Archives for 2013

అలవోకగా ఆమె అద్భుత జలవిన్యాసం!

br passportఎప్పుడు పుట్టిందో, ఎక్కడ పుట్టిందో! సుమారు రెండు వేల సంవత్సరాలుగా నడుస్తోంది తెలుగు పద్యం. దీనితో కలిసి మనమూ నాలుగు అడుగులు వేద్దామంటారా. రండి మాతో పాటు. పద్యం కోసం పాదయాత్ర. పాడిందే పాటగా ఎక్కిన గుమ్మమే ఎక్కడం కాదు. భక్తితో భజన చెయ్యడమూ కాదు. చూడవలసిన చోట్లు కొన్ని ఉన్నాయి. ఎవరూ అంతగా దృష్టి పెట్టనివి. అవి చూద్దాం.

**

          క్రీడాభిరామం శ్రీనాధుడిదే. మన వరంగల్లులోదే. అక్కడ ఒక చిన్నది అలవోకగా ఒక ప్రదర్శన ఇస్తోంది. కళ్ళు చెదిరిపోయే ప్రదర్శన .చూద్దామా-

        చం.      వెనుకకు మొగ్గ వ్రాలి కడు విన్నను వొప్పఁగఁ దొట్టి నీళ్లలో          

                   మునిఁగి తదంతరస్థమగు ముంగర ముక్కునఁ గ్రుచ్చుకొంచు లే

                   చెను రసనాప్రవాళమున శీఘ్రము గ్రుచ్చెను నల్లపూస పే

                   రనుపమలీల నిప్పడు చుపాయము లిట్టివి యెట్టు నేర్చెనో

(క్రీడాభిరామము – పద్యం. 146)

ఓరుగల్లులో ఒక పడుచుపిల్ల చేస్తున్న అద్భుత విన్యాసాలను చూసి మంచనశర్మ ఆశ్చర్యచకితుడవుతున్న సందర్భం.

ఆ పడుచుపిల్ల – నిండా నీళ్ళున్న తొట్టెలోకి తన ముక్కెరను (ముంగర) విసిరేసింది.  ఆ తొట్టె చెంత – ప్రేక్షకులవైపు తిరిగి బోసి ముక్కుతో నిలబడింది.  చేతులు పొట్టకి పెట్టుకుని – అలవోకగా వెనక్కి వంగింది (మొగ్గవ్రాలి).  తొట్టె అంచుకి తన వెన్ను తాకకండా వంగింది.  తొట్టెనీళ్ళలోకి చాలా నేర్పు (విన్ననువు) ఒప్పేట్టు తలా మెడా ముంచింది.  అంతే నేర్పుగా అలవోకగా లేచి నిలుచుంది. ఇప్పుడు ఆమె ముక్కుకి ముంగర మెరిసిపోతోంది. చప్పట్లే చప్పట్లు.

చేటలో నల్లపూసలు పోసుకుంది.  ఒక చేత్తో పట్టుకుంది.  దారం ఎక్కించిన సూదిని మరో చేత్తో పుచ్చుకుంది.  చిగురాకులాగా ఎర్రగా ఉన్న తన నాలుకతో అతివేగంగా (శీఘ్రము) ఆ నల్లపూసలను దారానికి దండ గుచ్చింది.  సాటిలేని రీతిలో (అనుపమలీలన్‌) ఒయ్యారంగా నల్లపూసలపేరు తయారు చేసింది.  మళ్ళీ చప్పట్లే చప్పట్లు.

ఈ పడుచుపిల్ల ఇలాంటి విద్యలూ ఉపాయాలూ ఎన్ని నేర్చిందో ఎలా నేర్చిందో కదా – అని మంచనశర్మ ఆశ్చర్యపోయాడు.

మల్లెల తీర్థం

siddhartha

ఈ   వనభూమి కానుకగా

కొన్ని చినుకుల్ని చిలకరించింది
తన పిల్లలతో వచ్చి
కాండవ వన దహన హృదయమ్మీద…
దహనం రెట్టింపైంది
రక్తంలో కొత్త లిపి పరిణమించింది
ఎముకల్లోపలి గుజ్జు
ఏకాంతాన్ని చెక్కుకుంటూంది
నా వందల దుఃఖరాత్రుల
పారవశ్యాల చుట్టూ
ఒక పచారి తీగ …లాగ…
తెలుసు నాకు తెలుసు నాకు
నా లోపల వొక స్త్రీ దేహముందని తెలుసు
జువ్వికొమ్మగా కనునీలాలను

                               పెనవేసుకుందనీ తెలుసు

ఆమె ముద్దుతో నా మాటకు
కొబ్బరి నీళ్ళ సువాసన వొచ్చిందనీ తెలుసు
గాలిలో దూది మొగ్గ ఎగిరినట్టుగా
వుంది నిశ్శబ్దం
ఇది క్షేత్రమో తీర్థమో
బట్టలు తొడుక్కోలేదింకా
అదింకా అమ్మ పాలకోసం వెదుక్కోలేదు
కొన్ని అమూర్త ఛాయలు
కనుపాపలపై గురగురమంటూ
ఈ శబ్దసందర్భం… నిద్రాభంగం కలలకు
దూరాన్నుంచి వచ్చాను
అక్కడెక్కడ్నుంచో
అవుటర్ రింగ్ రోడ్డుల్లోంచి
ఫ్లైవోవర్ల ఉరితాళ్ళల్లోంచి
పువ్వులా జారిపడ్డాను…
ఇక్కడ…
జనసమ్మర్ధం లేని కలలు
వాక్యసమ్మర్ధం కాలేని జనం
శూన్యమవుతూన్న కణం
రాలిపోయే సుఖం
అలల కంటి కొసపై ఊయలూగే కిరణం
గాలి కౌగిలింత
దాని లోపల ఔషధాల సువాసన
భూమి నిద్ర వాసన
చర్మం లోపలి ద్రవఫలకాలపైన
తడిసిన ఆకులు అలమలు
పిందెలు మొగ్గరేకులూ  నీటి బుగ్గలూ
ఎగిరే… ఎవ్వరూ…
నా పలుదెసలా
అన్నీ నేనేనా
నేనే నా వనాన్నా
వనాన్ని భోగిస్తున్న మృణ్మయ పేటికనా
లోతుల ఇక పాడనా…
ఈ వనాన…
“చెండూ గరియమ్మ బోనాల మీద
ఎవరొస్తుంర్రే పిల్లా… ఎవరొస్తుంర్రే…
చెండూ గరియమ్మ బోనాల మీద
పిలగో…
పద్యమొస్తుందే జుమ్ జుమ్ పద్యమొస్తుందే
చెండూ గరియమ్మ బోనాల మీద
పిల్లా
పాట వొస్తుందే పాటల గద్యమొస్తుందే…
మాట వొస్తుందే…
మాయల మూట వొస్తుందే…”
అంటూ…

ఓ ‘బొంత’ సృష్టించిన తుఫాను

Bhanukiranఇస్మత్ చుగ్తాయి కథలు” తెలుగు లోకి సత్యవతి గారు అనువదించారు. సత్యవతి గారి మాటల్లో చుగ్తాయ్ కథలు సాంస్కృతిక జీవితంలో ఒక భాగం కనుక, చాలా అత్మీయంగానూ, మన బంధువులవలె అనిపిస్తాయి. తాదాత్మ్యత కలుగుతుంది. పాత్రలన్నీ చాలా కాలం మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి అని అంటారు. కథలు ఉర్దూ నుంచి ఇంగ్లీష్, ఇంగ్లీష్ నుంచి తెలుగు లోకి సత్యవతి గారి అనువాదం చక్కగా తెలుగు రచన లాగే ఉండడం ఇక్కడ ఒక విశేషంగా చెప్పుకోవాలి.

ఈ సంకలనం లో “లిహాఫ్” మొదలుకొని మొత్తం 15 కథలున్నాయి. ఇక్కడ “లిహాఫ్” అనే వివాదాస్పద కథ గురించి మీతో పంచుకుంటా. లిహాఫ్ అంటే రజాయి. దూదితో బాగా దళసరిగా కుట్టిన బొంత-బాగా చలిరోజుల్లో కప్పుకుంటారు. ఈ కథ ఓ స్త్రీ చిన్ననాటి స్మృతుల రూపం లో మనకి చెబుతూ ఉంటుంది. ఆమె స్మృతుల్లో రజాయి లో వెచ్చగా పడుకున్నప్పుడల్లా దాని నీడ గోడ మీద ఒక ఏనుగులా కదులుతూ ఆమెను గత స్మృతుల్లోకి లాక్కెళుతుంటాయి.

నేను అంటూ తన చిన్న నాటి జ్ఞాపకాలు చెప్పిస్తుంది రచయిత్రి. బాగా అల్లరి చేస్తూ అన్నలతో పోట్లాడుతూ వుండే బాలిక ను తల్లి తన సోదరి అయిన “బేగం జాన్” దగ్గర ఓ కొన్ని రోజుల కొరకు వదిలి పోతుంది. పేదింటి పిల్ల అయిన బేగం ని ఓ నవాబ్ కి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ నవాబ్ గారికి తెల్లని మేనిఛాయతో నాజూకు నడుములతో, మిసమిసలాడే పడుచు కుర్రాళ్ళను చేరదీయడం ఓ సరదా. నవాబ్ గారు బేగం జాన్ ని తన గృహం లో అలంకరణ సామగ్రి లాగానే, వాటి పక్కనే ప్రతిష్టిస్తాడు.

నవాబ్ ని పెళ్లి చేసుకొని ఇంట్లో అలంకార ప్రాయంగా ఉంటూ, ఎటువంటి సరదాలు లేకుండా, నిప్పుల్లో పొర్లుతున్నట్లు, వేదన చెంది, ఏ మంత్ర తంత్రాలు ఉపయోగించినా నవాబ్ గారిలో చలనం లేక, నిద్రకు దూరమయి, బ్రతుకు మీద విరక్తి పుట్టి, కాని బ్రతకటం మొదలుపెట్టాక దాన్ని అలాగే కొనసాగించాలి కాబట్టి అలాగే బతుకుతూ ఉంటుంది. ఈ పరిస్థితులలో ఆమె జీవితం లోకి ప్రవేశిస్తుంది రబ్బు అనే పరిచారిక. ఎల్లప్పుడూ బేగం శరీరాన్ని తాకుతూ, గోకుతూ ఉండటం రబ్బు పని. ఈ అమ్మాయేమో బేగం కి దురద వ్యాధి ఉంది అందుకే రబ్బు ఎప్పుడూ గోకుతూ ఉంటుంది అనుకుంటుంది. నవాబ్ గారిలో చలనం లేక, రాతి నుంచి రక్తాన్ని పిండ లేక, బేగం జాన్ పరిచారిక దగ్గర లైంగికంగానూ, ఉద్వేగపరంగానూ ఉపశమనం పొందుతూ ఉంటుంది.

ఓ రాత్రి అదే గదిలో పడుకున్న ఈ అమ్మాయికి తెలివి రావడం, లిహాఫ్ నీడలు గోడమీద కదులుతూ, ఒక ఏనుగు ఆకారం దాని క్రింద దూరి తప్పించుకోవడానికి పెనుగులాడుతున్నట్లు, మరో రోజు రాత్రి బేగం కి రబ్బు కి ఏదో గొడవ సర్దుబాటు అవుతున్నట్టు గమనిస్తుంది. ఓ రోజు రబ్బు పొరుగూరికి పోతుంది. రబ్బు లేని సమమయంలో ఈ పిల్లకి బేగం జాన్ తో వెగటైన అనుభవాలు అనుభవమయితాయి. రబ్బు వచ్చిన తర్వాత రాత్రి మళ్ళీ బేగం లిహాఫ్ మళ్ళీ ఏనుగు ఆకారంలో ఊగుతుంది. కొంత సేపు భయపడి లేచి లైట్ వేస్తుంది. అంతే లిహాఫ్ కింద ఏనుగు ఒక పిల్లి మొగ్గ వేసి పడిపోతుంది. ఆ పిల్లి మొగ్గ లిహాఫ్ ని ఒక అడుగు పైకి లేపుతుంది. “అల్లా! అంటూ నేను నా మంచం మీదకు దూకాను. ఏం చూశానంటారా! చెప్పను గాక చెప్పను,” అంటూ కథ ముగుస్తుంది.

లిహాఫ్స్వలింగ సంపర్కం కథా వస్తువుగా రాయబడ్డ ఈ కథలో ఎక్కడా అశ్లీలత కి తావు లేకుండా రాయడం రచయిత గొప్పదనం. ఇంగ్లీష్ లోకి అనువదించిన “తాహిరా నక్వీ” తన పరిచయం లో” ఈ కథ ఒక తుఫాను సృష్టించింది. చిన్న పిల్ల ఊహల్లో నుంచి వచ్చిన కథ కనుక అమాయకత్వంతో కూడిన దైర్యమూ నిష్కాపట్యమూ కనిపిస్తుంది. బేగం కి ఆమె పరిచారిక కి మధ్య ఉండే స్వలింగ సంబంధాన్ని కళ్ళకి కట్టినట్టు చూపిస్తూనే, చిన్న పిల్ల ద్వారా చెప్పించడం వలన, కథ చెప్పడంలో ఒక సున్నితత్వం వచ్చింది. ఈ కథ ప్రచరణ అయిన రెండు నెలలకు దాన్ని గురించి పెద్ద వివాదం చెలరేగింది. పాఠకులూ, విమర్శకులూ ఆమెను,  ఆమె కథను తీవ్రంగా విమర్శించారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అశ్లీలత కింద లాహోర్ కోర్ట్ లో కేస్ కూడా పెట్టింది. కానీ కోర్ట్ లో కథలో ఎటువంటి అశ్లీల పదాలు దొరకనందున కోర్ట్ కేస్ కొట్టివేశారు. తన చిన్నప్పుడు తమ ఇంట్లో వాళ్ళు ఒక బేగం గురించి ఆమె పరిచారిక గురించి చెప్పుకుని నవ్వుకునే వాళ్ళమని ఆమె చెప్పింది.” లిహాఫ్ కథలో కథనం గూఢంగానూ, సూచ్యంగాను వుంటుంది అంటూ ఆ కథ దృష్టి కోణాన్ని గురించి వివరించింది. ఈ కథ వ్రాసినప్పుడు రచయిత్రికి స్వలింగ సంపర్కం అనే విషయాన్నీ గురించి అవగాహన స్వల్పమని అనిపిస్తుంది అని అంటుంది. కాని సత్యవతి గారు ఏమంటారంటే ఒక చిన్న పిల్ల అవగాహన మేరకు ఈ కథ ముగిసింది అని అంటారు.

ఈ కథ ఆధారంగా ఫైర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఎన్నో వివాదాలకు దారి తీసింది. ఏది ఏమయినప్పటికీ, ఆ రోజుల్లో (1944) స్త్రీలు సంప్రదాయాలను ఎదిరించడం, ధైర్యంగా మాట్లాడటం, అనేది కలలో కూడా ఊహించలేని రోజుల్లో ఇలాంటి కథ రాయడం రచయిత్రి ధైర్యానికి  ఒక నిదర్శనం.

తెల్లారగట్ల ప్రయాణం

“ఎన్నిగంటలకి పెట్టమంటావ్  అలారం,” అంటూ గడియారం పట్టుకొచ్చారు మా అత్తగారు.  మా అత్తగారికి తెలిసిన అతికొద్ది విద్యల్లో అలారం పెట్టడం ఒకటి.

ఆ గడియారంలో సెకన్ల ముల్లు నడుం విరిగి అందులోనే పడిపోయింది. ఇన్నాళ్ళూ తమతోపాటూ కలిసి తిరిగింది అలా పడుందన్న బాధ కాస్తయినా లేకుండా ఒకదాన్నొకటి రాసుకు పూసుకు తిరిగేస్తున్నాయి గంటలముల్లూ నిమిషాల ముల్లూ. “ఎప్పుడో  తెల్లారగట్ల పెళ్ళి ….ముహుర్తం  వరకూ ఎవరుంటున్నారు  రాత్రి భోజనాల్లో అయితే అందరూ కనిపిస్తారు. అంటే సాయంత్రానికి చేరుకుంటే సరిపోతుంది. పోనీ  మధ్యాన్నానికి  వెళ్ళగలిగితే ఊళ్ళో మిగతా చుట్టాల ఇళ్ళుకూడా చుట్టి రావచ్చు లేదంటే మళ్ళీ నిష్టూరాలు.  కాబట్టి పొద్దున్నే బయల్దేరాలి. తప్పుతుందా…తెల్లారు  గట్టే లేవాలి.”

“అవునవును   నాలుక్కి లేవలేకపోయినా కనీసం అయిదయ్యేసరికన్నా లేవాల్సిందేనండీ  హ…ఆ…..ఆ….” అని హాయిగా అవులిస్తూ నా అమూల్యమయిన సలహా ఆవిడముందు  పరిచాను.  ఆవిడ దాన్ని అధికారికంగా చుట్టేసి ఓ మూలకి విసిరేస్తూ…

“నీ మొహంలావుంది …..నాలుక్కి లేచి, టిఫినూ, అన్నంకూరా వండి ,నీళ్ళుకాచుకుని  స్నానాలు చేసి …  దేవుడికి దీపం పెట్టుకుని, ఇద్దరం టిఫిన్ తిని కాఫీ తాగి, మగమహారాజులిద్దర్నీ లేపి, వాళ్ళకీ ఇంత కాఫీ పోసి ….  ఇల్లు చూస్తుండమని శారదత్తయ్యకి చెప్పి మనం  ఎదురుచూసుకుని  బయల్దేరేసరికి  దుర్ముహుర్తం  వచ్చెయ్యదూ! రేపు శనివారం , అయితే అయిదు లోపులో లేదా ఎనిమిది తర్వాత పెట్టుక్కోవాలి ప్రయాణం.  అయిదు గంటలకి ప్రయాణం అంటే రెండు గంటల కైనా  లేవొద్దూ ….. అందుకనీ  ఒంటి గంటకి పెడతాను . అలారం మోగాకా బద్ధకంగా ఓ గంట అటూ ఇటూ దొర్లి లేచినా పర్లేదు.”  అంటూ ….అలారం  సెట్ చేసిన గడియారం  నా గదిలో టేబుల్మీద పెట్టి, “పడుకో పడుకో……మళ్ళీ  తెల్లారగట్లే లేవాలి,” అంటూ వెళ్ళిపోయేరు.  ఆ మాత్రం దానికి  “ఎన్నింటికి పెట్టనూ?” అని అడగడం ఎందుకూ…అన్నీ అబ్బాయి పోలికలే  అని అసందర్భపు అక్కసుని వెళ్ళబోసుకుంటూ.   టైం చూస్తే  పన్నెండున్నర !!

హత్తెరీ బేగ్గులు సర్ధుకోటంలో టైం చూసుకోలేదు  ఇంకేం  నిద్ర  అనుకుంటు తలుపు జారేయబోతుంటే  అత్తగారు , వీధరుగు మీద నిద్రపోతున్న అబ్బులు గాడిని  నిద్రలేపి “ఒరేయ్ తెల్లారగట్లే లేవాలి గుర్తుందా  పడుకో పడుకో ” అనడం వినిపించింది.

“మర్చేపోయాను…..నా గంధం రంగు చీర పెట్టేవా ?” అంటూ మళ్ళీ  వచ్చేసారు .  “ హా…….పెట్టానేమో లెండి!!” అన్నాను.  నాకు అర్జెంటుగా నిద్ర ముంచుకొచ్చేస్తుంది. అసలే అలారం మోగడానికున్న టైం అరగంటేనాయే….

“ఏ గంధం రంగనుకున్నావూ …….మొన్న దీపావళికి మా పెద్దన్నయ్య పెట్టాడూ అదీ ……చింతపిక్క రంగు అంచూ……అక్కడక్కడా మామిడిపిందె బుటాలూ……”
“హా….హ……ఆ ……..” పెట్టానండీ అని ఆపద్ధర్మంగా అబద్ధం ఆడేసాను. ఇప్పుడు బీరువా తీస్తే …….ఆ బరబరలకి   నిద్రాభoగమయితే ముసుగులో  సింహం మేల్కొనవచ్చు….ఏమో మీదపడి నమిలేయొచ్చు. . ఇప్పటికే పది గాండ్రింపులయ్యాయి. “పగలంతా ఏ పెద్దగుర్రాలకి  పళ్ళు తోమారు  అత్తాకోడల్లిద్దరూ అర్ధరాత్రి  అపరాత్రి లేకుండా …వెధవ సర్దుళ్ళూ మీరూనూ” అంటూ.

మీకేం తెలుసు మా అవస్థలు .  అనుకోటానికి నాలుగు జతల బట్టలేకానీ….ఎన్నెన్ని చూసుకోవాలి . మేచింగు ప్రకారం   సాల్తీలన్నీ సర్దుకోవాలి , క్రితం సారి పెళ్ళికి కట్టుకెళ్ళినవి పట్టుకెళ్ళకూడదు ,  రోజులో నాలుగు చీరలు  ఆ నాలుగు ఒకదానికొకటి సంబంధం లేని రంగులు వెతుక్కోవాలి,  ఆ రంగులకి సరిపోయే  బొట్టూ, గాజులూ…..అంటూ నాలువేళ్ళు ముడిచేసరికే నిద్రలోకి జారుకున్నారు .

“మా పెద్దొదిన  దిగుతుంది  పెళ్ళికి ….ఆవిడముందు ఆ చీర కట్టుకుని తిరిగితేకానీ   సిగ్గురాదు ….. జానాబెత్తెడు  కొలతతో ఉంది కొని పంపింది చూడు. పవిటేస్తే కుచ్చీళ్ళు రావు కుచ్చీళ్ళు పోస్తే పవిట చాలదు. చీరపెట్టలేదని నేనేవన్నా ఏడ్చానా?” తనధోరణిలో చెప్పుకుపోతున్నారావిడ. ఏంటో   పీత కష్టాలు పీతవి   హా…..ఆఅ….ఆ….అ.  గాట్టిగా ఆవులించి  గడియారం వంక చూస్తే  హమ్మో !! పెద్దముల్లపుడే పదడుగులేసేసింది.

నాకక్కడే  నేలమీద పడి  గడపమీద తలపెట్టుకునయినా  పడుకుండిపోవాలనిపించేంతగా  ముoచుకొచ్చేస్తుంది నిద్ర…..

“అవునూ ఎన్నిబేగ్గులయ్యేయీ…..మరీ ఎక్కువ లగేజీ అయితే బస్సుల్లో ఎక్కీ దిగీ కష్టం . అలాని మరీ కుక్కి పెట్టేసేవంటే వచ్చేప్పుడు బేగ్గులు పట్టవ్….ఇస్త్రీ బట్టల్లా  ఇడిసిన బట్ట్టలు సర్దలేం కదా! పోయిన సారి ఇలాగే   నీలపల్లి పెళ్ళిలో  బేగ్ పట్టక మూడు లంగాలు వదిలేసొచ్చాను. నే తర్వాత పంపిస్తాలే పిన్నీ అంది  మా చిన్నన్నయ్య మూడో కోడలు సుభద్ర . ఒకటే పంపటం….నిక్షేపంలాంటి లంగాలు. పరకాళ్ళా గుడ్డలే అనుకో తుని నించి తెప్పించేను    పదేల్లబట్టీ కట్టినా పిసరు రంగు దిగితేనా !!” ఓరి నాయనో…  ఈవిడని నీలపల్లిలో ఆపకపొతే యానం లో లాంచీఎక్కి , అలా  ఎదుర్లంక ,మురమళ్ళ ,అమలాపురం పెళ్ళిళ్ళకి కూడా పోయి  ఆయా పెళ్ళిళ్ళల్లో  వదిలేసొచ్చిన తువ్వాళ్ళూ, జేబురుమాళ్ళూ లెక్కేస్తూ కూర్చుంటారు  అని భయం వేసి, “అవన్నీ బస్సులో చెప్పుకోవచ్చులెద్దురూ ఇప్పుడు పడుకుందాం,” అనేసాను.

“సర్లే పడుకో…..మళ్ళీ తెల్లారగట్లే  లేవాలి. పొద్దున్న ఉప్మా లోకి కర్వేపాకు కోసిపెట్టేవాలేదా ! చీకట్లో దొడ్లో కెళీతే పురుగో పుట్టో ఉంటాయ్. ఓ సారిలాగే  తెల్లారు ఝాము ప్రయాణం… అపుడు మీ ఆయనకి మూడో ఏడు…మీ మావయ్యా నేనూ …..”

అబ్బాయిగారు నిద్రకీ మెలకువకీ మధ్య ఇబ్బందిగా కదులుతున్నారు. లేచారంటే ఓ గసురు గసురుతారు…….అని భయపడి . “హుష్…..అత్తయ్యా ఇలా రండి” అని ఆవిడ్ని  గుమ్మం బయటికి పిలుచుకెళ్ళాను.

ఏంటీ…..అని ఆవిడా గుసగుసగా అంటూ  నా చెవి దగ్గర చేరి చెయ్యడ్డుపెట్టి, ఆ  వస్తువులెక్కడ పెట్టేవ్. చంద్రహారం విడిగా జేబురుమాలులో ముడేయమన్నాను వేసేవా ……..ఏ బేగ్గులో పెట్టావో  నాకూ చెపితే  ఓ కన్నేసి ఉంచుతాను.  అసలే బస్సు ప్రయాణం  …..జాగ్రత్తగా పెట్టావా….అని అతి రహస్యంగా అడుగుతున్నారు. అంతే, …….

టేబుల్ మీద గడియారం  కర్ర్……..ర్ర్ర్….ర్ర్ర్ర్……………..ర్ర్ర్ర్ర్ర్ర్…..ర్ర్ర్ర్ర్ర్ మంటూ   రాక్షస స్వరంతో   గుక్కెట్టి ఏడ్చింది.  మా ఇంట్లో మగాళ్ళకి లానే దానికీ అత్తాకోడళ్ళిద్దర్నీ కలిపిచూస్తే కన్ను కుట్టేస్తుంది కాబోలు.

అప్పుడే తెల్లారిపోయిoదా లే…లే… ( అసలు పడుకుందెక్కడా!!). పొయ్యంటించు, అని మా అత్తగారు  తెగ హైరానా పడిపోయారు.  ఆ గోలకి అబ్బాయిగారు అదాట్న మంచమీంచి లేచి  నన్ను నమిలి మింగెయ్యాలన్న కోరికని అతికష్టం మీద ఆపుకుని ( పరగడుపున పచ్చిమాంసం అరగదనుకున్నారేమో), దుప్పటీ తలగడా తీసుకుని ఎటో వెళ్ళిపోయారు. మాం గారు  లేచి ఓసారి పెరట్లో కెళ్ళొచ్చి పడుకున్నారు ( బాగా గుర్తుచేసావ్ అన్నట్టూ).

ఇక నా పరిస్తితి ఏం చెప్పుకోనూ…..హాఅ….ఆఆ…హా…ఆ…..    సీన్ కట్ చేస్తే,
నేనూ మా అత్తగారూ మా ట్రాక్టర్ డ్రయివరు అబ్బులూ విత్  అవర్ బేగ్స్ అండ్ బెడ్డింగ్స్  మా ఊరి పుంతరోడ్డులో ఉన్నాం.

సమయం మూడుగంటలా నలభై  అయిదు నిమిషాలు.   చెప్పానో లేదో…..మా అత్తగారు గడియారానికి గంటంపావు ముందుంటారు   ప్రయాణాలప్పుడు మరీనూ…
మా ఊరు  పెద్దరోడ్డుకి  దగ్గిరిలెండి. ఎలాగో ఆ రోడ్డుకి  చేరితే అక్కడినుంచి ప్రయాణం నల్లేరుమీద బండి నడకే.  ఇప్పుడు మేం వైజాగ్ వెళ్ళాలంటే వెనక్కి రామిండ్రీ వెళ్ళి బస్సెక్కి మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇలా ముందుకెళ్ళటం సుద్ధ దండగ కదా ! అందుకే ఇక్కడే  కాపుకాసి   ఆగిన బస్సులో ఎక్కేస్తుంటాం. అవును మేం చెయ్యెత్తితే బస్సులు ఆగుతాయ్   ‘ ఒక్కోసారి ‘ నిద్ర మొహాన లేపుకొచ్చేసాం ఏమో… అబ్బులు కునిపాట్లు పడుతూ  దెయ్యాలు తిరిగే ఏళప్పుడు ఈ పయాణేలేటండీ. కుంత తెల్లారేకా ఎల్లకూడదేటండీ అని  చనువుగా ఇసుక్కుంటున్నాడు.

నేను బితుకూమంటూ  “అవున్రోయ్ ” అనుకుంటూ చుట్టూ చూసాను. ఎదురుగ్గా తళ తళలాడే తార్రోడ్డున్నా. మా వెనకున్నది సన్నగా మలుపులు తిరిగిన డొంక దారి.  ఈ పక్కా ఆ పక్కా   చింపిరి   దెయ్యాల్లాగా   కనిపించాయి  అడ్డడిడ్డంగా పెరిగిపోయిన చెట్లూ కంపలూ.  ఎక్కడా నరవాసన  చీ…చీ…ఎక్కడా నరసంచారం లేదు.   “ఇక్కడవుతే మలుపుంది గనక  బస్సులు ఇసులో ( స్లో )అయ్యినపుడు మనల్ని  సూడగానే  ఆటోమేటిగ్గా ఆగుతాయండి”   అని మా అబ్బులి ఆలోచన. ఆందుకే  ఏ వాహనం ప్రయాణించవీల్లేని  చిట్టడవిలాంటి ఈ చీకటి ప్రదేసానికి అడ్డదారిన నడిపించి తీసుకొచ్చేసేడు.

ఇంట్లోకూడా దుప్పటి ముసుగేసి భయపడుతూ చూసే  పాటొకటి చప్పున గుర్తొచ్చేసింది. నిను వీడని నీడను నేనే………   నాకు భయం వేసి , మా అత్తగారికీ అబ్బులుకీ మధ్యకొచ్చి నుల్చున్నాను. చేతిలో బేగ్గు భుజం లాగేస్తుంది. కింద పెడదామంటే అంతా మట్టి ..పెంట…ఏమో ఇంకేవేం వున్నాయో!

అత్తగారు  చేతులు రెండూ నడుమ్మీద పెట్టుకుని, ఒరేయ్ ఏదో బస్సొస్తుంది చూడు అంటూ ఆర్డరేసారు కలిదిండి మహారాణిలా ( ఆవిడ పుట్టిల్లు అదేలెండి). వాడు నెత్తినున్న మూడుబేగ్గుల్నీ  ఓ చేత్తో కాసుకుంటూ  భుజాన్నున్న ఇంకో సంచీని సర్దుకుని రోడ్డు మధ్యకెళ్ళి చూసొచ్చాడు. “వత్తవయితే  రైటేగానండి  బస్సో లారీయో దగ్గిరికొత్తేగానీ తెల్దండి….” అనేసాడు.

చుట్టూ చీకటి, పక్కనున్న మాకు మేవే కనప్డటం లేదు. ఇంక మమ్మల్ని చూసి ఏ బస్సు ఆగిచస్తుంది. తెల్లారగట్ల కీ అర్ధరాత్రికీ తేడా తెలొద్దూ ఈ పెద్దావిడకి  విసుగ్గా మనసులో అనుకున్నా… ఆవిడకి కాస్త దూరంగా  జరిగి.

దూరం నించీ లైట్లు  కనపడగానే అబ్బుల్ని రోడ్డుమీదికి తోలేస్తున్నారు మా అత్తగారు.  వాడు  మూటలన్నీ నెత్తినపెట్టుకుని ముఠామేస్త్రిలాగా పోజుగా  చెయ్యూపుతూ నుంచోటం, ఆ వాహనం ఒంటికన్నో రెండుకళ్ళో వేసుకుని బోయ్….అంటూ దగ్గరికొచ్చేసరికి వీడు అమ్మోయ్ అని  పక్కకి ఒక గెంతు గెంతడం.     రక్షించండీ రక్షించండీ అని చేతులూపుతూ హాహా కారాలు చేస్తున్నట్టున్న మా అబ్బులి గాడి సైగలు చూసి రోడ్డు వొంపులో  ఒకటో రెండో బస్సులు కీచుమంటూ  స్లో అయ్యి , మళ్ళీ వేగంగా వెళ్ళిపోయేవి. బస్సు మమ్మల్ని దాటెళ్ళిపోయేకా ఒకటిరెండు బండబూతులు గాలికి ఎగిరొచ్చి పడేవి. మేం వచ్చి  అరగంట అయినట్టుంది. ఎక్కడో కోడికూత  వినిపించింది . హమ్మయ్య పోన్లే  బస్సు రాకపోతే పోయే వెలుగన్నా వస్తుంది అనుకొని నేను ఆనందపడుతుంటే… బస్సుకంటే ముందు  వెలుతురెక్కడ వచ్చేస్తుందో అని మా అత్తగారు కంగారుపడుతున్నారు.

టైమెంత అయ్యుంటుందంటావ్ అన్నారు మా అత్తగారు. నేను నా ఎడంచెయ్యి వెనక్కి దాచేసి  పైకి కిందికీ వెనక్కీ ముందుకీ చూసి ఏమో తెల్దండీ  అనేసాను. అబ్బులుగాడయితే ఎటూ చూడకుండా ….. “కరకెస్టుగా నాలుగున్నరకీ  అయిదున్నరకీ మజ్జిలో ఎంతో అయ్యుంటాదండి,”అన్నాడు  ఇబ్బందిగా కడుపు నొక్కుకుంటూ.

అంత కరకెస్టుగా ఎలా చెప్పేసేవ్రా బాబూ….అని మేం ఇద్దరం అడగలేదు. అప్పుడే …   పైనుంచీ రాలిపడ్డట్టూ  మా ముందు కొచ్చి నుంచుందో ఆకారం. నేను హడలిపోయి, తు…తు..తు..అనుకుని  తేరుకున్నాను. మా అత్తగారు  నువ్వట్రా సింగినాధం అన్నట్టు ఓ తేలిక చూపు విసిరి, గుళ్ళగొలుసు ఓసారి సర్దుకుని  రోడ్డుకేసి చూస్తూ ఠీవీగా నిలబడ్డారు.

“ఏట్రా అబ్బులూ……అయ్యగారిని ఇక్కడ నిలబెట్టేవ్.  బస్సు కోసరవా?  నీకు తెల్దేటిరా…..పైన దాబా ఒటేలు ఎట్టినకాడ్నించీ అక్కడే ఆగుతున్నాయ్ బస్సులు.  ఈర్ని అక్కడకి తీసుకుపో”  అందా సాల్తీ .

అబ్బులు గాడ్ని రెండు తన్నాలనిపించింది.  వివరం తెలకుండా ఇంత సేపూ అక్కడ నిలబెట్టినందుకు.  అత్తగారుండగా కోడలు పెత్తనం చేసిందంటారని ఊరుకున్నా . ఎలాగో  ఆయన్ని బ్రతిమాలి బస్సెక్కించే ఏర్పాట్లు చేయిద్దామనుకుంటే, “ఎందుకండి బాబూ….. గంపకింద కోడి కూయ్యకముందే  మిమ్మల్ని బస్సెక్కిచ్చీ పూచీ నాది,” అని  ఆ కబురూ ఈ కబురూ చెప్పేసి అర్జెంటుగా అవసరం పడిందని యాభైరూపాయలు పట్టుకుపోయాడు రాత్రి.

ప్రయాణం అనుకున్నప్పటినుంచీ మూడు అయిదులు మా అత్తగారిదగ్గరా, మూడు యాభైలు నా దగ్గరా గుంజేసినట్టు లెక్కతేలింది. “వాణ్ణనుకోటం ఎందుకూ మన బంగారం మoచిదయితే ….పెళ్ళికెళ్ళాలని ముచ్చట పడుతున్నారు. దగ్గరుండి రైలో బస్సో ఎక్కిద్దాం అని ఉండొద్దూ. పైగా పిలిచిన ప్రతీ పెళ్ళికీ వెళ్ళిపోటమే  మీ తిప్పలు మీరు పడండి అనేసారు చూడు”. అని మా అత్తగారు నిన్న రాత్రి భోజనాల దగ్గర బాధపడ్డారు. నేనూ నా వంతుగా  ‘భామాకలాపం’ సాగించినా  ఫలితం లేకపోయింది.

“లేదు మాయ్యా బస్సులిక్కడా ఆగుతాయ్……ఆ మద్దిన మా యమ్మనీ, మా యావిడ్నీ ఇక్కడే కదేటీ  గోపాలపొరం బస్సెక్కిచేను”  అని అడ్డoగా దబాయించేస్తున్నాడు  అబ్బులు.

ఏం చేద్దావండీ అని మా అత్తగారిని అడుగుదామని చూద్దును కదా ఆవిడప్పుడే పిలుపుకు అందనంత దూరంలో  ఉన్నారు  ఆది చూసి, ఆబ్బులుమాయ్య ( అదే ..అబ్బులుకి మాయ్య)  “అదేటండీ పెద్దయ్యగారు అటెల్లతన్నారు….. ఇటెల్లాలండి” అని   చెంబున్న చెయ్యెత్తేడు. ఈవిడేమో చుట్టున్న చెయ్యివేపు వెళ్ళిపోతున్నారు లేడికి లేచిందే పరుగంటే ఇదే మరి.

ఏలాగో అరిచీ కేకలేసీ ఆవిడ్ని పట్టుకుని పూర్తి అపసవ్య దిశలో నడిపించుకొచ్చేసరికి అప్పటివరకూ మేం నుల్చుని ఉన్న ఆ చోట్లో  ఇత్తడి చెoబు మైలు రాయిలాగా  మసగ మసగ్గా కనిపించింది….తుప్పల వెనకనుంచీ  అలా తిన్నంగా ఎల్లిపోండి అని  అబ్బులు మాయ్య గారి సలహాకూడా వినిపించింది.

నాకు ఇంటికెళ్ళి ఇంకోసారి తలస్నానo చేసి రావాలనిపించింది. మా అత్తగారు ససేమిరా అంటారని ఊరుకున్నాను. మేం ఆ ‘ దాబా ఒటేలు కాడికి ‘  నడిచొచ్చేసరికి  ఎంచక్కా తెల్లారిపోయింది.   ఒకటో మూడో బస్సులు బోయ్..మని హారని కొట్టుకుంటూ మమ్మల్ని దాటుకుని వెళ్ళిపోయాయి.

మా మొదటిపెళ్ళిరోజు శ్రీవారు బహుమతిగా ఇచ్చిన (అంకెలేలేని ) టైటన్ వాచీలో చుక్కల్ని లెక్కపెట్టుకుని పెద్దముల్లుకీ చిన్న ముల్లుకీ ఉన్న దూరాన్ని బట్టి చూస్తే టైము అంచనాగా  అయిదున్నర  లెక్కకొచ్చింది.

ఇక దుర్ముహుర్తం వచ్చేసినట్టే అని మా అత్తగారూ ……ఇంకో అరగంట వరకూ పర్లేదని నేనూ వాదించుకున్నాం.

ఇదేం ఖర్మే ….దరిద్రగొట్టోడు  దండుకోటానికెళితే వడగళ్ళవాన కురిసిందనీ ……కదలక కదలక ఇల్లు కదిలితే ఇలా అయ్యిందేవిటీ అని అవిడ నానా హైరానా పడుతూ అబ్బులు కేసి కొరకొరా చూసి  ……టైమెంతయ్యిందీ అన్నారు పద్దెనిమిదోసారి. నేను వాచీ ఆగిపోయిందండీ  అని అలవాటుగా అబద్ధం ఆడేసాను.  అబ్బులుగాడు కడుపు పాముకుంటూ “కరకెస్టుగా ఆరయ్యుంటాదండి,” అన్నాడు కడుపే కైలాసం అన్నట్టు వాడికి కడుపే గడియారం.

ధాబా ఒటేలు నించి వస్తున్న కమ్మని వాసనలకి మా కడుపులో ఎలకలు  కలియతిరిగేస్తున్నాయి.  బస్సొచ్చేలోగా ఓ పనయిపోతుందని  అన్నవరం దాటాకా తిందామని  మేం తెల్లారగట్ల వొండితెచ్చుకున్న కరివేపాకు వేయని ఉప్మాని ముగ్గురం   నుంచున్న పళంగా  పంచుకు తినేసాం.

మేం మూతులు కడుక్కుని మంచినీళ్ళు తాగేసరికల్లా  బస్సొచ్చి సరిగ్గా మా ముందే ఆగింది. ముందు బోర్డు చూసుకుని, ఎందుకయినా మంచిదని కండక్టర్ని  కూడా అడిగి సందేహం లేకుండా గబగబా అందిన బేగ్గులు పుచ్చుకుని ముందు నేనూ,  వెనక అత్తగారూ బస్సులో కాళ్ళుపెట్టేసాం. తీరా చూస్తే ఇంకో రెండు బేగ్గులు కిందవుండిపోయాయ్. అబ్బులుగాడు అయిపూపజాలేడు. కండక్టరేమో “ఏటమ్మా ఎక్కుతే ఎక్కండి లేపోతే దిగండి. డోరుకడ్డంగా నిలబడిపోతే ఎలాగా అని  మమ్మల్ని అయితే బస్సులోకి లాగెయ్యడానికి లేకపోతే కిందకి తోసేయ్యడానికీ రెడీగా వున్నాడు.  అత్తగారు ఉండు నేను తెస్తా అని దిగేరు….అయ్యో పెద్దవిడ ఆవిడెక్కడ మోస్తారు అని నేనూ దిగాను. డ్రయివరు బస్సుని రయ్యిన లాగించేసేడు.  అపుడొచ్చాడు అబ్బులు ….. “ఊ కంగారడిపోతారేటండీ నోనొత్తన్నాను కదా”  అంటూ …అత్తగారు యధాలాపంగా వాడి నెత్తిన నాలుగు అక్షింతలు చల్లి శాంతించారు. అదయ్యాకా మాకు తెలుసున్నవాళ్ళు ఒకరిద్దరు కనిపించారు కానీ మేం వాళ్ళని చూళ్ళేదు  ఎక్కడికీ ప్రయాణం అనడుగుతారని.  అలా అడిగితే ప్రయాణం సాగదనీ….అనుకున్న టైముకి ఆశించిన విధంగా ప్రయాణం జరగనందుకు  కారణాలను మేం విశ్లేషించుకుంటూ ఉండగా ఓ రెండు బస్సులు ఖాళీ లేదు అని  అబ్బుల్ని లెక్కచేయకుండా వెళ్ళిపోయాయి.

నిన్న రాత్రనగా మొదలయిన ప్రయాణం  నిద్రలేక నిలబడలేక నీరసం వచ్చేస్తుందిరా దేవుడా.  నా సంగతొదిలేయ్….పాపం ఆ మహతల్లి  నీకు నైవేద్యం పెట్టకుండా ఏనాడన్నా తాను తిందా ….మాకు పెట్టిందా !! (ఏదో ఇలా ప్రయాణాలప్పుడూ ప్రాణం బాగోనప్పుడూ ఎలానూ తప్పదనుకో )  మహా సాద్విని  ఇలా కష్టపెడతావా? “కరుణామయా దేవా కరుణించగా రావా…..ఆపద్భాంధవ రావా …ఆపదలో కాపాడవా …” భక్త తుకారం పాట పూర్తయ్యేసరికి దేవుడే పంపినట్టూ  సరాసరి మాముందుకొచ్చి ఆగిందొక బస్సు. హమ్మయ్యా  నిరీక్షణ ఫలించింది అని సంబరంగా బస్సెక్కెయ్యబోతుంటే ఆ నిర్దాక్షిణ్యపు కండక్టరు, ఇది నాన్ స్టాప్,ఎక్కడపడితే అక్కడ దించుతాం కానీ ఎవళ్ళని పడితే వాళ్ళని ఎక్కించుకోం లేండి…లేండి, అని మా పరువు దుమ్ములో కలిపేసి పోయేడు.  నువ్వు చెప్పి చావొచ్చుకదా  మా అత్త్తగారు అబ్బులుమీద పడ్డారు.

వాడికి చాలా పౌరుషం వచ్చేసింది. దాంతో  ఏవైనాసరే ఈసారి వచ్చిన బస్సులో మమ్మల్ని ఎక్కించి తీరుతానని పంతం పట్టేడు .దాని ప్రకారం  నిద్రలో జోగుతున్నట్టూ ఆగాగి వస్తున్న  బస్సును రోడ్డుకు అడ్డం పడి ఆపేసాడు.

బస్సు ఆగగానే అబ్బులు కండక్టరుకీ డ్రయివరుకీ, ఆ మాటకొస్తే  యావన్మంది ప్రయాణికులకీ వినిపించేలా  “ఎవరనుకుంటునారండీ …పెసిడెంటుగారి తాలూకా ఈరు. బస్సెక్కిచుకోకపోతే  రేపీరూట్లో వొత్తారుకదా అప్పుడు సూద్దిరిగాని ఏవవుతదో . డోరు తియ్యండి డోరు తియ్యండి ….” అంటూ పెద్ద హడావిడిచేసి  లగేజీ  ముందు ఇంజను  మీదా  డ్రయివరు వెనక సీట్లో కూర్చున్నవాళ్ళ కాళ్ళమీదా సర్దేసి, “కుదుపులేకుండా వుంటాది ఇక్కడ కూకోండి అయ్యగారూ” అని, ముందు నించీ మూడో సీటు దులిపి  మేం కూర్చున్నాకా  దిగి డోరేసి, రైట్ రైట్  అనేసరికి బస్సుకదిలింది. వాడు ఇవతలపక్క కిటికీ దగ్గరికి పరిగెత్తుకొచ్చి, ఆయ్….జాగర్తండి, బేగ్గులులన్నీ సరీగా ఉన్నయోలేదో సూసుకోండి, పెళ్ళవగానే బీగొచ్చేయండి …ఆయ్ ….మరెల్లిరండి….ఆయ్…అని చేతులూపేసాడు. బతుకు జీవుడా అనుకుంటూ  సీట్లో జారబడి అత్తగారు చూడకుండా వాచీ చూస్తే   పెద్దముల్లు పైచుక్క  మీదా చిన్నముల్లు కిందచుక్కకి కాస్త అవతలగానూ ఉన్నాయి…అంటే టైము   ఏడేకదండీ….ఏడే…..ఏడే…
ఎక్కెడ దిగుతారమ్మా – కండక్టర్ .
వైజాగు రెండు టిక్కెట్లు -అత్తగారు.
వైజాగయితే ఈ బస్సెక్కేరేటీ – వెనక సీటు ప్రయాణికుడు.
డయివరు గారూ బస్సాపండి  పాపం ఈళ్ళు సూసుకోకుండా ఏరే రూటు బస్సెక్కేసేరు  -ముందు సీట్లో మదర్ తెరీస్సా.
ఏటమ్మా  ఓ లగేజీలేసుకుని తోసుకుని బస్సెక్కేటవేనా ?  దిగండి దిగండి  -కండక్టరు డ్రయివరు తోపాటూ యావన్మంది   ప్రయాణికులూ.
అత్తగారు నేనూ ఒకేసారి తలతిప్పి ఒకర్నొకరం చూసుకున్నాం . కంగారులో ఇద్దరం చూడలేదు ఆ బస్సు ఎటువేపెళుతుందో!
బస్సాగింది . మేం  మోయలేని మా లగేజీ తో సహా మళ్ళీ రోడ్డున పడ్డాం .   ఆ కంపలూ  ఆ తుప్పలూ, ఆ  డొంకలూ  “హత్తేరీ …..మా ఊరు పుంతరోడ్డు.”

***

నోట్ :  ఇంట్లో పనివాళ్ళు ఆడవారిని అమ్మగారు అనీ, మగవారిని అయ్యగారు అనీ పిలుస్తారు కదా అన్నిచోట్లా . కానీ మా ఊర్లో ( చాలా ఊర్లల్లో) మగవారిని  రాజుగారు, పంతులుగారు , కాపుగారు ఇలా ….ఆడవారిని  చిన్నయ్యగారు, పెద్దయ్యగారు ,  అనీ అంటుంటారు . కథలో అదే రాసాను .

ప్రతి గురువారం ఇక ‘సారంగ’ వారమే!

mandira1పుస్తకాలు లేని గది మూగది! నిజమే…కానీ-

వొక పదేళ్ళ క్రితం మంచి చదువరి అంటేనో, పుస్తకాల పురుగు అంటేనే చుట్టూ పుస్తకాలు పోగేసుకుని లేదంటే చేతిలో కనీసం వో పుస్తకం కచ్చితంగా ఛాతీకి ఏటవాలుగా అమిరేట్టు పెట్టుకునో కనిపించడం వొక రొటీన్ దృశ్యం! ఇవాళ ఆ దృశ్యం నెమ్మదిగా కనుమరుగయిపోతోంది. ఇది పుస్తకాలకే కాదు, పత్రికలకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు మూడు నాలుగు పుస్తకాలేమిటి, రెండు మూడు పత్రికలేమిటి వొక్క చిన్న నోట్ బుక్ లాంటి పరికరంలో వందల పుస్తకాలూ పత్రికలూ అగ్గిపెట్టెలో చీరలా ఇమిడిపోతాయి! చూస్తూ చూస్తూ వుండగానే మన పుస్తకాల ‘గది’ ఎంత చిన్నదైపోయిందో! కానీ, ఆ గదిలో ఇమిడిన ప్రపంచం రెప్పపాటులోనే, మన చేతివేళ్ళ ఇంద్రజాలంతో ఇట్టే ఆకాశమంత విస్తరించింది.

చిన్నప్పుడు ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రిక ఏ రోజు వస్తుందా అని రోజులు – మరీ ఆ సస్పెన్స్ తీవ్రతని నాటకీయంగా  చెప్పాలనుకుంటే- క్షణాలు లెక్కపెట్టుకుంటూ గడిపేవాళ్లం. నిజంగానే! వారపత్రిక లేని అలనాటి  చదువరి బాల్యాన్ని నేను వూహించలేను. ‘ఈవారం కవిత, కథ’ అనగానే కళ్ళలో చక్రాలు గిర్రున తిరిగి, ఆ పేజీల్లో ఎవరున్నారా అని ఆతృతగా వెతుక్కోవడం, ఆ చదివిన పేజీల్ని, వాటికి వాడిన చిత్రాల్ని అందంగా నెమరేసుకోవడం, ఎప్పటికయినా ఆ పేజీల్లో నేనొక పేజీ కాగలనా అనుకుంటూ కలలు కనేయడం…ఇవాళ నలభైలకి అటూ ఇటూ వున్న ప్రతి రచయితకీ  పఠితకీ అనుభవమే! ‘ఈ వారం మీ పత్రిక చదివాము, ఇంటిల్లి పాదీ ప్రతి పేజీ చదువుకునీ మళ్ళీ చదువుకుని ఎంత హాయిగా కాలక్షేపం చేశామో చెప్పలేను’ లాంటి లేఖలు నిన్నటి నాస్తాల్జియాకి గురుతులుగా మిగిలిపోయాయి. ఆ ‘ఇంటిల్లిపాదీ’ అన్న పదం ఇప్పుడెక్కడా వినిపించనే వినిపించదు ఆశ్చర్యంగా!

చాలా మంది స్నేహితులు ఇప్పటికీ వొక వారపత్రిక వుంటే భలే బాగుంటుంది అని ప్రకాశంగా అనడమూ, ‘ఆ రోజుల్ని తలచుకున్నప్పుడల్లా ఆనందంలాంటి విషాదమో/ విషాదం లాంటి ఆనందమో!” అంటూ కవి తిలక్ లాగా బాధపడిపోవడమూ తెలుసు. అంటే, వెబ్ లోకంలో  ఇన్ని ద్వైమాసిక. మాస పత్రికలు వున్నా అలాంటి వార పత్రిక లేదే అన్న వెలితి మనలో వుండిపోయింది. ఆ వెలితిని తలచుకుంటూ ఇదిగిదిగో సారంగ సాహిత్య వారపత్రిక! నిస్సందేహంగా ఇది సారంగ బుక్స్ మరో ముందడుగు, మిమ్మల్ని చేరుకోడానికి! మీ పుస్తక ప్రపంచంలో మీ ఆలోచనల్లో మీ ఉద్వేగాల్లో  మీతో వో  కరచాలనానికి!

వొక శుభవార్త ఏమిటంటే ఈ వెబ్ వార పత్రికలో అచ్చయిన కొన్ని రచనలు ఏడాది చివర సారంగ బుక్స్ సిరీస్ లో అచ్చు రూపం కూడా తీసుకుంటాయి.

సారంగ బుక్స్ నించి వొక సాహిత్య వారపత్రిక రాబోతున్నదంటే అది అచ్చు పత్రిక అయి వుంటే బాగుణ్ణు అని ఆశపడ్డారు చాలా మంది సాహిత్య మిత్రులు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. అక్షర ప్రయాణం మొదలయిన ఈ రెండేళ్లలోనే సారంగ  బుక్స్ అంటే వొక మంచి ప్రచురణ సంస్థ అన్న గౌరవం ఏర్పడింది. ‘సారంగ’ నించి ముందు ముందు ఏ పుస్తకాలు వస్తాయన్న ఆసక్తి కూడా పెరుగుతూ వచ్చింది. అయితే, సారంగకి మొదటి నించీ సాంకేతిక వెలుగుల మీద గొప్ప ఆసక్తి. సాంకేతిక రంగంలో వస్తున్న కొత్త వెలుగుల్నీ, మెరుపుల్నీ సాహిత్యానికి ఎలా అద్దగలమన్నదే ‘సారంగ’ అన్వేషణ. ఇవాళ ఈ గురువారంతో ‘సారంగ’ అన్వేషణ వొక కొలిక్కి వచ్చింది. వొక శుభవార్త ఏమిటంటే ఈ వెబ్ వార పత్రికలో అచ్చయిన కొన్ని రచనలు ఏడాది చివర సారంగ బుక్స్ సిరీస్ లో అచ్చు రూపం కూడా తీసుకుంటాయి.

మరో అంతర్జాల పత్రిక అవసరమా అన్న ప్రశ్నకి సారంగ దగ్గిర సమాధానం వుంది. మన రోజు వారీ జీవితంలో కనీసం కొంత భాగం కాగల సాహిత్య వారపత్రిక వుండాలన్నది మొదటి సమాధానం. అయితే, తెలుగు సాహిత్య ప్రచురణ రంగంలో సారంగ బుక్స్ మొదటి నించీ చేయాలనుకుంటున్నది రచయితలకు అనువయిన ప్రచురణ వాతావరణాన్నీ, సంస్కృతినీ ఏర్పరచాలన్నది. లాభాలు ఆశించని, రచయిత ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయని, పఠిత ఆకాంక్షలకు అనువైన ప్రచురణ రంగం ‘సారంగ’ కల. అందులో భాగంగానే ఈ ఏడాది సారంగ బుక్స్ వొక పూర్తిస్థాయి ప్రచురణ సంస్థగా మీ ముందుకు రాబోతోంది. కేవలం ఫిక్షన్ మాత్రమే కాకుండా నాన్- ఫిక్షన్ రచనలు కూడా మరిన్ని తీసుకురావాలనే సత్సంకల్పం వొక ఎత్తు అయితే, ఆ రచనలు అత్యాధునిక సాంకేతిక పరికరాల ద్వారా మీ చేతుల్లోకి పదిలంగా చేరాలన్నది సారంగ కల. అలాగే, కొత్తగా ఏర్పడుతున్న పాఠక ప్రపంచానికీ సాహిత్యంలో వున్న రెండు భిన్న ప్రపంచాలకూ- వొకటి నిన్నటిదీ, రెండోది ఇవాల్టిదీ- మధ్య వంతెనగా వుండాలన్నది సారంగ ఉద్దేశం. అందుకే, ఈ సంచికలో ఆ రెండు ప్రపంచాల మేలుకలయికని మీరు చూస్తారు. సాహిత్యం పట్ల మీ అభిరుచిని పెంచే భిన్న శీర్షికల్ని మీ ముందుకు తెస్తోంది సారంగ.

ప్రతి గురువారం సారంగ వారపత్రిక మీ కంటి తలుపులు తడుతుంది, మీ పుస్తకాల గదిలోంచి కనుమరుగైపోయిన వారపత్రికా దరహాసమే కాంతిగా! ఈ కాంతిని అక్కున చేర్చుకోండి. ఈ రచనల వెలుగులో కాసింత తడవండి!
శీ ర్షి క లు
ప్రతి నెలా మొదటి గురువారం సారంగ అన్ని శీర్షికలతో కొంచెం ఎక్కువ సందడిగా వస్తుంది. ఆ తరవాతి గురువారాలు పరిమితమయిన శీర్షికలతో వస్తుంది. తెలుగు పత్రికా ప్రపంచంలో సాహిత్య జర్నలిజానికి శ్రీకారం చుట్టిన శ్రీరమణ గారు చాలా కాలం తరవాత ‘సారంగ’ కోసమే రాస్తున్నశీర్షిక  ‘రెక్కల గుర్రం’  మీ కోసం! కథారచనలో ఆరితేరిన పి.  సత్యవతి గారు ఏడు పదుల వయసులో కూడా ఇప్పటికీ రోజుకు కొన్ని గంటల తరబడి పస్తక పఠనంలో గడుపుతారు. అలా చదువుతున్న  కొన్ని పేజీల్ని మనతో పంచుకుంటారు. సమకాలీన కథ అనగానే గుర్తొచ్చే ఆత్మీయమయిన పేరు ఆర్. యం. ఉమా మహేశ్వర రావు. ‘సారంగ’ కోసం తన వర్తమాన కథానుభవాన్ని మనసు విప్పి చెప్పబోతున్నాడు ఉమా  ‘కథా సమయం’ లో నెలనెలా!

ప్రతి ఏడాది వొక ప్రముఖ కథా రచయిత  ‘కథా సారంగ’  శీర్షికని నిర్వహిస్తారు. ఈ ఏడాది  ప్రముఖ కథకుడు వేంపల్లె షరీఫ్ నిర్వహించబోతున్నారు. ఈ శీర్షిక కోసం ప్రముఖ కథకులతో ప్రత్యేకంగా కథలు రాయించి మనకి అందించబోతున్నారు వేంపల్లె షరీఫ్. ప్రసిద్ధ సినీగేయ రచయిత భువనచంద్ర చాలా మందికి పాటల రచయితగానే తెలుసు. కానీ,ఆయనలో అందమయిన కథకుడు కూడా వున్నాడు. ఆయన అనుభవాల అమ్ములపొది నించి చేస్తున్న శరసంధానం  ‘Untold stories’  ప్రతి నెలా మీ కోసం!

తెలంగాణ చరిత్ర శోధనకి మారుపేరు సంగిశెట్టి శ్రీనివాస్. తెలంగాణ సాహిత్య చరిత్రని ప్రతి నెలా  మన కళ్ల ముందు వుంచే శ్రీనివాస్ శీర్షిక  ‘కైఫియత్’ . అత్తగారిని కూడా నవ్వించగల అల్లరి కోడలు దాట్ల లలిత కథా శీర్షిక  ‘ఈదేసిన గోదారి’  ప్రతి నెలా మీ ఇంట నవ్వుల పంట! ప్రతి వారం మీ కోసం సీరియల్ నవల  ‘అల’  అనే శీర్షిక కింద మీ కోసం ఎదురుచూస్తూ వుంటుంది. ఈ సీరియల్ వచ్చే గురువారం మొదలవుతుంది. ప్రపంచ సినిమాని మీకు పరిచయం చేస్తున్నారు  ‘తెర’చాప’  శీర్షికలో మద్దూరి శ్రీరాం.

ఇవిగాక వారానికి కేవలం వొకే వొక కవితతో  ‘తరంగ’  ఈ వారం కవిత మీకు ప్రత్యేకం! వొక కవిత చదివిన అనుభవాన్ని మీ దోసిట వుంచే  ‘అద్దంలో నెలవంక,’  అచ్చయిన కథ వెనక దాచేసిన అసలు కథల్ని చెప్పే  ‘చెప్పని కథ’  శీర్షిక వచ్చే గురువారం.  ‘ఓ కప్పు కాఫీ’   ‘అక్షరాల వెనక’   ‘తలపుల నావ’  శీర్షికలు. మీకు ఇష్టమయిన రచయితలతో హాయిగా గడుపుకునే కాఫీ సమయాలు, ఉత్తమ పాఠకుల వేదిక  ‘పాఠకచేరీ’  మంచి కథల తలపోత  ‘కథనరంగం’  ప్రసిద్ధ రచయితలతో మీ జ్నాపకాల వెలుగు  ‘దీపశిఖ  అప్పుడప్పుడూ!

Painting by Mandira Bhaduri

నెత్తుటి నేలపై ప్రేమ పతాక!

Sriram-Photograph“జూలిన్ షేనబెల్ గొప్పతనం ఏమిటంటే ప్రపంచ నాయకులను చర్చలకు ప్రేరేపించేటంతటి గొప్ప కళను సృజించడం’’ — జేవియర్ బార్డెం

మీరు ఒక క్రూరమైన, ప్రబలమైన శక్తి చేత అణచివేయబడుతున్నప్పుడు, ఆ శత్రుత్వంతో నిండిన పరిస్థితులను ఎలా అర్థం చేసుకుంటారు?

ద్వేషానికి  లొంగిపోవడం ద్వారా మీలోని విచక్షణని విడిచిపెడతారా, లేక వాస్తవ  పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా వైరి భావాన్ని  అధిగమించడానికి ప్రయత్నిస్తారా?

గొప్ప ఆలోచనాపరులు అరుదు. దర్శకుడు  జూలిన్ షేనబెల్ గాంధీవలె గొప్ప దార్శనికుడు, ఆలోచనాపరుడు.

ఎన్నో చలన  చిత్రాలు క్రూరమైన యుద్ధాల గురించి లోతైన జ్ఞానాన్ని అందిస్తాయి. కాని  అరుదుగా “మిరల్” వంటి కొన్ని చిత్రాలు మాత్రమే మనసులోని ద్వేషం యొక్క  మూలాల్ని శోధించడానికి, అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాయి. ఆ విధంగా  ఆచరణాత్మకమైన పరిష్కారాల్ని, శాంతితో కూడిన ప్రపంచాన్ని సృష్టించుకోవడం  సాధ్యమేనన్న ఒక ఆశని మన నిస్పృహకు లొంగిపోయిన హృదయాలకు కలిగిస్తాయి. ఈ  సంక్షుభిత లోకానికి మిరల్ వంటి చిత్రాల అవసరం ఎంతో ఉంది. మానవ హృదయంలోని  బలీయమైన ప్రతీకారేచ్ఛ యొక్క తీవ్రతను చూసి తల్లడిల్లిన హృదయాలకు ఈ చిత్రం  ఓదార్పుని ఇస్తుంది.

“మిరల్” దశాబ్దాలుగా రగులుతున్న ఇజ్రాయిల్-పాలస్తీనా సమస్యపై లోతైన అవగాహనని ఇవ్వడమే కాదు, పరిష్కారాన్ని చూపించడానికి కూడా   ప్రయత్నిస్తుంది. అయితే ఈ చిత్రం ఇజ్రాయిల్ కోణం నుండి లేదా పాలస్తీనా  కోణం నుండి కాకుండా ప్రజల కోణం నుండి మాట్లాడుతుంది. ప్రజల దైన్యానికి  ఇజ్రాయిల్ ఎంత కారణమో హమాస్ కూడా అంతే కారణం అని చెబుతుంది. హింస,  తీవ్రవాదం మానవ జీవితాన్ని ఎంతటి దయనీయ స్థితికి నెడతాయో వివరిస్తుంది.  వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రం ఎంతోమంది దయాన్విత హృదయుల  జీవితాలకు అద్దంపడుతుంది.

1948, అరబ్-ఇజ్రాయిల్ యుద్ధం సమయంలో,  దెయిర్ యాసిన్ నరమేథం తరువాత,  భీతిగొలిపే పరిస్థితుల్లో  వీధుల్లో తల్లితండ్రులు మరణించి అనాధలై భయంతో  వణికిపోతున్న 55 మంది చిన్నారుల్ని మహోన్నతురాలు హింద్  హుస్సేన్ జరేసులేం  తన ఇంటికి తీసుకువెళ్ళి వాళ్లకి ఆహారం,  ఆశ్రయం కల్పించే దయనీయమైన సన్నివేశంతో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. ఆరు  నెలల్లో ఆ 55 మంది కాస్తా 2,000 అవుతారు. వారికి ఆమె ఆహారాన్ని ఎలా  సమకూరుస్తుంది  ?  అమానవీయ పరిస్థితుల నుండి రక్షణ ఎలా కల్పించగలదు ? ఆమె తన  వ్యక్తి గత జీవితాన్ని, ఆనందాన్ని వారి కోసం వదులుకొని, ప్రమాదకరమైన రాజకీయ  అనిశ్చిత పరిస్థితులకు దూరంగా వారిని సంరక్షించేందుకు దర్-అల్-టిఫెల్  ఇనిస్టిట్యూట్ ని ప్రారంభిస్తుంది.

1778లో మిరల్ అనే 5 ఏళ్ల బాలికను  ఆమె తండ్రి తన భార్య మరణించించిన కారణంగా హింద్ హుస్సేన్ కు అప్పగిస్తాడు.  సంక్షుభిత బాహ్య పరిస్థితుల ఛాయలు తెలియకుండా దర్-అల్-టిఫెల్  ఇనిస్టిట్యూట్లో మిరల్ పెరుగుతుంది. ఆమె తన 17 ఏళ్ల వయసులో ఒక శరణార్థ  శిభిరంలోని పిల్లలకి బోధించడానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి పాలస్తీనా  శరణార్థుల దయనీయ పరిస్థితులను, బాహ్య ప్రపంచపు క్రూరత్వాన్నిచూస్తుంది.  తీవ్రవాది అయిన హని ప్రేమలో పడి “ఫస్ట్ ఇన్ఫిదా” విప్లవోద్యమం వైపు  ఆకర్షితమవుతుంది. విప్లవోద్యమానికి, విద్యయే శాంతికి మార్గమని నమ్మే హింద్  హుస్సేన్ ఆశయాలకి నడుమ  మిరల్  నలిగిపోతుంది.

miral-3

ప్రియుడు హనిని విప్లవకారులే  ద్రోహిగా ముద్రవేసి అనుమానించి చంపివేయడంతో హతాశురాలైన మిరల్ హింసతో నిండిన  తీవ్రవాదం సమస్యలకు పరిష్కారం చూపకపోగా ప్రజల జీవితాల్ని మరింత దుర్భర  పరిస్థితుల్లోకి నెట్టివేస్తుందని అర్థం చేసుకుంటుంది. న్యూయార్క్ లోని  ప్రజలవలె ఇజ్రాయీయులు, పాలస్తీనీయులు, అలాగే అన్ని జాతుల ప్రజలు కలిసి ఒకే  దేశంగా ఎందుకు ఉండకూడదు అని ఆలోచిస్తుంది. దశాబ్దాలుగా పాలస్తీనా భూభాగంలో  సెటిలర్స్ గా జీవిస్తున్న ఇజ్రాయిల్ ప్రజల పై హమాస్ తీవ్రవాదుల హింస కూడా  వ్యతిరేకిస్తుంది.

రాజకీయ కారణాలకు, సామాన్య జీవితాలకు ఎంతో  వ్యత్యాసం ఉంటుంది. ఎన్నటికీ గెలవలేని యుద్ధంలో తరాల ప్రజల ఆనందాన్ని ఫణంగా  పెట్టే కంటే తక్కువ శాతం భూభాగాన్ని స్వీకరించి సర్దుకోవడానికి, ఇజ్రాయిల్  తో చర్చలకు ప్రయత్నిస్తున్న మితవాదులైనవారి వైపు మొగ్గు చూపుతుంది మిరల్. ఈ  చిత్రం సామాన్య ప్రజలలో మన చుట్టూ జీవించి ఉన్న మహాత్ములను పరిచయం  చేస్తుంది.  ఉద్యమాలు ఎలా  మేధావులు, ఆలోచనపరులైన వారి చేతుల్లో నుండి  ఆవేశపరులు  , రహస్య రాజకీయ ఆశయాలు గల వారి చేతుల్లోకి వెళ్లిపోతున్నాయో,  ప్రజలు ఎలా రాజకీయ సిద్ధాంతాలకు ఉద్రేకులై హింసలో పడి తమ జీవితాల్ని నాశనం  చేసుకుంటారో సజీవంగా చూపుతుంది.

హింసతో కాకుండా సామరస్యంతో పరిష్కారం  సాధ్యం అని నమ్మే కొంతమంది ఆశకు బలాన్నిస్తుంది ఈ చిత్రం. హింసతో కూడిన  తీవ్రవాదం యొక్క పరిణామాలు ఎలా ఉంటాయో రవీంద్రనాథ్ టాగోర్ తన “చార్  అధ్యాయ్” నవలలో వివరించడం అప్పటి అతివాద భారత స్వాతంత్ర్య ఉద్యమకారుల్ని  నిరాశ పరచింది. బ్రిటిష్ ప్రభుత్వం విప్లవోద్యమాల్ని నైతికంగా  దెబ్బతీయడానికి “చార్ అధ్యాయ్” నవలని ఉపయోగించుకొందని వారు ఆరోపించారు.  కాని మానవత్వంపై అచంచలమైన విశ్వాసం ఉన్న టాగోర్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో  గాని, మరే ఇతర ప్రపంచ విప్లవోద్యమాలలోగాని హింసను, తీవ్రవాదాన్నిగాని  సహించలేదు.

“మిరల్” చిత్రం ఒక ప్రాంతంతోగాని, ఒక దేశంతో గాని లేదా ఒక  జాతితో గాని తమని తాము identify చేసుకునేవారికి నచ్చకపోవచ్చు. కాని  మనిషిని మనిషిగా ప్రేమించేవారి హృదయాలపై బలమైన ముద్రని వేస్తుంది.

మిరల్ (2010)

నిడివి:  112 నిముషాలు భాష: ఆంగ్లం దర్శకత్వం : జూలిన్ షేనబెల్ నటులు: ఫ్రిదా  పింటో, విలియమ్ డిఫోయ్, హియం అబ్బాస్, అలెగ్జాండర్ సిద్దిక్

హైదరాబాద్‌ చెప్పుకున్న ఆత్మకథ ‘యుగసంధి’

sangisetti- bharath bhushan photoహైదరాబాద్‌ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక జీవనానికి అక్షరరూపం భాస్కరభట్ల కృష్ణారావు నవలలు. 1950-66ల మధ్య మొత్తం నాలుగు నవలలు రాసిన ఈయన పైదాయిషీ హైదరాబాదీ.
నగరం స్మృతిని, జీవితాన్ని, జీవితాల్లోని సంఘర్షణలను, ఆలోచనలను, ఉన్నత ఆదర్శాలను, అంతకుమించి అత్యున్నత జీవిత విలువల్ని ఒకవైపూ ఛిద్రమవుతున్న బతుకుల్ని, చిదిమేస్తున్న దోపిడీ వ్యవస్థ, దానికి అండగా నిలిచిన వెన్నెముకలేని రాజకీయాలు, అన్ని విధాలుగా భాగ్యవంతులైన వారు అభాగ్యులుగా మారిన అమానవీయతను మరోవైపూ తన నవలల్లో కృష్ణారావు అక్షరీకరించారు.

హైదరాబాద్‌ నగర జీవితానికి సంబంధించినంత మేరకు భాస్కరభట్ల కృష్ణారావు నవలలు ఒక డాక్యుమెంటరీ. ప్రస్తుతం ‘అభివృద్ధి’ ఆవరించి మెట్రో రైలుపేరిట నగరాన్ని దిగమింగుతున్నాయి. చారిత్రక కట్టడాలు కనుమరుగవుతున్నాయి. సుల్తాన్‌ బజార్‌లాంటి నవలల్లోని ప్రదేశాలు రూపుమారనున్నాయి. కోఠీ విమెన్స్‌ కాలేజి కళావిహీనం కానుంది. వందల యేండ్లుగా సజీవ సంఘటనలకు సాక్ష్యాలుగా నిలిచిన ప్రదేశాలు మూగగా రోదిస్తూ రూపు మార్చుకుంటున్నాయి. తరిగిపోతున్న, నాశనం అవుతున్న ఒక చారిత్రక వారసత్వాన్ని ఈ నవలలు దివిటీపట్టి ఆకాశమెత్తు ఎత్తి చూపించాయి. ఇట్లాంటి నగరంపై, నగర చరిత్రపట్ల, సంస్కృతి పట్ల ఎలాంటి పట్టింపులేని పాలకులు, ప్రతిపక్షాలు ఒకేరీతిలో ప్రజాభిప్రాయాన్ని ‘బుల్‌డోజ్‌’ చెయ్యడమే పనిగా పెట్టుకున్నాయి.

‘బుల్‌డోజ్‌’కు గురవుతున్న చరిత్ర, సంస్కృతిని, సాహిత్యాన్ని కాపాడుకునేందుకు కొత్తతరం నడుంకట్టేందుకు కృష్ణారావు నవలలు స్ఫూర్తి కావాలి. యుగసంధి  నవల మొదట 1956లో ‘తెలుగు స్వతంత్ర’ పత్రికలో సీరియలైజ్‌ అయింది. తర్వాత 1957లో నవలగా వెలువడింది. ఇందులో 1920- 48 మధ్య కాలంలో హైదరాబాద్‌ కేంద్రంగా మొత్తం తెలంగాణలో చోటుచేసుకున్న సకల మార్పులు, ఉద్యమాలు, ఉద్వేగాలు, జీవితాలు, ఆర్థిక ప్రగతి, ఆదర్శాలు అన్నీ కలగలిసి ‘యుగసంధి.’.

ఐదారు దశాబ్దాల క్రితం వచ్చిన నవలల గురించి వర్తమానంలో చర్చించి, వ్యాఖ్యానించడం అంటేనే చరిత్రతో సంభాషించడం! ఈ సంభాషణలో గతంలో పాదుకొని ఉన్న కొన్ని ఉన్నత విలువలు ఈనాడు ఎక్కడా వినబడడం లేదు. మీదుమిక్కిలి ఆనాడు సమాజంలో ఉన్న అవలక్షణాలు ఈ ఆరున్నర దశాబ్దాల ప్రజాస్వామిక పాలన తర్వాత కూడా అంతకన్నా ఎక్కువగా వేళ్ళూనుకు పోయాయి. ఇది జాతి ప్రయాణిస్తున్న తిరోగమన దిశను సూచిస్తుంది. ఈ తిరోగమనానికి అనేక కారణాలు ఉన్నాయి. విలువలు నశించడం ఒక కారణం. నాశనం చేయడమే విలువలుగా చలామణి అవుతున్న కాలంలో మనం ఉన్నాము.

ఇట్లాంటి సందర్భంలో చారిత్రక విషయాలపై అవగాహన రాహిత్యంతో చేసే వ్యాఖ్యలు తప్పుడు సంకేతాలిస్తాయి. నిజానికి ఒక సంఘటన జరుగుతున్నకాలంలో వాటిని చూసి అనుభవించి వ్యాఖ్యానిస్తే వాటిపై భావోద్వేగాల ప్రభావం ఉంటుంది. అందువల్ల రచయితకు ఆనాడు ఉన్న అభిప్రాయం భవిష్యత్తులో మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సంఘటన వాడి వేడిలో రూపుదిద్దుకునే అభిప్రాయం ఆ తర్వాతి కాలంలో పరిశోధనలు, భిన్న పార్శ్వాల నుంచి వ్యక్తుల వ్యాఖ్యానాల, విశ్లేషణ మూలంగానూ, స్వయంగా వ్యక్తి జ్ఞానం, ఆలోచనల్లో మార్పు మూలంగానూ మార్చుకునే అవకాశముంది.

ఆనాటి వుద్యమాల డాక్యుమెంటు

1921 మొదలు 1948 వరకు తెలంగాణలో జరిగిన ఉద్యమాలన్నీ ‘యుగసంధి’ నవలలో రికార్డయ్యాయి. ఉద్యమాలకు నవలలోని పాత్రలకు విడదీయరాని సంబంధం ఉండడంతో ఈ అంశాలు చొప్పించినట్లుగాకుండా సాఫీగా సాగిపోతాయి. ఆంధ్రమహాసభ మొదలు హైదరాబాద్‌పై పోలీసు చర్య వరకు వివిధ ఉద్యమాలు ఇందులో విస్తృతంగా చర్చకు వచ్చాయి. మారుతున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ సందర్భంలో సంప్రదాయ, అంధ విశ్వాసాల/ మూఢనమ్మకాలను ఆచరించే వర్గానికి, ‘అభ్యుదయ’ భావాల ఆచరించే వారి మధ్యన జరిగే ఘర్షణను ‘యుగసంధి’గా ఆవిష్కరించాడు రచయిత. నిజానికి ఈ రచయిత కథలు, నవలలు 1940-60వ దశకంలో చదువుకున్న తెలంగాణ వారందరికీ గ్రాహ్యమే. గోలకొండ పత్రిక, దక్కన్‌ రేడియో ద్వారా తెలంగాణ సాహితీ ప్రియులందరికీ పరిచయమే!

హైదరాబాద్‌ స్టేట్‌ అస్తిత్వం కనుమరుగై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అవతరిస్తున్న సందర్భంలో వచ్చిన ‘యుగసంధి’ నవలలో ఒక రాజ్యం అంతర్థానమై ఇంకొక రాష్ట్రం ఏర్పాటు సంధి కాలంలో హైదరాబాద్‌ ముఖ చిత్రాన్ని నవలాకర్త ఆవిష్కరిస్తాడు. నవల హైదరబాద్‌పై పోలీసు చర్యతో ముగిసినా ఆ తర్వాతి కాలంలో ఈ అంశాలేవి తెలుగు సమాజానికి పాఠ్యపుస్తకంగా గానీ, సాహిత్య రూపకంగా గానీ అందుబాటులోకి రాకపోవడంతో దీనిపై జరగాల్సినంత చర్చ జరగలేదు. ఇది ఒక్క భాస్కరభట్ల కృష్ణారావుకు జరిగిన అన్యాయం కాదు. 1956కు ముందు సాహిత్యసృజన చేసిన తెలంగాణ సాహితీవేత్తలందరికీ జరిగిన అన్యాయం. ఇక్కడి వారు ప్రచారానికి విముఖులు కావడం ఒక కారణం కాగా, వారి గురించి, వారి రచనల గురించి విమర్శ, విశ్లేషణ, చర్చ తెలుగు పత్రికల్లో తగినంతగా జరుగకపోవడం మరో కారణం.

ఈ కారణంగానే అటు ఒద్దిరాజు సోదరులు మొదలు సురవరం ప్రతాపరెడ్డి, వట్టికోట ఆళ్వారుస్వామి తదితరులెవ్వరికీ న్యాయంగా తెలుగుసాహిత్యంలో న్యాయంగా దక్కాల్సిన స్థానం దక్కలేదు. తెలంగాణ సాహిత్యాన్ని కేవలం సాయుధ పోరాటంతో ముడివేసి చూడడం కారణంగానే అంతకుముందూ ఆ తర్వాత వచ్చిన సాహిత్యానికి గుర్తింపు లేకుండా పోయింది. తెలంగాణ సాహిత్యం తెలుగు సాహిత్యంలో ఉపశీర్షికలకు, ఫుట్‌నోట్స్‌కు మాత్రమే పరిమితమై ఉన్న తరుణంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొత్త పరిశోధనలకు, కొత్త రచనలకు ఊతమిస్తున్నాయి. ఇదే విషయాన్ని భాస్కరభట్ల కృష్ణారావు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ‘న్యూరైటింగ్‌’ పేరిట అనేక రచనలు వెలువడ్డాయని, ఎక్కడైనా పోరాటం ఉంటేనే సాహిత్య సృజన ఎక్కువగా ఉంటుందని చెప్పకనే చెప్పిండు.

bhaskerabhatla-1

అందుకే ఇప్పటికీ తమ హక్కుల కోసం, పీడన నుంచి విముక్తి కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న ఆఫ్రికన్స్‌, ‘బ్లాక్స్‌’ (పాజిటివ్‌ అర్థంలోనే) సృష్టిస్తున్న సాహిత్యం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంది. ఈ సాహిత్యం మాదిరిగానే ప్రస్తుత తెలంగాణ ఉద్యమంలో వందల సంఖ్యంలో సంకలనాలు పది జిల్లాల నుంచి వెలువడుతున్నాయి. సంవేదనతో, ఆగ్రహంతో, పీడన నుంచి విముక్తి కోసం, ఆత్మగౌరవం కోసం, స్వయం పాలన కోసం పది జిల్లాల కవులు, కథకులు, రచయితలు తమ గళాన్ని, కలాల్ని, పిడికిళ్ళను ఎత్తిపడుతున్నారు. అదే విధంగా గతకాలపు ఆణిముత్యాలు కూడా కొత్తగా వెలుగులోకి తెస్తున్నారు. ఇప్పుడిక్కడ చర్చించుకుంటున్న ఈ నవలలు కచ్చితంగా జనం మరిచిన తెలంగాణను తెలుసుకునేందుకు అకరాలు అవుతాయి. గత కాలపు విస్మృత తెలంగాణను దర్శించేందుకు దివిటీలవుతాయి.

సరిగ్గా ఇవే విషయాలు ఇక్కడ మనం చర్చించుకుంటున్న నవలలకు కూడా వర్తిస్తాయి. ఇక్కడ గత కాలపు సంఘటన లేదా సంఘటనలను వర్తమానకాలంలో విశ్లేషించడమంటేనే వాస్తవాల్ని వాస్తవాలుగా వెలుగులోకి తేవడమే. ఈ వాస్తవాలు, ఉద్వేగాలు, ఉద్యమాలు, జీవన్మరణ సంఘర్షణలు అన్నీ కలగలిసి ‘యుగసంధి’, ‘వెల్లువలో పూచిక పుల్లలు’ నవలలుగా రూపుదిద్దుకున్నాయి ఈ రెండు నవలలు ఆనాటి తెలంగాణ పరిస్థితులకు అద్దం పట్టాయి. రచయిత వీటిల్లో మానసిక సంఘర్షణలను, పరిస్థితులు, వ్యక్తులు, సమాజంపై వేసిన ప్రభావాల్ని భిన్న పార్శ్వాల నుంచి తడిమి పాఠకుణ్ని తనతో పాటు నడిపించాడు. చైతన్యస్రవంతి శిల్పంతో, అధివాస్తవికత భావనలతో తన నవలల్ని తీర్చి దిద్ది తెలుగు పాఠకులకు ఒక కొత్త తరహా సాహిత్య రుచిని చవి చూపించాడు.
అక్షరమక్షరం పాతల్ర మానసిక సంఘర్షణను, జీవన పోరాటాలను, నింపాదిగా ఉండనివ్వని ఆలోచనలు, ఆదర్శాలు అన్నింటినీ ఈ నవలలు చిత్రించాయి. యుగసంధి నవలలో పైరవీలు, పటేలు`పట్వారీ తగాదాలు మొదలు, కొంతమంది రొహిలాలు, అరబ్బుల దౌర్జన్యాలు, విధవా వివాహాలు, ఆర్యసమాజ్‌, ఆంధ్రమహాసభ, వందేమాతరం, కమ్యూనిస్టులు, రజాకార్లు, అతలాకుతలమైన హైదరాబాద్‌ జీవనం, అవి ఆయా కుటుంబాల్లో తీసుకువచ్చిన మార్పులు, కాలంతో పాటు సమాజంలో చోటుచేసుకుంటున్న` మారుతున్న విలువలు, ఒకవైపు శుద్ధశ్రోతియ బ్రాహ్మణులు పాటించే ఆచారాలు, మరో వైపు బ్రాహ్మణుడైనప్పటికీ జంధ్యంతో పాటు అన్నీ త్యజించి తాగుడు, డిబాచిరీకి అలవాటు పడ్డ ‘లంపెన్‌’ వ్యక్తి విశ్వేశ్వరరావునీ ఇందులో చిత్రించాడు.

మంచీ చెడుల సహ గమనం

హైదరాబాద్‌ నగర జీవన విధానం, రాజకీయ పరిస్థితులు, సామాజిక, సాంస్కృతికరంగాలు, హిందూ`ముస్లిం దోస్తానా దానితో పాటే మజ్లిస్‌ మతవిద్వేషం, జమీందార్లలో కూడా మంచీ చెడూ రెండూ ఉంటాయని భాస్కరభట్ల చెప్పిండు. ఆధునిక స్త్రీ స్వయం నిర్ణయాధికారం కోసం తండ్రిని సైతం ఎదిరించడం, విద్యా ప్రాధాన్యత ఈ నవలలో ప్రధానంగా చోటు చేసుకున్నాయి.

ముఖ్యంగా రుక్మిణి, రమణ, పద్మల పాత్రల ద్వారా ఆనాటి స్రీల ఆలోచనాసరళిని వారి తెగింపుని, కట్టుబాట్లకు లొంగని తిరుగుబాటు దోరణిని చదువుకున్న, ప్రగతిశీల భావాలు గల స్త్రీల మనోభావాల్ని రికార్డు చేసి నవలకు సమగ్రత కల్పించిండు. నిరుద్యోగం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం కూడా ఇందులో అంతర్లీనంగా చోటు చేసుకున్నాయి.భాస్కరభట్ల మొత్తం నాలుగు నవలలు రాసిండు. అవి వింతప్రణయం, భవిష్యద్దర్శనం, యుగసంధి, వెల్లువలో పూచిక పుల్లలు. భాస్కరభట్ల నవలల్లో మొదటగా చెప్పుకోవాల్సింది యుగసంధి. ఇందులోని రఘు, రుక్మిణి, రమణ, పద్మ పాత్రలు భిన్న ధృక్కోణాల్లో ఆనాటి సమాజాన్ని ఆవిష్కరిస్తాయి. భిన్నమైన ఆలోచనలు కలవాళ్ళని ఒక్కదగ్గర చేర్చి నవల నడిపించడమంటే చాలా క్లిష్టమైనపని. ఆ పనిని భాస్కరభట్ల విజయవంతగా చేసి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే ‘యుగసంధి’ నవల్లో రఘుపాత్రలో అక్కడక్కడ భాస్కరభట్ల కనిపిస్తాడు.‘యుగసంధి’ నవల హీరో రఘు స్వయంగా ఇంగ్లీషు ఎమ్మే ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు. రఘు పాత్ర  ద్వారా ఆనాటి తెలంగాణ సమాజానికి పరిచయమైన పాశ్చాత్య సాహిత్యాన్ని గురించి రచయిత విశ్లేషిస్తాడు.

నిజానికి హైదరబాద్‌లో 1917లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడే వరకు కూడా ఇంగ్లీషు మాధ్యమంగానే ఉన్నత చదువులు కొనసాగేవి. అయితే బ్రిటీషిండియాలో గాంధీ లేవదీసిన ‘ఉర్దూ`హిందుస్థానీ’ జాతీయ ఉద్యమాల ప్రభావంతో ఉస్మానలీఖాన్‌ తన పేరిట ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించడంతో ఇక్కడ విద్యాబోధన ఉర్దూమాధ్యమంగా ప్రారంభమయింది. ఈ విశ్వవిద్యాలయం ఉర్దూ మాధ్యమంగా ఆరంభం కావడానికి ప్రధాన కారకుడు రవీంద్రనాథ్‌ టాగోర్‌. ఆయన సూచనల మేరకే ఉర్దూ మాధ్యమంగా యూనివర్సిటీని ప్రారంభించారు. అయినప్పటికీ నిజాం కాలేజి, దాంతోపాటు మరి కొన్ని కళాశాలల్లో బోధన పూర్తిగా ఇంగ్లీషులోనే కొనసాగేది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉర్దూ బోధనా భాష చేయడంతో హైదరాబాద్‌ రాజ్యంలో తెలుగు, మరాఠీ, కన్నడ భాషలు దెబ్బతిన్నాయని కూడా రచయిత చెప్పిండు.

ఎన్ని అవరోధాలు ఉన్నా నిజాం కాలంలో హైదరాబాద్‌ రాజ్యంలో ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో పంచభాషా సంస్కృతి ఉండేది. నగరంలోని దాదాపు చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడ, ఫార్సీ భాషలు వచ్చేవి. పోలీస్‌ యాక్షన్‌ తర్వాత ప్రభుత్వాలు ఎకాఎకిన తెలుగును అధికార భాష చేయడంతో ఈ భాష తెలిసిన ఆంధ్రప్రాంతీయులు ఇబ్బడి ముబ్బడిగా హైదరాబాద్‌లో ఉద్యోగాలు సంపాదించారు. అంతేగాకుండా స్థానిక పంచభాషా సంస్కృతి కూడా సర్వ నాశనమయింది. భాషారాష్ట్రాల పేరిట ఐదారు భాషలు, కలిసిమెలిసి ఉండిన సంస్కృతిని భ్రష్టుపట్టించి ఏకైక భాష ‘తెలుగు’కు మాత్రమే పట్టం కట్టారు. ఉర్దూ మూలంగా కన్నా ‘తెలుగు’ మాత్రమే వెలిగించే ప్రభుత్వాల మూలంగా హైదరాబాద్‌ పంచభాష సంస్కృతి, తెహజీబ్‌ కనుమరుగయ్యింది.

హైదరబాద్‌ నగరంలో ఉద్యోగం చేయాలంటే కేవలం ఉర్దూ, కొంత ఫార్సీ వస్తే చాలు అన్న పరిస్థితులున్న కాలంలోనే భాస్కరభట్ల కృష్ణారావు కలకత్తా వెళ్ళి అక్కడ బి.ఎస్‌.సి చదివాడు. తిరిగి హైదరాబాద్‌కు వచ్చి లా చదివాడు. దక్కన్‌ రేడియోలో ఉద్యోగం సంపాదించి ఎందరో తెలుగువారికి అవకాశం కల్పించాడు. స్వయంగా తన నాటకాలు ప్రసారం చేయడమే గాకుండా, పాటలకు ప్రథమ స్థానం కల్పించాడు. హైదరాబాద్‌ రాజ్యం తన అస్తిత్వాన్ని కోల్పోయి భారతదేశంలో విలీనం కావడంతో ‘దక్కన్‌ రేడియో’ కూడా ఆలిండియా రేడియోలో సంలీనమయింది. దీంతో తనదైన హైదరాబాద్‌ ముద్ర చెరిగిపోయి ప్రాంతేతర ‘తెలుగు ముద్ర’ పడింది.

అప్పటివరకూ హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన నందగిరి ఇందిరాదేవి, మాడపాటి సత్యవతి లాంటి వారికి పుట్టినిల్లుగా ఉండిన ‘రేడియో’లో ప్రాంతేతరుల ప్రవేశం ప్రారంభమయింది. దీంతో ఉర్దూ, తెలుగు మిశ్రిత భాష క్రమంగా తెరమరుగయింది. ఇవే విషయాల్ని నేడు తెలంగాణవాదులు ఉద్యమ సందర్భంలో పదే పదే ముందుకు తీసుకువస్తున్నారు. తెలంగాణ తనదైన తెలుగుభాషను కోల్పోయిందని చెబుతున్నారు. కేవలం భాష విషయమే గాకుండా ‘యుగసంధి’ నవల ద్వారా అనాటి అనేక సమకాలీన అంశాలను కూడా చరిత్రకెక్కించాడు.

‘యుగసంధి’ నవలలో రెండున్నర దశాబ్దాల తెలంగాణ ఉద్యమాలను ఆంధ్రమహాసభ మొదలు పోలీసు చర్య వరకు సుదీర్ఘంగానే చర్చించాడు. ఆంధ్రమహాసభ వారు ‘వర్తక స్వాతంత్య్రం’, ‘వెట్టిచాకిరి’, మగ్గంపన్ను, పేరిట వేసిన చిన్న పుస్తకాలు ఆనాడు ఉద్యమానికి ఎలా ఊతమిచ్చాయో ఈ నవల ద్వారా తెలుస్తుంది. అలాగే బహద్దూర్‌ యార్జంగ్‌ మజ్లిస్‌ పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వం వాక్‌, సభా స్వాతంత్య్రాలను అరిగడుతూ గస్తీనిషాన్‌`53 పేరిట వెలువరించిన జీవో, పాఠశాలలు స్థాపించుకోవాలంటే అనుమతి తప్పనిసరి, వార్షికోత్సవాలు జరుపుకోవాలంటే లిఖితరూపంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి తీర్మానాలు ఉండబోవని రాసివ్వడం అన్నీ ఇందులో చర్చకు వచ్చాయి.

బ్రిటీషాంధ్రలో గాంధీజి పిలుపుమేరకు ఉద్యమాలు జరుగుతూ ఉండటం వాటి ప్రభావం హైదరబాద్‌లో ఏమాత్రం లేకపోవడంతో ఒక దశలో స్వయంగా ఉద్యమాన్ని లేవదీద్దామనే ఆలోచన కూడా ‘రఘు’కు వస్తుంది. అయితే అనంతర కాలంలో గోవిందరావ్‌ నానల్‌ వంటి వారు హైదరాబాద్‌ సుల్తాన్‌బజార్‌లో ‘సత్యాగ్రహం’ చేపట్టడంతో తాను కూడా అందులో చేరాలని భావిస్తాడు. ఇలాంటి సందర్భంలోనే తాను ఎమ్మే చదువుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతర ఉద్యమం ప్రారంభం కావడంతో దానికి ‘రఘు’నాయకత్వం వహించి విజయవంతంగా ఒక సంవత్సరం పాటు నడిపిస్తాడు.

చందాలు వసూలు చేసి విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగకుండా నాగపూర్‌లాంటి ప్రాంతాలకు పంపించి అక్కడ విద్యాబుద్ధులు చెప్పిస్తాడు. అలా నాగపూర్‌ వెళ్ళి చదివిన ఉస్మానియా విద్యార్థుల్లో పి.వి. నరసింహారావు లాంటి వారు కూడా ఉన్నారు. ఆనాటి విద్యార్థుల కష్టాలు, విద్యార్థినులచే వందేమాతర ఉద్యమం చేయించాలని ప్రయత్నించి విఫలమైన తీరు అన్నీ ఇందులో చోటు చేసుకున్నాయి.

స్వయంగా వందేమాతర ఉద్యమానికి నాయకత్వం వహించడంతో, ఎమ్మే ఇంగ్లీషు ఫస్ట్‌ క్లాస్‌లో పాసయినా ఏ కళాశాల వారు కూడా రఘుకు ఉద్యోగం ఇవ్వలేదు. ఆనాటికి ఈనాటికి పరిస్థితుల్లో పెద్దగా మార్పేమి లేదనడానికి ఇదే సూచన. ఈనాడు కూడా ఉద్యమాలు చేస్తున్న విద్యార్థుల్ని అక్రమ కేసుల పేరిట భయపెడుతూ, మీకు ఉద్యోగాలు రావు అని హెచ్చరిస్తున్నారు. ఈ దశలో రఘుకి హైదరాబాద్‌ సివిల్‌సర్వీసెస్‌ రాయడానికి అవకాశమున్నా నిర్దయగా ఉన్న ప్రభుత్వంలో పనిచేయడానికి ఆయనకు మనస్కరించలేదు. నిజానికి ఒక మధ్యతరగతి హైదరాబాదీ ‘సివిల్‌ సర్వీస్‌’ ఉద్యోగం చేయాలని కలగనడమే ఒక అభివృద్ధి సూచిక. ప్రధాన పాత్ర పద్మ తండ్రి కూడా డాక్టర్‌ కావడం కూడా చూస్తే ఇది ఆనాటి ఉన్నత మధ్యతరగతి జీవితాలను చిత్రించిందనడంలో అతిశయోక్తి లేదు. అవినీతి, ఆశ్రితపక్షపాతం కారణంగా యూనివర్సిటీకంతటికీ ప్రథముడిగా నిలిచినా లెక్చరర్‌ ఉద్యోగం కూడా రాని సందర్భంలో రఘు ఉద్యోగ ప్రయత్నాలే విరమించుకున్నాడు.

ఆనాడు తెలంగాణలో స్వతంత్రప్రతిపత్తితో పనిచేసే అవకాశమున్న ఏకైక వృత్తి న్యాయవాదం. అందుకే స్వాతంత్య్ర సమరయోధులందరూ లా చదివిన వారే. అడ్వకేట్లుగా రాణించిన వారే. ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించిన దాదాపు అందరూ న్యాయవాదులే కావడం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అందుకే రఘు చివరికి లా చదివి అడ్వకేటుగా స్థిరపడాలని నిర్ణయించుకుంటాడు. స్వాతంతత్య్రోద్యమంలో పాల్గొన్నందుకు ఉద్యోగాలు రాని పరిస్థితే గాకుండా, జపాన్‌ సైనికులు మణిపూర్‌పై దాడి మొదలు, హైదరాబాద్‌ స్వతంత్ర ప్రతిపత్తి, సిడ్నీకాటన్‌ ఆయుధాల సరఫరా, రజాకార్లు ఇలా హైదరాబాద్‌ స్వాతంత్య్రోద్యమంలోని అన్ని అంశాల గురించి ఈ నవల చర్చించింది. వందేమాతరం ఉద్యమంలో పాల్గొనే మహిళల గురించి ఒకవైపు, మరోవైపు సిగరెట్‌ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల్ని చిత్రించిండు.

స్త్రీల ఆధునిక జీవన దృశ్యం

మహిళలు కార్మికులుగా పనిచేయడమంటేనే అది అభివృద్ధికి చిహ్నం. ఎందుకంటే నగరాల్లో ఫ్యాక్టరీలు వెలువడడం, వారు తమ ఆర్థిక స్థితిని మెరుగు పరుచుకోవడానికి స్వీయ సంపాదనపై ఆధారపడడమంటేనే మారుతున్న సమాజానికి ఆనవాలు. ఇదే విషయాన్ని రమణ పాత్ర గురించి రచయిత ఇలా చెప్పాడు. ‘‘… తాను 20వ శతాబ్దపు యువతిగా బ్రతకదలచింది. తనకాళ్ళపై తాను నిలబడదలచింది. నేడు స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రం వుంటేనే గాని ఆమెకి సంఘంలో గౌరవం లేదు. తాను ఆర్థిక స్వాతంత్య్రం కోసం పాటు పడదలచింది’’. ఆర్థిక స్వాతంత్య్రం ద్వారానే స్త్రీకి సంఘంలో గౌరవం వుంటుందనే విషయాన్ని 60యేండ్ల కిందనే గుర్తించి ప్రచారం చేశాడంటే ఆయన దార్శనికత అర్థమవుతుంది. నవలల్లో స్త్రీ పాత్రలను తీర్చి దిద్దడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచాడని అనిపిస్తుంది. పదికి పైగా ఉన్న మహిళా పాత్రలను ఒకదానితో ఒకటి ఎక్కడా సారూప్యత లేకుండా భిన్నంగా మలిచాడు. వీటన్నింటిలోకి రుక్మిణి పాత్ర విశిష్టమైనది.

ఎనిమిదో ఏట పెళ్ళయి ఆర్నెల్లకే ‘మొగుడ్ని’ కోల్పోయిన రుక్మిణికి విధవా పునర్వివాహం గురించి, దాన్ని ఆంధ్రదేశంలో ప్రచారం చేసిన కందుకూరి వీరేశలింగం గురించీ, హైదరబాద్‌లో కూడా వాటిని చేసుకున్న వాళ్ళ గురించీ ‘బావ’ రఘు ద్వారా తెలుసుకుంది. నిజానికి సరోజిని నాయుడు` ముత్యాల గోవిందరాజుల వివాహం కందుకూరి వీరేశలింగం చేయించిన నాటినుంచే ఆయన గురించి తెలంగాణ వారికి కూడా కొంత తెలిసింది. ఆర్యసమాజ పద్ధతిలో వివాహం చేసుకుంటానని చెప్పిన ‘విశ్వేశ్వరరావు’ తుదకు డొక్కలో తన్ని మానవ మృగంలా తనని ఆక్రమించుకున్నా ఏమిజేయలేని స్థితికి చేరుకుంటుంది. నమ్మి విశ్వేశ్వరరావుతో వచ్చినందుకు మానంతో పాటు కంటె, గొలుసు కూడా అర్పించుకుంది. ఇలాంటి అభాగ్యురాళ్లు అప్పటికీ, ఇప్పటికీ మన కండ్లముందు కనబడుతూనే ఉంటారు. అయితే వారి పట్ల సంవేదనతో, సానుభూతితో, సాంత్వనతో రాసిన వాళ్ళు అరుదు. ఆ అరుదైన ఘట్టానికి ‘యుగసంధి’లో భాస్కరభట్ల జీవం పోసిండు.

చిన్నతనంలోనే భర్త చనిపోవడంతో ‘విధవ’ అయిన రుక్మిణి లంపెన్‌ ‘విశ్వేశ్వరరావు’ చేతిలో బలయిన తీరు. విశ్వేశ్వరరావు లైంగిక వాంఛను తీర్చడానికి అనుభవించిన హింసను నవలాకర్త భాస్కరభట్ల కృష్ణారావు మనస్సుల్ని కదిలించే విధంగా చిత్రిక గట్టిండు. ఈ నవల తెలంగాణ సమాజంలో వచ్చిన మార్పులను చిత్రిక గట్టాయి. తెలంగాణలో జరిగిన ఉద్యమాలను, భాష, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలను చర్చించాయి. భిన్న దృక్కోణాల్లో భిన్నమైన రీతిలో నవలలోని పాత్రలు సమాజాన్ని దర్శించాయి.

‘యుగసంధి’ నవల్లో ఈ భిన్నత్వాన్ని సహజసిద్ధంగా తీర్చిదిద్దిన పాత్ర రమణ. ఆర్థిక స్వాతంత్య్రం ద్వారానే స్త్రీకి గౌరవం దక్కుతుందని నమ్మి దాన్ని సాధించుకునేందుకు ఆత్మగౌరవంతో ముందడుగేసిన మహిళ రమణ. త్యాగం, ఆత్మగౌరవం, పట్టుదల, తిరుగుబాటు, అభ్యుదయ భావాలు అన్ని కలగలిపిన పాత్ర రమణ.ఇక పోతే ‘పద్మ’ పాత్రలో ఆనాడు ‘స్త్రీ’ స్వతంత్రంగా ఎదగడానికి తండ్రి తోడ్పాటు, దాన్ని దుర్వినియోగం కాకుండా ఆమె ఉపయోగించిన తీరు నవలలో ప్రస్తావనకు వస్తాయి. మనసులో ఉన్నది ఎదుటివారికి సూటిగా చెప్పే పాత్రగా పద్మని తీర్చాడు. రఘు డబ్బు తీసుకొని బాగా చదువుకున్నాడు. అదే డబ్బుని తీసుకోవడానికి కనీసం అప్పుగా కూడా తీసుకోవడానికి నిరాకరించి ‘రమణ’ తన ఆత్మగౌరవాన్ని చాటుకుంది.

రజాకార్ల రాజ్యంలో

ఇక్కడ రజాకార్ల గురించి కొంచెం విపులంగా చర్చించుకోవాలి. హైదరాబాద్‌పై పోలీసుచర్య జరిగిన నాడే రఘు`పద్మలకు కూతురు పుడుతుంది. ఆమె పేరు కళ్యాణి అని పెడతారు. లోక కళ్యాణం కోసం హైదరాబాద్‌పై పోలీసుచర్య జరిగింది కాబట్టి ఆ పేరు పెట్టారని రచయిత చెబుతాడు. అయితే తర్వాతి కాలంలో ఇది తప్పని రచయిత తెలుసుకొని ఉంటాడు. ఎందుకంటే అప్పటికప్పుడు రజాకార్ల దౌర్జన్యాలు, దుర్మార్గాలు మాత్రమే రచయితకి కనబడ్డాయి. నిజానికి 1948లో రజాకార్ల గురించి కాళోజి ‘నల్లగొండలో నాజీల కరాళ నృత్యం ఇంకెన్నాళ్ళు’ అని నిరసించాడు. అయితే 1969 వచ్చే సరికి రజాకార్లే నయం ఈ ఆధిపత్య ఆంధ్రులకన్నా అనే అభిప్రాయాన్ని వ్యక్తం జేసిండు. 1956లో సమైక్యవాదిగా ఉన్న కాళోజి 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నాటికి తెలంగాణవాదిగా మారిండు. దాశరథి 1964 నాటికి కొంత తెలంగాణ బాటపట్టిండు. ఇలా రజాకార్ల విషయంలో గానీ, తెలుగు భాష విషయంలో గానీ, పోలీసుచర్య విషయంలోగానీ అందరికీ ఎప్పటికీ ఒకే అభిప్రాయం లేదు. అది విషయపరిజ్ఞానంతో పాటు మారుతూ వచ్చింది. నిజానికి పోలీసుచర్య మూలంగా వేలాది కమ్యూనిస్టు వీరులు తెలంగాణలో పటేల్‌ సైన్యం చేతిలో హతులయ్యారు. నిజాం సైన్యం చేతిలో పదులు, వందల సంఖ్యలో కమ్యూనిస్టు నాయకులు/కార్యకర్తలు చనిపోతే అదే భారత ప్రభుత్వ సైన్యం చేతిలో ఒకవైపు వేలాది ముస్లింలు మరఠ్వాడా, హైదరాబాద్‌`కర్నాటక ప్రాంతాల్లో హతమయితే, మూడు వేలకు పైగా తెలంగాణ సాయుధ పోరాటవీరులు అమరులయ్యారు. ఇంతమందిని చంపి బలవంతంగా కైవసం చేసుకున్న హైదరాబాద్‌పై పోలీసుచర్య ఆక్షణంలో ‘లోకకళ్యాణం’ కోసం జరిగిందనే అభిప్రాయం కలిగి వుండవచ్చు.

అయితే దీన్ని మరింత లోతుగా విశ్లేషిస్తే హైదరాబాద్‌పై పోలీసుచర్య ఒక్క రాజ్యాధినేత ఉస్మాన్‌అలీఖాన్‌ని మాత్రమే మార్చింది. (ఇది కూడా పూర్తి నిజం కాదు. ఎందుకంటే 1956 వరకు హైదరాబాద్‌ రాష్ట్ర రాజ్‌ ప్రముఖ్‌ ఉస్మానలీఖానే) నిజానికి మిలిటరీ, ప్రజాస్వామ్యం పేరిట నియంతృత్వ పాలనను కొనసాగించింది. ప్రజలకు ఏమాత్రం సంబంధం లేని అధికారుల్ని రుద్దింది. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో వెల్లోడి లాంటి అధికారులు ముఖ్యమంత్రులుగా చలామణి అయ్యారు. రజాకార్ల అణచివేత పేరిట వేలాది మంది కమ్యూనిస్టుల ప్రాణాలను హరించిన జె.ఎన్‌.చౌదరి సైన్యం హీరోలుగా వెలిగిపోయారు. ఇంత విషాదం దాగి ఉన్న హైదరాబాద్‌పై పోలీసుచర్యపై ఇప్పటికీ ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు, మరాఠీ భాషల్లో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందుకే పోలీసుచర్య, రజాకార్లపై 1948`56ల కాలంలో చేసిన వ్యాఖ్యానంలో కొన్ని ఖాళీలున్నాయి. కొన్ని మార్పులున్నాయి. మరి కొన్ని చేర్పులున్నాయి. ఇవన్నీ మేళవించి ఆలోచిస్తే గానీ అసలు విషయం అర్థం కాదు. ఇట్లా కొత్త సమాచారం అందుబాటులోకి రావడం మూలంగా భాస్కరభట్ల కృష్ణారావు వ్యక్తపరచిన అభిప్రాయాల్లో కొన్ని ఖాళీలున్నాయి. వాటిని పూరించే పని ఇప్పుడు జరుగుతోంది.

60 యేండ్ల కాలంలో రజాకార్ల విషయమై ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. రజాకార్లలో కేవలం ముస్లింలే గాకుండా దొరలు, దేశ్‌ముఖ్‌లు, దళిత, బీసీలు కూడా ఉన్నారనే విషయం రూఢీ అయింది. ముస్లిం మతంలోకి మారిన వారు కూడా చాలామంది దళితులే అనే విషయం కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రజాకార్ల అణచివేత పేరిట వేలాదిమందిని భారతసైన్యం ఊచకోత కోసిందనే విషయం ప్రభుత్వం నియమించిన కమిటీలే నిర్ధారించాయి. అంతేగాకుండా హిందూత్వవాదులు ప్రచారం చేసినట్లుగా ఈ రజాకార్లకు నిజాం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందేది కాదు. అందువల్లనే వాళ్ళు నవలలోని పద్మ తండ్రి దేశ్‌ముఖ్‌ ఆంజనేయుల్ని కూడా డబ్బులివ్వమని డిమాండ్‌ చేస్తారు.

అలాగే సిగరెట్‌ ఫ్యాక్టరీ మేనేజర్‌ రషీద్‌ని కూడా డబ్బులు డిమాండ్‌ చేస్తారు. అంతేగాకుండా రుక్మిణిని మత మార్పిడి చేయించాలని కూడా హెచ్చరిస్తారు. దీనికి రషీద్‌ తిరస్కరిస్తూ నేను జాతీయవాదిని రుక్మిణిని మతం మార్చుకొమ్మని చెప్పేది లేదని తెగేసి చెబుతాడు. తెగేసి చెప్పినందుకు గాకుండా అడిగిన డబ్బు ఇవ్వనందుకే ఆగ్రహంతో రజాకార్లు రషీద్‌ని కూడా చంపేస్తారు. అంటే రజాకార్లకు మతంతో సంబంధంలేదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. తమ పబ్బం గడుపుకునేందుకే ముస్లింలీగ్‌ రాజకీయాల్ని హైదరాబాద్‌ రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి బహద్దూర్‌ యార్‌జంగ్‌ ఇత్తెహాదుల్‌ పార్టీని ఏర్పాటు చేసిండు. ఇట్లాంటి సందర్భంలో మజ్లిస్‌పార్టీ, మతతత్వాన్ని బాహాటంగా ప్రచారం చేసిన కాసిం రజ్వీ చర్యల్ని తప్పకుండా ఖండిరచాల్సిందే. అయితే ఇక్కడ ముస్లింలందరూ కాసిం రజ్వీ అనుచరులే అన్న రీతిలో ఇప్పటికీ కొన్ని సంస్థలు, పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. వాటిని అడ్డుకోవాలంటే లేదా వారి ఆలోచనల్లోని డొల్ల తనాన్ని బయటపెట్టాలంటే ఇందులోని రషీద్‌ పాత్ర, రజాకార్ల చర్యల్ని రెండిటినీ జమిలిగా విశ్లేషించాల్సి ఉంటుంది. నగరానికి జమీందార్లు, దేశ్‌ముఖ్‌ల వలస వారు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడం కూడా ఈ న వల ద్వారా మనకు తెలుస్తాయి. వెలమ సామాజిక వర్గం అప్పటికే హైదరాబాద్‌ చేరుకోవడం తమ పిల్లల్ని చదివించడం, వారికి పూర్తి స్వేచ్ఛనివ్వడం కూడా అర్థమవుతుంది.

నా సాహిత్య ప్రయాణం అను సొంత సుత్తి!

chitten rajuసుమారు నలభై ఏళ్ళు–అమ్మ బాబోయ్…అంత సీనియర్ నా???

ఆ మాట తల్చుకుంటేనే భయం వేస్తోంది…అన్నేళ్ళయిందా మొదటి రచన చేసి?

“రమణ రాత-బాపు గీత” కాంబినేషన్ లో “ఇడ్లీ కన్న పచ్చడే బావుంది ఫేమ్ మొట్టమొదటి సారిగా వచ్చిన సంవత్సరమే నేను మంచి సాహిత్య వాతావరణం ఉన్న కాకినాడలో పుట్టి పెరిగాను.  అందుకేనోమో ఇంత ఇది!

చిన్నప్పుడు తెలుగూ-గిలుగూ ఎక్కువగా పట్టించుకోక పోయినా, అక్కడ 1966లో ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించుకుని ఆంధ్రదేశం వదిలి అక్కడెక్కడో ఉన్న బొంబాయిలో, అనగా పరాయి రాష్ట్రంలో అడుగుపెట్టినప్పుడే తెలుగు భాషలో ఉన్న రుచీ, ఔన్నత్యం, సరదా అన్నీ అర్జంటుగా తెలిసొచ్చాయి. తెలుగు భాష, సాహిత్యాలపట్ల మక్కువ కూడా అంతకంటే అర్జంటుగా పెరిగిపోయింది. ఇలా లాభం లేదని కేంపస్ లో పది మంది లోపే ఉన్న తెలుగు కుర్రాళ్ళమూ,  ప్రొఫెసర్లు గా ఉన్న మరొక పాతిక మంది కుటుంబాలూ  కలిసి ఒక తెలుగు సంఘం పెట్టుకున్నాం. మొదటి సాంస్కృతిక కార్యక్రమంలో ఏదైనా చిన్న నాటకం వేస్తే బావుంటుంది అనుకున్నాం. కానీ ఎవరి దగ్గిరా నాటకం పుస్తకాలు లేవు. అప్పుడు టి.పి. కిషోర్ గాడు “గురూ, నువ్వే ఏదో ఒక నాటకం రాసేస్తే పోలా !” అని జోక్ చేశాడు.

అది సీరియస్ గా తీసుకుని అప్పుడు (1967) వ్రాసినదే ప్రపంచంలో చాలా చోట్ల ప్రదర్శించబడిన నా మొదటి సరదా నాటిక “బామ్మాయణం అనే సీతా కళ్యాణం”. “నువ్వు రాయగలవేమో కానీ, నటించడానికి బొత్తిగా పనికి రావు” అని ఆ నాటకాన్ని డైరెక్ట్ చేసిన జె. చంద్ర శేఖర్ (చందూ) గాడు  నేను రాసిన నాటకంలోనే నాకు వేషం ఇవ్వ లేదు.  ఆ కిశోర్ హఠాత్తుగా చనిపోయి చాలా ఏళ్ళయింది. చందూ జేసీ గా ఐ.ఐ.టీ లోనే  ప్రొఫెసర్ గా రిటైర్ అయి, ఇప్పుడు గోవాలో ఉంటున్నాడు అని విన్నాను. బొంబాయిలో నా ఇతర తెలుగు సాంస్కృతిక మిత్రులు కొందరితో ఇంకా “టచ్” లో ఉన్నాను.

ఆ రోజుల్లోనే బొంబాయి I.I.T లో చాలా మంది అమెరికా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా నేను మటుకు “చస్తే అమెరికా వెళ్ళను” అని భీష్మించుకుని కూచునే వాణ్ణి. కానీ ఒక రోజు రామ్ కుమార్ వచ్చి, ఆ మాటా, ఈ మాటా చెప్తూ. “గురూ, ఇక్కడ సంతకాలు పెట్టూ” అని నా చేత ఏవేవో అప్లికేషన్స్ మీద దొంగతనంగా సంతకాలు పెట్టించుకున్నాడు. ఆ తర్వాత తెలిసింది తను అమెరికా గ్రీన్ కార్డ్ కి అప్లికేషన్ పెడుతూ, ఇద్దరి ఫీజులూ నా చేతే కట్టించడం కోసం  మాత్రమే నా చేత కూడా అప్ప్లై చేయించాడూ అని. అతని ధర్మమా అని 1968లో నే అమెరికన్ కాన్సలేట్ వారు మా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి స్వయంగా వచ్చి, నన్ను మెచ్చి, గ్రీన్ కార్డ్ ఇచ్చినా నేను పట్టించుకో లేదు.

కానీ ఆరేళ్ళు అక్కడే లెక్చరర్ గా ఉద్యోగం వెలగబెడుతూనే 1974, అక్టోబరులో నా డాక్టరేట్ పూర్తి చేశాను. “తరవాత ఏం చేద్దాం?” అనుకోగానే, అమెరికా ఎలా ఉంటుందో చూసొస్తే పోలే? అని సరదాగా, గ్రీన్ కార్డ్ తో సహా అమెరికాలో అడుగుపెట్టాను. అప్పుడు షికాగో లో ఉన్న మా తమ్ముడి దగ్గర నాలుగు రోజులు ఉండి ” టెక్సాస్ లో  ఎకానమీ బావుంది సుమా” అనుకుని, నలుగురు మిత్రులం ఒక డొక్కు కారులో రాత్రికి రాత్రి హ్యూస్టన్ వచ్చేశాం ఉద్యోగాల కోసం.

రాగానే, ఇక్కడ యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ లో పోస్ట్ డాక్టరల్ ఫెలో గా చేరిపోయాను. అప్పుడు హ్యూస్టన్ లో తెలుగు అస్ఖ్హలిత బ్రహ్మచారులం అర డజను మందీ, సంసారులు పాతిక మందీ ఉండే వారు. అంటే ఈ ఇక్కడ కూడా బొంబాయి లాంటి పరిస్థితే అన్న మాట. అంటే, తెలుగు వారు తక్కువ, తెలుగు జపం ఎక్కువ. యథాప్రకారం పండగలూ, పబ్బాలూ చేసుకుంటున్నా, “శాస్త్రోక్తంగా”  ఒక తెలుగు సంస్థ ఉంటే బావుంటుంది అని అందరం ఆలోచించుకుని తెలుగు సాంస్కృతిక సమితి ని హ్యూస్టన్ లో 1977 లో మొదలుపెట్టాం. అప్పటికి అమెరికాలో న్యూయార్క్, లాస్ ఏంజెలెస్, షికాగో లాంటి ఐదారు నగరాలలో మాత్రమే తెలుగు సంఘాలు ఉండేవి.

1977 లో మేము జరుపుకున్న ఉగాది కార్యక్రమంలో నేను బొంబాయిలో రాసిన మొట్ట మొదటి నాటకం “బామ్మాయణం” ప్రదర్శించాం. నాకు తెలిసీ అమెరికాలో ప్రదర్శించబడిన తొలి తెలుగు నాటకమూ, ఇంచుమించు అమెరికాలో అన్ని నగరాలలోనూ ప్రదర్శించబడిన “సరుకు ” లేకపోయినా సరదాగా ఉన్న తెలుగు నాటకమూ అదే! అతి త్వరలోనే హ్యూస్టన్ లో నేను వ్యవస్థాపక సంపాదకుడిగా “మధుర వాణి” అనే సంస్థాగత సాహిత్య పత్రిక మొదలుపెట్టాం. ఆ పత్రిక తొలి సంచికలో ప్రచురించడానికి ఎక్కువ సాహిత్యం సరుకు లేక పోయినా నా  మొట్టమొదటి కథ “జులపాల కథ” వ్రాసాను. అనగా హ్యూస్టన్ లో అడుగుపెట్టిన తరవాతే నా మొట్టమొదటి కథ రాశానన్న మాట. ఇప్పటికీ చాలా మంది గుర్తుపెట్టుకున్న చిన్న కథ అది. ఇటీవలే గొల్లపూడి వారు హెమ్. టీవీ. లో నిర్వహిస్తున్న “వందేళ్ళ కథకు వందనాలు” అనే శీర్షిక కోసం ఈ కథని వారు పరిచయం చేశారు. టీవీ లో అది త్వరలోనే ప్రసారం అవుతుందట.

1977లోనే న్యూయార్క్ లో జరిగిన మొదటి అమెరికా తెలుగు మహాసభలకి చిన్న సైజు నిర్వాహకుడిగానూ, అమెరికా, కెనడాలనుంచి ఏడుగురు “తానా” సంస్థాపక డైరెక్టర్లలో ఒకడిగానూ వ్యవహరించడం జరిగాయి. వెనునెంటనే స్వర్గీయ కిడాంబి గారూ, చెరుకుపల్లి నెహ్రూ గారూ “తానా పత్రిక” ప్రారంభించి, ఆ తరువాత చాలా సంవత్సరాలు నన్ను సంపాదక మండలిలో చేర్చుకున్నారు. సుమారు పదేళ్ళ పాటు నేను రాసే కథలూ, కమామీషులూ మా “మధుర వాణి” లోనూ, తానా పత్రిక లోనూ, సావనీర్ ల లోనూ ప్రచురించబడేవి. నా రచనా వ్యాసంగంలో ఒక ప్రధాన ఘట్టం 1981లో “మహాకవి” శ్రీ శ్రీ గారు మా హ్యూస్టన్ రావడం, మా ఇంట్లో ఉన్న వారం రోజులలోనూ, “సిరి సిరి మువ్వలు”, ప్రాసక్రీడలు”, “లిమరిక్కులు” అనే మూడు శతకాలను “సిప్రాలి” అనే పేరుతో తన స్వదస్తూరీతో వ్రాసి, ఆ పుస్తకాన్ని ప్రచురించే అదృష్టాన్ని నాకు కలిగించడం, అప్పటికి నేను వ్రాసిన నాలుగైదు కథలూ చదివి “నీకు సొంత శైలి ఉందయ్యా, అది కాపాడుకో, ఎవరినీ అనుకరించకు” అని హిత బోధ చెయ్యడం, అంతే కాక నేను ఎప్పటికైనా నా నాటికల సంకలనం పుస్తకరూపేణా వేస్తానని ఊహించి, “రంగం మీద శ్రీరంగం” అనే మకుటంతో ముందు మాట వ్రాసి ఇవ్వడం వ్యక్తిగతంగా నాకు సాహిత్య స్ఫూర్తిని ఇచ్చిన గొప్ప అనుభవం.

నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ 1981 నాటి “సిప్రాలి” బహుశా అమెరికాలో మొదటి పుస్తక ప్రచురణ….అది వ్రాత ప్రతి. అలాగే “రంగం మీద శ్రీరంగం” శ్రీ శ్రీ గారు వ్రాసిన నాటికల పుస్తకాలకు వ్రాసిన ఏకైక పీఠిక. ఆలాగే అనేక మంది ప్రముఖులు, కవి పుంగవులూ, రచయితలూ మా ఇంట్లోనే బస చెయ్యడం వలన ఈ సాహిత్యం వాసన నా వంటినిండా పులుము కుంది.

1975-95 నాటి ఇంటర్నెట్ ముందు యుగంలో అమెరికా సాహిత్య వాతావరణంలో ఇంచు మించు అన్ని నగరాలలోనూ ఐదారుగురు రచయితలూ, మరి కొందరు సాహిత్యాభిమానులూ ఉండే వారు. ఇంచుమించు అందరూ స్థానిక సంస్థాగత పత్రికలో కథలు, కమామీషులూ వ్రాయడం, తానా, ఆటా మహాసభల సావనీర్లకి వ్రాయడం మాత్రమే చేసేవారు. నేను కూడా ఈ కోవకి చెందిన రచయితనే. నేను వ్రాసిన మొదటి పాతిక కథలూ ఎవరో ఒక సంపాదకుడు గారు నా నెత్తి మీద కత్తి పెట్టి, డెడ్ లైన్ పెట్టి వ్రాయించినవే! కానీ అప్పటికే తానా, ఆటాలు కానీ, స్థానిక తెలుగు సంఘాల లోనూ కులప్రాధాన్యతలు పెరగడం…మెల్ల మెల్లగా అవి సాంస్కృతిక సంఘాల బదులు రాజకీయ సంఘాలుగా మారుతూ ఉండడంతో రాజకీయ నాయకులకీ, సినిమా తారలకీ ప్రాధాన్యత పెరిగిపోయి, సాహితీవేత్తలకి ఇవ్వవలసిన ప్రాధాన్యత తరిగి ఫోయింది. ఆ తిరోగమనాన్ని గమనించి, కేవలం తెలుగు సాహిత్య పోషణ ఏకైక లక్ష్యంగా 1994 లో మేము స్థాపించిన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఉత్తర అమెరికా ఖండంలో తెలుగు సాహిత్య ప్రపంచాన్ని ఒక కొత్త మలుపు తిప్పిందని సగర్వంగానే చెప్పుకోగలను.

ఈ సంస్థ అమెరికా రచయితలకి మాత్రమే 1995 లో ప్రారంభించిన ఉగాది ఉత్త్తమ రచనల పోటీలు, అమెరికా తెలుగు కథానికా సంకలనం మొదటి సంకలనం, ముఖ్యంగా అట్లాంటా లో మేము నిర్వహించిన మొట్ట మొదటి అమెరికా తెలుగు సాహితీ సదస్సు అమెరికా తెలుగు సాహిత్య ప్రపంచానికి ఒక స్పష్టతనీ, తమదే అయిన ఒక గుర్తింపునీ తెచ్చిపెట్టాయి. తొంభైలలో నడిచిన SCIT, “తెలుసా” లాంటి ఇంటర్నెట్ చర్చా వేదిక ఇంటర్నెట్ తెలిసిన రచయితలకి “సునాయాస” వేదికగా  మంచి చేసినా, నియంత్రణ లోపాల కారణంగా విలువ తగ్గిపోయింది. వంగూరి ఫౌండేషన్ స్థాపించిన కారణాలని బహుశా అపార్ధం చేసుకున్న వారి చేత ఆ వేదికలో నేను వ్యక్తిగతంగా తిన్నన్ని తిట్లు ఎవరూ తిని ఉండరు. ఆ వేదిక వలన అంచెలంచెలుగా రూపొందిన సాహిత్య సామంత రాజ్యాలే ఆ తరువాత వచ్చిన ఇంటర్నెట్ వేదికలూ, కొన్ని వెబ్ పత్రికలూ “గేటేడ్ కమ్యూనిటీ” గా రూపొందడానికి దారి తీశాయి అని నా అభిప్రాయం. ముఖ్యంగా, అమెరికాలో “మంచి విమర్శకులు ఉంటేనే మంచి రచనలు వస్తాయి” అని చిత్తశుధ్దితో నమ్మినప్పటికీ, “మేమే గొప్ప సాహితీవేత్తలం, మా విమర్శకి తట్టుకునే వారే మంచి రచయితలు” అని భావించడం మొదలు పెట్టిన సాహితీవర్గాలు పుట్టుకొచ్చాయి.

ఆంధ్ర ప్రదేశ్ లో పరిపక్వమైన తెలుగు కథావిశ్లేషకుల, విమర్శకుల అభిప్రాయాలని ఇంకా తప్పటడుగులు వేస్తున్న అత్యధిక అమెరికా తెలుగు కథలకి అన్వయం చేసి,  కథకులని నిరుత్సాహపరచడం వలన అమెరికా తెలుగు కథలు ఎక్కువ సంఖ్యలో రాలేదు. “అమెరికాలో ఎక్కడ సాహితీ చర్చలు జరిగినా ఇంకా కొడవటిగంటి, రావి శాస్త్రి, ఓల్గా, రంగనాయకమ్మ మొదలైన వారి గురించే మాట్లాడుకుని గర్వంగా భావిస్తూ ఉంటారు, అమెరికా తెలుగు కథకుల గురించి ఎక్కడా చర్చలు ఎందుకు జరగవు?” అని ప్రశ్నించుకుంటే దానికి సమాధానం ఎక్కడ వ్యక్తిగత విమర్శలు చోటుచేసుకుంటాయో అనే “భయం” ఒక కారణం అయితే, అమెరికా కథకుల కథల మీద అమెరికా సాహితీవేత్తలకే సదభిప్రాయం లేదు అనేది బహుశా ప్రధాన కారణం.

ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, నా రచనలపైనా, కథా వస్తువుల ఎంపికపైనా కాస్తో, కూస్తో ప్రభావితం చేసిన, చెయ్యని విషయాలను ప్రస్తావించడానికి మాత్రమే. వంగూరి ఫౌండేషన్ సంస్థ కార్యక్రమాల ద్వారా అమెరికా తెలుగు సాహితీవేత్తల ప్రత్యేకత నిలబెట్టడానికీ, ఇతరుల చేత కూడా “ఒక కాపు కాయించడానికి” నాకున్న సమయాన్ని ఎక్కువగా వెచ్చించడం తప్ప, నా రచనాసక్తిని, నా శైలినీ ఆ సంస్థ కార్యక్రమాలు ఎక్కువగా ప్రభావితం చెయ్య లేదు అని నేను నమ్ముతున్నాను.

Bapu cartoon on me 001అప్పటికీ, ఇప్పటికీ నేను వ్రాసేన శతాధిక కథలన్నీ డైస్పోరా జీవితానికి సంబంధించినవే. అసలు ఈ డైస్పోరా అనే మాట ఎవరైనా వాడడాన్నే తప్పు పడుతూ, నన్ను ఒక కథా రచయితగా గుర్తించడానికి ఇబ్బంది పడే కొందరు అమెరికా సాహితీవేత్తలు తమ అనుయాయులవి తప్ప ఇతర రచయితల కథల్ని గుర్తించక పోవడం అందరికీ తెలిసినదే. అమెరికా కథావస్తువులు ఇంకా పరిణితి చెంద లేదు, రాసి లో కానీ వాసి లో తగిన సంఖ్యలో కథలు రాలేదు అనే విమర్శలు ఎక్కడైనా వినపడితే దానికి ముఖ్య కారణాలు అమెరికా తెలుగు సంఘాల నిరాసక్తి, కొంత మంది సాహిత్యాహంభావం, రచయితల ఆత్మన్యూన్యతా భావాలు, తెలుగు నాట కూడా అమెరికా కథకుల మీద ఉండే చిన్న చూపు వగైరాలే కొన్ని కారణాలు. ఇటువంటి సాహిత్య సామ్రాజ్య సామంతుల ప్రయత్నాలు కూడా నా రచనా శైలిని ప్రభావితం చెయ్యలేదు….అప్పుడప్పుడు కథా వస్తువులని ఎంపిక చేసుకోవడానికి అంతర్గతంగా ఉపయోగపడి ఉండ వచ్చును.

ఇక నా రచనావ్యాసంగంలో మరొక ప్రధానమైన మార్పు 2004 లో జరిగింది. ఆ యేడు “సిలికానాంధ్ర” అసోసియేషన్ వారు “సుజన రంజని” అంతర్జాల పత్రిక మొదలుపెట్టినప్పుడు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ గారు నన్ను పిలిచి ఆ పత్రికకి నెలకి ఒక కథ వ్రాయమని కోరారు. ఆ పత్రిక వ్యవస్థాపక   సంపాదకులు కిరణ్ ప్రభ గారు పత్రిక రూపు రేఖలు, ఆశయాలు వివరించారు. అప్పటికే నేను “ఈ మాట” అనే వెబ్ పత్రిక సంపాదకుల కోరికపై కొన్ని కథలు రాసి ఇచ్చాను. అవి వారి “ఉన్నత” ప్రమాణాలకి తక్కువ స్థాయిలో ఉన్నా నా మీద గౌరవం కొద్దీ ప్రచురించారు అని నాకు కాలక్రమేణా అర్ధం అయింది. ఇప్పుడు ఈ కొత్త వెబ్ పత్రికకి ప్రతీ నెలా రాయాలంటే “నెల నెలా భంగపాటు” తప్పదేమో అని అనుకున్నప్పటికీ, వారి కోరిక కాదన లేక, మొదట్లో అప్పుడప్పుడు క్రమం తప్పినా, నెలకి ఒక కథ వ్రాసే నిబధ్ధ్ద్తత అలవాటు చేసుకున్నాను. కిరణ్ ప్రభ గారు కౌముది.నెట్ మొదలుపెట్టిన తర్వాత క్రమం తప్పకుండా నెలకో కథ రాస్తున్నాను. అవి ఇండియాలో కూడా “రచన” మాస పత్రికలో ఏడెనిదేళ్ళ నుంచీ ధారావాహికంగా ప్రచురించబడుతున్నాయి. ఇతర పత్రికలు ఎన్ని సార్లు నన్ను అడిగినా, వాళ్ళకి ప్రత్యేక రచనలు రాయడం వీలు పడక పోవడం నా రచనావ్యాసంగంలో ఒక లోటుగానే భావిస్తాను, కానీ  “రక్షించాడు” అని నా గాఢమిత్రులూ-గూఢ శత్రువులూ” సంతోషిస్తారు కాబోలు

ఇటీవల లోక్ నాయక్ ఫౌండేషన్ వారు నాకు లక్షాపాతిక వేల రూపాయల పురస్కారం ఇచ్చినప్పుడు, ఆ సందర్భంగా “వంగూరి చిట్టెన్ రాజు చెప్పిన నూట పదహారు అమెరికామెడీ కథలు” అనే నా కథల సంపుటి ప్రచురించాం. అందులో కొన్ని తప్ప మిగిలినవన్నీ ఇదివరలోనే “అమెరికామెడీ కథలు”, “అమెరికాలక్షేపం” “అమెరికామెడీ కబుర్లు”. “అమెరి”కాకమ్మ” కథలు” అనే మకుటాలతో విడి విడి సంపుటాలుగా వచ్చినవే. వీటిల్లో మీకు నచ్చిన కథలు ఏమిటీ అని చాలా మంది టీవీ  ఇంటర్ వ్యూలలోనూ, పత్రికల వారూ అడిగినప్పుడు చెప్పడం కష్టమే కానీ, నాకు బాగా పేరు తెచ్చిన కథలు నా మొట్టమొదటి “జులపాల కథ”, “రెండో జులపాల కథ”, “వాహనయోగం కథ”. “బురదావనం కథ”, చేగోడీ కంప్యూటర్ కథ”, “సంకట్ కాల్ మే బాహర్ జానేకా మార్గ్”, “దంత వేదాంతం కథ”, ఊంఠ్ గాడీ కథ”, “మైక్రోవేవోపాఖ్యానం”,  “బుల్లితెరంగేట్రం”, మీ ఆవిడ ఎందుకు పుట్టిందీ?”, ..ఇలా చాలానే చెప్పుకోవచ్చును….నాట్ బేడ్..ఎటాల్!  నా కథా సంపుటాలకు ముందు మాటలు రాసిన వారు గొల్లపూడి, జొన్నవిత్తుల, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, రచన సాయి, కిరణ్ ఫ్రభ మొదలైన వారు.

ఇక నాటకాలలో నేను రాసిన పాతిక పైగా నాటకాలలో అమెరికాలో బాగా పేరు తెచ్చిపెట్టినవి “బామ్మాయణం”, “మగ పాత్ర లేని నాటిక” అయితే ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చినది “అసలు ప్రశ్న”. ఈ నాటిక దూర్ దర్శన్ లో ఇండియా అంతటా చాలా సార్లు చూపించబడింది అని విన్నాను. నా నాటికలన్నీ “అమెరికామెడీ నాటికలు” అని శ్రీశ్రీ గారూ, గొల్లపూడి గార్ల ముందు మాటలతో పుస్తక రూపంలో వచ్చింది.

నా కథల్లో అప్పుడప్పుడు ప్రవేశిస్తూ అనేక మంది పాఠకులని అలరిస్తున్న పాత్ర “క్వీన్ విక్టోరియా”. “ఆవిడే లేకపోతే మీ కథలు ఎవరూ చదవరు” అన్నారు ఈ మధ్యన ఒక ప్రముఖ సంపాదకులు. ఈ పాత్ర సృష్టి, నా కథలలో ఉన్న కొన్ని బారిస్టర్ పార్వతీశం ఛాయలు, సునిశితమైన హాస్యం, వ్యంగ్యం, రాజకీయ చతురోక్తులూ  మొదలైన అంశాల వలన నన్ను మొక్కపాటి, పానుగంటి, చిలకమర్తి, మునిమాణిక్యం, భమిడిపాటి, ముళ్ళపూడి మొదలైన వారితో పోల్చడం వినడానికి బాగానే ఉంటుంది కానీ, అది పూర్తిగా అతిశయోక్తే!. నేను వారిలో ఏ ఒక్కరి కాలిగోటికీ కూడా పోలను అని నాకు తెలుసు.

ఎవరు నన్ను పొగిడినా, తెగడినా..ఇటీవల నాకు మహదానందాన్ని కలిగించిన విషయం ..బాపు అంతటి మహానుభావుడు నా మీద ఒక కార్టూన్ వెయ్యడం…అది ఎమెస్కో వారు 2011 లో ప్రచురించిన “బాపు కార్టూనులు -2” లో చోటుచేసుకోవడం ( 51 వ పేజీ). అది కిందటి నెల ఇండియా వెళ్ళినప్పుడు ఆ పుస్తకం కొనుక్కుని, అమెరికా వచ్చాక చూస్తుంటే…ఈ కార్టూన్ కనపడి ఆశ్చర్య పోయాను. ఆ కార్టూన్ బహుశా స్వాతి పత్రికలో వేశారేమో నాకు తెలియదు. నేను ఎప్పుడో మా హై స్కూల్ గురించి రాసిన కథ చదివి బహుశా బాపు  గారు ఈ వ్యంగాస్త్రం సంధించి ఉంటారు. 2006 లో నా మొట్టమొదటి కథా సంపుటికి బాపు గారు ఇందుతో జత పరిచిన ముఖచిత్రం వెయ్యడం, బాపు-రమణ లు ఎంతో ఆప్యాయంగా, అద్భుతంగా ముందు మాట రాయడం, ఆ పుస్తకం అంకితం తీసుకోవడం, ఇప్పుడు బాపు గారు ఈ వ్యంగాస్త్రం సంధిస్తూ కార్టూన్ వెయ్యడం…ఈ జన్మకి ఇవి చాలు. ఇంకెవరి పొగడ్తా అక్కర లేదు

ఇలా రాసుకుంటూ పోతే…నేనే ఒక “సొంత సుత్తి: అనే వెబ్ పత్రిక పెట్టుకుంటానేమో అనే అనుమానం ఎవరికైనా వస్తే, ఆ భయం లేదు అని అభయం ఇస్తూ…శలవ్!

సగలమ్మ పలికింది

sagalamma illustration(రమణజీవి కథాసంపుటి ‘సింహాల వేట’ ఈనెల 9 న హైదరబాద్ లో ఆవిష్కరణ)

క్రితం రాత్రి సరిగా నిద్రే లేదు వరాలుకి. మరునాడు బలి కాబోతున్న తన కోడిని తల్చుకుని!

తెల్లారింది.

చల్లటి నీళ్లు మొహం మీద పడేసరికి రెండు చేతుల్తో మొహాన్ని కప్పుకుంటూ అటువేపు తిరిగి పడుకుంది వరాలు.

వాళ్లమ్మ చెంగమ్మ పోతూ పోతూ ఇన్ని నీళ్లు చల్లి పోయింది వరాలు మీద.

‘‘ఒమ్మే! వొరాలు… సగలమ్మ కాడికి బోవాల గదా’’ అంది అవ్వ సుబ్బమ్మ కుండెడు నీళ్లల్లో పేడ కలుపుతూ.

మామూలుగా అయితే అంత తొందరగా ఎప్పుడూ లేవని వరాలు ‘సగలమ్మ’ అనేసరికి మెరుపులా లేచి కూర్చుని అరుగు మీదినించి కిందికి చూసింది.

కోడిపుంజు మంచానికి కట్టేసి వుంది. ఠీవిగా నిలబడి తలను అటూ ఇటూ కదుపుతుంటే నెత్తి మీద ఎర్రటి కిరీటం రాజసంతో కదులుతోంది. ముదురు పసుపురంగులో వున్న కంటి మధ్య గుండ్రటి నల్లగుడ్డు నిర్భీతితో మెరుస్తోంది. రానున్న ఆపదను ఏమాత్రం పసిగట్టలేనంత అమాయకత్వంతో కూడుకున్న నిర్భీతి. ఒళ్లంతా నలుపు, ఎరుపు ఈకల కలనేత మెరుపులు.

గబ గబా అరుగుదిగి కోడి దగ్గరకు వెళ్లింది వరాలు. కోడి భయంతో క్రో…క్రో… అంటూ కాలికి కట్టిన తాడును లాక్కు పోవాలని ప్రయత్నించింది.

చెంగమ్మ కూతురు వేపు మురిపెంగా చూస్తూ ‘‘మ్మె! పోమ్మే!! నీళ్లు దేపోమ్మే…’’ అని తన తల్లి వేపు తిరిగి ‘‘కోణ్ణి కూరొండినాక జాచ్చి చీలు దినేదిదే బలే మిడిమేలపు ముండగని’’ అంది. సుబ్బమ్మ సన్నసన్న పుల్లలు విరుస్తూ నవ్వింది.

‘‘హూ!’’ అని తల విదిలించుకుంటూ లేచి గూట్లోంచి ఓ బొగ్గు తీసి నోట్లో వేసుకుని కరకర నమిలి చూపుడు వేలుతో పళ్లు రుద్దుకోడం ప్రారంభించింది వరాలు.

గోడ దగ్గరికి వెళ్లి గోడమీద తుపుక్కుమని వుమ్మేసింది. శిథిలమై సున్నపు పెచ్చులు వూడి లోపలి బంక మట్టి, రాళ్లూ కనిపిస్తున్న గోడ మీద నల్లటి ఎంగిలి పడింది.

‘‘మెడ్తో గొడ్తా! లం…ముండ’’ అని చివాలున లేచిన చెంగమ్మకు దొరక్కుండా బయటికి పరుగెత్తింది వరాలు.

‘‘ఏమి దీనికి బొయ్యేకాలం. కండ్ల గావరం’’ అంది సుబ్బమ్మ.

సుబ్బమ్మకు ఆ ఇల్లంత అపురూపమైంది ఇంకోటి లేదు. ఆ ఇంటిని స్వంత చేతుల్తో కట్టింది.

అప్పటికి చెంగమ్మ వరాలంత పిల్ల. బంక మట్టిని పిసికింది. రాళ్లు పేర్చింది. వాసాలు కూర్చింది. కొండ మీది బోద కోసుకొచ్చి ఇంటిని కప్పింది. ఇప్పుడు ఆ బోదంతా ఏళ్లతరబడీ ఎండల్నీ వానల్నీ ఎదుర్కొనీ ఎదుర్కొనీ నీరసించి పోయింది. ముట్టుకుంటే నుసి నుసయి పోతోంది.

ఇంటికప్పు అడుగునున్న వాసాలు, దూలాలూ కూడా పొగ తాకిడికి కాటుక రంగుకి తిరిగాయి.

ఆ ఇంటికి చుట్టూ మనిషెత్తు ప్రహరీ గోడ. ప్రహరీగోడకు ఇంటికి వున్న ఖాళీ స్థలంలో ఎప్పుడో పోసిన మట్టి చీపురు కట్ట వూడ్పులకెగిరిపోయి అడుగున గులక రాళ్లు పొడుచుకుని వచ్చి నేలంతా ఎగుడు దిగుడుగా తయారయ్యింది. అయినా సరే ఆ నేల మీదే పేడ చల్లడం … ముగ్గులు పెట్టడం… ఆ గోడలకే సంవత్సరం సంవత్సరం సున్నం పూయడం… ఎరమట్టి గీతలు గీయడం…

ఆయితే వరాలుకివ్వేమీ పట్టవు. ఎంతసేపూ ఏదో ఒకటి పాడుచేసి తిట్లు తినడం సరదా.

సుబ్బమ్మ చెంగమ్మను పొయ్యి వెలిగించమని చెప్పి సగలమ్మ మొక్కుకు కావల్సిన ఏర్పాట్లలో మునిగిపోయింది.

ఇంటి తలుపుకు ఇటూ అటూ వున్న రెండు పెద్ద పెద్ద అరుగులకు చిక్కటి పేడ నీళ్లు పులుముతోంది. మధ్యలో వేసిన గోనెపట్టతో ఆడుకుంటున్న రెండు బూడిదరంగు పిల్లి పిల్లలు కాళ్లకు మాటిమాటికి అడ్డుపడుతూంటే చేత్తో అవతలికి తోసి ‘చేయ్‌’ అని అరిచింది సుబ్బమ్మ.

ఆ రెండు పిల్లి పిల్లలు కింద ఓ దొర్లు దొర్లి లేచి నిలబడి విస్మయంగా సుబ్బమ్మ కేసి చూసి గబగబా ఇంట్లోకెళ్లాయి. మళ్లీ అంతలోనే వొకదాన్నొకటి తరుముకుంటూ వచ్చి ఆగి సుబ్బమ్మను చూడబోయిన వాటి దృష్టిలో అప్పుడే నేల మీద వాలిన ఓ ఈగ పడింది.

చెవులు రిక్కించి శత్రువు మీదికి పొంచి రహస్యంగా దాడి చేసే వాటిల్లా శరీరాన్ని వెనక్కి లాగి ముందు కాళ్లతో మెల్లి మెల్లిగా ఈగను సమీపించిన పిల్లి పిల్లలు దూలం చాటునించి వాళ్లమ్మ అరుపు విని చప్పున ఆగిపోయి తోకల్ని నిటారుగా ఎత్తి నడుమును తల క్రిందులైన అర్ధ చంద్రుడి ఆకారంలోకి మార్చి గొప్ప ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ బొమ్మల్లా నిల్చుండి పోయాయి.

‘‘వొసే నా సయితీ… వొరాలూ…నీళ్లు తీసకరాయే… మళ్లా ఫవరు తగ్గి పోతాది’’ అని కేకేసింది చెంగమ్మ. చుట్టుపక్కల ఎక్కడున్నా వరాలుకు వినపడేలా వుంది ఆ కేక. పొగవల్ల మండుతున్న కళ్లని కొంగుతో తుడుచుకుంది.

బయట గులక రాళ్ల దారి మీద రాత్రి కురిసిన వాన నీళ్లకు ఎడం కాలి బొటనవేలుతో కాలవలు తీస్తూ నిలబడి వుంది వరాలు. యాంత్రికంగా పళ్లను తోముతోంది, చూపుడు వేలుతో.

వరాలు మనసులో ఆ రోజు సగలమ్మకు బలి కాబోయే తన కోడి పుంజు మెదులుతోంది. గుడ్డులో నుంచి బయటపడినప్పట్నించి తెలుసు తనకది. చిన్నప్పుడు దాన్ని నెత్తి మీదకి ఎక్కించుకుంటే అది తన చిట్టి చిట్టి గోళ్లతో మెడ మీదకి దిగి గిలిగింతలు పుట్టించిన దృశ్యం కళ్ల ముందు పదేపదే మెదులుతోంది. దూదిలాంటి మెత్తటి పిల్ల…. ఎంతగా ఎదిగింది తన చేతుల్లో!… ఈ రోజుతో ఆఖరా!

చెంగమ్మ కుడి చేతిలో వూదురు గొట్టం, ఎడం చేతిలో బిందెతో బయటికి వచ్చింది కళ్లు నులుముకుంటూ.

‘‘మెట్టుతో పదారేట్లు గొడతా యెంచి లం…’’ అని అరిచింది.

వరాలు వులిక్కి పడి వాళ్లమ్మకు అందకుండా కొంచెం దూరం పరిగెత్తి దూరంగా నిలబడి ‘‘ఆడబెట్టు బిందె’’ అంది నేలవేపు చూపిస్తూ.

వాళ్లమ్మ బిందెను అక్కడ బెట్టి ‘‘ఇంట్లోకి రాయే వుండాది నీ కత’’ అని లోపలికి వెళ్లి పోయింది.

వరాలు బిందెను చేత్తో నిర్లక్ష్యంగా పట్టుకుని జవహర్‌ రోజ్‌గార్‌ నీళ్లకోసం వెళ్తుంటే మట్టి గొట్టుకు పోయిన జానెడుజడ గంజి పెట్టినట్టు బిరుసుగా వుంది.

ఇంట్లోంచి రాయుడు వొళ్లు విరుచుకుంటూ లేచి వచ్చాడు. అతడు చెంగమ్మ రెండో కొడుకు. అతడి వుంగరాల జుట్టు రాత్రి పడుకోబోయేముందు ఎలా వుందో ఇప్పుడూ అలాగే వుంది.

నెల రోజుల్నించీ గడ్డం పెంచుకుంటున్నాడు తిరుపతి పోవాలని.

‘‘ఏంబ్బీ! లేచినావా. రా. నాయినా, నువ్వు ముందు బోసుకుంటే నీళ్లు… మళ్ల నేను వరాలు బోసుకుంటాం’’ అంది సుబ్బమ్మ.

రాయుడు బ్రష్‌ మీద పేస్ట్‌ వేసుకుని పళ్లు తోముకుంటూ తుమ్మచెట్టు ఇవతల ‘జాలారి’ దగ్గరికి వచ్చాడు. జాలారి అంటే కింద పరచబడిన నాలుగు బండలు. ఓ బండ మీద పెద్ద నీళ్ల మట్టి తొట్టె. అక్కడ వాడిన నీళ్లు పక్కనే వున్న ముద్దబంతి, మల్లె, సన్నజాజి, బొప్పాయి పాదుల్లోకి పోతాయి.

రాయుడు టవలుతో వొళ్లు తుడుచుకొని వచ్చి మంచం మీద వొక పక్కకి వొరిగి పడుకుని కోడిపుంజు వేపు చేయి సాచాడు. అది ఎగరాలని ప్రయత్నించి బోళ్లా పడిరది, కెక్కిరిస్తూ.

‘‘కేజీ వుంటాదా ఇది’’ అడిగాడు రాయుడు కోడిపుంజు వేపు చూస్తూ.

‘‘కేజీ యేం కేజీరా! వొకటిన్నర పైనుండాదయితే’’ అంది చెంగమ్మ.

‘‘మేయ్‌! ఈ వరాలుముండ యాడికి బోతే ఆడ్నే. అబ్బికి నాస్టా అన్నా తెచ్చాదనుకుంటే’’ అంది బయటికి చూస్తూ. తలుపులోంచి వరాలు చంకలో బిందె పెట్టుకుని గబగబా వచ్చింది. బిందెకున్న చిల్లులోంచి సన్నటి ధార వేగంగా వస్తూంటే వుచ్చ…వుచ్చ… చూడండి అని నవ్వుతున్న వరాలు హాస్యాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అయినా అది ఒకళ్ల కోసం సృష్టించబడిన హాస్యం కాదని వరాలు మొహంలో ఆనందం చెబుతూనే వుంది.

‘‘మ్మేయ్‌! వరాలూ నువ్వు బొయ్యి కొండయ్యింటి కాడ అన్నకంట దోసె తేమ్మే’’ అంది సుబ్బమ్మ కొంగు విప్పుతూ.

‘‘వుప్మా జేస్తే బొయ్యేది గదుమ్మా అందురూ దినేవాళ్లము’’ అంది పొయ్యి మీద బానలో రాయుడు పోసుకోగా ఏర్పడిన వెలితిని చల్లనీళ్లతో నింపుతూ.

‘‘అబ్బి తిండు లేమ్మే. నువ్‌ బోమ్మే వరాలు’’ అంది సుబ్బమ్మ, అయిదు రూపాయల నోటు వరాలు చేతిలో కుక్కి.

‘‘ఇదో వరాలూ! లోపల నా చొక్కా జేబీలో వుండాది గాని లెక్క… తీసుగోని పో’’ అన్నాడు రాయుడు.

‘‘వొద్దులేన్నా’’ అని అరుస్తూ బయటకి పరిగెత్తింది వరాలు.

రాయుడు మనసులో నవ్వుకున్నాడు.

‘ఈ మర్యాదలు ఎంత కాలం! నాలుగేళ్లయింది తను ఇంట్లోంచి పారిపోయి. నిన్ననే వచ్చింది.

అందుకే ఈ దోసెలూ… ఈ కోళ్లు కోసి వండటాలూ… ఇంక నాల్రోజులు పోతే మళ్లీ మాములే. నా బట్టా… నా కొడకా… ఇంత సద్ది కూడు మొహానేసి…’ ఓ నవ్వు అతడి పెదాల మీద అలా వచ్చి వెళ్లిపోయింది.

అంతలో చెంగమ్మ భర్త శంకరయ్య చేతిసంచీతో లోపలికి వచ్చాడు. బట్టతల మీద మెరుస్తున్న చెమట బిందువుల్ని భుజం మీది టవలుతో తుడుచుకున్నాడు. కళ్లు నిలకడ లేకుండా అటూఇటూ కదులుతున్నాయి. సన్నగా రివటలా వున్న శంకరయ్య మల్లెపువ్వులాంటి తెల్ల చొక్కా, పంచ కట్టులో వున్నాడు. చాలా అరుదుగా చేసే స్నానాన్ని ఆ రోజు చాలా పెందలాడే కానిచ్చాడు.

‘‘ఏమి బ్బే! నాస్టా జేసినావా?’’ అన్నాడు రాయుడి వేపు చూస్తూ. ఎవరో తరుముతున్నట్టు తత్తరబిత్తరగా వుంటుంది అతడి ధోరణి.

‘‘ఓయ్యా! నాయినా! ఇప్పుటికయి పొయ్యిందా నీ బజారు…’’ అడిగింది చెంగమ్మ భర్తను బియ్యంలో రాళ్లేరుతూనే.

శంకరయ్య మాట్లాడకుండా సంచీలోంచి శనగపిండిపొట్లం, తమలపాకులు, వక్కలు, కుంకుమ, పసుపు, మల్లెపూలు, అరటిపండ్లు, కొబ్బరి కాయలు, జేబులోంచి చిన్న కర్పూరం పొట్లం తీసి అరుగు మీద పెట్టాడు.

చెంగమ్మ కళ్లు ఇంతవి చేసి కొబ్బరికాయను చేతికి తీసుకుంది.

‘‘ఓయ్యో! ఇదేంది టెంకాయా? ఇంత వులకంగా వుండాది… దీంట్లో కొబ్బిరుంటాదా?’’

శంకరయ్యకు చిర్రెత్తి పోయింది ‘‘ఇంగ్‌… ఇంగేముంటాది…’’

‘‘ఓయ్యా! నాయనా! ఏదో ఒకట్లేకానీ’’ అంది సుబ్బమ్మ గుడ్డలో బెల్లం పెట్టి గుండ్రాయితో నలగ్గొడుతూ, మొగుడూ పెళ్లాలు గొడవల్లోకి దిగకుండా వారిస్తూ.

చెంగమ్మ నాలుగు బియ్యం గింజల్ని నోట్లో వేసుకుని`

‘‘నిన్న దెచ్చిన చెనిగిపిండి ఎవురి దెగ్గిర దెచ్చినావు. పిండి తక్కువగని. ఈ పొద్దు తూంచితే తెలుచ్చుంది వాడి రంగం… నీ రంగం…’’ అంది తాపీగా.

శంకరయ్య కోపంతో వొణికిపోయాడు.

‘‘నా రంగమేం తెలుచ్చాది లేయే. లచ్చుమయ్య వోటలు కాడ దెలీలా నీ రంగం…’’

‘‘ఇంగ బోనీమ్మే తల్లీ… నా తల్లి’’ అంది సుబ్బమ్మ పొడిచేసిన బెల్లం పక్కన బెట్టి విడి మల్లెపూలూ, దారం చెండూ చేతికి తీసుకుని.

వరాలు టిఫిన్‌ తెచ్చి రాయుడికి ఇచ్చి చిన్న మట్టిగిన్నెలో నీళ్లు తెచ్చి కోడి ముందు పెట్టి చూస్తూ కూచుంది.

ఇంతలో ఓ కాకి మట్టిగోడ మీద కూచుని వకటే అరవడం మొదలెట్టింది.

‘‘వరాలూ… తోలుమ్మే… బందుగులేమన్నా దిగుతారో ఏం శనిద్రమో…’’ అంది చెంగమ్మ.

‘‘దిగనీలే ఏమయితాది’’ అంది వరాలు కోడి తలను పట్టుకుని నీళ్ల గిన్నెలో ముంచుతూ.

‘‘నీకు ముదిగారం చానా జాచ్చయుండాది. దించుతా లం…’’ అని చేతిలో వున్న మట్టి బెడ్డను కాకి మీదికి విసిరింది ‘‘షూ’’ అని అరుస్తూ.

బంధువులంటే చెంగమ్మ కంగారుపడడంలో పెద్ద విశేషమేమీ లేదు. చెంగమ్మ చేసిన బోండాల్ని శంకరయ్య సాయంత్రం దాకా బస్టాండులో వచ్చేపొయ్యే బస్సుల దగ్గర తిరిగి అమ్మితే రోజుకు పదిహేను రూపాయలదాకా మిగులుతాయి. యావత్తు కుటుంబానికీ అదే ఆధారం.

అంతలో పిల్లిపిల్లలు అరుస్తూ చెంగమ్మ చుట్టూ తిరగసాగాయి. వాటికి తెల్సు ఎవరి చుట్టూ తిరగాలో.

‘‘మ్మేయ్‌ వరాలూ నా తల్లీ ఈ అద్దురుపాయికి పాలు దెచ్చి ఈటికి పొయ్యే. అలమటిస్తాండాయి’’ అంది చెంగమ్మ బొడ్లోంచి చిల్లర తీస్తూ. అయితే వరాలుకి కోడిని వదిలిపోవాలని లేదు. పాలంటే అరమైలు దూరం పోయి రావాలి.

‘‘ఆ కోణ్ణేం జూచ్చావ్‌ పోమ్మా! సగలమ్మ తల్లి వుండాది అన్నిటికీ పైన. నీకు మంచి మొగుడొస్చాడు. ఆ తల్లి సలవుంటే కోయేట్నించి మీ పెద్దన్న దండిగా లెక్క పంపిస్చాడు లేమ్మా! ఫో నా తల్లీ’’ అని వరాలు గడ్డం పట్టుకుంది. వరాలు అయిష్టంగా లేచింది.

వరాలు పాలు తీసుకొచ్చేటప్పటికి-

ప్రకాశంగా వెలుగుతున్న ఆకాశం కింద సగలమ్మ మొక్కుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.

పెద్దగంపకు పేడ అలికి ఎర్రమట్టి చారలు పూశారు. నల్లటి నూలుదారం గంప చుట్టూ చుట్టి మధ్యమధ్య వేప మండలు వేలాడదీశారు. కడిగిన బియ్యపు సిల్వర్‌ గిన్నెనూ, నీళ్ల బిందెనూ ఇంకా పూజకు కావాల్సిన సామాగ్రిని సర్దేశారు.

రెండు కాళ్లూ కట్టేసిన కోడిని శంకరయ్య చంకలో పెట్టుకున్నాడు. చెంగమ్మ గంపను నెత్తి మీదికి ఎత్తుకుంటుంటే సుబ్బమ్మ సాయం చేసింది.

‘‘ఓమ్మో! సూరుకత్తి… సూరుకత్తి యాడ దీసుకున్నాం’’ అరిచింది చెంగమ్మ.

సుబ్బమ్మ గబగబా ఇంట్లోకి పోయి ఓ కత్తిని తెచ్చి గంపలో వొక వైపుకు దోపింది, వరాలు రెప్పవేయకుండా ఆ కత్తి వేపు చూస్తూండగా.

అందరూ బయలుదేరారు.

శంకరయ్య, రాయుడూ కొంచెం ముందూ… చెంగమ్మ, సుబ్బమ్మ, వరాలు కొంచెం వెనక. వరాలు చూపంతా శంకరయ్య చంకలో వున్న కోడి మీదే వుంది.

చెరువు కట్ట చేరుకున్నారు. అక్కణ్ణించి ఇంకా రెండు ఫర్లాంగులుంటుంది సగలమ్మమాను. దూరంగా కనిపిస్తోంది. తన కోడిని కబళించబోతున్న సగలమ్మంటే చాలా కోపంగా వుంది వరాలుకి.

‘‘అమ్మా! సగలమ్మంటే ఎవురే’’ అడిగింది వరాలు.

చెంగమ్మ నెత్తి మీది గంపను కొద్దిగా ఇంకోవైపుకు తల మీద సర్దుకుంది.

‘‘సగలమ్మ ఎవురంటే ఏం చెప్తామే పిలా?! కాపోళ్లామె. వాళ్ల నాయిన ఆచ్చీపాచ్చీ అన్నీ అమ్ముకోని చెరువు కట్ట కట్టించినాడంట. ఎన్ని మాట్లు గట్టినా కట్ట నిల్చడం లేదంట. రోజూ వొడ్డోళ్లను దీసకపొయ్యి కట్ట కట్టించేదీ… మళ్లా పొద్దున్నే చూస్తే కట్టుండేది కాదంట.

‘‘ఇంగాయన అన్నం దినకుండా, నీళ్లు దాక్కుండా పండుకోనుంటే ఈ సగలమ్మ తల్లి బొయ్యి ‘ఏం నాయనా అట్ట బండుకోనుండావు’ అంటే ‘ఈ మాదిరి అయిపోయుండాదమ్మా పరిచ్చితి’ అన్నేడు. అంటే అప్పుడు సగలమ్మ ‘నువ్వు లెయ్యి నాయినా. నీకేంటికి నేనుండా పా’ అని తానం చేసి పెండ్లి కూతురు మాదిరిగా తయారయ్యి గడ్డపార బుజానేసి నాయిన్ను ఎంట దీసుకోని – సెరువెంబడి బయలుదేరిందంట.

‘‘అంతే – వాళ్ల నాయిన చూచ్చావుండంగానే ఆ తల్లి పామయి ఆడెత్తిన పడగ దించకండా…’’ అని ఆపి చెంగమ్మ తల్లి వేపు చూసింది. ‘‘ఏమ్మా! పామయిపొయిండ్లా’’ అడిగింది సందేహంగా.

అక్కణ్ణించి సుబ్బమ్మ చెప్పడం ప్రారంభించింది.

‘‘ఆ! గాలా పాము? నాయినా ఈ మాదిరి నేను పామయి పోతాండాను. నా యెంబడి సెరువు కట్ట ఏసుకుంటా రా…! కొనా మొదులుకు’ అనిందంట…’’

‘‘ఆ ఆడమనిషి పామయిపోయిందావ్వా’’ అడిగింది వరాలు కళ్లు పెద్దవి చేసి. వరాలు గుండెలు వేగంగా కొట్టుకున్నాయి.

‘‘పాము గాదుమ్మే… పాము అవుతారమైబోయింది. ఇంగాపాట్న కట్టట్నే నిలబడిపొయ్యింది. ఇంగాణ్ణించి సగలమ్మ దేవతైపొయ్యింది. ఎవురన్నా పెండ్లిండ్లకు బోతా ‘ఓ సగలమ్మ తల్లీ! పెండ్లికి గావాల నీ సొమ్ములిస్తావా’ అంటే సొమ్ములిచ్చేది. పెండ్లయి బొయినాక సగలమ్మ సొమ్ములు సగలమ్మకిచ్చే వోళ్లు ఎనిక్కి.

‘‘గానీ వొగరోజు వొగ గొల్లోడు కొండ మీద జీవాల్ని మేపుకుంటా – వాడి కూతురు పేరూ సగలమ్మే – ‘సగలమ్మా నీ అంకవలు బడిపోనూ… పలకవేమే’ అని కూతుర్ని తిట్నాడంట. ఆమయిన సగలమ్మ తల్లికి కోపమొచ్చి ‘నా అంకవలు పడిపొయ్యేది నిజమే. నువ్వు నా యెనక కుంటి యాపమానై నిలబడేది నిజమే. నీ జీవాలు నల్ల రాళ్లయి పొయ్యేదీ నిజమే’ అననిందంట.

‘‘ఇంగప్పట్నించి ఎవురు బిల్చినా పలికేది లే. సొమ్ములిచ్చేది లే’’ అని ముగించింది సుబ్బమ్మ. వరాలు మనసులో సగలమ్మంటే భయమూ భక్తీ కలిసిన ఒకలాంటి భావం స్థిరపడ్డం ప్రారంభించింది.

ముందుకెళ్లి శంకరయ్య చంకలోని కోడిని చేతుల్లోకి తీసుకుంది. దానికేదో చెప్పడానికి ప్రయత్నించింది.

అందరూ సగలమ్మ కట్ట చేరుకున్నారు.

గాలి హోరుమంటూ వీస్తోంది. ఆడవాళ్లకి ఎగిరిపోతున్న చీరల్ని పట్టు కోవడమే సరిపోయింది. గట్టిగా అరిస్తే గానీ వొకరిమాటలొకరికి వినిపించే పరిస్థితి లేదు.

సగలమ్మ మీదున్న పెద్ద వేపచెట్టు గాలికి విరుగుతుందా అన్నట్టు వూగుతోంది. సగలమ్మకు అటు మూడు ఇటు మూడు పెనవేసుకున్న పాముల్ని చెక్కివున్న నల్లరాతి పలకలున్నాయి. ముందు విశాలంగా నల్ల బండల్తో కట్టలా కట్టి చుట్టూ మోకాలెత్తు ఇనుప ఫెన్సింగ్‌ వేశారు. ఫెన్సింగ్‌కు ఓ చిన్న తలుపు లోపలికి వెళ్లడానికి.

కోడిని ఆ ఫెన్సింగ్‌ లోపల పడేశారు. రెండు కాళ్లు కట్టెయ్యడం వల్ల వొక వైపుకు వొరిగిపోయి కళ్లు మూస్తూ తెరుస్తోంది. భయం వల్ల అక్కడి నేలనంతా పాడు చేసేసింది. వరాలు వొంగి ఫెన్సింగ్‌ లోపలి కోడి వేపే చూస్తోంది.

సుబ్బమ్మ విగ్రహాల్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టింది. చెట్టు కింద కొంచెం దూరంలో అప్పటికే సిద్ధంగా వున్న మూడు రాళ్ల మీద బియ్యం గిన్నెను పెట్టి ‘‘మ్మేయ్‌ వొరాలూ… ఎండుపుల్లలు ఏరకరాయే బెరీన’’ అంది చెంగమ్మ.

వరాలు ఎండు పుల్లల కోసం చెరువు కట్టెంబడి పోతూంటే చెరువు కోళ్లు ఒక్కసారిగా నల్లటి మబ్బుల గుంపుల్లోకి ఎగిరాయి టపటపా శబ్దం చేస్తూ. ఆ దృశ్యం వరాల్లో ఎంత సంతోషం కలిగించిందంటే తాను కూడా ఓ చెరువు కోడి అయిపోయినంత సంతోషం కలిగి ఓసారి తన వేపు చూసుకుంది ఆ గాలిహోరులో.

పుల్లలు తల్లి ముందు పడేసి ‘‘బలపం బట్టి బేమ్మ వొళ్లో… అ… ఆ… ఇ… ఈ…’’ అని బిగ్గరగా పాడింది కులుకుతూ.

అందరూ నవ్వేరు. అప్పుడు వాతావరణం ఎంత వుత్తేజపూరితంగా వుందంటే ఎప్పుడూ చిటచిటలాడే శంకరయ్యకు కూడా లేచి గెంతాలనిపించింది.

పుల్లలతో నానాతిప్పలు పడి పొయ్యి వెలిగించారు.

అన్నం పూర్తిగా వుడకక ముందే వరాలు గబగబా బెల్లం పొట్లం తెచ్చి చెంగమ్మ వారిస్తున్నా వినకుండా అన్నం గిన్నెలోకి బెల్లాన్ని వొంపేసి కాగితానికి అంటిన బెల్లాన్ని పళ్లతో గీక్కుంటూ నిలబడింది.

మూడు రావిఆకుల్ని తెచ్చి వొక్కొక్క దాంట్లో కొద్దికొద్దిగా బెల్లపన్నమూ, వొక్కొక్క అరటిపండూ సగలమ్మకు నైవేద్యంగా పెట్టారు. విగ్రహం కిందుగా వున్న త్రికోణాకారపు గూట్లో చాలా కష్టపడి ప్రమిదను వెలిగించారు. అగరుబత్తీలు అంటించి ఓ సిమెంటు పగులులో గుచ్చి, కర్పూరం వెలిగించింది సుబ్బమ్మ. వెంటవెంటనే రెండు కొబ్బరికాయలు కొట్టి శంకరయ్య వేపు తిరిగి-

‘‘కొయ్‌! కోణ్ణి కొయ్‌. కర్పూరం ఆరిపోతుంది. అయ్యో నాయినా కోడికి గుది గాళ్లు దీలా… ఏం దీలా…’’ అని అరిచింది.

శంకరయ్య వుత్సాహంగా కోడి కాళ్లకు కట్టిన తాడును కోసేస్తూంటే, అంతవరకూ కొబ్బరిచిప్పల కేసి చూస్తున్న వరాలు గబగబా కోడి దగ్గరికి పరిగెత్తు కొచ్చింది. సుబ్బమ్మ విదిలించుకుంటున్న కోడి శరీరాన్ని పట్టుకుంది రెండు చేతుల్తో గట్టిగా. శంకరయ్య ఎడం చేత్తో కోడితలను పట్టుకుని కుడిచేతిలోని కత్తిని కోడి గొంతు మీద పెట్టాడు.

వరాలు కాళ్లు దబదబా అదిరాయి. చెమటలు పడుతున్న అరిచేతుల్తో లంగాని గట్టిగా పట్టుకుంది.

శంకరయ్య కోడి మొండేన్ని సర్కారు కంపల్లోకి విసిరి తలని చెంగమ్మకు అందించాడు.

చెంగమ్మ కోడితలని సగలమ్మ ముందు పెట్టింది. చెంబులోని నీళ్లు కుడిచేతిలో వొంపుకుని విసురుగా దాని తల మీద చల్లుతూ-

‘‘పలుకు తల్లీ! పలుకు… సగలమ్మ తల్లీ పలుకు!’’ అని అరిచింది.

కోడి తల రెండుసార్లు నోరు తెరిచి మూసింది.

‘‘అదో తల్లి పలికిందే. ఎర్రిముండా ఏడుస్తాండాయేమే. సగలమ్మ తల్లి పలికితే’’ అంది వరాలు వేపు చూస్తూ.

కళ్లలో నీళ్లు ఇంకి పోకముందే వరాలూ వుత్సాహంగా నవ్వింది.

వొక మాంత్రికుడితో కొన్ని మాటలు

 మార్చి 10 కేశవరెడ్డి గారి పుట్టిన రోజు 

MaheshVenkat_KesavReddy1

(ఎడమ వైపు నుంచి) డా. కేశవ రెడ్డి, వెంకట్ సిద్ధారెడ్డి, కత్తి మహేష్ కుమార్

ధైర్యం కూడగట్టుకుని ఫోన్ చేశాను. అటువైపు రింగ్ అవుతోంది. ఊపిరిబిగబట్టి ఆ రింగ్ వింటున్నాను. ఆ రింగ్ కన్నా నా ఊపిరి నాకే ఎక్కువగా వినిపిస్తోంది. అటువైపునుంచీ ఫోన్ రిసీవ్ చేసుకున్నారు.

“హలో”

“సర్, నాపేరు మహేష్ అండీ, కేశవరెడ్డిగారేనా!” అంటూ నేను కొంచెం లోవాయిస్ లో…

“అవునబ్బా! కేశవరెడ్డినే. చెప్పండి.”

***

సంవత్సరం 2009.

“మునెమ్మ” చదివాక ఒక ఉన్మాదం ఆవరించింది. అప్పుడప్పుడే ఒక డబ్బింగ్ చిత్రాలకు మాటలు రాయడం, కొన్ని సినిమాలకి స్క్రిప్టు సహకారం అందించడం ద్వారా మెయిన్ స్ట్రీం సినిమా రంగంలోకి అడుగుపెడుతున్న తరుణం. మునెమ్మ గురించి విన్నప్పుడే ఒక శక్తివంతమైన సినిమాకు సంబంధించిన సరంజామా అనిపించింది. ఒకసారి చదివాక ఆగలేని ఉత్సాహం నిండుకుంది. కాలేజిలో హెమింగ్వే  ‘ఓల్డ్ మెన్ అండ్ ది సీ’ చదువుతున్నప్పుడు తెలిసిన  రెఫరెన్స్ తో “అతడు అడవిని జయించాడు” పుస్తకం చదవటంతో డాక్టర్ కేశవరెడ్డి అనే పేరు పరిచయం అయ్యింది. మా చిత్తూరు రచయిత అనే అభిమానమో ఏమోగానీ, పేరు మాత్రం అలాగే గుర్తుండిపోయింది. మళ్ళీ మునెమ్మ దెబ్బకి ఆ పేరు మర్చిపోలేని విధంగా మెదడులో నిక్షిప్తమైపోయింది.

నా మిత్రుడు, సహరచయిత సిద్దారెడ్డి వెంకట్ (‘కేస్ నెంబర్ 666/2013’ సినిమా దర్శకుడు) తో మునెమ్మ గురించి చర్చిస్తున్నప్పుడు “అరే! నువ్వు కేశవరెడ్డిగారిని ఇన్నాళ్ళూ మిస్ అయ్యావా. చదవాలి బాస్. ఆయన నవల ‘సిటీ బ్యూటిఫుల్’ చదివాకగానీ నాకు తెలుగులో అంత గొప్ప పుస్తకాలు ఉన్నాయని తెలీదు” అంటూ ‘సిటీబ్యూటిఫుల్’ నవలని పరిచయం చేశాడు. ఒక్కబిగిన చదివిన నవలలు నాజీవితంలో తక్కువే. సిటీ బ్యూటిఫుల్ ఆ కోవలోకి చేరింది. చైతన్య స్రవంతి శైలిని గురించి వినడం చదవడం అప్పటికే చేశాను. తెలుగులో అంపశయ్య నవీన్, వడ్డెర చండీదాస్ రచనలు ఆ శైలితో సుపరిచితమే. కానీ కేశవరెడ్డి విన్యాసంలోఆశైలి ఇంకో అద్వితీయమైన స్థాయికి చేరిందని నేను ఖరాఖండిగా చెప్పగలను. చైతన్య స్రవంతికి జేమ్స్ జాయ్స్ ఆద్యుడైతే, తెలుగులో చలం తరువాత ఆ శైలిని ఉఛ్ఛస్థితికి తీసుకెళ్ళిన రచయిత డాక్టర్ కేశవరెడ్డి. కాశీభట్ల వేణుగోపాల్ లాంటివాళ్ళు దీన్ని ఇంటర్నల్ మోనోలాగ్ అన్నా, నాకైతే స్ట్రీమ్ ఆఫ్ కాంషస్నెస్ గానే అనిపిస్తుంది.

ఇక వేట మొదలయ్యింది. ఇన్ క్రెడిబుల్ గాడెస్, చివరి గుడిసె, స్మశానం దున్నేరు, మూగవాని పిల్లనగ్రోవి, రాముడుండాడు రాజ్జిముండాది చదివాకగానీ ఆకలి తీరలేదు. ప్రతిపుస్తకం చదువుతుంటే ఒక అద్భుతమైన సినిమా చూసిన అనుభవం. ధృశ్యాలు కళ్లముందు కదలాడి, ఉద్వేగాలతో శరీరాన్ని ఊపేసిన అనుభూతి. ఇంత సులువుగా, ఇంత శక్తివంతంగా, ఇంత ప్రభావవంతంగా రాయగలగడం ఒక సాధన.

***

“మీ మునెమ్మ నవల చదివాను సర్”

“ఎట్లుంది? బాగుందా?”

“అద్భుతంగా ఉంది సర్. ఆ నవలను సినిమాగా తియ్యాలనుంది సర్.”

“మునెమ్మనా…సినిమాగానా! మనోళ్ళు చూస్తారా? అయినా సినిమా అంటే పెద్ద కష్టం లేబ్బా.”

“నిజమే…కానీ తీస్తే బాగుంటుంది అనిపించింది సర్. మిమ్మల్ని కలవాలనుంది. మీరు హైదరాబాద్ కి ఎప్పుడైనా వస్తున్నారా సర్”

“హైదరాబాదా…ఇప్పట్లో రాలేనుగానీ, నువ్వే మా నిజామాబాద్ కి రా ,కూచ్చుని మాట్లాడుకుందాం.”

“సరే సర్….సార్ మాదీ చిత్తూరు జిల్లానే సర్..పీలేరు దగ్గర యల్లమంద.”

“అవునా…నాకు బాగా తెలుసునే ఆ ఏరియా అంతా…సరే ఇబ్బుడు క్లినిక్ లో ఉండాను. మధ్యాహ్నంగా ఫోన్ చెయ్ మాట్లాడుకుండాము.” అంటూ అటువైపునుంచీ నిశ్శబ్ధం.

నేను ఫోన్ పెట్టేసాను.

***

అప్పట్నించీ అడపాదడపా ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. నేను అవడానికి చిత్తూరువాడినే అయినా, చదువురీత్యా, ఉద్యోగ రీత్యా ఎక్కడెక్కడో తిరగడం కారణంగా భాష చాలావరకూ న్యూట్రలైజ్ అయిపోయి ఏవోకొన్ని పదాలలో తప్ప మా యాస నాకు దూరమయ్యింది. కానీ డాక్టర్ కేశవరెడ్డిగారితో మాట్లాడుతుంటే, ఆ యాస వింటుంటే ఏదో తెలీని ఆత్మీయత. ఆయన జీవితమంతా నిజామాబాద్ లో గడిపినా, అక్కడి యాసతో భాషతో ఒదిగిపోయినా తన ఇంటొనేషన్, కొన్ని టిపికల్ పదాలువాడటం అన్నీ ‘సిత్తూరు’తీరే.

కొన్నాళ్లకు మిత్రులసహాయంతో ధైర్యం చేసి మునెమ్మ నవల హక్కులు తీసుకోవడానికి నిర్ణయించుకుని నిజామాబాద్ ప్రయాణం అయ్యాను. కలిసాను. ఫోన్లో ఎంత సింప్లిసిటీ వినిపించిందో అంతకన్నా సింపుల్ గా మనిషి కనిపించారు. క్లినిక్ నుంచీ పికప్ చేసుకుని ఇంటికి వచ్చాం. మధ్యాహ్నం కలిసినవాళ్లం మాటల్లో సాయంత్రం ఎప్పుడయ్యిందో తెలీలేదు. ప్రపంచ సినిమాపై కేశవరెడ్డిగారికున్న పట్టు, తన దగ్గరున్న స్క్రీన్ ప్లే కలెక్షన్లూ చూశాక ఆయన నవలలు చదువుతుంటే సినిమా ఎందుకు కనిపించిందో అర్థమయ్యింది. నాదగ్గరున్న చిట్టాకూడా ఏకరువు పెట్టాను. వెనుదిరిగి వచ్చాక పోస్టులో కొన్ని డివిడి లు.  పుస్తకాలు పంపాను.

మునెమ్మ మా సొంతమయ్యింది. పుస్తకం మీదో లేక నా ల్యాప్ టాప్ లోనో ఏదో పిచ్చిగా నోట్స్ రాసుకోవడం. మునెమ్మ పాత్రను, కథను, ఉపకథల్ని పొడిగించుకోవడం, కొత్త కోణాల్ని జోడించడం కేశవరెడ్డిగారికి ఫోన్ చేసి విసిగించడం. పాపం ఆయన ఎప్పుడూ విసుక్కున్న దాఖలాలు మాత్రం కనిపించలేదు. కొన్నిరోజులకి ఇప్పట్లో మునెమ్మను సినిమాగా తియ్యలేమనే నిజం తెలిసొచ్చింది. నేను నిరాశపడ్డా కేశవరెడ్డిగారు నిరాశపడలేదు. “సినిమా తియ్యాలంటే ఎంత కష్టపడాలో నాకు తెలుసులేబ్బా! చూద్దాం ఏమవుతుందో” అనేవాళ్ళు. నేను చెప్పిన క్లైమాక్స్ మార్పులకు మించిన ముగింపులు కొన్ని తనే తయారుచేశారు. ఆయన స్వప్నించి మునెమ్మని సృష్టిస్తే నేను ఆ మునెమ్మను ఇంకా శ్వాసిస్తూ ఉన్నాను.

***

డాక్టర్ కేశవరెడ్డిగారు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఏదో విధంగా కలిసే ప్రయత్నం చేస్తుంటాం. అప్పుడప్పుడూ ఫోన్లు. సాహితీచర్చలు. సినిమాల గురించి మాటలు. మునెమ్మ గురించి తక్కువగా మాట్లాడతాం.

***

తెలుగు నవలాకారుల్లో డాక్టర్ కేశవరెడ్డి ఒక మాంత్రికుడు. అత్యుత్తమ కథకుడు. ల్యాండ్ స్కేప్ ను, మిథ్ ను, మ్యాజిక్ ను, ఫోక్ లోర్  ని, జీవజంతువుల్ని కలగలిపి వాటితోనే మనుషులకు కథ చెప్పించగలిగిన అరుదైన కళాకారుడు. డాక్టర్ కేశవరెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు.

  

అతను- ఆమె – నేను – ఒక కథ

rm umamaheswararao‘ఇది ఫెయిల్యూర్ స్టోరీ,’ తలకోన అడవిలో ఖదీర్ బాబు అన్న మాట ఇది.

ఆకాశం ఎత్తుకు ఎదిగి, నీలిమబ్బులతో గుస గుసలాడుతున్న మహా వృక్షాల నీడలో కథలు రాసే ఎందరో, అప్పుడు కూర్చుని ఉన్నారు. అయ్యో… ఈ అడివి చెట్లు, నీలి మబ్బులతో మాట్లాడే భాష ఖదీర్ కి అర్ధం కాలేదే! అనుకున్నాను.

బహుశా ఖదీర్ పుష్పవర్ణమాసంలో పుట్టలేదనుకుంటాను.

కథని కంప్యూటర్ తెర మీద చదవడం కంటికీ, మనసుకీ కూడా అంత హాయిగా ఉండదు. అసలే ఉబ్బదీసిన మధ్యాహ్నం చిరచిరలాడుతోంది. తిరుమల కొండ ఎండుబారిపోయి దిగులు నింపుతోంది. సవాలక్ష కారణాలతో మనసంతా చికాగ్గా ఉంది. ‘మహిత’ రాసిన సామాన్య మెయిల్ లో పంపిన కథ చదవకుండా ఆగడం ఎలా? కథ పూర్తి చేసి చూద్దును కదా, కిటికీ బయట దిరిసెన చెట్టు, ఎర్రటి ఎండలో దగ దగా మెరిసిపోతోంది. ఎండా కాలపు ధూళిలో, వెలుగు రేఖలు ముదురుపచ్చ ఆకులను ముద్దాడి, చేతులు సాచి పిలుస్తున్నాయి. కొమ్మల నిండా అటూ ఇటూ ఎగురుతూ కిచకిచలాడుతున్న పిచుకలు, గుబురు ఆకుల నడుమ మౌనంగా కూర్చున్న కోయిల.

ఆ వెలుగుపచ్చ అందానికీ, నాకూ మధ్య ఇనుప ఊచల కిటికీ.

ఇంతదాకా నేను చదివిన కథ నా కంటి ముందు ప్రత్యక్షమయిన అనుభూతి. కథలోకి నేను వెళ్ళానా? కథ నాలోకి ప్రవేశించిందా? కథా, నేనూ కలగలసిపోయిన వింత అనుభవం. గొప్ప సౌందర్యం ఏదో గాలి తెమ్మెరలా నన్ను స్పర్శించి, నా లోలోపలికి ప్రవేశించింది. కంప్యూటర్ తెరమీది కథలోంచా, కిటికీ బయటి గుబురు పచ్చ వృక్షం లోంచా? ఎక్కడి నుంచో అర్ధం కాలేదు.

లేచి వాకిట్లోకి వచ్చాను. గంగిరేణి చెట్టు కింద పండి రాలిన ఆకుల పసుపుదనం, గోడ మీద పాకుతున్న కమ్మెట పురుగు వయ్యారపు నడక, ఎదురుగా కొబ్బరాకుల మీద వాలుతున్న గద్ద నైపుణ్యం, చింకి పొదల మీద ఆరేసిన రంగుబట్టలతో వాలెండ వర్ణ విన్యాసం, ఎప్పుడూ చూసే వరండాలోని కలంకారీ చిత్రంలోనూ కనిపించిన కొత్త అందం. సమస్తమూ సౌందర్యభరితంగా కనిపించిన క్షణం అది.

సామాన్య రాసిన ‘పుష్పవర్ణమాసం’ కథ చదివాక నాకు కలిగిన అనుభవం ఇది.

పుష్ఫవర్ణమాసం ఏమిటి? ఏముంది ఆ కథలో…?

అతను, ఆమె. ఆ ఇద్దరే.

భర్త, ఇల్లు, పని, పనివాళ్లు… ఇంతేనా? రోజూ ఇంతేనా?

పంజరం బంగారమైనంత మాత్రాన అనందం కలుగుతుందా?

అప్పుడు చూసింది ఆమె అతన్ని, కిటికీ అవతల గుబురు మామిడి చెట్టుమీద ఆకుల్లో ఆకులా కలగలిసిపోయిన అతన్ని. అతని భుజం మీద కోయిల.

ఎవరతను? దయ్యమా? దేవుడా? భ్రమా?

ఎందుకో, రోజూ అతని కోసం ఎదురు చూసేది ఆమె. ‘సౌందర్యం వెంట లేకుండా వచ్చేవాడు కాడతను.’ పలకరిస్తే మాయమయ్యేవాడు. కొన్ని రోజులు కనిపించేవాడు కాదు. ఉగ్ర రూపమెత్తి కురిసిన వానని వింటూ ఆమె నిద్ర పోయిన రాత్రి, తెల్లవారింది బీభత్సంగా. రాలిన ఆకులు, తెగిపడ్డ పిందెలు, విరిగిన కొమ్మలతో యుద్ధక్షేత్రంలా మారిన మామిడి చెట్టు మీద మొఖం నిండా దిగులుతో కనిపించాడతను. ఏమయ్యారు, ఇన్ని రోజులు? అని నిష్టూరంగా పలకరించిన క్షణమే చెరిపేసిన గీతలా మాయమయ్యాడతను. ‘రాత్రి కురిసిన వానలా’ ఏడ్చి ఏడ్చి పడుకున్నది ఆమె. పొద్దున్నే సంపెంగ పూ చెట్టు కొమ్మ మీద కూర్చుని కిటికీ ఊచలు పట్టుకుని పలకరించాడతను.

అప్పుడు నేర్చుకుంది ఆమె ‘నీలి మేఘం అడవితో మాట్లాడుతుందే, ఆ భాష.’

ఇక, ఒకటే మాటలు, గలగలా జలపాతంలా. ఆ ఇద్దరి మీదా వాలిన పిట్టలు పాటలు పాడేవి. ఆ పాటల్లో వాళ్ళ మాటలు వాళ్ళకే వినిపించేవి. భూమికీ, ఆకాశానికీ మధ్య కిటికీ. బయట అతను, లోపల ఆమె. అతను రాని రోజు రాత్రి, ‘బల్లంతా బంగారు రంగు జలతారు వెలుతురు పరుచుకుని, మనసు నిండుగా ఉత్తరం రాసేది’ ఆమె.

ఆమె నవ్వులూ, మాటలూ, పాటలూ ఆ ఇంట్లోని వాళ్ళకి వింతనిపించాయి. ఆమెకి దయ్యం పట్టిందన్నారు. పుట్టింటికి పంపారు. తిరిగి వచ్చింది ఆమె, అతని కోసం ఆర్తిగా.

అప్పుడు అనిపించింది ఆమెకి, ‘లక్ష ఊచల పంజరమై, అతన్నీ, అతని పక్షుల్నీ బంధించెయ్యాలని.’

అప్పుడు అర్ధమైంది ఆమెకి, అతనూ ఆమె కోసం ఎదురు చూస్తున్నాడని. లంకె కుదరని మాటలేవో నడిచాయి, తడబాటుగా ఆ ఇద్దరి మధ్యా. ‘అడవి పచ్చరంగు చీర, ఆకాశ నీలం రవిక ధరించిన ఆమె, చినుకు చుంబించిన నేల పరిమళం’ లా కనిపించింది అతనికి. ‘ఆకాశ సముద్రాన్ని ఈదే చంద్రుడి’ లోంచి కొంత భాగం తీసుకుని ఇరవై నాలుగు రేకుల పువ్వు ఒకటి చేసి ఇచ్చాడు ఆమెకి.

అప్పుడు కలిగిందామెకి, ‘అతను కావాలి’ అని.

‘మనం మంచి స్నేహితులం, అంతే’ అన్నాడతను. అతను మాట్లాడుతుండగానే ఒక మొక్క ఆమె మనసులో మొలిచి, మారాకు వేసుకుని వేగంగా పెరిగింది. ‘అతను ఏడు మామిడి చెట్లంత పురాతనుడు’ అతనితో వాదించగలదా ఆమె! ఇరవై నాలుగు రేకుల ‘వెన్నెల పువ్వు గుప్పెడు బూడిదగా మారిపోయింది’. అతను రాలేదు, చాలా రోజులు. ‘అతను కావాలి’ అని ఆమె ఒంటరి ధ్యానం.

ఒక రోజు అతనొచ్చాడు. కృశించిపోయిన ఆమెని చూసి దిగులుపడి వర్షించాడు. ఇప్పుడతని చుట్టూ పక్షులు లేవు. ఎందుకు ఆమె అంతగా కోరుకుంది అతన్ని. ఏం చేసుకుంటుంది అతన్ని? అతనేమివ్వగలడు ఆమెకి? ఆమెకి లేనిదేమిటి? అతనికీ, ఆమెకీ మధ్య ఉన్న కిటికీని ఏం చేసి మాత్రం ఎవరైనా తొలగించగలరు?

అప్పుడు ఇంకా బలంగా అనిపించింది ఆమెకి, ‘అయినా సరే, అతను కావాలి’ అని.

అప్పుడు మాట్లాడాడు అతను అచ్చు ఒక మగవాడిలా ఆమెతో.

ఏడుపు దాచుకున్న వైరాగ్యపు నవ్వు ఆమె పెదవుల మీద నర్తించింది. అతను వెళ్ళిపోయాడు, తొలి పరిచయపు రోజుల్లో అతను ఇచ్చిన గోమేధికం మాత్రం ఉండి పోయింది, ఆమె మెడలో మోయలేనంత బరువుగా మారి.

దయ్యాలని తరిమేసే కామాక్షమ్మ గుడి మెట్ల మీద కూర్చుని ఆమె అతని కోసం ఎదురు చూస్తూనే ఉంది, అతను వస్తాడనే నమ్మకంతో, మెడలో నిప్పులా కణకణ మండిపోతున్న బండరాయంత గోమేధికం ధరించి.

ఇంతకీ, అతనొస్తాడా?

ఈ కథలో రచయిత్రి సమాజానికి ఏం చెప్ప దలచుకుంది?

పెళ్ళయిన ‘ఆమె’,అతన్ని కోరుకోవడం అనైతికం కాదా?

దయ్యం ఏమిటి, అశాస్త్రీయంగా.

అసలు పుష్పవర్ణమాసం ఎక్కడుంది?

ఇట్లా అడిగే వాళ్ళతో ఏం మాట్లాడగలం?!

ఏ కథ అయినా మనసుకి దగ్గరగా ఎప్పుడు వస్తుంది? ఆ కథలో మనకి మనం కనిపించినపుడు. ముసుగులేసుకునో, రంగులు పూసుకునో, మనసు పొరల్లో దాక్కునో ఎక్కడో అక్కడ ఎలాగో ఒకలాగ మనకి మనం దొరికిపోతాం. అప్పుడిక అది మన కథే అనిపిస్తుంది. అద్దంలా మనల్ని మనకు చూపుతూనే, మెల్లగా ఎక్కడికో దారి తీస్తుంది. ఆ దారి మంచిదో చెడ్డదో తీర్పులు చెప్పకుండా, తేల్చుకోమని ఒక ఆలోచన ఇస్తుంది. అప్పుడిక మనసు, పగిలిన జిల్లేడు కాయలోంచి బయటపడి ఎగిరే విత్తనంలా మారుతుంది. ఎక్కడో ఏ చెమ్మ నేల మీదో వాలి, తొలి చినుకు కోసం ఎదురు చూస్తుంది.

పుష్పవర్ణమాసం కథ చదివాక, ‘ఆమె’ ఎవరు? ‘అతను’ఎవరు? అనే ప్రశ్రలు ఉదయిస్తాయి. ఆమె ఎవరో తెలిసిపోతుంది సులువుగానే. ఆమె ఎవరో తెలిసి పోయాక, అతని కోసం అన్వేషణ మొదలవుతుంది. అతను అమూర్తం. అతను అనేకం. ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నది అతని కోసమే కదా అనిపిస్తుంది. అబ్బ ఎంత సౌందర్యం! అతను కావాలి అనిపిస్తుంది. అతను కనిపించాక కానీ పంజరం గుర్తుకురాదు. సకల జీవన బంధాలనీ గుర్తు చేసే రెక్కల పిట్ట అతను. నడి అడవిలో గాలి ఊదే వెదురు గానం అతడు. మనిషా, దేవుడా, దయ్యమా..? ఎవరైతేనేం! అతని ప్రేమ కావాలనిపిస్తుంది, ఎక్కాల పుస్తకంలో ఇష్టంగా దాచుకున్న నెమలీక కొందరికి అతను. మరి కొందరికి మాత్రం అతను ఒక రహస్యోద్యమం. నిద్ర రాత్రి తల కింద దాచుకున్న ఆయుధం. పశువుల మందని అడవికి తోలుకెళ్ళే పాలేరు పిల్లగాడికి దొరికిన భరోసా. అందుకే, అతను కావాలి. అతని కోసమే నిరీక్షణ. అతనొస్తాడనే ఆశ. అతనొస్తాడనే నమ్మకాన్ని గుండెల నిండా నింపుతుంది పుష్పవర్ణమాసం కథ.

ఈ కథ నిర్మాణ రూపం మీద కూడా కొందరికి అసహనం, సూటిగా చెప్పొచ్చుగా, ఇన్ని ప్రతీకలెందుకని చిరాకు. మార్య్యూజ్ ని ఇలా ఎందుకు రాశావయ్యా అని అడగ్గలమా? అలా రాయడం అతని అవసరం, అప్పటి అవసరం. అవసరమే కదా కథకి రూపశిల్పాన్ని నిర్దేశిస్తుంది. అనుభవించి పలవరించినపుడే అది ప్రవాహంలా బయటకొస్తుంది. పుష్పవర్ణమాసం కూడా ఇంతే.

ఇంతకీ ఈ కథ నీకెందుకు నచ్చిందీ అనడిగితే, నేనేం చెప్పగలను?

బహుశా పుష్పవర్ణమాసంలో పుట్టానేమో అని తప్ప.

*****

పుష్పవర్ణమాసం

~సామాన్య

Painting of saamaanya -- pushpavarnamasam

ఆ  రోజు  నా మేనకోడలికి పుట్టు వెంట్రుకలు తీస్తున్నారు. మా గ్రామ దేవత కామాక్షమ్మ గుడికి ఎడం చేతి వైపున వుంటుంది సుబ్బరాయుని పుట్ట. అందరం అక్కడ చేరాం. పుట్టు వెంట్రుకలు తీస్తుంటే, పిల్ల పాపం ఘోరంగా ఏడ్చేస్తుంది. కొందరు పొంగళ్ళు పొంగించేందుకు  పొయ్యి పెట్టడం కోసం రాళ్ళు వెదుకుతున్నారు. మా గుడి ఆవరణ అంతా పరుచుకుని గల గల లాడుతూ, ఎండలో  వెండిలా మెరిసిపోతూ  వుంటుందో పెద్ద రావి చెట్టు, దాని చుట్టూ ఎత్తుగా కట్టిన అరుగు వుంటుంది. పుట్ట దగ్గర జరుగుతున్న తతంగాలకి చిరాకు వచ్చి, నేను వెళ్లి ఆ అరుగు పైకి చేరి, మందిరం  ఆవరణలో అక్కడక్కడా తచ్చాడుతున్న భక్తుల్ని  చూస్తూ కూర్చున్నా.

గుడికి కుడి వేపున వున్న మండపంలో   స్తంభానికి ఆనుకుని ఎవరో ఒకామె  కూర్చుని వుంది. గొప్ప అందంగా వుంది. నేను అద్దాలు తీసి తుడిచి పెట్టుకుని మళ్ళీ చూశా. దానిమ్మ పువ్వు రంగు ఝరీ  చీరలో కొంత వాడిన మొగలిపువ్వులా వుంది. ఆవిడ వొంటి రంగు, చీర రంగుల అద్భుత సమ్మెళనమో, మరోటో, వద్దన్నా బలవంతంగా తనవైపుకి లాగేస్తుంది ఆమె  సౌందర్యం. నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరీవిడ?  ఇంతక ముందెప్పుడూ ఇక్కడ  చూడలేదే … ? ఎవరినడగాలి ఈవిడ గురించి … ఆలోచిస్తుంటే  విఘ్నేస్వరుడి మందిరం లో నుండి బయటకొచ్చాడు చిన్న పూజారి శేషాచార్యులు . శేషు చిన్నప్పుడు నా ఆటల పాటల  జట్టులో ప్రధాన సభ్యుడు. నా కంటే ఏడెనిమిదేల్లు  చిన్న వాడు. వాడిని పిలిచి గుసగుసగా “ఏం శేషు! ఏంటి సంగతి ఈ మధ్య తపస్సులూ గట్రా మొదలెట్టావా ఏంటి? దేవకన్యలని గుడికి రప్పించావ్” అన్నా. తలా తోక లేని నా మాటలకి  అచ్చు చిన్నప్పట్లానే వెర్రి ముఖం ఒకటి పెట్టేసి, “దేవకన్యలేంటి పెద్దక్కా?” అన్నాడు ఆశ్చర్యపడిపోతూ, నేను ఇంకా గుస గుస పెంచి, అదిగో ఆ మండపం లో స్తంభానికి ఆనుకుని కూర్చుని వుందే ఎవరేమిటి  ఆవిడ దేవకన్య కాకపోతే” అన్నాను. అది విని శేషు ముఖం వికాసంగా పెట్టి “దేవకన్య కాదు పెద్దక్క, దెయ్యం” అన్నాడు పూలు కొబ్బరిచిప్ప  చేతిలో పెడుతూ.

అప్పుడే అటోచ్చిన మా అత్త   “పెద్దమ్మాయ్  నడువ్, నడువ్ ఎక్కడకొస్తే అక్కడ స్నేహితులు, మాటలూ…అందరూ నీ కోసం వెతుకుతున్నారు” అన్నది. నేను అరుగు దిగి అత్త వెనకాలే నడుస్తూ ఆవిడను చూసాను. అదే ఫీలింగ్. దానిమ్మ పూరంగు పట్టుబట్టలో చుట్టిన మొగలి పూపొత్తిని చూసినట్లు. ఆవిడ దెయ్యమేంటి, ఈ శేషుకి చిన్నప్పట్నుంచి వేపకాయంత వెర్రి వుంది.ఇప్పుడది తాటికాయ అయ్యుంటది. మా  గుడికి దయ్యం పట్టిన వాళ్ళని చాలా మందినే తీసుకొస్తుంటారు. చాలా మంది నయమై కూడా వెళ్తుంటారు, కానీ వాళ్ళెవరూ ఈవిడలా శుభ్రంగా వుండరు, ఎందుకో ఆవిడతో మాట్లాడాలనిపించింది. ఆవిడ సౌందర్యం వల్లనేమో…మా అత్త చేతి నుండి నా చేతిని విడిపించుకుని ఇదిగో అత్తా నీ వెనకే వచ్చేస్తా గానీ నువ్వు  పద అని మండపం వైపు నడిచా.

పువ్వులా ఆ స్తంభానికి ఆనుకుని కూర్చుని వుంది ఆవిడ, నిశ్చలంగానో, పరధ్యానంగానో. నేను నిశ్శబ్దంగా, ధ్యానానికి వచ్చిన భక్తురాల్లా ఆవిడకి కొంచం ఎడమగా  కూర్చుని, శేషు  ఇచ్చిన కొబ్బరిచిప్ప  పగలకొట్టడం మొదలుపెట్టాను. ఆవిడ పరిసర స్పృహలో లేదు. దగ్గరగా ఇంకా బాగుంది. రింగుల జుత్తు, నిండు నవ్వు పెదవులు.

కాసేపటికి చేతికొచ్చిన చిన్న కొబ్బరి ముక్క ఆవిడ వైపుకు సాచి, పరిచయపూర్వకంగా నవ్వుతూ “తీసుకోండి” అన్నాను. ఆవిడ చిర్నవ్వి “థాంక్ యు” అంది.  అమ్మయ్య ఈవిడ  దయ్యం కాదు దేవతే. కానీ పలకరించడం  ఎట్లా?  కాస్తా బలంగా  ఊపిరి పీల్చుకుని ధైర్యం చేసి “మాది ఈ ఊరే. కానీ, మిమ్మల్ని ఇంతకు  ముందు ఎప్పుడూ ఇక్కడ చూసినట్టు జ్ఞాపకం లేదు” అన్నాను. ఆవిడ నా మాట విని, పల్లవి అసలే లేని పాటలా “ఇంతకు ముందు ఎప్పుడూ ఇక్కడికి రాలా నేను! దయ్యం పట్టిందట నాకు! దయ్యం పట్టాలని  నేను గాడాతి  గాడంగా కోరుకుంటున్నానూ… అయినా పట్టడం లేదు అని చెప్పా. ఎవరూ వినలా. ఇక్కడ తెచ్చి వదిలారు. కానీ నాకిక్కడ బాగుంది. సందె వాలిందంటే చాలు ఆ చెట్టు పైకి ఎన్ని పక్షులొస్తాయో తెలుసా. అతనితో పాటూ అట్లాగే వచ్చేవి రకరకాల పక్షులు, రంగు రంగులవి, సౌందర్యం వెంట లేకుండా వచ్చేవాడు కాడతను” అన్నది.

నాకు అయోమయం అనిపించింది. ఏం మాట్లాడుతుందీవిడ, శేషు చెప్పినట్లు ఈవిడ తేడానేనా ?కానీ టూ క్యూరియస్. అందుకే తల ఊపి “మీరు భలే అందంగా వున్నారు. ఎంతసేపైనా చూడాలనిపించేట్టు…ఇంతకీ ఎవరతను” అన్నాను

“ఎవరూ”

“అదే, ఇప్పుడు మీరు చెప్పారు కదా, సౌందర్యాన్ని వెంట తెచ్చేవాడని అతను.”

“ఓ! అతనా, అతను దయ్యం! , పేరు నాక్కూడా తెలియదు”

నేను ఆశ్చర్య పడ్డాను. తల ఒకసారి విదిలించి, వెళ్దామా అని ఆలోచించాను. పగలు మద్యాహ్నం లోకి  జారబోతుంది. సుబ్బరాయుడి పుట్ట దగ్గర, పొయ్యికి మూడురాళ్ళు దొరికినట్టే వున్నాయి సన్నటి పొగ లేస్తుంది. ఎందుకో పోలేక ఆగి, ఆవిడ వైపు చూసి “దయ్యాలు ఉన్నాయంటారా?” అన్నాను. ఆవిడ “దయ్యాలున్నాయి, పుష్ప వర్ణ మాసంలో పుట్టిన వాళ్లకి కనిపిస్తాయి” అన్నది. పుష్ప వర్ణ మాసమా…! అదేం మాసం? నేనెప్పుడూ వినలేదే ఆ పేరు, బహుశ   పుష్య మాసాన్ని ఈవిడిట్లా చెప్తుందేమో అనుకుని, “అవునా… ఎక్కడ చూసారు దయ్యాన్ని మీరు?” అన్నాను.

ఆవిడంది “ఒకరోజు మధ్యాహ్నం పన్నెండూ అట్లా అయి వుంటుంది. వైశాఖ మాసపు చివరి రోజులవి. నా పడక గదిలో దిళ్ళకి ఆనుకుని, కిటికీలోంచి చూస్తూ వున్నాను. పెద్ద కిటికీ మాది. కిటికీ లోంచి లోపలికి రావడానికి తెగ ప్రయత్నిస్తూ వుంటుంది సంపెంగ చెట్టు. ఆ పువ్వుల రంగూ, మధురమైన ఆ  వాసన ఎంత బాగుంటాయో. దాని వెనక జామ చెట్టు, బాగా పెద్దది. మా అత్తగారు కాపరానికి వచ్చినప్పుడు వేసిందట. అది కూడా పూత పూసింది. తెల్లటి జామి పూలు. దాని వెనక మామిడి చెట్టు. ‘బేనిషాన్’. బోలెడు కాపు కాసింది ఆ ఏడాది. గుత్తులు గుత్తులుగా కాయలు వేలాడుతున్నాయ్. ఆ అందమైన వర్ణాల కలివిడి ఎంత బాగుండిందో, చూస్తూ కూర్చున్నాను.

చాలా సేపటి నుండి ఒక కోయిల ఆర్తిగా, అదే పనిగా ఎవరినో పిలిచినట్టు కూస్తుంది. నేను లేచి, సరిగా కూచుని మామిడి చెట్టులో మూల మూలలా కోయిలని వెతకడం మొదలెట్టాను. అదిగో అప్పుడు చూశాను ఆ దయ్యాన్ని … అదే అతన్ని. కోయిల అతని భుజం పైనే వుంది. మొదట నాకేం అర్ధం కాలేదు. చెట్టు గుబురులో ఆకుల్లో ఆకులా అతను. ధ్యానంగా, ఎక్కడో దూరంలో నిమగ్నమై, శరీరం  మాత్రం అక్కడ వున్నట్లు. నేనేమైనా భ్రమ పడుతున్నానా? లేచి టేబిల్ పైన నీళ్ళు తీసుకుని తాగి, గదిలోనే మూడు నాలుగు సార్లు అటూ ఇటూ నడిచి, మళ్ళీ  వచ్చి చూశాను. అతను అక్కడే, అట్లానే వున్నాడు. చుట్టూ  పింద, దోర మామిళ్ళు, భుజం పైన కోయిల, ఆకులు గాలికి అటూ ఇటూ కదుల్తుంటే అతనిపై  పరుచుకుంటున్న వెలుగునీడల తారాటలు… ఆలోచిస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది ఎంత సుందరమైన దృశ్యం కదా అది అని.

మా అమ్మమ్మ ఎప్పుడూ చెప్పేది, పుష్ప వర్ణ మాసంలో పుట్టిన వాళ్ళకి దయ్యాలు కనిపిస్తాయని. మా అమ్మ కూడా అదే మాసంలో పుట్టింది. ఎంత బాగుండేదో మా అమ్మ. మొక్కల్ని, సీతాకోకల్ని,ఆకాశాన్నీ, ఆరుద్రల్నీ, వాన చినుకుల్నీ అన్నింటినీ ప్రేమించేది, తియ్యగా పాడేది, గొప్పగా రాసేది. ఎంత బాగుండేదో తెలుసా! బహుశా మా అమ్మమ్మ ఆ మాసంలో పుట్టలేదనుకుంటా ఆవిడ నగల్ని, వాహనాల్ని, నౌకర్లు చాకర్లు ఉండే మేడల్ని ప్రేమించేది. మా అమ్మ చీటికి మాటికీ మా నానతో గొడవపడి, నన్ను తీసుకుని మా అమ్మమ్మ దగ్గరకి వెళ్ళేది. కానీ మా అమ్మమ్మ మళ్ళీ మా అమ్మని నాన దగ్గరికే  పంపేసేది. ఒకసారి మా అమ్మ చచ్చిపోయింది. అప్పటి నుండి నేను మా అమ్మమ్మ దగ్గరే పెరిగా. మా అమ్మమ్మ, నేను కూడా పుష్ప వర్ణ మాసంలోనే పుట్టినందుకు బాగా దిగులు పడేది.ఆ దయ్యాన్ని చూడగానే నాకు అదంతా గుర్తొచ్చింది.

అట్లా నేను దాదాపు ఒక వారం రోజులు ఆ దయ్యాన్ని చూస్తూ వుండేదాన్ని. చూస్తూ చూస్తూ వుండగా నాకో రోజు అతన్తో మాట్లాడాలనిపించింది. ఏం చెయ్యాలి ఎలా అతని దృష్టి నా  వైపుకి తిప్పుకోవాలి. ఆలోచించి, ఆలోచించీ చివరికి  పని వాళ్ళని రప్పించి, దోర మామిళ్ళను కొయ్యమని చెప్పా. నేను ఆశించినట్టే ఆ మనుషుల అలజడికి అతను ధ్యానంలోంచి బయటకొచ్చాడు.

దయ్యాలలో మనీశ్వరుడు అనే దయ్యాలు కూడా ఉంటాయట. అవి ఎప్పుడూ మౌనంగా ఉంటాయట మా ఊర్లో చెప్పేవాళ్ళు. ఇతను అది కాదు కదా అనుకుంటూ, “మీరు నాకు కనిపిస్తున్నారు అదిగో ఆ గదిలోంచి మిమ్మల్ని చూశా, మీతో మాట్లాడాలని వుంది” అని చెప్పా. అతను తల వంచి ఎత్తైన ఆ చెట్టు పైనుంచి నన్ను చూశాడు. ఆ తరువాతి  నిమిషంలో అతనక్కడ లేడు. ఎంత గుచ్చి గుచ్చి,కొమ్మ కొమ్మా వెతికినా, అతను అక్కడ కనిపించలేదు. నా మాటలు విని, మామిడికాయలు కోస్తున్నవాళ్ళు, వాళ్ళతో మాట్లాడుతున్నానేమో  అనుకున్నారు. నేను గబగబా నా గదిలోకి  వచ్చి  అక్కడినుండి చూశా. అతను లేడు. ఆ తరవాత నుండీ ప్రతి రొజూ అతని కోసం వెతికా. మధ్యాహ్నం పూట కదా అతను నాకు కనిపించింది. అందుకని, ప్రతి మధ్యాహ్నమూ అది పనిగా వెతికేదాన్ని. కానీ  అతను మళ్ళీ కనిపించలేదు.

ఒకరోజు పగలంతా బాగా ఎండ కాసింది, రాత్రి ఏడూ ఎనిమిది అవుతుండగా వర్షం మొదలయింది. ఉరుములూ, మెరుపులతో  ఆకాశం ఎర్రగా మెరుస్తూ ఉగ్రరూపమెత్తింది. రాత్రంతా వర్షమే. వర్షాన్ని వింటూ నిదురపోయాను. పొద్దుట లేచి చూద్దును కదా, ఎంత బీభత్సమో… ! మామిడికాయలు పిందెల తో సహా రాలి పొయ్యాయి. ఆకులూ, అక్కడక్కడా రాలి పడిన కొమ్మలూ  … గొప్ప యుద్ధక్షేత్రంలా వుంది అక్కడంతా. అదిగో ఆ రోజు మధ్యాహ్నం, మళ్ళీ చూశా అతన్ని. ఎంత దిగులో  ముఖం నిండా, గభ గభా లేచి, చెట్టు క్రిందకి వెళ్ళా. రాత్రి వర్షానికి తడిసి జడిసిన పక్షులు అతని దగ్గర సేద తీరుతున్నాయ్. నేను తల పైకెత్తి “ఇన్ని రోజులు రాలేదే, ఏమయ్యారు?” అన్నాను. అతను నన్ను చూశాడు. నేను అతన్నే చూస్తూ వున్నాను. చూస్తూ ఉండగానే, బోర్డు మీద వేసిన బొమ్మ డస్టర్తో చెరిపేస్తే ఎలా చెరిగిపోతుందో అలా చెరిగిపోయాడు. పక్షులు మాత్రం మిగిలాయి.

నాకు ఏడుపొచ్చింది. గదిలోకొచ్చి మామిడి చెట్టు వంక చూస్తుంటే, ఎందుకో తెలీదు… రాత్రి కురిసిందే ఉదృతమైన వర్షం, ఉరుముల మెరుపుల వర్షం, అట్లా వచ్చింది ఏడుపు. గది తలుపులు భిగించి, పెద్ద పెట్టున వెక్కిళ్ళు పెట్టి ఏడ్చుకుని ఏడ్చుకుని పడుకున్నాను. బహుశా గంట తర్వాత అనుకుంటా మెలకువ వచ్చింది. మామిడి చెట్టు వంక చూడటానికి తల తిప్పానో లేదో, నా కిటికీ దగ్గరగా ఊచల్ని పట్టుకుని, సంపెంగ పూచెట్టు కొమ్మ పైన కూర్చొని వున్నాడు అతను. నా మెలుకువ కోసమే చూస్తున్నట్లు, ఆత్రుతగా “ఎందుకు ఆ ఏడుపు?” అన్నాడు. నేనతన్ని చూశాను. యదావిదిగా అతని చుట్టూతా పక్షులు, సీతాకోకలూ, ఇప్పుడు సంపెంగలూ…చూసి చూసి, అతన్ని కళ్ళనిండుగా నింపుకుని “తెలీదు” అన్నాను. అతను నిశ్శబ్దంగా మామిడి చెట్టు వంకే చూసి, చాలాసేపటికి “ఒకటేరోజుటి వర్షం, చెట్టు చూడండి ఎట్లా అయిపోయిందో పిచ్చిదానిలాగా” అన్నాడు. అతని ముఖం నిండుగా దిగులు.

అట్లా మొదలయింది మా పరిచయం. అతను ‘నీలి మేఘం అడవితో మాట్లాడుతుందే, ఆ భాష’ మాట్లాడేవాడు. మొదట్లో ఆ భాష నాకు అర్ధమయ్యేదే కాదు. తరువాత నెమ్మదిగా నేర్చుకున్నాను. ఆ భాష, అతని మాటా ఎలా ఉంటుందంటే, అతనితో మాట్లాడిన తరువాత హృదయం, చినుకులతో తడిసిన పుడమిలా మారేది.

ఆ కొత్తల్లోనే ఒకసారి అడిగా “ఈ ఇంటితో మీకేమైనా అనుభందమా?” అని. ఎందుకడిగానో నిజంగా నాకూ తెలీదు. ఆ ప్రశ్న వినగానే అతను దిగులుగా తలవాల్చి “ఈ ఇంట్లో తనుంది” అన్నాడు.

“తనంటే?”

“నేనూ తనూ ప్రేమించుకున్నాం, కోతకొచ్చిన పంటని ఏనుగుల గుంపు ధ్వంసం చేస్తుందే …అట్లా వాళ్ళ  ఇంట్లో వాళ్ళు ఆమెకు పెళ్లి చేసేసారు. ఆ తరువాత నించీ నేనిట్లా. ఈ మామిడి చెట్టు వున్న చోటే. ఏడు మామిడి చెట్లు  పెరిగీ …మరణింఛీ … పెరిగాయి. కానీ ఆవిడ ఆ  ఇంట్లోంచి బయటకు రాదు ఎంత ప్రార్దించినా……..” అతని కళ్ళలో నీళ్ళు. ఎలా ఓదార్చను అతన్ని.

నాకు హట్టాత్తుగా గుర్తొచ్చింది. నా పెళ్ళైన కొత్తల్లో ఓ మధ్యాహ్నం తలారా స్నానం చేసి, ఎందుకో ఏడుస్తూ వట్టి గచ్చు మీదే పడుకున్నా. గచ్చు మీద పరుచుకుని నా జుత్తు. ఎందుకో, ఆ మగతలో ఎవరో తెల్లగా ఇంత పెద్ద కన్నులున్న ఒకావిడ చల్లగా నా నుదుటిని, జుట్టుని నిమిరినట్టు, నా దుఖాన్ని ఒదార్చినట్టు భ్రాంతి కలిగింది. మా అమ్మేమో అనుకున్నాను అప్పుడు. కానీ కాదు. ఆవిడ, ఇతను చెప్పే ఆవిడ. అతనితో  అన్నాను “ఆవిడ తెల్లగా ఉంటారా” అని. అతను దుఃఖంలోంచి ఒత్తిగిలి “తను మేలి ముత్యం లాగుంటుంది” అన్నాడు మురిపెంగా. అంతే ఆ తరువాత మా మధ్య ఆ సంభాషణ మళ్ళీ ఎప్పుడూ రాలేదు.

అతను ఎంత పురాతనుడో, ఎప్పటి వాడో, ఎక్కడి వాడో నాకేం అవసరం? నేనేం చేసుకుంటా ఆ వివరాలన్నీ? అదీకాక దుఃఖంతో నిండిపోయిన అతని గతాన్ని నేనెందుకు కదిలించాలి. అందుకే ఏడు మామిడి చెట్ల అతని గతాన్ని నేనెప్పుడూ ప్రస్తావించలేదు.

క్రమంగా అతను నాకొక వ్యసనమయ్యాడు. సంపెంగ పూ చెట్టుపైకి అతను రావడం ఆలస్యం  ఎక్కడెక్కడి  పక్షులూ  వచ్చి నా కిటికీ పైనా, నా పైనా, అతని పైనా వాలేవి. ఎన్నెన్నో పాటలు పాడేవి. ఆ పాటల్లో మా మాటలు మాకే కొన్నిసార్లు వినిపించేవి కాదు. ఆ పక్షుల్లో ఒక కోయిల నా గదిలోపలికొచ్చి గూడు పెట్టడం మొదలెట్టింది. ఎక్కడినుండో పుల్ల పుల్లా ఏరుకొచ్చి గూడు కట్టేది. పొరపాటున  అదెక్కడ  ఫాన్ రెక్కలు  తగిలి చచ్చిపోతుందోనని నాకు భయమేసేది. ఫాను స్విచ్చికి  గట్టి టేప్ ఒకటి అతికించి ఫాన్ తిరగకుండా చేసేశాను.

అప్పుడడిగాడు మా ఆయన ”ఫాన్ స్విచ్ ఎందుకిట్లా చేశావు” అని. నేను మామూలుగానే చెప్పా కోయిల గూడు కడుతుందండీ, ఫాన్ రెక్కలు  తగిలితే చచ్చిపోతుంది అని. విచిత్రంగా మా ఆయన నా వంక వెర్రి చూపు చూసి,”కోయిల  గూడా? ఎక్కడ? అసలు కోయిల గూడు పెట్టడం గురించి ఎప్పుడైనా విన్నావా?” అని వాదులాటకొచ్చాడు.

నేను ఓపికగా స్టూలు తెప్పించి కోయిల పేర్చిన పుల్లల్ని, సగం పూర్తయిన దాని గూటినీ  చూపించాను. అప్పుడు కోయిల, కిటికీ ఊచల మీదే నిలబడి మా ఆయన వంకే చూస్తుంది కూడా. అయినా సరే అదేం మా ఆయనకి  కనిపించలేదు. నా వంక అనుమానంగా చూట్టం మొదలెట్టాడు. ఇంట్లోవాళ్ళు, నేనతనితో  మాట్లాడేప్పుడు దొంగచాటుగా వినే వాళ్లు. ఏదో  పిచ్చి భాషలో మాట్లాడుతానట, నవ్వుతానట. ఆ విషయం మా ఆయన ఒక రాత్రి ప్రస్తావించాడు. నేనెట్లా చెప్పేది, నీలిమేఘం అడవితో మాట్లాడే భాష ఒకటి ఉంటుందని …ఆయనకి  నేనెట్లా అర్ధం చేయించగలను? ఆయన పుష్ప వర్ణ మాసంలో పుట్టలేదు కదా. ఆ దయ్యాన్ని, అదే అతన్ని నేనెలా ఈయనకి చూపించగలను? అందుకే అదేమీ లేదండీ, ఏదో పాట నేర్చుకుంటున్నాను, అంతే అని చెప్పా.

అప్పటి నుండి ఇక జాగ్రత్త పడడం మొదలు పెట్టాను. మా ఇంటికి  వెనక వైపు పది పన్నెండు మెట్లు పైన రెండు గదులున్నాయ్..ఒక దాంట్లో ఎప్పుడో ఒక వంటావిడ ఉండేదట. ఒకసారి వాళ్ళ ఊరికెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదట. ఎందుకనో ఆ గదికి, నేను వచ్చినప్పటినుండి తాళం వేళ్ళాట్టమే చూశాను గానీ, తెరవడం చూళ్ళేదు. దాని పక్కనే ఇంకో చిన్న రూమ్ వుంటుంది. దాంట్లో, మా తోటల్లోంచి కోసుకొచ్చిన దోర పళ్ళని పెట్టి మగ్గ వేస్తుంటారు. రక రకాల పళ్ళు. మగ్గిన తర్వాత ఇంటిలోపలికి తీసుకొస్తారు. ఆ గది భలే వుంటుంది. రంగురంగుల పళ్ళతో, మిళితమై పోయిన అనేక రకాల వాసనలతో…

మేమిద్దరం అక్కడ కలుసుకునేవాళ్ళం. అక్కడా కిటికీ బయట తను, లోపల నేను. భూమికి ఆకాశానికి మధ్య కిటికీ వుంటే ఎట్లా వుంటుందో అట్లా అనిపించేది నాకు. ఒక్కోసారి అతను రెండు మూడు రోజులు వొచ్చేవాడు కాదు. అప్పుడు నేనతనికి, రాత్రంతా కూర్చుని నా మనసు నిండుగా  ఉత్తరం రాసేదాన్ని. ఒకరోజు అట్లాగే నా మనసుని బల్లపైన పరచి రాస్తూ కూర్చున్నాను. బల్లంతా బంగారు  రంగు జలతారు వెలుతురు పరుచుకుంది. అతని స్మృతి నా పెదాలపై నవ్వై పరుచుకుంది. నేను రాసుకుంటూ పోతున్నాను. హటాత్ గా మా ఆయన నిదరనించి  లేచి “ఏం చేస్తున్నావ్” అన్నాడు. అంతే నేను గబగబా నా మనసునంతా జవిరి నా రెండు చేతుల మధ్యకు నెట్టి, కష్టపడి ఆ కాంతినంతా దాచి దాచి “ఏం లేదు ఏదో రాసుకుంటున్నా” అన్నాను. ఆయన ఆశ్చర్య పడి,”చీకట్లో ఏం రాస్తున్నావ్” అన్నాడు. చీకటా! చీకటెక్కడ! మిల మిల మెరిసిపోయే ఇంత కాంతి ఉండగా…నేను మౌనంగా ఉండిపోయాను. మా ఆయన చిరాకు పడి “వచ్చి పడుకో” అని గద్దించాడు. నేను నెమ్మదిగా లేచి వెళ్లి పడుకున్నాను.

మరుసటి రోజు అతనొచ్చాడు. ఉత్తరం చదివావా అని నేనతన్ని అడగలేదు, అడగాల్సిన అవసరమూ లేదు. ఆ ఉత్తరాన్ని ఎలా చదవాలో అతనికి తెలుసు.

ఆ రోజుల్లో మేం గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళం. ఏం మాట్లాడుకునే వాళ్ళమో ఇప్పుడు కొంచేమన్నా గుర్తు  లేదు. కానీ అతనితో మాట్లాడటం నాకు చాలా బాగుండేది. ఎందుకంటె అతను, చీకటిని బంతాడే సూర్యుడి లాగా, మరో ప్రపంచపు కల లాగా, స్వప్నాలకే స్వప్నం లాగా సంభాషించే వాడు.  కొండవాలు లో పుట్టిన అనాది  గానం లా ఉండే వాడు. అతనికి పక్షుల భాష, పూల భాషా అన్నీ  తెలుసు. ఒక సారి నా ముందే మా కుక్క అతనితో మాట్లాడటం నేను చూశాను.

మా ఇంట్లో నా గురించి గుస గుసలు ఎక్కువై పోయాయి. నేను ఒక్కదాన్నే వెళ్లి ఆ మూల గదిలో కూర్చుంటున్నానని, నాలో నేను మాట్లాడుకుంటూ, నవ్వుకుంటున్నానని అనుకోవడం మొదలుపెట్టేరు. మా ఆయన విసిగి నన్ను మా అమ్మమ్మ దగ్గర వదిలి వెళ్ళాడు.అందరికీ, సంక్రాంతి పండుగకి ఊరికెళ్ళిఒదని  చెప్పుకున్నారు. మా ఊరంటే మామూలు రోజుల్లో నాకెంత సంతోషమో .ఈసారి అట్లా అనిపించలేదు. నా బట్టలంతా నాకు తెలీకుండానే  పనిపిల్ల ఎప్పుడో సర్ది పెట్టేసింది  .రాత్రి పదిగంటల వేళ మా ఆయన “బయల్దేరు” అన్నాడు.నేను ముందు మొరాయించాను,ఏడ్చాను, అతనికి చెప్పకుండా ఎలా వెళ్ళగలను ?.అతను నన్ను వెతుక్కోడా …ఏమనుకుంటాడు,ఇంకెప్పటికీ రాకుండా అద్రుశ్యమైపోడా?

మా ఆయన, అమ్మమ్మకి ఏమిటేమిటో చెప్పాడు.నేను మాట్లాడుతున్న పిచ్చి భాష గురించి చెప్పాడు.వినివిని మా అమ్మమ్మ “ఏం చేసేది నాయనా  అన్నీ వున్నా సుఖ పడే రాత  నా నుదుటున రాసిపెట్టలేదు ఆ దేవుడు ,లేకుంటే తల్లిలాగే ఇదీ పుష్పవర్ణ మాసంలోనే పుట్టాలా” అని ఏడ్వటం మొదలుపెట్టింది.

నేను మా అమ్మమ్మ తిప్పిన గుడులూ, మసీదులూ అన్నీ తిరిగాను.నాకేం కాలేదని చెప్పినా మా అమ్మమ్మ వినిపించుకోలా. నీలిమేఘం అడవితో మాట్లాడే భాష గురించి చెప్పబోయినప్పుడల్లా టపటపా చేత్తో తల బాదుకునేది.నేనింక భయపడి ఆమాటే ఎత్తడం మానేశా.కొన్ని రోజులకిక  నేను కుదుట పడ్డానని చెప్పి  మా అమ్మమ్మ నన్ను మా ఇంటికి తెచ్చి వదిలి వెళ్ళింది.

ఆ రోజు తలస్నానం చేసి, కిటికీ దగ్గర కూర్చుని, వేళ్ళతో జుత్తు చిక్కులు  తీస్తూ వున్నాను.దిగులుగా ఉంది. అతను ఇక రాడా …నన్ను మరిచిపోయుంటాడా! అని.అతను వచ్చాడు.అతనితో పాటు వచ్చిన పక్షులు ,మేత తెచ్చిన అమ్మకోసం నోరంతా తెరిచి అరుస్తాయే బుజ్జి పిట్టలు, అట్లా నన్ను చూసీచూడగానే అరవడం మొదలుపెట్టాయి.అతన్నట్లా చూడగానే నాకు  ఒక్క సారిగా లక్ష ఊచల పెద్ద పంజరాన్నై పోయి అతన్ని చుట్టేసి అతన్నీ, అతని పక్షుల్నీ అట్లాగే బంధించేయ్యాలనిపించింది.  అతను నన్ను చూసి   గొంతు పెగల్చుకొని ,చాలా నీరసంగా  “ఇన్ని రోజులూ ఎక్కడికెళ్ళారు వీణాధరి” అన్నాడు.అదే అతని పెదవులు నా పేరుని మొదటిసారి పలకడం.నేనెప్పుడూ అతనికి నా పేరు చెప్పలేదు ,అతని పేరూ అడగలేదు.ఆ తరువాత ఇంకొక్కసారి అతను నన్ను పేరుతో పిలిచాడు మా మొత్తం పరిచయంలో.

అతని నోటి వెంట  నా పేరు వినగానే ఒక్కసారిగా  శరీరమంతా కంపింఛి పోయింది .గుండె దడదడమని కొట్టుకుంది.కళ్ళలో నీరు కమ్మింది.ఆ ఉద్వేగం నుండి బయటకు రాక మునుపే ,అతను చాలా మొరటుగా “ఏం గొంతు నొప్పా? మాట్లాడవేం…? చెప్పడానికేం…? ” అని ఏకవచనంతో గద్దించాడు. ఆ గద్దింపుకి నవ్వొచ్చింది.అతని అక్కరకి ఏడుపు పొంగుకొచ్చింది . నవ్వి ,కళ్ళ నీళ్ళని కళ్ళలోనే దాచిపెట్టేసి ”అచ్చు దయ్యం లాగే మాట్లాడుతున్నారు” అన్నాను.అతను నెమ్మదిగా శాంతించాడు.ఎన్ని ఆలోచనలో  తెలుసా?పగలూ రాత్రి ఆ మామిడి చెట్టు మీదే కూర్చున్నా తెలుసా !అన్నాడు.అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు ” మీకు ముగ్గులేయడం వచ్చా ?” అన్నాడు పిచ్చిగా .మళ్ళీ “పండగకి ఏం చీర కట్టుకున్నారు” అన్నాడు .నేను ఉక్కిరిబిక్కిరయ్యాను ఆ కొత్త కొత్త ప్రశ్నలకి .ఎట్లాగో మనసు కూడదీసుకుని “అడవి పచ్చ రంగు చీర,ఆకాశ నీలం రవిక “అన్నాను.అతను కళ్ళు మూసుకుని ధ్యానంగా  “చినుకు చుంబించిన నేల పరిమళంలా ఉన్నావ్ ” అన్నాడు.

ఆ రోజు రాత్రి ,మా ఆయన పని మీద ఎక్కడికో వేరే ఊరికి వెళ్ళాడు.అతను మొగ్గలు విడుతున్నసంపెంగ చెట్టు మీద, నేను కిటికీ లోపల కూర్చుని వెన్నెల కౌగిట్లో తడిసి ముద్దయ్యాం.చంద్రుడు ఆకాశాన్ని  ఆ ఒడ్దు నుండి ఈ ఒడ్డుకి త్వరత్వరగా ఈదేస్తున్నాడు.అట్లా ఈదే చంద్రుడిలో కొంత భాగం తీసుకుని ,ఇరవై నాలుగు రేకుల పువ్వు ఒకటి చేసి నాకిచ్చాడు.ఆ పువ్వు ధగ ధగా మెరిసిపోతూంది.గమ్మత్తుగా గుబాలిస్తుంది .దాన్ని పక్కనుంచుకుని వేకువున, ఎప్పుడో అతను వెళ్ళాక నిదురపోయాను.

మరుసటి రోజు నిదురలేచినప్పట్నుంచి ఏదో దిగులు. ఒక చోట నిలువనీయని దిగులు .నాకేదో కావాలి ,ఏదో కాదు ,నాకు అతను కావాలి ,నాకు నాకే సొంతంగా కావాలి, అతను నావాడైపోయి నేను అతని దాన్నైపోవాలి,హృదయం లోంచి  పొంగుకుని పొంగుకుని వచ్చింది దుక్కం  .ఏడుస్తుంటే నా గదిలో గూడు కట్టుకున్న కోయిల నన్నే రెప్ప వేయకుండా చూడటం మొదలుపెట్టింది.చూసీ చూసి చివరకి  ” అతనితో నేను చెప్తానులే ఏడవకు” అన్నది.

అతనొచ్చాడు .ఇవాళ అతని ముఖం కాంతిగా ఉంది.పెదాలపై నవ్వుంది. అతనొచ్చీ రాగానే  కోయిల వెళ్లి అతని భుజంపై కూర్చుని, ఒక పాట పాడటం మొదలుపెట్టింది.’ ఆకుపచ్చటి పాట’.పాట వింటూ ఉండగానే అతని ముఖం వివర్ణమవడం  మొదలు పెట్టింది. పాట ముగిశాక, కోయిలని భుజంపై నుండి చేతిలోకి తీసుకుని “నువ్వు పాడకుంటే నేను తెలుసుకోలేననుకున్నావా  కోయిలా” అన్నాడు.

నేను తలవంచుకుని కూర్చున్నాను. మనసంత ఆందోళనగా, భయంగా ఉంది.దిగులు పొగలాగా కమ్ముకుంటూ ఊపిరాడనీయకుండా ఉంది.అయినా అట్లాగే దిగులుగా చెప్పాను “నాకు మీరు కావాలి” అని .అతనేం మాట్లాడలేదు చాలాసేపు .చివరికి “మీరు అతని భార్య వీణాధరి , మిమ్మల్ని ఎట్లా స్వీకరించగలను”అన్నాడు.నాకేం మాట్లాడాలో తోచలేదు.సంపెంగల గాలికి పక్షులన్నీ శాంతిగా ,నిశ్సబ్దంగా కూర్చున్నాయ్.ఆ నిశ్శబ్దం లోంచి నేను మొండిగా  “నాకు నువ్వు కావాలి” అన్నాను.అంత ఏక వచనపు చనువు ఎట్లా పుట్టిందో  నాకు …మళ్ళీ రెట్టించి ”నాకు నువ్వు కావాలి”అన్నాను.నాకు అదొక్కటే తెలుసు మరి.

అతను నిట్టూర్చి “మీకు అట్లాంటి ఆలోచన కలగడానికి నేను చేసిన తప్పేంటి? అన్నాడు.అతను మాట్లాడుతూ ఉండగానే, హటాత్తుగా  నా మనసులో ఒక మొక్క మొలవడం చూశాను.  అది మారాకు  వేసుకుంటూ అతి వేగంగా పైకి వస్తున్నది .నేనా మొక్కనే గమనిస్తూ వున్నాను .అతను  “నాకు మీతో మాట్లాడటం బాగుంటుంది.అయినా  నేను ఆమెని ప్రేమిస్తున్నానని మీకు తెలుసు కదా.మనం మంచి స్నేహితులం అంతే ” అన్నాడు  .నేనేం మాట్లాడలేదు .నా మనసులో పుట్టిన మొలకను మొదలకంటా పీకి ,గోటితో చిన్న చిన్న తునకలుగా చేసి కిటికీలోంచి విసిరేశాను.అతనది చూశాడు, దిగులుగా “మీది చాలా మంచి జీవితం వీణా ,ఇది మీకు మంచిది కాదు ,కొంచెం  కూడా మంచిది కాదు”అన్నాడు.నేను ఊరుకున్నాను.అతను ఏడు మామిడి చెట్లంత పురాతనుడు.ఒక వేసం   కాలపు నీల మేఘం, అతని ప్రియమైన మామిడి చెట్టును ఏం చెయ్యగలిగిందో  తెలిసిన వాడు ,అతనికి బదులు మాట్లాడటం నాకెలా సాధ్యం?.సాధ్యా సాధ్యాల ప్రసక్తి ఎలా వున్నా ,నాకు ఇష్టం లేదు అంతే.నేను ఊరుకున్నాను. అతను వెళ్ళిపోయాడు.

తర్వాత రోజు అతను రాలేదు ,ఆ తర్వాత చాలా రోజులు రాలేదు. బట్టల అల్మారాలో  దాచిపెట్టుకున్న  వెన్నెల పువ్వు గుప్పెడు బూడిదగా మారిపోయింది.నేను కృశించి పోవడం మొదలుపెట్టాను.అయినా అష్ట సిద్దులలోని మూడు సిద్ధులు ప్రాప్తి,ప్రాకామ్య,వశత్వాలు పొందాలని తీవ్రంగా ధ్యానించేదాన్ని.ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు,గది తలుపులు భిగించుకునే దాన్ని .తిండి తినేదాన్ని కాదు .ఒకే ఒక్క ఆలోచన  ‘అతను కావాలి’ .ఈ సంఘటనకు ముందువున్న యధాతధ స్థితి ఇంకెలా సాధ్యం.ఏమో ఇదంతా కాదు, నాకు అతను కావాలి .

ఒకరోజు అతనొచ్చాడు.నా అవతారాన్ని చూసి దిగులుపడి ,వర్షించి , చివరికి  అన్నాడు “ఎందుకట్లా?”అని. నేను “ఎందుకు రావటం మానేశావ్”?అన్నాను .అతను తలొంచుకున్నాడు.అతని చుట్టూ ఇప్పుడు పక్షులు లేవు.”తప్పు చేసానో ఏమో ?” ఇదంతా ఎలా జరిగింది.అతన్ని కోరుకోవడమేంటి,ఏం చేసుకుంటానతన్ని నేను? అతను నాకేం ఇవ్వగలడు?నాకు లేనిదేమిటి?మా మధ్యనున్న కిటికీని ఏం చేసి ఎవరమైనా తొలగించగలం? ఒకర్నొకరు ఏం చేసుకోగలం? ఇదంతా సరే,అయినా సరే అతను నాకు కావాలి ,నువ్వు నాదానివని   అతను నాకు చెప్పాలి

నా మౌనాన్ని, ఆలోచనలని విరగగొడుతూ అతను “రాకూడదని కాదు ,రాకుండా వుండగలిగీ కాదు,మీరు బాగుండాలి మీ జీవితం మంచిది.మీరు కోరుకుంటున్నది మంచిది  కాదు ” అన్నాడు.ఏడు మామిడి చెట్లను చూసిన వాడు కదా అతను, అందుకని ఏడుపుని ఆపేసుకుని ,నవ్వి ఊరుకున్నాను.అతను వెళ్ళిపొయ్యాడు.

మా ఇద్దరి పరిచయపు మొదటి రోజుల్లో అతను, నాకో గోమేధికం పొదిగిన  పతకాన్ని ఇచ్చాడు.చిన్న కుంకుడు గింజంత రాయి అది.ఆవు పంచతం రంగులో ,నిప్పు కణిక రంగులో మెరిసి పోయేది .అదంటే నాకు చాలా ఇష్టం.ఎప్పుడూ నా గుండెల మీద అందంగా నిలిపి వుంచుకునేదాన్ని.ఎప్పుడైతే అతను రావడం మానేసాడో ,అప్పట్నిండి అది ప్రతి రోజూ కొంత కొంతగా పెరగడం మొదలు పెట్టింది. విపరీతమైన భరువు,మోయలేనంత భరువు ,మెడలు వంచేసేంత భరువు,ఏ పనీ తోచనీయంత భరువు,ఆ భరువు మోయడం కన్నా చచ్చి పోతే పోతుంది కదా హాయిగా అనిపించేంత భరువు వేసేది ఆ రాయి.

మొదట్లో దాన్ని తీసేద్దామని ప్రయత్నించాను. నాకు చేత కాలేదు,నువ్విచ్చింది  నువ్వే తీసుకెళ్ళు అని అతనికే చెప్తామనుకున్నాను. అయినా ఎందుకు చెప్పాలి.అతనికి తెలియకనా.అందుకే ఒక సానరాయి తీసుకుని గోమేధికాన్ని కొంత కొంతగా అరగదీయడం మొదలుపెట్టాను,గది తలుపులు బంధించుకునే అరగదీసేదాన్ని,అయినా ఇంట్లోవాళ్ళు  నా మీద గూడచర్యం చేశారు.నాకు దయ్యం పట్టిందనీ ,ఇదంతా దయ్యం చేష్టలేనని తేల్చారు.అక్కడికీ నేను చెప్పా ,మీరనుకున్నట్టు నాకు ఏ దయ్యమూ పట్టలేదు ,పట్టాలని నేను తపస్సు చేస్తున్నా అని .గోమేధికాన్ని కూడా చూపించా. ఏం చెప్పినా ,ఏం చూపించినా వాళ్లకి కొంచం కూడా అర్ధం కాలేదు.ఎక్కడ నీ గోమేధికం ?,ఎక్కడ నీ దయ్యం? అన్నారు.నన్నిక్కడకి  తీసుకొచ్చి వదిలారు.నాకేం దిగులు లేదు ,ఇక్కడ చాలా బాగుంది ,ఎప్పుడో ఒక రోజు అతను వస్తాడు.మా మధ్య  మాటలు  లేవు   కానీ  , నా గురించి అతను యోచించే క్షణాలు నాకు ,అతని గురించి నేను కలగనే క్షణాలు అతనికీ ,తెలిసి పోతూనే ఉంటాయ్.ఈ గాలిలోనో,ఈ కొమ్మల్లోనో దాగి అతను నన్ను చూస్తూనే ఉంటాడు ,నాకు తెలుసు . అన్నట్లు నేను చెప్పేదంతా మీరు నమ్ముతున్నారా ,చూడండీ పెద్ద మామిడికాయంత పెరిగి పోయింది ఈ గోమేధికం .మీకు కనిపిస్తుందా?’’ అన్నదావిడ.నేను భ్రాంతిలోంచి బయట పడ్డట్టు ఆవిడ గుండెవైపు చూశాను.మొదట ఏమీ కనిపించలేదు ,రెండవ క్షణంలో కనిపించింది ‘బండ రాయంత గోమేధికం’ కణకణ మండిపోతున్నట్లు నిప్పు రంగులో.

నేను దిగులుగా ఆవిడ వైపు చూసి “మీదే పొరపాటేమో అతను మొదటే చెప్పాడు కదా తను ఎవర్నో ప్రేమిస్తున్నట్లు”అన్నాను.ఆవిడ చిన్నగా నవ్వింది .”అతను నన్ను ప్రేమిస్తున్నాడని భ్రమ పడ్డాననా మీ భావన ” అన్నది.నేను తలూపాను. ఆవిడ “మా మధ్య నడిచిన గాలికి కూడా అమ్బిగుఇట్య్ [ఆమ్బిగ్యుటి]  ఉంది.దానిని మీకెలా కావాలంటే అలా మలుచుకోవచ్చు .నాకు కావలసినట్లు నేను, అతనికి కావలిసినట్లు అతను చెప్పుకోవచ్చు.మీ పేరేంటో నాకు తెలీదు కానీ  ,మీకో విషయం చెప్పేదా ,ఏనుగులను మచ్చిక చేసుకునే మావటీలు ,ఏనుగులతో ఒక ప్రత్యేక భాషలో సంభాషిస్తారు,అది మీకు ఐడియా ఉందా ? ఒకసారి నేనో  మావటీని ఇంటర్వ్యూ చేశా .’’ప్రేమని వ్యక్త పరచడానికి  ఏం పదాలు వాడుతారు మీరు ‘’అని. ఆ  ప్రశ్నకి అతనేం బదులిచ్చాడో తెలుసా ”అందుకేం పదాలూ లేవు .మన చేతలలలో, ప్రవర్తనలో నుండి మన ప్రేమ ,అనురాగ  భావనని అవి గ్రహించుకుంటాయి ” అని .ప్రేమ అట్లాటిది. దానికి భాషే అవసరం లేదు,ఆ ఇంట్లో వున్నావిడని ఇష్టపడ్డాడని కదా మీరు అడిగారు, ఆ ఇంట్లో వున్నది మరెవరో కాదు “నా మరో నేను ” అన్నది.

ఆవిడని తీసుకెళ్ళడానికి ఎవరో వచ్చారు .నేను లేచి మా  వాళ్ళ వైపు నడిచాను .వెళ్తున్న దారిలో ఎవరో ఒకావిడ మట్టిలో దొర్లి దొర్లి ఏడుస్తుంది.”ఒసేయ్ కామాక్షి ,నన్నొదిలి పెట్టే…నన్నొదిలి పెట్టే …నా చేతుల్ని  కట్టేయ్యకే కామాక్షి ,నేనీ బాలని తీసుకెళ్ళ డానికే వచ్చానే కామాక్షి ,దీని మీద నాకు మోజే కామాక్షి ,దీన్ని నేను వదిలి పెట్టనే …అని ఏడుస్తుంది .ఎందుకో  దిగులేసింది.చిన్నప్పటినుండీ అమ్మవారి మందిరం చుట్టూ,దయ్యాలు పట్టిన వాళ్ళని చూస్తూనే పెరిగా .ఎప్పుడూ భయం కలగ లేదు. ఇవాళెందుకో మొదటి సారి భయమేసింది .ఇందాక నేను ఆవిష్కరించలేక పోయిన ”పుష్ప వర్ణ మాసం”నాకు ఆవిష్క్రుతమవడం మొదలు పెట్టింది   .దిగులు,ఆవిడ చెప్పిన పొగలా ఊపిరాడనీయకుండా నన్ను కప్పేయడం మొదలు పెట్టింది.

యుద్ధ భూమిలో శాంతి కోసం ఓ కల!

sathyavati“యుద్ధం పురుషులది. యుద్ధ నిర్ణయాలు స్త్రీలకి వదిలిపెడితే వాళ్ళు పరస్పరం చర్చించుకుని ఆ సమస్యను ఎప్పుడో పరిష్కరించి వుండేవాళ్ళు. అసలు యుద్ధ పర్యవసానాలను భరించేది స్త్రీలే! భర్తల, సోదరుల, ప్రేమికుల, బిడ్డల, మరణ శోకాన్ని భరించేది ఇరువైపులా కూడా స్త్రీలే. అయినా స్త్రీలు యుద్ధాలకి పరష్కారాలు చూపించడం ఎక్కడా వినలేదు.ఆత్మీయుల మరణ శోకపు కంటితడి తుడుచుకునే విరామంకూడా లేకుండానే వాళ్ళు కుటుంబాలకి ఆహారం సమకూర్చాలి. పురుషుల వీరోచిత కార్యాలతో దీన్ని పోల్చడం లేదు నేను. కుటుంబాన్ని చూసుకోడం ఒక గొప్ప విషయంగా స్త్రీలెప్పుడూ భావించలేదు.

తుపాకి పట్టుకుని ఉద్యమంలో పనిచెయ్యని స్త్రీల సేవలు తక్కువవేమీ కావు. తమ దుస్తుల మడతల్లో చీటీలు దాచుకుని చెక్ పోస్టుల మధ్యనుంచీ ధైర్యంగా వెళ్ళి అజ్ఞాతంలో వున్న ఉద్యమకారులకి సందేశాలు చేరవేశారు భోజనాలు అందించారు. పురుషులు ఉద్యమంలోకి వెళ్ళినప్పుడు, ఒంటరిగా వ్యవసాయం చేసి పంటపండించారు ఇంట్లో పురుషులు చేసే పనులన్నీ చేశారు. ఆ చీకటి దినాలలో కుటుంబం గడవడానికి స్త్రీలు పడ్డ కష్టాన్ని ఎవరూ ఎక్కువ కాలం జ్ఞాపకం వుంచుకోరు. ఎందుకంటే యుద్ధం పురుషులకు సంబంధించినది స్త్రీలది కాదు.”

“యుద్ధంకోసం ఎంత ఉత్సాహంతో పనిచేశారో అంతే ఉత్సాహంతో శాంతికోసం పనిచేస్తే ఎంత బాగుండేది? యుద్ధం స్వల్పకాలంలో ముగియాలి. ఎక్కువకాలం కొనసాగితే అది మనలో శక్తిని చంపేస్తుంది. ఈ యుద్ధం గ్రామాల మధ్య జరిగే యుద్ధం లాంటిది కాదు. ఇదొక పెను యుద్ధం. మనకన్న అతి పెద్దదైన భారత దేశం మనతో వంద సంవత్సరాలైనా యుద్ధం చెయ్యగలదు. మనకి కావలసింది శాంతి. ప్రజల జీవితానికి భద్రత.”

ఈస్టరీన్ కైర్ ఇరలు (Easterine Kire Iralu) వ్రాసిన “బిట్టర్ వర్మ్ వుడ్” అనే నవలలో తుపాకి పట్టుకుని స్వయంగా నాగా విముక్తి ఉద్యమంలో పాల్గొని, తరువాత ఉద్యమపు కలల నుంచీ బయట పడిన ఒక స్త్రీ అనేమాటలు ఇవి. ఇటీవల హిందూ లిట్ ఫర్ లైఫ్ పోటీలో షార్ట్ లిస్ట్ లో వచ్చిన అయిదు నవలల్లో ఒకటి. ఒక శక్తిమంతమైన నాగా సాహిత్యకారిణి సంయమనంతో వ్రాసిన నవల ఇది.

09TH_EASTERNINE_KI_1359464e

1937 లో జన్మించి 2007 లో హత్యకు గురైన మోసె జీవిత కథగా సాగే ఈ నవలలో నాగా విముక్తి ఉద్యమ చరిత్ర కూడా సమానాంతరంగా సాగుతుంది.

నాగా తెగల జీవితం వాళ్ల ఆచారవ్యవహారాలు, వాళ్ల శాంతియుత జీవనం, తెగల మధ్య సమానత్వం పరస్పర ప్రేమాభిమానాలు వర్ణిస్తూ మొదలై ఆ జీవితాల్లోకి వచ్చిపడిన మార్పుల మీదుగా సాగుతూ కళ్ళఎదుట జరుగుతున్న దౌర్జన్యాలను చూసి భరించలేక ఎంతోమంది యువకులు ఉద్యమంలో చేరడం ఉద్యమం నుంచీ బయటికి రావడం, తరువాత ఉద్యమంలో చీలికలు, ఒకర్నకరు చంపుకోడం అదొక కల్లోల భూమిగా మారి సామాన్య ప్రజలకి ఇంటా బయటా భద్రతలేకుండా పోయిన కాలం దాపరించి మోసే. అతని వంటి అనేక మంది హత్యకు గురవడం స్థూలంగా కథ.

1832 లో ఈశాన్యప్రదేశాలను ఆక్రమించిన బ్రిటన్ ని, భారతదేశాన్ని విముక్తి చేసినట్టే, తమనూ విముక్తం చెయ్యమనీ తమకుభారతదేశంలో చేరే ఉద్దేశం లేదనీ నాగా ప్రజలు కోరుతూనే వున్నారు.కానీ బ్రిటన్ తను ఆక్రమించిన భూభాగం మొత్తంఇండియాకు ధారా దత్తం చేసింది. తామెప్పుడూ భారతదేశంలో ఒక భాగం కారు కనుక తమది వేర్పాటు ఉద్యమం కాదని అంటారు వాళ్ళు.నాగా ప్రజలు నివసించే భూభాగాన్ని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించి భారత ఆక్రమణ నించీ తమకి విముక్తి కలిగించాలనేదే వాళ్ల ఉద్యమం.

కానీ స్వతంత్రం సాధించిన ఇండియా నాగా ల్యాండ్ ను అస్సాం లో ఒక భాగం చేసింది. అయితే భారత దేశ స్వాతంత్రానికి ఒకరోజు ముందే వాళ్ళు అనధికారికంగా నాగా స్వతంత్ర దినం జరుపుకున్నారు బ్రిటన్ ఆక్రమణకు ముందు నాగా తెగలలో కుల వ్యవస్థ, కులాల ఎక్కువ తక్కువలూ లేవు.తెగలన్నీ సమానమే. ఎవరితెగ ఆచారాలు వాళ్ళు పాటించుకునేవారు నాగా తెగలన్నీ దాదాపు తొమ్మిది పది దాకా వున్నాయి. తరువాత మిషనరీ లొచ్చి చాలమందికి క్రైస్తవం ఇచ్చారు ఇంగ్లీష్ నేర్పారు. క్రైస్తవం తీసుకున్నా పాత ఆచారాలను వదిలిపెట్టలేదు చాలామంది.

అట్లా క్రైస్తవం తీసుకున్నవారిలో మోసే కుటుంబంకూడా ఒకటి. మోసె తల్లి విలా (vilau) పొలంలో పనిచేసుకుంటూ వుండగా నొప్పులొచ్చి( 1937 లో) అక్కడే బిడ్దను ప్రసవిస్తుంది. అక్కడి చాలా మంది స్త్రీలకి అది మామూలే. ఆమె అత్తగారు ఖ్రియెన్యో ( khrienuo) ఆమె పక్క ఇంట్లో వుంటూ. విలా ని కూతుర్లా చూసుకుంటుంది ఒకే వంటిల్లుంటే స్నేహ బంధాలు నిలవవంటుంది ఆవిడ. విలా భర్త లూ ( Luo-o) బిడ్దను చూసి మురిసిపోతాడు. కానీ తరువాత కొద్దిరోజులకే అడవిలో ఒక చెట్టుకొట్టుకురావడానికి వెళ్ళి దానికిందపడి మరణిస్తాడు. అత్తాకోడళ్ళిద్దరూ పొలంలో పనిచేసుకుంటూ మోసె ని ముద్దుగా పెంచుకుంటూ వుంటారు.

“బిట్టర్ వర్మ్ వుడ్” అనేది ఘాటైన వాసన కల ఆకులున్నఒక మొక్క మనకు దొరికే దవనం, మాచిపత్రి జాతికి చెందినది. దీని పసరు గాయాలను మాన్పుతుంది. అంతేకాదు ఒక రెమ్మ జేబులో పెట్టుకున్నా దుష్ట శక్తులని అడ్దగించే రక్షరేకులా పనిచేస్తుంది. మనం కూడా దుశ్చర్యలకు పాల్పకుండా చేస్తుందని నమ్ముతారు నాగాలు. “ఇపుడదే కావాలి మనకి,” అంటుంది రచయిత్రి. ఈ శీర్షిక ఒక మెటఫర్. ఉత్సుకతతో చదివించే నవల.
మోసే ఆరేళ్ళొచ్చి స్కూల్ కి పోదామనుకునే వేళకి జపాన్ యుద్ధం వల్ల స్కూళ్ళన్నీ మూతపడ్డాయి వాళ్ళ తెగలో అనేకమందిలాగానే బాంబుల భయానికి మోసే కుటుంబం కూడా కోహిమా నుంచీ వెళ్ళిపోయి వేరే వూళ్ళోతలదాల్చుకోవలసి వచ్చింది. అప్పుడే అతను ఆకాశంలో ఒక విమానం మంటలు చిమ్ముతూ కూలిపోవడం చూశాడు. యుద్ధం ముగిసి స్కూళ్ళు తెరిచేసరికి మోసేకి ఏడేళ్ళొచ్చాయి.

ఒక మిషన్ స్కూల్లో చేరిన మోసేకి నీట్యూ ( nietuo) తో స్నేహమైంది, నీట్యూ కన్న మోసే కి గ్రహణ శక్తి ఎక్కువగా వుండేది. అతను స్కూల్లో నేర్చుకున్న ఇంగ్లీష్ తల్లికీ నానమ్మకీ చెబుతూ వుండేవాడు. తల్లికి ఇంటిపనిలో సాయం చేసేవాడు పొలం పనిలోనూ సాయం చేసేవాడు. వేరు వేరు ఇళ్ళల్లో వున్నా ఆ ముగ్గురిదీ ఒక ప్రేమ మయమైన కుటుంబం. అప్పుడు వాళ్ళొక చిన్న ట్రాన్సిస్టర్ రేడియో కొనుక్కున్నారు అది వాళ్ళ చిన్న ఇంటిని ప్రపంచంతో కలిపింది.అందులో రోజూ ఇంగ్లిష్ వార్తలు విని తల్లికీ నానమ్మకీ చెప్పేవాడు మోసె. నానమ్మ కి అవి విని మనమడి చేత చెప్పించుకోడం ఎంతిష్టమో! గబగబ పన్లు చక్కబెట్టుకుని వచ్చి కూర్చునేది.

1947 నాటికి మోసె మూడో తరగతిలోకొచ్చాడు.

ఆసంవత్సరం చాలా విశేషాలు చెప్పింది రేడియో! బ్రిటిష్ వాళ్ళు ఇండియా వదిలి వెళ్ళిపోయారు దేశ విభజన గురించిన వార్తలే వార్తలు! ఇండియాలో ముస్లిమ్ ల హత్యలు,పాకిస్తాన్ లో హిందువుల హత్యలు!! తమ పొరుగువారిని చంపుకోడం నిజంగా ఎంత పిచ్చితనం అనుకున్నారు ఆ అత్తాకోడళ్ళు. రోడ్డుమీద నడిచిపోయే వాళ్ళు, స్కూల్లో పిల్లలు, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునే మాటల్లో మోసె కి “నాగా విముక్తి” అనేమాటకుడా ఎక్కువ వినబడింది. నాగా ప్రజలు చాలా మంది ఇండియానుంచీ స్వతంత్రం కోరుకుంటున్నారని. అతని స్నేహితుడు నీట్యూ తండ్రి చెప్పాడు కొంతమంది గాంధీజీ దగ్గరకు వెళ్ళి తమకు స్వతంత్ర నాగా దేశం కావాలని అడిగారనీ దానికి గాంధీజీ మద్దతు ఇస్తానన్నారనీ చెప్పాడు.

ఒక రోజు రేడియో గాంధీ హత్య వార్త చెప్పింది. గాంధీ ఎవరు ఏమిటీ అని ఆముగ్గురూ మాట్లాడుకున్నారు.తను స్కూల్లో విన్నవీ పాఠాల్లో తెలుకున్నవీ చెప్పాడు మోసే ఆడవాళ్ళిద్దరికీ. గాంధీ దేశానికి ప్రధాన మంత్రి కాదు ప్రధాన మంత్రి వేరే వున్నాడు ఆయన పేరు నెహ్రూ ఆ ఇద్దరిపేర్లూ ఎప్పుడూ కలిసి వినిపించినా వాళ్ళూ అన్నతమ్ములు కారు. ఒక రోజు చర్చికి వెళ్ళినప్పుడు తెలిసింది,నాగాలకు స్వతంత్రం కావాలని వారిని ఇండియాలో విలీనం చెయ్యొద్దని వ్రాసినందుకు ఫిజో అనే ఆయన్ని ఇండియా ప్రభుత్వం అరస్ట్ చేసిందని. అప్పుడు నానమ్మ అంది “అవును నాగాలు ఇండియాలో ఎందుకు చేరాలి? వాళ్ళెప్పుడూ ఇండియాలో భాగం కారు” అని. “మనం జీసస్ ని ప్రార్థించాలి ఆయన్ని త్వరగా విడుదల చేయించమని. పాపం ఆయన పిల్లలు ఆయన కోసం ఎంత తపిస్తున్నారో కదా?” అంది.

1950 నాటికి మోసే ఆరో తరగతిలోకి వచ్చాడు. ఒకరోజు వాళ్ళు సాయంత్రం చలిమంట దగ్గర కూచున్నప్పుడు విలా చెప్పింది “నేనివాళ పొలం నుంచీ త్వరగా వచ్చాను. రోడ్డు మీద చాలా సైనిక వాహనాలు వున్నాయి.చాలా సేపు అవి అక్కడే ఆగి వున్నాయి మాకు చాలా భయం వేసింది వాళ్ళు మమ్మల్నే చూస్తున్నారు.”

“అవును జపాన్ యుద్ధం అప్పుడు ఒకామెని సైనికులు ఎత్తుకెళ్ళారు.తిరిగొచ్చాక చాలా కాలం ఆమె ఏడుస్తూనే వుండేది,” అన్నది నానమ్మ. స్కూల్లో కూడా పిల్లల్ని బయట తిరగవద్దని చెప్పారు. ఇప్పుడు జపాన్ యుధ్ధమప్పుడు ఎంతమంది సిపాయిలున్నారో అంతమందికన్న ఎక్కువ వున్నారు. మోహరించిన భారత సైన్యం అది.

అప్పుడు డిసెంబర్ లో ప్లెబిసైట్ జరిగింది. అందరూ వెళ్ళి మాకు స్వతంత్రం కావాలనే అర్జీ మీద వేలుముద్రలు వేసొచ్చారు. కానీ ఇండియా ప్రభుత్వం దాన్ని లెక్కపెట్టలేదు ఒకరోజు కోహిమాలో ప్రొటెస్ట్ మార్చ్ జరిగింది. వాళ్లమీద పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. గుంపు చెల్లాచెదరైనా ఒకతను గుండుతగిలి చనిపోయాడు పట్నంలో కర్ఫ్యూ విధించారు.

1952 లో ఇండియాలో సార్వత్రిక ఎన్నికలొచ్చాయి. నాగాల్యాండ్ లోనూ వచ్చాయి,కానీ అక్కడంతా ఎన్నికలు బహిష్కరించారు. పోలీసులు చాలామందిని తీసుకుపోయి బలవంతంగా బ్యాలెట్ పేపర్లమీద వేలిముద్రలు వేయించారు అట్లా మోసే తల్లీ నానమ్మ కూడా వేసొచ్చారు. ఇండియా కి ఎవరు ప్రధాన మంత్రి అయితే మనకేమిటి? మనం ఎందుకు వోట్లు వెయ్యాలి? వాళ్ళు చేస్తున్నది చాలా తప్పు అన్నది నానమ్మ. సైన్యం ధాన్యపు కుప్పల్ని తగలబెడుతోదనీ విచక్షణారహితంగా కాల్పులకి తెగబడి అమాయక పౌరులను పొట్టన పెట్టకుంటోందనీ మోసే వింటున్నాడు. కానీ ఈ వార్తలేవీ వాళ్ళు వినే రేడీయోలో రావు. చాలామంది యువకులు అజ్ఞాతంలోకి వెళ్ళి నాగా విముక్తి ఉద్యమంలో చేరిపోతున్నారు. పెళ్ళయిన వాళ్లు మాత్రమే ఊళ్ళల్లో మిగిలివుంటున్నారు తమ మీద జరుగతున్న దౌర్జన్యానికి నాగాప్రజలు కోపోద్రిక్తులౌతున్నారు. చాలా చోట్ల సైనకుల చేతిలో స్తీలు అత్యాచారాలకు గురౌతున్నారు. ఎవరికీ ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. అప్పుడే ఒక సైనికుడు పేల్చిన తూటా పొలంనుంచీ వస్తున్న నానమ్మను బలితీసుకుంది.

ఆమె మరణం మోసే ను బాగా కదిలించింది. 1959 నాటికి మోసేకి 19 ఏళ్ళొచ్చాయి.

అతని తల్లి విలా కి అత్తగారి మరణం తరువాత ఏళ్ళకిమించిన వృద్ధాప్యం వచ్చినట్లయింది. స్కూల్ ఫైనల్ అవకుండానే మోసే చదువు మానేశాడు. సైనికుల ఆగడాలు చూస్తున్నకొద్దీ ఆగ్రహావేశాలు అదుపులోకి రావడం లేదతనికి. ఒకరోజూ అతనూ అతని స్నేహితుడు నీట్యూ అజ్ఞాత నాగా సైనికుల్లోచేరిపోయి అడవులకు వెళ్ళిపోయారు. తల్లి తన కొడుక్కి హృదయపూర్వకంగా అనుమతి ఇచ్చింది. ఏడు సంవత్సరాల కాలం అతను అడవులలోనే వుండిపోయాడు గెరిల్లా శిక్షణ తీసుకున్నాడు అక్కడ అతనికి తనతో పాటు గెరిల్లా శిక్షణ పొందుతున్న నీల్హౌనో (nielhounuo) పరిచయమౌతుంది. ఆమె చాలా ధైర్యవంతురాలు. అంతా ఆమెని రైఫిల్ గర్ల్ అంటారు.

మోసె ప్రాణానికి తెగించి ఒకరోజు కోహిమా వచ్చి రహస్యంగా నాగా పతాకం ఎగరేసి పోతాడు. ప్రభుత్వ సైన్యాలకూ ఉద్యమకారులకూ మధ్య కాల్పులూ ఎదురుకాల్పులూ మొదలౌతాయి. వీరిద్దరిమధ్య సామాన్య పౌరులు ప్రాణాలు పోగొట్టుకూంటూ వుంటారు. ఆపరిస్థితుల్లో అప్పటివరకూ అస్సాంలో ఒక భాగంగా వున్న నాగా ప్రాంతం 1963 లో ప్రత్యేక రాష్ట్రంగా అవతరిస్తుంది. ఈ పరిణామం ఉద్యమకారులలో క్రోధాగ్ని రగిలిస్తుంది కొందరు కోహిమాకు వెళ్ళి రాష్ట్రావతరణ ఆపాలంటారు. కొందరు అప్పటికే చాలా ప్రాణ నష్టం జరిగంది కనుక అట్లా చెయ్యడం మంచిది కాదంటారు. తీవ్రమైన చర్చలు జరగుతాయి. సీనియర్ నాయకులు హింస తగ్గించమంటారు. చివరికి వీరిమాట నెగ్గింది. అయితే కొత్తగా ఏర్పడిన రాష్ట్రప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేసే చర్యలు ప్రారంభించింది.

అందులో భాగంగా ఉద్యమాన్ని వదిలి జన జీవనంలో కలిసే వారికి కొంత డబ్బో భూమో ఇస్తానని ప్రకటించింది. ఎక్కువమంది ఉద్యమ కారులు ఇందుకు ఇష్టపడలేదు. చాలా కొద్దిమంది మాత్రమే బయటికొచ్చారు. ప్రభుత్వ సైనికులకీ ఉద్యమ కారులకీ మధ్య కాల్పులు ఉధృతమైన సమయంలో ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించింది. అప్పుడే మోసే తల్లి విలా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతోదని తెలసి అతను తన స్నేహితుడు నీట్యూ తో కలిసి ఇంటికి వస్తాడు. “నేను రమ్మనలేదు కదా,” అంటుంది తల్లి. ఆమె క్యాన్సర్ చివరి దశలో వుంది. మోసే తల్లిదగ్గరే వుండిపోతాడు. తనకి అజ్ఞాత జీవితంలో పరిచయమైన నీల్హౌనో కూడా బయటికి వచ్చేసింది ఆమెను పెళ్ళిచేసుకుంటాడు. అతనికి ప్రభుత్వం ఉద్యోగమేదో ఇస్తానంటే ఇష్టం లేక కిరాణా దుకాణం పెట్టుకుంటాడు. అతని ఉద్యమ జీవితం ముగిసింది. అతనికొక కూతురూ అతని స్నేహితుడు నీట్యూకి కొడుకూ జన్మిస్తారు.

ఇంక అక్కడనంచీ రాష్ట్రంలో జరిగే సంఘటనలన్నీ ఆ స్నేహితుల సంభాషణల ద్వారా చర్చల ద్వారా మనకి అర్థం అవుతాయి. మోసే కూతురుకి గానీ నీట్యూ కొడుక్కిగానీ ఉద్యమం మీద ఆసక్తిలేదు. అతను చదువుకుని స్కూల్లో టీచరౌతాడు ఆమె స్వంతంగా నేత పని ప్రారంభిస్తుంది వాళ్ళిద్దరూ పెళ్లిచేసుకుంటారు. మోసే మనమడు నీబో(niebou) డిల్లో శ్రీరామ్ కాలేజీలో చదువుకోడానికి వెడతాడు. అక్కద ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులపట్ల, విద్యార్థినుల పట్ల తోటి విద్యార్థులూ పౌరసమాజం చూపుతన్న వివక్ష వారిపై జరిగే దాడులూ దేశంలోని వివిథ ప్రాంతాలలో వారిపై చూపుతున్న జాతివివక్ష గమనిస్తాడు. అవడానికి తామందరూ భారత పౌరులే మరి!

ఒక దశలో చదువుమానుకుని వెళ్లిపోదాం అనుకుంటుండగా అతనికి రాకేశ్ అనే సహవిద్యార్థితో పరిచయం అవుతుంది. అతను అరవైల్లో నాగాల్యాండ్ లో పనిచేసిన హిమ్మత్ అనే ఆర్మీ కమాండెంట్ మనుమడు. ఆయన్ని కలుస్తాడునీబో. రిటైరైన హిమ్మత్ కి నాగాల్యాండ్ అంటే ఇష్టం ఆయన ద్వారా ఆర్మీ దృష్టి నుంచీ నాగా ఉద్యమాన్నీ ప్రభుత్వ వైఖరినీ చూస్తాం మనం. చాలాకాలం ఇంటికి దూరంగావుండడం కొత్త ప్రదేశం కొత్త భాష, తమలో ఎవరికి ఏం జరిగినా రెచ్చిపోయి కాల్పుల జరపడం వంటి సైనికుల మానసికావస్థలను గురించి చెప్పి అప్పటి సైనికుల చర్యల గురించి, “నేను ప్రభుత్వ ఆజ్ఞాబద్ధుడను.” అంటాడు. కానీ నాగాఉద్యమాన్ని సమర్థిస్తాడు. అజ్ఞాత సైనికుడైన మోసేని చూడాలనుకుంటాడు. మోసే 2007 లో హత్య కి గురౌతాడు. నాగా ఉద్యమ చరిత్రే కాదు, మొత్తం కుటుంబసభ్యుల మధ్య స్నేహితుల మధ్య భార్యాభర్తల మధ్య అత్తాకోడళ్ల మధ్య పిల్లల తల్లితండ్రుల మధ్య ప్రేమానురాగాలు ఎట్లా వుండాలో చెబుతుందీ నవల. అందరూ ఆలోచనాపరులే. అందరూ మనుషుల్ని ప్రేమించేవారే. చివరికి తన తాత మోసే ని చంపిన వారి మీద కూడా ప్రతీకారం తీర్చుకోదలుచుకోలేదు నీబో.

ఫాక్షనిష్టులేం చేశారు?

దుకాణాలపెట్టుకునో మరో విధంగానో బ్రతుకుతున్న సీనియర్ ఉద్యమకారులపై దాడులు చేశారు అవమానించారు. కొంతమందిని చంపారు. బాగా చదువుకుని అందమూ ఆస్తీ వుండికూడా ఉద్యమంలో చేరి ఫాక్షన్ల మధ్య ఐక్యతకోసం ప్రయత్నించిన మాయంగర్ అనే యువకుణ్ణి హత్య చేసారు. అటు ప్రభుత్వమూ ఇటు ఫాక్షనిష్టులూ కూడా మోసే వంటి పాత ఉద్యమకారులపై నిఘా పెట్టారు. బలవంతపు వసూళ్ళకి దిగారు. దీనివలన నాగాప్రజలుకూడా ఇన్సర్జెన్సీని సమర్థిస్తున్నారని ఇండియన్ ప్రెస్ లో వార్తలొచ్చాయి. కిల్లీ కొట్టుపెట్టుకుని జీవిస్తున్న బీహారీ యువకుడిని డబ్బు కోసం కాల్చబోతే అడ్డుపడబోయిన మోసేని కాల్చేశారు. జనం మధ్యలో నిర్భీతిగా కాల్పులు జరిపి తుపాకి భుజానికి ఆనించుకుని వెళ్ళిపోయారు.

ఇప్పుడు చీలిపోయిన ఉద్యమ గ్రూపులన్నింటినీ ఒక చోటికి తెచ్చి వాళ్లమధ్య అవగాహన కల్పించే శాంతి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హత్యల కొంత తగ్గినట్లే కనిపిస్తున్నాయి. ఈ కన్నీటి కల్లోల ప్రాంతంలో శాంతి ప్రసరించే ఛాయలు కనపడుతున్నాయని ముందుమాటలో అంటుంది ఈస్టరీన్. ఈ నవలలో ప్రధాన పాత్ర అయిన మోసే తన బంధువు దే దేననీ సంఘటనలన్నీ యదార్థాలనీ చెప్పింది. ఇందులో హిమ్మత్ కూడా నాగాల్యాండ్ లో పనిచేసి వెళ్ళిన ఒక కమాండెంట్ కు పేరు మార్పేననీ అన్నది. ఈ పుస్తకం చివర పొందుపరిచిన నికేతు ఇరాలు ప్రసంగంలో ఇట్లా అంటాడు, “సార్వభౌమత్వం కాకుండా మరేదైనా అంగీకరించడానికి నాగాలు సిద్ధంగా వుంటే డిల్లీతో ఒక గౌరవనయమైన అంగీకారయోగ్యమైన అవగాహనకు రావడం కష్టం కాదు.అది ఇరువైపులకు మంచిది….ఇప్పుడు చీలిపోయిన ఉద్యమ గ్రూపులన్నీ ఒక అవగాహనకు వచ్చి డిల్లీతో ఒక ఒప్పందానికి రావడం మంచిది తరవాతేం చెయ్యాలో భవిష్యత్తు తరాలు నిర్ణయించుకుంటాయి. ఇప్పుడు కావాల్సింది శాంతి, అభివృద్ధి.”

యుద్ధాలు నిర్ణయించేది సైనికులూ కాదు ప్రజలూ కాదు రాజకీయ నాయకులు, అని అర్థం అయింది వాళ్లకి.

“బిట్టర్ వర్మ్ వుడ్” అనేది ఘాటైన వాసన కల ఆకులున్నఒక మొక్క మనకు దొరికే దవనం, మాచిపత్రి జాతికి చెందినది. దీని పసరు గాయాలను మాన్పుతుంది. అంతేకాదు ఒక రెమ్మ జేబులో పెట్టుకున్నా దుష్ట శక్తులని అడ్దగించే రక్షరేకులా పనిచేస్తుంది. మనం కూడా దుశ్చర్యలకు పాల్పకుండా చేస్తుందని నమ్ముతారు నాగాలు. “ఇపుడదే కావాలి మనకి,” అంటుంది రచయిత్రి. ఈ శీర్షిక ఒక మెటఫర్. ఉత్సుకతతో చదివించే నవల.

చీర చెప్పిన కథ!

bhuvanachandra“నిజంగా మీ పేరు బయటికి రానీను… కానీ… నిజం మాత్రమే చెప్పాలి.. సరేనా?”

“అలాగే.. నేను పుట్టిన వూరు ‘క’తో మొదలవుతుంది. బాగా ధనవంతులం కాదుగానీ ఏదడిగినా ‘లేదు’ అనకుండా మా అమ్మానాన్న పెంచారు.. గొప్పగానే పెరిగాను. ఓ క్షణం మౌనంగా వుండిపోయింది కమల.

” ఊ.. తరవాత?” అడిగాను.

“9thలో పెద్దమనిషినయ్యాను. అప్పటిదాకా నా గురించి నేనేం పట్టించుకోలేదనే చెప్పాలి. పెద్దమనిషి అయ్యాకే మొట్టమొదటిసారి నేను ‘అందగత్తె’నని నాకు తెల్సింది… నాకే కాదు మా ఊరందరికీ కూడా తెలిసింది..” నవ్వింది.

ఆ నవ్వులో ఓ నిర్లిప్తత వుంది. నేను మౌనంగా కూర్చున్నా.

” ఓ మాట చెప్పనా.. తను అందగత్తెనని ఆడదానికి ఎప్పుడు తెలుస్తుందో అప్పటినించే మనసు వెర్రితలలు వేస్తుంది. దానికి నేనే ఉదాహరణ. చదువుమీద నాకు తెలీకుండానే శ్రద్ధ తగ్గింది. అప్పటిదాకా అసలు పేరే తెలియని క్రీములూ, పౌడర్లు, నెయిల్ పాలిష్‌లూ వాడటం మొదలుపెట్టి ఎవరు నా వంక మళ్ళీ మళ్ళీ తిరిగి చూస్తున్నా పొంగిపోయేదాన్ని!” మళ్ళీ నవ్వింది. ఆ నవ్వులో ‘గతపు’ కమల ప్రతిఫలించింది.

“అలాంటి అలంకార సామగ్రి అందరూ వాడేదేగా.. అలాగే ఏ ఆడపిల్ల ఐనా అందంగా వుంటే జనాలు వెనక్కి తిరిగి మళ్ళీ మళ్ళీ చూడటం ఆ పిల్ల పొంగిపోవటమూ సహజమేగా?” మామూలుగా అన్నాను.

“మీరొకటి మర్చిపోతున్నారు.. అప్పటి నా వయసు గురించీ, ఆ వయసులో కలిగే భావాల గురించి ఆలోచించండి. నేను ఏ స్టేజికి చేరుకున్నానంటే ఏ కుర్రాడైనా నా వంక చూడకపోతే అది ప్రెస్టీజ్‌గా తీసుకుని , ఎలాగైనా వాళ్ల అటెన్షన్ నా మీద పడేట్టు చేసుకునేదాన్ని. అప్పటికిగానీ నా ‘ఈగో’ చల్లారేది గాదు!”

పరీక్షగా ఆమె వంక చూశా. ఆ కన్ను ముక్కు తీరూ, ఆ పెదవుల వొంపూ, శరీరాకృతీ చూస్తే ఇప్పటికీ అంటే యీ వయసుకీ ఆమె అందంగానే వుందని చెప్పుకోవాలి. నలభై దాటాయి గనక శరీరం వొడలటం, అందం అలవటం తెలుస్తోంది. అలిసిపోయినా అందం అందమేగా. “కాలేజీ కొచ్చేసరికి నా శరీరాకృతి ఎంత అందంగా తయారైందో, నా మనసు అంతకన్నా ఎక్కువ అహంభావంతో నిండిపోయింది. డబ్బుకి పెద్దగా లోటు లేదు గనక నన్ను పొగిడే స్నేహితురాళ్ళనే చుట్టూ వుంచుకునేదాన్ని. వాళ్లకీ సరదాలు వుండేవి గనక నేను ఎక్కడికెళ్తే అక్కడికి నాతో వచ్చేవాళ్ళు…!”

“ఊ…”

“అప్పుడు పరిచయమైనవాడే మధు. చదువులో మా కాలేజీలోనే బెస్ట్. చదువుతున్నది డిగ్రీ అయినా అపారమైన తెలివితేటలుండేవి.

మా కాలేజీ లైబ్రరీలో ఏ పుస్తకం ఎక్కడుందో చెప్పగలిగినవాడు అతనొక్కడే. అంతే కాదు ఎంత ప్రయత్నించినా నన్ను పట్టించుకోనివాడు అతనొక్కడే!”

“తరవాత?”

“కాలేజీ యానివర్సరీ ఫంక్షన్‌లో ఓ నాటకం వెయ్యాల్సి వచ్చింది. దాన్ని సులభమైన వ్యావహారిక భాష లో రాసిందీ, డైరెక్ట్ చేసిందీ కూడా మధునే.శకుంతలగా నన్ను వెయ్యమన్నారు. మధు దుష్యంతుడుగా వేస్తేనే నేను వేషం వేస్తాననీ లేకపోతే వెయ్యననీ పంతం పట్టాను.!” అన్నది కమల. ఆమె చూపులు ఎక్కడో వున్నాయి. నాకు నవ్వొచ్చింది.

“కమలా.. యీ ఇన్సిడెంట్ మాత్రం కొంచెం సినిమాటిక్‌గా ఉంది సుమా!” అన్నాను.

“సినిమా జీవితం కాకపోవచ్చుగానీ, జీవితం మాత్రం సినిమాలాంటిదే కవిగారు!” ఆమె గొంతులో కొంచెం కోపం.

” ఆ విషయం ప్రస్తుతానికి వొదిలేద్దాం. సరేనా.. సారీ. ఇప్పుడు చెప్పండి. మధుగారు దుష్యంతుడుగా వేశారా?”

“పంతం పట్టానన్నాగా. వెయ్యకుండా ఎలా ఉంటాడూ? ఆ సందర్భాన్ని ‘చనువు’గా మలుచుకున్నాను. అప్పుడే ఓ సంఘటన నా జీవితాన్ని సంపూర్ణంగా మార్చేసింది!” నిట్టూర్చింది.

” ఏ సంఘటన?”

” ‘ము’గారు మీకు తెలుసుగా.. ది గ్రేట్ హీరో. ఆయన మా కాలేజీ పూర్వ విద్యార్థి కావటంతో ఆయన్నీ యానివర్సరీకి ఆహ్వానించారు. మా శకుంతల నాటకం చూసి నా అందమూ, నటనా, ఆ నాటకానికే ఓ ‘వన్నె’ తెచ్చాయనీ, నేను ఫిలిం ఫీల్డులోకి వస్తే చిత్ర పరిశ్రమ నన్ను చేతులు జాచి ఆహ్వానిస్తుందని అన్నారు. ఆ పొగడ్తలకి నేను పూర్తిగా ‘ఫ్లాట్’ అయిపోయాను. అంతేగాదు మధులో గొప్ప రచయిత వున్నాడనీ, అతను సినిమాల్లోకొస్తే ఆత్రేయగారంత పేరు తెచ్చుకొనగలడనీ కూడా అన్నారు.” ఓ క్షణం మళ్ళీ మౌనం మౌనంగా నర్తించింది.

“తరవాత?”

“మధూది దిగువ మధ్య తరగతి ఫేమిలీ. రెస్పాన్సిబిలిటీసూ ఎక్కువే. కానీ నేను పెంచుకున్న ‘చనువు’తో అతనిలో ఓ కొత్త ఉత్సాహం ఉప్పొంగింది. మావాళ్ళు సాంప్రదాయాల్ని బాగా పాటిస్తారు. నేను నాటకంలో వేషం వెయ్యడం వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. అందుకే పెళ్ళి సంబంధాలు చూడటం మొదలెట్టారు. కానీ అప్పటికే నేను ‘హీరోయిన్’ కావాలని ఫిక్సైపోయా. బలవంతాన మధూని ఒప్పించి చాలా డబ్బు, నగలతో మద్రాసు పారిపోయా…!”

“ఓహ్..! సామాన్యంగా ఇలాంటి పని మగవాళ్లు చేస్తారు.”

“ఆశకి మగా, ఆడా తేడా లేదు కవిగారూ. టి నగర్. ఆనందన్ స్త్రీట్‌లో ఒక సింగిల్ బెడ్‌రూం అపార్ట్‌మెంట్ తీసుకున్నాం. మీకు నేను గుర్తుండకపోవచ్చుగానీ, మీ మొదటి సినిమా ‘నాకూ పెళ్ళాం కావాలి’ ప్రొడక్షన్ ఆఫీసూ అదే స్ట్రీట్‌లో ఉండేదిగా? చాలా సార్లు మిమ్మల్ని చూశాను. మీ ఆఫీసులోనూ వేషం కోసం ప్రయత్నించా!” నవ్వింది కమల.

“నిజంగా? గాడ్… నాకు తెలీనే తెలీదే!” ఆశ్చర్యపోయాను.

“ఆశ్చర్యం ఎందుకూ? అందరూ మీలాంటి అదృష్టవంతులు కారుగా. సరే, మాట ఇచ్చాడు గనక మధు వచ్చాడు గానీ, అతనికి ఇలా ఆఫీసుల చుట్టూ తిరగడం ఇష్టం లేకపోయింది. మూడు నెలలు కలిసి ఒకే బెడ్‌రూం ఫ్లాట్‌లో వున్నా అతను నన్ను కనీసం ‘టచ్’ కూడా చెయ్యలేదంటే నమ్ముతారా?”

“నమ్ముతా.. ఎందుకంటే పెళ్ళి చేసుకుని కూడా దశాబ్దాల పాటు ఒకేచోట వున్నా ప్రేమకి తప్ప శరీరాకర్షణకి లోబడని ‘జంట’ నాకు తెలుసు. వారి జీవితం జగద్విదితం..!”

“నాకే జాలేసి అతన్ని వెళ్ళిపొమ్మన్నా.. మరో ‘పైకి రాగలడనుకున్న’ యువకుడ్ని నా లివింగ్ పార్ట్‌నర్‌గా చేసుకున్నాను. ఓ రోజు రంగరాజపురం రోడ్డులో ‘ము’గారు కనిపిస్తే ‘గతం’ గుర్తు చేసి ఏమన్నా వేషం ఇప్పిస్తారేమోనని అడిగా. చిత్రమేమిటంటే ఆయనకి శకుంతల గుర్తుందేమోగాని ఆ వేషం వేసిన ‘కమల’ గుర్తులేదు. పైగా, “చూడమ్మా..అనేక ఫంక్షన్స్‌కి పిలుస్తారు. కొన్నిటికి వెళ్ళక తప్పదు. నీ విషయమే తీసుకో. ‘స్టేజీ’ మీద నువ్వు బాగా చేసి వుండొచ్చు. ఓ ‘మాదిరి’గా చేసినా మిమ్మల్ని ప్రోత్సహించడం కోసం మేము మెచ్చుకుంటాం. దాన్నే ఓ ‘డిగ్రీ’ గా భావించి ఇలా వచ్చేస్తే ఎలా? హాయిగా ఇంటికెళ్ళి పెళ్ళి చేసుకుని పిల్లా పాపల్తో వుండు” అని ఓ సలహా పారేసి తన దారిన తాను పోయారు!” సుదీర్ఘంగా నిట్టూర్చింది

కమల.

“ప్రస్తుతం పరిస్థితి ఏమిటి?”

“నేను ‘లేచిపోయానని’ మావాళ్లు మా వూళ్ళో తలెత్తుకోలేక వున్నవన్నీ అమ్మేసి ఇప్పుడు ‘బళ్ళారి’ దగ్గర ఓ విలేజ్‌లో వుంటున్నారు. నేను వెళ్ళినా నా మొహం చూడరని నాకు తెల్సు. అలాగే ఎవరు ‘పైకి’ వస్తాడని భావించి నా లివింగ్ పార్ట్‌నర్‌గా చేసుకున్నానో అతను నిజంగా పైకి వచ్చాడు. హీరోగా కూడా చేశాడు. పేరు ‘ర’ తో మొదలవుతుంది. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చాలా విభాగాల్లో చాలా వ్యాపారాలు చేస్తున్నాడు.

“ఊ.. అతను మిమ్మల్ని ఎంకరేజ్ చేయ్యలేదా?” అడిగాను.

“నా నగలన్నీ అయిపోయేవరకూ ‘ఎంకరేజ్’ చేస్తూనే వున్నాడు. అతనికి మరో ‘నిచ్చెన’ దొరగ్గానే నన్నొదిలేసి అక్కడ చేరాడు. అయితే ‘ఆమె’ చాలా టఫ్. ఇప్పుడు అతని భార్యా, అతని పిల్లలకు తల్లి ఆవిడే!” నవ్వింది . ఆ నవ్వులో సంతోషము లేదు. దుఖము లేదు.

“ఫ్యూచర్ సంగతి ఏమిటి?” అడిగా.

“నిజం చెబితే నా వయసిప్పుడు నలభై ఆరేళ్ళు. అందరికీ నలభై అని చెపుతున్నాననుకోండి…. ! ఒక్క సంవత్సరం ఓపిక పట్టి నా డిగ్రీ పూర్తి చేసి వుంటే నా జీవితం మరోలా వుండేది. ఎక్కడో చదివా.. “ఎంత ముందుకొచ్చావంటే వెనక్కి తిరిగి వెళ్లలేనంత. వెళ్లినా ఎక్కడ్నించి పయనం మొదలైందో అక్కడికి చేరలేనంత!” అని . సో. ఫ్యూచర్ గురించి ఆలోచనే లేదు. ఊ..! చదువు కొద్దో గొప్పో వున్నది గనక నా జీవితాన్ని ఓ పుస్తకంగా అంటే ఓ బుల్లినటి ఆత్మకథగా తీసుకురావాలని వుంది. తేవొచ్చా?” నవ్వింది .

“ఎందుకు తేకూడదు?”

“ఆత్మకథలు గొప్పవాళ్లకేగా!. వాళ్ల జీవితాలైతే అందరూ చదువుతారు. నాలాంటివాళ్ల జీవితకథలు ఎవరు చదువుతారు ?”

“కమలగారూ.. నిజం చెప్పనా… ఆకాశాన్ని ఆక్రమించిన చెట్టుకైనా వేళ్ళు భూమిలోకే ఉంటాయి . ఆకులూ, కొమ్మలూ కాదు ఆత్మకథంటే.. ఆ చెట్టుకి పునాది అయిన వేళ్ళ కథలు. ఆ ‘వేళ్ళ’ కథలు చెట్టు చెబితేనే గానీ తెలీదు. కొమ్మల్ని బట్టి, కాండాన్ని బట్టి చెట్టు వయసునీ, గొప్పతనాన్నీ వూహించవచ్చు. కానీ ఎన్ని పురుగులు తల్లి వేరుని, మిగతా వేళ్లనీ కొరికాయో, కొరికే ప్రయత్నం చేశాయో ఆ చెట్టుకి తప్ప ఎవరికీ తెలీదుగా! తప్పక రాయండి. ఒట్టేసి చెబుతున్నా. మీ ‘స్క్రిప్టు’ మొదట నేను చదువుతా!” సిన్సియర్‌గా అన్నాను.

“వేరు పురుగుల గురించేగా రాయాల్సింది. అదీ తప్పే. నాకు ఇష్టం లేకుండా ఏదీ జరగలేదు. ఏ తప్పు జరిగినా నాకు తెలిసే జరిగింది. అందుకే నేనెవరినీ నిందించాలని అనుకోవట్లా. కానీ, జరిగింది జరిగినట్లు మాత్రం రాస్తాను.”

“గుడ్. నిజాన్ని నిజంగా వ్రాయగలగడం అంత కష్టం మరొకటి ఉండదు. చాలా ధైర్యం కావాలి!”

“అది వుంది లెండి. ఇంతకీ నేను వ్రాయబోయే కథలపేరు తెలుసా?”నవ్వింది. ఆ నవ్వులో చిన్న చిలిపిదనం దోబూచులాడింది.

“చెప్పండి!” ఉత్సాహంగా అన్నాను.

“చీర చెప్పిన కథలు!” పకపకా నవ్వింది.

 

*******************************************

 

అయ్యా… కమల ఇంకా మద్రాసులోనే ఉంది. ‘మధు’ ప్రస్తుతం ఓ గొప్ప కాలేజీలో లెక్చరర్‌గా ఉంటూ ఆ జాబ్ వదిలేసి ఆస్త్రేలియా వెళ్లాడట. ‘ది అన్‌టోల్ద్ స్టోరీస్’లో ఉన్న వ్యక్తులందరూ ప్రస్తుతం మన మధ్య వున్నవాళ్ళే. కొంతమంది ‘పర్మిషన్’ ఇస్తామన్నారు. ఇస్తే వారి ఫోటోల్ని, సెల్ నంబర్స్‌ని కూడా ప్రచురించడం జరుగుతుంది. బహుశా ఈ శీర్షిక మీకు నచ్చవొచ్చనే అనుకుంటున్నాను. వీలున్నంతవరకూ ‘చీకటి’ వ్యవహారాల్ని ‘రాత’లోనే ‘ఎడిట్’ చేశానని మనవి చేస్తూ (పేర్లు మార్చానని చెప్పక్కర్లేదుగా)…

మీ భువనచంద్ర…

స్త్రీలున్నంత కాలం స్త్రీవాదమూ ఉంటుంది: ఓల్గా

IMG_1530

తెలుగు సాహిత్య లోకం లో స్త్రీవాదం లో తనదంటూ ఒక ముద్ర వేసుకున్న ఓల్గా గారిని కలవడానికి వెళ్ళడం అతి ముఖ్య విషయంగా మూడు వారాలుగా నాలో నేను తర్కించుకుంటూ, నాకు నేను సలహాలిచ్చుకుంటూ గడిచింది. హైదరాబాద్ లో ఈస్ట్ మారేడ్ పల్లి లోని ‘అస్మిత’ కు వచ్చి కలవమంటూ ఓల్గా గారు ఫోన్ లో టైం ఇచ్చాక,  మొదటిసారిగా ఆమెను కలుస్తున్న అనుభూతి కొంచెం భయపెట్టిన మాట నిజమే. అస్మిత కు వెళ్ళే ఓల్గా గారి గురించి వెయిట్ చేస్తు, ఎంత గంభీరంగా వుంటారో, ఎలా ప్రశ్నలు వెయ్యాలో, యేం చెపుతారొ అన్న గుంజాటన మనసులో !

ఎప్పుడు లిఫ్ట్ తెరుచుకున్నా చేతిలోని ప్రశ్నల పేపర్ సరి చేసుకుంటూ, ఆమే నేమో అని అటన్షన్ లోకి రావడం… వేరే ఎవరో రావడం… ఒక అరగంట గడిచాక, ఓల్గా గారిని లిఫ్ట్ లోనుండి రావడం చూసి, సాహితీ వనంలో విచ్చుకున్న గులాబి గుర్తొచ్చింది. విష్ చేశాను. ఇంటర్వ్యూ ఎంత సేపు పడుతుంది అన్నారు. ఒక గంట పట్టొచ్చన్నాను. నా చేతిలో అప్పటికే వున్న పేపర్ తీసుకుని, చూసి, “ఓ ప్రిపేర్డ్ గా వచ్చారా?” అని చిన్నగా నవ్వి, ప్రశ్నలన్నీ చూసి, లోపలికి వెళ్ళి ఆఫీస్ రూం లో కూర్చుందామన్నారు. అలా మొదలైన ఇంటర్వ్యూ శీతల సెలయేరులా ప్రశ్న తరువాత సమాధానం లా సాగిపోయింది.

ప్రతి పదం లోనూ ఒక పట్టుదల, జీవితాన్ని చదివిన అనుభవం, పదాల్లో పలుకుతున్న ఉద్విగ్నత, స్త్రీవాదం పట్ల విపరీతమైన నిబద్ధత — వీటి ప్రతి రూపమే ఓల్గా గారి సాహితీ సృష్టి అనిపించింది. ఆమె జవాబులు చదివితే మీరు కూడా నాతో అంగీకరించక తప్పదు.

 

Q ఒక రచయిత్రిగా మీది సుదీర్ఘమయిన ప్రయాణం. ఈ ప్రయాణం మొదలు పెడ్తున్నప్పుడు సాహిత్యం పట్ల వున్న అభిప్రాయాలూ, ఆకాంక్షలూ ఇప్పుడు ఏ విధంగా మారాయి?

అపుడు ఇప్పుడు కూడా మౌలికమైన తేడాలు లేవు. నేను రాయడం మొదలుపెట్టినప్పుడు సమాజం సాహిత్యం పై ప్రభావం చూపిస్తుంది,  సాహిత్యానికి ఒక ప్రయోజనం వుంది,  ఆ ప్రయోజనం నెరవేర్చడం కోసం రచయితలు రాయాలి అనే ఒక సామాజికమైన అవగాహనతోనే వుండేదాన్ని. నేను చదువుకునే రోజుల్లో కూడా సమాజం తో ముడివేసుకున్న సాహిత్యం ఎక్కువ ఇష్ట పడే దాన్ని. కేవలం కాల్పనిక నవలలే కాకుండా వాస్తవిక జీవితం, సమాజం, వాటిలో రావాల్సిన మార్పులు, వీటిని గురించి ఆలోచించే సాహిత్యాన్నే ఇష్ట పడేదాన్ని.

అటువంటి సాహిత్యాన్ని రాయాలనే నా రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టాను. ఇప్పుడుకూడా అదే కొనసాగుతోందీ.  ఈ ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుండీ అప్పటికీ ఇప్పటికీ సాహిత్యం పట్ల నాకున్న అభిప్రాయాల్లో  మౌలికమైన భేదాలేమీ లేవు

Q మీరు వొక మార్క్సిస్టు శిబిరం నించి వచ్చారు. ‘నేను స్త్రీవాదిని కావాలి ’ అనే భావన మీలో బలంగా ఎప్పుడు కలిగింది?

నేను మొదటి నుంచి మార్క్సిస్ట్ ని .  విద్యార్థి గా వున్నప్పుడు  స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తర్వాత CPM CPML PARTY వీటితోటి సంబంధాలు కలిగి వుండటం ఇవన్నీ నన్ను మార్క్సిస్ట్ దారిలో నడిచేలా చేశాయి. వాటినన్నింటిని  తలుచుకుంటే ఇప్పటికీ ఇష్టమే. నాకు ఆ పునాది చాలా ఉపయోగపడింది.

ఆరోజుల్లోని సమాజాన్ని అర్థం చేసుకోవడానికి నాకు మార్క్సిజం చాలా ఉపయోగపడింది. విప్లవ రచయితల సంఘం లో గానీ, జనసాహితీ సంఘం లో పనిచేసినపుడు గానీ విప్లవ పార్టీల్లో వున్న వాతావరణాన్ని చూసినప్పుడు కానీ అక్కడ కూడా స్త్రీల సమస్యల పట్ల అవగాహన సరిగ్గా లేదని అర్థమయింది . స్త్రీ పురుష సమానత్వమనేది ఆ సంఘాలలో కూడా లేదు. మొత్తం సమాజాన్ని ఒక సమ సమాజం వైపు నడిపించాలనే ఆశయం తో బయల్దేరినటువంటి పార్టీలలో గానీ సంఘాలలో గానీ సమానత్వాన్ని గురించిన స్పృహ లేకపోతే వాళ్ళు యేం చేయగలుగుతారు అని నాకు ఆలోచన కలిగింది. అప్పుడు నేను,  నాలాంటి కొంతమంది ఈ విషయాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టాం.

ఆ ప్రశ్నల్ని వాళ్ళూ సహించలేక పోయారు. పురుషాధిపత్యం వంటి పదాలను కూడా అక్కడ వాడకూడదు. ” అలాంటి మాటలు వాడటం వల్ల  ప్రధాన విప్లవం అంతా పెడత్రోవ పడుతుంది. మనం ముందు విప్లవం తెస్తే తర్వాత స్త్రీ పురుష సమానత్వం దానితో పాటే వస్తుంది”  అనే సమాధానాలు తప్ప, స్త్రీల సమస్య ఒక ప్రత్యేకమైనటువంటిదనీ, స్త్రీల అణచివేత పితృస్వామిక సమాజం లో ఎలా జరుగుతుందన్న చర్చగానీ, అసలిది పితృస్వామిక సమాజమనే గుర్తింపు గాని, ఇవేమీ అస్సలు లేవు. అటువంటి సమయం లో నేను వాటి గురించి ప్రశ్నించాను.  వాళ్ళ సమాధానాలతో తృప్తి పడకపోవడంతో అక్కడ ఇమడలేకపోయాను. రాజీనామా చేసి ఆ సంఘాలు అన్నిటి నుంచీ బయటకు వచ్చాను.

అలా విడిగా వచ్చిన తర్వాత, నాకు ఒకసమస్య. నేనేమిటి అనే నా అస్తిత్వ సమస్య . ఇంతకాలం నేను ఒక సిద్ధాంతానికి పని చేశాను. ఒక పార్టీని ఇష్టపడ్డాను. కొన్ని సంఘాల్లో పని చేసాను. వాటన్నిటినుంచీ బైటకు వచ్చి నిలబడ్డాను. మామూలుగా నా ఉద్యోగాన్నిచేసుకుంటూ.. మామూలు గా బ్రతికేసెయ్యొచ్చు. లేదా  స్త్రీల సమస్యల పునాదులు అన్వేషిస్తూ, విశ్లేషణ గురించి ఆలోచిస్తూ నా దారి నేను వేసుకోవాలా ? అనే ఆలోచనలు. దాదాపు ఒంటరితనమే వుంది. ఏది యేమైనా స్త్రీల సమస్యల ను గురించి దాని విశ్లేషణా పద్ధతుల గురించి ఆలోచించాను. వున్న మార్గాలన్నిటిలోంచి స్త్రీ వాదాన్ని ఎంచుకున్నాను. అంతకు ముందుఉన్నది  వామపక్ష రాజకీయాలైతే,  బయటకు వచ్చాక నేను స్త్రీ వాద రాజకీయాల వైపు వచ్చాను. స్త్రీ వాదిగానిలబడ్డాను.

అది ఒక సంఘర్షణ. అది ఒక రోజులో అకస్మాత్తుగా వచ్చింది కాదు. సంఘాల్లో పనిచేసిన రోజుల్లోనూ సంఘర్షణ వుంది. బైటికి వచ్చాకా సంఘర్షణ వున్నది. స్త్రీవాదిగా మారుతూ.. క్రమంగా ఆ రాజకీయాల్లోకి లోతుగా వెళుతూ వుండటం లోనూ ఆ సంఘర్షణ వున్నది. అది ఒక ప్రాసెస్. ఆ క్రమం లో నేను స్త్రీ వాదినయ్యాను.

Q రచన విషయంలో స్త్రీ-పురుష తేడా పనిచేస్తుందని మీరనుకుంటున్నారా?

స్త్రీలు తమ వేదనల్ని చాలా కాలం పాటూ వ్రాయ లేదు. పురుషులే స్త్రీల తరుఫున చాలా కాలం పాటు వ్రాశారు. ఒక్క సారి స్త్రీలు గొంతు విప్పిన తరువాత స్త్రీలు రాస్తే ఎలా వుంటుందీ అనేది తెలిసింది కదా. పురుష రచయితల్లో కూడా స్త్రీల పట్ల చాలా సానుభూతితో రాసిన వాళ్ళున్నారు. మన చలం గారు, గురజాడ, కొడవటిగంటి ఇలా అనేకమంది వున్నారు. అలాగే స్త్రీ రచయితలూ చాలా మంది వున్నారు. ఐతే వీళ్ళల్లో చూసినప్పుదు స్త్రీలు తమ స్వీయానుభూతిని చెప్పుకునేటప్పుడు వచ్చే  ఒక ఆర్తి,  తమకేం కావాలో స్వయంగా ఆలోచించుకుని వ్యక్తం చేస్తున్నప్పుడు ఆ తేడా వుంటుంది. ఒక్కొక్కసారి పురుషులు కూడా ఆ తేడాను జయించి రాసినటువంటి సందర్భాలూ కొన్ని రచనల్లో వుంటాయి.

స్త్రీలు తాము స్త్రీలుగా కాకుండా పురుషులు ఆలోచించినట్లు రాసిన సందర్భాలూ వుంటాయి.

స్త్రీ వాదిగా రాస్తున్నామా లేక పోతే మామూలు రచయితగా రాస్తున్నామా – అలాంటప్పుడు మామూలుగా పురుషులుగా రాస్తున్నట్లే రాయొచ్చు. మామూలు నవలలు రాసే రచయిత్రులుంటారు కదా! వాళ్ళకీ పురుష రచయితలకీ పెద్ద తేడా లేదు. వాళ్ళు స్త్రీని అర్థం చేసుకుంటూ వర్ణించినట్లే వీళ్ళు కూడ వుంటారు. స్త్రీ వాది గా రాసినప్పుడు, రాసినది స్త్రీ అయినా పురుషుడైన ఒక స్త్రీ వాది రాసినట్టుగా తెలుస్తుంది. పురుషులు కూడా స్త్రీ వాదులు కావొచ్చు. ఫెమినిస్ట్ అనేది స్త్రీలే అవ్వాలని లేదు. పురుషులు కూడా ఫెమినిస్టులు అవ్వొచ్చు. అలా ఫెమినిస్ట్ దృక్పథం తో రాసినప్పుడు ఆ రచన ఒక ప్రత్యేకమైన రచనగా కనపడుతుంది.

Qమీరు మొదట కవిత్వం రాశారు, తరవాత వచనంలోకి మళ్ళాలి అన్న ఆలోచన మొదట ఎప్పుడు కలిగింది?ఎందుకు కలిగింది?

రాయడం కవిత్వం తోనే ప్రారంభమైనా, నేనేదో గొప్ప సాహిత్య కారిణి కావాలని నాకెప్పుడూ వుండేది కాదు. సాహిత్యం అంటే ఇష్టం.  ఏదో రాసేస్తాను. నేను నమ్మినది స్త్రీ వాదాన్ని. అప్పట్లో ఆంధ్ర దేశంలో స్త్రీవాదమంటే పెద్దగా తెలియదు. ఎనభయ్యవ దశకం లో అప్పుడప్పుడే స్త్రీవాద ఆలోచనలు మొలకెత్తుతున్నాయి. ఎప్పుడైతే నేను బయటకు వచ్చేసి స్త్రీ వాదిగా నిలబడ్డానో నాకుగా నేను సమాధానాలు వెతుక్కుని, దొరికిన సమాధానాలు నలుగురితోటి పంచుకోవాలి. అందుకు సాహిత్యం మంచి సాధనం. అందులో నాకు ప్రవేశమూ వుందీ. ఆసక్తీ వుందీ. అభినివేశమూ వుంది. కాబట్టి, దాన్ని ఒక సాధనం గా తీసుకుని పని చెయ్యాలనే ఆలోచన కలిగింది. అప్పుడు నేను ఎన్నుకున్నది వచనం. కవిత్వం రాస్తున్నా కూడా వచనం ఎన్నుకోవడానికి కారణం నేనెన్నుకున్న పని చాలా పెద్దది. స్త్రీ వాద సిద్ధాంత ప్రతి పాదన చెయ్యాలి. సిద్ధాంతాన్ని తెలుగులో తీసుకురావాలి. అప్పటికింకా తెలుగులో స్త్రీవాద సిద్ధంతాన్ని ప్రతిపాదించే పుస్తకాలు లేవు.

ఇంకొకటి స్త్రీ వాద సాహిత్య విమర్శ చెయ్యాలి. స్త్రీ వాద నవలలూ కథలూ రాయాలి. ముఖ్యంగా సిద్ధాంత రచనకీ, సాహిత్య విమర్శకీ వీటన్నిటికీ వచనం బాగా ఉపయోగ పడుతుంది. అందువల్లే కవిత్వం ప్రక్కన బెట్టి, వచనం లో కథలు, నవలలూ, సాహిత్య విమర్శ, సిద్ధాంత రచన ఇంకా రకరకాల రచనా ప్రక్రియలనన్నిటినీ వాడుకున్నాను. వచనమంటే ఇష్టమని కాదు. అసలు నాకు కవిత్వమంటే ఇష్టం. వచన ప్రక్రియలోని విభిన్న అవకాశాలు నన్ను అటు మొగ్గు చూపేలా చేశాయి. అందులో ఒక సిద్ధాంత వ్యాసం రాయొచ్చు, ఒక సాహిత్య వ్యాసమూ రాయొచ్చు. ఇంకా సామాజిక విషయాల మీద వ్యాసాలు రాయొచ్చు. కథలూ నవలలూ రాయొచ్చు. ఇలా వీటన్నిటి కోసం నేను వచనాన్ని వాడుకున్నాను కాబట్టి నేను వచనం లో ఎక్కువ వ్రాసినట్టు కనబడుతుంది.

Qకథ, నవల; ఈ రెండు ప్రక్రియల్లో ఏది మీకు సౌకర్యంగా అనిపించింది?

నవల కన్నా కథ ఎక్కువ సౌకర్యవంతం గా ఫీలయ్యాను.

Qనవలలో కంటే కథలో మీరు మీ సైద్ధాంతిక వాదనని ఎక్కువ బలంగా పెడ్తున్నారని ఇటీవలి ‘విముక్త’ కథల్ని బట్టి అర్థమవుతోంది? అంటే, కథని మీరు మీ సైద్ధాంతిక వాదనకి సాధనంగా చూస్తున్నారా?

‘విముక్త’ కథలు చూస్తేనే అనిపించనవసరం లేదు. విముక్త కథలు ఇటీవల వచ్చినవి. నా మొట్ట మొదటి కథా సంకలనం రాజకీయ కథలు చూశారా? అందులో నా సైద్ధాంతిక ప్రతిపాదనకు రాజకీయ కథలను శక్తివంతమైన ప్రక్రియగా వాడుకున్నాను. అవి స్త్రీ శరీరాన్ని పితృస్వామిక సమాజం ఎలా అణచి వేస్తుందో, స్త్రీ శరీరం లో ఒక్కొక్క భాగం — జుత్తు, కళ్ళు, ముక్కు, నోరు, స్తనాలు, యోని — అన్నిటినీ ఎలా అణిచి వేస్తుందో ఒక్కొక్క భాగానికీ ఒక్కొక్క కథ రాసుకుంటూ వచ్చాను.

పునరుత్పత్తి రాజకీయాల గురించి భిన్న సందర్భాలనే కథా సంకలనం తీసుకొచ్చాను. అందులో కూడా పునరుత్పత్తి రాజకీయాలేమిటి, పునరుత్పత్తి ప్రక్రియ స్త్రీని అణిచివేయడానికి ఎలా ఉపయోగించబడింది, మాతృత్వం అంటే,  లైంగికత్వం అంటే యేమిటి, మానభంగాలు, ఇంకా చిన్నపిల్లల మీద అత్యాచారాలు, కుటుంబ నియంత్రణ పేరుతో జరిగే రాజకీయం వీటన్నిటినీ ఎక్స్ ప్లోర్ చేస్తూ రాసిన కథలే ‘భిన్న సందర్భాలు ‘. అప్పటి నుండీ విముక్త వరకు కూడ ఒక్కొక్క అంశాన్నే ఎక్స్ ప్లోర్ చేస్తూ రాయడానికి నాకు కథా ప్రక్రియ బాగా తోడ్పడింది.

రాజకీయ కథలు నుండీ విముక్త వరకూ ఒక ప్రయాణం. ఒక కథా ప్రయాణం. దానిలో అప్పటి నుండీ ఒక్కో కథా సంకలనంలో నా కథా సిద్ధాంతాన్ని ఒక్కో కోణం లో బలపరుచుకుంటూ వస్తున్నా.

Q సమకాలీన స్త్రీవాద సాహిత్యం నిశ్శబ్దంలోకి వెళ్లిందని అనుకుంటున్నారా? మీ తరం రచయిత్రులు, కవయిత్రులూ వున్నంత బలంగా ఇప్పటి రచయిత్రులు ఎందుకు రాయడం లేదు?

ఏం తగ్గలేదు . స్త్రీ వాద సాహిత్యం చాలా బలంగా వస్తోంది. అటు కవిత్వం లోనూ, కథల్లోనూ వస్తోంది. నవలలు ప్రచురించేందుకు చోటు లేకపోవడం , పెద్ద కధకి అవకాశం లేకపోవడం వేరే ఇతరేతర కారణాల వల్ల నవలలు జనరల్ గానే తగ్గినాయి. కథలూ కవిత్వం వ్రాసే కొత్త రచయిత్రులు చాలా మందే వస్తున్నారు. అనేక వర్గాల నుండి వస్తున్నారు. అంతకు ముందు అగ్ర వర్ణస్తులు రాసే వారు. ఇప్పుడలా లేదు. దళిత స్త్రీలు రాస్తున్నారు

అంటే స్త్రీ వాదం చాలా విస్తృతమౌతోంది. ఒకప్పుడు స్త్రీ పురుష తేడాల గురించే స్త్రీ వాదం ఎక్కువ పట్టించుకుంది. ఇప్పుడు అలా కాకుండా దళిత స్త్రీ వాదం, మైనారిటీ స్త్రీల గొంతులేమిటీ, వాళ్ళ అణచివేత ఎలా వుంటుంది, వీటన్నిం టి కీ వున్న తేడా ఏమిటి, వీళ్ళందరూ ఎవరి అస్తిత్వాలను నిరూపించుకుంటున్నారు. ఇవన్నీ ఇప్పుడొచ్చినాయి. అనేక పాయలుగా విస్తరించింది. ఇప్పుడే పవర్ ఫుల్ గా వుందీ అనిపిస్తోంది. చాల మంది దళిత కవయిత్రులు రచయిత్రులూ చాలా పవర్ ఫుల్ గా రాశారు. గోగు శ్యామల కవితా సంకలనం చూస్తే అనేక మంది దళిత కవయిత్రులు రాశారు. వాళ్ళు రాసింది ఒకటి రెండు కవితలైనా వాళ్ళ గొంతు వినిపిస్తున్నారు. సుభద్ర, శ్యామల, షాజహాన మొదలైన వాళ్ళ గొంతులు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఇలా వీళ్ళందరూ రావడానికి స్త్రీ వాదం దోహదం చేసింది. దళితవాదమూ, అస్తిత్వ స్పృహ రావడానికి కూడా స్త్రీ వాదం తోడ్పడింది.

Q ఈ తరం రచయిత్రుల్లో మీకు కనిపిస్తున్న బలమూ, బలహీనతా ఏమిటి?

ఇప్పటి రచయిత్రుల్లో తమను తాము గుర్తించుకోవాలన్న తపన, సమాజం లో తమ అస్తిత్వాన్ని గుర్తించాలన్న తపన — అదీ వాళ్ళ బలం. బలహీనత ఏమిటంటే, తమ అస్తిత్వాన్ని గురించిన తపన తో పాటు, సమాజం లో వున్నటువంటి ఇతర అస్తిత్వాల గురించిన ఆసక్తి, వాటిని తమ అస్తిత్వం తో సరి చూసుకుని (బాలెన్స్ చేసుకుని) తమతో కలిసి వచ్చే శక్తులేంటీ అనే విషయాన్ని గమనించి ఇంకా తమ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించవచ్చు.

అది బలహీనత అని కూడా అనను. బలహీనతలని చెప్పుకోవడానికి ఎన్నైనా చెప్పుకోవచ్చు. అవన్నీ బలహీనతలా కావా అని నేను చెప్పలేను. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ వాళ్ళ పరిస్థితులూ, నేపథ్యం, సామాజిక అస్తిత్వం, స్వీయ అస్తిత్వం ఇన్ని వుండీ అన్నిట్లోనుండి రాస్తున్నారు. అన్ని సంఘర్షణల్లోంచీ రాస్తున్నరు. అలా రాసేటప్పుడు వాళ్ళ ప్రయాణం లో ఒక్కొక్క సారి బలాలు బలహీనతలవుతాయి. అలాగే బలహీనత అనుకున్నది బలమూ కావొచ్చు. అందువల్ల మనం ఈ విషయాల్లో జడ్జిమెంటల్ గా వుండకూడాదు. ఇలాంటి పరిస్థితుల్లో బలహీనత ఎప్పుడైన బలహీనపడిపోతుంది. బలం ఇంకా పెరుగుతూ పోతుంది.

Q ఈ సుదీర్ఘ సాహిత్య యాత్ర మీకు తృప్తినిచ్చిందా? వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదయినా నిరాశగా అనిపిస్తున్నదా?

నా సాహిత్య ప్రయాణం నాకు తృప్తి గానే వుంటుంది.నేను కేవలం రచనే కాదు విడిగా సమాజం లో స్త్రీల కోసం పని చేస్తున్న సంస్థలు — ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్, ఇంకా స్త్రీల కోసం పని చేసే అనేక సంఘాల్లో కార్యకర్తని. అందువల్ల నాకు దొరికిన సమయంలో ఇంతే రాయగలిగాను అన్న తృప్తి వుంది. ఇంకా సమయం దొరికి వుంటే ఇంకా రాసివుండేదాన్ని.

ఒక్కో సారి అవసరం అలా రాయిస్తుంది. ఒక విషయం మీద ఫలానా వ్యాసం రాసి పంపాలీ అంటే రాసేయడం. దాన్ని చెక్కడం, శిల్పం ఇలా చూడటానికి సమయం వుండదు. కథలు అంటే రీడర్స్ ఆసక్తిగా చదవాలి అని వుంటుంది. ఎవరినుంచీ ఈ కథ ఆసక్తిగా చదివించ లేదు అన్న ఫిర్యాదు రాలేదు. ఎప్పుడూ మీ కథ మొదలు పెడితే ఆపలేము, అనే అందరూ అన్నారు  కానీ ఫలాని కథ చదవలేకపోయాము అని ఎవ్వరూ అనలేదు. నా రచనలని చూసుకుని చాలా బాగా రాశాను అనే తృప్తి కంటే నాకు దొరికిన సమయానికి తగినట్లు రాయగలిగాను అన్న తృప్తి ఉంది.

నా కథల్ని హాయిగా చదువుకోగలిగారు, ఆలోచించగలిగారు, మారగలిగారు. అది నాకు చాలా తృప్తినిచ్చిన విషయం.

Qమీ రచనల్ని గురించి క్లుప్తంగా ‘ఇదీ’ అని అడిగితే ఏమంటారు?

నా రచనల గురించి నేనేం చెప్పుకుంటాను…(నవ్వు)

నాకు స్త్రీ వాదమే సందర్భం. స్త్రీ వాద ఉద్యమమే సమయం. అదే సమయం అదే సందర్భం. అదే నేపథ్యం. స్త్రీ వాదాన్ని తెలుగు సాహిత్యం లోనూ తెలుగు సమాజం లోనూ బలమైన వేళ్ళూనాలి అనే సంకల్పంతోనే నా రాజకీయ కథలు, స్త్రీల అణచివేత, పునరుత్పత్తిరాజకీయాలు, పురుషాహంకారం, లైంగిక సంబంధాలూ, ఇలా వీటన్నిటి గురించీ, స్త్రీల పౌరసత్వ భావనలూ, వాళ్ళ మానవ హక్కులు, వీటన్నిటి గురించి రకరకాల రూపంలొ రాయడం అనేది నాకు అవసరం. కథలూ నవలలూ రాస్తే అవి చదువుకునే వాళ్ళకే చేరతాయి. అలాకాకుండా మామూలు పల్లెటూరి వాళ్ళ కోసం జానపద ట్యూన్స్ తో పాటలు,వీధి నాటికలు , రాశాను. సినిమా స్క్రిప్ట్స్ రాశాను. యుద్ధమూ-శాంతీ, లక్ష్మణ రేఖ, ద్రౌపది వంటి నృత్య నాటికలు, పిల్లలకు వుండే సమస్యల్ని చూపించే బాలల చిత్రాలకు మాటలు  రాశాను. ఉషా కిరణ్ సంస్థ లో  పని చేస్తున్నప్పుడు స్త్రీల సమస్యల్ని చూపించే సీరియల్స్ రాశాను.

కొకు బకాసుర కథని తీసుకుని దాన్ని నాటకం చేశాను. చలం గారి నవలల్లోని ఆరు పాత్రలు తీసుకుని వాళ్ళు ఒకచోట కలిస్తే ఎలా వుంటుందీ అన్న భావన ఆధారంగా రాసినది “వాళ్ళు ఆరుగురు.”

కథ, నవలలు, సినిమా, పాటలు, నృత్యం, రూపకం – ఇట్లా నేను ఉపయోగించుకోని ప్రక్రియ లేదు. ఇది నాకు తృప్తిగా కూడా వుంటుంది. చాల కష్టపడ్డాను, సంతోష పడ్డాను, బోలెడన్ని విమర్శలూ ఎదుర్కొన్నాను. కొన్నిసార్లు నా రచనల్లో నా వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడం జరిగింది. ఇట్లాంటివి జరిగినపుడు బాధగా వుంటుంది. కానీ సమాజాన్ని ఎదుర్కొని , సంస్కృతికి భిన్నంగా చూడాలనుకున్నప్పుడు రచయిత్రులు ఇట్లాంటివి ఎదుర్కోవాల్సి  వుంటుంది. ఇలాంటి సమస్యను ప్రపంచం లోని అన్ని భాషల్లోని రచయిత్రులూ ఎదుర్కోన్నారు. నేను కూడా అందులో భాగమనుకుని అలా ముందుకు సాగిపోతున్నాను.