Archives for March 2016

ఒక బందీ కథ!

 

-అరుణ గోగులమండ

~

 

ఆమె..
అద్దాలమేడలాంటి అందమైన లోగిలిలో
నగిషీ పట్టిన బొమ్మల్లో ఓ అందమైన బొమ్మగా
ఆమె కదులుతుంటుంది.
యెత్తైన గోడల ఆవల-
కట్టుదిట్టమైన భధ్రత మధ్యన
ఖరీదైన ఖైదీలా
ధిలాసాగా బ్రతుకుతుంటుంది.
తులసికోట పూజలూ లెక్కలేనన్ని వ్రతాలూ
దీపారాధనలూ, మడీ తడీ ఆచారాల్లో
తన ఉనికిపట్టు మర్చిపోయి,
మసిబారిన దీపపు సెమ్మెలా,
అఖండజ్యోతిలోని ఆరిపోని వత్తిలా
నిరంతరంగా కాలుతూ
రెపరెపలాడుతూ బ్రతుకీడ్చుతుంటుంది.
సాంప్రదాయపు పంజరంలో
పంచదార చిలకలా-
ప్లాస్టిక్ నవ్వుల్నియెండినపెదవులపైపూసి
నిప్పులుకడిగే వంశాల అసలు కధల్ని మరుగుచేసే
నివురుగా మిగులుతుంది.

 

ఊరిచివర విసిరేసిన
చీకటిగుడిసెల సముదాయంలో
మట్టిలో మకిలిలో
పేడకళ్ళెత్తుతూ కట్టెలు చీలుస్తూ
తాగుబోతు మొగుడి దాష్టీకానికి బలైన
ఆమె వెన్నుపూస.వాతలుతేలిన ఒళ్ళు
చేవలేని యెముకలపై వేలాడుతున్న చర్మం.
అంటరాని వాడలో..అగ్రకులపు అహంకారంతోయేకమై
తమ పురుషాహంకారం సైతం..
వెలివేసిన ఆడతనం ఆమెరూపం.
చీత్కారాలు మింగుతూ
బలత్కారాల శిలువల్ని
ఇంటాబయటా నిర్వేదంగామోస్తూ,
నాట్లలో కోతల్లో
తమ బ్రతుకుల్నే పాతేసుకుని
మొలకెత్తడం మరచిన నిర్జీవపు విత్తనంలాంటి ఆమె
తరతరాల బహురూపపీడనా పర్వాల
మూర్తీభవించిన నగ్నత్వం.

తానుండే ఇంటిలాగా
తమ ఉనికినిసైతం ఎత్తు గోడల ఆవల మూస్తూ
మూడుసార్లు బొంకితే ఓడిపోయే కాపురాల్ని,
తుమ్మకుండానే ఊడిపోయే భరోసాలేని జీవనాల్ని
బురఖాల మాటున దాచి..
లిప్ స్టిక్ రంగుల చాటున పెదవుల నిర్వేదాన్నీ
నల్లని సుర్మాలకింద ఉబికొచ్చే కన్నీటినీ
అదిమిపట్టి బ్రతుకుతూ..
మతమౌఢ్యపు తంత్రాలకు బలైన
పాతకాలపు యంత్రం ఆమె.

అందమైన శరీరాలనే అద్దింటి బ్రతుకుల్ని..
యేడాదికోసారి కనిపించిన భర్తల యాంత్రిక కాపురాల
గురుతుల పెంపకంలో ఖర్చుచేస్తూ
రోజుకైదుసార్లు పిలిచినా
బదులివ్వని దేవుడికి నిష్టగా మొరపెడుతూ..
నల్లటిపరదాల మాటున
మతం మత్తు ఇరికించిన
ఊపిరాడని దేహంతో
చాందసవాదపు చీకటికి అనాదిగా బందీ ఆమె.

తమదనే బ్రతుకేలేని అతివల బ్రతుకు చిత్రపు నలిగిన నకలూ
గెలుపెరుగని తరతరాల శ్రమజీవీ
నిలువెత్తు పురుషాహంకారం నిర్మించిన
నిచ్చెనమెట్ల సమాజంలో కొట్టేయబడ్డ మొదటి మెట్టూ
హక్కుల లెక్కల్లో అట్టడుగుకు నెట్టేయబడి,
కుటుంబవ్యవస్థ సిద్ధంచేసిన
కుట్రపూరిత బంధనాల తరతరాల బలిపశువూ..
నిత్య పరాన్నజీవిపాత్రకే కుయుక్తితో నిర్దేశింపబడ్డ
అసమాన ప్రతిభాశాలి

మె.

*

 

దొంగ 

 

 

– రమణ యడవల్లి 

~

ramanaఅది ఆంధ్రదేశంలో ఒక పట్టణం. ఆ వీధి ఎప్పుడూ రద్దీగానే వుంటుంది గానీ – ఇప్పుడు మిట్టమధ్యాహ్నం కావడం వల్ల ఆట్టే సందడి లేదు. ఇద్దరు కుర్రాళ్ళు నడుచుకుంటూ అటుగా వెళ్తున్నారు. ఇద్దరూ డిగ్రీ చదువుతున్నారు, చిన్నప్పట్నుండీ స్నేహితులు. కొన్నాళ్లుగా వారిద్దరు రాజకీయంగా గొడవలు పడుతున్నారు. కారణం – ఆంధ్రరాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు (ఎవరెన్ని కబుర్లు చెప్పినా) రెండు కులాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నయ్. దురదృష్టవశాత్తు – స్నేహితులిద్దరూ చెరోకులానికి చెందినవారైపోయినందున అనివార్యంగా తమతమ కులపార్టీల తరఫున వాదించుకోవాల్సి వస్తుంది!

ఇవ్వాళకూడా (రోజూలాగే) ఇద్దరి మధ్యా చర్చ చిన్నపాటి వాదనగా మొదలైంది. ఆ తరవాత ఇద్దరిలో ఆవేశం ఉప్పొంగింది. ఫలితంగా పెద్దపాటి కేకలు, అరుచుకునే స్థాయిదాకా వెళ్ళింది.

“మీ నాయకుడు రాజధాని పేరు చెప్పి వేల కోట్లు కాజేస్తున్నాడు.”

“మీ నాయకుడు మాత్రం తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్ష కోట్లు కాజెయ్యొచ్చు.”

“మీ నాయకుడి కొడుకు మాత్రం తక్కువా? ఇప్పటికే రెండు లక్షల కోట్లు కాజేశాడు.”

“మా నాయకుడికి అభివృద్దే ఊపిరి. మీ నాయకుడు అడ్డు పడకపొతే ఈ పాటికి మన రాష్ట్రం సింగపూరుని మించిపొయ్యేది.”

“అవును, మా నాయకుడు అడ్డు పడకపొతే  ఈ పాటికి రాష్ట్రం అమ్ముడుపొయ్యేది.”

స్నేహితులిద్దరూ బుసలు కొట్టారు, ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకున్నారు.

ఇంతలో –

“దొంగ! దొంగ!” అంటూ పెద్దగా అరిచారెవరో. స్నేహితులిద్దరూ తలతిప్పి అటుగా చూశారు.

ఎదురుగా – బడ్డీకొట్ట్టు ముందు కూల్ డ్రింక్ తాగుతున్నాడో నడివయసు బట్టతల పెద్దమనిషి. అతని జేబులోంచి పర్స్ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడో కుర్రాడు. చెరుకు రసం బట్టతలాయన తన జేబులో చెయ్యి పెట్టిన ఆ కుర్రాడి చెయ్యి చటుక్కున పట్టేసుకుని ‘దొంగ దొంగ’ అంటూ అరుస్తున్నాడు.

స్నేహితులిద్దరూ సింహాల్లా లంఘించారు, క్షణంలో దొంగని దొరకబుచ్చుకున్నారు. ఆ కుర్రాడికి సుమారు పదహారేళ్ళు ఉండొచ్చు. నల్లగా, సన్నగా వెదురుబద్దలా ఉన్నాడు. మాసిన బట్టలు, చింపిరి జుట్టు. మన స్నేహితుల పట్టు విడిపించుకోడానికి గిలిగిలలాడుతూ మెలికలు తిరిగిపోతున్నాడా కుర్రాడు.

స్నేహితులిద్దరూ ఆ దొంగ కుర్రాణ్ణి బోర్లా పడేసి మోకాళ్ళతో తొక్కిపట్టి కదలకుండా చేశారు. ఆ పక్కనే కొబ్బరి బొండాలు అమ్మేవ్యక్తి దగ్గర కొబ్బరితాడు తీసుకున్నారు. తాడుతో ఆ కుర్రాడి పెడరెక్కలు బలంగా వెనక్కి విరిచి కట్టేశారు. ఆపై ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి రోడ్డు వారాగా ఉన్న కరెంటు స్తంభానికి కట్టేశారు.

ఇంక విడిపించుకోలేనని గ్రహించాడా కుర్రాడు. “అన్నా! వదిలెయ్యన్నా! ఇంకెప్పుడూ చెయ్యనన్నా! నీ కాల్మొక్తా అన్నా!” అంటూ ఏడవసాగాడు. ఈలోపు చుట్టూతా పెద్ద గుంపు తయారయ్యింది.

ఎర్రటి ఎండ. తారు రోడ్డు పెనంలా కాలిపోతుంది. కరెంటు స్తంభం నిప్పుల కొలిమిలో కాల్చి తీసినట్లు మండిపోతుంది. గుంపులో ఒకరు అతని చొక్కాని, పేంటుని చింపేసారు. చిరుగుల డ్రాయర్ అతగాడి నగ్నత్వాన్ని కప్పలేకపోతుంది.

స్నేహితులిద్దరూ దొంగపై పిడిగుద్దులు కురిపించారు. కొద్దిసేపటికి చేతులు నొప్పెట్టాయి. మోకాళ్ళతో డొక్కల్లో కుమ్మారు. కొద్దిసేపటికి మోకాళ్ళు నొప్పెట్టాయి. అంచేత ఎగిరెగిరి కడుపులో తన్నారు.

ఈ ‘నేరము – శిక్ష’ దృశ్యానికి ఉత్తేజితులైన ఇంకొందరు యువకులు వారికి జత కూడారు. వంతులవారీగా దొంగని తన్నటం మొదలెట్టారు. తరవాత దొంగని తన్నే పవిత్ర కార్యానికి వారిలో పోటీ మొదలైంది. అటు తరవాత గుంపుగా తన్నారు.

కొద్దిసేపటికి దొంగ కళ్ళు తేలేశాడు. నోట్లోంచి నెత్తురు కారసాగింది. శరీరం మాంసం ముద్దలా మారిపోయింది. ఇంకొద్దిసేపటికి తల వాల్చేశాడు.

రొప్పుతూ రోజుతూ చెమటలు గక్కుతూ శ్రమిస్తున్న ప్రజానీకం ఓ క్షణం ఆగింది.

“మాస్టారు! ఈ మధ్యన తన్నులు తప్పించుకోడానికి దొంగలు దొంగేషాలేస్తున్నారండీ! అదంతా యాక్షన్ సార్! కుమ్మండి కొడుకుని!”

మళ్ళీ తన్నులు మొదలు. ఈసారి కర్రలు వచ్చి చేరాయి. ధనా.. ధన్ .. ఫటా.. ఫట్.. దొంగవేషాలు వేసే దొంగలూ, అసలు యే వేషాలు వెయ్యలేని దొంగలూ.. వందసార్లు చచ్చేంతగా నిరంతరాయంగా కొనసాగిందా హింసాకాండ.

ఇది పుణ్యభూమి, ఇక్కడ చట్టం తనపని తను చేసుకుపోతూనే ఉంటుంది. అంచేత కొంతసేపటికి చట్టబద్దులైన పోలీసులొచ్చారు. దొంగ కట్లిప్పదీశారు. దొంగ రోడ్డుమీదగా వాలిపోయ్యాడు. తల పగిలింది, దవడలు విచ్చిపొయ్యాయి. నెత్తురు కమ్మిన ఎర్రటి కళ్ళు ఈ ప్రపంచాన్ని అసహ్యంగా, కోపంగా చూస్తున్నట్లు వికృతంగా వున్నాయి.

చచ్చాడా? చచ్చే ఉంటాళ్ళే, దొంగ ముండాకొడుకు. మురికిలో పుట్టి మురికిలోనే కలిసిపొయ్యాడు. మాస్టారూ! ఎందుకలా ఫీలవుతున్నారు!? మీరెవరో మరీ అమాయకుల్లా వున్నారే! యేదీ – ఓ సిగరెట్టిలా పడెయ్యండి. థాంక్యూ! పరాయి సొత్తు నిప్పుతో సమానం. నన్ను చూడండి! ఆకలేస్తే చావనైనా చస్తాగానీ, దొంగతనం చేస్తానా? ఈ నేరస్తుల్ని జైల్లో వెయ్యడం, వాళ్ళు బయటకొచ్చి మళ్ళీ నేరం చెయ్యడం – మన టాక్స్ పేయర్స్ మనీ ఎంత వృధా! అంచేత దొంగతనం చేసే లమ్డీకొడుకుల్ని ఇలా చావ చితక్కొట్టేస్తే దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఏవఁంటారు?

రాష్ట్ర రాజకీయాల పట్ల వైరుధ్యం వున్నా, దొంగని శిక్షించే విషయంలో ఒకటవ్వడం స్నేహితులకి సంతోషం కలిగించింది. బాధ్యత కలిగిన పౌరులుగా సమాజానికి మొదటిసారిగా సేవ చేసే అవకాశం కలిగినందుకు ఆనందంగా ఉంది. ‘ఈ దేశంలో అందరూ తమలా నేరం చేసినవాడికి శిక్ష పడేట్లు చేస్తే నేరాలే ఉండకపోను!’

స్నేహితులిద్దరు మళ్ళీ కబుర్లలో పడ్డారు.

“మా నాయకుడి ప్రజాసేవకి అబ్బురపడి మీ పార్టీ ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చేస్తున్నారు.”

“అది మీ నాయకుడి ప్రతిభ కాదు, అధికారం అనే బెల్లం!”

ఈ విధంగా తమ కబుర్లు కొనసాగిస్తూ ఇంటిదోవ పట్టారు.

రింగ రింగ.. రింగ రింగ.. రింగా రింగా రేయ్!

 

-బమ్మిడి జగదీశ్వర రావు 

~

 

bammidi ఒరే తమ్ముడూ..

నాకో సమస్య వచ్చింది! సమస్య అంటే పెద్ద సమస్య కాదనుకో! అలాగని చిన్న సమస్య కూడా కాదు! పోనీ అని వదిలేద్దామన్నా అది నన్ను వదలడం లేదు! ఇలా యెన్నాళ్ళు అవస్థలు పడాలో అర్థం కావడం లేదు! నీకు కాకపొతే యెవరికి చెప్పుకోను చెప్పు? ఎవరికి చెప్పినా యెవరికి వారే అదో సమస్య కాదన్నట్టు చూస్తున్నారు! ఆ సమస్య తమకీ వుందన్నట్టు మాట్లాడుతున్నారు!

నువ్వు నవ్వకు! ఎందుకంటే నేను యేడుస్తుంటే అందరూ నవ్వుతూ వున్నారు! సమస్యను తీర్చలేనప్పుడు పోనీ దానికి అలవాటు పడాలి కదా? అలా పడిపోదామన్నా అవడం లేదు! పైగా నన్ను చూసి యింటా బయిటా అంతా నవ్వుతున్నారు! నువ్వు హైదరాబాదుకూ ముంబాయికీ తిరుగుతుంటావు కదా?, నీకయితే మంచి డాక్టర్లు తెలుస్తారని! యిదిగో.. నీకిలా మెయిల్ పెడుతున్నప్పుడూ అదే.. ఫోన్ రింగయినట్టు.. రింగు కాకుండానే రింగయినట్టు.. యిదే సమస్య!

అదేమిటోరా.. ఫోన్ రింగవుతుంది! వెళ్లి తీస్తే- యే రింగూ లేదూ బొంగూ లేదు! అంతా బ్రాంతి! భ్రమ! మోగకుండా మోగినట్టు! యెవరూ చెయ్యకుండా చేసినట్టు! చచ్చిపోతున్నాననుకో! అంతా భ్రమని బ్రాంతని ఆగిపోతే, ‘మీ నాన్నకీమధ్య చెముడు వొచ్చినట్టు వుంది..’ అని పిల్లలతో అంటోంది మీ వొదిన! ‘ఫోన్ రింగయినా తియ్యరా? మీకొకరు ఫోన్ వొచ్చిందని చెప్పాలా? ఫోన్ కూడా తెచ్చి అందివ్వాలా? మగ పొగరు!’ అని వున్న గొడవలకి తోడు కొత్త గొడవలు! పోనీ అని ఫోను పట్టుకొనివుంటే – ‘వొచ్చిన ఫోను చూడకపోతే రాదా?’ అంటుంది! మాటిమాటికి ఫోన్ చెక్ చెయ్యక తప్పడం లేదు! చేస్తే నాకేదో కొత్త నెంబర్లు కనెక్ట్ అవుతున్నట్టు.. కొత్త ఎఫైర్లు వున్నట్టు అనుమానిస్తోంది మీ వొదిన!

తమ్మూ.. వూళ్ళో మనింట్లో జరిగింది నీకు గుర్తుంది కదా.. రోజూ లాగే ఆరోజూ అమ్మ సీరియల్ చూస్తూ వంట చేస్తోంది కదా.. ల్యాండ్ లైన్ ఫోన్ మోగింది! మోగుతూనే వుంది! అమ్మ వంట గదిలోంచి అరుస్తోంది.. ‘ఫోన్ యెత్తండ్రా’ అని! మోగిన ఫోన్ ఆగింది! ‘యెవరు చేసారో యేమో.. యీ ముష్టి మంద ఫోను యెత్తరు కదా..’ అమ్మ తిడుతోంది! ఆగిన ఫోన్ మళ్ళీ మోగింది! మోగుతూనే వుంది! ‘యెత్తండ్రా ఫోను..’ అమ్మ అరుస్తోంది! ఫోన్ మోగుతోంది! ఆఖరికి అమ్మే వొచ్చి ‘ఫోను యెత్తరేమర్రా..’ నోట్లో మాట నోట్లోనే వుండిపోయింది! ‘రింగయిందని టీవీ సీరియల్లో ఫోను యెలా యెత్తేది?’ నాన్న మాటలకు అందరం పడిపడి నవ్వలేదూ?..

ఆరోజు అలాగ నవ్వాననే యిలాగ యీరోజు అందరూ నన్ను చూసి నవ్వుతున్నారా? మెలకువలోనే కాదురా, నిద్రలోనూ ఫోన్ రింగయినట్టే గబుక్కున లేచి కూర్చుంటాను! ఫోను చూస్తాను! అర్ధరాత్రీ ఆపరాత్రీ లేదా అని ఆవిడ అపర కాళీ అయిపోతుంది! నా వాలకం చూసి లేనిపోనివి అన్నీ వూహిస్తోంది! పోయేకాలం వొస్తే.. అన్నీ పాడుబుద్దులే పుడతాయట! మగనాకొడుకులంతా చిత్తకార్తె కుక్కలట! ఇన్నాళ్ళూ నోట్లో వేలు పెడితే కొరకలేని వాణ్నని అనుకుందట! నేను వాళ్ళ మాంగారి వారసత్వం నిలిపేస్తానట! డౌటూ అనుమానమూ రెండూ లేవట! అగ్గి ఫైరయిపోతోంది! అప్పటికీ యెందుకు పెంట అని- ఆవాళ రాత్రి ఫోను మోగితే మోగనీ అని వొదిలేశా! వొకటికి నాలుగు సార్లు రింగవుతూనే వుంది! అప్పటికీ అడిగా! ‘మీ ధ్యాస వల్ల మీకు అలా అనిపిస్తోంది గాని మోగలేదు.. చెయ్యాలనుకుంటే వెళ్లి ఫోను చేసుకోండి.. నేనేమనుకోను..’ అంది మీ వొదిన! తెల్లవారి ఆఫీసులో బాసు యెక్కి తొక్కి నామీద డాన్సు చేసాడు! నాలుగుసార్లు ఫోను చేసినా యెత్తవా? అని! బాధ్యత లేదని!

మా ఫ్రెండ్ కు చెప్పాను! వాడు నాకు టెస్టు పెట్టాడు! నా సెల్ కు రింగిచ్చాడు! రింగయింది అన్నాను! కాసేపు ఆగి యిప్పుడో? అడిగాడు! లేదన్నాను! ప్రాబ్లం లేదన్నాడు! కాసేపటికే రింగు వొచ్చినట్టు అయ్యి కంగారుగా తడుముకున్నాను! చూసి- ‘అర్జెంటుగా రింగ్ టోన్ మార్చు’ అన్నాడు! నా కిష్టమయిన రింగ్ టోన్.. ‘సడిచేయకే గాలి.. సడిచేయబోకే..’ అన్నాను! అలవాటు కూడా పోరపాటే అన్నాడు! గ్రహపాటు అనుకున్నా! మన పెద్దోడు ‘రింగ రింగ.. రింగ రింగ.. రింగా రింగా రేయ్’ పాటని నా సెల్లో రింగ్ టోన్ గా పెట్టాడు! అదిమొదలు మాబాస్ తో అందరితో తిట్లే తిట్లు! నేనెవరి ఫోనూ యెత్తడం లేదని కంప్లైంట్! నిజమే! రింగయినా యెత్తలేదు! యెవరిదో ఫోను మోగుతోంది అని అనుకొనేవాడిని! నాది కాదనుకొనేవాడిని! యెక్కడ ‘సడిచేయకే గాలి..’ అన్నా నేను నా ఫోను యెత్తేవాణ్ని! కొన్నాళ్ళకి గాని రింగ రింగ.. రింగ రింగ.. రింగా రింగా రేయ్ – రింగు టోన్ కు అలవాటు పడలేదు! యిప్పుడు యెక్కడ ‘రింగ రింగా’ అన్నా నాఫోనే రింగయినట్టు వుంటోందిరా! ఒకటి చెప్పనా.. నాకులాగే ఒక్క ఫోను మోగితే పదిమంది తమ సెల్లులు తీసి చూసుకుంటున్నారు తెలుసా? నిజంరా!

ఎప్పటికప్పుడు.. కనీసం మూడు నెలలకి వొకసారి రింగు టోను మార్చుకోవాలని సైక్రియాట్రిస్ట్ చెప్పాడు! నాకు ముచ్చెమటలు పోశాయి! రింగు టోన్ మార్చినపుడల్లా యింట్లో ఆఫీసులో గొడవలే గొడవలు! పిర్యాదులే పిర్యాదులు! అలవాటు పడడానికి అష్ట కష్టాలు! ఆ అలవాటు లోంచి మళ్ళీ బయిట పడడానికి తిప్పలే తిప్పలు! కొత్త టోన్ కు అలవాటు పడడానికి పాట్లే పాట్లు!

ఫోను కొన్నాళ్ళు మానేయమన్నాడు డాక్టరు! ఒక్క రోజు మరిచిపోయి వెళ్తేనే వెలితి! మనసులో మనసుండదు! తలకాయ తీసి యింట్లో వొదిలి వొచ్చినట్టే! నిలవ నియ్యదు! కొంపలు మునిగినట్టుగా వుంటుంది! యింటికొచ్చి ఫోను తీసికెళితే- మీ వొదిన ‘వోడల వర్తకం గాని ఆగిపోతోందా..?’ అని ఆడుకుంటుంది! పగ పెట్టేసుకొని బాతురూములో వున్నా తలుపు కొట్టి మరీ ఫోను తెచ్చి యిచ్చేస్తుంది! అడగకముందే ‘అదెంత అర్జెంటో’ అంటుంది! ఆగక ‘ఆ అన్నయ్య ఫోను చేసినప్పుడు యెత్తేస్తే వొక్క నిమిషం మాట్లాడి పెట్టేస్తాడు.. లేదూ అని మనం చేసామో- సరిగ్గా రొండు గంటలు మాట్లాడుతాడు..’ అంటుంది! రీజనింగులో మా యింటావిడకి వందకి వంద మార్కులు.. నీకు తెలియందా?

మొత్తానికి ఫోను రింగవకుండా అయినట్టు అనిపిస్తుంది! రింగయినాసరే కాదు నా భ్రమ అనిపిస్తుంది! చెప్పుకుంటే చాలా చిన్న సమస్యలా అనిపిస్తుంది! అనుభవిస్తే చాలా పెద్ద సమస్యలా తోస్తుంది! వైబ్రేషన్లో కూడా పెట్టి చూసా.. శరీరమంతా చెవులవడమూ కష్టమేరా..!? సేం టు సేం ప్రాబ్లం..!!

ఏదయితే అదే కానివ్వమని ఫోను వాడడం మానేసా! ‘పోన్లెండి.. రేడియేషన్ బారి నుండి మీరయినా తప్పించుకున్నారు..’ మీ వొదిన మెచ్చుకుంది! ‘వెనకటికి నీలాంటివాడే సిగరెట్లు తాగడంలేదని సంబరపడ్డాడట.. యాక్టివ్ స్మోకర్ వొక సిగరెట్ కాలిస్తే.. పాసీవ్ స్మోకర్ పద్దెనిమిది సిగరెట్లు కాల్చినట్లు.. యింటి చుట్టూ ఆఫీసుల చుట్టూ నీ చుట్టూ టవర్లే టవర్లు పెట్టుకొని.. రేడియేషన్లోనే రేయింబవళ్ళు రొస్టవుతూ రోస్టు అవుతూ.. చాల్లేరా.. ఫోను వాడకపోయినా రేడియేషన్ నిన్ను ఫుల్లుగా వాడుకుంటుంది..’ అని బావగాడి వెర్షన్! ఎవడి వెర్షన్ యెలా వున్నా నేనయితే ఫోను వాడడం మానేసా! జేబులో ఫోను లేదు! లేదని తెలిసినా రింగు వినిపించేది?! లేని ఫోను తడుముకొనే వాణ్ని! అలవాటుగా పక్కవాడి ఫోను రింగయితే నాఫోనే అని నేనే యెత్తేసా! ఇంతకన్నా నా ఫోను నేను యెత్తుకోవడం బెటరనిపించింది! ‘రావుగారూ.. ఫోనేం వాడడం లేదూ?’ అని ప్రతొక్కడూ అడిగేవాడే! నేనొక కథ చెపితే- జనంలో పది రకాలు కాదు, వంద రకాల కథలు వినిపించాయి! నాకే తెలియని నా ఫోను గురించి కథలు కథలుగా విని యింతకన్నా ఫోనుతో యెన్నెన్ని తిప్పలు పడుతూ నయినా ఫోను వాడడమే బెటరున్నర బెటరనిపించింది!

సో.. నేనిప్పుడు ఫోను వాడుతున్నాను! అష్టకష్టాలు పడుతున్నాను! మర్చిపోకు.. నాసమస్యకు పరిష్కారం చూపించే మంచి డాక్టర్ని చూడు! చచ్చి నీ కడుపున పుడతాను!

ఫోను రింగవుతున్నట్టుంది.. వుంటానురా..

ఫోనుతో- సారీ ప్రేమతో-

మీ

అన్నయ్య

ఒకపరి జననం ఒకపరి మరణం

001

   –సి.ఉమాదేవి 

~

 

నిబద్ధతతో విశ్లేషణాత్మకంగా పరిశీలించి,  పరిశోధించి పాఠకులను తన రచనాపఠిమతో ఆయస్కాంతంలా ఆకర్షించేలా రచనచేయగలగడం రామా చంద్రమౌళిగారి ఒరవడి.పైగా రచనలోని లోతైన భావాలను వెలికి తీయించే పనిని మనకు తెలియకుండానే మనకే అప్పగిస్తారు.అక్కడక్కడా తటిల్లున మెరిసే పద మెరుపుల చురకలు ఒకొక్కసారి ఉరుములై గర్జిస్తాయి.

మనిషి జీవితంలో జననం చలనం,మరణం నిశ్చలనం.ఈ రెండు స్థితులనడుమ పయనం మనిషి మనుగడకై చేసే సంగ్రామం.

లోకానికి మనిషి పుట్టుకను తెలుపుతూ తొణికిన తొలి భాష్పం రాగరంజితం.అదే మనిషి మరణాంతరం  నలుగురి తలబోతలో ఒదిగినప్పుడు ‘ నీవు మరణించలేదు, అందరి గుండెల్లో పదిలమై శాశ్వతంగా జీవించే ఉంటావు’ అని ఆనాటి భాష్పానికి భాష్యం చెప్తుంది. నిజమే! మనిషిగా జన్మించాక మరణించక తప్పదు.అయితే మరణించాక కూడా జీవించాలి.అయితే ఆ జీవనంలో  లక్ష్యమనేది లేకపోతే అది మరణమే.అందుకే నేటి యువతకు దిశానిర్దేశం చేసి ప్రోద్బలం అందించాలి.గురిపెట్టిన లక్ష్యానికి చేరువకావాలంటే మార్గం సుగమం కావాలంటారు రచయిత.ఆలోచనలను చదవాలంటారు.నిజమే కదా!

‘ ది వాకర్ బ్రాండ్’ పాదరక్షల వ్యాపారంలో అగ్రగామిగా నిలవడానికి చోదకశక్తినందించిన వ్యక్తి లోల.ఆమే ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా విభిన్నఆలోచనలతో కంపెనీని ఊర్ధ్వపథంలో నిలిపింది.డబ్బు,పదవులు, అధికారాలు, ఆధిపత్యాలు కొందరికి ఆనందాన్నిస్తాయి.కాని కొందరికి తమ నైపుణ్యం అందించిన విజయాలు ఆనందంకన్నా అమితమైన తృప్తిని కలిగిస్తాయి.పరిమళకు అర్థమైన లోల మనసు ఇదే.సర్చ్,రిసెర్చ్ రామా చంద్రమౌళి గారి మంత్రాక్షరాలు.రచయిత తనకు నిర్దేశించిన బాటలో తన అడుగులను బలంగా ముద్రించుకోగలిగిన సదాశివ, జాతిని ప్రభావితం చేయగలిగే ఆవిష్కరణల దిశగా పయనిస్తాడు.అయితే విజయవ్యూహాల్లో మానవీయ స్పర్శను దర్శించాలనడం మానవతను ఆరాధించేవారికి దైవదర్శనమే!సౌరశక్తిని వినియోగంలోకి తెచ్చుకుని సోలార్ సిటీ రూపకల్పన,బ్యాటరీతో నాలుగు నిమిషాలు ఛార్జింగ్ చేస్తే మూడువందల కిలోమీటర్లు ప్రయాణం చేయగలిగే  ‘ లోల మోటర్ బైక్ ’

రూపకల్పనపై  ఉదహరించిన దృశ్యం(పవర్ పాయింట్ ప్రజంటేషన్ ) నవల ముగింపులో ఉత్సుకత కలిగించిన అంశం. ప్రజాప్రతినిధుల అండ దొరకడం అతడిని లక్ష్యదిశగా నడిపింది. “ జాగ్రత్తగా విను లోలా!” అని సదాశివ చెప్తున్న మాటలను మనము కూడా  చెవి ఒగ్గి వింటాము.ఘంటసాల,ముఖేష్ ఈనాడు లేరు.అయినా చిరస్మరణీయులే అని చెప్పే సదాశివ చరిత్రలో మిగిలిపోవాలన్న ఆకాంక్షపై దృష్టి కేంద్రీకరిస్తాడు.తను  రూపొందించాలనుకునే పరిశ్రమలకు ప్రభుత్వ వెన్నుదన్నేకాదు లోల తోడ్పాటును కోరుకుంటాడు.  తన పదవికి రాజీనామా చేసి లోల అతడి ఆహ్వానం మేరకు కలిసి పనిచేయడమేకాదు,కలిసి జీవించాలనుకుని తీసుకున్న నిర్ణయంతో మనము కళ్యాణమస్తు అని నవల ముగిస్తాము.అయితే వెంటాడే ఆలోచనలు తలుపులు మూయవు.అదే నవలకున్న సుగుణం.చదివిన పుస్తకంనుండి ఏదైనా కాస్త నేర్చుకోవాలనుకునే శ్రద్ధ ఉన్నవారికి  ఈ పుస్తకం కరదీపిక అనడంలో అతిశయోక్తి లేదు.

*

 

మెరుపై మెరిసిన మహేంద్ర!

 

కొందరు వ్యక్తులు కొద్దిలోనే అద్భుతాలు చేస్తారు. “అబ్బ,ఎక్కడి నుంచి వచ్చాడితను” అని మనం ఆ చాతుర్యానికి, నైపుణ్యానికి అబ్బుర పడి పలకరించబోయే లోపుగానే  కళ్ళ ముందే అదృశ్యమై పోతారు. అయ్యో ఇలా జరిగిందేంటని మనం ఎంతనుకున్నా లాభం లేదు. అలా వెలుగులు చిమ్ముతూ రాలి పోయిన ఒక నక్షత్రమే మహేంద్ర! మధురాంతకం రాజారామ్ గారి అబ్బాయి! అతను బతికుండగా రచయితగా నాకు పరిచయం కాలేదు. అతను రాసిన ధారావాహిక ఒక వార పత్రిక లో వస్తున్నపుడు కూడా చదవలేదు ! బహుశా  స్కూలు రోజులే కావడం  వల్లనేమో అంత సీరియస్ సాహిత్యం చదివే జ్ఞానం, ఎరుక లేక పోయుండాలి !  1991 లో అది నవల గా వచ్చినపుడు విశాలాంధ్ర లో కొన్నాను!

అంతటి అద్భుతమైన కథని సీరియల్ గా వచ్చినపుడు వారం వారం ఉత్కంఠ గా ఎదురు చూసి చదవలేక పోయానని పశ్చాత్తాప్పడ్డాను

మహేంద్ర గొప్ప కథకుడు! టెక్నిక్ తెల్సిన వాడూ, రచన గమ్యం పట్ల  స్పృహ కల్గిన వాడూ, రాయలసీమ ప్రాంతం పట్ల ప్రేమా, ఆ ప్రాంతపు సమస్యల పట్ల అవగాహన ఆందోళన, ఆ జీవనయానం మీద గౌరవమూ ఉన్నవాడు , ఇంకా ,మనిషి మీద, జీవితం మీద లోతైన ఆలోచన, పరిశోధన ఉన్నవాడు. అందుకే మహేంద్ర రాసిన కవితైనా కథైనా ఒక పట్టాన వదిలి పోదు పాఠకుడిని! జీవితం యవ్వన ప్రాయంలోనే వాడి రాలి పోవడం వల్ల అతను రాసిన కొద్ది రచనలతోనే అభిమాన పాఠకులు సరి పెట్టుకోవాల్సి వచ్చింది గానీ, మరో 20 ఏళ్ళైనా జీవించి ఉంటే ఇంకెన్ని ఆణిముత్యాలు అందించే వాడో అనే ఆలోచన దిగులు పుట్టిస్తుంది  అతని రచనలు చదువుతుంటే !

ఈ నవల “స్వర్ణ సీమకు స్వాగతం” చాలా చిన్న నవలే! కొద్ది గంటల బస్సు ప్రయాణాన్ని అత్యద్భుతంగా వర్ణిస్తూ సాగే నవల.  పుస్తకం పట్టుక్కూచుంటే గట్టిగా రెండు గంటల్లో చదివేయగలం! కానీ ఆ రెండు గంటల తర్వాత కనీసం రెండు రోజులైనా నవల్లోని పాత్రలూ, మహేంద్ర చెక్కిన వాక్యాలూ మన వెనకాలే మాట్లాడుతూ తిరుగుతాయి.

mahendra

జీవన యానం లో ఎవరి దార్లు వాళ్లవి. ఎవరి గమ్యాలు వాళ్లవి. ఒకరి బాగోగులు మరొకరికి పట్టవు. చూడ్డానికి అందరం ఒకటే దార్లో వెళ్తున్నట్టే ఉంటుంది కానీ మధ్యలోనే దిగి పోయే వాళ్ళు కొందరైతే, చివరి వరకూ ప్రయాణించే వాళ్ళు కొందరు! దారి ఒకటే అయినా గమ్యాలు వేరు! ఈ క్రమంలో సమాజమే పెద్ద పర్తి గుంట బస్సుగా అవతరిస్తుంది నవల్లో!

చిత్తూరు జిల్లా కుప్పం బస్టాండ్ లో ఎర్రని ఎండలో మొదలయ్యే కథ మరి కొద్ది గంటల్లోనే పెద్దపర్తి గుంట  చేరకుండానే కటిక చీకట్లో ఇసక లో దిగబడి ఆగి పోతుంది. గమ్యం చేరిన వాళ్ళు చేరగా నిమిత్త మాత్రులైన డ్రైవర్, కండక్టర్లు కాక అందులో మిగిలిన ఇద్దరూ గమ్యం చేరని నిర్భాగ్యులై మిగిలి పోతారు.

ఆ ఇద్దర్లో ఒకడు డెబ్భై ఏళ్ళు దాటిన వృద్ధుడు తిమ్మరాయప్ప! యాంత్రిక నాగరికతా ప్రస్థానం లో మానవత్వం అనుభవిస్తున్న సంక్షోభానికి ప్రతీకగా అన్ని రకాలుగానూ దగా పడి ఒట్టి చేతులతో మిగిలి పోయే తిమ్మరాయప్ప!  రెండో వాడు విజయవాడ కు చెందిన జర్నలిస్ట్ రమణ మూర్తి !  ఈ సంక్షోభాన్ని, సుభద్ర  మొదలుకుని దివాణం రాజా వారు వసంత నాయని వారు , తిమ్మరాయప్ప, రమణ మూర్తి,భాగ్యమ్మ , అత్తినీరాలు  ఇంకా ఇతర బలహీన, నిర్భాగ్య  జీవితాల ద్వారా కళ్లకు కట్టినట్టు మహేంద్ర ఆవిష్కరిస్తాడు.

చిగుర్ల గుంటలో కొత్తగా మొదలైన బంగారు గనుల గురించి మానవాసక్తి కర కథనాన్ని పత్రికకు రాయాలని విజయవాడ నుంచి వచ్చిన విలేకరి రమణ మూర్తీ, జ్వరం తో ఉన్న బిడ్డను పట్నంలో డాక్టర్ కి చూపించుకోడానికి వచ్చి తిరుగు ప్రయాణమైన సుభద్ర, ఆమె వాలుచూపుల కోసం ,పడిగాపులు కాసే వెంకట పతీ, చితికి పోయిన జమీందారు వసంత రాయని వారూ, అతని సేవకుడైన లింగయ్య , లీడరు అతని అనుచరులు, తాగుబోతు అత్తినీరాలు, భాగ్యమ్మ ఆమె ప్రియుడు వెంకట స్వామి వీళ్లందరి ఎదురు చూపులూ పెద్దపర్తి గుంట బస్సు కోసమే! బస్సు రాక ముందు, వచ్చాక, ఎక్కాక వీళ్ళందరి ప్రవర్తనలూ ఎన్ని రకాలుగా మార్పు చెందుతాయో మహేంద్ర అలవోకగా చిత్రించి ఔరా అనిపిస్తాడు.

Swarnaseemaku Swaagatam_Mahendra1నవలకు ముందు మాట రాసిన ఆర్. ఎస్. సుదర్శనం ఇలా అంటారు.”ప్రగతి అంటే మిథ్య కాదు. అది పెద్దపర్తి గుంట బస్సు. అందరూ దాని కోసమే ఎదురు చూస్తారు. తొక్కిసలాటలో కండబలం కలవాళ్ళు సీట్లు సంపాదిస్తారు.కొందరు కిక్కిరిసి నిల్చుంటారు. మరికొందరు టాపు మీదైనా చోటు సంపాదిస్తారు.ఎక్కడ దిగవలసిన వాళ్ళు అక్కడ దిగిపోగా బస్సు గమ్యం చేరుతుందా లేదా ఎవరికీ పట్టదు”.

తిమ్మరాయప్ప తోనే నవల ప్రారంభమై అతనితోనే ముగుస్తుంది. పంటలు పండక, నీళ్ళకోసం సొరంగం లాంటి బావి తవ్వి,దానికోసం ఉన్న డబ్బంతా పోగొట్టుకుని,భూముల్ని పాడుబెట్టి,అప్పులపాలై, అందర్నీ పోగొట్టుకుని చివరికి తాకట్టు పెడదామని కుప్పం తీసుకెళ్ళిన మనవరాలి ఒక్క నగనీ, ఎవరూ డబ్బు ఇవ్వకపోవడంతో ఇంటికి తిరిగొస్తూ కిక్కిరిసిన బస్సు ప్రయాణంలో పోగొట్టుకుని జీవచ్ఛవంలా విలపిస్తూ మిగులుతాడు. అతని బాధకి ప్రత్యక్ష సాక్షిగా ..నాగరిక సమాజంలో నలిగిపోతున్న రమణమూర్తి!

నవల చదువుతున్నంత సేపూ మనసులో ఏ మూలో బాధా వీచికలు కదుల్తూ ఉంటాయి. పాఠకులుగా స్పందిస్తున్నా, నిజానికి ఆ బస్సులో మనమూ ఉంటే ఏ ప్రయాణీకుడికీ భిన్నంగా ప్రవర్తించం! మహేంద్ర రచయిత మాత్రమే కాదు, కవి కూడా!  స్పందన కల్గిన అందరు కవుల్లాగే అతను కూడా యదార్థ జీవిత వ్యధార్త దృశ్యానికి చలిస్తాడు. స్పందిస్తాడు ! అతని  స్పందనను  అద్భుతంగా చిత్రిస్తూ , అసామాన్యమైన మాటల్లో పేనుతూ ,కుప్పం బస్టాండ్ లో పాఠకుడినీ ఒక పక్కగా నిలబెట్టి ప్రత్యక్ష సాక్షి గా చేస్తాడు. వాళ్లందరితో పాటే మనల్నీ బస్ ఎక్కించి అందరూ దిగి పోయాక, బస్సు ఇక ముందుకు కదలనని మొరాయించాక ఆ నిశీధి లో తిమ్మరాయప్ప కీ రమణ మూర్తికీ తోడుగా వదిలి పెడతాడు!!

మహేంద్ర దృష్టి ఎంత సునిశితమంటే, బస్టాండ్ లో గానీ బస్ లో  గానీ ఏ చిన్న అంశాన్నీ వదిలి పెట్టకుండా వర్ణిస్తాడు. టీ బాయిలర్ నుంచి రాలి పడే బూడిద నుంచీ, బస్టాండ్ లోని టాయిలెట్ల మీద ఔత్సాహిక కళాకారులు చిత్రించిన సృష్టి రహస్యాల వరకూ ప్రతి సూక్ష్మాంశాన్నీ ఏ మాత్రం విసుగు పుట్టించకుండా చిత్రిస్తూ పోతాడు. నిత్యం మనం చూసే సన్నివేశాలను మనకే కొత్తగా పరిచయిస్తాడు !

కుప్పం చుట్టు పక్కల పల్లెల జనం అంతా డొక్కు ఎర్ర బస్సు ఎక్కడానికి పడే పాట్లన్నిటినీ మహేంద్ర ఏవగింపుతో కాక ఎంతో గౌరవం తో వారి బతుకు పోరాటం లా అభివర్ణిస్తూ వీరోచిత కార్యం లా భావిస్తూ రాస్తాడు.

ఎంతో ఎదురు చూడగా చూడగా వచ్చిన ఆ బస్సులో కొందరు  సీట్లో చోట్లో సంపాదిస్తారు. తిమ్మరాయప్ప లాంటి నిర్భాగ్యులు సీటు కాదు కదా రెండు కాళ్ల మీద నిలబడేంత చోటు కూడా సంపాదించలేక, ఎవరి సానుభూతినీ పొందక ఎలాగో బస్సులో చేరామనిపించుకుంటారు. నిండుగా జనంతో అటూ ఇటూ ఊగిపోతూ బయలు దేరిన పెద్ద పర్తి గుంట బస్సు బయలు దేరాక దాని ప్రయాణం, అది గమ్యం చేరకుండానే ఆగిపోవడం వరకూ దాని ప్రస్థానాన్ని మహేంద్ర చిత్రించిన తీరు అనన్య సామాన్యం.  అక్కడున్న బస్సుల్లోకెల్లా కాస్త మెరుగ్గా ఉన్న బస్సు ఆగమనాన్ని “సింహమున్న గుహలోకి సింధూరము జోచ్చినట్టు, వీధి నాటకం లోకి కీచకుడు వచ్చినట్టు   ఆరెమ్మెస్  బస్ కుప్పం రాజ వీధుల గుండా వస్తోంది” అని దాని దర్పాన్ని చమత్కరిస్తాడు.

కండక్టర్ ని మహేంద్ర ఎలా వర్ణిస్తాడో చూడండి!

.”ఈ జనసంక్షోభంలో అతడు కొమ్మలమీదినుంచి దూకే కోతిలా, బొరియల్లో దూరే సర్పంలా,గాలిలో వలయాలు తిరిగే తూనీగలా ప్రయాణీకుల్లోకి ప్రవేశించాడు..ఆ సమయంలో సాగర మథనంలో హాలాహలంలా పుట్టుకొచ్చాడు.అతడు మనుషుల శరీరాల మధ్య పాతిపెట్టినట్టుగా ఇరుక్కుపోయి కండరాల మధ్య రక్తనాళంలా కదులుతున్నాడు.అత్యుష్ణ పూరితమైన పరిశ్రమలో పని చేస్తున్నట్లు అతడి శరీరం చెమటతో దొప్పదోగుతోంది.అతడు రెండు చేతుల్తోనూ జనాన్ని వెనక్కి తోసుకుంటూ జనజలధిని ఈదుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.ఒక చేత్తో క్రెడిల్ నుంచి టికెట్లను చింపుతున్నాడు. మరో చేత్తో నోట్లను లెక్కెడుతున్నాడు. ఒక చేత్తో టికెట్లను పంచ్ చేస్తున్నాడు. మరో చేత్తో చిల్లరడబ్బులను తోలు సంచీ లోంచి చిల్లర గలగరించి తీస్తున్నాడు. …”

బస్సు బయలు దేరాక ,

“బస్సు మెయిన్ రోడ్డు దిగి పెద్దపర్తి గుంట మట్టిబాట లోకి వెళ్ళే లంబకోణపు మలుపు తిరగడానికి నానా యాతనలూ పడుతోంది. ఈ కార్యక్రమంలో యధావిధిగా మలుపులోని పెంకుటింటి తాలూకు మరో రెండు పెంకులు రాలి పడ్డాయి.ఇంటిగల వాళ్ళు వెలుపలికి వచ్చి ఈ బస్సులకెప్పుడు పోయే కాలం వస్తుందో కానీ తమ ఇల్లు కూల్చకుండా అవి నిద్రోయేటట్లు లేవని పాపాల భైరవుడు సత్తార్ సాహెబ్(బస్సు డ్రైవరు) ని అతడి సకల స్త్రీ జనాల శీలాలను శంకిస్తూ బూతులు తిట్టసాగారు.

“ఇంతలో ఒక స్త్రీ తనకు బస్సెక్కితే వాంతులవుతాయనీ,తనకు సీటు ఇవ్వని పక్షంలో ఎవరి మీదనైనా వాంతి చేసుకోగలననీ భయపెట్టసాగింది.కేవలం సీటుకోసమే ఆమె దొంగెత్తు వేస్తోందని కొందరు ఆమె కోరికను వీటోచేయ జూసారు గానీ ఆమెకు దగ్గరగా ఉన్నవారు ఆమె ముఖకవళికలను జాగ్రత్తగా పరిశీలించసాగారు..”

Swarnaseemaku Swaagatam_Mahendra108 - Copyబస్సు అటూ ఇటూ వొరిగినపుడల్లా పక్కన ఉన్న ఆడవాళ్ల మీద పడి అంతటి చెమట, ఉక్క,దుమ్ములో కూడా పర స్త్రీ స్పర్శా సౌఖ్యాలను పొందాలని చూసే వాళ్ల నుంచీ , ఏదో ఒక  రకంగా దిగే లోపైనా సీటు సంపాదించాలని చూసే వాళ్ల వరకూ అందర్నీ మహేంద్ర సహానుభూతి తో పలకరిస్తాడు.  ఎవరి మీదా ఫిర్యాదుగా మాట్లాడడు. వాళ్ల బలహీనతలని, స్వార్థాలను విపరీత ప్రవర్తనలను  సైతం కేవలం ” స్వభావాలు గా, అవసరాలు గా ,సహజ ప్రవర్తనలు గా ”  గుర్తించి అంగీకరిస్తాడు. ఎవరినీ అసహ్యించుకోడు.

ఏ చిన్న విషయాన్నీ వదలక మనిషిగా,పాలకుల నిర్లక్ష్యం వల్ల బీడుగా మారిన ప్రాంతపు మనిషిగా రచయిత పరిస్థితుల పట్ల స్పందించే తీరు భిన్నంగా ఉంటుందిక్కడ!

రైల్వే లైను వద్ద గేటు పడి బస్సు ఆగాల్సి వచ్చినపుడు మహేంద్ర ఆ మామూలు సన్నివేశాన్ని కరువు ప్రాంత ప్రతినిధిగా పరిచయం చేస్తాడు.

రెండు నవ నాగరీక నగరీక నగరాలు బెంగుళూరు, మద్రాస్ నగరాల మధ్య ప్రయాణించే రైల్వే లైను పక్కనే ఉండే  పల్లెలు  మాత్రం అభివృద్ధికి గానీ నాగరికతకు గానీ నోచుకోలేదంటాడు.

“నాగరికతల్ని మోసుకుని రైళ్ళు అయోమార్గం మీద ప్రతి దినం పహారా చేస్తున్నా, మధ్యనున్న గ్రామాలూ పల్లెలూ ఇంకా జడం గానూ నిస్తేజంగానూ అనాగరికంగానూ ఉన్నాయి.దారి పొడవునా వ్యాపించిన వందల వేల బీడు భూములు బహుశా రైలులో ఏసీ కోచ్ ల లోనూ, ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లలోనూ ప్రయాణిస్తున్న ఏ రాజకీయ నాయకుడికి గానీ, ఏ విద్యాధికుడైన ఏ  ఉన్నతాధికారికి గానీ ఆనినట్టు లేదు! ఎక్స్ ప్రెస్ రైలు మార్గాల పక్కనే పూడిక పడి పోతున్న బావులున్నాయి. రాత్రింబవళ్ళు పని చేసినా ఆ బావుల నుంచి చాలినంత నీటిని తోడలేని ఏతాలున్నాయి. అర్థ రాత్రి చలి లోనూ మధ్యాహ్నపు టెండల్లోనూ అంతంత మాత్రపు ఆచ్చాదనలతో ఏతాలు తొక్కే బక్క మనుషులున్నారు (రచనా కాలం 1985 అని గుర్తుంచుకోవాలి) ఒకనాడు పట్నాల్లో మంచి బతుకే బతికి, ఇప్పుడు ముసలి వగ్గులైపోయినవై , ఇప్పుడు పూర్వ జన్మ ప్రాప్త స్వీయ దుష్కర్మ ఫలితాలను అతి దారుణంగా అనుభవిస్తూ రైళ్ళ రాక కోసం గంటల తరబడి క్రాసింగుల వద్ద గంటల తరబడి పడిగాపులు కాసే బస్సులున్నాయి” అంటూ బస్సుల దుస్థితిని  కూడా గుర్తించి  చేసి జాలి పడతాడు.  రైళ్ళలో ప్రయాణించే నాగరీకులకు వీటన్నిటినీ పట్టించుకునే తీరిక లేదంటూ ఆవేదన చెందుతాడు.”వారి కాలక్షేపానికి, జల్లు కురిసిన ఉదయం దిబ్బలపై లేచే పుట్టగొడుగుల్లా దిన వార పక్ష మాస పత్రికలుంటాయి. జోలారు పేట, వైట్ ఫీల్డ్ మొదలైన స్టేషన్లలో లభించే పాప్ కార్న్, బఠాణీలు, శీతల పానీయాలుంటాయి. అపరిచిత వ్యక్తులతో ప్రేమ ప్రహసనాలకిదే సమయం. రాజకీయ నాయకులకు కొత్త పార్టీ ఏర్పాట్లకిది నిరపాయకరమైన చోటు. తత్వ వేత్తలకిది తమ తత్వ జిజ్ఞాసను నిశిత పరచుకోడానికి అనువైన స్థలం ” అని, తత్వ వేత్తలతో సహా ఏ ఒక్కరూ ఆ ప్రాంతాలకు జరిగే అన్యాయాన్ని గురించి ఆలోచించరని ఎత్తి చూపుతాడు.

నీటి చుక్క దొరకడం కష్టమైన ఆ పల్లెల్లో, రైలు కోసం ఎదురు చూస్తూ బస్సు ఆగిన ఆ చీకట్లో, నిశ్శబ్దంలో ఎవరో ఎక్కడో బోరింగ్ పంపు కొడుతున్న శబ్దం వినగానే ఒంటిపల్లె కోమలమ్మ గుండెల్లో నొప్పి ప్రారంభమయ్యే సన్నివేశం ఆ వూళ్ళలోని దుర్భరమైన కరువుకు అద్దం పడుతూ, గుండె చిక్కబట్టేలా చేస్తుంది . 15 మంది గల ఇంటి నీటి అవసరాల  కోసం నిత్యం గంటల కొద్దీ పంపు కొట్టే కోమలమ్మకు గుండె నొప్పి ఆ బోరింగ్ ప్రసాదించిందే!

బస్సెక్కిన ప్రతి ఒక్కరి గురించీ మహి శ్రద్ధగా పట్టించుకుంటాడు . బస్ లోని ప్రయాణీకులంతా ఒక్కో వర్గానికి ప్రతినిధులు!ఒకరిద్దరు తప్ప అంతా జీవితాన్ని అతి కష్టం మీద ఈదుతున్న వాళ్ళే! వాళ్ళంతా మహేంద్రకు ప్రియమైన వాళ్ళే!

సరే, మరి తర్వాతేంటి?

అనేక విషమ పరిస్థితుల్ని దాటుతూ బస్సు ప్రయాణిస్తుంది. ఒకరి బాగు,సంక్షేమం మరొకరికి పట్టని ఈ ప్రయాణంలో , ఒకరినొకరు దగా చేసుకోడానికి సీటు సంపాదించడానికి అందరూ శాయ శక్తులా ప్రయత్నిస్తారు.  కొన్ని పల్లెలు దాటాక చాలా మంది దిగిపోయాక పెద్దపర్తి గుంటదాకా పోని బస్సు ఒక ఇసగవాగులో దిగబడి ఆగిపోగా అందులో మిగిలిన ప్రయాణీకులు విలేకరి రమణమూర్తి, దగాపడ్డ వృద్ధుడు తిమ్మరాయప్ప.

బంగారు గనులు మైనింగ్ కాంప్ గురించి ఎటువంటి సమాచారమూ దొరకని రమణమూర్తి చివరకు ఆ బస్సులో మిగిలిన తిమ్మరాయప్ప మీదే ఆధారపడతాడు. అరిచి గీపెట్టి అధికార పక్షం తరహాలో “బంగారు గనులిక్కడ పడటం వల్ల మీ బతుకులు బాగుపడ్డాయి కదూ? మీకు జీవనోపాధి దొరుకుతోంది కదూ”అని “హింట్” ఇస్తూ అడుగుతాడు. దానికి తిమ్మరాయప్ప ఇచ్చిన సమాధానమే ఈ నవల ఆత్మ!

“అదేమో సామీ, ఈ నేల్లో బంగారం దొరకతాదని శానా మంది కార్లలో జీపుల్లో వచ్చి పొతా ఉండారు!  ఈ నేల్లో బంగారు గన్లు వాళ్ళే పెట్నామంటూ మా దగ్గర ఓట్లేసుకోని పోతా ఉండారు. ఇంకొంత మంది ఈ నేల్లోనుంచి బంగారం దీస్తామని ఇనప రేకుల్తో ఇండ్లేసుకుని ఈడనే కాపురం పెట్టేసి మా దగ్గర అన్ని కూలి పన్లు చేయించుకుంటా ఉండారు. వాళ్ళొచ్చిన కాడ్నించి మా సేద్యాలు మూల బడి పోయినాయి!పోన్లే ఆ గెన్లో పనికే పోనీ అనుకుంటే,ఆ గెనిలో  పని అంటే మిత్తవ తో పోరినట్టే!  పోయిన పండగ నెల్లో ఆ సొరంగల్లో నేల ఉల్లుకోని ముగ్గురు ఒకేనాడు కాలమై పోయిరి!

Swarnaseemaku Swaagatam_Mahendra72ఈ నేల్లోనే మేము పుట్నాము. మా తాతల కాలం నుండీ ఈ నేలనే నమ్ముకోని బతకతా ఉండాము! . ఆ గెన్లో  పడే  కష్టం బూమ్మీదనే పడితే రాజనాలు పండు.అయినా బంగారం మీద జనాలకెందుకింత బ్రెమో తెలవటం లేదు. అదేమన్నా కూట్లోకి వస్తాదా,కూర్లోకి వస్తాదా? సేతుల కష్టంతో వడ్లు పండించు, టెంకాయ చెట్లు బెట్టు,మామిడితోపులు పెట్టు, ఊరు నాడంతా పచ్చగ కళ కళ లాడతాది. గురిగింజంత బంగారం కొసం ఎకరాలు ఎకరాలుగా బీడుపెట్టేసినారు. ఈడకొచ్చిన ప్రతి మనిషీ ఈడ బంగారం దొరకతాదా అని అడగతాడే గానీ ఈడ తాగేదానికి నీళ్ళు దొరకతా ఉండాయా అని ఒక్కడైనా అడగతా ఉండాడా?భూమండలానికి సొరంగాలు యోజనాలుగా తవ్వి కేజీ ఎఫ్( కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ) కి దీసుకోని బోతా ఉండారే గానీ మంచినీళ్ళు తాగను సేదబావులు తవ్వాలని ఎవరైనా అనుకుంటా ఉన్నారా? నీటికరవు లేని కాలాల్లో పైర్లు పండే కాలంలో మా ఆడోళ్లంతా బంగారం నగలు దిగేసుకోనుండ్రి. ”  అంటూ బంగారమంటే లోహం కాదనీ, పచ్చని పంటలనీ , జనం మొహాన కదలాడే చిరునవ్వులని తనకు తెలీకుండానే నిర్వచిస్తాడు. కష్టంలో పుట్టి, కష్టంలో బతికి, కష్టం లోనే చావుకు దగ్గరయ్యే వయసు దాకా ఈదిన అతని ప్రసంగం ఆవేదన పొర్లుతూ సాగుతుంది !

అది  చదివాక, ఇక ముందుకు పోబుద్ధి పుట్టదు. తిమ్మరాయప్ప మాటల్లోని కఠోర సత్యాన్ని, ఆ అతి చేదు నిజాన్ని ఇష్టంగా ఆస్వాదించడానికి సిద్ధమై, కళ్ళలో నిండే చెమ్మను రెప్పలు టప టప లాడించైనా విదుల్చుకోవాలనే స్పృహ కూడా తెలీదు.

రమణమూర్తి పరిస్థితి వర్ణనాతీతం! అనేక వ్యయ ప్రయాసలకోర్చి  మట్టిలో నుంచి బంగారం తీసి జనుల భవితవ్యాన్ని సుసంపన్నం చెయ్యడం కోసం వందలాది కార్మికులు నవీన యంత్రాల తోడ్పాటు తో కఠోర శ్రమ సల్పుతున్న ఆ భూమి లోనే ఒక నిర్భాగ్యుడైన ముసలి వాడు విగత జీవిగా మారిపోతున్న అతడి మనసుని కలచి వేస్తుంది. అతడి మెదడు నిండా మానవ సమాజం, దాని ప్రస్తానం, దాని వికటాట్ట హాసాల గురించిన ప్రశ్నలే !

ఆదిమ శిలా యుగం నుంచీ అంతరిక్షం దాకా విస్తరిల్లిన మానవ నాగరికతా ప్రస్థానానికి గమ్యం ఏమిటి?

ఈ నిరంతర స్పర్థాయుత క్షణ క్షణ సంఘర్షణామయ సతత అనిషిత అపాయకర సుదీర్ఘ పథంలో చివరకు దొరికేదేమిటి? అది మిగిలేదెవరికి? అన్న అంతుచిక్కని ప్రశ్నలతో నవల ముగుస్తుంది.

Swarnaseemaku Swaagatam_Mahendra40 - Copy

రాయల సీమ రచయితల సాహిత్యం లో ఈ నవలది ఒక ప్రత్యేక స్థానం గా తోస్తుంది. మహేంద్ర కథకుడు గా మాండలికం జోలికి పోడు. కథను ప్రామాణికమైన తెలుగులో చెప్తూనే, పాత్రల చేత చిత్తూరు మాండలికం మాట్లాడిస్తాడు . అంతే కాదు, ప్రతి అధ్యాయానికీ తనదైన శైలి లో చమత్కారంగా శీర్షికలు పెట్టాడు.

“శంకా-సువార్త”

“ది కంగుంది టైంస్ ”

“గుణ సంగ్రామ పరిషత్”

“లీడరోద్యోగ పర్వము”

“ఇతి మనుష్యాణాం”

ఇలా సాగించి  చివరి అధ్యాయానికి “స్వర్ణ సీమకు స్వాగతం”  పెట్టి అని ముగిస్తాడు.

మహేంద్ర ప్రామాణిక మైన తెలుగుగా  స్థిర పడిన  భాషను  నేరేషన్ కి వాడటానికి కారణం ఆ రోజుల్లో మాండలికాలకు ఇప్పుడున్న ఆదరణ లేక పోవడమే కావొచ్చేమో!  రచయిత సింగమనేని నారాయణ ఒక వ్యాసంలో ఇలా అంటారు ” రాయలసీమ రచయితలకు  తమ ప్రాంతపు మాండలిక భాష పట్ల తమకే అనుమానం. దీనికి సాహిత్య గౌరవం లభించదేమోనన్న భయం! ఇక కథ రాయటానికి కొత్తగా ఒక భాషను నేర్చుకోవాల్సిన విచిత్ర పరిస్థితి ఏర్పడింది. అప్పటికే పత్రికా భాషగా, రచనా భాషగా స్థిరపడివున్న కోస్తాంధ్రభాషను నేర్చుకొని కథలు రాయాల్సిరావటం వల్ల కూడా, రాయలసీమలో కథావేగం కొంత మందగించింది.”   ఆయన మాటల్లో నిజముంది ! ఇది కోస్తాయేతర రచనలన్నిటికీ వర్తిస్తుందేమో కూడా !

మహేంద్ర మరణించిన తర్వాత అతను డైరీలో రాసుకున్న కవితలన్నీ ఆయన సోదరుడు మధురాంతం నరేంద్ర “పర్వవేలా తరంగాలు”  ( పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఆటు పోట్ల వల్ల వచ్చే ఉధృతమైన తరంగాలు )  అనే పేరుతో  సంకలనంగా ప్రచురించారు. వివిధ పత్రికల్లో వచ్చిన మహేంద్ర కథలు “కనుపించని కోయిల” పేరుతో కథా నిలయం లో అందుబాటులో ఉన్నాయి. కథా నిలయం వెబ్ సైట్  లో ఒక కథ మాత్రం (అతడి పేరు మనిషి)  PDF గా చదవడానికి దొరుకుతుంది.

మహేంద్ర మరి కొన్నేళ్ళు జీవించి ఉంటే, రాయల సీమ వెతలగురించి అసంఖ్యాకంగా కథలు రాసిన రాజారాం గారి వారసుడి గా ఎన్నో రచనల్ని అందించి ఉండేవాడనే విషయం స్పష్టం!

ఈ నవలను తిరిగి సరి కొత్తగా, చక్కటి రూపం లో ప్రచురిస్తామని మధురాంతకం నరేంద్ర అంటున్నారు. దీనితో పాటే మహేంద్ర కథా సంకలనాన్ని కూడా!

మహేంద్ర రచయిత, కవి మాత్రమే కాదు, చిత్ర కారుడు కూడా! ఈ నవలకు వేసిన ఇలస్ట్రేషన్స్ మొత్తం ఆయనవే.

చదివి తీరవలసిన ఈ నవల కోసం ,మధురాంతకం  నరేంద్ర గారు తిరిగి ప్రచురించే వరకూ ఎదురు చూడటమే మార్గం.

 

(మహేంద్ర ఫొటో అడగ్గానే ఇచ్చినందుకు నరేంద్ర గారికి ధన్యవాదాలు )

కాళ్ళూ చేతులూ లేని కవిత్వం…

 

గురూగారు పతంజలి  చనిపోయి మరో సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు ఆయన మన సామూహిక జ్ఞాపకంలో అపురూపమైన భాగమైపోయారు. ‘నలుగురు కూచుని నవ్వే వేళల’ మాత్రమే కాదు, నలుగురు కూచుని రోధించే వేళ, కుట్రదారులైన పాలకులపై కుపితులైన వేళ పతంజలి గారు గుర్తుకువస్తారు.

ప్రజాస్వామ్యం నగుబాటైన, అవుతున్న సందర్భాల్లో, మెజారిటీ మత దాష్టీకాలు పెచ్చరిల్లుతున్న సందర్భాల్లో పతంజలి గారు గుర్తుకు వస్తారు.
పతంజలి గారు ఏ పదమూ, ఏ వాక్యమూ నిద్రపోయినట్టు వుండదు. నీరసంతో, ఉదాసీనతతో జీవచ్ఛవం లా వుండదు. పతంజలి గారి పదాలు, వాక్యాలు కరెంటు తీగల్లాగా వుంటాయి. అవి కల్లోలాలని చిత్రించే గొప్ప చిత్రకారుడి చేతులు. అవి ముడి జీవితాన్ని ప్రేమించిన అక్షరాలు.
జీవితమే కాదు దాన్ని చిత్రించే సాహిత్యం కూడా స్తబ్దుగా వుంటే పతంజలి గారికి ఇష్టం వుండదు. 1996-97 మధ్య రాసిన ఈ కవిత చదివితే మీకు అర్ధం అవుతుంది పతంజలి గారికి నంగిరి మనుషులంటేనే కాదు, నంగిరి కవిత్వమన్నా చాలా అసహ్యమని. జవాసత్వాలు లేని సాహిత్యాన్ని ఆయన కాళ్ళూ చేతులూ లేని కవిత్వమని, అది దుర్వాసన వేస్తోందని అంటారు. నేలలోకి వేళ్ళు దిగని, కలల్ని కనని, భూమితో మాట్లాడని కవిత్వమంటే పతంజలి గారికి పట్టరాని ఆగ్రహం.
రాజ్యం చేస్తున్న కుట్రల్ని, మతం చేస్తున్న దాడుల్ని, సమాజంలోని కల్లోలాల్ని, బతుకులోని హింసనీ, జీవితంలోని సున్నిత అంశాల్నీ పట్టుకోకుండా గాలిలో విన్యాసాలు చేస్తున్న కవిత్వం పట్ల పతంజలిగారికి contempt.
   చచ్చు పుచ్చు కవిత్వం పట్ల ఎప్పటెప్పటి కోపం పేరుకుపోయిందో ఏమోగానీ, పతంజలి గారు ఈ కవితని అప్పటికప్పుడు (‘మహానగర్’ సాహిత్య పేజీలో వెయ్యడానికి మంచి కవిత దొరకక) రాసేశారు. తన పేరు పెట్టుకోకుండా కాకుండా, గనివాడ కారునాయుడు పేరుతో కంపోజింగ్ కి పంపించారు.
ఆయనతో (ఆయన కింద, ఆయన దగ్గర వంటి expressions వాడితే ఆయనకి కోపం వచ్చేది. మనిద్దరం వీళ్ళ కింద పనిచేస్తున్నామని MD రూమ్ వైపు చూపించి అనేవారు) ‘మహానగర్’ లో పనిచేసిన ఆ కొద్ది నెలలూ గొప్ప అనుభవాన్ని మిగిల్చాయి.
myspace

*

ఏమో?

– గనివాడ కారునాయుడు (పతంజలి)

తెల్లవారగట్ట మెలకువ వచ్చినప్పుడు
కరగడానికి ఇష్టపడని చీకట్లో
దెయ్యాలో, నా భయాలో
నా కాంతి ముందు చనిపోయిన వాళ్ళో
కదిలినట్టయి, అట్టిటు నడిచినట్లయి
నాకు భయమేసిందని, గొంతు తడారిపోయిందని
రాయొచ్చునో లేదో?
పొద్దున కిటికీలో పేరుకున్న మట్టిలోంచి
జానెడెత్తు మొలిచిన కుక్క గొడుగు
పొద్దుటి గాలికి తలైనా వూపలేదని
మధ్యాహ్నానికి దాని శిరస్సుని
ఎవరో నరికి కింద పారేసినట్టు
నాకు అనుమానంగా వుందని
రాయొచ్చునో లేదో
శవ పేటికల్లాంటి పుస్తకాల్లో
చనిపోయిన అక్షరాలు
కంపుకొడుతున్నాయనీ
కడుపులో తిప్పుతున్నాదనీ
రాయొచ్చునో లేదో?
కొన్ని రకాల జంతువుల వలె
కొన్ని రకాల పక్షులవలె
కొన్ని రకాల కీటకాలవలె
కొన్ని రకాల మాటలు కూడా అంతరించిపోతున్నాయనీ
కొన్ని పదాలు కనుమరుగౌతున్నాయనీ
రాయొచ్చునో లేదో
కాళ్ళూ చేతులూ లేని కవిత్వం
నరవాహనం లేనిదే కదలలేక పోతున్నాదనీ
దాన్దగ్గిర కొంచెం దుర్వాసనలొస్తున్నాయనీ
కొంచెం కాలిన వాసనొస్తున్నాదనీ
దాని కంట్లో పువ్వులు పూసాయనీ
రాయొచ్చునో లేదో?
ఉంచుకున్న దానికి పిల్లలు పుట్టకుండా
జాగ్రత్త పడినట్టు
ఉంపుడు కవిత్వానికి కలలు రాకుండా
జాగ్రత్త పడుతున్నారనీ
జ్యోతిష్యం కార్డు తీయడానికి మాత్రమే
చిలకను ఉపయోగిస్తున్నారనీ
రాయొచ్చునో లేదో?
చెలమలోంచి ఊరిన నీరులాగా కాకుండా
కొబ్బరిలో ఊరిన నీరులాగా కాకుండా
చెడు భూమిలో ఇంకని వాన నీరులాగా
తాటి బురికెలో పోసిన నిలవ నీరులాగా
ఈ కవిత్వం తేడాగా వున్నదని
రాయవచ్చునో లేదో?
ఎవరైనా ఏమైనా అనుకొంటారో ఏమిటో?
( మార్చి 29, 1952 – మార్చి 11, 2009)

రోహిత్ యిప్పుడు రెక్క విప్పిన ఉప్పెన !

 

 

We want solid words
that resist in the middle of the night

rock-hard
unyielding words.

-Roque Dalton

 

1

 

బహుశా వొక లాటిన్ అమెరికా కవో, యింకో ఆఫ్రికన్ కవో, మరింకో  ఇరాక్  కవో, మన దాకా వస్తే కచ్చితంగా ఏ దళిత ముస్లిం కవో యీ మాట యింతగా తెగేసి చెప్పగలరు. మనం వూహించినట్టే Roque Dalton లాటిన్ అమెరికన్  కవి. ఇవాళ రోహిత్ గురించి వెల్లువైన యీ కవిత్వ వుప్పెన మధ్య నిలబడితే, నన్ను Roque Dalton ఆవహిస్తున్నాడు. విప్లవోద్యమ రణక్షేత్రం మధ్యలో నాలుగు పదుల వయసులో రాజ్యానుకూల శత్రువుల చేతుల్లో దారుణ హత్యకి గురైన వాడు Roque Dalton.

మనం యిప్పుడు తలచుకుంటున్న రోహిత్ అతనిలాంటి కవి కాకపోవచ్చు, కాని- అందమైన కల చూస్తూ చూస్తూ బలవంతాన కళ్ళు మూసుకున్న స్వాప్నికుడు. ప్రతి స్వాప్నికుడూ తనదైన వొక కవిత్వ సీమలో జీవిస్తూ వుంటాడు. ప్రతి మాటా, ప్రతి చర్యా కవిత్వ ఉద్విగ్నంగా బతుకుతాడు.

కవిత్వ భాషలోనే చెప్పాలంటే- యీ లాటిన్ అమెరికన్ కవి అన్నట్టు- solid words- లో యీ కాలపు ఉద్యమకారుడూ, ఉద్యమ కవీ బతుకుతాడు. మాటలు సర్రు సర్రున జారిపోతున్న విష సర్పాలు  మాత్రమే అవుతున్నప్పుడు, చలి చీమల్లాంటి చురుక్కున కరిచే పదాలు కావాలి, బలవంతమైన సర్పాన్ని బంధించడానికి! లేని నిశ్శబ్దాన్ని వూహించుకొని, లోపలి labyrinth అడవుల్లో  తెలుగు కవులు అదృశ్యమై పోతున్న కాలం ఇది. ఉద్యమం అనేది బహిష్కృత భావన అయిపోతున్న దశ. కవి అంటే కేవలం కవి మాత్రమే అనే archaic ఆలోచన చుట్టుముడుతున్న స్థితి. సోషల్ మీడియా మాయలో భాష స్పృహ తప్పిన అకాలం,  విపరీత బలవంతపు “ఇష్టాల”, ఇచ్చి పుచ్చుకునే కామెంట్ల negotiation మాత్రమే మిగిలి ఉంటున్న వ్యాపార కాలం. ఇది కవుల మీద ఫిర్యాదు కాదు, మొత్తంగా మన మధ్య మాటలు వొట్టిపోయిన స్థితి మీద ఎలిజీ. సాహిత్యం తన పాత్రని సరిగ్గానే పోషిస్తోందా అన్న ప్రశ్న వొకటికి పది సార్లు ఆలోచనల్లో తూట్లు పొడుస్తున్న గాయాల మధ్య వెతుకులాట.

ఇదిగో- యీ కృత్రిమ తగరపు మెరుపుల మధ్య రోహిత్ నిష్క్రమణ వొక విస్ఫోటనం!

 

 

2

రోహిత్ యిప్పుడు వొక phenomenon. రోజూ చస్తూ బతికే రొటీన్ గుండెల మీద పిడుగుపాటు లాంటి phenomenon. దీనికి వొక కులమో యింకో మతమో అక్కర్లేదు. మన వునికి రాహిత్యాన్ని చెరిపేయాల్సిన అవసరాన్ని చెప్పడం కోసం తనని తానే వొక erasure గా మార్చుకున్నాడు రోహిత్. యిలా అనడం అంటే అతని మరణాన్ని కీర్తించడం కాదు. వొక అధ్యాపకుడిగా నేను అలా నా విద్యార్థిని చూడలేను, లేదూ, వొక స్నేహితుడిగా అతని చివరి చర్యని యెట్లా అయినా సమర్ధించే పని  చేయలేను, లేదూ వొక ఉద్యమ ప్రేమికుడిగా అతని ఆ చివరి నిర్ణయంలో కారణాన్ని వెతకలేను. కాని, ఎన్నింటికి కారణాలు వెతికే శక్తి మనలో వుంది?!

యీ పుస్తకంలోని కవితల్లో కవులు ఏకరువు పెట్టిన అనేక “ఎందుకు” ల వరస క్రమం ఇదీ:

  1. ఎందుకో ఏకాగ్రత శిబిరాలు అని పిలవరుగానీ

మన పెరట్లో పూసిన భావజాల పువ్వులే వధ్యశిలమీద రాలిపోతుంటాయి (విల్సన్ సుధాకర్)

  1. ఏందోగాని అబయా !

మన పాలిటనే ఫిర్యాదులన్నీ ఫిరంగులౌతయ్

ఉత్తరాలన్నీ ఉత్తరించే కత్తులౌతయ్

వివక్షరాలే వెలివాడలూ , ఉరితాడులూ

ఇనుప గోరీలుగా మారిపోతయ్ (కృపాకర్)

  1. ఎందుకనుకున్నావ్ ?

నీ రాజీనామా తర్వాత నువ్వుండవని! (మిథిల్)

యిలా యింకా కొన్ని ఎందుకు అన్న శోధనలన్నీ వెతకవచ్చు.

 

ఇలాంటివి జరిగినప్పుడు శుభ్ర స్థిమితంగా, శుద్ధ నిబద్దంగా  కవిత్వం రాయాలనుకునే మనస్తత్వం వున్నవాళ్ళు సందిగ్ధంలో పడిపోతారు. ఎందుకంటే, వాళ్ళు వాళ్ళ జీవితాల్లో  ఆదర్శంగా నిలబెట్టుకున్న స్థిమిత సందర్భం ఇది కాబట్టి! కళ్ళ ముందు కదులుతున్న వాస్తవికత వాళ్ళని కలవరపరుస్తుందో లేదో కాని, అది వాళ్ళ కవిత్వంలో మాత్రం ప్రతిఫలించదు. కవిత్వ స్వచ్చ స్ఫటికత గురించి ముందే ఏర్పరచుకున్న నిర్వచన నియామాలూ, నిబంధనలూ వాళ్ళ వ్యక్తీకరణని అటకాయిస్తాయి. “ఎందుకు” అన్న ప్రశ్న యిక్కడ నిష్ఫల యాగమై పోతుంది. ఈ సంకలనంలో పలకరిస్తున్న కవులకి అలాంటి సంశయాలు లేవు, తాము రాస్తున్నది కవిత్వమేనా కాదా అన్న విచికిత్సా లేదు. కళ్ళ ముందు జరిగిన వొక  దారుణానికి వాళ్ళ ముఖాల్లోకి పొంగిన నెత్తుటి యేరుని దాచుకోకుండా దాన్ని వాక్యాలలోకి మళ్ళించే restless ప్రయత్నం వీళ్ళది.

అసలు ఇంత Restlessness – అశాంతి- అనేది వుందా అని naïve గా అడిగే వాళ్ళని ఏమీ అనలేం, జాలి పడడం తప్ప! కాసినీ పూలూ రెమ్మలూ ఆకాశాలూ పచ్చని నేలా వూరికే  సోమరిగా తిరిగే మబ్బు తునకలే కవిత్వం అనుకుంటే చేయగలిగేదీ లేదు. అంతకంటే ముఖ్యంగా ఏదో అంటీ ముట్టనట్టుగా నాలుగు వాక్యాలు “శుద్ధం”గా రాసుకొని, జీవితం ఎంత  హాయిగా వుందీ అనుకునే మాయదనమూ వుంది. కాసేపు ఏ యోగినో, మహర్షినో తలచుకొని, కళ్ళు మూసుకునే అంతర్జాల మార్జాల కవులూ వున్నారు. నిజానికి వీళ్ళ లౌకిక జీవితం మూడు సత్కారాలూ ఆరు అవార్డులుగా వర్ధిల్లుతూ వుంటుంది. వీళ్ళ చుట్టూ కవి సమూహాలు మోకరిల్లి వుంటాయి. వొక అబద్దాన్ని శుద్ధ కవిత్వంగా మోసుకుంటూ తిరుగుతూ వుంటారు.  ఇలాంటి వాళ్ళని రోహిత్ చాలా ఇబ్బందిలో పెట్టాడు.

హెచ్చార్కె అన్నట్టు:

బుద్ధి కేంద్రాలలో కాదు, ఆత్మ క్షేత్రాలలో పోరు

తప్పుడు తర్కాలు, వంచన వ్యూహాలు చాలవు

మనస్సులే ఆయుధాలు. ఒకడు నిలబడింది

ఫెన్సింగ్ కి ఎటు వైపని కాదు, వాడి రొమ్ముల్లో

ఏమైనా కొట్టుకుంటూ వుంటే అది నీ పక్షాననే

అవుతుంది, లేదా వాడొక నడుస్తున్న శవమని

రుజువవుతుంది

ఇవాళ్టి వుద్యమజీవుల కంటే కూడా  సాహిత్య జీవులకి ఇలాంటి “తప్పుడు తర్కాలూ, వంచన వ్యూహాలూ” పెద్ద సవాల్ అవుతున్నాయి. వీళ్ళు ఎంత దూరం వెళ్తారంటే రోహిత్ మరణం మీద కవిత్వం ఏమిటీ అని అసింటా వెళ్ళిపోతారు. మనకి తెలియకుండానే పాత సాహిత్య వాదాలన్నీ మళ్ళీ కొత్త చొక్కా వేసుకొని వస్తున్నాయి. అందులో వొకటి: సాహిత్యం సాహిత్యం కోసం మాత్రమే అన్నది! సాహిత్యానికి సామాజిక సందర్భం వుందనడం వీళ్ళ దృష్టిలో విపరీత వాదం అవుతోంది. అలాంటి వాళ్లకి రోహిత్ లాంటి వాళ్ళు ఎంత మంది చనిపోయినా, లేదా, ఎంత మంది అన్యాయంగా చనిపోతూ వున్నా మనసు చలించదు. లేకపోగా, వెంటనే వాళ్ళు చాలా సుఖంగా సాహిత్య శుభ్ర యాగంలో తలమునకలై పోతారు.

యీ బాధల సందర్భంలో యిలాంటి సంపుటిలో భాగమైన ప్రతి కవినీ మనం అభినందించాలి. ఇందులో ఎంత కవిత్వం వుందనే తూనికలూ కొలతలూ అక్కర్లేదు. యీ బాధలో యెంత నిజాయితీ వుందన్నదే ముఖ్యం. యిందులో కొన్ని కవితలు చదివి, కవిత్వ రూపం యెంత మరకలు పడిందీ అని క్షోభించే కవి హృదయాలకు నా దగ్గిర సమాధానం లేదు, వాటినలా క్షోభిస్తూ వుంటే చూసి జాలిపడడం తప్ప!

సుబ్బాచారి అన్నట్టు:

ఇక్కడ ఒక జింక కూలిపోతే మాత్రం

చుట్టూ ఉన్న జింకలు కొద్దిగానే ఉన్నాయి.

కాని అక్కడ పులులు, సింహాలదే పెద్దసంఖ్య

సహానుభూతి అనేది కవిత్వ లక్షణం కాకుండా పోతున్న సందర్భం ఇది. సహానుభూతికి బదులు సాహిత్య రాజకీయాలు పెత్తనం చేస్తున్నసందర్భం కూడా- సహానుభూతిని వ్యక్తం చేయడానికి అర్హతల్ని, ప్రవేశ రుసుముల్ని నిర్ణయించి పెట్టిన కాలం ఇది. కొంత మంది మాత్రమే కొన్నీటి గురించి మాట్లాడాలీ అన్నది యిందులో వొకటి. యీ గిరి గీసిన వాళ్ళు కూడా శుద్ధ సాహిత్య వాదులే! మళ్ళీ అదే గిరుల మధ్య మనం విలువల్ని వురేస్తున్నాం, యిన్ని చర్చలూ ఉద్యమ సాహిత్య అనుభవాల తరవాత కూడా! కొత్త ప్రశ్నల్ని కొత్త తలలెత్తకుండా యెప్పటికప్పుడు వుత్తరించడం అనేది శుద్ధ వాదపు అబద్ధపు పునాది. ఆ పునాదిని యిప్పటికీ బలపరిచే వాదాలు ప్రత్యామ్నాయ శిబిరాల్లోనూ వినిపించడం అసంబద్ధంగా కనిపిస్తుంది నా మటుకు నాకు!

3

 

అరుణ్ బవేరా అన్నట్టు:

త‌ప్పు చేయ‌నివాడినే కాదు..

చెమ్మగిల్లనివాడినీ గురి చూద్దాం

అక్కడ ఈ వాక్యాన్ని ఉరి తీద్దాం..

కవిత్వ నరాల్లో నెత్తురు ఎక్కించాల్సిన కాలం మళ్ళీ వచ్చింది. వాక్యాలకు వాక్యాలనే తిరగరాసుకోవాల్సిన కాలమిది. రోహిత్ మరణం అలాంటి కొత్త కాలానికి వొక ప్రవేశ ద్వారం- ఈ సంకలనంలో అనేక కవితల్ని అనేక ధోరణులకు ప్రతిరూపంగా ఉదాహరించుకుంటూ వెళ్ళవచ్చు. ప్రతి కవినీ ఆత్మీయంగా పలకరించి, ఆ వాక్యాల్ని మళ్ళీ వినిపించమని పదే పదే వినవచ్చు. ఆ వాక్యాల లోతుల్లో ఆరిపోని నిప్పు సెగల్ని తాకి రావచ్చు.

ఇది రోహిత్ సందర్భం కాబట్టి, యీ మరణం నన్నింకా కలవరపెట్టే చేదు పీడకలగానే వుంది కాబట్టి- అతనిలాంటి మరణాన్ని అనుభవించిన  Roque Dalton వాక్యాలతోనే ముగిస్తాను.

The dead are getting more restless each day.

But not anymore
the dead
have changed.

They get all ironic
they ask questions.

It seems to me they’ve started to realise
they’re becoming the majority!

(A Warrior’s Resting Place)

రోహిత్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు యింకా దొరకలేదు. కాని, అనేక మంది రోహిత్ లు మనలో వున్నారు. వాళ్ళందరిలోనూ నిర్జీవ రక్తం గడ్డకట్టక ముందే మనం పలకరిద్దాం. ఆ పలకరింతల్లోంచి కొత్త వాక్యాలు రాద్దాం.

 

“స్వాప్నికుడి మరణం” ఆవిష్కరణ!

swapnikudi

స్వాప్నికుడి మరణం ….ఆ పేరు ఆ పుస్తకానికి అందులో రోహిత్ కు అచ్చుగుద్దినట్టు సరిపోయింది, అవును స్వాప్నికుడే..అయన తెలియాలంటే  ఆయన స్వప్నంతెలియాలి …నిశీధి  రోహిత్ ను “రో ” అంటూ సంబోదించారు , బోల్షివిక్ నాయకుడు , బోల్షివిక్ లా ఉద్యమ వీరుడు చేగోవేర ను పోల్చుతూ  చెప్పి ఉండవచ్చు , ఔను అక్షరాల చేగోవేరా నే…..ఇంకా మరణం తద్యమని తెలిసిన యుద్ధంచేయ సంకల్పించిన స్పాంటాన్స్ యోధుడు కూడా….అంతేకాకుండా….భారత దేశ ముఖ చిత్రం లో దళితులను,అణగారిన వర్గాలను వారి హక్కులకై పోరాడిన , కల్పించిన బాబా సాహెబ్  అంబేద్కర్ గారి అలోచోన విధానం కోసం పరితపించిన , స్వప్నించిన స్వాప్నికుడు రోహిత్ ….

స్వాప్నికుడి మరణం ……..స్వప్నం కు మరణం లేదు ఇది స్వాప్నికుడికి మరణం లేదు. తన స్వప్నాలను నిశీది లో వెతుక్కుంటూ బయటకు తీసే ప్రయత్నం లో బాగం ఈ పుస్తకావిష్కరణ. ఈ కృషిలో  భాగమైన అందరికీ  నీల్ సలాం!

  • -శ్యాం కోలా 

 

“చమ్కీ పూల గుర్రం” పై చర్చ!

 

ఈ  శనివారం, అంటే మార్చ్ 12 సాయంత్రం నాలుగున్నరకి- వేదిక  అధ్వర్యంలో  హైదరాబాద్ లో  ఆలంబన  కిడ్స్  ప్రాంగణంలో 

ఆంధ్రజ్యోతి ఆదివారంలో వచ్చిన అఫ్సర్   కధ ‘చమ్కీ పూల గుర్రం’ మీద చర్చ ఉంటుంది.

 

 

*

 

“ఇప్పుడు ఆ గుర్రం…. ఆ చమ్కీ పూల   గుర్రం … బొమ్మ మీద నిజంగా కోపమొస్తోంది నాకు! ఈ బొమ్మ వల్ల కదా ఇప్పుడు నేను మున్నీతో  మాట్లాడకుండా అయిపోయింది. పో… పోవే..చమ్కీ!”

-అని పైకే అనేస్తూ  చేతిలో వున్న బొమ్మని మంచమ్మీదికి విసిరింది అపూ. ఆ విసరడం ఎంత నాజూకుగా విసిరిందంటే నిజంగా బొమ్మకేమయిపోతుందో అన్న దిగులు మనసులో పెట్టుకొని నెమ్మదిగా, వీలయినంత  మెత్తగా విసిరింది.

విసిరేసిన తరవాత “పోనీలే పాడు చమ్కీ!” అనుకోలేకపోయింది. మళ్ళీ పరుగు పరుగున వెళ్ళి, ఆ బొమ్మని చేతుల్లోకి తీసుకొని, అదేమయినా గాయపడిందేమో, నొచ్చుకుందేమో అన్నంత ఆతృతగా, కంగారుగా దాన్ని తన మెత్తని వేళ్ళతో సవరదీసింది.

అపూకి  ఈ చమ్కీల  గుర్రం బొమ్మ అంటే ఎంత ప్రాణమో! ఆ  మావిచిగురు రంగు గుర్రం వొంటి మీద నల్లని జూలు…దాని వీపు మీద మెరిసే ఎర్ర ముఖమల్ గుడ్డ కుట్టిన తళుక్కు చమ్కీలు. రాత్రి నిద్రలోకి నెమ్మదిగా జారిపోతున్నప్పుడు లైట్లన్నీ ఆర్పేశాక అవి భలే మెరుస్తాయ్! ఆ చిన్ని  మెరుపుల్లో చమ్కీతో బోలెడు కబుర్లు చెప్పుకుంటుంది అపూ.

ఇంకా ఆ బొమ్మ అంటే ఎందుకు ప్రాణం అంటే…అది మున్నీ ఎంత ఇష్టంగా అపూకిచ్చిందో! ఇంకా ఇంకా ఎందుకు అంటే,  మున్నీ  అంటే ప్రాణంలో ప్రాణం కాబట్టి!  మున్నీ వాళ్ళమ్మ భాషలో చెప్పాలంటే మున్నీ – అపూ  వొకళ్ళకొకళ్ళు ‘జిగర్ కా టుకడా’ (ప్రాణంలో  వో ముక్క) కాబట్టి!

మరీ మున్నీకి దూరంగా వున్న క్షణాల్లో చమ్కీని దగ్గిరకు హత్తుకొని, “మున్నీ!” అని ప్రేమ గోముగా పిల్చుకుంటుంది  అపూ మళ్ళీ మళ్ళీ! మున్నీతో చెప్పుకోవాల్సిన  కబుర్లన్నీ దాంతోనే చెప్పుకుంటుంది అపూ. అమ్మ వొడిలో వున్నప్పుడు కూడా కిటికీలోంచి ఆకాశంలోకి చూస్తూ, చమ్కీకి నక్షత్రాలు చూపిస్తూ, వాటిని లెక్కపెడ్తూ నిద్రలోకి జారుకుంటుంది.

ఇవాల్టికి అయిదు రోజులు- మున్నీని  అపూ  చూడక, మున్నీతో అపూ ఆడుకోక.

మున్నీతో కథలూ లేవు,  కబుర్లూ చెప్పుకోలేదు. మున్నీ  వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళమ్మమ్మ ఫాతమ్మ  ముందు కూర్చొని అల్లరీ  చేయలేదు. ఫాతమ్మ కథలు చెప్తూ చెప్తూ వుంటే ‘ఊ’ కొట్టనూ లేదు! అపూకి  ఊహ తెలిసిన తరవాత చూసిన మొదటి పీర్ల పండగనాటి సాయంత్రం పీరు కథ ఫస్టు ఫస్టు చెప్పింది ఫాతమ్మే. అప్పటి దాకా  అపూ దృష్టిలో పీరు అంటే చేతి ఆకారంలో వుండే వొక బొమ్మ మాత్రమే. కాని, ఫాతమ్మ చెప్పిన కథ విన్న తరవాత పీరు అంటే వొట్టి బొమ్మ కాదనీ, వాళ్ళు దేవుళ్ళ లాంటి గొప్ప మనుషులనీ అర్థమైంది. అందుకే, వాళ్ళని వూళ్ళో అందరూ అంత గొప్పగా కొలుస్తున్నారనీ తెలిసింది.

“అవును, మనుషులు వూరికే దేవుళ్ళు అయిపోతారా మరి!” అని అమ్మ కూడా ఫాతమ్మ చెప్పిన కథే మళ్ళీ చెప్పుకొచ్చింది. వూళ్ళో కరువొచ్చినప్పుడు పీరు దేవుడి మహిమే కరువుని వెళ్ళగొట్టిందని వొక కథ. వూరి మీద ఎవరో మూకలు పెద్ద యుద్ధానికి వచ్చినప్పుడు పీరు దేవుడే కత్తి దూసి యుద్ధం చేశాడనీ, తన ప్రాణం అడ్డుపెట్టి, వూరిని కాపాడాడని ఇంకో కథ. చివరి యుద్ధంలో శత్రువులు కుట్ర చేసి, పీరు దేవుడిని యుద్ధ భూమిలో చంపేశారనీ ఇంకో పెద్ద కథ పాటగా పాడుతారు వూళ్ళో పీర్ల చావిడి దగ్గిర!

అదలా వుంచితే, అసలు ఫాతమ్మ పాల కోవా ఎంత బాగా చేస్తుందో!  తన  కోసమే ఎప్పుడూ  దాచి వుంచే  కోవా బిళ్ళని ఇప్పుడు  ఫాతమ్మ ఏం చేస్తోందో! తను లేకుండా దాన్ని మున్నీ తినేస్తోందా? లేకపోతే, అన్నీ దాచిపెట్టి తను కలిసిన రోజున ఇస్తుందా? అపూ ఆలోచనల్లో కలల్లో మున్నీ తప్ప ఇంకోటేమీ లేదు!

అసలు మున్నీతో  మాట్లాడకుండా ఆడుకోకుండా ఈ అయిదు రోజులూ వుండడమే వింతల్లో వింత. కానీ, ఆ ఇంట్లో నాన్న  చండశాసనం ముందు అపూ అమ్మ సత్యా, నానమ్మ కూడా నిజానికి వణికిపోతారు, తొమ్మిదేళ్ళ  అపూ ఎంత? అయినా సరే,  మున్నీ  దగ్గిరకి వెళ్ళి రావాలి దొంగచాటుగా అయినా! కానీ, ఎప్పుడూ ఆ దొంగా పోలీస్ ఆటలోలాగా దొరికిపోతుందేమో అని అపూ భయం!

“ఒరే, నువ్వు పొరపాటున కూడా మున్నీ వాళ్ళ ఇంటివైపు వెళ్ళకు. మీ నాన్నకి  ముందూ వెనకా అన్నీ కళ్లే! ఎలా తెలిసిపోతుందో తెలిసిపోతుంది…నీ  వీపు విమానం మోత మోగిపోతుంది.” అని నానమ్మ ముందే హెచ్చరించేసింది కూడా. ఇంతకుముందు వో సారి వెళ్లి వస్తే, నాన్న  ఎలా కొట్టాడో ఏమైందో ఎలా మరచిపోతుంది అపూ?!

“పూవు లాంటి పిల్లని ఎందుకలా కొట్టి కొట్టి చంపుతావ్?” అని నానమ్మ  ఆ రోజు అడ్డు వచ్చింది  కానీ, సురేష్ అలాంటి క్షణాల్లో ఎవరేమిటని చూసుకోడు…వొక్క చేత్తో విస్సిరి అవతల పడేస్తాడు! “ఒరే, సురేష్ , నీకు పెద్దా చిన్నా అని కూడా తెలియకుండా పోతోంది!” అని అనేసి బయటికి వెళ్లిపోతుంది నానమ్మ  కోపంగా.

ఈ గుర్రం    బొమ్మ తెచ్చిన సాయంత్రం “ఇంకొక్క సారి ఆ గుమ్మం తొక్కావంటే వూరుకోను!” అని కోపంగా అరిచేసి, ఆ రాత్రి గుళ్ళో భజనకి  వెళ్ళిపోయాడు సురేష్.

అంతే! ఆ రోజు నించి మున్నీతో  అపూ మాటలు బంద్…ఆటలు బంద్…ఈ వీధిలో కాకి ఆ వీధిలోకి వెళ్ళి కావ్ కావ్ అనడానికి కూడా వణికిపోయేంత గొడవ అయిపోయింది.

కానీ, గుర్రం  బొమ్మని ఎలాగోలా ఆ గొడవలో కాపాడుకొని కుర్చీ కిందకి నెట్టేసింది అపూ. “జై పీరు బాబా  … కాపాడవా ఈ దెబ్బల నించి…!” అనుకుంటూ. “అది ఎలాంటి కష్టమైనా పీరు బాబాని వొక్క సారి తలచుకుంటే చాలు, ఇట్టే దూరమైపోతుంది,” అని కదా ఆ రోజు ఫాతమ్మ గారు చెప్పారు! పీరు బాబా ఈ గుర్రమ్మీదనే ఊళ్ళోకి వచ్చారట, అప్పుడెప్పుడో పెద్ద యుద్ధం జరిగినప్పుడు- శత్రువులందరినీ తుడిచి పెట్టేసి, ఆ గుర్రమ్మీదనే ఎటో వెళ్లిపోయారట. అందుకే, వూళ్ళో పీర్ల చావిడి మీద అన్నీ గుర్రం బొమ్మలుంటాయి, అవి అన్నీ పీరు ఎక్కి స్వారీ చేసిన గుర్రాలే, అవి పవిత్రమని వూళ్ళో అంతా నమ్ముతారు.

ఇప్పుడు ఈ క్షణాన  ఏ రాముడైనా, పీరు బాబా అయినా పర్లేదు, ఇప్పటికిప్పుడు  అపూకి కావలసిందల్లా తన మొరాలకించి, మున్నీని, తననీ కలపాలి!! అంతే!!

2

“సత్యమ్మా, ఇదిగోనే  నీ కోసం ఈ పటం తెచ్చానే!” అంటూ పీర్ల బొమ్మలున్న వొక క్యాలెండరు తెచ్చి ఇచ్చింది పక్కింటి అరుణ వాళ్ళమ్మ నెలరోజుల క్రితం. అది పక్కూళ్ళో  ఆ వూరి  పీర్ల పండగ సంతలో కొనుక్కొచ్చిందట. అరుణ వాళ్ళు ఈ వూళ్ళో పీరు దర్శనం చేసుకున్న తరవాత, యింకో  రోజు పక్కూళ్ళో పీర్ల పండక్కి కూడా వెళ్లి వస్తూ వుంటారు. ఆ పీరు మరీ చిన్నప్పుడే యుద్ధంలో నేలకొరగడం వల్ల అతని మహిమ ఇంకా పెద్దది అని అరుణ వాళ్ళమ్మ అంటూ వుంటుంది.

“ ఈ పీరు బొమ్మ ఇంట్లో వుంటే దుష్టశక్తులు రావు. నియ్యతూ బర్కతూ బాగుంటయ్యని తెచ్చా!” అంది అరుణ   వాళ్ళమ్మ.

“అక్కా, నీకు తెలుసు కదా! మా ఆయనకి ఇలాంటి తురక బొమ్మలూ, తురక మాటలూ  అవీ ఇష్టం వుండడం లేదీ మధ్య!” అని సత్య  అరుణ  వాళ్ళమ్మకి చెప్పబోయింది కానీ ఆమె వినిపించుకుంటేగా!

“అందరూ పీర్ల సంతకి వెళ్తున్నారు…ఇది మనూరి ఆచారం! మీరూ ఆ రమేష్ వాళ్ళే  కదా ఇట్లా వూరూ వాడా పట్టకుండా…ఎందుకలా? ఈ క్యాలెండరు చూడగానే నువ్వు గుర్తొచ్చావ్. తీసుకో సత్యమ్మా! ఇంట్లో గోడకి వుంచు. నీ ఇంటికి రక్ష,” అని క్యాలెండరు సత్య   చేతుల్లో పెట్టి వెళ్లిపోయింది అరుణ  వాళ్ళమ్మ.

రమేష్  పేరు వినగానే సత్యకి   సర్రున కోపం తన్నుకొచ్చింది లోపల్నించి – ఆ రమేషే వారానికో సారి  వచ్చి, నాన్ననీ, ఇంకో ముగ్గురు గుడి  పెద్దల్ని కూర్చోబెట్టి మన ధర్మం, పరధర్మం అంటూ  లేనిపోనివన్నీ  చెప్తుంటాడు. అది మన  మతం కాదు, మన ధర్మం కాదు …అంటూ. “మన ధర్మం గంగనీరు..పరధర్మం ఎండమావి” లాంటి మాటలు వినడం ఆ రమేష్ దగ్గిరే మొదటి సారి.

ఆ పేరు వినగానే  వెంటనే అడిగేసింది అపూ  అమ్మని వొకటికి రెండు సార్లు  –

“అమ్మా, ధమ్మం ఏమిటి? మతం ఏమిటి? అవేమన్నా కొత్త బొమ్మలా?”

“అమ్మా, ఆ  రమేష్ అంకుల్ వాళ్ళ  వల్లనే కదా మనం పండక్కి  వెళ్లకుండా అయిపోయింది! పండక్కి వెళ్తే ఎంత బాగుంటుందో, నా దోస్తులందరూ కలిసేది. ఆడుకునేది. చాలా తినేది. పక్కింటి అరుణ  వాళ్ళు కూడా వెళ్తారు కదమ్మా పీర్ల పండక్కి! అది మన పండగే కదా! మనం వెళ్లచ్చు కదా!”

“నీకు అర్థం కాదులే…అది నాన్నకి ఇష్టం వుండదు. అది మన పద్ధతి కాదు. నాన్న  వూళ్ళో మన వాళ్ళందరికీ  పెద్ద కదా,  అందరికీ చెప్పాల్సిన పెద్ద. ఆయనే తురక సంతలకీ, పీర్లదగ్గిరకీ వెళ్తే…ఈ నాలుగూళ్ళ మనోళ్ళంతా   పాడయిపోతారు. అసలే మనకీ మనవాళ్ళకీ మంచి కాలం కాదిది,” అంది.     అంత కంటే ఏం చెప్పాలో అర్థం కాలేదేమో మౌనంగా వుండిపోయింది సత్య.

నాన్నకి  ఇష్టం వుండదు …అన్నంత వరకే అపూకి  కూడా అర్థమయింది. ఆ తరవాతది దాని తల మీంచి ఎటో ఎగిరిపోయింది.

ఆ రోజు ఆ క్యాలండరు ఏం చేయాలో తెలీక ముందు గదిలో కనిపించీ కనిపించకుండా వొక మూలకి గోడ మీద పెట్టింది సత్య.

కానీ, అది సురేష్   కళ్ళలో పడనే పడింది. అంతే! ఇంట్లో రామ రావణ యుద్ధం మొదలైపోయింది. ఆ యుద్ధం తరవాత అపూకి  ఇంకోసారి అర్థమయిందేమంటే అరుణ  వాళ్ళింట్లో లాగా తురక దేవుళ్ళ బొమ్మలూ గట్రా ఏమీ తనింట్లో వుండకూడదు అని!

అరుణ  వాళ్ళింట్లో దేవుడి గది అంటే అపూకి ఎంత ఇష్టమో! ఒక ఆదివారం ఆడుకుంటున్నప్పుడు అరుణ  ఆ చిన్ని గదిలోకి తీసుకు వెళ్లింది. గోడ మీద పటాలూ, అవి కాక చిన్ని పెళ్లి మంటపంలాంటి అరుగుల మీద సీతా రాముడూ, శివ పార్వతులూ, వినాయకుడు….వాటితో పాటు పీర్ల గుడి ఫోటోలూ, పీర్ల ఫోటోలూ, అన్నిటికంటే అపూకి ఎంతో  ఇష్టమైన చమ్కీ పూల గుర్రం ఫోటో…అవన్నీ అరుణ  చూపించింది. కానీ, అన్నీట్లోకి అపూకి  బాగా నచ్చింది ఆ గుర్రం  బొమ్మ క్యాలెండర్! ఆ మెరుపు పూలు …దాని నడుమ్మీద చేతి గుర్తు!  ఆ చేయి పీరు దేవుడిదే అని అరుణ వాళ్ళమ్మ, మున్నీ వాళ్ళమ్మ కథల్లో  విన్నదే.

తను గుర్రం  బొమ్మ వేపు పరీక్షగా చూస్తున్న ఆ సమయంలోనే అక్కడ వొక గిన్నెలోంచి కాసింత విభూతి తీసి తన నుదుటి మీద పెట్టింది అరుణ. అది పీర్ల గుండం దగ్గిర నించి తీసుకువచ్చిన బూడిద..కళ్ళకి అద్దుకొని రాసుకుంటే మనసులో బాధలన్నీ పోతాయంటుంది అరుణ.

అపూ  వెంటనే అది చెరిపేసి, “అమ్మో! నాన్నకి కోపమొస్తుంది!” అంది.

అరుణ వాళ్ళమ్మ గారు  “సర్లే… ఎవరి పద్ధతి వాళ్ళది. ఏం కాదులే! ఇలా కూర్చోండి చక్కిలాలవీ పెడతా!” అంటూ ముందు గదిలో  కూర్చోబెట్టి, చక్కిలాలూ అరిసెలూ పెట్టింది. అందుకే, అపూకి  అరుణ వాళ్ళమ్మ  గారంటే మహా ఇష్టం!అసలు ఎన్ని రకాల వంటలు చేస్తారో..ప్రతి పండక్కి! ఆ మాటకొస్తే ఎప్పుడు వాళ్ళింటికొచ్చినా పండగే అపూకి!

“అత్తయ్యా! ఈ చమ్కీ పూల దేవుడి కథ చెప్పవా?” అంది అపూ.

“ఓ …పీరు  స్వామా?!” అంటూ అరుణ వాళ్ళమ్మ  గారు ఆ కథ చెప్పాక పీరు స్వామీ  తెగ నచ్చేశాడు అపూకి.

అందుకే, ఆ రోజు అరుణ వాళ్ళమ్మ  గారు కథ చెప్పగానే “అత్తయ్యా, నా ఫేమరెట్ దేముడు పీరు సామి!” అని ప్రకటించేసింది సంతోషంగా.

ఆ ప్రకటన ఇంత దూరం వచ్చి, ఇవాళ మున్నీనే దూరం చేస్తుందని అనుకోలేదు పిచ్చి అపూ!

3

“వేరేవాళ్ళతో  సావాసం చేస్తే అన్నీ వాళ్ళ  బుద్ధులే వస్తాయి. దీన్ని ఆ తురకల  ఇంటికి పంపద్దు అంటే నువ్వు వినవ్!” అన్నారు నాన్న  అవాళ పొద్దున్న కూడా కోపంగా.

దానికి అమ్మ  ఏం చెప్తుందో అని ఎదురుచూస్తూ వుంది అపూ.

సురేష్  దృష్టిలో అందరూ “వేరేవాళ్ళే” అని తరవాత్తరవాత నెమ్మదిగా అర్థమవడం మొదలైంది.

నానమ్మకి అసలు ఈ గొడవే లేదు. రాముడికీ మొక్కేది, పీరుకీ మొక్కేది. ఇద్దరూ వొకటే కదా అనేది ఇంకేమన్నా అడిగితే! మరి, అరుణ వాళ్ళమ్మ  గారు వొక్క రోజు కూడా పూజ చేయకుండా ఏ పనీ ముట్టుకోరు. అట్లాగే, పీరుకి కూడా మొక్కుకుంటారు. అరుణ పీరు  దేవుడికి దండం పెట్టుకోకుండా ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టదు. లక్ష్మి  వాళ్ళమ్మ పొద్దున్న లేవగానే పీర్ల చావిడికి వెళ్ళి, ఆ చావిడి మెట్లని కళ్ళకి అద్దుకొని గాని పనిలోకి దిగదు. వాళ్ళందరూ దేవుణ్ణి నమ్ముతారా లేదా?

సురేష్  దృష్టిలో అవన్నీ తప్పుడు పనులు ..ధర్మం కాదట! గుడికి వెళ్తేనే ధర్మం, శుభం.  మిగతావన్నీ- అంటే ఈ పీర్ల దేవుడి పటాలు పెట్టుకొని పూజలు చేయడం, గుడికి వెళ్ళినట్టు పీర్ల చావిడికి వెళ్ళడం, పీర్ల బొమ్మలు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం- ఇవన్నీ తప్పుడు–అంటే మనవాళ్ళు  చేయకూడని  పనులు!

మున్నీ  చమ్కీ గుర్రం  బొమ్మ ఇచ్చినప్పుడు అపూ దాన్ని కాదనలేకపోయింది. దాన్ని గౌనులో దాచుకొని తెచ్చి, ఇంట్లో పెట్టేసుకుంది. అది తండ్రి  కంట పడితే ఏమవుతుందో తెలుసు.  ముఖ్యంగా అలాంటివి నాన్న  కంటికి కనిపించకుండా చేయడం చాలా   కష్టం!

ఆ బొమ్మ తెచ్చిన రోజే అపూ ఇంటికి వెళ్ళి దానితో ఆడుకునే చివరి రోజు అవుతుందని అనుకోలేదు అపూ.

మున్నీ  వాళ్ళింటికి వెళ్ళడం, దానితో ఆడుకోవద్దనీ అన్న  నాన్న  మీద, ఆయన పద్ధతుల మీదా చచ్చేంత కోపంగా వుంది. అసలు నాన్నని   వొక్క మాట అయినా అడగొచ్చు కదా అమ్మ!  నిజానికి నానమ్మ  అవీ ఇవీ కబుర్లయితే చెప్తుంది కానీ, ‘మున్నీతో ఇవాళ ఆడుకోలేదేం’ అని వొక్క ముక్క అడిగిన పాపాన పోలేదు. వాళ్లెవరికీ ఇదొక పెద్ద సమస్యే కాదు.

“వీడు  ఏ లోకంలో వున్నాడోనమ్మా!” అంటుంది నాన్నమ్మ. “ఈ వూళ్ళో నాకు ఊహ తెలిసీ, మనమూ, పరాయీ అన్నది నా ఊసులో ఎన్నడూ లేదు,” అంది అమ్మతో ఒక సారి- నాన్న ఎంత చెప్పినా, నానమ్మ, అమ్మ నాన్న కంట్లో పడకుండా పీర్ల గుడికి వెళ్లి వస్తూనే వుంటారు. మిగతా అరుణ వాళ్ళమ్మా, అందరూ అంతే.. వాళ్ళు గుడికీ  వస్తారు, ఆ పీర్ల చావిడికి వెళ్ళి అక్కడ పెట్టిన బొమ్మలకూ మొక్కుకుంటారు!

కాని, అపూకి ఇవన్నీ అక్కర్లేదు, తనకేం కావాలి? కాసేపు మున్నీతో  హాయిగా ఆడుకోవాలి, పాడుకోవాలి, దాని బొమ్మల్ని సింగారించాలి. ఇద్దరూ కలిసి ఆ బొమ్మలతో కబుర్లు చెప్పుకోవాలి. అంత వరకే! కాని…అంత వరకూ వెళ్ళడానికి…!?

4

ఆలోచిస్తూ ఆలోచిస్తూ అపూ  ఎప్పుడు నిద్రలోకి జారిపోయిందో తెలీదు.  నిద్రలో మున్నీతో  తనదైన లోకంలో  పీర్ల  ఊరేగింపులో పరుగులు తీస్తోందట. పీర్ల సాయిబు పీరు ఎత్తుకోలేక అవస్థ పడుతున్నాడట. మున్నీ అపూ   ఇద్దరూ కలిసి ‘జై ఆంజనేయా!” అనగానే పీరు ఎత్తుకున్న సాయిబుకి కొండంత బలం వచ్చేసిందట.

అపూ  నిద్రలోపలి లోకం చాలా సందడిగా వుంది.  నిద్ర బయట అపూ  గొంతు లోంచి రెండు మాటలే బయటికి వచ్చాయి. అందులో వొకటి:  “జై పీరు సామీ !” రెండోది: మున్నీ!

ఆ రెండు పదాలూ అప్పుడే అపూకి  దుప్పటి కప్పడానికి వచ్చిన సత్య  చెవిన పడ్డాయి. మంచి నిద్రలో వుంది అపూ !  దాని ఛాతీ మీద రెండు చేతుల మధ్యా చమ్కీ గుర్రం  బొమ్మని గట్టిగా హత్తుకుని వుంది.

ఆ బొమ్మని అపూ  చేతుల్లోంచి బయటికి తీయబోయింది సత్య.  అపూ  చేతులు అది పడనివ్వలేదు. సత్య   చేతుల్ని తప్పించుకుని పక్కకి తిరిగి ఇంకా దగ్గిరకి వొత్తిగిలి పడుకుంది అపూ. అలా చేసే ప్రయత్నంలో మళ్ళీ కలవరించింది అపూ. “మున్నీ, రేపు నేనొస్తాగా!” అంటోంది నిద్రలోనే!

మంచం మీద ఓ పక్కకి కూర్చొని అపూ  నుదుటి మీద చేయి వేసింది సత్య. నుదురు వెచ్చగా అనిపించింది.

ఇంతలో  “అమ్మా!” అంటూ ఇంట్లోకి అడుగుపెట్టాడు సురేష్.

పిలిచింది వాళ్ళ అమ్మనే అయినా తనే జవాబిచ్చింది అలవాటు ప్రకారం-  “ఏమండీ  …ఇక్కడ పాప  దగ్గరున్నా!” అని నెమ్మదిగా.

సురేష్  బయటినించే  “సరే…” అన్నాడు.

“అపూకి కాస్త నలతగా వుంది. దాంతో వున్నా!”

అప్పుడైనా సురేష్ లోపలికి వచ్చి, పాపని చూస్తాడేమో అన్న ఆశ- అలా వచ్చినప్పుడు సురేష్ తో అపూ మనసులోని బాధంతా తన భాషలో  చెప్పేయాలని సత్య  ఆశ.

“అన్నం తిందా?” అని బయటి గది నించే  అడిగాడు.

“లేదు…అది సరిగా తినడం లేదు…” అంది తనే బయటికి వస్తూ.

ఆమె ఏదో చెప్పబోతుందన్న విషయం సురేష్  కి అర్థమవుతోంది. కానీ, ఆ  వేళప్పుడు అపూ  నిద్ర చెడగొట్టడం ఇష్టం లేక కొంతా, బయటికి వెళ్ళే హడావుడి  వల్ల కొంతా ఆ సమయంలో ఎక్కువ మాట్లాడ్డం ఇష్టం లేదు సురేష్ కి!

రెండు మెతుకులు గతికి వెంటనే బయటికి వెళ్ళిపోతూ – “తెలుసు కదా, మందిరం డబ్బు కోసం ఇంకా తిరుగుతూనే వున్నాం. ఇంత చిన్న వూళ్ళో లక్ష రూపాయలు పోగేయాలంటే తల ప్రాణం తోకకొస్తోంది. ఈ పూట  నేనూ, రమేష్ మళ్ళీ రెండు మూడు ఇండ్లకి వెళ్ళాలి!” అన్నాడు.

ఇంకేమీ అనలేక ఆటను అటు వెళ్ళగానే ఇటు అపూ దగ్గిరకి వచ్చి కూర్చుంది. నిద్రపోతున్న అపూ  ముఖాన్ని పరీక్షగా చూస్తూ వుండిపోయింది.  ఆ వయసులో తను ఎలా వుండేదో, ఎంత అల్లరిగా ఆడుకునేదో గుర్తొస్తోంది సత్యకి! తనని తాను ఆ వయసులో ఊహించుకొని ఎన్నాళ్ళయిందో కదా! ఆ అమాయకత్వం, అందరితో యిట్టే కలిసిపోయే తనం! అపూ తన పోలికే అంటుంది అమ్మ!

అపూ   ముఖంలోని అమాయకత్వం, పసితనం, ఏమీ తెలియని తనం అన్నీటినీ పరీక్షగా చూస్తూ చూస్తూ వుండిపోయింది.

బహుశా, ఇంత పరీక్షగా ఇంతకు ముందెన్నడూ తను అపూని చూసి వుండదు. ఆ అమాయకమైన ముఖమ్మీద ఏవేవో నీడలు పడుతున్నాయి. అవి చీకటి నీడలు. తన పసితనంలో తను ఎప్పుడూ చూసెరుగని నీడలు. కాలం ఎంత మారిపోయిందీ…ఎంత మార్చేసిందీ ముఖ్యంగా తన కుటుంబాన్ని! తన అపూని! చూస్తూ వుండగానే, ఆ పిల్ల వొంటరిదై పోతోందా అనిపిస్తోంది.

మున్నీతో గడిపే క్షణాల్లో అపూ  ముఖమ్మీద కదలాడే సంతోషాలన్నీ వూహించుకునే ప్రయత్నం చేస్తోంది తను.

అపూని ఇంకా దగ్గిరకు తీసుకుంది.

“అది చిన్న పిల్ల. దానికి ఈ వయసులో ఇంకేం తెలుస్తుంది? ఆ దేవుడి బొమ్మ కూడా ఆటబొమ్మ తప్ప ఇంకేమీ కాదు దానికి! కాసేపు ఆడుకుంటుంది, అంతే! పిల్లల ఆటలో దేవుడిని తెచ్చిపెడితే ఎట్లా? అక్కడ దానికి భక్తీ   గురించి,దానికి ఇంకా అర్థం కానీ ధర్మం  గురించీ  చెప్తే ఎట్లా?”

ఈ మాటలు సురేష్ తో ఎప్పుడైనా అనాలి. కాని, అలా మనసు విప్పి మాట్లాడుకునే  కాలం అంటూ వొకటి వస్తుందా?! రాదేమో ఇక!                    అపూ  చేతుల్లో వున్న బొమ్మలో చమ్కీ గుర్రం బొమ్మలో గుర్రం తోకా, దాని మూతి చూసి, ఆమె  పెదవి మీద వొక చిరునవ్వు పూసింది. కచ్చితంగా ఆ క్షణాన  ఏమైతే అయింది, తనే అపూని  మున్నీ వాళ్ళింట్లో దిగబెట్టి రావాలని అనిపించింది  సత్యకి.

సురేష్ ఎలాగూ ఇది పడనివ్వడు..కాని, తను దిగబెట్టి రాగలదా? చూడాలి ఎంతవరకు ఆ పని చేయగలదో!  అంత తెగింపు తనలో ఉందా అని ఆలోచనలో పడింది సత్య.

కలలో మున్నీతో ఎక్కడెక్కడో తిరిగి వస్తున్న అపూకి ఆ విషయం  తెలియదు.

తల్లి  వేపు తిరిగి బొమ్మని ఇంకాస్త దగ్గిరకి హత్తుకుంది అపూ..మున్నీని హత్తుకున్నట్టే!

 

*

ఆడం అండ్‌ ఈవ్‌

 

-రమా సరస్వతి

~

 

ramaవెదుక్కుంటోంది… ! ఎప్పుడూ చురుగ్గా కదిలే కళ్లు.. ఇప్పుడు బెరుగ్గా.. కాస్త కలవరంగా కదులుతున్నాయి.  నాకిష్టమైన కదలిక.. నా కోసం! చూసింది.

‘హమ్మయ్య. వచ్చాడు. ముందే చెప్పినట్టు నా కన్నా ముందరే! అదే నవ్వు! మీసాల చాటునుంచి కొంటెతనం ఒలకబోసే చిలిపి నవ్వు! నాకు మాత్రమే అన్నట్టుగా ఉంటుంది! చేయి చాచాను!

‘అందుకున్నాను. కుడివైపు నాలుగో వరుసలో విండో సీట్‌ తనకు ఆఫర్‌ చేశా!

‘సీట్‌లో సర్దుకున్నా. ఆఫీస్‌ నుంచి ఇళ్లకు వెళ్లేప్పుడు సిటీబస్‌లోనూ అంతే..  కుడివైపు నాలుగో వరుస విండో సీటే వెదుకుతాడు. దానికోసం  ఎన్ని బస్‌లు మిస్సవుతాయో! ఆ సీటే ఎందుకు?’

‘నవ్వు తప్ప ఆన్సర్‌లేదు నా దగ్గర. కొన్నింటికి జవాబులు ఉండవు. అదో కంఫర్ట్‌ అంతే! అలా ఓరగా వెళ్లే గాలి  ఆమె ఒంటిని తాకుతూ ఆ తాలూకు పరిమళాన్ని మోసుకుంటూ నా చెంపల్ని చేరుతుంది. గుండెలో గిలిగింతలు పెడుతుంది. మాటిమాటికీ నుదుటి మీద పడే ఆమె జుట్టుతో ఆ టైమ్‌లో గాలి ఆడే సయ్యాటలు ఇంకా ఒయ్యారంగా ఉంటాయి. ఏదో చెప్తుంటుంది. అలా చూస్తూ ఉండడం ఇష్టం!’

‘ఆ చిన్ని తేనే కళ్లలోని సమ్మోహనం..  ఆరాధన… తట్టుకోవడం కష్టం. ఏంటలా? మనమేం టీన్స్‌లో లేం. కనీసం థర్టీస్‌లో కూడా లేం’

‘ఆరాధనకు వయసేంటో స్పందించే మనసు  కావాలి కానీ..!   పెదవులు విడివడకుండా నవ్వుతూ మొహాన్ని కిటికీ వైపు తిప్పేస్తుంది!’

ఇప్పుడు ఎక్కడున్నాం…

బస్‌లో పోచంపాడ్‌ ప్రయాణమవుతూ! చలికాలం మొదలు కదా.. ఆరైనా పూర్తిగా వెలుతురు పర్చుకోలేదు. ‘బస్‌ కుదుపులకు మా భూజాలు రాసుకుంటుంటే బాగుంది.. సైడ్‌నుంచి హగ్‌ చేసుకుంటున్నట్టు’

‘అసలు ఆ హగ్‌ కోసమే కదూ ఈ ప్రయాణానికి ప్లాన్‌చేసింది?’

‘కాదు.. అంతకన్నా విలువైనదానికోసమే!

మళ్లీ కళ్లల్లో చురుకైన కదలిక.. చురకలాంటిది!’

‘ఉత్తినే చూశా! నువ్వేం ఆశిస్తున్నావో నాకు తెలుసు!’

ఈసారి కొంటెనవ్వు నాది!

——————————————–

అదృష్టం.. ఎండ లేదు! మబ్బు పట్టి వాతావరణం ఆహ్లాదంగా ఉంది..

‘ఇంత పొద్దున్నే ఎక్కడికి అని అడగలేదా  అపర్ణ?’

‘రాత్రే చెప్పాను. ఆఫీస్‌ వర్క్‌ మీద ఊరెళ్లాలి. రావడానికి రాత్రి పదకొండవచ్చు అని!’

‘పెళ్లాయ్యాక ఇది ఎన్నో అబద్ధం?’

‘ఇలాంటి అబద్ధం మొదటిదే!’ అని చెప్తున్నప్పుడు నా కళ్లలోకి సూటిగా చూసింది. తర్వాత మెత్తగా చేయి నొక్కింది. ఆ చేయి అలాగే పట్టుకొని ప్రాజెక్ట్‌ బ్రిడ్జ్‌ మీద నడుస్తున్నా…

‘చివరిది కూడా!’ ఈ సారి తను చూశాడు. కళ్లతోనే ఆన్సర్‌చేశాను అవునన్నట్టుగా! మూడ్‌ మారినట్టుంది మొహంలో దిగులు కనిపించింది ఒక్కసారిగా!

‘నేనొకటి అడగనా?’

‘ఒకటి అంటూ స్నేహం గట్టిపడ్డ ఈ మూడు నెలల్లో ఎన్నో అడిగింది. అడుగు అన్నట్టుగా చూశా!’

‘నేనంటే నిజంగా ఇష్టమేనా?’

‘పాత ప్రశ్న, అంతకన్నా పాత ఎక్స్‌ప్రెషన్‌! నిజంగా చాలా ఇష్టం కొత్తగా చెప్పడానికి ట్రై చేశా. కుదర్లేదు.’

‘మరి అపర్ణ అంటే?’

‘ఇష్టమే. అపర్ణ పెద్దవాళ్ల చాయిస్‌!  నువ్వు నా చాయిస్‌’ కన్విన్స్‌ కోసం కాదు నిజమే!

‘తన కన్నా నేను ఏరకంగా ప్రత్యేకం’ నూటొక్కసారి అడిగా!

‘ప్రత్యేకత ఉంటేనే కదా.. ఈ వయసులో నీకు ఎట్రాక్ట్‌ అయింది’ తను ఆశించిన సమాధానం ఇది కాదు.

‘కళ్లలోకి కళ్లు పెట్టి చూశా. ‘ఊ.. అవును.. నిజం’ అన్నట్టుగా తలాడించాడు ఎప్పటిలాగే. నవ్వాను. ‘నీ ఫాంటసీని ఎక్స్‌పీరియెన్స్‌ చేయడం కోసం నన్ను ఇష్టపడుతున్నావా?’

చివ్వున తలెత్తాను. ‘అపర్ణతో నాకు ఎలాంటి అసంతృప్తులు లేవు. స్టిల్‌ వి హావ్‌ దట్‌ రిలేషన్‌..’

‘సారీ.. నాకు మాత్రం ఆ ఎక్స్‌పీరియెన్స్‌  ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుంది. ఐ మీన్‌..’ వివరించలేక ఆగిపోయా!

‘ ఐ గాట్‌ ఇట్‌! పెళ్లయి .. ఇద్దరు పిల్లల తల్లి కోరుకుంటోంది!  ఒక్కసారిగా అపర్ణ మెదిలింది. డజ్‌ షి నో దట్‌? అసలు తను ఎక్స్‌పీరియెన్స్‌ అవుతోందా? ఎప్పుడో పెళ్లయిన కొత్తలో అడిగా.. ఎలా ఉంది అని? ఏ సమాధానమూ చెప్పలేదు. ఎదురుగా తను.. ఆప్యాయంగా హత్తుకోవాలనిపించింది..

టైమ్‌ పన్నెండు

తనకేదో ఎస్‌ఎమ్‌స్‌ వచ్చినట్టుంది బీప్‌ సౌండ్‌ అలర్ట్‌ వినిపించింది.

‘వందన వాళ్లు వెళ్లిపోయారు. వాళ్ల క్వార్టర్‌కి మనం వెళ్లొచ్చు’

raja

Artwork: Raja Sekhar Gudibandi

—————————————

‘పాలకూర పప్పు, వంకాయటమాట కర్రీ చేయనా?’

నవ్వాను…

‘ఓకే. డన్‌. ఫ్రెష్‌ అయి వచ్చేయండి. ఇదిగో ఈ మ్యాగజైన్‌ తిరిగేసే లోపు వంట రెడీ’ అని చెప్తూ వంట గదిలోకి వెళ్లా.

అరగంట గచింది.

‘ఎన్నోసారి తిరగేయడం? వంటింట్లోంచే అరిచా!

‘అయిదో సారి’ సీరియస్‌గా చదువుతూనే సమాధానం ఇచ్చా

‘అయితే మూసేసి వచ్చేయ్‌.. ఘుమఘుమలు రావట్లేదా అక్కడిదాకా?

‘మ్యాగజైన్‌ మూసేసి డైనింగ్‌ హాల్లోకి వెళ్లా. ‘ఊ.. వాసన మాత్రం అదిరింది’ అన్నా ముక్కు ఎగబీలుస్తూ!

‘రుచి కూడా అదుర్స్‌ బాస్‌’ అంటూ రెండు పళ్లాల్లో వంట వడ్డించేశా.

మధ్యాహ్నం రెండు

పెరట్లో మామిడి చెట్టుకొమ్మకు కట్టిన జూలాలో నేను.. నాకు దగ్గరగా ఎదురుగ్గా మోడా మీద తను.. ‘అబ్బా.. కదలకమ్మాయ్‌!’

‘ఇదేం కోరిక బాస్‌.. నా పాదాలకు గోళ్లు తీయాలని?’

‘ఏదో పిచ్చి కోరికలే. ఊ.. ఆ పాదం ఇవ్వు’

‘నేను అడిగింది కూడా ఇవ్వాలి మరి’ అని అంటుంటే నా కుడి పాదం తీసి తన మోకాలు మీద పెట్టుకున్నాడు.

‘ఏంటీ..  నువ్వుకోరుకునే ఎక్స్‌పీరియెన్సా?’ నవ్వాను.

‘ఉడుక్కున్నాను’

‘సరదాకన్నాలే అమ్మాయ్‌’

‘ఇవ్వడమేలాగో తెలిస్తేగా’ నేనూ ఉడికించా.

‘కానీ నాకెక్కడో గుచ్చుకుంది. మళ్లీ అపర్ణ మెదిలింది. తనకూ ఆ కోరిక ఉందా? తీరుతోందా? తీరట్లేదా? నెమ్మదిగా తన పాదాన్ని కిందకు దించాను.

‘సారీ బాస్‌ హర్ట్‌ అయ్యావా? ఐ డింట్‌ మీనిట్‌’

‘ఇట్స్‌ ఓకే. ఇప్పుడు నేనొకటి అడగనా ?’

‘రివర్సా? కన్నుగీటుతూ అన్నా చిలిపిగా.

‘నో సీరియస్‌లీ’

‘హేయ్‌…’ తన భుజం నొక్కాను చిన్నగా.

‘నేను సెల్ఫిష్‌లా కనపడుతున్నానా?’ ఆమె కళ్లల్లోకి కళ్లు పెట్టి సూటిగా చూస్తూ అన్నా.

‘ప్చ్‌’ తల అడ్డంగా ఊపా. ‘ఎందుకలా అడుగుతున్నావ్‌?’

‘నువ్‌ డైవోర్సి అని తెలిసీ అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నానేమో…’

నేనేం మాట్లాడలేదు. జూలాలోంచి లేచి నిలబడ్డాను.

నేనూ లేచాను.

అతనికి దగ్గరగా వెళ్లాను.

నా రెండు చేతుల్లోకి తన గుండ్రటి ముఖాన్ని నా కిష్టమైన ఆ మొహాన్ని తీసుకున్నాను.

ఆ స్పర్శ.. కళ్లలో నిండింది. బయటకెళ్లకుండా రెప్పలు మూసి దాచాను..

ఆ క్షణం మాటలొద్దు అనిపించి ఆమె పెదాలకు తాళం వేశాను నా పెదాలతో!

నా చేతులు అతని వీపుని చుట్టేశాయి.. దగ్గరి తనం.. ఇద్దరం ఒక్కటే అన్నంత దగ్గరి తనం… నాకోసం ఓ తోడు ఉంది అన్న భరోసానిచ్చిన దగ్గరి తనం… ఆర్గజాన్ని మించిన అనుభూతేమో!

ఆ భరోసాలో గాలికి కూడా భాగం ఇవ్వద్దన్న స్వార్థంతో ఆమెను నా బాహువులో బందించేశాను. గువ్వలా ఒదిగిపోయింది. ఆమె మెడ వంపులో నా పెదవుల తడి… సడి.. నా ఫాంటసీని నిజం చేశాయి!

లవ్‌ యూ  లేడీ.. లవ్‌ యు టూ మ్యాన్‌

ఈ జ్ఞాపకం చాలు కొత్తగా జీవించడానికి!

—————————-

rajaమళ్లీ ఎప్పుడు? అడిగా బస్‌ దిగి వెళ్లిపోతూ..

తెలీదు అన్నాను..

ఇంక సెలవా? బేలగా అడిగా.

సెలవు లేదు, నాందీ లేదు. అన్నిటినీ కాలానికి వదిలేద్దాం. అదెలా చెప్తే అలా చేద్దాం! అన్నా.

ఈ సారి భరోసా నాకొచ్చింది!

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

కాలాంతరజీవి ఆత్మ సంభాషణ..

 

 

సమకాలీనంగా వస్తున్న కవిత్వంతో పోలిస్తే బొమ్మలబాయిలోని సిద్ధార్థ కవిత్వం విలక్షణమైంది. దానికి కారణం సమకాలీన వైఖరికి భిన్నంగా కవిత్వాన్ని చెప్పేందుకు ఆయన ఎంచుకున్న తీరు. దానికి మూలమైన జీవితం. ప్రధానంగా ఈ రెండు అంశాలను ప్రోది చేసుకున్న ఒకానొక సాంస్కృతిక క్షేత్రం. ఒక జీవితాన్ని సిద్ధాంత సారంగా తీసుకుని వ్యక్తం చేయడానికి,కొన్ని అస్తిత్వ కోణాలను ఆశ్రయించి వ్యక్తం చేయడానికి, జీవితం లోని అణువణువుణు తనలో సంలీనం చేసుకుని ఆయా ఆత్మలతో , ఆ గొంతుకలతో వ్యక్తం చేయడానికి మధ్య వైరుధ్యాలున్నాయి. సిద్ధార్థచేస్తున్నది మూడవ వైపు పద్ధతి. ఒక వర్గపు జీవితాన్ని వ్యక్తం చేయడంలా కనిపించడం వల్ల కొన్ని అస్తిత్వ రూపాలు,ఆ అస్తిత్వ రూపాలను ఆనుకొని చెప్పడం వల్ల సిద్ధాంతాలు కనిపించినా ప్రధానంగా వ్యక్తమౌతున్నది ఇదే. బహుశః సిద్ధార్థ తానుంటున్న కాలాన్ని త్యజించి,ఇంకా చెబితే తనను కూడా త్యజించి కొన్ని జీవితాలను తనలోకి అవలోఢనం చేసుకుని ఒక ఆధునిక దృష్టి నిండిన వచనంతో వ్యక్త మౌతున్నారు.

1
ప్రాకృతంలో “లీలావతీ కథ”ఉంది.అందులో నాయిక ఒక మాటంటుంది.
భణీయంచ పీయతమాయే పియయమ ! కిం తేణ సద్ద సత్థేణ!జేణ సుహాసి మగ్గో భగ్గో అమ్మారిజణస్స,ఉవలబ్బయి జేణ పుఢం అత్థో కయిత్థి ఏణ హయ యేణ,సో చేయ పరో సద్దో ఇఠో కిం  

 లఖ్ఖ ణేణమ్హా?”

(చెప్పు ప్రియతమా !నీశబ్దశాస్త్రం తో పనేముంది.దేనివల్ల అర్థం విష్దం గానూ,దాపరికం లేకేని హృదయాలతో వ్యక్తం అవుతుందో-అదే మాపాలిటి శబ్దం.ఇంకా ఈ శబ్ద శాస్త్రాలతో పనే ముంది.”)

సిద్ధార్థ ఉపయోగించుకుంటున్న భాష ఒక ప్రధాన పరికరం.లక్షణేతరమైన ప్రజామూలం లోని భాషను ఆయన ఉపయోగిస్తున్నారు.ఈ భాష లక్షణేతరమైన మూలద్రవ్యం.వాక్యాలు చాలా పొట్టిగా ఉండటం.పునరుక్తి ఎక్కువగా ఉండటం.ఇవన్నీ ఆనాటి లక్షణాలే.
మల్ల మాపోచారం కుంతలమ్మ గునిగే/అంగజపు మొక్కయ్యిందీ-(పే.69)
పానం బోన మెత్తాలె/తానం జేయించాలే//దొమ్మీకి ముందు గూల్చిన ఇండ్లను జూడు/పగులగొట్టిన బండ మైసమ్మగుండ్లను ను జూడు/గుంబజ్ను జూడు“-(పే.70)
ఉదాహరణలను ఎత్తిపోయాలనుకుంటే ప్రతీవాక్యంలో ఈ దేశీ మెరుపులున్నాయి. ఒక కోణంలో తనుగా వాడుకున్న భాష ఆపాదమస్తకం దేశీలానే కనిపిస్తుంది. జీవితమూ దేశీనే.ప్రాకృత శబ్దానుశాసన వృత్తిలో త్రివిక్రముని అభిప్రాయాన్ని గానీ,దేశీ నామ మాలలోదిగా చెప్పబడే హేమచంద్రుని వాక్యాన్ని పరిశీస్తే ఈ విషయం అర్థ మవుతుంది.-“దేస విదేస పసిది /భణ్ణా మాణా అనంతయా హుంతి/తమ్హా అదాఇ పా ఇతి/పయట్టభాసా విసేస దేసీ“-(దేశ విదేశప్రసిద్ధమైన భాషలు ఎన్నో ఉంటాయి. అనాది ప్రకృతి ప్రవృత్తమే దేశీ)

sidha

సిద్ధార్థలో కనిపించే పదాల్లో దేశీపదాలు ఎక్కువ. ప్రకృతిగతంగా రూపొందించిన పదాలనిర్మాణం ఎక్కువ.ఒక్కోసారి ఈ విషయాలను తానుగా చెప్పిన సందర్భాలూ లేకపోలేదు

పాదాపాదాలు లక్షలు/అదుముకుంటూ తొక్కుకుంటూ/భాషనంతా దులుపుకుంటున్నాను/అతివాస్తవ కాంతిలో జాతరలూగుతున్నాను//అంతటా /నేనొఖ్ఖ ఇద్దరినే కొంత వేల యుగాల దాన్ని/ముడు వేసుకుంటున్నాను జన్మాంగాల్ని/శివసత్తునంటు“(పే.84)

తాను కోరుకుంటున్న భాష ఎక్కడ వుందో సిద్ధార్థకు తెలుసు.దానిజాడనూ తానే చెప్పిన సందర్భాలూ లేకపోలేదు.

కుతి..కుతి..రాతల కుతి/లేని వచనంలో /నేనులేని కథనంలో వాంతి/గోడలింకా రంగుల్లో రెపరెపలాడుతున్నాయ్/తాకగానే మొలుస్తున్నాయ్/ఇంటెనకాలకి పో్ంర్రి బిడ్డా/పిలగాండ్ల దగ్గరికి పో్ంర్రి/పొద్దుగూకినాంక తారాడే ఆడోల్ల/ముచ్చట్ల దగ్గరికి పో్ంర్రి“-(పే.38)

 

అచ్చమైన ప్రకృతిగతమైన భాష,అమ్మభాష అక్కడే దొరుకుతుంది. ఈ వాక్యాన్ని చూసినపుడు ప్రాచీన జైన గ్రంథాలన్నీ ప్రాకృతంలో రాయడం ,ఆసందర్భంలో ఒక జైన ముని చెప్పిన వాక్యం గుర్తుకొస్తుంది. అందులోనూ స్త్రీలు,పిల్లలు ఉదహరింపబడటం కాకతాళీయం కాదేమో.

మత్తూణ దిట్ఠి వాయుం కాలీయ ఉక్కలియంగ సిద్ధంతం

థీభాలవా యణత్తం పాయియ మయియం జీవరేయిం

(దృష్టి వాదాన్ని వదిలేసి కాలిక -ఉక్కాలికాంగ సిద్ధాంతాలు స్త్రీలు,పిల్లలు చదివే నిమిత్తం జైనాచార్యులు ప్రాకృతంలోనే చెప్పారు)

నిజానికి ప్రాకృత కాలానికి కథల్లో పురుష సంబంధం లేదు. ఆనాటి కథలను మానుషీ కథ,దివ్య మానుషీ కథ,దివ్యకథ అనే విభజన కనిపిస్తుంది. మానుషీ అనే స్త్రీ వాచకమే కాదు చెప్పుకున్న కథలు కూడా ఇలాంటివే.మళ్ళీ లీలావతీ కథలోకే వెళ్లొద్దాం

ఏమేయ సుదజుయ ఇమ్మణోహరం పాయియాయి భాసాయే

పవిరళదేసిసులఖ్ఖం కహసు దివ్వమాణుసియం

(పరిశుభ్రమైన విప్పారిన హృదయం గల ఇంపైన కథను విస్తారంగా దేశీమార్గంలో ఒప్పేటట్టు.దివ్య మానుషిలకు చెందే టట్టు చెప్పు)

సిద్ధార్థ చెబుతున్న కవిత్వం కూడా ఈ దివ్య మానుషులకు చెందిందే. “ఆదివాసీ -సంచారదేవతా”-(పే.85),”సంగెం-(పే.39)”మొసాంబ్రం”-(పే.37)”పదసమ్మర్థం”-(పే.33)”లోరీ-దఖ్ఖనీ జోలకథ”-(పే.23)ఇలాంటి కవితలు ఎన్నో ఈ స్పృహకు,అందులోని జీవితానికి నిదర్శనాలుగా ఉంటాయి.

పెద్దపిన్నమ్మలను/చిన్న పిన్నమ్మలను/మేల్పిన్నమ్మలను /పాలిబెట్టి సాకవోసి/బొందలకాడ దీపాలను బెట్టి/పూజలర్పించినాము“(పే.75)

ఎలిసిపోయిండ్రమ్మామ్మలక్కలు/చిలుమెక్కింది బలగమంతా/తోపులబట్టీ..లోయతిరాజమ్మా../ఏడున్నరే.. తోడుకోరేందే..”

దఖ్ఖనీ పీఠమంతా/బొమ్మలబాయిగదనే..చిన్నీ..పెద్దక్కా/దీని కిటికీ తెరుసుకోవాలె/కొత్తగాలి వీయాలె../తాటాకమ్మ చిగురించాలె“-(పే.191/192)

‘నా సమస్త జాతుల పెనురక్త చాపమే ఈ కవిత్వం”ఆ రక్త స్పర్శలో తనలో కలిసిన బొమ్మల ఉనికే సిద్ధార్థ కవిత్వం.  ఇలా సిద్ధార్థ కవిత్వంలో కొన్ని వేల సంవత్సరాల జీవితముంది. లోకముంది.. ఆధునికతదాకా,నాగరికత దాకా పెనుగులాడిన దుఃఖ సంవేదనుంది. ఈ క్రమంలో సిద్ధార్థలో అనాదినుండి ప్రపంచీకరణదాకా తనను తాను కోల్పోయిన అంశాలు కనిపిస్తాయి.

 

2

ఒక అనాది కాలానికే పరిమితమైతే సిద్ధార్థ కవిత కొంత వెనకబడేది. జీవితాన్ని, కోల్పోయినదాన్ని వెదుక్కునే విషయంలో ఎంత అనాది కాలానికి,పురా జ్ఞాపకాలకు వెళ్లారో,అంతే నిక్కచ్చిగా అత్యంత ఆధునికుడుగా కూడా నిలబడ్దారు.దీన్ని ఆయన కవిత్వీకరించిన తీరు,వ్యక్తికరణ మార్గాలు చెబుతాయి.మనోవైజ్ఞానిక శాస్త్రంలో టోల్  మన్ సంజ్ఞానాత్మక మనోవిజ్ఞాన శాస్త్రాన్ని(Cognitive psychology)ని పరిచయం చేసాడు.ఇది సంవేదన,ఆలోచన,ప్రత్యక్ష్యం,జ్ఞాపకంలాంటి అంశాలను అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది.ఈసిద్ధాంతం ప్రవర్తనను వివరించడంలో కేంద్రప్రక్రియలకు (Central processes)ప్రాముఖ్యతనిచ్చే సామాన్య అభివిన్యాసం(Orientation)ను చర్చించింది.తనలో ని ఆలోచనను సంవేదనను,ఉద్వేగాన్ని వ్యక్తం చేసేందుకు సిద్ధార్థ ఎన్నుకున్న కొన్ని మార్గాలు ఉన్నాయి.అయనకుండే కళాత్మకదర్శనం(Aesthetic Perspective),నాటకీయ స్వగతం (Dramatic monologue),వాక్యాలను తీర్చి దిద్దే తీరు(Verse design)గమనించదగ్గవి. యాకోబ్‌సన్(Roman jokobson)కవిత్వభాషను అధిభాష(Meta lingual)అన్నాడు.సిద్ధార్థలో అనేకకాలాలను ముడివేసే ఒక అధిభాష ఉంది.ఇందులో మూడు భాగాలను ఉరామరికగా గుర్తుంచవచ్చు.1.తాను చెప్పాలనుకున్న సాంస్కృతిక క్షేత్రాన్ని ప్రసారం చేసేభాష.పైన చెప్పుకున్న దేశీ పదజాలం ఇలాంటిదే.2.నాటకీయ మైన సంభాషణ;సంవేదనను చెప్పడానికి ఆ ఉద్వేగాన్ని ప్రసారం చేయడానికి ఒక నిర్దిష్ట నాటకీయభాషను సిద్ధార్థ వాడుకుంటారు.ఒక ఊహాహాత్మక పాత్రను దృష్టిలో ఉంచుకుని మాట్లాడటం,ఆకస్మిక ప్రారంభం(Abrupt beginning)అనేకమైన సంబోధనలను చేర్చి చెప్పటం. అనేక భాషలకు హింది,ఉర్దూ,తెలుగు,ఒక్కోసారి సంస్కృతం మొదలైన పదాలను గంభీరత కోసం చెప్పడం ఇవన్నీ అలాంటివి.3.కళాత్మకత అందమైన పద చిత్రాలను,భావ చిత్రాలను నిర్మించడం.వీల్ రైట్ కవితా భాషను బిగుతైన  భాష(Tensive language)అన్నాడు. అనేకాకోణాలలో భాష కుండే శక్తి సామర్థ్యాలను బాగా ఉపయోగించుకోవడం వల్ల ఈ కవిత్వంలో ఆ బిగువు కనిపిస్తుంది.

 

స్నిగ్ధ శీతలంగా/స్పర్శాపూరితంగా /మాట్లాడాలనే ఉంది“-(పే.106)

చెకుముకి వానా కమ్మిందిక/వొక్కపాటనొక్కిన జలదరింపులో/చాల్చాలు నిలబడలేను“-(పే.133)

లేత జాబిలి కిటికీ వెనుక అతని గుసగుసలేనా-(పే.159)

ఇలాంటి వాక్యాలన్నీ ఆకస్మికంగా ఎలాంటిప్రతిపాదనలు లేకుండా ప్రారంభమవుతాయి…ప్రారంభానికి ముందే గతాన్ని ధరించడం,ఆగతం తాలుకు ఆవేశ సంవేదనలను ప్రసారం చేయడం ఆకస్మికతకు నిదర్శనం.ఈ వాక్యాలు ఎంత ఆకస్మికాలో అంతే కళాత్మకాలు కూడా.వాక్యాల్లో ధ్వనించే గంభీర్యత,దాని తాలూకు రూపాన్ని మోసే పదాలు ఇందులో కనిపిస్తాయి.

సిద్ధార్థ వచనంలో ఎక్కువగా నాటకీయ సాంద్రతను కూర్చేది అనుకరణ(Mimeses)..సాధారణంగా సంభాషణకు నాటకీయ సంభాషణకు ఇక్కడే తేడా కనిపిస్తుంది.

 

అల్లా అలలల్లా..లల్లా/రావేయమ్మా“-(పే.85)

ల్లొల్లొల్లొల్లొల్లో..అంటూ/పాటలు పాడాము“-(పే.75)

ఢిల్లం భల్లం/ఢిల్లం భల్లం/ఢిల్లం భల్లం“-(పే.64)

అన్ని పురుగులు నేనే నేన్నేన్నేన్నేనే..-(పే.24)

 

అనుకరణల్లో అంతర్గతవచనం ఎక్కువ.అందులోనూ అనిర్దిష్టత కొన్నీటీలో కనిపిస్తుంది.పై శబ్దాల్లో చివరిదాంట్లో ఉద్వేగ సంబంధమైన మానసిక ప్రకంపనలు(psychic vibrations)కనిపిస్తాయి.మిగతావాక్యాలు కూడా ధ్వనిగతంగా అనుకరణలా,ఉపయోగ గతంగా నాటకీయంగా కనిపిస్తాయి. నిజానికి ఈవాక్యాలను చూస్తే నాటకాల్లో వచనశైలి(Diction)లో చెప్పే Imply Attitude(సూచనా ప్రవర్తన..?అనవచ్చేమో..?)కు సమాంతరంగా కనిపిఒస్తుంది..తన స్థితిని,అనుభవాన్ని.వ్యక్తం చేయడానికి సిద్ధార్థ ఇలాంటి నాటకీయ పద్ధతులను బాగావాడుకుంటారు.నాటక విమర్శ “డిక్షన్”లో Revel character(ప్రకటనాపాత్ర)Convey action (ప్రసార చేష్ట) Identify Themes(గుర్తింపు ప్రసంగాలు)లాంటివాటిని గమనిస్తుంది.

సిద్ధార్థ (సుమారుగా)ప్రతీకవితలో తనదైన వర్గాన్ని పాత్రను గుర్తించే సంబోధనలు చెప్పడం..ఆ మాధ్యమంలో చేష్టలు(Gesture) చేయడం..”పసుపు పూసిన గుండ్లు”లాంటి సంకేతాలనివ్వడం మొదలైన వన్నీ నాటకీయతను పట్టుకొని చూపుతాయి..ఒక దశలో ఈ వాక్యాలన్నీ దృశ్యాన్ని (అందులోని రస స్థితి ని)ప్రసారం చేస్తాయి.ప్రధానంగా తనతో తాను ,తన వర్గంతో తానుగా మాట్లాడుకుంటున్నట్టుగా ఉండే ఏకాత్మ సంభాషణ/ఏ కాంత సంభాషణ..అనేక కవితల్లో కనిపిస్తుంది.జర్మన్ నవలా రచయిత ఫ్రైటగ్ (Gustav Freytag)నాటకంలోని అంశాల నిర్మాణాన్ని ఒక పిరమిడ్ ద్వారా సూచించాడు.బొమ్మల బాయిలోని కవితల్లోకూడా ఒక వ్యాఖ్యానం తో మొదలయి కొన్ని అంశాలను ముడి వేయటం లాంటి చేష్ట(Gesture)లను అనుసరించి ఈ లక్షణాలను  విశ్లెషించుకోవచ్చు..

దళిత, బహుజన, ఆదివాసీ జీవితాలను దీనికి ప్రాదేశికంగా తెలంగాణాను ,దాని ఉద్వేగాన్నీ,రూపంగా ఆధునిక కవితానిర్మాణాలను,శిల్పంలో నాటకీయతను ,ప్రసరణ రూపంగా వేదాంతం ధ్వనించే బైరాగుల తత్వ జిజ్ఞాసను పొదవిపట్టుకున్న కవిత సిద్ధార్థ బొమ్మలబాయి.ఇది ఒక కాలాంతరజీవినిశ్చల తపస్సులోని ఆత్మసంభాషణ.

*

 

అందమైన కలలాంటి ఆ నేలా..గాలీ!

 

  -శివలక్ష్మి

~       

మా కోడలి  అక్కలిద్దరు సంధ్య,రూపల్ ఇండొనేషియాలో టీచర్స్ గా పని చేస్తున్నారు. పదే పదే రమ్మంటున్న వాళ్ళ  ఆహ్వానం మీద  ఇండొనేషియా వెళ్ళాలని అనుకున్నాం. అది ఒక ద్వీప దేశం. చిన్నప్పుడు రామాయణ పాఠాల్లో చదువుకున్న జావా,సుమత్రా దీవులు ఇండోనేషియా లోనివే కనుక చూస్తే బాగుంటుందనుకున్నాం. ఇటీవల మాకుటుంబం లోని – మేమిద్దరం హైదరాబాద్ నుంచి, హిమాన్షి (కోడలు) , శయన్ (మనవడు) డిల్లీ నుంచి , మా బాబు స్వరూప్  లే(లఢక్) నుంచి, రాజ్(రూపల్ భర్త) గౌహతి నుంచి బయల్దేరి, అందరం హైదరాబాద్ లో కలిసి డిసెంబర్ 23 న ఇండొనేషియా రాజధాని జకర్తా చేరుకున్నాం. అక్కడికెళ్ళాక న్యూజీలాండ్ లో చదివే సంధ్య కొడుకు సహర్ష్ జాయినయ్యాడు.అక్కడే ఉంటున్న సంధ్య,రూపల్ ఆమె  కూతురు రసజ్ఞ -ఇదీ మొత్తం 10మంది మాగ్రూప్.

అప్పటికే జకర్తాకి చేరిన సహర్ష్, రూపల్  తో కలిసి మమ్మల్ని జకర్తా ఎయిర్ పోర్ట్ కొచ్చి రిసీవ్ చేసుకున్నాడు. ఇతర దేశాలనుంచి అక్కడి పని చెయ్యడానికొచ్చే ఉపాధ్యాయులకి ఇండొనేషియా ప్రభుత్వం ఉచితంగా ఇల్లు,అవసరమైన గృహోపకరణాలన్నీ ఏర్పాటు చేస్తుంది. వాళ్ళకి ప్రభుత్వం సమకూర్చిన ఇళ్ళు కూడా స్కూళ్ళకి నడిచి వెళ్ళేంత దూరంలో, మంచి పరిసరాల్లో, అందమైన ఫర్నిచర్ తో ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయి. ఉపాధ్యాయుల  పిల్లలకి ప్రభుత్వమే ఉచిత విద్య నందిస్తుంది. అలా సంధ్య పిల్లలిద్దరూ జునియాలీ, సహర్ష్ 12th క్లాస్ వరకూ ఉచిత విద్య నభ్యసించి ఇప్పుడు పైచదువుల కెళ్ళారు.ఇప్పుడు రూపల్ కూతురు రసజ్ఞ 12th క్లాస్ ఇండొనేషియాలోనే చదువుతుంది. తన క్లాస్ టీచర్సందరూ భారతీయులేనని చెప్పింది. ఈ టీచర్ల పిల్లలందరూ 12th క్లాస్ వరకూ ఇక్కడ చదివి,తర్వాత వాళ్ళ వాళ్ళ అభిరుచుల కనుగుణంగా పై చదువులకు విదేశాలకెళ్తున్నారు.

జకర్తాలో ఉన్న నాలుగు రోజులూ సంధ్య, రూపల్ అత్యంత ఆత్మీయమైన ఆతిధ్యమిచ్చారు. అలాగని వాళ్ళేమీ పదిమంది మున్నామని  హైరానా పడలేదు. వాళ్ళు వంట చెయ్యనే లేదు. అసలా సమాజంలో వంట చేసుకునే కాన్సెప్టే లేదు. ఈ విషయం నాకు భలే నచ్చింది!అమెరికాలో ఇండియాని నెత్తిన మోసుకెళ్ళి ఇక్కడి వంటలతో ఆడపిల్లలందరూ తెగ యాతన పడుతున్నారు! కానీ “రోమ్ లో రోమన్ లా జీవించు” అన్నట్లు మా సంధ్య,రూపల్ ఎంచక్కా వంటలకు గుడ్ బై కొట్టేశారు!!

bali1

“The first condition of understanding a foreign country is to smell it”- అని Rudyard Kipling  అన్నట్లు Food is the best way to represent a country because of its distinctive aromas and flavours. రోడ్ల మీద ఎంతో రుచికరమైన,అత్యంత శుభ్రమైన ఆహారం దొరుకుతుంది.ఏదో అయిందనిపించే టట్లుండదు.నోరూరించే జిహ్వ రుచులతో, స్పైసీగా తిన్నాం.కొంచెం అన్నం, ఒక కప్పు ఆకు కూరా, చికెన్ మూడూ కలిపిన “పడాంగ్” అనబడే భోజనం వేడి వేడిగా దొరుకుతుంది ఆహా!ఎంతో రుచిగా ఉంది! ఎంతో రుచి, ఎంతో రుచి అని పాడుకున్నాం!ఖచ్చితంగా సగం సగం చేసి ఎనిమిది ముక్కలుగా చేసిన, మషాలా దట్టించిన, అద్భుతంగా ఘుమ ఘుమలు వెదజల్లే   నాలుగు పెద్ద పెద్ద చేపల్ని కొనుక్కుని అన్నంతో తిన్నాం.మా షయన్ కి హిమాన్షికి చేపలంటే చాలా చాలా ఇష్టం.అవి తిన్న తర్వాత తీసిన ఫొటోలో వాళ్ళ మొఖాల్లో ఆనందం చూడండి!!

పిల్లల చదువుల కోసం మా సంధ్య, రూపల్  డెహ్రాడూన్ నుంచి వెళ్ళి కుటుంబాలకు దూరంగా ఒంటరిగా ఉంటున్నారు. అక్కడ ఈవ్ టీజింగ్లుండవు.అత్యాచారాల చాయలేలేవు.ఆ రకంగా ఇండొనేషియా చాలా సురక్షితమైన దేశమని వాళ్ళిద్దరూ చెప్పారు. అత్యాచారాలతో అట్టుడిగిపోతున్న భారత్ గుర్తొచ్చి వేదన కలిగింది. వాయు కాలుష్యముండదు.పెట్రోల్ చాలా చౌకగా దొరుకుతుంది.అదెలా సాధ్యమని అడిగితే మన దేశంలో సెంట్రల్ ఎక్సైజ్,సర్వీస్ టాక్సులు చాలా ఎక్కువుంటాయని కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ లో పనిచేసిన మా ఆయన చెప్పారు. ఇండొనేషియాలో లీటర్ పెట్రోల్ మన 30రూపాయల కంటే తక్కువే.మనకి 70 రూపాయలు.రిఫైనరీ లీటర్ ధర రూ 16.50, టాక్స్ 11.80%, ఎక్సైజ్ డ్యూటీ 9.75%, వ్యాట్ సెస్ 4%, స్టేట్ టాక్స్ 8%-ఈ మొత్తం కలిసి 50.05. కానీ భారత ప్రభుత్వం ఇంకో 20రూ అదనంగా మన చెవులు పిండి వసూలు చేస్తుంద ! 20రూ దేనికోసం వసూలు చేస్తుందో మాత్రం ప్రజలకు చెప్పదు !!

మన లాగే ఇక్కడి వారివి మామూలు మధ్య తరగతి జీవితాలే! సాదా సీదా జీతాలే!! కానీ మన ఉపాధ్యాయులే కాదు,ఉన్నతోధ్యోగుల జీవితాలతో పోల్చి చూసినా ఈ దేశంలో చాలా హాయిగా ప్రశాంతంగా ఉన్నారనిపించింది.ఏ రకమైన ఒత్తిడీలేదు.ఇందు గల డందు లేదన్నట్లు మనకి యెల్లడలా ప్రత్యక్షమై, పీల్చి పిప్పి చేసి, అనారోగ్యాల పాల బడేస్తున్న దుమ్ము  అస్సల్లేదు.అమెరికాలో దుమ్ముండదనుకుంటారు గానీ అక్కడి  మూల మూలల్లో కనిపించే దుమ్ము లాంటిది కూడా యిక్కడ కనిపించదు.ఎటు చూస్తే అటు పచ్చని చెట్లతో పరిశుభ్రంగా ఉంటుంది. బట్టలు మాయవు. అంత పచ్చదనం నేనెక్కడా చూడలేదు.తాజాగా,నేవళంగా,కళ కళ లాడుతూ చెట్లూ,ఆకులూ,పువ్వులూ ఆహ్లాదం కలిగిస్తాయి. జకర్తా నగర శివార్లలోనూ,బాలీ లోనూ తిరుగుతుంటే రోడ్డు కిరువైపులా వరి పంట పొలాలు కనిపిస్తూ కన్నుల పండుగ చేస్తాయి.కొన్నిచోట్ల లోయల్లాగా ఉండి, లోయ నిండా పరుచుకున్న పచ్చదనంతో కళ కళలాడుతుంటాయి. ఆ వరి పంట నీళ్ళ మధ్య మధ్య లో చిన్న చిన్న చేపల్ని వదుల్తారనీ, ఆ చేపలు తిరుగుతూ,పెరుగుతున్న క్రమంలో వాటి మల మూత్రాలతో పంట బాగా పండుతుందని,ఆ ప్రజల ప్రధాన మైన పంట వరేనని తన పాఠాల్లో ఉందని రసజ్ఞ  మాకు చెప్పింది!

వాళ్ళ ప్రధానమైన ఆహారం మనలాగే అన్నం.రోజులో నాలుగైదుసార్లు అన్నం తింటారు.కానీ మనుషులు ముఖ్యంగా స్త్రీలు సన్నగా, నాజూగ్గా, చలాకీగా, బలంగా ఉంటారు. మీరు చెప్తే నమ్ముతారో లేదో గానీ నిజంగా నా సైజ్ ప్యాంట్ అక్కడి షాపుల్లో దొరకలేదు.మనదేశంలో నైతే నేనసలు లావే కాదు. నాక్కోపమొచ్చి ఇక్కడ కూడా అక్కడక్కదా లావాటి వాళ్ళున్నారు కదా వాళ్ళకెలా?అని అడిగాను.వాళ్ళకి బిగ్ సైజ్ షాపులుంటాయని చెప్పారు.సిగ్గేసింది కానీ ఒక విషయం తెలిసొచ్చింది. అదేమిటంటే  వాళ్ళు నాలాగా ఆవకాయ-ముద్దపప్పు లేకపోతే రోటి పచ్చడితో ఒక వాయి,కూరతో ఒక వాయి, సాంబారు,రసాలు వగైరాలతో ఒక వాయి,పెరుగుతో చివరి వాయి లాగించరు.ప్రతి సారీ రెండే రెండు స్పూన్ల (మళ్ళీ స్పూన్ అంటే  మన హస్తం కాదు,నిజంగా టేబిల్ స్పూన్ కన్న కొంచెం పెద్ద స్పూన్) అన్నం తింటారు అని. ఈ రహస్యాన్ని మా సంధ్య,రూపల్ దగ్గర ఉన్న మెయిడ్స్ నుంచి రాబట్టాను. మెయిడ్స్ అంటే గుర్తొచ్చింది (పని మనిషి పదం కంటే మెయిడ్ పదం కొంచెం బాగుంది) సంధ్య ఇంట్లో అమ్మాయి పేరుపార్వతి,రూపల్ ఇంట్లో అమ్మాయి పేరు మీనా.ఇంతకీ వాళ్ళు ముస్లిం స్త్రీలు.అచ్చం మన తెలుగు పేర్లు! వాళ్ళు చాలా హుందాగా,సమర్ధంగా ఉన్నారు. చక్కగా టూ వీలర్ల మీద వస్తారు. ఒకరి మీద ఒకరికి ఎంతో నమ్మకం, గౌరవం. వీళ్ళు తాళాలిచ్చి ఉదయాన్నే స్కూళ్ళకెళ్ళిపోతారు! వాళ్ళు ఇల్లు శుభ్రం చేయడం, బట్టలుతికి మడతలు పెట్టడం మొదలైన పన్లు చక్క బెట్టి వెళతారు!

ముస్లిం అమ్మాయిలకు తెలుగు పేర్లు ఎందుకున్నాయో తెలుసుకోవాలనే  ప్రయత్నంలో   జకార్తా చరిత్ర గురించి చదివితే 14 వ శతాబ్దంలో “జకార్తా” జావా అనే హిందూ రాజ్యంలో ఒక చిన్న నౌకాశ్రయం పట్టణంగా ఉండేది. 1527లో “ఫతాహిల్లా” అనే ముస్లిం మత పాలకుడు స్వాధీనం  చేసుకుని “జయకార్తా” (Victory City) అని పేరు మార్చాడు.1619 లో డచ్ వాళ్ళు స్వాధీనం చేసుకుని, ఒక కొత్తనగరంగా నిర్మించి, ‘బటావియా’ అని పేరు మార్చి, ఆగ్నేయాసియాకి అధికార కేంద్రంగా  చేసి 300 ఏళ్ళు పరిపాలించారు. 1941 లో జపాన్ సామ్రాజ్య వాదులు ముట్టడించి పాత పేరు జయకార్తాని జకార్తాగా మార్చేశారు. డచ్ పాలకులు మళ్ళీ ఇంకోసారి జకార్తాని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడం వల్ల ఇద్దరి మధ్య పోరాటాలు మొదలయ్యాయి. ఈ లోపల ఇండోనేషియన్ ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్ష ఉధృత మైంది . ప్రజల విముక్తి పోరాటాల ఫలితంగా 1945, ఆగష్టు 17 న ఇండోనేషియన్ నాయకులు జకార్తాలో విదేశీ పాలన నుంచి స్వాతంత్ర్యం ప్రకటించారు.

ఇక్కడ శతాబ్దాలుగా హిందూ,ముస్లిం,యూరోపియన్,డచ్,జపనీస్ ప్రజలు సహజీవనం చెయ్యడం వల్ల అన్ని జాతుల మిశ్రమ సంస్కృతి కలగాపులగమైందని అర్ధమైంది. హిందూ, బౌద్ధం,  కన్ఫ్యూషియనిజం, ఇస్లాం, క్రైస్తవ  మతాల సమూహాలతో కలిసిన ఒక సంక్లిష్టమైన సాంస్కృతిక జీవనం ఆశ్చర్యం కలిగిస్తుంది. మన “భాష” లాగే వాళ్ళు మాట్లాడే భాష పేరు “భాస”. స్త్రీలను వనిత (wanita) లంటారు. సరస్వతి, రాముడు,సీత,శివ-పార్వతులు,అర్జునుడు లాంటి అనేకమైన మన పదాలుండడం వల్ల వాళ్ళ భాష (భాస) కొంచెం అర్ధమవుతుంది.అర్ధం కాకపోయినా సైగలతో,హావభావాలతో వాళ్ళతో చక్కగా మాట్లాడొచ్చు. పోయిన సంవత్సరం హాంకాంగ్, మకావ్ లకు వెళ్ళాం. అక్కడి వాళ్ళకు ఇంగ్లీష్ రాదు. ఏ షాపుకెళ్ళినా,బజార్ల లో ఏమైనా తినాలని అడగబోయినా, సైగలు చేద్దామన్నా మొఖాలు చిట్లించుకుని విదిలించి పారేసేవారు. చాలా ఇబ్బంది పడ్డాం! ఇండోనేషియా మనుషులు ఎక్కడున్నా మనందరం మనుషులమే అన్నట్లు చాలా స్నేహపూర్వకంగా ఉన్నారు. ప్రేమాభిమానాలు చూపించారు. ఆ నేలలో మనుషులందర్నీ కలగలిపే గొప్పతనమేదో ఉందనిపించింది!

ఇక కరెన్సీ విషయానికొస్తే మన రూపాయికి 210 ఇండొనేషియన్ రూపయ్యాలు. ఒక డాలర్ కైతే 13,600 రూపయ్యాలు. అందుకే డాలర్లున్న విదేశీయుల ఎద్దడి సర్వకాలాల్లోనూ ఉంటుందట! పది వేల రూపాయిల్ని మార్చుకుంటే నాకు 20 లక్షల రూపయ్యాలొచ్చాయి. ఆర్టిస్ట్ మోహన్ అప్పుడప్పుడూ  ఆయన జేబులో కాసిని డబ్బులుంటే చాలు “I am Stinkingly Rich” అని అంటుంటారు, అలా ఫీలైపోయాను. తీరా ఒక కాఫీ మేకర్ కొనుక్కుంటే 2 లక్షలైపోయాయి. పిల్లలకిష్టమైన  బ్రాండ్స్ అన్నీ చీప్ గా దొరుకుతాయి.కానీ అవి ఇండొనేషియన్ బ్రాండ్స్.ఏమైనా రెండు మూడు వస్తువులు కొందామనుకున్నప్పుడు మిలియన్లలో లెక్క తేలేది.ఇక నా లెక్కలు రాని బుర్రకి తాళం పడిపోయేది.కౌంటర్ లో అమ్మాయి ఎంత చెప్తే అంతా ఇవ్వడం, అదీ రాకపోతే రూపల్ హెల్ప్ చేసేది.

bali2

జాతీయవాదం తీవ్రంగా ప్రబలిన  సుకర్ణో కాలంలో నిర్మించిన స్మారక చిహ్నం “మోనాస్”. ఇది 35 కిలోల బంగారపు పూతతో,137 మీటర్ల పొడవైన పాలరాయి కీర్తి స్తంభం. ఆగ్నేయాసియాలో అతి పెద్దదైన ఈ మసీదుని నిర్మించడానికి 17 సంవత్సరాలు పట్టింది.ఇది ప్రపంచంలోనే రెండవ అతి పెద్దదైన ఒక చారిత్రాత్మక మ్యూజియం.”ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం”,అన్న మాహాకవి మాటలు గుర్తొచ్చాయి. కానీ పరపీడన పరాయణత్వం నుంచి ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులకూ, స్వేచ్ఛకూ, వారి స్వావలంబనకూ ప్రతీకగా నిలుస్తున్న మ్యూజియం గోడలు, గోపురం మసీదు వైభవాన్ని, ఐశ్వర్యాన్నే గాక ప్రజల గొప్పతనాన్నీ,హుందాతనాన్నీ,స్వావలంబననీ చాటి చెప్తున్నాయి. పాలకుల దగ్గర యుద్ధ టాంకులుంటే ప్రజల దగ్గర చిట్టి చిట్టి  ఆయుధాలుంటాయి.  ఒకసారి ప్రజలకు రాజకీయ స్పష్టత వచ్చిందంటే ఎంత కౄరమైన సామ్రాజ్య వాదాలైనా కాగితప్పూలలాగా ఎగిరిపోయి, ప్రజలే అంతిమ విజయం సాధిస్తారని చరిత్రలో రుజువైన సత్యాన్ని ఇండోనేషియన్ ప్రజలు  మరోసారి నిరూపించారు.

భాలికల విద్య,ఆధునికత  విషయంలో ” బి యూ కార్టిని (IBU Kartini)” అనే ఒక పేరు ప్రముఖంగా వినబడింది. కార్టిని పేరుతో ఇండోనేషియాలో చాలా స్కూళ్ళు, స్థలాలు ఉన్నాయి.ఏమిటని సంధ్య నడిగితే ఆడపిల్లల చదువుల కోసం కృషి చేసిన కార్టిని అనే ఒక అద్భుతమైన మహిళ గురించి చెప్పింది. కార్టిని 1789 లో ప్రస్తుత ఇండోనేషియాలో ఒక కులీన జావనీస్ కుటుంబంలో జన్మించింది. 1904 వరకూ జీవించింది. ఆమెకు చదువు పట్ల విపరీతమైన  ఆసక్తి ఉండేది. 12 సం.ల లోపే ఆమె డచ్ భాష నేర్చేసుకుంది. జావనీస్ సమాజంలో అమ్మాయిలను ప్రాధమిక పాఠశాల, అంటే 12 సం.ల వరకే పాఠశాలకు వెళ్ళనిచ్చేవారు. ఆ కాలంలో బహుభార్యాత్వ ముండేది. బాలికల వేషధారణ మీద అనేకరకాలైన కౄరమైన ఆంక్షలుండేవి.ముక్కుపచ్చలారని పసిపిల్లలను గృహనిర్భంధంలో ఉంచి, మొఖం తెలియని ముసలివాళ్లతో రెండో,మూడో పెళ్ళికి సిద్ధం చేసేవారు.ఈ బాలికల దుర్భర పరిస్థితులకు కలత చెందిన కార్టిని వారి ఏకాంత బాధలను అధ్యయనం చేసి “Out of Darkness to Light” అనే పుస్తకం డచ్ భాషలో రాసింది. “Letters of a Javanese Princess” అని ఆమె భావాలను వ్యక్తపరిచే కొన్ని ఉత్తరాలు కూడా డచ్ భాషలోనే  రాసింది. అందులో ఆమె బహు భార్యాత్వాన్ని వ్యతిరేకించింది. ఇండోనేషియా యువత యూరోపియన్ యువతలా ఉండాలనే ఆశాభావం వ్యక్తం చేసింది. స్త్రీల చదువుల కోసం, హక్కుల కోసం ,రకరకాల పీడనలనుండి విముక్తి కోసం న్యాయపోరాటాలను సూచించింది. డచ్, నెదర్లాండ్స్, యూరోపియన్  దేశాల పౌరులను ఆకర్షించి, గొప్ప ఆసక్తిని  రేకిత్తించడం ద్వారా  విదేశీ  ప్రముఖుల  మద్దతును కూడగట్టగలిగింది. విద్యా రంగంలో మార్గదర్శకురాలైంది. ఇండొనేషియా స్వాతంత్ర పోరాటంలో కూడా దేశ నాయకులకు ఆమె ఆలోచనలు   ప్రేరణ నిచ్చాయి. కార్టిని జన్మదినం ఏప్రిల్ 21 ని జాతీయ సెలవు దినంగా, ఆమెను జాతీయ నాయకురాలిగా ప్రకటించింది ప్రభుత్వం. ఇండొనేషియా స్మారక చిహ్నం “మోనాస్”. తో పాటు, కార్టిని విగ్రహాన్ని కూడా చూశాం.

bali5

ఇండోనేషియా ఒక ముస్లిం మతం దేశం అయినప్పటికీ బయట పరిశీలకులు సమాజం లో ముస్లిం మహిళల హోదా, హక్కులు, వారి స్థా నాన్ని చాలా ఉన్నతంగా భావిస్తారు. సమాజంలో మహిళలు పాటిస్తున్న మంచి విలువలే సమాజానికి వెన్నెముకలా పనిచేస్తున్నాయని పరిగణిస్తారు. సుకర్ణో కూతురు మేగావతి అధ్యక్ష అభ్యర్థిగా  నిలబడితే ముస్లిం మత నాయకులు ఒక మహిళ అధ్యక్ష పదవిలో ఉండడమేమిటని వ్యతిరేకించారు. కాని ఆమె 1999 జాతీయ ఎన్నికల్లో అతిపెద్ద మెజారిటీతో గెలుపొంది, ప్రముఖంగా నిలిచింది. అక్కడి ముస్లిం మహిళలు బురఖాలు వదిలేశారు. చిన్న చిన్న అతి సుందరమైన స్కార్ఫ్ లను తల చుట్టూ మాత్రం ధరిస్తున్నారు.అవి కూడా మహిళల అందాన్ని పెంచుతున్నాయి. కొందరు అవి కూడా వదిలేశారు.అమ్మాయిలు రాత్రుళ్ళు స్వేచ్చగా తమ తమ పనుల మీదే కాకుండా రాత్రంతా తెరిచి ఉండే నైట్ మార్కెట్లలో నిర్భయంగా తిరుగుతున్నారు.వారికి సౌకర్యవంతంగా ఉండే అన్ని రకాల ఆధునికమైన దుస్తులను ధరిస్తూ అత్యాధునికంగా కనిపించారు. ఇండియాలో ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పే హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో మేము “బిలియన్ రైజింగ్” ల పేరుతో ‘పగలే కాదు,రాత్రుళ్ళు కూడా మావి కా వాలనే డిమాండ్ తో ఇంకా ఉద్యమాలు చేసే స్థితిలోనే ఉన్నాం! ఈ ఆధునికత వెనక కార్టినికి స్త్రీజాతి పట్ల ఉన్న ఆర్ధ్రత ఎంతైనా అభినందనీయం!!

ఇండోనేషియా నిత్య జీవితంలో ఆహారంలో, సంస్కృతిలో కూడా  దేశీయ ఆచారాలూ, విదేశీ ప్రభావాల కలయికలూ కనిపిస్తాయి. బాలినీస్ నృత్యాల్లో  పురాతన బౌద్ధ, హిందూ మత రాజ్యాల గురించి కథలున్నాయి. బాలిలో అచ్చు తెలంగాణ బోనాల పండుగలో మహిళలు తీసికెళ్ళే బోనాల్లాంటివే బాలి మహిళలు పెద్ద పెద్ద బుట్టలలో రకరకాల పళ్ళు అందంగా పేర్చుకుని తీసికెళ్ళడం చూశాం.

బాలి లో హోటెల్ Kuta Central Park లో దిగాం .అక్కడినుంచి ఒక టాక్సీ తీసుకుని ఊరంతా తిరిగాం. ఒక టాక్సీ డ్రైవర్ ని నీ పేరేమిటని అడిగితే “ఒయాన్” అని చెప్పాడు.మీరు ముస్లింలా?అనడిగితే “No,I am a real Hindu” అని చెప్పాడు.నిజమైన హిందువంటే ఏమిటంటే రోజుకి ఐదు సార్లు పూజ చేస్తారట!ఆ పూజలు ఇంటి బయటి ప్రవేశ ద్వారం దగ్గరే చేస్తారు. ఇంటి ఆవరణమంతా చాలా శుభ్రంగా ఉంచుకుంటారు.మనవాళ్ళలాగా పక్కింటివాళ్ళ గుమ్మాల్లో చెత్త పారబొయ్యరు! ప్రవేశ ద్వారం దగ్గరే  ఎందుకు పూజలు చేస్తారంటే సకల దేవుళ్ళూ,పంచ భూతాలూ ఇంటికి కాపలా ఉండి ఎటువంటి చెడునీ ఇంట్లోకి రానివ్వకుండా అడ్డు పడతాయని, తమను కాపాడతాయని వాళ్ళ నమ్మకం! నాకిది కూడా భలే నచ్చింది.పూజల పేరిట ఇక్కడి ఆడవాళ్ళకు ఇరుకు ఇళ్ళలో చచ్చేంత చాకిరీ ఉంటుంది.ప్రతిసారీ దేవుడి విగ్రహాలు తోమి,వాడిపోయిన పువ్వులూ,పాచిపోయిన నైవేద్యాలూ అన్నీ శుభ్రం చెయ్యాలి.బయటంటే స్త్రీలూ-పురుషులూ కలిసి చెయ్యడం చూశాం ! నడి రోడ్ల కూడళ్ళలో పెద్ద పెద్ద కృష్ణార్జునులూ,శివ-పార్వతులూ మొదలైన హిందూ దేవుళ్ళ విగ్రహాలు చూశాం!

ముస్లింలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం  వరకూ రంజాన్ సందర్భంగా నిష్టగా నెలంతా ఉపవాసం చేస్తారు. ప్రతి రాత్రి కుటుంబ సభ్యులంతా ప్రత్యేక వంటకాలతో వేడుకగా భోజనం చేస్తారు. స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, సహచరులకు  ఆహార పదార్థాలను పంచిపెడతారు. వారికి ఆతిథ్య సామర్ధ్యం చాలా ఎక్కువని, రంజాన్ సమయంలో మాకు విందులే విందులని మా సంధ్య,రూపల్ చెప్పారు.

రాజకీయ వ్యవస్థ, శాస్త్ర,సాంకేతిక సమస్యలు, వినోదం, సినిమా, టెలివిజన్ కార్యక్రమాలు మొదలైన విషయాల్లో పాశ్చాత్య సంస్కృతి ఇండోనేషియాను గొప్పగా ప్రభావితం చేసింది. అరబ్, మలయ్, భారత్ ల జానపద సంగీతాల మేళవింపుతో తయారైన సంగీతం ఇండోనేషియాలో బహుళ ప్రజాదరణ పొందింది.

డచ్, చైనా, యూరోపియన్లు ఆధిపత్యం చెలాయించడం వల్ల ఇండోనేషియాలో ఇప్పటికీ “ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ.”  ఉంది. దేశీయ వినియోగం కోసం జనాభాలో 60 శాతం వ్యవసాయం చేసి, వరి పండిస్తారు. మధ్య భూభాగంలో ఉండడం వల్ల ఇండోనేషియా వేడి ప్రదేశమే. వాతావరణ పరిస్థితుల్ని బట్టి జీవనోపాధికి కూరగాయలు, పండ్లు, టీ, కాఫీ, పంచదార,  సుగంధ ద్రవ్యాలు మొదలైన మార్కెట్ ఆధారిత పంటలు పండించే రైతులున్నారు. అందమైన చెక్క బొమ్మలు చేసే కళలో ఇక్కడి ప్రజలు మంచి నైపుణ్యం సంపాదించారు. బంగారం, చమురు, సహజ వాయువు, తగరం, రాగి, అల్యూమినియం, ఆయిల్ పామ్, రబ్బరు, చక్కెర, ఇండోనేషియా ఎగుమతుల్లో ముఖ్యమైనవి. ఇండోనేషియాలో దొరికే కలప నుపయోగించి ప్రాసెస్ చేసిన చెక్క కూడా ఎగుమతుల్లో ప్రధానమైనది.

గ్రామాల్లో వ్యవసాయపు పనుల్లో స్త్రీ-పురుషుల భాగస్వామ్యం ఉంటుంది. సాధారణంగా పురుషులు పొలం దున్నితే, మహిళలు సేద్యం చెయ్యడం, కోతలు కొయ్యడం,పంటల్ని భద్రపరచడం వంటి అనేక పన్లు చేస్తారు. ఆ స్త్రీలు శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకలుగా దర్శనమిస్తారు. విదేశీ సంస్కృతి యొక్క ప్రభావం ఉన్నప్పటికీ, కొన్ని మారుమూల ఇండోనేషియన్ ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రత్యేక మూలవాసీ సంస్కృతి భద్రపరచబడింది. ఆ  మహిళల సాంప్రదాయ దుస్తుల్ని మేము చాలా ఇష్టంగా  కొనుక్కున్నాం !

bali4నిర్ణయాత్మక స్థానాల్లో,అధికారా హోదాల్లో ఎక్కువగా పురుషులే ఉంటారు. మహిళలు పురుషుల కంటే తక్కువ సంఖ్యలో చిన్న చిన్న ఉద్యోగాల్లో దుకాణాలు, పరిశ్రమలు, మార్కెట్లలో  సేల్స్ గళ్స్ గా కనిపిస్తారు. మాధ్యమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా, కాలేజ్ లెక్చరర్లుగా,విశ్వ విద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా పురుషులే ఉంటారు గానీ మహిళలు మాత్రం ప్రాధమిక స్కూలు ఉపాధ్యాయుల వరకే పరిమితమవుతారని సంధ్య,రూపల్ చెప్పారు.కానీ ప్రాధమిక పాఠశాలల్లో బాల-బాలికల సంఖ్య సమానంగా ఉంటుందని చెప్పారు! రాచరిక పాలనే అయినప్పటికీ స్వాతంత్ర్యం వచ్చాక ఒకటి,రెండు దశాబ్దాలకే చదువు మీద అమితాసక్తి కలిగి,ఉచిత విద్యను అమలు చేసింది ఇండోనేషియన్ ప్రభుత్వం. అదీ గాక, ఈ దేశంలో కార్టిని పాఠశాలల ప్రభావం ఎక్కువగానే ఉంది కాబట్టి కొద్ది కాలంలో చదువుల్లో ఉద్యోగాల్లో స్త్రీలు కూడా పురుషులతో సమానంగా ఎదుతారని ఆశించవచ్చు!!

bali6

Taman Safari, Kidzania, Kuta Beach, Kuta Square,Tanah lot Temple,Tanjung Benua in Nusa Dua Beach for water sports,Sukhawati Art Market,Drive in Ubud,Ubud Art Market,Ubud Rice Fields, Zimbaran Beach and Sea Food Dinner, Legian Street,Seminyak area,Sanur Beach,Uluwatu Temple మొ.వాటిని జకర్తా,బాలి లలో మేము చూశాం. రెండు దేవాలయాల బయట సముద్ర తీరాలు,తనివి తీరని దృశ్యాల సౌందర్యాన్నే చూడగలిగాం.సాంప్రదాయ దుస్తులు లేనందుకు మమ్మల్ని లోపలికి అనుమతించలేదు.

ఎటు చూస్తే అటు కనుచూపు మేరా కనిపించే ఇండియన్ ఓషన్ పులకింపజేసేది! మన దేశం పేరుతో ఒక మహా సముద్రముండడ మనే భావన మరీ మరీ పరవశింపజేసింది !! దానికి తోడు ఉడుకు రక్తంతో అత్యుత్సాహంగా ఉరకలు వేసే పిల్లలు.ఒకటే కేరింతలు!వాళ్ళ సాంగత్యంతో మాకూ యవ్వనం వచ్చేసింది!

ఆధునిక జీవితం అర్ధం కావాలన్నారు శ్రీ శ్రీ. వేష భాషల్లోనే కాదు,ఆలోచనల్లోనూ శ్రీ శ్రీ చెప్పిన ఆధునికతను వంట బట్టించుకున్న మా అమ్మాయిలు, ఒకరు కాదు,ఇద్దరు కాదు, ముగ్గురు సమర్ధులైన, అతి చలాకైన,ఆధునిక యువతులు నిర్వహించిన ఈ ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోయే ఒక గొప్ప సంబరంగా సాగింది!

         *

 

 

 

 

 

 

 

 

న్యూటన్ సరికొత్త సిద్ధాంతం!

-బమ్మిడి జగదీశ్వరరావు

 

bammidi ప్రియమైన సైంటిస్టులారా..  సైన్సు యిష్టులారా..!

నన్ను క్షమించండి!

“భూమికి ఆకర్షణ శక్తి కలదు!” అని నేను కనుగొని రాసుకున్న సిద్ధాంతాన్ని భేషరతుగా నేనే ఖండించు చున్నాను! నేను యింతకాలం భూమ్యాకర్షణ శక్తి గురించి మానవాళిని తప్పుదారి పట్టించానని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను! సైన్సులో ముగింపులు వుండవని- కొనసాగింపులూ చేర్పులూ యెల్లప్పుడూ వుంటాయని విజ్ఞులైన మీకు గుర్తుచేసుకుంటున్నాను! చేసిన ప్రతిపాదిత తప్పు వొప్పుకొని- చెవులు నులుముకొని- గుంజీలు తీసి మరీ క్షమాపణలు చెప్పడానికి ఈ న్యూటన్ సిద్ధంగా వున్నాడు! నేను రాసింది కొట్టేశాను! చేతికి అందినంత వరకు చెరిపేశాను! చరిత్రని తప్పుదారి పట్టించానని తెగ బాధపడి బెంగపడి దుఃఖపడి యేడ్చాను కూడా!

సత్యం యెప్పుడూ వొకేలా వుండదు! అప్పటి పరిశోధనలకు అతీతమైన ఫలితాలు యిప్పుడు రావడాన్ని నేను గమనించాను! ఇందుకు భారతదేశంలోని తెలుగు రాష్ట్రాలు తాజా ఉదాహరణలుగా నా ముందు మరోసారి నిలబడ్డాయి! ‘ఆపరేషన్ ఆకర్ష్’ ప్రభావాల్ని తోసిపుచ్చలేకపోతున్నాను! తెలివిగల సైంటిస్టుల్లారా తెల్లమొహం వేయకండి! నా ‘న్యూటన్ సిద్ధాంతము’ తప్పే! ముమ్మాటికీ తప్పే!

ఫీల్డ్ రిపోర్టులు పరిశీలించాను! ఆంధ్రప్రదేశ్ లో జనం బతుకుతెరువుకి వూళ్ళు వొదిలి వలస పోతుంటే- కాంగ్రేసూ వైయ్యస్సార్ కాంగ్రేసు ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశం పార్టీలోకి వలసలు పోవడం గుర్తించాను! తెలుగుదేశానికి యింత ఆకర్షణ శక్తి వుంటే- అదే నిజమైతే- మరి తెలంగాణలో ఆ పార్టీ యెందుకు పూర్తిగా ఖాళీ అయిందో.. యెందుకు రేపోమాపో అధికార తెరాసలో విలీనం కానుందో.. యెందుకు ఆకర్షణ కోల్పోయిందో ఆరా తీసాను! అదే సమయంలో తెలంగాణలో తెరాస, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశానికి గల ఆకర్షణ శక్తులను యేకకాలంలో పరిశోధించాను!

‘మా నియోజక వర్గాల అభివృద్ధి మాకు ముఖ్యం..’, ‘మాకార్యకర్తల డిమాండు మేరకే మేం పార్టీ మారాం..!’, ‘ రాష్ట్రాన్ని బాగుచేసే సత్తా ముఖ్యమంత్రిగారికే వుంది..!’, ‘ఉన్న పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు..!’, ‘ పార్టీని వీడడం బాధగా వుంది.. కాని తప్పడం లేదు..!’, ‘రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో వుంచుకొని పార్టీ మారాం..!’, ‘మాపార్టీ నుండి చాలా మంది వొచ్చి చేరబోతున్నారు..!’ – అని పైకి చెప్పిన కారణాలూ…

‘మామీద కేసులు పెడుతున్నారు.. పాతకేసుల్ని తిరగదోడుతున్నారు..!’, ‘మాకు వొక్క కాంట్రాక్టు కూడా రానివ్వడంలా..!’, ‘మళ్ళీ అయిదేళ్ళ తరువాత మా పార్టీ అధికారంలోకి వొస్తుందన్న నమ్మకమూ లేదు..!’, ‘అధికారంలో లేకుండా కార్యకర్తలని పెంచి పోషించడం యెలాగ?’, ‘అధికారంలో లేకపోతే మమ్మల్ని జనం కూడా మరిచిపోతారు!’, ‘అధికారం లేకుండా అర నిముషం బతకడం కష్టమండీ..!’ – అని  పైకి చెప్పుకోలేని కారణాలూ…

ఈ ఆకర్షణ అనేది ఆదినుండీ వుందనీ, లోగడ రాజశేఖరమాత్యులవారు తెరాస నందు గల పదహారు మందిలో ఆరుగురిని లాగేసారని – సదరు తెరాస యిప్పుడు అదేపని చేసిందనీ.. ముగ్గురంటే ముగ్గుర్ని యిప్పటికి మిగిల్చిందని – తెరాసని తిట్టిపోసిన తెలుగుదేశం తెరాస అనుసరించిన దారినే స్పూర్తిగా పూర్తిగా అనుసరించిందని – అంచేత జంప్ జిలానీలతో జగన్ జగడమాడుటకు లేనే లేదని – తండ్రిగారు యిచ్చిన అధ్బుతమైన తర్ఫీదు కొడుక్కి ప్రాణసంకటాన్ని తెచ్చిపెట్టిందని – అనుభవాల అపహరణల సోదాహరణల ఫుట్ నోట్సులూ…

అన్ని అధ్యయన అంశాలనూ గమనించాను!

భూమికి ఆకర్షణ శక్తి వున్నప్పటికీ.. అది వొస్తువులకు మాత్రమే పరిమితం! భూమికంటే ఆకర్షించేవి కూడా వున్నాయి! అధికారపార్టీ ఆయస్కాంతము వంటిది! టోర్నడోలు అంత శక్తిమంతమైనది! అధికారంలేని ప్రజాప్రతినిధులు గాలివాటంగా వుండక తప్పదు! మనగలగక తప్పదు! లేదంటే యేటికి యెదురీదడమే! అమ్ముడుపోవుటకు అందుబాటులో వుండడంవల్ల ‘సంతలో పశువులు’గ  యీ ప్రజా ప్రతినిధులని కీర్తిస్తారు! వీరు అన్ని వేళలా అమ్ముడుపోవుటకు అత్యంత అనుకూలముగా వుందురని అర్థమయినది!

ఎన్నికలు ముగిసిన వెంటనే- ప్రతీ ప్రతిపక్షమూ ప్రతీ అధికారపక్షంలో విలీనము చేయుట యెంతో మంచిది! ఉత్తమం కూడానూ! ఆమాటకొస్తే పాలకపార్టీ సభ్యులందరూ వొకే పార్టీ సభ్యులు కానే కారు! అనేకానేక సమీకరణల వల్ల వేరు వేరు పార్టీలలో పోటీ చేయుట యెంత సహజమో.. గెలుపు గుర్రాలన్నీ వొకే చోట చేరడమూ అంతే సహజము! అధునాతన రసాయన సమ్మేళనము! ఆమాటకొస్తే అధికార పార్టీలో చేరకపోతే గెలిచినా వోడినట్లే! వోడినవాళ్ళు రేపటికో మాపటికో గెలవాలన్నా అధికారపార్టీ అండ వుండాల్సిందే!

ఏ విధముగా  చూసినా భూమికి మించిన ఆకర్షణ శక్తి అగుపించు చున్నది!

అధికారపార్టీ ఆకర్షణకు ప్రతిపక్షపార్టీ దూరంగా వుండి బతికి బట్టకట్టుట అసాధ్యము! అందువల్ల పాలక పక్షము ప్రతిపక్షము కలిసివుంటే కలదు సుఖము! పాలకపక్షమునకు ప్రతిపక్షపు తలనొప్పులు వుండవు! ప్రజల తలనొప్పులు ప్రజలు పడుదురు, అవి అత్యంత సహజమైనవి! అలాగే అధికారం వొచ్చునంతవరకూ ప్రతిపక్షములో వుండుట, ప్రతిపక్షమును నడుపుట బహుకష్టము! పాలకపక్షమూ ప్రతిపక్షమూ యేకపక్షమయినచో తిప్పలు, తలనొప్పులు తప్పును! ఎలక్షన్ల సమయంలో మాత్రమే యెవరి పార్టీ వారిది! ఎలక్షన్ల అనంతరం అన్ని పార్టీలు వొక్కటే! అందరి ద్యాసా భాషా ఘోషా వొక్కటే.. ప్రజాసేవ! ప్రజల అభివృద్ధి!

అధికారపార్టీ ఆకర్షించినంతగా భూమి కూడా ఆకర్షించలేదన్న సత్యాన్ని అనేకానేక ఆధారాలతో కనుగొన్నాను! సైన్సు సైన్సుగా వున్నప్పుడు ఫలితాలు వేరు! సైన్సు సోషల్ తో కలిసినప్పుడు వొచ్చే ఫలితాలు వేరు! అంచేత కొన్ని సవరణలు అవసరమని మీకు అర్థమయిందని నాకు అర్థమైనది!

మన్నింపులు కోరుతున్నాను!

యిట్లు

మీ

న్యూటన్

‘దేశభక్త’ మనోజ్ కుమార్‌కి అభినందనలు!

 

రమణ యడవల్లి 

~

ramanaమన్దేశంలో ఆనేక రంగాల్లో కృషి చేసిన (చేస్తున్న) వారికి ప్రభుత్వాలు పద్మ అవార్డులులిస్తాయి. సినిమా రంగానికి సంబంధించి ప్రత్యేకంగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డునిస్తాయి. ప్రముఖ హిందీ నటుడు మనోజ్ కుమార్‌కి ఈ యేడాది ఫాల్కే అవార్డు లభించింది, అందుగ్గాను మనోజ్ కుమార్‌కి అభినందనలు. గత కొన్నేళ్లుగా ఈ అవార్డులు అనేవి ప్రతిభకి చిహ్నంగా కాకుండా పలుకుబడికి నిదర్శనంగా మారిపొయ్యాయి. ఇందుగ్గానూ ప్రజలు మిక్కిలి చింతించి ఈ అవార్డుల గూర్చి పట్టించుకోవడం మానేశారు.

సినిమా వాళ్లకి ఒక ప్రత్యేకత వుంది. డాక్టర్లు స్పెషాలిటీ కోర్సులు చదువుకుని స్పెషలిస్టులు అవుతారు. సినిమావాళ్ళకి అలా కోర్సులేమీ వుండవు కానీ, వారు ఒకే మూసలో సినిమాలు తీసి స్పెషలిస్టులు అవుతారు. పౌరాణిక జానపదాలు, భక్తి సినిమాలు, ఫైటింగు సినిమాలు, ప్రేమ సినిమాలు, హాస్య సినిమాలు, బూతు సినిమాలు.. ఒక్కొక్కళ్ళది ఒక్కో స్పెషాలిటీ. అలాగే మనోజ్ కుమార్ స్పెషాలిటీ దేశభక్తి!

షహీద్, ఉప్‌కార్, పూరబ్ ఔర్ పశ్చిమ్.. మనోజ్ కుమార్ ఇలా అనేక దేశభక్తి సినిమాలు తీశాడు, విజయాలు సాధించాడు. అందుకే అభిమానులు ఆయన్ని ‘భారత్ కుమార్’ అని పిలిచుకున్నారు. మా మేనమామ ఒకాయనకి సినిమాల పిచ్చి. వరసపెట్టి సినిమాలు చూసీచూసీ సినీ పండితుడైపొయ్యాడు. మనోజ్ కుమార్ తన కెరీర్ అంతా ఒకటే ఎక్స్పెషన్‌తో లాగించేశాడనీ, ఆ వొక్కటైనా దిలీప్ కుమార్ దగ్గర అరువు తెచ్చుకున్నదనీ చెబుతుండేవాడు. నాకైతే నిజానిజాలు తెలీదు.

ఇవ్వాళంటే ‘మేం స్వచ్చమైన దేశభక్తులం’ అని మన శీలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం యేర్పడింది గానీ – నా చిన్నతనంలో ఈ సమస్య లేదు. ఆగస్టు పదిహేనో తారీకున ఒక స్వతంత్ర సమర యోధుడితో స్కూల్లో జాతీయ జెండా ఎగరేయించేవాళ్ళు, బిస్కట్లు పంచేవాళ్ళు. చాలా సినిమాల్లో యేదోక సందర్భంలో ఒక దేశభక్తి పాట వుండేది. ఆ పాటలో కనిపించే గాంధీ తాత, నెహ్రూ చాచా క్లిప్పింగులకి చప్పట్లు కొట్టేవాణ్ని. సినిమా అయిపొయ్యాక తెరమీద ‘జనగణమన’ వేసేవాళ్ళు, చివర్లో ‘జైహింద్’ అంటూ సెల్యూట్ చేసేవాణ్ని. ఈ విధమైన నా దేశభక్తికి నేను చాలా సంతోషించేవాణ్ని.

 ఎందుకంటే – నాకు తెలిసిన చాలామందికి నా మాత్రం దేశభక్తి కూడా వుండేది కాదు! పదో క్లాసు తప్పి పెళ్లి కోసం ఎదురు చూసే అక్కా, ‘ఫలానా ముండమోసినావిడ (సిగ్గు లేకుండా) ఫలానా వాడితో యికయికలు, పకపకలు’ అనే వార్తల్ని అందించే మా రంగమ్మత్తా, ఉద్యోగం కోసం తిరిగి తిరిగి బక్కచిక్కిన మా సూరిమామా – వీళ్ళెవరూ యేనాడూ దేశభక్తి గూర్చి మాట్లాడిన గుర్తులేదు. అంతేనా? సోడాబండి తిరుపాలు, పాచిపని చేసే బతకమ్మ, పాకీపని చేసే పుల్లాయ్ గాడు.. వీళ్ళందరికీ దేశభక్తి సంగతి అటుంచండి, కనీసం దేశం అంటే ఏంటో తెలీదని నాకు తెలుసు.

స్కూల్లో సైన్స్ టీచర్ గారు – మనం భారద్దేశంలో పుట్టినందుకు తీవ్రంగా గర్వించాలనీ, మనమందరం భారతమాత సేవలో తరించిపోవాలనీ గంభీరంగా చెప్పేవారు. మన ఉన్నతిని వోర్వలేని పాకిస్తాన్ సాయిబులూ, చైనా కమ్యూనిస్టులూ మన్దేశాన్ని కబళించడానికి నిరంతరం కుట్రలూ, కుతంత్రాలు పన్నుతున్నారని కూడా చెప్పేవారు. ఆయన చెప్పింది సరీగ్గా అర్ధం కాకపోయినా.. ప్రపంచ దేశాల్లో మన భారద్దేశ సంస్కృతి మాత్రమే పవిత్రమైనదీ, గొప్పదీ అనీ.. మిగిలిన దేశాలన్నీ భ్రష్ట సంస్కృతికి, దుర్మార్గాలకీ మాత్రమే నిలయమన్న సంగతి నాకు బాగా గుర్తుండిపోయింది.

దేశభక్తి విషయాల్లో మా సుబ్బు వాదన వేరుగా వుంటుంది. ఫిల్టర్ కాఫీ చప్పరిస్తూ తన అమూల్యమైన అభిప్రాయాల్ని అలవోకగా చెబుతుంటాడు.

“యే దేశంలోనైనా ‘దేశభక్తి’ అనేది రాజకీయ పార్టీల నినాదం మాత్రమే. ఈ నినాదం ఆయా రాజకీయ పార్టీల మెరుగైన భవిష్యత్తు కోసమే గానీ సామాన్య మానవుడి భవిష్యత్తు మెరుగు పడేందుకు మాత్రం కాదు. యే దేశచరిత్రలోనైనా ‘దేశభక్తి’ అనే భావన అణగారిన వర్గాల కష్టాలు కడగళ్ళు తీర్చినట్లుగా గానీ, సామాన్య మానవుడి జీవన స్థితిగతులు మెరుగు పరచినట్లుగా గానీ ఋజువుల్లేవు.” అంటాడు మా సుబ్బు.

“గురజాడ గారు ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్!’ అన్నారు. మనం, మన తోటి మనుషులు – అందరం ఈ దేశంలో భాగమే కదా! మరప్పుడు ఒక దేశపౌరుడు ఇంకో దేశపౌరుణ్ని మోసం చెయ్యకూడదు. భారతీయ పోలీసులు భారతీయ నిందితుల్ని లాకప్ డెత్ చెయ్యకూడదు, భారతీయ అగ్రకులాలు భారతీయ దళితుల్ని హీనంగా చూడకూడదు, భారతీయ సైనికులు భారతీయ ఆదివాసీల అణచివేతకి పాల్పడకూడదు. మరి – ఇవన్నీ జరుగుతున్నయ్యా?” అంటూ ప్రశ్నిస్తాడు మా సుబ్బు.

“గురజాడ వారే ‘దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా!’ అని చెప్పారు. అయితే వాస్తవానికి ఈ సూక్తి ఎవరికి వర్తిస్తుంది? ప్రజల్ని నిలువునా ముంచేస్తున్న రాజకీయ నాయకులకి వర్తిస్తుంది, పబ్లిక్ బ్యాంకుల్ని పబ్లిగ్గా దివాళా తీయిస్తున్న కార్పోరేట్ సంస్థలకి వర్తిస్తుంది. కానీ ఈ ఉన్నత వర్గాల వారే స్వతంత్ర దినం నాడు భారతమాత విగ్రహానికి దండేసి, జాతీయ జెండాకి దణ్ణం పెట్టి దేశభక్తులైపోతారు! దేశభక్తి గూర్చి ఉపన్యాసాలు దంచుతారు.” అంటూ నవ్వుతాడు మా సుబ్బు.

“ఒక దేశానికి అన్నిరకాల వృత్తులూ అవసరం. కర్షకులు, కార్మికులు, డాక్టర్లు, ఇంజనీర్లు, పారిశుధ్య పనివారు, సైనికులు.. ఇలా అనేకమంది కలిస్తే గానీ ‘దేశం’ అనే బండి నడవదు. వీరిలో యే ఒక్కరూ ఇంకొకరికన్నా ఎక్కువా కాదు, తక్కువా కాదు. పొలం దున్నుతూ పాము కరిచి చనిపొయ్యే రైతూ, ప్రమాదవశాత్తు ఫ్యాక్టరీలో చనిపోయ్యే కార్మికుడూ, రోగి నుండి సంక్రమించిన ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయ్యే వైద్యుడూ, మేన్‌హోల్లో కుళ్ళు కంపుకి ఊపిరాడక చనిపోయ్యే పారిశుధ్య కార్మికుడూ, సరిహద్దులో శత్రువు దాడికి చనిపోయ్యే సైనికుడూ.. అందరూ సమానంగా అమరులే (దీని అర్ధం యేమైనప్పటికీ)!” అంటూ బల్ల గుద్దుతాడు మా సుబ్బు.

ప్రస్తుతం దేశ పరిస్థితులు బాగాలేవు. దేశభక్తి టాపిక్ చాలా కాంప్లికేట్ అయిపొయింది. ఏదైనా కొంచెం అటూఇటుగా మాట్లాడితే దేశద్రోహులం అయిపొయ్యే ప్రమాదం పొంచి వుంది. కాబట్టి మా సుబ్బు అభిప్రాయాల్తో నాకస్సలు సంబంధం లేదని విన్నవించుకుంటున్నాను. స్వాతంత్ర సమరయోధుడు కొండ వెంకటప్పయ్యగారికి ‘దేశభక్త’ అనే టైటిల్ వుంది. వెంకటప్పయ్యగారి ‘దేశభక్త’ టైటిల్ సినిమావాళ్ళల్లో ఎవరికైనా యివ్వాలంటే మన మనోజ్ కుమార్‌ని మించిన యోగ్యుడు లేడని నా అభిప్రాయం.

చివరగా –

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ‘దేశభక్త’ మనోజ్ కుమార్‌కి అభినందనలు!

*

అపరిచయం

 

   -ఇంద్రప్రసాద్

~

 

రోజూ కనిపిస్తూనే వుంటాడు
మధ్యాహ్నం భోజనాల వేళ
వేణువూదుకొంటూ
ఎండలో నడుచుకొంటూ

మళ్లీ యింకో గంటపోయేక
తిరుగు ప్రయాణంలో
అరుగుమీద
పుస్తకం చదువుకొంటూన్న
నన్ను చూసి నవ్వుతాడు
పలకరింపుగా

పేరెప్పుడూ అడగలేదు
ఏం చేస్తాడు తెలుసుకోలేదు


ఆయన పేరూ తెలుసు
కవిత్వమూ తెలుసు
ఒక సారి కలుసుకొన్నాం
ఆప్యాయంగా పలకరించేడు
మళ్లీ మరో కవుల సభలోనే
కలిసేడు
పలకరించుకున్నాం

దూరాంతరవాసంలో
ఇప్పుడు పుస్తకం చాలా దూరం
కవులూ, సభలూ యింకా దూరం

నిన్ననే తెలిసింది
మరి కవి సమ్మేళనానికి
ఆయన రారని
మురళి యింక వినబడదని.

*

పగటి కలలు మనకెందుకు?

 

-నిర్గుణ్‌ ఇబ్రహీమ్‌

~

 

ఇప్పుడు కవిత్వం

ఒక గ్యాంబ్లర్‌ ఎక్స్‌పోజర్‌

 

గుండె అరల్లో జ్ఞాపకాలు చితుకుతున్నప్పుడో

కాలం బతుకుమీద కన్నెర్ర చేసినప్పుడో

కసాయితనం బతుకులమీద కత్తులు దూస్తున్నప్పుడో

పారే నెత్తుటి ఆవిర్లను కబళిస్తున్నప్పుడో

చెమ్మను తడుముకునే అక్షరాలు

సమూహ కదనాళికలో పురుడుపోసుకునే కావ్యం

ఎనకటెప్పుడో

మా తాత ముత్తాతల కాలాన

గుండెలమీద వాలి

గుర్తుల్ని వదిలి ఎగిరినపిట్ట

 

యీయేల అది

కూర్చుకుంటున్న ఒప్పందాలమీద

కూతపెట్టుతున్న పిట్ట

కాలం మీద రెక్కల్ని ఝళిపిస్తూ

ఆర్బాటాల హంగుల్లో

కృత్రిమ రాగాల్ని అల్లుతుంది

 

బతుకు దర్పణమయ్యేది కవిత్వమా?

బతుకుని మాయాదర్పణం చేసేది కవిత్వమా?

సందిగ్దం వీడి

గుండెలు ఆకాశమై కూయాలి!

 

కరెన్సీ కట్టల మాటున

మగ్గుతున్న అక్షరం

పచ్చనో్ట్ల కంపుకొడుతుంటే

రెక్కలొచ్చింది హైడ్రోజన్‌కే కదా అని విస్తరించనిద్దామా?

 

అదేమైనా ఆక్సిజనా?

ప్రాణాలకు పురుడు పోసేందుకు!

 

రూపాయినోట్లు అలుముకుంటున్న అక్షరాలను

కలల వీక్షణంలో విహరించనివ్వకండి!

చెదిరే నిద్రకు అదృశ్యమయ్యే

పగటి కలలు మనకెందుకు?

 

కవిత్వమంటే…

ప్లాస్టిక్‌ పూలగుత్తులు కాదు

 

కవిత్వమంటే…

విరబూసిన పూలపరిమళాలను

మనందరికి పంచే సమీరాలు!

 

కవిత్వమంటే….

శ్రామికుని చెమటలో పురుడుపోసుకున్న

అర్థాకలి పాట!

*

నిలకడగా నాలుగో అడుగు!

 

 

అంత తేలికేమీ కాదు, నాలుగడుగులూ కలిసి నడవడం! కలిసి నడవడం అంటే వొకరి అడుగుల్ని ఇంకొకరు అనుకరించడమూ కాదు, అనుసరించడమూ కాదు. ఎవరి నడక వాళ్ళదే! ఎవరి పాదముద్రలు వాళ్ళవే! ఆ వేరే అడుగుల మీద నమ్మకమూ గౌరవమూ రెండూ మిగుల్చుకుంటూ నడవాలి. ఆగని నడక! నడవడమే కాదు, ఆ నడకలో కొన్ని కట్టుబాట్ల మీద పట్టు సడలని భరోసా కూడా తోడవ్వాలి. ఏ నేల మీద కలిసి నడుస్తున్నామో ఆ నేల మీద కచ్చితంగా కాళ్ళు నిలిపి నడవాలి. ఆ గాలిలో ఊపిరై సాగాలి. అంటే, ఆ నేలలోని ప్రతి పరిమళాన్నీ, ఆ గాలిలోని ప్రతి విసురునీ అనుభవించి పలవరించాలి.

గత ఏడాది తెలుగు వాళ్ళ ప్రపంచం చాలా మారిపోయింది. అనేక కొత్త ఆలోచనల గాలుల మధ్య మనం వుక్కిరి బిక్కిరి అయ్యాం. రెండు రాష్ట్రాల చుట్టూ కన్న కలల్ని సాకారం చేసుకోవాలన్న తపన వొక వైపూ, ఆ కలలకి పుట్టుకొస్తున్న అడ్డంకులు  ఇంకో వైపూ. వీటన్నిటి మధ్యా తమని తాము మళ్ళీ వెతుక్కుంటున్న అస్తిత్వ ఉద్యమాలూ. వీటిని  ప్రతిఫలిస్తున్న సాహిత్య దర్పణాలూ. సాహిత్యమూ, సమాజమూ, సంస్కృతుల కలయికలోంచి పెల్లుబికుతున్న వాదవివాదాలూ. వీటిల్లో ఏ వొక్కటి లోపించినా సాహిత్యం తన కాళ్ళ కింద వున్న నేలని మరచిపోయినట్టే! ఇవన్నీ వొక చోట వొదిగిన కుదురైన సన్నివేశం “సారంగ”.

ఈ ఏడాది మాకు అమితమైన సంతృప్తిని కలిగించిన శీర్షిక “కథా సారంగ.” గత ఏడాది సారంగ ప్రచురించిన కథల్లో కొన్ని కథలకి కథా వార్షిక సంకలనాల్లో విశేషమైన ప్రాధాన్యం దక్కింది. “కథా సారంగ”లో కథ అచ్చు కావడం అంటే తెలుగు కథా ప్రపంచంలో తమకొక గౌరవనీయమైన స్థానం దక్కినట్టే అని చాలా మంది కథకులు సంతృప్తిని వెలిబుచ్చిన దశ ఇది. ప్రసిద్ధులతో పాటు కొత్త తరం రచయితలని కూడా ఈ వేదిక మీదికి తీసుకురావడంలో సారంగ సఫలమైంది. అలాగే, కథనరంగం గురించి చర్చా ప్రాధాన్యం వున్న అంశాలని తీసుకువచ్చి, అర్థవంతమైన దిశ వైపు అడుగులు కదిపేట్టు స్పూర్తినిచ్చింది.

గడిచిన జ్ఞాపకాల పాత సంచికల్ని వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఈ పన్నెండు నెలల వ్యవధిలో వారం వారం క్రమం తప్పకుండా వెలువడుతూ ఎన్ని శీర్షికలు, ఎన్ని రచనలు ఎన్ని వర్ణాలుగా కనిపిస్తున్నాయో!  ఎంతో మందీ మార్బలంతో పెద్ద సర్క్యులేషన్ వున్న అచ్చు పత్రికలే నాణ్యత వున్న రచనల కోసం అష్ట కష్టాలూ పడుతున్న స్థితిలో ఎలాంటి వనరులూ లేని, కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే వున్న చిన్న అంతర్జాల పత్రిక ఇంత మందిని వొక దగ్గిరకి తీసుకురావడం అంటే అది అంత తేలికేమీ కాదు. అయితే, వొక దశ వచ్చేసరికి రచనల కోసం మేం పదే పదే అడగాల్సిన పరిస్థితి కూడా తొలగిపోయింది. రచయితలే ఇతర రచయితల్ని ప్రోత్సహిస్తూ, సారంగకి రాయించడం మొదలయింది. ఆ కారణంగా ప్రతి వారం కేవలం ఎనిమిది రచనలు మాత్రమే అని మొదట పెట్టుకున్న పరిమితిని దాటి ఇప్పుడు వారానికి పదహారు రచనలు వేస్తున్న సందర్భం కూడా వుంది. ఇక వీటి ఎంపికలో, కూర్పులో మేం ఎంత సమయం పెడ్తున్నామో  అది మీ ఊహకే వదిలి పెడ్తున్నాం. ఒక్క అయిదు నిమిషాలు కూడా వూరికే ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేని ప్రస్తుత కాలంలో వారంలో ఎన్ని గంటలు అలా కంప్యూటరు ముందు తదేక దీక్షగా కూర్చొని వుంటే తప్ప ఇది సాధ్యపడదని మీకు తెలుసు.

నిష్కర్షగా వుండడం కష్టం. లేదా, వొక కట్టుబాటుతో వుండడం అంత కంటే కష్టం. ఏదో నాలుగు కవితలూ రెండు కథలూ వొకటో వొకటిన్నరో వ్యాసమూ వేసి, ఎలాంటి రంగూ రుచీ లేని నిర్గుణ వ్యక్తిత్వంతో నిలబడడం సారంగకి సాధ్యపడడం లేదు. అవసరమైన సందర్భాల్లో ముక్త కంఠం పూరించి వున్నమాటని నీళ్ళు నమలకుండా చెప్పే ప్రజాస్వామిక/ నిర్మొహమాట సంస్కృతి సారంగ జీవలక్షణం. నిర్జీవమైన కేవల సాహిత్య కాలక్షేపం మీద మాకు నమ్మకమూ లేదు, గౌరవమూ లేదు. వొక మాట మీద నిలకడగా నిలబడినందుకు కొందరు రచయితల్ని సారంగ కోల్పోవాల్సి వచ్చింది కూడా- “ఇంత activism సాహిత్య పత్రికకి అవసరమా?” అంటూ పంపిన రచనల్ని వెనక్కి తీసుకున్న ప్రముఖులూ వున్నారు. వాళ్ళ అభిప్రాయ స్వేచ్చని చిర్నవ్వుతో గౌరవించాం. సారంగ “కేవలం సాహిత్య” పత్రిక కాదు అన్న విషయం ఇప్పటికే స్పష్టంగా అర్థమైంది అందరికీ- బహుశా, ఈ ఏడాది ఆ విధంగా సారంగకి బలమైన మైలురాయి!  ఈ మైలురాయి దాకా మమ్మల్ని ధైర్యంగా ముందుకు నడిపించిన రచయితలకూ, చదువరులకూ మా కృతజ్ఞతలు. ఈ దారిని ఇలా సాగిపోవడానికి, ఈ నడక ఆగకుండా వుండడానికి మీ తోడు వుంటుందని నమ్ముతూ…

  • -సారంగ సంపాదకులు

 

సామూహిక జ్ఞాపకంలోంచి ….ఒక అన్వేషణ!

 

 

-ఎన్ వేణుగోపాల్

~

(అఫ్సర్ ఆక్స్ ఫర్డ్  ప్రచురణ  “‘ది ఫెస్టివల్ ఆఫ్ పీర్స్” గురించి యూనివర్సిటీ అఫ్ టెక్సాస్ లో  మార్చి తొమ్మిదిన జరగబోతున్న ప్రత్యేక చర్చా గోష్టి సందర్భంగా..)

venuప్రతిష్ఠాత్మకమైన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించిన, కవిమిత్రుడు అఫ్సర్ గ్రంథం ‘ది ఫెస్టివల్ ఆఫ్ పీర్స్’  మన గతం గురించీ వర్తమానం గురించీ అద్భుతమైన పరిశోధన. గూగూడు పీరు స్వామి గురించి వివరిస్తూ, సామాన్యుల మతవిశ్వాసాలనూ ఆచారాలనూ వాటి సామాజిక, సాంస్కృతిక, చారిత్రక మూలాలను విశ్లేషిస్తూ మతం గురించి కొత్త ఆలోచనలను ప్రేరేపించే పుస్తకం అది. వివరిస్తూ, వ్యాఖ్యానిస్తూ, విశ్లేషిస్తూ మరొక పుస్తకమే రాయగలిగినంత, రాయవలసినంత విలువైన, విశాలమైన, లోతైన పుస్తకం అది. అఫ్సర్ ను ఇంతకాలం కవిగా, కథకుడిగా, పాత్రికేయుడిగా చూసినవాళ్లకు ఈ పుస్తకం అఫ్సర్ గురించి ఒక కొత్త తెలివిడిని ఇస్తుంది. అఫ్సర్ లోని నిశితమైన పరిశీలకుడినీ, నిష్ణాతుడైన విశ్లేషకుడినీ, అద్భుతమైన సామాజిక చరిత్రకారుడినీ పరిచయం చేస్తుంది. కవిగా, కథకుడిగా, పాత్రికేయుడిగా తాను ఇదివరకే సాధించిన వివరణాత్మక, వర్ణనాత్మక శైలినీ, విభిన్న పొరల ఆలోచనలు ప్రేరేపించగల శక్తినీ అన్వేషణకూ, ఆ అన్వేషణాసారాన్ని వ్యక్తీకరించడానికీ ఎలా వాడుకున్నాడో ఈ పుస్తకం చూపుతుంది.

‘ది ఫెస్టివల్ ఆఫ్ పీర్స్’ ఏకకాలంలో నన్ను ఎంతో రాయడానికీ పురికొల్పుతున్నది, అసలేమైనా రాయగలనా, ఎంత రాస్తే ఆ పుస్తకానికి తగిన న్యాయం చేయగలను అని భయపెడుతున్నది. ముఖ్యంగా కరడుగట్టిన మతోన్మాదం జడలు విప్పుతున్న నేపథ్యంలో, ఇతర భావాల పట్ల హంతక అసహనాన్ని ప్రదర్శిస్తున్న మత భావజాలాల, మతోన్మాదాల వాతావరణంలో ఈ పుస్తకం అవసరం గురించి చెప్పవలసినది చాల ఉంది. రాయలసీమలో ఒక మారుమూల గ్రామంలో తరతరాలుగా సాగుతున్న హిందూ ముస్లిం మత సామరస్యం (బహుశా మత సామరస్యం కూడ కాదేమో, మత అభేదం, మత సమ్మేళనం అనాలేమో) పునాదిగా మన బహుళత్వ సమాజానికి ఎత్తిపట్టిన దర్పణంగా ఈ పుస్తకానికి ఇవాళ చాల ప్రాసంగికత ఉంది. ఈ పుస్తకంలో ప్రతి వాక్యమూ, ప్రతి వాదనా, ప్రతి పుటా, ప్రతి అధ్యాయమూ నన్ను గత వర్తమానాల ఆశ్చర్య విషాదాల మధ్య ఊగిసలాడేలా చేశాయి.

పీర్ల పండుగ అనే ఒకానొక గ్రామీణ విశేషాన్ని ఆధారం చేసుకుని అనేక సంక్లిష్ట, సంకీర్ణ, బహుళత్వ ఆలోచనలనూ వాద ప్రతివాదాలనూ ముందుకు తెస్తూ, అంతకన్న లోతైన ఆలోచనలు సంఘర్షించేలా చేస్తూ సాగిన ఈ పుస్తకం గురించి రాసేముందు అసలు ఈ పీర్ల పండుగ గురించి నా అనుభవంతో ప్రారంభిస్తాను. తెలంగాణ అంతటా పీర్ల పండుగ వ్యాపించి ఉంది. నేను మా రాజారంలో ఉన్న నా పన్నెండో ఏటివరకూ ప్రతి ఏటా పీర్ల పండుగ చూశాను. ఇరవయో ఏట ఆ ఊరితో సంబంధం పూర్తిగా తెగిపోయింది గనుక ఆ తర్వాత పీర్లపండుగను పట్టణాల్లో, నగరాల్లో చూశాను గాని ఆ అనుభవాలు కాస్త భిన్నమైనవి. ఇక్కడ పూర్తిగా బాల్యానికి సంబంధించిన అనుభవాన్ని మాత్రమే పంచుకుంటాను. మా ఊళ్లో పీర్ల పండుగ ఊరందరి పండుగలాగే జరిగేది. ఊళ్లో ఉన్న పీర్ల కొట్టం నుంచి పీరీలను తీసి అలంకరించి, పది రోజులు గద్దె మీద ఉంచేవారు. పదోరోజున ఆ పీరీలను ఎత్తుకుని ఊరివాళ్లందరూ, ప్రధానంగా శూద్రకులాలు, దళితులు కూడ ఊరేగింపు చేసేవారు. ముందర మాదిగడప్పులు మోగుతుండేవి. ఆ పీరీల ఊరేగింపు ఊరంతా తిరిగేది. బ్రాహ్మల, కరణాల, రెడ్ల ఇళ్లు పెద్దవి గనుక వాళ్ల ఇళ్లముందూ, వాడల్లో అక్కడక్కడా ఆగేవి. ప్రతిచోటా ఇళ్లలోంచి ఇంటి పెద్దలు స్వయంగా కుండలతో, బిందెలతో నీళ్లు తెచ్చి పీరీలు ఎత్తుకున్నవాళ్ల కాళ్లమీద గుమ్మరించేవాళ్లు. ఆ పీరీల వెంటనడిచే వాళ్లు ఇచ్చే “విభూతి”ని తీసుకునేవాళ్లు. ఫతేహాలు చదువుతుంటే వినేవాళ్లు. అది “తురక దేవుడి” ఆరాధన అనీ, పీరీలు ముస్లింల ఆచారమనీ, అది ముహర్రం అనే ముస్లిం సంస్మరణ సందర్భమనీ, అందులో ముస్లిమేతరుల పాత్ర ఏమిటనీ ఆలోచనలు ఆ నైసర్గిక గ్రామీణ అవగాహనల్లో ఎంతమాత్రం ఉండేవి కావు. నిజానికి అప్పటికి మా ఊళ్లో ముస్లిం కుటుంబాలు మూడు నాలుగు కూడ లేవు. నాకు తెలిసినవి పోస్ట్ మాన్ లాల్ మియా, చిన్న చిల్లర దుకాణం నడుపుతుండిన అబ్బాస్ అలీ రెండు కుటుంబాలు మాత్రమే. అప్పటికి ఐదారువందల గడప ఉన్న ఊళ్లో నాలుగు కుటుంబాలంటే ఊరి జనాభాలో ఒక్క శాతం కూడ కాదు. కాని ఆ ఒక్కశాతం ప్రజల సంస్మరణ ఆచారం ఊరందరి ఆచారంగా జరిగేది. అదంతా నాలుగున్నర దశాబ్దాల వెనుకటి కథ. ఇప్పుడు మా ఊళ్లో కూడ పీర్ల పండుగ అంత బహుళత్వంతో అంత సామూహికంగా జరుగుతున్నదో లేదో తెలియదు.

కాని అనంతపురం జిల్లాలో గూగూడు అనే చిన్న గ్రామంలో ప్రతి ఏటా పీర్ల పండుగ మహోజ్వలంగా జరుగుతున్నది. ఆ ఊళ్లో ముస్లిం జనాభా స్వల్పమే. మొత్తం జనాభా దాదాపు మూడు వేలు కాగా, ముస్లింలు (దూదేకులు) రెండువందల లోపు. కాని ఆ ఊరు ఊరంతా ఆ పండుగను సొంతం చేసుకుంటున్నది. కనీసం మూడు లక్షల మంది హాజరయ్యే ఈ ఉత్సవం మత విభజనలను అధిగమించింది. ఒకానొక మత విశ్వాసపు మౌలిక అంశాల మీద నిర్మాణమైనప్పటికీ ఇతర మత విశ్వాసాలు కూడ కలగలిసినది. ఒక సామూహిక నైసర్గిక సంస్మరణ ఉత్సవం అది. ఆ ఉత్సవం నేపథ్యంగా ‘దక్షిణ భారతదేశంలో జనప్రియ ఇస్లాం – సాముదాయక భక్తి’ అనే విశాలమైన పరిశోధన, అన్వేషణ, వివరణ, విశ్లేషణ సాగించడానికి పూనుకున్న అఫ్సర్ తొమ్మిది నెలల పాటు ఆ గ్రామంలోనూ, సంబంధిత స్థలాల్లోనూ పరిశోధించి ఈ పుస్తకం రాశాడు.

ఈ పుస్తకంలో ఉపోద్ఘాతం, ముగింపు కాక ఐదు అధ్యాయాలున్నాయి. ‘గూగూడు: సాముదాయక భక్తి స్థలం ఆవిర్భావం’ అనే మొదటి అధ్యాయం గూగూడు ప్రాధాన్యత గురించీ, దాని ఆవిర్భావ వికాసాల గురించీ వివరిస్తుంది. ‘టోపీ పెట్టుకున్న పీర్: కుళ్లాయప్ప కథనం’ అనే రెండో అధ్యాయం గూగూడు ప్రాముఖ్యతలోకి రావడానికి మాలమైన కుళ్లాయప్ప అనే పీర్ గురించి ఉన్న కథనాలను వివరిస్తుంది. ‘కుళ్లాయప్ప – ముహర్రం బహిరంగ ఆచారాలు’ అనే నాలుగో అధ్యాయం పదమూడు పరిశుద్ధ దినాలలో రోజువారీ జరిగే కార్యక్రమాలను, ప్రత్యేకంగా ఏడో రోజు, పదో రోజు జరిగే ఆచారాలను వివరిస్తుంది. ‘ఫకీరి: తాత్కాలిక సన్యాస ఆచరణ’ అనే నాలుగో అధ్యాయం కుళ్లాయప్ప భక్తిలో భాగంగా ప్రజలు ఆచరించే ఫకీరి ఉపవాసదీక్ష గురించి వివరిస్తుంది. ‘ఆచారాల చర్చ: ‘శుద్ధ’ ఇస్లాం రాజకీయాలు’ అనే ఐదో అధ్యాయం సమకాలీన మతతత్వ విస్తరణ నేపథ్యంలో గూగూడు ముహర్రంను పోల్చి చూసి విశ్లేషిస్తుంది. దాదాపు ఇరవై పేజీల పాదసూచికలు, నాలుగు పేజీల అర్థ వివరణలు, ఏడెనిమిది పేజీల ఉపయుక్త గ్రంథ సూచి రచన ఎంత పకడ్బందీగా సాగిందో చూపుతాయి. అఫ్సర్ తన కవితల, కథల, సాహిత్య విమర్శ వ్యాసాల నిర్మాణంలో ఎటువంటి శ్రద్ధ చూపుతాడో ఈ రెండు వందల పేజీల రచనలో అంతకు మించిన శ్రద్ధ కనబరచాడు.

ఈ పుస్తకం గురించి చెప్పుకోవలసిన అనేక అంశాలలో ఒకటి, మన గ్రామసీమల్లో హిందూ ముస్లిం సంప్రదాయాలు, బహుశా అవి వేరువేరని కూడ తెలియనంతగా ఎంత గాఢంగా కలిసిపోయాయనేది. ఇవాళ మతోన్మాద రాజకీయాలు చూపుతున్నట్టుగా హిందూ, ముస్లిం అస్తిత్వాలు విభిన్నమైన, ఎదురుబొదురుగా నిలబడిన, నిత్య సంఘర్షణాయుతమైన, వైరి అస్తిత్వాలు అనే ఆలోచన దాదాపుగా లేని సమాజపు ఆచారవ్యవహారాల గురించి ఈ పుస్తకం వివరిస్తుంది. బహుశా భిన్న భావాల పట్ల సహజంగా ప్రజాస్వామిక సహనం పాటించే, ఆదాన ప్రదానాలతో సాగే, బహుళత్వ చిహ్నాలను ఆమోదించే గ్రామీణ సమాజ వివేకపు చిత్రణ ఇది. ఈ వివేకం భాషలో, భావనల్లో, ఆచారాల్లో అన్ని చోట్లా కనబడుతుంది.

అసలు కర్బలా యుద్ధంలో చనిపోయిన మహమ్మద్ ప్రవక్త మనుమల సంస్మరణలో రూపొందిన విషాద సంస్మరణ ఆచరణ ముహర్రం. దానికి షియా ముస్లింల వ్యాఖ్యానం, అది దక్షిణ భారతదేశంలోకి సూఫీల ద్వారా వచ్చిన తీరు, అది చివరికి ప్రధానంగా ముస్లిమేతర (హిందూ కాదు, హిందువులు అనడానికి కూడ వీలులేని అనేక సమూహాలు మన గ్రామసీమల్లో ఉన్నాయి) భాగస్వామ్యంతో, వారి కథలతో, వారి ఆచారవ్యవహారాలతో, వారి ఆదానప్రదానాలతో కలగలిసి ఒక అమాయక సామూహిక మత ఉత్సవంగా మారిందో అఫ్సర్ చాల వివరంగా, విశ్లేషణతో చూపుతాడు.

గూగూడులో ఉన్నది ప్రధానంగా ముస్లిం పీర్ ప్రార్థనాస్థలం. ఆ పీరు పేరు కుళ్లాయప్ప. కుళ్లాయి (తల మీది వస్త్రం – టోపీ) అనే పర్షియన్ మాటకూ అప్ప అనే రాయలసీమ మాటకూ మైత్రి కుదిరి కుళ్లాయి పెట్టుకున్న అప్పగా రూపాంతరం పొందింది. అలా ఆయన పీరు స్వామి అయ్యాడు. ఆయన స్థలం, ఆరాధనా స్థలం, ఆశ్రయం – పీర్, మకాన్ (ఇల్లు) అనే రెండు మాటలు కలిసి, మొదటి మాట అజంతంగా తెలుగీకరణ పొంది, మకానం అనే కొత్త మాట పుట్టుకొచ్చి పీరు మకానం అయింది. నిజంగా ప్రజల సృజనాత్మకత ఎంత విశిష్టమైనది! అలాగే ముస్లిం సంప్రదాయంలోంచి ఒక మాట ముస్లిమేతర, హిందూ సంప్రదాయంలోంచి మరొక మాట కలిసి గూగూడు పదజాలం చాల తయారయింది. జియారతు దర్శనం, ఫతేహా ప్రసాదం, ముజావరు పూజారి, దీన్ గోవిందా, షహర్ గస్తీ – సెరిగట్టి, ఎర్రదారం కట్టుకుని ఫకీరు దీక్షకు పూనుకోవడం, ఫకీరి ఉపవాసాలు, ముహర్రం జాతర, కందూరి సామూహిక భోజనాలు లాంటి ఎన్నో పదాలు పుట్టుకొచ్చాయి. చదివింపులు, ప్రదక్షిణలు, నిప్పుల గుండం నుంచి బూడిద తీసి నుదుటికి, వంటికి రాసుకోవడం, పీరు మకానంలో ఒక పక్కన ఉన్న ఆంజనేయుడి విగ్రహానికి కొబ్బరికాయలు కొట్టడం, కుంకుమ తీసుకోవడం, పొర్లు దండాలు, విశ్వరూపం, పీర్ ను అవతారం (రాముడి అవతారం)గా, విష్ణువు పదకొండో అవతారంగా భావించడం వంటి ఎన్నో ప్రధానంగా హిందూ లేదా అంతకు ముందరి ఆచారాలు ఈ పీరు ఆరాధనలో కలిసి పోయాయి. బలి ఇవ్వడానికి ముస్లిమేతరులు తెచ్చిన జంతువులను కూడ ముస్లింలు ఫతేహా చదివి బలి ఇచ్చినతర్వాతనే వండుకోవడం జరుగుతుంది. అనేక సందర్భాలలో అది ఇస్లాం ఆచారమా, హిందూ ఆచారమా, హిందుత్వతో సంబంధంలేని శూద్ర కులాల ఆచారమా చెప్పలేని స్థితి ఉంటుంది. నియ్యా అనే అరబిక్ మాట నియ్యతు (పరిశుద్ధ సంకల్పం) గా మారడం, బర్కత్  (దైవ ప్రసాదం) అనే మాట బర్కతుగా మారడం సరే సరి. ప్రతి ఏటా గూగూడు ముహర్రం ఉత్సవాలు (వాటిని బ్రహ్మోత్సవాలు అనడం కూడ మొదలైంది!) చూడడానికి రావడం తీర్థయాత్రలాగ భావించేవాళ్లూ, పేదవారి హజ్ యాత్రగా భావించేవాళ్లూ కూడ ఉన్నారు. ఇతర చోట్ల ముహర్రం గాథలనుంచి గ్రహించి మార్చుకున్నవీ, సొంతంగా తయారు చేసుకున్నవీ ఎన్నో గూగూడు కథలు, గాథలు, సంగీతం, పాటలు, నమ్మకాలు పుట్టుకొచ్చాయి.

గూగూడుకు దానిదైన ఒక ప్రత్యేక స్థల పురాణం కూడ ఉంది. అది దండకారణ్యలో భాగమైన ప్రాంతమని, అది సీతారామలక్ష్మణులకు ఆతిథ్యం ఇచ్చిన గుహుడి గూడు అని ఒక కథనం. కాలక్రమంలో అది చంద్రాయణపేట అయింది. ఆ గ్రామం ఏ కారణం వల్లనో దగ్ధమైపోయింది. ఆ గ్రామదహనం, కొత్త గ్రామ పునర్నిర్మాణం బహుశా మారుతున్న నాగరికతలకు, పాత గ్రామాలు విధ్వంసమై కొత్త గ్రామాలు రూపొందడానికి ప్రతీకలు కావచ్చు. పాత గ్రామంలో పోషణ లేని చెన్నకేశవస్వామి ఆలయం ఇంకా ఉంది. ఆ దగ్ధమవుతున్న గ్రామం నుంచి బైటపడడానికి చేసిన ప్రయత్నమే తరతరాల సంచిత జ్ఞాపకంలో నిప్పుల గుండం మీద నడకగా మారి ఉండవచ్చు. అక్కడి నుంచి జనాన్ని కుళ్లాయప్పే ఇక్కడికి తీసుకువచ్చి తన మకానం చుట్టూ కొత్త ఊరు ఏర్పరచాడు. కుళ్లాయప్ప వాస్తవానికి ముస్లింల పవిత్ర ప్రతీక అయిన పంజా. పాత గ్రామం తగులబడిపోయినప్పుడు కంసాలులు బావిలో పడేసిన ఆ ప్రతీకను కొండన్న అనే వ్యక్తి తీసుకువచ్చి పీరు మకానంలో స్థాపించాడు. ఇప్పటికీ కొండన్న వారసులే ఈ ఉత్సవంలో ప్రధానభాగం వహిస్తారు. ఇది చదువుతున్నప్పుడు నాకు బుద్ధుడు మొట్టమొదట తన బోధనలను వినిపించిన ఐదుగురు శిష్యులలోని కొండన్న గుర్తుకు వచ్చాడు. ఒక విశ్వాసం నుంచి మరొక విశ్వాసానికి మారడానికి, లేదా రెండు విశ్వాసాల సమ్మేళనానికి కొండన్న ప్రతీక కావచ్చునా?

ఈ క్రమంలో గూగూడు ప్రాదేశిక సరిహద్దులు, గూగూడు భూగోళం కూడ కొత్త అర్థాలు సంతరించుకున్నాయి. కొత్త వ్యాఖ్యానాలు పొందాయి. “పీరు రాకముందు ఇదంతా దట్టమైన అరణ్యం. పీరు రాకతోనే ఇది సంపన్నమైంది” అంటాడు హుస్సేనప్ప. కర్బలా యుద్ధం వాస్తవంగా ఇవాళ్టి ఇరాన్ లో జరగలేదని, గూగూడు సరిహద్దులలోనే జరిగిందని, అందులో ప్రవక్త మనుమలతో పాటు కుళ్లాయప్ప కూడ పోరాడి అమరుడయ్యాడని, కర్బలా అమరులు హసన్, హుసేన్ లు కుళ్లాయప్ప తమ్ములని ప్రజల విశ్వాసం. అలాగే వాస్తవ కర్బలా గాథలో హసన్, హుస్సేన్ లను చంపిన యాజిద్, గూగూడు గాథలో మొఘల్ చక్రవర్తికి సామంతుడైన స్థానికుడిగా మారిపోతాడు. మొఘల్ చక్రవర్తి కుళ్లాయప్పతో సహా తొమ్మిదిమంది పీర్లను నిర్బంధించడానికి ప్రయత్నించినప్పుడు వారందరూ ఆ పోరాటంలో చనిపోయారని స్థానిక కథనం చెపుతుంది. నిజానికి కథనం అని ఏకవచనంలో చెప్పడం కూడ సరికాదు. పునాదిగా ఒక మౌలికాంశం ఉండవచ్చు గాని దాని మీద లేచి నిలిచిన అనేక కథనాలున్నాయి. కులం, లింగం, ప్రాంతం, సాన్నిహిత్యం, ఆరాధనాపద్ధతి, సామాజిక సాంస్కృతిక రాజకీయ అంశాలు ఆ కథనాలకు కొత్త కోణాలను కలుపుతున్నాయి. ఏకీకృత, శిలాసదృశ, సార్వజనిక మత విశ్వాసం గురించి ఇవాళ మాట్లాడుతున్నవాళ్లు గూగూడు సూక్ష్మ ఉదాహరణ నుంచి పరిశీలిస్తే భారత సమాజంలో మతవిశ్వాసాల బహుళత్వాన్ని అర్థం చేసుకునే అవకాశం వస్తుంది.

pirsఅసలు కుళ్లాయప్ప “ఆరాధన”లో కొంత అధిభౌతిక శక్తి ఆరాధన, కొంత హేతురహితమైన విశ్వాసం కూడ ఉండవచ్చుగాని అంతకన్న ముఖ్యంగా అది ఒక గ్రామీణ సమాజ సామూహికతా చిహ్నం. అది వ్యవస్థీకృతం కానంతవరకు అమాయకంగా, బహుళత్వంతో, ప్రజాస్వామికంగా కూడ ఉన్నది. మత విశ్వాసం వల్ల గూగూడు జన్నత్ కా దర్వాజా (స్వర్గ ద్వారం) అని ముస్లింలు భావించవచ్చు, వైకుంఠం అని ముస్లిమేతరులు భావించవచ్చు. కాని గూగూడు నుంచి నలబై ఐదు సంవత్సరాల కింద కర్నాటకకు వలస వెళ్లిపోయి, ప్రతి సంవత్సరం ముహర్రంకు మళ్లీ గూగూడుకు వచ్చే మదార్ సాహెబ్ మాటల్లో, “కుళ్లాయప్ప గాని, ముహర్రం గాని లేకపోతే మేం ఒకరిని ఒకరం కలుసుకోవడానికి, సంబంధంలో ఉండడానికి అవకాశమే దొరకదు” అన్నట్టు ఇది సామూహిక కలయిక వేడుక.  ఈ సామూహికతలో హిందూ బ్రాహ్మణీయ మత కార్యక్రమాలకు భిన్నంగా శూద్ర, దళిత, మహిళా భాగస్వామ్యానికి అవకాశం ఉంది. విభిన్న కులాల వ్యక్తులు, ముస్లింలు, మహిళలు, ఉత్సవాల సందర్భంగా వచ్చే భక్తులు, చిరు వ్యాపారస్తులు, ఇతర ప్రాంతాలలో ఉన్న కుళ్లాయప్ప భక్తులు వంటి ఎంతో మంది అభిప్రాయాలు ఈ సంకీర్ణతను వివరిస్తాయి.

అట్లని ఇది మత రహితమైన, అంధవిశ్వాస రహితమైన సామాజిక ఉత్సవం మాత్రమే అనడానికీ వీలులేదు. ఇక్కడ మహత్యాలున్నాయి. నాదస్వర వాద్యాలున్నాయి. స్వర్గపు ఆలోచనలు, పునర్జన్మ ఆలోచనలు ఉన్నాయి. ఈ గ్రామంలోనే, అసలు పీరు మకానంలోనే ఆంజనేయ విగ్రహం ఉంది. పక్కనే పెద్దమ్మ ఆరాధన ఉంది. పొరుగున పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానం బోధించిన కొండ ఉంది. హిందూ బ్రాహ్మణీయ మడి – వెలికి సమానమైన నిరంకుశత్వంతో కాకపోయినా పవిత్రత – అపవిత్రత ఆలోచనలున్నాయి. ఆ ఆలోచనలకు సమాంతరంగానే శూద్రకులాల సమైక్యత ఉంది.  అందువల్ల, ఈ ముహర్రంలో ప్రవక్త, అమరులైన ప్రవక్త కుటుంబసభ్యులు, ఖురాన్ ఫతేహా, జియారత్, నియ్యత్, బర్కత్ వంటి భావనలు ఉన్నప్పటికీ దీన్ని పూర్తిగా ముస్లిం ఉత్సవంగా చెప్పడానికీ వీలులేదు.

అసలు పీర్ల పండుగ అనడమే ముస్లిం మౌలిక ఆచారానికి భిన్నమైనది. పీర్లు కర్బలా యుద్ధంలో మరణించిన హసన్, హుసేన్ ల ప్రతిరూపాలు. విగ్రహారాధనను వ్యతిరేకించే ఇస్లాంలో ఆ మృతవీరుల చిహ్నాలను స్మరించడం, ఆరాధించడం కూడ “అనాచారాలే”. అలాగే మరణాన్ని సూచించే రోజును పండగగా జరపడం మరొక “అనాచారం.” కాని వాటిని అనాచారాలు అనడం కూడ ప్రామాణికత వైపు నుంచి, ఛాందస ఆచారాల వైపు నుంచి, ఆచారాలలో మార్పులేనితనం వైపు నుంచి చూసినప్పుడే గాని, మత విశ్వాసాలూ, ఆలోచనలూ, ఆచారాలూ ప్రజల నిత్యజీవిత వ్యవహారంలో, సంబంధాలలో, ఆచరణలో రూపొంది తలెత్తి లేచి నిలుస్తాయని, నిత్యం మార్పులకు లోనవుతాయని కూడ గుర్తించవలసి ఉంది.

“హిందువులు లేరు, ముస్లింలు లేరు. అందరిదీ ఒకటే మతం. దానిపేరు కుళ్లాయప్ప భక్తి” అని సత్తార్ సాహెబ్ అన్నమాట ఇవాళ్టి వివాదాల నేపథ్యంలో మతాన్ని కొత్తగా అర్థం చేసుకోవలసిన అవసరాన్ని సూచిస్తున్నది. అలాగే గూగూడులో ఈ పీర్ల పండుగ, ముహర్రం జరిపే పద్ధతి కూడ ఇతర ప్రాంతాలకూ, హైదరాబాద్ కూ భిన్నంగా ఉన్నదని సత్తార్ సాహెబ్ ఎత్తి చూపుతాడు. హైదరాబాద్ లో మాతం పేరుతో కొరడాలతో, ముళ్ల గొలుసులతో శరీరాల మీద కొట్టుకుంటూ నెత్తురు కార్చే ఆధారం ఉంది. గూగూడు నిప్పుల గుండంలో నడక దాని స్థానంలోనే వచ్చి ఉండవచ్చు.

ఈ మొత్తంలో కనబడేది స్థానిక ఆరాధనా పద్ధతులు, ఆచారాలు పెద్ద ఎత్తున సంలీనం కావడం, ప్రతి ఆచారమూ పునర్నిర్వచనానికి, భిన్నమైన ఆచరణకు గురికావడం. మొత్తం మీద కుళ్లాయప్పకు ఉన్న అనేక వ్యాఖ్యానాలలో, అర్థాలలో గ్రామదేవత, ముస్లిం ఆరాధనా చిహ్నం, కుల దైవం, అమరుడైన మహాత్ముడు అనే నాలుగు ప్రధాన అర్థాలున్నాయి. ఈ నాలుగు భిన్న నిర్వచనాలకు భిన్నమైన సామాజిక, రాజకీయార్థిక, సాంస్కృతిక, చారిత్రక మూలాలున్నాయి.

ఇవాళ్టి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక వాతావరణంలో హిందూత్వవాదులు చెపుతున్నట్టు ఇస్లాం అనేది పరాయి నేల నుంచి వచ్చిన దురాక్రమణ మత విశ్వాసమే అయితే అది ఒక స్థానిక బహిరంగా ప్రజాస్థలంలో ఎటువంటి పరివర్తన పొందిందో, ఎంతగా స్థానికతతో మమేకమైందో, ఎంతగా స్థానికమైందో అనే ఆసక్తిదాయకమైన చర్చకు గూగూడు పరిశీలన వీలు కల్పిస్తుంది. అయితే సమస్య కేవలం హిందూత్వ వాదుల ‘వాతాపిజీర్ణం’ వాదానిదో, గుత్తాధిపత్యానిదో మాత్రమే కాదు. గూగూడు మార్పు చేర్పులను ఇస్లాం కూడ సమాదరించడం లేదు. అసలు వ్యవస్థీకృత మతాలకు ప్రజల అవ్యవస్థీకృత, ప్రజాస్వామిక, నైసర్గిక ఉమ్మడి మత జీవనం గిట్టదు.

ఈసందర్భంగానే కుల విభజనలు లేని, సార్వజనిక సోదరత్వాన్ని ప్రతిపాదించే ఇస్లాం, కుల విభజనల, అంతరాల హిందూ సమాజంలో ప్రవేశించినప్పుడు ఎలా మారుతుంది, దేన్ని మారుస్తుంది, ఏ కొత్త రూపాలను సంతరించుకుంటుంది అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు అఫ్సర్ విశ్లేషణలు దారితీస్తాయి. తాత్విక పరిభాషలో చెప్పాలంటే సాధారణత్వానికీ ప్రత్యేకతకూ, సార్వజనీనతకూ నిర్దిష్టతకూ మధ్య ఐక్యత, ఘర్షణలు ఎలా ఉంటాయో విస్తృత చర్చ చేయడానికి నమూనాగా నిలుస్తుంది గూగూడు గాథ.

ఇక్కడ అఫ్సర్ స్థానిక ఇస్లాం, స్థానికీకృత ఇస్లాం అనే విశ్లేషణా పరికరాలతో ఈ సమస్యను అర్థం చేయించే ప్రయత్నం చేస్తాడు. ‘స్థానిక ఇస్లాం’ గురించి గతంలోనే కొందరు పరిశోధకులు చర్చించి ఉన్నప్పటికీ గూగూడు దృశ్యం మరింత సంక్లిష్టమైనదనీ, దాన్ని అర్థం చేసుకోవాలంటే ఎన్నో సూక్ష్మాంశాలను, మరెన్నో పొరలను విప్పిచూసే పరిశోధనాపద్ధతి అనుసరించాలని అఫ్సర్ అంటాడు. స్థానిక ఇస్లాం అనేది గూగూడు లాగ అనేక మత విశ్వాసాల సమ్మేళనం కాగా, ‘స్థానికీకృత ఇస్లాం’ విశ్వవ్యాప్త, ఏకశిలా సదృశ మత విశ్వాసాన్ని మాత్రమే అస్లీ ఇస్లాంగా అభివర్ణిస్తుంది. దాన్నే గీటురాయిగా పెట్టుకుని స్థానిక ఆచారాలను పరిశీలిస్తుంది. అందువల్ల సహజంగానే గూగూడు ‘స్థానికీకృత ఇస్లాం’కు విమర్శనీయ ఉదాహరణగా కనబడుతుంది. గూగూడు ముహర్రం విశ్వాసాలను సంస్కరించవలసి ఉందని అన్నవారిని కూడ అఫ్సర్ ఉటంకించాడు. దేవుడు ఒక్కడే, మరెవరినీ దేవుడితో సమానం చేయగూడదు అని భావించే ఇస్లాం కుళ్లాయప్ప స్థానాన్ని ప్రశ్నిస్తున్నదని అఫ్సర్ చూపాడు. చివరికి కుళ్లాయప్ప పేరు మీద ప్రచారంలో ఉన్న మహిమలను విమర్శిస్తూ, ఆ విమర్శకు హేతుబద్ధతను తోడు తెచ్చుకున్న ఒక మతాధిపతిని కూడ అఫ్సర్ ఉటంకించాడు. ఈ అస్లీ ఇస్లాం ప్రభావం యువతరం మీద ఎక్కువగానే ఉన్నదని, అందుకు ఇస్లామిక్ గ్రంథాలు స్థానిక భాషల్లో విరివిగా వెలువడడం కూడ దోహదం చేస్తున్నదనీ వివరంగా చర్చించి, ఈ ఆలోచనలు ముందుకుసాగితే, గూగూడు ముహర్రం ఉత్సవాలలో ముస్లింల పాత్రకు ఏమవుతుంది అని కూడ ఆలోచనలు చేస్తాడు.

చిట్టచివరిగా, ముగింపులో భారత సమాజం వంటి మత బాహుళ్య సమాజాలలో ఎటువంటి సమన్వయ, సర్వాంగీణ, సమ్యగ్ దృక్పథం ఉండాలో చర్చించే ప్రాతిపదికను సూచించడానికా అన్నట్టు గురజాడ వంద సంవత్సరాల వెనుక రాసిన ‘దేవుడు చేసిన మనుషుల్లారా! మనుషులు చేసిన దేవుళ్లారా! మీ పేరేమిటి?’ లో పీర్ల ప్రస్తావనతో వచ్చిన చర్చను ప్రస్తావిస్తాడు. వంద సంవత్సరాల తర్వాత నిసార్ రాసిన ‘ముల్కీ’ కథను ప్రస్తావించి సమకాలీన సమస్యలనూ సూచిస్తాడు.

మొత్తానికి ఈ పుస్తకం చదవడం ఒక గొప్ప అనుభవం. తరతరాల సామూహిక జ్ఞాపకం ఒక సమకాలీన బహుళత్వ ఉత్సవంగా మారి ఏకీకరణ, గుత్తాధిపత్య ఆలోచనలకు ఎదురుగా ఎలా నిలుస్తున్నదో ఒక సజీవ ఉదాహరణనుంచి చూపడమే ఈ పుస్తకపు విశిష్టత.

*

available at: http://www.amazon.in/Festival-Pirs-Popular-Shared-Devotion/dp/0199997594/ref=sr_1_1?s=books&ie=UTF8&qid=1457107819&sr=1-1&keywords=afsar%20mohammad

http://www.flipkart.com/festival-pirs-english/p/itmdhsyu8e4cknhg?pid=9780199997596&ref=L%3A2859794214406078613&srno=p_1&query=afsar%20mohammad&otracker=from-search

సృజన, అనువాదం బొమ్మా బొరుసూ: నలిమెల

 

బహుభాషా వేత్త, ఆదర్శ అధ్యాపకుడు, కవి, రచయిత, అనువాదకుడు, తెలంగాణ పదకోశ రూపకర్త  నలిమెల భాస్కర్ తెలంగాణ లోని కరీంనగర్ జిల్లాకు చెందిన వారు.     పద్నాలుగు భారతీయ భాషల నుండి తెలుగులోకి, తెలుగు నుండి ద్రావిడ భాషల్లోకి అనువాదాలు చేసిన వారు. మలయాళంలో పునత్తిల్ కుంజ్ అబ్దుల్లా రాసిన ‘స్మారక   శిలగల్’ నవల తెలుగులోనికి అనువాదం చేసినందుకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ       అవార్డును అందుకున్నారు.  బహుముఖీన మైన వారి ప్రతిభను కృషిని తెలుసుకోవడంలో       భాగంగా భాషారంగానికి పరిమితమవుతూ ఈ ముఖాముఖి బూర్ల వేంకటేశ్వర్లు మన        ముందుంచారు.

 

@  నమస్తే! ఉద్యోగమూ, సృజనా, వ్యక్తిగత జీవితమూ చక్కబెట్టుకుంటూ ఇన్ని  భాషలు నేర్వడంలో ఎట్లా సఫలీకృతులైనారు?

  • ఉద్యోగము చేయక తప్పని సరి పరిస్థితి, చేస్తే తప్ప వెళ్ళని స్థితి, కాకుంటే నిబద్ధతతో, నిజాయితీగా చేయడానికి మా తండ్రి రామచంద్రం స్ఫూర్తి. ఇక సృజన అంటారా! అది శ్వాసతో సమానం. ఐతే, అనువాదాలు ఆరంభమయ్యాక సృజన తగ్గింది. మా తరం అంతా ఆదర్శాల తరం. ఎటు చూసినా ఉద్యమాలు, పోరాటాలు. పొతే… భాషల అధ్యయనం గురించి నేను టీచర్ గా పనిచేసిన ఊరికి కనీసం పేపర్ రాదు. ఆ ఊళ్ళో గ్రంథాలయమూ లేదు. అక్కడ ఐదేండ్లు పని చేయాల్సి వచ్చింది. నాకు తొమ్మిదవ తరగతి నుండి పుస్తక పఠనం తప్ప మరే అలవాటు లేదు. ఏం చేయను. ముప్పై రోజుల్లో కన్నడ భాష పుస్తకం కంట బడింది. నేను దాని వెంట పడ్డాను. తర్వాత తమిళం వంతు అయ్యింది. ఐతే, భాషలు నేర్చుకోవడం అనేది ఒక అధ్బుతమైన క్రీడలాంటిది. గణితంలో కఠిన మైన లెక్కలు చేయడం లాంటిది. పైగా, అనేక భాషలను ఏక కాలంలో తులనాత్మకంగా నేర్చుకోవడం ద్వారా సులభమైంది. కొంత విలక్షణంగా పని చేయడం అనేది మొదటి నుండి నా స్వభావంలో ఉంది.

@ జాతీయ భాష, త్రిభాషా సూత్రం ఏమేరకు సాధించినై , భాష వలన ఇది సాధ్యమౌతుందా?

  • ఇది అకాడెమిక్ ప్రశ్న! జాతీయ భాష హిందీ ద్వారా దేశ సమైక్యతను కాపాడాలన్న సంకల్పం మంచిదే! కానీ, ఇది వికటించింది. హిందీ ఆధిపత్య భావజాలం దక్షిణాది మీద ముఖ్యంగా తమిళం మీద రుద్దబడింది అన్న అభిప్రాయలు ప్రచలితం అయినవి. ఇక, త్రిభాషా సూత్రం కూడా దాదాపు దక్షిణాది రాష్ట్రాలకే పరిమితమైంది. జాతీయ సమైక్యత బలపడాలంటే ఉత్తరాది వాళ్ళు సైతం దక్షిణ దేశ భాషలలోని ఏ ఒక్కటైనా చదవాలి కదా! కానీ, అలా జరగడం లేదు. జాతీయ భాష హిందీతో పాటు ఆంగ్లాన్ని చదువుకొని ఉత్తరాది వారు ద్విభాషా సూత్రానికే పరిమితమవుతున్నారు.

భాష వల్ల జాతీయ సమైక్యత అనేది కొంత మేరకే సాధించ గలమనేది నా వ్యక్తిగత    అభిప్రాయం. అపారమైన దేశభక్తే ఈ దేశ సమైక్యతను, సమగ్రతను నిలబెట్టగలదు.

@ జ్ఞానార్జనలో, సృజనలో, భావ వ్యక్తీకరణలో మాతృభాషకు మరో భాష ప్రత్యామ్నాయం  కాగలుగుతుందా, అంతర్జాతీయ భాష ప్రభావం ఇతర భాషల మీద ఎలాంటి ప్రభావాన్ని    చూపుతున్నది?

  • దేనిలోనూ మాతృభాషకు మరో భాష ప్రత్యామ్నాయం కాదు. అది తల్లి వంటిది. మాతృమూర్తికి బదులుగా మరొకరు ఆ స్థానాన్ని పొందగలరా, లేదు. తల్లిభాష సహజమైనది, సులభమైనది, శాస్త్రీయమైనది. అతి తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని సముపార్జించే సాధనం తల్లి భాష. వ్యక్తి సమగ్ర వికాసానికి, మూర్తిమత్వ వృద్ధికి మూలకారణం భాష. అది, మాతృభాష ద్వారా జరిగినప్పుడు అనేక సత్పలితాలు చూడగలం.

అంతర్జాతీయ భాష ప్రభావం ఇతర భాషల మీద బాగా పనిచేస్తున్నది. ఎంత  కాదన్నా… శాస్త్ర సాంకేతిక సమాచారమంతా ఆంగ్లంలో ఉండిపోయింది. జ్ఞాన     సముపార్జనకు ఆంగ్లాన్ని వాడుకోవాల్సిందే. ఐతే, ఆ క్రమంలోనే మాతృభాషను మరింత సుసంపన్నం చేసుకోవాలి. విరివిగా అనువాదాలు జరగాలి. ఆంగ్లంలో ఉన్నఅపారమైన ఆయా శాస్త్రాల జ్ఞానాన్ని ఇతర         భాషల్లోకి తెచ్చుకోవాలి. అట్లు జరగక      పోగా రాను రాను ఆంగ్ల భాష ప్రభావం వల్ల ఇతర భాషలు కనుమరుగయ్యే ప్రమాదం   ఏర్పడుతున్నది. మాతృభాష తన మూలాలు కాపాడుకుంటూనే అంతర్జాతీయ భాష వల్ల  ప్రభావితమైతే ఏ రకమైన ఇబ్బంది రాదు.

@ బహుభాషలు నేర్చుకున్న మీరు తెలంగాణ పదకోశం గల కారణాలు ఏమున్నాయి?

  • సాహిత్యంలో నిర్దిష్టత ప్రవేశించాక స్థానికత ప్రబలమయ్యాక, అస్తిత్వ ఉద్యమాలు బాగా ప్రచలితం అయ్యాక మన చరిత్ర, భాష, సంస్కృతి పట్ల సోయి పెరిగింది. తెలంగాణ మలిదశ పోరాట సందర్భంలో తెలంగాణ రచయితల వేదిక ఆవిర్భావం జరిగింది. ఆ వేదిక నన్ను నేను తవ్వి పోసుకోవడానికి కారణమైంది. ఆంధ్రా ఆధిపత్య వాదులు తెలంగాణ తెలుగుకు వెక్కిరించడం వల్ల అది తెలంగాణ ఆత్మకు శరాఘాతమైంది. తెలంగాణ ఆత్మ మేల్కొంది. కొందరు ఆ భాషలో కైతలు రాశారు. మరికొందరు కథల్ని పండించారు. నేనేమో పదకోశం వేశాను.

@ తెలంగాణ రాష్ట్రంలో భాషకు ఇస్తున్న ప్రాధాన్యత ఎలా ఉన్నది?

  • మన రాష్ట్రంలో కూడా ఇప్పటికీ శిష్ట వ్యావహారిక భాషనే వాడడం ఒకింత విచారాన్ని కలిగిస్తున్నది. పాఠశాల స్థాయిలో ఒకటి నుండి పదవ తరగతి వరకు తెలుగు వాచకాలు మారాయి. వీటిల్లో ఎనభై శాతం తెలంగాణ వాళ్ళవే ఉండడం ఆనందాన్ని కల్గించే  అంశం. అయితే, ప్ప్ర్వపు భాషే ఉన్నది. తెలంగాణ తెలుగులో వాచకాలు లేవు. ఒక ప్రామాణిక భాష ఏర్పడ లేదు. ఏదో ఒక స్థాయిలో ఎంతో కొంత మేరకైనా తెలంగాణ తెలుగును బోధనా భాషగా చేసుకోకపోతే బోలెడు నష్టం జరిగిపోతుంది. కేవలం బోధనా భాషగానే కాక, అధికార భాషగానూ, పత్రికా భాష గానూ, సినిమా భాషగానూ తెలంగాణ తెలుగు నిలదొక్కుకోవలసిన అవసరాన్ని ప్రభుత్వం తక్షణమే గుర్తించాలి. ఒక సమగ్ర నిఘంటు నిర్మాణం జరగాలి. తెలంగాణ తెలుగులో రాస్తున్న రచయితల్ని ప్రోత్సహించాలి. పాల్కురికి, పోతన వంటి కవుల పద ప్రయోగ సూచికలు రావాలి. భాషకు ఒక మంత్రిత్వ శాఖ ఉండాలి.

@ సృజనలో భాష నిర్వహించే పాత్ర గురించి చెబుతారా?

  • సృజనలో భాష ఒక అంగం. పైగా ముఖ్యమైన అనుఘటకం. రచనకు అది ఒక కవితైనా, కథైనా, నవలైనా మరేదైనా వస్తువు చాలా ముఖ్యమైన అంశం. ఐతే, ఆ వస్తువు ఎంత ఉదాత్తమైనది ఐనా, ఎంత ఉన్నతమైనది అయినా ఏ భాషలో చెబుతున్నామనేది ఎంతో ముఖ్యమైన విషయం. నన్నయ తన భారతాన్ని తెలుగులో కాక సంస్కృతంలోనే అతనికి అంత ప్రశస్తి వచ్చి ఉండేది కాదేమో! పాల్కురికి సోమన దేశీ కవితా మార్గంలో బసవ పురాణాన్ని తీర్చిదిద్దడం వల్లే దేశి కవితా మార్గానికి ఆది పురాణమైంది. వేమన అలతి అలతి పదాలతో ఆటవెలదులు రాసినందువల్లనే అతని పద్యాలు ఈనాటికీ అందరి నోళ్ళలో నానుతున్నాయి. సృజనలో ఉన్న అంతస్సత్త అంతా భాష అనే మాధ్యమం ద్వారానే పాఠకుణ్ణి చేరుతుంది. అది మాతృభాష కాకున్నా, ప్రజల భాష కాకున్నా రచనలకు అంత ప్రాధాన్యత ఉండదు.

@ ప్రాచీన భాష తెలుగు అభిమాన భాషగా ఎదగక పోవడానికి ఆటంకాలు ఏమున్నాయంటారు?

  • మాతృభాష పట్ల మన ప్రభుత్వాలకు ఉన్న అభిమాన రాహిత్యమే ప్రధాన ఆటంకం. తమిళనాడులో ప్రజల కన్న మిన్నగా పాలకులకే భాషాభిమానం ఉంటుంది. కర్ణాటకలో సైతం కన్నడ భాషాభిమానం మెండు. తెలుగు వాళ్లకి తెలుగు పట్ల ఒక తేలిక భావం. పొరుగింటి పుల్లకూర రుచి వీళ్ళకి. ముఖ్యంగా ఈ విషయంలో ప్రభుత్వాల్లో కదలిక రావాలి, చిత్తశుద్ధి కావాలి. మొక్కుబడి కార్యక్రమాలు సత్ఫలితాలను ఇవ్వవు.

@ అనువాదాల గురించి మీ అభిప్రాయమేమిటి?

* అనువాదం అనేది పొరుగు వాడి గురించి తెలుసుకోవడం వంటిది. ఇతరులగురించి అవగాహన ఉన్నప్పుడే వాళ్ళకన్నా మనం ఎంత ముందున్నాం లేదా వెనుకబడినాం అనేది తెలిసి వస్తుంది. ఎప్పటికప్పుడు ఇతరులను పోల్చుకుని పోటీపడే స్వభావం పెరుగుతుంది. సృజన, అనువాదం ఇవి రెండు పరస్పర పరిపూరకాలు. ఇందులో ఏది లోపించినా మన జ్ఞానం అసంపూర్ణం. అనువాదాలు లేకపోతే ఇతర భాషల సాహిత్యం లేదు. ప్రపంచ సాహిత్యం లేదు. శాస్త్ర సాంకేతిక జ్ఞానం శూన్యం. హృదయ వైశాల్యానికి, దృష్టి నైశిత్యానికి, వ్యక్తి వికాసానికి అనువాదం ఒక ముఖ్యమైన మెట్టు.

*

       రన్ రాజా రన్!

 

                                                  -బమ్మిడి జగదీశ్వరరావు

 

bammidi ఓయ్ హైదరాబాదీ..

నువ్వు అస్కాలో వున్నా బాధలేదు గానీ.. హైదరాబాదులో వున్నావు.. కురుక్షేత్రంలో వున్నట్టే! ఆమాటకొస్తే కురుక్షేత్రం జరిగింది పద్దెనిమిది రోజులే! హైదరాబాదులో వున్నోళ్ళకి నిత్యమూ నిరంతరమూ  కురుక్షేత్ర రణరంగమే! యమగండమే!

ఇక్కడ ‘నా దారి రహదారి’ అని రజనీకాంత్ కూడా అనలేడు! పవన్ కళ్యాణ్ కూడా ట్రెండ్ సెట్ చెయ్యగలడేమో గాని ట్రాఫిక్ సెట్ చెయ్యలేడు!

ఓరే.. నిన్నుగన్న తల్లికి వేయి దండాలు.. ఆ హైదరాబాదు రోడ్లమీద యెప్పుడూ రొండు కాళ్ళు యెడంగా పెట్టి నిలబడకు నాయనా.. నీకాళ్ళ సందున సందు చిక్కిందని ఆటోవాళ్ళు దూరిపోయి వెళ్ళిపోతారు! ఆ తరువాత అర్రంటే కాదు.. బుర్రంటే రాదు!

ఫుట్పాత్ మీద నడుస్తాను, నాకేంటి? అనుకోకు.. మన వూళ్ళోలాగ కాదు, ఫుట్పాత్ మీద టూ వీలర్లు నడుపుతారు! ఏమాటకామాట చెప్పుకోవాలి భలే ఫీట్స్ చేస్తారులే! జెమునాస్టిక్స్ టిక్కెట్టు లేకుండా చూడొచ్చు! వాళ్ళయినా యేo చేస్తారు? రోడ్లు ఖాళీ లేవు! వాళ్ళకి మరో దారిలేదు! టైము అంతకన్నాలేదు! ఫుట్పాత్ల మీద ఖాళీ యెక్కడుందీ అంటావా? ఉన్నంత వరకూ వున్నమాట చెపుతున్నా! ఆ తరువాత అర్రంటే కాదు.. బుర్రంటే రాదు!

రోడ్డు దాటేటప్పుడు వన్ వే కదా అని వొక వైపే చూస్తూ దాటేవు.. ‘చూడు.. వొక వైపే చూడు.. రెండోవైపు చూడాలనుకోకు’ అని నందమూరి బాలకృష్ణ చెప్పాడు కదా అని రెండోవైపు చూడకుండా వుండేవు.. ఎట్నుంచి యెవడొస్తాడో ఆ బ్రహ్మదేవుడికి కూడా తెలీదు! అంచేత అటూ యిటూ చూసి వాయువేగంతో రోడ్డు దాటాలి! ఆయువుంటే అవతలికి చేరిపోతావు! లేదంటే నీ పూర్వీకులని చేరిపోతావు!

బస్సు యెక్కడం చేతకావడం లేదని అన్నావు. అదేమీ బ్రహ్మవిద్య కాదు. జనం మధ్యలోకి దూరితే వాళ్ళే నిన్ను బస్సులోకి తోసేస్తారు! దిగాలనుకుంటే కూడా అంతే.. డోరు దగ్గరకు రావడం నీవంతు! మిగతా తంతు మిగతా ప్రయాణీకులు చూసుకుంటారు! కొద్దిగ ఆసుకొని కాసుకోగలిగితే వాళ్ళే తోసేస్తారు! కాకపోతే మధ్యలో సన్నికల్లు తొక్కినట్టు కాళ్ళు తొక్కుతారు! నొప్పి పడకుండా వుండాలంటే పెళ్లి రోజుల్ని తలచుకో! తీయగా అనిపిస్తాది.. తరువాత యింటికెళ్ళి తైలం రాసుకోవచ్చు! కాళ్ళు తొక్కుతున్నావేమి? అని పొరపాటున కూడా అడక్కు నాయినా.. సిటీకి కొత్తనుకుంటారు! అలాగే చెప్పడం మర్చిపోయాను.. సీటు కోసం ఫిల్టీలు పట్టి కుస్తీపట్టులు పట్టకు.. యెంతో అదృష్టముంటే తప్ప అది అందరికీ దొరికేది కాదు! అదేమీ మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్ల సీటు కాదు! నీ నుదిటన రాస్తే దొరుకుతుంది.. లేదంటే లేదు! ఒళ్ళు హూనమైతే రాత్రికి నిద్ర బాగా పడుతుందని సరిపెట్టుకో!

లేదూ నేనూ మార్గదర్శిలో చేరాను.. అని మోపెడ్ కొనుక్కున్నావనుకో- మోపెడు కష్టాలు.. తడిపి మోపెడు అనుభవాలు! ఇన్సూరెన్సూ ఆర్సీ లైసెన్సూ పొల్యూషనూ అన్నీ వున్నా హెల్మెట్ యేది అంటాడు, వెయ్యి బాత్తాడు! అది నిన్నటి మాట. ఇప్పుడు ఫస్ట్ టైం వంద, సెకండ్ టైం మూడొందలు చలానా ప్లస్ చార్జిషీట్.. ఆపైన వొక్క చాన్సు యిచ్చి జైలు.. వెహికల్ సీజ్.. చాలదని టూవీలర్ వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలట గదా? నయం.. రోడ్డుమీద నడిచేవాళ్ళకి కూడా హెల్మెట్ పెట్టుకోమనలేదు.. అని అనుకోకు! ఔనుమరి.. నడిపేవాళ్ళకీ వెనక కూర్చొనేవాళ్ళకేనా తలలుండేది? నడిచే పాదచారులకి తలలుండవా? తలసరి లెక్కల్లో ప్రతి తలా కౌంటబులే కదా? ఆ లెక్కన హెల్మెట్ కంపెనీలకు ఆదాయం పెరుగుతుంది.. రావల్సినోళ్ళకి కావలసినంత పర్సెంటేజీ.. యిప్పటికే హెల్మెట్ల షార్టేజీ.. రెట్టింపు ధరలకి కొనాల్సిందే.. కాదంటే ట్రాఫిక్ పోలీసులకి అమ్యామ్యాలు యివ్వాల్సిందే.. దొరికినోళ్ళకి దొరికినట్టు చలానాలు రాయడంలో ప్రభుత్వం ఆదాయవనరుగా మార్చుకోవడం మాత్రం అభినందించాల్సిందే! దారుల్లో వాహనదారుల్ని ఆపడం చూసి దోపిడీ దొంగల్ని చూసి హడలిపోయినట్టు హడాలిపోతున్నారట గదా? ఏమైనా నాలుగేళ్ళలో నూటరవై కోట్లు ప్రభుత్వానికి చేరిన ఆదాయమట! జేబుల్లో చేరిన డబ్బుల లెక్కలు ఏ పేపరోళ్ళూ యివ్వలేదు!?

అయినా అన్నిటికీ యిక మీ ఆవిడ్నో పిల్లల్నో బండిమీద తిప్పాల్సిన పనిలేదు. ఇంకో హెల్మెట్ లేదని చెప్పి యెంచక్కా నువ్వొక్కడివే టింగురంగా అంటూ తప్పించుకు తిరగొచ్చు! ఇవన్నీ సరేనని హెల్మెట్ పెట్టుకున్నావే అనుకో జట్కా గుర్రానికి గంతలు కట్టినట్టే, ముందున్నదే కనిపిస్తుంది తప్ప పక్కనున్నదేదీ కనిపించదు! అసలు యాక్సిడెంట్లు అప్పుడే అవుతాయి! జుట్టు రాలిపోయి నెత్తిమీద చంద్రుడు వొస్తే వొచ్చాడు, పక్కనుంచు! హెల్మెట్ పెట్టుకుంటే ముఖానికి రాసుకున్న పౌడర్ చెక్కు చెదరదు గానీ కాళ్ళూ చేతులే మనవి కావనుకోవాల!

అర్రన్నా బుర్రన్నా ఆపలేం.. హైదరాబాదు రోడ్లు అలాంటివి! రోడ్ల మీద యెక్కడ గొయ్యుoటాదో.. యెక్కడ నుయ్యే వుoటాదో నీకు తెలీదు.. నీకు తెలిసిందల్లా నీకు స్పాండిలైటీసా లేకపోతే వెన్నులో పూసలేమైనా రాలిపోయాయో కదిలిపోయాయో తెలుస్తుంది! రోడ్ల దయవల్ల డాక్టర్లకి మరింత ఆదాయం కలిసొస్తోంది! అన్ని సినిమాలు ఒకేలా వుండవు!’ అన్నట్టు రోడ్లన్నీ ఒకేలా వుండవు! పెద్దలున్న రోడ్లు ఒకలా వుంటాయి! తార్రోడ్డులు తల తలా కొత్తగచ్చులా మెరుస్తాయి! వొడ్డించిన వాళ్ళకే వొడ్డించినట్టు.. పోసిన రోడ్లమీదే రోడ్లు పోస్తారు! అయినా జూబ్లీహిల్స్ రోడ్లూ బంజారాహిల్స్ రోడ్లూ వున్నట్టు- కృష్ణానగర్ రోడ్లూ అమీర్ పేట రోడ్లూ యెందుకుంటాయి? రోడ్లకి కూడా వర్గముందని కమ్యూనిస్టులే చెప్పాలా?, మనకి తెలీదా?! రోడ్లు బాగుచెయ్యకుండా హెల్మెట్లతో పాటు బులెట్ ప్రూఫ్ తొడుక్కున్నా సేఫ్ గా నువ్వు యింటికి తిరిగి చేరుతావన్న గ్యారంటీ లేదు! అందుకే దానికి కూడా యిన్సూరెన్స్ సదుపాయముందని సంబరపడి సరిపెట్టుకోవాల!

సరే, లోను పెట్టి కారే కొన్నా.. గంటకు పదమూడు కిలోమీటర్లు కన్నా వేగంగా వెళ్ళమను.. నిన్ను గిన్నీసు బుక్ యెక్కించకపొతే అడుగు? పెట్రోలు పదహారు కాదు, పదకుండు కూడా రాదు! ఆటో యెక్కితే నగర సంకీర్తనమే! రోడ్డు మరమ్మత్తులని మూడు కిలోమీటర్లకి తొమ్మిది కిలోమీటర్లు చుట్టిరావలసిన పరిస్థితి! ట్రాఫిక్ సిగ్నళ్ళ దగ్గరే సగం జీవితం సంకనాకిపోయే పరిస్థితి! అయితే వొక్కటి నిజం.. మనం ట్రాఫిక్ లో అలవాటు పడితే యెక్కడాలేని వోపికా సహనమూ సొంతమవుతుంది! దాంతో ఆఫీసులో బాసు తిట్టినా రుషి మాదిరి నీక్కాదని దులిపేసుకొని యెంచక్కా వుండిపోతావు! మీయావిడతో కూడా గొడవలు తగ్గిపోతాయి!

ఈ ట్రాఫిక్ లో పడి ఆఫీసుకు రావడమే పెద్ద డ్యూటీ! విడిగా డ్యూటీ చెయ్యక్కర్లేదు! సీటుల్లో కూర్చొని నిద్రపోవడాన్ని ట్రాఫిక్ని అర్థం చేసుకున్న యెవరన్నా అర్థం చేసుకొనే తీరుతారు!

కిరోసిన్ తో ప్రయోగాత్మకంగా బళ్ళు నడిపే ఆటో సైంటిస్టులూ.. పదకుండో శతాబ్దంనాటి ప్రభుత్వవాహనాలూ.. పగలే నల్ల మేఘాలు వొదిలే వాళ్ళను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కన్నెత్తి కూడా చూడరు! జలుబూ జ్వరాల్లా కేన్సర్లూ ట్రీట్మెంట్లూ.. కార్పోరేట్ హాస్పిటల్లకి- రెండు చేతులా ఆదాయం వొస్తుందనుకో! ట్రాఫిక్ యిన్స్పెక్టర్లు తమ కండిషనేగాని బండి కండిషన్ చూడరు! లంబుగాడికి జంబుగాడు తోడన్నట్టు మెట్రో వర్క్స్.. మున్సిపల్ వర్క్స్.. పోటీపడి పురావస్తు శాఖలోళ్ళు తవ్విపారేసినట్టు తవ్విపారేస్తున్నారు!

దారీతెన్నూ తెలీని అడవిలో వొదిలేసినా హాయిగా యింటికి వొచ్చేయొచ్చు.. కానీ రోడ్లో వొదిలేస్తే యెలా వొస్తావు తమ్మీ? రాలేవు! తుఫాను భాదితుల్ని పట్టించుకుంటారు గాని ట్రాఫిక్ భాదితుల్ని పట్టించుకుంటారా? కోరు! అలవాటు పడకపోతే- ట్రాఫిక్ లోంచి వొచ్చినవాడు టెర్రరిస్టులా వుండక సౌమ్యంగా సున్నితంగా పెళ్ళాం బిడ్డలతో యెలా వుంటాడు? మన ఆడవాళ్లకే కాదు, మనకయినా సంసారం చెయ్యబుద్దవుతుందా? మా ఆయన కాపురం చెయ్యడం లేదని కోర్టుల కెక్కితే జడ్జిగారికి యేo చెప్పేది? విడాకుల కారణాల్లో ట్రాఫిక్ ని కూడా చేర్చాలి!

డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో చెకింగ్ లు యెక్కువయ్యాయి! తాగినందుకే ఖర్చు! మళ్ళీ తాగినడుపుతున్నావని ఫెనాల్టీ! రెండువిధాలా చిక్కే! బొక్కే! అయితే అదో కిక్కే! తాగకుండా ట్రాఫిక్ లో నడపడం ఆషామాషీ కాదు అని యీ ప్రభుత్వాలు యెప్పుడు గుర్తిస్తాయో యేమో? ఓ విషయం చెప్పనా.. యీ రోడ్లకి యీ ట్రాఫిక్కి తాగి నడుపుతున్నాడా?, తాగకుండా నడుపుతున్నాడా? తేడా యెవడూ కనిపెట్టలేడు!, బ్రీత్ అనలైజెర్ తో టెస్టు చేస్తే తప్ప! ఇవన్నీ సరే.. టీవీల్లో చూపించడం వల్ల యిలా కూడా కొన్నాళ్ళకి నువ్వు పాపులర్ కాగలవు!

ప్రతిదాన్లోనూ పాజటీవ్ యాటిట్యూడ్ అవసరం! ట్రాఫిక్ ని కూడా పాజిటీవ్ గా చూడడం వల్ల మాత్రమే నువ్వు ట్రాఫిక్ ని అధిగమించగలుగుతావు!

విష్ యూ హ్యాపీ జర్నీ!

మీ

పూర్వ హైదరాబాదీ

ప‌గిలిన దేహ‌పు ముక్క‌

 

 

శ్రీచ‌మ‌న్

~

ముఖం నిండా నీరింకిన‌
వాగులు వంక‌లు.
లాక్మే లుక్‌లోంచి
ఓ నిర్జీవ సౌంద‌ర్యం.

ముఖాల‌ ముక్క‌లు
అద్దానికి అతుక్కుపోయి
నెత్తురోడుతున్నాయి.
న‌రాల బంధం తెగినా
ఆశ అర్రులు చాస్తోంది.

విరిగిన గాజు ముక్క చివ‌ర‌
ప‌గిలిన  దేహ‌పు ముక్క‌
బొట్టుగా బొట్టుగా జారుతూ
కాన్వాస్‌పై ఓ విషాదచిత్రం

గ్రూపులు గ్రూపులుగా ర‌క్తం
అమ్మ‌కానికి, దానానికి.
నెత్తురులో కులాలు ఏబీసీడీ..
ఓ పాజిటివ్..మ‌రి ఓ నెగిటివ్ దృశ్యం

కొన్ని భ‌గ్నక‌ల‌ల
న‌గ్న‌రూపం
దృశ్యాఅదృశ్య గోచ‌రం
త్రీడీ యానిమేష‌న్ డైమెన్ష‌న్

*

వంచన

-కృష్ణ వేణి

~

 

 

 

“సుజాతా, ఇవాళ నీకు డే ఆఫ్ అనుకుంటాను. నేను వండినవి పట్టుకొస్తాను. కలిపి లంచ్ చేద్దాం.” మా అపార్ట్‌మెంట్లలోనే ఉండే కుముద ఫోన్.

“రా, రా, తొందరగా వస్తే కబుర్లు చెప్పుకోవచ్చు.“- ప్లేట్లూ, వంటకాలూ డైనింగ్ టేబిల్ మీద సర్దాను.

అరగంటలో కాసరోల్స్‌లో తను చేసినవి పట్టుకొచ్చింది. రాగానే, ‘కూర్చోడానికి ఓపిక లేదంటూ’ గెస్టు బెడ్రూమ్‌లోకి వచ్చి మంచంమీద వాలింది.

“ఈ మధ్య నల్లపూసయిపోయావే! కోడల్ని కూడా అభీ దగ్గరికి పంపించేశావు. నీ స్టూడియోలో ఏవో రిపెయిర్లు జరుగుతున్నాయని అక్కడికి కూడా వెళ్ళడం లేదని విన్నాను!”- అడిగాను.

కుముద స్కల్ప్టర్. ఢిల్లీలో ఘడీ అన్న ప్రాంతంలో ఉన్న అనేకమైన స్టూడియోల్లో ఒకదాన్లో తన ఫర్నస్ ఉంది. అక్కడ శిల్పాలు చెక్కి, వాటిని ఎక్జిబిషన్లలో మంచి ధరలకి అమ్ముతుంది. పది నెలల కిందట, సిడ్నీలో ఉండే తన కొడుకు అభిమన్యుకి దీపికతో పెళ్ళి చేసింది. అప్పుడు నాకు శ్రీనగర్ ఎయిర్‌పోర్టుకి టెంపరరీ పోస్టింగ్ అయి ఉండటం వల్ల, పెళ్ళి అటెండ్ అవలేకపోయాను.

“ఇంకేం కోడలు! నీకు తెలియదా?” డగ్గుత్తికగా వచ్చాయి మాటలు.

నాకు తెలిసినదల్లా, పెళ్ళవగానే దీపిక రెండు నెలలు టూరిస్ట్ వీసాతో అభీతో పాటు సిడ్నీ వెళ్ళిందనీ, స్పౌస్ వీసా కోసం అప్లై చేయడానికి తిరిగి అత్తగారింటికి వచ్చి… అయిదో ఆరో నెల్లుందనీ, ఆ తరువాత  వీసా దొరికి, సిడ్నీ వెళ్ళిందన్నది మాత్రమే. అదీ ఇరుగూపొరుగూ చెప్పిన మాటల బట్టే.

సగం మాటలు మింగుతూ, కళ్ళనుంచి నీళ్ళు చిప్పిల్లుతుంటే ముక్కు ఎగపీలుస్తూ, టిష్యూ బాక్సుని ఖాళీ చేస్తూ చెప్పడం ప్రారంభించింది సంగతేమిటో. వింటుంటే, నా విస్మయం అంచెలంచెలుగా పెరుగుతోంది. మధ్యమధ్య నేను వ్యక్తపరుస్తున్న సందేహాలకి సమాధానాలు ఎలాగో దక్కలేదు కనుక, ఇది పూర్తిగా కుముద కథనమే.

***

పెళ్ళయిన మూడో రోజే, అభీ దీపికని తనతోపాటు తీసుకెళ్ళాడు. నెల రోజులు కాలేదు, ఫిర్యాదులు మొదలుపెట్టడానికి. “అమ్మా- నువ్వూ, పిన్నీ కలిపి షాదీకాంలో వివరాలు భూతద్దంలో చూసి మరీ పిల్లని చూడటానికి వెళ్ళేరు. అమ్మాయి ఫిసియో థెరపిస్టన్నారు. సరే, మంచిదే. ఈ అమ్మాయికి మొహమంతా జుట్టే. అది మాత్రం కనపడలేదా?“

“వీడికేదో చాదస్థం! దీపిక ఎంత వాక్సింగ్ అవీ చేయించుకున్నాకానీ ఆడవాళ్ళం తెలుసుకోలేకపోతామా ఏమిటీ!”- మనస్సులోనే విసుక్కున్నాను. బయటకనలేదు.
అక్కడ ఆ అమ్మాయి ఉన్నన్నాళ్ళూ రోజుకో ఫిర్యాదు.

“సర్లే, కొత్తగా పెళ్ళయిన జంటలకి సర్దుకుపోయేటందుకు టైమ్ పట్టడం సహజం.”- నాకు నేనే సర్దిచెప్పుకున్నాను.

ఆ తరువాత స్పౌస్ వీసా కోసమని ఇక్కడికి వచ్చిందా! ఎయిర్‌పోర్టులో తనని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు, ట్రాలీ తోసుకుంటూ బయటకి వస్తూ ఉన్న దీపికని చూడగానే, అభీ అతిశయోక్తులేమీ చెప్పలేదనిపించింది. కొత్తగా పెళ్ళయిన గుర్తుగా రెండు చేతులకీ ఎర్రగాజులూ, పాపిట్లో సింధూరం, మంగళసూత్రం, నల్లపూసలూ. వాటన్నిటికీ మించి, కొట్టొస్తున్నట్టు మొహం మీద కనిపిస్తున్న  వెంట్రుకలు. మరి అక్కడ ఈ అమ్మాయికి కొత్త కనుక బ్యూటీ పార్లర్లెక్కడున్నాయో తెలుసుకోలేకపోయిందో, ఏమిటో!

మర్నాడు దీపికని లేసర్ సెంటరుకి తీసుకు వెళ్ళాను పర్మనెంటు హెయిర్ రిమూవల్ కోసం. మూడు సిట్టింగులో ఏవో కావాలంది అక్కడున్న పిల్ల డాక్టర్.

తనిక్కడ ఉన్న ఆరు నెల్లూ ‘కొత్త కోడలు’ కదా అని ఏ పనీ చేయనీయలేదు. కూతుళ్ళు లేని లోటు  తీర్చిందనుకున్నాను. మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళందరితో ఎంత కలివిడిగా ఉండేదో! కానీ ఒకటే ఆశ్చర్యం. అభీ, తనూ నా ఎదురుగా- ఫోన్లో కానీ, ఆన్లైన్లో కానీ మాట్లాడుకోగా, ఒక్కసారీ చూడలేదు.

ట్రీట్మెంటు పూర్తయింది. దీపిక మొహమూ, చెంపలూ నున్నగా అయాయి. మధ్యలో ఒక నెల పుట్టింటికి వెళ్ళొచ్చి, తిరిగి సిడ్నీ ప్రయాణానికి సిద్ధం అయింది.

వెళ్ళి అయిదు నెలలవలేదు. ఒక మధ్యాహ్నం అభీ ఫోన్. “అమ్మా, స్కైప్‌ చాటుకి రా. అర్జెంటు. మంచి నీళ్ళు కూడా పక్కన పెట్టుకో.“ అన్నాడు. మనస్సు కీడు శంకించింది.

మానిటర్ మీద కనబడిన వాడి మొహం చూస్తే భయం వేసింది. చెంపలు పీక్కుపోయి, నిద్రాహారాలు మానేసిన మనిషిలా ఉన్నాడు.

Kadha-Saranga-2-300x268

“అమ్మా, ఇన్నాళ్ళూ నీ మనసెందుకు పాడు చేయాలని ఏదో మామూలుగానే కబుర్లు చెప్తున్నాను కానీ, నీ ముద్దుల కోడలుందే! ఎవడితోనో లేచిపోయింది.” నాకు పొలమారింది.

నా మొహం చూస్తూ కొనసాగించేడు. “ఇక్కడ ఉద్యోగం దొరకాలంటే, ఫిసియోథెరపీ పరీక్షలకి తనెలాగో మళ్ళీ ఆరునెల్లు ప్రిపేర్ అవాలి కదా! అప్పటివరకూ ఇంట్లో బోర్ కొడుతోందంటే, ‘పోనీ బయటకి వెళ్ళి వస్తూంటే, తనకీ కాలక్షేపం అవుతుంది.’ అనుకుని, నాకు తెలిసిన ఒక ఇండియన్ స్టోరులో ఉద్యోగం ఇప్పించాను. అక్కడెవరితోనో పరిచయం పెంచుకుని, అతనితో సంబంధం పెట్టుకున్నట్టుంది. అనుమానం వేసి, ఇక్కడ స్థిరపడిన ఒక ఇండియన్ లాయరుంటే, అతనితో చెప్పి దీపికమీద 12 గంటల సర్వెలెన్స్ పెట్టించాను.

నల్లద్దాలున్న కారులో గంటలకొద్దీ వాళ్ళ తిరుగుళ్ళూ, వాటి గురించి ఆయన నాకు పంపించిన వీడియోలూ చూపిస్తే, నువ్వు తట్టుకోలేవు. నాకు నైట్ షిఫ్టులున్నప్పుడు, ఇద్దరూ కలిపి, నా ఇంట్లోనే చాలాసార్లు గడిపారు.

‘ఒకే చూరు కింద ఇద్దరం కలిపి ఉంటే విడాకులు దొరకడం కష్టం’ అన్న లాయరు సలహా ప్రకారం, ఆ వీడియోలు దీపికకి చూపించి, డైవొర్స్ కోసం అప్లై చేస్తున్నానని, నేను మెల్బోర్న్ వెళ్తున్నాననీ, తిరిగి వచ్చేలోపల ఇల్లు విడిచిపెట్టమని చెప్పి వెళ్ళిపోయాను.

నేను తిరిగి వచ్చేటప్పటికి నల్లపూసలూ, మంగళ సూత్రం మాత్రం మంచం మీద పడున్నాయి. తన సామానంతా తీసుకుపోయింది. స్పౌస్ వీసా రద్దు చేయమని ఎంబసీలో అప్లికేషన్ పెట్టేను. దేవుడిని ప్రార్థించు- నాకీ పీడ తప్పాలని.“ అన్నాడు.”
కాళ్ళూ చేతులూ ఆడలేదు నాకు.

***

కుముద స్వగతం పూర్తయినట్టుంది.

నాకు కొత్తేమీ కాదు ఈ తల్లీ కొడుకుల బంధం. అయిదో క్లాసులో ఉన్నప్పుడో ఎప్పుడో, ఒకసారి స్కూల్ మానేస్తానని ఒకే ఒక ముక్కన్నాడో లేదో, ఆ పూర్తి సంవత్సరం కొడుకుని ఇంట్లో కూర్చోపెట్టింది.

పిల్లలు ఆటలు ఆడుకుంటున్నప్పుడు కొడుకు ఓడిపోయినా, పిల్లలు తన్ని ఏడిపించినా కానీ కుముద మధ్యలో దూరి, అభీని వెనకేసుకు వచ్చి మిగతా పిల్లలని చెరిగేసేది. వాళ్ళ తల్లులు వచ్చి తమ పిల్లలని ఇంట్లోకి లాక్కోపోయేవారు, తన నోట్లో నోరు పెట్టడం ఇష్టం లేక.
‘ ఇవన్నీ గుర్తుకొస్తున్నాయేమిటి నాకు!’ నన్ను నేను మందలించుకున్నాను.
“పోనీలెద్దూ, అలాంటి పిల్ల మీ జీవితాల్లోంచి బయట పడటమూ ఒకందుకు మంచిదే. సంతోషించు.” ఊరడింపుగా అన్నాను- పీక్కు పోయిన మొహంతో దిండుకానుకుని కూర్చున్న తనతో.

వంటకాలు వేడిచేసి, డైనింగ్ టేబిల్ మీద పెట్టి కుముదని పిలిచాను.

***

నెలయింది. నా చిన్ననాటి స్నేహితురాలు నీరజనుంచి ఫోన్ వచ్చింది. కొడుకు పెళ్ళిట. తనకీ నాకూ కూడా క్లాస్‌మేటయిన తన భర్త రాజారాం యుఎన్ లో పని చేస్తాడు. సిడ్నీలో ఉన్న Women’s Empowerment సెల్‌కి రిలొకేట్ అయాడు. వధువు కుటుంబం చాలాకాలంగా అక్కడే స్థిరపడినది. ఈ వివరాలన్నీ చెప్పి, “పెళ్ళికి రాకపోయేవంటే చూసుకో మరి.”- బెదిరించింది.

పెళ్ళికీ, మిగతా ఫంక్షన్లకీ వేసుకునే బట్టలూ అవీ సర్ది పెట్టుకున్నాను. ఇలా వెళ్తున్నానని చెప్పి, అభీ నంబర్ అడుగుదామని కుముదకి ఫోన్ చేస్తే, ఆ అవకాశం ఇవ్వకుండానే ‘తన బాబాయి పరిస్థితి బాగాలేదనీ, తను కూడా ఆయనతోపాటు హాస్పిటల్లో ఉంది కాబట్టి మాట్లాడ్డానికి వీలవదనీ’ చెప్పింది. నేనింకా ఆఫీస్‌లో లీవ్ అప్లికేషనూ ఇవ్వలేదు, టికెట్టూ సాంక్షన్ చేయించుకోలేదు. ‘సరే, వెళ్ళిన తరువాత ఫోన్ చేసి కనుక్కుందాంలే’ అనుకుని ఊరుకున్నాను.

***

నేను చేరేప్పటికే పెళ్ళి హడావిడి మొదలయింది. నేను వెళ్ళిన మూడో రోజు- పెళ్ళి జరుగుతుండగా, హాల్ లోపలకి రాబోతూ నన్ను చూసి గభాల్న వెనక్కి తిరిగి కంగారుగా, వడివడిగా వెళ్ళిపోతున్న అభిమన్యుని చూశాను. “అభీ, ఆగు”-గొంతు పెద్దగా చేసి అరుస్తున్న నన్ను వింతగా చూస్తున్నవాళ్ళని పట్టించుకోకుండా లేచి, ఒక్కంగలో ఆ అబ్బాయిని సమీపించేను.

తన మొహంలో బెదురా! భయమా!- అర్థం అవలేదు.

“రా, లోపలికి. వెళ్ళిపోతున్నావేం? వరుడి తరఫునా? వధువు తరఫునా!” అడిగాను.

“ నా స్నేహితుడు ఇక్కడ కలుసుకుంటానంటే వచ్చానంతే ఆంటీ. అతను కనిపించలేదు. అందుకనే…”-అడిగిన ప్రశ్నకి జవాబివ్వకుండా నసుగుతున్నాడు. దించిన తల ఎత్తలేదు.

“ఇంతకీ దీపిక ఎక్కడుందిప్పుడు? ఇండియా వెళ్ళిపోయిందా?” కూపీ లాగుతున్నానా!

“ఏమో, తెలియదాంటీ. తను ఇంటిని వదిలిపెట్టేక, తన సంగతులేవీ తెలియవు.” పక్కచూపులు చూస్తున్నాడు. ఎక్కడో, ఏదో-సందేహం తొలిచివేస్తోంది నన్ను.

“సరే, నీ ఎడ్రెసివ్వు. ఫోన్ నంబర్ కూడా ఇచ్చి వెళ్ళు. కుదిరితే ఇంటికి వస్తాను. ఫోన్ మాత్రం చేస్తాను. నా లోకల్ నంబర్ సేవ్ చేసుకో.”-చెప్పాను.

“ఇల్లు మారుతున్నాను ఆంటీ.”- తన ఫోన్ నంబర్ మాత్రం ఇచ్చాడు.

story1 (1)పెళ్ళి సందడి పూర్తయింది. కొత్తగా పెళ్ళయిన జంట హనీమూన్‌కి వెళ్ళారు. నాలుగు రోజులుగా అభీ నంబర్‌కి ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఎవరో ఆస్సీ యాసతో “సారీ, రాంగ్ నంబర్ “ అంటూ పెట్టేస్తున్నారు.

మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు, రాజారాంకి చెప్పాను జరిగిన సంగతులన్నీ. “ఇటివ్వు ఆ నంబర్. నేను కనుక్కుంటాను”- నోట్ చేసుకుని, పక్కగదిలోకి వెళ్ళి ఎవరితోనో మాట్లాడి వచ్చాడు.

“సుజాతా, ఆ ఫోన్ నంబర్ ఇక్కడే ఎవరి పేరు మీదో రెజిస్టర్ అయి ఉంది. ముందు నువ్వు వాళ్ళమ్మతో మాట్లాడి, ఆ అబ్బాయి అసలు నంబరూ, చిరునామా కనుక్కోగలిస్తే మంచిదే. ఏదో తిరకాసుగా ఉంది ఈ వ్యవహారమంతా. వాళ్ళమ్మ మొబైలుకి ఫోన్ చేయకు. ఎక్కడినుంచి చేస్తున్నావో తెలుస్తుంది. వాళ్ళ లాండ్ లైన్ నంబరుకి కాలర్ ఐడి కానీ ఉందా? ఉంటే కనుక ఇంకేదైనా ఆలోచిద్దాం.”-హడావిడిగా ప్రశ్నలడుగుతూ, సలహాలిచ్చేస్తున్నాడు.

“ఊహూ, కాలర్ ఐడి లేదు. నాకు తెలుసు.”- గుర్తున్న ఎనిమిదంకెల నంబరూ చెప్పాను.

ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేసి, కుముద ఫోన్ నంబర్లిచ్చాడు. ఆస్ట్రేలియన్ ఎంబసీకీ, పోలీసులకీ ఫోన్లు చేసి మాట్లాడేడు. అభీ చిరునామా తెలియడానికి ఎక్కువసేపు పట్టలేదు. అరగంటలో ఇద్దరు పోలీసులు- ఒక మగా, ఒక ఆడా… ఆరెంజ్ రంగు చార ఉండి, ‘పోలీస్“ అన్న పెద్దక్షరాలు రాసున్న తెల్లటి కార్లో వచ్చేరు.

“నీరజా, సుజాతా, వెళ్దాం పదండి.” అని రాజారాం అనగానే, మేమిద్దరిమీ కూడా కారెక్కేం. ఆఫీస్ అవర్స్ కనుక ఆ అబ్బాయింట్లో ఉండి ఉండడు. మరక్కడికి వెళ్ళి చేసేదేమిటో అర్థం కాలేదు.

అపార్టుమెంటు రెండో అంతస్థులో ఉంది. మగ పోలీస్ పైకెక్కి డోర్ బెల్ నొక్కి, కిందకొచ్చి ‘ఎవరూ తలుపు తీయలేదని’ చెప్పాడు. పైనున్న ఒక కిటికీ వైపు వేలుపెట్టి చూపించింది ఆడ పోలీస్. దానికి అద్దానికి బదులుగా ఇనపరేకో, ఏదో బిగించి ఉంది. స్పష్టంగా కనిపించలేదు. రోడ్డువైపు కనిపిస్తున్న మిగతా రెండు కిటికీలకీ కర్టెన్లు వేళ్ళాడుతున్నాయి.

అందరం పైకెళ్ళేం. “పోలీసులమి. తలుపు తెరవండి.“ గట్టిగా అరిచారు. తన పెదాలమీద వేలు పెట్టి ‘శబ్దం చేయొద్దు’ అన్న సౌంజ్ఞ చేశాడు పోలీసు.
“మేము తలుపు బద్దలు కొడుతున్నాం” బిగ్గరగా చెప్తూ, మూడు వరకూ లెక్కపెట్టి కీహోల్ మీద పేల్చాడు.

గుండె దడదడలాడుతుంటే, దేవుడిని స్మరించుకుని నేనూ వాళ్ళ వెంట లోపలికి వెళ్ళాను. ఇల్లంతా ఖాళీ. ఒక గది తలుపు మీద మాత్రం డెడ్ బోల్ట్& లాచ్ మీద పెద్ద ఇండియన్ తాళం కప్ప వేళ్ళాడుతోంది. లోపలనుంచి లీలగా ఏదో చప్పుడు. దాన్నీ తెరిచి లోపలకి ప్రవేశించారు పోలీసులూ, వాళ్ళతోపాటుగా రాజారామూ.

వాళ్ళ వెనక ఉన్న నేను, గదిలో ఉన్న దీపికని చూసి నిశ్చేష్టురాలినయాను. తన నోటికి ప్లాస్టర్ వేసుంది. నైటీ వేసుకుని, మంచంమీద వెనక్కి వాలి కూర్చునుంది. కాళ్ళకీ, చేతులకీ ఇనుప గొలుసులు తగిలించి ఉన్నాయి. వాష్‌రూముకి వెళ్ళగలిసేటంత పొడుగు మాత్రమే ఉన్నాయవి. వినబడినది వాటి చప్పుడే అని అర్థం అయింది. అవి మంచం చుట్టూ చుట్టి ఉండి, వాటికో తాళం వేసుంది. దీపిక నుదిటిమీదా, చెంపలమీదా పెరిగి ఉన్న వెంట్రుకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆడ పోలీసు అమ్మాయిని గొలుసులనుంచి విడిపించింది.
“ఈ కుర్రాడు మనిషా, రాక్షసుడా! వదలను వీడిని.”- రాజారాం పళ్ళు పటపటలాడిస్తున్నాడు.

వెతికితే, దీపిక పాస్‌పోర్ట్ వార్డ్‌రోబ్ పైనున్న సూట్‌కేసులో కనిపించింది. అది తీసుకుని, తనని నీరజ వాళ్ళింటికి తీసుకువచ్చాం. “ఇంత జరిగాక ఇంకేం జాగత్త!”- అనుకుంటూ, కుముదకి ఫోన్ చేశాను. “ఈ నంబర్ పని చేయడం లేదు” అన్న రికార్డెడ్ మెసేజి తప్ప, ఎవరూ ఫోనెత్తలేదు.

డాక్టర్ని పిలిపించింది నీరజ. డాక్టర్ వచ్చి గది తలుపులు మూసింది. కొంతసేపటి తరువాత తలుపులు తెరిచి, నీరజనీ నన్నూ లోపలికి పిలిచింది. దీపిక వేసుకుని ఉన్న బట్టలు పైకెత్తి, చూడమన్నట్టుగా జాలి నిండిన కళ్లతో సైగ చేసింది. చూస్తే సోడొమీ జరుగుతున్న సూచనలు. చూడలేక కళ్ళు పక్కకి తిప్పుకున్నాను. శారీరికంగా అయితే, దీపిక వారంలో కోలుకుంది.

***

ఇంకో వారం తరువాత, నేను వెళ్ళే ఫ్లైటుకే తనకీ టికెట్టు కొంటున్నానని రాజారాంకి చెప్తే, “తను అభీమీద కేసు పెట్టాననీ, దీపిక ఇక్కడే ఉండటం అవసరమనీ” వాదించాడు. పిచ్చి చూపులు చూస్తూ, ‘వద్దు వద్దంటూ’ భయభయంగా తల అడ్డంగా ఆడించిందా అమ్మాయి. నాతోపాటే ఫ్లైటెక్కింది.

“పెళ్ళయిన కొత్తల్లో కూడా సిడ్నీ వెళ్ళి, రెండునెల్లున్నావుగా? అభీ సెక్సువల్ ప్రెఫెరెన్స్ గురించి తెలిసీ, తిరిగి వెనక్కెందుకు వెళ్ళావు?”- తను నిమ్మళంగా ఉన్న సమయం చూసి అడిగాను.

“లేదాంటీ, అప్పుడంతా సరిగ్గానే ఉండేది. అప్పుడప్పుడూ మాత్రం తన స్నేహితుడెవరింటికో వెళ్ళి రాత్రికక్కడే ఉంటాననీ, తన కోసం ఎదురు చూడకుండా భోజనం చేసి నిద్రపొమ్మని చెప్పేవాడు. నేను తిరిగి వచ్చే రెండ్రోజుల ముందు షాపింగ్ చేసుకోడానికి వెళ్తూ, పర్స్ తీసుకువెళ్ళడం మరచిపోయాను. వెనక్కి వెళ్తే, ఒకతనెవరో మా ఇంట్లో షార్ట్స్ వేసుకుని ఛాతీ మీదేదీ లేకుండా సోఫాలో అభీమీద ఆనుకుని కూర్చుని, అభీ వేళ్ళతో  ఆడుకుంటూ, జుత్తు చెరుపుతూ అల్లరి చేస్తున్నాడు. మురిపెంగా నవ్వుతున్న అభీ నన్ను చూసి తత్తర పడ్డాడు. సందేహంగా చూస్తే, ‘నా దగ్గిర స్నేహితుడేలే‘ అంటూ కొట్టిపారేశాడు.
అప్పుడే అర్థం అవాల్సింది నాకు.

రెండోసారి వచ్చిన మొదటి వారంలోనే, ఈ నరకం మొదలయినది.” అంది బేలగా.

ఏమనడానికీ నోరు రాలేదు నాకు.

***
టాక్సీలో దీపికని వాళ్ళమ్మ ఇంటి బయటే దించి, ఆవిడని పలకరించడానికి కూడా మొహం చెల్లక, ఇంటిదారి పట్టాను.

మా ఇంటి మెట్లెక్కకుండా, గేటువద్దే సామాను వదిలి అక్కడున్న ఇంటర్‌కామ్లోనుంచి కుముద ఇంటికి ఫోన్ చేస్తే ఎవరూ ఎత్తలేదు.

“కుముదకేనా? లక్నోలో పెద్ద అసైన్‌మెంటేదో దొరికిందిటగా! ట్రక్కులో సామానేసుకుని వెళ్ళి పదిరోజుల పైనయింది. తెలియదా నీకూ?” గేటు పక్కనే ఇల్లున్న శారదా ఆంటీ బయట వరాండాలో కూర్చుని, తన కీళ్ళ నొప్పులకని పనిపిల్ల చేత కాళ్ళు పట్టించుకుంటూ, దీర్ఘాలు తీసింది.

ఆశ్చర్యం ఎందుకు వేయలేదా అన్న ఆశ్చర్యం మాత్రం కలిగిందంతే.

ఎదురుగా వస్తున్న మా వంటబ్బాయికి, “ సామానింట్లోకి పట్రా”- చెప్తూ మా మెట్లెక్కేను.

*

 

 

 

 

 

 

 

 

 

 

peepal-leaves-2013

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

కొన్నిసార్లు ఇలా కూడా..!

 

     – రాళ్ళబండి శశిశ్రీ

~

1.రాకపోకలన్నీ
పూర్తిగా అర్ధరహితమేమీ కాదు
ఆమోద తిరస్కారాలలో
అదుపుతప్పే గుండెలయ మాత్రమే
అర్ధరహితమైనది!

2.మోహంగా పరచుకున్న మోహనకి
నిరాశగా అలముకున్న శివరంజనికి
మధ్య ఒక్క గాంధార భేదం –
సంతోష దుఃఖాలను వేరుచేసే
చిన్నగీత మాత్రమేనా?!
అధ్యాయానికీ అధ్యాయానికీ మధ్య
కదిలే భారమైన సంగీతం!

3.కొనగోటికి తగలని
కన్నీటిబొట్టు మహసముద్రంగా
వ్యాప్తి చెందకముందే
ఆలోచనలను ఆవిరిచేసేయ్యాలి
తడిగుండెకు ప్రవహించడమెక్కువ!

4.విస్ఫోటించిన అనుభూతుల సంలీనం
చెల్ల్లాచెదురైన గుండె శకలాల
మధ్య కూడా చిధ్రం కాని వ్యామోహాలు
సున్నితత్వానికి సమాధి కట్టడం సాధ్యం కాదేమో!?

5.అప్పుడప్పుడూ మనసుగదికి
తాళం వేయాల్సిందే
దృశ్యాలను మరుగుపరచందే
గాయాలకు మందు దొరకదు మరి!

*

రెటమతం గురించి…ఒక  సంభాషణ

 

 

రాణీ శివశంకర శర్మ

రాణీ శివశంకర శర్మ

కుడి ఎడమైతే నష్టమేమీ లేదు. ఎడమ కుడి అయినా కొంప మునిగేదేమీ లేదు. ఒక బ్ర్రాహ్మణుడి మరియూ అబ్రాహ్మణుడి లేక సగం భ్రాహ్మణుడి సంభాషణ నదీ సముద్రాల సంగమం కావొచ్చు. అంటే నది సముద్రంలోకలిసిపోతుందనే అర్థమేమీ కాదు. అది అంతఃస్రవంతిగా తన ఉనికిని చాటుకుంటూనే ఉంటుంది. సంగమాలు ప్రళయాలు కావు కదా. అలాగే ఒక రెట మతం లేక పూర్తి ఎదురుమతంగా భావించబడినదే శుభ శకునంగా పరిణమించవొచ్చు. అలాంటి శుభ శకునమే ఇస్లాం అంటాను నేను.

ఇస్లాంని టెర్రరిరిజానికి పర్యాయ  పదంగా మార్చేసిన కాలంలో- ఇస్లాంకి, భరత ఖండపు సంస్కృతులకి జరిగిన వివాహ ఫలితంగా జన్మించినదే సూఫీయిజం. సంగమాలను మనం పూర్తిగా నిర్వచించలేకపోవొచ్చు. అవి సహజంగా సంభవిస్తాయి. వాటి పుట్టుక తర్వాత వాటిని మనం నిర్వచిస్తాం. అది ప్రణాళిక ప్రకారం జరిగేది కాదు. అందుకే ఆ సంగమాలని మనం అర్థం చేసుకోవడంలో ఎప్పుడూ విఫలమవుతాం.

నిజమే, ఇస్లాం ఎదురు మతమే. దాని ప్రకారం ప్రకృతీ, దేవుడూ వేరువేరు. అవి ఎప్పుడూ, ఎక్కడా కలవవు. కానీ భారతీయ సంస్కృతులలో పాంథీఇజానికే పెద్ద పీట. అంటే దేవుడు సృష్టిగా అవతరించాడన్న మాట. సృష్టే దేవుని మొదటి అవతారం. అవతార భావన దీనికి కొనసాగింపే. కానీ ఇస్లాంలో అవతారాలే లేవు. ఇంకా క్రైస్తవం నయం. దైవ కుమారుడు అవతరించాడు కదా! నేనూ, దేవుడూ ఒకటేనని అతడు చాటుకున్నాడు. దీనిలో అద్వైతం ఉందని వివేకానందుడు అన్నాడు. యూదు, ఇస్లాం మతాలని ఫక్తు చాందస మతాలుగా నిర్వచించాడు కూడా. నిజమే, క్రైస్తవానికీ, అద్వైతానికీ, హిందూ అవతార భావనకీ పోలిక సాధ్యమే. కానీ ఇస్లాంతో ఇలాంటి పోలిక ఏమీ లేదు. ఇస్లాం ఎదురు మతమే. రెట మతమే. కానీ ఇస్లాంతోటే భారతీయ సంస్కృతి దాంపత్యం నెరపింది. చలం బ్రాహ్మణ స్త్రీలు ముస్లీం పురుషులతో ప్రణయ కలాపం నెరపడమే కాదు, ప్రాచీన సంస్కృత పండితుడు, అలంకార శాస్త్రవేత్త, జగన్నాధ పండిత రాయలు ఒక ముస్లీం స్త్రీని వివాహం చేసుకొని ప్రేమ కవిత్వం రాసాడు. వెంకటేశ్వర స్వామి కూడా అంతే.

భిన్న ధృవాలు ఆకర్షించుకుంటాయన్నట్టుగా ఉందీ కథ. సైద్ధాంతికంగా చూసినపుడు ఇస్లాం నుంచీ సూఫీయిజం వరకూ జరిగిన పరిణామం ఇటూవంటిదే. “అనల్‍హక్” (అహం బ్రహ్మాస్మి) అన్నందుకు ఒక సూఫీ యోగిని ముస్లీం మత పెద్దలు చంపేసారు ( దీ్నినే మళయాల రచయిత వైకం మహమ్మద్ బషీర్ కథగా రాసాడు).  మొగల్ రాజ వంశీయుడు, దారాషికోహో ఉపనిషత్తులని తురక భాషలోకి అనువాదం చేసి స్వమతం వారిచేత, సకుటుంబీయుల చేత వివక్షకు గురయ్యాడు. అంటే ముస్లీంలు తిరుగుబాటు జెండా ఎగురవేసి ఇతర సంస్కృతులతో సంగమించడానికి ఉద్యమించారు. అంటే దూరంగా ఉండిపోవల్సిన ఇస్లాం దగ్గరైంది. దగ్గర కావల్సిన క్రైస్తవం దూరమైంది. ఈ చరిత్రని ఎందుకు మరుగు పరుస్తారు? మనుస్మృతిని ప్రేమించేవాళ్ళు మనుస్మృతి ఏమి  చెప్పిందో గ్రహించాలి. కులాల, వర్ణాల నిరంత సాంకర్యం గురించి మను స్మృతి వేనోళ్ళ చాటింది. భారతీయ సంస్కృతులు చాటుతున్నది కూడా సాంకర్య చరిత్రే, సంగమ చరిత్రే. అది కుడి ఎడమల సంగమం. ఇస్లాంతో సోకాల్డ్ హిందూ దేవతలు, హిందూ సంస్కృతి జరిపిన ప్రణయ కలాపం ( “హిందూ” అనే పదాన్ని స్పష్టత కోసం వాడుతున్నాను, అంతే).

ఈ ఆలోచనలూ, సందర్భమూ ఇట్లా పెనవేసుకొని నడుస్తూ ఉన్నప్పుడు, ఈ ఆలోచనలు మరొకరితో పంచుకోవొచ్చు కదాని నాకు దగ్గరలో ఉన్న అవ్వారి నాగరాజుని మా ఊరికి రమ్మన్నాను.  ఇంట్లో కూడా తోడుగా ఎవరూ లేరు. తను ఫోన్ చేయగానే రావడానికి అంగీకరించాడు. కాసేపు సాధారణ మర్యాదలు అయిపోయాక మాట వెంట మాట  కలిసాక,  తను మామూలుగానే, మీరు రాతల్లో ఎక్కువగా ముస్లీం అనుకూలతని కనపరుస్తుంటారు కదా ఏమిటీ కథ అని అడిగాడు. అసలే ఇది ఒక పక్క హిందూ పాసిస్ట్ వాదులూ, అన్నింటినీ ఒకే తక్కెడతో సరిచూడగల  నాస్తికపు పెద్ద మనుషులూ విరుచుక పడుతున్న కాలం కదా.

వెంటనే నేను నాస్తికుల సంగతి పక్కన పెట్టండి. వాళ్ళు హిందూత్వ సిద్ధాంత కర్త వీర సావర్కర్ మానస పుత్రులు. ఆ సావార్కారేమో, హిట్లర్ నోట్లో నుండీ ఊడి పడ్డవాడు. అంటే ప్రొటెస్టంట్ క్రైస్తవపు జాతీయతా వాదం నుంచి. ఆ జాతీయత తీసుకొచ్చిన జాతి విధ్వేషం నుంచీ. ఈ పెద్ద మనుషులకు దేవుడూ లేడూ, ప్రకృతీ లేదూ అన్నాను. వాళ్ళు వొట్టి సంకుచిత మానవ కేంద్రక వాదులు

అన్నింటికన్నా ముఖ్యంగా ఇస్లాం కలోనియలిష్ట్ మతం కాదు అన్నాను. అదేంటో చెప్పరాదూ అన్నాడు తను.

నేను మానవసమాజంలో సర్వ సమగ్రమైన, హింసా రహితమైన దేన్ని గురించీ మాట్టాడం లేదు. స్వర్ణ యుగాల గురించి కూడా ప్రస్తావించడం లేదు. ఒకే మాట చెబుతున్నాను. ఇస్లాం కలోనియలినిజం కాదు అని మాత్రమే అని గట్టిగా అన్నాను.

ఈ దేశంలో ఇస్లాం నడక కూడా శైవ, వైష్ణవాల్లాగే. అవి కొట్టుకున్నాయ్. చంపుకున్నాయ్. తర్వాత కలిసి కొత్త రూపు ధరించాయి. ఇస్లాం కూడా ఇక్కడి సంస్కృతులతో అటువంటి సంబంధమే నెరిపింది. నిజానికి, శైవ వైష్ణవాల పుట్టుకకి మూలం ఇస్లామే.  థీయిజం, ఒకే దేవుడూ అనే భావాలు ప్రాచీన భారత దేశంలో కాళ్ళూనుకోలేదు. ఉపనిషత్తుల్లో కూడా ఈ భావాల ప్రసక్తి తక్కువ. శ్వేతాశ్వేతతరోపనిషత్తులో ఈ భావాలు కొంత వరకు ఉన్నాయని, అది ఆధునికమైనదని ఇండాలిజష్ట్, ప్రిట్స్ స్టాల్ చెప్పారు (వేదాస్). కనుక ఇస్లాం రాక  భారతీయ సంస్కృతిని మలుపు తిప్పిందని చెప్పవచ్చు. కేవలం మతాంతరీకరణల గురించి ఎందుకు మాట్లాడతారు? ఇస్లాం కొత్త మతాల ఆవిర్భావ వికాసాలకు కారణమైంది. అందువల్ల నేడు హిందూయిజం అని చెబుతున్న దాంట్లో ఇస్లాంది చాలా భాగమే ఉంది. అందువల్ల హిందూ వాదులు వాస్తవికంగా అయితే దారాషికోహోకు ఉత్సవాలు జరపాలి. ఇస్లాంకు సాంస్కృతికంగా  ఋణపడి ఉన్నామని బహిరంగంగా ప్రకటించాలి. కానీ హిందూ వాదులు చేస్తున్న దేమిటి? ఇస్లాంని రెటమతమనీ, ఎదురు మతమనీ ఉగ్రవాదమనీ నిందించి తమ మూలాల్ని తామే చెరిపి వేసుకుంటూ మహా పాపాన్ని మూట కట్టుకుంటున్నారు. వాళ్ళు రూట్స్ కోసం అన్వేషించాలి అన్నాను.

అయితే మీరు ఇస్లాంని కౌగిలించుకొని, క్రిష్టియానిటీని సైద్ధాంతికంగా ఎందుకు విమర్శిస్తారు? రెండింటిలోనూ విస్తరణ వాదం ఉంది కదా? అసలు ఏ మతానికైనా విస్తరణ కాంక్ష సహజమే కదా. క్రిస్టియానిటీ విషయానికే వొస్తే అది దళితులకు మేలు చేసిందని అంటారు కదా  అంటాడు తను.

అసలు మనిషే విస్తరణ వాది. మనిషి ప్రకృతినీ, ఇతర జీవులని ఎక్స్ ప్లాయిట్ చేస్తూ విస్తరించాడు. విస్తరణ వాదం దానికదే కలోనియలిజం కాదు. విస్తరణ వాదంలో ఆధిపత్యం ఉంటుంది. కానీ కలోనియలిజంలో అదనంగా ఙ్ఞానాధిపత్యం ఉంటుంది. క్రైస్తవం కలోనియలిజంగా చారిత్రక పాత్ర నిర్వహించింది. వలస క్రైస్తవం నిర్వహించిన ఆ చారిత్రక పాత్ర మీదే నా వ్యతిరేకత. పదకొండవ శతాబ్ధికి చెందిన ముస్లీం పండితుడు అల్ బెరూని బ్రాహ్మణుల సంకుచిత దృక్పథాన్ని విమర్శించాడు. భరత ఖండంలోని అనేక లోపాల్ని ఎత్తి చూపాడు. వలస క్రైస్తవులు చేసినది మాత్రం ఇది కాదు. వాళ్ళు ఇతర సంస్కృతులని ద్వేషించలేదు. నిర్వచించారు. తమ కంటే హీనమైన సంస్కృతులుగా, తమకన్నా అనాగరికమైనవిగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యానాలని శాస్త్రాలని బూకరించారు. చరిత్రని, మతాన్ని కలగాపులగం చేసారు. దీని నుంచే ముస్లీం వ్యతిరేకత పుట్టింది. దాన్నే హిందూవాదులు స్వీకరించారు. అందుకే హిందూ వాదులు ప్రచ్చన్న క్రైస్తవులు.

“డెవిల్ ఆన్ ది క్రాస్”- పేరుతో ఆఫ్రికన్ రచయిత, గుగీ ఒక నవల రాసాడు. దాన్ని మనవాళ్ళు  “మట్టికాళ్ళ మహారాక్షసి” అని అనువాదం చేసారు. వలస వాద అభివృద్ధి పట్ల ప్రేమే దానికి కారణం. ఆయనే ఇంగ్లీషు భాషాధిపత్యాన్ని నిరశించాడు. వలస వాదానికి వ్యతిరేకంగా ఆఫ్రికన్ సంప్రదాయంలో ఒక మాట ఉంది. వాడు ఒక చేత్తో బైబిల్, మరో చేత్తో తుపాకీ పట్టుకొని వొచ్చాడని. కళ్ళు తెరచి చూసేటప్పటికి బైబిల్ మాచేతుల్లో ఉంది. మా నేల మాత్రం వాడి అధీనమైంది. క్రైస్తవ కరుణ క్రూరమైన కరుణ(లాస్ట్ బ్రాహ్మిన్).

దగ్గర కావల్సింది దూరమైందీ- అన్నారు కదా అది ఎట్లా? అని అడిగాడు తను.

ఏ సంస్కృతీ ఏకశిలా సదృశం కాదు. మతాలు కూడా అంతే. క్యాథలిక్ క్రైస్తవాన్ని పరిశీలిస్తే ప్యాగన్ మతాల ప్రభావం కనపడుతుంది. మాతృ దేవతారాధన కూడా కనపడుతుంది.  మన స్థానిక ఆచార సాంప్రదాయాలతో చాలా పోలికలు కనపడతాయి. అందుకే అద్వైత దృష్టీ, అవతార భావన వంటి పోలికలు మన పురాణాలని గుర్తుకి తెస్తాయి. ఆ రకంగా క్రిస్టియానిటీ మనకు దగ్గర. అయితే ఇలాంటివేవీ మనకు ఇస్లాంలో కనిపించవు.  కానీ ఆధునిక కాలంలో సంస్కరణ వాదంగా వొచ్చిన ప్రొటెస్టింటిజం, గ్రంథానికి  ప్రాధాన్యం పెంచి బహుళ కథనాలకి ఆస్కారం లేకుండా చేసింది. మోనోపలీని, జాతీయతా భావం పేరుతో ఇతర జాతి విధ్వేషాన్నీ పెంచి హిట్లర్ మన్నన కూడా పొందింది. ప్రొటెస్టెంటిజం ప్రవక్త, లూథర్ ఉద్యమిస్తున్న రైతుల్ని కుక్కల్లా కాల్చి చంపమన్నాడు. యూధుల్నిదేశం నుంచీ తరిమేయమన్నాడు (రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ థర్డ్ రీక్). ఇదంతా ఆధునిక పారిశ్రామిక పెట్టుబడిదారీ అభివృద్ధి భావజాలంగా పరిణమించింది. మన నాస్తికులూ, హేతువాదులు కూడా ఈయన శిష్యులే. హిందూవాదులని కూడా ఈయన జాబితాలోనే చేర్చవొచ్చు. లిబరల్ ఫాసిస్ట్ దేశమైన అమెరికా ప్రొటెస్టెంట్ దేశమే.  అక్కడ ఒక్క క్యాథలిక్కూ ప్రథాన మంత్రి కాలేదు. కాలేడు. ఈ విషయాన్ని కంచె ఐలయ్యగారు ఒక వ్యాసంలో రాసారు.  ప్రొటెస్టంట్ సహజాత ముస్లీం విద్వేషానికి  అమెరికా ఇప్పుడు ప్రచార కర్త అయి కూర్చుంది. ఈ ప్రొటెస్టంట్లని అనుసరిస్తూనే ఆర్య సమాజం పుట్టింది. బ్యాక్ టూ బైబిల్ అని వాళ్ళంటే, బ్యాక్ టూ వేదాస్ అని దయానంద సరస్వతి అన్నాడు. వీరి  ముస్లీం విద్వేషం కూడా అక్కడ నుండి వొచ్చిందే. ఈ ప్రొటెస్టంట్ భావజాలమే చివరికి హిందూ ఫాసిజంగా రూపు మార్చుకొంది. ప్రొటెస్టెంట్ క్రైస్తవం, జినోయిజం, హిందూయిజం ఇప్పుడు చెట్టాపట్టాలు వేసుకొని విహరిస్తున్నాయి. జాతి విధ్వేషం వీటి సాధారణ ధర్మం.

అయితే మరి ఇస్లాం ఉగ్రవాదం మాటేమిటి? అని తన ప్రశ్న

ఉన్నది అమెరికన్ ఉగ్రవాదమే. వేదికమీద ఏం జరుగుతున్నది కాదు. తెర వెనుక జరిగేదే ముఖ్యం. సద్దాం హుస్సేన్ సంగతే తీసుకోండి. ఆయనని అమెరికా మీడియా గొప్ప ప్రజాస్వామిక వాదిగా సెక్యులరిస్టుగా, సంస్కర్తగా ఒకప్పుడు కీర్తించింది. ఒక ఉదయాన హఠాత్తుగా ఉగ్రవాదిగా చిత్రించింది. ఇరాక్‍ని ధూర్త దేశం అంది( మీడియా కంట్రోల్- నోం చాంస్కీ).

(రాణీ శివశంకర శర్మ అనే బ్రాహ్మణుడు – జంధ్యం వేసుకునే శూద్ర కులపు అవ్వారి నాగరాజు మాటా మంతీ)

ఈ ఇరానీ సినిమా ఒక కొత్త రుతువు!

 

-భవాని ఫణి

~

 

సినిమాల్లో అయినా , నిజ జీవితంలో అయినా నాటకీయత అనే అంశానికి ఆకర్షణ ఎక్కువ . ఒక చిన్న కుతూహలం ఒక్కోసారి ఎక్కడివరకైనా మనల్ని నడిపించి తీసుకెళ్తుంది. లోపలున్న బహుమతి ఏమిటో తెలీనప్పుడు గిఫ్ట్ ప్యాక్ ని ముక్కలు ముక్కలుగా చించైనా వెంటనే తెలుసుకోవాలనుకునే పసిపిల్లవాడి ఆత్రం, ఎంత ఎదిగినా అతన్ని వదిలిపెట్టదు. మూసిఉన్న పిడికిలి తెరిచి చూసేవరకు మనశ్శాంతిగా ఉండనివ్వదు. అపరాధ పరిశోధనకి చెందిన కథల్లో, చలన చిత్రాల్లో ఇటువంటి పధ్ధతిని ఎక్కువగా అవలంబించినా, వాటిలో నాటకీయత పాళ్లు ఎక్కువ కావడం వలన, మనకి కలిగే కుతుహలంలో కొంత కృత్రిమత్వం ఉంటుంది  అదే ఒకవేళ  సాధ్యతరమని అనిపించే సహజమైన అంశాలతో నాటకీయతని సృష్టించగలిగితే, అది కలిగించే కుతూహలం అంతా ఇంతా కాదు . ఆ పట్టుని అంత బాగా పట్టుకున్న దర్శకుడు అస్ఘర్ ఫర్హాదీ మాత్రమే అని చెబితే అది అబద్ధం కాకపోవచ్చు.  నలభై మూడు సంవత్సరాల ఈ ఇరానియన్ దర్శకుడు,తన నేర్పరితనంతో అద్భుతమైన చలన చిత్రాలకి ప్రాణం పోసాడు .

అన్నీ మనం రోజూ చేసే పనులే, చూసే విషయాలే కదా అనిపిస్తాయి. కానీ కథలో అతను ఎక్కడ ఎలా ఎప్పుడు మెలిక పెడతాడో మాత్రం అర్థం కాదు. కథ అల్లడంలోని ఆ నేర్పరితనం మనల్ని తన్మయత్వానికి గురి చేస్తుంది. ఏ సైన్స్ ఫిక్షన్లు గానీ , సైకలాజికల్ థ్రిల్లర్స్ గానీ , మర్డర్ మిస్టరీలు గానీ కలిగించనంతటి ఆసక్తిని అతని సినిమాలు కలిగిస్తాయి. అంతే సహజమైన ముగింపుతో సంతృప్తి పరుస్తాయి. ఎక్కడా ఏ సందర్భంలోను విసుగు కలగనివ్వనంత బిగువుగా కథ అల్లబడి ఉంటుంది.  ఆ కథనాన్ని ఆస్వాదించడం తెలిస్తే దర్శకుడి ప్రతిభని మెచ్చుకోకుండా ఉండలేం .
అంతేకాక ఫర్హాదీ చిత్రాలలో పాత్రల్ని మంచి చెడుల ఆధారంగా విడగొట్టడం వీలు కాదు. , పెరిగిన సమాజం, పరిస్థితుల ప్రభావం వంటివి మనిషి స్వభావాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయన్న విషయాన్ని అవగతం చేసే విధంగా పాత్రల చిత్రీకరణ ఉంటుంది. ఈ విధమైన పధ్ధతి వల్ల ప్రేక్షకుడు కేవలం ఏదో ఒక పాత్రకే ఆకర్షితుడు కాకుండా, అందరి వైపునుండీ అలోచించి వారి వారి ప్రవర్తనలని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు.
అతని చలన చిత్రాల్లో అతి ముఖ్యంగా చెప్పుకోవలసినవి మూడు చిత్రాలు. మొదటి స్థానంలో ఇరాన్ చిత్ర పరిశ్రమకి మొట్టమొదటి ఆస్కార్ ని సంపాదించి పెట్టిన  ” ఎ సెపరేషన్(A Separation) ఉంటుంది. చిక్కగా గుచ్చబడిన దండలో దారం ఎక్కడుందో తెలీనట్టుగానే అసలు విషయాన్ని అతను ఎక్కడ దాచిపెట్టాడో చాలా సేపటి వరకు తెలీదు. దాంతోపాటుగా ప్రేమ, జాలి, అహంకారం, అపరాధ భావం వంటి మనిషిలోని సహజలక్షణాలు అంతర్లీనంగా అవసరమైనంత మేరకు తమ తమ పాత్రల్ని పోషిస్తూ ఒక నిండైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.  ఈ సినిమా చూసిన తర్వాత కథ ఎవరికీ చెప్పాలనిపించదు. ఎవరికి వారే చూసి ఆ ఆనందాన్ని అనుభవిస్తే బాగుండునని అనిపిస్తుంది . అయినా చెప్పక తప్పదనుకుంటే ఇలా చెప్పడం మంచిది .
నాడెర్ , సిమిన్ భార్యా భర్తలు . వాళ్లిద్దరూ విడిపోవడం కోసం కోర్ట్ లో వాదించుకోవడంతో కథ ప్రారంభమవుతుంది . భార్య ఇరాన్ లోని కఠిన పరిస్థితుల మధ్య తమ పాప పెరగడం ఇష్టం లేక విదేశాలకి వెళ్లడం కోసం పట్టుపడితే, నాడెర్ మాత్రం, అల్జీమర్ వ్యాధితో బాధపడుతున్న తన తండ్రిని వదిలి రావడానికి ఇష్టపడకపోవడంతో పంతం మొదలై ఇద్దరూ విడిపోవడానికి నిర్ణయించుకుంటారు. కోర్ట్ విడాకులు మంజూరు చెయ్యకపోవడంతో సిమిన్ పంతం కొద్దీ విడిగా వెళ్లిపోతుంది.  వారి కుమార్తె పదకొండేళ్ల తెర్మెహ్ మాత్రం తండ్రి దగ్గరే ఉండిపోతుంది. ముసలివాడైపోయి, ఆల్జీమర్ కారణంగా ఏదీ గుర్తుడని స్థితిలో ఉన్న తన తండ్రి కోసం నాడెర్ ఒక స్త్రీని నియమిస్తాడు. ఆమె పేరు రజియా. ఐదారేళ్ల వయసున్న పాపని వెంట బెట్టుకుని రెండు ట్రైన్లు మారి నాడెర్ ఇంటికి వస్తూ ఉంటుంది రజియా. పైగా ఆమె గర్భవతి కూడా. ఇంట్లో పనీ, ముసలాయన్ని సంబాళించడం ఆమెకి చాలా కష్టమైపోతుంది.
నాడెర్ ఆఫీసు నించి వచ్చేవరకు ముసలాయన్ని కనిపెట్టుకుని ఉండటం రజియా చెయ్యవలసిన ముఖ్యమైన పని . కానీ ఒకసారి తొందరగా ఇంటికి వచ్చిన నాడెర్ కి ఇల్లు తాళం వేసి కనబడుతుంది . డూప్లికేట్ కీ తో లోపలి వెళ్లి చూస్తే కింద పడిపోయి ఉన్న తండ్రి కనిపిస్తాడు. పైగా అతను మంచానికి కట్టేసి ఉంటాడు. తండ్రి బ్రతికి ఉన్నాడో లేదో అర్థం కానంత ఉద్వేగంలో నాడెర్ విపరీతమైన ఒత్తిడికి గురవుతాడు. ఆ కోపంలో, అప్పుడే బయటి నించి వచ్చిన రజియాని ఇంట్లోంచి బయటకి గెంటేస్తాడు. తర్వాత ఆమెకి అబార్షన్ అయిందని తెలుస్తుంది . అందుకు నాడెర్ కారణమని రజియా భర్త కోర్ట్ లో కేస్ వేస్తాడు . ఇంతకీ అసలు జరిగింది ఏమిటి? భార్యా భర్తలు మళ్ళీ కలుసుకున్నారా అన్న అంశాలతో ఎంతో ఆసక్తికరంగా మలవబడిన కథ ఇది. నటీనటుల నటన కథకి జీవాన్ని సమకూర్చింది.  సమాజపు స్థితిగతులనే ఈ చలన చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలబెట్టగలగడం కూడా పెద్ద విశేషం.
ఇక రెండోది ‘ఎబౌట్ ఎలీ (About Elly)’.  చిత్రం పేరు సూచిస్తునట్టుగానే కథ ‘ఎలీ’ అనే అమ్మాయి గురించి. ఆమె ఒక కిండర్ గార్డెన్ స్కూల్ టీచర్. ఆమె స్కూల్ లో చదివే ఒక విద్యార్థిని తల్లి సెపిదే, ఆమెని తమ స్నేహితుల కుటుంబాలతో పాటుగా పిక్నిక్ కి తీసుకుని వెళ్తుంది. జర్మనీ నించి వచ్చిన ఒక స్నేహితుడికి ఎలీని చూపించి , అతనికి నచ్చితే వాళ్లిద్దరికీ పెళ్లి చెయ్యాలన్నది సెపిదే ఆలోచన . కానీ అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం, ఎలీ గురించి వారిలో ఎన్నో సందేహలని రేకెత్తిస్తుంది. ఒక్కో పాత్రా దాచిపెట్టిన చిన్న చిన్న విషయాల్ని మెల్లగా అన్ ఫోల్డ్ చేస్తూ చూపడం వల్ల ఆద్యంతం ఒక విధమైన ఉత్కంఠభరిత వాతావరణం నెలకొని ఉంటుంది. ఈ సినిమా కూడా కథ తెలుసుకోకుండా చూస్తేనే బాగుంటుంది.  .
ఇక మూడోది ‘ది పాస్ట్ (The Past)’. ఈ కథ ఫ్రాన్స్ లో జరుగుతుంది. భర్త నుండి విడాకులు తీసుకుని, మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకునే ఇద్దరు పిల్లల తల్లి మేరీ కథ ఇది. ఆమె వివాహం చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి భార్య కోమాలో ఉంటుంది . మేరీ కుమార్తెకి వారి వివాహం ఇష్టం ఉండదు. అతి సాధారణమైన కథాంశంలా అనిపించినప్పటికీ ఇందులో కూడా కొన్ని చిన్న చిన్న రహస్యాలు ఉంటాయి . కథని పొరలు పొరలుగా తవ్వుకుంటూ వెళ్తూ, ఎక్కడో ఓ ఊహకందని మలుపు దగ్గర నిలబెట్టగల దర్శకుడి నైపుణ్యత ఈ సినిమాకి కూడా మనల్ని కట్టి పడేస్తుంది.
కానీ A Separation , About Elly లతో పోలిస్తే The Past కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ చలన చిత్రంలో  ఫర్హాదీ, సస్పెన్స్ కంటే మానవ సంబంధాల స్వరూప స్వభావాలకి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చాడు. సహజమైన ఆవేశకావేశాలు, అపార్థాలు మనిషి విచక్షణా జ్ఞానాన్ని మరుగుపరుస్తాయి. ఆ సమయంలో అవి మనిషిని తప్పుదోవ పట్టిస్తాయి . ఆ ఒక్క క్షణం కొద్దిపాటి సంయమనాన్ని పాటించే ప్రయత్నం చెయ్యగలిగితే ఏమానవ సంబంధమైనా అంత తొందరగా ఒడిదుడుకులకి లోనుకాదు అన్నది ఈ చిత్రం చెప్పదలుచుకున్న ప్రధానమైన అంశాలలో ఒకటి. అయినా ఫర్హాదీ చిత్రాలు మనిషి స్వభావాన్ని నిర్దేశించవు. కేవలం అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే చేస్తాయి. చేయిస్తాయి .
కథ చెప్పే విధానం ఒక్కటే కాదు. చిత్రీకరణలోనూ, సినిమాటోగ్రఫీలోనూ, నటీనటుల ఎంపికలోనూ కనిపించే వైవిధ్యతలు అతని చలన చిత్రాల్ని అరుదైన వజ్రాల మాదిరిగా మెరిపిస్తాయి .ఎక్కడా  నేపధ్య సంగీతమే  వినిపించదు. కేవలం మాటలూ, అవసరమైన శబ్దాలూ మాత్రమే వాడి, అతను సహజత్వాన్ని కనబరచడమే కాదు వినిపించేలా కూడా చేస్తాడు.
చివరగా చెప్పేదేమిటంటే అస్ఘర్ ఫర్హాదీ సినిమాలు చూడని సినీప్రియులు, కొన్ని ఋతువుల్ని అనుభవించనట్టే.  కొన్ని దారుల్ని కనుగొననట్టే. కొంత ఆనందాన్ని పోగొట్టుకున్నట్టే.
*

అనిల్ ‘కథాయణం’ నుంచి ‘నాగరికథ’ దాకా!

kathayanam

-టి. చంద్రశేఖర రెడ్డి 

~

 

సారంగ-లో కథారచయిత అనిల్ ఎస్. రాయల్ తో వేంపల్లి షరీఫ్ గారి ముఖాముఖీలో ‘కథాయణం’ వ్యాససంపుటి, ‘నాగరికథ’ కథల సంపుటి గురించి ప్రస్తావన ఉంది. కథాయణం చదివింతర్వాత, నేను చదివిన ఇతర కథలను, కథాయణంలో  ఉన్న సూచనల్తో పోల్చి చూస్తే ఆ కథలకూ,  ఈ సూచనలకూ పొంతన లేదనిపించింది. అంతే కాదు. కథాయణంకు అనుబంధంగా కథనకుతూహలం-లో చెప్పిన క్లుప్తత ఆ కథల్లో లేనట్లు కనిపించింది.

కథాయణంలోనూ-కథనకుతూహలంలోనూ ఉన్న సూచనలు మిగిలిన రచయితల కథల్లో ఎందుకు అమలు కాలేదు? అవి అమలు చేయకూడనివా? అమలు చేయలేనంత కష్టమైనవా? అన్న అనుమానం వచ్చింది. నివృత్తి కోసం; ఆ సూచనలిచ్చిన రచయిత వాటిని తన కథల్లో ఎంతవరకు, ఎలా పాటించారో తెలుసుకోవాలని ప్రయత్నించాను. దాని ఫలితమే ఇది.

శీర్షిక గురించి సూచనలు: అవి ఎలా, ఎంతవరకు పాటించబడ్డాయి

  1. కథల విషయంలో శీర్షిక వీలైనంత విభిన్నంగా ఉంటే మంచిది.

నాగరికథ-కథ ఒక నాగరికత ఎలా అంతమైందో శాస్త్రీయంగా తెల్సుకోటానికి చేసిన ఒక ఊహ. అందువల్ల కథకి నాగరికత అని కానీ, ఆ పదాన్ని నాగరి’కత’ గా మార్చి ‘కత’ నాగరికత కి సంబంధించిన కథ అనిపించేలా  శీర్షికగా పెట్టుకోవచ్చు. కానీ నాగరి’కత’ లో ఇమిడి ఉన్న ‘కత’ అనే పదం ఎక్కువమంది దృష్టిని  ఆకట్టుకోపోవచ్చు. అందుకనే, కత, కథగా మారి ‘నాగరికథ’ అయింది. కథాంశాన్ని క్లుప్తంగా, గుప్తంగా సూచించింది. విభిన్నంగా ఉంది.

  1. శీర్షికలో నూతనత్వమూ, వైవిధ్యమూ ధ్వనిస్తే మంచిది.

రెండు విరుద్ధ విషయాలని సూచించే పదబంధం వెంటనే ఆకట్టుకుంటుంది. ప్రియశత్రువు అలాంటి రెండు  విభిన్న పదాల మేళవింపు. అందుకే ఆ కథ పేరులో నూతనత్వం, వైవిధ్యం ధ్వనించింది. కథలో ప్రధాన పాత్ర పేరు ‘ప్రియ’ అవటం వలన కథాంశం అంతర్లీనంగా పాఠకుడికి అందింది.

  1. శీర్షిక చూడగానే, అర్థమైనా కాకపోయినా అది కథ చదవమని ప్రేరేపించాలి.

కుంతీకుమారి కథ, మహాభారతంలో కుంతీదేవిలానే కుమారిగానే తల్లిగా మారిన స్త్రీ కథ.  కనుక ఈ కథకి  ‘కుంతీదేవి’ అని పేరు పెట్టొచ్చు. అయితే ఇందులో ఒక ప్రమాదం ఉంది. ఈ కథ కూడా పెళ్లికి ముందే తల్లి అయిన ఒక స్త్రీ కథ అని పాఠకులు  ప్రక్కన పడేయొచ్చు. అలా కాక, కుంతీకుమారి అని కథకి పేరు పెడితే, మహాభారతంలో కుంతికి పుట్టింది కర్ణుడు. కుంతికి కొడుకు కాకుండా కూతురు పుట్టటమేమిటి? అనుకుని కథలోకి పాఠకుడు ఆకర్షించబడొచ్చు. మహాభారతంలో కుంతీదేవి ముందు తల్లి, తర్వాత శ్రీమతి అయింది. కుంతీకుమారి కథలో,  ప్రధానపాత్ర కుమారిగానే మిగిలిపోయింది. కథకి పెట్టిన పేరు పరోక్షంగా కథాంశాన్ని కూడా సూచించింది.

  1. కొన్ని సందర్భాల్లో కథాంశాన్ని వివరించేలా పేరు పెట్టటమే మంచిది.

మరో ప్రపంచం కథ,  పారలల్ యూనివర్సెస్ గురించి. తెలుగులో ఆ కథకి పెట్టిన పేరు ఆ కథాంశానికి నిగూఢ సూచన ఇచ్చింది. అలానే మిగిలిన రీబూట్, రహస్యం, శిక్ష, ప్రళయం, మరపురాని కథ-కథల  పేర్లు కూడా.

  1. కథలకి పేర్లు పెట్టే క్రమంలో చాలా మంది ఔత్సాహిక రచయితలు/రచయిత్రులు చేసే పొరపాటు: కథలో ప్రధాన పాత్ర పేరునే కథ పేరుగా ఎంచుకోవటం.

నాగరికథ కథా సంకలనంలో ఉన్న పది కథల్లో, తొమ్మిదింటికి పాత్రల పేర్లు కథ పేరుగా లేవు. ఒక్క మినహాయింపు ‘కల్కి’ ప్రధాన పాత్ర  అయిన ‘కల్కి’ కథ. ఆ కథకి ‘కల్కి’ అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అన్న దాని గురించి కథాయణంలో వివరణ ఉంది.

  1. చప్పగా, సర్వ సాధారణంగా అనిపించే పదాలని, వాడీ వాడీ అరగదీసిన సామెతలని కథలకి శీర్షికలుగా ఎంచుకోకుండా ఉండటం ఉత్తమం.

నాగరికథ కథా సంకలనంలో ఉన్న పది కథల్లో, ఏ కథకీ సామెతలు పేర్లుగా లేవు.

  1. ప్రసిద్ధమైన కథల పేర్లని వీలైనంత వరకూ మళ్లీ వాడుకోకుండా ఉంటే మేలు.

నాకు తెలిసి కథలకి పెట్టిన పేర్లు  ప్రసిధ్ధకథల పేర్లు, ఇతర ప్రసిద్ధ సాహితీ ప్రక్రియల పేర్లు కూడా కావు.

  1. కథ పేరు ఎంత పెద్దదిగా ఉందనేది శీర్షికల విషయంలో మరో కీలకమైన విషయం.

నాగరికథ-లో ఉన్న కథల్లో; అన్నిటికన్నా ఎక్కువ అక్షరాలు, రెండే పదాలు ఉన్న పేరు-‘మరపురాని కథ’.  మిగిలిన తొమ్మిది కథల్లో, ఆరు కథలకు ఒక పదమే పేరు. మిగిలిన మూడిటికీ ఒక పదబంధం శీర్షిక.

  1. శీర్షికలో ఓ రకమైన అర్థాన్ని సూచిస్తూ, కథ పూర్తిగా చదివాక అందులో మరో అర్థం గోచరించేలా పేరు పెట్టటానికి నేను ప్రాధాన్యతనిస్తాను.

కథల పేరుకి వాడిన పదాలు వాటి అసలు అర్థమే సూచించటం; నాగరికథ, ప్రియశత్రువు, కుంతీకుమారి భిన్నమైన పదప్రయోగాలు కావడం; వాటివల్ల అందిన సూచన ప్రకారం కథ ఉండకపోవటం-ఈ కథల కథాంశం, శీర్షికల ద్వారా వేసుకున్న అంచనాకి భిన్నంగా ఉండటం సంబంధిత సూచన అమలుకు నిదర్శనం.

కొసమెరుపు:

  1. నాగరికథ కథాసంకలనంలో ఉన్న పది కథల్లో అయిదు కథల పేర్లు; రహస్యం (1967), మరపురాని కథ (1967)), మరో ప్రపంచం (1970), శిక్ష (1985), కల్కి (1997) కథలు ప్రచురించబడటానికి ముందే విడుదలైన తెలుగు చలనచిత్రాల పేర్లు. ఇది యాదృచ్ఛికం కావచ్చు-కాని గమనార్హం. కుంతీకుమారి లాగే ధ్వనించే కుంతీపుత్రుడు 1993 లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ప్రళయం కథ ముద్రితమైన తర్వాత 2015 లో అదే పేరుతో ఒక తెలుగు సినిమా విడుదలైంది. రీబూట్ కంప్యూటర్ కే కాదు చలనచిత్రరంగానికి కూడా చెందిన ప్రక్రియ.

ఎత్తుగడ పై సూచనలు: ఎలా, ఎంతవరకు పాటించబడ్డాయి

  1. అత్యవసరమైతే తప్ప కథని వర్ణనలతో మొదలు పెట్టను. అత్యవసరమైనా కూడా కథని సర్వసాధారణమైన సన్నివేశంతో మొదలు పెట్టను.

నాగరికథ, మరో ప్రపంచం, కల్కి,  ప్రియశత్రువు కథలు ఒక సంభాషణతోనే మొదలవుతాయి. శిక్ష కథ  కథాయణంలో ఒప్పుకున్నట్లు ఒక వర్ణనతో, వైవిధ్యం కోసం  ప్రాస ఉన్న పదాల్తో మొదలైంది. ప్రళయం కథ సంభాషణతో కాకుండా ఒక గమనికతో మొదలవుతుంది.  రీబూట్, రహస్యం, మరపురాని కథలు భిన్నంగా మొదలయ్యాయి. మరపురాని కథ ఒకటే ఒక సాధారణమైన సన్నివేశంతో మొదలయినట్లనిపిస్తుంది.  కుంతీకుమారి అనువాదకథ. దాని ఎత్తుగడ మీద అనువాదకుడికి స్వేచ్ఛ లేదు.

  1. మొదటి పేరా ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది. వీలైతే మూడు నాలుగు లైన్లకు మించకుండా. అంతకన్నా చిన్నగా ఉంటే మరీ మంచిది.

నాగరికథ కథలో ఈ సూచన ఏడు లైన్లతో కొంచెం దారి తప్పింది. మరో ప్రపంచం, రీబూట్, రహస్యం, శిక్ష, ప్రళయం, కుంతీ కుమారి; రెండు లైన్లతో; కల్కి, ప్రియశత్రువు, మరపురాని కథ ఒక లైనుతో మొదలయ్యాయి.

  1. మొత్తమ్మీద, ఎత్తుగడ అనేది వీలైనంత క్లుప్తంగా ఉండి చదవబోయే కథపై ఉత్సుకత కలిగించాలి.

ఎత్తుగడతో ఉత్సుకత ఎలా కలిగించవచ్చో అన్నదానికి, నాగరికథ కథ మొదలే ఒక ఉదాహరణ. అది  కథాయణంలో ప్రస్తావించబడింది. కల్కి కథ అయితే మరీ క్లుప్తంగా రెండు పదాల్తోనే పాఠకుడ్ని కథలోకి లాక్కు వెళుతుంది. ఆ రెండు పదాలూ “ఇద్దర్ని చంపాలి.”

ముగింపుపై సూచనలు: ఎలా, ఎంతవరకు పాటించబడ్డాయి

1.A.      ఎత్తుగడ భాగంలో, ‘కథని ఎలా మొదలెట్టినా ఆ ప్రారంభ వాక్యాలు పాఠకుల్లో ప్రశ్నలు రేపెట్టేలా చెయ్యాలి’ అని ఉంది. ముగింపులో ఆ ప్రశ్నలకి జవాబులు దొరకాలి అని చెప్పబడింది.

1.B.      అవి అరటిపండు వొలిచి పెట్టినంత విపులంగా ఉండనక్కరలేదు. కనీసం ఆ సమాధానాలు తామే వెతుక్కోవటానికి అవసరమైనంత సమాచారమన్నా కథలో లభించాలి.

ఉదాహరణకు-నాగరికథ కథ తీసుకుందాం. దీనిలో ‘ఎత్తుగడ’ టైమ్ మెషీన్ లో కాలంలో వెనక్కి ప్రయాణం చేయడం గురించి. హైస్కూలు విద్యార్థులకు గెస్ట్ లెక్చర్ ఇస్తున్న ఓ అణుశాస్త్రవేత్త వివరణతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత తాత గారు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే కాలంలో వెనక్కెళ్లి ఆయన్ను చంపెయ్యడం గురించి ఒక ప్రస్తావన ఉంటుంది. కాలయంత్రం ద్వారా కాలప్రయాణం  గురించి  పాఠం చెపుతున్నపుడు అణుశాస్త్రవేత్తకి వాళ్ల తాతగారి గురించి సెల్ ఫోన్ ద్వారా ఒక వార్త వస్తుంది. క్లాసు అర్ధంతరంగా ఆగిపోతుంది. తాతయ్య దగ్గరకి హడావిడిగా మనవడి ప్రయాణం మొదలవుతుంది. దీంతో పాఠకుడి మెదడులో టైమ్ మెషీన్ గురించీ, అందులో వెనక్కి వెళ్లడం గురించీ, తాతయ్య గురించి వచ్చిన వార్త ఏమిటనే దాని గురించీ ప్రశ్నలు మొదలవుతాయి.

ఆ ప్రశ్నలకు సమాధానాల కోసం పాఠకుడు తప్పనిసరిగా మిగిలిన కథలోకి వెళతాడు. కథనంలో టైమ్ మెషీన్ ఉందా? లేదా? ఉంటే ఎలా తయారయింది? దాన్ని ఎవరు తయారు చేశారు? అందులో కాలంలో ఎవరైనా వెనక్కి ప్రయాణం చేశారా? వెళ్లింది ఎలా? వెళ్లింది ఎవరు? ఆ ప్రయాణఫలితం ఏంటి? అనే దాని మీద తగినంత సమాచారం ఒక దాని తర్వాత ఒకటి కథకుడు అందిస్తాడు.

ఈ ప్రశ్నల్లో కొన్నిటికి జవాబులు కథలో నేరుగా ఉంటాయి. మిగిలిన ప్రశ్నలకి జవాబులు తెలుసుకోవటానికి అవసరమైన ఆధారాలు కథలో ఉంటాయి. ప్రధాన పాత్ర ప్రత్యక్షపద్ధతిలో తెలిసిన వాటిని మొదట నమ్మదు. కాని నమ్మక తప్పదు. పరోక్షంగా తెలిసిన వాటిని మనవడు నమ్ముతాడో లేదో రచయిత స్పష్టంగా చెప్పడు.  నమ్మాలో వద్దో విశ్లేషించి తెలుసుకోవాల్సింది మనవడూ, అతడితో పాటు మనమూ.

  1. A. కథలకి రెండు రకాల ముగింపులుంటాయి-ప్రధానపాత్ర తనని వేధిస్తున్న సమస్యని ఎలా పరిష్కరించిందో చూపటం ఒక రకం ముగింపు. ఇది క్రైమ్, సస్పెన్స్, డిటెక్టివ్, హారర్ కథలకి వర్తిస్తుంది.

2.B. పాత్రల అంతఃసంఘర్షణ చిత్రణపై దృష్టి కేంద్రీకరించే లిటరరీ ఫిక్షన్ కోవకి చెందిన కథలైతే ప్రధానపాత్ర వ్యక్తిత్వంలో వచ్చే మార్పు, ఆలోచనావిధానంలో కలిగే పరిణతి, లేదా ఆ పాత్ర కనుగొన్న సత్యం…ఇలాంటి విషయంతో ముగుస్తాయి.

నాగరికథ కథ పై రెండు వర్గాల్లో ఏ విభాగానికి చెందినది అనేది అప్రస్తుతం అనుకుంటే; ప్రధాన పాత్ర తనని వేధిస్తున్న సమస్యని ఎలా పరిష్కరించిందో; లేదా ఆ పాత్ర కనుగొన్న సత్యం ఏమిటో; కథ ముగింపు చెప్పాలి.

ఈ కథలో ప్రధాన పాత్ర అణుశాస్త్రవేత్త. అతడిని వేధించే సమస్యా, పాఠకుడిని వేధించే ప్రశ్నల సారాంశం ఒకటే. సూచన 2-A ప్రకారం, ఆ పాత్ర తన సమస్యని పరిష్కరించుకోవాల్సింది, సూచన 2-B ప్రకారం ఇవ్వాల్సిన  సమాచారం. దాన్ని కథకుడు తాత ద్వారా, మనవడికి అందిస్తాడు. దాన్ని విశ్లేషించి మనవడు ఒక నిర్ధారణకి వస్తాడు. కాని, అదేంటో రచయిత పాఠకులకి చెప్పడు. దాన్ని కథ ముగింపిడికిట్లో పెట్టి, తెరిచి ఏముందో చూసే బాధ్యత పాఠకులకే వదిలేస్తాడు. అది సవ్యమా, సంభావ్యమా అన్నది వదిలేస్తే, అదిక్కడ చెప్పటం భావ్యం కాదు.

  1. రచయిత అనేవాడు ఎన్ని తిప్పలైనా పడి కథని కంచికి చేర్చాల్సిందే. కాడి మధ్యలో వదిలేస్తే కుదరదు.

నాగరికథ కథలో రచయిత కాడిని పాఠకులతో పాటు తాను కూడా మోసి కంచికి కూతవేటు దూరం దాకా  వచ్చాడు. ఊరు బయట తాను కాడిని వదిలేసి పాఠకులకి మిగిలిన ప్రయాణం ఎలా చెయ్యాలో, గమ్యస్థానం ఎలా చేరాలో చెప్పాడు. తమంతట తాము గమ్యం చేరిన తృప్తి కలగాలంటే ఆ కాస్త దూరం ప్రయాణించాల్సింది పాఠకులే.

  1. కాబట్టి ముగింపు అనేది తప్పనిసరిగా చిన్నదో పెద్దదో ఓ మార్పుని సూచించాలి.

ఈ సూచన కథలో ఎలా పాటించబడిందో చెపితే, కథ ఇంకా చదవని పాఠకులకి కథ చదువుతున్నపుడు కలిగే ఉత్సుకత మిగలదు.

  1. మీరనుకున్న ముగింపు కోసం ప్రధాన పాత్ర (లేదా ఇతర ముఖ్య పాత్రల) స్వభావాన్ని ఉన్నపళాన మార్చేయటం సరైన పద్ధతి కాదు.

నాగరికథ కథ లో అలాంటి మార్పేదీ లేదు.

  1. ముగింపు ఎలా ఉండబోతోందో కథనిండా క్లూస్ వదులుతూనే, మరో వైపు పాఠకుడిని మాయచేసి పెడదారి పట్టిస్తూ, చివర్లో అతన్ని ఆకస్మికంగా అసలు దారికి మళ్లించేదే అసలు ఊహాతీతమైన ముగింపు.

నాగరికథ కథలో మనవడికి కలిగిన అనుమానాల ద్వారా పాఠకులు పొందింది, వాళ్లకు అందిందీ అదే.

తుది మాట:

మిగిలిన తొమ్మిది కథల్లో ఏం జరిగిందో ఎలా జరిగిందో చూడాల్సింది పాఠకులే.

*

 

వెన్నెలదారుల్లో మంచుపూలవాన…

 

-అరణ్య కృష్ణ

~

 

కుప్పిలి పద్మ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు.  ఆమె జగమెరిగిన స్త్రీవాద రచయిత్రి.  స్త్రీవాద దృక్పధంతో దాదాపు గత 20 సంవత్సరాలుగా ఎంతో క్రియాశీలకంగా రచనలు చేస్తున్నారు.  కథ, నవల, పత్రికా కాలం, ప్రేమలేఖలు, మ్యూజింగ్స్….ఇలా అన్ని రకాల రూపాల్లోనూ స్త్రీవాద భావజాలన్ని బలంగా వినిపిస్తున్నారు.  అయితే ఏదో స్త్రీ స్వేచ్చ గురించి ఉపరితల స్పర్శతో వాపోవటంగా కాక మారుతున్న వ్యవస్థ మూలాల్లోకి వెళ్ళి, అక్కడ వస్తున్న మార్పులు వ్యక్తుల మీద, తద్వారా మానవసంబంధాల మీద, ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాల మీద చూపుతున్న ప్రభావాన్ని ఒడిసి పట్టుకోవటం, ప్రతికూల ప్రభావాల్ని తన స్త్రీ పాత్రలు అవగతం చేసుకొని తెలివిగా, ధైర్యంగా ఎదుర్కొనే విధానాన్ని సూచించటం కూడా ఆమె రచనల్లో కనిపిస్తుంది.

పద్మ మొత్తం ఆరు కథా సంకలనాలు వెలువరించారు.  ఒక్కో కథా సంకలనం లో స్త్రీలకి సంబంధించిన ఒక్కో అంశం బాటం లైన్  గా ఉంటుంది.

ఒక స్త్రీవాదిగా కుప్పిలి పద్మ తన కథల్లో సమాజాన్ని అవగతం చేయటమే ముఖ్యంగా కనిపిస్తుంది.  అస్తిత్వవాద సాహిత్యకారులందరిలాగే ఆమె ఏ సిద్ధాంత రాజకీయ దృక్పథానికి కట్టుబడినట్లు కనబడరు.  స్త్రీల అస్తిత్వం చుట్టూ మానవసంబంధాల్లో జరిగే రాజకీయాల్ని గొప్పగా పట్టుకున్నప్పటికీ ఎక్కడా వర్తమాన రాజకీయాల ప్రస్తావన వుండదు.  బహుశ ఈ విధానం వలన ఇంకా ఎక్కువమందికి తను రీచ్ అయ్యే అవకాశం వుండొచ్చని ఆమె భావన అయ్యుండొచ్చు.

ఆమె ఎంచుకున్న వస్తువుకి సంబంధించిన పాత్రల నివాస వాతావరణం, ఆహారం, వస్త్రధారణ, భాష….అన్నింటిమీద ఆమెకున్న మంచి పట్టు కనబడుతుంది.  అది హోటల్ కావొచ్చు లేదా ఇల్లు కావొచ్చు లేదా ఆఫీస్ కావొచ్చు…తన పాత్రలు సంచరించే, తన పాత్రల్ని ప్రభావితం చేసే వాతావరణాన్ని చాలా పకడ్బందీగా మన కళ్ళముందుంచగలరామె.  ఆమె తనకు తెలియని వ్యక్తుల జీవితం గురించి, వాతావరణం గురించి ఎప్పుడూ రాయలేదు.  ఇది కథకి ఎంతో బలాన్నిచ్చే అంశం.  ఆమె ప్రధానంగా అర్బన్ రచయిత్రి.   మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి, అక్కడక్కడా ఉన్నత వర్గాల స్త్రీలే ఆమె కథానాయికలు.

ఇప్పటి సమాజంలో స్త్రీ ఒంటరి అయినా, వివాహిత అయినా సమస్యలు మాత్రం తప్పవు.  ఒంటరి స్త్రీలకు వారి కష్టాలు వారికుంటాయి.  చుట్టు పక్కల వారి మోరల్ పోలీసింగ్ పెద్ద సమస్య.  సింగిల్ వుమన్ అనగానే చుట్టుపక్కల వారికి అత్యంత సహజంగా చులకన భావం కలగటమో లేదా మోరల్ పోలీసింగ్ చేయటమో లేదా వ్యక్తిగత విషయాల్లోకి తలదూర్చి పెత్తనం చేయటమో జరుగుతుంది.  స్వంత కుటుంబ సభ్యులైతే ఆమె సంపాదన మీద, కదలికల మీద, స్వేచ్చా భావనల మీద పెత్తనం చేస్తారు.  శ్రేయోభిలాషుల రూపంలో అధికారం చెలాయిస్తుంటారు.

ఈ సింగిల్ వుమన్ యాతనలన్నీ మనకు “ముక్త” (1997) సంకలనంలో  ఎక్కువగా కనబడతాయి.  ఈ కథల్లోని కథానాయికలు ఇన్నాళ్ళూ స్త్రీల మనశ్శరీరాల మీద అమలవున్న భావజాలాల్ని నిక్కచ్చిగా ప్రశ్నిస్తారు.  “ముక్త” కథలో వర్కింగ్ వుమన్ అయినా     ముక్త తన కుటుంబసభ్యుల చక్రబంధం నుండి విముక్తమయ్యే తీరే కథాంశం. ఇంక “కేసు” అన్న కథలో ఒంటరి స్త్రీని ఒక “కేసు”గా చూసే అనైతిక నైబర్స్ యొక్క విశృంఖల నైతిక పెత్తనం కనబడుతుంది.  “గోడ” కథ స్త్రీలు తమ శరీరాలపై తామెందుకు అధికారం కలిగి ఉండాలనే విషయంపై పద్మగారి సునిశిత అవగాహన, విశ్లేషణ తెలియచెప్పే కథ.  పురుషుడి పట్ల ప్రేమని, మోహాన్ని అధిగమీంచేంత నియంత్రణ ఆడవారికి తమ శరీరాలపై ఎందుకుండాలనే విషయాన్ని ఎంతో ప్రభావవంతంగా చెప్పిన కథ.  ఒక లిబరేటెడ్ వుమన్ అయినంత మాత్రాన స్త్రీలెందుకు ఆచితూచి సంబంధాలేర్పరుచుకోవాలో తెలియచెప్పే కథ.  “నిర్ణయం” కథలో స్త్రీ తను తల్లి అవ్వాలా వద్దా అన్న విషయంలో నిర్ణయం స్త్రీకే వుండాలని బలంగా చెప్పిన కథ.   సూటిపోటి మాటలతో ఎటువంటి సంకోచం లేకుండా దాడి చేసే మొగుళ్ళు,  కొంతవరకు ప్రోగ్రెసివ్ ఆలోచనలతో ముందుకొచ్చిన పురుషుల్లోనూ కీలకమైన సమయాల్లో స్త్రీకి మద్దతుగా నిలవలేని తనం, వారి దృష్ఠిలో స్త్రీ-పురుష సంబంధాల్లో అస్తిత్వ గౌరవం కంటే శారీరిక సంబంధమే ప్రధానంగా మిగిలిపోవటమే బాధ కలిగించే విషయంగా “నిర్ణయం, గోడ” వంటి కథలు చెబుతాయి.  “విడీఅరెల్” అన్న కథలో పెళ్ళైన యువతి గైనిక్ సమస్య ఎదురైనప్పుడు చెప్పుకోలేనితనం, ఎవరూ బాధని అర్ధం చేసుకోకుండా ఏకాకిని చేయటం కథాంశం.  అత్యంత సహజమైన శారీరిక సమస్యల్నెదుర్కోవటంలోని ఏకాకితనపు దుర్భరతనాన్ని విశదంగా చిత్రించిన కథ అది.

“మసిగుడ్డ” కథ స్త్రీ సంసార నిర్వహణలో ఎంత బాధ్యతాయుతంగా వున్నప్పటికీ , ఆమెకు దక్కే అప్రాధాన్య గుర్తింపుని ఎత్తిచూపుతుంది.  పిల్లలు పైకొస్తే “నా పిల్లలు” అని గర్వంగా చెప్పుకునే భర్త అదే పిల్లలు తప్పటడుగు లేస్టెనో లేదా వెనకబడిపోతేనో “ఏం చేస్తున్నావ్ అసలు? నీ పెంపకం అలా ఏడిసింది” అంటూ భార్యని నిష్ఠూరమాడతాడు.  వంటగది తుడుచుకోవటానికి ఉపయోగించే మసిగుడ్డ లాంటి అస్తిత్వాన్ని మోసే స్త్రీల ఆవేదన ఈ కథలో ప్రస్ఫుటంగా కనబడి మనల్ని విచలితుల్ని చేస్తుంది.  “ఆడిపాడిన ఇల్లు” ఒక వైవిధ్య కథాంశం.  తను ఆడిపాడి పెనవేసుకుపోయిన ఇంటికి సంబంధించిన నోస్టాల్జియా ఈ కథాంశం.  శిధిలమైన ఆ ఇల్లు తిరిగి కొనుక్కునే అవకాశం వచ్చినా వసుధ వద్దనుకుంటుంది.  శిధిలమైపోయిన ఇంటిని చదును చేసి ఓ మూడంతస్తుల ఇల్లు కట్టొచ్చు కానీ  ఆ నాటి ఇల్లవదుగా? “ ఆ నాటి బాల్యస్మృతుల ఆనవాలు లేని ఆ ఇల్లెందుకు? వద్దు” అనుకుంటుంది.  ఇలాంటి సున్నిత భావుక ప్రధానమైన అంశంతో కూడిన కథ కూడా ఈ సంకలనంలో వుండటం విశేషమే.

“సాలభంజిక” (2001) కథా సంకలనంలోని కథలు విశ్వవ్యాపితమై, మూడో ప్రపంచపు మానవసంబంధాలను అతలాకుతలం చేస్తున్న గ్లోబలైజేషన్ మీద రాసినవే.  గ్లోబలైజేషన్ని వ్యతిరేకించే మేధావులు సైద్ధాంతికంగా, ఆర్ధికాంశంగా దాన్ని వ్యతిరేకిస్తే రచయితలు అవి సామాన్యుల జీవితాల్ని అల్లకల్లోలం చేసే తీరుని ఒడిసిపట్టుకోవాల్సి వుంది.  పద్మ గారు ఈ బాధ్యతని గొప్పగా నిర్వహించారు.  “ఇన్ స్టెంట్ లైఫ్” కథలో చిన్న చేపని పెద్ద చేప చందంగా పెట్టుబడి బలంతో ఇడ్లీబండీ ని ఒక ఆధునిక ఈటింగ్ జాయింట్ మింగితే,  దాన్ని మరో స్టార్ హోటల్ మింగుతున్న క్రమానికి సమాంతరంగా కథానాయకి మునీరా జీవితంలో వచ్చిన మార్పులను అనుసంధానిస్తూ చెప్పిన తీరు విస్మయం కలిగిస్తుంది.  ప్రపంచీకరణ బాంకుల దగ్గర ఆగిపోకుండా పడగ్గదుల్లోకి చొచ్చుకొచ్చిన వైనాన్ని చెప్పిన కథ ఇది.  మనిషిని మనిషి అర్ధం చేసుకోవటానికి కార్పొరేట్ ప్రపంచానుకూల వ్యక్తిత్వ వికాస తరగతులు అనివార్యమైన విషాద సందర్భంలో రాసిన కథ ఇది.

“ప్రకంపనం” కథ కార్పొరేట్ రంగం అన్ని సామాజిక పార్శ్వాలకూ వ్యూహాత్మకంగా విస్తరించి వృత్తులను, బతుకు తెరువును పెట్టుబడితో కొల్లగొట్టి, బతుకుల్ని లొంగతీసుకునే క్రమాన్ని, ఈ లొంగుబాటు ఫలితంగా మనుషుల అంతరాత్మల్లోనూ, జీవనశైలుల్లోనూ వచ్చిన మార్పులవల్ల కంపేటిబిలిటీ చెడిపోయి అగాధాలు ఏర్పడిన తీరుని వెల్లడించిన కథ.  ఈ కథలో కార్పొరేట్ వ్యూహాల్ని కూడా సమర్ధవంతంగా చెప్పటం జరిగింది.  ఆర్ధిక పశుబలంతో వస్తువులను మార్కెట్లో తక్కువకు సప్లై చేసి, తద్వారా దేశీయ పెట్టుబడిదారులకు నష్టం కలిగించి, వారు తమ కర్మాగారాలను తమకే అమ్మేసే పరిస్తితి కలిపించి, టేకోవర్ చేసుకున్నాక, పోటీ ఉత్పత్తిదారుడు లేని పరిస్తితుల్లో ఉత్పత్తుల ధరల్ని పెంచేసే కార్పొరేట్ మాయాజాలాన్ని తేటతెల్లం చేసిన కథ ఇది.

“సాలభంజిక” కథ కార్పొరేట్ వ్యాపారం ప్రవేశపెట్టిన ఎస్కార్ట్ విధానం (విదేశీయులు భారత్ వచ్చినప్పుడు వారికి “తోడు”గా వుంటూ ఉల్లాసం కలిగించటం) ఊబిలోకి అమ్మాయిలు ఎలా జారిపడతారో, ఫలితంగా వారి మానసిక, శారీరిక ఆరోగ్యాలు సంక్షోభంలోకి ఎలా వెళ్ళిపోతాయో చెప్పే కథ.  అమ్మాయిల దయనీయ కుటుంబ పరిస్తితులు, భావోద్వేగాల బలహీనతల్ను స్వార్ధపరులు ఎలా ఉపయోగించుకుంటారో చెప్పే కథ ఇది.  ఈ కథ చదివాక మనసు కకావికలమై పోతుంది.   “కుబుసం” కథ కుటుంబ సంబంధాల్లో సరసరా సంచరిస్తూన్న కార్పొరేట్ పాము కక్కే విషం మీద కథ.  లాభార్జనే ధ్యేయంగా మసలే కార్పొరేట్ సంస్కృతికి అనుకూలంగా కుటుంబసంబంధాల్ని పునర్నిర్వచించే యంత్రాంగాన్ని బట్టబయలు చేసే కథ.  కుటుంబం దగ్గరుంటే, సహచరి పక్కనుంటే ఎటువంటి టెన్షన్ లేకుండా ఉద్యోగులు పనిచేస్తారనే కార్పొరేట్ లాభాపేక్ష ఒక కుటుంబంలో పెట్టిన చిచ్చు ఈ కథాంశం.

“మంచుపూల వాన” (2008) సంకలనం లోని కథలు ప్రేమ, కుటుంబం, దాంపత్యం వంటి విషయాల్లో స్త్రీల భావోద్వేగాలకు సంబంధించిన కథలు.  ప్రధానంగా స్త్రీలు ఎదుర్కొనే ఎమోషనల్ వయోలెన్స్ గురించి రాసిన కథలు.  “వర్షపు జల్లులలో” కథ సాధారణంగా అబ్బాయిలకు అమ్మాయిల పట్ల ఉండే ఆకర్షణ, అమ్మాయిలకు అబ్బాయిల పట్ల కలిగే భావోద్వేగ స్పందనలతో డీల్ చేసిన కథ.  ఇందులో కథానాయకి మహి తల్లి దెబ్బతిన్న కూతురికి చెప్పే మాటలు చాలా బాగుంటాయి “కొన్ని సార్లు గాయపడటం అనివార్యం. అవసరం. ఒక కొత్త జీవితం అందులోంచే చిగురిస్తుంది.”  “మంచుపూల వాన” కథ పెళ్ళికి ముందున్న విలువలు మర్చిపోయి డబ్బు మనిషిగా తయారైన భర్త నుండి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ని ఎదుర్కొని అతని నుండి బైటపడ్డ మేఘ కథ.  రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇచ్చే ఇన్స్టెంట్ లాభం మనుషుల్ని ఎంతగా పతనం చేస్తుందో చెప్పే కథ ఇది.   “చలెగచలెగా యే ఇష్క్ కా జమానా” కథ కొంత హిలేరియస్ గా సాగుతుంది. ఈ సంకలనంలో ఇదో భిన్నమైన కథ.  తన గర్ల్ ఫ్రెండ్ ప్రేమని పొందటం కోసం ఆమె సామాజిక బాధ్యతగా ఫీలయ్యే విషయాల్లో పాలు పంచుకొనే కుర్రాడి అవస్థ భలేగా అనిపిస్తుంది.  “మంత్రనగరి సరిహద్దులలో” కథ  మంత్రముగ్దంగా సాగే కథ.  ఈ కథలో భావోద్వేగాల హింస కనబడదు కానీ ప్రేమ పట్ల స్త్రీ భావోద్వేగాల ఫోర్స్ కనబడుతుంది.  హృద్యమైన మోహప్రపంచం గురించి పద్మగారి భావుకత పరవళ్ళు తొక్కిన కథనం వున్నదిందులో.   ఒక ఆత్మగౌరవంగల స్త్రీ తనంత తానుగా మోహపడాలంటే  పురుషుడిలో ఎటువంటి ప్రవర్తన వుండాలో సూచించే కథ ఇది.

“వాన చెప్పిన రహస్యం” ఒక వైవిధ్యపూరితమైన కథనంతో సాగుతుంది.  తనని ప్రేమించలేదని క్లాస్ మేట్ మీద కత్తితో దాడి చేసిన యువకుడికి తనకు తెలియకుండానే, అనుకోకుండా ఆశ్రయమిచ్చిన అమ్మాయి కథ ఇది. ప్రేమ గురించి, ప్రేమైక అనుభవం గురించి తనకు ఆశ్రయమిచ్చిన ఆ అమ్మాయి ఆలోచనలతో ఇంటరాక్ట్ అయిన కుర్రాడి పరోక్ష కథ ఇది. “సెకండ్ హజ్బెండ్” కథలో భర్త చనిపోయాక రెండో వివాహం చేసుకున్న యువతి యాతన కథాంశం.  ఆ రెండో భర్త ఇంట్లో తన మొదటి భార్య పటం పెట్టుకోగలడు.  ఆమె పుట్టినరోజుని ఘనంగా చేయగలడు. అందుకు అందరూ అతన్ని ఎంతో మెచ్చుకుంటారు కూడా.  కానీ తన రెండో భార్య తన దివంగత భర్త ఫోటోని అతని వర్ధంతి రోజున బైటకి తీస్తే తట్టుకోలేక పోతాడు.  అతని తల్లి కూడా అభ్యంతర పెడుతుంది.  అతను తన కోపాన్ని లైంగిక హింసలో చల్లార్చుకుంటాడు.  ఇటువంటి పడగ్గది హింసని విచారించే ఏ న్యాయ వేదికలూ ఉండవు.  మంచాల మీది నేరాలు ఏ చట్ట పరిధిలోకీ రావు.  అయితే ఈ కథలన్నింటిలోనూ ముఖ్య పాత్ర సమాజాన్ని, అందులో భాగమైన తననీ అర్ధం చేసుకుంటుంది.  ఎలా నిలబడాలో తెలుసుకుంటుంది.

“ద లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్” కథ దర్శన, విహాస్ ల మధ్య వుండీ లేనట్లుగా దోబూచులాడే ప్రేమ భావన కథాంశం. వారి మధ్య ప్రేమ అసత్యం కాదు.  కానీ అది సజీవమూ కాదు.  బతకాలంటే ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా మరొకరికి లొంగాలి, అబద్ధాలు చెప్పాలి.  ఇంకెక్కడి అమాయకత్వం, స్వచ్చత?  “నా స్నేహితురాలి పేరు సుధీర” కూడా క్విక్ మనీ, ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ల క్యాట్ రేస్ లో తనని, తన మనసుని, ఆ మనసులోని సున్నితత్వాన్ని మర్చిపోయి, చివరికి జీవితంలో చతికిల బడ్డ స్నేహితుణ్ని అక్కున చేర్చుకొని “ఇది మన జనరేషన్ క్రైసిస్.  ఇది గ్లోబల్ ఎకానమీ సృష్ఠించే వికృతం” అని ఓదార్చిన సుధీర కథ.   పెళ్ళి చేసుకుంటే తనకొక ఇల్లు ఏర్పడటం కాకుండా తను పెళ్ళి చేసుకున్న వాడింటికి తను వెళ్ళటమనే పరిస్తితి మీద తెలివిగా తిరుగబాటు చేసిన గ్రీష్మ కథ “ఫ్రంట్ సీట్”.

స్త్రీ శరీరాన్ని సరొగసీ రూపంలో సరికొత్త పద్ధతిలో వెలగట్టి వాడుకునే ప్రపంచీకరణ విశృఖలత్వం “మదర్ హుడ్ @ రియాలిటీ చెక్” కథలో కనబడుతుంది.  ఈ కథ ఒక ప్రత్యేక కథనంతో పరుగులు పెడుతుంది.  అద్దె గర్భం చుట్టూ వ్యాపారం చేసే వికృతస్వభావాలు బట్టబయలు చేస్తారు రచయిత్రి.  “హ్యుమన్ టచ్” ఎలిమెంటుతో ఎక్కువ టి.ఆర్.పి.ల కోసం లేని మెలోడ్రామా కోసం ప్రయత్నం చేసే చానెళ్ళ వాళ్ళు, ఎక్కడికక్కడ దండుకునే మధ్యవర్తులు, వచ్చిన సొమ్ముని దోచుకునే కుటుంబసభ్యులు అంతా స్త్రీ గర్భం మీద ఆధారపడే వాళ్ళే. చాలా కదిలించే కథ ఇది.  “గాల్లో తేలినట్లుందే” కథ యువత ఎలా పెడదారి పడతారో, వారు అలా పెడదారి పట్టడాన్ని ప్రోత్సహించే వ్యాపార సంస్కృతి ఏమిటో తెలియచెప్పే కథ.  “మౌన” కథ చాలా భిన్నమైన కథ.   ఇద్దరు స్త్రీల మధ్య పుట్టిన అనురాగం శారీరిక అనుబంధంగా ఎదిగిన తరువాత ఏర్పడిన కల్లోలాన్ని వివరించే కథ.  ఎన్.వేణుగోపాల్ ఈ సంకలనానికి ముందు మాటలో రాసినట్లు “ఈ కొత్త తరం అమాయకత్వం కోల్పోవటాన్ని నిజానికి చాలా రంగాల్లో, కోణాల్లో, స్థాయిల్లో అర్ధం చెసుకోవలసి ఉంది. అది సంఘ్ పరివార్, ఖాఫ్ పంచాయితీలు చూస్తున్న ఏకైక, సంకుచిత, పురుషాధిపత్య అర్ధంలో మాత్రమే  జరగడం లేదు. సంక్లిష్ట, అసాధారణ రూపాల్లో జరుగుతున్నది”.  ఆ అసాధారణ, సంక్లిష్ట రూపాలన్నింటినీ తన కథల్లో పద్మ గారు ప్రస్ఫుటంగానే చూపించారు.

ఆమె కథలన్నీ వర్ష బిందువులు, చిరుజల్లులు, పున్నాగపూలు, మంచు ముత్యాలు, తుషారాలతో నిండి వుంటాయి.  ఒక్కోసారి కథలో ప్రవేశించటానికి ఈ ప్రకృతి మోహం కొన్ని ఆటంకాల్ని కలుగచేస్తుంది కూడా.  ఇంక పాత్రల పేర్లైతే గ్రీష్మ, ధాన్య, దక్షిణ, సుధీర, దర్శన వంటి అందమైన పేర్లతో అలరారుతుంటాయి.  జీవితం ఎంత బీభత్సంగా ఉన్నా సరే,  మొత్తానికి పాత్రలన్నీ జీవితంతో ఘర్షణ పడుతుంటాయి.  మర్రిచెట్లు కూలుతున్న నేపధ్యంలో అవి లొంగిపోకుండా తుఫాను గాలికెదురొడ్డి నిలబడ్డ చిన్న మొక్కల్లా తమని బతికించుకుంటాయి.  అందుకే ఈ కథలు చదివాక జీవితం మీద ధైర్యం, ఆత్మ విశ్వాసం కలిగించే అవకాశం వుంది.  పద్మగారి కథల్లో అమ్మ పాత్రకి చాలా విలువుంది. చాలా కథల్లఉజ జీవితాన్ని అర్ధం చేసుకోవటంలో అమ్మ చాలా దోహదం చేస్తుంది.  అమ్మ అంటే ఒక గొప్ప సపోర్ట్ అనే భావన బలంగా కలుగుతుంది.

సమాజం మీద, జీవితం మీద అపారమైన అవగాహన, నమ్మకం మాత్రమే కాక ప్రేమని కూడా కలిగివున్న కుప్పిలి పద్మ ఇప్పటికే తనదైన సంతకం చేసారు.  ఆమె నుండి మరిన్ని మాస్టర్ పీసెస్ ఆశిస్తూ…

peepal-leaves-2013