Archives for September 2013

గద్దరన్న చుట్టూ నా కెమెరా కన్ను…!

desktop gaddar(1)

 

1.

తారీఖులూ, దస్తావేజులూ సరిగ్గా గుర్తులేవు కానీ, దాదాపు ఓ మూడు దశాబ్దాల క్రితం అనుకుంటాను. హైద్రాబాద్

“మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్”లో మూడు రోజుల పాటు AJLRC మహాసభలు  జరిగాయి. దేశం నలుమూలల నుండి వచ్చిన కళాకారులు, వక్తలు, ఎర్రజండాల రెపరెపల్తో హాలు  హాలంతా హోరెత్తి ఎర్ర్ర సముద్రంగా మారింది. ఆ మూడు రోజులూ పాటలు, వుపన్యాసాలు వింటూ, ఫోటోలు తీస్తూ తలమునకలుగా వుండేవాణ్ణి.

2.

చివరి రోజు లాంగ్ మార్చ్‌లా హాలునుండి చార్మినార్ ఓల్డ్ సిటీ వరకు ఊరేగింపు. అక్కడ ముగింపు సభ. దారి పొడవునా పాటలు, డప్పుల చప్పుళ్ళు, వివిధ కళాకారుల జానపద నృత్యాలు. అది నిజంగా ఒళ్ళు జలదరింపజేసే ఎర్రమైలు రాయి ఊరేగింపు! గద్దర్ ఆట పాట, మాట మీదనే నా కెమరా కన్ను గురి ఎప్పుడూనూ! అంతలా అతని చుట్టే పరిభ్రమిస్తుండేది నా చూపెప్పుడూనూ.

3.

సభను ప్రారంభిస్తూ గద్దర్ “వూరు మనదిరా.. ఈ వాడ మనదిరా” అంటూ పాడి ప్రకంపనలు రేపుతూ తెరమరుగయ్యాడు. గద్దర్‌ని వెతుకుతూ నేను సభాస్థలి వెనుక భాగంలో కనిపించాడు. ఆకలిమీద వున్నాడేమో. విమలక్క (గద్దరన్న జీవిత సహచరి) వెంకటాపురం నుంచి తెచ్చిన వేడి వేడి అన్నం, పప్పుచారు  కలుపుకొని తింటూ కనిపించాడు. ఓల్డ్ సిటీ కదా.. మీటింగ్ వెనకవైపు కాబట్టి అక్కడ అట్టే వెలుతురు సౌకర్యం లేదు. అవి డిసెంబర్ మాసపు దీర్ఘ చలిరాత్రుల రోజులనుకుంటాను. మసక చీకటి. తను కూచుని తింటున్న గోడ చారికలతో పాకురు పట్టి ఉంది. కింద కాళ్ల దగ్గర రాళ్లు, రప్పలు. గడ్డి విపరీతంగా పెరిగి వుంది. పైన వెన్నెల పుచ్చపువ్వులా కాచిలేదు కాని మసక మసకగా వుంది.

నేనా ప్రదేశం చూడగానే నాకు అడవిలో అన్నలకు ఆప్యాయంగా అక్కలు, తల్లులు, చెళ్ళెళ్ళు, సహచరులు తమ ఇంట్లో కలిగింది ప్రేమతో పంచుతున్నట్టు అనిపించింది. విమలక్క కూడా ఖద్దరు గళ్ళ ముతక చీర ధరించి వుంది. నాకు వెంటనే వాళ్ల ఫోటో మనసు రెటీనా మీద ముద్ర వేసుకుపోయింది. అన్నలు తుపాకి సరి చేసుకుంటున్నట్టు, వెంటనే నేను నా Pentax K 1000 ని క్లియర్ చేయబోతే (ఇప్పటిలా అవి ఆటోస్టార్త్ కాదు) నాకు ఏదీ సరిగ్గా కనిపించలేదు. ఫోటో బ్లర్‌గా  బావోదు కదా! వెంటనే నాకు ఆశాకిరణంలా గద్దర్ కట్టుకున్న తెల్లని పంచె అంచు కనిపించింది. దాని మీద క్లియర్ చేసుకుని బుల్లెట్‌లా క్లిక్‌మనిపించాను. అంతే! ఎగిసి  పడుతున్న నా గుండె చప్పుళ్ళు, గద్దరన్న గుండె చప్పుళ్ళతో మమేకమైనట్టు అనిపించి ఊరట చెందాను. గద్దర్, విమలక్కలు ఫ్లాష్ లైట్ పడగానే తలపైకెత్తి చూసి నవ్వారు. కించిత్ ఆశ్చర్యంతో.

4

నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని కితాబు ఇక్కడ తప్పక చెప్పాలి. అప్పుడే ఎందుకో ఆర్. నారాయణమూర్తిగారు (సినిమా డైరెక్టర్, నిర్మాత, నటుడూ) నా వెనకాల నేను పడుతున్న తపనను గమనిస్తూ నించున్నారు. ఫోటో తీయగానే నన్ను భుజం తడుతూ గట్టిగా కౌగలించుకొని “చాలా మంచి ఫోటో తీసావ్ తమ్ముడు! అడవిలో అన్నలకు అక్కలు ఆప్యాయంగా తినిపిస్తున్నట్టు వుంది. పాకురు పట్టి వున్న ఆ గోడ, నాచు అవీనూ!  మనసు కదిలింది. బావుంది” అన్నారు.

“నా మనసులో కూడా అదే భావన కలిగి తీసాను సార్” అని నేనంటే.  “మనం కళాకారులం కదా. అలాగే ఉంటుంది. నువ్వు కెమెరా కవిలా వున్నావు తమ్ముడూ. ఆల్ ది బెస్ట్” అంటూ వెళ్లిపోయారు.

5

దరిమిలా, ఆ ఫోటో ఒకటి పెద్దది చేయించి లామినేషన్‌తో గద్దరన్నకు ఇస్తే తన ఆఫీసు హాల్లో పెట్టుకున్నాడు. అన్ని ఇంటర్వ్యూల్లో ఆ ఫోటో కనపడినప్పుడు నాకు చాలా సంతోషం, తృప్తి కలిగేది

5

తర్వాత కొన్నాళ్లకు గద్దరన్న మీద ఓ సారి చంద్రబాబు హయాంలో కాల్పులు జరిగాయి. సరే తను బ్రతికి బయటపడ్డం. అదో చరిత్ర… కొంతకాలం తర్వాత పెద్ద ఎత్తున సికిందరాబాదు ‘హరిహర కళాభవన్’ లో ఆటా, పాట, మాట బంద్. కళలకు, గళాలకు సంకెళ్ళు” అంటూ పెద్ద సభ జరిగింది. అందరు ఫోటోగ్రాఫర్స్‌ని వెళ్ళనివ్వడం లేదు. Pressని తప్ప. సో అలా అని నేను బయటే వుండిపోయాను. Surprisingగా గద్దరన్న అబ్బాయి వచ్చి “నాన్న మిమ్మల్ని కెమెరాతో తీసుకురమ్మన్నాడు” అంటూ లోపలికి తీసుకువెళ్ళాడు. “అదీ, గద్దరన్నకు నా మీద వున్న గురి!” అని మనసులో పులకించిపోయాను.

ఒకసారి ఏదో ఒక పత్రికకు ఆ ఫోటో ఇస్తే వ్యాసంతో పాటు వేసారు. అవుతే కంపోజర్‌కు Photo Importance  తెలియక విమలక్కను కట్ చేసి  గద్దరన్న ఫోటోనే వేసాడు. ఎందుకు లేనిపోని Importance ఆమెకి ఇవ్వడం అని. కాని ఆమె గద్దరన్న సహచరి అని అతనికి తెలియదు కదా! ఎడిటర్‌గారూ, ఆర్టికల్ రాసిన జర్నలిస్టూ, నేను చాలా బాధపడ్డాం అలా జరిగినందుకు.

గద్దరన్న కూడా ఓ సారి అననే అన్నాడు. “ఏందిరా తమ్మి! అట్ల చేసిండ్రు?” అని.

 

– భాస్కర్ కూరపాటి

భాస్కర్ కూరపాటి

భాస్కర్ కూరపాటి

 

 

ప్రేమరాగం వింటావా!

kumar raja copy

“వర్షాకాలం వచ్చేస్తోంది! ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కేరళ ప్రవేశించాయి . ఏరోజెైయినా, ఏ క్షణంలో అయినా మన నగరం లో ప్రవేశిస్తాయి” అని పేపర్లూ, టివీలు ఉదారగొట్టేస్తున్నాయి. జనం ఈ వేసవి ఏoడలు మరీ విపరీతం గా వున్నాయని చాలా అసహనంగా  వాపోతున్నారు.  దీనికి తగట్టు నీటి కొరత , కరెంట్ కట్టు, ఉక్కపోత  ఇక వీరి పాట్లు ఏమని చెప్పాలి ? అందుకే “వర్షాలు వచ్చేస్తున్నాయి” అనే వార్త కొచెం ఆనందాన్ని ఇస్తోంది. కానీ టివిల విపరీత ప్రచారం కొంచెం ఎబ్బెట్టుగా వుంది . ఇప్పుడు రుతుపవనాల ప్రభావం వల్ల చల్లగాలులు వీస్తున్నాయి . రాబోయే వర్షాన్ని అవి భరోసా ఇస్తున్నాయి.

అతనికి హైదరాబాద్ కొత్తేమికాదు. ఇంజనీరింగ్ ఇక్కడే చేసాడు. ట్రైనింగ్,ఉద్యోగాల కోసం వేరే నగరాలన్నీ తిరిగి మరల యిక్కడకు చేరుకొన్నాడు. చాలా రోజులు తరువాత సాయంత్రం నడకకోసం ఇలా పార్కుకు వచ్చాడు. చల్లగాలికి చెట్లన్నీ తలలు ఊపుతున్నయి, వర్షం రాకకోసం స్వాగతం పలుకుతున్నట్లు ఉంది. అతను నాలుగు  రౌండ్లు పాత్ వే  ఫై నడిచిన తరువాత,  ఎక్కడయినా కూర్చోవాలని బెంచీల కోసం వెతుకుతున్నాడు. ప్రేమికుల జంటలు చాలా కనిపిస్తున్నాయి. వాళ్ళ కళ్ళల్లో ఆనందం. మరికొంత మంది జంటలు భయం గా నడిచి వచ్చే వారి వైపు బెదురు చూపులు  చూస్తున్నారు. ఎవరైన తెలుసున్నవాళ్ళు కనిపిస్తారేమో అని భయం. కొందరైతే ఈలోకంలోనే లేరు, కలలలో తేలుతున్నారు.  ఇంతలో అదిగో ఆ మోదుగుపూల చెట్టు కింద బెంచీ కనిపించింది. కానీ ఓ అమ్మాయి ఒంటరిగా కుర్చుని ఉంది. ఇయర్ ఫోన్ లో  మ్యూజిక్ వింటోంది. కాలేజి అమ్మాయా? సాఫ్ట్ వేర్  ఇంజనీర్? ఏమో ఎవరికీ తెలుసు? చూడటానికి చక్కగా ఉంది . జీన్ ప్యాంటు , టీ షర్ట్ వేసుకొని  సింపుల్ గా ఉంది . పేపర్లో ఎదో రాస్తోంది. ఇప్పుడు ఏంచెయ్యాలి ? ’బెంచీ పెద్దగానే ఉంది. తను మరోచివర కుర్చోవచ్చు‘ అనుకొన్నాడు. తను ఎవరికోసమయినా ఎదురు చూస్తోoదా!  అతను వస్తే,  ఆమె ప్రక్కనే కూర్చుంటాడు, తరువాత కూడా ఇంకా ప్లీస్ వుంటుంది , అని తనలో తనే అనుకొంటూ ఆ బెంచీ మీద మరో చివర కూర్చున్నాడు . ఆమె చట్టుక్కున అతనివంక చూసింది . మరల తనపనిలో ములిగిపోయింది.

ఓ చల్లని గాలి తెమ్మెర సుడులుగా వచ్చి తనను తాకింది. మనస్సు ఆనందంగా వుంది . ఇన్నాళ కు ప్రకృతిలో చెట్లమద్య గాలి ని  గుండె నిండా పీల్చుకొన్నాడు. బెంచీ ఫై వెనక్కు వాలి కళ్ళు ముసుకొన్నాడు . చటుక్కున గుర్తుకు వచ్చింది ,  ఈ బెంచీ పైనే ఆ చివర ఓ అమ్మాయి కూర్చుందని . ఆమె వంక చూసాడు . ఆమె సీరియస్ గా గడులు నింపే ‘సుడోకు ‘ అనే ఆట ఆడుతోంది . ఇప్పుడు అతనికి ఆమె ఇంకా అందంగా కనిపిస్తోంది . మాట్లాడిస్తే బాగుంటుంది అనుకున్నాడు . ఆమె మ్యూజిక్ వింటోంది కదా అని , ఓ సారి పెన్ను ఇస్తారా అని సైగలతో చెప్పాడు . తన సైగలు చూసి నవ్వుకొంటూ పెన్ను ఇచ్చింది . నవ్వుతున్నప్పుడు ఆమె మొఖం ఇంకా వికసించింది . తనుకూడా తాను తెచ్చుకున్న పేపర్లో సుడోకు  ట్రై చేసాడు . ఆమె నవ్వుతూ ఇటీ  చూస్తోంది . తనకు హటాత్తు  గా  గుర్తుకువచ్చి, పెన్ను ఆమెకు ఇచ్చేసి థాంక్స్ చెప్పాడు . తను కూడా విష్ చేసింది . కొద్ది సేపు మాటలు లేవు . తను లేచి వెళ్ళిపోయింది . వీళ్ళకు మ్యూజిక్ వినడం , సుడోకు  ఆడటం మినహా వేరే పని ఉండదా  అని అనిపించిది .

తరువాత రోజు కూడా అతను పార్క్ కు వచ్చాడు. అక్కడ బెంచీ కాళీగా వుంది . బెంచీ మీద రాలిన రెండు ఎర్రని మోదుగు పూలు వున్నాయి . తను బెంచీ పైన ఓ చివర కుర్చుని ఓ పువ్వును చేతిలోనికి తీసుకున్నాడు . ‘ఎంత అందమైన ఎర్రరంగు ‘ అనుకొంటూ వాసన చూసాడు. ఏ వాసనా లేదు . ‘అరె ఈ అందమైన పువ్వు కు మంచి సువాసన కూడా వుంటే ఎంత బాగుండును ‘ అనుకున్నాడు . ఈసారి తను తెచ్చుకున్న పేపర్ పైన ‘సుడోకు‘ ఆడుతున్నాడు . కొద్దిసేపటికి ఆ అమ్మాయి వచ్చింది . నవ్వుతూ విష్ చేసింది , తాను కూడా విష్ చేసాడు . ఆమె చేవ్వుల్లో ఇయర్ ఫోన్ , ‘ఈమె అంత మ్యూజిక్ ప్యానా!’ అనుకొన్నాడు . అతని పేపర్ లో ఓ మూల కాగితం చింపి  దానిమీద రాసి ఆమెకు చూపించాడు ,”ఈరోజు మీరు లేట్“ అని. ఆమె చిరునవ్వు నవ్వింది. వేయిపువ్వులు వికసించినట్లుగా. రెండుమూడు రోజులు గడిచాయి. స్నేహం పెరిగింది. ఇద్దరూ కొంచెం దగ్గరయ్యారు . ఈ అమ్మాయి ఎప్పుడు  మ్యూజిక్ వినడం అతనికి విసుగనిపించింది . అతను పేపర్ అంచుఫై “మీరు వినే పాట, నేనుకుడా వినోచ్చా!” అని రాసి ఆమెకు చూపించాడు . ఆ అమ్మాయి నవ్వుతూ తన ఇయర్ ఫోను తీసి అతనికి ఇచ్చింది . తను పెట్టుకొన్నాడు , ఏమీ  వినపడలేదు. “కొంచెం ముందుకు నడపండి” అన్నాడు. ఆమె నవ్వింది . పేపర్ అంచున రాసింది “అందులో ఏమి లేదు “  అతను ఆశచర్యం తో “మరి ఏమి వింటున్నారు “ అన్నాడు . ఆమె తలదించుకోoది. మొఖంలో నీలి నీడలు , నెమ్మదిగా పెన్ను తీసుకొని రాసింది “నాకు మాటలు రావు, వినిపిoచదు కూడా“. అతను హతాసుడయ్యాడు. ఆశ్చర్యం నుంచి తెరుకోలేకపోయాడు .ఆమె మరల రాసింది “ నన్ను క్షమించండి !”. కొద్దిసేపు మానం , తరువాత ఆమె లేచి వెళ్ళిపోయింది .

తరువాతి రోజు అదేసమయానికి అతను అక్కడికి వచ్చాడు. అప్పటికే ఆమె కూర్చొని సుడోకు  పుర్తిచేస్తోంది . అతను ఆమె దగ్గరగా కర్చున్నాడు. ఆమె చిరునవ్వు నవ్వింది . అతను పేపర్ అంచున రాసి ఆమెకు చూపించాడు “క్షమించండి……కానీ మీ పాటను వినగలిగాను, తియ్యగావుంది , ఈరాగాన్ని ఎప్పుడు వింటూనే వుండాలనిపిస్తోంది “. ఆమె మొఖం వికసించింది. చల్లని గాలి బాగా వీచింది . యూకలిప్తుస్ ఆకులు వీళ్ళ మీద రాలాయి. రెండు మూడు పెద్ద నీటి చుక్కలు అతనిమీద పడ్డాయి . ఫైకి చుస్తే నల్లటి కారు మేఘాలు!. ఇద్దరూ లేచి తొందరగా నడుస్తూ షెల్టర్ వైపుకు వెళ్ళుతున్నారు . ఇప్పుడు వాళ్ళ చేతులు కలసి వున్నాయి . ఈ శ్రావన మాసపు మొదటి వర్షం జోరుగా ప్రారంభం య్యింది. రుతుపవనాలు నగరాన్ని ఆక్రమించాయి.

             15944_100443406646011_3087999_n — కూనపరాజు కుమార్ 

ఇదే న్యాయం !

DSC_9165 

ఓదెల వెంకటేశ్వర్లు కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ తెలుగు లిటరేచర్ చేసారు. చదువుకున్నది గోదావరిఖని మైన్స్ ప్రాంతం. స్వస్థలం  కరీంనగర్ జిల్లా పెద్దపల్లి దగ్గర ఓ చిన్న గ్రామం చీకురాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం . ఆంధ్రభూమి దినపత్రికలో పొలిటికల్ కార్టూనిస్టుగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు కు కథలు, కవితలు రాయడం పట్ల ఆసక్తి.  విరివిగా రాయలేదు కానీ ఇది రాయకుండా ఉండలేను అనుకున్నవే కథలుగా వచ్చాయని చెప్తాడు.  ఓదెల రాసిన  కామెడి కథలకు స్వాతి వీక్లీలో బహుమతులు వచ్చాయి. అనేక పత్రికల్లో కథలు అచ్చయ్యాయి.  “కడుపు కోత” పేరుతొ వచ్చిన కథల పుస్తకం  తనకు  గుర్తింపు నిచ్చింది అంటారు వెంకటేశ్వర్లు .  పందికొక్కులు, కడుపుకోత కథలు తనకు  మంచి  తృప్తినిచ్చాయి అని చెప్తారు. –వేంపల్లె షరీఫ్

 ***

రాత్రి నాలుగు గంటలకే లేచాడు లచ్చుమయ్య. జల్తీ జల్తీ మొకం కడుక్కుని, పశువుల దగ్గర పేడ తీసి , స్నానం చేసి తయారయ్యాడు.ఈ లోపు భార్య భాగ్యమ్మ లేచింది. పొద్దునే తయారవుతున్న భర్తను చూసి,
“మల్లెక్కడికి పోతాండో ఎమో! ఒక్కటి సుత చెప్పడు. ఏం మనిషో ఏందో, లేని నేను ఇంత సాయం చేయకపోదునా” అనుకుంటూ..
“అవునయ్యా ఎగిలివారంగనే లేచి తయ్యారకావడితివి. ఎటువోతున్నవ్” అడిగింది.
“పట్నం బోతున్నా”
“మొస మర్ర కుంట పని పెట్టుకుని పట్నం బోతాన్న అనడవడ్తివి. కైకిలోళ్ళను పిలిచి కలుపు తీపిద్దామని నిన్ననే చెప్పితి. దానికి నువ్వు సరేనంటివి. మళ్లా బుయ్య బుయ్య తయ్యారైతివి ”  ఇక్కడి పని అంతా తనమీద వదిలిలేనినాడని కోపంతో కనిరుచ్చికుంది.
“పట్నంల మా మామా దావతిద్దాండు. పొద్దు పొడిేనటల్లాకు రమ్మన్నడు గందుకే పోతున్నా” కాస్త వ్యంగం జోడించి చెప్పాడు.
“దావతికి నిన్ను రమ్మన్నోడు, మరీ పెండ్లాన్ని తీసుకరమ్మనలేదా?”  తను తక్కువ తినలేదన్నట్టుగా అడిగింది.
“ఎందో పొద్దుగాల పొద్దుగాల జగడానికి కాలు దుయ్యవడ్తివి” అన్నడు.
“మరి అడిగిందానికి సక్కగా జవాబు చెప్పకపోతివి. నేను జగడానికి కాలు దువ్వుతున్ననా, నువ్వా”
“నువ్వు కైకిలోల్లను తీసుకుని కలుపు తీపియ్యి. నేను పట్నం బోయ్యి మందు బస్తాలు దెస్తా. మరీ ఆడ ఎంత పెద్ద లైనుంటదో ఎరికెనా గింత పొద్గుగాల పోయిన ఎక్కన్నో ఎనకనిలవడవలసి వస్తది” చెప్పాడు.
“మరి గిముచ్చట చెప్పతందెకు ఏమో పరగ్యాసం ఆడవడ్తివి. నేను లేచి ఇంత సద్దికట్టి పంపిద్దుకదా?” అన్నది.
“ఏహె సద్దెందుకు తీయ్యి. పోయ్యి లైన్ల నిలవడితే ఆకలిలేదు. దూప లేదు. మందు బస్తాలు దొరికితే చాలు కడుపునిండినట్టే” అన్నడు.
“నివద్దనే. మందులు బస్తాలు దొరికితే మనమే అదృష్టవంతులం” అంటూ అంది.
“ఎవుసం చేసుడు మహాదండి కష్టమైతాంది.  ఇంత కష్టం మా నాయనలు, తాతలు కూడా పడలే. అరొక్కటి కొనుడేనాయే. విత్తనాలు కొనుడు, మందులు కొనుడు… అండ్ల కరెంటు సరింగా ఇయ్యరు. అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి అన్నట్టుగా వుంది. ఎంత కష్టమైనా చేని పంట పండితే  దానికి గిట్టుబాటు ధర రాదు. ఇగ బతుకుడెట్లా”
“నువ్వద్దే నువు చెప్పింది. మరేం చేత్తం. మనకు అచ్చిన పని ఇదొకట్టేనాయే. సదుకోకపోతిమి ఏదైనా నౌకరి చేద్దామంటే.  దిక్కు లేక ఈ పని చేసుకుని కష్టాలుపడవడితిమి. ఎవుసం చేసుడు జూదం ఆడినట్టే వుంటాది. జూదమాడితే ఇంకా నయం ఒక్కసారి కాకపోతే ఒక్కసారైన పైసలు వస్తాయి. కాని ఎవుసం చేస్తే  అప్పులు పెరిగపోవట్టే.”
టీవీలల్ల మాత్రం ఎరువులు ఇస్తున్నాం. ఎరువుల అక్రమాలు సాగనీయం. అందరికి న్యాయం చేస్తాం. రైతులను ఆదుకుంటాం అనవట్టిరి.
ఇక్కడ పరిస్థితి  చూస్తేనేమో  ఎదురు చూడగా చూడగా చుక్కతెగి పడ్డట్టు ఒక్క లారీ వస్తుంది. అందులో రికమేండేషన్ క్యాండిడెట్లు.  పోను మిగిలిన వారికి ఒకటి అర పంచడం జరుగుతుంది. ప్రపంచంలోనే రైతుల పట్ల ఇంత అన్యాయం జరిగేది ఇక్కడే కావచ్చు. ఎన్ని కష్టాలు ఓర్చుకోవాలి. విత్తనాలు దొరకవు. నీళ్ళు దొరకవు, కరెంట్ వుండదు. ఎరువులు దొరకవు. వీటిని తట్టుకుని కిందా మీద పడి ఏదో పంట పండిస్తే  గిట్టుబాట ధర వుండదు. కాని మధ్యవర్తులు ఇస్త్రీ  చొక్కా నలక్కుండా డబ్బులు దోచుకుంటారు. వీరికి హద్దు అదుపు లేదు. ఆఖరికి అందరికి అన్నం పెడుతున్న రైతన్నకే సున్నం పెడతారు.
“సరే తీయ్యి. ఎప్పుడున్న ఏడుపే గిది. వొడిేనదున్నది. ఆయిపోయేదున్నదా‘? నేను పోయెస్త” అంటూ బయలు దేరాడు.
“గట్లనే, జర ఉశారుగుండు. ఎవ్వనితోని లొల్లి పెట్టుకోకు, పయిలంగా పోయిరా” అన్ని జాగ్రత్తలతో పాటు హెచ్చరికలు చెప్పి సాగనంపింది.

***

kadupu
పట్నానికి దాదాపు పదికిలోమీటర్ల లోపు  పల్లెటూరు లచ్చుమయ్యది. ప్రతి పనికి పట్నానికి రావల్సిందే. పెళ్ళి నుండి చావు వరకు ఏ వస్తువు కోసమైనా ఇక్కడికి వచ్చి తీసుకపోవల్సిందే. ఇంటికి ఎవరైనా చుట్టము వచ్చినా కూడా మందు తెవాలన్న, చికెమ్ మటన్ లాంటివైనా తీసుకువెళ్ళాలన్న ఇక్కడినుండే. ఎందుకంటే ఇంటికి వచ్చిన చుట్టానికి కోయడానికి ఊళ్ళలో నేడు కోళ్లు లేవు.  ఎవరు పెంచడం లేదు. అదొ పెద్ద అయిపోయినుట్టుగా వుంది. అవసరమైనప్పుడు వెళ్ళి చికెన్, మటన్ పట్టుకురావడం అవసరాలు తీర్చుకోవడం లాంటివి చేస్తుంటారు. ఇక కోళ్ళను పెంచడం, కోయడం, వాటిని శుభ్రం చేయడం వంటివి సిటీలాంటి ప్రదేశాలే కాదు, పల్లెటూర్లలో కూడా చేయడం లేదు. ”
అప్పుడే వచ్చిన  లారీ ముందు బస్తాల లోడ్ వచ్చేసరికి రైతుల్లో చాలా సందడి మొదలైంది.
మరీ ఎరువులా మజాకా. అక్కడ పరిన్థితి చూస్తె  కుస్తీ  పోటీలకు వచ్చినట్టుగానే వుంది. అందరూ గోచీలు బిగించి బరిలోకి దిగినట్టుగా సన్నద్ధం గా  ఉన్నారు. లారీ వచ్చి ఆగడంతోటో తోపులాట మొదలైయ్యింది. అరుచుకోవడాలు, తిట్టుకోవడాలు మొదలైనాయి.  రైతులకు రైతులే గొడవపెట్టుకుంటున్నారు. తిట్టుకుంటున్నారు. చొక్కాలు పట్టుకుంటున్నారు. ఎంత ఘోరం. మరి ఎరువులు అందరికి కావాలి. పని వదిలేసుకుని వస్తే  ఎరువులు లేకుండా ఖాళీ చేతులతో ఇంటకి వెళ్ళడం యిష్టం లేదు. యుద్ధం లో  దిగిన వాడికి విజయమో వీరస్వర్గమో అన్నట్టుగా వున్నారు.
ప్రభుత్వాలు మాత్రం కడుపునిండిన మాటలు  చెబుతున్నారు. తమది మాత్రమే రైతు ప్రభుత్వమని. తమ ప్రభుత్వం రైతుకు చేసిన పనులు మరే ప్రభుత్వం చేయలేదని నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఇంతకి వీళ్ళు చేసిందేంటో ఎవరికి అర్థం కాదు. నిజానికి ఆ మాట అన్నవాడికి కూడా అర్థం కాదు.
సంక్షేమ పథకాలన్నీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అదీ చేస్తాం ఇదీ చేస్తాం అంటూ బాకాలు ఊది, వీళ్ళు చేసేది  ఏమిటో చూస్తె మతి పోతుంది. ఆరుకాలం కష్టపడి వ్యవసాయం చేసే వాడికి ఒక కిలో బియ్యం ఇస్తారు. రెక్కలు ముక్కలు చేసుకుని కంటిమీద కునుకులేకుండా కాయకూరలు పండిస్తే  ధర మాత్రం ఎవరో నిర్ణయిస్తారు. 7 గంటల కరెంట్ అంటారు. అదీ కూడా యిస్తారా లేదా అన్నది ఎవరకి వారే తేల్చుకోవాల్సిందే.  ప్రపంచంలో అందరూ ఎవడి వస్తువులకు  వాడే ధర నిర్ణయిస్తారు. కాని ఒక్క రైతుకు మాత్రము తను పండించిన పంట, ధాన్యం వంటి వాటి ధర ఇతరులు నిర్ణయిస్తారు. ఇక్కడ రివర్స్. అదే ఎందుకంటే మార్కెట్లో ఉన్న వాళ్ళ పని యిదే. రైతుకు అలా కాదు పండి పంటను అమ్ముకుని మళ్ళీ పండించడానికి పరిగెత్తాలి. ఎంత కష్టం. అయినా వాడికి వీళ్ళే తిండి పెడుతున్న బిల్డప్‌లు యిస్తారు. ప్రపంచానికి అన్నం పెట్టిన వాడు రైతు. ఆ రైతును కోలుకోకుండా చేస్తున్నారు. అదీ సాటి మనిషే కావచ్చు. అందర్నీ సృష్టించిన దేవుడు కావచ్చు. అదేలాగంటే, కావలనిన సమయంలో వర్షం పడదు. రెక్కలు ముక్కలు చేసుకుని తనకు చేతనైనా పరిధిలో పంట పండిస్తే  తీరా చేతికి వచ్చేసమయంలోనే భీకరంగా వర్షాలు పడతాయి. పంటమొత్తం వర్షార్పణం. అదీ నేటి భారతదేశ రైతు పరిన్థితి. ఇలాంటి పరిన్థితులు ఇంకే దేశంలోనైనా ఉన్నాయా? ఇక్కడే ఉన్నాయా? అన్న విషయం మనకు తెలియదు.
అలాంటి పరిన్థితులమధ్య ఎరువులకోసం వచ్చాడు మన రైతు. కొంచెం దూరంగా నిలబడి తోపులాటను చూస్తున్నాడు పాపం. తాను పోట్లాడతున్నది తన తోటి రైతుతోనే అన్న విషయం విస్మరించి కలబడి ఎగబడి పోతున్నారు. లారీ ఊగిసలాడుతు ఆగింది. బరవుకు కిర్రు కిర్రు మని అరుస్తోంది. దానికి కట్టిన తాళ్ళు విప్పారు. ఇంకా తోపులాట ఎక్కువైంది.
ఇంతలో “అవురా నువ్వు నాకే ఇయ్యకుంట అమ్ముకుంటావురా? అన్నకు చెబుతా” గట్టిగా అరుస్తున్నాడు ఒకతను.
“ఏం చెయ్యమంటారండి.. పాపం నిన్నటి నుండి రైతులు లైనులో నిలబడి వున్నారు. వాళ్ళను కాదని మీకిమ్మంటే ఎలా” అంటున్నాడు దుకాణం అమ్మకం దారుడు.
“నేను చెప్పేది చెప్పినా, ఆ పై  నీ యిష్టం” అన్నాడు నిష్టూరంగా.
చేసేది లేక కొన్ని బస్తాలు వాళ్ళపరం చేసాడు. మరి ఎమ్మేల్యే అంటే మాటలా?
తరువాత ఇంకో చోటామోటా నాయకుడు. పాపం ఎవర్ని  కాదనగలడు. అందర్నీ ఒప్పించాలి.
ఆఖరికి రైతులను మాత్రం బెదిరిస్తాడు. “ఏందయ్యా కొద్దిగా ఆగలేరా?”
“రైతులే నీకు కనిపిత్తలేరు. వాళ్ళనే ఆగమంటున్నావు. వాళ్ళను చూసీ భయపడి యిస్తున్నావు. మేము ఇక్కడ కాళ్ళు నొప్పులు పుట్టేలా  నిలబడి నిలబడి చస్తున్నాం. నువ్వేమో ఆగలేరా అంటున్నావు. మళ్ళీ మేము పోయి పనిచేసుకోవాల్నా వద్దా. మా బతుకులు మీ ముంగట్నే తెల్లారుతాయినయి” అన్నాడు కడుపుమండిన  ఓ రైతు.
రైతులకు ఇవ్వడం మొదలు పెట్టాడు. తోపులాట ఇంకా ఎక్కువైంది. లైను కోసం నిలబెట్టిన చెప్పులు రాళ్లు అన్నీ చెల్లా చెదురు అయిపోయాయి.  వాటిని పట్టించుకునే నాధుడు కనిపించడం లేదు. పాపం మన లచ్చుమయ్య బీరిపోయి చూస్తున్నడు ఇయ్యాల సుత ఎరువులు దొరకుతాయా లేదా? అన్న భయం అతడి కళ్ళలో కనిపించింది.   కాని అలా జరగడానికి వీళ్ళేదు ఈ రోజు ఎలాగైనా  సరే ఎరువులు తీసుకుని వెళ్ళాలి. అని ఆలోచిస్తూ లచ్చుమయ్యా సుత లైన్ల జొరబడ్డాడు. వెనక్కి ముందుకి ముందుకి వెనక్కి జరుగుతోంది లైను. ఆ వత్తిడికి బక్కగా ఉన్న రైతులు ఆ తాకిడికి తట్టుకోలేక లైను నుంచి బయటికి వచ్చేస్తున్నారు. అయినా వారు మళ్ళీ లైనులో నిలబడ్డానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఒంటిమీది బట్టలు స్థానభ్రంశం చెందుతున్నాయి.
హఠాత్తుగా ఓ కలకలం బయలుదేరింది. ఉన్న లైను వదిలేసి రైతులు లారీ వైపు పరిగెడుతున్నారు.
“అరే ఏమయిందిరో” అనుకుంట లచ్చన్న లారీ చూశాడు.
అంతే. బీరిపోయిండు. రైతులు లారీ ఎక్కి ఎరువుల బస్తాలు భుజాన వేసుకుని వెళ్ళిపోతున్నారు.
“గిదేం పనిరో గిట్ల చెయ్యవడ్తిరి”
“మరేం చేత్తరు వాళ్ళేం చేస్తున్నారు. అచ్చిన లారీ లోడు రైతులకు ఇయ్యకుంట ఆళ్ళు ఏం జేత్తున్నరు. రైతలకు కడుపు మండుతది. రెండురోజుల సంది ఇక్కడే పండుకుని ఉన్న వాళ్ళకు సుత ఒక్క బత్త ఎరువు దొరకపాయే. ఇంకేం చేత్తరు” అనుకుంటా ఓ రైతు తలకు రూమాలు చుట్టు బిగించి లారీదిక్కు ఉరికిండు.
నిజమే ఎగిలివారంగా నాలుగుగంటలకు వచ్చిన తనకే కడుపు మసిలి పోతాంది. రెండు రోజులసంది ఉన్నోనికి ఇగ ఎట్ల ఉంటది. మరి ఇది మంచిదా కాదా అని ఎవలు ఆలోచించడం లేదా? సరే మనం చేనింది తప్పైతే  వాళ్ళు చేసింది  కుడా తప్పే కదా? ఇగ రైతులు ఇట్ల చేసుడు తప్పు కానేకాదు అనుకున్నాడు లచ్చుమయ్య. కానీ ప్రస్తుతం తను ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేక లారీ మీదినుంచి ఖాళీ అవుతున్న ఎరువుల బస్తాలను చూస్తు ఉండిపోయాడు. తను కూడా వెళ్ళి ఆ గుంపులో కలవడమా? లేదా? ఆలోచిస్తున్నాడు లచ్చుమయ్య.

 

— ఓదెల వెంకటేశ్వర్లు

 

 

 

త్రిపుర గారూ !మీరు ఎక్కడికీ వెళ్ళ లేదనే నా నమ్మకం…

త్రిపుర గారూ !

మీకు ఉత్తరం రాసి ఎన్నాళ్ళయిందో. అప్పుడెపుడో చాలా ఏళ్ళ కిందట మీరు అగర్తలా అంచుల్లో ఉన్నపుడు  పెద్ద ఉత్తరం రాసాను. దానికి మీరు రెండు చిన్న వాక్యాల జవాబిచ్చారు. నేను చిన్నబుచ్చుకొని పెద్ద కాగితం మీద తిరిగి నేను కూడా ఒకే వాక్యం రాసి పంపాను. “నీ ఒక్క వాక్యం వెనుక వున్నఖాళీకాయితం నాకు ఎన్నో చెప్పిందంటూ” అప్పుడు మీరు నాకు పేద్ద ఉత్తరం రాసారు. అప్పుడే మీరంటే ఏమిటో తెలిసింది. త్రిపురకి ఎక్కువ మాటలు, పెద్ద ఉత్తరాలు అక్కర్లేదు. లౌడ్ వాయిస్ పనికిరాదు.  అంతే కదూ  !

అందుకే పెద్ద ఉత్తరం రాయను. కానీ ఎన్నో జ్ఞాపకం వస్తున్నాయి. కన్నీళ్ళు అనకూడదేమో అలాంటివే  ఏవో….. వాటి మధ్య నుంచే . రెవెన్యూ గెస్ట్ హౌసులో దిగారు మీరు  84 డిసెంబర్ అని గుర్తు. అనాబ్ షాహి ద్రాక్షపళ్ళ మీది పలచని పొర వొలిచి మీ చేతులో పెడుతుంటే అవి తింటూ చిన్నగా కబుర్లు చెబుతూ ఇంక చాలు ఇరవై మూడు తిన్నానన్నారు. అదీ త్రిపుర. లెక్క తప్పకుండా జీవితాన్ని  ఆస్వాదించటం అంటే అదే కదా  –

అప్పట్లో మా తమ్ముడు చెప్పినట్లు మీ ప్రేమ పొందాలని మేమందరం పోటీ పడ్డాం. కానీ మీరు భక్తసులభులు. మేం కోరిన దాని కన్నా ఎక్కువ ప్రేమించారు మమ్మల్నందరిని.

తొంభై ఎనిమిదిలో అనుకుంటాను కాఫ్కా కవితలు పుస్తకం శాఫాలిక డాబా మీద ఆవిష్కరించాము. ఆ రోజు భోగి పండుగ. మద్యాహ్నం మూడు దాటాక కాఫ్కా వాసన కొట్టే కొత్త పుస్తకాలు పట్టుకొని విజయవాడ నుంచి విశ్వేశ్వర రావు, వి. చంద్రశేఖరరావు గార్లు  దిగారు. “నాకు క్రౌడ్ పనికి రాదు.  చిన్న గేథరింగ్ చాలు” అన్నారు మీరు . మీ  అక్కయ్య, లక్ష్మి తల్లి గారు , సంధ్య, మేమూ అంతే. మీరు అలా కలల్లోంచి ఊహలలోకి జారుతూ పుస్తకావిష్కరణ చేయించుకున్నారు.

 

ఆ మర్నాటి ఉదయం నా చెయ్యి పట్టుకుని “పాపా! నా డ్రీమ్ నిజం చేసావు” అన్నారు. మీకు అప్పుడు చెప్ప లేదు కానీ ఈ జన్మను సార్ధకం చెయ్యడానికి ఈ ఒక్క మాటా చాలదా ? అనుకున్నాను.

 tripura

ఆ సాయంత్రం ఇస్మాయిల్ గారూ మీరూ మళ్ళీ శేఫాలిక పెరట్లో నేరేడు చెట్టు కింద గాజు గ్లాసులు కాకుండా స్టీలు గ్లాసుల్లో కబుర్లు తాగారు, ఎవరికీ తెలియకుండా. చివర్లో ఎమ్మెస్ సూర్యనారాయణ వచ్చి,కనిపెట్టేసి, మీ ఇద్దరినీ చంటి పిల్లలుగా మార్చేస్తే, వాడిని నాలుగు తిట్టి, నేనూ లక్ష్మి గారూ మిమ్మల్ని నిద్రపుచ్చి తెల్లవారే సరికి మళ్ళీ పెద్దవాడ్ని చేసేసాం కదా! అప్పుడు సామర్లకోట స్టేషన్ లో మిమ్మల్ని రైలెక్కించి ఇంటికి వచ్చాక నేననుకున్నట్టే మీరూ ఉత్తరంలో రాసారు. ” రైలు దిగి మళ్ళీ కాకినాడరైలెక్కి వెనక్కి వచ్చేయ్యాలనిపించింది” అని.

 

ఆ నాలుగు రోజులూ మీరూ, లక్ష్మి గారూ నా దగ్గర మా అమ్మా, నాన్నల్లా ఉన్నారు.  సరిగ్గానే రాస్తున్నాను.  మీరూ అమ్మలాగ ఆమె నాన్నలాగ.  అదే సమయంలో నా కడుపున పుట్టిన పిల్లల్లాగా కూడా ఉన్నారు.  భోజనం టైములో ప్లేట్ పట్టుకుని “అమ్మా అన్నం పెట్టు తల్లీ ” అని సరదాగా గోల  చేస్తూ.

 

ఆ  మర్నాడు ఉదయాన్నే రెడీ అయి బయటికి తీసికెళ్ళి” మీరిద్దరూ ఇప్పుడు మంచి చీరలు కొనుక్కోవాలి, నేను కొని పెడతాను” అని సంధ్యకీ నాకు ఎంతో అందమైన చీరలు సెలక్టు చేసి కొనిపెట్టారు.  అలాంటప్పుడు ఈయనా ? చీకటి గదులు రాసిన త్రిపుర ? అద్దంలోని శేషా చలపతిరావ్ చేత” గొప్ప మజా ! స్కాండ్రల్ !” అనిపించిన త్రిపురా? అని మాటి మాటికీ ఆశ్చర్య పోయేదాన్ని.

 

అవును మీ కథల పుస్తకాలు నా దగ్గర రెండు ఉండేవి.  ఒకటి ఇంటి దగ్గర చదవడానికి, మరోటి ప్రయాణాల్లోకి.  ఎన్ని సార్లు చదివేనూ ఆ కథలు.  ప్రతి సారీ శరీరంలోకి నెత్తురు ఎక్కిస్తున్నట్టుఉంటుంది .ఆ తర్వాతే కదా మిమ్మల్ని చూసాను.  అస్సలు పోలిక లేదు.  ఆ కథలకీ మీకూ సమన్వయం కుదర్చడం ఏళ్లు గడిచినా సాధ్యం కాలేదు.

 

మీరు చాలా సింపుల్.  మీ ప్రేమ పొందడం చాలా సులువు.  మీతో సంభాషణ మరెంతో సరళంగా హాయిగా ఉంటుంది.  కానీ మీ కథలు ఒక పట్టాన కాదు బహు పట్టాన కూడా అంతు బట్టవు.  కానీ వాటిని చదువుతూ ద్వారాలు తెరుచుకుంటూ లోపలికి ప్రవేశిస్తూ ఉంటే ఏదో మైకం ఎక్కి అందులోంచి మెదడు లోపలి పొరలు ఒక్కక్కటిగా తొలగి మెలకువ లోకి ఒత్తిగిలినట్టవుతుంది.

 

మీ లోపలి ప్రపంచానికీ, బయటి ప్రపంచానికీ మధ్య ఇంత దృఢమైన ఉక్కు వంతెన ఎలా కట్టగలిగారు ? వంతెన ఇవతలినుంచి చూస్తే అవతలి మీరు కనపడడం లేదు మా లాంటి వాళ్లకి.  మీరు జర్కన్.  వీరా స్వామిని జర్కన్ అన్నారు మీరు.  కానీ మీరే జర్కన్.  అలా జీవించగలగడం ఒక మోహం లాగ నన్ను చాలా కాలంగా పట్టుకుని పీడిస్తోంది.  సరళ జీవనం అనే మోహం అది. కానీ అది ఎంతటి దుస్సాధ్యమో మొదలు పెడితేనే గానీ  అర్థం కాదు.

 

ఇంత సులువుగా బతుకుతూన్నమీరు  ఎక్కడికో వెళ్ళేరని అందరూ అంటున్నారు .  మా అమ్మ, నాన్నల్లాగా, ఇస్మాయిల్ గారి లాగ మీరూ ఎక్కడికీ వెళ్ళ లేదనే నా నమ్మకం.

600277_473103009426641_557986530_n

విశాఖ సముద్ర తీరంలోని ఒక అందమైన పాత కాలపు ఇంట్లో మనం రాత్రి ఎంతో సేపు చెప్పుకున్న కబుర్లు, రామలక్ష్మి అపార్మెంట్ లో మీ ఇద్దరితో కలిసి నేను నాలుగు రోజులు గడిపినప్పుడు ఉదయాన్నే మనిద్దరం కాఫీ తాగుతూ చెప్పుకున్న సంగతులు అన్నీ అలాగే ఉన్నాయి.  కొంచెం కూడా రంగు తగ్గలేదు.  మీ కథల్లో మీరు  సకృత్తుగా- కానీ  -ఎంతో అవసరంగా వాడిన సంస్కృత పదాలు ఏరి నేను చెప్తుంటే మేఘాలయ హోటల్లో మీరూ, అమ్మా దోసెలు తినడం మానేసిమరీ కుతూహలంగా వినడం ఇప్పుడే జరుగుతోన్నట్టుంది.

 

మీలోని భాస్కర్ శేషాని క్షమిస్తాడు.  దయతో ఆదరిస్తాడు.  ఘోరంగా మోసపోయినా, దిగమింగుకుని ,సహించుకుని శేషియోతాలూకు  వెనక జీవితం గురించి యోచించమంటాడు.  లోకంలో మూడు వంతులు ఉప్పునీరున్నట్లు శేషియోలే  ఉంటారు.  వాళ్ళను సహిస్తూ జీవితాన్ని హుందాగా జీవించడం ఎలాగో చెప్పడం కోసమే ఇంతటి పనితనంతో కథలు చెక్కుతూ జీవించిన త్రిపురగారూ !అవనీ మీ జీవన సాధన లో భాగమైన ఆత్మకథ లే అని కదా మీరు అంటారు .అసలు ఆత్మకథలు అలాగే వుండాలని చెప్తూ కన్ఫెషనల్ గా వుండాలన్నారు ఆత్మకథ గా రాయడం లో సెల్ఫ్ డిసీవింగ్ఎలిమెంట్ ఉంటుందని మీరే పసిగట్టగలరు .

మా లాంటి వాళ్ళం ఉన్నత కాలం మీ కథలు మా దాహాలకు జలాశయాలవుతాయి.  మీ జ్ఞాపకాలు ఇంకెన్నో ఉన్నాయి  అవి నేను ఉన్నంత కాలం నాతోనే ఉంటాయి కదా!అంత కాలమూమీరు ఈ లోకంలో మాతో ఉన్నట్టే .
త్రిపురా త్రిపురా అని తల్లడిల్లిపోతున్న రామయ్య గారికి చెప్పండి నేను ఆయన బాధ చూడలేకుండా ఉన్నాను.

 

“గాలివాన చెట్లను ఊపినట్లు ఊపిన” మీ కథల పుస్తకంలోంచి అమాంతం లేచి వచ్చి “పాపా ఇస్మాయిల్ గారికి నేనిచ్చిన  టీ షర్ట్ సరిపోయిందా,ఆయనకు నచ్చిందా” అని పలకరిస్తూనే ఉన్నారు మీరు.  రామయ్య గారితో కూడా ఒక్కసారి చెప్పండి ”కాకినాడ నుంచి వచ్చిన పాపకీ వాళ్ళ స్నేహితులకీ నీ గురించి గంట సేపు చెప్పాను” అని.

 

కాసేపు విశ్రాంతి తీసుకుంటారా! మళ్ళీ మాట్లాడుకుందాం.  ఈ లోగా లక్ష్మి అమ్మతో కబుర్లు చెప్పి వస్తాను. ఉండనా కాసేపు

 

వెండి వుంగరం తో  దృఢంగా వుండే

మీ చెయ్యి తాకి  కాసేపు వీడ్కోలు తీసుకోనా?

– వాడ్రేవు వీరలక్ష్మి దేవి

————————————————–

‘లేఖా సాహితి’ మీ శీర్షిక

వేగం పెరిగిన ఇప్పటి జీవితాల్లోంచి కనుమరుగై పోతున్న ఒక అందమయిన ప్రక్రియ: లేఖ.

కాని, లేఖ రాయాలి అనిపించే బలమయిన అనుభూతి ఇంకా మిగిలి వుందనే మా ఆశ.

మీరొక లేఖ రాయండి ఈ శీర్షిక కోసం…మీ మనసు లోపల దాచి పెట్టుకుంటున్న మాటలకు ఒక రూపాన్నివ్వండి. ఒక రచన చదివాకో, ఒక రచయితని కలిసాకో, ఒక సాహిత్య సమావేశం తరవాతనో, ఒక అందమయిన సంభాషణ జరిగాకో…ఆ కబుర్లన్నీ కలబోసుకునే లేఖ రాయండి. ఎవరినో ఒకరిని ఉద్దేశించే మీరు రాయక్కర్లేదు. కాని, మీరు రాయాలనుకున్నదే రాయండి. ‘సారంగ’ ద్వారా మీ ఆత్మీయ సాహిత్య ప్రపంచంతో పంచుకోండి.

మీ లేఖని పంపాల్సిన ఈ-చిరునామా: editor@saarangabooks.com

—————————

తొలి ప్రేమ జ్ఞాపకాల సహారా ఈ కథ!

 

ప్రియ కారుమంచి

ప్రియ కారుమంచి

‘తేరా నామ్ ఏక్ సహారా?!’

– చదివేసి, ఈ పుస్తకాన్ని మూసేశాక, నరేష్ ఎదురుగా ఉంటే (లేదా ఉన్నట్టు అనుకొని) ఇలా చెప్పాలనిపిస్తుంది:

నరేష్ … నువ్వొక ప్రేమ పిపాసివి!

నీకు ప్రేమించటం అనే చిత్కళ తెలుసు.

‘నిరంతరమూ వసంతములే…. ‘ అని నమ్ముతావు, లేదా ‘హాయిగా పాటపాడే కోయిలే మాకు నేస్తం.. తేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం’ అని నమ్మబలుకుతావు.

నువ్వు చాలా సులువుగా కనిపించే గడ్డిపువ్వు, లేదా బహు అరుదని అనిపించే గగనకుసుమం, పోనీ పారిజాతం; ఈ లోకాలకి చిక్కని, దొరకని ప్రేమ పరిమళాలు చిమ్మే దేవ పారిజాతం.

‘తేరా నామ్ ఏక్ సహారా?!’

viewer

చదివేసి, ఈ పుస్తకాన్ని మూసేశాక, ఒక ఎమోషనల్ స్థితిలో పైవిధంగా చెప్పాలని అనిపించడం రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు.

ఒకటి- స్టేజ్ మీద నాటకానికి తెర పడ్డాకో, తెరమీద బొమ్మల కథ ముగిశాకో ఒక ఈలవేసి బరువు దించుకోవడం, లేదా ఆ ప్రదర్శనతో మమేకం కావడం వల్ల ఆ మూలాన్ని తలకెత్తుకోవడం-

….. ఈ రెంటిలో నాది ఏ స్థితి అని తరిచి చూసుకోవడానికి మళ్లీ పుస్తకంలోకి వెళ్లాలి.

ఇప్పటికే ఈ పుస్తకం మీద చాలా మంది రివ్యూలు రాసారు (ఏం రాశారో చదవడం పడలేదు).

అసలు ఇది పుస్తకం అని ఎలా అనగలం.. కాదు ఇది ఒక పుస్తకం మాత్రమే కాదు ఇదీ ప్రేమతో మనల్ని తడిపేయడానికి వచ్చిన శ్రావణ మేఘం. చేయిపట్టుకుని తన కలల ప్రపంచంలోకి నడిపించుకెళ్ళే జ్ఞాపకాల శరచ్చంద్రిక. రచయిత తనదైన ఒక nutshellలో భద్రంగా దాచుకున్న తన జ్ఞాపకాల దొంతరను మనముందు పరిచి, ఆ దిగుడుబావి మెట్ల మీదుగా తన మనసు అగాధాల్లోకి నడిపించిన ఒక మెత్తని, కల్పన అనిపించని ప్రేమ కథ. శ్రావణమే గానీ, ఒక దిగులు మేఘం కరిగి రాల్చిన వలపువియోగాల వాన చినుకు.

– ఇలా రాసేసి చూసుకున్నాక, కనిపించని నిట్టూర్పు, వినిపించని ఈల వేసిన ఒక రిలీఫ్ అనిపించింది. ఇది చదివిన ఎవరైనా ‘MY AUTOGRAPH- Sweet Memories’ అంటూ, అంత బాహాటంగా కనిపించని పోపు డబ్బాల్లో రహస్యంగా, అపురూపంగా దాచుకున్న మారుతాళం చెవులతో స్మృతుల పేటికల్ని తెరుచుకుంటూ పోతారు. కానీ, నన్ను నేను కొత్తగా కనుక్కున్నట్టు, నేను కొత్తగా పుట్టి, పుట్టిన వెంటనే దేనికోసమో వెదుక్కున్నట్టు చేసిన పుస్తకం తర్వాత ‘రిలీఫ్’, ‘రిలీవ్’అయిపోవడం నాకు ఎంతమాత్రం నచ్చలేదు; లేదా సరిపోలేదు.

ఈ కధలో రచయితే Protagonist. ఆమె నమ్మకానికి, అతని ప్రేమకి మధ్య సంఘర్షణ. చివరిలో, తన ప్రేమ మీద దాటవేసిన పరీక్షకి ఎవరో సంబంధం లేని మూడోవ్యక్తి జారీచేసిన రిజల్ట్ ని భారంగా మోసుకొచ్చిన తన ప్రేయసి చెప్పిన చివరిమాట- “వద్దన్నారు , నీకూ నాకూ అస్సలు కుదరదన్నారు , ఇక ముందెప్పుడూ నిన్ను కలవకూడదన్నారు”. తన నిస్సహాయతకు క్షమాపణ చెపుతూ చివరిగా తన చేతిని చాచిన ఆమె చేయి అందుకోకుండా రెండడుగులు వెనక్కు వేస్తాడు;ఎందుకంటే అలిగి కాదు ..తన తొలి స్పర్శే చివరిదై ఎడబాటు కరచాలనంగా మిగలడం ఇష్టం లేక-

పైన చూచాయగా చెప్పుకున్నట్టు ఈ ప్రేమకతలతో పెద్ద గొడవ ఉంది. ‘ప్రేమకు లేదు వేరే అర్ధం ప్రేమకు ప్రేమే పరమార్ధం ప్రేమించు, ఆ ప్రేమకై …….జీవించు’ అనే ప్రతిపాదన లాంటి, ప్రేమ పాటలతో ఉన్న గొడవ లాంటిది. వీటిని ‘బాగున్నాయి’, లేదా ‘బాగోలేదు’ అని అనుకోవడానికి ముందే చదువరుల (శ్రోతల) అనుభవాలూ,జ్ఞాపకాలు తగుదునమ్మా అని ముందుకు తోసుకొచ్చి, వాటి బాగోగుల్ని తరిచి చూడనివ్వక్కుండా తగు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగుకి దిగుతాయి. పాఠకుల సదరు బలహీనత మీద దెబ్బకొట్టి పబ్బం గడుపుకుందామని అనుకోకపోవడమే- నరేష్ నిజాయితి. అలాగే, ఇది విఫల ప్రేమ అంటే నేను ఒప్పుకోను; ఎందుకంటే రచయిత నరేష్ గుండెల్లో ఈ ప్రణయ గురుతులు ఇంకా పదిలంగా, సజీవంగా ఉన్నాయి కాబట్టి.

నున్నా నరేష్

నున్నా నరేష్

ఒకచోట సత్యసాయి గురించి చెప్తూ “సత్య సాయి ఒక రూపం కాదు, సారం- అనుకుంటే పాత్రని బట్టి ద్రవం రూపం తీసుకుంటే ప్రేమ మూర్తి అయిన అనిల్ అంకుల్ దృష్టిలో సాయికి పర్యాయ పదం ప్రేమ ….అదే శాస్త్రీయ సాక్ష్యాల మీద బ్రతుకు భవనం కట్టుకునే అచ్యుతుల వారికి సాయి ఒక మహత్తు.. అష్టైశ్వర్యాలూ కట్టబెట్టే ఒక మహత్తు ….శల్య పరీక్షలతో నిగ్గుతేల్చి అసలు రంగు బయట పెట్టాలనుకునే చార్వాకులకు బాబా వట్టి బురిడి …సంరక్షణ సాకుతో ఆయన బోను చుట్టూ నిఘా నీడలుగా మోహరించిన అంతరంగికులకు సాయి ఒక తరగని గని”, అంటాడు రచయిత.

“ఒక నమ్మకాన్ని గుడ్డిగా నమ్మే వాళ్ళ ఇళ్ళల్లో వధువుల పరిస్థితి హోమగుండంలో కాలీకాలని పచ్చికట్టేల పొగకి కళ్ళు మండి, పక్కనున్న వరుడే కాదు, ముందు పొంచిఉన్న జీవితం కూడా ఆనని, అర్థంకాని అయమయమే కొత్తపెళ్లి కూతురిది” అన్నప్పుడు చలం ముద్రలు కనిపించాయి.

ఇక పోతే కధలోని ఒక పాత్ర ‘సౌభాగ్యమ్మ’ మీద వేసిన సెటైర్లు చదువుతున్నంత సేపూ నాకైతే సౌభాగ్యమ్మ విసావిసా విదిలించుకుని వెళ్ళిపోతున్న దృశ్యం కళ్ళముందు కదలాడి ‘ఇలాంటి వాళ్ళతో సరిగ్గా ఇలాగే మాట్లాడాలి , భలే అన్నాడు’ అనిపించిది.

ఈ పుస్తకంలో ప్రతి అక్షరంలోనూ, ప్రతి పదంలోనూ జీవాన్ని పొదిగి, తన భావాలతో జోడించి ఒక వాస్తవ ప్రేమకథని మన కళ్ళకు కట్టిన నరేష్ – ఒక కార్మేఘమై మనల్ని కమ్మేసి, చదివిన ప్రతి ఒక్కరూ అందమైన తమ తొలి ప్రేమ జ్ఞాపకాల్ని తవ్వుకొని, తమని, ప్రేమ రూప- భావాల్ని తరిచి చూసుకోవడానికి మళ్లీ మళ్లి చదివేలా చేశారు. గొప్ప రచనల ఉద్దేశం ఇదేగనక అయితే,  ‘తేరా నామ్ ఏక్ సహారా?!’ మంచి పుస్తకం అనడానికి ఇంతకు మించి రుజువు లేదు నా దగ్గర.

– ప్రియ కారుమంచి

తెలంగాణా రచయితలూ/ కవులు ఇప్పుడేం చేయాలి?

వ్యక్తిగత వైఖరులను సవరించుకోవాలి: కె. శ్రీనివాస్
Box content
195922_10150100454781059_8264333_nతెలంగాణ రచయితలు చాలా చేశారు. ముఖ్యంగా కవులు, పరిశోధకులు చాలా చేశారు.  కవుల్లో కూడా పాట  కవులను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలంగాణా వాద కథ మాత్రం రావలసినంత రాలేదు. నవల అయితే మరీ హీనం.  ఉద్యమప్రయాణం చివరి మజిలి కి చేరిన దశలో, నిరాశా నిస్పృహలు ముంచెత్తుతున్నప్పుదు, కవులు చేయాల్సింది ఆశను అందించడమే.  పరిణామాలు మన చేతుల్లో లేనప్పుడు, సంకల్ప బలాన్ని పోరాట స్ఫూర్తి నమ్ముకోవాలి. వాటిని కవులు గుర్తు చేయాలి. వచనం రాయగలిగిన వాళ్ళంతా వ్యాసాలు రాయాలి. శ్రీశ్రీ వంటి ఉద్యమ రచయితలు అనేక సందర్భాల్లో వివిధ ప్రక్రియల ద్వారా తమ అభిప్రాయాలను చెప్పారు. అందరినీ ఒకే గాట కట్ట కూడదు.
కాని, మన రచయితలకు అధ్యయ న ఆసక్తి తక్కువ. పేరు మీద ప్రచురణ మీద ఉన్న ఆసక్తి  సందర్భానికి అవసరమైన విశ్లేషణలను వ్యాఖ్యలను పాఠకులకు అందించడం మీద ఉండదు. విరివిగా విస్తృతంగా రాయాలి, నాణ్యత తక్కువైనా, తగిన సమాచారం, సందేశం ఉంటే చాలు అనే ఆచరణాత్మక ద్రుష్టి ఉండాలి . అందుకు వ్యక్తిగత వైఖరులను సవరించుకోవాలి. హైదరాబాద్ తో  తాదాత్మ్యాన్ని చెప్పే ఒక్క మంచి పోయెమ్ తెలంగాణా కవుల నుంచి రాలేదు. సీమాంధ్రు లను సంబోధిస్తూ రాసే సవాల్ కవిత్వాలే ఎక్కువ వస్తున్నాయి. అటువంటి వ్యక్తీకరణ రూపాన్ని  అధిగమించే ప్రయత్నం కూడా లేదు.  అనేక అస్తిత్వ వాద ధోరణుల్లో ఉండే కొన్ని అవలక్షణాలు   తెలంగాణ సాహిత్య రంగంలో కూడా బలపడ్డాయి. ప్రస్తుత సందర్భంలో అవసరమైన ధైర్యాన్ని, సందేశాలను ఇస్తూనే, తెలంగాణా సాహిత్య రంగ పునర్నిర్మాణం గురించి కూడా ఆలోచించాలి.
* *
తెలుగు-ఉర్దూల మధ్య వారధి కావాలి: స్కై బాబా
Box content
తెలుగు-ఉర్దూల మధ్య వారధి కావాలి: స్కై బాబా
skyహైదరాబాద్ పై సీమ, ఆంధ్ర ప్రాంతాల వారు గొడవ మొదలు పెట్టడం తో తెలంగాణ కవులు, వాగ్గేయకారులం కలిసి ఉర్దూ తెలుగు కవి గాయక సమ్మేళనం సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో ఏర్పాటు చేశాం.. దాదాపు 200 మంది కవులు వాగ్గేయకారులు పాల్గొన్నారు. 1953లో దాశరధి అధ్యక్షతన ఉర్దూ-తెలుగు ముషాయిరా జరిగిందట. ఆ తరువాత మళ్ళీ ఇన్నాళ్ళకు ఉర్దూ-తెలుగు కవులు కలిసి పాల్గొన్న కవి సమ్మేళనం ఇదేనట! హైదరాబాదీ తెహజీబ్ ని అందరికీ తెలియజేయాలంటే ఉర్దూ-తెలుగు ముషాయిరాలు, సమ్మేళనాలు విరివిగా జరపాలి..
పై కార్యక్రమం కూడా నా ఆలోచనతోనే అలా రూపొందిన కార్యక్రమం. ఈ ఆలోచన 2 ఏళ్ల క్రితం నుంచే చేస్తున్న నేను ఉర్దూ-తెలుగు తెలంగాణ ముస్లిం కవితా సంకలనం కూడా వేసే పనిలో ఉన్నాను. ఆ సంకలనం ఈ వారం లో రానుంది.
తెలంగాణ లో కవులు, రచయిత లంటే తెలుగు వారితో పాటు ఉర్దూ వారు కూడా. ఆ విషయం నేటి ఉద్యమకారులు, సాహిత్య సంస్థలు విస్మరించాయి. ‘గంగా జమున తెహజీబ్’ కి హైదరాబాద్ రాజ్యం పెట్టింది పేరు. ఆ హిందూ-ముస్లిం అలాయిబలాయి సంస్క్రుతి గత 60 ఏళ్లుగా మాయమవుతూ వొచ్చింది. తిరిగి దానిని జీవింప జేసుకోవడం నేటి తెలంగాణ కవులు రచయితల బాధ్యత. దాని వల్ల ఇరు మతాల వారిలో సోదర భావం పెంపొందుతుంది. దేశంలోనే ప్రసిధ్ధి పొందిన ఉర్దూ రచయితలు మనకు ఉన్నారు. ఉర్దూ రచనలు తెలుగులోకి, తెలుగు రచనలు ఉర్డులోకి అనువాదాలు జరగాలి. తెలుగు-ఉర్దూ సాహిత్యకారుల కోసం ఒక అధ్యయన కేంద్రం ఏర్పాటుకు కృషి చేయాలి.
* * *
ప్రాంతీయ వివక్ష తెలంగాణా సాహిత్యంలోనూ వుంది: ఎంవీ పట్వర్ధన్
Box content
ప్రాంతీయ వివక్ష తెలంగాణా సాహిత్యంలోనూ వుంది: ఎంవీ పట్వర్ధన్
మన పోరాటం అస్తిత్వం గూర్చే ఐనప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అది బహు ముఖీనం అవుతుంది. అప్పుడూ ప్రాంతీయ భావాలు మరో రూపంలో పెల్లుబుకుతాయి. ఇప్పటి తెలంగాణా ఉద్యమ కవిత్వాన్ని గమనిస్తే అది ఏ రెండు మూడు ప్రాంతాల నుండో ఉద్ధృతంగా వచ్చినట్టు కనిపిస్తుంది.కానీ నిజం అది కాదు. మరి ఎందుకీ అభిప్రాయం అంటే పత్రికలూ,సుప్రసిద్ధ కవుల ధోరణే అని చెప్పాలి. చల్లకు వచ్చి ముంత దాచినట్లు ఎందుకు?ఉన్నదున్నట్టు చెప్పేస్తా.

ఈ పోరాట క్రమంలో ఉదాహరణకు ఆదిలబాదు జిల్లానుండి వచ్చిన సాహిత్యం వివక్షకు గురయింది.ఆదిలబాదు నుండి వచ్చిన ఎన్నో పుస్తకాలు గుర్తింపు పరంగా తొక్కి పెట్టబడ్డాయి.నేను జనాంతర్గామి -తెలంగాణా ఉద్యమ దీర్ఘ కవిత రాసి సమీక్షకు పంపిస్తే ఏ పత్రికా సమీక్షించలేదు.కవిత్వం బాగుంటే లాంటి మాటలు వద్దు.పత్రికా సమీక్షలకు ఏ కొలమానాలో చాలమందికి తెలుసు.ఈ అభిప్రాయం తప్పైతే ఆ బాధ్యత అ అభిప్రాయాన్ని కలిగిచిన పత్రికలదే! ఇంకా అనేకులు రాసిన పుస్తకాల పరిస్థితీ ఇదే.ఈ ప్రాంతం నుంచి ఏ ఒక పుస్తకానికో అవార్డు వచ్చినంత మాత్రాన అది ఈ ప్రాంత కవులందరికీ గుర్తింపు అనే మాటల్లో నాకు విశ్వాసం లేదు.

ఏ ఉద్యమ కార్యక్రమంలోనైనా ఆదిలాబాదుకు ప్రాధాన్యత అంతంత మాత్రమే.ఎప్పుడూ తల్లిచాటు బిడ్డలా అప్రాధాన్య పాత్రను పోషించాల్సిందే.అనవచ్చు గుర్తింపు కోసం ఇంత తహతహ దేనికని.నిజంగా మీరే చెప్పండి.ఎంతో కొంత గుర్తింపు కోరుకోని రచయిత ఉంటాడా?

ఇప్పుడు నేను ప్రస్తావిస్తున్న విషయం చిన్నదిగ కనబడవచ్చు.కొంత అపరిపక్వంగానూ.కానీ రేపు ఇదే మనసులకు మాంచలేని గాయాన్ని చేస్తుంది.ప్రస్తుత తెలంగాణా రచయితలూ,పత్రికలూ చేయాల్సిందేమంటే అన్ని ప్రాంతాల వారికీ సమాన అవకాశాలివ్వడం.

మన పోరాటంలో ముఖ్య భూమిక మాండలీకందే.సందేహం లేదు.కానీ దురదృష్టవషాత్తు మనది తెలుగు భాషే కాదనుకునే దాకా వెళ్ళిపోయాం.ఇప్పుడు రాష్త్రాన్ని కొంతైనా సాధించుకున్నం గదా ఇక నైనా భాషకూ,మాండలీకానికి ఉన్న తేడాను మనం గుర్తించాలి.రేపు పూర్తి స్థాయిలో రాష్ట్రం ఏర్పడ్డాక మనం మాట్లాడేది తెలుగు కాకుండా పోదు కదా!మరణాంతాని వైరాని అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే మంచిది. మన రచయితలు తెలుగు భాషనూ రచయితలను గౌరవించడమంటే తెలంగాణను వ్యతిరేకించడం కాదన్న గ్రహించిన విషయాన్ని నిజాయితీగా ఒప్పుకోవాలి.మనమిన్నిన్ని రాయడానికి మాధ్యమం తెలుగే కదా!ఒక విజయం తరువాత తప్పనిసరిగా శాంతి పునరుద్ధరణ జరగాలి.

కుల సంకులాలను గూర్చి నేను మాట్లాడదల్చుకోలేదు.ఒక విశాల లక్ష్యంకోసం అన్ని అక్తులూ ఉద్యమిస్తాయి.ఏది ప్రతీప శక్తి అన్నది అనుభవం మీద గాని తెలువదు.ఎప్పుడూ నమ్మకం ఘనీకృతంగా కాక ఇష్యూ బేస్డ్ గా ఉండాలి.ఇది చర్చకు మీరు పెట్టిన అంశం ఐనా కాకపోయినా నా రాతలోనూ కొన్ని చర్చనీయాంశాలు లేకపోలేదు.

 

**
బయటికిరాని తెలంగాణా రచనలను వెతికిపట్టుకోవాలె: శ్రీరామోజు హరగోపాల్
Box content
బయటికిరాని తెలంగాణా రచనలను వెతికిపట్టుకోవాలె:    శ్రీరామోజు హరగోపాల్

haragopalకవులు, రచయితలకు ఎప్పుడేం రాయాల్నో తెలిసినవిద్యే. ఎల్లపుడు ప్రజలపక్షం వహించే వాళ్ళనే కవులని, రచయితలని గుర్తుంచుకుంటున్నాం.యివాళ్టి సంగతి ప్రత్యేకసందర్భం. తెలంగాణరాష్ట్రం కోసమేనైతే కవులేం చెయ్యాలె, రచయితలేం రాయాలెనన్నదానికి ఇంకా నిజం కానిదానికి, కోటి అనుమానాలు వున్నదానిగురించి రాసేదేం లేదు కాని, మనకల నిజమైతుందన్న ఆశతో రాయడం వేరేసంగతి.

ఏండ్లుపూండ్లుగా తెలంగాణాలో కవులేం రాస్తున్నరో అదే రాస్తాలో రాస్తరు.కాళోజి లెక్కనె ప్రజలగొడవే రాసి ధిక్కారం గొంతుతోనే లేస్తరు. తెలంగాణాసాయుధపోరాట కాలం నుంచి పాట,పోరాటం ధరించిన కవుల వారసత్వం నిలుపుతరు.ఎప్పటికప్పుడు మారుతున్న పోరాటాలకు జెండాలై నినాదాలిస్తరు. ఊరేగింపుల ముందునిలుస్తరు. ఇపుడు ప్రజల్లో వున్న భయాలు, ఆ భయాలను పురిగొల్పుతున్న దుర్మార్గపు అరాచకీయ వ్యవస్థలపట్ల ప్రజల్ని మేలుకొల్పి మేల్కొనివుండేటట్టు చూస్తరు.

మాసిపోయిన మనతెలంగాణాభాషను కవులు, రచయితలు రాయడం అలవాటుచేసుకోవాలె. మనం మన భాషను మన ముసలోల్ల దగ్గర నేర్చుకోవాలె, ఆ భాషను సేకరించాలె, నిఘంటువులని తయారు చేసుకోవాలె. భాషావేత్తలు తెలంగాణాభాష ఎట్ల ప్రత్యేకమైందో చెప్పాలె.ఎంత కాలం నుండి ఎంత సంపన్నంగా వుండేదో రాయాలి. బయటికిరాని తెలంగాణా రచనలను వెతికిపట్టుకోవాలె. అన్ని రకాల సాహిత్యాన్ని సేకరించి, పరిష్కరించాలి.

చరిత్ర విషయంలో తెలంగాణాకు చాలా అన్యాయం జరిగింది. ఇక్కడి ప్రాచీన, ఆధునిక చరిత్ర నిర్లక్ష్యానికి గురైంది. ఇక్కడున్న అపారమైన చారిత్రక పూర్వయుగ విశేషాలు కాని, శాసనాలు కాని, శిల్పసంపద గాని ఏదో పట్టీపట్టనట్లు కొంచెమే పేర్కొనబడ్డయి. మన చరిత్రను మనం యదార్థంగా రాసుకోవాలె. ఆ పనికి ఎవరైన పూనుకోవాలె కదా.

మనసంస్కృతి – మన సంప్రదాయాలని ( మతాతీతంగా, కులాతీతంగా) నిలబెట్టుకోవాలె. వాటిలో మన జీవనసంస్కృతిని దొరకబట్టుకుని కాపాడుకోవాలె. మనతెలంగాణాను మనం మళ్ళీ డిస్కవర్ చేస్కోవాలె.అందుకు తెలంగాణాను పునర్నిర్మాణం చేసుకోవాలె. దానికి కవి,గాయక,రచయితలు అందరు సనాతన సంచార మౌఖిక, లిఖిత సంప్రదాయాల్నన్నింటిని పరిశోధించాలె. ఇప్పటిదాకా నిర్లక్ష్యానికి గురైన మన భాష, సంస్కృతి, సాహిత్యం, చరిత్ర లన్నింటిని మళ్ళీ తిరగరాసుకోవాలె. ఇదొక సంధి సందర్భం. ప్రత్యేక పోరాటమెంతనో ఆ తర్వాత కూడా అంతే పటిమతోని పోట్లాడాలె. తెలంగాణాపోరాట చరిత్రను రేపటితరం కోసం నిష్కర్షగా రాసిపెట్టాలి. కవులు రేపటి తెలంగాణాలో ( ఎంత గొప్పగా వూహించినా అది మళ్ళీ ఈ రాజ్యలక్షణాలను వొదులుకునేదైతే కాదుగదా, అందుకని బద్మాష్ పాలకులతో తగాదా తప్పదుగా ) ప్రజల చేతుల్లో పదనెక్కిన పద్యమై, పాటై,కవితలై మోగుతరు.

——————————————————————————————————————

                    (గమనిక: ఈ అంశంపై మీ అభిప్రాయాలను editor@saarangabooks.com కి పంపండి)

వీలునామా – 16 వ భాగం

  

శారద

శారద

       

  (  కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

  ఫ్రాన్సిస్ వింత ధోరణి

 

 

ఫ్రాన్సిస్ ఆ రాత్రంతా నిద్ర పోకుండా ఆలోచించాడు. ఆలోచించిన కొద్దీ అతనికి జేన్ ని పెళ్ళాడమనే నిర్ణయం నచ్చసాగింది. తలచుకుంటున్నకొద్దీ ఆతనికి జేన్ తనవైపు చూసే చూపులో, నవ్వే నవ్వులో ఏదో అర్థం కాని ఆప్యాయతా, అభిమానమూ వున్నవనిపించింది. చెల్లెలు ఎల్సీకి కూడా నీడను కల్పిస్తానంటే ఆమె ఇంకెంతగానో సంతోషిస్తుంది. అయితే ఆమెని ప్రలోభ పెట్టడం తన ఉద్దేశ్యం కాదు. తన మనసులో ఆమె పట్ల వున్న ప్రేమని గుర్తించి అతన్ని వివాహమాడాలి. ఆమె ఆశలకీ, ఆశయాలకీ కుటుంబ జీవితం ఏ రకంగానూ అడ్డం రాదని ఆమెని ఒప్పించాలి! కుటుంబంలో వుంటూ కూడా పది మందికి పనికొచ్చే పనులు చేయొచ్చని ఆమెకి నమ్మకమిస్తే చాలు! తనూ తన వంతు సహకారాన్నెలాగూ ఇస్తాడు.

తానిప్పుడు ఒంటరి కాడు. ఆమెని ఒప్పించి, పెళ్ళాడి పట్నం వచ్చేస్తారు. ఏదో ఉద్యోగం చూసుకుంటాడు తాను.

ఇంతకు ముందూ ఉద్యోగం వుండేది కానీ, ఎంతో ఒంటరిగా అనిపించేది. ఇప్పుడల్లా కాదు. పని చేసి అలసిపోయి ఇంటికొచ్చేసరికి తనకొరకు ఎదురుచూసే భార్య. ఆ ఊహే ఎంతో సంతోషాన్నిచ్చింది ఫ్రాన్సిస్ కి.

నిజానికి తనలాటి భావుకుడికి ఆమెలాటితెలివైన యువతి నచ్చడం ఎంతో వింతగా వుంది. సాధారణంగా భావుకులకి నాజూకైన స్త్రీలు, ఎప్పుడూ పక్క వాళ్ళ మీద ఆధారపడే ముగ్ధలూ నచ్చుతారంటారు. తనకి మాత్రం ఆమే చాలా నచ్చింది. ఆమె మంచితనమూ, సున్నితమైన ఆలోచనా, వ్యవహార దక్షతా తనకెంతో ఊరట నిస్తాయి. తన మనసులోని ఏ భావాన్నైనా ఆమెతో నిర్భయంగా చెప్పుకోగలడు. జీవిత సహచరిలో ఇంతకంటే కావలసిన లక్షణమేముంటుంది? అలాటి మనిషి తోడుంటే జీవితంలో వచ్చే ఆటుపోట్లని వేటినైనా తేలిగ్గా ఎదుర్కోగలడు. తీయటి సంతోషాన్నిచ్చే ఆలోచనలతోటే తెల్లవారిందతనికి.

***

మర్నాడు అతను పెగ్గీ ఇల్లు చేరుకునేసరికి ఎల్సీ సంతోషంగా ఎదురొచ్చింది. జేన్ అతనితో ఉత్సాహంగా బ్రాండన్ తనకు ఫిలిప్ దగ్గర ఉద్యోగం ఇప్పించాలనుకుంటున్నారని చెప్పింది. ఇద్దరు అక్క-చెల్లెళ్ళ మొహాలూ తేటపడి సంతోషంగా వున్నారు.

“కొద్ది రోజుల్లో ఫిలిప్ గారు చెప్పేస్తారట. నాకీ ఉద్యోగం వస్తే ఎంత బాగుంటుంది కదా ఫ్రాన్సిస్! అన్ని సమస్యలూ తీరిపోతాయి. పెగ్గీ అయితే ఫిలిప్ గారు తప్పకుండా పని ఇస్తారనే అంటూంది. నాకే కంగారుగా వుంది. నువ్వేమంటావు ఫ్రాన్సిస్? నీకు సంతోషంగా లేదూ?” జేన్ ఆగకుండా మాట్లాడుతూనే వుంది.

జేన్ ఉత్సాహమూ, సంతోషమూ చూసి ఫ్రాన్సిస్ నీరుకారిపోయాడు. అతని ఆలోచనలు సర్దుకునేలోపే, జేన్ అతను ఎస్టేటులో పాలేర్ల కోసం చిన్న ఇళ్ళూ కట్టించ దలచుకున్న సంగతి పెగ్గీతో చెప్పింది. ఫ్రాన్సిస్ తో నిమిత్తం లేకుండా అందరూ అతను గీసిన ప్లాన్ల బొమ్మలు చూడడంలో మునిగిపోయారు. పెగ్గీ, థామస్ లిద్దరూ శ్రధ్ధగా ఆ ఇళ్ళ ప్లానులు పరిశీలించి మార్పులు సూచించారు.

ఆ తర్వాత ఎస్టేటులో ఎవరెవరికి ఈ ఇళ్ళూ, చిన్న చిన్న స్థలాలూ ఇవ్వాలన్న చర్చ మొదలైంది. నిజానికి ఇదంతా ఫ్రాన్సిస్ కెంతో సంతోషాన్నివ్వాల్సిన మాట. అయితే ఎందుకో అతనికి చాలా దిగులుగా చిరాగ్గా అనిపించింది.

“ఇవ్వాళ నువ్వు చాలా ఉత్సాహంగా వున్నావు జేన్!” ఉండబట్టలేక అన్నాడు.

“అంతే కదా మరి! ఏడాదికి యాభై అరవై పౌండ్లు జీతం వచ్చే ఉద్యోగం అంటే మాటలనుకున్నావా? అందులోనూ పిల్లలకి చదువు చెప్పడం లాటి పనులంటే నాకెంతో ఇష్టం! ఫిలిప్ గారికి నేను నచ్చుతానో లేదో అన్న బెంగ తప్ప పని గురించి నాకెలాటి భయమూ లేదు. చూస్తూండు! ఈ ఉద్యోగమే దొరికితే కొన్నేళ్ళు పని చేసి డబ్బు దాచుకుని సొంతంగా వ్యాపారం మొదలు పెడతాను.”

“మరి ఎల్సీనొదిలి ఉండగలవా?”

“తప్పదు ఫ్రాన్సిస్! ఇతర్ల మీద ఆధారపడకుండా మా బ్రతుకులు మేం వెళ్ళదీసుకోవాలంటే కొన్ని కష్ట నష్టాలు ఓర్చుకోక తప్పదు.”

“జేన్! నేను నీదారికెప్పుడూ అడ్డు రాను! నీ మీద భారం మొత్తం చచ్చినా వేయను. పరిస్థితులతో సర్దుకు పోతాను.” ఎల్సీ అక్క మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుంది.

“నువ్వు నాకెప్పుడూ భారం కాదు ఎల్సీ. నీ కవితల పుస్తకం కూడా అచ్చవుతుంది. నీ సంపాదన నీకుంటుంది.”

“ఛీ! ఛీ! ఆ కవితల మాటెత్తకు!” చిరాగ్గా అంది ఎల్సీ.

“ఆగాగు! ఇవాళ అసలా కవితలు ఫ్రాన్సిస్ కి చూపిద్దామనుకున్నాం కదా?”

“వాటి మాటెద్దొన్నానా? అసలు జేన్ ఎన్ని రోజులనించి లండన్ చూడాలనుకుంది! ఇప్పటికి తన ఆశ నెరవేరింది!”

“అది సరే ఎల్సీ! నువ్వేం చేయదల్చుకున్నావు? ఇక్కడే పెగ్గీతోపాటే వుండి పోతావా?” ఫ్రాన్సిస్ అడిగాడు.

“పెగ్గీతోపాటే వుంటా కాని, అక్క చేయాలనుకున్న కుట్టు పని నేను చేస్తా! శ్రీమతి డన్ గారి దగ్గర కొంచెం కత్తిరింపులూ, డిజైనూ కూడా నేర్చుకుంటా. తర్వాత జేన్ చేయబోయే వ్యాపారంలో పనికొస్తుంది కదా?”

“ఎల్సీ! నిజంగా కవితలు రాయడం మొత్తానికే మానేసి కుట్టు పనిలోకెళ్తావా?” ఆశ్చర్యంగా అడిగాడు.

“ఏం ఫ్రాన్సిస్? నువ్వు బాంకు లో పని చేసినన్నాళ్ళూ కవితలూ, పుస్తకాలూ వదిలెయ్యాలేదూ? ఇదీ అలాగే!”

“నిజం చెప్పాలంటే సాహిత్యం లాటి వ్యాపకాలతో జీవన భృతి ముడి పడి లేనప్పుడే మంచి సాహితం సృష్టించగలుగుతామేమో!” సాలోచనగా అంది జేన్.

“అంతే అంతే!” ఏదో దీర్ఘాలోచనలో వున్నట్టు పరధ్యానంగా అన్నాడు ఫ్రాన్సిస్. నిజానికి అతను ఎల్సీ గురించి కానీ ఆమె కవితల గురించి కానీ ఆలోచించే స్థితిలో లేడు. మనసంతా ఒకలాటి నిరాశ కమ్మేసిందతన్ని.

నిన్ననే తను పెళ్ళి ప్రస్తావన తెచ్చి వుంటే జేన్ ఆలోచించేదేమో! ఇప్పుడసలు ఒప్పుకోదు. అందులోనూ ఈ పెళ్ళితో తను ఆస్తిపాస్తులూ, ఎస్టేటూ ఒదిలేసుకోవాలి కాబట్టి అసలే ఒప్పుకోదు.

“ఆ డబ్బుతో ఎన్నెని పనులు చేయొచ్చు! పాలేర్ల ఇళ్ళ మాట మరిచిపోతావా?” అంటుందు.

ఫిలిప్ గారి ఇంట్లో ఆమెకి తప్పక తనకంటే మంచి వరుడు దొరుకుతాడు. జేన్ ఇంకొకరి భార్యగా మారటమన్న ఊహకే అతనికి ఒళ్ళు కంపరమెత్తింది.

కలలో కనిపించిన అందమైన లోకం చేయి జారిపోయినట్టనిపించింది అతనికి. చేజారిపోయిన వరం ఎప్పుడూ చాలా అందంగా, ఉన్నతంగా అనిపిస్తుంది.ఒక్కక్షణం ఫిలిప్ జేన్ కి ఉద్యోగం ఇవ్వకుంటే బాగుండన్న స్వార్థపుటాలోచన కూడా వచ్చింది. ఆ ఆలోచనని అక్కడే అదిమి పట్టాడు.

” పెద్దమ్మాయిగారు వెళ్ళిపోతారని చెప్పగానే పిల్లలందరూ గొల్లుమన్నారు! అయితే ఉత్తరాలు రాసుకోవచ్చని సంబరపడ్డారు కూడా అనుకోండి. ఇప్పుడు పోస్టు కార్డు ఒక పెన్నినే!” పెగ్గీ మాట్లాడుతోంది. ఈ లోకంలో కొచ్చి పడ్డాడు ఫ్రాన్సిస్.

“జేన్! నాకూ ఉత్తరాలు రాస్తావు కదూ? చిన్నదైనా పెద్దదైనా, అన్ని విషయాలూ రాయాల్సిందే! నీ మనసులో వచ్చే ప్రతీ భావమూ నాతో చెప్తావు కదూ?”

“తప్పక రాస్తాను ఫ్రాన్సిస్! నువ్వు మాత్రం నీ పని అనుకున్నట్టు జరగకపోతే నిరాశపడొద్దు ఫ్రాన్సిస్. పాలేర్లు నువ్వనుకున్నంత కష్టపడి ఉత్పత్తి పెంచలేకపోవచ్చు. నువ్వు వాళ్ళకొరకు ఎంత చేయబోతున్నావో అర్థం  చేసుకోలేకపోవచ్చు. అన్నిటినీ తట్టుకోవాలి!”

ఫ్రాన్సిస్ మౌనంగా కూర్చున్నాడు.

“ఇవాళెందుకో ముభావంగా వున్నావు ఫ్రాన్సిస్? ఎల్సీ! ఇవాళ నీ కవితల పుస్తకం చూపించొద్దులే. ఈ చిరాకులో చాలా తీవ్రంగా విమర్శిస్తాడేమో,” జేన్ నవ్వుతూ అంది.

“కాదు జేన్! ఇలాటి మూడ్ లోనే నా కవితలు ఇవ్వాలి. అప్పుడు నేను కవితల్లో చూపించే నిరాశా నిస్పృహలు అర్థమవుతాయి. ఇప్పుడే పుస్తకం తీసుకొస్తా. ”

ఎల్సీ వెళ్ళి దారంతో కట్టి వున్న కాగితాల బొత్తి తీసుకొచ్చింది.

కవితా పఠనంలో ఆనందం పాఠకుడి మానసిక స్థితిని బట్టి కూడా వుంటుంది. ఇవాళ తనున్న బాధలో ఫ్రాన్సిస్ కి ఎల్సీ కవితల్లో తన నిస్సహాయతే ప్రతిధ్వనించినట్టనిపించింది. చాలా చోట్ల కవితాత్మ చక్కగా వుందని మెచ్చుకున్నాడు కూడా. అక్కడక్కడా కొన్ని తప్పుల్ళేకపోలేదు. కానీ మొత్తం మీద ఎల్సీ కవిత్వం బానే అనిపించింది ఫ్రాన్సిస్ కి.

ఆ రోజు వాళ్ళు ముగ్గురూ ఒక పాటకచ్చేరీకెళ్ళారు. అతనికి ఎల్సీ అభిరుచి నచ్చింది. నిజానికి అతనికి ఎల్సీతో భావ సారూప్యం ఎక్కువ. అయినా అతనికి జేన్ మీదున్న గొప్ప అభిప్రాయమూ, అభిమాననూ ఎల్సీ పట్ల ఏర్పడటం లేదు. ఎందుచేతనో మరి!

 

ఎల్సీ తనకి మొదట్లో ఫ్రాన్సిస్ మీదున్న కోపమూ, అపనమ్మకమూ గుర్తొచ్చి నవ్వుకుంది. అంతలోనే ఆమె దృష్టిలో అప్పుడే అక్కడికొచ్చిన విలియం డాల్జెల్ పడ్డాడు.

చిరాకుతో ఆమె మొహం ముడుచుకుంది. అక్కని అతను మోసం చేసాడన్న కోపం ఆమె మనసులో ఇంకా అలానే వుంది. డాల్జెల్ రెన్నీ కుటుంబంతోనూ, లారా విల్సన్ తోనూ కలిసి వచ్చినట్టున్నాడు. అతనిలాటి స్వార్థపరుడికీ, ఫ్రాన్సిస్ లాటి మంచి మనిషికీ ఎంత తేడా, అనుకుంది ఎల్సీ.

విలియం డాల్జెల్ ని ఫ్రాన్సిస్ కూడా దూరం నించి చూసాడు. అన్నీ కలిసొస్తే జేన్ అతన్నే పెళ్ళాడేదన్న విషయమూ తెలుసతనికి. అతనికి ఆ సంగతి తలచుకోగానే గుండెల్లో ముల్లు దిగినట్టైంది.

 

***

(సశేషం)

 

 

డైరీలో ఒక పేజీ

 

వినోద్ అనంతోజు

వినోద్ అనంతోజు

 

 

 

 

 

 

 

అనుషాని పిక్ చెస్కోడానికి బెంగళూరు రైల్వే స్టేషన్ కి వెళ్ళాను. సరిగ్గా సంవత్సరం క్రితం చూశాను తనని.

ఎన్నో రోజుల తరవాత కలుస్తున్నాను. ఏదో ఆత్రుత, ట్రైన్ టైమ్ కి గంట ముందే వచ్చేశాను స్టేషన్ కి. స్టేషన్ బయట ఒక ౩౦ ఏళ్ల ఆవిడ నీరసంగా, చిన్న చిన్న దెబ్బలతో పడి ఉంది. చిరిగిపోయిన బట్టలతో, వొళ్ళంతా దుమ్ముతొ. ఆమె పక్కన ఆమె తాగుబోతు మొగుడు నలుగురితో గోడవపడుతున్నాడు. వాళ్ళ సంభాషణ అంతా కన్నడ లో జరుగుతోంది. నాకు అర్థమైనదాన్ని బట్టి వాడు ఆమెని కొడుతుంటే అటుగా వెళ్తున్న కొంతమంది అతన్ని ఆపి వాదులాటకి దిగారు. 

“నా భార్య నా ఇష్టం” అన్నాడు వాడు. ఆది విని కొంత మంది వెళ్ళిపోయారు అదేంటో..!! ఇద్దరు మాత్రం అతన్ని రెండు దెబ్బలు వేసి తరీమేశారు. వాళ్ళు కుడా వెళ్ళిపోయారు. ఆమె అక్కడే పడుంది. బలహీనంగా మూలుగుతోంది. జనం వస్తున్నారు, పోతున్నారు. కొందరు ఆమెని సరిగా గమనించకుండానే, అడుక్కునే ఆవిడ అనుకుని చిల్లర వేసిపోతున్నారు. నేను ఆ పక్కనే నిలబడి చూస్తున్నాను. ఇంతలో ఆ మొగుడు ఎక్కడినుంచో వచ్చి ఆవిడ ముఖం మీద బలంగా గుడ్డాడు. ఆవిడ గట్టిగా రోదించడం మొదలుపెట్టింది. అటు ఇటు పొర్లుతోంది. తాగుబోతు ఏదో గట్టి గట్టి గా అరుస్తూ అటు ఇటు తులుతూ తిరుగుతున్నాడు. జనం ఆవిడని దాటుకుని, తప్పుకుని వెళ్ళిపోతున్నారు. 25 ఏళ్లు ఉండే ఒకావిడ ఆమె భర్తతో అటుగా వెళ్తూ ఆగి ఆవిడతో మాట్లాడాలని ప్రయత్నించింది. మంచి నీళ్ళు తాగించింది. ఏదో జరుగుతోందని జనం గుమిగూడి చూస్తున్నారు. ఆవిడ కన్నడలొ ఏవో ప్రశ్నలడిగింది. ఆమె రోదిస్తూ సమాధానం చెప్తోంది. ఇంతలో అందరు తాగుబోతు మొగుడిని తిట్టడం మొదలుపెట్టారు. పోలీసాయన్ని పిలిచి అతని గురించి చెప్పారు. వాడు పోలీసు ని చూడగానే పారిపోయాడు. పోలీసాయన వెనకే పరిగెత్తాడు. ఆవిడని ఏం చెయ్యాలి అనే ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండానే వెల్లిపొయాడాయన. నేను ఆ 25 ఏళ్ల ఆవిడని అడిగాను.

“డూ యూ నో కన్నడ? ”

“యస్”

“వాట్ ఇస్ షీ సేయింగ్?”

“ఈ డిడ్ నాట్ గెట్ హర్. షీ ఇస్ క్రైయింగ్ ఏ లాట్.”

ఆవిడ భర్త వచ్చెయ్యమని ఇందాకటి నుంచి లాగుతున్నాడు. కొద్దిసేపు నిలబడింది. ఎం చెయ్యాలో తోచక తన వాటర్ బాటల్ ఆమెకిచ్చేసి వెళ్లిపోయింది. జనం మళ్లీ ఎవరిదారిన వాళ్ళు వెళ్లిపోవడం మొదలుపెట్టారు. అప్పటిదాకా అక్కడ నిల్చున్న ఒకతన్ని ఏమైందని అడిగాను.

“వదిలెయ్యండి సార్… మనమేం చెయ్యలేము.. వాళ్ళ పాపాన వాళ్లే పోతారు !! ” అన్నాడు.

నేనిక చూడలేక పోయాను. వెళ్ళి ఆమెని అడిగాను.

“అమ్మా తెలుగొచ్చా?” వచ్చు అని చెప్పింది.

ఆవిడది మదనపల్లి అంట. మొగుడు పిల్లలు అక్కడే ఉన్నట్టున్నారు. ఈ తాగుబోతు ఈమెని ఇక్కడికి తీస్కొచ్చాడట. అక్కడే స్టేషన్ దగ్గరే అడుక్కుంటూ ఉంటారట. రోజూ తాగొచ్చి తంతూ ఉంటాడట. ఈ రోజు ఎందుకో నువ్వు ఛస్తే డబ్బులొస్తాయి అని ఛంపుతానని కొడుతున్నాడట. నేను ఆమెతో మాట్లాడుతుంటే ఏదో జరుగుతోందని జనం గుమిగూడారు.

చాలా నీరసంగా ఉంది ఆమె. చేతులు కదిలించడం కూడా కష్టంగా ఉంది ఆమెకి. మాటలు కూడా స్పష్టం గా అర్థం కావడంలేదు. ఆమె ముఖం మీద దెబ్బల నుంచి బాగా రక్తం కారుతోంది. రైల్వే స్టేషన్ లో క్లినిక్ ఏదైనా ఉందేమో అని ఒకతన్ని అడిగాను.

ఫర్స్ట్ ప్ల్యాట్‌ఫార్మ్ మీద ఉంది కానీ ఎలా తీస్కెళ్తాము అన్నాడు. స్ట్రెచర్ ఏమైనా ఉంటుందేమో చూద్దాము అన్నాను. వీల్ ఛైర్ ఒకటుంది. దాన్నే తీస్కొచ్చాం. ఆవిడని ఎత్తి దాంట్లో కుచోబెట్టాలి. ఆడమనిషిని ముట్టుకోవడం సరికాదన్నాడు ఒకడు. నాకు ఆవిడ ఒక దీనురాలు అంతే. ఆడా మగా సమస్య కాదు. ఆమె చేతులు పెట్టుకుని పైకి లేపడానికి ప్రయత్నించాను. అందరు నిలబడి నిశ్చేష్ఠులై చూస్తున్నారు కానీ ఎవరూ ఆమెని ముట్టుకోడానికి ముందుకి రాలేదు.

పక్కనే ఒక కార్పెట్ ఉంటే తీస్కొచ్చి పరిచాను. ఇద్దరు ముగ్గురు సాయం పట్టారు. ఆమెని కార్పెట్ లో పడుకోబెట్టి, ఎత్తి ఛైర్ లో కూచోపెట్తి తీస్కెళ్తున్నాం. ఆ తాగుబోతు భర్త మళ్లీ వచ్చాడు. తాను కూడా క్లినిక్ కి వస్తా అన్నాడు. ఛైర్ నెడుతున్నాడు. ఆవిడ వాడిని చూడగానే భయపడి ఏడుస్తోంది. వద్దని చెప్తోంది. నేను అతనిని తెలుగులో వెళ్ళిపొమ్మని చెప్పాను. వాడికి అర్థం కాలేదు. పక్కన ఉన్న ఒకాయనకి చెప్పాను అతనిని పంపించెయ్యమని.

“ఎంతైనా మొగుడు కదా.. రావోద్దని ఎలా చెప్తాం” అన్నాడు.ఆ మాట విని నాకు ఒక్క క్షణం మతిపోయింది. మొగుడు ఎంత నీచుడైనా భార్య మీద అన్ని అధికారాలు ఉంటాయి అని నమ్మడం, హు.. మధ్యయూగాల వాసన ఇంకా అలానే ఉంది. ఇంతలో ఆ పోలిసాయన అటుగా వచ్చాడు. ఆ తాగుబోతు పారిపోయాడు అక్కడ్నుంచి.

 

ఒక ఐదుగురం కలిసి ఆవిడని వీల్ ఛైర్ మీద క్లినిక్ కి తీస్కెళ్తున్నాం. జరుగుతున్నదంతా గమనించి ఒక 20 ఏళ్ల కన్నడ యువతి కూడా మాతో జాయిన్ అయ్యింది. ఏం జరిగింది అని నన్ను అడిగింది. జరిగిందంతా ఇంగ్లీష్ లో చెప్పాను. ఆ అమ్మాయి ఆవిడతో కన్నడలొ ప్రేమగా మాట్లాడి ధైర్యం చెప్పింది. నీకేం కాదు, మేమంతా ఉన్నాం అని చెప్పింది నాకు ఆ అమ్మాయి మీద గౌరవం కలిగింది.

 R_Tagore_Veiled_Woman

క్లినిక్ లో 25 ఏళ్ల కుర్ర డాక్టర్ ఉన్నాడు. లోపలికి తీస్కెళ్లగానే ఆవిడని చూసి కొంచం ఆశ్చర్యపొయినప్పటికీ, ఎటువంటి ఏవగింపు లేకుండా ఆ దెబ్బలకి మందు పూయడం మొదలుపెట్టాడు. “ఈమె ఫుల్ గా తాగి ఉంది” అని చెప్పాడు.

“ఏమ్మా ఫుల్ గా తాగావా?” అడిగాడు.

ఆవిడ సత్య ప్రమాణంగా తాగలేదని చెప్పింది. అతను వెటకారంగా నవ్వి “ఇది మాములే సార్.. ప్ల్యాట్‌ఫార్మ్ మీద అడుక్కోవడం, రాత్రికి తాగి తన్నుకోవడం. మీరంతా ఎందుకు సార్ అనవసరంగా టైమ్ వేస్ట్ చేసుకున్నారు.” అన్నాడు.

అక్కడున్న వారంతా ఈ మాట విని ఏదో పెద్ద సానుభూతి భారం గుండెల మీద నుంచి దిగిపోయినట్టు రిలీఫ్ గా ఫీల్ అయ్యారు.

నేనేం మాట్లాడలేదు. ఆ కన్నడ యువతి ఇంగ్లీష్ లో అంది “వీళ్ళకి తినడానికి డబ్బులుండవు గాని .. తాగడానికి మాత్రం ఉంటాయి.”

 

ట్రీట్‌మెంట్ అయిపోయింది. డాక్టర్ దెబ్బలకి కట్టు కట్టాడు. ఇప్పుడామెని ఎం చెయ్యాలి అనేది ప్రశ్న.

బయట వదిలేస్తే మళ్లీ ఆ తాగుబోతు మొగుడు వస్తాడు. క్లినిక్ లోపల ఉంచడానికి కుదరదు.

ఆవిడని అడిగాను. “అమ్మా.. ఎక్కడికెళ్తావు?” అని.

సగం మూసుకుపోతున్న కళ్ళతో, నీరసంగా ఏమో అన్నట్టు చెయ్యి ఉపింది. నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

నా మనసులో కలుగుతున్న భావాన్ని జాలి అనాలో, సానుభూతి అనాలో, వ్యవస్థ మీద కోపం అనాలో అర్థం కావట్లేదు.

“మదనపల్లి వెళ్తావా” అని అడిగాను. డబ్బుల్లెవు అంది. తమిళాయాన భోజనం పార్సల్ తీస్కొచ్చాడు. ఆవిడని ప్ల్యాట్‌ఫార్మ్ మీదనే ఒక చోట కూచొపెట్టి ఎవరికి తోచినంత వాళ్ళిచ్చారు. ఆ కన్నడ యువతి ట్రైన్ టైమ్ అవుతోందని చెప్పి వెళ్లిపోయింది.

ఆవిడకి చెప్పాను ” అమ్మా ఈ డబ్బులు జాగ్రత్త. ఆ తాగుబోతు వాడికి చూపించొద్దు. ముందు భోజనం చేసి కొంచం శక్తి వచ్చాక మదనపల్లి ట్రైన్ ఎక్కెయ్యండి.” ఆవిడకి నేను చెప్పింది ఎంతవరకూ బుర్రకెక్కిండో తెలియదు. ఏడుస్తూ దండం పెట్టి కాళ్ళు పెట్టుకొబోయింది. ఆపి, వద్దని చెప్పి, జాగ్రత్త అని చెప్పి లేచాను.

మొదట్నుంచి మాతోపాటు ఉన్న ఒక తెలుగాయన వాష్ బేసిన్ చూపిస్తూ “చేతులు శుభ్రంగా కడుక్కోండి సార్” అని చెప్పాడు. నాకేం అర్థం కాలేదు.

“ఆహా… అదంతా పట్టుకున్నారు కదా… చేతులు కడుక్కోండి.” అన్నాడు. సరే అన్నట్టు తల ఊపాను.

అనూష వచ్చే ట్రేన్ అనౌన్స్మెంట్ వచ్చింది. వెనక్కి తిరిగి ఆవిడని చూస్తూనే ముందుకి నడిచాను. ఎన్నో సమాధానం చిక్కని ప్రశ్నలు మనసుని ముసురుతూండగానే అనుషాని రిసీవ్ చేస్కున్నాను. తను ఏదో మాట్లాడుతోంది గాని, నా మనసు అక్కడ లేదు. తిరిగి ప్ల్యాట్‌ఫార్మ్ 1 మీదుగా వస్తూ ఆవిడ కోసం వెతికాను. కనిపించలేదు.

 

ఒక్క గంటలో ఎన్ని రకాల మనుషులని, ఎన్ని రకాల మనస్తత్వాలని చూసాను.

ఆ దీనురాలి సమస్య కి పరిష్కారం ఏమిటి? దాన్ని పరిష్కారం చేసేవారెవరు?

ఆ సమస్యని నెత్తికెత్తుకుని ఆమె జీవితాన్ని చక్కదిద్దే స్థోమత, శక్తి నాకున్నాయా?

ఆవిడని అలా ప్ల్యాట్‌ఫార్మ్ మీద వదిలేసి రావడం సరైన పనేనా? నాతో పాటు ఉన్నవాళ్ల ప్రవర్తన సమంజసమేనా?

ఆవిడ తాగి ఉంది అనగానే ఆమె పట్ల, ఆమె పరిస్థితి పట్ల చులకన భావం ఎందుకు కలిగింది?

ఆమె సంస్కారహీనతని లోపం గా చూపి, తమ బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నం కాదా ఆది?

చిన్నప్పటి నుండీ రోజూ కడుపునిండా తిండితో, తీరైన పోషణతో, ఉన్నతమైన చదువులు చదువుతూ పెరుగుతాం మనం. మనకి మంచేదో చెడేదో ముందుగానే ప్రిడిఫైన్ చెయ్యబడి ఉంటాయి. ఎవరితో ఎలా మాట్లాడాలి, గౌరవం ఎలా ఇవ్వాలి, మర్యాద ఎలా సంపాదించుకోవాలో పెంపకంతోపాటే నేర్చుకునే మనకు ఒక సంస్కార స్థాయి ఉంటుంది.

రోడ్ల మీద పుట్టి, రోడ్ల మీద పెరిగినవాళ్ళు, ఏరోజుకారోజు ఉనికి సమస్యనెదుర్కునేవాళ్ళు, జీవితంలోని అన్ని రకాల దౌర్భాగ్యాలని, దుర్మార్గాలని ఎదుర్కుంటూ పెరిగినవాళ్ళు, ఎక్కడికెళ్లినా అవమానాలు, ఛీత్కారాలు, రుచిచుసే వాళ్ళు, మాంచేదో చెడేదో చెప్పే దిక్కులేనివాళ్ళు అలా కాక ఇంకెలా ఉంటారు? వాళ్ళకి కూడా మనకున్న సంస్కార స్థాయి ఉండాలనుకోవడం తప్పు. ఆ మాటకొస్తే.. పదిమందిలో ధైర్యంగా, బాధ్యతగా నిలబడి ఒక దీనురాలికి సహాయం చేస్తున్న భార్యని వెనక్కి లాగిన భర్తదేమి సంస్కారం?

రోడ్డు మీద ఒక మనిషి వేదనలో ఉంటే ఆడమనిషి కాబట్టి ముట్టుకోను అనడం ఏం సంస్కారం? అడుక్కునే ఆవిడ అయినంతమాత్రాన ముట్టుకున్నాక చేతులు కడుక్కోమని సలహా ఇచ్చిన పెద్దమనిషిది ఏం సంస్కారం?

ఒక మనిషి సమస్య మనం అర్థం చెస్కోవాలంటే ఆ సమస్య  సామాజిక మూలం గ్రహించగలగాలి. ఆది గ్రహించలేకపోతే ఆ మనిషి బ్రతుకు మనకి అర్థం కానట్టే. ఆ దీనురాలి పరిస్థితి ని అర్థం చెస్కోవాలంటే ఆమె స్థానంలో, ఆమె స్థాయిలో నిలబడి ఆలోచించాలి. ఆమె అనుభవిస్తున్న వేదన మనమూ అనుభవించాలి, ఆమె మోస్తున్న సామాజిక భారాన్ని మనమూ మొయ్యాలి, ఆమె అవివేకాన్ని మనమూ పంచుకోవాలి. దీన్నే సానుభూతి (సః అనుభూతి) అంటారు అనుకుంటాను.

నాలో ఆ సానుభూతే కలిగింది. అంతకంటే ఎక్కువగా కోపం కలుగుతోంది. వ్యవస్త మీద. జరిగిన దాంట్లో నాకు మొత్తం హింసే కనపడుతోంది. భార్య మీద భర్త చేసిన హింస కాదు. వాళ్ళిద్దరి జీవితాల మీద సమాజం చేస్తున్న హింస. వాళ్ళ ఈ పరిస్థితికి కారణం ఆ హింసే కదా. సమాజం లో అడుగడుగునా వేళ్ళూనుకుపోయిన హింసాస్వభావమే కాదా.

 

“ఏంటి అలా ఉన్నావ్?” అమాయకంగా అడిగింది అనూష. నా మనసు తన మీద లేదని గమనించింది కాబోలు. ఏమని చెప్పను తనకి. నాలో కలుగుతున్న ఆగ్రహం తనకి అర్థమౌతుందా. నా మూడ్ బాలేదు అనుకుంటుంది. నిజానికి నా మూడ్ ఇప్పుడే బాగుంది. ఏదో ఒక పనికొచ్చే ఆలోచన వైపు పరుగులు తీస్తోంది.

“ఏం లేదే… బానే ఉన్నా…!! నువ్వే జిడ్డు మొహం వేస్కుని ఉన్నావ్..!” :P

“20 గంటలు జర్నీ బాబూ..”

– వినోద్ అనంతోజు

 

 

అడివిలో మాయమయిన ఇంకో వెన్నెల!

’సముద్రుడు’ ఈ పేరు వినగానే ఒక గంభీరమైన వాతావరణం ఆవరించుకుంటుంది. నాకు కవిత్వాన్ని విశ్లేషించడం రాదు. ఆస్వాదించడం లేదా వంటపట్టీంచుకోవడమే వచ్చును. కొన్ని కవితలు చదివినప్పుడు బాగున్నాయనుకుంటాం మరికొన్ని చదువుతుండగానే  మనలోని వెలితిని కోల్పోతూ మమేకమవుతాం మరికొన్ని చదువుతూ కొత్త వెలుగును చూస్తాం. అలా కొత్త వెలుగును చూపే కవిత్వం ఆసరా భరోసా ఇచ్చే కవిత్వం ఇన్నేళ్ళ తరువాత కూడా నాకు కొద్ది మంది కవిత్వంలోనే పొందుతాను. అందులో మొదటిది సముద్రుని కవిత్వం. ఈ వరుసలోనే అమరులు కామ్రేడ్ ఎమ్.ఎస్.ఆర్., కామ్రేడ్ కౌముదిల కవిత్వం. ఈ ముగ్గురి కవిత్వ వస్తువు ఒక్కటే అయినా ఎవరి ప్రత్యేకత వారిదే. ఎవరి అక్షరం వారిదే. ఒకరికొకరు యుద్ధ రంగం నుండే రాస్తున్నా తమ మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తూ విప్లవ కవిత్వానికి ఓ కొత్త పరిమళాన్ని అద్ది దారి చూపిన వారే. ఇప్పుడు సముద్రుని సమయం గురించి మాటాడుకుందాం.

సరిగ్గా ఇరవై రెండేళ్ళ క్రితం 1991 సెప్టెంబర్ ఒకటో తారీఖున ఉద్యమ కార్యాచరణలో భాగంగా మోటార్ సైకిల్ పై వస్తున్న ఇద్దరు యువకులపై కాల్పులు జరిపి గాయపడిన వారిని తీవ్రమైన చిత్రహింసలకు గురిచేసి ఎదురుకాల్పుల పేరిట రాజ్యం హత్య చేసింది. వారిద్దరిలో ఒకరు కామ్రేడ్ జనార్థన్. తన కలం పేరు సముద్రుడు. అతని అమరత్వం తరువాత ఆయన ముద్రిత రచనలు ’త్యాగమే జయిస్తుంది’, ’భూమి నా తల వెల నిర్ణయించు’, ’స్వేచ్చ’, ’వాడు నా భూమి, మరణానంతరం అచ్చయిన ’మృత్యువే మరణిస్తుంది’ కవితా సంకలనాల సంపుటిగా సముద్రుడి సమయం’ పేరుతో విరసం 1994 లో ప్రచురించింది.

నిజానికి విప్లవ కవిత్వమంటే నినాద ప్రాయంగా ఒకే వస్తువుతో ఎలిజీలకు పరిమితమవుతూ ఉంటుందని చాలా మంది అభిప్రాయం, నిజమే కదా యుద్ధ రంగం నుండి పిలుపు ప్రేమ పల్లవిలా ఎలా పలుకుతుంది? అది వీరుని గొంతులోనుండి యుద్ధ నినాదంగానే పెడబొబ్బలా సింహనాదంలా ప్రతిధ్వనించి మేల్కొలపాల్సిన అవసరముంది. అదే సమయంలో మీ తూనిక రాళ్ళకు సరిపోయే కవిత్వాన్ని అందించే కృషి జరుగుతునే వుంది నిరంతరం. అలా కృషి కొనసాగుతున్న క్రమంలోనే నూనూగు మీసాల నూత్న యవ్వన ప్రాయంలోనే యుద్దరంగంలో ఒరిగిపోతున్న వారి కవిత్వానికంటిన పచ్చి నెత్తురు తడి మీ అరచేతులకంటుతుంది ఈ సంపుటినిండా. ఒరిగిపోతున్న తన గురువులు, సహచరుల గురించి కవి గుండె కలిగిన సముద్రుడు రాయకుండా వుండగలడా? అలా ఇందులోను ఎలిజీలు వున్నాయి.

శివారెడ్డి గారన్నట్టు విప్లవ సాహిత్యం ఎదుగుదలలో ’ఎలిజీ’ది ప్రత్యేక స్థానం. ఒక ఎడబాటు, ఒక లాస్, ఒక తీరని దు:ఖం, పోయిన దాన్ని వెతుక్కునే క్రమంలో తగిలే కారణాల్లోంచి జన్మించే క్రోధం నుంచి ’ఎలిజీ’ పుడుతుంది అంటారు. అసహజ మరణాలు నిత్యకృత్యమయ్యే దశలో ’ఎలిజీ’ అనివార్యమయింది. ఎవడి ’ఎలిజీ’ వాడు రాసుకునే దశ ఇది అంటారు. యుద్ధ రంగంలో వున్న గెరిల్లా తనను తాను సంభాళించుకొని అడుగు ముందుకు వేయటానికి పనికొచ్చేదే కామ్రేడ్ స్వర్ణలత ’చరితార్థయై’ గాధగా మిగిలినప్పుడు రాసిన వాక్యాలు..

 

’ ప్రపంచంలోని విషాదాన్ని, ఆనందాన్ని ఒక్కసారే ఎవ్వరైన

 తాగుతారో లేదో తెలియదు గానీ.

 విప్లవకారులు మాత్రం హాలాహలాన్ని అమృతాన్ని ఒకేసారి

 తాగి జీర్ణించుకోగలరు’

అలాగే కామ్రేడ్ సుధాకర్ అమరుడయినప్పుడు రాసిన ’బేబాకీ’లో

 

’ చావు ద్వారం వద్ద నిలబడి పిలుస్తుంటే

 గేలిచేస్తూ పగలబడి నవ్వే వారెవరు?

 కబళించిన చావును తిరిగి విసిరి

 గోడకు దిగ్గొట్టిన వారెవ్వరు?

 శహభాష్! నా వీరులారా!

 మీరు చావుకి గోరీలు కడుతున్నారు’

అలాగే కామ్రేడ్ బాబూరావు అమరత్వంపై రాసిన కవిత ’మృత్యుంజయులు’ లో

 

మీ కోసం వదిలిన ఈ కన్నీళ్ళు

సామాన్యమైనవి కావు కామ్రేడ్ అంటూ

ఇవి రక్త సంబంధం కోసం వదిలిన అశువులు కావు

హిమాలయాలకంటే ఉన్నతమైన

వర్గసంబంధం కోసం వెచ్చించిన కన్నీటి ధారలు

కామ్రేడ్! అంటాడు సముద్రుడు.

 samudrudi samayam

కవిత్వంలో కొత్త ఎత్తుగడలను పదబంధాలను ఎన్నుకొని ప్రయోగించడంలో సముద్రుడు తనదంటూ ఒక ముద్రను వేస్తూ పోయాడు. అందుకు ఈ సంపుటిలోని మొదటి కవిత నీవు – నేను ఒక మంచి ఉదాహరణ. మిషనరీ స్కూళ్ళలో విద్యార్థులపై తీసుకునే క్రమశిక్షణా చర్యలును ఉదహరిస్తూ రాజ్య దౌష్ట్యాన్ని మన కళ్ళముందుంచుతాడు,

 

’పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యం వచ్చుగాక!’

 నీ రాజ్యంలో దాసదాసీలున్నంత కాలం నీ రాజ్యం వద్దు స్వామీ!

 ప్రజల కొరకు ఏ రాజు పాటుపడ్డాడు?

 ఏ పులి మేకలకై త్యాగానికి సిద్దపడుతుంది

 రెండు చేతులు జోడించనందుకు

 నా అరచేతులు కాల్చినపుడు

 రాలిన నీటిబిందువులపై

 నీ ఆత్మ ’అల్లాడిందా’ ప్రభూ?’

సిద్ధాంతాన్ని తద్వారా పోరాట పటిమను ఎలుగెత్తి కీర్తించడంలో సముద్రుని కవిత్వం ప్రతిభావంతంగా సాగుతుంది. ’మేకవన్నె పులులు’, ’జడుడు’, ’ప్రతిఘటన’ ’మేం వజ్రాలనే వెదుకుతాం!’ మొ.న కవితలు ఉదాహరణలు. ఇందులో ’ప్రతిఘటన’ కవితలో

 

’సముద్రపు అంచు పైపైకొస్తున్న

 సూర్యుణ్ణి అణచాలని

 సాయుధంగా సముద్రంలో ముందుకు సాగినా

 సూర్యుణ్ణి చూసి ఉత్సాహంగా లేచే అలల్ని

 మాత్రం మీరు అణచగలరు గాని

 సూర్యుణ్ణి ఏమీ చేయలేరు’

అని విప్లవ ఉద్యమాన్ని రాజ్యం ఎన్ని బూటకపు ఎదురుకాల్పులు జరిపినా, ఎన్ని వేలకోట్ల రూపాయలు వెచ్చిస్తూ విష ప్రచారం చేసినా అణచలేదని భరోసా ఇస్తాడు.

 

గెరిల్లా కవిగా సహచరులకు తన కవితల ద్వారా కార్యోన్ముఖులను చేయడంలో సముద్రుడు చాలా శ్రద్ధ తీసుకొన్నాడు. ఉదాహరణకు

’కాలం సందిట్లో గుణపాఠం నేర్వకుంటే

 పొందికగా నడవడం చేతకాదు

 గుణపాఠాన్ని గుర్తించకుంటే

 రేపటి నీ ఆకారానికి గుర్తింపే ఉండదు’

’వేళ్ళను నమ్మని వాళ్ళకు చెట్టుపై విశ్వాశముండదు

కాపును కోయ సిద్ధమేగాని నీళ్ళు పోయడానికి భయం’ అని లొంగిపోయిన వాళ్ళని ఎద్దేవా చేస్తాడు

’విశ్వాశం పట్టుదల తరాలను మారిస్తే

త్యాగం అంతరాలను మారుస్తుంది’  అంటాడు.

ఇంకా ఉద్యమాన్ని హేళన చేస్తూ తామే ఉద్యమాన్ని నిర్మించామనుకునే స్వీయ ప్రకాశుల కోసం

 

’ సారె మీద తిరిగే ఈగ

 సారె తిరిగేది తన గొప్పతనంనుండే అనుకుంటే

 చివరకు కుడితిలో పడ్డ ఈగలా

 ఊపిరాడక చావక తప్పదు

 ఒకనాటి తోటరాముడు చివరకు

 కాగితం పువ్వుకంటే హీనమైపోతాడు’ అంటాడు

’పాలక వర్గం “ఫేస్” మీద “పౌడర్”లా

అతుక్కుపోయిన వీరికి

ఏ ధర్మం అర్థం కాదు

అందుకే అవకాశవాది నోరు తెరిస్తేనే దుర్వాసన’ అంటాడు.

సముద్రుడు కవిత్వంలో ఏ వస్తువునీ స్పృశించకుండా వదలలేదు. తన తల్లి, గురువులు, సహచరులు, బిడ్డ సాగర్, అడవి, ప్రకృతి, పెట్టుబడిదారీ విధానం, గెరిల్లా యుద్ధతంత్రం, అంతర్జాతీయ, జాతీయ రాజకీయాలు, ఎత్తుగడలు వ్యూహాలు ఇలా అన్ని అంశాలను తన కవిత్వంలో పొందుపరిచాడు. ఇందులోని చివరి దీర్ఘ కవిత ’అడివి’ చదివితే మన కళ్ళ ముందు అడివిలోని జీవితం ప్రకృతి రమ్యతతో పాటు యుద్ధమూలాలు సజీవంగా మనకు కదలాడుతాయి. తన రచనా శైలిలోని బిగువుకు అడివి సజీవ ఉదాహరణ. విప్లవ కవికి శిల్పం పట్ల నిర్లక్ష్యం అన్నమాటకు జవాబుగా ఇందులో తాను తీసుకున్న అనేక ప్రతీకలలో

 

’నడిజాము ముబ్బుల మధ్య దోబూచులాడే చంద్రుడు

 నీటిలో చేపలా తిరుగాడే గెరిల్లా

 అకస్మాత్తుగా దాడి జరిపే వానజల్లు

 చివరికి ఆకులపై పొంచివుండి సెంట్రీ జేస్తుంది!

 గుట్టలమీద నుండి దూకే జలపాతం తిరిగి తిరిగి అడవికి వడ్డాణమైంది

 ఎత్తైన కొండల్ని – అగాధాల్ని దాచుకున్న అడివి పూర్ణగర్భిణిలా వుంటుంది!

’ అడివిలో వృక్షాలపై, కొమ్మలపై, ఆకులపై నిఘాను పెట్టగలడేమో గాని

 అడివిలో వెన్నెల వెల్లి విరియడాన్ని ఎవడాపగలడు?

’వెన్నెల వేడిలో అడివి స్నానమాడుతుంది

 అడివి కిరీటాన్ని తొడిగినట్లు ఆకాశాన ఇంద్రధనుసు వెల్లివిరిసింది’

’అడివి వసంతాన్నావహించి చిగుర్లలో లేత ఎరుపును కౌగిలించి

 లేత చిరు ఎండలో ఆరుద్రలో మెరిసిపోతుంద”

’ఆకాశం కాలుష్యాన్ని చూసి భోరుమని విలపిస్తే

 అడివి కడిగిన ముత్యంలా వెలిగిపోతుంది’

 

ముప్పైఏళ్ళలోపు పిన్న వయసులోనే అమరత్వాన్ని ముద్దాడిన కామ్రేడ్.  నిత్యమూ యుద్ధరంగంలో తన మెడపై వేలాడే కత్తిని గమనిస్తూనే సమకాలీన కవిత్వాన్ని అధ్యయనం చేస్తూ, వేటగాళ్ళ చూపులనుండి తప్పించుకుంటూ తనకిష్టమైన కవులను కలుస్తూ సాహిత్యం గురించి చర్చిస్తూ తన సృజనకు మెరుగులు దిద్దుకునే క్రమంలో రాజ్యం అత్యంత నీచంగా హింసాత్మకంగా తన ముఖాన్ని చెక్కి దేహమంతా గాయాల మయం చేసినా తన కవిత్వంలో నిర్బంధం గురించి ఏమి రాసాడో అవే అక్షరాలకు బద్ధుడై తన పిడికిలిలోని రహస్యాన్ని తెరవకుండా చిరునవ్వుతో చావును గేలి చేస్తూ శతృవుకు తనను చంపడమనే చేతకాని చర్య తప్ప మరో దారి లేకుండా చేసిన మరో భగత్ సింగ్, ఆజాద్ ల వారసుడు. జీవితమే యుద్దమై యుద్ధమే జీవన రంగమైన ఓ నవయువకుని ఆశల స్వప్నాల ఆరని జ్వాల ఖండిక ఈ ’సముద్రుని సమయం’ ఇప్పటికీ యుద్ధ సమయమే.

-కెక్యూబ్ వర్మ

వర్మ

వర్మ

 

 

గాంధారి పెళ్లి

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

అంగములలోన మే లుత్తమాంగ మందు

నుత్తమంబులు గన్నుల యుర్విజనుల

కట్టి కన్నులు లేవను టంతె కాక

యుత్తముడు గాడె సద్గుణయుక్తి నతడు

                                  -నన్నయ

(శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, పంచమాశ్వాసం)

అవయవాలు అన్నింటిలోనూ ఉత్తమం శిరస్సు, ఆ శిరస్సులోనూ ఉత్తమాలు కన్నులు. అలాంటి కన్నులు లేకపోవడం ఒక్కటే లోటు కానీ, సద్గుణసంపదలో అతడు ఉత్తముడు కాడా ఏమిటని ఈ పద్యం చెబుతోంది. సందర్భమేమిటంటే, గాంధారరాజు సుబలుడు తన కూతురు గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చేశానని బంధువుల మధ్య ప్రకటించాడు. అప్పుడు బంధువులు ఇలా అనుకున్నారు.

***

మన వివాహ సంబంధాలు బోర్లించిన గోపురం ఆకారంలో ఉంటాయి. పైన ఉండే వైశాల్యమూ, చుట్టుకొలతా కిందికి వెడుతున్న కొద్దీ తగ్గిపోతాయి. పై భాగాన అంతర్జాతీయస్థాయి వివాహాలు ఉంటే, అట్టడుగున ఒకే కుటుంబంలో ఇచ్చి పుచ్చుకునే వివాహసంబంధాలు ఉంటాయి. ఈ మధ్యలో జాతీయం, రాష్ట్రీయం, ప్రాంతీయం, గ్రామం వగైరా  ఉంటాయి. అంతర్జాతీయస్వభావం కలిగిన వివాహాల సంఖ్య తక్కువే అయినా వాటి  భౌగోళిక వైశాల్యం చాలా ఎక్కువ.

రాజీవ్ గాంధీ, సోనీయా గాంధీల వివాహం అంతర్జాతీయం. అలాగే, చాలాకాలంగా ప్రచారంలో ఉన్నట్టు రాహుల్ గాంధీ కొలంబియా అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే జరిగితే అది కూడా అంతర్జాతీయం అవుతుంది.  జాతీయ వివాహాలకు ఎన్ని ఉదాహరణలైనా ఇవ్వచ్చు. ఇందిరాగాంధీ-ఫిరోజ్ గాంధీల వివాహం జాతీయం. అలాగే, ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ ల వివాహం. కిందికి వెడుతున్న కొద్దీ ఒకే స్వభావం కలిగిన వివాహ సంబంధాల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది కానీ, ఎంపిక స్వేచ్ఛ తగ్గిపోతూ ఉంటుంది. కులం, ప్రాంతం వగైరాలకు చెందిన ప్రాధాన్యాలు, పట్టింపులు అందుకు కారణమవుతాయి. ఒకే కుటుంబంలో ఇచ్చి పుచ్చుకోవడం బహుశా వివాహసంబంధాల సంకుచిత, కనిష్ట రూపం.

కులాల పరంగా చూస్తే, బ్రాహ్మణులు, క్షత్రియుల వంటి రెండు మూడు అగ్రవర్ణాల వారి వివాహ సంబంధాలకు జాతీయస్వభావమూ, ఎంపిక స్వేచ్ఛ ఎక్కువ ఉండడానికి సూత్రరీత్యా అవకాశం ఉంది. శూద్రులకు కూడా ఆ అవకాశం ఉండేది కానీ, వారు అనేక కులాలుగా చీలిపోవడం వల్ల అది తగ్గిపోయింది. వెనకటి సంగతి ఎలా ఉన్నా ఈ రోజున కులాంతర వివాహాలతో పాటు  అంతర్ బ్రాహ్మణ వివాహాలు జాతీయస్వభావాన్ని తెచ్చుకుంటున్నాయి. పైగా అవి ఆక్షేపణీయం కావడం లేదు. నేనీ మధ్య అలాంటి ఓ పెళ్ళికి వెళ్ళాను. వరుడు తెలుగబ్బాయి, వధువు అరవమ్మాయి. వరుని అన్న ఒక మరాఠీ అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. ఆ అమ్మాయి అన్నయ్య ఓ గుజరాతీ అమ్మాయిని చేసుకున్నాడు. ఒకే కులం మధ్య వివాహసంబంధాలు అలా నాలుగు రాష్ట్రాలను, నాలుగు భాషలను ముడి పెట్టాయి.

కులం, శాఖ, ప్రాంతం, భాష వగైరాలతో గిరిగీసుకునే వివాహసంబంధాలే సహజమైనవనీ, శాస్త్రసమ్మతాలనీ, సర్వత్రా అదే ఆనవాయితీ అనే భ్రమ మనలో ఇప్పటికీ చాలామందిలో ఉంది. కానీ ఉన్నతవర్గాలలో వివాహసంబంధాలు ఇప్పుడే కాదు, ఎప్పుడూ  గిరిగీసుకుని లేవు. ఉదాహరణకు, రాజకీయనాయకులు, సినీ నటులు, ఇతర సెలెబ్రటీల వివాహాలు. ఇతరేతర అంశాలు వారి వివాహనిర్ణయాలకు కొలమానం అవుతుంటాయి. వివాహం వ్యక్తిగతం అనుకుంటాం. కానీ వెనకటి రాచకుటుంబాల కాలంలో వివాహం వ్యక్తిగతం కన్నా ఎక్కువ రాజకీయసంబంధి.

రాజకీయ అవసరాలు, ఒప్పందాలలో భాగంగా ఆ వివాహాలు జరగడం సర్వసాధారణం. గజపతుల యువరాజును చెరపట్టిన కృష్ణదేవరాయలు రాజకీయసంధిలో భాగంగా అతని సోదరిని వివాహం చేసుకున్నాడు. అన్నపట్ల క్రూరంగా ప్రవర్తించిన రాయలను ఆమె ఎంత మనస్ఫూర్తిగా ప్రేమించిందో, ఎంత మనోవ్యధ అనుభవించిందో మనకు తెలియదు. తండ్రి రాజకీయ చదరంగంలో పాచికలుగా మారిన రాచకన్నెలు చరిత్ర పొడవునా ఉన్నారు. వాళ్లలానే వాళ్ళ కన్నీళ్లు కూడా అసూర్యం పశ్యలై అంతఃపుర రహస్యాలుగానే మిగిలిపోయి ఉంటాయి. రాచకుటుంబాలలో వివాహ సంబంధాలకు కులీనత, స్థాయి మొదలైనవి గీటురాళ్ళుగా ఉంటాయి కనుక  భాష, ప్రాంతం తదితరాలను అధిగమించడం అనివార్యమవుతుంది. విజయనగరం మహారాజు పాటియాలా మహారాజుతో వియ్యమందడం లాంటివి సహజంగా జరిగిపోతాయి.

మహాభారతానికి వస్తే, కురురాజుగా అభిషిక్తుడైన ధృతరాష్ట్రునికి భీష్ముడు పెళ్లి చేయాలనుకున్నాడు. ఈడు వచ్చిన యువకునికి పెళ్లిచేయాలనుకోవడంలో విశేషమేముంది కానీ, ఆ సమయంలో భీష్ముని ఊహాల్ని ప్రధానంగా మరొకటి ఆక్రమించుకుంది. అప్పటికి కొన్నేళ్ళ క్రితమే కురువంశం ఆగిపోయే ప్రమాదం భయపెట్టింది. వ్యాసుని జోక్యంతో ఆ గండం గడిచింది. ఆ అనుభవం ఇప్పటికీ భీష్ముని ఆలోచనల్లో పచ్చిగానే ఉంది.  కనుక ధృతరాష్ట్రుని పెళ్లిని మించి, ఆ పెళ్లితో కులం నిలిచే అవకాశమే అతనికి కొట్టొచ్చినట్టు కనిపించింది. విదురునితో ఆలోచనలను కలబోసుకున్నాడు. ఇక వధువు ఎవరన్న విషయానికి వస్తే, గాంధారరాజు సుబలుని కూతురు గాంధారి మంచి రూపమూ, లావణ్యమూ, శీలమూ, ఆభిజాత్యమూ కలిగిన కన్య అని బ్రాహ్మణుల ద్వారా విన్నాడు. పైగా వందమంది కొడుకులు కలిగేలా ఆమె వరం పొందిందని తెలిసి మరింత ముచ్చటపడ్డాడు. సుబలునితో మాట్లాడి రమ్మని కొంతమంది వృద్ధులను పంపించాడు.

ధృతరాష్ట్రుడు పుట్టంధుడు. అయినాసరే, సుబలుడు భీష్ముని కోరికను కాదనే అవకాశం లేదు. ఎందుకంటే, రాజు ధృతరాష్ట్రుడే కానీ, రాజ్యరక్షకుడు భీష్ముడే. అతడు పరాక్రమవంతుడే కాక, కాశీ రాజు కూతుళ్లను రాక్షసవివాహ పద్ధతిలో ఎత్తుకు వెళ్ళి, తన తమ్ముడు విచిత్రవీర్యునికి ఇచ్చి పెళ్లి చేసిన చరిత్ర అతనికి ఉంది. కనుక ఆ ప్రతిపాదనకు  ఒప్పుకుని మర్యాద నిలుపుకోవడమే మంచిదని సుబలుడు అనుకొని ఉండచ్చు. దాంతో, ‘గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చేశా’నని బంధువుల మధ్య ప్రకటించేశాడు. గాంధారి ఆ మాట వింది. తండ్రి అలా మాట ఇచ్చిన క్షణం నుంచే ధృతరాష్ట్రుని తన భర్తగా భావించింది. ఈ కళ్ళతో ఇక పరపురుషుని చూడరాదనుకుని నేత్రపట్టం కట్టుకుంది. ఓ రోజున సోదరుడైన శకుని గాంధారినీ, గొప్ప సంపదనూ వెంటబెట్టుకుని హస్తినాపురానికి విచ్చేశాడు. గాంధారీ-ధృతరాష్ట్రుల వివాహం వైభవంగా జరిగిపోయింది.

నిజానికి అప్పుడు ధృతరాష్ట్రుడు ఒక్క గాంధారిని మాత్రమే పెళ్లిచేసుకోలేదు. ఆమెతోపాటు ఆమె చెల్లెళ్ళు పదిమందిని పెళ్లాడాడు. మహాభారతం వాళ్ళ పేర్లను కూడా ఇచ్చింది. అంతేకాదు, కులం, రూపం, శీలం కలిగిన మరో వందమందిని తెచ్చి ధృతరాష్ట్రునికి ఇచ్చి భీష్ముడు పెళ్లి చేశాడు. ఆ లెక్కన ధృతరాష్ట్రుని భార్యలు నూటపదకొండుగురు అవుతారు. అప్పుడు అతనికి వందమంది కొడుకులు ఉండడంలో ఆశ్చర్యం లేదు. అయితే వారందరినీ  గాంధారి సంతానంగానే చెబుతారు.  గతంలో ఒకసారి చెప్పుకున్నట్టు, మహాభారతంలో కొన్ని వివరాలు ప్రచారంలో లేవు. అలాగే, అనేక సందేహాలకు అందులో తగిన సమాధానం ఉండదు. నూటొక్క మందిని గాంధారి సంతానంగా చెప్పడం అలాంటిదే. గాంధారి చెల్లెళ్ళకు, ఇతర భార్యలకు కలిగిన సంతానాన్ని కూడా పట్టమహిషి అయిన గాంధారికే ఆపాదించి ఉండచ్చు. నూటొక్కరు (కూతురు దుశ్శలతో కలిపి) కౌరవులలో పదిహేడుమందే గాంధారికి పుట్టినవారని ఎస్.ఎల్. భైరప్ప తన ‘పర్వ’ నవలలో అంటారు. అయితే, చిక్కుముడులుగా కనిపించే ఈ సంతానం లెక్క లన్నింటికీ శాస్త్రపరమైన ఇతర వివరణలు లేకపోలేదు. వాటి గురించి తర్వాత చెప్పుకుందాం.

సుబలుడు ‘గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చేశా’ననడం, కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధాన్లు ‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావం’డనడంలా ధ్వనిస్తుంది. మహాభారత కాలం నుంచీ నేటి వరకూ అప్రతిహతంగా సాగుతున్న పితృస్వామ్యం పదునును ఈ రెండు వాక్యాలూ పట్టి చూపుతాయి. ముక్కుపచ్చలారని తన కూతురును ముసలివాడికిచ్చి పెళ్లి చేసే అఘాయిత్యాన్ని సహించలేక అగ్నిహోత్రావధాన్లు భార్య ప్రతిఘటించడం భోజనాల దగ్గర పెద్ద సీను సృష్టిస్తుంది. మరి సుబలుని నిర్ణయాన్ని అతని భార్యా, పిల్లలు వాస్తవంగా ఎలా తీసుకున్నారో తెలియదు. విశ్వనాథ సత్యనారాయణగారు నన్నయ ప్రసన్న కథా కలితార్థయుక్తికి ఉదాహరణగా ఈ ఘట్టాన్ని పితృస్వామ్య కోణం నుంచి వ్యాఖ్యానించారు.  ‘గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చేశా’ననగానే బంధువులు మారు మాట్లాడక పోగా, కళ్ళు లేకపోతేనేం గుణవంతుడు కాడా ఏమిటని సరిపెట్టుకోవడం; తండ్రి ఆ మాట అన్న క్షణం నుంచీ గాంధారి ధృతరాష్ట్రునే తన భర్తగా భావించి నేత్రపట్టం కట్టుకోవడం -బంధువర్గంలోనూ కుటుంబసభ్యుల్లోనూ సుబలుని మాటకు గల  తిరుగులేని లక్షణాన్ని, గాంధారి పాతివ్రత్యాన్ని సూచిస్తాయని విశ్వనాథవారు అంటారు.  ఇరావతీ కార్వే తన ‘యుగాంత’లో స్త్రీ కోణం నుంచి ఈ ఘట్టాన్ని చూస్తూ గాంధారి నేత్రపట్టం కట్టుకోవడం తండ్రి నిర్ణయంపట్ల నిరసన సూచకంగా అనుమానిస్తారు. కాలంతోపాటు కలిగే దృష్టిభేదం ప్రతి కాలంలోనూ పురాగాథల్ని సరికొత్తగా వ్యాఖ్యానించుకునే అవకాశం కల్పిస్తుంది. ఆ విధంగా ఆ కథలు నిత్యనవీనత్వాన్ని సంతరించుకుంటూ ఉంటాయి.

అంధత్వాన్నే కాదు, ఏ వైకల్యాన్ని అయినా వేలెత్తి చూపించడం ఇప్పుడు కుసంస్కారం అవుతుందని మనకు తెలుసు. అదలా ఉంచి, ధృతరాష్ట్రునిపై సానుభూతినుంచి కలిగిన ప్రేమతోనే గాంధారి అతనిని భర్తగా అంగీకరించీ ఉండచ్చు.  నిజంగా ఆమె ఆంతర్యం ఏమిటో మనకు తెలియదు. తెలిసే అవకాశం లేదు.

birth-kaurava-gandhari-mahabharat-indian-mythology

చెప్పుకుంటూ వెడితే ఈ ఘట్టంలోని విశేషాలకు అంతే ఉండదు. ధృతరాష్ట్రునికి వధువుకోసం గాంధారం దాకా వెళ్ళారంటే, సమీపంలో సుక్షత్రియకన్య దొరకలేదనుకోవాలి.  గాంధారి రూపలావణ్య శీలాల గురించి భీష్ముడు బ్రాహ్మణుల ద్వారా వినడం ఇంకో విశేషం. బ్రాహ్మణుల ద్వారానే ఎందుకంటే, వాళ్లే ఆనాడు క్షత్రియ కుటుంబాలకు, బయటి ప్రపంచానికి మధ్య వారధులుగానూ, వార్తాహరులుగానూ ఉన్నారు. అంటే, నాలుగు గోడల మధ్య ఆభిజాత్యాన్ని కాపాడుకునే క్షత్రియులకు బహిరంగ అభివ్యక్తి లేదా బయటి ప్రపంచాన్ని చూపించే కిటికీ బ్రాహ్మణులే. అది మళ్ళీ బ్రాహ్మణ-క్షత్రియ అన్యోన్యత గురించిన చర్చలోకి తీసుకువెడుతుంది. దానినలా ఉంచితే, ఎక్కడికైనా యధేచ్చగా వెళ్లగలిగే అవకాశమూ, బహుశా అధికారమూ ఆనాడు బ్రాహ్మణులకే ఉండి ఉండాలి. అది మళ్ళీ నాటి సామాజికమైన అమరికవైపూ, గణసమాజపు తీరు తెన్నులవైపు మనల్ని మళ్లిస్తుంది. అలాగే, ధృతరాష్ట్రుడే గాంధారదేశం వచ్చి గాంధారిని పెళ్లాడకుండా, గాంధారే అతని దగ్గరకు తరలి వెళ్లడమూ విశేషమే.

అంతకు మించి గమనించవలసిన విశేషం ఇంకొకటి ఉంది. అది కుంతి- పాండురాజుల వివాహం. ధృతరాష్ట్రునికి వధువు కోసం గాంధారదేశం దాకా వెళ్లవలసివచ్చింది కానీ, పాండురాజుకు వధువు దగ్గరలోనే, యాదవుల ఇంట దొరికింది. ఆ వధువు కూడా అప్పటికే కొడుకును కన్నది. అన్నదమ్ములే అయినా రాజ్యాధికారం ఉన్న వ్యక్తికీ, లేని వ్యక్తికీ వధువును ఎంపిక చేయడంలో ఉండే తరతమ భేదాలకు ఇది సూచన కావచ్చు. అయితే, ఆ తర్వాత పాండురాజు భీష్ముని అనుమతితో మద్రదేశపు రాచకన్య మాద్రిని కూడా పెళ్లిచేసుకున్నాడు.  మొదటి పెళ్లికీ, ఈ పెళ్లికీ మధ్య ఏం జరిగిందో తెలియదు. కుంతికి సంతానం కలగకపోవడం ఒక కారణంగా కనిపిస్తుంది. లోపం పాండురాజులోనే ఉన్నా దానిని కప్పి పుచ్చడానికి  మాద్రిని ఇచ్చి చేశారని ఎస్.ఎల్. భైరప్ప ఊహిస్తారు. కుంతి చరిత్ర యాదవ-క్షత్రియుల మధ్య నున్న సామాజిక అంతరాన్ని సూచిస్తోందనుకుంటే, అదే కురు-పాండవ శత్రుత్వానికీ అంతిమంగా యుద్ధానికీ దారితీయించిందా అన్నది అన్నింటికంటే ఆసక్తికరమైన ప్రశ్న.

Kunti_Gandhari_Dhrtarashtra

కిందటి వ్యాసం ఆగిపోయిన చోటికి మళ్ళీ వెడదాం.  మధ్య ఆసియాలో ఉన్న నేటి అప్ఘానిస్తానే నాటి గాంధారదేశం. అంటే ధృతరాష్ట్రునికి వధువును మధ్య ఆసియా నుంచి తెచ్చుకున్నారన్నమాట. అంతేకాదు, మాద్రి కూడా అక్కడిదే. మద్రదేశం గాంధారదేశాన్ని ఆనుకునే ఉంటుంది. అది మళ్ళీ ఉత్తర మద్ర, తూర్పు మద్ర అనే రెండు జనపదాలుగా ఉండేది.  ఉత్తరమద్రను ఉత్తర కురుభూములని, బాహ్లిక దేశమని కూడా అనేవారు. గ్రీకులు దానినే బాక్ట్రియా అన్నారు. పురాణ, ఇతిహాస కాలం నాటి భౌగోళిక రేఖా పటాన్ని గీస్తే అది అప్ఘానిస్తాన్ నుంచి  ఉత్తరభారతం వరకూ ఒకే నడవగా ఉన్నట్టు చూపిస్తుందని చెప్పుకున్నాం. అంటే,  మధ్య ఆసియా, భారత ఉపఖండ జనపదాల మధ్య బాంధవ్యాలు, ఇచ్చి పుచ్చుకునే సంబంధాలు, యుద్ధాలలో పరస్పర సహకారం ఉండేవన్నమాట.

క్షత్రియ వధువుల కోసం గాంధార, మద్రదేశాలవరకూ వెడితే వెళ్లచ్చు కానీ, నిజానికి మద్ర (లేదా బాహ్లిక) జనాలకు మంచి పేరు లేదు. ఆ విషయం కూడా మహాభారతమే చెబుతోంది. దాని గురించి తర్వాత…

 

మన తరానికి జాషువా నేర్పిన పాఠం ఇదీ!

శాంతి ప్రబోధ

శాంతి ప్రబోధ

“జీవితం నాకు ఎన్నో పాఠాలు  నేర్పింది.  నా గురువులు ఇద్దరు  – పేదరికం – కులమత భేదం .  ఒకటి నాకు సహనాన్ని నేర్పితే రెండోది నాలో ఎదిరించే శక్తిని పెంచిందే కాని బానిసగా మార్చలేదు .  దారిద్ర్యాన్ని , కులమతాల్ని కూడా చీల్చి నేను మనిషిగా నిరుపించుకోదలిచాను. వాటిపై కత్తి కట్టాను.  అయితే నా కత్తి కవిత ” అంటాడు జాషువా. 
అట్టడుగు జీవితాల హీన , దీన స్థితిని స్వయంగా అనుభవించి మనసులో పడ్డ ఆవేదననూ , ఆర్తినీ కవిత్వ రూపంలో ఆవిష్కరించిన ఆధునిక యుగపు మహాకవి జాషువా.  దారిద్ర్యం , అంటరానితనం , ఆర్ధిక అసమానతలు, వర్ణ వ్యవస్థ, కులవ్యవస్థ, కర్మ సిద్ధాంతాలు వీటన్నిటితో  సతమతమయిన జాషువా, తన తోటివారిని చూసి తిరుగుబాటు చేసి వ్యవస్థను నిలదీసి మానవ విముక్తికి, ఉన్నతికి కవిత్వాన్ని ఒక ఆయుధంగా ఎంచుకున్న సామాజిక దార్శనికుడు.   బిరుదులూ, పురస్కారాలూ ఎన్ని అందుకున్నా సమతా ధర్మాన్ని , సమతా భావనను దర్శించిన క్రాంతి కవి జాషువా.  ప్రాచీన భారతీయ వైభవాన్ని వేనోళ్ళ కవులు స్తుతిస్తున్న ఆ రోజుల్లో తన నిత్య జాగృత కవితలద్వారా ఎప్పటికప్పుడు వర్ణ వ్యవస్థ వైకల్యాన్ని మతాంధ మనస్తత్వాన్ని, సాంఘిక దురాచారాల్ని, స్త్రీల స్థితిని ఎత్తి చూపి ఎలుగెత్తి చాటిన నవయుగ కవి చక్రవర్తి జాషువా.
అందుకు ఆయన ఎన్నుకున్నది సంప్రదాయబద్దమైన చందం. వస్తువుగా తీసుకున్నది సార్వకాలిక సామాజిక ధర్మ ప్రతిష్టాపన.  కులమతాల కుళ్ళుకు అతీతంగా కవిత్వానికి పరమార్ధం ప్రయోజనాన్ని నిర్దేశించడం ఆయన కవితల ఉద్దేశం .  కులము , కట్టుబాట్లు క్రౌర్యాన్ని, కాటిన్యాన్ని అంతగా చీత్కరించిన కవి మనకు ఆధునిక కాలంలో కనిపించరు.  అభ్యుదయ కవితాయుగంలో శ్రీ శ్రీ గేయంతో సాధించింది జాషువా చాల ముందుగానే పద్యంతో సాధించారని ఓ సందర్భంలో అన్నారు సినారె.
“కసరి బుసగొట్టు అతని గాలి సోక నాల్గు పడగల హైందవ నాగరాజు ”  అన్నప్పుడు ఆయన వ్యక్తం చేసింది తననుభవించిన బాధనే కాదు .  ఆనాటి ఆ స్థితిపై అసమ్మతిని.  విద్యాగంధం, సంస్కార సంపద లేని నిరుపేద కుటుంబంలో పుట్టిన జాషువా జీవితంలో తాను అనుభవించిన అవమానాల్ని , తిరస్కారాన్ని అధిగమిస్తూ తనదైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడమే కాకుండా తన కవితకి ఆత్మాశ్రయ రూపం ఇవ్వకుండా సాధారణీకరించడం, భావకవిత్వం రాజ్యమేలుతున్న రోజుల్లో వస్తాశ్రయ కవిత్వం రాయడం ఆయన ప్రత్యేకత.
“ప్రతిమల పెండ్లి చేయటకు వందలువేలు వ్యయించుగాని
దుఃఖ మతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్
మెతుకు విదల్పదీ భారతమేదిని ముప్పది మూడు కోట్ల దే
వతలెగవడ్డ దేశమున భాగ్య విహీన క్షుత్తులారునే !
అంటూ గబ్బిలంలో పరమ శివునికి పంపు కున్న సందేశంలో దరిద్రులపై దయ చూపని, దైవపూజలని, హృదయ దౌర్భల్యాన్ని, భావ దారిద్ర్యాన్ని ఈ కవి క్షమించలేక పోవడం కనిపిస్తుంది.
‘గబ్బిలం’  కాళిదాసు మేఘసందేశాన్ని మనసులో నింపుకుని చేసిన రచన.  ఇందులో నాయకుడు పరమ దరిద్రుడు.  క్షుద్భాధా  పీడితుడు.  సంఘం వెలివేసిన వాడు.  ఈ భేదం కావ్య వస్తు రూపాన్నే మార్చేసింది.  ఇంట్లో చీకట్లో కూర్చొన్న దీనుడైన , దరిద్రుడైన వ్యక్తి తలెత్తితే  ఓ మూలన గబ్బిలం కనిపించింది.  అతడు తన బాధను దానితో చెప్పుకుంటాడు.  కైలాసంలో  ఈశ్వరునికి తన కథ నివేదించమని వేడుకుంటాడు.  ఇది సాగినంతమేర కనబడే దృశ్యాలు దేశం , చారిత్రక , సామాజిక  స్థితిగతులు.  ఈ సంవిధానం ఎంతో శిల్పవంతంగా ఉంది. కరుణరసం నిండి ఉంది.  కన్నీటి కథకి ఆర్ద్ర హృదయం జత పరచిన మనోజ్ఞ కావ్యం గబ్బిలం .
సాంఘిక న్యాయసాధన నా జన్మహక్కు అనే కృత నిశ్చయంతో ఈ ప్రపంచంలోనే మరో ప్రపంచాన్ని , కావ్యలోకంలో  ‘కొత్త లోకం ‘ సృష్టించాడు జాషువా.  ఈ నీచ నికృష్ట నియంతృత్వ బందురమైన పాతలోకానికి బదులు కొత్త లోకాన్ని ప్రసాదించమని ‘కొత్తలోకం’లో ఆర్దిస్తాడు.  ఆ లోకం ఎలా ఉండాలో చూపిస్తాడు.  జాషువా ‘కొత్తలోకం’ ఒక జీవత్కార్యం.  సామాజిక కావ్యం.  అరుదైన రసవత్కావ్యం.  ఒక కొత్త సాంఘిక వ్యవస్థ కోసం ఆయన పడిన తపన, ఒక విన్నూత్న మార్పు కోసం ఆయన కన్న కళలు , సామాజిక చైతన్యం కోసం ఆయన కనబరిచిన ఆతురత ఆయన  ప్రతి పద్య పాదంలోనూ ధ్వనిస్తుంది.  నినదిస్తుంది.
hyf02VS-gurram-_HY_1537788e
ఆత్మీయాంశతో కూడిన కావ్యం ‘ఫిరదౌసి’.  తండ్రికి తగ్గ కూతురు ఫిరదౌసి కుమార్తె.  ఆమె పాత్ర చిత్రణ , స్త్రీ స్వభావ నిరూపణలో జాషువా చూపిన మెలకువ ‘ఫిరదౌసి ‘లో తెలుస్తుంది.
‘ముంతాజ్ మహల్ ‘ లో ముంతాజ్ సౌందర్య వర్ణనకి అవకాశం ఉన్నా కూడా ఆయన శృంగార వర్ణన చేయలేదు .  ముంతాజ్ – షాజహాన్ల మధుర ప్రణయాన్ని ఔచిత్యంతో, భావనా బలంతో, శబ్ద సౌందర్య వ్యంగ్య స్పూర్తితో అవసరమైనంత వరకే వర్ణించిన తీరు అనితర సాధ్యం .
జాషువా తన భావాలను ఎంత తీవ్రంగా వ్యక్తం చేసినా సమాజంలోని ఏ  వర్గానికీ దూరం కాలేదు.  పైగా అందర్నీ స్పందింప చేశాడు .  అది ఆయన చైతన్య స్థాయికి నిదర్శనం.  జాషువాకి కుల ద్వేషం లేదు.  అందుకే ఆయన ” మతపిచ్చి గాని, స్వార్ధచింతన కాని నా కృతులకుండదు ” అని చెప్పుకోగలిగారు.  జాషువా కవితా చైతన్యం సంకుచితంగా ఆగిపోకుండా ఒక విశాల పరిధిలో విస్తరించి ఒక బాధ్యతాయుతమైన పరిణామాన్ని పొందింది.
‘గబ్బిలం’ కావ్యంలో జాషువాలో ఒక హేతువాది కనిపిస్తాడు.  కాందిశీకుడు , కొత్తలోకం కావ్యాల్లోనూ ఆయన హేతుదృష్టి   కనిపిస్తుంది.  ఆయన కవిత్వంపైన ఆనాటి హరిజనోద్యమం , సహాయ నిరాకరణ , పుల్లరి సత్యాగ్రహం , ఆంధ్రోద్యమం మొదలైన వాటి ప్రభావం కనిపిస్తుంది.  అలాగే ఆయన ఆస్తికుడా, నాస్తికుడా అనే సంశయం కలుగుతుంది.  ఆయన రచనల్లో దళితవాద, స్త్రీవాద శబ్దాలు ప్రయోగించక పోయినా ఒక దళితవాదిగా, స్త్రివాదిగా అప్పుడప్పుడూ దర్శనమిస్తాడు.
“గవ్వకు సాటిరాని పలుగాకుల మూకలసూయచే న
న్నేవ్విది దూరినన్ ననువరించిన శారద లేచిపోవునే
ఇవ్వసుధా స్థలిన్ పొడమరే రసలుబ్దులు ఘంటమమూనెదన్
రవ్వలు రాల్చెదన్ గరగరల్ సవరించెద నాంధ్ర వాణికిన్”
అనే జాషువా ఏనాడూ లోక విపరీత బుద్ధులకు వేరవలేదు. బెదరలేదు.  ఆయన వజ్ర సంకల్పం చెదరలేదు.  రానురాను మరింత తీవ్రమైంది.  ఆ స్వభావమే పై పద్యంలో స్పష్టంగా కనిపిస్తుంది.
“యుగ యుగమ్ముల  భారతీయుడను నేను ” అంటూ సగర్వంగా చాటుకున్న జాషువా ఆ తర్వాతి కాలంలో తన పరిధిని విస్తరించుకున్నాడు.
‘కులమతాల గీచుకున్న గీతలను జొచ్చి
పంజరాన కట్టువడను నేను
నిఖిలలోక మెట్లు నిర్ణయించిన నాకు
తిరుగు లేదు విశ్వ నరుడను నేను ‘
అంటూ తన విశ్వ జనీన దశకు చేరుకున్నాడు. ఆయనే చెప్పుకున్నట్లు   “వడగాడ్పు నా జీవితమైతే – వెన్నెల నా కవిత్వం ‘  అన్న  మాటలు అక్షర సత్యం.
 
వి. శాంతి ప్రబోధ
హైదారాబాద్ లో ఈ వారం 26 న జాషువా జయంతి సభ జరుగుతున్న సందర్భంగా…
MaNaSu Invitation for Jashuva book release

అస్పష్ట మహారణ్యంలో పాఠకుల్ని వదిలేసిన “ద్రోహ వృక్షం” కథ !

drohavruksham

‘ద్రోహావృక్షం’అనే కథ చూద్దాం. కథంతా ప్రతీకలతో,సంకేతాలతో నడుస్తుంది. ఒక భావనా ప్రపంచంలో, కల్పనా చాతుర్యంతో కథని నడపడం ఊహా? వ్యూహమా? అనే ప్రశ్న మనకి వస్తుంది. ప్రధానంగా ఇది ద్రోహం కథ. మరి ద్రోహులెవరు? కథలో వాక్యాలు చూద్దాం.

“ఇది నమ్మకద్రోహం నుంచి పుట్టిన అందం. నా జుట్టు చూశావా? ఎర్రటి  రంగులో మిలమిలలాడుతూ” అంటాడు కథలో పాత్ర కొండయ్య. తనని తాను ద్రోహిగా ప్రకటించుకొన్న కొండయ్య ఎవరికి ప్రతీక? కథలో చూద్దాం. “ఊరికి ఆ చివరన వాళ్ళ యిళ్ళు. ఈ చివరన మా ఇళ్ళు” అంటాడు మరో  పాత్ర సంగీతరావు. ఇద్దరి ఇళ్ళూ వూరికి చివర్లలోనే వున్నాయి కాబట్టి ఇద్దరూ మాల – మాదిగ కులాలకి ప్రతీక అనిపిస్తుంది. “రెండు కులాల మధ్యా” అని సంగీత అంటాడు. మరి ఈ ఇద్దర్లో కొండయ్య మాదిగ కులానికి ప్రతీక.మరి మాదిగలు మాలలకి ఎలా ద్రోహం చేశారు? కథలోంచి చూస్తే, గతంలో వాళ్ళిద్దరూ కలిసి ఎదురు కొండ ఎక్కుతారు చాలా కష్టమైన పని అది. కొండ ఎక్కాక “మేము జయించిన రాజ్యాలుగా తోచాయి” అంటాడు సంగీత. రిజర్వేషన్లను సాధించడానికి ఇది సంకేతం.. కథలోనే “రిజర్వేషన్లు, వర్గీకరణ, సభ, నిరసన, దళిత నాయకులు” అని వుంటుంది. అంటే రిజర్వేషన్ల విషయంలో కొండయ్య ద్రోహిగా మారి విభజన కోరాడని అర్ధం అవుతుంది. ద్రోహం చేసీ, మోసం చేసీ, కొందర్ని బలి ఇచ్చి కొండయ్య ఏం సాధించలేదని సంగీత అనుకుంటాడు. కథలో వాక్యాలు చూద్దాం. “ఎన్నిసార్లు గాలాన్ని పైకి లాగినా,అది ఖాళీగానే వుంటుంది. చేపలకట్లా తిండి వేయడానికే అతను అక్కడ కూర్చున్నట్లుగా ఉంది” చేపలు, చెరువు, సమాజానికీ, వేరే కులాలకీ ప్రతీకలు. ఎందుకు కొండయ్య ఏమీ సాధించలేదు? “ప్రాజెక్టువాళ్లు పెట్టిన స్కూలు, ఇప్పుడందులో దళితవాడల్లోని పిల్లలే చదువుతున్నారు. ఒకళ్ళిద్దరు చెంచుల పిల్లలు.” అని వున్నది కథలో. అంటే ప్రభుత్వ పాఠశాలలు దళితులకే పరిమితమయిపోవడం. రిజర్వేషన్లవల్ల ఏమీ వుపయోగం లేకపోవడం.. ఇక్కడ మనం ఆగి అసలు రిజర్వేషన్ల విషయం చూస్తే…

వ్యవసాయక సమాజంలో భూమి మీద యాజమాన్యం ఆధిపత్యం, వుత్పత్తి ప్రక్రియ (వ్యవసాయం)లో భాగం ఆధారంగానే కులాలు ఏర్పడ్డాయనిమనం స్థూలంగా అంగీకరిస్తాం. కులాల మధ్య వృత్యాసాలూ అలాగే ఏర్పడ్డాయి. గ్రామాల్లో నివాసాలు అంతే. వ్యవసాయంలో పెట్టుబడి ప్రవేశంతోనూ, “విద్య” స్థానంలో “చదువు” ప్రవేశంతోనూ వలసలు ప్రారంభమై నగరీకరణ పెరిగింది. “వృత్తి స్థానంలో “వుద్యోగాలు” ప్రవేశించి మనుష్యులు మనుగడ  కోసం సమాజం మీద కాకుండా  ప్రభుత్వం మీద ఆధారపడ్డం మొదలైంది.

కొండయ్య, సంగీతలు కలిసి ఎన్నికొండలెక్కేరోగానీ, అంబేద్కర్ మహాశయుడు ప్రపంచం ముక్కు మీద గుద్ది విషయాన్ని చెప్పడంతో అధికార గణాలు (అగ్రకులాలు) రిజర్వేషన్లు తీసుకొచ్చేయి. అయితే వ్యవసాయంలో ప్రవేశించిన పెట్టుబడి అంతరాల్ని అంతం చెయ్యలేదు. నగరీకరణ క్రమంలో చదువు కూడా కులాల అమరిక క్రమంలోనే వుపయోగపడిందనీ, ఫలితంగానే వుద్యోగాలు అనబడే జీవనోపాధి మార్గంలో అగ్రకులాలవారూ, ధనికులూ పైస్థాయిల్లోనూ, అదే క్రమంలో మిగతా కులాలవారూ కుదురుకున్నారనీ సామాజిక శాస్త్రవేత్తల అధ్యయనం ఋజువు చెస్తోంది.  అది ఆర్ధిక సూత్రం. అది చరిత్ర. దీనిలో భాగంగానే షెడ్యూల్డు కులాలనే వాటిలోనూ తారతమ్యాలు పెరిగాయి. రిజర్వేషన్లవల్ల మాలకులస్థులే ఎక్కువ ప్రయోజనం పొందరన్నది మాదిగ కులస్థుల భావన. స్థూలంగా ఆ భావం నుంచే వర్గీకరణ ఒక అంశంగా ముందుకొచ్చి ఆందోళనరూపం తీసుకొన్నది. తారతమ్యాల పెరుగుదలకీ జీవన మార్గాలు మూసుకుపోవడానికి కారణం భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థలు. అది వదిలిపెట్టి కులాలు, ఒకరినొకరు ద్రోహులుగా లెక్కకట్టి మాట్లాడ్డం సరైనది కాదు. రిజర్వేషన్లు వుండే ప్రభుత్వ రంగం కుంచించుకుపోవడం గురించి, యంత్రాలు ప్రభుత్వ వుద్యోగుల్ని తగ్గించి వేయడం గురించి,  అంతరిస్తున్న వృత్తులు, కొత్త జీవనమార్గాల్ని కల్పించలేకపోవడం గురించి భూమితో సహా సహజ, వుమ్మడి వనరుల్ని, వుత్పత్తి సాధనాల్ని స్వంతం చేసుకున్న పెట్టుబడి మానవశ్రమ (జీవనమార్గం)ని దూరం చేసెయ్యడం గురించిమాట్లాడకుండా కులాలమధ్య వుండే వైరుధ్యాల్ని “వాళ్లని నమ్మవద్దు, వాళ్ల పొడ కూడ మన మీద పడకూడదు” అనీ, రెండు కులాల మధ్య పెద్ద పెద్ద కొట్లాటలే జరిగేయి. హత్యకేసులు, కోర్టు వాయిదాలు..” అని రాయడం ఒకళ్ల ఇళ్లు ఒకళ్లు కాల్చుకున్నారనీ, రాళ్లు విసురుకుంటున్నారనీ వాళ్ల మధ్య వైరుధ్యాన్ని వూహాశక్తి ప్రయోగించి వైషమ్యాల స్థాయికి తీసుకెళ్లి రాయడం వాస్తవ విరుద్ధం.ఇళ్ళు తగలబెట్టించేదీ, హత్యలు చేసేది రాజ్యం, ధనికవర్గం, మాలలు ఈ రోజుకి కూడా రాజ్యంలో భాగస్వాములు కాలేదు. అది పూర్తిగా వక్రీకరించి “అయ్యే ఎస్సో ఏదో రాసినట్టున్నావు” అని సంగీతరావు(మాల)ని రాజ్యానికి ప్రతినిధిగా చేసి  కొండయ్య మాట్లాడటం అవాస్తవం మాత్రమే కాదు. అన్యవర్గ ప్రయోజనం కూడా. మాదిగలు వేరే బడి (కులసంఘం) పెట్టుకోవడం గురించి, వాడు  నా ముఖ్యమైన శత్రువు అని రాసి ఏ వర్గం ఆలోచనా ధోరణిని మోసుకొస్తున్నాడు రచయిత. వర్గం అన్నానా? అవును . కొండయ్య మాదిగలకే ప్రతీక కాదు. కమ్యూనిస్టులకి కూడా . కథలో చూస్తే.

“ఎర్రగా భయం గొలిపేలా వుంది జుట్టు” అంటాడు సంగీతరావు కథ ప్రారంభంలోనే” తురాయి మొగ్గ, మోదుగ చెట్లు, గద్దర్, నవంబర్ నెల” అంటాడు.

“నా జుట్టు చూసావా?ఎర్రని రంగులో మిలమిలలాడుతూ” అంటాడు కొండయ్య.

“ఎర్రటి గుండ్రటి మొహం అతనికి” అంటాడు సంగీతరావు కథలో.

“చర్చల కల, తుపాకులు, గెరిల్లా యుద్ధ తంత్రం” అని వున్నది ఇంకాకథలో ” ఈ రంగు పూలను చూసి మోసపోకు. దీని అందాలను  చూసి మోహపడకు. ఇది నమ్మకద్రోహం నుంచి పుట్టిన అందం” అంటాడు కొండయ్య.  బహుశా జూడా రక్తం నాలోనూ పారుతుందేమో” అంటాడు కొండయ్య.

అంటే కమ్యూనిస్టులు ద్రోహులనా? ఎదురు కొండ విప్లవానికి, జయించిన రాజ్యం అంటే ఒక గొప్ప, అధర్శ సమాజానికి సంకేతమైతే, కమ్యూనిస్టులు ద్రోహులని కొండయ్య ద్వారా రచయిత అభిప్రాయ పడ్డట్టు అనుకోవాలి. పైవి రెండూ కలిపితే కమ్యూనిస్టుల్లోని మాదిగలు, లేదా మాదిగలకోసంకమ్యూనిస్టులు మాలలకి లేదా ప్రజలకి ద్రోహం, మోసం చేశారన్న అర్ధం వస్తుంది. అయితే కథలో ఇంకెక్కడా ఈ భావాన్ని ఖండించే వాక్యాలు లేవు కాబట్టి కమ్యూనిస్టులు ఏ విధంగా, ఎవరికి ద్రోహం చేశారో చెప్పవలసిన అవసరం వున్నది.

జూడాస్ గురించీ, బైబిలు గురించీ ఒక కథ చెప్తాడు కొండయ్య. అయితే కొత్త నిబంధన గ్రంధంలో ఎర్ర పొలం గురించి వున్నది కానీ కథలో రాసినట్టు “మరుసటి రోజు చెట్టు మొత్తం వెలిగిపోయి, “దాని కొమ్మల నిండా ఎర్రటి పూలు పూసాయి” అని ఎక్కడ వున్నది అనుమానాస్పదం. పైవన్నీ చదవగానే మనకి హిట్లర్ వుదంతం గుర్తొస్తుంది. హిట్లర్ కూడా జాతి వ్యతిరేక ఆవేశానికి లోనయ్యాడా అనిపిస్తుంది.

Half of all German Banks were Jewish owned, Stock Brokers were Jews.  Half of Newspapers were Jewish” అని చరిత్రకారుడు RALF GEROGE REUTHరాసింది నిజమే కావచ్చు. కానీ హిట్లర్ ఆ సగాన్నీ వాస్తవంగానే చూశారుగాని విశ్లేషణాత్మకంగా చూడనేలేదు. తన చుట్టూ వున్న జర్మన్ ప్రజల కష్టాల్నీ, వారి బీదరికాన్ని చూసిన  హిట్లర్ దానికి కారణం తనని హాస్టల్ నుంచి వెళ్లగొట్టిన యూదులే కారణం అనుకున్నాడు అనిపిస్తుంది. ఆ జాతి ద్వేషంలోంచే అతను

“The personification of the devil as the symbol of all evil assumes the living shape of the Jew”

అన్నాడు. మరింత విషాదం ఏమిటంటే వ్యతిరేకులు కూడా గౌరవించే కార్ల్ మార్క్స్‌ని గొప్ప ఆర్ధికవేత్తగా, సిద్ధాంతకర్తగా కాక ఒక యూదుగానే చూశారు. లెనిన్‌ని అలాగే చూశారు. అందుకే…

“Death to Marxism” అన్నాడు.

“THE HEAVIEST BLOW WHICHEVER STRUCK HUMANITY WAS CHRISTIANITY. BOLSHEVISM IS CHIRISTIANITY’S ILLEGITIMATE CHILD . BOTH ARE INVENTIONS OF THE JEW.” అనే తీవ్ర  తప్పిదం చేశాడు. యూదుల్లో అత్యధికులు కమ్యూనిస్టులుగా వుండడానికి కారణం బీదరికం, దోపిడి అని గుర్తించలేక లక్షలాదిమందిని చంపించేడు. వర్గానికీ, జాతికీ, కులానికీ వున్న పరిధులూ, ప్రమేయాల పట్ల స్పష్టత లేనప్పుడు జరిగే ప్రమాదాలివి.

విషయానికొస్తే షెడ్యూల్డు కులాల్లో మాల, మాదిగలే కాక వేరే కులాలు బోలెడన్ని వున్నాయి. తరతరాలుగా ఎంతో అవమానకరమైన పనులు చేసి బతికిన, బతుకుతున్న ఎన్నో కులాలున్నాయి (పాకీ, రెల్లి, చచ్చర,) అవన్నీ వదిలేసి వర్గీకరణ మాల – మాదిగల సమస్యగా ముందుకు రావడం మనం విశ్లేషించుకోవాలి. ఈ విషయం గురించి కథలో ఏమీలేదు.

కథలో వున్న “చర్చల కల ముగిసి, మళ్ళీ అడవిలోని పొదలకు తుపాకులు మొలుస్తున్నాయని హెచ్చరికలిచ్చారు” అన్న వాక్యంలోంచి చూస్తే రియాజ్ మరణం వెనక ద్రోహం వున్నదని “ఐదు హంసలు” నవలా రచయిత భావిస్తున్నారా  అనిపిస్తుంది.

ఇన్నిరకాల భావాలు కలిగేటట్టుగా అస్పష్టంగా, పరస్పర విరుద్ధ వాక్యాలతో కథ రాయడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?

“కప్పి చెప్పడం” అనే దాన్ని ఇంతగా సాగదీసి అస్పష్ట అరణ్యంలో పాఠకుల్ని వదిలెయ్యడం ఎందుకో?

రచయితకు  వుద్ధేశాలు అంటగట్టడం నా ఆశయం కాదు. కాని ఒక కథ ఎలాటి భావాలు కలుగజేసే అవకాశం వున్నదో తెలుసుకోవాలి. ఈ భావాలకు కారణం ప్రయోగం కోసం కధా ? కథ కోసం ప్రయోగమా?  అని ప్రశ్నించుకుని రచయితే తెల్చుకోవాలి.

విషయం కోసం కథ రాస్తే  స్పష్టత, కథ కోసం విషయం తీసుకొస్తే విస్తృతీ తీసుకొస్తే నిడివీ ఉంటాయన్న విషయాన్ని “ఆవు – పులి మరి కొన్ని కథలు” “క్రానికల్స్ ఆఫ్ లవ్” కథలు నిరూపిస్తాయి.

ఈ కథ రచయిత డాక్టర్ వి. చంద్రశేఖర్‌రావు. ఈ కథ వార్త ఆదివారం 2004 డిసెంబరు 26 లో ప్రచురించబడింది.

( సి. ప్రసాద వర్మ కు కృతజ్ఞతలు)

–చిత్ర

మిగిలినవి నాన్న పుస్తకాలూ, కొన్ని జ్ఞాపకాలూ!

అనిల్ అట్లూరి

అనిల్ అట్లూరి

విజయవాడలో పూర్ణానందపేటలో అనుకుంటా మేము ఉండేవారం. లీలగా గుర్తు. నా చిన్నతనంలోనే నాన్న నా కోసం బొమ్మలు తీసుకురావడం, పుస్తకాలు తేవడం బాగానే గుర్తుంది. అప్పట్లో నాన్న ‘విశాలాంధ్ర’లో ఉండేవారు.

విజయవాడ నుండి మద్రాసుకి హౌరా మెయిల్లో వెళ్లడం గుర్తే. పొగబండి (స్టీం ఇంజన్) కదా! కళ్ళు మిరుమిట్లు గొలిపే హెడ్‌లైట్. మెటాలిక్ సిల్వర్‌తో నక్షత్రం లాంటి డిజైన్ మధ్యలో ఉండేది ఆ దీపం. మొదట పసుపచ్చని కాంతి కనబడేది. తరువాత ధడ్, ధడ్, ధడ్ మంటూ శబ్దం వినపడేది. ఆ తరువాత ట్రైన్ కనపడేది. రైలు పట్టాలు మెరిసేవి ఆ కాంతిలో.

 ప్లాట్‌ఫారం అంతా వెలుతురే! ముందు తెల్లటి ఆవిరి. అది బుసలు కొడుతూ చేసే శబ్దం. ఆ బ్రహ్మాండమైన నల్లటి చక్రాలు, వాటిని కదిలించే శక్తివంతమైన పిస్టన్లు. కాళ్లక్రింద ప్లాట్‌ఫార్మ్ కదిలిపోతుందా అనిపించేది. దగ్గిరకు వెళ్ళి చూద్దామనుకుంటూ ఉంటే వెనక అమ్మ చెయ్యి పట్టుకుని ఆపడం బాగానే గుర్తు ఉంది. కిటికి పక్కనే కూర్చోవడం, కళ్లలో ఆ రాకాసి బొగ్గు నుసి, మొహంమ్మీదకి, ముక్కులోకి ఆ నల్లని, చిక్కటి, దట్టమైన పొగ, ఆ చీకట్లోకి కళ్ళు చికిలించి చూడడం ఇంకా గుర్తే! ఈలోపు అమ్మ నాన్న సహాయంతో హోల్డాల్‌ తెరిచి బెర్త్ మీద పరవడం లీలగా గుర్తు.

మద్రాసు సెంట్రల్ స్టేష‌న్లో దిగడం. ఫియట్ టాక్సిలో నేను, అమ్మ వెనుక సీటులో. నాన్న ముందు సీటులో. డిక్కిలో సామాన్లు. పైన కారియర్‌. దాని మీద హోల్డాలులు. ఇంటి ముందు దిగడం గుర్తు ఉంది. తేనాం పేటలోని వెంకటరత్నం వీధి, ఇంటి నెంబరు 13. మేడ మీద ఉండే వారం. మొదట్లో ముగ్గురమే. నాన్న, అమ్మ, నేను.

ఫాస్ట్ ఫార్వార్డ్

ముఖం మీద లైట్ పడి కళ్ళు తెరిచాను. నాన్న బట్టలు వేసుకుంటున్నారు. బయట కిటికిలోంచి చూస్తే చీకటి కప్పేసింది ప్రపంచానంతటిని. బయటికి వెడుతున్నట్టున్నారు.

“వస్తావా?”

“ఎక్కడికి?”

పాంటు వేసుకుంటూ, “చెప్పకపోతే రావా?”

పుస్తక ప్రపంచంలో నాన్న

పుస్తక ప్రపంచంలో నాన్న

నేను కళ్ళు నులుముకుంటున్నాను. అమ్మ “వద్దులేండి” అంటుండగానే, “వస్తా” అంటూ లేచాను. వరండాని వీధి లాంతరు వెలుతురు పలకరిస్తోంది. వరండాకి పిట్ట గోడ ఉంది. దానినిండా జాలీలు. పిట్ట గోడ అంచుమీద కుండీలు. అటు ఇటూ మనీప్లాంట్ మొక్కలు. మధ్యలో ఇంకేవో పూల మొక్కలు. బయట పెరడులో వేపచెట్టు, మల్లె చెట్లు, కొబ్బరి చెట్టు, సంపెంగలు, గన్నేరు చెట్లు, వగైరా. వాటి మధ్య నుండి పడుతున్న ఆ వీధి లాంతరు వెలుగులో ఆ కొమ్మల, ఆకుల నీడలు అల్లిబిల్లిగా ఆ వరండా గోడ మీద నృత్యం చేస్తున్నవి నిశబ్దంగా.

ఈ లోపు ‘మోతి‌’ కూడా లేచి తోక ఊపుకుంటూ వెనక పడింది. దాన్ని ఆగమంటూ అమ్మ గేటు వేసేసింది. కిందకి దిగిన తరువాత, నాన్న షర్ట్ జేబులోంచి గోల్డ్ ఫ్లేక్ పాకెట్ తెరిచి అందులోనుంచి సిగరెట్టు తీసుకున్నారు. లైటర్‌తో దాన్ని ముట్టించారు. గుండెల నిండా పీల్చి నెమ్మదిగా వదులుతున్నారు. ఆ పొగలోంచి నా వైపు చూసారు.

వీధి లాంతరు మసక వెలుతులో.. చలిగాలిలో.. ఆ సుడులు తిరుగుతున్న పొగల వలయాలలో నాన్న నాకు దేవుడు లాగా కనపడ్డాడు. చెయ్యి అందుకున్నాను. వెచ్చగా ఉంది తన ప్రేమ లాగా. ఇద్దరం నెమ్మదిగా నడవడం మొదలు పెట్టాము.

“ఎక్కడికి నాన్నా?”

“ఇక్కడే నాకొక ఫ్రెండ్ ఉన్నాడు. చూద్దామని”

బహుశా ఇక్కడే పడిందేమో “స్నేహం”కి నా తొలి పునాది. ఎందుకనో మొదటి నుంచి నాకు స్నేహితులే దగ్గిరవుతూ వచ్చారు, బంధువుల కన్నా.

నాన్న అడుగుతున్నారు. నేను చెబుతున్నాను. నేను అడుగుతున్నాను. నాన్న చెబుతున్నారు. అలా మా వీధిలోనుండి అవి ఇవి కబుర్లు చెప్పుకుంటూ తేనాం పేట మెయిన్ రోడ్డు మీదకి చేరుకున్నాం. కుడి చేతి వైపుకు తిరిగి, మార్కెట్ వైపు నడవడం మొదలుపెట్టాం. ఎడం చేతి వైపు అక్కడ స్కూలు. ఒకొక్కసారి సాయంకాలం నా స్నేహితులతో అందులోనే ఆటలు. దానిని దాటాం. ఇంకా వీధి లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. తరువాత గుడి. మార్కెట్టు ప్రాంతంలో ఎడ్ల బండ్ల మీద నుంచి కూరగాయల గంపలు, బస్తాలు దింపుకుంటున్నారు. తుపుక్కున నములుతున్న తమలపాకుని ఊస్తున్నారు. బొడ్డునుంచి ఆకులు తీసుకుని, సున్నం రాసి, మడిచి నోట్లో పెట్టుకుంటోంది ఆమె. కొందరు బీడీలు కాలుస్తూనే బస్తాలు మోస్తున్నారు. నిశబ్దంగా యాంత్రికంగా పనిచేసుకుంటున్నారు. ఈ లోపు టీ షాప్ కనపడింది. నాన్న నిలబడగానే ఆ టీ మాస్టారు పలకరింపుగా నవ్వి, నా వంక చూస్తూ ఏదో అన్నాడు.

పొగలు కక్కే..Young Turk...!

పొగలు కక్కే..Young Turk…!

నాన్న “నువ్వు కూడా తాగుతావా? టీ”.

“ఊ” అంటూ బుర్ర ఊపాను.

నాకొక చిన్న గాజు గ్లాసులో సగం కన్నా తక్కువ టీ ఇచ్చాడు. మూతి వెడల్పు, అడుగు సన్నగా ఉంటుంది ఆ గ్లాసు. దాని చుట్టూ పలకలు, పలకలుగా దానికి డిజైను. “నెమ్మదిగా తాగు, వేడిగా ఉంటుంది. జాగ్రత్త”. అరిచేతుల మధ్య పట్టుకుని ఊదుకుంటూ, ఆ మార్కెట్టు వైపు, ఆక్కడ వాళ్ళు చేసుకుంటున్న పనులు చూస్తూ ఆ టీ తాగాను. నాన్న మరో సిగరెట్టు అంటించారు. టీకొట్టు వాడికి డబ్బులు ఇచ్చారు నాన్న. నేను మళ్ళీ నాన్న చెయ్యి అందుకున్నాను. ప్లాట్‌ఫారం పైనే నడుచుకుంటూ వెళ్ళాం ఇద్దరం. నేను నా చెప్పులతో కాళ్లకి అడ్డం వచ్చిన గులక రాళ్ళు తంతున్నాను. వాటితో పాటు సిగరెట్టు ఫాయిల్స్.

ఒక పది ఇళ్ళు, కొట్లు దాటగానే కుడి చేతి వైపునే తలుపులు. చిగురాకుపచ్చ రంగులో. నెమ్మదిగా నాన్న నెడితే అవి తెరుచుకున్నవి. పైకి మెట్లు కనపడ్డాయి. ఏదో గుడ్డి వెలుగు. ముందుకు నన్ను నెట్టి నాన్న నా వెనక మెట్లు ఎక్కుతున్నారు. ఈ లోపు కిర్రు మని చప్పుడు. పైన తలుపు రెక్క తెరుచుకుని ఎవరో ఒకాయన లుంగిలో బయటకి వచ్చారు. పైన బనీను. ముఖానికి కళ్ళజోడు. “రండి, రండి. మీ వాడ్ని కూడా తీసుకువచ్చారా” అంటూ నవ్వుతూ అహ్వానించారు. (దాసరి సుబ్రహ్మణ్యం గారనుకుంటాను).

గుమ్మం ముందు ఒక పక్కగా చెప్పులు వదిలి లోపలికి అడుగు పెట్టాం ఇద్దరం. గదిలోపల ఎడం వైపు మంచం. దానికి ఆనుకుని ఎదురుగాఉన్న గోడకి ఒక చెక్క కుర్చి. పక్కనే చెక్క స్టూలు. క్రింద పేపర్లు. ఒక వైపు గోడకి ఆనుకుని రాక్. దాని నిండా పుస్తకాలు. రంగు రంగుల అట్టలు. వాళ్ళిద్దరు మాటల్లో పడ్డారు. నాకు ఏమీ తోచడం లేదు.

“నేను అవి చూడోచ్చా”

“చూడ్డమెందుకురా? చదువుకో. మీ ఇంట్లో ఉండే ఉంటాయి! లేకపోతే తీసుకువెళ్ళు.”

అవి ఇల్లస్ట్రేటెడ్ వీక్లి ప్రతులు. ఇంగ్లీష్ పత్రిక. రెండో మూడో తీసుకుని మంచం మీద కూర్చుని చూస్తున్నాను. మా యింట్లో, లైఫ్, స్పాన్, పంచ్, ఇంకా ఎవో చాలా ఇంగ్లిష్ పత్రికలున్నాయి. వాటిల్లో కొన్నింటిలో బొమ్మలు ఉంటాయ్. కొన్నిట్లో బొమ్మలు అస్సలు ఉండవు. ఈ లోపు నాన్న, ఆయనా మాటల్లో పడ్డారు.

ఎవరో నెమ్మదిగా “బాబు, బాబూ” అంటూ పిలుస్తున్నారు. కళ్ళు తెరిచి చూస్తే నాన్న, నా కళ్లలోకి చూస్తూ. తెల్లవారింది. ఇంటికి ఎలా చేరానో గుర్తు లేదు కాని.. మోతి మాత్రం భలే గొడవ చేసింది.

ఆడించే నాన్న...పాడించే నాన్న!

ఆడించే నాన్న…పాడించే నాన్న!

నిద్ర లేచి చూస్తే, నాన్న పక్క మీద లేరు. హాల్లోనూ లేరు. వరండాలో పేము కుర్చిలో కూర్చుని, పిట్టగోడమీదకి కాళ్ళు జాపుకుని ఏదో ఇంగ్లీష్ పుస్తకం చదువుకుంటున్నారు. వెళ్లి పుస్తకం లాగేసి నేను బొజ్జమీదకి చేరాను. నన్ను వాటేసుకున్నారు.

“బాబు, ఈ పూట సుమతీ శతకంలో పద్యాలు చదువుకుందామా?”

“ఊ”

“ఐతే వెళ్ళి ముఖం కడుక్కుని రా”

ముఖం కడుక్కున్నాను. బినాకా టూత్ పేస్టు. అమ్మ ఈ లోపు బోర్న్‌వీటా కలిపి ఇచ్చింది. అది తీసుకుని వెళ్ళి నాన్న ముందున్న టేబుల్ మీద పెట్టాను. నా టేబుల్ మీద ఉన్న శతకాల పుస్తకంలో నుండి, సుమతీ శతకం తీసుకుని మళ్ళీ వరండాలోకి వెళ్ళాను. నాన్న కాళ్ళ మధ్యకి చేరాను. నా చుట్టు చేతులు చాపి నా ముందు నాకు కనపడేలాగా పుస్తకం పట్టుకున్నారు. నా తలమీదుగా పుస్తకాన్ని చూస్తూ నాన్న ఒకొక్క పాదం చదువుతుంటే నేను మళ్ళీ పలికేవాడిని. నాన్న నన్ను అలా వాటేసుకున్నట్టుంటే ఆ బలమైన చేతులమధ్య ఎంత వెచ్చగా, హాయిగా ఉంటుందో! బహుశా అందుకేనేమో ఆ పద్యాలు అంత ఇష్టంగా నేర్చుకున్నాను.

శ్రీ రాముని దయచేతను

నారూఢిగ సకల జనులు నౌరా యనగా

ధారాళమైన నీతులు

నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ

సుమతీ, వేమన, దాశరధి, కృష్ణ శతకం, గజేంద్ర మోక్షం నాన్నే నాతో వల్లె వేయించారు. ప్రతి దానికి తాత్పర్యంతో సహా. దాదాపు ప్రతి రోజు పొద్దునే ఉండేది ఈ శతకాలన్ని చదవడం. ఉచ్ఛారణ కూడా. చ అక్షరం పలకడం లో ఎందుకనో ఆ రోజు నాకు రావడం లేదు. చ కి వత్తుతో పలకడం రావడం లేదు నాకు. చేప అంటున్నాను , చాప అంటున్నాను కాని వత్తుతో పలకలేక పోతున్నాను.

“అది. ఇప్పుడు “చ్చ” పలికావుగా! అలా అన్నమాట”

“ఏది మళ్ళీ చెప్పు. “చ్చ” పలుకు.”

“చ్చ”

“చా”

“చాప”

“చేప”

“చాపము”

——

మద్రాసులో టి.నగర్ బస్ టెర్నినస్, సౌత్ ఉస్మాన్ రోడ్డులో ఉంది. దానికి తూర్పు వైపున కృష్ణవేణి సినిమా హాలు. అందులో ఒక ఉదయం తెలుగు సినిమా ప్రీవ్యూకి తీసుకెళ్ళారు నాన్న. చాలా మంది పలకరించారు నాన్నని. నాన్నకి చాలా మంది స్నేహితులు ఉన్నారు! నెమ్మదిగా మెట్లు ఎక్కి పైన ఫోయర్ లోకి వెళ్లాం. బాల్కని. ఏదో ఒక వరుస. అప్పటికే కొంత మంది కూర్చుని ఉన్నారు. కుడి చేతి వైపు మధ్యలో ఉన్న ఒక వరుసలోకి ముందు నన్ను వెళ్లమంటూ నాన్న నా వెనకే వచ్చారు. హాలు ఫుల్.

నాన్నకి కుడి వైపున నేను కూర్చున్నాను. లైట్లు డిమ్ అయినవి. సినిమా మొదలైంది. ఇంట్రవెల్‌లో నాన్న లేచారు. వారి వెనకే నేను. ఐల్ లోకి రాగానే నాన్న చిటికిన వేలు పట్టుకున్నాను. చుట్టూ చాలా పాంట్లు. చాలా మంది మగవాళ్ళు. ఆ చిటికిన వేలు పట్టుకుని ఒకొక్క మెట్టు ఎక్కి తలుపుల దగ్గిరకి చేరాను. అక్కడ ఫోయర్ లోకి దిగడానికి మెట్లు. దిగి చిటికిన వేలును పట్టుకుని పైకి చూసాను. నాన్న కాదు. ఇంకెవరో! నాన్న ఏరి? చూట్టూ చాలా మంది పెద్దవాళ్ళు.

పొగ. మాటలు. నవ్వులు. పలకరింపులు. నాన్న కనపడటం లేదు. నాన్న, నాన్న ఏరి? ‘ఏపిఆఱ్‌”..”రావుగారు” అని పిలుపులు. చక్కగా గంజిపెట్టిన, స్టిఫ్‌గా ఉన్న పాంట్, దానితో పాటు నాకు చిరపరిచితమైన రెండు అడ్డపట్టీలున్న నల్లరంగు పాలీష్డ్ లెదర్ చెప్పులు. పైకి చూస్తే నవ్వుతూ నాన్న. “భయపడ్డావా?” నాన్న పక్కనే ఉంటే నాకు భయం ఎందుకు? నవ్వుతూ నాన్న చిటికెన వేలు అందించారు. దానితో పాటే వెళ్లాను. పాప్‌కార్న్ పాకెట్టు ఇచ్చారు. అక్కడే నిలబడి ఎవరితోనో సిగరెట్టు తాగుతూ, కాఫీ తాగుతూ ఏవో కబుర్లు. ఇంతలో హాలు బెల్లు మ్రోగింది. మళ్ళీ లోపలికి. ఈ సారి జాగ్రత్తగా నాన్న చిటికిన వేలును చూసుకుని పట్టుకుని ఆయన వెమ్మటే నడిచాను. సీట్‌లో కుర్చున్నాక, పాప్‌కార్న్ పాకెట్ ఒపెన్ చేసి ఇచ్చారు. నెమ్మదిగా చప్పుడు చెయ్యకుండా తింటూ సినిమా చూసాను.మళ్ళీ నాన్న చెయ్యి పట్టుకుని బయటికి వచ్చాను. కారులొనే మళ్ళీ ఇంటికి.

వరండా. నాలుగు పేము కుర్చిలు. ఒకటి టూ సీటర్. రెండు సింగిల్ సీటర్లు. మధ్యలో చెక్క టేబుల్. దాని మీద ఒక ఆకు పచ్చని క్రాస్టిచ్ గుడ్డ పరిచి ఉంటుంది. దాని మీద పూల బొమ్మ. అది కుట్టింది అమ్మే. దాని మధ్యలో ఇత్తడి ఆష్ ట్రే. దాని మీద చక్కని నగిషీలు. మూత తీస్తే, లోపలి అంచు చుట్టూతా పది చిన్న గొట్టాలు. ప్రతి గొట్టం లోను ఒక చిన్న స్ప్రింగ్. అందులోకి సిగరెట్లు పేర్చి, మూత పెట్టాలి. మూతలో ఒక బెజ్జం. మూత తిప్పగానే ఆ బెజ్జం నుండి ఒక సిగరెట్టు పైకి వచ్చేది. ఒక పక్కనే ఇల్లస్ట్రేటేడ్ వీక్లి, స్పాన్, లైఫ్ వగైరా. మరో వైపు తెలుగు దిన పత్రికలు. ఆంధ్రప్రభ, ఆంధ్ర పత్రిక, విశాలాంధ్ర, అభ్యుదయ లాంటివి. చందమామ కూడ. పేము కుర్చీలకు కవర్లు. కవర్ల మీద అందమైన పువ్వులు. వాటిని క్రాస్ స్టిచ్‌తో కుట్టింది అమ్మే. అమ్మకి కుట్లు, అల్లికలు వచ్చు. చాలా బాగా వచ్చు. కలర్ మాచింగ్ కూడా అమ్మ తరువాతే ఎవరైనా. నా భార్యకి కూడ అమ్మే నేర్పింది.

వరండాలోనుంచి హాల్లోకి గుమ్మం. గుమ్మానికి కర్టెన్లు. దాని మీద చక్కని కుట్లు. అవి కూడా అమ్మ కుట్టినవే. హాల్లో నుంచి బెడ్ రూమ్. బెడ్ రూములో ఉత్తరం వైపున నా స్టడీ టేబుల్. టేకుది. దక్షిణం వైపున గోడకానుకుని నాన్న టేబుల్, రైటింగ్ పాడ్, నాన్న కుర్చి. టేబుల్ ని కప్పేస్తూ గుడ్డ. దాని అంచుల చూట్టూ అందమైన లతలతో అమ్మ కుట్టిన డిజైన్లు. దాని మీద ఎదురుగుండా గోడకి ఆనుకుని నాన్న కలం. పార్కర్ పెన్ను. పెన్సిళ్ళు, ఎరుపు, నీలంతో పాటు మాములు గ్రాపైట్ పెన్సిళ్లు. అవన్నీ ఒక చెక్క పెట్టెలో. దానికి మూత ఉండదు. పక్కనే ఒక షార్పెనర్. నాన్న వాడుకునే క్వింక్ , బ్లూబ్లాక్ ఇంక్ బాటిల్. బ్లాటింగ్ పేపర్లు. ఒక బ్లాటింగ్ పాడ్. మార్కింగ్ పెన్సిళ్ళు, ఎరేజర్లు. మరో వైపు నాన్న చదువుకునే పుస్తకాల దొంతర. ఒక చిన్న పళ్ళెం. మధ్యలో ఒక బ్రాస్ ఆష్‌ట్రే. అందులో కొన్ని నీళ్ళు. దాని పక్కేనే లైటర్.

ఆ రోజు నాన్న ఇంట్లోనే ఉన్నారు. సాయంత్రం స్కూలు నుంచి వచ్చి, స్నానం చేసి ఆటలాడుకుని ఇంటికి రాగానే మళ్ళీ స్నానం. పుస్తకాలు వేసుకుని హోం వర్క్ చేసుకున్నాను. అమ్మ పక్కనే కూర్చుంది. ఏదో పుస్తకం చదువుకుంటూ. నాన్న అవతల పడక గదిలో ఉన్నారు.

“ఇక చాల్లే. లే భోజనం చేద్దువు” అని అమ్మ అంటే, “నాన్నని పిలుస్తా!”

“నాన్న వ్రాసుకుంటున్నారు. తరువాత చేస్తారు లే. ముందు నువ్వు కానివ్వు”

నాన్న గారి చేరాత

నాన్న గారి చేరాత

“మరి నువ్వు?”

“నేను నాన్నగారితో చేస్తాను. నీకు నేను పెడతానుగా. నువ్వు చేసేయ్”.

అయిష్టం గానే భోంచేసాను. సాధ్యమైనంత వరకు మేము ముగ్గురం కలిసే భోజనం చేసేవారం. అదే అలవాటు నా జీవితాంతం పాటించాను.

బెడ్ రూం గుమ్మానికున్న కర్టెన్లు తొలగించి, నెమ్మదిగా చప్పుడు చెయ్యకుండా ఒక తలుపు రెక్కని వెనక్కి తోసాను. ఎదురుగుండా టేబుల్ లైటు వెలుగులో గోడ మీద ముందుకు వంగి కూర్చున్న నాన్న నీడ. నాన్న ఎడం చేతిలో సిగరెట్టుతో కూర్చుని ఉన్నారు. కుర్చీ చేతుల మీదుగా టేబుల్‌కి వారధి లాగ మధ్యలో రైటింగ్ పాడ్. దానిమీద తెల్ల కాగితాలు. టేబుల్ మీద టేబుల్ లైటు. దాని వెలుతురు కాగితాల మీద పడుతోంది. కుడిచేతిలో పెన్ను. పార్కర్ పెన్ను అది. బంగారపు పాళీ. ఆ కలం కాగితం మీద పరుగెడుతున్న చేస్తున్న మధురమైన శబ్దం. (వయొలిన్ గుర్తు వస్తోంది) ఆ లైటు వెలుతురులో వ్రాసుకుంటున్న నాన్న.

చప్పుడు చెయ్యకుండా నాన్న వెనుకగా గోడ వైపుకు ఉన్న నా చిన్న మంచం మీదకి ఎక్కి దుప్పటి కప్పుకున్నాను. కాళ్ళూపుకుంటూ నాన్న వీపు వైపు చూస్తున్నాను. నాన్న వ్రాసుకుంటున్న కలం పాళీ చప్పుడు చేస్తున్న చప్పుడు వింటున్నాను. మధ్యలో ఎందుకో ఒకసారి, వెనక్కి తిరిగి చూసారు. నేను దుప్పటి తలమీదుగా కప్పుకుని పడుకుని ఉన్నాను. నన్ను చూసి నవ్వారు. నేను నవ్వాను. కళ్ళు మూసుకున్నాను. కాగితం మీద ఆ ‘వయొలిన్’ వినిపించే సంగీతానికి ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో నాకే తెలియదు.

మరో రోజు

ఆ రోజు ఉదయం నాన్న పడక కుర్చీలో హాలులో గుమ్మానికి ఎదురుగుండా కూర్చుని ఉన్నారు. పెన్సిల్‌తో ఏదో ఇంగ్లీష్ పజిల్ నింపుకుంటున్నారు. చెవుల మీదుగా తలకి మఫ్లర్ చుట్టుకున్నారు. స్వెటర్ కూడా వేసుకున్నారు. దగ్గిరకి వెళ్ళి పుస్తకం నెట్టేసి చేతుల మధ్య నుండి ఆయన బొజ్జ మీదకి ఎక్కేసాను. ఆయన నడుం చుట్టూ కాళ్లేసేసి, చాతీ మీద తల వాల్చుకున్నాను. ఎందుకనో ఎప్పుడు ఉండే వెచ్చదనంకంటే ఆయన శరీరం ఇంకా కొంచెం ఎక్కువగానే వెచ్చగానే ఉన్నట్టుంది. ఈ లోపు అమ్మ ఒక పళ్ళెంలో కప్పు, సాసర్‌తో టీ తెచ్చింది. నన్ను చూస్తునే, “లేమ్మా, నాన్నగారికి బాగోలేదు”.

“ఏం అయ్యింది?”

“జ్వరం”

“ఐతే నేను స్కూలుకి వెళ్లను. నాన్న ఇంట్లోనే ఉంటారుగా”.నాన్న నవ్వుతూ, “నేను ఇంట్లోనే ఉంటాను కదరా? నువ్వు స్కూల్‌కి వెళ్ళి వచ్చేయ్”

నాకు ఎందుకో నాన్నని అలా వదిలేసి స్కూలుకి వెళ్ళాలనిపించలేదు. నేను వెళ్లను అని, వెళ్ళాలని అమ్మా, నాన్న. చివరికి నాన్న ఒక సలహా ఇచ్చారు. సరే స్కూలుకి వెళ్ళి మధ్యాహ్నం వచ్చేయ్ సరేనా? అని. అమ్మ లీవు లెటర్ వ్రాసి ఇచ్చింది.

రోజూ స్కూలుకి స్కూలు బస్సులో వెళ్లి వచ్చేవాడిని. ఆ రోజు స్కూలు బస్సులో వెళ్ళి మధ్యాహ్నం బస్సులో ఇంటికి చేరుకున్నాను. నాన్న పడుకుని ఉన్నారు. ఎందుకో దిగులేసింది. నాన్న అలా పడుకుని ఉండటం నచ్చలేదు నాకు. నెమ్మదిగా పక్కలోకి దూరాను. నాన్న ఆ మగత నిద్రలోనే నా తలని తన భుజం మీదకు లాక్కున్నారు. అలానే ఉండిపొయ్యాను. అమ్మ గదిలోకి వచ్చి చూసి ఏమనలో తెలియక అలా చూసి వెళ్ళిపోయింది. కళ్ళలో తడి. ఉందా? ఏమో తెలీదు.

—-

భార్యాభర్తలు సినిమా విడుదల ప్రకటన

భార్యాభర్తలు సినిమా విడుదల ప్రకటన

నాన్న ఊరెళ్ళారు.

పొద్దున్నే వస్తారు అని అమ్మ చెప్పింది. నేను, మోతి ఇద్దరం వరండాలోనే కూర్చున్నాం. ఏదో కారు హారన్ వినపడింది. చదువుకునే వాడినల్లా పిట్టగోడకున్న జాలీలో నుంచి చూస్తే, కారులో నుంచి నాన్న దిగుతున్నారు. “నాన్నొచ్చారు” అని అరుస్తూ, గేటు తెరిచి మెట్లు దూకుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నా వెనకే మోతి. నాన్న నవ్వుతూ నా వైపు తిరిగి మోకాళ్ల మీదకి కొంచెం వంగి చేతులు చాపారు. ఒక్క దూకు దూకాను ఆ చేతుల్లోకి. అలాగే గాల్లోకి లేపి, మళ్ళీ నన్ను హత్తుకున్నారు.

బాబోయ్, నాన్నకి ఎంత బలమో!

మోతి కూడ నాన్న కాళ్ళమీదకి ఎగురుతోంది. నాన్న కాళ్ళు నాకుతోంది. మా ఇద్దరి చుట్టు గిరగిరా తిరుగుతోంది. సంతోషంగా అరుస్తోంది. డ్రైవరు డిక్కి లోంచి సామాన్లు తీసి కింద పెడుతున్నాడు. ఈ లోపు పనిమనిషి ‘బేబి‌’ వచ్చింది. అవన్నీ తీసుకుని ఇంట్లోకి చేరుస్తోంది. పెద్దది బ్రవున్ పేపర్ పాకెట్ ఒకటి. చాలా బరువుగా ఉన్నట్టుంది. మొయ్యలేక ఆపసోపాలు పడుతోంది. నాన్న అలాగే నన్ను ఒక చేత్తో ఎత్తుకుని మరో చేత్తో హొల్డాలు పట్టుకుని, మెట్లెక్కి పైకి ఇంట్లోకి తీసుకువెళ్ళారు.

కాసేపు అవి ఇవి కబుర్లు. స్కూలు టైం అయిపోతుంది అమ్మ నన్ను హెచ్చరిస్తోంది. స్కూలు ఎగగొట్టే అవకాశం లేదు. “నేను ఉంటానులేరా నువ్వు వచ్చేటప్పడికి”, అని నాన్న దగ్గిర అరిచేతిలో ప్రమాణం చేయించుకుని ఆ రోజు స్కూలుకి వెళ్ళాను.

సాయంత్రం వచ్చాను. నాన్న హాలులో పడక కుర్చీలో కూర్చుని చదువుకుంటున్నారు. మార్కింగ్ పెన్సిల్‌తో గుర్తు పెట్టుకుంటున్నారు. ఇంట్లో హాలులో పుస్తకాల రాక్‌ల మధ్య ఆ బ్రవున్ పేపర్ కట్ట అలానే ఉంది.

“నాన్న, ఇందులో ఏం వున్నాయి?”

“నువ్వే చూడు”

“నేను తెరవ్వొచ్చా”.

నవ్వుతూ “ఊ”..

అమ్మ నవ్వుతూ “మెషిన్లో కత్తెర ఉంది గా. చూడు”.

ఉషా కుట్టు మిషిన్ అది. నాన్నకి, నాకు అమ్మ ఆన్నీ దానిమీదే కుట్టి పెట్టేది. అందులో నుంచి కత్తెర తీసాను. అమ్మ సహాయంతో ఆ కట్టకున్న తాళ్ళు కోసేసాను. పొరలు పొరలుగా కాగితాలు తీసేసి చూస్తే లోపల పుస్తకాలు. ఎన్ని పుస్తకాలో! రంగు, రంగుల అట్టలతో!

“నాన్నా, ఈ పుస్తకాలన్ని నాకేనా?”

“నీకేరా..అన్నీ నీకే”.

తీస్తూన్నాను, ఇంకా వస్తూనే వున్నాయ్. ఇంగ్లీష్‌లో కూడా ఉన్నాయి పుస్తకాలు.
ఇవన్నీ చదివి నాన్నలాగా పెద్దవాడినై పోవాలి. మరి ఎక్కడ పెట్టుకోవాలి ఈ పుస్తకాలన్నీ.  అమ్మ అంది. నీ టేబుల్ మీద పెట్టుకో అని. “మరి అన్ని పట్టవుగా”? అప్పుడు నాన్న, “ నా రాక్‌లో కొన్ని పెట్టుకో. నీ పుస్తకాలకి ఇంకో రాక్ చేయించుదాంలే” అన్నారు. నాన్న పుస్తకాల రాక్‌లో నాన్న పుస్తకాల పక్కనే నా పుస్తకాలు. అంటే నాన్న అంత గొప్పగా చదువుకుంటాను. నాన్నకంటే ఎక్కువ తెలుస్తుంది అప్పుడు. అప్పుడు, నాన్నని కాస్మోనాట్ అంటే ఎవరు, స్పుత్నిక్ అంటే ఏమిటి, పడవలను ఎలా చేస్తారు, షిప్పు కాప్టెన్‌కి సముద్రంలో దారి ఎలా తెలుస్తుంది, దెబ్బ తగిలితే రక్తం వస్తుంది కదా, అది ఎలా చెక్కు కడుతుంది, ఒంట్లో పురుగుగులు ఎలా ఉంటాయ్,  అవేమి తింటాయ్ అని అడగకుండా అన్ని నేనే చదివి తెలుసుకోవచ్చు.

నాన్న నాకు డ్రాయింగ్ బుక్స్ కూడా తెచ్చిపెట్టారు. ఎంచక్కగా, జనమంచి మామయ్య తెచ్చిన కలర్ పెన్సిల్స్‌తో కొత్త పుస్తకంలో, కొత్త కొత్త బొమ్మలు వేసుకోవచ్చు. బొమ్మల పంచతంత్రం, భారతం, రామాయణం, పారిపోయిన బఠానీ, జానపద కథలు, రష్యన్ కథలు, గేయాలు. పిల్లల పాటలు, నీతి చంద్రిక, ఉత్పలమాల, మను చరిత్ర, సింద్‌బాద్ కథలు ఎన్నో కథలు. రాకుమారులు, రాకుమార్తెలు, మంత్రగత్తెలు, గుర్రాలు, ఏనుగులు, పులులు, చీమలు, కోతులు, చెట్లు, ఆకులు, పడవలు, స్పుత్నిక్కులు, విమానాలు, కార్లు, ఫోర్డ్, నక్షత్రాలు, నీరు, పిడుగులు, విద్యుత్తు …వాటితో పాటు గ్లోబ్. దాని మీద పేర్లన్నీ తెలుగులో ఉన్నాయి!

నాన్న మీద అమాంతం ప్రేమ పెరిగిపోయింది. పరుగెత్తుకుంటూవెళ్ళి నాన్నమీదకి ఎక్కేసాను. నేను చూసుకోలేదు. నాన్న చేతిలో సిగరెట్టుని. కాలుతున్న సిగరెట్టు కొస నుండి ఒక కణిక నాన్న చాతి మీద పడింది. కాలింది. బొబ్బలేచింది. నా ప్రేమకి మచ్చగా అది మిగిలిపోయింది. నాన్న నవ్వుతునే ఉన్నారు.

ఆ రోజు ఆకాశంలో నల్లని మబ్బులు అటూ ఇటూ పరుగెడుతునే ఉన్నాయి. నాన్న అటు పడక గదిలోనుండి ఇటు హాలు లోకి అటూ ఇటూ తిరుగుతునే ఉన్నారు. ఏమిటో తెలియదు కాని ఏంటో ఏదో సరిగ్గా లేదు. నేను వరండాలో చెస్ ఆడుకుంటున్నాను.

లోపల నుండి మూలుగులు. పరిగెత్తుకుంటూ పడక గదిలోకి వెళ్ళాను. అమ్మ కూడా వంటగదిలోనుండి వచ్చింది.

నాన్నకి బాగోలేదు. వాంతులు, విరోచనాలు. బెడ్‌రూమ్ నిండా వాంతులే. నాన్నకి అస్సలు బాగోలేదు. సన్నటి తుప్పర పడుతోంది. క్రింద ఇంటిలోనుండి వాళ్ళు వచ్చారు పరుగెత్తుకుంటూ. ఎవరో అన్నారు, “టాక్సీ తీసుకురామ్మా. నాన్నని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాలి”. పరుగెత్తాను. తేనాం పేట మెయిన్‌రోడ్డు మీదకి. ఆ మూల మీద టాక్సీ స్టాండ్‌లో ఎవరూ లేరు. అటూ, ఇటూ చూసాను. ఆల్వార్ పేట మూల మీద రెండు పెట్రోలు బంకులున్నవి. వాటి దగ్గిర్లో ఒక టాక్సీ స్టాండ్ ఉంది. అటువైపు పరుగెత్తాను. దాదాపు ఒక కిలోమీటరు. రొప్పుతూ అంబాసిడర్ కార్ టాక్సీ డ్రైవర్‌కి చెప్పాను. నాన్నకి బాగోలేదు. నువ్వు రా. హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి అని.  ముందు డోర్ తెరిచి కూర్చో మన్నాడు. ఇంటికి తీసుకు వెళ్ళాను. నాన్న కిందకి తీసుకుని వచ్చారు. మెట్లమీద, నాన్న “బాబూ” అంటూ రెండు మూడు సార్లు పిలిచారు. అదే ఆఖరు సారి నాన్న నన్ను పిలవడం. బహుశా ఆయన ఆ ఆఖరి క్షణాలలో భయ పడింది నేనేమైపోతాననేమో!

నాన్న వెళ్ళిపోయారు. నేను మిగిలిపోయాను. ఆయన జ్ఞాపకాలు మిగిలిపోయినవి, ఆయన పుస్తకాలు లాగానే!

 

-0-

నాన్నకి వార్ మెడల్

నాన్నకి వార్ మెడల్

మా నాన్న పేరు అట్లూరి పిచ్చేశ్వర రావు.  ఆయన వృత్తి రీత్యా మొదట నావికుడు.  బ్రిటీషు వారి రాయల్ ఇండియన్ నేవీ నావికాదళంలో నౌకల మీద ఇంజనీరు. భారత దేశ స్వాతంత్ర్య సమరం నేపథ్యంలో రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటులో(మ్యూటిని) పాల్గొన్నారు. బ్రిటీష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి శిక్షించింది. బారతదేశ స్వాతంత్ర్యానంతరం, భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు మళ్ళీ భారత నౌకాదళంలో చేరారు. ఆయన రచయిత. సాయుధ నౌకదళం తిరుగుబాటు నేపథ్యంతో కథలు కూడా వ్రాసారు. కొన్ని కథలు, వ్యాసాలు, నాటికలు, వెండి తెర నవలలే కాక, సినిమాలకి కథలు కూడా వ్రాసారు. కొన్నింటికి సంభాషణలు కూడా వ్రాసారు. అంటే స్క్రీన్‌ప్లేలు. కొన్ని హిందీ నవలలని తెలుగులోకి అనువదించారు.

మా అమ్మ పేరు చౌదరాణి. శతావధాని త్రిపురనేని రామస్వామి గారి కనిష్ట పుత్రిక. తనూ రచయిత్రే. కథలు, కవితలు, రేడియో వ్యాసాలు, నవలలు వ్రాసింది. హిందీలో నుండి తెలుగులోకి అనువాదాలు చేసింది. స్వయంగా మూడు దశాబ్దాల పాటు మద్రాసులోని త్యాగరాయ నగరులోని, పాండి బజారులో తెలుగు వారికోసం ప్రత్యేకంగా తెలుగు పుస్తకాల షాపుని స్థాపించి, సాహిత్య గోష్టులు, చర్చా వేదికలు, సమావేశాలు నిర్వహిస్తూ సాహిత్య సేవ చేసింది. బహశా ఆ మాత్రం చేసిన తొలి తెలుగు మహిళ తనేనేమో!

– అనిల్ అట్లూరి

సెప్టెంబర్ 26 ప్రసిద్ధ అభ్యుదయ రచయిత అట్లూరి పిచ్చేశ్వర రావు గారి వర్ధంతి .

Sakshi_D25895202

– ౦-

 

Frozen సరోవరం!

 

కాసుల లింగా రెడ్డి

కాసుల లింగా రెడ్డి

 

అతని రాత్రుల్ని సాంప్రదాయ రాక్షసి మింగేసింది-

అందం చేసే నఖక్షతాల నాజూకు బాధల్లో మూర్ఛిల్లాలనే కోరిక

లేత యవ్వన తుఫాను ఉధృతిలో

నిలువ లేక గింగిరాలు కొట్టాడు-

నిటారుగా నిలిచిన కెరటాల్ని

తనలో కరిగించుకుంటుందని నమ్ముకున్న సముద్రం వంచించింది-

జీవితకాలమంతా

ఒక్క ఫ్రెంచి కిస్సుకైనా నోచుకోని

ఆంక్షల వలలో విలవిల్లాడాడు-

గీతదాటలేని నిస్సహాయతలో

తీరానికేసి తలబాదుకొని కరిగిపోయింది కెరటం-

అతని రమణీయ యవ్వన వసంతాల్ని మిడతలు మింగేసాయి-

 

అతని రాత్రులు వడగళ్ళవానలో కొట్టుకొనిపోయాయి-

కొలిమిలో ఎర్రగా కాలిన కర్రులాంటి కోరికతో అతడు వస్తాడు

ఆమె గురిచూసి విసిరిన మాటల బాణం

రక్త సంబంధాల నాభిలో దిగుతుంది

ఓడుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ

జ్వలన సరోవరాల్లో మునుగుదామనుకుంటాడు

పెట్టుబడుల ఉచ్చును

కోరికల కంఠాలకు బిగించి లాగుతుంది

చిక్కటి నిరాశ రాత్రినిండా గడ్డకడుతుంది

వడగళ్ళవాన తెరిపివ్వక కురుస్తూనే వుంటుంది-

అతని రమణీయ యవ్వన వసంతాల్ని మిడతలు మింగేసాయి-

 

painting: Mandira Bhaduri

painting: Mandira Bhaduri

ఆమె ఫ్రిజిడిటీతో అతని రాత్రులు గడ్డకట్టాయి-

కాలుతున్న పెదవుల తడి అద్ది

కోరికల కొనవేళ్ళతో శ్రుతి చేసినప్పుడు

ఏ రాగమూ పలకని వీణాతంత్రులు-

 

రగులుతున్న నిప్పుల గుండంలో స్నానించి

ద్వైతం అద్వైత రససిద్ధి పొందాల్సినచోట

మరబొమ్మతో మార్మిక క్రీడ-

సళ్ళకవ్వపు సరాగాన్ని కుండ నిరాకరించినప్పుడు

చేతివేళ్ళతోనైనా గిళ్ళకొట్టాల్సిందే కదా!

అతని రమణీయ యవ్వన వసంతాల్ని మిడతలు మింగేసాయి

 

–    కాసుల లింగా రెడ్డి

 

 

 

 

 

ఇంద్రధనుసుపై ఎగిరిన సీతాకోక ఒకటి

 

కోడూరి విజయ్ కుమార్

కోడూరి విజయ్ కుమార్

 

ఒక పరిమళమేదో అపుడపుడూ అల్లుకుంటుంది

పరిమళమే కాదు … పరిమళాన్ని పంచిన

పూల చాటు ముళ్ళ గాయాలు  కూడా

 

ఒక ఉత్సవ గీతమేదో వెంటాడుతుంది  అపుడపుడూ

ఉత్సవగీతమే  కాదు ….

గీతాలాపన నడుమ దొర్లిన అపశ్రుతులూ

జీర పోయిన విషాదాలూ తరుముతాయి

2

మరిచిపోయాననే   అనుకుంటాను

లోపలెక్కడో పదిలంగా ఒక నేలమాళిగలో

నిన్ను పడేసి, పెద్ద తాళం వేసి

హాయిగా వున్నాననే అనుకుంటాను

 

నిజానికి హాయిగానే వున్నాను కదా

నేను తప్ప మరో లోకం లేని

ఒక స్త్రీ సాంగత్యంలో సుఖంగానే వున్నాను కదా

మరి, దేహాంతర వాసంలో తూనీగ  వలె  ఎగిరే

అప్పటి నీ జ్ఞాపకాన్ని దోసిట్లోకి

తీసుకుని పలకరించేది యెలా ?

3

మీ వీధి మలుపు తిరిగినపుడల్లా

నీవు అప్పటి రూపంతో ఎదురైనట్టే వుంటుంది

కొన్ని నవ్వుల్ని నాకు బహుమతిగా ఇచ్చేందుకు

నీవు మీ పాత ఇంటి గుమ్మం లో

నిలబడి ఎదురు చూస్తున్నట్టే వుంటుంది

 

కళ్ళతో కళ్ళని కలిపే ఇంద్రజాలమేదో తెలియక

కొన్ని పొడి పొడి మాటల తీగ మీద

ఒడుపుగా నిలబడలేక ఓడిపోయిన రోజులవి

 

4

జీవితం తెగిన వంతెనలా వెక్కిరించి

నన్ను పూర్తిగా ఓడించ లంఘించిన రోజుల్లోనే కదా

వంతెన చివర ఇంద్ర ధనుసులా నువ్వు మెరిసింది

 

మబ్బుల ఆకాశం పైన రంగుల ఇంద్ర ధనుసు

నిలిచే ఉండునని భ్రమసిన అమాయక రోజులవి

ఇంద్ర ధనుసు అదృశ్యమయినాక

సాగిన ప్రయాణమొక దుర్భర జ్ఞాపకం

butterfly-2

5

ఈ గడ్డి పోచల గూడులో ఒక

నిప్పుని రాజేసి నీవు నిశ్శబ్దంగా కనుమరుగయ్యాక

తగలబడిన గూడుతో ఒక్కడినే

రాత్రులని కాల్చేసిన రోజులవి  ….

 

అప్పుడే కదా తెలిసింది

దేవదాసు మధువు దాసుడెందుకు అయింది

ఇదంతా నీకు తెలిసి వుండక  పోవొచ్చు

తెలిసినా ఒక నిర్లక్ష్యపు చూపు విసిరి వుండ వొచ్చు

6

ఏం చేస్తూ వుంటావని అనుకుంటాను కాసేపు

ఎవరమైనా ఏం చేస్తూ వుంటాము ?

 

సూపర్ మార్కెట్లలో సరుకులు కొంటూ

సరుకులుగా మారిన మనుషుల రణగొణ ధ్వనుల

నడుమ తల తెగిన కోడిపిల్లలా కొట్టుకుంటూ

రంగుల పెట్టెల్లో, అంతర్జాలలో

మనల్ని మనం కోల్పోతూ

ఇంటి పనీ, బైటి పనీ అని అలసిపోతూ ….

 

ఒకనాడు నీ ఊహల్లో కాలిపోయిన గూటిలో

ఇవాళ కొన్ని సరదా ఊహలు

7

ఒక వర్షాకాలపు సాయంత్రం నేను

నా స్త్రీ వొడిలో తల పెట్టుకుని

లోకపు ఆనందాన్నంతా ఒక్కడినే లాగేసుకున్నపుడు

చల్ల గాలిలో తేలి వొచ్చే కిషోర్ పాట

పరిమళమై నన్ను ఆక్రమించుకుంటుంది –

 

‘యే షామ్ కుచ్ అజీబ్ హై …

వో షామ్ భీ అజీబ్ థీ ‘

 

నేను జీవిస్తోన్న ఇప్పటి రోజులే కాదు

తొలిసారి నేనొక రంగుల సీతాకోకనై

ఇంద్రధనుసుపై  ఎగిరిన

అప్పటి రోజులూ అపురూపమే

–      కోడూరి విజయకుమార్

29 న ప్రముఖ కథా రచయిత్రి శారద “ నీలాంబరి” కథల పుస్తకం ఆవిష్కరణ

ప్రముఖ కథా రచయిత్రి, అనువాదకురాలు శారద కథల పుస్తకం “ నీలాంబరి” ఆవిష్కరణ సభ సెప్టెంబర్ 29 న ఆస్ట్రేలియా లోని అడిలైడ్ లో జరుగుతుంది. గత  ఏడెనిమిదేళ్ళుగా కథలు రాస్తున్న శారద ఇప్పటివరకు 40 కి పైగా కథలు రాసారు.  అనేక అనువాద రచనలు చేసారు. ప్రతి కథ లోనూ తనదైన ఒక  ప్రత్యేక కోణాన్ని ఆవిష్కరించగలిగిన మంచి రచయిత్రి శారద. ఆమె కొత్త కథల పుస్తకం “ నీలాంబరి” కినిగె లో ebook గా కూడా లభ్యమవుతుంది. ఈ పుస్తకం లో ఆమె రాసిన 18 కథలున్నాయి.

” ఒకే రచయిత రాసిన కథల్లో వైవిద్యం వస్తువు లో, శైలి లో, శిల్పం లో , పాత్ర చిత్రణ లో, భాష లో, సందర్భాలలో , సంఘర్షణలలో, మనస్తత్వ చిత్రణ లో కనిపిస్తాయి. ఆ ఒక్క రచయిత యొక్క అనుభవాలు గానీ, తన చుట్టూ ఉన్న సమాజం లో గమనించిన విశేషాలూ , సంఘర్షణలూ ఉంటాయి. శారద కథల్లో ఈ వైవిధ్యం చూస్తాము. ఈ కథల్లో హాస్యం ఉంది. వ్యంగం ఉంది. సమాజం లో జరిగే ఆకృత్యాల మీద వ్యాఖ్యానం ఉంది. మనస్తత్వ చిత్రణ ఉంది. ” అంటారు నిడదవోలు  మాలతి శారద కథల పుస్తకం “నీలాంబరి” కి రాసిన ముందు మాట లో.

 

 

నాటా -నవ్య వీక్లీ కథలూ కవితల పోటీ

NATA Navya Kathalu Kavitala poti

వేంపల్లె షరీఫ్, మల్ల్లిపురం జగదీష్‌కు విమలాశాంతి పురస్కారాలు

DSC_0062

వేంపల్లె షరీఫ్

IMG_5573

విమలా శాంతి సాహిత్య సాంఘిక సేవా ట్రస్టు ప్రతి ఏడాది అందచేసే విమలాశాంతి సాహిత్య పురస్కారాలు 2013 వ సంవత్సరానికి గాను కథా రచయిత వేంపల్లె షరీఫ్ కు, మల్లిపురం జగదీష్ కు ప్రకటించారు. విమలాశాంతి సాహిత్య సాంఘిక సేవాట్రస్టు, సమాజ వికాసం కోసం రచనలు చేస్తున్న రచయితలను గౌరవించే దిశలో 2013 కథాపురస్కారం కోసం జాతీయ స్థాయిలో రచయితల నుండి కథాసంపుటాలను ఆహ్వానించింది. ట్రస్టు ఆహ్వానాన్ని మన్నించి 47మంది రచయితలు తమ తమ కథా సంపుటాలను పంపి పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలో కొత్తవాళ్లతోపాటు లబ్ధప్రతిష్టులు చాలామంది పాల్గొన్నారు.  “2013 – విమలాశాంతి సాహిత్య పురస్కారాల”ను “శాంతి రజనీకాంత్ స్మారక సాహిత్య పురస్కారాలుగా” అందజేస్తున్నారు . “2013 శాంతి రజనీకాంత్ స్మారక కథా పురస్కారాన్ని” వేంపల్లి షరీఫ్ (కడప జిల్లా) “జుమ్మా” కథా సంపుటికి, మల్లిపురం జగదీష్ (శ్రీకాకుళం జిల్లా) “శిలకోల” కథా సంపుటికి సంయుక్తంగా ప్రకటించారు.

ఉత్తమ సాహిత్య ప్రతిఫలన రూపంగా ఎదుగుతున్న మా  చిన్నబ్బాయి “శాంతి రజనీకాంత్ (27) ఒక ప్రయివేట్ ఉద్యోగ రాక్షసి కర్కశ కరాళ నృత్యఘంటికల హోరులో నలిగి తటాలున కాలగర్భంలో కలిసిపోయాడు. కళకళలాడుతూ కళ్లముందే కరిగి మాయమయి పోయిన ఆ మానవత్వపు సుగంధ పరిమళానికి స్మృత్యర్ధంగా ఈ పురస్కారాలను అందజేస్తున్నామని విమలా శాంతి సాహిత్య సాంఘిక  సేవా ట్రస్ట్ చైర్మన్ డా. శాంతినారాయణ  ఒక ప్రకటన లో తెలియచేసారు.

అక్టోబర్ నెలలో జరిగే పురస్కార ప్రధానోత్సవ సభలో రచయితలకు జ్ఞాపికల్తో పాటు ఒక్కొక్కరికి రూ.5,000/= చొప్పున నగదును బహూకరించి సత్కరిస్తారు. . ఈ పురస్కారాల ఎంపికలో ఆచార్య కాత్యాయని విద్మహే, గంటేడ గౌరునాయుడు డా. వి.ఆర్.రాసాని న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

తెలంగాణా కవులు/ రచయితలూ ఇపుడేం చేయాలి?

 

(చిత్రం: అన్నవరం శ్రీనివాస్)

(చిత్రం: అన్నవరం శ్రీనివాస్)

యివాళ్ళ తెలంగాణ రచయితలు ఒక చౌరస్తాలో నిలబడి ఉన్నారు. గత దశాబ్ది కాలంగా తెలంగాణ రచయితలు, తెలంగాణ అస్తిత్వాన్ని, విముక్తి, స్వేచ్చా స్వాతంత్ర్యాకాంక్షలను, ప్ర్రత్యేక రాష్ట్ర  ఆకాంక్షలను యెలుగెత్తి చాటారు. తమ రచనల్లో – పాట, కవిత్వం, కథ, నవల, సాహిత్య విమర్శ – అన్ని సాహితీ ప్రక్రియల ద్వారా ప్రధానంగా  వారు చాటింది ఈ ఆకాంక్షలనే! అయితే కేవలం ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష్లని మాత్రమే చాటితే తెలంగాణ సాహిత్యం రాజకీయ ప్రచార సాహిత్యం మాత్రమే అయి ఉండేది. కానీ గత దశాబ్దంన్నర కాలంగా తెలంగాణ రచయితలు సృష్టించిన సాహిత్యం ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను మాత్రమే కాకుండా,  అనేక విషయాలని తడిమింది.

ముందుగా తెలంగాణ రచయితలు తమ అస్తిత్వాన్ని కనుక్కొన్నారు. తెలుగు భాష, సంసృతి, సాహిత్యం మొత్తం కూడా యెట్లా ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని జిల్లాలలోని కొన్ని సామాజిక వర్గాల  వారి గుప్పిట్లోనే ఉండిపోయి, వారు రాసిందే సాహిత్యం, వారు మాట్లాడిందే భాష, వారిదే అసలైన సంస్కృతి అనే పద్దతిలో చలామణీ అయిందో, ఈ క్రమంలో మిగతా వెనుకబడ్డ ప్రాంతాల వారి సాహిత్యం, భాష, సంస్కృతుల లానే తాము కూడా యెట్లా అణచివేతకు గురయ్యారో, అయితే తాము గురయిన అణచివేత కు ప్రత్యేక చారిత్రిక కారణాలూ, ప్రత్యేక సందర్భమూ యెట్ల్లా ఉన్నయో గుర్తించారు. నిజానికి ప్రజా సాహిత్యం లో ప్రజల భాషకు పెద్ద పీట వేసినప్పటికీ , మాండలిక భాష అంటూ తెలంగాణ భాషకున్న ప్రత్యేక అస్తిత్వాన్ని, చారిత్రిక నేపథ్యాన్ని ప్రగతిశీల వాదులుగా చెప్పుకుంటున్న వారు కూడా   గుర్తించ నిరాకరించారో, తెలంగాణ రచయితలు బట్టబయలు చేసారు. తెలంగాణ లో మరుగున పడ్డ అనేక గొప్ప సాహిత్యకారులను, వారు సృష్టించిన సాహిత్యాన్ని వెలికి తీసారు. సాహిత్య విమర్శకు కొత్త తెలంగాణ దృష్టిని దృక్కోణాన్ని అందించి పదునెక్కించారు. గత తెలుగు సాహిత్య చరిత్రనూ దృక్పథాలను తెలంగాణ దృక్పథంతో వినిర్మాణం చేసి సాహిత్య చరిత్రనూ, సాహిత్య విమర్శనూ తిరగ రాసారు. కొత్త తెలంగాణ సాహిత్య శకాన్ని సృష్టించారు.

అట్లే తెలంగాణ ప్రజా జీవితంలో, సంస్కృతిలో, చరిత్రలోని అనేక అంశాలని వెలికితీయడమే కాకుండా , కొత్తగా కనుగొన్నారు, సూత్రీకరించారు, సిద్ధాంతీకరించారు . దీని వెనుక – తెలంగాణ సాహిత్యకారులు తమ సాహిత్య చరిత్రను (గత చరిత్రనూ, నడుస్తున్న చరిత్రనూ)   పునర్నిర్మించడానికీ, పునర్లిఖించడానికీ,  వినూత్నంగా కనుక్కోవడానికీ (discover ), “కేవలం తెలంగాణ దృష్టీ దృక్పథమూ మాత్రమే ప్రధానం”  అనే ‘సంకుచితంగా’ కనబడుతున్నట్ట నిపించే భావన ఆలంబన ఐంది. ‘సర్వే జనా సుఖినోభవంతు’ నుండి ‘ప్రపంచ కార్మికులారా యేకం కండి”  నుండి, ‘రైతాంగ ఆదివాసీ విముక్తి పోరాటాలు వర్దిల్లాలి’ నుండి ఒక ప్రాంతీయ వాద దృక్పథానికి సాహిత్యంలో localized outlook కీ, expression కీ ప్రయాణించారు తెలంగాణ రచయితలు.

అయితే ఈ ప్రయాణానికి తెలంగాణ ఉద్యమ  చారిత్రక సందర్భం యెంత దోహదపడిందో , తాము తెలంగాణ సమాజపు అనేక దశల్లో సాధించిన పరిణామాలు, పరిణతీ, acquire చేసుకున్న చారిత్రిక అనుభవమూ, జ్ఞానమూ అంతే దోహదపడ్దాయి. యేదీ సమాజంలో చరిత్ర లేకుండా ఊడిపడదు కదా! అయితే కొన్ని సందర్భాల్లో తెలంగాణ రచయితలు ఒక తీవ్రమైన దృక్పథాన్ని అవలంబించి కొంత గత చరిత్రని నిరాకరించిన సందర్భమూ లేక పోలేదు. అచారిత్రికంగా అనిపించినా ఇది అన్ని అస్తిత్వ వాద ఉద్యమాల్లో మనకు సాధారణంగా కనబడే లక్షణమే! తమని తాము  నిర్మించుకునేందుకు, స్థాపించుకునేందుకు చాలా సార్లు పునాదుల్నీ, నేపథ్యాన్నీ పూర్తిగా నిరాకరించే ధోరణి సరైంది కాకపోవచ్చేమో కాని అసందర్భమూ అచారిత్రికమూ మాత్రం కాదు. ముఖ్యంగా ఒక ప్రాంతం విముక్తి కోసం పోరాడుతున్న ఉద్యమ నేపథ్యంలో, అన్ని రంగాల్లో  జరిగే assertions లో ఇది మనం చూస్తాం. అదే తెలంగాణ రచయితల్లో సాహిత్య విమర్శకుల్లో కూడా వ్యక్తమైంది.

ఐతే తెలంగాణ జీవితాన్ని అనేక సందర్భాల్లోంచి, అనేక పార్శ్వాలనుంచి, అనేక కోణాలనుంచి తెలంగాణ సాహిత్యం తెలంగాణ ఉద్యమ బీజాలు మొలకెత్తడం ప్రారంభించిన 1990 దశాబ్దం అర్ధ భాగం నుండే అద్భుతంగా ఆవిష్కరించడం ప్రారంభించింది. యే కాలంలో నైనా , యే స్థలంలో నైనా సాహిత్యం ఉద్యమం రాకని యెలుగెత్తే వైతాళిక పాత్ర పోషిస్తుంది అనేది తెలంగాణ విషయం లో అక్షర సత్యం. కథల్లో, నవలల్లో, కవిత్వంలో, మరీ ముఖ్యం పాటలో తెలంగాణ జీవితం లోని, చరిత్రలోని మున్నెన్నడూ వెలికిరాని ప్రతిఫలించని అనేక కొత్త కోణాలు ఆవిష్కరించబడ్డాయి. సాహిత్య విమర్శ కొత్త దృక్పథాలని ప్రకటించింది. ఐతే ప్రాంతీయ వాద అస్తిత్వ సాహిత్యమూ ఉద్యమంగా కనబడ్డా,  తెలంగాణ ఉద్యమమూ సాహిత్యమూ ప్రధానంగా ప్రపంచంలోని బడుగు దేశాలనీ, ప్రాంతాలనీ, ప్రజలనీ ముంచెత్తి వేసిన ప్రపంచీకరణకు ధీటుగా తన అస్తిత్వాన్ని నిలబెట్టి,  సవాలు చేసి, ప్రత్యామ్నాయంగా ఒక కొత్త సామాజిక నమూనాని ప్రకటించి, తన వనరులని తానే అనుభవించగలిగే రాజ్యనియంత్రణ, అధికారమూ కోసం చేసిన, చేస్తున్న  ఒక గొప్ప చారిత్రిక యుద్ధం ! యెలుగెత్తిన ప్రజాగ్రహ ప్రకటన! ఇందులో తెలంగాణ రచయితలు గొప్ప చారిత్రిక పాత్రను పోషించారు. పోషిస్తున్నారు. యిట్ల్లా ప్రపంచవ్యాప్తంగా ముందుకొచ్చిన అస్తిత్వ ఉద్యమాల్లో తెలంగాణ అగ్రభాగాన నిలుస్తుంది, తెలంగాణ సాహిత్యమూ సాహిత్యకారులూ తెలంగాణ ఉద్యమానికి జెండాలై రెప రెప లాడుతారు.

యివాళ్ళ తెలంగాణ రచయితలు ఒక చౌరస్తాలో ఉండడానికి కారణం తెలంగాణ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంధి దశ!

ఒక వైపు కేంద్రంలో అధికారం లోనున్న ఒక ప్రధాన జాతీయపార్టీ అనేక సంవత్సరాల జాప్యం తర్వాత ప్రజా ఉద్యమాల పెను ఉప్పెనల ఒత్తిడికీ, మరుగుతున్న తెలంగాణ ప్రజాగ్రహానికి జడిసి, యెడతెరపిలేకుండా కొనసాగుతున్న తెలంగాణ యువకుల ఆత్మబలిదానాలకు తలవంచి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. అయితే ఇప్పటిదాకా యెక్కడుందో కూడా తెలియని సమైక్యాంధ్ర ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన మరుక్షణమే ప్రత్యక్షమై నాటినుండి నేటి దాకా అనేక కుట్రలూ, కూహకాలతో కేంద్రప్రభుత్వం మీద వత్తిడి పెంచి వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టివేయాలని రాజకీయ పార్టీలకు అతీతంగా సీమాంధ్ర పెత్తందార్ల నాయకుల కనుసన్నల్లో నడుస్తూ చేతననంతగా ప్రయత్నించినస్తున్నది. తిరిగి 2009 డిసంబర్ ను పునరావృతం చేయాలని శాయశక్తులా కుట్రలు పన్నుతున్నది. అందుకే తెలంగాణ రచయితల మీద బాధ్యత నాలుగు రెట్లవుతున్నది.

నారాయణస్వామి వెంకట యోగి

నారాయణస్వామి వెంకట యోగి

ఒకటి: గతంలో లాగే (వీలయితే ఇంకా ఉధృతంగా) తెలంగాణ అస్తిత్వం నిలుపుకునే సాహిత్యం సృష్టిస్తూ పోవడం,

రెండు: వచ్చిన తెలంగాణ యేదో ఒక రాజకీయ పార్టీ అనుగ్రహిస్తేనో, దయాదాక్షిణ్యాల భిక్షలాగానో రాలేదని అది తెలంగాణ ప్రజా ఉద్యమాల వల్ల, ఆత్మ బలిదానాల వల్ల వచ్చిందనీ స్పష్టంగా గుర్తెరిగి దానిని కాపాడుకునే దిశగా ఉద్యమ సాహిత్య సృష్టి చేయడం,

మూడు: జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం స్పష్టంగా సీమాంధ్ర పెత్తందార్ల , దొపిడీ దార్ల నాయకత్వంలో వారి ప్రయోజనాలకోసం సాగుతున్న ఉద్యమమనీ దానికి నిజంగా సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు యెంతమాత్రమూ పట్టవనీ (నిజంగా సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలే ప్రధానమై ఉంటే శ్రీకాకుళం నుండి అనంతపూర్ దాకా ప్రజలని పట్టి పీడిస్తున్న అనేకానేక సమస్యలమీద ఉద్యమం జరిగి ఉండేది) కేవల హైదరాబాదుని గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్న  రాజకీయార్థిక శక్తుల ప్రయోజనాలే ముఖ్యమనీ  యెలుగెత్తి చాటాలి.

నాలుగోదీ ముఖ్యమైనదీ – ఇప్పుడు పెత్తందార్ల కనుసన్నల్లో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం కుట్రపూరితంగా  తెలంగాణా ప్రజలకూ, సీమాంధ్ర ప్రజలకూ మధ్య సృష్టిస్తున్న తీవ్రమైన వైషమ్యాలనూ, వైమనస్యాలనూ రూపుమాపేందుకు, తిరిగి సామాన్య తెలుగు ప్రజల మధ్య స్నేహపూరిత సుహృద్భావ వాతావరణాన్ని సృష్టించేందుకు పూనుకోవాలి. ఈ పని రచయితలే చేయగలరు.

బాధ్యత సీమాంధ్ర రచయితలమీదా ఉన్నప్పటికీ, ప్రధానంగా ఈ ప్రయత్నానికి నాయకత్వం వహించాల్సింది తెలంగాణ రచయితలే! యిరు ప్రాంతాల తెలుగు ప్రజల మధ్య ఒకరి హక్కులను ఒకరు, ఒకరి స్వేచ్చను యింకొకరు, ఒకరి వాటాను యింకొకరు, ఒకరి అభివృధ్ధిని యింకొకరు, ఒకరికొకరు భంగం కలుగకుండా గౌరవించుకుని facilitate చేసుకుని, పంచుకునే ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పే అత్యవసర కర్తవ్యానికి  తెలంగాణ రచయితలు పూనుకోవాలి. ఈ పని యిరు ప్రాంతాల రాజకీయ పార్టీలు వాటి నాయకులూ చెయ్యరు – అందుచేత దీనికి తెలంగాణ రచయితలే పూనుకోవాలి! అప్రజాస్వామిక వలస  పాలకులనీ, అన్ని రంగాల్లో  వారి అంతర్వలసీకరణ ఆధిపత్య ఆజమాయిషీ కుట్రలనీ యెట్లా ఐతే వ్యతిరేకించి తిప్పికొట్టడానికి పదునైన సాహిత్యాయుధాలని సృష్టించారో, అట్లే యిరుప్రాంతాల ప్రజలు విడిపోయి సఖ్యంగా ఉండేందుకు, విభజన సృష్టించే అభద్రతలను పోగొట్టేందుకు, విభజన తర్వాత పంపకాలు ప్రజాస్వామ్యయుతంగా జరిగేందుకు, యిరుప్రాంతాల ప్రజల్లో ఉన్న ప్రజాస్వామిక సంస్కృతినీ , ఆకాంక్షలను కలిసికట్టుగా నిలబెట్టేందుకు తెలంగాణ రచయితలు పెద్ద యెత్తున పూనుకోవాలి – నాయకత్వం వహించాలి! యీ క్రమంలో సీమాంధ్ర ప్రాంతపు రచయితలను ప్రజాస్వామ్యయుతంగా కలుపుకుని పోవాలి. విడిపోయి కలసి ఉండే ఒక సాంస్కృతిక వారధి నిర్మించాలి.

అంతే కాదు – విభజన జరింగితర్వాత జరిగే సాహిత్య, సాంస్కృతిక పునర్నిర్మాణానికి అవసరమయ్యే ఒక్కొక యిటుకరాయినీ యిప్పట్నుంచే సమకూర్చుకోవడమూ ప్రారంబించాలి! అందు కోసము అవసరమైన భవిష్యత్తు దృష్టినీ , నిర్మాణాత్మకమైన దృక్కోణాన్నీ దృక్పథాన్నీ అభివృద్ధి చేయాలి. అంటే యిప్పటిదాకా చేస్తూ వచ్చిన వినిర్మాణాన్ని కొనసాగిస్తునే కొత్తని ప్రయత్న పూర్వకంగా నిర్మించే చారిత్రిక దృష్టిని సమిష్టిగా యేర్పర్చుకోవాలి.

– నారాయణస్వామి వెంకట యోగి

index

———————————————————————-

తెలంగాణా కవులు నిశ్శబ్దంగా వున్నదెపుడని?

ప్రస్తుత పరిస్థితులలో ఈ ప్రశ్నని ఎలా స్వీకరించాలన్నదే మొదటి సవాలు –

‘తెలంగాణా ప్రజల స్వప్నం’ సాకారమవుతోన్న వేళ ‘తెలంగాణా కవులు ఇపుడేం చేయాలి?’ అన్నదే అడిగిన వారి ఉద్దేశ్యమైతే నేనందుకు సిద్ధంగా లేను –

ఇంకా సవాలక్ష సందేహాలున్నాయి …

గతానుభవాలు మిగిల్చిన నమ్మక ద్రోహపు గాయాల సాక్షిగా, తెలంగాణా రాష్ట్ర సాకారం కల ‘ సంపూర్ణంగా’ నిజమైతే తప్ప, తెలంగాణా ప్రజలెవరూ నమ్మడానికి సిద్ధంగా లేరు-

ప్రజాకవి కాళోజీ మాటల్లోనే చెప్పాలంటే- “ప్రజలూ – నేనూ కలిసి ప్రజల్లో ఒకనిగా ‘నా గొడవ’ బద్మాశులైన పాలకులకు చెబుతున్నాను”

కాబట్టి, తెలంగాణా రాష్ట్ర కల ఇంకా సాకారం కాలేదు కాబట్టి, తెలంగాణా కవులు తెలంగాణా ని తర  తరాలుగా  ఎలా గానం చేస్తూ వొస్తున్నారో ఆ పనిని ఇక ముందూ కొనసాగిస్తారు …

ఆ మాటకొస్తే, తెలంగాణా కవులు నిశ్శబ్దంగా వున్నదెపుడని? ….

కోడూరి విజయ్ కుమార్

కోడూరి విజయ్ కుమార్

తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట కాలంలో ప్రజల చేతిలో శక్తివంతమైన గేయాలనీ/కవితలనీ పెట్టి వాళ్ళని సాయుధులని చేసి, తాము కూడా స్వయంగా ఆ పోరాటం లోకి దిగిన కాళోజీ, సుద్దాల హనుమంతు లాంటి కవులు ఎందరో ?

అనంతర కాలంలో తెలంగాణా భారత దేశం లో విలీనమైన తరువాత కూడా భూస్వాముల/దొరల ఆగడాలను ప్రతిఘటిస్తూ సాగిన అద్భుత ప్రజా ఉద్యమాలనూ, ఆ ఉద్యమాలను అణిచివేసే క్రమంలో ప్రభుత్వాలు తెలంగాణా పల్లెలని రణభూములుగా, మరుభూములుగా మార్చి వేసినపుడు కూడా చెరబండరాజు, వరవర రావు, జ్వాలాముఖి, సిద్దారెడ్డి, అలిశెట్టి ప్రభాకర్, దర్భశయనం లాంటి కవులు గొప్ప కవిత్వాన్ని సృజించారు.

ఇక గద్దర్, గోరటి వెంకన్న లాంటి తెలంగాణా  ప్రజా వాగ్గేయకారుల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? …. బహుశా, తెలంగాణా ప్రజా ఉద్యమాలతో కలిసి నడిచిన గత చరిత్ర వల్లనే అనుకుంటాను, మలి  దశ తెలంగాణా ఉద్యమంలో ‘పాట’ తరువాత,  తెలంగాణా కవిత్వమే ముందు వరుసలో నిలబడి ఉద్యమానికి బాసటగా నిలిచింది-

కాబట్టి, ఇంకా తెలంగాణా కల సాకారం కాలేదు గనుక, తెలంగాణా కవులు ఇప్పటిదాకా తాము పోషిస్తూ వొచ్చిన పాత్రనే మరింత శక్తివంతంగా పోషిస్తారు. ‘పోషించాలి’ అనే మాట ఎందుకు వాడడం లేదంటే, తెలంగాణా కవులు ఇప్పటి దాకా పోషించిన పాత్రని ఎవరో ఆదేశిస్తేనో / సలహా యిస్తేనో పోషించలేదు. తిరిగి కాళోజీ మాటనే తీసుకుంటే, తెలంగాణా కవి తన ప్రజా సమూహపు గొంతునే వినిపించాడు ఏ కాలంలోనైనా!

‘తెలంగాణా కవులు ఇపుడేం చేయాలి?’ … అనే ప్రశ్నని మరో విధంగా స్వీకరిస్తే … అంటే, ఒక వేళ తెలంగాణా కన్న కల సంపూర్ణంగా సాకారమైతే ….. అప్పుడు తెలంగాణా కవులేం చేయాలి?

ఒక్క కవులు మాత్రమే అని ఏముంది? …. ఆలోచనా పరులైన పౌరులు ఎవరైనా తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత, ఏ అన్యాయాలని సరిదిద్ద వలసి వున్నదని తెలంగాణా ఉద్యమించిందో ఆ దిద్దుబాట్ల ప్రక్రియ నిజాయితీగా జరుగుతున్నదీ, లేనిదీ జాగరూకతతో గమనించాలి. సాటి మనుషుల పట్ల, సమాజం పట్ల బాధ్యతతో మెలిగే పౌరులకు కవిత్వ కళ కూడా వుంటే, సమాజంలోని అసమానతలని  చూస్తూ ఏమీ ఎరగనట్లు సాక్షీ భూతులుగా పడి వుండ  లేరు … రేపటి తెలంగాణా లో కవులు అసలు ఉండలేరు.

బహుశా, ప్రజాకవి కాళోజీ లా “దోపిడి చేసే ప్రాంతేతరులను /దూరంగా తన్ని తరుముదాం /ప్రాంతం వారే దోపిడి చేస్తే /ప్రాణాలతో పాతరేస్తం ” అని మరొక యుద్ధ దుందుభి మోగిస్తారు!

అయితే, కవిత్వం ఒక కళ … కవులెవరైనా పనిగట్టుకుని, అది తెలంగాణ కోసమైనా, మరొక దాని కోసమైనా, కవిత్వం రాస్తే అది మిగలదు. ప్రజల ఉద్యమాలతో, వాళ్ళ సమస్యలతో మమేకం అయిన వాళ్ళు  స్పందించకుండా ఉండలేరు  … కవిత్వం చేయగల శక్తి వున్న  వారు ఆ వేదనని కవిత్వ రూపంలో వ్యక్తం చేస్తారు … అంతే  తేడా!

తెలంగాణా ఏర్పడిన తరువాత కవులు/రచయితలు చేయవలసిన పని, మిగతా వాటి సంగతి ఎలా వున్నా, ఒకటి మాత్రం వుంది అనిపిస్తుంది. కారణాలేమైనా, కారకులెవరైనా ప్రస్తుతం తెలుగు మాట్లాడే ప్రజల మధ్య ఒక భయానక అమానవీయ వాతావరణం కమ్ముకుని వుంది. బహుశా, కాలక్రమంలో ఒక మానవీయ వాతావరణాన్ని సృష్టించేందుకు ముందుగా తెలంగాణా కవులు చొరవ తీసుకోవలసి వుంది-

తెలంగాణా ఏర్పడినా, ఏర్పడక పోయినా ఎపుడేమి చేయాలన్న సంగతి తెలంగాణా కవులకు ఎవరూ చెప్పవలసిన అవసరం లేదనే అనుకుంటున్నాను …

ఎందుకంటే, “పరిస్థితులేట్లా వున్నాయని కాదు …. పరిస్థితులలో మనమెట్లా ఉన్నామని?” అన్న కాళోజీ లాంటి తెలంగాణా వైతాళికుల మాట ఒకటి వారికి ఎప్పుడూ దారి చూపిస్తుంది –

 

కోడూరి విజయకుమార్ 

హైదరాబాద్ – 17 సెప్టెంబర్ 2013

(చిత్రం: అన్నవరం శ్రీనివాస్)

(చిత్రం: అన్నవరం శ్రీనివాస్)

————————————————————————————

సాహిత్య చరిత్ర నిర్మాణం జరగాలి

ఆరుపదుల పైబడిన ఉద్యమంలో ఈ  ప్రత్యేకరాష్ట్రకల సాకారమవడానికి ఇప్పుడు అతిదగ్గరలో ఉంది తెలంగాణా. ఈ కాలంలోనే రాష్ట్ర సాధన చివరిపేజీలోనించే ఓ భవిష్యత్ దర్శనం కావాలి. నిజానికి గత దశాబ్దిని “తెలంగాణా సాంస్కృతిక పునరుజ్జీవన దశ”గా అభివర్ణించుకోవలసిన అవసరం ఉంది.

తెలంగాణా సంస్కృతి, సంప్రదాయం,జీవితం సమైక్య రాష్ట్రంలో నిరాదరణకి , అణచివేతకి గురయ్యాక ఉద్యమంతో సాధించుకున్న ఫలాలు నిండుగ కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే తెలంగాణా కవులు,కళాకారులు,మేథావులు భాష పట్ల ఈకాలంలో ఎక్కువ శ్రద్దని కనబరిచారు.ఇది పొక్కిలి,మత్తడి మొదలైన సంకలనాలతో పాటు మునుం వరకు కూడా కవిత్వంలో ఒక ప్రధాన పరికరంగా జీవధారలా సాగుతుంది.

ఎం. నారాయణ శర్మ

ఎం. నారాయణ శర్మ

ఈ కాలాన్నించి గతకాలపు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తరానికి గతాన్ని ఎలా అందించాలనేది ఇప్పుడాలోచించ వలసిన సమయం. తెలంగాణా సాహిత్యం ,చరిత్ర,భాష  రేపటి తరానికి అందడానికి ఏంచేయాలనేది ఇప్పుడాలోచించ వలసిన అంశం.

అందుకోసం రూపొందించవలసిన ప్రధాన అవసరాలు భాషాచరిత్ర,సాహిత్య చరిత్ర,నిఘంటువు.తెలుగులోనే అధికశాతం నిఘంటువులు సాహిత్యనిఘంటువులే.ప్రజా సమూహంలో ఉన్నభాషని నిఘంటువు రూపంలోకి తేవాలి. గతంలో వచ్చిన  నలిమెల భాస్కర్-“తెలంగాణా పదకోశం”, రవ్వా శ్రీహరి “నల్ల గొండ జిల్లా ప్రజల భాష”కొంత మేరకు ఈ అవసరాన్ని తీరుస్తాయి.కాని ఇది ఇంకా విస్తృత రూపంలో రావాల్సిన అవసరం ఉన్నది.

తెలంగాణా భాషకుండే ప్రత్యేక లక్షణాలను బట్టి సాహిత్య , ఔపయోగిక,మౌఖిక,జాన పద ధోరణులనుండి , కళలనుండి వర్ణం , పదం, వాక్యం మొదలైన స్థాయిల్లో భాషనిర్మాణాన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.ఇందుకోసం ఒక భాషా చరిత్ర కావాలి.

సుమారు ఆరువందల సంవత్సరాలు సుల్తానుల పరిపాలనలో ఉన్నా, రాజ భాష మరొకటైనా అవసరాల మేరకు ఆ పదజాలాన్ని తనలో సంలీనం చేసుకుంది కాని తన ఉనికిని కోల్పోలేదు.దేశీ మాధ్యమంగా ఉండటం వల్ల ద్రవిడ జాతుల ప్రభావమూ ఎక్కువే.ఆయా మార్గాలనించి భాషని విశ్లేషించు కోవల్సిన అవసరం ఉంది.

తెలంగాణాలో జానపద,మౌఖిక  సాహిత్యంతో పాటు లిఖిత సాహిత్యం అధికమే. వీటన్నిటినీ బయటికి తేవడమే కాక అన్ని ప్రక్రియలను సమగ్రంగా చిత్రించ గల, అన్ని వాదాలను సమూలంగా నిర్వచించ గల”సాహిత్య చరిత్రను “అందించ గలగాలి.ఈ క్రమంలో తొలిదశలో తెలంగాణ రచయితల వేదిక తీసుకొచ్చిన కథా సంకలనం గాని, ఆతరువాత వచ్చిన “నూరు తెలంగాణా కథలు”గాని గమనించ దగినవి. ఈ మార్గంలోనే  సాహిత్య చరిత్ర నిర్మాణం జరగాలి.

తెలంగణ లోని సాహిత్య మూర్తుల జీవితాలను రానున్న తరాలకు అందించేందుకు వారి ఆదర్శ జీవితాలను చిత్రించాల్సిన అవసరముంది.చరిత్ర రచన రచయితల బాధ్యత కాకపోయినా  గతంలో వచ్చిన ఒకే ఒక తెలంగాణా చరిత్ర (సుంకి రెడ్ది నారాయణ రెడ్డి)రచయితలందించిందే.ఈ అవసరం దృష్ట్యా మరింత లోతైన పరిశీలనలు జరగాలి. మతాలకతీతంగా జరిగే పండగల గురించి ,సంస్కృతి సంప్రదాయాల గురించి అందించ గలగాలి.

ఈ క్రమంలో రచయితలు గతానికంటే ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుందనేది సత్యమే అయినా కాపాడుకొని, సాధించుకున్న దానిని తరువాతి తరాలకు అందించ వలసిన అవసరమూ ఉంది.

              -ఎం.నారాయణ శర్మ

 

రెండు డాలర్లంత వర్షం

 (డొమినికన్ రిపబ్లిక్ కథ)

Juan_Bosch_escritor

ఖ్వాన్ బాష్ (1909 – 2001):  ఇతడు డొమినికన్ రిపబ్లిక్ దేశానికి చెందిన వాడు. కథారచయితే కాక రాజకీయ వేత్త, చరిత్రకారుడు, వ్యాస రచయిత, విద్యావేత్త. 1939లో Dominican Revolutionary Partyని, 1973లో Dominican Liberation Partyని స్థాపించాడు. 23 సంవత్సరాల కాలం ప్రవాసంలో గడిపి వచ్చాక 1963లో దేశాధ్యక్షుడయ్యాడు. 1969లో ప్రత్యర్థులు అతని పాలనను కూలదోయటంతో మళ్లీ పోర్టోరికోకు శరణార్థిగా వెళ్లాడు. నాలుగు కథా సంపుటాలు, రెండు నవలలు, 26వ్యాస సంపుటాలు రాశాడు.

***

ముసలి రెమిజియా గుర్రపు వీపును గట్టిగా కరచుకుని, తన చిన్న ముఖాన్ని పైకెత్తుతూ  “నరకం లోని ఆత్మల కోసం ఇదిగో నా దమ్మిడీ, ఇక వర్షం పడుతుంది ఫెలిపా” అన్నది.

ఫెలిపా చుట్ట తాగుతూ ఏ జవాబూ ఇవ్వలేదు. కరువు గురించిన యెన్నో శోకాలను విన్నది ఆమె. అంతిమంగా చెయ్యి పైకెత్తి ఆకాశాన్ని ఒక కొస నుంచి మరో కొస వరకు పరీక్షగా  చూసింది. ఆకాశం నిర్మలంగా వుంది. ఒక్క మబ్బు కూడా లేదు. ఆకాశపు తెల్లదనం రెమిజియా  కు ఆగ్రహాన్ని తెప్పించింది.

ఆకాశంలో ఒక్క మేఘం కూడా లేదు  అనుకుని మళ్లీ తన చూపును దించుకుంది.  గోధుమవర్ణపు పొలాల నేల పగుళ్లను చూపుతోంది. దూరాన కొండ మీద ఒక గుడిసె వుంది. ఆ గుడిసెలో, పక్క గుడిసెలో, దాని పక్క గుడిసెలో, ఇంకా చుట్టుపక్కల వున్న ఇతర గుడిసెల్లోని వారంతా ఆమె లాగా, ముసలి రెమిజియా లాగా అదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఎన్నో నెలలుగా వర్షమే లేదు. కొండ అంచుల మీది పైన్ చెట్లను మగవాళ్లు కాల్చేశారు. ఆ మంటల వేడిమి మొక్కజొన్న కాండాలకు వేలాడే ఆకుల్ని కాల్చేసింది. అగ్నికణాలు పిట్టల్లాగా ఎగురుతూ,  కాంతిచారల్ని వదులుతూ మహా జ్వాలలై మండాయి. ఇదంతా యెందుకంటే ఆ పొగంతా పై  లోకం వైపు పోయి వర్షం కురుస్తుందని వాళ్ల ఆశ. కానీ అలా జరగ లేదు.

“మన బ్రతుకులు అంతమయ్యే రోజు వచ్చింది రెమిజియా” అన్నది ఫెలిపా

“ఎన్నో సంవత్సరాలుగా మనం నేలను సాగు కోసం తయారు చేస్తూ…”     రెమిజియా ఏదో చెప్పటం ప్రారంభించింది.

పంటల్ని నాశనం చేస్తూ కరువు ప్రారంభమైంది. నేల లోని తేమనంతా పీల్చేసాక అది నదుల మీద, కాలువల మీద తన ప్రభావాన్ని చూపించటం మొదలు పెట్టింది. కొంచెంకొంచెంగా నదుల అడుగు భాగాలు పైకి తేలి, పాకుడు పట్టిన బండరాళ్లు తమ తలల్ని పైకి లేపాయి. చిన్న చేపలన్నీ నది దిగువ భాగానికి తరలి పోయాయి. ఒక్కో వానా కాలం గడిచిన కొద్దీ నదులు ఎండి  పోవటమో, బురదగుంటలుగా మారటమో లేక చిత్తడినేలలుగా మారటమో జరిగింది. దాహమూ, నిరాశా నిండిన ఎన్నో కుటుంబాలు పొలాలను వదిలేసి, తమ గుర్రాల మీద ఎక్కి , వర్షాభావం లేని ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్లిపోయారు.

కాని వృద్ధురాలైన రెమిజియా అందుకు నిరాకరించింది. ఏదో ఒక రోజు వర్షం వస్తుందనీ, ఒక మధ్యాహ్నాన ఆకాశం మీద మబ్బుల గుంపులు బారులు తీరుతాయనీ, ఏదో ఒక రాత్రి వేళ ఎండిపోయిన తన గుడిసె మీద పడే వర్షపు చినుకుల శబ్దం తనకు వినపడుతుందనీ   ఆశ పడిందామె.

తన కొడుకును స్ట్రెచర్ మీద తీసుకు వెళ్తూ మనవడినొక్కడినే తనకు వదిలిన నాటి నుండి రెమిజియా ముభావంగా వుంటూ పొదుపును అవలంబించ సాగింది. తన సొరకాయ బుర్ర  ను కొంత బూడిదతో నింపి, ఒకటొకటిగా నాణాలను అందులో వేస్తూ పోయింది. గుడిసె వెనుక వున్న నేలలో మొక్కజొన్న, చిక్కుడు వేసింది. మొక్కజొన్న గింజలు కోళ్లకూ, పందులకూ పనికొ   స్తాయి. చిక్కుడేమో తనకూ, తన మనవడికీ. ప్రతి రెండు మూడు నెల్లకో సారి ఆమె బాగా పెరిగిన కోడిని తీసుకుని, దాన్ని అమ్మటానికి పట్నం వెళ్తుంది. పందుల్లో ఒకటి బాగా బలిసి వుంటే ఆమె దాన్ని చంపి, ఆ మాంసాన్ని తనే అమ్ముతుంది. అందులోంచి ఆమె వెన్నను కూడా తయారు చేస్తుంది.  దాన్నీ, పంది తోలునూ కూడా ఆమె పట్నానికి తీసుకుపోయి అమ్ముతుంది. గుడిసె తలుపును మూసేసి, తన వస్తువుల్ని జాగ్రత్తగా చూడవలసిందిగా పొరుగింటి వాళ్లకు చెప్పి,  మనవణ్ని బుల్లి గుర్రం మీద కూచోబెట్టి, తాను వెనకాల నడుస్తూ పోతుంది. ఇంటికి తిరిగి వచ్చే సరికి రాత్రవుతుంది.

ఈ విధంగా మనవణ్ని గుండెకు వేలాడదీసుకుని, జీవితాన్ని స్వీకరించింది ఆమె.  “నేను బతుకుతున్నది నీ కోసమే బిడ్డా. నువ్వు కూడా నీ తండ్రి లాగా జీవితం కోసం విపరీతమైన తంటాలు పడటం, లేక వయసు మీరక ముందే చనిపోవటం నాకిష్టం లేదు” అంటుంది ఆమె ఆ పిల్లవాడితో. ఆ పిల్లవాడు ఆమె వైపు చూస్తాడు. వాడు మాట్లాడుతుండగా ఎవరూ వినలేదు.  మూడడుగుల ఎత్తు కూడా లేకున్నా వాడు సూర్యోదయంకన్న ముందే లేచి, చంకలో ఇనుప తవ్వుడు కోలను పెట్టుకుని, పొలం లోకి పోయి పని చేస్తుంటే అప్పుడు సూర్యోదయమౌతుంది.

ముసలి రెమిజియా ఆశల్ని హృదయానికి హత్తుకుంటూ బతుకుతోంది. తన మొక్కజొన్న, చిక్కుడు పెరుగుతుంటే, దొడ్లో పందులు గురగురమని శబ్దం చేస్తుంటే ఆమె మనసుకు నిమ్మళంగా వుంటుంది. రాత్రి వేళల్లో కోళ్లు ఎగిరి చెట్ల కొమ్మల మీద కూర్చున్నప్పుడు  ఆమె తన గుడిసెలో వున్న కోళ్లను లెక్క పెడుతుంది. మధ్యమధ్య సొరకాయ బుర్రను కిందికి దింపి, రాగి నాణాల్ని లెక్క పెడుతుంది. అందులో అవి బాగా జమ అయ్యాయి. కొన్నాళ్ల తర్వాత అన్ని సైజుల సిల్వర్ నాణాలు కూడా జమ అయ్యాయి.

ఆమె వణికే చేతులతో నాణాలను ప్రేమగా నిమిరి, మనససులో ఒక స్వప్నాన్ని దర్శిం చింది. ఆ కలలో యుక్తవయస్కుడైన తన మనవడు మంచి గుర్రం మీద స్వారీ చేస్తూనో  లేక కౌంటరు వెనక రమ్ సీసాలనో, గుడ్డలనో, చక్కెరనో అమ్ముతూనో కనిపించాడు. ఆమె నవ్వి , నాణాల్ని తిరిగి సొరకాయ బుర్రలో వేసి, ఆ బుర్రను కొయ్యకు తగిలించి, గాఢనిద్రలో ఉన్న పిల్ల   వాని పైకి వంగింది.

అంతా సవ్యంగా జరిగిపోతోంది. కానీ కొన్నాళ్ల తర్వాత ఎందుకు ఎలా అని తెలియ  కుండా కరువొచ్చింది. ఒక నెల వర్షం లేకుండా గడిచింది. తర్వాత రెండు నెలలు, ఆ పైన మూడు నెలలు. ఆమె గుడిసె ముందు నుంచి పోయే మగవాళ్లు పరామర్శ చేస్తూ  “వాతావరణం  భయంకరంగా వుంది రెమిజియా” అంటారు.

ఆమె నిశ్శబ్దంగా అంగీకరిస్తుంది. ఒక్కో సారి  “నరకంలో ఉన్న ఆత్మల కోసం కొవ్వొత్తుల్ని వెలిగించాలి” అంటుంది.

Akkadi MeghamFeatured

కానీ వర్షం కురవలేదు. ఎన్నో కొవ్వొత్తుల్ని వెలిగించినా మొక్కజొన్న చేను వడలి పోయింది. వసంత రుతువులు అడుగంటి పోయాయి. పందులు దొర్లే బురద ప్రదేశం ఎండి పోయి మట్టిబిళ్లలు తయారైనాయి. అప్పుడప్పుడు ఆకాశం మీద కొన్ని మబ్బులు కమ్ముతాయి.  దూరాన ఎండిపోయిన మందమైన గట్లు కనిపిస్తున్నాయి. కొండ మీది భాగం నుండి ఒక తేమ నిండిన గాలి వీచి, ధూళిమేఘాల్ని లేపింది.

తన గుడిసె ముందు నుండి పోయే మనుషులు  “ఈ రాత్రికి వర్షం వస్తుంది రెమిజియా” అంటూ నమ్మకమిచ్చారు.

“ఇన్నాళ్లకు వాన వస్తోంది” అన్నది ఒకామె.

“ఇక యీ రోజు వర్షం కురిసినట్టే” అన్నది ఒక నీగ్రో స్త్రీ.

ముసలి రెమిజియా పడక మీదికి పోయి, దేవుణ్ని ప్రార్థించింది. నరకం లోని ఆత్మలకు మరిన్ని కొవ్వొత్తుల్ని వాగ్దానం చేసి, నిరీక్షించింది. ఆమెకు కొండ శిఖరాల మీద వర్షం కురుస్తున్న చప్పుడు వినిపించినట్టనిపించింది. ఆశాభావంతో రాత్రి ఆమె నిద్ర పోయింది. కానీ ఉదయం లేచి చూసే సరికి ఆకాశం తెల్లని తాజా దుప్పటిలా ఖాళీగా, నిర్మలంగా వుంది.

జనాలకు ధైర్యం సడలి పోయింది. అందరి ముఖాలూ వెల్ల వేసినట్టు తెల్లబడి పోయాయి. నేలను ముట్టుకుని చూస్తే అది వేడిమితో కాలిపోతోంది. చుట్టుపక్కల ప్రదేశాల్లోని నదులు, సెలయేళ్లు అన్నీ ఎండిపోతున్నాయి. కొండ చుట్టుపక్కల ఉన్న చెట్టూ చేమా అంతా మాడిపోయింది. పందులకు వేయటానికి మేత లేదు. చెట్ల మీది ఎండిన కాయల కోసం గాడిదలు తిరుగుతున్నాయి. పశువులు చిత్తడి నేలలకు తరలి పోయి, చెట్ల వేర్లను చప్పరిస్తున్నాయి. ఒక డబ్బా అంత నీళ్ల కోసం వెతుకుతూ పిల్లలు ఒక పూటంతా గడుపుతున్నారు. గింజల్ని, పురుగుల్ని దొరికించుకోవటానికి కోళ్లు అడవుల్లోకి వెళ్లి పోయాయి.

“ఇది ప్రళయం రెమిజియా, ప్రళయకాలం” అంటూ దుఃఖించారు ముసలి స్త్రీలు.

ఒక చల్లని ఉదయం పూట రొసెండో తన భార్య, ఇద్దరు పిల్లలు, ఆవు, కుక్క , బక్కచిక్కిన గాడిదను తీసుకుని వెళ్లిపోయాడు. సామానునంతా గాడిద వీపు మీద తీసుకెళ్తూ , “దీన్ని నేను తట్టుకోలేను రెమిజియా. ఈ వూరి మీద ఏ దుష్టశక్తిదో పాడు దృష్టి పడింది”  అన్నాడు. రెమిజియా గుడిసె లోపలికి పోయి, రెండు రాగి నాణాలతో బయటకు వచ్చింది.  వాటిని రొసెండోకు యిస్తూ, “నరకం లోని ఆత్మల కోసం నా పేరు మీద యీ డబ్బుతో కొవ్వొత్తుల్ని కొని వెలిగించు” అన్నది. రొసెండో ఆ నాణాల్ని తీసుకుని, వాటిని చూసి, తల పైకెత్తి, ఆకాశాన్ని చాలా సేపు చూశాడు.

“నీకు రావాలనిపించినప్పుడు టవేరాకు వచ్చెయ్. అక్కడ మాకు చిన్న భూమి చెక్క దొరికింది. నీకు ఎప్పుడూ మా స్వాగతం వుంటుంది” అన్నాడు.

“నేనిక్కడే వుంటాను రొసెండో. ఈ కరువు ఇట్లానే వుండి పోదు” అన్నది రెమిజియా.

రొసెండో వెనక్కి తిరిగాడు. తన భార్యాపిల్లలు చాలా దూరం వెళ్లిపోయారు.  దూరాన వున్న కొండలు సూర్యకాంతి మంట మీద వున్నట్టు అనిపించినయ్.

రెమిజియా మనవడు ఎండల ధాటికి నీగ్రో లాగా నల్లబడి పోయాడు.“నానమ్మా!  ఒక పంది చచ్చిపోయినట్టుంది” అన్నాడు వాడు. రెమిజియా పందుల దొడ్డి వైపు పరుగెత్తింది.  ముట్టెలు వడలిపోయి, తీగల్లాగా తయారయి, పందులు గురగురమంటూ రొద చేస్తూ ఒగరుస్తున్నాయి. అవి అన్నీ ఒక చోట గుమిగూడాయి. వాటిని పక్కకు తరిమి చూడగానే, చచ్చి పడి వున్న ఒక పంది కనిపించింది ఆమెకు. అది బతికి వున్న పందులకు ఆహారంగా పనికి వచ్చిందని ఆమెకు అర్థమైంది. తనే స్వయంగా వెళ్లి నీళ్లు తెస్తే పందులు బతుకుతాయి కనుక  అలా చేయాలని నిశ్చయించుకున్నది ఆమె.

సూర్యోదయం కాగానే ఆమె ముదురు గోధుమ రంగులో వున్న తన చిన్న గుర్రాన్ని తీసుకుని బయలుదేరింది. తిరిగి వచ్చే సరికి మధ్యాహ్నమైంది. మౌనంగా, మొండిగా,  అవిశ్రాంతంగా ఇదే ప్రణాళికను పాటించించింది. ఆమె నోటి నుండి ఒక్క ఫిర్యాదు మాట కూడా బయటికి రాలేదు. సొరకాయ బుర్ర బరువు తగ్గింది. అయినా నరకం లోని ఆత్మలు జాలి చూపుతాయని తను పొదుపు చేసిన డబ్బులో కొంత భాగాన్ని ఆమె వెచ్చించింది. గుర్రానికి శ్రమ ఇవ్వకూడదని ఆమె నడిచి వెళ్లటం ప్రారంభించింది. నదికి పోయి రావటానికి ఆమెకు చాలా సమయం పట్టసాగింది. గుర్రం డొక్కలు కత్తి అంచుల్లాగా మొనదేలాయి. దాని మెడ యెంతగా సన్నబడి పోయిందంటే, అది తల భారాన్ని మోయలేని విధంగా తయారైంది. ఒక్కో సారి దాని ఎముకలు చేసే చప్పుడు వినపడింది.

జనాలు ఆ వూరిని వదిలి వెళ్లటం ఆగలేదు. ప్రతి రోజూ ఒక గుడిసె ఖాళీ అవుతోంది. నేల బూడిద రంగుకు మారి, దాని మీద పగుళ్లు కనపడ సాగినై. ఒకటి రెండు ముళ్ల  జాతి మొక్కలు మాత్రమే పచ్చగా వున్నాయి. నదికి వెళ్లిన ప్రతిసారీ నీటి మట్టం అంతకు ముందు న్న దానికంటె తక్కువైపోసాగింది.  ఒక వారం తర్వాత, నీళ్లు ఎన్ని వున్నాయో అంతే బురద వుంది.  రెండు వారాల తర్వాత, నది అడుగు భాగం మెరిసే రాళ్లతో నిండిపోయి, పాత రోడ్డు లాగా తయారయింది. తినటానికి ఏదైనా దొరికించుకోవాలని గుర్రం ఎంతగానో నిరాశతో ప్రయత్నించింది. కాని లాభం లేకపోయింది. ముసిరే ఈగల్ని అది తన తోకతో పారద్రోలుతోంది.

రెమిజియా ఆశను పోగొట్టుకోలేదు. వర్షం వచ్చే సూచనల కోసం ఆమె ఆకాశాన్ని పరీక్షగా చూసింది. తన మోకాళ్ల మీద వంగి, “నరకం లోని ఆత్మలారా! మీరు సహాయం చేయకపోతే మేము మాడిపోతాము” అని వేడుకుంది.

కొన్ని రోజుల తర్వాత ఒక ఉదయాన గుర్రం తన కాళ్ల మీద నిలబడలేక పోయింది. అదే రోజు మధ్యాహ్నం ఆమె మనవడు జ్వరంతో కాలిపోతూ మంచం పట్టాడు.  రెమిజియా ప్రతి గుడిసెకూ పోయింది. చాలా దూరంలో వున్న గుడిసెలకు కూడా వెళ్లింది. ఆ గుడిసెల వాసులతో  “మనం సెయింట్ ఇసిడోరోకు రుద్రాక్షల దండ చేయిద్దాం” అన్నది.

వాళ్లు ఒక ఆది వారం పొద్దున పెందరాళే బయలుదేరారు. ఆమె తన మనవణ్ని చేతుల్లో పెట్టుకుని నడుస్తోంది. జ్వరంతో బరువెక్కిన ఆ పిల్లవాని తల నాయనమ్మ బుజం మీద గుడ్డ పేలిక లాగా వాలిపోయింది. పదిహేను ఇరవై మంది పురుషులు, స్త్రీలు, ఎండకు నల్లబడిన శిథిల దేహాల పిల్లలు బంజరు నేలల మీది తోవల మీదుగా సాగిపోతూ శోకాలు పెడుతున్నారు.  వాళ్లు మేరీ కన్య బొమ్మను, వెలిగించిన కొవ్వొత్తుల్ని పట్టుకుని, నడుమ నడుమ ఆగి, మోకాళ్ల మీద వంగుతూ దేవుణ్ని ప్రార్థిస్తున్నారు. ఒక బక్కపలుచని వృద్ధుడు మండే కళ్లతో, నగ్నమైన ఛాతీతో, పొడవుగా పెరిగిన గడ్డంతో ఆ వూరేగింపు మొదట్లో నడుస్తున్నాడు. ఆకాశం వైపు చూస్తూ –

 

“సెయింట్ ఇసిడోరో, ఓ కర్షకుడా

సెయింట్ ఇసిడోరో, ఓ హాలికుడా

సూర్యుణ్ని కప్పేసి వర్షాన్ని తెప్పించు

సెయింట్ ఇసిడోరో, ఓ కృషీవలుడా” అంటూ వేడుకుంటున్నాడు.

అందరూ వెళ్లిపోయారు. రొసెండో వెళ్లిపోయాడు. బుద్ధిమాంద్యం వున్న తన కూతుర్ని తీసుకుని టోరిబియో వెళ్లిపోయాడు.  ఫెలిపె, ఇతరులు, ఇంకావేరే వాళ్లు, అందరూ వెళ్లిపోయారు. కొవ్వొత్తులు వెలిగించటానికి ఆమె వాళ్లందరికీ డబ్బు యిచ్చింది. ఆఖరున వెళ్లినవాళ్లు ఎవరో ఆమెకు తెలియదు. వాళ్లు ఒక రోగిష్టి అయిన వృద్ధుణ్ని తీసుకునిపోయారు.  దుఃఖభారంతో వాళ్లు కుంగిపోయారు. రెమిజియా వాళ్లకు డబ్బులిచ్చింది, కొవ్వొత్తులు వెలిగించటం కోసం. గుడిసె గుమ్మం నుండి దూరాన వున్న కొండల దాకా నేల మీద అంతా మాయమై, ఖాళీగా వుంది. ఎండిన నేల తప్ప ఏ చెట్టూ చేమా లేదు. నీళ్లు ఆవిరైపోయి, పైకి తేలిన నదుల అడుగు భాగాలు కూడా కనిపిస్తున్నాయి.

ఇక వర్షం పడుతుందనే ఆశ అందరిలో అడుగంటిపోయింది. ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లే ముందు వృద్ధులు “దేవుడు యీ ప్రాంతాన్ని శిక్షిస్తున్నాడు” అనుకున్నారు. యువకులు, పిల్లలు

అక్కడేదో దుష్ట శక్తి తన పాడు దృష్టితో కీడు కలిగిస్తున్నదని అనుకున్నారు.

రెమిజియా ఆశను వదులుకోలేదు. ఆమె కొన్ని నీటి చుక్కల్ని సేకరించింది. మళ్లీ మొదట్నుంచి ప్రారంభించాలని అనుకున్నదామె. ఎందుకంటే సొరకాయ బుర్ర దాదాపు ఖాళీ అయింది. తన చిన్న తోట లోని భూమి రహదారిలా అయిపోయి, అంతటా ధూళి నిండింది.  ‘మానవుడి దుష్ట చేష్టల పట్ల దేవుడి శాపం ఇక్కడ ప్రభావాన్ని చూపిస్తోది’ అనుకుంది. కాని దేవుడి శాపం కూడా ఆమె నమ్మకాన్ని నిర్వీర్యం చేయలేకపోయింది.

నరకం లోని ఒక మూలలో నడుముల దాకా వున్న మంటల్లో కాలుతూ,  ఆత్మలు పరిశుద్ధమౌతున్నాయి. భూమ్మీద వర్షాన్ని కురిపించి, జలమయం చేసే శక్తి ఆ ఆత్మలకే వుండటం  విడ్డూరం, వ్యంగ్యభరితం. గడ్డం వున్న ఒక వికృతమైన ముదుసలి స్త్రీ ఇలా అన్నది  “కారంబా!  పాసో హోండో అనే వూళ్ళో ముసలి రెమెజియా కొవ్వొత్తుల కోసం రెండు డాలర్లను వెచ్చించింది.   కాబట్టి అక్కడ వర్షం కురవాలి.”

ఆమె సహచరులు అప్రతిభులయ్యారు.

“రెండు డాలర్లా?  అయ్య బాబోయ్!”

మరొక ఆత్మ అన్నది ఇలా “ఆమెకు యింకా ఎందుకు సహాయం అందలేదు? మనుషులతో మనం వ్యవహరించేది ఇలాగేనా?”

“ఆమె కోరికను మనం మన్నించాలి” అని గర్జించింది మరొక ఆత్మ.

“పాసో హోండోకు రెండు డాలర్లంత వర్షం కురిపించాలి”

“అవును రెండు డాలర్లంత వర్షం, పాసో హోండోకు”

“పాసో హోండోకు వర్షం, రెండు డాలర్లంతది”

ఆ ఆత్మలన్నీ చాలా సంతోషించాయి. ఎంతో సంతుష్టి చెందాయి. ఎందుకంటే వర్షం కోసం అంత పెద్ద మొత్తాన్ని ఇంతకు ముందెప్పుడూ ఎవ్వరూ చెల్లించలేదు. అందులో సగం కోసం కూడా, మూడో వంతు కోసం కూడా ఎవ్వరూ ఆర్డరివ్వలేదు. రెండు సెంట్ల కొవ్వొత్తులకు ఇంతకు ముందొక సారి ఆ ఆత్మలు ఒక రాత్రంతా వర్షం కురిపించాయి. మరొకసారి ఇరవై సెంట్ల కొవ్వొత్తులకు ఒక చిన్న వరదనే ప్రసాదించాయి.

“రెండు డాలర్లంత వర్షం, పాసో హోండోకు” అని ఆ ఆత్మలన్నీ ఏక కంఠంతో గర్జించాయి.

అంత డబ్బు వెచ్చించి కొవ్వొత్తులు వెలిగించినందుకు ఎంత పుష్కలమైన వర్షాన్ని కురిపించాలో తలుచుకునే సరికి నరకం లోని ఆ ఆత్మలన్నీ అదిరి పడ్డాయి. దేవుడు తమను తన దగ్గరికి పిలిపించుకునే దాకా, ఇలా మంటల్లో కాలుతున్నంత కాలం వర్షాన్ని కురిపిస్తూనే వుండాలి కదా అని నివ్వెరపోయాయి ఆ ఆత్మలు.

పాసోహోండోలో ఒక ఉదయాన ఆకాశం నిండా మబ్బులు కమ్మినయ్. రెమిజియా తూర్పుదిక్కున వున్న ఆకాశాన్ని చూసింది. ఆమెకు ఒక పలుచనైన నల్లని మేఘం కనిపించింది. అది శోకించే వాళ్లు ధరించే నల్ల పట్టీ లాగా, సన్నని తోలు దారం లాగా పలుచగా వుంది. ఒక గంట తర్వాత పెద్ద పెద్ద మేఘాల గుంపులు జమ కూడి, ఒకదాన్నొకటి తోసుకుంటూ వేగంగా కదల సాగినయ్. రెండు గంటల తర్వాత చిక్కని చీకటి ఏర్పడి, రాత్రి అయిందా అనిపించింది.

తనకు కలుగుతున్న సంతోషం సున్నా అవుతుందేమోనన్న భయం కమ్ముకోగా రెమిజియా ఏమీ మాట్లాడకుండా కేవలం చూస్తూ ఉండిపోయింది. ఆమె మనవడు ఇంకా జ్వరంతో మంచం మీద పడి వున్నాడు. వాడు ఎముకల గూడులా  చాలా బక్కగా వున్నాడు.  వాడి కళ్లు రెండు గుహల్లోపల నుండి బయటకు చూస్తున్నట్టు వున్నాయి.

పెద్ద ఉరుము ఉరిమింది. రెమిజియా గుమ్మం దగ్గరకు పరుగెత్తింది. దౌడు తీస్తున్న రేసు గుర్రంలా ఒక వర్షపు జల్లు కొండ వైపు నుండి గుడిసె దిశగా వస్తోంది. ఆమె తనకు తానే నవ్వుకుని, చేతులతో చెంపలను గట్టిగా పట్టుకుని, కళ్లను విశాలం చేసింది. చాలా కాలం తర్వాత మళ్లీ వర్షం పడుతోంది.

వేగంగా కదులుతూ టపటపమనే చినుకులతో పాట పడుతున్నట్టుగా వర్షం రోడ్డును చేరి, గుడిసె పైకప్పు మీద చప్పుడు చేస్తూ గుడిసెను దాటేసి, పొలాల మీద కురవటం ప్రారంభించింది. రెమిజియా వెనక గుమ్మం వైపు పరుగెత్తి , చిన్న వరద లాంటి నీరు పారుతూ వస్తుంటే నేల అణగిపోయి దట్టమైన ఆవిరులను చిమ్మటం గమనించింది. ఆమె విజయోత్సా  హంతో బయటికి పరుగెత్తింది.

“వర్షం వస్తుందని నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు” అంటూ బిగ్గరగా అరిచింది.

వర్షపు నీరు ఆమె తల మీద శబ్దంతో పడి, కణతల మీదుగా కిందికి జారుతూ  వెంట్రుకల్ని పూర్తిగా తడిపేసింది.

ఆకాశం వైపు చేతులు చాస్తూ  “వాన పడుతోంది… వర్షం కురుస్తోంది…     ఇట్లా జరుగుతుందని నాకు తెలుసు” అంటూ కేరింతలు కొట్టింది.

ఆమె యింట్లోపలికి పరుగెత్తి మనవణ్ని చేతుల్లోకి తీసుకుని, గుండెలకు హత్తుకుని, వాడికి వర్షాన్ని చూపించింది.

“తాగరా, తాగు, నీళ్లు తాగు. చూడు. ఈ నీళ్లను చూడు. ఇవిగో నీళ్లు” అన్నది వేగిరిపాటు కలిసిన ఆనందంతో. మనవడిలో చల్లని నీటి శక్తిని నింపాలనుకున్నట్టు వాణ్ని వూపి  గుండెలకు హత్తుకుంది.

బయట తుఫాను చెలరేగుతుంటే గుడిసె లోపల రెమిజియా కలలోకి జారి పోయింది.  ఆమె యిలా అనుకుంది. సాగు కోసం నేల తయారవగానే బంగాళా దుంపలు, వరి,  చిక్కుడు, మొక్కజొన్న నాటుతాను. విత్తనం కొనటానికి నా దగ్గర ఇంకా కొంత డబ్బు మిగిలింది.  పిల్లవాడు బాగవుతాడు. పాపం చాలా మంది వూరొదిలి వెళ్లిపోయారు. ఈ వర్షం గురించి విన్నప్పుడు టోరిబియో ముఖం యెలా వుంటుందో చూడాలనిపిస్తోంది నాకు. అందరం యెన్నో ప్రార్థనలు చేశాం కాని నేనొక్కదాన్నే లాభం పొందబోతున్నాను. వర్షం పడిందని తెలిస్తే వాళ్లంతా తిరిగి వస్తారనుకుంటాను.

ఆమె మనవడు నిశ్శబ్దంగా నిద్రిస్తున్నాడు. పాసో హోండో లోని ఎండిపోయిన నదుల అడుగు భాగాల మీద మట్టి కలిసిన నీళ్లు ఉరకలెత్తినయ్. వర్షం ఇంకా బాగా పుంజుకో  లేదు గాని, బండరాళ్ల చుట్టూ తిరుగుతూ నీటి ప్రవాహాలు సుళ్లు తిరిగాయి. కొండ దిగువ భాగాన రేగడి మట్టి కలిసిన చిక్కని నీళ్లు ప్రవహించాయి. ఆకాశం నుండి వర్షం ధారాపాతంగా కురుస్తోంది.  వర్షపు చినుకుల బలమైన తాకిడి ధాటికి తాటాకుల గుడిసె పైకప్పు పగులుతోంది. రెమిజియా కళ్లు మూసుకుని కొన్ని దృశ్యాల్ని దర్శించింది. విరగ కాసిన తన పంట చేను చల్లని గాలి తరగల్లో కదలాడుతోంది. పచ్చని మొక్కజొన్న, వరి, చిక్కుళ్లు, ఉబ్బిన బంగాళా దుంపలు ఆమె కళ్ల ముందు నాట్యమాడాయి. చివరకు ఆమె గాఢనిద్ర లోకి జారిపోయింది.

బయట ఎడతెరిపి లేకుండా బీభత్సంగా వర్షం.

వారం రోజులు, పది రోజులు, పదిహేను రోజులు గడిచాయి. వర్షం ఒక గంట సేపు కూడా ఆగక ఇంకా కురుస్తూనే వుంది. బియ్యం, వెన్న, ఉప్పు అన్నీ నిండుకున్నాయి. ఆహార పదార్థాల్ని కొనటానికి రెమిజియా వర్షంలోనే నగరానికి బయలుదేరింది. పొద్దున్న బయలుదేరిన ఆమె తిరిగి మధ్యరాత్రి ఇల్లు చేరింది. నదులు, సెలయేళ్లు, నీరు నిండిన చిత్తడి నేలలు, రోడ్లను కప్పేస్తూ మెల్లగా పొలాల్లో నిండుతూ ప్రపంచాన్ని ముంచెత్తుతున్నాయా అనిపించింది.

ఒక మధ్యాహ్నం వేళ పెద్ద కంచర గాడిద మీద పోతున్న ఒకతణ్ని ఆపి  “స్వామీ,  ఆగండి” అన్నది.

అతడు గుమ్మం దాకా వచ్చాడు. కంచర గాడిద తలను లోపలికి దూర్చింది.

“కిందికి దిగి లోపలికి వస్తే కొంచెం వెచ్చగా వుంటుంది” అన్నదామె.

కంచర గాడిద బయటే వుండిపోయింది.

అతడు  “ఆకాశం నీళ్లుగా మారిపోయింది. నేను నీ పరిస్థితిలో వుంటే ఈ లోతట్టు ప్రదేశాన్ని వదిలి ఆ కొండమీదికి పోయే వాణ్ని” అన్నాడు.

“నేను యిక్కణ్నుంచి వెళ్లిపోవటమా? లేదు స్వామీ, ఈ వర్షం ఒకటి రెండు రోజుల్లో ఆగి పోతుంది” అన్నదామె.

“చూడమ్మా, ఇది వరద పరిస్థితి. నేను కొన్ని భయంకర దృశ్యాల్ని చూశాను. వరద నీరు జంతువుల్నీ, ఇళ్లనూ, చెట్లనూ, మనుషుల్నీ లాక్కుపోతోంది. నేను దాటివచ్చిన నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. పైగా నదుల జన్మస్థానాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది” అన్నాడతడు.

“స్వామీ, కరువు భయంకరంగా వుండింది. అందరూ పారిపోగా నేనొక్కదాన్నే తట్టుకుని ఇక్కడే వుండిపోయాను” అన్నది రెమిజియా.

“కరువు చంపకపోవచ్చు. కాని వరద ముంచేస్తుంది తల్లీ” అన్నాడు ఆ ఆసామి. మళ్లీ చేతితో వెనక్కి చూపుతూ “అక్కడంతా వరదతో నిండిపోయింది. పొద్దున్నుంచి మూడు గంటల పాటు  ప్రయాణం చేసి వచ్చాన్నేను. నా కంచర గాడిద పొట్ట వరకు నీళ్లు వచ్చాయి” అన్నాడు.

చీకటి పడుతుండటంతో అతడు వెళ్లిపోయాడు. ఆ రాత్రి వేళ వెళ్లొద్దని ఆమె బతిమాలింది.  కాని అతడు వినలేదు. “పరిస్థితి మరింత విషమించబోతుందమ్మా. నదులు గట్లను తెంపుకుని అంతా జలమయం అవుతుంది” అంటూ వెళ్లిపోయాడు ఆ వ్యక్తి.

రెమిజియా గుడిసె లోపలికి పోయింది. లోపల పిల్లవాడు జడుసుకుంటున్నాడు.

ఆ ఆసామి చెప్పిందే నిజమైంది. అబ్బ, అది ఎంత భయంకరమైన రాత్రి! మధ్యమధ్య ఉరుములు మెరుపులతో అత్యంత ఉధృతమైన కుంభవృష్టి ఎడతెరిపి లేకుండా కురిసింది.  మురికి నీళ్లు సుళ్లు తిరుగుతూ, గుమ్మం తలుపులోని సందులోంచి లోపలికి వచ్చి, నేల మీద నిండిపోయాయి. దూరాన గాలి ఈల వేస్తోంది. చెట్టు విగిన చప్పుడు ఫెళఫెళమని వినిపించింది.  రెమిజియా తలుపు తెరిచింది. దూరాన మెరిసిన మెరుపు పాసా హోండోను వెలుతురు మయం  చేసింది. కొండ వాలు మీంచి నీళ్లే నీళ్లు…. రహదారి నదిగా మారిపోయింది.

‘ఇది వరద కావచ్చునా’ రెమిజియాకు మొదటి సారిగా అనుమానం వచ్చింది.

కాని ఆమె గుమ్మం తలుపులు మూసి లోపలికి పోయింది. గడచిన కరువు తీవ్రత కన్న,  రాబోయే వర్షపు తీవ్రత కన్న, బలమైన ఆశాభావం కలిగింది ఆమెకు. గుడిసె బయట ఎంత తడిగా వుందో లోపల కూడా అంతే తడిగా వుంది. పైకప్పు లోంచి కారుతున్న నీటి ధారల్ని తప్పించుకోవ  టానికి ప్రయత్నిస్తూ పిల్లవాడు ముణగదీసికున్నాడు.

ఒక మధ్యరాత్రి వేళ గుడిసె పక్క గోడ నుంచి దభీమని చప్పుడు రావటంతో ఆమెకు మెలకువ వచ్చింది. మంచం లోంచి కిందికి దిగేసరికి తన మోకాళ్ల దాకా నీళ్లు వచ్చిన సంగతి తెలిసింది ఆమెకు.

అబ్బ , ఎంతటి కాళరాత్రి! నీళ్లు ప్రవాహరూపంలో లోపలికి దూసుకు వచ్చి, లోపల మొత్తం నిండిపోయాయి. మరో మెరుపు మెరిసింది. పెద్ద ఉరుముతో ఆకాశం వణికినట్ట నిపించింది.

“మేరీ కన్యకా, మేరీ కన్యకా, కరుణించు” అంటూ యేడ్చింది. కాని యీ పరిణామానికి కారణం మేరీ కన్యక కాదు, నరకం లోని ఆత్మలు. అవి “ఈ వర్షం సగం డాలరుకే సమానం, సగం డాలరుకే” అంటూ అరిచాయి.

ఎప్పుడైతే ఆ వరద నీరు గుడిసెను కదపటం మొదలెట్టిందో అప్పుడు రెమిజియా ఆశాభావాన్ని వదలి, తన మనవణ్ని చేతుల్లోకి తీసుకుంది. ఆమె వాడిని సాధ్యమైనంత గట్టిగా ఎదకు హత్తుకుని, నీళ్ల లోంచి అతి ప్రయత్నపూర్వకంగా నడిచింది. ఎలాగో ఆమె గుడిసె తలుపును తీసి బయటికి నడిచింది. నీళ్లు ఆమె నడుము దాకా వచ్చినయ్. ఆమె అతి కష్టంగా మెల్లమెల్లగా ముందుకు నడిచింది. తను ఎక్కడికి పోతోందో ఆమెకు తెలియదు. గాలికి ఆమె వెంట్రుకలు విడివడి పోయాయి. దూరాన ఒక మెరుపు మెరిసింది. నీటి మట్టం ఇంకా ఇంకా పెరుగుతోంది.  తన మనవణ్ని మరింత గట్టిగా హృదయానికి హత్తుకుంది ఆమె. తూలి పడబోయింది కాని ఎలాగో  నిలదొక్కుకుని  “మేరీ కన్యకా, మేరీ కన్యకా” అంటూ గట్టిగా యేడ్చింది.

ఉధృతంగా వీస్తున్న గాలి ఆమె కంఠస్వరాన్ని కబళించి, దాన్ని జలమయమైన ఆ ప్రదేశం మీద పరిచింది.

“మేరీ కన్యకా, మేరీ కన్యకా”

ఆమె గౌను నీళ్ల మీద తేలింది. ఆమె జారిపోతోంది. ఏదో వస్తువు తన వెంట్రుకలకు తట్టుకుని తలను ముందుకు పోకుండా ఆపినట్టనిపించింది ఆమెకు.

“ఇదంతా ముగిసింతర్వాత బంగాళా దుంపలు నాటుతాను” అనుకున్నదామె.

తన మొక్కజొన్న చేను మురికి నీళ్లలో మునిగిన దృశ్యం కనపడింది ఆమెకు. ఆమె తన వేళ్లను మనవడి ఛాతీ లోకి గుచ్చి పట్టింది.

“మేరీ కన్యకా, మేరీ కన్యకా”

గాలి ఊళ వేసింది. ఆకాశాన్ని పగలగొడుతున్నట్టు పెద్ద ఉరుము ఉరిమింది.

ఆమె వెంట్రుకలు ఒక ముళ్ల చెట్టుకు తట్టుకున్నాయి. గుడిసెల్నీ, చెట్లనూ లాక్కెళ్తూ వరద నీరు పొర్లింది. నరకం లోని ఆత్మలు “ఈ వర్షం సరిపోదు. రెండు డాలర్లంత వర్షం, రెండు డాలర్లంత వర్షం కురవాలి” అంటూ ఉధృతంగా గర్జించాయి.

– ఖ్వాన్ బాష్

                                                 (Juan Bosch)

                                                             అనువాదం: ఎలనాగ

(సెప్టెంబర్ 2వ తేదీ వెలువడనున్న  ‘ఉత్తమ లాటిన్ అమెరికన్ కథలు’ అనే నా అనువాద కథల సంపుటిలోంచి-)

 

***

elanaga invitation

 

అదే…అదే..మణిమహేష్!

( గత వారం తరువాయి)

అలా ఓ మూడుగంటలు కబుర్లతో సాగగా  మొత్తం పది కిలోమీటర్లు గడిచి ‘సుంద్రశ్’ అన్న ప్రడేశం చేరాం, దాని పొలిమేరల్లోనే నాజూకు స్వరూపం, పల్చని శరీరం ఉన్న ఓ నలభై ఏళ్ల మనిషి కనిపించి మాటల్లో పెట్టాడు.  ‘అదిగో ఆ చిట్ట చివర ఉన్న లంగరు మాదే. మీరు వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి సేద తీరాలి’ అన్నాడు. వెళ్లాం. మాటల్లో తెలిసింది.  ఈయన బెంగుళూరులో మెడిసిన్ చేసారని.  కాంగ్రా జిల్లాలో గవర్నమెంటు డాక్టరు. “మొన్న ఉత్తరాఖండ్ ఉత్పాతం వల్ల యాత్రికుల సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది. లేకపోతే ఈపాటికి కిటకిటలాడుతూ ఉండవలసింది” అన్నాడాయన.

బడలికలూ, ఆకళ్ళూ తీర్చుకొనేసరికి మూడయిపోయింది.  భోజనంతోపాటు లౌడ్‌స్పీకర్లో శివభక్తి గీతాలు… వాటి పారవశ్యంతో చిందులు వేస్తోన్న ఆబాలగోపాలం. ఈలోగా నేనూ ఉన్నానంటూ భోరున వర్షం. అసలు అప్పటిదాకా కురవకపొవడమే విశేషం. ఏదేమైనా వర్షం పుణ్యమా అని సందిగ్ధంలో పడ్డాం. ఆలోచనలు .. చర్చలు..

“ఇంకా మూడు కిలోమీటర్లూ, రెండు గంటల ప్రయాణం ఉంది. వర్షం వెలిసిన మాట నిజమే గానీ మళ్లీ కురిసే అవకాశం ఉంది.  తెగబడి వెళ్ళడం ఎందుకూ? ఈ ప్రదేశం బావుంది. వసతి పుష్కలంగా ఉంది. రాత్రికుండిపోదాం” నా ప్రపోజలు. అందరూ ఓకే అన్నా నాయకుడు సంజయ్ వీటో చేసాడు. “పోనీ మీరూ, ముక్తా గుర్రాలమీద రండి. మిగిలిన అయిదుగురం రిస్కు తీసుకుని నడచి వస్తాం” అన్నాడు. వెనక్కి తిరిగి చూస్తే అదే మంచి నిర్ణయం అని తేలింది. నలభై నిమిషాలు. ఆశ్వారోహణ చేయగా మరో రెండు కిలోమీటర్ల దూరాన ఉన్న ‘గౌరీకుండ్’ చేరాం. ‘పార్వతీదేవి స్నానాలు చేసే కుండమిది’ అని జనుల నమ్మకం.

ఇహ వెళ్లాల్సింది ఒకే ఒక్క కిలోమీటరు. వర్షం పూర్తిగా వెలిసింది. అందరం వచ్చేదాకా ఆగుదాం’ అని నేనూ, ముక్తా అక్కడ దిగాం.  మిగిలిన యాత్రికులు దాదాపుగా లేరు. ‘తన మొక్కు తీర్చుకోవడం కోసం ఆ రాళ్లల్లో, నీళ్లల్లో, మంచులో, చలిలో నగ్న పాదాలతో పైకి వెళుతోన్న ఓ పాతికేళ్ళావిడా, ఆవిడ అడుగులకు మడుగులొత్తుతూ సహకరిస్తోన్న అన్యోన్యపు భర్తా – అక్కడ కనిపించిన అపురూప దృశ్యం’ రెండు మూడు లంగర్లు … ఓ డిస్పెన్సరీ.. అరడజను ధాభాలు.. హెచ్‌పి సర్కారు వారి అత్యాధునిక టెంట్లు వంటి ముచ్చటైన ప్రదేశం ఆ గౌరీకుండ్. అల్లదిగో ఆ చిరుకొండ వెనకనే మణిమహేశ్వర్  అన్నారు.

 SAM_9371

సంజయ్, ముక్తాలతో నాది పదిహేనిరవై ఏళ్ల పరిచయం . అప్పట్లో ఓ ఆఫీసు సాంస్కృతిక కార్యక్రమానికి ముక్తా , నేనూ వ్యాఖ్యాతలుగా వ్యవహరించాం కూడానూ. స్నేహం కాకపోయినా మంచి పరిచయం, చనువూ ఉన్నాయి. మా బృందం రావడానికి మరో గంటైనా పడుతుంది గాబట్టి అక్కడి లంగర్లో చెప్పి మరీ పంచదార లేని టీ చేయించుకుని తాగాం. వంద గజాల దూరాన ఉన్న నదీ వంతెన దగ్గరకు నడక సాగించాం. మాటల మధ్యలో “ఎంతవరకు చదువుకున్నావు” అని అడిగాను. “ఎమ్మెస్సీ మాత్స్” అంది. అంత చదివి కనీసం టీచరుగానైనా ఉద్యోగం చెయ్యాలనిపించలేదా? వాటే వేస్టావ్ రేర్ టాలెంట్” అని నావైన దుడుకు బాణీలో నిష్ఠూరించాను. నవ్వేసి ఊరుకుంది. ఓ పది నిమిషాల తర్వాత వివరించింది. “నాన్న గవర్నమెంటు ఉద్యోగి. నాకు పెళ్ళి అవకముందే హృదయ రోగిష్టి అయ్యారు. అమ్మకు అంతగా వ్యవహారజ్ఞానం లేదు. ముగ్గురు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. నా పెళ్ళి దగ్గర్నించి ఇంట్లో అన్ని వ్యవహారాలకూ  నేనే పెద్దను. అదిగాక నా భర్త, పాప, సంసారం. ఆపైన రెండువైపులనుంచి దగ్గర బంధువుల తాకిడి. వీటన్నిటి మధ్య ఉద్యోగం గురించి ఆలోచించే అవకాశం లేకపోయింది. తమ్ముడు ఆలస్యంగా  ఈ మధ్యనే జీవితంలో సెటిల్ అయ్యాడు..” పి.సత్యవతి గారు మెచ్చరేమో అనిపించినా ఇదంతా విన్నాక ఆవిడంటే గౌరవం పదిరెట్లు పెరిగింది.

అందరూ గౌరీకుండ్ చేరేసరికి దాదాపు ఆరు. మరో ముగ్గురు గుర్రాలవైపు మొగ్గు చూపారు. అప్పటికే పరిచయమయిన సురేంద్రపాల్‌గారి లంగర్లో టీలు తాగి మమ్మల్ని ఆ రాత్రికి అక్కడే ఉంచేలా ఆయన చేసిన ప్రయత్నాలను సున్నితంగా తిరస్కరించి ముందుకు సాగాం. ఓ పంజాబు గ్రామ పంచాయితీ సెక్రటరీ అట ఆయన.

అంతా కలిసి అయిదుగురం గుర్రాలమీద, సంజయ్, ప్రధి కాలినడకన గౌరీకుండ్, మణిమహేశ్వర్‌ల మధ్య ఆ నలభై నిమిషాలలో సూర్యుడు, మబ్బులు, కొండలు, లోయలు, పచ్చని పచ్చిక, గాఢపు నీలాకాశం – అన్నీ కూడబలుక్కొని అద్భుత సౌందర్య ఆవిష్కరణకు పూనుకొన్నాయి. ఎదురుగా సువిశాలమైన లోయలో వేలాడుతూ మేఘాలు, వాటిమీద రంగులు చిమ్ముతూ అస్తమించే సూర్యుడి బంగారు కిరణాలు. ఆ కిరణాల సుతిమెత్తని స్పర్శలో ధగధగ వెలిగిపోతున్న హిమగిరి శిఖరాలు. ఓ పావుగంటా ఇరవై నిమిషాలు గుండె గొంతులోన కొట్టాడింది. గుర్రం మనిషిని అడిగి, ఆపించి రెండు మూడు ఫోటోలు తీసానేగాని అసలు ఆ క్షణాలు గుర్ర్రం మీద ఉండదగినవి కాదు. నడక అయితే బావుండేది.

ముసిరీ ముసరని చీకట్లలో ఏడుగంటలవేళ ఏడుగురమూ మణిమహేష్ సరోవర తీరం చేరాం. చిన్న తటాకమది. చుట్టూ అరకిలోమీటరు పొడవున పరిక్రమ మార్గం, ఎదురుగా నిడుపాటి మణిమహేష్ శిఖరం. శిఖరాగ్రాన మంచు తొడుగు. కొండ చరియల్లో గ్లేషియర్లు. అటు ఇటు గరుకుపాటి పర్వత శ్రేణులు. వెనక్కి తిరిగితే గౌరీకుండ్. ఇంకా ఆపైన కనిపించే  సువిశాలమైన లోయ. ప్లాస్టిక్కు, కల్మషమూ లేని  సరోవర జలాలు. అందులో ప్రతిబింబించే కైలాస పర్వతం .. చక్కని దృశ్యం. దేవుడి సంగతి దేవుడెరుగు.. నాలాటి సామాన్యునికి సరిపడే సౌందర్యం పుష్కలంగా  ఉంది. అక్కడి సంప్రదాయమేమో.. గుడి అంటూ శాశ్వత నిర్మాణం ఏమీ లేదు. సరోవర తీరంలో ఒకచోట చిన్నపాటి అరుగు. శివుని ప్రతిమ. అలంకరణ.. పూజలు.. అరడజనుకు పైగా లంగర్లూ. దాభాలూ.. విశాలమైన గుడారాల నివాసాలు. సూర్యుని అంతిమ వెలుగురేకల్లో కైలాస శిఖరాన్ని చూసి పరవశిస్తోన్న పదీ పదిహేనుమంది భక్తులు.. నిశ్శబ్ద ప్రశాంత వాతావరణం.

అందము, ఆనందమూ ఎలా ఉన్నా అందరమూ విపరీతంగా అలసిపోయి ఉన్నాం. జీరో డిగ్రీల దరిదాపుల్లో చలి. అంచేత స్నానాల ప్రసక్తి లేనేలేదు. ఉన్నంతలోనే కొంచెం ఫ్రెష్ అయ్యి. ఎనిమిదిన్నరకల్లా లంగరు భోజనాలు ముగించుకొని గుడారాలలో నిద్రకు ఉపక్రమించాం. తెచ్చిన స్వెట్టర్లన్నీ వదలకుండా వేసుకొన్నాం. వాళ్ళిచ్చిన రెండు రెండూ రగ్గులకు తోడు రెండు అడిగి పుచ్చుకున్నాం. మొత్తానికి చలిపులి బాధ తెలియకుండా రాత్రి గడిచింది.

అన్నట్టు అవి పున్నమి రాత్రులు. నేనూ సంజయ్ ముందే అనుకొని తెల్లవారుఝామున నాలుగు గంటలకు గుడారం బయటకు వచ్చాం నిండుచంద్రుడు. వందలాది తారలు. వెండి కైలాసశిఖరం. మరువలేని అనుభవం. అన్నట్టు ఆ శీఖరాగ్రాన భక్త శిఖామణులకు ఒకోసారి రాత్రిళ్లు మణీదీపాల వెలుగు కనిపిస్తుందట. శబరిమలై శైలిలో నన్నమాట. మాకా ఛాయలు కనిపించనేలేదు. విశ్వాసం ముఖ్యం గదా!

ఆగస్టు 23 ఉదయం ఆరింటికే రోజు మొదలయింది.

100_8613

సరోవరం చుట్టూ ఒకటికి రెండుసార్లు ప్రదక్షిణ. “అరే.. నీళ్లమీద  మెరుస్తూ ఏవిటదీ?’ అని వెళ్లి చూస్తే పలకలు గట్టిన మంచు. ఆ మంచునీళ్లలోనే స్నానాలు చేస్తోన్న సాహస భక్తులు. మేమంతా భయపడినా ప్రధి సాహసించాడు. అయిదారు మునకలు వేసాడు. రెండోమునక అతికష్టమయినది. ఉండేలు దెబ్బ తెలియని పిల్లకాకుల్లా మొదటి మునక చలాగ్గా వేసేస్తాం. దాంతో రుచి తెలుస్తుంది. రెండోది వెయ్యడానికి పదిరెట్లు ధైర్యసాహసాలు కావాలి’ అన్నది అతని చక్కని విశ్లేషణ.

సంజీవ్‌గారు పూజ అన్నారు. అదో అరగంట. లంగర్లో ఒకటికి రెండుసార్లు వేడివేడి అతి తియ్యని తేనీరు తాగి, అల్పాహారమూ ‘స్వీకరించి’ మరోసారి, మరోసారి  తటాకాన్నీ, అబేధ్యమైన (ఇప్పటిదాకా ఎవరూ ఎక్కలేకపోయిన ) కైలాసశిఖరాన్ని చూసి, చూసి మనసులో నింపుకొని  ఏడున్నరకు తిరుగు ప్రయాణం మొదలెట్టాం. హడ్సర్ చేరేసేరికి సాయంత్రం మూడున్నర . “ఓరిదేవుడో… ఈ దిగడం కన్నా ఆ ఎక్కడమే సుఖంగా ఉంది” అని (అసహజంగా) అనిపించిన మార్గమది!

నా కాలు (ఇదే చివరిసారిలెండి!) చిద్విలాసాలు చిందుతూ కనిపించింది. పట్టరాని ఆశ్చర్యం నాకు. భక్తులూ, ఆస్తికులూ – ఇదంతా ఆ మహాదేవుని లీల. అనే సందర్భమిది. మరి నాలాంటి అవిశ్వాసికి ఆ అవకాశం లేదాయే!!

ఉపశృతి:

1. పైకి వెళ్ళేటపుడూ, కిందకు దిగేటపుడూ ఓ అచ్చమైన పంజాబీ గ్రామీణ కుటుంబం తోడుగా వచ్చింది. భీష్మాచార్యుని వంటి తాతగారు, నాలుగేళ్ళ బుడుగులాంటి మనవడు. వాడి అమ్మా, నాన్నా, బాబాయి, అత్తయ్య, నాయనమ్మా, దారంతా మాటలు – తాతామనవళ్ళతో విడివడేటప్పుడు పచ్చబొట్ల పల్చని ముప్పై ఏళ్ల అత్త్తయ్య వచ్చి పరిచయం చేసుకొంది. ఊళ్లో టీచరట. వాళ్ల జీపు బయల్దేరుతోంటే, తాతామనవళ్ళు వీడ్కోలు చెప్పడం సరేసరి.. ఈవిడ పక్కసీట్లోంచి వంగి తల బయటపెట్టి మరీ ఆత్మీయంగా చెయ్యి ఊపింది. నాకీ పుణ్యయాత్రలో సరైన విశ్వాస స్నేహఫలం దొరికిందని అంబరమంత సంబరం.

2. ఏసీ రైళ్లు, ఇన్నోవాలూ, గుర్రాలూ – ఇన్ని హంగులతో ప్రయాణం చేసినా ‘సత్రం భోజనం – మఠం నిద్ర ‘ పుణ్యమా అని మా ఖర్చు మనిషికి నాలుగువేలే.. ఎంత చవక!!

 – దాసరి అమరేంద్ర

 

 

‘ఆర్గానిక్’ కూడా ఒక మార్కెట్ మాయ!

ఎస్. నారాయణస్వామి

ఎస్. నారాయణస్వామి

 

సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథల్లో భోజనచక్రవర్తి అని ఒక కథ ఉన్నది. అప్పంభొట్లు అసామాన్యమైన తిండిపుష్టి కలవాడు. ఒకసారి పోటీమీద రెండు గంగాళాల ఆవడలు పెరుగుతోసహా జుర్రిపారేసి ఊరి ప్రజలందరినీ దిగ్భ్రాంతుల్ని చేసిన మూర్తీభవించిన జఠరాగ్ని అతను. ఇంకో కథలో బావగాడు అనబడే కనకారావు కార్తీకసమారాధన వనభోజనాలలో రకరకాల తెలుగు వంటల్ని, కాయల సెలెక్షన్ దగ్గర్నించీ, ఏ కూర ఎలా వండాలో, ఏ రుచి ఎలా ఉండాలో దగ్గరుండి వండించి, స్వహస్తాలతో అందరికీ వడ్డించి పరవశించినవాడు. 

రెండు మూడు తరాల కిందట గోదావరి జిల్లాల సంపన్న బ్రాహ్మణ కుటుంబాల్లో పంక్తిభోజనాల పద్ధతుల్నీ మర్యాదలనీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు అనేక రచనల్లో చాలా విపులంగా వర్ణించారు. అడివి బాపిరాజు గారి నారాయణరావు నవల్లో ఆంగ్లో ఇండియన్ వారి దగ్గర్నుండీ వివిధరకాల ప్రజల ఆహారపు పద్ధతుల్ని వర్ణించారు. అంతదాకా ఎందుకు, ఈ మధ్యకాలంలో సినిమా ద్వారా కూడా తెలుగువారికి బాగా దగ్గరైన కథ ‘మిథునం’ (శ్రీరమణ)లో అప్పాదాసు మొదణ్ణించీ చివరిదాకా వంటకి సంబంధించిన ఏదో ఒక విషయం మీద భార్యతో గొడవపడుతూనే ఉంటాడు. 

timthumb.php

ఇదంతా చెప్పుకు రావడం ఎందుకంటే ఒక జాతి సాంస్కృతిక అస్తిత్వంలో భోజనానికీ, భోజన పద్ధతులకీ చాలా ముఖ్యమైన భూమిక ఉన్నది అని చెప్పడానికి. మా అమ్మానాన్నల పెళ్ళైన కొత్తలో అప్పుడు బాగా కరువురోజులు. మా నాన్నగారు అత్తారింటికి వెళ్ళిన సందర్భంలో భోజనంలోకి నెయ్యి లేకపోయేటప్పటికి – ఇంటికొచ్చిన కొత్తల్లుడికి నెయ్యి లేకుండా భోజనం పెట్టాల్సొచ్చిందని మా అమ్మమ్మా తాతయ్యా మహా గుంజాటన పడిపోయారుట. కేవలం ఒక్క తరం కిందట నెయ్యి లేకుండా భోజనం చెయ్యడం, పెట్టడం అమర్యాదయే కాదు, అనాగరికం కూడా అనిపించుకునేది. అదే ఇవ్వాళ్టి రోజున – విందుభోజనాల సంగతి పక్కన పెట్టండి – ఆంధ్రదేశంలోనే ఎవరైనా బంధుమిత్రుల ఇంటికి భోజనానికి వెళ్తే, నెయ్యి వడ్డించడం సంగతి దేవుడెరుగు, అసలు ఇంట్లో నెయ్యి ఉన్నదో లేదో అనుమానించవలసిన పరిస్థితి. అలాగే ఆచారాల ప్రకారం మన వంటల్లో విరివిగా వాడుతూ ఉండిన కొబ్బరి, నువ్వులు, బెల్లం, ఇవన్నీ కూడా మరుగున పడిపోయాయి – ఏవిటయ్యా అంటే, ప్రతీ వాళ్ళకీ షుగరు, బీపీ, కోలెస్టరాలు భయం.
తమాషాగా, మెక్డొనాల్డ్స్, పిజ్జా హట్, కెంటకీ ఫ్రైడ్ చికెన్ వంటి మెగా ఆహార వ్యాపారాలకి పుట్టినిల్లైన అమెరికాలోనూ గత ఇరవయ్యేళ్ళగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని గురించి అవగాహన పెరుగుతూ వచ్చింది. ఆ అవగాహన అందోళనగా పరిణమించి, కొండకచో ఉద్యమంగా ఎదిగి ఇంతింతై అన్నట్టు అదొక విశ్వరూపాన్ని దాల్చిందిప్పుడు. ఈ విశ్వరూపానికి బహుముఖాలున్నాయి. స్థానికంగా పెంచిన ముడిపదార్ధాలని వాడడం, ఆర్గానిక్ గా పెంచిన ముడిపదార్ధాలని వాడడం, తినుబండారాల ఉత్పత్తిలో భారీ యంత్రాలని ఉపయోగించకపోవడం, అన్నీ “సహజమైన” ముడిపదార్ధాలని వాడడం .. ఈ ముఖాలలో కొన్ని. అమెరికా ఎప్పుడూ Meat and Potatoes దేశమే. తరతరాలుగా తక్కువ ఖరీదుకి బర్గర్లు, పిజ్జాలవంటి జంకు ఫుడ్డు తినడం మరిగి, వొళ్ళు కొవ్వు పట్టి ఉన్న అమెరికను ప్రజానీకానికి ఒక్కసారిగా జ్ఞానోదయమైనట్టు, దేశం మొత్తం ఒక్క మనిషిలాగా ఈ ఆరోగ్యకరమైన ఆహార విశ్వరూపాన్ని ఆహ్వానించింది. ఎటొచ్చీ ఎంత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటున్నా దేశపు ఆరోగ్యం మెరుగుపడ్డం లేదట.
జంకు ఫుడ్డు వొంటికి మంచిది కాదు అని ప్రత్యేకంగా పనిగట్టుకుని చెప్పక్కర్లేదు – విపరీతమైన కొవ్వు, ఉప్పు, చక్కెరతో నిండి ఉన్న ఈ తిండి సంగతి స్పష్టంగా తెలుస్తూ ఉన్నదే. పైగా అవన్నీ ఎక్కడో ఫేక్టరీలో తయారై, ఎన్నెన్నో రోజులు ఫ్రీజర్లలో నిలవచెయ్యబడి, అప్పటికప్పుడు వేడిచేసి వడ్డిస్తున్న వ్యవహారం. దీనికి పూర్తి వ్యతిరేకంగా స్థానికంగా పండించిన కూరగాయలు, పండ్లు, ఇతర ముడి పదార్ధాలు, సహజ ఉత్పత్తులు, .. ఆహా ఎంత స్వఛ్ఛంగా, ఆరోగ్యంగా ఉంటుందో ఆ వంట! అనిపించక మానదుగదా! అసలే కేలిఫోర్నియాలో ఆ ఆరోగ్యం పిచ్చ బాగా ఎక్కువ. హాలీవుడ్ ప్రాంతాల్లో ఆరోగ్యకరమైన స్వఛ్ఛమైన భోజనానికి బాగా పేరుపడ్డ రెండు రెస్టారెంట్లలో బాగా జనాదరణ పొందిన కొన్ని వంటకాలని ప్రయోగశాలల్లో విశ్లేషించినప్పుడు కొన్ని ఆసక్తి కరమైన సత్యాలు బయటపడ్డాయి. వొళ్ళు పెరగడానికి బాగా దోహదం చేసే కొవ్వూ, పిండిపదార్ధాలూ ఈ వంటకాల్లో చాలా హెచ్చుగా ఉన్నాయి. ఇందులో వాడిన ముడి సరుకు స్థానికమైనదీ, తాజాదీ అయితే అయుండవచ్చునుగానీ, శరీరానికి కొవ్వు పట్టకుండా ఉంచడానికి మాత్రం ఎటువంటి సహాయమూ చెయ్యదు ఇటువంటి ఆహారం.
images12
ఇదే కాదు, మంచి ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం అని విపరీతంగా ప్రకటనలు గుప్పించే అనేక సూపర్ మార్కెట్లలో షెల్ఫుల మీదున్న ఉత్పత్తులని చూసినా మనకి ఈ విషయం తెలుస్తూనే ఉన్నది. ఈ మాత్రానికి ఏ లేబరేటరీకో వెళ్ళనక్కర్లేదు – రకరకాల పొటేటో లేక వెజెటబుల్ చిప్సు, రకరకాల తీపి వంటకాలు, చాక్లెట్లు, మరెన్నో రకాల పాస్తా వంటి పిండిపదార్ధాలు – వాటి మీద “సహజం, ఆర్గానిక్, ఫలానా ఆరోగ్యకరమైన అంశాలతో  వృద్ధి చెందినది” ఇత్యాది పదజాలంతో మన కళ్ళనూ మనసునూ మాయజేసే వర్ణప్రపంచం కనిపిస్తుంది, కానీ లేబుల్ ని కాస్త విశదంగా పరీక్షిస్తే – ఔన్సుకి ఔన్సు, కేలరీకి కేలరీ – ఇవన్నీ మెక్డనాల్డ్సు వాడు అమ్మే బర్గరు + ఫ్రెంచి ఫ్రై భోజనానికి తీసిపోకుండా ఉన్నాయి. ఇంకా గట్టిగా మాట్లాడితే, కొన్ని సందర్భాల్లో జంకు ఫుడ్డే మెరుగ్గా ఉన్నదేమో కూడాను. మొత్తానికి తెలుస్తున్నదేవిటంటే – వొళ్ళు పెరగడానికి ముఖ్య కారణం భోజనంలో ఉండే కొవ్వు, పిండిపదార్ధాలూ కాగా, ఇప్పుడు మంచి ఆహారం పేరిట చెలామణి అవుతున్నదానిలో చాలా భాగం ఆ విషయంలో తినేవారి ఆరోగ్యానికి దోహదం చేసేలా లేదు.
సహజమైన ఆహారంకూడా జంకు ఫుడ్డు లాగానే వ్యాపార సంస్థల వ్యాపార సూత్రం మాత్రమే అయుంటే అదొక తీరుగా ఉండును. కానీ, ఈ విషయం, ఈ సూత్రం వ్యాపారాన్ని మించి – వ్యాసం మొదట్లో చెప్పినట్టు – ఒక ఉద్యమంగా, ఇంచుమించు ఒక సరికొత్త మతంగా పరిణమించింది. కొందరు పేరు పొందిన పాత్రికేయులు (E.g. Michael Pollan) ఈ మతానికి ప్రధాన మతాచార్యులు. టీవీలోనూ పత్రికల్లోనూ తారలుగా వెలుగుతున్న వంటవారు (Chefs, e.g. Mark Bittman) ప్రధాన అర్చకులు. పుస్తకాల ద్వారా, పత్రికల ద్వారా, టీవీలో, విడియోల్లో వీరందరూ కలిసి చేస్తున్న ప్రబోధాలు మధ్యతరగతి అమెరికన్ల మనసుల్ని చాలా ప్రభావితం చేస్తున్నాయి. తద్వారా వారి అలవాట్లని ఎంత ప్రభావితం చేశాయో తెలియదు గానీ వారి కొనుగోళ్ళని మాత్రం చాలా మార్చివేశాయి.
గత ఇరవయ్యేళ్ళలో ఈ “సహజ ఆహారం” ఒక స్వతంత్రమైన ఇండస్ట్రీగా ఎదిగింది. వచ్చిన తంటా ఏవిటంటే ఈ ప్రవచనాలు చెప్పే మహానుభావులెవ్వరూ వైద్యంలో కానీ, శరీరతత్వ శాస్త్రంలో కానీ, ఆహార శాస్త్రం (Nutritional science)లో కానీ పట్టభద్రులు కారు. ఆహారపు అలవాట్లు, శరీరతత్వం మీదనూ, ఆరోగ్యం మీదనూ వాటి ప్రభావాన్ని గురించి కొన్ని పరిశోధనలు జరిగాయి కానీ శాస్త్రీయమైన గమనికలు గానీ, ఇతర నిర్ణయాలు కానీ బయటికి రాలేదు. ప్రజల జీవితాలని ప్రభావితం చేసే అనేక సమస్యలకి శాస్త్రీయంగా జవాబులను వెతెకడానికి ఇష్టపడే అమెరికను సమాజం, ఆధునిక టెక్నాలజీలని ఒక ముఖ్యమైన సాధనంగా వాడుకునే అమెరికన్ సమాజం ఇలా ఆహారం విషయంలో మాత్రం ఎక్కడో వెనకబడిన ప్రాంతాల్లో మూఢనమ్మకాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆదిమ సమాజం మాదిరిగా ఈ ఆరోగ్య ఆహార మతాన్ని నమ్ముకుంటున్నది, తన అమిత బరువు సమస్యని పరిష్కరించడానికి.
స్వఛ్ఛమైన, సహజమైన ముడి సరుకు మంచిదే – కాదనడం లేదు. జంకు ఫుడ్డు చెడ్డదే – అదీ కాదనడం లేదు. కానీ శరీరపు బరువుని గురించీ, ఆరోగ్యాన్ని గురించీ సైన్సు చెబుతున్న మౌలికమైన విషయాలను పట్టించుకోకుండా సహజమైనది కదా అని ఏది పడితే అది, ఎంత పడితే అంత తింటూ పోతే వచ్చేది ఆరోగ్యం కాదు, అకాల మృత్యువే. మా మిత్రుడు ఒకడు అంటూ ఉంటాడు –  పాము విషంకూడా సహజమైనదే, ఆర్గానిక్‌గా, ఎక్కడా ప్రాసెస్ చెయ్యకుండా ఉత్పత్తి అయినదే – అలాగని, విషం తింటామా? అది విషమే అయినప్పుడు, అది ఆర్గానిక్ అయితేనేమి, ఏదో యంత్రాల్లో తయారైనది అయితేనేమి ప్రాణం తియ్యడానికి.

organic garden

మన ఇంటి వెనకాల పెరడులో పెద్దగా ఎరువులూ, క్రిమిసంహారకాలూ అవీ వాడకుండా మనం పెంచుకున్న కూరగాయల్ని మన చేత్తో కోసుకొచ్చి వండుకుని (అదీ ఎక్కువ ఉప్పూ, నూనెలూ లేకుండా) తింటే – అది కచ్చితంగా జంకుఫుడ్డు కంటే ఆరోగ్యంగా ఉంటుందని ఒప్పుకోవచ్చు. అంతేగానీ “సహజ సూపర్ మార్కెట్”లో షెల్ఫుల మీద అమ్మబడుతున్న సహజ పాస్తాలు, సహజ చిప్సు, సహజ ఐస్ క్రీములు తింటూ ఉండడం ఆరోగ్యం కాదు. అది మన మనసును .. కాదు కాదు – శరీరాన్ని – మనమే వంచన చేసుకోవడం.
References:

“The cure for Obesity”, David H. Freedman, The Atlantic (monthly) July 2013

 

– ఎస్. నారాయణ స్వామి

వీలునామా- 15 వ భాగం

శారద

శారద

  (కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

శుభ వార్త 

పిల్లలూ, జేన్, ఎల్సీ అంతా బయటికెళ్ళాక, బ్రాండన్ పెగ్గీతో తీరికగా కబుర్లు చెప్పాడు. అన్నిటికన్నా, ఆయనని సంపన్నుల ఇంటి ఆడపడుచులు ఈ చాకలి మనిషి ఇంట్లో ఎందుకున్నారా అన్న కుతూహలం వేధించింది. అంతకు ముందు రోజు రాత్రి రెన్నీ గారి అమ్మాయి, ఎలీజా ఏవో వివరాలు చెప్పింది కానీ, ఆయనకి అవంత నమ్మదగ్గవిగా అనిపించలేదు. వాటిల్లో అతిశయోక్తీ, అతిశయమూ ఎక్కువగా అనిపించాయి. ఆయన ఊహించినట్టుగానే, పెగ్గీ వాళ్ళిద్దరి గురించీ మామూలుగా నిజాలు వెల్లడించింది. పెగ్గీ కి అందులోనూ జేన్ అంటే చాలా ఇష్టమూ, మర్యాదా.

“పెద్దమ్మాయిగారు ఎంత తెలివైందనుకున్నారు? ఆవిడకి తెలియని విషయం లేదేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. అంత తెలివైన మంచి మనిషి, కుట్టు పనికి వెళ్తోందటే ఎలాటి రోజులొచ్చాయో చూడండి. రాత్రి పూట ఆవిడ పిల్లలకి చదువు చెప్పేటప్పుడు చూడాలి. మా టాం అయితే ఆవిడ చేతిలో బొమ్మే అనుకోండి. ఆవిడ మాటంటే మావాడికి వేద వాక్కు. ఆ వయసులో మగపిల్లలకి అలా ఆరాధించేందుకు ఒక స్త్రీ మూర్తి వుండి తీరాలండీ! వాళ్ళకి ఆడవాళ్ళ మీద గౌరవం పెరుగుతుంది.”

“పెగ్గీ! ఆదర్శవంతమైన్స్ స్త్రీ మూర్తిని చూడాలనే అనుకుంటే నీకంటే వేరెవరున్నారు?” బ్రాండన్ అభిమానంగా అన్నాడు.

“నాకు అక్షరం ముక్క రాదాయే! నన్నెవరు గౌరవిస్తారు లెండి. అయితే నాకు దాని గురించి పెద్ద బాధా లేదు. నిజానికి టాం చాలా మంచి కుర్రాడు, చురుకైన వాడు. వాడికి రాని లెక్కలూ, లాటినూ, ఏదైనాసరే, అన్నీ పెద్దమ్మాయి గారు చెప్తారు. ఆవిడ ఒక పేజీ నిండా వున్న అంకెలని కూడా చకచకా మనసులోనే కూడిక చెయ్యగలరు తెలుసా! అయినా, నాకు తెలీకడుగుతాను. జేమీకి లాటిన్ తో ఏం పని చెప్పండి? చెక్క పనులు నేర్చుకుని వడ్రంగి అవుదామనుకునేవాడికి, ఈ లేటినూ భాషలూ ఎందుకో! వీణ్ణి చూసి టాం! ఇద్దరూ లాటిన్ నేర్చుకుంటున్నారు. ఏం ప్రయోజనమో ఆ దేవుడికే ఎరుక. భాష మాటెలావున్నా వాళ్ళ అక్షరాలు మాత్రం ముత్యాల్లా అయ్యాయంటే నమ్మండి. అంతా పెద్దమ్మాయిగారి చలవే. ఆవిడ ఆజమాయిషీలో వున్నప్పుడు, వాళ్ళ మావయ్యగారి ఎస్టేటులో, ఇంట్లో లెక్కా, అదీ వొంక పెట్టలేకుండ వుండేదు. అంత తెలివీ చదువూ వుండి ఏం లాభం, పాపం. ఇప్పుడు ఎక్కడో కుట్టు పనికి కుదురుకోవాలనుకుంటోంది. చిన్నమ్మాయిగారున్నారా, ఆవిడంతా అదో ప్రపంచం. కవితలూ, కథలూ, నవలలూ, అంతా రాత పనే. అయితే ఈ మధ్య అన్నీ మానేసారులెండి. ఈ మధ్య కొంచెం నిరుత్సాహంగా వున్నారని చెప్పి ఫ్రాన్సిస్ గారు అలా బయటికి తీసికెళ్ళారన్నమాట.”

“నాకు మీ చిన్నమ్మాయిగారితోనే కొంచెం స్నేహం! ఆ పెద్దమ్మాయిని చూస్తే నాకు వొణుకు. అందులో ఆవిడ మాట్లాడితే నీతులు బోధిస్తున్నాట్టే అనిపిస్తుంది.”

“అబ్బో! ఆవిడ నీతుల వల్ల మీరు చెడిపోయిందేమీ లేదే! మంచి చెప్పినా తప్పేనా? సరే, ఇదంతా అలా వుంచండి. నిజంగా మెల్బోర్న్ లో నా కొట్టు చవకగా ఇచ్చెయాల్సి రావడం నాకు బాధగా వుంది. మీరన్నట్టు ఆ కొట్టుకు రెండు వేల పౌండ్లు వస్తేనా, నేను పెద్దమ్మాయిగార్ని మెల్బోర్న్ తీసికెళ్ళి ఇద్దరమూ కలిసి ఏదైనా వ్యాపారం మొదలుపెట్టేవాళ్ళం.”

జేన్ పట్ల పెగ్గీ అరాధన చూసి బ్రాండన్ కి నవ్వొచ్చింది. ఇంకొంచెం సేపు మామూలు కబుర్లయ్యాక ఆయనన్నాడు,

“పెగ్గీ! నాకొక ఆలోచన తోస్తుంది!”

“ఆలోచనా?”

“అవును! నీకు ఫిలిప్ గారి కుటుంబం గుర్తుందా?”

“ఎందుకు గుర్తు లేదు? వాళ్ళు బాగున్నారా? అడగడమే మర్చిపోయాను. చిన్న పాప ఎమిలీ ఎలా వుంది? ఇప్పుడు బాగా పెద్దదయి వుంటుంది.”

“బానే వున్నారు. వాళ్ళకిప్పుడు ఎమిలీ కాక ఇంకా నలుగురు పిల్లలు. శ్రీమతి ఫిలిప్ గారికి ఎప్పట్లానే తన షోకులకే సమయం చాలటం లేదు.”

“ఆవిడ ఎప్పుడూ అంతే లెండి.”

“ఇంతకీ సంగతేమిటంటే, నేను మెల్బోర్న్ నించి ఇంగ్లండు వచ్చేటప్పుడు అదే నౌకలో ఫిలిప్ గారి కుటుంబం కూడా వచ్చింది. వాళ్ళు ఇక ఎప్పటికీ లండన్ లోనే వుండిపోతారట. మీ పెద్దమ్మాయి గారికి ఆ కుటుంబంలో వుద్యోగం దొరికిందనుకో, వాళ్ళకీ హాయి, తనకీ సుఖంగా వుంటుంది. వాళ్ళ పిల్లలు ఎమిలీ, హేరియాట్ ని అదుపులో పెట్టగలిగే టీచర్లు లేక అవస్థ గా వుందని అన్నాడు ఫిలిప్ నాతో. వాళ్ళు జేన్ శిక్షణలో కాస్త నాలుగు అక్షరాలు నేర్చుకుంటారు. ఏమంటావ్? మాట్లాడి చూడనా?”

“నేనక్కడ వున్నప్పుడే ఎమిలీ తండ్రినొక ఆట ఆడించేది. ఆవిడ కేమో అసలు ఏ పనికీ ఒళ్ళొంగదు. మీరన్నట్టు ఇది మంచి ఆలోచనే.”

“జేన్ లాటి మనిషి దొరికితే ఫిలిప్ ఎగిరి గంతేస్తాడనుకుంటా. నేను వెంటనే ఫిలిప్ తో మాట్లాడతా. అతనెటూ ఇటు వైపొచ్చే ఆలోచనలో వున్నాడు. అప్పుడు నిన్నొకసారి కలవమంటా. అతనే జేన్ తో మాట్లాడి ఏ విషయమూ నిర్ణయించుకోవచ్చు. నువ్వు ఆవిడని తొందర పడి కుట్టు పనికి వెళ్ళొద్దని చెప్పు.”

“ఆయన వొచ్చేటట్టయితే తప్పక ఎమిలీని తీసుకురమ్మని చెప్పండి. వారి కుటుంబానికి పెద్దమ్మాయిగారు నచ్చి పనిలో పెట్టుకుంటే కాస్త వాళ్ళకి సాయం చేసిన వాళ్ళమవుతాం.”

“ఇహ ఆ పని మీదే వుంటాను. నేను మరి బయల్దేరతా పెగ్గీ! నిన్ను చూసినందుకు చాలా సంతోషంగా వుంది.”

లోపలికెళ్ళి పిల్లల తాతగారు థామస్ లౌరీ కి నమస్కారం చేసి బయల్దేరాడు బ్రాండన్. పెగ్గీ ఆలోచనలో పడింది.

‘…. చూస్తూంటే బ్రాండన్ గారికి చిన్నమ్మాయి గారు బాగా నచ్చినట్టున్నారు.  ఇప్పుడు చిన్నమ్మాయి గారికి ఈయన నచ్చుతాడో లేదో! నేను ఆయన గురించి అంతగా చెప్పి వుండకుండా వుండాల్సిందేమో! పొరపాటైపోయింది. ఇప్పుడామెకి ఆయన్ని చూస్తే నవ్వులాటగానే వుంది. బ్రాండన్ గారన్నట్టు పెద్దమ్మాయిగారికి ఫిలిప్ గారి దగ్గర ఉద్యోగం దొరికితే బాగుండు. పాపం ఇక్కడ పిల్లలు ఆవిడ లేకపోతే దిగులు పడతారేమో. మరప్పుడు చిన్నమ్మాయిగారు ఒంటరిగా ఇక్కడుండాల్సొస్తుందేమో! అసలే కళాకళాల మనిషి. ఆమెని ఒంటరిగా నేను సంబాళించుకోగలనో లేదో!…’

అంతలోనే ఆమె ఆలోచనలు మెల్బోర్న్ లో తను అద్దెకిచ్చిన కొట్టు మీదికెళ్ళాయి.

‘…ఆ జులాయి వెధవ కొట్టు నిజంగానే కొనేసుకుంటాడనుకోలేదు. రెండు వందలక్కొన్న కొట్టు ఇప్పుడు రెండు వేలయిందట. అయినా నాకు రెండు వందలే వొస్తాయి. ఎంత అన్యాయం. అంతా నేను చేసిన పొరపాటు. ఇప్పుడేమనుకొని ఏం లాభం….’

ఆలోచనల్లోనే పెగ్గీ పనంతా ముగించి బయటికెళ్ళిన అమ్మాయిలిద్దరికోసం ఎదురు చూస్తూ కూర్చుంది.

జేన్ ఎల్సీలిద్దరూ నాటకం చూసి వచ్చేసరికి రాత్రి బాగా పొద్దుపోయింది.

“ఇంత ఆలస్యమయిందే! భయపడ్డా మీరిద్దరూ ఎక్కడున్నారోనని.” తలుపు తీస్తూ అంది పెగ్గీ.

“అవును పెగ్గీ! ఇంత పెద్ద నాటకం అనుకోలేదు. అసలు నువ్వెందుకు మాకోసం ఎదురు చూస్తూ మెలకువతో వున్నావు? పడుకోకపోయావా!” చెప్పులు విప్పుతూ అంది జేన్.

ఎల్సీ చాలా రోజుల తర్వాత ఆ రోజు సంతోషంగా అనిపించింది.

“ఏం పెగ్గీ! ఆస్ట్రేలియాలో నువ్వెప్పుడైనా నాటకం చూడ్డానికెళ్ళావా?” సరదాగా అడిగింది.

“వెళ్ళా కాని నాకేం నచ్చలా! ఆ రంగులు పూసుకున్న మొహాలూ వాళ్ళూ!”

నవ్వింది జేన్.

“పెగ్గీకి రంగుల కల్పనలకంటే నలుపూ-తెలుపుల నిజ జీవితమే నచ్చుతుంది. కదూ పెగ్గీ!”

“మీ వేళాకోళానికేమొచ్చె కానీ, నిజ జీవితమంటే గుర్తొచ్చింది! అమ్మాయిగారూ! బ్రాండన్ గారు మీకొక మంచి ఉద్యోగం చూసి పెడతానన్నారు!”

అమ్మాయిలిద్దరూ ఉత్సాహంతో కెవ్వుమన్నారు.

“ఒక ఇంట్లో పిల్లల చదువులూ, డబ్బు లెక్కలూ చూసుకునే గవర్నెస్ ఉద్యోగం. రేపే మాట్లాడతానన్నారు. కనీసం తాను ఏ కబురూ చెప్పేవరకూ కుట్టు పనికి వెళ్ళొద్దన్నారు.”

తర్వాతె పెగ్గీ ఫిలిప్ గారి గురించి వివరాలన్నీ చెప్పింది.

“జీతం ఎంతుంటుందో!” ఆత్రంగా అంది జేన్.

“దాఇ గురించి మీరు ఆలోచించకండి. ఫిలిప్ గారు పిసినారి కాదు నాకు తెలిసినంతవరకూ.

“అయితే రేపు ఫ్రాన్సిస్ వచ్చేసరికి మనం అతనికొక శుభవార్త చెప్పొచ్చన్నమాట!” జేన్ అంది సంతోషంగా.

 

***

(సశేషం)

 

ప్రశ్నలు లేని జవాబులు

satyaprasad “రేపు ఒక కాన్పరెన్స్ కోసం హైదరాబాద్ వస్తున్నాను. కుదిరితే డిన్నర్ కి కలవగలవా?”

ఎన్నిసార్లు ఆ మెసెజ్ చూసుకున్నావో లెక్కేలేదు. అందులో ఒక్కొక్క అక్షరం నీలో ఎన్నో జ్ఞాపకాలను కదిలిస్తోంది. అక్కడికి రమణిని మర్చిపోయావని కాదు. గుర్తుకువచ్చేది. నువ్వు రమణిని వద్దనుకున్న కొత్తల్లో చాలా తరచుగా గుర్తుకువచ్చేది. కానీ నీ చదువులు, ఉద్యోగం, పెళ్ళీ వీటన్నింటి మధ్యలో రమణి జ్ఞాపకం ఎక్కడో తప్పిపోయింది. నువ్వు వూరు వెళ్ళినప్పుడో, రమణితో కలిసి చూసిన పాత సినిమాలు టీవీలో చూసినప్పుడో, ఏదో ఒక అర్థరాత్రి కలలో ఆమె కనిపించినప్పుడో ఒక్కసారిగా అన్నీ గుర్తొచ్చి నిన్ను అతలాకుతలం చేసేవి.

చిన్నప్పుడు గుడి ముందర ఆడిన ఆటలు – దాగుడు మూతలు దండాకోర్ – పిల్లి వచ్చె ఎలకా భద్రం – ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చుప్ సాంబార్ బుడ్డి..

ఆ తరువాత ఆటలతో పాటు తొండి చెయ్యడం కూడా నేర్చుకున్న రోజులు. ఇంటికి వచ్చే ముందు చీకట్లో దొంగిలించిన ముద్దులు. ఆటలు ఆడుతూ ఆడుతూ జారిపోయిన బాల్యం. రమణిలో కొత్తగా పూసిన రంగులు, సిగ్గులు. ఆ తరువాత తల్లిదండ్రుల కనుసన్నలలో కట్టడైన తొలి యవ్వనం. తొలిప్రేమ – మొదలు ఎక్కడో తెలియని మనసుల కలయిక. ఒకే బస్సులో కాలేజీ ప్రయాణాలు, ఆ కాలేజీలో ప్రణయాలు. ఒకరికొకరు ప్రేమించుకుంటున్నామని చెప్పుకొకుండానే, అసలు ఆ విషయం తెలియకుండానే మునిగితేలిన ప్రేమానుభూతులు. ఇవన్నీ కలగాపులగం అయిపోయి ఒక కొలాజ్ లా నిన్ను కుదిపేసేవి.

నీ కార్పొరేట్ వుద్యోగంలో, నీ ఉరుకుల పరుగుల జీవితంలొ, నీ సంసార వ్యవహారాల్లో ఎక్కడో తప్పిపోయిన అందమైన కల రమణి. చిన్నప్పటి పుస్తకాలను తిరగేస్తుంటే కనపడే నెమలిపింఛెం లా ఈ మెసేజ్ రూపంలో మళ్ళీ నీ ముందుకి వచ్చింది.

కలిసినప్పుడు రమణి అడగబోయే ప్రశ్నలకు నీ దగ్గర జవాబు లేదని నీకు తెలుసు. ఆమె చూసే చూపులను తట్టుకునే శక్తి నీకు వుండదనీ తెలుసు. అయినా వెళ్ళాలి అనుకున్నావు.

“తప్పకుండా వస్తాను..” రిప్లై పంపించి మర్నాడు సాయంత్రం కోసం ఎదురుచూస్తూ వున్నావు.

***

అన్నేళ్ళక్రితం ఎలా వుండేదో అలాగే వుంది. కొంచెం వళ్ళు చేసింది. కళ్ళకు అద్దాలు. ఆమెను చూడగానే నువ్వు కలవరపడటమో, కన్నీళ్ళు పెట్టడమో చెయ్యలేదు. అలా జరగకుండా జాగ్రత్తపడ్డావు. వయసుతో పాటు నీకు మెచ్యూరిటీ వచ్చిందనుకున్నావు. అయినా నీ మనసు మాత్రం పదహారేళ్ళ పసి వయసు వైపు పరుగులు పెడుతోంది. ఆ సంగతి నీకు మాత్రమే తెలుసు.

డిన్నర్ చేసినంతసేపు చిన్నప్పుడు ఆడిన ఆటల గురించి, అప్పటి స్నేహాల గురించి సరదాగా మాట్లాడావు. పన్నెండేళ్ళ క్రితం వదిలేసిన కథని కొనసాగించినట్లే వుండాలని నీ ఆశ. అన్నేళ్ళు మీ ఇద్దరి మధ్య నిలిచిన మౌనవారధి ఎప్పుడు కూలిపోయిందో తెలియలేదని సంబరపడ్డావు. ఆమె ఆ ప్రశ్న అడిగే వరకు.

“పెళ్ళి చేసుకున్నావా?”

ఏ ప్రశ్నకి సమాధానం చెప్పడం నీకు ఇష్టం లేదో అదే ప్రశ్న వేసింది. తలూపావు.

“నా సంగతి తెలుసుగా. పెళ్ళి, విడాకులు..!! ఐ యామ్ హాపీ దట్ ఐ యామ్ ఔట్ ఆఫ్ ఇట్..! పీఎచ్.డీ చేశాను. ఇప్పుడు హాయిగా వుంది.” అంది. నీకు ఆమె మాటల్లో వినపడిందంతా ఒక అవకాశం. ఒక ఆహ్వానం మాత్రమే.

“ఒంటరితనం నాకు తెలుసు రమణీ. సరోజ చనిపోయి ఐదేళ్ళైంది. ఎండిపోయిన చెట్టులా పడివున్నాను” అంటూ విషాదాన్ని ఒలకబోశావు. ఆమె నుంచి ఎలాంటి సానుభూతి మాటలు లేవు.

“అయినా ఫర్లేదు… కార్పొరేట్ వుద్యోగం.. పదవి.. హోదా.. ఏదో ఒక వ్యాపకం కావాలి కదా? మూడు బంగళాలు, నాలుగు ఫ్లాట్లు, కార్లు… జీవితాన్ని పూర్తిగా అనుభవిస్తున్నాననుకో..” గర్వం గొంతులోకి వచ్చేలా చెప్పావు. ఆమె కళ్ళలో ఆశ్చర్యమో, ఆరాధనో కనపడాలని నీ తాపత్రయం. ఆమె నవ్వింది.

డిన్నర్ పూర్తైంది. నన్ను ఎందుకు వదిలేశావు అని ఆమె నిన్ను అడగలేదు. నువ్వు పెళ్ళి చేసుకోను అని చెప్పిన తరువాత ఆమె ఎంత బాధ పడిందో చెప్పలేదు. అసలేం జరగనట్లే వుంది. పాత స్నేహితుణ్ణి కలిసినట్లే మాట్లాడింది. నీ కారు దాకా వచ్చి నిన్ను సాగనంపి హోటల్ లో తన రూమ్ కి వెళ్ళిపోయింది.

***

రమణి అడగాల్సిన ప్రశ్నలు అడిగివుంటే నీ దగ్గర సమాధానాలు సిద్ధంగా వున్నాయి. కానీ ఆమె అడగలేదు, నీ సమాధానాలు బయటపడలేదు. సమాధానాలు వున్నాయి. ప్రశ్నలే లేవు.

రాత్రంతా కలత నిద్ర. తెల్లవారగానే ఫోన్ చేశావు.

“మరో గంటలో బయల్దేరుతున్నాను” చెప్పింది చల్లగా.

“నేను వస్తున్నాను. డ్రాప్ చేస్తాను.” అన్నావు చొరవగా.

“వద్దు. టాక్సీ బుక్ చేశాను.” అన్నదామె కటువుగా.

వొప్పించేదాకా నువ్వూరుకుంటావా?

బీయండబ్లూ నడుపుతున్న గర్వం నీ కళ్ళలో వుంది కానీ అది ఎక్కిన ఆనందం ఆమె ముఖంలో కొంచెమైనా లేదు. నీకెందుకో అసహనం.

దారిలో చాలా విషయాలు మాట్లాడావు. నీ పెళ్ళి శుభలేఖ ఆమెకి పంపించావని అబద్ధం చెప్పావు.

“అందలేదు..” అంది ఆమె.

“నీ శుభలేఖ అందింది కానీ రావాలనిపించలేదు” అని చెప్పాలనుకున్నావు. “కుదరలేదు” అని మాత్రం చెప్పగలిగావు. మళ్ళీ మౌనవారధి ఇద్దరి మధ్య.

“ఒంటరి బ్రతుకు చాలా దారుణంగా వుంటుంది రమణీ” చెప్పావు. ఆమె విన్నదో లేదో తెలియలేదు. కానీ నువ్వు మాట్లాడటం మాత్రం ఆపలేదు.

నీ చుట్టూ వున్న కార్పొరేట్ ప్రపంచం ఎంత నిర్దయగా వుందో చెప్పావు. జ్ఞాపకాలలో శిధిలమైన రమణి స్నేహాన్ని గుర్తించానని చెప్పావు. రమణి ఇప్పుడు నీకు ఎంత అవసరమో చెప్పావు. అయినా ఆమె మాట్లాడలేదు. కనీసం ఏమైనా అడుగుతుందేమో అని నీకు ఆశ. ఆ ప్రశ్నలు సంధిస్తే నీ సమాధానాలు తయారుగా వున్నాయి.

ఆమె అడగలేదు. నీ అసహనం తగ్గలేదు. నీకు తెలియకుండానే నీ కళ్ళలో నీరు.

ఎయిర్ పోర్ట్ లో కారు ఆపి కిందకు దిగి లగేజ్ దింపావు. ఒక్కసారి ఆమె నిన్ను చిన్నగా హత్తుకుంది.

“టచ్ లో వుంటావు కదూ” అన్నావు.

ఆమె నవ్వింది.

“నువ్వు పూర్తిగా మారిపోయావు రమణీ” అన్నావు.

“నువ్వు ఏ మాత్రం మారలేదు ప్రదీప్…” అంది నవ్వి

“అంటే?”

“నువ్వు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలా వున్నాయని నీకు తెలుసు… అవి అడిగే అవసరం లేకుండా చేశావు. నీ గురించి కాకుండా నిన్ను ప్రేమించేవాళ్ళ గురించి ఆలోచించడం నేర్చుకో… బై.” అని చెప్పింది రమణి.

“ఫోన్ చేస్తావు కదూ..” అన్నావు వెనకనుంచి.

ఆమె నుంచి సమాధానం లేదు.

నువ్వు వెనక్కి తిరిగావు. ఆమె ముందుకు సాగిపోయింది.

[ *** ]

–అరిపిరాల సత్య ప్రసాద్

జీవితమే ఒక నాటక రంగం – ‘థియేటర్ స్క్వేర్’

uri_civara

“All the world’s a stage, and all the men and women merely players. They have their exits and their entrances; And one man in his time plays many parts”

 

“Oh! How bitter a thing it is to look into happiness through another man’s eyes!”

 

“I like this place and willingly could waste my time in it”

 

పైన ఉటంకించినవన్నీ షేక్స్పియర్ వ్రాసిన ‘As You Like It’ లోనివి. ఎప్పుడో డిగ్రీ చదువుకున్నప్పుడు బట్టీ పెట్టిన వాక్యాలు. అసలు ఇవి ఎందుకు చెప్పాల్సివస్తున్నదంటే, కొన్నాళ్ళ క్రితం అఫ్సర్ గారు వ్రాసిన ‘ఊరిచివర’ తిరగేస్తున్నప్పుడు మొట్టమొదటగా ఆకర్షించిన పేజీలో నేను చదివిన కవిత ‘థియేటర్ స్క్వేర్’ దీనికి కారణం. ఈ శీర్షిక చూడగానే ఒకదానివెంట మరొకటిగా పైవన్నీ గుర్తుకొచ్చాయి. అఫ్సర్ గారి కవితల్లో నా స్వభావానికి అంటే నా అంతర్యానానికి నచ్చిన కవిత ‘థియేటర్ స్క్వేర్’.

 

ఇదో అరుదైన, కాకతాళీయమైన సందర్భం. ఎందుకంటే, నాకు గుర్తుకువచ్చిన, పైన ఉటంకించిన మూడు కోటబుల్ కోట్స్ అఫ్సర్ గారు ‘థియేటర్ స్క్వేర్’ లోని తన పద్యాలలో స్పృశించారు! అవేమిటో చూద్దాం…

 

షేక్స్పియర్ ఒక సందర్భంలో అంటాడు “All the world’s a stage, and all the men and women merely players. They have their exits and their entrances; And one man in his time plays many parts”. చాలామంది చాలాచోట్ల ఇదే విషయాన్ని కొద్ది మార్పుచేర్పులతో చెప్పినా, అఫ్సర్ గారు మొదటి పద్యంలో ఇదే విషయాన్ని ఎలా చెబుతున్నారో చూడండి :

 

దృశ్యం – 1

 

ఒక నిశ్శబ్దంలోకి అందరూ

మౌనంగా.

 

తెర మీద

ఎవరి కథల్ని వాళ్ళే విప్పుకుంటారు తీరా.

 

షేక్స్పియర్ వ్రాసినదానికి, ఈ మొదటి పద్యానికి ఎంత సామ్యం! నా ఆశ్చర్యం అంతటితో ఆగలేదు. నాలుగో పద్యానికి వచ్చేటప్పటికి ‘As You Like It’ లోని మరో వాక్యం కళ్ళముందే దాగుడుమూతలు ఆడటం మొదలేసింది. ముందు ఆ పద్యం :

 

దృశ్యం – 4

 

ఎవరి జీవితం వాళ్ళకి చేదు

అవతలి బతుకు

కాసేపు అద్దం

తెలియని అర్థానికి.

 

షేక్స్పియర్ అంటాడు “Oh! How bitter a thing it is to look into happiness through another man’s eyes!”

 

సాథారణంగా మనిషికి,  తనకు ఏం కావాలో కూడా తనకు తెలియదు. అలా అని ఉన్నదానితో తృప్తి చెందడు. ఆనందం పొందడు. తను కోరుకున్న వ్యక్తి మరొకరికి చేరువౌతున్నదని తెలిసిన సందర్భంలో ఓ పాత్ర చేత షేక్స్పియర్ చెప్పించిన విషయాన్ని, ఎంతో సరళంగా, సున్నితంగా అఫ్సర్ గారు సార్వత్రికం చేసారో!

 

చివరి పద్యానికి వచ్చేటప్పటికి అఫ్సర్ అంటారు :

 

దృశ్యం – 6

 

థియేటరు

నన్ను అనువదించే యంత్రం

ఇక్కడ

నన్ను నేను వెతుక్కుంటాను

ప్రతి సాయంత్రం.

 

శుద్ధ వ్యావహారిక వ్యాపకంగా ఓ పాత్ర చేత షేక్స్పియర్ చెప్పించిన విషయాన్ని (“I like this place and willingly could waste my time in it”) అఫ్సర్ గారు ఎంత గొప్పగా చెబుతున్నారో!

 

***

 

ప్రతి పద్యాన్ని విడమరచి వివరించటం ఔచిత్యం అనిపించుకోదు కాబట్టి, అఫ్సర్ గారి కవిత :

థియేటర్ స్క్వేర్

దృశ్యం-1

 

ఒక నిశ్శబ్దంలోకి అందరూ

మౌనంగా.

 

తెర మీద

ఎవరి కథల్ని వాళ్ళే విప్పుకుంటారు తీరా.

 

దృశ్యం-2

 

ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు?

మాటల మధ్య చీకట్లు

ఎవరి చీకట్లో వాళ్ళు

లోపలి అనేకంతో కలహం.

 

దృశ్యం-3

 

కాసిని కన్నీళ్ళు వుప్పగా

పెదవి మీదికి.

చాన్నాళ్ళయ్యిందిలే కన్ను తడిసి!

ఇంకా కరగనీ

కళ్ళ వెనక శిలలు విరిగివిరిగి పడనీ.

 

దృశ్యం-4

 

ఎవరి జీవితం వాళ్ళకి చేదు

అవతలి బతుకు

కాసేపు అద్దం

తెలియని అర్థానికి.

 

దృశ్యం-5

 

ఎవరూ ఎక్కడా ప్రేక్షకులు కారేమో!

కొద్దిసేపు

పాత్రలు మారిపోతాయి అంతే

నేను అనే పాత్రలోకి

స్వకాయ ప్రవేశం ఇప్పుడు

 

దృశ్యం-6

 

థియేటరు

నన్ను అనువదించే యంత్రం

ఇక్కడ

నన్ను నేను వెతుక్కుంటాను

ప్రతి సాయంత్రం.

***

అనుభవాల అగాధాల్లో జ్ఞాపకాలు పరిభ్రమిస్తూ ఉంటాయి. రెక్కలు విప్పుకుంటూ అవే జ్ఞాపకాలు జలపాతాలై దూకుతుంటాయి. ఇది ఓ నిరంతర ప్రక్రియ. ఇదే జీవితం. ఎగసిపడే కెరటాలని ఒడిసిపట్టుకుంటూ, కొత్త కెరటాలతో సరికొత్త ఎత్తులకు ఎదుగుతూ, జారుతూ సాగిపోతుంది, నిరంతరం నిత్యనూతనంగా ప్రవహిస్తూనే ఉంటుంది  – జీవితం.

 

ఇందులోనే అందం ఉంది… ఆనందమూ ఉంది. బహిర్ముఖుడైన వ్యక్తి అందాన్ని మాత్రమే ఆస్వాదిస్తూ గడిపేస్తాడు. అంతర్ముఖుడైన కవి అది భయానక సౌందర్యమైనా సరే, ఆనందపు లోతులు ఆవిష్కరిస్తూ ఉంటాడు. ఆ అంతర్ముఖత్వంలోనే, కవి తనను తాను చూసుకోగలడు, తన లోతులు అంచనా వేసుకోగలడు. కవిత్వానికి అతీతమైన ఏదో విషయాన్ని, కవిత్వంగా చెప్పగలడు. అలాంటి అంతర్ముఖత్వాన్ని కొందరు మాత్రమే సాధించగలరు. అలాంటి అద్భుతమైన ప్రయత్నం అఫ్సర్ గారి ‘ఊరిచివర’ సంకలనంలోని ‘థియేటర్ స్క్వేర్’ అనే కవిత.

 – కొండముది సాయి కిరణ్ కుమార్

kskk_amtaryaanam

 

ప్రకృతి గీసిన రేఖా పటాలు

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

పరశురాముడు భీకర కోపాగ్నితో ఉగ్రరూపం ధరించి ఇరవై యొక్కసార్లు దండెత్తి భూమిమీది క్షత్రియులను తుడిచిపెట్టాడు. అప్పుడు ఆ క్షత్రసతులు ఋతుకాలాలలో ధర్మం తప్పకుండా మహావిప్రుల వల్ల కూతుళ్లను, కొడుకులను కని క్షత్రధర్మాన్ని నిలబెట్టారు…

వైవస్వతుడనే మనువుకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులైన మానవులు పుట్టారు. మరియు అతనికి వేనుడు మొదలైన యాభై మంది రాజులు పుట్టి, వంశాలను వృద్ధి చేసారు. వారు తమలో తాము యుద్ధాలు చేసుకుని మరణించారు.

                                                                 –శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం

విడి విడిగా ఉటంకించిన పై రెండు వివరాలు ఒక  ఉమ్మడి విషయాన్ని చెబుతున్నాయి. అది క్షత్రజాతి నిర్మూలనం కావడం గురించి, దానిని నిలబెట్టడం గురించి. నాటి ఆయుధోపజీవులైన క్షత్రియగణాలకు చంపడం, చావడం ఒక నిత్యకృత్యంగా, ఆటగా ఉండేదనీ; అది అనేక సంక్షోభాలకు, అవ్యవస్థకు దారితీయించేదనీ, వాటిని అధిగమించడానికి అందుబాటులో ఉన్న మార్గాలను వెతుక్కున్నారనే సంగతిని గుర్తుపెట్టుకుని ముందుకు వెడదాం.

    ***

మనిషి ఊహలు అలవాటుగా మారి, విశ్వాసంగా ఘనీభవించి గిరి గీసుకునే తీరు నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఒకటి చూడండి, భారతదేశపు రేఖాపటాన్ని (చాలావరకు) ఇప్పుడున్న స్థితిలోనే చూడడానికి దశాబ్దాలుగా అలవాటు పడిపోయాం. ఈ రేఖాపటం ఒకప్పుడు మరోలా ఉండేదనీ, రేపు ఇంకోలా ఉండే అవకాశం ఉందనే ఊహ మనకు రానే రాదు. ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రేఖాపటాన్ని 58 ఏళ్లుగా చూస్తున్నాం. గతంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రప్రాంతాలు కలసి ఉన్నప్పటి రేఖాపటమూ;  నేటి మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలు కొన్ని కలసి ఉన్న నిజాం రాజ్యం తాలూకు రేఖాపటమూ మరపు పుటల్లోకి జారిపోయాయి. ఇప్పుడవి మన ఊహకు కొత్తగా అనిపిస్తాయి. 1947 కు ముందు భారతదేశ రేఖాపటంలో నేటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ లు భాగంగా ఉండేవి. కాలంలో ఇంకా వెనక్కి వెళ్ళండి, నేటి అఫ్ఘానిస్తాన్ కూడా భారతఖండంలో ఉండేది. ఇంకా చాలా వెనక్కి వెళ్ళండి. పశ్చిమాసియా నుంచి వాయవ్య భారతం వరకూ మొత్తం ఆర్యావర్తం గా ఉండేదనిపిస్తుంది. మరింత వెనక్కి వెళ్ళండి, రాంభట్ల కృష్ణమూర్తి గారి ప్రకారం యూరప్ కూడా కలసి ఉన్న ప్రదేశాన్నే భారతవర్షం అనేవారు.

చరిత్ర పొడవునా రేఖాపటాలు మారిపోతూనే వచ్చాయి. పదమూడో శతాబ్ది నాటి మంగోలియన్ పాలకుడు చెంగిజ్ ఖాన్ ఏలిన మహాసామ్రాజ్యాన్ని రేఖాపటంలో చూపిస్తే, అది చైనాలోని పెకింగ్ (నేటి బీజింగ్) తో ప్రారంభించి వాయవ్యభారతం మీదుగా హంగరీ వరకూ వ్యాపించి కనిపిస్తుంది. చెంగిజ్ ఖాన్ డీ.ఎన్.ఏ ను పంచుకున్న వారసులు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నారో చెబుతూ ఆమధ్య ఒక ఆసక్తికర కథనం వెలువడింది. అలాగే, ఒకనాటి మౌర్య సామ్రాజ్యపు రేఖాపటంలో అఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణభారతం వరకూ చేరి ఉండేవి. అశోకుడి నాయనమ్మలలో ఒకామె గ్రీకు సెల్యూకస్ కూతురు.

అయితే, మనిషి ఎప్పుడూ అధికారిక రేఖాపటాలను ఉల్లంఘిస్తూనే ఉన్నాడు. తనవైన ఊహాపటాలను రాసుకుంటూనే ఉన్నాడు. నదీ నాగరికత వర్ధిల్లిన కాలంలో నది నడిచిన దారి వెంట మనిషి రేఖాపటాలను నిర్మించుకున్నాడు. ఇప్పటికీ ఆదివాసులు కొండలు, గుట్టలు, అడవులు, సెలయేళ్ల వెంబడి తమ రేఖాపటాలను గీసుకుంటూనే ఉంటారు. దూరాలను పెంచిన నాగరికమైన దారులకంటే అతి తక్కువ కాలంలో గమ్యం చేర్చే దారులు వారికి కరతలామలకంగా ఉంటాయి. దండకారణ్యాన్ని రేఖల్లో బంధించడానికి ప్రయత్నించి చూడండి, అది నేటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను విజయవంతంగా ధిక్కరించి వెక్కిరిస్తుంది.  దండకారణ్యాన్ని ఒక రాష్ట్రం చేసి ఆదివాసులకు ఇవ్వకుండా, యధేచ్చగా దోచుకోమని చెప్పి నాలుగు రాష్ట్రాలకు పంచిపెట్టడం; సమన్యాయ రాజ్యాంగం వెలుగులో అమలుచేసే పరమ దురన్యాయంగా అనిపిస్తుంది.  ఆ అన్యాయం  మూలాలు వేల సంవత్సరాల చరిత్రలో ఉన్నాయి. అంటే, కొన్ని అన్యాయాలు ప్రజాస్వామ్యం, సమానత్వం, సమాన హక్కుల వంటి ఆధునిక భావాలను కూడా ధిక్కరించి కొనసాగుతున్నాయన్న మాట.

నేనోసారి నరసాపురం(ప.గో.జిల్లా) వెళ్లినప్పుడు తెలిసిన ఓ సంగతి నన్నెంతో విస్మితుణ్ణి చేసింది. మత్స్యకారులు నరసాపురానికి దగ్గరలో ఉన్న సముద్రతీరం వెంబడే సైకిళ్ళమీద కృష్ణా జిల్లాలోని మచిలీపట్నానికి వెళ్ళి సాయంత్రానికి తిరిగొస్తారట!  సైకిల్ కంటే వేగంగా పయనించే ఏ వాహనం మీద వెళ్ళినా అది సాధ్యం కాదు. మా ఊరి గోదావరి గట్టు మీద నిలబడి చూస్తే, ఎదురుగా నదికి ఆవలి గట్టున తూర్పు గోదావరి జిల్లా ఊళ్ళు ఉంటాయి. కరణంగారు పొద్దుటే గొడుగు పుచ్చుకుని బయలుదేరి పడవలో గోదావరి దాటి తూ.గో. జిల్లా ఊళ్ళకు వెళ్ళి సాయంత్రం చీకటి పడే లోపల తిరిగొస్తూ ఉండేవారు.

భౌగోళిక రేఖాపటాలతో నిమిత్తం లేకుండా నదీతీర గ్రామాల వాళ్ళు ఒకే గుండెతో స్పందించడం నాకు ప్రత్యక్షంగా తెలుసు. పాపికొండలలో పేరంటపల్లి అనే ఓ గిరిజన గ్రామంలో బాలానంద స్వామి అనే ఒక సాధువు ఉండేవారు. పాపికొండలు నేడు మనం కొత్తగా గీసుకున్న ఖమ్మం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు కూడలి కావడం నాకో అద్భుతంగా తోస్తుంది. బాలానంద స్వామి గిరిజనులకు ఎంతో సేవ చేశారు. గోదావరి జిల్లా గ్రామాల వారందరికీ ఆయనమీద భక్తి. ఆయన వృద్ధాప్యంలో అస్వస్థులై రాజమండ్రిలో కాలం చేసినప్పుడు భౌతికకాయాన్ని లాంచీలో రాజమండ్రి నుంచి పేరంటపల్లి తీసుకెళ్లారు. లాంచీ వస్తున్న సంగతి తీరగ్రామాల వాళ్ళందరికీ తెలిసింది. ప్రతి ఊరి రేవులోనూ లాంచీ ఆపారు. ఊళ్ళకు ఊళ్ళు పిల్లా పాపాతో గోదావరి గట్టుకు కదలి వెళ్ళి భౌతికకాయాన్ని దర్శించుకుని కన్నీటి తర్పణం విడిచి వచ్చాయి. లాంచీ మా ఊరి రేవుకి వచ్చినప్పుడు గోదావరి గట్టుకు పరుగెత్తిన జనంలో నేను కూడా ఉన్నాను.

బమ్మెర పోతనామాత్యుడు చంద్రగ్రహణం రోజున తన ఊరి గోదావరిలో స్నానం చేసి, జపతపాలు పూర్తి చేసుకుని భాగవతాంధ్రీకరణకు శ్రీకారం చుట్టారని అంటారు. చాలా ఏళ్లక్రితం చంద్రగ్రహణం రోజునే నేను మా ఊళ్ళో గోదావరి స్నానానికి వెళ్లినప్పుడు ఈ సంగతి గుర్తొచ్చి ఆ సన్నివేశాన్ని ఊహల్లో చిత్రించుకోడానికి ప్రయత్నించాను. పోతనగారు సరిగ్గా ఇలాగే, ఇలాంటి పరిసరాలలోనే; గోదావరి గాలులు మోసుకొచ్చే శీతలస్పర్శ దేహాత్మలను పునీతం చేస్తున్న ఘడియల్లోనే భాగవతాంధ్రీకరణ ప్రారంభించి ఉంటారనిపించింది. ఈ చంద్రగ్రహణం రోజున మా ఊరి గోదావరి దగ్గరి సన్నివేశం నాటి పోతనగారి సన్నివేశానికి అచ్చమైన ప్రతికృతి అయుంటుందనే ఊహ నన్నెంతో ఉత్తేజితుణ్ణి చేసింది. పోతన భాగవత పద్య పరిమళాన్ని మా తీరగ్రామాల వాకిట గోదావరి గాలులే వెదజల్లి వెళ్ళాయనిపిస్తుంది.

ప్రకృతి గీసిన రేఖాపటాలు భిన్నంగా ఉంటాయి.

మనిషి ఉల్లంఘించినది భౌగోళిక రేఖాపటాలను మాత్రమేనా… కాదు. గణం, తెగ, వర్ణం, కులం, జాతి వగైరా చట్రాలను కూడా పురాకాలం నుంచి, నేటి కాలం వరకూ ఉల్లంఘిస్తూనే ఉన్నాడు. ఆదిమ కాలం నుంచి ఆధునిక కాలం వరకూ జాతుల సాంకర్యం ఎంత పెద్ద ఎత్తున జరిగిపోయిందో చెప్పుకోవడం ప్రారంభిస్తే దానికదే ఒక మహాగ్రంథం అవుతుంది. మనిషి అనుభవం ఇరుకునుంచి వైశాల్యానికి ఎదిగిందని మనం సాధారణంగా అనుకుంటాం. కానీ వైశాల్యం నుంచి ఇరుకులోకి కుదించుకుపోయిందని నాకు అనిపిస్తుంది. పురాచరిత్ర-చరిత్రలతో నా పరిచయం గొప్పదని చెప్పను కానీ, నాకొకటి గాఢంగా అనిపిస్తూ ఉంటుంది. మన పూర్వులు మనకన్నా విశాలమైన ప్రపంచాన్ని చూశారు. విశాలమైన అనుభవాలు పొందారు. వాటిని కొత్త కొత్త సమూహాలతో పంచుకున్నారు. సరిగ్గా ఇదే ఊహను హెచ్. జి. వెల్స్ (A SHORT HISTORY OF THE WORLD) కూడా ప్రకటించడం ఓ అపురూపమైన భావసారూప్యం . దూరాలను జయించడం అతి కష్టంగా ఉండే పురాకాలంలో మనిషి విశాల ప్రపంచాన్ని చూడగలితే, దూరాలను జయించిన నేటి గ్లోబల్ కుగ్రామంలో మనిషి అస్తిత్వం ఇరుకై పోతుండడం నాకు ఆశ్చర్యం గొలుపుతుంది.

మనం దేశాలు, ప్రాంతాలు, మనుషులు, మతాలు, భాషల మధ్యా; కాలాల మధ్యా కృత్రిమంగా కట్టుకున్న ఆనకట్టల మీదుగా, మన కళ్ళు కప్పి చరిత్ర ప్రవహిస్తూనే ఉంటుంది. తన అవిచ్ఛిన్నతను చాటిచెబుతూనే ఉంటుంది.  ఆమధ్య ఓసారి ఓ టీవీ చానెల్ పెట్టగానే అందులో ఓ చర్చ నడుస్తోంది. కొంతమంది యువతీ యువకులు రెండు పక్షాలుగా విడిపోయి ఆవేశంగా వాదించుకుంటున్నారు. అది కాశ్మీర్ గురించిన చర్చ అని వెంటనే తెలిసింది కానీ వారిలో ఒక పక్షం కాశ్మీరీ పండిట్లనీ, ఇంకో పక్షం కాశ్మీరీ ముస్లిం లనే విషయం కొంతసేపటికి కానీ తెలియలేదు. ఎందుకంటే, వారి ఆకృతులు, వేషభాషలు, హావభావాలు ఒక్కలానే ఉన్నాయి. ఒకే కుదురుకు చెందిన జనం అలా మతం కారణంగా విడిపోయి రెండుపక్షాలుగా చీలిపోయి తీవ్రంగా వాదించుకుంటున్న దృశ్యం నాకు విస్మయం కలిగించి ఆలోచన రేకెత్తించింది. నా ఊహల్ని చదివాడా అన్నట్టుగా ఆ చర్చలో పాల్గొన్న ఓ ముస్లిం యువకుడు “మీరూ మేమూ రక్తబంధువులం, మీ మీద మాకు వ్యతిరేకత ఎందుకుంటుంది, మనం ఎప్పటికీ సహజీవనం చేయవలసినవాళ్ళమే” అన్నాడు. ఎవరు ఏమనుకున్నా సరే, కాశ్మీరీలను మతాల లేబుళ్లతో గుర్తించకూడదని అప్పటికప్పుడు నేనొక వ్యక్తిగత నిర్ణయానికి వచ్చాను. మతం మధ్యలో వచ్చింది. వాళ్ళలో ప్రవహించే రక్తం తాలూకు గతం మతం కన్నా చాలా పురాతనం.

mahabharata1

నేటి భౌగోళిక రేఖాపటాలను. మతాలు తదితర ముద్రలను కాసేపు మరచి పోయి పైన పేర్కొన్న మహాభారత కథనానికి తిరిగి వెడదాం. చంపడం, చావడం నిత్యకృత్యంగా మారిన ఆయుధోపజీవులైన క్షత్రియగణాల గురించి అది చెబుతోందనుకున్నాం. మన చూపుల్ని మనదేశం నుంచి మరికొంత వాయవ్యంగా విస్తరించుకుని చూస్తే, అటు అప్ఘానిస్తాన్ నుంచి ఉత్తరభారతం వరకు అంతా ఆయుధోపగణాల నడవగా ఉండేది. అతి ప్రాచీనకాలంలో ఒక యుద్ధం జరిగింది. దశరాజ యుద్ధంగా అది ఋగ్వేదానికెక్కింది.  జలవనరులపై ఆధిపత్యం కోసం జరిగిన యుద్ధం అది. పది గణాలకు చెందిన రాజులు పరూష్ణీ(నేటి రావీ నదిలో కొంతభాగం) నదీజలాలను మళ్లించడానికి ప్రయత్నించారు. భరతులలో త్వష్టృ అనే ఉపగణానికి చెందిన సుదాస్ దీనిని ప్రతిఘటించాడు. దాంతో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సుదాస్ గెలిచాడు. సుదాస్ తో పోరాడిన పది గణాలలో ‘ఫక్తు’లు ఒకరు( మిగిలిన తొమ్మిది: సిమ్యు, తుర్వస, యక్సు, మత్స్య, భృగు, దృహ్యు, భలాన, అలీన, విశానిన్). ఫక్తులను అలెగ్జాండర్ కాలం నాటి గ్రీకులు Pakthyes అన్నారు. ఈ పక్తూన్లనే ఇప్పుడు పఠాన్లు అని కూడా అంటున్నారు. వీరికే పష్టూన్లనే పేరు ఉంది. అప్ఘానిస్తాన్ కు చెంది, గాంధీజీకి అనుయాయిగా మారి సరిహద్దుగాంధీగా ప్రసిద్ధుడైన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఈ తెగకు చెందినవారే.

ఈ ఆయుధోపజీవులను అంతమొందించే కార్యక్రమం మనదేశంలో కోసల, మగధ రాజులతో ప్రారంభమై గుప్త రాజుల వరకూ దాదాపు వెయ్యి సంవత్సరాలపాటు సాగింది. అందుకే అప్ఘానిస్తాన్ నుంచి ఉత్తరభారతం వరకూ ఒకప్పుడు ఆయుధోపజీవుల నడవ (కారిడార్)గా ఉండేదన్న మాట మనకిప్పుడు వినడానికి వింతగా ఉంటుంది.  ఈ ఆయుధోపజీవుల స్వైరవిహారమూ , వారి ఊచకోతా మనదేశంలో బుద్ధుడనే ఒక దార్శనికునీ, అహింస అనే ఒక  ఆదర్శాన్నీ సృష్టించాయి. మౌర్యరాజు అశోకుడికి ఈ ఆయుధోపజీవులే పెద్ద సవాలుగా మారారు. ఆ సవాలును ఎదుర్కొనే క్రమంలో అశోకుడు తీసుకున్న చర్యలు నేటికీ కొనసాగుతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అవతరింపజేశాయి. మనదేశానికి గతంగా మారిపోయిన ఈ ఆయుధోప జీవన వ్యవస్థ అప్ఘనిస్తాన్ లో వర్తమానం. అప్ఘానిస్తాన్ కు చెంది, సరిహద్దు గాంధీగా ప్రసిద్ధుడైన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఫక్తూన్ తెగకు చెందినవారే. గాంధీ అనే మరో అహింసావాది ప్రేరణ తో ఆయన ఆయుధోపజీవులను శాంతి మార్గం లోకి మళ్ళించడానికి కృషి చేసారు. కానీ ఆయన కృషి ఫలించిన జాడ లేదు. చరిత్ర అవిచ్ఛిన్నత కు నేటి ఆఫ్ఘనిస్తాను ఒక ఉదాహరణ.

— కల్లూరి భాస్కరం

 

 

అంకురం

balaji

పలమనేరు బాలాజీ అసలు పేరు కె.ఎన్.బాలాజీ. పుట్టిన ఊరునే ఇంటి పేరుగా మార్చుకుని రచనలు చేస్తున్నారు. జనవరి 19, 1974లో చిత్తూరు జిల్లాలో పుట్టారు. తొలికథ “ఎగురలేని విహంగం’ 1991లో ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. “గదిలోపలిగోడ’ పేరుతో ఒక కథాసంపుటి తెచ్చారు. ఇప్పుడు మరో కథాసంపుటి తెచ్చే పనిలో ఉన్నారు. కవిత్వమూ రాశారు. ఒక కవితా సంపుటి, రెండు నవలలు, ఒక వ్యాస సంపుటి ప్రచురించారు. ఈయన రచనలు వివిధ భాషల్లోకి అనువాదమయ్యాయి. వివిధ పురస్కారాలు అందుకున్నాయి. ప్రస్తుతం చిత్తూరుజిల్లా పెద్దపంజాణిలో ఎంపిడీవోగా పనిచేస్తున్నారు బాలాజీ. — -వేంపల్లె షరీఫ్

***

Kadha-Saranga-2-300x268

దుర్గమ్మ గుడి ముందు సందడిగా ఉంది.

ఇందిరమ్మ కాలనీలో ఆరోజు గ్రామసభ జరుగుతోందని, ఒకరోజు ముందే దండోరా కొట్టడం వల్ల, జనం అక్కడ గుమిగూడి పోయారు.

మధ్యాహ్నం మూడు దాటింది. ఎండ చుర్రుమంటోంది. ఆ పంచాయతీలో ఉపాధి హామీ పనుల్ని పర్యవేక్షించే ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రమణ వేపచెట్టు నీడలో చాపపరిచి కూర్చుని ఉన్నాడు. రెండు పాత చాపలు ఒకదాని పక్కన ఒకటి పరచి  ఉన్నాయి. ఆ రెండు చాపల చుట్టూ నాలుగు ఇనుప కుర్చీలు, రెండు ప్లాస్టిక్‌ కుర్చీలు పహారా కాస్తున్నట్లు ఉన్నాయి. చాపపైన తెల్లకాగితాలు, గ్రామసభ రిజిష్టరు, హాజరు పట్టిక, ఇంక్‌ ప్యాడ్‌, ప్లాస్టిక్‌ సంచిలో కొన్ని అర్జీలు రమణ ముందు పేర్చబడ్డాయి.

‘‘పంచాయతీ కార్యదర్శి, సర్పంచు వచ్చారంటే ఎంత… అరగంటలో అయిపోతుంది మీటింగ్‌. వాళ్లింకా రాలేదు. ఎండ చూస్తే మనుషుల్ని కాల్చేసేలా ఉంది’’ తనలో తాను గొణుక్కుంటున్న రమణ మాటలు అక్కడికి సమీపంలో ఇండ్ల అరుగుల పైన కూర్చున్న వారి చెవిన పడ్డాయి.

కుయ్యప్ప అరుగుపైనుండి లేచి నిలబడి, వదులైన లుంగీని సర్దుకుని గట్టిగా బిగించి కట్టుకుని, మురికి కాలువలోకి వక్కాకు ఎంగిలి ఊసి, మళ్లీ అరుగు పైన సర్దుకుని కూర్చుంటూ ‘‘ఎంతసేపు సూడాలా అబ్బోడా?’’ అన్నాడు విసుగ్గా మొహం పెట్టి.

అసలామాటే వినబడనట్లు, తనకా మాటతో ఏ సంబంధమూ లేదన్నట్లు రమణ తన ముందున్న ప్లాస్టిక్‌ సంచిలోంచి అర్జీల్ని, దరఖాస్తుల్ని బయటకు లాగి ఒక్కదాన్నే పరిశీలనగా చూస్తూ, కాగితాలు అటూ ఇటూ తిప్పుకుంటూ ఉండిపోయాడు.

గూని సుబ్రమణ్యం ఇంటి ముందున్న చేతి బోరులోంచి ఎట్లాగైనా నీళ్లు రప్పించాలనే లక్ష్యంతో ఇద్దరమ్మాయిలు పైట కొంగుల్ని నడుములకు బిగించి ఎదురెదురుగా నిలుచుని బోర్‌ హ్యాండిల్‌ని నాలుగు చేతులతో బలంగా ఒడిసి పట్టుకుని, పైకి కిందకి ఊపుతూ ఉంటే ఆ ఊపుకి అనుగుణంగా వాళ్లిద్దరి శరీరాలూ ముందుకూ వెనక్కూ కదులుతూ ఉన్న దృశ్యాన్ని కళ్లప్పగించి చూస్తున్నాడు నాగవేలు. అతడి కళ్లు ఎదుటి దృశ్యం వైపే కేంద్రీకరించబడి ఉన్నాయి. మెడ మీద, ముఖం పైన కారుతున్న చెమటను ఎంత మాత్రం పట్టించుకునే స్థితిలో అతడు లేదు. అతడి నోట్లోంచి చొంగ కారిపోతున్న సంగతిని కూడా అతడు విస్మరించాడు.

మునిరాజులు తన టీ అంగడి ముందు నిలబడ్డాడు. సన్నగా పొడవుగా చామన చాయలో ఉన్నాడు. పాతికేళ్లు దాటకపోయినా వయసుకు మించిన ముదురు తనమేదో అతడి ఒంట్లో, మొహంలో కనబడుతోంది. టీ బాయిలర్‌ ముందు నిలబడి, నిప్పు కణికల్ని రాజేస్తూ, బొగ్గుల్ని వేస్తూనే ఆ ఆడవాళ్లిద్దరి వైపు కళ్లార్పకుండా చూస్తున్నాడు.

ఆ టీ అంగట్లోనే కూర్చుని, చినిగి పేలికలైన ఆనాటి దినపత్రికలోని ఒకానొక భాగంలో కనబడుతున్న సినిమా హీరో హీరోయిన్ల వైపు, మునిరాజులు వైపు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రమణ వైపు, నాగవేలు వైపు, బోరింగ్‌ వద్ద నీళ్ల కోసం నానా తంటాలు పడుతున్న ఆ పడుచువాళ్లు వైపు తలతిప్పి మార్చి మార్చి చూస్తున్నాడు అరవయేళ్ల శంకరయ్య. అతడిది పూర్తి బట్టతల. తల్లో ఒక్క వెంట్రుకైనా లేదు. బట్టతల పై నుండి కారిపోతున్న చెమటను తువ్వాలుతో తుడుచుకుని బీడి ముట్టించుకున్నాడు.

టివిఎస్‌ మోపెడ్‌ శబ్ధం, హారన్‌ రెండూ ఒకేసారి వినిపించేసరికి, కాగితాలు మరోసారి సర్ది రమణ చాప పైనుండి లేచి నిలుచుని, వీథి మొదలువైపు చూసాడు. వస్తున్న వాళ్లు సర్పంచు, పంచాయతి కార్యదర్శే అని నిర్ధారించుకున్న తర్వాత చేతులు ఊపుతూ చుట్టూ అక్కడక్కడా గుమిగూడిన జనాల్ని, అక్కడికి దూరంగా ఇండ్ల అరుగులపైన కూర్చున వాళ్లని, టీ అంగడిలో కూర్చున్న శంకరయ్యని.. పేర్లు పెట్టో, వరసలు పెట్టో పిలుస్తూ… ‘‘రండి రండి సెక్రటరి మేడం, సర్పంచు అన్న ఇద్దరూ వచ్చేసినారు. మీరందరూ బిరీన్నా వస్తే మీటింగ్‌ స్టార్ట్‌ చేసేద్దాం. ఈ మీటింగ్‌ అయినాక నేను మళ్లీ పలమనేరుకు పోవల్ల. యంపిడిఒకి రిపోర్ట్‌ రాసివల్లంట. తొందరగా రండి’’ పెద్దకంఠంతో గొంతెత్తి జన సమీకరణ మొదలుపెట్టాడు రమణ.

చాలాసేపు బోరింగ్‌ కొట్టీ కొట్టీ ఆడవాళ్లిద్దరూ అలసిపోయారు. రెండు బిందెల నిండా నీళ్లు నింపుకుని అక్కడి నుండి కదిలారు. వాళ్ల వంతు అయిపోగానే అక్కడే కాచుకుని ఉన్న మరో ఇద్దరు నడి వయస్కురాళ్లు, బోరింగ్‌ హ్యాండిల్‌ను చెరో వైపు పట్టుకుని, ముందుకూ వెనక్కూ ఊగిపోతూ నీళ్లకోసం తమ ప్రయత్నాన్ని ప్రారంభించారు.

‘‘పుష్పావాళ్లు నిలపక ముందే మనంగానా ఇంకొంచెం ముందుగానే మొదలెట్టి ఉంటే.. నీళ్లు లోపలికి ఎనెక్కి పోయిండేవి కావు. రొంత లేటయ్యిందానికి ఇప్పుడు చూడుమే. నీళ్లు లోపలికి ఎళ్లిపోయినట్లుండాయి. ఈ నా బట్టలు బోరింగ్‌ సంగతి పట్టించుకుంటే కదా. బిందె నీళ్ల కోసం ఎండలో బోరింగ్‌ కొట్టీ కొట్టీ చేతులు బొబ్బలెక్కి పోతావుండ్లే’’ అంది విజయమ్మ కసాబిసా వక్కాకు నములుతూ.

ఇంకొకామె వక్కాకు ఎంగిలి దూరంగా ఊస్తూ ‘‘అరుగులపైన కూర్చుని ఆడోళ్ల నడుముల గురించి, పిర్రల గురించి మాట్లాడమంటే మాట్లాడతారు కానీ మన మొగాళ్లు ఆ సర్పంచు కాడనో, ఎండిఒ కాడనో పోయి నాలుగు పైపులు ఇప్పించుకుని, ఆ మెకానిక్‌ కృష్ణయ్యని తోడుకుని వచ్చి బోరింగు రిపేరు చేయించే సత్తా మాత్రం వీళ్లకు లేదమ్మే విజయా’’ అంటోంది గసపోస్తా గోవిందమ్మ.

afsr

ఆ మాటలు గుడి ముందు చేరిన జనాల చెవులకు వినబడుతూనే ఉన్నాయి. కుర్చీలపైన నింపాదిగా కూర్చున్న సర్పంచుకూ వినిపించాయి. పంచాయతీ కార్యదర్శికి వినిపించాయి. అందరికీ వినపడాలనే గట్టిగానే ఇద్దరూ మాట్లాడుతున్నారనే సంగతి అర్థమయ్యాక శంకరయ్యకు నవ్వొచ్చేసింది.

ప్లాస్టిక్‌ కుర్చీలో కూర్చుంటూనే సర్పంచుతో మాట కలిపాడు.

‘‘ఏమిరా మునస్వామి, ఆ ఆడోళ్ల మాటలు విన్నావు కదా. బిందె నీళ్ల కోసం కన్నగసాట్లు పడతా ఉండార్రా నాయినా. ఈ మీటింగ్‌లు, లోన్లు మళ్లింకా సూద్దాం. ముందు నీళ్ల కత సూడ్రా, పుణ్యం ఉంటుంది.’’

‘‘ఆ… ఆ.. చూస్తాంలే తాతా. బోరింగ్‌ మెకానిక్కు క్రిష్టప్పకు జ్వరమని ఆఫీసు తావకే రావడం లే. వారం దినాలవతా ఉండాది మనిషి కనబడి. బోరింగ్‌ రిపేర్‌ అని ఎవరైనా మాకు ముందుగా చెప్పినారా? ఆ ఎండిఒ ఆఫీసుకో, నాకో, సర్పంచుకో ఎవరికో ఒకరికి ఫోనయినా చేసిండ కూడదా? ఊర్లో ఇంతమంది జనాలుండారు కదా. అందరి చేతుల్లో సెల్లులు కూడా ఉండాయి కదా’’ అంది పంచాయితి కార్యదర్శి లలితమ్మ.

‘‘మంచి స్కీం ఉండాది. డబ్బులిస్తాం. ఇంటింటా మరుగుదొడ్డి కట్టుకోండయ్యా అంటే మాత్రం వినబడనట్లు ఉంటారు. మాకాడ డబ్బేడ ఉందమ్మా అని అంటారు. సెల్‌ఫోన్లు మాత్రం ఇంటికి రెండు మూడయినా ఉండాయి కదా. ఆ బడాయికేం తక్కువ లేదు జనాలకి’’ మెల్లగానే అయినా లలితమ్మ గొణుగుడు అందరికీ వినబడిరది. ఆమె మాటలు అయిపోగానే సర్పంచు గొంతు విప్పాడు.

‘‘మేడం ముందు మనం వచ్చిండే పని సూడండ. ఊరన్నాక సమస్యలు ఉండనే ఉంటాయి. ఈ రోజు ఇదొకటి. రేపు ఇంకొక్కటి. ఈ రోజు ఈ ఊర్లో, రేపు ఇంకొక ఊర్లో. మొన్నాడు ఇంకో ఊర్లో. మనకిది మామూలే కదా. ఎంత చేసినా చేసిండే మంచిని జనాలు నిముషాల్లో మరచిపోతారు. మళ్లింకా ఏం ఊరికే చేస్తా ఉండావప్పా అని మొహం పైనే అడిగేస్తారు. నా గ్రహచారం బాలేక, శనేశ్వరుడు నెత్తిపైన కూర్చుని ఉంటే సర్పంచుగా నామినేషన్‌ ఏశాను. మన బాధలు ఈ జనాలకు అర్థం కావులే. జనాలు ఏమైనా అడగొచ్చు కానీ నేను కడుపు కాలి ఏమైనా అంటే మాత్రం జనాలు అడ్డం తిరగతారు.’’ అని ఆగాడు. చుట్టూ చూసి మళ్లీ కొనసాగించాడు.

‘‘ఏదైనా అంటే మాత్రం, అంతే లేబ్బా. మీకు మా ఊరంటే చులకన. నీకు మీ ఊరే గొప్ప. అన్ని పనులూ మీ ఊరికే చేస్తా ఉండావే కానీ ఏ పొద్దయినా మా ఊరివైపు ఎగాదిగా చూసిండావా? నిన్ను మీ ఊరోళ్లు మాత్రమే ఓట్లేసి ఎన్నుకోలా? ఈ పంచాయితీలో ఉండే పన్నెండూరోళ్లు నిన్ను సర్పంచుగా ఎన్నుకోనుండారప్పా. నువ్వా సంగతి మరచిపోతాండావు అని నాకే పాఠాలు చెప్తారు జనాలు. ఏం చేసేది మేడం? వాళ్లు అడిగేదానికే నన్ను సర్పంచును చేసిండారు. సిగ్గు మానం లేకుండా నేను జనం దగ్గర అయిన కాడికి అడిగించుకునే దానికే సర్పంచు అయి కూర్చొండాను. అంతా నా ఖర్మ’’ అని ఎడమ చేత్తో నుదురు కొట్టుకున్నాడు.

శంకరయ్య ముందుకు వచ్చి సర్పంచును సముదాయించే ప్రయత్నం చేసాడు.

‘‘ఇప్పుడేమయ్యిందిరా అబ్బోడా. నీ గురించి అందరికీ తెల్సు కదా. ఏదో జనం బాధల్లో ఉండేప్పుడు కోపంలో బాధతో నాలుగు మాటలంటారు. దానికే నువ్వు ఇదయిపోతే ఎట్లా చెప్పు. నీకు ఓపికుండాల. ఇంకా ఎన్ని పదవులు చూడాల నువ్వు ముందు ముందు’’ ఆ మాటలు విని అడ్డంగా తలూపుతూ నవ్వాడు సర్పంచు.

‘‘నేనా.. ఇంకోసారా? నేను గానా ఇంకోసారి ఎలక్షన్లో నిలబడితే నీ ఎడమకాలి చెప్పుతో నన్ను కొట్టు తాతా. అయినా బుద్దీ జ్ఞానం ఉండేవాడు ఎప్పుడూ రాజకీయాల్లోకి రానేరాడు. తెలివైనోడయితే ముఖ్యంగా సర్పంచు పదవి మాత్రం కావాలనుకోడు.’’

సర్పంచు మాటలకు మధ్యలోనే అడ్డమొచ్చాడు కుయ్యప్ప.

‘‘ఏమైందన్నా ఇప్పుడు. పంచాయతీలో పనులు చేసుకునేది, బిల్లులు వసూలు చేసుకునేది, చెక్కులు రాసుకునేది అంతా నువ్వే కదన్నా. పంచాయతీలో అయినా మండలంలో అయినా, కలెక్టర్‌ ఆఫీసులో అయినా యాడైనా నీకుండే పరపతి నీకు ఉండనే ఉంటుంది గదా’’ నవ్వుతూనే అడిగినా కుయ్యప్ప మాటల్లోని వెటకారం అర్థమయ్యి సర్పంచు అతనికి సమాధానం చెప్పే ప్రయత్నం చేసాడు.

‘‘మీరంతా ఇండ్ల కాడ, అరుగుపైన, రచ్చబండ దెగ్గిరా కూర్చుని ఇట్లే అనుకుంటా ఉండారు. సర్పంచు.. పదవికే సర్పంచు. మీరనే గుర్తింపు, గౌరవం మాట ఎట్లా ఉన్నా, ముందు చేతిలోంచి దుడ్లు పెట్టి పనులు చేయించల్ల. కాలువలు శుభ్రం చెయ్యల్ల. ట్యాంకులు శుభ్రం చెయ్యల్ల. ఎక్కడైనా పైప్‌లైన్‌ దెబ్బతినింటే దాన్ని మార్చాల్నా. గేట్‌ వాల్వ్‌ మార్చల్ల. ముందు మనం డబ్బు పెట్టి పనిచేసేటప్పుడు ఎవురూ రూల్స్‌ మాట్లాడరు. పనయిపోతే చాలంటారు. నాకత మళ్లీ కదా ఉండేది.’’

కొంతమంది ఆడవాళ్లు ఖాళీ బిందెలతో అక్కడికి చేరుకున్నారు. వాళ్ల వైపే చూస్తూ తలాడిరచి, ఏదో ఆలోచించుకుని, మళ్లీ గొంతు సవరించుకుని మాటలు కొనసాగించాడు.

‘‘మనం సొంతంగా ఖర్టు పెట్టిండే దుడ్లు గవర్మెంటోడి లెక్క ప్రకారం రూలు ప్రకారం మన చేతుల్లోకి రావల్లంటే మాటలు కాదు. మా తాత మా ముత్తాతలు దిగివస్తారు. ఏయి రికార్డింగ్‌ చేయాలంటే తీర్మానం కావల్లంటాడు. తర్వాత ఎస్టిమేట్‌ అంటాడు. వారం పది దినాలు ఏయి దగ్గరకు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ దగ్గరకు తిరిగితే ఎస్టిమేట్‌ పనవుతుంది. తర్వాత యంబుక్‌ కోసం ట్రెజరీతో చలాన్‌ కట్టాల్నా. ఆ తర్వాత ఆ చలాన్‌ చూపించి ఎండిఒ ఆఫీసులో ఎంబుక్కు తీసుకోవల్ల. మళ్లీ ఇంజనీర్‌ దగ్గరకు పోయి బిల్లు రాసుకోవల్ల. ఆయనడిగే బిల్లులు, రశీదులు, మస్టర్లు అన్నీ తెచ్చివ్వల్ల ` మళ్లింకా డియీ సార్‌ని కలవల్ల. ఆయన ఒక పట్టాన దొరకడు. అక్కడ చెక్‌ మెజర్‌మెంట్‌ అయినాక చెక్కు రాసుకుని ట్రెజరీకి పోతే అక్కడ వాళ్ల దయాదాక్షిణ్యాల పైన మన చెక్కు పాసవుతుందా లేదో ఎంత డబ్బు ఎప్పుడు చేతికొస్తుందో తెలీదు. ఇదంతా ఒక ఎత్తైతే.. వీళ్లెవురూ మనం పోయిన టయానికి దొరకరు. ఇంటి కాడనో, ఆఫీసు కాడనో ఐదారుసార్లు తిరిగీ మళ్లీ వాళ్లను పట్టుకుని వాళ్ల దగ్గర సంతకాలు చేయించుకునే సరికి దేవుడు కనబడతాడు. టౌనుకు పోతే టీలకే ఎంత డబ్బు ఖర్చవుతుందో తెల్సా తాతా. మర్యాదకి టీలు తాపేదానికి, సిగిరెట్లు ఇప్పించే దానికి, వీళ్ల కోసం తిరిగి దానికే నూర్లకు నూర్లు ఖర్చయిపోతాయి. దీనికంతా లెక్కేడవుంటుంది. ఇదంతా అనామత్తు ఖర్చు. ఇదంతా అయినాక సంవత్సరానికోసారి ఆడిట్టోళ్లు వస్తారు. మా అల్లుళ్లని కూడా నేను ఏ పొద్దూ అంత మర్యాదగా చూసిండనంటే నమ్ము. వాళ్లకి ఏ లోటూ ఉండకూడదు. బిర్యానీలే తింటారు వాళ్లు. కంపెనీ నీళ్లే తాగుతారు. మామూలు జనం తినే తిండి, తాగే నీళ్లు వాళ్ల ఒంటికి పడవంట. ఎవురైనా సరే తాత ఏ డిపార్ట్‌మెంటు ఆఫీసరన్నా అయిపోనీలే. ఊర్లోకి రాగానే ఎవుర్ని అడగతాడో మీరే ఇంతకు ముందు చెప్పినారు కదా. వచ్చే వాళ్లందరికీ వాళ్లు ఏం తింటారో దాన్ని వండయినా పెట్టల్ల. లేదా టౌన్‌ లోంచి తెప్పించయినా పెట్టల్ల. ఆ కల్లా సూడు ఆడోళ్లంతా సర్పంచు నా బట్ట వచ్చిండాడు కదా అని ఖాళీ బిందెలు ఎత్తుకుని వచ్చిండారు’’ అని అక్కడ చేరిన ఆడవాళ్లవైపు చూసాడు సర్పంచు. అతని గొంతులో వణుకు స్పష్టంగా తెలిసిపోతోంది.

‘‘మీకు బోరింగు రిపేరు చేయించాల. అది నా బాధ్యత. నాకు బోరింగ్‌ రిపేర్‌ అయిందని నీళ్లు సరిగ్గా రావటం లేదని ఈ ఇలాకాలో ఎవరైనా ముందుగా చెప్పినారేమో… మీరే చెప్పండమ్మా. మీ ఊర్లో నీళ్ల సమస్య ఉండాదని నాకు ముందుగా తెల్వదు. ఇప్పుడే తెల్సింది. మీకూ ఆ బోరింగ్‌ కృష్టప్ప కథ తెలిసిందే కదా. మనిషి ఒక పట్టాన దొరకడు. ఇక్కడంటే అక్కడంటాడు. అక్కడంటే ఇక్కడంటాడు. వాడ్ని పట్టుకుని రెండు రోజుల్లో మీ బోరింగ్‌ రిపేర్‌ చేయిస్తానమ్మా. మీరు ఎలబారండి. ఈ దినం ఈడ ఏదో లోన్లు కోసం పేర్లు రాసుకునేదానికి వచ్చిండాం. లోన్లు కావల్సినోళ్లు ముందుకు రాండి. ఏమ్మా సెక్రటరీ మేడం… ఆ పేర్లు చదువమ్మా…’’

ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గ్రామ సభను ఏదో విధంగా ముగించి ముందు అక్కడి నుండి బయట పడాలనే అతడి ప్రయత్నం కొందరికి అర్థమయ్యింది. కొందరు మాత్రం వేళాకోళంగా నవ్వుతూ సర్పంచు మొహంలో మారుతున్న హావభావాల్నే గమనిస్తున్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ అందించిన కాగితాన్ని చేత్తో పట్టుకుని, నిలుచుంది పంచాయతీ కార్యదర్శి.

ఖాళీ బిందెలతో అక్కడకు చేరిన ఆడవాళ్లల్లో కొందరు బిందెలతో వెనుతిరిగారు. నిలబడి జరుగుతున్న తతంగాన్ని చూస్తూ అక్కడే నిలబడ్డారు కొందరు. ఐదారు మంది మాత్రం బిందెల్ని దూరంగా ఉంచి లోన్ల వివరాలు వినేందుకు ఆసక్తిగా గుడి ముందుకొచ్చి నిలబడ్డారు.

పంచాయతీ కార్యదర్శి లలితమ్మ మొహంలో ఎందుకో విసుగు స్పష్టంగా కనబడుతోంది. ఎండ వేడిమికి మొహం పైన కారిపోతున్న చెమటను ఖర్చీప్‌తో తుడుచుకుంది.

ఇద్దరు చిన్న పిల్లలు చెంబులో మజ్జిగ తీసుకుని వచ్చారు. ప్లాస్టిక్‌ గ్లాసులు రమణ ముందుగానే సిద్ధం చేసి ఉంచాడు. వాటిల్లో మజ్జిగ నింపి సర్పంచుకూ పంచాయతీ కార్యదర్శికీ శంకరప్పకూ అందించాడు రమణ.

మజ్జిగ తాగి మరో గ్లాసు మజ్జిగ అడిగి మరీ తీసుకుంది లలితమ్మ. చీర కొంగుతో పెదాలు తుడుచుకుంటూ, రుణపథకాల వివరాలు చెప్పసాగింది.

ఫలానా స్కీం క్రింద పంచాయతీకి ఇన్ని రుణాలు మంజురైనాయని, ఆసక్తి, అర్హత ఉండేవాళ్లు పేర్లు చెపితే తాను రాసుకుంటానంది. ఆమె చెప్పడం ఆపగానే ఒక్కసారిగా అక్కడ కలకలం చెలరేగింది.

‘‘మా పేర్లు రాసుకోండి మేడం. ముందు నాది రాసుకోమ్మా తల్లా. అక్కా మా పేర్లు రాసుకో అక్కా. మేడం ఇంట్లో ఎందరికిస్తారు? ఇంటికి ఒకటేనా? ఎన్నయినా ఇస్తారా? మేడం నేనూ మా ఆయనా ఇద్దరూ రాసుకోవచ్చా? మేడం ఏయే లోన్లు ఇస్తారు? సబ్సిడి ఎంత? బ్యాంకు లోన్‌ ఎంత? ష్యూరిటీ ఏం అడగరా బ్యాంకోళ్లు. అయినా తల్లీ ఈ లోన్లన్నీ నిజంగా వస్తాయంటావా?’’

ఒక్కసారిగా ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడ్డం మొదలయ్యే సరికి అక్కడ ఎవరేం మాట్లాడుతున్నది ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. గొంతు పెంచి అరచలేక నిస్సహాయంగా రమణ వైపు చూసి ‘‘రమణా’’ అంది పంచాయతీ కార్యదర్శి.

రమణ చప్పట్లు తడుతూ గట్టిగా అరిచాడు ‘‘అన్నా, అక్కా అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. దయచేసి ఎవరూ మాట్లాడవద్దు. మేం అడిగినదానికి మాత్రం జవాబు చెప్పండి. ఒక్కొక్కళ్లనే అడుగుతాం. అంతా కూర్చోండి. ప్లీజ్‌’’ పెద్ద గొంతుతో చెప్పిందే రెండు మూడు సార్లు రమణ అరచి చెప్పాక అక్కడ అంతా సద్దుమణిగింది. ఉన్నట్లుండి గుంపు చెదిరిపోయింది. జనాలు పక్కకు తప్పుకుంటుంటే, ఏం జరిగిందా అని సర్పంచు, పంచాయతీ కార్యదర్శి, రమణ ముగ్గురూ ఒకేసారి తలలు తిప్పి అటు వైపు చూసారు.

శంకరయ్య చివాలున లేచి నిలబడ్డాడు. ‘‘ఎన్ని తూర్లు చెప్పాలమ్మే నీకు. గుడిసె వదిలి బయటకు రావద్దని. మానం మర్యాద, చిన్నా పెద్దా అనే భయమే లేదు. ముందిక్కడ నుండి ఎలబారి పోమ్మే. నీకు ఇక్కడేం పని’’ అంటూ కసురుకున్నాడు.

‘‘అసలా అమ్మాయిని ఊర్లోంచే దూరంగా ఎక్కడికైనా తరిమేద్దాం అంటే పిలకాయలు ఒప్పుకోలే. పోనీలే ఆడబిడ్డ బతికింది, ఏదో ఒక మూలన పడి ఉంటుంది అనుకుంటే.. గుడిసె వదిలి ఊర్లోకి వస్తా పోతూ ఉంటే ఊర్లో జనాలకు రోగాలు రాకుండా ఉంటాయా? ముందు ఆ ఆడదాన్ని ఇక్కడి నుండి పంపేయండి’’ గట్టిగా అరుస్తున్నాడు కుయ్యప్ప.

చెదిరిపోయిన గుంపు మధ్యలో బెదురు చూపులతో, ఎముకల గూడులా నిలుచుని ఉందామె. జుట్టు రాలిపోయింది. చీరను బట్టి ఆ ఆకారాన్ని స్త్రీగా గుర్తించాల్సి వస్తోంది.

రెండు చేతులూ జోడిరచి ‘‘గవర్మెంటోళ్లు వచ్చిండారంట కదా. నాకేదైన సహాయం చెయ్యండయ్యా. పుణ్యం ఉంటుంది’’ అని మాత్రం అంది. ఆ గొంతు స్త్రీ గొంతులా లేదు. మగ గొంతులానూ లేదు. అసలా కంఠస్వరాన్ని ఎవరిదో పోల్చుకోవడం కూడా కష్టమే.

ఆ మాట మాత్రం అప్పచెప్పి ఆమె అక్కడి నుండి కదిలింది. ఆమె కనుమరుగయ్యేంత వరకూ చూసి, తర్వాత కూర్చున్నాడు శంకరయ్య. తలవంచుకునేశాడు మెల్లగా.

‘‘ఎవరామె ఇంతకు ముందెప్పుడూ ఊర్లో కనబడినట్లు లేదే’’ రమణవైపు చూస్తు అడిగింది పంచాయతి కార్యదర్శి. మెల్లగా తలపైకెత్తాడు శంకరయ్యా. అతని మొహం నిండా బాధ కనబడుతోంది.

రమణ ఏం చెప్పాలా అన్నట్లు తడబడి శంకరయ్య వైపు చూసాడు. అతడి అవస్థ గమనించి శంకరయ్యే నోరు మెదిపాడు.

‘‘నాకు మనవరాలి వరస అవుతుందిలేమ్మా. మొగుడు చచ్చిపోయాడు. వాడు పోయాక తెలిసింది. ఆమెకు ఎయిడ్స్‌ అని. దాని మొగుడు జబ్బు విషయం దాచిపెట్టి వాడి దారిన వాడు దీన్ని అనాథలా వదిలేసి పోయాడు. దాని అదృష్టం దానికి పిల్లోల్లు లేరు. ఎవరో ఒకరు దయపెట్టి అంత సంగటి వేస్తే తిని బతకతా ఉండాది. దాని జబ్బు బాగవ్వాలంటే మంచి తిండి, మందూ మాత్రలు, పండ్లు, కూరగాయలు తినాలంటారు. అవన్నీ ఎక్కడ కుదురుతుంది లేమ్మా. దాని టయిం అట్లా ఉండాది. దేవుడు చిన్నసూపు చూసినాడు లేమ్మా. దాని పేరు విశాలాక్షి.’’

జనంలో అక్కడక్కడా గుసగుసలూ మొదలయ్యాయి.

‘‘మీరందరూ ఒప్పుకుంటే, సరేనంటే మేం సర్వే చేసి, విచారించి గుర్తించిన అర్హుల పేర్లు మీకు ఇక్కడే ఇదే గ్రామసభలో చదివి వినిపిస్తాం. మీరందరూ సరేనంటే వీళ్లకి గవర్నెంటు ద్వారా సబ్సిడీ, బ్యాంకుల ద్వారా అప్పులు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఏమంటారు?’’

తడబాటు లేకుండా స్పష్టంగా మాట్లాడుతున్న పంచాయతి కార్యదర్శి మాటలకు ఈసారి ఎవరూ అడ్డొచ్చే ప్రయత్నం చెయ్యలేదు.

సర్పంచు లేచి నిలబడ్డాడు. అందరి దృష్టీ అతడిపైనే నిల్చింది. ‘‘ప్రతి సంవత్సరం గవర్నెంటు, బ్యాంకులు కలిసి అప్పులూ, సబ్సిడీలూ ఇస్తానే ఉంటాయి. ఊర్లో ఉండే పెద్ద మనుషులు వాళ్లూ వాళ్లూ మాట్లాడుకుని ఏవో నాలుగు దొంగ పేర్లు రాసి బీనామీల్ని చూపించి సబ్సిడీ సొమ్ము స్వాహా చేస్తా ఉంటారు. ఎవురికి ఏం లోన్‌ మంజూరైందో ఎవరికీ తెలియదు. ఇప్పుడట్లా కాకుండా మీ అందరికీ తెలిసే రకంగా, మీ అందరి ఆమోదంతోనే రుణాలు మంజురుకు పేర్లు సిఫారసు చేద్దాం అనుకుంటున్నాం. మాకు మీ సహకారం అవసరం. మీరు కాదూ కూడదూ అంటే మా ఎంపిక మేం చేసుకుంటాం. మా పద్ధతులేవో మాకు ఉండనే ఉన్నాయి.’’

సర్పంచు కూర్చున్నాక ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. మెల్లగా ఎవరో గొణుక్కుంటున్నారు. కానీ పెద్దగా ఎవరి దగ్గర నుండీ వ్యతిరేకత రాలేదు.

హఠాత్తుగా గుంపులోంచి ఓ కుర్రాడెవరో ఇరవయ్యేళ్ల లోపు వయస్కుడు, ముందుకొచ్చి బొంగురు గొంతుతో అరవటం మొదలుపెట్టాడు.

‘‘అయినా మీరే ఎంపిక చేసేటట్లయితే ఇంక ఈ గ్రామసభ ఎందుకు? మాకేం పనీ పాటా లేదని ఇక్కడికి రమ్మన్నారా? మా అందరికీ నచ్చేలా మీరే ఎంపిక చేస్తామని అంటున్నారు కదా. ముందా పేర్లేమిటో చదివి వినిపించండి. వాళ్లకంత అర్హత ఉందో లేదో మేం తేలుస్తాం.’’

ఆ కుర్రాడి మాటలు పూర్తయ్యేంత వరకూ ఆగలేకపోయాడు రమణ.

‘‘ఒరే హనుమంతూ కూర్చోరా. ఎందుకట్లా అబ్బరిస్తా ఉండావు’’ అన్నాడు రమణ ఆ కుర్రాడికి అడ్డొస్తూ.

రమణ అట్లా మాట్లాడేసరికి ఆ కుర్రాడికది అవమానంగా అనిపించినట్లయ్యిందేమో. గొంతు మరింత పెంచాడు.

‘‘రమణా మీది ఈ ఊరు కాదు. మా కులమూ కాదు. నువ్వెందుకు మధ్యలో తల దూరుస్తావు? నీ పని నువ్వు చూసుకో. ఇది మా ఊరి వ్యవహారం. ఏదైనా అడిగే హక్కు, తెలుసుకునే హక్కు మాకుంది’’ అన్నాడు హనుమంతు. అతడికి తోడుగా మరో ఇద్దరు కుర్రాళ్లు అతని పక్కన నిలబడ్డారు.

ఏదో మాట్లాడబోతున్న రమణను వారించి, పంచాయతి కార్యదర్శి హనుమంతుకు సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది.

‘‘నిరుపేదల్లో నిరుపేదల కోసం ఉద్దేశించిన రుణాలు చాలా వరకు బినామీల పేరుతోనే స్వాహా అయిపోతూ ఉన్నాయి తమ్ముడూ. నేను కింది స్థాయి కులాల నుండి వచ్చినదాన్ని. మన ఎంపిడిఒ కూడా రిజర్వ్‌డ్‌ కులాలకు చెందిన వ్యక్తి కావడం వల్లే ఏదో ఎండిఒ ఆఫీసులో కూర్చుని నాయకులు, విలేకరులు, కుల నాయకులు, దళారులు చెప్పే పేర్లు రాసి రుణాలు మంజూరు చేసే పురాతన సంప్రదాయాన్ని కాదని, ఇట్లా నన్ను మీ ఊరికి పంపించారు. ఒక మంచి వ్యక్తి మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు అతనికి సహకరించాలని నేను, సర్పంచు అనుకున్నాం. ఎవ్వరూ ఈ లబ్ధిదారుల ఎంపికలో చెయ్యేత్తి చూపించని విధంగా అర్హుల జాబితా ఉండాలనుకున్నాం. ఇదంతా మీకు అర్థం అవుతుందనే అనుకుంటాను. మీకు తెలుసో తెలియదో ఒక నాయుడో, రెడ్డో, ఇంకో అగ్రవర్ణాల అధికారో కులపిచ్చి చూపిస్తే చెల్లుబాటు అయినట్లు ఒక ఎస్సీనో, ఎస్టీనో, బీసీ అధికారో తన కులం వాళ్లకు ఏదైనా మంచి చేద్దామని చూస్తే అదెంత మాత్రమూ జరగనివ్వరు పెద్దోళ్లు. నా సర్వీసులోనే నేను మొదటిసారి చూస్తా ఉండాను. ఒక తపన కలిగిన పేదల పక్షపాతి అయిన ఆఫీసర్ని. ముందు మేం రుణాల మంజూరు కోసం ఎంపిక చేద్దామనుకోనుండే వాళ్ల పేర్లు, వివరాలు మీ అందరికీ చదివి వినిపిస్తాను. అంతా నెమ్మదిగా విని మీ అభ్యంతరాలు, సూచనలు ఏవన్నా ఉంటే చివర్లో చెప్పండి’’ అంది లలితమ్మ.

ఆ మాటలంటున్నప్పుడు ఆమె మొహంలో ఏదో వెలుగు తళుక్కుమంది. సూటిగా గుండెలోపల నుండి వచ్చిన ఆ మాటలు హఠాత్తుగా అక్కడొక నిశ్శబ్ధకర వాతావరణాన్ని ఏర్పరచాయి. చాలా మందికి ఆ మాటలు స్పష్టంగా అర్థమైనట్టే అనిపించాయి వాళ్ల మొహాలు చూస్తే. కొంతమందికి అర్థం కాకపోయినా, ఏదో వింత జరగబోతుంటే చూస్తున్నట్లు చూస్తుండిపోయారు.

చంటి బిడ్డ ఎక్కడో కేర్‌మని ఏడుపు మొదలు పెడితే, వాళ్లమ్మ ఆ పసిబిడ్డను సముదాయిస్తూ పాలు తాపించే ప్రయత్నం మొదలుపెట్టింది. క్షణాల్లో ఆ చంటి బిడ్డ ఏడుపు కూడా ఆగిపోయింది. మళ్లీ అంతటా నిశ్శబ్దం అలుముకుంది.

కుయ్యప్ప, నాగవేలు, మునిరాజులు, శంకరయ్య, చివరికి హనుమంతు, రమణ కూడా మంత్రించినట్లు నిశ్చలంగా లలితమ్మ వైపే నిశ్శబ్ధంగా చూస్తుండిపోయారు.

‘‘మేనపాటి శాంతమ్మ. ఈమె భర్త యాక్సిడెంట్‌లో నెల క్రితం చనిపోయాడు. ఐదు మంది పిల్లలున్నారు. ఇప్పుడామె ఎనిమిదో నెల గర్భిణి… ఇంకొక పేరు కావాటి నారాయణప్ప. కుడి చేయి లేదు. మీకూ తెల్సు. చెరుకు గానుగాడుతూ చెయ్యి పోగొట్టుకున్నాడన్న సంగతి. మూడో లోన్‌ ఇందాక ఇక్కడికి వచ్చి వెళ్లిందే.. ఆ విశాలక్ష్మమ్మకు. ఇప్పుడు చెప్పండి. ఏవైనా లోటుపాట్లు ఉంటే’’ లలితమ్మకు ఎవరూ జవాబు చెప్పే ప్రయత్నం కానీ ఆమె మాటలకు బదులు మాట్లాడే ప్రయత్నం కానీ చెయ్యలేదు. కానీ హనుమంతు ఆమె ముందుకొచ్చి నిలబడ్డాడు.

‘‘మేడం పొరపాటుగా మాట్లాడినాను. ఏం అనుకోకండి. మీరు ఇందాక చదివిండే పేరు నారాయణప్ప మా నాయినే. మేం లోన్‌ అడక్కపోయినా, మా అవసరాన్ని గుర్తించారు చాలా థ్యాంక్స్‌ మేడం’’ అంటూ కళ్లనిండా నీళ్లు పెట్టుకునేసాడు హనుమంతు. ఏడుపు అడ్డు రావటం వల్ల అంతకు మించి మాట్లాడలేకపోయాడు.

శంకరయ్య నమ్మలేనట్లు అయోమయంగా లలితమ్మ వైపు చూస్తూ చేతులు జోడిరచి ‘‘చాలా సంతోషం తల్లీ’’ అని మాత్రం అనగలిగాడు.

గుంపులోంచి పెద్దవాళ్లెవరో ముందుకు బలవంతంగా తోస్తే ఇద్దరాడపిల్లలు లలితమ్మ ముందుకొచ్చి బిత్తర చూపులు చూస్తూ నిలబడ్డారు. గుంపులోంచి ఎవరో నోరు కదిపారు.

” మేడం మీరు ఇందాక చెప్పిండ్లా…శాంతమ్మ.. ఆయమ్మ బిడ్డలే వీళ్లు”

భయపడుతూ వెనక్కి వెనక్కి నడుస్తున్న ఆ ఆడపిల్లలిద్దర్నీ రెండు చేతులూ చాపి తన ముందుకు లాక్కుంది లలితమ్మ. కిందకు వంగి చాపపైన స్టీలు పళ్లెంలో రమణ తెప్చించి ఉంచిన బిస్కెట్‌ పాకెట్స్‌ చెరొకటి అందించింది.

ఆ పిల్లలిద్దరికీ ఒంటి నిండా సరైన బట్టలైనా లేకపోవడాన్ని, ఎండిపోయినట్లున్న ఆ దీనపు ముఖాల్ని చూస్తుంటే లలితమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

గ్రామసభ ముగించుకుని పంచాయతి కార్యదర్శి, సర్పంచు ముందుగా అక్కడి నుండి కదిలారు. వారి వెనుకే రమణ మిగతా సరంజామా అంతా బ్యాగ్‌లో సర్దుకుని బయలుదేరాడు. పిల్లలు కొందరు గుడి ముందు చేరి ఆటలు మొదలుపెట్టారు. ఎవరి తాలూకు కుర్చీలు, చాపల్ని వాటి యజమానులు తీసుకుపోతున్నారు.

రెండు కుక్కలు ఒకదాన్నొకటి తరుముకుంటూ వీథుల వెంట అరుచుకుంటూ పరుగులు తీస్తున్నాయి.

బాయిలర్‌లో బొగ్గుల్ని, నిప్పుకణికల్ని కలిపి కలబెడుతూ, కళ్లు మూసుకుని నోటినిండా గాలి ఊదుతూ నిప్పురాజేసాడు మునిరాజులు. కాసేపట్లో అక్కడ చేరిన అందరికీ టీ గ్లాసులు అందాయి.

బోరింగ్‌ దగ్గర మళ్లీ కిర్రుమని చప్పుడు కావటంతో అందరూ తలలు తిప్పి అటు వైపు చూసారు. యాభై దాటి ఉంటుంది వయసు. మొహం నిండా, చేతుల పైనా ముసలితనం తాలూకు మడతలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి.

‘‘కడుపాత్రం పిలకాయలు బెంగుళూరు చేరిపోయినా ముసలోళ్లు మాత్రం రేషన్‌ బియ్యం కోసం, పించనీ డబ్బు కోసం ఊర్లోనే నిలిచిపోయినారు. ఈ వయసులో ఈ గోవిందమ్మకు ఏం కష్టమో చూడప్పా. బిందెడు నీళ్లు సాధించేదానికి ఆ ముసలామె వల్ల అవుతుందా ఏమైనా’’ అంటున్నాడు కుయ్యప్ప.

‘‘ఇది ఊరు కదా. మనిషిని మనిషే ఆదుకోవల్ల. లేదంటే దీన్ని ఊరని ఎట్లా అంటారు. రేయ్‌ అబ్బోడా నువ్వు పోయి ఆ నీళ్ల కతేందో చూడ్రా’’ అన్నాడు శంకరయ్య ఖాళీ అయిన టీ గ్లాసును మునిరాజులు చేతికి అందిస్తూ.

ముందు హనుమంతు కదిలాడు. అతడి వెనుకే చురుగ్గా నాగవేలు కూడా కదిలాడు. ఇద్దరూ కలిసి ముసిలామెను పక్కకు జరిపి బోరింగ్‌ హ్యాండిల్‌ను చెరోవైపు పట్టుకుని, ముందుకూ వెనక్కూ ఊగిపోతే, హుషారుగా, జోరుగా భూమి లోతుల్లోంచి నీటిని పైకి రప్పించే ప్రయత్నం ప్రారంభించారు.

‘‘రమణగాడ్ని అడిగి బోరింగ్‌ క్రిష్టప్ప సెల్‌ఫోన్‌ నంబరెందో తీసుకోవాల తాతా. వాడు అదీ ఇదీ అంటావున్నాడంటే మనమే ఎవరో ఒకర్ని స్కూటరిచ్చి పంపించాల. ఎవర్దో ఎందుకు? నా స్కూటరే పంపిస్తా. రెండు పైపులు దించితే చాలు నీళ్లు పైకి వస్తాయి. రేపీ పాటికి బోరింగు రెడీ అయిపోవల్లంతే. ఆరూ నూరయినా, నూరు ఆరయినా రేపీ పాటికి బోరింగ్‌ రెడీ అయిపోవల్ల అంతే’’ మునిరాజులు గొంతు కొత్తగా ఉంది. ఆ గొంతులో ఏదో ఉత్సాహం, ఏమిటో ఉత్తేజం ధ్వనించాయి.

బోరింగు శబ్ధం అంతకంతకూ పెరుగుతూ ఉంది. బిందె నిండుతూ ఉంది.

కథ : పలమనేరు బాలాజీ

కథాచిత్రం: కాశిరాజు

కథాసారంగ టైటిల్ : మహీ పల్లవ్

సెప్టెంబర్ 17: “పగలు రజాకార్లొచ్చేది, రాత్రి వాల్లొచ్చెది…”

నాలుగేళ్ళ క్రిందట మలి దశ తెలంగాణా ఉద్యమం మొదలయిన తరువాత తెలుగు జాతీయతా భావన యొక్క పతనం వేగవంతమయింది. తెలంగాణా వాదులు తెలుగు రాష్ట్ర ఆవిర్భావం, విశాలాంధ్ర ఏర్పాటు క్రమంతో పాటు, హైదరాబాదు రాజ్యం భారత యూనియన్ లో కలిసిన విధానం పై కూడా చర్చ కూడా మొదలయింది. సెప్టెంబర్ 17 ను విమోచన దినంగా జరుపుకోవాలా అనే చర్చలో భాగంగా నిజాము రాజ్య స్వభావం, జాతీయవాద దృక్కోణంలో/కమ్యునిస్టు దృక్కోణంలో హైదరాబాదు చరిత్ర, విశాలాంధ్ర ఏర్పాటులో కమ్యునిస్టు పార్టి పాత్ర ను విమర్శనాత్మకంగా చూడటం మొదలయ్యి ఈ రోజుని విలీనంగా, విమోచనగా, విద్రోహంగా చూడాలా అనే ఆరోగ్యకరమయిన చర్చ ముందుకొచ్చింది.

ఆరోగ్యకరం ఎందుకంటే చరిత్ర (ఏమి జరిగింది) అన్నది చరిత్రకారుల దృక్కోణాల నుండి విడతీసి చూడలేము; కొత్త అవసరాల, చర్చల, దృక్కోణాల వెలుగులో చరిత్రను మళ్ళా, మళ్ళా, చూడవలసిన అవసరం వస్తుంది అన్న అంశం దీనివల్ల ముందుకొచ్చింది. ఈ చర్చను ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నంలో భాగంగా ఆ సమయం గురించి వివిధ వర్గాల, కులాల, మతాలకు చెందిన స్త్రీల అనుభవాలను, జ్ఞాపకాలను చర్చించే ప్రయత్నం చెస్తాను. ఈ వ్యాసం ద్వారా ఇంతకు ముందు ‘జ్ఞాపకాలకీ రాజకీయాలున్నాయ్’ వ్యాసం లో ప్రస్తావించిన చర్చను కొంత ముందుకి తీసుకువెళ్లటం కూడా నా వుద్దేశం.    
ఈ వ్యాసంలో రజాకార్ల గురించి, హైదరాబాదు రాజ్య విలీనం గురించి ప్రస్తుతమున్న ‘కామన్ సెన్స్’ను స్పృశించే ప్రయత్నం చెస్తాను. ప్రజా బాహుళ్యంలో ఈ గుంపు గురించి, సమయం గురించి వున్న’జ్ఞాపకాలు’, ‘నమ్మకాలు’, ‘అనుభవాలు’ కాల క్రమేణా ప్రజా సంస్కృతి (పాపులర్ కల్చర్) లో ఒక రకమయిన ‘కామన్ సెన్స్’ గా రూపుదిద్దుకున్నాయి. కామన్ సెన్స్ అంటే ‘రోజువారి జీవితంలో అనుభవాల నుండి పొందే లోకజ్ఞానం’ కాదని,  క్లిఫర్డ్ గీర్త్జ్ (కామన్ సెన్స్ అస్ కల్చరల్ సిస్టం – లోకల్ నోలేడ్జ్ 1983) అంటారు. దీనిలో కొంత నిజం, కొంత భావజాలం, కొంత అనుభవం, కొంత వ్యాఖ్యానం, కొంత గుర్తు, మరి కొంత సమాజం ఒప్పుకునేది – అన్నీ కలిసి పోయు వుంటాయి అనీ, అన్ని రకాల సంస్థాగత జ్ఞానాలను విశ్లేషించినట్లే కామన్ సెన్స్ ను కూడా విశ్లేషించాలని అయన అంటారు.
Dsc_1203_0
రజాకార్లు, హైదరాబాదు రాజ్యం భారత యునియన్ లో కలిసిన విధానం గురించి చరిత్ర రాసిన తీరు లోనే కాక, కామన్ సెన్స్ లో కూడా ‘కమ్యూనల్’ గా నిక్షిప్తమయ్యాయి: హైదరాబాదు ఒక ముస్లిం రాజ్యం. హిందువులందరూ పీడితులూ, సేవకులూ; ముస్లిములేమో భూస్వాములూ, కులీన వర్గమూ, పీడించేవారు. ముస్లిం రాజు పాలనలో ముస్లిములందరూ ముస్లిములు కాని వారిని నీచంగా చూసినట్లూ; ఉస్మాన్ అలీ ఖాన్ తన పాలనలో స్వతంత్రత కాంక్షించే హిందువులను అణిచివేసి నట్లు గానూ;  భారత దేశం ఆవిర్భావం తరువాత, హైదరాబాదు రాజ్య హిందూ ప్రజలందరూ (వర్గాల, కులాల కతీతంగా) దానిలో విలీనం కావటానికి తహ తహ లాడితే, రజాకర్లనే మత చాందస వాదులు ముస్లిముల ఆధిక్యత కాపాడటానికి హిందువులని క్రూర అణచివేతకు గురిచేసారనీ; అందువల్లే భారత మిలిటరీ వచ్చి హిందువులని కాపాడి, తప్పులు చేసిన ముస్లిముల్ని శిక్షించిందనీ ఈ కమ్యూనల్ కధనం. ముఖ్యంగా హిందూ స్త్రీలను  రజాకార్లు హింసించారని అనేక కధనాలూ, కధలూ విరివిగా చెప్పాయి.
ఇటువంటి కామన్ సెన్స్ ను చెదర గొట్టటం, రూపు మార్చటం ప్రస్తుత తెలంగాణా ఉద్యమ సందర్భంలో చాలా అవసరం. తెలంగాణా వీరత్వం, గొప్పతనం రజాకర్లను ఎదుర్కోవటం, నిజామును ఎదిరించటం తో ముడి పడుతున్న ఈ చారిత్రిక సందర్భంలో ఇటువంటి  కామన్ సెన్స్ ను చెదరగొట్టటం మరింత అవసరం. ఈ దిశగా జరుగుతున్న ప్రయత్నాలు హిందుత్వ వాదంలో ఇమడని దళితులకూ, ఇతర బహుజన  కులాలకూ, ఈ కామన్ సెన్స్ ప్రభావాన్ని రోజూ చవిచూసే ముస్లిములకూ, అన్ని వర్గాలకు చెందిన స్త్రీలకూ కూడా చాలా అవసరమవుతుంది. ఎందుకంటే, ఈ కామన్ సెన్స్ లో స్త్రీలు అలలు, బలహీనులు, కమ్యూనిటి ఆస్తులు గా మాత్రమె వుంటారు. తమకు తాముగా, తామంతట తాముగా అలోచించుకోలేని, బ్రతకలేని, అస్తిత్వ రహితులు.
నా వంతు నేను ఈ కామన్ సెన్స్ ని సామాన్య స్త్రీల అనుభవాలు, జ్ఞాపకాల సహాయంతో విశ్లేషించి, చెదరగొట్టే ప్రయత్నం చేస్తాను. ఆయా అనుభవాలన్నీ 1997-99 ల మధ్య నా డాక్టరల్ పరిశోధన కోసం హైదరాబాదు లోనూ, వరంగల్ లోనూ వివిధ వర్గాల, కులాల, మతాల స్త్రీలతో జరిపిన సంభాషణ లలో భాగంగా డాక్యుమెంట్ చెసినవి. నా పరిశోధన ఉద్దేశం 1930-50 ల మధ్య పుట్టిన స్త్రీలు కుటుంబ పరంగా అనుభవించిన హింస, బాధల గురించి అర్ధం చెసుకోవటం. అయితే తమ తమ జీవితాల గురించి చెప్పే సందర్భంలో అనేక మంది, 1944-50 ల మధ్య  రజాకార్లు, పోలీసు యాక్షన్ ల వల్ల తాము ఎదుర్కున్న  ఇబ్బందులు, తమ కుటుంబాల లో వచ్చిన వొడిదుడుకుల గురించి కూడా చెప్పారు. ఆ విషయాలు నా పరిశోధనకు కీలకం కాదు కాబట్టి నేనప్పుడు వాటిని గురించి పెద్దగా ఆలోచించలేదు. అంతే కాక అప్పటికి ఇటువంటి చర్చ కూడా లేదు. గత నాలుగేళ్లలో జరుగుతున్న చర్చ నేపధ్యంలో వాటిని మళ్ళా చూసి రాయాల్సిన అవసరం వుందనిపించింది.
ఈ స్త్రీలందరూ ఏ రకమయిన ఉద్యమాలతో సంబంధం లేని వాళ్ళు. తమ జీవితంలో ఏమయినా ఇబ్బంది కలిగితే, తాము చూసింది, అనుభవించింది గుర్తు తెచ్చుకుని చెప్పారు తప్ప, ఎవరూ రాజకీయ విశ్లేషనలకు సిద్ధపడలేదు. అయితే, ఆయా జ్ఞాపకాల్లో రాజకీయాలు తప్పకుండా వున్నాయి.  ఈ వ్యాసంలో ఈ జ్ఞాపకాలు ఎటువంటివి, ఏ భావజాలంతో కూడుకున్నవి, ఎందుకలా చెప్పి వుంటారు అన్న ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే ఆ విశ్లేషణ మరిన్ని ప్రశ్నలతో, అసంపూర్తిగా వుంటుంది. అడగాల్సిన ప్రశ్నలు అప్పుడు అడిగుంటే బహుశా వాళ్ళు చెప్పి వుండే వారేమో. అప్పటికే ఆ స్త్రీలందరూ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కావటంతో, ఇప్పుడు వారిని మళ్ళా పలకరించే అవకాశం చాలా తక్కువ.
t4
గాలి మోటర్లు వచ్చినయి, బాంబు లేసినయ్యి:
వరంగల్ జిల్లా తెలంగాణా సాయుధ పోరాటం ఉద్ధృతంగా జరిగిన జిల్లాల్లో ఒకటి. వరంగల్ పట్టణం ఆనుకుని వున్నఖిలా వరంగల్ గ్రామంలో స్త్రీలతో మాట్లాడేటప్పుడు, చాలా మంది స్త్రీలు ఆ సమయంలో అక్కడే ఉన్నామని చెప్పారు. వారందరూ అత్యంత భయపడిన సమయం గా వర్ణించారు. అయితే, కింద వారు చెప్పింది చూస్తే, వారు భయపడింది – రజాకార్ల గురించా, నిజాం పోలీసుల గురించా, సెప్టెంబర్ 17 తరువాత వచ్చిన భారత సైన్యం గురించా, లేదా అప్పుడు జరిగిన దోపిడీల గురించా అన్న సందేహాలు రాక మానవు.
శాంతమ్మ అనే మాదిగ వ్యవసాయ కార్మికురాలు, తనొక రోజు బావులు తవ్వే పని చేస్తుంటే ‘వాల్లచ్సిన్రు’ అని చెప్పారు. “రగతాలు తీస్తరంట, రజాకార్లు. అందరూ బావుల్నించి దిగిపొయిన్రు. నేనొక్కతినే వున్న. పిలిసిన్రు. పిలిస్తే, ‘మేము చీకటి పడే దాక కష్టం చేసుకుంటే గాని తిండి వుండదయ్య’ అని సెప్పిన. పొమ్మన్నరు. ఉరికొచ్చిన. ఒక పిల్లగాన్నిపట్టుకున్నరు. వయసోడే. సాన రక్తం తీసిన్రట. బాంబులు పడినయ్యి”
తాము తమ అన్న కుటుంబం వుండే గీసుకొండపల్లికి  వెళ్దామని బయల్దేరితే, దార్లో వారి కుటుంబమే ఎదురొచ్చిందని, ఎందుకొస్తున్నారంటే, “అక్కడ సానమందున్నారు బావా, గుట్టకింద జివజివ మంటున్నరు. తుపాకులన్నీ పెట్టి” అన్నాడని, అందరు కలిసి మళ్ళా ఖిలా వరంగల్ కే వచ్చామని చెప్పారు. “ఏం కాదులే, తలుపులు పెట్టి పందాం” అని ఇక్కడే ఉన్నామని చెప్పారు. మరి వచ్చింది పోలీసులా, రజకార్లా? తెలియదు. రక్తాలు తాగే వారని ఆమె ఎక్కడ విన్నది? గుట్టకింద వున్నది రజాకార్లా, సంఘం మనుషులా?మరి రజాకార్లు రక్తాలు తాగే వారయితే, ఆవిడని ఎందుకు ఏమీ చెయ్యకుండా వదిలేసారు? వయసతన్ని మాత్రమే ఎందుకు పట్టుకున్నారు, అతను సంఘం మనిషనా? బాంబులు ఎవరేసారు? అన్న ప్రశ్నలు ఆవిడకి, నాకూ కూడా తట్టలేదు.
ఈరమ్మ అనే ఒక ఒక తెలగ వ్యవసాయ కార్మికురాలు రజాకార్లప్పుడు ఏమయింది అని అడిగితే, “ఈ వూరికేం కాలేదింక. ఇక్కడనే వున్నాం. పని నడుపుతాన్నం. మరి పంచేయందే కడుపులో ఎట్లా? దెంగ్కపొతె.. మేం పోలె. ఇక్కడోల్లెవరు పోలె. తురకోల్లు పోయిన్రు. అప్పుడా రజాకార్లప్పుడు వీధి మోటార్లు తిరిగి బాంబు లేసినయ్యి. ఆ పైకెళ్ళి తిరిగి డామ్మ, డామ్మ, డీమ్మ, డూమ్మ అయ్యేసిన్రు..” అని చెప్పారు.
వాళ్ళు ఎక్కడికీ పారిపోలేదనీ, పన్లు చేసుకునే వారికి పారిపోయే అవకాశం రాలేదనీ అంటూ, “తురకోల్లొస్తుంటే గజ గజ వణికినాం.. ఇగ పదిరవైమందొస్తున్రు.. మగోల్లెవ్వరు లేరు, పన్లకి పోయిన్రు. మేవు నల్గురాడాల్లం ఉన్నం. మా అత్తుంది. ఆమె వింది. వత్తాన్రు, వత్తాన్రు అనే వరకు రానే వచ్చిన్రు, చమ్మకు చమ్మున. ఇల్లు కొంచెమే వున్నదప్పుదు.. ఇగ మా అత్త, మా యారాల్ని, నన్ను లోపలికి తోసి  గొల్లిం పెట్టింది. ఒక పెద్ద యారాలు, పిల్లని తీస్కుని వచ్చే లోపల, ఆల్లు అరుగెక్కనె ఎక్కిన్రు. ఎక్కంగనే మా యారలంది కదా. ‘మా వాల్లెవ్వర్లేరు’. అంటనే అరుగెక్కిన్రు, చూసిన్రు, ఇగ పొయిన్రు రజాకార్లు. మల్ల రాలే. ఇగ దోప్కాలయినాయి. ఇగ మనకెంత? దోప్కాలచ్సినయ్యంటే అది పాపకారి సొమ్ము”. ఎవరు ఎవరిని దోచుకున్నారంటే, ‘ఏమో, రజాకార్లప్పుడయినాయి. పేట, గీటంతా దోచుకున్నారు”
నిజాము పోలీసులు వచ్చారా, లేక రజాకార్లు వచ్చారా అని అప్పుడు అడిగుంటే బాగుండేది. ఆవిడ దృష్టిలో తురకోల్లకి, రజాకార్లకి, నిజాము పోలీసులకి పెద్ద ఫరక్ లెదు. అంతే కాదు, గాలి మోటార్లు – విమానాలు – భారత సైన్యంతో వచ్చినా, ఆవిడ జ్ఞాపకంలో అవి రజాకార్లతోనే ముడిపెట్టి వున్నాయి. ఎందుకు? ఇంకా చిత్రంగా, ముస్లిములపై దాడులు జరిగినట్లు చెప్తున్నా, అవి కూడా రజాకార్లకే ముడిపెట్టి ఎందుకు చెప్పినట్లు?
ఖిలా వరంగల్ లోనే పోశమ్మ అనే ఎరుకల ఆవిడ మాటల్లో కూడా ఇదే వ్యక్తమయింది. ఆవిడ తామందరూ అడవి లోకి పారిపోయి, తోటలో వుండి ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత ఊర్లోకి వచ్చామని చెప్పారు. ఇద్దరు పిల్లలు పుట్టటమంటే, కనీసం రెండు, మూడేళ్ళ వ్యవధి. ఆ సమయమంతా రాజాకార్లే వున్నారని ఆమె అభిప్రాయం. పోనీ గుర్తు లేదా అంటే, వయసు 90 పై పడినా, ఆవిడకి తన పిల్లలు, పారిపోయిన వూర్లు, తిరిగొచ్చిన సమయం అన్నీ గుర్తున్నాయి.
రజాకార్లు క్రియాశీలకంగా నిజాం అధికారాన్ని కాపాడటానికి పనిచేసింది 1947-1948 మధ్య కొన్ని నెలలు. ముఖ్యంగా వాళ్ళు నిజాం పోలీసులతో కలిసి, భూస్వామ్య దొరల ఆధిపత్యం కాపాడటానికి, కమ్యునిస్టు సంఘాల కార్యకర్తలని ఎదుర్కోవటానికి గ్రామాల్లో వున్నారు. వాళ్ళు కొన్ని నెలలుంటే, ఆ తరువాత వచ్చిన భారత సైన్యం కొన్ని సంవత్సరాల పాటు వుందని అందరికి తెలుసు. ఉస్మాన్ అలీ ఖాన్ ని దింపటం, సాయుధ పోరాటాన్ని అణచటం అన్న రెండు ఉద్దేశాలతో ఆపరేషన్ పోలో జరిగిందని;  తెలంగాణలో, ఆంధ్రాలో సాయుధ పోరాటం జరిగే జిల్లాల్లో దేశంలోనే పెద్ద మిలిటరీ క్యాంపులు నడిపారనీ, అనేకమందిని చంపారనీ, దోచుకున్నారనీ, అత్యాచారాలు చేశారనీ కమ్యునిస్టు చరిత్రకారులు మనకి చెప్పారు.
‘రక్తాలు తాగే’ రజాకార్లకు, భారత సైన్యానికి, ముస్లిములపై దాడులను, జరిగిన దోపిడీలను సామాన్య ప్రజలు కలిపేసి చూసారని పైన స్త్రీలు చెప్పిన తీరు బట్టి అర్ధం చెసుకోవచ్చా? రాజకీయ ఉద్యమాలతో సంబంధం లేని సామాన్య స్త్రీలుగా వారందరికీ రజాకార్ల ఉదంతం లో తాము, కుటుంబం, బంధువులు పడిన బాధ గుర్తుంది; ఎవరు ఎవరి తరపున పోరాడారు, ఎవరి రాజ్యం పొయ్యి, ఎవరి రాజ్యం వచ్చింది అన్న విషయాలు పట్ట లేదు. ఒక్కళ్ళు కూడా పోలీసు యాక్షన్ అన్న మాట కూడా అనలేదు. అలాగే స్వాతంత్ర్యం, విమోచన వంటి మాటలు కూడా చెప్పలెదు. వాళ్ళందరికీ ఆ సమయం అల్లర్లు, అశాంతి, గందరగోళ సమయం. ‘మాటలతో భయపెట్టిన’ సైన్యానికి, వచ్చి క్రూరత్వానికి ఒడిగట్టిన మరో సైన్యానికి మధ్య తేడాలుంటాయని గుర్తించే అవసరం లేకపోవటం వల్ల రజాకారు పేరుతోటే అందర్నీ, అన్నింటినీ – ‘రక్తాలు తీయటం, గాలి మోటార్లు రావటం, దోప్కాలవ్వటం, తురకోల్లు పోవటం’ – గుర్తుపెట్టుకున్నారా? ప్రజా సంస్కృతిలో కూడా ఆ సమయాన్ని, అప్పటి భయానక అనుభవాలని ‘వారి’ పేరుతోనే ‘జ్ఞాపకం’ పెట్టుకోవటం దీనికి దోహదం చేసిందా? 
పగలు రజాకార్లొచ్చేది, రాత్రి వాల్లొచ్చెది:
భారత సైన్యం, నిజాం పోలీసులు, రజాకార్లు మధ్య తేడా గుర్తించని స్త్రీల జ్ఞాపకాలు ఒకలా వుంటే, ఈ సమయం గురించి పెద్దగా ఎవరూ చర్చించని అనుభవాన్ని చవిచూసిన ఇంకొకావిడ ఘోష ఇంకోలా వుంది. ఇక్కడ రజాకార్లు, మహారాష్ట్ర నుండి వచ్చిన హైదరాబాదు స్వాతంత్ర సమర యోధులతో కలిసి కన్పిస్తారు.  ఉస్మాన్ అలీ ఖాన్ ఇచ్చిన ప్రకటనకు స్పందించి గుంటూరులో తమకున్న రెండెకరాల పొలం అమ్ముకుని నిజామాబాద్ జిల్లాలో బోధన్ దగ్గర పదెకరాలు కొనుక్కుని స్థిరపడ్డ క్రిస్టియన్ కమ్మావిడ ఇనాసమ్మ చెప్పిన విషయాలు ఈ గందరగోళాన్ని వివరిస్తాయి. 1998 లో ఆవిడ రెండు మూడు సార్లు విడమరిచి  చెప్పినా నేను అర్ధం చేసుకోలేక పోయిన విషయాలు ఆవిడ ఇంటర్వ్యూ మళ్ళా చదివితే ఇప్పుడు బోధపడుతున్నాయి. ఎందుకంటే, భారత సైన్యం బ్రిటిషు వారు వెళ్ళిపోయిన తరువాత భారత దేశంలో కలవటానికి సందేహించిన హైదరాబాదు వంటి స్వతంత్ర రాజ్యాల పట్ల వ్యవహరించిన తీరు గురించి కాప్టెన్ పాండురంగా రెడ్డి వంటి వారు ఈ మధ్యనే కొంతమంది రాస్తున్నారు. భారత సైన్యాలు, రజాకార్ల వంటి పనులే హైదరాబాదు సరిహద్దుల్లో చేసాయని; రజాకార్లలో ముస్లిములు మాత్రమె లేరనీ, హిందువులు కూడా ఉన్నారనీ చెప్తున్నారు. హైదరాబాదు రాజ్య సరిహద్దుల్లో నివసించిన ఈవిడ మాటలు ఈ విషయాలకే  అద్దం పడతాయి.
“మేమొచ్చిన ఐదు సంవత్సరాలకి ఇక్కడ రజాకార్ల మూమెంట్ వచ్చింది. నెహ్రూకి చాలా లెటర్లు రాసాం. అయినా ఆయన ఏమీ చర్యలు తీసుకోలేదు. శాంతం, శాంతం అన్నడు. పటేలు మట్టుకు ఆయనికి చెప్పకుండా ఆర్డర్ ఇచ్చెసాడు… మావి ఇరవయి ఎనిమిది కుటుంబాలు… అందరూ కలిసి రజాకార్లు మన వూరికి రాకుండా చేసుకుందా మనుకున్నాము. పగులొస్తే ‘మాకు నాలుగు బస్తాల బియ్యం కావాలా’ అంటే మనం మన దగ్గరున్న వడ్లు తీసుకుపోయి మరకిచ్చి వాళ్ళకిచ్చి రావాల. ఈ రాజాకార్లని పెట్టుకుని మహారాష్ట్ర వోళ్ళు వచ్చేవారు దొంగతనాలు చెయ్యటానికి, రాత్రిళ్లు. మన దగ్గర పెద్ద డబ్బులేం ఉండేవి కాదు కదా, వచ్చిన డబ్బులు వచ్చినట్టు పొలం మీద పెట్టటం తప్ప, వాళ్ళు దోచుకోవటానికి! ఇహ మాకు నాగలి మొద్దులు కావాలా అంటే పది మొద్దులు కొట్టుకు పోయి వాల్ల్లకేసి రావాల, తురకోళ్ళకి. అట్లా దౌర్జన్యంగా తీస్కునే వాళ్ళు గాని, మా ఊల్లో దొంగతనాలయ్యి ఎక్కువ జరగనియ్యలెదు. చుట్టూ కాపలా, రాత్రంతా కాపలా. ఐదు నెలలు కాసామమ్మాయ్ కాపలా, రాత్రంతా. ఏడు గంటల కల్లా అన్నాలయ్యీ తినేసి, ఆ పెద్ద పెద్దయ్యి వుంటాయి కదా, ఇత్తడివి అవి గుంటల్లో పెట్టి కప్పెట్టాం. పొద్దున్నే మళ్ళీ చీకటి తోటే లేచి ఆ గాదెలన్నీ బయటికి తీసేది, వంటలు చెసుకునెది… మాకు పారిపోటానికి వీల్లేకపోయింది”
ఇదంతా చాలామంది ఆంధ్రా వాళ్ళు, తెలంగాణలో గ్రామీణులు చెప్పే సంగతులే. భారత ప్రభుత్వం ఆర్ధిక బ్లాకేడ్ విధించటం వల్ల అనేక వస్తువులకి కటకటగా వుండేది ఆ రోజుల్లో. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగా వుండేది. ఈవిడ బంధువులు చాలా మంది ఆంధ్రాలో తమ తమ ఊర్లకి పారిపోయారు. నిజామాబాదు దూరమవ్వటంతో వీరి కుటుంబం వూరు వదిలి వెళ్ళలేదు. వారు వెళదామనుకున్నా కుదరలెదు. ఆవిడ భర్త నిజాం పోలీసుల దృష్టిలో వుండేవారు. ఎందుకు?
“ఈయన లీడరు..  ఏమయినా అయితే పదిమందిని వేసుకుని పొయ్యేది..  ఒక రోజు ఈయన్ని కొట్టారు పోలీసులు. అరెస్టు చెయ్యటానికి వారంటు తీసారు. ఆరుగురు పోలీసులు, ఒక సబ్ ఇన్స్పెక్టర్  ఇంటికొచ్చారు…మా పెద్దోళ్ళoదరూ ప్రార్ధనలు చెయ్యటం మొదలెట్టారు.. చివరికి చాయ్ తాగి వారంటు వెనక్కి తీసుకుని వెళ్లిపొయ్యారు”. అంత భయపెట్టే నిజాం పోలీసులు వారంటు వెనక్కి తీసుకొని ఎందుకెళ్ళిపోయారు అన్న ప్రశ్న ఆవిడకి రాలేదు. తన భర్తను పోలీసులు అరెస్టు చెయ్యటానికి కూడా ఆవిడ వేరే రకంగా కారణాలు వెతుక్కుంది, “అప్పుడందరూ ‘ఆళ్ళే’ కదా.. ఇప్పుడు స్వతంత్రం వచ్చె వరకు  కలెక్టరు, పెద్ద పెద్ద పోస్టులన్నీ ‘ఆళ్ళ’కే ఇచ్చారు కద. మనోళ్ళకి ఇయ్యలేదు కదా. ఆ నవాబు తురకోళ్ళకే ఎస్.ఐ పోస్టులిచ్చేవాడు. తతిమ్మా వాళ్ళందరూ ఇక్కడెవరు డెవలప్ కాలేదు కదా ఇక్కడ. అన్నీ ముస్లింలకే ఇచ్చేవాళ్ళు.. ఇహ మనం పోయి చెప్పుకోవటానికి ఎవర్లేరు. ఎవరున్నారు?”
మీ వూర్లో రజాకార్లుండేవాళ్ళా అంటే ఆవిడ ఇచ్చిన సమాధానం అత్యంత ఆశ్చర్యకరమయింది,
“మా వూర్లో అయితే, అస్సలు ముస్లిములే లెరు. ఒక్క ఫామిలీనే వుండేవాళ్ళు. కూలికీ, నాలికీ వచ్చే వోళ్ళే. … చిల్లర కులాల వాళ్ళు వుంటారు కదా, వాళ్లకి నెలకి ముప్పై రూపాయలు, ఒక మిలటరీ డ్రెస్సు, ఒక తుపాకి ఇవన్నీ ఇచ్చి వాళ్ళు వాళ్ళందర్నీ పెట్టుకున్నారు. ముస్లింలు ఎంతమందున్నారు లేకపోతె? హిందువుల్ని చేర్చుకున్నారు. ఏ కులమయినా గానీ ‘నేను రజాకార్లలో చేరతానం’ టే చాలు ఆళ్ళ పేర్లు రాసుకుని ఆళ్ల కో డ్రెస్సు, తుపాకి, కత్తి ఇచ్చేవాళ్ళు. అన్ని కులాల వాళ్ళు చేరిపొయెవాళ్లు,  ముప్పై రూపాయల జీతమిస్తారని. … ఆ రోజు రేడియోలో రజాకార్లందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోండి అని చెప్పారు. ఇక చూడు ఎక్కడ గుంట వుంటే అక్కడ ఏభై మంది ఆ డ్రెస్సులు, కత్తులు, తుపాకులు అయన్నీ పారేసేది”
ఆవిడ రాత్రి పూట దోపిడీకి ‘వాళ్ళు’ వచ్చారంటే, నేను ‘వాళ్ళు’ కూడా రజాకార్లే అనుకున్నాను విన్నప్పుడు. కానీ ఆవిడ చెప్పింది వేరు. కాంగ్రెసు, ఇతర హిందూ సంస్థలూ దేశ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, హైదరాబాదు ‘విమోచన’ కోసం,  సైన్యం సహకారంతో నడిపిన కాంపులలో తయారయిన ‘యోధుల’ గురించి ఆవిడ మొత్తుకున్నది. ఆవిడ వాల్లెవ్వరో పేరు పెట్టి చెప్పలేకపోయారు. నేను కూడా ‘వాళ్ళ’ని హైదరాబాదు ‘స్వాతంత్ర సమర యోధులు’ లేదా విముక్తి కోసం పోరాడిన వారని గుర్తుపట్టలేక పొయాను. మొహమ్మద్ హైదర్ ‘అక్టోబరు కూ’ పుస్తకం (2012, రోలి బుక్స్) లో భారత దేశం ఏర్పాటు చేసిన ‘బార్డర్ కెంపులు’ గురించి చదివేదాకా. హైదరాబాదు రాజ్య చరిత్ర లో నిజాం రాజ్యాన్ని ‘విముక్తి’ చెయ్యటానికి ‘సర్వ శక్తులనూ’ ధారపోసిన యోధులుగా ఎవరినయితే వర్ణిస్తారో వారే వీరని ఇప్పుడు అర్ధమయింది. ఎందుకంటే, ఆవిడ స్పష్టంగా ఐదు నెలల పాటే ఈ కాపలా,  అనిశ్చితి, మహారాష్ట్ర దోపిడీల వున్నాయని చెప్పింది. ఇంతకీ ఆ ‘యోధులు’ చేసిందేమిటి?
 “వాళ్ళ పేరు పెట్టుకుని, మహారాష్ట్ర, నాందేడ్ వాళ్ళు ఎక్కువ దోపిడీ కొచ్చే వాళ్ళు. ఇక్కడ చిన్న చిన్న ఊళ్ళల్లో పటేళ్లకి బాగా బంగార ముంటుంది కదా.. వాళ్ళు తవ్వి పెట్టుకోవటమది. అది వీళ్ళు దోచుకుపోయ్యేవాళ్ళు.. ఈ రజాకార్లదేముంది? వస్తారు మాకిది కావాల, అది కావాల అంటే అది ఇయ్యాల.. మాకు నెయ్యి కావాలంటే అవి సప్లై చెయ్యాల.. కానీ వీళ్ళు బద్దెయ్యని తెసుసా.. ఆయన్ని కొట్టి నలభై ఐదు రూపాయలు తీస్కున్నారు.. హరి నారాయణని కొట్టారు, చాలా మందిని కొట్టారు”.
imagestel
స్వాతంత్ర సమరయోధులని మనం పుస్తకాల్లో రాసుకున్న వాళ్ళు చేసిన ఘనకార్యాలివి. నిజాము రాజ్యాన్ని అంతర్గతంగా అస్థిర పరిచి భారత సైన్యం కోసం సామాన్య ప్రజలు ఎదురు చూసే పరిస్థితి కల్పించటంలో జరిగిన గెరిల్లా యుద్దం తీరిది. ఈ యుద్ధాన్ని ఆఖరి విమోచన పోరాటంగా హైదరాబాదు చరిత్రలో రాసుకోవటం జరిగింది. ఇవేవీ పట్టక పోయినా అప్పటి పరిస్థితిని చవిచూసిన సామాన్య స్త్రీ గా తనకే తెలియని చరిత్రని ఆవిడ ఈ విధంగా నాకు వర్ణించింది. నిజాం తరపున రజాకార్లు వున్నారని, ఆ బందిపోట్లు రజాకార్లని ఎదుర్కో వటానికి వచ్చారని తెలుసుకానీ,  ఆవిడకి (నాకు కూడా) వీళ్ళు ఎవరి తరపున పనిచేస్తున్నారో తెలియదు. ఇది రెండు రాజ్యాల మధ్య జరుగుతున్న యుద్ధమనీ, ఆ యుద్ధంలో కొత్తగా ఏర్పడిన భారత దేశం గెరిల్లా పద్ధతిలో హైదరాబాదు రాజ్యాన్ని అస్థిర పరచటానికి ఈ దోపిడీలని ప్రోత్సహించిందనీ, ఆ యుద్ధంలో తాను కూడా పావునని ఆవిడకి, అందరి లాగే, అర్ధం కాలెదు. ఆవిడ కూడా చాలా సార్లు, ఆ పరిస్థితి నంతా ‘రజాకార్లు’ అన్న పదంతో ముడిపెట్టేసింది. అయితే చూసిన, అనుభవించిన విషయాల గురించి ఆవిడ చెప్పింది ఇప్పుడు చదివితే, ఆ సందిగ్ధ సమయపు రాజకీయాల నేపధ్యంలో అర్ధం చేసుకుంటే ఒకరి స్వాతంత్ర యోధులు, మరొకరికి దోపిడీ దారులు, దొంగలు అవుతారు కాబోలు అన్న అనుమానం తప్పకుండా వస్తుంది.
ఎవరో వచ్చి రక్షిస్తారని చాలా ఎదురు చూసినా, ఆవిడ పోలీసాక్షన్ తరువాత ముస్లిముల పరిస్థితి చూసి చాలా జాలి పడింది. చెడ్డ పనులు చేసిన ‘ముస్లిం’లని లైన్లల్లో నిలబెట్టి సైన్యం ఆయా గ్రామస్తులకి కర్రలిచ్చి కొట్టిచ్చారని చెప్పింది. తాను జాలిపడటం చూసి కొంత మంది ముస్లింలు ఆశ్చర్య పోయారంది.
“నాందేడ్ అవతల చాలా మందిని చంపారు. చాల మంది బోధన్ వచ్చారు. షుగర్ ఫాక్టరీ వుంది కదా, ఉద్యోగాలు దొరుకుతాయి కదా (అందుకని)… మాకు బోధన్ లో చేపలు అమ్మేవోళ్ళు, ఎండు చేపలు అమ్మేవోళ్ళు (చెప్పిందేంటంటే)  ‘నేను అరవై మందికి జీతాలిచ్చే వాణ్ణమ్మా. నాకు మిల్లుండేది. ఇప్పుడు నేను, నా భార్యా చేపలమ్ముకుని బతుకుతున్నాం అని చెప్పాడు. తాళాలమ్ముకునే అతను కూడా అదే చెప్పాడు. పెద్ద పెద్ద ఉద్యోగాలు వదిలిపెట్టి పారిపోయి వచ్చారు. బోధన్ లో అప్పుడు ముస్లింలు తక్కువ. ఇప్పుడు సగం మంది వాళ్ళే. అక్కన్నుంచి పారిపోయి వచ్చి నోళ్లే. తల్లికి పిల్ల లేదు, పిల్లకి తల్లి లెదు. ఏద్దొరికితే అది”
వలస రైతు కుటుంబానికి చెందిన స్త్రీగా, ప్రాణాలతో పాటు, తమ ఉనికి ఏమయిపోతుందనే ప్రశ్న కూడా ఆవిడకి వచ్చింది. అయితే, ఆవిడ స్థానిక రాజకీయాలతో సంబంధం లేకపోవటం వల్ల, ప్రభావితం కాకపోవటం వల్ల హిందూ-ముస్లిముల సంబంధాలని కొంతలో కొంత పక్షపాతం లేకుండా అర్ధం చేసుకోవటానికి కూడా ప్రయత్నించింది. తన కుటుంబం, తానూ కూడా పెద్దగా నిజాం పోలీసుల వల్ల బాధ పడక పోవటం కూడా ఆవిడకి ఈ తటస్థత ను ఏర్పరిచి ఉండొచ్చు. స్వాతంత్ర్యమంటే, ‘మనోళ్ళు’ అధికారంలోకి రావటం అని ఆవిడ అర్ధం చేసుకుంది. మనోళ్ళు అంటే, ఆంధ్రా వాళ్ళా? హిందువులా? తాను హిందూ మతస్తురాలు కాకపోయినా ‘హిందువులు రాజ్యాధికారం లోకి రావటాన్ని’ మనోళ్ళు అనుకోవటానికి కారణమేమిటని నేనప్పుడు అడగలేదు, ఇప్పుడు అడిగుంటే బాగుండనిపిస్తోంది.
ఉస్మాన్ అలీ పాషా చనిపోయాడు, మా ఆయన నౌకరి పోయింది
పాత బస్తీ లో ముస్లిం స్త్రీలతో మాట్లాడినప్పుడు నేను అడక్కుండానే వాళ్ళు చెప్పిన విషయాలివి. అప్పట్లో కోవా సంస్థ లో పనిచేసే నూర్జహాన్ గారు నాకు వీరిని పరిచయం చెసారు. నా పరిశోధన గురించి వివరిస్తే వారు కుటుంబం గురించి మాట్లాడతారు అని నేననుకున్నాను, కానీ వారు ‘కుటుంబం, హింస, బాధలు’ వంటి మాటలు నా నోటి నుండి వినంగానే యాక్షన్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. యాక్షన్ తో వారి జీవితాలు అతలాకుతలమయ్యాయి, చితికిపొయాయి, పూర్తిగా రూపు మార్చుకున్నాయి, అన్నది వారు చెప్పిన మాటల సారాంశం. పది మంది స్త్రీలతో మాట్లాడితే, వారిలో ఐదుగురు యాక్షన్ గురించి మొదలు పెట్టి తమ జీవితాల గురించి మాట్లాడారు. తెలంగాణా గ్రామీణ ప్రాంత స్త్రీలతో మాట్లాడేటప్పుడు రజాకార్ల గురించి వారిని అడిగితే గానీ చెప్పలేదు. పోలీసు యాక్షన్ గురించి పైన వర్ణించిన ఆవిడ తప్ప వేరే వాళ్ళందరూ రజాకార్ల గురించి, తమ తమ ధైర్యం గురించి చెప్పుకున్నారు తప్ప, యాక్షన్ గురించి చెప్పలెదు. పాత బస్తీ స్త్రీలకి మాత్రం యాక్షన్ వారి జీవితాల్లోనే అతి పెద్ద ఉపద్రవం. వారి జీవితాలని అతి దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేసిన ఉపద్రవం.
“బీదర్ జిల్లా కళ్యాణి లో వుండేవాళ్ళం మేము. మా నాన్న వూరి నవాబు దగ్గర వాచ్మన్ గా పని చెసె వాడు. చిన్నప్పుడే పెళ్లి అయిపోయింది. అత్త గారింట్లోనే పెద్దమనిషి అయ్యాను. నా భర్త కూడా వూరి అమీన్ ఇంట్లో నౌకర్ గా పని చెసెవాదు. ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. అప్పుడు మొదలయింది పోలీసు యాక్షన్. నా భర్త, మామ, మరిది అందరూ మరణించారు. ఎవరు ఎవర్ని చంపారో ఎవరికి తెలుసు? హిందూ మిలిటరీ వచ్చింది. జొన్న చేలల్లో దాక్కున్న వాళ్ళని కూడా వెతికి చంపారు. చాలా మంది పారిపొయారు. ఏమీ మిగల్లెదు – తినటానికి, కట్టుకోవటానికి, వుంటానికి. మాకు ఎనిమిది మామిడి చెట్లు ఉండేవి. అక్కడి హిందువులు లాగేసుకున్నారు. ఇక్కడికి పారిపోయి వచ్చాం. మక్కా మసీదులో ఉంటూ, పని కోసం వెతుక్కున్నాం. పాన్, బీడీ చేసే పని దొరికింది” – అయేషా బీ

“మాది బీదరు గ్రామం. మేము దర్జీలం. మేము బట్టలు కుడితే, ధాన్యం, పప్పు, పాలు, కూరలు ఇచ్చేవాళ్ళు, పైసలకి బదులు. పోలీసు యాక్షన్లో నాకు తొమ్మిదేళ్ళ పిల్లాడు, ఏడేళ్ళ పాప వున్నారు. పటేలింట్లో దాక్కున్నాం. మాకేం కానీయలె ఆయన. మా చిన్న మామ (మా భర్త బాబాయి) జొన్న చేలలో దాక్కుంటే ఆయన్ని తీసుకెళ్ళి పొయ్యారు. మళ్ళా ఎప్పడూ కనిపించలేదాయన. రైల్లో ఎక్కి ఇక్కడికొచ్చి బహదూర్ యార్ దేవ్డిలో ఉన్నాం. తరువాత నాకు చాలా మంది పిల్లలు పుట్టి చనిపొయ్యారు” – అమీనా బీ
“మాది హైదరాబాదే. ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెళ్లయింది. మా ఆయన హోం గార్డ్ గా చేస్తుండె. ఉస్మాన్ అలీ పాషా పోయిండు. మా ఆయన నౌకరి పోయింది. రిక్షా తొక్కిండు” – గౌసియ బేగం
“మాది బీదర్లో పేద వ్యవసాయ కార్మిక కుటుంబం. నన్ను మేనమామ కొడుక్కి ఇచ్చి పెళ్లి చెసారు. ఈ లోపల యాక్షన్ అయింది. హిందువులు మా వాళ్ళని చాల మందిని చంపేశారు –  మా తాత, చిన్న తాత, మామ చనిపొయారు. మా ఆయన కూడా చచ్చిపోయడనుకున్నాం. ఆయన హైదరాబాదు పారిపోయి వచ్చాడని మా దూరపు చుట్టం చెప్పాడు చాల రోజుల తర్వాత. అప్పుడు అందరం ఇక్కడికొచ్చి కలిసాం” – జరీనా బేగం
“మాది బీదర్ జిల్లా కల్యాణి. పేద కుటుంబం. పొలాల్లో పని చేసే వాళ్ళం. పోలీసు యాక్షన్ అప్పుడు ఏమైందో నాకు అంతా గుర్తుంది. ఎక్కడికి పారిపోయామో, ఏ ఊర్లల్లో దాక్కున్నామో అంతా.. మా మామ రసమ్ (తాంబూలాలు) అవుతుండే. కాల్పులు మొదలయినయ్. అన్ని ముస్లిముల ఇళ్ళని దోచుకున్నరు. ఆర్మీ వచ్చుండే. మేమందరం పారిపోయినం. మా ఇళ్ళల్లో ఏమి మిగల్లేదు. నాకు స్వతంత్రం ఎప్పుడొచ్చిందో ఏమీ తెలియదు. ఈ దోపిడీ, పారి పోవటం ఇదే గుర్తుంది” – చాంద్ బీ
హైదరాబాదు ఒక బహు భాషా రాజ్యం గా బ్రిటిషు వారి కనుసన్నల్లో నడుస్తూ ఉండింది. అంతర్జాతీయ రాజకీయాల్లో టర్కీ పతనం తర్వాత, బ్రిటిషు వారికి ‘హైదరబాదు రాజ్యం’ తాము ముస్లింలకు, ఇస్లాంకు వ్యతిరేకం కాదని చెప్పుకోవటానికి, కీలకంగా పరిణమించింది. ఆ సమయంలో పెరిగిన పరపతిని నిజాం సుస్థిర పరచుకుందామనుకున్నాడు కానీ ఆయనకి సాధ్య పడలేదు. జాతీయతా భావన వేళ్ళూనుకోని ఈ రాజ్యంలో మత సంస్కరణ పేరుతో వచ్చిన ఆర్య సమాజ ప్రభావం ఎక్కువగా ఉండింది. బ్రిటిషు ఇండియాలో జాతీయోద్యమ ప్రభావం పెరిగే కొద్దీ, ఇక్కడ కూడా ఆ ప్రభావం వచ్చింది కానీ వేరే రూపంలో వచ్చింది. అది 1930 లల్లో ఒక రూపు తీసుకుంది. ‘మత సంస్కరణ’ వెనక్కి పోయి, కాంగ్రెసు, ఇతర శక్తులు – ఉదారవాద ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని, సంస్కరణ లనూ సాధించుకోవటం కోసం ప్రజలను సమీకరించటానికి – మత పరమయిన భేదాలను వాడుకోవటం మొదలు పెట్టాయి. ‘తురక రాజుని’ ఎలాగయినా సింహాసనం దించాలని హిందూ సంస్థలు, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని తీసుకురావాలంటే ‘రాజు’ ని ఎలాగయినా ప్రజలకి బాధ్యుడిని చెయ్యాలనే రాష్ట్ర కాంగ్రెసు ఈ ప్రయత్నంలో కలిసి పనిచెసాయి అని మార్గ్రిట్ పెర్నౌ (పాసింగ్ అఫ్ పాట్రి మోనియలిజం: పాలిటిక్స్ అండ్ పొలిటికల్ కల్చర్ ఇన్ హైదరాబాద్, మనోహర్ పబ్లికేషన్స్, 2000 ), లూసిఎన్ బెనిచౌ (ఫ్రం అటానమి తో ఇంటిగ్రేషన్, పొలిటికల్ డెవలప్మెంట్ ఇన్ హైదరాబాద్ 1938-1948, ఓరియంట్ లాంగ్మన్ 2000) అనే చరిత్రకారులు రాసారు. ఈ ప్రయత్నాలను ఎట్లాగయినా తిప్పి కొట్టాలని, హైదరాబాదు రాజ్య స్వతంత్రతను కాపాడాలని ఖాసిం రజ్వి రజాకార్ల ద్వారా ప్రయత్నించాడు. అందువల్లే, కుల మత విభేదాలు లేకుండా ఎవరి నయినా చేర్చుకున్నాడు ఆ సైన్యంలో. అయితే మత విభేదాల భూమికపై పనిచేస్తున్న ఉదార వాద హిందూ రాజకీయాలను 1947 తరువాత భారత ప్రభుత్వం (హైదరాబాదు రాజ్యాన్ని కలుపుకోవాలనే ప్రయత్నంలో) సమర్ధించింది. హైదరాబాదు రాజ్యానికి చుట్టూరా కాంపులు పెట్టి హైదరాబాదు ను అస్థిర పరచటానికి అవసరమయిన ఆయుధాలు, డబ్బు, ట్రైనింగ్ ఇచ్చింది. వీళ్ళూ, భారత సైన్యం కలిసి సెప్టెంబర్ 17 తరువాత ఓడిపోయిన హైదరాబాదు రాజ్యంలో సాధారణ ముస్లింలపై చేసిన ప్రతీకార మారణ కాండకి నిదర్శనమే పాత బస్తి ముస్లిం స్త్రీల జీవిత అనుభవాలు.
పాత బస్తి స్త్రీలలో ఎవ్వరూ కూడా పెద్ద కుటుంబాలకి చెందినవారు కాదు. పటేళ్ళూ కాదు, పఠాన్లు కాదు, భూస్వాములూ కాదు. కొలువు వుండిన వాళ్ళు కూడా అతి తక్కువ స్థాయిలో ‘నౌకరి’ చేసుకుంటున్న కుటుంబాలకి చెందిన స్త్రీలు. వ్యవసాయపు పనులో, వేరే పనులో చేసుకుని పొట్టపోసుకునే శాంతమ్మ, నరసమ్మ, పోశమ్మ వంటి వాళ్ళే వీరందరూ కూడా. తరువాతి కాలంలో వీరి ఆర్ధిక, సామాజిక  స్థితి మరింత దిగజారింది. రెండు, మూడు తరాల వరకూ కూడా ఎవరూ కోలుకోలేదు. వీరి కుటుంబాల్లో ఎవ్వరూ డిగ్రీ చదివిన వారు గానీ, ఒక గవర్నమెంటు వుద్యోగం చేస్తున్న వారు గానీ లేరు. ఇంటర్వ్యూలు చేస్తున్న సమయంలో నాకు వారి బాధను ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక వేరే విషయాలకు సంభాషణ మల్లించేసాను. ఇప్పటికి కూడా వీరి అనుభవాలని అర్ధం చేసుకోటానికి నాకు/మనకి ఏ సాధనాలూ లేవని, అసాధ్యమనే నాకు అనిపిస్తోంది. హైదరాబాదుకి వలస వచ్చిన స్త్రీలు వూరు, బంధువులు, కుటుంబం పోగొట్టుకుని దేశం కాని దేశంలో వచ్చీ రాని పని వెతుక్కుని ఎట్లా బ్రతికారు? అసలు తమనెందుకు బాధించారు అన్న విషయం కూడా అర్ధం చేసుకునే అవకాశం వారికి వచ్సిందా? వారి బాధను గురించి ఎవరూ అడక్క పోవటం వల్లనేనా, నేను కుటుంబం గురించి అడగ్గానే పోలీసు యాక్షన్ గురించి చెప్పారు? బాధ చెప్పుకునే అవకాశం కూడా లేకపోవటం దారుణం కదా? అసలు వారి బాధను పట్టుకునే భాష ఉందా మనకు? భాష కూడా ఇక్కడ ఈ స్త్రీలని వదిలెసిందేమో అనిపిస్తుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పరచుకుని, కన్నడ, తెలుగు, మరాఠీ వాళ్ళందరం ఎవరి భాషలో వాళ్ళు, వారి ఘోష, చరిత్ర, అనుభవాలు రాసుకోగలుగుతున్నాం. మరి  వీళ్ళు ఏ భాషా సంస్కృతిలో తమ బాధను వ్యక్తం చేసుకోగలరు?
1944-50 ల మధ్య జరిగిన విషయాల గురించి పైన చెప్పిన ప్రజా బాహుళ్యాని కున్న ‘కామన్ సెన్స్’ లో వీరి అనుభవాలకి, జీవితాలకి వున్నస్థానమేమిటి? ఇది ‘అనివార్యం’ అని లేదా ‘రజాకార్ల/ముస్లిం పోలీసు/ముస్లిం దొరల ఆధిపత్యానికి’ తగిన ప్రతీకారమే అని అందామా మనం కూడా? ఈ కామన్ సెన్స్ వివరణ సరయిందేనా? వీరు ముస్లింలే కానీ, పీడించేవారు కాదు. నిజాం అధికారం క్రింద ఉన్నవారే కానీ అధికారంలో భాగస్వాములు కాదు. మరి వీరిపై హింస ఎందుకు జరిగినట్లు? అంతే కాదు, ఇన్నాళ్ళకి కూడా, వారి బాధకు ‘మన’ భాషలో, కామన్ సెన్స్ లో గుర్తింపు ఎందుకు రాలేదు? వారిని కనీసం ‘బాధితులుగా’ ఎందుకు గుర్తించలేదు మనం? రజాకార్ల బాధితులు, నిజాం పోలీసుల బాధితులు, దొరల బాధితులకూ వున్న చోటు ఈ బాధితుల కెందుకు లేదు? మన కామన్ సెన్స్ ను ఏ విధంగా రూపు మారిస్తే వీరు తమ బాధను గురించి కనీసం చెప్పుకోగలుగుతారు?
ముస్లింలను నిజాము, రజాకార్ల వారసులుగా చూడొద్దని అనేకమంది ముస్లింవాదులు చెప్తూ వస్తున్నారు. దీన్నానుకుని వున్నఇంకొన్ని అంశాలను కూడా మనం పునరాలోచించు కోవాల్సిన సమయం వచ్చిందని అనిపిస్తోంది నాకు. 1944-50 సమయంలో జరిగిన అన్ని రకాల అలజడిని, హింసని, గందరగోళాన్ని’రజాకార్ల’కి అంటగడుతున్నామేమో అన్న ప్రశ్న మొదటిగా వెసుకోవాలి. ఆ సమయంలో భారత ప్రభుత్వం, కాంగ్రెసు పార్టి, కమ్యునిస్టు పార్టి, నిజాము ప్రభుత్వాల మధ్య – ఒకరి స్వాతంత్ర యోధులు మరొకరికి దోపిడీ దారులు. అప్పుడు సామాన్య ప్రజల జీవితాల్లో ఏర్పడిన గందరగోళానికి, జరిగిన అలజడిలో ఎవరి బాధ్యత ఎంతుందో కూడా ఆలోచించుకోవాలేమో. కేవలం విలీనం, విమోచన అని సెప్టెంబర్ 17 ను వర్ణించేటప్పుడు ఎవరి దృక్కోణం నుండి అన్న విషయం కూడా తప్పకుండా చర్చించాలి. ఈ రాజ్య విమోచన ముస్లిముల ప్రాణాల ఫణంగా జరిగినప్పుడు, అది బీదర్లో, వేరే చోటా జరిగిందని, తమకు సంబంధం లేదని తెలంగాణా వాదులు తప్పించుకునే అవకాశం లేదు. అప్పట్లో బీదర్, నాందేడ్, గుల్బర్గా ప్రాంతాల్లో నివశించిన ముస్లింలు సెప్టెంబర్ 17 తరువాత ఇప్పటి తెలంగాణ  జిల్లాలలోకి పారిపోయి వచ్చి తెలంగాణలో అంతర్ భాగమయి పోయిన తరువాత, వారి భయంకర అనుభవాలని, ఎదుర్కున్న హింసని తెలంగాణా చరిత్రకారులు గాని, తెలంగాణా వాదులు గాని ఎట్లా కొట్టిపడేయగలరు?
సెప్టెంబర్ 17 వస్తోందంటే చాలు ప్రతి తెలుగు వార్తా పత్రిక ఒక ‘రజాకార్’ దుర్మార్గాన్ని, ఒక నిజాం పోలీసుల కధనీ ప్రచురిస్తుంది. తెలంగాణా ప్రజలను, నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని, విలీనాన్ని సమర్ధించి తమ దేశ భక్తిని చాటుకున్నందుకు ‘జాతీయ గుర్తింపు’ నిచ్చి పొగుడుతుంది. పైన చర్చించిన స్త్రీల జ్ఞాపకాలు, అనుభవాలు ఈ జాతీయతా మూసలో ఇమడవే మరి! రజాకార్ల దౌర్జన్యాలు, నిజాం పోలీసుల అరాచకాలతో పాటు, విమోచన యోధుల దోపిడీలు, భారత సైన్యం దుర్మార్గాలు కూడా స్మరించుకోవాలి మనం. సాయుధ పోరాటం హైదరాబాదు విమోచన కోసం, ఆ రాజ్యాన్ని భారత దేశంలో కలపటానికీ రాలేదని, ప్రధానంగా దున్నే వారికి భూమి కోసం, ‘హిందూ’ దొరల ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిందనీ గుర్తు చేసుకోవాలి. ఆలోచనా పరులైన తెలంగాణా వాదులు పదే పదే చెప్తున్నట్లు, ఈ ప్రాతం అనేక చరిత్రల చౌరస్తాలో ఉండింది, ఉంటూ వచ్చింది. ఇది జాతీయ వాద చరిత్రలోనో, హిందుత్వ వాద చరిత్రలోనో, వామ పక్ష చరిత్రలోనో వొదిగేది కాదు, ఏకోన్ముఖంగా వివరించగలిగేదీ కాదు. 1944-50 ల మధ్య సమయపు రాజకీయాలను కూడా బహు ముఖంగా, పలు కోణాల నుండి మాత్రమె చూడగలం. తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించి, కొత్త చరిత్రలను రాసుకోబోతున్న తరుణంలో ఇటువంటి అవగాహన అలవరచుకోవటం బహుశా మరింత అవసరం. 
 
ఎ. సునీత

ఎ. సునీత

– సునీత అచ్యుత

ఎల్లలు దాటుతున్న తెలంగాణా అక్షరం!

Memont Final1

ఎనిమిదేళ్ల కింద తెలంగాణా రచయితల వేదిక నాయకత్వం అగ్రకుల వాసనలున్న వారినుంచి బహుజన వాదుల చేతుల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ‘తెరవే’ దొరల నాయకత్వం ఊడిగం నుంచి అసలైన ప్రజల అస్తిత్వ ఉద్యమంలోకి ప్రవేశించింది.

గత 12 సంవత్సరాలుగా తెలంగాణా రచయితల వేదిక తెలంగాణా సంస్కృతి పరిరక్షణగా పనిచేస్తూ, తెరవే తన పరిధిని విస్తృతపరుచుకునే క్రమంలో రెండేళ్ళ క్రితం అఖిల భారత తెలంగాణ రచయితల వేదికను నిర్మాణం చేయడం జరిగింది. హిందీలోకి ‘ఉడాన్’ అనే కవితా సంకలనాన్ని ఆవిష్కరించింది. అయితే దేశ, విదేశాల్లో కవులు, రచయితల గురించి ఆరా తీయగా ముంబాయి, భీవండీ, షోలాపూర్, ఢిల్లీలలో కొందరు, విదేశాల్లో నామమాత్రంగా ఉన్నారు. ఇలా ఉండడానికి కారణాలను వెతుకగా తెలంగాణ ప్రాంతం నుంచి శ్రమాధారిత వలసలే ప్రధానంగా అకనిపించాయి. విదేశాల్లో కవులు, రచయితలు కొద్దిగా ఉన్నారు. తెలంగాణ నుంచి  మేధోపరమైన వలసలు గత దశాబ్దం నుండే జరుగుతుంఢడం వలన అని తేలిపోయింది.

ఇప్పుడు తెలంగాణ రచయితలు ఇక్కడి సాహిత్యం, సంస్కృతులపై ఆధిపత్య ప్రాంతం వారు చేసిన దాడిని మరింత తీవ్ర ఉద్యమంలోకి పరివర్తనం చెందేలా పని చేయాలి. ఇదే కాలంలో తెలుగు వాచకాల్లో,  చరిత్ర పుస్తకాల్లో,  తెలంగాణ ప్రజల చరిత్ర, భాషలను, సంస్కృతిని ప్రవేశపెట్టడానికి ఇంటి, బయటి బ్రాహ్మనీయ ఆధిపత్యవాద భావజాలంతో ఆచరణాత్మక లక్షల అక్షర యుద్ధానికి సన్నద్ధం అవుతుంది. ఈ దిశగా తెలంగాణ రచయీతల వేదిక తీవ్రంగా కృషి చేస్తూ పుస్తక ప్రచురణలను, వివిధ కార్యక్రమాలను, మహాసభలను, ధర్నాలను నిర్వహించింది. ఇకముందు నిర్వహిస్తుంది కూడా.

ఇకపోతే తెలంగాణ రాష్ట్రం విషయంలో కాంగ్రేస్ పార్టీ తన నిర్ణయం చెప్పింది. కానీ అది సమైక్యవాదం పేరుతో చేస్తున్న మీడియా ఉద్యమాన్ని కట్టడి చేయాల్సి ఉంది. కాబట్టి పది జిల్లాల (హైదరాబాద్)తో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేయకపోతే 2014 ఎనికల్లో కాంగ్రేస్ నామరూపాలు లేకుండా పోతుంది. మెజార్టీ సీమాంధ్ర పెట్టుబడి రాజకీయ నాయకుల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం ఏ చిన్న పొరపాటు  చేసినా దాని ఆయుష్షు మూడినట్టే. మొత్తం తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్ర నాయకులు ఎట్లయినా వ్యతిరేకులే కానీ తెలంగాణ రాజకీయ నాయకులే మొదటినుంచి పెద్ద ఇంటి దొంగలు. రాజకీయ పరిణామాలను, మోసాలను, కుట్రలను, దగాలను ఎప్పటీకపుడు తెరవే ఎత్తిచూపుతూ సృజనాత్మక ప్రక్రియలైన కవిత్వం, వ్యాసాల ద్వారా దునుమాడుతూనే ఉంది. తెలంగాణ సాయుధ పోరాట  వారసత్వాన్ని అందిపుచ్చుకోలేక యువకులు ఆత్మహత్యలు చేసుకోవడాన్ని తెరవే కీర్తించలేకపోతుంది. ఈ ఆత్మహత్యల శవాల మీది ప్యాలాలను ఏరుకొని బతుకీడుస్తున్న రాజకీయ నాయకులు, కొన్ని ప్రజాసంఘాలు పబ్బం గడుపుతున్న వైఖరులను  తెరవే ఆదినుంచి గర్హిస్తున్నది.

మొదటినుంచి తెరవే ఒక స్పష్టమైన ప్రణాలికా విధానాలతో అడుగులేస్తున్నది. తెలంగాణ వచ్చేదాక ఆధిప్రత్య ప్రాంతాల సాహిత్య, సంస్కృతులపై పోరాటం చేస్తుంది. అదేకాలంలో తెలంగాణ ప్రాంతం సాహిత్య సంస్కృతుల పునర్జీవనానికి కృషి చేస్తున్నది. తెలంగాణ వచ్చినంక బహుజన పక్షం వహించి ఈ ప్రాంతం సంపదలను దోచుకొని రాజకీయ ముసుగులో దోబూచులాడే అధికార నాయకత్వంతో తిరుగులేని పోరు సలుపుతుంది. ఆ దిక్కుగా నిరంతరం అక్షరాయుధాలను లక్ష్యంగా ఎక్కుపెడుతూనే ఉంటూంది.

 -జూకంటి జగన్నాధం

 

నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాథం

నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాథం

భాష, చరిత్ర నిర్మాణం మీద శ్రద్ధ పెరగాలి

వాస్తవానికి తెలంగాణా రచయితలు చేయవలసిన  కార్యక్రమాలు  మునుపటికన్నా ఎక్కువగా ఉన్నాయి. భాధ్యతలు కూడా ఎక్కువ. భాషా సంస్కృతి, సాహిత్య రంగాల్లో గతంలో జరిగినవన్నీ బేరీజు వేసుకోవాలి. ఆ పనిని భద్రపరచవలసిన అవసరం కూడా ఉన్నది. వర్తమానంలో తెలంగాణా భాషా సాహిత్యాలకు జరుగుతున్న వివక్ష ఇంకా ఎండకట్టాలె. అన్నమయ్యను పట్టించుకున్నంతగా రామదాసును పట్టించుకోలేదు. ఇక్కడి కోటి లింగాల ప్రాధాన్యాన్ని చరిత్ర పుస్తకాల్లోకి ఇంకా ఎక్కించలేదు.

ఇక భవిష్యత్ దర్శనం కూడా చాలా అవసరం. ముఖ్యంగా పత్రికల్లోనూ, సినిమాల్లోనూ, పాఠ్యపుస్తకాల్లోనూ, పాలన భాషగాను తెలంగాణా భాష ఎట్లా ఉండాలె అన్న అంశం పై చర్చ జరగాలి. సమగ్ర తెలంగాణా నిఘంటువు నిర్మాణం, సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం మొదలైన అంశాలు పట్టించుకోవాలె. ఇప్పుడున్న స్థితిలో తెలంగాణా వనరుల విధ్వంసం ఆపాలి. పాలకుర్తి సోమన నుంచి ఇప్పటివరకు కోనసాగుతున్న దేశీ కవితా సంప్రదాయాన్ని, జానపద సాహిత్య వారసత్వాన్ని పదిలంగా కాపాడుకోవాల్సిన భాద్యత తెలంగాణా కవులదే..

– నలిమెల భాస్కర్

——————————————————————

పోరాడే గొంతులకు సరిహద్దులు లేవు!

6730_1201798282421_6844587_n

తెలంగాణా దశాబ్దాల తన్లాట  ఒక కొలిక్కి వస్తున్నట్టున్న సందర్భంలో తెలంగాణా రచయితల భాద్యత మరింత పెరిగిందని భావిస్తూ , అఖిల భారత తెలంగాణా రచయితల వేదిక మరొక్క అడుగు ముందుకు వేసింది. వివిధ రాష్ట్రాలలో, ప్రాంతాలలో స్థిరపడి,    తెలంగాణా సంస్కృతీ, సంప్రదాయాలని , చరిత్రని, సాహిత్యాన్ని నలుమూలల  తమ రచనల ద్వారా చాటుతున్నఅఖిల భారత ప్రవాస రచయితలను ఒక్క తాటికి తీసుకు వచ్చి తెలంగాణా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయ తలచినది.

ఈ నెల 22న , కరీంనగర్ లో అఖిల భారత రచయితల వేదిక మహాసభలలో భారత దేశం లోని ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణా రచయితలు వచ్చి తమ రచనలను , భావాలను తెలంగాణలో పంచుకోనున్నారు . ఈ మధ్య కాలంలో   తెలంగాణా ఉద్యమ క్రమంలో వచ్చిన కొన్ని కవితలని ‘ఉడాన్’ అనే పేరుతొ హిందీలోకి అనువదించిన పుసకాన్ని ఆవిష్కరించనున్నారు . అట్లానే గాగోజు, అన్నవరం, బూర్ల వెంకటేశ్వర్లు, పెద్దింటి అశోక్ కుమార్   ఇతర రచయితల పుస్తకాలను , సీడీ ల  ఆవిష్కరణ లు ఉంటాయి.

తెలంగాణా మలిదశ ఉద్యమం లో ప్రతినిత్యం ప్రజలతో కలిసి  స్థానిక పోరాటాలలో భాగస్వామ్యం అవుతూ,  తమ రచనల ద్వారా అనేక అంశాలని ప్రజలోకి విస్తృతంగా తీసుకు వచ్చింది తె.ర.వే. అందులో ముఖ్యంగా గల్ఫ్ బాదితుల గాధలు , గ్రానైట్ మైనింగ్ ఇతర వనరుల విద్వంసం  ద్వారా జరుగుతున్న జన, ప్రాణ, నష్టాలు , కోల్పోతున్న  చారిత్రిక కట్టడాల పరిరక్షణ, ఇంకా అనేక రూపాలలో తెలంగాణా భావ వ్యాప్తికి  పది జిల్లాలలో  నిరంతర కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

విద్యార్ధులను, ఉద్యోగస్తులను, పట్టణ, గ్రామీణ ప్రాంతాలను ఒక్క తాటిపైకి తెచ్చి అనేకులకు సామాజిక భాద్యత స్పృహను కల్పిస్తున్నారు తెరవే రచయితలు.   తెలంగాణా పునర్నిర్మాణ క్రమం లో,  తెరవే, అభారవే త్వరలో ఏర్పడబోయే అంతర్జాతీయ తెలంగాణా  రచయితల  వేదిక లు ఈ ప్రాంతం  గొప్ప చారిత్రకతని నలుదిశల   వ్యాప్తి చేసేటట్టు, స్వేచ్చా , సమానత్వపు పునాదుల మీద  ఈ ప్రాంతం  నిలబడి  హక్కుల కోసం పోరాడే గొంతుగా రచయితలు తమ అక్షర ఆయుధాలను సంధించేటట్టుగా  ఈ కార్యక్రమం రూపు దిద్దుకుంటుంది.

తెలంగాణా ప్రకటన రాగానే దోపిడీ, పెట్టుబడి దారుల అండతో  సీమ, ఆంధ్రా లో   మొదలైన ఒక బూటకపు సమైక్య ఆరాటం తోని , కేంద్రం జాప్యం తోని ఒకింత అసహనానికి , అధైర్యానికి గురైతున్న తెలంగాణా ప్రజలకి , నిరాశతో ప్రాణాలు కోల్పోతున్న యువతకి మళ్ళి ఉద్యమ చైతన్యాన్ని నింపి , ప్రజలతో కలిసి ప్రజలతో కలిసి ఉద్యమించడానికి ‘అతెరవే’ పిలుపునిస్తుంది. హైదరబాద్ మీద డేగ  కన్ను వేసి, మత విద్వేషాలని రగిల్చి, హింసను ప్రేరేపించి నయాన్నొ భయాన్నొ తెలంగాణా ని అడ్డుకుందామని చూస్తున్న సీమ , అంధ్రా నాయకుల కుట్రలను తిప్పికొట్టి తమ రచనల ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడూ  అప్రమత్తం చేస్తూ ఉండే బాద్యతను నిరంతరం చేపడుతుంది రచయితల వేదిక.    దానికి కలిసి, దేశ,  ఖండాంతరాలలో ఉండి నిరంతరం తెలంగాణా కొరకు ఆరాట పడే మిత్రులకు ఇదే మా ఉద్యమ ఆహ్వానం .

 సుజాత సూరేపల్లి

రాష్ట్ర కార్యదర్శి , తెరవే .

1208945_528882817180842_314503988_n 

                 ———————————————————————–

 ఆంధ్ర మూసనుంచిబయటపడాలే!

536547_314947875241005_1061780088_n

ముందుగా అరవై ఏండ్ల కింద మాయమైన తెలంగాణా భాష ను తిరిగి చిగురింప చేసుకోవాలే. ఇప్పుడు కవులు, రచయితలు చేయాల్సిన పని ఇదే.

తెలుగు జాతి పేరిట ఒక్కటై తెలంగాణా సంస్కృతి ని సత్తే నాశనం చేసిండ్రు.  ఎన్నో ఉద్యమాల పలితంగా దళిత బహుజనులు ఆదివాసీలు అస్తిత్వ  చైతన్యం పొందుతున్న తరుణంలో తెలంగాణా ఉద్యమంలో దోపిడీ,  అగ్ర కులశక్తులు సహజంగానే ప్రవేశించాయి  రానున్న రోజుల్లో వీళ్లతోనే మల్లా షమ ఉండే ఉంటది. ఇక్కడి వనరుల విద్వంసం జరిగింది. వందలాది, వేలాది గుట్టలను గ్రైనేట్ పేర దోసుకొని పోతాండ్రు. వాళ్లకు తెలంగాణా రాజకీయ నాయకులు అండగా ఉంటాండ్రు ,

ఇప్పుడు తెలంగాణా పాఠ్యపుస్తకాలు , చరిత్ర పుస్తకాలు మార్చుకోవాలె. కవులు, రచయితలు ఆంధ్ర మూస ,ఆంధ్ర ప్రమాణాలతో సాహిత్యాన్ని బేరీజు వేస్తున్నారు. అది పోయి తెలంగాణా ప్రమాణాలు నిలువాలే. అరవై ఏండ్ల సీమాంద్ర పాలన వల్ల తెలంగాణా సమాజం చెప్పరానంత నష్టపోయింది . దానిని తిరిగి నిర్మించే ఉద్యేశ్యంతో ఈ సభలు నిర్వహిస్తున్నాం.

-అన్నవరం దేవేందర్

 1238254_515385905211021_339088778_n

త్రిపురా… ఓ త్రిపురా!

వివిన మూర్తి

 

“ఏమిటి నీ ప్రయత్నం?”

“అర్ధం చేసుకుందామని”

“ఎవరిని?”

“—??—”

“ఆయన్నా.. వాళ్లనా.. ”

“అంతేకాదు”

“కాక?”

“చాలా ఉంది. మొత్తాన్ని. రాతని.. చదువుని.. రాయించే చదువుని… చదివించే రాతని.. కమ్యూనికేషన్ని… సాహిత్యాన్ని.. మనిషిని.. నన్ను. ”

“నిన్నా?”

“అవును. నన్నూనూ”

****

“విశాఖపట్నం అంటే సముద్రం”

“కాదు. రాచకొండ. ”

“ఛఛ 13 నంబరు బస్సు.. కేజీహెచ్ అప్పు.. ”

“తెన్నేటి విశ్వనాధం.. అబ్బూరి.. ”

“సింగు హోటలు.. సొంటి బిస్కట్లు”

“కాదు కాదు.. కనక మాలక్ష్మి.. యారాడ కొండ”

“కిట్టటం లేదోయ్.. పాత ఇశాపట్నమా.. ”

“ఇచ్చట మార్గము మూయబడెను.. మార్గమును వెదుకుడి.. ”

****

“హోటల్లో చదివావా?”

“కాలేజీలో చదివాను. ”

“బీట్ రూట్ లాంటి దిబ్బకుర్రాడు దోసిని తినీసి పెసరెట్టుని తడమటం. తెలుగు సినిమా హీరో ఓ దాన్ని వానలో తడిపేసి.. మరోదాన్ని మంచులో ఎక్సర్సైజులు చేయించి.. డాఫర్ పని చెయ్యటం.. ”

“సంబంధం లేదు”

“స్టేట్మెంటా..? నీక్కనపడలేదు”

“చూపించొచ్చుగా”

“చూసిన నీకే కాపడనప్పుడు.. నానేటి సూపించేది”

“ఏంటీ న్యూసెన్సు!!! ”

“ఇమిటేషను బాబూ.. తమాసకాలు కాదు.. ”

“బొంగేం కాదూ.. ”

“ప్యూర్ కాకపోవచ్చు”

“పూర్ కూడా కాదు.. నీ పద్దతిలో నువ్వేడు”

“నా పద్దతా అదేంటది?”

“వాస్తవం.. రాత ద్వారా వాస్తవం.. ”

“నాకలాటి భ్రమలు లేవు. రాతలో ఉండేది వాస్తవ భ్రమ.  కల్పన.”

“వాస్తవం ఉండదా”

“అద్దంలో ఉండేది నువ్వా?”

“కొండలున్నాయి. వాటి మధ్యలోంచి సూర్యుడు పొడవటం ఉంది. సముద్రం ఉంది. ఆ అలల మీద కిరణాలు పడటం.. వీటిని పడవలు చెదిరించటం ఇదంతా.. వాస్తవమే.. ”

“లేదు. భూమి తిరగటమే వాస్తవం.. ”

“రాతలో ఇదంతా నీ కళ్లకి కట్టిస్తాను. నా మనసుకి పట్టిన ప్రతి అనుభూతినీ.. తట్టిన ప్రతి ఊహనీ.. నీ మనసులో పుట్టిస్తాను.. ఇదంతా వాస్తవం కాక.. ?”

“కాదు. ”

“మరి వాస్తవం ఏమిటి?”

“అదేదో నువ్వు చెప్పాలి”

“నేనా?”

“అవును. ఆయన గురించి రాయాలన్న నిర్ణయం నీది. వాస్తవం – కల్పన అన్న ఆలోచన మెదడున పడ్డది నీకు. దానిని కనటం నీ బాధ్యత.. ”

“వెల్లువలో పూచిక పుల్లలు.. మృత్యుంజయుడు.. అల్పజీవి..అసమర్ధుని జీవితయాత్ర.. హిమజ్వాల.. బుచ్చిబాబు.. చంద్రశేఖరుడు.. మార్క్వెజ్.. సాల్ బెల్లో.. వేణు.. ”

మిత్రబృందంలో త్రిపుర

ముందు వరస 1.అత్తలూరి 2. త్రిపుర 3. భరాగో 4. భైరవయ్య 5. కాళీపట్నం
వెనక వరస 1. ఆదూరి సీతారామమూర్తి 2. అల్లం శేషగిరిగావు 3. అబ్బూరి గోపాలకృష్ణ 4. ఎయస్వీ రమణారావు 5. వివిన మూర్తి

“ఆపాపు.. లిస్టు పెద్దదే.. లింకు తెలీటం లేదు.. ”

“అర్ధం కాకపోటమే లింకు.. అర్ధమయూ కాకపోవటమే సంబంధం.. తరతమ భేదాలు.. స్వపరాలు.. ”

“ఏభై ఏళ్లకి పైబడి చదూతున్నావు.. ఏదో ఒకటి గిలుకుతున్నావు.. అర్ధం కాదంటం పొగరు కాదా.. వాళ్లని అవమానించటం కాదా.. నువ్వు గిలికీదీ అర్ధం కానివాళ్లు చాలామంది.. ”

“ఇంగ్లీషున రాసింది అర్ధం కావాలంటే ఇంగ్లీషు రావాలి.. రాదనటం పొగరెలా అవుతుంది.. మహా అయితే సిగ్గు పడాలి.. ఒప్పుకోటానికి కాస్త ఖలేజా ఉండాలి.. లేకపోతే వినాయకుడి బొడ్డులో వేలే.. అది నాకు గాని వాళ్లకి గాని అవమానమూ గాదు.. సన్మానమూ కాదు.. ”

“ఇంగ్లీషు నేర్వొచ్చుగా.. ”

“ప్రయత్నం చేసా. పట్టు దొరకలేదు”

“అసలు కొందరెందుకు అలా రాస్తారు?”

“కొన్ని వివరణలున్నాయి. ఒక ఎఫెక్టుకి అనేక కాజెస్ ఉంటాయి. అనేక చర్యలకి ఒకే ఫలితం ఉండవలసిన అవసరం లేదు. ”

“అన్నీ చెప్పు”

“పొడుగైపోతుంది. పలచనై పోతుంది”

“నువ్వేప్పుడైనా ప్రచురణ గురించి పొడుగు పొట్టిల గురించి .. ”

“రాయటం మొదలు పెట్టేముందు తనేం చెప్పదలుచుకున్నదీ రచయితకి స్పష్టత ఉంటుంది. అంటే ఆ విషయంలో అతను కాన్షస్ అనవచ్చు. ”

“పాత్రను సృష్టిస్తున్నపుడే నూతిలో పడాలా ఉరేసుకోవాలా అన్నది రచయిత నిశ్చయించేసు కుంటాడంటావు. ”

“కాదు. ఓ క్లిష్టస్థితి నుంచి ఓ స్వభావం కలిగిన పాత్ర లేదా సమూహం బైట పడాలన్నది రచయిత కలం పట్టేముందే మనసులో ఉంటుంది. బయట పడటానికి చంపాలా చావాలా పారిపోవాలా అన్నది కథ రాస్తున్నపుడు మారే అవకాశం ఉంది. చనిపోవటానికి రచయిత అనుమతించితే నుయ్యా, ఉరా, ఎండ్రినా, గార్డినలా అన్నది చాలా చిన్ని సమస్య.”

“ఇలస్ట్రేట్ చెయ్యి”

“చావు అన్న కథలో ఓ గుంపు ఓ ప్రత్యేక పరిస్థితి నుంచి బయటపడాలన్నది రాత ఆరంభించేసరికే కాళీపట్నం రామారావు నిర్ణయం. దానికి జొరావరీగా పుల్లలు కొట్టటం కూడా అతని రచనాపూర్వ నిర్ణయం అయుండాలి. రెండవ నిర్ణయం వెనక రచయిత కన్విన్స్ అయిన న్యాయమో, తాత్విక భావజాలమో అలాంటిదేదో ఒకటుంటుంది. ”

“వద్దొద్దు. నీ వ్యూ పాయింట్ కి సార్వత్రికత ఉందీ అంటే ఈయన కథల నుంచే చెప్పాలి. కొంపదీసి కథలే కావంటావా?”

“నిస్సందేహంగా కథలే.. ఏ కథా.. ?”

“అర్ధం కాలేదంటున్నా అన్నీ చదివావుగదా.. ఒక్కటంటే ఒక్కటి నీ ఇలస్ట్రేషన్ కి పనికిరాదా”

“అన్నింటినీ ఈ భావనతో వివరించవచ్చు. సరే.. చీకటిగదులు.. ”

“కానీ.. ”

tripura

“భాస్కర్ పోగొట్టుకుని, పొంది, పోగొట్టుకుంటాడు కల్యాణిని. ఆవిడని పోగొట్టుకోటం అనే బలితో గాని సుఖమూ, స్వేచ్ఛా భాస్కర్ పొందలేకపోయాడన్నది ‘నిజమే’ అయితే కటువైనది. ఈ నిజం అన్నది కలం పట్టే క్షణానికే కథకుని మనసులో ఉంది. అందువల్ల పోగొట్టుకోటం కథకుని నిర్ణయం. స్వేచ్ఛ పొందానని భాస్కర్ అనుకోటం కథకుని రెండవ నిర్ణయమే. దాని వెనుక కథకుడు కన్విన్స్ అయిన తత్వమో, న్యాయమో, క్రమమో మరేదో ఉంది. అదేమిటో నాకు అందలేదు. ”

“పోనీ.. మిగిలినవన్నీ అందేయా?”

“నాకందినవి చెపుతాను.”

“?”

“శేషాచలపతి పొలిటికల్ మీటింగ్ కి వెళ్తాడు. అక్కడివన్నీ ‘కొత్వాలీ’ లో రిపోర్టు చేస్తాడు. అంతకుముందు రాసిన కథలు పాఠకుడు చదవకపోతే ఈ విషయం పాత్ర స్వభావాన్ని అందిస్తుంది. అప్రధానంగా కనిపించే ఈ వాక్యం ఓ విధంగా ఈకథకి ‘కీ’. శేషాచలపతికి బాల్యం ఉంటుంది. తల్లిని తండ్రి చంపటం.. ఆ చంపటంలోని క్రూరత్వం ఓ వాక్యంలో దాచుతాడు కథకుడు. ‘ఆ పూజాగృహంలో, నాన్న అమ్మని చంపి, వూడిపోయిన పన్నుని అరచేతిలో పట్టుకుని చూసుకున్నాడు-’.. కథ భవిష్యత్తు సూచించే ఓ శక్తి మరో వాక్యంలో.. ‘అతడి దోవలో తగిలినవాళ్ల జీవితాల్లో ఒక మలుపు తిప్పిస్తాడు. అతని ధాటికి నిలవటం కష్టం’. ‘రంగు’ సంగతి భాస్కర్ నోట చెప్పిస్తాడు. ‘నేను’ ‘నాది’ బంధాలే కాదు. బాధ్యతలు.. ’ ‘అవును జీవితం బద్దలయేవుండేది’ అంటాడు ఓల్డ్ స్మగ్లర్ ఇటుకల్లాంటి మాటలకు ప్రాణాలు పోస్తుంటే.. ‘మిగతా అంతా సిన్నింగ్ ఫ్లష్ .. ’ అంటున్నపుడు నవ్వులో అమాయకత్వం కళ్లలో క్రూరత్వం పెట్టుకున్న శేషాచలపతి ముందు అడ్లూ, ఆటంకాలూ తొలగించింది కథకుడా.. ఓల్డ్ స్మగ్లరా.. శేషాచలపతేనా.. ?”

“ఇన్ని అందాక కూడా రచయిత విశ్వసించిన తత్వం.. అందలేదా.. ”

“విశ్వసించిన అనటం నాకు ఇష్టం లేదు. అందరూ కాఫ్కా అంటారు గదా.. ఇన్ ద పీనల్ కాలనీ చదివి చలించిపోయాను. మెటమార్పసిస్, ద ట్రయల్ వంటి ప్రసిద్ధాలు చదివానో లేదో గుర్తులేదు. కాని ఆయన ప్రభావం మన కథకుని కథలలో కనిపిస్తుంది. తండ్రీ-కొడుకు సమస్య.. మార్క్వెజ్ అన్నట్లు కాఫ్కాను చదివాక “that it was possible to write in a different way”… ”

“సరేనయ్యా అందరికీ తెలిసినదే గదా.. ”

“అన్నీ అందరికీ తెలిసినవే గనక .. నాకెందుకు అనుకోవాలంటే మూసేస్తాను.. ”

“సరే సరే నీ గోలేదో నువ్వేడు.. ”

“అబ్సర్డిటీ .. తెలుగులో ఎవడేమంటాడో నాకు తెలీదు.. అసంబద్ధతని కాఫ్కాని కలపటం ఉంది.. కన్నడ సాహిత్యంలో ఇది గుర్తుపట్టగలిగేంత కనిపిస్తుంది.. జీవితానికి అర్ధం లేదని చెప్పే అర్ధం కొందరికి గట్టిగానే పడుతుంది .. ఎందుకు.. అన్నీ తెలిసాక కూడా ఏమీ తెలియకుండా పోతోందనిపించటం వల్లనా.. ఎక్కడో అది కేపిటలిజాన్ని.. అంటేటీ.. జనం బాధలకు కారణాన్ని .. కాదంటుందని కొందరు… వాస్తవాన్నే నిరాకరిస్తుందని కొందరూ.. మార్క్సిస్టులే గట్టిగా వాదించుకునేదాన్ని.. సాహిత్య ప్రతిఫలనంలో.. త్రిపుర వంటి వారు.. కథకులే కారేమో అనిపించే కొందరి.. రచనా లక్ష్యం ఏంటి.. చీకటిగదులలో జీవితపు అసంబద్ధత చూపించటమా.. తనని తను ఎలాంటి purposeనీ లక్ష్యాన్నీ మనసులో ఉంచుకోకుండానే వ్యక్తం చేసుకోటమా.. పెద్దాయన రచన.. వాస్తవం నిరాకరణ కోసం కల్పనా.. కల్పన సొగసు కోసం వాస్తవ నిరాకరణా.. రచయిత కల్పనలో ఉద్దేశిత ఉద్దేశ్యం లేకుండానే వాస్తవాన్ని – పాఠకులని.. ప్రభావితం చేస్తుందని ఇంత స్పష్టంగా తెలిసాక .. రచయిత బుర్రలో ఏమున్నా మానినా అతని కల్పన వాస్తవాన్ని కొట్టిపారేసినా.. అది వాస్తవాన్ని వాస్తవంగా ప్రభావితం చేస్తే.. అందులోనూ సామాజిక ప్రయోజనం గాళ్లని .. ఉందనుకునే వాళ్లని.. ఊపేస్తే.. ”

“…………………”

“పన్ను వూడితేనే సలుపు పోతుంది. కల్యాణి పోతేనే స్వేచ్ఛ.. రామాయణానికి ప్రేరణ జంట విడిపోటం లోని దుఃఖం .. దానిలోని సుఖం ఈ కథకి ప్రేరణా.. సుఖానికి రచయిత నమూనా అలక్ నిరంజన్ యా..సుఖం పట్ల అసంతృప్తా.. సంశయమా.. ”

“అదేదో నీకు అర్ధం కాలేదా.. కథకునికి కూడానా.. ?”

“భగవంతం కోసం .. హోటల్లో .. కెజిహెచ్ ఎంట్రన్స్ ఎదురుగా .. పద్మా నివాస్ అనే గుర్తు.. బుర్రలో తిరిగింది.. అది చదివీ, చదివీ .. వాస్తవం, కల్పనల మధ్య.. బుర్ర తిరిగింది కాని కరగలేదు.. ఎదగలేదు .. అసలది చదవి, వేసిన .. సబ్బు.. కి ఏటి బోద పడిందో నాకైతే కనపడ్డవి కనబడ్డాయి గాని.. బోద పడనేదు.. ఏబైయేళ్ల క్రితం అందులో ఉన్నదేదో .. ”

“దానికి కాలం ఏమిటి?”

“నిరీక్షణకా? మెదలవటానికా? అట్నుంచి ఏడులోనూ.. ఇట్నుంచి పదమూడులోనూ రాని భగవంతం రాటానికి.. ”

“నీకు భాష్యకారులు కావాలి.. ”

“వాస్తవానికి అక్కరలేదు.. సుబ్బారాయుడి రహస్యజీవిత మంత బహిర్గతంగా ఉంటే ఎందుకు?”

“కొన్నింటికి ‘కీ’ అక్కరలేదంటావు”

“కొందరికి కావాలి”

“అందరికీ వకాల్తా ఎందుకు?”

“ఐతే కాసుకు..జైలురోడ్డుకీ సింగుహొటలుకీ మధ్య.. అట్నుంచి కుడివైపు వీరాస్వామి.. ఎడంవైపు నేను.. జర్కన్ వద్దని.. బర్మా కార్గో పడవల పెత్తన ప్రపంచం నుంచి .. నిన్నటి వరకూ తనకిందే పనిచేసిన మనుషుల్తో కలిసి.. మురికి వాడలో.. కుళ్లు కంపులో.. ఎలక్ట్రిక్ దీపాలకోసం అరుస్తూ.. నాస్తిక సమాజం కావాలి రావాలి.. పైసా ఇయ్యి పేరు చెపుతా .. వెంకట్రావు కొడుకు.. ప్రభ పుటల్లోంచి.. ”

“నీకూ భాష్యకారుడు కావాలంటావు.. ”                                                                                                                                            tripura_336x190_scaled_cropp

“అది భాష్యకారుడి కథవుతుంది.. నీకథ ఎక్కాలంటే.. నీ ఏడుపు సంగీతం కారాదు.. ”

“అయిందేమో.. ”

“ఎందుకవదూ.. వానవానగా బాంబులు కుర్దుల మీద కరుస్తుంటే కవనశర్మ ఇరాక్ వాసులు.. వాన తగ్గింది పదండి కూరలు కొనుక్కుందాం.. బజారు చేసుకుందాం.. తొడతొక్కిడి.. టేక్ బహుదూర్ .. పదకొండు ద్వారాలు తెరిచి.. ఓ చాయ్ చిన్నారిని మూసి.. మార్ఫియా వద్దు.. బిస్కట్లు కావాలా.. కర్నాటక ఆంద్రా స్వతంత్ర దేశాలై.. మదనపల్లి బోర్డర్లో తుపాకీగుళ్ల వర్షంలో .. టీ.. చాయ్.. టీ.. చాయ్.. దానికి అక్కరలేని వీసా నీకెందుకు వచ్చెయ్ వివినా అంటూ ఆటునించి వల్లంపాటి.. నాదగ్గర వీసాలేదు.. నాకోసం పన్నెండు ద్వారాలు తెరవటానికి నువ్వు టేక్ బహుదూర్ కాలేవు వల్లంపాటీ.. ఉండుండు.. గాజీ మునిగి పోయింది.. నిస్సార్ సబ్ మెరీన్ రెస్క్యూ షిప్ పంపాలి.. పధండి.. నిద్ర లేవండి.. వైర్లు పీకేసి పని ఆరుగంటలది రెండు గంటల్లో.. డ్రైడాక్ డోర్లు తెరుచుకుంటూ నీరు వదులుతుంటే.. ఓడ కూర్చున్న దుంగలు కదిలి కూలుతున్న శబ్దం.. నెమ్మదిగా సముద్రాన్ని కావలించుకుని హుషారుగా తెల్లారగట్ల మూడుగంటల ప్రాంతంలో డాక్ జట్టీ మీద డాంగ్రీలలో వెళ్తున్నవాళ్లకి చెయ్యూపుతూ నించున్న దృశ్యం.. తిరిగి వస్తారా ప్రశ్నల మొక్కలు తలలో ఎదుగుతుంటే పీకేసిన వైర్ల చుట్టల మధ్య సిటిసి సేవిస్తూ.. ”

“నీకు బాధ్యత లేదా?”

“గొలుసులు గొలుసులుగా జ్ఞాపకాలు వరదలా పొంగుతుంటే.. ఏ కాజ్ ఏ ఎఫెక్ట్ విచికిత్స కొట్టుకుపోతుంటే .. తెగిపడ్డ బాధ్యతలకి సానుభూతి చూపించగలను గాని.. బాధ్యత వహించను. ”

“నువ్వెవరివి?”

“ఈ క్షణానికి ఓ బిలియన్ మిలియన్ స్పెర్మటోజోవాలో ఛాన్సు వచ్చిన నారాయణావతారాన్ని. ద్వారం కనిపించక సముద్రాన్ని ద్వారం చేసుకున్న నువ్వుని. ”

“చెప్పు చెప్పు”

“నారాయణకి కనుపించని ద్వారాన్ని కనుగొన్నవాడిని.. ప్రపంచమంతటా లాసా మొనెస్టరీలో.. కింబర్లీ వజ్రపు గనులలో బ్లాక్ ఫారెస్టులో.. నీచేల వాల్మీకిలో.. స్మగ్లర్ లో నన్ను చూసుకున్నవాడిని.. ఇక్కడ ఈ ఆస్తి.. సంతకాలు.. తల్లీ తండ్రీ.. అక్కా చెల్లీ వెదుకులాటలో.. యవ్వనం, దేహం.. వారసత్వాన్ని తెగ్గొట్టాలని.. తీర్ధపురాళ్ల మీంచి.. కోస్టల్ బాటరీ పక్కన నువ్వు ఉరికిన రాత్రే .. ఆ రాత్రే.. ఆఖరురూపాయ.. ఆకలి రూపాయ..ద్రోణంరాజు చలపతిరావు అనీ బిలియన్ మిలియన్ స్పెర్మటోజోవాలో ఒక్కటి ఒకే ఒక్కటి ఆకారం దిద్దుకోకపోతే.. ఇది రాయటానికి త్రిపురని చదవటానికి మిగలని వాడిని.. కనిపించని ద్వారం వరకూ వెళ్లి.. కనిపించినవన్నీ నావే.. నేనే.. నని.. వారసత్వాలు తెగ్గొట్టటం కోసం అదే పరిష్కారం అంటూ వెర్రికేకలు వేసుకుంటూ.. పిచ్చిరాతలు రాసుకుంటూ.. ”

“అంతా వ్యక్తిగతం.. టూ పెర్సనస్.. ట్రూ పెర్సనల్.. ”

“పెర్సనల్ అన్నది అసలు ఉందా.. మనం, మనకి ఎదురయీ సమస్యలు.. వాటికి పరిష్కారంగా కలిగే ఆలోచనలు వాటికి రూపాన్నిచ్చే శబ్దాలు.. సంకేతాల భాష అన్నీ సమాజ ఫలాలే.. ఫలితాలే.. మరోలా చెప్పాలంటే నువ్వుండటం వల్లా మరెందరో ఉండటం వల్లా ఎవరెవరో రాసినవి చదవటం వల్లా.. ”

“మరి వంతెనలు ఎందుకూ.. ?”

“అదీ అసలు ప్రశ్న.. అందులో ఉన్నది త్రిపురే కాదు.. నేనూనూ.. మేం ట్రైటర్సుం.. మేమున్నచోట ధనం ఉంటుంది.. దాన్ని వదులుకోగలం.. అసహ్యించుకోగలం.. జేబులో రాజీనామాలు, గార్డినల్ మాత్రలు, రివాల్వర్లూ అన్నీ మావైపే గురి పెట్టుకోగలం.. రాజూ ఏ పసిబిడ్డల భావి శాంతి స్వప్నాలలో మనిషి కోసం వెక్కివెక్కి ఏడుస్తావ్.. ఏడుస్తూ ఏ ఆయుధం పట్టుకుంటావంటూ మొత్తకుంటాం.. రాజు గురి మారదు.. మా గురి మా గుండెలకి తప్పితే మా మెదడుల మీదకే ఎక్కుపెట్టబడి ఉంటుంది.. అయినా ఆశ.. మేమూ రాజూ ఏ వంతెన మీదైనా కలుసుకుంటామన్న ఆశ.. అందాకా మమ్మల్ని మన్నించమంటూ వేడుకోలు.. మమ్ము తిరస్కరించొద్దని కైమోడ్పులు.. వంతెన ఉందనే మా నమ్మకం.. కాని గురి మారదు.. అతని గురి వేరు.. మాది మాత్రం మావైపే.. నిద్రమాత్రలతో, భర్కీ, రివాల్వర్ నాకోసం నావైపు మృదువుగా మెత్తగా ఎదురుచూస్తుంటే మధ్య పురంలో త్రిపురా.. నేనూ.. ”

“సఫర్ .. ప్రయాణం జరగదా?”

“నడుస్తూనే ఉంటుంది.. రాజు ప్రశ్న వేస్తూనే ఉంటాడు.. ఎందుకంత విషాదం అంటూ.. జవాబుల కోసం మేధావి జీవితంలో.. చీకటి గదుల్లో దొరుకుతుంది.. ప్రవేశించు.. చీకట్లో కనిపించదు.. గదుల్లో చిక్కడి పోతావు కాకుండా పోతావు.. బయట ప్రపంచంలో ఓపెన్ నక్సలైట్ గా అన్నీ వదులుకుని.. లోపలికా బయటకా.. నీ సఫర్? జూడాస్ వి కాగలవు గాని కావుగదా.. ”

“సఫర్ ముగుస్తుందా?”

“ఎలా… కనిపించని ద్వారం లోంచి వంతెనల మీద సఫర్ అభినిష్క్రమణతో కూడా మలుపు.. త్రిపుర రెండవ పురం.. నా మటుక్కు నాకు ప్రధానం.. మొదట జ్ఞాన సేకరణతో.. సేకరించిన జ్ఞానంతో గొడవ.. రెండో దానిలో ఆచరణ ముందు వంగిన తల.. ఆచరించే రాజు ఆచరణ ప్రశ్నల బాణాల ముందు .. వివాహ వ్యవస్థలో సుశీల ప్రేమ స్వంతం..గృహం గృహిణి.. మరి విమల? ఉంటుంది.. జరుగుతుంది.. బయట ఇళ్లంటుకుని.. దేశం దుర్గంధ భూయిష్టమై.. కన్నీళ్ల పర్వతాలను దొర్లించుకుంటున్న చీమల పుట్టల మధ్య.. విమల సాధ్యమా.. సాధ్యమే.. సుశీలా ఎలా ముడెయ్యను మన పిక్నిక్ ముగిసిపోయింది.. అభినిష్క్రమణ కదా ఇది.. రాజూ.. నిన్ను సందేహాలు అడగలేను.. నా ప్రశ్నల కత్తులతో నన్ను నేను చీల్చుకోకుండా ఉండలేను.. బై.. ”

“మూడో పురం.. ?”

“మాలోని అత్తలూరులు చలించి.. ప్రపంచాన్ని చేర్చి.. నువ్విదని.. నీదిదనీ.. నువ్వే ఆహ్వానించని దేన్నో నీముందుంచి.. నీ చుట్టూ ఆరాధకులకి చోటు పెట్టి.. ఎనిమిదేళ్ల ఎడంలో.. ఇంకా ఉన్నానా.. ఓ వాన సాయంత్రం.. సైకిలు కొట్టులో.. సీలలు ఇంకా లూజే.. గ్రీజు వదలదు.. బురదలో కాలు పెట్టకుండా ఉండలేవు.. ఇది అసలు ప్రపంచం కాదు.. కాపీ, నకల్, కౌంటర్ ఫీట్.. మెదడు మడతల్లో డిజార్డర్ చూడు.. డిజార్డర్ లోని ఆర్డర్ కనిపెట్టు.. డాక్టర్ జాన్ పి జాన్ – నీకేం రోగం లేదు బొద్దింక గుర్తింపు.. కుక్క గుర్తింపు కనిపెట్టి కథకట్టే మూర్తీ నీకిలాంటి ఆలోచనలు ఎలావస్తాయి.. నీకు డిజార్డర్ ఏంటి.. ఆర్డర్ లేని ప్రపంచంలో ఆర్డరుందనే వాళ్లలో నారాయణ నట్టులోంచే .. తండ్రి.. ప్రభువు.. సర్వవ్యాపి.. ఎక్కడున్నాడో .. వస్తాడు.. నీచెయ్యి పట్టుకుంటాడని నమ్మవు పట్టుకునీవరకూ.. ”

“మూడోపురంలో నువ్వు లేవా?”

“కౌంటర్ ఫీట్, నకల్, కాపీ ఎక్కడినుంచి వస్తాయి ఒరిజినల్ లేకుండా.. రూపు లేని రాజు చూపూ.. దూరంగా తనలో తనే గొణుక్కునే మూర్తీ.. కల్పనతో కరాలు మోడుస్తున్న వాస్తవ ప్రపంచం ఆరాధకులూ.. ఒరిజనల్ కదా.. ఆ చూపు.. ఆప్రశ్నలు .. చచ్చిపోయాయా.. తుప్పు తుడిపించు.. గీసి పారెయ్.. నట్లు బిగించు.. ఆయిలింగ్ చేయించు.. –ఇవ్వన్నీ ‘పైనే’ – జీవితంలోంచే, ఒరిజినల్ లోంచే కొంటర్ ఫీట్లూ పుడతాయి.. అది గుర్తు పడితే ఒరిజినల్ కుట్ర అవదు. నకలు అన్న ఆలోచనే కుట్ర అవుతుంది. ”

“ఇదీ ఆయనదేనా?”

“నేకపోతే నా పైత్యమా.. నా జొరావరీయా?”

“తేడా తెలీటం నేదు బాబూ”

“తెలాలా?”

నాటి-నేటి త్రిపుర

నాటి-నేటి త్రిపుర

“తెలవాలనీ,  తెలపాలనే గదా నీ ఏడుపు…… ఈ ఏడిపింపూ ”

“ఏడుపా.. కాదే.. ప్రయత్నం.. ఒరిజినల్.. ”

“తేడా ఏంటో?”

“నేనంటే రెండు మనుషులని యిప్పుడిప్పుడే తెలుస్తోంది.. కావాలంటే భగవంతం సంతకం చూడు.. ఒకరినొకరు వెతుక్కుంటూ.. తప్పించుకుంటూ.. ఒకరికొకరు ఎదురైనా గుర్తు పట్టీపట్టనట్లుగా.. ”

“లాభాల గూబల్రాయుడూ నువ్వేనా వలసపక్షీ”

“ఒకవేపే పక్కమీదే మూడు సంవత్సరాల పడుకున్న తర్వాత రెండోవేపు తిరిగి పడుకోటానికి ఉపక్రమించేటపుడు సహజంగా, సంతోషంతో ఎంతో సుఖంగా తేలిగ్గా నిట్టూర్చే వరదరాజులూ.. ఎప్పుడూ ఒకవేపు పడుకోక క్షణంక్షణం మెసిలే నేనూ.. హహ్హహ్హ.. ”

TripuraKathaluPrintBook

“మరినువ్వు?”

”గారబంధ ఆయన్ని గుండోల్లోకి తీసుకున్నవాణ్ణి పెద్దపెద్ద ధియరీలు నాకొద్దు- అతనే నా అంతరాత్మ- నారక్షకుడు.. నా దిగులుకు కారణమూ విరుగుడూ”

“భగవంతం?”

“ఏడేళ్లు ఒక వాక్యాన్ని సరిదిద్దుతూ తెలుసుకున్నది భగవంతం ఒప్పేసుకుని సంతకం పెట్టేసాడు గదా.. ”

“నిజమే గాని-”

“ఒకే ఒక కథని. కుప్పిలి సుదర్శన్ పిల్లిగడ్డాన్ని .. పాలకొండ గ్రంధాలయంలో .. విపుల పాము కరిస్తే.. దాంతో ఇరవై జతల కళ్లని కరపించితే.. పది జతల పెదాలు అర్ధంకాలే అంటే.. ఆరు బుర్రలు ఆంగ్లంకి అను.. అనుమానం చూపుల్తో.. నాలుగు జతల కళ్లు ఉన్మత్త ఉద్విగ్నతతో.. పాము మాజండా జైజై కొట్టి .. అవునవును సాధ్యమే ..ఎప్పుడో  డొస్టోవిస్కీ నేరానికి 67లో మొదలైన శిక్ష ఈ కథాకారాగారంలో ఎవరెవరు ఏఏ పిచ్చి పిచ్చి ఏడుపులతో కాగితాలని పాడుచేసారని లెక్కించుకుంటూ అనుభవిస్తూంటే.. త్రిపుర రామయ్య రాస్తే రాయండి చెక్కొద్దని గొణిగితే .. అసహనం ఫోనుముక్కు మీదనుంచి జారిపోతే.. త్రిపురా ఓ త్రిపురా.. అర్ధమయీ కాని తెలుగు త్రిపురా.. ”

“ఏంటి డౌటు వివినా?”

 “మరేం లేదు గాని త్రిపురా.. నివ్వు ట్రైటరువి.. ”

“నివ్వు కాదేంటి?”

“కాదు. భాషని వాడుకుని దానికి వెన్నుపోటు పొడిచావు. జ్ఞానాన్ని సేకరించి రీసైకిల్ బిన్ లో వేసావు. ‘ఉన్న’ భావనని స్వీకరించి ‘లేని’ భావనగా మార్చేసావు. ‘ఉన్న’ ప్రపంచంలో జీవించి దాన్ని అంతరాత్మ చేసుకుని ‘లేని’ మనుషుల మధ్య అలజడి పుట్టించావు. నువ్వు ట్రైటరువి. బతకటానికే కష్టపడీ ప్రపంచాన్నిమెదడులో మోస్తూ తోచీతోచని ప్రపంచంలో తోపుడుబండి పెట్టుకుని తిరుగుతున్నావు. వాస్తవాన్ని తీసుకుని కల్పనలో వేసుకుని పంచాల్సిన నువ్వు ..వాస్తవాన్నే నిరాకరించే నువ్వు.. నువ్వే ట్రైటరువి.. ”

“వెర్రోడా.. నువ్వూ అంతే.. అక్షరాల గోడల మధ్య సాగని భావప్రసారం కోసం అక్షరాలనే ఆశ్రయించే వాళ్లంతా .. అంతే stabilized అంతటినీ de-stabilize చేయజూసే వాళ్లే వివినా.. పదాల చెకుముకి రాళ్లతో నిప్పు పుట్టించే రచయితలు మనుషులని మాత్రమే కాల్చగలరు.. బండలను కరిగించలేరు. ప్రతి రచనా మనిషిని కాల్చాలనే చూస్తుంది. రైటర్సంతా ట్రైటర్సు కాదనగలవా.. ”

“ మరి రాజు?”

 

 – వివిన మూర్తి