అర్చకుల ఆందోళన…ఏ ధైర్యంతో?!

 

జి ఎస్‌ రామ్మోహన్‌   

 

rammohan

అర్చకుల్లో కొందరు పేదలున్న మాట వాస్తవం. ముఖ్యంగా చిన్నదేవాలయాల్లో, శివాలయాల్లో. నిజమే. అయితే దానికి పరిష్కారమేంటి?అర్చక సంఘాలు, ట్రెజరీనుంచి జీతాలివ్వాలా? ఇవాళ వారికి వస్తున్న జీతాలు కానీ జీతాలు ఇస్తున్న పద్ధతి కానీ సక్రమంగా లేవని వాదిస్తున్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లాగే నెలనెలా ట్రెజరీ నుంచి మెరుగైన జీతాలిచ్చే ఏర్పాటు కావాలని కోరుతున్నారు.

సమాజానికి అవసరమైన ఉత్తత్తిలో పాలు పంచుకుంటున్న రైతులు, చేనేత కార్మికులు ఏకంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఉత్పత్తి చేస్తున్నవారే మాకు ట్రెజరీ నుంచి జీతాలివ్వాలని ఇంతవరకూ కోరలేదు. ఏం ఉత్పత్తి చేస్తున్నారని పూజారులకు జీతాలివ్వాలి? గ్రామీణ సమాజపు అవశేషాలైన కమ్మరి, కుమ్మరి వంటి అనేక కులవృత్తులవాళ్లు ఆ సంకెళ్లనుంచి బయటపడి వేర్వేరు వృత్తుల్లో స్థిరపడ్డారు. కూడు బెట్టని వృత్తిని పట్టుకుని వేలాడలేదు. సంఖ్య ఎక్కువవడం వల్ల కులవృత్తులకు సంబంధించి చేనేతలోనే ఎక్కువ సంక్షోభం కనిపిస్తుంది. వారెవరూ తమకు ట్రెజరీ బెంచ్‌నుంచి జీతాలిస్తే బాగుండుననుకోలేదు. డిమాండూ చేయలేదు.

ఆలయాల ఆదాయం నుంచి ప్రస్తుతం వేతనాలుగా అందరికీ సర్దుతున్నారు. అది పూజారులకు గౌరవమైన స్థాయిలో అందడం లేదు. అది నిజమే. కానీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనాలు కావాలనడం న్యాయమైన డిమాండ్‌ అవుతుందా! సమాజానికి అవసరమైన ఉత్పత్తి చేసేవాళ్లు, శ్రమజీవులు ఎన్నడూ ట్రెజరీ జీతాలు అడగలేదు. పూజార్లు ఏ ధైర్యంతో అడుగుతున్నారు? ఈ ధైర్యం ఇంకా మన మెదళ్లలో పాతుకుపోయిన కుల గౌరవాల నుంచి వస్తున్నది. ఆ డిమాండ్‌ విచిత్రమైనదిగా కనిపించకపోవడంలో మనలో పాతుకుపోయిన బానిస లక్షణం దాగుంది. మనిషిని ఆచరణనుంచి కాకుండా పుట్టిన కులం నుంచి కుటుంబం నుంచి చూసే ధోరణి బానిస ధోరణి.

మన కళ్ల ముందే రైతులు, చేనేత కార్మికులు ఉసురు తీసుకుంటూ ఉండగానే ఎలాంటి ఉత్పత్తి చేయని కులవృత్తి వాళ్లు వీధినపడి మాకు జీతాలేవీ అంటే ఆ రైతులకు, చేనేత కార్మికుల్లో కూడా చాలామందికి పాపం అయ్యవార్లు కూడా రోడ్డుమీదకొచ్చారు అనిపిస్తుంది. ఈ పాపం అనిపించడంలో ఆర్థిక స్థితి, పేదరికం మాత్రమే పనిచేస్తే ఇబ్బంది పడాల్సిందేమీ లేదు. సాటి పేదవారి పట్ల ఎవరు కన్సర్న్‌ చూపించినా మంచిదే.

కానీ ఇక్కడ కులం పనిచేస్తుంది. అంతటివాళ్లు కూడా, అందర్నీ ఆశీర్వదించాల్సిన వారు కూడా వీధిన పడ్డారే అని మనలో తెలీని సానుభూతిని కలిగిస్తుంది. తలపై పెట్టాల్సిన చేయి మన చేయి కంటే కింద ఉంటే మనకే ఇబ్బంది అనిపిస్తుంది. అసుర చక్రవర్తి కాబట్టి బలి “ఆదిన్‌ శ్రీసతి కొప్పుపై తనువుపై పాలిండ్లపై నూత్న మర్యాదంజెందు కరంబు క్రిందగుట-మీదై నాకరంబు మేల్గాదె…” అని భక్తి పూర్వకంగానైనా అనగలిగాడు. కానీ ఏదో ఒక కులంలో పుట్టి ఆ భావాలను ఏదో రూపంలో మోస్తున్న సామాన్యులు భూసురుల చేయి కిందయితే తట్టుకోలేరు. పేదపూజార్లకు దానమిచ్చి భోజనం పెట్టి పాదాభివందనం చేసే సంస్కృతి ఇంకా ఉంది.

ఏ పేదకైనా అటువంటి ట్రీట్మెంట్‌ ఇవ్వగలిగితే వారి దొడ్డమనసుకు నమోవాక్కములు చెప్పవచ్చును. అలా ఉండదు. ఇక్కడ కనిపించే గౌరవం వెనుక ఉన్నది కులం. పేదరికం కాదు. శ్రమ అంతకన్నా కాదు. అలాగే ఉపాధి కూలీ కన్నా తక్కువ వేతనం లభిస్తుంది అని అదేదో తక్కువ పని అన్నట్టు అర్చక సంఘాల మద్దతుదారులు రాస్తున్నారు. ఉపాధి కూలీ సమాజానికి అవసరమైన పని. పౌరోహిత్యం కన్నా తక్కువేమీ కాదు. ఆధ్యాత్మికత కూడా ఒక రకమైన ధార్మిక ఉత్పత్తిగా చూడాలి అని రైటిస్ట్‌ మేధావులు అనొచ్చు. అది భౌతిక వాస్తవాకతకు లొంగదు కానీ వాదనకోసం తీసుకుందాం. అపుడేం చేయాలి?

 

ప్రస్తుతం ఆధ్యాత్మికత, అర్చకత్వం అలౌకిక కోటాలో ఉన్నాయి. వాటిని లౌకిక పరిధిలోకి తేవాలి. మెరుగైన ప్రభుత్వ వేతనాలు కావాలంటే కుల ప్రాతిపదికను పక్కనబెట్టి ఆ పనిని ప్రజాస్వామిక ప్రక్రియలోకి తేవాలి. వైదికులకే పరిమితం చేయకుండా దానికేవో పరీక్షలు పెట్టి అర్హతలు నిర్ణయించాలి. అన్ని కులాల వారూ, మతాల వారూ ఆ పనిని చేపట్టగలిగే విధంగా మార్పులు చేయాలి. రిజర్వేషన్లు కూడా కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి ట్రెజరీ జీతాలు కోరుతున్న వారు దీనికి సిద్ధమైతే చర్చించొచ్చు.
”అర్చకుడు వైదిక విభాగానికి చెందినవాడు. ఈవో పరిపాలనా విభాగానికి చెందినవాడు కానీ పూజల గురించి ఏమీ తెలియని ఈవో అర్చకుడికి బాస్‌. దేవుడినే నమ్మని, దైవభక్తిలేని, కొండొకచో ఇతర మతాలకు చెందిన వారూ అధికారుల పేరుతో ఆలయాల్లో ప్రవేశిస్తున్నారు” అని ఈసడింపుగా రాస్తున్నారు. అందులో ఉన్న ధ్వని ఏమిటి? ఏమి చెప్పదల్చుకున్నారు?

25KMPSRHI-W005__HY_2524109f

ప్రభుత్వ ఉద్యోగాలకు కొన్ని అర్హతలు, పరీక్షలు, ఇంటర్యూలు అనే పద్ధతేదో ఉంటుంది. మనకిష్టమున్నా లేకున్నా అది ప్రజాస్వామికమైన ప్రక్రియ. ఎన్ని లోపాలు, అవకతవకలున్నా ఆ పద్ధతినైతే తప్పు పట్టలేము కదా! ఆ ఉద్యోగాలు కూడా బ్రాహ్మణులకే కట్టబెట్టండి అని అడగదల్చుకున్నారా! బ్రాహ్మడిపైన ఇంకొకరు బాస్‌ ఏంటి అది అనూచానపు సహజన్యాయానికి విరుద్ధం అని చెప్పదల్చుకున్నారా! అది నేరుగానే అడగొచ్చు. ఇతర కులాలను మతాలను విశ్వాసాలను పరోక్షరీతిలో కించపర్చనక్కర్లేదు. పూజార్లను చూసి ఆలయంలో వారు చేసే అలంకరణ చూసి ఆలయానికి వస్తారు కానీ అధికారులను చూసి వస్తారా అని రాస్తున్నారు, చెపుతున్నారు. దేవుడి మీద భక్తితో వస్తారేమో అనుకుంటున్నారు చాలామంది. ఇదన్నమాట అసలు విషయం! ఇక్కడా అలంకరణే ప్రధానమన్నమాట!
”కెసిఆర్‌ పరమ భక్తుడు. బ్రాహ్మణ పక్షపాతిగా కనిపిస్తారు. …అయినా అర్చకులు మాత్రం బ్రాహ్మణులు బజారును పడవలసి వస్తున్నది” అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాక్యాన్ని చెవివొగ్గి వింటే రాజాధిరాజా..రాజమార్తాండా..ధర్మం నాలుగు వర్ణాలా సాగే మీ పాలనలోనూ బ్రాహ్మణులకు ఇబ్బంది కలగడమేమిటయ్యా అని వినిపిస్తుంది. వీరికి రాజుపై ఉన్న నమ్మకం సరైనదే. కెసిఆర్‌ వ్యవహార శైలి రాజుకంటే తక్కువేమీ కాదు. ఆయన రాజులకు రాజు. నవాబులకు నవాబు. మంచీ చెడూ గురించిన చర్చ కాదు. పాలకుడి పద్దతి గురించి. అది ప్రజాస్వామికమైన పద్ధతి అని ఎక్కడా అనిపించదు. చాలామంది రాజకీయ నాయకులతో పోలిస్తే ఆయన తెలివైన వాడు, చదువుకున్నవాడు కావచ్చేమో కానీ పాలన అనేది రాజకీయ నాయకుడి తెలివితేటలకు సంబంధించిన విషయం కాదు.

ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్య స్వభావానికి సంబంధించిన విషయం. ఇతరులకు భయం కల్పించినా, అభయమిచ్చినా, చేతికి ఎముక లేనట్టు వరాలు ప్రకటించినా అన్నీ పాలకుడి వైయక్తిక ఆసక్తులకే ప్రాధాన్యమిచ్చినట్టు తెలుస్తున్నది. ప్రజాస్వామిక ప్రక్రియలో భాగం అనిపించవు. వైష్ణవ సంప్రదాయంలో మావోయిజాన్ని ఎజెండాగా ప్రకటించుకున్న పాలకుడాయె! ఉద్యమ సందర్భంగా ఎంచుకున్న పద్దతుల వల్ల ఆ గందరగోళం నుంచి బయటపడలేకపోవడం వల్ల తెలంగాణ సమాజంలో పురోగామి సమాజపు వెన్నెముక కూసింత వంగిపోయి ఉన్నది. తమకు నేరుగా చురుకు తగిలితే తప్ప ఇతరత్రా స్పందించే లక్షణం తక్కువ కనిపిస్తున్నది. అది రాజరికపు వాసన ఎదురులేని రీతిలో బలపడడానికి తావిస్తున్నది. రాజును ప్రసన్నం చేసుకుంటే చాలు అనే భావన అన్ని శిబిరాల్లో నెలకొంది.

అందువల్లే బ్రాహ్మణ పక్షపాతి అయిన రాజు పాలనలో ఈ తిప్పలేల అనే వాదన తెరపైకి తేగలగుతున్నారు. ఆ వాదనను పెద్ద స్థాయిలో చేస్తున్నారు. అర్చకులైనా మరెవరైనా నిజంగా బతుకు పోరాటమే చేస్తుంటే శ్రమను గౌరవించే వారెవరైనా వారివైపు నిలవాల్సిందే. అయితే వారు చేస్తున్న శ్రమ, దాని స్వభావం కచ్చితంగా చర్చకు వస్తుంది. బతుకుపోరాటానికి అవసరమైన భాష శ్రమ భాష. మేమీ శ్రమ చేస్తున్నాం, మాకు సరైన ప్రతిఫలం దక్కడం లేదు అన్నది సరైన భాష అవుతుంది. మేము ఫలానా వాళ్లం కాబట్టి మాకు సరైన ప్రతిఫలం దక్కాలంటే సరైన భాష అవదు. కులాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మేం వైదికులం కాబట్టి మాకు మెరుగైన జీతాలివ్వాలి అంటే ప్రజాస్వామికం అనిపించుకోదు.

*

 

 

 

 

మీ మాటలు

  1. saakya maharaj says:

    చాల మంచి వ్యాసం. సఫాయి కార్మికులకు మద్దతు తెలపని నాయకులు పూజారులకు మాత్రం సంఘీభావం ప్రకటించారు. ఇది మన సమాజ స్వభావం. రమణా చారి ప్రభుత్వ సలహాదారు. దేవాదాయ శాఖను తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తున్నాడు. ఆయన ఆల్రెడీ ప్రభుత్వాన్ని కంట్రోల్ లోకి తీసుకున్నాడు. ఈ పూజారుల వల్లనే మన రాష్ట్రం ఇలా తగలడ్డది. రామ్మోహన్ గారు, మీకు ధన్యవాదాలు.

    • అర్చకుల ఆలోచనా విధానంలో మార్పు రావాల్సి ఉంది. తాము సమాజంలో భాగం అనుకునే పరిస్థితి రావాలి. వాళ్లు అతీతులుగా భావించుకుంటే మనం చేయగలిగిందేమీ లేదు. బ్రహ్మణ కులస్తుల్లో తక్కిన కులాల పట్ల అసంకల్పితంగానే ఏహ్య భావం కనిపిస్తుంది. మా బంధువుల్లోనే చాలా మందిని చూశాను. అది అవసరమో కాదో కూడా వారికి తెలీదు. ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్ధల్లో ఉన్నతోద్యోగాల్లో ఉన్న వారిలో ఈ ఏహ్య భావం కాస్త అధికంగా కనిపిస్తుంది. వాళ్లలో ఇన్ బిల్డ్ ఈ ఆలోచన క్యారీ అవుతున్నట్టు కనిపిస్తుంది.ప్రజాస్వామిక ఆలోచన వారినుంచి ఆశించడం కాస్త కష్టమే.

    • ముగింపు బాగుంది సార్

  2. సఫాయి కార్మికులకు మద్దతు తెలపని నాయకులు పూజారులకు మాత్రం సంఘీభావం ప్రకటించారు. ఇది మన సమాజ స్వభావం.

    నిజం!

    సమాజాన్ని వెనక్కు లాగుతున్నందుకు పూజారులకు, ఫాదరీలకు, మసీదులోళ్ళకూ మనం జీతాలిచ్చి పోషించాలన్నమాట. ఉత్పత్తిలో పాలుపంచుకొనేవారు ఎలా ఏడ్చినా ఫర్వలేదు.

  3. b.ramnarayana says:

    very precisely analysed,It is read in today’s paper that they called off their strike on being assured by the govt. B.ram narayana, KOTHAGUDEM.

  4. P V Vijay Kumar says:

    స్తుతం ఆధ్యాత్మికత, అర్చకత్వం అలౌకిక కోటాలో ఉన్నాయి. వాటిని లౌకిక పరిధిలోకి తేవాలి. మెరుగైన ప్రభుత్వ వేతనాలు కావాలంటే కుల ప్రాతిపదికను పక్కనబెట్టి ఆ పనిని ప్రజాస్వామిక ప్రక్రియలోకి తేవాలి. వైదికులకే పరిమితం చేయకుండా దానికేవో పరీక్షలు పెట్టి అర్హతలు నిర్ణయించాలి. అన్ని కులాల వారూ, మతాల వారూ ఆ పనిని చేపట్టగలిగే విధంగా మార్పులు చేయాలి. రిజర్వేషన్లు కూడా కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి ట్రెజరీ జీతాలు కోరుతున్న వారు దీనికి సిద్ధమైతే చర్చించొచ్చు.

    ఏ పేదకైనా అటువంటి ట్రీట్మెంట్‌ ఇవ్వగలిగితే వారి దొడ్డమనసుకు నమోవాక్కములు చెప్పవచ్చును. అలా ఉండదు. ఇక్కడ కనిపించే గౌరవం వెనుక ఉన్నది కులం. పేదరికం కాదు

    Reallly loved this piece of writing….ప్రతి పేదోడు పేదోడు అయిపోడు…..అన్న విషయం అర్థం కావాలంటే – నెహౄ దగ్గర్నుండి నేటి మార్క్సిస్టుల వరకు ….. అందరూ ఒకే బావి లో ఈత కొట్టే కప్పలు…

  5. Ram sarigga cheppadu. Ramanachary ee bhoommeeda unnantha kalam kcr marchadalchukunna ee paristhithi maaradu. Mana brahmanetharulandaru kaayitham pululugaa unnantha kaalam

  6. మేమీ శ్రమ చేస్తున్నాం, మాకు సరైన ప్రతిఫలం దక్కడం లేదు అన్నది సరైన భాష. మేము ఫలానా వాళ్లం కాబట్టి మాకు సరైన ప్రతిఫలం దక్కాలంటే సరైన భాష అవదు. fine clarification.భావాలు ఘర్షించే తరుణం దూరం లేదనిపిస్తున్నది. కాని..కాని..let us pave a way for change..మార్పులు తెలిసి రావు.వచ్చాకే తెలుస్తాయి .

  7. పవన్ సంతోష్ says:

    అదో వర్గమనుకున్నప్పుడు దానికో భాష ఉంటుంది. ఒకప్పుడు సమాజంలోని అన్ని రంగాలూ అదే భాష మాట్లాడేవారు, అదే సాంకేతిక పదజాలం ఉపయోగించేవారని బాధపడ్డారు. సరే అది వెనకబట్టి వేరే స్థితిగతుల వల్ల వేరే భావాలు, దానివల్ల వేరే మాటలు వచ్చేశాయి. ఇప్పుడు ఆ వర్గాన్ని కూడా ఆ భాష మాట్లాడొద్దంటే..? ఆ వర్గాన్నే నిర్మూలించేస్తాము, ఆ వృత్తినే నిర్మూలించేస్తాము అని కంకణం కట్టుకుంటే వేరు, ఆ వర్గం ఉండాలి కానీ తమది కాని భాష మాట్లాడాలి. జనాలు ఆమోదించిన పదాలే వాడాలి. వాళ్ళ నమ్మకాలు వాళ్ళు వదులుకోవాలి అంటే చాలా విచిత్రంగా ఉంది. ఒకప్పుడు ఆలయాలు, ఆలయ మాన్యం వాళ్ళవిగా ఉండేవి(మంచో చెడో ఉండేవి), ఇప్పుడు దాన్ని ప్రభుత్వపరం చేసుకుని నిర్వహిస్తున్నారు(మంచికో చెడుకో తీసుకున్నారు). అన్ని ప్రభుత్వ రంగాల్లానే మాకూ ఖజానా నించి డబ్బులివ్వండి అంటే దాని సాధ్యాసాధ్యాలు వదిలి నేరుగా కోరికే తప్పు ఎలా అవుతుందో తెలియట్లేదు. నేతమగ్గాల్నీ, వ్యవసాయ భూములను ప్రభుత్వ నిర్వహణలోకి తీసేసుకోలేదు. ఇదొక్కటే తీసేసుకుంది. ఎందుకూ-ఇందులో ఆదాయం కనిపిస్తోంది కనకేనా? అలాగైతే లాభసాటివి చాలానే వున్నాయి. పోనీ ఆలయాలు ఊరందరికీ అవసరం, వారందరికీ ఉమ్మడి సొత్తు అన్న భావనా? అయితే పుట్టగొడుగుల్లా ప్రైవేటు స్కూళ్ళు, కాలేజీలు ఉన్నాయి. అన్నిటినీ ప్రభుత్వపరం చేసుకుని వాళ్ళనీ ఇలా చేస్తున్నారా? చాలానే ప్రశ్నలున్నాయి. కానీ అడిగేవాళ్ళకు నోరు లేదంతే.

  8. Lakshmi Gudipati says:

    pavan santosh garri samadhaanamu is as well reasoned as Rammohan gaari samvadana

  9. akbar mohammad says:

    చాలా బావుంది .

  10. ఏం ఉత్పత్తి చేస్తున్నారా?

    నన్నడిగితే పూజార్లు రాబిన్హుడ్ లంటాను. సమాజాన్ని దోచుకునే వాళ్లనుంచే వాళ్ళకు పాపభీతి కల్గించి వాళ్ళ ఆదాయంలోంచి కొంతయినా మళ్లీ దేవుడి దగ్గరకు చేర్చే ప్రగతిశీల పాత్ర వాళ్ళది. కాగా, ఇవాల్టి వస్తు మారక సమాజంలో ఏది ఉత్పత్తి? ఏది అనుత్పత్తి? ఎవరిది ఉత్పత్తి పాత్ర, ఎవరిది అనుత్పత్తి?

    పూజార్లను రైతులతో పోల్చనేల? జర్నలిస్టులతో పోల్చరెందుకు?

    పూజార్ల కంటే జర్నలిస్టుల జీతాలెందుకు ఎక్కువ ఉండాలో మాట్లాడరెందుకు?

    జర్నలిస్టులేమి ఉత్పత్తి చేస్తున్నారని ప్రభుత్వ ఇన్సురే న్స్, ప్రభుత్వ స్థలాలు , ఇంకా అనేక వెసులు బాట్లు కావాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నరో చెప్పాలి.

    అలాగే సాంస్కృతిక నాటక సంఘాలు. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కంటే ఏమి సమాజానికి ఇచ్చారని ప్రభుత్వం వాటిని ఆదుకోవాలి? వాటి ప్రతినిధులకు పదవులు కల్పించాలి?

    -శశాంక్

  11. గౌరవనీయులైన రామ్మోహన్ గారికి శిష్యపూర్వక నమస్కారములు. ఉత్పాతకత లేని బ్రాహ్మణుడు ఏ రకంగా జీతభత్యాలకు అర్హుడు అంటున్నారు. రైతు, చేనేత కార్మికుడు వీళ్లందరూ కలసి కూడూ గుడ్డా మొలిపించి పుట్టించి దాన్ని అమ్మగా వచ్చే డబ్బే ఉత్పాదకతా ఫలం.. ఈ మాట మీరు ఒప్పుకోవాలి.. మరి ఆ ఉత్పాదకత ఫలం వైదిక బ్రాహ్మడు పుట్టించడం లేదని మీరెలా అంటున్నారో నాకర్ధం కావడం లేదు. ఒక ఆలయం ఉంటే దానికి భక్తులు వేసే కానుకలే ఉత్పాదకతా ఫలం.. కాదంటారా? వేకువ జామున లేచి స్నానం పానం చేసి నామం గీమం దిద్దుకుని.. కౌసల్యా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటూ.. రాగాలాపన చేసి దేవదేవుడు అక్కడ ఉన్నా లేకున్నా నిద్రలేపి.. రాత్రింబవళ్లూ ఆ సేవలనీ ఈ సేవలనీ చేసి నిత్యకల్యాణం పచ్చతోరణాలు కట్టి..దీని సిగదరగ భక్తకోటిని హోరెత్తేటట్టు చేసి.. వాళ్ల చేత మొక్కులు మొక్కించి కానుకుల మూటలు తెప్పించి.. శ్రీవారి హుండీలు నిండేలా చేయడం ఉత్పాదకత కాదా? ఒకానొక సమయంలో శ్రీవారి ధనాన్ని వాడితే ఎలా ఉంటుందోనని ఆర్బీఐ ప్రయత్నించిందే అది బ్రాహ్మణుడి ఉత్పాదకత వల్ల సాధ్యమైంది కాదా? దేవాదయ శాఖంటూ ఒకటి పెట్టి దానికంటూ ఒక మంత్రిత్వం పెట్టి ఆ శాఖను వెలగబెడుతున్న మంత్రులు అనుభవిస్తున్నది బ్రాహ్మణ ఉత్పాదకతా ఫలం కాదా?మీరీ పాయింటు ఏదీ దేవుడ్ని చూపించూ అన్నదాన్లోంచి వెలికి తీసినట్టు కనిపిస్తోంది. దేవుడు అలా మీరడిగిన ఉత్పాదకతలా డైరెక్టుగా కనిపించడండీ! ఆ మాటకొస్తే మీరు ఉదహరించిని మిగిలిన కులాల ఉత్పాదకత కూడా అలాంటిదేనండీ..అది సరేగానీ ఒక విలేకరిగా మీరీ ప్రపంచానికి చూపిస్తున్న ఉత్పాదకతా ఫలం ఏదీ చూపించండి చూద్దాం? జర్నలిస్టు లేని సమాజం చచ్చిపోతుందా? అరడజను పత్రికలు.. డజను ఛానెళ్లు లేకుంటే ఇక్కడేమైనా కొల్లబోద్దా? మీలా లా పాయింట్లను లాగడం నాబోటి సామాన్యులకు తెలీదా? జర్నలిస్టు తనకు తాను ఒక గ్యాప్ పుట్టించుకుని మరీ దాన్నో వ్యవస్థగా తీర్చిదిద్దారని చెప్పింది మీరు చెప్పిన పాఠమే నీరజాక్షా! మీరా ఉత్పాదకత గురించి ప్రశ్నించేది..? బేసిగ్గా నేను బ్రాహ్మణ వ్యతిరేకిని. నాకు ఈ సమాజం ఏ కులాలు లేకుండా ఉంటే చూడాలన్న కోరిక బాగా ఎక్కువ. ఇది నిజం. ఈ కులమతాల హెచ్చుతగ్గులు కూడా నాకిష్టముండదు. నా వరకూ మానసికంగా ఏ కులాధిపత్యం నచ్చదుు. ఏ కులాన్నీ హీనంగా చూడ్డం చేతకాదు. భారతదేశంలో మాత్రమే శాఖాహారులు మాంసాహారులు ఉంటారేంటని? నాకు నేను ఎంతో చిరాకు పడుతుంటాను. అలాంటిది నాకు మీ వాదన వల్ల ఇలా రాయాల్సి వస్తోంది. ఇక్కడ మీకో పిట్ట కథ చెప్పాలి. గతంలో ఒక రాజుండేవాడట. వాడి కోట ముందు మీలాండి వాడొకడొచ్చి రాజుగారికి పెట్టే అప్లికేషన్లను చూసి.. పరిశీలించి.. ఒక ముద్ర వేసి పంపేవాడట. ఒక రోజు ఆ రామ్మోహన్ కి జ్వరమొచ్చి.. రాలేదట. ఆరోజు కూడా రాజుగారి దగ్గరకి ధరఖాస్తులొచ్చాయట. కానీ ఆ రాజు వాటిని రిజెక్ట్ చేశాడట. కారణం వాటిలో ఇదివరకటి ముద్రేదో కనిపించక పోవడం వల్ల రాజు అలా చేశాడట. జర్నలిస్టు కూడా ఇలాంటోడే. లేని దాన్ని ఉందని చూపించి ఈ సమాజంలో చోటు దక్కించుకున్నవాడే. నాకు తెలిసి నవయుగ పురోహితుడు జర్నలిస్టే. అలా తనకు తాను ఒక గ్యాప్ క్రియేట్ చేసుకుని ఈ సమాజం మీద ఆధిపత్యం చెలాయిస్తున్నా అతిపెద్ద కులపోడు విలేఖరే. మీరు కూడా లేని దాన్ని సృష్టించి సమాజానికి అలవాటు చేసినా ఒకానొక జాతికి చెందిన వ్యక్తులే. రామ్మోహన్ గారూ ఈ సమాజపు తొలి ఉత్పాదకుడు, వ్యాపారి బ్రాహ్మడేనండీ.. మీకు తెలుసో తెలీదో.. రైతు పండించిన ధాన్యం కుప్పలో రెండు బస్తాల ధాన్యం ఎలాగైనా సొంతం చేసుకోవాలని.. దానికి పౌర్ణమీ, అమావాశ్యలని కట్టు కథలు చెప్పి.. ఆ రైతు చేత వ్రతాలు, పూజలని చేయించి.. ఆ తర్వాత వాళ్లనుంచి అతిలాగవంగా సంభావనలు రాబట్టుకుని.. ఈ సమాజానికి వ్యాపార మెళకువ నేర్పిన తొలి ఒకట్రెండు వర్గాల్లో బ్రాహ్మణుడు అత్యంత ముఖ్యుడు. దశ దిశ చూపిన వాడికే మీరు శఠగోపం పెడతారేంటండీ అన్యాయం కాకుంటే.. ఇది కులపు వాదనలోంచి రాస్తున్న వ్యాసం కాదు. సమాజం లో లేని ఒక వృత్తిని సృష్టించుకున్న్ జర్నలిస్టులనబడే మీరా ఇలా రాస్తోందన్న ఆవేశం కొద్దీ ఇలా రాస్తున్నది! తప్పైతే క్షమించగలరు.. అసలే నేను మీ అంత లెఫ్టిస్టు మేథావిని కాను మరి!!

  12. భేషో!
    ఈ వ్యాసంలో రచయితకొచ్చిన అనుమానాలే నావీను. ఈ మధ్య బాబు ప్రకటించిన బ్రాహ్మణ పేదల చదువుకు ఆర్థిక సహాయం కూడా ఈ ఆలోచనా ధోరణిలోదే అని నా అనుమానం.
    ఏ కులంలో పేదలున్నా భరించవచ్చు, అది వారి ఖర్మ అనుకోవచ్చు కానీ అయ్యవారు పేదవారుగా వుండటం మాత్రం కాసింత ఎక్కువ జాలి కలిగిస్తుంది.

    • పవన్ సంతోష్ says:

      కొందరికి అయ్యవార్లు పేదలైతే జాలి కలుగుతుంది.. కొందరికి అయ్యవార్లు పేదలైతే ఓ జస్టిఫికేషన్ కనిపిస్తుంది. ఈ రెండోది మాత్రం ఎందుకుండాలట? ఎక్కడుందీ అని వెతికితే మాత్రం నమస్కారం.

    • సాహితీ says:

      మను వాద సమాజం ఏర్పరిచిన బావ జాలం ఒకణ్ణి ‘బ్రతికి చెడ్డ వాడు’ అని సాను భూతి చూపిస్తుంది ఇంకొకన్ని ‘ చెడి బతికిన వాడు’ అని కళ్ళెర్ర చేస్తుంది. చెడిన వాడు ఎప్పటికి చెడి పోయినా పరవా లేదు గాని, బ్రతికి చెడ్డ వాడు మాత్రం చెడి పోకూడదు. ఇది ఈ సమాజ మేర్పరిచిన న్యాయం. రామ్ మోహన్ గారు మీరు చెప్పే న్యాయం ఎవరికీ కావాలి.

  13. ఈ ఆర్టికల్ చదవడం అంటే టైం వేస్టు చేసినట్టే. శీర్షికలాంటి ప్రశ్నలో వ్యాసరచయిత ఏడుపు, దుగ్ధ కనపడుతున్నాయంతే. అందుకే హెడింగ్ చదివి కామెంట్ రాస్తున్నా.. అర్చకులు ఏ ధైర్యంతో ట్రెజరీ జీతాలు అడుగుతున్నారంటే.. దేవాలయాల సొమ్మును ప్రభుత్వం సిగ్గు లేకుండా మేస్తోంది కనుక. చర్చ్‌లు, మసీదుల్లాగా దేవాలయాలను కూడా హిందువుల మానానికి వదిలేస్తే ట్రెజరీ జీతాలు అడిగే ఖర్మ వారికెందుకు? ఈ మాత్రం తెలియడాన్ని ఇంగితం అంటారు. అది తెలియని వాళ్లు ఇలా జర్నలిస్టులై తమనుతాము మేధావుల్లాగా భావించుకుంటూ చెత్త ప్రశ్నలు అడుగుతారన్నమాట. వీరికితోడు కమ్యూనిస్టులు. దేవాలయ భూములనేమో అందరికీ పంచిపెట్టేయాలంటారు. వక్ఫ్ భూములను కాపాడాలంటారు. దీన్నే లౌకికవాదం అనుకోమంటారు. ఛీ…

  14. ఈ వ్యాసం చదువుతున్నంత సేపూ, ఎక్కడో లాజిక్ తప్పుతున్నట్టు అనిపించింది. ఎక్కడ తప్పిందో, (ఉత్పత్తి -ప్రభుత్వ ప్రమేయం విషయంలో) పవన్ సంతోష్ గారి వ్యాఖ్యలో అర్ధమైంది.

  15. narayana sharma says:

    బహుశః ఇందులో రచయితలకు తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి.మొదట ప్రజాస్వామ్య ప్రాతిపదికన దేవాలయాల్లో పూజారులు అనేది..మఠాల అధీనంలో ఉన్న దేవాలయాలను మినహాయిస్తే..దేవాదాయ శాఖ్గలో ఉన్న పోస్టులు ప్రస్తుతం అలాగే ఉన్నాయి.వేములవాడ లాంటి దేవాలయాల్లో అన్ని కులాల ఉద్యొగులున్నారు.వీటిని నిర్ణయించడానికి విద్యార్హతలను గురించి ప్రస్తావించారు.. వేదిక్ యూనివర్సిటీ (తిరుపతి)మొదలైనవి ఈ కోర్సులు నిర్వహించి సర్టిఫికెట్‌లను ఇస్తూ ఉన్నాయి.అన్ని విశ్వవిద్యాలయాలలోని రిసర్వెషన్స్ ఇక్కదకూదా అనుసరించబడుతున్నాయి.ఇందులోనూ వివిధకోర్సులు ఉన్నాయి.

    ఉద్పాదకత అనేపదం వ్యాపరసంబంధమైంది..దేసం కేవలం వ్యాపారమే అయితే మాట్లాడవలసిన పనిలేదు..సంస్కృతి పేరిట,భాష పేరిట ,సినిమా లాంటి కళారంగాలపేరిట తగలేసే డబ్బుకు ఏ ఉత్పాదకత ఉంది.

    ఏ శాఖకూ లేని “ఆదాయ”శబ్దం “దేవాదాయ శాఖకు” ఉంది.

    అన్నీటికీ ఇంచి సారంగాలో ఇలంటి వ్యాసం రావడం బాధగా ఉంది.ఈ వ్యాస ఉద్దేశ్యం వర్గ న్యాయమే తప్ప మరోటికాదు.

  16. buchi reddy gangula says:

    లేని పోనీ నమ్మకాలను — మత పిచ్చి ని కలిగిస్తూ —–మనష్యుల మధ్య లేని పోనీ అడ్డు గోడలు కడుతూ —యింకా
    ఎంతకాలం వీళ్ళ అరాచకత్వం ???
    సమ్మె — most..meaningless.one…
    —————————————————————————
    బుచ్చి రెడ్డి గంగుల

  17. M.KALIDASU says:

    all you said is true, we are praying god, not pujari,
    “Devudu varamichina pujari varamiyya ledu”
    Vachina vari vesha bhashalu chuchi adarinche pujarulaku
    ala adige hakku ledu

  18. Dear G S R: There is a College funded by the Government to train the priests (poojaari) clan. I was told by a priest graduated from the College and was struggling to get a decent employment as a priest in a Telugu temple. But, he was lucky. He could migrate to the USA. All caste are welcome to apply. I would like to ask you as a journalist of the Red-variety to find out how many non-Brahmins applied, got trained and were employed as priests. But, I would ask you a fair question. Why in the hell a nephew of KCR or a distant relative of Babu would try to become a priest, when he could become a political pest and mess up the entire State? Again, did you ever try to find out how many non-upper caste people go to Andhra University to obtain an M A in Telugu? Quite a few my friend! You know why? He/she can get free tuition, boarding and can take over seven years to graduate and is assured of a job in a Government college. A first class must be awarded to these fellows who could not write two Telugu sentences correctly. If they were not awarded a first class they would threaten the Professors. When such a sinecure is available why would these so-called oppressed caste folks would go to a college for priests? Get of your virasam band wagon and be a realistic journalist and write some truthful things and attack the corrupt politicians if you have real guts. I will suggest you one thing to investigate. What was Chandrababu Naidu’s wealth worth it before he got into politics and what is it now? I am asking you investigate only the so-called declared assets, not those hidden in foreign countries under binami names. Do you have such guts? Go for it. Priests of any kind are not a threat to the society. No one forces any one to go to a Temple, a Church or a Mosque( May be I should not say about Mosque!). Not only that! They are not a drain on the economy, like the corrupt politicians, executive and the bureaucrats. Stop the nonsense and write some sense and some useful stuff. You are capable of it, but you are playing to the wrong music for long, my good friend! — Best wishes, Sarasa

  19. Mythili Abbaraju says:

    అర్చక ‘ ఉద్యోగాలు ‘ అం దరికీ ఓపెన్ గానే ఉన్నాయి కదా ? సరిపడా ‘ ఆదాయాలు ‘ లేక వాటికి ఇతరుల నుంచి అర్జీలు వస్తూ ఉందకపోవచ్చు. ఇంకెక్కడికీ వెళ్ళ లేని వారు మాత్రమే పూజారులుగా కొనసాగుతున్నారు …ఏదో చలాయించాలని కాదు.

  20. Aranya Krishna says:

    అర్చకులన్దరూ ఫలానా కులం వారు కాబట్టి జీతాలు అడగటంలో తప్పులేదు అని అనటంలో ఎంత తప్పుందో వారు ఫలానా కులస్తులు కాబట్టి జీతాలు అడగ కూడదు అనటంలో కూడా అంతే దోషముంది. ఎవరైనా ఎందుకు జీతాలడగాలి ప్రభుత్వం నుండి. చేస్తున్న శ్రమకి జీతాలడగాలి. ప్రభుత్వ పరిధిలోని ఆలయాల ఆదాయం ప్రభుత్వ ఖజానాకే పోతున్నప్పుడు ఆ ఆలయాల్లో ఉద్యోగాలు చెసే వారెవరికైనా జీతాలడిగే హక్కుంటుంది. దీనికి ధైర్యం అక్కర్లేదు. జీతం అనేది ఉత్పత్తితో ముడిపెట్టటం తప్పు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సామ్స్కృతిక సంస్థలు, పత్రికల్లో పనిచేసేవారికి జీతాలు ఇస్తున్నప్పుడు ఆలయాల్లో పనిచేసేవారికి ఎందుకివ్వ కూడదు? ఒక స్వీపర్ దగ్గర్నుండి అర్చకుడివరకు అందరికి ఆ హక్కు వుంటుంది. అర్చకుల జీతాలకు మద్దతు తెలిపేవారికి ఎటువంటి కుల దృక్పధమ్ వుంటే వుండొచ్చు. అంత మాత్రాన అర్చకులు తమ శ్రమకి తగ్గ ప్రతిఫలాన్ని పొందే హక్కుని కోల్పోవాలా? నేను విజయ్ కుమార్ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తాను. కులాతీతంగా అర్చకుల రిక్రూట్ మెంట్ జరగాలి. ఇందులో రిజర్వేషన్లు కూడా పాటించాల్సిందే. అక్కడ అర్చకవర్గం కానీ, బ్రాహ్మ్ణ్య వాదులు కానీ ధర్మం గురించి మాట్లాడకూడదు. ధర్మం కావాలంటే హక్కుల్ని వదులుకోండి లేదా హక్కులు కావాలంటే ధర్మం గురించి మాట్లాడకండి అని ఖండితంగా చెప్పాలి. ఎందుకంటే పనికితగ్గా వేతనం అనేది లౌకికమైన ఆలోచన, అది ఆధ్యాత్మికమైనది కాదు కనుక.

  21. పూర్ణప్రజ్ఞాభారతి says:

    ఈ చర్చతో సంబంధమున్నా లేకపోయినా ఒక వాస్తవాన్ని పాఠకుల ముందుకు తీసుకురావాలి. భారతదేశంలో ఏ మతానికి చెందిన ఆస్తులు, కాని తత్సంబంధిత సంస్థలపైన కాని ప్రభుత్వ పెత్తనం లేదు. కాని కేవలం హిందూ ధార్మిక సంస్థలు, దేవాలయాలను మాత్రమే నియంత్రించడానికి, ఆవి కాస్త లాభప్రదంగా కనిపిస్తే తమ ఆధీనంలోకి తీసుకోవడానికి మాత్రం దేవాదాయ చట్టం ఉంది. దేవాలయం క్రింద ఉన్న భూమిని ప్రభుత్వం తీసుకుంటుందట, దాన్ని అన్ని సామాజిక వర్గాలకు పంచుతుందట. దాన్ని ప్రశ్నించకూడదట. ఎందుకంటే అది సామాజిక ప్రయోజనం కోసమట. నాకు తెలిసి క్రైస్తవాన్ని పాటిస్తున్నవారికి కూడా హిందూ దేవాలయాల భూములను పంచడం జరిగింది. ఇది వాస్తవం.

    అలాగే దేవాదాయ శాఖ ముఖ్యంగా ఆంధ్ర. తెలంగాణా రాష్ట్రాలలో రెవెన్యూశాఖ నేతృత్వంలో నడుస్తుంది. అంటే అర్థమయి ఉంటుంది. ఇది రాబడికి సంబంధించిన శాఖ. ఆధికారులు ప్రభుత్వాధికారులు. వారికి జీతాలు ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వంపై లేదు. దేవాదాయ కమీషనరు జీతం నుంచి కార్యాలయాల కరెంటు ఖర్చుల వరకు అన్ని వ్యయాలు దేవాలయాల నుంచి తీసుకున్న ఫండు నుంచి చెల్లిస్తారు. అంటే దేవాలయాలు తమ డబ్బుతో ప్రభుత్వాధికారులను పోషిస్తూ, వారి నియంత్రణలో నడుస్తుందన్న మాట. అంటే మతాతీతమైన ప్రభుత్వ వ్యవస్థలో ఒక విభాగపు ఖర్చులన్నీ దేవాలయాలే భరిస్తున్నాయి. ఈ విషయంలో లౌకిక మేథావులకు ఎలాంటి అభ్యంతరాలు లేవు.

    ఇక మత నియంత్రణకు వస్తే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ లౌకికవాద ప్రేమను చాటుకునేందుకు చేసే సత్కార్యాలలో అంటే చట్టాలలో అన్నీ హైందవాన్ని నియంత్రించేవే. కాస్త గమనించి చూస్తే ఈ విషయం బోధ పడుతుంది. ఈ మధ్యనే కర్ణాటకా ప్రభుత్వం వివిధ మఠాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందామని ఒక బిల్లు ప్రవేశపెట్టి, ఆ తర్వాత ఉపసంహరించుకుంది. సోనియా మార్గదర్శనంలో సాగిన గత కేంద్ర ప్రభుత్వం లక్షితదాడుల నిషేధం పేరిట అల్పసంఖ్యాకుల, హిందువులు అనే గీత గీసి, అల్పసంఖ్యాకులు నోట్లో ద్రాక్షపండు పెట్టినా కొరకలేేనివారని, వారి చుట్టూ ఉండే హిందువులే అన్నివిధాలా వారిని అణచివేస్తున్నారని, అలాంటి అల్పసంఖ్యాకులను రక్షించడం, న్యాయవాదిని సంప్రదించే అవకాశాన్ని కూడా హిందువులకు కల్పించకుండా ఉండేేలా ఒక బిల్లును ప్రవేశపెట్టి, ఆపైన ఉపసంహరించుకుంది. అదిగనుక చట్టం అయి ఉంటే, అల్పసంఖ్యాక వర్గానికి చెందిన వ్యక్తి ఒక దుకాణం నడుపుతున్నాడనుకుందాం. అతనని వద్ద సామగ్రి కొనలేదనుకుందాం. అప్పడు ఆ అల్పసంఖ్యాక వర్గ వ్యాపారి హిందువులు తన జీవికకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేస్తే చాలు, ఆ వాడలోని హిందువులను ఆ ఫిర్యాదు మేరకే కటకటాల పాలు చెయ్యవచ్చు. ఇది మన లౌకికవాద ప్రభుత్వ ధోరణి.

    ఇక దేవాలయాల్లో అర్చకులుగా ఉన్న బ్రాహ్మణులు ఉత్పత్తిరంగానికి చెందినవారా కాదా అన్న విషయానికి వస్తే, దేవాలయాల్లో వారు చేసే కళ్యాణోత్సవాలు, ఇతర ఉత్సవాలు వందల కోట్లు కూడబెడుతున్నాయని, వాటితోనే విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు పనిచేస్తున్నాయన్న సంగతి కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈ సంస్థలకు ప్రభుత్వం నయాపైసా సాయం చేయదు, సరిగదా, వాటిని నియత్రించడానికి, నిర్వహింంచడానికి అధికారులను నియమిస్తుంది. దేవాలయాల ధనం ఇలా సామాజిక ప్రయోజనాలకు ఉపయోగపడుతుంటే, ఆ ప్రక్రియలో భాగమైన పురోహితుడు ఉత్పత్తేతర వర్గాని చెందినవాడు ఎలా అవుతాడు అన్నది ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  22. బాగా చెప్పారు పూర్ణ ప్రజ్ణా భారతి గారు. ప్రపంచంలో ఏ దేశంలోను మైనారిటిలను చూసి, మెజారిటిలు భయపడే స్థితి దాపురించి ఉండదు. ఒక్క భారతదేశంలో తప్ప. మనదేశంలో సెక్యులర్రిజం అంటే అర్థం హిందూమత వ్యతిరేకతే. హిందూ పదం వింటేనే సెక్యులర్ మేధావులకు కంపరం కలుగుతుంది. గత పాలనలో అది ఎంత వరకు వెళ్ళిందంటే,మీటీంగ్ లో హిందూ పదం ఉచ్చరించటానికి కూడా తప్పుగా భావించారు. మొన్నటి ఎన్నికల ప్రచారం లో భారతదేశం సూఫీ ల కర్మభూమి అని కాంగ్రెస్ అధినేత్రి గారు చెప్పారు. ఆమేకి, ఆ మీటీంగ్ ఉపన్యాసం రాసిచ్చిన మేధావులకి తెలియనిదేమిటంటే కర్మ సిద్దాంతం హిందూ మతంలో తప్ప ఇతర మతాలలో లేదు. హిందువుల కర్మ భూమి అయిన భారతదేశం అన్యమతస్థుల కర్మభూమి అని ఎలా అంటారు? అన్య మతాలలో కర్మ సిద్దాంత కాన్సెప్టే లేకపోతే!?

  23. *ఏం ఉత్పత్తి చేస్తున్నారని పూజారులకు జీతాలివ్వాలి?*

    బ్రాహ్మణులు ఎమి ఉత్పత్తి చేయలేదనే వాదన సరికాదు. ఇటువంటి వాదన స్కుల్ బాయ్స్ ను ఆకట్టుకోవచ్చు, చదువుకొన్న వారిని కాదు.

    ఒక ఉదాహరణ తీసుకొందాము. ప్రపంచ వ్యాప్తంగా, రోజు స్టాక్ మార్కెట్ లో బిలియన్ డాలర్ల బిజినెస్ జరుగుతుంది. మరి స్టాక్ మార్కేట్ ప్రజలు రోజువారి దైనందిన జీవితాలలో ఉపయోగించే ఒక సుదిని గాని, లోటా ను గాని, తిండి గింజలు గాని, టివి వంటి వస్తువులను ఎమైనా ఉత్పత్తి చేస్తున్నదా? ఎమి చేయటం లేదు కదా! భౌతికంగా అదేమి ఉత్పతి చేయటం లేదని స్టాక్ మార్కేట్ లో పనిచేసేవారికి ఎందుకు జీతాలివ్వాలి అని అంటే ఎలాగుంట్టుంది?

    స్టాక్ మార్కేట్ అనే వ్యవస్థ వెనుక, అనేక రకాల ఎకనామిక్స్ థీరిల (మైక్రో ఎకనామిక్స్ నుంచి మాక్రో ఎకనామిక్స్ సిద్దాంతాల )కంట్రిబ్యుషన్ ఉంది. వాటి వలనే అక్కడ వస్తు వుత్పత్తి లేకపోయినా బిలియన్ డాలర్ల బిజినెస్ జరుగుతున్నాది.

    అలాగే ఒక దేవాలయం ఉందంటే దాని వెనుక ద్వైత,అద్వైత,విశిష్టాద్వైత ఫిలాసఫిలు ఉన్నాయి. ఆ ఫిలాసఫిల వెనుక ఎంతో చరిత్ర ఉంది. ఆ ఫిలాసఫిల ను ఆధారం చేసుకొని శివాలయం, రామ, కృష్ణ, విష్ణాలయాలు కట్టారు. వాటికోసం పూజారులు ఉన్నారు.

    కొంతమంది మేధావులు పై పై విశ్లేషణ చేస్తూ పూజారులు ఎమి ఉత్పత్తి చేయటంలేదని అనుకోవచ్చు, కాని వాస్తవం వేరు. పూజారులు వేల సంవత్సరాలుగా ఆధ్యాత్మిక రంగంలో ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొంట్టు, హిందూ దేవాలయాలయాలలో నిబద్దత తో పనిచేస్తూ, ట్రిలియన్ డాలర్ల విలువ చేసే 22000 టన్నుల బంగారాన్ని భద్ర పరచారు. ఆ సొమ్ము బాంక్ లో, ప్రభుత్వ అజమాయిషి కిందే ఉంది. ఇక స్థలాలు, పొలాల విలువ కూడా వేల, లక్షల కోట్లలో ఉంట్టుంది. భారతదేశం ఇంత బంగారం ఉన్నాదని, లెక్కలు తెలుసు గనుకనే, ప్రభుత్వాలకు పక్క దేశాల వారు ఋణలు ఇచ్చేది.

    Wealthy Hindu temples such as this one are repositories for much of the $1 trillion worth of privately held gold in India – about 22,000 tonnes, according to an estimate from the World Gold Council.
    http://www.theguardian.com/world/2015/apr/27/india-temple-gold-circulate-economy

    గత 20ఏళ్లుగా టి.టి.డి. పదివేల కోట్ల ఆదాయం సంపాదిస్తే, దాని పైన వడ్డి 780 కోట్లు వస్తున్నదని మొన్న పేపర్లో వార్త వచ్చింది. మరి టి.టి.డి. ని మేనేజ్ చేసేది కూడా ప్రభుత్వమే. అవసరమనుకొన్నపుడు ఎదో మిషతో టి.టి.డి. నిధులను ప్రభుత్వం వాడుకోంట్టున్నాది కదా!

    దేవాలయాల మీద ఇంత సంపదను ప్రభుత్వం వాళ్ళు మేనేజ్ చేస్తూ, కనీసం పెరిగిన ధరలకు అనుగుణంగా పూజారులకు వేతనాలు ఇస్తే తప్పేమిటి?

  24. Prof P C Narasimha Reddy says:

    We have to unlearn to understand the basics of the inequalities of the system. The arguments placed by GSR and others are on different planes. One wrong can not justify the other. We are not yet ready to recognise the physical and mental labour without which we can not survive – household chores of our womenfolk at home and ready food they serve ( recognised at our doorstep by G V Apparao a century ago – Lenin at the same period ) – Prof P C Narasimha Reddy

  25. ఒకసారి గుడిలో – పూజారి రోజూ అలవాటైన పద్ధతిలో – గోత్ర, నామాల సహిత పూజ చేస్తున్నాడు. “భార్య పేరు x” గ్ని కరెక్టుగా చదివాడు.
    పెద్ద వాగ్వాద పోరాటం జరిగింది – అబద్ధాలు చెప్పి, పెళ్ళాడిన స్త్రీ Y – అక్కడ ఉన్నది మరి!
    మనిషికి మాదిరిగానే – (స్పీడుగా మారుతూన్న నేటి సంఘంలో తిరస్కార ప్రవృత్తి ప్రబలుతూన్న యువత – ఇందుకు నిలువెత్తు నిదర్శనాలు కదా!)
    సమాజానికి మానసిక ఆరోగ్య సంరక్షణకై – సాత్విక మత భావనలూ, వానిని పదేపదే – ఒక టీచర్ లా గుర్తు చేస్తూండే అర్చనకర్తలు – ఇది గొప్ప వ్యవస్థ; తూస్కరించడం సబబు కాదు. రామ్మోహన్ గారూ!

    • సాహితి says:

      /సమాజానికి మానసిక ఆరోగ్య సంరక్షణకై – సాత్విక మత భావనలూ, వానిని పదేపదే – ఒక టీచర్ లా గుర్తు చేస్తూండే అర్చనకర్తలు /
      నిజమా అండీ! నిజమైతే నేటి సంఘంలో తిరస్కార ప్రవృత్తి ప్రబలు టం ఎందుకటా ? నేర ప్రవృతి, తిరస్కార ధోరణి, హింస వంటి వన్నీ తగ్గు ముఖం పట్టాలి మరి. భయానకం ఎక్కువై తున్నది. తానూ తప్ప మరెవ్వరు బ్రతకూడదనే ప్రభలుతున్నది.

  26. ఉత్పాదకతకు – స్పష్టమైన నిర్వచనాన్ని చెప్పగలరా? :-
    1] బ్యూటి క్లినిక్సు – లలో ఫేసియల్ వంటి సేవలకు ఫీజు కాస్త చెప్పుకోదగినంత ఉంటూంటుంది.
    2] చానెల్సులలో డాన్సులూ, పటలు, వండుట ఇత్యాది ఎంటటెయిన్ మెంటు ప్రోగ్రాములన్నీ – ఉత్పాదకశక్తికి కొలబద్దలేనంటారా? ఆ కార్యక్రమాలను సోఫాలో కాళ్ళు బార సాచుకుని, నంకీన్లు తింటూ కూర్చుని, చూస్తూండే ప్రేక్షకుల క్రియ – {ప్రేక్షకులు కూడా} మీరు నొక్కి వక్కాణించిన ‘ఉత్పాదక వర్గమూ నకు చెందుతాయని – ప్రస్తుతం ఋజువు చేస్తారా?
    3] [భజన ] సంగీత, నాట్యాది వర్గాలకు ఆలవాలం కోవెలలు. ఈ వ్య్వస్థను ధ్వంసం చేయదలుచుకున్న వ్యక్తులు – ఖచ్చితంగా ప్రత్యామ్నాయాన్ని సరిదీటుగా సృష్టించి, రేపటి ఆదర్శప్రాయ సమాజ నిర్మాణానికి దోహదపడగలరా?
    4] అపార్టుమంటులలో పనిమనుషులు, వాకిలి, మెట్లు చిమ్మి – వారం కు ఒకసారి, నీళ్ళతో శుభ్రం చేస్తున్నారు, వారి చేతులకు అందుతూన్న జీతం – విలువ తెలిసినదే! (2000/ రూపాయలు – ఇంచుమిచు)
    5] కర్పూర హారతి వంటి పూజా క్రియలు – వాతావరణ కాలుష్య నివారణకు తోడ్పడుతున్నవి. ముఖ్యంగా పండుగల సందర్భములప్పుడు – పూజారులు ‘భుజస్కంధాల పైన – స్వామి వారి అలంకరణ మున్నగు పనుల పెను భారం మోపబడ్తున్నది.
    బ్యూటీ క్లినిక్ పాటి – మూల్యాన్ని కోరడానికి అర్చకులకు అర్హత లేదా?
    6] దండలూ, అగరుబత్తీలూ – నాన్సెన్సు – అని వాదిస్తున్నారా?
    ఇందువలన – పూలతోటల పెంపకందారులు, మధ్యవర్తులు, రవాణాచేసే వాళ్ళూ – షాప్స్, సేల్స్ మెన్, ఇంతమందికి, కుటీరపరిశ్రమల వాళ్ళకూ – పరోక్షంగా ఉపాధి దొరుకుతున్నది కదా! – ఈ కుటీరపరిశ్రమల అంచెలంచెల వ్యవస్థలో – మతభేదం లేకుండా – అందరూ బతుకుతెరువు ఏర్పడుతున్నది.
    7] అన్నిటి కన్న ముఖ్యంగా – పూల చెండ్లు -అల్లుట – మొదలైనవి – గొప్ప కళలు, హస్తకళా నైపుణ్యతకు సంబంధించి ఉన్నవి [ప్రపంచంలో ఒక్క భారతదేశంలొ మాత్రమే పుష్పహారముల అల్లికలు, పూలజడలు తయారీ – ………… కళాచాతుర్యత ఉన్నది, మనకు ఇది గర్వకారణం కూడా! గోరింట, మెహిందీ – ఇత్యాదులు వానికి అనుబంధ శాఖలు}
    8] కుక్సు = వంటవాళ్లు – ఎట్సెట్రా లిస్టు పెద్ద లిస్టు – ఔతూన్నది మరి! ………….
    హిందూ పూజా పద్ధతులు – శ్రమతో కూడినవి. గుడిని, భగవంతుని అభిషేకాదులు – పరిసుభ్రత -క్లీనింగ్ పనులే!
    ఇందుకు వాళ్ళకు లభిస్తూన్నది ఎంత?
    – లేఖ కూదా వ్యాసం ఔతూన్నది కాబట్టి ఇంతటితో ఆపుతాము
    ధన్యవాదములు

  27. G B Sastry says:

    సమాజంలొ అందరూ పోరాడితేగాని తమ న్యాయమైన వాటా
    సమకూడదన్న నమ్మకం సమాజం కలిగించబట్టే అన్నివర్గాలు
    పోరుబాట బట్టి చిన్న నా బొజ్జకి శ్రీ రామ రక్ష అనుకోడం నిజం
    జరిగేవాటికి ఎవరి రంగుకళ్ళద్దాల ఆరంగు అవగాహనతెలుపుతారే
    ఓ గులుకు రాణి

  28. సారంగ పత్రిక బ్రాహ్మలని తిట్టడం పని గా పెట్టుకున్నారా ఏంటి? కథ సారంగ లో కూడా ‘నామాలు’ అన్న కథ లో, ఆ మధ్య ఓ చిన్న కథ ‘బొట్టు’ లో చదివినపుడు కూడా అదే విధంగా అన్పించింది. ఇది మూడో కథ/ఆర్టికల్. మిగితా కథల్లో ఇలాగే టార్గెట్ చేసి రాసారేమో మరి నేను చదవలేదు. వేరే ఏ కులాల వాళ్ళని తిట్టడానికి ధైర్యం లేక వీళ్ళనే ఎన్నుకున్నారా ? ఒకే వర్గం మీద టార్గెట్ చేసి రాయటం పద్దతి గా అన్పించుకోదు. ఏం ఉత్పత్తి చేస్తున్నారని పూజారులకు జీతాలివ్వాలా? దేవాదాయ శాఖ అని ప్రత్యేకం గా ఎందుకు వుందో ప్రశ్న వేసుకోండి మీకు మీరే. అప్పుడు అర్ధం అవుతుంది ఎందుకు ఇవ్వాలో.

  29. g.venkatakrishna says:

    వేల ఏండ్ల కిందట బ్రాహ్మణా వర్గం చేసిన మేధో శ్రమ కు ఇప్పటికీ ఫలితాలు పొందుతోంది .సమాజం లో అధికారం ,సంపదా అన్నీ అప్పటి శ్రమ చలువె .ఇప్పుడు ప్రత్యేకంగా ట్రెజరీ ద్వారా పొందాలన్తోంది …సమాజాన్ని నడిపిస్తున్న భవజాఆలమ్ మీదే ,శ్రమకు మించిన ఫలితం ఇంకెంత కాలం అంటున్నాడు రామ్మోహన్ ,…. రామ్మోహన్ శ్రమ వృత్తిని , అదే తర్కం తో మీరు ఎద్దేవా చేయ డం బాగా లేదు ….నిజానికి రామ్మోహన్ వ్రుత్తి సర్విస్ సెక్టార్ కింద పరిగణిస్తే ,వేద మేధో శ్రమ కూడా ,సర్విస్ సెక్టార్ అని మీరు అనొచ్చు …మీది సర్విస్ సెక్టార్ ,సమాజం లో అసమానతలు పెంచే సంస్కృతీ సెక్టార్ ….రామ్మోహన్ అసమానతలు ఖండించే జర్నలిస్ట్ ….అంటే తేడ అర్థం అవుతుంది ……

  30. ఇంత క్రితం నేను రాసిన కామెంట్ ఇక్కడ కనపడటం లేదు. టెక్నికల్ ప్రాబ్లెం వలన అది కనపడంలేదా? లేక మోడరేషన్ చేసేవారు తొలగించారా? తొలగిస్తే ఎందుకు తొలగించారో తెలుసుకోవచ్చా?

    • మీ సైట్ లో టెక్నికల్ ప్రాబ్లెం ఉన్నట్లుంది. మొదట రాసిన కామెంట్ కు “your comment is awaiting moderation” అని చూపింది. రి ఫ్రెష్ చేస్తే ఆ కామెంట్ మాయమైంది. రెండో ది (పై వ్యాఖ్య) వెంటనే పబ్లిష్ అయ్యింది.మొదటి కామెంట్ ఇప్పుడు ఎక్కడా కనపడటంలేదు.

  31. Rishi Srinivas says:

    ప్రొడక్షన్ వేరు సర్వీసెస్ వేరు. ఇస్రో,డి.ఆర్.డి.ఓ,ఎన్.టి.పి.సి. వంటి సంస్థలను మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖలూ సేవలు.. అనగా సర్వీసెస్ కోవకి చెందుతాయి. ఒక వ్యక్తికి రేషన్ కార్డ్ ఇవ్వడం వల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం ఉత్పత్తి చేసిందో చెబుతారా ? ఆకాశవాణిలో లలిత సంగీతం వినిపించడం వల్ల వారు ఉత్పత్తి చేసిన మానసికోల్లాసాన్ని చూపించమంటే ఏం చెబుతాం ? కోర్టులు న్యాయ సేవలను, హాస్పిటల్స్ వైద్య సేవలను, పోస్టాఫీసులు తపాలా సేవలను, రైల్వేస్ రవాణా సేవలను,పాఠశాలలు విద్యా సేవలను అందిస్తున్నాయి. వీటిలో ఎక్కడ కూడా ఉత్పత్తి అనేది ఉండదు. సేవ మాత్రమే ఉంటుంది. అలాగే ఆలయాలు ఆధ్యాత్మిక/ధార్మిక సేవలను అందిస్తాయి. దేవాలయాలకు ఎంత ఆదాయం వస్తుంది, ఆ ఆదాయం సమకూర్చడానికి పూజారులు ఎంతగా దోహదపడుతున్నారో విజ్ఞత గల పాఠకులు కొందరు కామెంట్లలో చెప్పారు కాబట్టి మళ్ళీ నేను చెప్పడం చర్విత చర్వణం. ఇకపోతే అర్చకత్వం ఇతర కులాల వారికి కూడా చెయ్యనివ్వాలని అన్నారు చూడండీ ఇది భేషైన మాట ! అర్చకత్వం చేస్తుంటే డబ్బులు రావడం లేదు, పెళ్ళిళ్ళు కూడా కావడం లేదని భ్రాహ్మణులే ఆ పనికి దూరంగా ఉంటున్న పరిస్థితుల్లో భ్రాహ్మణేతరులు అర్చకత్వం చెయ్యాలనుకుంటారని అనుకోవడానికి లేదు. ఒకవేళ అనుకున్నా భ్రాహ్మణేతరులు అర్చకత్వం చేసే ఆలయాలకి భ్రాహ్మణేతరులైనా వెళ్తారా లేదా అన్నది నాకన్నా మీకే బాగా తెలుసు. ప్రతిరోజు ఉదయాన తిరుపతిలో గుడి తలుపులను వేరే కులానికి చెందిన వ్యక్తి తీస్తాడు. ఆ బ్రాహ్మణేతరుడి వంశానికే తొలి దర్శనాన్ని దక్కించుకునే భాగ్యం ఉంటుంది. ఇంకా మీరు బ్రాహ్మణులకు కుల దురహంకారాన్ని ఆపాదించాలనుకుంటే.. మీ ఇష్టం ! చివరగా ఒక్క మాట… ధైర్యంతో ఎవరూ అడగరు సార్.. గతిలేక కడుపుకాలి ఆడుగుతారు.

  32. ‘దేవుడినే నమ్మని, దైవభక్తిలేని, కొండొకచో ఇతర మతాలకు చెందిన వారూ అధికారుల పేరుతో ఆలయాల్లో ప్రవేశిస్తున్నారు” ‘సఫాయి కార్మికులకు మద్దతు తెలపని నాయకులు పూజారులకు మాత్రం సంఘీభావం ప్రకటించారు.’, ‘సమాజాన్ని దోచుకునే వాళ్లనుంచే వాళ్ళకు పాపభీతి కల్గించి వాళ్ళ ఆదాయంలోంచి కొంతయినా మళ్లీ దేవుడి దగ్గరకు చేర్చే,’ ‘దేవాలయాల సొమ్మును ప్రభుత్వం సిగ్గు లేకుండా మేస్తోంది,’ ‘మతాతీతమైన ప్రభుత్వ వ్యవస్థ,’ ‘22000 టన్నుల బంగారం,’ ‘మైనారిటిలను చూసి, మెజారిటిలు భయపడే స్థితి,’ ‘ఆదాయ”శబ్దం “దేవాదాయ శాఖకు” ఉంది,’
    ఈ పద ప్రయోగాలన్నీ పరిశీలిస్తే — అనవసర ఆందోళన కనబడుతుంది రెండు వాదనలలోనూ. ముఖ్యంగా రెండు విషయాలు అందరి స్ఫురణకు రావలసినవి … మతం, నమ్మకం, విశ్వాసం వ్యక్తిగత విషయాలు. వాటికి సంబంధించిన ఏ విషయాన్నీ లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నెత్తిన పెట్టుకోకూడదు. పెత్తనం చలాయించకూడదు. బాధ్యత తీసుకోకూడదు. ఒక మతానికి సంబంధించిన వాటిలోనే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంటే ఉలకని పూజారి వర్గం, భవిష్యత్ లో ఇలా ప్రభుత్వం నుంచి శాశ్వత భృతి పొందవచ్చని ఆశించే, మిన్నకుందని అనుకోవాలా? పూజారుల బ్రతుకుతెరువు కష్టం అవుతోందని ఒక పక్క మీరందరూ వాపోతుంటే, మరోపక్క రోజుకో కొత్త గుడి, గల్లీ కొక ఆలయం, పూజోత్సవాలూ, యాగాలూ, యజ్ఞాలు జరుగుతోంటే ఎలా అర్ధంచేసుకోవాలి? ప్రబలిపోతున్న పిచ్చినమ్మకాలా? మతం పేరుతో ఇబ్బడిముబ్బడిగా జరుగుతున్న లాభసాటి వ్యాపారమా?
    రాజా.

  33. rani siva sankara sarma says:

    ఇద్దరిదీ సాంస్కృతిక సామ్రాజ్య వాదమే
    సాంప్రదాయ వాదులనే ముద్ర చూసుకొని భయపడే తృతీయ ప్రపంచ దేశాల ప్రజల పట్ల , సాంస్కృతిక సామ్రాజ్యవాదం నిరంకుశంగా ప్రవర్తిస్తోంది.మార్కెట్ అనే ఒకేఒక ఆధునిక దైవం ఉందని , దానికి అడ్డం వచ్చే సాంప్రదాయిక సంబంధాలన్నిటినీ నాశనం చెయ్యాలని ఉపదేశిస్తోంది.[ జేమ్స్ పెట్రాస్ ]
    పూజారులు కాస్తంత జీతం పెంచమంటే అది కుల తత్త్వం జిఎస్ రామ్మోహన్ కి. వాళ్ళు శ్రమ కి దూరం గావున్న వాళ్ళు. శ్రామిక సంస్కుతికి ప్రత్యక్షశత్రువులు.
    కంచ ఐలయ్య దృష్టిలోనూ అంతే. సాంస్కృతిక రంగం నుంచి బ్రాహ్మలు తరిమెయ్యడం వల్ల శుద్రులు పాపం రకరకాల వ్యాపారాలు చేసుకొంటూ బతుకుతున్నారు. దానిలో భాగంగా సంస్కుతిని వ్యాపారంగా మార్చుకొన్నారు. వ్యాపారాన్ని వంశ పారంపర్యం చేసుకొన్నారు. వాళ్ళది శ్రమ సంస్కృతి. [ గుజరాత్ హత్యా కాండ కూడా ఎంతో కొంత శ్రమ సంస్కృతిలో భాగమే. అందుకే మోడీ మరో అబ్రహం లింకన్ కాగలరని ఐలయ్య ఆశపెట్టుకొన్నారు]
    రామ్మోహన్ దృష్టిలో పూజారులు ఏమి చెయ్యాలి? తమ కుల తత్వాన్ని విడిచిపెట్టి ఫిలిం నగర్లో వాటా కోసం డిమాండు చెయ్యాలి. రిక్షా తొక్కి రామోజీ రావులు కావాలి.

మీ మాటలు

*