Archives for December 2013

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ? – 5వ భాగం

Ekkadi(1)

(గత వారం తరువాయి )

5

మొబైల్‌ మ్రోగింది.
మనిషి తనను తాను ఎక్కడో పోగొట్టుకుని అవ్యవస్థితమై ఏదో ఒక ఆలోచనలో సమాధియైపోవడం, శవప్రాయమై అనిమిత్తమైపోవడం ఎప్పుడో ఒకప్పుడు అందరికీ అనుభవమయ్యే విషయమే. అప్పుడు ఏ కొద్ది అంతరాయమైనా మనిషిని ఉద్విగ్నుణ్ణి చేస్తుంది..ఉలిక్కిపడ్డాడు రామం.
మనసు సుడిగాలిలో కాగితపు ముక్కలా ఉంది.. ఒకరకంగా..యుద్ధంలో పాల్గొనబోయేముందు దీక్షాబద్ధుడైన సైనికునిలా ఉంది..యిక ప్రయాణం ప్రారంభించాలి.
‘హాలో..” అన్నాడు
”హై..” అటునుండి క్యాథీ.
”ఓ.”
”ఐయామ్‌ వెయిటింగు ఫర్యూ ఎట్‌ బార్నెస్‌ అండ్‌ నోబుల్‌..యుహావ్‌ గినెన్‌ టైం. హావ్యూ ఫర్గాట్‌”సారీ…ఐ ఫర్గాట్‌.. కమింగు నౌ..”
ఉన్నపళంగా లేచి..టకటకా బయటికి వచ్చి తన ఇన్ఫినిటీ, కారును స్టార్ట్‌ చేశాడు రామం.. వాటర్‌హాలో, డార్సీ స్ప్రింగు, అబ్జర్వేషన్‌ డ్రైవ్‌, కాంఫ్రీ, రాయల్‌ క్రౌన్‌.. కారు సర్రున జారిపోతోంది. బయట సన్నగా వర్షం.,
జ్ఞాపకాల వర్షం.. చినుకులు చినుకులుగా ఘటనలు,
జీవితంలోకి క్యాథీ అనే ఈ అమెరికన్‌ యువతి యొక్క ప్రవేశం యాదృచ్ఛికమే ఐనా..పోను పోను ఓ ప్రభావశీలమైన అనుబంధంగా మారడం..మనుషుల ప్రాంతాలు, మూలాలు, దేశాలు, నేపథ్యాలు..వీటితో ఏ సంబంధమూ లేకుండానే ఒక హృదయానుగతమైన అనురాగంతో చేరువై ఆత్మీయులుగా మారుతూండడం.. ఇదంతా ఓ చిత్రమైన ఏ నిరూపణకూ, తత్వానికీ, తత్వజ్ఞానానికీ అందని అంతరిక రహస్యమై.,
తను మొదట టిసిఎస్‌ స్టాఫ్‌గా రాక్‌విల్లీలో చేరిన తర్వాత రెండు నెలల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు ఒక వారం రోజుల తేడాతో పరిచయమైన విశిష్టమైన వ్యక్తిత్వం గల వ్యక్తులు ఇద్దరు. ఒకరు లీల. మరొకరు క్యాథీ. లీల తను చేరిన పదిరోజుల తర్వాత భారతదేశంనుండే టిసిఎస్‌స్టాఫ్‌గా మేనేజ్‌మెంట్‌ మాడ్యూల్‌లో హైద్రాబాద్‌ బ్రాంచ్‌నుండి వచ్చి చేరిన వ్యక్తి. ఆమె ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, బెంగళూర్‌ నుండి బంగారు పతక గ్రహీత. క్యాంపస్‌ ఇంటర్వూలో తన వలెనే ఎంపిక చేయబడి చాలా మంచి జీతంతో ప్రవేశపెట్టబడ్డ వ్యక్తి. అప్పటికే ఆమెకు గొప్ప ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. విద్యార్థిగా ఉన్నపుడే ఎన్నో సంస్థలతో సంబంధాలు పెట్టుకుని అనేక విజయాలను సాధించి పెట్టిన మనిషి. ప్రధానంగా బిజినెస్‌ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగు కార్యకలాపాలను విస్తరించే ప్రత్యేక విధులకోసం ఆమెను రాక్‌విల్లీ ఆఫీస్‌కు పంపారు.
లీల..ఒక వ్యక్తే..కాని ఒక వ్యవస్థతో సమానం. మనిషి చేతలు, కదలికలు, నిర్ణయాలు, ఒక కేస్‌ను అధ్యయనం చేసే విధానం చాలా విలక్షణమైంది. ఆమె ఆలోచనలు పోలీస్‌లవి. చూపులు డేగవి. వ్యూహాలు సింహానివి. తెలివి చాణక్యునిది. వెరసి లీల అంటే విజయానికి ప్రతీక.
ఐతే.. లీల అందగత్తె.. లీల అహంకారి..లీల పొగరుబోతు.
అంటుంది..’నా అహంకారమే నాకు అలంకారం’ అని.

”ఐ లైక్‌ మెన్‌ ఆఫ్‌ మల్టిట్యూడ్స్‌.. బహుముఖ ప్రజ్ఞాశాలులంటే నాకిష్టం..”అంది మొదట తన్ను తాను పరిచయం చేసుకుంటూ. అంతకుముందు ఒక వారంరోజులు తనను ఆమె అతి వివరంగా పరిశీలించి అధ్యయనం చేసినట్టు తనకు తెలుసు. తను ఒక అసాధారణ ప్రతిభగల మెకానికల్‌ ఇంజనీరే కాకుండా, కాడ్‌కాం రంగంలో, ఫ్లెక్సిబుల్‌ మెషినింగు సిస్టమ్స్‌లో, స్పేస్‌ అప్లికేషన్‌ బేరింగ్సు రూపకల్పనలో సాప్‌ సాఫ్ట్‌వేర్‌ను సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌లో వాడడం.. ఈ రంగాల్లో తన అసమాన ప్రతిభను లీల అద్భుతంగా పసిగట్టింది.
ఒకరోజు ‘స్టార్‌బక్‌ కాఫీ షాప్‌’ లో కలుసుకుందామని ప్రపోజ్‌ చేసి పర్సనల్‌గా ఒక గంటసేపు మాట్లాడింది. ఆ సంభాషణ తర్వాత కొంత చేరువైనట్టనిపించింది. మనిషి ఎంతో డైనమిక్‌ ఐనా చాలా లోతైన తాత్విక ఆలోచనలు గల సున్నితమైన దృఢసంకల్పంగల మనిషి..ఆమెకు తనదైన ఒక వ్యవహారశైలి ఉంది. చొరవ ఉంది. సింహంవలెనే పట్టువిడువకుండా వేటాడే గుణముంది. అన్నింటినీమించి అద్భుతమైన ధైర్యముంది.
ఐతే లీల గురించి అర్ధంగానిది ఆమె యొక్క ‘పాదరసం’ వంటి చంచల స్వభావం. దాన్ని అస్థిరత అనే వీలేలేదుగాని, అస్పష్టమైన సందిగ్ధతగా అర్థం చేసుకోవచ్చునేమో. మంచి ఇంగ్లీష్‌. మంచి వ్యక్తీకరణ..ఎదుటి మనిషిని రెండు నిముషాల్లో ఆకట్టుకునే దేహభాష.
ఎందుకో ఆమెతో పరిచయం పెరుగుతున్నకొద్దీ ఏదో తెలియని ఆకర్షణకూడా పెరుగుతూ వచ్చింది తనలో. ఆమెను తరుచూ కలుసుకోవాలనీ, సాధ్యమైనంత ఎక్కువసేపు మాట్లాడాలనీ, ఎక్కవకాలం సాంగత్యాన్ని అనుభవించాలనీ అనిపించేది.
ఆమె అభిరుచులుకూడా తనను ఎంతో ఆకట్టుకున్నాయి. తనవలెనే ఆమెక్కూడా మధురమైన సంగీతాన్ని వినాలని కోరిక. ప్రకృతిని ఆరాధించే తత్వం..ముఖేశ్‌ పాటలను తను తదేకంగా వింటున్నపుడు ఓ చరణాన్ని అందుకుని హమ్మింగు చేసేది. ఒంటరితనాన్ని యిష్టపడ్తుంది. విపరీతంగా పుస్తకాలను చదువుతుంది. ఏ కారణంవల్లనైనా  డిస్టర్బ్‌ ఐనపుడు ఎటో ఏకాంతంలోకి వెళ్ళిపోతుంది. ‘హిట్‌ అండ్‌ మిస్‌ కాకుండా..హిట్‌ అండ్‌ స్టే..అండ్‌ ఫేస్‌’ తత్వం ఆమెది.
‘జీవితం ఓ యుద్దం. పోరాడి గెలవాలి’ అనేది ఆమె సిద్ధాంతం. కారు మైల్‌స్టోన్‌ సెంటర్‌ మలుపు తిరిగింది..వర్షం ఉధృతమై చినుకులు చిక్కబడ్డాయి.
ekkadi -5

క్యాథీది లీలకు పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వం. లీల జలపాతమైతే క్యాథీ మైదానథలో ప్రవహించే నది. నిండైన మనిషి. తొణకకుండా గంభీరంగా ఏ సమస్యనైనా తట్టుకుని శాంతంగా పరిష్కరించగల నేర్పరి. వెన్నెల ముద్దతో చేసిన మనిషిలా అతి సున్నితమైన, నాజూకైన సౌందర్యం ఆమెది. తేనెరంగు కళ్ళు, రాగిరంగు వెంట్రుకలు, గోధుమరంగు శరీరం. కళ్ళలో తొణికిసలాడే జీవకాంతి. అన్నింటినీ మించి క్రమశిక్షణతో కూడిన ప్రతిభ. చేస్తున్న పనిలో నిజాయితీ.
జన్మతః మంచి ఆర్థిక నేపథ్యం ఉన్న కుటుంబంలోనుండి వచ్చింది క్యాథీ. తండ్రి జాన్సన్‌ మంచి ఇండస్ట్రియలిస్ట్‌. ఫోర్డ్‌, జియంసి, టయోటా కంపెనీలకు కొన్ని కారు విడిభాగాలను ‘జస్ట్‌-ఇన్‌-టైం’ పద్ధతిలో సరఫరా చేసే పరిశ్రమ ఉందతనికి. జీవితకాలమంతా ఆ పరిశ్రమను ఉన్నతీకరించడంలోనే గడిపిన వ్యక్తి. తల్లి మేరీ గృహిణి. ఒక్కతే కూతురు క్యాథీ. తన తర్వాత తన పరిశ్రమను నిర్వహించగల సమర్థను క్యాథీలో పాదుకొల్పేందుకు క్యాథీతో బి.ఎస్‌ ఇన్‌ ఆటోమొబైల్‌ చేయించాడు. అందులో ఆమె యూనివర్సిటీ ఫస్ట్‌ వచ్చింది. అనెహర్బర్‌లో ఉండేవాళ్లు మొదట. తర్వాత డెట్రాయిట్‌కు మారి.,

పదేళ్ళక్రితం క్యాథీ పరిచయమైనపుడు తండ్రితో కలిసి తూర్పుతీరంలో, వాషింగ్టన్‌ డి.సి. మాంగోమెరీ, గేథర్‌ బర్గ్‌, మేరీల్యాండ్‌, వీటన్‌.. అటు వర్జీనియా ప్రాంతాల్లో ఔట్‌లెట్స్‌ తెరిచి వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌కోసం సాఫ్ట్‌వేర్‌ కావాలని తనదగ్గరికొచ్చారు. అప్పుడే మొదట ఆమెను చూడడం. తర్వాత్తర్వాత నాల్గయిదు సార్లు పనులకోసమే పదేపదే తనను కలిసింది. కలిసిన ప్రతిసారీ ఏదో తెలియని ఆకర్షణ ఆమె వైపు లాగేది. మనిషిలో ఏదో ప్రత్యేకత కనిపించేది. సహజమైన అమెరికన్‌ యువతుల్లో ఉండే ఫ్యాన్సీనెస్‌, శరీరాన్ని బహిరంగంగా ప్రదర్శించే లౌల్యం కొద్ది అతిగా అనిపించే ప్రవర్తనగానీ ఏవీ ఆమెలో లేవు. పద్ధతైన అణుకువతో నిండిన వినమ్రత, అవధుల్లోనే ఉంటూ ఎదుటిమనిషిపై జరిపే తెలివైన దాడి.. యివన్నీ తనను ఎంతో ఆకట్టుకునేవి.

ఎందుకోగానీ తనపట్ల ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని పెంచుకుని..”ఐయామ్‌ ఫీలింగు టు బి ఎ ఫ్రెండాఫ్‌ యు” అంది క్యాథీ అకస్మాత్తుగా..ఓసారి..
ఆమె కళ్ళలోకి చూశాడాక్షణం తను. ఏదో అనిర్వచనీయమైన లాలస.
తనక్కూడా అలాగే అనిపించింది. ఐతే క్యాథీతో అనిపించిన ఈ ఉద్విగ్నానుభవం లీల విషయంగా అనిపించలేదు.
లీలలో ఒట్టి ఆకర్షణ ఉంది. కాని క్యాథీలో దాన్ని మించిన ఇంకేదో భాషకందని నిజాయితీకి, నిర్మలత్వానికి సంబంధించిన బలమైన ఉన్మీలన శక్తి ఉంది.
క్రమక్రమంగా క్యాథీ ఇంకా ఇంకా చేరువై..ఒకరి వ్యక్తిత్వంలోకి మరొకరు తొంగి చూచుకుని, ఒకరిగురించి మరొకరు ఇంకా వివరంగా, లోతుగా తెలుసుకుని ఒకర్నొకరు చదువుకుని,
”దీన్నేమంటారు” అని అడిగాడు తను ఒకరోజు పార్క్‌లో కూర్చున్నపుడు.
క్యాథీ అంది ”మె బి లవ్‌” అని.
”ఈజిట్‌”
స్పష్టాస్పష్టంగా, ద్వైదీభావంగా, ఒక్కోసారి డోలాయమానంగా..మనిషికి ఏది కావాలో ఏది వద్దో..ఆ కావలసింది ఏమిటో, వద్దనేది కూడా ఏమిటో..మోహానికీ, కామానికీ, ప్రేమకూ తేడా తెలియకుండా గాలిలో దూదిపింజవలె తేలిపోతున్నట్టనిపించే వయసులో.,
ఎక్కడో విన్నాడు తను..’జవానీమే సువ్వర్‌ భీ సుందర్‌ లగుతా హై’ అని
వయసువల్ల వస్తున్న పరితపనా ఇది. శారీరకంగా ఉధృతమౌతున్న భౌతిక వాంఛనా ఇది. మౌనంగా యుక్తతవల్ల అంతరాంతరాల్లో రగులుతున్న యవ్వనాగ్నా ఇది.
..ఐతే..ఈ పరితపన లీలపై ఎందుక్కలగట్లేదు.
లీల కూడా..స్పష్టంగా సంకేతాలిచ్చింది తనకు చేరువకావాలని..స్నేహం కావాలని..సాంగత్యం కావాలని..కాని.. అది ప్రేమా?..వ్చ్‌..ఏమో. ఆమె కూడా దాన్ని ప్రేమ అనిగానీ మనం ప్రేమించుకుందామనిగానీ..అంతకుమించి ఇంకేదైనా అనిగానీ అనలేదు తనతో.
కాని ఏదో ఉంది లీలకు తనపట్ల..ఆ ఏదో ఏమిటి..పోనీ తనక్కూడా లీలపట్ల ఆ ఏదో ఉందా..?
అప్పుడు తనకు ఇరవై తొమ్మిదేండ్లు..అమెరికాకు వచ్చి మూడవ సంవత్సరం.
టిసిఎస్‌నుండి రాజీనామా చేసి..కొన్నేళ్ళ తర్వాత భారతదేశం తిరిగివెళ్ళి ప్రజాజీవితంలోకి వెళ్లవలసిన లక్ష్యాలనుస్పష్టంగా నిర్వచించుకుని ఒక ఎంటర్‌ప్రునర్‌గా మారాలనీ, సర్వశక్తులనూ ఒడ్డి యిక సాధ్యమైనంత ఎక్కువ డబ్బు సంపాదించాలనీ, తనవంటి ఆలోచనా ధోరణే కలిగిన వ్యక్తులను ఇక్కడ అమెరికాలో, అక్కడ భారతదేశంలో గుర్తించి సమీకరించాలనీ నిర్ణయించుకుని ఒక్కసారే ఒక నెలరోజుల్లోనే మూడు స్వతంత్ర వ్యాపారసంస్థలను ప్రారంభించిన సందర్భంలో,
ఒకసారి.. చాలా సూటిగా తను లీలతో ఒకనాడు, క్యాథీతో మర్నాడు జీవితంగురించి చర్చించాడు.
లీల స్పష్టంగా చెప్పింది..’మన అభిరుచులు ఒక్కటే..కాని మన గమ్యాలు వేరు’ అని. తనకు పరిచయమై రెండున్నర మూడేళ్ళు గడిచేసరికి లీల ఆలోచనల్లో, ఎత్తుగడల్లో జీవితాన్ని వ్యూహాత్మకంగా జీవించాలని సరికొత్తగా నిర్వచించుకోవడంలో ఎంతో మార్పు కనిపించింది. ఉద్యోగరీత్యాగానీ, స్వంత ఆసక్తులవల్లగానీ లీల ఆ కాలంలో ఎన్నో దేశాలను, ముఖ్యంగా భారతదేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో, కేంద్ర ప్రభుత్వంతో ఏర్పడ్డ, ఉద్యోగరీత్యా సంభవించిన సంబంధాల వల్ల చాలా విస్తృతంగా పర్యటించింది. అనేకమంది ప్రముఖులతో కాంటాక్ట్‌ ఏర్పడింది. సంపన్న వర్గాల్లో  బయటికి కనిపించని అనేక అంతర్గత రహస్యాలనూ, వ్యాపార మూలాలనూ, లావాదేవీలనూ, మనుషులను లోబర్చుకునే అనేకానేక మార్గాలనూ చాలా లోతుగా అధ్యయనం చేసింది. ఎవరిని ఎలా టాకిల్‌ చేయాలి, ఎవరిని ఎక్కడ ఎలా లోబరచుకుని పనిచేయడానికి ఒప్పించాలి.. ఎవరిని ఎక్కడ భయపెట్టి ఎలా బ్లాక్‌మెయిల్‌ చేయాలి వంటి రాజకీయ, కార్పొరేట్‌ విధానాలన్నింటినీ సుళువుగా అలవర్చుకుంది. ఈ చీకటి వ్యాపారాత్మక ప్రపంచంలో లోలోతులకు దిగుతున్నకొద్దీ లీల వ్యక్తిత్వంలో ఎంతో గుణాత్మకమైన మార్పులు కొట్టొచ్చినట్టు కనబడేవి. ఒక్కోసారి తనను అతిక్రమించి నియంతలా మాట్లాడేది. ప్రవర్తించేది.
”వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి రామం.. మనందరం బురదలో కూరుకుపోయి ఉన్నాం. యిక స్వచ్ఛత గురించి ఆలోచించి లాభంలేదు. బస్‌.. వర్రీ ఎబౌట్‌ యువర్‌ సెల్ఫ్‌.. అంతే. ఇదే జీవితం.. విజయం సాధించినవాడే గౌరవింపబడ్తాడు. విజయం ఎలా సంభవించిందన్నది ముఖ్యం కాదు. సాధించింది విజయమా కాదా అన్నదే ప్రధానం.”
”అంటే..”
”అంటే..ఎర్న్‌..సంపాదించు..ఇంకా సంపాదించు..ఎదుగు.. ఎదుగు..అంతే..”
”ఎంత సంపాదించు..ఎంత ఎదుగు..”
షాకై చూచింది..తుపాకీ గుండు తాకిన జంతువులా.
”ఉహు..రామం..నువ్వు మారవు. నీకు సిద్ధాంతాలు కావాలి”
”నేనదే అంటున్నాను. నువ్వు మారవు. నీకు కేవలం డబ్బే కావాలి..నీకు డబ్బు పిచ్చిపట్టింది.”
”కాదు..నాకు ఈ కార్పొరేట్‌, కరెప్టివ్‌ పొలిటికల్‌ బాస్టర్డ్స్‌, బ్రూరోక్రటిక్‌ ప్రభుత్వ అధికారులు. వీళ్లందరి మీద కసి ఉంది..రామం నువ్వు నన్ను స్టడీ చేయలేకపోతున్నావు..విశ్వనాథన్‌ ఆనంద్‌ అద్భుతంగా చెస్‌గేమ్‌ ఆడి ప్రత్యర్థిని మట్టికరిపిస్తాడు. అలా ఎదుటిమనిషిని ఓడించడంలో ఒకరకమైన అద్భుతానందముంటుంది. నాకు ఆ ఆనందం కావాలి. ఆనందం నేను గెలుస్తున్నందుకు కాదు.. ఎదుటివాన్ని ఓడిస్తున్నందుకు..”
”నీ దగ్గర అద్భుతమైన ప్రతిభ ఉంది లీలా..ఐతే దాన్ని పరిమితమైన నీ వ్యష్టి అభివృద్ధి గురించీ, నీ స్వంత వికాసం గురించి మాత్రమే వెచ్చించాలనుకుంటున్నావు. అంతకంటే ఇంకాస్త విశాలంగా సమిష్టివృద్ధి గురించి ఆలోచించగలిగితే..”
”స్టాపిట్‌..సమిష్టి ఎక్కడుంది రామం..ఒకప్పటి భారతీయ జీవన వ్యవస్థలో ‘ఒక్కరికోసం అందరు..అందరికోసం ఒక్కడు ‘ విధానం ఉండేది. కాలం గడుస్తున్నకొద్దీ మనుషుల్లో నైతిక పతనం సంభవిస్తూ సంభవిస్తూ ఇప్పుడు ఎవరికివారే యమునాతీరే తరహాలో దిగజారిపోయి అసలు మానవతా విలువల స్పృహే లేక ఒక సంకక్షుభిత వాతావారణంలో కూరుకుపోయి..నువ్వు ఏ రంగమైనా తీసుకో..రాజకీయాలు..పచ్చి వ్యభిచారంకంటే హీనం. అత్యున్నత స్థాయిలో ఉన్న ఏ పార్టీ అధినేతనైనా తీసుకో. వేల, లక్షల కోట్లను గోడౌన్లలో నగదురూపంలో కట్టలకట్టలను గోనెసంచులో నింపుకు పెట్టుకుని కదూ రాజకీయాలు చేస్తున్నది. కార్పొరేట్‌ సెక్టార్‌లో సిఇవో అన్నా, ఎమ్డీ అన్నా, వైస్‌ ప్రెసిడెంట్‌ అన్నా ఏమిటి.. ఏ జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్ట్‌నైనా కిక్‌బ్యాక్‌లతో స్వంతం చేసుకోవాలని ప్రయత్నించే వెధవకదా. శివుని శిరసుపైనుండి గంగ ప్రవహిస్తూ ప్రవహిస్తూ చివరికి మున్సిపల్‌ మురుక్కాలువలోకి ప్రవహించినట్టు ఈ దిక్కుమాలిన అవినీతి సమాజంలో మున్సిఫల్‌కార్పొరేటరంటే వీధిస్తాయి కాంట్రాక్టరై, ఎమ్మెల్యే అంటే జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి కాంట్రాక్టరై, ఎంపీ అంటే జాతీయస్థాయి కాంట్రాక్టరై, మంత్రులందరూ అంతర్జాతీయ స్థాయి బ్రోకర్లయి, దళారులై, ముఖ్యమంత్రులు మధుకోడాలుగా నేరచరితులై.. ప్రభుత్వ యంత్రాంగమంతా చిలుంపట్టి, భ్రష్టుపట్టి, ఒక కార్పొరేషన్‌ వర్క్‌ ఇన్‌స్పెక్ష్టర్‌పై ఎసిబి దాడిచేస్తే కనీసం ఇరవై కోట్లు బయటపడే స్థితి, జాయింట్‌ కలెక్టరైతే కనీసం వందకోట్లు, ఐఏఎస్‌ అయితే వందలకోట్లు.. ఏమిటి.. ఏమిటదిది.. ప్రజలైతే ఇంకా నీచంగా పతనమై తమను తాము అమ్ముకునే స్థితిలో చచ్చిపోతున్నారు. ఉచితంగా యిస్తే పేడను కూడా తినే తత్వాన్ని అలవర్చుకుంటున్నారు. ఓట్లకోసం ఈ దిక్కుమాలిన రాజకీయనాయకులు ఉచితంగా కలర్‌ టి.విలు యిస్తే తీసుకుంటారు. విస్కీ సీసాలు తీసుకుంటారు. నగదు బదిలీ ప్రలోభాలు కలిగిస్తే తలలూపుతారు. ఉచిత కరెంటు,  ఉచిత బియ్యం, ఉచిత విద్య, ఉచిత్య ఆరోగ్యం, ఉచిత బట్టలు, ఉచిత ఆహారం, ఉచిత మోటార్‌ సైకిల్‌. ఉచిత పెళ్లాం, ఉచిత మొగుడు..నీయమ్మ…ఈ ఉచితాలు ఎక్కడ్నుండిస్తావ్‌రా వెధవా అన్నీ నీస్వంత ఆస్తుల్లోంచి యివ్వరా చవటా అని ఏ ఒక్కడైనా ఎవెర్నైనా నిలదీసి ప్రశ్నిస్తున్నారా. నలభై రూపాయలకు కిలో బియ్యం అమ్ముతున్న మార్కెట్‌నుండి రెండ్రూపాయలకు కిలో బియ్యం అసలెలా పుడ్తాయి. ఇవి జన సంక్షేమ పథకాలా, జన సంక్షామ పథకాలా..ఎవరి డబ్బును దోచి ఎవరు ఎవరికి పెడ్తున్నారు. ఎవరు ఎవరిని మభ్యపెట్టి మాయచేసి నిద్రపుచ్చుతున్నారు. పౌరులను అత్యుత్తమ బాధ్యతలతో కూడిన సామాజిక కార్యకర్తలుగా తీర్చిదిద్దవలసిన ప్రభుత్వాలు నిస్సిగ్గుగా ప్రజాకర్షక పథకాలతో జనాన్ని సోమరిపోతులుగా, బిచ్చగాళ్లుగా, పరాన్నభుక్కులుగా మారుస్తూంటే ప్రశ్నించే ఒక్క మేధావైనా ఈ దేశంలో ఉన్నాడా. ఎన్నికల్లో సూటిగా ‘నగదు బదిలీ’ ..అంటే నేరుగా డబ్బునే లంచంగా యిస్తా ఓటర్లకు అని ఒక నాయకుడు ప్రణాళికగా ప్రకటిస్తే దాన్ని ఒక ఆర్థిక శాస్త్రవేత్త భలే భేషయిన ఆలోచనగా ప్రశంసించి పరమ కుచమర్థన స్థాయిలో  శ్లాఘిస్తే..అసలీ దేశం, ఈ వ్యవస్థ ఏమైపోతోంది. ఎక్కడికి పోతోంది. ఎట్నుండి ఏదిశలోకి ప్రయాణిస్తోంది.
దేశానికి వెన్నెముకవంటి యువత ఈ దేశంలో ఏ కార్యకలాపాల్లో మునిగి ఉందో చెప్పు రామం. ఏ స్థాయి యువతీ యువకుణ్ణయినా తీస్కో..చేతిలో సెల్‌ఫోన్‌, చేయిచాచితే బూతు వెబ్‌సైట్లతో విరాజిల్లే ఇంటర్నేెట్‌, టి.వి. ఆన్‌ చేయగానే ఒక సముద్ర కెరటంలా పైనబడే బూతురోత, దిక్కుమాలిన కుక్కలకొట్లాటవంటి ‘మేధావుల’ చర్చలు, అడ్డూ ఐపూలేని అవసరానికి మించి లెక్కకు మిక్కిలి ఆరువందల ఎనభై ఇంజినీరింగు కాలేజీలు, రెండున్నర లక్షలకు పైగా చెత్తవలె ప్రతి సంవత్సరమూ తయారై ఈ దేశపు రోడ్లమీద వ్యాపించే నాన్‌ ఎంప్లాయబుల్‌ ఫేక్‌ ఇంజనీర్ల కంపు. అసలు పాఠాలే చెప్పని ప్రొఫెషనల్‌ కాలేజీలు, ప్రమాణాలు, నాణ్యత అంటే ఏమిటో తెలియని విద్యాబోధనా పద్ధతులు, వ్యాపార కేంద్రాలుగా మారి విలసిల్లుతున్న విశ్వవిద్యాలయాలు..ఏ ఒక్క యువకునికైనా సమాజస్పృహ, దేశ స్పృహ ఉందా..ఈ దిక్కుమాలిన దుస్థితిని సరిచేద్దామన్న కనీస ఆలోచన ఉందా..”
”నేనూ అదే అంటున్న లీలా..కనీస ఆలోచనైనా ఉందా అని.. నీవంటి ప్రతిభాశీలియైన యువతికైనా దేశంగురించిన కనీస స్పృహ ఉండాలి గదా అని నేనంటున్నా..అందరూ చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే..దీపాన్ని వెలిగించేదెవ్వరు.. నీవంటి జీనియస్‌ కనీసం సమాజం యింత బీభత్సంగా చెడిపోయిఉందని గ్రహించడమే విశేషం..ఐతే దానిని శుభ్రపర్చే మార్గం అన్వేషించి ఏదో ఒక పరిష్కారం కనుక్కొని అమలు చేయకుండా ఊర్కే ఎదుటివాళ్లను విమర్శిస్తూ కూర్చుంటే.. మిగతా వాళ్ళకూ మనకూ తేడా ఏమిటీ అని..”
లీల ఉలిక్కిపడి చూచింది రామంవైపు.
”నాకు ఈ వ్యవస్థమీద కసిగా ఉంది రామం”
”కాబట్టి..”
” ఈ అసమర్థ పాలకులు, అవ్యవస్థితమైన వర్తమానం, కొద్దిగా తెలివీ, నీతిహీనతా, ఎక్కువ ధైర్యం ఉన్న ఎవరైనా రాక్షసంగా ఎదిగి ఎదిగి విజృంభించగల ఈ ప్రస్తుతస్థితిలో ఒకసారి కసిగా ఈ వ్యవస్థలో ఆడుకుని నన్నునేను పరీక్షించుకోవాలనుకుంటున్నా..లైకె ఎ గేమ్‌ ఐ వుడ్‌ లైక్‌ టు మేక్‌ ది లైఫ్‌ ఎ ఛాలెంజింగు టాస్క్‌ అండ్‌ ఎంజాయ్‌”
”ఊఁ.. చివరికి ఏం సాధిస్తావ్‌..”

”ఆ ప్రశ్నే అనవసరం..ఆనందించడమే జీవితం..అందరూ పైశాచికమైన చర్య ప్రతిచర్యలతోనే ఆనందిస్తున్నారీ ప్రపంచంలో. ఇరాక్‌పై దాడిచేయం బుష్‌కు ఆనందం..ప్రజలను వెధవలను చేసి కోట్లు కోట్లను సంపాదించి ప్రపంచంనిండా బ్రాంచీలతో ఎదగడం, పైగా నీతులను, బోధనలనూ కొనసాగించడం భారతదేశపు ఏమతానికి చెందిన స్వామికైనా ఆనందం, ప్రజలపై డబ్బును కుమ్మరించి.. బిచ్చగాళ్ళ గుంపుపైకి కరెన్సీ నోట్లను ఎగజల్లి ఏరుకుంటూ వాళ్ళు కొట్టుకుని చస్తూంటే సంతోషించడం ఈ రాజకీయ నాయకులకు ఆనందం. కార్పొరేట్‌ ప్రపచంలో అంతులేని డబ్బును ప్రోగుచేసుకుంటూ  ఫోర్బెస్‌ జాబితాలోకి దూసుకుపోవాలనుకోవడం ఇంకొందరికి ఆనందం..ఎవని ఆనందాన్ని ఎవడు నిర్వచించగలడు. ఎవని ఆనందాతిరేకాలు తప్పని ఎవరిని ఎవడు నిరోధించగలడు. నో థియరీ ఫిట్స్‌ టు ద సిస్టమ్‌..”
”కుళ్ళిపోయి, భ్రష్టుపట్టిపోయి..తెలివైన సామాజిక స్పృహ ఉన్న మనవంటి యువతనుండి ఏదో ఒక చికిత్సను కోరుతున్న వర్తమాన భారతదేశస్థితిని నువ్వు చూస్తున్న దిశ లోపభూయిష్టంగా ఉంది.లీలా”
”కావచ్చు..మూడువేలకోట్ల రూపాయల స్కామ్‌లో కోర్టులో సాక్ష్యంచెబ్తూ హర్షద్‌మెహతా ఏమన్నాడో తెలుసా రామం.. నేను అంతా భారతదేశ సెబీ నిర్దేశించిన రూల్స్‌ ప్రకారమే చేశాను..తప్పేదైనా ఉందీ అంటే అది లోపభూయిష్టమైన మీ దిక్కుమాలిన రూల్స్‌లో ఉన్నాయి. దమ్ముంటే మీ రూల్స్‌ను సరిచేసుకుని సవరించుకోండి. లేకుంటే ఆ కుళ్ళులోనే కుళ్లిచావండీ అన్నాడు.. మొన్న వేలకోట్ల రూపాయల స్టాంప్‌పేపర్ల కుంభకోణంలో తెల్గీ కూడా అదే అన్నాడు..ఎక్కడని ఈ వ్యవస్థను రిపేర్‌ చేస్తావు రామం. దిస్‌ సిస్టమ్‌ ఈజ్‌ ఇర్రిపేరబుల్‌. దీని సర్వాంగాలూ కుళ్లిపోయినై..”
”అందుకే. మరమ్మత్తుకు లొంగనపుడు, సాధ్యంకానపుడు మొత్తం వ్యవస్థనే మార్చాలి. ధ్వంసానంతర పునర్నిర్మాణం జరగాలి.”
”కదా.. అందుకే ఈ వ్యవస్థయొక్క సంపూర్ణ ధ్వంసానికి నేను ఉపక్రమిస్తున్నా..తదనంతర పునర్నిర్మాణం నువ్వు చెయ్‌” అంది లీల స్పష్టంగా..నిశ్చలం.
అప్పుడు..ఆ రోజు కూడా భీకరమైన వర్షమే..ఈ చర్చ..ఒక సాయంకాలం రిహోబోత్‌ బీచ్‌ స్టార్‌బక్‌ కాఫీ షాప్‌లో జరిగింది. ఎదురుగా..లోపలికి చొచ్చుకొచ్చిన అట్లాంటిక్‌ మహాసముద్రం..ఒక ఎడతెగని నిరంతర తరంగ ఘోష మధ్య.
మొత్తంమీద లీల గురించి తనకు తెలిసిన మూడేళ్ళలో అర్థమైందేమిటంటే, ఆమె అసాధారణ ప్రతిభాశీలి. మృదు హృదయిని. సున్నిత మనస్కురాలు..కాని కఠిన క్రమశిక్షణతో కఠోర పరిశ్రమ చేసే తత్వం గలది. కొన్ని నిర్ణయాలను నిర్దయగా తీసుకుంటుంది. ప్రేమ అనే పదం ఆమెలో లేదేమో అన్నంత అతి తక్కువ మోతాదులో ఉంది. సంగీతాన్ని  యిష్టపడ్తుంది. తాత్విక స్పందనలుంటాయి. ఐతే ఎందుకో అలెగ్జాండర్‌లో ఉన్నట్టు ఈ సమస్త ప్రపంచాన్ని జయించాలన్నంత బలమైన ఉత్తీర్ణతాకాంక్ష ఉందామెలో. ఆమెది సున్నితమైన మల్లెపరిమళంవంటి అందం. సంభాషణ అర్ధవంతమైన ఆకాశంలా గంభీరమైంది.
”నాకో సంశయముంది రామం” అందొక సందర్భంలో ఆరోజే..అట్లాంటిక్‌ సముద్రం ముందు.
ఇద్దరూ ఇసుకలో నడుస్తున్నారప్పుడు..అలల రొద నడుమ.
రామం మౌనంగానే ఆమెవైపు చూశాడు.
”నేను నాకు తెలియకుండానే నిన్ను ప్రేమిస్తున్నానేమోనని..”యథాలాపంగానే కాని లోలోతుల్నుండి వస్తోందామాట.
”…..”
”చాలా జాగ్రత్తగా నన్ను నేను విశ్లేషించి చూచుకుంటే.. నువ్వు కొంతవరకు నాలో విస్తరించి ఇప్పటికే అల్లుకుపోయావని కూడా అనిపిస్తోంది.”
”…..”
”నీకేమనిపిస్తోంది”
”నిజానికి నాలో ఏ భావమూ లేదు లీలా..నా మనసంతా ఈ సహజమైన శారీరక స్పందలనకతీతంగా ఒక యుద్ధం ఆవరించి ఉంది. వ్యక్తి కంటే వ్యవస్థ, వ్యవస్థ కంటే మానవ సమూహం, మానవ సమిష్టి కంటే దేశం, దేశంకంటే విలువలతో కూడుకున్న ఆత్మ ఉన్నతి.. యివే అతి ప్రధానమై నానిండా ఒక సముద్రమై గర్జిస్తున్నాయి. సముద్రమంటే ఒట్టి నీరు.. ఒక్కోసారి మౌనమై, ఒక్కోసారి ప్రళయమై, అగ్నిపర్వతాలనుకూడా తన గర్భంలో దాచుకుని నిర్మలంగానవ్వే నీరు.. నాలో ఏదో నిర్గుణాత్మకమైన రాహిత్యత ఉంది లీలా..”
”…..” లీల మాట్లాడలేదు. కోటి ప్రశ్నలను, అర్ధింపులను నింపుకున్న చూపులతో చూచింది రామం వంక.
ఆ క్షణం అతనికి ఆమెపట్ల మమకారం నిండిన ‘ఈమె కావాలి’ అన్న భావం బలంగా కల్గింది.. వెంటనే ఆమె చేతినితన చేతిలోకి తీసుకుని మృదువుగా నిమిరాడు.
లీల పులకించిపోయింది.
కొద్దిసేపు అలాగే ఇద్దరూ నడచి..నడుస్తూనే..మౌనమై..కోటి సంభాషణలై..శతకోటి ఉద్వేగాలై.,
”నేను రేపు నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను రామం..నన్ను నేను విజేతగా మల్చుకునేందుకు ప్రయోగాత్మకంగా ఈ లోపభూయిష్టమైన వ్యవస్థను నాకనుకూలంగా మలచుకునేందుకు యిక విజృంభించబోతున్నాను. చూస్తా..ఒక వ్యక్తి ఎలా ఒక బలీయమైనా శక్తిగా మారి శాసించగలదో సాధించి ఆత్మపరీక్ష జరుపుకుంటా.. అందుకే నీతో ఈ రోజు ప్రత్యేకంగా కలవాలని ఈ ప్రోగ్రాం..”
”మన యిద్దరి లక్ష్యాలు దాదాపు ఒకేరీతైనవి లీలా..ఐతే నీది దక్షిణ ధుృవమైతే నాది ఉత్తర ధుృవం..నువ్వు ఎన్నుకున్న దారీ, ఎంతో రిస్క్‌తో నిండిన సాహసోపేతమైన సాధన..అంతా గొప్పదే ఐనా లక్ష్యం ఋణాత్మకమైంది. నా దారీ నీ దారే ఐనా.. నా గమ్యం నిర్మాణాత్మకమైంది..”
”కావచ్చు..కాని..”లీల..ఒట్టిగానే నడిచింది వెంట..చాలాసేపు..ఏమీ మాట్లాడకుండా.
తర్వాత.. ఇసుకలోనుండి సముద్రంతో దూరమై..కార్లో పయనించి పయనించి డెలావర్‌..మేరీల్యాండ్‌.. పోర్‌ నైంటీఫైవ్‌ ఇంటర్‌స్టేట్‌..రాక్‌ విల్లీలో దిగిపోయింది.
చటుక్కున ఒక తార తెగిపోయింది..,
తర్వాత భారత కార్పొరేట్‌ వ్యవస్థలో, రాజకీయ, ఉన్నత సంపన్న వర్గాల వ్యూహాత్మక వ్యాపార లావాదేవీల్లో, కుతంత్ర రచనల్లో లీల ఒక తిరుగులేని శక్తిగా ఎదగడం, విస్తరిల్లడం రామంకు తెలుస్తూనే ఉంది ఎప్పటికప్పుడు.
ఉండి ఉండి.. ఏ దేశంనుండో చటుక్కున ఏ రాత్రో, పగలో అకస్మాత్తుగా ఫోన్‌ చేస్తుంది లీల. నాల్గయిదు వాక్యాలు, లోలోపల గుప్తమైఉన్న ఆత్మ మాట్లాడ్తున్నట్టు వర్షమై కురుస్తుంది. అప్పుడప్పుడు అనూహ్యంగా అమెరికాలో కళ్ళముందు ప్రత్యక్షమౌతుంది. ఒక మెరుపులా వచ్చి మరుక్షణం మాయమైనట్టు నిష్క్రమిస్తుంది.
మొత్తంమీద ఆమె మనసులో మాసిపోని ఓ ముద్రయి తనున్నాడు..ఉంటాడు..శాశ్వతంగా. ఆ విషయం తనకు తెలుసు.
ఐతే ఇటువంటి ఆత్మానుగత అంతస్సంబంధాన్ని ఏమంటారు.
వర్షం కురుస్తూనే ఉంది..చినుకులు ఎక్కువై, చిక్కనై..బయటా..అప్పట్నుండి లోపలా.,
కారును పార్కింగు ఏరియాలో ఆపి, పక్కనే ఉన్న గొడుగును తీసుకుని..దిగి..చీకటి అలుముకుంది అప్పటికే.. చుట్టూ అనేక దుకాణాలు..వందల కార్లు..వాల్‌మార్ట్‌, హోమ్‌ డిపో, రైట్‌ ఎయిడ్‌, పెట్‌మార్ట్‌, కోల్స్‌, బార్నెస్‌ అండ్‌ నోబుల్స్‌,
‘చాలా సేపే ఐంది – క్యాథీ ఎదురుచూస్తూంటుంది.’ అనుకుంటూ రామం వర్షంలో వడివడిగా అడుగులు వేసుకుంటూ.,
క్యాథీకి తనకూ నడుమ ఇప్పుడు జరుగబోయేది అతీ కీలక సమావేశం. రెండు జీవితాలకూ, రెండు అసమాన ప్రతిభా విశేషాలు ఒకటిగా సంధానమై ఒక నిర్ణయాత్మక శక్తిగా రూపొందడానికి ప్రాతిపదిక ఏర్పడే.. తమకు సంబంధించినంత వరకు ఓ అతి ప్రధాన సందర్భం..అందుకే క్యాథీని అవసరమైతే నాల్గయిదు గంటలసేపు విపులంగా చర్చించుకుని నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా సిద్ధపడి రమ్మని చెప్పాడు రామం.
అతని మనసు నిజంగా వర్షం కురుస్తున్న రాత్రివలెనే చిత్రంగా, గంభీరంగా ఉంది.
చటుక్కున ఒక జ్ఞాపకం రామం హృదయంలో పిడుగై కురిసింది.

(సశేషం)

యూరపు వరకూ ఆర్యావర్తమే!

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 

మళ్ళీ నేనిప్పుడు ఓ పెద్ద చిక్కులో పడిపోయాను…!!

తెలియకుండానే రాంభట్ల పురాచరిత్రాధ్యయనం అనే అఖాతంలోకి అడుగుపెట్టేశాను. దీనినుంచి ఎలా గట్టెక్కాలన్నది ఈ క్షణాన నా ముందు వేలాడుతున్న ప్రశ్న. ఎలాగూ మునిగాను కనుక ఇంకా లోపలికి వెళ్లిపోతే ఎప్పటికి ఒడ్డు చేరతానో నాకే తెలియదు. ఇందుకు బహుశా మరో ఇరవై వ్యాసాల వ్యవధి పడుతుందని నా అంచనా. అది కూడా ప్రాథమిక అంచనా మాత్రమే. కానీ నేను గత తొమ్మిది వ్యాసాలుగా యయాతి-దేవయాని-శర్మిష్టల కథ గురించి రాస్తున్నాను. ముందుగా ఆ కథను గట్టెక్కించవలసిన బాధ్యత నాకుంది.

విషయంలోకి వెడుతూనే  ఆ కథతో పాటు నన్ను నేను గట్టెక్కించుకునే ఉపాయాలను వెతుక్కోవడం తప్ప గత్యంతరం కనిపించడం లేదు…

అయితే, ఇంతటి చిక్కులోనూ నాకు అమితమైన సంతృప్తినీ, సంతోషాన్నీ కలిగించే అంశం ఒకటుంది. అది, రాంభట్ల కృష్ణమూర్తిగారి అధ్యయనం గురించి రాయడం! దశాబ్ద కాలం క్రితం కన్ను మూసిన ఆయన గురించి ఇప్పుడు ఎంతమంది తలచుకుంటున్నారో నాకు తెలియదు. పత్రికా రచయితగా, వ్యంగ్యచిత్రకారుడిగా ఆయన ప్రస్తావన ఎక్కడైనా వస్తూ ఉండచ్చు. కానీ ఆయనకు అత్యంత ఇష్టమైనదీ, ఆత్మీయమైనదీ అయిన పురాచరిత్ర లేదా పురామానవ చరిత్రాన్వేషణ గురించి ఎవరూ మాట్లాడుకుంటున్నట్టు లేదు. అదాయన ఒక తపస్సుగా సాగించిన ఓ కృతజ్ఞతారహిత (thankless) వ్యాసంగం. ‘నేను మాత్రమే’ దాని గురించి రాస్తుండడం నా సంతృప్తికీ, సంతోషానికీ కారణం.  ఇలా ‘నేను మాత్రమే’ ననుకోవడంలో కొంత అజ్ఞానమూ ఉంటే ఉండచ్చు. అందుకు మన్నించాలి. ఇప్పుడాలోచిస్తే, నాలాంటి ఒకరినో, పదిమందినో పాఠకులను సృష్టించుకున్న ఆయన తపస్సు వృథా కాలేదనీ అనిపిస్తుంది. ఒక గొప్ప తపః ఫలితమైన ఒక సృష్టి కాలం వెంబడి తన అస్తిత్వాన్ని పొడిగించుకోడానికి ఆయా కాలాలలో ఒక్క పాఠకుడు ఉంటే చాలదా అనిపిస్తుంది.

ప్రస్తుతానికి వస్తే…

పశ్చిమాసియా రంగస్థలమే భారతదేశానికి మారినట్టు రాంభట్ల గారి పరిశీలన వెల్లడిస్తుందని కిందటి వ్యాసంలో చెప్పుకున్నాం.  వైదికార్యులకూ, అసురులకూ మధ్య మొదలైన వైరం కూడా అందులో భాగం. ఇంతకీ ఆ వైరం ఎందుకు సంభవించింది అంటే, వారి ఆహారపు అలవాట్లలోనూ, ఆహారోత్పాదన పద్ధతుల్లోనూ ఉన్న తేడాల వల్ల. అది  మనుగడకు సంబంధించిన  పెనుగులాట.

ఎలాగంటే,  అసురులు వ్యవసాయదారులు. అలాగని వారు పూర్తిగా శాకాహారులు కాదు, మాంసమూ తింటారు. ఆవిధంగా వారు మిశ్రాన్న భోక్తలు.  వైదికార్యులు సంచారజీవనులైన  పశుపాలకులు. వారి ప్రధానాహారం పశుమాంసం. పశుమాంస భక్షణం వల్ల, పాలు, వెన్నల వల్ల వారు నిజానికి రాక్షసుల కంటే బలిష్ఠులు. వ్యవసాయదారులకు ఆహారాన్ని పండించే పంట పొలాలు, వైదికార్యుల దృష్టిలో ప్రధానంగా తమ పశుగణాలకు ఆహారాన్ని అందించే పచ్చిక పొలాలు మాత్రమే. వారు తమ ఆలమందలను పంట పొలాల మీదికి తోలేసరికి అసురులు సహజంగానే వారిని ప్రతిఘటిస్తారు. ఆవిధంగా మొదలైంది వారి మధ్య శత్రుత్వం.

అయితే, వైదికార్యులు సంచారజీవులు కనుక వారికీ, అసురులకూ మధ్య యుద్ధాలలో కూడా కొంత విరామం ఉంటుంది. సంచారజీవనం వల్ల అసుర భూమి కన్నా ఆర్యభూమి చాలా విశాలంగా కూడా ఉంటుంది. మైదానాలలో గడ్డి పుష్కలంగా దొరకడం వల్ల మందలు త్వర త్వరగా పెరిగాయి. అప్పటికి ఆర్యులు యూరప్ లో ఉన్నారు. అక్కడ మూడే కాలాలు: శరత్, హేమంత, వసంత కాలాలు. ‘నూరు శరత్తులు, నూరు హేమంతాలు, నూరు వసంతాలు జీవించు’ అని నేటికీ వైదికాశీర్వచనం. శరత్కాలం చివరిలో భూహిమం ప్రారంభమవుతుంది. భూహిమాన్ని ‘ground frost’ అన్నారు. అప్పుడు పచ్చగడ్డి మాడినట్లు అయిపోతుంది. దాంతో ఆర్యులు ఆలమందలను తోలుకుని సమీపంలోని అరణ్యాలకు వలసపోతారు. అక్కడ చర్మంతో కుటీరాలు నిర్మించుకుని ఉంటారు. ఆలమందల రక్షణ కోసం ఒక వసతీకీ, ఇంకొక వసతికీ మధ్య కొంత నిర్జనారణ్యాన్ని విడిచిపెడతారు. ఆ దశలోనే త్రేతాగ్నులు అవతరించాయి. వాటి గురించి మరెప్పుడైనా చెప్పుకుందాం.

వసంతాగమనంతోనే వైదికార్యుల నిర్బంధ అరణ్యవాసం ముగుస్తుంది. వారు యధాప్రకారం ఆలమందలను తోలుకుని నదీ మైదానాలకు తిరిగివస్తారు. అప్పటికి మైదానాల రూపం మారిపోతుంది. వ్యవసాయం పెరటి నుంచి పొలాలకు పాకుతుంది. అక్కడక్కడ కూరాకులు, కూరగాయ పాదులు పచ్చపచ్చగా ఎదిగివస్తాయి. ఆ దృశ్యం వైదికార్యులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. తమ మందలను పొలాల మీదికి తోలతారు. అలా వ్యవసాయదారులతో వారి ఘర్షణ ప్రారంభమవుతుంది.

aurora-borealis-by-ship-2-thomas-kolendra

అదలా ఉండగా, మధ్య ఆసియాలో రష్యా, అజర్బైజాన్, ఇరాన్, కజక్ స్తాన్, తుర్క్ మెనిస్తాన్ లను ఆనుకుని ప్రపంచంలోనే అతి పెద్దదైన ఒక జలాశయం ఉంది. అది ఎంత పెద్ద దంటే, దానిని సముద్రంగానే చెప్పుకున్నారు. అదే- కాస్పియన్ సీ. దీనిని మన పూర్వులు కాశ్యపీ సముద్రం అన్నారు. ఆ పేరునుబట్టి ఆ జలాశయం పరిసర ప్రాంతాన్ని కూడా కాశ్యపి అంటూ వచ్చారు. కాశ్యపి అన్నా భూమే. విశేషమేమిటంటే, కాశ్యపి ఒకప్పుడు  యూరోపియన్లు, నిగ్రాయిడ్లు, మంగోలాయిడ్లు వంటి అనేక జాతులవారికి, భాషల వారికి ఆవాసం. ఆనాడు జాతులంటే వర్ణాలే. యూరోపియన్లది తెలుపు రంగు, నిగ్రాయిడ్లది నలుపు రంగు, మంగోలాయిడ్లది పసుపు రంగు. సంస్కృతం తోబుట్టువులైన ఇండో-యూరోపియన్ భాషలు; మ్లేచ్ఛ భాషలైన హిబ్రూ, అరబ్బీ, అరమాయిక్, ఆగద, అసుర, ఈజిప్టు భాషలు; చీనా, జపాన్, మంగోలు, కాకస పర్వత భాషలు మాట్లాడేవారు కాశ్యపిలో ఉండేవారని రాంభట్ల ‘జనకథ’లో అంటారు. అందుకే ఈ మూడు రకాల భాషల్లోనూ కొన్ని సామాన్య పదాలు కనిపిస్తాయి. ఉదాహరణకు, భూమిని అరబ్బులు ‘అర్దున్’ అంటారు. జెర్మన్లు ‘ఎర్దీ’ అంటారు. ఇంగ్లీష్ వారు ‘ఎర్త్’ అంటారు. వేదభాష ‘రజ’ అంది.

 

అదలా ఉంచితే, పశ్చిమ పండితుల ప్రకారం ‘కస్’ అనే ధాతువునుంచి కశ్యప శబ్దం పుట్టింది. ఆ ధాతువునుంచే ఇంకా మరికొన్ని మాటలు పుట్టాయి. వాటిలో ‘కుశ’ ఒకటి. వైదికార్యులకు కుశ చాలా పవిత్రమైనది. దానికే ‘దర్భ’అనీ, ‘బర్హిస్సు’ అనీ పేర్లు. ఇంకా విశేషంగా, కస్ ధాతువునుంచే తెలుగు మాట అయిన ‘కసవు’ పుట్టిందని రాంభట్ల అంటారు. గడ్డి అనే అర్థం కలిగిన ‘పులు’, ‘పూరి’  కసవుకు సమానార్థకాలు. ఇవి పుష్కలంగా ఉన్న కాశ్యపిలోనే పశుపాలన పెరిగి పెద్దదై ఉంటుందని రాంభట్ల  ఊహ.  క్రమంగా కాశ్యపిలో స్థిర నివాసం ఉండగల అవకాశం లోపించడంతో కాశ్యపీజనం కొత్త భూముల్ని వెతుక్కుంటూ వలసపోయారు. ఆ వలసల్లో కొన్ని పశ్చిమాసియాలో చరిత్రను సృష్టించాయి.

మనం ఇంతకుముందు ఒక వ్యాసంలో కశ్యప ప్రజాపతి గురించి చెప్పుకున్నాం. దేవతలు, దైత్యులు, దానవులు ఆయన సంతానమే నని కూడా చెప్పుకున్నాం. కశ్యపుని పేరు కాశ్యపిని తలపిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూర్వదేవులు అనే పేరు కూడా ఉన్న దైత్యదానవులే అసురులు. పశుపాలక దేవులైన వైదికార్యులకూ, ఈ అసురులకూ మధ్య యుద్ధాలు కాశ్యపిలోనే ప్రారంభమయ్యాయి. బలవంతులైన వైదికార్యులు యుద్ధాలలో పై చేయిని చాటుకుని అసురులను పశ్చిమాసియా ఆవలలోకి తరిమేసి ఉంటారని రాంభట్ల ఊహ.

ఆవలు అంటే చిత్తడి నేలలు. ఆ నేలల్లో దోమలు, తేళ్ళ బాధ ఎక్కువ. ఒకప్పుడు నైలు, యూఫ్రటిస్, టైగ్రిస్(ఈ రెండు నదులనూ సంస్కృతంలో వరుణ, తిగృథ అన్నారు) నదీ ముఖద్వారాలు ఆవలుగా ఉండేవి. అసురులు కాందిశీకులుగా ఈ ఆవలకు వలసవచ్చారు. అక్కడి దోమలు, తేళ్ళ బాధను సహిస్తూ వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు. ఆ ఆవల్లో రకరకాల తుంగ మొలిచేది. ఆ తుంగ ముస్తల కోసం వరాహాలు వచ్చి నీటిని ఓడ్చి పొడి భూమిని పైకి తేల్చేవి. ఆవిధంగా, నేల దున్ని సాగించే వ్యవసాయానికి వరాహాలు ఆదిగురువులయ్యాయి. ఆవల్లో చేపలు కూడా పుష్కలంగా దొరికేవి. అడవి పందులు, జలపక్షుల మాంసం దొరికేది. ఈ అన్న పుష్కలత్వం వల్ల, అది కలిగించిన స్థిరతవల్ల ఇక్కడికి వలస వచ్చిన జనం గొప్ప సంస్కృతిని నిర్మించారు.  నైలు నది ఆవలలోని జనం ఈజిప్టు(ఐగుప్త) సంస్కృతినీ, మేరువులనూ సృష్టిస్తే; మెసపొటేమియాగా పిలవబడిన యూఫ్రటిస్, టైగ్రిస్ నదుల ఆవల్లోని జనం సుమేరు సంస్కృతిని సృష్టించారు. మన పురాణాలలోని వరాహావతార, మత్స్యావతార కథలకు ఈ ఆవలే ఆధారమని రాంభట్ల అంటారు. ఇనుము కరిగించడం నేర్చింది కూడా ఈ పశ్చిమాసియా లంక జనమే నని ఆయన అంటారు. పశ్చిమాసియా ఆవలలో పదివేల ఏళ్లక్రితం ‘సుబరు’ లనే గొప్ప సంస్కారులు ఉండేవారని, వారే ‘శంబరు’లు అయుంటారనీ ఆయన అభిప్రాయం. పశ్చిమాసియాలో శంబరుల చారిత్రక పాత్ర చాలా ఉంది. అక్కడ వారు మారి, అస్సూరు, నినవే అనే నగరాలను నిర్మించి రాజ్యాలు చేశారు. మన పురాణాలలో శంబరుడు ఒక అసురుడు, మన్మథుడికి శంబరారి అనే బిరుదు ఉంది. పశ్చిమాసియా నుంచి  శంబరులు భారతదేశానికి వచ్చినట్లు దాఖలాలు ఉన్నాయి.

 

పశుపాలకులకు, వ్యవసాయదారులకు మధ్య యుద్ధాలు కాశ్యపి పరిసరాలలోనే కాక ఆఫ్రికా ఖండంలో కూడా జరిగాయి. ఆ వివరాలు అన్నిటిలోకీ వెడితే ఇప్పట్లో పైకి తేలడం కష్టం.  అదలా ఉంచితే, రాంభట్ల గారి పరిశీలనలు పశుపాలన, వ్యవసాయాల మధ్య శత్రుత్వాన్నే కాక; పశుపాలననుంచి వ్యవసాయానికి  జనం పెద్ద ఎత్తున మళ్లిన క్రమాన్నీ; వ్యవసాయం వల్ల ఏర్పడిన స్థిరజీవనాన్నీ, స్థిరజీవనం నుంచి రాజ్యమూ, సంస్కృతీ పుట్టిన విధానాన్నీ చర్చలోకి తీసుకొస్తున్నాయి. ఈ పరిణామక్రమం మన పురాణ ఇతిహాసాలలోనే కాక ప్రపంచ పురాణ ఇతిహాసాలలో కూడా ప్రతిఫలించింది.  అంతేకాదు, ఈ క్రమంలోనే మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి; గణదశనుంచి జనదశకు మళ్ళడంవంటి అనేకానేక పరిణామాలు  సంభవించాయి. రాంభట్లతో పాటు, లూయీ హెన్రీ మోర్గాన్, జార్జి థామ్సన్, జోసఫ్ క్యాంప్ బెల్ తదితర దిగ్దంతుల పరిశీలనలను కూడా కలుపుకుని చెప్పుకోవలసిన మహత్తర విషయాలు ఇవన్నీ. అవకాశాన్ని బట్టి ముందు ముందు వాటి లోతుల్లోకి వెళ్లచ్చు.

Rambatla Krishna Murthyఅంతకంటే విశేషంగా రాంభట్ల పరిశీలనలు, ఆర్యావర్తం గురించిన మన భావనలను మనదేశం నుంచి సుదూర పశ్చిమానికి పొడిగిస్తున్నాయి. యూరప్, మధ్య ఆసియా, పశ్చిమాసియాలను కూడా ఆర్యావర్తంలోకి తీసుకొస్తున్నాయి. వేదాలలో ఉన్న పురా చరిత్రను, పురా మానవ పరిణామ చరిత్రను పుష్కలంగా తవ్విపోస్తున్నాయి. రాంభట్ల ప్రకారం, మన పురాణాలలోని కొన్ని కథలు, పాత్రల మూలాలు భారతదేశం వెలుపల ఉన్నాయి. యయాతి కథ గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. సుకన్య-చ్యవనుల కథ, అశ్వనీ దేవతల ఉదంతం మరో రెండు ఉదాహరణలు. తెలుగువారమైన మనకు ప్రత్యేకించి ఆసక్తి గొలిపే విషయం ఏమిటంటే,  రాంభట్ల పరిశీలనలు మన సంబంధాలను మెసపొటేమియాలోని సుమేరుకు తీసుకువెడుతున్నాయి.

భారతదేశంలోని సప్తసింధు ప్రాంతానికి రావడానికి ముందు వైదికార్యులు ఉత్తర ధ్రువాన్ని, యూరప్ ఖండాన్ని, కాశ్యపిని, పశ్చిమాసియాను చుట్టబెట్టి వచ్చారని రాంభట్ల గారు మాత్రమే అనడంలేదు. ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధుడు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ కూడా వేదరుషులకు ఉత్తరధ్రువం తెలుసుననీ, దీర్ఘ హేమంత నిశాంతంలో ఆరోరా బొరియాలిస్ ను చూసినవారు తప్ప ఎంతటి భావుకులైనా వేదాలలోని ఉషోసూక్తులను చెప్పడం కష్టమనీ అన్నట్టు రాంభట్ల ఉటంకిస్తారు. ఆ దృశ్యం ఎలా ఉంటుందంటే, తూరుపు దిక్కున కొన్ని రోజులపాటు రంగులు నాట్యమాడతాయి. ఆ తర్వాత కాంతిమంతమైన ఆకుపచ్చరంగు ఆకాశమంతా అలముకుంటుంది. ఈ ఆకుపచ్చరంగు క్రమంగా తగ్గిన తర్వాత ఎర్రని బింబం వస్తుంది. ఈ ఆకుపచ్చని రంగును సూర్యుని గుర్రాలు అన్నారు వేదరుషులు. ఆ గుర్రాలకు హరిదశ్వాలని పేరు. ఆ తర్వాత కనిపించే ఎర్రని బింబం సూర్యసారథి అరుణుడు. ఆ తర్వాత అసలు సూర్యబింబం దర్శనమిస్తుంది. ఈ అందమైన వర్ణన ప్రత్యక్షంగా చూసినవారు, వారి నోట విన్నవారు తప్ప మరొకరు చేయలేరని తిలక్ పండితుడు అంటాడు. అరుణుడు అనే మాట వర్ణవ్యత్యయం వల్ల పౌరాణికుల నోట అనూరుడు అయింది. దాంతో దానికో కథ పుట్టింది. అనూరుడు అంటే తొడలు లేనివాడు అనే అర్థం చెప్పారు.

రాంభట్ల ‘వేదభూమి’లో రాసిన వాక్యాలనే ఉటంకించుకుంటే; వైదికార్యులు గుర్రాలు, రథాలు ఎక్కి ఆలమందలను తోలుకుంటూ కైబర్, బొలాన్ కనుమల గుండా సప్తసింధు ప్రాంతానికి చేరారు. కైబర్, బొలాన్ కనుమల గుండా వచ్చినప్పుడు ఆ ప్రాంత జనం అయిన ఫక్తులు, బొలాన్ లు కూడా వారి వెంట సప్తసింధు ప్రాంతానికి వచ్చారని రాహుల్ సాంకృత్యాయన్ అంటాడు. ఋగ్వేద మంత్రాల్లో ఫక్తులు, బొలాన్ ల ప్రస్తావన ఉంది. పాకిస్తాన్, అప్ఘానిస్తాన్ లలోని ఫక్తులు లేక పఠాన్ల గురించి ఇంతకుముందు ఒక వ్యాసంలో చెప్పుకున్నాం. ఇక్కడికి రాకముందునుంచీ వైదికార్యులు  యజ్ఞాలు చేసేవారు కనుక బళ్ళమీద అగ్నిహోత్రాలను కూడా పెట్టుకుని వచ్చారని మార్క్సిస్టు పండితుడు శ్రీపాద అమృత డాంగే అంటాడు…

ఈ చిన్న వ్యాసంతో  రాంభట్లగారికి న్యాయం చేయలేకపోయాయని నాకు తెలుసు. కానీ మొదటే చెప్పినట్టు ఆయన  పురాచారిత్రాధ్యయనం అనే అఖాతంలో నేనిక ఆట్టే లోతుకు వెళ్లలేను. ఇక అత్యవసరంగా పైకి వచ్చేయాలి. యయాతి కథ దగ్గరికి వెళ్ళాలి. వైదికార్యులకు, అసురులకు పశ్చిమాసియాలోనే మొదలైన యుద్ధాలు లేదా సంబంధాలు  భారతదేశానికి బదిలీ అయాయని చెప్పడమే ఈ పరిశీలన అసలు లక్ష్యం. దీని గురించి చరిత్రకారులు ఏమంటున్నారో…తర్వాత…

–కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

పాదం మీది పుట్టుమచ్చ!

druhttps://i0.wp.com/saarangabooks.com/retired/wp-content/uploads/2013/12/drushya-drushyam-13-1024x693.jpg?resize=717%2C485shya drushyam-13

డావిన్సీ చిత్రించిన మోనాలిసా చిరునవ్వు గురించి చాలా చర్చ జరిగింది. ఇంకా జరుగుతుంది కూడా.
కానీ, దైనందిన జీవితంలో చిరునవ్వులతో జీవించే సాదాసీదా మనుషుల గురించి అంత చర్చ జరగదు.
జరగాలనీ లేదు. కానీ, ఈమెనే చూడండి.ఈమె మోనాలిసా కాదు, మేరీమాతా కాదు.
మామూలు మనిషి.
లక్ష్మి!
ఇంతకన్నా మంచిగ చెప్పడం నాకు చేతకావడం లేదు!ఇటువంటి వరలక్ష్ములతో, నడయాడే వారి పాదాలతో మా ఊరూ వాడా గొప్ప సంబురాన్నే పొందుతాయి.
ఆమె తిరుగాడినంత మేరా వాతావరణం పరిశుభ్రం అవుతుంది. ముషీరాబాద్లో మొదలయ్యే ఆమె బంజారాహిల్స్ దాకా నడుస్తుంది. తలపై భారం తీరాక ఆమె మళ్లీ వడివడిగా ఇంటికి చేరుకుంటుంది. అంతదాకా చిరునవ్వే!
ఒక శుభ్రమైన ఆరోగ్యకరమైన ఆత్మీయమైన చాలనం.

+++

తాను మాదగ్గరి మనిషి. మేమంతా ఒకే వీధిలో ఉంటాం.
“చీపుర్లమ్మో…” అనుకుంటూ తిరగాడే ఈ వనిత నిజానికి సంచార జాతికి చెందిన స్త్రీ.
బిబూతీ భూషణుడు రాసిన ‘వనవాసి’ నవల్లో కనబడే ‘నాగరీకమైన’ మనిషి.
ఏదీ దాచుకోకుండా, దేనికీ సంశయించకుండా, మనసులో ఒకటి – మాటలో ఒకటి కాకుండా, నిర్భయంగా సంభాషించే సిసలైన సంస్కారి ఆమె.

+++

తన మోములో తాండవమాడే కళ చూడండి.
ఆమె పెదవులపై విరిసే దరహాసం చూడండి.
ఒద్దికగా ఒంటిని చుట్టుకున్న ఆ కొంగును, అందలి అభిమానం చూడండి.
తలపై దాల్చిన చీపురుకట్టలను, వాటిని సుతిల్ తాడుతో కట్టి ‘దూ’ ముడి వేసిన తీరు చూడండి.

చెంపలకు పసుపు, పచ్చటి రుమాలు, జాతీయ పతాకం వంటి చీరా…
అంతా వర్ణ సంచయం…శోభ.

ఇంకా కేవలం ఆమె…
ఆమెలో గొప్ప ఆత్మవిశ్వాసం….డిగ్నిటీ ఆఫ్ లేబర్…
స్త్రీత్వం, అందులో జనించే ప్రేమాభిమానాలు,
ఆదరణ, సిగ్గూ కలగలసిన హాసం…

కష్టజీవి స్వేదంనుంచి ఇంద్రధనుస్సు విరిసినట్టు అన్నీ కలిసిన ఆమె చిత్రం
నా వరకు నాకు ఈ చిత్రం ఒక అపూర్వమైన కానుక.
మాస్టర్ పీస్.

+++

ఇలాంటివి ఎన్ని చిత్రాలో…

తనను ఇలా వీధుల్లోకి వెళ్లేప్పుడు చూస్తాను. వెళ్లక ముందూ చూస్తాను.
పిల్లలతో ఉంటుంది. వాళ్ల ఆలనా పాలనా చూస్తుంది.
భర్తతో ఉంటుంది. అతడి అవసరాలను చూసుకుంటుంది.
స్నేహితులతో ఉంటుంది. అప్పుడు నవ్వులే నవ్వులు.
విశ్రాంతిగా ఉన్నప్పుడు శిరోజాలు విరబోసుకొని తలకు నూనె పట్టిస్తుంటుంది.
అత్తమ్మతో పేండ్లు చూయించుకుంటూ కూడా కనిపిస్తుంది.

నీళ్లు పడుతున్నప్పుడు, ఏదో పనిమీద కిరాణా దుకాణంలోకి వెళుతున్నప్పుడు,
వాడకట్టులో అకస్మాత్తుగా తప్పిపోయిన పిల్లవాడిని వెతుకుతూ ఉన్నప్పుడు, ఎన్ని చిత్రాలో!
అన్నీ వేటికవే సాటి.

+++

ఇట్లా అనేకానేక ఘడియల్లో ఆమెను, ఆమె వంటి ఎందరినో చూస్తూనే ఉంటాను.
కొన్నిసార్లు కెమెరాతో ఆ ఘడియలను పదిలపరుస్తుంటాను. అదొక అదృష్టం.
బహుశా ఈమెవే నా వద్ద పదిపదహారు అదృష్టాలున్నయి.
ప్రతిదీ దేనికదే సాటి. ఇంత గొప్పవే అవన్నీనూ!

కానీ, దురదృష్టం ఏమంటే, తనను ఇలా మోనాలిసాతోనో మరొకరితోనో పోల్చవలసి వస్తుండటం!
అదొక బలహీనత కాబోలు! నిజమే మరి! మోనాలిసాను తలదన్నే జీవితాలు ప్రధాన స్రవంతి అయ్యేదాకా
ఇట్లా నావలె ఎవరో ఒకరు, ఏదో రకంగా వాపోవడమూ, పోల్చుకోవడమూ బలహీనతే!

అయినా పరవాలేదు. బలహీనతే బలం అనుకొని మరికొందరు అదృష్ట దేవతలను చిత్రీకరిస్తూ ఉంటాను.

+++

నమ్ముతారో లేదోగానీ, ఇట్లా ఈ జనసామాన్యం జీవనచ్ఛాయల్లో తొణికిసలాడే నిండుతనం, తృప్తీ, శాంతి,
వాటితో వర్ధిల్లే చిరునవ్వు…వాటిని ఒడిసి పట్టుకోవడాన్ని మించింది ఇంకేమైనా ఉంటుందా?
వారి నడకలో, నడతలో, బింబప్రతిబింబాల్లో తారాడే ఆ వెలుతురు, దాని నీడన జీవించడాన్ని, జీవనచ్ఛాయను కావడాన్ని మించిన భాగ్యం మరొకటి ఉంటుందా? ముఖ్యంగా నగరంలో రాంనగర్, ముషీరాబాద్ వంటి పరిసరాల్లో జీవించే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి జీవితాలకు ఇలాంటి బతికిన క్షణాలే చిరునవ్వులు!

అయితే, ఒకటి మాత్రం నిజం. ఉన్నతిని పొందేకొలదీ మనుషులు మారతారని కాదు. కానీ, వాళ్ల పోకడ వేరుగా ఉంటుంది. దాంతో ఇంత నిర్మలమైన చిరునవ్వులు చూడటం కష్టమేమో! వాటిని ఒడిసి పట్టుకోవాలనుకునే తాపత్రాయులకూ కొరతేనేమో! ఏమో! అది వేరే వాళ్ల కష్టం!

+++

ఏమైనా ఈ మనిషిని మళ్లీ చూడండి.ఎంత అద్భుతంగా ఉంది.
ఆమె వైభవానికి శీర్షిక పెడితే… ‘చిరునవ్వూ – చీపురు కట్టలూ – రాజరికం’ అనాలేమో!

+++

నిజానికి, ఇలాంటి కష్టజీవులను అందంగా చిత్రీకరించడం తేలిక.
ఎందుకంటే వాళ్ల కీర్తికిరీటాలన్నీ కష్టార్జితం. అది సామూహికం.
కాయకష్టంతో జీవించే వారిలో ఒక వర్ఛస్సు, కళ. అలౌకికత్వం, ఆత్మసౌందర్యం మహత్తరం.
అది కాసులకు లొంగనిది. పేరుప్రఖ్యాతులతో కునారిల్లనిదీనూ.
అందుకే ఈ మహిళ ఒక చూడముచ్చట.

ఆమె ఒక నిరాడంబరమైన కవిత.
మన సోదరి. దీవించండి.

+++

గద్దరన్న రాస్తాడు, “నీ పాదం మీది పుట్టమచ్చనై చెల్లెమ్మా…” అని!.
ఇటువంటి సోదరీమణుల చెంత దినదినం ప్రవర్థమానం అవుతున్న కళ…అది ఎవరిదైనా కానీ…
నిజంగానే అదొక చూడముచ్చట. దాన్ని నలుగురికీ పంచడమే నిజమైన చిరునవ్వు!

కృతజ్ఞతలు.

~ కందుకూరి రమేష్ బాబు

ramesh

గతం

అక్కా! అక్కా!అని అరుచుకుంటూ వచ్చాడు అభినవ్ నా గదిలోకి.

 అప్పుడు సాయంత్రం 5 అయిందినా స్నేహితురాలు  విజయలక్ష్మి  తో ఫోనులో మాట్లాడుతున్నాను.

 ఫోనులో మాట్లాడుతుంటేనేమి? నిద్రపోతుంటేనేమి? నేను పలికిందాకా అక్కా! అక్కా!అని చెవి కోసిన పిట్టల్లాగా అరుస్తూనే ఉంటారు పిల్లలు.

 మాది పెద్ద బోర్డింగ్ స్కూల్మా స్కూల్ లో మూడు వందల యాభై మంది పిల్లలు ఉంటారునేను ఇక్కడ తెలుగు టీచర్ని.  మా స్కూల్లో లేడీ టీచర్స్ ని పిల్లలు అక్కాఅని పిలుస్తారుస్కూల్లో ఇరవై హాస్టల్స్ ఉన్నాయిఒక్కో హాస్టలికీ అనుబంధంగా ఉండే ఇంట్లో ఒక టీచర్ ఉంటారుమా హాస్టల్ లో ఐదు,ఆరు తరగతుల పిల్లలు 18 మంది ఉన్నారు

 ఫోన్లో మాట్లాడుతున్న నేను ఉండమ్మా విజ్జీ లైన్లోఅని విజయలక్ష్మికి  చెప్పి ఏంటి చెప్పు అభీఅన్నాను.

అక్కో! నిన్న మనం హైక్ కి వెళ్ళాం గదా! అప్పుడు పొద్దున్నే డైనింగ్ హాల్ వాళ్ళు దోశలు పొట్లం కట్టిచ్చారు కదా! దోశ తినేదా? భలే ఆకలేస్తుందిఅని అన్నాడు.

 ఫోనులో విజ్జితో సంభాషణ  – లోకంలోని మనుషులు, వారి కోపాలూ, అసూయలూ దగ్గర  మొదలై  రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, ఆత్మ, ధ్యానం దగ్గర ఆగిపోవడంతో రకమైన తాదాత్మ్యంతో ఉన్న నాకు వాడు చెప్పింది సరిగ్గా అర్థం కాక   ” నిన్న తిన్నట్లు దోశ  తినాలని అనిపిస్తుందా? రోజు డిన్నర్ లో ఇవ్వరు కదా! గురువారం బ్రేక్ ఫాస్ట్ లో ఇస్తారులే. తిందువుగానిఅని అన్నాను. రోజు భోజనం పెడతారో మాకు ముందుగానే మెను చార్ట్ ద్వారా తెలుస్తుంది. ( ఇలా తెలియడం వల్ల  జీవితంలో నూతనత్వాని కోల్పోతున్నాం కదా! అనిపిస్తుంటుంది నాకు.)

 ” అది కాదక్కా! నిన్న ప్యాకెట్టు మొత్తం తినలేదుమిగిలినది బ్యాక్ పాక్ లో పెట్టుకున్నా. అది ఇప్పుడు తినేదా! అన్నాడు.

ఓరోయ్! నాయనోయ్! ఛీ! ఛీ! – నువ్వు ఫోను పెట్టెసెయ్ విజ్జీ! – ఫోరా ఫో. పోయి తీసుకురా ప్యాకెట్టుని”  అని అరిచాను.

 వాడు చాలా ముద్దుగా ఉంటాడువాడి తరగతిలో అందరికంటే వాడే పొట్టిఇంతలేసి కళ్ళునేనన్న మాటలకి మూతి ముడుచుకుని ఎందుకు అక్క  అరుస్తోంది ‘  అన్నట్లుగా ముఖం  పెట్టి గునగునా పరిగెత్తాడు హాస్టల్ లోకి.

 మిగిలిన నిన్నటి దోశ ఇప్పుడు తినేదా అన్నప్పుడు కోపం వచ్చినా, వాడు పెట్టిన ఆశ్చర్యకరమైన  ముఖాన్ని చూడగానే నాకు నవ్వు ఆగలేదు.  పెద్దగా నవ్వుతూ నా గదిలోనుండి  హాస్టల్  లోపలకి వెళ్ళాను.  నా నవ్వు విని ఎదురుగా ఉన్న గదిలో నుండి వార్డెన్ పరిగెత్తుకుంటూ వచ్చింది.  జరిగింది చెప్పగానే  ” అబ్బేఅని ముఖం జుగుప్సగా పెట్టింది.  నాకు మాత్రం నవ్వు ఆగడం లేదు.    లోపు అభి ప్యాకెట్ ని పట్టుకుని వచ్చాడు.    వాడి ముఖం లో ప్రశ్నార్థకం కనిపిస్తూనే ఉంది. 

 “పారేసెయ్! పారేసెయ్! అన్నాను దగ్గరకు రాకుండానే.

ఎక్కడ పారేసేది? అన్నాడు అమాయకంగా.

ఎక్కడ పారేసేదేందబ్బాయ్? చెత్తబుట్టలో వెయ్! అంటూ ముక్కుకి పైట చెంగు అడ్డం పెట్టుకుని తనే వాడి చేతిలోనుంచి ప్యాకెట్ లాక్కున్నట్టు తీసుకుని బయట పారేయడానికి వెళ్ళింది వార్డెన్.

నిన్నటిది రోజు తినొచ్చా? పాడయిపోయింది తింటే జబ్బులు వస్తాయి”  అని అన్నాను నేను.

నాకు సంగతి తెలియదు అక్కా! అన్నాడు.

సరేలే! ఇంకెప్పుడూ అలా మిగిలిన తిండిని బ్యాక్ పాక్ లో దాచుకోకు. వెళ్ళు. వెళ్ళి చేతులు కడుక్కుని లాకర్లో నుంచి రెండు బిస్కెట్ లూ, ఒక చాక్లెట్ తీసుకుని తిను” అని అన్నాను.

వాడికి ఆకలేస్తుందట. చూసుకోమ్మా” అని వార్డెన్ తో చెప్పి నా గదికి వచ్చాను.

 విజయలక్ష్మికి ఫోన్ చేద్దామని ఫోన్ చేతిలోకి తీసుకున్నానో లేదో మళ్ళీఅక్కా!” అని పిలుచుకుంటూ వచ్చాడు అభి.

ఏమిటిఅన్నట్టుగా చూశా వాడి వైపు.  ” మరీ, చాక్లెట్లూ, బిస్కెట్లూ కూడా నిన్నటివే కదా! అవి పాడైపోలేదా” అని అడిగాడు.  వాడు అడిగే ప్రశ్నకి, వాడు అడిగిన తీరుకీ భలే ముచ్చటేసింది.  అభిని హత్తుకుని ముద్దు పెట్టుకున్నాను.  పక్కనే కూర్చోబెట్టుకునికొన్ని రోజులకి పాడవకుండా ఉండటానికి వీటిల్లో కెమికల్స్ కలుపుతారు. ఇవి కూడా మంచివి కావు కాబట్టే ఎక్కువ తినొద్దు అని చెప్పేది.  రేపు సైన్స్ క్లాస్ లో టాపిక్ నే డిస్కస్ చేయండి. ఆమె చక్కగా అర్థం అయ్యేట్లు చెప్తుంది.  నేను కూడా సుమతి అక్కకి (సైన్స్ టీచర్) చెప్తాలేవెళ్ళు. వెళ్ళి ఆడుకో” అన్నాను.

వాడు సంతోషంగా ముఖం పెట్టి బయటికి పరిగెత్తాడు తను గ్రహించిన విషయాన్ని అందరితో చెప్పడానికి.

 ‘ నిన్నటి ఆహారం శరీరానికి విషం. అది అందరూ ఒప్పుకుంటారు.  కాని నిన్నటి గతం మనసుకి విషం అని ఎందుకో తెలుసుకోలేకపోతున్నారు.  నిన్నటి నిందను ఈరోజు తలుచుకొని ద్వేషాన్ని లేదా బాధని పెంచుకుంటారు. అలాగే నిన్నటి చాక్లెట్ లాంటి పొగడ్తని తలుచుకొని ఆనందపడతారురెండూ ప్రమాదమేఅసలు గతమే మనసుకి విషం, మాయ అని గ్రహిస్తే ఆత్మ ప్రకాశిస్తుందిశాశ్వతమైన  ఆనందం లభిస్తుంది. ‘


        ***

radhamanduva1-రాధ మండువ

 

కవిత్వ తాత్విక మార్మిక కావ్యం ‘మహాశూన్యం’!

        Front Page

   మాతృగర్భం నుండి మహా శూన్యంలోకి మట్టిఘోష వినడానికీ అహోరాత్రం ప్రయాణం చేస్తూ, జననమరణాలు ఎందుకు? ఈ సృష్టి ఎలా వుంది?-అనే తాత్విక చింతనతో కాలగర్భంలో బందీ అయిపోయీ బయటపడటానికి నిరీక్షణ చేస్తూ జీవప్రమిదెలు వెలగడానికీ ఊపిరి పొస్తూ కాలకుసుమాలు పూయించడానికీ సంకల్పం చెప్పుకొంటూ అప్రయత్నయత్నం తో విశ్వరూపంను డర్శించి ఆదర్శనంతో నేనుగా మిగిలిపొయాను-అనే తాత్విక విచారాన్ని చేస్తున్న ఉత్తమ కవి డాక్టర్ దీర్ఘాశి విజయ భాస్కర్   గారు.

ఎన్నో పర్యాయాల పఠానానంతరం విమర్శకున్నో,విశ్లేషకున్నో కాకపోయినా కవిత్వపు వొడిలో వొరిగిపోయే ఐంద్రికున్నవ్వటం వల్ల వో నాలుగు మాటలు రాయాలనిపించింది.

భారతీయ తత్వచింతనతో, జననమరణాల గవేషణ గూర్చిన ఆలోచనతో, విశ్వరూప రహస్యాల శోధన చేస్తూ వాటిని పారదర్శక చీకటి పొరల్లా మహాశూన్యం లో కవి పాఠకునిముందుంచుతాడు.  ఆనాటి భారతీయ తత్వచర్చ అంతా భావవాద,భౌతివాదాల ఘర్షణే. భావవాదానికీ కేంద్రబిందువు దైవ భావన. భౌతికవాదానికీ ఆధారం ప్రకృతిశక్తులు.  ఈ రెండింటి సమన్వయ ప్రయత్నమే ఈ కావ్య రచనేమో?

ఏ కవైనా ముందు కవిత్వ రచన చేసి పరిపక్వత సాధించిన పిదప నాటక రచనకు పూనుకొంటాడు. కానీ డాక్టర్. దీర్ఘాశీ విజయభాస్కర్ గారు చాల గొప్ప నాటకాల రచన చేసింతరువాత మహాశూన్యం రచించాడు. ఆ కారణంగానేమో ఈ కవిత్వంలో గాధత, సాంద్రత, చిక్కదనం ఆవరించాయి.

లోకాయతం,  సాంఖ్యం,న్యాయం, యోగం, బౌద్దం, జైనం, పూర్వమీమాంస, వేదాంతం మున్నగు దర్శానాల ఙానం “మహాశూన్యం”లో అంతర్లీనంగా అంతరగంగలా కవిత్వపొరల్లో ప్రవహించడం పరిశీలిస్తే ద్యోతకమవుతుంది.  ఈ కావ్యాన్ని కవి అనుభావ కావ్యమన్నాడు.         అనుభావమంటే “నిగూఢమైన తాత్విక భావనల్ని, అందులోని సున్నితమైన పొరల్ని అనుభవించి అనుభవింపజేసేది”- అని కవే తెలియచేశాడు.కన్ ఫ్యూషియస్ భావనలో అనుభవం కూడా వొక ఙానమే.ఈ ఙాన సముపార్జన కష్టమైంది చేదైంది.దీన్ని స్వానుభవంతో మాత్రమే సాదించుకోగలుగుతారు.

“జనన మరణాలు అభేధమని / అవిభాజ్యమని తెలుసుకొని/ఙ్ఞానినయ్యాను/నేనే ఙ్ఞానమయ్యాను”-అని కవి అనటంలోనే కావ్యాస్వభావం స్థూలంగా తెలుస్తుంది.   అనుభవించి అనుభవింపచేసె అంశాలు అనేకం ఈ కావ్యమంతా అల్లుకొని దీన్నొక కవిత్వతాత్వికమార్మిక కావ్యంగా రూపొందించాయి.పాథకుల మేధోచిత్త సంస్కారాన్ని బట్టి ఈ కావ్యం కొందరికి కవిత్వపరిమళం అలదికొన్నదిగా, మరి కొందరికి తాత్విక చింతనాత్మకతను సంతరించుకొన్నదిగా,  ఇంకొందరికి సంవేదన,  సంశయాత్మక మార్మికత కూడుకొన్నదిగా స్ఫురిస్తుంది.   ఇలాంటి కావ్యాలు అరుదుగా సౄజించబడుతుంటాయి.

దీర్ఘాశి విజయభాస్కర్

దీర్ఘాశి విజయభాస్కర్

మహాశూన్యంలో”అంతా వుండి అంతటానిండి వున్నసమస్తం లోని శూన్యం నుంచి చైతన్యం ఎలా అంకురిస్తుందో,అంతటా వుండే శూన్యం,అంతా తానై ఎలా రూపాన్నిపొందుతుందో సృష్టి,స్థితి లయలను ఎలా క్రమబద్దం చేస్తుందో ఈ కావ్యంలో ముకురంలో బింబంలా దర్శనమిస్తుంది.  ఏమీ లేని తనం నుండి ప్రారంభించబడి విశ్వాంతరాళానికీ ఎగబ్రాకీ, కాలస్పర్శతో అంతర్ముఖమై తనలోకి తాను గతించే పదార్థంయొక్క నిరంతరగమనశీలతను కవి ఈ కావ్యంలో ఆవిష్కరించాడు.

మానవుడు నిరంతర అన్వేషణాసక్తుడు.అంతేకాదు తమకంతోఅన్నింటిని అవగతం చేసుకోడానికి ప్రయత్నిస్తాడు.   ఈ లక్షణం కవిలో పుష్కలంగా వుంది.కాల స్వభావాన్నీ తెలుసుకోవాలనే తన గాఢ వాంఛను పాఠకుడి గుండెకు తగిలేలా కవిత్వం చేసి గురి తప్పని బాణంలా సంధించాడు.

“కాల గర్భంలో క్షణాల కణాల్లా దూసుకొస్తున్నాయి”, “కాలం ఏక ముఖి” ,  “కాలం హాలాహలం”,  “కాలం త్రినేత్రి”-ఇలా ఎన్నో కాల సంబంధి అంశాలు కవిత్వమంతా పరచుకొని పఠిత మనసుని కాలంతోపాటు కవితలవెంట పరుగెత్తిస్తాయి.కాల గర్భంలొ దాక్కున్న కాలాన్ని కవి  “అది అంతరిక్ష విశేష కల్పన “అని ”  స్వయంభువు అయిన చైతన్యం వల్లనే సృష్టి మొత్తం ఏర్పడిందని తీర్మానిస్తూ కాలం మాటలన్నీ మనిషికిచ్చి తాను మాత్రం మౌనం మిగుల్చుకొని ఆ మౌనంలో చావు పుట్టుకల్ని దాచుకుందంటాడు.  కాలం విశ్వమంతా వ్యాపించి సృష్టినంతా ఆక్రమించి పంచభూతాలకు ఆధారభూతమైన  ఆద్యంత హేతువైందని కవి భావిస్తున్నాడు.  ఏంచేసినా…ఏంచేయించినా కాలమే చేసేది చేయించేది.  అయితే కాలం దేన్ని తనదిగా చేసుకోదు-అని కవి కాలస్వభావాన్ని మార్మికంగా వ్యాఖ్యానిస్తాడు  ఈ కావ్యంలో.  కాలం ఈ సంపుటిలో వొక అంతస్సూత్రంగా అల్లుకపోయింది.

ఎవరైతే  ” ఎవనిస్వరూపం తుదిలేని మహాశూన్యమని భావిస్తారో, ఎవరైతే ప్రతి మట్టి రవ్వ,నీటి బొట్టు, గాలి రెబ్బ సమిధలవుతున్నాయి అంతశ్శక్తి మళ్ళీ మళ్ళీ అవతరించాడానికీ అని నమ్ముతారో, ఎవరైతే మనం మరో లొకంలో వున్న రూపాలకు నీడలమని తలపోస్తారో,  ఎవరైతే మట్టిలొ పడింది మరుగుపడినా మెరుగుపడే బయటికొస్తుంది మృత్యుఘాతంతోనని విశ్వసిస్తారో,  ఎవరైతే దేహికి మట్టి మళ్ళీ మళ్ళీ దేహాన్ని సిద్ధం చేస్తుందని భావిస్తారో,  అలాంటి కవులకు వ్యక్తులకు మరో జన్మ మీద, కాలాన్ని నడిపిస్తున్న  శక్తి మీద విశ్వాసం వుండే అవకాశం వుంది.

బౌద్దమత పరిచయ జ్ఞానంతోనో,  అంబేత్కర్ ఆలోచన విధాన అనురక్తుడైన ఈకవి తన కావ్యానికి బౌద్ద తత్వవేత్త నాగార్జనుడు ప్రతిపాదించిన శూన్యవాదానికీ దగ్గరగా వున్న” మహాశూన్యం”-అనే పదాన్ని కావ్య శీర్షికగా చేసుకొన్నాడు. మనిషి జీవితం కూడా కాల ప్రవాహంలో నిరంతరం  కృశిస్తూ సాగిపోయే వొకజనానంతరయానమని బౌద్దమతవిశ్వాసం.  బౌద్ద జాతక కథలు బోధిసత్వుడు అనేకలెత్తిన అంశాన్ని చెబుతాయి.  ఈ ప్రభావం వల్లనేమో  దీర్ఘాశి విజయభాస్కర్ గారు అనంత కాలంలోకోట్లాది మనసుల్లో మెదిలిన ప్రశ్న,ఎన్నో మెదల్లను వెధించిన ప్రశ్న,ఎందరో మహర్షులు,తత్వవేత్తలు శోధించి సంధించిన  ప్రశ్న ఒకటే అది మరుజన్మ.  మరణానంతరం మనిషి ఏమవుతాడు అన్న సంశయం.   ఈ ప్రశ్నకు సంశయానికి సమాధానంగా”ఆత్మక్రతువు”అనే కవితలో కవి ఇలా అంటాడు “అందుకే ఇక్కడ పాతవారెవరూ వుండరు/కొత్తవారెవరురారు/ప్రతి వ్యక్తి సనాతన విశ్వచేతనకు ఓ అధునాతన ” అభివ్యక్తి”-అని.  అయితే ఈ సంశయానికీ బైరాగి ఇలా సమాధనం చెబుతాడు వొకచోట.”ఏదీ చావదు ఇచట/ద్రవ్యంలోంచి రూపంలోకి/రూపంలోంచి భావంలోకి/ఓజంలోంచి భావంలోకిరూపం మారుతున్నది ఒకే శక్తి/రాలుటాకు సెజ్జలోంచి క్రొంజిగురులు లేచినట్లు”-అని బైరాగి తాత్వికంగా వ్యాఖ్యానిస్తాడు.  ఇలా అనేకులు అనేక విధాలుగా మరోజన్మ గురించి ఆలోచనలు చేశారు.

పోషణ శోషణ డైవం నుంచి ప్రకృతికీ మారినప్పుడు ఈ విశ్వమంతాప్రళయతరంగాలలో కూడిన సముద్రంలో ప్రయాణించే నావికుడు లేని నావగా కవి పోలుస్తాడు.ఆ నావలోని ప్రయాణికులు భయంతో ఎవరికీ వారు తీరాన్ని చేరడానికీ వారంతా అన్నివైపులకు తెడ్డు వేసీ ఆనావను నడ్ఫిపించే ప్రయత్నం చేస్తే దానికీ కదలిక వుంటుది కాని గమనం వుండదు.అంటే ఈ సమస్త విశ్వసృష్టిని ఎవరికీ వారు వారివారి ధోరణుల్లో ఆలోచించుకుంటూ వ్యాఖ్యానించుకుంటూ పోతే అసలు సత్యం,ఙ్ఞానం మున్నగు గమ్యాలను  ఈ మానావళి అందుకోలేక పోయిందనే భావనను కవి మహశూన్యంలో ఆవిష్కరిస్తాడు.

అప్రయత్నయత్నం అనే ఈ కవితలో “కణం ఆధారంగా ప్రకృతి క్షణం క్షణం ఆకృతి దాల్చాలనే నిర్దేశం ఎవరిది?….సృష్టి సమస్తం పర ప్రయత్నరహితమై స్వయం భోజక రూపమై ఘటిల్లే అప్రయత్న యత్నం  ఏ  శక్తిహేతువుది? -అని తనకు తానుగా ప్రశ్నించు కోవడంలోనే కవ్య స్వభావం అర్థమవుతుంది.

ప్రకృతి, పదార్థం జడంగా.చైతన్యంగా అవస్థీకరించడం వల్లనే అహం, ఇహం విభజించబడ్డాయని మనిషి తనప్రవర్తనలో, నడవడిలో మహన్నొతుడిగా ఎదగకుండా మరుగుజ్జు అవుతున్నాడని కవి తాత్విక పరితాపాన్ని ప్రకటిస్తాడు. ప్రకృతి, పర్యావరణ నేఫథ్యంతో ఎంతో తాత్వికంగా మనిషిని మలిచిన మట్టి ఘోషను మనకు వినిపిస్తాడు.  మానవీయ లక్షాణాల్ని అలక్ష్యం చేసి అరిషడ్వర్గాలను అక్కున చేర్చుకొని క్రోధిగా, లోభిగా, పాపిష్టిగా, భూమాత గుండె మీద పుండుగా మారిన మనిషిని మట్టిఘోషను వినమని చెబుతాడు. “భూమాత చేసే ఘర్జనలే భూకంపాలు/మనిషి జరిపే విధ్వంసం చూసీవిశ్వజనని కార్చే కన్నీరే కుంభవృష్టులు” -అనిచింతన చేస్తూ “ప్రభూ!ప్రకృతిని ప్రేమించే పుట్టించమని” నమ్రతతో నమస్కరిస్తూ, ప్రకృతిని ప్రేమించే మనిషి జనన అనివార్యతను గుర్తుకు తెస్తాడు.

పంచభూతాలు,తోకచుక్కలు,కృష్ణబిళాలు,గ్రహశకలాలు ఏవి ఎప్పుడు ఈ అవనిని ఆవగింజగా మార్చి అంతం చేస్తాయో ఎవరికీ తెలుసు-అని మనో సంశయాన్ని చెబుతూ మానవుని ఙ్ఞానావిష్కరణా పద ఘట్టనలకింద ప్రకృతి నలిగినలిగి నుజ్జునుజ్జవుతుందని ఈ సత్యం గ్రహించే సరికి మనిషి మిగలడూ భూమి వుండదని కవి వొక మార్మిక రహస్యాన్ని విప్పుతాడు.

పదార్థం దాని స్వభావాన్ని కనబరచకబోతే విలువను కోల్పోయి న్యూనతను పొందుతాయని ప్రతిపాడిస్తూ” తుఫానే లేకపోతే సముద్రమెంత చులకన?  కంపించడం మరచిపోతే భూమి ఎంతలోకువ”- అంటాడు.  ఈ  కవే మరో చోట పదార్థం తన స్వభావాన్ని కనబరచకబోతేఆధిక్యతతో భాసిస్తాయంటాడు.  “గాయపర్చే శక్తిని కోల్పోతే అస్త్రమే ఆభరణమవుతుంది నోప్పించే గుణాన్ని కోల్పోతే మాటే మంత్రమవుతుంది”- వొక  అభాస వైచిత్రుల్నీ కావ్య పరిమళంలో కలిపి పఠితల్ని ఆఘ్రానింప చేస్తాడు.

గతవైభవ ఆలొచనలతో శాస్త్రీయతను అంగీకరించకపోవడం,  ఆధునిక  దృక్ఫథాల  పెడసరితనంతో శాస్త్రాలను పక్కన పెట్టడం ప్రతి తరంలోను వుంది.ఆ భావనతోనే అనంత ఆత్మ తత్వాన్ని “విశ్వరూపం”-అనే కవితా ఖండికలో ఆవిష్కరించానని కవే పేర్కోన్నాడు.   “కాలాన్ని వొడిసిపట్టి కాలంలో లీనమై  నేనే  కాలస్వరూపంగా  మారాను.”-“భౌతికం నుండి బ్రహ్మంగా మారుతున్నాను.  అడిగో మహాశూన్యం సాక్షాత్కరిస్తోంది.”-  అ ఒటున్నాడు కవి విశ్వరూపంలో.

బ్రహ్మం అంటే ఏమిటి?  ఙ్ఞాని కావడం ఏమిటి?  ఙ్ఞానమై పొవడమేమిటి?  ఈ ప్రశ్నలు పాఠకుల మనసును తొలుచక మానవు.   ఇది మార్మిక తాత్విక కావ్యమవ్వటం వల్ల ఇలాంటి అనేక సంశయాలు కావ్యంలో పొదగబడ్డాయి.   పొరలుపొరలుగా వున్న కవిత్వాన్ని విప్పుకొంటు పాఠకుడు ముందుకు పోగలిగితే కావ్య స్వరూపం మాధుర్యం మనసుకు అంది ఆలోచనామృతం అవుతుంది.

సర్వకాల సర్వాస్థలలో కాదలేనిది, లేదనడానికీ వీలులేనిది, పరిమితి, సంకుచిత తత్వం,వివాదం లేనిది, అప్రమేయమైనది, స్వతంత్రమైనది ఏదంటే ” బ్రహ్మం”.  ఆ బ్రహ్మం కోసం అన్వేషణ సాగించాలంటే సూక్ష్మదృష్టి కావాలి.   కళ్ళతో చూస్తున్నప్పుడు కన్పించేది వేరేగా వుంటుంది.  అట్లాంటి స్థితిలో కనిపించిన దానిమీదంతా కాకుండా, అవసరమైన దానిమీదే మనసును కేంద్రీకరించ గలిగితే, అలా…అలా ఒకానొక కేంద్రానికి చేరాక,సూక్ష్మస్థితికి చేరుకొన్నాక ఆ కేంద్రబిందువు మీద మనసు నిలిపితే గోచరమయ్యేది శుద్దమైన సత్యం.   అదే బ్రహ్మం.  అప్పుడు ఏమి?  ఏంత?  ఎన్ని?  అనే ప్రస్నలు ఏర్పడవు.ఎంత వున్నా కావాలనిపించేది ఏదీ వుండదు.    అదే బ్రహ్మం.  ఆ స్థితికీ మనిషి చేరుకోవలన్నది  కవి కాంక్ష.   అప్పుడే సృష్టి సమస్తం సుఖవంతం   .జననమరణాలు అభేధమని, అవిభాజ్యమని తెలుసుకోవడం ఙ్ఞానం.    తనను తాను తెలుసుకోవడం ఙ్ఞాని అవ్వడం.

ఇది ఎంత తాత్విక మార్మిక కావ్యమే అయినా ఆ తాత్వికమార్మికతా ఉంగరంలో కవిత్వ రత్న వాక్యాలు  వొడుపుగా పొదగబడ్డాయి.  కవి విజయభాస్కర్ గారి భావనా శక్తి అపారం.  సముద్రం ఎట్లా ఏర్పడిందో కవి భావిస్తాడు చూడండి.  సూర్యుడు,చంద్రుడు ఆకాశానికి అందాల బిడ్డలు.  ఆకాశానికి పాలు పడక ఆకలితో అల్లాడే వాళ్ళకి పాలిమ్మని ఆకాశం భూమిని అడుగుతుంది.  భూమి మంచు తెరల పయిటను తొలగించి పర్వత పాలిండ్లను చేపి ఆకాశపు బిడ్డల కడుపు నింపిందట.  వాళ్ళు తాగుతున్నప్పుడు జారిపడ్డ పాలబొట్లే మడుగుకట్టి సముద్రమయ్యిందట.  ఇలా ఊహించటమ్ ఈ కవికీ సాద్యమేమో?  అలాగే రాత్రి,  పగలు ఏర్పడిన విధానాన్ని కూడ అడ్భుతంగా ఊహిస్తాడు.

“వయోభారంతో విశ్వం బుద్ది మందగిస్తోంది.  ఙ్ఞానభారంతో భూమి తల్లడిల్లుతోంది.  అంతరిక్ష అంతరంగం గాయాలతో మూలుగుతోంది.”- కవి అన్న ఈ మాటలు ఎన్నొ సంకేతార్థాలను స్ఫురింపచేస్తాయి.  గాఢతాత్వికాంశాల  ప్రస్తావనలోనే సమకాలీన అంశాలను స్ఫురింప చేయడం ఈ కవి ప్రత్యకత.

మనిషి భయంకర వికృత ఆలోచనలతో ప్రకృతిని, చివరకూ గ్రహాలను కూడా వొదలకుండా దోచుకోబోతున్నాడని “గ్రహాల్లారా పారిపోండి”-అని హెచ్చరిస్తాడు.   ప్రకృతిని సృజించడానికీ ముక్కోటి దేవతలు కావాలేమో కాని వినాశనానికి ఒక్క మనిషి చాలు అని లుప్తమైపొతున్న మానవ్త విలువల్ని గురించి ఆలోచింప చేస్తాడు.  “భూమి గుండె గుజ్జు వొలుచుకొంటున్న గనుల గుర్తులు.సుర్యున్ని మింగేసిన అంజనీ పుత్రుడొక్కడే ఆనాడు భూమిని నమిలేస్తున్న వాయునందనులెందరో ఈనాడు”-అని అనటంలో బళ్ళరి గనులను నమిలేసిన గాలిని గుర్తుకు తెస్తాడు.

ఇలా తాత్వికతతో, మార్మికతతో, కవిత్వంతో భాసిస్తున్న మహాశూన్యం ను గూర్చి   ఎంత మాట్లాడినా మిగిలిపోయే అంశమేదో వుందని అనిపిస్తుంది.ఎవరికీ వారు దీన్ని చదివి కవిత్వపు లోపలిపొరల్లోకి  వెళ్ళి తమ లోపలి ప్రపంచాల్నీ ప్రక్షాళన చేసుకోవాల్సిందే.కొలకలూరి వారన్నట్లు శ్రీశ్రీ మహాప్రస్థానం చేస్తే విజయభాస్కర్ మహాశూన్యం డర్శించాడు.

ఈ కవే అన్నట్లు” మనందరి మధ్య ఏమీ తెలియని తెలిసిన తన మొకటుంది.  తెలుసు కున్నవారు కూడా తెలియచెప్పలేని తెలివి తక్కువతనమది”-తెలివి తక్కువ తనంతో ఏదైనా రాసివుంటే దానికి బాధ్యత నాదే,  కావ్యానిది కాదు.

 

   -రాజారామ్ తుమ్మచర్ల

రాజారాం తుమ్మచర్ల

రాజారాం తుమ్మచర్ల

ఈలాంటి కథల్ని పల్లకీకెక్కించి మనమేం సాధిస్తాం??

మరో వుత్తమ కధ చూద్దాం. స్వాతి మాసపత్రిక మే 2012 లో  వి.రాజారామ్మోహనరావుగారు “ఉన్నంతలో” అనే కథ రాశారు.

భర్తకి జబ్బు చేస్తే ముక్కూమొహం తెలీని రామారావుని సాయం కోరుతుంది అరుంధతి. హాస్పిటల్‌లో చేర్పించి ఖర్చంతా భరిస్తాడు రామారావు. ఆ అప్పు తీర్చలేని అరుంధతి రామారావుతో సంబంధం ఏర్పరచుకొంటుంది. అరుంధతి భర్త మంగరాజు మంచానికే పరిమితమైపోడంతో ఆ సంబంధం కొనసాగుతుంది. తమ మధ్య అడ్డంగా మంగరాజు వద్దని వృద్ధాశ్రమంలో చేర్పించి, ఖర్చంతా తనే భరిస్తానన్న రామారావు ప్రతిపాదనని తిరస్కరిస్తుంది అరుంధతి. కథ చదివిన తర్వాత మనకు కలిగే ఆలోచన్లేంటి?

“రాజుకి ఆరునెలలుగా బాగోలేదు ఇల్లు కదలలేకపోతున్నాడు” అని స్వయంగా రాసిన రచయిత “అంత డబ్బు ఖర్చవుతుందని అని అరుంధతి అనుకోలేదు” అని తనే స్వయంగా చెప్పడం విశ్వసనీయంగా లేదు. అరుంధతికి నలభై రెండేళ్లు. అంతే కాదు. “ప్యాకింగ్ మెటీరియల్ తయారుచేసే ఓ ఫాక్టరీలో చిన్న ఉద్యోగం చేస్తూ, అనారోగ్య భర్తని పోషిస్తూ కాలం గడుపుతోంది అరుంధతి” అని రచయిత చెప్తారు. వాస్తవ దృష్టితో చూస్తే దాదాపు ఒంటి చేత్తో సంసారం నడుపుకు వస్తున్న  స్త్రీలకు కొంత “లోకజ్ఞానం” వుంటుంది. నలభయ్యేళ్ళ వయసు ఎంతో కొంత “తెలివిడి” తెచ్చే వుండాలి. అటువంటి స్త్రీ  ఏ రకమైన గత పరిచయం లేని ఒక పురుషుడు తన కుటుంబంపై అంత ఖర్చు పెడుతున్నప్పుడు వచ్చే పరిణామాల్ని ఊహించలేదని నమ్మలేం. అలా చూసినపుడు విధిలేక పరిస్థితులకు తలొగ్గే స్త్రీల పట్ల కలిగే సహజ సానుభూతి కలగదు. ఆ పాత్రపై ఒక సానుకూల దృక్పధమూ కలగదు. పాఠకులకు ఇది వాస్తవం కంటే కల్పన అనే నమ్మకమే ఎక్కువ కలుగుతుంది.

మరో విషయం చూస్తే అరుంధతి వుండేది ఒక రకం “వాడ”లో ” మీ యింటి ఎదురు సందులో వుంటాం” అని స్వయంగా ఆమే చెప్పింది. సందుల్లో వుండేది బీదజనమే. సాధారణంగా బీదవాడల్లో ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ఇరుగుపొరుగు జనం మూగుతారు. సహాయం చెయ్యలేకపోవచ్చు, డబ్బు ఇవ్వలేకపోవచ్చు కానీ అక్కడ ఒక రకం అలికిడి, కొంత హడావిడి కలగడం వుంటుంది. అటువంటిది అరుంధతి ఒంటరిగా వెతుక్కుంటూ రామారావు ఇంటికి రావడం కూడా కల్పనకి దగ్గరగా వుంటుంది.

వాస్తవంలో మనం ఆశించేదీ, అబ్బురపడేదీ ఈ వుమ్మడి తత్వం గురించే.. మధ్య తరగతిలో లేనిదీ అదే.

“నెలకి అరుంధతికి ఇంటికి పదివేల రూపాయలు ఖర్చవుతున్నాయి. అది అతనికి ఎంత మాత్రం భారం కాదు” అని రచయిత స్వయంగా రాస్తారు. తర్వాత “మరో పదివేలు ఖర్చు అవుతాయి” అని స్వయంగా రామారావు అంటాడు. ఒకరి కోసం నెలకి ఇరవై వేలు ఖర్చు పెట్టగలిగిన  “లోలోపల  సుప్తచైతన్యం లోని ఎడారిలాంటి ఒంటరితనాన్ని” భరించిన రామారావు, “భార్య తర్వాత మరే స్త్రీ పట్లా ఆసక్తి చూపించలేదు” అని నమ్మడం కష్టమే. ఇది వాస్తవంకంటే కల్పనకే బాగా దగ్గరగా వుంటుంది.

మంగరాజు కోసం డబ్బూ, సమయం ఖర్చుపెట్టగలగడం, రికామిగా వుంటూ డబ్బు సంపాదించగలిగే వున్నత వర్గ మనుషులకే సాధ్యం.  కింది వర్గానికి చెందిన అరుంధతిని సుళువుగానే సమాజం భాషలోని “నీతి” కోల్పోయే దానిలా చిత్రీకరించి, వున్నతవర్గానికి చెందిన రామారావుని జాలి, సానుభూతి, దయ వగైరా “గొప్ప” గుణాలున్న వ్యక్తిగా చిత్రీకరించడం కల్పన కాదంటే నమ్మడం అస్సలు సాధ్యం కాదు.

కథ చదువుతూ పోయేకొద్దీ ఇది రచయిత ఆలోచనల్లోంచీ, కల్పనా శక్తిలోంచీ పుట్టిన కథే అన్నది బలపడుతూనే వుంటుంది. ఇక ఈ కథకి పాఠకులు(Takers) ఎవరు అని ఆలోచిస్తే..

ఏ వృత్తిలో, ఏ వ్యాపకంలో చూసినా పనిగంటలు పెరిగిపోయాయి. జానెడు పొట్ట కోసం తెగ బారెడు పని చేస్తూ నిరంతరం భయంతో, అభద్రతతో బతికేలా మనుషుల్ని తయారు చేస్తున్నది పెట్టుబడీదారీ. వాళ్లకి సాహిత్యాల్తో, కళల్తో పని లేదు. వుండదు. మొదట్నించీ కాల్పనిక సాహిత్యానికి ప్రధాన పోషకులైన జానెడు తీరుబాటున్న మధ్యతరగతి స్త్రీలోకం అదృశ్యమైపోతూ వున్నది. దాదాపు ప్రతి స్త్రీ, తన పొట్ట కోసం, సంసారం కోసం, బండెడు చాకిరీ చెయ్యక తప్పటం లేదు. అందుకే కాల్పనిక సాహిత్య పాఠకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో, ఈ పూర్తి కాల్పనిక, వ్యూహా చాతుర్యం మీద ఆధారపడ్డ ఇలాంటి కథల్ని కీర్తించి, భుజాలకెత్తుకోడం కల్పనకి తులసి నీళ్లు పోయడమే. సంస్కారాన్ని వున్నతీకరించడం సాహిత్యం ఇచ్చే ప్రయోజనం అనుకుంటే ఆ ప్రయోజనానికి ఈ కథ విలోమంగా వుంటుంది. పాత్రకి అరుంధతి అని పేరు పెట్టడం. ఏం చేసైనా సరే భర్తని కాపాడుకోవాలన్న సుమతి, సక్కుబాయిల్ని ఆదర్శంగా తీసుకొచ్చి చూపించే ప్రయత్నమూ, చుట్టూ వున్న వాస్తవానికి పూర్తి విరుద్ధం. పాత్రివ్రత్యం రాచరిక, భూస్వామ్య సమాజాల విలువ.

పోనీ కల్పనగా తీసుకున్న కథలో పెద్ద గొప్ప, ప్రత్యేకత కనబడకపోవడం బహుశః నా లోపమేనేమో? భర్త ఆరోగ్యాన్నీ, గౌరవాన్నీ, ప్రాణాల్నీ కాపాడ్డానికి తన శీలం (క్షమించాలి) పణంగా పెట్టడం ఎన్నోసార్లు చదువుకున్న పౌరాణిక వారసత్వమే. కథనం మామూలు వచనమే. పాత్రచిత్రణలో కూడా ఏకసూత్రత కనబడక ఒకే పాత్రపై విరుద్ధ భావాలు కలగడం కళావిలువల దృష్ట్యా ఓటమే. “ఏ అరమరికలు లేకుండా” మాట్లాడుకున్న రామారావు, అరుంధతిల మధ్య సంభాషణ గోరంత కూడా చెప్పకుండా మనిషి మారిపొయినట్లు చెప్పటం కథలో “టెంపో”ని పోషించదు. రామారావు భార్య ఎందుకు వెళ్లిపోయిందో చెప్పకుండా “అన్ని సౌకర్యాలు వుండి, ఏ ఇబ్బంది లేకపోయినా అదనపు సౌఖ్యమని తన భార్య ఎవరితోనో వెళ్ళిపోయింది” అనుకుంటాడు.

వెళ్ళిపోయే స్త్రీ పాత్ర  ఒకటి, సుళువుగా లొంగిపోయే స్త్రీ పాత్ర ఒకటి సృష్టించి, రిపీట్ , సృష్టించి వారి మధ్య ఒక దయామయుడైన పురుష పాత్రని ప్రతిష్టించి ఏ స్త్రీ పాఠకుల్ని గెల్చుకుందామనుకున్నారో అర్ధం కాదు. వారికేం చెప్పదల్చుకున్నారు? వెళ్లిపోవద్దా? భర్త కోసం ఏమైనా చెయ్యకూడదా? తన పాఠకుల పట్ల తనకే సరైన అవగాహన లేకపోయిన కథ ఏం సాధిస్తుంది?

ఈలాంటి కథల్ని పల్లకీకకెక్కించి మనమేం సాధిస్తాం??

–చిత్ర

అంటు

‘హలో యూసుఫన్నా! నేను రాజుని… మీ మామయ్య బిడ్డ రేష్మా లేదన్నా.. ఆమె మా మాదిగ ఇద్దయ్య కొడుకు సురేష్‌తోటి సిటీ కొచ్చేసిందన్నా.. యూనివర్సిటీల ఉంది. మీ మామలకు తెలిస్తే ఇద్దర్ని సంపేస్తరే.. జర నువ్వు సమ్జాయించి చెప్పు.. వచ్చి ఆ పిల్లను తీస్కెల్లిపొమ్మను అన్నా!’ అన్నడు రాజు మా ఊరి నుంచి.
సెల్‌ఫోన్ ఆగకుంట మల్ల మల్ల మోగుతుండేతలికి రోడ్డు పక్కన బండి ఆపి ఫోనెత్తి ఉంటి. అతని మాటలు విని కాసేపు ఏం మాట్లాడలేక పొయ్‌న. కొద్దిసేపట్ల సంభాలించుకొని, ‘అది కాదు రాజు, ఎప్పుడు జరిగిందిది? ఇప్పుడెక్కడ ఉన్నరు? మన ఊర్లో వాళ్లకు తెలిసిందా?’ అన్నా పరేశాన్‌గ.
‘రాత్రి ఒచ్చిన్రటన్నా. లేడీస్ హాస్టల్లో పిల్ల నుంచిన్రంట. పిలగాడు బాయ్స్ హాస్టల్ల ఉండు. ఊర్లె ఇంక తెలియదన్నా..’
‘పిలగాడు ఏం చేస్తడు?’

‘సదువుకుంటుండన్నా! వాళ్ల నాయన లేడు. వాళ్లమ్మ, వాడే ఉంటరు. షానా బీదోల్లన్నా. నేనే ఆనికి సదువుకు పైసలిస్తున్న. ఆడి సదువు ఖరాబైతదన్నా. మీ మామలు గుడ ఊకోరు. కొట్లాటలైతయ్.. వచ్చి పిల్లను తీస్కపొమ్మనన్నా..’

నా మైండ్ బ్లాంక్ అయిపొయింది. ఏం చెప్పాల్నో ఏం చెయ్యాల్నొ సమజ్ కాలె. సుతరాయించుకొని ‘రాజు! నేను రోడ్డు మీదున్న, జరసేపాగి ఫోన్ చేస్త’ అన్న. ‘సరె అన్న, మీ మామలకు ఎవరికన్నా చెప్పన్నా, మల్ల ఫోన్ చెయ్యి’ అని కట్ చేసిండు రాజు.

ఫోన్ జేబుల పెట్టుకొని బండి స్టార్ట్ చేసి ఇంటి దిక్కు పోనిస్తున్న. షానా గజిబిజిగ అనిపిస్తున్నది. మనసంత ఏదొ అయిపొయినట్లున్నది. ఇంటికి పొయి కుర్సీల కూలబడ్డ. ఏమైంది అన్నది మా ఆమె.

‘మా నడిపి మామ బిడ్డ రేష్మ, ఎవరో మాదిగ పిలగానితోటి సిటీ కొచ్చేసిందంట!’ అన్న.

‘అవునా.. ఎవరు చెప్పిన్రు?’ అన్నది పరేశాన్‌గ మా ఆమె.
విషయమంత చెప్పిన. కొద్దిసేపు ఆమెతో చర్చించిన. రాజుకు ఫోన్ చేసిన.

‘…పిల్ల, పిలగాడు ఒకర్నొకరు బలంగ ఇష్టపడుతున్నరా.. ఏమంటున్నరు రాజు?’

‘నేను వాళ్లతోని మాట్లాడలేదన్న. వాళ్ల వయసుకు ఇప్పుడేడ సమజైతదన్నా? పిలగాడు చెప్తె ఇంటడన్న. మీ మామలకు చెప్తె ఆల్లే వచ్చి పిల్లను ఎట్లన్న ఒప్పిచ్చుకొని తీస్కపోతరు’ అన్నడు రాజు.

‘…మా మామోల్లకు నువ్వే ఫోన్ చెయ్ రాజు. నాకు చెప్పిందే వాళ్లకు చెప్పు. వొచ్చి పిల్లను తీస్కపొమ్మని నేనెట్ల చెప్త? లవ్ మ్యారేజ్‌లను నేను సపోర్ట్ చేస్త గదా.. నాది గుడ లవ్ మ్యారేజేనాయె!’ అన్న.

‘అట్ల కాదే.. మీ మామలు వాన్ని బతకనియ్యరన్నా.. వాళ్ల బిడ్డ మాదిగోల్ల పిలగానితోని లేషిపొయిందన్న పేరొస్తె ఊకుంటరా అన్నా?! పిలగాని వాల్లమ్మ బయపడి రాత్రే ఎటో ఎల్లిపొయిందంట! నువ్వే ఎవర్తోనన్న మీ మామోల్లకు చెప్పిస్తె ఆల్లే వొచ్చి ఎట్లన్న జేసి తోల్కపోతరు..’

‘నువ్వు చెప్తె ఏమైతది రాజు!’ అన్న ఓపిగ్గ.

‘నేను చెప్పలేనన్నా.. అసలు ఈ విషయం నాకు తెల్సని, నేను చెప్పిన్నని గుడ ఆల్లకు చెప్పొద్దన్నా.. మల్ల నాకు పరేశానైతది..’ అన్నడు రాజు.

‘..సరె, నేను ట్రై చేస్త.. నువ్వు పిల్ల, పిలగాని సంగతి తెల్సుకో.. మల్ల ఫోన్ చేస్త’ అని ఫోన్ పెట్టేసిన.

‘ఏందంట?’ మా ఆమె.

సంగతి చెప్పిన. కాలుగాలిన పిల్లిలెక్క అటు ఇటు తిరుగుతున్న. ఏం తోస్తలేదు నాకు. కొద్దిసేపు నా వాలకం జూసి.. ‘ఇట్ల కుర్సీల కూసొ నువ్వు.. నిమ్మలంగ ఏం జెయ్యాల్నొ ఆలోచించు..’ అన్నది మా ఆమె.

కూసున్న. ఒక్కసారిగ ఎన్నో ఆలోచనలు నా మీద దాడిచెయ్యబట్టినయ్..

ఈ విషయం తెలిస్తె మా మామ తట్టుకోగలుగుతడా? బి.పి, షుగర్ ఉండె.. పెద్ద పిల్ల మెంటల్లీ రిటార్టెడ్. ఇంకో చిన్న పిల్ల ఉండె. ఇగ మిగతా ఇద్దరు మామల పరిస్థితి ఎట్లుంటదో.. ఎట్ల చెప్తం ఆల్లకు. అసలు ఆల్లకు చెప్పకుంటనె, ఈ పిల్లతోటి ఒక్కసారి మాట్లాడి సూస్తె బాగుండు. ఏం చెయ్యాలె…

మల్ల రాజుకు ఫోన్ చేసిన, ‘రాజు! యూనివర్సిటీల ఎవరు ఈల్లకు తోడున్నరు? ఆల్లతోటి ఒకసారి నేను మాట్లాడాలె’ అన్న.

‘లెనిన్, భరత్‌లు ఈల్లతోటి మాట్లాడుతున్నరన్న. వాళ్లతోటి నువ్వొకసారి మాట్లాడు..’ అన్నడు.
ముందుగాల భరత్‌కు ఫోన్ చేసిన.

‘హలో అన్నా! ఏం సంగతే?’ అన్నడు భరత్.

‘భరత్! మీ మాదిగోల్ల పిలగానితోటి వొచ్చిన పిల్ల కాస మా మామ బిడ్డనే’ అన్న.

‘అవునా అన్నా..! సొంతం మావ నా?!’ అన్నడు.

‘అవునే.. నేను చిన్నప్పుడు ఆల్లకాడనె పెరిగిన. ఏంది వాల్ల సంగతి?
‘రాత్రి ఒచ్చిన్రంటన్న.. వాళ్లు ఆగెటట్టు లేరు..!’
‘కాదన్న.. పిలగాడు ఎమ్మెస్సీ ఫస్టియరే సదువుతున్నడంట గదా.. ఎనకా ముందు ఏం లేదంట. ఈ పిల్ల గుడ కాలేజ్ బంద్ జేసె. మరెట్ల బతుకుతరే?!’ అన్న.
‘మేం అన్ని రకాలుగ చెప్పి జూసినమన్నా. పిల్లే ఇంటలేదన్న. ‘మీవల్ల అయితె పెండ్లి చెయ్‌రి. లేదంటే ఎల్లిపోతం’ అంటున్నదే. మమ్మల్నె నమ్ముతలేదె పిల్ల’ అన్నడు భరత్.
‘మరి పిలగానికి గుడ అంతే ఇష్టం ఉన్నదా భరత్?’ అన్న.
‘ఏమో అన్న! ఆడు భయపడుతున్నడు’ భరత్.
‘మరేం చెయ్యబోతున్నరు మీరు?’
‘మాదేముందన్నా.. అన్ని విధాల చెప్పి సూషినం. ఇగ ఆల్ల ఇష్టం’ అన్నడు.
‘నేను మల్ల మాట్లాడత’ అని పెట్టేసిన.
అప్పటికె రాజువి 4 మిస్‌డ్ కాల్స్ ఉన్నై.
ఏం చేస్తె బాగుంటదో సమజైతలేదు నాకు.
కొద్దిసేపు పక్క మీద పండుకుండిపొయ్‌న.. మల్ల ఆలోచనలు ముసురుకున్నయ్.
మా ముగ్గురు మామలకు ఒక తమ్ముని లెక్క వాల్ల దగ్గర్నె పెరిగినోన్ని నేను. కాని ఆల్ల లోకం వేరు. నా చైతన్యం వేరు. ఈ విషయాన్ని నేను చూసే తీరు వేరు. వాల్లు తీసుకునే తీరు వేరు. వాల్లు నిజంగనె ఊర్లె ఇజ్జత్ పొయ్‌నట్లు ఫీలయితరు. అందరికున్నట్లే మాదిగోల్లంటె వీల్లక్కూడ చిన్నచూపు మామూలె. తమ బిడ్డ ‘మాదిగోడితో లేషిపొయిందట’ అన్న మాట వాల్లు తట్టుకునే విషయమేం కాదు. మరి వాల్లను ఎట్ల సమ్‌జాయించాలె? ఎట్ల అర్దం చేయించాలె.. మొదలు విషయం చెప్పుడెట్ల..??
అసలు పరిస్తితేందో తెలుసుకుందామని ముందుగాల మా తమ్మునికి ఫోన్ చేసిన. ‘ఏంరా.. ఏంది సంగతులు. ఊర్లె ఏమన్న జరిగిందా? అన్న. ‘ఏం జరగలేదే.. ఏంది విషయం?’ అన్నడాడు.
‘నడిపి మామ బిడ్డ సంగతేంది?’ అన్న.
‘ఏమొ మరి, రాత్ర పదింటప్పుడు మామ నా కాడికొచ్చి జర తోడు రమ్మని తీస్కెళ్లిండే. ‘రేష్మ ఇంటికి రాలేదు. ఏమైందో తెలియద’న్నడు. ఊరి ఎనక రైలు పట్టాలెంట ఆడ్నించి ఈడిదాంక సూషి ఒచ్చినం. పరేశాన్ ఉన్నడు మామ’ అన్నడు.
‘ఆ పిల్ల సురేష్ అనే మాదిగోల్ల పిలగానితోటి సిటీకొచ్చి యూనివర్సిటీల ఉందంట. పెండ్లి చెయ్యమని స్టూడెంట్ లీడర్స్‌ని ఒత్తిడి చేస్తున్నదంటరా..’ అన్న.
‘అవునా…!’ అని పరేశానై, తర్వాత ‘మామ వాళ్లకు చెప్దామా మరి?’ అన్నడాడు సందిగ్ధంగా.
‘చెప్పేద్దాం.. తెలిసి గుడ చెప్పకుంటె బాగుండదు గదా.. నడిపి మామకు డైరెక్టుగ ఈ విషయం చెప్తే తట్టుకోగలుగుతడా?!’ అన్న.
‘మొత్తానికి ఇసొంటిదేదో జరిగి ఉంటదని ఆయనకు తెలిసే ఉన్నట్లున్నదన్న. ఆయన మాటల్ని బట్టి నాకట్ల సమజైంది’ అన్నడాడు.
‘ముందుగాల చిన్నమామకు ఈ విషయం చెప్పు. నడిపి మామ యాడ ఉన్నడో తెలుసుకొని ఆయన కాడికి పొయ్యి జర నిమ్మలంగ విషయం చెప్పమని చెప్పు’ అన్న.
‘సరె’
ఇంతల రాజు ఫోన్..
ఎత్తిన. ‘అన్నా! ఈవినింగే వాళ్ల పెండ్లి చేస్తానికి చూస్తున్నరంటనె.. జల్ది మీ మావోల్లను సిటీకి బయల్దేరి పొమ్మనన్నా’ ఆదుర్దాగా ఉంది రాజు గొంతు.
నాగ్గూడ కొద్దిగ షాకింగా అనిపించింది. ఏం చెయ్యాల్నొ అర్దం గాలె.
‘ఇప్పుడె మా మామోల్లకు చెప్పమని తమ్మునికి చెప్పిన రాజు. వాళ్లేమంటరో సూద్దాం.’
‘సూద్దామంటె ఎట్లన్న. అసలు నువ్వు యూనివర్సిటీ లీడర్స్‌తోటి గట్టిగ మాట్లాడన్నా. తొందరపడి పెండ్లి చెయ్యొద్దని చెప్పన్నా. పిల్ల వాళ్ల నాయనలు ఏమంటరో సూద్దాం, జర ఆగమనన్నా.’
‘అట్ల నేనెట్ల చెప్త రాజు? నువ్వే ఏమన్న చెప్పి ఆపితె ఆపు’ అన్న.
రాజు నారాజై ఫోన్ కట్ చేసిండు. నాగ్గూడ టెన్షన్‌గ అనిపించింది. రేష్మ తొందరపడుతున్నదేమొ.. ఐటెంక ఇబ్బందులు పడతదేమో.. అది ప్రేమ కాకుండా ఆకర్షణే అయితే మాత్రం కష్టమే.. ఏం చెయ్యాల్నో తోచక అటు ఇటు తిరుగుతున్న.
గంటకు- నడిపి మామ ఫోన్. మాట్లాడాలంటె ఎట్లనో అనిపించింది. కని తప్పదు. ఎత్తిన.
‘మామా! సలామలేకుమ్’ అన్న.
‘వాలేకుమ్ సలామ్. ఏం చేద్దాం యూసుఫ్ మరీ?’ అన్నడు.
‘నాక్కూడా ఏం సమజైతలేదు మామా! యూనివర్సిటీ స్టూడెంట్స్ రకరకాలుగ చెప్తున్నరు. ఈ సాయంత్రమే పెళ్లి చేసెయ్యాలని చూస్తున్నరని కూడా అంటున్నరు. మరి ఎట్లంటవ్?’ అన్న.
‘అట్లెట్ల?! మేం ఇప్పుడు బయలుదేరి వస్తం. ఆపమను’ అన్నడు కాస్త కటువుగ.
‘అట్ల మనం చెప్పలేం మామా! రేష్మానే వత్తిడి చేస్తుందని చెప్తున్నరు.’
‘లేదు యూసుఫ్, నేను ఒక్కసారి రేష్మతోని మాట్లాడాలె. దాని మనసుల ఏమున్నదొ నాకు తెల్వాలె గదా.. అంతవరకన్న ఆగాలె కదా..’ అన్నడు.
‘నిజమే కాని.. మనకు ఎట్ల తెలుస్తది మామా! మనకు చెప్పకుంట కూడ చేసెయ్యొచ్చు.’
‘అది కాదు యూసుఫ్, జర నువ్వు పొయ్ రావొచ్చు గదా.. పొయి వాళ్లతోని మాట్లాడితె వింటరేమో’
‘లేదు మామా! నేను వెళ్లలేను. నేను వెళ్లి మీరొచ్చేదాంక పెండ్లి ఆపమన్నా నేను మీ వైపు నుంచి వచ్చినట్లు యూనివర్సిటీ అంతా నన్ను బద్నాం చేస్తరు. నేను అందరికీ తెలుసు కదా..’
‘మరెట్లా! మేం వెళ్లిందాకనన్నా ఆగాలె కదా..’
‘మీరు వస్తున్నరు, వచ్చిందాక ఆగమంటున్నరని చెప్పించమంటె చెప్పిస్త మామా’ అన్న.
‘సరె, అట్లనన్న చెయ్. మేం బయలుదేరుతం’ అన్నడు.
‘సరె మామా!’
మామ గొంతు పలికిన రకరకాల ధ్వనులకు నా మనసు గిలగిలలాడింది. అయ్‌నా ఏం చేయగలను..!
***
antu
ఇదంత అయ్యేసరికి మద్యాహ్నం దాటింది. నేను ఆఫీస్‌కు వెళ్లిపోయిన. రాజు మద్య మద్య హెచ్చరిస్తనె ఉండు. రాజును వాళ్లతోపాటు వెళ్లమని చెప్పిన. సరేనన్నడు. మా నడిపి మామ, వాళ్ల జిగ్రీ దోస్తు శ్రీను, మా చిన్న మామ, మా తమ్ముడు కారు మాట్లాడుకొని బయల్దేరిన్రు. రాజు చివరి నిమిషంలో తాను ఆల్రెడీ బస్‌లో బయలుదేరినట్లు చెప్పిండంట. ఒట్టిదే.. అతను రాడని సమజైపొయింది..
పొద్దుగూకింది..
భరత్‌కు ఫోన్ చేసిన. ‘పరిస్తితేంది భరత్?’ అన్న.
‘ఏముందన్న, వాళ్లకు పెండ్లయిపోయిందే!’ అన్నడు.
నేను పరేశానై, ‘అంటె.. మీరు చేసిన్రా?’ అన్న.
‘వాళ్లే చేసుకున్నరన్న. ఆ పిల్ల మమ్మల్నే నమ్ముతలేదు. మరి మీ నాయ్న వాళ్లు వస్తున్నరంట కదా.. వచ్చిందాంక ఆగమన్నం. దాంతోటి ఆ పిల్ల మరింత పరేశాన్ చేసింది. మీరు చేస్తె చెయ్‌రి. లేకపోతే ఎటన్న వెళ్లిపోతం అన్నది. మిమ్మల్ని నమ్మి మీ దగ్గర్కి వస్తె మీరేంది ఇట్ల చేస్తున్నరని అరిచింది.. పోరగాన్ని సమ్జాయించబోతె వాన్తోని గుడ ‘నువ్వు గన్క వాళ్ల మాటలు విని ఆగుతనంటె నేను ఇక్కడ్నె ఆత్మహత్య చేసుకుంట’నని గడ్‌బడ్ చేసిందన్న.. ‘అరె, జర ఆగమ్మా.. ఆన్ని గుడ ఆలోచించుకోనీ’ అన్నమన్నా.. ‘ఇద్దరం అనుకున్నంకనే కదా, మావోల్ల నందర్ని వొదిలేసి, ఇంట్ల నుంచి వొచ్చేసిన. మా నాయనలొస్తె పెండ్లి కానిస్తరా? ఇప్పుడు పెండ్లి చెయ్యకపోతె నేన్ సచ్చిపోత’ నని బెదిరించిందన్న’ అన్నడు భరత్.
‘అవునా..! మరి, ఎట్ల చేసిన్రు పెండ్లి?’ అన్న.
‘ఏముందన్న, ఆర్ట్స్ కాలేజ్ పక్కన గుడి ఉంది కదా.. అక్కడ దండలు మార్పిచ్చినమ్. తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ చేస్కుంటరంట’ అన్నడు.
‘సరె గని, భరత్! మా మామలు వస్తున్నరు. మరి వాళ్లతోని మారేజ్ అయినట్లు చెప్పొద్దు. వాళ్లు వెంటనె తట్టుకోలేరు. వాళ్లు ఏమంటరో వినురి’ అన్న.
‘అది కాదే.. ఇప్పుడెందుకు వాళ్లు ఇక్కడికి? ఇప్పుడొద్దని చెప్పన్నా.. రెండ్రోజులాగి రమ్మంటె మంచిది.. కొద్దిగ కోపం తగ్గుతది..’
‘వాళ్లు బయల్దేరిన్రు భరత్! నేను ఆగమంటె ఆగుతరా?’
‘ఇప్పుడొచ్చి ఏం చేస్తరన్న. అనవసరంగ ఆవేశపడ్డరనుకో.. ఇక్కడ పోరగాళ్లు ఊకోరు. బాగుండదన్నా..’
‘నేను చెప్త భరత్, వాళ్లతోని. గొడవ చెయ్యొద్దని. వాళ్లతోని మా తమ్ముడున్నడు. వాడికి కూడా చెప్త. జర ఓపిగ్గా వాళ్లతోని మాట్లాడి పంపించురి.’
ఫోన్ పెట్టేసినంక మా చిన్నమామకు ఫోన్ చేసిన- ‘మామా! అది యూనివర్సిటీ కాబట్టి స్టూడెంట్స్ చాలామంది ఉంటరు కదా.. ఎవరు ఎట్లుంటరో చెప్పలేం. పిల్లలు ఇప్పుడు వాళ్ల హేండోవర్‌లో ఉన్నరు. గొడవ చేసేటట్టు గాని, కోపంగ గాని మాట్లాడితె గడ్‌బడైపోతది..’ అంటూ అన్ని విషయాలు వివరించిన.. మా తమ్మునికి గుడ జాగ్రతలు చెప్పిన.
ఐటెంక- ఆఫీసుల ఉన్ననన్న మాటేగనీ ఇదే మనాది.. ఏం జరుగుతదో ఏమోనని.
8 గం.లకు మల్ల తమ్మునికి ఫోన్ చేసిన.
‘ఇక్కడ అంబేద్కర్ హాస్టల్ కాడికొచ్చినం. నడిపి మామను కార్‌లనే కూసుండబెట్టి మేం ముగ్గురం భరత్ రూంకొచ్చినం. షానాసేపయ్యింది. స్టూడెంట్స్ షానామందే ఉన్నరు. అన్ని విషయాలు మంచిగనె మాట్లాడుతున్నరు.. చిన్నమామ, శ్రీను పిల్లను కలిషిపోతమని షానా రకాలుగ అడిగి సూషిన్రు.. కలవడం కుదరదని వాళ్లు చెప్తున్నరు. నన్ను పక్కకు తీస్కపొయి చెప్పిండు లెనిన్, ‘యూసుఫన్న మామలని ఇంతసేపు సమ్జాయిస్తున్నమే.. లేకుంటె ఇక్కడికి ఇప్పుడు వద్దనే ఖచ్చితంగా చెప్దుము’ అని. వీళ్లేమో ఇంకా కోషిష్ చేస్తనె ఉన్రు.’
‘సరె, బయల్దేరేటప్పుడు ఏ విషయమైంది నాకు చెప్పు. ఇంటికొచ్చి పోరి, మందు తెచ్చి పెడత’ అన్న.
రాత్రి 11కు ఫోన్ చేసిండు తమ్ముడు. ‘భాయ్! నల్గొండ కెల్లిపోతున్నం’ అని.
‘అరె, అదేందిర.. నేను ఇంటికొచ్చి ఎదురుచూస్తున్న కద.. మీల్స్, మందు రెడీ చేసి..’ అన్న.
‘ఇగ ఇప్పటికె లేటయ్యింది, పోదమన్నరు.’
‘అట్లనా.. ఇంతకు ఆఖరికేమయ్యిందిరా?’ అడిగిన.
‘రెండ్రోజులాగి రారి, మాట్లాడుకుందాం.. ఇప్పుడైతె కలవడం కుదరదన్నరు. నడిపి మామ కొద్దిసేపు అట్లెట్ల అని వాదించిండు. వాళ్లు నిమ్మలంగనె మామను సమ్జాయించిన్రు’
‘సరె, జాగ్రత్తగ పోరి’
***
తెల్లారి తమ్ముడు చెప్పిండు, రాత్రి ఊరు చేరుకునేసరికి మూడు దాటిందని. మద్యలో ఆపి మామకు జర మందు పోయించిన్రంట. బాగ ఏడ్చిండంట మామ.
పెద్ద మామ ఏమన్నడంట అని అడిగి తెలుసుకున్న- ఇజ్జత్ తీసిందని, నేనైతె నరికేద్దును అని అరిషిండంట.. నడిపి మామ మా అత్తను బాగ కొట్టిండంట..
ఇటు మా అమ్మ వాళ్లూ, అటు మా అమ్మమ్మ అంతా పరేశాన్ ఉన్రు.. అందరు నాకు ఫోన్ చేసి నన్నేదైన చెయ్యమంటున్నరు..
మద్యాహ్నం మా నడిపి మామ ఫోన్.. ఎట్లన్న చేసి రేష్మాను తనతోటి మాట్లాడించమని స్టూడెంట్ లీడర్స్‌తో మాట్లాడమన్నడు. రేష్మాతో ఒక్కసారి మాట్లాడితె సాలు అంటున్నడు.
‘నువు చెబితె రేష్మ ఇంటదని నీకు నమ్మకముందా మామా?’ అనడిగిన.
‘అడిగైతె సూద్దాం యూసుఫ్. కని.. అది ఇనదు.. మొండిది..! అదేమనుకుంటదో అదే చేస్తది. దాని మనస్తత్వం నాకు తెల్సు.. అయ్‌నా, ఇంతపని చేస్తదని అనుకోలేదు యూసుఫ్. పెద్ద పిల్ల సూస్తె అట్ల ఉండె. ఇప్పుడు ఇదిట్ల చేస్తే చిన్నదాని పెండ్లెట్లయితది చెప్పూ…’ మామ గొంతు పూడుకుపొయింది.
‘మనసు గట్టి చేసుకోవాలె మామా! అయిందేదో అయింది, ఇప్పుడేం చేస్తే బాగుంటదో ఆలోచించాలె’ అన్న.
‘ఏం ఆలోచించాలె చెప్పూ.. ఊర్లె ఇజ్జత్ లేకుంట చేసింది. అప్పుడె ఊర్లె పోరగాళ్ల సూపు మారె.. అది ఇంత పని చేస్తదని కలల గుడ అనుకోలె..’ మామ ఏడుస్తున్నడు.
‘మామా! ఊరుకో మామా..! అన్నీ తెలిసినోడివి, నువ్వే ఇట్ల దైర్యం చెడితె ఎట్ల.. ఊరుకో..’ అంటుంటె నాకు కూడా గొంతు పూడుకుపొయింది.
మామకు దుఃఖం ఆగుతలేదు.. గొంతు పెగుల్త లేదు, ‘నేను మల్ల మాట్లాడత’ అని ఫోన్ పెట్టేసిండు. ఫోన్ పక్కన పడేసి నేను గుడ కొద్దిసేపు ఏడ్షిన. ఇంతదాంక మామ ఏడ్షిండని విని గుడ ఎరుగను.. ఏం చెయ్యాల్నో తోచక తల్లడమల్లడమైన.
ఆఖరుకి- పొద్దుగూకాల మామకు ఫోన్ చేసిన- ‘మామా! ఒక్కటే మార్గం, మన రేష్మానె వినేటట్లు లేదు కాబట్టి ఆ పిలగాడిని ఒప్పించి ఏదొ ఒక మజీదులో నిఖా చదివించేస్తే, వాళ్ల బతుకు వాళ్లు బతుకుతరు. మీకు గుడ గౌరవంగ ఉంటది. చిన్న పిల్ల షాదీకి ఇబ్బంది ఉండదు.. సోంచాయించురి’ అన్న.
‘నాతోని గుడ మనోళ్లు ఇదే అంటున్నరు.. మరె అట్ల ఒప్పుకుంటడా పిలగాడు..’ అనుమానంగ అన్నడు మామ.
‘మీకు ఇష్టమేనా? ఇష్టమైతె అడుగుదాం’ అన్న.
‘ఇగ మన పిల్లే ఇననప్పుడు ఏం జేస్తం. గని, మరె మిగతా మామలు ఏమంటరో..’ అన్నడు.
‘మామా! మిగతావాళ్ల అభిప్రాయాలు తర్వాత సంగతి మామా! వాళ్లు రకరకాలుగ చెప్తుంటరు. రేష్మా నీ బిడ్డ! మీరంతా ఎక్కువ టైట్ చేస్తె ఆ పిల్ల ఏమన్న చేసుకుంటె ఏం చేస్తరు? నీ బిడ్డ మీద నీ ప్రేమ వేరు. మిగతా వాళ్ల ప్రేమ వేరు. కాబట్టి నీ నిర్ణయం ముఖ్యం మామా! నీకు ఓకే అయితే అందరు ఊకోక ఏం జేస్తరు?!’ అన్న కొంచెం టోన్ పెంచి.
కొద్దిసేపు సైలెంట్‌గ ఉండిపొయ్‌న మా మామ, ‘సరె, సూద్దాం యూసుఫ్! ముందు నేనొకసారి రేష్మాతోటి మాట్లాడాలె. రేష్మా నాతోని గుడ ఆ పిలగాన్నే చేసుకుంట అంటె ఇగ నువ్వన్నట్లె చేద్దాం’ అన్నడు.
***
మర్నాడు-
మా నడిపి మామ, ఆయన బామ్మర్దులు-దోస్తులు, మా చినమామ యూనివర్సిటీకొచ్చిన్రు. నేను గుడ పొయ్‌న. స్టూడెంట్ లీడర్స్ మా మామోళ్లను అంబేద్కర్ హాస్టల్ వెనక గ్రౌండ్‌లో దూరంగా చెట్టుకింద కూసోబెట్టిన్రు. పిల్ల, పిలగాన్ని హాస్టల్‌లోని ఒక రూంకు రప్పించిన్రు. మా నడిపి మామ ఎక్కడ బరస్ట్ అవుతడోనని, మా చిన్నమామను, నన్ను, శ్రీనును ముందు పిల్సుకపోయి వాళ్లతోటి కలిపిన్రు.
రేష్మ నన్ను, చిన్నమామను సూడంగనె లేషి నిలబడి సలాం చేసింది. సెల్వార్ ఖమీజ్‌లనె ఉన్నది. తన చామన ఛాయ మొఖం గుంజుకుపొయ్ ఉన్నది. కండ్లు పీక్కుపొయ్‌నయ్. పక్కన పిలగాడు లేషి నిలబడ్డడు. బక్కగున్నడు. నలుపే. అతని మొఖం గుడ పీక్కుపొయింది. మేం ఎదురుంగ కుర్సీల్ల కూసున్నం. వాళ్లు మంచం మీద కూసున్నరు. రేష్మ తల వొంచుకొని కుడి కాలి బొటనవేలితోటి నేలను రాస్తున్నది. కాలి ఏళ్లకు మెట్టెలు తొడిగిన్రు. చేతుల నిండా గాజులు. మెడల వెతికిన. పసుపుతాడో, నల్లపూసలో ఉన్నట్లుంది గనీ వోనీతోటి కప్పేసింది…
శ్రీను గుచ్చి గుచ్చి కొన్ని ప్రశ్నలు వేసిండు- ‘మీరిట్ల వొచ్చేస్తే మరి మీ వోల్లు ఎట్ల ఊకుంటరనుకున్నరు? ఎన్ని కష్టాలెదురైనా ఎదుర్కుంటరా? ఎప్పటికీ కలిసి ఉంటరా? మద్యల మోజు తీరిపోతె ఏం జేస్తరు?’ అని.
మొత్తానికి ఇద్దరూ షానా గుండె నిబ్బరంతోటే జవాబులిచ్చిన్రు. ఎక్కడా తొట్రుపాటు లేదు. కలిసే బతుకుతం.. కలిసే చస్తం! అన్నరు.
మా చిన్నమామ రేష్మా నుద్దేశించి- ‘మరి, నీ అక్క సూస్తె ఎడ్డిది.. ఆ పిల్ల నిన్ను విడిచి ఉండలేదు కదా.. నువ్వు కనబడక ఒకటె గొడవ చేస్తున్నది, ఏడుస్తున్నది. అట్ల చేస్తదని నీకు తెల్సు కదా!’ అన్నడు. ఆ మాటలకు మాత్రం రేష్మా కండ్ల నిండ నీళ్లు తిరిగినయ్. కండ్లు తుడుసుకున్నది. మల్ల మా మామ- ‘నువ్విట్ల చేస్తె మీ చెల్లె పెండ్లి ఎట్లయితదనుకున్నవ్? ఇగ ఆ పిల్లను ఎవరు చేసుకుంటరు?’ అన్నడు. దానికి వంచిన తల ఎత్తలేదు రేష్మా.
నేను పిలగాన్ని ఉద్దేశించి- ‘రేపు నీకు ఉద్యోగం వచ్చినంక కట్నం గిట్నం బాగొస్తదని ఈ పిల్లను వొదిలెయ్యవని గ్యారంటీ ఏంది?’ అనడిగిన. అట్లేం చెయ్యనన్నడు.
శ్రీను అందుకొని-‘సరె, అయిందేదొ అయింది. మరి మీరు మంచిగుండాలె. మీవాళ్లు గుడ మంచిగుండాలె. వాళ్ల పద్ధతి ప్రకారం పెండ్లి చేసుకుంటె, వాళ్లకు గుడ గౌరవంగ ఉంటది. మీకు గుడ ఏ ఇబ్బంది ఉండదు. అట్ల చేసుకుంటవా పిలగా?’ అడిగిండు.
అప్పటికె ఆ టాపిక్ వాళ్లదాక చేరి ఉండడంతోటి ఆ ప్రశ్నకు రెడీగ ఉన్నట్లె ఆ పిలగాడు ‘పెండ్లి వరకు వాళ్ల ప్రకారం చేసుకుంట’ అన్నడు. మంచిదె అనుకున్న నేను.
‘అయితె ఒక చిన్న పని చెయ్యాల్సొస్తది. మా ఇండ్లల్ల ఒట్టిగ మజీదుల నిఖా చదివించడానికైనా ముస్లిం పేరు పెట్టుకోవాలె. అట్లనె నిఖాకు ముందే సున్తీ చేయించుకోవాల్సి ఉంటది’ అన్నడు మా చిన మామ.
పిలగాడు తకబిక అయ్యిండు ఆ మాటతోని. అతని దోస్తుల దిక్కు, స్టూడెంట్ లీడర్స్‌దిక్కు సూషిండు. ఆలోచించుకొని చెప్పు, బలవంతం ఏమీ లేదని ఎవరో అన్నరు. దాంతోని మేం కాసేపు మాట్లాడుకొని చెప్తం అన్నడు పిలగాని దోస్తు. దాంతో మా మామ, శ్రీను బైటికి నడుస్తుంటె, నేను పిలగాన్ని పక్కకు పిలిషి ‘ఇయాల్రేపు సున్తీ అనేది మామూలు విషయం. ఆరోగ్యానికి మంచిదని, డాక్టర్లు గుడ ఎంతోమందికి సున్తీ చేయించుకొమ్మని సజెస్ట్ చేస్తుంటరు. ఆ విషయంల నువ్వేం భయపడకు’ అని ‘దైర్యం చెప్పి బైటికొచ్చిన.
కొద్దిసేపటికి మల్ల వాళ్లు మమ్మల్ని లోపలికి పిలిషిన్రు. పిలగాడు రెండ్రోజులు టైమ్ కావాలన్నడు, తమ వాళ్లను అర్సుకొని చెప్తనన్నడు. సరె, అట్లనె కానివ్వమని అన్నరు వీళ్లు. బైటికొచ్చినంక నాకొక మీటింగ్ ఉండడంతోని నేను వొచ్చేసిన.
వీళ్లు పొయి మా నడిపి మామకు విషయం చెప్పిన్రంట. ఆయన అయితెమాయె గని పిల్లను నేను గుడ సూషి మాట్లాడత అన్నడంట. దానికి రేష్మ- ‘వొద్దు, నేను మా నాయన ముందు నిలబడలేను. వద్దే వద్దు’ అన్నదంట. అట్లెట్ల అని మా మామ, తానేమీ అననని, పలకరింపుగా చూస్తనని అన్నడంట. వద్దులెమ్మని స్టూడెంట్ లీడర్స్ అంటె వాళ్లతో కాస్త వాదం పెట్టుకున్నడంట. నా బిడ్డను నాకు సూపెట్టకపోతె ఎట్ల అని నిలదీసిండంట. దాంతో వాళ్లు రేష్మాను ఒప్పించి ఇద్దర్ని కలిపిన్రంట. తండ్రిని సూడంగనె కాళ్లమీద పడి బోరున ఏడ్సుకుంట నన్ను మాఫ్ చెయ్యమని వేడుకున్నదంట రేష్మా. రేష్మాను ఎత్తి గుండెలకు హత్తుకొని తాను గుడ ఏడ్షిండంట మామ. ఐటెంక ‘ఆ పిలగాడు రెండ్రోజులు టైమడిగిండు కదా.. నువ్వు మాతోటి వచ్చెయ్యి.. మల్ల రెండ్రోజుల తర్వాత వద్దాం’ అన్నడంట. దానికి రేష్మా, స్టూడెంట్ లీడర్స్ ఎవరూ ఒప్పుకోకపొయ్యేసరికి చేసేదేం లేక వీళ్లు వెనుదిరిగిన్రంట.
***
ఆ వెంటనె రాజు నాకు ఫోన్ చేసిండు- ‘ఏం జరిగిందన్నా..’ అన్నడు. విషయం చెప్పబొయ్‌న. అతను వ్యంగ్యంగా- ‘అంటె వానికి సున్తీ చేయించి వాన్ని ముస్లింగ మారుస్తరా? అంటే రేపు వాన్ని అందరూ తీవ్రవాదిగా సూస్తానికా?’ అన్నడు.
నేను ఆశ్చర్యపోయి- ‘అంటే నీకు ముస్లింలందరూ తీవ్రవాదుల్లెక్క కనిపిస్తున్నరా?’ అడిగిన విసురుగ.
అతను కూడ విసురుగ- ‘వానికి సున్తీ చేయించి వాని ఎస్.సి. రిజర్వేషన్ పోగొట్టాలనుకుంటున్నరా?’ అని మల్లొక బాంబు వేసిండు.
‘అరె, ఏం మాట్లాడుతున్నవ్ రాజు నువ్వు? అంటె వాళ్లను బలవంతంగ విడగొట్టాలనా నీ ఉద్దేశం?!’ అన్న.
‘మీరు అనుకున్నదే చేద్దామనుకుంటున్నరు కదా..! వాని జీవితాన్ని చెడగొడదామనుకుంటున్నరేమో- కానియ్‌రి.. సూద్దాం!’ అని కట్ చేసిండు ఫోన్.
నాకు చికాకేసింది. అతనికి వీళ్ల ప్రేమ వివాహం ఇష్టం లేదని ముందునుంచే అతనిపై ఉన్న డౌటు నిజమైంది. కాని ఇంతగనం వ్యతిరేకత ఉందని మాత్రం నేను అనుకోలే. అణగారిన కులం నుంచి వొచ్చి లెక్చరర్‌గ పనిచేస్తున్నవాడే ఇట్లంటె ఇగ మామూలు ‘హిందువుల’ సంగతేంది? అనుకున్న.
రెండు రోజులు గడిచినయ్-
రేష్మ రెండు మూడు మాట్లు మా మామకు ఫోన్ చేసి మాట్లాడిందంట- సున్తీ చేయించుకోవడానికి భయపడుతున్నడని ఒకసారి.. అతని దోస్తులు రకరకాలుగా భయపెడుతున్నరని ఒకసారి.. ఎస్.సి. రిజర్వేషన్ పోతదని భయపడుతున్నడని మల్లోసారి.. సున్తీ హైదరాబాద్‌లనే చేయించుకుంటనంటున్నడని మరొకసారి మాట్లాడిందంట. నల్గొండలోనైతే తాము తోడుంటమని మా మామ అన్నడంట. నల్గొండకు వస్తానికి భయపడుతున్నడని అన్నదంట. అయితె హైదరాబాద్‌లనే చేయిద్దాం, ఎప్పుడు చేయించుకుంటడో చెప్పమని మా మామ అన్నడంట.
ఆ తర్వాత నించి ఫోన్‌లు బందైనయంట. భరత్, లెనిన్‌లు గుడా ఫోన్‌లు ఎత్తుత లేరంట!
నాలుగు రోజులు చూసి మా మామ నాకు ఫోన్ చేసి ఏం సంగతో కనుక్కోమన్నడు. ప్రేమ పెళ్ళిళ్లకు రిజర్వేషన్ కూడా సమస్యే అయిందేందా అని జరసేపు సోంచాయించుకుంట ఉండిపొయి, ఇబ్బందిగనే భరత్‌కు ఫోన్ చేసిన.
‘ఏమో అన్న! వాళ్లు మాకు గుడ కాంటాక్టుల లేరే..! ఎటు పొయిన్రో సమజైతలేదు’ అన్నడు.
‘అదేందే! ఏం జరిగిందసలు?’ అనడిగిన.
‘ఆ సున్తీ గురించే వాడు భయపడుతున్నడన్నా..’ అన్నడు.
‘అరె! ఆ పిల్ల ఆ పిలగాని కోసం అందర్ని వొదులుకొని వచ్చినప్పుడు వాడా పిల్ల కోసం ఆ మాత్రం చెయ్యలేడానె? సున్తీ చేసుకున్నంత మాత్రాన ఏమైతది!’ అని అడిగిన నేను.
‘అట్లనె మేం గుడ అడిగినమన్నా.. ఇట్ల ఎటూ తేల్చుకోలేకపోతె కష్టమని, ఏదో ఒకటి చెప్పమని గట్టిగనె అడిగినం.. దాంతోటి వాడిక మమ్మల్ని గుడ కలుస్తలేడే! ఏమైందని తెల్సుకుంటె అసలు వాళ్లిద్దరు ఇక్కడ్నుంచి ఇంకెక్కడికో ఎల్లిపొయిన్రని తెలిసిందే.. యాడికి పొయిన్రో తెలుస్తలేదే..!’ అన్నడు భరత్.
ఎందుకో.. భరత్ మాటలు నమ్మబుద్ధి కాలేదు నాకు.
మా మామకేం చెప్పాల్నో ఎంతకూ సమజ్ కాలేదు.
సోంచాయించుకుంట కుర్సీల కూలబడ్డ-
పిలగాడు అట్లా భయపడడం సహజమే కానీ.. రేష్మ మనసెంత తల్లడిల్లుతుంటదో కదా..! తన దిక్కు నుంచి ఈల్లెవరు ఎందుకు ఆలోచించరు..!?
*
స్కైబాబా

స్కైబాబా

–స్కైబాబ

తనదైన స్పృహతో రాసిన కథలు!

రండి బాబూ రండి!

[మోసం లేదు, మాయా లేదు!
ద్రోహం లేదు, దగా లేదు!

రండి బాబూ రండి!
రండీ, కొనండీ, చదవండీ, ఆనందించండీ, ఆలోచించండీ, ఆశీర్వదించండి….
ఆంధ్రుల అభిమాన యువ రచయిత అరిపిరాల సత్యప్రసాద్ రాసిన “ఊహాచిత్రం”
కథాసంకలనం! నేడే మీ కాపీ రిజర్వ్ చేసుకోండి ! ఆలసించిన ఆశాభంగం-
త్వరపడితే తపోభంగం!]

*    *    *

Cover

అఫ్సర్ గారినుంచి వినతి లాంటి ఆజ్ఞ రావడంతో మొహమాటానికి పోయానుగాని, పుస్తకాన్ని సమీక్షించడం అంటే తల మాసినవాడు తలకి పోసుకోవడం లాంటిదని కాసేపటికి యిట్టే తెలిసిపోయింది!

ఈ మాట ఎందుకంటే అరిపిరాల సత్యప్రసాద్ రాసిన “ఊహాచిత్రం” పుస్తకం లోని 18 కథలు వెంట వెంటనే చదివేసి వాటి సమాచారాన్ని అరల్లో భద్రపరచే మెకానిజం, మెమరీ పవరూ నాకుందని నేననుకోను. అయితే కొన్నిసార్లు సన్యాసికైనా విన్యాసాలు తప్పవుకదా!:-)

కథలు రాయడం అనే ప్రక్రియని సత్యప్రసాద్ ఒక యోగవిద్యలాగానో, యుద్దవిద్యలాగానో భావించి తగినంత స్వయంశిక్షణతో రాశాడనేది అర్ధమయ్యాక తనమీద గౌరవం మరింత పెరిగింది. తెలుగు సినిమాల్లో పేదరికం కమ్ముకున్న హీరో రకరకాల వృత్తులు చేసినట్టుగా, తనకథలకి భిన్నమైన సబ్జెక్టులు యెన్నుకుని తననితను బాగా కష్టపెట్టుకున్నాడు రచయిత.

ఈ సంకలనం లోని కథల్లో మొదటి కథ “స్వప్నశేషం”, చివరికథ “భూదేవతమ్మ” నాకు బాగా నచ్చాయి. స్వప్నశేషం కథలో ఒక చోట అన్నట్టు, “ఫైన్ ఆర్ట్స్ మర్చిపోయి ఎకనామిక్స్ మాత్రమే బోధించే జీవితపు విశ్వవిద్యాలయంలో భావుకత్వం ఇక భ్రమ”– అన్నప్రకారం ప్రతి తల్లీ, తండ్రీ, స్కూలు కలిసి భావి తరాలను యంత్రాలుగా మార్చే దశలో మనమందరం జీవిస్తున్నాం. ఈ పరిస్తితులను వివరిస్తున్నట్టు పచ్చి రియాలిటీతో సాగే “ఓపన్ టైప్” అనే కథను రాశాడు రచయిత. దీనికి పుర్తి భిన్నంగా, యిదే రచయిత రాశాడంటే నమ్మలేని విధంగా “చినుకులా రాలి” అనే కథని కూడా రాశాడు. ప్రతి కధా దేనికదే ప్రత్యేకంగా అనిపించే 18 కథల్లో 3 కథలు పట్టించుకోదగినవి కాదనేది నా అభిప్రాయమైనా, మిగతా కథలన్నీ మటుకు మనకొక టూర్ ప్రోగ్రాం చేసొచ్చిన అనుభుతిని కలిగిస్తాయి.

ఈ సంకలనంలో భిన్న నేపథ్యాలున్న కథలవల్ల రచయితకొక తాత్వికత లేనట్లుగా పైకి కనిపిస్తుంది గానీ, అంతర్లీనంగా అలోచిస్తే ‘భౌతిక ప్రపంచం వేగంగా మారిపోతున్న వర్తమాన సమాజంలో మనుషుల మధ్య పెరుగుతున్న *దూరం* దాదాపు అన్ని కథల్లోనూ కనిపిస్తుంది. వీలైననంతవరకు ఈ దూరాన్ని దగ్గర చేసే ప్రయత్నంలోనే రచయిత ఈ కథలు రాశాడని చెప్పవచ్చు.

ఇందులోని కథల్లో రచయిత మార్క్సిజం, బుద్దిజం, అంబేద్కరిజం ఇంకా వివిధ అస్తిత్వవాదాలు వంటి సిద్దాంతాల జోలికి పోకపోవడం  ఒక రిలీఫ్. వివిధ సిద్దాంతాలే వైరుధ్యాలతో సంఘర్షిస్తున్న వేళ –  మానవ విలువలే తన దృక్పధంగా ఈ కథల ద్వారా రచయిత తనదైన స్పృహని ప్రకటించుకోవడం కూడా ఆహ్వానించ దగ్గ పరిణామం.

అయితే రచయిత చాలా కథల ముగింపు విషయంలో తగినంత శ్రద్ద తీసుకోలేదని మాత్రం నాకు అనిపించింది. ఇది రచనపై అశ్రద్ద అనేకన్నా మన అవగాహనపై అశ్రద్ద అనవచ్చేమో.  పదిమందికి చేసే కూరలో ఒక ఇల్లాలు ఉప్పు అవసరానికన్నా తక్కువే వేసి గిన్నె దించుతుంది. ఈ తగ్గించి వేయడంలోని జాగ్రత్త గమనిస్తే, తదుపరి కథలు మనల్ని  రచయితకి మరింత దగ్గర చేస్తాయి.

–దగ్గుమాటి పద్మాకర్

daggumati

ఆత్మలో కవిత్వం వున్నవాళ్ళు రాసిన కథలు ఇవి!

మళయాళ కథా ప్రస్థానం – 1

Secular Theatre in Kerala

నేడు కథ  అంటే ,ఏ సాహితీవేత్త కాని విమర్శకుడు కాని ఉద్దేశించేది ఒక శతాబ్ధానికి అటో ఇటో పుట్టిన కథ  , లేకపోతే కథానిక అనే సాహిత్య ప్రక్రియగురించే. కాని అతిపురాతన కాలంనుంచే  కథలు ఉన్నాయి.బి. సి 320 నుంచి  సమాజంలో కథ లు  చలామణి లో ఉన్నాయి  అనేదానికి రుజువులు కనబడుతున్నాయి . బి.సి. 320 కి చెందిన ‘’ఇద్దరు సోదరులు’’ అనే కథ ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఇప్పటి వరకు మనకు లభ్యమైన కథ ల్లో అతి పురాతనమైనదని చెప్పాలి .బి. సి. ఆరో శతాబ్దంలో గ్రీకు రాష్ట్రంలో ప్రాచుర్యంలో వుండేవని నమ్మే ఈసోపు కథ లు ,బుద్ధుని పూర్వ జన్మల గురించని నమ్మే జాతక కథలు  [563—483 బి. సి .] ఏ. డి. 300 –500 కి మధ్య కాలంలో రచింపబడినవి అని అనుకుంటున్నపంచతంత్ర కథలు మొదలైనవాటిని  ఆధునిక కథ లుగా పరిగణించలేం .  కాని కధావిర్భావానికి అప్పుడే బీజం పడిందని చెప్పాలి. మనిషి మాట్లాడటం ప్రారంభించాక తన అనుభవాలను ఇతరులకు తెలియపరిచాలని అనుకున్న నిమిషమే కథావిర్భావ  ముహూర్తం. నిజం చెప్పాలంటే ఒక వ్యక్తి తాలూకు జీవితానుభవాలనూ ఆలోచనలనూ ఇతరులకు చెప్పాలనే తపన నుంచే కథ పుట్టుకొస్తుంది. ఎదురుగా  ఉన్నవాడికి మౌక్తికంగా చెప్పవచ్చు –కాని లేనివాడికి అక్షర బద్దం చేసి చెప్పాలి . అందువల్ల కథ అనేది రచయిత తన జీవితానుభవాలగురించి  తన ఎదుట లేని పాఠకుడి తో జరిపే సంభాషణ కథ అని  కూడా భావించవచ్చు—కాని ఏకపక్షీయమైన సంభాషణ.

ప్రాంతీయ భారతీయ భాషల్లో నేడు మనం కథ అని కాని కధానిక అని కాని వ్యవహరించే సాహిత్య ప్రక్రియ ప్రారంభమైనది 19 వ శతాబ్దపు చివరి దశలో కాని,  ఇరవయో శతాబ్దపు ప్రారంభం లో  కాని మాత్రమే అనేది వివాదరహితమైన వాస్తవం. దక్షిణాది భాషల విషయంలో కూడా ఇది నిజమే. మలయాళ భాషలో సాహిత్య విమర్శకి సాహిత్య పత్రికకి పునాది వేసిన.సి. పి. అచ్యుత  మీనోన్ [1863 –1933] సారధ్యంలో వెలుబడిన విద్యావినోదిని అనే మాస పత్రికలో1891 లో  వెలుబడిన ‘’వాసనా వికృతి’’ అనే కధ మలయాళ భాషలో వెలువడిన తొలి కథ. ఈ కథ వ్రాసినవారు వెంగయిల్ కుంజీరామన్ నాయర్.[1869 –1914]. ఈ కథ వారసత్వం అనే పేరుతో  తెలుగులో  అనువదింపబడింది . కధాకేరళం అనే సంకలనంలో ఈ కధ లభ్యం [అనువాదకుడు –ఎల్. ఆర్. స్వామి]. ఇది ఒక దొంగ కథ. వారసత్వంగా దొంగతనం చేయటం అలవరిచుకున్న ఒకడు , రాజ్యంలో పోలీసు వ్యవస్ద ఏర్పడటంవల్ల ఊరిలో ఉండలేక మదిరాసుకి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు తను దొంగలించిన నగల పెట్టె తన ప్రేయసికి ఇచ్చి వెళ్తాడు. అందులోని ఒక ఉంగరం  ఆమె అతని  తొడుగుతుంది. మదరాసులో  దొంగతనాలు చేయకుండా మంచిగా బ్రతగాలని అనుకుంటాడు . కాని అందగత్తే అయిన  ఒక వేశ్యను అలా చూస్తూ నిలబడినప్పుడు ఆ ఉంగరం  ఎవరో కొట్టేస్తారు.పోలీసుకి ఫిర్యాదు చేస్తాడు . అందువల్ల పోలీసు అతన్ని పట్టుకుంటారు . ఆరు నెలల శిక్ష అనుభవించిన తరువాత జైల్ బయటికి వచ్చిన అతడు చెప్పుకున్నదే ఈ కథ .

రెండో కథ ‘’చెడుఅదృష్టం ‘’కూడా ఇతడు వ్రాసినదే. తిండికి కూడా లేని ఒక యువకుడు ధన వంతుడుగా మారిన జీవిత యాత్రని చిత్రీకరిస్తోంది ఈ కథ. మాతృసామ్య వ్యవస్ధలో వున్న అలనాటి ఉమ్మిడి కుటుంబాల సజీవ చిత్రీకరణ ఈ కథ. ‘’సెంట్రల్ జైల్ తప్ప గొడవలు లేని ఉమ్మిడి కుటుంబాలు వేరే ఎక్కడా  లేవు ‘’మొదలైన అలనాటి సామాజిక జీవనానికి అద్దం పట్టేఎన్నో మాటలు కథ ప్రారంభంనుంచి కనబడుతాయి.ఈ రెండు కథ లూ చాలా చిన్నవే. సుమారు అయిదు పేజీలు వుండవచ్చు. నాటకీయమైన ఎత్తుగడతో కూడిన కథ లు ఇవి. రెండు కథలూ బ్రతుకులోని చీకటి కోణాలను చూపిస్తున్నాయి. మొదటి కథ లో కథానాయకుడు స్వయంగా తన కథ చెబుతునాడు –రెండో కథ లో రచయిత కథ చెపుతాడు . రెండో కథ లో రచయిత ప్రత్యక్షంగా సమాజాన్ని విమర్శిస్తూన్నాడు. రెండు కథ ల్లోనూ సామాజిక నేపధ్యం ప్రస్ఫుటంగా కనబడుతుంది .పాఠకుకులను కూర్చోపెట్టి చదివించేవే ఈ రెండు కథలూ.

A house hotel boat on the backwaters in Kerala

మలయాళ కథ సాహిత్యంలోని ఈ తొలి దశ 1925 వరకు సాగింది. ఈ దశలో  కథ రచన  చేసినవాళ్ళలో ముఖ్యలు ఏడుగురు. మొదటి కథ బయిటికి వచ్చాక రెండు కథలు వ్రాసారు ఒడువిల్ కుంజీకృష్ణ మీనోన్ [1869—1916] .చాలా నిడివిగల కథ లు వ్రాసాడు ఇతడు –సంభాషణల నిడివి కూడా ఎక్కువే ఉంటాయి . వర్ణనలు కూడా ఎక్కువే ఇతని కధల్లో.కాని ఒక కథ లో నాయిక మనో సంఘర్షణను అత్యద్భుతంగా వర్ణించాడు అతడు. ఇతని మొదటి కధ 1902 లో అచ్చైంది. మదిరాసు మైసూర్ పట్నాల నేపధ్యంలో కధలు వ్రాసాడు ఇతడు.

అంబాడి నారాయణ పొడువాల్ [1871—1936] వ్రాసిన రెండు కధల్లో జీవితావగాహన ,హాస్యం ,వ్యంగధోరణి మొదలగు అంశాలు కనబడుతాయి. వర్ణనలతో కూడిన ఇతని కధల్లో తుది మలుపు గోచరిస్తుంది.

సి. ఎస్. గోపాల పణిక్కర్ [1872—1930]హాస్య రసాత్మకమైన కధలు వ్రాసారు. మూర్కొత్తు కుమారన్[1874—1941] వ్రాసిన రెండు కధలూ చిన్నవే . ఆధునిక మలయాళ కధల స్వభావం ప్రస్ఫుటంగా కనబడేది కే. సుకుమారన్[1876—1956] అనే రచయిత రచనలలోనే. ఇరవై ముప్పై పేజీల కధలు అతనివి.అయినా ఆసక్తిగా చదివించేవి అవి. దానికి కారణం కధలో కనబడే తుది మలుపే. పరోక్షం గా సామాజిక స్దితిగతులను విమర్శించాయి ఈ కధలు. ‘’పరాయివాడి బిడ్డ ‘’అనే కధ అయితే నేటి అంకురం సినిమాలంటిదే . ఈ కధలో రెల్వే స్టేషనుకి వెళ్ళిన ఒక యువకుడికి ఒక యువతి ఒక చిన్న పిల్లని ఇచ్చి కాస్త చూసుకో అని చెప్పి మాయమవటం అతడు ఆ పిల్లను ఇంటికి తీసుకురావటం భార్య అతన్ని అనుమానించటం అలా అలా సాగుతుంది కధ.మానవ స్వభావాన్నిఅతి వాస్తవికంగా చిత్రీకరించటమే కాక స్త్రీ హృదయానికి అద్దం పడుతుంది ఈ కధ. నేడూ ఇలాంటివి జరగవచ్చు అనిపిస్తుంది మనకు ఈ రోజు కూడా ,ఆ కధలు చదువుతే . కిట్టుణ్ణి నాయర్ 1882—1959] రసిక రంజిని అనే మాసపత్రిక కోసం వ్రాసిన ‘’అప్పున్ని మూప్పీల్ నాయర్ అనే కధ అలనాటి ఉమ్మిడి కుటుంబాల్లో నెలకొన్న పగ కక్ష తీర్చుకోవటం మొదలగు అంశాలను అతి తక్కువ నిడివిలో చిత్రీకరించిన కధ. తొలి నాటికధా రచయితల్లో ప్రస్తావించవలసిన మరో పేరు ఎం. ఆర్. కే. సి. [1881 –1939 ]

తొలి దశలో వచ్చిన కధల్లో ఎక్కువ కధలు విద్యావినోదిని అనే పత్రికలోనే వెలుబడ్డాయి. సామాజిక దృక్పదం కలిగిన కధలతో పాటు హాస్య వ్యంగ్య రచనలు కూడా కనబడుతాయి. తొలి నాటి కధలను ఆధునిక మలయాళ కధలతో కలిపే శృంఖలాలుగా నిలిచిన వారు ఇ. వి. కృష్ణ పిళ్ళ [1894 –1938],వి. టి. భట్టతిరిపాడ్ [1896—1982]భవత్రాధాన్ నంబూతిరిపాడ్[1902 –1944]. ఇ. వి. కృష్ణ పిళ్ళ గారి కధలు కేళీ సౌదమ్ అనే పేరుతో నాల్గు సంపుటాలుగా ప్రచురిపబడ్డాయి. కధ చెబుతూనే అప్పుడప్పుడు పాఠకులతో  స్వయంగా సంభాషించే శైలి ఇతనిది. అంతే కాక శైలి ప్రౌడ గంభీరం కూడా. వర్ణనలప్పుడు అలంకారాలతో కూడిన సాహిత్య భాష వాడినప్పట్టికి సంభాషణ లో వాడుక భాషే వాడాడు ఇతడు. మానసిక సంఘర్షణలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తాడు ఇతడు.

నంబూద్రి కుటుంబాల్లోని స్త్రీల దురవస్థలే వి. టి. భట్టతిరి పాడే, కీ భవత్రాధాన్ నంబుద్రి కీ  కధా వస్తువులు. అంత: పురంలో మగ్గిపోయే  నంబూద్రి స్త్రీల విషాదాన్ని కళాత్మకంగా చిన్న చిన్న  మాటలతో చిత్రీకరించారు వి. టి. స్వభావికత ఉట్టిపడే సంభాషణ రచన భవత్రాధాన్ నంబూద్రి ప్రత్యేకత. . అతని కధల్లో కధ చెప్పేది రచయితే. సంభాషణలు ద్వారా , కధా పాత్రల ఆలోచనలు ద్వారా పాత్రల మనసు బహిర్గతం  చేస్తాడు అతడు.

పలుగురు ప్రముఖ కధా రచయితలు రచన చేసిన 1925 నుంచి 1960 వరకు మలయాళ కధల రెండో దశగా పెరుకోవచ్చు. జాతీయంగానూ అంతర్జాతీయంగానూ పేరు ప్రఖ్యాతులు గడించిన రచయితులు  రచన చేసారు ఈ కాలంలో. కారుర్ నీలకండ పిళ్ళ [1898—1975], పి. కేశవ దేవ్[1904—1983], లలితాంబిక అంతర్జనం [1909—1987 ],వైకం మహమ్మద్ బషీర్[1910—1994], పోంకున్నాం వర్కి[1910—2004], తకళి  శివశంకర పిళ్ళ,[1912—1999 ], ఎస్. కె. పొట్టేకాడ్[1913 –1982], పి. సి. కుట్టికృష్ణన్[ఊరూబ్ –1915 –1979]పులిమాన పరమేశ్వరన్ పిళ్ళ[1916—1947],నాగవళ్లి ఆర్. ఎస్. కురుప్ [1917—2003], ముట్టత్తు వర్కి[1917 –1989],వెట్టూర్ రామన్ నాయర్,కే.సరస్వతి అమ్మ[1919—1975], టి. కె. సి.వడుతల[1921—1988] మొదలైనవారు ఈ కాలంలో రచన చేసినవాళ్ళల్లో ప్రఖ్యాతులు. ఎన్. పి. చెల్లప్పన్ నాయర్ [1903—1972], ఈ. ఎం. కోవూర్ [1906—1983] ఎం. ఎన్,గోవింధన్ నాయర్[1910—1997] చెరుకాడ్[ 1914—1976] ,ఎం.గోవింధన్[1919 –1989]. ఐ.కె.కె. ఎం. మొదలగు కధా రచయితలు కూడా ఈ కాలంలో రచన చేసినవాళ్ళే.

ఈ కాలంలో ,అంటే 1925 నుంచి 1960 వరకు వున్న కాలంలో కేరళలో సజీవమైన ఒక సాంస్కృతిక వాతావరణం ఉంటేది. 1927లో సమస్త కేరళ సాహిత్య పరిషత్తు రూపు దిద్దుకుంది. పరిషత్తు వార్షిక సమావేశాలు సాహిత్య సంస్కృతిక రంగాల్లో ఒక కదలిక సృష్టించింది. 1937 మూడు ముఖ్య సంఘటనలకు సాక్షిగా నిలిచింది. అవి తిరువితాంకూరు మహా రాజు వారి [మొదటిలో నేటి కేరళ ,తిరువితాంకూరు ,కొచ్చి మలబార్ అని మూడు ప్రాంతాలుగా ఉండేవి ]క్షేత్ర ప్రవేశ ప్రకటన, తిరువితాంకూరు విశ్వ విద్యాలయ  స్థాపన ,సజీవ సాహిత్య సమితి స్థాపన మొదలైనవి ఆ మూడు. 7 సంవత్సరాలు తరువాత 1944లో ఆ సాహితి సంస్ద అభ్యుదయ సాహిత్య సమితిగా మారింది. రచయితుల మొదటి సహాయ సహకార సంఘం 1945లో స్థాపించబడింది. 1946లో కేరళ సంస్కృతిక చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిన గ్రంధాలయ సంస్ధ ఏర్పాటైంది .

భారతీయ రాజకీయాలను కూడా కుదిపి వేసే రోజులు అవి. 1920నుంచే రాజకీయ తలంలో గాంధీజీ సాన్నిధ్యం ప్రస్ఫుటంగా కనబడటం మొదలైంది. గాంధీజి సాన్నిధ్యం భారతీయ రాజకీయానికి కొత్త చూపు రూపు ఇచ్చింది. రౌలెట్ అక్టుని వ్యతిరేకించమని గాంధీజీ ఇచ్చిన పిలుపుని మన్నించి లక్షల కొద్ది జనం నిరసనగా రోడ్డెక్కారు  1919లో. అహింస ,సత్యాగ్రహం నిరాహార దీక్ష, సహాయ నిరాకరణ మొదలైన ఆశయాలు ప్రజల ఆలోచనల్లోకి పాకాయి. ఈ ఆలోచనల ప్రతిధ్వనులు తిరువితాంకూర్ ,కొచ్చి మలబార్[ అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సి లో ఒక భాగం ]ప్రాంతాల్లో కూడా వినబడ్డాయి. ఈ కాలంలో జాతీయం గానూ అంతర్జాతీయంగానూ నెలకొన్న వాతావరణం,  జరిగిన సంఘటనలు,  ప్రపంచ మహాయుద్ధం ,స్వాతంత్ర సమరం తద్ఫలితంగా ఏర్పడిన దేశ విభజన వగైరాలు రచయితలను ప్రభావితం చేసాయి. అంతే కాదు స్వాతంత్రానంతర కాలంలో సాయుధ విప్లవం ,ఆ తరువాత పొరపాటు గ్రహించి ప్రజాసామ్య మార్గం అవలంబించి కమ్మునిస్టు పార్టి అధికారం కైవసం చేసుకోవటం [1957 ,ఏప్రిల్ 5] .ఆ తరువాత ఒక అపూర్వ ప్రజా పోరాటం వల్ల [విమోచన సమరం]ప్రభుత్వాన్ని తొలగించడటం ఆ తరువాత ఎన్నికలో కమ్మునిస్టు పార్టి గెలవకపోవటం మొదలైన సంఘటనలు సామాజిక జీవితంలో కల్లోలాలు  సృష్టించాయి. ఈ సామాజిక సంఘటనల కుదుపు కొంత వరకు జీర్ణించుకున్న వారే ఆ కాలంలో రచన చేసిన కారూర్ ,కేశవ దేవ్ ,బషీర్ వర్కి, తకళి, మొదలైన రచయితలు.

కధా స్వభావాన్ని బట్టి పరిగణిస్తే ,కారుర్ లలితాంబిక ,బషీర్ ,ఊరూబ్ మొదలైనవారిని ఒక చోట కట్టవచ్చు. కేశవ దేవ్ వర్కి, తకళి –ముగ్గురూ ఒకే గూటికి చెందినవారు. పొట్టేక్కాడ్,స్వరస్వతి అమ్మ,వెట్టూర్ రామన్ నాయర్, నాగవల్లి,ముట్టత్తు వర్కి, టి. కె. సి. వడుతల  మొదలగువరు మరో రో కోవకి చెందినవారని చెబుతునారు సాహిత్య చరిత్రకారులు.

మలయాళ కధా సాహిత్యంలో ఎలా చూసిన అగ్రగణ్యుడు కారుర్. ప్రభుత్వ అధ్యాపకుడుగా  బ్రతుకు గడిపిన అతడు ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించలేదు . కాని సమకాలీన సమాజం తాలూకు గుండె సవ్వడి నిజాయితితో చిత్రీకరించాడు తన కధల్లో. అతనికి ఆంగ్ల పరిజ్ఞానం లేకపోవటం వల్ల ఆంగ్ల ప్రభావం అతని కధల్లో అసలు కనబడదు.ఇంచు మించి 500 కధలు రాశాడు ఇతడు. అతని మొదటి కధ 1932 లో అఛైన భర్తృవాత్సల్యం. ఇరవై సంపుటాలు వెలువరించారు  –ఇతని కధల్లోని పాత్రలు సగటు మనుషులే. మామూలు మనుషుల రోజువారీ జీవితంలోని చిన్న చిన్న సంఘటనలే కధలకు ఇతివృతం. అపూర్వమైన రచనాశిల్పమూ తొణికిసలాడే మానవీయత ఇతని కధల ప్రత్యేకతలు. అధ్యాపకుల జీవితం గురించి అతడు వ్రాసిన కధలు చాలా ప్రసిద్ధం. ఈ కధలు కొంత’’ ఐరనీ ’ కొంత అతిశయోక్తి మిళితం చేసి వ్రాసారు,కారూర్. తన కధలకు నాటకీయ ప్రారంభం ఇస్తాడు ఈ రచయిత. మధ్యాహ్న భోజనం అనే కధ దీనికి ఉదాహరణ [ఈ కధ తెలుగులో లభ్యం –కధా కేరళం సంకలనం అనువాదకుడు –ఎల్. ఆర్. స్వామి ] ఇరవై ఎనిమిది గంటలు ఏమి తినక ,తినడానికి లేక ,పని చేసి అలసిపోయిన అధ్యాపకుడు ఒకవిద్యార్ధి [అతడు రెండు మూడు గంటలక్రితం ఏదైనా తినివుండవచ్చు] తెచ్చుకున్న అన్నం పొట్లం విప్పి తింటాడు. అలనాటి బడిపంతుల హృదయ విదారక స్దితినికాక ,అలనాటి దుర్భిక్షం గురించి కూడా పాఠకులకు  తెలియచేస్తుంది ఈ కధ. అలనాటి ఆకలి వత్సరాలను  చిత్రీకరించే కధలు ఎన్నో వ్రాసారు కారూర్. అతడే ఎప్పుడూ కధ చెబుతాడు. సంభాషణలు అతని కధలకు ప్రాణం. సంఘటనలుద్వారా  కధా పాత్రల  ప్రత్యేకతల గురించి తెలియపరిస్తాడు. రచయితే మన పక్కన కూర్చుని మనకు కధ చెపుతున్నడనే అనుభూతి కలుగుతుంది అతని కధలు చదువుతువుంటే.

లలితాంబికా అంతర్జనం

లలితాంబిక అంతర్జనం :

సాహిత్య రంగంలో కవయిత్రిగా అడుగు పెట్టారు లలితాంబిక అంతర్జనం[1919—1987] .చెప్పదలచుకున్నది మొత్తం కవిత్వంలో చెప్పలేక పోవటం వల్లనే ఆమె కధలు వ్రాయటం ప్రారంభించారు.బాధలు భరించే ఆత్మల పట్ల తనకున్న సానుభూతియే తను రచన చేయడానికి  కారణం అని ఆమె ఒక సందర్భంలో ప్రస్తావించారు. నంబూద్రి సమాజంలోని దురాచారాలను తేట తెల్లం చేసారు ఆమె. ముఖ్యంగా నంబూద్రి యువతుల దురవస్థను చక్కగా చిత్రీకరించి సమాజానికి అవగాహన కల్పించారు. 1966 లో ఆమె ఇలా వ్రాసారు’’ఒక మారుమూల పల్లెలో కర్షక కుటుంబంలో పుట్టి పొలాల మధ్య జీడి మామిడి తోటల మధ్య ఎదిగిన నాకు కాళీ ,నీలి ,అలగన్ [దళిత వర్గానికి చెందినవారి పేరులు ] మొదలగువారు ఫాషన్ కోసం స్వీకరించిన పాత్రలు కావు. ఆ పల్లె ప్రకృతి తో పాటు నా ప్రకృతిలో ఒక భాగమై మారిన మంచి స్నేహితులు. అంతర్జనాల బ్రతుకుకన్నానేను  ముందు తెలుసుకున్నది వాళ్ళ బ్రతుకు గురించే ‘’. ఈమె వ్రాసిన మొదటి కధ [ముసుగులో]నంబుద్రి సమాజంలో నెలకొన్న బహు బార్యత్వం గురించి ,ఆ సమాజంలోని ఆడపిల్లలను ,అతి చిన్న వయసులోనే నాల్గో పెళ్ళిగానూ అయిదో పెళ్ళిగానూ ముసలివాళ్ళకిచ్చి చేయటం ,భర్త ఇంటిలో సవతులతో వంట ఇంటిలోనే మొగ్గే వాళ్ళ జీవితం వగైరాలు చిత్రీకరించారు. 1938లో ఈమె వ్రాసిన మనోవిశ్లేషణాత్మక కధ చాలా ప్రసిద్ధం. కధ పేరు ‘’ప్రతీకార దేవత’. ఈ కధ కేరళ లో పెద్ద సంచలనం సృష్టించింది. ఇందులోని నాయిక నువ్వూ  ఒక లంజయేగా అనే మాట భరించలేక వెలయాలుగా మారుతుంది. కాని ఆమె మాటలు గమనార్హం ‘’జనం చూడనీ –మగాళ్ళే కాదు స్త్రీలు కూడా దిగ జారవచ్చని –న్యాయంగా ఆలోచిస్తే నంబూద్రి సమాజంలో వెలి వేయవలసినది మగాళ్లను కదా ‘’[ఒకొక్కరూ నాల్గైదు వివాహాలు చేసుకోవటమే కాక కొందరిని ఉంచుకునేవారు కూడా ]castme out if you will

ఈ కధ వ్రాసినప్పుడు రచయిత్రి వయసు ముప్పైకన్నా తక్కువే.

మాతృత్వపు మధిరిమ గురించి బాలల నినిష్కల్మషం  గురించి కూడా కధలు వ్రాసి వున్నారు ఈమె. రాజకీయ పరిణామాలు వల్ల భూసవరణ చట్టం వల్ల నిరుపేదలుగా మారిన  ఎందరో నంబుద్రి జమీందార్ల బ్రతుకులు కూడా ఈమె కు  కధా వస్తువే.  ‘ఒక మాటలో చెప్పాలంటే ఆమె బ్రతికిన నాటి సమాజపు [ముఖ్యంగా నంబుద్రి సమాజం ] గుండె సవ్వడి ఈమె కధల్లో వినబడుతుంది  .

Vaikom_Muhammad_Basheer

వైకోమ్ మహమ్మద్ బషీర్

వైకం మహమ్మద్ బషీర్ : మలయాళ సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం బషీర్ ది  . ఇతని కధలు ,నవలలు చాలా ఎక్కువగానే వివిధ భాషల్లోకి అనువాదం చేయబడింది కనుక ప్రపంచ వ్యాప్తంగా సాహిత్యాభిమానులకు బషీర్ అపరిచితుడు కాదు. ఇతని కధలకు నిడివి ఎక్కువ. నవలైనా , నవలికలైనా  ,కధ లైనా  ఇంచు మించు ఒకే పరిమాణంలోనే ఉంటాయి. భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో సంచరించి జీవితం తాలూకు చీకటి కోణాలు స్వయంగా చూసి అనుభవించినవాడు బషీర్. కాని ఆశ్చర్యం ఏమిటంటే అతను వ్రాసిన కధలన్నీ తనకీ తన కుటుంబానికీ పరిచయమున్నవారిదే. అతని కధల్లో కనబడే  హాస్యం  అప్పుడప్పుడు సరిహద్దు దాటి పరిహసించటం వరకు చేరుతుంది. కాని ఆ హాస్యం  అతను తన మీద కూడా ప్రయోగించు కొంటూ  వుంటాడు. మానవీయత అతని ఏ కధలోనైనా  తేట తెల్లమవుతుంది. సునాయసంగానూ స్వాభావికంగానూ ప్రవహించే సుమధుర భాష అతని రచనల ఆస్తి. బషీర్ గారి ఏ ఒక కధ వివరించాలన్నా ,వ్యాసం నిడివి  దాటిపోతుంది కనుక ,బషీర్ రచనలన్ని [ఇంచుమించు ] తెలుగులో లభ్యంకనుక ఆ పని చేయటం లేదు. ముస్లిం జీవితవిధానాలు ఇతని కధల్లో ఎక్కువగా ప్రస్ఫుటమవుతాయి.

ఉరూబ్ [పి.సి. కుట్టి కృష్ణన్]కధను భావగీతానికి దగ్గరగా చేర్చిన రచయిత. మనిషిలో వున్న మంచితనం గురించిన అచంచల విశ్వాసం అతని కధల్లో కనబడుతుంది. ప్రతి మనిషి ఏదో రకంగా సుందరి లేకపోతే సుందరుడు అని నమ్మాడు అతడు. జీవితపు ప్రసాద మధుర భావాల్లో మునిగి తేలేది అతనిమనసు. అందహీనమని వ్యవహరించే వాటిలో కూడా అందం కనిపెట్టే ,దేనిని నిస్సారమని పరిగణించని దృకోణంఅతనిది. నిండు సానుభూతి ఈ దృకోణం కి కారణం. వేసిన వేషాల మీద కోపం తెచ్చుకోవటం అర్ధరహితమని అతని ఉద్దేశ్యం.ఇతని కధల్లో ప్రకృతి కధా నేపధ్యంగా కలిసిపోతువుంటుంది.

సామాజిక పరిణామాలను లక్ష్యంగా భావించి అవసరమైతే ఆ పరిణామాల గురించి కొంత చెప్పవచ్చు అనే అభిప్రాయం కలిగిన రచయితలు ,పి. కేశవ దేవ్,పొంకునం వర్కి,తకళి, మొదలైనవారు. కమ్మునిస్టు పార్టీకి ప్రచురణ కర్తగా ,కేరళలో సాంస్కృతిక ట్రేడ్యూనియునుల వేదికల పై మొదటిసారిగా తన గళం విప్పాడు కేశవదేవ్. కాని సోవియటు యూనియనులో కార్మిక సర్వాధిపత్యం స్టాలిన్ అనే ఒక వ్యక్తి స్వేచ్చాధిపత్యంగా మారటం గమనించి కమ్యునిజానికి  వీడ్కోలు పలికి కమ్మ్యూనిస్టు వ్యతిరేకుల వర్గంలో చేరారు. పొంకున్నం వర్కి వైతే తన వామపక్ష భావ జాలంతోనే కొనసాగాడు. కాని తకళి గురించి ఇవి రెండూ చెప్పలేము. వామపక్ష పద జాలం వైపు మొగ్గున్నవాడే తకళి. కాని వంద శాతం వామ పక్ష పదజాల వాది కాదుఅతడు. వామ పక్షాలను విమర్శించినప్పుడు కూడా వ్యతిరేకుల గుంపులో ఉంటేవాడు కాదు..ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాలకు అతీతంగా నిలిచాడు అతడు. కాని ఒకటుంది. ఈ ముగ్గురు రచయితలు సమాజంలోని అట్టడుగు వర్గాల జీవిత సమస్యలు గురించి  వాదించినవాళ్లే –వాళ్ళజీవితాలు మెరుగు పరచటం కోసం నిలబడినవాళ్ళే –ముగ్గురూ మంచి కధా రచయితులే కాక గొప్ప నవలా రచయితలు  కూడా.

పి. కేశవ దేవ్.;[1904—1983]

ఇతడు రచించిన ఎక్కువ కధలకు ఇతివృతం మధ్య తరగతి వాళ్ళ అట్టడుగు వర్గం వాళ్ళ జీవితమే. ఆకలి బాధల గురించి కాని దరిద్రం గురించికానీ బషీర్ కాని తకళి కాని ఇన్ని కధలు వ్రాయలేదు. జమీందారులకు  ,పెట్టుబడుల దారులకు వ్యతిరేకంగా పొర వదలి లేచే అట్టడుగు వర్గ పు పాత్రలు ఇతని కధల్లో కనబడుతాయి. అధికారుల ప్రభుత్వాధికారుల అణిచివేతకి గురై ప్రాణం కోల్పోయిన వారి చిత్రీకరణ కూడా ఉంటుంది. వీళ్ళ వ్యక్తి గత  బంధాల పట్లే రచయిత శ్రద్ధ .ఏ కధ నైనా  ఒకే ఒక ఆశయం కోసం వ్రాసాడు దేవ్ . కుల మతాలకు అతీతంగా ఆలోచించే పాత్రలు ఇతని  కధా పాత్రలు.సంఘటిత శ్రమ శక్తియొక్క ఎదుగుదల ,  రాజకీయ కక్ష సాధింపులు వగైరాలు చిత్రీకరించే కొన్ని కధలు కూడా వ్రాసి వున్నాడు కేశవ దేవ్. కుల మత సంఘటనలకు అతీతంగా వ్రాసిన రెండు కధలు ‘’నాయర్ –ఇళవ గొడవ మరియు ’గుస్తి ‘’చాలా చిన్న నిప్పు రవ్వలు పెద్ద మంటగా మారే విధానాన్ని చిత్రీకరిస్తున్నాయి ఈ కధలు.వ్యక్తి నుంచి ప్రారంభమయే పగ అగ్నిగా మారి సమాజాన్ని ఎలా మింగేస్తుందో చూపిస్తాడు దేవ్ ఈ కధలల్లో. రాజకీయంగా విభేదించేవాళ్ళు సొంత పార్టీ వాళ్ళైనా చంపే హత్యల రాజకీయానికి వ్యతిరేకంగా వ్రాసిన కధ ‘’చంపకు ,తమ్ముడు చంపకు ‘’. అతడు 1965లో [అప్పడు అతని వయసు అరవై ] వ్రాసిన  స్వర్గంలో ఒక సైతాన్ అనే మనోవిశ్లేషణాత్మక కధ కూడా చాలా ప్రసిద్ధం.

పోంకున్నాం వర్కి : పెట్టుబడిదార్ల వ్యవస్థ,జమీందారివ్యవస్థ , పౌరోహిత్యపు వ్యవస్థ [క్రిస్టియన్ సమాజంలో ]మొదలగు మూడు వ్యవస్థలను శక్తి వంతంగా ప్రతిగటిస్తూ రచన చేసాడు  పోంకున్నాం వర్కి. ఇతడు అభ్యుదయ రచయితుల మార్గం అనుసరించాడు. యేసు ప్రేమను మార్క్స్ మానవీయతను ఒకటిగా భావించాడు  . స్వభావికంగానే పెత్తందార్లను పౌరోహిత్యాన్ని పెట్టుబడిదార్లను ఘోరంగా విమర్శించాడు. అందువల్ల వాళ్ళందరూ అతనికి వ్యతిరేకులుగా మారారు. ఏం చెప్పాలి అనేది ఎలా చెప్పాలి అనేదానికన్నా ముఖ్యంగా భావించాడు అతడు. అతడు ఒక సారి అన్నాడు’’రోడ్డు మీద జరిగే దోపిడి గురించి వ్రాసినప్పుడు కొన్ని పరుష మాటలు పడివుండవచ్చు. ఎవ్వరినైనా ఆక్షేపించే బదులు బాగు చేయాలనేదే నా కోరిక. ‘’

‘’నా నిరసన ప్రకటించటం కోసమే నేను రచయితగా మారాను నిరసన తెలుపవలసిన విషయాలు ఉన్నాయి,నాకు “ . నిజమే, నిరసన అతని కధలకు ప్రాణం

Thakazhi_1

తగలి శివశంకర పిళ్ళై

తకళి శివశంకర పిళ్ళ : [1912 -1999]

జీవితసమస్యలు గురించి వ్రాసిన కధకుడే తకళి కూడా . కాని నిరసన ప్రదర్శించడంలోనూ సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించడంలోనూ వర్కి వెళ్ళినంత దూరం వెళ్ళడు తకళి . తన ఏ కధలోనైనా ఒక ప్రశ్న అంతర్లీనంగా ఉంటుందని తకళియే చెప్పారు ఒక సారి. మోపోసొ ,చెకోవ్ స్టీఫాన్ స్వైగ్ మొదలగు పాశ్చాత్య రచయితుల ప్రభావం తకళి లో వుందనేది నిజం. కాని ఈ ప్రభావం కధా కదన రీతికి మాత్రమే పరిమితం.అతనికి తనదైన జీవిత దృకోణం ఉంది. మానవ సంబంధాల్లోని దైన్యానికి కారణం దారిద్రమే అని అతని నమ్మకం. వరద అనే కధ చాలా ప్రసిద్ధమైనది [తెలుగులో లభ్యం ] మానవ మనస్తత్వాన్ని విశ్లేషించిన మరో మంచి కధ ‘’మిలిటరివాడు’’ తకళి రచించిన ఎక్కువ కధలకు కుట్టనాడు నేపధ్యం [కుట్టనాడు –వరి సుభిక్షంగా పండే భూమి గల ఒక చిన్న ప్రాంతం.] తగళి పేరు వినగానే ఎవ్వరికైనా వెంటనే గుర్తు వచ్చేది అతని నవలలే.  కాని తకళి గొప్ప కధా రచయిత కూడా .

ఈ కాలంలోనే తమదైన ప్రత్యేక రచనా వ్యక్తిత్వంతో సాహిత్యానికి సేవ చేసిన మరి కొందరు కూడా వున్నారు. వాళ్ళలో ముఖ్యడు ఎస్. కె. పొట్టేకాడ్. [1913—1982]. తకళిలా కాని ,దేవ్ లా కాని నిరసనతో మండిపడి  అరవలేదు ఇతడు . ఇతరులుకు కోపం వచ్చే చోట అతనికి కొంత తమాషా అనిపించేది. భారత దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా కూడా పలు చోట్ల సంచారిలా తిరిగిన ఇతడు ప్రకృతి వైవిధ్యాన్ని ,మానవ జీవిత వైవిధ్యాన్ని దర్శించిన రచయిత. అందువల్లనే ఇతని కధలో కనబడెంత వైవిధ్యం గల కధాపాత్రలు ,కధా నేపధ్యం ఇతర కధా రచయితుల రచనల్లో కనబడవు. కధా నిర్మాణంలో దేవ్ కన్నా తకళి కన్నా ఎక్కువ శ్రద్ధ తీసుకొనేవారు .  అద్భుతమైన కొస మెరుపు ఉంటుంది కధల్లో. చాలా నిడివిగల కధలు ఇతనివి .రెండు మూడు దశాబ్దాల్లో నడిచే కధని కూడా కధగా వ్రాసారు ఇతడు . పుళిమాన అనే అతడు వ్రాసిన కధలు కవి వ్రాసిన కధలు. ఒక భావ గీతంలా ఉంటాయి అతని కధలు.  కధా వస్తువు అతి తక్కువే ఉంటుంది ఇతని కధల్లో. అతి చిన్న వయసులో చనిపోయిన ఈ కధా రచయిత [1916—1947]ఆ తరం రచయితుల ముందు ఉంటేవాడు.

నాగవళ్లి [1917—2003] నవలలూ కధలూ రచించారు. సామాజిక విమర్శ అతని రచనల్లోని అంతరార్థం . మనకు రోజు ఎదురయే జీవిత సంఘటనలకు హాస్యం జోడించి జీవితముయొక్క ఐరనీ   బోధపడే విధంగా వ్రాస్తాడు నాగవళ్లి. అతని ఒక పాత్ర ఇలా అడుగుతుంది ‘’నాకు అర్ధం కావటం లేదు. శాశ్వతమైన దివ్య ప్రేమకి నశ్వరమైన శరీరమూ లౌకికమైన వివాహమూ ఎందుకు ? ’’నిరుపేద కుటుంబాల్లోని [ఏ కులానికి చెందినదైనా ]సంఘటనలను ఆధారం చేసుకొని రచన చేసిన కధకుడు వెట్టూర్. కాని అట్టడుగు వర్గంవారి కధలు హాస్య రసంతో మిళితం చేసి వ్రాసిన రచయిత టి. కే. సి.వడుతల. [1921-1988 ]. పులయ [మాల ]సమాజానికి చెందిన వారి స్వప్నాలు ,స్వప్న భంగాలు,పులకింతలు ,ధర్మ సంకటాలు ఇతని కధల్లో నిండా కనబడుతాయి .  కుట్టనాటి మాలను  ఆవిష్కరించిన తకళి  కాని , మాల సమాజానికి చెందినవారిని రైతు కూలీల నాయకులుగా ఆవిష్కరించిన తోప్పీల్ భాసి కాని [ప్రముఖ నాటక రచయిత –తులాభారం తెలుగులో మనుషులు మారాలి ,రచయిత ] చిత్రీకరించిన దానికన్నావాళ్ళ జీవిత సమస్యలూ సంకీర్ణతలూ చిత్రీకరించ గలిగాడు ఈ రచయిత . క్రైస్తవులుగా మతం మార్చుకున్న మాలల ధర్మ సంకటాలను వివరించి ఇతడు వ్రాసిన కధ చాలా ప్రసిద్ధం .

హాస్య కధలు :

తమ హాస్య కధలతో మలయాళ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కధకుల ఆవిర్భావం కూడా ఇంచుమించి ఈ కాలంలోనే. ఎన్. పి. చెల్లప్పన్ నాయర్ [1903 –  1973],ఎం.న్.గోవిందన్నాయర్[19101997],ఆనందకుట్టన్[1920 –2000]మొదలైనవారు ముఖ్యలు. ఈ రచయితల్లో జీవితపు సంక్లిష్ట కోణాలకు హాస్యం మిళితం చేసి శక్తి వంతంగా రచన చేసిన వారు చెల్లప్పన్ నాయర్. అతి తక్కువ రచనలే చేశాడు ఇతడు. సహృదయుడైన ఒక మాన్యుడు జీవితంలోఇంకివున్న హాస్యం దర్శించి మనకు చెబుతునట్లు ఉంటాయి ఇతని కధలు. ఆనందకుట్టన్ రచించిన కధలు పూర్తి గ్రామ్య భాషలో ఉంటాయి. అతని హాస్యం వెనక సామాజిక విమర్శ దాగివుంటుంది. పి. కె.రాజ రాజ వర్మ 1907 –1987 ]వేళూర్ కృష్ణన్ కుట్టి కూడా [1927—2003]ఈ కోవకి చెందిన రచయితులే. దేవ్ ,తకళి కాలఘట్టానికి ఆధునిక మలయాళ కధకు పునాది వేసిన ఎన్. పి. మహమ్మద్,టి. పద్మనాభన్, మాధవికుట్టి [కమలాదాస్ ]ఎం. టి. మొదలగు కధకులకు మధ్య ఒక లింకు లా వర్తించే గొప్ప కధకులు కోవిలన్ [1923]జి.వివేకానందన్ [1923-1999],పొంజీకర రాఫీ [1924 -1993 ]పారపురత్ [1924-1981]నందనార్ [1926-1974 ]కే. టి. మహమ్మద్ 1929—2008 ]  పట్టత్తు విల కరుణాకరన్ [1926 -1985 ]మొదలైనవారు .

నందనార్ ,కోవిలన్, పారపురత్ ,–ఈ ముగ్గురికి మిలిటరీ కధల రచయితలుగా కూడా గొప్ప కీర్తి లభించింది మిలిటరీ జీవితానికి సంబంధించిన కధలు ఎన్నో రచించి ప్రజలకు జవానుల జెవితం గురించి వాళ్ళ కుటుంబ జీవిత సమస్యల  గురించి మంచి అవగాహన కల్పించారు వీళ్ళు . కధకుడుకన్నా గొప్ప నాటక రచయితగా ప్రసిద్ధుడు కే.టి.మహమ్మద్.

రాజకీయ విషయాలు ఇతివృత్తంగా స్వీకరించి మంచి కధలు రచించిన కధకుడు పట్టత్తు విల కరుణాకరన్. వామ పక్ష భావ జాలాన్నే కాదు అన్ని రాజకీయ భావ జాలాన్ని ప్రశ్నించే ధోరణి అతని కధల్లో కనబడుతుంది . రచనా పరమైన సాహసాలు చేయటంలో ముందు ఉండేవాడు అతడు .

( వచ్చే వారం ఆధునిక మళయాళ కథ )

LR-SWamy-240x300— ఎల్. ఆర్. స్వామి

ఇప్పటికీ మించి పోయింది లేదు!

కె.ఎన్.వి.ఎం.వర్మ

కె.ఎన్.వి.ఎం.వర్మ

సాయంత్రం ఐదుకే చీకటి పోటెత్తింది
చలిగాలి ఊరు మీదకి వ్యాహ్యాళి కొచ్చింది
పెంట పోగు మీద ఎండుగడ్డి తెచ్చి
పాక చివర దోమలకి పొగ ఏస్తుంటే
దారి తప్పొచ్చిన వెన్నల
కుందేలు పిల్లలా తోటంతా గెంతుతోంది

ఒకానొక రోజు నువ్వేమన్నాయ్..
అంత మెహ మాసి పోయావా నాకోసం
అని అడిగావ్… గుర్తుందా?
ఇప్పటికీ మించి పోయింది లేదు

చూడు ఈ తోటంతా కలియ తిరుగు
పదహారు సెంట్ల మల్లెపందిరి చూడు
అత్తరు పూల సౌరభాలలో
నా నిశ్వాస పరిమళాలు అఘ్రాణించు
ఈశాన్య చెరువు గట్టు అఘ్నేయాన
వెచ్చని చలి మంట వేసుకొని
నిశ్చల తటాకంలో
చందమామని నన్నూ చూసుకొని మురిసిపోతుంటే

వెనుక నుంచి కుందేలు పిల్లలా దూకి
నన్నావహించకు,
ఒంటరిని చేసి పోతే
వ్యవసాయం చేసుకుంటానని
ఆ రోజే చెప్పాను….గుర్తుందా?

చూడు నిన్ను తలుచుకోగానే
మంచు కురిసిన తోట ఎలా నీరుగారిపోయిందో
ఇప్పటికీ మించి పోయింది లేదు
ఇక్కడ పండదని తెప్పించిన కాష్మీర్ కుంకుమ ఉంది
తోటలో నీ పాదాలు మోపగానే
బహుమతి ఇవ్వడానికి పసుపుకొమ్ము ఎదురుచూస్తోంది.

-కలిదిండి వర్మ

రజనీగంధ

పాపినేని శివశంకర్

పాపినేని శివశంకర్

పువ్వులంటే యిష్టం

ఇంటి ముందు గుప్పుమని పిలుస్తూ

పసితనానికి తావులద్దినపొన్నాయి చెట్టు –

పూలేరి కాడలు తుంచి

బూర లూదటమంటే యిష్టం

కిలకిలల పూలరేకులంటే యిష్టం

రేకుల కోమలత్వం ఇష్టం

విరిసిన ధనియాల చేల మీదగా

తావుల తలపులు మోసుకొచ్చే గాలులంటే యిష్టం

గాలుల్లో సోలిపోయి నిద్రించే రాత్రులంటే యిష్టం

రజనీ నీల మోహన రూపానికి

రాగాలద్దే రేరాణులంటే యిష్టం

images

పూలకు తల్లి ఒడి అయినందుకే

పులకిస్తుంది నేల

కల్మషలోకాన్ని కాస్త నిర్మలం చేసేందుకే

ఆ రెక్కల దేవకన్యలు ఇక్కడికి దిగి వచ్చాయి

పువ్వులంటే యిష్టం

పువ్వుల్లాంటి మనుషులంటే యిష్టం

మనుషుల్లో ప్రవహించే మలయ మారుతాలంటే యిష్టం

నడిచే దారమ్మట కనపడని పూలచెట్లేవో బారులు తీరితే యిష్టం

ప్రపంచం పూలతోటయ్యే

కోకిలల కాలం కోసం స్వాగత గీతాలు రాయటమంటే

మరీ యిష్టం.

-పాపినేని శివశంకర్

rajinigandha

కవి రామా చంద్రమౌళికి ‘ఫ్రీవర్స్ ఫ్రంట్ -2013’ పురస్కారం

ramachandramouliవరంగల్: వచన కవిత్వ పితామహుడు  కుందుర్తి ఆంజనేయులు   స్థాపించిన ప్రతిష్టాత్మక పురస్కారం ‘ ఫ్రీవర్స్ ఫ్రంట్   అవార్డ్  -2013 ‘ ఈ సంవత్స్తరం వరంగల్లుకు చెందిన ప్రముఖ కవి రామా చంద్రమౌళి ని వరించింది  . ఆయన ఇటీవల విడుదల చేసిన  ‘ అంతర’ కవిత్వ సంపుటికి ఈ గౌరవం దక్కింది  . పురస్కార కమిటీ కన్వీనర్ శీలా వీర్రాజు ఈ పురస్కార విషయాన్ని ప్రకటిస్తూ ఫిబ్రవరి ఒకటవ తేదీన హైదరాబాద్ లో  జరిగే ప్రత్యేక సభలో పదివేల రూపాయల నగదు,ప్రశంసా పత్రం,జ్ఞాపిక మరియు శాలువాతో ఘనంగా రామా చంద్రమౌళి ని సత్కరిస్తామని చెప్పారు. ఇంతవరకు 20 నవలలు,250 కి పైగా కథలు,9 సంపుటాల కవిత్వం వెలువరించి వరంగల్లు ప్రతిష్టను ఖండాంతర పరచిన మౌళి గారికి ఈ పురస్కారం రావడం ఈ కాకతీయుల గడ్డకు ఒక అదనపు అలంకారంగా సాహిత్యాభిమానులు భావిస్తూ రామా చంద్రమౌళి ని అనేక సాహితీ ప్రియులు అభినందించారు .

వీలునామా – 24 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

పారిపోయిన ప్రేమ 

“ఆఖరికి నా మేనేజరు దగ్గర్నించి ఉత్తరం వచ్చింది. అయితే అక్కడి వార్తలంతగా బాగోలేవు,” మర్నాడు పొద్దున్నే ఫిలిప్స్ ఇంటికి వొచ్చిన బ్రాండన్ చిన్న బోయిన మొహంతో ఆన్నాడు.

“ఏం జరిగింది?” అన్నారంతా ఆతృతగా.

“నేను వెంటనే వెళ్ళాలి. లేకపోతే కొంప మునుగుతుంది. ఉత్తరం ఇంకొంచెం ముందు వొచ్చి వుంటే, కిందటి పడవలో వెళ్ళి వుండేవాడిని. వెళ్ళి ఇంకొంచెం భూమి కొనాల్సి వొస్తుందేమో. ఇప్పుడు అక్కడ భూమి ధరలేమో బాగా పెరిగిపోయాయి. అసలు నా మేనేజరు తెలివితక్కువతనంతో కొంత నష్టం జరిగింది. నేను వీలైనంత త్వరగా వెళ్ళి లెక్కలూ అవీ చూసి పరిస్థితి చక్కబరచి రావాలి. ఆరు నెలలు దేశం వదిలితే చాలు, నష్టాల్లో కూరుకుపోతున్నాను. స్టాన్లీ, నీ ఎస్టేటు లెక్కలేలా వున్నాయి?”

“ఫరవాలేదులే. ఎలాగూ నువ్వెళ్తున్నావు కదా? ఒకసారి విర్రావాల్టా వెళ్ళి నా పొలం వైపు తొంగి చూడరాదూ? అక్కడ నాకొరకు పని చేసే గ్రాంట్ ఉత్త పనికిమాలిన వాడు. అసలొక పని చేస్తాను. నీకు పవరాఫ్ ఆటార్నీ ఇచ్చేస్తాను. ఏమంటావ్?” ఫిలిప్స్ అడిగాడు.

“అలా చేస్తే గ్రాంట్ ఏమైనా అనుకుంటాడేమో!”

“ఏమీ అనుకోడు. అసలు తనపనే తలకు మించి వుందని సణూక్కుంటూ నా పనికొప్పుకున్నాడు.”

“సరేలే. ఒకసారి వెళ్ళి చూసొస్తా.”

“నాకయితే ఇప్పట్లో ఆస్ట్రేలియా రావాలని లేదు. అక్కడ పొలం మీద వచ్చే రాబడి ఈ మాత్రం వుంటే నేనిక్కడ కుటుంబంతో కాలక్షేపం చేయొచ్చు.వీళ్ళందరకీ ఇక్కడ ఎంత బాగుందో చూసి, మళ్ళీ వీళ్ళని అక్కడికి ఎలా తీసికెళ్ళను? పెరుగుతున్న పిల్లలకి కాస్త చదువూ సంధ్యా చెప్పించుకోవాలి కదా?”

“మంచి రాబడి వుంటే లండన్ లో వుండడమంత సుఖం లేదు. అయితే నీలా లండన్ కి కుటుంబాన్ని తీసుకురావడానికి నాకింకో పదేళ్ళు పట్టొచ్చు. ఈ పదేళ్ళూఊ ఆస్ట్రేలియాలో నా వ్యవహారాలు చక్కబరచుకోని నిలదొక్కుకోవాలి. అప్పుడు నేనూ నీలా కుటుంబాన్ని ఇక్కడకి తీసుకొచ్చేస్తాను. అందుకే నన్ను పెళ్ళాడబోయే అమ్మాయి కనీసం పది పన్నెండేళ్ళు ఆస్ట్రేలియాలో ఉండగలగాలి,” బ్రాండన్ అన్నాడు సాలోచనగా.

వింటున్న హేరియట్ ఉలిక్కిపడింది. ఆమెకీ ప్రతిపాదన ఎంత మాత్రమూ నచ్చలేదు. ఆస్ట్రేలియాలో భూస్వామి అంటే తన అన్నలా బోలెడంత డబ్బూ దస్కం వున్నవాడై వుంటాడనీ, తనూ తన వదినలా దర్పంగా వుండొచ్చని ఈ పెళ్ళికి ఒప్పుకుంది కానీ, ఆస్ట్రేలియా పొదల్లోకీ పాముల్లోకీ వెళ్ళి గొడ్డు చాకిరీ చేయడానికా?ఆమెకి తలచుకుంటేనే కంపరం పుట్టింది.

అలాటి కష్టనష్టాలకి ఓర్చుకునేందుకు తనకేమీ బ్రాండన్ పైన కొట్టుకుపోయేంత ప్రేమ ఏమీలేదు. ఐనా బ్రాండన్ ఇంత మోసం చేస్తాడా! తనేదొ పెద్ద ధన్వంతుణ్ణీ భూస్వామినీ అని నమ్మించి ఇప్పుడు తన పేదరికాన్ని బయటపెడతాడా? తనీ మోసాన్ని ఎంత మాత్రమూ సహించదు. ఈ మోసంలో అన్నా వదినా, అందరూ భాగం పంచుకున్నట్టనిపించింది ఆమెకి.

హేరియట్ చిరాగ్గా ఆ రోజు బయటికెళ్ళడానికి తయారయింది. ఇంతలో కొత్త బోనెట్ తో వదిన ముస్తాబు ముగించి వచ్చింది. తనకి పాత బోనెట్ తప్ప వేరే గతి లేదు. ఎల్సీ తన బోనెట్ ఇంకా పూర్తి చేయలేదు మరి. అద్దంలో తన నీడా, పక్కనే వదిన గారి నీడా చూసి ఆమె చిరాకు ఇంకా ఎక్కువయ్యింది.

తలుపు మీద చిన్నగా తట్టి ఎల్సీ లోపలికొచ్చింది. ఆమె చేతిలో తనకోసం చేసిన కొత్త అందమైన బోనెట్. అందంగా, ఖరీదైనదానిలాగా, ముద్దొస్తూ వున్న ఆ బోనెట్ చూసి హేరియట్ మొహం విప్పారింది.

“ఓ ఎల్సీ! నా టోపీ తయారు చేసేసావా? నేను చెప్పలే నువ్వు చేయగలవని? ఎంత బాగుందో బుజ్జి టోపీ! రా లోపలికి ఎల్సీ. ఎవరూ కొత్త వాళ్ళు లేరు. బ్రాండన్, ఫ్రాన్సిస్ అంతే. వదినా, ఫ్రాన్సిస్, ఈ టోపీ ఎంత బాగుందో చూడండి. ” ఎల్సీ సిగ్గూ మొహంటాల్తో చితికిపోతూ డ్రాయింగ్ రూం లోకొచ్చింది. అందరూ ఎల్సీ అభిరుచినీ, పనితనాన్ని అందరూ మెచ్చుకునేంతవరకూ ఆమె వదల్లేదు.

ఇంట్లో పనిమనిషికి అంత గుర్తింపు ఇవ్వడంతో తన విశాల హృదయాన్ని చాటుకున్నాననుకుంది హేరియట్. నిజానికి అక్కడున్న ఇద్దరు మగవాళ్ళకీ ఎల్సీ పట్ల చాలా స్నేహ భావమూ, ఆఫ్యాయతా వున్నాయనీ, పదే పదే ఆ అమ్మాయి పనిమనిషి హోదాని వాళ్ళకి గుర్తు చేయడం మొరటు తనమవుతుందనీ, ఆ మొరటు తనానికి వాళ్ళు తనని అసహ్యించుకోవచ్చనీ తట్టనుకూడాలేదామెకి. ఎల్సీ ఆ గదిలోంచి తప్పించుకోగానే,

“నేను చెప్పలే! ఎల్సీ తప్పకుండా ఈ పని చేయగలదని. పని వాళ్ళని కొంచెం దబాయిస్తే కానీ పని చేయరు. ఇంతకీ ఇది మా వదిన టోపీ అంత బాగుందా లేదా?” అద్దంలో తన నీడని చూసి మురిసిపోతూ అంది.

veelunama11

అలంకరణ ముగించి,

“పదండి, పదండి, గాలరీకెళ్ళి చిత్రపటాలు చూద్దామనుకున్నాం కదా? బ్రాండన్! నేను ఫ్రాన్సిస్ గారితో వొస్తా, ఏమనుకోకు. నీకెటూ చిత్ర లేఖనం పెద్దగా అర్థం కాదు, ” అంటూ ఫ్రాన్సిస్ హొగార్త్ చేయి పట్టుకొని చిత్రకళా ప్రదర్శన చూడడానికి వెళ్ళిపోయిది హేరియట్. (పాశ్చాత్య నాగరికతలో ముఖ్యమైన కార్యక్రమాలకు మగవారి చేయి పట్టుకొని ఆడవారు నడవడం ఆనవాయితీ. )

అందమైన నాజూకు టోపీతో తను విజయాన్ని సాధించాననుకుంది కానీ, తనకెంతో ముఖ్యమైన వ్యక్తి మనసులో తన స్థానం పూర్తిగా పోయినట్టు తెలుసుకోలేకపోయింది.  అహంకారమూ, మితిమీరిన ఆత్మ విశ్వాసమూ కళ్ళని మాయ పొరల్లా కప్పేస్తాయి. తమ చుట్టూ వున్నవారందరూ తమని ఆరాధిస్తున్నారనే భ్రాంతిలో ముంచేస్తాయి. నిజంగా చుట్టూ వున్నవారికి తమ పట్ల అంత గౌరవమేమీ లేకపోగా, కొండొకచో కొంచెం చులకన భావం వుందనీ తెలిస్తే అహంకారి ఎలా తట్టుకుంటాడో.

తన పట్ల ఫ్రాన్సీ, బ్రాండన్ ఇద్దరూ భయంకరమైన ఆకర్షణాలో మునిగి పోయారన్న నమ్మకంలో వుంది హేరియట్. నిజం తెలిస్తే తట్టుకోగలదో లేదో.

తన చేయి పట్టుకోని నడవకుండా హేరియట్ ఫ్రాన్సిస్ చేయి పట్తుకున్నందుకు బ్రాండన్ ఏ మాత్రం బాధపడలేదు సరికదా, తమతో పాటు జేన్ కానీ, ఎల్సీ కానీ వచ్చి వుంటే బాగుండేదనిపించింది. ఈ మధ్య అతనికి జేన్ మాటలు వింటూంటే భయం పోయింది. ఆమె తెలివితేటల వెనక వున్న సౌజన్యమూ, కఠోర పరిశ్రమ వెనక వున్న ఆత్మ గౌరవమూ అతనికి అర్థం కాసాగాయి. ఎల్సీ అమాయకత్వమూ, సున్నితమైన మనసూ, పని తనమూ పట్ల అతనికున్న ఇష్టం సరే సరి. వాళ్ళిద్దరూ ఈ ప్రదర్శనకి వచ్చి వుంటే తనకెంత హాయిగా వుండేదో అనుకున్నాడు బ్రాండన్. వాళ్ళిద్దరూ రాకపోవడంతో అతను లిల్లీ ఫిలిప్స్ తో ప్రదర్శన తిలకించాడు.

ఫ్రాన్సిస్ కి హేరియట్ పట్ల ఎటువంటి భావమూ లేదు. కేవలం మర్యాద కోసం అతను ఆమెతో మాట్లాడుతున్నాడు. అంతే కాదు, అతనికెంతో ప్రీతి పాత్రురాలైన జేన్ వాళ్ళ ఇంట్లో ఉద్యోగంలో వుంది. అటువంటప్పుడు తాను వారితో మర్యాదగా ప్రవర్తించకపోతే ఆమె కేదైనా సంస్యలు రావొచ్చన్న భయమూ వుందతనకి.  అంతే తప్ప అతనికి హేరియట్ పట్ల ఎటువంటి ఆసక్తీ లేదు. ఆమె మీద ఎంతో కొంత ఆసక్తి వున్న బ్రాండన్ మనసులోంచి ఆమె ఎప్పుడో రాలిపోయింది.

***

(సశేషం)

మూగవాడి పిల్లనగ్రోవి

drushya drushyam-12

అజంతా గుర్తొస్తాడు చాలాసార్లు.
చెట్లు కూలుతున్న దృశ్యాలు చూస్తున్నప్పుడు.
కూలకుండా చెట్టు అలా నడుస్తూ వెళుతున్నప్పుడు కూడా.

+++

ఇతడు కూడా అలాంటివాడే.
రిక్షా లాగి పొట్టపోసుకుంటాడు.
నిజానికి “రిక్షా తొక్కి’ అని రాయాలి. కానీ, తనకి రిక్షా తొక్కే పరిస్థితి లేదు. బోదకాలు మరి!
దాంతో రిక్షా లాగి తన జీవికను తాను వెళ్లదీస్తున్నాడు.

ఒకానొక ఉదయం.
హైదరాబాద్ లోని ముషీరాబాద్ డివిజన్ సమీపంలోని మేకలమండి. అక్కడ అతడ్ని చూశాను.
ఆ వీధిలోకి వెళ్లే ముందే ఒక గుడి వస్తుంది. ఆ గుడి దగ్గరకు రాగానే ఎందుకో నాకు తనను ఫొటో తీయబుద్ధి అయింది.
ఆ టైమ్ కి అక్కడ గుడి ఉందని కూడా నాకు తెలియదు. అతడు అలా రిక్షా లాక్కుంటూ వస్తున్నాడు. చూశాను. ఒకట్రెండు చిత్రాలు తీసుకున్నాను. ఆ తర్వాత అర్థమైంది, వెనకాల నర్సింహస్వామి ఉన్నాడని.
దాంతో మరొక మెరుగైన ఫొటోకోసం వ్యూ ఫైండర్లోంచి చూస్తున్నాను. అప్పుడు తెలిసింది, నర్సింహస్వామి ఏమోగానీ అతడికి బోదకాలు ఉందని!
ఆ కాలుతో రిక్షాను లాగుతున్న తీరు చూశాక ఇక చాలనుకున్నాను.

నిజానికి ఆ ఒక్క చిత్రం ఇక చాలనే అనుకున్నాను. కానీ మనసూరుకోలేదు.
అతడు చెట్లు కూలుతున్న దృశ్యమే. కానీ కూలకుండా నడుస్తున్న చెట్టు కూడా అని అర్థమైంది.
తీస్తూనే పోయాను. అతడితో పాటు నేను పోతూనే ఉన్నాను. పోతూ ఉండగా అర్థమైంది!
అతనొక వృక్షమని. తాను నలుగురికీ నీడనిచ్చే వృక్షమేగానీ పిల్లలో మరొకరో తనను పట్టించుకోవడం లేదంటూ విచారంతో కృంగిపోయే మనిషి కాదని!

ఏవో వేళ్లను నాలో నాటాడు.
కొత్త లిపినేదో నేర్పాడు. ఇక ఆ వృక్షం శాఖోపశాఖలై నాలో కుదురుకున్నది.
సరికొత్త పద చిత్ర దృశ్యాలు వాటంతటవే పేనుకొని నేనే ఒక చిత్రమై పోయి కొత్త కొత్త పాటలు పాడుతున్నాను.
ఏవోవో కవితలు అల్లుతున్నాను.

+++

తీరుబడిగా చూస్తూ ఉంటాను నన్ను నేను.
ఒకానొక రోజు మళ్లీ ఆ చిత్రాలన్నీ చూశాను.
వాటిల్లో అతను మరింత ఉత్సాహంగా కనిపించాడు. నోట్లో వేపపుల్లతో అతడు…ఏమీ ఆలోచించకుండా కులాసాగా నడుస్తూ రిక్షాను లాక్కెళుతున్న వయో వృద్ధుడు!
వెనకాల నర్సింహస్వామి! గాఢమైన రంగుల లిపితో కూడిన ఈ ఛాయాచిత్రాన్ని ఎంపిక చేసుకున్నాను.
అతడి వెనకాల ఉన్న కారు కూడా అతడు బతుకుతున్న స్థితిపట్ల కొన్ని భావ ప్రకటనలు చేస్తూ ఉన్నది.
అదీ మంచిదే అనుకున్నాను.

+++

ఈ ఫొటోను తర్వాత కాలంలో పెద్దది చేసి ప్రదర్శనకు పెట్టినప్పుడు, ఆ ఫొటో ప్రింట్ చేసిన శేఖర్ తన భార్యతో సహా ఎగ్జిబిషన్ కు వచ్చాడు.
అప్పుడు అతడి భార్య పవిత్ర ఈ చిత్రం వద్ద ఆగి ఆ ముసలాయన్ని గుర్తు పట్టి ఆశ్చర్య పోయింది.
“ఈ తాత నాకు తెలుసు. నీకెలా తెలుసు?” అని అడిగింది.
ఏకవచనం! ఎంత బాగుందో’ అనుకుంటూ, “నేను ఆ తాతను చూశాను’ అని మెల్లగా చెప్పాను.
“మేకలమండిలోనేనా?’ అందామె.
అవునన్నాను.
“ఇతడు మా ఇంటికి దగ్గర్లోనే ఉంటాడు. చాలా మంచివాడు. ప్రేమగా మాట్లాడుతాడు’ అంది.
“పిల్లలు పట్టించుకోరు. దాంతో ఇప్పటికీ కష్టపడుతుంటాడు” అని కూడా వివరించింది.
“అవును. పాపం…బోదకాలు’ కదా!” అన్నాను నేను.
ఆమె నా వైపు సాలోచనగా చూసి, “ఇతడికే కాదు, ఈయన భార్యకు కూడా’ అని ఆగింది.

+++

నాకు నోట మాట రాలేదు.
“ఇద్దరికా?” అన్నానో లేదో గుర్తులేదు గానీ, ఒక్కపరి నా జీవగ్రంథం రెపరెపలు పోయింది.
ఒక తల్లివేరు నిస్సత్తువగా తలవాల్చినట్టయింది.
నేను మెల్లగా మామూలు స్థితికి రావడానికి కొంత టైం పట్టింది.
ఇంకా ఆమె చెప్పింది, “ఇతడు రిక్షా లాగి కాసిన్ని డబ్బులు తెస్తే, తాను కూరగాయలు అమ్మి మరికొంత సంపాదిస్తుంది, కూచున్న చోటే!’ అని వివరించింది.
ఇప్పుడు నాకు మళ్లీ ఆశ్చర్యం కలిగింది.
“నయమే!” అన్నాను నేను.

“ఏం నయమో ఏమో! ఈ వయసులో కూడా వాళ్లు కష్టపడాలా?’ అంది తాను.
ఈ మాటకు మళ్లీ డోలాయమానం. ద్వైతం.

“తప్పదు. అనివార్య జీవన ప్రస్థానం” అనుకున్నాను నేను, మనసులో!

+++

ఏమైనా ఇదంతా జరిగింది.
ఇంకా చాలా జరిగింది, ఈ ఫోటో వల్ల.
తాత గురించి, తాత అవస్థ గురించి, తాత భార్య దుస్థితి గురించి…
వీటన్నిటీనీ మించి ఉల్లాసంగా వేపపుల్లతో నడుస్తున్న ఒక యువకుడి గురించి కూడా.
మస్తు మాట్లాడుకున్నాం.

విశేషం ఏమిటంటే, ఇదంతా మాట్లాడుకునే వీలు కల్పించిందీ చిత్రం.
అందుకే అంటాను, ఒక దృశ్యం చెట్లు కూలుతున్న వైనాన్ని చెబితే,
మరో చిత్రం కూలకూడదని చెబుతుంది.  ఒకటి ఉంటే మరొకటి ఉంటుంది.
ఉన్నదానికీ ఉండాల్సిన దానికీ మధ్య ఒక ఊహ, ఒక ఆశ, మరి ఆదర్శం….
ఇవన్నీ ఉంటేనే…ఒకానొక స్వప్నలిపి గురించిన ప్రేమపూర్వక ఆకాంక్షలు ఇలాగే ఉనికిలోనికి వచ్చినయి.

కళ ఆదర్శం బహుశా ఇదేనేమో!

అందుకనే దృశ్యాదృశ్యంగా జీవితం – కళ పెనవేసుకుని జీవించాలని నాకు మహా ఇది!
అటువంటి దార్శనికతను పంచిన ఎందరికో…
కేశవరెడ్డికి, అజంతాలకి కృతజ్ఞతలు.
ఆ తాతకు, తాతమ్మకు వందనం!!

~ కందుకూరి రమేష్ బాబు

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 4 వ భాగం

( గత వారం తరువాయి)

4

Ekkadi(1)

తన కొత్త ఇన్‌ఫినిటీ కార్‌లో దూసుకుపోతున్నాడు నలభై ఏళ్ళ రామం. ఇంటర్‌ స్టేట్‌ టు సెవన్టీపై..వేగం ఎనభై ఎమ్‌పిహెచ్‌. దాదాపు గంటకు నూటాపది కిలోమీటర్లు.. టైర్ల ధ్వని బీభత్సంగా..కార్లమంద..అప్పుడే కురిసి వెలిసిన వర్షపు నీరు దూసుకుపోతున్న కార్ల టైర్ల రాపిడివల్ల ఆవిరిగామారి తెల్లని పొగమంచువలె ఎగిసి,ఎవరో వెంటపడి తరుముతూంటే పరుగెత్తుతూ పారిపోతున్నట్టు ఎవరికివారు కార్లలో మందలు మందలుగా ఒకటే.. పరుగు. ఏదైనా అడ్డొస్తే తునాతునకలై ఎక్కడో ఎగిరి పడ్తుందన్నంత వేగం..మనిషికి ఇంత విధ్వంసకర వేగం అవసరమా అని అనిపించే ఒకణ్ణి మించి మరొకరి దూకుడు. గ్లోబల్‌ పొజిషనింగు సిస్టంలోనుండి ఆమె అరుస్తోంది..’టేక్‌ ఎగ్జిట్‌’ అని
రామం జిపిఎస్‌సిస్టం విన్నప్పుడల్లా ఆశ్చర్యంతో, పులకింతతో, మనిషి సాధిస్తూ వస్తున్న ఈ అనేక విజయాలపట్ల గర్వపడ్తూంటాడు. ఒక ఇంజినీర్‌గా ఈ ఊహాతీత సౌఖ్యాల సాధన అతనికి ఓ అద్భుతంగా తోస్తూంటుంది. వాషింగ్టన్‌ నేషనల్‌ పైక్‌.. ఫాదర్‌ హర్లే రోడ్‌.. టంగు టంగు.. ఘంట వంటి అలర్ట్‌ శబ్దం. ఎదురుగా స్టీరింగు పానల్‌ తెరపై సిక్స్‌ట్రాక్‌ రోడ్‌ బొమ్మ.. గుండ్రగా ఎంట్రీ, ఎగ్జిట్‌ రోడ్లతో కలిసి బ్రిడ్జ్‌ బొమ్మ., అందులో కారును సూచిస్తూ కదుల్తున్న బాణం ఎర్రగా.. లోపల్నుండి సమాంతరంగా సిడిలోనుండి సన్నగా వినిపిస్తున్న కంఠ ధ్వని..బయట వర్షం మళ్ళీ ఆరంభమై.,
”సాప్ట్‌ సిడి” అన్నాడు రామం. ఠక్కున వీణధ్వని ఆగిపోయింది. లోపల ఎవరో ఓ మనిషి కూర్చుని చెబుతున్న విషయాలన్నింటినీ విని అతి ఖచ్చితంగా, విధేయంగా చేస్తున్నట్టు..రిడ్జ్‌రోడ్‌ జంక్షన్‌.. ఎదురుగా ఎర్రని స్టాఫ్‌ లైట్లు.. మెల్లగా కారుకు బ్రేక్‌ వేస్తూ,
చీకటి ముంచుకొస్తోంది ఒక పెద్ద సముద్ర కెరటంలా..అందరూ గుంపులు గుంపులుగా ఆగితే..ముందున్న  కార్ల ఎర్రని టెయిల్‌ ల్యాంప్స్‌ సమూహం కణకణలాడే నిప్పుల ప్రవాహంవలె..ఎదురుగా ప్రక్క అప్‌స్ట్రీమ్‌లో..వస్తున్న కార్లమంద హెడ్‌లాంప్స్‌..పచ్చని కాంతితో ప్రవహిస్తున్న కరిగిన ఇనుమువలె..టు సెవెన్టీ ఎక్స్‌ప్రెస్‌ వే నుండి బయటికొచ్చి. ఎడమదిక్కు అబ్జర్వేషన్‌ డ్రైవ్‌లోకి..ఎదురుగా ఎర్రనిలైట్లు ఆకుపచ్చగా మారగానే..కదలికల్లో ఓ చైతన్యం…మళ్ళీ కార్ల పరుగు..
రాయల్‌ క్రౌన్‌..విలియం గిబ్స్‌ ఎలిమెంటరీ స్కూల్‌. మైల్‌స్టోన్‌ డ్రైవ్‌..డార్సిమిల్‌ రోడ్‌..’టేక్‌ లెఫ్ట్‌’ అని జిపిఎస్‌లోనుండి సూచన..వాటర్స్‌ హాలో..బ్రూక్‌ ఫీల్డ్‌..ఓల్‌నెస్ట్‌ సర్కిల్‌..నౌ..యు రీచ్చ్‌ యువర్‌ డిస్టినేషన్‌..గమ్యం..ఇల్లు చేరుట..,
మనిషి నిజానికి ఎప్పుడు తన గమ్యాన్ని..ఇంటిని..లక్ష్యాన్ని చేరినట్టు..తను ప్రారంభమౌతున్న చోటును..తను చేరవలసిన గమ్యాన్ని స్పష్టంగా నిర్వచిస్తే మానవ మేధతో నిర్మితమైన ఈ ఉపగ్రహ, సంచార, ఉత్సర్గ గ్రాహక వ్యవస్థ ఖచ్చితంగా దారిని చూపిస్తుంది. దిశానిర్దేశం చేస్తుంది. దారి తప్పితే సవరించి మళ్ళీ సరియైన దార్లోకి మార్గదర్శనం చేస్తుంది. మళ్ళీ దారితప్పుతూంటే హెచ్చరికకూడా చేసి దాదాపు తిట్టినంతపని చేస్తుంది.
కాని జీవితంలోనో.,
ఎందరికి తన జీవితం ఎక్కడ ప్రారంభమౌతోందో..తను చేరవలసిన గమ్యం ఏమిటో తెలుస్తుంది. ఎవరికైనా తన గమ్యం నిర్వచించుకుంటే దారి తెలుస్తుంది దారి తెలిస్తే దిశ, దూరం..దూరంతో వేగం స్పృహ..వేగంతో కాలం అంచనా.. కాలంతో తన ప్రణాళిక..పథకం..పథకంతో వ్యూహం.,
ఎవరినైనా ఓ మనిషిని ఎంచుకుని..నువ్వు రేపేం చేస్తావు..నువ్వు జీవితంలో ఏం కావాలనుకుంటున్నావు. ప్రత్యేకంగా సాధించవలసిన లక్ష్యాలేవైనా నీకున్నాయా అని అడిగితే..పెళ్లిచేసుకుంటా, పిల్లలను కంటా, వీలైనంత ఎక్కవ డబ్బు కూడబెడ్తా.. పద్ధతి ఏదైనా ఫర్వాలేదు. డబ్బును గుట్టలు గుట్టలుగా పోగెేస్తా అని తప్పితే భిన్నమైన ఒక నిర్మాణాత్మక జవాబును ఎంతమంది ఇవ్వగలరు.
ఓ పుచ్చలపల్లి సుందరయ్యలా ఈ దేశంకోసం జీవించవలసిన తను భవిష్యత్తులో పిల్లలుంటే తన నిర్దేశిత లక్ష్యాలను చేరలేనని పిల్లలను కనకుండా ఎందరు కఠోర, త్యాగపూరిత నిర్ణయాలు తీసుకోగల్గుతారు.
అసలు భవిష్యత్తునే ఊహించలేని ఈ తరం..అస్తవ్యస్తంగా ఉన్న దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడ్తూ దిక్కుమాలిన నీతిహీన, అనైతిక, అసమర్ధ ప్రభుత్వాల పాలనలో మగ్గుతున్న సమాజంలో..ఏమని ‘రేపు’ను స్వప్నించగల్గుతుంది. ఇక విలువలు, నీతి, నిజాయితీ, నైతికత.. వీటిగురించి కనీసం ఆలోచనైనా చేయగల్గుతుందా.,
రామం కారును గ్యారేజిముందు ఆఫ్‌ చేసి.. దిగి..సన్నగా కురుస్తున్న చినుకుల్లో..నాల్గడుగులు వేసి..తన ఇంటి తలుపులను తాళం చెవితో తెరిచి..ముందు గదిలో బూట్లు విడిచి, రాక్‌లో పెట్టి.,
‘ఇక తనకు కూడా..ఎప్పుడో పదేళ్లకు ముందు స్పష్టంగా నిర్వచించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు కార్యరంగంలోకి దూకవలసిన సమయం ఆసన్నమైందా..’అనే ప్రశ్న..బాధ్యత…ఉద్యుక్తత ఉదయంనుండీ మనసులో పదేపదే కదుల్తూ.,
రామంకు గతవారంనుండీ మనసు మబ్బుపట్టిన ఆకాశంలా, గాలి దుమారంలో ఎడారిలా, కల్లోల సముద్రంలాఉంది. గతం.. ఏళ్ళకు ఏళ్ళుగా అనుభవించిన సంఘర్షణ..మేధోపరంగా ఒట్టి పుస్తకాల పురుగులా జీవిస్తూ.. ఉద్యోగం,వృద్ధి, సుఖవంతమైన జీవితం, విలామయమైన వ్యష్టి వికాసం..వీటినే పరమావధిగా భావిస్తూ నిర్మించుకున్న స్వప్న ప్రపంచంనుండి.. నాన్న.. నాన్నను తను అమెరికా వచ్చిన తర్వాతనుండే నిజంగా అర్ధం చేసుకున్నాడు.
‘నాన్న’..నాన్న జ్ఞాపకం రాగానే మనసు బకెట్‌లోని నీళ్ళను చేతితో లొడపెట్టినట్టు కల్లోలమై పోయింది.
రెండేళ్ళక్రితం నాన్న తన దగ్గరికి..యిక్కడి అనేక విశ్వవిద్యాలయాల్లో, మేధావుల సమావేశాల్లో, తెలుగు సంఘాలు ఏర్పాటుచేసిన సభల్లో మాట్లాడ్డానికి వచ్చినపుడు తనుకూడా ప్రతి సమావేశానికీ వెంటవెళ్ళాడు. నాన్న చేసిన అర్ధవంతమైన, అవశ్యమైన సామాజికాంశాలతోకూడి మనిషిని ప్రశ్నించే అనేక ఆలోచనాత్మకమైన ప్రసంగాలను ఒక ‘భారతీయ యువకుడిగా’ జీర్ణించుకుని ఎంతో ఉత్తేజాన్ని పొందాడు. చిన్ననాటినుండి పుస్తకాలు..చదువు..చదువు..ర్యాంకులు..స్థాయి..క్వాలిఫికేషన్‌ పెంచుకోవడం, స్టార్‌ స్టూడెంట్‌గా ఎదగడం..స్కూల్‌ ఫస్ట్‌..కాలేజి ఫస్ట్‌..స్టేట్‌ ఫస్ట్‌..ఐఐటిలో చేరాలని లక్ష్యం..ఐఐటీయన్‌ కాని జీవితం ఛీ.. ఏం జీవితం అని అహర్నిశలు పుస్తకాలు పుస్తకాలు..ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌.. శక్తి నిత్యత్వ సూత్రాలు, అణుధార్మిక సిద్ధాంతాలు, అత్యాధునిక శాస్త్ర పురోగతులు. కృత్రిమ మేధో విశ్లేషణలు..ద్రవ్య ప్రతిదవ్య భావనలు..నియమాలు. ఇవే ఇవే.,
రాత్రింబవళ్ళు..లైబ్రరీ..ఇంటర్నెట్‌..వికీపీడియా..డిజిటల్‌ పుస్తకాలు..ఐఐటీ మద్రాస్‌ హాస్టల్‌లో..ఎన్ని రాత్రులో.. ఒక అసాధారణ మేధోజీవిగా రామం అనే తనకు ఓ పేద్దపేరు. 1959లో ప్రారంభించబడి భారతదేశంలోనే ఒక అత్యుత్తమ విద్యాసంస్థగా పేరున్న ఐఐటి మద్రాస్‌నుండి మెకానికల్‌ ఇంజినీరింగులో..ఎమ్‌టెక్‌లో బంగారు పతకాన్ని సాధించడం ఒక సుందర స్వప్నం.

third week fig-2
నాన్న అప్పటికే రీజినల్‌ ఇంజినీరింగు కాలేజ్‌ వరంగల్‌లో ప్రొఫెసర్‌..అమ్మ తను హైస్కూల్‌లో ఉన్నపుడే పోయింది. అమ్మంటే ఒక దేవత అనే తీయని జ్ఞాపకం.. అమ్మ అంటే నవ్వు..అమ్మ అంటే ఒక ఆశీర్వాదం..అంతే తెలుసు తనకు..నాన్న అంటే ఋషి..పుస్తకాలు..పాఠం..బోధన..జ్ఞానం..ఒక సజీవ సిద్ధాంతం..తను పుట్టినప్పటినుండీ తనకు తెలిసిందీ, తను ఆడుకున్నదీ, తన పరిసరాలూ అన్నీ పుస్తకాలే..అంతా నాన్నే.
నాన్న చెప్పేవాడు..పుస్తకాలు రెండు రకాలని..ఒకటి విద్యావిషయక శాస్త్రాలు..గణితం, భాష, చరిత్ర, భౌతిక, రసాయనికి శాస్త్రాలు..ఇవి..ఈ ప్రపంచ భౌతిక జీవితం గురించి చెప్పేవి. రెండు సృజనాత్మక పుస్తకాలు..కవిత్వం, శాస్త్రాలు, సంగీతం, కళలు, జీవితాధ్యయనాలు, దేశచరిత్రలు..పరిణామ సిద్ధాంతాలు, మనిషి పరిణామ ప్రక్షిప్తాలు, ఇతిహాలు, తత్వ, ఆధ్యాత్మిక శాస్త్రాలు..ఇవి..మనిషి గురించి, జీవితం గురించీ, జీవిత పరమావధి గురించి, హృదయం గురించి, అంతిమంగా ఈ సృష్టి ఏమిటి..గురించీ..ఒక అనంతానంత ఆత్మ దర్శనం.
దాదాపు.. ఎమ్‌.టెక్‌ పూర్తయి..స్వర్ణపతకం పొంది..రెండు మూడు ప్రఖ్యాత కంపెనీలలో కాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ వచ్చి.. ఓహ్‌ా.. పందొమ్మిది వందల తొంభై ఏడు..అనుకున్న ఒక అద్భుతమైన విజయాన్ని సాధించి..అప్పుడే రెక్కలు మొలుస్తున్న పక్షి పిల్ల పొందే అవ్యక్త మహానుభూతి..కాన్వొకేషన్‌ జరిగి..గవర్నర్‌ చేతులమీదుగా బంగారు పతకాన్ని మెడలో వేయించుకుని..పొంగి పొంగి.,
నాన్నకూడా వచ్చాడు ఆ కీలకమైన సభకు. ఆహుతుల్లో ఒకనిగా కూర్చుని కాన్వొనేషన్‌ను తిలకించాడు. అప్పుడు ఆయన కేవలం తండ్రి.. అప్పటికే ఆయన రీజినల్‌ ఇంజినీరింగు కాలేజిలో పేద్ద పేరున్న మెకానికల్‌ ఇంజినీరింగు ప్రొఫెసర్‌. ఐతే అనేక సామాజికశాస్త్ర, సాహిత్య గ్రంథాలు రాసిన రచయితగా నాన్నకు పెద్దపేరు..రాష్ట్రపతినుండి, రాష్ట్రప్రభుత్వంనుండి ఉత్తమ అధ్యాపకునిగా పురస్కారం పొందినవాడు. అతి తక్కువగా మాట్లాడేవాడు.. అనర్ఘళంగా ఉపన్యసించేవాడు.. అతి నిరాడంబరంగా ఒక నమూనాగా జీవించేవాడు.
ఆ రాత్రి.. భీకరంగావర్షం కురుస్తున్న రాత్రి..పన్నెండు దాటిందేమో.,హాస్టల్‌కు నాన్నా..తనూ తిరిగొచ్చి..నాన్నకు తను పొందిన బంగారు పతకాన్ని చూడమని ఇచ్చి..అతని కళ్ళలోకి తనకీ జన్మనిచ్చినందుకు కృతజ్ఞతాపూర్వకంగా చూచిన క్షణం..
”వెల్‌ డన్‌ మై బాయ్‌..”అన్నాడు నాన్న..ఒక తండ్రి.
”థాంక్యూ నాన్నా..”నాన్నా అని పిలిపించుకోవడమే ఆయన కిష్టం.
”ఇటువంటి..ఎమ్‌టెక్‌లో స్వర్ణపతకాన్ని నలభై ఏళ్ళక్రితమే మీరు సాధించారుగదా నాన్నా..ఏమనిపిస్తోంది మీకు.”
‘ది ట్రెడిషన్‌ కంటిన్యూస్‌. అప్పుడు నాకుగానీ..ఇప్పుడు నీకుగానీ ..ఒక అధ్యాయం ముగిసింది నాన్నా..ఇప్పుడు మనిషి ఒక చౌరస్తాలోకి వచ్చి నిలబడ్డాడు. ఈ కీలకమైన సందిగ్ధసమయంలో మనిషి తన జీవితాన్ని నిర్దేశించగల ప్రధాన నిర్ణయాన్ని తీసుకోవలసి ఉంటుంది.. ఐతే..” అని ఓ క్షణం ఆగి..తన కళ్ళలోకి చూశాడు నాన్న ఎంతోసూటిగా..బాగా జ్ఞాపకం తనకు ఆ చూపు ..గుచ్చుకున్న ఆ చూపు.,
”ఐతే.. మనిషి ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తులో ఆ నిర్ణయం తీసుకున్నందుకు పశ్చాత్తాపపడవలసిన పరిస్థితి రావద్దు. ఆచితూచి, మనిషిగా పరిపూర్ణమైన జ్ఞానంతో అడుగుముందుకు వేయాలి.”
”…..”ఒట్టిగా వింటున్నాడు తను.
”మనిషి ప్రధానంగా వ్యష్టి జీవి.ఎంతసేపూ నూటికి తొంభైఐదు శాతం మందికి తను, తన భార్య, తన పిల్లలు, తన పరివారం, తన సంపద..తన అభివృద్ధి.. తన సంతోషం..ఇవే. ఐతే ప్రకృతిసహజంగా మనిషి. ఆ మాటకొస్తే ఏ జీవియైనా సంఘజీవి అనే ప్రాథమిక సూత్రాన్ని మరిచి, తన సహ మానవులపట్ల, జీవులపట్ల, సమాజంపట్ల..సంఘ బాధ్యతలపట్ల మనిషి ఆలోచించడం క్రమంగా మరచిపోతూ..”
”అర్థమైందా రామం..”
”ఊఁ.. ఔతోంది”
”మనిషి ఎప్పుడూ సమాజంలోనుండి ఎదుగుతాడు. ఉదాహరణకు ఒక ఐఐటీయన్‌గా నువ్వీ డిగ్రీ పొందడానికి ప్రభుత్వం..అంటే ఈ భారత ప్రజలు దాదాపు ఇరవై ఐదు లక్షలు నీపై ఖర్చు చేశారు..నువ్వనుకుంటావు..నిన్ను నేను కన్నాను, కొంత నేను చదివించాను..ఎక్కువగా రేయింబవళ్ళు కష్టపడి నువ్వు చదువుకున్నావు.సాధించావు..అని..అది పాక్షిక సత్యమే. పూర్తి సత్యంకాదు. ఐఐటి అనే ఈ మహత్తరమైన ప్రజల డబ్బుచే నిర్మించబడ్డ సంస్థ సమాజపరంగా చేస్తున్న విద్యాదాన క్రతువువెనుక లక్షలమంది అతి సామాన్యపౌరుల చెమటతో నిండిన డబ్బే ఖర్చవుతున్న సంగతి..”
”….”
”కొన్ని బయటికి కనిపించవు. కనబడకుండా గుప్తంగానే దాగి ఉంటాయి అగ్నిలా..ఇక్కడే మనిషి బాధ్యతాయుతంగా ఆలోచించాలి.. వ్యష్టిగా కాదు.. సమిష్టికోసం..”
”అంటే..”
”నీకిప్పుడు టిసిఎస్‌లో సెలక్షన్‌ వచ్చింది. నువ్వు యుఎస్‌ఎ – మేరీల్యాండ్‌ ఆఫీస్‌లో జూన్‌ పదిన రిపోర్ట్‌ చేయాలి. హెచ్‌వన్‌బి వీసాగీసా, నీ ఫ్లైట్‌ టికెట్‌ ..అన్నీ రెడీ చేయబడ్డాయ్‌..ఔనా..”
”ఔను..”
”నలభై ఏండ్ల క్రితం నాకిదే జరిగింది..రీజినల్‌ ఇంజినీరింగు కాలేజి మొదటి బ్యాచ్‌ విద్యార్థిని నేను..ఎమ్‌ఇ చేసి.. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో..అరబ్‌ దేశమైన బహ్రాన్‌లో..అరామ్‌కో అనే ప్రపంచంలోనే అతిపెద్ద పెట్రోలియం ఉత్పత్తి కంపెనీలో ట్వంటీ కె డాలర్లతో ఉద్యోగం వచ్చింది..నా మిత్రులు, నా ప్రొఫెసర్లు, అందరూ ఆ అదృష్టానికి ఎంతగానో అభినందించారు.. కాని నేనా ఉద్యోగంలో చేరలేదు. తిరస్కరించాను.” ఆగిపోయాడు నాన్న.
” మా నాన్నా ఒక సాధారణ ప్రాథమిక పాఠశాల పంతులు. నిజాయితీకి ప్రతీక. అన్నాడు..’ఇన్నాళ్ళూ నిన్ను కని, సాది, పెంచి పెద్దచేసిన నన్నూ, అమ్మనూ నువ్వు అర్థాంతరంగా ఈ వృద్ధాప్యంలో విడిచి వెళ్ళడం ఎంతవరకు న్యాయమో తెలియదు నాన్నా..కాని..నిన్ను ఈ దేశపు బీదాబిక్కి ప్రజలు పన్నులరూపంలో సమకూర్చిన డబ్బుతో ఇంత ఉన్నతంగా తీర్చిదిద్దబడ్డ మేధోజీవివైన తర్వాత ఈ దేశంపట్ల, ఈ ప్రజలపట్ల, ఈ సమాజంపట్ల, నీకెటువంటి బాధ్యతా లేదా నాన్నా. నీ అద్భుతమైన తెలివితేటలు ఈ దేశంకోసం, ఈ దేశప్రగతికోసం, ఉపయోగపడొద్దా..అవన్నీ నిన్ను పోషించే వేరే ఇతర దేశాలకోసమే ధారపోయాలా.’ అని..”
”……”
”ఒక రాత్రంతా ఆలోచించాను..నాకు బాగా జ్ఞాపకం. ఆ రోజుకూడా ఇలాగే..కుండపోతగా వర్షం..ఎడతెగని వర్షం.. మర్నాడు నిర్ణయం తీసుకున్నాను..అరామ్‌కోలో చేరలేదు. ఆ ఉద్యోగాన్ని తిరస్కరించాను. స్థిరంగా, లోతుగా, బాధ్యతాయుతంగా ఆలోచించి చివరికి ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగు కాలేజిలో లెక్చరర్‌గా చేరాను.. ఎందుకంటే టీచర్‌ ఒక జ్యోతివంటివాడు..ఒక జ్యోతి లక్షల దీపాలను వెలిగిస్తుంది. ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని కాంతిమయం చేస్తుంది.. ఇన్నాళ్లుగా నేను చేస్తున్నదదే..నేను కొన్ని తరాలను తయారు చేస్తున్నాను.” చెప్పుకుపోతున్నాడు నాన్న ఒక ట్రాన్స్‌లో ఉన్న మనిషిలా.
”మంచి టీచర్‌ ఒక అంకెవంటివాడు రామం. ఒట్టి సున్నాల్లాంటి విద్యార్థులు అతని ప్రక్కన చేరి విజ్ఞానవంతులై పదులు, వందలు, వేలు, లక్షల సంఖ్యలుగా విస్తరిస్తారు. విద్యాదానం ఒక యజ్ఞం..ఒక క్రతువు..ఒక అదృష్టం..”
”…..”
”ఐతే ఎవరి జీవితం వారిది. తత్వాలు కూడా ఎవరివి వారివే. అప్పటి సామాజిక, వ్యక్తిగత సందర్భంలో వ్యక్తి విజ్ఞతనుబట్టి తగు నిర్ణయం తీసుకోవాలి. నౌ ఇటీజ్‌ లెప్ట్‌ టు యు..”
”…..”నాలో ఒక అనిశ్చితి.. కాని అవగతమౌతున్న మనిషి బాధ్యత.. జీవిత పరమార్థం.
ఇన్నాళ్ళూ వ్యక్తిగత వృద్ధి..వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, నడక..ఇవన్నీ హస్తగతమైనాయి. ఇప్పుడు ఇక ‘నడత’ గురించిన స్పృహ కావాలి. అందరిలా పుట్టినం, ఎదిగినం, సంపాదించినం, పిల్లలను కన్నాం, చచ్చినం.. కాకుండాఏదో ఒక విలక్షణమైన మహా సంకల్పాన్ని ఒక పరిమితమైన పరిధిలోనే విస్తరించిఉన్న చూపును యిక విస్తృతపరచాలి. ఈ భారత సమాజాన్నీ, రాజకీయాలనూ, ప్రజల స్థితిగతులనూ, లోలోతుల్లోకి పయనించి చూడవలసిన నిజమైన జనజీవితాలనూ, అడవులను.. ఆదివాసీలను, గిరిజనులకు, విస్మరించబడ్డ బడుగుజాతులను.,
ఐతే.. వర్తమానాన్ని అంతర్జాతీయ మానవ సమాజంతో పోల్చి చూచినపుడు మాత్రమే పేదరికం, దరిద్రం, అవిద్య, కుళ్ళు రాజకీయాలు, అవినీతి, అనైతికత..ఇవన్నీ స్పష్టంగా తెలుస్తాయి. అందుకే ఇప్పుడు ఒక విపులమైన అధ్యయనం చేయాలి తను. ఒక రాహుల్‌ సాంకృత్యాయన్‌వలె, ఇంగ్లండ్‌లో చదివి దక్షిణాఫ్రికాలో ఒక మామూలు మనిషిలా అడ్వకేట్‌ జీవితం జీవిస్తూనే ప్రపంచ రాజకీయాలను శాసించగల మహావ్యక్తిగా ఎదిగిన గాంధీవలె, దేశాంతర పర్యటనలతో తనను తాను తెలుసుకున్న అనిబిసెంట్‌ , జిడ్డు కృష్ణమూర్తివలె..ఇప్పుడు ఒక అధ్యయనాత్మక జీవితాన్ని కొంతకాలం గడపితే.. తర్వాత కార్యరంగంలోకి దూకితే..,
అదే అన్నాడు రామం అతని తండ్రితో..,
”మన్య విప్లవం ప్రారంభించడానికి ముందు అల్లూరి సీతారామరాజు విస్తృతంగా దేశమంతా పర్యటించి ప్రజల జీవితాలను అధ్యయనం చేశాడు. గాంధీకూడా అహింసా విప్లవోద్యమంలో దూకేముందు కాశ్మీర్‌నుండి కన్యాకుమారి దాకా అధ్యయన యాత్ర జరిపాడు. ఐతే..ఇప్పుడు భారతదేశం ఇంగ్లీష్‌వాడు పాలించినప్పటికంటే అనేకరెట్లు చెడిపోయి, పతనమై పోయి, కుళ్ళిపోయి ఉంది. భారతేతరులు పరిపాలించినపుడు ఎక్కడ జనం తిరుగబడ్తరోనన్న భయంతో ఒళ్లుదగ్గరపెట్టుకుని మెదిలారు. కాని యిప్పుడు మనల్ని పాలిస్తున్న మనవాళ్ళుమాత్రం నిస్సిగ్గుగా, నీతిహీనంగా ప్రజలను పీడించుకు తింటున్నారు. సమాజాన్ని దోపిడీ చేస్తున్నారు. పందికొక్కుల్లా అందినంత మేరకు స్వాహాచేసి ఇకిలిస్తున్నారు.”
”…..” శ్రద్ధగా వింటున్నాడు రామం.
”ఓట్లకోసం ఏమైనా చేయగల నిర్లజ్జ రాజకీయాలు ఈ దేశానికి శాపంలా దాపురించాయి. గత కొన్ని థాబ్దాలుగా వృద్ధనాయకత్వంలో దేశం మగ్గిపోతోంది. కొత్త మేధావితరం రాజకీయాల్లోకి రావడంలేదు. రాజకీయాలన్నీ మాఫియాలు, గుండాలు, నేరచరితులు, దొంగలు, దోపిడీదారులతో భ్రష్టుపట్టిపోయాయి. అధికారంకోసం ఏ దౌర్భాగ్యపు పనికైనా సిద్ధపడి పాలకులు విలువలను భూస్థాపితం చేశారు. దేశభక్తి, సామాజిక బాధ్యత, విలువలు, నైతికత, ఆత్మ.. యివన్నీ ఒట్టి కాలంచెల్లిన పదాలుగా మిగిలిపోయాయి. విషాదమైన విషయమేమిటంటే ప్రజలను ఈ ప్రభుత్వాలు తాగుబోతులుగా సోమరిపోతులుగా, అవినీతిపరులుగా, ఒట్టి కుక్కగొడుగులవంటి పారసైటిక్‌ తరంగా తయారుచేస్తున్నాయి. యధారాజా తథాప్రజా ధోరణిలో ప్రజలుకూడా పూర్తిగా అవినీతిపరులై ఎవనికి అందిందివాడు దోచుకుతింటున్నాడు. ఒక మున్సిపల్‌ ఇంజినీర్‌ ఇంటిపై దాడిచేస్తే కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్తున్నాయి. జనం ఈ రోజు విని రేపు అన్నీ మరిచిపోతున్నారు. ఎక్కడా జవాబుదారీతనం లేదు. ఒకవైపు హద్దులు మీరిన మీడియా, విచ్చలవిడి సినిమాలు, అతిస్వేచ్ఛాయుత వాతావరణంలో ఇంటర్నెట్‌, సెల్‌ఫోన్‌ సౌకర్యాల విషవలయంలో చిక్కి యువత నిర్వీర్యమై, దారితప్పి, పుట్టుకతోనే వృద్ధులుగా మిగిలి.. దేశం దేశమంతా వృద్ధ నాయకత్వంతో, అసమర్థులైన యువ వృద్ధులతో నిండి కుళ్లిపోతోంది రామం. ఏ కొద్దో మేధోసంపద ఉన్న నీవంటి క్రీమ్‌ విదేశాలపాలై ఈ దేశాన్ని అనాథను చేస్తోంది. ఈ దేశం కుక్కల పాలైపోతోంది రామం..” చటుక్కున ఆగిపోయాడుాన్న.
తలెత్తి చూస్తే..ఎదుట తండ్రి కళ్ళనిండా నీళ్ళు..పొంగిపొర్లుతున్న దుఃఖం అతని మాటలను సమాధి చేసింది.
ఇద్దరిమధ్య ఒట్టి నిశ్శబ్దం.
నిశ్శబ్దం ఒక్కోసారి ఎంతో శక్తివంతంగా సంభాషిస్తుంది. గర్జిస్తుంది. నినదిస్తుంది..నిలదీస్తుంది.
”..ఇప్పుడీ దేశానికి శస్త్ర చికిత్స జరగాలి రామం..బహుముఖంగా విరుచుకుపడ్తున్న అవినీతి, లంచగొండితనం ఈ భారత సమాజాన్ని కేన్సర్‌లా పీడిస్తోంది. ఒక తరిమెల నాగిరెడ్డి ‘ఇండియా మార్టిగేజ్డ్‌’ పుస్తకం రాసినప్పటి పరిస్థితి ఏమాత్రం మెరుగు పడకపోగా యింకా యింకా ఎన్నిరెట్లో కుళ్ళిపోయింది. కంపుకొడ్తోంది. దిస్‌ నీడ్స్‌ ఎ ప్రెషరైజ్డ్‌ వాషింగు, రాథర్‌ డిస్ట్రాయింగు అండ్‌ రీకన్‌స్ట్రక్టింగు..”
”ఔను..” స్థిరంగా జవాబు చెప్పాడు తను.
సరిగ్గా అప్పుడే ఫెళఫెళారావంతో ఎక్కడో పిడుగుపడింది. బాగా గుర్తు తనకు.. స్థితి తెలుసు తనకు.. తన ధర్మమూ, తన బాధ్యతా తెలుసు తనకు.. గురి తప్పకుండా బాణాన్ని సంధించి లక్ష్యాన్ని ఛేదించాలనుకున్నప్పుడు నిగ్రహం, సంయమనంతో కూడిన పరిణతీ, ప్రావీణ్యం, సాధనా అవసరం.
అందుకే.. వ్యూహాత్మకంగానే తను అమెరికా వచ్చాడు.
మొట్టమొదట తను అమెరికా భూభాగంపై అడుగుపెట్టింది వాషింగ్టన్‌ డి.సి డల్లెస్‌ ఏర్‌పోర్ట్‌లో.. తొంభై ఏడు మే పదిహేనవ తేదీ సాయంత్రం నాల్గుగంటల ముప్పయి నిముషాలకు.
రాక్‌ విల్లేలో ఆఫీస్‌ …టాటా కన్‌సల్టేన్సీ లో హైటెక్‌ ఇంజినీరింగు, ఎంటర్‌ప్రైజ్‌ సొల్యూషన్స్‌, సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌ మెంట్‌ వ్యవహారాలు చూచేవాడు తను. కనీసం ఒక ఏడాది పాటు టాటాస్‌తో ఉండాలని ప్లేస్‌మెంట్‌ అగ్రిమెంట్‌. హండ్రెడ్‌ కె పేమెంట్‌ పర్‌ ఆనం.
మేరీల్యాండ్‌ విలేజ్‌ గ్రీన్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో మకాం. ఇక ప్రయాణం, ప్రయోగం, భవిష్యత్‌ పథక ప్రణాళిక  ప్రారంభం.
అమెరికాతో ఇండియన్స్‌కు ఉన్న వలసల అనుబంధం ఎంతో సుదీర్ఘమైందని రామంకు అతితొందరగానే అర్థమైంది  దాదాపు గత ఎనభై సంవత్సరాల నుండి భారతదేశం నుండి, ఆంధ్రదేశం నుండి కూడా విపరీతంగా వలసలు జరిగాయి. ఐతే ఎవరు వలస వచ్చినా ఒక మేధోపరమైన విలక్షణతతోనే యుఎస్‌ఎకు వచ్చారు. మొదట ఎక్కువగా  డాక్టర్లు, వ్యాపారులు, ఏ ఆధారమూ లేకుండా అలా గాలికి వచ్చి స్థిరపడ్డ బాపతు ఎక్కువైతే, తొంభైలలో అనూహ్యంగా వచ్చిన బూంవల్ల మాత్రం ఐటి ఇండస్ట్రీ ఈ వలసల వెల్లువను ఒక కుదుపు కుదిపి విడిచిపెట్టింది. ఐతే గతంలో వలస వచ్చి అమెరికాలో స్థిరపడ్డ భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు ఇండియన్స్‌ అంటే గౌరవనీయులై మేధోజీవులన్న సామాజిక విలువను యిక్కడ స్థిరపర్చి పదిలపర్చారు. ఈ పరంపర ఉధృతంగా కొనసాగి న్యూజెర్సీ, డెట్రాయిట్‌లాంటి చోట తెలుగువాళ్ల సంఖ్యాబలం ఎంత పెరిగిందంటే..అంతటా ఇండియన్‌ స్టోర్స్‌ ప్రత్యేకంగా నెలకొల్పబడ్డాయి. కాగా రాజకీయాలనుండి మొదలుపెట్టి భారత సంతతి జనం అనేక అమెరికా జీవనరంగాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు. అమెరికాలోని మొత్తం డాక్టర్లలో ముప్పయి ఎనిమిది శాతం మంది భారతీయ డాక్టర్లు, ముప్పయి ఆరుశాతం ప్రతిష్టాత్మక నాసాకేంద్ర శాస్త్రజ్ఞులు, దేశ శాస్త్రవేత్తల్లో పన్నెండుశాతం, మైక్రోసాఫ్ట్‌లో ముప్పయినాల్గుశాతం,ఐబియంలో ఇరవై ఎనిమిదిశాతం, ఇంటెల్‌, జిరాక్స్‌లాంటి బహుళ జాతి కంపెనీల్లో పదిహేడు పదిహేను శాతం భారతీయులే విస్తరించి పోయారంటే..విస్తృతి ఎంత ఉధృతంగా జరిగిందో ఊహించవచ్చు.
ఐతే తొంభైలలో అమెరికాలోకి వచ్చిపడ్డ చెత్త చెదారం మాత్రం యిక్కడి నాణ్యతా ప్రమాణాలను బాగా దెబ్బతీసి ఒక రకమైన నిస్పృహను మిగిల్చి క్రమక్రమంగా భారతదేశం నుండి వలసలు తగ్గడానికి కారణం కావడం మాత్రం ఒక పచ్చినిజంగా జరిగింది. పెరుగుట విరుగట కొరకే అనేసూక్తి నిజమైంది కూడా. వేలు చూపితే కొండబాకే తత్వమున్న తెలుగువాళ్ళు అనేక అమెరికా సామాజిక రంగాల్లోకూడా చొరబడ్డారు.,
ఈ నేపథ్యంలో నిలబడ్డ వర్తమానం మాత్రం.. వాల్‌మార్ట్‌, జెయింట్‌. కాట్‌స్కో వంటి భారీ వ్యవస్థల్లో సేల్స్‌మెన్‌, మెయింటెనెన్స్‌ పీపుల్‌, ల్యాండ్‌ స్కేపర్స్‌, రోడ్‌ వర్కర్స్‌ వంటి అన్ని ప్రజా వినిమయ రంగాల్లో చిన్నస్థాయి ఉద్యోగాల్లో ఉన్న స్థానిక అమెరికన్లకు..’ఈ ఎక్కడనుండో వచ్చిన భారతీయులు మమ్మల్ని దోచుకుంటున్నారు అన్న కొంగ్రొత్త భావన కల్గుతున్నట్ట్థుానిక భారతీయుల అనుభవాలు చెబుతున్నాయి.
అడవి అంటుకోవద్దు..ఒకసారి నిప్పురవ్వ ఎండిన చెట్లనడుమ పడిందంటే ఆ బడబాగ్నిని నియంత్రించడం ఎవరితరమూకాదు. గత నాల్గుయిదు సంవత్సరాలుగా అంతర్జాతీయ సమాజంలో ప్రధానంగా అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, కెనడా వంటి దేశాల్లో స్థానికేతరుల ఉనికి అక్కడి పౌరులను అసహనానికి గురిచేస్తున్న ఉదంతాలు పదేపదే పొటమరించడం.. ఒక విపరీత పరిణామం.
ఐతే చాలామంది సాధారణ అమెరికన్లు పౌరులుగా ఎంతో సంస్కారవంతులు. ప్రేమమయులు. క్రమశిక్షణ గల ఉత్తమపౌరులు. అందరిలోనూ ఎంతో గొప్పగా భాసించేది వాళ్ల దేశంపట్ల వాళ్ళకున్న విపరీతమైన ప్రేమ, దేశభక్తి, సమాజంపట్ల ఉన్న అంకితభావం. పౌరవిధులపట్ల స్పృహ. ఉదయం వాకింగు చేస్తున్నపుడు ఎదురైన ఏ అమెరికనైనా ప్రేమగా,నవ్వు ముఖంతో ‘హాయ్‌’అని పలకరిస్తాడు. కాని ఇండియన్స్‌ పలకరించలేకపోవడం సర్వసాధారణంగా కనబడే విషయం. అమెరికన్స్‌ ఎందుకో చదువులో..ఉంటే మహాగొప్పగా..లేకుంటే సగటుకంటే తక్కువ స్థాయిలో ఉన్నట్టు ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.
ఐతే.. చాలామంది అమెరికన్లు దురాశపరులు కారు. సంపాదించిన దాన్ని తమ తక్షణావసరాలకోసం, జీవితాన్ని సౌకర్యవంతంగా గడపడం కోసం, ప్రధానంగా నాణ్యమైన ఆహారంకోసం, అలంకరణ, ఆరోగ్యంకోసం ఖర్చుచేస్తారు. కడుపు చంపుకుని పొదుపుచేసి తెలుగువాళ్లవలె డబ్బును దాచిదాచి ఆస్తులు, సంపదలు కూడబెట్టుకోవాలన్న యావలేదు వీళ్ళకు. తెలుగువాళ్ళలో వలె సంపాదన మొదలుపెట్టి తన తరంతోపాటు భావి ఇంకో ఐదు తరాలు సుఖపడేట్టు మందికొంపలు ముంచయినా కూడబెట్టే దుష్టసంస్కృతికూడా అమెరికన్లలో లేదు. తను కష్టపడి ఏదో ఒక ఆదాయం కల్గించే పనిచేసి జీవిస్తూ పిల్లలను వాళ్ల కాళ్ళమీద వాళ్ళు నిలబడే ప్రయత్నమే అందరూ చేస్తారు. పారదర్శకమైన జీవితం వాళ్ళ విశిష్టత.
భారతసమాజంలో ఉన్న తీవ్రమైన ఆర్థిక అసమానతలు, బీదరికం, నిరుద్యోగం, అవిద్య మనుషులందరినీ ఒకేచోట, ఒకేవిధంగా, జీవించే వీలు కల్పించలేకపోతుంది. కాని శతాబ్దాల పర్యంతం కొనసాగిన అనేక దూరదృష్టిగల పాలకుల పరిపాలనా పద్ధతులు, సంస్కరణల వల్ల ప్రస్తుతం ఎక్కువగా ఆర్థిక నిమ్నోన్నతులు లేని సమసమాజం అమెరికాలో వేళ్ళూనుకుంది. అందరికీ కనీసాదాయం, కనీస వసతి, కనీస సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ స్థితి సాధించడం సాధారణ విషయమేమీకాదు. భారతదేశంతో పోల్చుకుకంటే అనైతికత, విచ్చలవిడితనం, అవినీతి, లంచగొండితనం, రాజకీయ కాలుష్యం అమెరికాలో అస్సలే లేవు.
ఈ నేపథ్యంలో..,
రామం డ్రెస్‌ మార్చుకుని, డ్రాయింగు రూంలోకి వచ్చి..అప్పటినుండీ మనసునిండా ఒక వీడియో కార్యక్రమంలా కదిలిన గతాన్ని పునశ్చరణ చేసుకుంటూనే.,
తను అమెరికా వచ్చిన మొట్టమొదటిరోజు నుండి..ఒకటే ఆలోచన..ఒకటి..ఎప్పటికైనా..సాధ్యమైనంత త్వరగా భారతదేశానికి వెళ్లిపోవాలి..ఈ లోగా తను వర్తమాన భారత సమాజాన్ని పట్టి పీడిస్తున్న సర్వరుగ్మతలనూ రూపుమాపగల పరిష్కారాలను తయారు చేసుకోవాలి. రూపొందించుకోవాలి వాటిని పకడ్బందీగా అమలు చేయగల కార్యాచరణ ప్రణాళికను రచించుకోవాలి.
ఉద్యమం అంటే హింసాయుతమైన, రక్తపాతంతో కూడిన దౌర్జన్యకర ప్రజాప్రతిఘటనే కానవసరంలేదు. అర్ధవంతమైన హృదయ పరివర్తనతో కూడిన చైతన్యంకూడా ఉద్యమమే ఔతుంది. విప్లవం అంటే పెనుమార్పేగాని వేల లక్షలమంది ఆత్మార్పణతో నిండిన హింసాత్మక ఘటన కాదు. మనుషుల్లో సమూలమైన, నీతివంతమైన ప్రవర్తనను నెలకొల్పడం, అప్పటికే పతనమై ఉన్న మానవీయ మూలవిలువలను పునఃప్రతిష్టించడం కూడా ఒక అతి ప్రధానమైన విప్లవం క్రిందే లెక్క. ప్రశాంతంగా కూడా విప్లవాలు సాధ్యమౌతాయని తన అంచచల విశ్వాసం. అందుకు పటిష్టమైన సిద్ధాంతాన్ని రూపొందించుకోవాలి. రెండు..ఏ పెనుమార్పును ప్రవేశపెట్టాలన్నా మొదట తగిన ఆర్థిక పరిపుష్టత కావాలి. ప్రారంభథలో డబ్బు చేతిలో లేకుండా ఉద్యమాలను నిర్మించడం సులభసాధ్యం కాదు. కనీస పోషణలేకుండా కార్యకర్తలు ఒక పోరాటంలో నిలబడలేరు. అందువల్ల ఒక నియమితకాలం కష్టపడి కొంత డబ్బును అతివేగంగా సంపాదించాలి. ‘ధనం మూలం మిదం జగత్‌’ అన్నది ఎవరూ విస్మరించలేని పరమసత్యం.
మూడవది.. ప్రజా ఉద్యమాలెప్పుడూ ఒకే ఒక వ్యక్తిచే నిర్మించబడి, నిర్వహించబడితే విజయవంతంకావు. ఒకే ఆలోచనా విధానం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం కలిగిన కొంతమంది మూలవ్యక్తుల భాగస్వామ్యం ప్రతి ఉద్యమ నిర్మాణంలో ప్రారంభథలోఅవసరం. భారతదేశ సమూల మార్పును కాంక్షించే తనవంటి ఎందరో యువకులు, వ్యక్తులు ఎందరెందరో ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్లను గుర్తించడం, సమీకరించడం, ఒకచోట చేర్చడం, అందరినీ కలిపి ఒక శక్తిగా ఏకీకృతం చేయడం.. అప్పుడు ఒక సిద్ధాంతబద్ధమైన కార్యాచరణతో ముందుకు సాగడం.. ఇదంతా ఒక దీర్ఘకాలిక, జీవసమానమైన ప్రణాళిక.
ఒక మార్క్స్‌, ఒక మావో జుడాంగు, ఒక హోచిమిన్‌, ఒక గాంధీ..వీళ్లందరూ తమవైన విలక్షణమైన మానవీయ వ్యూహాత్మక సిద్దాంతాలతో ఈ మానవ సమాజానికి వివిధ జీవనసూత్రాలనందిస్తేగదా ఆ బలమైన పునాదుల మీద అనేక సమాజాలు, దేశాలు నిర్మితమై ఎదిగి ఈ రోజు మనగల్గుతున్నాయి.ఐతే..ఆ సిద్ధాంతాలు కాలపరీక్షకు నిలబడి మారుతున్న మానవ సమాజంలో ఎన్నేళ్ళు నిలబడగలిగాయి..ఎంతకాలం మనగలిగాయి..ఇంకా సజీవంగా ఉన్నాయా, కాలగర్భంలో కలిసి అంతరించిపోయాయా అన్నది వేరే విషయం.
ఏమైనా..ఒక సామాజిక పెనుమార్పుకు మాత్రం ఒక సూత్రబద్ధమైన సిద్ధాంతం, విపులమైన మానిఫెస్టో, విధానం అవసరం.. దాన్ని రూపొందించుకోవాలిప్పుడు తను..ఐతే లీలా మాత్రంగా ప్రస్తుత పరిస్థితికి పరిష్కారాలనబడే పద్ధతుల గురించి ఎప్పట్నుండో తను తన సహానుభూతిగల మిత్రులతో చర్చిస్తూనే ఉన్నాడు. అవి కార్యరూపం ధరించేందుకు సమయం ఆసన్నం కాబోతోందిక.
రామం నిశ్శబ్దంగా సోఫాలో ఒరిగి..అలా నిర్వ్యాపారంగా చూస్తు ఉండిపోయాడు. ఎదురుగా..చిన్నప్పటినుండీ  తనకున్న అలవాటును ప్రతిబింబిచే ఒక చిత్రం ఉంది. గోడపై..ఒక ముఖ్యవాక్యాన్ని ఎదురుగా ఉదయం లేవగానే కనబడేవిధంగా బెడ్‌రూంలో గోడకు అతికించుకునేవాడు తను. మరుపు రాకుండా..’మనిషి దొంగ’ అని రాసిపెట్టుకున్నాడు ఎన్నో నెలలు. అది పైకి అసత్యమేమో అనిపించినా ఆత్మసమీక్ష స్థాయిలో అదే సత్యమని ఎవరి అనుభవం వారికి చెబుతుంది.
ఇప్పుడు.. ఎదురుగా ఉన్న మందపు డ్రాయింగు షీట్‌పై..ఒక బొమ్మవేసి ఉంది. కుళాయి నుండి వడివడిగా నీళ్ళు ఒక కుండలో పడ్తున్నాయి. ఆ నీళ్ళపై ‘దేశప్రజల ఆర్థిక వనరులు’ అని రాసి ఉంది. ఆ నీటిధార క్రింద ఒక కుండ ఏర్పాటు చేయబడి ఉంది. దానికి అడుగు లేదు.కుండపై ‘భారతదేశం..ప్రజలు..ప్రజాసంక్షేమం’ అని రాసి ఉంది. కుండలో ఒక్క నీటి బొట్టుకూడా పడకుండా సూటిగా నీళ్లుమొత్తం క్రింద ఉన్న బకెట్‌లో పడి, నిండి పొంగి పొర్లిపోతున్నాయి. బకెట్‌ఫై ‘మంత్రులు..రాజకీయనాయకులు..దళారులు..ప్రభుత్వ అధికారులు’ అన్న అక్షరాలున్నాయి.
భారతదేశపు భావి ప్రధానిగా భావించబడ్తున్న రాహుల్‌ గాంధీ ఒక సందర్భంలో భారతదేశంలో ఊడలుదిగిన అవినీతి గురించి చెబుతూ ‘ఈ దేశంలో ప్రభుత్వం ఒక రూపాయిని ప్రజాపథకాలకు అందిస్తే కనీసం ఐదు పైసలు కూడా లబ్దిదారులకు అందడంలేదు’ అని వాపోడం జ్ఞాపకమొచ్చింది రామంకు.
‘ఈ దేశంలోనుండి అవినీతి లంచగొండితనం  అనే రక్కసిని మనందదరం ఏకస్తులమై పారద్రోలాలి’ అని రాష్ట్రపతి తమ ప్రసంగంలో ఉద్ఘాటించడం స్ఫురణకొచ్చింది.. పారద్రోలవలసిన రాష్ట్రపతే ‘మనందరం కలిసి పారద్రోలాలి’ అని నిస్సహాయంగా అంటే.. ఇక పారద్రోలవలసింది ఎవరు.

( సశేషం)

యయాతి కథావేదిక పశ్చిమాసియా!?

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 

మనం పొగమంచుకు దూరంగా ఉండి చూస్తున్నప్పుడు అది ఆవరించిన వస్తువులు స్పష్టంగా కనిపించవు. పొగమంచులోకే మనం వెళ్ళడం ప్రారంభించామనుకోండి…అప్పుడవి స్పష్టంగా కనిపించడం ప్రారంభిస్తాయి. ఆ సమయంలో మనం మన భౌతిక నేత్రాల సాయమే తీసుకుంటాం తప్ప అతీంద్రియదృష్టిని ఆశ్రయించం.

పురాణ, ఇతిహాసకథల్లోకి వెళ్ళడం కూడా అలాగే ఉంటుంది. వాటిని కాలమనే పొగమంచు కప్పుతుంది. అందువల్ల అవి అస్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ  అస్పష్టతను తొలగించే విషయంలో స్థూలంగా రెండు వైఖరులు మనకు కనిపిస్తూ ఉంటాయి. మొదటిది, ఆ కథలను కప్పిన పొగమంచుతో, అందువల్ల ఏర్పడిన అస్పష్టతతో సహా వాటిని ఉన్నవున్నట్టుగా తీసుకోవడం. వాటిని భౌతికవాస్తవికత అనే కొలమానంతో హేతుదృష్టినుంచి చూడవద్దని చెప్పడం. మరి అస్పష్టతను తొలగించడం ఎలా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఎంత పనికిరాదని శాసించినా హేతుదృష్టి చికాకు పెడుతూనే ఉంటుంది. దానినుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం…భౌతికనేత్రం స్థానంలో అతీంద్రియనేత్రం తీసుకువచ్చి ఆ కథలను భౌతికవాస్తవికతనుంచి వేరుచేసి అతీంద్రియ మార్గం పట్టించడం. మతమూ, విశ్వాసమూ, ఆ రెండూ ప్రాబల్యం వహించే సంప్రదాయమూ ఈ మార్గాన్ని నిర్మించి దానికి పెట్టని కోటలా కాపలా కాస్తుంటాయి.

అయితే, అవి మీ అన్వేషణను అడ్డుకోవు. కాకపోతే, మీ అన్వేషణ మీ ఇష్టానుసారం సాగడానికి వీల్లేదు; మేము  అనుమతించిన పరిధిలోనే సాగాలని శాసిస్తాయి. ఇంతకు ముందే ఒకసారి చెప్పినట్టు ఈ సంప్రదాయ శాసనానికి తలవంచడం శతాబ్దాల కాలగతిలో ఎంత అసంకల్పితచర్యగా మారిపోయిందంటే, పురాణ ఇతిహాసకథలను పరిశీలించేటప్పుడు మన భౌతికనేత్రం దానంతట అదే మూసుకుపోయి, అతీంద్రియనేత్రం అప్రయత్నంగా తెరచుకుంటుంది.

కవిత్రయభారత (టీటీడీ ప్రచురణ) వ్యాఖ్యాతలు పైచూపులకే స్పష్టంగా కనిపించే కొన్ని వైరుధ్యాలను ఎలా దాటవేశారో వెనకటి వ్యాసాలలో చెప్పుకున్నాం. అదే ఇందుకు  తార్కాణం.

రెండో మార్గం, పైన చెప్పినట్టు పొగమంచు ఆవరించిన వస్తువులను స్పష్టంగా పోల్చుకోడానికి మన మామూలు భౌతికనేత్రాన్ని ఉపయోగించుకోవడం. జాగ్రత్తగా గమనిస్తే, ఇది మార్గాలలో తేడాయే తప్ప చూసే వ్యక్తులలో తేడా కాదని మీకే అనిపిస్తుంది. నేనే కాదు, మీరైనా సరే, భౌతికనేత్రంతో పురాణ ఇతిహాసకథలను చూడదలచుకుంటే అవి మీకు భిన్నంగానూ, మన సాధారణబుద్ధికి అర్థమయ్యేవిలానూ కనిపిస్తాయి. వాటిలోని పాత్రలు మనలానే రక్తమాంసాలు, ఈతిబాధలు, రాగద్వేషాలు వగైరాలు కలిగిన మనుషుల్లానే కనిపిస్తాయి. ఒకానొక కాలంలో వాళ్ళు కూడా మనలానే జీవించారనిపిస్తుంది. అదే మీరు అతీంద్రియనేత్రంతో చూడదలచుకుంటే, ఆ పాత్రలు భూమికీ, ఆకాశానికీ మధ్య గాలిలో ఈదుతున్నట్టు కనిపిస్తాయి. మీరు ఏ నేత్రంతో  చూడదలచుకున్నారనేది మీ ఇష్టం.

అంతిమంగా చెప్పాలంటే, ఇది ‘ఛాయిస్’ కు సంబంధించిన ప్రశ్న.

పురాణ ఇతిహాసకథలను కప్పింది కాలం అనే పొగమంచు కనుక, ఎంతో కాలంగా ఆ పొగమంచు అలాగే ఉండిపోయింది కనుక; అది కప్పిన కథలు, పాత్రలు అస్పష్టంగానే కాక మనకు అపరిచితాలుగా కూడా మారిపోతాయి. అప్పుడు వాటిని చూడడానికి భౌతికనేత్రంతోపాటు ఇతరేతర వనరులు కూడా అవసరమవుతాయి. అయితే, అన్వేషణే మన వంతు తప్ప ఆ అన్వేషణ రెండు రెళ్ళు నాలుగన్నంత కచ్చితమైన ఫలితాలను ఇస్తుందన్న హామీ ఏమీ ఉండదు. అయితే, ఒక్కొక్కసారి ఫలితం కన్నా అన్వేషణే ఉత్తేజకరంగానూ, ఉత్సాహవంతంగానూ ఉంటుంది. ఇంకో సంగతి ఏమిటంటే, ఈ అన్వేషకుని స్థానంలో ఇప్పుడు నేను ఉండచ్చు కానీ, ఒకవేళ మీరే ఉంటే నేను ఎదుర్కొనే ప్రశ్నలనే మీరు కూడా ఎదుర్కొంటారు.

కనుక,  అసలు విషయంలోకి వెడుతూ అన్వేషణలో ఉండే మజాను కలసి ఆస్వాదిద్దాం.

   ***

యయాతి-దేవయాని-శర్మిష్టల కథను ఒక స్పష్టమైన చారిత్రక సందర్భంలో ఇమడ్చగలమా అనే ప్రశ్న వేసుకుని, ముందుగా మహాభారతం ఆధారంగానే యయాతి ఎంత ప్రాచీనుడో అంచనా వేయడానికి ప్రయత్నించాను. అందులో ఇచ్చిన రాజుల పట్టికలో, యయాతినుంచి పాండవుల మునిమనవడైన జనమేజయుని వరకూ (జనమేజయుని వరకే ఎందుకంటే, అతడే మహాభారతప్రసిద్ధులైన రాజులలో చివరివాడు) లెక్కిస్తే 26 తరాలు లెక్కకు వచ్చాయి. ఈ పట్టిక ఎంతవరకూ ప్రామాణికం, ఈ మధ్యలో కొన్ని తరాలు ఎగిరిపోయి ఉండే అవకాశం లేదా అన్న అనుమానానికి కచ్చితంగా అవకాశముంది కనుక; మొత్తం మీద యయాతి అతి ప్రాచీనుడని గ్రహించే మేరకే దీనిని తీసుకుందాం.

యయాతి ప్రాచీనతను స్థాపించే అంతకంటే ముఖ్యమైన వివరం ఏమిటంటే, అతని తండ్రి నహుషుడు ఇంద్రపదవికి ఎన్నిక కావడం. ద్వీప, అరణ్యాలతో కూడిన భూమండలాన్ని అంతటినీ తన బాహుబలంతో పాలించిన నహుషుడు నూరు యాగాలు చేసి ఇంద్రపదవిని పొందాడని మహాభారతం చెబుతోంది. రాంభట్ల కృష్ణమూర్తి గారు ‘వేదభూమి’ అనే వ్యాససంపుటిలో ’వేదకాలపు ఆయగా’ర్ల గురించి రాస్తూ ఇంద్రపదవికి ఎన్నిక కావడానికి ఎలాంటి అర్హతలు ఉండాలో చెప్పారు:  అతడు నూరు యాగాలు చేసినవాడై ఉండాలి. అందుకే ఇంద్రుడికి ‘శతక్రతు’ వనే బిరుదు ఉంది. అతడు బలిష్ఠుడై ఉండాలి. మంచి ధనవంతుడు, విద్వాంసుడు అయుండాలి. మూడేళ్లకు మించిన ఆహారపు నిల్వలు ఉన్నవాడై ఉండాలి. అలాంటివాడే సోమపానానికి కూడా అర్హుడు. ఒక కొడుకును కని ఉండాలి. జుట్టు నెరిసి ఉండకూడదు!

అయితే, ఇన్ని అర్హతలూ ఉన్న ఇంద్రుడు సమాజ సేవకుడే కానీ, నిరంకుశప్రభువు కాదు. ఇంద్రుడు కాక మరో అయిదుగురు సమాజసేవకులు ఉన్నారు. వారు: అగ్ని, యముడు, వరుణుడు, నాసత్యులు, అంటే అశ్వినీ దేవతలు. సేవకులలో ఇంద్రుడిది ప్రథమస్థానం.  గోగణాన్ని దొంగల బారినుంచి రక్షించడం, ఇతరుల గోగణాన్ని స్వాధీనం చేసుకోవడం, యుద్ధాలకు నాయకత్వం వహించడం ఇంద్రుడి బాధ్యతలు. అగ్ని యజ్ఞ నిర్వాహకుడు. యముడు గణధర్మ పరిరక్షకుడు. వరుణుడు జలవనరులను నిర్వహించేవాడు. ఇక అశ్వినీ దేవతలు ఇద్దరిలో అశ్విని నేత్రవైద్యుడు. అతనితోపాటు ఉండే అశ్విపుడు భూతవైద్యుడు. సమాజసేవకులనే అర్థంలో ఈ ‘ఆయగా’ర్ల సంప్రదాయం నిన్న మొన్నటి వరకూ కొనసాగింది. కాకపోతే వీరి సంఖ్య పన్నెండుకు పెరిగి ‘పన్నిద్దరు ఆయగార్లు’ అనే మాట ప్రసిద్ధిలోకి వచ్చింది. చర్మకారులు, కుంభకారులు(కుండలు చేసేవారు), వడ్రంగులు, కమ్మరులు, రజకులు వగైరాలు ఈ జాబితాలోకి వస్తారు. సంఖ్య పెరగచ్చు కానీ, ఏదో ఒక రూపంలో ఈ వ్యవస్థ ఇప్పుడూ ఉంది.

ప్రస్తుతానికి వస్తే; మహాభారతం, ఆదిపర్వంలో చెప్పిన రాజుల పరంపరలో ఇంద్రపదవిని నిర్వహించిన రాజుగా నహుషుడు ఒక్కడినే చెప్పారు. కనుక అతడు అతి ప్రాచీనుడయుండాలి. ఎందుకంటే, అప్పటికి రాజరికాన్ని ఇంద్రపదవితోనే సంకేతించేవారు. ఆ తర్వాత ఇంద్రుని ఒక దేవుడిగా మార్చి రాజును అతనినుంచి విడదీశారు. ఇంద్రుడే కొందరిని రాజుగా నియమించడం కూడా కొన్ని ప్రారంభకథలలో కనిపిస్తుంది. వసురాజు ఒక ఉదాహరణ.

నహుషుని నుంచి కొంచెం వెనక్కి వెడితే, అతని తాత పురూరవుడు! పురూరవునితోనే ఈ రాజుల పరంపర ప్రారంభమవుతుంది.  మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసంలోని కౌరవవంశ వివరణ ఘట్టాన్ని పరిశీలిస్తే, ఒక రాజుల పరంపర విచ్ఛిన్నమైన తర్వాత, మనువు పుత్రిక అయిన ఇలకు, చంద్రుడి కొడుకైన బుధుడికి పుట్టిన పురూరవునితో ప్రస్తుత రాజుల పరంపర ప్రారంభమైనట్టు అర్థమవుతుంది.  అంటే, మనువు పుత్రుడి వైపునుంచి కాకుండా పుత్రిక వైపునుంచి ఈ రాజుల పరంపర మొదలైందన్నమాట. అది కూడా చంద్రుడి కొడుకైన బుధుడి ద్వారా.  ఇక్కడ బుధుడికి కన్నా, ఇలకే ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తుంది.  ఈ పరంపరకు చెందిన రాజులను ‘ఐలులు’ అని కూడా అనడం దానినే సూచిస్తుంది. ఇది మాతృస్వామ్యాన్ని సంకేతిస్తోందా అని నాకో అనుమానం. ఇక్కడ చంద్ర సంబంధంలో కూడా చాలా విశేషాలు ఉన్నాయి. ఒకటి చెప్పుకుంటే, చంద్రుడు పైరు పంటలకు రాజు. ఆ విధంగా చూసినప్పుడు ఈ రాజుల చంద్ర సంబంధం వీరి వ్యవసాయ సంబంధాన్ని సూచిస్తూ ఉండచ్చు. ఇవన్నీ ప్రత్యేకంగా మరింత వివరంగా చెప్పుకోవలసిన విషయాలు కనుక వాటిని అలా ఉంచి ప్రస్తుతానికి వద్దాం.

ఊర్వశీ-పురూరవుల కథ పురాణప్రసిద్ధంగా కన్నా కావ్యప్రసిద్ధంగా మనకు బాగా తెలుసు. కవులు ఆ పాత్రల చుట్టూ గొప్ప కాల్పనిక ప్రణయ వలయాన్ని సృష్టించడం తెలుసు. కాళిదాసు విక్రమోర్వశీయం ఊర్వశీ-పురూరవుల కథే. ఈ కథకు కోశాంబీ అన్వయం అద్భుతంగానే కాక,  ‘షాకింగ్’ గా కూడా ఉంటుంది. దాని గురించి చెప్పుకునే సందర్భం ముందు ముందు తప్పకుండా వస్తుంది. అయితే,  మహాభారతంలో చెప్పిన పురూరవుడు మునుల దృష్టిలో రాజుగా ఒక పెద్ద వైఫల్యం, ఒక తప్పుడు ఎంపిక. ధనాశతో బ్రాహ్మణోత్తముల ధనాలను అపహరించాడని అతనిపై ఆరోపణ. ఆ ఆరోపణను విచారించడానికి వచ్చిన మునులను కలసుకోడానికి కూడా అతను నిరాకరిస్తాడు. పైగా వారిని ఎగతాళి చేస్తాడు. దాంతో వారు అతనిని ఉన్మత్తుడివి కమ్మని శపిస్తారు. అప్పడతను పదవీచ్యుతుడై ఊర్వశితోపాటు గంధర్వలోకంలో ఉండిపోతాడు. వారిద్దరికీ కలిగిన ఆరుగురు కొడుకులలో పెద్ద అయిన ఆయువుకు పుట్టినవాడే నహుషుడు.

01Kach

ఆయువు గురించి వివరాలు చెప్పలేదు కానీ, తాత పురూరవుడితో పోల్చితే నహుషుడు రాజుగా కొంత ఆమోదాన్ని పొందినట్టు కనిపిస్తాడు. కానీ  విచిత్రంగా అతడు కూడా మునులను అవమానించినందుకు పదవీచ్యుతుడై, వారిచ్చిన శాపఫలితంగా కొండచిలువ అవుతాడు. పురూరవుడూ, నహుషుడూ కూడా ఇలా ఇంచుమించు ఒకే విధంగా పదవీచ్యుతులు కావడం ఎందుకు సంభవించిందని ప్రశ్నించుకుంటే రెండు సంభావ్యాలు(probabilities) కనిపిస్తాయి.  వీరిద్దరూ రాచరికం ఒక వ్యవస్థగా పూర్తిగా కుదురుకోని కాలానికి చెందినవారు అయుండచ్చు. అది కూడా వీరి ప్రాచీనతకు సాక్ష్యం కావచ్చు. రాజుపై ఒక అంకుశంగా వ్యవహరించే ప్రజాప్రాతినిథ్యవ్యవస్థను ఇక్కడ మునులు సంకేతిస్తూ ఉండచ్చు. మొత్తం మీద అప్పటికి ఇంకా రాచరికం ప్రయోగాత్మకదశలో ఉండి ఉండవచ్చు. రెండో సంభావ్యత- అప్పటికే రాచరికవ్యవస్థ కుదురుకునీ ఉండచ్చు. ఆ వ్యవస్థను ఉల్లంఘిస్తూ స్వతంత్రతను చాటుకుని శిక్షపొందినవారు కనుక వీరి గురించి ప్రత్యేకంగా చెప్పి ఉండవచ్చు.

అదలా ఉంచితే, రాంభట్ల వారి పరిశీలన యయాతి కథను మరింత ఆసక్తికరమైన సన్నివేశంలోకి తీసుకువెడుతోంది. ఆయన అనుమానం ప్రకారం,  యయాతి కథ జరిగింది అసలు భారతదేశంలోనే కాదు, పశ్చిమాసియాలో!

ఇంతకుముందు ఒక వ్యాసంలో దీని గురించి క్లుప్తంగా ప్రస్తావించాను. ఒకింత వివరాలలోకి వెడితే, ‘నహుషుడు’ అనే మాట మ్లేచ్ఛభాషాపదమని , ‘వేదకాలపు ఆయగార్లు’ వ్యాసంలో ‘ రాంభట్ల గారు అంటారు. ఇంకా చెప్పాలంటే అది సుమేరు పదం. సుమేరు భాషలో  ఆ మాటకు ‘అజగరం’, అంటే కొండచిలువ అని అర్థం. నహుషుడు, యయాతి అనే పేర్లే కాక; యయాతి కొడుకుల పేర్లు కూడా (యదు,తుర్వసు, అను, దృహ్యు, పురు) వారు సుమేరులు కావచ్చునని సూచిస్తాయని రాంభట్ల అంటారు. ఆ రకంగా చూస్తే; యతి, సంయాతి, ఆయాతి, అయతి అనే యయాతి సోదరుల పేర్లే కాక; పురూరవుని పేరు కూడా అలాంటిదే అనిపిస్తుంది. నేను ఇంకొకటి కూడా గమనించాను. ఈ రాజుల పేర్లు కొత్తగా ధ్వనించినా, వారి భార్యల పేర్లు కొత్తగా కనిపించకపోవడం. ఉదాహరణకు, నహుషుని భార్య ప్రియంవద. యయాతి భార్యలు దేవయాని, శర్మిష్ట; పురూరవుని ప్రేయసి ఊర్వశి. ఇందులోని మర్మ మేమిటన్నది మరో ఆసక్తికరమైన ప్రశ్న.

దీనినిబట్టి తేలుతున్న దేమిటంటే, వేదభాషకు మ్లేచ్ఛభాష అయిన సుమేరుతో సంబంధం ఉండడమే కాక; వైదికార్యులకు సుమేరు ప్రాంతమైన పశ్చిమాసియాతో సంబంధం ఉంది. పశ్చిమాసియా ఉత్తర ప్రాంతంలో, అంటే నేటి టర్కీలో పురాణ ప్రసిద్ధులు, క్షత్రియులు అయిన కుశులు, మైతాణులు(మితానీలు), భృగులు రాజ్యాలను స్థాపించి పశుపాలనను, వ్యవసాయాన్ని సమన్వయపరిచారని రాంభట్ల అంటారు. ఎందుకంటే, ఆనాడు పశ్చిమాసియాలో వ్యవసాయం చాలా ఉచ్చదశలో ఉండేది. వేదాలకు మ్లేచ్ఛభాషతో ఉన్న సంబంధాలకు సాక్ష్యం, పూర్వమీమాంసా సూత్రకర్త జైమిని మాటల్లో దొరుకుతుంది. వేదార్థ నిర్ణయం చేసేటప్పుడు ఏ మాటకైనా ఆర్యభాషార్థం దొరకనప్పుడు మ్లేచ్ఛభాషార్థాన్ని చూడమని జైమిని అంటాడు. నహుషుడంటే కొండచిలువ అనే అర్థం ఆర్యభాషలో లేదు, మ్లేచ్ఛభాషలో ఉంది. ఒక మాటకు రెండు అర్థాలు ఉన్నప్పుడు, ఒక అర్థానికి కథ కల్పించడం పౌరాణికులకు అలవాటు అన్న రాంభట్ల గారు, నహుషుడు అనే మాటకు కొండచిలువ అనే అర్థం ఉంది కనుక దానిని సమర్థించడానికి మునుల శాప రూపంలో పౌరాణికులు ఓ కథ సృష్టించారంటారు.

Rambatla Krishna Murthy

అదలా ఉండగా, రాంభట్ల గారి ప్రకారం యయాతి కొడుకుల్లో తుర్వసు, పురు పేర్లకు సుమేరులో అర్థాలు దొరుకుతున్నాయి. ‘తురు’ అంటే పల్లపు భూమి. దానికి భూమి అనే అర్థం కలిగిన  ‘వసువు’ అనే సంస్కృత పదం చేరి తుర్వసు అనే మాట ఏర్పడింది. సుమేరు భాషలో ‘కీ’ అంటే భూమి. సుమేరులు పల్లపు భూమి అనే అర్థంలో నేటి టర్కీని తుర్కీ అనేవారు. ఇంకా విశేషం ఏమిటంటే తెలుగు గ్రామనామమైన మొగలితుర్రులోని ‘తుర్రు’ ఈ ‘తురు’ నుంచే వచ్చింది. అలాగే, సుమేరు భాషలో ‘పురు’ అంటే గడ్డి. పూరిల్లు అనే మాటలో ‘పురు’ ఉంది. ఈవిధంగా సుమేరు, తెలుగుభాషలకు సంబంధం కలుస్తోందని రాంభట్ల ప్రతిపాదన…

చూడండి…ఎక్కడినుంచి ఎక్కడికి వచ్చామో! తీగ కదిపితే డొంకంతా కదలడమంటే ఇదే. రాంభట్ల గారి పరిశీలనలలో ఈ అనుభవం మనకు అడుగడుగునా ఎదురవుతుంది. మనకు తెలియకుండానే ఒక అజ్ఞాత, ఆశ్చర్యకరప్రపంచంలోకి వెళ్లిపోతాం. అంతేకాదు, ఈ పెద్దమనిషి వాస్తవాల నేల విడిచి ఊహావిహారం చేస్తున్నారా అన్న అనుమానం కూడా కలుగుతుంది. దీనికితోడు ఆయనది ఒకవిధమైన హ్రస్వలిపి. తన ప్రతిపాదనలకు ఆధారాలు ఇచ్చే అలవాటు కూడా ఆయనకు అంతగా లేదు. ఆవిధంగా ఆయనది ఓ గుప్తలిపి కూడా. రాంభట్ల అధ్యయనాంశాలతో నాది పదిహేనేళ్ళ సాహచర్యం. అయినాసరే, ప్రతిసారీ అవి నాకు కొత్తగానే ఉంటాయి.

అయితే, రాంభట్ల గారు చెప్పీ, చెప్పకుండా సూచిస్తూ వచ్చిన కొన్ని ప్రామాణిక అధ్యయనాలతో నాకు పరిచయం కలిగినప్పటినుంచీ ఆయనవి మరీ నేల విడిచిన ఊహలు కావనే సంగతీ అర్థమవుతూ వచ్చింది. అది వేరే విషయం.

ఇప్పుడు అర్జెంటుగా అసలు విషయంలోకి వచ్చేస్తే, రాంభట్ల యయాతి కథకు పశ్చిమాసియాను రంగస్థలం చేసి, పశ్చిమాసియా-భారతదేశాల మధ్య పురావారధిని నిర్మిస్తున్నారు. పశ్చిమాసియా రంగస్థలమే క్రమంగా భారతదేశానికి మారినట్టు ఆయన పరిశీలనను బట్టి అర్థమవుతూ ఉంటుంది.

మరిన్ని విశేషాలు వచ్చే వారం…

 

 

 

 

 

 

 

 

పైసా వసూల్ పుస్తకం – “రామ్@శృతి.కామ్.”

Ram@Shuruthi.comCoverPage(1)

 

కాల్పనిక సాహిత్యానికి ప్రాధాన్యత తగ్గి కాల్పనికేతర సాహిత్యానికి ప్రాముఖ్యత పెరుగుతున్న కాలంలో ఓ వర్థమాన రచయిత తన తొలి నవలనే ‘బెస్ట్ సెల్లర్’గా మార్చుకోగలడం అరుదు, అందునా తెలుగులో మరీ అరుదు!

ఆ నవల రామ్@శృతి.కామ్. రచయిత అద్దంకి అనంతరామ్. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ అయిన రామ్ తనకు తెలిసిన నేపధ్యానికి, ప్రేమ కథని జోడించి యువ పాఠకులకు చేరువయ్యే ప్రయత్నంలో విజయవంతమయ్యారనే చెప్పాలి.

ఒకే కంపెనీలో పనిచేసే యువతీయువకుల మధ్య ప్రేమ జనించడం అనే సింగిల్ పాయింట్ థీమ్‌తో నవల రాయడం అంటే చాలా కష్టం. అయితే ఆ వ్యక్తుల మధ్య ప్రేమ పుట్టడానికి దారి తీసే సంఘటనల చుట్టూ అల్లిన సన్నివేశాలు, కథని ముందుకు తీసుకువెడతాయి. సన్నివేశాలను ఒకదానికొకటి జోడించి కథని ముగింపుకి తేవడం చాలా బాగా కుదిరింది. చక్కని స్క్రీన్‌ప్లే ఉన్న సినిమాని చూస్తున్నట్లుంది ఈ పుస్తకం చదువుతుంటే. విద్యార్థి దశలో చదువుని తేలికగా తీసుకుని సరదాగా కాలం గడిపే వారు, బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టాక ఎదుర్కునే సమస్యలను హాస్య ధోరణిలోనే ప్రస్తావించినా, అందులో అంతర్లీనంగా ఓ హెచ్చరిక కూడా ఉంది.

ఈ నవలని కథానాయకుడు రామ్ ప్రథమ పురుషలో చెబుతాడు. బిటెక్ పాసయి హైదరాబాద్‌లో ఉద్యోగానికి వచ్చి, ఇక్కడో అమ్మాయి ప్రేమలో పడి, కెరీర్ ముఖ్యమో, ప్రేమ ముఖ్యమో తేల్చుకోడంలో ఇబ్బంది పడతాడు.  ఒక దశలో అసలు తనది ప్రేమా, ఇష్టమా అని తికమకకి గురి అవుతాడు. చివరికి కెరీర్ వైపే మొగ్గు చూపి, తన జీవితాశయమైన అమెరికా ప్రయాణాన్ని సాధిస్తాడు. వృత్తిలో విజయం సాధించాక, జీవితంలోకి వెనక్కి తిరిగి చూస్తే ఏదో వెలితి. ఆ వెలితి పేరే శృతి.

శృతి కూడా తను ఎంతో ఇష్టపడి, ప్రేమించిన రామ్‌ని తన ఆశయం కోసం వద్దనుకుంటుంది. ప్రేమికుల మధ్య అపోహలు, అలకలు సహజమే అయినా, స్వాభిమానం ఎక్కువగా ఉన్న వీరిద్దరూ, తమ తమ లక్ష్యాలను సాధించుకునేందుకు తన ప్రేమని పణంగా పెడతారు. దాదాపుగా రెండేళ్ళ తర్వాత పెళ్ళి చూపులలో తారసపడతారు మళ్ళీ. కానీ అప్పుడు కూడా ఒకరినొకరు వద్దనుకుంటారు. కాని చివరకు ఒక్కటవుతారు. అందుకు దారితీసిన సంఘటనలేవి, కారకులెవరు… వంటివి ఆసక్తిగా ఉంటాయి.

ఈ నవల ఆన్‌లైన్ పాఠకులలో అత్యంత ఆదరణ పొందడానికి గల కారణాలలో మొదటిది, ఐటి రంగంలోని యువత ఈ పాత్రలతో తమని తాము ఐడెంటిఫై చేసుకోడం; రెండు రచయిత హాస్య చతురత. ప్రతీ సంభాషణలోనూ చదువరుల పెదాలపై చిరునవ్వులు పూయించడంలో రచయిత సఫలీకృతుడయ్యారు. బయట ప్రపంచంలో సాధారణ యువతీ యువకులు మాట్లాడుకునే మాటలని పాత్రలతో పలికించడం వల్ల తమ కథ చదువుతున్న అనుభూతి కలుగుతుంది చాలా మందికి. రచయిత టార్గెటెడ్ రీడర్స్ యూతే కాబట్టి సన్నివేశాలు సరదాగాను, సంభాషణలు కొండొకచో చిలిపిగాను ఉండి నవలని హాయిగా చదివింపజేస్తాయి. అలా అని ఈ నవల మిగతా వాళ్ళకి నచ్చదు అని అనడానికి లేదు. హాస్యం అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, సరళ వచనాన్ని ఇష్టపడే వాళ్ళు, జీవితాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలనుకునేవాళ్ళు, నిజమైన ప్రేమంటే తెలుసుకోవాలనుకునేవాళ్ళు…. ఇలా ఎవరైనా ఈ పుస్తకాన్ని ఇష్టపడతారు.

ఏదో లొల్లాయి పదాలు రాసేసి పేరు తెచ్చేసుకుందామని రచయిత భావించలేదు. సందర్భాన్ని బట్టి భావుకత్వాన్ని, భావ శబలతని నవలలో వ్యక్తం చేసారు. శృతి అందాన్ని వర్ణించడానికి సరదా సంభాషణలు రాసినా, కని పెంచిన తల్లిదండ్రుల ప్రేమ ముందు తను ప్రేమ అనుకుంటున్నది ప్రేమేనా అని రామ్ సంశయానికి గురయ్యే సందర్భంలో రచయిత వ్రాసిన సంభాషణలు ఆయా సన్నివేశాలకి జీవం పోసాయి. అలాగే కష్టాలని ఎదుర్కొనలేక, ఆత్మహత్యకు పాల్పడిన ఓ మిత్రుడిని తలచుకుంటూ రామ్ పడిన బాధలో జీవితానికి అసలైన అర్థం చెప్పే ప్రయత్నం చేసారు రచయిత.

ఈ నవలలో స్పష్టంగా విదితమయ్యేది రచయిత నిజాయితీ. తనకు తెలిసిన ప్రపంచాన్ని తనదైన భావాలతో తన సొంత పదాలతో పాఠకులకు అందించారు. భావాడంబరం, పదాడంబరం లేకుండా హాయిగా, సరళంగా సాగిపోయే వచనం అద్దంకి రామ్‌ది. బహుశా తొలి రచన కావడం వలననేమో, నేల విడిచి సాము చేయకుండా, ఓ చక్కని కథని, ఆసక్తికరమైన కథనంతో పాఠకుల ముందుంచారు అద్దంకి రామ్. నవల చదవడం పూర్తి చేసాక, ఓ ప్రామిసింగ్ రైటర్‌ అనిపిస్తారు అద్దంకి అనంతరామ్. మరింత కృషి చేసి తన సృజనాత్మకతకి మెరుగులు దిద్దుకుంటే మంచి రచయితగా రాణించే అవకాశం ఉంది.

134 పేజీలున్న ఈ పుస్తకం వెల రూ. 80/-. పాఠకుల డబ్బు, సమయం ఏ మాత్రం వృధా కాని పుస్తకం రామ్@శృతి.కామ్. అని చెప్పవచ్చు. డిజిటల్ రూపంలో కినిగెలో లభ్యమవుతుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ బుక్‌ని తగ్గింపు ధరకి పొందవచ్చు. ఇంకా అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభ్యమవుతుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.

 

<a href= “http://kinige.com/kbook.php?id=1671&name=Ram+at+Shruthi+Dot+com” > రామ్@శృతి.కామ్ On Kinige <br /> <img border=0 src= “http://images.kinige.com/thumb/Ram@Shruthi.com.jpg” ></a>

– కొల్లూరి సోమ శంకర్

కన్నీటిగుండె ఆకాంక్షలోంచి పుట్టిన కవిత్వం: బూర్ల వెంకటేశ్ “పెద్ద కచ్చురం”

ఎం. నారాయణ శర్మ

ఎం. నారాయణ శర్మ

ఏ కవిత్వంలోనైన వ్యక్తి ఉంటాడు.అతనిచుట్టూ అతను గ్రహిస్తున్న,గమనిస్తున్న సమాజం ఉంటుంది.ఈ సమాజాన్నానుకొని కొన్ని విలువలుంటాయి.అవి సామాజిక, ఆర్థిక,రాజకీయ, సాంస్కృతిక, కళాభావనలు ఏవైనా కావొచ్చు.కవికుండే నిబద్దతలను బట్టి కొన్ని అంశాలు ప్రధానంగా,కొన్ని సాధారణ దృష్టితో కవిత్వీకరించబడుతాయి.కవిత్వంలో వాస్తవ సమాజం స్వీకరింపబడుతుంది.కవికి ఆయా అంశాలపై ఉండే విఙ్ఞానం మేరకు వాటిని  స్వీకరిస్తాడు.అది కళాత్మక ప్రతిఫలనం చెంది పాఠకులకు చేరుతుంది.వెంకటేశ్ కవిత్వంలో సమకాలీన వాస్తవ సమాజం ఉంది.ఈ మధ్య కాలంలో తను ఆవిష్కరించుకున్న కవితా సంపుటి”పెద్దకచ్చురం”లో ఆసమకాలీన సమాజానికి అద్దం పడుతుది.
వస్తువు గురించి మాట్లాడుకుంటే తనకు తాను పరిధులు గీసుకోనట్టుగానే కనిపిస్తాడు.అంతే స్పష్టంగా సమాజాన్నీ వదిలేయలేదు.గతంలో ప్రచురించిన “వాకిలి”కి ఈవల వెంకటేశ్ కవిత్వాన్ని గమనిస్తే స్పష్టమైన పరిణతి కనిపిస్తుంది.బూర్లలో ప్రపంచీకరణ,తెలంగాణా ఉద్యమం లాంటివాటితోపాటు గుట్టలవిధ్వంసం,తన వ్యక్తిగతమైన అంశాలుకొన్ని ఉన్నాయి. సాధారణంగా కవిత్వం రాస్తున్నప్పుడు కొన్ని నిర్దిష్టతలుంటాయి.ఒక నిర్దిష్ట వస్తువు(perfect Content)పై రాస్తున్నప్పుడుకూడా ఇవి ప్రధానాంశంతో పాటు ప్రభావాన్ని చూపుతాయి. ఆముఖ కవిత్వం(prefaced Poetry)రాస్తున్న ప్పుడు ఈధార ఎక్కువ.
“కవితల్నెవడు అల్లుతాడు””కవిత”లాంటి కొన్ని కవితలు వెంకటేశ్ వస్తుసంబంధమైన అస్తిత్వ నిర్దిష్టతల్ని పరిచయం చేస్తాయి.తను ఎక్కడ మేల్కొని ఉన్నాడో తెలుపుతాయి.”కవితల్నెవడు అల్లుతాడు/ప్రవహించే ఊహల కంటిముత్యాల్ని ఆల్చిప్పలా ఒడిసిపట్టి/హృదయ హారం ఎవడు చేస్తాడు””రహదారంతా పరిగెడుతున్నప్పుడు /ఎర్రమెరుపులా ఎగిరిపడ్డ/అమాయకుని పాదాల్నెవడు ముద్దాడుతాడు””ఎర్ర దీపాలవెనుక కుమిలిపోతున్న/మాంసపుముద్దల మనోవేదనలకెవడు/అక్షర వైద్యం చేస్తాడు””ఐదేళ్ల అవతారాన్ని/ప్రతిఙ్ఞ మొదలు రద్దువరకు/సెకనులో వెయ్యోవంతై/పిల్లలకోడిలా ఎవడు కనిపెడతాడు”కచ్చితమైన నిబద్దతని చెప్పినప్పుడుకూడా జీవితాన్ని మర్చిపోకపోవడం కనిపిస్తుంది.కవుల బాధ్యత ఏపరిధిలో ఉంటుందో చెప్పిన వాక్యలివి.ఏ వస్తువైనా వెంకటేశ్ కి తనదిగా రూఢిచేసుకున్న శైలి ఒకటి ఉంది.పాఠకుడిని అనుభోక్తగా మార్చడానికి వాతావరణంలోనికి తీసుకెళ్లటం,ఉద్వేగాన్ని కలిగించడం వంటి క్రమ పద్దతిని పాటిస్తాడు.అంశాత్మక పరిశీలన(Case Study)వచనంలో వేగం ఉన్నాయి.రాజకీయల మీద మాట్లాడుతున్నా కేవలం నినాదం చేయకుండా కవిత్వాన్ని చంపేయకుండా హృదయానికి అందిస్తాడు.”ఆత్మగౌరవ కిరీటం””ఆత్మగౌరవంలోంచి””ఉద్యమం“”ఏమొస్తది””ఇక్కడ””నడువుండ్రి”-లాంటి కవితలు తెలంగాణా ఉద్యమాన్ని గురించి రాసినవి.ఒక సాధారణ వాక్యాన్నిబలంగా హృదయనికి చేర్చడానికి ప్రతీకలని ఉపయోగించుకుంటాడు.అలా అంతే దీర్ఘాలోచనలో భారంగా అదే మానసికావస్థలోకి అడుగుపెట్టేలా చేస్తాడు.

“ఒక గుండెకాయను మరో శరీరంతో కలిపి కుట్టిన శస్త్ర చికిత్స”-(ఆత్మ గౌరవంలోంచి-పే.-1)

“ఎంత జాలె పోత పోసి అల్లినా/నువ్వు నాపై బిగువుగా విసిరిన వల/పెద్దమనుషుల ఒప్పందం/నువ్వు పచ్చ బొట్టు పొడిపించుకోడానికి తయారైన ఫార్మూలా”-(పైదే)

“మనో భూమిలో విత్తన మంటూ పడ్డాక/తాను చిట్లటం నేలను చీల్చడం తప్పుతుందా?”(పైదే)

 

కెనెత్ బర్క్ ఇలా అంటాడు-“సాహిత్యంలో వస్తు రస భావ స్వభావాలను బట్టి హృదయానికి అనుభూతినందించే అవస్థాస్థితి ఒకటి ఉంది-ఈ అవస్థాస్థితిని Pattern  అని దాని ఉపయోగాన్ని ప్రతీక (Symbol)అనివ్యవహరిస్తారు.”-ఈ అభివ్యక్తిమెరుపుల్ని వెంకటేశ్ లో అనేక చోట్ల గమనించ వచ్చు.అమ్మ గురించి రాసిన కవిత అసలుసిసలైన కవిత్వానికి ఉదాహరణగా మిగులుతుంది.

boorla

“పక్కలో వెన్న ముద్దను పెట్టుకున్నట్లు/నా పక్కన ఎంత ఒత్తిగిలి పడుకునేది అమ్మ”-(అమ్మగురించి-పే.6)

“అటువెల్లిన నాఊయల /ఇటువచ్చేవరకు అమ్మ కళ్లు విచ్చిన తామరలై ఎదురుచూసేవి”

“అనేక చూపులను అనుమానించి/పూటపూటకూ దిష్టి తీసిన కనురెప్ప అమ్మ”

“తనగుండెను రెండుచేసి ప్రాణం పోసిన అమ్మ/ఈ అందాలబొమ్మను విడిచిపోవడం/ముళ్లకంప గీరుకుపోయినంత బాధ”

ఒక బలమైన మానసిక వాతావరణాన్ని పరిచయం చేసే వాక్యాలు.మూస అభినివేశం కాకుండా తనదైన కొత్త దర్శనం ఇందులో కనిపిస్తుంది.

“అమ్మకోసం””నాన్న””అర్ధాంగికి””నువ్వు నేను ప్రేమ””వెల్డర్ తిరుపతి”-లాంటివి వైయ్యక్తిక సంబంధాలకు సంబంధించినవి.నిజానికి కవిత్వం చుట్టు ఒక ఆర్ద్రమైన ,ప్రతీకాత్మక ప్రపంచాన్ని సృష్టించాడు వెంకటేశ్.

తనదైన ముద్రని పదిల పర్చుకుంటున్న సమయంలా కచ్చితంగా ఈ సంపుటి కనిపిస్తుంది.బలమైన కవితాత్మక వచనంతో తనను తాను నిలబెట్టుకోడానికి వెంకటేశ్ కు ఎక్కువకాలం పట్టదు.

ఎం.నారాయణ శర్మ

పు(ని)ణ్యస్త్రీ

chinnakatha

“సాంప్రదాయలని పాటించడమే  జీవితం అనుకొన్న  సీతమ్మ, జీవనభుక్తి కోసం  ఆ సాంప్రదాయానికి ఎదురీదెందుకు నిర్ణయించుకొంది.తను తీసుకొన్న నిర్ణయం ధర్మమో, అధర్మమో కాలమే   చెప్పాలి?”

రోజు గోదావరి  ఒడ్డున ఉన్న కోటి లింగాల రేవుకి  ఉదయాన్నే వెళ్లి కాలు ఝాడిస్తూ ఉంటాను. గత పదిహేను ఏళ్ళ గా ఉన్న అలవాటు అది, చేసేది కాలేజీ లో అధ్యాపక వృత్తి, ఇంక నా ప్రవృత్తి  అంటారా మనుషులని చదవడం, వాళ్ళ స్వభావాలను అంచనా వెయ్యడం తో పాటు అప్పుడప్పుడు చిన్న-చితక కధలు, కవితలు  రాస్తూ ఉంటాను . అన్నీ మన చుట్టూ జరిగే సంఘటనలని చూసి రాస్తూ ఉంటాను. ఇది నా అర్ధభాగానికి అస్సలు నచ్చని సంగతి. “ఎవరిగురుంచో మీకు ఎందుకండీ  ఇన్ని ఆలోచనలు” అని  ఆవిడ నన్ను సాధిస్తూ ఉంటుంది. అయినా  నా అలవాటు మారలేదు, మార్చుకోను లేదు.  అందుకే   పొద్దునే  వస్తాను  ఏకాంతంగా మనుషులని పరిశీలన చేస్తూనే ఉంటాను.  దాంతోటి  నాలోని  రచయతకు  పని  కలిపిస్తాను. ఇది స్థూలంగా నా దినచర్య.

ఈ మధ్యనే  ఒక ఆవిడను  ఇంచుమించుగ ఒక నెల రోజుల నుంచి గమనిస్తున్నాను.పెద్ద వయస్సు గల ఆవిడలా లేదు. పచ్చగా,  పెద్ద కుంకుమ బొట్టుతో నిండుగ    కనిపించే  రూపం. ముఖమంతా పరుచుకున్న చక్కటి నవ్వు చూస్తుంటే ఎవరో పెద్దింటి ఆవిడ లా వుంది అని అనుకున్నాను. ఆవిడ కూడా ఇంచుమించుగా రోజు పొద్దునే గోదారి గట్టుకు వస్తుంది. రావడమే ఎవరో తరుముతున్నట్లు గా భలే హడావుడి గా  వస్తుంది.  ఎప్పుడు వెళుతుందో మాత్రమూ  అస్సలు తెలియటం లేదు .అసేలే  నా బుర్ర కి  ఇలాంటి వి  చూస్తె కోతి కి కొబ్బరికాయ దొరికినట్లే ! ఈ మారు  శ్రద్ధ పెట్టి చూడాలి అని అనుకుంటూ  ఇంటికి బయల్దేరాను.

ఇల్లు ఇక్కడికి దగ్గరే సీతంపేటలో. మాది డాబా ఇల్లు, మా తాతగారి వారసత్వంగా వచ్చినది.  ఏదో పెద్దవాళ్ల పుణ్యమా అని తలదాచుకునేందుకు  ఓ సొంత గూడు అనేది వుంది. వస్తున్న జీతం తో ఏ ఒడిదుడుకులు లేకుండా  సాఫీగా సాగుతోంది జీవితం. అందుకు భగవంతుడికి సర్వదా కృతజ్ఞడుని.

అలానడుస్తూ వుండగా సన్నగా ఏడుపులు వినిపించాయి. పాపంఎవరో ఈ లోకం నుంచి వీడ్కోలు తీసుకొని ఇక తిరిగిరాని లోకాలికి వెళ్లి పోయిన ట్లున్నారు. గోదారి ఒడ్డునే ఉన్న స్మశానవాటిక  దగ్గరకి  తీసికొనివెళుతున్నారు.  అలా నేను అటువైపు చూస్తూవుండగా తొందర తొందరగా రోజు నేను  చూస్తున్న ఆవిడ  ఆ శవం వెనకాలే వెడుతోంది. పాపం ఆవిడ బంధువులు కామోసు, వాళ్ళు అని నాకు నేనే చెప్పుకున్నాను.

యధాప్రకారం మరునాడు నేను వెళ్ళినప్పుడు నాకు తెలియకుండానే నా చూపులు ఆవిడ కోసం వెతికాయి.   కాని  ఆవిడ ఎక్కడా  కనపడలేదు. రోజులాగే నా ఉదయ వాహ్యాళి పూర్తిచేసుకొని వెళ్ళిపోయాను. ఇలా ఓ వారం రోజులు గడిచాయి. ఆ రోజు  ఆదివారం కావటం తో నేను కొంచెం ఆలస్యంగా వెళ్ళాను. నేను వెళుతుండగానే ఆవిడ  పరుగులాంటి నడక తో వస్తోంది. ఇంతలో  చలపతి గారని మాకు బాగా తెలిసిన బ్రాహ్మణుడే, ఆయన మా ఇంటికి పూజలు చేయించడానికి వస్తారు, ఆయన  ఈవిడని చూసి “ఏమ్మా ఇప్పుడా రావడం? నేను పొద్దున్నే రమ్మనిచెప్పాను కదా! వాళ్ళు అందరు మీ కోసమే ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ప్రయాణం  పొద్దునే అట, ఆలశ్యం అయిపోతోందని విసుక్కుంటున్నారు”  అంటూ  ఈయన కొంచెం గదమాయించి నట్లుగా అన్నాడు. దానికి సమాధానం గా  పాపం ఆవిడ  చిన్నపోయిన మొహంతో  ఎంతో నొచ్చుకుంటూ ‘ఏమీ అనుకోకండి చలపతి గారు,    మా మావగారికి ఒళ్ళు బాలేదు  బాబు,  అందుకే  కొంచెము   ఆలస్యమైంది’   అని అంటోంది .

“సరే  సరే  పదండి  వాళ్ళు ఆ పక్కన మనకోసం ఎదురు చూస్తున్నారు అంటూ  ఆపక్కగ  వున్న  పావంచల వైపు గబ గబా తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఓ ఇద్దరు ఆడవాళ్ళూ, కొంతమంది మగవాళ్లు వున్నారు. వాళ్ళు ఆవిడని గట్టుమీద  కూర్చోమన్నారు ఒకావిడ ముఖానికి పసుపు రాసింది ఇంకో ఆవిడ బొట్టుపెట్టింది మూసివున్న చేటలని  ఆవిడకి అందించింది. అప్పుడు అక్కడే వున్న  వేరే బ్రాహ్మణుడు వచ్చి మంత్రాలూ చదివి “మీ అమ్మగారిని తలచుకొని నమస్కారం చెయ్యండి”  అని వాళ్ళ ఇద్దరకి చెప్పాడు.

ఆవిడతో చలపతిగారు “సీతమ్మ! ఇక్కడ నీ పని అయింది. ఇహ! ఆ శంకరం గారి భార్యది వుంది అందుకే ఎక్కడకి  వెళ్ళిపోక ఇక్కడే వుండు.! వాళ్ళు వచ్చాక ఆ  నిన్ను సూరిపంతులు పిలుస్తాడు”  అని చెప్పి  ఆయన వెళ్లిపోయాడు.

ఆవిడ  “అలాగే చలపతి గారు”‘అని తల ఊపి తన కూడా తెచ్చుకున్న సంచిలో  వాళ్ళు ఇచ్చిన వన్నీ సర్దుకుంటోంది. మధ్యలో  తలయెత్తి ఇందాక వాయనం ఇచ్చిన ఆడవాళ్ళని వో సారి చూసింది. అంతవరకూ మాములుగా కబుర్లు చెప్పుకుంటూ వున్న వాళ్ళు గబగబా అక్కడనుంచి నడచుకుంటూ కొంచెం పక్కకు వెళ్లారు. అందులోఒకావిడ అంటోంది “చూసావా ఆవిడ వాలకం, ఆ చూపులు వట్టి ద్రిష్టి కళ్ళు, అవి మంచివి కాదు బాబు నరుడి కళ్ళకి నాపరాళ్ళుఅయిన పగులుతాయి అంటారు అందుకే  ఇలాంటి వాళ్ళని శుభాలకి  ఎవరూ  పిలవరు” అంటూ ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు,

అంతవరకూ జరిగినదంతా చూస్తూనే వున్నాను. పాపం  ఆవిడ పచ్చటి మొహం  అవమాన భారంతో ఎర్రగా అయ్యి కన్నీళ్ళ పర్యంతం అయింది. ఇంతలో ఇందాకటి  బ్రాహ్మణుడు  అంత దూరమునుంచే “సీతమ్మ రావమ్మా! వాళ్ళు వచ్చేసారు”  అనిపిలుస్తున్నాడు. “ఆ వచ్చే! వచ్చే!”  అనుకుంటూ ఆవిడ  అక్కడనుంచి  ఆ పక్కగా వున్న గట్టు దగ్గర గా వెళ్ళింది. మళ్లి ఇందాక నేను చూసిన తంతు మొదలుపెట్టారు. అప్పటికే చాల పొద్దు పోవటం తో  నేను ఇంటి కి బయల్దేరాను.  కానీ  ఆరోజంతా అదే సంఘటన నా కళ్ళ ముందు కదలాడ సాగింది.

కాలేజీ లో పరీక్షల మూలం గ, అదీ గాక  ఎప్పటి నుంచో  వెళ్ళాలనుకొన్న   కాశి యాత్రకు కు కూడా వెళ్లి రావడంతో నా ఉదయ వ్యాహళ్లి కార్యక్రమం కొన్ని రోజులు గ  వెనుకబడింది. ఇదిగో మళ్ళి  ఈవాళ        ఆదివారం కావటంచేత కొంచెం తీరుబడిగా గోదారి ఒడ్డు కొచ్చి ఆ ప్రత్యూష వేళలో  ఆ నీటి తరగలమీద నుంచి వీచే చల్లని గాలి  మనసుని, శరీరాన్ని కూడా సేద  తీరుస్తూ వుంటే, ఎంతో హాయిగా, ప్రశాంతం గా వుంది. అలా ఏదో లోకాలలో విహరిస్తున్న నన్ను, “ఏం బాబు బావున్నారా?” అన్న చలపతి గారి పిలుపుతో తెప్పరిల్లి, ఆ! ఆ ‘! చెప్పండి చలపతి గారు ఎలా వున్నారు? ఏమిటి లాంటి కుశల ప్రశ్నలు వేస్తూ ,పిచ్చాపాటి మాట్లాడుకుంటూ నడుస్తున్నాము.

ఇంతలో మళ్ళి ఆవిడ కనిపించింది.కాని మాములుగా కాదు. ఏదో జబ్బు పడి లేచినట్లుగా వుంది. అది చూసిన చలపతి గారు “ ఆ వచ్చేది సీతమ్మకదూ! అయ్యో అలా జబ్బు పడిన దానిలా వుందేమిటి? పాపం సంసారం కోసం మహా కష్ట పడుతుంది,ఏమిటో ఆ దేముడు కొంతమంది నుదుట కష్టాలే రాస్తాడు”  అంటూ కొంచెం ఆందోళనగా.ఎమ్మా! సీతమ్మా ఎలా వున్నారు? ఎవరో అమెరికానుంచి వచ్చిన వాళ్ళకి  వంటా అది చెయ్యడానికి  వాళ్ళతో పాటు వో 15 రోజులు కాశి వెళ్లావు అని చెప్పారు, ఆ విశ్వేశ్వరుని దర్శనం  అదీ బాగా అయిందా? అలా అయిపోయవేమిటమ్మ? ఏమి ఒంట్లో బావుండలేదా?” అంటూ ప్రశ్ర్నించారు.

“ఆ, ఆ ,అయింది చలపతి గారు! అబ్బే పెద్ద జబ్బు ఏమి చెయ్యలేదు,  కాని అక్కడ స్నానాలు అవి పడలేదండి” అంది ! “అవునమ్మా ! అక్కడి వాతావరణం వేరు”, అంటూ నావైపు తిరిగి “మీరుఎన్నయినా చెప్పండి రామారావు గారు మన రాజమండ్రి, వాతావరణమే నాకు నప్పుతుంది” అని అన్నాడు..

అంతవరకు ఏదో యథాలాపంగా చూస్తున్న నేను ఒక్కసారి సీతమ్మగారిని చూసి షాక్ తిన్నాను. కారణం ఆవిడ ముత్తైదువ గ కనిపించడమే . కొంచెసేపు అయిన తరువాత చలపతి గారు వెళ్ళిపోయారు.

అప్పుడు నేను వెంటనే అసహ్యంగా చూసి, ఆగ్రహం నిండిన గొంతుతో “ ఏమండీ సీతమ్మగారు! మీరు ఇలా ఎందరి ని మోసం చేస్తారు, అది తప్పు, పాపం అనిపించటం లేదా మీకు? ఈ విషయం నలుగురికి తెలిస్తే మీ పరిస్థితి యెంత దారుణంగ వుంటుందో  గ్రహించారా?    భర్త చనిపోయినా మీరు  ఇలా పుణ్యస్త్రీ గా  కనిపిస్తూ  అవతలవాళ్ళ  ని  నమ్మిస్తూ  ఇలా చేయడం పాపం కాదా? మీరు కుటుంబం కోసం కష్టపడుతున్నారని తెలిసి  అయ్యోపాపం ఒంటరి గా సంసారభారం మోస్తున్నారని అనుకొన్నాను కాని. ఇలా అందర్నీ వంచన చేస్తున్నారని  తెలుసుకోలేకపోయాను. మిమ్మల్ని నేను  కాశి లో చూసాను, పాపం అది మీకు తెలియదేమో” వ్యంగంగా . అన్నాను

నామాటలకి ఆవిడ మొహం నెత్తురుచుక్కలేకుండా పాలిపోయింది. అసలే నీరసంగా ఉన్నదేమో ఒక్కసారిగా తూలి పడబోయి నెమ్మదిగా తమాయించుకుని “అవును బాబు మీరు చూసినది నిజమే ,కాని నేను ఇలా చెయ్యడానికి గల కారణం చెబుతాను. దయచేసి నన్ను అసహ్యహించు కోవద్దు, నేను చెప్పేది వినండి, అంటూ చెప్పడం మొదలు పెట్టింది. “ మాది చాలా పేద కుటుంబం. మేము గంపెడు సంతానం మా అమ్మ నాన్నలకి. ఏదో భుక్తి కోసం నాన్న చావు మంత్రాలూ చెప్పుతూ,అమ్మ వాళ్ళఇళ్ళల్లో వీళ్ళ ఇళ్ళల్లో  వంటలు వండుతూ  కాలం వెళ్ళబుచ్చుతున్నారు. అందరిలోకంటే నేను పెద్దదాన్ని,చదువా ఏదో అక్షరంముక్క నేర్చుకొన్నాను. పెళ్లివయసు వచ్చింది. కాని  పెళ్లి ఎలా చేస్తారు ? ఏం పెట్టి చేయగలరు?వచ్చే సంపాదన తోఅందరకినాలుగు వేళ్ళు  నోట్లోకి వెళ్ళడ మే గగనమవుతోంది,ఆ సమయం లో మా మేనత్త, అదే మా నాన్నగారి చెల్లెలు వచ్చింది, వాళ్ళ అబ్బాయికి నన్ను అడగటానికి . వాళ్ళకి ఒకడే కొడుకు,అమాయకుడు, వయసు వచ్చినా మానసిక పరిపక్వత లేదు.  ఇకఇందులో నాఇష్టాల ప్రసక్తి అనేదే లేదు. ఇక్కడ నుంచి నేను వెళితే ఒక మనిషి బరువు తగ్గుతుంది. అది ఆలోచించి సరే అన్నాను. మావయ్య   ఏదో చావు మంత్రాలూ చెప్పుకొంటూ  రెండుపూటలా తిండికి లోటులేకుండా బతుకును ఈడుస్తున్నాడు. పెళ్లి జరిగింది అత్తయ్యతో పాటు నేను వంటలు చేస్తూ, ఇలా పుణ్యస్త్రీగా వాయినాలు అందుకొంటూ కాలం గడుపుతున్నాను. మా బావ చిన్న పిల్లాడితో సమానం. ఎప్పుడో ఒక స్వామీజీ “కాశి “గురించి చెప్పాడుట. అప్పటి నుంచి నేను కాశికి పోతానని ఒకటే గొడవ, నన్ను కూడా అడిగాడు  తీసుకొని వెళ్ళమని అలాగే వెళదాము అన్నాను. కాని ఇంతలోనే ఒక రోజున ఇంట్లోంచి చెప్పకుండా  ఎటో వెళ్ళిపోయాడు. ఎక్కడి కి వెళ్ళాడో తెలియదు. అన్ని చోట్ల వెతికించాను. పోలీసు రిపోర్ట్ కూడా ఇచ్చాను. కాని ఏమి లాభం లేకపోయింది. ఈ సంఘటనతో మావయ్య మంచాన పడ్డారు. అత్తయ్యకి షుగర్ కంప్లైంట్ వుంది దానితో కంటి చూపు బాగా దెబ్బతింది. అత్తయ్య ,మావయ్య కూడా రోజుకోసారి నీకు అన్యాయం చేసామని ఏడుస్తారు. ఈ  కష్ట సమయం లో నేనే వాళ్ళని వదిలి వెళ్ళలేకపోయాను. అప్పుడు అనుకొన్నాను. దేముడు నా నుదుటన ఇలాగ రాసాడు. అని సమాధానపరచుకొని  వాళ్ళని చూసుకొంటూ,ఇది గో ఈ చలపతి గారి ద్వార నాలుగు రాళ్ళూ తెచ్చుకొంటూ బతుకుని వెళ్లదీస్తున్నాను. ఒక పక్క మా బావ కోసం వెతుకుతూనే వున్నాను. నా కెందు కో అతను కాశి కి వెళ్లి వుంటాడు అని అనిపించేది. మాకు తెలిసిన వాళ్ళ ద్వారా అక్కడ కూడా వెతికించమని చెప్పాను. ఇదంతా జరిగి పది ఏళ్ళు అయింది. అత్తా, మామలు పండుటాకులయ్యారు. ఏ క్షణమైన రాలిపోవచ్చు, ఇలాంటి సమయంలో నాకు కాశి నుంచి ఒక కబురు వచ్చింది.బావ దొరికాడని,కాని అతను ఆరోగ్యం బాగా దెబ్బతిని చివరి దశలో ఉన్నాడని. అప్పుడు నేను ఇక్కడ వీళ్ళకి ఎవరో అమెరికానుంచి వచ్చిన పెద్దవాళ్ళకి  వంటా అది చెయ్యడానికి అక్కడికి రమ్మన్నారు అని చెప్పి వెళ్ళాను. నేను వెళ్ళిన కొంచెం సేపటికే బావ చనిపోయాడని చెప్పారు. అక్కడ వాళ్ళనే  బతిమాలుకొని  అన్ని అక్కడే కానిచ్చుకొని వచ్చాను. అదే మీరు చూసి వుంటారు.

నాకు తెలుసు నేను చేస్తున్నది సమాజం దృష్టి లో చాలా పెద్దతప్పు అంటారని, కాని నాకున్న కారణాలు, చాలా వున్నాయి అందులో మొదటిది “ఆకలి”. మేము అవటానికి అగ్రవర్ణం వాళ్ళ మైన సమాజంలో మా స్టాయి వేరు.  మనిషి పోయినప్పుడు,లేదా ఆబ్దికాలు పెట్టానికి మాత్రమె మావాళ్ళు పనికివస్తారు, శుభకార్యాలకు వెళ్ళలేరు. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే, మేము వేరే వాళ్ళ చావును కోరుతున్నట్లు అనిపిస్తుంది.. ఇలాంటి స్థితిలో మాకు వేరే జీవనాధారం లేనప్పడు ఆ వచ్చే నాలుగు డబ్బులు కోసం నేను విధవనై మూల కూచుంటే,  ఈ ముసలి ప్రాణాలను ఎలా పోషించనూ? శరీరం లో ఊపిరి ఉన్నంతవరకు బతకాలి కదా? ఎలాగూ నాభర్త ఎక్కడి కో వెళ్లిపోయాడని అందరికి తెలుసు.  ఈ విషయం చెప్పి ఆ ముసలి ప్రాణాలు రెంటిని క్షోభ పెట్టదలచుకోలేదు. అందుకే నేను సమాజం కోసం కన్నా ఈ పెద్దవాళ్లని, ఆదుకోవడం ముఖ్యం అనుకున్నాను. ఆఫీస్ ఉద్యోగాలు చేసేందుకు నాకా చదువులేదు . నాకొచ్చినది ఒక్కటే, పది మందికి వంటలు చేసిపెట్టడం, ఇదిగో ఇలా పుణ్య వాయనాలు అందుకోవడము. బతకాడానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా  అందుకే ఈ నిర్ణయం. తీసుకొన్నాను”  అంటూ చెప్పటం ముగించింది ఆమె.

ఆమె చెప్పినది విన్నాక  ఒక సంప్రదాయవాదిగా ఆమె నిర్ణయం హర్షించలేకపోయాను. అలాగ అని పరిష్కారమూ చూపలేకపోయాను.

పాపమో,పుణ్యమో సాంప్రదాయలని పాటించడమే  జీవితం అనుకొన్న  సీతమ్మ, జీవనభుక్తి కోసం  ఆ సాంప్రదాయానికి ఎదురీదెందుకు నిర్ణయించుకొంది.ఆమె తీసుకొన్న నిర్ణయం ధర్మమో, అధర్మమో కాలమే   చెప్పాలి? అనుకొంటూ భారమైన మనస్సు తో  ఇంటి ముఖం పట్టాను.

***

Mani Vadlamaniమణి వడ్లమాని

 

 

 

 

 

 

 

 

” యిన్నాళ్ళ బ్రతుకే ఒక బోనస్” : ఆ పోరాట వీరుడి ఆఖరి వాక్యం!

పోరాటాల  మల్లారెడ్డి

పోరాటాల మల్లారెడ్డి

ఆగస్టు 23 (2011) వుదయాన  ఫోన్, మిత్రుడు కుంబాల మల్లారెడ్డి యిక లేడని. . క్యాన్సర్ వ్యాధితో యేడు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం యిక ముగిసింది. అంతకు రెండు రోజుల ముందే పరామర్శించడానికి వెళ్లి, దిగులు పడుతూనే ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తే, ‘ఎప్పుడో పోవాల్సిన ప్రాణం కదా, యిన్నాళ్ళ బ్రతుకే ఒక బోనస్’ అని జవాబు చెప్పిన మనిషి.

ఏమని చెప్పుకోవాలి మల్లారెడ్డి గురించి? చీకటిలో కనిపించని నీడల గురించి, వెలుతురు మెరుపులలో విస్మృతమయే దీపాల గురించి, మాటల సవ్వడిలో వినిపించని మౌనం గురించి, సుదీర్ఘ పయనంలో గుర్తించని దురాల గురించి, వుత్సవంలో వెలుగు చూడని విషాదాల గురించి..ఎప్పుడో రాండాల్ స్వింగ్లర్ రాసాడు కదా..

వీధులన్నీ విద్యుత్తేజంతో వురకలేస్తూ

కరతాళ ధ్వనులతో మార్మోగుతున్నపుడు

కవాతు చేసే మన వూహల లయతోనే

భేరీలు మోగుతున్నపుడు

గొంతెత్తి పాడడం తేలిక ..

జనసమూహం జాగృతమై

మనం రుజువు చేయదల్చుకున్నదాన్నే కోరుకుంటున్నపుడు

కదంతొక్కేలా మాట్లాడడమూ తేలికే

కన్నుపొడిచినా కనిపించని కటిక చీకటిలో

నిప్పురవ్వని దావానలంగా విస్తరించే వొడుపుతో

వెలుగువైపు నడిపించడం అంత తేలిక కాదు

ఎవరు చూడనిదీ, గుర్తించనిదే అసలైన పని

మల్లారెడ్డి గురించి మాట్లాడటమంటే ఎవరు చూడని, గుర్తించని పనుల గురిచి చెప్పుకోవడమే.

ఎమర్జెన్సీ అనంతర కాలం కరీంనగర్ జిల్లాలో భూస్వామ్య వ్యతిరేక రైతాంగ పోరాటాల వెల్లువ పెల్లుబికిన కాలం. సిరిసిల్ల, జగిత్యాల జైత్రయాత్రల కాలం. ‘దొరల కాలికింది ధూళి ఎగిసి వాళ్ళ కళ్ళలో పడిన చోటు ‘కల్లోలిత ప్రాంతం’గా ప్రకటించిన కాలం. రైతాంగ పోరాటాలు అటు సామాజిక ఆచరణలో, ఇటు సైద్ధాంతిక రంగంలో కొతాచుపునీ, కోణాలని ఆవిష్కరించిన కాలం. దానితోపాటు ఆ ఉద్యమాల ముందు కొత్త సమస్యలూ ముందుకొచ్చాయి. విశాలమైన పునాదిపై ఐక్యతని నిలబెట్టుకోవడం, ఉద్యమాన్ని సంఘటిత పరచుకోవడం, విస్తృతం చేయడం, భూస్వామ్య వ్యతిరేక ప్రతిఘటనని అభివృద్ధి చేయడం, భూస్వాములకి అనుకూలంగా ప్రభుత్వం అమలు జరుపుతున్న నిర్బంధాన్ని తట్టుకుని నిలబడటం – ఇవి ఆనాడు వుద్యమం ముందుకొచ్చిన సమస్యలు. 1982 లో సిరిసిల్ల, వేములవాడ రైతాంగ పోరాటాలపై ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ప్రచురించిన వ్యాసం ఆనాటికి ప్రభుత్వ నిర్బంధమే కీలకమైన సమస్యగా మారిన విషయాన్ని గుర్తించింది. ఆరోజులలో (రోడ్డు)పదిర గ్రామ సర్పంచిగా, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేసిన యువకుడు మల్లారెడ్డి.

1985 తర్వాత, ‘ఆట, పాట, మాట’ అన్నీ బంద్ అయిన కర్కశ, నిరంకుశ పాలన రాజ్యమేలింది. కరీంనగర్ జిల్లా రైతాంగ పోరాటంలో ముందుకొచ్చిన వ్యక్తులు, నాయకులు వుద్యమ విస్తరణ అవసరాల రీత్యా యితర ప్రాంతాలకి తరలడమో, బూటకపు ఎదురుకాల్పుల్లో బలికావడమో జరిగింది. ఆ రోజుల్లో మల్లారెడ్డి యేమయ్యాడో చాలామందికి తెలియదు. ఉవ్వెత్తున వుద్యమాలు యెగిసినప్పుడు మెరిసిన మనుషులు తర్వాతి కాలంలో వొడుదుడుకులు  యెదురైనప్పుడు తెరమరుగు కావడం సహజమే. మల్లారెడ్డి ఆచూకి మాత్రం చాలా మందికి తెలియలేదు. మిత్రులకీ, బంధువులకీ, శత్రువులకీ.

పార్టి రహస్య నిర్మాణంలో అనుసంధానకర్తగా మల్లారెడ్డి నిర్వహించిన బాధ్యతల గురించి యెవరు చెప్పగలరు? అవి అజ్ఞాత జీవితపు అజ్ఞాత వివరాలే కదా. ఒక వ్యక్తి బహు ముఖాలుగా, అనేక పేర్లు వొకే ముఖంగా, పరిచిత ముఖాల మధ్య వొక అపరిచితునిగా, అనామకునిగా నిలిచిన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించగలిగేదెవరు? చిరుద్యోగిగా, చిరువ్యాపారిగా, చిరపరిచిత మిత్రునిగా, చుట్టపుచూపుగా అప్పుడప్పుడూ వచ్చిపోయే బంధువుగా తారసపడే వ్యక్తి రూపాన్ని బట్టి అతను నిర్వహించే బాధ్యతలని యెవరూ వూహించలేరు. కలుసుకోబోయే మనిషిని బట్టి, స్థలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వొక వ్యక్తి యెన్నెన్ని పేర్లు, యెన్నెన్ని రూపాలలో యెదురవుతాడో లెక్కపెట్టిందెవ్వరు? ఎప్పుడు పొంచివుండే ప్రమాదాన్ని అలవోకగా ధిక్కరించిన  నిర్లక్ష్యంతో, అవసరానికి మించి యేమీ మాట్లాడని జాగ్రత్తని మేళవించి అనామకంగా మిగిలిపోవడానికి తాను చూపిన శ్రద్ధ విలక్షణమైనది.

ఉద్యమాలు సమూహపు స్వప్నాల లాంటివి. కొన్ని సార్లు కలలు చెదిరిపోవచ్చు. శత్రువులు చిదిమివేయవచ్చు. లాంగ్ స్టన్ హ్యూస్ వాయిడా పడిన కల గురించి చెబుతాడుకదా,

వాయిదా పడిన కలకి యేమవుతుంది?

ఎండిన ద్రాక్ష పండులా ముడుచుకు పోతుందా?

గాయంలా సలుపుతూ

 స్రవిస్తుందా?

కుళ్ళిన మాంసంలా

గౌలుకంపు కొడుతుందా?

తీయటి పొరలా

పేరుకపోతుందా?

బహుశా వొక దింపుకోలేని బరువులా

వేలాడుతుందా?

లేక పెఠీల్లుమంటూ

పేలిపోతుందా?

కల చెదిరినా లొంగిపో నిరాకరించేమనిషి యేమౌతాడు? మల్లారెడ్డి యేమయ్యాడు? ఏకాకి కాకున్నా మల్లారెడ్డి వొక వొంటరి మనిషి. తనదొక వొంటరి యుద్ధం. తానెంచుకున్న పోరాట రంగంలో పదిమందిని కూడగట్టి న్యాయం కోసం పోరాడాడు. నాయకత్వం కోసం, పేరు కోసం, ప్రాపకం కోసం అర్రులు చాచే కాలంలో తాను ముందుకి రాకుండా, తెరవెనుకే నిలబడి బస్తీ ప్రజలని సంఘటితం చేశాడు. మనసుని వెంటాడే కల చెదిరిన దు:ఖానికి మనిషిని నిలువెల్లా కుంగదీసే క్యాన్సర్ వ్యాధి తోడైతే యెలా వుంటుంది? ఇక్కడ కూడా మల్లారెడ్డి ద్రుడంగా నిలబడ్డాడు. తనవలెనే క్యాన్సర్ వ్యాధి పాలైన మరొక మితృనికి ఆసరాగా నిలబడ్డాడు. ఊరటనిచ్చేందుకు శాయశక్తులా కృషి చేశాడు. జీవితమొక యుద్ధరంగం.. కల చెదిరిన మనిషి వొక అనామక సైనికుడు.. మల్లారెడ్డిని తలచుకోవడమంటే కలల్ని నిలబెట్టుకోవడానికి మనిషి వొంటరిగానూ, సాముహికంగానూ చేయాల్సిన కృషిని బేరీజు వేసుకోవడమే.

ఎక్కడినుంచి వెలుగుతుందో తెలియదు

బయలుదేరి వెళ్లిపోయాక గానీ

గుర్తించని చిరునవ్వు వెలుతురు

మేఘాల చాటున కనిపించని నక్షత్రం

ఎందరికి ఆసరాగా నిలిచిందీ తెలియదు

ఒంటరి యుద్ధంలో గాయపడ్డాకగానీ

వెలుగులోకి రాని రహస్య జీవితం

మౌనంలో ప్రతిధ్వనించే నిశ్సబ్ద నినాదం

ఎప్పుడు ఎవరు నాటారో తెలియదు

తొలకరి జల్లు కురిశాక గానీ

కనిపించని రైతు పాదముద్ర

నాగేటి చాళ్లలో మొలిచిన రహస్యోద్యమ సందేశం

ఎటునుంచి ఎటు వీచిందో తెలియదు

కరచాలనం చేసి మాట్లాడాక గానీ

అనుభవంలోకి రాని సహజ స్నేహ పరిమళం

పంటపొలాల్ని మోసుకొచ్చిన సిరిసిల్ల పైరగాలి

మల్లారెడ్డికి జోహార్లు..

  సుధా కిరణ్

సుబ్బక్క సుప్రభాతం

  నన్ను నేను పరిచయం చేసుకోవడం ఇబ్బంది. అది తేల్చుకోలేకే పదేళ్లుగా నానా తిప్పలు పడుతున్నాను.  రాజకీయ, సాహిత్య విద్యార్థిగా నన్ను నేను భావిస్తాను.కార్యకర్తనని కూడా అనుకుంటాను.నాకు గుర్తున్నంత వరకూ ఇది నా ఏడోకథ. ఆంధ్రజ్యోతిలో వచ్చిన  పులిజూదం కథను మధురాంతకం నరేంద్రవారి కథావార్షికలోనూ, రైతు కథల్లోనూ తిరిగి అచ్చువేశారు. నాకు దోస్తవిస్కీ ఇష్టం. రావిశాస్ర్తి, పతంజలి, నామిని ఇష్టం.  –జి. ఎస్.రామ్మోహన్

***

“నా బట్టల్లారా..నా సవుతుల్లారా

మీ ముక్కులో నా సాడు బొయ్య

మీ చేతిలో జెట్ట బుట్ట

మీకు గత్తర తగల

మీ తలపండు పగల

మీ వొంశం మీద మన్ను బొయ్య…….”

సుబ్బక్క సుప్రభాతంతో పల్లె రెక్కలిప్పుకుంది.

చేతుల్తో మట్టి ఎత్తెత్తి బోస్తా శాపనార్థాలు పెడతా ఉంది. రామాలయం మైకులోంచి ఎంఎస్‌ సుబ్బలక్ష్మి గొంతు మంద్రంగా వినిపిస్తా ఉంది. దాన్ని డామినేట్‌ చేయడానికా అన్నట్టు సుబ్బక్క అరిచి అరిచి గసపెడతా ఉంది. కళ్లాపి ఇసురిసురుగా చల్లతా ఉంది.

“ఏందే పొద్దు పొద్దునే బిగిన్‌చేసినావ్‌….ఊళ్లో అందరికి సావొస్తా ఉంది. నీకు రావడం లేదే…”

చెంబు తీసుకుని బయలుకు బోతావున్న ఎంగట్రాముడు నడక తగ్గిచ్చి పెద్దరికం చూపిచ్చినాడు.

“తిన్నదరక్క సొయ్యం బట్టి కొట్టుకుంటా ఉంటి నాయనా…ఊరోళ్ల ముల్లెంతా మూటగట్టుకుని మిద్దెలు, మాడీలు కడ్తినాయనా…అందుకే సావొస్త లేదు”…

మాంచి రెస్పాన్స్‌ ఇచ్చి మళ్లీ తిట్ల పనిలో పడింది సుబ్బక్క.

“నీ నోట్లో నోరుబెట్టి బతికిందెవడే” అనేసి ఎంగట్రాముడు నడకలో వేగం పెంచేసినాడు.

సుబ్బక్కకు ఐదుగజాల దూరంలోనే తలకాయొంచుకుని ముగ్గేస్తున్న సుజాత అంతా జాగర్తగా గమనిస్తా ఉంది. ఎదిరింటి వాకిట్లో యాప్పుల్ల నములుతా సుబ్బారాయుడు జరగబోయే వినోదం కోసం ఎదురుచూస్తా ఉన్నాడు. ఆయన భార్య రాములమ్మ పేడకాళ్లు తీస్తా ఉంది గానీ మనసంతా ఇక్కడే ఉంది.  తలకాయొంచుకున్న సుజాతనే మద్దెమద్దెలో తలతిప్పి జూస్తా ఉంది.

“యా పూటన్నా ఒకరింటికాడ చేయి జాపితినా..ఒకరి సంగిటిముద్దకు ఆశపడితినా…పెతి నాబట్టకు నా యవ్వారమే, పెతి లంజెకి నా ఇంటిమీద కన్నే…మీ కుదురు నాశనం కాను”….

సుబ్బక్క డోస్‌ పెంచేసింది.

“ఏందే బాసిలా…పిల్లోళ్లు ఎవరో ఆడుకోడానికి పిడికెడు సిమెంట్‌ తీసకబోతే ఇంత గత్తర జేయాల్నా లేకిముండా”..తగులుకొనింది సుజాత. లంజె అనే పదం ఇనిపిచ్చేసరికల్లా ఆ ఆడబిడ్డకు రోసం వచ్చేసింది. అదే సుబ్బక్క కోరుకునేది. అజ్ఞాతంలో ఉన్న ప్రత్యర్థిని జుట్టుపట్టుకుని బయటకు ఈడ్చుకురావడంలో సుబ్బక్క దిట్ట.

“అది పిడికెడా..ఎవురే లేకిది…పొరుగింటి సొమ్ముకు ఆశపడేది ఎవురే”…సిమెంట్‌బస్తాను అరుగుమీంచి లాగిలాగి చూపిస్తా ఉంది సుబ్బక్క.

“ఒరే సుబ్బరాయుడా!..నువ్వు జూడ్రా..ఇది పిల్లోళ్లు తీసకపోయినట్టు ఉండాదిరా..మాటనేదానికి ఇంగితం ఉండాల….నా సవితి, ఇపుడు తేలాల…నా సిమెంట్‌ దెంకపోయిందెవరో తేలాల…ఆ లంజెవరో లంజెకొడుకెవరో తేలాల”…

అనవసరంగా ఇరుక్కుంటి గదరా అనుకున్న సుబ్బారాయుడు “నాకెందుకులేత్తా!..మీ ఆడోళ్ల యవ్వారాలు” అని నోరుకడుక్కోవడానికి బోరింగ్‌ దగ్గరకు బోయినాడు.

“లేస్తే లంజె అంటాండావు, ఎవురే లంజె, నువ్వే లంజె, నీ ఆరికట్ల వంశమే లంజె వొంశం” అని సుజాత కొంగుబిగిచ్చి ముందుకు దూకింది. వీధి వీధంతా తమాస జూడ్డానికి తయారైపోయింది. జాలాడి బండకాడ పెచ్చులూడిపోతే రాత్రి సిమెంట్‌ తీసుకునిపోయిన సుజాత మొగుడు శ్రీనివాసులు ఇంట్లోంచి తల బయటకు పెట్టింది ల్యా.

తాగిన మత్తులో సిమెంట్‌ అవసరమైన దానికన్నా నాలుగు పిరికిళ్లు ఎక్కువ తీసుకుని దారిలో పోసి ఇపుడు సుజాతను బోనులో నిలబెట్టిన పాపానికి మంచంలోనే అటూ ఇటూ దొర్లుతూ ఇంట్లోంచే ఈదిరామాయణం చూస్తా ఉన్నాడు.

ఊరోళ్లకు సుబ్బక్క యవ్వారం కొత్తదేమీ కాదు గానీ దగ్గరిళ్లోళ్లకు మాత్రం నాలుగైదు రోజుల్నించి ఇచ్చిత్రంగా అనిపిస్తా ఉంది. ‘కొడుకు దగ్గరకు పోయొచ్చినాల్మించి మళ్లీ దీనికి రోగం తిరగబెట్టిందేమే’ అని పక్కింట్లో ఎంగటేసులు ఒగటే ఆశ్చర్యపోతా ఉన్నాడు.  ‘మొన్న మొన్నటి దాకా నా కొడుక్కి ఉద్యోగమొచ్చింది, నా కొడుక్కి ఉద్యోగమొచ్చింది అని తప్పెటేసుకుంటా తిరిగిన ముండకి ఇపుడేమైంది’ అనేది అర్తం కాకపాయె.  ‘పెళ్లికి అందర్నీ హైదరాబాద్‌ తీసుకుపోయి రయిక గుడ్డలు గూడక పెడితిరి..ఇపుడేమాయె దీనికి’ అని బీడితాగతా పొగలు పొగలుగా ఆలోచిస్తా ఉన్నాడు.

హైదరాబాద్‌లో కొడుక్కి ఉద్యోగమొచ్చినాల్మించి సుబ్బక్క నెమ్మదిచ్చిన మాట వాస్తవమే. ఇల్లు బాగు చేయిచ్చుకోవడం, బేల్దారిని పిలిపిచ్చుకోవడం, రంగులేయిచ్చుకోవడం…బో కుశాలగా ఉండింది. మొగుడు పోయినాక సుబ్బక్కలో అంత నెమ్మది చూడడం అదే తొలిసారి. అవసరమున్నా లేకపోయినా ఇరుగింటికి పొరుగింటికి పోయి పనుల్లో చెయ్యేసేది. కొడుక్కి వచ్చిన బ్యాంకి ఉద్యోగం గురించి అడిగినోళ్లకు అడగనోళ్లకు వర్ణించి వర్ణించి చెప్పేది. ఊరోళ్లంతా ముసిల్దానా నువ్వు ఆడిదానివి కాదే, మొగరాయుడివే అంటుంటే పొంగిపోయేది. ఎవురైనా పొగుడుతుంటే బో సిగ్గుపడేది. సుబ్బక్క సిగ్గు పడగలదని ఊరోళ్లకి తెలిసిందపుడే. సర్కారీ నౌకరంటే సామాన్యమా!  లంచమివ్వకుండా ఏ ఎమ్మెల్యేతో చెప్పిచ్చుకోకుండా సుబ్బక్క కొడుక్కి ఉద్యోగం రావడమనేది ఊరోళ్లకి ఎంత బుర్ర చించుకున్నా అర్తమయ్యే విషయం కాదు.  సుబ్బక్క ఆ అద్భుతాన్ని సాధించింది.

‘నువ్వేమన్నా చెయ్యి నాయనా….నువ్వు సర్కారీ నౌకరి కొట్టాల..మనల్ని చిన్నతనంగా చూసినోళ్ల ముందు మొగోడివై మీసం తిప్పాల’. అని ఒగటే తారకమంత్రం బోధించింది. అతను కూడా అర్జునుడు పక్షి కన్నునే చూసినట్టు రేయింబవళ్లు ఉద్యోగాన్నే కలవరచ్చి కోచింగులు అవీ తీసుకుని పరీక్షలు అవీ రాసి కొట్టేసినాడు. సర్కారీ నౌకరయిపోయినాడు. ఊరిలో మొనగాళ్ల జాబితాలో చేరిపోయినాడు. అంతటితో ఆగిందా! ఆడు ఆడ్నే ఎవర్నో ఆడపిల్లను చూసుకున్నాడని తెలిసి ఏడెనిమిది లక్షలు పోయెగదరా బగమంతుడా! అని నాలుగైదు రోజులు బో బాధ పడింది సుబ్బక్క. ఉత్సాహమంతా నీరుగారిపోయి ఇరుగూ పొరుగుకు మొకం చూపిచ్చలేక యమ యాతన పడింది.  మామకు ఒగతే కూతురని, కొడుకుల్లేరని తెలిసి నిదానిచ్చింది. “కులమింటి కోతినే చేసుకుంటున్నాడమ్మో..ఏమో అనుకునేరు” అని ఇల్లిల్లూ తిరిగి వివరణ ఇచ్చింది.

బంధుబలగం అంతా పోయిం తర్వాత ఆ సింగిల్‌బెడ్‌రూం ఇంటి యవ్వారం చూసి కొత్త జంటకు అడ్డుగా ఉండడం మర్యాద కాదని వచ్చేసింది. రెండు నెలలు ఉగ్గబట్టినాక కజ్జికాయలు, బూందీ లడ్లు చేసుకుని ఎగురుకుంటూ పోయింది.

***

gs story copy

కజ్జికాయలు, బూందీలడ్లు చూసి కోడలు మొకం చిట్లిచ్చుకున్నా సుబ్బక్క పెద్దగా ఏమీ అనుకోలే. పట్నమోళ్లు ఇంగేమైనా నైసుగా జేసుకుంటారేమోలే అనేసుకుంది.

“మా ఊళ్లో అందరూ పామాయిల్‌తో చేసుకుంటారు.  నేనియ్యన్నీ సెనగనూనెతోనే చేసినానమ్మ!. మంచి బలం. తినాల. పెళ్లయిన కొత్తలో ఇట్టాంటియన్నీ తినాల!”….

ఏవో చెప్పే ప్రయత్నం చేసింది. కానీ కోడలికి అవేవీ వినడం ఇష్టం లేదని అర్థమై సైలెంటయిపోయింది. సుబ్బక్క గడబిడగా ఏదో మాట్లాడాలని అనుకుంటా ఉంటది. కోడలు పెద్దగా మాట్లాడదు. అన్నీ మొకం చూసి అర్తం చేసుకోవాల్సిందే.

“ఈడ నీళ్లు బాగున్నాయమ్మాయ్‌..మా వూర్లో అన్నీ సవ్వ నీళ్లు” అని ఇక్కడున్న సానుకూల అంశాన్ని ముందుకు నెట్టి మరోసారి మాట కలపాలని ప్రయత్నించింది సుబ్బక్క.

“మంజీర గదా, బానే ఉంటయ్‌”…అనేసి పక్కకు తిరిగి పనిమనిషికి ఏదో పురమాయిస్తూ బిజీ అయిపోయింది కోడలు. ఆ మాట తీరు కానీ హఠాత్తుగా బిజీగా మారిపోయిన తీరుగానీ ఇంకొక మాటకు అవకాశం లేకుండా చేశాయి. సుబ్బక్కకు సుర్రుమంది. కానీ తమాయించుకుంది.

ఆరోజు మద్యాన్నం సుబ్బక్క అలవాటు చొప్పున రొంటినున్న మూటలోంచి ఆకొక్క తీసి నమిలేసి రెండు పెదాలపై రెండు వేళ్లు పెట్టి గేట్‌మీదుగా వీధిలోకి ఉమ్మింది. ఖండాంతర క్షిపణి కంటే వేగంగా ప్రయాణించే పదార్థమది! ఆ సౌండ్‌ ప్రత్యేకం. కోడలు ఒక్కసారిగా తలతిప్పి చూసింది. అసహ్యం రంగరించిన చూపు.

‘ఏందిమే! నేనేమన్న లంజెతనం జేసిన్నా..దొంగతనం జేసిన్నా…ఏందీ బాసిలి ఈ మంతున జూస్తది’ అనుకుంది సుబ్బక్క. ఊరికే అనుకోవడమే గాకుండా ఆ మాటల్ని బయటకే అందామనుకుని నోరు తెరవబోయింది. కోడలు ఈ లోపు బెడ్‌రూమ్‌లోకి వెళ్లి దడేల్‌మని తలువేసుకుంది. అత్త ఎంత వేగంగా ఆకొక్క ఊసేయగలదో కోడలు అంత వేగంగా తలుపు వేసేయగలదు.

రోజూ వచ్చే దానికంటే ఒక అరగంట ముందే వచ్చినాడు కొడుకు. మంటలనార్పే ఫైరింజన్‌లాగా వచ్చినాడు.

“అట్లా బజార్లోకి ఊస్తే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారమ్మా…ఇదేమైనా మనూరనుకున్నావా….అంతగా నమలాలనిపిస్తే ఇంట్లో వాష్‌బేసిన్‌ఉంది కదా..అందులో ఉమ్మేయ్‌”..అని సలహా ఇచ్చేసినాడు…ఇబ్బందికరంగా మసులుతూ కోడలివైపు అపాలజిటిక్‌గా చూస్తూ. ఆ చివరి వాక్యాలు కోడలికి నచ్చలేదని ఆ పిల్ల మొకం చూస్తే అనిపిస్తా ఉంది. దానికంటే కూడా కొడుకు కోడలికేసి అట్లా చూడడం సుబ్బక్కకు అర్థం కాలా. ఏ మొగుడైనా పెళ్లాందిక్కు అట్లా చూడడం ఆమె చూసి ఎరగదు.

మర్నాడు పొద్దున్నే పళ్లుగూడా తోముకోకుండా కోడలు కాఫీ తాగుతుంటే సుబ్బక్క కాసేపు గిజగిజలాడింది.

“స్నానం చేసి పూజ చేసి నోట్లో ఏదైనా ఏసుకోవాలమ్మా…పాసినోటితో తాగడం మంచిది కాదమ్మా”.. అనునయంగా  పెద్దరికం చూపిచ్చింది.

“చూడండి అత్తయ్యా!..ఎవరి అలవాట్లు వారివి. మీ అలవాట్లు మీవి. మా అలవాట్లు మావి. మిమ్మల్ని మారమంటే మారతారా”…

కోపంగా చెప్పినట్టు లేదు. గయ్యాలి తనం అస్సలే లేదు. అలాగని సౌమ్యంలేదు. వినయం మాటెత్తడానికే లేదు. స్థిరంగా ఉంది. కరుగ్గా ఉంది. మారుమాట మాట్లాడేందుకు వీలులేకుండా ఉంది. ఇక చాలు, ఊరుకుంటే నీకు మర్యాదగా ఉంటుంది అని చెప్పినట్టుగా ఉంది. మెత్తని చెప్పుతో కొట్టినట్టుగా ఉంది. ఈ రకం గొంతు సుబ్బక్కకు తెలీనిది. ఈ పట్నపు నీళ్లలో ఏదో తేడా ఉంది అనుకుంది సుబ్బక్క.

‘చిన్నప్పటినుంచి మాటలు పడుడే. ఆ మొగుడు నాబట్ట  కాలితో చేత్తో  ఊర్కూర్కినే తన్నేది. మొగుడు పోయినాల్మించి ఊరోళ్లంతా ఏడిపిచ్చి చంపేది. చిన్నప్పటినుంచి ఒకరి మాట తాను వినడమే. తనమాట ఒకరు వినడం ఎరగదు. ఇంత కాలానికి ఒక కోడలు పిల్ల వచ్చింది. నాలుగు మాటలు చెప్పొచ్చు. కొంచెం పెద్దరికం చూపొచ్చు’ అనుకుని ఆశపడింది. “ఓసే ఎడ్డిదానా ఆడికి పోయి ఏం మాట్లాడతావో ఏమో” అని అందరూ అంటా ఉంటే అదమ్మాయ్‌..ఇదమ్మాయ్ లాంటి నైస్‌ మాటలు కూడా నేర్చుకోని వచ్చింది. ఈడ యవ్వారం చూస్తే తేడాగా ఉంది.

సుబ్బక్కకు కుడి కన్ను అదిరినట్టుగా అనిపిచ్చింది. ఆకొక్క తోనే యవ్వారం తెలిసొచ్చినా ఏదో ఒక ఆశతో ఉండింది. ఇపుడదీ పోయింది. ‘ఇది తన పెద్దరికానికి తలొగ్గే రకం కాదు. ఊర్లో తెలిస్తే ఎంత నామర్దా. పరువు తుట్టాగా పోదూ!’

“ఊపుకుంటా పోయింది ముసిల్ది. కోడలి చేత ముడ్డిమీద తన్నిచ్చుకుని ముంగిమాదిరి వొచ్చింది”…ఇరుగు పొరుగు అనబోయే మాటలు ఇపుడే వినిపిస్తా ఉన్నాయి సుబ్బక్కకు.

మర్నాడు మరో ఎపిసోడ్‌. సాయంత్రం వక్క అయిపోతే వాచ్‌మన్‌పెళ్లాం దగ్గర అడిగి తీసుకుని అక్కడే ముచ్చట్లలోకి దిగింది సుబ్బక్క. కోడలికి  తల కొట్టేసినట్టయ్యింది. ఎదురింటి ఫ్లాట్‌ ఆవిడ తన అత్తగార్ని ఆ స్థితిలో చూసిందని తెలిసి కోడలికి మరీ మరీ మండుతా ఉంది. మర్నాడు పొద్దునే అత్తను తీసికెళ్లి చందన బ్రదర్స్‌లో రెండు మాంచి కోకలు కొనిచ్చి ఈడున్నన్ని రోజులు అవే కట్టుకోవాలని చెప్పేసింది. “ఏందో అనుకున్నా గానీ కొంచెం మంచిపిల్లే” అనుకునింది సుబ్బక్క. ఇంటికి చేరాక వాచ్‌మెన్‌క్వార్టర్‌ దగ్గరకు వెళ్లకూడదని, వెళ్లినా వారితో సమానంగా కూచ్చొని కబుర్లు చెప్పకూడదని కోడలు మెత్తగా చెప్పేసింది. అపుడు అర్తమైంది కోడలు కొత్త కోకలెందుకు కొనిచ్చిందో!

దేవాలయానికి పోయొచ్చేసరికి స్టవ్‌మీద ఏదో సుర్రుమంటా ఉంది. ఏందా అని చూడబోతే కొడుకు ఉల్లిపాయలు తరిగి తాలింపు వేస్తా ఉన్నాడు. “ఏందిరా ఈడు ఆడంగి పనులు చేసేది” అని మనసు గింజుకుంది. కోడలు స్నానానికి పోయింది అని అర్తమైపోయింది.

“నీ పెళ్లాం జలకాలాడతా ఉంటే నువ్వు వంట చేస్తా ఉండావా, నువ్వు లే..నాయినా..నేజేస్తా గానీ, మొగోడివి నువ్వు చెయి కాల్చుకోవాల్నా……అది నీళ్లు పోసుకొనొచ్చి వంట చేస్తే కందిపోతాదా…ఇంత సదువుకుని ఏం పనిరా ఇది” అని చేతిలో గంటె లాగేసుకుంది.

“నువ్వుండమ్మా…చిన్నచిన్న పనులు కూడా చేసుకోకపోతే ఎట్లా…క్యారేజ్‌ రెడీ కాకపోతే ఆఫీసుకు లేటయిపోదూ”…

“ఏందిరా ప్రతిదానికీ దాన్ని ఎనకేసుకురావడమేనా… అప్పుడే పెళ్లాం బెల్లం అయిపోయిందా నాయనా”

కొడుకు పని అటూ ఇటూ గాకుండా తయారైంది. భార్య ఎక్కడ ఈ మాటలు వింటుందో, ఎక్కడ అత్తా కోడళ్ల యుద్ధం బద్దలవుతుందో అని భయం. పైగా కోడలికి కచ్చితంగా వినపడాలనే తల్లి గొంతు పెంచి మాట్లాడుతున్నట్టు అర్తమవుతూనే ఉంది. అతనసలే బహు జాగ్రత్తపరుడు. సాయిబాబా భక్తుడు. ఎప్పుడూ ఎవరితోనూ గొడవపడే మనిషి కాదు.

కోడలికి సుబ్బక్క మాటలు వినపడ్డాయో లేదో తెలీదు. ఆమె అనుమతి లేకుండా ఆమె మొకంలో ఏ భావమూ పలకదు. వచ్చేసి వంటలో మునిగిపోయింది గంభీరంగా.

సుబ్బక్కకేమీ అర్తం కాలా. ఎదుటి మనిషి గొంతు పెంచి గొడవపడితే తడాఖా చూపించొచ్చు. కానీ ఇట్లా ఉంటే ఏం చేయాలో ఆమెకు తెలీదు. కానీ అంతకంటే కూడా ఆమెకు కొడుకు యవ్వారమే అంతుపట్టకుండా ఉంది. కోడలి కేసి కొడుకు కేసి మార్చి మార్చి చూసింది. కొడుకు చూపులు నేలమీదకు దించేసుకోని వంటగదిలోంచి బయటకు పోయినాడు.

‘ఎట్టాంటోడికి ఎట్టాంటోడు పుట్టినాడు! ఆ నాబట్ట ఎపుడన్నా ఇటున్న చెంబు అటు పెట్టినోడా…సుట్టకాల్చుకోవడానికి అగ్గిపెట్టె అడిగితే ఆడ్నే ఉంది అని చెప్పిన పాపానికి “ఏం తీసిస్తే అరిగిపోతావే లంజె” అని యీదంతా తిప్పితిప్పి కొట్టలా”….చచ్చిపోయిన భర్త గుర్తొచ్చి లోలోపల మెలిపెట్టింది. గతం తవ్వుకున్న కొద్దీ ఏడుపొస్తా ఉంది. కోడలిమీద యాడలేని కోపం తన్నుకొస్తా ఉంది.

తొలిరోజే కోడలు పిల్ల రెండు సార్లు అన్నం వండాల్సి వచ్చింది. మనుషులు అంత అన్నం తింటారని కోడలికి తెలీదు. సుబ్బక్క అన్నాన్ని గురుగులాగా చేసుకుని పైన ఇంత పప్పేసుకుని ఇంతింత ముద్దలు కళ్లకద్దుకుని లాగిస్తా ఉంటే చూస్తా ఉండేది. ఆ ఆశ్చర్యానికి అంతే ఉండేది కాదు. మూడో రోజూ కోడలు కళ్లలో అదే ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యం సుబ్బక్క కంట పడకుండా ఉండాలనే పట్టింపు కోడలికేమీ లేదు.

వాళ్లు తినే తిండి కూడా సుబ్బక్కకు ఆశ్చర్యమే. రెండు పిరికిళ్ల అన్నం. అంతే సైజులో రెండు మూడు రకాల కూరలు. ఆ కొంచెం తిని మనుషులు ఎట్లా బతుకుతారో ఆమెకు అర్తం కాని విషయం. మౌనంగా ఉండడానికి ఆమె కోడలు పిల్లలాంటిది కాదు.

” ఇట్ట తింటే ఎట్ట!…తినాల నాయనా.. రాళ్లు తిని రాళ్లు అరిగించుకునే వయసు. బాగా తినాల.” అని ప్రేమ చూపిచ్చబోయింది.

“మీ లాగా తినాలంటే కష్టమండి. మేం చేసే పనికి అదే ఎక్కువ” అంది కోడలు పిల్ల.

“అంత కొంచెం కూరేసుకుని అంతంత అన్నం తినేయకూడదమ్మా. కూరగాయలు బాగా తినాల. అన్నం ఎంత తింటామో కూర అంత తినాల. నిజానికి కూరే ఎక్కువ తినాలంట. డాక్టర్లు అదే చెప్పేది”. రివర్స్‌ జ్ఞానబోధలోకి దిగాడు కొడుకు.

‘నోరు లేవాల్సినపుడు లేవదు గానీ ఇపుడు దాని మాటకు తాళమేయడానికి మాత్రం తయారైపోయినాడు’ లోలోపల కాలిపోతోంది సుబ్బక్క.

“ఏమోలే నాయన! ఇంత సంగటిమీద ఊరుమిడి ఏసుకుని తినిన ప్రాణం. ఇపుడు మారాలంటే యాడ మారేది!” ….మొకం అదోలా పెట్టి మాటల్ని ఈటెలు చేసి విసిరింది.

పేరుకు నాయనా అన్నా ఆ విసురు కోడలిమీదే అని తెలుస్తానే ఉంది.

“చిన్నప్పటినుంచీ కుదార్తంగా కూచ్చొని తిన్నది లేదు. ఇపుడు తిందామంటే కుదరకపాయె. అది తింటే బిపి. ఇది తింటే సుగర్. ఆ డాక్టర్ నాబట్టదగ్గరకు పోయొచ్చినాల్మించి సప్పిడి బతుకయిపోయె. కోడలు పిల్ల మరీ అన్యాయం. ఉప్పు లేదు,కారం లేదు..నోరు సప్పగా చచ్చిపోయింది.  రుచీ పచీ లేకుండా ఇదేం తిండో అర్తమే కాదు”….తనలో తాను మాట్లాడుకోవడం నేర్చేసుకుంది సుబ్బక్క.

ఊళ్లో ఆ ఇబ్బంది ల్యా. తల తిప్పితే ఎవురో ఒకరు. ఎవురితో మాట్లాడాల్సినయి వాళ్లతో. ఈడ ఎవురికెవురు!

ఎవురితో మాట్లాడడానికి లేదు. ఎవురితో మాట్లాడకుండా ఉంటే నోరు పూర్తిగా చచ్చిపోయి మూగిదాన్నైపోతానేమో అన్నంత భయమొచ్చేసింది సుబ్బక్కకు. వాచ్‌మెన్‌భార్యతో ముచ్చట్లొద్దని కోడలి ఆర్డర్‌. ఇంకెవురితో మాట్లాడేది! అదేందో, అందరూ తలుపులేసుకునే ఉంటారు జైల్లోమాదిరి! ఇది ఏమి బతుకురా బగమంతుడా! అని సుబ్బక్క ఎన్ని సార్లు అనుకునిందో చెప్పలేం.

బేస్తవారం సందేళకాడ కొడుకు, కోడలు ఇద్దరూ తయారైపోయినారు.

“అమ్మొక్కతే ఏం చేస్తాది,  తీసుకుపోదాం” అన్నాడు కొడుకు.

కోడలు నోరు తెరిచింది లేదు. కొడుకు దాన్నే అంగీకారంగా అన్వయించేసుకుని అమ్మా “నువ్వు కూడా తయారవు” అనేసినాడు. కోడలిది అనాంగీకారంగా అర్తమైన సుబ్బక్క “ఎందుకులే నాయినా…ముసల్దాన్ని యాడికొచ్చేది, మీరు పోయిరాండి” అనేసింది. ఇట్లన్నా రిమోట్‌కంట్రోల్‌ చేతికొస్తుందేమో,ఈ పూటన్నా చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌ చూడొచ్చేమో అని లోలోపల ఆశపడింది.

“లేదమ్మా..పోయేది గుడికే. సాయిబాబా దేవలానికి ..రా..చాలా బాగుంటది, చూద్దువుకానీ” చిన్నపిల్లలకు తాయిలం ఇస్తున్నట్టు ఊరించే గొంతుతో చెప్పినాడు కొడుకు.

గుడి అనేసరికల్లా సుబ్బక్క మనసు మారిపోక తప్పలే. ముసిలోళ్లుగా ఉండి దేవలానికి రమ్మంటే రాకుండా ఉంటే ఏమైనా ఉంటదా! సరేలే నాయనా అని బయలు దేరింది.

Kadha-Saranga-2-300x268

“ఎంత బెమ్మాండంగా కట్టినారురా…అబ్బో అబ్బో” అని సుబ్బక్క అదే పనిగా ఆశ్చర్యపోతానే ఉంది. మురికి కాళ్లు అడుగు పెట్టదగిన ఆలయంలాగా లేదది. అక్కడికొచ్చిన వాళ్లందరిలో తనలాంటి మనిషి తానొక్కతే ఉన్నానని అర్థమైపోయిందామెకు. “ఇది సదువుకున్నోళ్లు, పెద్దపెద్దోళ్లు వచ్చే దేవలం. తన లాంటోళ్లది కాదు” అని అర్తమైపోయింది.

గుళ్లోంచి బయటకు వచ్చింతర్వాత మొగుడూ పెళ్లాం గునా గునా మాట్లాడుకోవడం, ఇట్నించి ఇటే ఎక్కడన్నా బయట తినేసి ఇంటికిపోదాం అని కొడుకు ఎనౌన్స్‌మెంట్ ఇచ్చి చట్నీస్‌కి తీసుకుపోవడం అన్నీ ఒక పథకం ప్రకారం జరిగిపోయినాయి. ఈ దండగమారి హోటల్‌ప్లాన్‌ తన కోడలిదే అయ్యుంటాదని సుబ్బక్క అనుకునేసింది. ఆ చట్నీస్‌ అనే హోటల్‌లో కూడా తన లాంటి మనిషి తనొక్కతే ఉన్న విషయం, ఆ విషయాన్ని తనకు గుర్తు చేస్తున్నట్టున్న కోడలి చూపులు అన్నీ సుబ్బక్కకు అర్తమవుతానే ఉన్నాయి. కోడలు ఇడ్లీ దోసెతో సరిపెట్టేసుకుంది. సుబ్బక్క, సుబ్బక్క కొడుకు భోజనం కానిచ్చేసినారు. భోజనం తెచ్చిచ్చినోడు ఒక పుస్తకం లాంటిది పెట్టేసి దూరంగా చూస్తూ నిలబడినాడు. అందులో కొడుకు  రెండు అయిదొందల రూపాయల నోట్లు పెట్టినాడు. హోటల్‌వాడు మళ్లీ పుస్తకం తెచ్చిస్తే కొడుకు అందులోంచి ఒక్క వంద రూపాయల నోటు మాత్రం తీసుకుని మిగిలింది ఉంచేసినాడు. అన్నింటినీ సుబ్బక్క ఇచ్చిత్రంగా చూస్తా ఉంది.

“ఎంతయినాదిరా” అని అడిగింది గేట్లోంచి బయటపడగానే.

అప్పటిదాకా ఉగ్గబట్టుకుని ఉంది. అడక్కపోతే పొట్ట పగిలిపోయేట్టు ఉంది. కొడుకు ఏదో మాట్లాడబోయేంతలో….

“ఎంతయితే ఏమిట్లెండి” అని అడ్డుపడింది కోడలు పిల్ల.

“అన్నింటికి నువ్వు అడ్డమొస్తావేందిమే…మొగోడు మాట్లాడుతుంటే మద్దెలో మాట్లాడొచ్చునా…ఇదేం పద్దతమ్మాయ్‌..నీకు నీవాళ్లు పద్దతి సరిగా నేర్పిచ్చినట్టు లేరు”…సుబ్బక్క అసలు అవతారంలోకి వెళ్లిపోయింది. కొడుక్కి విషయం అర్తమైపోయింది.

“నేనేం చెప్పాను, మీరేం మాట్లాడుతున్నారు. పెద్దవాళ్లు కదా అని గౌరవమిచ్చి మాట్లాడితే మావాళ్లగురించి మాట్లాడతరేంటి…..అయినా మీకెందుకివ్వన్నీ”….పక్కనున్న మనుషులకు వినపడకుండా లోగొంతుకతో అయినా గట్టిగానే ఇచ్చింది కోడలు. ప్రపంచంలోని చిరాకు అసహ్యం అంతా రూపమెత్తినట్టు ఉంది ఆమె ముఖం.

హోటల్‌ బయట ఎక్కడ సీన్‌ క్రియేట్‌అవుతుందో అని కొడుకు గడగడలాడుతూ ఉన్నాడు. అతనసలే గొడవలంటే ఇష్టపడని మనిషి. దేనిమీదైనా ఒక వైఖరి తీసుకోడమంటే అతనికి మా చెడ్డ చిరాకు. సిగరెట్‌తాగని, మందు కొట్టని తనలాంటి మంచి మనిషికి ఇలాంటి కష్టం ఆ సాయినాధుడు ఎందుకు తెచ్చిపెడతాడా అని అతను ఆలోచిస్తా ఉన్నాడు. మౌనంగానే అంతా ఇల్లు చేరుకున్నారు. అక్కడ కొడుకు మొకం చూసి ఇబ్బందిని అర్త చేసుకుని మర్యాద కాపాడడానికి తమాయించుకుంది సుబ్బక్క. రగిలే బడబాగ్నిని దాచుకున్న అగ్ని పర్వతం ఇంటికి రాగానే లావా చిమ్మడం మొదలెట్టింది.

“అయినా ఏందిరా నీ పెళ్లాం! నేను దాన్నేమయినా అంటినా..నిన్ను కదా అడిగితి. మద్దెలో అడ్డమెందుకు రావాల. అయినా మగోడు మాట్లాడుతుంటే ఆడది మద్దెలో వచ్చేదేందిరా…అయినా నేనేమంటి… ఎంతయిందిరా అని అడిగితి” గాలి పీల్చుకోవడానికన్నట్టు ఓ క్షణం ఆగి కోడలి వైపు చూస్తూ అంది…..

“అదే తొమ్మిదొందలు పెడితే నాకు నెల గడిచిపోతుంది గదరా ఊళ్లో”

“మీ ఊరువేరు, ఇది వేరండి. ఎక్కడి పద్ధతులక్కడ ఉంటాయి. మమ్మల్ని కూడా మీలాగే బతకమంటారా”..

కోడలి గొంతు ఎపుడూ లేనంత ఆవేశంగా ఉంది. శరీరం వశం తప్పుతున్నట్టు ఉంది. పెదాలు అదురుతున్నాయ్‌.

“మా లాగా మీరెట్ట బతుకుతరమ్మా….నువ్వు మహారాణివైపోతివి…నీ మొగుడొక మహారాజైపోయె. నీ మొగుడిలాగా నా మొగుడు ఉద్యోగస్తుడు కాదే. మట్టి పిసుక్కునేటోడు. కడుపు మాడ్చుకుని తినీతినక ఎంత జాగ్రత్తగా ఒక్కో రూపాయిని కూడబెడితే  నాయనా..నువ్వు డిగ్రీ చేసి ఉద్యోగం సంపాదిచ్చింది? రూపాయి వచ్చినపుడు దాచిపెట్టుకోవాల నాయనా! ఈ బాసిలి కేమీ డూండాంగా తిరగాలంటాది. .మీరొండుకునే రెండు బొచ్చెలు తోమడానికి పనిమనిషి అవసరమా నాయనా! ఏం, నీ పెళ్లాం చేతులు బొబ్బలెక్కుతాయా…. దొరల కుటుంబంలో పుడితిమా నాయనా! అంతంత కర్చుపెట్టి కోకలు కడితేనే కట్టినట్టా నాయనా! అంతంత పెట్టి అట్టాంటి హోటల్లో తింటేనే తిన్నట్టా నాయినా! తొమ్మిదొందలంటే ఎంత కష్టపడితే నాయనా వచ్చేది. ఇద్దరు మడుసులకు నాలుగిత్తులు ఉడకేసుకోవడం కష్టమా నాయనా! ఉద్యోగం రావడం తోనే మొగోడివై పోవు …రూపాయి రూపాయి దాచిపెట్టుకుంటేనే రేపు నువ్వు మొగోడనిపిచ్చుకునేది. ఊర్లో మీసం మెలేసి, బాంచత్! పలానోడి కొడుకు ఈడు అని తిరగాలంటే ఇట్టయితే అయితదా నాయనా! ఇంట్లో ఆడిబిడ్డ అంటే ఎట్టుండాలా?.. మొగోడు దుబారా అయినా అది జాగ్రత్త చేసి పైసా పైసా కూడెయ్యాల. ఇట్టయితే అయితదా నాయనా! సంసారం ఈదుకొచ్చే ఆడిదేనా ఇది! ఇట్లాంటి ఐసాపైసా దాంతో ఉన్నది ఊడ్చేసుకుని పోవడమే కదా నాయనా!”..

కాసేపు గస పోసుకోవడానికి ఆగింది. ముక్కు చీదుకుంది. కళ్లలో నీళ్లు పెట్టుకుంది.

ఇంటిదగ్గర నేర్చుకుని వచ్చిన అమ్మాయ్‌..లాంటి నైసు మాటలు మాయమై ఒరిజినల్‌ పూర్తిగా బయటికొచ్చేసింది.

కొడుకు ఒక్కమాట కూడా మాట్లాడకుండా నేలచూపులు చూస్తున్నాడు. మధ్యమధ్యలో కొద్దిగా తలపైకెత్తి కోడలి ముఖం వైపు ఇబ్బందిగా చూస్తున్నాడు. కొడుకు యవ్వారంతో సుబ్బక్కకు మరీ మంటెత్తింది.

“ఆడంగి నా కొడుకు పుట్టినావు కదరా…ఆయన ఎట్టుండేటోడు”. భర్తను గర్వంగా గుర్తు చేసుకుంది.

“నోరెత్తనిచ్చేటోడా…నోరెత్తితే ఎగిచ్చి ఎగిచ్చి తన్నేటోడు కాదు!”….

“మొగోడ్ని నేను మాట్లాడుతుంటే మధ్యలో నోరెత్తుతావే ముండా”….భర్త ఉగ్రస్వరూపం గుర్తొచ్చి బొటాబొటానీళ్లు కార్చేసింది సుబ్బక్క.

“మొగోడంటే అట్టుండాల. అయినా ఆడదాన్ని నోరెత్తనీయొచ్చునా! మొగోడంటే ఎట్టుండాల…పౌరుషముండొద్దూ. ఆడదాన్ని మాట్లాడనిస్తే మొగోడికి గౌరవముంటదా!”

కొడుకుతో మాట్లాడుతుందో, తనలో తానే మాట్లాడుతుందో తెలీనట్టుగా మాట్లాడేస్తూ ఉంది సుబ్బక్క.

స్టాచ్యూ అన్నట్టు నిలబడి పోయి చూస్తా ఉంది కోడలు పిల్ల. అత్తగారి ప్రవాహం చూశాక ఆపడానికి తన శక్తి సరిపోదని అర్థమైపోయింది. మధ్యలో ఆవేశం తెచ్చుకొని ఏదో మాట్లాడబోతే కళ్లతోనే వారించాడు కొడుకు. ఉడికిపోతా ఉంది. తట్టుకోలేకపోయింది.

“చీ..ఎదవగొడవ…ఎదవ మొకాలు” అనేసి విసురుగా లోపలకుపోయి దడాల్న తలుపేసుకుంది.

“ఏం మాటలయి..ఏం మాట్లాడుతున్నావ్‌ నువ్వు” …కొడుకు తలుపు వైపు తిరిగి అరిచినట్టుగా గొణుగుతున్నాడు.

“ఎవురే, ఎదవ మొకాలు”. ….ముక్కు చీదడం ఎక్కువ చేసింది సుబ్బక్క.

“నువ్వు జమీందారీ బిడ్డవి అయిపోతివి. ఉద్యోగస్తుడైన నాబిడ్డ, నేను ఎదవ మొకాలమైపోతిమి. ….ఏం మొగోడివిరా నువ్వు. అదట్లా నోరేసుకుని మాట్లాడుతుంటే”…ఆ రూట్లో నరుక్కొచ్చే ప్రయత్నం చేసింది సుబ్బక్క.

ఎవురు నోరేసుకుని మాట్లాడుతున్నారో అర్థం కానట్టు నిలబడి…”ఎందుకిమ్మా చిన్నదానికి ఇంతగొడవ” అని ఏవో సణుగుతూ నుంచున్నాడు కొడుకు. అతనసలే గొడవలంటే పడని మనిషి.

“కట్నం తీసుకోకుండా పెళ్లిచేసుకున్నాడే  నా కొడుకు నిన్ను! పది పదిహేను లచ్చలొచ్చేయి నా చిన్నాయన మనుమరాలిని చేసుకొనుంటే! ఎట్లుండేది అది! ఎంత మర్యాదగా ఉంటదది! నీలెక్కన పోలేరమ్మలాగుంటదా! ఎంత మర్యాద, ఎంత మన్నన! ఈడు నా మాటిని దాన్ని చేసుకునుంటే నాబతుకిట్టయ్యేదా!”

“ఆ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి ఖర్చే ఐదులక్షలయ్యింది మా డాడీకి. ఊరికే వస్తుంది కదాని బస్సేసుకుని ఒక మందని దింపారు ఇక్కడ. పెళ్లిని జాతర జేశారు”.. కోడలు తలుపు వెనకనుంచే అరుస్తోంది..

యవ్వారం ఎట్నుంచి ఎటుపోతోందో అర్థం చేసుకున్న కుమారరత్నం “అమ్మా..అవన్నీ తవ్విపోయకు. చిన్నదానికి రాద్దాంతం చేసేస్తున్నావు. ఇపుడేమైందని, ప్రశాంతంగా ఇంత తిని ఉండొచ్చు కదా, ఎందుకియ్యన్నీ నీకు” అని అసహనంగా అనునయించాడు.

“పెద్దామె ఏదో అంటే నువ్వు మళ్లీ మాట్లాడాల్నా…కాసేపు ఊరుకుంటే ఏమవుతుంది!”..తలుపు వైపు తిరిగి అటువైపు చెప్పాల్సింది అక్కడ చెప్పేసాననుకుని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు.

“ఊళ్లో తిండిలేకనే నీదగ్గరకొస్తి నాయనా. తిని ఉన్నీకి. అంతేలే నాయనా. పెళ్లాం బెల్లం, తల్లి అల్లం. ఉరే, నానా గడ్డి తిని పైసా పైసా కూడబెట్టి చదివిచ్చినానురా..నిన్ను. ఇంత చేసి ఉద్యోగస్తుడ్ని చేసి దీని ఎదాన పడేస్తి కదరా నిన్ను” ముక్కు చీదుకుంటా ఘోరంగా ఏడుస్తోంది సుబ్బక్క.

తలుపు వెనుకనుంచి కోపంతో నిస్సహాయతతో బుసలు కొడుతోంది కోడలు. “లేబర్‌ మనుషులు, లేబర్‌ బుద్ధులు” అని ఏవోవో గొణుక్కుంటా ఉంది.

కొడుకు చూపులు మరింత నేలబారుగా దిగిపోయాయి. ఏం చేయాలో తెలీదు. ఎలా అనునయించాలో తెలీదు. ఎవర్ని అనునయించాలో తెలీదు. ఏ ఆక్రోశం ఏగొడవకు దారితీస్తుందో ఏది ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందో ఆలోచించాలంటేనే అసహనం. కారణాలు తెలీవని అనలేం. కానీ తెలుసుకునే కొద్దీ చిరాకు. ఇలా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడడమే  అతనికి మా చెడ్డ చిరాకు.

అతనసలే గొడవలంటే పడని మనిషి. సాయినాధుడి సన్నిధిలో ప్రశాంతంగా గడపాలనుకునే మనిషి.

***

“అవునే, నువ్వు దొజస్తంభం లేపిన పెతివ్రొతవి. మాదే లంజె వొంశం”…..సుజాత గొంతు పీలగా పలుకుతా ఉంది.

“కాకపోతే ఒకరి కూడికి ఆశపడితిరే లేకిముండా….నా కష్టం నేను పడుకుంటా నా బతుకేదో నేను బతుకుతా ఉంటే అందరికీ నామీదే కన్నేమే సొట్టముండా…. వయ్యారంగా తిప్పుకుంటా తిరగడం కాదే, కష్టపడితే తెలుస్తాదే…కష్టపడి బతకాల. మొగోళ్లా బతకాల. బాంచత్‌ అని ఒకడి మొకం మీద కొట్టినట్టు బతకాల. ముడ్డి తిప్పుకుంటా మాటలు చెప్పుకుంటా తిరగడం కాదు….”

గసపెడతా తిడతా ఉంది సుబ్బక్క.  గుండెలు ఎగిసేట్టు ఏడుస్తా తిడతా ఉంది.

సుజాతకు ఇచ్చిత్రంగా అనిపిస్తా ఉంది. ఇంతకుముందుకూడా ఇది నోరేసుకుని బతికిందే కానీ ఇట్టా ఎదుటోళ్లని తిట్టేటపుడు ఏడవడం ఏనాడూ చూడల్యా.

సుబ్బక్క సుజాతనే తిడుతోందో..ఇంకెవర్నయినా తిడుతోందో అర్థంకాక  జుట్టు పీక్కుంటా ఉన్నాడు పక్కింటి ఎంగటేశులు. సిమెంట్‌ తీసకపోయినదానికి ఇంత ఏడుపు దేనికో అతనికి ఎంత ఆలోచించినా అర్తం కావడం ల్యా.

 

జి ఎస్‌ రామ్మోహన్‌

కథకు బొమ్మ గీసిన వారు : అక్బర్

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

కవిత్వం మైమరుపు కాదు, ఒక ఎరుక : లాలస

లాలస

లాలస

కొన్ని వాక్యాలు చదవగానే ఎక్కడో గుండె పట్టేస్తుంది .. మర్చిపోయిన తడి ఏదో మనల్ని మనమే తడిమేలా చేస్తుంది .. ఒకానొక మామూలు రోజుని దృశ్యాదృశ్యం గా మార్చగల శక్తి … దేనికన్నా ఉందీ అంటే .. అది పాట లాంటి అక్షరాల తోరణం కావచ్చు .. లేదా లాలస కవిత్వమూ కావచ్చు.
ఎవరీ లాలస ..ఏమా కథ .. నేను అనబడే సాయి పద్మ ప్రోలిఫిక్ గా రాస్తాను .. అంతకంటే ఎక్కువ చదువుతాను .. కవిత్వం చాలా తక్కువ చదువుతాను …చాలావరకూ నచ్చని వాక్యాన్ని మర్చిపోయే ప్రయత్నం శతవిధాలా చేస్తాను.
ఇహపోతే లాలస పేరుతో కవిత్వం రాసే శ్రీబాల వడ్లపట్ల .. ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్, టైమ్స్ అఫ్ ఇండియా లో పొలిటికల్ జర్నలిస్ట్ గా పనిచేస్తోంది. చాలా తక్కువ రాస్తుంది .. ఎందుకంటె ఆమె మాటల్లోనే చదవాలి మీరు.. రాసే కొన్ని వాక్యాలు ఎరుకలోనూ, మైమరపులోనూ గుర్తుకు వచ్చేది మంచి వాక్యం/కవిత్వం అనే ఒక అభిప్రాయంతో నేను చేస్తున్న పరిచయం ఇది.

. సరదాకి కొన్ని వాక్యాల సమ్మోహనత్వం ఇక్కడ –
• నదికి అణువణువునా చేతులే… కెరటాలుగా నది నీటిని ఈదుతుంటాయి
• రంగుల రుతువును రమ్మనేందుకు సైగలు లేవు … భాషలు ఒక్కసారి ఏకమైనా మహామౌనం కాలేవు
• ఇలాగైతే ఒక్క ఇష్టమైన కలనైనా రప్పించుకోగలరా ఎవరైనా
• కొత్త వానలు పుట్టుకురావు .. పాత చినుకులే మళ్ళీ మళ్ళీ వర్షమవుతాయి
• మరణం కొవ్వోత్తికి కాదు .. మారణాయుధాలకు రావాలి
• మిట్టమధ్యాహ్నం ఎండలో నీ కోసం రహస్యంగా మిద్దె మీద కొచ్చిన ఆమె వొట్టి పాదాల నెప్పి .. గురించి చెప్పావ్ గానీ .. నెప్పి నెప్పి వెన్ను నెప్పి కాదు బతికే ఉరఫ్ చచ్చే నెప్పి తెలుసా ?
• హృదయపు వలపు నిప్పు నుంచి ఉష్టం స్నేహితులే ఉపసంహరిస్తారు
• నదికి కవిత్వమొచ్చు అంది – అందుకోసమే వొంటి నిండా బోలెడు తడి ఉన్నది – ఇంకిపోవచ్చు-ఉప్పొంగిపోవచ్చు
• ఒక యవ్వనం రివైండు ఒక భగ్నప్రేమ ఫార్వర్డు
• నది – నదే , తాను ప్రవహించే తీరాల నిర్వచనం కాదు
• నేను నాట్యం చేయటం లేదు – వేదనను పాతాళం లోకి సరఫరా చేస్తున్నాను
• చినుకుల స్నో కారి మేకప్ రంగులు రాల్చుకుంటున్న భవనాలు
• యవ్వనమంటే మైమరపు మత్తు కాదు . యూత్ఫుల్నెస్, గంపల మీద కన్నం లాంటి లౌక్యపు మర్యాదతనమూ, ఎవరూ చూడకపోతే గాలిబుడగ లాంటి పెద్దమనిషితనాన్ని మసి చేయాలి
• కుర్రవాడా , మనసిచ్చా గానీ .. జీవితాన్నివ్వలేను

ఇన్ని వాక్యాలు పుస్తకం చూడకుండా రాసిన కవిత్వ పుస్తకాల్లో లాలస కవిత్వం ఒకటి . అది నా గొప్ప కాదు .. ప్రతీ పుట్టుమచ్చ వెనుక జ్ఞాపకం లేకపోవచ్చు .. బట్ ..ఆత్మని తాకే ప్రతీస్పర్శ … వేల మైమరపుల పచ్చబొట్టు కదూ ..!
పచ్చబొట్టు లాంటి అనేక కవిత్వపాదాల సంకలనం ‘ సౌండ్ అఫ్ పోయెట్రీ ‘ఆమె కవితల ఈ-బుక్ ఈ క్రింద లింక్ లో మీరు చదవవచ్చు

ఇక ఇన్నర్ వ్యూ లోకి వెళదామా .. ప్రతీ చెట్టూ జ్ఞాపకాల జలజలరాలలేక పోవచ్చు .. పరవళ్ళు తొక్కే అక్షరాల నది అల్చిప్పలని ఏరే ధైర్యం కావాలి కదా .. అలాంటి కొన్ని ప్రశ్నలూ జవాబులూ ..
లాలస ఎవరు?
లాలస ఎవరూ లేరు.లాలస నాలోని ఆత్మ, దాచిపెట్టుకున్న మహిళ వగైరా ఏమీ కాదు. ఆ పేరు వినడానికి ఈస్తటిక్ గా ఉంది.చలం రచనల్లో నాకు నచ్చిన ఏకైక నవల ” జీవితాదర్శం” లో ప్రధాన పాత్ర పేరు.చివరాకరకు శాంతి మాత్రమే మనిషికి మిగిలిన మార్గం అని, ఒక వేళ ఆ విషయం తెలిసినా కలిగే అలజడులే మనిషి తత్వం అనేదే ఆ పుస్తకం సారం.ఆయన ఆ పుస్తకానికి జీవితాదర్శం అని ఎందుకు పేరు పెట్టాడో తెలీదు. ఎందుకంటే జీవితానికి ఒక ఆదర్శం అంటూ ఉండదు అన్న తెలివిడే లక్ష్యంగా సాగిన రచన అది. నచ్చిన పుస్తకంలో నచ్చిన పేరు అలా పెట్టేసుకున్నా అంతే. పైగా నాకు యావజ్జాతికి కవిత్వం రాస్తానని తెలియడం కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అదో అందమైన ముసుగు అనుకోండి.

మీ దృష్టిలో కవిత్వానికి, కవికి కావలసింది ఏమిటి?
కవిత్వానికి కవిత్వమే కావాలి. భావోద్వేగాలు లేదా ఆలోచనలు, లేదా ఇమేజరీలను ఒక లయలో పెట్టాలంటే క్రాఫ్టింగ్ అవసరం కొంత. బేసిక్ గా కవిత్వాన్ని ఆర్ట్ ఫాం అనుకంటాను నేను. దానికి కాస్త శ్రద్ధ ఓపిక, ఆ ఆర్ట్ కి కావలసిని మెళకువ తప్పనిసరే. ఫిక్షన్ తో పోలిస్తే కవిత్వం రాయడం ఈజీలా అనిపిస్తుంది. ఏదో ఒకటి కెలకాలనుకుంటే కెలకవచ్చు. క్రాఫ్టింగ్ పరంగా మనం సరిగ్గా ఉన్నామా లేదా అనే నిజాయితీ ముఖ్యం అనుకుంటాను. I don’t get fascinated by what i write.

కవి అంతర్ముఖుడు కావలసిన అవసరం ఉందా? సామాజిక దృక్పథంతో వస్తున్న కవిత్వం మీద మీ అభిప్రాయం ఏమిటి?
అంతర్ముఖం, బహిర్ముఖం ఇలా పర్సనాలిటీ ట్రెయిట్లతో పెద్ద పని ఏమీ లేదు. పొయెటిక్ సెన్స్, రీడింగ్ ఉండి ఎలాగైనా కవి అనిపించుకోవాలనే ఐడెంటీ క్రైసిస్ తో కాకుండా కలం పట్టుకుంటే చాలు కనీసం సంతృప్తికరమైన స్థాయిలోనే కవిత్వం రాయవచ్చు. విప్లవ కవిత్వం, పోస్ట్ మోడరన్ కవిత్వం ఇలా అన్ని ధోరణులు తెలుగులోనూ బాగానే వచ్చాయి. ఏ ధోరణితో రాసినా కవిత్వంగా చిక్కగా ఉండటమే ప్రయారిటీ. ( అయితే స్లోగన్ కవిత్వాలంటే కాస్త చిరాకే) పోస్ట్ మోడర్నిజం రిలవెన్స్ మీద ఇపుడు లిక్విడ్ మోడర్నటీ, సాలిడ్ మోడర్నటీ అని చర్చలు జరుగుతున్నాయి. ఏదైనా సామాజిక దృక్పథంతో రాయాలనుకుంటే , దానిలోని వస్తువే హైలెట్ కావాలనుకుంటే కవిత్వం కన్నా కథ, పాటలు మెరుగనుకుంటాను. ఎంతయినా కవిత్వం పర్సనల్ స్పేస్ లాంటిదే.

ఒక వాదం ( స్త్రీ వాదం లేదా ఏ అస్తిత్వ వాదం అయినా ) ఆధారంగా ఉన్న కవిత్వం మీద మీ అభిప్రాయం, దాని ప్రయోజనం ?
మీరు ఇంతకు ముందు అడిగిన ప్రశ్నకు కొనసాగింపే ఇది అనుకుంటున్నాను. Oppressed sections కవిత్వం లాంటి పర్సనల్ ఫాం ను ఎంచుకున్నపుడు కాస్త సీరియస్ గా రాయాలనే అంటాను.అవి స్లోగన్స్ కాకుండా చూసుకోవాలి. మీ దగ్గర ఒక విషయం ఉన్నపుడు రాయడానికి కాన్వాస్ చాలా పెద్దది అవుతుంది. దానిని ఎలా వాడుకుంటారు అనే దాన్ని బట్టి కవిత్వం ఉంటుంది.

మీ కవితల్లో, పదాల్లో ఉన్న వొత్తిడి ..ఒక కళ గా మార్చటంతో , మీ కవిత్వం ఒక కొత్త దారి తొక్కింది.. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి?
కొత్త దారో తెలీదు కానీ I can say that i am a very conscious writer. పుట్టుకెంత సహజమో కాంట్రడిక్షన్కు కూడా అంతే అనివార్యత ఉంది అని నమ్మే వ్యక్తిని. వైరుధ్యం ఎందుకు వస్తుందో, ఎక్కడ ఉండదో తెలుసుకోవడం లేదా తెలియడం సామాజిక, సాంసృతిక అవగాహనలో భాగమే. అవి ఎంత బాగా అర్ధమైతే అంత బాగా వాటిని వ్యక్తీకరించవచ్చు.

ఒంటరితనం,ఒత్తిడి, మోహం దేనితో మీ కవిత్వాన్ని ఐడెంటిఫై చేసుకుంటారు? ఎందుకు?
ఒంటరితనం,ఒత్తిడి, మోహం దేనితో మీ కవిత్వాన్ని ఐడెంటిఫై చేసుకుంటారు అంటే అన్నింటితోనూ అని చెబుతాను. మోహం స్ర్తీ,పురుషుల మధ్యనే కాకపోవచ్చు దేని మీదైనా ఉండవచ్చు. ఉదాహరణకు నాకు సంగీతం అంటే ఇష్టమే కాదు విపరీతమైన మోహం అనుకుంటాను. పని చేస్తూ, చదువుతూ కూడా నేను సంగీతం వింటాను. ఎంతో సంతోషకరమైన జీవితం గడుపుతున్న ఏ వ్యక్తికైనా ఒక Inner cry ఉంటుంది. బహుశా అందరూ దాన్ని గుర్తించలేకపోవచ్చు.కవులనే జాతి దాన్నిబాగా గుర్తించగలరు. అందులో ఏదైనా ఉండవచ్చు మట్టివాసన, పూల మీద ఎగిరే సీతాకోకచిలుక,నాన్న దూరమైతే కలిగే దుఃఖం, రాజ్యం చేసే పెత్తనం, సంతోషం, కంటి అంచునే అంటిపెట్టుకుపోయిన కన్నీరు ఏదైనా కావచ్చు. మనల్ని ఎక్కువగా పట్టే విషయాలే కవిత్వంలోకి వస్తాయి. తల్లి తండ్రులు ఎపుడూ మనతోనే ఉంటారు అనుకుంటాం. మా నాన్న చనిపోయినపుడు తెరలుగా తెరలుగా దుఃఖం కంటే అదో షాక్ లాంటిది దాదాపు రెండేళ్ళు నాలో ఉండిపోయింది. ఏదో ఎగిరే గాలిపటంకి పుటుక్కున దారం తెగినట్లు.నేను అలాంటి ఇమేజరీలతోనే కవిత్వం రాస్తే ఒకరు చిన్నపుడు ఎగేరేసిన గాలిపటాల కోసం రాశానని అనుకున్నారు. మరో సారి బిన్ లాడెన్ గురించి పర్సనల్ టచ్ తో పొలిటికల్ పొయెం రాస్తే అదేదో విరహం అనుకుని నాకు తెలీకుండానే ఒక ప్రేమ కవితలం సంకలనంలో వేశారు. నేను దాన్ని తప్పు బట్టను కానీ ఎవరి inner cry వారికి ఉంటుందీ అంటాను. ఎవరికి ఏది ఎలా అర్ధం అవుతుంది అనేది వారి జ్ఞాన స్థాయి బట్టి కాక దానిని బట్టి కూడా ఉండవచ్చు. మళ్ళీ అందుకు బేస్ ఏమిటని అడగకండేం.

సరే, కవిత్వంలో సంగీతం ప్రాధాన్యత ఎంత? మీ అభిప్రాయం (మీరు సంగీతప్రాయులు కాబట్టి)?
సంగీతం వేరు కవిత్వం వేరు కానీ సంగీతం తెలియడం ఎడ్వాంటేజే రాసేపుడు. కొన్ని ఎక్స్ ప్రెషన్లు బాగా రాయగలుగుతాం.

స్వీయ విధ్వంస ధోరణి ఒక తాత్వికా చింతనా? ఏరకంగా?
మనిషిలోని రకరకాల తత్వాల్లో ఇదీ ఒక భాగం.డయాబెటిక్ పేషెంట్లు అదే పనిగా స్వీట్లు తినడం కూడా .స్వీయ విధ్వంసమే మరి. అదో బ్రహ్మపదార్ధం కాదు తాత్విక చింతనా కాదు. కాకపోతే కొంత మందికి ఫ్యాన్సీ కావచ్చు.ఒక వేళ ఎవరికైనా బీబత్సమైన స్వీయ విధ్వంసం అనేది ఇష్టం అయితే ఇష్టం అయిన దానిని స్వీయ విధ్వంసం అనలేం గా….

మిగతా కవుల మరణ కాంక్షా కవిత్వానికి మీ కవిత్వానికి సామ్యం లేదా తేడా వివరించే ప్రయత్నం చేయగలరా?
మరణ కాంక్షా కవిత్వం అనేది ఒక ధోరణి గా లేదే. మీ ఉద్దేశం కవిత్వంలో మరణం గురించిన ప్రస్తావన లేదా దాని తాలూకు దుఃఖం అనుకుంటా. మరణం అంటే చావు అనే కాదు అర్ధం అంతం అని కూడా.ఒకోసారి అంతం నచ్చవచ్చు. మెచ్చవచ్చు.మరో సారి అంతం ఏవగింపు కావచ్చు.

సమూహంలో ఒంటరితనం, అంతర్యుధ్దం పరస్పర విరుద్ధ భావాలు ఎంత వరకు అవసరం?
నాకు తెలిసి పుట్టిన ప్రతి మనిషి ఒక ఒంటరి అంతర్యుద్ధంలోనే ఉంటాడు.జీవితంలో వైరుధ్యం ఎంత అనివార్యంగా ఉంటుందో అంతే అనివార్యంగా అంతర్యుధ్దమూ ఉంటుంది. ఒకోసారి కాంట్రడిక్షన్ లోని అనివార్యత నచ్చకపోవచ్చు. కానీ దానితో వచ్చిన అంతర్యుద్ధం మనల్ని కష్టపెట్టకపో చ్చు. పైగా తృఫ్తి కలగవచ్చు. అలాగే వైస్ వెర్సా. నేను పెద్దగా అంతర్యుద్దాల గురించి రాసిన గుర్తు లేదు. జీవితం మోసుకొచ్చిన పరిస్థితులను ఈదులాడే క్రమంలో ఉన్నపుడు ఒకోపుడు ఒకోలా ఉంటాం కదా.

మీకు ఇష్టమైన కవిత్వం ఎవరిది?తెలుగు,ఇంగ్లీష్ ఏదైనా?
లౌడ్ గా పెడబొబ్బల్లా కాకుండా సునిశితంగా కవిత్వం ఎవరు ఎపుడు ఎందుకు రాసినా ఇష్టమే. కవిత్వాన్ని ఎంచుకోవడంలో నాకేమీ వేరే ఇతర నియమ నిబంధనలు ఏమీ లేవు. తెలుగులో ఇస్మాయిల్, నగ్నముని తరహా కవులు ఇష్టం. రేవతీదేవి చాలా తక్కువ రాశారు కానీ చాలా ఇష్టం ఆవిడ కవితలు. హిందీ లో గుల్జార్ ఇష్టం. ఉర్దులో ఫైజ్. నిజానికి భారతీయేతర సాహిత్యం బాగానే చదివాను. కవిత్వమే ఎక్కువ చదవలేదు. నాకో ఫిర్యాదు ఉంది కవిత్వ అనువాదాలు చదవేపుడు. నేటివ్ లాంగ్వేజ్ లోని కవిత్వం కనీసం ఎనభై శాతం కాంప్రమైజ్ అయ్యే వేరే భాషలోకి వెడుతుంది. ఇంగ్లీష్ లో అందరూ ఇష్టపడే కవులు నాకూ ఇష్టమే.

మీకు కావలసిన కవిత్వం వస్తోందా?
సమాధానం చెప్పలేను కానీ కవిత్వం అక్షరాల్లోనే కాదు జీవితంలో, మనిషిలో,కళలో,దృశ్యాల్లో, సన్నివేశాల్లో, ప్రపంచంలో ఉంటుందని తెలుసు నాకు. I engage with poetry at different levels, not just in writing. నా ఫ్రెండ్ కూతురికి ఎనిమిది నెలలు, చాలా ముద్దుగా ఉంటుంది. ఆ పాపకు ఎవరైనా కథలు చెపితే చివరి సెంటెన్స్ వరకూ చాలా యాంక్షస్ గా వింటుంది అర్ధమైనట్లు. చివరి వాక్యం ఏదైనా ఠా, హా అంటే చాలు ఒకటే నవ్వులు. ఆ ప్రాసెస్ మొత్తం కూడా కవిత్వమే నా దృష్టిలో. పొయెట్రీ పర్సనాలిటీలో ఉంటుంది. జీవితంలో ఉంటుంది. అనుభవంలోకి వస్తే బావుంటుంది. కవిత్వం రాయగలిగితే అది కూడా ఒక మంచి అనుభవమే.ఎవరైనా కన్నీరు గురించి రాసినా కడివెలు కొద్దీ కారుస్తూ రాస్తారు అని నేను అనుకోను. అదొక అనుభవం.
What i mean is being poetic is personality trait and writing is expression skill.

మీలోని లాలసకి కావలసింది ఏమిటి?
నాలోని లాలస అంటూ ఎవరూ విడిగా లేరు. బహుశా మీ ఉద్దేశం మీ అంతర్గత వాంఛ ఏమిటి అని ఏమో. అందరిలానే నాకు తిక్కలూ, ఇష్టాలు, అయిష్టాలు ఉంటాయి. వాటిని వ్యక్తీకరించగలిగిన కొద్ది మందిలో నేనూ ఒక దాన్ని.

వచనంలో మీరు మరిచిపోలేని వాక్యాలు  కొన్ని?
రేవతీ దేవి గారు దివిసీమ ఉప్పెన సమయంలో వరదల బీభత్సం గురించి రాసిన ఒక లైన్ భలే ఇష్టం నాకు. ‘ ఈ నీళ్ళకు నిప్పు పెట్టండి”అని.. చాలా సార్లు చాలా సందర్భాల్లో గుర్తుకు వస్తుంటుంది ఆ లైన్. గుల్జార్ రాసిన చడ్డీ పెహన్ కే ఫూల్ ఖిలా హై అనే లైన్ కూడా ఇష్టం. ( పూల తొడిమను పిల్లలు వేసుకునే చడ్డీతో పోల్చారాయన). ఇలా కొన్ని. వీటి కన్నా గొప్ప లైన్లు వీళ్ళు కూడా రాసి ఉంటారు. కానీ నాకెందుకో గుర్తుకు వస్తాయి.

లాలస రాయాలనుకుని రాయలేకపోయిన వాక్యం?
రాయలేకుండా మిగిలిపోయిన వాక్యం ఏమీ లేదు నాకు సంబందించినంతవరకు

మీ కవితలో మీకు ఎక్కువ నచ్చిన వాక్యం…
జీవితం…. లెక్కల్లో విలువైన సున్నా

కవిత్వం కాకుండా మీకు నచ్చిన సాహిత్యకారులు?
చాలా మందే ఉన్నారు. ఒకోరు ఒకో కారణం వల్ల నచ్చుతారు. కామూ, కాఫ్కా, కుందేరా ఇలా చాలా మందే ఉన్నారు. ఇతర భారతీయ భాషల్లోనూ ఉన్నారు. అయితే ఈ మధ్య ఫిక్షన్ కన్నా ఎక్కువగా సీరియస్ సోషల్ కామెంటరీల మీద ఎక్కువ ఆస్తకి పెరిగింది. సూఫీ తత్వ వేత్తల రచనలు ఇష్టం. చదువుతూ ఉంటాను. తెలుసుకుంటూ ఉంటాను.

కవిత్వం.. జీవితంలో వివిధ పార్శ్యాల క్రాఫ్టింగ్ మీద మీ అభిప్రాయం ఏమిటి?
జీవితంలో వివిధ అంశాలు ఉన్నయి కదా వాటిని ఎలా కవిత్వీకరిస్తారు అనా మీ ఉద్దేశం. నేను పని గట్టుకుని చేసి పని కాదు కవిత్వం. మొన్నీ మధ్య ఒక అమెరికన్ జర్నలిస్టు కమ్ కవయిత్రి ఇంటర్ వ్యూ ఒకటి చదివా. నేను కవిని అనుకోవడం లేదు.నేను పదాలకు కొరియోగ్రఫీ చేస్తాను, మ్యూజిక్ డైరెక్షన్ చేస్తా అదే కవిత్వమైపోతుంది అందావిడ. అదేమిటో పాలు పోలేదు కానీ నన్ను నేను మిగతా దుష్ట ప్రపంచంతో సంబంధం లేని ఒక మహోత్కృష్ట జీవి అనబడే కవి అనుకోను. ఇటీజ్ జస్ట్ ఐ లైక్ అండ్ ఐ నో టు రైట్. కవిత్వం రాసేపుడు వత్తిడికి గురికాకపోతే చాలు జీవితం తాలూకు వత్తిడి అందులోకి వస్తుందని తెలుసు. ఇది కవితా, మహా కవితా అనుకుంటూ రాస్తే అది ఎలా ఉంటుందో ఏమో తెలీదు.

మీరు ఏ థీం, లేదా ఏ విషయం మీద కవిత్వం రాయటానికి ఇష్టపడతారు?

ప్రత్యేకించి ఒకటి అంటూ లేదు. అయితే రాసినవి ఒక చోట పెట్టి గమనిస్తే ఎక్కువగా అవి soliloquy లా ఉంటాయి. దానిని బట్టి అలానే రాయడానికి ఇష్టపడతానేమో అనుకోవాలి.

మీ కవిత్వంలో USP ఏంటి?
ఏం రాసినా ఒక ఎరుకతోనే రాయడానికి ప్రయత్నిస్తాను. మైమరుపుతో కాదు. అదే కావచ్చు.

భరించలేని ఆనందనానికి విరిగిపోయే fluidity ని కవత్వీకరించారా?
కాంట్రడిక్షన్ కు,ఫ్లూయిడ్ గా ఉండానికి కాస్త సంబంధం ఉంది. కాంట్రడిక్షన్ ఆమోదించడం ఫ్లూయిడ్ గా ఉండడంలో భాగమే.

కవిత్వంలో మార్మికత, బ్రెవిటీ ఎంతవరకు అవసరం మీ అభిప్రాయం?
అసలు జీవితమే పెద్ద కవిత కదా. A loooong one at that. బ్రివిటీ అనేది ఎన్ని లైన్లు రాశారు అనే దాన్ని బట్టి ఉంటుంది అనుకోను కానీ నాలుగు లైన్లు రాయనీయండి,నాలుగు పేజీలు రాయనీయండి వ్యక్తీకరణ బ్రీఫ్ గా సూటిగా ఉంటేనే కవిత్వం చిక్కగా ఉంటుంది. చాలా మంది ఊతపదంలా వాడేసే పదం అనుకుంటా మార్మికత. నాకైతే అంతుబట్టలా ఇంతవరకూ.

గాఢమైన కవిత్వానికి మహా విషాదం అవసరమా?
మహా విషాదాలే కవితలు అవుతాయా ? ఈ ప్రశ్న బహుశా విషాదం ఎంత ఉంటే అంత గాఢమైన కవిత్వం వస్తుందనే స్పృహ స్థిరపడిపోవడం వల్ల వచ్చిందనుకుంటా. మీరు అదే కోవలో అడిగారో లేదో తెలీదు కానీ అనుభవాలు,గమనింపులు ఏవైనా కూడా కవితలు కావచ్చు. ఎంత బాగా కవిత్వం రాస్తాం అనేదే ముఖ్యం. విషాదం కాదు. లేదంటే కవిత్వమే విషాదం కాగలదు.లేదా కామెడీ కూడా.

ప్రేమ, ప్రేమ భావన ప్రేమ కవిత్వం మీద మీ అభిప్రాయం?
పరిణామ క్రమంలో అయితే ప్రేమ చాలా అక్వర్డ్ ఇమోషన్ ( Acquired emotion ) అనే నేనూ అనుకుంటాను. అదేమీ సహజం కాదు. సహజమైనా, అక్వర్డ్ అయినా మనిషిని నడిపించేది అయితే మంచిదే. ఆ కవిత్వమూ ఓకేనే. కానీ ఆరోతరగతి స్థాయి ప్రేమలేఖలు రాసేసి ఇదే ప్రేమ కవిత్వం అంటే మాత్రం బోలెడెంత నిస్సహయంగా ఉంటుంది లెండి. బ్లాగుల్లో ఈ ప్రేమ దాడి ఎక్కువైపోయింది.చదవండి ఒకసారి అని పంపుతూ ఉంటారు. చదివితే ఇలా ఉంటుంది వరస .

ఇపుడు ఏమన్నా రాస్తున్నారా? రాయకుండా ఉండలేని బలహీనతలు ఉన్నాయా?
రాయకుండా ఉండలేను అనే బలహీనత్వం ఏమీ లేదు.ఉంటే ఆరేడేళ్లు రాయకుండా కూచోను కదా.నాతో పాటు ఏళ్ళ తరబడి పని చేసిన వాళ్లకు కూడా నేను కవిత్వం రాస్తానని తెలీదు.ఎపుడూ పని గట్టుకుని చెప్పను. ఈ మధ్యనే మొదలు పెట్టాను మళ్ళీ రాయడం.చూడాలి ఈ స్థితి ఎంత కాలం ఉంటుందో.

మీ కవిత్వంలో చెప్పినట్లు ఆర్ యు ఎడిక్టెట్ టు లివ్ ?
ఎడిక్టెడ్ టు లివ్ అనే మాట చాలా కాన్షియస్ గా రాశాను. మనం చాలా రకాల అవగాహనలకు వస్తూ ఉంటాం కదా. అలా ఒక సందర్భంలో వచ్చిన అవగాహన నుంచే అది రాశాను. తినడానికి, కట్టుకోవడానికి బట్ట లేని వాళ్లు.జీవితంలో తమకే కాదు తమ ముందు తరాలకు కూడా ఏమాత్రం తేడా రాదు అనే వారు కూడా ఎందుకు జీవితం కోసం కష్టపడతారు అంటే చాల మంది చెబుతారు ఆశే నడిపిస్తుంది అని.కానీ నేను అంటాను జీవితం విపరీతంగా అలవాటు అయిపోతుంది. జీవితం మీద అడిక్షన్ వల్లనే మనుష్యులు అన్ని అఘాయిత్యాలు భరిస్తారు. దుఃఖాన్ని భరిస్తారు.జీవితం ఒక అలవాటు అని. జీవితం కేవలం అలవాటు వల్ల కాకుండా ఇంకో కారణం వల్ల జీవించే ఛాన్స్ ఉందనుకోండి అదో లగ్జరీ.

సాహిత్యానికి సంబంధించి మీరు చేయాలనుకొని, రాయాలనుకున్నది ఏమిటి?
నా ఫాం కవిత్వమే.ఒకటి రెండు కథలు రాశాను. అది చేయలేననిపించింది.ముందు ముందు రాస్తానేమో తెలీదు. రాయడం అనేది నాకొక టెండన్సీ తప్ప దానిని సీరియస్ కెరీర్ లా ఎపుడూ చూడలేదు. కథ, కవిత్వం రెండూ రాసేసే వాళ్ళని చూస్తే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఎలా వీళ్లకి సాధ్యం అని.

మీరేమో కవయిత్రి ,కానీ మీరు పనిచేసేది పొలిటికల్ జర్నలిస్టుగా మీకు ఇబ్బంది ఉండదా?
ఒకటి వృత్తి, మరొకటి ప్రవృత్తి ఆ మాత్రం కంపార్టమెంటలేజేషన్ ఉండాలి గా.

తీరాల నిర్వచనం కాని నది..అలసి చేరేది ఎక్కడికి?
నది అలిసినా అలవకపోయినా చేరేది సముద్రంలోకే. దానిని నదికి ముగింపు అనుకోవచ్చు. లేదా ఒంటరి నదికి బోలెడు నదులు కలిసిన సముద్రుడి తోడు దొరికిన కొత్త ప్రారంభమూ అనుకోవచ్చు.మన మూడ్ బట్టి ఉంటుంది.

మీ లైఫ్ యాంబిషన్ ఏమిటి?
ప్రత్యేకించి ఏమీ లేదేమో. But i will be happy if life allows me to remain poetic till the end.

హ్మ్మ్… నావరకూ లాలస (శ్రీబాల ) ఇంటర్వ్యూ అవగానే కొన్ని పదాల పాదాలు ఇలా అనిపించాయి.
కొన్ని వాక్యాలు ఎంత అలంకరించినా కవిత్వం కావు -చీకటి వెలుగుల దోబూచులాట సౌందర్యానికి ఎలాంటి మేకప్ అక్కరనే లేదు -నలుపు తెలుపుల ఫ్రేముల్లో ఇమడని జీవితం -రంగుల రుతువుల్లో చిక్కి , మోహగాలంలో పడి మాయమవుతుంది ఎందుకనో ..
మే బీ వీ ఆర్ అడిక్తేడ్ టు లివ్ …!!

-సాయి పద్మ

స్త్రీవాద విమర్శలో కాత్యాయని కొత్త దారి!

కాత్యాయని విద్మహే

కాత్యాయని విద్మహే

(కాత్యాయనీ విద్మహే గారికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు సందర్భంగా)

తెలుగునాట స్త్రీవాద సాహిత్య విమర్శ అనగానే గుర్తుకు వచ్చే అతి కొద్ది విమర్శకుల్లో కాత్యాయని విద్మహే ఒకరు. స్త్రీవాదమంటే విదేశాలనుండి దిగుమతి చేసుకున్న వాదంగానే ఇంకా అనేకమంది వ్యాఖ్యానిస్తుండగా, స్త్రీల జీవితాల్లోని ఆరాట, పోరాటాల చరిత్ర ఈనాటిది కాదు,సంప్రదాయ సాహిత్య కాలం నాటికే వుందని సహేతుకంగా నిర్ధారించి, సాధికారికంగా చెప్పిన విమర్శకురాలు విద్మహే. ప్రాచీన సాహిత్యం పవిత్రతని నెత్తిన పెట్టుకోడమో, లేదా పరమ ఛాందసమని తీసిపారెయ్యడమో కాకుండా ఒక సమన్వయంతో, సదసద్వివేచనతో ప్రాచీన సాహిత్యాన్ని ఆధునిక దృష్టికోణం నుండి చూడాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ దిశగా తన విమర్శనా మార్గాన్ని ఎన్నుకున్నారు విద్మహే.ఈవిధంగా చేయడం వల్ల అటు ప్రాచీన సాహిత్యానికి, ఇటు స్త్రీవాద విమర్శకు ఆమె సరైన న్యాయం చేయగలిగారు. కాత్యాయని లాంటి విమర్శకులు చేసిన ఇలాంటి కృషి వల్ల ‘దేశీయ స్త్రీవాదచైతన్యం’ మూలాలు తెలుకునే వీలు కలుగుతోంది. అయితే ఈ దిశగా తరువాత స్త్రీవాద విమర్శకులెవరూ పెద్దగా కృషి చేసినట్టు కనిపించడంలేదు.

రెండు దశాబ్దాల పైబడి తెలుగు సాహిత్య విమర్శలో కాత్యాయని చేస్తున్న కృషి ప్రముఖంగా చెప్పుకోదగ్గది. కేవలం సమీక్షాత్మకంగా కాకుండా,’లోనారసి’ విశ్లేషణ చేయడం ఆమె విమర్శలో ప్రధానమైన లక్షణం. ఈ లక్షణమే ఆమెకు, ఆమె విమర్శకు ఒక విశిష్టత చేకూర్చగలిగింది.

కాత్యాయని సాహిత్య విమర్శ కృషి ని రెండు పాయలుగా విశ్లేషించి చూడటం అవసరం. స్త్రీవాద సాహిత్య విమర్శ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టినా అంతకుందు ఆమె చేసిన కృషి మరింత ముఖ్యమైంది. కవులు, కవిత్వ విమర్శల ఆకర్షణల నుండి తప్పుకొని తథ్భిన్నంగా కవిత్వేతర సాహిత్య ప్రక్రియలైన కధ,నవల మీద దృష్టి నిలిపి ఏకాగ్రతతో కృషి చేసిన, చేస్తున్న విదుషి విద్మహే. 1977లో ఎమ్మే పూర్తి చేసి ఆధునిక సాహిత్యంలో మరీ ముఖ్యంగా నవల,కథానిక ప్రక్రియల మీద అభిరుచితో పరిశోధన ప్రారంభించారు విద్మహే.సాహిత్య చరిత్ర నిర్మాణంలో భాగంగా ఆమె వివిధ వాఙ్మయ జీవిత సూచికలు రూపొందించారు. కొడవటిగంటి కుటుంబరావు వాఙ్మయ జీవిత సూచిక, నవలా రచయతల పరిచయ విమర్శనల సూచిక ఈ కోలోనివే. కాత్యాయని 1986లో రూపొందించిన కొ.కు.వాజ్మయ జీవిత సూచిక విశేష కృషిగా చెప్పుకోవాలి.

1980లో కొ.కు. చనిపోయిన తర్వాత మొదలెట్టి కనీసం ఆరేళ్ల పాటు పరిశోధించి ఆమె ఈ సూచిక తయారుచేశారు. ఈ సూచిక తయారీ అంతా ఒక ఎత్తు, దీని కోసం ఆమె తయారు చేసిన క్షేత్ర పర్యటన మరో ఎత్తు. ముఖ్యంగా ఈ పుస్తకానికి కాత్యాయని రాసిన పీఠిక ప్రముఖంగా పేర్కొనతగినది. ఇలాంటి విస్తృతమైన కృషినే ‘తెలుగు నవలా, కథానికా విమర్శనా పరిణామం’లో కూడా చూడవచ్చు.

1995లో ప్రచురితమైన ఈ పుస్తకం మొదటి అరవై పేజీలు కధ,నవలాసాహిత్య విమర్శనా పరిణామం చెపుతుంది.తెలుగు లో మొదటి నవల ఏది లాంటి చర్చల్ని తిరగతోడకుండా ప్రస్తుత సాహిత్య సందర్భంలో వచన సాహిత్యానికి సంబంధించిన దృక్పథాంశాల్ని ఈ పుస్తకం చర్చల్లోకి తీసుకు వచ్చింది. తెలుగు సాహిత్య ప్రపంచంలో కథ,నవల ప్రక్రియలపై కలిగిన చైతన్యాన్ని చరిత్రాత్మకంగా రికార్డు చేయడం ఈ పుస్తకం సాధించి్న విజయం.

వీటికంటే ముందు 1986లో అనంతపురం లోని ‘కదలిక’ పత్రిక నుంచి పునర్ముద్రించిన ‘తెలంగాణా పోరాట తెలుగు కధ-నవల’ అనె పెద్ద వ్యాసం ప్రస్తుత సాహిత్య సందర్భంలో ప్రత్యేకించి పేర్కొనతగినది.తెలంగాణా పోరాట సందర్భాన్ని కథ, నవల సాహిత్యంలో ఎలా వ్యక్తీకరించాయన్నది ఈ వ్యాసంలో ఆమె చెప్పారు.అప్పటి రైతాంగ పోరాటంతొ, ఇప్పటి జీవన పోరాటాన్ని సరిపోల్చుతూ వచ్చిన కధల్ని కాత్యాయని విశ్లేషించారు. తెలంగాణ వాస్తవికతని, సాహిత్యంలో దాని ప్రతిఫలనాన్ని మన కళ్ళ ముందుంచే ఈ వ్యాసం అప్పటికంటే ఇప్పుడు మరింత ఉపయోగకరమైందని చెప్పవచ్చు.

ఈ పరిశోధనాత్మక రచనలన్నింటిని ఒక్క సారిగా చదవడం మొదలుపెడితే, కాత్యాయని విద్మహే సాహిత్య దృక్పథం ఏమిటో మనకు స్పష్టమవుతుంది.మొదటి నుంచి కూడా చరిత్ర దృష్టి నుంచి సాహిత్యాన్ని విశ్లేషించే విమర్శకురాలిగా ఒక ప్రత్యేక రచనని ఎలా విశ్లేషించవచ్చో చూపించే ప్రయత్నం చేశారు మరో విమర్శ పుస్తకం’చివరకు మిగిలేది:మానసిక జీవన స్రవంతి నవలావిమర్శ’(1987)లో. స్త్రీవాద దృక్పధం నుంచి కాత్యాయని రాసిన మొదటి విమర్శ గ్రంధం బహుశా ఇదే కావచ్చు. ముఖ్యంగా ఒక పురుష పాత్రకు ఫెమినిస్టు దృక్పధాన్ని ఆపాదించి, విశ్లేషించడం ఈ అధ్యయనంలో విశేషంగా చెప్పు కోవాలి.

ఆ తర్వాత నుంచి కాత్యాయని విమర్శ దృక్పధంలో మార్పు వచ్చింది. ఈ మార్పుకు దర్పణం 1998లో వచ్చిన ‘సంప్రదాయ సాహిత్యం-స్త్రీవాద దృక్పధం’.ఆమే స్వయంగా చెప్పుకున్నట్టు ‘సామాజిక,సాంస్కృతిక రంగాల్లో ఉద్యమ స్థాయిలో ప్రచారంలోకి వచ్చిన స్త్రీవాద భావజాలం, యూనివర్శిటి పరిశోధనా రంగంలోకి చొచ్చుకొచ్చిన మహిళా జీవన అధ్యయన విధానం’ రెండూ కాత్యాయని సాహిత్య జీవిత దృక్పధాన్ని ప్రభావితం చేశాయి. ప్రధానంగా ఈ పుస్తక రచన ఆమెలో వచ్చిన గాఢమైన మార్పుని చూపిస్తుంది.

ప్రాచీన సాహిత్యంలో స్త్రీ-పురుష సంబంధాల విశ్లేషణ, వాటిని స్త్రీవాద దృక్పధం వెలుగులో చూడడం ఈ పుస్తకం వుద్దేశ్యం.భారతంలో భార్యాభర్తృ సంబంధాలతో మొదలై, మహిళావాద భూమిక నుంచి కావ్య శాస్త్ర దర్శనం వరకూ ‘మిరుమిట్ట్లు గొలిపే కొత్త ప్రతిపాదనవలతో’ ఈ విశ్లేషణ సాగుతుంది.సాంప్రదాయ సాహిత్యంలో కనిపించే స్త్రీల జీవితానికి వెనుక వుండే కనపడని పితృ స్వామిక హింసా రూపాలను, ఆ సాహిత్యంలోని కధ నిర్మాణాన్ని,మాటలను,సంభాషణలను బట్టి ఎంత సమగ్రంగా తెలుకునే వీలుందో అన్వేషిస్తాయి ఈ వ్యాసాలు. స్త్రీవాద విమర్శ దిశను మార్చిన రచన ఇది. నిజానికి ఈ పుస్తకంలోని ఒకొక్క వాక్యం విస్తృతంగా చర్చించతగినదే. ఈ వ్యాసాల్లోని ఆలోచనలు ప్రసరించే వెలుగులోసంప్రదాయ సాహిత్యం మన ముందు కొత్త అర్థాల్ని స్పురింప చేస్తుంది. బహుశా ఈ విధమైన రచన కాత్యాయని లాంటి కొద్దిమంది మాత్రమే చేయగలరేమో!

(‘ఈమాట’ వెబ్ పత్రిక సౌజన్యంతో)

Kalpana profile2– కల్పనా రెంటాల

నీకు తెలుసా?!

Padmapriya C V S

మేఘం గర్జించకుండానే వర్షిస్తుంది…

గుండెల్లో వేదన పెదవి దాటకుండా కంట ప్రవహించినట్టు..

ఘనీభవించిన సాంద్ర వేదన, కల్లోల మానసంలో…

ప్రళయ గర్జనై, తుఫానై, సముద్రాంతరాళంలో

మండే అగ్నిపర్వతమై లావాలు విరజిమ్ముతుంది….

సముద్రాలు కెరటాలై తీరాల్ని చీల్చకుంటూ పరిగెడుతాయి,

పారిపోతున్న కలల రహదారుల్ని చేజారకుండా పట్టుకోటానికి !!!

నీకు తెలుసా,

ఆకాశం ప్రతి రోజూ చీకట్లను తరుముతూ

నిరంతర ఆశా ప్రవాహమై ఉషస్సులోకి వికసిస్తుందని?

సముద్ర గర్భంలోకి  మనస్సుని విసిరేసి తొక్కిపెట్టటం సాధ్యమా?

పర్వత సానువులపై  సౌరభాల్ని విరజిమ్మే శక్తి దానికి ఉన్నప్పుడు?

కన్నీటికి జీవితాన్ని సమర్పించటం సాధ్యమా?

వెలుగు మతాబులు, చిర్నవ్వుల దివ్వెలు –

ఆనందపు చిరుజల్లులు  విరజిమ్మే శక్తి మన సొంతమైనప్పుడు?

1452516_10151954442429158_1641434253_n

నీకు తెలుసా…

మైదానంలో, వసంత తాపానికి సొమ్మసిల్లే పువ్వుకూడా,

రాలి భూమిని తాకి  పరవశిస్తుందని?

ప్రతి దుఃఖోద్వేగానికీ ఆవలి తీరం ఒకటి ఉంటుందని,

అది వెన్నెల జలతారై మనసును కమ్మేస్తుందని,

ఆత్మానందపు దరహాసమై ఎదను ప్రజ్వలిస్తుందని?

నాకు ఖచ్చితంగా తెలుసు –

మనిషి దుఃఖంలో రగిలినట్టే,

ఆనందంలోనూ  తల్లీనుడౌతాడనీ,

జీవించి గెలుస్తాడని – తన అస్తిత్వంతో

పునీతుడై  తరిస్తాడని!!!

సి వి యస్ పద్మప్రియ

ఛాయాచిత్రం: దండమూడి సీతారాం

***

అతడొక వీస్తున్నపూలతోట

రెడ్డి రామకృష్ణ

రెడ్డి రామకృష్ణ

ముప్ఫై ఏళ్లగా

అతన్ని చూస్తూనే ఉన్నాను

ఎక్కేబండి దిగే బండిగా

ప్రయాణమే…

జీవితంగా మలుచుకున్నట్టున్నాడు

తలకు చిన్నగుడ్డ  తలపాగాచుట్టి

మొలను నిక్కరు ధరించి

చేతుల్లోని పినలిగర్రను మూతికి ఆనించి

ఏకకాలంలో వందలమందిని శిశువులుగా చేసి

సమ్మోహ పరిచే మంత్రగాడు

ఎన్నేళ్లుగా అతడలా గాలికి గంధం పూస్తున్నాడో

తన వూపిరితో మురళికి ప్రాణంపోస్తూన్నాడో

తనెక్కిన రైలును ఉయ్యాలగా చేసి ఊపుతున్నాడో

తెలియదు కానీ

తన శరీరంలో ఎన్నో చిల్లుల వెదురుగొట్టాలు

చర్మం చాటున దాచుకున్నట్టున్నాడు

అతడు  మురళి వూదితే చాలు

లోపలి వేణువులన్నీ ఒక్కసారిగా మ్రోగినట్టుంటాయి

అతనిలోనేనా!…

మనలోకూడా…

ఒక్కోసారి అతడు కనిపించడు

నేను బండి ఎక్కిన కాన్నుంచి

అతని ఉనికి కోసం వెతుకుతూనే వుంటాను

కనులతో  చెవులతో

ఎక్కడా కానరాక కళ్ళు మూసుకుంటానా

ఏచివరనుంచో ఒక సమ్మోహన మంత్రం

“నామది నిన్ను పిలిచింది గా..నమై… వేణు..గానమై..”

నేనక్కడే కూచుంటాను

నామది  మాత్రం స్వాధీనం తప్పి

ఆ రాగపు కొసను పట్టుకొని

అలా..అలా.. అతన్ని చేరుకుంటుంది

అతడు నెమ్మెదిగాదగ్గరౌతూ

మనపిల్లల పుణ్యం కోసమని

చెయిచాచి

మనపాపాన్ని రూపాయికాసంత అడిగి తీసుకుపోతుంటాడు

అతడు  బండిలో వున్నంతవరకూ  నామనసు

తేనెటీగై  అతనిచుట్టే తిరుగుతుం టుంది

చివరికి

అతడన్నా బండిదిగాలి

లేదా

నేనన్నా బండిదిగాలి

అంతవరకూ

నామనసు తిరిగి నా స్వాధీనం లోనికి రాదు.

                                     రెడ్డి రామకృష్ణ

ఆ తప్పిపోయిన పిల్లడు…మళ్ళీ దొరికాడు!

మిమ్మల్నో మాట అడగనా? ఒక చక్కని పుస్తకం……మీ చేతిలోకి వస్తే ఎలా ఉంటుంది? సరే, ఆ చక్కని పుస్తకం మీరెప్పటినుంచో వెతుకుతున్నదైతే? మీకిష్టమై, మీరు ఒకసారి చదివేసి, విపరీతంగా ప్రేమించి, తరవాత తప్పిపోయిన పిల్లాడిలా ఆ పుస్తకం కోసం వెతికి ఇక వీల్లేదనుకున్న సమయంలో ఎవరో దయతలిచి, ‘నా దగ్గరుంది, సర్లే తీసుకో’ అని ప్రేమగా ఇస్తే? !!

అంతకు మించిన గొప్ప అనుభవం జరిగింది నాకు. ఉషోదయాన, హైదరాబాదు రోడ్లలో, కారులో ఒక్కదాన్నే రేడియోలో వచ్చే ‘భూలేబిసేరేగీత్’ వింటూ..అలా లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డులో ఉన్న ఇంకా పూర్తిగా సన్నిహితురాలు కాని మిత్రురాలి ఇంటికి వెళ్తుంటే ఆనందం నావెంటే వచ్చింది. అదే ఆనందంతో నా స్నేహితురాలితో కలిసి మీటింగ్ పూర్తిచేసుకుని, వెనక్కు వచ్చేదారిలో బోల్డన్ని కబుర్లూ చెప్పుకుంటూ, ఇద్దరమూ ఒకరినొకరిలో ఇంచుమించుగా చూసుకొంటూ, తబ్బిబ్బవుతూ, దారిలో ఒకచోట ఆగి పున్నాగ పూలు ఏరుకుని వాళ్ళ ఇంటిదాకా వచ్చాము. అదే ఉత్సాహంతో తను కారునుంచి ఒక్క గంతున ఇంట్లోకి, తరవాత చెంగున పెరట్లోకి దూకింది, నన్ను పిలుస్తూ! తన వెనుకే ‘ఏమిటా’ అని వెళ్లి అక్కడ నేలరాలిన పారిజాతాలను చూసి నేను ఆశ్చర్యపోతుంటే, తను ఆర్ద్రంగా నా చేతినిండా ఏరినపూలు పోసి ఇచ్చింది. అప్పటికే మూగబోయిన నాకు లోపలికి పిలిచి “ పెద్దప్రపంచం లో చిన్న పిల్లడు(వి. పనోవ)” నాచేతిలో పెట్టి సాగనంపితే……, ఏం చెప్పాలి!

2013-11-19 23.18.48

 

ఇదిగో, ఈ నెలన్నారా ఆ పుస్తకాన్ని చదివి ప్రతి వాక్యమూ ఆస్వాదిస్తూ ఇష్టంగా రాయాలకున్న కోరిక ఇప్పటికి తీరింది! పుస్తకం గురించి చెప్పాలంటే వెనుక అట్టతో మొదలుపెడతాను. అందులో ఇలా ఉంది:

“సెర్యోషకి ఆరేళ్లోస్తాయి. నాన్న యుద్ధంలో మరణించాడు. అమ్మ ఉంది, పాషా అత్తయ్య ఉంది, ల్యుకానిచ్ మావయ్య ఉన్నాడు. మరి సెర్యోషకి తను చుసుకొవలసినవీ, తను అనుభవించవలసినవీ ఎన్నో ఉన్నాయి- ఏమంటే తన జీవితంలో ప్రతిరొజూ ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటుంది.
మరి, ఇప్పుడేమో, తన జీవితంలోకెల్లా అతి ముఖ్యమైన విషయం జరిగింది- తనకి మారు తండ్రి వచ్చాడు. ఈ పిల్లడికీ వాడి రెండవ తండ్రికీ ఉన్న సంబంధాల గురిచి ఈ పుస్తకం మనకి చెబుతుంది. “
************

ఇంతేనా?
ఈ పుస్తకం మనకు ఇంకా చాలా విషయాలు చెబుతుంది. అనుభూతిని పొందడం, స్పందించడం అనే మాటలు తెలుసుకోవాలంటే ఇది చదివాక మన మనస్ధితిని అర్థం చేసుకోగలిగితే చాలు.

సెర్యోష! మన పెద్దప్రపంచంలో చిన్న పిల్లడు! తన ఊరూ, ఇల్లూ, స్నేహితులూ, ఇరుగు పొరుగు…అవేగాకుండా తను గమనించవలసిన విషయాలు ఎన్నో…వీటితోనే తను అలిసిపోతుంటే ఇప్పుడింటిలో కొత్తనాన్న రాక… ఇదివరకు కుటుంబానికి మిత్రుడు, ఇప్పుడు కొత్తనాన్నగా మారిన కొరొస్తల్యేవ్ వచ్చాక సెర్యోష మామూలుగా అడుగుతాడు. “నన్ను బెల్టుతో చెమ్డాలెక్కగొడ్టావా?” కొరొస్తల్యేవ్ ఆశ్చర్యపోతూనే చెప్తాడు, “మనం ఒక ఒప్పందం చేసుకుందాం. మన మధ్య బెల్టు వ్యవహారం ఎప్పటికి వొద్దు,” అని. సైకిలు కొనివ్వడం తో సెర్యోష అభిమానాన్ని సంపాదిస్తాడు కొరొస్తల్యేవ్. అంతేనా? కాదు, తనకెంతో ముఖ్యమైన తన బొమ్మలను, కొరొస్తల్యేవ్ బీరువా జరిపి ఇవ్వడంతోనే అతని బలానికి సెర్యోషకు తెలియని ఆరాధన కలుగుతుంది. చిన్నపిల్లలు ఎన్ని చిన్నవిషయాలు గమనిస్తారో! ‘అంత బీరువా ఎత్తగలిగిన మనిషి తనని ఎత్తలేడా’, అనే భరోసాతో రెండో రోజే సెర్యోష కొరొస్తల్యేవ్ భుజం మీద ఎక్కి గర్వంగా తిరుగుతాడు.

మొదటి పావువంతు పుస్తకం చదవగానే కొరొస్తల్యేవ్ కి సెర్యోష మీద ఉన్న గౌరవం అర్థమవుతుంది. నిజానికి ఈ పుస్తకంలో సెర్యోషతో పాటు కొరొస్తల్యేవ్ కూడా నాయకుడే.. కొరొస్తల్యేవ్ ఎప్పుడూ సెర్యోషని చిన్నపిల్లాడిలా చూసినట్లనిపించడు. అంతెందుకు కొరొస్తల్యేవ్ భోజనాల సమయంలో అందరితో పాటు సేర్యోషకు కూడా వైన్ అందించడంవంటి గౌరవాన్ని మరి ఎవరూ సేర్యోషకు అప్పటిదాకా ఇవ్వలేదు!!

అసలు ఈ పుస్తకం ఒక రకంగా ,“a book on parenting” అనవచ్చు. నిజమే, ఇది ఒక సుతిమెత్తని భావనను మిగిల్చే పుస్తకం మాత్రమే కాదు, తెలియకుండానే పేరెంటింగ్ టెక్నిక్స్ నేర్పే పుస్తకం కూడా. సెర్యోష ప్రకారం పెద్దవాళ్ళు చాలా అనవసరపు మాట్లాడుతారు- ‘ఎందుకు పాడుచేసావు’ లాంటి మాటలన్న మాట! వస్తువులు పాడుచేసినందుకు పిల్లలేమీ సంతోషించరు, ఇంకా సిగ్గుపడుతారు. అయినా ఈ పెద్దవారెందుకు ఆ విషయం గుర్తించకుండా అనవసరంగా మాట్లాడతారు? అదే వాళ్ళు పాడుచేస్తే ఎవరూ ఏమి మాట్లాడరు, అదేదో సరైనపనే జరిగినట్లు! ఇంకో విషయం- ‘దయచేసి(please)’ అన్నమాట వాడడం. ‘ఏదన్నా కావాలంటే దయచేసి అన్న మాట జత చేస్తే ఇస్తాను,’ అంటుంది, సెర్యోష అమ్మ. ‘మరైతే, ఏదైనా ఇయ్యి’ అని అడిగినప్పుడు, ‘నాకది కావాలని నీకు అర్ధం కాదా?’ అని అడుగుతాడు సెర్యోష. ‘దయచేసి అని అడగడం వల్ల ఇచ్చేవారు సంతోషంగా ఇస్తారని’ వివరిస్తుంది అమ్మ. అంటే ‘దయచేసి అని అడగకపొతే సంతోషం లేకుండా ఇస్తావా’, అనడుగుతాడు సెర్యోష. అమ్మ అప్పుడు, “అసలు ఇవ్వనే ఇవ్వను”, అని చెప్తుంది. “సరే అలాగే అంటాను” అనుకుంటాడు సెర్యోష. కాని కొరొస్తల్యేవ్ పెద్దవాళ్ళలాగా ఇలాంటి ‘ఉత్తుత్తి మాటలు’ పట్టించుకోడు. అంతేగాకుండా తను ఆడుకుంటున్నప్పుడు ల్యుకానిచ్ మావయ్య లాగా అనవసరంగా పిలిచి తనని ముద్దుచేసి చిరాకు పెట్టడు!

పేత్యమామ వచ్చి చాక్లట్ అని చెప్పి ఖాళీ కాగితం చుట్టిన ఉండను సెర్యోషకిస్తాడు. సెర్యోష మర్యాదగా దాన్ని అందుకొని మోసాన్ని గ్రహించి సిగ్గుపడితే, పేత్యమామ పగలబడి నవ్వుతాడు. సెర్యోష అసహనంతో ‘ పేత్యమామా, నీకు బుద్దిలేదా?’ అని నిర్మొహమాటంగా అడుగుతాడు. ఆ మాటలకు అమ్మ అదిరిపడి, సేర్యోషను మందలించి, క్షమాపణ అడగనందుకు శిక్షిస్తుంది. సెర్యోష ఆత్మాభిమానంతో ఏమి బదులు చెప్పడు. అతనికి తన తల్లి మీద కూడా కోపం వస్తుంది. తనను మోసం చేసిన పేత్యమామతో అమ్మ ఇంకా ఎలా కబుర్లూ చెప్తుంది? అని. సాయంత్రం సెర్యోష లేడనుకుని జరిగే చర్చలో కోరోస్తల్యేవ్ సెర్యోష మాటలను ‘న్యాయమైన విమర్శ’ అంటాడు. ‘ బుద్ధిలేనివాడిని బుద్ధిలేని వాడని అన్నందుకు ఏ బోధనాశాస్త్రం ప్రకారము శిక్షించకూడదు.’ ఈ మాటలకు అర్థం సెర్యోషకు తెలియక పోయినా కోరోస్తల్యేవ్ తన తరఫునే మాట్లాడాడని మనసులో కృతఙ్ఞతలు చెప్పుకుంటాడు.

సెర్యోషకు కొరొస్తల్యేవ్ మీద పూర్తినమ్మకం ఏర్పడినందుకు గీటురాయిగా, సెర్యోష తనకు ఈ బ్రహ్మాండవిశ్వంలో భూమికాక ఇతర గ్రహాలతోబాటు భూమివంటి మరో గ్రహం ఉంటే, అందులో సెర్యోషవంటి మరో కుర్రవాడి ఉనికిని గురించి వచ్చిన అద్భుతమైన ఊహ ఒక్క కొరొస్తల్యేవ్ కు మాత్రమే చెబుతాడు. అవును మరి, సెర్యోష ప్రకారం అటువంటివి పంచుకోవడానికి ఒక్క కొరొస్తల్యేవ్ మాత్రమే అర్హత ఉంది!

సేర్యోషకు తమ్ముడు పుట్టినప్పుడు, కొరొస్తల్యేవ్ మాటల ప్రకారం తన తమ్ముడిని బాగా చూసుకోవలనుకున్నాడు సెర్యోష. కానీ అదేంటదీ, ఇంత చిన్నగా ఉండే తమ్ముడిని అమ్మే సరిగ్గా ఎత్తుకోలేకపోతోంది! పైగా ఆ పిల్లాడి వ్యవహారం కూడా నచ్చలేదు సెర్యోష. కాస్త పాలకోసం ఏడ్చి గొడవచేసి, పాలుతాగిన వెంటనే చప్పున నిద్రపోయే తమ్ముడిని చూసి, “ఏం పిల్లాడమ్మా” అని అలసటగా అనుకుంటాడు సెర్యోష. కానీ కొరొస్తల్యేవ్ సర్దిచెప్పగానే కుదుటపడతాడు. అమ్మ తమ్ముడితో ఎప్పుడు పనిలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొరొస్తల్యేవ్ వీలు చిక్కినప్పుడల్లా- అంటే బట్టలు మార్చుకునే సమయాల్లో, నిద్రపోయేముందు కథలు చెప్తాడు సెర్యోషకి. కాని కొరొస్తల్యేవ్ కు పూర్తిగా తీరిక అంట తేలిగ్గా ఎప్పుడూ చిక్కదు. అతను చాలా ముఖ్యమైన మనిషి- అతను లేకపొతే పనివాళ్ళకు జీతలుండవు, కావాలనుకుంటే వాళ్ళను ఉద్యోగాలనుండి తీసివేయగలడు. కొరొస్తల్యేవ్ ను అందరికీ అధికారిగా నియమించారంటే అర్థం, అతను అందరికన్నా మంచివాడు, గొప్పవాడు అని సెర్యోష గ్రహిస్తాడు.

కానీ కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. జీవితాన్ని ఇంతగా అర్థం చేసుకుంటున్న క్రమంలో సెర్యోషకు విపరీతమైన అనారోగ్యం. ఒక జబ్బు తగ్గగానే మళ్ళి ఇంకొకటి. సెర్యోష కుదుటపడుతుండగా అదే సమయంలో కొరొస్తల్యేవ్ కు బదిలీ అయింది. సేర్యోష ఆరోగ్య పరిస్ధితుల దృష్ట్యా అతనిని కొంతకాలం వారు కదల్చలేని పరిస్ధితి. కాని సెర్యోష వేదన చెప్పనలవి కాదు. అమ్మ, కొరొస్తల్యేవ్, ల్యోన్య వెళ్ళిపోతుండగా తనను మాత్రం వదిలి వెళ్ళడం దుర్భరంగా ఉంది సేర్యోషకు. ఒక రోజు సెర్యోష బాధను చూసి కొరొస్తల్యేవ్ బయటకు తీసుకువెళ్తాడు. కొరొస్తల్యేవ్ ఎంతో ముద్దుగా మంచిగా మాటలు చెప్పి, సేర్యోషను వదిలి వెళ్ళడం తనకు కూడా ఇష్టం లేదు అనే విషయాన్ని వివరించాడు. దాని వల్ల రవ్వంత శాంతి కలిగినా సెర్యోష పూర్తిగా సమాధనపడలేదు. ఇదివరకు అమ్మ తనని వదిలి స్కూల్ లో పనికి వెళ్ళింది. కాని అప్పుడు అమ్మ ఒకతే- పైగా అప్పుడు తానింకా చిన్నవాడు, తనకు తెలియలేదు. ఇప్పుడు అలా కాదు. కొరొస్తల్యేవ్ కూడా వెళ్ళిపోతున్నాడు. అన్నింటికన్నా ఘోరం, ల్యోన్యను తీసుకెడుతున్నారు, తనను వదిలేసి! ఆ రాత్రి, చిట్టడివిలో సెర్యోష తో కొరొస్తల్యేవ్ చెప్పిన మాటలు విన్నా సమాధానపడని సెర్యోష గురించి రచయిత ఇలా అంటారు. :

“సెర్యోషకి తన మనసులో ఇలా జవాబు చెప్పాలనిపించింది. ఎంత ఆలోచించిన సరే, ఎంత ఏడ్చినా సరే, ఏమి ప్రయోజనం లేదు, మీరు పెద్దవాళ్ళు, మీరు అన్నీ చేయగలరు. ఇది చెయ్యవచ్చని, ఇది చెయ్యకూడదనీ మీరే అన్నీ శాసిస్తారు; కానుకలిచ్చేవారు మీరే; దండిచేవారూ మీరే; మరి నన్ను ఉంచేస్తామని మీరు అన్నారూ అంటే, నేను ఉండిపోవాల్సిందే, నేను ఏమన్నా, ఏం చేసినా కార్యం ఉండదు. తన మనసులో ఉన్నది చెప్పగలిగే సామర్ధ్యం ఉండి ఉంటే ఇలా అని సెర్యోష జవాబు చెప్పి ఉండేవాడు.”
ఇంత వేదనను అనుభవించిన సెర్యోష కథ చివరికి ఊహించని మలుపు తిరిగి చదివినవారి హృదయాన్ని చాలా సున్నితంగా తాకుతుంది. ఒకవేళ ఎవరైనా ఈ పుస్తకాన్ని చదివి చివరలో కంటతడి పెట్టకుండా ఉన్నట్లయితే వారిని ఇక పుస్తకపఠనం ఆపేయమని శాపం ఇవ్వొచ్చు.

ఇంతేనా ఉన్నదీ నవలలో..కానేకాదు…కథకు మించిన పాత్రలు- పెద్దరికాన్ని చూపే వాస్య, కష్టాలు పడిన జేన్య, కుళ్లుబోతు లీద, పెద్దవాళ్ళ నీచబుద్ధికి ప్రతీక జేన్య పెద్దమ్మ, జైలు నుంచి విడుదలైవచ్చి సెర్యోష ఇంటి ఆతిధ్యాన్ని అందుకున్న అనుకోని అతిధి(ఇక్కడ సెర్యోష గమనించిన విషయాలని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి), వాస్య మావయ్య, ఆయన పచ్చబొట్లు, పచ్చబొట్ల కోసం పిల్లల తిప్పలు- ఇలా ఎన్నో పాత్రలతో తియ్యని సన్నివేశాలతో మధురంగా గడిచిపోతుందీ నవల.

*****************
ఇంకొకటి! ఎవరికైనా నేను ఈ పుస్తకం గురించి నేను న్యాయంగా రాయలేదు అనిపిస్తే దయచేసి బాధపడకండి. ఎందుకంటే, మీరనుకున్నది నిజమే కావొచ్చు! ఈ పుస్తకమే అంత అందమైంది! దీని గురించి నేను రాస్తానన్నప్పుడు, ఒక అమ్మాయి రాయోద్దనికుడా బ్రతిమాలింది. ఆమెకి భయం- అలా రాసి ఈ పుస్తకం లో అందమైన అనుభూతిని అందరికీ దగ్గరగాకుండా చేస్తానేమో అని. ఆమె బాధ చాలా న్యాయంగా అనిపించడమే కాదు, అలా బాధపడడం వల్ల ఆమె మీద ప్రేమ కూడా కలిగింది.
ఒక చిన్న నవలలా కనిపించే ఇంత చక్కని కథ రాసింది వి. పనోవ. పుస్తకం అట్ట వెనుక రాసినట్లు ‘ఈమె పేరు విదేశీయ పాఠకులకు సుపరిచితమే. ఆమెకు మూడుసార్లు రష్యన్ ప్రభుత్వ బహుమానం లభించింది. వేరా పనోవ నాలుగు పెద్ద నవలలని, ఐదునాటకాల్ని, ఎన్నో నవలికల్ని రాసింది. అన్నీ ప్రజాదరణ పొందాయి. వీటిలో అనేకం వెండితెర పై ప్రదర్శితమయాయి.’

ఈ రచయిత్రి రాసిన అత్యంత కవితాత్మకమైన కృతులలో ఒకటి- “పెద్ద ప్రపంచంలో చిన్నపిల్లడు.” దీని అనువాదం ఉప్పల లక్ష్మణరావు గారు చేసారు. ‘రాదుగ పబ్లికేషన్స్’ వారు ప్రచురించిన ఈ నవల మొదటి ముద్రణ 1968లో, రెండవ ముద్రణ 1987 లో అయింది. ప్రస్తుతానికి కాపీలు అందుబాటులో లేవు. మీరు నిజంగా చదవాలనుకుంటే మీకు తెలిసిన, పుస్తకాల పిచ్చి ముదిరిన మిత్రుల దగ్గర ఖచ్చితంగా దొరకొచ్చు – ముందు లేదని దబాయించినా కాళ్ళు పట్టుకొంటే మెత్తబడో, మొహమాటపడో ఒకసారి చదవడానికి ఇవ్వొచ్చు!

విజయీభవ!

 – అపర్ణ తోట

aparna

నా ఏకాంతక్షణాలు

PrasunaRavindran

బరువైన క్షణాల్ని మోసి అలసిన పగటిని జోల పాడి నిద్రపుచ్చాక, నా కోసం మాత్రమే ఓ రహస్య వసంతం మేల్కొంటుంది.

గుమ్మం దగ్గరే, కలలు కుట్టిన చీర కట్టి, నిద్ర వాకిలి తడుతున్నా, అక్షరాన్ని ఆప్యాయంగా తడుముకుని ఎన్నాళ్ళయిందోనని ఙ్ఞప్తికొచ్చాక, నా గది గవాక్షన్నే ముందుగా తెరుస్తాను.

వెన్నెల తివాచీలు పరుస్తూ చంద్రుడూ, పన్నీరు జల్లుతూ చల్ల గాలీ నా వెనుకే వస్తారు.

 

నా అడుగుల సవ్వడి వినపడగానే ఆ పూదోట మెల్లగా విచ్చుకుంటుంది.

ఎందుకో మరి, అలిగి విరిగి పడ్డ మబ్బు తునకలు, దారంతా కాళ్ళ కింద నలుగుతూ ఎదురుచూడని ఏ రాగాన్నో అస్పష్టంగా గుణుస్తున్నట్టున్నాయ్.

ఎప్పటి ఉద్వేగానికో ఇప్పుడు పదాల్ని సమకూర్చుకుంటూ ఇక్కడొక చలిమంట వెయ్యాలనుంది.  చీకటీ , నిశ్శబ్దం సంగమించే సమయం ఎంత అపురూపం?   కీచురాళ్ళ భాష తెలిస్తే రాయలేనన్ని పదాలు దొరికేవేమో.

182447_10152600304780363_1937093391_n

 

చంద్రుడినుంచి ఒకే ఒక్క కౌగిలి పుచ్చుకున్న స్ఫూర్తితో ఎక్కడున్నా వెలిపోయే మబ్బు తునకలాగో,

అడవి నుంచి ఒకే ఒక్క రంగుని తీసుకుని గాలిలో విలీనమవుతూ సాగిపోయే పాట లాగో

నువ్వన్న ఒకే ఒక్క మాట, కొన్ని వేల ప్రతిధ్వనులుగా విడిపోయి, వెచ్చటి ఊపిరి లోంచి బయటికొస్తూ అదో రకమైన మత్తులో నన్ను ఓలలాడించిన ఙ్ఞాపకమొకటి నా ముంగురులు సవరించి వెళ్ళిపోతుంది.

 

క్షణాలన్నీ నన్నే ఎత్తుకుని లాలించే ఈ అద్వితీయమైన ఏకాంతం కోసమే పగలంతా ఎదురు చూస్తాను.  కొన్ని అరుదైన పూరేకుల్ని దోసిట దొరకపుచ్చుకుని సంతృప్తిగా  నా గది గవాక్షం వైపు సాగిపోతాను.

     – ప్రసూన రవీంద్రన్

painting: Mandira Bhaduri

పేరు తెలియని పిల్లవాడు

the three dancers-picaso

 

యవ్వనం పొద్దుతిరుగుడు పువ్వులా విచ్చుకొని తలవాల్చింది
ముసలితనమేలేని మనసు విహరిస్తోంది ఆకాశంలో
అందని ఇంద్రధనుస్సు అందుకునేందుకు

తొలియవ్వన కాంతి మేనిపై తళతళలాడేవేళ
ఎందుకు సెలఏరులా తుళ్ళిపడతావో
పురివిప్పిన నెమలిలా పరవశంతో నర్తిస్తావో
మనసును గాలిపటంచేసి ఆకాశంలోకి ఎగురవేస్తావో
నువ్వెందుకు కిలకిలా నవ్వుతావో,
నీక్కూడాతెలియదు

ఒకానొక రాత్రి
సరుగుడు చెట్లపై కురిసి జారే ముత్యాల వానని
కిటికీలోంచి తొంగి చూసే వేళ
నీ చందమామ మోముకోసం
వీధిలైట్ల క్రీనీడకింద వానలో తడుస్తూ
పేరుతెలియని పడుచువాడు నిలబడతాడు
నీకోసం మాత్రమే  నిరీక్షించే
అతడికేసి నువు విసిరేసే జలతారు నవ్వుల్ని
అతడు వొడిసి పట్టుకుంటాడు

ఎన్నో ఏళ్ళు గడిచిపోయాక, వాన వెలిసిపోయాక కూడా
అతడావేళ నీలో రేపిన అలజడి
తొలకరివాన కురిసిన
ప్రతి వానాకాలంగుర్తుకొస్తుంది

ఎవరూలేని ఓ మునిమాపువేళ
అతడిచ్చిన సంపెంగెపూలను అందుకునేందుకు
చాచిన నీ చేతివేళ్ళకు తాకిన
అతడి తడబడిన స్పర్శ తాలూకు వెచ్చదనం
చలి రాత్రులలో కప్పుకున్న రజాయిలా ఇంకా హాయిగొలుపుతుంది

దాచుకున్న పూలువాడిపోయి
జీవితపు పుటల నుండి ఎక్కడో జారిపోతాయి
ఆ పూల కస్తూర పరిమళం మాత్రం
ఏకాంత వేళల్లో
ఏకతారను మీటుతూ మనసువాకిట నిలిచి నిన్ను దిగులుగా పలకరిస్తుంది

ముసలితనమేలేని మనసును కమ్ముకుంటుంది
అతడి ఙ్నాపకం ఆకాశంలా

ఆ పడుచువాడు మళ్ళీ ఎన్నడూ తారసపడకపోవచ్చు
లేదూ తారసపడ్డా, బహుషా అతడు నిన్ను,
నువ్వు అతడ్ని గుర్తించనట్లు వెళ్ళిపొయివుంటారు
అతడి కోసం ఎదురుచూడటం మరిచిపోయినందుకే కాబోలు
ఆ పడుచువాడు ఇంకా తాజా జ్నాపకంలా నీలో మిగిలివున్నాడు.

vimala1విమల
నవంబర్‌, 2013

వర్తమానంలో భవిత!

 

pictureచాలామంది అడుగుతుంటారు, ఫొటోగ్రఫి నేర్పమని!
నేర్చుకున్న వాళ్లూ అడుగుతుంటారు, మీరెందుకు తీస్తూ ఉంటారని!
నా సంగతీ సరేగానీ, ఎందుకు తీస్తున్నారో చెప్పే వాళ్లను మాత్రం నాకైతే ఒకటి అడగాలనిపిస్తుంది,మీరు తీసిన ఫొటోలేమిటీ? అని.
ఫోటో తీస్తూ తీస్తూ మీరు తీసిన ఫోటోలేమిటా అని!

ఈ రెండోది ముఖ్యమనే ఈ కథనం.

+++

అర్థమయ్యేలా చెప్పాలంటే మన కన్ను ఒకదానిపై పడుతుంది. తీయాలనిపిస్తుంది. తీస్తాం.
అదొక రకం.తర్వాత మనం తీయాలనుకున్న ఫొటో తీసేందుకు కెమెరా వ్యూ ఫైండర్లో కన్ను పెట్టి చూస్తాం, చూడండి.
అలా చూసినప్పుడు మనకు అంతకుముందు కనిపించనిది కనిపిస్తుంది. ఇక దాన్ని తీయాలన్పించి తీయడమూ ఉంటుంది. ఇది రెండో రకం.నా సోదరసోదరీమణులను అడగాలనిపిస్తుంది. ఈ రెండో రకం చిత్రాలెన్ని తీశారూ అని!
అలా తీసిన చిత్రాలు చూపరూ అని వారిని అభ్యర్తించాలనుకుంటూ ఉంటాను.

+++

ఇక నా విషయానికి వస్తే, ఈ చిత్రం కూడా అలాంటిదే.
కెమెరాలో కన్ను పెట్టాక తెలిసి తీసిన ఫొటో.

అవును. నిజానికి నేను ఫొటో తీయాలనుకున్నది ఇద్దరు శ్రామికులను.
కానీ తీసేప్పుడు తెలిసింది, వాడూ ఉన్నాడని.
అప్పుడు వాడిపై కన్ను పడి, వాడినే తీయాలనుకుని, వాళ్లనూ తీసినప్పటి చిత్రం ఇది.
అలా తీసిన ఫోటోనే మీరు చూస్తున్నది.

+++

మళ్లీ వెనక్కి వెళ్లి, తీసినప్పటి విషయం చెబితే…
ఫొటోలో ఉన్న బాబు. వాడిని నేను చూడనేలేదు. వాడికోసం ఏ మాత్రం తాపత్రయ పడనూ లేదు. కానీ, వాడు దొరికాడు.
ఆ ఫొటోలోని వాడిని పదే పదే చూడండి. నిమ్మళంగా తల్లి గొప్పదనమూ తెలుస్తుంది. ఆ తల్లి, ఆ తల్లి పక్కనున్న తల్లీ, వాళ్ల తలపై ఉన్న పనిముట్లూ, వాటి గొప్పదనమూ తెలుస్తుంది.
అదీగాక వాళ్లేదో సంభాషణలోనూ ఉన్నారని తెలుస్తుంది. కానీ నాకైతే వాడే గొప్పగా ఉన్నాడు.
శ్రమజీవుల కష్టసుఖాల్లో, పాలూ చెమటల్లోంచి ఉద్భవించిన ఒక నూతన మానవుడూ వాడే నని నా నిశ్చితాభిప్రాయం.
వర్తమానం మాత్రమే తీయాలనుకుని భవిష్యత్తూను చిత్రించిన సంబ్రమం ఈ ఛాయాచిత్రం అనుకుంటూ ఉంటాను.

+++

అయితే, నేను దించాలనుకున్నది వేరు.
సెక్రెటేరియేట్ దగ్గరున్న బస్టాండ్ దగ్గర దాకా వచ్చాక ఈ ఇద్దరు స్త్రీలను, నెత్తిపై తమ పనిముట్లతో చకచకా నడిచి పోతుంటే చూశాను.
చూస్తుండగానే వాళ్లు నన్ను దాటిపో్యారు.
నన్ను దాటిపోయాక నేనూ మరికొన్ని మైళ్లు దాటిపోయాను.
పోతూ ఉండగా మెల్లగా ‘నిర్ణయాత్మక క్షణం‘ …Decisive moment గురించిన ఎరుక యాదికి వచ్చింది.

అది ఆధునిక ఫొటో జర్నలిజం పితామహుడిగా భావించే Henri Cartier-Bresson  ఖాయం చేసిన ఒక ఒరవడి…పదబంధం. ఛాయచిత్రణంలో నిర్ణయాత్మక క్షణం గురించి…ఎంతో అప్రమత్తంగా ఉండి… లాఘవంగా బంధించే ఒకానొక అరుదైన క్షణం గురించిన ముచ్చట గుర్తుకు వచ్చింది.
బ్రెస్సెన్ గురించి చదవగా చదవగా ప్రతి ఛాయాచిత్రకారుడికి ఒక నిర్ణయాత్మక క్షణమైతే ఎదురవుతుంది. ఆ క్షణంలో అతడి స్పందన ఎటువంటిదీ అన్న విషయం స్ఫురించింది. అనుకోకుండా తారసపడ్డ ఆ లిప్తకు అనుగుణంగా స్పందించి దాన్ని చిత్రీకరిస్తాడా లేదా? అదే ముఖ్యం అన్న విషయం గుర్తొచ్చింది. కాలాతీతం కాకుండా తీశాడా…ఆలోచిస్తూ కూచున్నాడా అన్నది చాలా ముఖ్యం. అలా ఆ క్షణానికి అణుకువగా ఉన్నాడా లేదా పరధ్యాసలో ఉన్నాడా అన్నదే కీలకం. పట్టుకోకపోతే అది కదిలి మాయమైతుంది.

చలమో/ శ్రీశ్రీయో  కూడా వేరే సందర్భంలో అంటాడు…ఒక అపూర్వమైన క్షణం దృశ్యమానం చేయడంలో  ప్రకృతికీ తనకూ కుదిరే సమన్వయం వంటిదేదో అదే బ్రెస్సన్ చెప్పడమూ, ఆ విషయమే మళ్లీ అలవోకగా ఆ ఇద్దరు స్త్రీల మీదుగా నాకు గుర్తుకు రావడమూ అదృష్టమే అయింది. ఇక వేదన…నీకూ సమాజానికీ మధ్య తాదాత్మ్యతే అనుబంధమై చిత్రమయ్యే నిర్ణయాత్మక క్షణాల గురించిన చింతన మొదలైంది. ఇక మనసున పట్టలేదు. ఒకింత బాధకు గురయ్యాను. గుర్తు రావడమూ మొదలైంది. ఒకానొక రోజు…నేనైనా మరెవరైనా వారి వారి జీవన వ్యాపకాల్లో పూర్తిగా నిమగ్నమై ఉండగా ఎన్నిసార్లు ఫోటో తీయాలనిపిస్తుందో అన్ని సార్లు ఫొటో తీయగలగడం ఒక మహత్యం అన్న విషయమూ… ఆ నిర్ణయాత్మక క్షణంలోనిదే అన్న విషయమూ…ఇక ఆ ఎరుక నన్ను ముందుకు పోనీయలేదు. అప్పుడు ప్రసిద్ధ భారతీయ ఛాయాచిత్రకారుడు రఘురాయ్ గుర్తుకు రావడం నా వరకు నాకు యాదృచ్ఛికం కాదు. అవును మరి.  Decisive moment తాలూకు అనుభవైక వైద్యాన్ని నేను వారివద్దే గమనించాను.

+++

ఎప్పుడూ ఆయన తప్పిపోలేదు. ఆ ప్రసక్తే లేదు.
‘ఒక ఛాయ నిన్ను ‘దించు’ అని డిమాండ్ చేస్తుందా ఇక ఆ డిమాండ్ కు తలొగ్గాలి. అప్పుడే నువ్వు అదృష్టవంతుడివి. లేదంటే నువ్వు దుర్మార్డుడివి కూడా.’
– అవును. ప్రకృతి ప్రసాదించే భాగ్యాన్ని చేజేతులా జారవిడుచుకున్న అబాగ్యుడివే అవుతావు. అలా దురదృష్టవంతుడిగా మిగిలిపోని మహోన్నత ఛాయాచిత్రాకారుల్లో ఒకరే రఘురాయ్.
ఆయనెప్పుడూ అప్రమత్తుడే. ప్రకృతికి విధేయుడే…అది చెప్పినట్టు నడుచుకునే తాను అంతటి భాగ్యవంతుడయ్యాడు.

నమ్మతారో లేదోగానీ, అతడు ఫోటోలు తీయడు. He never captured pictures. Picture captures him.
ఆ సంగతిని సన్నిహితంగా చూశాక నా అదృష్టాన్ని నేను పరీక్షించుకోవడమూ మొదలెట్టాను.

+++

అయితే, ఎందుకో ఏమో ఫలనాది కనిపిస్తుంది. ఫొటో తీయబుద్ధి అవుతుంది. తీస్తుంటాను.
రీజనింగును వదిలిపెట్టడమే ఛాయాచిత్రణం. బుద్ధికి పదును పెట్టకపోపవడమే ఆ మహోన్నత కార్యం.
అయినా, మనసు చెప్పినా కూడా, ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా రోజుకు నాలుగైదు బొమ్మలను మిస్ అవుతూనే ఉంటాను. అంటే నేను నూటికి నాలుగైదే శాతం అజాగ్రత్తపరుడిని అని అర్థమౌతోంది. ఇప్పుడు కూడా…ఈ ఇద్దరు స్త్రీలు తమ తోవలో తాము నడుచుకుంటూ వెళుతుంటే వాళ్లను గమనించి, స్పందించి కూడా నా తోవలో నేను పోవడం అంటే దుర్మార్గం అని భావించాను. అంత అజాగ్రత్త పనికిరాదన్న స్పృహ కలిగింది. ఇక వెంటనే బండి వెనక్కి తిప్పాను ఒక చోట సైడ్ స్టాండ్ వేశాను. బ్యాగులోంచి కెమెరా తీశాను. వాళ్లు నా ముందు నుంచి వెళ్లేదాకా కెమెరాను క్లిక్ మనిపిస్తూనే ఉన్నాను.

తీస్తూ ఉండగా అప్పుడు చూశాను, ఆ బాబును!
క్షణంలో నిర్ణయమైంది, వాడే నన్ను పిలుస్తున్నాడని!
ఇక అదీ మొదలు… వాడిని వదిలిపెట్టలేదు.
వాడిని ఎన్ని విధాలా ఆ తల్లి చంకలో ఉండగా తీశానో…లెక్కలేదు.

శ్రమజీవుల సన్నిధిలో భద్రంగా రూపొందుతున్న భవితకు రూపం వాడు.
ఆ బాలుడికి, వాడి బాల్యానికి నేను బందీ అయిన అపూర్వ నిర్ణయాత్మక క్షణాల్లో ఒకానొక లిప్త, మీ కోసం!

+++

మొత్తంగా కృతజ్ఞుణ్ని…
ముందు బ్రెస్సెన్ తాతకి… అటు తర్వాత తల్లులకూ బిడ్డలకూ…
మీది మిక్కిలి.. నాకు వ్యూ ఫైండర్లో కన్ను పెట్టి చూడాలని చెప్పిన రఘరాయ్ కి!

~ కందుకూరి రమేష్ బాబు

వీలునామా- 23వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

హేరియట్ మనసు దోచిన ఫ్రాన్సిస్

హేరియట్ చుట్టూ చాలా మంది ఆడా మగా స్నేహితులున్నా, ఆమెని నిజంగా ఆరాధించి అభిమానించిన మగవాళ్ళు లేరు. అయితే దీనికి తన గొప్పతనమే కారణమన్నది ఆమె ప్రగాఢ అభిప్రాయం.  తమ కుటుబం గొప్పతనమూ, తన అందచందాలూ, తెలివి తేటలూ చూసి మగవాళ్ళు భయపడి పోతున్నారన్న ఆలోచన ఆమె అహంకారాన్నెంతో తృప్తి పరచింది.

స్వతహాగా ఆమె తెలివైనదే. అయితే ఆమె ఆలోచనల వైశాల్యం చాలా చిన్నది. తనకి తెలిసిన విషయాలూ, తనకి ఆసక్తికరమైన విషయాలు మాత్రమే ప్రపంచానికంతటికీ నచ్చాల్సిన విషయాలన్నది ఆమె నమ్మకం. ఇంకా చెప్పాలంటే తనకి తెలియని విషయాలకి ప్రపంచంలోనే ఏ విలువా ఉండదనుకుంటుంది ఆమె. ఆత్మ విశ్వాసం మంచిదే. అయితే ఆత్మ విశ్వాసానికీ, అహంకారానికీ మధ్య వుండే గీత చాలా సన్నది.

బ్రాండన్ హేరియట్ గురించి తన సొంత అభిప్రాయం కంటే ఆమె అభిప్రాయాన్నే నమ్మాడు. అందుకే తన కంటే ఆమె ఎంతో గొప్పదనీ, సాంఘికంగా, ఆర్థికంగా తన కంటే ఆమె ఎన్నో మెట్లు పైనుందని అనుకున్నాడు. హేరియట్ కి అతని పట్ల గొప్ప గౌరవమేమీ లేకున్నా, అతనికి తన పట్ల వున్న గౌరవమూ, పది మందిలో అతను తన మీద ప్రకటించే అభిమానమూ నచ్చాయి.

ఎలాగూ ఎవరో ఒకరిని పెళ్ళాడక తప్పదు. అతను ఎటూ ఇంగ్లండులోనే వుండబోతున్నాడు కాబట్టి అతన్ని పెళ్ళాడడంలో తనకేమీ నష్టం వుండదని భావించింది హేరియట్. అప్పుడప్పుడూ విక్టోరియాకి తిరిగి వెళ్తానని అంటూ వుంటాడు కానీ, అదంతా తను ఎటూ పడనివ్వదు. తన మాట సాగించుకోవడం ఎలాగో తనకి బాగా తెలుసు. కాబట్టి బ్రాండన్ తో పెళ్ళికి అన్ని విధాలా సిధ్ధమయింది హేరియట్.

అయినా సరే, ఈ హొగార్త్ గారినీ తన ఆరాధకులలో ఒకరిగా చేర్చుకోక తప్పదనుకుంది. బ్రాండన్ అతని గురించి మాట్లాడుతూ, “అచ్చం నీలాటి వాడే” అన్నాడు. నిజంగానా? అయితే తన గురించేమనుకుంటాడు? ఈ రోజు తన అలంకరణా, వాక్చాతుర్యాలతో అతన్ని మంత్రించి వేస్తాను, అనుకుంది. అది చూసి బ్రాండన్ కొంచెం ఉడుక్కుంటాడేమో! ఉడుక్కోనీ, అదీ కొంచెం సరదాగానే వుంటుంది, అని సరిపెట్టుకుంది. స్త్రీ సహజమైన సానుభూతీ, ఆలోచనా ఆమెకుండినట్టయితే అప్పటికే బ్రాండన్ తన ప్రవర్తన పట్ల కొంచెం చిరాగ్గా వున్నాడనీ,  కాబోయే  భర్తని కొంచెం శాంత పర్చాలనీ ఆమెకి తట్టి వుండేది. తనేసుకున్న కొత్త చెప్పులు ఎక్కడ కరుస్తున్నాయో చెప్పలేని మనిషిలా, ఆమె తన ప్రేమికుడు అప్పటికే దూరమవుతున్నాడని గ్రహించలేక అతన్ని ఇంకా  దూరం చేసుకుంది.

ఆ రోజు సాయంత్రం ఆమె హొగార్త్ తో చాలా చనువుగా మాట్లాడింది. మాట్లాడే ప్రతీ విషయంలోనూ బ్రాండన్ కేమాత్రం తెలియని విషయాలే ఎన్నుకుంది. అతన్ని ఉడికించి అతను ఈర్ష్య పడుతూంటే చూసి సరదాగా నవ్వుకోవచ్చనుకుంది. అయితే జరిగింది వేరొకటి.

బ్రాండన్ కెందుకో తనని చుట్టుకున్న సంకెళ్ళు- అవి ప్రేమ సంకెళ్ళు కావు, తను అలవాటు చొప్పున తగిలించుకున్న మొహమాటపు సంకెళ్ళు, వాటంతట అవే విడిపోతున్నట్టు భావించాడు. అతని మన్సులో యే మూలో హేరియట్ పట్ల వున్న అభిమానం తుడిచి పెట్టుకుపోయింది. ఆవేళ అతను తనకీ ఫ్రాన్సిస్ కీ మధ్య హేరియట్ కాకుండా ఎల్సీ కూర్చుని వుంటే ఇంకాస్త హాయిగా గడిచి వుండేదనుకున్నాడు.

ఎల్సీ ఎక్కడుందా అని వెతికాడు. ఆమె ఫ్రాన్సిస్ కటువైపు, ఇంకొక ఆస్ట్రేలియన్ అతనికీ మధ్య కూర్చుని వుంది. అతనేదో చెప్తున్నట్టున్నాడు, శ్రధ్ధగా వింటూ, మధ్య మధ్య  లోగొంతుకతో ఏదో అంటూంది.

అతనికి వున్నట్టుండి రెన్నీ గారింట్లో జరిగిన విందు గుర్తొచ్చింది. ఆ రోజు ఎంత సంతోషంగా గడిచింది! అతను నిట్టూర్చాడు. అతని చూపులు పదే పదే ఎల్సీ వైపు పరిగెత్తడం హేరియట్ పసిగట్టింది. వెంటనే తనూ ఆ సంభాషణలోకి దూకింది.

“మీరెన్నైనా చెప్పండి మిస్టర్ డెంస్టర్!  ఈ ఆత్మలూ వాటితో మాట్లాడడం వంటి విషయాలు నేను చచ్చినా నమ్మను. నేను ఈ కాలపు సైన్సు మనిషిని.”

“సైన్సు మాట నిజమే అయినా నేను నా కళ్ళతో చూసిందాన్ని అబధ్ధమంటే ఎలాగండీ? ఆ మాటకొస్తే సైన్సు వివరించలేని విషయాలూ చాలానే వున్నాయి. అందువల్ల మొత్తం సైన్సునే తప్పు పట్టలేం కదా?” అన్నాడు సదరు డెంస్టర్ అనునయంగా.

“నిజమో అబధ్ధమో మాట అటుంచండి. ఇలా ఆత్మలతో సంభాషణవల్ల మీకేం ప్రయోజనం?” కుతూహలంగా అడిగింది జేన్.

” చాలా ప్రయోజనాలున్నాయి మేడం! ముందుగా మన కళ్ళతో చూసి, మన అనుభవంలోకి వచ్చేది మాత్రమే కాక ఆ బయట కూడా పెద్ద ప్రపంచం వుందన్న నా నమ్మకం బల పడుతుంది. దాంతో సంకుచిత దృష్టి తగ్గుతుంది. నిజంగా మనల్ని భౌతికంగా వదిలి వెళ్ళిపోయిన ఆత్మీయుల బాగోగులు తెలుస్తాయి. మనిషి పోగానే మరిచి పోలేం కదా? భౌతికంగా శరీరం కృశించి నశించినా ఆ జీవ శక్తి మిగతా పదార్థాలలోనో, ప్రకృతిలోనో వచ్చి చేరుతుందన్నది నా విశ్వాసం. ఆ జీవ శక్తికి మరణం లేదు. నేను సంభాషించేది ఆ జీవ శక్తితోనే.”

అతన్ని మధ్యలోనే ఆపింది హేరియట్.

veelunama11

“ఆగండాగండి! ఇప్పుడు మనిషీ మరణించక్కర్లేదంటున్నది సైన్సు.మానవుని ఆయు ప్రమాణాలని ఎంత వరకైనా పొడిగించవచ్చంటున్నారు వైద్యులు. అందుకే నాకు భౌతిక ప్రపంచం గురించిన విషయాల్లో సైన్సుని నమ్మి, ఆధ్యాత్మిక విషయాలకి బైబిలు ని సంప్రదిస్తే సరిపోతుందనిపిస్తుంది. మీకది సరిపోక కుర్చీలూ టేబుళ్ళూ వుపయోగించి ఆత్మలతో మాట్లాడుతున్నాననుకుంటున్నారు.” హేళనగా అంది.

“బైబిలు మానవుని మరణాంతర జీవితం గురించి కొంచెం గజిబిజిగా వుందనిపిస్తోంది. అసలు నిజానికి, మానవుని కి ఎడతెగని ఆయు ప్రమాణం అవసరమంటారా? నాకా ఆలోచనే అంత గొప్పగా అనిపించదు. భూమ్మీదకి వచ్చి తగినంత కాలం జీవితాన్ననుభవించాక భగవంతుని చేరుకోవడంలో ఎంతటి హుందాతనమూ, నిరంతర ప్రవాహ ధర్మమూ వున్నాయి? ఎల్ల కాలం భూమ్మీదనే వుండి మనం మాత్రం బావుకునేదేముంది?”

“మానవుని మరణాంతర జీవితం గురించి బైబిలు కావాలనే కొంచెం సందిగ్దంగా వుంటుందేమో.  ప్రతీ మనిషీ తనదైన స్వర్గాన్ని ఊహించుకుంటాడు. అలాటప్పుడు అందరికీ కలిపి ఒకే రకమైన స్వర్గ నరకాల గురించీ చెప్పడం కష్టం కదా? అందువల్లనేమో. అయితే స్వర్గంలోనైనా మనిషికి ఙ్ఞాపకాలూ, తాను అన్న భావనా వుంటే బాగుంటుంది. అవి లేనప్పుడు ఏ స్వర్గమైనా మనిషికి ఒరగబెట్టేదేం వుండదు.” అన్నది ఎల్సీ తన అభిప్రాయం చెప్తూ.

“నాకూ ఈ విషయాల గురించి మొదట్లో ఏమీ తెలిసేది కాదు. ఆత్మలతో సంభాషించిన తర్వాతే నాకు మరణానంతర జీవితం గురించీ, స్వర్గ నరకాల గురించీ, దేవుని గురించీ, నిరంతరంగా ప్రవహంచే ప్రేమ గురించీ అవగాహన ఏర్పడింది,” అన్నాడు డెంస్టర్.

“కళ్ళతో చూస్తేనే నమ్ముతానంటే అది నమ్మకమే కాదు, అన్నాడు సెయింట్ పాల్. బహుశా స్వర్గ నరకాల గురించి ఆలోచనా, ఆత్మల గురించిన పరిఙ్ఞానమూ మనిషికి ఒక భద్రత కలిగిస్తాయి కాబోలు. అందరికీ ఆ భద్రత అవసరమనిపించదు. కొందరికి అవసరమనిపిస్తుంది. అంతే, ” అన్నాడు ఫ్రాన్సిస్ తేల్చేస్తూ.

” అసలు మీరందరూ ఒక సారి నాతో ఒక సియాన్స్ సెషన్ కు వస్తే బాగుంటుంది. మీరూ కళ్ళారా చూడొచ్చు,” అన్నాడు డెంస్టర్.

“నేను తప్పక వచ్చి చూస్తాను,” ఉత్సాహంగా అంది లిల్లీ ఫిలిప్స్.

“నేను చచ్చినా రాను,” ఖచ్చితంగా అంది హేరియట్.

“నాకెందుకో ఇలాటి వాటి మీద పెద్ద ఆసక్తి లేదు. నేను రాలేను,” అన్నాడు స్టాన్లీ ఫిలిప్స్.

“నేనూ రాలేను. ఎల్సీ చెప్పినట్టు ఎవరి స్వర్గం వారిది. ఎప్పుడో జరగబోయే దాని గురించీ, మన చేతిలో లేని దాని గురించీ ఆలోచనలతో ప్రయోజనం ఏముంది?” అన్నాడు బ్రాండన్.

సాధారణంగా ఏ విషయం గురించి ఎలాటి అభిప్రాయమూ చెప్పని బ్రాండన్ ఆ రోజు అభిప్రాయం చెప్పడమే కాక, ఎల్సీ అభిప్రాయాన్ని బలపర్చడం హేరియట్ కి చిర్రెత్తించింది.

ఫ్రాన్సిస్ మాత్రం తనతో వెళ్ళడానికి ఒప్పుకునే వరకూ డెంస్టర్ వదల్లేదు.

జేన్ పిల్లల్ని పడుకోబెట్టడానికి వెళ్ళిపోయింది. ఎల్సీ గదిలోకి వెళ్ళి లిల్లీ ఫిలిప్స్ కొరకు మొదలు పెట్ట్టిన టోపీ పుర్తి చేసింది. వాళ్ళిద్దరూ మళ్ళీ కిందికొచ్చేసరికి ఇంకా అంతా కబుర్లలోనే వున్నారు.  ఎల్సీ మర్నాడు తెల్ల వారు ఝామునే లేచి హేరియట్ టోపీ కూడా పూర్తి చేసేద్దామనుకొంది. నిజంగానే వదిన గారు అందమైన బోనెట్ పెట్టుకొని, తాను పాతది పెట్టుకొని మొహం చిన్న బుచ్చుకుంటే ఏం బాగుంటుంది!

ఆ నిశ్చయంతో ఎల్సీ వచ్చి సంతోషంగా అందరూ పాటలు పాడుతుంటే వింటూ కూర్చుంది. తన టోపీ పని చేయకుండా ఆట పాటలతో కాలం వెళ్ళ బుచ్చుతోందని హేరియట్ ఉడుక్కుంది.

ఆ రాత్రి హేరియట్ పొద్దు పోయేవరకూ అందరి ఆనందం కోసం పియానో వాయిస్తూ పాటలు పాడింది. హేరియట్ కి చక్కటి కంఠమూ, మంచి పరిఙ్ఞానమూ వుండడం వల్ల పాటలు చాలా రక్తి కట్టాయి. హేరియట్, జార్జియానా, ఇద్దరక్కచెల్లెళ్ళల్లోనూ, డాక్టరు గారికి హేరియట్ అంటేనే ప్రీతి ఎక్కువ, బహుశా సంగీతం వల్లనే కాబోలు. స్టాన్లీకి కూడా చెల్లెలి పాటంటే చాల ఇష్టం. ఇలా ఇంట్లో నలుగురూ భోంచేసింతరవాత ఆమె కూర్చుని అందరి మధ్యా పాడుతూంటే ఇంకా ఇష్టం. తన భార్యకి కూడా కొంచెం సంగీతం చెప్పించాలని ప్రయత్నించాడు కానీ, లిల్లీకి సంగీతం అబ్బలేదు. అయితే స్టాన్లీ పెద్ద కూతురు ఎమిలీ మాత్రం మళ్ళీ చక్కగా పాడగలదు. అందుకే ఇప్పుడు కూతురికి శ్రధ్ధగా సంగీతం చెప్పిస్తున్నాడు స్టాన్లీ.

అందుకే ఆ రాత్రి పిల్లలతో పాటు పడుకోకుండా ఎమిలీ పెద్దలతో కూర్చుని పాటలు పాడింది. అందరూ తెలిసిన వారి మధ్య రెండు మూడు సార్లు పాడితే గానీ ధైర్యం రాదు మరి, అంది లిల్లీ ఫిలిప్స్.

“ఎమిలికి ధైర్యం లేకపోవడమేమిటి, విచిత్రం కాకపోతే! కాలనీల్లో ప్రకృతి మధ్య పెరిగే పిల్లల్లో చాలా ధైర్య సాహసాలుంటాయి. ఇక్కడ ఇంగ్లండులో సురక్షితంగా ఎరిగే అమ్మకూచిల్లా కాదు! ” వేళాకోళంగా పక్కనే కూర్చున్న ఎల్సీతో మెల్లిగా అన్నాడు బ్రాండన్.

“నాకు ఎమిలీ అంటే చాలా ఇష్టం. ధైర్యమే కాకుండా విషయాలని చాలా త్వరగా గ్రహించగలదు. అన్నిటికంటే, నేనంటే తనకి చాలా ఇష్టం. నాకేమో నన్నిష్టపడే చిన్న పిల్లలంటే ఇష్టం,” నవ్వుతూ అంది ఎల్సీ.

“అలాగా? మరి నిన్నిష్టపడే పెద్ద వాళ్ళ మీద నీ అభిప్రాయం ఏమిటి?” ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు బ్రాండన్. సిగ్గుతో మొహం ఎర్రబడింది ఎల్సీకి.

“ఎల్సీ! అత్త పాట  ఆపింతరవాత నువ్వొక పాట పాడాలి. నీ పాటలో చక్కగా అన్ని పదాలూ వినిపిస్తాయి నాకు,” అంది ఎమిలీ ఎల్సీ తో.

“నాకసలు కొంచెం కూడా పాట రాదు. దానికి తోడు నేనొక్కసారి కూడా సంగీతం క్లాసులకి వెళ్ళలేదు. ఇప్పుడు నేను పాటెత్తుకుంటే..”

“అంతా వుత్తదే బ్రాండన్. ఎల్సీ చక్కగా పాడుతుంది. అందులోనూ ఊరికే క్లాసులో చెప్పే పాటలు కాకుండా, కొన్నిసార్లు కవితలూ కథలూ కూడా పాటల్లా పాడి వినిపిస్తుంది.” ఎమిలీ చెప్పింది.

“ఆహా! ఎమిలీ ఇవాళ ఎల్సీ రహస్యం బయట పెట్టేసింది. ఇహ పాడేయి ఎల్సీ!” బ్రాండన్ ఉత్సాహంగా అన్నాడు.

“ఇది మరీ చోద్యంగా ఉంది. నా పాట నేనూ, లేదా చిన్న పిల్లలు తప్ప ఇంకెవరూ వినలేరు. అర్థం చేసుకోండి.”

“అరెరే! నువ్వు నన్ను సరిగ్గా అర్ర్థం చేసుకోలేదు ఎల్సీ. నేను చిన్న పిల్లలల్లోకే చిన్న పిల్లాణ్ణి. ఇంతవరకూ నేను ఒక్కరి పాటను కూడా విమర్శించలేదంటే నమ్ము.”

“ఏం వాగుడు కాయవే నువ్వు! పాట శ్రధ్ధగా వింటూ కుదురుగా కూర్చోలేవు. అయినా ఇంత రాత్రి పడుకోకుండా పెద్దవాళ్ళతో నీకేం మాటలు?” పాట ముగించి కోపంగా మేనకోడలితో అంది హేరియట్.

“ఇవాళా నాన్న గారు నన్ను రాత్రి పది వరకూ మేలుకోవచ్చని అన్నారు. అయినా మేమిద్దరం ఏదో పాత ఆస్ట్రేలియా రోజుల గురించి మాట్లాడుకుంటూన్నాం, నీకెందుకు?”

“వేలెడు లేవు, నీకు పాత రోజుల ఙ్ఞాపకాలా?”

“అవును! మా ఇంట్లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది తెలుసా. అప్పుడు ఈ బ్రాండన్, ఇంకా పెగ్గీ మమ్మల్ని కాపాడారు. కదూ బ్రాండన్?”

“చాల్లే వూరుకో! ఇంటి పక్కనే వున్నా కాబట్టి పరిగెత్తుకొచ్చా. ఇప్పుడా సంగతులెండుకు, పోనీలే!” బ్రాండన్ కొట్టిపారేసాడు.

“కాదు కాదు! చేయంతా బాగా కాలి పెద్ద మచ్చ కూడా పడింది. చూపించు బ్రాండన్,” ఎమిలీ గోల చేసింది. షర్టు చేతులు పైకి మడిచి పెద్ద మచ్చని చూపించే వరకూ వదల్లేదు.

ఇంగ్లండు మర్యాదస్తుల ఇంట్లో అడవాళ్ళముందు షర్టు చేతులు పైకి మడవడం ఏమిటి! ఈ ఆస్ట్రేలియన్లకి మంచీ మర్యాదా తెలియదు, విసుక్కుంది హేరియట్. అదే ఫ్రాన్సిస్ గారు, ఎంత మర్యాదా, హుందా తనమూ, నెమ్మదీ! ఎంతైనా ఇంగ్లండులో వుండేవాళ్ళ నాజూకు ఆస్ట్రేలియాలో పొదల మధ్య తిరిగే మొరటు మనుషులకుంటుందా! తన పాటని మర్యాదగా విన్నాడు, పక్కవాళ్ళతో కబుర్లేసుకోకుండా. పాటని మెచ్చుకున్నాడు కూడా.. మర్నాడు తనని ఒక చిత్ర కళా ప్రదర్శనకి తీసికెళ్తానన్నాడు కూడా! ఆ ప్రదర్శనకి వెళ్ళేటప్పుడు పెట్టుకోవడానికి తన టోపీ ఎల్సీ పూర్తి చేస్తుందోలేదో నన్న ఆందోళన ఒక్కటే మిగిలిపోయింది ఆమెకి ఆ రాత్రి.

***

(సశేషం)