Archives for 2013

‘రాక్షసులు’ ఎవరు?!

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

‘రాక్షసులు’ ఎవరు?!

ఈ వ్యాసం ప్రారంభించబోయేసరికి, ఉన్నట్టుండి  నేను మళ్ళీ క్రాస్ రోడ్స్ కు చేరా ననిపించింది…!

కిందటి వ్యాసం చివరిలో జాతిభేదాల గురించిన ప్రస్తావనలను ఉదహరించాను. ఆనాటి జాతులు, తెగల సాంకర్యాన్ని అవి సూచిస్తూ ఉండచ్చని అన్నాను. ఆధునిక చరిత్రకారుల రాతలు ఇందుకు సంబంధించిన పురాచరిత్రను నిర్మించుకోడానికి ఏమైనా సాయపడచ్చు అన్నాను.  అలా అనేటప్పుడు, ఆ అంశాలలోకి నేరుగా వెళ్లచ్చునని ఆ క్షణంలో అనిపించింది. తీరా ఈ వ్యాసం మొదలెట్టేసరికి అదంత తేలికనిపించలేదు. ఇందులో విప్పుకుంటూ వెళ్లవలసిన పొరలు చాలానే కనిపించడం ప్రారంభించాయి. తీరా విప్పడం ప్రారంభిస్తే దృక్కోణాలకు సంబంధించి ఎదురయ్యే సమస్యలూ చాలానే కనిపించాయి.  దాంతో ఎటు వెళ్లాలో తోచని స్థితిలో కాసేపు ఉండిపోవలసివచ్చింది. చివరికి దగ్గరి దారి కాకుండా దూరపు దారి పట్టడం తప్పదన్న నిర్ణయానికి వచ్చాను.

రాక్షసులు, అసురులు, దానవులు, దైత్యులు అనే మాటలు మనకు బాగా తెలుసు. వీటి మధ్య స్వల్పంగా అర్థభేదాలు ఉండచ్చు కానీ వీటన్నిటినీ మనం రాక్షసులు అనే ప్రసిద్ధ అర్థంలోనే తీసుకుంటూ ఉంటాం. మన పురాణ, ఇతిహాస కథలు; వాటి ఆధారంగా తీసే సినిమాల పుణ్యమా అని  రాక్షసుల గురించి మనలో కొన్ని ఊహలు స్థిరపడిపోయాయి. వారు భారీ ఆకారంతో చాలా వికృతంగా భయంకరంగా ఉంటారు. వాళ్ళకు కొమ్ములు, కోరలు ఉంటాయి. వాళ్ళు మనుషుల్ని తినేస్తారు. వాళ్ళ దగ్గర ఏవో మాయలు ఉంటాయి. రాక్షసులను ఇలా ఊహించుకోవడంలో మనలో పెద్దవాళ్ళు, పండితులూ కూడా పసివాళ్లు అయిపోతూ ఉంటారు. ఇటువంటి రాక్షసులు నిజంగానే ఉండేవారని వారు నమ్మడమే కాక మనల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. మహాభారతంలో నరమాంసభక్షణ చేసే రాక్షసజాతికి చెందినదిగా చెప్పే హిడింబ నరుడైన భీముని వరించడమే కాక అతనివల్ల కొడుకుని కూడా కంటుంది. అయినాసరే, ఆమె రాక్షసియే!

వేల సంవత్సరాలుగా సంస్కృతి, సారస్వతం, మతం వగైరాలు మన ఆలోచనలపై ముద్రించే నమ్మకాలు ఎంత బలీయంగా ఉంటాయో తెలుసుకోడానికి ఇది కూడా ఒక నిదర్శనం. ఇలాంటి నమ్మకాల చరిత్రను తవ్వుకుంటూ కాస్త లోపలికి వెడితే వాటి వెనుక ఉన్న హేతుత్వం అర్థమవుతుంది. కుక్కను చంపాలంటే మొదట దానిమీద పిచ్చికుక్క అనే ముద్ర వేయాలని నానుడి. అలాగే ఒకప్పుడు(బహుశా ఇప్పుడు కూడా) శత్రువు మీద; లేదా భిన్న ఆచారవ్యవహారాలు పాటించేవారి మీద  అలాంటి ముద్రలే వేసేవారు. ఆ విధంగా జాతి వాచకాలు ఎన్నో తిట్టుపదాలుగా, అవహేళన పదాలుగా మారిపోయాయి. ‘అప్రాచ్యులు’ అనే మాటనే తీసుకోండి. తూర్పుదేశానికి చెందినవారు కారనే దాని సామాన్యార్థం. కానీ అదిప్పుడు తిట్టుపదంగా, అవహేళన వాచకంగా మారిపోవడం మనకు తెలుసు. అలాంటివే మ్లేచ్ఛుడు, పిండారీ లేదా పింజారీ వగైరా మాటలు.

cambell

‘రాక్షసులు’ అనే మాట కూడా అలాంటిదే. ఇంకా విశేషం ఏమిటంటే, శత్రువుపై రాక్షసులుగా ముద్రవేసే ప్రక్రియ పురాచరిత్రలో ఒక నిర్దిష్టసందర్భంలో ప్రారంభమైంది. అంతకన్నా విశేషం ఏమిటంటే, ఆ ప్రక్రియ కేవలం మనదేశంలోనే కాదు; ప్రపంచంలో అనేక చోట్ల జరిగింది. ప్రపంచ పురాణ గాథలను అనేక ఆధునిక వనరుల సాయంతో, అనేక కోణాలనుంచి విశ్లేషిస్తూ నాలుగు బృహత్సంపుటాలను వెలువరించిన జోసెఫ్ క్యాంప్ బెల్ అనే పండితుడు దీని గురించి Occidental Mythology అనే సంపుటంలో చర్చించాడు. పూజారులు ప్రయోగించిన ‘పౌరాణిక అపకీర్తికర చర్య’ (Mythological Defamation) గా దీనిని వర్ణించిన క్యాంప్ బెల్, ప్రధానంగా దీనిని పాశ్చాత్య మతశాస్త్రకారులు ఎక్కువగా ఉపయోగిస్తూ వచ్చినా, మిగతా చోట్ల కూడా కనిపిస్తుందంటాడు. ఒక బాబిలోనియా పురాణగాథను విశ్లేషించే సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆ పురాణగాథ సంగ్రహంగా ఇదీ:

తియామత్, అప్సు అనే ఆది దంపతులు ఉంటారు. తియామత్ మన జగజ్జనని లాంటి దేవత. వారి కుమారుడు ముమ్ము. అప్పటికి ఇంకా ఆకాశాదేవత, భూదేవతల నియామకం జరగలేదు. పచ్చిక భూములు లేవు. అంతా జలమయం. తియామత్, అప్సుల వల్ల దేవతలు ఉద్భవించినా వారికి ఎలాంటి బాధ్యతలూ అప్పగించలేదు. ఇదొక అద్వైత స్థితి. కొంతకాలానికి ఇద్దరికి అధికారమిచ్చారు. అయితే, ఆ తర్వాత ఆ దంపతులు సృష్టించిన మరో ఇద్దరు తెలివిలో, స్థాయిలో మొదటి ఇద్దరినీ మించిపోయారు. వీరికి కలిగిన సంతానం వారిని కూడా మించిపోయి చివరికి జగజ్జననితోనే యుద్ధానికి దిగి ఆమెను, ఆమె మరో సంతానాన్ని ఓడించారు. ఈ యుద్ధంలో గెలుపొందిన దేవతల పక్షానికి  మర్దుక్ అనే దేవుడు నాయకత్వం వహించాడు.

క్యాంప్ బెల్ ప్రకారం, మాతృస్వామ్యంపై పురుషస్వామ్యం విజయాన్ని సంకేతించడంతో సహా ఈ కథ వెనుక చాలా విశేషాలు ఉన్నాయి. అంతా జలమయంగా ఉన్న ఆదిమకాలపు అద్వైతస్థితినుంచీ, నిష్క్రియతనుంచీ మనిషి బయటపడి, భూమిని స్వాధీనం చేసుకుని, దానిని ప్రధాన ఉత్పాదకవనరుగా చేసుకున్న క్రమాన్ని ఈ కథ సూచిస్తుంది. అంతేకాదు, రాజ్యం పుట్టుకను, వీరపురుషుల ఆవిర్భావాన్నీ కూడా ఇది వెల్లడిస్తుంది. క్యాంప్ బెల్ ఈ కథ వెనుక గల చారిత్రక నేపథ్యాన్ని తేదీలతో సహా సూచించడం మరింత ఆసక్తిదాయకం. క్రీ.పూ. 3000 సంవత్సరం నాటికి మెసపొటేమియా ఉత్తరప్రాంతం నుంచీ, సైరో-అరేబియా ఎడారి నుంచీ వచ్చిన సంచారజీవులైన దురాక్రమణదారులు రాజ్యాలు స్థాపించడం; క్రీ.పూ. 2500 నాటికి వీరు మెసపొటేమియాను ఆక్రమించుకోవడం ఈ కథకు పూర్వరంగం అని ఆయన అంటాడు. అన్ని వివరాలలోకీ ఇప్పుడు వెళ్లలేము కానీ, ఒక నూతన సామాజిక వ్యవస్థ ఆవిర్భాన్నీ, ఒక నూతన మనస్తత్వాన్నీ, మనిషి ఆలోచనలో, అనుభూతిలో కలిగిన ఒక నూతన నిర్మాణాన్నీ పౌరాణికపు ముసుగులో ఈ కథ సూచిస్తుందని క్యాంప్ బెల్ అంటాడు. మన ప్రస్తుతాంశానికి సంబంధించి అంతకంటే ముఖ్యంగా, శత్రుప్రజలు కొలిచే దేవతలపై రాక్షసులన్న ముద్రవేయడం (అంటే, శత్రుప్రజలను కూడా రాక్షసులుగా  చిత్రించడమే),  విశ్వంపై తమ దేవతల గుత్తాధిపత్యాన్ని స్థాపించడం, అందుకు అవసరమైన పురాణ కథలను సృష్టించడం ఇందులో భాగమని ఆయన అంటాడు. రాక్షసులను నిర్వీర్యులుగా, దుష్టశక్తులుగా; దేవతలను ఉన్నతులుగా, ధర్మపరులుగా చిత్రించడం ఇక్కడితోనే మొదలైందని కూడా అంటాడు.

joseph-campbell-power-of-myth

క్యాంప్ బెల్ ను ఉటంకించుకునే సందర్భాలు ముందు ముందు చాలావస్తాయి. దానినలా ఉంచితే, ఆయన పాశ్చాత్యుడు కనుక పై పౌరాణిక ప్రక్రియ పాశ్చాత్యంలోనే ఎక్కువగా జరిగిందని ఆయనకు అనిపించి ఉండచ్చు. కానీ మన పురాణ ఇతిహాసాలలోనూ దీని సామ్యాలు అచ్చుగుద్దినట్టు కనిపించి ప్రపంచపురాణకథల మధ్యగల పోలికలను ఆశ్చర్యకరంగా వెల్లడిస్తాయి. ఈ సందర్భంలో, ఒకే రకమైన పురాణకథలు ప్రపంచమంతటా వ్యాపించాయన్న క్యాంప్ బెల్ సూత్రీకరణనూ దృష్టిలో ఉంచుకోవాలి.

మన పురాణ ఇతిహాసాల ప్రకారం, దేవతలు, రాక్షసులు, పక్షులతో సహా సమస్త జీవరాశీ కశ్యపుడు అనే ప్రజాపతి సంతానం. దక్షుడు అనే మరో ప్రజాపతి; అదితి, దితి, దను, కాల మొదలైన పదముగ్గురు కూతుళ్లను కశ్యపునికి ఇచ్చాడు. కశ్యపునికి అదితి వల్ల ఆదిత్యులు అనగా దేవతలు, దితి వల్ల దైత్యులు అనగా రాక్షసులు, దనువల్ల దానవులు కలిగారు. దైత్యులను, దానవులనూ కూడా మనం స్థూలంగా రాక్షసులుగానే చెప్పుకుంటాం. దీని ప్రకారం దేవతలు, రాక్షసులు ఒకే తండ్రికి పుట్టిన సంతానం, అంటే సోదరులన్నమాట. అందుకే రాక్షసులను కూడా దేవతలుగానే గుర్తించిన మన పురాణాలు వారిని పూర్వ దేవులని, పూర్వ గీర్వాణులనీ అన్నాయి. అయితే ఈ సోదరుల మధ్య శత్రుత్వం ఏర్పడింది. యుద్ధాలు జరిగాయి. అవి దేవాసురసంగ్రామాలుగా ప్రసిద్ధి కెక్కాయి.

గమనించండి…పైన చెప్పిన బాబిలోనియా పురాణకథలో జరిగింది కూడా అదే. తియామత్, అప్సు అనే ఆది దంపతులకు కలిగిన తొలి సంతానమైన దేవతలతో మలిసంతానమైన దేవతలు శత్రుత్వం వహించారు. యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో తియామత్ తొలి దేవతల పక్షం వహించింది. ఆ పక్షం ఓడిపోయింది. విజేతల పక్షం పరాజిత పక్షంపై రాక్షసులన్న ముద్ర వేసింది. నిజానికి మన పురాణకథలలోని రాక్షసుల లానే వారు కూడా పూర్వదేవులే నన్నమాట. బాబిలోనియా కథను తియామత్ పరంగా, అంటే మాతృస్వామ్యపరంగా చెబితే; మన పురాణ కథను కశ్యపుని పరంగా, అంటే పితృస్వామ్యపరంగా చెప్పారు. అంటే అప్పటికి మాతృస్వామ్యం స్థానంలో పితృస్వామ్యం ఏర్పడిందన్న మాట. ఆవిధంగా చూసినప్పుడు బాబిలోనియా పురాణ కథ మన పురాణకథల కన్నా ప్రాచీనం అనిపిస్తుంది. ప్రస్తుతం ఆ కోణంలోకి లోతుగా వెళ్లలేం.

ఈవిధంగా శత్రువులైన దాయాదులపై రాక్షసులుగా ముద్ర వేయడం అనేది క్రమంగా శత్రువులైన ఇతర జాతులకు, తెగలకు విస్తరించడంలో ఆశ్చర్యం లేదు. ఆ క్రమంలో పరాజితులైన శత్రువుల జాతివాచకాలు కూడా తిట్టు పదాలుగా, ఆక్షేపణ వాచకాలుగా మారిపోయాయి. ప్రస్తుత సందర్భంలో ‘దాసులు’ అనే మాట కూడా అలాంటిదే. ఆ మాట ఒకప్పుడు జాతివాచకం మాత్రమే. క్రమంగా అది నిందార్థకంగా మారింది. దాని గురించి మరింత వివరంగా చెప్పుకునే ముందు ఇంకో విషయం చెప్పుకోవాలి.

ఆయా అంశాలను కప్పిన పొరలు విప్పుకుంటూ వెడితే దృక్కోణాలకు సంబంధించిన సమస్యలూ చాలానే ఎదురవుతాయని పైన అన్నాను. రాక్షసులు అనే మాట ఒకే వర్గానికి చెందినవారి గుణ గుణాలలో తేడాను చూపించే గుణవాచకమే తప్ప జాతి వాచకం కాదని కొందరు అనవచ్చు. అలాగే, దేవతలు అనే మాట సత్వగుణాన్ని సూచిస్తుందనీ, రాక్షసులు అనే మాట తమోగుణాన్ని సూచిస్తుందనీ అంటూ ఆ మాటలను భౌతికస్థితినుంచి తప్పించి వేదాంత గగనవిహారం చేయించవచ్చు. ఒక కోణంలో అదీ అవసరమే కావచ్చు కనుక దానిని నేను తప్పుపట్టను. అయితే, ఈ ధోరణికి చరిత్రను మూలమట్టంగా నిరాకరించే స్వభావం ఉంది. దాంతోనే చిక్కు వస్తుంది. చరిత్రలో ఆయా సమూహాల మధ్య యుద్ధాలే జరగనట్టు, సోదర జాతుల మధ్య, భిన్న జాతుల మధ్య అసలు ఘర్షణలే జరగనట్టు; అవి పురాణ కథలకు ఎక్కనట్టు ఒక అవాస్తవిక, అసహజ చింతనకు అది దారితీయిస్తుంది. మౌలికంగా సంచారజీవనులైన గుంపుల మధ్య యుద్ధాలు, ఘర్షణలు జరగడం సహజాతి సహజం. పరాజిత పక్షాల జాతి,  లేదా తెగ వాచకాలను విజేతల పక్షం తిట్టుపదంగా, ఆక్షేపణ వాచకంగా మార్చడం అంతే సహజం.

213px-Lord_Brahma_and_Adhiti_-_19th_Century_Illustration

ఇక రెండో సమస్య; ఆర్యులు-అనార్యులన్న విభజనకు సంబంధించినది. ఇది చాలా వివాదాస్పదమైన సమస్య. ఆర్య-ద్రావిడ సిద్ధాంతాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించేవారు ఉన్నారు. అది పాశ్చాత్యచరిత్రకారుల కుట్రగా వీరు అభివర్ణిస్తారు. ఆర్యులు-ద్రావిడులుగా చెప్పబడేవారు మొదటినుంచీ ఈ దేశంలో ఉన్నవారే ననీ;  అసలు ఆర్యులు-ద్రావిడులు అనే విభజనే అర్థంలేనిదనీ, ఆర్యులనే వారు ఎక్కడినుంచో వచ్చారనే సిద్ధాంతం తప్పనీ వీరు అంటారు. చరిత్రకారులు ఎంతోమంది నమ్మే ఆర్య-ద్రావిడ విభజనను గుడ్డిగా సమర్థించాలన్న ఉత్సాహం నాకేమీ లేదు. ఆర్యులు ఎక్కడినుంచో వచ్చారన్న సిద్ధాంతం పరమ ప్రామాణికంగా, వేదవాక్కుగా భావించాలనీ నాకు లేదు. చరిత్ర శోధనా క్రమంలో పై వాదానికి విరుద్ధమైన సాక్ష్యాలు లభిస్తే ఆమోదించడానికి నేనూ సిద్ధమే. సైన్సు లానే చరిత్ర కూడా ఒక నిరంతర ప్రక్రియ. కొత్త పరిశోధనలు పాత సిద్ధాంతాలను త్రోసి రాజనే అవకాశం ఇక్కడా ఉంటుంది. అయితే, ప్రధానసమస్య ఏమిటంటే; ఆర్య-అనార్య లేదా ద్రావిడ సిద్ధాంతాన్ని వ్యతిరేకించేవారివైపు చరిత్ర శూన్యత ఉండడం. కనీసం దానిని ప్రామాణిక చరిత్రశూన్యతగా చెప్పచ్చు. రెండోవైపు, సమగ్రమో, అసమగ్రమో  చరిత్ర ఉంది. కనుక నేను నిర్దిష్టమైన ఇలాంటి అభిప్రాయభేదాల జోలికి వెళ్లకుండా ఒకనాటి సమూహాల సంచారజీవనం, ఆ క్రమంలో భిన్న సమూహాల మధ్య జరిగిన యుద్ధాలు, ఘర్షణల అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే చరిత్ర ఆకరా(సోర్సు)లను వాడుకోడానికి ప్రయత్నిస్తున్నాను.

మిగతా అంశాలు తర్వాత…

–కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

ఎక్కడి నుండి ఎక్కడి దాకా ? 3 వ భాగం

( గత వారం తరువాయి)

3

third week fig-1

వర్షం ఇంకా కురుస్తూనే ఉంది.
చుట్టూ విపరీతమైన మీడియా వ్యక్తుల ఒత్తిడి. టి.వి. ఛానళ్ళవాళ్ళు, పత్రికలవాళ్ళు, ఒక మంత్రి హత్య జరిగింది కాబట్టి జాతీయస్థాయి టి.వి. వాళ్ళు..ఒకటే హడావుడి.. ఈ దేశంలో ఇంత స్వేచ్ఛ, యింత మీడియా కవరేజ్‌, యింత అతి ప్రవర్తన అవసరమా అని వేయవసారి విసుక్కున్నాడు ఎస్పీ విఠల్‌. గెస్ట్‌హౌజ్‌లో మంత్రిగారి హత్య జరిగిన బెడ్‌రూం ప్రక్కగదిలో కూర్చున్నాడు ఒంటరిగా బోనులో సింహంలా. బయటంతా పోలీసులు వాసన.. హడావుడి.. మంత్రిగారి శవాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించే ప్రయత్నం..మంత్రి బంధువుల రాక..రాళ్ళవానలా..అంతా బీభత్సం.
విఠల్‌లోనుండి విస్కీ మత్తు పూర్తిగా దిగిపోయింది.
‘కథ’ను ఎంత పకడ్బందీగా అల్లినా..డిపార్ట్‌మెంట్‌లో తనకు విధేయులైన చెంచాగాళ్ళను ఎంత మందిని పురమాయించి ఉద్యుక్తుల్ని చేసినా..ఇటువంటివే ఎన్నో హత్యలను తను ఇదివరకు విజయవంతంగా చేసినా..ఎందుకో చిత్రంగా విఠల్‌కు భయం కల్గుతోంది. ఎన్నడూ లేంది.
ఎందుకు.. రాక్షసుడిలాంటి, రాయిలాంటి తనకు భయమెందుకు.
వర్షం బయట ఉధృతంగా కురుస్తున్నా విఠల్‌ ముఖం నిండా అతనికి తెలియకుండానే చెమటపట్టింది.. ఏదో సన్నని వణుకు.
సరిగ్గా అప్పుడు మ్రోగింది విఠల్‌ మొబైల్‌.
”హలో” అన్నాడు. అన్‌నోన్‌ నంబరది.
”విఠల్‌.. అనవసరంగా తొందరపడ్డావ్‌” అటు ప్రక్కనుండి గంభీరమైన నిశ్చలమైన ఓ స్త్రీ గొంతు.
మొదట షాకై..క్షణకాలం తత్తరపడి..తర్వాత అదిరిపడి. మరుక్షణం ఆ కంఠాన్ని లీల స్వరంగా గుర్తించి..కంపితుడై,
”మేడమ్‌..”అన్నాడు ఆందోళనగా.
”ఇలా చేయవలసింది కాదు” అదే స్థిరత్వం గొంతులో. సారీ మేడం..”
”ఇట్సాల్‌రైట్‌.. ఒక ఎంక్వయిరీ కమీషనొస్తుంది..బయట పడ్డానికి ముందు నిన్ను అక్కడ్నుండి ట్రాన్స్‌ఫర్‌ చేపిస్తా.. నీతో నాకు చాలా పనుంది. ధైర్యంగా ఉండు”
”థ్యాంక్యూ మేడం”
”నువ్వు అళ్లిన కథనే కొనసాగించు. కథ బాగానే ఉంది..ఊఁ. తాగడం బాగా తగ్గించి తక్కువగా మాట్లాడ్డ మంచిదేమో విఠల్‌ నీకు ఊఁ..”
”ఔను మేడం.”
ఫోన్‌ పెట్టేసింది లీల అటువైపునుండి.
నిజానికి విఠల్‌ అప్పుడాక్షణం లీల గొంతువిని అదిరిపడ్డ వణుకునుండి కోలుకోకుండానే..వెంటనే పోలీస్‌ బ్రెయిన్‌తో లీల చేసిన నంబర్‌ను డిస్‌ప్లే చేసి కోడ్‌ చూచుకున్నాడు. 0974.. అని ఉంది. నైన్‌ సెవెన్‌ ఫోర్‌..అంటే దోహా..కతార్‌.,
ఎక్కడో ఓ అరబ్‌దేశంలో ఉన్న లీలకు..తను చేసిన హత్య విషయం ఇంత వివరంగా..ఇంత తొందరగా.,
చటుక్కున విఠల్‌కు జ్ఞాపకమొచ్చింది..మంత్రికీ, తనకూ కలిపి ఆ పవర్‌ ప్రాజెక్ట్‌ రెండువందలకోట్ల రూపాయల కాంట్రాక్ట్‌ను యిప్పించింది లీలేనని. తమ గొడవను సెటిల్‌ చేయమని తనే ఈ మధ్య లీలను సంప్రదించడంకూడా వెంటనే స్ఫురించింది.
విఠల్‌ ఖంగుతిని..’తనెరిగిన కొద్దమంది అద్భుతమైన అతి తెలివితేటలున్న వ్యక్తుల్లో ఈ లీల ఒకతి’ అని ఎందుకో అనుకున్నాడు లిప్తకాలం.. వెంటనే ముఖంమీద పట్టిన చెమటలు తుడుచుకుంటూ.,
జ                జ        జ
విఠల్‌తో మాట్లాడి మొబైల్‌కాల్‌ కట్‌చేసిన లీల టైం చూచుకుంది. దోహాలో ఉదయం ఆరుగంటల పదినిముషాలు.. ఇండియాలో ఎనిమిది దాటింది.
క్షణకాలం చనిపోయిన మంత్రి విశ్వనాధరెడ్డితో ఉన్న లావాదేవీలను పునశ్చరణ చేసుకుంది.. ”పూర్‌ ఫెలో..నోటి దురుసున్న ఒట్టి ఆవేశపరుడు..”అని నిట్టూర్చి..నిర్మలను పిల్చుకుంది లైన్‌లోకి.
”నిర్మలా..ఏమైంది..”
”మీ ప్రోగ్రాం మొత్తం రీషెడ్యూల్‌ చేశాను మేడం. ముందనుకున్నట్టు మీరు ఢిల్లీకి రాకుండా..వాషింగ్టన్‌ వెళ్తారు. రెండు రోజుల స్టే అక్కడ..ఔనా.”
”ఎగ్జాట్లీ..ఫుట్‌ మీ టోటల్లీ ఫ్రీ నిర్మలా”
”ఎస్‌ మేం..యు ఆర్‌ కంప్లీట్లీ రిలీవ్డ్‌.. మీకెవరూ కాల్‌ చేయరు. అన్ని కాల్స్‌ను జామ్‌ చేస్తాను”
”దట్స్‌ గుడ్‌..”
”మీకు ఈ పూటే తొమ్మిదీ పదికి కతార్‌ ఎయిర్‌వేస్‌లో గష్ట్ర.51 ఫస్ట్‌క్లాస్‌లో వాషింగ్టన్‌ డి.సి.కి టికెట్‌ బుక్‌ చేశా మేడం. రిసిప్షన్‌లో ఇ-టికెట్‌ తీసుకోండి.. పదమూడు గంటలు ప్రయాణం. సాయంత్రం యుఎస్‌ టైం నాల్గున్నరకు అక్కడకు చేరుకుంటారు. మేరీల్యాండ్‌లో ఉంటారు మీరు కాబట్టి లోయిస్‌ ఇంటర్‌ కాంటినెంటల్‌ అన్నెపోలిస్‌ హోటల్‌లో డీలక్స్‌ కింగు సూట్‌ మీ పేర బుక్‌ చేయబడి ఉంది. మీకు మన ఏజంట్‌ ప్రకాశ్‌ రిచర్డ్స్‌ అనే డ్రైవర్‌ నిచ్చి ఏర్‌పోర్ట్‌కు కారును పంపుతాడు..”
”థాంక్యూ నిర్మలా..వెల్‌డన్‌”
”హాపీ స్టే మేం..”
”థాంక్యూ”
అటువేపునుండి నిర్మల నిష్క్రమించింది. ఎంత చురుకైన ఎగ్జిక్యూటివో అనుకుంది లీల.

Ekkadi(1)
‘రెండురోజులు..ఫ్రీ..స్వేచ్ఛ..వినీలాకాశంలో ఎగిరే పక్షి తను..’ఎందుకో ఆమె అప్పుడే రెక్కలు మొలుస్తున్న పక్షికూనలా పులకిస్తూ సంబరపడిపోయింది.
‘ఒక అద్భుతమైన టీ తాగితే ఎలా ఉంటుంది.’ అని అనిపించి,
చటుక్కున లేచి.. కిచెన్‌ ఓవెన్‌లోనుండి కంపోజ్ట్‌ టీ..రెండు నిముషాల్లో తెచ్చుకుని..ఎంత గ్రాండ్‌ హోటల్స్‌ ఇవి.. అన్నీ చాచిన చేయికి అందేవిధంగా..లాంజ్‌లోకి వచ్చి..విశాలమైన గాజు కిటికీ సన్నని తెరలనుజరిపి ఎదురుగా గర్జిస్తున్న నీలి సముద్రం..దూరంగా లంగరు వేసిన నౌకలు..పైన ఎర్రగా ఆకాశం..పురిటినొప్పులు పడ్తున్న ప్రకృతి..ఒక సూర్యశిశువు జన్మించాలిప్పుడు..లెట్‌ మీ సీ ఇట్‌.
పసిపిల్లయిపోయింది లీల.
చాలా అనాలోచితంగా. ఆమె టకటకా తన బ్లాక్‌బెర్రీ ఫోన్‌తో ఎంపిఫోర్‌ ట్రాక్‌ చేసి బటన్‌ను ఆన్‌ చేసింది.
తనకెంతో యిష్టమైన ముఖేశ్‌ పాట..’లౌట్‌ కే ఆఁ..లౌట్‌ కే ఆఁ…’
పాట ఒక సముద్ర కెరటమై పురి విప్పుకుని విస్తరిస్తూండగా..టీని మృదువైన పెదవులలో కొద్దికొద్దిగా చప్పరించి.. కళ్ళుమూసుకుని..కుర్చీలో వెనక్కి ఒరిగి..
శరీరంలోనుండి.. ఆత్మ విడివడి వియుక్తమౌతున్నట్టు…ఏదో విభాజ్యమై..ఏదో సంయోగం చెంది..ఎక్కడో ఒక అనుస్పర్శతో పులకించి.. వివశయై.,
తంత్రి మీటబడి..ఒక రసధ్వని పుట్టి..విస్తరిస్తూ..వ్యాపిస్తూ..భాషకందని ఏదో తాదాత్మ్యతలో అన్నీ కోల్పోతూ.. అంతర్ధానమైపోతూ..లీనమైపోతూ..అదృశ్యమైపోతూ,
‘ఎక్‌ ఫల్‌హై హస్‌నా, ఏక్‌పల్‌ హై రోనా
ఏక్‌ పల్‌ హై మిల్నా ఏక్‌ పల్‌ బిచడ్‌నా
దునియాహై దోదిన్‌కా మేలా…’అంటున్నాడు ముఖేశ్‌.
ఎంత సత్యం.. స్థూలంగా జీవితమైవరిదైనా అంతిమంగా అంతా ఇంతేగదా.
మనిషి వెళ్ళిపోయి..పాడిన పాట మిగిలిపోయి..పాటతో ఒక జీవిత సారాంశం చిరస్మరణీయ సంపదగా మిగిలిపోయి.. ఏదోపోయి..ఏదో మిగిలి..అసలు పోయేదేమిటి..చివరికి మిగిలేదేమిటి..నిజానికి పోవడానికిగానీ మిగిలిపోవడానికిగానీ మనిషి దగ్గర ఏదైనా ఉందా. శక్తి నిత్యత్వ సిద్ధాంతం ప్రకారం ఎక్కడైనా వ్యవస్థీకృతమైన శక్తి ఎప్పుడూ స్థిరమేకదా..రూపాలు మారవచ్చుగానీ శక్తి పరిమాణం మారుతుందా..పరిణామక్రమాలు వేరుకావచ్చు కాని రూపాంతరస్థాయిలో నిక్షిప్తమై ఉండే శక్తి స్థిరమూ, శాశ్వతమూ, అనంతమూ ఐ..చివరికి మిగిలేది శూన్యమేగదా.,
పూర్ణమదః పూర్ణమిదః
పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావ శిష్యతే
శూన్యం నుండి శూన్యాన్ని తీసివేసినా, శూన్యానికి శూన్యాన్ని కలిపినా..శూన్యంతో శూన్యాన్ని హెచ్చవేసి, భాగించి.. భిన్న భిన్న సహస్రాంశ సూక్ష్మాలుగా విభజించినా..సత్యమై, నిత్యమై పరిఢవిల్లే పరమ పచ్చి నిజం శూన్యమేకదా-
కళ్ళు మూసుకున్న లీల మనసు సముద్రమై మథనం చెందుతోంది.
నిశ్చలత్వం. అనిశ్చితి..స్థిరత..డోలనం..మథనం..మళ్ళీ ఏకత..ఇదంతా ఏమిటి?
మూసిన కళ్ళవెనుక ఏదో గాఢమైన, లోతైన, సాంద్రమైన..స్పష్టంగా తెలియని ఏదో అవ్యక్తత.,
ఏమిటది..తెలియని ఆ ఏమిటో ఏమిటది.?
అన్వేషణ..లోపల..లోపల్నుండి యింకా లోపలివైపు..’ఎవ్వనిచే జనించు, జగమెవ్వని లోపల నుండు లీనమై..ఆ ‘లోపలివైపు’ ..నక్షత్రాలను చిమ్ముకుంటూ రసోద్విగ్నయానం చేస్తున్న ఆత్మ ఒక ఉల్కవలె విశ్వాంతరాల గర్భాల్లోకి చొచ్చుకొని చొచ్చుకునిపోతూ పతనమౌతున్న క్షణం..ఒక బిందువై జన్మించే అన్వేషణ, వివేచనై.. విశ్లేషణై, విస్తరించి విస్తరించి.. ఉహుఁ.. అర్థంకావడంలేదు..అంతు చిక్కడంలేదు..భౌతికం అభౌతిమై, మిథ్య ఒక వాస్తవమై..సత్యం పరమ సత్యంగా భాసిస్తూ ఋజువుగా అనుభవమౌతున్న మహోద్వేగ క్షణాలు..వ్యక్తీకరించేందుకు భాషకు లొంగుతాయా. అనేక సందర్భాల్లో మనిషి తట్టుకోలేని మహోగ్ర ఉద్విగ్నతలను బయటి ఏ భాషలోనైనా వ్యక్తీకరించలేక ఓడిపోయి..సుళ్ళు తిరుగిపోతూ బిగ్గరగా ఏడ్చి.. పిచ్చిగా నవ్వి.. పొంగి పొర్లి తుఫానులా తల్లడిల్లిపోయిన అనుభవాలు ఎందరికి లేవు.
ఐతే.. ఈ అంతర్‌లోకాంతరాల్లోకి తొంగి చూడగల సంస్కారం, తత్వం, అభిరుచి ఎందరికుంటుంది..దీన్నేుకృతమంటారా. కృతాలూ, దృష్టాలూ..ఇవన్నీ ఏమిటి..సుకృతాలూ, కనబడని అదృష్టాలూ ఏమిటి..అసలీ కనబడడం, కనబడకపోవడమేమిటి. చూపు, దృష్టి ఏమిటి.. ఉందీ అంటే కనబడడమా. లేదూ అంటే కనబడకపోవడమా. కనబడనివన్నీ లేనట్టా. సమస్త విశ్వాంతరాల చుట్టూ క్షేత్రమై వ్యాపించి ఉన్న ఏ శక్తితరంగాలూ కంటికి కనబడ్డం లేదు కదా. అంతమాత్రాన అవి లేవని నిర్ధారించలేముకదా. ఉన్నాయని మన రేడియో తరంగాలు, విద్యుదయస్కాంత తరంగాలు, అనేక వర్గీకరణలకు చెందిన కాంతి తరంగాలు..ఇవన్నీ తమ అద్భుత చర్యలతో ప్రమేయాలై ఋజువు చేస్తున్నాయికదా. మనిషికి తెలిసిన ఈ కొద్ది అదృశ్య తరంగశక్తులు కాకుండా..మనిషి ఇంకా పసికట్టని అనేకానేక వింత శక్తి స్వరూపాలు ఈ సృష్టిలో ఇంకెన్నున్నాయో.
హృదయ తరంగాలుంటాయా..ఒక మనిషి తనకు చెందిన ఒక హృదయ పౌనఃపున్యంతో స్పందిస్తున్న మరో మనిషియొక్క హృదయ తరంగాలతో అనుసంధానమై ప్రతిచర్యించగలడా.
వ్చ్‌.. ఏమో,
చీకటే శాశ్వతం..వెలుగే అప్పుడప్పుడు మధ్య మధ్య అతిథిలా వచ్చి ‘దిన’మై మనను భ్రమింపజేస్తోందనే వాదన నిజమేనా. వెలుగును విశ్లేషిస్తే ఏడు రంగులుగా విడిపోయినట్టు చీకటిని విశ్లేషిస్తే.. వింతైన అద్భుతాలు బయటపడ్తాయా,
లీల ఒక శ్వాసిస్తున్న సముద్రంలా కళ్ళు మూసుకుని..సమాధియై పోయింది.
ఆకాశపర్యంతం విస్తరించిన ఒక మహావాయుస్తంభనలో తను చిన్న ధూళి కణమై తేలిపోతున్నట్టు..అంతా తేలిక, అగమ్యం. శూన్యోత్సర్గం-
నిశ్శబ్దం..గడ్డకట్టిన నిశ్శబ్దం..అభేద్యమైన నిశ్శబ్దం.
కాలం గడుస్తోంది..ఆమె పూర్తిగా అభౌతికమైపోయింది.
..అప్పుడు మ్రోగింది ఆమె మొబైల్‌ఫోన్‌.
ఉలిక్కిపడి..చటుక్కున ఎత్తి..
నిర్మల
నిర్మల కాల్‌ చేయవలసిన ప్రోగ్రాం ఏమీలేదు. ఐనా ఎందుకు చేస్తోంది.
”నిర్మలా..”అంది.
”….”జవాబు లేదు. ఏదో గర్ర్‌ర్‌ర్‌మని ధ్వని. లైన్‌ డిఫెక్టివ్‌.,
”నిర్మలా..”మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది. కొద్దిసేపు ఏవేవో శబ్దాలు వినిపించి ఓ అర నిముషం తర్వాత లైన్‌ తెగిపోయిది. మనసులోనుండి ఏదో ఓ మహాపర్వత భారం తొలగిపోయినట్టయి..,
ఎదురుగా అదే దృశ్యం..నిరంతరంగా సంఘర్షించే సముద్రపు అలలు. నీలి గగనం..నీలి నీరు..మధ్య రగులుకోబోతున్న కొలిమిలా ఎర్రగా నిప్పుముద్ద..సూర్యోద్భవం.
సూర్యోదయం..నిత్యనూతనమైన..అతిసాధారణమైన.. అతి సహజమైన..ప్రాణప్రదమైన, జీవాధారమైన..సూర్యోదయం.
దేవుడున్నాడా.. లేడా.. ఉంటే ఎలా ఉన్నాడు,ఎక్కడున్నాడు, ఆ ఉన్నది ఆడదా, మగాడా, వాడు లేక ఆమె రూపమేమిటి.. వాడి వెనుక మర్మమేమిటి..ఈ మీమాంసను ప్రక్కనబెడ్తే..తన దృష్టిలో ప్రత్యక్షదైవం సూర్యుడే..కనబడేవాడు.. కనిపింపజేసేవాడు.. కనువిప్పుకలిగించేవాడు. సర్వశక్తులకూ శక్తికేంద్రకమై  సకల చరాచర సృష్టికి మూలమై భాసించేవాడు. ప్రధానంగా తనకూ, తన జీవిత రూపకల్పనకు స్ఫూర్తిప్రదాతయై ఒక ఊపిరిగా గుండెల్లో నిత్యమై జ్వలించేవాడు. తన వ్యక్తిత్వ వికాసానికి అజ్ఞాత నిత్యప్రేరకుడు.

third week fig-2
రథస్యైకం చక్రం భుజగయమితా స్సప్తతురగాః
నిరాలంబో మార్గ శ్చరణవికల స్సారథి రవిపి|
రవి ర్యాత్యేవాస్తం ప్రతిదిన మపారస్య నభసః
క్రియాసిద్ధి స్సత్వే భవతి మహతాం నోపకరణే||
ఎంత గొప్ప స్ఫూర్తిదాయకమైన విషయమిది..
ఒంటి చక్రమేగల రథాన్ని అధిరోహించి వచ్చేవాడు..అసలు ఒంటి చక్రం పడిపోకుండా నిలబడ్తుందా..ఒంటి చక్రం నిలబడాలన్నా, నిలబడి పయనించాలన్నా కొంత కనీస భ్రమణవేగాన్ని కలిగి ఉండాలి. లేకుంటే అది కూలిపోతుంది. అంటేకదలిక.. కనీస వేగంతో కూడిన కదలిక జీవిపురోగతికి అత్యంతావశ్యకమని చెప్పడం.. సప్తాశ్వరథమారూఢం.. ఏడు గుర్రాలు తెలుపురంగుకు మూలమైన సప్తవర్ణాలకు ప్రతీకలే ఐనా..ఏడు శక్తులు గుర్రాలవలె వివిధ దిశలలో రథాన్ని.. అంటే మనిషిని లాక్కుపోతున్నపుడు వాటన్నింటిని సమన్వయపరిచి ఏకశక్తిగా..సింగిల్‌ వెక్టార్‌గా రూపొందించుకోవాలి.. అంటే మనిషి తనలో నిబిడీకృతంగా ఉన్న వివిధ శక్తులను గుర్తెరిగి వాటిని సమీకృతపరచుకుని ఏకలక్ష్య గమనంతో గమ్యంవైపు సాగాలి. రథసారధి అనూరుడు. తొడలు లేనివాడు. కనీసవేగంతో ఒంటిచక్రపు రథాన్ని నడుపుతూ, ఏడు గుర్రాలను సమన్వయపరుస్తూ, అదుపులో ఉంచుకుంటూ క్రమశిక్షణతో నిండిన కాలస్పృహతో పయనం సాగించేవాడు. అంటే జీవితమనే గమనానికి సారధ్యం వహించేవానికి అంగవైకల్యం ఏవిధంగానూ ఒక అవరోధం కాదు- అని. గుర్రాలను నియంత్రించే పగ్గాలు.. పాములు. సజీవమైన పగ్గాలు సక్రమంగా పనిచేయాలంటే సమర్థవంతమైన పాలనతో కూడిన నిర్వహణ ముఖ్యం..అందుకు పాటవం కావాలి. అన్నింటినీ మించి ప్రతి దినమూ భూగోళానికంతటికీ సంబంధించి కాలధర్మానికీ, సృష్టి నియమాలకూ లోబడి నియమిత ప్రాంతంలో, నియమిత కాలంలో సూర్యుడక్కడకు చేరి, విధులను నిర్వర్తించి ఉదయాస్తమయ ధర్మాలను పాటించాలి.. ఒక నిర్దుష్ట మార్గాన్ని అతి ఖచ్చితంగా పాటించాలి. ఐతే.. ఏ దారీలేని ఆకాశమార్గంలో.. మేఘాల్లో..ఎప్పటికప్పుడు దారిని తెలుసుకుంటూ, పథభ్రష్టత చెందకుండా ఒళ్ళు దగ్గరపెట్టుకుని ప్రయాణం కొనసాగించాలి. జీవితంలో లక్ష్యాలను చేరేందుకు ఎప్పటికప్పుడు ఎవరికివారు తమతమ దిశను తామే నిర్దేశించుకుంటూ జాగ్రత్తగా సాగాలి..అని లేకుంటే దారితప్పి ఆత్మధ్వంసంతో మనిషి పతనం కావడం ఖాయం.. ఇంత వ్యక్తిత్వవికాస పాఠం సూర్యునితో, సూర్యునివల్ల..సూర్యునిద్వారా.,
తను ఎం.బి.ఎ చేస్తున్నపుడు మౌళిసార్‌ చెప్పిన ‘ఆదిత్య హృదయ వివరణ’. ఇది ఎంత గొప్ప అన్వయం. జ్ఞానం ఉన్న ఏ మనిషికైనా సూర్యుణ్ణి మించిన స్ఫూర్తి ప్రదాత ఇంకెవరుంటారు.,
ఆకాశంనుండి ఒక నక్షత్రం రాలిపడ్డ అనుభూతి కలిగి..చటుక్కున తెగిపోయి..ఉలిక్కిపడి,
టైం చూచుకుంది లీల. ఎనిమిదీ పది. తొమ్మిదీ నలభైకి యుఎస్‌ఎ ఫ్లైట్‌..తయారుకావాలి.,
ఇంతకూ నిర్మల ఎందుకు ఫోన్‌ చేసినట్టు,
చకచకా నిర్మలకు నంబర్‌ కలిపింది..రింగై..”నిర్మలా..”
”మేడం..పావుగంటనుండి మీకోసమే ప్రయత్నిస్తున్నా..లైన్‌ కలువడంలేదు”
”చెప్పు..”
”ఒక అలర్ట్‌ న్యూస్‌”
”మనం. ఇరాక్‌ యుద్ధం తర్వాత రీ కన్‌స్ట్రక్షన్‌ ప్రోగ్రాంలో భాగంగా విపరీతమైన ప్రాజెక్ట్స్‌ దొరుకుతాయని ఒక మూడునెలలకాలం కేవలం మిడిలీస్ట్‌ కార్యకలాపాలపైననే దృష్టి పెట్టాం జ్ఞాపకముందా. బస్రా పవర్‌ ప్రాజెక్ట్‌ ఇన్‌స్టలేషన్‌కు సంబంధించి అమెరికా కంపెనీ ఆల్టెక్‌ పవర్‌ ఇన్‌కార్పొరేషన్‌తో కలిసి ఇండియాకు చెందిన మన క్లెయింట్‌ రమేశ్‌ సహానీకి రెండు మిలియన్‌ డాలర్ల కాంట్రాక్ట్‌ ఇప్పించాం..జ్ఞాపకముందా..ఆ డీల్‌లో మెక్సికోకు చెందిన జెన్‌రోవర్‌ అండ్‌ కంపెనీతో గొడవపడ్డాం.. మీరు ఒకసారి మెక్సికోకూడా వెళ్ళొచ్చారు. రోజర్స్‌, మైకేల్‌, మిసెస్‌ బర్గర్‌,మిస్‌ హోస్టలర్‌..ఊఁ..ఐతే నిన్నరాత్రి ఎవరో గుర్తుతెలియని దుండగులు రమేశ్‌ సహానీని గుజరాత్‌ గాంధీనగర్‌లో కృష్ణ ఐమాక్స్‌ థియేటర్‌లో తన కీప్‌తో కలిసి సినిమా చూస్తూండగా కాల్చి చంపారు..ఎవరో ఆ పాతపగను పర్సూ చేస్తున్నారు..మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇపుడు మిసెస్‌ బర్గర్‌ గ్రూప్‌ మార్చి అలెక్స్‌ మైకేల్‌ గ్రూప్‌లో ఉందట. ఆమెకు మీరు..మీ గురించిన పూర్తి వివరాలు తెలుసు. చాలా పదునైన మనిషి – యంగు అండ్‌ బ్యూటిఫుల్‌. ఆమె ఫోటోను మీకు మెయిల్‌ చేస్తున్నా. మొన్ననే ఆమె ఇండియాకు వచ్చి వెళ్ళినట్టు తెలిసింది..”
చెప్పుకుపోతోంది నిర్మల..ఒక పోలీసాఫీసర్‌కంటే స్పష్టంగా,
యంగు అండ్‌ బ్యూటిఫుల్‌..నిర్మల కూడా. కార్పొరేట్‌ రంగాల్లోగానీ, దుర్మార్గమైన నీచరాజకీయాల్లోగానీ, మాఫియా గ్రూపుల్లోగానీ కీలకమైన వ్యక్తులు వ్యక్తిగతమైన ఆసక్తులతో ద్రోహపూరిత చర్యలతో ప్లాట్‌ఫాం మారడం ఎంతో సహజమే.. ఐతే, నాయకత్వం వహించేవాళ్లు ఎప్పుడూ ‘ఎదుటివాడు దొంగ..ద్రోహి’ అనే దృష్టితోనే అనుక్షణమూ వ్యవహారాలను నిర్వహిస్తూంటారు. ఎక్కడైతే అత్యంత సుఖవంతమైన సౌకర్యాలూ, అధికారాలూ ఉంటాయో ప్రక్కనే తత్‌వ్యతిరేకమైనప్రాణభయంతో కూడిన ప్రమాదాలూ, రిస్కూ పొంచి ఉంటాయి. ఉన్నతస్థాయి నిర్వహణలన్నీ తాడుపై పరుగువంటివి. పరుగును మరచి నడకకొనసాగిస్తే లోయల్లోకి పత్తాలేకుండా కూలిపోతారు..ధ్వంసమైపోతారు.
”ఓకే నిర్మలా..”
”టేక్కేర్‌ మేం..” లైన్‌ కట్‌ చేసింది.
”… ” లేచి..అద్భుతమైన పరిమళం నిండిన బాత్‌రూంలోకి నడిచింది లీల. గోరువెచ్చని నీటి షవర్‌క్రింద స్నానం కానిస్తూ,
ఆమె మెదడు పాదరసంలా జ్ఞాపకాలను తవ్వుతోంది. మార్చి 20, 2003న ప్రారంభమైన ఇరాక్‌ యుద్ధంలో అమెరికా సేనలు ఇరాక్‌ సమాజాన్ని కకావికలు చేసిన విధ్వంసం తర్వాత, యుఎస్‌ 35 బిలియన్‌ డాలర్ల సహాయాన్ని ఇరాక్‌ పునర్మిర్మాణం కోసం ప్రకటించిన తర్వాత, యిక అంతర్జాతీయ స్థాయి రాబందులన్నీ ఇరాక్‌ నేలపై వాలడం మొదలైంది. మల్టీనేషనల్‌ కంపెనీల ముసుగువేసుకున్న ఈ దిక్కుమాలిన కంపెనీలన్నీ దేశం ఏదైనా ఒకే ఒక అనైతిక మూలసిద్ధాంతాన్ని కలిగి ఉంటాయి. అదేంటంటే ‘పే అండ్‌ యూజ్‌’. నిజానికి ఇది ప్రైవేట్‌ టాయ్‌లెట్‌ ఆపరేటర్ల స్లోగన్‌. ఇదే నినాదం అత్యున్నత స్థాయి అంతర్జాతీయ వ్యాపార సంస్థలు కూడా ఖచ్చితంగా పాటిస్తాయి. దేశమేదైనా, వ్యక్తి ఎవరైనా డబ్బుకు లొంగని వాడెవడూ ఉండడు. గో ఎ హెడ్‌ అండ్‌ కాప్చర్‌. అంతే. ఆ క్రమంలో అమెరికాకు చెందిన ఫిలిప్‌ బ్లూమ్‌ కంపెనీతోకలిసి మెక్సికోకు చెందిన జెన్‌ రోవరో 1.2 బిలియన్‌ డాలర్ల పవర్‌ ప్రాజెక్ట్‌లను బస్రా, కుర్దిష్‌, రుమాలియాలలో చేజిక్కించుకున్నపుడు మెల్లగా తను ప్రవేశించి 0-2-బి. ఒకటి, 0.4 ఒకటి, 0.3 ఒకటి ఇలా మూడు సబ్‌ కాంట్రాక్ట్‌లను రమేశ్‌ సహానికి యిప్పించింది. అందువల్ల జెన్‌ రోవర్‌ కొన్ని ప్రాజెక్టులను కోల్పోవలసి వచ్చింది తన వల్ల. అదీ తనపై వాళ్ళ పగ.అప్పుడైతే..రెండు నెలల బాగ్దాద్‌లోనే మకాం వేసింది తను ”ఆయిల్‌ ఫర్‌ ఫుడ్‌” పథకం క్రింద బైజి, రుమాలీయాలలో మన బిహెచ్‌ఇఎల్‌ 8.7 బిలియన్‌ రూపాయలతో నాల్గు గ్యాస్‌ టర్బయిన్‌లను నెలకొల్పడంలో మాత్రం తక్కువ అవినీతి జరిగిందా. సైట్‌ ఇంజనీర్‌ నాయర్‌, వాసుదేవ్‌, అలెగ్జాండర్‌, షర్మిల సక్సేనా.. వీళ్ళందరు ఎన్ని లక్షలు..కోట్లు తిన్నారో.. చరిత్రలన్నీ అవినీతి కంపు..వ్యాపారాలన్నీ పుట్టకురుపుల్లాంటి కుళ్ళు.,
స్నానం ఐపోయింది..ఒక చెత్త జ్ఞాపకం తెగిపోయింది. బయటకొచ్చి చకచకా పదినిముషాల్లో తయారై..యిక యిప్పుడెవడూ రారు తనకోసం..ప్యూర్లీ పర్సనల్‌ మూవ్‌మెంట్స్‌..రూంలోని ఇంటర్‌కాంలోనే రిసిప్షనిస్‌కు దోహా ఏర్‌పోర్ట్‌కు టాక్సీకోసం చెప్పి,
అద్దంలో..తనను తాను తృప్తిగా చూచుకుని..పొంగిపోతూ.,
కిందికి..ట్యాక్సీలోకి..పావుగంట తర్వాత దోహా ఏర్‌పోర్ట్‌లోకి..మరో పది నిముషాల్లో కతార్‌ ఏర్‌ వేస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఫస్ట్‌క్లాస్‌..ఎ- త్రీ టు కిటికీ దగ్గరి ఫ్లాట్‌బెడ్‌లాంటి సీట్లోకి.. మరో పదినిముషాల్లో విమానం గర్జిస్తూ టేకాఫై ..గగనతలంలోకి.,
మళ్ళీ..శృతిలా కొనసాగుతున్న విమాన గర్జన మధ్య గడ్డకట్టిన నిశ్శబ్దం.
పదమూడు గంటల ప్రయాణం..బాగ్దాద్‌, బస్రా, ఫ్రాంక్‌ఫర్ట్‌…అట్లాంటిక్‌ మహాసముద్రంపై నాల్గుగంటలు..డెట్రాయిట్‌, పెన్సెల్వీనియా, బూస్టన్‌, న్యూయార్క్‌.
మళ్ళీ…అంతర్లోకాల్లోకి ప్రయాణం.,
రామం జ్ఞాపకమొచ్చాడు లీలకు.
జ్ఞాపకమొచ్చాడు అనడం తప్పేమో..మరిచిపోతేగదా జ్ఞాపకం రావడానికి.. కొన్ని జ్ఞాపకాలు నిరంతరం ఒక అనునాదంలా హృదయంలో సజీవంగా కదుల్తూనే ఉంటాయి. మెలకువలోనైనా..నిద్రలోనైనా.
రామం ఒక ప్రత్యేకమైన అతీత వ్యక్తి.

కిటికీ

సుమారు పది పదిహేను సంవత్సరాల క్రిందట అనుకుంటాను, “Readers Digest” ప్రత్యేక కథల సంపుటిలో ఈ Open Window కథ మొదటి సారి చదివాను.  మనసుమీద చెరగని ముద్ర వేసింది. ఈ కథకి ఆయువుపట్టు చివరి వాక్యమే. ఎక్కడా అసంబద్ధత లేకుండా, ఏ చిన్న విషయాన్నీ వదిలిపెట్టకుండా, ఎంత నిశితంగా పరీక్షించినా (నా మట్టుకు) తప్పుదొరక్కుండా పకడ్బందీగా కనిపించింది దీని అల్లిక.  Short Story(చిన్న కథ) అన్నపదానికి అక్షరాలా నిర్వచనంగా చూపించొచ్చు దీన్ని. ఇంగ్లీషు అచ్చులో 2, 3  బొమ్మలతో కలిపి 3 పేజీలు మించకుండా వచ్చినట్టు జ్ఞాపకం. కిటికీ వంటి చిన్న కేన్వాసుమీద కథ అల్లటం నిజంగా రచయితకి సవాలే. రావి శాస్త్రిగారు ఇలా “కుక్కపిల్లా, సబ్బుబిళ్ళా…” అన్న శ్రీశ్రీ కవితలోని వస్తువులు తీసుకుని రసవత్తరమైన కథలు అల్లేరు. ఇంతకంటే ఎక్కువ చెబితే, పొరపాటునైనా కథగురించి క్లూ ఇచ్చేస్తానేమోనన్న భయంతో విషయం చెప్పకుండ కప్పదాట్లేస్తున్నాను. ఎవరికివారు చదివి ఆనందించవలసిన కథ ఇది.

452px-Hector_Hugh_Munro_aka_Saki,_by_E_O_Hoppe,_1913

* *

 

 

“మిస్టర్ నటెల్, మా అత్త ఇప్పుడే వచ్చేస్తుంది,” తన మనోభావాల్ని ఏమాత్రం పైకి కనపడనీయని నేర్పుగల పదిహేనేళ్ళ ఆ అమ్మాయి అంది; “అప్పటిదాకా మీరు నన్ను భరించక తప్పదు.”

ఫ్రాంటన్ నటెల్ ఆ క్షణానికి తగినట్టుగా మేనగోడల్ని పొగుడుతూ ఏదో తోచింది చెప్పేడు ఎదురుచూస్తున్న మేనత్తని ఏమాత్రం పలుచన చెయ్యకుండా. మనసులో మాత్రం ముక్కూ ముఖం తెలియని వాళ్ళ ఇళ్ళకి ఇలా తన ఆత్మవిశ్వాసం పునరుద్ధరించుకుందికి వెళ్ళడంవల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని మునుపటికంటే ఎక్కువగా ఇప్పుడు పునరాలోచించసాగేడు.

“నేను ఊహించుకో గలను,” అంది అతని సోదరి తను పల్లెవాతావరణంలో విశ్రాంతి తీసుకుందికి మకాం మార్చడానికి సిద్ధపడుతున్నప్పుడు; “ఏ ఒక్క ప్రాణితోనూ మాటాడకుండా నిన్ను నువ్వు అక్కడ సమాధి చేసేసుకుంటావు. దానితో నువ్వు ఇంకా అంతర్ముఖుడివైపోతావు. అక్కడ నాకు తెలిసిన వాళ్ళందరికీ పరిచయపత్రాలిస్తాను. నాకు తెలిసినంత వరకు వాళ్ళందరూ మంచి వాళ్ళే.”

ఆ మంచి వాళ్ళ జాబితాలోకి తను పరిచయపత్రం ఇవ్వబోతున్న సాపిల్టన్ వస్తుందో రాదో అన్న సందేహం కలిగింది ఫ్రాంటన్ కి.

“మీకు ఇక్కడ తెలిసినవాళ్ళెవరైనా ఉన్నారా?” అని ఉండబట్టలేక అడిగింది ఆ మేనగోడలు… తమ మధ్య అప్పటికే తగినంత మౌనసంభాషణ జరిగిందని నిశ్చయించుకున్నాక.

“ఒక్కరు తెలిస్తే ఒట్టు,” అన్నాడు ఫ్రాంటన్. “సుమారు నాలుగేళ్ళక్రిందట మా సోదరి ఇక్కడ ఫాదిరీ గారింట్లో ఉండేది. ఆమే ఇక్కడ తనకి తెలిసిన కొద్ది మందికి పరిచయపత్రాలు ఇచ్చింది.”

ఆ చివరి మాట అంటున్నప్పుడు అతని గొంతులో పరిచయపత్రాలు ఎందుకు తీసుకున్నానా అన్న పశ్చాత్తాపం స్పష్టంగా తెలుస్తోంది.

“అయితే మీకు మా మేనత్త గురించి అస్సలు ఏమీ తెలీదా?” అని రెట్టించి అడిగింది ఆ అమ్మాయి.

“ఆమె పేరూ, చిరునామా. అంతవరకే,” అంగీకరించాడు సందర్శకుడు. అసలు ఈ సాపిల్టన్ వివాహితో, భర్తృవిహీనో అర్థం కాలేదు అతనికి. ఎందుకంటే, ఆ గదిలోని వాతావరణం అతనికి కారణం చెప్పలేని అనుమానం కలిగిస్తోంది అక్కడ మగవాళ్ళే ఉంటున్నారేమోనని.

“ఆమె జీవితంలో అతి విషాదకరమైన సంఘటన జరిగి సుమారు మూడేళ్ళయి ఉంటుంది,” అంది ఆ పిల్ల; “బహుశా మీ సోదరి ఇక్కడనుండి వెళ్లిన తర్వాత అయి ఉండొచ్చు,” అని ప్రారంభిస్తూ.

“విషాద సంఘటనా?” అడిగేడు ఫ్రాంటన్; ఇంత ప్రశాంతమైన ప్రదేశంలో అకస్మాత్తుగా ఏ విషాద సంఘటనలు జరగడానికి అవకాశం లేదనిపించి.

“మీకు ఈపాటికి సందేహం వచ్చి ఉండాలి, అక్టోబరు నెలవచ్చినా ఇంకా ఆ కిటికీ ఇంకా ఎందుకు తెరిచే ఉంచేరని,” అంది ఆ మేనగోడలు, లాన్ లోకి తెరుచుకున్న పెద్ద ఫ్రెంచి కిటికీని చూపిస్తూ.

అసాధారణంగా ఈ నెలలో ఇక్కడ ఇంకా ఉక్కగానే ఉంది,” అన్నాడు ఫ్రాంటన్; “అయితే ఆ కిటికీకి, విషాదానికీ ఏమైనా లంకె ఉందా?” అని అడిగేడు.

“సరిగ్గా ఇవాళ్టికి మూడేళ్ళ క్రితం, ఆమె భర్తా, ఆమె సోదరులిద్దరూ వేటకని బయటకి వెళ్ళేరు. మరి తిరిగి రాలేదు. వాళ్ళకి ఇష్టమైన పక్షుల్ని వేటాడడానికి అనువైన చోటికి వెళుతూ దారిలో ఒక చిత్తడినేలదాటబోయి అక్కడి ప్రమాదకరమైన అడుసులో కూరుకుపోయారు. ఆ ఏడు ఎంత భయంకరంగా వర్షాలు కురిసేయంటే, అంతవరకూ నిరపాయమైన స్థలాలుకూడా తెలియకుండానే ప్రమాదకరంగా మారిపోయాయి. అన్నిటిలోకీ విషాదకరమైన విషయం వాళ్ళ శరీరాలు ఇంతవరకు దొరకలేదు.” ఇలా అంటున్నప్పుడు మాత్రం ఆ అమ్మాయి గొంతులో అంతవరకూ ఉన్న సంయమనం పోయి ఒక్క సారి గద్గదమైపోయింది. “పాపం, మా పిచ్చి అత్త, ఇంకా కలగంటూనే ఉంటుంది, ఏదో ఒక రోజు వాళ్ళూ, వాళ్ళతో పాటే తప్పిపోయిన వేటకుక్కా వాళ్ళు వెళ్ళిన ఆ కిటికీలోంచే ఇంట్లోకి తిరిగి వస్తారని. అందుకే ప్రతిరోజూ చీకటిపడే దాకా ఆ తలుపు తెరిచే ఉంచుతుంది. పాపం, ఆమె ఎప్పుడూ నాకు చెబుతూనే ఉంటుంది వాళ్లు బయటికి ఎలా వెళ్ళేరో… ఆమె భర్త మోచేతిమీద వాటర్ ప్రూఫ్ కోటు వేసుకునీ, ఆమె చిన్న తమ్ముడు రోనీ ఆమెని ఎప్పుడూ ఏడిపించడానికి పాడే “ఎక్కడికిపోతావె చిన్న దాన,” అన్న పాట పాడుకుంటూను. ఆ పాట వింటున్నప్పుడల్లా ఆమెకి గొప్పచిరాకేసేదట. ఎందుకో తెలీదుగాని, ఇలాంటి, స్తబ్ద నిశ్శబ్ద వాతావరణంలో, నాకు ఒళ్ళు గగుర్పొడిచే ఊహ కలుగుతూంటుంది… ఆ కిటికీ లోంచి వాళ్ళు నిజంగా లోపలికి వస్తారేమో నని….”

గగుర్పాటు కలగడంతో ఆమె తన కథనం ఆపింది. ఇంతలో ఆమె మేనత్త ఇంట్లోకి తను ఆలస్యంగా వచ్చినందుకు పదేపదే క్షమాపణలు చెప్పుకుంటూ ప్రవేశించడంతో అతనికి కొంత ఊరట కలిగింది.

“వెరాతో మీకు మంచి కాలక్షేపం అవుతోందనుకుంటాను,” అందామె.

“ఆమె చాలా కుతూహలమైన విషయాలు చెబుతోంది,” అన్నాడు ఫ్రాంటన్.

“తలుపు తెరిచి ఉంచడం వల్ల మీకు అభ్యంతరం లేదు కదా,” అంది సాపిల్టన్, వెంటనే, “నా భర్తా, సోదరులిద్దరూ వేటనించి తిన్నగా ఈ తోవనే లోపలికి వస్తారు. ఇవాళ పక్షుల్ని పట్టుకుందికని బయటకి వెళ్ళేరు. వాళ్ళు నా కార్పెట్లని బురద బురద చేసెస్తారు. ఈ విషయంలో మీ మగవాళ్ళందరూ ఒక్కటే. అవునా?” అని అంది.

ఆమె అలా గలగలా మాటాడుతూనే ఉంది… వేట గురించీ, పక్షులు దొరక్కపోవడం గురించీ, ఈ శీతకాలంలో బాతులు లభ్యమవడం గురించీ. ఫ్రాంటన్ కి అదంతా భరించ శక్యంగా లేదు. అతను సంభాషణని ఎలాగైనా మరో విషయంవైపు మళ్ళిద్దామని శాయశక్తులా ప్రయత్నించాడు గాని అంతగా సఫలంకాలేకపోయాడు; పదే పదే ఆమె దృష్టి కిటికీ వైపూ, అక్కడి లాన్ వైపూ ఇంకా ముందికీ వెళుతోంది తప్ప, అతను చెబుతున్న దానిపై ఆమె ఏమాత్రం మనసు లగ్నం చెయ్యడం లేదన్న సంగతి అతను గ్రహించాడు. ఆ దురదృష్టసంఘటన జరిగిన వార్షికం నాడే తను ఆమెను కలవడానికి ప్రయత్నించడం కేవలం యాదృచ్ఛికం.

“డాక్టర్లందరూ నన్ను పూర్తిగా విశ్రాంతి తీసుకోమనీ, దేనికీ ఉద్రేకపడొద్దనీ, ఎక్కువ శారీరకశ్రమ కలిగించే పనులు తలపెట్టవద్దనీ చెప్పారు,” చెప్పుకుపోతున్నాడు ఫ్రాంటన్ … తమకి ఏమాత్రం పరిచయంలేనివారు తమ రోగాలగురించీ తమ అశక్తతలగురించీ వాటి కారణాలూ, నివారణోపాయాలగుంచి ఏదో కుతూహలం కనబరుస్తారని చాలా మంది రోగులకి ఉండే అపోహను కనబరుస్తూ… “భోజనం విషయంలో మాత్రం ఎవరి అభిప్రాయాలూ కలవలేదు.”

“లేదూ?” అంది సాపిల్టన్, మనసులో నిర్లిప్తత గొంతులో లీలగా కదిలి చివరకి ఆవులింతగా పరిణమిస్తుంటే. ఆమె ఒక్కసారి వెంటనే అప్రమత్తమైంది … అయితే దానికి కారణం ఫాంటన్ చెబుతున్న విషయం కాదు.

“అదిగో వచ్చేశారు,” అని ఆనందతో కేరిందామె, “సరిగ్గా టీ వేళకి. వాళ్ళు ముఖంనిండా మట్టిగొట్టుకుపోయినట్టు లేరూ ?” అంది.

ఫ్రాంటన్ కి ఒకసారి ఒళ్ళుజలదరించి మేనగోడలువైపు చూశాడు కళ్ళలో జాలి కనబరుస్తూ. ఆ అమ్మాయి ఒక భయంకర దృశ్యాన్ని చూస్తున్నట్టు తెరిచిన కిటికీ వైపు కళ్ళు తేలేసి చూస్తోంది. చెప్పలేని భయమేదో ఆవహించి కొయ్య బారిపోతూ తనూ ఆమెచూస్తున్న వైపు తనదృష్టి సారించాడు.

ముసురుకుంటున్న సంజచీకట్లలో మూడు ఆకారాలు చంకలో తుపాకులు వేలేసుకుంటూ లాన్ వైపు నడుచుకుంటూ వస్తున్నాయి …. ఒక దానికి అదనంగా తెల్లని కోటు ఒకటి భుజానికి వేలాడుతోంది. బాగా అలసినట్టు కనిపిస్తున్న గోధుమరంగు వేటకుక్క ఒకటి వాళ్ళ అడుగుల్లో అడుగులేస్తూ అనుసరిస్తోంది. చప్పుడు చెయ్యకుండా వాళ్ళు ఇల్లు సమీపించిన తర్వాత, ఒక పడుచుగొంతుక, “ఎక్కడికి పోతావె చిన్న దానా?” అన్న పాట అందుకుంది.

అంతే! ఫ్రాంటన్ తన చేతికర్రనీ టోపీని ఒక్కసారి ఎలా అందుకున్నాడో అందుకున్నాడు; హాలుకి తలుపెటుందో, కంకరపరిచిన కాలిబాట ఎక్కడుందో, ముఖద్వారం ఎటో అతనికి లీలగా గుర్తున్నాయి అతని వెనుదిరిగి చూడని పరుగులో. పాపం, ఆ రోడ్డువెంట సైకిలు తొక్కుకుంటూ వస్తున్న వ్యక్తి తన సైకిలు తుప్పల్లోకి మళ్ళించవలసి వచ్చింది ఖచ్చితమైన ప్రమాదాన్ని నివారించడానికి.

“ప్రియా, ఇదిగో వచ్చేశాం” అన్నాడు తెల్లనికోటు మోసుకుని కిటికీలోంచి లోపలికి ప్రవేశించిన వ్యక్తి, “బురద కొట్టుకు పోయామనుకో, అయినా ఫర్వాలేదు చాలవరకు పొడిగానే ఉన్నాం. ఇంతకీ, ఎవరా వ్యక్తి, మేం లోపలికి వస్తుంటే, బయటకి బుల్లెట్ లా పరిగెత్తేడు?”

“ఎవరో, నటెల్ ట. చాలా చిత్రమైన వ్యక్తి,” అంది సాపిల్టన్; “అతని అనారోగ్యం గురించి తప్ప మరో మాటలేదు. మీరు రావడమే తడవు, శలవు తీసుకోకుండా, వీడ్కోలైనా చెప్పకుండా ఏదో దయ్యాల్ని చూసినట్టు పరిగెత్తాడు.”

“దానికి కారణం, ఆ వేటకుక్కే అనుకుంటున్నాను,” అంది ఆ మేనగోడలు ప్రశాంతంగా; “అతను చెప్పేడు నాకు కుక్కలంటే మహాభయమని. ఒకసారి అతన్ని గంగానది ఒడ్డునున్న ఒక గోరీలదొడ్డిలోకి కొన్ని కుక్కలు తరిమేయట. పాపం, అప్పుడే తవ్విన ఒక గోతిలో దూకి రాత్రల్లా తలదాచుకున్నాడట నెత్తి మీద అవన్నీ చొంగకారుస్తూ, మొరుగుతుంటే. అది చాలు, హడలిపోయి ఎవరికైనా ధైర్యం సన్నగిలిపోడానికి.”

ఉన్నపళంగా కథలల్లగలగడం ఆ పిల్ల ప్రత్యేకత.

.

సాకీ  (హెక్టర్ హ్యూ మన్రో.)

(18 December 1870 – 13 November 1916),

Notes:

ఇక్కడ కిటికీ అంటే  నేలకి 3 నాలుగు అడుగుల ఎత్తులో మనకు పరిచయమున్న కిటికీ కాదు; ఫ్రెంచ్ కిటికీ. మన ద్వారబంధాలలాగే నేల వరకూ ఉండి, ఒక గదిలోంచి బయట వసారాలోకో, తలవాకిట్లోకో తెరుచుకునే కిటికీ.

అనువాదం: నౌడూరి మూర్తి

 

ఉప్పరి పిచ్చోడు

chinnakatha

“ఒరేయ్ .. ఉప్పరి పిచ్చోడొస్తున్నాడ్రోయ్..!” దివాకర్‌గాడు అరిచాడు.

ఒక్క దెబ్బన అందరం పారిపోయాం.

తాసిల్దారుగారి అమ్మాయి ‘విజయ’ మాత్రం దొరికిపోయింది.

మేం కొంచెం దూరం పరిగెత్తి వెనక్కి చూస్తే ఏముంది… విజయ నవ్వుతూ వొస్తోంది. దానికి ఏడేళ్లు. అప్పుడు

“నిన్నేం చెయ్యలేదుటే వాడూ?” ఆత్రంగా అడిగాడు గంగాధరం.

“పోండ్రా పిరికిగొడ్డుల్లారా! వాడు నా తల మీద చెయ్యిపెట్టి బే..బే… అని వెళ్లిపోయాడు.” ఎగతాళిగా నవ్వింది విజయ. వాడి పేరు ఎవరికీ తెలీదుగానీ.. ఉప్పరిగూడెంలో ఉంటాడు గనక ఉప్పరి పిచ్చోడనేవాళ్లం.

కూలీనాలీ చేస్తుండేవాడు.

పిల్లలు అల్లరి చేస్తోంటే.. “అదిగో! ఉప్పరి పిచ్చోడొస్తున్నాడు. అల్లరిచేస్తే  ఎత్తుకుపోతాడు.! ” అని భయపెట్టేవాళ్లు.

అందుకే మేము భయపడి పారిపోయింది.

వెన్నెల రాత్రుల్లో నేనూ, రంగడూ, శేషగిరీ, గంగాధరం, శేషగిరి తమ్ముడు కృష్ణమూర్తీ, నాగమణీ, విజయ, అమ్మాజీ అందరం షికార్లు కొట్టేవాళ్లం.

పిండారబోసినట్టుండేది వెన్నెల. మామిడి చెట్ల మీదుగా వీచే గాలి మత్తుగా వుండేది.

అప్పుడప్పుడూ ‘చిట్టిబాబు’గారి తోటలో ‘వేట’కి పోయేవాళ్లం. వేటంటే జంతువుల్ని వేటాడ్డం కాదు. మామిడికాయలు ‘తోటమాలి’ కళ్ళు గప్పి దొంగిలించడానికి.

జేబుల్లో ఉప్పూ, కారం కలిపిన పొట్లాలు రెడీగా ఉండేవి. పాత బ్లేళ్లు కూడా.

‘సరుకు’ దొరకంగానే మామిడికాయని బ్లేడుతో ముక్కలుగా కోసి, ఉప్పూ కారం అద్ది ఆరగించడం ఆ వెన్నెల రాత్రుల్లో అద్భుతంగా ఉండేది. ఆ ఉప్పూ కారం కలిపిన మావిడి ముక్కల్ని ‘కైమా’ అనేవాళ్లం.

ఓసారి కాయలు కోసేసి ‘జోగులు’గారి ‘సా మిల్లు’ ముందున్న రంపంపొట్టు గుట్టలమీద కూర్చుని ‘కైమా’ లాగిస్తుంటే ఉప్పరి పిచ్చోడు వచ్చి నిశ్శబ్దంగా వచ్చి ‘బే..బే’ అని అరిచాడు. పారిపోబోయాం కాని విజయ, “ఆగండ్రా” అని ఆ పిచ్చోడికి నాలుకు మావిడిముక్కలు ఇచ్చింది.

రెండుచేతులూ దోసిలి పట్టి ‘ప్రసాదం’ తీసుకున్నంత భక్తిగా ఆ ముక్కల్ని అందుకున్నాడు.

వెండి వెన్నెల్లో నల్లని ఉప్పరి పిచ్చోడు విచిత్రంగా కనిపించాడు.

“నీ పేరేంటబ్బాయ్?” ఆరిందాలా అడిగింది అమ్మాజీ.

“బే..బే” అన్నాడు ఉప్పరి పిచ్చోడు.

“వాడు మూగవాడు. మాటల్రావు!”అన్నాడు శేషగిరి.

మనిషి ఆరడుగుల ఎత్తు. ఒక్క తువ్వాలు నడుం చుట్టూ కట్టుకున్నాడు. అంతే. మాకు పదేళ్ళుండేటప్పుడు వాడికి పాతికేళ్ళు ఉండేవేమో.

వాడంటే భయం పోయింది గనక మేమందరం కబుర్లు చెప్పుకుంటూ, రంపంపొట్టు గుట్ట మీద ఆటలాడుతూ చాలా సేపు గడిపాం. వాడూ కూర్చుని మమ్మల్ని చూస్తూ ఉన్నాడు. ఆనందంగా ఉన్నాడని మాత్రం తెలిసింది. ఎందుకంటే మేం నవ్వుతున్నప్పుడల్లా వాడూ నవ్వాడు.

అప్పట్నించీ, మేం ఎక్కడ కనిపించినా ‘బే..బే’ అని నవ్వేవాడు.

దేవుడు వాడ్ని మూగవాడ్ని చేశాడు గానీ, వాడికెన్ని విద్యలో తెలుసా?

తాటి చెట్లెక్కి ముంజలు కోసేవాడు. కొడవలితో కాయని చెక్కి ‘నీళ్లు’పోకుండా ముంజలు ఆ కొడవలి అంచుతో తియ్యడం వాడి ప్రత్యేకత.

ఎండబెట్టిన కొబ్బరి పీచుతో ‘తాళ్లు’ నేసేవాడు. నాగిరెడ్డి గూడెం ఫారెస్టుకు పోయి ‘కంప’నరుక్కొచ్చేవాడు.

బ్రహ్మాండంగా ఆ కంపతో ‘దళ్ళు’ కట్టేవాడు.

గోడలు ‘మెత్తి’ నున్నగా పేడ పూసి.. ఎండాక రంగులు దిద్దేవాడు. ఇహ పాత పాకల కప్పు ఊడదీసి కొత్త తాటాకు కప్పడంలో వాడు ఎక్స్‌పర్టు.

‘రాజుగారి’ హోటల్లో పప్పు రుబ్బేవాడు. మేవందరం ‘తమ్మిలేరు’ పిక్నిక్ కి పోతే మాతో కూడా వచ్చి, తిరిగొచ్చేటప్పుడు మేం కోసిన ‘వాక్కాయలూ, అడివి కరేపాకు’ గోతాంలో నింపి ఇళ్లదాకా మోసుకొచ్చేవాడు.

వర్షాకాలం ‘యోగి లింగేశ్వర స్వామి’ గుడి పక్కనున్న చెరువు నిండి, నీళ్ళు ‘కళింగ’  దాటి రోడ్డు మీద ఇంతెత్తుకు ప్రవహిస్తుంటే జాగ్రతగా మమ్మల్ని ‘రోడ్డు’ దాటించేవాడు.

ఓ రోజు ‘దివాయ్‌’ గాడు మావిడి చెట్టెక్కి దిగటానికి భయపడితే వాడే చెట్టెక్కి ‘దివాయ్’ని భుజాలకెత్తుకుని కిందకి దింపాడు.

ఓ సారి నిప్పంటుకుని ‘ఇళ్లు’ తగలబడుతుంటే కడివెడు నీళ్లు మీద పోసుకుని మంటల్లోకి దూకి చాలా’మంది’నీ, ‘సొత్తు’నీ బయటికి చేర్చాడు.

ఏ యింటికెళ్లినా వాడికి తింటానికి ఏదో ఒకటి పెట్టేవాళ్లు. వాడూ తిన్నదానికి ప్రతిఫలంగా ఏదో ఒక పని చేసేవాడు. గడ్డి చెక్కడమో, అరుగులు మెత్తడమో, వాకిలంతా ఊడ్చి శుభ్రం చెయ్యడమో, ఏదో ఒకటి..

నానాదేశాలూ తిరిగి, ఇరవై ఒకటో ఏట మా చింతలపూడి వెళ్లి ఫ్రెండ్స్‌తో కబుర్లాడుకుంటూ ‘ఉప్పరి పిచ్చోడి’ గురించి వాకబు చేస్తే వాళ్లన్నారు ‘మర్దిమత్తెన నాగేశ్వర్రావుని పాము కరిస్తే వాడ్ని ఆస్పత్రికి తీసుకుపోయి తిరిగొస్తుండగా ఎద్దు పొడిచి చచ్చిపోయాడు” అని..

“అదేంట్రా?” అని నేను నివ్వెరపోతుంటే…

“పాపం. వాడు మూగే కాదు చెవుడు కూడా ఉంది. అందుకే వెనకాల్నించి జనాలు అరుస్తున్నా పక్కకి తప్పుకోలేకపోయాడు!” అన్నాడు కొనకళ్ల కృష్ణమూర్తి.

“మరి మనం చెప్పేవి వాడికి అర్ధమయ్యేవిగా?” అడిగా.

“పెదాల కదలికని బట్టి అర్ధం చేసుకునేవాడు. అంతేగానీ వాడికి పుట్టుచెముడు !”

“ఒరే..! సమయానికి నన్ను ఆస్పత్రికి చేర్చి నన్ను బతికించాడు కాని వాడు పోయాడ్రా! ఉప్పరాళ్ళే పాపం దహనం చేశారు. అస్పత్రి దగ్గర మా నాన్న నన్ను తీసుకొచ్చినందుకు డబ్బివ్వబోతే ‘బే…బే’ అంటూ వారించాడు. ఒక్క పైసా తీసుకోలా!.” కథ మధ్యలో వచ్చిన మద్ది మంచ్తెనోడు నాతో అన్నాడు. వాడి కళ్లల్లో నీళ్లు.

“వాడు మనందర్నీ స్నేహితులమనుకున్నాడ్రా.  అందుకే మనకి ఎన్ని పనులు చేసిపెట్టినా ఒక్క పైసా పుచ్చుకునేవాడు కాదు…!” విచారంగా అన్నాడు మా హిందీ  మాస్టారి కొడుకు రంగారావు.

అవును స్నేహానికి ‘ఇవ్వటమే’ తెలుసు. చివరికి ప్రాణాన్నైనా..

 

***

 

ఇది జరిగిన చాలా ఏళ్లకి ‘ప్రాణస్నేహితులు’ సినిమాలో ‘స్నేహానికన్న మిన్న’ పాట వ్రాసినప్పుడు గుర్తొచ్చింది మా అప్పరి పిచ్చోడే!

ఇప్పటికీ వూరు వెళితే ‘బే.. బే’ అని అరిచే వాడి గొంతు లీలగా మనసులో మెదుల్తుంది.

వెన్నెల రాత్రుల్లో ఆరుబయట పక్కలేసుకుని ఆకాశంలోని కోటానుకోట్ల నక్షత్రాలు చూస్తుంటే అనిపిస్తుంది.. వాడూ ఆ నక్షత్రాల మధ్య ఎక్కడో వుంటాడు.

bhuvanachandra (5)–భువన చంద్ర

ఒక నవల – తొమ్మిది అనువాదాలు

ఈ పరామర్శను ఒక వాస్తవిక ఉటంకింపుతోనే మొదలుపెట్టాలి. కథా, నవల ప్రక్రియల్లో పెద్దింటి ఏమిటి అని విగడించుకున్నప్పడు అతనికే చెందే కొన్ని గుణ విశేషాల్ని  ప్రత్యేకతల్ని చెప్పుకోక తప్పదు. కథానికని ప్రక్రియా గౌరవాన్ని పాటిస్తూ కథానికగానే రాయగలడాయన. నవల విషయంలోను ఇది అన్వయిస్తుంది. వస్తు పరిధిలోపల రకరకాల భావజాలాలు అయోమయాన్ని గుప్పించి  పిచ్చిగీతలు గీయడు. ఇతి వృత్తం వెంట 360 డిగ్రీల నుంచి గీసిన ఏ రేఖ అయినా ఉద్దిష్ఠ ప్రయోజనం అనే కేంద్రకానికి సూటిగా చేరుకుంటుంది. వస్తువు పరమ నవీనం సమకాలీనం సామాజికం అయి ఉంటుంది. విలక్షణం అయి తీరుతుంది. అప్పటి వరకు ఆ వస్తువుని ఏ కొందరు రచయితలో సృజించినా అశోక్‌ కూర్చుకున్నంత ఘాడమైన సాంధ్రమైన సాధికారమైన పరిజ్ఞాన భరితమైన ఇతి వృత్తాన్ని ఇతరులెవరూ కూర్చుకోలేక పోయారు అంటే అతని దృష్టి కోణంలోని నైశిత్యం కథా వస్తు గ్రహణంలో అసాధారణత్వం Pinning of the Plot లో అనుభవ విస్తృతి  ప్రత్యేకమైనవి. అతనికి మాత్రమే సాంతమైనవి. శిల్ప పరంగా ఏ సన్నివేశాన్ని ఎలా వర్ణించాలి?  ఏ సంఘటనని ఎలా జరిపించాలి  ఏ పాత్ర తనంత తానుగా ఎంతగా ఎదగనివ్వాలి వంటి రస విద్యతో పాటు విజ్ఞత ఆయనకు కరతలామలకం. ఆ శైలి తెలంగాణ మాండలిక సొబగుతో పరిమళంతో అమృత సేతనాన్ని ఇస్తుంది. చదువరికి రచనని ఆద్యంతము ఒకే బిగిని చదివింపచేయగల శక్తి ఆ శైలికి ఉన్నదని గ్రహింపుకు వస్తుంది.

నవల సంగతికి వస్తే మూస ఇతి వృత్తానికి విభిన్నంగా ప్రాపంచిక దృక్పథ ప్రతిఫలనంతో సామాజిక వాస్తవికతతో ఒకే అపూర్వమైన అనన్య సామాన్యమైన రచనా శిల్పాన్ని మలిచి తన ప్రతిభా వ్యుత్పత్తుల్ని  గుమ్మరిస్తూ జిగిరి నవలని మన ముందుంచారు అశోక్‌ కుమార్‌.

గుడ్దెలుగు ఒక క్రూర జంతువు. అడవి నుంచి ఊరికి వచ్చి మృగ లక్షణాలను పోగొట్టుకుని సాధువయి పోతుంది. కాని సాధువులా వుండాల్సిన మనిషి  మృగమయి పోతాడు. వస్తువు మూల పదార్థం, ఇతివ్రుత్తం వలయం- రెంటిని స్ధూలంగా స్పర్శిస్తుందీ విషయం. వివరాలను చూద్దాం.

ఊరిచివరి గుడిసె ఆ నలుగురి నివాసం. ఇమాం యజమాని. జంతువు వెంట తిరిగే జంతువులాంటి మనిషి. బీబమ్మ ఇమాం భార్య. వీళ్ల కొడుకు చాంద్‌. ఈ ముగ్గురి దోస్త్‌ అంతకంటే జీవనాధారం షాదుల్‌. ఇది ఒక ఎలుగు. షాదుల్‌ తో ఈ ముగ్గురిది ఇరవయి యేండ్ల సోపతి. బీబమ్మ షాదుల్‌ ను మురిపెంగా చూసుకునేది. తనకు ఇద్దరు కొడుకులని అనందించేది. ఇమామ్‌ షాదుల్‌ అవిభక్త ప్రాణులు. షాదుల్‌ ను అడవిలోంచి తెచ్చుకోవడానికి అష్ట కష్టాలు పడ్దారు దంపతులు. దాని అలవాట్లు మార్చి ఆటా పాటా నేర్పడానికి నానా అవస్థలు పడ్డారు.

పెద్దింటి అశోక్ కుమార్

పెద్దింటి అశోక్ కుమార్

ఈగాథనంతా పాటకులకు  వాస్తవికంగా అందించడానికి  అశోక్‌  అత్యంత సాధికారమయిన సమాచార సేకరణా వివరాలూ సాధించాడు. ఆ వివరాలు చదువుతుంటే  దిగ్బ్రమకి లోనవుతాం. ఎలుగును వేటాడి పట్టుకునే పద్దతులు, దాని జీవన పద్దతులు, స్పందన ప్రతి స్పందనలు , తిండి, రోగానికి మందులు-ఇలా అతి సూక్ష్మమయిన అంశాలన్నింటిని ఎంతో చిత్తశుద్దితో కథాగతం చేస్తాడు రచయిత. వీరి మధ్య నెలకొన్న అన్యోన్యానుబందాన్ని , ఆనంద విషాదాల కలబోతని , మురిపాల ముచ్చట్లను,  దృశ్యం వెంట దృశ్యం తరుముకొని వచ్చేలా – స్క్రీన్‌ప్లేలాగా కనిపింపజేసాడు రచయిత.

ఒక సందర్భంలో బీబమ్మ తన స్తన్యాన్ని షాదుల్‌కి అందజేసే ఘటన  కరుణ ప్లావితమయి చదువరి కన్నుల్ని చెమరింప జేయడమేకాదు – గుండె బిగిసేట్టు చేస్తుంది. వెన్ను జలలదరింప జేస్తుంది. ఇక చాంద్‌ షాదుల్‌తో ఆడుకునేవాడు. వాళ్లిద్దరు చిన్నపిల్లలయిపోయేవారు. ఎలుగు కుటుంబంలో మనిషయిపోయింది. వారిది విడదీయరాని బంధం.

ఈ నవల ప్రారంభమయ్యే సందర్భంలో ఒక దురదృష్టకరమయిన అవసరం ఏర్పడింది. కారణం గ్రామాల్లో ఎలుగును ఆడించకూడదు. ఇది ప్రభుత్వ నిర్ణయం, రూలు. ఇది ఒకటి. ఎలుగు లేకపోతే వారి జీవనాధారం పోతుంది  కనుక ఆ కుటుంబానికి రెండెకరాల భూమిని పట్టా చేస్తుంది  ప్రభుత్వం – ఇది రెండు. ఈ రెంటిని కలిపి ఆలోచించినప్పుడు దురదృష్టకరమయిన అవసరం ఏర్పడింది. చాంద్‌ ఇప్పుడు ఇరవయి ఏళ్ల యువకుడు. అతనికి భూమిని పొందాలని రయితు కావాలని కోరిక. భూమి కావాలంటే షాదుల్‌ ఉండకూడదు. నిజం చెబితే ఏమవుతుందోనని లేదని అబద్దమాడుతాడు. కనుక భూమి కోసం షాదుల్‌ను ఉండనీయకూడదు. చాంద్‌ బలవంతం వలన అతని భవిష్యత్తు మీది ఆరాటం వలన భీబమ్మ అతని దిక్కు చేరిపోతుంది. అప్పుడు మొదలవుతుంది ఘర్షణ. నవల చివర చూస్తే ముగింపు పేరాలను – కళ్లొత్తుకుంటూ ముక్కు పుటాలు అదురుతుండగా మళ్లీ మళ్లీ చదువుతుంటే నా నోట మరోవాక్యం అప్రయత్నంగా నవలని పూర్తి చేసింది. ఆవాక్య మేమిటంటే – అతనిక రాడు !!!

ఈ నవల సంచనాత్మకమైనది. ప్రభుత్వ నిబంధనలన వల్ల ఈ దుస్థితి అనే అంశాన్ని ధ్వన్యాత్మకంగా ఎంతో నిర్మోహతతో చిత్రించి తన శిల్ప నిర్వహణని నైపుణ్యంతో ముగించాడు. జరిగిన దురవస్థలో దుర్ఘటనలో రాజ్య ప్రమేయాన్ని ఎక్కడా ఫోకస్‌ చేయలేదు. రాజ్యం పట్ల విద్వేష ప్రదర్శన ద్వారా కథాగత ప్రాణుల పట్ల ఒక సానుభూతిని పెంపొందించాలనే లౌల్యానికి గురికాలేదాయన. రచయితగా ఇది పెద్దింటి విజయాల్లో ఒకటిగా నేను భావిస్తున్నాను. దీనికి కారణాల్ని objectiveగా నవలే ఇచ్చింది. రాజ్యం విషయికంగా రెండు positive points ని చెప్పింది నవల. ఒకటి వన్యప్రాణి రక్షణ. రెండు వాటి ద్వారా బ్రతుకు దెరువును కోల్పోతున్న వారికి రెండెకరాల భూమి నివ్వటం. ఈ రెండింటికి నవలాకారుడు రాజ్య వ్యతిరేక చర్యల కల్పనతో ఉపన్యాసాల నిరసనతో తన దృష్టిని మరల్చుకోలేదు. నిజానికి  ఈనవలలో రాజ్యాన్నో దాని దుష్టత్యాన్నో లాగటం పీకటం రచయిత లక్ష్యం కాదు. ధ్వనిమంతంగా కూడా ఏ ఇతర పాత్రల టోన్‌లో కూడా దీన్ని రానీయలేదు. మనిషికి జంతువుకి మధ్య పుట్టి, పెరిగి, దగ్గరై ప్రాణప్రదమైన సంబంధం చివరికిలా చావులతో ముగియవలసిన పనిని అన్యాపదేశంగా కూడా రాజ్యమేమి ఫోర్స్‌ చేయలేదు. ”షాదుల్‌ ను పట్నంల జంతు ప్రదర్శన శాలకు అప్పజెప్పాలనట. మన ఇంట్లనే ఉండనీయద్దట” అని ఎమ్మార్వో  చెప్పినట్లు చాంద్‌ తండ్రికి చెప్పాడు కనుక ఆ option ఉంది కాని అతను అవసరార్థం అది తమతో లేదని బొంకి నెత్తి మీదికి, కొంప మీదికి తెచ్చుకున్నాడు.

ashok2

అసలు నవలా ధ్యేయం వీటన్నిటికీ అతీతమైనది. మనుషుల పట్లనే కాదు ఈ నాటి సామాజిక సంక్లిష్ఠతలో మానవ సంబంధాల సంకీర్ణతలో జంతువుల పట్ల కూడా మనిషి తన మనిషితనాన్ని మరచి ప్రవర్తిస్తున్నాడు. స్వప్రయోజనాకాంక్ష అనేది అతన్ని అంతటి బలవన్మరణానికి తలపడేటంత దారుణ పరిస్థితికి పురిగొల్చుతుందనే అంశాన్ని శిల్పభరితంగా, నవలా ప్రక్రియ సాధనంగా చదువరులకు ఆర్తితో అందించటం ఆ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చిత్తశుద్దితో, ప్రాపంచిక నిబద్దతతో, రచన పట్ల ఆరాధనాభావంతో నిర్వహించి విజయం సాధించాడు రచయిత.

పాత్ర చిత్రణలో ఆ మనుషులతో వారి భావోద్వేగాలతో తాదాత్యంచెందుతాడు కాని ఆసాంతం తానొక Outsider గానే నిలిచి తన ధర్మం నిర్వహిస్తాడు రచయిత. ఇది ఆయన ప్రజ్ఞ .ఏ పాత్ర పనిని ఆలోచనని ప్రవర్తనని ఆ  ఆపాత్రనే చేయనిస్తాడు. పాత్రల ఉత్ధాన పతనాన్ని వారినే పడనిస్తాడు. వారి మురిపాల్ని ఆక్రోశాల్ని వారినే వెల్లడించనిస్తాడు.  ”ఆనాడు తన ప్రాణానికి ప్రాణం అడ్డుపెట్టిన షాదుల్‌కు ఎర్రి మందు పెడుతున్నందుకు దుఖం వచ్చింది ఇమామ్‌కు” అనే ఘట్టాన్ని చదవండి. ఆ తరువాత దీనికి కొనసాగింపుగా ” ఆలోచించి దంచిన మందును ఆవేశంగా దూరంగా విసిరి కొట్టాడు ఇమామ్‌” అనే ఘట్టాన్ని చదవండి. పాత్రని తన పనిని తాను చేయనీయడమంటే ఎమిటో అర్థం చేసుకుంటాము. అలాగే చాంద్‌ ఉక్రోశము, ఆక్రోశము, యువ రక్తపు పొంగు వీటి తీవ్రతని చల్లార్పుని చూస్తాము.

కాలం నిరంతర శ్రోతస్విని. మనిషి బ్రతుకు అంతే ఒడ్డుల వొరుసుకుంటూ పొంగుతుంది. మెరక తేలి ఎండిపోతుంది. ఈ జీవ విభిన్నత్వాన్ని నవలలోని పాత్రలకి అన్వయింపజేస్తూ సార్వకాలీనము, సార్వజనీనము అయిన ఒక తాత్విక స్ఫూర్తిని పఠితులకు పంచే మెస్మరిజంను, సృజనాత్మకత కలిగిన  పెద్దింటి వంటి శిల్పనిపుణుడు నిర్వహిస్తాడు. ‘జిగిరి’ లో ఈ విద్యని మరింత ప్రతిభావంతంగా ప్రదర్శించాడు అశోక్‌ కుమార్‌. పాత్రల మనస్తత్వాల్లో, స్వభావాల్లో భేదాల్ని చెప్పగలగడం ఒక ఎత్తు కాగా ఒక పాత్రని మలచడంలోనే ఎత్తుపల్లాల్ని చూపగలగడం మరోక ఎత్తు. ఈ రెండింటిని అద్భుతంగా ఆవిష్కరించాడు అశోక్‌. ఒక ప్రత్యేక పాత్ర చిత్రణ నుంచి ఒక సమూహాన్ని సాధారణీకరణం చేయడం అనేది ఒక సృజనాత్మక కళ. ఈ కళలో ఆరితేరినవాడు ఈ రచయిత.

ప్రస్తుత సాహిత్య సందర్భం వినిర్మాణాల పోస్ట్‌ మోడర్న్‌ కాలం అని చాలా మంది అంటున్నారు. అంటే రచయితలు వాళ్ల వాళ్ల వైయక్తిక అనుభవాల, ఆకాంక్షల అసాధరణతో Fragmented themes తో కాల్పనిక ప్రక్రియల్ని సృష్టిస్తారని అభిప్రాయం. అయితే ఈ జిగిరి నవల ఈ అభిప్రాయాల్ని అధిగమించి సాహిత్య సృజనలో శాశ్వత విలువల ప్రతిపాదనకే పట్టం కడుతుంది. నవలా వస్తువు ద్వారా శిల్పం ద్వారా మనిషి కోల్పోవకూడని మానవీయతని అంతర్లియంగా పటిష్టం చేసింది. సమాజానికి ఏది వాంఛితమో దాన్ని స్పష్టం చేసింది. అయితే ఈ రెండిటింకి భిన్నంగా నవల ముగిసిందేమని అనిపించవచ్చు .అదే కళాత్మక వాస్తవికత మర్మం. చదువరిలో ఒక Purging effect తీసుకురావడానికి ముగింపు అలాగే ఉంటుంది. దాని సారభూతమైన ఉద్ధిష్ఠమైన సందేశం సరిగ్గా ఆ ముగింపుకు వ్వతిరేకమైన ఆలోచనని ఆశిస్తుంది. ప్రవర్తనని ప్రోది చేస్తుంది. అంటే సమాజంలో ఉన్న ఇమామ్‌ లాంటి బడుగులు  అలా తమ  బతుకుని ముగించకూడదు. షాదుల్ కు అలాంటి దుర్మార్గపు దయనీయమైన పరిస్థితి రాకూడదు. జిగిరి ప్రయోజనం విజయమూ కూడా పఠితలో ఆ భావనోల్మీనాన్ని అంతర్ముఖీనంగా అందించండమే. ఇది జిగిరి Pinnacle of Success.

ఈ నవల ఇంతటి ఆకర్షణ శక్తి కాంతివంతమైనది. కాబట్టే ఇంగ్లీష్‌, మైథిలీ, మరాఠీ భాషల్లో పుస్తక రూపంలో హిందీ, ఒరియా, పంజాబీ భాషల్లో మాస ప్రత్రికల్లో  ఒకే సారి నవలగా, కన్నడలో ధారా వాహికంగా ప్రచురించబడడమే కాకుండా బెంగాలీ, గుజరాతీ భాషల్లో ప్రచురణకు పత్రికల్లో సిద్ధంగా ఉంది.

 

    విహారి

 

సిరిమల్లె పువ్వల్లే నవ్వు చిన్నారి పాపల్లే నవ్వూ…

on smileనవ్వు!

దేవుడు మనిషికి ప్రసాదించిన అందమైన వరం.. నవ్వు! నవ్వే జంతువొకటేదో ఉందని అంటూంటారు కానీ అసలు ‘గొడ్డుకీ మడిసికీ’ తేడాను తెలిపేది నవ్వే కదా.  చక్కగా పలువరస కనబడేలా, మనసులో ఆనందమంతా నవ్వులో కనబడేలా హాయిగా నవ్వుతున్న మనిషిని చూస్తే ఎంత చిరాకులో ఉన్నా అప్రయత్నంగా మనమూ ఓ చిరునవ్వు నవ్వమూ?! మనసారా హాయిగా నవ్వుకోగలిగిన మనిషిని ఏ చింతలూ కలవరపరచలేవు. నాకైతే నవ్వు లేని మొహం విచ్చుకోని మొగ్గలా అసంపూర్ణంగా అనిపిస్తుంది.

జీవితంలో ఎన్ని చికాకులూ, సమస్యలూ ఉన్నా కొందరి మొహం మాత్రం ఎప్పుడూ ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. అలాంటివారిని చూస్తే మన చికాకులు కూడా మర్చిపోతాం. మరికొందరుంటారు.. వీళ్లకు అసలు నవ్వడం రాదా అని సందేహం కలిగేట్లు, ఎప్పుడూ కనుబొమలు చిట్లించుకుని చికాకు పడుతునే ఉంటారు. వాళ్ల ముడిపడ్డ కనుబొమలు విడదీసి దగ్గరకు రాకుండా సెలోటేప్ వేసి దూరంగా అతికించేయాలనిపిస్తుంది అలా చిరాకుపడేవాళ్లను చూస్తే!  అసలు ఓ మనిషి తత్వాన్ని వాళ్ల నవ్వుతో అంచనా వేసేయచ్చు.

ఇక ఈ నవ్వులో ఎన్ని రకాలో..! పలకరింపు నవ్వు, మొహమాటం నవ్వు, ఆశ్చర్యపు నవ్వు, చమత్కారపు నవ్వు, విచారపు నవ్వు, వెటకారం నవ్వు, కళ్లలో ప్రేమ నిండిన నవ్వు, పొట్ట చెక్కలయ్యే నవ్వు… ఇలా మాటలు అవసరం లేకుండా ఒక్క నవ్వుతోనే మనసులోని భావమంతా గుమ్మరించేయచ్చు. అమాయకమైన పసిపాప బోసి నవ్వులు ప్రశాంతతని, హాయినీ ఇస్తే, అందమైన అమ్మాయి నవ్వులు ఆనందాన్ని ఇస్తాయి. మరి ఇంత చక్కని ఆహ్లాదకరమైన “నవ్వు” గురించి మన సినీ కవులు ఏమన్నారో వినేద్దామా…

1) “సిరిమల్లె పువ్వల్లే నవ్వు చిన్నారి పాపల్లే నవ్వూ..
చిరకాలముండాలి నీ నవ్వు..
చిగురిస్తు ఉండాలి నా నవ్వు.. నా నవ్వు…”
అంటూ ప్రియురాలి నవ్వు  తనను పలువిధాలుగా ఎలా ప్రభావితం చేసిందో చెప్పే పాట ఇది..
నటీనటుల కన్నా జానకి నవ్వులే ఈ పాటకు ప్రత్యేకమైన అందం.

(జ్యోతి)

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5307

2) “ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు
జాజిమల్లెపువ్వు బజ్జోమ్మ నువ్వు”
అంటూ సాగే ఈ జోలపాటలో జోలతో పాటూ నాయకుడి ఒంటరితనపు ఛాయలు కూడా వినిపిస్తారు పి.బి…

( సత్తెకాలపు సత్తెయ్య)

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6505

3) “ఖుషీ ఖూషీగా నవ్వుతూ
చలాకి మాటలు రువ్వుతూ
హుషారు గొలిపేవెందుకే
నిషా కనుల దానా”
అని అబ్బాయి అంటే,

“ఖుషీ ఖూషీగా నవ్వుతూ
చలాకి మాటలు రువ్వుతూ
హుషారుగా ఉందాములే
నిషా కనులవాడా”
అంటుంది అమ్మాయి..! వీళ్ల కథేమిటో విందామా…

(ఇద్దరు మిత్రులు)

4) “మనసు తీరా నవ్వులె నవ్వులె నవ్వులె నవ్వాలి
మనము రోజూ పండుగె పండుగె పండుగె చెయ్యాలి ”
అంటూ సాగే ఈ పాట సరదాగా జీవితాన్ని గడపమనే సందేశాన్ని ఇస్తుంది..
ఈ గీతానికి “నెవెర్ ఆనె ఎ సండే<

అనే పాపులర్ ఆంగ్ల గీతం ప్రేరణ. దీని అసలు మాతృక ఒక గ్రీక్ సాంగ్ ను ఇక్కడ <

వినవచ్చు.

అసలు పాట క్రింద లింక్ లో..

(గూఢచారి 116)

5) “పువ్వులా నవ్వితే
మువ్వలా మోగితే
గువ్వలా ఒదిగితే
రవ్వలా పొదిగితే
నిన్ను నేను నవ్విస్తే
నన్ను నువ్వు కవ్విస్తే
అదే ప్రేమంటే…అదే అదే…” అని సాగే ఈ సరదా పాటని వినేద్దాం…

(ప్రేమబంధం)
http://www.raaga.com/player4/?id=193973&mode=100&rand=0.2858572390396148

6) “నవ్వవే నా చెలీ..నవ్వవే నా చెలీ..
చల్లగాలి పిలిచేను.. మల్లెపూలు నవ్వేను..
వలపులు పొంగే వెళల్లో..”
అని ప్రియురాలిని నవ్వమని, లోకమేమన్నా ఆమెకు తాను తోడున్నాని ధైర్యం చెప్తూ ఓ ప్రియుడు పాడే పాట ఇది..

( అంతా మన మంచికే)

7) “మిసమిసలాడే చినదానా
ముసిముసినవ్వుల నెరజాణా
సిగ్గులు చిలికి సింగారమొలికి చేరగ రావేమే
నా చెంతకు రావేమే”
అని ఓ ప్రేమజంట పాడుకునే పాట ఇది..

(పూలరంగడు)
http://www.song.cineradham.com/player/player.php?song[]=2330

శ్రీ తిరుపతమ్మ కథ చిత్రంలో ఓ చిత్రమైన పాట ఉంది.

8) “ఈ చిరునవ్వులలో .. పూచిన పువ్వులలో
ఓ చెలియా నా వలపే విరిసినదే” అని చెలికాడు అంటే
“నవ్వులు వీడునులే.. పువ్వులు వాడునులే
నీ వలపే నా మదిలో నిలుచునులే..” అంటుంది నాయిక
వాద ప్రతివాదాల్లా ఉంటుందీ పాట..

http://www.mediafire.com/listen/k4c5wcktxcse5dn/Sri+Tirupatamma+Katha+-+Ee+chiru+navvulalo.mp3

9) “చిరునవ్వుల చినవాడే
పరువంలో ఉన్నాడే
నా మనసే దోచాడే
ఏమేమో చేసాడే..”
అనే సాగే ఈ పాటలో ఓ ప్రియురాలు తన మనసుని ప్రియుడు దోచుకున్న వైనాన్ని తెలుపుతుంది..
(పవిత్రహృదయాలు)

10) “కిలకిల నవ్వులు చిలికిన
పలుకును నాలో బంగారు వీణ”
అంటూ చెలి సోయగాలు తనలో ఏలాటి కోరికలు రగిలించాయో వర్ణిస్తాడు నాయకుడు.
(చదువుకున్న అమ్మాయిలు)

11)  “ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుసగుసలాడినవి ఏమిటో ..” అంటూ మరో ప్రేమజంట పాడుకునే గీతాన్ని విందామా..

(ఇద్దరు మిత్రులు)

12) “నువ్వే నువ్వమ్మా నవ్వుల పువ్వమ్మా
నీ సరి ఎవరమ్మా..”
అంటూ ప్రేయసిని నవ్వులపువ్వుతో పోలుస్తాడీ ప్రియుడు. పాట చాలా బాగుంటుంది కానీ నవ్వు గురించిన వర్ణన ఎక్కువ ఉండదీ పాటలో…

(అందమైన అనుభవం)

“నవ్వు” పై రాసిన మరికొన్ని సినీగీతలు:

* “నవ్వు నవ్వించు ఆ నవ్వులు పండించు”
(లక్ష్మీనివాసం)

* “చిన్నారి నవ్వులే సిరిమల్లె పువ్వులు
అల్లారుముద్దులే కోటి వరాలు”
(పవిత్రబంధం)

* “బుజ్జి బుజ్జిపాపాయి బుల్లి బుల్లి పాపాయి
నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోయీ..”
(ఆడబ్రతుకు)

* “నవ్వే ఓ చిలకమ్మ
నీ నవ్వులు ఏలమ్మా
ఆ నటనలు చూడమ్మా
ఏ జవరాలినుడికించకమ్మా ”
( అన్నదమ్ములు)

* “నవ్వని పువ్వే నవ్వింది
తన తుమ్మెద రాజుని రమ్మంది..”
(చదరంగం)

* “కిలకిల నగవుల నవమోహినీ ప్రియ కామినీ”
ఘంటసాల భాగేశ్వరి రాగం లో పాడిన ఈ గీతం “వసంతసేన” చిత్రంలోది.

* “నవ్వరా నువ్వైనా నవ్వరా
ఆ నవ్వే నిను పెంచు పాలబువ్వరా బాబూ..”
(అబ్బాయిగారు అమ్మాయిగారు)

* “నవ్వు నవ్వు నవ్వు నవ్వు
నవ్వే బ్రతుకున వరము”
(ఆకాశరామన్న)

ఇవండీ.. నవ్వులపువ్వులు పూయించే కమ్మని ఆపాత మధురాలు! మళ్ళీసారి మరొక నేపథ్యంతో కలుసుకుందామేం…

raji–తృష్ణ

సూర్యస్నానం చేసిన సాగరోద్వేగాలూ…

srikantha sarma

దాట్ల దేవదానం రాజు, శ్రీకాంత శర్మ, జానకీ బాల

జ్ఞాపకపు పరిమళాలు, జీవన సౌరభాలతో పాటు వాస్తవపు వాసననీ వెదజిమ్మే పలువర్ణాల పూలసజ్జ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి “అనుభూతి గీతాలు” కవిత్వం. స్వప్నసేతువులాంటి ఏకాంతలో కలల్ని కవిత్వంగా మార్చుకున్న రసాత్మకత తొణికిసలాడుతుంది ఈ గీతాల్లో. పువ్వుల్లా పూసిన రోజులు రాలిపోయాక తొడిమల్లా మిగిలిన జ్ఞాపకాల్ని తడిమే స్పర్శతో, చురుక్కుమని తగిలినా పరిమళించే అగరువత్తి కొనల్లాంటి అక్షరాలతో అలరారుతుంది ఈ కవిత్వం. కొన్ని వర్ణనలు “ఆకుఆకునా బిందువులై ఊగే ఎండ/నీడల బీటల మధ్య పడియలై” సజీవ చిత్రాలుగా కనుపాపల కొక్కేలకి వేలాడతాయి. మరికొన్ని భావనలు “ఎన్ని కదలికల రంగులో తాకి తొణికి తడిసి మెరిసే గాజుకాగితం లాంటి నిదుర” ని సున్నితంగా చెదరగొడతాయి. “సూర్యస్నానం చేసిన సాగరోద్వేగాలూ/మంద్రపవన మలయవేణుస్పర్శలూ” కలిసినంత ఆహ్లాదంతో ఓలలాడించే అలాటి ఒక అందమైన కవిత ఇక్కడ:

 

40- సూర్యకిరణాల జీవధార

నిద్రపోయే నది గుండెను తట్టి

పడవను మేలుకొలుపుతుంది-

ఇంత వెలుగు- ఇంతగాలి-

పడవని ఊగించి లాలిస్తాయి-

లోతైన నదిగుండెలోకి

స్తిమితంగా మునకవేసిన వెదురుగడ

పడవచేతిలో తంబురా…

పడుకున్న పక్షిని

పాటలతో మేల్కొలుపుతుంది-

పక్షి పంజరం దాటుకుని

వెళ్ళిపోయిన శూన్యసమయం-

అలలమీద దర్భపుల్లలూ, నందివర్ధనంపూలూ…

మంత్రాలు గొణిగే బ్రాహ్మడూ

నిర్గమన సాక్షులుగా

మనిషి పేరిటి వేషం విప్పేసిన

నా తండ్రి సంస్కృతి నిమజ్జనమైన వేళ…

నది కాసేపు అరమోడ్పు కళ్ళతో నిలిచింది-

ఒడ్డున ఒంటరిగా నన్ను వదిలేసి

తంబురా మీటుకుంటూ

పక్షుల్ని మేలుకొలుపుకుంటూ

పడవ మాత్రం

మరో తీరం వైపు-


 

వ్యాఖ్యానం

ఒక నిశ్చల చిత్రంలో కదలిక కలిగి దాన్లోని రంగులకి గాలి అల తాకినట్టు కాస్త ఊగి మళ్ళీ ముందులానే సర్దుకున్నట్టు ఉంటాయి కొన్ని అనుభూతులు. “సూర్యకిరణాల జీవధార/నిద్రపోయే నది గుండెను” తాకడం కూడా అలాటి ఒక దృశ్యానుభూతి. మొట్ట మొదటి చైతన్య కిరణం తాకిన నీరు పడవలో కదలికగా పరావర్తనం చెందుతుంది. బహుశా పడవ కదలికే నదికి గుండె చప్పుడు కాబోలు. “ఇంత వెలుగు- ఇంతగాలి” చూపుగా, ఊపిరిగా నీటి ప్రాణాన్ని నిలబెడుతూ ఉండొచ్చు.

కొన్ని ప్రయాణాలకి సిద్ధమవ్వడం అంత సులువు కాదు. పైపైన కనపడే పనుల్ని తెముల్చుకోవడమే కాక లోతుల్లోకి మునకేసి అక్కడి ప్రవాహపు నిండుతనాన్ని చీల్చుకుపోవాల్సి రావచ్చు. తీరం మీదే వదిలేయాలని తెలిసీ తంబురాని శృతి చేసుకుంటూ “పడుకున్న పక్షిని పాటలతో“ మేల్కొలిపే సమయం దగ్గరైనప్పుడు బహుశా ఎగిరిపోవడానికి మాత్రమే నిద్ర లేస్తుంది పక్షి. పంజరానికి శూన్యాన్ని వదిలి పాటని మాత్రం తనతో తీసుకెళ్తుంది. అప్పుడు “అలలమీద దర్భపుల్లలూ, నందివర్ధనంపూలూ…మంత్రాలు గొణిగే బ్రాహ్మడూ నిర్గమన సాక్షులుగా” మిగుల్తారు. వెళ్తూ వెళ్తూ రెక్కల కింద వీచిన చల్లటి గాలి తెమ్మెరకి కృతజ్ఞతగా “నది కాసేపు అరమోడ్పు కళ్ళతో” మౌనంగా నిలుస్తుంది.

ఒక మనిషి దాటిపోవడం అంటే అతనికే చెందిన కొన్ని మాటలు, అలవాట్లు, వివరాలు, అనుభవాలూ అన్నీ కాలంలో కలిసిపోవడం. ఒకానొక తరానికి చెందిన సంస్కృతిలోని ఒక సూక్ష్మభాగం నీళ్లలో నిమజ్జనం అయిపోవడం. మనుగడ అనేది మనుషుల మధ్య ఆగకుండా కొత్త చరణాల్ని కలుపుకుంటూ వెళ్ళిపోయే ఒక పాట లాంటిది. ఇక నిష్క్రమించవలసిన చరణాల్ని మోసుకుంటూ పడవ కాలంలా, జీవితంలా నిరంతరాయంగా అనంతమైన ఆవలితీరం వైపు సాగిపోతూ ఉంటుంది ”తంబురా మీటుకుంటూ పక్షుల్ని మేలుకొలుపుకుంటూ…”

1swatikumari-226x300–బండ్లమూడి స్వాతి కుమారి

 

బోలెడు కరుణ…కొంచెం ఆగ్రహంతో…!

25VZVIJREG2WRIT_25_1309849e

(ప్రసిద్ధ కథా రచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి 75 వ పుట్టిన రోజు : డిసెంబర్ 15)

ఓ బోయవాడు బాణం వదిలాడు. పూర్వాశ్రమంలో దొంగగా బతికిన ఓ వ్యక్తి అక్కడ నిలబడి జంట పక్షుల్లో ఒకటి నేలకొరగడం చూశాడు. తోడు కోల్పోయిన రెండో పక్షి కన్నీరులో కరిగాడు. కరుణరసాత్మకమైన ఓ కావ్యానికి బీజం పడింది. ఇది మనందరికీ తెలిసిన వాల్మీకి కథ. జాగ్రత్తగా గమనించండి. వాల్మీకికి అప్పుడు కలిగిన భావన కేవలం కరుణేనా? బాణం వేసిన బోయవాడి మీద కోపం రాలేదా? ప్రాణాలని కబళించి మిగిలిపోయినవారికి విషాదాన్ని మిగిల్చే మృత్యువు మీద ఆగ్రహం కలగలేదా? ప్రేమ జంట తనని వీడిపోయిందని ఏడుస్తున్న పక్షి కన్నీరు తుడవలేని అశక్తతని తలుచుకోని వాల్మీకికి అసహనం కలగలేదా? ఒకవేళ అలాంటి ఆగ్రహం, అసహనం కలిగివుంటే వాల్మీకి రాసిన కావ్యం ఎలా వుండేది?

నేను చెప్పనా?

అప్పుడు కూడా రామాయణం కరుణరసాత్మకంగానే వుండేది. ఆ వాల్మీకి పెద్దిభొట్ల సుబ్బరామయ్య అయితే. ఆగ్రహానికీ కరుణకు ఏమిటీ సంబంధం? తెలుసుకోవాలి. తెలుసుకునే ప్రయత్నమైనా చెయ్యాలి. ఎలా? పెద్దిభొట్ల కథలు చదవాలి. “ద్రణేవుడు” ఎవరు? ఎవరో వుండే వుంటారు. వెతకాలి. వెతుకుతూనే వుండాలి. తెలుసుకుంటే జ్ఞాని అవుతాడు. తెలుసుకోలేనివాడు “ఇంగువ” అంటే ఏమిటో ఎరగని వాడిలా జీవితాన్ని చాలిస్తాడు. ముగిసిపోయేది కాదు జీవితం అంటే, తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తావే అదీ జీవితం అంటే..

అలా కాదు నీకు తెలిసిందే ప్రపంచం అనుకుంటావా… ఆల్ రైట్… గాటానికి కట్టిన ఎద్దులా గిరా.. గిరా.. గిరా… బావిదాటని కప్పలా బెక బెక బెక బెకా…! తనకు తెలియని కొత్త ప్రపంచం ఒకటుందని, అందులో కనుచూపు సాగినంత మేర “నీళ్ళు” వుంటాయని తెలియని వాడు ఏమౌతాడు? మంచినీళ్ళు కనిపిస్తే అవురావురంటూ తాగుతాడు. గంటలుగంటలు స్నానాలు చేస్తాడు. చివరికి ఓ ముహూర్తాన నీళ్ళలోనే పడి చస్తాడు. మరి అతను తెలుసుకోవాల్సిందేమిటి? ఓ వూరిలో నీళ్ళు లేక ఛస్తుంటే మరో వూర్లో నీళ్ళలో మునిగి చస్తుంటారు. ఈ వైరుధ్యాన్నే తెలుసుకోవాలి. ఈ వైరుధ్యం పేరు కూడా జీవితమే.

అయితే ఈ జీవితం గురించి మనకి చెప్పేది ఎవరు? నేను చూడని కొత్తకోణం వైపు బైనాకులర్స్ పెట్టి చూపించేది ఎవరు? ఒక పుస్తకం. ఒక జిజ్ఞాస. ఒక ప్రశ్న. ఇదిగో అలాంటి ప్రశ్నలన్నింటినీ తలకెత్తుకోని తిరిగే పెద్దమనిషి ఒకాయన వున్నాడు. పెద్దిభొట్ల సుబ్బరామయ్య అంటారు ఆయన్ని. మృత్యువుని రక్తం రంగులో కళ్ళారా చూసినవాడు. తల్లిప్రేమని అభద్రత రూపంలో అనుభవించిన వాడు. కష్టాన్ని కన్నీటి రుచిలో తెలుసుకున్నవాడు. జీవితం అంటే కషాయం అని కనిపెట్టిన మానసిక శాస్త్రవేత్త. ఆ కషాయాన్ని ఏ మిశ్రమాలలో కలపాలో తెలుసుకున్న సరికొత్త రసవాది. కథ అనే అంబులపొదిలో అక్షయతూణీరాల్లాంటి పాత్రల్ని పెట్టుకోని మనసుని కరుణాస్త్రబద్ధుల్ని చేయగల విలుకాడు.

కవిసామ్రాట్ దగ్గర శిష్యరికం చేసినవాడు పోనీ కవిత్వం రాసి వుండచ్చుగా? కథని పట్టుకున్నాడు. కథ ఆయన్ని పట్టుకుంది. కథల్లో వర్ణన చూడండి. ఒకో కథలో ఒకలాగ వుండే వాతావరణం చూడండి. నిప్పుల మీద నుంచి వీస్తున్నట్లుగా వేడిగాలులు, బాగా బలిసిన ఏనుగుల్లా మబ్బులు, వాన జల్లులు, ముసురు పట్టడాలు, గుడ్డివెన్నెలలు, తెల్లటి వెండి కంచంలాంటి చంద్రుడు, వేప చెట్లు అబ్బో.. ఇంకా చాలా వున్నాయి. ఇవన్నీ కథలోకి వచ్చి ఏం చేస్తున్నాయి? చదివిస్తున్నాయి. అంతే. ఏ వాక్యాన్ని విత్తనంగా వేస్తే ఏ అనుభూతి మొలకెత్తుతుందో తెలియడమే రచన. అదే కదా కావాల్సింది.

వుద్యోగంలో చేరాల్సినరోజే ఎగ్గొట్టి “పథేర్ పాంచాలి” చూసినవాడు పోనీ సినిమా అయినా తీసుండచ్చుగా? లేదు. మళ్ళీ కథలోకే వచ్చాడు. సినిమా చూపించాడు. కావాలంటే అయన రాసిన తొలి కథల్లో ఒకటైన “భయం” (1960) చూడండి. ఓ పిల్లవాడు గోడగడియారం బద్దలుకొట్టాడు. నాన్న వస్తే బెత్తం విరిగేట్లు కొడతాడని భయం. అదే కథ. అంతే కథ. ఆ పిల్లాడి భయం చెప్పాలంటే వాడి మనసులో దూరి తెరలు తెరలుగా వున్న భయాన్ని పొరలు పొరలుగా వ్యాక్యాలలో చెప్పాలా? ఊహు.. అలా కాదు. ఎండ, ఎండుటాకులు, టెలిగ్రాఫ్ తీగలమధ్య చిక్కుకున్న గాలిపటాలు, వీధి చివర తోలుతిత్తి వొత్తుతుంటే వచ్చే ’గుఫ్ గుఫ్’ చప్పుడు, మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముతున్న ముసల్ది, దూదేకులవాడు ఏకుతున్న దూది, ఓ ఇంటి పంచాలో ఓ చిన్నపిల్ల వూదుతూ పగలగొట్టిన బెలూన్, ఆ చప్పుడుకి ఏడ్చిన చంటిపిల్లాడు… ఏమిటిదంతా? సంబంధంలేనివేవో చూపిస్తూ ఆ పిల్లాడి మనసులో భయాన్ని పరిచయం చేస్తాడు. ఈయనెవరు సైకాలజిస్టా? దాదాపు అలాంటిదే – స్కూల్ మేష్టరు.

“నేను ఏదీ టెక్నిక్ ప్రకారం రాయలే”దని. “కథకి మేథమేటిక్స్” వుండదని చెప్పిన రచయితేనా రాసింది? అవున్నిజమే. ఆయన టేక్నిక్ అనుకోని రాయడు. అది రాసిన తరువాత ఆ టెక్నిక్ గురించి మనం తెలుసుకుంటాం.

కథలన్నీ కరుణరసం అన్నామా? మరి మనసుల్ని తాకేవి, పిండేవి, కాల్చి నుసి చేసేవి రాసాడా? అదీ లేదు. మరేం చేశాడు?చెప్పదల్చుకున్నది మూడు పేజీలలో తేల్చేశాడు. ఆ మూడు పేజీల్లోనే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ తయారు చేశాడు. కరుణరసాత్మకమైన కథలో ఓ సస్పెన్స్ థ్రిల్లర్? ఇదెలాగా? అదలాగే. ఏ వాక్యమైతే కథకి మూలమో ఆ వాక్యాన్ని గుండెకి దగ్గరగా పెట్టుకోని, షో చెప్పేముందు విసిరే ట్రంప్ కార్డులా విసిరి కథ ముగిసిందంటాడు. అదేమి చిత్రమో మన మనసులో కథ అప్పుడే మొదలౌతుంది. “అన్నదాత సుఖీభవ” కథ చూడండి. పురుషోత్తం అనే వ్యక్తి కథ చెబుతుంటాడు. ఎక్కడో సత్రంలో తప్పక అన్నదాన పంక్తిలో భోజనం చెయ్యాల్సివచ్చిన సంగతి అది. తీరా తిన్నాక అక్కడ బోర్డుమీద వున్న పేరుని చూసి కన్నీళ్ళు పెట్టుకున్నానంటాడు. ఆ పేరేమిటో చెప్పడు. ఆ తరువాత మూడు పేరగ్రాఫుల సమయం గడిచాక, పక్కనున్న మిత్రుడు అడిగితే గాని ఆ పేరు ఎవరిదో పాఠకుడికి తెలియదు. ఆ తరువాత లైనుకి కథ అయిపోతుంది. ఇది కొసమెరుపుతో ముగించడం కాదు. ఒక మెరుపుని కొసదాకా లాక్కొచ్చి పడేయడం. ఆయన రాయడానికి కలం వాడుతారా? ఉలి వాడుతారా? తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఎలా?మధ్యతరగతి జీవితాలని కాచి వడబోసిన కషాయం కనిపెట్టిన కథకుణ్ణి తెలుసుకోవద్దూ? అర్థంకాని లిపిలో దేవుడు రాసిన జీవితమనే కావ్యాన్ని అలతి తెలుగుపదాలలోకి మార్చిన అనువాదకుణ్ణి తెలుసుకోవద్దూ? అగ్రవర్ణం అని పిలవబడే జాతిలోకూడా అస్పృశ్యుడైన దళితుణ్ణి పరిచయం చేసిన మనిషిని గురించి తెలుసుకోవద్దూ? ఆటల్ని కూడా కథలుగా మార్చగలిగిన రచయితని తెలుసుకోవద్దూ? మీరే చెప్పండి – తెలుసుకోవాలా లేదా? మరింకెందుకాలస్యం తెలుసుకోండి –

ఇంతకీ ఇంగువ ఏమిటి? తెలుసుకున్నారా? “అది చెట్టు నుంచి వొస్తుందా? ఏదైనా రసాయనిక పదార్థమా? లేక ఒక రకం రాయి వంటిదా? అది గాక ఏదన్నా జంతువుకు సంబంధించినదా?” తెలుసుకున్నారా?లేక తెలియకుండానే..???

(ఒక కథకుణ్ణి నేను ఎందుకు అభిమానిస్తున్నాను అన్న ప్రశ్నకి నేను వెతుక్కున్న జవాబులే రాశాను తప్ప సమీక్షలు చేసే అర్హత నాకు లేదని నా విశ్వాసం – రచయిత)

– అరిపిరాల సత్య ప్రసాద్

అరిపిరాల సత్యప్రసాద్

అరిపిరాల సత్యప్రసాద్

మరుగుజ్జు

 

Sujala_Ganti  

(రచయిత్రిగా  నా ప్రస్థాన౦  మూడేళ్ళు. నా మొదటి  కథ 2011 లో ప్రచురి౦చబడి౦ది. 2012 లో   “ అమ్మ బ౦గారు కల”  నవల అనిల్  అవార్డ్  గెలుచుకు౦ది . సప్తపది  నవల  గత ఆగస్ట్  లో  ఆ౦ధ్రభూమి  లోప్రచురి౦చబడి౦ది. —-సుజలమూర్తి గ౦టి) 

  ***

సాయ౦కాల౦  పార్టీకి  వెళదామని  తయారవుతున్నాను. నాభర్త   విక్ర౦  ఆఫీసులో  పార్టీ  ఉ౦ది. అద్ద౦లో  నన్ను  నేను చూసుకోవడ౦  నా కిష్టమైన  పనుల్లో ఒకటి. దానికి  కారణ౦ నేను చాలా  అ౦ద౦గా ఉ౦డడమే.

చక్కని  పసిమి చాయ. అ౦దమైన  అవయవసౌష్టవ౦, గులాబీలు  పూసినట్లు  ఉ౦డే  చెక్కిళ్ళు, కోటేరిన  ముక్కు, ప్రబ౦ధ కవులు  వర్ణి౦చే౦త  అ౦ద౦గా  ఉ౦టాను. నేను అనుకోవడమే కాదు, అ౦దరూ  అనడ౦ నాకు తెలుసు.అ౦దుకే  నన్ను  అద్ద౦  లో  చూసుకున్నప్పుడు  నాకు  చాలా  గర్వ౦  గా ఉ౦టు౦ది.

షిఫాన్ వర్క్ చీర దానికి  మాచ్  అయ్యే డిజైనర్  బ్లౌజ్  వేసుకున్నాను. లైట్ గా కా౦పాక్ట్  రాసి, విల్లులా వ౦గిన అ౦దమైన పెదవులకు లిప్స్టిక్ రాసి  మరోసారి  అద్ద౦ లో  చూసుకున్నాను. నా  గదిలో౦చి  బైటికి  వచ్చిన  నన్ను  నా  కూతురు గబగబా వచ్చి  నా  కాళ్ళ కు చుట్టుకోబోయి౦ది. చీర  నలిగి పోతు౦దన్న  క౦గారులో దాన్ని  ఆపబోయాను. నా చెయ్యి  తగిలి పడిపోయి౦ది.

గట్టిగా  “లతా”  అ౦టూ కేక పెట్టాను.  మా  పని పిల్ల  భయపడుతూ  వచ్చి౦ది. “ఏ౦  చేస్తున్నావు? నేను  బైటికి వెడుతున్నాను  కదా! పాపను  చూసుకోవాలి  కదా! నువ్వు  ఉన్నదే అ౦దుకు. పాప  నా  బట్టలు పాడు చెయ్యబోయి౦ది” అ౦టూ, మా   పాప వైపు తిరిగి, “ బుజ్జి  నేను  పార్టీకి  వెడుతున్నాను. అలా కౌగలి౦చుకు౦టే  నా  బట్టలు  పాడయిపోతాయి.” అన్నాను.

ఇ౦తలో  విక్ర౦  వచ్చినట్లుగా  కార్ చప్పుడు  అయ్యి౦ది. లతను  కాఫీ తెమ్మన్నాను.

“ హాయ్  డార్లి౦గ్ సూపర్. ఎప్పటిలాగే  చాలా  అ౦ద౦గా  ఉన్నావు.ఒక్క  పది నిముషాల్లో  రెడీ  అయి వస్తాను” అ౦టూ  లోపలికి వెళ్ళాడు. ఈ హడావుడిలో  బిక్క మొహ౦  తో  నా కూతురు  లతను  అనుసరి౦చి౦ది. నా ప్రవర్తనతో  నేను  ఎ౦త  తప్పుచేస్తున్నానో  నేను  గ్రహి౦చలేదు.

పార్టీ స్థలానికి  చేరుకున్నాము. అది  ఒక  ఫైవ్ స్టార్  హోటల్. విక్ర౦  ఆఫీస్  పార్టీలన్నీ ఎక్కువగా  అ౦దులో  జరుగుతాయి. మే౦ ఇద్దర౦  రాగానే  అప్పటికే  వచ్చిఉన్నవాళ్ళు  వెనుతిరిగి  చూసారు. నాకు  కావాల్సిన  మెరుపు వాళ్ళ కళ్ళల్లో కనిపి౦చి౦ది. కి౦చిత్ గర్వ౦.అ౦దరి  చూపుల్లో  ఉన్న మెచ్చుకోలు, ఈర్ష్య అన్నీ  ఎన్ జాయ్  చేస్తూ  పార్టీ కూడా  ఎన్ జాయ్ చేసాను. విక్ర౦ కూడా  నాలా౦టి  అ౦దమైన  భార్య తన  సొ౦త  అయిన౦దుకు చాలా గర్వ౦ ఫీల్  అవుతాడు.

మేము  పార్టీ  ను౦చి  వచ్చేసరికి మా  పాప నిద్రపోయి౦ది.  దాని బెడ్ రూమ్ లోకి వెళ్ళి దాన్ని  చూసి  నుదుటి మీద ముద్దుపెట్టుకుని నా  గదిలోకి  వచ్చి  బట్టలు  మార్చుకుని  పడుక్కున్నాను.

నేను  చాలా  తెలివైన  దాన్నని,  నా  కన్నీ వచ్చునన్న  అహ౦కార౦  నా నరనర౦  లో  జీర్ణి౦చుకు పోయి౦ది.  నా  లా౦టి  వాళ్ళు  చాలామ౦ది  కాకపోయినా  కొ౦తమ౦ది  అయినా  ఉ౦టారు. చదువుకున్నాను నాకు  రాని  విద్య  అ౦టూ  లేదు.  నా  భర్త  కూడా  నన్ను  పొగడ్డ౦  కొ౦త కారణ౦ కావచ్చు.  నా  చుట్టుపక్కల  ఆడవాళ్ళలో  నేనొక  విశిష్ట వ్యక్తిగా  ముద్రి౦పబడ్డాను.  అ౦దుకే  నేను ఎవరితో  మాట్లాడినా  నా గొప్పతనాన్ని  అడుగడుగునా  ప్రదర్శి౦చడానికి  తాపత్రయపడతాను.

నా  కూతురికి  పై౦టి౦గ్ అ౦టే  చాలా ఇష్ట౦.  కానీ  ర౦గుల  తో  అయ్యే క౦గాళ౦  నాకు  ఇష్ట౦  ఉ౦డదు. శుభ్రపరచడ౦ కూడా  శ్రమతో  కూడిన పని. అ౦దుకే  నాకు  నా  కూతుర౦టే  ఎ౦త  ఇష్టమైనా  నేను  దాన్ని ఆ  విషయ౦లో  మాత్ర౦  ఎ౦కరేజ్ చెయ్యను.

ఈ  విషయ౦లో  నా  భర్తకు  నాకు  చాలాసార్లు ఆర్గ్యుమె౦ట్స్  జరిగాయి. కానీ  చివరకు  నేనే గెలిచాను. ఆ విధ౦గా మా  అమ్మాయి  పై౦టి౦గ్  ముచ్చట  తీరలేదు.

ఒక  రోజు  నా  కూతురు  చాలా  ఆన౦ద౦గా  వచ్చి౦ది. “ అమ్మా  ఇవ్వాళ  నేను కరణ్, ప్రీతిల వాళ్ళ  ఇ౦టికి  వెళ్ళి ఆడుకున్నాను.” అ౦ది

కరణ్, ప్రీతి  మా  అపార్ట్ మె౦ట్స్  లోనే ఉ౦టున్నారు. వాళ్ళ తో  నాకు  పరిచయ౦ లేదు. అలా౦టిది  నా కూతురు వాళ్ళతో సడన్ గా  పరిచయ౦  పె౦చుకోవడ౦  నా కె౦దుకో  నచ్చలేదు.

“ సరేలే  ఆడుకున్నావు గా ఇ౦కెప్పుడు  వెళ్ళినా  నాకు చెప్పకు౦డా  వెళ్ళకు” అన్నాను.

నా  మొహ౦లోని  సీరియెస్ నెస్ చూసి  నా కూతురు మాట్లాడకు౦డా  తన  రూమ్ లోకి  వెళ్ళిపోయి౦ది. నేను కూడా వాళ్ళ గురి౦చి పెద్దగా  ఆలోచి౦చలేదు.

కరణ్, ప్రీతి  అప్పుడప్పుడు  బయిటికి  వచ్చినప్పుడు కనబడతారు. కడిగిన  ముత్యాల్లా  ఉన్న పిల్లలు నవ్వుతూ కనబడ్డ పెద్దవాళ్ళకు  నమస్కార౦  చెప్తారు. వాళ్ళను  చూసి  ముచ్చటపడని  వాళ్ళు లేరు. కానీ  నేను ఎ౦దుకు  హర్షి౦చలేకపోతున్నాను?

నేను  వద్దన్నా  మళ్ళీ  వాళ్ళి౦టికి  ఆడుకు౦దుకు  వెళ్ళి౦ది. తిరిగి వచ్చిన నా పాప లో  పట్టలేని  ఆన౦ద౦.

“అమ్మా  ఇవ్వాళ  నేనే౦ చేసానో   నీకు తెలుసా? ప్రీతీ  వాళ్ళి౦ట్లో  చాలా బాగా  ఆడుకున్నాను.వాళ్ళమ్మగారు కేక్ చేస్తు౦టే  మే౦ హెల్ప్ చేసా౦.  ఆ౦టీ  మాకు  ఫి౦గర్  పై౦టి౦గ్  నేర్పి౦చారు. ఎ౦త  బాగు౦దో  తెలుసా!నాకు  ఏ ఏ ర౦గులు కలిపితే కొత్త ర౦గులు  వస్తాయో  ఆ౦టీ నేర్పి౦చారు. వాళ్ళిల్లు  చాలా  నీట్ గా  ఉ౦టు౦ది. ప్రీతీ, కరణ్  వాళ్ళు  ఏ వస్తువు  వాడినా మళ్ళీ  ఆ  స్థాన౦లో  పెట్టేయాలి.  ఇల్లు నీట్ గా  ఉ౦డకపోతే  ఆ౦టీకి  నచ్చదు.” అ౦టూ పూర్తిచేసి౦ది.

సరే  దాని  ఆన౦దాన్ని  ఎ౦దుకు  పోగొట్టాలని, నాకు  ఇష్ట౦ లేకపోయినా  ఏ౦  మాట్లాడలేదు.  లేడీస్  క్లబ్  వార్షికోత్సవ౦  పనుల్లో  బిజీగా ఉన్నాను. అ౦దుకే  సమీర  కదలికలు  నేను  పట్టి౦చుకోలేదు. రోజూ  నా  కూతురిని౦చి  ఆ౦టీ  ఇలా  చేస్తు౦ది  అలా  చేస్తు౦ది  అన్న  ప్రశ౦సలు వినాల్సి  వస్తో౦ది.                                                              

నిజ౦  చెప్పాల౦టే  నాకు నన్ను  తప్ప  ఎవర్ని  పొగిడినా  భరి౦చలేను. నాలో మెల్లగా ఆవిడ  పట్ల ఈర్ష్య  మొదలయ్యి౦ది. నేనె౦దుకు  ఈర్ష్య కు  లోనవుతున్నానో  నాకే  అర్థ౦  కాలేదు.  నా  కూతురికి  అ౦త నచ్చిన  ఆమెను,  ఆమె ఇ౦టిని  చూడాలని  నిశ్చయి౦చుకున్నాను.                                                                                                      

ఒక  రోజు  వాళ్ళ  అపార్ట్ మె౦ట్  కు  వెళ్ళాను. బెల్  కొట్టగానే  అయిదునిమిషాలకు  తలుపు  తెరుచుకు౦ది. తలుపు  తెరిచిన  స్త్రీమూర్తిని  చూసి  ఆ ఇ౦టి ఇల్లాలు  ఆవిడే  అయ్యు౦టు౦దని  అనుకుని  “నమస్కారమ౦డి నేను  సమీర వాళ్ళమ్మను  మీ  గురి౦చి  మా  అమ్మాయి  తెగపొగుడుతూ  ఉ౦టు౦ది. అ౦దుకని  మిమ్మల్ని కలవాలని వచ్చాను.” అన్నాను.

“అరె  మీరా  లోపలికి  ర౦డి. సమీర  చాలా మ౦చి పిల్ల. బ౦గారు తల్లి. అన్నీ  నేర్చుకోవాలన్న కుతూహల౦  తన లో  చాలా ఉ౦ది.  కూర్చో౦డి”  అ౦టూ  సోఫా  చూపి౦చి౦ది.

సోఫాలో  కూర్చుని  ఇల్ల౦తా  పరిశీలి౦చాను. నిజ౦గానే  ఇల్లు  తీర్చిదిద్దినట్లుగా  ఉ౦ది. నేను  ఇల్లు  పరిశీలి౦చే లోపల  ఆవిడ లోపలికి  వెళ్ళి  ట్రేలో  కాఫీ, బిస్కెట్స్ తీసుకు వచ్చి౦ది. టీపాయ్  మీద పెట్టి “తీసుకో౦డి”  అ౦ది.

ఇ౦త  తొ౦దరగా ఇవన్నీ చేసిన  ఆమె  చురుకుతనాన్ని  మెచ్చుకోకు౦డా  ఉ౦డలేక పోయాను.

“ మీరు  ఇ౦ట్లో  కూడా నల్లకళ్ళద్దాలు  పెట్టుకు౦టారా?” అన్నాను.

నవ్వుతూ “నేను  కళ్ళద్దాలు  పెట్టుకోకపోతే  నన్ను  మీరు  చూడలేరు” అ౦ది.

“అ౦టే  మీరు” అ౦టూ  అర్థోక్తిలో  ఆగిపోయాను.

“ అవును  నాకు  కళ్ళు  లేవు”.

నమ్మశక్య౦  కాలేదు. నేను  వచ్చినప్పట్ని౦చీ  ఆవిడ  చర్యల్లో  ఎక్కడా  ఆవిడకు  కళ్ళు  కనబడవన్న  అనుమాన౦  రాలేదు. ఆమె  చేసే  ప్రతీ పనీ  సుశిక్షితుడైన  సైనికుడి చర్య లా ఉ౦ది.

నాకు  నోట మాట  రాలేదు. ఇవన్నీ  ఎలా  సాధ్య౦? బహుశా  ఆమెకున్న ఆ  ఒక్క  లోపాన్ని మిగిలిన గుణాలు  డామినేట్ చేసి  ఉ౦టాయి.

“ మీ రొక్కరూ  అన్ని  పనులూ  ఇ౦త  బాగా ఎలా  చేస్తున్నారు?”

“ అలవాటు  అయిన  ఇల్లే  కదా! కొత్త  జాగాలో అయితే  ఇబ్బ౦ది  అవుతు౦ది. మా  ఇ౦ట్లో ప్రతీ వస్తువు కు ఒక  నిర్ణీత  స్థల౦  ఉ౦ది. ఏ వస్తువు  ఎక్కడ  ఉ౦దో  నా  భర్త  కానీ  నా  పిల్లలు కానీ నాకు  చెప్తారు. దాన్ని బట్టి  నేను ఆ  వస్తువును  అవసరమయినప్పుడు  వాడుకు౦టాను. కొ౦చె౦  ప్రాక్టీస్ చేసి  టీ  పెట్టడ౦, వ౦ట కూడా  అలవాటు  అయిపోయి౦ది. పెద్దపనులు  తప్ప  చిన్నపనులు  అన్నీ  నేను  మానేజ్  చెయ్యగలను” అ౦ది.

“ మీరు  మొదటిను౦చీ  ఇలాగే  ఉన్నారా?” పుట్టుగుడ్డివారా  అని  అడగడానికి  సభ్యత అడ్డు  వచ్చి౦ది.

“  అవున౦డీ.  కానీ  నా  ఆ లోప౦ తెలియకు౦డా  మా  అమ్మ  నన్ను  పె౦చి౦ది. నేను  ఎప్పుడూ నాకు  చూపులేదని  బాధపడ కూడదని,  చిన్నప్పట్ని౦చీ  నేను ఎవరి  మీదా  ఆధారపడకు౦డా  ఉ౦డాలని  ఆమె చాలా తాపత్రయపడి౦ది నాలో ఆత్మస్థైర్యాన్ని, విశ్వాసాన్ని  పె౦చి౦ది.                                                                                                   జీవిత౦ లో  అ౦దరికీ  అన్నీ  దొరకవు  మనకు  దొరికిన  వాటితోనే  స౦తృప్తి  పడాలని  నేర్పి౦చి౦ది. నా  ప౦చే౦ద్రియాల్లో  ఒక  ఇ౦ద్రియ౦  పనిచెయ్యక  పోయినా  ఆ  ఒకదాని  శక్తి  కూడా దేముడు  మిగిలిన  వాటికి  ఇచ్చాడు నా  సిక్స్త్ సెన్స్ నాకు  చాలా  మటుకు  దోహద పడుతూ  ఉ౦టు౦ది” అ౦ది.

“ ఇ౦కా  మీ  గురి౦చి చెప్ప౦డి” అన్నాను.

“ చెప్పడానికి  ఏము౦ది?  నాన్నగారు  అమ్మకు మేనమామ.  చాలా  కాల౦గా దగ్గర  స౦బ౦ధాలు  చేసుకోబట్టి  నేను,  నా  తరువాత మా  తమ్ముడు  ఈ లోప౦  తో  పుట్టాము. డాక్టర్  తరువాత  పిల్లలు  కూడా  ఈ  లోప౦ తో  పుట్టే  అవకాశ౦  ఉ౦దని  చెప్పడ౦ తో  నాన్నగారు  తమ్ముడి  తరువాత ఇ౦కో  ప్రాణి  ప్రప౦చ౦లోకి  రాకు౦డా  జాగ్రత్తపడ్డారు.

ఇద్దర౦  చిన్నప్పట్ని౦చీ  బ్లై౦డ్ స్కూల్లో  చదివి డిగ్రీలు  స౦పాది౦చుకున్నాము. తమ్ముడు  కాలేజ్ లో  లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. మా  వారు  దూరపుబ౦ధువు.ఆయన  మనస్పూర్తిగా  ఇష్టపడే నన్ను  చేసుకున్నారు. లోక౦లో  మ౦చితన౦  ఇ౦కా  మిగిలి ఉ౦దన్న  దానికి  నిదర్శన౦  మా వారు” అ౦ది.

నా  కళ్ళు  చెమర్చాయి.  ఆమె  ఆత్మ  విశ్వాసానికి జోహార్లు.

“  నా పేరు  అరుణ. మీ  పేరు?”  అన్నాను.

“ నా  పేరు  అరు౦ధతి”  అ౦ది.

“ చాలా  చక్కని  పేరు”  నాకు  తెలియకు౦డానే నా  నోటివె౦ట  వచ్చి౦ది.

“ మీరు  పెయింటింగ్   నేర్పి౦చారని  మా  సమీర  చెప్పి౦ది. ర౦గులు  కూడా  ఏది  కలిపితే  ఏది వస్తు౦దో  కూడా మీరు  చెప్పారని  అ౦ది.  అదెలా  సాధ్యమయ్యి౦ది?”  అన్నాను.

“ అమ్మ  ఓపికగా అన్నీ  నేర్పి౦చి౦ది నేను కళ్ళతో  చూడలేకపోయినా  అనుభూతి  పొ౦దేటట్లుగా  అమ్మ  నేర్పి౦చి౦ది. మీ  సమీర  చాలా  తెలివైన  పిల్ల. నేను  చూడలేకపోయినా  నేను  చెప్పినట్లుగా  చేస్తూ  ఆమె  స౦తోష౦  లో  మాట్లాడుతున్న మాటలు నేను  గ్రహి౦చి ఆమెను  ప్రోత్సాహి౦చాను.తనకు  తెలియకు౦డానే  తను  వేసిన  చిత్ర౦  గురి౦చి  నాకు వివరణ  ఇచ్చేది. అది విన్న  నేను  ఆమె చిత్రాన్ని చూసినట్లుగా  మాట్లాడేదాన్ని. నేను  చేసిన  ఆ  పనికే  తను  నేను ఏదో  నేర్పానని నేను  చూసానని అనుకు౦టో౦ది. అ౦తకన్నా  నేను  చేసి౦ది  ఏమీ లేదు ” అ౦ది  అరు౦ధతి.

“ సరే   నేను  వెడతాను”  అ౦టూ  లేచాను.

“ అప్పుడప్పుడు  వస్తూ  ఉ౦డ౦డి”.

ఇ౦టికి  వచ్చినా  నా  ఆలోచనల  ని౦డా  ఆమే  ని౦డి  ఉ౦ది. నేను  ఎ౦తగానో  ప్రేమి౦చే  నా  కూతురు  నా కన్నా ఆమె  సా౦గత్యాన్ని  కోరుకు౦టో౦ది. ఇన్నాళ్ళూ  నేనేదో  గొప్పదాన్నని  మిడిసి  పడ్డ నాకు  ఆమె ప్రవర్తన, స౦స్కార౦  నాలో  ఏదో  అలజడిని  రేపి౦ది.

నాలో  ఏ౦  గొప్పతన౦  ఉ౦దని  ఇన్నాళ్ళూ  మిడిసి  పడ్డాను? చుట్టుపక్కల ఉన్న  మిగిలిన  వాళ్ళకన్నా ఒకటి  రె౦డు  విద్యలు  ఎక్కువ  వచ్చిన౦త  మాత్రాన  నేనేదో  అపురూప  వ్యక్తిగా గర్వపడ్డాను.

సమీర  వచ్చాక  అడిగాను “ అరు౦ధతి  ఆ౦టీ  నీకు  బొమ్మలు  వెయ్యడ౦  నేర్పి౦చి౦దన్నావు కదా! ఎలాగా? అన్నాను.

“ ర౦గులు  కలిపి  నా  చేతిని  ర౦గులో  ము౦చి  నా ఫి౦గర్స్తో  రకరకాల  బొమ్మలు గీసాను.ఆ౦టీ  ఏ ఏ ర౦గులు  వాడాలో  చెప్పేది.  ఆ౦టీ  చూసి  ఎ౦త  ఆన౦ది౦చేదో  తెలుసా  అమ్మా!  అ౦ది సమీర.

“సమీరా  ఆ౦టీ  కి  కళ్ళు  లేవు తెలుసా!”  అన్నాను.

సమీర  ఆశ్చర్యపోయి౦ది. “ అవునా  నాకు తెలియలేదు  అమ్మా.  నా  బొమ్మలు  తాను  చూసినట్లుగా ఎ౦త  బాగా మెచ్చుకు౦దో  ఆ౦టీ”  అ౦ది

“  అవును  ఆన౦ద౦లో నువ్వు  వేసిన  బొమ్మలు  ఎలా  వున్నాయో  నీ  నోటితో  చెప్పడ౦  విని నీకు ఆన౦ద౦ కల్గి౦చడానికి  అవన్నీ  తను  చూసినట్లుగా  మాట్లాడి౦ది” అన్నా.

“ మన౦  ఇలా  అనుకోవచ్చు కదా అమ్మా, ఆ౦టీ  తన  కళ్ళతో  కాకు౦డా  నా  కళ్ళతో  చూసి  ఉ౦డవచ్చు కదా!” అ౦ది.

“ అవునమ్మా  ఆ౦టీ  నిజ౦గా  నీ  కళ్ళనే  తన కళ్ళుగా  చేసుకుని  చేసి౦ది. తల్లిగా  నేను  చెయ్యలేని పనిని  ఆమె  చెయ్యగలిగి౦ది. నేనేదో  విశాలమ౦త  ఎత్తుకు  ఎదిగానని  ఏదో  గొప్పదాన్నని  మిడిసి  పడ్డాను. ఆమెను  చూసాక  నేను  ఎ౦త  మరుగుజ్జునో  అర్థ౦  అయ్యి౦ది”  అన్నాను.

నేనన్న  మాటలకు  అర్థ౦  తెలియని  నా  పాప  విస్మయ౦గా  నా  కళ్ళల్లోకి  చూసి౦ది.

బాహ్య  చక్షువులకన్నా  అ౦తర్  చక్షువులకున్న  ప్రాధాన్యత  నాకు  ఆ రోజు  తెలిసి౦ది. అ౦దుకే నాలో ఉన్న మరుగుజ్జుతనాన్ని  గుర్తి౦చడానికి  నాకు  సిగ్గు వెయ్యలేదు.

–సుజలా మూర్తి గంటి

 

 

“ తోటలో నా ‘రాజు” – నిజంగానే, నేనే ?”

వంగూరి “జీవిత” కాలమ్ –  9

1952, డిశంబర్ చలి కాలంలో ఆ రోజు నాకు ఇప్పటికీ చాలా బాగా జ్జాపకం. ఎందుకంటే నా చిన్నప్పుడు అంత గా గోల పెట్టి ఏడ్చిన రోజు మరొకటి లేదు. ఆ రోజు మద్రాసులో పొట్టి శ్రీ రాములు గారు నిరాహార దీక్ష చేస్తూ  మరణించారు. ఆయన ఎవరో, ఎందుకు నిరాహార దీక్ష చేసారో ఆ వయసులో నాకు తెలియదు. నాకు తెలిసినందల్లా ఆ రోజు కాకినాడ అంతా భగ్గుమంది. మా “ఆనంద పురం ఎలిమెంటరీ స్కూలు” అర్జంటుగా మూసేసి మమ్మల్ని ఇంటికి పంపించేసారు. అన్ని కాలేజీలూ, దుకాణాలూ మూత పడి మొత్తం నగరం అంతా స్తంభించి పోయింది.  కొన్ని వేల మంది విద్యార్ధులు సైకిళ్ళమీదా, కాలి నడకనా ఊరేగుతూ మా ఇంటి దగ్గర గాంధీ గారి విగ్రహానికి పూల మాల వేసి, పార్కు కేసి నినాదాలు చేస్తూ వెడుతుంటే, అసలు విషయం తెలిసిన మా నాన్న గారూ, మా అన్నయ్యలతో బాటు కుర్ర కుంకలం అందరం కూడా మా గుమ్మం దగ్గర నుంచుని ఆ “ఊరేగింపు” చూస్తున్నాం. ఇంతలో హఠాత్తుగా ఒక కాలేజీ స్టూడెంట్ నాకేసి దూసుకొచ్చి, సరదాగా ఒక టెంకి జెల్ల కొట్టి, చేతిలో ఉన్న పెద్ద బొగ్గు కణికెతో మా గోడ మీద ఒక వేపు  “CR చావాలి” “CR కి ఉరికంబం” అనీ, రెండో వేపు “నెహ్రూ డౌన్, డౌన్” అనీ పెద్ద అక్షరాలతో రాసేసి ఊరేగింపు లో కలిసి పోయాడు. రాబోయే సంక్రాంతి కి మా నాన్న గారికి చాలా ఇష్టమైన గోపీ చందనం రంగుతో అప్పుడే వెల్ల వేసి, ఎంతో అందంగా ఉన్న ఆ గోడ ని మసి పూసి మారేడు కాయ చేసెయ్య గానే వేల సంఖ్యలో ఆవేశంలో ఉన్న ఆ స్ట్యూడెంట్స్ ని ఏమీ అన లేక మా నాన్న గారు, మిగిలిన వారూ నిస్సహాయంగా ఉన్న సమయంలో నేను ఆ గోడ కేసి చూసి భోరు మని ఏడుపు లంకించుకున్నాను. నేను ఎవరు ఎంత చెప్పినా, ఆ గోడ మీద రాతల కేసి చూపిస్తూ ఏడుపు స్థాయి పెంచుతూ ఉండగా ఎవరో “ఎందుకురా అంత ఏడుస్తున్నావు. ఆ మాత్రం చిన్న జెల్ల కాయ కొట్టి నందుకే అనీ” “పరవా లేదు రా మళ్ళీ వెల్ల వేయిస్తాం” అనీ అనగానే “అందుకు కాదు నా ఏడుపు. అసలు నేను ఎందుకు చావాలి? నన్ను ఉరికంబం ఎందుకు ఎక్కించాలి?” అని గగ్గోలు పెట్టాను. అప్పుడు అందరికీ అర్ధం అయింది. “ఓరి వెర్రి వెధవా, అదా సంగతీ. వాళ్ళు ‘చావాలి’ అన్నది CR ..అంటే చక్రవర్తుల రాజగోపాలాచారి….నిన్ను కాదు. ” అని నాకు చాక్లేట్లు పెట్టి నా ఏడుపు ఆపారు. ఈ చక్రవర్తుల రాజగోపాలాచారి గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్న ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మా మిత్రులు కొంత మంది నన్ను “CR” అని పిలవడంతోటీ, మద్రాసులో ఉండే ఈ CR ఎవరో నాకు తెలియకా నా ఏడుపుకి కారణం. అదంతా తల్చుకుంటే నాకు అప్పటి ఏడుపు గురించి కాదు కానీ, ఇప్పడు నాకు మరో కారణానికి కళ్ళమ్మట నీళ్ళు తిరుగుతాయి. ఎందుకంటే రాష్ట్రం విషయంలో అసలు సమస్యలు పరిష్కరించుకోలేక ఏవేవో , కారాణాలు చెప్పుకుంటూ మళ్ళీ మనం మళ్ళీ వెనక్కి పోతున్నాం.  అన్నట్టు ఆ రాజగోపాలాచారి ప్రసంగం కొన్నేళ్ళ తరువాత కాకినాడలో ఒక పబ్లిక్ మీటింగ్ లో విన్నాను. ఆయనతో మాట్లాడాను కూడా.

ఇక ఆ వీధి గుమ్మం కాక ఆ గోడలోనే మా పొలం నుంచి వచ్చే బళ్ళు లోపలి రావడానికి మరొక పెద్ద రేకుల గుమ్మం, అక్కడే వాయవ్యం మూల మా పాడి పశువులు ఉండే పాక ఉండేది. అక్కడి నుంచీ మా 3600 గజాల స్థలంలో మా చిన్నపుడు ఉండే “తోట విహారం” మొదలు పెడితే వాయవ్యం నుంచి ఈశాన్యం మూల దాకా ఉండే ప్రహారీ గోడని ఆనుకుని నేను ఎప్పుడూ ఎక్కని పెద్ద ములగ చెట్టు, అప్పుడప్పుడు ఎక్కే చిన్న ఉసిరి, పెద్ద ఉసిరి చెట్లూ, జీడిమామిడి, చిన్న మామిడి పళ్ళ చెట్టు, పొడుగ్గా ఉండే యూకలిప్టస్ చెట్లు, తలగడాలలో కూరుకునే పెద్ద పత్తి కాయలు కాసే వంద అడుగులు ఎత్తు ఉండే చెట్లు ఉండేవి. ఏడాది పొడుగునా కింద రాలిపోయే ఈ పత్తి కాయలని పోగేసి ఒక గుట్టగా పడేసే వాళ్ళం.  ఆరు నెలలకో సారి మా దూదేకుల సాయబు వచ్చి, మా ఇంటి వరండాలో దుకాణం పెట్టి వారం రోజుల పాటు నానా కంగాళీ చేసి, పదో, పదిహేనో తలగడాలూ, రొజాయిలు అనే పరుపులూ చేసే వాడు. అతనున్న వారం రోజులు మా ముక్కుల్లోను, చెవుల్లోనూ, నోట్లోనూ, ఇల్లంతానూ. ఆఖరికి ఎంతో మడిగా ఎక్కడో మూలా ఉన్న వంటింట్లో చేసిన అన్ని వంటకాల్లోనూ సిల్కు లా ఉండే ఈ దూది పింజలే! ఇక యూకలిప్టస్ ఆకులు కొయ్యడానికి కష్టపడినా, నలిపి చూస్తే భలేగా ఖరీదైన సెంటు వాసన వచ్చేది. ఇక ఈ ఈశాన్యం మూల ఉండే  ఆకుపచ్చ సంపెంగ చెట్టు మా గాంధీ నగరం అంతటికీ సువాసనలు వెద జల్లేది. ఆ సంపెంగ పువ్వులు, ఆకుల్లో కలిసిపోయి ఎప్పుడైనా మా అక్కా వాళ్ళూ కోసుకోడానికి కంటికి కనపడేవి కావు.  అ సంపెంగ మొక్క ఉంటే పాములు వస్తాయని మేము ఎప్పుడూ చీకటి పడ్డాక అటు వేపు వెళ్ళడానికి హడిలిపోయే వాళ్ళం.  నిజంగానే అక్కడ ఒకటి, రెండు పాము పుట్టలు ఉండేవి. మా పేటలో నాగుల చవితి హడావుడి అంతా అక్కడే. అందరూ ఆ పుట్టలలోనే పాలు పోసే వారు.

తోటలో మా నాన్న గారు

తోటలో మా నాన్న గారు

ఇక ఈశాన్యం మూల నుంచి ఆగ్నేయం వేపు గోడ వారన నడుస్తూ ఉంటే ఓ ఉసిరి చెట్టు, కరివేపాకు మొక్కలూ, పులా మొక్కలు ఉన్నా, అన్నింటి కన్నా ప్రత్యేకమైన ఒక చిన్న, చిన్న పళ్ళు కాసే ఉసిరి చెట్టు లాంటి పెద్ద మొక్క ఉండేది. దాన్ని “పుల్ల, పుల్ల చెట్టు” అనే వాళ్ళం. అసలు పేరు ఎవరికీ తెలియదు. అది చిన్న ఉసిరి కాయల సైజులో పళ్ళు కాసినప్పుడు అవి తింటే విపరీతమైన పుల్లగా ఉండి అస్సలు తినలేక పోయే వాళ్ళం. కానీ అవి పండాక, వయొలెట్ రంగులో కి వచ్చాక అద్భుతమైన తీపి రుచి ఉండేవి. మా దురదృష్టవశాత్తూ, ఇరవై ఏళ్ల క్రితమో ఎప్పుడో, ఏదో తుఫానుకో , మరెందుకో మాయం అయిపోయింది. ఆ తరువాత ఆ మొక్క కోసం మా సుబ్బన్నయ్య చెయ్యని ప్రయత్నం లేదు. ఆఖరికి మొక్కలకి ప్రసిద్ధమైన కడియం గ్రామం లో ఉన్న అన్ని నర్సరీలో కూడా తను వాకబు చేసినా ఆ మొక్క ఏమిటో, ఎక్కడ దొరుకుతుందో ఎవరూ చెప్పలేక పోయారుట.  నేను ఎప్పుడు కాకినాడ వెళ్ళినా ఆ మొక్క ఉండే చోటి దగ్గర నుంచుని ‘నివాళులు’ అర్పిస్తూ ఉంటాను.

ఇక మా స్థలం నైరుతి నుంచి ఆగ్నేయం వేపు ఉండే గోడని ఆనుకుని ఒక పెద్ద నేరేడు చెట్టూ, మా డాబా  మీదకి అందేలా పళ్ళు కాచే సీతా ఫలం చెట్టూ ఉండేవి. నాకు తెలియదు కానీ మా పెద్దన్నయ్య, ముఖ్యంగా చిన్నన్నయ్య కోపం వచ్చినా, ఏదైనా కావాల్సి వచ్చినా ఆ నేరేడు చెట్టు పై దాకా ఎక్కేసి దూకేస్తానని బెదిరించే వాడుట. పాపం మా బామ్మ గారు, తాత గారు వెళ్లి రక రకాల “లంచాలు” ఇచ్చి అతన్ని క్రిందకి దింపే వారుట. అప్పటికి నాకు ఐదేళ్ళు కూడా లేక పోయినా మా బామ్మ గారు మా చిన్నన్నయ్యకి ఇచ్చే లంచం పేరు “బంగారం పులుసు”. “ఒరేయ్, ఇవాళ నీ కోసం బంగారం పుసులు చేశాను రా. ఇంకెవరికీ అది పెట్టను. క్రిందకి దిగిరారా” అని ఆవిడ చేసిన గుమ్మడి కాయ పులుసు కి పెట్టిన స్పెషల్ పేరు ఆ బంగారం పులుసు. మా బామ్మ గారు ఎప్పుడూ వంద కాసుల పేరు పెట్టుకునే ఉండే వారు.  అవైనా ఇప్పటి లాగా చిన్న సైజువి కాదు. పూర్వకాలపు పెద్ద సైజు కాసులే!

ఇక మిగిలిన స్థలంలో అన్ని రకాల కూరగాయలు, పాదులూ ఒక ఎత్తయితే బొడ్డు మల్లి తొ సహా డజన్ల కొద్దీ పెద్ద మల్లె పొదలు, ఇంచు మించు అన్ని రంగుల మందారాలు, కనకాంబరాలు, డిశంబర్ పువ్వులు, దర్జాగా ఉండే ఒక పారిజాతం చెట్టు (ఆ పారిజాతానికి ఎప్పుడూ గొంగళీ పురుగులు అంటిపెట్టుకుని ఉండేవి) , ఐదారు నంది వర్ధనాలు, మొగలి రేకుల పొదలు రెండు,  నైట్ క్వీన్లూ, మెట్ట తామరా, రెండు బాదం చెట్లూ, ఒక పెద్ద సపోటా, ఒక చిన్న సపోటా, డజను పైగా కొబ్బరి చెట్లూ, దబ్బ చెట్టూ, రెండు నారింజలూ, నిమ్మ చెట్లూ,  ఒక దానిమ్మా,  నీరు బాగా పారే పెద్ద నూతి దగ్గరా, స్నానాల గదుల దగ్గరా అరటి చెట్లూ, ఒక పెద్ద జామ చెట్టు, ఒక చిన్న చిన్న తీపి కాయలు కాచే జామ చెట్టూ యింకా ఎన్నెన్నో మొక్కలతో మా తోట ఒక “ఆర్గనైజ్డ్ అరణ్యం” లా ఉండేది.

విశేషం ఏమిటంటే మా స్థలానికి సరిగ్గా మధ్యలో రెండు చాలా పొడుగైన తాటి చెట్లు ఉండేవి. ఇవి సాధారణంగా పొలం గట్ల మీదే ఉంటాయి కానీ ఇళ్ళ స్థలాలలో ఉండవు. ప్రతీ రోజూ సాయంత్రం అయ్యేటప్పటికల్లా ఆ తాటి చెట్ల మీద వాలి సేద దీర్చుకోడానికి  రెండు రాబందులు వచ్చి వాలేవి. మేము స్కూల్లో “జంతు శాస్త్రం” లో గెద్దలకీ, రాబందులకీ ఉండే తేడాలు చదువుకునే రోజుల్లో వాటిని చూస్తూ మేము చదివిన పుస్తకాలలో ఉండే ముక్కులలా వాటి ముక్కులు సూదిగా, వంకర గా ఉన్నాయా, లేవా అని చూసే వాళ్ళం. ఇక్కడ ఒక చిన్న పిట్ట కథ ఏమిటంటే ఒక సారి మా నాన్న  గారూ, మేమూ వరండాలో కూచుని ఆ రాబందుల గురించి మాట్లాడుకుంటూ ఉంటే మా చెల్లెలు హఠాత్తుగా “బాబయ్య గారూ, రాబందులు కూడా కాకి రెట్టలు వేస్తాయా?” అడిగింది అమాయకంగా. “లేదమ్మా, రాబందులు రాబందు రెట్టలు వేస్తాయి. కాకి రెట్టలు అవి వెయ్య లేవు” అని మా నాన్న గారు ఒక నవ్వు నవ్వి సమాధానం చెప్పారు.

అన్నట్టు, మా వీధి గుమ్మం పక్కనే ఉన్న బొగడ చెట్టు గురించి చెప్పడం మర్చిపోయాను. మా చిన్న బొగడ పువ్వులూ, పళ్ళు కాసేది. మా చిన్నప్పుడు ఒక సారి ఏమయిందంటే, ఓ రోజు చీకటి పడ్డాక, ఎవరికీ కనపడకుండా నేనూ, ఇంకో ఇద్దరు, ముగ్గురు స్నేహితులూ కలిసి ఆ బొగడ చెట్టు పై దాకా ..అంటే కనీసం యాభై అడుగులు ఎక్కేసి, పండిన బొగడ పళ్ళు కోసేసుకుని బొక్కుతూ ఉంటే, మా నాన్న గారో, మా దొడ్డమ్మో , మరెవరో “ఎవరా అక్కడా?” అని అరిచారు. నేను హడిలి చచ్చి పోయి ధబీమని కిందకి దూకేయ్యగానే,  మిగిలిన వెధవలు కూడా హర్రీ, బుర్రీగా గా దూకేసి, ఇంకెక్కడా చోటులేనట్టు నా మీదే పడ్డారు. ఇంకే ముంది మొత్తం “బొగడ పళ్ళ దొంగలం” అందరం దొరికిపోయాం. “వెధవల్లారా, ఏవో కాస్తో కూస్తో కోసుకుని తినాలి కానే వందల కొద్దీ బొగడ పళ్ళు తింటే కడుపు నొప్పి తో చస్తారు, మమ్మల్ని చంపుతారు” అని మా పెద్దలు చీవాట్లు వేసి, ఏవేవో ద్రవ్యాలు కలిపి తాగించి, మమ్మల్ని బతికించారు.

ఇక మా ఇంటికి ఆగ్నేయం మూల వంటింటికి వెనకాల మరొక మామిడి చెట్టు కూడా ఏకాకి గా ఉండేది. ఈ చెట్టు మా వెనకాల వీధిని ఆనుకుని వేపు ఉండడంతో, అది కాయలు కాసే వేసవి కాలంలో ఆ వీధిలో కుర్ర కుంకలు రాళ్ళు విసిరి మామిడి కాయలు రాల గొట్టి, గోడ దూకేవారు. ప్రతీ ఏడూ ఎన్ని సార్లు వాళ్లకి వార్నింగ్ ఇచ్చినా ఆ కుర్రాళ్లు యింకా రెచ్చి పోయేవారు. ఒక ఏడు అలా ఒక రాయి మా అమ్మకి తగలబోయింది. అసలే కోపిష్టి మనస్తత్వం ఉన్న మా చిన్నన్నయ్య కి ఆవేశం కట్టలు తెంచుకుని వెనకాల గోడ దూకి దొరికిన ఒక కుర్రాణ్ణి నాలుగు వాయించి  వాడి అమ్మకి అన్వయించదగ్గ తిట్లు కూడా తిట్టాడు. దాంతో ఆ వీధిలో వాళ్ళంతా ఏకమై పోయి మా ఇంటి వీధి గుమ్మం వేపు వచ్చి నానా గొడవా చేశారు. పోలీసులని పిలిచే దాకా వచ్చింది ఆ తగాదా. అప్పుడు బాగా తన్నులు తిన్నది ఆ ఇంటి పని వాడు సూన్నారాయణే పాపం!

నేనూ, సూన్నారాయణా అక్టోబర్ 2013 లో

నేనూ, సూన్నారాయణా అక్టోబర్ 2013 లో

సుమారు నలభై ఏళ్ళు మా తోట అంతటినీ మానాన్న గారితో సమానంగా ఎంతో ఆప్యాయంగా చూసుకుని, రోజు నీళ్ళు పెట్టి, ఎరువులు వేసి అన్ని విధాలుగానూ మా కుటుంబానికి అన్ని విధాలుగానూ సేవ చేసిన ఆ సూన్నారాయణ ఎనభై ఏళ్ళు దాటినా రెండు నెలల క్రితం నేను కాకినాడ వెళ్ళినప్పుడు నన్ను చూడడానికి వచ్చి మళ్ళీ నన్ను ఎత్తుకోడానికి ముచ్చట పడ్డాడు కానీ పాపం ఒక కన్ను కనపడకా, నేను తీవ్రంగా వారించబట్టీ ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. అతణ్ణి తీసుకుని మిత్రుడు చంద్రశేఖర్ నిర్వహించే సంకురాత్రి ఫౌండేషన్ లో కంటికి ఆపరేషన్ చేయించాను. అంతకు ముందే మొదటి కంటికి మా సుబ్బన్నయ్య (డా. సుబ్రహ్మణ్యం) దగ్గరుండి ఆపరేషన్ చేయించాడు.  ఆ సూన్నారాయణ తో తాజాగా మా “ఇలవేల్పు”  మామిడి చెట్టు నీడలో తీయించుకున్న ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను.

మా నాన్న గారికి కూరగాయలు పండించడం చాలా ఇష్టం.  ఖాళీ స్థలం ఉన్న వారందరూ వేసుకునే వంగా, బెండ, బీర, గుమ్మడి, ఆనప, పొట్ల మొదలైనవే కాక కాలీ ఫ్లవర్, కేబేజీ లాంటి వి కూడా వేసే వారు. మొక్క జొన్న మొక్కలని మా వీధి గుమ్మం నుంచి ఇంటి దాకా..అంటే సుమారు వంద గజాలు దారికి రెండు వేపులా వేసి పొలంలోనో, బొటానికల్ గార్డెన్ లో నడుతున్న భావన ఇంటికొచ్చిన వాళ్లకి కలిగేలా  చేసే వారు. పైగా మా నాన్న గారికి గార్డెనింగ్ తో బాటు తేనెటీగలని పెంచి తేనె తయారు చెయ్యడం మంచి హాబీగా ఉండేది.  సామర్ల కోట లో ఉన్న అగ్రికల్చరల్ ఫారం నుంచి తేనెటీగలు పెరిగే బీ-హైవ్ తెప్పించుకుని, అందులో “రాణీ తేనెటీగ” ని పెట్టగానీ వందల కొద్దీ ఉన్న ఆ తేనెటీగల కుటుంబం అందులో బస చేసేది. మాకున్న తోటలో అన్ని రకాల పువ్వులూ ఉండేవి కాబట్టి ఆ తేనెటీగలకి పుప్పొడి కోసం వేరే తోటల్లోకి వెళ్ళే అవసరం ఉండేది కాదు. ఆశ్చర్యం ఏమిటంటేమ మా కుర్ర వెధవలం అక్కడే ఆడుకుంటున్నా విశ్వాసం గల ఆ తేనెటీగలు  మాలో ఎవరినీ ఎప్పుడూ కుట్టిన జ్జాపకం లేదు నాకు. మానాన్న గారు మా తోట మధ్యలో నుంచుని మా సూన్నారయణకి ఆదేశాలిస్తున్న ఒక అపురూపమైన ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను. మా పెద్దన్నయ్య ఇది రహస్యంగా తీశాడు. ఈ ఫోటో తీస్తున్నట్టు అప్పుడు ఆయనకీ తెలియదు. తెలిసాక “వెధవల్లారా, నేను చొక్కా వేసుకోకుండా, కనీసం బనీను అయినా వేసుకోకుండా ఉన్న ఫోటో తీస్తారా, బుద్ది లేదూ” అని మమ్మల్ని చెడా, మడా తిట్టారు. ఆయన పోయి 30 ఏళ్ళు అయింది కాబట్టి ఇప్పుడు ధైర్యంగా ఆ ఫోటో పబ్లిక్ గా బయట పెడుతున్నాను.  మా తోటలో అన్ని రకాల మొక్కలు వెయ్యడానికీ, వాటిని మా కుర్ర కుంకలం తొక్కేసి తగలెయ్యకుండా ఆడ సింహం లా కాపలా కాసేది మా రెండో మేనత్త హనుమాయమ్మ గారు. మాతో సహా ఆవిడని అందరూ దొడ్డమ్మ అని పిలిచే వారు. ఆవిడకి పెళ్లి అయినా, పిల్లలు లేరు. భర్త తో సత్సంబంధాలు లేక నాకు తెలిసీ యాభై ఏళ్ళు ఆవిడ మా ఇంట్లోనే ఉండి, అక్కడే పోయారు. మంచి సంస్కృత పండితురాలు.  మొక్కల విషయంలో ఆవిడ అంటే మాకు సింహ స్వప్నమే!

హ్యూస్టన్ లో చంద్రకాంతం

హ్యూస్టన్ లో చంద్రకాంతం

ఒక విశేషం ఏమిటంటే అన్ని కూరగాయలలోనూ కాలీ ఫ్లవర్ పువ్వు పూయగానే  మొత్తం తోట అంతా  ఘాటుగా వాసన వేసేది. అదేమిటో తెలియదు కానీ నేను అమెరికాలో మా ఇంటి వెనకాల వేసినప్పుడు చూడడానికి షోకే కానీ కాలీ ఫ్లవరే కాదు, అస్సలు ఏ పువ్వుకీ ఎటువంటి వాసనా ఉండదు. కానీ ఎటువంటి సువాసనా లేకున్నా చాలా అందంగా ఉండే పువ్వు చంద్రకాంతం పువ్వు. పదేళ్ళ క్రితం నేను కాకినాడ  వెళ్ళినప్పుడు మా తోటలో మా చిన్నప్పటి నుంఛీ ఇప్పటి దాకా ఉన్నవి మా మామిడి చెట్టు, బొగడ చెట్టు, చంద్రకాంతం మొక్కలు మాత్రమే.  మా మామిడి చెట్టునీ, బొగడ చెట్టునీ అమెరికా తెచ్చుకోలేను కాబట్టి, ఆ చంద్రకాంతం విత్తనాలని ఆప్యాయంగా కోసుకుని హ్యూస్టన్ లో మా తోటలో వేసుకున్నాను.. ఆ మొక్కలు ఇప్పటికీ ప్రతీ ఏడూ ఎన్నెన్నో పూస్తున్నాయి. ఎప్పుడైనా మా చిన్నతనం గుర్తుకి వస్తే మా తోటలోకి వెళ్లి ఆ చంద్రకాంతాలని పలకరిస్తూ ఉంటాను.  హ్యూస్టన్ లో మా తోటలో ఉన్న ఆ చంద్రకాంతాల ఫోటో ఇక్కడ జత పరుస్తున్నాను. వాటి పూర్వీకులు నాలాగే కాకినాడ వారు. ఇప్పుడు మా నాన్న గారి గార్డెనింగ్ వారసత్వాన్ని,  నా పై వాడైన మా సుబ్బన్నయ్య పుణికి పుచ్చుకున్నాడు. అతను ఇటు కాకినాడలోనూ, అటు మా పొలంలోనూ అన్ని రకాల పూల మొక్కలు వేసి, కూరగాయలు పండిస్తున్నాడు. ఇటీవలే మేము కాకినాడ వెళ్ళినప్పుడు మా తమ్ముడు (లాస్ ఏంజెలెస్ నివాసి) మా మామిడి చెట్టుకి డ్రిప్ ఇరిగేషన్ పెట్టించి, మా స్థలాన్ని నందన వనం లా తీర్చిదిద్దడం మొదలుపెట్టాడు.

..మా చిన్నప్పుడు నేను నిజంగానే “తోటలో నా రాజు” ని.. ఒకటేమిటి, మా తోటలో లేని పూల మొక్కలు కాని, పళ్ళ చెట్లు కాని, కూరగాయలు కానీ లేవన్నా, ఆ సకల సంపదల మధ్యా నా చిన్నతనం గడిచింది సుమా అని నాకు ఇప్పటికీ నమ్మ బుద్ది కావడం లేదు. ప్రపంచంలో అందరికీ ఇలాంటి “బాల్య సంపద” ఉంటుంది. దాన్ని నెమరు వేసుకునే యోగం కొందరికే ఉంటుంది ఆ రోజుల్లో అది గుర్తించే బుద్ది నాకు అప్పుడు లేకపోయినా, ఇప్పుడు గుర్తు చేసుకుని అక్షరబద్ధం చేసుకునే అదృష్టం నాకు కలిగింది.

chitten rajuవంగూరి చిట్టెన్ రాజు, హ్యూస్టన్

హత్యనో, ఆత్మహత్యనో, సహజ మరణమో తెలియని అవస్థ!

drushya drushyam-10ఎందుకో చిన్నప్పటి నుంచీ నడక ఒక అలవాటు.
ముందు ఒక్కడిని…తర్వాత దోస్తులు కలిసేవారు.
చిన్ననాడు భుజంపైన పుస్తకాలు పెట్టుకుని నడుచుకుంటూ బడికి వెళ్లేవాళ్లం.
చిన్న చిన్న గల్లీలనుంచి నడుస్తూ నడుస్తూ పెద్ద రోడ్డు వచ్చేదాకా అలా సానుపు చల్లిన ఇరుగు పొరుగు వాకిళ్ల మధ్య నుంచి చిన్నదారి…అందులో స్లిప్పర్లతో నడక….అది క్రమంగా పెద్ద రోడ్డును కలిపేదాకా నడిచేవాళ్లం.
కొంచెం పెద్దయ్యాక ఇంటినుంచి బస్టాండ్ దాకా గబగబా నడక. ఆ నడకలోనూ మళ్లీ చిన్ననాటి అనుభవాలతో మళ్లీ రోడ్డును చూస్తూ, ఆ డాంబర్ రోడ్డుపై చూపు ఆనిస్తూ నడిచేవాళ్లం.
బస్టాండ్లో బస్సెక్కి కాలేజీ ఉన్న సిరిసిల్లకి వెళ్లాక మళ్లీ బస్టాండ్ నుంచి కాలేజీ దాకా నడక.
కొద్ది దూరమే అయినా కొంచెం పట్నంలో నడక.
తర్వాత నిజామాబాద్, అటు తర్వాత హైదరాబాద్…ఇక్కడా చాలా ఏళ్లు నడకే.
జీడిమెట్ల, హైదరుగూడ, బషీరుబాగ్, నల్లకుంట, రాం నగర్, డీడీ కాలనీ, మళ్లీ రాం నగర్, ఇప్పుడు పార్సీగుట్ట…గంగపుత్ర కాలనీ…బండి కొన్నాక కూడా నడక ఉండనే ఉన్నది.
అయితే నడక నేర్పిన చూపు ఒకటి అప్పుడూ ఇప్పుడూ ఉండనే ఉన్నది.
ఆ చూపే అనేక చిత్రవిచిత్రాలు పోతూ ఉన్నది.నిజమే మరి.
అప్పుడు వీధుల్లో చూపు సాగేది. పెద్దయ్యాక విశాలమైన రోడ్డుపైనా చూపు ప్రసరిస్తూనే ఉన్నది.
అప్పుట్లో ఒకసారి పది పైసల బిళ్ల దొరికేది. ఇంకోసారి పిన్నీసు కనిపించేది. గుండీలూ కనిపించేవి.
మరోసారి రెవెన్యూ స్టాంపూ కనబడేది. అలాగే దువ్వెన, ఇంకా పెద్దవీ కనిపించేవి.
అయితే, ఇప్పుడూ నడకలో అవి కనబడుతూనే ఉన్నయి. కనబడ్డప్పుడల్లా వాటిని తీసుకునే తీరు మారింది.

నడకతో వయసు నడుస్తుందేమో లేదా అనుభవమేమో!
ఇంకా చెబితే చాదస్తమూ కూడా…

నడవగా నడవగా అది అక్షరాల్లోకి అనువదించడమూ మొదలైంది.
మళ్లీ ఛాయచిత్రాల్లో వాటిని ఒడిసి పట్టుకోవడమూ జరూరు అయింది.
ఎందుకూ అంటే అది బాల్యం అనాలా? గతంలో సాగిన నడకకు కొనసాగింపు అనుకోవాలా?
తెలియదు.

కానీ మూడేళ్లలో నడక ఒడిసి పట్టిన చిత్రాలోన్నో…
ఆగి నడిచిన దాఖలాలూ ఎన్నో…
అలాంటి ఎన్నో చిత్రాల్లో ఇదీ ఒకటి.

+++

చిన్నప్పుడు నడుస్తూ ఉంటే, ఎండలో ముందుకు సాగుతూ ఉంటే, నా చిన్ననాటి మిత్రుడు సొన్నాయిల శీను ఒక గమ్మత్తు నేర్పించాడు.  కుడిచేతి పిడికిలి బిగించి …మధ్యన చిన్న సందు వదిలి ..ఆ వదులు పిడికిలితో ఎండలో అలా నడుస్తుంటే ఆ రంధ్రం గుండా ఒకానొక గుండ్రటి ఛాయ నేలమీద పడుతూ ఉంటే మనకిష్టమైన ఛాయచిత్రం ఒడిసి పట్టుకున్న తృప్తి. అదీగాక ఒంటరితనం తెలియనివ్వని సరదా అది!
మనతోపాటు ఒక నీరెండ వంటి అపూర్వమైన ఛాయ నొకదాన్ని మోసుకెళ్లడం అప్పటి ప్రయత్నం. జ్ఞాపకం!

ఇప్పుడు ఫొటోలు తీస్తూ ఉంటే, ముఖ్యంగా నేలమీద పడ్డ వాటిని కెమెరా కంటితో భద్రపరుస్తూ ఉంటే, ఎన్ని జ్ఞాపకాలో…మరెన్ని బాధలో…ఎంత అపూర్వమైన నడకో అనిపిస్తుంది, బతుకుది. అలాగే, మరెంతటి విషాద సమ్మోహనమో ఈ ప్రయాణ భరితమూ అనిపించేది.

ఒకటని కాదు, కొన్ని వందలు.
నా కలెక్షన్లో అలాంటి మహత్తరమైన జ్ఞాపకాల ఛాయలు వందలకు వందలున్నాయని సగర్వంగా చెబుతాను.
వాటిల్లో రాలిపడిన పారిజాతాలు నాకిష్టమైన ఒకానొక అందమైన చిత్రం. అలాగే పొగడపూల వాకిలి నేనే మెచ్చిన మరో  చిత్రం. అంతేకాదు, ఒకనొక ఉషోదయాన ఒక పేపర్ ప్లేట్ తడిసి నేలను అతుక్కుపోయి ఉండగా చూశాను. అది అచ్ఛం చందమామను తలపిస్తే ఎగిరి గంతేశాను. ఆ చిత్రమూ నా ఛాయాచిత్ర వాకిలిలో కదిలీ కదలాడే వెన్నెల దోసిలి.

ఇంకా పిన్నీసూ తీశాను, పండ్లు వూడిపోయిన దువ్వెననీ తీశాను.
ఒక మగువ తన భర్తను అభిమానంగా కావలించుకుని స్కూటర్ మీంచి వెళుతుంటే, పాపం! నా దిష్టే తగిలిందేమో, తన జుట్టులోంచి రాలిపడ్డ గులాబీని చిత్రించాను. చితికిపోయిన టమాటనూ చిత్రించాను.
ఇక ఈ కప్ప సంగతి సరేసరి, అది నన్ను ఇంకెంతో గాయపర్చింది.

+++

జీవితం సాగుతూ ఉంటే, నడక మున్ముందుకు కొనసాగుతూ ఉంటే, సుఖమే కాదు, దుఃఖమూ ఉండనే ఉంటుంది.
దాన్నీ అంగీకరించి నడిస్తేనే బతుకు నిండుదనం తెలిసి వస్తుందేమో!

బహుశా ఎన్నో జ్ఞాపకాలు. చూస్తూ చూస్తూ ఉండగానే ఎందరో పోయారు.
తాతమ్మ పోయింది. నాయినమ్మ మరణించింది. బాబాయి కూడా చనిపోయాడు. వాళ్లను చివరగా మంచం మీంచి నేలమీదికి అక్కడ్నుంచి కాటికి తరలిస్తుంటే చూడనే చూశాను.

బంధువులూ మిత్రులూ సహచర కార్యకర్తలూ ఎందరో పోయారు. హత్యకు గురైన పౌరహక్కుల పురుషోత్తం అయితే ఆ నేల, దిల్ సుఖ్ నగర్లో ఆ నేలపైన నెత్తుటి చెమ్మని ఇప్పటికీ వెళ్లి తడుముకుంటుంటాను.

ఆయన స్మారకార్థం ఒక పాటల క్యాసెట్టు తెచ్చినప్పుడు మిత్రులు “వొద్దు వొద్దూ’ అన్నా వినకుండా రక్తం చిందిన నేలమీద ఆ తెగిపడిన తల, దేహాన్నీ, పక్కనే భోరున విలపిస్తున్న జ్యోతక్కను – ఆ ఫోటోను అట్లే ముద్రించాను, రంగుల్లో- కవర్ పైన!

ఇదంతా అప్పటి వర్తమానం కోసం. ఒక భయ విహ్హలమైన గతం…దాన్ని మరచిపోకుండా ఉండే భవిష్యత్తు కోసం,
ఒక వాస్తవికతను చెప్పడానికి అలా ఆ ఛాయచిత్రాన్నీ అట్లే ప్రకటించాను.

ఇప్పుడూ అంతే. చిన్న చిన్న ఛాయల్లో ఒదిగే చరిత్రను, స్థితీగతినీ చిత్రాలు చెప్పక తప్పక చెబుతూనే ఉంటే చూస్తూనే ఉన్నాను, ప్రేక్షకుడినై!

అనుకుంటాం గానీ నేలమీద కనిపించే ఇసుక, కంకర, మొరం, డాంబరు, పూలు, ఇనుప రజను, కోడి రెట్ట, ఇంకా ఇంకా  నిదానంగా శిథిలమౌతున్న కప్పా ..అంతా కూడా వికృతి కాదు, ప్రకృతే. ఒక పురావలయం. చరిత్ర.

మట్టిలో వికసించి మట్టిలో కలిసే మహా కవిత్వం. చరిత్ర చరణాల ధూళి.
అది వినిపిస్తుంది తీసింది మీరైనా కూడా! అదీ చిత్రమే!!

చిత్రం నాదా మీదా అనికాదు, చూస్తూ ఉంటే- నడిచినంత మేరా ఎవరికైనా అనుభవాలు తగులుతూ ఉంటై.
మనం సుప్తావస్థలో ఉన్నా కూడా ఎప్పుడో ఒకప్పుడు బయటకి వస్తనే ఉంటయి.

ఇదొక అనివార్యమైన అవస్థ.

మరి, ఆ నడకకు వందనం. అది పంచే బతుకు చిత్రాలకూ అభివందనం.

~ కందుకూరి రమేష్ బాబు

సంప్రదాయం విస్మరించిన మరికొన్ని ప్రశ్నలు!

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

అవిచారంబని పల్క నోడెదము ధర్మాభిజ్ఞ! నీ యగ్రసం

భవు డత్యున్నతశక్తియుక్తుడు మహీభారప్రగల్భుండు భా

ర్గవదౌహిత్రుడు పాత్రు డీ యదుడు లోకఖ్యాతు డుండంగ నీ

భువనేశత్వభరంబు బూన్ప దగునే పూరున్ జఘన్యాత్మజున్

                                                         -నన్నయ

(శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం)

ధర్మం తెలిసిన ఓ యయాతి మహారాజా! (నువ్వు చేసిన పని) అనుచితమని చెప్పడానికి జంకుతున్నాము. నీ పెద్దకొడుకు, శుక్రుని మనవడు, మంచి శక్తియుక్తులు కలిగినవాడు, భూభారాన్ని మోయగలవాడు, కీర్తిమంతుడు, యోగ్యుడు అయిన యదువు ఉండగా; నిమ్నస్త్రీకి పుట్టిన పూరునికి రాజ్యభారం అప్పగించడం సమంజసమేనా?

               ***

యయాతికి శర్మిష్ట భార్య ఎలా అవుతుందన్న సందేహానికి నేటి సంప్రదాయ పండితులనుంచి సమాధానం దొరకదని   కిందటిసారి చెప్పుకున్నాం. అటువంటివే ఈ కథలో మరో మూడు ఉన్నాయి…

మొదటిది, యయాతికి శుక్రుడు ఇచ్చిన శాపం. శర్మిష్టతో సంబంధం పెట్టుకోవద్దన్న తన ఆదేశాన్ని యయాతి ఉల్లంఘించాడు కనుక, అతనికి అకాల వృద్ధాప్యం విధించి శుక్రుడు శిక్షించాడని అనుకుంటాం. కానీ కాస్త లోతుగా పరిశీలిస్తే, శుక్రుని శాపం యయాతికి ఏవిధంగానూ శిక్ష కాలేదు. అతడు యవ్వన సుఖాలు అన్నీ అనుభవించిన తర్వాతే సహజగతిలో వృద్ధుడయ్యాడు. శాపాలనే నమ్మవలసివస్తే, నిజంగా శిక్ష అనుభవించింది, అతని వృద్ధాప్యాన్ని మోసిన అతని కొడుకుల్లో ఒకడు. యయాతికి ఎలాంటి శిక్షా లేకపోగా మొదటినుంచి చివరివరకూ ప్రతీదీ అతనికి అనుకూలించాయి.  తను తొలిచూపులోనే శర్మిష్ట పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆమెను కోరుకున్నాడు. ఆమెను పొందాడు. ఆమెతో సంతానం కన్నాడు. చివరికి ఆమెకు కలిగిన పూరునే తన రాజ్యానికి వారసుని చేశాడు. ఈవిధంగా అన్నీ అతని ప్రణాళిక ప్రకారం, లేదా అతనికి అనుకూలించే ప్రణాళిక ప్రకారమే జరిగాయి.

దేవయాని కథ ఇందుకు భిన్నం. ఆమెకు దాదాపు అన్నీ ప్రతికూలంగానే జరిగాయి. ప్రేమించిన కచుడు  దక్కలేదు. రాచగర్వంతో తనను అవమానించిన శర్మిష్టను దాసినైతే చేసుకోగలిగింది. కానీ, ఆ దాసియే ఆమె కాపురంలో చిచ్చు పెట్టింది. ఒక మహారాజును పెళ్లిచేసుకోగలిగింది. కానీ, అతనిని దాసితో కలసి పంచుకోవలసివచ్చింది. తను ఎంతో తెలివీ, గడుసుదనమూ, మాట నేర్పూ ఉన్నదే. కానీ యయాతి తెలివి ముందు చిత్తుగా ఓడిపోయింది! తండ్రికి ఆమె మీద విపరీతమైన మమకారం ఉంది. ఆమె కోరింది ఆయన కాదనే ప్రశ్నే లేదు. కానీ, విచిత్రం, తండ్రికి తన మీద ఉన్న అంత గొప్ప మమకారమూ ఆమెకు కలసిరాలేదు. అంతకంటే విచిత్రం, శుక్రుడు కూతురి ప్రణాళికకు పెద్దగా సహకరించకపోగా, యయాతి  ప్రణాళికకు సహకరించడం!

ఎలాగంటే…శర్మిష్టతో పడక సుఖం మాత్రం పంచుకోవద్దని పెళ్లి సమయంలో యయాతికి శుక్రుడు చెప్పడంలో బహుశా దానికి విరుద్ధమైన ధ్వని ఉండచ్చని ఇంతకుముందు అనుకున్నాం.  ఇప్పుడు యయాతికి శాపమిచ్చే సమయంలో శుక్రుడు అన్న మాటలు దానికి పొడిగింపుగానూ, ధృవీకరణగానూ అనిపిస్తాయి.  యవ్వనగర్వంతో నా కూతురిని నొప్పించావు కనుక నీపై వృద్ధాప్యభారం పడుగాక అని శపించిన శుక్రుడు; ఆ తర్వాత శాప సవరణ చేస్తూ, నీ కొడుకుల్లో ఒకరు నీ వృద్ధాప్యాన్ని స్వీకరిస్తే నువ్వు మరికొంతకాలం యవ్వనసుఖాలు అనుభవించవచ్చు నన్నాడు. అంతవరకు అర్థవంతంగానే ఉంది. కానీ శుక్రుడు అంతటితో ఊరుకోకుండా, నీ వృద్ధాప్యాన్ని స్వీకరించినవాడే నీ రాజ్యానికి వారసుడవుతాడన్నాడు! సమయ, సందర్భాలను దృష్టిలో పెట్టుకుంటే శుక్రుడు ఆ మాట అనవలసిన అవసరం, ఔచిత్యం కనిపించవు. ఆ ఘట్టంలో, యయాతికి కాబోయే వారసునికి ఒక కఠినమైన అర్హతను నిర్దేశించడం చీకట్లో రాయి విసరడం లాంటిది. ఎలాగంటే, దేవయాని కొడుకులైన యదు, తుర్వసులు తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించడానికి ముందుకు వస్తారో లేదో ఆ క్షణంలో ఎవరికీ తెలియదు. కనుక శుక్రుని నిర్దేశం దేవయానికి ఉపకారం కన్నా అపకారం చేసే అవకాశమూ ఉంది. ఈ కథను మలచడం వెనుక ఒక ప్రణాళికా, ఆ ప్రణాళికలో శుక్రుని భాగస్వామ్యమూ లేవనుకుంటే; ఎంతో బుద్ధిశాలి అనుకునే శుక్రుడు ఇలాంటి అనాలోచిత నిర్దేశం చేస్తాడా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

కథ వెనుక ఒక ప్రణాళికా, అందులో శుక్రుని భాగస్వామ్యమూ ఉన్నాయనుకున్నప్పుడే ఆ ప్రశ్న తలెత్తదు.  శుక్రుని పాత్రను మొదటినుంచీ గమనించండి… అతనికి దేవయాని ప్రవర్తనతో ఏకీభావం ఎప్పుడూ లేదు. దానికితోడు శర్మిష్టపై అతనికి ఆదరభావం ఉంది. ఆమెకు అన్ని సౌఖ్యాలూ సమకూర్చి బాగా చూసుకోమని యయాతికి ప్రత్యేకంగా చెప్పాడు. పడక సుఖానికి మాత్రం ఆమెను దూరంగా ఉంచమన్నాడు. ఆమెతో పడక సుఖం పంచుకోమన్న ధ్వనీ అందులో ఉండచ్చని చెప్పుకున్నాం. అందుకే, శర్మిష్టతో సంబంధం పెట్టుకున్నందుకు యయాతిపై అతనికి నిజంగా కోపం లేదు. కూతురికోసం కోపం నటించాడు. శపించిన వెంటనే శాప సవరణ చేయడం దీనికి మరో సాక్ష్యం. పైగా, నీ వృద్ధాప్యాన్ని స్వీకరించిన వాడే నీ రాజ్యానికి వారసుడవుతా డన్నాడు. శర్మిష్ట కొడుకుల్లోనే ఒకడు ఆ అర్హతను సాధించుకోగలడన్న నమ్మకం అప్పటికే ఆయనకు ఉండి ఉండాలి. లేనప్పుడు చీకట్లో రాయి విసరడం లాంటి ఆ  శాపసవరణను ఆయన చేసి ఉండేవాడు కాదు. అంతకంటే ముఖ్యంగా, శర్మిష్ట కొడుకు రాజు కావడమే అతిక్రమించరాని ధర్మమన్న బలమైన భావనా ఆయనకు ఉండచ్చు. ఎందుకంటే, ఆమె రాచకూతురు కనుక.

ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాలి. కథకుడు జరిగిపోయిన కథను చెబుతున్నాడు. తను చెప్పదలచుకున్న ఫలశ్రుతికి అనుగుణంగా కథను మలచుకుంటున్నాడు. ఆయా పాత్రలను ఆ ఫలశ్రుతికి కలసివచ్చేలా నిర్మించుకుంటున్నాడు. శర్మిష్ట చిన్న కొడుకు పూరుడు రాజు కావడమే ఈ కథలో ఫలశ్రుతి. అతడు భరతవంశ మూల పురుషులలో ఒకడు కాబోతున్నాడని చెప్పడం కథకుని దృష్టినుంచి చాలా ముఖ్యమైన అంశం. కథకుడు ఉద్దేశించిన ఈ ఫలశ్రుతికి కలసివచ్చే అతి ముఖ్య పాత్ర, ఇక్కడ శుక్రుడు. ఎలాగంటే, శర్మిష్ట రాచకూతురే కానీ, మధ్యలో దాసి అయింది. ఆమె కొడుకులపై దాసిపుత్రులన్న ఆక్షేపణ ఉంటుంది. అయినాసరే, ఆమె కొడుకు పూరుడు రాజయ్యాడు. దానికి సామాజిక ఆమోదం లభించాలి. ఆ ఆమోదాన్ని పొందడం వివిధ అంచెలలో సాగుతుంది. వాటిలో శుక్రుని ఆమోదం ఒకటి. అతడు పురోహితుడు, ధర్మాధర్మనిర్ణయవేత్త, నీతికోవిదుడు, గురుస్థానంలో ఉన్నవాడు. కనుక అతని ఆమోదం తప్పనిసరి.

సామాజిక ఆమోదం సాధించే ఈ ప్రక్రియలో మరో అంచె, పౌరజానపదపరిషత్తు ఆమోదం. ఇది ఈ కథలో సంప్రదాయ  పండితుల మౌనముద్రను వెల్లడించే మరో సందర్భం కూడా. పౌరజానపదపరిషత్తు నేటి ప్రజాప్రతినిధుల సభ లాంటిది. యయాతి తనకు ‘విధేయులైన’ బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలైన అన్ని వర్ణాలలోని ముఖ్యులనూ రప్పించి; మంత్రి, పురోహిత, సామంత, పౌరజన సమక్షంలో పూరునికి పట్టాభిషేకం చేశా డని కథకుడు చెబుతున్నాడు. అంటే, పూరుని రాజుగా అభిషేకించే విషయంలో యయాతి ముందుగా వారిని సంప్రదించి, ఆమోదం పొందలేదనీ; స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నాడనే అభిప్రాయానికి ఇక్కడ అవకాశమిస్తున్నాడు. పైగా వారందరికీ ‘నిజాజ్ఞా విధేయు’ లనే విశేషణం వాడాడు. ఆ మాట ద్వారా యయాతి సర్వస్వతంత్రాధికారాలు గల రాజు అనీ, అతని మాట శిలాశాసనమనే భావన కలిగిస్తున్నాడు.

విచిత్రం ఏమిటంటే, కథకుడు ఆ వెంటనే ‘సర్వ ప్రకృతి జనా’లకూ యయాతి చర్య నచ్చలేదనీ సూచిస్తున్నాడు. వారు తమ అభ్యంతరాలను సూటిగానే వెల్లడించారు. పై పద్యం అదే చెబుతోంది. ‘నీ పెద్దకొడుకు, అన్ని విధాలా సమర్థుడు, శుక్రుని మనవడు అయిన యదువు ఉండగా, ఒక నిమ్న స్త్రీకి జన్మించిన పూరునికి రాజ్యమెలా ఇస్తా’వని వారు అడిగారు.  దానికి యయాతి జవాబిస్తూ, ‘మీరన్నట్టు యదువు నా పెద్దకొడుకే, నా హృదయంలోంచి పుట్టినవాడే; కానీ, నా మాట పెడచెవిని పెట్టి నన్ను అవమానించాడు. తల్లిదండ్రుల ఆజ్ఞను పాటించనివాడు కొడుకెలా అవుతాడు, తండ్రి ఆస్తికి వారసుడెలా అవుతాడు? పూరుడు అలా కాదు. చిన్నవాడైనా నా ఆదేశాన్ని పాటించాడు. గుణసంపదలో అతనే పెద్ద. పైగా భూభారం మోయగల సహనం అతనికి ఉంది’ అన్నాడు.  అంతటితో ఆగకుండా, శుక్రుని కూడా తనకు సమర్థనగా ముందుకు తెచ్చాడు. ‘నా వృద్ధాప్యభారాన్ని మోసిన కొడుకే నా రాజ్యానికి అర్హుడూ, వంశకర్తా అవుతాడు. ఇది శుక్రుని మాట’ అన్నాడు. ఆ విధంగా యయాతి ప్రకృతిజనాలను ఒప్పించి పూరుని భూభారదురంధరుని, అంటే పట్టాభిషిక్తుని చేశాడని అంటూ కథకుడు మరోసారి పట్టాభిషేక ప్రస్తావన చేస్తున్నాడు.

ఇలా ఒకే సందర్భంలో, అందులోనూ వెంట వెంటనే యయాతిని ఒకసారి సర్వస్వతంత్రుడైన రాజుగానూ; ఆ తర్వాత ‘ప్రకృతి జనాల’ అభ్యంతరాలకు సమాధానం చెప్పి, వారిని ఒప్పించవలసిన రాజుగానూ కథకుడు చిత్రించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ క్రమంలో పూరుని పట్టాభిషేక ప్రస్తావన రెండుసార్లు చేసి అనవసరంగా తన కథనానికి పునరుక్తి దోషాన్ని  ఆపాదించడమూ వింతగానే కనిపిస్తుంది. ఎందుకిలా అని ప్రశ్నించుకుంటే స్ఫురించే కారణాలు ఇవే:

నేటి ప్రజాప్రతిధుల సభలాంటి పౌరజానపదపరిషత్తు ప్రాముఖ్యం, పనితీరుల గురించి కథకునికి స్పష్టమైన అవగాహన లేకపోవచ్చు. రాజుకు సర్వస్వతంత్ర అధికారాలు ఉంటాయని మాత్రమే కథకుని అవగాహన కావచ్చు. అయితే, యయాతి నిర్ణయాన్ని మొదట (పౌరజానపదపరిషత్తు రూపంలోని) ‘ప్రకృతి జనాలు’ ప్రశ్నించారనీ, యయాతి వారిని సమాధానపరచిన తర్వాతే పూరునికి పట్టాభిషేకం చేశాడని మూల కథ చెబుతోంది కనుక, కథకుడు దానిని తప్పించుకోలేకపోయాడు. సందిగ్ధస్థితిలోనే దానినీ అనువదించి ఉంటాడు. లేదా, పౌరజానపదపరిషత్తు గురించి తనకు అవగాహన ఉన్నా, దాని గురించి తెలియవలసిన అవసరం లేని వేరొక సామాజిక దశకు చెందిన శ్రోతలకు కథ చెబుతున్నాడు కనుక ఆ వివరాన్ని ఇలా స్పష్టాస్పష్టంగా తేల్చి వేసి ఉండచ్చు. లేదా, రాజుకు సర్వస్వతంత్ర అధికారాలు ఉంటాయని చెప్పడం మీదే తనకు ఎక్కువ ఆసక్తి ఉండి ఉండవచ్చు. మొత్తానికి కఃథలోని ఈ వివరాన్ని తప్పించుకోడానికి కథకుడు చేసిన విఫలయత్నం పైన చెప్పిన అస్పష్టతకు, పునరుక్తికి అవకాశమిచ్చింది. విశేషమేమిటంటే, నేను పరిశీలించిన టీటీడీ ప్రచురణలో వ్యాఖ్యాతలు దీనిపై ఎటువంటి వ్యాఖ్యా చేయలేదు.

సంప్రదాయ పండితుల మౌనముద్రను పట్టి చూపే మూడో అంశాన్ని చూద్దాం…శర్మిష్ట కొడుకులు ముగ్గురినీ దేవయాని ఎప్పుడు చూసింది? వారు యయాతి దగ్గర ఆడుకుంటుండగా. అంటే, వారు బాల్యదశలో ఉండి ఉండాలి. కథకుడు కూడా వారిని బాలకులనే అన్నాడు. కనీసం వారు కౌమారదశలో కూడా లేరు. మీ తల్లిదండ్రులెవరని దేవయాని వారిని అడిగినప్పుడు వారు నోటితో కూడా సమాధానం చెప్పలేదు. తమ ‘లేత చూపుడివేలితో’ యయాతీ, శర్మిష్టలను చూపించారు. శర్మిష్టవల్ల యయాతి ఈ ముగ్గురినీ కన్నాడని అర్థమైన దేవయాని అప్పటికప్పుడు పుట్టింటికి బయలుదేరివెళ్లింది. తండ్రికి అంతా చెప్పింది. ఆమె వెనకే యయాతీ వెళ్ళాడు. అప్పుడు వృద్ధుడివి కమ్మని శుక్రుడు శాపమిచ్చి, శాప సవరణ కూడా చెప్పాడు. శాపం పని చేసి, ఆ వెంటనే యయాతిపై వృద్ధాప్యభారం పడిందని కథకుడు చెబుతూ ఆ అవస్థను కూడా వర్ణించాడు. అప్పుడు యయాతి అయిదుగురు కొడుకులనూ పిలిచి, ‘మీలో ఒకడు నా వృద్ధాప్యం తీసుకుని తన యవ్వనం నాకు ఇవ్వా’లని అడిగాడు. మొదటి నలుగురూ తిరస్కరించగా, ఆఖరి కొడుకు పూరుడు ఒప్పుకుని తన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చి అతని వృద్ధాప్యం తను తీసుకున్నాడు.

ఇదంతా మహా అయితే కొన్ని రోజుల వ్యవధిలో జరిగిపోయి ఉండాలి. అప్పటికి శర్మిష్ట కొడుకులే కాదు సరికదా, దేవయాని కొడుకులు కూడా యవ్వనవంతులు కావడానికి అవకాశం లేదు. కనీసం కౌమారదశలో ఉండే అవకాశమూ తక్కువే. అందులోనూ శర్మిష్ట చివరి కొడుకు పూరుడు మరింత శైశవదశలో ఉండి ఉంటాడు. అతడు యవ్వనవంతుడు ఎప్పుడయ్యాడు? తన యవ్వనాన్ని తండ్రికి ఎప్పుడు ఇచ్చాడు? అతడు పెరిగి పెద్దయ్యే దాకా యయాతి వృద్ధాప్యాన్ని అనుభవించాడా? అప్పుడు దేవయానితో అతడు సుఖించడం ఎలా సాధ్యమవుతుంది? ఒకవేళ, పూరుడు యవ్వనవంతుడయ్యాక యయాతి అతని యవ్వనం తీసుకున్నాడనుకున్నా; అప్పుడు యయాతి దేవయానితో సుఖించడం ఎలా సంభవం? దేవయాని యవ్వనం అప్పటికి తరిగిపోతుంది కదా? శుక్రుడు తన శాపసవరణ ద్వారా కూతురికి చేసిన మేలు ఏమిటి?

సంప్రదాయ పఠన పాఠనాలలో సమాధానం దొరకని ఇలాంటి అనేక ప్రశ్నలను అలా ఉంచి, మరో అంశాన్ని ఎత్తుకుంటే…

శర్మిష్టతో యయాతి సంబంధం పెట్టుకోవడమే కాక, ఆమెవల్ల కొడుకులను కూడా కన్న ఈ ఘట్టంలో కథకుడూ, దేవయానీ, ప్రకృతిజనులూ కూడా జాతిభేదాన్ని ముందుకు తెస్తున్నారు. ఇందులో అంతర్లీనంగా వారసత్వ వివాదం ఉన్న సంగతి స్పష్టమే. శర్మిష్టతో యయాతి కొడుకుల్ని కన్నట్టు తెలిసి దేవయాని దుఃఖిస్తూ తండ్రి దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేసిందని చెబుతున్న సందర్భంలో కథకుడు శర్మిష్టను ‘దానవి’గా పేర్కొని ఈ వారసత్వ వివాదానికి సూచనప్రాయంగా తెరతీశాడు. ‘ఈ రాజు ధర్మం తప్పి రాక్షసపద్ధతిలో రాక్షసి వల్ల ముగ్గురు కొడుకుల్ని కని నన్ను అవమానించా’డని దేవయాని తండ్రితో అంది. ‘ఒక నిమ్న జాతి స్త్రీకి పుట్టినవాడికి రాజ్యభారం ఎలా అప్పగిస్తా’వని ప్రకృతిజనులు యయాతిని అడిగారు.

జాతిభేదం గురించిన ఈ ప్రస్తావనలు బహుశా ఒకనాటి జాతులు, తెగల సాంకర్యాన్ని సూచిస్తూ ఉండచ్చు. ఆధునిక చరిత్రకారుల రాతలు ఇందుకు సంబంధించిన పురాచారిత్రక పరిణామక్రమాన్ని పునర్నిర్మించుకోడానికి ఏ కొంచెమైనా సాయపడచ్చు. అలాగే, దేవయాని రాక్షస పద్ధతిలో అనడం వివాహచరిత్రనూ, వివాహభేదాలనూ స్పృశిస్తూ ఉండచ్చు.

వాటి గురించి తర్వాత…

–కల్లూరి భాస్కరం

ఎక్కడి నుండి ఎక్కడి దాకా ? – 2 వ భాగం

ekkadi-2( గత వారం తరువాయి )

2

రాత్రి పన్నెండుగంటల నలభై రెండు నిముషాలు.ఎస్పీ విఠల్‌ చాలా అసహనంగా, చికాగ్గా..ఎందుకో పొయ్యిమీది గిన్నెలో మరుగబోతున్న నీటిలా ఉడికిపోతున్నాడు.

ఎండాకాలం.. ఉంచుకున్న మూడవ ఆడదాని మూడవ అంతస్తులోని ఎ సి గదిలో ఒంటరిగా..రివాల్వింగు చైర్‌లో అటు ఇటూ కదుల్తూ..నిప్పుకణికలా కణకణలాడ్తున్నాడు.
అంత అసహనం ఎందుకో అతనికే అంతుపట్టడంలేదు. కాని ఎందుకో ఏదో చేయాలని మాత్రం చాలా కసిగా ఉందతనికి.

ఎదురుగా టేబుల్‌పై ఆరోజే కొత్తగా సీల్‌తీసి పొద్దట్నుండి తోలుకేస్‌లో పెట్టుకున్న యుఎస్‌ఎ బెరెట్టా సర్వీస్‌ రివాల్వర్‌ ఉంది. తళతళా మెరుస్తూ, నిగనిగలాడ్తూ కొత్త పిస్టల్‌ పొద్దట్నుండీ లాడ్జింగు గదిలో తనకోసం ఎదురుచూస్తున్న కొత్త ఆడదానిలా కవ్విస్తూనే ఉంది.

పిస్టల్‌ను ఎప్పుడు వాడుదామా అని తొందర.. ఎవర్నయినా కాల్చి చంపితే ఎంత బాగుండుననే అజ్ఞాత కాంక్ష.. గులగుల.. ఉవ్విళ్ళూరే హింసోన్మాదం. ముట్టుకోవాలనీ, ముద్దుపెట్టుకోవాలనీ ఏదో తెలియని మోహం..,

ప్రతి మనిషిలోనూ తనకు తెలియకుండానే హింసను బలంగా యిష్టపడే పశుప్రవృత్తి అజ్ఞాతంగా ఉంటుందా.. అందుకే సినిమాల్లో ఫైటింగు దృశ్యాలను ప్రతిమినిషీ ఆనందిస్తాడా..వీధుల్లో ఎవరైనా కొట్లాడుకుంటూంటే అందుకే అందరూ ఆసక్తిగా తిలకిస్తూ ఆనందిస్తారా. చిన్నపిల్లలు అందుకే తూనీగనిస్తే రెక్కలనూ, తోకనూ పీకేసి హింసిస్తారా..బొద్దింకనిస్తే చీపురుపుల్లతో గుచ్చి గుచ్చి అందుకే చంపుతారా. మనిషిలో గుప్తంగా జ్వలించే ఈ హింసాపిపాస ఏమిటి.?

ప్రక్కనే టేబుల్‌పై తనకిష్టమైన ఫ్రెంచి విస్కీ 25 సంవత్సరాల ఏజ్డ్‌ గిన్లేవిట్‌ విస్కీ సీసా ఉంది. అప్పటికే రెండు పెగ్గులు దాటింది.. మూడవ పెగు సగం ముగిసి సోడా, ఐస్‌ ముక్కలు..ఏదో వెలితి..ఏదో ఉద్వేగం..ఏదో,

ఆ ఏదో ఏమిటి.. ఏమిటి కావాలి తనకు.,

యింతకుముందే డైమండ్‌ నెక్లెస్‌ కొనివ్వలేదని ఈ నంబర్‌ త్రీ అలిగి తనతో పడుకోకపోవడం కారణమా..ఆ మంత్రి వెధవ తమ మద్యవ్యాపార, వ్యవహార లావాదేవీల లెక్కలను మాట్లాడుకుందామంటే తమ జిల్లాకు పర్యటనకని వచ్చి గెస్ట్‌హౌజ్‌లో ఉండికూడా తనకు అపాయింట్‌మెంటివ్వకపోవడం కారణమా..పొద్దట్నుండీ ఈ కొత్త పిస్టల్‌ కవ్విస్తూండడం కారణమా..వ్చ్‌..ఏమో

మళ్ళీ కొద్దిగా విస్కీని సిప్‌ చేశాడు విఠల్‌. కసివల్ల కావచ్చు ఇంకా ఇంకా తాగాలనే కోరిక పురులు విప్పుకుంటోంది. రాత్రి ఎనిమిది తర్వాత అపాయింట్‌మెంట్సన్నీ కాన్సిల్‌ చేసుకుని సలుపుతున్న మనసుతో ఈ నంబర్‌ త్రీ యింటికొచ్చాడు. నేరుగా.. గంటన్నరసేపు.. బాగానే గొడవ జరిగింది. అరేబియా గుర్రంలా కవ్వించే ఆడది రంజని.. ఉహు..అస్సలే పడుకోలేదు. మొండికేసింది. ఎంత బతిలాడినా వినలే..తలుపులేసుకుని కనుమరుగైంది. కుంపటిలా కోరిక. ఇదస్సలే పడుకోదు.. అటు ఆ మంత్రిగానిపై కోపం పాదరసం లెవెల్‌ వలె పెరిగి పెరిగి తారాస్థాయికి చేరుతోంది. తామిద్దరికీ చెంది బినామీ పేర్లతో గ్యాస్‌ పవర్‌ స్టేషన్‌ నిర్మాణంలో ఏడాదిగా నడుస్తున్న రెండు వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌ లెక్క, జిల్లాలో వాడి బామ్మర్దిపేర, తన ఉంపుడుగత్తె రంజని పేర నడుస్తున్న ఏడు బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, హైద్రాబాద్‌లో ఎనభై రెండు కోట్ల ఫ్లై ఓవర్‌ కాంట్రాక్ట్‌, దేవాదుల ప్రాజెక్టుకు మెటల్‌ పైపుల సప్లయ్‌, ఇరవై రెండు కోట్ల సబ్‌ కాంట్రాక్ట్‌, పద్దెనిమిది భూమి పంచాయితీల సెటిల్‌మెంట్లు, మంత్రి ఇన్‌స్ట్రక్షన్‌పై.. ఒక హత్య.. రెండు శాల్తీల గల్లంతు కేసులు.. అన్నీ కలిపి… కోట్లకు కోట్ల లెక్క తేలాల్సి ఉండగా.,

‘లంజాకొడ్కు నక్‌రాల్‌ చేస్తాండు’

మనిషిని అధికారం, నిర్భయం, ధీమా, అహం..ఇవి కళ్ళుండగానే గుడ్డివాణ్ణి చేసి ధైర్యం పేరుతో ఉన్మాదిగా మారుస్తాయి. విఠల్‌లోకి అహం కట్టలు తెంచుకుని ప్రవహించడం మొదలైంది.
అప్రయత్నంగానే విఠల్‌ టేబుల్‌పైన విస్కీ సీసా ప్రక్కనే ఉన్న కొత్త బెరెట్టా పిస్టల్‌ను చేతిలోకి తీసుకున్నాడు. ఒక బ్రహ్మస్తంలా చేతిలోకి ఆయుధం రాగానే ఒట్టి రాగి తీగలోకి విద్యుత్తు ప్రవేశించినట్టయింది. విఠల్‌.. విఠల్‌ ఐపిఎస్‌గా మారి.. ఒక జిల్లాకు ఎస్పీగా సర్వం సహాధికారిననే స్పృహ కలిగి.. ఎదురులేని నియంతకు గల శక్తి తెలిసి..,

ఏదో తెగింపు కట్టలు తెంచుకుంటూండగా.,

సెల్‌ఫోన్‌ను తీసి మినిస్టర్‌కు ఫోన్‌ చేయాలనుకుంటూండగా…, అట్నుండే కాల్‌..”విఠల్‌..రా..యిప్పుడ్రా..గెస్ట్‌హౌజ్‌లో ఉన్న..తెగ తొందరపడిపోతున్నావ్‌గదా..తేల్చుకుందాంరా.. లెక్కలను..”అంటున్నాడు మంత్రి.

వెధవ..మెట్రిక్యులేట్‌ ..నోరుతెరిస్తే..పశువుకు మాటొచ్చినట్టు..ఫైల్‌ చదువరాదు..ఎండార్స్‌మెంట్‌ రాయరాదు.. అధికారులు చెప్పేది విని..మళ్ళీ వాళ్ళకే ఉల్టా చెప్పి..నవ్వులాట..మంత్రి పదవి వెధవలకు ఓ నవ్వులాట థూ నీయమ్మ.. భారత రాజకీయాలన్నీ భ్రష్టు పట్టిపోయాయి. ఎంతసేపూ ఎలా అధికారంలో కొనసాగాలా, ఎలా పార్టీఫండ్‌ పేరుతో దండుకోవాలా అని అన్ని రాజకీయపార్టీలు సంకీర్ణ సహకారాల పేరుతో ఒకన్నొకడు బ్లాక్‌మెయిలింగు, సిగ్గువిడిచి బహిరంగంగానే ప్రజాధనం దోపిడి.. పెచ్చుమీరిపోయిన విచ్చలవిడి అవినీతి. ఎవనిపైన ఎవనికీ అదుపులేని అసమర్థ పరిపాలన.. ఎక్కడా కనిపించకుండా శాశ్వతంగా కనుమరుగైపోయిన క్రమశిక్షణ.,

బెరెట్టా పిస్టల్‌పై మోడల్‌ నంబర్‌ ధగధగా మెరుస్తోంది జుఎఔ. 8085 డిస్టింక్టివ్‌ సీరియల్‌ నంబర్‌. 25-03-92 సీరిస్‌ మ్యాగజైన్‌. ధర తొంభై వేలు.. కొన్న కోటిరూపాయల పిస్టల్స్‌ ఖరీదులో నలభైశాతం కిక్‌ బ్యాక్స్‌.

కిక్‌.. బ్యాక్‌.. వెనక్కి తన్ను.. వెనుకనుండి తన్ను.. వెనుక వీపుపై తన్ను.

ఎవని వీపుపై ఎవరు తన్నుట?..ఎవరి వీపుపైనైనా ఎవరైనా తన్నుట.

విఠల్‌ కొత్త పిస్టల్‌ను ప్యాంట్‌ బెల్ట్‌వెనుక, ముడ్డి దగ్గర పదిలంగా గుచ్చుకుని చకచకా నడిచాడు కిందికి.. కిందికి రాగానే తన అక్యురా కార్‌ను స్టార్ట్‌ చేసి మంత్రి బసచేసి ఉన్న గెస్ట్‌హౌజ్‌ దిక్కు పోనిచ్చాడు. ఒక మర్డర్‌కేస్‌లో లిక్కర్‌ కాంట్రాక్టరొకణ్ణి సేవ్‌ చేసినందుకు ఈ అక్యురా కార్‌ను వారంక్రితం తన మూడవ ఆడదాని పేర రిజిస్ట్రేషన్‌ చేసి లంచమిచ్చిన సంగతి ఎందుకో స్ఫురించింది విఠల్‌కు.. తిరుగులేని అధికారాలు తనవి.. ఎదురులేని మగాడు తను.

గెస్ట్‌హౌజ్‌ చేరుకుని, కారును పార్క్‌చేసి సూటిగా మంత్రిగారి ఆంటీరూంలోకి నడిచాడు విఠల్‌ వడివడిగా. అక్కడ విజిటర్స్‌ ఎవరూ లేరు.. అర్ధరాత్రి దాటింది కదా.

ఒక సెక్యూరిటీ కానిస్టేబుల్‌ మాత్రం కునికిపాట్లు పడ్తూ బెడ్‌రూం దగ్గర నిలబడి నిద్రలో జోగుతూ.. వాని దగ్గరా విస్కీ వాసన గుప్పుమంది.

‘నమ ..స్తే సర్‌” అన్నాడు ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ కానిస్టేబుల్‌. వాడి పేరేమిటో తెలియదు. డ్రెస్‌లో ఉన్నాడు. బెల్ట్‌కు పిస్టల్‌ ఉంది. కళ్ళు ఎర్రగా..మాట ముద్దముద్దగా ఉంది.

విఠల్‌ కొద్ది అసహనంగా తలపంకించి మంత్రిగదిలోకి చొచ్చుకుపోయాడు.

గదిలోకి పోగానే మంత్రిగారి దగ్గర్నుండీ విస్కీవాసనే.

అంతా మత్తులో గమ్మత్తుగా జోగుతూ, తూగుతూ, ఊగుతున్న వేళ.,

ఒకడు భద్రతకోసం నియమించబడ్డవాడు.. మరొకడు ప్రజలందరి భద్రతకు హామీగా నిలబడవలసినవాడు, ఇంకొకడు మంత్రిగా రాజ్యాంగబద్దంగా ప్రజల భద్రతకూ, సంక్షేమానికీ బాధ్యత వహిస్తానని ప్రమాణం చేసినవాడు.. అందరూ విస్కీమత్తులో చిత్తయి ఉన్న వేళ.,

ఐనా తాగుబోతుల డబ్బులతో నడుపబడ్తున్న ఈ దిక్కుమాలిన, సిగ్గుమాలిన ప్రభుత్వాలు నీతి తప్పి, రీతి తప్పి విశృంఖలంగా, నిర్లజ్జగా ప్రవర్తిస్తున్న వర్తమాన సంకక్షుభిత సందర్భంలో..ఈ సన్నివేశం సమకాలీన భారత సమాజాన్ని ప్రతిబింబిస్తోందా..అనుకున్నాడు విఠల్‌.

ఎందుకో.. ఎదురుగా విశాలమైన డబుల్‌ కాట్‌ మంచంమీద విలాసంగా ఒరిగిఉన్న మంత్రి తలపై ఉన్న వాచ్‌దిక్కు దృష్టిపోయింది విఠల్‌కు. టైం ఒంటిగంట పది నిముషాలు.

”ఊఁ.. ఏందయ్యా.. తెగ గోల చేస్తున్నావ్‌ లెక్కలూ లెక్కలో అని..”

”…..” విఠల్‌ ఎదురుగా సోఫాలో కూర్చుని ఒట్టిగా, నిర్లిప్తంగా మంత్రివైపు చూశాడు.

”చెప్పు.. ఏం చేద్దాం..”

”ఆ పవర్‌ ప్రాజెక్ట్‌ పనులకోసం ఫ్లై ఓవర్‌ కన్‌స్ట్రక్షన్‌ కోసం.. నేనొక్కణ్ణే నా తరపున నూటా పదికోట్ల పెట్టుబడి పెట్టిన. మీరు వాటి సంగతే మాట్లాడ్డంలేదు. మీ బార్లు, సెటిల్‌మెంట్లు, భూముల లావాదేవీలు.. వీటన్నింటి కింద నాకు దాదాపు నా లెక్క ప్రకారం నలభై కోట్లు రావాలి. మొన్న మీ కీప్‌ రంజనికి సెటిల్‌మెంట్‌ కింద పద్దెనిమిదెకరాల భూమిని ఫ్రీగా ఇప్పించిన కేస్‌లో ఒక మర్డర్‌ కూడా చేయించవలసి వచ్చింది..”

”ఓకే.. ఓకే..ఐతే.. ఇప్పుడేంది”

” నాకు క్యాష్‌ కావాలి”
”ఎంత…”
”రెండు వందల కోట్లు”
”ఊఁ..”
”అక్కెరుంది నాకు”
”ఇప్పుడు లేవు..”
”అట్లంటెట్ల”

”ఇవ్వాళ ఉదయం చూచినౌగద..ముఖ్యమంత్రికే ఎసరుపెట్టిన..జంగు షురువైంది..పరేషాన్లున్న. అధిష్టానం నుంచి వార్నిగచ్చింది..మనుషుల్ని కొనాలె..”
”అందుకే చెబ్తున్న.. సెటిల్‌మెంట్‌ చేయమని”

”అరే.. రేపు కాబోయే ముఖ్యమంత్రిని నేనే..పొద్దుగాల్నుంచి మీడియా అంత చూచినౌకద. కోడై కూస్తాంది లోకం..”
”అని నువ్వనుకుంటానౌ. హై కమాండ్‌కు ఎదురు తిరిగినవని ఉన్న మంత్రి పదవి పోద్దని నా ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్స్‌ చెప్తానై..”
”అట్లనా..ఓరి కుక్కలకొడ్కా..నమక్‌ హరాం..శుభం పల్కురా పెండ్లికొడ్కా అంటే గిట్ల మాట్లాడ్తానౌర..అరేయ్‌..”
”మాటలు మంచిగా రానియ్‌..”
”ఏందిర నీతో మంచిగా మాట్లాడేది.. ఆఫ్టరాల్‌ ఒక ఎస్పీగానివి.. వెంట్రుక ముక్క లెక్క పీకేస్తే బంగాళాఖాతంల కొట్కపోవాలె నాకొడ్కా..”
”హోల్డ్‌ యువర్‌ టంగు మిస్టర్‌ మినిస్టర్‌” విఠల్‌కు తెలుసు ఎక్కడా తమ సంభాషణ రికార్డ్‌ కావడంలేదని.
”ఏందిరా హోల్డ్‌..బొచ్చు..ఇప్పుడు నాదగ్గర పైసల్లేవు.. పో.. పీకుతవా..”
”మీరు హద్దులు మీరి మీట్లాడ్తున్నారు. ప్లీజ్‌”

మంత్రి బోనులోపెట్టి కొట్టిన పులిలా మహోగ్రంగా ఉన్నాడు. అతను అంతకు ముందే ఒక రహస్య స్థావరంలో తను ప్రత్యేకంగా యిష్టపడి తెప్పించుకున్న ఓ పల్లెటూరి ఇరవై ఏళ్ళ యువతితో కుతిదీరా రమించి, అలసి.. తృప్తిగా పీకలదాకా తాగి, యిష్టమైన చికెన్‌ కబాబ్‌ తిని.. ఉదయం మీడియాతో రాజకీయంగా, ఎత్తుకు ఎత్తి కుదిపిన కుదుపుల చక్కిలగిలికి పొంగి.. అంతా మత్తు.. ఆనందం.. వెర్రి సంతోషం.. పరవశోన్మాదం..

తెరవెనుక మాస్టర్‌మైండ్‌ లీల ఆశీర్వాదం.,
”అరే ఎస్పీ.. ఏందిరా నీల్గుతానౌ”
”మాటలు.. మాటలు..”
”మాటలేందిరా..అట్లనే అంట..ఒక్క పెన్‌ స్ట్రోక్‌తో శంకరగిరిమాన్యాల్‌బడ్తవ్‌ బిడ్డా”

”అరే..దొంగవెధవా. నీ దిక్కుమాలిన చిట్టా విప్పిన్నంటే అదిరిపడి గుండెపగిలి చస్తవ్‌..జనం రేపు నీ నోట్లె ఊంచుతరు.. పొలిటికల్‌ బాస్టర్డ్‌.. నువ్వేందిరా నాయి పీకేది. ఇయ్యాల పవర్లుంటవ్‌ రేపు పోతవ్‌.. నీలాంటి బాస్టర్డ్స్‌ ఎందరు మారినా శాశ్వతంగా కుర్చీలల్ల ఉండి ఈ ప్రభుత్వాలను నడిపేది మేమేకాదురా గూట్లే.. షటప్‌”
”నన్నే షటప్‌ అంటవా..”
”ఔ అంట..మళ్ళీ మళ్ళీ వందసార్లంటు..నా పైసల్‌ పారేయ్‌బే”
”బే..”అవాక్కయిన స్తబ్దత.
”ఔ.. బేనే.. డబ్బుసంగతి చెప్పు ముందు. రెండు వందల కోట్లు”
”లెవ్‌.. ఏంజేస్తవ్‌”
”ఏంజేస్తనా..” ఆఁ.. ఏంజేస్తవ్‌రా”

”విఠల్‌ పిచ్చికుక్కయి పోయాడు. తలలో విజృంభిస్తున్న విస్కీ విస్ఫోటనం విచక్షణను చంపేసింది. ప్రక్కనున్న టీపాయ్‌మీది గాజుఫ్లవర్‌ వేజ్‌ను తీసి నేలకేసి కొట్టాడు బలంగా. అది భళ్ళున శబ్దంచేసి పగిలి ముక్కలుముక్కలైంది.

వెంటనే బయట నిద్రలో జోగుతున్న గన్‌మెన్‌ లోపలికి పరుగెత్తుకొచ్చి.. అప్రయత్నంగానే సర్వీస్‌ రివాల్వర్‌ను బయటికి తీసి.. ఎస్పీ విఠల్‌ దిక్కు, మంత్రి దిక్కు బిక్కుబిక్కున షాకై చూస్తూండగానే,

తృటికాలంలో.. విఠల్‌ మెదడులో తను ఆ రోజే సీల్‌ తీసిన తన బెరెట్టా పిస్టల్‌ జ్ఞాపకమొచ్చి.. తళ్ళుక్కున ఓ మెరుపు మెరిసినట్టయి.. హింసావాంఛ సముద్రంలా పొంగి, క్షణంలో వేయితలల సర్పమై పడగ విప్పి.. జస్ట్‌ ఫర్‌ ఫన్‌.

‘ఈ మంత్రిగాన్నిప్పుడు చంపితే ఎలా ఉంటుంది..చంపితే ఏమౌతుంది. మజాగా ఉంటుందికదా’ అని అనిపించి,

విఠల్‌ లిప్తకాలంలో తన నవనవలాడే కొత్త బెరెట్టా పిస్టల్‌తో గన్‌మెన్‌ను కాల్చాడు. క్షణంలో వేయవవంతుకాలంలో కొత్త తూటా కానిస్టేబుల్‌ గుండెలో దిగబడి, ఫౌంటెన్‌లా రక్తం చింది..చావుకేక గెస్ట్‌హౌజ్‌  దద్దరిల్లేలా విస్ఫోటించి.. మరుక్షణమే నేలపైకి కూలిపోతున్న గన్‌మెన్‌ చేతిలోని రివాల్వర్‌ను నేలపై పడకుండా అందుకుని..మరుక్షణమే దాన్ని మంత్రిపైకి గురిచూచి.. ట్రిగ్గర్‌ను నొక్కి.,

బుల్లెట్‌ మెరుపులా దూసుకుపోయి..మంత్రి తలను వందముక్కలు చేసి..అరిచే సమయంకూడా లేక ”తప్‌” మని  మంత్రి శరీరం మంచంపైనుండి కిందపడి..అంతా రక్తం..ఎర్రగా..జయ్‌ఁమని చిమ్ముతూ విస్తరిస్తూ.,
‘అసలేం జరిగింది.’

వ్చ్‌.. ఏమో చుట్టూ ప్రపంచం గిరగిరా..కసిగా..పిచ్చిపిచ్చిగా..ఆనందంగా.

విఠల్‌ చేతిలో రివాల్వర్‌తో నిలబడి..పడగెత్తిన విస్కీమత్తు శరీరం నిండా గర్జిస్తుండగా ఏదో ఒక కుదుపు..షాక్‌.

ఐతే విఠల్‌ పోలీస్‌ బుర్ర మెరుపులా మెరిసింది. వెంటనే గన్‌మెన్‌ పిస్టల్‌పైనపడ్డ తన వేలిముద్రలను చకచకా దస్తీతో తుడిచి, మళ్ళీ భద్రంగా వాడి శవం చేతిలో ఉంచి..
పేరు తెలియని గన్‌మన్‌ శవం దిక్కూ,  క్షణం క్రితం తనను ఏం పీక్కుంటౌరా’ అని హూంకరించి మరుక్షణమే దిక్కులేని కుక్క చావుచచ్చి కింద నేలకు కరుచుకుని పడున్న మంత్రి మృతశరీరం దిక్కూ, గిర్రున తిరుగుతున్న బుర్రతో, కళ్ళతో చూచి.. దీర్ఘంగా, గంభీరంగా శ్వాస ఎగపీల్చుకుని, నిట్టూర్చి.,

‘ఇట్స్‌ ఓ.కే..’ అనుకుని,

తూగుతూ ఒక్కో అడుగువేసుకుంటూ గదినుండి బయటికొచ్చి..’ఇప్పుడెలా’ అనుకుంటూ,

పోలీస్‌ మెదడు దీర్ఘకాల శిక్షణలవల్ల అతిసహజంగానే నేరపూరితమై ఎప్పుడూ పాదరసంలా సంచలితంగా ఉంటుంది.
బయటికి.. వరండాలోకి వచ్చి నిలబడ్డ విఠల్‌..అప్పట్నుండీ ఉరుముతున్న ఆకాశం విషయం గమనించనేలేదు. ఉన్నట్టుండి కుండపోతగా వర్షం మొదలై గాలివానతో మెరుపులు ముసురుకుంటూండగా.ఉలిక్కిపడ్డట్టయి..,
చకచకా ఓ కథ రూపుదిద్దుకుంటోంది విఠల్‌ పోలీస్‌ మెదడులో,

ఉదయం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మంత్రిగారు నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్‌ నేపథ్యంలో జిల్లా పర్యటనకు వచ్చిన తర్వాత..అనేకమంది ముఖ్యమంత్రి అభిమానులనుండి, శిబిరాలనుండి మంత్రిగారికి పుంఖానుపుంఖాల బెదిరింపు కాల్స్‌ వచ్చాయి పొద్దంతా. అందుకు ఆయనెంతో ఆవేదనచెంది భయపడ్డారు. ప్రాణభయంకూడా ఉందని చర్చిండానికి అసాధారణ వేళే ఐనా అర్ధరాత్రి ఏకాంతంగా మాట్లాడ్డానికి ఎస్పీగా తనను రమ్మని కబురుచేస్తే తను వచ్చాడు. సీరియస్‌గా మాట్లాడ్తున్న మంత్రి తన సహజధోరణిలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అనేక ఆరోపణలు చేస్తూ ముచ్చటిస్తున్న సందర్భంలో.. తాము అప్పటినుండీ గమనించని ముఖ్యమంత్రి వీరాభిమానియైన గన్‌మెన్‌ అనూహ్యంగా తన రివాల్వర్‌ను తీసి మంత్రిగారికి గురిపెట్టి బండబూతులు తిట్టడం మొదలెట్టాడు. అవాక్కయిన తను గన్‌మెన్‌ను వారించి సర్దిచెప్పే ప్రయత్నం చేసే లోపలే.. బాగా తాగిన మత్తులో ఉన్న గన్‌మన్‌ టకటకా పిస్టల్‌ను మంత్రిగారిపైకి కాల్చాడు. వెన్వెంటనే కుప్పకూలిన మంత్రి.. పెనుగులాటలో ఆత్మరక్షణార్థం, మంత్రిని రక్షించే ప్రయత్నంలో భాగంగా తను అనివార్యమై గన్‌మన్‌ కాల్చడం.. అంతా క్షణాల్లో జరిగి.,

మంత్రిగారి మరణం.. వెన్వెంటనే గన్‌మన్‌ మరణం కూడా,     కావలిస్తే.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో మంత్రీ, గన్‌మన్‌ ఇద్దరూ తాగినట్టు ఎలాగూ రిపోర్ట్‌ వస్తుంది. మంత్రి శరీరంలో కానిస్టేబుల్‌ బుల్లెట్‌, కానిస్టేబుల్‌ శరీరంలో తన రివాల్వర్‌ బుల్లెట్‌ ‘ఈ కథ బాగుంది. సరిగ్గా అతికింది’ అనుకున్నాడు విఠల్‌.

విఠల్‌ కొద్ది అసహనంగా తలపంకించి మంత్రిగదిలోకి చొచ్చుకుపోయాడు. అనుకున్నాడు విఠల్‌. శవాలూ ఉన్న బెడ్‌రూంలోకి వెళ్ళి, చేతికి దస్తీ చుట్టుకుని ప్రక్క వార్ట్‌రోబ్‌లో ఉన్నమంత్రిగారి బ్రీఫ్‌కేస్‌ను తెరిచాడు. ఆశ్చర్యం..నిండా బంగారు బిస్కెట్‌ బిళ్ళలు. మరుక్షణమే బ్రీఫ్‌కేస్‌ను మూసి.. టకటకా బయటికొచ్చి..వర్షంలో తన కారు డిక్కీ తెరిచి … క్రింద టూల్‌ బాక్స్‌దగ్గర బ్రీఫ్‌కేస్‌ను భద్రంగా సర్ది..ప్రశాంతంగానే డిక్కీని లాక్‌ చేసి..మళ్ళీ నెమ్మదిగా నడుచుకుంటూ వరండాలోకి వచ్చి నిలబడి..దీర్ఘంగా ఊపిరిపీల్చుకుని నిట్టూర్చి,
లోపల విస్కీ మత్తు విచ్చుకుపోతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది విఠల్‌కు.

ఆ క్షణం అతని మెదడులో..మంత్రి మరణంవల్ల తమ మధ్య లావాదేవీల్లో ఎంత నష్టమొస్తుంది..ఈ బంగారు బిస్కెట్ల విలువెంతుంటుంది.. మిగతాది ఎలా రాబట్టాలి..వంటి ఆలోచనలు చినుకుల్లా కురుస్తూండగా..,

ఈ గన్‌మన్‌ మరణం ఏమిటి..ఎందుకు..జస్ట్‌ఫర్‌ ఫన్‌ కదా..తన కొత్త పిస్టల్‌ను ఉపయోగించి పైశాచికంగా ఆనందించాలనే అంతర్గత రాక్షసవాంఛేనా,
ఐనా.. బూటు కింద ఒక చీమ ఎందుకు పడిచస్తుంది..పండిన టమాటాపై బూటుకాలు పడి చితికితే..వాటి
వెనుక హేతువేమిటి..అందుకు కారణమేమిటి..వంటి ఆలోచనలు..మీమాసం ఎందుకు..అనవసర పిచ్చిగానీ,
వ్చ్‌.. అంతా ట్రాష్‌.
విఠల్‌ చకచకా తన సెల్‌ఫోన్‌ను డయల్‌చేసి డిఎస్పీ ప్రకాశ్‌ను తన మందీ మార్బలంతో గెస్ట్‌హౌజ్‌కు రమ్మని  ఆదేశిస్తూ..,
అప్పుడు..ఆక్షణం..అంతా ప్రశాంతంగా..గంభీరంగానే ఉంది.

( సశేషం)

పిట్ట మనసులో ఏవుందీ ?

SAM_0344

“ఓరి నీ అఘాయిత్యం కూలా ….ఎంత తోస్తే అంతా చేసేయడవే ! ఆలోచనుండొద్దూ ?” అంటూ అబ్బులుగాడి మీద అంతెత్తున  విరుచుకు పడ్డారు  అత్తగారు .

మరి, అబ్బులు చేసుకొచ్చింది ఆషామాషీ ఆగడం కాదు . పొగాకు బేరన్ కి పుల్ల కోసం ట్రాక్టరు తోలుకుని మన్యం వెళ్ళినవాడు పుల్లతోపాటు పిల్లనీ దింపేడు మా వాకిట్లో .

” ఆయ్..ఈ పిల్లపేరు తలుపులమ్మండీ ” అంటూ కొంగు ముడేసి తీసుకొచ్చిన కొత్తపెళ్ళాన్ని  పరిచయం చేసినట్టూ  బోర విరుచుకుని గర్వంగా  చెప్పేసరికి ,  అత్తగారు  సందేహంగానూ, నేను ఆశ్చర్యంగానూ చూస్తూ నిలబడిపోయాం. ” అడ్డతీగలండీ…అమ్మాబాబూ లేరంటండీ పాపం . అడివిలో పురుగూ పుట్టా మధ్య  బతకటం సేనా కట్టంగా  వుందనీ, మనూర్లకేసి వచ్చేసి ఏదో పనిసేసుకు బతుకు దారని పాపం ఒకటే గోలండి. ఆడకూతుర్ని అడవిలో వదిలేలేక ఎమ్మట ఎట్టుకొచ్చేసేనండీ  ” అంటూ వట్రంగా ఒక్కోమూడీ విప్పేసరికి,  చెప్పొద్దూ..  మా అత్తగాకీ నాకూ ఫ్యూసులు ఎగిరిపోయాయి.

వెనకటికి ఇలాగే … మారేడుమిల్లి అడవుల్లో దొరికిందని  దెబ్బతిన్న నెమలి  పిల్లని  ఒకదాన్ని చంకన పెట్టుకొచ్చాడు . మురిసిపోయిన మాంగారు అబ్బులుగాడికి ఒకబుట్ట పుగాకు బహుమానంగా ఇచ్చేసి, దాని పెంపకం బాధ్యత కూడా వాడికే అప్పచెప్పారు . వాడేమో మిగతా పనులన్నీ వదిలేసి, దాన్నే  కనిపెట్టుకుని కూర్చునేవాడు  . అది మకాంలోని   గిన్నీకోళ్ళు, డింకీకోళ్ళు, టర్కీ కోళ్ళు వంటి , పెంపుడు జాతులతో కలవలేక పోయేసరికి  ఇంటిపెరట్లో   దాని పెంపకానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసారు . తనపెంపకంలో చక్కని ఈకలు తొడిగి దినదినప్రవర్ధమానమవుతున్న ఆ నెమలి ని చూసి తెగ పొంగిపోయేవాడు అబ్బులు .దాంతో ఉత్సాహం తీరక  నలుగురి కంటా పడకుండా మా ఇంటి ప్రహారీ మధ్య తన హయాంలో గుట్టుగా  పెరుగుతున్న ఆ నెమలి వయ్యారాలని ఊరందరికీ వర్ణించి చెప్పుకోవడం మొదలుపెట్టాడు . ఆ కబుర్లు ఆనోటా ఈనోటా పాక్కుంటూ ఎక్కడో టౌను  స్టేషన్ లో నిద్రపోతున్న ఎస్సై చెవుల్లో పడిపోయాయి .” కేసవుతుందండీ రాజుగారు ”   అని ఆ పోలీసు బాబు ఒళ్ళువిరుచుకుంటూ వచ్చి పడేసరికి   , “ అమ్మమ్మా..అంతపనిచెయ్యకండి  ఏదో తెలీక ..” అంటూ బాబుని బుజ్జగించి  అబ్బులు చేతుల్లో అల్లారుముద్దుగా  పెరుగుతున్న ఆ నెమలిని దాని  పుట్టింట్లో  వదిలిరావడానికి  అప్పటికప్పుడు చిన్నకారు కట్టించుకుని అడవులకి దౌడుతీయాల్సి వచ్చింది మాంగారు .

“ఏటేస్ … నాటుకోడిని నీటుగా  నవిలేత్తే  కేసవ్వదుకానీ, నెమలికోడిని గారంగా పెంచుకుంటుంటే కేసేసేత్తారా ” అంటూ ఓనాడెప్పుడో   లోగిట్లో కోడిపులావ్ లొట్టలేసుకుంటూ తినెళ్ళిన ఆ ఎస్సైమీదకి తూగుతూ తగూకి  కి వెళ్ళబోయిన  అబ్బుల్ని ”  ఓరిబాబూ ఊరుకోరా … గవర్నమెంటోడి రూలంటే రూలే ..ఆడికంటే మనకెక్కువ తెలుసేటీ  . అదీగాపోయినా నువ్వు ఎన్నముద్దలెట్టి ఎన్నాళ్ళు  పెంచినా అది ఏదో ఓనాడు   జతకోసం అడివిలోకి ఎల్లిపోయీదే . ఆ మాత్రం దానికి ఓ ఇదయిపోటవెందుకూ ”  అని నచ్చచెప్పటానికి నానా కష్టాలు పడ్డాడు చేలో మకాం ఉండే కన్నప్పడు .   తన గారాలపట్టి ని తలుచుకుని తలుచుకుని కొన్నాళ్ళు బెంగపడ్డ  అబ్బులు , ఎంత దూరాన్ని వదిలేసినా అది తనని వెతుక్కుంటూ ఎగిరొచ్చేస్తుంద న్న  భ్రమలో  మరి కొన్నాళ్ళు గడిపేసాడు.. అదెక్కడున్నా సుఖంగా ఉండాలని గాల్లో దణ్ణాలు పెడుతూ   చాన్నాళ్ళకి ఆ సoగతి మర్చిపోగలిగాడు .

పుణ్యానికి పోతే పాపం ఎదురయ్యిందన్న సామెత అబ్బులు విషయంలో చాలా సార్లు రుజువయ్యింది. నేలన పోయేదాన్ని నెత్త్తికి రుద్దుకోవడంలో కూడా వీడు సిద్దహస్తుడు.

ఒకసారి మేం చూస్తుండగానే   ఇంటి చూరునించీ జారి నీళ్ళగోళెంలో పడిన ఎర్రతేలు మునగాలో తేలాలో తేల్చుకోలేక అవస్థ పడుతుంది  .   అత్తగారూ నేనూ గోళెం చూట్టూ  ప్రదక్షిణ చేస్తూ  ఎవడి చెప్పుకిందో పడి చావకుండా నీళ్ళలో ములిగి ఉత్తమ మరణం పొందబోతున్న ఆ పుణ్యాత్మురాలయిన తేలుకు పుణ్యలోకాలు ప్రాప్తించాలని ప్రార్ధిస్తుంటే అటుగా వచ్చిన అబ్బులు ” అదేం పనండి అయ్యగారు ” అంటూ ఉత్తిపుణ్యానికే మమ్మల్ని  కోప్పడ్డాడు    . అక్కడికి  మేవేదో  దాని తోక పట్టుకుని నీళ్ళలో తోసేసినట్టు  .

“ అంతగా అయితే పైకి తీసి ఒక్కదెబ్బెయ్యాలిగానండీ  అలా పేణాలకోసం గిలగిలా కొట్టుకుంటుంటే సూత్తా ఊరుకో కూడదంటండీ…సేనా పాపవంట మా తాత సెప్పీవోడు”  అంటూ  తాతోపనిషత్ తిరగేసాడు. అక్కడే వున్న పుల్లని నీళ్ళలోకి జారవిడిచి వస్తాదులా నిలబడ్డాడు .” ఏడ్చావులే రా ! నీ దారిన నువ్వుఫో … దాని చావు అది చస్తుంది” అన్న అయ్యగారోపనిషత్  వాడి చెవికి చేరేలోగానే    , పుల్లమీంచీ మేం ఊహించని స్పీడులో పైకి  పాక్కుంటూ  వచ్చిన ఎర్రతేలు అదే స్పీడులో అబ్బులుగాడి చేతిమీదికి  చేరిపోయి  తన ప్రాణాలకు పుల్ల అడ్డేసిన  పెద్దమనిషన్న కనికరం అయినా లేకుండా తోకతో టపీ టపీమని కొట్టేసింది .  ఇంకేవుంది  .. చెయ్యి గాల్లో గింగిరాలు తిప్పేస్తూ  లబోదిబోమంటూ తేలుమంత్రం వేయించుకోడానికి   పరిగెత్తాడా    ఆపద్భాంధవుడు   .

ఆపదలోవున్నవారిని  అక్కున చేర్చుకోవాలని తహతహలాడిపోతుంటాడు పిచ్చి సన్నాసి   . అవతల ఉన్నది  మనిషయినా ,మానయినా –పురుగయినా, పిల్లయినా వాడికొక్కటే .

మరి అలాగే కదా , చెరుకు లోడుతో చెల్లూరు వెళ్ళినవాడు అక్కడా ఆపధ్భాంధవుడి అవతారం ఎత్తి అడకత్తెరలో పడ్డాడు . ఇప్పటికీ నలుగుతూనేవున్నాడు   .

అమ్మానాన్నా, అత్తామావా అందరూ  ఎంతగా  బతిమాలుతున్నా వినకుండా నక్కబావని నేను చేసుకోనంటే చేసుకోను అని మంకుపట్టుతో పంటకాలవలో దూకేసిన సత్యవతిని అటుగా వెళుతున్న అబ్బులు పైకి లాగి నీళ్ళు కక్కించాడట . కళ్ళుతెరిచిన ఆ పిల్ల  అబ్బులుని  పరీక్షగా చూసి , నా  వంటిమీద చెయ్యేసిన నువ్వే  నన్ను ఏలుకోవాల్సిన జగదేకవీరుడివి అంటూ వెంటపడిందట సతీ సత్యవతిలా  .    ‘ నాకు పెళ్ళయిపోయింది పిల్లో ‘ అని వాడు మొత్తుకుంటున్నా వినకుండా  వీడు చెరుకు లోడుతో వెళ్ళేసరికల్లా   షుగరు ఫేక్టరీ గేటు దగ్గరే ఎదుపడి వగలుపోయేదట    .  ఒకసారి,  శారదా వాణిశ్రీల మధ్య విలాసంగా నిలబడ్డ శోభన్ బాబు వాల్ పోస్టరు చూపించి , నువ్వాపాటి చెయ్యవా నీకేం తక్కువా అని ఎగేసిందట . అప్పటికీ వీడు చిక్కకపోయేసరికి ,   ఒక సుభలగ్నాన  వాళ్ళూరు పుంతరోడ్డులో సత్తెమ్మ తల్లి గుడిదగ్గర కాపుకాసి, ఈరోజుతో తాడో పేడో తేలిపోవాల్సిందే నుంచున్నపళంగా నా మెళ్ళో తాళికడతావా లేకపోతే , మా నక్కబావని  పెళ్ళిచేసుకుని ఈ రాత్రికే చచ్చిపోమంటావా అని నిలేసేసిందట , ఆపిల్ల మంకుపట్టుకి  అంతటి మొగోడు  కళ్ళనీళ్ళుపెట్టేసుకుని , ఏవయితే అదే అయిందని తలొంచుకుని సత్యవతి మెళ్ళో మూడుముళ్ళూ వేసేసాడట.

ఇంత జరిగాకా ఆ పిల్ల అమ్మానాన్నా  ఏడ్చి ఏడ్చి మొఖం కడుక్కుని  అబ్బులుని ఇంటికి పిలుచుకెళ్ళి ,   మా పిల్లనొదిలేసి మేం వుండలేం   మాకున్న అరెకరం పొలం, మేం వుంటున్న ఈ డాబా ఇల్లూ మా పిల్లవే అంటే ఇకనుంచీ  మీవే . మీ ఇబ్బంది మాకు తెలుసనుకోండి  అయినా   వీలు చిక్కినప్పుడలా  వచ్చిపోతుండండి అల్లుడుగారు అనేసారట .

అబ్బులు చేసిన ఈ ఘనకార్యం ముందు చెల్లూరులోనూ  ఆనక మా ఊర్లోనూ షికారు చేసి చివరికెప్పటికో అబ్బులు పెళ్ళానికి చేరింది . ముందు మొగుడనే  మమకారం లేకుండా  చితక్కొట్టేసినా  …ఆనక అరెకరం పొలం -డాబా ఇల్లు సంగతీ తెలిసి ” సర్లే ….ఏదో సామెత చెప్పినట్టూ పుణ్యానికి పోతే పాపం ఎదురయ్యింది . ఆడది అంతకి తెగించాకా ఆయన మాత్రం ఏం చేత్తాడు . రాముడు దేవుడు కనకా  శూర్పణకకి చిక్కకుండా తప్పించుకోగలిగేడు . మా అబ్బులు మాయ పాపం అమాయకుడు దొరికిపోయేడు . ఇకనుంచీ నేనెంతో ఆవిడా అంతే  ” అని సర్దేసుకుందట.  అలా అని   మొగుణ్ని  ముక్క బద్దా కింద  పంచేసుకోలేరు కదా ! అందుకే ఇద్దరూ గొడవ పడకుండా ఒక పద్ధతి ప్రకారం పోతూ   అబ్బులుని ఇక్కడ ఈవిడ  ఉతికి  ఆరేస్తే , అక్కడ ఆవిడ మడతేసి ఇస్త్రీ చేస్తుందనీ  జనం నవ్వుకుంటారు .   అబ్బులు మాత్రం అసలేం జరగనట్టూ ఎక్కడవక్కడే మర్చిపోయి  తన మానాన తను న్యాయమనుకున్న పనులు  చేసుకుపోతుంటాడు .

ఇక ఈ పిట్టకథలు , పీత కథలు పక్కనపెట్టి అసలు కథకొస్తే   ….. అబ్బులు చేసుకొచ్చిన ఘనకార్యానికి అయోమయంలో పడిపోయిన అత్తగారు అప్పటినుంచీ అదే పాట పాడుతున్నారు. బాగాచెప్పారు అంటూ నేను అలవాటుగా అత్తగారి వెనక నిలబడి  తాళం వేస్తున్నాను.

” నీకు బుర్రా బుద్ధీ లేదటరా…. ఇదేం చోద్యం రా . అడవిలో దొరికిందని  లేడి పిల్లని తెచ్చినట్టూ  ఆడపిల్లని తీసుకొచ్చేస్తావా ! ఇదేం అఘాయిత్యపు పనిరా ….ఆలోచనుండొద్దూ  !!

” అదికాదండి అయ్యగారూ …” అని తలొంచుకుని నీళ్ళు నములుతూ అబ్బులు, ఆ పక్కనే అదురూ బెదురూ లేకుండా నిట్రాటలా నిలబడి పరిసరాలు పరిశీలిస్తూ ఆ పిల్ల .

ఏగేసి మోకాళ్ళ కిందికి కట్టిన  ముదురాకుపచ్చ రంగు చీరలో బోసిమెడతో ఉన్న తలుపులమ్మ అడ్డూ ఆపూ లేకుండా తన ఇష్టానికి పెరిగిన అడవిమల్లెతీగలా సన్నగా బలంగా  వుంది . మెడలో పసుపుతాడులాంటిదేదీ కనిపించక పోవడంతో మేం కొంచెం ఊపిరి పీల్చుకున్నాం .

” అదేపోన్లెండి  …మీకు నచ్చాపోతే  రేపొద్దుగాలే  ఆ అడివిలో దిగబెట్టేసొత్తాను . మాపిటికి ఇక్కడే మీ లోగిట్లోనే ఉండనీయండి . సాకిరీ సెయ్యలేక సీపురు పుల్లలా అయిపోయేరు గదా సిన్నయ్యగారు, చేతికింద సాయానికో మడిసుంటే ఆరికీ మీకూ కుంత కులాసాగా వుంటదని అలోచించేనండీ . మీరు వొద్దంటే ..నాకేం పట్టిందిలెండి “ అని   అబ్బులు నిష్టూరంగా అంటుంటే,  అన్నంత పనీ చేసేయడు కదా అన్నట్టు అబ్బులుకేసి దిగులు చూపులు చూస్తుంది తలుపులమ్మ . ‘ మా నాయనే ..నా కష్ట సుఖాల గురించి నీకెంత అక్కరరా ‘ అని  నా మనసు సంతోషంతో గంతులేసింది .

అత్తగారు మాత్రం అబ్బులు మాటకి “ హవ్వ… “ అంటూ బుగ్గలు నొక్కుకుంటూ  వాడ్ని పక్కకి పిలిచి, “  నీ తెలివి తెలారినట్టేవుంది . ఇలా ముక్కూ మొహం తెలీని వాళ్ళని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే ఇంకేవన్నా ఉందట్రా   ! ఆ పిల్ల చూపూ వాలకం చూస్తే  పని తెలిసినదానిలా వుందా ? అసలే అడవుల్లోంచీ వచ్చింది అక్కడెవరితో ఏం సంబధాలున్నాయో ….ఈ సంగతి రాజుగారికి తెలిస్తే చీల్చి ఎండేస్తార్రోయ్  “ అంటూ  పళ్ళు నూరేసరికి   బెకబెకమంటూ నవ్వేసిన అబ్బులు , “ అబ్బే మీరూరికే అనుమానపడతనారండీ… ఆయమ్మి అలాటిది కాదండీ పాపం.  సేనా మంచిదండీ”  అంటూ వాదించబోయాడు . అప్పటికే విసిగిపోయి ఉన్న అత్తగారు ‘ ఠాట్ ‘ అంటూ కళ్ళెర్రజేసి గద్దించేసరికి కొంచెం బెదిరినట్టూ  వెనక్కి తగ్గి,  “ అయ్ బాబూ  అలాకోప్పడతారేటండీ…అలాగే అంపిచ్చేద్దారిలెండి “ అంటూ దారికొచ్చాడు .

ఆ మాటతో  సమాధానపడ్డ  అత్తగారు ” అలాగే  అఘోరించు . పొద్దున్నే రా ఫో “అ ని అబ్బుల్ని కేకలేసేసరికి వాడు కాల్లో ముల్లు  దిగబడ్డవాడిలా  బాధపడుతూ ఒక్కో అడుగూ అతికష్టం మీద వేసుకుంటూ వెనక్కి చూసుకుంటూ  వెళ్ళిపోయాడు. పోతూ పోతూ ” పొద్దుగాలెప్పుడో తిన్నాది. పాపం ఆకలేత్తది కదండీ . మీరు తిన్నాకా కుంత ఒణ్ణం ఎట్టండి  ” అంటూ పరమాయించి పోయాడు.

తలుపులమ్మ  అన్నంతిని ఆకు పారేసొచ్చాకా  తుంగచాపా దుప్పటీ ఇచ్చి పడుకోటానికి చోటు చూపించారు అత్తగారు  .” ఈ రాత్రి మనకెలాగూ జాగారం తప్పదు అనుకుంటూ అత్తగారూ నేనూ  సావిట్లోనే  కూలబడ్డాం .  మేం నిద్రపోతే ఆ అపరిచితురాలు ఎక్కడ కొంప తవ్వుకుపోతుందో అన్నంత ఇదిగా రెప్పవేయకుండా జాగ్రత్తగా వుండాలనుకుంటూ ” ఇదిగో వెనకటిలాగే…” అని ఎక్కడెక్కడి పాత కథలో తవ్వుకుంటూనే  ఆవులింతలతో   ఒకరిమీద ఒకరు వాలిపోయాం .

ఎండ మొఖం మీద పడటంతో మెలకువొచ్చిన మాకు నారింజరంగు చీరలోకి మారిపోయిన తలుపులమ్మ గుమ్మంలో ముగ్గేస్తూ కనిపించింది . వాకిట్లో పొయ్యిమీద నీళ్ళు కాగుతున్నాయ్ .  నవ్వుతూ వచ్చిన తలుపులమ్మ  గోళేల్లోకి  నీళ్ళు తోడేసిన సంగతి,  మంచినీళ్ళబిందెలూ, పాలతెపాళాలూ తోమేసి బోర్లించిన  సంగతీ చెప్పి ఇంకేవన్నా పనుంటే చెప్పండి అనేసరికి మేం  తెల్లమొఖాలేసుకు  నిలబడిపోయాం .

పొద్దున్నే వస్తానన్న అబ్బులు  మధ్యాహ్నవయినా అజాపజాలేడు. చూసినవాళ్ళు ఎవరూ ఏవిటీ అని ఆరాలు తీస్తారనే భయంతో అత్తగారు తలుపులమ్మని పెరడు దాటి రావద్దని  ఆజ్ఞాపించేసారు  . మoచినీళ్ళు దగ్గరినుంచీ అన్నీ కాళ్ళదగ్గరికే అందిస్తూ మాంగారు, మా రాజుగారు కూడా సావిడి దాటి వంటింటివైపు రాకుండా చూసుకుంటున్నాం.

చూస్తుండగానే సాయంత్రవయిపోయింది . ఆ పనీ ఈపనీ అని లేకుండా అన్ని పనులూ మా చేతుల్లోంచి చనువుగా లాక్కుని మరీ చేసేస్తుంది తలుపులమ్మ.  మాంగారు రాత్రి భోజనానికి కూర్చున్నప్పుడు , అత్తగారు అబ్బులు గురించి ఆరా తీస్తే  ” మన్యం వెళ్ళొచ్చాడు కదా ! నీళ్ళు తేడా చేసాయేమో ..రెండు రోజులు రాలేనని కబురంపేడు “అన్నారట  . రెండ్రోజులే …..అని తలపట్టుకు కూర్చున్నారు అత్తగారు.

అంతోటి అత్తగారే అలా అయిపోయేసరికి ఏం చేయాలో తెలీక కంగారుపడిపోయాన్నేను . ఇదేం పట్టని తలుపులమ్మ  రాములవారి గుళ్ళోంచీ మైకులో వినిపిస్తున్న మూగమనసులు సినిమాలోని ”  గోదారి గట్టుందీ… ..” అన్న పాటని   తలాడిస్తూ వింటుంది .

ఆ మర్నాడు కూడా కోడికన్నా ముందులేచి అంతే హుషారుగా పనులన్నీ చేసేసి  అత్తగారిని ఆశ్చర్యపరిచేసింది తలుపులమ్మ.

ఎంత పెట్టినా ఎప్పుడూ మొఖం మొటమొటలాడించుకుని గిన్నెలూ గిరాటేసే  నరసమ్మకీ , చలాగ్గా చేతిలో పని అందుకుని చేసేస్తున్న ఈ మనిషికీ  నక్కకీ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది కదే అన్నారు అత్తగారు .

అవునంటూ తలాడించాను .

మెతుకు చూస్తే అన్నం పదును తెలిసిపోదూ , ఈ రెండ్రోల్లోనీ  పిల్ల పద్ధతి తెలిసిపోయింది కదా , మనకీ చేదోడుగా వుంటుంది పోనీ ఉండనిద్దామా అన్నారు . మనిషి మొరటే అనుకో అయినా  పోగా పోగా తీరిక అదేవస్తుందిలే అన్నారు మళ్ళీ ఆవిడే . అదీ నిజమేలెండి అన్నాను .

ఆ సాయంత్రం “ పెరట్లో ఆ మనిషెవరూ కొత్తగావుందీ ?” అనడిగిన మాంగారితో  .  ఇంటిపనిలో చేతిసాయానికి పెట్టుకున్నాం ఇక ఇక్కడే వుంటుంది అని డిక్లేర్ చేసేసారు అత్తగారు  . వీధిలో రాజకీయాలకే రోజు చాలటంలేదు పెరటి రాజకీయాలు మనకెందుకనుకున్నారో ఏమో  వివరాలజోలికి పోకుండా ” ఓహో ” అనేసి ఊరుకున్నారు మాంగారు .

మూడోనాడు పొద్దున్నే ఈనులాగేసిన కొబ్బరాకులా వాలిపోతూ వాకిట్లో నిలబడ్డ అబ్బులు “అయ్యగారూ  సత్తెపెమాణకంగా పేణం బాగోక రాలేకపోయేనండీ … నిజవండీ బాబూ , ఒట్టండీ బాబూ ”   అంటూ పెద్దయ్యగారిని  ప్రసన్నం చేసుకోటానికి  తలమీద చేతులేసుకుని  తెగ ప్రయాస పడి పోతున్నాడు .

చేటలో బియ్యం పోసుకొచ్చిన తలుపులమ్మని ” ఒలే…నీ సంచొట్టుకొచ్చీ . అయ్యగారొద్దన్నాకా నువ్వో చనం కూడా ఉండటానికి ఈల్లేదు ” అంటూ వాడు  తొందర చేస్తుంటే ….”అయిందేదో అయిందిలే , ఇక్కడే వుండనీ “ అని అత్తగారు ప్రసన్నవదనంతో అభయం ఇచ్చేసరికి అంత నీరసంలోనూ అబ్బులు ఆనందతాండవం చేయబోయాడు .

అత్తగారు వాడి ఆత్రానికి పగ్గాలు బిగిస్తూ ” ఇక తలుపులమ్మ ఆలనా పాలనా మేం చూసుకుంటాం కాబట్టి, నువ్వు దాని ఇరుపంచాలా  కనిపించకూడదు. మేం లేనప్పుడు నీళ్ళనీ, నిప్పులనీ పెరట్లోకి  వెళ్ళి పలకరించకూడదు  . పనున్నాసరే నువ్వుదాని దరిదాపుల్లో మసలకూడదు ..మళ్ళీ లేనిపోని తంటసా  అంటూ ముచ్చటగా  పెట్టిన మూడు షరతులకే  మూర్చొచ్చినంత  పనయింది అబ్బులుకి . అయినా తమాయించుకుని ఉస్సూరంటూ ఓ చూపు చూసి    ” అలాగేలెండి ఏదో మీనీడన   ఆయమ్మి సల్లగా వుంటే  నాకంతే సాలు “అంటూ  ప్రేమ కథల్లో  నాగేస్సర్రావులా భుజమ్మీద  తువ్వాలు  జారిపోతున్నా పట్టించుకోకుండా తూగుతూ వెళ్ళిపోయాడు.

అబ్బులు వెళ్ళాకా తలుపులన్నీ బిగించి,  ఆ అడవిమల్లికి  కొన్ని సుగంధాలు  అద్దే ప్రయత్నంలో పడ్డారు  అత్తగారు  .

ఆప్రకారం ….  అత్తగారి అనుమతిలేకుండా వీధి గుమ్మం దాటకూడదనీ,ఊరికే గోడలెక్కీ గుమ్మాలెక్కీ వీధిలోకి చూడకూడదనీ , ఏదయినా పనిమీద ఎవరింటికయినా పంపిస్తే ఆ పని  చప్పున చక్కబెట్టుకు వచ్చేయాలి కానీ    అక్కడే కబుర్లు చెపుతూ కూర్చోకూడదనీ, అలా చేస్తే అవతలివాళ్ళు మాటల్లో పెట్టేసి మన ఇంటిగుట్టంతా లాగేస్తారనీ , ఎవరిగగ్గరా ఏదీ ఊరికే పుచ్చుకోకూడదనీ, ఇంట్లో మగాళ్ళుండగా వంచిన తలెత్తకుండా పనులు చేసుకోవాలి తప్ప, వచ్చేదెవరూ పోయేదెవరూ అని ఊరికే ఆరాలు తీయకూడదనీ , ఇంకా అదనీ, ఇదనీ ….పెద్ద పురాణమే చదివేసారు .  అవన్నీ విన్న తలుపులమ్మ అర్ధం అయీ కానట్టు అయోమయంగా  తలాడించినా నాకు మాత్రం    చుట్టూ కారుచీకట్లు కమ్ముకున్నట్టూ అనిపించి పైకి చూస్తే ఆకాశంలో కూడా గోడలు కనిపించాయి . సరిగ్గా అప్పుడే మా పొట్టి బ్రహ్మం ” చీకటిలో కారుచీకటిలో….” అన్న విషాద గీతానికి తనపొట్టి సన్నాయిమీద ట్యూన్స్ కట్టుకుంటున్నాడు. పాపం వాడి పెళ్ళం మళ్ళీ వాడ్ని కొట్టేసి పుట్టింటికెళ్ళిపోయినట్టుంది అనుకొని కాస్త విషాదంగా నవ్వుకున్నాను .

వచ్చిన నెలలో ఉన్న హుషారు తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టి  వాడిన  సన్నజాజి తీగలా వేలాడుతూ  తిరుగుతుంది తలుపులమ్మ .  ఇంకో పదిరోజులు గడిచేసరికి వంకర ముగ్గులు వేస్తూ , నూతిలో బకెటుకి బదులు తాడు వదిలేస్తూ పరధ్యానంలో పడింది. అబ్బులు గోడమించీ అందించిన గోలీ షోడాలు దాచినంత సులభంగా వాడందించిన సంపెంగలు, మొగలిరేకులూ మా కంట పడకుండా దాచలేక అవస్థ  పడుతుంది  .  పక్కూళ్ళో తీర్థానికి వెళ్ళాలని ఉబలాటపడి అయ్యగారి పర్మిషన్ దొరకక ఢీలా పడింది.  గోరింటాకు కోసుకురావటానికి  కరణంగారి తోటవరకూ  వెళ్ళొచ్చినరోజు మాత్రం కాస్త హుషారుగా కనపడింది . అటకమీద ఆవకాయ జాడీలు దించడానికి , చెట్టుమీంచీ కొబ్బరి గెలలు దించడానికీ , అబ్బులుగాడు వచ్చిపోయినప్పుడు దిగులుగా వాడెళ్ళినవేపు చూస్తూ వుండిపోయింది .  చుట్టూవున్న నాలుగు గోడల్నీ చూసినట్టే , రోజూ  కనపడే మా నాలుగు ముఖాల్నీ ఏభావం లేకుండా చూస్తుంది . కొత్తమనుషులెవరన్నా వస్తే వదలకుండా వాళ్ళనే అంటిపెట్టుకు తిరుగుతుంది . బయటినుంచి వినిపించే ప్రతీ మాటనీ , మైకులో వినవచ్చే ప్రతీ పాటనీ ఒళ్ళంతా చెవులుచేసుకు వింటుంది .

ఒక మిట్ట  మద్యాహ్నం  మండువా గుమ్మంలో  తీరిగ్గా కూర్చునున్నప్పుడు  …..” తలుపులొచ్చి మూడ్నెలు అయింది కదే “ అన్నారు అత్తగారు .  పత్తిలో గింజలు తీస్తూ …

అయ్యేవుంటుందిలెండి అన్నాను  నేను ,   పంచదారతో వచ్చిన పొట్లాల కాగితం విప్పుతూ….

“ ఆ అడవిలో ఏం తినేదో ఏంటో….మనతోపాటు శుబ్రమయిన తిండి తింటుందికదా  మనిషి  ఒల్లుచేసింది.  కానీ , మొఖంలో కళపోయి పాండురోగం వచ్చినదాన్లా రోజురోజుకీ అలా  అయిపోతుందేంటో !“ అన్నారు అత్తగారు .

అలా అడిగితే నాకు మాత్రం ఏం తెలుసు …వాళ్ళూరు మీద బెంగ పెట్టుకుందేమో అని అప్పటికి తోచిందేదో చెప్పేసాను

ఇంకా నయం అక్కడెవరూ లేరనేగా ఇక్కడికొచ్చింది . అయినా మనం బానే చూస్తున్నాం కదా !   బట్ల భాస్కర్రావు దగ్గర దానికి నచ్చిన రంగు చీర తీయించి ఇచ్చామా . మనముందు బోడి బొంగరంలా తిరుగుతుంటే చూళ్ళేక రామిండ్రీనించీ గాజులూ పూసలూ తెప్పించి వేసామా . నెలక్రితం ద్వాదసి దీపాలు  వదలడానికెళుతూ మనతో పాటూ దాన్నీ  పుష్కరాలరేవుకు  తీసుకెళ్ళాం కదా ….అంటూ  చిన్న స్వరంతో చిట్టా విప్పుతున్న అత్తగారు

దూరంగా వాకిట్లో పందిరి రాటకు ఆనుకుని  ఆకాశంలోకి చూస్తూన్న తలుపులమ్మని  చూపించి  …దీని వాలకం చూస్తుంటే నాకు భయంగా వుందేవ్ ” వెర్రి మాలోకంలా అలా శూన్యంలోకి చూస్తుందేవిటే ”  అని గాభరాగా అంటూ గింజలు పళ్ళెంలోనూ, పత్తి నేలమీదికీ గిరాటేస్తున్నారు  .

ఇవతలున్న సగం జోకూ చదివేసి, నవ్వురాక పొట్లంలో చిక్కుకున్న పూర్తి జోకు చదవాలనే  కుతూహలంతో   కాగితం మడతల్ని జాగ్రత్తగా విప్పుకుంటున్నదాన్నల్లా  “ ఆకాశంలో అడ్డు  గోడలుండవుకదండీ  ! అందుకే  అందినంతమేరా అలా చూస్తూ పోతుందేమో !” అనేద్దామనుకుని  …..అసలే అత్తగారు ఒకింత గాభరాగా వున్నారుకదా  ఇంకా కంగారుపెట్టడం భావ్యం కాదనిపించి  , నా కవి హృదయాన్ని తొక్కిపట్టి   ” ఏమోనండీ నాకెలాతెలుస్తుందీ  ”  అని అప్పటికి తప్పించుకున్నాను .

పండుగ నెల . సీతాకాలం పొద్దు ,  భోగి పిడకలకి ఆవుపేడ తెస్తానని మధ్యాహ్నం వెళ్ళిన తలుపులమ్మ   దీపాలవేళయినా  ఇల్లుచేరలేదేవిటని అత్తగారు హైరానా పడుతున్నారు . “అదేం చిన్నపిల్లా తప్పిపోటానికీ …రావాలంటే  తనే వస్తుంది . ఓ..ఇదయిపోతారెందుకూ” అని మాంగారు కేకలేస్తున్నారు .  అంతలో,  ఆ మధ్య ఇంటికి సున్నాలేయటానికొచ్చిన జట్టులో సూరిబాబనే వోడు , పడుతూ లేస్తూ  వచ్చి ఈ కబురు చెప్పేడు  .

మధాహ్నమే  తలుపులమ్మ  గోకారం రోడ్డులో ఉల్లిపాయల సూరిబాబు ఒంటెద్దుబండిమీద వెళ్ళటం చూసేనని .  ఎక్కడికని అడిగితే కోపంగా చూసిందట   . మళ్ళీ ఎప్పుడొస్తావ్ అంటే  ” మళ్ళీనా ! సత్తేరాను …ఆ కొంపలో నాకు గాలాడతాలేదు ” అందట . “ఎందుకన్నా మంచిది ఓపాలి సూసుకోండి రాజుగారూ ఏవన్నా అట్టుకుపోయిందేమో”  అని మాకంటే ఎక్కువ కంగారు పడిపోయాడు  .

ఇలా తెల్లారిందో లేదో అలా ఊళ్ళో జనం ఒకళ్ళనొకళ్ళు తొక్కుకుంటూ తోసుకుంటూ పరామర్శకి వచ్చేసారు .

అమ్మో  అలా జరిగిందా అని ఆశ్చర్యపోయారు  . నమ్మి ఇన్నాళ్ళూ ఇంట్లో పెట్టుకుంటే ఒక్క మాటన్నా చెప్పకుండా చెక్కేసిందంటే ఎంత గుండెలు తీసిన బంటో చూడండి  అంటూ  ఆడిపోసుకున్నారు .   ఏవేం పట్టుకు పోయిందీ అని ఆరాలకి దిగారు .

ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయింది …పాపం ! పూచికపుల్లకూడా పట్టుకెళలేదు అని మేం చెపుతుంటే వినరే . అలా ఎలా జరుగుతుందీ  ఏ చెంబో గిన్నో అయినా ఎత్తేసుంటుంది సరిగా చూసుకోండి అంటూ  మాకు ఊపిరాడకుండా చేసేస్తుంటే , విసిగిపోయిన మేం ” ఏమో బాబూ  ఇక్కడయితే ఏం పోలేదు . అక్కడినుంచేవయినా కొల్లగొట్టుకుపోయిందేమో ఆరా తీయండి  “ అంటూ  మల్లెపందిరి  కింద చతికిలపడి విచారవదనంతో  గాల్లో దణ్ణాలు పెడుతున్న అబ్బులు మీదికి తోలేసాం . వాడ్ని పట్టుకుని  కావల్సిన కథలేవో వాళ్ళే దులుపుకుంటారని .

తలుపులమ్మ తలపుల్లోంచీ అబ్బులు తొందరగానే బయటపడ్డా “  ఆ కొంపలో గాలడతాలేదు ” అని  ఆ అడవిమల్లి అనేసి పోయిన మాటని మాత్రం అత్తగారు మర్చిపోలేక పోతున్నారు .

“ అంత మాటందా ! మరీ విడ్డూరం కాకపొతే . ఇవే కొంపల్లో మనం తరాల తరబడి బ్రతికేయడంలేదూ”  అన్నారు   అమాయకంగా .

“ దట్టమయిన అడవుల్లో మొలిచే కొన్ని మొక్కలు ఎండని వెతుక్కుంటూ పెరుగుతూ పోతాయట .  మరికొన్ని   మొక్కలకి ఆట్టే గాలీ వెలుతురూ అక్కరలేదట . వాటిని ఇళ్ళలో ఉంచేసినా  కిటికీలోంచి పడే చిన్నపాటి ఎండతోనే అవి చక్కగా జీవించడానికి అలవాటు పడిపోతాయట   . వాటినే ఇండోర్ ప్లాంట్స్ అంటారట”  . అని నేను అన్నదాతలో వచ్చిన వ్యాసాన్ని పైకి చదివి వినిపించబోతే , నే అడిగేదానికీ నువ్వు చెప్పేదానికీ ఏవన్నా సంబంధం వుందా  …” అయ్యోరాత  ! ఇంత  అయోమయం ఏవిటే !” అని విసుక్కుంటున్న అత్తగారికి విడమర్చి చెప్పటం నావల్లకాదు బాబు .

–దాట్ల లలిత

వాన రాత్రిలో…చీకటి దారిలో…మిగిలిపోయిన పాట…మన్నాడే!

Mannadey

 

మన్నా డే, తొంభై నాలుగేళ్ల పాటు ఒక పరిపూర్ణమైన జీవన యాత్రను కొనసాగించి ఇహలోకాన్ని వదలి వెళ్లి ఒక నెల  పైనే కావస్తోంది. “నాస్తి ఏషాం యశః కాయే, జరామరణజం భయం”, అన్న భర్త్రుహరి సుభాషితం, ఆయన నిష్క్రమణ వార్త వినంగానే, ఒక్క సారి కళ్ళ ముందు మెదిలింది.  భువనచంద్ర గారు ఆయనకి అశ్రునివాళిని ఈ పత్రికలోనే తమ వ్యాసంలో కొద్ది వారాల క్రిత్రమే ఎంతో హృద్యంగా అర్పించారు. దాదాపు అరవై ఏళ్ళ పాటు జరిగిన ఆయన  సంగీత ప్రస్థానంలో ఎన్నో తరాల వాళ్ళు వివిధ దశల్లో ఆయనతో పాటు చేరి ఆ గంగలో అలా పరవశంతో తేలుతూనే ఉన్నారు. నాకు తెలిసిన నా మన్నాడే ని మీతో పంచుకొని ఆయన జీవితాన్నీ, సంగీతాన్నీ కూడా సెలబ్రేట్ చేసుకొందామనే ఈ చిన్ని సాహసం!

ఊహ తెలిసిన దగ్గరనుంచీ కిషోర్ పాటలంటే ప్రాణం. భాష తెలియని రోజుల్లో కూడా హిందీ పాటలను వినాలనిపించేలా చేసిన ఆయన గళమే నాకు మన్నాడేని పరిచయం చేసింది. “షోలే” సినిమాలో ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్లు ఒక వింత స్కూటర్ మీద వెళ్తూ రకరకాలుగా విన్యాసాలు చేస్తూ, “యే…దోస్తీ.. హమ్ నహీ తోడేంగే.. తోడేంగే దం మగర్ తేరా సాథ్ నా ఛోడేంగే” అంటూ వాళ్ళ స్నేహాన్ని మనకు పరిచయం చేస్తారు. హుషారైన కిషోర్ గొంతుతో ధర్మేంద్ర పాడుతూ ఉంటే, అంతే ఉత్సాహంతో అమితాబ్ కి పాడిన ఈ పాట ద్వారానే మన్నాడే పేరు, నాకు తెలిసింది.

మళ్ళీ అమితాబ్ సినిమా జంజీర్ వల్లే, మన్నాడే పాటతో పరిచయం మరికొంత పెరిగింది. అందులో అమితాబ్ పిచ్చ సీరియస్ గా మొహం పెట్టుకొని కూర్చొని ఉంటాడు. పఠాన్ ప్రాణ్, “తేరీ హసీ కీ కీమత్ క్యా హై? యే..బతాదే తూ” అంటూ ప్రశ్నిస్తూ, అమితాబ్ ని నవ్వించటానికి ప్రయత్నం చేస్తూ, “యారీ హై…ఈమాన్ మేరా..యార్ మేరీ జిందగీ” అని పాట పాడతాడు. కొద్దిగా హై పిచ్ లో ఉంటుంది ఆ పాట. అయినా కానీ, మెలోడీ, ఆ గొంతు లోని తియ్యదనం,  ఏ మాత్రం తగ్గకుండా పాడిన మన్నాడే గాత్ర మాధుర్యాన్ని, అతని అద్భుతమైన కళనీ గుర్తించే వయసు కాదది. ఆ పాట అమితాబ్ కోసం పాడిన ప్రాణ్ పాట, అంతే!

రిషీ కపూర్, డింపుల్ కపాడియాల, రోమియో, జూలియాట్ల కథ, రాజ్ కపూర్ “బాబీ” సినిమా. రిషీ, అందులో తన కాబోయే మామగారిని (జాక్ బ్రిగాంజా – ప్రేమ్ నాథ్), తమ ఇంటికి ఆహ్వానించటానికి వచ్చినప్పుడు, ఆత్మాభిమానమే తప్ప మరో ధనం లేని, జాక్, చేతిలో విస్కీ బాటిల్ తో, గోవన్ డాన్సర్ల నేపథ్యంలో, “నా చాహు సోనా చాందీ..నా చాహు హీరా మోతీ…యే మేరే కిస్ కామ్ కే?” అంటూ పాటందుకుంటాడు. అదీ, రిషీ పాట, జాక్ బ్రిగాంజా పాట, లేదా రాజ్ కపూర్ పాట, తెర వెనుక గాత్రం మన్నాడేది.

మరింత ఊహ తెలిసిన తరవాత చూసిన సినిమా “పడోసన్”. కిషోర్ కుమార్ పిచ్చి పీక్స్ లో ఉన్నది కూడా ఆ సమయంలోనే. శాస్త్రీయ సంగీత నేపథ్యం లేకుండా, జన్మతః అబ్బిన ఒక అద్భుతమైన టాలెంట్ గల సింగర్ గా, తన నిజజీవితానికి అతిదగ్గరగా ఉండే పాత్రను, కిషోర్ దా, ఈ సినిమాలో పోషిస్తాడు. “పక్కింటి అమ్మాయి”ని పడవేసే ప్రయత్నంలో సునీల్ దత్ ఉంటే, ఆ అమ్మాయిని తన శాస్తీయ సంగీత విద్వత్తుతో బుట్టలో వేసేసుకుందామనే ఒక తమిళ కమీడియన్ పాత్ర మెహమూద్ ది. సునీల్ దత్ కి పాట రాక పోయినా, కిషోర్ ప్లేబ్యాక్ వాయిస్ తో (లిటరల్ గా), మెహమూద్ తో పోటీకి దిగుతాడు. “ఎక్ చతుర్ నార్ కర్ కే సింగార్” అంటూ సుశాస్తీయంగా మెహమూద్ పాటందుకుంటే, “ఎక్ చతుర్ నార్ బడి హోషియార్” అంటూ కిషోర్ కొంటెగా సమాధానం ఇస్తూ, స్వరాల్ని ఎడా పెదా మార్చేస్తూ, ఆ పాట పోటీలో నెగ్గుతాడు. ఆ పోటీ లో ఓడిన గళం  మన్నాడే దే. ఆ సమయంలో కిషోర్ గెలిచినందుకు ఎంత సంబరపడిపోయానో! అదే పాటని కాలేజి సమయంలో పాడటానికి ప్రయత్నించినప్పుడు తెలిసొచ్చింది, మన్నాడే పాడింది ఎంత కష్టతరమో! ఇప్పటికి కూడా ఆ పాట వినంగానే గుర్తుకొచ్చేది, కిషోర్, మెహమూద్ లే! ఈ సన్నివేశం మొత్తం ఈ క్రింది లింకులో చూడండి, మొత్తం సినిమా చూసేసినట్లే!

మన్నాడే పాటలని చెప్పి, ఆయన్ని వదిలేసి, ఆ సినిమాల గురించీ, సినిమాలో పాటానుసారం పెదాలాడించిన నటుల గురించే ఎక్కువ మాట్లాడేశాను కదా! ఒక “సినీ ప్లే బ్యాక్” సింగర్ అంటే, అసలు సిసలు నిర్వచనం అదేనెమో! ఒక పాట విన్నప్పుడల్లా, అది పాడిన వారు కనుమరుగైపోయి, తెర మీద కనిపించిన వారే కళ్ళెదుట మెదిలితే, అది నిస్సందేహంగా ఆ గాయకుడి ప్రజ్ఞే! తన గొంతుని, తెర పైన కనపడే పాత్ర భావావేశ ప్రకటన చేసే పాటకి  పూర్తిగా అంకితం చేసేసి, తాను కనుమరుగైపోవటం ఒక అత్యుత్తమ స్థాయికి చేరుకొన్న కళకు చిహ్నమేమో కూడా!

నిజానికి, రఫీ, కిషోర్, ముఖేష్, లతా, ఆషా లాంటి మహామహులందరి కంటే వయస్సులో, అనుభవంలో కూడా పెద్దవాడు, మన్నాడే. అందరి కంటే ముందర రంగప్రవేశం చేశారు కూడా. కానీ వాళ్ళ పాటలన్నీ వాళ్ళ పాటల్లానే ఈనాటికీ గుర్తింపబడితే, మన్నాడే పాటల్లో మాత్రం ఆయన “స్టాంపు” వెయ్యకుండా, తన గాత్రాన్ని ఒదిగించటం వల్ల, అవి ఆ సినిమా పాటలు గానో లేక ఆ నటుల పాటలు గానో మాత్రమే ఎక్కువగా జ్ఞాపకం ఉండి పోయాయి.

1919లో కలకత్తా లో జన్మించిన మన్నాడే, 1942 లో బొంబాయి వచ్చి, “తమన్నా” అనే చిత్రం ద్వారా తన సినీసంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు.  2012 వరకూ ఆయన పాడుతూనే ఉన్నారు. అంటే గత డెభ్భై సంవత్సరాలుగా మనకు సినిమా సంగీతంలో తెలిసిన (తెలియని) దాదాపు అందరితోనూ పనిచేసిన అనుభవం ఉంది ఆయనకు. హిందీ లోనే కాకుండా, తన మాతృభాష బెంగాలీలో, భోజపురీ, అస్సామీ, పంజాబీ, మరాఠీ, గుజరాతీ,ఒరియా, సింధీ, నేపాలీ భాషలలో నే కాకుండా, మళయాళంలో కూడా పాటలు పాడారు. ఒక్క హిందీలోనే దాదాపు వందకి పైగా సంగీత దర్శకులకు పాడారు. అనేక చిత్రాలకు సంగీత దర్శకత్వం కూడా చేశారు. 2007 లో భారతదేశపు అత్యుత్తమ సినీ పురస్కారం, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్నారు.

చిన్నప్పుడు హిందుస్తానీ సంగీతం నేర్చుకొని సినిమా పాటలు పాడటం ప్రారంభించినా, తన శాస్త్రీయ సంగీతాభ్యాసం మరి కొంత కాలం కొనసాగిస్తూనే వచ్చారు. మన్నాడే కి శాస్త్రీయ సంగీతం మీద ఉన్న పట్టు వల్లనే నేమో, “బిజు బావ్రా” సినిమాలో భరత్ భూషణ్కి, మొహమ్మద్ రఫీ కొన్ని అద్భుతమైన పాటలు అప్పటికే పాడి ఉన్నప్పటికీ, “బసంత్ బహార్” సినిమాలో ఒక సన్నివేశానికి మాత్రం, శంకర్ జైకిషన్, మన్నాడే నే ఎన్నుకున్నారు. ఆ సన్నివేశానుసారం, “బసంత్” రాగంలో ఒక విద్వాంసుడు పాట పాడుతూ ఉంటే, హీరో వచ్చి, అదే రాగం అందుకొని, ఆ పాటని కొనసాగించి ఆ విద్వాంసుడిని “ఓడించాలి”. ఆ విద్వాంసుడికి గాత్ర దానం చేసింది మరెవరో కాదు, అప్పటికే, హిందుస్తానీ సంగీత సామ్రాజ్యంలో మకుటం లేని మహారాజులా శోభిల్లుతున్న పండిత్ భీమసేన్ జోషీ. హీరోకి పాడటానికి మన్నాడే ని తీసుకొన్నారు సంగీత దర్శకులు. నిజానికి, అది ఒక పెద్ద దుస్సాహసమే! ఆ పాట రికార్డింగు పూర్తికాంగానే, మన్నాడే తనంతట తానుగా వెళ్లి పండిత్ జీకి పాదాభివందనం చేశారని ఆయనే తరవాత చెప్పుకొన్నారు. “కేతకీ గులాబ్ జుహీ చంపక్ వన ఫూలే” అన్న ఈ పాట అద్భుతః!

అలాగే దర్బారీ కానడ లో సాగే “ఝనక్ ఝనక్ తోరి బాజే పాయలియాన్..” పాట, “మేరే హుజూర్” సినిమా నుంచి. మన్నాడే, మేలోడీని తన తియ్యని గళంతో ఆ పాటంతా నింపి చిరకాలం నిలచిపోయేలా పాడితే, ఆ దర్శకుడు మాత్రం దాన్ని అతి ఘోరంగా చిత్రీకరించారు. హెడ్ఫోన్స్ తగిలించుకొని ఈ పాటని వింటూ మన్నాడే గాన మకరందాన్ని ఆస్వాదించుకోవచ్చు కానీ, కళ్ళు మాత్రం మూసుకోవలసిందే!

హిందుస్తానీ భైరవి (కర్నాటక తోడి) లో సాగే “లాగా చునరీ మే దాగ్..ఛుపావూ కైసే? ఘర్ జావూ కైసే?”, పాట మాత్రం “మన్నాడే పాట”. రాజ్ కపూర్ మారు వేషం వేసి తెర మీద పాడతాడు కాబట్టి, ఈ ఒక్క సారికీ ఇది ఆయన పాట కాకుండా పోయింది. “దిల్ హీ తో హై” సినిమా లోని ఈ పాట, 2113 లో జరగబోయే పాటల పోటీలలో కూడా ఎవరో ఒకరు పాడి తీరతారు, మనమెవ్వరూ చూడటానికి మిగలక పోయినా!

రాజ్ కపూర్ అనంగానే గబుక్కున గుర్తుకొచ్చే గాయకుడు ముకేష్ అయినా, నా కిష్టమైన ఆయన పాటలు మాత్రం ఎక్కువ మన్నాడే వే. “దిల్ కా హాల్ సునే దిల్ వాలా..సీధీసీ బాత్ నా మిర్చి మసాలా..కేహకే రహేగా కేహనేవాలా”, “ముడ్ ముడ్ కే నా దేఖ్” “శ్రీ 420” పాటలు సతతహరితాలైతే, నా అభిప్రాయంలో “డ్యూయెట్ ఆఫ్ ది సెంచరీ”, “ప్యార్ హువా ఇక్రార్ హువా హై” పాటకి ఇచ్చెయ్యచ్చు. కాదంటారా? ఆ పాట ఇక్కడ చూసెయ్యండి, తరవాత చర్చిద్దాం.

అలాగే “చోరీ చోరీ” నుంచి, “యే రాత్ భీగీ భీగీ….”. అవిచి వి. మెయ్యప్పన్ (ఎ.వి.యమ్), ఆ చిత్ర నిర్మాత. ముకేష్ తప్ప వేరెవ్వరూ పాడటానికి వీల్లేదని పంతం పట్టుకు కూర్చున్నారట. సంగీత దర్శకులు శంకర్ జైకిషన్లు, ఎలాగొలా ఒప్పించి మన్నాడే చేతే పాడించారు. ఎ.వి.యమ్ గారు, రికార్డింగ్ అవ్వంగానే ఆనందంతో మన్నాడే ని వాటేసుకున్నారని కథనం. “ఆజా సనమ్..మథుర్ చాందినీ మే హమ్”, అదే సినిమాలోని ఇంకొక మర్చిపోలేని యుగళగీతం.

రాజ్ కపూర్ లాంటి హీరోతో పాటుగా, హిందీలో చెప్పుకోదగ్గ అత్యంత శ్రేష్ఠ క్యారెక్టర్ ఆర్టిస్టులైనటువంటి బల్రాజ్ సహానీ, ప్రాణ్ లకి కూడా అజరామరమైనటువంటి పాటలు ఇచ్చారు మన్నాడే. “కాబులీవాలా” లోని “యే..మేరే ప్యారే వతన్, యే మేరె ఉజ్డే చమన్, తుమ్పే దిల్ ఖుర్బాన్” పాటలో “తూహీ మేరీ ఆర్జూ…తుహీ మేరీ ఆబరూ…” అని వేదనతో నిండిన మేలోడిక్ స్వరం విన్నప్పుడు, ఒక సారి రోమాలు నిక్కపోడుచుకుంటాయి. బల్రాజ్ సహానీ కే, “వక్త్” లో పాడిన “ఎ మేరె జోహ్ర జబీన్..” పాట మాత్రం ఎవరు మరువగలరు?

ప్రాణ్ కి పాడిన “యారీ హై…” పాట గురించి పైన చెప్పుకున్నాం. ప్రాణ్ అనంగానే గుర్తుకొచ్చే మరో “హాంటింగ్ మెలాంకొలిక్ మెలోడీ”,  “ఉప్కార్” చిత్రం నుంచి., “కస్మే వాదే ప్యార్ వఫా సబ్ బాతే హై…బాతోం కా క్యా?”.

డెభ్భైల్లోని సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా అనంగానే కిషోర్ కుమార్ గుర్తుకొచ్చేస్తారు. కానీ మన్నాడే కూడా అడపా తడపా రాజేష్ ఖన్నాకి పాడారు. “బావర్చీ” లో శాస్త్రీయంగా సాగే “తుమ్ బిన్ జీవన్ కైసా జీవన్…” చాలా మధురంగా ఉంటుంది.

ఆనంద్ సినిమాలో రాజేష్ ఖన్నా కోసం పాడిన “జిందగీ కైసీ యే హాయే పహేలీ హాయే..” పాట లోని లిరిక్స్ ఇలా ఉంటాయి.

“జిన్హోంనే సజాయే యహా మేలే … సుఖ్ దుఖ్ సంగ్ సంగ్ ఝేలే

వోహి చునకర్ ఖామోషీ…యూ చలే జాయే అకేలే కహా?”

మన్నాడే మౌనంగా ఒక్కరే ఏదో లోకాలకి వెళ్లిపోయి ఉండచ్చు, వారి సంగీత సంపద మాత్రం తరతరాలకీ తరగని విధంగా మనకి వదిలేశారు. మరిక బాధేల మిత్రమా?

“దునియా మే ఖుష్ రెహనా హోతో మానో మన్నాడే కీ బాత్”
“ఆవో ట్విస్ట్ కరే… జగ్ ఉఠా మౌసమ్!”

-శివ సోమయాజులు

Siva

 

ఒక altruistic కథకుడు- ముందొక ముళ్లకిరీటం!

 daalappa1

కవి/ రచయిత నాకు తెలుసు అని చెప్పేవాళ్లని- ఆకాశమంత ఎత్తుగా వుండే అతని వీపు తట్ట చూస్తున్నారని- అప్పుడెప్పుడో 80 ఏళ్ల క్రితమే చలం గారు (యోగ్యతాపత్రంలో) వెక్కిరింపు, చీత్కరింపు గుర్తుకొస్తున్నా, దాలప్పతీర్థం కథారచయిత చింతకింది శ్రీనివాసరావుతో నా వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని ప్రస్తావించడానికి వెనుకాడటం లేదు. ఐతే, అతని కథలకి Motive springs చూపడానికైతే కాదు. అతను నాకు వ్యక్తిగతంగా తెలియక పోతే, ‘దాలప్పతీర్థం’ కథలు మరోలా అర్థమయ్యేవి (లేదా అపార్థానికి గురయ్యేవి). నిర్మమత్వంతో చూడాల్సిన కథలకి నాకు అతనితో ఉన్న పరిచయం అడ్డు కాలేదు సరికదా, నాకు ఆ దిశలో మరింత తోడ్పడింది.

కథల్లోకి వెళ్లే ముందు, కథా రచయిత రాతలకి సంబంధం లేదనిపించే కొన్ని సంగతులు:

ఆంధ్రప్రభ అనే ఒకానొక బుల్లి దినపత్రికని సామ్రాజ్యంగా భావిస్తూ, దానికి తానో చక్రవర్తినని విర్రవీగుతూ, తన భ్రమకి కించిత్ భంగం వాటిల్లినా అందుకు కారణమైన ఉధ్యోగులు అనే కీటకాల్ని కఠినంగా శిక్షిస్తూ- ఓ వేయి విషపడగల వాసుకి! ఆయన ఫ్యూడల్ హయాంలో రకరకాల శిక్షలకి గురైన వాళ్లలో ‘అవిధేయతా’ నేరం కింద అక్కడెక్కడో రూర్కేలా అనే శంకరగిరి మాన్యాలు పట్టిపోయిన వాడు చింతకింది శ్రీనివాసరావు. ఆంధ్రప్రభకి మంచిరోజులు తెచ్చి, దాన్ని భూమార్గం పట్టించిన ఎడిటర్ నిజం శ్రీరామ్మూర్తి గారు- ఆయన టైమ్‌లో తిరిగి తన విశాఖపట్నం గూటికి చేరే ముందు, ఒక నెల రోజులు పాటు హైద్రాబాదులో ఉన్నాడు చింతకింది. వాసుకి బాధితులు సాధారణంగా సెల్ఫ్ పిటీతో కుంగిపోతుంటే, వారి పట్ల సానుభూతి చూపించడంలో మిగతా సహోద్యోగులకి గొప్ప తృప్తి, ఒక మెట్టు ఎగువన ఉన్నామన్న ఆనందం కలిగేవి. కానీ, అటువంటి వారందరికీ చింతకింది ఒక చెంపపెట్టులా కనిపించాడు. సానుభూతి కాదుకదా, ఏ మాత్రం నంగిరితనాన్ని సహించనితనం ముఖాన కుంకుమ బొట్టులా మెరిసేది (ఇంటర్వ్యూలో తొలి ప్రశ్నగా శాఖ ఏమిటని నన్నడిగిన మా వాసుకి నెలకొల్పిన వాతావరణం వల్లనేమో, కొలీగ్స్ కులం సదరు కొలీగ్ కంటే ముందే తెలిసిపోతుండేది. కాబట్టి మెడలో నళినాక్షితాల మాల, స్పటిక పూసల హారం, ఆ పక్కన జంధ్యం, ముఖాన కుంకుమతో, మెడ ఎత్తి చూడాల్సిన చెయ్యెత్తు మనిషి- చింతకింది బ్రాహ్మడని మాకు ముందే తెలుసు). అలాగని ధూంధాంలాడుతుంటాడా అంటే, భారతీయ స్వభావాత్మ వంటి సత్-చిత్-ఆనంద తత్వానికి ప్రతినిధిలా ముఖాన చెదరని నవ్వు. 1990ల ద్వితీయార్థంలో నాతో చిన్నపాటి పరిచయం, తదనంతరం వీడ్కోలు- అంతే.

నేను వైజాగ్ బదిలీఐ వెళ్లాక చింతకింది నాకు నిజంగా పరిచయమయ్యాడు.

పన్నెండేళ్ల క్రితం నా కళ్ల ముందు నిలిచిన ఒక దృశ్యాన్ని చెప్పక పోతే, నేనిక్కడ రాసేదంతా అసంపూర్ణం. బాబ్జీ అనే సహద్యోగి. చిన్న వయసువాడే. రోడ్డు ప్రమాదంలో అర్థాంతరంగా చనిపోయాడు. పోస్టుమార్టం అయ్యాక, దగ్గరి బంధువులు, కొలీగ్స్ ఎవ్వరూ కూడా శవం దగ్గరకి వెళ్లడానికి తటపటాయిస్తున్న సందర్భం. ఒక్కడే ఒక్కడు చింతకింది బాబ్జీ శవాన్ని భుజాన మోసుకుంటే బైటకి వచ్చినప్పటి దృశ్యం. శనిదానం. మృత్యుంజయ దానాలు పట్టే బ్రాహ్మడు, శవాన్ని మోసే బెస్త, పాడెగట్టే కాష్ఠమల్లడు, కాటిలో ప్రేతగోపుడు… అన్నీ అతడే. అసందర్భమే గానీ, సతిని మోస్తూ ప్రళయ తాండవం చేసిన రుద్రుడు గుర్తొచ్చాడు. శివుడితో పోలిక లేకపోలేదు, ఆయన గరళాన్ని గొంతులో దాచుకుంటే, చింతకింది దుఃఖాన్ని దాచుకున్నాడు. ఎవరు అతని నోట పలికించే వారోగానీ, చనిపోక ముందు తరుచూ అనేవాడు బాబ్జీ- ‘ నవ్విన నాప చేనే పండుతుందిలే. నన్ను చూసి నవ్విన నువ్వే ఓ రోజు నన్ను భుజాన ఎక్కించుకొని ఊరేగిస్తావు చూడ్రా బావా’. ఆ మాట మరోలా నిజం కావడం వల్ల పొర్లుతున్న, పొగులుతున్న దుఃఖాన్ని గొంతులోనే దాచుకున్న చింతకింది – అగ్ని పర్వతంలా గుంభనంగా కనిపించే మంచుకొండ – అప్పటి నుంచి ఆత్మబంధువు అనుకుంటాను. ఇంకా తరిచి చూసుకుంటే అతను నాకొక subject matter, ఒక phenomenon!

బతుకు కోరేవాడు బావమరిది అంటారు, అలా కోరడానికి చుట్టరికాలు కలవనక్కరలేదు, చింతకిందిలా కలేసుకోవచ్చనుకుంటా. ఒక్క బాబ్జీ యే కాదు, అందరూ ఆయన బావలు, తమ్ముళ్లు, చెల్లెళ్లు, వదినెలే. పిఆర్ వ్యవహారంలా నీళ్లమీద నూనె తెట్టెలా urbanized పైపై పలకరింపులు కావు. ఎంతవాడ్నైనా ‘ఒరే’ అంటూ పలకరించే చింతకిందిలో సామాజికంగా బ్రాహ్మణ్యం అందించే దాష్టీకం లేదు. ఆ మాటకొస్తే అనూచానంగా వచ్చే అలవాట్లే తప్ప ఆయన కులాన్ని పట్టించే లక్షణాలు మచ్చుకి కూడా లేవు. దాచుకోవడం తెలియని, ఇవ్వడానికే ఉన్నట్టు సాగిన ఆజానుబాహుత్వం ఉన్న ఇటువంటి వారికి, తమ దగ్గర లేనప్పుడు, మోకాళ్ల వరకూ వేళ్లాడే ఆ నిడద చేతులతోనే తీసుకోవడం, లేదా లాక్కోవడం అనే లక్షణాలు కూడా ఉంటాయి. కానీ, అడగటం, తన చేయి కింద కావడం చింతకింది స్వభావంలో లేదు. “….. శ్రీసతి కొప్పుపైఁ, దనవుపై, నంసోత్తరీయంబుపై,/ బాదాబ్జంబులపైఁ, గపోలతటిపై, బాలిండ్లపై నూత్నమ/ ర్యాదం జెందు కరంబు గ్రిం దగుట మీఁదై నా కరంబుంట మేల్/ గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?” అని బలి చక్రవర్తిలా తనది పైచేయి అనిపించుకోవాలన్న మెహర్బాణీ కూడా లేదు. తన చుట్టూ ఉన్న లోకం అంతా ఆయనకి ఒక కుటుంబం, ఒకే కుటుంబం. చింతకిందిలో మరో ముఖ్యమైన లక్షణం నైతికత. అది మర్యాదస్తుల దొంగ ముసుగు కాదు. ఒక పల్లెటూరి నిసర్గమైన నీతి. ఆరడుగుల పైనుండే చింతకింది సమక్షంలో చెట్టు నీడన సేదతీరుతున్నట్టుండే ఆడవాళ్లని గమనిస్తుంటే ఆశ్చర్యమేసేది. జింక- పులి సంబంధానికి సమాంతరంగా ఉండే ఆడ-మగ లోకంలో మానంత మనిషిలా కనబడేవాడు చింతకింది. అతని సమక్షంలో ఏ స్త్రీ కూడా తన పరిమితులు గుర్తొచ్చి న్యూనత పడటం, తన ఉనికి గురించి ఉక్రోషపడటం, తన భద్రత గురించి భయపడటం మచ్చుకైనా ఉండేవి కావు (అతనిని అందరూ అన్నగా భావించడం, నేను తనతో ముందే బావగా వరసలు కలిపేయడం వల్ల, నా వరకైతే భలే బాగుండేదనుకోండి).

ఇక వృత్తి పరంగా కూడా నికార్సైన జర్నలిస్టు. సాధారణంగా చలామణిలో ఉన్న పాత్రికేయం, ముఖ్యంగా ప్రాంతీయ పాత్రికేయం అంటే ఓ పవర్, ఒక దబాయింపు, పరోక్ష (ప్రత్యక్ష) బ్లాక్‌మెయిలింగ్, ఇంకా పైరవీకి synonym. కానీ, ఈనాడులో రిపోర్టరుగా చేరింది మొదలు, ఈరోజు ‘పబ్లిక్’ అనే దినపత్రిక ఎడిటర్‌గా ఎదిగినంత దశ వరకూ చింతకిందికి జర్నలిజం అతని ప్రవృత్తికి కొనసాగింపు. సొంతలాభమనే ప్రయోజనాన్ని ఆశించి, బెదరింపు లాంటి, ఎత్తుగడలాంటి, గూడుపుఠాణీ లాంటి, పోనీ భజనలాంటి రిపోర్టులు ఇతని నుంచి వచ్చే అవకాశమే లేదు. రాజకీయ నాయకుల మొదలు, సెలబ్రిటీస్ అందరితోనే విస్తారమైన పరిచయాలు ఇతనికి. పడవతో నీటికుండే తగుమాత్ర సంబంధంలాంటివే అవన్నీ.

కవులతో, రచయితలతో, కళాకారులతో మాత్రం ప్రగాఢమైన అనుబంధం. స్వతహాగా మంచి గాయకుడు. చాలా తక్కువ మందికి వంటబట్టే పద్య పఠనం అబ్బింది. పీసపాటి వారి నుంచి ఎందరో నాటకరంగ కళాకారులతో పాత్రికేయేతర బాంధవ్యం. మూర్తీభవించిన నియంతృత్వ నియతిలా కనిపిస్తాడు గానీ, పైపై నియమనిబంధనలకి అతీతంగా కళాకారుల్లో ఉన్న artistic moralityకే ఎక్కువ విలువిస్తాడు. చీమకుర్తి నాగేశ్వర్రావు గారికి వైజాగ్ రైల్వే స్టేషనులో చింతకింది పాదాభి వందనం చెసినప్పుడు చుట్టూ ఉన్న సభ్య సమాజం బిత్తరపోయింది. చీమకుర్తి అంతటి కళాకారుడని తెలియక పోవడం వల్లే కాదు, ఆ పచ్చి తాగుబోతు ఒక విసిరేసిన చింకిపాతలా ఉండటం కూడ బహుశా ఒక కారణం.

ఇంత సజ్జన సాంగత్యం, పురా- నవ సాహిత్య పరిచయం, భాషాభినివేశం, నిబద్ధత, కార్యశూరత్వం ఉన్న చింతకింది, 2010 వరకూ, అంటే తన 46 ఏట వరకూ సాహిత్య రంగ ప్రవేశం చేయలేదు, సాహిత్యానికి పాఠకుడిగా ఉన్నాడే గానీ. అదేదో నేరారోపణగా చెప్పడం లేదు. తొలి కథ ‘నిదర్శనం’ 2010 మధ్యలో రాస్తే, దాన్ని 25 జూలై, 2010 ‘ది సండే ఇండియన్’ పత్రికలో ప్రచురించే గౌరవం, ఆ పత్రిక ఎడిటర్‌గా నాకే దక్కింది. చింతకింది కథ రాయడం నాకేమంత ఆశ్చర్యం కాదుగానీ, ‘నిదర్శనం’ వంటి కథ రాయడం నాకు గొప్ప అబ్బురం. దాని కథాకాలంలో ఒక గమ్మత్తుంది. విజయనగరం జిల్లా, నెల్లిమర్ల సమీపంలోని మొయిదా గ్రామ పొలిమేర్లలో గాలులు ప్రచారం చేసే శతాబ్దం నాటి గాథల్ని 21వ శతాబ్దం తొలి దశకం తర్వాత విన్నాడు రచయిత. విని, దాన్ని కథగా మార్చి, రెండు కాలాలకి గడుసుగా ముడి వేశాడు చింతకింది. జ్యోతిష్య, ఆగమాది శాస్త్రాల్లో నిష్ణాతుడైన ఓ పండితుని నిన్నటి తరాల కథే- నిదర్శనం. గత (మృత) బ్రాహ్మణీయ సమాజాల పునరుద్ధరణ ప్రీతిని ప్రతిఫలించినట్టుండే ఈ కథని తొలికథగా రాయడమే నా విస్మయానికి కారణం. అనుభవాల మీద (అరువు) ఆలోచనలు పెత్తనం చేస్తూ, అవి కథల, లేదా ఇతర సాహిత్య ప్రక్రియల రూపంలో ప్రతిపాదనల స్థాయికి దిగజారి రాజ్యమేలుతున్న వర్తమాన సాహిత్య వాతావరణం, రాజకీయాలూ తెలిసి తెలిసీ, ‘నిదర్శనం’ వంటి కథని రాయడం నా దృష్టిలో సాహసమే. ప్రగతి నిరోధకమనో, బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలమనో, పాతచింతకాయ పచ్చడనో పక్కకి తోసేసే వీలున్న కథ.

ఆధునికత అందించిన అత్తెసరు జ్ఞానంతో నిర్లక్షించిన, పక్కకి తోసివేయబడ్డ అంశాల్ని ఆధునికోత్తర టార్చిలైట్లతో వెదికి, వెలితీయాలని ఊదరగొడుతున్న వర్తమానంలో, ఆధునిక పూర్వ సమాజాల బహుముఖీనతని ప్రదర్శించే ఏ కథనైనా తల మీద పెట్టుకోవల్సిందే. కానీ, అది అగ్రవర్ణ బ్రాహ్మణ సమాజాలదైతే ‘మార్కెటింగ్’ చాలా కష్టమే గాక, ఎదురు నిందలు మోయాల్సి ఉంటుందని తెలిసి కూడా ‘నిదర్శనం’ రాశాడు చింతకింది.

రెండవ కథ, ఈ సంకలన శీర్షికగా నిలిచిన- దాలప్ప తీర్థం. ‘నిదర్శనం’లా దీనిని పుక్కిటి కథ అని తేల్చేయడానికి వీల్లేని, స్థల పురాణానికీ- వీరగాధకి మధ్యన నిల్చే ఆధునిక కాలానికి చెందిన కథ. ఈ వైవిధ్యం చూపించిన తర్వాత, సాధారణంగా రచయితకి ఒక అలసట ఉంటుంది. కానీ, ఈ సగటుతనాలు తనకి ఆపాదించడం కుదరదన్నట్టు నిండా మూడేళ్లు తిరక్కుండా 14 కథలతో ఒక కథాసంకలనంగా ముందుకొచ్చాడు (ఇంకొన్ని కథలు పక్కన పెట్టాడనుకుంటా). ఇదంతా గోళ్లు గిల్లుకుంటూ బోల్డు తీరుబడి దొరికి చేయలేదు; ఒక పక్క ‘సాక్షి’లో పని ఒత్తిడి, మరో పక్క తన పీహెచ్‌డీ థీసెస్.

ఇక ఈ కథల్లో సూత్రపాత్రల విషయానికొస్తే, దాదాపు అందరూ ‘పరోపకారమిధం శరీరం..’ అన్న సుభాషితం గురించి చదివే జ్ఞానం, వినే తీరుబడి లేని బొటాబొటీ బతుకుల వాళ్లే; అయినా ఆ సూక్తిని మనసా, కర్మణా ఆచరించిన వారే. ‘పిండిమిల్లు’ హుస్సేనయ్య (అనబడే షేక్ మక్బూల్ హుస్సేన్), ‘గుడ్డముక్కలు’లో సిలపరశెట్టి తాతయ్యలు, ‘పాలమ్మ’, ‘చెరుకుపెనం’ తెప్పగా ఏరు దాటించే రాపర్తి భూషణం, ‘జలగల డాక్టర్’ – సివ్వాల రామునాయుడు….

అందరూ రచయిత పుట్టి పెరిగిన చౌడవరం వాళ్లే, లేదా కాస్త ఇరుగూ పొరుగూ ఊళ్లోళ్లు. అతని చిన్ననాటి జ్ఞాపకాల్లోంచి, నోస్టాల్జియాలోంచీ మేల్కొని, కాగితాల మీదకి నడిచొచ్చిన వాళ్లే.

‘వసుధైక కుటుంబ’మనే అమూర్త భావాలకీ, అతిసాహస, వీరపరాక్రమ యోధానుయోధుల, దీరోదాత్తుల మహాకథనాలకీ వీడ్కోలుగా petits récits అనబడే స్థానీయ కథనాలకి Jean-François Lyotard దారులు వేశాక, ప్రపంచంలో, ముఖ్యంగా మూడో ప్రపంచంలో, ఆ ప్రపంచంలోని తెలుగు లోకంలో అటువంటి కథలు వెల్లువెత్తాయి. కాబట్టి, చింతకింది శ్రీనివాస్ ‘దాలప్పతీర్థం’ ఆ ఒరవడిలో కొత్తదేమీ కాదు. ఆ మాటకొస్తే, చింతకింది కాకుండా (నాకు వ్యక్తిగతంగా తెలియని) ఏ రచయితైనా ఇవే కథలు రాసి ఉన్నట్టైతే నాకు కచ్చితంగా విసుగొచ్చేది, ఈ మీదుమిక్కిలి మంచితనం, పరహితత్వం సరిపడక వెగటేసేది. అదేదో మహాభారత కాలం నాటి ద్వాపర యుగంలో ధర్మరాజుకి ఒక్క చెడ్డవాడు, దుర్యోధనుడికి ఒక్క మంచివాడు కనబడలేదన్న పిట్ట కథ గుర్తొచ్చేది. మల్లాది రామకృష్ణశాస్త్రి వారంతటి విద్వన్మణి రాసిన ‘తేజోమూర్తులు’లో చిత్రించిన సమాజం, పల్లె, ప్రజ… అందరూ మరీ ఆదర్శప్రాయమై అదేదో రచయిత కలల ప్రపంచం లెమ్మనుకున్నట్టే మరోసారి అనిపించేది.

కానీ,  చింతకింది గురించి ఆసాంతం తెలుసు కాబట్టి ఈ కథాస్థలం కల్పితం కాదనీ, రచయిత పుట్టి, తనకంటే ముందే పుట్టేసిన పలు చింతకింది శ్రీనివాసరావుల్ని చూస్తూ పెరిగి, వారిని తలుచుకుంటూ ఈ కథాశ్రేణికి కారణమయ్యాడనీ, మున్ముందు ఇంకా మరింత అవుతాడనీ అర్థమయ్యింది. ఒక సామాజిక న్యాయం కోసం, తనదైన అస్థిత్వం కోసం స్థానికత పడరానిపాట్లు పడుతూ, తనదైన చరిత్రని ఈ చిన్ని చిన్ని కథల ద్వారా పునర్నిర్మించుకుంటోంది. ఆ పునర్నిర్మాణ ప్రక్రియకి తన కథల ద్వారా చింతకింది చేసిన (చేస్తున్న) కాంట్రిబ్యూషన్ అధికం. ఈ కథల్లో ఇంటిపేర్లతో సహా తను అలవోకగా ప్రస్తావించిన పేర్ల వరకూ చాలు, ఒక ఉత్తరాంధ్ర గ్రామ సామాజిక జీవన వైవిధ్యాన్ని సమగ్రంగా గ్రంథస్థం చేయడానికి. ఆకెళ్ల సోమిదేవమ్మ, కాకరపర్తి సీతాలక్ష్మి, చింతలపాటి సత్యమాంబదేవి, పాలఘాట్ కృష్ణయ్యర్, అగ్గాల సన్నాసి, గరిమెళ్ల సూర్యకాంతమ్మ, అబ్బరాజు సూర్యారావు, మండా రామ సోమయాజులు, భమిడిపాటి యజ్ఞేశ్వరరావు, సచ్చరి పైడయ్య, నడుపూరి ఓబలేసు, జక్కవరం పైడితల్లి, బళ్ల కనకారావు, చుక్కా సీతయ్య, కర్రి పార్వతీశం, పిడపర్తి విశ్వేశ్వర సోమయాజులు, రాళ్లపల్లి కామేశ్వరరావు, పెన్మత్స కృష్ణభూపతి, పిప్పల నారాయణ, కొమ్మిరెడ్డి రాంబాబు, ఈతలపాక వెంకటేశం, గూనూరు గణేషుడు, బుద్ధ నాగజగదీషు, గండి గౌరునాయుడు, ధన్యంరాజు నరసయ్య, బోయిన గౌరీసు, నేమాని పార్వతీశం, యర్రంశెట్టి వీర్రాజు, కోయిలాడ వెంకట్, సుగ్గు వరాలు, మంత్రిప్రగడ గోపాల కృష్ణ, చుండూరు కామేశ్వరరావు, గాటూరి అప్పన్న, బయిన పాపారావు…. ఇంకా ఎందరో…. శారదా నది, బొడ్డేరు, తాచేరు, మానేరుల మధ్య చోడవరం, వడ్డాది, కొత్తకోట, మేడివాడ, అర్జాపురం, దొండపూడి వగైరా ఊళ్లలో ఎదురయ్యే పాత్రలు. వీటితోపాటు, ఉత్సవ సమయాలు, పొర్లు దండాలు, ఏకాకితనాలు, సామూహికత్వాలు, కుడి ఎడమలు, చీకటి వెలుగులు, ద్వంద్వాలు… వెరసి, “To see the world in a grain of sand, and to see heaven in a wild flower, hold infinity in the palm of your hands, and eternity in an hour”అన్న William Blakeని గుర్తుకు తెస్తాయి.

మళ్లీ మొదటిగడి (square one) దగ్గరకే వస్తే, పఠితకి రచయిత (వ్యక్తిగతంగా) తెలియడం అన్న కాన్సెప్ట్ మీద నిర్మించబడ్డ వ్యాసం ఓ పేకమేడ. ‘దాలప్పతీర్థం’ బాగోగులు ఎటువంటి ఊతకర్రల సాయంలేకుండా, దాని textకే పరిమితమై చూస్తే, ఒక అనుభవాన్ని అందించే ముందే రచయిత ఉద్దేశ్యాల మీద ఒకానొక అనుమానాన్ని రేకెత్తించే అవకాశముంది. కథాంశంలోని మానవీయతని సాకుగా చూపించి, కథన రీతి మీద నోరు మెదపకుండా చదువరిని emotionalగా కట్టడి చేసే ఎత్తుగడకి రచయిత పాల్పడుతున్నాడా అన్న అనుమానం. ‘నిదర్శనం’ కథతో తనమీద దాడికి కవ్వించిన తెగువ, లేదా ఆ కథాంశాన్ని మిషగా తనని మొగ్గగానే తుంచేసే అవకాశాన్ని తానే చేజేతులా అందించిన తెంపరితనం మరే కథల్లోనూ కనిపించదు. కథాంశం, దాని నేపథ్యం, దాని వెనుక చిత్తశుద్ధి, తత్పరతలు మాత్రమే కథకి సాహిత్య గౌరవాన్ని చెచ్చిపెట్టవు. వాటి దన్నుతో, take-it-for-granted దిలాసాతో, అభ్యాసం కూసువిద్యలా మూడేళ్లలో 14 కథలు రాసిపారేసినట్టు పాఠకుడికి తోచిందా- ఇక ఆ రచయిత (రచన మీద కూడా) గౌరవం తగ్గుతుంది, నమ్మకం సడలుతుంది. నిజానికి రచయిత నిబద్ధతంటే కమ్యూనిస్టులు చెప్పే మూసల్లోకి రంగూ, రుచీ లేకుండా ఒదిగిపోవడం కాదు, పాఠకుడికి రచన ద్వారా గతంలో ఇచ్చిన భరోసాని, కలిగించిన క్రెడిబిలిటీనీ నిలబెట్టుకోవడం. అటువంటి నిబద్ధత కోసం చింతకింది ఇంకా అక్షర దాస్యం, ధ్యానం చేయాలి. ‘శిఖండిగాడు’, ‘చిదిమిన మిఠాయి’ వంటి కథల్లో శైలీగతమైన లోపాలు కొన్ని కనిపిస్తున్నాయి. రచయిత సర్వజ్ఞుడేమీ కాదు కాబట్టి, కొన్ని ఖాళీల్ని (సహజంగా) వదిలేయడం కూడా రచనా సంవిధానంలో భాగమే. ఈ విషయం సాహిత్య అకాడమీ అవార్డులు సొంతం చేసుకొని, జ్ఞానపీఠాల మీద గురిపెట్టిన తెలుగు మహామహోపాధ్యాయులకే ఎక్కడం లేదు కాబట్టి, చింతకింది వంటి వారిని కార్నర్ చేయడం సబబు కాదేమో. అయినా, అక్షరలోకంలో చిన్నా పెద్దా ఉండవు కాబట్టి అటువంటి excuses, concessions దొరకవని చింతకింది శ్రీనివాస్ గ్రహించాలి. ‘కళింగాంధ్ర వారసుడు’ అంటూ వాడ్రేవు చినవీరభద్రుడు అంతటి సాహితీవేత్త అనడం ఒక ప్రశంసగా కాకుండా, దాన్నొక ముళ్లకిరీటంగా చూడాలి, దాన్ని ధరించడానికైనా, విడనాడటానికైనా-

నరేష్ నున్నా

 ఈ పుస్తకం ఇక్కడ దొరుకుతుంది.

మిథునం గురించి మరో సారి

midhunam3

‘‘తెలుగు సినిమాకు మడికట్టిన మిథునం’’ పేరుతో ‘‘సారంగ’’ లో జి.ఎస్‌. రామ్మోహన్‌ రాసిన వ్యాసం చదివాక మిధునం గురించి మరోసారి రెండు ముక్కలు రాయాలనిపించింది.
‘‘పాలపిట్ట’’ పత్రికలో మిథునం సినిమాను సమీక్షించింది నేనే! స్త్రీ, పురుష సంబంధాలలో వుండే అద్వైత తత్వాన్ని, అర్థనారీశ్వరత్వాన్ని మిథునం కథా నెపంగా చెప్పడానికి తనికెళ్ళ భరణి ప్రయత్నం చేశాడని అందులో నేను చెప్పాను. ఆ పత్రిక సంపాదకులు ఒక పేజీ మొత్తం ఎడిట్‌ చేయడం వలన అది పూర్తిగా వ్యక్తం కాలేదు. ఆ వ్యాసం ఇలా ముగుస్తుంది.
‘‘మిథునం సినిమా చూశారా? ఎలా వుంది?’’ అని ఒక సాహితీ మిత్రుడుని అడిగాను. అందుకు ఆయన సినిమా బావుంది కానీ కాస్త బ్రాహ్మణ వాసన వేస్తుంది?’’ అన్నారు. ‘‘అయ్యా! యిదీ మన సంస్కారం’’ అంటూ వ్యాసం ముగించాను. ‘‘అయ్యా ఇదీ మన సంస్కారం’’ అన్న వాక్యం పట్ల చాలా మంది అభ్యంతరం వ్యక్తంచేశారు. అభిప్రాయం చెపితే సంస్కారం లేదని అంటే ఎలా! అని ఫోన్‌ చేసి మరీ మందలింపు ధోరణిలో కూడా మాట్లాడారు.
ఏదయినా ఒక వాక్యం రాసి అచ్చయ్యేంత వరకే రచయిత స్వంతం. ఒక సారి అచ్చులో వచ్చాక అది ప్రపంచానిదై పోతుంది. ఎవరికి నచ్చిన రీతిలో వారు దానికి వ్యాఖ్యానం చేస్తారు. ప్రతి వ్యాఖ్య రచయిత ఉద్దేశించిన రీతిలోనే వుండాలని లేదు.
‘‘అయ్యా! ఇదీ మన సంస్కారం’’ అన్న వాక్యం రాయడం వెనుక నేను ఆశించిన ధ్వని వేరు. సాహితీ మిత్రుడు, కవి, బుద్ధిజీవి ఏదయితేనేం… సమాజానికి కాస్త భిన్నంగా ఆలోచించి, దిశా నిర్దేశం చేయవలసిన బుద్దిజీవులం మనం కూడా ‘‘ఎబౌ ది క్యాస్ట్‌’’ ఆలోచించకపోతే ఎలా? అనే నిరాశ, నిస్పృహ, నైరాశ్యం, నేనాశించిన ధ్వని.
జి.ఎస్‌. రామ్మోహన్‌కి కూడా అది ‘‘తిట్టి పోయడం’’గా అర్థం అయింది. మన సంస్కారం ఉండవలసిన రీతిలోలేదు అన్నది నా బాధ. వ్యక్తులనయినా, విషయాలనయినా పరుషంగా వ్యాఖ్యానించడం నా పద్థతి కాదు.
జి.ఎస్‌. రామ్మోహన్‌ తన వ్యాసంలో మిథునం సినిమా పట్ల అభ్యంతరం వ్యక్తంచేసిన విషయాలు ఇవి.
1) ఇది తెలుగు సంస్కృతికాదు ఇది కేవలం 5% మైనారిటీ వ్యవహారమే.
2) మిథునంలో జంటకి సామాజిక జీవనం లేదు.
3) బ్రాహ్మణులు ఏదో ఒక రకంగా కోల్పోయిన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఇవి ప్రధానమయినవి.
తెలుగు సినిమా ‘‘కులం’’ను కౌగిలించుకుని చాలా కాలమే అయ్యింది. ఎప్పుడో 1950లలో వచ్చిన ‘‘గుండమ్మ కథ’’లోనే ఎస్వీరంగారావు ‘‘మేము పెద కాపులం’’ అంటాడు. పదేళ్ళ క్రితం వచ్చిన ఒక సినిమాలో ‘‘మేము నాయుళ్లం, మీరేమిటి? అని చక్రవర్తి. హీరో శ్రీకాంత్‌ను అడుగుతాడు. చాలా సినిమాలలోహీరోలు ఇంటి పేర్లతోసహా తమ, తమ వంశ, కుల చరిత్రలు చెప్పుకుంటున్నారు. సూర్యదేవర వీర రాఘవయ్య, పర్వతనేని తులసీరామ్‌ ప్రసాద్‌… ఇలా…
ఈ కుల వాసన మనకు అభ్యంతరకరం కానప్పుడు బ్రాహ్మణ కుల వాసన మాత్రం ఎందుకు అభ్యంతరకరం అవుతున్నది? ఒక యువ నటుడు మీసం మెలేసి, తొడ చరిచి వంశం పేరు చెప్పి, అదంతా తెలుగు వారి ఆత్మగౌరవం అని… పెడ బొబ్బలు పెడితే మనం ఎందుకు మౌనంగా వుండిపోయాం…
మిథునం కథరాసిన శ్రీరమణ కానీ, దర్శకత్వం వహించిన తనికెళ్ళ భరణి కానీ ‘‘ఇదే తెలుగు సంస్కృతి’’ అని ఎక్కడా ‘‘క్లెయిమ్‌’’ చేసుకోలేదు. ఇదీ తెలుగు సంస్కృతి అని ఎవరయినా క్లెయిమ్‌ చేసుకున్నా యివాళ్ళ తెలుగు సమాజం ఆమోదించే స్థితిలో వున్నదా…?
తెలుగు అంటే ఏ తెలుగు అని అడిగే అస్తిత్వ సందర్భంలో వున్నాం మనం. తెలంగాణా తెలుగా…? ఉత్తరాంధ్ర తెలుగా..? రాయలసీమ తెలుగా..? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే తెలుగు సంస్కృతి అంటే ‘‘ఏ తెలుగు సంస్కృతి’’ అని ప్రశ్నించడంలో తప్పులేదు.
విశాలమయిన జన సమూహాన్ని కలిపి వుంచే, అందరికీ ఆమోదయోగ్యమయిన సంస్కృతి ఎక్కడ వుంటుంది! సమాజం మొత్తం చిన్న చిన్న సమూహాలుగా, వర్గాలుగా, కులాలుగా, మతాలుగా విడిపోయినప్పుడు అన్ని రకాల సంస్కృతులు, ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు అస్తిత్వంలో వుంటాయి. అన్నీ కలగలసిపోవడమే భిన్నత్వంలో ఏకత్వం. భారతీయ సంస్కృతికి మూలం అదే. ఎవరి అస్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకుంటూ ఇతర అస్తిత్వాలతో ఘర్షణ లేకుండా, సామరస్యంగా, సౌభ్రాతృత్వ పూర్వకంగా కలసి జీవించడాన్ని ఆధునిక సమాజాలు కోరుకుంటున్నాయి.
ఒక విశాలమయిన వృత్తం మధ్య కేంధ్రం ఎంత బలంగా వుండాలో, ఆ వృత్తంలో వున్న యితరేతర కేంద్రాలూ అంతే బలంగా వుండాలి. అది సమాజం కూడా ఈ విశాల తెలుగు సమాజానికి, బ్రాహ్మణ సంస్కృతి కూడా ఒక పార్శ్వంగా నిలుస్తుంది. దానినే భరణి, శ్రీరమణ చూపించాలి అనుకుంటే ఎవరయినా ఎందుకు తప్పుపట్టాలి? సోమయాజి, సోమిదేవమ్మ, ‘‘లచ్చుమ్మమ్మ’’ని విమర్శిస్తేనో, తృణీకరిస్తేనో, అగౌరవపరిస్తేనో ఖచ్చితంగా అభ్యంతరం పెట్టవలసిందే. సోమిదేవమ్మ కథలోకి లచ్చుమమ్మ రానంతవరకూ, లచ్చుమమ్మ కథలోకి సోమిదేవమ్మ రానంతవరకూ… ఎవరికయినా ఎందుకు అభ్యతరం వుండాలి..? సూర్యదేవర వీరరాఘవయ్యను యాక్సెప్ట్‌ చేసినట్లే బుచ్చిలక్ష్మీనీ అప్పదాసునూ యాక్సెప్ట్‌ చేయాలికదా…?
ఆయన ఉయ్యాల బల్లమీద శ్రీ మహావిష్ణువులాగా ఊగుతుంటే గడప మీద తలపెట్టుకుని ఆవిడ పడుకోవడం గురించి మనకెందుకు? బ్రాహ్మణ సంస్కృతిలో అమానవీయ అంశాలు వుంటే వాళ్ళే పరిష్కరించుకోవాలి. అది వాళ్ళ సమస్య.
గురజాడ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, కందుకూరి వీరంతా బ్రాహ్మణేయ సంస్కృతిలోని లోలోపలి చీకటి అంశాలను తూర్పారా పట్టిన వారే? అది 5% మైనారిటీల సంస్కృతి అయినా సరే.. దానికొక అవిచ్ఛిన్నత వుంటుంది. కాలం గడుస్తున్న కొద్ది అది అవలక్షణాలు పరిహరించుకుంటూ సాఫ్టెన్‌ అవుతుంది.
మిథునం సినిమాలో జంటకి సామాజిక జీవనం లేదు? వాళ్ళు ఎవరితోనూ కలవరు? అన్నది మరో విమర్శ. నిజమే వాళ్ళు ఎవ్వరితోనూ కలవరు (సినిమాలో). నిజానికి ఒంటరితనం వేరు. సామాజిక జీవనం లేకపోవడం వేరు. రెండిరటికీ చాలా తేడా వుంది.

mithunam
శ్రీరమణ కథలో అప్పదాసు బావమరిది పాత్ర ఒకటి వుంటుంది. అది సినిమా రూపంలోకి వచ్చేసరికి భరణి ఎందుకో తీసివేసాడు.
2012 కేన్స్‌ ఫిలమ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రం అవార్డు పొందిన ‘అమోర్‌’’ అనే సినిమాకు, మన మిథునం సినిమాకు చాలా పోలికలున్నాయి. ఇది వృద్ధ దంపతుల కథ. అదీ వృద్ధ దంపతుల కథే. ఆ సినిమాలోను వృద్ధ జంట బయటివారిని ఎవరినీ తమ యిటికి రానివ్వరు. తాము ఎక్కడికీ వెళ్ళరు భార్యకు పక్షవాతం వస్తే చూదామని కూతురు వస్తే, కూతురును చూడటానికి కూడా వాళ్ళు యిష్టబడరు. వాళ్ళిద్దరే ఒక లోకంగా వుంటారు.
2010 అక్టోబర్‌లోవచ్చిన సుప్రసిద్ధ రచయిత వి. చంద్రశేఖర్‌రావుగారి ‘‘ఆదివారం’’ కథ గుర్తుందా? హైద్రాబాద్‌లాంటి మహానగరంలో ఒక అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా వుండే ఇద్దరు వృద్ధ దంపతుల కథ అది. ఉదయం నుండి సాయంత్రం వరకూ వాళ్ళిద్దరూ తలుపులు మూసుకొనే వుంటారు. ఉదయం లేచిన దగ్గర్నుండీ రాత్రి నిద్రపోయే వరకు. కాఫీ చేసుకుని తాగుతారు. వంట వండుకుంటారు. టి.వి. చూస్తారు. విశ్రాంతి తీసుకుంటారు. కబుర్లు చెప్పుకుంటారు. ప్రొద్దున్నే ఎవరో తలుపు తట్టిన చప్పుడయితే తలుపు తీద్దాము అనుకుని తీయరు. ఆ తలుపు అలా మధ్యాహ్నం దాకా మోగుతూనే వుంటుంది. అయినా వాళ్ళు తీయరు సాయంత్రం ఎవరిదో అంతిమ యాత్రకి సన్నాహాలు జరుగుతున్నాయి అని తెలిసినా తలుపు తీయరు. కథ అయిపోతుంది.
మిధునం, అమోర్‌, ఆదివారం ఈ మూడు కథలలోనూ వృద్ధ జంటల ప్రవర్తన ఒకే రకంగా వుంటుంది. మిథునం తెలుగు సినిమా, అమోర్‌ ఫ్రెంచి సినిమా. భాషలు, ప్రాంతాలు సరిహద్దులు లేకుండా వృద్ధ జంటల ప్రవర్తన ఒకేలా ఎందుకు వుంది?
ఒంటరిగా వుండాలని కోరుకోవడం అంటే సామాజిక జీవనం లేకపోవడమా? ఈ మూడు జంటలూ సమాజంతో నిరంతరం సంభాషిస్తూనే వుంటారు. సమాజంలో జరుగుతున్న అల్లకల్లోలాలు అన్నింటినీ గమనిస్తూ వుంటారు. ఆ సామాజిక సంఘర్షణలు ఏవీ తమ జీవితాలను ప్రభావితం చెయ్యకుండా జాగ్రత్త పడుతూవుంటారు. మరో మాటలోచెప్పాలంటే సమాజంలో చురుకయిన పాత్ర పోషించడానికి (యాక్టివ్‌ పార్టిసిపేషన్‌) ఇష్టపడరు. వాళ్ళది పాసివ్‌ రోల్‌. వృద్ధులకు ఈ తరహా ప్రవర్తన ఎందుకు వస్తుంది? అందుకు కారణం ఎవరు?
ఈ సమస్యలోతులలోకి వెళితే తప్పు మనదే అని మనం గుర్తించాల్సివస్తుంది. మనమెప్పుడూ వృద్ధులని మనుషులుగా గుర్తించం. వాళ్ళ పెద్దరికాన్ని గౌరవించం. వాళ్ళ సలహాలు పాటిస్తామా లేదా! అనే విషయం పక్కన పెడదాం? అసలు వాళ్ళ మాటలు కూడా వినడానికి యిష్టపడం. చొరవ తీసుకొని ఏదయినా చెప్పపోతే అంతా చాదస్తంగా కొట్టిపడవేస్తాం.
అలాంటప్పుడు వృద్థులు ఏం చేస్తారు? తమలోకి తాము ముడుచుకుంటారు. సాధ్యమయినంత వరకు మన కంటపడకుండా ఒంటరిగా దాక్కుంటారు. మన అమ్మా నాన్నాలతో కలసి మనం ఎప్పుడయినా భోజనం చేస్తామా? వాళ్లకోసం పదినిమిషాలు కేటాయిస్తామా? మన ఉరుకుల పరుగుల జీవితం మనది. సమాజం అంటే మనమేకదా? మనం వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళు మనల నుండి దూరం జరుగుతారు. వాళ్ళకి సమాజ జీవనం ఉన్నాట్టా? లేనట్టా?
సామాజికి జీవితం అంటే నిత్యం సమాజంలో సంభాషించడమే కదా! ఈ వృద్ద జంటలు నిత్యం సమాజంతో మాట్లాడుతూనే ఉంటారు. కాకపోతే వాళ్ళ మాధ్యమం వేరు. మన మీడియం వేరు.
అమోర్‌లో భార్యకి పక్షవాతం వస్తే హాస్పిటల్‌కి తీసుకుని వెళతాడు భర్త. భార్య బట్టలు వుతికాడని ఆకతాయి పిల్లలు అల్లరి చేస్తే కర్ర పట్టుకుని అప్పదాసు వెంటపడతాడు. టి.వి. చూస్తూ రాజకీయాలు చర్చిస్తారు. ఆదివారం దంపతులు. ఇదంతా ప్రతి స్పందనే కదా… మరి సామాజికి జీవితం లేనిది ఎక్కడ.?
నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ ప్రభావాలు, ఎదిగి వచ్చిన ఒక కొత్తతరం జరుగుతున్న అస్తిత్వ ఉద్యమాలు, బ్రాహ్మణులలో కూడా ఒక నూతన చైతన్యం తీసుకుని వచ్చాయి. వాళ్ళని వాళ్ళు అసెర్ట్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవ్వాళ బ్రాహ్మణులు ఎంత మాత్రమూ అగ్రవర్ణం కాదు. ఉగ్రవర్ణమూ కాదు. ఎప్పుడో జరిగిన తప్పులకి మేము ఎందుకు శిక్ష అనుభవించాలని అడుగుతున్నారు. ఇది వస్తున్న మార్పు.
1980 లలో వచ్చిన దేవత సినిమా సమయానికి 2012లో వచ్చిన దేనికైనా రెడీ సినిమా సమయానికి బ్రాహ్మణులలో వచ్చిన మార్పు గుణాత్మకమయినదే.
దేవత సినిమాలో ప్రాత: సంధ్యవేళ నదీతీరంలో సంధ్యావందనం చేసుకునే ఒక బ్రాహ్మణుడిని మోహన్‌బాబు కాలెత్తి నడుంమీద తంతే బ్రాహ్మణులు కూడా హాస్యంగా సరిపెట్టుకున్నారు. కానీ దేనికైనా రెడీ సినిమా సమయానికి వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేశారు. రాస్తారోకోలు చేశారు. బంద్‌లు చేశారు. 1980లలో మొలకు చుట్టిన యజ్ఞోపవీతాన్ని 2012లో మామూలుగా ధరించారు. ఇదంతా అస్తిత్వ ఉద్యమాల పుణ్యమే! ఇతర అస్తిత్వ ఉద్యమాలని చూసినట్లే దీనిని కూడా చూడాలి. తప్పదు.
ఇవ్వాళ సమాజంలో బ్రాహ్మణుల ఆధితప్యం లేదు. ఆర్ధికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ వాళ్ళ చుట్టూ ఏ పరిభ్రమణనూ జరగడం లేదు. ఆధిపత్య వర్గాలు ఏవో అందరికీ తెలుసు. అటువంటప్పుడు బ్రాహ్మణులు మిధునం లాంటి సినిమాల ద్వారా కోల్పోయిన ఆధిపత్యాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తారని అనుకోలేము. ఒక వేళ వాళ్ళు అలాంటి ప్రయత్నం చేసినా అది వ్యర్ధ ప్రయత్నమే అవుతుంది.
నాగప్పగారి సుందర రాజు కథను సినిమా తీసినా, వేముల ఎల్లయ్య కక్కను సినిమా తీసినా తెలుగు సమాజం మిథునం సినిమాను చూసినట్టే చూస్తారు. సాహిత్య రూపాలుగా వాటి పేరు ప్రఖ్యాతులను ఎవరయినా అడ్డుకున్నారా? వాటికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఎవరయినా కబ్జా చేశారా… లేదే!
సినిమా తీయడానికి అతి ముఖ్యమయిన నిర్మాత ఎవరయినా వుంటే వాటిని సినిమాలుగా తీయవచ్చు. అవార్డులు కూడా పొందవచ్చు. చోమనుడి డప్పును, కన్నడ ప్రేక్షకులు అదరించినట్లే కక్కనూ, అంటరాని వసంతాన్ని తెలుగు ప్రేక్షకులూ ఆదరిస్తారు.
ఈ వ్యాసంలో జి.ఎస్‌. రామ్మోహన్‌ ఒక మాట అన్నారు. తెలుగుదేశం నుండి అమెరికా లేదా మరే ఇతర దేశాలకయినా వలస వెళ్ళిన ప్రజలను నోస్టాల్జియా పట్టి పీడిస్తూ వుంటుంది. తెలుగు సంస్కృతికీ, సంప్రదాయానికి దూరం అయిపోయామనే బెంగ ఎక్కువగా వుంటుంది. ఆ బెంగలో నుండి సత్యనారాయణ వ్రతాలు, బతకమ్మా పండగలూ జరుపుకుంటారు. పూజలు, పున:స్కారాలు చేస్తారు. అంతవరకు మనం ఆమోదించవచ్చు. కానీ వాళ్ళు తెలుగు సంస్కృతి గురించి, చరిత్ర గురించీ ఉపన్యాసాలు, యివ్వడమో, పరిరక్షకులుగా ఫోజులెట్టడమో చేస్తేనే అసలు సమస్య.
అంటే ఏ విషయాన్ని అయిన ఆమోదించడానికి ఒక స్థాయి వుంటుందన్నమాట. ఆ స్థాయి దాటితే అది ఆమోదనీయం కాదు. యాక్సెప్టబుల్‌ స్టేజ్‌. ఆమోదనీయ స్థాయి, వ్యక్తులకీ సమాజాలకీ వేర్వేరు స్థాయిలలో వుంటుంది. స్త్రీ పురుషులు మధ్య ప్రేమ కూడా ఈ స్థాయి దాటితే బానిసత్వంగా మారుతుంది.
అప్పదాసు, బుచ్చిలక్ష్మీల మధ్య వున్న సంబంధాలను చేస్‌గా చేసుకుని స్త్రీ పురుషుల మధ్య వుండే అసమా సంబంధాలను ప్రస్తావిస్తూ ఈ సినిమా పాత విలువలని స్థిరీకరించడానికి ప్రయత్నం చేసిందంటారు రామ్మోహన్‌.
అప్పదాసు ఉయ్యాల బల్లమీద ఊగడమూ, బుచ్చిలక్ష్మీ గడప మీద తలపెట్టుకుని పడుకోవడమూ, అనే అసమం సబంధాలను అప్పదాసు బుచ్చిలక్ష్మీ బ్టటలు ఒక సారి ఉతకడం ద్వారా సరికావని, కానీ అలా చూఏపిండం ద్వారా భరణి షుగర్‌ కోటెడ్‌ ఫిల్‌ అందించి పాత విలువలను స్థిరీకరించడానికి ప్రయత్నం చేశాడు అని రామ్మోహన్‌ వ్యాఖ్య.
స్త్రీ పురుష సంబంధాలలో ఆమోదనీయ స్థాయి ఒక్కొక్కళ్లకి ఒక్కొక్క రకంగా వుంటుంది. బుచ్చిలక్ష్మీ ఆమోదనీయ స్థాయి మనకు తెలియదు. కనుక ఒక పెద్ద వ్యాఖ్య చేయడానికి ఒక చిన్న రిఫరెన్స్‌ చాలదేమో!
ప్రవాసాంధ్రులు సత్యనారాయణ వ్రతాలు జరుపుకోవడము. బతకమ్మలాడటం వరకు సంస్కృతి పరిరక్షకులుగా రామ్మోహన్‌కి పనికి వస్తారు. అది తన ఆమోదనీయ స్థాయి దాన్ని దాటితే రామ్మోహన్‌కి నచ్చదు. అలాగే తన ఆమోదనీయ స్థాయి దాటితే అప్పదాసుకూడా బుచ్చిలక్ష్మీకి నచ్చడు.
అందరూ ఆమోదించే స్థాయి స్త్రీ పురుష సంబంధాలలో వుండవు. కనుక ప్రేమ రూపంలో హింస కొనసాగుతూనే వుంటుంది. స్త్రీ పురుష సంబంధాలు స్టేటిక్‌ కాదు. డైనమిక్‌. కనుక మన యిష్టాయిష్టాలతో సంబంధం లేకండా మారుతూ వుంటాయి. వాటిని ఎవరూ పనికట్టుకుని స్థిరీకరించనవసరం లేదు. ఇది రామ్మోహన్‌కి కూడా తెలుసు.
జి.ఎస్‌. రామ్మోహన్‌ వ్యాసాలంటే నా కిష్టం. మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో రాసిన ‘‘వై దిస్‌ కోల వెర్రి’’ అంటే మరీ ఇష్టం.
మిథునం లాంటి బలహీనమయిన సినిమా గురించి బలమయిన వ్యాసం రాసిన రామ్మోహన్‌కి అభినందనలు.

వంశీకృష్ణ

సినిమాలు : మైలురాళ్ళూ, తంగేడు పూలూ!

వెంకట్ శిద్దారెడ్డి

వెంకట్ శిద్దారెడ్డి


మొదలుపెట్టేముందు నాదొక కన్ఫెషన్.

ఇలాంటి వ్యాసాలు రాయాలనుకోవడమే నాకు సిగ్గుగా ఉంది. ఇవన్నీ ఎప్పుడూ ఎవరితోనూ చెప్పుకోనివి. బహుశా నేను మారుమూల పల్లెటూరివాడినని అందరికీ తెలిసిపోతుందనేమో ఇవన్నీ ఎప్పుడూ ఎవరికీ చెప్పుకోలేదేమో. లేదా ఇవన్నీ అంత గొప్పగా చెప్పుకోవాల్సిన విషయాలేమీ కాకపోవడం కూడా కారణం అయ్యుండొచ్చు. అఫ్సర్ గారు సారంగ కి రాయమని అడిగినప్పుడు, ఏమి రాయాలో మీరే చెప్పండి అని అడిగాను. అంటే ఏదడిగితే అది రాసిచ్చేంత ఉద్దండపండితుడునని కాదు. అల్రెడీ సినిమాలకే అంకితమైన వెబ్ సైట్ నడుపుతున్నాను; అక్కడ వందలకొద్దీ రాసి పారేస్తున్నాను కాబట్టి సినిమా గురించి నవతరంగం లో ప్రచురించలేని వ్యాసాలేవైనా సారంగ కి రాస్తే బావుంటుందని నా ఆలోచన. లేదంటే ఒక వైపు నా సొంతదైన నవతరంగం కి అన్యాయం చేసినట్టవుతుందని నా బాధ.

ఆ క్రమంలో పుట్టిన ఐడియానే ఇది. నా సినిమా అనుభవాలు రాయమని సలహా ఇచ్చారు. మొదట్లోనే చెప్పినట్టు ఈ వ్యాసాలు రాయాలంటే బోలెడంత సిగ్గుగా ఉంది. అందుకు ఇంకో కారణం కూడా ఉంది. అల్రెడీ సినిమాల్లో పెద్ద పొడిచేసినట్లు అప్పుడే memoirs, జ్ఞాపకాలు గట్రా అవసరమా అని అంతరాత్మ తీవ్రంగా ఘోషించింది.అంత బాధపడీ రాయడమెందుకులే అనుకున్నాను. కానీ ఈ ఆలోచన పుట్టినప్పటినుంచీ జ్ఞాపకాలు తన్నుకుని బయటకు వస్తున్నాయి. అరే లోలోపల ఇంత దాగుందా అని అప్పుడనిపించింది.

సినిమా చూడ్డమంటే నాకు చిన్నప్పటి నుంచీ చాలా ఇష్టం. కానీ సినిమా చూడ్డంతో నేను ఆగిపోను. ఆ సినిమా బావుంటే చాలా సార్లు ఆ సినిమా చూసి అందులోని అంశాలను పరిశీలించడం కూడా నాకు ఇష్టమైన పని. అలా చేస్తూ చేస్తూ ఆ విషయాల గురించి రాయడం కూడా అలవాటయింది. మొదట్లో “మౌత్ షట్” అనే సైట్ లో మొదలుపెట్టి, ఆ తర్వాత “24fps.com” అనే సైట్ మొదలు పెట్టి, కొన్ని రోజులు “ప్యాశన్ ఫర్ సినిమా” లో రాసిన తర్వాత చివరికి నవతరంగం స్థాపించాక సినిమాల గురించి వీలైనప్పుడల్లా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ రాస్తునే ఉన్నాను. అయితే చూసిన సినిమాల గురించి కాకుండా అసలు సినిమా చూడడం, సినిమాలు చూస్తూ ఫిల్మ్ మేకింగ్ ప్రక్రియ గురించి అవగాహన పొందడం లాంటి అనుభవాల గురించి, సామాన్య ప్రేక్షకుడిగా రాస్తున్న వ్యాసాలు ఇవి.

అయితే ముందే చెప్పినట్టు నా కన్ఫెషన్ ఏంటంటే… జీవితంలో ఏదో సాధించేశాక తీరుబడిగా కూర్చుని, గడిచిపోయిన జీవితాన్ని నెమరువేసుకుంటూ, దాటిన మైలు రాళ్లను లెక్కపెట్టుకుంటూ, చేసిన తప్పొప్పుల్ని బేరీజు వేసుకుంటూ రాసే ఆటోబయోగ్రఫీ కాదిది. చిన్నప్పుడు ఏ లక్ష్యం లేకుండా మైళ్ల కొలది రోడ్ మీద నడుస్తూ, మైలు రాళ్ల పక్కన ఏపుగా ఎదిగిన తంగేడు పూలు ఏరుకున్నట్టుగా, నా సినిమా వ్యూయింగ్ మరియు ఇతరత్రా జ్ఞాపకాలను నెమరు వేసుకునే వ్యాసాలు ఇవి.

 -వెంకట్ సిద్దారెడ్డి

——————————————————————————————————————————————————————————-

  1. మొట్టమొదటి జ్ఞాపకాలు

రాత్రయింది. ఊరంతా చీకటి. కానీ ఊరు ఊరంతా సందడిగా ఉంది. ఆ రోజు మా ఊర్లో సినిమా ప్రదర్శిస్తున్నారు. బహుశా మా ఊర్లో అదే మొదటి సినిమా ప్రదర్శన అనుకుంటాను. అప్పటికి నా వయసు ఎంతో కూడా నాకు తెలియదు. ఊరిలోని పీర్ల చావిడి దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశంలో సినిమా ప్రదర్శన కి ఊరు ఊరంతా తరలి వచ్చింది. నిజానికి ఈ విషయాలేవీ నాకు గుర్తు లేవు. అసలు ఆ రోజు నేను ఎవరితో కలిసి సినిమాకెళ్లానో కూడా నాకు గుర్తు లేదు. చాలా ఏళ్ల తర్వాత మా అమ్మను అడిగితే నా చిన్నప్పుడు ఊరికి జెనరేటర్ తెచ్చి, తెరమీద సినిమా ప్రదర్శించినట్టు చెప్పింది కానీ అమ్మకి ఆ సినిమా పేరేదో గుర్తులేదు. కానీ నాకు బాగా గుర్తుంది. ఆ సినిమా పేరు అగ్గి బరాటా. ఆ రోజు రాత్రి సినిమా కి వెళ్లడం కానీ, తిరిగి రావడం కానీ, సినిమా చూస్తుండగా నేను పొందిన అనుభవం కానీ ఏదీ గుర్తు లేదు.  కానీ ఆ రోజు రాత్రి నేను చూసిన సినిమాలో ఒకే ఒక్క ఇమేజ్ మాత్రం నాకు ఇప్పటికీ గుర్తుంది. “ఒక యువతి తెర తీసుకుని బయటకు వస్తుంది. బయటకు రాగానే పిచ్చి పట్టిన దానిలా వేప రెమ్మలు చేతిలో పట్టుకుని గంతులేస్తుంది,” ఇదే నాకు గుర్తున్న ఇమేజ్.’

aggibarata

చాలా ఏళ్ల వరకూ నాకు సినిమా అంటే ఇదే ఇమేజ్ గుర్తుకొచ్చేది. అప్పట్లో అంటే కుదర్లేదు కానీ, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక చాలా సార్లు, అగ్గి బరాటా సినిమా చూసి అసలిలాంటి సీన్ ఇందులో ఉందో లేదో తేల్చుకోవాలనుకున్నాను. కానీ ఎందుకో మనసు ఒప్పేది కాదు. నా జ్ఞాపకం అబద్ధం అవుతుందేమోనని భయం అయివుంటుంది. కానీ ఈ వ్యాసం రాయడానికి పూనుకున్నాక ఆ పని చెయ్యక తప్పలేదు. అగ్గి బరాట సినిమా చూశాను. నా జ్ఞాపకం నిజమే. కానీ నాకు గుర్తున్న దానికంటే కొంత వ్యత్యాసం ఉందా సన్నివేశంలో. నిజానికి ఆ దృశ్యాలు “మల్లెలమ్మా…మల్లెలో” అనే పాటలో వచ్చే కొన్ని దృశ్యాలు. అందులో నాకు గుర్తున్నట్టుగానే హీరోయిన్ రాజశ్రీ ఒక గుడారం లోనుంచి బయటకు వస్తూ తెర తొలిగించుకుని వస్తుంది. కాకపోతే వేపాకులతో గంతులు వేసేది మాత్రం ఆమె కాదు; మారువేషం లో ఉన్న ఎన్టీయార్.

ఇదీ నా మొదటి సినిమా జ్ఞాపకం.

*****

అలా జ్ఞాపకాల త్రోవలో వెళ్తూ వుంటే నాకు గుర్తుకొచ్చే రెండవ జ్ఞాపకం, కొండవీటి సింహం సినిమా గురించి.

మా అమ్మమ్మ వాళ్ల ఊర్లో మూడు థియేటర్లు ఉండేవి. రామకృష్ణ, శ్రీనివాస, వెంకటేశ్వర. ఈ సినిమా రామకృష్ణ లో చూసినట్టు బాగా గుర్తు.

అగ్గిబరాటా లాగే కొండవీటి సింహం గురించి కూడా నా జ్ఞాపకాలు అన్నీ లీలగానే గుర్తుకొస్తాయి. ఎవరితో నేను ఆ సినిమాకెళ్లానో తెలియదు. కానీ నాకు బాగా గుర్తున్న విషయం మాత్రం థియేటర్ బయట నేను నిల్చుని ఉన్నాను. థియేటర్ చుట్టూ కొండవీటి సింహం పోస్టర్స్ వరుసగా పేర్చి ఉన్నాయి. అక్కడ్నుంచి ఎప్పుడు థియేటర్ లోపలకి వెళ్లానో, అప్పుడు నా వయసెంతో ఏమీ గుర్తు లేవు. కానీ థియేటర్లో కూర్చుని, సత్యనారాయణ, ఎన్టీయార్ లు ఒక పడవలో ఫైట్ చేస్తుండగా నేను ఉత్కంఠగా చూస్తుండడం మాత్రం గుర్తుంది. ఆ తర్వాత చాలా సార్లు అసలా సినిమాలో ఆ ఫైట్ ఉందా లేదా అని నివృత్తి చేసుకుందామనుకున్నాను. కానీ అలాంటి ప్రయత్నం చెయ్యలేదు. ఇప్పుడు యూట్యూబ్ లో సినిమా అంతా ఫాస్ట్ ఫార్వార్డ్ లో చూస్తుంటే సినిమా చివరిదాకా ఎక్కడా అలాంటి ఫైట్ లేకపోవడంతో కొంచెం నిరాశపడుతుండగా, సినిమాలోని ఆఖరు మూడో నిమిషంలో వచ్చిన పడవ ఫైట్ దృశ్యాలు చూసి ఆనందపడ్డాను.

 

*****

మొదటి రెండు జ్ఞాపకాల్లో కేవలం నేను మాత్రమే ఉన్నాను. కానీ ఈ మూడో దాంట్లో మా బాబాయి ఉన్నాడు; అతని మిత్రులు కూడా ఉన్నారు. అప్పట్లో మా ఊరికి అర్టీసి బస్సులు వచ్చేవి కావు. ఒక ప్రైవేట్ బస్ మాత్రం మూడు సార్లు వచ్చేది. రాత్రి ఎనిమిదింటికి వచ్చిన బస్ రాత్రికి ఊర్లోనే ఉండి, వేకువ జామునే బయల్దేరేది. “నైట్ హాల్ట్” బస్ అనే వాళ్లం అప్పుడు. అయితే రాత్రి ఎనిమిదింటి నుంచి ఖాళీగా ఉన్న బస్ ని ఊర్లోని కుర్రాళ్ళు బుక్ చేసుకుని టౌన్ కి వెళ్లి సెకండ్ షో చూసి వచ్చేవాళ్ళు. అలా నేను కూడా మా బాబాయి వాళ్లతో వెళ్లి చూసిన సినిమా రంగూన్ రౌడి.

 

అసలు బస్ ఎక్కినదీ గుర్తు లేదు. టౌన్ కి వెళ్లింది అసలే గుర్తు లేదు. ఈ సినిమా గురించి అంతంత మాత్రమే గుర్తున్న కొన్ని విషయాలు ఏంటంటే, సినిమాలో చిన్న పిల్ల బర్ట్ డే పార్టీలో పాడే “ఓ జాబిలీ” పాట, ఇంటర్వెల్ లో తిన్న సమోసాలు. బహుశా నేను సమోసా తినడం అదే మొదటి సారి అనుకుంటాను. ఆ రోజు తిన్న సమోసా రుచి, క్యాంటీన్ లోనుంచి గుబాళించిన ఉల్లిపాయల వాసన, రాత్రి తిరిగి బస్ లో వస్తుంటే అందరూ కలిసికట్టుగా పాడిన “ఓ జాబిలీ” పాట… ఇవీ రంగూన్ రౌడీ జ్ఞాపకాలు.

jayaprada

*****

బహుశా ఇవన్నీ నేను చాలా చిన్నప్పుడు చూసిన సినిమా జ్ఞాపకాలు అయ్యుండాలి. ఈ మూడు సినిమాల కథలు, నటీనటులు ఎవరూ గుర్తులేకుండా చూసినవి. ఆ తర్వాత కాలంలో ఈ సినిమాల గురించి చాలా వివరాలు తెలిసినప్పటికీ నాకు మొట్టమొదట జ్ఞాపకం వచ్చేవి మాత్రం ఈ విషయాలే!

జస్ట్ ఫర్ యూ..

ప్రసాద మూర్తి

ప్రసాద మూర్తి

అక్షరాల్లేని కవిత కోసం

అర్థాల్లేని పదాల కోసం

పదాల్లేని భావాల కోసం

వర్ణాల్లేని చిత్రాల కోసం

రాగతాళలయరహితమైన

సంగీతం కోసం

పట్టాల్లేని రైలు కోసం

నగరాల్లేని నాగరికత కోసం

ఆఫీసుల్లేని ఉద్యోగాల కోసం

విడివిడి ఇళ్ళు లేని

అందమైన పల్లెకోసం

తుపాకులు సంచరించని  అడవి కోసం

నేను కాని నన్ను పిలిచే

నీవి కాని నీ చూపుల కోసం

నీకూ నాకూ మధ్య

అవసరాలేవీ  అవసరమేపడని

ఒక్క పలకరింత కోసం

ఒక్క కౌగిలింత కోసం..

17/10/2013

Salvador Dali Paintings 23

ప్లీజ్ క్లోజ్ ద డోర్

మూసేయ్

కొన్నిసార్లు కళ్లు మూసేయ్

కొన్నిసార్లు చెవులు మూసేయ్

వీలైతే అన్నిసార్లూ నోరు మూసేయ్

ఎందుకురా

హృదయాన్ని అలా బార్లా తెరిచి కూర్చుంటావ్?

నిశ్చల శూన్యంలోకి

చూపుల్ని బుడుంగ్ బుడుంగుమని విసురుతూ-

ఖాళీ ఇన్ బాక్స్ ని

క్లిక్కు క్లిక్కుమని నొక్కుకుంటూ నొచ్చుకుంటూ-

ఎందుకు చేతుల్ని

అలా చాపిచాపి నిల్చుంటావ్?

నిద్రపోతున్న రోడ్డు మీద

నీకు మాత్రమే వినిపించే

అడుగుల చప్పుడు కోసం ఒళ్ళంతా రిక్కిస్తూ-

మూసేయ్

చాచిన చేతుల్నిచటుక్కున

జ్ఞా పకాల జేబుల్లోకి తోసేయ్

మూసేయ్

గుండెనీ దాని గుర్తుల్నీ.

లేదంటే అదలా సొద పెడుతూనే ఉంటుంది

ప్లీజ్ క్లోజ్ ద డోర్.

-ప్రసాద మూర్తి

ఒక హుషారు పూట

 

లాలస

లాలస


పసి పువ్వు పసి పువ్వూ తడుముకున్నట్లు ,మూడు నెలల పాపాయి పాల బుగ్గల మీద మూడేళ్ళ చిన్నారి చిరు ముద్దు- విలోమ సౌందర్యం కుప్పేసినట్లు ,నల్లటి నేల మీద రాలిన తెల్లటి పూల సొగసు- జ్ఞాపకం జ్ఞాపకంతో కరచాలనం చేసినట్లు,పాత పాటల వరుస కచేరీ- ప్రశ్నకు ప్రశ్నే సమాధానం అన్నట్లు , నిద్రకు స్వప్నం యక్షప్రశ్నలు -ఏమి జరుగుతుందో తెలీయనట్లు, వర్షానికీ  అంటిన తడి

 

ఒక ఉల్లాసపు మాట

 

అనంతాకాశం చూడాటానికి రెండే చిన్న కళ్ళు చాలు- కోటి నక్షత్రాలూ తళుక్కుమనేదీ వాటి నీలిమలోనే.- రెండు చిన్న కళ్ళున్న  అతని లేదా ఆమె అరి చేతి నుంచే మధ్యాహ్నం తన నాలుగు ముద్దలూ తింటుంది- ఒక గడ్డిపోచకు కిరణాల వెలుగు తగులుతుంది.- సముద్రం నుంచి నది వెనుతిరిగి ఎడారి తో స్నేహం చేస్తుంది- వూవొచ్చి సీతాకోకచిలుక మీద పూస్తుంది

45906960

ఒక దిగులు పాట

 

తోటలో వణుకుతున్న ఆకు లాంటి నిన్ను నువ్వు వెళ్ళి పట్టుకునేలోపు

గాలి ఎత్తుకు వెళ్ళిపోయింది.

పువ్వు మనసుకు ముల్లు పూచింది.

నిన్నా మొన్నల పలకరింపులో ఇవాళ అదృశ్యమైపోయింది.

– లాలస

చిత్రరచన: పికాసో

‘రంగు రంగుల జ్ఞాపకాలు’…మీ ముంగిట్లో…వచ్చే గురువారం నుంచి…!

memories-1

రాత్రయింది. ఊరంతా చీకటి. కానీ ఊరు ఊరంతా సందడిగా ఉంది. ఆ రోజు మా ఊర్లో సినిమా ప్రదర్శిస్తున్నారు. బహుశా మా ఊర్లో అదే మొదటి సినిమా ప్రదర్శన అనుకుంటాను. అప్పటికి నా వయసు ఎంతో కూడా నాకు తెలియదు. ఊరిలోని పీర్ల చావిడి దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశంలో సినిమా ప్రదర్శన కి ఊరు ఊరంతా తరలి వచ్చింది. నిజానికి ఈ విషయాలేవీ నాకు గుర్తు లేవు. అసలు ఆ రోజు నేను ఎవరితో కలిసి సినిమాకెళ్లానో కూడా నాకు గుర్తు లేదు.

– సినిమా ఒక అందమయిన జ్ఞాపకం. అది నిజంలాంటి కల. కలలాంటి నిజం. ఈ రెండీటి మధ్యా ఊగిసలాడే మనం! ఆ జ్ఞాపకాల తెర తీస్తున్నారు వెంకట సిద్దా రెడ్డి మీ కోసం! నెలకో సారి మీ ముందు!

బానిసకొక బానిసకొక బానిస!

drushya drushyam-9 photoఒకరిని చిత్రించడం ఒకటి.
-అది మనిషిదైతే అతడి అంతర్ముఖం కనిపిస్తుంది.ఇద్దరిని చిత్రించడం మరొకటి.
-అది ఆలుమొగలదైతే వాళ్లిద్దరి అనుబంధం కనిపిస్తుంది. స్నేహితులదైతే అనురాగం వ్యక్తమవుతుంది.ముగ్గురిని చిత్రించడం మాత్రం పూర్తిగా భిన్నం.
ఎందుకో అది సమాజాలనూ, ప్రపంచాలనూ చూపినా చూపుతుంది!

+++

అవును. ఒక చిత్రంలో గనుక ముగ్గురు ఉన్నారూ అంటే ఆ చిత్రం వ్యక్తులను దాటుతుంది. సామూహికతను మెలమెల్లగా చెప్పడానికి ఆ ఛాయాచిత్రం విశ్వ ప్రయత్నం చేస్తుంది. ముగ్గురు లేదా నలుగురు ఉన్నారూ అంటే అది సంఘమే అవుతుంది. మనిషి హఠాత్తుగా ఒక సంఘటనలో భాగంగా లేదా ఒక సన్నివేశంలోని పాత్రలుగా వ్యక్తమవుతారు. ఒక ప్రవహిస్తున్న ధారకు సంబంధించిన వాహికగా మారి మనల్ని ఆశ్చర్యపరుస్తారు. కలవర పరుస్తారు. లేదా ఆనందపారవశ్యానికి గురిచేస్తారు. ఈ చిత్రం అటువంటిదే. కాకపోతే ఇది మనల్ని మనకు పట్టి చూపే కాలమ్, అనుకుంటాను!

+++

ఒకానొక రోజు దీన్ని మన దేశ రాజధానిలో చిత్రించాను.

ముగ్గురూ ముగ్గురే.
ఒక బస్టాఫ్ వద్ద కూచున్న ఒక దినసరి కూలి, నిలబడ్డ ఒక సాఫ్టు వేరు ఉద్యోగి. ఒక చిరు కంపెనీలో పనిచేసే మరొకతను…ముగ్గురూ ఉన్నారు. అందరూ ఎదురు చూస్తున్నది బస్సుకోసమే.

నిజానికి వేచిచూపు.
ఆ వేచిచూపు అందరిదీ.
కానీ, వ్యక్తులు మాత్రం ఎవరికి వారు.

ఒక్కొక్కరు ఒక్కో రకం. ఒక్కొక్కరిదీ ఒక స్థితి.
చిత్రం చూస్తుంటే ఎవరి వయసేమిటో తెలుస్తున్నది. ఎవరి ఆర్థిక స్థోమత ఏమిటో కూడా అగుపిస్తూ ఉన్నది.
మనం ప్రభుత్వం నుంచి మనం ఏదేనీ ధృవీకరణ పత్రం తీసుకోవాలంటే, నింప వలసినవి ఉంటాయి గదా!
అవన్నీ ఈ చిత్రంలోనూ దాదాపుగా నిండి ఉండనే ఉన్నాయి.

అంతా ఒకే చిత్రము.
కులమూ మతమూ జాతీయతా నివాస స్థలమూ ఆర్థిక స్థోమతా అన్నీ ఏదో విధంగా తెలుపుతున్న చిత్రము.
అన్నిటికన్నా చిత్రం ఏమిటంటే, ఇది మూడో ప్రపంచ చిత్రం.

వేర్వేరు స్థాయి భేదాలతో…ధనికా పేదా మధ్యతరగతిగా కానవస్తున్న ఆ చిత్రం  అచ్చమైన మన దేశీయ చిత్రమే.
– The third world.

+++

ముగ్గురున్నారని కాదు.
బానిసకొక బానిసకొక బానిస గనుక!

విడగొట్టబడి…
అందరూ చౌరస్తాలో అపరిచితులై ఎదురుచూస్తూ ఉన్నారు గనుక!

~కందుకూరి రమేష్ బాబు

వీలునామా – 22 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

 

హేరియట్ ఫిలిప్స్ వ్యక్తిత్వం

ఆ రోజు ఎల్సీ లిల్లీ ఫిలిప్స్ కొరకు ఒక మంచి గుడ్డను తెప్పించి దానితో ఆమెకి అందమైన బోనెట్ (టోపీ) తయారు చేసింది. వదిన గారి అందమైన బోనెట్ చూసిన దగ్గర్నించీ హేరియట్ కి తనకీ అలాంటిదొకటుంటే బాగుండనిపించింది. మర్నాడు తనతో పాటు దుకాణానికొచ్చి, తనకీ అలాటి గుడ్డనే, వేరే రంగులోది కొనాలనీ,తనకీ అంత బాగా టోపీ కుట్టిపెట్టాలని ఎల్సీకి ఆఙ్ఞ జారీ చేసింది హేరియట్.

మర్నాడే దుకాణానికి బయల్దేరుతూ ఎల్సీని కూడా బయల్దేరదీసింది. వీళ్ళ కూడ బ్రాండన్ కూడా బయల్దేరాల్సి వచ్చింది. స్టాన్లీ ఇంట్లో లేడు, లిల్లీ, పిల్లలూ జేన్ తో కలిసి గదిలో చదుకుంటూన్నారు. అందువల్ల ముగ్గురూ దుకాణానికి బయల్దేరవల్సి వచ్చింది.

హేరియట్ కి తన బలహీనత తనకే తెలియదు. తెలిసి వుంటే కాబోయే భర్తతో కలిసి బట్టల దుకాణానికి వెళ్ళి వుండేదు కాదు. ఎల్సీకీ అంతవరకూ లిల్లీతో కలిసి వెళ్ళిన అనుభవమే కానీ, హేరియట్ తో కలిసి బయటికి వెళ్ళింది లేదు. అయితే ఎంతో చదువుకుని అత్యాధునికంగా అలంకరించుకునే హేరియట్ నించి అలాంటి సంస్కార హీనమైన ప్రవర్తన ఊహించలేదేమో, చాలా సిగ్గుపడింది. తనని సంప్రదిస్తే, తను కావలసిన ధరలో నప్పే రంగులు చకచకా ఎంపిక చేసి ఇచ్చేదే. అయితే హేరియట్ కి నాణ్యమైన బట్టా, నచ్చే రంగులూ కావాలి కానీ దుకాణ దారు చెప్పిన ధరతోటి ఆమె సాధారణాంగా ఏకీభవించదు.  ఆమె దుకాణంలో వున్న అబ్బాయిలని పరుగులు పెట్టించింది. తాను దుకాణంలో అలాంటి పని ఇదివరకే చేసి వున్నందువల్ల ఎల్సీ ఆ అబ్బాయిలని చూసి జాలి పడింది. పాపం, ఒకటి తర్వాత ఒకటిగా లెక్కలేనన్ని డబ్బాలు తెచ్చి పడేసారు వాళ్ళు. ఒక్కటీ హేరియట్ కి నచ్చలేదు.

పంతొమ్మిదో శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత రచయిత లే హంట్ అన్నాడట, “నువ్వు పెళ్ళాడబోయే అమ్మాయిని ఒక్కసారి బట్టల దుకాణానికి తీసికెళ్ళు. బయటికొచ్చినతర్వాత కూడా ఆమెనే పెళ్ళాడదలిస్తే పెళ్ళాడు,” అని. బట్టలకొట్లోని పనివాళ్ళతో ప్రవర్తనలోనే స్త్రీ వ్యక్తిత్వం బయటపడుతుందని ఆయన అభిప్రాయం.

నిజంగా మగవాళ్ళు పెళ్ళాడబోయే ముందు అమ్మాయిలకీ పరీక్ష పెడితే ఎంత మంది పెళ్ళిళ్ళవుతాయన్నది సందేహమే. దానికి తగ్గట్టు బట్టల దుకాణంలో బట్టలు చూపించే పని వారు ఏమాత్రం నోరూ, ఆత్మాభిమానమూ లేనట్టు ప్రవర్తిస్తారు. సహజంగా వుండే అలంకరణమీద ఆసక్తీ, లోకంలో వుంటూ అలవడే డబ్బాశా, ఆ సమయంలో ఎంతటి సౌమ్యురాలయిన స్త్రీనైనా సివంగిలా మారుస్తాయి.

బ్రాండన్ బట్టలకొట్లోని హేరియట్ ని ఏమాత్రమూ ప్రేమించలేకపోయాడు. అక్కడ హేరియట్ మొరటు ప్రవర్తనని చూసి సిగ్గుపడ్డ ఎల్సీ అతని కళ్ళకి ఎక్కువగా నచ్చసాగింది. అస్సలతనికి ఎల్సీ మీద హేరియట్ చలాయించే ధాష్టీకమే చిరాకెత్తించసాగింది. తన ప్రేమని నిరాకరించినా తనకామె పట్ల కోపమేమీ లేదని చెప్పే ఎల్సీతో అవకాశం వస్తే బాగుండు, అనుకున్నాడు బ్రాండన్.

అయితే అతనికా అవకాశం రాలేదు ఎప్పుడూ.

ఎన్నెన్నో దుకాణాలు వెతికీ, పెట్టెలన్నీ తెరిపించినతర్వాత బోనెట్ కి కావల్సిన లేసులూ, పువ్వులూ, గుడ్డా దొరికాయి. హేరియట్ తృప్తిగా నిట్టూర్చింది. చేతి గడియారం చూసుకుని కెవ్వుమంది.

“అయ్య బాబోయ్! ఎంత ఆలస్యం అయిపోయిందో! ఆకలవుతూంది. పొద్దుటిపూట బట్టలు కొనుక్కోవడం భలే సరదాగ వుంటుంది కదూ? హాయిగా కావలసినవన్నీ కొనుక్కుని భోజనాలకి లేవొచ్చు. అన్నట్టు, మనం ఇంటికెళ్ళేసరికి మనకోసం వదిన కానీ, పిల్లలు కానీ ఆగుతారనుకోను. బ్రాండన్, ఏదైనా మంచి రెస్టారెంటు చూస్తావా? భోజనం చేసేద్దాం. భోంచేసాక ఒక టాక్సీ సరేసరి. మగవాళ్ళతో రావాలోయ్, షాపింగుకి, ఏమంటావ్?” నవ్వింది.

“అలాగే హేరియట్. భోంచేసి టాక్సీలో ఇంటికెళ్దాం. నాకు పెద్ద కొంపలంటుకునే పనేం వుందని,” మామూలుగానే అన్నాడు బ్రాండన్.

“ ఏం మగాడివయ్యా! పెద్ద పన్లుంటే మాతో వచ్చేవాడివి కావన్నమాట! అంత తేలిగ్గా వుందా ఆడపిల్లలంటే? సరే, ఈ సారికి క్షమించి వదిలేస్తాలే!”

హేరియట్ వేళాకోళం చేసింది. ఆమె ఆశపడ్డట్టే బ్రాండన్ వాళ్ళని ఖరీదైన హోటల్ కి తీసికెళ్ళి భోంచేసాక గుర్రపు బగ్గీ కుదిర్చి ఇంటికి తీసికెళ్ళాడు.

“అసలు తన సొంతానికి ఒక గుర్రపు బగ్గీ పెట్టుకోవాలని నేను అన్నయ్యతో ఎన్నిసార్లు చెప్పానో లెక్క లేదు! ఈ ఒక్క విషయంలోనే నాకూ మా వదినకీ ఏకాభిప్రాయం. ఇలా మాటి మాటికీ ఇతర్ల మీద ఆధారపడాలంటే ఎంత విసుగు! పైగా, కిరాయి బగ్గీలని నడిపే వాళ్ళని చూస్తేనే నాకు భయం బాబూ! ఇంతకుముందు వీడేం పని చేసేవాడో కదా, వీడి బండిలో మనకిప్పుడేమేం జబ్బులు అంటుకుంటాయో కదా, అన్న భయం సహజమే కదా?”

“ఏమో మరి! అంత అసహ్యకరమైన ఆలోచనలు నాకైతే ఇంతవరకూ రాలేదు. నాకు సొంత బగ్గీ ఏదీ లేదు కూడా. మా వూళ్ళో గుర్రపు స్వారీ తప్ప వేరే దారి లేదు. మెల్బోర్న్ లో కూడా సాధారణ పౌరులు డబ్బిచ్చి గుర్రబ్బగ్గీ మీద వెళ్ళలేరు. ఈ లండన్ లో బగ్గీ కిరాయి ఎంత చవకా అని నేను ఆశ్చర్యపోయేను. మీరేమో సొంత వాహనాలకలవాటు పడి వీటిని చీదరించుకుంటున్నారు.”

“ఎల్సీ! మీ ఇంట్లో కూడా సొంతానికి ఒక గుర్రపు బగ్గీ వుండేదేమో కదా?”

“వుండేది కానీ, నాకెక్కువగా గుర్రపు స్వారీయే ఇష్టం. అయితే డాక్టరు ఫిలిప్స్ గారితో సాయంత్రపు పూట బగ్గీలో వెళ్ళడం కూడా బానే వుండేది. ఈ మధ్య కాలి నడక తప్ప ఇంకే సౌకర్యమూ లేకపోవడం తో నాకీ బగ్గీ లో హాయిగా వుంది.”

“డెర్బీషైర్ లో డాక్టరు గారితో కలిసి సాయంత్రాలు బయటికెళ్ళడం వల్ల మీ ఆరోగ్యం చాలా కుదుటపడినట్టుంది ఎల్సీ!” బ్రాండన్ అభిమానంగా అన్నాడు.

“అవునవును! నాన్నగారందుకే ఎల్సీ ఆరోహ్యం గురించి ఆందోళన చెందవలసిందేమీ లేదని అననే అన్నారు. మీరిద్దరు అక్క-చెల్లెళ్ళూ ఎందుకంత భయ పడ్డారో గాని! అంతే కాకుండా, నీ ఆరోగ్యానికి ఎడిన్ బరో కంటే లండన్ మంచిదేమో ఎల్సీ! ఇక్కడికొచ్చింతరవాత నువు దగ్గడమే వినలేదు నేను.”

“అవును, నా దగ్గు బాగా తగ్గిపోయింది. మనసు కూడా చాలావరకు కుదుటపడింది.”

“అది సరే కానీ, రేపటికల్లా టోపీ కుట్టేయగలగుతావా? రేపు సినిమాకెళ్ళేటప్పుడు పెట్టుకుందామనుకున్నా,” హేరియట్ అడిగింది.

“రేపటి లోగా కాదేమోనండి. మనం ఇంటికెళ్ళేసరికే ఆలస్యమవుతుంది. పైగా ఇవాళ ఫ్రాన్సిస్ని భోజనానికి రమ్మన్నాం. ఫిలిప్స్ గారు నన్నూ అందరితో కలిసి భోజనం చేయమన్నారు,” ఇబ్బంది పడుతూ చెప్పింది ఎల్సీ.

“అలాగా! ఏం చేస్తాం. ఆ టోపీ పెట్టుకుని వెళ్ళాలని చాలా ఆశపడ్డాను.”

“ఇవాళ ఫ్రాన్సిస్ తో కబుర్లు చెప్పుకుందాం రమ్మంది జేన్. భోజనానికి రానంటే ఫిలిప్స్ గారేమంటారో!” ఎల్సీ భయపడుతూ అంది.

“అయితే ఇవాళ రాత్రి భోజనాల దగ్గర అందరూ చేరతారన్నమాట. స్టాన్లీ నన్ను పిలవడం మర్చి పోయాడల్లే వుంది. అయినా సరే, నేనూ వచ్చేస్తా!” నవ్వుతూ అన్నాడు బ్రాండన్.

“నిన్ను పిలవడమేంటి బ్రాండన్? నీ ఇష్టం వచ్చినట్టు వస్తూ పోతూ వుంటావు గా మా అన్నయ్య ఇంటికి? అది సరే, ఎల్సీ, నువ్వు కొంచెం ప్రయత్నిస్తే టోపీ కుట్టడం అయిపోవచ్చు. నువ్వు ఎడిన్ బరోలో ఎంత వేగంగా బట్టలు కుట్టేదానివో నేను చూసాగా! రెండూ, రెండున్నరకల్లా ఇల్లు చేరుకుంటాం. బోలెడంత టైముంది నువ్వు కుట్టడానికి. మా వదినదీ అలాగే వేగంగా కుట్టి ఇచ్చేసావు గంట సేపట్లో!”

“వదిన గారి టోపీ పూర్తిగా కుట్టలేదండీ! ఆవిడదే రేపటి సినిమా వేళకి ఇచ్చేయాలి నేను. దాని పైన మీ టోపీ, పూర్తిగా కుట్టడానికి నాకు ఒక్క పూట చాలదేమో అని నా భయం. ”

హేరియట్ కోపంగా మూతి ముడుచుకుంది.

“సరేలే, ఎల్సీ! నాకు పెట్టుకోవడానికి ఇంకో టోపీ వుందిగా. మా వదినకైతే కొత్తది వుంది కానీ! మా అన్నయ్య చేసే గారాబంతో ఆవిడంటే ఎంత డబ్బైనా చెల్లిస్తుందీ, ఎంత ఖరీదైన అలంకరణైనా చేసుకుంటుంది. అసలంతంత డబ్బు తన కోసమే ఖర్చు చేసుకోవడానికి ఆవిడకి మనసెలా వస్తుందో! నేను చూడు ఎంత సాదా బట్ట కొనుక్కున్నానో, నా టోపీకోసం.  అయితే అది కుట్టింతర్వాత ఆవిడ టోపీ అంత అందగానూ వుండలి సుమా! వుంటుందా ఎల్సీ?”

“వీలైనంత అందంగా చేస్తానండి,” ఎల్సీ బదులిచ్చింది.

“అంత జాగ్రత్తగా డబ్బు ఎక్కువ ఖర్చు చేయకుండా బట్ట కొంటాను కాబట్టే నాకు బట్టల దుకాణంలో అంత సమయం పడుతుంది!”

బ్రాండన్ మర్యాదగా నవ్వి వూరుకున్నాడు.

“బ్రాండన్, నువ్వు కూడా వస్తున్నావు గా ఇవాళ భోజనానికి. అన్నట్టు నేనసలు ఫ్రాన్సిస్ హొగార్త్ ని ఇంతవరకూ చూడలేదు తెలుసా? అతని గురించి విని వుండడమే కాని. వాళ్ళ నాన్నా, మా నాన్నా స్నేహితులటగా? ఎలాటి వాడతను?” కుతూహలంగా అడిగింది హేరియట్.

“నాకు తెలిసినంతవరకూ సౌమ్యుడు, మర్యాదస్తుడు. జేన్, ఎల్సీలంటే ఎంతో అభిమానంగా వుంటాడు, కదూ ఎల్సీ?” బ్రాండన్ జవాబిచ్చాడు.

“ఓ! జేన్ కి ఇష్టమైనవాడైతే చాలా మంచి వాడన్నమాట. నాకు జేన్ చాలా నచ్చింది. మిగతా ఆడవాళ్ళలాగా తెలివి తక్కువగా వుండదు. అసలు మా నాన్నగారు మమ్మల్ని పెద్ద చదువులు చదివించిందే మేము మిగతా ఆడవాళ్ళలా కాకూడదని. అందుకే నాకు జేన్ అచ్చంగా నాలాటి మనిషే అనిపిస్తుంది. జేన్ చెప్పడం వల్లే నా మేనకోడళ్ళకి ఆ మాత్రం చదువు అబ్బుతుంది. అసలు నువ్వు కూడా టీచరుద్యోగం చేయి ఎల్సీ! మీ మావయ్య నీకందుకే చదువు చెప్పించి వుంటాడు.”

“మీ నాన్న కూడా నువ్వు టీచరుద్యోగం చేయాలని  నీకు చదువు చెప్పించారా హేరియట్?” బ్రాండన్ కఠినంగా అన్నాడు.

“లేదు, లేదు. మా సంగతి వేరు. మాకుద్యోగాల్తో ఏం పని? అయినా, జేన్ లా చదువులు చెప్పాలంటే మాకొచ్చే చదువులు చాల్తాయా ఏమన్నానా? పాపం, ఎల్సీకే, చదువుకున్న చదువంతా వృథా అవుతోంది.”

“నేర్చుకున్న ఏ చదువూ వృథా అవదు హేరియట్. తన విద్య వల్ల ఎంతమందికి ఎన్నివిధాల లాభమో ఎల్సీ ఎప్పుడూ నోరు విప్పి చెప్పదు. కానీ, పెగ్గీ వాకర్ ని అడుగు ఎల్సీ గురించి. అప్పుడు తెలుస్తుంది నీకు, ఇంకొకరి విద్యల విలువలు.”

“అబ్బ! నీకూ, మా అన్నయ్యకీ ఆ పెగ్గీ వాకర్ అంటే అంత ఇష్టం దేనికో అర్థం కాదు. స్టాన్లీకి కూడా పెగ్గీ మాటంటే తిరుగు లేదు!” వెటకారంగా అంది హేరియట్.

“అవును! స్టాన్లీ, నేనూ ఇద్దరమూ పెగ్గీ కెంతో ఋణపడి వున్నాం!”

“నువ్వు కూడానా బ్రాండన్? ఎందుకబ్బా? ఓ, తెలిసింది. మా వదినా పిల్లలని కాపాడి, చూసుకున్నట్టే, నువ్వూ జబ్బు పడితే సేవలు చేసిందటకదా పెగ్గీ?”

బ్రాండన్ ఒక్క క్షణం మౌనంగా వున్నాడు.

“లేదు హేరియట్. నా ప్రాణాలు నిలబెట్టినందుకు కాదు. పెగ్గీని చూసింతరవాతే నేను ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకున్నాను. అంత కార్య దక్షతా, ధైర్యమూ, త్యాగనిరతీ, నిజాయితీ, నేనైతే ఇంకెక్కడా చూడలేదు. ”

“మీ అమ్మా, చెల్లెళ్ళ కంటే గొప్పదనుకుంటున్నావా పెగ్గీ?”

“హేరియట్! ప్రతి దానికీ అమ్మా, చెల్లెళ్ళతో పోలిక యెందుకు? వాళ్ళ స్థానం వాళ్ళదే. పెగ్గీ పట్ల నాకుండే గౌరవాభిమానాలకీ, వాళ్ళపట్ల నాకుండే ఆప్యాయతకీ అసలు సంబంధమే లేదు.”

హేరియట్ హేళనగా నవ్వేసి వూరుకుంది.

బ్రాండన్ వ్యక్తిత్వం గురించి హేరియట్ కి అర్థమైందో లేదో కానీ, ఎల్సీకి మాత్రం పూర్తిగా అర్థమయింది. మొదటిసారి తను బ్రాండన్ ని కాదని తప్పు చేసిందేమోనన్న అనుమానం ఆమె మనసులో కదలాడింది. ఆనాటి సంభాషణ గుర్తు రాగానే వున్నట్టుండి ఆమె చెంపలు ఎర్రబడ్డాయి.

వున్నట్టుండి ఆమె మొహం చూసిన బ్రాండన్, ఆ సాయంత్రం ఆమెతో కలిసి కూర్చొని భోజనం చేయబోతున్నాడన్న విషయం తలచుకుని సంతోషపడ్డాడు. ఆ సంగతి తెలిస్తే హేరియట్ ఏమనుకుంటుందో!

(సశేషం)

ఒక రోజా కోసం…

 oka roja kosam -2 (2)

సాధారణంగా తల్లిదండ్రులు – అందులో అత్యంత వైభవోపేతమైన జీవితం గడిపేవాళ్ళు – తమ పిల్లలు ఇంకా ఉన్నత వర్గానికి ఎదగాలని, సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందాలని, తమ కంటే విలాసవంతమైన జీవితం గడపాలని కోరుకుంటారు.  కాని సెర్దర్ ఓజ్కాన్ ‘ఒక రోజా కోసం’ నవల లోని తల్లి తన కూతురు  అంతరాంతరాల్లో ఉండే ‘నేను’  ని కనుగొనాలని కోరుకుంటుంది.

ఈమె చాలా చిన్న వయసులోనే భర్తను పోగుట్టుకుంటుంది.   ఎంతో ఆత్మవిశ్వాసంతో, ఎరుకతో బ్రతికే ఈమె ఇతరుల కళ్ళల్లో ఆరాధనని చూడటం కోసం తన కలని కూడా విస్మరిస్తున్న కూతురు డయానాని చూసి బాధపడుతుంది.  ఇతరుల కోసం కాక తనకై తాను స్వేచ్ఛగా   బ్రతకడానికి అడ్డుపడుతున్న అహాన్ని డయానా తొలగించుకోవాలని, తాను ప్రవేశించిన ఆనందపు తోటలోని గులాబీలతో మాట్లాడుతూ తన కూతురూ తిరుగాడాలని, కూతురు తన లోలోపలి పరిమళాన్ని ఇతరుల కోసం కోల్పోకూడదని కోరుకుంటుంది.

డయానాకి రచయిత్రి అవాలనే కల బలంగా ఉంది కాని మంచి రచయిత్రి కాకపోతే సమాజం నుండి నిరసన ఎదురవుతుందేమోనన్న భయంతో,  ,తను సమాజంలో గొప్పగానే ఉండాలన్న అహంతో తన కలను చంపుకుని లాయరు అవాలనుకుంటుంది.   చుట్టూ తిరిగే  స్నేహితుల మెప్పుదల కోసం బ్రతుకుతున్న కూతురు డయానాని  వ్యక్తిత్వం కలిగిన బిడ్డగా మార్చుకోవాలని ప్రయత్నిస్తుంది తల్లి.  అయితే తన బిడ్డకి నెమ్మదిగా తెలియచెప్పడానికి ఆమెకి భగవంతుడు సమయం ఇవ్వలేదు.  మరో ఐదు నెలల్లో ఆమె చనిపోతుందని డాక్టర్లు  చెప్పడంతో తను చనిపోయిన తర్వాతైనా సరే డయానాలో మార్పు రావాలని పటిష్టమైన పథకం తయారు చేసుకుంటుంది ఆ తల్లి.  తన బిడ్డను విచార మార్గంలో పయనింప చేయడానికి చనిపోయిన భర్త బ్రతికి ఉన్నాడని అంటుంది.  లేని మరో కూతురిని (మేరీ) సృష్టిస్తుంది.  మేరీ రాసినట్లు ఉత్తరాలు రాసింది.  తన స్నేహితురాలైన జైనప్ హనీమ్ అనే తాత్త్వికురాలిని తన బిడ్డని దివ్యత్వానికి దగ్గరగా వచ్చేట్లు చేయమని కోరింది.  ఆఖరికి బిచ్చగాడి సహాయాన్ని కూడా అర్థిస్తుంది.

చనిపోయేముందు రోజు తనకి మరో కూతురు ఉందని, తన భర్త తన నుంచి విడిపోతూ ఆ కూతురిని తీసుకువెళ్లాడని, ఇప్పుడు మేరీ  ఇంటి నుండి ఎక్కడికో వెళ్లిపోయిందని డయానాకి చెప్తుంది.  మేరీ రాసినట్లుగా తనే రాసిన ఉత్తరాలను డయానాకిచ్చి ఆ ఉత్తరాల ఆధారంతో మేరీని అన్వేషించమని ఆఖరి కోరికగా కోరుతుంది. ఆ అన్వేషణా మార్గంలో తన స్నేహితురాలు, తాత్త్వికురాలు అయిన జైనప్ హనీమ్ ని కలుసుకునేట్లు చేస్తుంది.

తన కవలసోదరిని వెతుకుతానని తల్లికిచ్చిన మాట కోసం ఇల్లు వదిలి జైనప్ హనీమ్ ని కలుసుకుంటుంది డయానా.  అక్కడ – జైనప్ హనీమ్ దగ్గర ‘తన గులాబీకి బాధ్యత వహించడం అంటే ఏమిటో తెలుసుకుంటుంది.  గులాబీలతో మాట్లాడటం, వాటి మాటలను వినడం నేర్చుకుంటుంది.  దేవుడు మన జీవితంలోని అన్ని విషయాల్లోనూ భాగస్వామి అవుతాడని తెలుసుకుంటుంది.   ప్రగతిని సాధిస్తుంది.  చివరికి నీ వరకు మిగిలిన అన్ని తోటలకంటే నీ తోట వేరేదే అయితే మిగిలిన అన్ని గులాబీలకంటే నీ గులాబి వేరేదే అయితే ఆ తేడా నీకు ఆధిక్య భావనని కాక నిన్ను భూమి మీద నిలిపి ప్రపంచమంతటినీ హత్తుకునేలా చేస్తే నీకు దివ్యత్వం లభించినట్లే బిడ్డా! ఇక నువ్వు నన్ను కోల్పోవునీ జ్ఞాపకాల వెనక ప్రతి ఒక్క దాని ద్వారా నేను నీతో మాట్లాడతానుఅని అమ్మ రాసిపెట్టిన ఉత్తరం డయానాకి దొరుకుతుంది.

అప్పుడు – ఆ క్షణంలో డయానా అంతరంతరాల్లో ఉన్న ‘నేను’ ని కనుగొంటుంది.  ముఖంలో అద్వితీయమైన మెరుపుని పొందుతుంది.

oka roja kosam -2 (1)

క్లుప్తంగా ఇదీ కథ

సెర్దర్ ఓజ్కాన్ కి జీవనయానానికి సంబంధించిన లోతైన అర్థాలు వెలికి తీసే రచనలు చేయడం ఇష్టమట.  ‘The Missing Rose’ – ‘ఒక రోజా కోసం’ ఇతని తొలి నవల.  ఈ పుస్తకం ఇప్పటికి 27 భాషల్లోకి అనువదింపబడి ఎంతో ఆదరణ పొందింది.  దీన్ని తెలుగులోకి మంచిపుస్తకం.నెట్ (సురేష్ ) వాళ్లు అనువదించి ప్రచురించారు.

  • ఇతరుల కంటే భిన్నంగా ఉండటానికి మాత్రమే విచారమార్గంలో పయనించేవారికి గర్వం తప్ప ఏమీ మిగలదు.
  • మేథోశక్తితో ఊహించడం ద్వారా అసలైనదేదో తెలుసుకోలేము.
  • హృదయం ద్వారా ప్రకృతిని వినగలిగే శక్తి పుట్టుకతో అందరికీ ఉంది కానీ ఎందుకో కాలం గడిచేకొద్దీ గుండెలు చెవిటివవుతున్నాయి.
  • శిఖరాన్ని చేరుకోవాలని ఉన్నా చేరుకోలేమోనన్న భయంతో ప్రయత్నాన్ని విరమించుకుంటాం.  పట్టు వదలకుండా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వెళితే శిఖరాన్ని చేరుకోగలము.  మనకి శిఖరాన్ని చేరుకోవాలనే ఇచ్ఛ కలిగితే అన్ని వైపులనుండీ సహాయం అందుతుంది.
  • నువ్వు అలవి కావు ఒడ్డుని ఢీ కొని మాయమైపోతానని భయపడటానికి.  నీవు సముద్రానివి.
  • గులాబీగా ఉండటం అంటే ఇతరులు పొగిడినపుడు బ్రతికి వాళ్లు తిరస్కరిస్తే అంతరించిపోవడం కాదు.
  • ఇప్పుడు నిన్ను ఇంతగా ఆరాధిస్తున్నవారే ఏదో ఒక రోజు నిన్ను త్యజిస్తారు. ఎందుకంటే వాళ్లు ఆరాధిస్తున్నది నిజంగా నిన్ను కాదు.  వాళ్ల కోరికల్ని.  వాళ్ల పొగడ్తలలో నీ ఉనికి ఉన్నప్పుడు వాళ్లు నిన్ను త్యజించగానే నువ్వు లేకుండాపోతావు.
  • నువ్వు మోజుపడే ఆత్మ తియ్యటి మృత్యువుని చవి చూసిన తర్వాత నీకు పునర్జన్మ లభిస్తుంది  –    ఇలాంటి వాక్యాలు ఎన్నో పుస్తకం నిండా.  జీవితం పట్ల ఎంతో పరిణితి ఉంటేనే రాయగలిగిన వాక్యాలు.

మనకి నిజంగా ఇష్టమైన పని ఒకటైతే డబ్బు సంపాదన కోసమో, అధికారం కోసమో, ఎంచుకున్న రంగంలో పరిణితి సాధించలేకపోతే ఎదుర్కొనబోయే పరిస్థితులని ఊహించుకొనో ఇష్టమైన రంగాన్ని వదిలేసి సమాజ ఆమోదయోగ్యమైన రంగాన్ని ఎంచుకుంటాం.  మనల్ని అర్థం చేసుకోలేని ప్రపంచాన్ని ఒంటరిగా ఎదుర్కోవడానికి భయపడతాం.  దాని వలననే మనకి లోలోపల సంఘర్షణ, అసంతృప్తి.  తద్వారా జీవితం పొడవునా అశాంతి.

తమ బిడ్డలు ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు కావాలనే కాంక్షతో పిల్లల మనస్సుకి నచ్చినదేమిటో తెలుసుకోలేకపోతున్న తల్లిదండ్రులు, ఇతరుల ఆరాధనతో బ్రతుకుతూ, ఇతరుల కళ్లల్లో తమని చూసుకుంటూ మరుగుజ్జులుగా మారుతున్న యువతీయువకులు తప్పకుండా చదవవలసిన పుస్తకం ఇది.

అప్పుడు కనీసం కొన్నైనా నాట్యం చేయవలసిన చేతులు గరిటను తిప్పుకుంటూ (ఇక్కడ నా ఉద్దేశం ‘వంట చేయడం మంచిది కాదు’  అని కాదు) , సంగీత కచ్చేరీలు ఇవ్వవలసిన నోళ్లు గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉండవు.

మన కలని అనుసరించకపోవడానికి అడ్డుపడే అహాన్ని చంపుకుని చేరుకోవలసిన శిఖరాన్ని ఎలా చేరుకోవాలో,  శాంతిని పొందుతూ ప్రపంచాన్ని ప్రేమతో ఎలా హత్తుకోవాలో ఈ నవల ద్వారా విశదపరిచిన సెర్దర్ ఓజ్కాన్ చిరస్మరణీయుడు.

–    రాధ మండువ

 

 

 

 

 

 

 

 

పాదాలకు తగిలిన ప్రశ్నలు..!

 

డాక్టర్ చింతకింది శ్రీనివాస రావు

డాక్టర్ చింతకింది శ్రీనివాస రావు

ఆ రోజు మా చోడవరం ఊళ్లో పూసిన పువ్వులన్నీ ఆలయాల్లోకో, ఆడవాళ్ల కొప్పుల్లోకో చేరిపోలేదు. భక్తప్రజాళి చెవుల ఇరకల్లోకి దూరిపోలేదు. అన్నీ కలిసికట్టుగా మా జాన్‌ మేస్టారి మెళ్లోకి జేరీసేయి. దండలుగా మారిపోయి ఆయన గుండెలమీద కులాసాగా కూచున్నాయి. దిలాసాగా ఊగీసేయి. మా మేస్టారు మాత్రం ఆ పూలమాలల మధ్యన భలే సిగ్గుసిగ్గుగా అయిపోయేరు. అందరూ జేజేలు కొడుతుంటేను.. భుజాలకెత్తుకుని ఊరేగిస్తుంటేను.. ఇంత ధైర్యవంతుడూ అదొకలాగ మొహమాటంగా మొగం పెట్టీసేరు.

మరి, ఆ రోజు మాములు రోజేంటి. మా ఊరికి, మా మేస్టారికీ కూడాను చాలా స్పెషలే. మాకే కాదు. మా ఇరుపంచాల గ్రామాల జనాలకీ ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. మేస్టారు నెంబర్‌వన్‌ మగాళ్లా మా మారకమ్మ రేవులో ఎలుగుబంటిని  తుపాకీతో పేల్చిచంపీసిన రోజు. చచ్చిన భల్లూకాన్ని వీపుమీద మోసుకుంటూ ఊరివైపు మొనగాళ్లా నడిచొచ్చీసిన రోజు.

అప్పటికి పదిహేను రోజులవుతుంది. సిలవరి బిందిలట్టుకుని మా ఊళ్లో ఆడంగులెవరూ మారకమ్మరేవు గట్టుకి నీళ్లకెళ్లడమే లేదు. ఏటి స్నానాలు చేసి పుణ్యం సంపాదించుకోవాలనుకునే పతివ్రతలూ అటేపు కన్నెత్తి చూడ్డం లేదు. ఏటి వార మావిడితోటల్లోనూ, తాటిపెండెల్లోనూ, మొక్కామోడుల్లోనూ జనసంచారం అస్సల్లేదు. అంతెందుకు. పేద్ధ చెంబట్టుకుని సిగ్గులజ్జాల్లేకుండా గొప్ప రాజసంగా ఏటి కొసాకి డైలీ దొడ్డికి పోయే మా కరణం సరిపిల్లి సత్తిబాబుగారు సైతం ఆ వైపు తొంగి చూసిందే లేదు. దీనంతటికీ కారణం ఒకానొక ఎలుగుబంటి అంటే నమ్ముతారా. నమ్మితీరవలసిందేను.

మా ఊరెలాటిదంటే, మా విశాఖపట్నం జిల్లా అడవులకి ద్వారబంధం లాటిది. మమ్మల్ని దాటీసే ఎవురైనా ఏజెన్సీకెళ్లాలి. ఊరికి ఆనుకుని ఉండే మారకమ్మ రేవు దగ్గర పొలాల్లోకి, ఏటి సైడు డొంకల్లోకి తరచుగా అరణ్యంలోంచి నానాజాతి నక్కలు, దొంగవరళ్లు, దెష్ట ఎలుగుబంట్లు జొరబడిపోయీవి. వచ్చినవి వచ్చినట్టు దొరికిందేదో తినీసి పాడేరు కొండలమీదికో, గంగరాజు మాడుగుల గిరుల్లోకో పోతుండీవి. ఈసారే ఆలా జరగలేదు. అదే వచ్చిన చిక్కు.

ఈ దఫా మా రేవుకొచ్చీసిన ఓ ఎలుగుబంటి ముండ సామాన్యమైన ముండ కానట్టుంది. కాయ కసరు తింటూ రేవు పొదల్లోనే రోజుల తరబడి తిష్టేస్సింది. వేసింది వేసినట్టుగా ఉండిపోయిందా. అదీ లేదు. పక్కనున్న చాకిరేవులో గుడ్డలారేసుకుంటున్న మడియాలు గంగరాజుమీదికి దూకీసింది. ఆడికి దూదేకీసింది. దుంపతెంచీసి ధూపంవేసీసింది. దొరికినవాణ్ణి దొరికినట్టుగా చీరిపారీసింది.

శనిలా పట్టీసిన ఎలుగును తప్పించుకునేందుకు గంగడు చేయనిపనంటూ లేదు. రక్తాలు కారుకుంటూనే పరిగెట్టేడు. ఏం ఉపయోగం. అదొట్టి బాజోటుమృగం. వీడేమో మంచిమనిషి. ఎలా సాలగల్డు. పరిగెట్టలేపోయేడు. ఆఖరికి ఆ ఎలుగుబంటినుంచి వాణ్ణి విడిపించడానికి మా రజకులంతా నానా సంకలు నాకీసేరు. రాయీ రప్పా, కర్రా కంపా తీసుకుని నాలుగిసర్లు ఇసిరితేనే గానీ అది ఒగ్గింది కాదు.

Kadha-Saranga-2-300x268
ఎలుగు దాడిలో చావసిద్ధమైన గంగరాజును తీసుకొచ్చి ఊరిమయాన ధర్మాసుపత్రిలో పడీసేరు. విషయమంతా తెలిసిపోవడంతో ఊరు ఊరంతా ఒంటేలు పోస్సింది. పరుగుల మీద గవర్నమెంటు ఆస్పట్లకొచ్చీసింది. చర్మం లెగిసిపోయి, ఒళ్లంతా తొక్కలూడిపోయి, మాంసం ముద్దలా అయిపోయిన గంగణ్ణి తనివితీరా తిలకించీసి ముక్కు చీదీసింది. ప్చ్‌…ప్చ్‌…ప్చ్‌లు కొట్టీసింది.

మా ఊరనే ఏంటి. ఇరుగుపొరుగునున్న గోవాడ, ఆంభేరుపురము, రాయపరాజుపేట, ఎంకన్నపాలెం ఇలా అన్ని గ్రామాలూ మా గ్రామం మీదికే వచ్చిపడిపోయేయి. ఎలుగుబంటిని అమ్మలకీ పెళ్లాలకీ తిట్టిపోస్సేయి.

ఈ తిట్లు ఇంకా ఆగేలేదు. మరో దయిద్రవయిన కబురొచ్చీసింది. గంగణ్ణి కొట్టీసిన ఎలుగుబంటి ఇంతలోనే మరో ఉన్మాదానికి దిగీసింది. రేవు మావిడి తోట్లో గంజి తాగుతున్న కాపలాదారు అన్నాబత్తుల కోటేసు సంగతీ తేల్చీసింది. లొట్టలేసుకుంటూ కుండమూకుట్లో గంజి జుర్రుకుతింటున్న కోటేసుగాడిని ఎనాకతల్నించి ఎలుగ్గొడ్డమ్మ ఎక్కీసి తొక్కీసింది. తెల్లపళ్లు, నల్ల బొచ్చు ఉన్నదేదో ఉన్నట్టుండి పీకిమీదకొచ్చీడంతో కోటిగాడి పై ప్రాణాలు పైనే పోయాయి. తొలీతా అదేదో దెయ్యం అనుకున్నాట్ట. వదిలించుకుందామంటే కుదర్లేదట. ఎలుగుబంటి చమడాలు రేగ్గొడుతుంటే రేవురేవంతా ధ్వనించేలా కేకేలేశాట్ట. దాపల్నున్న చెరుకు రైతులు బరిశెలు, బాడిదల్తో తెగబడి తరిమితే తప్ప ఎలుగు పారిపోలేదట. అలా ఆడికి చావు తప్పి కన్నులొట్టపోయింది. ఆస్పట్లో గంగరాజు పక్క మంచం మీద కెక్కీసేడు. ఇకనంతే. ఆ రోజు నుంచీ మా మారకమ్మరేవు వైపు వెళ్లాలంటే జనానికి వణుకు మొదలైపోయింది.

ఇదే సందు అదే మందు అనుకుందేమో ఎలుగ్గొడ్డూ బాగానే చెలరేగీసింది. పిచ్చెక్కిన పీరండంలా అయిపోయింది. చెరుకుతోటల్లోకి దిగిపోయి మేసినంత మేయడం, ధ్వంసం చేసినంత చేసీడం మొదలెట్టింది.

వాస్తవం మాటాడుకోవాల్సివస్తే, ఏటికీ మా ఊరికీ ఉన్న బంధం మామూల్ది కాదు. తల్లీబిడ్డల పేగు బంధం లాటిది. ఆ బంధాన్ని ఈ ఎలుగుమహాతల్లి పుటుక్కున తెంపీసినట్టయింది. ఇలా రోజులు గడిచీసరికి ఊరిజనానికి కంటిమీద కునుకులేకపోయింది.

సంగతి తెలిసి ఫారెస్టు ఆఫీసోళ్లంతా కంగరెత్తిపోయేరు. చోడవరానికి క్యాంపు కట్టేరు. పోలీసోళ్లూ వారికి సాయం చేస్తామన్నారు. విలేజి ప్రెసిడెంటు కురుముద్దాలి పాపారావు ఆళ్ల కాళ్లు పట్టుకున్నాడు. మునసబు కోట్ని మహాలక్ష్మినాయుడు, కరణం సత్తిబాబు ఆ పని చేయలేదు గానీ అంతకు తగ్గ చాలా పనులు వారికి చేస్సేరు.

ఒకేపున పోలీసు బాబులు, ఫారెస్ట్‌ గార్డులు, మరో దిక్కున మా ఊళ్లో ముదురుటెంకలని అందరూ చెప్పకునే ఆకుల వీరేశు, దేవరాపల్లి రంగడు, కిస్తా గోవిందు ఇలాగందరూ కలిసికట్టుగా ఎలుగుబంటిని చంపీడానికి రేవుకు బయలెల్లేరు. కొందరు కత్తులు, మరికొందరేమో కర్రలు, ఇంకొందరేమో కొడవళ్లు పట్టేరు. ఫారెస్టోళ్లు మాత్రం సరిగ్గా పేల్తాయో లేదో తెలీని రెండో మూడో తుపాకుల్తో వేట మొదలెట్టేరు.

రేవు దగ్గిరివరకూ మహా సూరుమానంగానే వెళ్లిన ఈ మారాజులంతా ఎలుగ్గొడ్డును వెతికీటప్పుడు మాత్రం దడదడలాడిపోయేరు. ఏ బొక్కలోంచి అది పారొచ్చీసీ బొక్కబద్దలు గొడతాదోనని నంగినంగిగానే వెతుకులాడేరు. వీళ్లంతా రేవు ఎక్కనున్న గుబురు పొదల్ని జట్లు జట్లుగా గాలిస్తుండగానే కాస్త దూరంగా వెళ్లి ఎలుగుకోసం తంటాలు పడుతున్న వీరేశుగాడి కేకొకటి గట్టిగా వినిపించీసింది.

”చచ్చాన్రోయ్‌”.. అని వాడు కెవ్వుమనడంతో మిగతా వాళ్లంతా బిక్కసచ్చిపోయేరు. పెద్ద పోటుగాళ్లా చెరుకు పొలాల్లో కాలు మోపిన వీరేశుడు గారిని మడిలోకి దిగీ దిగ్గానే ఎలుగుబంటి ఠక్కున పట్టీసింది. సుబ్బరంగా రక్కీసింది. ఎక్కడబడితే అక్కడే కొరికీసింది. ఆడి నోట్లో కాలుతున్న గుర్రం బీడీ ఉన్నాది కాబట్టి బతికేడు. అగ్గి దాన్ని భయపెట్టింది గనక బతికేడు. లేదంటే పనయిపోను. దెబ్బల్తో పొలాల్లోంచి బయటకొచ్చి వాడు చెబితేనే ఇదంతా అందరికీ తెలిసింది.

ఇక ఈ ఎలుగ్గొడ్డు యవ్వారం మనశక్తికి మించిందని తీర్మానించి వేటజట్టంతా ఊళ్లోకొచ్చీసింది. పంచాయితీ బోర్డు బల్లల మీద కూర్చుని బుర్రలు బద్దలు గొట్టుకుంది. ఊరి పెద్దలూ వీరితో కలిసి వీలయినంతసేపు బుర్రలు పాడు చేసుకున్నారు. చివరాఖరికి ఈ జంతుగోల తప్పించే నికార్సయిన మనిషెవరన్నప్పుడు మా జాన్‌ మేస్టారి పేరు ప్రస్తావన కొచ్చీసింది.

మా జాన్‌ మేస్టారంటే మామూలు మేస్టారు కాదు. ధర్మప్రభువు. మా బోర్డు హైస్కూల్లో పంతులు. మా పిల్లలందర్నీ కంటికి రెప్పలాగ కాపాడీవారు. ఆయనకి పెళ్లాం పిల్లల్లేరు. అలా అని బాధ్యతలేవీ లేవని అనుకోడానికి లేదు. మేమంతా ఆయనకు బాధ్యతలమే. మాకు చిన్న జ్వరం వచ్చినా అల్లాడిపోయీవారు. మా పుస్తకాలు చిరిగిపోతే కొత్తవి కొనిచ్చీవారు. ఆయన తినీది తక్కువ. మాకు మేపీది ఎక్కువ. పక్కోడికోసం పీకతెగ్గోసుకునీరకం.

మేస్టారి ధైర్యం గురించి చెప్పాలంటే చాలా ఉంది. గొప్ప హీరో. ఆయనకు భయం అన్నదే తెలీదు. తాగీసి మా ఊళ్లో ఎవరు తన్నులాడుకున్నా జాన్‌బాబు వచ్చేరంట సైలెంటయిపోయీవారు. ఒకేళ చుక్కేసుకున్నోడు ఎక్కువ మాటాడనే అనుకుందాం. తొలి పాలి మెల్లిగా చెప్పీవారు. రెండో పాలి మాత్రం రెండు తగల్నిచ్చి ఇంటికి తొవిలీసీవారు. తగూ అంటే ఆపడానికి ముందునుండీ ధర్మప్రభువని పేరు తెచ్చుకున్నారు. మనిషి ఆజానుబాహువు. చేతులు చేపాటి కర్రల్లాగుండీవి. కాళ్లు స్థంభాల్లాగ, పాదాలు ఏనుగు పాదాల్లాగా ఉండీవి. ఆయన చేతులు పడితే ఎవడికేనా పులుసులోకి ఎముకలుండవు అన్నట్టుండీవారు.

ఊరందరితోనూ కలిసిపోయి నెత్తురుకి నెత్తురుగాను, ప్రాణానికి ప్రాణంగానూ జాన్‌మేస్టారు బతికీవారు. అన్నట్టు. ఆయన దగ్గరో తుపాకీ ఉండీది. దానికి లైసెన్సూ ఉండీది. చిన్నప్పుడెప్పుడో కుమిలిగాటీల మీద, రైవాడ కొండలమీద మేస్టారు అడవిపందుల వేట చేసీవారని పెద్దలు చెప్పగా విన్నాం.

ఇలాంటి మేస్టారికి, ఆయన తుపాకీకి ఇన్నాళ్లకి మళ్లీ పని పడింది. ఎలుగుబంటి దౌర్జన్యానికి హడలెత్తిపోయిన ఊరి మోతుబరులందరూ ఓనాడు తూరుపు తెల్లారకుండానే ఆయనింటికెళ్లిపోయేరు. లబోదిబోమంటూ జరిగిందంతా ఆయన చెవుల్లో వేస్సేరు. ఎలుగ్గొడ్డు దెబ్బకి చెరుకుతోటలు నాశనమైపోతున్నాయని మొర పెట్టుకున్నారు. ఫారస్టోళ్లంతా చేతులెత్తీసేరనీ చెప్పుకున్నారు. గంగడు, కోటి, వీరేశులు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారనీ విన్నవించేరు. తుపాకీ తీసి ఎలుగుని చంపితేనే గానీ సుఖం లేదని కోరీ, ప్రార్థించీ, మనవి చేసుకున్నారు. అయినాగానీ, మేస్టారి గుండె ముందయితే కరగలేదు.

”పశు ప్రవృత్తి అలాగే ఉంటుంది. ఈ రోజు కాకపోయినా రేపయినా అడవుల్లోకి పోతుంది లెండి”. అనీసేరు తడుముకోకుండా.

”అమ్మమ్మా అలగనీకండి. రోజులెల్లిపోతన్నాయి. ఊల్లో వొవులికీ కంటిమీద కునుకులేదు. నా మొగుణ్ణి నాసనం చేసీనాది. నా బతుకు పాడయిపోనాది..”

ఎల్లుగ్గొడ్డు  దెబ్బకి చావసిద్ధమైపోయిన గంగడి భార్య రత్తమ్మ గగ్గోలు పెట్టింది.

వీరేశు పెళ్లాం లచ్చిమి కూడా రత్తమ్మకి వంత పాడింది. ”నా పెనిమిట్నీ అన్నేయంగా సీరీసింది దేవుడోయ్‌. దేవుడే మమ్మల్ని రచ్చించాల్రోయ్‌” అనీసి నెత్తి కొట్టీసుకుంది. ఎప్పుడైతే ఈ ఆడకూతుళ్లు పడీపడీ దు:ఖిస్తున్నారో అప్పుడిక మా మేస్టారి గుండె లుక్కుమనిపోయింది. ఇంకెంతమందిని ఎలుగ్గొడ్డు యాతన పెడుతుందోననే బెంగ ఆయనలో ఆరంభమైపోయింది.

” ఏం భయం లేదు. నేనీరోజు మారకమ్మ రేవుకి బయలెల్తాను. నాతో మాత్రం ఎవరూ రావద్దు. ఇల్లూ పొల్లూలేని ఒంటిగాణ్ణి. నేను దాని చేతిలో పోయినా పర్లేదు. అదో నేనో తేల్చుకొస్తాను.” మేస్టారు గంభీరంగా భరోసా ఇస్తూ పలికేరు. ఆ మాటలకు జనం తెగమగా సంబరపడిపోయేరు.

ఆ వెంటనే ఇంట్లోకెళ్లిన మేస్టారు పడగ్గదిలోని కర్రబీరువా తెరిచేరు. అందులో ఎప్పట్నుంచో దాచిపెట్టిన ఖాకీ చొక్కా, ఖాకీ ఫేంటు తీసి తొడుక్కున్నారు. తుపాకీ తుడుచుకున్నారు. టార్చిలైట్లో ఏసే బేటరీల్లాంటి మందుగుళ్లను తీసి బందూకు గొట్టంలో వాటంగా దోపీసేరు. మారకమ్మరేవు వైపు ప్రయాణమయ్యేరు. ఆయనతో పాటుగా చాలా మందిరి రేవు పొలిమేరల దాకా వెళ్లేరు. మేస్టారిని లోనికి సాగనంపి వెనక్కి వచ్చీసేరు.

అప్పటికి ఉదయం తొమ్మిదే అయింది. ఊళ్లోని పిల్లా మేకా అందరూ రామకోవెల్లో చేరిపోయి మేస్టారి కోసం భజన్లు చేస్తున్నారు. ఆయన క్షేమంగా వస్తే ఆకు పూజ చేయిస్తానని రైతు కూలీ రాములమ్మ ఆంజనేయస్వామికి మొక్కులెట్టుకుంది. మేస్టారు ఎలుగుబంటి పాలపడకూడదంటూ ఎవరెవరో వేనవేల దేవుళ్లకి దండాలెట్టుకున్నారు. అసలాయన్నెందుకు దాని కాడికి పంపేరని బోడి రాముడు, గెడ్డం సన్నాసిలాంటి మానమర్యాదలు గల అమాయకులు కొందరు ఊరి ప్రముఖుల మీద తిరగబడ్డారు. ఆళ్లని సముదాయించీసరికి పెద్దోళ్లకి పెద్ద పనయిపోయింది.

ఈ లోగానే మధ్యాహ్నం అయిపోయింది. ఎలుగుబంటితోనూ, మేస్టారితోనూ, ఆ మాటకొస్తే అసలు చోడవరంతోనూ నాకేటీ లింకు లేదన్నట్టుగా పడమట కొండల్లో కుంగీడానికి సూరీడు రెడీరెడీచ్‌ అంటున్నాడు. ఇంతలో మునసబుగారు ఆగలేక మాటాడీసేరు.

”ఏట్రా… ఇంతమందిమి ఉండి ఒక్కణ్ణి రేవులోకి పంపీనాం. ఆ తోటల్లో, ఆ తోపుల్లో ఆ సెట్ల మయాన మేస్టారు బాబు అన్నాయంగా ఏం బాదలు పడతన్నాడో. ఒకేపు యేల మించిపోతంది. ఇప్పటికీ మనం ఒల్లక్కూకుంతే మనం మొగోళ్లవే కాదెహే..’ నిష్ఠూరంగా మాట్లాడ్డం మొదలెట్టేడు. మునసబు మాటల్ని అక్కడున్న అందరూ నిజమేస్మీ.. నిజమేస్మీ.. అన్నట్టుగా తలపంకించేరు. పదండి.. పదండంటూ కేకలేసుకున్నారు. అంతా కలిసి రేవు వైపు నడక తీసేరు.

రేవు దాకా చేరేక అక్కడ గోర్జీదారుల్లో బితుకుబితుకు మంటూ అడుగులేస్తున్నారు. తాటాకు కదిల్తే చాలు. దడదడలాడిపోతున్నారు…ఉడతలు పరుగులెడుతున్నా ఎలుగ్గొడ్డే వచ్చి మీద పడిపోయినంతగా హడలి ఛస్తున్నారు. చేతులు చేతులు కలుపుకుని మెల్లిగా ఆడపెళ్లివారిలా జిడ్డోడుకుంటూ నడుస్తున్నారు.

కరక్టుగా వీరంతా అరమైలు నడిచేరో లేదో భీకరాకారంగా, రొప్పుతూ మహావీరుళ్లా ఎదురొస్తున్న జాన్‌మేస్టారు కంటబడ్డారు. ఆయన చొక్కా, ఫేంటు చెమటధారలతో ముద్దకట్టీసేయి. ఒక భుజం మీద తుపాకీ. మరో భుజం మీద నల్లటి మూటలాంటిదేదో మరోటీ ఉంది. ఊరివారిని చూడగానే ఆయన ” ఓహో.. రండర్రోహో..” అని ఆనందంతో కూడిన గావుకేకలాంటిదేదో వేసేరు.

మామూలుగానే మేస్టార్ని చూస్తే ఎప్పుడూ ఆనందపడే జనం ఆవేళ ఆయనంటే మరీ పిచ్చెక్కిపోయేరు. మారాజు క్షేమంగా వచ్చీసేడంతే చాలనుకుని ఆయన కాడికి మూగీసేరు. జనమంతా దగ్గరకి రాగానే జాన్‌మేస్టారు మరీ సంతోషపడిపోయేరు. భుజానున్న నల్లమూటని భళ్లున నేలకేసికొట్టీసేరు. కిందపడ్డ మూటని చూసి జనానికి మూర్ఛపోయినంత పనయిపోయింది. అది మూట కాదు. ఒకటోరకం ఎలుగ్గొడ్డు. చచ్చిన ఎలుగ్గొడ్డు. మేస్టారి చేతుల్లో, ఆయన తుపాకీ గుళ్లకి చచ్చిన ఎలుగ్గొడ్డు. జనం కేరింతలకి హద్దు లేదు. తుళ్లింతలకి హద్దూ పద్దూ లేదు. ఒకటే ఈలలు. ఒకటే గోల. మేస్టార్ని భుజానికెత్తుకుని ప్రజానీకమంతా డేన్సులు కట్టేరు. చచ్చిన ఎలుగ్గొడ్డును ఆనందంతోనూ, ఆశ్చర్యంతోనూ తేరిపార చూస్సేరు.

”బాబూ.. ఊరికి పట్టిన దయిద్రాన్ని వదలగొట్టీసేవు. ఎలుగును సంపీసి మమ్మల్ని, మా పొలాల్నీ రక్షించీసేవు. నువ్వయ్యానాయినా మొగోడివి. మా కోసమే జనమ ఎత్తినావు నాయనా. నాయినా..” బాగా పొగిడీసేరు.

”అసలింతకీ ఈ ముదనష్టపు గొడ్డు ఎలా సచ్చింది బాబూ..” ఉండబట్టలేక వివరాలడిగీసేరు.

ముందూ వెనుకా జనాలు నడుస్తుండగా..ఇద్దరు మనుషులు కావిడి కట్టి ఎలుగ్గొడ్డు కళేబరాన్ని కొయ్యమీద మోస్తుండగా.. పెద్ద గొంతెట్టుకుని మేస్టారు మొదలెట్టారు. ఉదయంనుంచీ తనని ఎన్ని తిరకాసులకి ఎలుగుబంటి గురి చేసిందో పూసగుచ్చేరు.

ఆఖరికి వెంటబెట్టగా వెంటబెట్టగా రేవుగట్టుమీదికి పోయిన దొంగసచ్చిన ఎలుగు సాయంత్రం నాలుగ్గంటలకి గానీ ఏట్లోకి దిగి నీళ్లు తాగలేదట. అదే సమయంలో అక్కడే మాటేసి కూచున్న మేస్టారు తుపాకీ గురి చూసి ఠక్కుమనిపించేరట. గుండు దాని గుండెల్లోకి దూరీసిందట. ఠపీమని  చచ్చూరుకుందిట. దాన్ని మూటలా కలీగట్టీసి సంబరంగా మేస్టారు మోసుకుంటూ వచ్చేరన్నమాట.

మొత్తానికి ఎలుగ్గొడ్డును చంపిన మేస్టార్ని ఊరేగింపుగా ఊరి రామమందిరానికి తీసుకువచ్చారు ప్రజ. వెనువెంటనే అప్సరా ఫోటో స్టూడియో రమణగాడికి కబురెళ్లింది. ఈలోగానే తాటి తడపలతో నాలుగు వెదురు కర్రముక్కలు తెచ్చేడు షరాబు నీలకంఠం. నాలుగు కర్రల్ని చచ్చిన ఎలుగుకాళ్లకి కట్టి చేటపెయ్యిలా నిలబెట్టేడు. వస్తూవస్తూనే ఫోటోగ్రాఫర్‌ రవణ చాలా ఫోజులు కొడుతూ వచ్చేడు. చాలా ఫోజుల్లో మేస్టార్నీ, ఆయన తుపాకీని, చచ్చిన ఎలుగునీ, ఊళ్లో పెద్దల్నీ కలిపి రకరకాలుగా ఫోటోలు తీస్సేడు. ఆనకేమో అంతా కలిసీసి ఎలుగ్గొడ్డుని సొసానంలో గొయ్యి తీసి కప్పెట్టీసేరు. ఇదంతా ఫారెస్టోళ్లు సూసీ సూణ్ణంట్టుండిపోయేరు.

ఫోటోల రవణగాడు అమర్నాడు కాక మర్నాడనుకుంటా. ఫోటోలన్నీ పెద్ద పెద్ద బొమ్మలుగా కడిగీసి పలచటి అట్టముక్కలకి అంటించీసి మేస్టారికి, ఊరిబడాబాబులికీ ఇచ్చీసేడు. దీనంతట్నీ ఊరి కుర్రనాయాళ్లందరం కళ్లారా చూసేం. కళ్లింతింతలు చేసుకుని చూసేం. ఒకానొక ఉద్వేగంతో చూసేం. అప్పటికి మా వయసు పదేళ్లుంటుందేమో. మా మాస్టారుగారికి ఏభయ్యుంటుంది. చదువులు అవీ పూర్తి చేసుకుని మా గుంటజట్టంతా ఉద్యోగాల కోసం వైజాగు నగరం పట్టీసినా మాస్టారిని, ఎలుగ్గొడ్డు వ్యవహారాన్ని చాలా మాట్లే గుర్తు తెచ్చుకుంటుంటాం.

ఇదంతా ఇలాగుండగానే, ఈ మధ్యనోసారి నేను మా ఊరు వెళ్లవలసివచ్చింది. జీవితం పట్ల తీవ్రంగా భయం పుట్టిన ఒకానొక బలహీన క్షణంలో మా ఊరి కరకచెట్టు పోలమాంబకి నేను కొన్నేళ్లకిందట రకరకాల మొక్కులు పెట్టీసుకుని ఉన్నాను. పెట్టుకున్న మొక్కుబళ్లన్నీ పెట్టుకున్నట్టే ఉండిపోయేయి. ఇంట్లో ఆడోళ్లు పోరుతుంటే ఆ మొక్కులేవో తీర్చేసుకుంటే వదిలిపోతుందని చోడవరం వెళ్లేను.

బస్టాండ్లో దిగానో లేదో పెడ అరిటిపళ్లు కొనీసేను. డైరెక్టుగా అమ్మవారి గుడికే కాళ్లు కదిపీసేను. మా పోలమాంబకి ధూళి దర్శనమంటే మహా మక్కువ. అందుకే కాళ్లయినా కడుక్కోకుండా అమ్మ విగ్రహం పాదాల దగ్గర పండూకాయా పెట్టీసి చేతులు జోడించేను. తీసుకెళ్లిన చీర, రవికెల గుడ్డ సమర్పించేను. నన్ను, నా ఇల్లు పిల్లాద్రినీ చల్లగా చూడమ్మా.. అని దండం పెట్టేను. ధ్వజస్థంభం చుట్టూ మూడు సుట్లు తిరిగేను. అమ్మవారి తమ్ముడు పోతురాజు బొమ్మ దగ్గరకెళ్లి భక్తిగా ఊదొత్తు పుల్లలకి అగ్గి పెట్టేను. నైవేద్యంగా ఇంటినుంచి పట్టుకెళ్లిన బెల్లం అచ్చులు వదిలీసేను. కోవెల బయటకొచ్చీసేను.

సరిగ్గా అప్పుడే గుర్తుకొచ్చేరు మా జాన్‌ మేస్టేరు. ఆయన్ని చూడాలనిపించింది. తొంభయ్యో పడిలో పడ్డారు కదా. ఒకసారి వెళితే మంచిదే అనుకున్నాను. వెంటనే ఆయన ఇంటిదారి పట్టేను. గుడికీ మేస్టారింటికీ పెద్ద దూరం ఉండదు. త్వరగానే వచ్చీసిందది.

రకరకాల పచ్చాపచ్చని మొక్కల్ని దాటి చిన్న పర్ణశాలలాంటి మేస్టారి ఇంటికి చేరేను. వసారాలో పడక్కుర్చీలో దేవుళ్లా వాలి కూచోనున్నారాయన. మనిషి బాగా లొంగిపోయేరు. వృద్ధాప్యం ముంచుకొచ్చీసింది కాబట్టి ఆరముగ్గిన అంటిపండులా అయ్యేరు. మిగలపండిన మావిడిపండులా కానొచ్చేరు. కంఠం మాత్రం ఖంగుఖంగుమంటోంది.

”నమస్కారం మేస్టారు..” అనగానే కళ్లు పెద్దవి చేసుకుని తేరిపారచూసేరు. అయినా గుర్తు పట్టలేపోయేరు. ఫలానా పంతులుగారి కొడుకునని చెప్పుకున్నాను.

”ఓరేయన నువ్వట్రా..” అంటూ నా చేతులు పట్టీసుకుని ఎంతగా ఇదయిపోయేరో చెప్పలేను. ఎదురుగా ఉన్న బల్లమీద కూచోబెట్టేరు. చాన్నాళ్లకి చూసినందుకో మరెందుకోగానీ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. నా నేత్రాలూ తడిసిపోయేయి. ఎలాంటి మేస్టారు. ఎలాగయిపోయేరు. కమ్మిచ్చువు తీసనిట్టుండే కండలన్నీ ఎక్కడికిపోయేయి. దెబ్బ.. దెబ్బ.. వస్తే చావుకయినా సిద్ధపడిపోయే అంత బలిష్టమైన శరీరం ఏటైపోయింది. మనిషిని వయస్సు ఎంతగా వంచేస్తుందో.. ఇలా రకరకాల ఆలోచనలు తలని పట్టీసేయి.

ఇంతలోనే, నా చూపు వసారా గోడకు తగిలించిన ఫోటో మీదికి పోయింది. అప్పుడెప్పుడో ఎలుగుబంటిని చంపినందుకు గుర్తుగా దాంతో కలిపి మేస్టారికి తీసిన చిత్రం అది. దాదాపు నలభైయ్యేళ్లయిపోయింది కదా. బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోకి కొన్ని కొత్త రంగులేవో పట్టీసినట్టు అదోరకంగా తయారయింది. నేను దగ్గరకెళ్లి మేకుకి తగిలించిన ఫోటో చేతుల్లోకి తీసుకుని రుమాలుతో తుడిచేను. ఆనాటి ఎలుగ్గొడ్డు సంహారం గురించి మేస్టారికి నవ్వుతూ గుర్తు చేసేను.

”మీసారూ మీరెంత దైర్యవంతులండీ” అన్నాను.

”మేస్టారూ మీకెంత తెగువ ఉండేదండీ” అనీ అన్నాను.

”మనిషంటే మీరే మనిషండీ” అంటూ ప్రశంసలు కురిపించేను. నాటి నా జ్ఞాపకాలన్నీ ఆయనతో చకచకా పంచీసుకున్నాను. అంతా విన్న ఆయన మెల్లగా గొంతువిప్పేరు.

” పోనిస్తూ. అవన్నీ వదిలిద్దూ. అప్పుడేదో అలా అయిపోయింది. ఎలుగుబంటిని చంపినంత మాత్రాన పెద్ద మొనగాడయిపోతానేంట్రా. అడివి జంతువుని హత్య చేసినంత మాత్రాన పులిసిబలిసిన ముల్లుడనయిపోతానేంట్రా. నోరు లేని జీవిని చంపడమూ ఓ గొప్పేనేంట్రా.” అన్నారు నిస్సారంగా.

ఆ మాటలు ఆయన తేలిగ్గా అంటున్నట్టుగా పైకి వినిపించినా వాటి వెనుక ఒక బాధ, ఒక యాతన ఏదో అన్నట్టుగా నాకయితే అనిపించింది. ఆ మాటలంటున్నప్పుడు ఆయన గొంతులో శోకమేదో ధ్వనించింది. ఇంతలో ఆయనే మళ్లీ అందుకున్నారు.

” మన ఊరికి అప్పుడు ఒక్క ఎలుగుబంటే వచ్చిందిరా. దాన్ని చంపీగానే దరిద్రం తీరిపోయిందిరా. ఇప్పుడు దాన్ని మించిన క్రూర జంతువులు ఊళ్లోకి దిగిపోయేయిరా. వాటిని నేను ఏం చేయగలిగేన్రా. ఎలుగుబంటిని చంపేనుగానీ, మన ఊరి బక్క రైతుల భూముల్ని బలవంతంగా లాక్కుని మందుల ఫ్యాక్టరీ పెట్టీసిన ఉప్పల సూర్యనారాయణదొరని ఏదయినా చేయగలిగేనేంట్రా..? మన ఊరి జనం వద్దు వద్దంటున్నా వినకుండా న్యూక్లియర్‌ ప్లాంటు పెట్టిన మార్వాడీ సేట్‌ ఉదయ్‌లాల్‌ వెంట్రుక ముక్కయినా తెంపగలిగేనేంట్రా..? సమ్మెకట్టిన మన జనపనార మిల్లు వర్కర్లని పిట్టల్లా కాల్పించీసిన ఫ్యాక్టరీవోనరు పానకాల రాయుడి అంతు తేల్చీగలిగేనేంట్రా..? చెప్పరా.. చెప్పు.. చెప్పు..” అంటూ ఆవేశంగానూ చాలా కోపంగానూ కడిగీసినట్టుగా నన్నడిగీసేరు. ఆ సమయంలో ఆయన మాటాడుతుంటే సింహాచలం ఉగ్రనరసింహస్వామిలాగ, అనకాపల్లి నూకాల్తల్లిలాగ, గంధవరం మరిడిమాంబలాగ భయంకరంగా ఆవుపించారు.

దెబ్బకి నా గుండెకాయ గొంతులోకి వచ్చీసినట్టయింది. తొంభైయ్యేళ్ల అమావృద్ధుడైవుండి కూడా జనకంటకులమీద మీద నిప్పులు కురిపిస్తూ మేస్టారు మాట్లాడుతుంటే నాకయితే దడుపు పుట్టీసింది. ఆయన హృదయంలో ఎంతటి దావాగ్ని దాంకుందో అర్థమైపోయింది. ఏదో అనబోయేను. ఈలోగానే, ఎలుగుబంటితో అప్పుడెప్పుడో దిగిన ఫోటోను గభాల్న నా దగ్గర్నించి ఆయన లాగీసుకున్నారు. దాన్ని పరపరా చింపీసేరు. చిరిగిన ఆ ముక్కల్ని వీధులో విసిరీసి చక్కావచ్చి కుర్చీలో మౌనంగా కూచుండిపోయేరు. ఆ వయసులో మేస్టారు అలా ఊగిపోవడం చూసి నాకు భయం వేస్సింది. ఆ వేళ ఆయన్ని మరింక ఎక్కువగా కదపకూడదనుకున్నాను. నమస్కారం పెట్టీసి మెల్లగా ఇంట్లోంచి బయటపడిపోయేను.

రోడ్డుమీదికొచ్చీసి గాభరా గాభరాగా నడుస్తున్నాను. నాలుగే నాలుగు అడుగులు పడ్డాయో లేదో. మేస్టారు చంపీసి పారీసిన పాత ఫోటో ముక్కలు వీధిలో ఎదురుపడ్డాయి. గాలికి రెపరెపలాడుతూ నా పాదాలకూ అడ్డం పడ్డాయి ” బాబూ! మీ జాన్‌ మేస్టారు ఆవేశంగా మాటాడిన మాటల్లో తప్పేటయినా ఉందా..? ఒకేళ ఉంటే గనుక, ఆ తప్పేంటో బేగా చెప్పీ..  బేగా చెప్పీ బాబూ..!” అంటూ అవన్నీ నన్ను నిలువునా నిలదీసినట్టుగా ఆ క్షణంలో నాకు తోచింది. ఉన్నపళంగా ఉక్కిరిబిక్కిరయిపోయేను.


డా. చింతకింది శ్రీనివాసరావు

ఖాళీలలోనే ఉంది కథంతా…

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 

ఋతుమతి యై పుత్రార్థము

పతి గోరిన భార్యయందు బ్రతికూలుండై                                    

ఋతువిఫలత్వము సేసిన

యతనికి మరి భ్రూణహత్య యగు నండ్రు బుధుల్

                                             -నన్నయ

 (శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం)

ఋతుమతి అయిన భార్య, పుత్రుని ఇవ్వమని భర్తను కోరినప్పుడు నిరాకరించి ఋతుకాలాన్ని విఫలం చేసినవాడికి గర్భస్థ శిశువును చంపిన పాపం చుట్టుకుంటుందని పెద్దలు చెబుతారు.

  ***

అదీ విషయం…ఋతుమతి అయిన భార్య పుత్రుని ఇమ్మని భర్తను కోరినప్పుడు, భర్త నిరాకరించి ఋతుకాలాన్ని విఫలం చేస్తే భ్రూణహత్యా పాపం చుట్టుకోదా అని శుక్రుని యయాతి అడుగుతున్నాడు!

  ఋతుకాలాన్ని విఫలం చేయడం, భ్రూణహత్య అనే మాటలు చర్చను మరో ప్రాంగణంలోకి తీసుకెడుతున్నాయి. బహుశా అవి పురాదశకు చెందిన  స్త్రీ-పురుష సంబంధాలను ఇప్పటి మన అవగాహనకు భిన్నంగా నిర్వచిస్తున్నాయి. ఋతుకాలాన్ని విఫలం చేస్తే భ్రూణహత్యా పాపం చుట్టుకుంటుందనే భావన ఇక్కడ చాలా కీలకం. భ్రూణహత్యా పాపం అనేది ఒక విశ్వాసం. ఇంకా చెప్పాలంటే ఒక మతవిశ్వాసం అంత బలీయమైనది. అంతేకాదు, స్త్రీ-పురుష సంబంధాల గురించి నేటి మన విశ్వాసాలు, భావనల కంటే కూడా అది బలీయం. పురా మానవుడి దృష్టిలో విశ్వాసాన్ని మించిన బలవత్తర శక్తి ఇంకొకటి లేదు. పురామానవుడు నూటికి నూరుపాళ్లూ విశ్వాసజీవి.  స్త్రీ-పురుష సంబంధాల గురించిన ఊహలు, శీలం, ఏకపత్నీవ్రతం,లేదా ఏకపతీవ్రతం మొదలైనవి మానవ పరిధిలోకి చెందినవి. సామాజిక కల్పనలు. ఋతుకాలాన్ని విఫలం చేస్తే భ్రూణహత్యా పాపం చుట్టుకుంటుందనే భావన వాటిని మించినది. అది మానవ పరిధినీ, సామాజిక పరిధినీ దాటేది. ఒక అతీతశక్తి పట్ల, లేదా ప్రకృతిపట్ల జరిగే దారుణ అపచారానికీ, ద్రోహానికీ అది సూచన. 

ఈ సందర్భంలో నాకు ఎస్. ఎల్. భైరప్ప రాసిన ‘పర్వ’ నవల గుర్తుకొస్తోంది. ఆ నవల ప్రారంభమే ఋతుకాల భయాలతో జరుగుతుంది. మద్రదేశాధీశుడైన శల్యుడి మనవరాలు పెద్దమనిషి అవుతుంది. నెలలు గడుస్తూ ఉంటాయి. కానీ శల్యుడి కొడుకు ఇంకా ఆమెకు పెళ్లి చేయలేదు. శల్యుడు దీనినే తలచుకుని బాధపడుతూ ఉంటాడు. మనవరాలు నెల నెలా బయటచేరిన ప్రతిసారీ అతడు మరింత చిత్రవధకు లోనవుతూ ఉంటాడు. కొడుకుపై కోపం ముంచుకొస్తూ ఉంటుంది. వంశానికి అంతటికీ  భ్రూణహత్యా పాపం చుట్టబెడుతున్నాడనుకుంటాడు. కొడుకుని పిలిచి కోప్పడతాడు. మన వంశ గౌరవానికి తగినట్టు స్వయంవరం ప్రకటించాలని తన ఉద్దేశమనీ, అయితే, కురు-పాండవ యుద్ధం జరగబోతోంది కనుక రాజులందరూ యుద్ధ సన్నాహంలో ఉన్నారనీ, స్వయంవరానికి రాకపోవచ్చనీ, అందుకే ఆలస్యం చేస్తున్నాననీ కొడుకు సమాధానం చెబుతాడు.

books

భ్రూణ హత్యాపాపంతో పాటు మరో భయమూ శల్యుని పీడిస్తూ ఉంటుంది. అది, మనవరాలిని పొరుగునే ఉన్న ఏ నాగజాతి యువకుడో లేవదీసుకుపోయే అవకాశం! చివరికి అదే జరుగుతుంది.

ఋతుకాల విఫలత్వం భ్రూణహత్యా పాపాన్ని చుట్టబెడుతుందన్న ఆదిమ విశ్వాసం ఆధునిక కాలంలోనూ మొన్న మొన్నటివరకూ శ్రోత్రియ కుటుంబాలలో కొనసాగింది. ‘రజస్వలాత్పూర్వ వివాహం’ గతంలో ఒక పెద్ద చర్చనీయాంశం.  పాటించి తీరవలసిన ఒక నియమం. దీనికి ఏవేవో సామాజిక కారణాలు చెబుతారు. వాటిలోనూ నిజం ఉంటే ఉండచ్చు కానీ, నా ఉద్దేశంలో భ్రూణ హత్యా పాపం గురించిన భయాలే ఆ నియమానికి అసలు కారణం. రజస్వలాత్పూర్వ వివాహాల పట్టింపు క్రమంగా కొంత సడలి, రజస్వల అయిన వెంటనే పెళ్లి చేసే తొందరకు దారి తీసింది. ఇప్పుడు ఆ పట్టింపు కూడా చాలావరకూ పోయింది. చట్టం కూడా బాల్యవివాహాలను నిషేధించింది.

మరికొంత వివరించుకుంటే, పైన చెప్పుకున్న ఋతుకాల భయాలనేవి స్త్రీ-పురుష సంబంధాలను వివాహం అనే సామాజిక రూపంలో వ్యవస్థీకరించడానికీ; స్త్రీకి ఒకే పురుషుడన్న నియమానికీ; స్త్రీ శీలం గురించిన నేటి భావనలకూ కూడా పూర్వదశకు చెందిన వనడానికి అవకాశం ఉంది. ఆవిధంగా ఋతుకాలభయాలకూ, వివాహానికీ ముడి అనంతర కాలంలో ఏర్పడిందనుకుంటే, బహుశా ఋతుకాలం ప్రాప్తించిన స్త్రీకి వివాహం వెలుపల సైతం దానిని సఫలం చేసుకునే హక్కూ, తద్వారా సంతానం పొందే హక్కూ ఉండి ఉండాలి. పురుషుడికి ఉన్నట్టే స్త్రీకి కూడా ఋతుకాల వైఫల్యం వల్ల కలిగే భ్రూణ హత్యాభయాలు ఉంటాయి కనుక, ప్రస్తుత సందర్భంలో కథకుడు చెప్పకపోయినా శర్మిష్ట ఆ భయాలను యయాతిపై ప్రయోగించే ఉంటుంది.

దీనిని విస్తరించుకుంటూ వెడితే ఈ చర్చ క్రమంగా మాతృస్వామ్య, పితృస్వామ్య వ్యవస్థల గురించిన చరిత్రలోకి తీసుకువెడుతుంది. మాతృస్వామ్యంపై పితృస్వామ్యానిది పై చేయి అయి, స్త్రీ క్రమంగా పురుషుడి ప్రైవేటు ఆస్తిగా మారి, వివాహ వ్యవస్థ బిగుసుకునే క్రమంలో దానికీ;  స్త్రీ ఋతుకాల హక్కుకూ, సంతాన హక్కుకూ మధ్య ఘర్షణ ఏర్పడి ఉండాలి.  భైరప్ప ప్రకారం శల్యుడి కాలానికే ఆ పరివర్తన జరిగిపోయి ఉండాలి. అయితే వ్యవస్థ మారినంత వేగంగా విశ్వాసం మారదు. దాని ఫలితమే శల్యుని భ్రూణహత్యా భయాలు.

పై వివరణ ఇప్పటి నమ్మకాలను, మనోభావాలను గాయపరిచేలా ఉండచ్చు కానీ, స్త్రీకి ఒకే పురుషుడన్న నీతిని మించి ఋతుకాల ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పే సాక్ష్యాలు మహాభారతంలోనే పుష్కలంగా ఉన్నాయి. ముందుగా మూడు ఉదాహరణలు చెప్పుకుంటే…

ఆదిపర్వం, తృతీయాశ్వాసంలో కథకుడైన వైశంపాయనుడు వ్యాసుని పుట్టుక గురించి జనమేజయునికి చెప్పి, ఆ వెంటనే, దేవదానవుల అంశతో భీష్మాది వీరులు పుట్టి భారతయుద్ధం చేశారని అంటాడు. అలా పుట్టిన రాజులందరూ భారతయుద్ధంలో నశించడానికి కారణమేమిటని జనమేజయుడు అడుగుతాడు. వైశంపాయనుడు సమాధానం చెబుతూ, పరశురాముడు ఇరవయ్యొక్కసార్లు దండెత్తి క్షత్రియులందరినీ సంహరించాడనీ, అప్పుడు ఆ రాజుల భార్యలు సంతానం కోరి ఋతుకాలంలో ధర్మం తప్పకుండా మహావిప్రుల దయతో సంతానం పొందారనీ, దాంతో రాజవంశాలు వర్ధిల్లాయనీ అంటాడు. ఎన్నో ఆసక్తికర విశేషాలున్న వైశంపాయనుని సమాధానం మొత్తాన్ని నేను ఇక్కడ ఇవ్వడం లేదు. వేరొక సందర్భంలో దాని గురించి చెప్పుకుందాం. ప్రస్తుతానికి వస్తే…

మృతులైన రాజుల భార్యలు ఋతుకాలంలో ధర్మం తప్పకుండా, అంటే ఋతుకాలధర్మం తప్పకుండా మహావిప్రుల దయతో సంతానం పొందారని పై సమాచారం వెల్లడిస్తోంది. ఇక్కడ ఋతుకాల ప్రస్తావన చేయకుండా, విప్రుల ఆశీస్సులతో సంతానం పొందారని చెప్పి ఉంటే, దానికి ఏదో మహిమను ఆపాదించి సమర్థించుకోవచ్చు. కానీ ఋతుకాలాన్ని ప్రస్తావించి మరీ కథకుడు ఈ సంగతి చెప్పాడుకనుక దీనిని వాస్తవికార్థంలోనే తీసుకోవలసి ఉంటుంది.

రెండో ఉదాహరణ, ఉదంకుని ఉదంతం. ఉదంకుడు పైలుడనే ముని శిష్యుడు. ఫైలు డొకసారి దేశాంతరం వెడుతూ ఇంటి బాధ్యతలు ఉదంకునికి అప్పజెబుతాడు. అంతలో ఫైలుని భార్యకు ఋతుకాలం సంభవిస్తుంది. ఇతర స్త్రీలు ఉదంకునితో ఈ విషయం చెప్పి, గురువు దగ్గరలో లేరు కనుక ఆయన స్థానంలో నువ్వు ఆమెకు ఋతుకాలోచితాన్ని నిర్వర్తించాలని చెబుతారు. ఉదంకుడు అందుకు తిరస్కరిస్తాడు. గురువు తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయం ఆయనకు చెబుతాడు. అప్పుడు గురువు ఉదంకుని మెచ్చుకుంటాడు. ఉదంకునికి స్త్రీలు ఆ సూచన చేశారంటే, అప్పటికి అలాంటి ఆనవాయితీ ఉందనుకోవాలి. ఉదంకుడు తిరస్కరించాడంటే, ఆ ఆనవాయితీకి కాలం చెల్లుతూ ఉండాలి. ఈ సందర్భాన్ని కథకుడు ప్రధానంగా మరొకందుకు వాడుకున్నాడు. అది, ఉదంకుని గురుభక్తిని చెప్పడం.

నాకు ఈ ఉదంతంలో లీలగా ఇంకొకటి కూడా స్ఫురిస్తూ ఉంటుంది. యజమాని దేశాంతరం వెళ్ళడం, ఒక కట్టుగా ఉన్న స్త్రీలు మాతృస్వామ్యం తాలూకు ఒక ఆనవాయితీని అమలుచేయడానికి ప్రయత్నించడం, యజమాని ప్రతినిధి అయిన ఉదంకుడు అందుకు నిరాకరించడం -ఋతుకాలోచితం విషయంలో  స్త్రీ-పురుషుల మధ్య అప్పటికింకా కొనసాగుతున్న ఘర్షణను సూచిస్తూ ఉండచ్చు.  విశేషమేమిటంటే, సంస్కృత భారతంలో ఉన్న ఈ ఉదంతాన్ని అనువాదంలో నన్నయ పరిహరించాడు.

ఇక మూడో ఉదాహరణకోసం నేరుగా కథలోకి వెడదాం:

శర్మిష్టకు కొడుకు పుట్టాడు. పేరు, దృహ్యువు. దేవయాని ఆశ్చర్యపోయింది.  ‘చిన్నదానివైనా మంచి వినయశీలాలతోనూ, గౌరవంగానూ, మనోవికారాలకు దూరంగానూ ఉంటున్న ఈ పరిస్థితిలో నీకు కొడుకు ఎలా పుట్టాడు? చాలా ఆశ్చర్యంగా ఉందే!’ అంది.

శర్మిష్ట సిగ్గుపడుతూ తలవంచుకుని, ‘ఎక్కడినుంచో ఒక మహాముని, వేదవేదాంగపారగుడు వచ్చి ఋతుమతి నై ఉన్న నన్ను చూసి కొడుకును ప్రసాదించాడు’ అంది.

దేవయాని (ఏమీ మాట్లాడకుండా) తన నివాసానికి వెళ్లిపోయింది. ఆ తర్వాత శర్మిష్టకు వరసగా అనువు, పూరువు అనే మరో ఇద్దరు కొడుకులు కలిగారు.

దేవయానికి శర్మిష్టలో హఠాత్తుగా వినయశీలాలు, గౌరవనీయత కనిపించడం విశేషం. దానినలా ఉంచితే, శర్మిష్ట సమాధానం గమనించండి…ఎవరో మహాముని వచ్చి, ఋతుమతి నై ఉన్న నన్ను చూసి కొడుకునిచ్చా’ డని చెబుతోంది. పైన రాజుల భార్యల విషయంలో చెప్పుకున్నదే ఇక్కడా వర్తిస్తుంది.  శర్మిష్ట ఋతుకాలం లో ఉన్నప్పుడే ఆ ‘మహాముని’ ఆమెకు కొడుకునిచ్చి వెళ్ళాడు. అది అబద్ధమైనా, అది వెల్లడిస్తున్న ఆనవాయితీ అబద్ధం కాదు. ఆ ఆనవాయితీ దేవయానికి కూడా తెలుసు. అందుకే శర్మిష్ట అలా చెప్పగానే మారు మాట్లాడకుండా వెళ్లిపోయింది. నిజానికి ‘నీకు కొడుకు ఎలా పుట్టా’ డన్నదే దేవయాని ప్రశ్న అయుంటుంది. యయాతి వల్ల కలిగాడా అన్నది తేల్చుకోవడమే ఆమెకు కావాలి.  యయాతి వల్ల కాకుండా, ఇంకెవరి వల్ల శర్మిష్టకు కొడుకు పుట్టినా దేవయానికి అభ్యంతరం లేదు, అందులో ఆశ్చర్యమూ లేదు.

ఇక, ఆమె ప్రశ్నలోని మిగతా భాగమంతా కథకుని కల్పన. ఎందుకంటే, ఋతుకాల ప్రాధాన్యాన్ని వెల్లడించే ఆ ఆనవాయితీ చర్చలోకి రాకూడదు. అందుకే, దేవయాని నోట తన మాటలు పలికిస్తూ ఆ ఆనవాయితీపై  కథకుడు ముసుగు కప్పుతున్నాడు. కారణం ఇంతకుముందు చెప్పుకున్నదే:  ఆ ఆనవాయితీ గురించి తెలియని వేరొక సామాజిక దశకు చెందిన శ్రోతలకు అతడు కథ చెబుతున్నాడు. లేదా, తనే ఆ ఆనవాయితీని సరిగా పోల్చుకోలేకపోయీ ఉండచ్చు.

కథలోకి వెడితే…శర్మిష్ట కొడుకులు ముగ్గురూ, ఒంటి మీద ఆభరణాలు లేకపోయినా సహజకాంతితో మూడు అగ్నుల్లా ప్రకాశిస్తూ తన ముందు ఆడుకుంటుండగా వినోదిస్తున్న యయాతి దగ్గరికి; శర్మిష్టనూ, ఇతర దాసీ కన్యలనూ వెంటబెట్టుకుని వైభవం చాటుకుంటూ శచీదేవిలా దేవయాని వచ్చింది. తేజస్సు ఉట్టిపడుతుండగా, యయాతి ప్రతిబింబాల్లా ఉన్న ఆ ముగ్గురినీ చూసి ‘ఈ పిల్ల లెవ’ రని యయాతిని అడిగింది. యయాతి సమాధానం చెప్పలేదు. ‘మీ తల్లిదండ్రు లెవ’ రని ఆ పిల్లలనే అడిగింది. వారు లేత చూపుడు వేళ్ళతో యయాతినీ, శర్మిష్టనూ చూపించారు.

తనకు తెలియకుండా యయాతి శర్మిష్టవల్ల సంతానం పొందాడని దేవయానికి తెలిసిపోయింది. కోపమూ, దుఃఖమూ ఆమెను ముంచెత్తాయి. ఈ ‘దానవి’తో సంబంధం పెట్టుకుని యయాతి తనను నిలువునా వంచించాడనుకుంది. తక్షణమే పుట్టింటికి వెళ్ళి, తండ్రి పాదాలమీద పడి దీర్ఘనేత్రాలనుంచి ఉబికివచ్చే జలధారలతో వాటిని కడిగింది.

యయాతి కూడా బతిమాలుతూ దేవయాని వెంటే వెళ్ళి శుక్రుని దర్శించి నమస్కరించాడు.  ‘ధర్మం తప్పి ఈ రాజు రాక్షస పద్ధతిలో ఆ రాక్షసిమీద అనురక్తుడై ముగ్గురు కొడుకుల్ని కన్నాడు. నన్ను అవమానించాడు’ అని దేవయాని గద్గదస్వరంతో అంది. శుక్రునికి కోపం వచ్చింది. ‘యవ్వన గర్వంతో కళ్ళు మూసుకుపోయి నా కూతురికి అప్రియం చేశావు కనుక నువ్వు వృద్ధాప్యభారంతో కుంగిపోతావు’ అని యయాతికి శాపమిచ్చాడు.

అప్పుడు, ‘ఋతుమతియైన భార్య కొడుకునిమ్మని భర్తను కోరినప్పుడు అతడు నిరాకరించి ఋతువిఫలత్వం చేస్తే భ్రూణహత్యా పాపం సంభవిస్తుందని పెద్దలు చెప్పలేదా, దానికి భయపడే ఆ మానవతి కోరిక తీర్చాను, ఇందుకు ఆగ్రహించడం న్యాయమా’ అని యయాతి ప్రశ్నించాడు. ఆ వెంటనే గడుసుగా, కూతురిపై శుక్రునికి ఉన్న మమకారానికి గురి పెడుతూ, ‘ఈ దేవయానిపై నాకింకా కోరిక తీరలేదు. ఇప్పుడే వృద్ధాప్యాన్ని ఎలా భరించను?’ అన్నాడు. ఆ మాటకు శుక్రుడు మెత్తబడ్డాడు. ‘అలా అయితే నీ వృద్ధాప్యాన్ని నీ కొడుకుల్లో ఒకరికిచ్చి వాడి యవ్వనాన్ని నువ్వు తీసుకో. విషయసుఖాలతో తృప్తి చెందిన తర్వాత తిరిగి వాడి యవ్వనాన్ని వాడికి ఇచ్చేసి, నీ వృద్ధాప్యాన్ని తిరిగి పుచ్చుకో. ఇంకో విషయం, నీ వృద్ధాప్యాన్ని తీసుకున్నవాడే నీ రాజ్యానికి అర్హుడు, వంశకర్త అవుతాడు’ అన్నాడు.

02Kach

దేవయానీ, శుక్రుల పరంగా ఇందులో విశ్లేషించుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. వాటిని ప్రస్తుతానికి అలా ఉంచితే, ఋతుమతి అయిన భార్య కొడుకునిమ్మని అడిగితే భర్త ఎలా నిరాకరిస్తాడని యయాతి అనడాన్ని గమనించండి… ఇంతకీ శర్మిష్టకు యయాతి ‘భర్త’ ఎలా అయ్యాడు?! ఈ సందర్భం, భర్త అనే మాటకు నేడున్న అర్థాన్ని దాటిపోతోంది. ఇక్కడ భర్త అంటే ఒక స్త్రీకే పరిమితుడైన మొగుడు కాదు. తన పోషణలో ఉన్న దాసీలపై కూడా లైంగిక హక్కు ఉన్న యజమాని, నాథుడు, మాస్టర్. ‘భార్య-దాసి-కొడుకు వారించరాని ధర్మా’లన్న శర్మిష్ట మాట దానినే చెబుతోంది. ఇది ఒకనాటి గృహ ఆర్థిక వ్యవస్థను సూచిస్తోంది.

విశేషమేమిటంటే, శర్మిష్టకు తనను భర్తగా యయాతి చెప్పడంలోని మర్మం ఏమిటన్న సందేహం సంప్రదాయ పండితులెవరికీ వచ్చినట్టు లేదు. కనీసం, దివాకర్ల వేంకటావధాని, జీవీ సుబ్రహ్మణ్యం గార్ల వ్యాఖ్యానంతో టీటీడీ ప్రచురించిన కవిత్రయ భారతం, ఆదిపర్వంలో దీనిపై ఎలాంటి వివరణా లేదు. సంప్రదాయ పఠన పాఠనాలు విడిచిపెట్టిన ఇలాంటి సందేహాల ఖాళీలు చాలా చోట్ల కనిపిస్తాయి. ఆ ఖాళీలలోనే ఉంది అసలు కథ అంతా!

 

 – కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

 

“ఒక మనిషి డైరీ” అంటే బాగుండేది!

మంచి రచన ప్రథాన లక్షణం హాయిగా చదివించగలగడం; ఆ పై ఆలోచింపజేయడం. కాలానికి తట్టుకుని నిలిచేది ఉత్తమ రచన అని కొంతమంది అంటూంటారు. కాలంతో పాటు సాగుతూ, గడచిన కాలాన్ని రికార్డు చేయడం, ఆయా అనుభూతులను, అనుభవాలను, స్మృతులను, ఆనందాల్ని, బాధల్ని అక్షరబద్ధం చేయడాన్ని డైరీఅనవచ్చు. మరి డైరీలూ, ఉత్తమ రచనలేనా అని కొందరు ప్రశ్నించవచ్చు. అన్ని డైరీలు కాకపోయినా, ప్రపంచవ్యాప్తంగా కొందరు ప్రముఖుల డైరీలు సాహిత్యాన్ని, సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసాయని చెప్పక తప్పదు. పూడూరి రాజిరెడ్డి పలక పెన్సిల్అనే పుస్తకం ఉప శీర్షిక ఒక మగవాడి డైరీమనకి ఇదే చెబుతుంది.
మనిషి జీవితంలోని ఒక్కోదశలో అతని ప్రవర్తన, భావాలూ, ఆలోచనలు, జ్ఞాపకాలు, సంశయాలు, సందిగ్ధాలు, సమస్యలు, విజయాల గురించి చెప్పింది. పుస్తకంలోని ఆర్టికల్స్ (ఇవన్నీ గతంలో సాక్షి ఫండేలోనూ, ఈనాడు ఆదివారం అనుబంధంలోనూ ప్రచురితమైనవే) మనిషి జీవితంలో ఒక క్రమంలో ఎదగడాన్ని సూచిస్తాయి. రచయిత ఉద్దేశానికి తగినట్టే ముఖచిత్రం మీద అన్వర్ వేసిన బొమ్మలు వ్యక్తి జీవితంలోని శైశవం, బాల్యం, కౌమారం, యవ్వనం, ముదిమిలను ప్రతిబింబిస్తున్నాయి. పుస్తకంలోని ఆర్టికల్స్‌ని బలపం, పెన్సిల్, పెన్ను విభాగాలుగా విభజించడం బాల్యం, కౌమారం, యవ్వనాలకు ప్రతీకగా పరిగణించవచ్చు. సాధారణంగా డైరీ అంటే ఎవరిదైనా వ్యక్తిగత సమాచారం అని భావిస్తాం. కానీ ఈ డైరీ వ్యక్తిగతం కాదు, ఓ వ్యక్తి గతాన్ని, వర్తమానాన్ని మిళితం చేస్తూ, ఆ వ్యక్తిలాంటి ఎందరో వ్యక్తుల అనుభవాలు, అనుభూతులను, భావాలను వెల్లడించింది. శిశువుగా ఓ కుటుంబంలో జన్మించి, ఎదుగుతూ బంధాలను కలుపుకుంటాడు మనిషి. యవ్వనంలోకి వచ్చేసరికి కుటుంబం పరిధి పెరుగుతుంది, ఒక్కోసారి తగ్గుతూంది కూడా. కొత్తబంధాలు ఏర్పడుతాయి. అయితే చాలామంది చేసే పొరపాటు పాతవాటిని వదిలేసుకోడం అని అవ్యక్తంగా చెబుతారు రచయిత. తన ఊరు, పొలం జ్ఞాపకాలు, తమ్ముడి స్మృతులు, తను చూసిన సినిమాలు, తన చదువు ముచ్చట్లు – “బలపంవిభాగంలోని ఆర్టికల్స్ చెబుతాయి. ఈ విభాగంలోని ఆర్టికల్స్ చదువుతుంటే ఎప్పుడో బాపుగారి దర్శకత్వంలో వచ్చిన స్నేహంసినిమాలోని ఓ పాట ఎగరేసిన గాలిపటాలు….” పాటలోని కొన్ని వాక్యాలు …. “చిన్ననాటి ఆనవాళ్ళుస్నేహంలో మైలురాళ్ళుచిన్నప్పటి ఆనందాలు చిగురించిన మందారాలు….” మనసు పొరల్లో దోబూచులాడాయి. పెన్సిల్ విభాగం కౌమారంతో ప్రారంభం అవుతుంది. కలం స్నేహం చేయాలనే అభిలాషతో గోవాలోని ఓ అమ్మాయికి మొదటి లేఖలోనే…. తన గురించిమొత్తం చెప్పేయడం…. కానీ ఆ లేఖకి జవాబు రాకపోవడం…. తను చేసిన తప్పేంటో తర్వాతర్వాత తెలుసుకుంటారు రాజిరెడ్డి.

చిన్నచిన్న పదాలతో కోనసీమ కొబ్బరిచెట్లని మనోజ్ఞంగా వర్ణించారు రచయిత. అదే భావ శబలతతో తన సొంతూరుని వర్ణించిన తీరు, ఎవరికైనా తమ స్వంత ఊరుని గుర్తు చేయకమానదు.

మనిషికి తోడు ఎందుకు కావాలో తెలుసా? అందరూ తమ దుఃఖాన్ని పంచుకోడానికి మరొకరు కావాలనుకుంటారు. కాని రాజిరెడ్డికి మాత్రం అలా అనిపించదు. హృదయంలో పొంగి పొరలుతున్న సంతోషాన్ని ఒక్కడే అనుభవించక, తోడు కావాలని కోరుకుంటారతను. అంతలోనే బంధం ఎన్నాళ్ళని ప్రశ్నిస్తూ, తనే సమాధనం చెబుతారు జీవితకాలం అని. “రూపం లేని, ఇదీ అని చెప్పలేని ప్రేమకి రూపం వస్తేఅదిగోఅది మీ ఇంట్లో ఉండే మీ మనిషిగా ఉంటుంది…” అంటూ జీవితభాగస్వామి గురించి అద్భుతంగా చెప్పారు.

PalakaPencilFrontCover

భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న తగాదాలు, అభిప్రాయబేధాల గురించి ఇలా అంటారు – “నేను కాదంటాను. నువ్వు చేసే రాచకార్యమేమిటి? అని హోమ్ పాయింట్ ఎదురవుతుంది. నేను చెప్పబోయేవేవీ వాదనకు నిలబడవని నాకు తెలుసు. అందులో కొన్నింటిని చెప్పుకోలేమనీ తెలుసు. అందుకని అసహనాన్ని ఆశ్రయిస్తాను. వాళ్ళు నిరసనని ఆయుధంగా చేసుకుంటారు. ఆ నిరసనని నిరసిస్తూ నేను మౌనం పాటిస్తాను. ఆ మౌనాన్ని ఛేదించడానికి మాటల ఈటెలు విసరబడతాయి. వంద విసుగులు, వెయ్యి నిట్టూర్పులు శవాలుగా నేల కూలుతాయి. చేస్తున్నది ధర్మయుద్ధం కాబట్టి, చీకటి పడగానే దాన్ని అలా అక్కడికి ఆపేస్తాం“. ఈ వాక్యాలు చదివాక, ఇది తమకి సంబంధించినది కాదని పాఠకులు అనుకోగలరా? తమ గురించే రచయిత రాసేసినట్లు భావించరూ?

పిల్లల్ని ఎలా పెంచాలో మరో చోట చెబుతూ.. “బతకడం ఎలాగో మనమే నేర్చుకుంటున్నప్పుడు, పిల్లలకు జీవితం అంటే ఏం చెప్పగలం?” అని ప్రశ్నిస్తారు. బహుశా, ఇది ప్రతీ తల్లీ తండ్రీ తమకి తాము వేసుకోవాల్సిన ప్రశ్నేమో

“మనకి మనమే ఎందుకు ఇంతగా నచ్చకుండా పోతాం? మన అలవాట్లను ఎందుకు ఇంత తీవ్రంగా నిరసిస్తున్నాం? మనం ఉన్న స్థితే కరెక్టు అని తెలియాలంటే, దీనికంటే భిన్నస్థితిలోకి ఒకసారి వెళ్ళిరావాలి…” అంటారు. వ్యక్తిత్వ వికాస రచయితలు పెద్ద పెద్ద పదాలతో చెప్పే విషయాన్ని సూక్ష్మంగా, సునిశితంగా చెప్పేసారు రాజిరెడ్డి.

భోగిమంటల్లో ఏమేమి వెయ్యాలో హృద్యంగా చెప్పారు ఈ పుస్తకంలో. మోసం, కపటం, అసూయ, అపరాధ భావన, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్వీటిని భోగిమంటల్లో వేసి తగలబెట్టాలట. “రక్తప్రసరణ పెంచుకుని, జుట్టుని రాల్చుకుని, ముఖాన్ని మాడ్చుకుని…. వాటిల్లో మనం దహించుకుపోడమా, వాటినే మనం దగ్ధం చేయడమా?” అని అడగడంలో ఆనందంగా జీవించడమెలా అనే కళని చెప్పకనే చెప్పారు రచయిత.

ఎవరినో ఎందుకు మార్చాలి? ఇతరులలో తప్పులెందుకు పట్టాలి? జీవితాంతం జీవించడం నేర్చుకుంటూనే ఉండాలనే సెనెకా మాటలని ఉదహరిస్తూ ఈ ప్రపంచం పర్ఫెక్ట్ కాదంటారు. “నేనేమిటోఅన్న వ్యాసం పూర్తిగా రచయితకి సంబంధించినదే అయినా, ఇందులోని చాలా పాయింట్లతో చదువరులు తమని తాము ఐడింటిఫై చేసుకుంటారు.

పెన్ను విభాగంలోని రచనలు క్లుప్తంగా ఉన్నా, వాటిలో విస్తృతమైన, విశాలమైన భావాలున్నాయి. తాత్త్వికత జోడించిన అంశాలివి. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడం పిల్లలకి మాత్రమే ఎందుకు సాధ్యమవుతుందో, ఆటతో పోలుస్తూ చెప్పడం బాగుంది. ప్రేమ, బాధ, ఆప్యాయత, అసూయ…. ఏ గుంపుకైనా సహజ లక్షణాలు అనుకున్నప్పుడు సంసారానికి, సన్యాసానికి పెద్దగా తేడా ఉండదంటారు రాజిరెడ్డి. “చెట్టు కదలకుండానే పెరుగుతుంది చూడు; మనిషి కూడా అలా లోలోపల పెరగలేడంటావా?” అని అడిగిన మల్లయ్య ప్రశ్న మనల్నీ ఆలోచనల్లో పడేస్తుంది.

ఇదే పుస్తకంలో మరోచోట అంటారు – “ఆడవాళ్ళతో సమస్యలుంటాయేమో గాని అమ్మతో పేచీ ఎప్పుడూ ఉండదుఅని. అమ్మల గురించి చెప్పినా, అందం అంటే ఏమిటో వివరించినా, స్త్రీలు అంటే ఎవరో నిర్వచించినా కుటుంబాన్ని, సమాజాన్ని దగ్గర్నించి చూసి, గ్రహించి, నిర్వచించినట్లు తెలుస్తుంది ఆయా వాక్యాలు చదువుతూంటే.

పుస్తకం కవర్ పేజి మీద ఉన్న పలక బొమ్మ మీద రాసిన అక్షరాలు – “: అతడు; : ఆమెమనకెన్నో సంగతులు చెబుతాయి. మనం మన గురించి కాక, ఇతరుల గురించే ఎక్కువగా ఆలోచిస్తాం. వాళ్ళిలా…. వీళ్ళిలా అంటూ వేరేవారి అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఆపాదిస్తాం. కాని అసలు మనకి కావల్సింది ఎవరిని వారు తెలుసుకోడం అంటారు రాజిరెడ్డి.

ఈ పుస్తకం ఒక నాస్టాల్జియా! గతాన్ని నెమరువేసుకునే జ్ఞాపకం!! భవిష్యత్తులోకి భవ్యంగా నడిపే మార్గదర్శి!!! చదవడం పూర్తయ్యాక, ఈ పుస్తకం ఉపశీర్షిక ఒక మగవాడి డైరీఅనికాకుండా, “ఒక మనిషి డైరీఅని ఉండుంటే సరీగ్గా ఉండేదని అనిపిస్తుంది.

ఈ పుస్తకం గురించి అఫ్సర్ గారు తన ముందుమాటలో చెప్పిన వాక్యాలతో వ్యాసం ముగిస్తాను. “జీవితం ఒక వొత్తిడి. మనసుకీ, చేతకీ మధ్య, ఆలోచనకీ, సిరాకీ మధ్య – మనసు తీసే కూని రాగాలన్నీ వరుసబెట్టి కాయితమ్మీద తుమ్మెద బారులాగా చూసుకుంటే… అదిగో… అలాంటి పని రాజిరెడ్డి “పెన్ను” చేసింది. అనేక రకాల వొత్తిళ్ళ మధ్య మాట క్లుప్తం అవుతుంది. కానీ, మాటకి వొక పొందిక వస్తుంది. వొక జెన్ యోగి నిశ్శబ్దంలోంచి రాలిన హైకూలాంటి అరుదైన ఆకులాంటి భాష.”

సరళ వచనం, నమ్మశక్యంగాని సులభమైన శైలి ఈ పుస్తకాన్ని ఆసాంతం చదివేలా చేస్తాయి. సారంగ బుక్స్ ప్రచురించి 113 పేజీల ఈ పుస్తకం వెల రూ. 75/- నవోదయ బుక్ హౌస్‌లో లభిస్తుంది. భారతదేశం బయట తెలుగువారికి అమెజాన్, సారంగ బుక్స్, ఎవికెఎఫ్ లోనూ లభిస్తుంది.

కొల్లూరి సోమ శంకర్

కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమశంకర్

తొలి అడుగులలో నాలుగు అచ్చు, పధ్నాలుగు రొచ్చు…!!

 

అరిపిరాల సత్యప్రసాద్

అరిపిరాల సత్యప్రసాద్

నిజం చెప్పద్దూ, మా ఇంట్లో వెనక ఏడు తరాలు చూసుకున్నా రచయితలు ఎవరూ లేరు. దూరపు చుట్టాలలో సంగీతజ్ఞులు, ఇదే ఇంటిపేరుతో కొంతమంది రచయితలు వున్నా వారితో అనుబంధం తక్కువ. మరి నాలో ఈ సాహిత్యాభిలాష ఎక్కడిదా అని వెతుక్కుంటూ నాలోకి నేనే చూసుకుంటే –

ముందు మా అమ్మ జ్ఞాపకం వస్తుంది. గత పాతికేళ్ళుగా ఆమె జ్ఞాపకంగానే మిగిలింది. పాత సినిమాపాటలో, లలిత సంగీతమో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా లేకుండా ఆమె నాకు గుర్తుకురాదు. రేడియో పాడుతుంటే, ఆమె పనులు చేసుకోవటం ఆమె గురించి గుర్తున్న సంతోషకరమైన జ్ఞాపకాలలో ఒకటి.

ఇక అదే రేడియోలో ఏ రాత్రిపూటో నాన్న పెట్టే కర్ణాటక సంగీతం – తెలియకుండానే త్యాగరాజునీ, శ్యామదాసునీ, పురంధరదాసునీ పరిచయం చేసేవి. సుబ్బలక్ష్మి, శమ్మంగుడి, మహారాజపురం, కున్నకూడి, పట్టమ్మాళ్ ఇలా ఒక్కొక్కళ్ళే మా గోడమీద చెక్కస్టాండ్ స్టేజి పైకి ఎక్కి టేప్ రికార్డర్ రూపేనా కచేరీలు చేస్తుండేవాళ్ళు. వీళ్ళంతా నాన్న సేకరించిన వందలకొద్ది సంగీతం క్యాసెట్లలో సంగీత సామ్రాట్టులు. వీరందరి మధ్యలో అక్కడక్కడ కనిపించే నాలుగైదు సినిమా పాటల క్యాసెట్లలో నుంచి ఎ.ఎమ్.రాజా, ఘంటసాల, లీల, సుశీల గొంతు సవరించేవాళ్ళు. వీళ్ళంతా అమ్మకోసం నాన్న రికార్డ్ చేయిస్తే ఇంటికి వచ్చిన అతిథులు. ఈ సంగీతం, సినీగీతం మధ్యలో ఎక్కడో కళల గురించి ఆసక్తో, అభిరుచో మొదలైంది.

వేమన్నని, పోతన్నని పరిచయం చేసింది మేనత్త. తొలి అడుగులు వేస్తున్నప్పుటి నుంచే తెల్లవారుఝామున లేపి, నీళ్ళు పోసి, దేవతార్చనకి పూలు కోసే నెపంతో నన్ను పక్కింటికి తీసుకెళ్ళి “శుక్లాంబర ధరం”తో మొదలుపెట్టి, “ఇంతింతై వటుడింతై” అంటూ పోతనని పలకరించి, ఆ తరువాత పాడ్యమి విదియ తదియలు, ప్రభవ విభవలు చెప్పించేది. తెల్లవారుఝామున చెప్పిన పద్యాలు, చదివిన చదువులు, నందివర్ధనం చెట్టు మీద నుంచి రాలిపడిన మంచుబిందువులంత స్పష్టంగా గుర్తున్నాయి. అక్కడ తెలుగుతో పరిచయం అయ్యింది.

“నానమ్మా కథ చెప్పవూ” అనే మాటతోనే రాత్రుళ్ళు మొదలయ్యేవి మాకు. రాజకుమారుడు, తెల్లగుర్రాలు, పూటకూళ్ళపెద్దమ్మలు, కాశీమజిలీలు, భోజరాజు కథలు, విక్రమార్కుడు… నిద్ర… కథ…! వింటూ నిద్రపోతూ, కథల్లో తూగుతూ, కలల్లో కథని చూస్తూ, మనమే యువరాజులై గుర్రం పైన స్వారీ చేస్తూ వుంటే… ఇంతలో రాక్షసుడొస్తే పక్కనే ధైర్యం చెబుతూ నానమ్మ. కొంత వూహ తెలిసాక రామాయణం, మహాభారతం ఆ తరువాత ధృవుడు, ఇంకోరోజు హరిశ్చంద్రుడు… “లోహితా, లోహితా” అంటూ హరిశ్చంద్రుడు ఎంత ఏడ్చాడోకానీ, నానమ్మ ఆ కథ చెప్పిన ప్రతిసారీ ఏడవడం ఒక ఆశ్చర్యకరమైన జ్ఞాపకం. కథతో, అందులో వుండాల్సిన ఎమోషన్ తో తొలి పరిచయం.

ఆ తరువాత ఇంకేముంది – మనకి చదవటం వచ్చేసింది. పాఠ్య పుస్తకాలలో – మొక్కపాటి, పానుగంటి, జాషువా, కరుణశ్రీ, సర్ ఆర్థర్ కానన్ డాయల్, సోమర్ సెట్ మామ్, బయట పుస్తకాలలో – యండమూరి, మల్లాది, సూర్యదేవర, యద్దనపూడి వీళ్ళందరూ పరిచయం అయ్యారు. వీళ్ళందరినీ చదివి అవన్నీ చాలక కనపడ్డ పుస్తకమల్లా నమిలేస్తూ, నెమరేస్తూ – కిరాణా కొట్టులో కట్టిచ్చిన పొట్లాల కాగితంతో సహా చదివేసి తృప్తిగా తీరుబడిగా కూర్చున్నాక ఒక శుభముహుర్తాన శ్రీశ్రీ కనపడ్డాడు. ఆయన వెంట మొదలుపెట్టిన పరుగు “కలం కల” అంటూ కవితై మయూరి వారపత్రికలో అచ్చైంది. ఆ తరువాత కథలు – 1995 తొలికథ ఆంధ్రప్రభ ఆదివారం పత్రికలో దీపావళి కథలపోటీలో సాధారణ ప్రచురణ. అప్పుడే రైల్వే జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కథలపోటీలో మొదటి బహుమతి. తొలి అడుగులలో నాలుగు అచ్చు, పధ్నాలుగు రొచ్చు…!!

Cover

సాహితీవైద్యం కోసం వసుంధరగారికి రాయచ్చో రాయకూడదో అనుకుంటూ, ఒక రోజు ధైర్యం కూడగట్టుకోని “ఈరేశంగాడి ముచ్చట” పంపించాను. “కథాంశం బాగుంది. మీకంటూ ఒక శైలి ఏర్పడాలంటే మీరు ఎక్కువగా చదవా”లని వారి నుంచి ఉత్తరం. పెద్దల మాట చద్దన్నం మూట అని నాన్నమ్మ చెప్పిన మాట. అప్పుడే మరిన్ని పుస్తకాలు చదవాలని నిర్ణయించుకున్నాను!

అదే మొదలు. ఇట్నుంచి షిడ్నీ షెల్డన్, అగాథా క్రిస్టీ అట్నుంచి ముళ్ళపూడి, కొకు, బుచ్చిబాబు, చలం…. చదువుతున్నకొద్దీ కుచించుకుపోయి, నేను రాసినవీ కథలేనా అని ఆ మహామహుల రచనలలో ఆవగింజంతైనా అందుకునేదాకా రాయకూడదని ఆరేడు సంవత్సరాలు అజ్ఞాతవాసం. నేను రాసేది నాకు నచ్చేదాకా చదవటమే ఒక పని (ఇప్పటికీ కొనసాగుతోంది). గుజరాత్ లో చదువులు ఆ తరువాత కార్పొరేట్ వుద్యోగం. వుద్యోగం వూళ్ళు తిప్పింది. కొత్త ప్రాంతాలు, కొత్త మనుషులు, కొత్త పుస్తకాలు… కొత్త కొత్త కథలు. ఇందోరులో వున్నప్పుడు ఉజ్జైనిలో మంచినీటి కటకట గురించి పేపర్లో చదివిన తరువాత మళ్ళీ కలం కదిలింది. కొత్తగా పరిచయమైన టెక్నాలజీ సాయం తీసుకొని బ్లాగులు, అంతర్జాల పత్రికలకే పరిమితమై వుండిపోయాను.

ఆ తరువాత పరిచయమైన సాహితీ మిత్రులు వెన్నుతట్టి ప్రోత్సహించారు. బ్లాగుల్లో గుట్టుగా వున్న నన్ను అచ్చోసిన రచయితని చేశారు.

వసుంధరగారిని మళ్ళీ పలకరించాను. “మీ కథలకి ఇక సాహితీవైద్యం అవసరంలేదు. పుష్టిగా వున్నా”యన్నారు. పత్రికలో నా కథ వచ్చినప్పుడల్లా చదివి అభినందించారు, ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదం ఇచ్చిన ధైర్యం తోనే ఈ పుస్తకానికి వాళ్ళనే ముందుమాట అడిగేదాకా తీసుకొచ్చింది. వారి వాత్సల్యానికి, ప్రోత్సాహానికి నా సగౌరవనమస్సులు.

ఈ పుస్తకంతో నా సాహితీ ప్రస్థానం మొదలైంది.

***

చివరిగా ఒక్క మాట – ఇదంతా సోత్కర్షలా వుంటుందని తెలిసినా చెప్పే ధైర్యం చేశాను. చెప్పాల్సిన అవసరం వుందనిపించింది కాబట్టే ఆ సాహసం.

తెలుగు భాషని మరుగుపరుస్తున్నారన్న అపవాదు మోసే తరంలో వాడిని నేను. ఆంగ్లమాధ్యమంలో చదువులు, కార్పొరేట్ వుద్యోగాల పరుగుల మధ్యలో తెలుగు భాషాభిమానాన్ని, సాహితీ ఆసక్తిని సజీవంగా వుంచుకోవచ్చని చెప్పడానికి నేను ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. నాలాంటివారు ఎందరో వున్నారు. తెలుగు భాష అంతరించిపోతోందని బాధపడటం వల్ల ప్రయోజనం లేదు. మన ప్రయత్నం మానకూడదు. రేపటి తరానికి రెండు కథలు, నాలుగు పద్యాలు, కాసిన్న సామెతలు చెప్పి తెలుగు భాషని రుచి చూపించండి. ఆ తరువాత పఠనాసక్తిని కలిగించి వదిలిపెట్టండి. ఏ మాధ్యమంలో చదివినా, జీవనానికి మరే భాష అవసరం అయినా తెలుగు మీద మక్కువ ఎక్కడికీ పోదు. అందుకు నేనే సాక్ష్యమని చెప్పడానికే ఈ ముందుమాట.

 

భవదీయుడు

అరిపిరాల సత్యప్రసాద్

final invi

అతనిలా ఇంకెవరున్నారు?!

“కాలే గచ్చుపై కుంకుండు గింజలు గీకి
నాకు తెలీకుండా నువ్వు చురుగ్గా అంటించినప్పుడు
పరిక పొదల్లో గుచ్చిన ముళ్ళని
నొప్పి తెలీకుండా నేను సుతారంగా తీసినప్పుడు
ఎర్రటి మధ్యాహ్నం మనం భూతద్దపు చేతులతో
రెండు పచ్చి అగ్గిపుల్లలని వెలిగించ చూసినప్పుడు”

ఈ గుప్పెడు పదాలూ చదివేసరికి, మనం ఎక్కడి వాళ్ళమక్కడి నుండి తప్పుకుని, పసితనపు వీథుల్లోకి పరుగూ తీస్తాం. జ్ఞాపకాన్ని వెన్నెలకిరణమంత సున్నితంగా స్ఫృశిస్తూ , మనకే తప్ప మరొకరికి తెలీదనుకున్న బాల్యాన్ని అక్షరాల్లో గుప్పిస్తూ “నీలాగే ఒకడుండేవాడు” అంటూ పేరుతోనే మనసులకు ఎర వేసి లాగిన వాణ్ణి – ‘ఆ మాట నీకెలా తెలిసిందసలు’ అంటూ ప్రశ్నించేందుకు సిద్ధమవుతాం. నిండా పాతికేళ్ళు నిండని పసివాడు కదా, బహుశా కవిత్వమంటే బాల్యమేనన్న భ్రమలో ఉన్నావాడేమో కదా, లోకాన్ని చూడని అమాయకత్వం పదాల్లో వెల్లువలా పొంగుతోంటే, కవిత్వమంటూ మనకిచ్చాడు కానీ…అని ఊహిస్తూ ఊరికే పేజీలు తిరగేస్తోంటే..

“వెన్నెల స్నేహితా!
నిన్నేమీ అనను. నువ్వు చేస్తున్న దేన్నీ ప్రశ్నించను. నీకు దేహం కావాలి. సత్తువతో నిండిన దేహం. శుభ్రత నిండిన మనసు, స్వచ్ఛత నిండిన ఆత్మ కావాలి. మనం మనమై జీవించడం కావాలి. అనుభూతి సంపదను సృష్టించడం కావాలి. ఏం చేద్దాం?! అవేమీ నా దగ్గర లేవు. ఉన్నదల్లా ఒక అనారోగ్యమైన దేహం, గాయాలు నిండిన మనసూ, వెలుతురు లేని ఆత్మ. నీ అద్భుత హృదయం లాంటిదే నాకూ ఉంటే బాగుండు. ఈ విషాదాలు, నిషాదాలూ అన్నీ ఒకేసారి అంతమైతే బాగుండు. చిందరవందరగా పడి ఉన్న ఊహలకి నిశాంతమేదైనా ఆవహిస్తే బాగుండు. కానీ-

కానీ, ఏదీ జరగదు. ఒక పిచ్చి ఊహలో తప్ప ఏవీ ఎక్కడా అంతమవవు.
దుఃఖిత సహచరీ!
మసకలోనే అడుగులేస్తాను. మసకలోనే తప్పిపోతాను. మసకలోకానికే జీవితం రాసిచ్చి ప్రయోజనం లేకుండా పరుగు తీస్తాను.” అంటూ ఊపిరి వేగం పెరిగేంత ఉద్వేగం కలిగిస్తాడు. ఎవరితను? చలాన్ని గుర్తు చేసేంత తీవ్రతతో జ్వలించిపోతున్న పిల్లవాడు – ఎవరితను?

గుర్తొస్తారు, ఒక్కో కవితా మొదలెట్టగానే, ఎవరెవరో కవులు గుర్తొస్తారు. కానీ కవిత పూర్తయ్యేసరికి మాత్రం, ఈ కవి ఒక్కడే మిగులుతాడు, ఒక అపూర్వ అనుభవాన్ని మనకి విడిచిపెడుతూ. అదే నంద కిశోర్ ప్రత్యేకత. ఇతనికి తనదైన గొంతు ఉంది, తనకు మాత్రమే సాధ్యమయ్యే శైలి ఉంది. ఇంకా, అతనికి మాత్రమే సొంతమైన కొన్ని అనుభవాలున్నాయ్. అయితే, అవి ఎలాంటివైనా, ఆ బాధనో, సంతోషాన్నో, పాఠకులకు సమర్థవంతంగా చేరవేయగల నేర్పూ, ఆ విద్యలో అందరికీ దొరకని పట్టూ కూడా ఉన్నాయ్. పాఠకులను ఆదమరచనివ్వడు. పరాకుగా చదివే వాళ్ళను కూడా “ఓయ్, నిన్నే!” అని కవ్వింపుగా పిలిచి మరీ ప్రశ్నించే అతని గడుసుదనం, ఈ కవిత్వాన్ని తేలిగ్గా తీసుకోనివ్వదు. అంత తేలిగ్గా మరచిపోనివ్వదు.

“చేపలా తుళ్ళేటి పరువాన్నంతా
దేశాలమీదుగా విసురుకున్నవాళ్ళం.
వానలా కురిసేటి యవ్వనపు కోరికని
సముద్రపు అంచులకు వదులుకున్నవాళ్ళం.
ఒరుసుకున్న రాళ్ళ మీదా ఓడించే నీళ్ళ మీదా
సంతకాలు చేసినవాళ్ళం, సంతోషం పొందిన వాళ్ళం.
చెప్పు! ఏదో ఒకటి..
అంతా అర్థమవుతోందనో
అప్పటిలా ఉండలేననో చెప్పు.
అసలే తెలీదనో
అణువంతైనా గుర్తులేదనో చెప్పు.
నిశ్శబ్దాన్ని వింటూ
రక్తం ఇంకిపోకముందే

నేనేడ్వనుగాని
ఓయ్!నిన్నే…”

“నిశ్శబ్ద్దాన్ని వింటూ, రక్తం ఇంకిపోకముందే” అన్న నాలుగు పదాల్లో ఆశానిరాశల ఊగిసలాటనీ, తానిక మోయలేని బాధనీ సుస్పష్టంగా చూపెడుతూనే, “నేనేడ్వను గానీ” అన్న మరుసటి పాదంలో తనకున్న తలబిరుసునంతా చూపెడతాడు. ఆ “ఓయ్! నిన్నే” అన్న పిలుపుకు ఎంత వేటాడే లక్షణమున్నదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గుండె ఒక్కసారిగా ఝల్లుమని, నన్నేనా అన్న ఉలికిపాటుతో లోకంలోకి, అతని లోకంలోకి, కవిత్వంలోకీ గబగబా వెళ్ళి చక్కర్లు కొడుతూంటామే – అప్పుడనిపిస్తుంది, కవిత్వం ఇతనికి అడక్కుండా దొరికిన వరమని.

ఆధునికాంధ్ర సాహిత్య ప్రయోగాలను సమీక్షిస్తే, అనుభూతిని ఆమోదయోగ్యంగా, ఆస్వాదయోగ్యంగా చేయడానికి ఉన్న పద్ధతుల్లో,” స్వాత్మీయీకరణ” ప్రథానమైనది. పఠితకు అనుభవయోగ్యమైన స్వీయానుభవాన్ని కవి వ్యక్తీకరించడం, దానిని పఠిత ఆత్మీకరించుకుని తాదాత్మ్యంతో అనుభవించడం ఈ ప్రక్రియలో కనపడుతుంది. ఈ సంపుటిలో ఎన్నో కవితలు కవికి ఈ ప్రక్రియలో గల పట్టుకి అద్దం పడతాయి. కవితల దాకా కూడా వెళ్ళక్కర్లేదు, “నీలాగే ఒకడుండేవాడు” అన్న శీర్షికలోనే ఎంత కవిత్వం ఉందో , చూసే కళ్ళుంటే!

“నీలాగే ఒకడుండేవాడు..
వాడు నీలాగే-
అచ్చం నీలాగే నవ్వుతూ తుళ్ళుతూ
పొద్దు నెత్తికెక్కుతుంటే గారాలు దులుపుకుంటూ
చేతిలో సంచితో, సంచిలో సద్దితో
సద్దిలో బువ్వతో, బువ్వలో అమ్మతో
పొద్దుగూకేదాక బళ్ళోనే దాగిపోయి
సాయంసంధ్యపైన సూరీడై వెలిగేవాడు”

అని ఈ నందుడు అంటున్నప్పుడు ఎందరు యశోదల మనసులు బరువయ్యాయో ఊహించడం అసాధ్యమేం కాదుగా!

“కవిత అందరిళ్ళకూ వెళ్ళదు, ఎవరి ఇంటి తలుపు తడుతుందో, అతడిక ఉన్మత్తుడు” అంటారు చినవీరభద్రుడో కవితలో. నందకిశోర్ కవిత్వంలో ఆ ఉన్మత్తత ఉంటుంది. అది ఎదుటి వాళ్ళకి వెన్నులో నుండి జలదరింపు తెప్పించేంత గాఢమైనది.లోతైనది.

“తూరుపు దోసిట్లోంచీ సూర్యుడు రాకముందే ఊపిరి నదుల్లో స్నానం చేసి రావాలి. పోనీ- నాలోంచీ నువ్వూ, నీలోచీ నేనూ నడుచుకుంటూ పోతాం, ఏంటట? నా కాళ్ళకి వెన్నెల అంటుకోనీ..నీ కాళ్ళు రెండూ రాళ్ళు తగిలి చిట్లిపోనీ..ఏంటట” అని ఎంత నిర్లక్ష్యంగా చెప్పేస్తాడో!

“శిశిరాన్నిగెలిచిన పిచ్చిలో వెర్రిలో
చెట్టుకి ఏమీ పట్టకపోవచ్చు.
వాలే పక్షులకి ఏ చెట్టైనా ఒక్కటే
గూడు కడ్తే గుండె పగిలిపోతుంది.
గాలివానొకటి గట్టిగా వీస్తే
నిజం నిక్కచ్చిగా తెలిసిపోతుంది.”

– అన్నప్పుడు చేదు జీవిత సత్యాలను అలతి పదాలలో కూర్చిన నేర్పుకి అవాక్కయ్యాను. ఆత్మాశ్రయ పద్థతిని దాని చివరి అంచుల దాకా కొనసాగిస్తే, ఏనాడైనా బాహ్య ప్రపంచాన్ని పునర్దర్శించే పరిణామం తప్పదు. ఉదాహరణగా పై కవితనే తీసుకుందాం. ఇక్కడ చెట్టును జీవితంతోనూ, వాలే పక్షులను అవసరాలుగానూ ఊహించుకోండి. మీకొక భావం చప్పున స్ఫురిస్తుంది. అలా కాకుండా చెట్టును ఒక మనిషి గానూ, వాలే పక్షిని స్త్రీగానూ ఊహించుకోండి – మరొక అద్భుతమైన అర్థం దొరుకుతుంది. ఇహ దాని నుండీ “గూడు కడితే గుండె పగలడం” ఎందుకో, “గాలివాన వస్తే తేలిపోయే నిజ”మేమిటో కవి చెప్పక్కర్లేదు. గొంతుకలో కొట్టాడుతున్న ఆ భావాన్ని నిజానికి పదాల్లో పెట్టక్కర్లేదు. అదే ఈ కవితలోని సౌందర్యం. కవి ఏ ఉద్దేశ్యంతో రచన చేశాడో అంతకంటే భిన్నమైన స్ఫూర్తినివ్వగల శక్తి దానికి ఉన్నప్పుడే, అది కాలం ధాటికి తట్టుకుని నిలబడగలదు. ఈ కవితకు ఆ శక్తి ఉందో లేదో, ప్రతీకలను అర్థవంతమైన వస్తువులతో పూరించగల పాఠకులెవరైనా తీర్మానించగలరు.

1461245_10102664998433657_1684156529_n

ఈ పుస్తకం ఉత్తరార్థం మాత్రం ఒకింత పలాయన లక్షణాలతో ఊహాజనిత దుఃఖ పరిథికి కుదించుకుపోవడం మొదలెట్టింది. ఉదాత్తంగానూ సమస్తాన్నీ ఆత్మీకరించుకోగలిగింత విస్తృతంగానూ కనిపించిన ప్రణయ భావం మెల్లిగా ప్రతికూలమై, జీవితానికే ప్రతికూలమై “ముగింపు” కోసం ప్రాకులాడుతున్న భావన కలిగిస్తుంది.

“ఎవరికీ చెప్పకుండా, ఎవర్నీ అడగకుండా/ఎందుకో తెలీకుండా ఉరి వేసుకుంతారు” అన్న పంక్తుల్లోనూ,

“సముద్రం వాణ్ణి ప్రేమించిందని
ఎవ్వరికీ చెప్పడు
కల్లోలాన్ని వాడు కోరుకున్నట్టు
ఎప్పటికీ తెలీదు
తెలిసేదల్లా
వాడిక లేడనే!”

అన్నప్పుడూ ఇదే ధోరణి కనపడుతుంది.

రెండవ సమస్య అతని భాషకు సంబంధించినది. చాలా చోట్ల అతను కొత్త పదాలను కూడా సృజించాడు, సందర్భోచితంగా వాడాడు. మచ్చుకు, ఒక కవితలో “నిశిద్దోహలు” అని వాడాడీ కవి. ఆ పదం ఉందా? లేదు. మరెందుకలా వాడాడూ? అతని కవిత చెప్తుంది. కొన్ని చోట్ల భాషాపరంగా, శైలిపరంగా ప్రయోగాలూ చేశాడు. వాటితో కూడా నాకేం పేచీ లేదు. “రాఖీ” కవితలో చక్కటి తెలంగాణా మాండలీకాన్ని వాడాడు. నన్నడిగితే ఆ కవిత ఈ పుస్తకానికే తలమానికమంటాను.

“గనపడంగనే
ఉరుక్కుంట వచ్చి
కావలించుకుని
కండ్లు తుడుసుకున్నట్టు..
తెచ్చిన దారప్పోసల రాఖీకి
నీ లెక్క నా లెక్క గుచ్చిపెట్టిన..” అంటూ ఆర్ద్రంగా సాగిపోయే ఆ కవిత, ఏమో, మామూలుగా వ్రాసి ఉంటే ఏ మేరకు అలరించేదన్నది ప్రశ్నార్థకమే. కానీ ఇలా వ్రాయడంలో మాత్రం తమ్ముడి చేతికి రాఖీ కట్టేందుకు తపిస్తోన్న అక్క తడికళ్ళత్ మన ముందుకొస్తుంది.

అలాగే “పిచ్చిరాత” కవితలో “దృశ్యాదృశ్య సంకెలలు తెగి/నిస్సందేహ స్వేచ్ఛావాయువులలో/ఏకాంతముగా సంగమించు” అంటూ గ్రాంథికంలోకి ముడుచుకున్నప్పుడు కూడా దానినొక విలక్షణతగానే స్వీకరించగల్గుతాం ( ఈ కవితలో ఒకే ఒక్క పాదంలో మాత్రం శిష్ట వ్యావహారికాన్ని కవి వాడటం కనిపిస్తుంది – అది కవితా ప్రవాహానికి అడ్డు కలిగించకపోగా దాని ప్రత్యేకతను నొక్కి చెప్తుంది). కనుక, ఈ కవికి భాష ఉన్నది ఎందుకో తెలుసు. ఏ మాండలీకంలో లేదా ఏ శైలిలో తన మనసు లోతుల్లో ఉన్న భావం నర్మగర్భంగా పాఠకులకు చేరవేయాలో సుస్పష్టంగా తెలుసు. ఇంత తెలిసినవాడు కూడా మామూలు భాషలో సాగుతోన్న కవితల్లో “వాణ్ణి” అనవలసిన చోట “వాన్ని” అనడమే, బొత్తిగా మింగుడుపడని విషయం. అలాగే “అట్లా” అని దీర్ఘం ఉండవలసిన చోట హ్రస్వంతో రాజీపడటం (ఉదాహరణకు ఆఖరు పేజీలోని – “రాళ్ళెట్ల వికసించేదీ, పువ్వులెట్లా బద్దలయ్యేదీ రహస్యం” అనడం) అకారణమనిపిస్తుంది. ఇవి అచ్చుతప్పులో, కవి ఈ పదాలను పలికే పద్ధతిదేనో పాఠకులకు అర్థమయ్యే అవకాశం లేదు. ఏదేమైనా, ఈ పలుకురాళ్ళ ఏరివేతలో పాయసపు రుచిని మరచిపోయే ప్రమాదమెంతైనా ఉంది కనుక, మలి ముద్రణల్లో ఈ లోపాలు సవరించబడతాయని ఆశిద్దాం.

ఒక సంవత్సర కాలంలో సృజింపబడ్డ కవిత్వం కనుక, సమకాలీన సమాజపు పోకడలేవో కవిని ప్రభావితం చేయడమన్నది ఊహించదగ్గ విషయమే. స్పందించే లక్షణమూ, దానిని భద్రపరచాలన్న తలంపూ ఉన్నవాడవడం వల్లేమో, “కాంక్ష” అంటూ పాక్, ఆఫ్గన్, సిరియాలను చుట్టేసి వచ్చాడు. కవిలో అకస్మాత్తుగా కనపడ్డ ఈ అభ్యుదయవాదం మాత్రం ఆశ్చర్యపరచింది. భావకవిత్వ లక్షణాలతో ఉప్పొంగిన ఈ కవితా సంపుటిలో, ఈ ఒక్క కవితా తన చుట్టూ తానే ఒక గిరి గీసుకుని పాఠకులను అటు నుండటే వెళ్ళిపొమ్మంది. ఈ సంపుటిలో ఇమడదనిపించిన ఒకే ఒక్క కవిత ఇది.

మొదటి 36 కవితలకు అనుబంధంగా వచ్చిన వచనాన్ని ( అనుకోకుండా, ఒక సంధ్యావస్త కాలంలోంచీ)చదువుతున్న కొద్దీ, ఈ కవికి బలమైన అభివ్యక్తి, శిల్పానికి సంబంధించి గొప్ప అభిరుచీ, ప్రత్యేకతా ఉన్నాయని తెలుస్తుంది. “చిట్టితల్లీ” అనేటప్పుడతడి నిష్కల్మషమైన అనురాగమూ, “దేవీ, దేవీ!” అంటూ తపించే ఇతగాడి వలపూ, “వెన్నెల స్నేహితా!”, “దుఃఖిత సహచరీ!” అంటూ ఆర్తిగా పిలుచుకునే నవనీత హృదయమూ, మనకు తెలీకుండానే కవితో ఓ దగ్గరి సంబంధాన్ని కలుగజేస్తాయి. “తన బాధను లోకం బాధ”గా మలచిన కృష్ణశాస్త్రి అసంకల్పితంగా గుర్తొస్తారు.

” ఆ కొత్త రోజుల్లో, మేలుకున్న కొత్త సమాజంలో తనకు లభించిన ఒకటి రెండు అనుభవాలనో, కష్టసుఖాలనో కవి తన దివ్యకావ్యాల్లో పెట్టాడు. తరువాత అహంకారం వల్లనో, అశ్రద్ధ వల్లనో ఆ అనుభూతుల్నే కౌగిలించుకుని చుట్టూ ఆవరణ కట్టి కూర్చున్నాడు”
– (–పాతిక సంవత్సరాల తెలుగు కవిత్వం, భారతి రజతోత్సవ సంచిక)

కృష్ణశాస్త్రి తన కవిత్వం గురించి తానే చెప్పుకున్న మాటలివి. పునరుక్తి దోషాలకు తన బాధ్యత ఎంతవరకూ ఉందో లోకం ముందు ఒప్పుకుంటూ చెప్పిన సత్యమిది. శైలి, భాష, శిల్పాల పరంగా ఏ పోలికా లేకపోయినా, ప్రస్ఫుటంగా కనపడే సంవేదన ఇద్దరిలోనూ ఒకటే కనుక, పై మాటలు ఈ కవి భవిష్యత్తులో ప్రచురించబోయే మరే కవితా సంపుటికీ అద్దం పట్టే స్థితి రాకూడదని అభిలషిస్తున్నాను. ఆ ఆవరణలు మరీ సంకుచితమై, కరుడు గట్టి, కవికీ పాఠకులకు మధ్య ఏ అఖాతాన్నీ సృష్టించకుండా నందకిశోర్ తగిన జాగ్రత్తలు తీసుకోగలడనే విశ్వసిస్తున్నాను.

నందకిశోర్లోని కవితాదృష్టి విశ్వరహస్యాల్నీ, జీవిత రహస్యాల్నీ వర్తమాన వస్తుప్రపంచంలో చూడటాన్ని నిరాకరించి, లేదా అధిగమించి అనుభూతి వైశిష్ట్యంలో అన్వేషించింది. అందుకే అంత ప్రత్యేకంగా కనపడుతుందది. అమలిన శృంగారాన్ని ప్రతిపాదించడంలోనూ, అనుభూతులకు పట్టం కట్టి రూపపరంగా నూతన అభివ్యక్తి మార్గాలను సుసంపన్నం చేయడంలోనూ, అనుభూతిని విస్తరింపజేయడానికి సమర్థంగా కవితాభాషను రూపొందించుకోవడంలోనూ ఈ కవి తనదైన ముద్రను ప్రతి పుటలోనూ చూపెడుతూ వచ్చాడు. ఆనందానికి ఒకింత నిర్లక్ష్యాన్నీ, బాధలకు ఒకింత నిబ్బరాన్నీ జోడించి, మోహంలో మాత్రం ప్రాణాలర్పించే నిజాయితీని ప్రకటిస్తూ సాగిన ఈ సంపుటి, “నీలాగే ఒకడుండేవాడు” అన్న కవి మాటలకు నిజమేనని జవాబివ్వగల అనుభవాన్నైతే ఇచ్చే తీరుతుంది. ఆశ్చర్యానికి పదాలు మరచిన లోకంలో మనను వదలిన ఈ కవి, మరిన్ని సంపుటులతో మళ్ళీ మన ముందుకు రావాలనీ, “నీలా మరెవ్వరూ ఉండరు” అనిపించేంత ప్రత్యేకంగా తన ప్రస్థానాన్ని కొనసాగించాలనీ మనసారా ఆకాంక్షిద్దాం.

–మానస చామర్తి

మానస చామర్తి

మానస చామర్తి

అంట్లు.. పాచి… కూసింత ఆత్మీయత!

amma and satavathi

పనిమనిషి, పనమ్మాయి మా ఇంట్లో వినిపించనేకూడని ఒకేఒక్క పదం.

                 ఐతే మా ఇంట్లో ఎవరూ పనిచేయరని కాదు. పనిచేస్తారు. సబ్బు లక్ష్మి, సముద్రం(మనిషి పేరు), సిరి, నాగవేణి, నాగమణి, సత్యవతి-ఇలా ఎందరు మా ఇంట్లో పనిచేసినా పేర్లతో పిలవడమే తప్ప “మా పనమ్మాయి” అని ఎప్పుడూ అమ్మ అన్నది లేదు. మేము “పనమ్మాయి వచ్చిందమ్మా” అని చెప్తే ఊరుకున్నదీ లేదు. స్వావలంబన, సమానత్వం, వ్యక్తి గౌరవం లాంటి పెద్ద పదాల గురించి మా అమ్మ చదివినట్టు లేదు కానీ నాకు తెలిసినంతలో వాటి స్పృహ, ఆచరణల్లో ఆమెని మించినవారిని నేనెన్నడూ చూడలేదు. ఇంకో విశేషమేంటంటే మా అమ్మ సహృదయత, సంస్కారం మా చుట్టపక్కాలకే కాదు మాకే స్పష్టంగా తెలిసేది కాదు. కొడుకును కాబట్టి అమ్మ ఆచరణను దగ్గరనుంచి చూస్తూండగా ఏళ్లకేళ్లలో నాకు అర్థమైంది మా ఇంట్లో పనులు చేసేవాళ్లను ఆమె చూసుకునే పద్ధతి. అమ్మా నువ్విలా చేస్తున్నావు తెలుసా అంటే ఆమె కూడా ఆశ్చర్యపోయిందంటే చూడండి.
                అమ్మ నాకు మా తాతముత్తాతల గురించీ,పెదనాన్నలు, అత్తయ్యల గురించి తెలుసుకున్న విశేషాలు(పుకార్లు చెప్పేది కాదు. కచ్చితంగా తెలిసినవే చెప్పేది), వాళ్ల జీవితంలో చీకటివెలుగులు చెప్తూంటుంది. అలాంటి వాటిలో ఒకటి మా పెదనాన్న-అతని నౌకరు కథ. మా తల్లిదండ్రులది మేనరికం. మా నాన్నారి అక్కకూతురు మా అమ్మ. ఇద్దరూ మేనమామ-మేనకోడళ్లు. పైగా ఆమె బాల్యం చాలావరకూ(దాదాపు ఆమె 10ఏళ్ల వయసు వరకూ) మా పెదనాన్నలు, పెద్దమ్మలు, అత్తయ్యలు, నాన్నమ్మలతో మా స్వగ్రామంలో ఉమ్మడి కుటుంబంలోనే గడిచింది. మా పెదనాన్న(అంటే అమ్మకి పెదమావయ్య) గ్రామ కరణం. బహుశా ఈ కథ 1975-80 కాలంలోనిది. ఓరోజు నౌకరు కొడుకు వెంకడు(పేరుమార్చాను) మా ఇంటికి వచ్చాడట. అతనిదీ చాలా చిన్న వయసే. మా అమ్మ బయటకి వచ్చి “పెదమావయ్య స్నానం చేస్తున్నాడు. అలా అరుగు మీద కూచో” అందట. మంచినీళ్లేమైనా కావాలా అనడిగి, పెద్దాయనకి చెప్పేందుకు వెళ్ళింది. స్వతహాగా మా పెదనాన్నది ప్రథమకోపం.
అరుగుమీడకి వచ్చీరాగానే పిచ్చగా తిడుతూ కొట్టినంత పని చేసాడు.  అతని మాటల్లోనే తేలిన విషయమేమిటంటే- కచేరీ చేసే అరుగు మీద నౌకరు కొడుకు కూర్చోవడమేంటి? ఊళ్ళో రాజులేవరైనా చూస్తే మళ్లీ మా అరుగెక్కుతారా? నిజానికి మా అమ్మ అప్పటికి చాలా చిన్నది. ఇలా కూడా ఉంటుందా లోకం అని కొత్తగా తెలిసింది ఆమెకి. ఐతే మా అమ్మ కథ ఇక్కడితో ఆపలేదు. ఓ పదేళ్లు తిరిగేసరికి వెంకడల్లా గ్రామనౌకరుగా ప్రభుత్వంచే నియమింపబడ్డాడు. మా పెదనాన్న ఉద్యోగం సక్రమంగా చేయాలంటే నౌకరు చక్కగా సహకరించాలి కదా. పైగా నాటికి సాంఘికమైన కొన్ని కట్టుబాట్లు, మూర్ఖపు పట్లు పలచబడ్డాయి. వెంకడితో మండల కేంద్రానికి వెళ్ళే పని పడింది. పాత విషయాలేవీ గుర్తులేని ఆయన “రా ఎక్కు” అని (మోటారు)బండి ఎక్కమని పిలిచాడు. అతను గతం మర్చిపోలేదు. “మీ బండి ఎక్కితే పెద్దమనుసులు ఎవురైనా మళ్లీ ఎక్కుతారాండీ” అని గతం గుర్తుచేసుకుని బాధపడ్డాడు. మా పెదనాన్న అయ్యో ఏదో అప్పుడు అలా జరిగిపోయింది లే బాధపడొద్దని సముదాయించాడు. ఆ తర్వాత అతను రెవెన్యూ ఉద్యోగి కూడా అయ్యాడు. అప్పుడు కూడా “మీ అరుగు మీదకి నేనెక్కితే పెద్దమనుషులు ఎవరైనా మీ అరుగు తొక్కుతారాండీ” అని వేళాకోళంగా అనేవాడు. గతం తిరగదోడాడు. అప్పటికి మా అమ్మకి పెళ్లయింది, దీనికీ అమ్మ ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. ఇలాంటివి ఎన్నో ఆమె దృక్పథం వెనుక ఉండి ఉంటుంది. “పనివాళ్లయితే మనుషులు కాదా. జరుగుబాటు లేని ఇళ్ళలో వాళ్ళు పుట్టారు. ఎంతో కొంత జరుగుబాటున్న ఇంట్లో మనం పుట్టాం. అంతే కదమ్మా తేడా” అంటుంది అమ్మ. అందుకే మా ఇంట్లో పనిమనుషులన్న మాట చాలా తప్పు మాట.
                           అమ్మ పెళ్ళవగానే “ఎంప్లాయర్” అయ్యింది; మా అమ్మ దగ్గర పని చేసిన మొదటి పనిమనిషి పేరు సబ్బు లక్ష్మి. పల్లెటూళ్ళో కాపురం. 2 పెద్ద అరుగులు, కాఫీ వసారా, ఉత్తరంపు వసారా, విశాలమైన చావిడి, వంట గది, పూజగది, తూర్పువైపు గది, పెద్ద మెట్టు(వీధి వైపుంటే అరుగంటారు అది మగాళ్ల సామ్రాజ్యం, మరి ఏ వైపున్నా మెట్టంటారు. అక్కడ అమ్మలక్కల కబుర్లు సాగుతూంటాయి).బయట దస్త్రాల గదితో సహా 500గజాల్లో ఉండే పేద్ద ఇల్లు అంతా మా అమ్మ చక్కబరుచుకోవాల్సి వచ్చేది. మిగిలిన పెద్దనాన్నలు ఇల్లు వాటా వేసుకున్నా ఊళ్ళో ఒకరు, పక్కూరిలో మరొకరు, హైదరాబాదులో ఇంకొకరు అద్దెకుండేవారు. దాంతో మా అమ్మ వాళ్ళ వాటాలతోపాటు ఇల్లంతా తుడిచి,అలికి,బాగుచేసుకోవాల్సి వచ్చింది. మాకు పనిచేసే లక్ష్మి ఈ భారమంతా తన మీద వేసుకునేదిట. మొత్తం ఇల్లంతా ప్రతీ నెల రెండుసార్లు అలికి, రోజూ తుడిచి, పండగ వచ్చినపుడల్లా బూజు దులిపేది. మిగతా అంట్లు, చుట్టూ ఉన్న మరో 500గజాల స్థలం ఊడ్పులు సరేసరి. అలికినప్పుడు మా అమ్మే లక్ష్మి వాళ్ల ఇంటిలో పొయ్యి వెలిగే పనిలేకుండా వంట చేసేది.
                            అలాంటి లక్ష్మికి ఓరోజు పెద్ద కష్టం వచ్చిపడింది. తాగుడికి డబ్బులివ్వడం లేదని, పుట్టింటివాళ్ళతో తనకెన్ని గొడవలున్నా లక్ష్మి పుట్టింటికి వెళ్తూనే ఉందని, ఇలా చిన్నా చితకా, పెద్దా పరకా గొడవలతో లక్ష్మి భర్త ఆమెతో పెద్ద దెబ్బలాట పెట్టుకున్నాడు. తిట్టుకున్నంత సేపు ఇద్దరూ సమ ఉజ్జీలుగానే ఉన్నారు గానీ అతను లక్ష్మిని రోకలిబండ పుచ్చుకుని కొట్టాకా ఆమె ధైర్యం సడలిపోయింది. దానికితోడు లక్ష్మిని చంపుతానంటూ కత్తి పట్టుకుని వెంటపడ్డాడు. పారిపోతూ రక్షణ కోసం ఊరంతా తిరిగింది. “ఆడు కత్తి పట్టుకుని తిరుగుతున్నాడంటే నిన్నేమీ నరికేస్తానికి కాదు. ఏదో భయపెడతన్నాడు అంతే”, అని కొందరు “మొగుడూ పెళ్ళాలు మళ్ళీ ఒకటవుతారు. మధ్యలో చేడేది మేమే” అని ఇంకొందరు.
ఆ స్థితిలో 19ఏళ్ల వయసున్న మా అమ్మ(చిన్నవయసు పెళ్లి లెండి తనది) ఆమెని దాచిపెట్టింది. ఊళ్ళో కావాల్సినవాళ్లు”వాడు పెద్ద పిచ్చెదవ. పసిపిల్లలు ఉన్నదానివి నీకెందుకీ గొడవ. దాన్ని వదిలెయ్” అన్నారు, ఇరుగుపొరుగు “మీకెందుకు సాయి గారో ఈ గోల. ఆళ్ళూ ఆళ్లు ఒకటైపోయి మీకు సెడ్డ పేరు మిగులుద్ది” అని సలహాలిచ్చారు.   లక్ష్మి భర్త రోజూ కత్తి పట్టుకుని,”లచ్చీ బైటికి రా. కరణం గారింటో ఉంటే ఏటీ సెయ్యలేనని అనుకుంటన్నావేమో. నీ సంగతేంటో సూత్తాన”ని బెదిరించేవాట్ట. కానీ మా అమ్మ లక్ష్మిని ఆమె మొగుడి చేతికి వదలలేదు.
                      మా నాన్నగారేమీ అడ్డు చెప్పలేదట కానీ నిర్ణయమూ, నిర్వహణా పూర్తిగా మా అమ్మదే. రోజుకో గదిలో దాచిపెట్టి, పొద్దుట కాఫీ నుంచి రాత్రి భోజనం వరకూ అమ్మ లక్ష్మికి గదిలోకే పట్టుకెళ్లేది. కాలకృత్యాలు, స్నానం లాంటివాటికైతే అదాటున పరుగెత్తి బాత్రూంలో దూరి, ముగించుకుని టకీమని మళ్లీ ఇంట్లోకొచ్చేసేదట. అమ్మ చీరలే మూడురోజులు కట్టేది. మూడు రోజులు అలా గడుస్తూండగా మా అమ్మ ముందు ఇంక రంకెలు చెల్లవని అర్థం చేసుకుని లక్ష్మి భర్త పెద్దమనుషులతో మా ఇంటికొచ్చాట్ట. తాగనని పోలేరమ్మ మీద, పెళ్లాన్ని కొట్టనని వాళ్ళ అమ్మ మీద, లక్ష్మి డబ్బు పాములా చూస్తానని ఒట్టు పెట్టుకుంటే తప్ప లక్ష్మిని పంపనని తెగేసి చెప్పింది అమ్మ. బెట్టు చేసి, బెట్టు చేసి చివరకు తలొగ్గి ఒట్లు పెట్టి, లక్ష్మిని తీసుకెళ్ళాడట. దేవతలకీ, ప్రమాణాలకి జడిసే రకం కాబట్టి ఇంకెపుడూ ఆ పనులు చెయ్యలేదు. అయితే “సాయి గారు ఊరుకుని ఉంటే నేను ఇలా అయిపోయేవోణ్ణి కాదు. ఇంకెప్పుడూ ఆరింట్లో పనికి ఎళ్లొద్దని”, భార్యపై ఆంక్ష పెట్టాడు. కళ్ల నీళ్ల పర్యంతమై ఆ మాట మా అమ్మకి చెప్పి మా ఇంట్లో కొలువుకి సెలవు పుచ్చుకుంది సబ్బు లక్ష్మి.  ఆ తర్వాత పల్లె నుంచి పట్నం వచ్చేవరకూ పదేళ్లకు పైగా అంతటి ఇల్లంతా మా అమ్మే అలికింది అక్కడ ఉన్నన్నాళ్లూ. విచిత్రం ఏంటంటే లక్ష్మి భర్తకి మా అమ్మ మీద ఉన్న కోపం కోపమే కానీ మళ్లీ “ఆరోజు సాయిగారు ఆపకపోతే మా లచ్చిని ఆ ఊపులో నరికేద్దునో ఏమో” అని కృతజ్ఞతగానూ మాట్లాడతాడు.
                  పల్లెటూళ్ళో చంద్రమ్మ, పట్టణం వచ్చాకా సముద్రం, నాగవేణి, నాగమణి, సత్యవతి ఇలా చాలామంది పనిచేశారు కానీ  సబ్బు లక్ష్మిలా ఇంట్లో మనిషల్లే చేసిన వాళ్లు ఇంకెవరూ లేరు అంటుంది మా అమ్మ.
                  మా అమ్మ నన్ను కడుపుతో ఉండగా ముమ్మరమైన చలికాలంలో “మామిడిపళ్ళ”డిగిందట. మా నాన్నగారు తణుకు, అత్తిలి, భీమవరం తెగతిరిగి చివరికి ఓ జ్యూస్ షాపులో మామిడిపళ్లు పట్టకున్నారట. జ్యూస్ షాపు వాడు జ్యూసులే తప్ప పళ్లు ఇవ్వం అని పట్టుపట్టాడు. నానా రకాల ప్రయత్నించి కళ్లుతిరిగే రేటుకు ఓ మూడు మావిడి పళ్లు కొని మా అమ్మకి ఇచ్చారట నాన్నారు. సంగతేమిటంటే మా అమ్మ నుంచి కడుపులో ఉన్ననాడే మా చెల్లెళ్లకి, నాకూ మావిడి పళ్లంటే పిచ్చి ఇష్టం పట్టుకుంది. ప్రతీ వేసవికీ అన్ని రకాల మావిడిపళ్లు కొనిపెడుతూ ఆ పిచ్చిని ఆనందంగా భరించిన మా నాన్నారు ఓ వేసవిలో మాత్రం కొనితేలేదు. మా నాన్నమ్మకు విపరీతమైన అనారోగ్యం చేస్తే మా అమ్మానాన్నలే ఆర్థికంగా, శారీరికంగా పనిచేయడం వల్ల, మేము చదువులకు ఎదిగి రావడం, అప్పుడే మా ఇల్లు కట్టుకోవడం వంటివి ఆర్థికంగానూ, మానసికంగానూ మా నాన్నారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ హడావుడి రోజుల్లో మావిడి పళ్ళు లాంటి చిన్న చిన్న సరదాల కోసం పర్సు తీయలేకపోయారు. పాపం ఏమనుకున్నారో వేసవి ముగుస్తుండగా ఓ పరక మంచి రసాలు కొని తీసుకువచ్చారు. “పోనీలే పిల్లలు ఒకటికి మూడు తిననీ” అనుకుని ఉంటారు. పెద్దవాళ్ళకి చెరో పండు, పిల్లలకు చెరి 3పళ్ళు వాటా పెట్టాల్సింది పోయి మా ముగ్గురికీ రెండేసి పళ్లే పంచింది. తనకి ఒక్కపండూ అక్కరలేదని మొత్తం నాలుగు పళ్ళూ ఇంట్లో పనిచేసే నాగవేణికి మా చేత్తోనే ఇప్పించింది. “ఇంటిల్లి పాదీ చెరో పండు తినండి”అని పంపింది నాగమణిని.
                     అలా ఇచ్చేందుకు మాకు ముందే చెప్పి ఒప్పించింది అమ్మ. “మీరు కొంచెం పెద్ద పిల్లలు కదా మీకే ఇంతగా తినాలనిపిస్తూ ఉంటే, పాపం నాగవేణి పిల్లలు చాలా చిన్నపిల్లలు కదా మరి వాళ్ళు ఎంత మొహం వాచి ఉంటారో కదా. మనలాంటి ఉద్యోగస్తులమే కొనలేకుండా ఉన్నామే, ఇళ్లల్లో పనిచేసే నాగవేణి ఏమి కొనిపెడ్తుంది. మన ఇంట్లో డస్ట్ బిన్ ఖాళీ చేసేప్పుడు మావిడి టెంకలు చూస్తె పిల్లల్ని తలుచుకుని ఎంత బాధపడుతుంది”అంటూ మాకు సర్ది చెప్పే చేసింది అమ్మ. ఇది ఓమారు మా ఇంట్లో ఆర్థికంగా ఇబ్బంది కలిగిన సమయంలో జరిగిన కథ. ఐతే అంతకు ముందూ, ఆ తరువాతా కూడా ప్రతి వేసవి కాలంలోనూ మా అమ్మ రహస్యంగా నా చేత కనీసం రెండు పరకలు మామిడిపళ్లు తను కష్టపడి తేనెటీగలా కూడబెట్టిన డబ్బులు వాడి తెప్పించేది. అప్పుడు మా ఇంట్లో ఎవరు పనిచేస్తే వారికే ఇప్పించేది. రహస్యం ఎందుకూ అంటే ఇంట్లో ఎవరికైనా తెలిస్తే ఇల్లు గుల్లవుతోంది అంటారేమోనని.
మా నాన్నమ్మ జీవించి ఉన్నన్నాళ్ళూ ఇంట్లో పనిచేసే అమ్మాయికి కాఫీ, నీళ్లు ఇచ్చేందుకు వేరే గ్లాసులు, టిఫిన్ పెట్టేందుకు వేరే ప్లేట్ పెట్టాలనే పధ్ధతి ఉండేది. మా అమ్మకి అలా వాళ్లని అవమానించడం ఇష్టం ఉండేది కాదు. ఎవరినీ ఇబ్బందిపెట్టడం ఇష్టంలేక తాను ఆ గ్లాసుని, ప్లేటునీ వాళ్లకే ఇచ్చి కాఫీకి వచ్చినప్పుడల్లా తెచ్చుకోండి అనకుండా మా అమ్మే రహస్యంగా మెయింటైన్ చేసేది. మా అమ్మ చేతికి పూర్తిగా ఇంటి వ్యవహారం వచ్చిన తర్వాత మొదట చేసిన పని ఆ గ్లాసుల పధ్ధతి మానెయ్యడమే. ఇప్పుడు మా ఇంట్లో వేరే గ్లాసుల పధ్ధతి లేదు.
                మరోమాటు మా అమ్మ వీధిలోకి వచ్చి “బాబూ! చేపలూ ఇటు రా” అని పిలిచింది. వీధి వీధంతా బిత్తరపోయింది శుద్ధ శాకాహారులమైన మా ఇంటి నుంచి ఆ పిలుపు విని. ఆ చేపల బుట్ట ముంగిట్లోకి వచ్చాకా మా వంటింట్లో పనిచేస్తున్న నాగమణిని పిలిచి “ఎలాంటి చేపలు కావాలో ఏరుకో. డబ్బులు గురించి ఆలోచించకు. ఇవన్నీ నీ జీతంలో కొయ్యను. బహుమతి అనుకుని తీసుకో” అంది. జీవితంలో ఎప్పుడూ అలాంటివి ఎరగదో ఏమో ఆమె చాలా కరిగిపోయింది. అసలేం జరిగిందంటే-మేము మూడంతస్తుల బిల్డింగులో మొదటి అంతస్తులో ఉండేవాళ్లం. మా ఇంటి వాకిట్లో నిలబడ్డ మా అమ్మ నాగవేణి కిందకి తొంగి చూడడం చూసింది. మళ్లీ తలతిప్పేసుకుని లోపలికి వచ్చేస్తున్న ఆమెని ఆపి అలా ఏం తొంగి చూసి వస్తున్నావని అడిగింది చాలా మామూలుగా మా అమ్మ.
ఆమె ఇబ్బందిగా, సిగ్గుగా, అవమానభారంతో “ఏం లేదమ్మా” అనేస్తుంటే ఏదో ఉందనుకుని కిందికి వంగి చూసింది అమ్మ. అప్పుడే చుట్టుపక్కల వాళ్ళు చేపల బేరం చేసి ముగించుకుని చేపలతో కింది ఫ్లోర్ వాళ్లూ, పక్కింటివాళ్లూ ఇళ్లలోకి వెళ్తున్నారు చేపలబుట్టతో అమ్మే అతను వీధిదాటి వెళ్లిపోతున్నాడు. “ఏమ్మా చేపలు చూసి ఎందుకలా వచ్చేస్తున్నావు?” అంది అమ్మ. “ఏమీ లేదమ్మా ఊరికే కొందామని…” అంటూ అర్థోక్తితో ఆగిందామె. “అదే ఎందుకు కొనలేదు?” “డబ్బులెక్కడివమ్మా..” అంటూ నవ్వులో బాధని కలిపేసే ప్రయత్నం చేస్తూ చెప్పిందామె.
                 ఇక మా అమ్మ ఆగలేదు స్వయంగా పిలుచుకొచ్చి ఇంటిముందు తొలిసారి చేపలబుట్ట దింపించింది. ఆమె మొత్తానికామె ఓ చేప తీసుకుంది. మా అమ్మకు అంచనా తెలియదు కానీ ఒకటి ఇంట్లోవాళ్లకి సరిపోతుందా అని అనుమానమొచ్చి చేపలతన్నే అడిగితే ఇద్దరికైతే సరిపోద్దండీ నలుగురైతే సరిపెట్టుకోవాలని చెప్పాడు. “మీ పిల్లలు ఇంకాస్త కూర వెయ్యి అని అడిగితే ఏం చేయ్యగలవు? అసలు పెట్టకపోయినా పర్లేదుగానీ పసివెధవల్ని అర్థాకలితో లేపి ఏడిపించకూడదు. ఇంకో చేప తీసుకో” అని బలవంతాన ఒప్పించింది. వీటితో కూర ఐపోదు కదాని ఉల్లిపాయలు, బియ్యం, ఇతర దినుసులు కూడా మా ఇంటి నుంచే ఇచ్చింది ఏమేమి అవసరమౌతాయో పక్కింట్లో మా అమ్మ ఫ్రెండ్ ఒకావిణ్ణి అడిగి తెలుసుకుని. మా ఇంట్లో లేని కొన్ని మసాలా దినుసుల్ని వాళ్ళింట్లో అరువడిగి ఇప్పించింది.
నాగవేణి భర్త ఇదంతా తెలుసుకుని “ఏదో ఆరు కొనిపెట్టారే అనుకో ఇదే అదునని ఒకటికి రెండు తీసేసుకుంటావా?” అని తిట్టాట్ట.
               కొసమెరుపేమిటంటే- “సాయిగారు చేపల బుట్టని పిలిచేరేంటి. ఆళ్లు బ్రేమ్మలు కదా” అని చాలామంది అడిగారట నాగవేణిని. ఇలా నాకోసం అని చెప్తే ముక్కున వేలేసుకుని, మా అమ్మ దగ్గరకి వచ్చినప్పుడు “పనోళ్లని మరీ అంత ఇదిగా చూడకూదదండీ. లోకువకట్టేత్తార”ని బోధించే ప్రయత్నం చేశారు. “జరుగుబాటు లేక కానీ వాళ్లకీ కొనుక్కోవాలనే ఉంటుంది కదండీ. నేనేం వాళ్ల జీవితాలు బాగు చేసెయ్యలేను. ఏవో చిన్న సరదాలు తీర్చాను. మీ ఇంట్లో చేపలు రుద్దేప్పుడు మాకు లేవే అని బాధపడితే మంచిదా ఏంటి?” అని చెప్పుకొచ్చింది. వాళ్ల గొడవ అమ్మకి పట్టదు. అమ్మ లెక్క వాళ్లకి రాదు. అయినా మా అమ్మకి పనిచేసే వాళ్ల మనసులు చివుక్కుమన్న చప్పుడు కూడా వినిపిస్తుంది.
                       సత్యవతి మా ఇంట్లో పనిచేసేప్పుడు “సత్య.. సత్య” అని పిలిచేది ఆమెని. అలా కాలేజి పిల్లలా సత్య అని పిలిపించుకోవాలని ఆమె ఆశట. నీకు ఎలా పిలిస్తే ఇష్టం అని తెలుసుకుని మరీ అలా పిలిచేది అమ్మ. అప్పుడే మాటలు వస్తున్న మా మేనకోడలి చేత కూడా “సత్య”(సచ్చ అని పిలవడమే వచ్చేది తనకి) అని పిలిపిస్తే సత్యవతి “మాయమ్మే ఎంత ముచ్చటగా పిలుస్తున్నావమ్మా” అని మురిసిపోయేది. చాన్నాళ్ళు మా ఇంట్లో పనిచేశాకా  మేము ఇల్లు మారిపోతే రెండు కిలోమీటర్లకు పైగా దూరం నుంచి నడిచి వచ్చేది. చివరకి “మిమ్మల్ని వదల్లేక పోతున్నానండీ సాయి గారూ” అనంటూనే మానేసింది సత్య.
              నాగలక్ష్మి పిల్లలు కాన్వెంట్లో పనిచేస్తోంటే మా నాన్నారి పరిచయాలు ఉపయోగించి ఫీజులు బాగా తగ్గించడం లాంటివి మొదలు చిన్నవీ చితకవీ ఇంకా చాలానే ఉన్నాయి గానీ విషయం మాత్రం ఒకటే. అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే రెండు మెతుకులు ముట్టుకుంటే చాలు కదా.
santhosh-సూరంపూడి పవన్ సంతోష్