినది “లోకారెడ్డి  వారి చెరువు ఇస్తువా పంపు” దాని గురించి తదుపరి వ్యాసం లో ప్రస్తావిస్తాను.

-వంగూరి చిట్టెన్ రాజు

అంచులలో జీవితాలు :దేవులపల్లి కృష్ణమూర్తి ‘బయటి గుడిసెలు’

తనలోని ఒక ముఖ్యమైన భాగాన్ని, బహుశా సంఖ్యాత్మకంగా గణనీయమైన అంతర్భాగాన్ని తనలో భాగం కాదన్నట్టుగా చూడడమే, పట్టించుకోకపోవడమే, విస్మరించడమే, దూరం పెట్టడమే భారత సమాజపు ప్రత్యేకతలలో ఒకటి. భారత పాలకవర్గాలు ఆ గణనీయమైన భాగాన్ని శ్రమకూ సేవలకూ మాత్రం వాడుకుని ప్రతిఫలానికీ, వాటాకూ, హక్కుకూ, అధికారానికీ అవతల పెట్టాయి. అంచుల లోకి నెట్టాయి. నిమ్నమనీ, నీచమనీ, అస్పృశ్యమనీ ప్రకటించాయి. హిందూ బ్రాహ్మణీయ భావజాలంలో, తాత్విక దృక్పథంలో సహజంగా ఇమిడిపోయిన ఈ నిరంతర విభజన, అంతరాలు, ఆధిక్యత, అస్పృశ్యత, మడి, యథాస్థితిని సమర్థించే కర్మ సిద్ధాంతం భారతీయ సమాజంలో రక్తమజ్జాస్థిగతమై పోయాయి. అవి సమాజ జీవితంలో ఎంతగా సంలీనం అయ్యాయంటే, ఆ నిచ్చెనలో అట్టడుగున ఉన్న మెట్టు కూడ తన కింద మరొక మెట్టు ఉండాలని కోరుకుంటుంది. ఉందని అనుకుంటుంది. ఆ కిందిమెట్టు కన్న తాను అధికురాలిననీ, దానితో తాను అస్పృశ్యత పాటించాలనీ, పాటించవచ్చుననీ భావిస్తుంది. సహచర మానవ సమూహాలతో అంతర్వివాహ, సహపంక్తి భోజన సంప్రదాయం లేకపోవడమే తమ సమూహపు ప్రత్యేకతగా ప్రతి సమూహమూ భావిస్తుంది. అందువల్ల అట్టడుగున అంచులలో ఉన్న సమూహాల మధ్య కూడ ఐక్యత గాని, ఏకశిలా సదృశ సంఘీభావం గాని సాధ్యం కావడంలేదు. ఆ అంచులలోనే మరెన్నో అంచులు, అక్కడా విభజనలు, అక్కడా నిచ్చెనమెట్లు, అక్కడా దూరాలు విస్తరించాయి.

ఆయా నిమ్నవర్గాలకు తమ జీవితాలను చిత్రించే, సమాజాన్ని తాము అర్థం చేసుకునే పద్ధతిని చిత్రించే సాహిత్య కళా సంస్కృతులు ఎన్నో ఉన్నప్పటికీ అవన్నీ లిఖిత రూపం పొందక పోవడం వల్ల కొంత, అగ్రవర్ణ ఆధిపత్యం కింద, పాలక భావజాలపు ప్రభావం వల్ల కొంత నలిగిపోయాయి. ఒకటి రెండు శతాబ్దాలుగా ఆయా వర్గాల నుంచి పుట్టుకు వచ్చిన రచయితల వల్ల, వారితో సహానుభాతి ప్రదర్శించే ప్రగతిశీల భావధోరణులవల్ల, సామాజిక శాస్త్ర పరిశోధనల వల్ల ఆయా అంచుల జీవితం కొంతయినా బయట పడుతున్నది. కాని బయటపడని అపార జీవితంతో పోలిస్తే బయట పడుతున్నది చాల తక్కువ. అందులోనూ ఆ అంచులలో కూడ కొన్ని సమూహాల గురించి వచ్చిన దానితో పోలిస్తే ఇంకా సమాచారం బయటికి రాని సమూహాలు ఎన్నో ఉన్నాయి. సమాచారం ఎంతో ఉంది.

bayatigudiselu.jpg.1b3c128e7e.999x600x600

అటువంటి అనేకానేక అనామక అవ్యక్త అలిఖిత అంచుల జీవితాలలోనుంచి ఒక వర్గాన్ని ఎంచుకుని, ‘బయటి గుడిసెలు’ రూపంలో దానికి కళారూపం ఇవ్వడానికి ప్రయత్నించిన దేవులపల్లి కృష్ణమూర్తి గారి కృషి ప్రశంసనీయమైనది. ఈ చిత్రణలో మొండి, బుడగ జంగాలు, దాసరి, బైండ్ల వంటి నాలుగైదు కులాలు వాచ్యంగానూ, దొమ్మరి, ఎరుకల వంటి మరికొన్ని కులాలు సూచనప్రాయంగానూ ఉన్నాయి. అవన్నీ దళితుల కన్న కిందివీ, ఆదివాసి, గిరిజన తెగల కన్న పైవీ కావచ్చు. నిజానికి వాటిని కులాలు అనవచ్చునా లేదా అనేది కూడ సందేహమే. అధికారిక, సామాజిక శాస్త్ర అధ్యయనాలన్నీ వాటిని కులాలుగా గుర్తిస్తున్నాయి గాని, సాధారణంగా కులాలు స్థావర ప్రవృత్తితో, స్థిర ఉత్పత్తి విధానాలతో కలిసి ఏర్పడి గడ్డకట్టాయి. మరి ఇక్కడ చిత్రణ పొందిన సమూహాలన్నీ స్థావర ప్రవృత్తికీ, స్థిర ఉత్పత్తి విధానానికీ కూడ చేరనివి. కొంత ఆహారసేకరణ, కొంత పశుపోషణ దశల్లో ఉండి, జనావాసాల అంచులలో భిక్షుక వృత్తిలో ఉన్నవి. మరో మాటల్లో చెప్పాలంటే జంగమ ప్రవృత్తికి చెందినవి.

కాని ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఈ సమూహాలలో కొన్నిటికి గొప్ప సంస్కృతి ఉంది. సంగీత నృత్య గానాల సంప్రదాయాలున్నాయి. సాధారణంగా ఒక సమూహానికి తగినంత స్థిరత్వం ఉంటేనే సంస్కృతి రూపొంది, విస్తరిస్తుంది గాని, బహుశా ఈ సమూహాలలో జంగమ ప్రవృత్తి వల్లనే సంస్కృతి వర్ధిల్లినట్టుంది. పెద్దగా చలనం లేని పాత సమాజాల స్థితితో పోల్చి చూసినప్పుడు, నిరంతర చలనంలో ఉన్న ఈ సమూహాలు తాము వెళ్లిన ప్రతిచోటి నుంచీ ఎంతో కొంత స్వీకరించాయి, పంచుకున్నాయి. అటువంటి గొప్ప ఆదాన ప్రదానాల వల్ల వీరిలో సంస్కృతీ వికాసం జరిగినట్టుంది. కాలక్రమంలో, సామాజిక పరిణామాలలో ఈ జంగమ సమూహాలు కూడ అక్కడక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకోక తప్పలేదు. సమాజం అంచులలో ఉన్నారనడానికి భౌతిక నిదర్శనంగా వారివి ‘బయటి గుడిసెలు’ అయిపోయాయి. దళితుల కన్న, ఆదివాసుల కన్న మరింత ఆవల అంచులలో కూడ అంచులలో ఉన్న మనుషులుగా వాళ్లు మిగిలిపోయారు.

సొంత ఆస్తి భావన తక్కువగానో, అసలు లేకుండానో ఉన్న ఈ ‘బయటి గుడిసెల’ వారిమీద  నేరస్త జాతులుగా ముద్ర వేసే అలవాటు వలస పాలన కాలం నుంచి ఇవాళ్టిదాకా సాగుతూనే ఉంది. సంభాషణలలో మొరటుదనం, బూతులు, అతిగానే మద్యపానం, మార్కెట్ కు లోబడకుండా తమ మద్యాన్ని తామే తయారు చేసుకోవడం, స్త్రీపురుష సంబంధాలలో భేషజాలు, విధినిషేధాలు తక్కువగా ఉండే సహజత్వం వంటి కారణాల వల్ల ఈ జాతులను “సంస్కృతి” లేనివి గానో,   అధోజగత్తుగానో చూసే అలవాటు కూడ పెరిగింది.

కాని ఆ లక్షణాలు సంస్కృతి లేకపోవడానికి చిహ్నాలు కావు, అవే ఒక సంస్కృతి. సరిగ్గా ఆ లక్షణాలు గల మనుషులే ఒక కళారూపానికి, ముఖ్యంగా కథ, నవల వంటి కాల్పనిక ప్రక్రియకు విలువైన ముడిసరుకులవుతారు. అటువంటి అద్భుతమైన నిర్దిష్ట చారిత్రక సామాజిక శకలపు ముడిసరుకును తీసుకుని కృష్ణమూర్తి గారు ఈ కథో, నవలికో, జీవన దృశ్యమో చిత్రించారు. రచయిత అక్కడక్కడ కనబడినా, ఆ జీవితాలతో, వారి జీవన్మరణ ఘర్షణలతో, కష్టాలతో, కడగండ్లతో రచయిత ఆద్యంతమూ సాధించిన మమేకత్వం పాఠకులను అబ్బురపరుస్తుంది. మాటతీరు, స్పందనలు, హావభావాలు, అలవాట్లు, జీవనగమనం, దారుణమైన విషాదాలు, జీవన బీభత్సం, సమాజంలో ఆధునికత ప్రవేశించినకొద్దీ వారి జీవితాలలో వస్తున్న మార్పులు – సమస్తమూ ఎంత వాస్తవికంగా, విశ్వసనీయంగా చిత్రణ పొందాయంటే రచయిత తన పాత్రలతో సంపూర్ణంగా తాదాత్మ్యం చెంది ఉండకపోతే అది సాధ్యమయ్యేదే కాదు. నిజానికి చాల సందర్భాలలో అవి పాత్రలు కాదేమోనని, నిజజీవిత వ్యక్తులే తమంత తాముగా, తమ గుణదోషాలన్నిటితో, లక్షణాలన్నిటితో ఈ పుటలమీదికి నడిచివచ్చారేమోనని అనిపిస్తుంది.

ఆ జీవితాలలో ఉండే నిస్సహాయత వల్ల, ఎవరిమీద తీర్చుకోవలసి ఉందో తెలియకుండా పేరుకుపోయే అసంతృప్తి ఆగ్రహాల వల్ల మనుషులు ఒకరికొకరు కనబడితేనే తిట్టుకుంటారు. తిట్టే ఒక పలకరింపు అవుతుంది. సాదాసీదా సంభాషణలు కూడ పోట్లాట స్థాయిలో జరుగుతాయి. బిచ్చమెత్తడానికి ఉదయాన బైటికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చిన భర్తతో “పొద్దున పోతివి, బతికితివా చస్తివా, జాడ తెల్వకపాయె, సావనన్న సావకపోతివి. నాపానాన బడ్తివి’ అంటూ తగులుకుంటుంది పెళ్లం” అని రాసిన వాక్యాలు రచయిత సృష్టించినవి కావు, నిత్యజీవితానుభవం లోనివే. అలాగే ఆ అసహన వాతావరణంలో మంచి మాట, ఆర్ద్రమైన పలకరింపు కూడ ఎట్లా అపార్థానికి, పరస్పర దూషణలకు, నిందారోపణలకు, ఎడతెగని వివాదాలకు, చివరికి భౌతిక హింసకు దారితీస్తాయో రచయిత ఎన్నో చోట్ల చిత్రించారు. ఈ లక్షణాలను దోషాలనుకుంటే అవి ఆ పాత్రల దోషాలు కావు, వారిని అటువంటి అమానవీయ స్థితిలోకి దిగజార్చిన వ్యవస్థ దుర్మార్గాలు. రచయిత చిత్రణ వాచ్యంగా ఆ మాట చెప్పకపోయినా సత్యజిత్ రాయ్ పేదరికపు చిత్రణ లాగ, ఆ అమానవీయ స్థితికి కారణమైన వారి మీద ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.

“అరె, భూమి వుంటె ఎన్ని బాధలురా, దాని బాధలు దానికుంటయి కొడకా. అట్లె, సొంత ఇల్లుందనుకో, దాన్ని బాగు చేసుకోవాలె. ఎక్కడికి పోయినా, పానం ఇంటి మీదనే గుంజుద్ది. అందుకే భూమి, ఇల్లు జోలికి పోలేదురా” అని దాసరి రామచంద్రం అన్నమాట పని చేయడానికి ఇష్టపడని, అడుక్కతినడానికి అలవాటు పడిన ఒక సోమరి వృద్ధుడి మాటల్లా అనిపిస్తాయి గాని అట్టడుగున అవి సొంత ఆస్తి అనే బంధం లేని ఒక నైసర్గిక సామూహిక సహజ సంస్కృతి చిహ్నాలు. వేల సంవత్సరాలుగా ఆస్తి, అంతరాల భావనలు ఆ సహజత్వం మీద అభేద్యమైన మకిలి చిమ్మాయి. ఆ మకిలిని వదలగొట్టి మనిషికి మనిషితనాన్ని తిరిగి అందించే మహాపోరాటానికి సిద్ధపడే శక్తి మళ్లీ ఆ బయటి గుడిసెల మనుషులకే ఉంది. వారికి ఒక శాస్త్రీయ, సామాజిక, చారిత్రక భావజాల పరికరం దొరికితే ఆ పోరాటం విజయం సాధిస్తుంది. భారత సమాజానికే బయటి గుడిసెలుగా ఉండిన దండకారణ్యంలోని ఆదివాసులు ఇవాళ చేస్తున్న పని అదే. కృష్ణమూర్తి గారి పాత్రలు ఆ చైతన్యాన్ని అందుకోవడానికి ఇంకా చాల సమయమూ కాలమూ పట్టవచ్చు. కాని అటువంటి అధోజగత్ పాత్రలలో ఆ దందహ్యమాన పదార్థం ఉన్నదని గుర్తించి, ఆ పాత్రలను వాస్తవికంగా, విశ్వసనీయంగా చిత్రించడమే విప్లవ పూర్వ రష్యన్ సమాజంలో అటువంటి జీవితాలను చిత్రించిన దాస్తొవిస్కీ, తుర్గేనెవ్, కుప్రిన్ వంటి రచయితలు చేసిన పని. ఆ పనిని మన సమాజపు నిర్దిష్టతతో, వాస్తవికంగా చేసినందుకు కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు.

  ఎన్ వేణుగోపాల్

( ఈ పుస్తకాన్ని ఆన్ లైన్ లో ఇక్కడ కొనుక్కోవచ్చు.)

http://www.logili.com/books/devulapalli-krishnamurthy/p-7488847-26370821871-cat.html#variant_id=7488847-26370821871

భలే భలే అందాలు సృష్టించావు…..

 
“A thing of beauty is a joy for ever: 
Its lovliness increases; it will never 
Pass into nothingness; but still will keep 
A bower quiet for us, and a sleep 
Full of sweet dreams, and health, and quiet breathing.. “
అన్నాడు “కీట్స్” మహాశయుడు “Endymion” అనే మహాకావ్యంలో! 
ఈ వాక్యాల్లోంచే “అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం”  అనే పల్లవి వచ్చి ఉంటుందని నా ఊహ. 
 
అదే కీట్స్ “Ode on a Grecian Urn” అనే కవితలో
“Beauty is truth, truth beauty,” that is all
Ye know on earth, and all ye need to know..”
అని కూడా అన్నాడు. అయితే ఈ వాక్యాలను గురించి విమర్శకుల మధ్య చాలా చర్చ జరిగింది. 
ఆ చర్చ సంగతి వదిలేస్తే, అసలు అందాన్ని చూసి ఆనందించనివారెవ్వరు? ప్రపంచంలో, ప్రకృతిలోనూ, మనుషుల్లో, మనసుల్లో, మమతల్లో ఎక్కడైనా సరే అందాన్ని భౌతికంగానో అంతర్గతంగానో చూసినప్పుడు తెలియని ఆనందంతో మనసు నిండిపోతుంది. ఎవరి హృదయానికి ఎటువంటి ఆనందం(భౌతికమైనదా, అంతర్గతమైనదా అన్నది) కావాలన్నది వారి వారి మనస్తత్వాలను బట్టి ఉంటుంది. 
 
 
మనిషి కోరిక ఎటువంటిదైనా దానికి చిట్టచివరి కొన ఆనందమే కదా! ఆ ఆనందం “అందం ద్వారా కూడా మనిషికి చేరువవగలదు. అందమైన పరిసరాలను చూసి ప్రకృతారాధకులు ఆనందపడితే, ప్రేయసీప్రియులు తమతమ ప్రియతముల అందచందాలను చూసి ముచ్చటపడతారు. తల్లిదండ్రులు తమ చిన్నారుల ముద్దులొలికే సుందరాకారానికి ముగ్ధులైతే, భక్తులు తమ ఇష్టదైవాల సౌందర్యాకృతులకూ, గుణగణాలకూ దాసోహమంటారు.
 
మరి ఆ అందాన్ని గురించి మన సినీకవులెటువంటి వర్ణనలు చేసారో వినేద్దామా…
 
 
1) అందం పై సినీగీతాలనగానే పైన చెప్పుకున్న బ్రతుకుతెరువు చిత్రం లోని “అందమే ఆనందం..” పాటే గుర్తుకు వస్తుంది. ఈ పాట పల్లవి ఒక ఆంగ్ల పద్యాన్ని గుర్తుకు తెస్తే, చివరి వాక్యం “all the world’s a stage” అని షేక్స్పియర్ రాసిన వాక్యాలను గుర్తుకుతెస్తుంది. వీటి సంగతి ఎలా ఉన్నా పాట ఆద్యంతం మధురమైన సాహిత్యాన్ని అందించారు సముద్రాల రామానుజాచార్యులు. ఇదే పల్లవితో కొద్దిపాటి సాహిత్యపు మార్పులతో పి.లీల పాడిన పాట కూడా వినసొంపుగా ఉంటుంది. ఘంటసాల ,పి.లీల పాడిన ఈ రెండు గీతాలను క్రింద లింక్ లో పక్కపక్కనే వినవచ్చు: 
 
 
2) “భలే భలే అందాలు సృష్టించావు.. ఇలా మురిపించావు ” అంటూ అందమైన ప్రపంచాన్ని, ప్రకృతినీ సృష్టించిన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్తూ, మానవతావిలువలను మరచిపోయి మృగంలా మారిపోతున్న మానవుణ్ణి మార్చమని కోరుకుంటాడు గాయకుడు ఈ పాటలో. ప్రకృతి నుండీ, పశుపక్ష్యాదుల నుండి మానవుడు నేర్చుకోవాల్సిన నీతిని గురించి తెలిపే ఈ పాట భక్త తుకారాం చిత్రం లోనిది.
 
 
3) ” అందాల రాముడు ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు..” 
అంటూ సాగే ఈ పాటలో శ్రీరాముడి మనోహరమైన రూపవర్ణన చేస్తూ, ఏ గుణగణాల వలన  ఆయన దేవుడయ్యాడో, రాముడు ఎందువలన ఉత్తమ పురుషుడుగా నిలిచాడో తెలుపుతుంది గాయని. “ఇన్సాఫ్ కీ డగర్ పే బచ్చోం దిఖావో చల్ కే” అనే హిందీ పాట లోని ఇంటర్ల్యూడ్(బి.జి.ఎం)లో వచ్చే వాద్యసంగీతం ఈ పాటలో చరణాంతర కోరస్ గా రూపుదిద్దుకుంది. “ఉయ్యాల జంపాల” చిత్రంలోని ఈ పాట
 
 
 
4) ” అందాల పసిపాపా.. అన్నయ్యకు కనుపాప
బజ్జోవే బుజ్జాయీ నేనున్నది నీ కొరకే
నీకన్నా నాకెవరే.. ”  అంటూ చెల్లెలికి జడ వేసి, ఆటలాడుతూ, ఆమె ఉన్నతిని కోరుతూ జోలపాడతాడొక అన్నయ్య. ఇలాంటి అన్నయ్య ఉంటే ఇంకేం కావాలి అనిపిస్తుందీ పాట చూస్తే. ముద్దులొలికే ఆ ఒంటరి పసి పిల్లలను చూస్తే జాలి కూడా కలుగుతుంది. అన్నాచెల్లెళ్ల అందమైన అనుబంధానికి ప్రతీకనిపించే ఈ ముచ్చటైన గీతం “చిట్టిచెల్లెలు” చిత్రం లోది. 
 
 
5) ” అందంలో పందెమేస్తా అందర్నీ ఓడిస్తా ” అంటూ భానుమతి గారి స్వరం ఖంగుమంటూ సవాలు విసురుతుంది. ” అబలంటే మోజులా?”  అని నిలదీస్తూ తన దగ్గర ఆకతాయిల ఆటలేవీ సాగవని హెచ్చరిస్తుంది గాయని ఈ పాటలో. “ఆలీబాబా 40 దొంగలు” చిత్రంలోని ఈ పాటకు సుసర్ల దక్షిణామూర్తి సంగీతం సమకూర్చారు.
క్రింద లింక్ లోని వరుసలో మొదటి పాట:
 
 
 
6) తమ ప్రేమకు ఎదురైన అడ్డుతెరలు తొలగి ఒకటవబోతున్నామన్న ఆనందంతో  “అందాలు తొంగిచూసే..హా… ఆనందం ఈల వేసే..రా..”  అంటూ రెండు ప్రేమ జంటలు ఆనందంతో ముచ్చటగా పాడుకుంటాయి. చూస్తున్నంతసేపు నవ్వుల పువ్వులు పూయించే హాస్యరస ప్రధానమైన “ప్రేమించి చూడు” చిత్రంలోని పాట ఇది.

 
 
7) “నీలో విరిసిన అందాలన్నీ నాలో వీడని బంధాలాయే ” అంటూ అమ్మడి అందాలకు తానెలా వశమైపోయాడో తెలుపుతాడో ప్రియుడు. 
“నీలో పలికిన రాగాలన్నీ నాలో శ్రావణమేఘాలాయే” అంటూ తన ఆనందాతిశయాలను తెలియచేస్తుందాతని ప్రియురాలు. 
 “ఆ కోరికలే ఇద్దరిలోనా కార్తీకపూర్ణిమలై వెలగాలి..”  అంటూ తమ బంధం ఏడేడు జన్మల బంధమై నిలవాలని తహతహలాడతారిద్దరూ!
“మనుషులు మట్టిబొమ్మలు” చిత్రంలోని ఈ చక్కని పాట క్రింద లింక్ లో వినేయండి..
 
 
8) “అందాల బొమ్మతో ఆటాడవా
పసందైన ఈ రేయి నీదోయి స్వామి” అంటూ తన జావళీతో కవ్విస్తుందో నాయిక.
 
“చల్లగాలితో కబురంపితిని చందమామలో వెదకితినోయి
తార తారను అడిగితినోయీ” అంటూ ప్రియుని కోసం ఎంతగా ఎదురుచూసిందో, ఎంతగా వెతుకులాడిందో తెలుపుతూ సాగే ఈ జావళీ ” అమరశిల్పిజక్కన్న” చిత్రం లోది. చంపకు చారడేసి కన్నులతో బి.సరోజాదేవి ప్రేక్షకులను గారడీ చేస్తుంది.
 
 

9) ప్రియుడి రూపలావణ్యాలు చందమామ కన్నా మిన్నవంటూ అతగాడిని పొగడ్తలతో ముంచెత్తుతూ మురిసిపోతుందో అందమైన ఇంతి. ఇంటి గుమ్మంలో నిలబడి “అందచందాల సొగసరివాడు విందు భోంచేయవస్తాడు నేడు ” అంటూ భోజనానికి పిలిచిన ప్రియుడి కోసం ఎదురుచూస్తూ గానం చేస్తుంది.
మెచ్చవలసింది పాటలోని సాహిత్యాన్నో, అందాల చందమామనో, తెరపై కనబడే అమ్మడినో, ఆమె మెచ్చే ప్రియుడినో తేల్చుకోలేకపోతాం మనం.
అంత చక్కని ఈ పాట “దొంగరాముడు” సినిమా లోది.
 
 

10) సినిమాకథా అదీ తెలీకపోయినా చిన్నప్పుడు రేడియోలో వినేప్పటి నుండీ ఈ పాట బాగా నచ్చుతుంది నాకు. ఎం.ఎస్ .విశ్వనాథన్ అందించిన సంగీతం, ఎస్.జానకి గళం రెండూ వేటికవే అన్నట్లుంటాయి. ఆత్రేయ రచన గురించి చెప్పేదేముంది..
 
“అందమైన లోకమని రంగురంగులుంటాయని 
అందరూ అంటూంటారు రామ రామ
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా..
చెల్లెమ్మా..అందమైంది కానే కాదు” అంటూ లోకం పోకడని ఎంతో సమమైన ఉపమానాలతో తెలియపరుస్తుంది గాయని.
 
“ఆశలకు అంతముందా “
 
“గడ్డిమేసి ఆవు పాలిస్తుంది పాలుతాగి మనిషి విషమౌతాడు
అది గడ్డి గొప్పతనమా? ఇది పాల దోషగుణమా?”

“లోకమంతా ఇదే తీరు పిచ్చమ్మా..”
 
“డబ్బు పుట్టి మనిషి చచ్చాడమ్మా పేదవాడు నాడే పుట్టాడమ్మా
ఆ ఉన్నవాడు తినడు ఈ పేదని తిననివ్వడు
కళ్ళు లేని భాగ్యశాలి నువ్వమ్మా
ఈ లోకం కుళ్ళు నువ్వు చూడలేవు..”
 
మొదలైన వాక్యాల్లో లోకంలోని కల్మషాలన్నింటినీ క్లుప్తంగా కళ్లముందు ఉంచుతారు ఆత్రేయ..!
“తొలి కోడి కూసింది” చిత్రం లోని పాటని క్రింద లింక్ లో వినవచ్చు..

  ***
 
 
“అందం” పై మరి కొన్ని సినీ గీతాలు:
 
 
“అందమైనతీగెకు పందిరుంటే చాలును 
పైకి పైకి పాకుతుంది చినదానా
పరవశించి సాగుతుంది చినదానా”
(భార్యాబిడ్డలు)
 
 
 
“ఆనందతాండవమే ఆడెనుగా ఆ శివుడు అనాదిగా
అదే నేను చేస్తున్నా ఏడవకండి..”
అందమైన అనుభవం..
 
 
 
“అందమైన అనుభవం..” ( title song) ఒఠ్ఠి స్వరం + ఈ మాటలతో చిత్రంగా ఉంటుందీ పాట..

 
 
“అందములు విందులయే అవని ఇదేగా
కమలాసనుని కోటిశిల్ప కూటమిదేగా
ఎందును లేని తీయందనాలు చిందులు వేసేనుగా”
(భూకైలాస్)
 
 
“అందమంటే నువ్వే
ఆనందమంటే నువ్వే
నువ్వంటే నువ్వే
నీవంటిది నువ్వే నువ్వే “
(ఇల్లాలు)
 
 
ప్రతి అందం జంట కోసం పలవరించిపోతుంది 
(ఊర్వశి)
 
 
 
“అందమంతా నాదే చందమంతా నాదే 
ఇంక సుందరాంగులందు రాణి నేనే గదే”
(పెద్దరికాలు)
(8th song in the link)
 
 
“అందాల ఆనందం ఇందేనయ్యా
అందం చూడవయ్యా ఆనందించవయ్యా”
(దేవదాసు) 

 
“అందానికి అందం నేనే జీవన మకరందం నేనే
తీవెకు పూవుని నేనే పూవుకి తావిని నేనే”
 (చివరికి మిగిలేది)
 
 
 
“అందం ఉరికింది వయసుతో పందెం వేసింది
మనసులో బందీ అయ్యింది ఇదే మీ బంధం అంటోంది”
(బంగారు సంకెళ్ళు)
 
 
“ఆహా అందము చిందే హృదయకమలం అందుకునే రాజొకడే”
(ఆడబ్రతుకు)
 
“అందమైన జీవితము అద్దాల సౌధము
చిన్న తప్పు చేసినా ముక్కలై మిగులును”
(విచిత్ర బంధం)
 
 
“అందమైన లోకముంది అనుభవించు కాలముంది.. “
(అందమైన అనుభవం)
 
 
మళ్ళీసారి మరో నేపథ్యంతో కలుద్దాం…
 

rajiతృష్ణ

పర్యావరణం తెల్లదుప్పటి కాదు!

ఎస్. నారాయణస్వామి

ఎస్. నారాయణస్వామి

అమెరికా వచ్చి నేను తెలుసుకున్న విషయాల్లో పర్యావరణ స్పృహ కూడా ఒకటి. ఎనభైలలో వరంగల్లో బి.టెక్ చదువుతున్న రోజుల్లో, అప్పటికే భారత్‌లో కూడా కొన్ని పర్యావరణ సంరక్షణ ఉద్యమాలు జరుగుతూ ఉన్నా, ర్యాడికల్ నక్సలిజం నా దృష్టిని ఆకట్టుకున్నంతగా పర్యావరణాన్ని గురించిన ఆలోచన ఆకట్టుకోలేదు. ఐనా మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన పుణ్యానికి, అందునా ఇంటర్నల్ కంబస్చన్ నా అభిమాన శాస్త్రం కావడం వల్లనూ, ఇంజన్లద్వారా జరిగే వాతావరణ కాలుష్యాన్ని గురించి కొంత అధ్యయనం చేస్తూ వచ్చాను. అమెరికా వచ్చిన కొత్తల్లో ఒక రోజు మా విశ్వవిద్యాలయం నడిబొడ్డున ఏదో నిరసన ప్రదర్శన జరుగుతున్నది. అప్పటికి ఎక్సాన్ వాల్డెజ్ దుర్ఘటన జరిగి ఒక యేడో, రెండేళ్ళో పూర్తయి (ఏనివర్సిరీ అనడానికి తెలుగులో వార్షికోత్సవం అని తప్ప ఇంకో మాట లేదా? దుర్ఘటనల ఏనివర్సరీలని ఏమనాలి? సాంప్రదాయకంగా తద్దినం అంటే పోతుందేమో?) ఆ సందర్భంగా ఎక్సాన్ కంపెనీని ఉద్దేశించి ఆ నిరసన ప్రదర్శన జరుగుతున్నది. పర్యావరణ సంరక్షణ ఉద్యమంతో అదే నాకు తొలి పరిచయం. ఆ తరవాత ఈ సంఘటనని తలుచుకుని నిరసన అనే పేరుతో నేనొక చిన్న సెటైరు రాసుకున్నాను.

అటుపైన పుస్తకాల ద్వారా, మిత్రులతో చర్చల ద్వారా, ఇంకా ఆ తరవాత ఇంటర్నెట్ ద్వారా చాలా ఉద్యమాలు పరిచయమయ్యాయి. కొన్నిటితో అనుబంధాలు పెరిగాయి, నేను కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే వరకూ. చాలా మట్టుకు పబ్లిగ్గా జరిగే ఈ నిరసన కార్యక్రమాలు ఏదో ఒక కంపెనీని వ్యతిరేకిస్తూ నడిచేవి. కంపెనీలకి ముఖ్య బలం వాటి లాభాలు కాబట్టి, దుష్టకంపెనీలకి బుద్ధి చెప్పాలంటే వాటి ఉత్పత్తులని కొనడం మానెయ్యాలనే సిద్ధాంతం ఒకటి అప్పుడే బయల్దేరింది. ఇది నిజమేనని నమ్మి (ఎంతైనా మొదట మార్క్సు శిష్యుణ్ణి కదా! సంబంధాలన్నీ ఆర్ధికమే!!) కొన్ని ఉత్పత్తులని బహిష్కరించాను ఆ రోజుల్లో. ఆయా కంపెనీలని తీవ్రంగా శిక్షిస్తున్నానని దృఢంగా నమ్మాని. అంతేకాక ఇదే సరైన మార్గమని మిత్రులతో చాలా తీవ్రంగా వాదిస్తుండేవాణ్ణి కూడాను. ఐతే, మెల్లమెల్లగా ఇంకొక స్పృహ మేలుకోవడం మొదలుపెట్టింది. ఇంధన జ్వలనం మీద రీసెర్చి చేసే పూరిండియన్ గ్రేడ్యువేట్ స్టూడెంటుగా నేను అందుకుంటున్న గొర్రెతోక ఉపకారవేతనం ఒక చమురు కంపెనీ చలవ. వారమంతా కోకు పెప్సీ ఉత్పత్తులేవీ ముట్టకుండా పవిత్రంగా గడిపి వారాంతానికి బీరు తాగబోతే ఆ బీరు తయారుచేసే కంపెనీ తాగునీటిని విపరీతంగా కలుషితం చేస్తోందని తెలియవచ్చింది. ఒక బయాలజీ మిత్రుడితో చర్చిస్తున్నప్పుడు, అప్పటి నా తీవ్రమైన నమ్మకాలకి వ్యతిరేకంగా, జన్యుమార్పిడి పంటలు మంచివేననీ, వాటివల్ల చాలా ఉపయోగాలున్నాయనీ నన్ను ఒప్పించాడు ఆ మిత్రుడు. ఇలా తగిలిన ఎదురు దెబ్బలతో పర్యావరణ సంరక్షణ అంతా తెలుపూ, కాలుష్యం నలుపూ కాదనీ, మధ్యలో ఓ యాభై రంగులు పట్టేటంత ‘గ్రే” ఉన్నదనీ తెలియవచ్చింది.

 

ఖాండవ దహనం అని ఒక కథ రాశాను 2005 లో. అప్పట్లో తానా సావనీరులో వచ్చిందది. ఆ కథ పర్యావరణ రక్షణ గురించి కాదుగానీ, నల్లమల అడవుల్లో చెంచు గూడేలలో నేను చూసిన కొన్ని విషయాలు అందులో చర్చకి వచ్చాయి. ఉదాహరణకి అడివంతా పర్యావరణ పరిరక్షణ అనీ, పులుల అభయారణ్యం అనీ చెంచువారి వేట మీద సవాలక్ష ఆంక్షలు విధించారు. దానికి పరిహారంగా చెట్లు నాటమనీ, గోతులు తవ్వమనీ, ఇంకా ఇలాంటివే ఏవో పది రకాల పనులు కల్పించి (ఇది ఉపాధి కల్పన అన్న మాట) ప్రతి ఫలంగా జొన్నలో సజ్జలో ఇప్పిస్తున్నారు. పర్యావరణ సంరక్షణ ఎప్పుడూ ఆ పర్యావరణానికి అతి చేరువులో ఉన్న మనిషి మనుగడని దెబ్బతీస్తూ వస్తున్నది. అంతే కాక, ఆ సంరకషణ కోసం చేపట్టే కార్యక్రమాలు ఎంత అనాలోచితంగా, ఎంత అశాస్త్రీయంగా ఉంటాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

images

నిజానికి తెలుగు సాహిత్యంలో పర్యావరణ స్పృహ కొంచెం తక్కువనే అనిపిస్తోంది. గట్టిగా చూస్తే చంద్రలతగారి దృశ్యాదృశ్యం నవల ఒకటి కనబడుతున్నది, భారీ ఆనకట్టలు అటు సహజ వనరులకీ, ఇటు ఆ ప్రాంత ప్రజల జీవనానికీ రెండిటికీ ముప్పు తెస్తాయనే అంశంతో. డా. చంద్రశేఖర్రావు గారి కథలు కొన్నిట్లో ఈ అంశాలు అక్కడక్కడా తొంగి చూస్తుంటాయి. దాదాహయత్ రాసిన మురళి ఊదే పాపడు కథ మనుషుల దురాశకి బలై పోతున్న సహజవనరుల్ని గురించి ఒక ఫేంటసీ ధోరణిలో ఆర్ద్రంగా చెప్పిన కథ. చంద్రలత గారే జన్యుమార్పిడి విత్తనాలను గురించీ, మరికొన్ని ఇతర పర్యావరణ సంబంధిత అంశాలను గురించీ ఇతర పుస్తకాలు కూడా రాశారు. కవిత్వంలోనైనా ఇటువంటి అంశాలు సూచనప్రాయంగా దర్శనమిచ్చాయే తప్ప, కేవలమూ పర్యావరణ స్పృహ సాహిత్యాన్ని డిక్టేట్ చేసిన సందర్భాలు తక్కువే.

 

ఉద్యమ కారణం ఏదైనా – అంతరించి పోతున్న పక్షి జంతు జాతులని రక్షించడం కావచ్చు, సహజ వనరుల సంరక్షణ కావచ్చు – అక్కడ రక్షించవలసిన అంశాన్ని బహు సున్నితమైనదిగా, నాజూకైనదిగా వర్ణించడం, ఆ రక్షణ ఉద్యమాన్ని ఒక యుద్ధంగా అభివర్ణించడం పరిపాటి అయింది. అంతే కాదు, రక్షణని సపోర్ట్ చెయ్యని సామాజిక శక్తి ఏదైనా (ప్రజలు, సంస్థలు, వ్యాపారాలు, ప్రభుత్వాలు) దాన్నొక కౄరమైన శత్రువుగా చిత్రించడం కూడా వారి వ్యూహంలో భాగమే. కానీ పర్యావరణ సంరక్షణ ఏ కొద్దిమంది జన్మహక్కో కాదు. నిజానికి ఇక్కడ గమనించాల్సిన ధర్మసూక్ష్మం ఒకటున్నది. మానవులు చేస్తూ ఉండిన అకృత్యాలవల్ల పర్యావరణానికీ, భూగోళానికీ వచ్చిన ముప్పు ఏమీ లేదు. వాటి బాగుకోసం అవసరమైన సవరణలు అవి చేసుకోగలవు. ఎటొచ్చీ అవి చేసే సవరణలు మానవజాతికి అంత సౌకర్యంగా ఉండవు. అంచేత పర్యావరణ సంరక్షణ, భూగోళ సంరక్షణ అంటూ జరిగే ప్రయత్నాల్లో ముఖ్యమైన ఉద్దేశం మానవజాతి తమని తాము రక్షించుకోవడమే. అంటే, ఈ ప్రయత్నం అంతా మొత్తం మానవజాతి మనుగడకి సంబంధించినది కాబట్టి ఇందులో అందరికీ భాగస్వామ్యం ఉండాలి, అందరికీ బాధ్యత కూడ ఉండాలి. అంతేకాని, ఏ నూటికి ఒక్కరో మేమే హీరోలం, మేమే రక్షణ కార్యకర్తలం అని (వారికి వారు ఎంత ఫీలైపోయినా సరే) ఉప్పొంగిపోతే పెద్దగా ఉపయోగపడే పనేమీ అక్కడ జరగదు.
వెరసి ఈ యుద్ధ కథాకథనంలో పర్యావరణ కార్యకర్త ఒక ఉదాత్తుడైన హీరోగానూ, అంతర్జాతీయ వ్యాపారవేత్త ఒక భయంకరమైన విలన్ గానూ ముద్ర పడిపోతారు. ప్రజల ఊహల సంగతి యెందుకూ, ఆయా రక్షణ సంస్థలే తమ ప్రత్యర్ధులని ఎంత ఏహ్యభావంతో చూస్తాయంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళతో కలిసి మాట్లాడ్డానికి కానీ, కనీసం వాళ్ళతో ఒకే గదిలో కూర్చోవటానికి కూడా ఇష్టపడరు. తీవ్రవాద పద్ధతులలో పనిచేసే గ్రీన్ పీస్, ఎర్త్ ఫస్ట్ వంటి సంస్థలే కాక సంయమనంతో వ్యవహరిస్తాయని ప్రపంచ వ్యాప్తంగా పేరున్న సంస్థలు, సాధారణ పౌరులవద్ద మంచి ఇమేజి ఉన్న సంస్థలు కూడా తమ సంరక్షణ కార్యకలాపాల దగ్గరికి వచ్చేసరికి ఇటువంటి మొండి వైఖరి అవలంబించడం స్పష్టంగా కనిపిస్తూన్నది, సంరక్షణ ఉద్యమాల చరిత్రని చూస్తే.

 

కానీ నిజంగా పనికొచ్చే పని జరగాలంటే, అందులో కౄర పరమ నీచనికృష్టులని పేరుబడిన వారు కూడా ఉండక తప్పదు. ఒకానొక కాలంలో ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఆహారం అంటే చిన్న విక్రేతల దగ్గర మాత్రమే దొరికేది ఇప్పుడు సర్వత్రా లభ్యమవుతున్నట్లే, పర్యావరణ సంరక్షణ మీద కూడా ఉద్యమకారుల మొనాపలీ వెనుకబడిందని చెప్పుకోవాలి గత పాతికేళ్ళలో. అనేక బహుళజాతి కంపెనీలు సహజ వనరుల నిలకడ గురించి, మారుతున్న వనరుల వాతావరణ పరిస్థితులలో తమ తమ కంపెనీల మనుగడని గురించీ తీవ్రంగా కృషిచేస్తున్నాయి. నేరుగా విద్యుత్, చమరు, బొగ్గు రంగాలలో ఉన్న కంపెనీల విషయంలో ఈ కృషి నేరుగా కనిపిస్తున్నది. ఉత్పత్తి రంగంలో – ఉదాహరణకి ఆటో, ఎలక్ట్రానిక్ రంగాలలో, ఉత్పత్తిదారులైన కంపెనీలు ఈ విషయమై చాలా పట్టుదలగా ఉన్నాయి. వనరుల నిలకడ విషయమే కాకుండా పెద్ద కంపెనీలన్నీ తమ తమ కార్బన్ ఫుట్ ప్రింట్ (ఒక సంస్థ కార్యకలాపాల వల్ల ఎంత కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో విడుదలవుతున్నది తెలిపే ఒక కొలమానం) గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నాయి. అంతేకాక ఏ జెనరల్ మోటర్స్ వంటి కంపెనీనో ఉదాహరణకి తీసుకుంటే .. ఎన్ని దేశాలలో ఎన్ని లక్షలమంది ఉద్యోగులతో, ఎంత భారీ యెత్తున వారి కార్యకలాపాలు సాగుతున్నాయి? వాళ్ళు తయారు చేసే కార్లు కాలుష్యాన్ని పెంచుతున్నాయి, వారి ఉత్పాదన పద్ధతులు బాగులేవు అని చెప్పి, అసలు వాళ్ళతో మాట్లాడం పొమ్మంటే ఎవరికి నష్టం?

ఇంకొక కీలకమైన విషయం, పర్యావరణం దగ్గరికొచ్చేసరికి అన్ని రకాల విషయాలూ కలగలిసి తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీనికి సంబంధించిన శాస్త్రీయ పరిజ్ఞానం కూడా ఎప్పటికప్పుడు మారుతున్నది, ఎప్పటికప్పుడు విస్తరిస్తున్నది. ఇప్పుడున్న అవగాహన పదేళ్ళ కిందట లేదు. ఏ విషయాన్నీ, ఏ అంశాన్నీ వేరువేరుగా డిఎస్క్ట్ చేసి పరిశీలించడానికీ, అదుపు చెయ్యడానికీ వీలుపడదు. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకునే కార్యాచరణ కావాలి. ఈ ప్రణాళిక ఎప్పటికప్పుడు ఎదుగుతూ ఉండాలి. ఇదంతా సాధ్యపడాలంటే ఉద్యమకారులు మడికట్టుకుని కూర్చుంటే సరిపోదు. అటు వివిధ ప్రాంతాల ప్రభుత్వాలతోనూ, ఇటు వివిధ వాణిజ్య సంస్థలతోనూ చేతులు కలిపి పని చెయ్యాలి.

ఒకటి గుర్తుంచుకోవాలి. మనుషులు రాకముందూ భూమి ఉంది. మనుషులు పోయాకా ఉంటుంది. భూమికేం ఢోకాలేదు. వచ్చిన బాధల్లా మనుషుల మనుగడకే. ఇకనైనా మనం తెలివిన బడితే మంచిది.

 

References:

Exxon Valdez

http://en.wikipedia.org/wiki/Exxon_Valdez_oil_spill

My satire

http://eemaata.com/em/issues/199911/867.html

My Story

http://kinige.com/kbook.php?id=58

Works of Chandralatha

http://kinige.com/kbrowse.php?via=author&name=Chandra+Latha&id=19

 

తత్వ దీపం వెలిగితేనే దారి తేటపడుతుంది: సుప్రసన్న

kovela1

వ్యక్తమయ్యే చైతన్యం ఎప్పుడూ అనంత రూపాలలో ఆవిష్కృతమవుతుంది. బీజం నాటినా వ్యక్తమయ్యే వృక్షం ఏ ఆకృతిలో పెరిగి వస్తుందో ఎవరూ చెప్పలేరు. మనిషి బ్రతుకూ అంతే.. నా బ్రతుకూ అంతే. ఎవరి బ్రతుకూ సరళరేఖాకారంగా ఉండదు. ఎన్నో మలుపులు మార్పులు తప్పనిసరి.
మాది వరంగల్ పట్టణం. నేను మార్చి 17, 1936లో పుట్టాను. నేను పుట్టిన నాటికి నిజాం రాష్ట్రంలో మేలుకొనబోతున్న స్వాతంత్య్ర సంగ్రామం, మేలుకొని తరంగాలు తరంగాలుగా రూపొందుతున్న తెలుగువారి సామాజిక సాహిత్య ఉద్యమాలు, తెలుగు భాషను, సారస్వతాన్ని  రక్షించుకోవాలన్న తీవ్ర సంకల్పం గాలిలో వ్యాపించి ఉన్న కాలం. బ్రిటిష్ ఇండియాలో దృఢమైన సంకల్పంలోకి సాగుతూ వున్న స్వాతంత్య్రోద్యమం. భారత దేశాన్ని ఆవరించిన గాంధీజీ వ్యక్తిత్వం, సాహిత్యరంగంలో విశ్వంలోనే తన ఉనికిని నిలబెట్టుకున్న రవీంద్రుని కవితా మూర్తిమత్త్వం జీవనాన్ని దాని చైతన్య మూలాలను స్పృశిస్తున్న భారతీయ తాత్త్విక మథనం జరుగుతున్న కాలం. ఇదీ వాతావరణం.
మా తాతగారు కోయిల్ కందాడై రంగాచార్యులు గారు. వారి పూర్వులు అదే జిల్లాలోని నెల్లికుదురు, మునిగలవీడు, చిట్యాల గ్రామాలలోని వారు. చివరకు వారు చిట్యాల(వరంగల్ జిల్లా తొర్రూరు దగ్గర) నుండి వరంగల్లుకు వచ్చి చేరుకున్నారు. వారి మేనమామ గారు వరంగల్లులో ఉండేవారు. వారి కుమార్తెను వివాహమాడి వారికి పురుషసంతతి లేకపోవటంతో తాతగారు వరంగల్లుకు వచ్చినారు.
మొదటి నుంచీ బీద కుటుంబమే. జీవిక కోసం కరణాల యిండ్లలో వంటలు చేస్తూ కడుపు నింపుకున్నారు. చదువుకోవాలని బలమైన కోరిక ఉండేది. అవకాశాలు లేవు. దొరికిన పుస్తకం చదువుతూ- స్వయం వ్యక్తులుగా రూపొందుతూ వచ్చారు. వరంగల్లుకు రాగానే ముదిగొండ మల్లికార్జున శాస్త్రి, అమరవాది నారాయణాచార్యుల వద్ద సంస్కృత సాహిత్యము, ఇతర ప్రాథమిక శాస్త్ర గ్రంథాలు అధ్యయనం చేసినారు. అయినా దానితో తృప్తి కల్గలేదు. విద్యాపిపాసతో విజయనగరం వెళ్లారు. 1905 ప్రాంతాలలో (20 ఏండ్ల వయసులో) అక్కడ సంస్కృత కళాశాలలో తాతా సుబ్బరాయ శాస్త్రి మొదలైన దిగ్ధంతుల వద్ద శాస్త్రాభ్యాసం చేసినారు. తునిలో రాజావారి ఆస్థాన విద్వాంసులు సద్విద్యాప్రకరణాది గ్రంథకర్తలు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల చిన రంగాచార్య స్వామి వారి వద్ద శ్రీభాష్యం పూర్తి చేసుకున్నారు.

ఇంచుమించు 1910 నాటికి ఎన్న దగిన ఉభయ వేదాంత విద్వాంసులయ్యారు. స్వయం కృషితో పురాణేతిహాసాలను, శాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేసినారు. క్రమంగా విశిష్టాదై్వతంలో ఇటు కాంచి నుంచి, అటు విజయనగరం దాకా మహా విద్వాంసులుగా పేరొంది అనేక బిరుదులు సన్మానాలు గ్రహించారు. మా ఇంట్లో సంస్కృత విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. వారికి భోజనాల వసతీ యిక్కడే.
మా తాతగారి సంతానం నలుగురు కుమారులు. పెద్దవారు వెంకట నరసింహాచార్యులు నా తండ్రి. మిగిలిన ముగ్గురిలో చివరి వారు సంపత్కుమారాచార్యులు గారు. నలుగురిలో ముగ్గురూ ఉభయ వేదాంతాలలో పండితులే. చివరి వారు మీ అందరూ ఎరిగిన ఛందోవ్యాకరణాలంకార శాస్త్రాలలో సాహిత్యంలో తనదైన ముద్ర వేసుకున్న సంపత్కుమార.
నేను పెరిగిన ఈ వాతావరణానికి కొంచెం వేరైనది మా అమ్మగారి పుట్టిల్లు. మా మాతామహులు ఠంయాల లక్ష్మీనరసింహాచార్యులు. వారిది వరంగల్లులోని గోవిందనగరం (ఎల్లంబజారు) శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయ నిర్మాతల కుటుంబం. వారు తెలుగులో అనేక ప్రబంధాలు, క్షేత్ర మాహాత్మ్యాలు, చిత్రబంధ కవితలు, యక్షగానాలు, నాటకము, ప్రహరి వంటి రచనలు చేసినవారు. కవినాథ బిరుదాంకితులు. వారి యింట వాస్త జ్యోతిషాది శాస్త్రములు కూడా అధ్యయనంలో  ఉండేవి.
మా మాతామహులకు అయిదుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుటుంబం. వచ్చిపొయ్యేవాళ్లు ఎట్లా గడిచేదో సంసారం. అందరిలో మా అమ్మ మూడవ సంతానం. మొదటి ఆడబిడ్డ. ఆడపిల్ల కావాలని మా అమ్మమ్మ కొడవటివంచ లోని లక్ష్మీనృసింహస్వామి సేవకు వెళ్లిందట. ఆ వూరి స్వామి ఆమె కలలో కనిపించి తన కోరిక తీర్చటానికి ఒక రూపాయి ఇమ్మన్నాడట. ఆమె పావులా ఇస్తానన్నదట. చివరకు ఏదోవిధంగా స్వామియే అంగీకరించాడు. అమ్మ పుట్టింది 1918లో. అమె పేరు లక్ష్మి. (ఈ విషయం  మాతామహులు రచించిన కొడవటివంచ క్షేత్ర మాహాత్మ్యంలో ఉన్నది.) తరువాత ఆమె పేరు లక్ష్మీ నరసమ్మ. నా వ్యక్తిత్వం మీద ఒత్తిడులు ఈ రెండు ఇండ్లలో నుంచి వచ్చినవే. శాస్త్రీయ సంప్రదాయ, విద్య ఒకవైపు, కవిత్వం పొంగే వాతావరణం మరొకవైపు. పాంచాలరాయ శతకంలో నేను వ్రాసిన పద్యం యిది.

ఇటు చేయి వేసిన తాత హేలా కవిత్వాభిరాము
డటు చేసి వేసిన తాత ఆధ్యాత్మ విద్యానిధాను
డిటుల నా తలిదండ్రు లిర్వురీ చెట్ల మధుర ఫలములు
చిటిలిన మధువేనొ కానొ చేకొమ్ము పాంచాల రాయ

నా కోసమూ మా అమ్మ వ్రతాలూ ఉపవాసాలూ చేసిందిట. నేను వరమున పుట్టినాను. చిన్నతనంలో ఎన్నో బాలారిష్టాలు. అవన్నీ దాటుకుంటూ వచ్చాను. అమ్మ తన తమ్ముడి వివాహం నిమిత్తం వేల్పుగొండ (ఇప్పుడు జఫర్‌గఢ్)కు వెళ్లగా అక్కడ నేను పుట్టినాను. వేల్పుగొండ అతి పురాతన క్షేత్రం. అక్కడ లక్ష్మీనరసింహస్వామి స్వయం వ్యక్తమూర్తి. ఆయన నీడలో పుట్టడం వల్ల ఆయన నేత్రకాంతులు నా మీద ఆవేళ ప్రసరించాయేమో! అది పంచ నారసింహ క్షేత్రం. ఆ కొండమీద కోటగోడలున్నాయి. ఆదిరాజు వీరభద్రరావు గారు వేల్పుగొండ కాకతీయుల తొలి రాజధాని కావచ్చునన్నారు. ఆ కొండకు నైఋతి భాగంలో సుప్రసన్న నారసింహ క్షేత్రం ఉన్నది. అక్కడ పన్నిద్దరాళ్వారులూ ఒకే బండమీద ఉన్నారు. మా నాన్న యింట్లో, అమ్మ ఇంట్లోనూ పరంపరగా వస్తున్న ఇలవేలుపు వేల్పుగొండ స్వామియే. ఈ సుప్రసన్న నారసింహస్వామి పేరు నాకు పెట్టారు. నా జీవితాన్ని వేల్పుగొండ, కొడవటంచలలో నెలకొని ఉన్న నరసింహస్వామి మూర్తులూ, మాతామహులర్చించే సీతారామచంద్రస్వామి పరిపాలిస్తూ వచ్చారు.
ఇంట్లో సాయంకాలాలలో అరుగుల మీద పోతన భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర, గజేంద్రమోక్షం, వామన చరిత్ర, రుక్మిణీ కళ్యాణం మొదలైన ఘట్టాలు చెప్పేవారు. ఆ మాధుర్యం హృదయంలోనికి అప్రయత్నంగా ప్రవేశించింది. సంస్కృత స్తోత్రాలు, ద్రావిడ వేదంలోని తిరుప్పల్లాండు మొదలైనవి సంత చెప్పేవారు. మా నాయనమ్మ వరదరాజుల పెండ్లి, సీతాకల్యాణం మొదలైన జానపద గీతాలు పాడేది. ఆ నాళ్లలో మా యింటి దగ్గర ఉండే బురుజు దగ్గర కూచిపూడి నాటక ప్రదర్శన చూచినాను. శ్రీవైష్ణవ సంప్రదాయ కుటుంబంలో ఆయా సందర్భంలో తిరునామాలు గానం చేసేవారు. ఆంధ్ర దేశంలో ద్రావిడ దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ విద్వాంసులు ఈ ప్రాంతం వస్తే మా యింట్లోనే దిగేవారు. వారి శాస్త్ర చర్చలూ, సాహిత్య చర్చలూ కొనసాగేవి. తాతగారు శ్రీమద్రామాయణము, భగవద్విషయమూ ఇతర సంప్రదాయ గ్రంథాల ప్రవచనాలు చేసేవారు. అప్రయత్నంగానో, సప్రయత్నంగానో చెవుల్లోకి వెళ్లేవి ఈ అంశాలన్నీ. శ్రుతమైనదంతా ఒక సంస్కారంగా, ఆత్మలో ముద్రించుకొని పోయింది.
నాకు మనస్సులోకెక్కిందంతా శ్రుతపాండిత్యమే. గురుకుల క్లిష్టత లేని నాకు అధ్యయనం అంతా స్మృతిలగ్నమైందే. నా చిన్నతనంలో మరొక ముఖ్య ప్రభావ కేంద్రం రెండిండ్లలో ఉన్న గ్రంథాలయమే. దాదాపు 500 సంస్కృత, ద్రావిడ గ్రంథాలు ఒక్కోచోట ఉండేవి. వాటిల్లో కొన్ని కొత్తవి. కొన్ని పాతవి. ఇండ్లలోకి శ్రీవైష్ణవ పత్రిక, రామానుజ పత్రిక, ప్రపన్న సుధ వంటివి వచ్చేవి. గోలకొండ కవుల సంచికలో మా మాతామహుల పద్యాలు (ఫోటోతో సహా) మా పెద్ద మేన మామల ఇద్దరి పద్యాలున్నాయి. వాటితో పాటు మా నాన్నగారి పద్యాలూ ఉన్నవి.
మా యింట్లో ఉన్న శ్రీవైష్ణవ సంప్రదాయం ఉదారమైంది. స్మార్త పండితులూ, ఆరాధ్య శైవులూ మా యింటికి వస్తూవుండేవారు. అందరికీ ఆదర సత్కారాలు ఉండేవి. తాతగారికి ఆ నాళ్లలో తెలంగాణంలోని జమీందారుల ఆశ్రయం ఉండేది. కల్లెడ, పర్వతగిరి, రంగాపురం మొదలైన చోట్లలో కొన్ని నెలల కొద్దీ ఉండి కాలక్షేపాలు కొనసాగించేవారు. వారిచ్చిన భూముల మీద కొంత ఆదాయమూ వస్తూ ఉండేది. కుటుంబ పోషణలకు సరిపోయేది.

kovela2
2.
రాజ్య వ్యవస్థ ప్రజల సంస్కృతికీ, భాషా సంప్రదాయాలకు, విద్యకు, జీవన పురోగమనానికి, విరుద్ధంగా ఉన్నప్పుడు సమాజం నూతనంగా సమాంతర వ్యవస్థను నెలకొల్పుకుంటుంది. నిజాం సంస్థానంలో సరిగ్గా అదే జరిగింది. తెలుగు భాష అణచివేతకు గురయింది. సంస్కృతి, సంప్రదాయాలకు ఆదరణం లేదు. అట్లాంటి స్థితిలో భాషా సాహిత్యాల రక్షణ కోసం గ్రంథాలయాలు, వీధి పాఠశాలలు వృద్ధి పొందాయి. మాదిరాజు రామకోటేశ్వరరావు ఆత్మకథలో వరంగల్లులో ఆనాళ్లలో ఉన్న వీధిబడులు సుమారు వందకు పైగా ఉన్నట్లు పట్టిక ఇచ్చారు. దేవోత్సవాలు, హరికథలు, బతుకమ్మ పండుగలు, పురాణ ప్రవచనాలు, గణేశోత్సవాలు, పంచాంగ శ్రవణాలు, ఆర్యసమాజ సనాతన ధర్మ సభలు ఇలా ఎన్నెన్నో సంస్కృతిని నిలువబెట్టే సంస్థలు ఏర్పడ్డాయి.
నేను తొలుదొల్త అలాంటి వీధి బళ్లలోనే చదివాను. ఒకటి మా యింటికి దగ్గరలో ఉన్న ‘పొట్టి పంతులు’ జగన్నాథం గారి బడి. రెండవది నాకు అక్షరాభ్యాసం చేసిన మోటుపల్లి కృష్ణమాచార్యుల గారి బడి. ఇది ఇంటికి అరకిలోమీటరు దూరం ఉండవచ్చు. ఆ తరువాత నియత విద్యాభ్యాసం విషయం ఇంట్లో చర్చకు వచ్చినట్లున్నది. ఇంట్లో మా ‘నాన్న’ల వలె ప్రాచ్య విద్యలోకి  చేరిపోవటమా లేక పాఠశాల విద్యలోకి వెళ్లటమా అన్న సందేహం. మా చిన్న మేనమామ రంగాచార్యులు అప్పటికే ఇంటర్ పూర్తి చేసి బిఏ కోసం హైదరాబాద్‌లో చేరినట్లున్నారు. అప్పటికే ఆయన వీలైనప్పుడు ట్యూషన్‌లు చెప్పుతూ కొంచెం కొంచెం తన చదువు కోసం సంపాదించుకునేవారు. అప్పుడు మా అమ్మ పట్టుబట్టి నన్ను స్కూలు చదువుల్లోకి చేర్చాలని కోరింది. మా తాతగారు అంగీకరించినారు. నాకు మే 10, 1943న ఎనిమిదవ ఏట ఉపనయనము జరిగింది. అప్పుడే మా తాతగారి అన్నగారి చేత పంచ సంస్కారాలూ జరిగాయి. ఒకసారి ఏదో ఉత్సాహంతో రామలింగేశ్వర దేవాలయంలో ఉన్న సంస్కృత పాఠశాలలో ‘రామ’ శబ్దమూ నేర్చుకున్నా. అయితే మళ్లీ వీధి బడిలోకి వెళ్లవలసి వచ్చింది.
ఆనాళ్లలో తెలుగులో విద్యాబోధన చేయటానికి ఒక పాఠశాల ఏర్పరచవలెనని జాతీయోద్యమ నేతలిక్కడ భావించారు. అప్పటికే ఎన్‌కే రావు ఈ ప్రయత్నంలో
రాష్ట్రంలో దేశీయ విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నారు. చందాకాంతయ్య అనే వర్తకుడు తెలుగు పాఠశాల నెలకొల్పటం కోసం లక్ష రూపాయలు దానం చేస్తానని ప్రకటించినాడు. ఆంధ్ర విద్యాభివర్ధినీ పాఠశాల ప్రారంభం అయింది. దానికి కాంగ్రెస్ నాయకులు ఎం.ఎస్ రాజలింగం కార్యదర్శి. భండారు చంద్రమౌళీశ్వరరావు, అడవాల సత్యనారాయణ, పాములపర్తి సదాశివరావు మొదలైన వాళ్లు దానిలో అధ్యాపకులు. (జీతాలు కూడా ఉన్నవో లేవో సరిగా తెలియదు) ఈ పాఠశాల మా అమ్మమ్మగారి యింటికి వెనుక వీధిలో అప్పుడు ఉండేది. మిక్కిలి దగ్గర కావటంతో మా అమ్మ నన్ను ఆ పాఠశాలలో చేర్పించటానికి అనువుగా, చదువు
నిమిత్తం అమ్మమ్మ యింట్లోనే ఉంచింది. నేను 1945-46లలో నాటి మూడవ తరగతిలో చేరినాను. మా మేనమామ రంగాచార్యులే తొలుతగా ఏ,బీ,సీ,డీలు నేర్పించారు.  ఆ పాఠశాల నేను నాల్గో తరగతిలో ఉన్నప్పుడు మట్టెవాడలో నేరెళ్ల వాళ్ల స్థలంలోకి మారిందని గుర్తు.
ఆ పాఠశాలలో తొలి నుంచీ ఒక సాంస్కృతిక పునరుజ్జీవన చైతన్యం ప్రస్ఫుటంగా ప్రకాశించేది. నిజాం రాజు చందాకాంతయ్యకు ఒక బిరుదం యిచ్చి సత్కరించినాడు.
చందాకాంతయ్య నిరంతర దానశీలి. యజ్ఞములు చేసేవాడు. వేదాంతి. యాత్రాచణశీలి. ఎప్పుడో అనుకోకుండా బుట్టనిండా మిఠాయి పెట్టుకుని బడికి వచ్చి పిల్లలందరికీ ఆ పిఠాయి పంచి తాను ఆనందించేవాడు. ఆజీవమూ ఆ పాఠశాల సమితిలో సభ్యుడే కాని, కార్యదర్శి కాలేదు. అధ్యక్షుడు కాలేదు. స్కూలుకు తన పేరు
పెట్టనీయలేదు. అప్పటికే పాఠశాలలో ఏకనాథ గ్రంథాలయము అని ప్రత్యేక గ్రంథాలయము ఉండేది. జాతీయోద్యమంలో భాగంగా జాతీయ విద్యార్థి సంఘం అనే సంస్ఖ యువకులకు ప్రేరణ యిచ్చేదిగా పని చేస్తూ వుండేది. వ్యాస రచన, వకృ్తత్వ పోటీలు నిర్వహించేది. ఆ సంఘానికి మా మేన మామ రంగాచార్యులు, మా పినతల్లి భర్త
ఎంఎన్ రంగాచార్యులు క్రియాశీల కార్యకర్తలు. గోసేవా సమితి కార్యక్రమాలుండేవి. ముఖ్యంగా ఈ అశాంతభావంలోనే సంఘ సంస్కారం, ప్రజలకు సంస్కృతి పట్ల ఆలోచింపజేసేవి. ఆర్యసమాజం, సనాతన ధర్మసభల సమావేశాలు నిరంతరంగా జరిగేవి. ఆర్య సమాజం సంస్కరణవాది. విగ్రహారాధనకు, శ్రాద్ధాది కర్మలకు, అవతార వాదానికి వ్యతిరేకం. సనాతన ధర్మ సంస్థలు వీటిని సమర్థించేవి.

Image (7)
ఎంఎస్ రాజలింగం వార్ధాలో గాంధీగారి వద్ద శిక్షితులై వచ్చి వరంగల్లులో సుభాను చేతి పరిశ్రమశాల నెలకొల్పినాడు. నవారు నేత, గ్లోకోజు తయారు చేయటం
వంటివి వారు చేస్తుండగా నేను చూచినాను. ప్రతి సంవత్సరం గణపతి ఉత్సవాలు తొమ్మిది రోజుల్లో వైభవంగా జరిగేవి. ఉపన్యాసాలు, సంగీత కచ్చేరీలు, సాహిత్య స్పర్థలు, అవధానాలు, కవిసమ్మేళనాలు కొనసాగేవి. ఆంధ్రపత్రిక రోజూ మధ్యాహ్నానికి ఊళ్లోకి వచ్చేది. వరంగల్ చౌరస్తాలో వేముల వారి యింటి ముందు గద్దెపై కూర్చొని పత్రికలో వార్తలు అన్నీ చదివేవారు. అనేకమంది శ్రోతలు శ్రద్ధగా అదంతా వినేవారు. అదీ జాతీయ నిష్ఠయే. ఈ వాతావరణంలో నా మనస్సులో ఎన్నో మార్పులు వచ్చాయి. కొన్ని గొప్ప భావాలకు ప్రతీకలైన ఆచారాలను ప్రతీకలుగానే కాక అనివార్యంగా ఆచరించవలననే భావం క్రమక్రమంగా సడలిపోవటం ప్రారంభం అయింది. వాటి మీద విరోధము లేదు. భిన్న భిన్న ఉపాసనామార్గాలు, సంప్రదాయాలు మానవుని చిత్తశాంతి కోసం ఏర్పడ్డవి. ప్రాతిభాసికంగా కనిపించే భేదాలు అన్నీ తాత్కాలికంగా రూపొందినవే. వాటికి సార్వజనీనత సార్వకాలీనత లేదు. వేషభాషలు, ఆచారాల వ్యవహారాల పట్ల పట్టుదలలు, విభేదాలు, పరస్పర అనిష్టాలు ఇవన్నీ వ్యర్థములనే నిశ్చయం ఏర్పడుతూ వచ్చింది.
భారత దేశానికి స్వాతంత్య్రం రావటం, పాకిస్తాన్ ఏర్పడటం ఆనాటి ఉద్విగ్న క్షణాలు అనుభవంలోకి వచ్చేవి. ఒకనాడు స్కూలు నుంచి తిరిగి వస్తున్నప్పటికి
ఒక గుర్రం కడుపులో ఎవరో బాకు గ్రుచ్చారు. ప్రాణావసాన స్థితిలో ఉన్నది. అమ్మమ్మ యింటికి చేరేప్పటికి ఎవరో దుండగులు నారాయణరెడ్డి అనే డాక్టరును,
మొగిలయ్య అనే జాతీయ పతాకనెగురవేసిన యోధుని చంపినట్లు, వారు రజాకార్లనీ తెలియ వచ్చింది. స్వతంత్ర  భారత దేశంలో విలీనం కాకుండా తాను స్వతంత్ర రాజుగా ఉండాలని కోరుకోవటం, ప్రతి ముస్లిం  రాజే అన్న ఒక సూత్రాన్ని ముస్లిం సంస్థలు ప్రచారంలోకి తేవటం కారణంగా నిజాంను నిలబెట్టేందుకు రజాకార్లనే ప్రత్యేక
సేన ఏర్పడింది. ప్రజలకొక ప్రాణరక్షణ లేకుండా పోయింది. అప్పటికీ భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణా సాయుధ పోరాటాన్ని ప్రారంభించింది. రెండు
విభిన్న శక్తుల సంఘర్షణలో ఎన్నో ప్రాణాలు, మానాలు, ఆస్తులు గాలిలో కలిసిపోయినాయి.
మా కుటుంబం వరంగల్లులో రక్షణ లేదని భావించి కల్లెడ దొరవారైన ఎఱ్ఱబల్లి వెంకటేశ్వరరావు పిలుపు మేరకు కల్లెడకు చేరుకుంది. అక్కడ మొత్తం కుటుంబమూ
ఉన్నది. తాతగారు ఉదయం భగవద్విషయాన్ని, సాయంకాలం శ్రీమద్రామాయణాన్ని కాలక్షేపం చెప్పేవారు. నేను దాదాపుగా రెండు సమయాలకూ వెళ్లేవాడిని. అనేక
వేదోపనిషత్ ఇతిహాస పురాణాంశాలు ఆ కాలక్షేపాలలో ప్రసక్తములయ్యేవి. వాటి అర్థము, సమన్వయము అద్భుతంగా ఉండేది. సర్వ సమర్పణ, శరణాగతి, మానవుని ఆర్ద్ర సంబంధాలు ఈ కాలక్షేప సమయంలో మరొక అద్భుత లోకమన్నట్లుగా సాక్షాత్కరించేవి. నా జీవనంలో ఎంతో విద్యను సేకరించుకున్న సమయం అది. సామాన్యులు వర్ణభేదాలకు అతీతంగా భగవంతునికి చేరువకావటం వింటూంటే, వారందరూ నా చుట్టూ తిరుగుతున్నారన్న స్ఫురణ కలిగేది.
నాన్నగారికీ, పినతండ్రులిద్దరకూ ఉదయం గడిలో కాలక్షేపం కంటే ముందే ఇంట్లో ద్రావిడ వేదాంత రహస్య గ్రంథాలను తాతగారు అధ్యాపన చేసేవారు. గడిలో
కాలక్షేపంలో వీరిలో ఎవరో ఒకరు పాఠ్యం చదివేవారు. తాతగారు విశదంగా విపులంగా వ్యాఖ్యానించేవారు. ఇంట్లో నేనూ, మా చిన్నాయన సంపత్కుమారలకు
వేరే చెప్పుకోదగిన పనులు లేవు. ఈ సందర్భంలో ఒక అద్భుత సన్నివేశం జరిగింది. అది మేమిద్దరం కలిసి కవిత్వాభ్యాసం చేయటం. మేముంటున్న యింటికి ఇంచుమించు ఎదురుగా శ్రీనివాసమూర్తి ఇల్లు ఉండేది. వారి చెల్లెలు భర్త ప్రతాపపురం రాఘవాచార్యులు మా వలెనే వరంగల్లు నించి భద్రత కోసం అత్తవారి ఇంటికి వచ్చినారు. వారు చిక్కగా పద్యాలు రాసేవారు. అప్పటికి బీజభూతంగా ఉన్న పద్యం మాలో చివురించి పుష్పించటం అక్కడే ఆరంభం అయింది. వారి దగ్గరనే తిరుపతి వేంకట కవుల పేరు విన్నాము. ఆ ఆరునెలల కాలంలో ఎన్ని పద్యాలు వ్రాసినామో తెలియదు. కానీ, పద్య ధోరణి అలవాటయింది. సాధన జరిగింది. నాకు ఛందో లక్షణం తెలిసేది కాదు. అయినా పద్యం నిర్మించే సందర్భంలో ఇక్కడ లఘువు, ఇక్కడ గురువు ఉండాలని నాకు అనిపించేది. దానికి కారణం అంతకు ముందే మౌఖికంగా నేర్చుకున్న భాగవత పద్యాల మూసలు కావచ్చు.
కల్లెడలో మా చిన్నాయనగారితో నాకు ఏర్పడ్డ గాఢానుబంధం ఆయన జీవితాంతం దాకా అంతే సజీవంగా కొనసాగింది. ఆయన మిత్రుడు, గురువు. నాయెడ వాత్సల్యం గలవాడు. కల్లెడ దొరలు ప్రజల విషయంలో ఎలా ఉండేవారో తెలియదు కానీ, సంప్రదాయాన్ని పోషించేవారు. శ్రీరంగంలో ఒక సత్రం నిర్మించారు. కందాడై శేషాచార్యులు, ప్రతివాది భయంకర అణ్ణంగణాచార్యుల వారి గ్రంథ ముద్రణకు ఆర్థిక సహాయం చేసేవారు. ఈ కాలంలోనే సాయుధ కమ్యూనిస్టులు రాత్రులలో పాటలు పాడుకుంటూ వచ్చేవారు. జనం కొందరు చాటుగా పరుగెత్తి దాక్కునేవారు. ఆర్నెల్లకు ఆ ఊరు విడిచి బెజవాడ చేరుకున్నాము మొత్తం కుటుంబం. అయితే గడవటం కష్టమని కొందరు రాజమండ్రికి, కొందరు రేపల్లెకు వెళ్లినారు. తాతగారు బెజవాడలో ఉన్న శిష్యుల ప్రోత్సాహంతో గ్రంథ ప్రవచనాలు చేస్తూ సంసారం నిర్వహించేవారు. ఆ రోజుల్లో మేం కొంతకాలం అద్దెకున్న యిండ్లలో ఒకటి గూడవల్లి రామబ్రహ్మం గారి యిల్లు. పారుపల్లి వారి వీధిలో ఉండేదనుకుంటా.
బెజవాడలో ఉన్న రోజులు నేను కొంతకాలం అక్కడ మునిసిపల్ స్కూలులో చేరి చదువుకున్నా. తాతగారి వెంట కాలక్షేపాలకు వెళ్లటం ఉండనే ఉన్నది.

సంపత్కుమార గారు రేపల్లెలో ఉన్నారు. కల్లెడ తరువాత మేమిద్దరం మళ్లీ ఒక కప్పు కింద ఉన్న రోజులు దాదాపుగా లేవేమో. అక్కడ ఉన్ననాళ్లలోనే నా మీద
గాంధీ ప్రభావం ఎక్కువయింది. ఆయన హత్య జరిగిన రోజులవి. బెజవాడలో ఏడెనిమిది నెలలున్నాము. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌పై పోలీస్ యాక్షన్ జరిగిన
తరువాత నెమ్మదిగా దీపావళి వరకు యింటికి చేరుకున్నాము. బెజవాడలో ఉన్న రోజుల్లోనే ఎక్కడో వ్రాతప్రతిగా లభించిన వేదాంత కవి పద్యాలు చదువుకున్నాను. ఆ పద్యాలు మొన్న మొన్నటి దాకా గుర్తుండేది. అక్కడి నుంచి వెలువడే ‘విజయవాణి’(మల్లెల శ్రీరామ మూర్తి సంపాదకులు)లో మా పెద్ద మేనమామ
వార ఫలితాలు వ్రాస్తుండేవారు. నిజాం ప్రాంతం నుంచి వచ్చిన కాందిశీకులను బెజవాడ ప్రజలు ఆదరించలేదు. అద్దెలు విపరీతంగా పెంచారు. భాషను వెక్కిరించారు. ఒక తీవ్రమైన అనిష్టం యిక్కడి ప్రజలలో అందువల్ల నెలకొన్నది. తరువాత వచ్చిన నాన్‌ముల్కీ, ప్రత్యేక తెలంగాణా ఉద్యమాల వెనుక ఈ అసంతుష్ఠి ఉన్నది.
3
ఒక మత సంబంధంమైన తాత్త్వికానుబంధం గల వాతావరణంలో నేను పెరిగిన సంగతి తెలుసుకోవలసి ఉంటుంది. అయితే ఆర్యసమాజం మొదలైన ఉద్యమాల బలం వలన బాహ్యాచారాల ఆడంబరాల పట్ల విశ్వాసం సడలిన విషయం చెప్పుకున్నాను. అసలు భక్తి ఉద్యమం ఈ లోకం నుంచి పారిపోవటం నేర్పదు. ఈ జగత్తు నిండా ఈశ్వరుని సాక్షాత్కరించుకుంటుంది. ‘సర్వభూతేషుచాత్మానం సర్వభూతానిచాత్మని, ఈక్షతే యోగ యుక్తాత్మా, సర్వత్ర సమదర్శనః ’ అన్న గీతావాక్యం భౌమ జీవన దివ్యీకరణ భావాన్ని వ్యక్తం చేస్తుంది. సగుణోపాసనకు ఆధారం ఇదే. శ్రీవైష్ణవం పరవ్యూహ విభవ అంతర్యామ్యర్చావతారాలుగా భగవంతుని దర్శించినా, మనకు అంత్యంత సన్నిహితమైంది అర్చావతారమే అన్న అంశం శ్రీవచన భూషణాది సంప్రదాయ గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. మరొక అంశం భక్తుని-భగవంతునిగానే చూడటం, అతని అర్చనాసేవ భగవదర్చనమే. మానవ సేవయే మాధవ సేవ అన్న ఆధునిక భావన దీనిలోనుంచి పుట్టిందే.
భక్తి ఉద్యమం ఈ లోకాన్ని ఈశ్వర స్థానంగా ఎన్ని దీన్ని అతని లీలా విభూతిగా భావించింది ‘నాహం వందే తవచరణే యోర్ద్వద్యమద్వంద్వహేతోః’ అన్న ముకుందమాల మోక్షం నాకు వద్దు. జన్మ జన్మలకూ నిన్ను భావిస్తూ, సేవిస్తూ ఉండటం కావాలి అంటున్నది. శ్రీ శఠగోపులు తమ తిరువాయ్ మొళి ప్రబంధంలో భక్తి ధర్మం వలన లోకం ఎలా పరివర్తన చెందిందో వివరించారు.
పుడమికిని కల్గు శాపమ్ము పొలిసె, యముడు
కార్య నిరృ్వత్తుడయ్యెను, కలి దొలంగె
నరకములు మారిపోయెను నరుల పాప
సంతతి నశించె, భక్తుల సముదయమ్ము
కడలి వన్నె గలుగు స్వామి గాధలెల్ల
పాడుచును నృత్యమాడుచు పరవశింప
కన్నులార గంటిమి-వృద్ధి కలుగుగాక
కలుగుగాకమేలు సమృద్ధి కలుగు గాక(5-2-1)
పాండురంగ మాహాత్మ్యంలో రామకృష్ణ కవి ‘నిత్యనైమిత్తికముల నిర్ణిద్రబుద్ధి నాచరించుచు, హరిభుక్తమాత్మ భార్య భక్తినిడ భుక్తి నిడుచున్కి ముక్తిగాని
నిదురవంటిది, రాతివంటిదియు గాదు’ గార్హస్థ్య జీవితం ఎంత శ్రేష్ఠమైందో- ‘నిదుర వంటిది రాతి వంటిదియు గాదు’ అనినాడు కేవల స్థితిని ముక్తి భావాన్ని కాదంటున్నాడు. ఆళ్వారులు కొంతమంది తాము ఈ జన్మలో తిరుమల కొండమీద రాయిగానో, మొక్కగానో పుట్టి ఉంటే ధన్యులమని భావించినారు. ఈ భావన వైకుంఠ, కైలాస, భూలోకాది పరలోక భావనలను కాదంటున్నది. ఆ భావనలు ఒక విధంగా చూస్తే లోకంలోని దివ్యజీవన భావనకు ప్రతిబింబాలు మాత్రమే. ఇదంతా ఎందుకు చెప్పటమంటే, అప్పటికి శ్రీఅరవిందుల తత్త్వం నన్ను ఆకర్షించటమే. ఈ భూమిక నా చేతనలో స్పష్టాస్పష్టంగా ఉండటం కారణం కావచ్చు.
ఎక్కడికో పారిపోవటం కాకుండా ఈ లోకాన్ని అవిద్యాపరిమితుల నుండి దూరం చేసి దివ్యచైతన్యాన్ని ఆవహింపచేయటం లక్ష్యంగా శ్రీఅరవిందుల తత్త్వం ఏర్పడింది.
అదై్వతుల జగన్మిథ్యాత్వభావన కానీ, కైవల్యరూప ముక్తి కానీ, బౌద్ధుల నిర్వాణం కానీ, నన్ను ప్రభావితం చేయలేదు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మూడూ
సత్యమేనని ఒకదానికొకటి శరీరం వంటిదని చెప్పిన విశిష్టాదై్వతం తాత్త్వికంగా ఈ భావనకు అతి సన్నిహితం. అంతా ఈశ్వరమయమే. ఈశావాస్యమిదగుమ్
సర్వం. అందువల్ల జగత్తును దివ్యపరిణామం వైపు ప్రయాణింపజేసేది సౌందర్యభావన, ప్రేమ భావన, శాంతి భావన, ఆనంద భావన.
1950 డిసెంబర్‌లో శ్రీఅరవిందులు శరీరం విడిచిపెట్టిన తరువాత ఆయన తత్త్వమును గురించి భారతిలో వచ్చిన వేలూరి వారి వ్యాసాలు నా సాహిత్య
తత్త్వదృష్టికి పునాదిని ఏర్పరిచినాయి. మానవుని సర్వజీవనానికి ఇహలోకము, భూమి ముఖ్యవేదిక. ఆసురీ తత్త్వాన్ని ఏరూపంగా ఉన్నా దాన్ని పరిహరించి దైవీ
గుణాలను పృథ్విమీద స్థాపించటమే వ్యష్టి ముక్తి కాక, సమష్టి ముక్తి అవుతున్నది. ఈ నిశ్చయానికి నేను వచ్చేసరికి నా వయస్సు ఇంచుమించు 16
సంవత్సరాలు.
అప్పటి నుంచి నా సాహిత్యం, కవిత్వం, విమర్శ, వ్యాఖ్యానం ఏదైనా ఈ భూమిక మీదనే నిలబడి ఉన్నాయి. నా తొలి రచన హృద్గీతలోని తొలి పద్యాలలో – ‘జడమై,
ప్రాణమవై, మనస్సువయి విజ్ఞానంబవై’ అని బ్రహ్మ పదార్థాన్ని వర్ణించటం జరిగింది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ భూమికల గురించి స్పష్టంగా చెప్పటమే. 1949-50లలో ఆంధ్రప్రాంతం నుంచి మా పాఠశాలకు తెలుగు మాధ్యమంలో పాఠం చెప్పటానికి అధ్యాపకులు ఒక సమూహంగా వచ్చినారు. వారికి నాయకులు ప్రధానోపాధ్యాయులుగా వచ్చిన యద్ధనపూడి కోదండరామశాస్త్రి. వారు దివ్యజ్ఞాన సమాజం వాతావరణంలో పెరిగి వచ్చినారు. మేడం బ్లావట్స్‌కీ, కల్నల్ ఆల్కాట్, అనిబిసెంట్, జిడ్డుకృష్ణమూర్తి ఈ పేర్లన్నీ అప్పుడు విన్నవే. ఈ తరంగం ముంపులో తాత్త్వికలోని విశ్వజనీనత అర్థమైంది. జాతీయ భావన కేంద్రంగా
విశ్వజనీనత చుట్టూ వలయంగా నా భావ పరిధి విస్తరించుకుంటూ పోయింది.

1986లో అడయార్‌లో జిడ్డుకృష్ణమూర్తి, చివరి ఉపన్యాసం (జనవరి, 4) విన్నాను.
వైకె శాస్త్రి వచ్చిన తరువాత పాఠశాలలో పరివర్తన వచ్చింది. పోతన జయంతి ఉత్సవాలు ప్రారంభం అయినాయి. నేను పదో తరగతిలో ఉండగా పోతన జయంతి ఉత్సవాలలో వక్తృత్వము, వ్యాసరచన, గ్రంథపఠన పోటీలలో మూడు ప్రథమ బహుమతులు నాకే వచ్చినాయి. ప్రథమ బహుమతి దేనికైనా పోతన భాగవతమే కానుక. నాకు ఆ సంవత్సరం పోతన భాగవతంతో పాటు కవిత్రయ భారతము బహుమతిగా ఇచ్చారు. ఇది నా జీవితంలో ఊరిలో పెద్దల ముందు కలిగిన తొలి పరిగణన. తొలి అవార్డు కూడా కావచ్చు.
నేరెళ్ల వేణుమాధవ్ నాకన్నా మూడేళ్లు స్కూల్లో సీనియర్. మా ప్రధానోపాధ్యాయులు భాగవతంలోని నృసింహావతార వర్ణన ఘట్టం అద్భుతంగా చదివేవారు. నన్ను ఒక విధంగా పోతన మోహం లోకి నెట్టి పడవేసినారు. ఆ గద్య పద్యాల చింతనామృత పాన విశేష మత్త చిత్తమేరీతి నితరంబు చేరనేర్తు. ఇదీ అప్పటి మనః స్థితి.
4
కల్లెడలో ప్రారంభమైన పద్యరచనాభ్యాసం సాగుతున్నది మా యిద్దరకూ. సంపత్కుమార 1949లో చిట్టిగూడూరులో భాషాప్రవీణ కోర్సులో చేరినారు. అక్కడికి దగ్గరయిన బందరులోని ఉద్దీప్త సారస్వత సంభార సామగ్రి నెమ్మది నెమ్మదిగా ఆయన ద్వారా వరంగల్లుకు నా దగ్గరకు వస్తూ ఉన్నది. మా ఊళ్లోని శబ్దానుశాసన
ఆంధ్రగ్రంథాలయం పుస్తకాల ద్వారా పరోక్ష గురుస్థానం వహించింది.
హైదరాబాద్‌లో అప్పటికే తెలుగు బిఏ చేసిన మా చిన్న మేనమామ రంగాచార్యులు పారిజాతాపహరణం లోని పద్యాలను, రాయప్రోలు పద్యాలను, జాషువా, కరుణశ్రీల పద్యాలను పరిచయం చేసేవారు. ఒక్కోసారి ఆయన ‘విజయశ్రీ’ని కమ్మని గొంతుతో మాకు వినిపించేవారు. ఆయన ఇంట్లో మధ్యాహ్నం వేళ ఆయన తల్లికి, వదినలకు కాలక్షేపంగా వావిలకొలను సుబ్బారావు రామాయణానువాదం వినిపించేవారు. ఆ వరుసలో కొన్నిరోజులు వరుసగా ‘వేయిపడగలు’ కూడా చదివి వినిపించారు. నా జీవితంలో విశ్వనాథ ప్రవేశించింది అలాగే అనుకుంటా. బందరు నుంచి కదలి వచ్చే సాహిత్య సామగ్రిలో రాయప్రోలు, కృష్ణశాస్త్రి, అడవిబాపిరాజు, నాయని, వేదుల ఇలా కాల్పనిక కవులంతా కదలివచ్చేవారు. ‘వైతాళికులు’ చదవటం ఒక అచ్చెరువు గొలిపే అనుభవం.

నెమ్మది నెమ్మదిగా విశ్వనాథ సత్యనారాయణ సపరివారంగా కవితలతో, నవలలతో, నాటకాలతో, విమర్శతో, కల్పవృక్షంతో తరలి వచ్చారు. చిట్టిగూడూరులో సంపత్కుమార పద్యరచనాభ్యాసం పెరిగింది. ఇక్కడ నేనూ అభ్యసనం సాగిస్తున్నాను. 1951లో విశ్వనాథవారి సోదరులు వెంకటేశ్వరులు మా పాఠశాలలో తెలుగు అధ్యాపకులుగా వచ్చారు. ఆయన నా పద్యాలు చూసి తలవూపారు. అప్పుడే 1951 నుంచి అప్పుడప్పుడూ రాసుకున్న పద్యాలు యిద్దరం కలిసి ఒక శతకంగా తెద్దామని అనుకున్నాం. మకుటం ‘సర్వేశ్వరా!’ అని.. దాంట్లో ఇద్దరి పద్యాలు కలగలపుగా కూర్చినాము. ఆ రోజుల్లో వరంగల్లు నుంచి వివేకానంద అనే ఒక
ద్విభాషా పత్రిక వచ్చేది. దానిలో ఒక కమ్మ నిండా ఈ పద్యాలు అచ్చు వేసేవారు. నెలకు పన్నెండు పద్యాలు వచ్చేవి. ఆ ముద్రితమైన కాగితాలు సంపాదకులు కొమ్ము సుబ్బారావు 200 విడిగా అచ్చు వేసి యిచ్చేవారు.
పుస్తకంగా రూపొందటానికి ఆంధ్రప్రింటింగ్ ప్రెస్ వారు ఉచితంగా ముఖ పత్రము, పీఠిక ముద్రించి యిచ్చారు. 1954 మధ్యభాగానికి అలా ముద్రితమైంది మా తొలి
పుస్తకము. విశ్వనాథ వెంకటేశ్వర్లు దాన్ని పట్టుకువెళ్లి విశ్వనాథవారితో పీఠిక వ్రాయించి తెచ్చినారు. దానిని హృద్గీత అని పేరు పెట్టి మా తాతగారికి అంకితం చేశాము.
ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రస్తుత అధ్యక్షులు ఆచార్య సి.నారాయణరెడ్డి అప్పటి తెలంగాణ రచయితల సంఘం కార్యదర్శి. మా రచనలను పత్రికలకు పంపి అచ్చయ్యేటట్టు చూసేవారు. తెలుగు స్వతంత్రలో అవి అచ్చయినప్పుడు మా పేర్ల చివరనున్న ఆచార్య శబ్దం తొలగించివేశారు. మేము సుప్రసన్న, సంపత్కుమారలము అయ్యాము. ఎంత అందమైన కత్తిరింపో అది. అప్పటి నుంచి నారాయణ రెడ్డి నాకు అన్నయ్యనే.
1954లో తెలుగు స్వతంత్రలో నా వచన పద్యాలు అచ్చయ్యాయి. గోలకొండ పత్రికలో ఉదాహరణాలను గురించిన నా వ్యాసం పెద్దది అచ్చయినది. మే 28 1954నాడు జరిగిన నా పెళ్లిలో సంపత్కుమార రవీంద్రుని ఊర్వశి కవితా సంపుటాన్ని (బెజవాడ గోపాలరెడ్డి అనువాదం) నాకు అత్యంత ప్రీతితో తనకన్నా ప్రతిభావంతుడననే
అతిశయోక్తితో బహూకరించారు. ఆ సందర్భంలో దాశరథి అభినందిస్తూ ఒక లేఖ వ్రాశారు.  తన పదకొండవ ఏట నా జీవితంలోకి నడచివచ్చిన నా మేనమామ కూతురు శారద. తన జీవితం చివరి క్షణం దాకా నాకు నెచ్చెలియే. ప్రియురాలే. నా కావ్యాలలో శేఫాలికకు నాయిక. కులపాలిక. నాకు సాధనలోనూ సహచరి. ఆత్మసఖి. నిడుదవోలు వారి ఉదాహరణ వాజ్మయ చరిత్ర చదివి నేను పోతన్నను గూర్చి రససిద్దోదాహరణము వ్రాసినాను. అది కరీంనగరం నుంచి వెలువడే సారస్వత
జ్యోతిలో అచ్చయినది. ఆ రోజుల్లోనే కొన్ని గేయాలూ అచ్చయినాయి. అంటే రూపనిష్ఠతో సంబంధం లేకుండా పద్యము, గేయము, వచనపద్యము మూడు నా రచనా
మార్గంలో ప్రధాన స్థానాన్ని ఆక్రమించాయి.
1953-54 నాటికి వరంగల్లులోని సామ్యవాద మిత్రులతో నా పరిచయం పెరిగింది. వారిలో అతి సన్నిహితులు పి.నరసింహ స్వామి. అతడు ఒక అడవిచెట్టు వంటివాడు. శ్రీశ్రీ, ఆరుద్ర, అనిశెట్టి వంటి వారి రచనలు వినిపించేవారు. సమ్మోహముద్ర వేసేవారు. ఆయనకు ప్రేరకులు పాములపర్తి సదాశివరావు. పివి నరసింహారావు ఈయనా  కలిసి కాకతీయ పత్రిక నడిపేవారు. కాకతీయ కళాసమితి పేర ప్రతి సంవత్సరమూ సంగీత సాహిత్య సభలు నిర్వహించేవారు. ఒక కవిసమ్మేళనములో నేను సున్నా అని చివర వచ్చే ఒక గేయాన్ని చదువగా సభంతా కరతాళ ధ్వనులు చేసింది. పివి, సదాశివరావులకు కాళోజీకి గార్లపాటి రాఘవరెడ్డి గురువు. రాఘవరెడ్డి ఏ పూర్వయుగాల నుంచి ఋష్యాశ్రమాల నుంచి కదలివచ్చిన యోగివలే ఉండేవారు. స్వామి దగ్గర నుంచి రాఘవరెడ్డి వరకు వచ్చేసరికి సంవాద దశ నుండి సంభావన దశదాకా వచ్చినట్టుంది. నా రచనలలో అవికలితంగా కలిసిపోయిన సామ్యవాద ధోరణికి ఈ సాంగత్యం కారణం అనుకోవాలె. 1953-55లలో వరంగల్లు కాలేజీలో ఇంటర్‌మీడియట్ చదివినాను. అక్కడ చలమచెర్ల రంగాచార్యులు, ప్రత్యేక తెలుగువారికి పాఠం చెప్పేవారు. ఆయన మాకు గబ్బిలం పాఠం చెప్పినారు. ఆయన పాఠం వింటే ఆ పద్యాలన్నీ ఒకపాటి సారస్వత ప్రియునికి కంఠస్థం కావలసిందే.
సాహితీబంధుబృందం అనే సంస్థను నేను, నా సహపాఠి పేర్వారం జగన్నాథం మిగిలిన మరికొందరు మిత్రులం 1955 ఫిబ్రవరిలో స్థాపించినాము. దానికి విశ్వనాథ
సత్యనారాయణ ప్రారంభకులుగా వచ్చినారు. నేను ఆ సంస్థకు స్థాపక అధ్యక్షుడిని. కాళోజీ, హయగ్రీవాచారి వేదికమీద ఉన్నారు. పివి సభలో కూర్చున్నారు. ఆ సందర్భంలోనే పివి, విశ్వనాథ వారిని కలిసి వేయిపడగల హిందీ అనువాదానికి అనుమతిని కోరినారు. తెలంగాణా రచయితల సంఘం 1955 మొదట్లో ఒక కవిత్వపు పోటీ పెట్టింది. దానికి నేను ఎవరెస్టు అనే గేయం పంపించినాను. ఆ పోటీలో తెన్నేటి పూర్ణచంద్రరావు రాసిన దయ్యాల మఱ్ఱిచెట్టు అన్న వచన పద్యానికి మొదటి బహుమతి, నా గేయానికి రెండో బహుమతి వచ్చింది. బహుమతులు 50, 30, 20 రూపాయలు. మూడో బహుమతి ఎవరికి వచ్చిందో గుర్తు లేదు. ఎవరెస్టు అన్న నా గేయంలో కాల్పనిక ప్రగతివాద ధోరణులు కలసిఉన్నాయనుకుంటున్నాను. న్యాయ నిర్ణేతలుగా నార్ల, పుట్టపర్తివారున్నారు. నార్లవారి పట్టుదల మీద
మొదటి బహుమతి తెన్నేటి వారికి వచ్చినట్లు, కానీ, పుట్టపర్తివారు నా గేయానికి మొదటి బహుమతిని సూచించినట్లు అప్పట్లో విన్నాను. ఇది నాకు
రాష్ట్ర స్థాయిలో వచ్చిన మొదటి బహుమానము. కవిగా గుర్తింపబడటం దీనివల్ల జరిగింది. ఆ గేయం స్రవంతిలో అచ్చయినది.
వరంగల్లులో కాకతీయకళాసమితి వారు భారతీయ సంగీతం గురించి వ్యాసం రాసే పోటీ పెట్టారు. దానికి సామగ్రి కావాలంటే మా చెలమచర్ల వారు ది హిస్టరీ ఆఫ్
క్లాసికల్ సాంస్క్రిట్ లిటరేచర్ అన్న పుస్తకం చదవమన్నారు. అది ఆధారంగా నేనో వ్యాసం రాసి పంపించినాను. దానికి ప్రథమ బహుమతి వచ్చింది. కాలేజీ
మ్యాగజైన్‌లో నా పేరి రచనలతో పాటు, మారు పేరుతో ఒక కథ వ్రాసినాను. అంతకుముందే విశ్వనాథ సాహిత్యంతో పరిచయం ఉన్నా, 1951లో వరంగల్లులో
ఆంధ్రసారస్వత పరిషత్ వరంగల్ శాఖ వార్షిక సభలకు ముఖ్యఅతిథిగా వచ్చినప్పుడు వారి రెండుమూడు ఉపన్యాసాలు వినటం, ఆయన పద్యం చదవగా ముగ్ధుడనవటం, మాస్కూల్లో ఉపన్యసిస్తూ, మా స్థాయికి దిగివచ్చి మాట్లాడటం అన్నీ  నా మనస్సును పట్టివేశాయి.
విశ్వనాథ సాహిత్యంలో అంతర్బహిర్లోకాల అద్భుతమైన ఆవిష్కరణ పద్యంలో ఉండే సంభాషణ శైలి, అతి విపులమైన శబ్దార్థ సందోహం, అనంత కల్పనాచతురత, చరాచర ప్రకృతి అంతా సజీవమై సాక్షాత్కరించటం, ఋతువులు, కొండలు, అడవులు, వాగులు, వంకలు, పశుపక్షులు ఆపూర్వరీతిలో ప్రవృత్తం కావటం, నాణ్యతో దర్శనీయం కావటంతో అదేదో పూర్వ యుగాల బంధువు చేరవచ్చినట్లయింది. ఉద్వేగం పొందిన గడియలలో ఆ సాహిత్యం చిత్తశాంతిని కలిగించే సాధరణీకరణ లక్షణం నన్ను లోగొన్నది. ఆ విధంగా విశ్వనాథ సాహిత్య అధ్యయనం నా జీవనంలో అవిభాజ్యమైన భాగంగా మారిపోయింది. నేను విశ్వనాథను సర్వప్రకృతిని వివిక్తంగా సాక్షత్కరింపజేసే మహాకవిగా అంగీకరించినా, ఆయన విశ్వసించే జగన్మిథ్యాభావాన్ని అంగీకరించలేకపోతున్నాను. సామాజిక దృక్పథంలోనూ ఆయనకున్న కొన్ని పరిమితులు నాకు లేవు. అట్లాగే సంపత్కుమార శ్రీవైష్ణవ తాత్త్విక దృక్పథంతో విభేదించలేక నాకు దూరంగానే ఉన్నారు. నా వలె శ్రీఅరవిందుల చైతన్యం ఆరోహణ,
అవరోహణల జంట నిచ్చెనల లక్షణాన్ని ఆయన అంగీకరించలేదు. పద్య నిర్మాణంలో ఆయనకు రాయప్రోలు అంటే అంత ఇష్టం లేదు. నాకైతే రాయప్రోలు పద్యం మధుర రసవాహినులు ప్రవహించే కోన. సంస్కృత పాండిత్యం సంపత్కుమార పద్యాన్ని ప్రౌఢంగా చేసింది. నా పద్యం తీయదనాన్ని పుంజుకొని వెలువడింది. ఈ విధంగా యిద్దరి మధ్య రచనా విషయంలో ఎడం పెరుగుతూ వచ్చింది.  అయినా ఆయన చివరి క్షణం దాకా నేను ఆయనకు అనుగు బిడ్డనే.
5
హైదరాబాదుకు పై చదువులకోసం వెళ్లి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏడు సంవత్సరాలు గడిపినాను. 1955-62 వరకు సాగిన ఈ కాలంలో బిఏ, ఎంఏ,
పిహెచ్‌డిలు పూర్తయినాయి. దేశంలోని అనేక రంగాల ప్రముఖులను అక్కడ వినే అవకాశం వచ్చింది. ఉస్మానియాలో అధ్యయనం సర్వతోముఖ వికాసం కలిగించింది.
తెలుగుశాఖలో ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం, దివాకర్ల వెంకటావధాని, రామరాజు, చలమచర్ల ఇత్యాదుల అంతేవాసిత. ఖండవల్లివారి సౌజన్యం ఎంతో గొప్పది. వినీతి, ఆర్ద్రత, తెలుగు భాషా సాహిత్యాల పరివ్యాప్తికి ఏ పరిమితులు లేకుండా ఆయన సాగించారు. ఆయన కృషి ఫలితమే ఈనాటి తెలంగాణాలోని
సాహిత్య వికాస స్థితి. ఆయన శిష్య వాత్సల్యం అపారం. విద్యార్థులతోనూ సమస్థాయిలో ఆదరించి మాట్లాడేవారు.

అప్పుడే ఆంధ్రప్రాంతం నుంచి విద్యార్థుల రాకడ ప్రారంభమైంది. కళాశాలల్లో తెలుగుభాషాబోధన అవకాశాలు విస్తరించాయి. ప్రాచ్యవిద్యా పరివ్యాప్తి కలిగింది. ఖండవల్లివారికి పరిశోధక పర్యవేక్షక స్థితి కలిగింది. రామరాజు, అవధాని, దుర్గయ్య, సినారె, ఆనందమూర్తి, గోపాలకృష్ణారావు, రాజేశ్వరశర్మ, పిఎస్‌ఆర్ అప్పారావు ఇలా ఎంతోమంది దిగ్గజాలు పరిశోధన మార్గాన్ని బహు విస్తృతంగా నిలబెట్టారు. వారి సాహిత్య శోధ క్షేత్రాలు అతి విశాలమైనవి. ఆ నాళ్లలో పరిశోధనకు చేరుకున్న
వాళ్లలో నేనూ ఒకణ్ణి. నేను ఏ హాస్టల్‌లో ఉండేవాడిని. మాదిరాజు రంగారావు అక్కడే ఉండేవాడు. మాకు తరగతుల తరువాత గ్రంథాలయం, ఊళ్లో సాహిత్య
సమావేశాలు, హాస్టల్లో రాత్రివేళ్లల్లో సాహిత్య గోష్టులు… ఇదీ నిరంతర చైతన్య స్ఫూర్తి. నారాయణగూడలో పల్లాదుర్గయ్య ఇంట్లో రామరాజు, దాశరథి,
రామలింగం ప్రభృతులు ఉండేవారు. సినారె, ఆళ్వారుస్వామి మొదలైన వారు అక్కడ జతకూడేవారు. నేను, రంగారావు అక్కడికి సాయంకాలాలలో చేరుకునేవారం. ఎక్కువ సమావేశాలు కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలోనే జరిగేవి.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం, ఆంధ్రప్రాంత కవిపండితుల రాకపోకలు పెరగటం, వాతావరణంలో కొత్త వెచ్చదనం అప్పటి స్థితి. ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంలో
తెరసం వరంగల్ శాఖ ఒక ప్రత్యేక సంచికను వెలువరించింది. దాని వెనుక నా కృషి ఉన్నది. నేను స్థానిక సాహిత్య సమీక్ష పేరున వరంగల్ జిల్లా సాహిత్య వికాసం
గురించి దానిలో విపులమైన వ్యాసం వ్రాసినాను. నేను బిఎ విద్యార్థిగా ఉన్న రోజుల్లో వట్టికోట ఆళ్వారు స్వామి నాతో సాహిత్యము-నీతి అనే ప్రసంగం
చేయించి, వ్యాసము రాయించి ప్రభాస అనే వ్యాససంపుటిలో చేర్చి ప్రకటించినారు.
6
ఆ నాళ్లలో నేను కాళోజీ నాగొడవ మీద వ్యాసం రాస్తే, ఆయన దాన్ని మెచ్చి ఆ గ్రంథం రెండవ కూర్పులో పీఠిక వలె చేర్చినారు. ఎంకిపాటలమీద నా వ్యాసం
నాలుగు నెలలు స్రవంతిలో వరుసగా వచ్చింది. నేను ఎమ్మే విద్యార్థిగా ఉన్నప్పుడు సంస్కృత రూపకములు, తెలుగు అనువాదము అనే వ్యాసాన్ని సెమినార్లో
సమర్పింపగా దాన్ని నాటి సభాధ్యక్షులు భూపతి లక్ష్మినారాయణ దాన్ని మంచి పరిశోధన వ్యాసం అన్నారు. ఇంకా ఆళ్వారుస్వామి, వానమామలై మొదలైన వారికి
కూడా నా వ్యాసంగం మీద అభిమానం ఉండేది. పోతన చరిత్ర వర్తమాన కవిస్తుతిలో నా పేరును పేర్కొనటం నా పూర్వభాగ్యఫలంగా భావిస్తాను.

కరీంనగర్‌లో విశ్వనాథ షష్టిపూర్తి సందర్భంలో నా కవితను అధ్యక్షత వహించిన పివి మెచ్చుకున్నారు. నాకు సంపత్కుమారల రచన ఒక గేయకావ్యం చదవటానికి తెరసం ప్రత్యేక కావ్యగాన గోష్టి ఏర్పాటు చేసింది. అక్కడ మమ్మల్ని సన్మానించింది. అదే మాకు మొదటి సన్మానం. ఆ సభకు కప్పగంతుల వారు అధ్యక్షులు. 1957లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఏర్పడింది. అంతకుముందే అఖిలాంధ్ర సాహిత్య పరిషత్ అనే సంస్థ ఏర్పాటు చేయాలనే సంకల్పం ఉండేది. ఆ ప్రయత్నంలో పివి, కాళోజీ మొదలైన వారు ప్రముఖులు. దాని త్రోసిరాజని సాహిత్య రాజకీయాల కారణంగా ప్రభుత్వం చేత అకాడమీ ఏర్పాటు చేసి గోపాలరెడ్డి
అధ్యక్షుడు, విశ్వనాథ ఉపాధ్యక్షుడుగా సంస్థ ఏర్పడింది.
విశ్వనాథ సంపాదకత్వం గౌతమరావు నిర్వహణలో ఆ నాళ్లలోనే జయంతి పత్రిక 1955లో ప్రారంభమైంది. దానిలో నా రచనలు ఎక్కువగా వచ్చేవి. రసధుని అనేపేర కొందరు మిత్రులము ఒక సాహిత్యసంస్థను స్థాపించి విశ్వనాథను గూర్చి, శ్రీశ్రీని గూర్చి రెండు గోష్టీ కార్యక్రమములు ఏర్పాటు చేసినాము. ఒకసారి కోఠీ మహిళాకళాశాలలోని దర్బారు హాలులో ఆర్ట్స్ కాలేజీ తెలుగు సాహిత్యసంఘం వారు విశ్వనాథ కల్పవృక్ష ఉత్సవాలు నిర్వహించారు. ఒక సదస్సుకు తాపీ ధర్మారావు అధ్యక్షత వహించి ప్రశంసాపూర్వకంగా ప్రసంగించారు. ప్రశంసకో, నిందకో భాగ్యనగర సాహిత్యలోకంలో మాకు విశ్వనాథ అభిమానులనే కాకుండా, భక్తులనే
ముద్రపడింది. అంతవరకు మమ్మల్ని అభిమానించిన కవిమిత్రులతో ఈ అంశం ఎడం పెంచింది.
ఈనాళ్లలో నా పద్యాలు భారతిలో అచ్చయ్యేవి. ఆ పద్యాలను దాశరథి ప్రభృతులు ప్రశంసించేవారు. బాపురెడ్డి, చేకూరి రామారావు నాకు మంచి మిత్రులు. చేరా
కోసం నేను నిజాం కాలేజీ హాస్టల్లో అప్పుడప్పుడూ కొన్ని రాత్రులు గడపడం ఆయన నాకోసం యూనివర్సిటీకి వచ్చి మా హాస్టల్లో గడపడం పరస్పర స్నేహ గాఢతకు
దారి తీసింది. ఆ రోజుల్లో నేను తేజశ్చక్రము రాశాను. ఇది మధ్యాక్కర వలె కన్పిస్తుంది. యతిప్రాసలు కూడా ఉంటాయి. అయితే గణనిబద్ధత ఉండదు. తొలుదొలుత కొన్ని భాగాలుగా జయంతిలో వచ్చినవి. అయితే 1958 అక్టోబరులో ఇది పుస్తకరూపంలో వచ్చింది. ఈ పుస్తకంలో దుఃఖయోగిని అన్న గీతపద్య బహుళ కావ్యమూ చేరింది.
కుందుర్తి వచనపద్యోద్యమం నడుపుతున్న కాలమది. తన ఆఫీసులోనే ఒక ఆలస్య మధ్యాహ్న వేళలో నా తేజశ్చక్రము చదివించారు. అప్పుడు నవయుగ అనే
వారపత్రికలో దాన్ని ఆయన సమీక్షించారు. కుందుర్తికి నా పద్యాలంటే  ఇష్టం. అయితే ఆయన వచన పద్యాన్ని ఆధ్యాత్మిక వాదులు ఆక్రమించగలరని సంకోచం
పొందేవారు. అయినా, ఆయన విశ్వనాథ శిష్యుడే కావటం వల్ల ఈ పరస్పర ఆదరణానికి ఇబ్బంది కలుగలేదు. కుందుర్తి వల్ల వచ్చిన సమస్య రూపనిష్ఠ. నాకెన్నడూ
రూపనిష్ఠ లేదు. నేనే కాదు, దాశరథి దగ్గర నుంచి తెలంగాణా కవులు ఎవరూ ఈ రూపనిష్ఠకు కట్టుబడలేదు. కొంతలో కొంత ఈ రూపనిష్ఠ ప్రచురణ విషయంలో మా
రంగారావుకు ఉండేది. పద్యం రాసి మనం మెప్పించేది ఏముంటుంది అని ఆలోచించేవాడు. 1959 ఏప్రిల్ భారతిలో నా ‘సాహస్రమాన్మథము’ అనే పద్యాలు అచ్చయినాయి. ఆ సంవత్సర సాహిత్య సమీక్ష చేస్తూ సాళ్వకృష్ణమూర్తి ఈ కవితను ఆ ఏటి ఉత్తమ కవితగా పేర్కొన్నారు.
1959లో నేను పరిశోధన కోసం చేరినాను. అంశము రామరాజభూషణుని కృతులు-అధ్యయనము అని. వసుచరిత్రను గూర్చి నాకొక సందేహము ఉండేది. ప్రతి పద్యమూ శబ్దశక్తి చేత అనేకార్థాలను ప్రసరింపచేస్తున్నప్పుడు వస్తువును భావించటం దుర్లభమని, కావ్యానుభవం ఎలా కలుగుతుందని. నేను 1961 జనవరిలో విజయనగరం నుంచి మద్రాసు దాకా  ఈ ప్రశ్నను మోసుకొని సాహిత్యయాత్ర చేసినాను. ఎంతోమంది విద్వాంసులను కలుసుకున్నాను. అనేక సాహిత్య గోష్టులలో పాల్గొన్నాను. అయినా సందేహం తీరలేదు. ఈ పరిశోధన వ్యాసం నా సాహిత్య దర్శనాన్ని విస్తృత పరచిన మాట వాస్తవమే. ఎంతోమంది విద్వాంసులను దర్శించి సంభాషించి వారి వాత్సల్యాన్ని అనుభవించి ఒక పరితృప్తిని పొందినాను. త్రిపురనేని గోపీచంద్-నేను వసుచరిత్ర మీద పరిశోధన చేస్తున్నానని తెలుసుకుని ఒకసారి నన్ను కలుసుకోమన్నారు. సాదరంగా నాతో చర్చించినారు. బహు అర్థ సంయోజనలో ప్రధానార్థానికి ఇతర అర్థానికి ఉపమాన, ఉపమేయ భావం
చెప్పుకోవచ్చునేమో చూడమన్నారు. అలాగే వసుశబ్దార్థం తెలుసుకోమన్నారు. తరువాత సంశయం తొలగిపోయింది. కావ్యము మూడు పొరలలో ఉన్నదని, ఒకటి జలం లోకంలోకి ప్రవహించటం, రెండు ఇంద్ర వృత్రాసురుల కథ, మూడు కావ్య స్ఫుట వస్తువైన ఉపరిచర వసు కథ. ఈ బహుస్తర గాథా నిర్మాణానికోసం కవి అనేకార్థ
ప్రతిపాదకమైన శైలిని ఎన్నుకొన్నాడని నాకు స్ఫురించింది. శ్రీఅరవిందుల ‘సావిత్రి’ కావ్య అధ్యయనం ఈ అంశాన్ని విపులంగా ప్రస్ఫుటం చేసింది. ఇది ప్రాచీన కావ్యాధ్యయనంలో నూతన మార్గావిష్కరణంగా ప్రశంస పొందింది. 1962 జూన్‌లో నాకు డాక్టరేట్ డిగ్రీ వచ్చింది. వరంగల్ కళాశాలలో స్థిరమైన ఉద్యోగం వచ్చింది.
1970 ప్రాంతాలలో పద్యరచనం మీద ఒక నిరసనం తీవ్రమైంది. పద్యం చచ్చిపోయిందంటూ వ్యాఖ్యానించేవారు. ఆ తీవ్రతను తొలగించేందుకు నేను 1973లో
తొలి అష్టావధానం చేసినాను. ఆ తరువాత తెలంగాణాలో చాలా ప్రాంతాలలో 80 దాకా అష్టావధానాలు చేసినాను. శ్రీశృంగేరీ పీఠాధీశులు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ
స్వాముల సమక్షంలోనూ, శ్రీపివి సమక్షంలోనూ అష్టావధానాలు చేసే అవకాశం లభించింది. వారి ఆశీఃస్సులు లభించాయి.
వరంగల్లు ప్రాంతంలో సాహిత్య చరిత్ర గురించి, చరిత్ర గురించి కొంత తీవ్రంగానే కృషి చేసినాను. ఇంటాక్ సంస్థవారి ప్రోత్సాహం ఇందుకు కారణం. ఏకశిలా సాహిత్య సౌందర్యం అనేపేర ఈ ప్రాంత సాహిత్య చరిత్రను సంపాదకుడుగా ప్రచురించినాను. విద్యారణ్యస్వామి సాహిత్య సమగ్ర తాత్త్వికతపై ఒక గోష్ఠి నిర్వహణకు పరిస్థితులు ఏర్పరచటం విద్యారణ్య విద్వద్గోష్ఠి అనే పేర రెండు సంపుటాలను ప్రచురించటం మరొక మౌలిక కృషి.
మా తాతగారు కోయిల్ కందాడై రంగాచార్యుల వారి స్మారకంగా 2005 నుంచి ఒక ట్రస్టు ఏర్పరచి ప్రసిద్ధులైన ఉభయ వేదాంత పండితుల చేత స్మారకోపన్యాసం
చేయించి, ఆ వేళకు దాన్ని ప్రచురించి వారిని పండిత రత్న బిరుదంతో సత్కరించి యథోచితంగా సన్మానం చేస్తున్నాము. నేను ఎమర్జెన్సీ రోజులలో దానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో రహస్యంగా పాల్గొన్నాను. అప్పుడే వందేమాతరం గీతం శతజయంతి ఉత్సవాలు జరిగితే ఒక ప్రత్యేక సంచికను వెలువరించారు.
7.
జీవనగమనంలో మార్పు. ఉద్యోగం, సంసారం ఒక పార్శ్వమైతే, కవిత్వం, విమర్శ మరో పార్శ్వం. ఉద్యోగ జీవితంలో ప్రతిరోజూ ప్రతి తరగతి పాఠమూ, నూతన అధ్యయన స్థానమే అయింది. బయట కానవచ్చే ఇతరాంశాలు ఏవీ నన్ను వికలం చేయలేదు. వృత్తి నిర్వహణ సందర్భంలో చివరవరకూ ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు కలుగుతూనే వున్నాయి. 1964లో అధునా అన్న కావ్యసంపుటి వచ్చింది. దానికి ముందుమాట వ్రాస్తూ దేవులపల్లి రామానుజరావు-‘‘సుప్రసన్న తెలుగు సరస్వతికి సహస్ర కమలపూజ చేయగలర’’ని ఆశించారు. ఈ ఖండకావ్య సంపుటిలోని పద్యాలు 1957 నుంచి వివిధ పత్రికలలో వచ్చినవే. కవికి సొంత గొంతు క్రమంగా ఏర్పడుతుంది. పేర్వారం జగన్నాథం సంపత్కుమార, నర్సింహారెడ్డిలతో కలిసి 1967లో చేతనావర్తం తొలిసంపుటం నా పీఠికతో వెలువడింది. ఈ సంపుటం వెలువడగానే సాహిత్యలోకంలో సంచలనం. ఈ సంకలనం పార్టీలకు లొంగిపోయే సాహిత్యాన్ని దూరం చేసింది. ప్రజాస్వామ్య దృక్పథానికి బలమిచ్చింది. మానవుడు కేవలం అర్ధవశుడుగా కాక ఆధ్యాత్మిక ఆధిదైవిక, ఆధి భౌతిక స్తరాలలో పరిపూర్ణంగా వికసించవలసిన అవసరాన్ని నొక్కిచెప్పింది. దివ్యజీవన ఆవిర్భావాన్ని పృథ్విమీద జరగాలని స్వప్నించింది.
జాతీయ జీవన ధోరణితో విరోధం పెంచుకుని పార్టీల వ్యక్తుల తీరులు వెనక్కి తగ్గాయి. ప్రతిభావంతమైన సంస్కృతి ప్రకాశంలో సమాజంలోని వైరుధ్యాలను,
ధోరణులను ఈ సంపుటి సమీక్షించింది. మరి నాలుగేళ్లలో సంపత్కుమార పీఠికతో రెండవ సంపుటం వచ్చింది. ఎవరేమని నిరసించే ప్రయత్నం చేసినా చేతానవర్త
స్ఫూర్తి ఆధునిక తెలుగు కవితారంగంలో తన కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వహించింది. ఈ నడిమి కాలంలో వరంగల్లు నుంచి వారపత్రికగా వెలువడే జనధర్మ దై్వమాసిక సాహిత్యానుబంధాన్ని ప్రకటించింది. నేను దీనికి సంపాదకుణ్ణి. విలువగల సాహిత్య పత్రికను పదకొండు సంచికలను ప్రకటించింది. స్వాతంత్య్రోత్తర కాలాన తెలుగు కవిత ఇది వెలువరించిన విలువైన ప్రత్యేక సంచిక. అట్లాగే జ్ఞానపీఠ పురస్కార సందర్భంలో విశ్వనాథను గురించి మరొక ప్రత్యేక సంచికను వెలువరించింది.
1971లో ఆధునిక సాహిత్యాన్ని ముఖ్యంగా కవిత్వాన్ని గురించి నేను వ్రాసిన వ్యాసాలను సాహిత్య వివేచన పేరిట ప్రచురించాను. ఇది వెలువడిన వెంటనే
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, ఉత్తమ విమర్శ గ్రంథంగా బహుమతి ప్రకటించింది. దానితో నాకు విమర్శక స్థానం లభించినట్లే భావించాను.
అబ్బూరి రామకృష్ణారావు వంటి వారు నా విమర్శలోని సమతులా లక్షణాన్ని ఎంతగానో అభిమానించారు. నా అదృష్టం ఏమిటంటే తొలితరం కవులు చాలామందితో నా పరిచయము కలిగి ఉండటం. వారి వాత్సల్యాన్ని నేను పొందగలగటం నా అదృష్టమే. విశ్వనాథ వారితో పాటు కాటూరి వెంకటేశ్వరరావు, శివశంకరస్వామి, నోరి నరసింహశాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, నాయని సుబ్బారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి వీళ్లందరితో నాకు ఆప్తమైన సంబంధం ఉండేది. తరువాత తరం కవులతో కూడా నా సంబంధాలు ప్రీతిపాత్రాలే అయినవి.
నా జీవితం ఉద్యోగంలో కుదురుగానే సాగింది. మెట్లు ఎక్కడమూ జరిగింది. నా జీవితంలో ఎంతోమంది నా సంపూర్ణ వికాసానికి దోహదం చేసినారు. వారికి నేను
ఏమి చేసినానో చెప్పలేను కానీ, కొంతమంది పురోగమనానికైనా నా చేతనైన సహాయం చేసినాను. 1987లో శతాంకుర వచ్చింది. కావ్య సృజనశక్తికి విలక్షణమైన
అభివ్యక్తి ముద్ర కలిగింది. సాహిత్యవేత్తలు దీన్ని స్వాగతించి దాని అభినవతను మెచ్చుకొన్నారు. సృష్టిలోని అనేక పార్శ్వాలు ఈ ముక్తక సంపుటిలో వ్యక్తమయ్యాయి. నా తాత్త్విక జీవన పరమార్థ దృష్టి ఈ కావ్యంలో సంగ్రహంగా ప్రకటితమైంది. నా కావ్య ప్రస్థానంలో ఇది ఒక విశిష్ఠమైన ఘట్టమే. ఈ సందర్భంలోనే నాకు ఆధ్యాత్మిక సాధనలో కొంత సంక్లిష్టమైన ఘట్టంలో ఉన్నట్టు అనిపించేది. ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లభించలేదు. కొన్ని సంశయాలు తీరే అవకాశాలు లేకుండెను. నా తపోమార్గంలో హఠాత్తుగా నిరోధం ఏర్పడ్డట్టు అనిపించింది. ఆ సందర్భంలో నా జీవనంలోకి ఒక అరుదైన వ్యక్తి, సనాతన అధునాతన జీవన తాత్పర్యాన్ని తనలో సమన్వయం చేసుకున్న వ్యక్తి అవతరించారు. వారి పేరు సద్గురు శివానందమూర్తి. అంతకుముందు నా జీవనంలో ప్రవేశించిన తత్త్వ స్ఫూర్తిని కలిగించిన వారు శ్రీఅరవిందులు, శ్రీమాత, రమణమహర్షి, సాయిబాబా వంటి వారు వీరిలో లీనమైనారు. వారి మార్గదర్శనం నన్ను నాజీవితాన్ని స్పష్టమైన అసంక్లిష్టమైన మార్గంలో తీర్చిదిద్దుకోవటానికి దోహదం చేసింది.
సద్గురువుల అనుగ్రహం నాకు అనంతమైన చిత్తశాంతిని కలిగించింది. వారి సన్నిధి అసంతృప్తి లేకుండా నాకు సమచిత్తతను ప్రసాదించింది. వారి సన్నిధి నాకు ఈశ్వర సన్నిధానమే అయింది. వారు స్థాపించిన సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ పక్షాన శ్రీరామనవమి పురస్కారం లభించటం గొప్ప ఆశీర్ అనుగ్రహం.
అలాగే శ్రీముత్తేవి లక్ష్మణ యతీంద్రుల అనుగ్రహం కూడా లభించింది. వారు ఉత్తమ కవితకు స్వయంగా వశీకృతులయ్యేవారు. తొలి పరిచయంలోనే 1982లో
తేజశ్చక్రము రాసిన కవివి కదా అని కౌగిలించుకున్నారు. అది శ్రీరాముడు మారుతికి అనుగ్రహించిన పరిష్వంగం. నన్ను మధురకవి అని పిలిచేవారు.
తరువాత నా కావ్యాలు ఎన్నో వెలువడ్డాయి. ఋతంభర, కన్నీటి కొలను, కృష్ణరశ్మి, శ్రీనిరుక్తి, శ్రీనృసింహ ప్రపత్తి ఇలా ఎన్నో. అయినా నేను భావిస్తున్న సమగ్ర కావ్యం రూపు కట్టలేదు. అనుకోకుండా పదిహేను రోజులు జ్వరంలో పడ్డ తరువాత ఆ వేదనలో 2002లో సాంపరాయం కావ్యం ఒక ప్రవాహం లాగా వెలువడింది.
సాంపరాయం 12 అధ్యాయాల్లో సృష్టి ఆరంభం నుంచి జీవన పరిణామం వర్ణించి మానవుడు మృత్యువును అతి తరించేదాకా ప్రయత్నాన్ని వ్యక్తీకరించే ఇతిహాస
కావ్యం. శతాంకుర లాగా ఇదీ వచన పద్యమే. అయినా ప్రతిపద్యమూ లయ కలిగిన నాలుగు పాదాలతో నిర్మితమైంది. మృత్యువును జయించి దివ్యమైన సమాజం
భూమండలంలోనే ఏర్పడవలసిన రీతిని కలగన్నది. భావుకులు తత్త్వవిదులు, కవిత్వగ్రహణ పారీణులు దీని ఔన్నత్యాన్ని ప్రశంసించినారు. ఈ కావ్యాన్ని మిత్రులు డాక్టర్ ఎల్‌ఎస్‌ఆర్ ప్రసాద్, డాక్టర్ విబి రామారావులు ఇంగ్లీషులోకి అనువదించారు. సాంపరాయం తరువాత వచ్చిన కావ్యాలు శేఫాలిక, ప్రీతి పుష్కరిణి, మణిసేతువు,
మణికర్ణిక మొదలైనవి దేనికవి వైలక్షణ్యం కలవే. బింబప్రతిబింబ భావాన్ని ఓర్వలేవు.
1983లో వెలువడిన సహృదయచక్రం వ్యాస సంపుటి తరువాత నా విమర్శ గ్రంథాలు మరో 11 వెలువడ్డాయి. అనేక అంశాలకు సంబంధించిన వినూత్న అంశాలు ఈ వ్యాసాల్లో ఉంటాయి. వీటిల్లో అధ్యయనానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ విమర్శ గ్రంథంగా పురస్కరించింది. అదే విశ్వవిద్యాలయం ఉత్తమ పరిశోధకునిగా ప్రతిభా పురస్కారాన్ని అందించింది.
నా పీఠికల సంపుటి అంతరంగం. శ్యాంసంగ్ వారు కేంద్ర సాహిత్య అకాడమీ వారు సంయుక్తంగా ప్రకటించిన తొలి ఠాగూర్ సాహిత్య పురస్కారాన్ని పొందింది. తరువాత శ్యాంసంగ్ కంపెనీ వారి ఆహ్వానం మీద కొందరు పురస్కార గ్రహీతలతో కలిసి దక్షిణ కొరియాకు వెళ్లటం, అక్కడ సాహితీవేత్తలను కలుసుకోవటం జరిగింది. అఖిల భారత ప్రాచ్యవిద్వన్మహాసభలలో పాల్గొని 1977 నుంచి ఎన్నో పరిశోధన పత్రాలను సమర్పించాను. 1987లో కలకత్తాలో ఈ మహాసభలు జరిగినప్పుడు ద్రావిడ అధ్యయన సదస్సు విభాగానికి అధ్యక్షత వహించగలగటం నాకు సమకూడిన గొప్ప గౌరవం. జీవిఎస్ పేర ఏర్పడ్డ సాహిత్యపీఠం వారి ఉత్తమ విమర్శక పురస్కారం 2001లో నాకు లభించింది.
వేద రహస్యాన్ని సామాన్య పాఠకులకు అందించే సంకల్పంతో వేద సూక్త సౌరభం అనేపేర వాటిలోని ఆధ్యాత్మిక భూమికను ఆవిష్కరించే ప్రయత్నం చేసినాను. ఈ
గ్రంథానికి మంచి స్పందన లభించింది. ఇదే పద్ధతిలో ఇటీవల శ్రీకృష్ణోపనిషత్ వ్యాఖ్య కూడా ప్రకటించాను. దీపవృక్షం అనే పేర జీవనములోని అన్ని పార్శ్వాలకు సంబంధించిన మనోభావాల సంకలనం వెలువరించాను.
సాహిత్యంలో జాతీయ భావధోరణి బలపరిచే నిమిత్తం 1974లో జాతీయ సాహిత్య పరిషత్ ఏర్పడింది. దాని స్థాపన ప్రయత్నంలోనూ, పురోగమనంలోనూ నేను ప్రముఖమైన కృషిని నిర్వర్తించాను. విశ్వనాథ శతజయంతి సందర్భంలో గ్రంథరూపంలోకి రాని ఆయన అనేక రచనలను విశ్వనాథ అసంకలిత సాహిత్యం అనే పేర నేను, సంపత్కుమార కలిసి ఆరు సంపుటాలుగా వెలువరించినాము. దాన్లో మూడు నాలుగు సంపుటాలకు నేను సంపాదకుడిని. నేను సంపాదకత్వం వహించిన అనేక గ్రంథాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంపుటాల అనువాదంలో అయిదవ భాగం ఒకటి. సాహితీబంధుబృందం, కులపతి సమితి, జాతీయ సాహిత్యపరిషత్, విశ్వనాథ భారతి, సృజనలోకం, వంటి అనేక సాహిత్య సంస్థల నిర్మాణంలో పురోగతిలో నా ప్రయత్నం ముఖ్యమైందే. 1964-73 సంవత్సరాల నడుమ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యుడిగా నేను సాధ్యమైన కృషి నిర్వర్తించాను. 1982లో రాష్ట్ర స్థాయిలో పోతన పంచశతి ఉత్సవాలను నిర్వహించిన సందర్భంలో నా భూమిక ముఖ్యమైందే. ఆ సంకల్పం దగ్గర నుంచి పూర్తయ్యే దాకా నా కృషి ఉన్నది. ఈ ఉత్సవాలు అయిదు రోజుల పాటు వరంగల్లులో అపూర్వంగా జరిగినాయి. దీనికి ప్రధాన ఆధారం బలం పివి నరసింహారావు. ఈ ఉత్సవాల ఫలితంగా పోతన విజ్ఞానపీఠం 1987లో ఏర్పడింది. ఆ పీఠం 1992లో భవనం నిర్మించుకోవటం జరిగింది.
అంతకుముందు, తరువాత ఎన్నో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది. నిర్వహిస్తున్నది. నేను చాలాకాలం దానికి సంయుక్త కార్యదర్శిగా ఉన్నాను. ఆరేడేళ్లుగా కార్యదర్శిగా నా కృషి  కొనసాగిస్తున్నాను. ఈ ప్రాంతంలో సాంస్కృతిక చైతన్యం పురోభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను. దీనిలో సభాభవనం, గ్రంథాలయం ఉన్నాయి. వరంగల్లు ప్రాంతంలో సాంస్కృతికంగానే కాక ఆధ్యాత్మిక స్ఫూర్తిని కలిగించటంలో ఈ సంస్థ ఎంతో దోహదం చేస్తున్నది.
నా జీవితం సుఖదుఃఖ మిశ్రీతం. ఎన్నో వెలుతులు, ఎన్నో పొంగిపొర్లటాలు. 2008 చివర మా పెద్దబ్బాయి గుండెపోటుతో పరమపదించటం, 2010 ఆగస్టులో మా చిన్నాయన సంపత్కుమార పరలోక గతులు కావటం, మొన్న డిసెంబరులో నా ధర్మపత్ని కాలగతి చెందటం ఇవన్నీ ఒకేకాలంలో సంభవించిన విషాదాలు. ఇప్పుడొక విచిత్రమైన శూన్యస్థితిలో మనస్సు ఉన్నది. ఈ మృత్యువు చేసే ఒత్తిడి జీవన పరమార్థాన్ని వ్యాఖ్యానించే దివ్యద్వారమే అవుతుందని నా విశ్వాసం.
శతాంకురలో ఎక్కడో అన్నాను. జీవితం ఎటర్నల్ స్క్రిప్చర్ అని. అలాగే దీన్లో వెలుగులు చూచుకుంటూ ఆ మార్గంలో నడుస్తున్నాను. ఋతుచక్రంలో శిశిరం తరువాత
వసంతం వస్తుంది. ఇదంతా చక్రనేమిక్రమం.

– కోవెల సుప్రసన్నాచార్యClose

ఇది ‘పెట్టుబడి’ చేసిన హత్య!

Uday-Kiran-Modeling-Pic‘‘ప్రముఖ సినీనటుడు ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్య’’ అన్న వార్త టెలివిజన్‌ తెరమీద స్క్రోల్‌ రూపంలో చూసినపుడు నాకు పెద్దగా ఆశ్చర్యంకానీ, దు:ఖం కానీ కలగలేదు. వైయక్తిక దు:ఖానికి తప్పిస్తే, సామాజిక అవ్యవస్థకి మనం మనుషులుగా స్పందించడం మానేసి చాలాకాలమయింది కనుక…దు:ఖం స్థానంలో ఒక నిర్లిప్తత, ఒక ఉదాసీనత ఏదో కలిగింది. చిత్ర సీమకు ఇలాంటి రోజు ఏదో ఒక రోజు వస్తుంది అని తెలుస్తూనే వుంది కనుక ఆశ్చర్యం లాంటి భావమేదీ కలగలేదు.
ఆ ఏదో ఒక రోజు ఇంత త్వరగా రావడం మాత్రం ఖఛ్చితంగా విషాదమే!
సినిమా అవకాశాలు తగ్గిపోవడమూ, ఆర్ధిక ఇబ్బందులు, పరాయీకరణ లాంటి కారణాల వలన డిప్రెషన్‌కి గురి అయి ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించి ఇవ్వాళో, రేపో కేసు మూసివేయ వచ్చు. కానీ ‘‘హత్య’’కి ఆత్మహత్యకి మధ్య ఉన్న ఒక సన్నని రేఖను వాళ్ళెప్పుడూ, ఎప్పటికీ ఛేదించలేరు. అది వాళ్ళ తప్పు కూడా కాదు సమాజంలో కొండలా పేరుకుని పోయిన రుగ్మత, పోలీసులకి భౌతిక, ప్రాసంగిక సాక్ష్యాలు కావాలి. వాటి అవసరం లేకుండానే సమాజం, ఏది హత్యో, ఏది ఆత్మహత్యో నిర్ధారణ చేయవచ్చు కానీ మన సమాజం ఆ దిశగా ప్రయత్నించదు అది మన దురదృష్టం.
‘‘ఉదయ్‌ కిరణ్‌’’ హత్య, పోనీ ఆత్మహత్య వెనుక నాలుగు శక్తులు ప్రధానంగా పనిచేశాయి అని ఈ వ్యాసకర్త బలమయిన నమ్మకం. ఒకటి సినిమా, రెండు సమాజము, మూడు ప్రేమ రాహిత్యము చివరగా చెపుతున్న కారణం  అత్యంత బలమయినది. ఏ ఆత్మహత్య వెనుక అయినా, కొంచెం లోతుగా పరిశీలిస్తే ఈ నాలుగు అంశాలు తప్పిస్తే మరేమీ కన్పించవు.
ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్య వార్త లోకానికి వెల్లడి కాగానే మొదటి చూపుడు వేలు సినిమా రంగం వైపే చూపించింది. అవునన్నా, కాదన్నా యివ్వాళ సినిమా రంగంలో  సామాన్యుడికి స్థానం లేదు.
ప్రపంచీకరణ విధానాలు ఆంధ్రదేశంలో అమలు కావడం మొదలయిన తర్వాత, ఆ విధానాలకు బలంగా ప్రభావితమయినది మాత్రం సినిమా రంగమే 1980 దశకం దాకా రాష్ట్రం ఎల్లలు దాటని సినిమా రంగం షూటింగ్‌లు, సినిమా వ్యాపారము 1990 తర్వాత మెల్ల మెల్లగానూ 2000 తర్వాత ఉధృతంగానూ విశ్వవ్యాప్తమయినాయి.

ప్రేమాభిషేకం లాంటి సినిమా ఇరవై, ముప్పై లక్షలులో తయారయిందంటే మనకు ఆశ్చర్యంగా ఉండవచ్చు. ఇవ్వాళ ‘‘కోటి’’ రూపాయల బడ్జెట్‌ లేకపోతే ఎంత చిన్న సినిమా అయినా తయారుకాదు. ఒకప్పుడు ‘‘అడవిరాముడు’’ అనే సినిమా రాష్ట్రవ్యాప్తంగా 27 ధియేటర్లలో విడుదల అయితేనే ఒక రికార్డు. కానీ ఇవ్వాళ సినిమా రెండు వేలకు పైగా ధియేటర్లలో విడుదల అవుతుంది పెట్టుబడి వరదలాగా చిత్రసీమలోకి వచ్చి చేరుతున్నది ప్రభుత్వ రాయితీలూ యింతకు ముందు కంటే పదిరెట్లు పెరిగాయి. ఇన్ని సానుకూల అంశాలు ఉన్నప్పుడు చిత్రసీమ కళకళలాడుతూ ఉండాలికదా… అలా వుండలేదు ఎందుకని?
దీనికి ప్రధానమయిన కారణం కేంద్రీకరణ, పెట్టుబడి, అవకాశాలు, మార్కెటీకరణ లాంటి అన్ని అంశాలలో కేంద్రీకరణ కేవలం నాలుగయిదు కుటుంబాలకే పరిమితం కావడంతో ఈ దుస్థితి ఏర్పడిరది. ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్య వార్త వినగానే ఏ రాజకీయాలూ తెలియని ఒక సినిమా ప్రేమికుడి ప్రతిస్పందన ‘‘తొక్కేశారు’’అని.
అక్కినేని కుటుంబం నుండి అయిదుగురు నటులు చిరంజీవి కుటుంబం నుండి ఐదుగురు నటులు, దగ్గుబాటి కుటుంబం నుండి ఇద్దరు నటులు, మంచు వంశం నుండి నలుగురు నటులు ఇవ్వాళ ఇండస్ట్రీలో ఉన్నారు. వీళ్ళ అధీనంలోనే రాష్ట్రంలో తొంభైశాతానికి పైగా ధియేటర్లు వున్నాయి, వీళ్ళ చేతుల్లోనే మీడియా వుంది. దర్శకులు, నిర్మాతలు కుటుంబాల వారీగా విడిపోయారు ఈ నటులు ఎవరిని చెపితే వారినే తీసుకునే స్థితిలో వున్నారు చిన్న సినిమాకు, చిన్న నటులకు అవకాశం ఎండమావి.
ఈ పెద్ద కుటుంబాలలోని హీరోలకి ఒక్క హిట్‌ వస్తే చాలు పది, పదిహేను మంది నిర్మాతలు క్యూ కడతారు. ఆ పదింటిలో మరొక్క హిట్‌ వస్తే మరొక పది, పదిహేను సినిమాలు చేతిలోకి వస్తాయి. ఈ హీరోల సినిమాలకి ఆయా సామాజిక వర్గాలకి చెందిన రాజకీయ పార్టీలు, యువజన సంఘాలు వెన్నుదన్నుగా నిలుస్తాయి. లక్షలు వెచ్చించి కాంప్లిమెంటరీ టిక్కెట్లు కొంటాయి మీడియా సినిమా వసూళ్లు ఇన్ని కోట్లు దాటాయి అన్ని కోట్లు దాటాయి అని ప్రచారంతో హోరెత్తిస్తుంది. ఇన్ని సౌకర్యాలు చిన్న సినిమాకు ఏవి? చిన్న సినిమాకు ధియేటర్లు దొరకటమే కష్టం, దొరికినా ‘‘సినిమా బావుంది’’ అనే మౌత్‌ పబ్లిసిటీ వ్యాపించే లోగానే ధియేటర్ల నుండి ఆ సినిమాను ఎత్తేస్తారు అందుకేనేమో చిన్న సినిమాల వైపుకి వెళ్లకుండా ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కలసి ఒక పెద్ద హీరో సినిమాను ఇవ్వాళ తీస్తున్నారు. ఒక పెద్ద హీరో సినిమాకు ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. ఇక నిర్మాతలు, దర్శకులు అయితే తమ సృజనాత్మకతను అంతా ఆ పెద్ద హీరోల ప్రాపకం కోసం ఖర్చు పెడుతున్నారు. ఇటీవల ఒక ఆడియో ఫంక్షన్‌లో ఒక నిర్మాత ‘‘నాన్నా దేవుడు ఎలా వుంటాడు?’’ అని మా అబ్బాయి అడిగితే గదిలోకి తీసుకెళ్లి ఫలానా హీరో ఫోటో చూపించాను అని చెప్పడం ఈ కేంద్రీకరణకి పరాకాష్ట.
నాగార్జున మొదటి సినిమా ‘విక్రమ్‌’ నాగేశ్వరరావుగారి అబ్బాయి ఎలా చేశాడో అన్న ఉత్సుకతతో జనం చూశారు. తరువాత కెప్టెన్‌ నాగార్జున, అరణ్యకాండ, మజ్నూ వరకు వరుస ఫ్లాప్‌లు. బాలకృష్ణకి సుల్తాన్‌, కృష్ణబాబు, రాణా సమయంలో వరుస అపజయాలు. చిరంజీవి ఏకంగా సంవత్సరంపాటు ముఖానికి రంగేసుకోలేదు, ఫెయిల్యూర్‌కి భయపడి అయినా వాళ్లంతా ఎలా నిలదొక్కుకున్నారు వారి వెనుక బలమయిన డబ్బువుంది. దాన్ని మించిన అక్కినేని ఫ్యామిలీ, నందమూరి వంశం చిరంజీవి మెగాస్టారిజం అనే దుర్బేధ్యమయిన గోడలు వున్నాయి. ‘‘మనవాడు పడిపోకూడదు’’ అని కాపు కాసిన కుల సంఘాలు ఉన్నాయి.  ఉదయ్‌ కిరణ్‌ వెనుక యివేమీ లేవు.
ఇవ్వాళ ఉదయ్‌ కిరణ్‌ అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకున్నాడు ఇంతకు ముందే ఒక నిర్మాత ఒక భారీ సినిమా నిర్మించి విడుదల చెయ్యలేక హుస్సేన్‌ సాగర్‌ లో దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు మరో నిర్మాత బాగా నడుస్తున్న సినిమాను మరో పెద్ద హీరో సినిమా కోసం ధియేటర్‌ నుండి తీసివేస్తున్నారని ‘‘కూకట్‌ పల్లి’’ చౌరస్తాలో  ధర్నా చేసి పోలీస్‌ కేస్‌ పెట్టాడు.
ఇవన్నీ చదువుతుంటే మీకు ఏం అనిపిస్తోంది? కె.వి. రెడ్డి, బి.ఎన్‌. రెడ్డి తరంలో సినిమా ఒక కళ. అది ప్రజల ప్రయోజనాలని కలవరించింది, కాంక్షించింది.
బాపు, విశ్వనాధ్‌, దాసరినారాయణరావుల తరంలో ‘సినిమా’ కళాత్మక వ్యాపారం కళాత్మక విలువలు కాపాడుకుంటూనే వ్యాపార సూత్రాలను అందిపుచ్చుకుంది.
ఎస్‌.ఎస్‌ రాజమౌళి, వి.వి. వినాయక్‌ల తరంలో సినిమా కళకాదు, వ్యాపారమూ కాదు. డబ్బు తయారుచేసే యంత్రం. వ్యాపారంలో, యుద్ధంలో కొన్ని నైతిక సూత్రాలు, విలువలు వుంటాయి కానీ యంత్రానికి అదేమీ తెలియదు. మానవీయ స్పర్శ ఇప్పటి సినిమాకు లేదు.
విశ్వనాధ్‌ ప్రతి సినిమాకు ‘‘ఎస్‌’’ అనే అక్షరంతో మొదలయ్యే పేరు పెడతానో, మూడు అక్షరాల పేర్లు మహేష్‌ బాబుకి కలసి వస్తుందనో, వి.వి. వినాయక్‌ హీరోయిన్‌కి ‘నందిని’ అనే పేరు పెడితే హిట్‌ అవుతుందనో, కృష్ణవంశీ సినిమాలో హీరోయిన్‌ ఎప్పుడూ ‘‘మహాలక్ష్మీ’’ అనో సినిమా పరిశ్రమకి సెంటిమెంట్లు ఎక్కువ అని మనం అనుకుంటాం కానీ… సెంటిమెంట్‌ లేనిదే సినిమా పరిశ్రమలో!
సెంటిమెంట్‌ అంటే ఒక మానవీయ స్పర్శ. సెంటిమెంట్‌ అంటే భావోద్వేగాల కలబోత. సెంటిమెంట్‌ అంటే మనిషి పట్ల ప్రేమ, సెంటిమెంట్‌ అంటే మనిషిని సొంతం చేసుకునే గుణం ఇవేవీ ఇవ్వాళ ఇండష్ట్రీకి లేవు.
అందుకే ఉదయ్‌కిరణ్‌ గురించి నాలుగు మంచి మాటలు చెప్పిన సిన జీవుల ముఖాల మీద దు:ఖం సగం కరిగిన మేకప్‌ లాగా కనిపించింది.
ఇక రెండో చూపుడు వేలు సమాజం ఆంధ్రదేశంలో ఎన్నికలు ఏడో ఋతువు అన్నాడు నగ్నముని, ఎనిమిదో ఋతువు కూడా వుంది అది ఆత్మహత్య. ఉద్యమాల పేరుతో, వ్యవసాయ రంగం సంక్షోభం పేరుతో, మానసిక ఒత్తిడి పేరుతో ఈ పదిహేనేళ్ల కాలంలో ఆంధ్రదేశంలో ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య కనీసంలో కనీసం యాభైవేలు పదిహేనేళ్ల కాలంలో ఆత్మహత్యల్లో ఆంధ్రదేశ పోగ్రెస్‌ రిపోర్ట్‌ యాభైవేలు.
ఇది ఏ రకంగా చూసినా ఆందోళన కలిగించే విషయమే నిర్భయ ఉదంతం జరిగినప్పుడు ఒక టి.వి ఛానల్‌ ఢల్లీిలో జరిగిన కొవ్వొత్తుల ప్రదర్శన ‘‘లైవ్‌’’ లో చూపించింది. విరామ సమయంలో అది చూపించిన ప్రకటన గుర్తుందా? ‘‘అమ్మాయిలను పడగొట్టడం ఎలా?’’ అనే విరాట్‌ కోహ్లి ప్రకటన నిర్భయకి నివాళులు అర్పిస్తూనే ఈ ప్రకటనను చూసి మనం ఆనందించాం అంటే మన చైతన్యస్థాయి ఏ రకంగా వుందో తెలుస్తూనే వుంది.
ఇలాంటి సమాజం ‘‘ఆత్మహత్యలు’’ లాంటి మానసిక సంక్షోభాలను ఎలా దాటుతుంది? ఒక ఆత్మహత్య జరిగినప్పుడు కవులు ఒక కవిత రాసి, ఒక కవిత్వ సంకలనం వేసి తమ బాధ్యత తీరిపోయింది అనుకుంటారు. సామాజిక అధ్యయన పరులు రెండురోజులు ఓపెన్‌ ఫోరంలలోనూ, బిగ్‌ డిబేట్లలోనూ చర్చోపచర్చలు చేసి తమ పని అయిపోయింది అనుకుంటారు. ఎవరికి వారు తమ తమ లోకంలోకి జారుకుంటారు ఒక సమగ్రమయిన కార్యచరణ తీసుకుని ముందుకి కదలరు ఎందుకని? ఇవ్వాళ ప్రతి మనిషీ ఒక ఒంటరి ద్వీపం భౌతికంగా అతడు సమాజంలో నివశిస్తున్నాడు తప్పిస్తే దానితో అతనికేమీ సంబంధం లేదు అతడొక ఒంటరి ద్వీపం అతడొక రహస్యగాయం అతడు ఏ పరమార్ధాన్ని కౌగిలించుకోలేని నిలువెత్తు స్వార్ధం. అతడొక కాగితం పువ్వు.
అందుకే ఈ సమాజంలో ఆత్మహత్యలు అనేవి ‘‘ఎనిమిదో’’ ఋతువు అనేది.
ఇక మూడవ చూపుడు వేలు ప్రేమరాహిత్యం. ఉదయ్‌కిరణ్‌ మృతశరీరాన్ని తీసుకోవడానికి తండ్రి నిరాకరించాడన్న వార్త కలచివేసింది తండ్రి వంద తప్పులు చేసి వుండ వచ్చు కొడుకూ వంద తప్పులు చేసి వుండవచ్చు ఆ తప్పులు తండ్రులవీ, కొడుకులవీ తప్పిస్తే తండ్రీకొడుకుల బంధానిది కాదుకదా!
‘‘అంగా దంగాత్సంభవతి నిజస్నేహజో దేహసౌర:
ప్రాదుర్భూయ స్థితి ఇవ బహిశ్చేతనా ధాతురేక:
సాంద్రానంద క్షుభిత హృదయ ప్రస్రవేణావస్తికం
గాఢాశ్లేషస్సహిమమ హిమశ్చ్యోత మాశంసతవ’’
అంటాడు ఉత్తరరామ చరిత్రలో భవభూతి. పుత్రుడి శరీరం తండ్రి ప్రతి అంగం నుండి ఉదయిస్తుందట అంటే తనే మరోసారి పుడతాడన్న మాట. అలాంటి పుత్రుడు విగతజీవిగా పడివున్నప్పుడు తండ్రి నిరాకరించాడంటే  ఆ బంధం ప్రేమాన్వితం అనాలా? ప్రేమరాహిత్యం అనాలా? ఈ ప్రేమరాహిత్య మూలం కూడా సామాజిక మూలంలోనే దాగి వుంది.

భార్య అంటే భర్తకి ప్రేమ వుండదు. భర్త అంటే భార్యకు ప్రేమ వుండదు తల్లి దండ్రులు పిల్లలని తమ కోరికలకి ప్రతిరూపం కావాలని అనుకుంటారు. కానీ వాళ్లకీ ఒక లోకం ఉందని గ్రహించరు మనుషుల మధ్య మిగిలీ మిగలని మానవ సంబంధాలని కలిపి విడదీస్తున్న ఊహా మేఘం డబ్బు. డబ్బులేని చోట ప్రేమ వుంటుందా? డబ్బుకొద్దీ ప్రేమ అని బాలచందర్‌ ఊరికే అన్నాడా…? ఇటీవలి సినీ నటి అంజలి ఎపిసోడ్‌ గుర్తుందా?

ఇక చివరి చూపుడు వేలు ఉదయ్‌ కిరణ్‌  చివరగా చెపుతున్నా మొదట చెప్పవలసింది ఉదయ్‌ కిరణ్‌ గురించి…!
అవును ఉదయ్‌ కిరణ్‌ హత్యకి అతడే కారణం మన పక్కంటి పిల్లాడిలాగా కనిపించే ఉదయ్‌ కిరణ్‌ మన పక్కింటి పిల్లాడి  లాగానే ఒత్తిడి తట్టుకోలేకపోయాడా? 2000 నుండి 2013 వరకు సినిమా రంగంలో వున్నాడు కదా…! ఆ మాయాజలతారు మృదుచేలాంచలములకొసగాలుల విసురు పట్టుకోలేక పోయాడా? ఆ పాకుడు రాళ్లమీద కాలు బలంగా నిలపలేక పోయాడా?

ఒక రంగంలో వైఫల్యం ఎదురయినప్పుడు మరోరంగాన్ని ఎంచుకోవాలనే ప్రాప్త కాలజ్ఞత ఎందుకు లోపించింది? జీవితాన్ని సున్నా నుండి ప్రారంభించి గెలవగలిగే ఆత్మస్థైర్యాన్ని ఎందుకు కోల్పోయాడు. జీవితాన్ని ఒంటరిగా గెలవాలనే విషయాన్ని ఎందుకు మర్చిపోయాడు తను పోషించిన పాత్రలను తనెందుకు మనసులోకి తీసుకోలేక పోయాడు? శిఖరం మీద ఎవరూ ఎల్లకాలం ఉండరనే విషయం త్వరగానే గ్రహింపుకి వచ్చివుండాలి కదా..

ఒక విజయం ఆత్మవిశ్వాస స్థాయిని పెంచుతుంది. ఒక అపజయం ఆత్మవిశ్వాస స్థాయిని పడవేస్తుంది నిజమే! ప్రాణం పోసే శక్తి మనకు లేనప్పుడు ప్రాణం తీసుకునే హక్కు మనకు ఉందా అనేదే అసలు ప్రశ్న…బ్రతకడానికి వందకారణాలు అవసరం లేదు ఒక్క కారణం చాలు ఎందుకంటే జీవితం ఒక్కటే కనుక. మరణానికే వంద కారణాలు కావాలి.

ఏదయితేనేం హృదయ కమలం వాడిపోయింది. ఉదయ్‌కిరణ్‌ ఇక లేడు. అతడి పందొమ్మిది సినిమాలు అతడి మరణాంతరం కూడా జీవిస్తాయి.
అతడి మరణం నుండి అయినా చిత్రసీమ పాఠం నేర్చుకుంటుందా? దాసరి నారాయణరావు, తమ్మారెడ్డి భరద్వాజ లాంటి పెద్దలు సీరియస్‌గా ఆలోచిస్తారా…. సగటు సినీ ప్రేమికుడిగా అడుగుతున్న ప్రశ్నలకు స్పందిస్తారా…. లేక ఇది ఒక కామా మాత్రమేనా…..?

 – వంశీ కృష్ణ

రైల్వే స్టేషన్ లో కూర్చున్నప్పుడు…

రాఘవ రెడ్డి

రాఘవ రెడ్డి

 

అప్పుడెప్పుడో నాకింకా నటించడం రానప్పుడు


వరిపొలం మీద పరుచుకున్న ఒకానొక ఉదయం 
మెత్తగా గుండెల్లోకి దిగినప్పుడు


అచ్చం ఇలాగే అనిపించినట్లు గుర్తు.

 


ఇక్కడ ఇప్పుడిలా కూర్చుని
పెట్టెలు పెట్టెలు గా పరుగెడుతోన్న ప్రపంచాన్ని చూస్తూ


కాలాన్ని చప్పరిస్తోన్న వేళ

 


గుండెకు గొంతునిచ్చి నువ్ పలకరించినప్పుడు
అనిపించింది చూడు.. ఇలానే-


..
అచ్చం ఇలానే అనిపించినట్లు గుర్తు-

Old_TrainStation_00_1280
. . .
రసవంతమైన బత్తాయినొకదాన్ని 
చేతుల్లోకి తీసుకుని
ఒక సిట్రస్ పరిమళాన్ని సేవిస్తూ


శ్రద్ధగా తొక్కదీసి తొనలు ఒలిచి
ముత్యాలను మురిపెంగా ముట్టుకున్నట్టు..


పదేపదే నీ మాటలు ప్రేమగా తల్చుకుంటాను..


ఇక సెలవంటూ పెట్టేస్తావా.. 

నాతోనే ఉంటావదేంటో!

– రాఘవ రెడ్డి

ఎటు ?

స్వాతీ శ్రీపాద

స్వాతీ శ్రీపాద

నాలో నేను ఇంకిపోతూ

నన్ను నేను కొత్తగా పరిచయం చేసుకుంటూ

నా చుట్టూ గిరిగీసుకున్న వలయంలో

ఎన్ని సముచ్చయాలు

ఎక్కడెక్కడో పరిచ్చేదాలు

నిట్టనిలువునా ఒరుసుకుంటూ పారే నదీ నదాలు

 

సంకోచ వ్యాకోచాల మధ్య కుదిస్తూ విస్తరిస్తూ

కాస్సేపు నీలిని౦గి పరచుకున్న సముద్రాన్నవుతాను

అంతలోనే నూతి నీళ్ళలో మోహ౦ చూసుకునే చిన్నబోయిన

గోరంత నెలపొడుపు జాబిలినవుతాను

 

దిగంతాలు తాకే రెక్కలతో ఒక్కోసారి ఆల్బెట్రాస్ పక్షినవుతాను

 అంతలో

నీళ్ళ లో కరిగిపోయే తెలి మబ్బు నీడనూ అవుతాను

 

2.

రోజుకి ఎన్ని రూపాలు మార్చుకు౦టూనో

ఊహకందని లోకాల మధ్య విహరిస్తూ ఉంటాను

అయితే నేలమీద రెండడుగులు వేసేందుకు

పంచ ప్రాణాలూ అరచేత పెట్టుకు

పలుమార్లు తత్తరపడుతూ తప్పటడుగులే వేస్తాను

అడుగు అడుగునా మొలుచుకు వస్తున్నసూదిమొనల మీద

రక్తపు టేరులు మరిగించే లేతగాయపు చిరునామా నవుతాను

3.

ఇక్కడ ఊహలకూ, పులకింతలకూ కూడా వెలకడతారట

మనసులకూ ,ప్రేమలకూ కాలం చెల్లి

సంపాదనలనూ , అవసరాలనూ అందలాలు ఎక్కించాక

కొలమానాల విలువలు మిల్లీ కొలతలకు పడిపోయాక

కలిసినంత సమయం పట్టని విడిపోడాలు

దిక్కులనూ మూలలనూ ముక్కలు చేసి

ఎక్కడ పంచుకు౦టాయి

పగిలిపోయిన గాజు అనుభూతులు

4.

నాలో నేను ఒక సుడి గు౦డాన్నై

నాలోకి నన్ను  లాగేసుకు౦దుకు

నేను నేనుగా ప్రకటి౦చు కోవాలని

అక్షరాలూ నాలుగు పోగేసుకు౦దామని

ఇలా నీటి చెలమల్లోకి

కన్నీటి పాయల్లోకి ….

– స్వాతీ శ్రీపాద

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

5 న తెనాలి లో ‘ రియాలిటీ చెక్ ‘ ఆవిష్కరణ

RC_invi_leaf_jp

పూడూరి రాజిరెడ్డి కలం నుంచి వెలువడిన ” రియాలిటీ చెక్” పుస్తకం ఆవిష్కరణ సభ తెనాలి లో జనవరి 5 వ తేదీ జరుగుతుంది. పుస్తకాన్ని ప్రముఖ కథా రచయిత అల్లం రాజయ్య ఆవిష్కరిస్తారు.

11 న హైదరాబాద్ లో ” చిత్రలిపి” కందుకూరి రమేష్ బాబు ఛాయాచిత్ర ప్రదర్శన

telugu invitation*
ముగ్గులు స్త్రీల కళా నైపుణ్యానికి, కల్పనాశక్తికి చిహ్నాలు. కేవలం హస్తమాత్ర సహాయంతో ఊహాశక్తిని అనుసరించి చిత్ర విచిత్రాలైన రచనా విధానాలతో సంప్రదాయాలను ప్రదర్శించే స్త్రీల ముగ్గులు చిత్రకళాధి దేవతకు సహజ సౌందర్య శోభిత ఆభరణాలు. ‘దృశ్యాదృశ్యం’ పేరిట సారంగ పాఠకులకు పరిచయం అయిన కందుకూరి రమేష్ బాబు సంక్రాంతి సందర్భంగా ప్రదర్శిస్తున్న చిత్రకళా ప్రదర్శన వీటిపైనే. శుభాకాంక్షలతో…ఆహ్వానం అందరికీ…. 

సంక్రాంతి శుభాకాంక్షలతో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – భాషా సాంస్కృతిక శాఖ
భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి సౌజన్యంతో

చిత్రలిపి
SAMANYASHASTRAM IMAGES

~  కందుకూరి రమేష్ బాబు ఛాయాచిత్ర ప్రదర్శన ~

11 జనవరి 2014 సాయంత్రం 6 గం॥
ఐసిసిఆర్ ఆర్ట్ గ్యాలరీలో, కళాభవన్, రవీంద్రభారతి ప్రాంగణం, హైదరాబాద్-4
ప్రదర్శనః 12 నుంచి 14 జనవరి 2014 వరకు. ప్రతి రోజూ ఉదయం 11 గం॥ సాయంత్రం 7 గం॥ వరకు

జ్యోతి ప్రకాశనం
శ్రీమతి సత్యలతా కిషన్ (చిత్రకారుడి మాతృమూర్తి)

ప్రారంభకులు
శ్రీ ఎన్.ముక్తేశ్వరరావు, ఐఎఎస్ (కార్యదర్శి, ఆం.ప్ర. భాషా సాంస్కృతిక శాఖ)

ముఖ్య అతిథి
శ్రీ బి.నరసింగరావు (ప్రసిద్ధ దర్శకులు, ఛాయా చిత్రకారులు)

విశిష్ట అతిథి
శ్రీ అల్లం నారాయణ ( సంపాదకులు, నమస్తే తెలంగాణ దిన పత్రిక)

ఆత్మీయ అతిథి
డా॥ రాళ్లబండి కవితా ప్రసాద్ ( సంచాలకులు, ఆం.ప్ర. భాషా సాంస్కృతిక శాఖ)

ముగింపు ఉత్సవం
14 జనవరి 2014. సాయంత్రం 6గం॥
ఆత్మీయ అతిథులు: డా॥ రావి ప్రేమలత (‘చిత్రలిపి’ పరిశోధకులు),
శ్రీ కె.వి.రమణా చారి (సాంస్కతిక శాఖ పూర్వ సలహాదారులు)

అందరికీ సాదర ఆహ్వానం

విఫల స్వప్నాలు, వైయక్తిక వేదనల ప్రతిబింబం ఆధునిక మళయాళ కథ

A house hotel boat on the backwaters in Kerala

రెండో భాగం

ఆధునిక మలయాళ కధ  

ఒకానొక కాలంలో చోటు చేసుకున్న సామాజిక పరిణామాలు మలయాళ కధా సాహిత్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసాయి .ఆ సామాజిక పరిణామాలు వల్ల ఏర్పడిన సామాన్య ప్రజల జీవిత వ్యధను శక్తివంతంగా చిత్రీకరించగలగింది అనేదే ఆధునిక మలయాళ కధ తాలూకు విజయం –కీర్తికి కారణం కూడా. అందువల్ల కేరళలో నెలకొన్న సామాజిక స్దితిగతులు గురించి సంక్షిప్తంగా నైనా  సమగ్రంగా చెప్పటం తప్పదు. ఈ సామాజిక స్దితిగతులు భారత దేశంల్లోని ఇతర ప్రాంతాల్లో నెలకొన్నవాటికన్నా చాలా భిన్నము . గొప్ప రచయితులైన ఎం. టి. వాసుదేవన్ నాయర్ మొదలగువారి రచనల తెలుగు అనువాదాలను చదివి ఆస్వాదించాలంటే అలనాటి సామాజిక స్దితి గతులు గురించి ఒక కనీస పరిజ్ఞానం  ఉండాలిసిందే.

కేరళలోని అగ్రకులస్తులు [హిందువులుగురించే ఇక్కడ ప్రస్తావిస్తునాను ],నంబుద్రి ,నాయర్[మీనోన్ ,పణిక్కర్ మొదలగువారు  వారు కూడా నాయర్లే –అగ్రకులస్తులు ]నంబుద్రి అంటే బ్రాహ్మణుడు –ఈ కులంవాళ్ళు తరతరాలుగా భూస్వాములు  –పితృసామ్య వ్యవస్ద గలవాళ్ళు- ఉమ్మిడి కుటుంబంగా జీవించిన వీళ్ళ కుటుంబాల్లో అన్నదమ్ములు కలిసి వుంటేవారు –ఆస్తి పెంపకం ఉండదు -. ఇంటికి పెద్దవాడు –తండ్రి లేదా  తండ్రి లేకపోతే పెద్దన్న ఆస్తి వ్యవహారాలు ఇంటి విషయాలు చూసుకునేవారు.  అలనాటి సాంప్రదాయనుసారంగా కావ్యాలు నాటకాలు తర్కం మొదలైనవి నేర్చుకున్న వీళ్ళు విద్యావంతులు –కవులు ,కళా సాంస్కృతిక పోషకులు. కాని వీళ్ళ సాంప్రదాయం ప్రకారం ఇంటికి పెద్ద కొడుకు మాత్రమే నంబుద్రి యువతిని పెళ్ళి చేసుకొని ఇంటికి తీసుకొస్తారు –పెళ్ళి ఒకటో రెండో ,ఎన్నో –ఆ నంబుద్రి భార్య ద్వారా కలిగిన పిల్లలకే ఆస్తి హక్కు ఉంటుంది . మిగతా కొడుకులు వాళ్ళుకు తోచినటు ఇష్టమైన ఇతర కులస్తులతో [ముఖ్యంగా నాయర్ మీనోన్ యువతులతో] సంబంధం పెట్టుకుంటారు.సంబంధం అంటే అందరికీ తెలిసిన లైంగిక సంబంధమని అర్ధం . మంత్ర తంత్రాలతో కూడిన పెళ్ళి కాదు. తాళి కట్టు ఉండదు –అసలు తాళియే ఉండదు. అలా సంబంధం చేసుకున్న యువతి తన ఇంటిలోనే ఉంటుంది. నంబుద్రి, ఆ పిల్ల ఇంటికి రాత్రి వచ్చి పొద్దునే లేచి వెళ్ళి పోతాడు. పిల్లలు కలిగినా ఆ పిల్లలు తల్లితో పాటు తల్లి ఇంటిలోనే ఉంటారు –నంబుద్రి ఇచ్చినది పుచ్చుకోవటమే తప్ప హక్కు ఏది లేదు. అలనాటి నాయర్ సమాజంలోని వివాహ వ్యవస్ద దీనికి అనుగుణంగానే ఉంటేది .ధనవంతులైన గొప్ప నాయర్ కుటుంబాలు ఉంటేవి ఆ రోజుల్లో. మాతృస్వామ్య వ్యవస్ద పాటించేవారు నాయర్ ,మీనోన్ సమాజాలు . ఆస్తి మొత్తం ఆడపిల్ల పేరు మీదే ఉంటేది.మేనమామ ఇంటి పెద్ద –ఆస్తి వ్యవహారలంతా అతడే చూసేవారు. తరవాడు అనబడే నాయర్ మాతృస్వామ్య వ్యవస్డలోని ఉమ్మిడి కుటుంబంలో ఇంటి పెద్ద మేనమామ ,అతని తల్లి అక్కచెల్లిల్లు, తమ్ముళ్ళు,  మేనకోడళ్ళు , మేనల్లళ్ళు –అందరూ కలిసి ఉంటేవారు –నాయర్ మీనోన్ సమాజంలోని వివాహ వ్యవస్ద, సంబంధమే. ఇంటి పెద్దవైన మేన మామ భార్య ఆవిడ ఇంటిలోనే ఉంటుంది. ఇంటివ్యవహారాలు చక్కబెట్టుకున్న అతడు రాత్రి భార్య ఇంటికి వెళ్ళి పడుకొని పొద్దునే తిరిగి తన ఇంటికి వస్తాడు . తరవాడులోని ఆడవాళ్ళకు పుట్టిన పిల్లలందరూ ఆ తరవాడులోనే బ్రతుకుతారు. ప్రతి ఆడపిల్లకి కూడా ఆస్తి మీద హక్కు ఉండేది ఇరవై ముప్పై మనుషులు వున్న తరవాడు సాధారణమే . వాళ్ళు కోసం పెద్ద పెద్ద ఇల్లు /వాటాలు ఒకే ప్రాంగణంలో ఉండేవి ,ఒకే వంట గదితో.

ఇతర సామాజిక వర్గాలకు చెందినవారు ముఖ్యంగా తీయలు శ్రీ నారాయణగురు వల్ల ప్రభావితులై సామాజిక రంగంలో ముందడుగు వేసారు అప్పటికే. ముస్లింలు క్రిస్టియనులు ముఖ్య ధారలో కలిసిపోయినవాళ్ళే  . వీళ్ళు కాక తమిళ నాడు నుంచి వలస వెళ్ళి కేరళలో స్ధిరబడ్డ అరవ బ్రాహ్మణులు [అయ్యర్ ]కర్నాటకవాళ్లు కూడా సమాజంలో ఉండేవారు కనుక సాహిత్యంలో కూడా కనబడుతారు .

ఉమ్మిడి కుటుంబపు ఉక్కు హస్తాలనుంచి వ్యక్తి స్వతంత్రుడైన కాలం ఇది .అలా ఉమ్మిడి కుటుంబ వ్యవస్థ  నుంచి బయిటికి వచ్చి తన విధి తనే స్వయం నిర్ణయించడానికి ప్రయత్నించే మేనల్లుళ్ళ వైయక్తిక అనుభవాల నుంచి పుట్టుకొచ్చిన భావుకతే ఈ తరం రచయితుల బలం . జీవితాన్ని గెలవాలనే ఆతృత ,ఆ ప్రయత్నంలో అందిన స్వల్ప విజయాలు ఎక్కువ నైరాశ్యం ,ఆత్మనింద ,ఛవి చూసిన మోసాలు కక్ష మొదలైన భావాలు ఈకాలం కధల్లో కనబడుతాయి .

ఆర్ధిక సామాజిక సమస్యలు అప్రసక్తం కాలేదు కాని సామాజిక సమస్యలకన్నా సొంత సమస్యలకూ కలలకూ వేదనలకు ప్రాధాన్యం ఇచ్చారుఈ కాలపు కధకులు .  ఆకలి బాధ కన్నా హృదయ బాధ భరించలేనిదిగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే కధ ‘’మానసిక జీవితానికి   ప్రచురణా కేంద్రమైంది ‘’ తన హృదయం మీద తగిలి  ప్రతిఫలించే అనుభవాలకు తన గుండె రంగు కలిపి చిత్రీకరించారు రచయితలు –అలా కధ ఒక భావ గీతానికి దగ్గరైంది.

కొన్ని మానసికావస్థలను అనుభవ ముహూర్తాలను ఆవిష్కరించవలసి వచ్చినప్పుడు నిర్మాణ చాతుర్యం అనిర్వార్యమైంది. అంతర్భావావిష్కారం కోసం మాటలనూ  బింబాలనూ ఆశ్రయించవలసి వచ్చింది. ఎత్తు గడ కధ ,ముగింపు మొదలైనవాటితో బంధించబడిన ఒక కధ చెప్పడానికి కాదు ,కధ ద్వారా కొన్ని వైయక్తికానుభూతులు అందించడానికి ప్రయత్నించారు ఈ కాలపు రచయితలు . ఇలా కధలకు కావ్యాత్మ ఇచ్చిన రచయితలు టి.పద్మనాభన్ ,ఎం.టి.వాసుదేవన్ నాయర్ ,కమలాదాస్ -1950 దశకపు ద్విదీయార్ధంలో జరిగిన పరిణామం ఇది. కాని వైయక్తికానుభవాల ఆవిష్కారం అని చెప్పగానే వాళ్ళు సామాజిక సమస్యలను నిర్లక్ష్యం చేశారని అనుకోకూడదు వైయక్తికానుభవం సామాజిక సమస్యనుంచి ఉత్పన్నమైనదే.

Mt_vasudevan_nayarఎం. టి. వాసుదేవన్ నాయర్ కధలు :[1933—జననం ]

ఈ కలఘటపు కధా చరిత్ర వీక్షణం  ఎం. టి. గారి కధలతోనే ప్రారంభించాలి.శిధిలావస్దకి చేరే ఒక సామాజిక స్దితిని దానివల్ల ఉత్పన్నమైన మానసిక సంఘర్షణలను కవితాత్మకంగా పాఠకుల  గుండెకి అంటుకునే విధంగా చిత్రీకరించగలగటమే   ఎం. టి. కధల గొప్పతనం.శిధిలావస్దకి చేరే తరవాడులు ,వాటిలో అవగణనకీ పీడనకీ గురయే మేనల్లళ్ళు వాళ్ళ వైయక్తిక ప్రపంచం –ఇవీ ఎం. టి. కధా ప్రపంచం. అతడు ఒంటరివాడైన వ్యక్తి కధే చెబుతున్నాడు . చిన్నపిల్లవాడుగా వున్నప్పుడు అనుభవించిన నిర్లక్ష్యమూ దారిద్ర్యమూ దీనికి కారణాలు. చిన్న పిల్లాడుగా వున్నప్పుడు అవసరాలు ఆనందాలు నిషేధింపబడిన వాడు యవ్వనంలో జీవితాన్ని గెలవడానికి ప్రయత్నిస్తున్నాడు. క్రమశిక్షణతో కూడిన బ్రతుగు గడిపే శక్తిని కోల్పోయి తీవ్ర జీవితాశక్తి తో ముందుకు సాగుతునాడు –శాంతి పర్వం ,సంధ్య వెలుగు, నీలి కొండలు ,మొదలగు మొదటి కధల్లో ఇలాంటి పాత్రలు కనబడుతాయి –సామాజిక పరిస్డితుల పట్ల కక్ష ,ఆత్మ నింద వాళ్ళ ముఖ ముద్రలు. మానసిక సంఘర్షణల చిత్రీకరణ అనే విశేషణానికి అర్హమైన ఇతని కధల్లో శిధిలమయే తరవాడు ఎప్పుడూ  ఉంటుంది.

కధా నేపధ్యం నగరమైనా ఎలాగోలా తరవాడు గ్రామీణ జీవితం ,గ్రామీణ వాతావరణం మొదలైనవి కధల్లోకి చొచ్చుకువస్తాయి –ఇతని కధలకు నిడివి ఎక్కువ. ప్రతి కధలోను కచ్చితమైన సామాజిక నేపధ్యం ఉంటుంది. స్థల కాల సామాజిక స్ధితులు కధల్లోని విడతీయలేని అంశాలు –అందువల్లనేమో కధను మనం అనుభవిస్తాం –అనుభూతి పొందుతాం. భావాత్మకమైన బింబాత్మక మైన  కధలు ఎం. టి. వ్రాసిన కధలు. ఎక్కువ కధలు ‘’అతడు ‘’అనే మాటతోనే మొదలవుతాయి –కధా నాయకుడు అతడే –పేరుకుడా ఉండదు. అనవసరమైన ,అర్ధ రహితమైన ఒక మాట కూడా అతని కధల్లో కనబడవు.

ఆత్మలో కవిత్వం లేనివాడు కధ వ్రాయకూడదు అనే తన నమ్మకాన్ని బయిట చెప్పటమే కాదు తన రచనలు ద్వారా ఋజువు చేసినవాడు కూడా టి. పద్మనాభన్ [జననం 1931]అనే రచయిత. సరళమైన కధాఖ్యాన శైలి ఇతనిది.

ఈ ఇద్దరి రచనా వారసత్వాన్ని కొనసాగించినా ,ఈ కధకులంత సహృదయామోదం పొందని రచయితలు కొందరున్నారు. గొప్ప కధలు వ్రాసినా మర్రి చెట్టుకృంత మొక్కల్లా నిలిచిన ఈ రచయితలు కూడా మలయాళ కధా వికాసానికి బాట వేసినవారే.ప్రముఖ రచయిత్రి మాధవికుట్టి [కమలా దాస్]గురించి ప్రస్తావించే ముందు ఇలాంటి కొందరు ప్రముఖ రచయితలు గురించి ప్రస్తావించాలి. –వాళ్ళలో ముఖ్యుడు ఎన్. పి. మొహమ్మదే. మతం తాలూకు సరిహద్దులు దాటిన అధికారం,జీవితం తాలూకు మానసిక ప్రశాంతతను పోగొట్టే మూఢ నమ్మకాలు ఆచార సాంప్రదాయాలు,మామూలు మనుషులను ప్రలోభాలు వల్ల మోసగించే తంగళ్ [ముస్లిం పెద్దలు ] బహుభార్యాత్వం వల్ల కలిగే నష్టాలు ,భోగాలకు ముసుగుగా నిలిచే మత నియమాలు వగైరాలను కొన్ని కధల్లో హాస్యంతోనూ ,మరి కొన్ని కధల్లో నిశిత విమర్శ తోను మిళితం చేసి రచన చేసాడు ఇతడు. ముస్లిం మిత్రుల  వ్యాఖ్యానాలు ద్వారా సామాజిక జీవితం తాలూకు అర్ధం వెతుకుతునాడు ఈ కధకుడు . ఒక కధలో రచయిత ఇలా అంటాడు

‘’మరణం ఎదుగుదలను మేం జీవితం అని అంటున్నాం –మీకు తెలియనిది అల్లాహుకు తెలుస్తుంది –మొక్కలను చూడండి. అవి ఎదుగుతున్నవి ,పుష్పించడానికీ కాయలు ఇవ్వడానికీ మాత్రమే.  మరణించడంకోసం ఎదుగుతున్నారు మీరు.  మీరు పుట్టగానే నిజంగా మీరు చనిపోతున్నారు –మీ జననమే మీమరణం ‘’

సామాజిక జీవితమే ఇతని కధావస్తువు

విషాద భావంతో మిళితమైన తీక్ష్ణ వైయక్తిక ప్రపంచం ఎన్. మోహనన్[1933 –1999 ] కధా ప్రపంచం –ఆత్మనిష్ట మైన అనుభవాల ప్రపంచం –వైయక్తికమైన సత్యాన్వేషణలు అవి. మరణం సృష్టించే విషాదం ఇతని కొన్ని కధల్లో చూడవచ్చు. రాజకీయభావాలకు ,కులానికి మతానికి అతీతమైన మానవతా కోణం ఇతని కధల్లో ప్రస్ఫుటంగా కనబడుతుంది. అతి తక్కువ కధలు వ్రాసిన ఇతడు కధా నిర్మాణంలో  ,మనసులోని భావానికి అనుగుణ మైన రూపం కధే తీసుకుంటుందని వదిలేసేవాడు. క్షేత్రోద్యోగి కనుక ,తనకు సుపరిచితమైన క్షేత్ర జీవితంలోని అనుభవాలనూ అలనాటి సంబంధం వ్యవస్థ వల్ల నెలకొన్న’ లూస్ ‘  లైంగిక సదాచారం  మొదలైనవాటిని ఆధారంగా చేసుకొని మంచి కధలు వ్రాసిన రచయిత ఉన్నికృష్ణన్ ,పుతూర్. సీదాసాదాగా కథనూ  పాత్రల మానసిక స్డితులనూ  వివరిస్తాడు ఈ కధకుడు.

కేవలం 12 కధలు వ్రాసి 34వ ఏట చనిపోయిన రాజలక్ష్మి షి [1930—1965] ఈ తరంలోని ఒక గొప్ప రచయిత్రి. స్త్రీల బాధలు ఆత్మ వ్యధలు ,అలనాటి సామాజిక గృహ వాతావరణంలో స్త్రీలు ఎదుర్కొనే సవాళ్ళు సంఘర్షణలు ఆమె కధలకు ఆధారం.

సంపూర్ణం కాని వ్యక్తిత్వాలూ ఆశ్చర్యకరమైన జీవిత సంఘటనలూ సి.వి. శ్రీరామన్ కధలకు ప్రాణంపోసే అంశాలు. వ్యక్తులకు సంఘటనలకు ఇతని కధల్లో సవిశేషమైన ప్రాధాన్యం ఉంటుంది.చాలా శ్రద్ధతో కధకి ఇతివృత్తం  అల్లుతాడు ఈ రచయిత. ఇతని కధానేపద్యం కేవలం కేరళ రాష్ట్రానికే పరిమితం కాదు. అతని ప్రసిద్ధ కధ ‘వాస్తు హార ‘ కి నేపధ్యం బెంగాల్. వ్యత్యస్తమైన రెండు సంస్కృతుల సంఘర్షణల సమన్వయ తలాలను ఆవిష్కరిస్తోంది ఈ కధ. వృతి రీత్యా వక్కీలైన ఇతడు న్యాయవృత్తికి సంబంధించిన మంచి కధలు కూడా వ్రాసారు. తమ దృక్పథా నికి  అనుగుణంగా మంచి కధలు వ్రాసి మలయాళీ పాఠకుల  మన్నెన పొందిన రచయితలు ఎందరో ఉన్నారు ఈ తరంలో –కాని రచయితుల పేర్లు వారి కధలు, సంపుటాలు ,వివరించటం ఈ వ్యాసం తాలూకు ఉద్దేశం కాదు కనుక కొత్త భావాలకు కాని కొత్త రూపాలకు కాని ఊపిరి పోసి మలయాళ కధను ఒక మలుపు తిప్పిన రచయితలు గురించే వివరించాలని అనుకున్నాను కనుక కొందరి పేర్లు [వాళ్ళూ గొప్ప రచయితులే– అయినా ప్రస్తావించటం లేదు ]

Kamala_dasభావుకతే మాధవికుట్టి[1934—2007] [కమలాదాస్ ]ప్రత్యేకత  అని చెబుతే అది నిజం కాదు. జీవితమంటే ఆమెకున్న కచ్చితమైన వాస్తవిక స్పృహ,రుచికరంకాని నిజాల ముఖాలను దాచే ఆదర్శవాదుల తిరస్కారం —ఇవీ ఆమె కధలను అస్వస్డత రేకెత్తే  అనుభవాలుగా మలిచాయి. అందమైన జీవితనిమిషాలు చాలా అరుదుగా కనబడుతాయి ఆమె కధల్లో. ఆమె కధల్లో ఎక్కువ కధలు నగర నేపధ్యం తో వ్రాసినవే –కపట భరిత జీవితాలు గురించి జీవితాన్ని అడ్జస్ట్ మెంట్ గా  మార్చిన బ్రతుకులు గురించి వ్రాసారు ఆమె . పల్లెలు ,పల్లె మధురిమలు ఆ కధల్లో అప్పుడప్పుడు జ్ఞాపకాలుగా స్వప్నాలుగా కనబడవచ్చు.తమది కాని బ్రతుకు బ్రతక వలసిన ధనికుల ధర్మ సంకటాలు ఆమె కధా ప్రపంచానికి ఒక  ప్రతేక పరివేషంగా నిలిస్తోంది.

దారితప్పిన దాంపత్యాల అణిచివేసిన రోధనా స్వరాలు కమలా దాస్ వ్రాసిన ఎక్కువ కధల్లో అంతర్ధారగా కనబడుతాయి. పరస్పరం మోసగించి బ్రతికే  భార్యా భర్తలు –భర్త నుంచి తనకు సంపూరణమైన ప్రేమ అందనప్పుడు భార్య ఒక ప్రియుడు కోసం వెతుకుతుంది. –భర్తను మోసం చేస్తుంది.  భర్తను  మోసగించాననే నేర చింత వల్ల సతమతమయే వాళ్ళు కొందరు –నేరచింత కలగనివాళ్ళు రతీలోకంలో స్వతంత్రంగా విహరిస్తారు –ప్రేమ ,రతి –రెండూ ఒకటి కాదు అని చెబుతాయి ఈమె కధలు – తన కధలు ద్వారా కమలా దాస్ మన ముందు వుంచే ప్రశ్న ఒకటుంది. అది –

తనను ఎన్నెడూ మనస్ఫూర్తిగా ప్రేమించని  భర్తకి లైంగికంగా లొంగిపోవట మనేదా లేకపోతే తనను నిజంగా ప్రేమించే పరపురుషుడికి సంతోషం తో స్వయం అర్పించుకోవటమా  న్యాయం అనే ప్రశ్న అది. కామాసక్తి లేని ప్రేమ వాస్తవికమా? స్త్రీ తాలూకు జీవిత దృకోణం వేరు. ఆమె జీవితాన్ని, పురుషుడు చూసినట్లు చూడదు;అనుభవించదు. ఆమె కోరికలను ఆశలను పోల్చటంలో పురుషుడు విఫలమవుతునాడు –ఈ విశాల దృక్కోణం నుంచి వీక్షిస్తే కమలాదాస్ స్త్రీ వాదియే. సరళంగా గుండెను హత్తుకునే  రీతిలో వ్రాస్తారు. కమలాదాస్ కధల్లోని స్త్రీ పాత్రలు అలనాటి మలయాళీ సమాజానికి సంబంధించినవని చెప్పలేము –ఆమె కధల్లో కనబడే స్త్రీపాత్రలు విశ్వ మహిళలు. అందువలనే ఆమె కధలు ప్రపంచ ప్రాచుర్యం పొందాయి . కమలాదాస్ రచించిన  కొన్ని ముఖ్య కధలు తెలుగులో లభ్యం .

220px-Sara అభ్యుదయ ఆదర్శాల వెలుగులో కూర్చుని రచన చేసిన కధా రచయిత్రి సారా జోసెఫ్ [జననం 1934 ]జీవిత బంధాల్లోని కాలుష్యమూ వ్యక్తి జీవితంలోని దర్మ సంకటాలు ఈమె కధలకు ఇతివృత్తం. అలాగైనా సరే బ్రతుకు బ్రతకటం కోసమే అనేది ఆమె అభిప్రాయం. స్త్రీవాదానికి సంబంధించిన కధలు ఈమె వ్రాయలేదు ;కాని భారతీయ సామాజిక పరిస్డితిల్లో స్త్రీలు అనుభవించే అణిచివేతలనూ దురితాలనూ పోలిస్తునారు ఈవిడ. కధ చెప్పే టెక్నికు కన్నా కధ మీదే ఈ రచయిత్రి తన శ్రద్ధ కేంద్రీకరిస్తునారు.

ఈ తరానికి చెందిన మరో ముఖ్య కధకుడు పద్మరాజన్ [1945—1991 ]. ఎం.టి.లా కాల్పనికుడు కాదు. ఆధునికత యొక్క దర్శనము ప్రయోగాత్మకత కనబడదు అతని రచనల్లో. అతి సాధారణ జీవితాల్లోని  అసాధారణ ముహూర్తాలు  కనిబెట్టే అతని రచనలు వాస్తవికతకి అతి దగ్గరగా వుంటాయి. విషయం ఏదైనా –మనకు నచ్చనివైనా నిరాడంబరంగా ఆవిష్కరించే రీతి అతనిది.  ఇతడు చాలా తెర కధలు కూడా వ్రాసారు కొన్ని కధల్లో రతి యొక్క విస్తృత ఆవిష్కారం కనబడుతుంది

ఈ కధా రచయితల్లో ఎందరో ఇంకా రచనా రంగం మీద సజీవంగానే వున్నారు –కాని 1960లోనే వ్యత్యస్త రూపభావాలతో కూడిన వీళ్ళ రచనలు వెలుబడ్డాయి.  కవిత్వంలోనూ నవలలోనూ అలా కధల్లో కూడా ఆధునికత రూపు దిద్దుకుంటూనే ఉంది –కాని కధలోని ఆధునికతకి సమాంతరంగా రూపు దిద్దుకున్న నవీన కధ వైపు తిరుగుతాం ఇక

పైన చెప్పబడిన రచయితలు రచనా రంగం మీద అడుగు పెట్టిన కాలంలోనే రచనలు ప్రారంభించిన కొందరు కధా రచయితలున్నారు –అలనాటి మలయాళ సాహిత్యంలో నవీనధార సృష్టించినది ఆ  ధారని  సజీవంగా నిలిపినదీ వీరే. ఓ. వి.విజయన్ ,ఎం. ముకుందన్,కాక్కనాడన్ ,సేతు పునత్తిల్, కుంజబ్దుల్లా, ఆనంద్ మొదలైనవాళ్ళు వీరు –ఆధునిక కధకులు అని చెప్పబడే కధకులతో పాటు రచన ప్రారంభించిన వీళ్ళు భిన్నమైన ఒక భావుకతను  సృష్టించారు –అంతే .

ఫ్రెంచ్ ,జెర్మన్ ఆంగ్ల భాషల్లోని ఆధునిక సాహిత్య ప్రభావం వీళ్ళలో కనబడుతుందిసార్త్రే,  కాఫ్కా,  నీషే  మొదలగు రచయితుల దార్శనికత్వం కొంతవరకు వీళ్ళ అభిరుచిని ప్రభావితం చేసిందనే చెప్పాలి

“ అప్పటకే సమాజంలో నెలకొన్న మూల్యాలను సామాజిక వ్యవస్దనూ తిరస్కరించిన ఈ కధకులు జీవితం తాలూకు అర్ధ రాహిత్యం గురించి వ్యర్ధత గురించి వ్యక్తపరచడానికి ప్రయత్నించారు. వాళ్ళు యదార్థ్యంగా దర్శించినది వ్యక్తిని కాని సమాజాన్ని కాని కాదు ,మానుషి అనే ప్రతిభాసాన్ని– ఆలంబ రహితమైన మానవావస్థ  తాలూకు దైన్యాన్ని –ప్రేమ వాళ్ళ దృష్టిలో కేవలం ఒక దైవ  ప్రేరణ – నగరాల్లో వేర్లు కోల్పోయిన మానుషి యొక్క ఒంటరీతనం  అతని నిసహాయ అస్తిత్వవేదన ,అస్థిత్వం గురించిన అన్వేషణ మొదలైనవి కధా వస్తువులుగా మారాయి. అస్తిత్వ వాద జన్యమైన ఆతృతలను వ్యధలనూ ఆవిష్కరించటం కోసం కధలను కట్టుకధలుగానో ‘ఇకువేషన్ ‘గానో మార్చారు వాళ్ళు “.

కాని ఇది అతి కొంత కాలం మాత్రమే నిలిచింది. ప్రతిభావంతులైన ఈ కధకులు అతి తక్కువ కాలంలోనే తమదైన రచనా మార్గాలు కనిబెట్టారు –మలయాళ కధకి వ్యత్యస్తమైన అనుభూతుల  కవాటాలు తెరిచారు.

ఆధునిక కధకుల్లో ప్రాతస్మరణీయుడు కాక్కనాడన్ [జోర్జ్ వర్గేస్]. ఆధునికత యొక్క కొన్ని లక్షణాలు మాత్రమే ఇతని కధల్లో కనబడుతాయి. కాని ఎం. టి. తో పాటు అందరి సమకాలీన రచయితుల దృకోణాలనిర్మాణ శైలీల ప్రభావం ఇతని కధల్లో కనబడుతుంది . ఎంతో కాలం తనను మోసుకు తిరిగిన తరువాత  పాతదై నిష్ప్రయోజనమైన  పాదరక్షలను ప్రతీకగా తీసుకొని ఒక వృద్ధుని  మనోభావాలను చిత్రీకరించిన ‘’పాతబడటం’’ అనే కధ [1960కన్నా ముందు]చెప్పుకోదగ్గది. సమాజంలోని సదాచారపు డొల్లతనం బయిట పెడుతాయి ఇతని కధలు .

మరో ముఖ్య కధకుడు ఓ. వి. విజయన్ [1931 –2005]—ఇతడు గొప్ప కార్టూనిస్టు కూడా. ప్రతీకాత్మకంగా  కధ చెబుతాడు ఇతడు. ఆకస్మికం  గానో అప్రతీక్షితం గానో జీవితాన్ని పరిణతిలోకి తీసుకొని వెళ్ళే భౌతీకాతీత  నియోగాలు గురించిన అస్వస్థతలు ఇతని కధల్లో అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతాయి. ఇతని కధలను రెండు విభాగాలుగా విభజించవచ్చు. సమకాలీన జీవితానుభవాలను ఒక కార్టూనిస్టు దృక్పదంతో అతిశయోక్తితో కాని  న్యూ నోక్తితో కాని గీసినకధా చిత్రాలు  ఒక విభాగానికి చెందినవి అయితే జీవితంలోని  మనశ్శాంతిని పోగొట్టే దార్శనిక సమస్యల నుంచి పుట్టుకొచ్చిన  కధలు రెండో విభాగానికి చెందుతాయి

చాలా భిన్నమైన ఇతివృత్తాలతో రచన చేసిన కధకుడు ఆనంద్ [పేరు –పి. సచ్చిదానందన్ – జననం 1936]220px-Sachidanandan

కధకుడుకన్నా నవలిస్టుగానే ఇతనికి కీర్తి ప్రతిష్టలు ఎక్కువ. కధల్లోనైనా ,నవలోనైనా తన చారిత్రిక దృక్పదం ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తాడు ఈ రచయిత. మౌలికంగా ఇతడు ఒక త్వాత్వికుడు. తన ఆలోచనలను వెలువరించే  మాధ్యమం అతని సాహిత్యం. వ్యాసాలు వ్రాసే బదులు సంఘటనలను కాని కధాపాత్రలను కాని ఆధారం చేసుకొని తన ఆలోచనా ధోరణిని వ్యక్తపరిస్తాడు అతడు. తన ఆలోచనా ధోరణికి అనుగుణమైన పాత్రలనూ సంఘటనలనూ సృష్టిస్తాడు.

పాఠకులను  తన ఆలోచనా ధోరణికి తీసుకురాగలిగిన నిర్మాణ శైలి వున్నందువల్ల వాళ్ళు అతని కధలను ఆస్వాదిస్తారు.

విషాద మిళితమైన ఒక నిస్సహాయ వాతావరణం ఇతని కధల్లో కనబడు తుంది. రాజకీయ చరిత్ర ఎప్పుడూ దోపిడీల,ఆధిపత్యాల చరిత్రే. దోపిడీ  శక్తులు రూపం మార్చుకుంటాయి తప్ప , దోపిడీకి కాని పీడనానికి కాని ముగింపు ఉండదు. పీడించేవాళ్ళు పీడనకి లోనయే వాళ్ళు ఎల్ల కాలంలోనూ ఉంటారు.వాళ్ళ చేతులనుంచి విముక్తి పొందామని అనుకుంటే అది కేవలం తాత్కాలికమే—ఇది ఈ కధకుడు ఆలోచనా ధోరణి . కొన్ని చోట్ల ఈ కధకుడు కధకుని పరిమితి దాటాడేమో నని కూడా అనిపిస్తుంది.

M_mukundanసమాజంలో నెలకొన్న మూల్యాలనూ సదాచార వ్యవస్థలను ప్రశ్నించిన రచయిత ముకుందన్. మత్తుమందుల పొగ నిండిన ఒక వాతావరణం ఇతని కధల్లో చూడవచ్చు. హరిద్వార్ కి వెళ్ళేట ప్పుడు కూడా మూడు పైపులు ఒక పెట్టె పొగాకు పెట్టెలో ఉంచుకోవడానికి మరవని పాత్రలు ఇతని కధల్లో సాధారణం .  బ్యాంగ్ తాగి ‘’పరిశుద్దులైన’’ వాళ్ళు వేశ్యలకు గుడి కట్టేవాళ్ళు కూడా కనబడుతారు ఇతని కధల్లో  –వీటి ద్వారా మూల్యాలను తిరస్కరిస్తునాడు కాని సమాజాన్ని విమర్శించటం లేదు కధకుడు. ఇతని కధల్లో ప్రేమ ఉండదు ;లైంగికత్వమే ఉంటుంది. తను అనుభవించినవి కావు ,తెలుసుకున్నవి ఇతడు కధల్లో ప్రస్తావిస్తునట్లు అనిపిస్తుంది.

ఇలాంటి రచయితుల కధలతో పోలిస్తే చాలా భిన్నంగా వుంటుంది సేతు కధా ప్రపంచం[జననం 1942]మధురమైన జీవితనుబంధాలు కానీ హృద్యమైన  జీవితానుభవాలు కానీ అతని చైతన్యానికి స్పందన అందించటం లేదు. కాల్పనిక సౌందర్యానికి అసలే ఆ కధా ప్రపంచంలో చోటు లేదు. బాహ్య జీవితం ఇతని రచనల్లో అడుగు పెట్టదు –అంతగా అడుగు పెట్టినా అవి ఫాంటసిగా మారుతాయి

జీవిత మహా ప్రవాహాన్ని ఉత్సుకతతో వీక్షించే వాడు కాదు సేతు. అతన్ని అస్వస్థత కు గురి చేసేది మనిషి అనే స్థితి  –దానివల్ల ఏర్పడే దురంత పూరిత పరిణామాలు . అరవై ఎనభై సంవత్సరాలకాలంలో అనావృతమయే ఒక దురంతాన్ని కొన్ని నిమిషాల్లో లేకపోతే ,కొన్ని గంటల్లో చూపించవలసి వచ్చినప్పుడు వాస్తవికత యొక్క మార్గం స్వీకరించటం కుదరదు. అలాంటప్పుడు ఫాంటసియోక్క మార్గం లోకి దారి మళ్లుతున్నాడు  ఇతడు. సేతు కధల్లోని మనుషులు పీడితలు –వివిధ బంధాల సంకేళ్ళల్లో ఇరుకున్నవాళ్ళు. ఇవి తప్పించుకోలేని స్ధితి అని, దానికి కారణం ప్రాకృతికం [నేచురల్ ]అని రచయిత నమ్ముతున్నాడు. జనన మరణాలు కలువలని మరణం బతుకుని మింగడానికి సమయం చూస్తూ వెంటాడుతుందని రచయిత భావం.  తప్పించుకోలేని ఏదో నియోగానికి తలవంచి నిర్ణయింపబడిన ఒక భ్రమణ పధంలో విఫలంగా తిరిగి తన దూరాంతాలను చేరడమే మానవావస్థ  అనే ఆలోచన రచయితను విడిచి పెట్టదు. ఆతని ఎక్కువ కధల్లో మరణం ఒక ముఖ్య పాత్ర. మరణాన్ని వివిధ కోణాల్లోనుంచి వీక్షిస్తాడు సేతు.

సక్కరియ గారి[జననం 1945] కధలు ఒక విచిత్ర ప్రపంచం.  మానవ మనస్తత్వాల సంక్లిష్ట భావాలను ఆవిష్కరించే కధలే కాక నేటి మానవుని ఆత్మస్తుతినీ కపట మనస్తత్వాన్ని హాస్య ధోరణితో నిశితంగా విమర్శించే కధలు కూడా వ్రాశాడు ఇతడు. మాటల్లో గొప్ప ఆదర్శాలు ఒలకపోసినా ,ని జ జీవితంలో అసలు వాటిని పట్టించుకోని క్రైస్తవ సమాజాన్ని చూసి నవ్వుతాడు ఈ రచయిత. మనో సంఘర్షణలను కాని మానసిక భావాలను కాని వ్యక్తపరిచేటప్పుడు ఆచి తూచి మాటలు వాడే సక్కరియ ,ఆక్షేప హాస్యం వ్రాసినప్పుడు మాటలు కుమ్మరిస్తాడు .

కొత్తదీ సంక్లిష్టమూ వైన ఆఖ్యాన శైలి వెతికి కనిబెట్టి ప్రయోగించిన కధా రచయిత మేథిల్ రాధా కృష్ణన్. ఇతని కధలు నిడివిలో చాలా పెద్దవి –శిధిలమైన సంఘటనా వివరాలు –కధా రూపంగురించి ప్రయోగాలు చేసిన ఇతడు ప్రత్యేకమైన టెక్నిక్ ద్వారా అతి సాధారణమైన సంఘటనకి అపరిచితత్వం ప్రసాదించి   భిన్నమైన ఒక వాతావరణం సృష్టించడానికి  ప్రయత్నిస్తున్నాడు. సృజన యొక్క  అందం కాదు రచనా నైపుణ్యమే ఈ కధల అస్తిత్వానికి కారణం.

ఆధునిక  కధా వికాసం గురించి సంక్షిప్తంగా ప్రస్తావించినప్పుడు కొందరు ప్రశస్త రచయితల పేరులు ప్రస్తావించక పోయివుండవచ్చు. శైలిపరంగా గాని దృక్కోణ పరంగా గాని మరే విధంగా గాని భిన్నమైన రచయితలు గురించే ప్రస్తావించటం జరిగింది –అంటే ఇక్కడ ప్రస్తావించబడని  ఎందరో, మలయాళ కధకి కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. అస్తిత్వ దర్శనం ఆధునిక కధకులను ప్రభావితం చేసింది కాని , ఆ ప్రభావం ఒకొక్క రచయితలోనూ ఒకొక మోతాదులో ఉంటుంది . కొందరు తొలి రోజుల్లో అస్తిత్వ వ్యధలను ఆవిష్కరించారు కాని తరువాత జీవితానుభవాల్లోకి తిరిగి వెళ్ళిపోయారు . 1980 నాటికి, 1960లో వ్యక్తమైన ఆధునికత యొక్క ప్రసక్తి  కోల్పోయింది మలయాళ కధ .

1980 తరువాత రచన ప్రారంభించిన కధకులు మూల్యాల అకారణ తిరస్కారాన్ని హర్షించలేదు. ఆధునికులు బోధ పూర్వంగా నిర్లక్ష్యం చేసిన సామాజిక స్పృహ ప్రదర్శించారు వాళ్ళు. నాగరీక జీవిత పరిస్థితుల్లో అనుబంధాలకు, మూల్యాలకూ వ్యక్తిత్వాలకు జరిగే పరిణామాల వైపు  సంఘర్షణా త్మకమైన జీవితపు సందర్భాల వైపు  మళ్ళీ తన ఆసక్తిని మళ్ళించింది మలయాళ కధ. కధ పూర్తిగా యుక్తి సహజంగా ఉంటాలని కాని నమ్మశక్యంగా ఉంటాలని కాని ఈ రచయితలూ అనుకోవటం లేదు. పూర్తిగా వాస్తవికమైనవీ ,కాల్పనికమైనవీ భావాత్మకమైన  కధలు కూడా ఈ కాలం కధకులు వ్రాస్తున్నారు .ఇతర ప్రాంతీయ భాషల్లో లా  స్త్రీవాద రచయిత్రులు కూడా తమ సాన్నిధ్యాన్ని తెలియపరిచారు ఈ కాలంలో.

lalithambikaనంబుద్రి కుటుంబాల అంతపురాల్లో మొగ్గే స్త్రీల గురించి యాబైల్లో వచ్చిన అంతర్జనం కధలతో –లేకపోతే దానికన్నా ముందే స్త్రీవాద రచనలు వెలుబడినా స్త్రీవాద రచయిత్రులు అనే ముద్ర పడిన రచయిత్రులు  కనబడేది ఈ కాలంలోనే. చంద్రమతి ,ఆషిత ,ప్రియ ఏ. ఎస్. , గీతా హిరణ్యన్,కే.ఆర్.మీర ,ఇందు మీనోన్ మొదలగు రచయిత్రులు వీళ్ళలో కొందరు. తను ఒక ఫెమినిస్టు కాదని గట్టిగా చెబుతూనే ఫెమినిజం  తాలూకు గొప్పతనాన్ని విమర్శించారు చంద్రమతి .  ఇతివృత్తాల్లోనూ  నిర్మాణంలోనూ వున్న వైవిధ్యం ఆమె మాటలను కొంత వరకు సమర్థిస్తుంది కూడా.  కాని ఆమె గొప్ప కధల్లో కొన్ని స్త్రీల సంకటాలను ఆవిష్కరించేవే. నేటి దాంపత్యం  తెలుసుకొని చేసే ఒక పరస్పర వంచన కదా అనే ప్రశ్నను ఒక గొప్ప కధలో ఆవిష్కరించారు ఆమె. స్త్రీల వ్యక్తి గత అనుభవాలను సరళంగా ఆవిష్కరించే ఆషిత [జననం 1956 ]టెక్నిక్ గురించి పెద్దగా పట్టించుకోరు.  తాళికి  ట్రాఫిక్ కానిస్టేబుల్  వేసుకున్న చొక్కాకి వున్న సురక్షితత్వం కూడా లేదని వ్రాస్తారు ఆమె ఒక కధలో.పురుషుని బాధ్యతా రాహిత్యం గురించి కూడా ఆమె అక్షర శిల్పాలు చెక్కారు. ఒంటరి స్త్రీలను గురించి వ్రాసారు ప్రియ .  జనాలమధ్య జబ్బువల్లనో పేదరికం వల్లనో స్నేహ రాహిత్యం వల్లనో ఒంటరిగా మారినవాళ్ళు ,జీవితంలో అమూల్యమైన ఏవేవో పోగొట్టుకున్న వాళ్ళు చిన్న చిన్న ఇష్టాల తీగలు పట్టుకొని బ్రతుగు సాగిస్తున్నవారు  –ఇలాంటి పాత్రలు ఆమె కధల్లో చూడవచ్చు –దాంపత్య జీవితంలోని నమ్మక రాహిత్యం కూడా ఈమెకి కధా వస్తువే. స్త్రీల మనసులోని సంఘర్షణలూ ధర్మ సంకటాలు ఆవిష్కరిస్తున్నాయి గీతా హిరణ్యన్ కధలు.

గొప్ప రచనా శైలి గల రచయిత్రి కే. ఆర్.మీర[1970] పరిశుద్ధమైన జీవిత బంధాలను గౌరవిస్తున్నారు ఈ రచయిత్రి –సమాజంలోని సదాచార నియమాలను సవాల్ చేస్తున్నాను  అనే భావం ధ్వనించ కుండానే  మానవ సహజమైన ఒక వాస్తవికత అనే రీతిలో సమీక్షిస్తున్నారు  ఆమె లైంగికతను.  కొన్ని కధల్లో ఫెమినిజం  తాలూకు కొన్ని పోకడలను నిశితంగా విమర్శిస్తున్నారు కూడా.  ఈమె కధ లు కూడా  కొన్ని తెలుగులో లభ్యం .

చివరికి ఒక మాట చెప్పాలి. పేజీ కధలు ,  కాలమ్ దాటని కధలు ,కార్డు కధలు మొదలైనవి  మలయాళం లో ప్రాచుర్యం పొందని కధా రూపాలు. ప్రఖ్యాత కధా రచయితలు కొందరు [కమలా దాస్ ,టి. పద్మనాభన్ మొదలగువారు ] పేజీ కధలు వ్రాసి ఉన్నారు. కాని వాటి సంఖ్య చాలా తక్కువ. 2000 సంవత్సరం తరువాత పి,కే. పారక్కడవ్ అనే రచయిత అయిదారు వాక్యాల్లో కధలు వ్రాస్తునాడు. సామాజిక ఐరనీ,రాజకీయ మోసాలు,  స్త్రీ పీడనం ,ప్రపంచీకరణ మొదలగు విషయాలగురించి చాలా ‘ క్రిస్ప్” గా  వ్రాస్తాడు అతడు. కొన్ని కధలు ప్రతీకాత్మకంగా ఉంటాయి. పాఠకుడి పెదవి పై ఒక చిరునవ్వు విరియించి కధలు ఇలా కూడా గొప్పగా వ్రాయవచ్చా అని అనిపించేలా చేస్తాయి ఇతని కధలు. ఉదాహరణకి ఒకటి :

అడుగుల సవ్వడి :

 

తరువాత ఒక గర్జనం లాంటి కాలింగ్ బెల్ మ్రోత

తలుపు సగం తెరిచి చూశాను —అతడే !

కాగితం నాకు అందిస్తూ అతడు అన్నాడు

‘’మీరు పీల్చిన గాలి తాలూకు బిల్ ‘’

 

చివరికి సంక్షిప్తంగా చెప్పాలంటే మలయాళ కధకి సంబంధించిన వరకు మూడు పరిణామాలు జరిగాయి అని చెప్పాలి. వాస్తవిక సామాజిక జీవితంనుంచి వ్యక్తి తాలూకు సొంత దు:ఖాలవైపు మారటం మొదటి పరిణామం. కధ అంతర్ముఖం కావటమే కాక ఆర్ద్రత సంతరించుకుంది ఈ కాలంలో.  మానవావస్థనూ జీవితాన్నీ తాత్విక విమర్శతో వీక్షించేది విశ్లేషించేది  రెండో పరిమాణం. ఈ తాత్విక బరువు వదిలేసి కచ్చితమైన వాస్తవిక దృక్కోణంతో జీవితానుభవాలనూ  అనుబంధాలనూ విశ్లేషించి సర్గాత్మక సాఫల్యం పొందుతునారు నేటి కధకులు.

సమకాలీన మలయాళ కధల్లో ఆధునికానంతర సాహిత్య ధోరణీలు కనబడుతున్నాయా ?ఫెమినిజం  దళిత అవగాహన,  ఇతర సంస్కృతుల దాడి గురించిన అవగాహన ,ఆ దాడిని ఎదురుకోవాలనే ఆతృత వగైరాలు ఆధునికానంతర సాహిత్యపు లక్షణాలని అనుకుంటే అలాంటి ధోరణి మలయాళ కధల్లో కూడా కనబడుతున్నాయి. వీటిలో ముఖ్యంగా అతి శక్తి వంతంగా కనబడేది ఫెమినిజం  .ఎందరో ఫెమినిస్ట్ రచయిత్రులు పురుషాధిక్యత గురించి స్త్రీ లైంగికత గురించి నేటి కట్టుబాటులకు సదాచార ఆలోచనలకు వ్యతిరేకంగా వ్రాస్తున్నారు . జీవితమే తమ సిరాబుడ్డి అని అంటునారు. ఒకొక్కప్పుడు  ఈ కధలు వాస్తవికతకి భిన్నంగానూ దూరంగానూ కనబడుతున్నాయి. ఇప్పడు నెలకొన్నవాటిని తిరస్కరిస్తునారు కాని వాటికన్నా ప్రయోజనకరమైనవాటిగురించి  ఫలదాయకమైనవాటి  గురించి ఆలోచించలేకపోతునారు వాళ్ళు .

దళిత స్పృహ కధల్లో అంత శక్తివంతం కాదు . టి. కే. సి.వాడుతల తోనూ అంతకన్నా ముందూ మొదలైన ఈ ప్రక్రియ వేరు తన్నలేదు. బహుశా కేరళ లో వున్న సామాజిక స్థితి గతులు కావచ్చు దానికి కారణం –రచనలను వర్గీకరించి చూసేదానికన్నా సమగ్రంగానే వీక్షిస్తునారు రచయితలూ ,పాఠకులు.

ఆదివాసీ జీవితంగురించి ఆదివాసిఅయిన  నారాయణ్  వ్రాసిన కధలు,  నవలలు నేటి సాహిత్యంలో ముఖ్యమనే చెప్పాలి. అయినా నేటి మలయాళ కధ కొంతవరకు ఇతివృతపరంగానూ పాత్రలపరంగానూ కేరళ సరిహద్దులు దాటిందనే ది వాస్తవం –మలయాళీల క్రియారంగం విశ్వ వ్యాప్తమైనప్పుడు కధ,కధా పాత్రలు కూడా విస్తరించటం సహజమే కదా !

 

అనువాదకులు ఎల్. ఆర్. స్వామి

అనువాదకులు ఎల్. ఆర్. స్వామి

–ఎల్. ఆర్. స్వామి

 

 

సంపన్న ‘దాసు’లు, ‘అసుర’ దేవతలు!

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

ఇంతా చెప్పుకున్న తర్వాత కూడా, యయాతి కథ పశ్చిమాసియాలో జరిగిందనేది ఒక ఊహా లేక వాస్తవమా అన్న సందేహం అలాగే ఉండిపోతుంది. ఇందుకు కచ్చితమైన సమాధానాన్ని రాబట్టడం కష్టం. మహా అయితే మనం ఒకటి చేయగలం. అది: నిరంతర సంచారజీవితమూ, సమూహాల మధ్య ఘర్షణలు, వలసల నేపథ్యంలో పశ్చిమాసియా-భారతదేశాల మధ్య ఒక సంబంధాన్ని ఊహించడం. అప్పుడు వ్యక్తులు లేదా పాత్రల స్థానంలో పరిస్థితులు ప్రాధాన్యం వహిస్తాయి. ప్రముఖ చరిత్రకారిణి రొమిలా థాపర్ From Lineage to State అనే రచనలో క్రీ. వె. ప్రథమ సహస్రాబ్ది మధ్యలో గంగానదీ లోయలోని సమాజపు అమరికలను పురావస్తు ఆధారంగా చర్చించారు. నాటి పరిస్థితుల అవగాహనకు  ఆ చర్చ ఏమైనా తోడ్పడవచ్చేమో…

అంతకంటే ముందు, భిన్న వృత్తిదారుల మధ్య ఘర్షణలు ఎలా పురాణకథలకు ఎక్కాయో చెప్పుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.

కొత్త వృత్తులు, లేదా ఆయా వృత్తులలో కొత్త పోకడలు పుంజుకున్న కొద్దీ పాత వృత్తులు, లేదా వాటి పద్ధతులు క్షీణముఖం పట్టడం ఇప్పటికీ మనకు అనుభవపూర్వకంగా తెలుసు. ఉదాహరణకు, సాంప్రదాయిక వ్యవసాయం, చేతి వృత్తులు మనదేశం ఆధునికమయ్యే క్రమంలో కొత్త వృత్తులనుంచీ, కొత్త పోకడలనుంచీ తీవ్రమైన పోటీని ఎదుర్కొంటూ వచ్చాయి. ఆ పోటీలో అవి ఓటమి చెందడమూ చూస్తున్నాం. భిన్న వృత్తులవారు ఒకే సహజవనరును ఉపయోగించుకుంటున్నప్పుడు వారి మధ్య పోటీ అస్తిత్వ ఘర్షణగా మారుతుంది. అలాగే ఒక వృత్తి ప్రాబల్యం కలిగిన ప్రాంతాన్ని ఇంకో వృత్తి ప్రాబల్యం కలిగిన జనం ఆక్రమించుకున్నప్పుడు అందుకు అనుగుణంగా వారి వృత్తికీ ప్రాధాన్యం పెరుగుతుంది. ఈ రెండు రకాల సన్నివేశాలూ విడివిడిగానో, జమిలిగానో పురాణకథలకు ఎలా ఎక్కాయో జోసెఫ్ క్యాంప్ బెల్ Occidental Mythology లో చర్చించారు.

స్థూలంగా చెప్పుకుంటే పశుపాలన తొలి వృత్తిగానూ,  వ్యవస్థీకృత వ్యవసాయం మలివృత్తిగానూ ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రారంభంలో పశుపాలకవృత్తి దారుల మధ్య, వ్యవసాయవృత్తిదారుల మధ్య ఆధిపత్యం కోసం ఘర్షణలు జరిగినా క్రమంగా అన్న పుష్కలత్వానికి ఎక్కువ దోహదం చేసే పురోగామి వృత్తిగా వ్యవసాయం వైపు పశుపాలకవృత్తిదారులు కూడా మళ్లడం కనిపిస్తుంది. ఈ పరిణామం భారతదేశం వెలుపలే కాక లోపల కూడా జరిగింది. ఒక కోణం నుంచి చూస్తే, మన పురాణ, ఇతిహాసాలు; పురాచరిత్ర ఈ వృత్తి పరివర్తన గురించే చెబుతున్నాయి. ఎంతో వివరంగా చెప్పుకోవలసిన ఆ కోణంలోకి నేనిప్పుడు వెళ్ళను.

అయితే, ఒక విషయాన్ని మాత్రం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. మన పురాణాల్లో కశ్యపుడు, మొదలైన ప్రజాపతులు ఉన్నట్టే, బైబిల్ లోనూ ప్రజాపతులు ఉన్నారు. బైబిల్ పేర్కొన్న తొలి ప్రజాపతి పశుపాలక యూదుల అబ్రహాం అని ‘జనకథ’లో రాంభట్ల కృష్ణమూర్తి  అంటూ, (మధ్య ఆసియా, పశ్చిమాసియా పురాణకథలలో ఉన్నట్టుగా) మన పురాణాలలో పశుపాలన తొలినాళ్ళ సమాచారం లేదనీ, కనీసం పేర్లు అయినా మిగిలాయనీ అంటారు.

జోసెఫ్ క్యాంప్ బెల్ దగ్గరికి వద్దాం. సృష్టి ఎలా జరిగిందో చెప్పే పురాణకథలు ప్రపంచమంతటా ఉన్నాయి. యూదులకు సంబంధించిన పౌరాణిక, చారిత్రక ఆవృత్తు(cycles)లను నిర్మించిన మౌలిక పాఠాలు(basic texts) అయిదు ఉన్నాయనీ, ఈ అయిదూ క్రీ.వె. 9-4 శతాబ్దుల మధ్య కాలంలో అభివృద్ధి  చెందినవనీ క్యాంప్ బెల్ అంటారు. క్రీ.వె. 9వ శతాబ్దికి చెందిన సృష్టిగాథ(Genesis)ను యెహోవాయిస్ట్(జె) పాఠంగానూ, క్రీ.వె. 4వ శతాబ్దికి చెందిన సృష్టిగాథను పూజారుల పాఠంగానూ గుర్తించగా;  వీటి కంటే పురాతనమైన కథలో లేని  అంశాలు వీటిలోకి ఎలా ప్రవేశించాయో క్యాంప్ బెల్  వివరించారు. పురాణకథలను భౌతిక వాస్తవికతకు అనుగుణంగా ఎలా సవరిస్తారో, వాటిలో చారిత్రక అంశాలు ఎలా ప్రతిఫలిస్తాయో తెలుసుకోడానికి ఈ వివరాలు తోడ్పడతాయి.

 

యెహోవాయిస్ట్ పాఠంలో దేవుడైన యెహోవా ఒక రోజున భూమినీ, ఆకాశాన్నీ సృష్టించాడు. ఆ తర్వాత భూమినుంచి పొగమంచు పుట్టి భూమిని తడిపింది. అప్పుడు యెహోవా మట్టితో మనిషిని తయారు చేశాడు.  అతని ముక్కుపుటాలలోకి ఊపిరి ఊది ప్రాణం పోశాడు. తూర్పు దిక్కున గల ఈడెన్ లో ఒక తోటను కల్పించాడు. ఆ తోటలో మనిషిని ఉంచాడు. ఆ తోటలో ఆహ్లాదం గొలిపే అందమైన చెట్లను, మంచి ఆహారాన్ని అందించే మొక్కలను సృష్టించాడు. తోట మధ్యలో రెండు చెట్లను ప్రతిష్టించాడు. ఒకటి, జీవన వృక్షం; రెండోది, మంచి-చెడుల జ్ఞానవృక్షం. తోటను తడపడానికి ఒక నదిని సృష్టించాడు. ఆ నది ఆ తర్వాత నాలుగు పాయలు అయింది. యెహోవా ఆ మనిషిని తోటలో ఉంచి, దానిని సాగు చేస్తూ, సంరక్షిస్తూ ఉండమని చెప్పాడు. అయితే, ఏ చెట్టు ఫలాలనైనా నువ్వు స్వేచ్ఛగా తిను కానీ జ్ఞానవృక్షఫలాలను మాత్రం తినవద్దనీ, తింటే మరణిస్తావనీ హెచ్చరించాడు. ఆ తర్వాత యెహోవా అన్ని రకాల జంతువులను, పక్షులను సృష్టించాడు. నువ్వు వాటిని ఎలా పిలిస్తే అవే వాటి పేర్లు అవుతాయని మనిషికి చెప్పాడు. అంతలో, మనిషికి తోడు కావాలికదా అనుకున్నాడు. జంతువులు అతనికి తగిన తోడు అవుతాయని యెహోవాకు అనిపించలేదు. మనిషికి నిద్ర ఆవహిల్లేలా చేశాడు. ఆ తర్వాత అతని పక్కటెముకల్లో ఒక దాన్ని తీసి, ఆ ప్రదేశాన్ని తిరిగి మాంసంతో పూరించి, ఆ పక్కటెముకను స్త్రీగా మార్చాడు.  చివరికి వాళ్ళిద్దరూ వద్దన్న పని చేయడంతో వారిని తోటలోంచి బహిష్కరించాడు.

ఈ కథ పురుష ప్రాధాన్యాన్ని స్థాపిస్తున్న సంగతి అర్థమవుతూనే ఉంది. ఆవిధంగా ఇది మాతృస్వామ్యం స్థానంలో పితృస్వామ్య స్థాపనకు సంకేతం కూడా. ఈ పరివర్తనను సూచించే కథలు మన పురాణ, ఇతిహాసాలలో కూడా ఉన్నాయి. ఉదాహరణకు, పురుషుడైన బ్రహ్మ మన పురాణాలలో సృష్టికర్త. ఆయనకు పుట్టిన సరస్వతే ఆయనకు అర్థాంగి అయిందని మన పురాణాలు చెబుతాయి. అయితే, మన పురాణ, ఇతిహాసకథల ప్రత్యేకత ఏమిటంటే, స్త్రీప్రాధాన్యాన్ని చెప్పే కథలూ వాటిలో ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురినీ మళ్ళీ జగన్మాత సృష్టిగా ఈ కథలు చెబుతాయి. ఈ అంశంలోకి ఇప్పుడు మరీ లోతుగా వెళ్లలేం కనుక, యెహోవా కథ దగ్గరికి మళ్ళీవద్దాం.

Cain_and_abel_painting_a_Dennis_Van_Alsloot_paintings

యెహోవా సృష్టించిన ఆది దంపతులకు కెయిన్, ఎబెల్ అనే ఇద్దరు కొడుకులు కలిగారు. కెయిన్ వ్యవసాయదారుడుకాగా, ఎబెల్ గొర్రెల కాపరి. కెయిన్ తన వ్యవసాయంలో ప్రథమ ఫలాన్ని, ఎబెల్ తన గొర్రెల మందలో ప్రథమఫలాన్ని తెచ్చి యెహోవాకు సమర్పించారు. కెయిన్ ప్రథమఫలాన్ని యెహోవా నిరాకరించి, ఎబెల్ ప్రథమఫలాన్ని  ఆమోదించాడు. దాంతో కెయిన్ కోపం పట్టలేకపోయాడు. తమ్ముణ్ణి చంపేశాడు. యెహోవా దానిని సహించలేకపోయాడు. ‘నువ్వు సాగుచేసుకునే భూమి క్రమంగా నిస్సారమైపోతుంది, తగినంత పంట నివ్వదు, నువ్వు ఈ భూమిమీద ఒక పలాయిత నేరస్థునిలా దేశదిమ్మరి జీవితం గడుపు’ అని కెయిన్ ను శపించాడు. కెయిన్ యెహోవాకు దూరమై సంచారజీవనులు ఉండే ఈడెన్ తూర్పు ప్రాంతానికి వెళ్లిపోయాడు.

విశేషమేమిటంటే, యూదులకు చెందిన ఈ తొలి పురాణగాథకు ప్రతిరూపాలు ఆఫ్రికా, భారత్, ఆగ్నేయాసియా, మెలెనేసియా, పొలినేసియా, మెక్సికో, పెరు, బ్రాజిల్ సహా వ్యవసాయ సంస్కృతి నెలకొన్న ప్రతిచోటా ఉన్నాయని క్యాంప్ బెల్ అంటారు. వాటన్నిటిలోనూ ఉమ్మడిగా ఉన్న అంశాలనూ, ప్రతీకలనూ ఆయన ప్రస్తావిస్తారు. వాటిలోకి లోతుగా వెళ్లలేం కానీ, యూదుల కథకు భిన్నంగా ఈ కథల్లో ఆది దంపతుల పతనం, లేదా పాపం, బహిష్కరణ అనేవి లేవు.  లేకపోగా ఈ కథలు భౌతికజీవితాన్ని వ్యతిరేకదృష్టితో కాక, సానుకూల దృష్టినుంచి నొక్కి చెబుతాయి. ఈవిధంగా వ్యవసాయసంస్కృతికి చెందిన కథ కాస్తా, ఎడారి జీవితానుభవం ఉన్న యూదుల దగ్గరికి వచ్చేసరికి మారిపోయింది. వ్యవసాయదారుడైన కెయిన్, గొర్రెల కాపరి అయిన ఎబెల్ ను హత్య చేసినట్టు చెప్పుకున్నాం. ఈ ‘హత్య’ అనేది వ్యవసాయసంస్కృతికి చెందిన కథలో కూడా ఉంది కానీ, అది మరణం నుంచి(విత్తనాలను పూడ్చి పెట్టడం, లేదా బలి ఇవ్వడం) పునరుత్పత్తి జరుగుతుందని చెప్పే క్రతు(ritual) సంబంధమైన హత్య.  వ్యవసాయ సంస్కృతి కథలో ఈ ‘హత్య’ ముందే జరిగితే, యూదుల కథలో తర్వాత జరిగింది.

ఇంతకీ యూదుల కథ సూచించే చారిత్రకాంశం ఏమిటంటే, వ్యవసాయదారుల దేశమైన కనాన్ ను గొర్రెలకాపరులైన యూదులు ఆక్రమించుకున్నారు. కనుక  పెద్దవాడైన వ్యవసాయదారుని కాక, చిన్నవాడైన గొర్రెల కాపరినే యూదుల దేవుడు సహజంగా అభిమానిస్తాడు. ఇక్కడే కాదు, ఈ సృష్టిగాథ పొడవునా పెద్ద కొడుకును కాదని, చిన్నకొడుకుకు ప్రాధాన్యమివ్వడం కనిపిస్తుందని క్యాంప్ బెల్ అంటారు. మన యయాతి కథలో కూడా, పెద్ద కొడుకు యదువుకు బదులు చిన్న కొడుకు పూరునికి యయాతి పట్టం కట్టడంలో ఈ కథా ఛాయలు ఏమైనా ప్రతిఫలిస్తున్నాయా అన్నది ఆసక్తికరం. యదువు పేరు పసుల కాపరులైన యాదవులను సూచిస్తోందనుకుంటే, పురులు వ్యవసాయదారులని ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం.

అదలా ఉంచితే, క్రీ. వె. 2050కి చెందిన ఒక సుమేరియా పాఠం, పై యూదుల కథను తలకిందులు చేస్తోంది. యూదుల కథలో యెహోవా అనే పురుష దేవుడు ఉండగా, ఈ సుమేరియా కథలో  ఇనన్న అనే స్త్రీదేవత ఉంటుంది.  పై కథలో లానే దేవత అనుగ్రహం కోసం వ్యవసాయదారుడు, గొర్రెల కాపరి పోటీ పడతారు. అయితే దేవత వ్యవసాయదారునివైపే మొగ్గు చూపుతుంది. అంతే కాదు, నేను అతన్నే వివాహమాడతానని కూడా అంటుంది. అప్పుడు గొర్రెల కాపరి,

రైతు నా కన్నా ఎందులో ఎక్కువ, అతడు నాకు ఖర్జూరపు మద్యాన్ని పోస్తే, నేను అతనికి నా పసుపు పాలను పోస్తాను, నాకు అతడు రొట్టె పెడితే, నేను అతనికి తేనెలోలికే జున్ను పెడతాను, రైతు నా కన్న ఎందులో ఎక్కువ, నా దగ్గర లేనివి అతని దగ్గర ఏమున్నాయి?’

అని దేవతతో అంటాడు. దానికి దేవత,

ఎన్ని ఉన్నా నేను గొర్రెల కాపరిని పెళ్లాడను; పుష్కలంగా మొక్కలను పెంచుతూ, రాశుల కొద్దీ ధాన్యాన్ని పండించే రైతునే నేను పెళ్లి చేసుకుంటాను’

అంటుంది. వెయ్యేళ్ళ తర్వాత, ఎడారికి చెందిన పితృస్వామిక, సంచారజీవులైన యూదులు వ్యవసాయదారుల దేశాన్ని ఆక్రమించుకుని ఈ కథను తలకిందులు చేశారని క్యాంప్ బెల్ అంటారు.

చెప్పొచ్చేదేమిటంటే, పశుపాలకులైన వైదికార్యులకు, వ్యవసాయదారులైన అసురులకు మధ్య సంభవించిన శత్రుత్వం కూడా ఇలాంటిదే. కాకపోతే, ఈ శత్రుత్వ కారణాలు పైన చెప్పుకున్న పశ్చిమాసియా కథలలో ఉన్నంత స్పష్టంగా ఉండకపోవచ్చు. మన పురాణాలలో పశుపాలన తొలినాళ్ళ సమాచారం లభించడం లేదన్న రాంభట్ల వారి మాటలో ఈ అస్పష్టతకు కారణం దొరకచ్చు.

ఇప్పుడిక రోమిలా థాపర్ పరిశీలనకు వెడదాం:  సింధు-గంగానదుల మధ్యప్రాంతంలో, గంగకు పశ్చిమంగా ఉన్న లోయలో కొన్ని పురావస్తు ఆధారాలు దొరికాయి. ఆ ప్రాంతాలలో క్రీ.వె. 2000 నాటికి జనావాసాలు ఉన్నట్టు అవి సూచించాయి. ముఖ్యంగా సింధు-గంగా నదుల ఎగువభాగంలో హరప్పా సంస్కృతి మలిదశకు చెందిన ఆనవాళ్ళు కనిపించాయి. అవి కాషాయ మృణ్మయపాత్రల (Ochre-Colour Pottery) సంస్కృతికి చెంది, పరస్పర సంబంధం లేని జనాలు ఆ ప్రాంతంలో ఉండేవారని వెల్లడించాయి. ఇదే ప్రాంతంలో క్రమంగా చిత్రిత మృణ్మయపాత్ర(Painted Grey Ware)ల సంస్కృతి పుంజుకుంది. దానికి సంబంధించిన జనావాసాలు పెద్ద సంఖ్యలో అవతరించాయి. బియాస్-సట్లెజ్ నదుల మధ్య జరిగిన తవ్వకాలు మలి హరప్పా, చిత్రిత మృణ్మయ పాత్రల సంస్కృతుల మధ్య కలయికను సూచించాయి. అంతేకాదు, పరోక్షంగానో, పలచబడో అప్పటికి ఇంకా హరప్పా సంప్రదాయాలు కొనసాగుతున్నట్టు వెల్లడించాయి. సింధు, పంజాబ్, సరస్వతీనదీ ప్రాంతాలలో వివిధ తెగలవారు ఉన్నట్టు ఋగ్వేదం కూడా చెబుతోంది. ‘సప్తసింధవః’ అనే మాటతో ఋగ్వేదం ఈ ప్రాంతాలను సూచించింది.

ఈ చిత్రితమృణ్మయ పాత్రల సంస్కృతికి చెందినవారే వైదికార్యులు. ఋగ్వేదసమాజం ప్రధానంగా పశుపాలక సమాజమే అయినా పరిమితస్థాయిలో వ్యవసాయం కూడా ఉండేది. ఋగ్వేదం మలి భాగాలలో వ్యవసాయ చర్యల వర్ణన తరచుగా వస్తుంది. అయితే, ఋగ్వేదకాలానికి ముందునుంచే సింధు-గంగా ప్రాంతంలో వ్యవసాయదారులు స్థిరజీవితం గడుపుతున్నట్టు పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి.  హరప్పా మలి దశకు చెందిన కాషాయమృణ్మయపాత్రల సంస్కృతికి చెందినవారు వీరే కావచ్చు. వీరిని అసురులుగా భావించారనడానికి శతపథ బ్రాహ్మణం అవకాశమిస్తోంది. అసురులు దేవతలకంటే నాగరికులనీ, వ్యవసాయపు మెళకువలు తెలిసినవారనీ, వారు ఇళ్ళు కట్టుకుని స్థిర నివాసానికి అలవాటుపడితే; దేవతలు రథాల మీద తిరుగుతూ సంచారజీవితం గడుపుతూ ఉంటారనీ శతపథ బ్రాహ్మణం(vi.8.1. 1-2) చెబుతోంది. ఏయే ఋతువులలో ఎలాంటి వ్యవసాయచర్యలు చేపట్టాలో అసురులకు కచ్చితమైన అవగాహన ఉండేదని చెబుతారు.

అయితే, వీరు వ్యవసాయదారులు కనుక వ్యవసాయదారులను శత్రువులుగా చూసే ఆర్యులు తమ మధ్య, పశ్చిమాసియాల అనుభవంతో వీరిని కూడా అసురులు అన్నారా; లేక ఆర్యులకంటే ముందే పశ్చిమాసియా అసురులు సింధు-గంగా మధ్యప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. పశ్చిమాసియా వ్యవసాయసంస్కృతికి పుట్టిల్లు అన్న సంగతి ప్రసిద్ధమే.

అదలా ఉంచితే, ఇరానియన్ పురాణ కథలు మన పురాణ కథలను తలకిందులు చేస్తాయి. ఎలాగంటే, ఇరానియన్ పురాణకథలలో దేవతలది అసురుల స్థానమైతే, అసురులది దేవతల స్థానం. ఇరానియన్ పురాణాలలో అసుర శబ్దం ‘అహుర’ అయింది. అలాగే, మన ‘దాస’ శబ్దం ‘దాహ’ అయింది. ఇరానియన్ భాషలో ఆ మాటకు మగవాడు, నాయకుడు అని అర్థం. అసురులు అనే మాట ఒకప్పుడు లేదా ఒక ప్రాంతంలో గౌరవవాచకమే కానీ నిందార్థకం కాదు. అలాగే దాస శబ్దం కూడా.  ఋగ్వేదం ఆర్య, దాస అనే రెండు వర్ణాలను పేర్కొంది. ఆర్యులకు భిన్నమైన రంగు(కృష్ణ వర్ణం) కలిగినవారిని సూచించడమే ఆ విభజనలో ఉద్దేశం. ఎందుకంటే, దాసులలో సంపన్నులు, దృఢమైన ఇళ్ళు కట్టుకుని ఉంటున్నవారు ఉన్నారని చెప్పి ఋగ్వేదం కొందరి సంపన్నుల పేర్లు కూడా ఇచ్చింది. సంపన్న దాసులైన బల్బూత, తారుక్ష, అంబస్త్య అనేవారిని బ్రాహ్మణులు స్తుతించడమూ కనిపిస్తుంది. బలవత్తరులైన కొందరు దాసులతో ఇంద్రుడు యుద్ధం చేసినట్టు కూడా ఋగ్వేదం చెబుతోంది. వారిలో శంబరుడు ఒకడు. విశేషమేమిటంటే, శంబరుని అసురునిగానూ పురాణాలు పేర్కొన్నాయి.  సింధు నది వెంబడి ‘అరియో’లు(ఆర్యులు), దాహలు(దాసులు) స్థిరపడ్డారని టాసిటస్ అనే చరిత్రకారుడు రాశాడు. దీనినిబట్టి  హరప్పా మలి సంస్కృతికి చెందిన వ్యవసాయ తెగలవారు ఈ దాసులు కావడానికీ అవకాశముంది.

సారాంశమేమిటంటే, అసుర, దాస శబ్దాలు మొదట్లో నిందార్థకాలు కావు. ఆ తర్వాతే క్రమంగా నిందార్థకాలుగా మారాయి.

మిగతా అంశాలు తర్వాత….

–కల్లూరి భాస్కరం

ఆత్మీయత ఆ వాక్యాల అందం!

                              

బాలసుధాకర్ మౌళి

బాలసుధాకర్ మౌళి

                 1

‘రక్తస్పర్శ’, ‘ఇవాళ’, ‘వలస’ లాంటి వైవిధ్యభరితమైన కవిత్వం రాసిన కవి- అఫ్సర్ గారి- కొత్త కవితా సంపుటి ‘ఊరిచివర’ ని చదవడం వొక గొప్ప రిలీఫ్. కవిత్వానికి వొక కొత్త పరికరాన్ని, వొక కొత్త చూపుని అందిస్తూ… కవి, కవిత్వం వొక్కటిగా పరిణమిస్తూ సాగడం- వొక గొప్ప జీవలక్షణం. ముందుమాటలో ఎన్.వేణుగోపాల్ గారు అన్నట్లు- ‘జ్ఞాపకాన్ని కవిత్వంగా మార్చే రసవిద్య’- అఫ్సర్ గారి ‘ఊరి చివర’ కవిత్వం.
‘ఊరి చివర’ కవిత్వాన్ని నేను గత రెండు సంవత్సరాలుగా చదువుకుంటున్నాను. మొత్తం అన్ని కవితలూ నన్ను మళ్లీ మళ్లీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
మరీ ముఖ్యంగా రెండు కవితలు- నన్ను నిరంతరం వెంటాడుతునే వున్నాయి.ఒకటి: Take me home, country roads!
రెండు: నల్లానల్లని నవ్వుఈ రెండు కవితలు ఇన్ని నెలలుగా, ఇంత గాఢంగా- ఎందుకు వెంటాడుతున్నాయి- అని ఆలోచిస్తే… కవిత్వంలో వున్న స్వచ్చత, నిజాయితే కారణమని రూఢీ అయ్యింది. అవే ఆ కవితలను తాజాగా వుంచాయనీ అర్థమౌతుంది.కవిత్వానికి ‘తాజాదనం’ రెండు రకాలుగా చేకూరుతుందనుకుంటా.
-కవిత్వవస్తువు సర్వకాలాలకు చెందినదై.. కవి దానిని ప్రతిభావంతంగా కవిత్వీకరించినప్పుడు…
-అలాగే కవిలోని, తను ఎన్నుకున్న అంశం పట్ల తనకుండే గాఢమైన ‘ఆప్యాయతా సాంద్రత’ ఉన్నదున్నట్లుగా కవిత్వంలోకి బదిలీ అయినప్పుడు…!అఫ్సర్ గారి పై రెండు కవితల్లోని తాజాదనానికి కారణం అదే. కవిలోని కవిత్వాంశం పట్ల గాఢమైన ప్రేమ కూడా… సర్వకాలాలకు చెందినదేననడం సబబు.uri_civara                                                                        2‘ Take me home, country roads!’ కవిత- అఫ్సర్, తన విద్యార్థి ‘బ్రైస్’తో అతని సొంత ఊరిలో కలిసి గడిపిన క్షణాల కలవరింత.
ఈ కవితలో-‘మెత్తని అరచెయ్యి
నీ కొలరాడొ నది‘  అని అఫ్సర్ కవితను ప్రారంభిస్తారు.’మెత్తని నీ అరచెయ్యి- కొలరాడొ నది’ అని అనొచ్చు కదా- అని కవిత చదివిన మొదటలోనే వొకసారి నాకు అనిపించింది. కానీ ‘నీ కొలరాడొ నది’- అని అనడం మూలాన కొలరాడొ నదికి, బ్రైస్ కి మధ్య అనుబంధాన్ని మరింత తీవ్రం చేసారు అఫ్సర్. సరిగ్గా ఆ అనుబంధంలో వున్న అనుభూతి కొసని అందుకుంటూ.. కవిత్వంలోకి ప్రవేశించినప్పుడు… అక్కడే… ఆ ప్రారంభ వాక్యాలే- పాఠకున్ని కట్టిపడేస్తాయి.వొకరి అనుభవాన్ని, అనుభూతిని own  చేసుకునే వొక గాఢమైన కళని అఫ్సర్ ఒంటబట్టించుకున్నారనిపిస్తుంది. ముఖ్యంగా కవి నిజాయితీపరుడైతే (అవ్వాలి కూడా..) అతను సృజించిన కవిత్వం కవిత్వాభిమానుల హృదయాలలో పరిమళిస్తుంటుంది.

సరిగ్గా ఆ పనే చేసారు అఫ్సర్. తన శిష్యుడు ‘బ్రైస్’ తో- అతని ఊరు ‘బాస్ట్రాప్’లో గడిపిన క్షణాల వెంట- మనల్ని కూడా తీసుకుని వెళ్తారు.

ఆ relation ని నాలాంటి కవిత్వాభిమాని కోరుకుంటాడు.

కవిత్వం విషయానికొస్తే… తర్వాత వాక్యాలలో అఫ్సర్ నెమ్మదిగా జ్ఞాపకంలోకి జారిపోతారు.

దీని నిదానమయిన నడకల్లోంచి
నా వూరి గుండె గూళ్లలోకి
పిచ్చుకలాగా జారిపోయాను సుఖంగా’   అని…..

ఆ జ్ఞాపకం- పుట్టిన ‘తల్లి ఊరి’ నుంచి దూరమైన ఎవరినైనా వెంటాడుతుంటుంది- నాకు లాగే………

వొకటో స్టాంజా చివరలో- నది జీవత్వాన్ని ‘బ్రైస్’ చిరునవ్వుతో పోలుస్తూ… అద్భుతమైన ‘మెరుపు’ను సాధించారు అఫ్సర్.

బ్రైస్, నీలాగే నవ్వుతుంది
మీ వూళ్ళో నీ కొలరాడొ ‘ అంటూ………

తరువాత స్టాంజాల్లో-

‘ఈ పూట నీ వూళ్లో
నీ కొలరాడొ చీరమడతల్లో
కరిగిపోయాను ఆత్మని మడతపెట్టి

అఫ్సర్ కవిగా- యిప్పుడు అసలుసిసలైన కవిత్వపు లోతుల్లోకి ప్రవేశించారు. ‘బ్రైస్’ అనుభూతిని తను స్వంతం చేసుకున్నారు. నదితో తనను ఏకీకరణం చేసుకున్నారు. ఇది నిజాయితీతో కూడిన ప్రతిస్పందన.
అందుకే……

నిన్ను కన్న వూరికి ధన్యవాదాలు, బ్రైస్‘     అని ప్రేమతో అనగలిగారు.

మొత్తానికి కవితలో- ‘బ్రైస్’ అనుభూతిని తన అనుభూతిగా; బ్రైస్ అనుభవ గాఢతను తన అనుభవ గాఢతగా చేసుకుంటూ కవిత్వాన్ని సృజించిన తీరు నాకు విపరీతంగా నచ్చింది.
ఈ కవితను చదివిన నేను- అఫ్సర్ గారిలో వున్న సహజమైన, సున్నితమైన పసిపిల్లల నిర్మలత్వానికి జోహార్లు చెప్పకుండా వుండలేను.

‘బ్రైస్’ ఊరి నుంచి తిరిగి వెనక్కి వచ్చేస్తూ….. ఆ అనుభూతి గాఢత తనలో వుంటూనే వుంటుందని చెప్పడానికి-

నెమ్మదిగా పరిగెట్టే నీ నదిలో
ఇప్పటికీ నా కాళ్లు సగం అలాగే వుండిపోయాయి
తడి ఆరకుండా ‘

కవితకు అసలైన ముగింపు- ఇంతకంటే మరొకటి వుండదనుకుంటా.

                                    3

సరిగ్గా మళ్లీ అలాంటి అనుభూతి గాఢతే వున్న కవిత ‘నల్లానల్లని నవ్వు’. సర్వదేశాల సంస్కృతుల కూడలిలాంటి…. వొక యూనివర్షిటీలో అధ్యాపకుడిగా  పనిచేయడం- అఫ్సర్ గారి ఆలోచనలకు, కవిత్వవస్తువులకు, కవితా వ్యూహాలకు- వొక విస్తృతిని ఇచ్చాయి.
‘నల్లానల్లని నవ్వు’ కవితలో…………..

మెట్రోబస్ వెనకాతల
వొక కితకితల నల్లసముద్రమేదో
అల లలలుగా తుళ్ళి తుళ్ళి పడ్తుంది

అని అనడంతోనే కితకితలు పెట్టినప్పుడు మనిషి ఎలా మెలికలు తిరుగుతాడో…. దానిని సముద్రంలో అలల కదలికలతో పోల్చారు. అద్భుతమైన ఈ పోలికను ఎవరైనా నచ్చకుండా వుండలేరు. ‘నల్లసముద్రం’ అని అనడం వొక రూపాన్ని తీసుకురావడమే. దృశ్యం కళ్ల ముందు ప్రత్యక్షింపబడుతుంది.

ఏ ఇరుకు నగర శరీరాన్నో పగలగొట్టి
నవ్వుల వానలో ముంచెత్తాలని…..’

ముందు కవితలాగే- ఈ కవితలో కూడా… ఎదురుగా వున్న వొక మనిషి అంతరంగంలోకి చొరబడి… ఆ మనిషిలోని అనుభూతితో మమేకమయ్యారు అఫ్సర్.
కవిత ముగింపులో-

మెట్రోబస్ వెనకాల
వొక కితకితల నల్లసముద్రమేదో
హోరు హోరుగా చిలిపి చిలిపిగా
వెంటాడ్తుంది నిద్రలోనూ
నిద్రకళ్లు వాలకుండా! ‘

నిజంగా వెంటాడే కవితే. అనేక రోజులుగా నన్ను వెంటాడుతున్న కవితా ఇదే.

                                                                    4

ఊరి చివర కవితా సంపుటి వచ్చి మూడున్నరేళ్లు దాటినా… నాకు మాత్రం ఎప్పటికీ, ఎన్ని సంవత్సరాలైనా- అపుడే పుట్టిన లేగదూడవంటి నిర్మలమైనదే. సరికొత్త కవితా సంపుటే!

కొత్తదనాన్ని పొదిగివున్నదేదైనా సజీవమైనదే కదా!

– బాల సుధాకర్ మౌళి

నేనూ అమ్మనవుతా !

vnl photo

వారణాసి నాగలక్ష్మి

      

  పుట్టింది పెరిగిందీ నూజివీడు దగ్గర ప్లీడర్ గారి తోటలో. ఆలంబన కథా సంపుటి 2005 లోనూ , ఆసరా కథా సంపుటి 2010 లోనూ వెలువడ్డాయి .రచయిత్రిగా లేఖిని నించి ‘కథ’ పురస్కారం, స్వర్గీయ యమ్వీయాల్ సాహితీ సత్కారం వంటి కొన్ని ప్రోత్సాహకాలు లభించాయి. కారా మాస్టారు , ఛాయా దేవి గారు , మునిపల్లె రాజు గారు వంటి సాహితీ ప్రముఖుల నుంచి అందిన ప్రశంస, పురస్కారాల కన్నా ఎక్కువ సంతోషాన్ని , ప్రోత్సాహాన్ని ఇచ్చిందని చెప్పాలి.  కారా మాస్టారు చెప్పినట్టు ప్రముఖుల ప్రశంస , రచయితని గొప్ప కథలు మాత్రమే  రాయాల్సిన పరిస్థితిలోకి నెట్ట కూడదని నమ్ముతాను . మామూలు కథలు కూడా హాయిగా రాసుకోగలిగే  స్వేచ్చని రచయిత కాపాడుకోవాలని, పాఠకులు  expectations  లేకుండా రచయితని స్వీకరించాలనీ నా అభిప్రాయం, నా ఆకాంక్ష  !– వారణాసి నాగలక్ష్మి 

***

హాల్లో ఫోను మోగుతోంది.రోజూలా ఆయన తీస్తారేమో అని ఆగకుండా గబా గబా వెళ్లి రిసీవర్ తీశా. విజయ్ నించీ నీలిమ  నించీ ఇంకా ఫోను రాలేదు. వాళ్ళ నించే అనుకుంటూ హలో అన్నా. అటునించి నవీన పలికింది.

” ఏం తల్లీ? “అన్నా మళ్ళీ చేసిందేమిటా  అనుకుంటూ.

” అమ్మా ! ఎలా గడిపావు ఈ రోజు ?”అంది.

” చెప్పారు గదమ్మా నాన్న. ఐస్ క్రీం తెచ్చారు మధ్యాహ్నం .ఇవాల్టికి షుగరు మాట మర్చిపోయి తినేశా. అన్నం లోకి నాన్నకిష్టమని కొబ్బరి పచ్చడీ, నాకిష్టమని పులిహారా చేశా…” ఇంకా నా మాటలు పూర్తి కాకుండానే

“ఊ .. అంతే మీరు !  పుట్టినరోజు పూటా వండుకుంటూ కూర్చున్నావా? ఇన్నాళ్ళూ మా చడువులనీ, పరీక్షలనీ, నాన్నకి ఆఫీసులో కుదరకా, చుట్టా లొచ్చారనీ  ఏదో ఒక కారణం తో ఇంట్లోనే గడిపేదానివి. ఇప్పుడైనా హాయిగా ఎంజాయ్ చెయ్యచ్చు కదా ” కోప్పడుతూ అంది నవీన.

” ఇప్పుడేం కష్ట పడుతున్నా తల్లీ? హోటలు భోజనం నిండా ఉప్పు కారాలూ ,నూనెలూ ఎక్కువ. దాని బదులు ఇంట్లో సింపుల్ గా చేసుకుని ఇలా ఐస్ క్రీమో, స్వీటో తెచ్చుకుంటే నయం కదా!” అన్నా .

” సర్లే  ..ఏదో ఒకటి చెప్తావు. సాయంత్రం అయినా ఎటైనా వెళ్తున్నారా?” అంది నిష్ఠూరంగా  .

దాని బుంగమూతి ఊహించుకుంటూ ” ఊ.. కాలనీ గుడిలో ఏదో పురాణ కాలక్షేపం ఉంది. ఇద్దరం వెళ్తున్నాం ” అన్నాను .

“నీకింకా అరవై కూడా రాలేదే బాబూ!  చక్కగా ఆదివారం నాడొచ్చింది  పుట్టినరోజు! కాస్త ఓ సరదా సినిమాకో, పార్కుకో వెళ్లకూడదూ ? నాన్న కివ్వు ఫోను ” అంది విసుక్కుంటూ.

“నాన్న భోంచేసి  పడుకున్నారమ్మా. నువ్విలా అన్నావని చెప్తాలే.. అలాగే వెళతాంలే.. .  సినిమాకి కాదుగాని ఏదైనా పాట కచేరీ ఉంటే వెళ్తాం ” అన్నా.

“నాన్నకి నీ ఇష్టాయిష్టాలేవీ పట్టవు. నేనక్కడ జాబ్ చేసినన్నాళ్ళూ ఎలా వెళ్ళేవాళ్ళం మనిద్దరం?..అలా గుర్తొచ్చినపుడల్లా వెనక్కి వచ్చెయ్యాలనిపిస్తుంది…. కానీ ఇక్కడి జీవితం అలవాటు పడ్డాక అలా వెనక్కి రాలేం..” అంది.

నవీన మాటలకి నా మనసు పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అప్పట్లో విజయ్ అమెరికా లో ఎమ్మెస్ చేస్తుండేవాడు . నవీన చదువై ఉద్యోగంలో చేరింది. రెండేళ్ళ పాటు దాదాపు ప్రతీ సాయంత్రం సరదాగా ఏదో ఒక ప్రోగ్రాంకి వెళ్ళేవాళ్ళం. దానికి పెయింటింగ్  అంటే ఇష్టం. నాకు సంగీతం ప్రాణం. ఇద్దరం కలిసి ఆర్ట్ ఎగ్జిబిషన్ కో, సంగీత కచేరీకో నవీన స్కూటీ మీద వెళ్ళిపోయేవాళ్ళం.

అప్పట్లో ఆయన ఇంటికొచ్చేసరికి దాదాపు ఎనిమిదయ్యేది. మేమూ సాధారణంగా ఆ సమయానికి ఇల్లు చేరేవాళ్ళం. ఎప్పుడైనా కచేరీ చాలా బావుంటే ఇంకా లేటయ్యేది. అప్పటికాయన స్నానం చేసి టీవీ చూస్తూ ఉండేవారు. ముందుగానే వంట పూర్తి చేసి భోజనాల బల్ల మీద పెట్టి వెళ్ళేవాళ్ళం గనక రాగానే కబుర్లు చెప్పుకుంటూ భోజనం పూర్తి చేసేవాళ్ళం. నా జీవితంలో ఆ రెండేళ్ళూ చాలా  స్పెషల్ !

నవీన పెళ్లి చేసి పంపాక నాకు చాలా కాలం పట్టింది తేరుకోడానికి. ఆయనకి లలిత కళల మీద అభిరుచి లేదు. అలిసిపోయి ఇల్లు చేరేవారేమో నాతో మళ్ళీ బయటికి  రావడానికి ఆయనకి ఇష్టం ఉండేది కాదు.మిత భాషి కావడంతో మా ఇల్లు ఎక్కువ సేపు నిశ్శబ్దం గానే ఉంటుంది. పిల్లలతోపాటు పరుగులు పెట్టే రోజులు ఎలా గడిచాయోగాని ఇప్పుడు మాత్రం తరచుగా విసుగనిపిస్తోంది జీవితం. ఆయన  రిటైరయినా పెద్ద  తేడా  ఉండక పోవచ్చు. ఈ యాంత్రికజీవనం లో  విజయ్ నించీ, నవీన నుంచీ వచ్చే ఫోన్ కాల్స్ , వాళ్ళు పంపించే ఫోటోలు, ఈ మెయిల్స్ , ఏడాదికో రెండేళ్ళకో ఒకసారి వాళ్ళ రాక …ఇవే నా జీవితంలో మెరుపు తునకలు !

ఇవాళ నా పుట్టిన రోజు. చాలా మందికి లాగే నాకూ పుట్టిన రోజు నాడు నా ఆప్తులు కొద్దిమందీ నన్ను పలకరించాలనీ, నా పట్ల వారి ప్రేమ వ్యక్తమయ్యేలా ఏవో చిట్టి పొట్టి బహుమతులో, శుభాకాంక్షలో అందించాలనీ ఎదురు చూడడం అలవాటు. పిల్లలకి  జ్ఞానం  రాక ముందు, ఆయనకి గుర్తుకూడా ఉండక, నా పుట్టినరోజులన్నీ చప్పగా గడిచి పోయేవి. పిల్లలకీ, మా ఆయనకీ  వాళ్ళ పుట్టినరోజులన్నీ గుర్తుపెట్టుకుని వాళ్ళ కిష్టమైన పిండివంటలు చేసి, కొత్తబట్టలు కుట్టించి పండుగలా సెలబ్రేట్ చేసినా, నా పుట్టినరోజు ఎవరికీ గుర్తుండక ఉక్రోషం వచ్చేది.  నవీన కొంచెం  పెద్దదైనప్పటి నుంచీ అమ్మ పుట్టినరోజు అంటూ గుర్తు పెట్టుకుని ఆ రోజు అన్న తో కలిసి రహస్యంగా చర్చించి ఏవో సర్ప్రైజులు ఏర్పాటు చెయ్యడం , ఇంట్లో అన్ని పనుల్లో సాయం చెయ్యడం మొదలు పెట్టింది….అవన్నీ మధుర స్మృతులు !

ఇద్దరినీ ఒకలాగే పెంచినా విజయ్ కి ప్రేమ ప్రకటన చేతకాదు. వాడి భార్య నీలిమ  కూడా మంచి అమ్మాయే. కానీ పెళ్లవుతూనే విజయ్ తో  కలిసి విదేశాలకి వెళ్లిపోవడంతో నాతో పెద్దగా అనుబంధం ఏర్పడలేదు. ఎప్పుడైనా  వాడు ఫోన్ చేసి నాతో మాట్లాడమని ఇస్తే మాట్లాడుతుంది. ఈ విషయంలో నాకెంతో బాధగా ఉంటుంది. నవీన మాత్రం దాదాపు రోజూ ఫోన్ చేసి పలకరిస్తుంది. తరచూ ఈ మెయిల్స్ కి పిల్లల ఫోటోలు జతచేసి పంపుతుంది. పుట్టినరోజు పెళ్లిరోజులకి ఏవో బహుమతులు పంపిస్తుంది . ఒక్కోసారి డబ్బు పంపి ” ఆ డబ్బు దాచిపెట్టి మళ్ళీ నాకే ఏదో ఒకటి కొంటావు..అలా చెయ్యకు. ఏదైనా మంచి చీర కొనుక్కో. పని మనిషి ఎక్కువ డబ్బిచ్చి పనులన్నీ చేయించుకో ” అంటూ తాపత్రయ పడుతుంది . పనితో ఎంత సతమతమౌతూ  ఉన్నా పిల్లలచేత మాట్లాడిస్తుంది. వాళ్ళు’ అమ్మమ్మా తాతా’ అంటూ చిలక పలుకులు పలుకుతారు. నా జీవితంలో నవీన పంచే ఆనందం వర్ణన కందనిది.

Kadha-Saranga-2-300x268

కిందటి వారం విజయ్ ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఇప్పుడు బహుశః వెనక్కి కాలిఫోర్నియా ప్రయాణంలో ఉండుంటాడు. ప్రయాణం హడావిడిలో మెయిల్స్ చెక్ చేసుకుని ఉండడు. నవీన వాడికి గుర్తు చేసే వుంటుంది !!

పిల్లలు మరీ చిన్న వాళ్లవడంతో ప్రస్తుతం నీలిమ  ఉద్యోగం చెయ్యడం లేదు. ఒక్కసారి ఫోన్ చేసి  మాట్లాడకూడదూ? చివుక్కుమనిపించింది. మా అత్తగారిని నేనెంత  బాగా చూసుకునే దాన్ని! పెద్ద కోడలిగా ఎన్ని బాధ్యతలు నెరవేర్చాను! మరుదులూ, ఆడపడుచులూ అందరి పెళ్ళిళ్ళూ,చదువులూ అన్ని విషయాల్లోనూ అందిపుచ్చుకుని ఎలా నిభాయించాను? అందులో పావు వంతైనా తన నించి ఆశిస్తే తప్పు కాదు కదా! మనసు చిన్నబోయింది.

మళ్ళీ ఫోను మోగింది. ఈ సారి తప్పకుండా విజయ్ నించో, నీలిమ నించో అనుకుంటూ రిసీవర్ తీశాను. అబ్బే.. ఆయన కోసం ఆఫీసు వాళ్ళెవరో చేసారు. లేచారో లేదో చూసి కార్డ్లెస్ ఫోనందించి వంటింట్లోకి నడిచా కాస్త టీ పెడదామని. జీవితం చప్పగా ఉంది పోనీ టీ లోనైనా కాస్త మసాలా వేద్దామనిపించింది. యాలకులా ,దాసించెక్కా, సోంపా అని అలోచించి చివరికి అల్లం దంచి వేశా. రెండు కప్పుల్లో వేడి టీ పోసి పది చదరపు అడుగుల బాల్కనీ లోకి తెచ్చేసరికి ఆయన కూడా లేచి వచ్చారు, పొద్దుటి పేపరు చేతిలో పట్టుకుని.

టీ తాగుతూ అమ్మాయి ఫోన్ చేసిన విషయం చెప్పి ,”చూశారా విజయ్ గాని, నీలిమ గాని ఫోనే చెయ్యలేదు.వాళ్ళకసలు నా పుట్టిన్రోజన్న విషయమే గుర్తులేదు!” అన్నాను ఉక్రోషంగా .

తలాడించారు మౌనంగా.

” నేనెంత చేసేదాన్ని అత్తయ్య కోసం ?ఆవిడ కనుసన్నల్లో తిరుగుతూ,ఆవిడ చెప్పినట్టుగా నడుచుకుంటూ , ఇంటి బాధ్యతలన్నీ ఎంత పట్టించుకున్నాను? ఆఖరి వరకూ ఆవిడ అవసరాల్లో ఎంత వెన్నంటి ఉన్నాను? ” అన్నాను బెంగగా.

ఆయన నా కళ్ళలోకి చూసారు.

నా బాధ తనకి అర్ధమైనట్టే అనిపించింది.

చెయ్యి చాచి నా చేతిని నొక్కుతూ “నవీన మళ్ళీ ఫోన్ చేసిందన్నావ్?”అన్నారు.

నా కళ్ళు మెరిసి ఉండాలి. దాని ఫోను వివరాలు చెప్పాను.

ఆయన కొంత సేపు ఏదో ఆలోచిస్తున్నట్టు ఉండిపోయారు .

తర్వాత గొంతు సవరించుకుని “చూశావా భానూ! నీ కూతురు నీకు చేస్తున్న దానిలో పావు వంతైనా మీ అమ్మ గారికి నువ్వు చేసావా? ఆవిడకి డెబ్భై దాటినా ఇప్పటికీ పుట్టింటికెళ్ళి అంతో ఇంతో చేయించుకుని వస్తావు! ఈ నాటికీ వాళ్ళనించి పెట్టుపోతలు అందుకుంటూనే ఉన్నావు. అదే మరి నవీన పుట్టింటికి వచ్చినపుడల్లా నీకు పనికొచ్చేవీ, నచ్చేవీ ఏవేవో తెస్తూనే ఉంటుంది. దాని డెలివరీలకి మీ అమ్మ గారు నీకు చేసిన దాంట్లో పావువంతు కూడా నువ్వు దానికి చెయ్యలేదు. అక్కడికి మనని తీసుకెళ్ళి అమెరికా అంతా తిప్పి చూపించింది. ఇప్పటికీ మన పుట్టినరోజులకీ, పెళ్లిరోజులకీ ఏవేవో బహుమతులూ, చెక్కులూ పంపుతుంది. అటువైపు ఆలోచించావా?”అన్నారు మృదువుగా.

ఒక్కసారిగా నాకు కళ్ళు తెరుచుకున్నట్టయింది. నిజమే .. మా అమ్మ కు ఇంతవరకూ  నేను చేసిన సేవ ఏమీ లేనట్టే! పాపం ఇవాల్టికీ మేం వెళితే పక్కన కూర్చుని కొసరి కొసరి వడ్డిస్తుంది. వద్దన్నా వినదు. వంటకి వంట మనిషీ, పనికి పని మనిషీ ఉన్నా , ఏవో పచ్చళ్ళూ, పొడులూ ,చేసి ‘నీకిష్టమని చేసానే’ అంటుంది. ‘ వంకాయ కారంపెట్టి చేస్తే అతనికిష్టం కదే! ..కొబ్బరి పచ్చడి చేస్తే మళ్ళీ వేయించుకుంటాడు’ అంటుంది!

నేనూ ‘ఆవిడకి అలానే తృప్తి ‘ అని హాయిగా అనుభవించి ఊరుకుంటాను. రాత్రి పడుకునే ముందు జండూ బామ్  వాసన వస్తుంది. అమ్మ రాసుకుంది కాబోలు అని నిట్టూరుస్తాను. రెండు రోజులుండి మళ్ళీ మా ఊరు చేరుకుంటాను. అమ్మ మా ఇంటికి వస్తే ఆవిడకిష్టమని ఎక్కడికీ తీసుకెళ్ళిన జ్ఞాపకం లేదు. ఏదో పెళ్లి ళ్ల కీ, పేరంటాలకీ ,తప్పనిసరి అయిన చోట్లకీ తప్ప. అదే నవీన మాకోసం ఎంత ప్లాన్ చేస్తుందో. ఎంత ఆలోచిస్తుందో!

ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ శ్రీవారి మాటలు వినిపించాయి…

“అప్పటి కోడళ్ళకి చిన్నప్పుడే పెళ్ళిళ్ళు కావడంతో అనుబంధం గాఢంగా  ఏర్పడేది. ఎదిగే చెట్టు మట్టిలో వెళ్ళు విస్తరించుకున్నట్టు కనపడకుండా అత్తింటితో బంధం బలపడేది.. కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలున్నా కష్ట సమయాల్లో, అనారోగ్యాల్లో, పిల్లల పెంపకంలో అత్తా కోడళ్ళు ఒకరికొకరు చేదోడు వాదోడుగా నడవడంతో ఒకరి లోపాలొకరు అర్ధం చేసుకుని తేలిగ్గా తీసుకోగలిగేవారు. ఒకరి మీదొకరు మానసికంగా ఆధారపడేవారు! ఇప్పుడు పెళ్లవుతూనే విదేశాలకి  వెళ్లిపోవడంతో పెద్దగా అనుబంధం ఏర్పడక పోవడం, ఇద్దరూ ఉద్యోగస్తులు కావడంతో టైము దొరక్క పోవడం, అయిన వాళ్ళు లేని చోట భార్యా భర్తలిద్దరే కష్ట సుఖాలన్నీ ఎదుర్కోవడంతో అత్త మామలతో అంత ఇంటరాక్షన్ లేకుండా పోతోంది.” అన్నారు.

నిజమే ! కుటుంబ బాధ్యతలు నిర్వహించడంలో నేనూ అత్తగారి సహకారం , మాట సాయం  పొందాను. అనేక సందర్భాలలో ఆవిడ ప్రేమాభిమానాలు, ప్రశంసలూ పొందాను. చిన్న తనం నించీ ఆవిడ దగ్గరే  ఉండడంతో ఆవిడతో ఎంతో అనుబంధం ఏర్పడింది. తరవాత్తరవాత ఈయన ఉద్యోగ రీత్యా  వేరే రాష్ట్రాలలో ఉన్నప్పుడు కూడా  ఆవిడా వస్తూ ఉండేవారు, అవసరాలకి  నేనూ పిల్లలతో వచ్చి ఆవిడ దగ్గరుంటూండే దాన్ని. ఆయనొకరే ఎలాగో మానేజ్ చేసుకునేవారు………

ఆలోచనల్నించి బయట పడుతూ ” సరే లెండి… ఇప్పటి తరం తమకు సమ్మత మయిందే చేస్తారు గాని ఇతరులేమనుకుంటారో అనో , ఇతరులు ఆశిస్తారనో  ఏదీ చెయ్యరుగా !” అన్నాను నవ్వుతూ.

“అవును సరిగ్గా చెప్పావు! ఇంకో విషయం చెప్పనా ? ఇప్పటి పిల్లలకి,  చాలా కాలం…. అంటే దాదాపు పాతికేళ్ళ పాటు  చిన్న  కుటుంబంలో తల్లీ తండ్రీ, ఒక తోబుట్టువూ మధ్య పెరగడం, బాగా చదువుకుని ఉద్యోగం లో చేరి, కొన్నాళ్ళు సంపాదించాక పెళ్లిళ్లు జరగుతున్నాయి. వాళ్ల ఉన్నతిలో తల్లిదండ్రుల పాత్ర అర్ధమై, వాళ్లతో అనుబంధం గాఢమై,  అదే వాళ్ళ మనసులో నిలిచిపోతోంది. వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలనే తాపత్రయం కలుగుతోంది ! దానికి  తోడు సొంత సంపాదన ! ఏమంటావు?”అన్నారు.

ఏమంటాను? నిజమే..

మళ్ళీ ఆయనే ” పెళ్ళైన వెంటనే దూర దేశానికి వెళ్ళడం, అన్ని కష్ట సమయాల్లోనూ ఇరుగు పొరుగుల సహకారం అవసరమై, వాళ్ళతోనే  అనుబంధం ఏర్పడడం ! దూరంగా ఉన్న అత్త మామలు బాధ్యతలుగానే గాని, తీయని బంధాలుగా అనిపించే ఆవకాశం ఏదీ?

“నీలిమ విషయంలో  తను చెయ్యక పోయినా నువ్వే చెయ్యి. … ఆశించకుండా అందిస్తూ పోతే ఎప్పుడో ఒకప్పుడు నువ్వూ తల్లిలా కనిపిస్తావేమో!!” అన్నారు నవ్వుతూ.

అన్నీ వింటూ ‘ అవును .. నీలిమకి నేనూ అమ్మనవాలి ‘ అనుకున్నా.

 

***

 –  వారణాసి నాగలక్ష్మి

గతంలోకి ప్రయాణం

vekuvapoolu

‘‘గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళ్ళతో’’ అన్నాడు శ్రీశ్రీ. గతమంతా రణరక్త సిక్త ప్రవాహమేనా? ‘‘సదాస్మరించుకోవడానికి, తలుచుకుని పులకరించడానికే, లేశమాత్రమయిన మంచిలేదా?’’ అంటే మంచి కూడా వుంది. కానీ, ‘‘మంచి గతము కొంచేమేనోయ్‌’’ అన్నాడు గురజాడ. కవి నిరంకుశుడు గనుక దేన్నైనా ఎలాగయినా అనగలడు. కానీ మామూలు మనుషులుగా మనం అప్పుడప్పుడు గతంలోకి తొంగిచూడకపోతే, మన భవిష్యత్‌ ప్రస్థానానికి సరయిన ఆలంబన దొరకదు. గతంలో చేసిన తప్పు ఒప్పులే మన ప్రయాణానికి దారిదీపాలుగా వ్యవహరిస్తాయి.

నిద్రపట్టని ఒక అర్ధరాత్రి నా చూపుడు వేలు, నా పుస్తకాల ‘‘రాక్‌’’ లో వున్న ‘‘వేకువపూలు’’ అన్న నవలను బలంగా తాకింది. రెండు వందల పేజీల ఆ నవలను ఒక్కుదుటన తెల్లవారే వరకు చదివేసాను. ఎప్పుడో ఫిబ్రవరి 2000 సంవత్సరంలో చతుర మాస పత్రికలో సంక్షిప్తంగా ప్రచురించబడిన నవలకు విస్తృత రూపం నేను చదివిన ‘‘వేకువపూలు’’. కథాకాలం 1970 దశాబ్దం. అంటే 43 సంవత్సరాల పాత కథావస్తువు అన్నమాట. ఈ నవలను చదవడం అంటే ఇప్పటి గ్లోబల్‌ తరానికి ‘‘ఫేస్‌బుక్‌’’ లో ‘‘లైక్‌’’లు మాత్రమే పెట్టగల యువతరానికి, ‘‘టైమ్‌ మెషీన్‌’’లో గతంలోకి ప్రయాణం చెయ్యడం అన్నమాట. నిజంగా ఈ నవల చదవడం ఒక అనుభవం.

ఢిల్లీ లో నిర్భయ ఉదంతం జరిగిన తర్వాత ఒక్కుమ్మడిగా కొవ్వొత్తులతో పార్లమెంటును ముట్టడిరచిన యువతరంగానికి, అరవై ఏళ్ళ వృద్ధుడు ‘‘అన్నా హజారే’’ నాయకత్వం వహిస్తే వెనుక వుండి సంఫీుభావం ప్రకటించే దుస్థితిలో వున్న యువ గళానికి, ఒక తరం క్రితం తమ సహచరులు ఎలా వున్నారో, సమాజ చలన శీలతను తమ కార్యాచరణతో ఎలా ప్రభావితం చేశారో, ఆ సామాజిక గమనానికి చోదక శక్తులై ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాడో సోదాహరణంగా చెప్పగలదీ నవల. ఇప్పటి ‘‘యువతరం’’ నిస్తేజాన్ని నిర్వ్సాపారాన్ని, చైతన్యలేమిని ప్రశ్నిస్తుందీ నవల.

1947లో స్వతంత్య్రం రావడమూ, 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడటమూ, స్వాతంత్య్రోద్యమ కాలంనాటి ఆదర్శాలన్నీ నీటి మీద రాతలయిన కరకు వాస్తవం తెలిసిన తర్వాత, 1969లో మొదటి దశ తెలంగాణా ఉద్యమం రావడమూ, అదీ అయిపోయాక శ్రీకాకుళంలో రాజుకున్న నిప్పురవ్వ, రాష్ట్రమంతటా వ్యాపించడం అనే అంశాలు నేపధ్యంగా ఈ నవలకి అమిరాయి.

నామ మాత్రపు రాజకీయ స్వాతంత్య్రం, స్వాతంత్య్రమే కాదని, ఆర్ధిక స్వావలంబన, స్వేచ్ఛ సమానత్వం, అన్ని రంగాలలో, అన్ని వర్గాల ప్రజలకి అందినప్పుడే నిజమయిన స్వాతంత్య్రమని నమ్మిన యువతీ యువకులు, తాము కలలు గన్న సమాజాన్ని సాధించాలి అనే ఆశయంతో ఒక విస్తృత విప్లపవోద్యమాన్ని నిర్మించే క్రమంలో పెద్దయెత్తున ఉద్యమాలలో భాగస్వాములు అయ్యారు. కాలేజి, సాహితీ, సాంస్కృతిక సంఘాలలో భాగస్వాములయ్యారు. చదువునీ, జీవితాన్ని త్యాగం చెయ్యడానికి ముందుకు వచ్చారు. ‘‘నెత్తురు మండే, శక్తులు నిండే’’ యువతరానికి ప్రతినిధులు వారు.

అప్పటి సాంస్కృతికోద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ‘‘జతిన్‌ కుమార్‌’’ ఈ నవల రాశారు. ఉద్యమానికి ‘‘ఇన్‌సైడర్‌’’ కావటం వలన ఉద్యమ ఎత్తు పల్లాలని ప్రతిభావంతంగా ఆవిష్కరించగలిగారు.

ఈ నవలలో ప్రధాన పాత్రలు మూడు. సమత, ఝాన్సీ, రాకేష్‌. సమత ఇంటర్‌మీడియట్‌లో కాలేజీలో ప్రవేశించడంతో మొదలయ్యే నవల, సమత డిగ్రీ, పి.జీ దాటుకుని, పి.హెచ్‌.డి లో చేరి అర్థాంతరంగా మానేసి విప్లవోద్యమంలో మమేకమయి జైలు జీవితం అనుభవించి విడుదలవ్వడంతో ముగుస్తుంది.
నిత్య చైతన్యశీలి అయిన ఒక యువతి జీవితంలోని పది సంవత్సరాలను ఈ నవల చిత్రించింది. ‘‘సమత’’ నెపంగా ఆ సమయంలో సమాజంలో జరిగిన ప్రతి సంచలనాన్నీ నమోదు చేసినది. నమోదు చేయడమే కాకుండా, ఎలా ప్రతిస్పందించాలో, రకరకాల అంశాలు ఒక విషయాన్ని కప్పివేసినప్పుడు, ఆ పొరలను తొలగించి సత్యశోధన ఎలా చెయ్యాలో ఈ నవల వివరిస్తుంది.

కామినేని వెంకటరామారావు ఉరఫ్‌ కె.వి.ఆర్‌. మాస్టారు అనే ఉపాధ్యాయుడికి ముగ్గురమ్మాయిలు. స్వరాజ్యం,ఝాన్సీ, సమత. స్వరాజ్యం గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. మామూలు, సాదాసీదా ఆడపిల్ల. పెళ్ళయినాక భర్త ఆధిపత్యం అనే ‘ఛాయ’ లోకి వెళ్ళిపోయి, ఎప్పుటికప్పుడు పుట్టింటి నుండి ఏదో ఒకటి ఆశించే సాధారణ ఆడపిల్ల.

ఝాన్సీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, తల్లిదండ్రులను పోషిస్తూ, చెల్లెలను చదివిస్తూ వుంటుంది. మిత భాషి, మరోమాటలో చెప్పాలంటే ఇంట్రావర్టు. అంతర్ముఖి. ఉద్యోగం చేస్తూనే ప్రయివేటుగా యం.కాం చదువుతుంది.

మూడో అమ్మాయి సమత. సమత అంటే ఒక చైతన్యం. ఒక పాట పాడినా, ఒక ఆట ఆడినా, గంభీరంగా ఏదయినా చర్చ సాగించినా ఆ యింట్లో మనుషులందర్నీ కలిపి వుంచే ఒక ‘‘హబ్‌’’ సమత. జీవితం పట్ల సమ్యక్‌ దృష్టి, జీవనంలో హుందాతనం, ప్రతి పని లోనూ ఆత్మ విశ్వాసం, ప్రతి మాటలోనూ ఆలోచన సమత వ్యక్తిత్వానికి వన్నె తెచ్చే అంశాలు.
ఝాన్సీసమత పాత్రలు, వాళ్ళ జీవితాలలో ఎదురయ్యే పురుషులు. వీళ్ళద్వారా స్త్రీ పురుష సంబంధాలని, కేవలం సంబంధాలుగా కాక చైతన్యశీలంగా ఎలా మార్చవచ్చో జతిన్‌కుమార్‌ బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఝాన్సీకి దత్తాత్రేయ శర్మ అనే సహోద్యోగితో పరిచయం అవుతుంది. మొదట్లో వున్న స్నేహం కాస్తా ప్రేమగా మారుతుంది. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని అనుకుంటారు. తీరా పెళ్ళి యింకో రెండు మూడు రోజులు వుంది అనగా దత్తాత్రేయ శర్మ యాక్సిడెంట్‌లో మరణిస్తాడు. కానీ ఝాన్సీ అప్పటికే గర్భవతి.    ఈ స్థితిలో మామూలు ఆడపిల్ల ఏం చేస్తుంది? ఏం చేయాలని సమాజం ఆశిస్తుంది? గుట్టు, చప్పుడు కాకుండా ‘‘అబార్షన్‌’’ చేయించుకుని మరో పెళ్ళి చేసుకోమంటుంది సమాజం. అలా చేయమని తల్లిదండ్రులతో సహా మిగతా అందరూ ఒత్తిడి చేస్తారు. కానీ ఝాన్సీఅలా చెయ్యడానికి ఒప్పుకోలేదు. పెళ్ళి కాకుండానే తల్లి కావాలి అనుకుంది. ఆ నిర్ణయాన్ని తల్లి వ్యతిరేకిస్తుంది.

vekuva poolu-1

‘‘పెళ్ళి అని నలుగురికీ చెప్పుకుని చాటింపు వేయడం కాదమ్మా! ఏ స్త్రీ పురుషుల మనసులు యేకం అవుతాయో, వాళ్ళిద్దరూ కలసి వుండటమే దాని అంతరార్ధం. పెళ్ళి అనే తతంగం లేదు. కానీ నేను కోరుకున్న మగవాడి సంతానానికి తల్లిని అవుతున్నాను. ఇందులో తప్పు, అవినీతి ఏదీ లేదు’’.
‘‘పెళ్ళి తంతు జరగత ముందే అతను దూరం అయ్యాడు. నేను తల్లిని అవుతున్నాను. అతను దూరమయినంత మాత్రాన, మా మధ్య విరిసిన స్నేహం, ప్రేమ దాని మాధుర్యం’’ మరచిపోయి ఏమీ తెలియని దానిలా యింకో వ్యక్తికి భార్యను కాలేను.’’

అంతర్ముఖి. ఈ మాత్రం మాట్లాడడమే గొప్ప. ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఆమె అలాగే వుంటుంది. బిడ్డను కంటుంది. వాడి పేరు సుధాంశు. ఝాన్సీ పెళ్ళి కాకుండా తల్లి అయి, సింగల్‌ పేరెంట్‌లా ఉండాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు సమత దాన్ని అర్ధంచేసుకోవడానికే ప్రయత్నంచేస్తుంది. ఇదే విషయాన్ని ‘‘రాకేష్‌’’తో ప్రస్తావిస్తుంది.

‘‘ఆ అమ్మాయి మనో ధైర్యాన్ని మెచ్చుకోవాలండి’’ సంఘంలోని కృత్రిమ విలువల మీద ఒక స్త్రీ తీస్తున్న దెబ్బగా దానిని గుర్తించాలి.
ఒక స్త్రీ పెళ్ళి చేసుకోవాలా లేదా? అనేది ఆమె వ్యక్తిగత ఈ నిర్ణయం. పెళ్ళికాకుండా, (ఇక్కడ అయ్యే అవకాశం లేదు కనుక) తల్లి అయి ఆ బిడ్డను పెంచడంలోనే ఆనందం వుంది అనుకుంటే అభ్యంతరం పెట్టవలసింది ఏం వుంది? అయితే ఇది ఆనందకరం కాదు అనే గుర్తింపు కలిగిన నాడు, ఇంకా ఏదో కావాలని కోరుకున్ననాడు ఇలాంటి అమ్మాయి సమాజం ఏమనుకుంటుందో అని వెనుకా, ముందూ చూడదు. తనకు కావలసింది అందిపుచ్చుకుంటుంది ధైర్యంగా’’ అంటాడు రాకేష్‌.
ఝాన్సీ మనస్తత్వానికి సరిగ్గా విరుద్ధంగా మరొక పాత్ర వుంది. పేరు వసంత.

‘‘పొందిన ఒక అనుభూతిని భద్రంగా దాచుకొని బతుకంతా మురిసిపోతాను’’ అంటుంది ఝాన్సీ.
‘‘అనుభూతుల వేటలో అందే ఆనందమంతా జుర్రుకుంటాను ఈ సమాజ నీతితో నాకు సంబంధం లేదు’’ అంటుంది వసంత. పెళ్ళికి సంబంధించినంత వరకూ వీళ్ళ ఆలోచనలు, అనుభవాలు వేరు… వేరు…

జీవిత కాలానికి మీల్స్‌ టిక్కెట్లు, కొంచెం రక్షణ తప్ప మరేది యివ్వదు కొందరికి పెళ్లి. ముసలితంలో, రోగంతో, రోష్టులో తోడుంటాడనే చిన్న ఆశ తప్ప మరేమీ యివ్వదు కొందరికి పెళ్ళి. నిజంగా పెళ్ళంటే ఏమిటి? ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ. ఈ వేద మంత్రాలకు అర్థం లేదా?
ఆ అర్థం ఏమిటో సమతా రాకేష్‌ కలసి జీవించి చూపిస్తారు.

సమత నిద్రలేచేసరికి అతను కాఫీ టిఫిన్‌ రెడీ చేస్తాడు. కూరగాయ ముక్కలు తరిగి అన్ని గిన్నెల్లో పెట్టి రెడీ చేస్తాడు. సమత లేచి కాఫీ తాగి గదులు క్లీన్‌ చేసి ఉప్పుకారం చూసి చెబితే కుక్కర్‌ పెట్టేస్తాడు తొమ్మిది గంటలకు ఇద్దరూ తయారయి బయటకి వెళ్ళిపోతారు.

సాయంత్రం పనులు సమత చేసుకుంటుంది. అతను ఎప్పుడో రాత్రి పదిగంటలకు వస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఈ పని నీది, ఈ పని నాది అనే విభజన లేదు. ఎవరికి వీలుగా వుంటే వాళ్ళు చెయ్యడమే.

సమత పెళ్ళయిన ఎనిమిది నెలలకు సమత తల్లి ఒకసారి సమతను చూడటానికి వస్తుంది.

సమత కాపురం చూస్తుంటే ఆవిడకు ఆనందంగానూ, ఆశ్చర్యంగానూ అనిపిస్తుంది. వాళ్ళ పిలుపులు, పలకరింపులు, పనులు చేసుకునే పద్దతి ఆమెకు కొత్తగా కనిపిస్తున్నాయి. ‘‘నేను అదీ కూర్చుని మాట్లాడుతూనే వున్నాం. ఎప్పుడు వెళ్ళాడో నేను గమనించనేలేదు. చటుక్కున కాఫీ తెచ్చి యిచ్చాడు. తాగాలంటే నాకెంత సిగ్గేసిందో’’.

స్త్రీ పురుష సంబంధాలలోని అన్ని కోణాలను ఈ నవలలో ప్రతిభావంతంగా చిత్రీకరించారు జతిన్‌. అలాగే దిగువ మధ్యతరగతి, మధ్య తరగతి, ఉన్నత తరగతి జీవితాలలోని సంబంధాలలోని విలోమత్వాన్ని గూడా చిత్రీకరించారు.

సమత రాకేష్‌లది ఆదర్శ దాంపత్యమయితే, రాయుడు చంద్రావతిలది ఒకటే మాట, ఒకటే బాణం లాంటి ఏకాభిప్రాయ దాంపత్యం. స్రవంతి పురుషుడిని సాధించే స్త్రీ. వసంత పురుషుడిని ఆటవస్తువుగా ఆడుకుంటూనే అతడి మానసిక వైకల్యానికి జాలిపడే పాత్ర. ఆత్మ నూన్యతతో బాధపడుతూ భార్య జీవితంలో, తద్వారా తన జీవితంలోనూ హింసను గుమ్మరించుకునే పాత్ర గోవర్థన్‌ది.

ఈ నవల చిత్రించిన జీవితం ఇప్పటి తరానికి పూర్తిగా అపరిచితమయినది. దేశం పట్ల, సమాజం పట్ల నలభైఏళ్ళ క్రితం యువతరం చూపించిన ప్రేమ, దేశంతోనూ, సమాజంతోనూ మమేకమయిన తీరు ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు కానీ, యువతలో వుండవలసిన సరి అయిన ధృక్పధం అదే.
సమతకు, రాకేష్‌కి పుట్టిన పాప పేరు ఉజ్జ్వల. ఉజ్జ్వలకి సమత, అందరు తల్లులలాగే పాఠాలు చెప్పింది. అందరు తల్లుల లాగా ‘ఎ’ ఫర్‌ యాపిల్‌, బి ఫర్‌ బాయ్‌, అని కాక ఎ ఫర్‌ ఎబిలిటీ, ‘బి’ ఫర్‌ బెటర్‌మెంట్‌, సి ఫర్‌ కమ్యూనిటీ ‘ఆర్‌’ ఫర్‌ రివల్యూషన్‌ అంటూ ఆంగ్ల అక్షరాలని పరిచయం చేసింది.

జీవితాలని వెలిగించే విప్లవం ఒక్క క్షణంలోనో, ఒక్క ప్రదర్శనతోనో రాదు. అది నిరంతరం సాధన చెయ్యాల్సిన అసిధారావ్రతం అసిధార అంచు మీద నిల్చిన తరం అది. విలువల కోసం పిడికిలి బిగించిన తరం అది.
ఇప్పుడా విలువలన్నీ మారిపోయి సమాజం కులం, మతం అంటూ భిన్న  భిన్న సమూహాలుగా మారిపోయింది. సామూహిక చైతన్యం స్థానంలో అస్తిత్వచైతన్యం వచ్చి చేరింది. కుల రహిత సమాజం కోసం పోరాటం జరిగిన ఈ నేల మీద ‘‘కుల’’ స్థిరీకరణ కోసం పోరాటాలు జరగడాన్ని మించిన విషాదం ఏం వుంది?

వర్గ చైతన్యాన్ని బోధించిన యూనివర్సిటీలు ఈనాడు కుల సంఘాలుగా మారిపోయినాయి. సమాజం నిరంతర చలనశీలి. సామాజికంగా వచ్చే ఏ మార్పు కార్యకారణ సంబంధం లేకుండా రాదు.
ఇప్పటి గ్లోబల్‌ తరం అనుభవిస్తున్న జీవితం. ఎప్పటిసామాజిక రుగ్మతల ప్రతిఫలనం..? వచ్చిన మార్పు మంచిదేనా..? ఈ మార్పు యిలా కొనసాగవలసిందేనా… ఇప్పటి తరం వేసుకోవలసిన ప్రశ్నలు. యివి

 ఈ ప్రశ్నలు వేసుకోవడానికి కావలసిన తాత్విక భూమికలు ఏవో ఈ నవలలో ఉన్నాయని నా కనిపిస్తోంది. నవల చదివితే మీరూ ఒప్పుకుంటారేమో.

— వంశీకృష్ణ

ఏకాంత లు ….. ఒక ఏకాంతం !

drushya drushyam-14..పురుషులకు కావాల్సినన్ని స్థలాలున్నాయి.
బయటి ప్రపంచం అంతా వారిదే. ఇంట్లో కొచ్చినా వారి ప్రపంచమే.
ఎంతైనా, మగవాళ్లకు అన్ని స్థలాలూ, అన్ని కాలాలూ యోగ్యమైనవే.
ఎక్కడ ఫొటో దిగినా అది వారి సామ్రాజ్యమే.
కానీ, లేడీస్ అలా కాదని, వారివే అయిన ఫొటోలు చాలా తక్కువ అనీ అనిపిస్తుండగా ఈ ఫొటో….

ఈ ఫొటో ఒక్కటే కాదు, నా ఫొటోలూ మీ ఫొటోలూ అని కాదు, మొత్తం ఫొటోగ్రఫిని చూడాలి.

మొత్తంగానే, ‘స్త్రీలు మాత్రమే’ అన్న ఫొటోలు చాలా తక్కువ.
స్త్రీలుగా వారు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అనుభవిస్తున్న తీరును సగర్వంగా ఆవిష్కరించే ఛాయాచిత్రాలు బహు తక్కువ!ఒకసారి మీ ఫొటోలు మీరు చూసుకోండి.
ముఖ్యంగా మహిళలు.
మీవి మీరే మళ్లీ మళ్లీ చూసుకుని చూడండి.ఆ చిత్రాలన్నీ ఒక రిలేషన్ లో భాగంగా చూపేవి కావా?
ఎక్కడ దిగినా గానీ, ఆ మహిళల చుట్టూ నిర్మాణమైన నిర్మాణాలే కదా!
+++

దిగిన ప్రతి ఛాయా చిత్రమూ వ్యక్తిగతం. అది రాజకీయాలూ పలుకుతుంది.
ఇల్లూ, వంటిల్లు, లేదంటే ఉద్యోగంలో పనిచేసే చోటు.
నిజానికి అదీ ఇల్లే. చాకిరీకి మారుపేరు కదా ఇల్లు.
ఇష్టంగా నిర్మించుకునే పక్షి ఖానా కదా ఆ జైలు.

పక్షుల ఫొటోలు కానవస్తాయిగానీ స్వేచ్ఛ జాడ లేదు.
అదీ నేటి ఛాయాచిత్రణం, మహిళల వరకు!

+++

 

చాలా ఫొటోలు…
ఉద్యోగిగా విధి నిర్వహణలో ఉండగా కూడా ఎన్నో దిగుతారు.
అక్కడా మళ్లీ పనిలోఉండగానే తప్పా విరామంగా ఉండగా ఫొటో దిగడం కొంచెం కష్టమే!
అందుకే చాలా ఫొటోలు ఒంటరిగా కంటే మరొకరి తోడుతో దిగేవే అయి ఉంటున్నాయి.

+++

 

social network sites గొప్ప ఉదాహరణ.
అంతా ముఖచిత్రాలే.
జీవన చిత్రాల జాడలేదు.
తమవైన జీవ చిత్రాల ఊసు లేదు.
తమను తాము నిర్మొహమాటంగా, నిర్భయంగా ఆవిష్కరించుకునే చిత్రాలు బహు అరుదు.

+++

 

ఎవరికి వారు ఆలోచించి చూడండి. మీ ఫొటోల్లో మీరు ఏ విధంగా అచ్చయ్యారు?
ఏ కార్యాకారణ సంబంధాల్లో ఉండగా మీరు ఆ ఛాయాచిత్రాల్లో బందీ అయ్యారు.
అసలు మిమ్మల్ని అలా బంధించిందెవరు?

ఖచ్చితంగా మీ భర్తో లేదా మీ అన్నయ్యో నాన్నో అయి ఉంటాడు.
లేదా మిమ్మల్ని కట్టుకునేవాడూ అయి ఉంటాడు.
ఎంత లేదన్నా రిలేషన్.
అది స్త్రీ అయినా కావచ్చును. ఆమెకు కూడా అది ఒక రిలేషన్.
చెల్లెలు, అక్క, వదిన యారాలు. తోటి కోడలు…ఇట్లాంటివే ఏదో ఒకటి.
వాటితో తీసిన చిత్రాలే అధికం.

+++

 

మరేం లేదు.
ఎవరేం చేసినా వాళ్లు భద్రంగా ఉండే ప్రత్యేక పరిస్థితుల్లో  మీరు భద్రంగా ఉండాలనే అర్థంతోనే!
అంతేగానీ, మీరొక పక్షి అని రెక్కలల్లారుస్తూ ఎగిరేటప్పుడు తీయాలని  వాళ్లకు తోచదు!
పంజరంలో ఉండగా అదే సమస్య.
అవే చిత్రాలు వస్తయి.

ఒక ఛాయాచిత్ర గ్రాహకుడిగా ఉండగా ఫొటోలు తీయడమే కాదు, దిగడంలోనూ అనేక పరిమితులు ఉన్నాయన్న స్పృహ ఇలా మెలమెల్లగా తెలిసి వస్తున్నది.

నా వరకైతే, ఛాయా చిత్రణం చేస్తూ ఉండగా ఎందుకో తెలియకుండానే మహిళల పబ్లిక్ స్పేస్ గురించి బెంగ కలుగుతుంది.
ఏది తీసినా ఆమె ఉంటుంది. కానీ, ఆమె ఎవరో తెలుస్తుంది. అదీ విషాదం.

వాళ్లను ఎప్పుడు ఫొటో తీసినా అది ‘మన’ దృష్టికోణం నుంచే ఉండటం బాధిస్తుంది.
అయితే అందంగా లేదంటే శ్రమజీవులుగా కాకుంటే ఇల్లాలిగా ఇంకా కాదంటే ఉద్యోగిగా చూడటమే గానీ, స్త్రీలను మనుషులుగా, నిర్వ్యాపకంగా, నిర్భయంగా చూడటం, చూపటం అన్నది కష్టం.
అందుకు తెగించవలసే ఉంటుంది. చిత్రకారుడే కాదు, చిత్రణ పొందే మనుషులూనూ!

+++

 

దీనర్థం ఒక ఫొటోను వాళ్లు స్త్రీలుగా తమవైన రోల్ ప్లేయింగుల్లో భాగంగా కాకుండా చూడాలని!
అలా అని ఈ రోల్స్ లేదా పాత్రలపై విమర్శ అని కాదు. ఈ ఫొటోల్లో వాళ్లు బాగానే ఉంటారు.
అమ్మ, అక్క, వదిన, చెల్లి, స్నేహితురాలు, భార్య, ప్రియురాలు, సహచరి, ఇష్ట సఖి, విరాగి, యాంకర్, సినీ నటి, అపరిచితురాలు…ఇట్లా చాలా…

సమస్య బాగుండటం కాదు…ఉండటం.
ఒక మనిషిగా ఆమె కనిపించడం…అదే మహాకష్టం.

ఆమెను చూస్తే ఏ సంబంధాలు లేకుండా ఒక అస్తిత్వంగా కనిపించడం ఎంతో కష్టంతో కూడి ఉన్న ఘటన.
ఒకరి అపూర్వమైన చిరునవ్వు చూస్తే, తప్పిపోయిన స్నేహితురాలిగా ఉంటుంది.
ఇంకో నిండుదనాన్ని చూస్తే మా అమ్మే అనిపిస్తుంది.
అల్లరి చిల్లరి పిల్లను చూస్తే చెల్లెలే కనిపిస్తుంది. కానీ, మనిషిగా ఆమె నిండైన వ్యక్తిత్వంతో కనిపించనే కనిపించదు.

కారణం?
ఒక్కటే, అలాంటి జీవితం సమాజంలో ఒకటి ఉండటం, దానికి మనం ఎక్స్ పోజ్ కావడం జరగాలి.
ఆ తర్వాత అలాంటి ఛాయాచిత్రాలు వాటంతటవే దృశ్యబద్ధం/expose అవుతాయి.

కానీ, మానవ సంబంధాల్లో అలవోకగా మనకిష్టమైన పాత్రోచిత సందర్భాలే కావాలనుకుంటాం.
అందులో భాగంగానే మనం వాళ్లను చూస్తుంటాం.
అలా కాకుండా ఉన్నప్పుడు కొన్ని సంభవం!
ఉదాహరణకు ఈ ఫొటో చూడండి.

 

+++

బహుశా, వీళ్లు పూర్తిగా తమ ప్రపంచంలోనే ఉన్నారు.
భార్యలుగా వంటింటి కుందేళ్లుగా కాకుండా మగువలుగా, స్వతంత్రంగా కనిపించారు.
తిరగేసిన బిందెలపై మగువలు.

వీళ్లను అమ్మలక్కలు అని కొట్టిపారేయ గలిగే దృష్టి ఇక్కడ సవరించుకోవాలి.
ఎందుకంటే, అమ్మలక్కల కబుర్లంటే పురుషుడి దృష్టిలో అక్కరకు రానివి.
కానీ, వాళ్లకు పూర్తిగా అవసరమైనవి.
వాళ్ల ప్రైవేట్ లైవ్స్ సెలబ్రేట్ అయ్యేది అక్కడే, ఆ ముచ్చట్లలోనే!

జాగ్రత్తగా చూడండి…
బిందెలు తిరగేసి వాళ్లు కూచున్న విధానం….
ఇది వాళ్ల వ్యక్తిగత రాజ్యం గురించి చెబుతున్నది.
ఒకరితో ఒకరు పంచుకుంటున్న తీరుతెన్నులూ ఉన్నయి.
అన్నీ ఉన్నయి. వాళ్ల వ్యక్తిత్వం, వాళ్లను బిందెలుగా మార్చిన వైనమూ ఉన్నది.
సమ్మక్క సారాలమ్మ… మేడారం జాతరలో తీసిన చిత్రం ఇది.
చూడ ప్రయత్నిస్తుంటే మెలమెల్లగా ఇవన్నీ కానవస్తున్నయి.

+++

 

నిజానికి ఇది కూడా ఒక సగం చిత్రమే.
వాళ్లు అమ్మలక్కలు కూడా కాదు.
పాత్రలు.
పాత్రలు లేని స్థితిమంతులు.
’వాళ్లు.’..
అంతే!
జాతరలో వాళ్లు కలిశారు. అంతకుముందరి మనుషులే. ఆత్మీయులే. బంధువులే.  స్నేహితులే.
కానీ, జాతరలో వారు తమను తాము వ్యక్తం చేసుకున్నారు, ఇలా.
అందుకే ఈ చిత్రం ఒక అపూర్వ చిత్రం- నాకైతే!తమని తాము సరికొత్త పాత్రలుగా చూసుకున్న వైనం, ఈ చిత్రం.
వాళ్లను మనమూ చూడాలి. ఆ పాత్రల్ని తిరగేసి కూచున్న వైనాన్ని నలుగురికీ చెప్పాలి.
అప్పుడే పాత్రోచిత ఛాయచిత్రాల అందం ఏమిటో చూడగలం.ఇక్కడైతే ఎవరూ లేరు. ఏకాంతలు. ఇంకేమీ లేదు.కేవలం స్త్రీలు మాత్రమే.

వాళ్లకు ధన్యవాదాలు.

~ కందుకూరి రమేష్ బాబు

అమ్మ, నేను, సినిమా!

memories-1

నేను ఏడో తరగతి లో ఉన్నప్పుడు మా ఊరికి కరెంట్ వచ్చింది. ఆ తర్వాత రెండేళ్ళకి మా ఊరికి టివి వచ్చింది. కానీ అంతకంటే ముందే నేను చాలా సినిమాలు చూసినట్టు గుర్తు. మా ఊర్లో స్కూల్ కి శెలవులు ఇవ్వగానే అమ్మ మమ్మల్ని అమ్మమ్మ ఊరికి తీసుకుళ్లేది. బహుశా, ఈ సమయానికి నేను స్కూల్ లో రెండో మూడో తరగతి లో ఉండి ఉంటాను. అప్పటికే మా అమ్మను ఎదిరించే ధైర్యం వచ్చింది. అప్పటి రోజుల కొన్ని సినిమా జ్ఞాపకాలు ఇవి.

ఒక రోజు రాత్రి నేను మా పెద్దమ్మ వాళ్లింట్లో నిద్రపోతున్నాను. కొంచెం హడావుడి అవుతుండడంతో లేచి చూశాను. ఏమీ లేదని చెప్పి మా అమ్మ నన్ను పడుకోబెట్టింది. కానీ కాసేపటికి లేచి చూస్తే ఇంట్లో మా అమ్మ లేదు; అలాగే మా ఇద్దరు అక్కలు లేరు. లేచి ఏడవడం మొదలు పెట్టాను. మా పెద్దమ్మ నిజం చెప్పేసింది. నన్ను పడుకోబెట్టి మా అమ్మ వాళ్లు సినిమాకెళ్లిపోయారు. నేను ఊరుకోలేదు. అంత రాత్రి పూట రోడ్డు మీద కి పరిగెత్తాను. కొంచెం దూరం వెళ్లగానే వాళ్ళు వెళ్తున్న రిక్షా కనిపించింది. గోలగోల చేశాను. రోడ్ మీద పడి దొర్లాడాను. మా అమ్మ నన్ను చితక్కొట్టింది. చివరకు మా అక్కవాళ్ళు జాలిపడి నన్ను సినిమాకి తీసుకెళ్లారు. ఆ సినిమా “అందరూ దొంగలే”.

అయితే సినిమా థియేటర్ వెళ్లేలోపే మళ్లీ నిద్రలోకి జారుకున్నాను. ఏమైందో తెలియదు. ఆ సినిమా కథేంటో కూడా గుర్తులేదు. కానీ ఎందుకో రమాప్రభ, పద్మనాభం ఇమేజ్ మాత్రం పోస్టర్ మీద చూసిన గుర్తు. సినిమా అయ్యాక థియేటర్ కి దగ్గర్లో ఉన్న మా బంధువుల హోటల్ కి వెళ్లి ఫ్రిజ్ లోని కూల్ వాటర్ తాగిన విషయం మాత్రం నాకు ఇప్పటికే గుర్తు. అదే మొదటి సార్ నేను చిల్డ్ వాటర్ తాగడం.

*****

ఇలాంటిదే మరో వయొలెంట్ సినిమా అనుభవం గుర్తుంది. మా అమ్మమ్మ వాళ్లందరూ కలిసి నెల్లూరికి దగ్గర్లో ఉన్న పెంచల కోన కి దేవుని దర్శనం కోసం బయల్దేరారు. కానీ నాకు వెళ్లడం ఏ మాత్రం ఇష్టం లేదు. అంతకు ముందు రోజే ఊరిలో సినిమా మారింది. నేను రానని మొండికేశాను. కొట్టారు. తిట్టారు. అయినా చివరికి నా మాటే నెగ్గింది. అందరూ వెళ్ళారు కానీ, మా తాతను నాకు కాపలాగా పెట్టారు. మా తాత కి సినిమాలంటే ఇష్టముండేది కాదో లేక టికెట్ కొనడానికి డబ్బులుండేవి కాదో తెలియదు కానీ నన్ను సినిమా హాల్లో కి పంపించి సినిమా అయ్యాక నన్ను పికప్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చేవాడు మా తాత. అలా మా తాత నన్ను తీసుకెళ్ళిన మొదటి సినిమా పార్వతీ పరమేశ్వరులు.

ఈ సినిమా కథ పెద్దగా గుర్తు లేదు కానీ సత్యనారాయణ, చిరంజీవి ఉంటారని మాత్రం గుర్తుంది. చిరంజీవి వంటింట్లో పాడే ఒక పాట తాలూకు చిత్రాలు లీలగా గుర్తుకున్నాయి.

బహుశా ఆ రోజు పెనుశిల నరసింహ స్వామి నాకు శాపం పెట్టి ఉంటాడు – తనకంటే సినిమానే ఎక్కువైందని. అప్పటి నుంచి ఇప్పటివరకూ చాలా సార్లు పెంచలకోనకి వెళ్దామనుకున్నా ఎప్పుడూ కుదర్లేదు.

29085.png

ఇలాగే మా అమ్మతో గొడవపడి, ఏడ్చి చివరకి మా తాత నన్ను ఓదారుస్తూ తీసుకెళ్ళిన మరో సినిమా శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం.  అప్పటికే మా ఎదురింట్లో ఉండే చంద్రశేఖర్ రెడ్డి అనే పెద్దయన చెప్పగా కొద్దో గొప్పో రామాయణం, భారతం కథలు విని ఉన్నాను. అందుకే రామాయణభారతాలను కలిపిన ఆ సినిమా టైటిలే నాకు గమ్మత్తుగా అనిపించింది. కానీ సినిమాకి సంబంధించిన ఏ విషయాలూ గుర్తులేవు.

నేను చూసిన సినిమాల్లో నాకు బాగా గుర్తున్న మొదటి సినిమా శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. బహుశా అప్పటికే చాలా సార్లు బ్రహ్మం గారి జీవిత చరిత్ర నాటక ప్రదర్శన చూడడం వల్ల, కక్కయ్య, సిద్ధయ్య కథలు కాస్తా తెలిసి ఉండడం చేతనేమో ఈ సినిమా లో సన్నివేశాలు ఇప్పటికీ గుర్తున్నాయి.

అయితే ఈ సినిమా లోని సన్నివేశాలు మాత్రమే కాదు ఆ రోజు సినిమా చూసిన అనుభవం కూడా నాకు బాగా గుర్తుంది.

అప్పట్లో ఈ సినిమా చూడ్డానికి జనాలు బండ్లు కట్టుకుని టౌన్ కెళ్లేవారని మీరెక్కడైనా వినుంటే అది నిజం. అందుకు నేనే సాక్ష్యం. కాకపోతే మరీ ఎద్దుల బండి కాకపోయినా, మా ఊరికొచ్చే డొక్కు ఆర్టీసీ బస్సు లో ఈ సినిమా చూడ్డానికి నేను, మా చెల్లి, అమ్మ, పిన్ని, తమ్ముడు అందరం కలిసి మా అమ్మమ్మ వాళ్ల ఊరికి వచ్చాం. ఎలాగూ వచ్చాం కాబట్టి రెండు సినిమాలు చూసి వెళ్దామనుకున్నాం. కానీ మధ్యలో అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్ళేంత టైం ఉండదు కాబట్టి టిఫిన్ లో పెరుగన్నం, పులిహోర పెట్టుకుని బయల్దేరాం.

టౌన్ కి చేరుకోగానే  మార్నింగ్ షో  బ్రహ్మం గారి సినిమా చూశాక, మధ్యాహ్నం దగ్గర్లోనే ఉన్న పార్క్ లో కూర్చుని భోజనం చేస్తుండగా మాకు తెలిసిన వారెవరో చూసి మా వాళ్లకి విషయం చేరవేశారు. విషయం తెలుసుకున్న మా పెద్దమ్మ కూతుళ్లిద్దరూ పార్క్ కి వచ్చేశారు. మేమింకా బతికే ఉన్నాం, ఇలా పార్క్ లో కూర్చుని భోజనం చెయ్యడమేంటని వాళ్ళు నానా గొడవ చేశారు. మా అమ్మ తో పెద్ద గొడవే పెట్టుకున్నారు. చివరికి వాళ్లమాటే నెగ్గింది. రెండో సినిమా ప్లాన్ క్యాన్సిల్ అయింది. అందరం వాళ్లింటికి వెళ్ళాం. రెండో సినిమా మిస్సయినందుకు నాకు భలే బాధ వేసింది; ఏడుపొచ్చింది. కానీ అప్పటికి కాస్త పెద్దాడయ్యాను కాబట్టి బయటకు ఏడవలేదు.

marana_mrudhangam_Songs

కొన్నాళ్ళకు నన్ను హాస్టల్లో చేర్పించారు. అప్పట్నుంచీ అమ్మతో సినిమా గొడవలే లేవు. అంతా నా ఇష్టమే. కానీ హాస్టల్లో ఉండగా ఒక రోజు నన్ను చూడ్డానికి వచ్చారు అమ్మా, నాన్న. వాళ్లు వెళ్లిపోతుంటే దిగులుగా మొహం పెడితే వెళ్తూ వెళ్తూ విజయనగరంలో మరణ మృదంగం సినిమా చూపించారు. బహుశా అమ్మతో చూసిన చివరి సినిమా ఇదే అనుకుంటా! ఇరవై ఏళ్ల తర్వాత నేను తీసిన సినిమా విడుదలైనప్పుడు చూసి ఫోన్ చేసింది. తీసుకున్న కాన్స్పెప్ట్ కి న్యాయం చేశానని చెప్పి మెచ్చుకుంది.

 

 –వెంకట్ సిద్దారెడ్డి

కోపం జ్వరానికి ‘టాబ్లెట్’ మందు!

yandmuri

చిన్నచిన్న కారణాలకి మీకు తరచూ కోపం వస్తుందంటే దానికి కారణం ఎదుటి మనిషి కానీ, సందర్భం కానీ అయి ఉండదు. అది ఆర్థికపరమైన ఇబ్బందో, లేదా దగ్గరవాళ్ళతో చెడిపోయిన బాంధవ్యమో కావచ్చు. కోపం ఒక జ్వరమైతే దానికి మందు కూడా ఉంది. ఇదే ‘ఫీవర్ అండ్ టాబ్లెట్’ కాన్సెప్టు. ఈ టెక్నిక్ అవలంబిస్తే సగం కోపం తగ్గిపోతుంది.

అతడు ఒక తెలివైన, అందమైన యంగ్ ఎగ్జిక్యూటివ్. పేరు రాకేష్. వయసు పాతిక. జీతం 75 వేలు. ఏ దురలవాట్లూ, వ్యసనాలూ లేవు. అందంగా, అంతకన్నామించి హుందాగా వుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, అతడు పెళ్ళికి  ప్రపోజ్‌ చేస్తే ‘నో’ చెప్పే అభ్యంతరాలు సాధారణంగా ఏ అమ్మాయికీ వుండవు.!

అతడు తన వితంతు తల్లితో కలిసి జీవిస్తున్నాడు. వాళ్ళిద్దరూ తల్లీ కొడుకుల్లా వుండరు. స్నేహితుల్లా వుంటారు. దాదాపు ప్రతివిషయమూ అతడు తల్లితో చెప్తాడు. అటువంటిది క్రమక్రమంగా మారిపోయాడు. వారం రోజుల్లో విపరీతమయిన మార్పు వచ్చింది. తిండి తగ్గిపోయింది. చిరాకు ఎక్కువైంది. ప్లేటు తోసేస్తున్నాడు. తల్లిపై విసుక్కుoటున్నాడు.

అతడిని అంత కలవరపరిచే విషయం ఏమైవుంటుందా అని తల్లి అతడి స్నేహితుల దగ్గర ఎంక్వయిరీ చేసింది. అప్పుడొక సంగతి బయటపడింది. వాళ్ల ఆఫీసులో త్వరలో జరగబోయే రిట్రెంచ్‌మెంట్ గురించి అతని తోటి ఉద్యోగస్తుడు ఆమెతో చెప్పాడు. నష్టాల దృష్ట్యా ఆఫీసులో స్టాఫ్‌ని తగ్గించి వేస్తున్నారు. అందులో రాకేష్ కూడా వుండొచ్చు.

ఇలా విషయం నాన్చితే లాభంలేదని ఆమె ఒకరోజు అతడిని మందలించింది. మాట మీద మాట పెరిగింది. వారి వాదనలు తారాస్థాయికి చేరుకున్నాయి. “….ఉంటుందో లేదో తెలియని ఉద్యోగం కోసం నిద్రా, భోజనం మానేయటం మంచిది కాదు బాబూ. ఉద్యోగం పోయినా పర్వాలేదులే…” అంటూ ఓదార్చడానికి ప్రయత్నించింది. కొడుకు నిర్ఘాంతపోయాడు. అంత కోపంలోనూ నవ్వొచ్చింది. ఎందుకంటే, ఈమాత్రం ఉద్యోగం తనకి ఎక్కడైనా దొరుకుతుందని అతడికి తెలుసు.

“నా దిగులుకి కారణం నా ఉద్యోగం అని నీకెవరు చెప్పారు?” అన్నాడు. ఈసారి విస్మయం చెందటం తల్లి వంతయింది. అసలు కారణం అతడు చెప్పటం ప్రారంభించాడు.

అతని చిరాకుకి కారణం అదికాదు.   అతడు పనిచేసే ఆఫీసు ఎదురు బిల్డింగ్‌లో స్వప్న అనే మల్లెతీగ స్టెనోగ్రాఫర్‌గా పనిచేస్తోంది. ఆమె గగనజఘన. నితంబిని. ‘చాలెంజ్’ అనే మా సినిమాలో సరస్వతీపుత్రుడు వేటురివారు ఒక పాట వ్రాశారు. మందగమన, మధుర వచన, గగన జఘన, సొగసు లలనవే… అని! గగనం అంటే ‘శూన్యము’ అనీ, గగనజఘన అంటే ‘నడుము లేనిది’ అనీ అర్ధం. నితంబిని అంటే ఎత్తైన పిరుదులు కలది. నితంబినులు సహజంగా మందగమనులు. కానీ కవి కల్పనలో, గగనజఘనలు కూడా మందగమనలు అవటం ఒక గొప్ప ప్రయోగం. తెలుగు మర్చిపోతున్న యువతకి మన భాషలో ఉన్న సొగసులు చెప్పటం కోసమే ఈ అప్రస్తుత ప్రసంగం.  తిరిగి సబ్జెక్ట్‌ లోకి వస్తే…

ఆమె తనకి అన్ని విధాలా సరిపోతుందనుకొన్నాడు. ఆ విషయమై ఆమెతో మాట్లాడాలని  లంచ్‌కి ఆహ్వానించాడు. పెళ్ళికి ముందు సినిమాలూ, పార్కులూలాంటి డేటింగ్ విధానాన్నిఅతను నమ్మడు. మర్యాదపూర్వకంగా లంచ్‌కి ఆహ్వానించి, తన ఇష్టం గురించి అక్కడ చెప్పాలనుకున్నాడు. “మీరు నాతో లంచ్‌కు వస్తారా?” అని అతడు అడుగుతుండగానే ఆమె కఠినమైన స్వరంతో “తరువాత మాట్లాడతాను” అంటూ ఫోన్ ‘టప్‌’మని పెట్టేసింది. ఆ తరువాత మళ్ళీ ఫోన్ చేయలేదు.

అదీ సంగతి.

Picasso-rug-femme-au-chapeau-1-768x1024

అంతా విన్న అతడి తల్లి నమ్మలేనట్లు ‘ఇంత బలహీనమయిన మనసా నీది’ అన్నట్టుగా అతడి వైపు చూసి, “ప్రేమించిన అమ్మాయి  కాదంటే భోజనం మానేసి ఏడుస్తావా?” అని అడిగింది.

“నేనామెను ప్రేమించలేదు. పెళ్ళి జరుగుతుందో లేదో తెలియకుండా ప్రేమించేసేటంత బలహీనత నాలో లేదు. ఆమె కూడా ఇష్టపడితే, నా ఇష్టాన్ని ప్రేమగా మార్చుకుందామనుకున్నాను. అంతే.”

“మరెందుకు బాధ?”

“నా అహం బాగా దెబ్బతిన్నదమ్మా! ఆమెని మర్యాదగా మధ్యాహ్నం లంచ్‌కి పిల్చానే తప్ప రాత్రి ‘పబ్’కి కాదు! కనీసం డిన్నర్‌కి కూడా కాదు. ఇష్టం లేకపోతే చెప్పొచ్చు కదా. అంత విసురుగా మొహం మీద కొట్టినట్టు ఫోన్ పెట్టెయ్యటం ఎందుకు?” సున్నితమైన చోట దెబ్బతగిలినట్టు అన్నాడు. అదీ కథ.

మనసుకి దెబ్బ తగిలింది. నిజమే. కానీ దాన్ని తల్లి మీద కోపంగా చూపించటం ఎందుకు? దీన్నే  ఫీవర్ అంటారు. ఫీవర్ అంటే  జ్వరం. అందరూ అనుకొనే జ్వరం కాదు. మానసికశాస్త్రంలో దానికి మరో అర్థం వుంది. F అంటే ఫ్యాక్ట్  (నిజం), E – అఫెక్ట్  (ప్రభావం), V-వెంటిలేషన్  (బహిర్గతం) , A-ఎమోషన్ (భావోద్రేకం), R- రిజల్ట్ (ఫలితం).

పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనిషి మెదడుకి చేరుకునేది రియాలిటి (వాస్తవం). మెదడు దాన్ని ఎలా స్వీకరిస్తుంది అనేది ఎఫెక్టు (ప్రభావం). రోడ్డు పక్కన రాయి వుండటం వాస్తవం. దాన్ని ఒకరు కాలితో తన్నవచ్చు. మరొకరు భగవంతుడిగా పూజించి ప్రార్థించవచ్చు. చైనా దేశపు షాంగై నగరంలో క్యాడ్బరీస్ చాక్లెట్ మధ్యలో జీడిపప్పు అద్దినట్టూ తేలు పెట్టి అమ్ముతారు. అక్కడ దానికి చాలా డిమాండు. మనకి..?

వాస్తవం ఒకటే. ప్రతిస్పందన వేరు. ‘ఫీవర్’ లో రెండో అక్షరం E కి అంత ప్రాముఖ్యత  వుంది.

దాని తరువాత అక్షరం V. వెంటిలేషన్. తన మీద పడిన వాస్తవపు ప్రభావాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క  విధంగా బహిర్గత పరుస్తారు. కొందరు కోపంతో అరుస్తారు. కొందరు ఏడుస్తారు. మరి కొందరు తమ చీకటిగుహల్లోకి  నిశ్శబ్దంగా వెళ్ళిపోతారు. దాన్నే ఎమోషన్ అంటారు. కొందరు వ్యక్తుల్లో దీని తీవ్రత ఎక్కువ వుంటుంది. ఎమోషన్స్(E) ని (భావోద్వేగాలు) కంట్రోలులో పెట్టుకొకపోతే రిలేషన్స్(R) దెబ్బ తింటాయి. రాకేష్‌కీ అతడి తల్లికీ ఆ విధంగానే కలిగింది. ‘మూలం’ అమ్మాయి తిరస్కారం. దాని ప్రభావం ‘తల్లిపై అసహనం’. మరి దీనికి పరిష్కారం?

టాబ్లెట్. ఈ జ్వరానికి విరుగుడే TABLET. ఫీవర్‌ని తగ్గించే టాబ్లెట్ కాదు. దీని అర్థం వేరే. T అంటే టేబిలింగ్ (అమర్చు), A- ఆక్సెస్ (విశ్లేషించు), B- బ్రౌజ్ (వెతుకు), L- లొకేట్ (పట్టుకో ), A- ఎన్‌కౌంటర్  (చంపు), T- టెర్మినేట్ (శాశ్వతంగా నాశనం చెయ్యి).

బుద్దుడి యోగము కూడా ఇదే! రోగము- కారణము- ఔషధము- నాశనము! మన భావోద్రేకాలకీ, మూడ్ బావోలేకపోవటానికి, దుఃఖానికీ, కోపానికీ, అసహనానికీ కారణం వేరే ఎక్కడో వుండవచ్చు. ముందు దాని మూలాన్ని వెతికి పట్టుకోవాలి. దానికోసం తన సమస్యలన్నిటినీ టేబిల్‌పై పరచి చూడాలి. రాకేష్ బాధకి కారణం అతడి తల్లి అనుకొన్నట్టు ఉద్యోగభయం కాదు. ప్రేమ విఫలం. టేబ్లింగ్ చేయటం అంటే అదే. ఒక్కొక్క కారణాన్నీ ఆవిధంగా విశ్లేషించి, అసలు దాన్ని పట్టుకోవాలి.

కారణం అమ్మాయే! సందేహం లేదు. కానీ ప్రేమ తిరస్కరించటం కాదు. అమర్యాదగా ఫోన్ ‘టప్’ మని పెట్టెయ్యటం! అతడి అహం అక్కడ దెబ్బతిన్నది. అంతవరకూ అతడితో అంత అమర్యాదగా ఎవరూ ప్రవర్తించలేదు. అతడి సంస్కారానికి అదొక దెబ్బ, అందుకే అది తలచుకొని అతడెంతో కుమిలి పోయాడు. అతడికి అంత కోపం రావటానికిగల పరిస్థితులన్నిటినీ సమీకరించి చూడాలి (Table). ఆ విధంగా మూలకారణపు అసలు అంశాన్ని బ్రౌస్  చేయాలి. లొకేట్ చేసి ఎన్‌కౌంటర్ చేసెయ్యాలి! విషయం తెలియకుండా నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపినా ఏం లాభం? సమస్య అలాగే ఉంటుంది. బాధ  మిగిలిపోతుంది. దానికన్నా అటోఇటో తేల్చేసుకోవటమే మంచిది కదా! చాలా మంది సమస్యని తేల్చరు. పరిష్కారం అంటే భయం! సమస్యకి దూరంగా నిలబడి బాధపడుతూనే వుంటారు. దీన్నే ‘ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ‘ అంటారు. ఆ అమ్మాయి ఆఫీసుకి ఫోన్ చేసి విషయం ఏమిటో కనుక్కోమని కొడుకుని తల్లి వత్తిడి చేసింది (Access). అతడా అమ్మాయి ఆఫీసుకి వెళ్ళాడు. అయితే ఆ అమ్మాయి ఆఫీసులో లేదు. పది రోజులు సెలవు పెట్టింది. బహుశా పెళ్ళికోసం అయివుంటుంది అనుకొన్నాడు.

“నాతో లంచ్‌కి  రావటం ఇష్టం లేకపోయినా, ఇప్పటికే వివాహం నిశ్చయమై పోయినా, ఆ విషయం మామూలుగానే చెప్పొచ్చుకదా ! నేనొక విలన్‌ని  అయినట్టు అలా మొహంమీద విసురుగా ఫోన్ పెట్టెయ్యటం దేనికి?” అని అడగాలని అతడి ఉద్దేశం.

ఇంటి దగ్గర వివరాలు కనుక్కుంటే ఆమె హాస్పిటల్‌లో ఉందని తెలిసింది (Browse). ఆలస్యం చేసే కొద్దీ దిగులే మిగుల్తుందనీ, నిరంతరం దుఃఖం కన్నా- అటోఇటో తేల్చుకొని, ఆ  దుఃఖకారణాన్ని నిర్మూలించటం మంచిది కదా (Locate), వెంటనే వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడదామని (Encounter) అతని తల్లి ప్రోత్సహించింది. వాళ్ళు హాస్పిటల్‌కు వెళ్ళారు(Terminate).

అతడిని చూడగానే ఆమె మొహం విప్పారింది. అతను ఫోన్ చేసినప్పుడే, అతని మనసులో ఆలోచన ఆమెకి తెలిసిపోయింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. ఈలోపు బాస్ ఇంటర్‌కమ్‌లో అర్జెంటుగా డిక్టేషన్ తీసుకోవటానికి పిలవడంవల్ల కంగారుపడి “తర్వాత మాట్లాడతాను” అని ఫోన్ పెట్టేసింది. ఆమె గొంతులో ఆ రోజు కనపడిన తొందరని అతడు తిరస్కారంగా అపార్ధం చేసుకున్నాడు. ఫోన్ పెట్టేసిన అమ్మాయి ఆకాశంలో పక్షిలా ఎగురుతూ క్రిoదమెట్లు చూసుకోలేదు. జారిపడడంతో కాలు విరిగి ఆస్పత్రిలో జాయిన్ అయింది. తల్లీకొడుకులు వెతుక్కుంటూ వెళ్ళినందుకు సినిమా లెవెల్లో కధ సుఖాంతమయింది.

ఇతరుల్ని మనం అపార్థం చేసుకుంటే వారిపై మనకి వచ్చేది కోపం. మనల్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే కలిగేది ‘దుఃఖం’. కోపమూ, దుఃఖమూ మనిషికి వచ్చే మానసిక రోగాలు.

దేవుళ్ళు సైతం కోపానికి అతీతులు కారు. శివుడు ఆగ్రహిస్తే ఎదుట ఉన్నది ఎంతటి వారైనా శాపం తప్పదు. మహా విష్ణువు సైతం భావావేశానికి లోనయి మొసలి బారి నుండి ఏనుగును కాపాడే తొందరలో సిరికిన్ చెప్పడు… శంఖ చక్ర యుగమున్ చేదోయి సంధింపడు. ఆయుధాలను సైతం తీసుకువెళ్ళడం మర్చిపోయాడు.

భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకుంటే బీ.పీ. వస్తుంది. అలా అని వాటిల్ని అధికంగా ప్రదర్శిస్తే హార్ట్ ఎటాక్ వస్తుంది. కోపాన్ని ప్రదర్శించకపోతే కొన్నికొన్ని సందర్భాల్లో అవతలివారు మనల్ని అసమర్ధులుగా జమకట్టే ప్రమాదం ఉంది. కానీ ప్రదర్శించటంవేరు, అనుభవించటంవేరు. ఐదు ప్రశ్నలు వేసుకుంటే భావోద్వేగ నియంత్రణ సాధ్యమే.

1. ఎందుకు నాకీ కోపం?

2. నాది కోపమా లేక నిస్సహాయతా?

3. నాకు తరచూ ఈ మధ్య ఇటువంటి స్థితి కలుగుతోందా?

4. ఇలా కాకుండా నేను ఇంకో రకంగా ప్రతిస్పందించే అవకాశం ఉందా?

5. నేనిప్పుడు ప్రవర్తిస్తున్న విధానాన్ని రేపు నా అంతరాత్మ ఒప్పుకుంటుందా?

ఈ ఐదు సూత్రాలు అమలు జరిపి చూడండి. క్రమక్రమంగా మీ ప్రవర్తనలో ఒక అద్భుతమైన మార్పు మీకే తెలుస్తుంది.

– యండమూరి వీరేంద్రనాథ్

 

పుంజుతోక అను ‘Cocktail’ కవిత

పుంజును చేతబట్టుకుని పోతివి దానిని కోయనెంచి, నీ

కంజలులోయి మానవ, దృగంచలమందున నిన్ను బోలు వా

డంజనమేసినన్ దొరకడంచు వచించెద ; యేల నీకు ఆ

వ్యంజనమందు కాంక్ష ? వసివాడని జీవిని చంపుటేలనో

 

పుంజు యొక్క ప్రాశస్త్యమును ఏల గ్రహించవైతివి మానవాధమా? నిజమునకు దానిని పక్షిరాజమనవలె. ఎందుకనినచో అది ప్రాతఃకాలముననే నిన్ను నిద్రలేపును. నీ గృహము ముందున్న ప్రాంగణములోని పురుగుపుట్రలను భక్షించి, నీ ముంగిలిని శుభ్రముగా యుంచును. అది వేయునట్టి రెట్టలను ప్రస్తుతమునకు మరచిపొమ్ము! మరి పుంజునకు కృతజ్ఞుడవై యుండుటకు బదులుగా దాని ప్రాణములను హరింతువా? వివిధ వర్ణముల ఈకలుగల కోడితోకను వీక్షించినచో మనమునందు యెంతటి ప్రసన్నత కలుగునో ఎప్పుడైన ఆలోచించితివా?

 

పుంజు కొనవలెనోయీ

మనము ‘పుంజుకొన’ వలెనోయీ

రంజుగా కనిపించు పుంజుతోకను జూసి                    //పుంజు కొన//

 

గంప కిందా పుంజు గంపెడాశలు రేపు

ఇంపుగా కనిపించి సొంపులెన్నో జూపు                       //పుంజు కొన//

 

రంజకమ్మగు పక్షి రగిలించు మనసులూ

పుంజుతోకను చూసి పులకించు మేనులూ                  //పుంజు కొన//

 

 

తోకను చూసినప్పుడల్లా

ఏకరువు పెట్టాలనిపిస్తుంది ఊహల్ని

రంగులు నిండిన ఇంద్రధనుస్సులా పొంగుతూ

ఎంత అందంగా ఉంటుంది కోడితోక

దేని ఉపయోగం దానిదే సుమా

కోడితోకతో కొండంత లాభం

తోక లేకుంటే కోడిని పట్టటం కష్టం

అందుకే కోడితోకంటే నాకు యిష్టం

 

గందుకెనే మరి నేన్జెప్తున్న యినుండ్రి. పుంజును పట్కోని, పొతం బట్టి, అండుకొని తినంగనె అయిపాయెనా? అరె, దాని కూర దింటుంటె మంచిగుంటది నిజమేగని, గట్లని దాన్ని సంపుకోని తినుడేనా? సక్కదనమున్న దాని తోకను సూస్కుంట యాడాదులకు యాడాదులు గడ్పచ్చు. మజ్జుగ పండుకోని మత్తుల మునిగే లోకాన్ని నిద్రలేపే కొండగుర్తు కోడిపుంజంటె. గందుకెనే మరి కోడిపుంజుల్ని కోస్కోని తినుడు ఆపుండ్రి.

ఏందీ? పెట్టల్ని తింటమంటరా? ఆఁ , గిది జెరంత ఇషారం జేశెతందుకు సందిచ్చే సంగతే.

     ఎలనాగ

 

***

నిద్ర నుండి నిద్రకి

bvv
నిద్రలేవగానే నీ ముందొక ఆకాశం మేలుకొంటుంది
వినిపించని మహాధ్వని ఏదో విస్తరిస్తూపోతున్నట్టు
కనిపించని దూరాల వరకూ ఆకాశం ఎగిరిపోతూ వుంటుంది

ఈ మహాశూన్యంలో నీ చుట్టూ దృశ్యాలు తేలుతుంటాయి
నీ లోపలి శూన్యంలో జ్ఞాపకాలు తేలుతుంటాయి
తేలుతున్న జ్ఞాపకాలు, తేలుతున్న ఇంద్రియాలతో
తేలుతున్న దృశ్యాలలో ఆట మొదలుపెడతాయి

404138

ఇక బయలుదేరుతావు
కాంతినో, చీకటినో నీలో నింపుకొనేందుకూ
నీ చుట్టూ నింపేందుకూ

రోజు ఒక ఆకులా రాలిపోయే వేళ అవుతుంది
పండిన ఆకులాంటి మలిసంధ్య రాలిపోయాక
మోడువారిన చీకట్లో
నిన్ను నువ్వు వెదుక్కోవటం మొదలుపెడతావు

దిగులు నగారా ఎడతెగక మోగుతుంది
జవాబుకోసం మేలుకొన్న నువ్వు
నిన్నటి ప్రశ్ననే మళ్ళీ పక్కలోని పసిబిడ్డలా తడుముకొంటావు

ప్రశ్నరాలిన చప్పుడు వినకుండానే
నువ్వు ఎప్పటిలాగే ఎక్కడికో వెళ్ళిపొతావు

బివివి ప్రసాద్