Archives for July 2013

తెలుగులో కన్నడ కథల పరిమళాలు

matateeru

కన్నడనాట ఉత్తమ రచయితల్లో ఒకరైన శ్రీ పూర్ణచంద్ర తేజస్వి రచించిన కథలకు తెలుగు అనువాదం “మాటతీరు”. తెలుగు సేత  శాఖమూరు రామగోపాల్.

ఈ అనువాద కథాసంకలనంలో ఎనిమిది పూర్ణచంద్ర తేజస్వి గారి కథలు మాత్రమే కాకుండా, వర్తమాన కన్నడ సాహిత్యంలో విశేష కృషి సలుపుతున్న శ్రీ ఎస్. తమ్మాజీరావ్ నంగ్లీ గారి కథలు రెండు, బి. ఎల్. వేణుగోపాల్ గారి కథలు రెండు, కె. సత్యనారాయణ గారి ఒక కథ ఉన్నాయి. అదనంగా, అనువాదకులు హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలలో తన పర్యటన వివరాలను ఆసక్తికరంగా అందించారు. పూర్ణచంద్ర తేజస్వి గారి కథల్లో ఎక్కువగా గ్రామీణ భారతం నిండి ఉంటుంది. ప్రకృతి వర్ణన కళ్ళకి కట్టినట్లుగా ఉంటుంది. ఆయా వర్ణనలను తెలుగులో కూడా సమర్థవంతంగా వ్యక్తీకరించారు శాఖమూరు రామగోపాల్ గారు. ఈ పుస్తకంలోని కథలను పరిచయం చేసుకుందాం.

సహ్యాద్రి పర్వత శిఖరాల మీద గంభీరమైన చీకటి అదేదే గొంగడ్ని కప్పుకొన్నట్లు ముసుగేసి కప్పుకుని ఉంది.

బాల్యం అంటే కుతూహలం, బాల్యం అంటే భయం, బాల్యం అంటే ప్రశ్నలు, బాల్యం అంటే భరోసా! చదువుకుంటున్న పదేళ్ళ శివ తన తండ్రి మంజప్ప గౌడ పిలవడంతో చదువాపి వరండాలోకి వస్తాడు. బయట వాన కుండపోతగా కురుస్తూంటుంది. కొత్తనీరులోని రుచి కోసం పంటకాలువలో ఎదురీది వచ్చే బురదమట్టల్ని, కొర్రమీనల్ని పట్టుకోడానికి మంజప్ప గౌడ, పనివాడు లింగడితో కలిసి ఆ రాత్రి వేళ బయల్దేరుతూంటాడు. జాగ్రత్తగా తలుపు వేసుకోమని చెప్పి, వాళ్ళిద్దరూ బయల్దేరుతారు. శివ సగం తలుపు తీసి ఉంచి, బయటి వానని; తండ్రి, లింగడు ముందుకు సాగడాన్ని చూస్తూంటాడు. జోరుగాలికి తలుపులు కొట్టుకోవడంతో లోపలిగదిలో ఉయ్యాలలో నిద్రపోతున్న శివ తమ్ముడు సదానంద ఏడుపు మొదలుపెడతాడు. వాడిని ఊరడించమని తల్లి లోపలినుంచి కేక పెడుతుంది. వాన ఆగదు. ఆ రాత్రి గడిచిపోతుంది. మళ్ళీ చీకటి పడుతుంది.

తండ్రీ, లింగడూ రారు. శివ చెల్లెలు ఓ వసపిట్ట. ఆమెకి ఎన్నో సందేహాలు… వాటన్నింటిని శివ ముందుంచుతుంది. శివ వాటికి జవాబులు చెప్పలేడు. చివరికి అలా ప్రశ్నలు వేయకూడదంటూ…. తనకు లింగడు చెప్పిన కథ చెబుతాడు. ఆ కథ విని చెల్లి బాగా భయపడిపోతుంది. తాను లింగడి నుంచి కథ విన్నప్పుడు భయపడినదానికంటే, చెల్లి ఎక్కువగా జడుసుకున్నందుకు శివకి కాస్త ఆనందం కలుగుతుంది. వాన కురుస్తునే ఉంటుంది. ఊగుతున్న గుడ్డి దీపం వెలుగులో తమ్ముడి ఉయ్యాల నీడ గోడమీద పడి నాట్యం చేస్తుంది. మెల్లగా శివకి తన కథపై తనకే భయం కలుగుతుంది. బెదిరిపోతాడు. ఇంతలో తలుపు చప్పుడై, తండ్రి, లింగడు లోపలికి రావడంతో కథ ముగుస్తుంది. బాల్యంలోని అమాయకత్వాన్ని, కథలలోని కల్పనలని తెలుసుకోలేని ఉద్విగ్నతనీ అద్భుతంగా చిత్రిస్తుంది “లింగడొచ్చిండు” కథ.

తన కాళ్ళ అడుగుభాగాన జరుగుతున్న ఈ దుర్బల మానవుల నడవడిక మరియు తన తల మీద నడుస్తున్న మేఘమాలికల సయ్యాట…. ఈ సర్వవ్యాపారానికీ సాక్షిభూతంగా ఆ పర్వత శిఖరం గాంభీర్యంగా నిల్చి ఉంది!

లక్కడు, సోముడు అనే ఇద్దరు నిష్ప్రయోజకులూ, స్వార్థపరుల కథ “ఉరుము చెప్పిందేంటి?”. పని చేయడాన్ని ప్రాణసంకటంగా భావించే వీరిద్దరూ తమ ముసలి అవ్వని రోడ్డు మీద వచ్చే వాహనానికి అడ్డంగా పడేసి, ఆమె మరణించాక, రాబట్టుకునే నష్టపరిహారంతో మజా చేసుకోవాలనుకుంటారు. వేరే ఊర్లో పని వెతుక్కోడానికి వెడుతున్నట్లుగా ప్రయాణమై, అనుకున్నట్లుగానే దారిలో ముసలామెను ఓ వాహనానికి అడ్డంగా తోసేస్తారు, ఆమె మరణిస్తుంది. ఆ కారు యజమాని దగ్గర వందరూపాయలు (కథాకాలం 1957 వ సంవత్సరం, ఆ కాలంలో వంద రూపాయాలు చాలా పెద్ద మొత్తం) తీసుకోబోతుంటే ఓ తమాషా జరుగుతుంది. ఆ వాహనం యజమాని వంద రూపాయలు ఇవ్వకుండానే చిన్నగా మందహాసం చేస్తాడు. మనిషిలోని కుత్సిత స్వభావానికి అద్దం పడుతుందీ కథ.

హులియూరు అనే ఊరిలో నివసించే రంగప్ప గౌడకీ, అతని కొడుకు సోమూకి ఒక్క క్షణం కూడా పడదు. తండ్రి ప్రతీ దాంట్లోను కొడుకును నియంత్రించాలనుకుంటాడు, కొడుకేమో స్వతంత్రంగా ఉండాలని తండ్రి అదుపాజ్ఞలకి దూరంగా పోవాలని ప్రయత్నిస్తూంటాడు. సీత అనే అమ్మాయిని కొడుక్కిచ్చి పెళ్ళి చేయాలని రంగప్ప గౌడ పంతం. ఆ సంబంధం కాకుండా తను ప్రేమించిన నళినాక్షిని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. వీరి ప్రాంతంలో గద్దలెక్కువ. కోడిపిల్లలు ఏమరుపాటుగా ఉన్నప్పుడు చటుక్కున క్రిందకి దిగి నోట కరుచుకుపోతుంటాయి. రంగప్ప గౌడ గద్దల్ని చంపాలనంటాడు. సోమూ దానికి నిరాకరిస్తాడు. కారణం, మల్లినమడుగు గ్రామంలోని పూజారి చేసిన బోధ. గద్దలు విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడి ప్రతిరూపమని, దానిని చంపిన వారు తిన్నగా నరకానికి పోతారని పూజారి చెబుతాడు. ఆ మాటలను బలంగా విశ్వసిస్తాడు సోమూ. ఒక గద్ద వీళ్ళింట్లో కోడి పిల్లలని ఎత్తుకుపోడానికి దిగుతుంది, వీళ్ళ పెంపుడుకుక్క ఆ గద్ద నోట కరుచుకుంటుంది, కుక్క నుంచి గద్దని కాపాడేందుకు సోమూ ప్రయత్నిస్తే, అది భీతిల్లి తన వాడైన గోళ్ళతో సోమూ చేతులను గీరి అతని ముంజేతిని పట్టుకొంటుంది. పైకి ఎగరలేక, గోళ్ళను సోమూ ముంజేతిలోకి బలంగా తెంచుతూంటూంది. పని వాడి అరుపులకి తండ్రి బయటకి వస్తే గద్దని తప్పించేందుకు, ఒక కత్తి తెమ్మని అరుస్తాడు సోమూ. కత్తి తేవడం ఆలస్యం అయితే, చివరికి దాని మెడ కొరికి చంపుతాడు సోమూ. “నువ్వూ నరకానికి పోతావా?” అని పనివాడు అడిగితే, “స్వర్గం నరకం అనేవి లేని లేవు, అంతా పూజారుల ఒత్తి మాటలు” అంటూ కసితీరా ఉమ్ముతాడు. ఇదొక ప్రతీకాత్మక కథ.

సోమూ సుభద్రని ప్రేమిస్తూంటాడు లేదా ప్రేమిస్తున్నానని అనుకుంటూంటాడు. ఓ మైదానంలో కూర్చుని పల్లీలు తింటూంటాడు. అతని పక్కనే ఓ నల్లకుక్క నిల్చుని పల్లీల కేసి ఆశగా చూస్తూంటుంది. ఒక్కో పల్లీగింజ నోట్లో వేసుకుంటూ, నెల రోజుల క్రితం జరిగిన సంఘటనని గుర్తుచేసుకుంటాడు సోము. ఆ రోజు – చీకటి పడుతోంది, వెళ్ళాలంటూ సుభద్ర తొందరపెడుతుంది. ఇంకాసేపు ఉండమంటాడు. ఆమె వినకుండా ఏదో చీటీ చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. ఆమె మీది కోపంతో అందులో ఏం రాసుందో కూడా చదవడు. ఆ కాగితాన్ని జేబులో కుక్కేసుకుంటాడు. – ఈ నెల రోజులలో ఆమె మళ్ళీ కనబడదు. సగం నమిలిన పల్లీగింజ గొంతుకు అడ్డం పడడంతో వర్తమానంలోకి వస్తాడు. దాన్ని బయటకు రప్పించడానికి రకరకాల విన్యాసాలు చేస్తూండగా, పక్కనే ఉన్న ఆ నల్లకుక్క చటుక్కున అతని కాలు కొరికి పారిపోతుంది. అది పిచ్చికుక్కేమో ననే సందేహం కలుగుతుంది. అక్కడ్నించి మొదలవుతుంది అతని కష్టకాలం. బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు పొడిపించుకోవాల్సివస్తుంది, ఆ కుక్క పిచ్చిదో కాదో తెలుసుకోవాలి. ఈ హడావుడిలో ప్రియురాలి సంగతి, ఆమె రాసిన చీటి సంగతి మరిచిపోయి, ఆ కుక్క క్షేమ సమాచారం కోసం తెగ తిరుగుతాడు. ఈ క్రమంలో అతను చిత్రభ్రమకి గురవుతాడు. తనని తాను పురూరవుడిగా భావించుకుని, తన ప్రేయని “ఊర్వశి”గా ఊహించుకుంటాడు. మనుష్యుల లోని చంచల స్వభావాన్ని, భావసంచలనాన్ని చిత్రించిన కథ “ఊర్వశి”.

జోరు వానకు తడి ముద్దై నానిన కొండ శిఖరమొకటి విరిగిపడి కడలి తీరంలో కల్సే ఒక నదీ ప్రవాహంలో మేట వేసి, లంకలా మారినట్లుగా….

మోహన్‌దాస్ కె.జి. (మోని) అనే పేరున్న ఓ బాలుడి కథ “గాంధీజీ దశ నుంచి”. తండ్రికి అనారోగ్యం కలిగితే, మందు తేవడానికి మోని బయల్దేరుతాడు. గాంధీజీ కథ చదువుకుంటూంటాడు మోని. తల్లి అకారణంగా తిట్టి, తండ్రికి మందులు తెమ్మని పంపిస్తుంది. తండ్రికి ఉన్న అనారోగ్యాల పేర్లు రాసుకునేందుకు చెల్లిని పెన్సిల్ అడుగుతాడు మోని. ‘నీ పెన్సిల్ ఏది?’ అని తల్లి అడిగితే, క్లాసులో ఎవరో దొంగిలించారని చెప్పి, మరిన్ని తిట్లు తింటాడు. తండ్రి జబ్బుల జాబితాని తల్లి రాసిస్తుంది. దిగులుగా బయల్దేరుతాడు మోని. వైద్యుదు ఉండే ఊరు నాలుగు మైళ్ళ దూరం. ఏవో ఆలోచనల్లో పడి తల్లి రాసిచ్చిన కాగితాన్ని ఎక్కడో పోగొట్టుకుంటాడు. చివరకి, జబ్బుల పేర్లు గుర్తు చేసుకోడానికి ప్రయత్నిస్తూ, తను చేసిన తప్పులని తండ్రికి ఉత్తరంగా రాస్తాడు గాంధీగారిలా. తర్వాత ఏమవుతుందనేది ఆసక్తిగా ఉంటుంది. పిల్లలు గాంధీగారిలా నిజాలను నిర్భయంగా రాయాలనుకున్నా, గాంధీజీ తండ్రిలా వాటిని ఆమోదించలేని తండ్రులెందరో. 1960లలో రాయబడిన ఈ కథ నేటికీ వర్తిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

గంభీరమైన కథల మధ్య హాస్యం చిలకరించే కథ “పంజ్రోళ్ళి పిశాచి”. హాస్టల్‌లో ఉండే కుర్రాళ్ళు ఇంట్లోంచి పాత్రలు తీసుకొచ్చి చక్కని ఫిల్టర్ కాఫీ తాగాలనుకుంటారు. అర్థరాత్రి తమలో ఒకడైన మిత్రుడింటికి వెళ్ళి పాత్రలు, డికాక్షన్ తెచ్చుకుని, కాఫీ తాగి ఆనందిస్తారు. అయితే తెల్లారాక వారికో నిజం తెలుస్తుంది. గిలగిలాడిపోతారు.

ఆకాశమంతా మేఘాలు కమ్ముకొని, రోడ్లన్నీ బురదమయమై దూరానున్న రమణీయ దృశ్యాలన్నీ తొలగిపోయి స్తబ్దుగా నిలబడియుంది వాతావరణం.

ఈ పుస్తకానికి మకుట కథ “మాటతీరు”. ఓ రచయిత అంతర్మథనాన్ని అందంగా చిత్రిస్తుందీ కథ. వేదాంత సత్యాలను మిళితం చేస్తూ, గ్రామీణుల భోళాతనాన్ని, తుంటరి పిల్లల అల్లరి చేష్టలని చక్కగా చూపిస్తుందీ కథ. ఇరుకిరుకైన బతుకుని మాటల తీరుతో మళ్ళీ మళ్ళీ చికాకు పెడుతున్న జగత్తు మీద, జనం మీద అసహనం వ్యక్తం చేస్తుందీ కథ.

కొత్త మన్నుతో కరిగి కలగలసిన ఆ నీళ్ళు కుంకుమరంగుతో ఉన్నట్లుగా కనపడుతుంది. అటు ఇటు ఉన్న దట్టడవి వాగులోని ప్రవాహం మ్రోతకు ప్రతిధ్వనించి ఒకటి రెండు ఎక్కువైనట్లు మ్రోత పెట్తుంది. తేలుతూ కొట్టుకొచ్చిన గడ్డిగాసం మొదలైనవన్నీ ఆ ఎర్రనీళ్ళ ప్రవాహం మధ్యన తలెత్తి నిలబడ్డ వృక్షాల తలలలో ఇరుక్కుపోయి, ఇక ఆ చెట్లు తలపాగాలు చుట్టుకొన్నట్లుగా నిలబడియున్నవి.

“నిగూఢ మనుషులు” ఈ సంకలనంలో కెల్లా పెద్ద కథ. దాదాపు 56 పేజీల కథ ఇది. మనుషుల నిజస్వరూపాలను, జాతిబేధాలను, అసూయా ద్వేషాలను, అహంకారాలను, కృత్రిమత్వాన్ని ఈ కథ ప్రదర్శిస్తుంది. ప్రకృతి ప్రకోపాన్ని, వరద విలయాన్ని, భూపంకం వల్ల కొండ చరియలు విరిగి పడి గ్రామాలకు గ్రామలు నాశనమవడాన్ని ఈ కథ చెబుతుంది. బీభత్సకరమైన ఘటనలున్నా, భయోత్పాతాన్ని కల్పించదీ కథ. దీన్ని చదువుతుంటే ఒక ప్రాంతపు చరిత్ర చదివినట్లుంటుంది.

తనను లైంగికంగా వేధించిన ఆఫీసర్‌ని శిక్షించమని ఉన్నతాధికారులను వేడుకొన్న ఓ యువతి వినతి మేరకు ఆ అధికారిని వేరే ప్రాంతానికి బదిలీ చేస్తారు. అయితే అనూహ్యంగా బాధితురాలు ఉన్నతాధికారిపై తిరగబడుతుంది. తాను అడిగింది ఏమిటి? వాళ్ళు చేసింది ఏమిటి? అని వాపోతుంది. కారణం తెలుసుకోవాలంటే, ఆలోజింపజేసే కథ “చిట్టితల్లి” చదవాల్సిందే.

“కాళ్ళు లేని కవిత”లో అవార్డుల కోసం, బిరుదుల కోసం తాపత్రయపడే సాహితీవేత్తలపై చురకలు వేస్తారు రచయిత. “ముందుగా బతుకును అనుభవించు. అనుభవం అర్థవంతంగా మారి నీ కవిత్వంలోకి వస్తది. అర్థమైన దాన్ని అక్షరాల్లోకి దించు. అలాగున రాస్తుంటే నీ సాహిత్యం అనుభావమౌతుంది” అంటాడో సీనియర్ కవి, తన జూనియర్ కవికి జ్జాన బోధ చేస్తూ. తర్వాత ఏమవుతుంది? కథ పూర్తయ్యాక చదువరుల పెదాలపై నిట్టూర్పు వెలుస్తుంది.

మూడు వందల కోట్ల రూపాయాలకు వారసురాలయ్యే అవకాశం ఉన్న ఓ మహిళ తన కుటుంబీకులు పెడుతున్న బాధలనుంచి తప్పించుకోడానికి రైలెక్కి వేరే ఊరికి బయల్దేరిపోతుంది. విధి ఆడే వింత నాటకం వల్ల చివరికి ఆ డబ్బు ఆమె ఆశ్రయం పొందిన అనాధాశ్రమానికే అందుతుంది. మనుషుల జీవితంలో సంపద సృష్టించే దురాశని, దాని వల్ల మనుషుల మనస్తత్వాలలో వచ్చే మార్పులని “వారసుదార్లు” కథ చక్కగా చెబుతుంది.

జీవించి ఉన్నప్పుడు ఎవరికీ ఒక్క రూపాయి కూడా దానం చేసి ఎరుగని ఓ వృద్ధురాలు తన మరణానంతరం ఆస్తినంతా ఓ అనాధ శరణాలయానికి ఎందుకు రాసేసిందో తెలుసుకోవాలంటే “సొత్తు” కథ చదవాలి. దొంగ బాబాల మీద, అవినీతిపరులైన రాజకీయవేత్తల పైన సంధించిన అస్త్రం “మఠాదిపతి మరియు మెడికల్ కాలేజి” కథ. నేటి వ్యవస్థలోని లోపాలను వ్యంగ్యంగా ఎత్తి చూపిన కథ ఇది.

చివరగా తన యాత్రానుభవాలు వివరిస్తారు రామగోపాల్ గారు. ఆయా అనుభవాలు చదువుతుంటే, మనం కూడా ఆయనతో ప్రయాణించినట్లు, ఆయా ప్రదేశాలు స్వయంగా దర్శించిన అనుభూతి కలుగుతుంది. కేరళలోని మున్నార్ పర్యటన సందర్భంగా కాలడి వెళ్ళి, ఆదిశంకరుల జన్మస్థలాన్ని, కీర్తిమందిరాన్ని దర్శించారు అనువాదకులు. శంకరుడి జన్మస్థలం దర్శనం కోసం ఆ రోజున వచ్చింది కేవలం పది మందేనని తెలిసి ఎంతో బాధ పడతారు రామగోపాల్ గారు. సినిమా హీరోల ఇళ్ళముందు వందలాది మంది ఎదురుచూస్తుంటే, అఖండ భారతావనిని దర్శించి, నాలుగు దిక్కులా మఠాలు నెలకొల్పి వేదాల ఔన్నత్యాన్ని చాటి చెప్పిన శంకరుని గృహం వద్ద యాత్రికులు లేకపోడాన్ని సంస్కృతి క్షీణించడంగా భావించారట ఆ రోజు వీరితో పాటు ఆ గృహాన్ని దర్శించిన ఓ మహారాష్ట్రకు చెందిన యాత్రిక కుటుంబం. ఓ కఠోర వాస్తవం!

మొత్తంగా తరచి చూస్తే, చక్కని కన్నడ కథలని తెలుగు పాఠకులకు అందించే ప్రయత్నం ఈ సంకలనం అని చెప్పవచ్చు. అయితే అనువాదకులు ఉపయోగించిన భాష – మహబూబ్‌నగర్ జిల్లా, కర్నాటక సరిహద్దుల ప్రాంతంలోని తెలుగు కన్నడం కలగలసిపోయిన యాస – పాఠకులకు కాస్త ఇబ్బందిగా తోచవచ్చు. కొంచెం ఓపిక చేసుకుని చదివితే కన్నడ కస్తూరి పరిమళాలను అస్వాదించవచ్చు. మంచి కన్నడ కథలని శ్రమకోర్చి తెలుగు పాఠకులకు అందించిన రామగోపాల్ గారు అభినందనీయులు.

kolluri

కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమ శంకర్

“మాటతీరు”పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభిస్తుంది. 230 పేజీల ఈ పుస్తకం వెల రూ.200/- (విదేశాలలోని తెలుగువారికి $10.). ప్రతులకు రచయితనూ సంప్రదించవచ్చు.
చిరునామా: Sakhamuru Ramagopal,
5-10, Road No. 21,
Deeptisri Nagar, Miyapur (post),
Hyderabad – 500 049;
Ph: 09052563666; email: ramagopal.sakhamuru@yahoo.co.in

మూడు ముక్కలయిన గుండె కోత “మొరసునాడు కథలు”

MorasunaduKatalu

భాషాప్రయుక్త రాష్ట్రవిభజన, పరిపాలనా సౌలభ్యం కోసమే అనడం నిజమే అయినా, ఒకే భాష మాట్లాడుతున్నవారు, వేర్వేరు రాష్ట్రాలలో కొందరైనా మిగిలిపోవడం, ఆ భాషకు జరిగిన అన్యాయానికి గుర్తే! ఎక్కువమంది మాట్లాడుతున్న భాషగా గుర్తింపు పొందిన తెలుగు భాష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో తమిళనాడు, మైసూరు, ఒడిశా, మధ్యప్రదేశ్ మున్నగు ప్రాంతాలలో ఎంతోమంది తెలుగువారిని పోగొట్టుకుంది. తమిళనాడులో దాదాపు యాభై శాతాన్ని మించి ఉండిన తెలుగు ప్రజల సంఖ్య,  2012 నాటి తమిళనాడు ప్రభుత్వ గెజిట్ ప్రకారం కేవలం రెండు శాతం మాత్రమే అనడం సాంస్కృతికంగా, ముఖ్యంగా భాషాపరంగా తెలుగు వారు నష్టపడుతున్న విధానానికి ఆనవాలు.

ఈ నేపథ్యంలో, యిటీవల వెలువడిన “మొరసునాడు కథలు” అన్న ముప్ఫైకథలతో కూడిన సంకలనం పేర్కొనదగినది. ఆంధ్ర, కర్ణాటకం, తమిళ రాష్ట్రాలుగా ముక్కలైన మొరసునాడులో నివసిస్తున్న రచయితల రచనలివి. తెలుగు భాషాభిమాని,  ప్రళయకావేరి కథల రచయిత,   యీ పుస్తక సంపాదకులలో ఒకరు అయిన స.వెం. రమేశ్ గారు

మొరసునాడును గూర్చి చేసిన విశ్లేషణ గమనింపదగినది. మొరసు అంటే గులకరాతినేల అని అర్థం. గాంగ, రాష్ట్ర కూట రాజవంశస్థుల మధ్య జరిగిన పోరాటాలకు నెలవైన ఈ మొరసునాడు, ప్రాచీన ప్రాకృత శాసనాలలో ‘ సణ్ణనాడు’ గా చోళుల కాలంలో ‘చోళమండలం’గా నొలంబరాజుల కాలంలో ‘నొలంబవాడి’ గా పిలువబడినా క్రీ.శ. తొమ్మిదవ శతాబ్దపు

శాసనాలలో మొరసునాడుగా గుర్తింపబడింది.

ఆంధ్రప్రదేశ్ లోని పాత కుప్పం, పలమనేరు, పుంగనూరు, హిందూపురం తాలూకాలు, మదనపల్లి తాలూకాలోని ఎక్కువ భాగం,    కర్ణాటకలోని కోలారు, చిన్నబళ్ళాపురం, బెంగుళూరు నగరంలోని అన్ని ప్రాంతాలూ, బెంగుళూరు పరిసర ప్రాంతాలైన పెద్ద బళ్ళాపురం, దేవునిపల్లి, కొత్తకోట తాలూకాలు,  తమిళనాడు లోని హోసూరు, డెంకణి కోట తాలూకాలు, వేపనపల్లి ఫిర్కాలు కలిస్తే మొరసునాడు అవుతుందట! ఈ మొరసునాడులో  మొత్తం మీద యాభై శాతం తెలుగువారు, ముప్ఫైశాతం కన్నడిగులు, పది శాతం తమిళులూ, పదిశాతం యితర భాషలు మాట్లాడేవారున్నారట!

ఈ సంకలనం లోని కన్నడ కథల్లో తొమ్మిదింటిని నంద్యాల నారాయణరెడ్డి గారు, ఒక్క కథను కె.యెస్. నరసింహమూర్తి గారు తెలుగులోకి అనువదించగా, తమిళనాడు నుండి తీసుకున్న పది కథలూ తెలుగులో వ్రాసినవే కావడం అక్కడి వారి తెలుగు భాషాభిమానానికి పతాకనెత్తుతూంది.

మూడు ముక్కలైన మొరసునాడు లోని తెలుగు ప్రజల ఏకీకృత  సాంస్కృతికాంశాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారికీ, పరిశోధకులకూ మంచి ఆధార గ్రంథంగా ఉపకరించే ఈ “మొరసునాడు కథలు” తెలుగు సాహిత్య సరస్వతికొక విలువైన ఆభరణంగా అమరిన గ్రంథం. శతాబ్ద కాలాన్ని అధిగమించిన  తెలుగు , కన్నడ కథలు జానపద

స్థాయినుండి గ్లోబలైజేషన్  ప్రభావం దాకా గల విస్తార పరిథిలో సాగగా, తమిళనాడులోని తెలుగు కథలు ఎక్కువమందివి పదేళ్ళ ప్రాయపు పసితనంతో కూడినవైనా, తాము నష్టపోతున్న తమ సాంస్కృతిక విలువలను కాపాడుకోవాలన్న తపనకు అద్దం పట్టేవిగా ఉన్నాయి.

ఈ కథలనన్నిటినీ చదివిన తర్వాత, మానవుని జీవితంలో అత్యంత సాదారణంగా కనిపించే మౌలికాంశాలు, ఏ ప్రాంతంలో నివసించే వారిలోనైనా సమానమైనవే అన్న సత్యాన్నిమరోసారి గుర్తు చేసుకుంటాం. జీవితాలను తలక్రిందులు చేయగలిగిన శక్తి అంతటా సమానమే అని గమనిస్తాం.

స్వాతంత్ర్యానంతరం మనుష్యుల జీవితాల్లో వచ్చిన వేగవంతమైన మార్పులు. ప్రాచీన విలువలను విధ్వంసం చేసే దిశగా పయనించడం, మానసికంగా మారలేని, ఆర్థికంగా పురోగమనం సాధించ వీలుకాని పెద్దల జీవితాలు సంక్షోభంలోకి నెట్టివేయబడటం, యీ స్థితి మానవసంబంధాలపై చూపే ప్రభావం (రానున్న శిశిరం) యీ కథల్లో కనిపిస్తాయి.

ప్రపంచీకరణ ప్రభావం కులవృత్తులను అంతరింపజేసి, జీవితాలను తలక్రిందులు చేయడాన్ని (అన్నంగుడ్డ) కరుణరసాత్మకంగా వివరిస్తాయి. ఫ్యాక్టరీలకోసమని,  కార్ఖానాల కోసమని, పంట చేలను సెజ్ లుగా గుర్తించి, నామమాత్రపు ధరలు చెల్లించి స్వాధీనం చేసుకునే ప్రభుత్వం, భూస్వాములను కూలీలుగా ఎలా మారుస్తుందో, ఆ ప్రాంతపు ప్రజలు పొలాలను, ఊర్లను కోల్పోయి నిలువనీడలేక వలసవాదులుగా ఎలా మారిపోతున్నారో, మనసును పరిమళింపజేసే మట్టి వాసనలను కోల్పోయి, స్వచ్చమైన ప్రాకృతిక సౌందర్యం కోసం ఎలా వెదుక్కుంటున్నారో చెప్పే కథలు ( మా ఊర్లుఎత్తేస్తారా…!, బి.డి.ఎ.వెలినెలవు & చిక్కతాయమ్మ నేల) గుండెను తడి చేస్తాయి.

దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న కొడుకు నుండి ఉత్తరం రావడం ఆలశ్యమైతే, తరంగాల్లా పుట్టే ఆలోచనల్తో సతమతమయ్యే తండ్రి మనసు (తరంగాలు)కు అద్దంపట్టే కథలు, రెండు సంవత్సరాలకొకసారి కూడా గ్రామంలోని తలిదండ్రులను చూసిరావడానికి తీరికలేని కొడుకుకోసం బియ్యాన్ని, కూరగాయలను మూటలుకట్టే తల్లి, ఈ సారి వచ్చేటప్పుడు తనకొక చీరను తెచ్చిపెట్టమని, కొంగున ముడివేసి యున్న రూపాయలను కొడుకు చేతిలో పెట్టే (అమ్మకొక చీర) కథలు మనసును తడిచేసే అపురూపమైన అక్షర శిల్పాలు.

స్వార్థ రాజకీయాలు,  గ్రామీణ ప్రజల ఐక్యతారాగాలను రూపుమాపి, విధ్వంసాలను సృష్టిస్తున్న  (ఇసుక) అమానవీయతను, ఆకాశరామన్న ఉత్తరం ఆధారంగా తనిఖీకి వచ్చిన అధికారికి ఆతిథ్యమిచ్చి, రాత్రిపూట అతడు నిద్రిస్తున్న యింటితో బాటు ఫైలును కూడా తగలబెట్టిన ( తనిఖీ) దౌష్ట్యాన్ని చూసి ఉలిక్కి పడతాం.

వేటగాడి ఉచ్చులో తగుల్కున్న జింకపిల్లలా మగవాడి మోసానికి సులభంగా లొంగిపోయిన చదువుకున్న యువతి ( జింకపిల్ల ),  ప్రేమించిన యువతి మరొకరితో చనవుగా మాట్లాడటాన్ని కూడా సహించలేని వారు (ఎదగలేనివారు),  లేచిపోయి, మోసపోయిన భార్యను ఆదరించిన మనసున్న మనిషి ( వెంకటగాని పెళ్ళాము ), బస్సులో దొరికిన తొమ్మిది లక్షల రూపాయలను డిపోలో అప్పగించిన నిజాయితీని,  చేతకానితనంగా నర్ధారించిన లోకరీతి ( మీరైతే ఏం చేస్తారు?),  తన జన్మకు సంబంధించిన రహస్యాన్ని చెప్పి, తత్ఫలితంగా తన ఆస్తి మీద హక్కునూ, తన ఉనికినీ కోల్పోయి, ఆత్మహత్య చేసికొన్న చంద్రంలాంటి వ్యక్తులు (నేను చంపిన యువకుడు ) , మట్టిగాజులు కొనడానికయ్యే ఐదు రూపాయలను భర్తకు తెలియకుండా దాచడంలో సంఘర్షణ పడిన యాది ( యాది పండగ సంత చేసింది)వంటి నిరుపేదలు, తనను నిర్లక్ష్యం చేసిన కొడుకు కోడళ్ళ మన్నన పొందిన”‘ కూరాకవ్వ”లు, తెలుగు నేల వైశాల్యాన్నిగుర్తుచేస్తూ ఆలోచింపచేసే హాస్యరసస్ఫోరకమైన “కూరేశికాశిరెడ్డి ” వంటి వారు, జీవనం కోసం ఎన్నో వ్యాపారాలు మార్చి, “చివరిమజిలీ” గా  రాజకీయాల్లో కుదురుకున్న తారానాథ్ వంటి బ్రతకనేర్చిన వారు….. ఇలా ఎందరినో,– అనునిత్యం మనకు అక్కడక్కడా తటస్థపడే ఎందరినో — కళ్ళముందు నిలుపుతాయీ కథలు.

అంతే కాదు, మనం నష్టపోతున్న కుటుంబ సంబంధాలను అందంగా గుర్తుచేస్తాయి.  నాన్నమ్మల అకళంకమైన ప్రేమను కోల్పోయి, జీవచ్చవాల్లా బ్రతుకుతున్నమనుమలను ( శబ్దాల వెలుగులో ), అపారంగా వర్షించే మేనత్తల ఆప్యాయతలను, (కావేరత్త మడుకు), తనకేదో అయ్యిందన్న అనుమానంతో క్రుంగిపోయి ఆరోగ్యాన్ని దిగజార్చుకుంటున్న వెంకన్నను, ఉపాయంతో స్వస్థుణ్ణి చేసిన పెద్దమ్మల మానవత్వంతో కూడిన సమయస్ఫూర్తిని (నీడ నీళ్ళు), పరిచయం చేసే ఈ కథలు, మనలోని బాల్యాన్ని తట్టిలేపి, మనం ఈ తరానికి అందకుండా చేస్తున్న అపురూపమైన ఆనందాలను మనముందు ప్రశ్నార్థకంగా నిలుపుతాయి. హాలుక్కమ్మగా పూజలందుకుంటున్న మాతృమూర్తి ( రగిలిన పేగు) కథనం, సాంస్కృతిక సంపదగా మిగిలిన ‘గౌరమ్మ పండగ ‘లు, ‘పాటలపెట్టి ‘శిన్నమ్మలు,  రైతుకూ, ఎద్దుకు ఉన్న బాంధవ్యాన్ని హృద్యంగా అందించే ( జంకనపల్లి దేవగౌని జాలెద్దు ), కథనాలు, గ్రామీణ సంస్కృతీ ప్రత్యేకతను చాటుతాయి.

ఇవన్నీ ఒక యెత్తు కాగా, సంవత్సరమంతా పండిన పంటను, ఏనుగుల బారినుండి కాపాడుకునే నేపథ్యంలో, అనునిత్యం జీవన పోరాటాన్ని సాగిస్తున్న ఒక భౌగోళిక వర్గపు ప్రజల సామాజిక జీవితాలకు ప్రతీకలుగా (జాడ, ఏనుగుల బాయి ) కనిపించే కథలు మనం తినే ఆహారం వెనుకనున్న జీవనావేదనలను గుర్తుచేస్తాయి. ఈ సామాజిక జీవన పోరాటాన్ని ‘ అల్లమదేవి ‘ కథతో కలిపి, తమ వాడ స్త్రీల మానరక్షణకు ఉపయోగించుకున్న ( సిడి మొయిలు ) మహిళల వీరోచిత కృత్యం ఆలోచింపచేస్తుంది.

“ఇంటిముందర పిల్లలు” చేసే అశౌచ్యం అనే అత్యంత ప్రాథమికావస్థ స్థాయి నుండి మొదలై, సెజ్ లు, ప్రపంచీకరణ నేపథ్యాలు, జీవితాలను తలక్రిందులు చేసే పరిస్థితులను వివరిస్తూ, మనం కోల్పోయిన, కోల్పోతున్న ఆప్యాయతాను రాగాలను,మట్టి వాసనలను, పండుగల సంస్కృతినీ, మట్టికీ మనిషికీ మధ్యనున్న సంబంధాలను, ఆదరంగా గుర్తుచేస్తూ సాగిన ఈ కథలు, భౌతికంగానే కాదు, మానసికంగా కూడా మనిషి ఎదగవలసిన ఆవశ్యకముంది అన్న జీవన నేపథ్యాన్ని వివరించడం మరువలేదు. అప్పన్నపదాలు, నారాయణతాత తత్వాలను గుర్తు చేయడమేగాక, అనంతమూ, మహాశక్తిమంతమూ అయిన మనస్సు పోకడలను కరుణార్ద్రంగా వివరిస్తూనే( జాన్ పాల్ చేసిన బీరువా కథ ), అనశ్వరమైనది ఏదివుందో, అది నశ్వరమై కనిపించే లోకం ద్వారానే మనుష్యునికి అందుతుందనే అద్వైత భావంతో (మధుర మీనాక్షి ) కూడిన జీవన తాత్వికతనూ వివరిస్తాయి.

ఈ కథలను చదివినపుడు, మనం పొందే మరో మధురానుభూతి, మొరసునాడులో ప్రతిఫలిస్తున్న మాండలిక భాషాసౌందర్యాన్ని ఆస్వాదించడం  వలన కలిగే అనుభూతి. ముఖ్యంగా కన్నడ, తమిళ ప్రాంతాలలో వాడుకలో మిగిలి ఉన్న తెలుగు పల్కుబడులు, ఆయా భాషలతో కలగలసి ఏర్పడిన కొత్త పదబంధాలు మనస్సులను పరిమళింప జేస్తాయి. సోరంపు రెక్కలు(కిటికీ తలుపులు), బెడుకు (దీపం)లు, తీరాటు(యూనిఫారం)లు, తేటంగా పటం (మ్యాప్) లు,  నేల కంజము( ధాన్యం పాతర)లు, తొణేకత్తె( తొండ)లు, చెలువు(ఖర్చు)లు, పోటుముట్టు (ఆయుధాలు) లు, మంగళం(ఫోర్టికో)లు, కలకుండు(ఊరకుండు)లు, పొక్కిపోవిడి(వదంతి)లు, బానము(ఆకాశము), జాలుమట్లు( చారలు), సారిగ( పెద్ద పొలం)లు — వంటి పలుకు బడులు, మాండలికాలుగా రూపుదిద్దుకుంటూ తెలుగు భాషా పరిథిని పెంచుతున్నాయి.

తెలుగు భాషా సౌరభాలు మనలను ముంచెత్తుతున్న  ఈ పుస్తకాన్ని  చదివి ముగిసిన తర్వాత, మంచికథలను చదివామన్న ఆనందంతోబాటు, చిక్కి పోయిన తెలుగునాడు పరిథిని, మరిచిపోయిన సాంస్కృతిక పరీమళాలను తలచుకొని మనసు మూగబోతుంది.

మన సంస్కృతిని శ్వాసింపజేసే ఈ మొరసునాడు కథల సేకరణలో తోడ్పడిన ఎందరో మహానుభావులకు, కథల ఎంపికలో పాలుపంచుకున్న, మధురాంతకం నరేంద్ర గారికి, ఆర్.ఎం.ఉమామహేశ్వరరావుగారికి, సంపాదకులు స.వెం. రమేశ్ గారికి, స. రఘునాథ్ గారికి తెలుగు భాషా ప్రేమికులు ఋణపడి ఉంటారు, యింత మంచి కథల హారాన్ని తెలుగు సాహిత్యంలో చేర్చినందుకు.

భాషాపరంగా, సాంస్కృతికంగా,తెలుగునాడుకు ఉపబలకంగానున్న మొరసునాడు, దీనికి దక్షిణంగా ఉన్న వరుసనాడు (తేని జిల్లా లోని మరొక తెలుగు తావు)లను గూర్చిన పరిశోధనవైపు విశ్వవిద్యాలయాలు దృష్టిని సారించ వలసిన అవసరముంది అంటున్న స.వెం.రమేశ్ గారి ఆర్తినీ, అభ్యర్థననూ గూర్చి ప్రతి తెలుగు పరిశోధకుడూ సానుకూలంగా స్పందించాల్సిన అవసరాన్ని ఈ పుస్తకం నొక్కి వక్కాణిస్తుంది.

 డా .రాయదుర్గం విజయలక్ష్మి

 

 

దేవుడమ్మ

jhansi papudesiనన్ను మావూర్లో అందురూ దేవుడమ్మంటారు.మామూలుగా పూజబెట్టి పిలిస్తే వొచ్చే దేముడు నా పైనికి రాడు. నాకెప్పుడు దేముడొస్తిందో నాకు తప్ప ఇంగెవురికీ తెల్దు. దేముడ్ని నమ్మనోల్లు నన్ను దొంగ దేవుడమ్మని ఎక్కిరిస్తారు. వోల్లు నన్నట్టా ఎక్కిరిస్తే నాకు భయింగా వుంటుంది. మాయత్త ఇనేస్తిందేమో అని.యాలంటే నాకు దేముడొచ్చింది ఆమెవల్లే. మాయత్త పేరు యెంగట లచ్చిం. నేను ఆమి రెండో కొడుకుని పెల్లిజేసుకోని ఈవూరికొచ్చినా. మాయమ్మోల్లు రోజూ కూలికి బోతేనే రోజూ అంత సంగటి తినేది. మాయత్తోల్లు బాగా వున్నోల్లు.ఈడైతే కూట్నీల్లకు కరువుండదని మాయత్త గయ్యాలిగంపైనా నన్నీఇంట్లో ఇచ్చేసింది మాయమ్మ.

పెల్లి గాక  ముందు  ఆడతా పాడతా  వుంటి మాయమ్మోల్ల  ఇంట్లో .. తెల్లార్తో  లేసి  కళ్ళాపి  జల్లి  ముగ్గేసి, బోకులు కడిగేసి అంత  సద్దాగేసి కూలికి  బొయ్యేది… మాయిటాల  వొచ్చి  వుడుకుడుగ్గా  రెణ్ణీల్లు  బోసుకోని  కడుపుకింత  తినేసి అరుగుమింద కుచ్చోని అరుట్లు  కొడ్తా  నిద్దరబొయ్యేది .

ఆదినం  నేను  కూలికి పక్కింటి సుబ్బులత్త  దెగ్గిరికి బొయ్యింటి . నేను సింతకాయి  బొప్పిదీసి ఇసుర్రాయి  మింద బెట్టుకోని సుత్తితో  కొట్టి కొట్టి కిందేస్తా వుంటే సుబ్బులత్త  పండు  వొలస్తా వుండాది . అర్రోజు  పని జేసేసి ఇంటికి రమ్మని మాయమ్మ జెప్పింది . నన్ను చూసేదానికి పెల్లోల్లు వొస్తావుండారంట.

మద్దేనం మూడు గొడ్తా వుండగానే పల్లి బస్సుకు పెల్లోల్లు వొచ్చేసినారు. మాయత్త , ఆడబిడ్డి , ఆడబిడ్డి  మొగుడు , పెండ్లికొడుకు  వొచ్చినారు  నన్ను జూసేదానికి . నన్ను అట్టా ఇట్టా నడవమని, మాట్టాడమనిజెప్పి నాకు అయిటి లేదని దెల్సుకున్నారు. నాకు వొంటజేశేది వొస్తిందని మాయమ్మ జెప్పింది. వుత్త  జల్లి గదా  అది..  సద్దినీల్లకే సచ్చిబతకతా వుంటే ఇంగ వొంటేం వొండేది…మాయమ్మ నాగురించి ఏందేందో జెప్పి ఎచ్చులుబోతావుంది. నాకు మాత్తరం వోల్లకు కయ్యలుండాయని,రెండుమూడు జీవాలుండాయని,ఇంట్లో టీవీ గూడా వుందని భలే కులుగ్గా ఉండాది. బొట్టుగట్టిచ్చుకోని ఆయిగా ఆడికి పూడిస్తే సిన్మాల్లో మాదిరి వుండచ్చని కాస్కో నుండా. నాఈడుదే ఎగవీధిలో వుండే సుబ్బక్క.

12

టీవీ జూద్దారని వోల్లింటికిబోతే పెగ్గిజేస్తా వుంటింది. మిసిను ఆపుజేసేసి దాయాలు ఆడేదానికి రమ్మంటింది.నాకు దాయాలు ఆడేదానికన్నా టీవీ జూసేదే బాగిస్టం.  ఎట్టోకట్ట ఈ సమందం కుదిరిపోతే దినామూ టీవీ జూడచ్చు. ఇట్టనుకోని మాయత్తకు కొంచిం నోరని జెప్తే కూడా పెల్లికి వొప్పుకునేసినా. నామొగుడు బాగనే వుండాడు…కొంచిం మనిసి కుర్స. అయితేబొయ్యినాడు…కొరుక్కోనేమన్నా తింటామా…కడుపులో సల్లగుంటే సాలు. కాణిపాకులో పెల్లిజేసుకోని వొచ్చేసినా. బంగారు బొంతాడు,మాయమ్మ గుండ్లకమ్మలు, ఒక రాగి అండా బెట్టించికోని మరేదగా వొచ్చినా ఈడికి.

వొచ్చినాకగదా దెల్సింది నాకు…మాయత్త నోట్లో నోరు బెట్టేంత బుద్దిలేనిపని ఇంగోటి లేదని. మాఇంట్లో తాగేది సద్దినీల్లే ఐనా తిండికోసం ఎప్పుడూ తిట్లుదిన్లా. మాయత్త నోరంటే నోరుగాదది. నామొగుడు వోల్లమ్మ ముందర నోరుగూడా దెరవడు. ఎప్పుడన్నా తెర్సినా నన్ను దిట్టేదానికే. వుత్త దద్దమ్మ. మూడురాత్తుర్లు జరక్కముందే నాకుదెల్సిపొయ్యింది… పెద్దగాండ్లపొయ్యిలోకొచ్చి పడ్నానని.

పెండ్లయ్యిన మర్రోజే మాయత్త మా మొగుడూపెళ్ళాలు పొణుకోనుండారని గూడా సూడకుండా పొరకతో దెమదెమా తలుపును గొడ్తా సెత్తదోస్తా వుండాది. పంజేసుకుంటా కొడ్తావుండాదేమో అనుకోని మల్లా ముడుక్కోని పొణుకున్నా. నేను లేశి బైటికొచ్చేదాకా ఆడ్నే తోస్తా వుండాది. లేశొస్తానే  “అప్పుడే లేసేస్తివా…బాయికాడికి బొయ్యి రెండు బిందెలు నీల్లుదెచ్చి అండాలోబోసి నీల్లకిందట్ట మంటెయ్యి..బిన్నిగా నీల్లుబోసుకోని దీప్ము బెట్టెయ్యి. మల్లి మనిద్దురూ అన్నం జేసుకుందారని’’….నవ్వతా నవ్వతా పనంతా నాతోనే జేపిచ్చేసింది మాయత్త.

మెట్నిల్లుగదా… పనిజేస్తే తప్పేవుండాదిలే అని జుట్టు ముడేసుకోని మాయత్త దగ్గిర పొరక దీసుకున్నా. పనంతా అయిపొయ్యినాక వంటింట్లోకి బొయ్యి ఏంజేద్దామత్తా టిపనుకి అంటె సద్దుండాది తాగెయ్యి..కూరేమన్నా జేసుకుందారి మద్దేనానికి అనింది. కొత్తపెల్లికూతురికిఎవురన్నా సద్దిబోస్తారా…? నా నోరట్టా తెరసక పొయ్యింది. ఇంగేం జేసేది…అత్తయ్యి పొయ్యె..వొచ్చి వొకరోజైనా కాలా…  ఏంటికి జగడాలేసుకునేదని గొమ్మునైపొయ్నా. ఏదో వొగిటి తినేసి..కూరజేద్దారని పప్పేడుందో ఎతకతా వుండా.. నేందెచ్చిస్తా వుండని చాటెత్తుకోని వొంటిల్లుకానుకోనుండే రూము బీగాలు దీసుకోని లోపలికి బొయ్యింది. నేంగూడా యనకమ్మిడి పొయ్యినా..

లోపలంతా దొంతులు పేర్శి పెట్టిండాది. వొగొయిటే దించి కొంచుం పప్పు, లెక్కేశి నాలుగు మిరక్కాయిలు, తెలగెడ్డ వొల్చి రొండు రెబ్బలు, కొంచుం తిరగబాత సామాను వొక శిబ్బిడిలో యేశి ఇచ్చింది. గొమ్మునే తీస్కోని బైటికొచ్చినా.. నా యెనకాలే వొచ్చేసి మల్లీ బీగాలేసేసింది. బొంతాడుకి బీగాలు తగిలిచ్చుకోనుండాది. అప్పుట్నుంచి ఒక పదేండ్లు ఆ గడపలో  సంసారం జెయ్యాలంటే సావే నాకు.

కూల్ది మాదిరి తెల్లారి లేస్తే నడిజాము దాకా పనిజేస్తానే వుండాల. యెప్పుడన్నా యేమారి కుచ్చున్నానంటే లంజల మాటే మాటాడ్తాది మాయత్త. పొరకతో గొట్తా..ఛాటతో గొట్తా…చెప్తో గొట్తా … అంటా కుక్కమింద పిల్లి మింద సాకు బెట్టుకోని తిడ్తానే వుంటాది.

ఇంతాజేసి ఇంట్లో యామన్నా సొంతముందా అంటె అదీలే..నూనెసుక్క, శెనిగ్గింజె గూడా బొంతాడుకుండే బీగాలు దీసి ఇస్తేనే గెతి. ఒకసుక్క నూని జాస్తిబోసి యేవన్నా జేసేస్తే ఇంగంతే. ఈదాట్లు ఆడేస్తాది. జుట్టుబట్టుకోని ఈపుమింద గుద్దిగుద్ది నడుములు ఇరగ్గొటేస్తింది. పనంతా ఐపొయ్యినాక ఎప్పుడన్నా టీవీ ముందర కుచ్చుంటే సాలు…వొచ్చి టీవీ ఆపుజేసేసి యాదోవొగ పనిజెప్తింది. నేనెప్పుడు యేం జెయ్యాలనేది ఐవోరి మాదిరి ఒగదానియెనకాల వొగిటి జెప్తానే వుంటింది. బొట్టుగట్నోడన్నా అన్ని నీల్లు బోస్తాడంటే ..అయ్యోరామ! యెప్పుడూ అమ్మకొంగు బట్టుకోని తిరగతావుంటాడు. సావుకో, దినాలకో వూరికి బొయ్యిందంటే  నన్నెట్ట మెడ్తోగొట్టాలో జెప్పిచ్చేసి బోతాది. థూ.. ఈ బతుకు బతికేదానికంటే వడిశాకు మింగి సస్తేనే మేలు. వొగిటికి నలుగురు బిడ్లుండారు..అందురూ అవ్వ సుట్లానే తిరగతా వుంటారు.వీల్లకు నేనో కూలిది…అంతే..

ఆడికో అమాసకో మొగునిపక్కన పొనుకుంటే ఆడాణ్ణే తిరగతా  వుంటింది. ఎందురు బిడ్లను కనాలనేది గూడా మాయత్తే జెప్పింది. నెలదప్పినప్పిట్నించి ఒగ మాత్తర మింగింది లేదు… ఆసుపత్రికి బొయ్యింది లేదు. అన్నీ ఇంట్లోనే. నెలదప్పినప్పుడు గానిగాడే పన్లు వొచ్చేస్తే పచ్చి పరిందికాయి తినిపిచ్చేసి కడుపు తీసేస్తింది. కనిండేది నలుగుర్నయితే..పొయ్యిండేది మూడు. వొద్దంటె ఇనేది యొవురు??

పిండాకాపుగ్గూడా …ఎవురు జస్తారా…యాడ దినాలకాడికి పొయ్యి తిందామా అని కాస్కోనుంటావుండా…ఈ ముసిల్ది అట్టగూడా నన్ను తిన్నీకుండా ఆడిగ్గూడా ఎలబారి పూడస్తాది. ఎట్టజచ్చేది??

పంచాయితీలు బెట్టి మాట్టాడిస్తే గూడా లాభంలా…ఇట్టగాదని నేనే నోరు అడ్డమేసుకోని ఎంతమాటోస్తే అంత మాట అనేసేది మొదులుబెట్నా..అట్ట అత్తదగ్గిరా…ఇట్ట మొగుడి దెగ్గిరా ఈపు పగిలిపొయ్యేది. బొట్టుగట్టిన ముండాకొడుకు నలుగురు బిడ్లను కనిచ్చినానన్న అరువు గూడా లేకుండా కుక్కకంటే ఈనంగా ఇదిలిచ్చి కొడ్తా అమ్మను యెనకేస్కోని వొచ్చి ఇంట్లో నుండి పోవయ్ అనె..

యాడికి బొయ్యేది  నేను ? మొగుడ్ని వొదిలేసి పుట్టింటికి బోతే పొరకదెబ్బలే… కస్టంవొచ్చిందని  మాయమ్మోల్లు కడుపులో బెట్టుకుంటే గూడా వూల్లోల్లు గొమ్మునే వుంటారా ? వయసుకొచ్చిన ఆడది వొంటిగా వుంటే వూర్లో యెదవల కండ్లన్నీ దానిమీదే గదా ? అమ్మగారింట్లో బాగుంటే నేనీడ యెందుకు ఇట్ట సస్తా?

ముసిల్దానికి యాదన్నా మందు బెట్టాల అని, మాయమ్మతో జెప్తే ఎవురో ఐవోరి దెగ్గిర మందు దెచ్చిచ్చింది. మంతరమేసిన  ఎండు  నిమ్మకాయ  పొట్టు .. అత్తకు దెలీకుండా అన్నం లో, కూర్లో కలిపి నలభై ఐదు దినాలు తినిపిచ్చేసినా.అదిగూడా పనిజెయ్యలా..

కాపురానికొచ్చిన పదేండ్లలో నాకు దెల్సిందొగిటే…మాయత్త ఎవురికీ బైపడ్దు. దేవుడొచ్చినోల్లకు…దెయ్యమొచ్చినోల్లకు తప్ప. యింట్లోకి దెయ్యాలు రాకుండా రాగిరేకులు బెట్టిచ్చేది , నిమ్మకాయిలు కట్టిచ్చేది జాస్తి . పిలకాయిలికి వొల్లు  బాగలేకపోతే గాలి బట్టుకునేసిందని మెళ్ళో మంత్రించిన దండేసి , దిస్టిదీసి ఎర్నీల్లు మూడు దోవల మద్దెలో బొయిపిస్తింది .

అట్నే వూర్లో  యాడ ఎవురికి దేముడు వొంటి మీదికి వొచ్చినా మాయత్త ఆడికి పూడిస్తింది . పూజబెట్టి , కర్పూరం దిగదీసి దేముడు దిగిపోయ్యేదాకా ఆడ్నే వుండేసి  వొస్తింది . ఆమికి ఏందన్నా బాదుంటే  చెప్పుకోని జవాబులు దీసుకుంటింది . రావుకాలం ,అమావాస్య పూజలు  జెయిపిస్తింది . పడవ పడిపొయ్నా ఈపన్లు మాత్రం సచ్చినా నిలపదు . నేను మాయత్తను బైపడిచ్చాలంటే నన్ను దేవుడన్నా పూనాల…లాకపోతే దయ్యమన్నా పట్టుకోవాల.

 ***

  ఆదినం మావూర్లో కొన్నిండ్లు అంటుకునేసినాయి..ఎవురో బీడీ తాగేశి పూరింటిపైన పారేశింటారు…వూరికేదో ఐపొయ్యిందని అందురూ ఎవురికొచ్చిన కతలు వాల్లు  చెప్పుకునేస్తావుండారు…మాఇల్లు మిద్దిల్లే …ముందరే ఇంగో సుట్టిల్లుంది…బోదిల్లు. మాయత్త ఫానేసుకోని మిద్దింట్లో పొనుకుంటే నేను నడ్జాము దాకా పంజేసి ఆ సుట్టింట్లో పొనుకోవాల. ఈఇల్లు అంటుకోని కాలిపూల్లేదే అని అనిపిచ్చింది. మాయత్తను బయిపడిచ్చల్లంటే ఇప్పుడైతేనే సరిగ్గా వుంటింది అనుకోని..కాపీబెట్టుకోని వొస్తావొస్తా పొరకపుల్ల వొగిటి అంటిచ్చి బోదలో గుచ్చేసి వొచ్చేసినా. మాయత్త కాపీదాగతా…ఎవురన్నా శాతబడి జేస్తేనే దెయ్యాలొచ్చి అట్ట ఇండ్లంటిచ్చేస్తాయని జెప్తావుంది. నేనా సుట్టిల్లుని జూస్తా ఇంటావుండా…అంటుకునేసింది. మాయత్త భయిపడింది ఆదినం జూసినా నేను.. నాకప్పుడొచ్చింది పదేండ్లు నాకు గెవనం లేని నొవ్వు. పొండ్లు బిగబట్టుకుంటే కూడా నోరు టకటకా కొట్టుకుంటాండాది. మాయత్త ఈసారి నన్ను జూశేశింది. ఏంటికి మేయ్ అట్ట నవ్వతా వుండావు..మూస్కో ఇంగ అనింది. ఇంకొంచుం గెట్టిగా నొవ్వినా.. ఆదినం కొంపలో గూడా ఎవురూ లేరు. చెయ్యెత్తుకోని కొట్టేదానికి నాదెగ్గిరికి వొచ్చింది. చెయ్యట్నే పట్టుకోని ఇంగా గెట్టిగా నొవ్వినా…నాకు దెయ్యం బట్టేసిందని అరస్తా పరిగెత్తింది బైటికి. నొవ్వినొవ్వి దొక్కనొప్పొచ్చేసి అట్నే పడిపొయ్యి నిద్దరబొయ్యినా. లేసినాక భయిం భయింగా వొచ్చి ఏమైందే నీకు?? గాలేమన్న సోకిందా అనింది. ఏం తెలీనట్టు బిత్తర సూపులు జూసినా..మల్లొక వారం దినాలు….నామీదకు చెయ్యెత్తలా..

ఇంటికెవురన్నా వొస్తే నాకు దెయ్యంబట్టిందని గుసగుసగా జెప్పేది నేను ఇనిండా. వారం దినాలికి మల్లీ పెత్తనం జేసేదానికి జూస్తే నాకింకోసారి దెయ్యమొచ్చి తిక్క కుదిరిచ్చింది. ఇట్టగాదని మాయత్త దయ్యాలొదిలిచ్చే వోల్లను పిల్చుకోనొచ్చి నన్ను సావగొట్టించే పనిబట్టింది. ఆ దెబ్బలు బరించేదానికి నావల్ల గాలా. ఆనాబట్లొచ్చి ఇది మొండిదెయ్యం…బాగా దెబ్బలుబడ్తేగానీ వొదల్దు అని యాపాకులు, యాప సులగ దెచ్చి నేను యాడస్తా, పరిగిత్తా వుంటేగూడా వొదలకుండా యాడివాడ ఇరగ్గొటేస్తా వుండ్రి. నాకు బట్టిండేది శానా మొండిదెయ్యం. మాయత్త దెయ్యం కొంపలోనుండిబోతేనే నాగ్గూడా దెయ్యం వొదిలేది. కొన్నిదినాలు దెబ్బలు వోర్సుకున్నా…ఇంగ నావల్ల గాలా .

దెయ్యాన్ని పంపించేసి మల్లీ కూలి పని మొదులుబెట్నా..దెయ్యాన్ని నావొంట్లోనించి తరిమేసినాక మాయత్త కొంపలో పూజ్జేసేది ఎక్కువైపోయ..నాపని మల్లీ మొదిటికొచ్చేసింది.

ఈతూరి ఇట్టగాదని మాయత్త పూజ్జేసే రెండ్రోజులూ సాయంకాలమైతే వూగడం మొదులుబెట్నా… మల్లీ  దయ్యాన్ని తరిమేసే  మంత్రగాల్లు వొచ్చేసినారు . యాపమండ తో  ఒకదెబ్బ పడిందో లేదో ‘దేముడో  దెయ్యమో  తెల్దారా నా బట్టల్లారా … అమ్మోరిమిందనే సెయ్యెత్తినారా … మీ బతుకులు అగ్గయ్యి పోతాయిరా ‘ అని ఉరిమి చూసినా . దెబ్బకు నాకాల్లు బట్టుకోని తిరిగి  మల్లి  సూడకుండా  పరిగెత్తినారు  నాకొడుకులు. ఈసారి నాకు దేముడొచ్చింది…అమ్మోరు…అంకాలమ్మ. “సేయ్ ఎంగిటీ “అంటే మాయత్త  పరిగెత్తుకోనొస్తింది. నాకిప్పుడు కోడ్నికోసి వొండిపెట్టంటే గెంటగొట్టే లోపల గిన్నె నా ముందరుంటింది. నాకిప్పుడు పట్టుకోక గట్టి , బీరువలో బంగారు బొంతాడు తెచ్చి యెయ్మంటే, తెచ్చిచ్చి పూజ గూడా జేస్తింది. నాక్కోప్మొస్తే కర్పూరం చెయ్యిపైన ఎలిగిచ్చేసి దిగదీస్తింది. నేనిప్పుడు మాయత్తకు, నా మొగుడికి దేముడు.

మొన్నీమద్దె మాయత్త పెళ్ళో ఇరగబడి తుంటి ఇరగ్గొట్టుకునింది. మాయత్త బొంతాడు బీగాలు ఇప్పుడు నా తిత్తిలో ఉండాయి. మొగుడు, పిలకాయిలు నాతో బాగనే మాట్టాడ్తా వుండారు. నా ఇంట్లో పెత్తనమంతా నాదే.  నాకిప్పుడు పెండ్లయ్యి మల్లీ కొత్తపెల్లికూతురైనట్టు వుండాది. ఇప్పుడీ కొంపంతా నాదే..నన్ను కొట్టేవోల్లు, తిట్టేవోల్లు ఎవురూలేరు. ఇప్పుటికి నెమ్మతైపొయ్యింది నాకు. నా పని నేంజేసుకుంటా..నాకు ఇస్టమొచ్చింది వొండుకోని తింటా..దేముడొచ్చినట్టు నాటకాలు ఎయ్లేక ఇంగ నిలిపేద్దారా అనిపిస్తింది.గానీ నాబతుకు నాగ్గావాలంటే నేనీ పని  జెయ్యాల్సిందే.

మా ఇంటికొచ్చిన డాకట్రు జెప్పినాడు…వొల్లు నీరసించిపోతే ఇట్టాంటి దయ్యాలు, దేవుల్లు వొచ్చినట్టు అనిపిస్తిందంట. నేను వీల్ల దెగ్గిర తన్నులు తప్పించుకునేదానికి దేవుడమ్మ అయిపొయ్యినా..

దొంగ దేవుడమ్మనే నేను. కానీ ఈ ఇసయం మన మద్దెనే వుండాల. మాకొంపలో వోల్లకు తెలీగూడ్దు. కస్టమొస్తే వురేసుకునేవోల్లను నేను శానామందినే జూసిండా. నేనుగూడా యాడస్తా నా బతుకింగ ఇంతే అనుకొనింటే ఆరోజుకి యెత్తేసి నామొగుడికి ఇంగో పెల్లాన్ని తెచ్చేసింటాది మాయత్త. ఏదోవొగ యాసమేసి దేవుడిచ్చిన బతుకుని ముగిసిపొయ్యేదాక ఈదల్ల.

 

  పాపుదేశి ఝాన్సీ

ఫోటో కర్టెసీ : కందుకూరి రమేష్ బాబు

 

 

 

మరణ మజిలీ

541392_4595388722851_1575449086_n
కథ ఎప్పుడూ అలానే ఎందుకు రాయాలి.. ఇలా ఎందుకు రాయకూడదు అని ప్రశ్నించే మహా టెక్కు ఉన్న కథ ఇది. సరికొత్త ఫార్మెట్‌తో మన ముందుకు వచ్చిన వాసుదేవ్‌ అసలు పేరు శ్రీనివాస్‌. మొదటి కథ ‘అమ్మకానికో మనసు’ ఉదయం పత్రిక ఆదివారం అనుబంధంలో 1997లో ప్రచురితమైంది. ఇప్పటిదాక పది కథలు రాశారు. కవిగా కూడా గుర్తింపు పొందారు. ఈమధ్యే ఆయన కవిత్వానికి మెచ్చి “Poesiesonline” (ఫేస్‌బుక్‌లోని ఇంటర్నేషనల్‌ పోయిట్రీ గ్రూప్‌ ) అనే సంస్థ ‘అవుట్‌ స్టాండింగ్ పోయెట్‌ ఆఫ్‌ది ఇయర్‌ `2013’ అవార్డు ఇచ్చింది. సొంత ఊరు వైజాగ్‌. పదిహేడేళ్లపాటు విదేశాల్లో ఉండి వివిధ కాలేజిల్లో ఇంగ్లీష్‌ బోధించారు. ప్రస్తుతం ఇండియా వచ్చేసి బెంగుళూరులో ఉంటున్నారు.   –వేంపల్లె షరీఫ్ 
***

జరిగిన కథ

సాహితీ లోకంలొ చీకటి కోణాలకి విలువెక్కువె.  రైటర్ ఫిక్సింగ్ లూ, స్టోరీ ఎరేంజ్‌‌మెంట్లకీ తెలుగు సాహిత్యం  మినహాయింపుకాదన్నది నిఖార్సయిన నిజం. పాఠకులకి తెలియనివీ, తెలిస్తె అబ్బురపర్చేవీ చాలానే ఉంటాయి… ఓటమికీ, అనుభవానికీ ఉన్న అవినాభావసంబంధం తెలుగు కథలకీ పెద్ద సోర్స్. బహిరంగ రహస్యాలే  కొన్ని కథలకి పెద్ద వ్యాపారం. తెలుగుసాహితీ లోకంలో ప్రదీప్ ఇంతలా వెలిగిపోవటానికి ముందు అతనో ఘోస్ట్ రైటర్. రాఘవదాస్ అనే ఓ ప్రముఖ (?) రచయితకి రాస్తూ ఇద్దరూ సంపాదించేవారు. రాఘవదాస్ కున్న కాంటాక్ట్స్, ప్రదీప్ రచనా శక్తీ ఇద్దరు కల్సి విజయవంతంకావటంలో ఆశ్చర్యంలేదు. కానీ అలా ఎల్లకాలం జరగదు-జరిగితే అది జీవితం అవ్వదు.

జీవితానికి కథ అవసరంలేదు కాని కథకి జీవితమే సోర్స్.  రానూ రాను రాఘవదాస్ ప్రదీప్ కివ్వాల్సిన వాటా రెమ్యూనరెషన్ తగ్గించటం, అది సహజంగానే ప్రదీప్ కి నచ్చకపోవటం- ఇద్దరి మధ్యా అగాధానికి ఎక్కువకాలం పట్టలేదు. కలాన్నీ, కీబోర్డ్ ని నమ్ముకున్న ప్రదీప్ పరిస్థితి దయనీయంగా తయారయింది. అంతకుముందు తను రాసిన మరో ముగ్గురు రచయితలని కల్సి వివరించాడు. వాళ్ళు కొంతిచ్చారు. మళ్ళీ రాయమన్నారు. కొంతమంది పూర్తిగా రాఘవదాస్ కి రాయటం మానేస్తేనే మళ్ళీ బిజినెస్ మాట్లాడతామన్నారు. ఇప్పుడు రాత్రీ పగలు అందరికీ రాస్తున్నాడు. ఎవరేం అడిగితే అది…కథలకోసం శ్రమిస్తున్న  ప్రదీప్ జీవితంలో అప్పుడే ఓ అద్భుతం–తన కజిన్ ఇంద్రాణి రూపంలొ అతనికి అదృష్టం కలిసొచ్చింది.

ఇంద్రాణి– ఓ అద్భుతం ఈ ప్రపంచంలో! తన అందచందాలని ఎన్ని రకాలుగా ఈ ప్రపంచంలో వాడుకోవచ్చో ఆమెకి తెల్సినట్టుగా

పమేలా బోర్డెస్ కి కూడా తెలియదంటె ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ప్రదీప్ తన ఘోస్ట్ అవతారం చాలించి తనంతట తాను కథలు రాయడానికి ఇంద్రాణి మాత్రమే అతిపెద్ద ఉత్పత్తిస్థానం. రోజుకో కథ చెప్తుంది అతనికి.ఇంద్రాణి కథలకి సోర్సేంటో తెలుసుకోవాలనే కుతూహలం ఉండొచ్చు కానీ తొందరపాటు అనవసరం. ఇప్పుడు ప్రదీప్ ఓ ప్రముఖ రచయిత. డబ్బుతో కొనగలిగినవన్నీ ఉన్నాయతని దగ్గర. సమాజంలో అతనో సెలబ్రిటీ . తన చివరి “రచనని” ఓ సీరియల్ గా రాస్తున్నాడు. దీనికి “మరణమజిలీ” అని పేరుపెట్టుకున్నాడు. సిక్‌‌యూనిట్ గా తయారైన ఓ పత్రిక ఈ సీరియల్ తో బాగా పుంజుకుంది. పత్రికని మూసేద్దామనుకున్న తరుణంలొ ప్రదీప్ సీరియల్ ఓ మహాద్భుతాన్నే సృష్టించింది. దీనికి మరో ముఖ్యకారణం ఆ సీరియల్‌‌కి ట్యాగ్‌‌లైన్‌‌గా “యధార్ధ సంఘటనల ఆధారంగా” అని రాయటమే! ఇదే ప్రదీప్ ఆఖరి రచన అని ఆ పత్రిక నెలానెలా ప్రముఖంగా పచురించటం కొసమెరుపు…..ఇక చదవండి

 ’మరణమజిలీ’ సీరియల్ ప్రచురిస్తున్న పత్రికాఫీసునుంచి ఓ రోజు ప్రదీప్‌కి ఫోన్.

10.30కి పత్రికాఫీసుకి చేరుకున్నాడు ప్రదీప్.

చీఫ్ ఎడిటర్ రెడ్డిగారి ఛాంబర్‌లో సినిమా ప్రొడ్యూసర్ కోటేశ్వర్రావు కూడా ఉండడం కొంచెం ఆశ్చర్యమనిపించినా అతనితో ఉన్న పూర్వ పరిచయంతో ఇరువుర్ని విష్‌చేసి కూర్చున్నాడు ప్రదీప్.

“ప్రదీప్! నీ సీరియల్‌ని మన కోటేశ్వర్రావుగారు కొనుక్కుంటారటయ్యా, దాని గురించే మాట్లాడ్డానికే నిన్ను పిలిపించాం.” రెడ్డిగారి ఉపోద్ఘాతం.

“అవునయ్యా ప్రదీప్, నీ సీరియల్‌కి నువ్వెంత అడిగితే అంతిస్తానయ్యా, కానీ మన డీల్ కుదరటనికి ముందర నా ప్రశ్నలకి నీనుంచి సమాధానం కావాలి, నిజాయితీగా” కోటేశ్వర్రావు విషయానికొచ్చేశాడు.

“అడగండి” ప్రదీప్ నవ్వుతూనే ముక్తసరిగా జవాబిచ్చాడు. అతను ఏం అడగదల్చుకున్నాడో ప్రదీప్ ఊహించాడు. ఈ రోజుల్లో హిట్టయిన ప్రతీ సినిమా కథపై ఓ కాంట్రవర్శీ ఉంటోంది. ఫలానా సినిమా కథ నాదేనని, కాపీ కొట్టారని, నాకు తగిన నష్టపరిహారం ఇప్పించాలని కొంతమంది కోర్టులకెక్కటం, కొందరు మీడియా ముందుకు రావటం రొటీన్ అయ్యింది ఈ మధ్య. కోటేశ్వర్రావు కూడా ప్రొడ్యూసరె కాబట్టి రిస్క్ లేని విధంగా జాగ్రత్తపడుతున్నాడన్పించింది ప్రదీప్‌కి. అయితే తనూహించని ప్రశ్నలొచ్చాయి.

“ఏమయ్యా ప్రదీప్! నువ్వు ఇంతకు ముందు వేరే రచయితలకి రాసేవాడివని విన్నాను. అదేనయ్యా ఘోస్ట్‌రైటర్ ఉద్యోగం. నాకు ఎన్నాళ్ళనుంచో కొన్ని సందేహాలున్నాయి. అసలీ ఘోస్ట్‌రైటర్స్ ఎందుకుంటారు, వాళ్ళే రాయొచ్చుగా స్వంతంగా? ఎవరికో రాసిపెట్టి డబ్బులకోసం వాళ్ళని దేబిరించరటం, డబ్బు, పేరు మరెవరొ తీస్కోవటం, ఏంటిదంతా? సో ఇన్నాళ్ళకి నాకు సమాధానం చెప్పేమనిషి దొరికాడని ఆనందంగా ఉందయ్యా!”

ప్రదీప్ ఏం మాట్లాడలేదు. ఓ చిర్నవ్వు నవ్వి సాలోచనగా ఛీఫ్ ఎడిటర్ రెడ్డిగారివైపు చూశాడు. వెంటనే కోటేశ్వర్రావుకి ఏంచెయ్యాలో అర్ధమయింది. తన బ్రౌన్ కలర్ బ్రీఫ్‌కేసులోంచి ఓ చెక్‌బుక్ తీసి అందులోంచి ఓ లీఫ్ చింపి దానిపై సంతకం చేసి ప్రదీప్ ముందుకితోసి “” నీ నిశ్శబ్దం నాకర్ధమయిందయ్యా, ఇదిగో బ్లాంక్ చెక్.సీరియల్‌గా వస్తున్న నీ కథని నేను కొనుక్కుంటున్నా. ఎంత కావాలో దానిపై రాసుకో.”

ప్రదీప్ ఏం మాట్లాడకుండా చెక్ తీస్కుని జేబులో వేస్కున్నాడు.

  **ప్రదీప్ చెప్పిన కథలు**

 “హు! ఇప్పుడు చెప్పవయ్యా!” రెడ్డిగారు కొంచెం రిలాక్సయ్యారు కుర్చీలో వెనక్కి వాలుతూ.

“ఈ ప్రపంచంలో డబ్బెవరికి చేదు చెప్పండి. ఓ వ్యక్తి ఘోస్ట్ రైటర్‌గా తయారవ్వటానికి అన్నిటికన్న ప్రధానకారణం డబ్బే, ఆ తర్వాత చాలానే ఉన్నాయి కొంతమంది రాస్తారు కాని వాళ్ళ రచనలు పబ్లిష్ అవుతాయో, లేదోననే ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది. అలాంటివారు అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన రచయితలకి, రచయిత్రులకి రాసి పరీక్షించుకుంటారు. ఆ తర్వాత వారిచ్చే రెమ్యూనరేషన్‌తో సంతృప్తిపడిపోతూ వాళ్ళే నేరుగా ప్రయత్నించడమనే ఆలోచనే చెయ్యరు. మరికొందరికి వ్యక్తిగత ప్రచారం నచ్చదు. వాళ్ళ ఫోటోలు ఎక్కడా ప్రింట్ అవ్వటం కాని రేడియో, టీవీల్లో ఇంటర్వ్యూలకి కూడా ఇష్టపడరు. వారికి బ్రహ్మాండంగా రాసే స్కిల్ ఉంటుంది. వారు కూడా ఇలానే వేరే వారికి రాసి పెడ్తూంటారు. వీరికి కూడా డబ్బే ముఖ్యం.

ఇకపోతే కొంతమందికి భాషపై మంచి పట్టు ఉంటుంది.కథకి ప్లాట్ అంత సులభం కాదు వీళ్ళకి. కథల కోసం రకరకాలుగా ప్రయత్నించి వివిధ సొర్సస్ ద్వారా మంచి కథల్ని సంపాదించి వాటికి తమ భాషా పరిజ్ఞానాన్ని జోడించి వేరే వారికిస్తారు. ఒకటి, రెండు కథలు క్లిక్కయాక ఇంక మరి వేరే వాటికోసం ఆలోచించరు. రాస్తునే ఉంటారు,రాసి ఇస్తూనే ఉంటారు ఎవరడిగితే వాళ్ళకి, ఏది కావాలంటే అది.” ప్రదీప్ ఆగాడు.

“ఆ, ఇక్కడే నాకర్ధంకాని విషయం. అంత టాలెంట్ ఉన్నవ్యక్తి, ఆ టాలెంట్ ప్రూవ్ అయ్యాక అయినా స్వంతంగా రాసి మెత్తం రెమ్యూనరేషన్ తనే తీస్కోవచ్చుగా, పైగా సంఘంలో బోలెడంత పేరు, సన్మానాలు వగైరా…” కోటేశ్వర్రావు ఆ పాయింట్‌పై చాలా ఆసక్తి కన్పడుస్తున్నాడని ప్రదీప్‌కి అర్ధమయ్యింది.

“ఆ! మంచి పశ్న. ఒక్కసారి ఘోస్ట్ అవతారం చాలించి తనే స్వయంగా పబ్లిష్ చేసుకోవడంలో చాలా రిస్క్ ఉంది, కోటేశ్వర్రావుగారూ! అది అంత సులభంకాదు.మీకు తెలియందేముంది, కళా రంగంలో సెంటిమెంట్ పాత్ర చాలా ఎక్కువ. ఏ సినిమా ఎందుకన్నాళ్ళు ఆడుతుందో, ఓ మంచి సినిమా ఎందుకు ఫెయిలవుతుందో తెలీనట్లే ఏ రచన, ఏ రచయిత ఎందుకు పాప్యులర్ అవుతాడో, ఒక్కో రచయిత ఎందుకు వెలుగుచూడడో అర్ధంకాదు. అంతవరకూ ఘోస్ట్ రైటర్ గా ఉన్నవ్యక్తి, ఐమీన్ రచయిత వెళ్ళి నేను ఫలానా వాళ్ళందరికీ ఘోస్ట్ రైటర్‌గా రాస్తున్నాను, ఇక ఇప్పట్నుంచీ నేను నా పేరుమీదే రాస్తానంటే ఏ ఎడిటరూ ఆసక్తి చూపరు సరికదా మొదటి మోసం వచ్చే పరిస్థితి. పోనీ పోస్ట్‌లో పంపించి తన అదృష్టాన్ని పరీక్షుంచుకునే ఓపిక, టైమూ ఉండవు డబ్బు యావలో పడిపోయిన ఈ రచయితలకి. అదే మార్కెట్‌లో ఇప్పటికే పుంఖానుపుంఖాలుగా రాసేస్తున్న వారికివ్వటం, అవి వెంటనే పబ్లిష్ అవ్వటం, నెల రెండు నెలల్లోపే రెమ్యూనరేషన్ అందుకోవటం జరుగుతుంది.ఒక్కేసారి ఈ రచయితలు తమ ఘోస్ట్ లకి, కథ అందుకోగానే ఎంతోకొంత ఇవ్వటం కూడా పరిపాటి. ఇంకేం కావాలి చెప్పండి?” ప్రదీప్ ఆపాడు. రెడ్డిగారు, కోటేశ్వర్రావు అలా చేష్టలుడిగి అతని వాక్ప్రవాహాన్ని చూస్తూ వింటున్నారు.

“మీకు మరో విషయం, ఈ సో-కాల్డ్ ప్రముఖ రచయితల్లో స్త్రీలు, అంటే రచయిత్రులు ఎక్కువగా ఘోస్ట్‌లన్ని ఆశ్రయిస్తారు. కొంతమంది రచయిత్రులకి వారి భర్తే రాసి పెడతాదు లేదా నాలాంటి ఫేక్స్‌ని అరేంజ్‌చేస్తారు. ఇలాంటి రచయిత్రుల్లో కేవలం కథలు రాసేవారే కాదు “మీరడగండి–నేచెప్పేస్తా”, “మీరు ముడేయ్యండి–నే విప్పేస్తా” లాంటి శీర్షికలు నిర్వహించే వారుకూడా నా లాంటివారితో రాయిస్తారని మీకు తెలీదు. ఈ ప్రాక్టీస్ కేవలం తెలుగులోనే అనుకునేరు, తెలుగులో కంటే ఇది మన నార్త్‌లో ఇంగ్లీష్‌లో రాసే రచయితల్లో చాలా ఎక్కువ. సోషల్ సెలబ్రిటీస్‌గా చెలామణి అవుతున్న చాలా మంది ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలోని తెలివైన స్టూడెంట్స్‌కి డబ్బు ఎరచూపి వాళ్ళచేత ఆర్టికల్స్ రాయించి తమపేరు మీద పబ్లిష్ చేయించుకుంటారట. ఈ సెలబ్రిటీస్‌కి పబ్లిషర్స్‌తో మాంచి యాక్సెసబిలిటీ ఉంటుంది, ఇక మీకు చెప్పేదేముంది. మీకు మరోషాకింగ్ న్యూస్. ఇలా మనం ముగ్గురం చేరి ఆడాళ్ళ తెలివితేటల గురించి తక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరంలేదు. ఎందుకంటే ఘోస్ట్ రైటర్స్‌లో పురుషులకంటే స్త్రీల సంఖ్యే ఎక్కువ అంటె నమ్ముతారా?”

రెడ్డిగారేం మాట్లాడే స్థితిలో లేడు.

కోటేశ్వర్రావు తేరుకున్నాడు.  తెలివైనవాడు, బిజినెస్ తెల్సినవాడు.

“సరేనయ్యా ప్రదీప్ మా సినిమా వాళ్ళ కష్టాలు నీకు తెల్సుగా, ఓ సినిమా తియ్యటం ఎంత కష్టమో, ఆ కథని కొనడం, కొన్నాక కాపాడుకోవటం అంత కష్టంగానూ ఉంది. ఇప్పుడు నువు రాస్తున్న ఈ ’మరణమజిలీ’ పూర్తిగా నీ స్వంతమేకదా, ఏ ఇంగ్లీష్ నవలకి కాపీయో లేదా మరో రచయిత కథో కాదుకదా? నాకు పూర్తి వివరాలు కావాలయ్యా. నాకు నిజాలు కావాలి. అందుకే ఈ కథకి నీకెంత కావాలో తీస్కొమ్మని బ్లాంక్ చెక్కిచ్చాను.”

“వివరాలంటే?” ప్రదీప్ కావాలనే రెట్టించాడు.

“వివరాలంటే…నువు ఈ సీరియల్‌కి ట్యాగ్‌లైన్‌గా ’యధార్ధసంఘటనల ఆధారంగా’ అని పెట్టావుగా, ఏంటా సంఘటనలు? ఎక్కడ జరిగాయి? ఆ పాత్రల అసలు పేర్లేంటి, ఆ కథలు నీకెలా వచ్చాయి లాంటివన్నీ,”  కొంచెం స్లో చేశాడు కోటేశ్వర్రావు.

ప్రదీప్ జేబులోంచి చెక్ తీసి బల్లమీద పెట్టాడు.

“మీకు ఆ వివరాలన్ని చెప్తేనే కథ కొనుక్కుంటానంటే అమ్మడానికి, చెప్పడానికి నేను సిధ్ధంగా లేను, మీ చెక్ మీరు తీసేస్కోవచ్చు.” ప్రదీప్

“ప్రదీప్‌గారూ, మీరీ కథకి ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు?” చాలా కూల్‍గా కోటేశ్వార్రావు చెక్‌పై తన కుడిచేయి రెండువేళ్ళు వేసి చిన్నగా బీట్‌చేస్తూ అడిగాడు. ప్రదీప్ ని గారూ అని సంభోధించడం పూర్తి బిజినెస్ వ్యవహారం. దానికి ప్రదీప్ ఏం మాట్లాడలేదు. రెడ్డిగారు వైపు చూస్తున్నాడు తీక్షణంగా.

“అబ్బే మన ప్రదీప్ చిన్న చిన్న ప్రలోభాలకి లొంగడండి.” డీల్ ఇలా చెడిపోవడం ఇష్టంలేని రెడ్డిగారు అదోమాదిరి చూస్తున్నారిద్దరిని.

“ఐదు లక్షలు?” ప్రశ్నార్ధకంగా చూస్తున్నాడు కోటేశ్వర్రావు.

మనుషుల్ని, వారి టాలెంట్‌ని కొనడంలో సిధ్ధహస్తుడు కోటేశ్వర్రావు.

ప్రదీప్ ఏమ్ మాట్లాడలేదు. ఇంకా రెడ్డిగారి వైపే చూస్తున్నాడు.

“పది?” కోటేశ్వర్రావు చిర్నవ్వుతో రెట్టిస్తున్నాడు.

ప్రదీప్ అంతే సీరియస్‌గా ఉన్నాడు. కానీ కుర్చీలో కొంచెం అసహనంగా కదిలాడు.

తెలుగులో ప్రముఖ రచయిత అతడు. బాడీ లాంగ్వేజ్‌ అతనికి తెల్సినట్టుగా మరెవరికి తెలుస్తుంది.

“పదిహేను?”

విలువల వేలంపాట జరుతోంది ఆ ఛాంబర్‌లో.

“ఓ.కే. చివరి ఆఫర్. పదిహేడు లక్షలిస్తాను. ఇక నీఇష్టం!” చెక్‌పై చేతివేళ్ళు తీసేసాడు కోటేశ్వర్రావు.

“ఇరవై అభ్యంతరమా?” అంతవరకూ వచ్చాక తగ్గకూడదన్నది ప్రదీప్ బేరానికి బేస్.

బహుశా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అంత ఖరీదైన కథ మరొకటి లేదేమో!

కోటేశ్వర్రావు లొంగే ప్రసక్తే లేదు…ఊ అనడానికి ఎక్కువ టైమ్ తీస్కోడు.

“అంటే ఇరవై లక్షలకి నా కథలకి సోర్స్ ఏంటి, నేనెలా ఇన్ని కథలు రాయగలిగాను లాంటి వివరాలన్నీ మీకు చెప్తే నేనీ చెక్‍పై ఆ ఎమౌంట్‌ని రాసుకోవచ్చు కదా, కోటేశ్వర్రావుగారూ?” కన్ఫర్మ్ చేసుకున్నాడు ప్రదీప్.

“అవును”

“అయితే వినండి. రెడ్డిగారూ మీరు వినండి. వీలయితే నా ఈ కన్ఫెషన్స్‌ని కథలుగా మీ పత్రికలో   ప్రచురించుకోవచ్చు.”

“లేదు ప్రదీప్, నాకున్న  విలువల వల్లే నేనీ పత్రికని నడపలేని స్థితికొచ్చాను. అలాంటి పరిస్థితుల్లో నువ్వు రావడం, నీ సీరియల్ ఇంత క్లిక్ కావడం నాకింకా షాకింగ్‌గానే ఉంది. చెప్పు ప్రదీప్, అందరికీ ఘోస్ట్ రైటర్‌గా రాసే నీకు కథలందిచ్చే వ్యక్తి ఎవరు? ఘోస్ట్‌కి ఘోస్టా? నమ్మలేకున్నాను. చెప్పు ప్రదీప్!” రెడ్డి గారి మొహంలో ఉద్విగ్నత.

“నేను వేరేవాళ్ళకి రాసినవైనా, నాపేరు మీద రాసినవి అన్నీ నిజజీవితంలోని సంఘటనలే. నానుంచి ఎవరైనా కాపీ కొట్టారేమోగానీ, నేనెవరి కథలు కాపీ కొట్టాలేద్సార్. నమ్మితేనమ్మండి.”

“మరి ఈ మరణమజిలీకి ఇన్‌స్పిరేషన్ ఎవరు? ఆ ’ట్యాగ్‌లైన్’ కి అర్ధం ఏమిటి?” కోటేశ్వర్రావులో ఆనందం, ఆతృత కలిగలిపిన విభిన్న రియాక్షన్.

“అందులో ఓ క్యారక్టర్ నా కజినని, ఆమె జీవితాన్ని ఓ వంచకుడు నమ్మించి మోసంచేశాడని ఆ తర్వాత ఆమె జీవితాన్ని బాగుచేసే క్రమంలో నేను తెల్సుకున్న విషయాలని చెప్తే నమ్ముతారా?” కొంచెం స్లో చేసి ప్రదీప్ ఇద్దరినీ మార్చి చూశాడు.

టేబుల్ పైనున్న గ్లాసులోనున్న నీళ్ళన్నీ ఒకె గుక్కలో తాగేశాడు ప్రదీప్.

“చెప్పు ప్రదీప్, నువ్వేం చెప్పినా నమ్ముతాము.”

ప్రదీప్ చెప్పడం ప్రారంభించాడు.

 ** ఇంద్రాణి చెప్పిన కథలు **

ఇంద్రాణి.

ఆమె అందం గురించి చెప్పుకోకుండా ఇంకేం చెప్పుకున్నా ఇక్కడ అప్రస్తుతమే. ఇంద్రాణి ఓ అద్భుతం ఈ ప్రపంచంలో! అందం ఇలా పుట్టిందెందుకా అని ఆలోచించకమానరు ఆడాళ్ళందరూ..వాళ్ళకర్ధంకాని విషయం ఒకటే. అందాన్ని ఎలా ప్రొజెక్ట్ చెయ్యాలా అన్నది. కామాంధుడి నుంచి మునీశ్వరుడి వరకూ ఓసారి నఖశిఖపర్యంతం చూసికానీ తలతిప్పుకోలేని అందం ఆమెది. మంచి ఫిగర్‌కి, ఫిజిక్‌కి తేడా ఏంటని ఆలోచొంచేవాళ్ళని ఇంద్రాణి ఓ సమస్యే.  కాలేజీ రోజుల్లో ఆమె అందాన్ని వర్ణించడానికి కుర్రాళ్ళు నిఘంటువులు తిరగేసేవారని, శ్రీనాథుడు మళ్ళీ పుడితే ఇంద్రాణినే చూస్తే తన కావ్యాలని తిరగరాసేవాడని ప్రబంధనాయిక నిర్వచనాన్ని పూర్తిగా మార్చేసి ఒకే పదం వాడేవాడని అదే “ఇంద్రాణి” అని కొంతమంది కుర్రాళ్ళు ఆమెకి రాసిన ప్రేమలేఖల్లో పేర్కొనేవారు.

తేనె రంగు మేనిఛాయతో తేనెలూరే పౌటింగ్ పెదవులతో ఏ వయసువాళ్ళనైనా వివశుల్ని చేసి ’ఏంమాయచేశావే’ అని అన్పించే అందం ఆమెది. ప్రదీప్‌కి కజిన్ బంధుత్వం ఇంద్రాణి. అతనితో మంచి స్నేహితుడిగా ఉంటూ తన ’చెప్పు చేతల్లో’ పెట్టుకుంది. ఆమెకి మరో ప్లస్‌పాయింట్ ఆమె తెలివి తేటలు. అందం, తెలివితేటలు పోటిపడుతుంటాయి ఆమెలో. ప్రదీప్‌కి ఇంద్రాణి అంటె పిచ్చిగాని, అమెకి ప్రదీప్ ఓ మగాడు మాత్రమె. తన అదుపాజ్ఞల్లో ఉండే మగాడు. నిజానికి ప్రదీప్‌నుంచే మగాళ్ళని స్టడీ చెయ్యటం ప్రారంభించింది ఇంద్రాణి. ఆమె అందాన్ని, తెలివితేటల్ని, చురుకుదనాన్ని చూసి ఆమెకి దగ్గరవ్వాలని చాలా మందే ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇంద్రాణి తన మెదడుకి పదునుపెట్టి ఎవర్ని నొప్పించక తెలివిగా అందర్నీ దూరంగానే ఉంచగల్గింది. అప్పటికీ ఆమె మనిషి బలహీనతలపై ఓ అవగాహన ఏర్పరుచుకుంది.

తన తెలువితేటల గురించి అప్పుడప్పుడు యుఫోరిక్ అయినా, తన స్త్రీ సహజమైన మెచ్యూరిటీతో మగాళ్ళని బాగానే హ్యండిల్ చేసేది.

అందం,తెలివితేటలు సమానంగా ఉన్న అమ్మాయిల పారామీటర్స్ ఎప్పుడూ మారుతుంటాయి. ముఖ్యంగా అబ్బాయిల విషయంలో.

తెలివైన ప్రతి అమ్మాయి, తనకంటే తెలివైన మగాణ్ణే కోరుకుంటారనడం తప్పుకాదు.

ఇంద్రాణి చేసింది కూడా అదే. మంచిగా అమాయకంగా ఉన్నచాలా మంది అబ్బాయిలందర్నీ దూరంగా నెట్టి రఘునెంచుకుంది. చాలా మంది తెలివైన అమ్మాయిలందరూ ఇలానే చేస్తారనడం అతిశయోక్తి కాదేమో.

ఇంద్రాణిని చాలా తెలివిగా డీల్ చేసాడు రఘు.

రఘు పరిచయం అయిన మొదటిక్షణంనుంచీ ఇంద్రాణి తనకి తెలియకుండానే అతనికి దగ్గరయింది.త్వరగానే సాన్నిహిత్యం పెరిగింది. రఘు మంచివాడే కానీ మంచితనాన్ని అతని తెలివితేటలు డామినేట్‌చేసి ఓ విలక్షణమైన వ్యక్తిత్వం పెంచుకున్నాడు. అదే అతనికి వరం, ఇంద్రాణికి శాపంగా పరిణమించింది తర్వాత. ఇంద్రాణిని బాగా ఇంప్రెస్ చెయ్యగలిగాడు రఘు.ఆమెని ఓ విధమైన మెస్మరిజం లోకి నెట్టేశాడు. ఫలితంగా రఘు అనుకున్నదానికంటే ముందుగానే ఇంద్రాణితో పెళ్ళయిపోయింది.

పెళ్ళయిన రెండు, మూడేళ్ళు చాలా మంది ప్రేమజంటల్లానే మేడ్‌ఫర్ ఈచ్ అదర్ లా జీవితాన్ని జుర్రుకున్నారు. ఒకరి తప్పుని మరొకరు క్షమించేసుకున్నారు.!

 జీవితంలో ఎదుగుతానంటూ ఉన్న ఉద్యోగం మానేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటానన్నాడు రఘు. రియల్ ఎస్టేట్, చిట్స్ రన్ చెయ్యటం లాంటివి ప్రయత్నించాడు. అన్నీ ఫెయిలయ్యాయి. అదృష్టం కల్సిరాలేదన్నాడు. మరో ప్రయత్నంగా మిడిల్ ఈస్ట్‌కి, గల్ఫ్‌కి లేబర్ కార్మికులని పంపించే వ్యాపారం మొదలెట్టాడు. దాదాపు రెండేళ్ళు నిజాయితీగానే చేశాడు. ఇంద్రాణి కూడా రఘు బిజినెస్‌లో చేదోడువాదోడుగా ఉంటూ తన పాత్రని సమర్ధవంతంగా పోషించింది. తన మాటకారితనాన్ని తన వంతు పెట్టుబడిగా వ్యవహారాన్ని బాగా చక్కబెట్టే సమయంలో ఆఫీస్ విషయాలు కొన్ని తెల్సుకుంది. ఎవరెవరు వస్తున్నారు, ఎంతిస్తున్నారు లాంటివన్నీ…..

సరిగ్గా ఈ సమయంలో ఓ అనుకోని సంఘటన…..

ఒమాన్ రాజధాని మస్కట్‌కి లేబర్ కాంట్రాక్ట్ కోసస్ం వెళ్ళిన రఘు మరి రాలేదు. ఫోన్ కాల్స్ లేవు, మెయిల్స్ లేవు. పోలీస్ కంప్లయింట్‌తో ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. ఇంద్రాణి తను చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేసింది.

రఘు ఏమయ్యాడనేది ఓ మిలియన్ డాలర్ ప్రశ్న ఎందుకంటే ఇప్పుడామె దాదాపు కోటిరూపాయల అప్పులో కూరుకుపోయింది. తమకి ఉద్యోగమైనా ఇప్పించమని లేదా డబ్బైనా వాపస్ ఇవ్వమని ప్రెజర్ మొదలయ్యింది జనాలనుంచి. అయితే ఇందులో చాలా మంది అసలు డబ్బు కట్టకుండానే, రఘు పారిపోయిన సంగతి తెల్సుకుని ఇంద్రాణిని వేధించటం మొదలుపెట్టారు.

జీవితంలో మొదటిసారిగా ఓడిపోయింది తెలివైన, అందమైన ఇంద్రాణి.

ఆత్మహత్య కూడా పరిష్కారం కాదు. తను హఠాత్తుగా చనిపోతే ఈ ప్రజలు ప్రదీప్‌ని వేధిస్తారు. అలా జరగడం తనకిష్టం లేదు. ప్రదీప్ అంటె ఇష్టం ఆమె చేత మరో పరిష్కారం ఆలోచింపజేసింది.

మరో మార్గం లేదు……ఎంత ఆలోచించినా ఇదొక్కటే పరిష్కారం.

తన అందమే పెట్టుబడిగా కొత్త బిజినెస్ ప్రారంభించింది. చెప్పిన వాళ్ళకి చెప్పినట్లుగా వారి సొమ్ము వాపస్ చేసింది– క్యాష్ ఆర్ కైండ్! ఏదో విధంగా బయటపదింది. ఆరు నెలలకే తను పూర్తిగా బయటపడిపోయింది. కాని తన వ్యాపకం మారలేదు, మానలేదు. “అభిమానుల”ని తగ్గించుకుని రాబడి పెంచుకుంది. సంఘంలో ఓ సుస్థిర స్థానం– ఎలీట్ సోషల్ వర్కర్ గా… చాలా మందితో పరిచయం. వాళ్ళలో రాజకీయ నాయకులు, పోలీస్ శాఖ నుండే కాక ఆఖరికి జ్యుడీషియరీ నుండి ఎందరెందరో ఇంద్రాణి ’కంపెనీ’ కోసం క్యూ కట్టే వారు.

రఘు మోసంతో ఇంద్రాణికి మగాళ్ళమీద, సమాజంమీద నమ్మకం, గౌరవం పోయింది. తన దగ్గర కొచ్చే వాళ్ళకి తన అందంతో హిప్నాటిక్ సజెషన్స్ ఇస్తూ వాళ్ళ జీవితాల్లోని అన్ని కోణాల్ని స్పృశించేది. వాళ్ళు ఓ రకమైన అచేతనావస్థలో ఉండగా వాళ్ళ కథలన్నీ వినేది. ఒక్కోసారి వాళ్ళకి తెలీకుండా వాయిస్ రికార్డర్‌లో రికార్డ్ చేసి అవన్నీ ప్రదీప్‌కి విన్పించేది. తను విన్న ప్రతీ కథని తప్పకుండా ప్రదీప్‌తో షేర్ చేసుకునేది. ఇలా అందరినుంచీ కథలు రాబట్టడం ఆమెకి చిన్నప్పట్నుంచీ హాబీ. అదే ఇప్పుడు ప్రదీప్‌కి ఓ అక్షయపాత్ర.

……..ముగింపు వచ్చే వారంలోనే!

అని లేచాడు ప్రదీప్.

“అదేంటయ్యా అలా మధ్యలో ఆపేసి వెళ్ళిపోతున్నావు?” రెడ్డిగారు, కోటేశ్వర్రావు ఒకేసారి అరిచినంత పనిచేశారు.

“ఇంకేం లేదండీ చెప్పడానికి, నా ఈ సీరియల్‌కి మీరు ’ముగింపు వచ్చే సంచికలోనే’ అని ప్రకటించేయండి” కూల్‌గా ఓ సారి తన జేబులోని చెక్ ని చెక్ చేసుకుని ఛాంబర్‍లోచి బయటకొచ్చేశాడు ప్రదీప్.

* * *
పత్రికాఫీస్ నుంచి బయట తన కారు దగ్గరికి చేరేసరికి ప్రదీప్ సెల్ మోగింది.

“ఆ, సర్! మీరు వెంటనే కొలంబియా హాస్పిటల్‌కి రావాలి, ఇంద్రాణి పరిస్థితి సీరియస్” తన మేనేజర్ కృష్ణారావు గొంతులో ఆందోళన.

ప్రదీప్ వెళ్ళేసరికి ఇంద్రాణి నిస్త్రాణంగా ఉంది మంచంపై. ఇంతవరకు అందరికీ మత్తిచ్చిన ఇంద్రాణి శరీరంలోకి ఏవేవో గొట్టాలు ద్వారా మందిస్తున్నారు.

“రారా ప్రదీప్ నీకు చివరగా ఓ కథ చెప్పాలని” చాలా ఆయాసపడుతోంది ఇంద్రాణి. చావుతో పోరాడుతూ….

దురదృష్టవశాత్తూ మరణానికి లంచం లేదు. కనీసం ఏ ప్రలోభాలకి లొంగదు. లేదంటే మరణశాసనాన్ని కూడా తన అందంతో తిరగరాయించేది ఇంద్రాణి.

కానీ ఇప్పటి ఇంద్రాణి పరిస్థితి వేరు. అందర్నీ తన కనుసన్నలతో ఆజ్ఞాపించే ఇంద్రాణిని, మరణం ఇప్పుడు తన గుపిట్లో ఉంచుకుని తన ప్రభావాన్ని చాటుతోంది.

“ప్రదీప్ నీకు సినిమా ప్రొడ్యూసర్ కోటేశ్వర్రావ్ తెల్సా? పేరెప్పుడైనా విన్నావా?” ఇంద్రాణి ప్రదీప్ జవాబు కోసం నిరీక్షించకుండా చెప్పుకు పోతోంది.

“ఆ కోటేశ్వర్రావు నాకు దగ్గరవ్వటం కోసం తన భార్యని ఎలా చంపిందీ, కేసవ్వకుండా అది ’బోన్ క్యాన్సర్’ గా ఎలా చిత్రీకరీంచాడో చెప్పాడు. ఆ కథంతా వాయిస్ రికార్డర్ లో రికార్డ్ చేశాను. తర్వాత విను. కానీ నా చావుకి మాత్రం కారణాలడగొద్దు. ఈ విషయం నాతోనే సమాధి కానీ…” తర్వాత ఇంద్రాణి కథలు చెప్పడానికి వేరే లోకానికి వెళ్ళిపోయింది.

ఇంద్రాణి మరణం ప్రదీప్‌ని  చాలా కలచివేసింది. నెమ్మదిగా ఆమె ఎలా చనిపోయిందో కారణాలు వెతకడానికి ప్రయత్నించాడు. పుర్తి వివరాలు సంపాదించలేకపోయినా చాలా వరకూ ఇంద్రాణి మరణానికి కోటేశ్వర్రవే కారణమని తెల్సుకున్నాడు.

వారం రోజుల తర్వాత తనకి కోటేశ్వర్రావు ఇచ్చిన చెక్‍ని చింపేసి తను రాస్తున్న సీరియల్ ’మరణమజిలీ’ కి ముగింపు రాయటనికి ఉపక్రమించాడు ప్రదీప్.

ఇంద్రాణి  తన చివరి మజిలీ పూర్తి చేసింది….

 

అవన్నీ ‘చెప్పినవే’ తప్ప ‘రాసినవి’ కాదు!

 Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)పాదబద్ధోzక్షరసమః తంత్రీలయసమన్వితః

శోకార్తస్య ప్రవృత్తోమే శ్లోకో భవతు నాన్యథా

శిష్యుడు భరద్వాజుడితో కలసి వాల్మీకి తమసానదికి స్నానానికి వెళ్ళాడు. అంతకుముందే ఆయన నారదుని నోట  సంక్షిప్తంగా రామాయణ కథ విన్నాడు. దానినే భావన చేస్తున్నాడు. స్నానానికి దిగబోతుండగా క్రౌంచ పక్షి జంట కనిపించింది. మగపక్షి కామపరవశస్థితిలో ఉంది. అంతలో ఒక కిరాతకుడు బాణం వేసి దానిని నేలకూల్చాడు. ఆడపక్షి శోకించసాగింది. వాల్మీకిలోనూ కరుణశోకాలు ఉబికివచ్చాయి. అప్రయత్నంగా ఆయన నోట కొన్ని మాటలు వెలువడ్డాయి:

మా నిషాద ప్రతిష్ఠామ్ త్వ మగమ శ్శాశ్స్వతీస్సమాః

యత్ క్రౌంచ మిథునా దేకమ్ అవధీః కామమోహితమ్

(ఓ కిరాతుడా! క్రౌంచ మిథునంలో కామపరవశంగా ఉన్న ఒక పక్షిని చంపావు. అందువల్ల నువ్వు ఎక్కువ కాలం జీవించవు [శాశ్వతంగా అపకీర్తిని మూటగట్టుకుంటావు])

ఆశ్చర్యపోయిన శిష్యుడు అప్పటికప్పుడు ఆ మాటల్ని కంఠస్థం చేశాడు. స్వయంగా వాల్మీకికీ ఆ మాటలు విస్మయం కలిగించాయి. నేను ఏం పలికానన్న ఆలోచనలో పడ్డాడు. ” చూశావా, నేను పలికిన ఈ మాటలు సమాక్షరాలతో పాదబద్ధంగా ఉన్నాయి. వాద్యయుక్తంగా, లయబద్ధంగా పాడుకోడానికి వీలుగానూ ఉన్నాయి. శోకార్తితో నేను అన్న ఈ మాటలు శ్లోకమే తప్ప మరొకటి కావు” అని శిష్యుడితో అన్నాడు.

ఆశ్రమానికి తిరిగి వెళ్ళిన తర్వాత కూడా వాల్మీకి దాని గురించే ఆలోచిస్తున్నాడు. శిష్యుడు తను కంఠస్థం చేసిన మాటల్ని సహాధ్యాయులతో పంచుకున్నాడు. వారు కూడా ఆశ్చర్యానందాలలో తలమునకలవుతూ వాటిని కంఠస్థం చేశారు. అంతలో బ్రహ్మదేవుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి అతిథి సేవలు అందించి ఆయనతో మాట్లాడుతున్నాడే కానీ మనసంతా తన నోట వెలువడిన మాటల మీదే ఉంది. బ్రహ్మ ఆయన పరధ్యానాన్ని గమనించి చిరునవ్వు నవ్వాడు. “నీ నోట వెలువడింది శ్లోకమే. ఈ ఛందస్సులోనే నువ్వు రామాయణం చెప్పు” అన్నాడు. వాల్మీకి రామాయణం చెప్పాలని సంకల్పించుకున్నాడు. అయితే, ఇంకొక చింత ఆయనను వేధించడం ప్రారంభించింది. దీనిని కంఠస్థం చేసి ఎవరు మధురంగా గానం చేస్తారనుకున్నాడు. అంతలో ఆశ్రమంలోనే ఉంటున్న కుశలవులు ఆయనను దర్శించుకున్నారు. వారిని చూడగానే వాల్మీకి చింత తీరింది. వీరే తన రామాయణ గానానికి అర్హులనుకున్నాడు. కుశలవులు రామాయణం నేర్చుకున్నారు. వీధులలో, రాజమార్గాలలో తిరుగుతూ దానిని గానం చేయడం ప్రారంభించారు.

కవిత్వం పుట్టుక గురించీ, అది కలిగించే సంభ్రమాశ్చర్యాల గురించీ చెప్పే ఈ ఘట్టంలో చెప్పుకోవలసిన విశేషాలు అనేకం ఉన్నాయి. మరో సందర్భానికి వాటిని వాయిదా వేసి ప్రస్తుతానికి వద్దాం. వాల్మీకి రామాయణం ‘రాశా’డన్న మాట మూలంలో ఎక్కడా లేదు. ఆయన రామాయణం ‘చెప్పాడు’, లేదా ‘చేశాడు’. శిష్యులు ఆయన చెప్పిన శ్లోకాన్ని రాసుకోలేదు, కంఠస్థం చేశారు. రామాయణం చెప్పడం పూర్తి అయిన తర్వాత దీనిని ఎవరు ‘కంఠస్థం చేసి గానం చేస్తా’రనే వాల్మీకి అనుకున్నాడు. కుశలవులు దానిని కంఠస్థం చేసి గానం చేయడం ప్రారంభించారు. విచిత్రం ఏమిటంటే, నేను చూసిన రామాయణ ప్రతిలో తెలుగు తాత్పర్యం కూర్చిన పండితుడు, వాల్మీకి రామాయణం చెప్పాడు, చేశాడు అని ఉన్న ప్రతిచోటా ‘రచించాడు’ అనే మాట ఉపయోగించారు!

కాలం మన ఆలోచనలను, అలవాట్లను ఎలా నియంత్రిస్తుందో గ్రహించడానికి ఇదొక ఉదాహరణ. అంతేకాదు, మన చరిత్రశూన్యతకూ నిదర్శనం. లిఖితసంప్రదాయం చివరికి సంప్రదాయ పండితులలో కూడా ఎంత అలవాటుగా  జీర్ణించుకుపోయిందంటే, ఒకప్పుడు మౌఖిక సంప్రదాయం ఉండేదనీ; వ్యాసవాల్మీకులు మౌఖిక సంప్రదాయానికి చెందినవారనే స్ఫురణ వారికీ లేదు.

భారతీయులు, గ్రీకులు, ఆఫ్రికన్లు అనే తేడా లేకుండా ప్రాచీన కవి, కథకులందరూ కవిత్వం లేదా కథ చెప్పారు, రాయలేదు. తమ కవిత్వం తంత్రీలయబద్ధంగా ఉండాలనుకున్నారు. తాము చెప్పే కథలకు, వీరగాథలకు, వంశచరిత్రలకు తంత్రీలయ నేపథ్యం ఉండేలా చూసుకున్నారు.  ఇంతకీ విషయమేమిటంటే, కుంటా కింటే వంశచరిత్రను చెప్పే గాథికుని గుర్తించి హేలీకి తెలియజేసిన గాంబియా మిత్రులు ఒక హెచ్చరిక కూడా చేశారు: సంగీత నేపథ్యం లేకుండా గాథికులు నోరు విప్పరట! దాంతో హేలీ ఆ ఆఫ్రికన్ వాల్మీకిని కలుసుకోడానికి ముగ్గురు దుబాషీలు, నలుగురు సంగీతకారులతో సహా పద్నాలుగు మందిని వెంటబెట్టుకుని వెళ్ళాడు.

గాంబియాకు వెళ్ళేముందు కన్సాస్ సిటీకి వెళ్ళి కజిన్ జార్జియాను ఓసారి చూసిరమ్మని ఎందుకో అతని మనసు చెప్పింది. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. తను అంతవరకు తెలుసుకున్నవీ, ఇకముందు తెలుసుకోబోయేవీ చెప్పగానే ఆమె సంభ్రమం పట్టలేకపోయింది.  మరోసారి దీవెనలు అందించింది.  గాంబియా చేరుకున్న హేలీ, “గాథికుడు ఏడీ, ఎక్కడ” అని ఆతృతగా మిత్రులను అడిగాడు. వాళ్ళు అతని వైపు వింతగా చూసి, “గాథికుడు ఇక్కడెందుకుంటాడు? ఊళ్ళో ఉంటా”డని చెప్పారు.  హేలీ ఆ ఊరికి ప్రయాణమయ్యాడు.  తను గాంబియా నది మీదుగా వెళ్లాలని నిర్ణయించుకుని ఒక లాంచీని అద్దెకు తీసుకున్నాడు. చుట్టుదారిలో సరకులు చేరవేయడానికి ఒక లారీని, ఒక ల్యాండ్ రోవర్ ను కుదుర్చుకున్నాడు. దుబాషీలు, సంగీతకారులతో సహా పద్నాలుగుమందిని వెంటబెట్టుకున్నాడు. మార్గమధ్యంలో జేమ్స్ ఐలండ్ లో ఆగాడు. అక్కడినుంచే బానిసల ఎగుమతి జరుగుతూ ఉండేది. దానిపై ఆధిపత్యం కోసం ఫ్రాన్స్, ఇంగ్లండ్ లు రెండువందల ఏళ్లపాటు ఘర్షణపడ్డాయి. అక్కడి శిథిలాల మధ్య కాసేపు తచ్చాడాడు. ఆనాడు బానిసలను బంధించడానికి ఉపయోగించిన పురాతనమైన గొలుసు అవశేషం లాంటివి  ఏవైనా దొరుకుతాయేమోనని ఆశగా వెతికాడు. ఏదీ దొరకలేదు. చిన్న గచ్చుముక్కను, ఇటుక ముక్కను తీసుకున్నాడు. తిరిగి లాంచీ ఎక్కబోయేముందు, ఎక్కడో అట్లాంటిక్ ఆవల వర్జీనియాలో ఉన్న తన పూర్వీకుడు కుంటా కింటే తన కూతురుకు ‘కాంబీ బొలోంగో’ పేరుతో పరిచయం చేసిన ఆ నదిని ఒకసారి తేరిపార చూశాడు. అక్కడినుంచి అల్ బ్రెడా అనే ఓ చిన్న ఊరికి చేరుకున్నాడు. ఆ తర్వాత కాలినడకన అంతకంటే చిన్నదైన మరో ఊరు చేరాడు. ఆ ఊరు పేరు జఫూరు. గమనించారో లేదో, జఫూరు అనే మాటలో ‘ఊరు’ ఉంది, అచ్చంగా మన తెలుగు ‘ఊరే’. ఆఫ్రికాలోనే కాక, పశ్చిమాసియాలో కూడా ఊళ్ళ పేర్లలో తెలుగు ‘ఊరు’ కనిపిస్తుంది. దీని గురించి మరోసారి చెప్పుకుందాం.

valmiki

జీవితంలో మరే దశలోనూ అందుకోలేని ‘భావోద్వేగపు పరాకాష్ట’స్థితిని పశ్చిమాఫ్రికాలోని ఆ మారుమూల పల్లెలో తను గడిపిన తొలిరోజున అందుకున్నానని హేలీ అంటాడు.

జఫూరుకు వాళ్ళు కనుచూపు మేరలో ఉండగానే బయట ఆడుకుంటున్న పిల్లలు చూసి  పెద్దవాళ్ళకు చెప్పారు. అంతా బిలబిల్లాడుతూ పూరి గుడిసెల్లోంచి బయటకు వచ్చారు. ఆ ఊరి జనాభా 70 మందిని మించి ఉండదు. ఎన్నో మారుమూల గ్రామాల్లానే ఈ ఊరు కూడా రెండు శతాబ్దాల క్రితం ఎలా ఉందో అలాగే ఉంది. అన్నీ మట్టితో నిర్మించిన గుండ్రటి పూరిళ్ళు. కప్పులు గోపురాకారంలో ఉన్నాయి.  జనం అంతా ఒక వృద్ధుని చుట్టూ చేరడం ప్రారంభించారు. ఆ వృద్ధుడిది చిన్నపాటి ఆకారం. తెల్లని అంగరఖా వేసుకున్నాడు. నెత్తిన ఒక పెట్టె లాంటి టోపీ పెట్టుకున్నాడు. చూడగానే ‘ఒక ముఖ్యమైన వ్యక్తి’ అనే భావన కలిగించేలా ఉన్నాడు.

తను ఎవరిని కలసుకోడానికీ, ఎవరిని వినడానికీ ఆ ఊరు వచ్చాడో ఆయనే ఈయన అని హేలీకి దుబాషీలు చెప్పారు. ఆయనే గాథికుడు కెబ్బా కంజీ పొఫానా!

దుబాషీలు ఆయనతో మాట్లాడుతుండగా, జనం గుర్రపు నాడా ఆకారంలో హేలీకి దగ్గరగా నిలబడి ఆసక్తిగా అతనినే గుచ్చి గుచ్చి చూస్తున్నారు. ఒక అమెరికన్ నల్లజాతీయుని చూడడం వారికి ఇదే మొదటిసారి. ఆ కారు నలుపు మనుషుల మధ్య కొట్టొచ్చినట్టు కనిపించే తన గోధుమవర్ణాన్ని తలచుకుని హేలీ సిగ్గుపడ్డాడు. కాసేపటి తర్వాత జనాన్ని దాటుకుంటూ ఆ వృద్ధుడు హేలీని సమీపించాడు. అతని ముఖంలోకి నిశితంగా చూశాడు. నా మాండింకా భాష నీకు అర్థమవుతుందా అన్న ప్రశ్న ఆ చూపుల్లో కనిపించింది. తర్వాత అతనికి ఎదురుగా కూర్చున్నాడు.

శతాబ్దాలుగా, తాతముత్తాతల కాలం నుంచీ మౌఖికంగా జాలువారుతున్న కింటే వంశ చరిత్రను చెప్పడం ప్రారంభించాడు. అది కేవలం సంభాషణ రూపంలో లేదు. తాళపత్రాలను చదువుతున్నట్టు ఉంది. జనం నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. గాథికుడు మధ్య మధ్య ఛాతీనుంచి ముందుకు వంగుతున్నాడు. మిగతా దేహం స్థాణువులా ఉండిపోయింది. కంఠనాళాలు ఉబ్బి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఒకటి రెండు వాక్యాల తర్వాత దుబాషీలకు అవకాశమిస్తూ వెనక్కి వాలుతున్నాడు. ఆయన మాటలు దాదాపు భౌతిక వస్తువులను రూపుకడుతున్నాయి. సంక్లిష్టమైన కింటే వంశచరిత్ర ఆయన నోటినుంచి అలవోకగా ప్రవహిస్తోంది. ఎవరు ఎవరిని పెళ్లాడారు, వారి పిల్లలు ఎవరు, వారు ఎవరిని పెళ్లాడారు, వారి పిల్లలు ఎవరు…

తన చెవులను తనే నమ్మలేనట్టుగా హేలీ అప్రతిభుడవుతున్నాడు. గాథికుని నోట దొర్లే విస్తారమైన వివరాలే కాదు, ఆయన శైలి కూడా బైబిల్ శైలిని తలపిస్తోంది.

మిగతా కథ తర్వాత…

 

 

సైరన్ మోతల మధ్య మేలుకున్న స్వరం

devipriya

దేవీప్రియ

దేవిప్రియ సాహిత్య ప్రస్థానం గురించి వ్యాసాలను ‘సారంగ’ ఆహ్వానిస్తోంది. 

 

విశాఖ మొజాయిక్ సాహిత్య సంస్థ, ఎస్వీ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో ప్రసిద్ధ కవి, ఎడిటర్ దేవిప్రియ సాహిత్యానుశీలనం ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ వ్యాసం పునర్ముద్రిస్తున్నాం. ఈ వ్యాసం అఫ్సర్ 1992 లో వెలువరించిన సాహిత్య వ్యాసాల సంపుటి “ఆధునికత- అత్యాదునికత” నించి తీసుకున్నాం. ఇది ఇరవై వొక్క సంవత్సరాల కింద రాసిన వ్యాసం కాబట్టి,  ఇందులో అఫ్సర్ చేసిన విశ్లేషణ  అంత సమకాలీనం కాకపోవచ్చు. 

1970లలో వొక సంధికాలానికి సమాధానంగా బయలుదేరిన విప్లవోద్యమం విలువైన  కవిత్వ వారసత్వాన్ని మిగుల్చుకుంది. కవిత్వ ప్రయోజనానికి స్పష్టమైన గిరి గీసింది. అభ్యుదయోద్యమంతో స్థిరపడిన లక్ష్యనిబద్ధతతొపాటు నిమగ్నత అనే మరో ఆచరణాత్మకమైన పదం కవిత్వ విమర్శలో చేరింది. నిబద్ధతకీ, నిమగ్నతకీ మధ్య వొక వూగిసలాట ప్రారంభమైంది. కవికి నిబద్ధత వుంటే చాలదు, నిమగ్నత కూడ అవసరమేనన్న వాదం వొకవైపు సాగుతుండగా, మధ్యతరగతి కవుల్లో ఆశయానికీ, ఆచరణకీ మధ్య అంతరం ఏర్పడింది. ఇక్కడ రెండు అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. మొదటిది విప్లవోద్యమ ప్రత్యక్ష ప్రభావం. రెండవది ఆ ప్రభావాన్ని జీవితంలో అన్వయించుకోగలిగినా భౌతిక పరిస్థితులు లేక పరోక్షంగా విప్లవ భాగస్వామ్యం తీసుకోవడం … శివారెడ్డి, దేవిప్రియలవంటి సీనియర్ కవులనుంచి గుడిహాళం రఘునాధం, నందిని సిద్ధారెడ్డి దాకా ఈ విధంగా ఒక వర్గీకరణ కిందికి వస్తారు. అయితే  శివారెడ్డికీ, ఈ వరసలోని మిగిలిన కవులకీ మరో తేడా వుంది. మిగిలిన కవులతో పోల్చినప్పుడు శివారెడ్డిలో అంతర్ముఖత్వం తక్కువ. వీళ్ళందరితో పోల్చినప్పుడు దేవిప్రియలో అంతర్ముఖత్వం ఎక్కువ. దీని కారణాలు ఆయా కవుల భౌతిక జీవన పరిస్థితుల్ని బట్టి వుంటాయి. వీళ్లందరి మీద పని చేస్తున్న ప్రభావాలు వొక్కటే. కాని వీళ్లలో వొక్కొక్కరిది వొక్కొక్క తరహా జీవితం.

దేవిప్రియ జీవితం వడ్డించిన విస్తరి కాదు. ‘పొగాకు కంపెనీ సైరన్ మోత ‘ జీవితాన్ని శాసించే నేపథ్యంలో దేవిప్రియ పుట్టేరు. ‘ఒక గుడిసె కథ’ కవితలో దేవిప్రియ తన కవిత్వానికి ప్రాధమిక ముడిసరుకులేమిటో చెప్పారు. తన పంచేంద్రియాల ద్వారా సంపాదించుకునే జ్ఞానం కవితకి ఎప్పుడూ ప్రాధమికమైందే. ప్రేరణలు ప్రభావాలుగా స్థిరపడకముందు కవిలో నిక్షిప్తమైన భావసంపుటి అది. వ్యక్తి జీవన సారాన్ని సాంద్రతరం చేసేవి ఈ భావాలేనని ఫ్రాయిడ్ అంటాడు. దేవిప్రియ జీవన తాత్వికతని నిర్దేశించి చూపుడువేళ్లు ‘ఒక గుడిసె కథ’లో కనిపిస్తాయి.

“ఈ ‘గుడిసెలో’ నేనా ప్రపంచం వుదయించింది అని కవి అంటున్నప్పుడు ఆ ప్రపంచం కేవలం భౌతిక ప్రపంచం కాదు. కొత్త వ్యక్తిత్వాన్ని రూపుదిద్దే తాత్విక ప్రపంచం. ఈ కవితలో గతం మీద జాలి, ప్రేమ మాత్రమే కాదు వర్తమానం నుంచి భవిష్యత్తులోకి  సాధికారికంగా నడిచి వెళ్లగల ఆత్మస్థయిర్యం వుంది.

అయితే దేవిప్రియ ఆలోచనల మీద ముద్ర వేసిన పరోక్ష అనుభవాల ప్రస్తావన ‘పుట్టినరోజు గురించి’ అనే కవితలో వుంది.

నా పుట్టినరోజుదేముంది

ఒక కాడ్వెల్ తరువాత

ఒక శ్రీశ్రీ తరువాత

ఒక పాణిగ్రాహి తరువాత

ఒక చెరబండరాజు తరువాత

పుట్టినవాణ్ని నేను” అంటారు.

ఇక్కడ సూచించిన నాలుగు పేర్లు కేవలం   పేర్లు కాదు. ఈ వరస క్రమంలో ఒక చారిత్రక వికాసం వుంది. ఆధునిక కవిత్వంలో సామాజిక చైతన్యం ఎన్ని మలుపులు తిరిగిందో ఈ నాలుగు పాదాల్లో కనిపిస్తుంది.

ఈ రెండు కవితలు ముందు చదివితేగాని కవిగా దేవిప్రియ యేమిటో పూర్తిగా అర్ధమయ్యే అవకాశం లేదు. ‘పైగంబరకవి’గా కన్ను తెరిచిన దేవిప్రియ ‘నీటిపుట్ట’లో ఏ వర్గం భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఈ కవితల్లో స్పష్టంగా కనిపిస్తుంది. “కవిత్వ నిత్య నిబద్ధం” అని ఆయన నమ్ముతారు. అందుకే చిరకాల స్వప్నాన్ని వాస్తవం చేసిన ” ‘శ్రామికస్వర్గం’ నరకంగా మారుతున్నప్పుడు నిస్సంశయంగా నిరసన వ్యక్తం చేయగలిగారు.

తూర్పు యూరప్‌లో సంభవించిన పరిణామాలు ఏ సామ్యవాద కవికైనా ఆశనిపాతం వంటివే. గ్లాస్‌నొస్త్, పెర్రిస్త్రోయికాల ముసుగులో సోవియట్‌లో ప్రవేశించిన పెట్టుబడిదారీ స్వభావం  ఇక సోషలిస్టు వ్యవస్థ స్వప్నప్రాయమేనని భయపెట్టింది. మనిషి ఆనందానికి ఏ వ్యవస్థ సరిపడ్తుందో తెలియని గందరగోళం యేర్పడింది. ‘ఏది నీ మానవాంశని పరిపూర్ణం చేస్తుందో నాకు అంతుబట్టడం లేదు’ అని వేదన వ్యక్తం చేస్తారు. “ఎర్రబల్బుల్లా వెలిగిన కళ్లలో కలర్ టీవీ వర్ణబింబాలు కదలాడుతున్నప్పుడు, తరతరాల ధార్మిక దాస్యాన్ని ధిక్కరించిన చేతుల్లో కోకాకోలాలు చెమ్మగిల్లుతున్నప్పుడు” సామ్యవాది హృదయ ప్రకంపనలు ఇలాగే వుంటాయి.

ఇదే ధోరణిలో రాసిన మరొక అద్భుతమైన కవిత ‘హిట్లర్ నవ్వు’. ఇది ప్రజాస్వామ్య శిలలమీద ఎర్రపూలు రాలుతున్న రుతువు – అంటూ మొదలయ్యే ఈ  కవితలో దేవిప్రియ రాజకీయ భావాల తీవ్రత తెలుస్తుంది. ఒక శ్రీశ్రీ, ఒక చెరబండ రాజు వారసత్వం నుంచి వచ్చిన కవి మాత్రమే ఈ భావాన్ని ఇంత బలంగా వ్యక్తం చెయ్యగలడు. ఈ రెండు సందర్భాల్లో కూడా దేవిప్రియ కవిత్వ సంవిధానం ప్రత్యేకంగా గమనించాలి. ఇక్కడ కవి పదం మీద ఎక్కువ దృష్టి నిలుపుతాడు. సాధారణంగా  దేవిప్రియ కవితకి ఒక రూపపరిమితి వుంది. అలవాటుపడిన గేయ చందస్సుల నడక ప్రతి కవితలో కనిపిస్తుంది. ‘హిట్లర్ నవ్వు’ ‘ఆదిరహస్యం మానవుడు’ కవితల్లో కూడా ఆ నడక వుందిగానీ, భావాల తీవ్రత దాన్ని అధిగమించింది. కవితలో కొసమెరుపులు ఇవ్వడం ‘రన్నింగ్ కామెంటరీ’ లక్షణం. ఆ లక్షణాన్ని మామూలు కవితలో కామిక్ రిలీఫ్‌గా మార్చుకుని నిర్మాణంలో ఒక సౌలభ్యం సమకూర్చారు దేవిప్రియ. దీనివల్ల ఆయన ఇతర ఆధునిక కవుల్ని బాధిస్తున్న నిర్మాణ సంక్లిష్టత నుంచి బయటపడ్డారు.

గొప్ప ఉద్వేగాన్ని కూడా నింపాదిగా చెప్పడం దేవిప్రియ లక్షణం. కార్యకారణ  సంబంధాలు తెలిసి వుండడం వల్ల ఈ కవిలో అకారణమైన ఆవేశం నుంచి పదచిత్రాలు అదేపనిగా రాలవు. ఆయన భావాన్ని ఒక పదచిత్రంతోనే చిత్రిక పడ్తాడు. తాత్విక సంకోచాలు లేనప్పుడు మాత్రమే కవిలో ఈ స్పష్టత సాధ్యపడుతుంది.

వైరుధ్యాల చిత్రీకరణలో దేవిప్రియ కవిత్వ వ్యక్తిత్వం  కనిపిస్తుంది. నిబద్ధత వుండి ఉద్యమాలలో నిమగ్నం కాలేక పోయాననే ఆవేదన చాలా సందర్భాల్లో వ్యక్తమవుతుంది. కాని ఇలాంటి అనేక రకాల వైరుధ్యాల పొరల్ని విప్పి చూసుకునే నిజాయితీ దేవిప్రియలో వుంది. నిజానికి నిబద్ధత విషయంలొ ఏమాత్రం తెలివి వుపయోగించకుండానే ఎవరినైనా ఇట్టే మోసం చెయ్యవచ్చు. కాని లోపల నిజమైన కవి దేవులాడుతున్నవాడు కవిత్వంలో పగటి వేషం వెయ్యలేడు. ఉద్యమం గాలి అయినా సోకని కవులు కూడా ఒక ఫాషన్‌గా ఉద్యమ కవిత్వం రాస్తున్న ఈ కాలంలో ఒక కవి నిమగ్నత గురించి నిజాయితీగా కంఠం విప్పడం విడ్డూరంగానే కనిపించవచ్చు.

 

గార్డెన్ రెస్టారెంట్ చల్లగాలి

రుచిమరిగిన వాణ్ణి నేను

ఫ్యాను విసిరే చల్లగాలిలో

శరీరాన్ని ఆరేసుకోవడానికి

అలవాటు పడ్డవాణ్ని నేను

అయినా అడివీ

నువ్వంటే నాకిష్టం‘ (‘అమ్మచెట్టు’లో)

ఇక్కడ అడవి దేనికి సంకేతమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1970లలో ఒకవైపు ఉద్యమం తీవ్రతని అందుకుంటున్నప్పుడు మరోవైపు మధ్యతరగతి జీవితంలోకి నయా సంపన్న లక్షణాలు ప్రవేశిస్తున్నాయి. ఆర్ధికంగా కొద్దికొద్దిగా స్థిరపడుతున్న ఈ వర్గంలో అసంతృప్తికి తగిన కారణాలు లేవు. సామాజిక చైతన్యం వున్న మధ్యతరగతి మేధావులలో ఈ స్థితిపై అసహనం వుంది. ‘అడవి’ కవితలో దేవిప్రియ ఈ స్థితిని బలంగా వ్యక్తం చేశారు. అంతేకాదు,

ఈ దేశాన్ని

ప్లాస్టిక్ తీగల విషపుష్పాల ఉద్యానవనాల నుంచి కాపాడడానికి,

ఏదో ఒకనాడు,

నేను నీ సాయమే కోరతాను..” అని వాగ్ధానం చేయగలిగారు..

1984లో దేవిప్రియ ఇలాంటిదే మరో కవిత రాశారు. ఇది దాదాపు ‘అడవి’కవితకు ఒకరకమైన కొనసాగింపు. ఎనభయ్యో దశకం వచ్చేసరికి విప్లవోద్యమం మీద పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. గుత్తపెట్టుబడిదారీ మనస్తత్వాల ముందు గొప్ప ఆదర్శాలు కూడా వీగిపోతాయని తీవ్రవాద కమ్యూనిస్టులు కూడా మరోసారి నిరూపించారు. సిద్ధాంతాలను పణంపెట్టి ‘వ్యక్తి’వాద ముఠాలుగా చీలిపోయారు. దేవిప్రియ అన్నట్టు ‘వర్తమానానికి నిన్నటి గుణపాఠాల వర్తమానం అదేమిటో ఇంకా అందలేదు. నేను నడుస్తోన్న ఈ రోడ్డు నా కళ్లు యేరయ్యేదాక నా కాళ్ళు తెడ్లయ్యేదాకా ముగిసేట్టు లేదు.’. ఎదురుచూపులు ఫలించకుండానే కళ్లముందు మళ్లీ చీకటి అలుముకుంది. రాజకీయ, సామాజిక రంగాలలో ఏర్పడిన ఈ స్తబ్దతని కవి ‘అర్ధరాత్రి నిశ్శబ్దంలోని అనిర్వచనీయ శబ్దం’గా అభివర్ణించారు. ఈ ‘నిశ్శబ్దశబ్దం’ తనని భయపెడుతుందనడంలో ఒక మానసిక అంతరాన్ని సూచించారు.

పుస్తకాల పిరమిడ్‌లో మరొక మమ్మీగా మారిపోతానేమోనన్న ఆందోళన వెలిబుచ్చారు. చివరికి ఒక ఆశ. దిగులు  తనని ఎంతగా ఆవరిస్తున్నా నిరీక్షణ ఆగిపోదన్న ధైర్యం. ఉద్యమంలో ఏర్పడిన అవరోధాలు తొలగిపోయి రేపటి చరిత్రని కొత్త రంగుల్లో రాయగలనన్న ధీమా. దేవిప్రియలో Negative element ఏ కోశానా లేదనడానికి ఈ కవిత ఒక్కటే చాలు నిదర్శనంగా.

అఫ్సర్

కడలిని దాటిన కార్తి

ఎల్. ఆర్. స్వామి

మళయాళ రచయిత కె.పి. రామనున్ని

 

(మళయాళ భాష లో 1993 లో వెలువడిన సంచలనాత్మక నవల “ సూఫీ పరాంజే కథ” కు ప్రముఖ అనువాదకుడు , రచయిత ఎల్. ఆర్. స్వామి చేసిన తెలుగు అనువాదం “ సూఫీ చెప్పిన కథ” పుస్తకాన్ని సగర్వం గా ప్రచురిస్తోంది సారంగ పబ్లికేషన్స్. త్వరలో పుస్తకం గా బయటకు రానున్న ” సూఫీ చెప్పిన కథ” నవల నుంచి కొంత భాగాన్ని ప్రత్యేక వ్యాసం గా ఈ వారం సారంగ పాఠకులకు అందిస్తున్నాము. కేరళ సాహిత్య ఆకాడమీ అవార్డ్ తో పాటు మరెన్నో ప్రతిష్టాత్మక అవార్డులు పొందిన ( సినిమా గా కూడా విడుదలై అవార్డులు సాధించింది) ఈ నవల ఇప్పటికే హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, తమిళ, కన్నడ భాషల్లోకి అనువాదమయింది. )

 

***

 

సముద్ర దేవతలు శృంగలావిముక్తం చేసిన గాలిలా ఇసుక తిన్నెలను దాటి వచ్చాడు ముసలియార్‌. మఠానికి చెందిన మమ్ముటి మగతనమూ, పురుష బలమూ తొణికిసలాడే అతడు ‘భారతప్పుళ’ దాటి వచ్చాడు.

పొడుగుగా ఎదిగిన చేతులతో రాక్షసుడిలా కనబడ్డాడు అతడు. అడవి దాటి కొండలను దొర్లించి రెండు మూడు అడుగులతో పొలాలను కొలిచి కొండల నుండి దూకి వచ్చాడు. ధమనుల్లో వేడితో, నరాల్లో బలంతో గుండెలో జాలితో మమ్ముటి పరిగెత్తుకొచ్చాడు. దేనికీ జంకని కనులతో పెదవుల నిండా నవ్వుతో మమ్ముటి తలవంచకుండా వచ్చాడు.

శంకుమీనన్‌కి ఆ సంగతి చెప్పినది వేలాయుధమే. పొన్నాని ఊరి ముస్లిం ఒకరు కొబ్బరికాయలూ, పోకలూ కొని వ్యాపారం చేయడం కోసం ఊరిలోకి వచ్చాడని చెప్పాడు. మశూచి విత్తనాలను పట్టించుకోకుండా మిగతావి కొని ఒక చోట నింపుతున్నాడట!

పంటలు కొనేవాళ్ళు లేక డబ్బుకు బాగా ఇబ్బంది పడే రోజులు అవి. శంకు మీనన్‌ చాలా సంతోషించాడు. కళ్ళంలోనూ, అటకపైనా పోకలూ, ఎండుకొబ్బరి నిండుగా ఉన్నాయి. అంతేకాక పన్నును సవరించడంవల్ల డబ్బు కట్టవలసిన బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి.

మమ్ముట్టిని పత్తాయపురంలోకి తీసుకొచ్చాడు వేలాయుధం. పడకకుర్చీలో పడుకొని ఉన్న శంకుమీనన్‌ అతన్ని చూసి ఉలిక్కిపడ్డాడు. ఒకటిన్నర మనిషింత పొడుగున్న మమ్ముటి  వినమ్రంగా వంగి నమస్కారం చేస్తూ నిలబడి వున్నాడు. ఎదుట సరుకు బాగుంటే మొత్తం కొనడానికి తాను సిద్ధమేనని అన్నాడు. పొన్నాని సముద్రతీరం నుండి ఇతర దేశాలకు సరుకులు ఎగుమతి చేయటమేనట అతని వృత్తి.

కొత్తగా ఆర్జించిన సంపద తాలూకు మెరుపు మమ్ముటి ముఖం మీద ప్రస్ఫుటంగా గోచరించింది. దగ్గరకు కత్తిరించిన జుట్టు, గుండ్రంగా ఉండే గడ్డం, గంభీరంగా వున్నా నవ్వుతూ కనబడే పెద్ద పడవలాంటి పెదవులు .. ఇది అతని రూపం. కొన్ని వస్తువులను ఒకచోట చేర్చడానికి, విడతీసి కట్టలు కట్టడానికి ఒక చోటు గురించి వెతుకుతున్నాడు అతడు.

తన ‘కళప్పుర’ (పొలాలను ఆనుకొని వుండే చిన్న ఇల్లు) వాడుకోమని శంకు మీనన్‌ అనగానే మనస్ఫూర్తిగా నవ్వాడు మమ్ముటి  కాళ్ళు చేతులు ఒకసారి సవరించుకొని వసారాలో నేల మీద కూర్చున్నాడు. మశూచి రోగమేఘాలను దూరంగా తీసుకెళ్ళే ఒక గాలి అక్కడ నీరసంగా కదులుతూ ఉండేది. ఆ గాలికి మమ్ముటి జుట్టు ఎగిరెగిరి పడింది.

‘‘నువ్వు అనుకున్నంతా కొనుక్కోవచ్చు. కాని సరుకుకు తగినంత ధర ఇవ్వాలి,’’ శంకుమీనన్‌ లేని గౌరవం తెచ్చుకొని మరోసారి అన్నాడు.

గట్టిగా నవ్వాడు మమ్ముటి.  అప్పుడు పొన్నాని కడలి తరంగాలు గర్జించాయి. తరంగాల లోపల ఉండే అమ్మమ్మ కడలి ఇగిళ్ళు బయటపెట్టింది. కడలి ఒడ్డున మంచి చెడు జిన్నులు చేతులు కలిపి నాట్యం చేశాయి.

హఠాత్తుగా కడలిలోని కెరటాలు శాంతించాయి. అంతా ప్రశాంతత నిండుకుంది. కార్తి మజ్జిగ్గ  గ్లాసుతో శంకుమీనన్ని సమీపించింది. ఆమెను చూస్తూ  అలాగే ఉండిపోయాడు మమ్ముటి.  ఎంత ప్రయత్నించినా ఆ అందాలరాణి నుండి దృష్టి మళ్ళించలేకపోయాడు.

SufiBookFrontCover

తన కళ్ళలోకి, వొంటిలోకి ఒక మగాడు రెప్పవాల్చకుండా చూస్తున్నాడని ప్రప్రథమంగా గమనించింది కార్తి.  పైపైకి తేలిన ఆమె శరీరం మెల్లగా భూమి మీదకు దిగింది. నిప్పురవ్వలు వెదజల్లే ముఖంతో రక్తప్రసారం పెరిగిన నరాలతో కూర్చున్న మమ్ముటిను ఆమె గమనించలేదు. కాని…

అతని చూపుతో తాను వివస్త్ర అయినట్లు తోచింది ఆమెకు. అది మమ్ముటి దృష్టిలో పడినట్లు… ఇంత అందమైన అద్భుత శరీరం తనకుందా? మదమెక్కిన ఏనుగులా తన గురించిన కొత్త విషయాలు కార్తి మదిలో మెదిలాయి.

తనకంటూ ఒక అస్తిత్వమూ, శరీరమూ లభించాయి. మరొకరిలోకి విద్యుత్తులా ప్రవహించే రూపం, ఏ భీతి లేకుండా ఏ సందేహానికి లోనుకాకుండా కళ్ళలో నక్షత్రాలు విరిసే అందం.

‘‘కార్తీ… నువ్వు వెళ్ళు…’’

మొద్దుబారి నిలబడిపోయిన కార్తిని శంకుమీనన్‌ మాటలు లేపాయి.

మమ్ముటి హృదయంలోనూ కెరటాలు లేచాయి. శంకుమీనన్‌తోనూ, వేలాయుధంతోనూ మాట్లాడుతూనే ఉన్నాడు కాని మధ్యలో మాటల తాడు తెగింది. ఎంత అణిచివేసినా ఆగని కెరటాల శక్తీ, సుడుల లోతూ తనలో ఉన్నాయని తెలుసుకున్నాడు మమ్ముటి.  ధమనుల నుంచి వేడి కెరటాలు లేచాయి. హాయిగా నవ్వుతూ పొన్నాని నుండి వచ్చిన మమ్ముటి  మనసులోన ఏదో సలుపుడు.` తనకీ ఆశ్చర్యం కలిగేలా నిశ్శబ్దుడై శంకుమీనన్‌గారి కళప్పురలో నిద్రపోయాడు.

నూతన ప్రపంచాల తలుపులు తన ఎదుట తెరుచుకున్నట్టు తోచింది కార్తికి. తన రూపం గురించి, శరీరం గురించీ అదుపులోకి రాని ఊహాలు ఏర్పడ్డాయి. అంతవరకు ఒక మగాడిని  మత్తెక్కిస్తూ అతని కళ్ళు నక్షత్రాలుగా మార్చే వింత విద్య తనలో ఎక్కడో దాగి ఉందని ఆమెకు తెలియలేదు.

మేడమీదకు పరిగెత్తుకెళ్ళిన ఆమె జిజ్ఞాసతో సతమతమైంది. నిలువుటద్దం ముందు నిలబడి మెల్లమెల్లగా పై దుస్తులు జారవిడిచింది.

ఆ తరవాత ఒక ఆతృత ప్రప్రథమంగా కట్టలు తెంచుకుని దూకే స్వయంకామన యెక్క సూతి పొడుపులు` గబగబా మిగతా దుస్తులు కూడా తీసి విసిరేసింది. ముందుకు దూకే రొమ్ముల నుండి జ్ఞానపరిమళం ఇంటినిండా పాకింది. ఆ లహరిలో సీతాకోకచిలుకలూ, కీటకాలూ, పాములూ, ఎలుకలూ, తోడు కోసం పరుగెత్తాయి.

ఎంత తీసినా, తీరనన్ని చుట్లు తన చీరకి ఉన్నట్లు తోచింది కార్తికి. అద్దం ముందు నించున్న ఆమె చెమటతో తడిసి ముద్దైంది. చీర పూర్తిగా జారవిడిచి ఒక నిమిషం ఆలోచించింది. ఇది చేయాలా? మత్తెక్కిన తన మనసు ఇది భరించగలుగుతుందా? చివరికి తెగించి లో దుస్తులు కూడా విడిచింది. అద్దంలో కనబడిన ప్రతిబింబం రంగులోనూ, రూపులోనూ పరిపూర్ణంగా ఉంది. ఆ రూపాన్ని ఆవహించి మత్తెక్కిన కార్తి బలహీనతతో ఆ రూపాన్ని ప్రేమించి లాలించడానికి తొందరపడిరది. ఈ ప్రపంచంలోని ఏ క్రూరత్వానైనా సానుభూతితో అందుకునే భూదేవి యొక్క జాలితో ఆమె నేలపై వెల్లకిలా పడుకుంది.

  ఉచ్ఛ్వాసాలతోపాటు రొమ్ముల కొసలు పైకి కదిలాయి. కళ్ళు మెల్లగా మూతలు పడ్డాయి. కనురెప్పల లోపలి వర్ణ ప్రపంచంలో తన ప్రతి అవయవమూ కరిగిపోయి మళ్ళీ పునర్జన్మ ఎత్తుతున్నట్లు గమనించింది.

పెదవులు సీతాకోకచిలుకలాగా సంకీర్ణ అరణ్యాలను వెతుకుతున్నాయి. బుగ్గలు వసంత పుష్పాలుగా వికసిస్తున్నాయి. స్తనాలు జోడించిన చేతులతో విడిపోయి గుండె నుండి దిగి పర్వత సానువు లెక్కి అమృత నదులను స్రవిస్తున్నాయి. ఏదో శక్తి యొక్క విస్ఫోటనాన్ని మనసు ధ్యానిస్తోంది. బ్రహ్మాండమంతా తనలో గర్భస్తమైన నిండు అనుభవం. అప్పటికి ఆమె శరీరం దేశాల సరిహద్దులు దాటి ఖండాంతరాల్లోకి వ్యాపించింది.

ఏమిటీ అస్తిత్వపు లహరి! విశాలత యొక్క గర్వం! ఒడ్డు కనబడని కడలి యొక్క ఆత్మవిశ్వాసం! ఆనందంతో గర్వంతో కార్తి మనసు పులకించింది.

కాసేపటికి తాను మేలేప్పురం తరవాడులోని చిన్నమ్మాయి కార్తి అనే వాస్తవం గుర్తు రాగానే ఆమెకు తన మీద తనకే జాలి కలిగింది. ఇప్పటివరకు తన మీద తను ఏర్పరచుకున్న గౌరవం ఒక్కసారిగా సానుభూతిగా మారిపోయింది. కార్తి కళ్ళ నుండి కన్నీరు జాలువారింది.

జ్ఞాపకాల అడుగుదాకా వెళ్ళి చూసింది కార్తి. నష్టపోయిన వాటి, పగిలిన వాటి అవశేషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆత్మా శరీరమూ ముక్కలై ఎన్నో సంవత్సరాలుగా చీకటిలో ఒంటరిగా పడి వున్నాయి. అది తెలుసుకున్నవారు కాని, వాటిని కలిపేవారు కాని ఎవ్వరూ లేకపోయారు.

ఉత్సాహంగా  ఉన్నప్పుడు  మామయ్య  దగ్గరకు  వెళ్ళేది  కార్తి. కాని అప్పుడు ఉబ్బసంతో బాధపడేవాడి ముఖకవళికలతో వుంటాడు అతడు. అయినా కాసేపు అక్కడక్కడే తచ్చాడుతూ ఉంది కార్తి. ఆమె దగ్గర అవుతున్న కొద్దీ దూరంగా వెళ్ళేవాడు ఆమె మామయ్య. చివరికి జుట్టు ఊడి తోక ముడిచి దయనీయంగా మరణించే జంతువుగా మారుతాడేమో, తన మామయ్య అనే అనుమానం కలిగినప్పుడు వెనక్కు తిరుగుతుంది కార్తి.

ఆ తరవాత తల్లిని సమీపించినప్పుడు ఆమె శరీరం, అవయవాలు కరిగి అంతా కలిసి ప్రవహించి ఒక అద్భుతమూర్తిగా తనను ఆరాధించే రెండు కళ్ళు మాత్రం మిగిలేవి. అప్పుడు పట్టరాని కోపం వచ్చేది కార్తికి. వెంటనే పరిగెత్తేది అమ్మమ్మ సమాధి వైపు. అక్కడకెళ్ళి అమ్మమ్మను పిలిస్తే, ‘నువ్వు భయపడతావు తల్లీ,’ అని ఆమె కూడా లేవడానికి నిరాకరించేది. చనిపోయినందువల్లనో, లేకపోతే శరీరంలో కురుపులున్నందు వల్లనో తెలియదు. తను బాగానే ఉన్నానని వందసార్లు ఒట్టువేసి చెప్పినా, అమ్మమ్మ నమ్మేది కాదు.

చనిపోయిన వారు లేచి రాకూడదట! ఎంత మూఢనమ్మకం!

మమ్ముటి ఎవరని కానీ ఎందుకు వచ్చాడని కానీ తెలుసుకోవలసిన అవసరం రాలేదు కార్తికి. తన అవయవ సౌందర్యాన్ని కుతూహలంతోనూ నిశితంగానూ అతడు చూస్తూ ఉంటే తను బ్రతికే ఉన్నానని పదేపదే గుర్తు చేస్తున్నాడని అనుకుంది. మళ్ళీమళ్ళీ ఆమె స్వయం పరిచయమవుతుంది. అతడు ఇంటి పెరటిలో వున్నా కళ్ళప్పుర అరుగులో పడుకొని వున్నా అతని దృష్టి తన చుట్టూనే వుందని కార్తి తెలుసుకుంది.

రోజులు గడిచిన కొద్దీ సరుకులు సేకరించడం పట్ల శ్రద్ధ తగ్గింది మమ్ముటికి.  కొబ్బరికాయలను, పోకలను వాటి నాణ్యత ఆధారంగా విడతీస్తూ రోజంతా మేలేప్పురం తరవాడులోనే గడిపాడు.

మమ్ముటి పని చేస్తూ వుంటే నిర్భీతితో నిస్సంకోచంగా అతని వద్ద నిలబడడానికి కార్తి జంకలేదు. చేయకూడని పనియేదో చేస్తున్నట్లు అనిపించలేదు. ప్రేమవల్ల విరిసే లజ్జ కాని, పిచ్చిచేష్టలు కాని ఆమె ముఖాన్ని కలుషితం చేయలేదు. మానవ సహజమైన మైత్రీభావం ఆమె కళ్ళలో తొణికిసలాడుతూ ఉండేది.

కార్తి మమ్ముటి వెంట ఉంటుందనే సంగతి శంకుమీనన్‌ దృష్టిలో పడింది. ఆమెను అడ్డుకోవాలనే ఒక సామాజిక స్పృహ తాలూకు స్పందన అప్పుడప్పుడు శక్తివంతమైన అతని మనసుని పడగగా మారుస్తుంది. ధమనుల గోడలు పగిలి నెత్తురు కారే నొప్పితో మనసు పడగ విప్పి ఆడుతుంది. వెంటనే వాస్తవంలోకివచ్చి సమస్యను తనలోకి తీసుకుంటాడు.

కార్తి గృహస్థితి వల్ల ఇలాంటిదేదో జరుగుతుందని అనుకున్నదేకదా? కార్తి తన సంరక్షణకు అతీతంగా కదా ప్రవర్తిస్తున్నది? పన్నును సవరించడం కోసం వచ్చిన వారు దేవుడు గదిలో ప్రవేశించినప్పుడు కార్తి అది రుజువు చేసింది కూడా. ఆమెను తిట్టే శక్తి కాని, ఆపేశక్తి కాని తనకు లేదుకదా అని అనుకున్నాడు శంకుమీనన్‌. అంతేకాదు కార్తి తల్లియైన అమ్మాళుకు కూడా ఆ శక్తి ఉందని అనుకోలేదు అతడు.

మమ్ముటిని వెంటనే పెట్టే బేడా సర్దుకొని బయలుదేరమని చెప్పాలనే ఆలోచన వచ్చింది అతనికి. కాని అది అనివార్య దురంతాన్ని వేగిర పరిచినట్లు అవుతుందని అనుకున్నాడు. కార్తి కావాలని అనుకున్న దాన్ని ఆపటం, ఎవ్వరివల్లా సాధ్యంకాదని అతనికి ఖచ్చితంగా తెలుసు. తన బలమూ, బలహీనతా, సౌందర్యమూ అంతా అయిన కార్తి కదలికలను ఆమెకు తెలియకుండా గమనిస్తూ వచ్చాడు. జీవితం అందించే వేదన అనుభవించాడు. అనుభవించి అనుభవించి దాన్ని కొంచం కొంచంగా దిగమింగడం నేర్చుకున్నాడు.

సన్మార్గపు వెలుగుతో ముసురులేకుండా చివరికి ఆనాటి ప్రభాతం వికసించింది. ప్రాణానికి ఊపిరి పొయ్యడానికి అన్నట్లు కార్తి ఏటిలోకి వెళ్ళింది. స్వచ్ఛమైన గాలిలో ఆమె ముంగురులూ, ఒంటి మీద దుస్తులూ తేలియాడాయి. మమ్ముటిని వెతుకుతూ వెళ్ళే ఆ యాత్ర ఆమెకు ఒక రోజువారీ కార్యక్రమం. తల్లీ మామయ్యలూ తనను గమనిస్తున్నారనే జంకు కూడా లేదు ఆమెకు.

ఒక కొబ్బరికాయల గుట్ట క్రింద నిలబడి కాయల పీచు తీస్తున్నాడు మమ్ముటి. కార్తి రావటం చూసి కాయలు వలిచే గునపంపై తుఫాను రేపాడు. భుజాల ఎముకలకు రెక్కలు మొలిచాయి. చేతి ధమనుల్లో నుంచి గుర్రాలు లేచాయి. నిమిష నిమిషానికి తరిగే కొబ్బరికాయల గుట్టను చూసి ఆశ్చర్యపోయింది కార్తి. ఒక హిమాలయ పర్వతం నిమిషాల్లో కరిగి కొన్ని కొబ్బరికాయలుగా మిగిలిపోయింది.

మొత్తం కాయలు వలిచి గునపం నేల మీద నుండి లాగి పారేసి క్రింద కూర్చున్నాడు మమ్ముటి.  మెల్లమెల్లగా మనసును అదుపులోకి తెచ్చుకున్నాడు. చాలా మామూలుగా చిరునవ్వైనా నవ్వకుండా రెప్పవాల్చకుండా తనను చూస్తూ నిలబడిన కార్తిని అడిగాడు.

‘‘నువ్వు వస్తావా…?’’

‘‘వస్తాను,’’  కార్తి జవాబిచ్చింది.

‘‘ఎక్కడికి?’’

‘‘నాకు తెలుసుకోవాలని లేదు.’’

పొన్నానిలోని సముద్రపు ఘోష అప్పుడు అక్కడ వినిపిస్తున్నట్లు తోచింది మమ్ముటికి.

తన బలమూ మగతనమూ సౌందర్యరాశిని సొంతం చేసుకోవడం కోసమే పుట్టినవి కదా? పొన్నాని పిల్లలకు ఆరాధనామూర్తియైన తను వాళ్ళ నుండి తప్పించుకొని తిరిగినది ఈ పిల్ల కోసమేనని ఇప్పుడు తెలుస్తోంది.

కాని ఆమె ముందు ఎంత హుషారు ప్రదర్శించినా ఆమె కళ్ళ నుండి ప్రసరించే కాంతిధారల ముందు తను కేవలం ఒక చిన్నపిల్లాడై మారిపోతున్నట్లు… తప్పటడుగులు వేసే పిల్లాడిలాగా ఏవో పిచ్చి పనులు చేసి భయపడుతున్నట్లు. వాత్సల్యపు కుంభాలు తెరిచిపోసిన నవ్వు నవ్వి కార్తి వెళ్ళగానే ఆ చల్లతనానికి మనశ్శాంతి  చేకూరుతుంది.

భారతప్పుళ దాటి వచ్చిన మమ్ముటి  సేకరించిన సామానుతో కళప్పుర నిండి పోయింది. బంగారురంగులోకి మారిన పోకలూ,  నూనెతో నిండిన కొబ్బరికాయలూ వాడుకకు తయారైనాయి. బాధ్యతాయుతంగా వుండే మమ్ముటి తను బయలుదేరడానికి వారంరోజులు ముందే శంకుమీనన్ని కలిసి అన్నాడు. ‘‘దొరా పొన్నానికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. లెక్కచూడండి మిగిలినవి ఇచ్చేస్తాను.’’

ఆరోజు రాత్రి ‘పత్తాయప్పుర’ మేడ మీద పడుకున్న శంకుమీనన్‌కు నిద్ర పట్టలేదు. గంటగంటకీ ఒకసారి తలుపు బయటికి వచ్చి చూశాడు. అంతవరకూ సంతరించుకున్న సంయమనపు ఆత్మసంపద వాకిటిలో పడిన వాననీరులా కారి దూరమవుతున్నది. ఏదైనా విషాద సంఘటన అనివార్యమని తెలిస్తే దాన్ని స్వీకరించగల మనోబలం ఉండాలి. లేకపోతే ఎదుర్కోగల ధైర్యం ఉండాలి. కార్తికి వ్యతిరేకంగా వేలెత్త లేని తాను, పట్టించుకోకుండా ఉండడమే మేలని అనుకున్నాడు. అలా ఉండాలంటే మనసు దృఢంగా ఉండాలి. కాని అంతవరకు ఎరుగని ఎత్తుపల్లాల్లో, సుడుల్లో ప్రవహించే తన మనసు తనదేనా అనే అనుమానం కలిగింది శంకుమీనన్‌కి. హతాశుడైన కొన్ని వేళల్లో పరుగెత్తుకెళ్ళి అమ్మాళుకు వివరాలు చెప్పి సలహా తీసుకోవాలని అనిపించేది. లేకపోతే మేనేజర్‌ వేలాయుధానికి అంతా చెప్పి ఏడ్చి ఏదైనా దారి చూపమని అడగాలని అనిపించేది. కాని ఎంతో ఉన్నతుడుగా పరిగణింపబడే తను చెల్లెలి ముందూ, మేనేజర్‌ ముందూ విలపించటమేమిటిని ఊరుకున్నాడు.

కిటికి వద్దకు వచ్చి చూసిన ప్రతిసారి వెన్నెల యొక్క తెల్ల మచ్చ, చీకటి యొక్క మసి నలుపు స్త్రీ పురుష రూపాలుగా కనబడ్డాయి. కనబడేవి నీడా, తెలుపూ అని ఖచ్చితంగా తెలిసినా అతని మనసు వాటిని స్త్రీ పురుష రూపాలుగా మలచుకుంటుంది. మళ్ళీ మళ్ళీ  స్త్రీ పురుష రూపాలు దిగిరావడం ఊహించిన అతని కండరాలు పత్తాయప్పుర నుండి దూకడానికి ప్రయత్నించింది.

ఎంత ప్రయత్నించినా కిటికీ వద్ద నుండి జరగటం కానీ, నిద్రపోవడం కానీ కుదరదని అతనికి తెలుసు. కాని అలాగే నిలబడి ఆలోచిస్తే తను ఏదైనా అఘాయిత్యం చేసుకుంటానేమోననే భయం కలిగింది.

గాలివానలో చిక్కుకున్న మనసులో హఠాత్తుగా ఒక మెరుపు మెరిసింది. గబగబా మెట్లు దిగాడు. క్రింద వసారాలో పడుకుని ఉన్న వేలాయుధాన్ని తట్టిలేపాడు. అటక మీద వెతికించి ఒక లావుపాటి ఇనుపగొలుసూ, తాళమూ తీయించాడు. కిటికికి ఎదురుగా పడకకుర్చీలో కూర్చుని గొలుసుతో తనను కట్టమని ఆజ్ఞాపించాడు. మారు మాట పలకకుండా యజమాని మాటల్ని అనుసరించే వేలాయుధం ఒక రోబోలా ఆ పని చేశాడు. ఇనుపగొలుసుతో కాళ్ళు చేతులు బంధించబడిన శంకుమీనన్‌ స్త్రీ పురుష రూపాల కోసం ఎదురుచూస్తూ కూర్చుని ఆలోచించాడు. తాత్విక చింతన యొక్క అరిటి నారుతో ఎంత బలంగా కట్టిపడేసినా ఆ సమయంలో కట్టలు తెంచుకుంటుంది కోపం. చెడు చూడకుండా దూరంగా వుండే శక్తిలేదు మనసుకి. చూస్తే ఏం జరుగుతుందని ఊహించనూ లేదు. స్వయంగా తెలుసుకోలేనివాడి శరీరం ఇనుపగొలుసులకు బానిసవుతుంది.

మరునాడు తెల్లవారగానే వేలాయుధం వచ్చి గొలుసు విప్పాడు. ఆ తరవాత మరో అయిదు రాత్రులు కూడా అలాగే గొలుసుతో బంధించుకుని రెప్పవాల్చకుండా కిటికి నుండి చూస్తూ కూర్చున్నాడు శంకుమీనన్‌.

ఆరో రోజు రాత్రి` వెన్నెల మసకమసకగా మారిన వేళ` రాత్రి పూట మరో సంధ్య వెలుగు చిక్కపడే లక్షణాలు కనబడ్డాయి. గత అయిదారురోజులుగా శంకుమీనన్‌ తన మనసులో చెక్కుకున్న రూపాలు బయటికి వచ్చాయి. మమ్ముటి నీడ కార్తిని పూర్తిగా కమ్మేసినట్లు కనబడింది.

హఠాత్తుగా ఒళ్ళు మొద్దుబారిపోయినట్టు తోచింది అతనికి. అయినా సంభాళించుకున్నాడు. కిటికి ఊచల్ని గట్టిగా పట్టుకొని నిలబడ్డాడు. పీడకలల్లో ప్రత్యేక్షమయ్యే దుర్భర బాధలే కదా నిజజీవితంలో జరిగే సంఘటనలు. ఇంటి వాకిలి దాటి కార్తి గేటు దగ్గరకు చేరగానే కేవలం  అస్థికలతో  మిగిలిన  ఒంటరి గుండెలా ఉండిపోయాడు.

ఆ తరవాత ఏమైందని గుర్తులేదు. ఎలాగోలా కార్తిని పోగొట్టుకోకుండా చూడమనే సందేశాలు వేలకు వేలు అతని ధమనుల్లో పాకాయి. కోశాలు మొక్కలుగా విభజించి లేపిన శక్తి యొక్క ప్రళయంలో అతడు రాక్షసుడుగా మారాడు. పత్తాయప్పుర మేడ మీద నుండి గాలిలోకి పాదాలు వేసి గేటులోకి దూకడానికి శరీరం ముందుకు వంగింది.

ఇనుపగొలుసులు గర్జించాయి. ఆ ఎదురుదాడికి అవి వేడెక్కి పెద్ద సవ్వడి చేశాయి. గది నేలపై నిలబెట్టిన పడకకుర్చీ విరిగిపోయింది.

చివరి యుద్ధంలో అతని మనసు మరో మార్గం లేక శరీరం నుండి బయటపడి నియంత్రణాతీతమై గేటు దాటే కార్తిని సమీపించింది.

‘‘నువ్వు వెళ్తున్నావా…’’

ఎవరో కుదిపి పిలిచినట్లు కార్తి చివరగా ఒకసారి వెనక్కు తిరిగి చూసింది. ఆ సమయానికి రక్తసిక్తమైన కాళ్ళూ చేతులుతో కుర్చీలోనే స్పృహ కోల్పోయి పడి వున్నాడు శంకుమీనన్‌.

మసక వెన్నెలలో మేలేప్పురం ఇంటి రూపురేఖలు ఒక అస్థిపంజరంగా మిగిలాయి. ఆజానుబాహువులైన వృక్షాలు చీకటికి కాపలాదార్లుగా మేలేప్పురం ఇంటి పెరటిలో కాపలా కాసాయి. ‘పంది పరంబు’లోని మట్టిపొరల్లో నుండి మశూచి యొక్క వేడి నిట్టూర్పులు ఎగిశాయి. చూపులకతీతమైన దూరంలో ఎక్కడో దాగి ఉండే ఒక లేత ఉదయపు పొరల్లోకి నడిచారు మమ్ముటి, కార్తీలు.

మమ్ముటి పాదాలను ఏకాగ్రత రూపమెత్తినట్లు కనబడిన కార్తి ఒక నీడలా అనుసరించింది. ఇంత త్వరలో ఆమె తనతో నడిచి వస్తోందనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక పోయిన మమ్ముటి ఒకే ఒక నిమిషంలో ఆమెను భుజానికి ఎత్తుకున్నాడు. అప్పుడు అతనికి నమ్మకం కుదిరింది తనపై, తన అవయవాలపై. తొడలోని కండరాలు అలలా కదిలాయి.

శాప విముక్తులైన ధూళి మేఘాలు మమ్ముటి నడిచిన బాటలో లేచి మిగిలిన జ్ఞాపకాల్లా మేలేప్పురం తరవాడు దాకా పాకాయి.

పొలం గట్టుల మీద నుండి ఇరుకు సందుల్లోకి సందుల్లో నుండి కొండలెక్కి దిగే దారుల్లోకి వాళ్ళు సాగారు.

మమ్ముటి నిశ్వాసాలు వెచ్చని ధారలుగా మారి కార్తి తొడల్ని వెచ్చగా చేస్తున్నాయి. ఒక నిమ్నమ్ నుండి పరిగెత్తుకెళ్ళి సమతలం చేరితే పాదాలు తడబడ్డాయి. మట్టినీళ్ళతో నురుగులు కక్కే భారతప్పుళ్ల దూరం నుండి కనబడగానే అతడు ఆగి ఊపిరి పీల్చుకున్నాడు. నదిని చూసిన కార్తి భుజం మీద నుండి దింపమంది. అతని శరీరాన్ని రాసుకుంటూ క్రిందకి జారుతూ వుంటే అతని నాసిక నుంచి, నోటి నుంచి విడుదలవుతున్న వేడి గాలి తగిలింది ఆమెకు. దాన్ని ఆస్వాదించింది ఆమె. ఆయాసంతో, తడిసిన నేలమీద తడబడే అడుగులతో నడిచారు.

నురగల పెద్దకూటమిలు పగిలి మళ్ళీకలిసి ప్రవాహ విస్తృతిలో ప్రవహిస్తున్నాయి. నదిలో విలీనమై వచ్చేది ఏ పర్వతమో! తన అమూల్యనిధితో ఈది నదికి అవతల ఒడ్డు చేరగలననే దాన్ని గురించి మమ్ముటికి అసలు అనుమానం కలగలేదు. తన శక్తిని ఊది జ్వలింపచేసి అతడు తయారైనాడు.

వంగినప్పుడు బండరాయిగా మారిన తన వీపు మీద ఎక్కమని అతడు కార్తికి చెప్పాడు. ఆమె కదలలేదు, సుడులు తిరిగే ప్రవాహం చూస్తూ నిలబడింది.

‘‘భయపడక, ఎక్కు. నిన్ను మోస్తూ రెండుసార్లు నది దాటగలను, నాకంత బలం ఉంది,’’ మమ్ముటి అన్నాడు.

‘‘నిజమే… కాని పిచ్చి యెక్కిన నదికి అది తెలియదుకదా. నేను వస్తున్నానని దానికన్నా ముందు…’’

మాటలు పూర్తి చేయకుండానే హోమకుండంలో అర్పించే హవిస్సులా కార్తి మమ్ముటి తాపంలో అంటుకుపోయింది. అది ఆమెకు అవసరం, అత్యవసరం. కోరిక నిండిన పెదవులతో ఆమె మమ్ముటి వక్షస్సులోకి ఈదింది.

నది దాటకపోతే… అలాంటి సాధ్యత గురించి ఆలోచించలేకపోయింది కార్తి. అంత సాహసం చేస్తే… జీవితం అభాసుపాలైతే… అలాంటి దిశల్లో సాగాయి కార్తి ఆలోచనలు.

వణికే పెదవులతో మమ్ముటి గుండెలో తల దాచుకుంది. అతని చేతులు ఆమెను వాటేసుకున్నాయి. అంతా అందుకోవడం కోసం ఆమె పడుకుంది. మూర్తీభవించిన సంపూర్ణ స్త్రీ సౌందర్యం యొక్క మూస తడిసిన ఇసుకలో తయారైంది. మమ్ముటి ఒంటిలోని వేడి ఆమె ప్రతి అణువులోనూ పాకింది.  మెడలో, పెదవుల్లో, రొమ్ముల మధ్య, ఊరువులో… ఒకచోట తరవాత మరోచోట రసానందపు మొగ్గలు వికసించి ముడుచుకున్నాయి. చివరికి జననాంగంలోకి పాకిన ఉష్ణంతో ఆమె మైకపు సరిహద్దుల్లోకి జారుకుంది. ముక్కలు చెయ్యబడే తన శరీర సీమలను తెలుసుకుంది. భరించింది.

లొంగిపోవటమనే ఆనంద శిఖరాల్లో నించుని కార్తి తొంగి చూసింది, కోటాను కోటి ఆనందాల సూర్యులు.

‘‘ రా ఇంక పద. ఇక ప్రమాదపు నది కానీ, సముద్రం కానీ… ఏదైనా కానీ… కలిసి దాటుదాం.’’

అవరోహణపు మెట్ల నుండి జారే మమ్ముటి శరీరాన్ని ఆమె తట్టి లేపింది. అభినందనలు అందుకున్న బాలుని అల్లరి నవ్వుతో అతడు కార్తి నుండి ముఖం తిప్పుకున్నాడు. నదీ జలంలోకి శయన ప్రదక్షిణం చేసి తన నగ్నతను దాచుకున్నాడు. అతని స్వచ్ఛమైన నవ్వుని నదిలోని అలలు అందుకొని అద్దంలో లాగా పలుచోట్ల ప్రతిబింబించాయి.

జలస్ఫటికం నుండి వంకరగా తిన్నగా పెరిగిన మమ్ముట్టి యొక్క శరీర చిత్రాలను చూస్తూ కూర్చుంది కార్తి.

ఎంత అందం! ఆమె ఆశ్చర్యబోయింది.

కొన్ని నిమిషాల క్రితం ఇంత అందం తన ఒంటిని కప్పి వేసిందనే విషయం నమ్మలేకపోయింది. ఆమె ఆ అపనమ్మకంలోని భాగంగా నది తన ప్రియుడిని తస్కరిస్తుందేమోననే భయం రాగానే ఆమె నీటిలో దిగి మమ్ముటిని బయటకు లాగింది.

కార్తిని వీపు మీద ఎక్కించుకుని, ఒక తెప్పలా భారతప్పుళ దాటాడు మమ్ముటి. వీపును అంటుకొని ఉండే కార్తీ బరువు తక్కువ ఉండటం వల్ల ఆమె మత్స్యకన్నెగా మారిపోయిందేమోనని ఊహించి సరదాపడ్డాడు. నదిలో ఈదేటప్పుడు ఆమె శరీర స్పర్శకి పులకరించాడు.

ప్రవాహపు శక్తికి తట్టుకొని నది మధ్య ఈదేటప్పుడు కూడా మమ్మటికి ఇబ్బంది అనిపించలేదు.  మేలేప్పురం  తరవాడులో  అంతవరకు  మండిన ఉత్కంఠ, భయాందోళనలు ఎప్పుడో ఎక్కడో కాటువేసి పడగ ముడుచుకున్నాయి. మరణ భయం కూడా కొన్ని నిమిషాల క్రితం జరిగిన స్కలనంతో కొట్టుకుపోయింది. అంతవరకు అనుభవం లోకి రాని ఒక ప్రశాంతత అతన్ని స్థితప్రజ్ఞుణ్ణి చేసింది.

ఎంత సేపు…?

 Photo Garimella Narayana

ఇబ్బంది పెట్టాలంటే ఎంత సేపు…?

ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా..సరే

 

చెప్పు-రాయి

చెవి-జోరీగ

కాలి-ముల్లు

కంటి-నలుసు

ఉండనే ఉన్నాయిగా

అల్పంగా…

 

అల్పాతి  అల్పంగా

అలోచించి పారేస్తే

జిడ్డు బుర్రకి సైతం

తట్టక ఛస్తుందా

ఇబ్బంది పెట్టే ఆలోచనా…?

 

బురద చల్లాలంటే ఎంత సేపు?

 

పంది విదిలించినట్టు

గేదె తోక విసిరినట్టు

జలగ పాకినట్టు

బాతు ముక్కు బుక్క పెట్టి

ఉమ్మేసినట్టు…

 

పాతాళంలోకి కూరుకుపోయే

ఆలోచనలతో కుచించుకుపోతే

బురదేసే కళ

అదే వచ్చేస్తుంది..

 

అందుకే

దయచేసి

ఇబ్బందుల బురదల

ఇంగితం లేనోళ్ళు చేసే

సులువైన వాటిని

కండలు పెంచాలనుకుంటున్న

కాగడాలకు చెప్పి

అవమానించకండి…

 

ఒకే అసంబద్ధ నాటకం..మరోసారి, మీ కోసం…

deraa

కేతిగాడు మరోసారి తెరతీశాడు
తాళవాద్యాలతో భజనబృందం సిద్ధమైంది
నగరం నడిబొడ్డు లోని  ప్రేత సౌధం వేదికగా-
పాత్రధారులు గళ విన్యాసం ప్రదర్శించారు

వొకరిద్దరు ఔత్సాహికులు ఓవరాక్షన్తో-
ప్రేక్షకాదరణ కోసం పాకులాడారు
మేకప్, మడత నలగని చీరలతో-
ఒకరిద్దరు నటీమణులు కాసింత గ్లామర్నద్దారు
నోరుపారేసుకుని, గోడలు దూకి..
ఫ్రైడే బ్యాంగ్ తో డైలీ సీరియల్ను రక్తికట్టించారు
అక్కడక్కడ చొరబడిన యాక్షన్ సన్నివేశాలు
బాటసారులను ఒకింత ఉద్వేగపరిచాయి
చతురంగబలాలను ప్రయోగించి..
జనాన్ని దాచేసి ఓటమినొప్పుకున్నాడు ప్రతినాయకుడు
ప్రజలకు పట్టకపోయినా, నాటకం రసవత్తరంగా సాగిందని..

పాత్రధారులే వేదిక దిగి కాసేపు చప్పట్లు కొట్టుకున్నారు
కామెర్ల కళ్లకు పచ్చజెండాలు కప్పుకుని
ఒకర్నొకరు ఘనంగా అభినందించుకున్నారు
నాటకాన్ని పదేపదే తిలకించిన..
అమరులు మాత్రం-
సిగ్గుతో మరోసారి చావుకు సిద్ధమయ్యారు!

5192479564_f9b7264107_o

నాట్స్ సాహిత్య సభా ప్రయోగం సక్సెస్!

సాహిత్య సభల్ని ఏదో ‘నామ’ మాత్రంగానో, ఒక తంతులాగానో కాకుండా- స్పష్టమయిన ఉద్దేశంతో, చిత్తశుద్ధి తో చేస్తే అవి ‘సక్సెస్’ అయి తీరుతాయని నిరూపించారు నాట్స్ సాహిత్య కమిటీ నిర్వాహకులు. చిత్తశుద్ధితో పాటు కొంత ప్రయోగాత్మక దృష్టి తోడయితే, సాహిత్య సభలకి పదీ పాతిక మంది మాత్రమే హాజరయ్యే దుస్థితి కూడా తొలగిపోతుందని ‘నాట్స్’ నిరూపించింది. మూడు రోజులు ఒక మహాసందడిగా జరిగిన నాట్స్ సభల్లో రెండు రోజుల సాహిత్య సభలు ఒక హైలైట్ గా నిలిచాయంటే అతిశయోక్తి కాదు, కేవలం సాహిత్య అభిమానిగా చెప్తున్న మాట కాదు. “  ” సాహిత్య సభలకి నేను- బాబోయి -ఆమడ దూరంలో ఉంటా. అలాంటిది, వూరికే అలా వచ్చి ఇలా చూసిపోదామని వచ్చి, ఇక్కడ సెటిలై పోయా,” అన్న వాళ్ళు వున్నారు.

శుక్రవారం అమెరికాలో పనివారమే. ఆ రోజు మొదలయిన సాహిత్య సభ మొదట్లో పలచగా వున్నా, నెమ్మదిగా హాలు నిండిపోయింది. “రండి…కూర్చోండి,” అని బతిమాలుకునే అవస్థ నిర్వాహకులకు పట్టకుండానే, మొదటి సభకి వచ్చిన వాళ్ళంతా చివరి కార్యక్రమం దాకా అంటే – వొంటి గంటకి మొదలై, ఆరు గంటల దాకా- వోపికగా కూర్చోడం ఆశ్చర్యంగా అనిపించింది. సాధారణంగా సభల్లో ఎవరో సినిమా వాళ్ళు వుంటే వాళ్ళ పాటలో, మాటలో విని అక్కడినించి వెళ్ళిపోవడం చాలా సందర్భాల్లో జరుగుతుంది. కాని, నాట్స్ సాహిత్య సభల్లో అలాంటి స్థితి కనిపించలేదు.

మొదటి రోజు సాహిత్య సభలు

 తెలుగు భాష గురించి చర్చ అంతా ఒక ఎత్తు. ఇప్పుడు తెలుగు సాహిత్యంలో స్థానికత/ ప్రాంతీయత  గురించి చర్చలు వేడెక్కుతున్న సమయంలో మాండలికం మీద చర్చకి తెర తీయడం- అదీ నాట్స్ లాంటి వేదికల మీద- నిజంగా సాహసం. గిడుగు రామమూర్తి  పంతులుకి అంకితం చేసిన ఈ సభా వేదికకి అది సందర్భోచితమే. ప్రసిద్ధ విమర్శకులు కె. శ్రీనివాస్ కీలకోపన్యాసంతో మొదలయిన చర్చలో ఆధునిక తెలుగు భాషలో మాండలికాలకు సంబంధించిన భిన్న కోణాలని సినిమా సాహిత్య భాష గురించి కోన వెంకట్, చంద్రబోసు, భాషా సాహిత్య కోణం నించి అఫ్సర్, సరిహద్దు భాషల మాండలికం గురించి గాలి గుణశేఖర్, స్త్రీల రచనల్లో  మాండలికం గురించి కల్పనా రెంటాల మాట్లాడారు. అనంత మల్లవరపు సభా సంధాతగా వ్యవహరించారు. మాండలికంవేపు సాహిత్యం సాగిస్తున్న  ప్రయాణంలోని మైలురాళ్ళని గుర్తు చేయడంతో పాటు, ముందుకు సాగవలసిన  దారిని ఈ చర్చ సూచించింది.

రెండో సభ ప్రముఖ విద్వాంసులు మీగడ రామలింగ స్వామి సంగీత  నవావధానం. ఇది ప్రయోగాత్మక అవధానం. అమెరికాలో సాహిత్య సభలంటే  అవధానాలే; పద్యాలు అనగానే ఎవరయినా చెవికోసుకుంటారు. కాని, మీగడ వారి సంగీత అవధానం అటు సాహిత్యమూ ఇటు సంగీతమూ కలగలిసిన శబ్ద రాగ విభావరి.  ఈ సభకి అటు పండితుల నించి, ఇటు సాధారణ సాహిత్య అభిమానుల దాకా, అటు సంప్రదాయికుల నించి ఇటు ఆధునికుల దాకా అపూర్వమయిన స్పందన లభించింది. మూడు గంటల పాటు కరతాళ ధ్వనులతో సభాస్థలి మార్మోగిపోయింది.సంగీత నవావధానికి సంధాత గా రమణ జువ్వాది వ్యవహరించారు. అక్కిరాజు సుందర రామకృష్ణ, రమణ జువ్వాది, గాయని జ్యోతి, మద్దుకూరి చంద్రహాస్, మహారాజపురం రాము, తదితరులు సంగీత నవావధానం లో పృచ్ఛకులుగా వ్యవహరించారు. ఇద్దరు పిల్లలు కూడా పృచ్ఛకులుగా పాల్గొని పద్యాలు పాడటం అందరినీ ఆనందింప చేసింది. ఆశ్చర్యపరిచింది. నాట్స్ సాహిత్య కమిటీ సభ్యులు అనంత్ మల్లవరపు, శారద సింగిరెడ్డి, సతీష్ పున్నం, శ్రీనాధ్ జంద్యాల , జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, నసీం షేక్, సురేష్ కాజా తదితరులు అతిథులను సత్కరించారు.

 రెండో రోజు

సభలు రెండవ రోజు ఇంకా  ఘనంగా జరిగాయి. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి శత జయంతితో రెండవరోజు సాహితీ సభలు ప్రారంభమయ్యాయి.పాపయ్య శాస్త్రి గారి మనవడు శ్రీనాథ్ జంధ్యాల ఈ కార్యక్రమానికి సంధాతగా వ్యవహరించారు. ప్రముఖ నటులు, గాయకులు అయిన అక్కిరాజు సుందర రామకృష్ణ గారు జంధ్యాల పాపయ్య శాస్త్రి  గారి పద్యాలను చక్కగా పాడారు. ఈ ప్రపంచంలో సూర్యచంద్రులున్నంత వరకు పాపయ్య శాస్త్రి గారి పద్యాలు అందరికీ గుర్తుండి పోతాయన్నారు.ఈ సందర్భంగా అక్కిరాజు సుందర రామకృష్ణ గారిని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి మనవడు, మనవరాలు కుటుంబ సమేతంగా సత్కరించారు.

పద్య వాణీ విన్యాసం కార్యక్రమంలో సమైక్యభారతి సత్యనారాయణ, డి.ఎస్.డీక్షిత్, ప్రముఖ రంగస్థల నటులు గుమ్మడి గోపాలకృష్ణ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కాజా సురేష్ గారు నిర్వహించారు. శ్రీకృష్ణ రాయబారం, శ్రీనాధుడు, సత్య హరిశ్చంద్ర నాటకాల నుండి కొన్ని పద్యాలు పాడి అందరినీ ఆకట్టుకున్నారు.

ప్రముఖ కవులయిన చంద్రబోస్, సిరా శ్రీ, రసరాజు, వడ్డేపల్లి కృష్ణ గారితో ‘మా బాణి-మీ వాణి’ శీర్షికన ఆశువుగా గేయ రచన కార్యక్రమం జువ్వాడి రమణ గారి ఆధ్వర్యంలో ప్రేక్షకుల చప్పట్లతో మారుమోగింది. మహారాజపురం రాముగారు రసరాజు గారిని పరిచయం చేస్తూ అసెంబ్లీ రౌడీ సినిమాకి  వ్రాసిన “అందమయిన వెన్నెలలోనా” పాటను పాడారు. ఈ పాటకు కళాసాగర్ అవార్డు వచ్చిందని రసరాజు గారు గుర్తు చేసుకున్నారు.  సిరా శ్రీ గారిని పరిచయం చేస్తూ “ఇట్స్ మై లవ్ స్టోరీ” సినిమా నుండి “నిన్నలా లేదే, మొన్నిలా లేదే” పాట పాడారు. చంద్రబోస్ గారిని పరిచయం చేస్తూ ఝుమ్మంది నాదం సినిమా నుండి దేశమంటే మతం కాదు పాట పాడారు.మగధీర సినిమాకి పంచదారా బొమ్మ,బొమ్మా పాటను గుర్తుకు తెచ్చుకుంటూ చంద్రబోస్ గారు ఆ పాట అనుభవాన్ని అందరితో పంచుకున్నారు.కన్నడ, మళయాల, తమిళ బాణీలకు వడ్డేపల్లి కృష్ణ, సిరా శ్రీ, రసరాజు చంద్ర బోస్ గారు చక్కగా తెలుగు వాణిలను వినిపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. డాలస్ నుండి మద్దుకూరి చంద్రహాస్, రాయవరం భాస్కర్, దివాకర్ల మల్లిక్ గారు కూడా పల్లవి అందించి అందరి చేత “శెభాష్” అనిపించుకున్నారు. మల్లవరపు అనంత్ గారి నవ్వు మీద రసరాజుగారు ఆశువుగా పాట పాడి అనంత్ ను ఉక్కిరిబిక్కిరి చేసారు.అన్ని పాటలను మహరాజపురం రాజు గారు, డాలస్ ఆస్థాన గాయని జ్యోతి గారు పాడి వినిపించారు.

 మొదటి సారి ప్రవాస వేదిక ఎక్కిన శ్రీధర్

ఈనాడు ఇదీ సంగతి శ్రీధర్ గారితో షేక్ నసీం ముఖాముఖి సందడిగా జరిగింది. ఆంధ్రదేశంలో తెలుగు కార్టూన్ల గురించి పోచంపల్లి శ్రీధర్ గారు చక్కగా మాట్లాడారు. రాజకీయనాయకుల ఇగోని కార్టూనిస్ట్ పంక్చర్ చేస్తూ ఉంటాడు అని చెప్పారు. చిన్న, చిన్న గీతలతో కార్టూన్లు ఎలా గీయచ్చో చూపిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. వివిధ కాలాలలో తను వేసిన కొన్ని కార్టూన్లను గుర్తు తెచ్చుకున్నారు.

సాహిత్య సేవలో భారీ వదాన్యులు కార్యక్రమంలో  గురవారెడ్డి, ప్రముఖ రచయిత భారవి ముఖాముఖి జరిగింది. ఆహుతులు వేసిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు  చెప్పారు. సియాటిల్ నుండి వచ్చిన పద్మలత భారవి గారిని సభకు పరిచయం చేసారు.  గురువాయణం పుస్తకం వ్రాసిన గురవారెడ్డిని పెనుగొండ ఇస్మాయిల్ గారు సభకు పరిచయం చేసారు. ఆహుతులు వేసిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు  చెప్పారు. అమెరికాలో సాహితీ సభలకు ఇంతమంది రావడం ఎపుడూ చూడలేదని గురవారెడ్డి గారన్నారు. అతిథులని నాట్స్ సాహితీ బృందం ఘనంగా సత్కరించడంతో కార్యక్రమం ముగిసింది.

‘స్రవంతి’ వెలుగులు

భాస్కర్ రాయవరం, రవి వీరెల్లి సంపాదకత్వంలో వెలువడిన నాట్స్ సాహిత్య ప్రత్యేక సంచిక ‘స్రవంతి’ కూడా ఒక విశేష ఆకర్షణ. ఇందులో కొన్ని రచనలు ఈ నెల ‘వాకిలి’ పత్రికలో వెలువడ్డాయి.  కవిత్వమూ, వచన రచనల ఎంపికలో వైవిధ్యానికి పీట వేసారు. మామూలుగా ఇలాంటి సావనీర్లలో షరా  మామూలుగా కనిపించే రచయితల పేర్లు కనిపించకుండా, కొత్త తరానికి ప్రాముఖ్యమివ్వడం బాగుంది.

                                                                               –     శ్రీనివాసులు బసాబత్తిన

సంబరాల – అలజడి

ఎద ఎన్నో భావాల సంద్రమై ఎగసి పడుతుంది

నిర్లిప్తతో, నిరాసక్తతో నా దరికి చేరకుండా ఆరాట పడుతుంది.

అభినివేశం, ఆత్మాభిమానం మాకే సొంతం!

అసూయ, అలజడి, అలుపూ సొలుపూ క్షణభంగురం!

ఉద్వేగం, ఉన్మాదం ఊపిరి తీస్తుంది!

ఉత్తేజం, ఉత్సాహం ప్రాణం పోస్తుంది!

పొగడ్త కోసమో, తెగడ్త కోసమో చేసే పని కాదది

జీవన్మరణాల మధ్య అస్తిత్వం కోసం ఆరాటమది!

భేషజాలకు, ఇజాలకు మేము దూరం

భాషకు, భావజాలానికి, బంధాలకు బానిసలం

బహుదూరపు బాటసారులు, మీరంతా మాకు బంధువులు

ఒక్క ఆత్మీయ పలకరింత, మాకు పులకరింత

– అనంత్ మల్లవరపు

వీలునామా – 7వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

పాత ఉత్తరాలు

ఫ్రాన్సిస్ ఎడిన్ బరో వొదిలి ఎస్టేటులో వుండడానికి వొచ్చే రోజు ఎల్సీ తల నొప్పిగా వుందని తన గదిలోనే పడుకుంది. జేన్ అతన్ని సాదరంగా ఆహ్వానించి, బంగళా, తోట అంతా తిప్ప్పి చూపించింది. నౌకర్లందరినీ పరిచయం చేసింది. వీలైతే వాళ్ళని పనిలో వుంచుకోమని సలహా కూడ ఇచ్చింది. అంతే కాదు, జేన్ ఇంతకు ముందు వృధ్ధులైన పనివాళ్ళకి పన్లోకి రాకపోయినా, ఎంతో కొంత సొమ్ము ముట్టచెప్పేది, పెన్షన్ లాగా. ఆ సంగతి కూడా చెప్పిందతనితో.

ఆమె మాటలన్నీ శ్రధ్ధగా విన్నాడు ఫ్రాన్సిస్. తను కూడా అలాగే కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు.

ఎస్టేటంతా తిరిగి చూసి అక్కడ ప్రకృతి సౌందర్యానికి పరవశించిపోయాడు నగరవాసి అయిన ఫ్రాన్సిస్.

“ఇదంతా వొదిలి వెళ్ళాలంటే నువ్వు పడే బాధ నాకర్థమవుతుంది జేన్,” అన్నాడు.

“ఉమ్మ్మ్….నిజం చెప్పాలంటే, ఫ్రాన్సిస్, నాకు ఇల్లూ తోటా కంటే, ఇదిగో ఈ రెండిటినీ వొదిలి వెళ్తున్నందుకు ఎక్కువ దిగులుగా వుంది,” అంటూ రెండు అందమైన గుర్రాలని చూపించింది.

“నేనూ ఎల్సీ, ఎప్పుడూ ఈ రెండిటి మీదనే స్వారీ చేసే వాళ్ళం. ఫ్రాన్సిస్, ఈ గుర్రాలనీ, కుక్కలనీ, దయగా చుస్తానని నాకు మాటిస్తావా? వాటిని నేనూ, ఎల్సీ ఎంతో ప్రేమతో పెంచుకున్నాం. పట్టణంలో పెరిగిన నీకు జంతువుల మీద ఎలాటి అభిప్రాయం వుంటుందో మరి,” సందేహంగా అంది జేన్.

“నువ్వన్నది నిజమే జేన్. నేను ఎప్పుడూ జంతువులని పెంచి, ప్రేమించలేదు. అసలు నాకొక్కడికే తిండి సరిపోయేది కాదు. అయినా, నీ మాట ఏదీ నేను కాదనను. అసలు మనిద్దరి పరిచయం ఇలా కాకుంటే ఎంత బాగుండేది. ఇంత జరిగినా నీకు నామీద ఎలాటి కోపమూ లేదన్నదొక్కటే నాకు తృప్తి. చాలా మంది వకీళ్ళని కలిసి వీలునామా చూపించాను, ఏదైనా ఒక దారి కనబడి మీకిద్దరికీ సహాయం చేద్దామని. ఇంత డబ్బు కంటే మా నాన్నగారు నాక్కొంచెం ప్రేమ ఇచ్చి వుంటే నేనెక్కువ సంతోషపడి వుండే వాణ్ణి. ఆ సంగతే ఆయనకు తట్టలేదు,” అన్నాడు ఫ్రాన్సిస్ ఆవేదనగా.

“ఫ్రాన్సిస్! ఈ ఎస్టేటూ, ఆస్తి పాస్తులూ నీ చేతుల్లో సురక్షితంగా వుంటాయి. నాకా నమ్మకం వుంది. నిజానికి, నేను సంవత్సరాల తరబడీ నేర్చుకున్నదొక యెత్తయితే, కిందటి నెలరోజులలో నేర్చుకున్నదొక యెత్తు. ఎప్పుడు లేనిది నేను మన దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల గురించి ఆలోచించాను! పొట్ట పోసుకోవడం అంత తేలికైన విషయం కాదని ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది నాకు. కష్టపడి పని చేసేవాళ్ల మీద గౌరవం పెరిగింది. ఫ్రాన్సిస్! ఒక్కటే సలహా ఇస్తాను నీకు! పాత జీవితాన్నెప్పుడూ మరచిపోవద్దు. “నడ మంత్రపు సిరి” అని నిన్నెవరూ వెక్కిరించే పరిస్థితికి వెళ్ళకుండా వుండు. నేనన్న మాటలు నిన్ను నొప్పిస్తే క్షమించు!”

“జేన్! పాత జీవితం గుర్తున్నా లేకపోయినా, నీ మాటలు మాత్రం తప్పకుండా గుర్తుంటాయి,” నవ్వాడు ఫ్రాన్సిస్.

“ఆ రోజు మీ వూళ్ళో చర్చిలో ఫాదరు చెప్పిన ఒక్క మాట నేనూ మర్చిపోనూ!”

“ఏమిటది?”

“అంతా మన మంచికే నన్న మాట. దేవుడు ఏది చేసినా మన మంచి కొరకే నన్న మాట. వుదాహరణకి, మావయ్య ఇలా వీలునామా రాయలేదనుకో! ఏం జరిగి వుండేదో తెలుసా?”

“ఏమిటి?” కుతూహలంగా అడిగాడు ఫ్రాన్సిస్.

“డబ్బు కోసమే నా చుట్టూ తిరిగిన వాణ్ణి, నేనేమాత్రమూ గౌరవించలేని వాణ్ణి వివాహమాడి వుండెదాన్ని.”

ఫ్రాన్సిస్ నివ్వెరపోయాడు.

“అంటే…”

“అంత బాధ పడటానికేమీ లేదిందులో, ఫ్రాన్సిస్.”

“అంటే, నా వల్ల నువ్వు నిలవనీడా, పెళ్ళాడే అవకాశమూ అన్నీ పోగొట్టుకున్నావన్నమాట! బాధ పడకుండ ఎలా వుంటాను జేన్!”

“అబ్బే! అలా కాదు! నేనతనికి నేనున్న పరిస్థితి వివరించాను, ఇద్దరమూ విడిపోవాలని నిశ్చయించుకున్నాం, అంతే!”

“ఎల్సీ పెళ్ళి సంగతి?”

“మేమింకా దాని గురించి ఆలోచించలేదు. అదిప్పుడు కవితా ప్రపంచంలో మునిగి వుంది. ఎలాగైనా కవితల పుస్తకం ప్రచురించి, మా ఇద్దరికీ జీవనోపాధి వెతకాలని దాని తాపత్రయం.”

“అవునా? అదీ మంచిదే.”

“అవును కానీ ఎల్సీ విమర్శ తట్టుకోలేదు. విమర్శని తేలిగ్గా తీసుకోని మనిషి కవితా సంకలనాలేం వేయిస్తుంది చెప్పు?”

“ఫర్వాలేదు జేన్. కొంచెం సున్నిత మనస్కురాలంతే. నాకు కవిత్వం తెలుసన్న సంగతి తనతో చెప్పకు! మామూలుగా చదివి బాగున్నదీ లేనిదీ నీతో చెప్తాను. నీ సంగతేమనుకుంటున్నావు?”

“నాకు ఎల్సీ బాధ్యత లేకపోయినట్లయితే ఏవరైనా ధనవంతుల ఇంట్లో ఇంటి వ్యవహరాలు చూసే హౌస్ కీపరుగా వుద్యోగం వెతుక్కునేదాన్ని. కానీ, ఎల్సీని ఒంటరిగా వొదిలి వెళ్ళడం నాకిష్టం లేదు. ఏదేమైనా, రేపు ఇద్దరమూ ఎడిన్ బరో వెళ్తున్నాము. అక్కడ ఒక స్నేహితురాలి ఇంట్లో చిన్న గది అద్దెకు తీసుకుంటున్నాం.అన్నట్టు, ఇక్కడ మా ఇద్దరి గదుల్లో వున్న సామాను మేం తీసుకోవచ్చన్నారు. కానీ, అక్కడ చిన్న గదిలో ఈ సామానంతా పట్టదు. ఇంకో ఇల్లూ అద్దెకు తీసుకునేంతవరకూ ఏవో కొన్ని ముఖ్యమైనవి తప్ప, చాలా వరకు ఇక్కడే వుంచి వెళతాను. నీకేమైనా అభ్యంతరమా?”

“లేదు లేదు! ఇక్కడే వుంచుకో. గదులకి తాళాలు కూడా వేయిస్తాను, భద్రత కోసం.”

“తాళాలు వేసుకు వెళ్ళేంత అపనమ్మకం నాకు నీ మీద లేదు ఫ్రాన్సిస్. అంతే కాదు, అన్ని గదులూ అప్పుడప్పుడూ కిటికీలూ, తలుపులూ తెరిచి శుభ్రం చేయిస్తూ వుండలి.”

“సరే, అలాగే. ఎడిన్ బరో లో నువ్వు అద్దెకు తీసుకున్న గది ఎక్కడ?”

ఆ వీధి పేరూ, ప్రాంతం పేరూ చెప్పింది జేన్.

“అరే! ఆ ప్రాంతం నాకు బాగా తెలుసు. నేనక్కడ కొన్నాళ్ళున్నా కూడా!”

“అవునా? మీ అమ్మగారు ఎక్కడ వుండేవారు? ఆవిడ ఙ్ఞాపకం వుందా నీకేమైనా?”

“లేదు జెన్. అయితే ఎడిన్ బరో కంటే ముందు నేనింకెక్క డో వున్నట్టు లీలగా గుర్తుంది. అది మా అమ్మతోనేనో కాదో అంత బాగా గుర్తు రావడం లేదు.”

“ఆవిడ బ్రతికి వుందంటావా?”

“వకీలు గారైతే అవుననే అంటారు. ”

“ఏమో మరి! బ్రతికి వుండీ నిన్ను కలుసుకునే ప్రయత్నం చేయకుండా వుంటుందా? అలాటి తల్లి వుంటుందా ఎక్కడైనా?”

“ఆవిడ పరిస్థితి ఏమిటో! ఆవిడకీ మా నాన్నగారికీ మధ్య సంబంధాలు ఎలా వుండేవో! అయితే, ఆవిడకి సహాయం అవసరమైతే నేను సాయపడొచ్చని వుంది విల్లులో! కానీ, వకీలు గారు నన్ను ఆవిడ కోసం వెతకొద్దని సలహా ఇచ్చారు!”

“నువ్వు ఆస్తి పరుడవైన విషయం తెలిస్తే, ఆవిడే నిన్ను వెతుక్కుంటూ రావొచ్చు కదా!”

“ఒకసారి నాన్నగారి పాత ఉత్తరాలు వెతికితేనో? వకీలు గారు నాకు ఆయన పెట్టె తాళాలు ఇచ్చారు. ఇద్దరం కలిసి ఒక్కసారి ఆయనకి సంబంధించిన కాగితాలన్నీ చూద్దామా? ఎక్కడైనా నాకు మా అమ్మ ఆచూకీ దొరుకుతుందేమో!”

“సరే పద!”

ఇద్దరూ దాదాపు రెండు గంటలు కాగితాలన్నీ చూసారు. ఎక్కడా ఫ్రాన్సిస్ జన్మ వృత్తాంతం కానీ, అతని తల్లిని గురించిన సమాచారం కానీ దొరకలేదు. ‘ఫ్రాన్సిస్ స్కూలు ఫీజులు’ అనే ఫోల్డరులో కొన్ని బిల్లులు మాత్రం దొరికాయి.

ఎవరో స్త్రీ చేతి రాతతో ఫ్రెంచిలో వున్న ఒక వుత్తరాల కట్త కూడా దొరికింది. కుతూహలంగా ఉత్తరాలు తెరిచారు. అన్నీ ఫ్రెంచి లో వున్నాయి.

“నాకు ఫ్రెంచి బాగా వచ్చు. ఇటివ్వు, నేను ఉత్తరాలు చదివి విషయాలు చెప్తాను!” ఉత్తరాలు తీసుకొంది జేన్.

మార్గరెట్ అనే ఫ్రెంచి స్త్రీ కొన్ని సంవత్సరాల పాటు హొగార్త్ కి రాసిన ఉత్తరాలు అవి.

“….ఫ్రాన్సిస్ స్కూల్లో బాగా చదువుతున్నాడని తెలిసి సంతోషించాను. ఇప్పటికైనా ఆ పసివాణ్ణి నువ్వు ప్రేమించగలిగితే మంచిది. మా వాడు ఆర్నాల్డ్ ఎంత తెలివైన పిల్లాడనుకున్నావ్? క్లెమెన్స్ కూడా అంతే. స్కూల్లో అంతా వాళ్ళిద్దర్నీ తెగ మెచ్చుకుంటారు…” ఇక మళ్ళీ ఆ వుత్తరంలో ఫ్రాన్సిస్ ప్రసక్తి లేదు.

ఆ తర్వాత అన్ని వుత్తరాలూ ఓపిగ్గా చదివారు. ఎక్కడా ఫ్రాన్సిస్ ప్రసక్తే లేదు. ఆవిడెవరో కానీ, స్నేహంగా, అభిమానంగా, ఆప్యాయంగా రాసినట్టనిపించింది. ఆవిడ వుత్తరాలని బట్టి ఆవిడ ఒక వితంతువనీ, ఇద్దరు పిల్లలతో ఒంటరిగా బ్రతుకుతోందనీ అర్థమైంది వాళ్ళకి.

ఆవిడ ఉత్తరాల నిండా తన పిల్లల ముద్దూ మురిపాలు, తన వ్యాపారం విషయాలూ, వున్నాయి. పిల్లలక్కూడా హొగార్త్ తెలిసినట్టే వుంది. ఆవిడకి చాలా చిన్నప్పుడే పెళ్ళైనా, ఆ పెళ్ళి వల్ల పెద్దగా సుఖపడినట్టు లేదు.

అన్నిటికంటే ఆసక్తికరమైన వుత్తరం చివరికి కనబడింది. అప్పుడే బహుశా హొగార్త్ తన మేనకోడళ్ళని పెంచుకోబోతున్నట్టు చెప్పి వుంటాడు.

“… పోన్లే! నువ్వెందుకనో ఫ్రాన్సిస్ ని సొంత బిడ్డలా ప్రేమించలేకపోతున్నావు. ఈ అమ్మాయిలని ప్రేమగా పెంచుకొంటే నీ ఒంటరితనం తగ్గొచ్చు. మనిషన్నవాడికి ప్రేమతో కూడిన బంధాలు తప్పకుండ వుండాలి. లేకపోతే జీవితం మిద ఆసక్తి పోతుంది.

నాకూ, ఆర్నాల్డ్, క్లెమెన్స్ ల ప్రేమ లేకపోతే జీవితం ఎంత అససంపూర్తి, అనిపిస్తూ వుంటుంది. నేను వాళ్ళని ఎప్పుడు ఫిలిప్ పిల్లలుగా అనుకోలేదు. అనుకుని వుంటే వాళ్ళని ప్రేమించగలిగే దాన్ని కాదు. నువ్వేమో, ఫ్రాన్సిస్ తల్లి మీద వున్న అయిష్టాన్ని ఆ పసి వాడి మీద చూపిస్తున్నావు. ఎవరికి తెలుసు? నీ మేన కోడళ్ళిద్దరి పెంపకంతో నీ మనసు మెత్తబడి నీ కొడుకునీ చేరదీస్తావేమో! అలా జరిగితే నాకంటే ఎక్కువగా సంతోషించే వాళ్ళుండరు!

మీ చెల్లెలు మేరీ మరణం గురించీ, ఆమె మరణించిన పరిస్థితులను గురించీ ఎంతో ఆవేదనతో రాసావు. చదివి చాలా బాధ పడ్డాను. అమ్మా నాన్నలు కుదిర్చిన పెళ్ళి చేసుకుని నేనెంత కష్టపడ్డానో, ఇష్టపడ్డ మనిషిని పెళ్ళి చేసుకొని మేరీ అంతే కష్టపడింది.

నాకు మా అమ్మా-నాన్నా ఈ పెళ్ళి నిశ్చయం చేసినప్పుడు వొద్దని నేనెంత ఏడ్చానో నాకింకా గుర్తే. ఈ పెళ్ళిలో వాళ్ళసలు నా ఇష్టాయిష్టాల ప్రమేయమేమీ లేదన్నట్లు ప్రవర్తించారు. అయితే, నా పెళ్ళిలో ఒక్క సుగుణం వుంది. ఈ పెళ్ళి గురించి నాకే కలలు లేకపోవడం మూలాన ఆ కలలు విఫలమై మనసు ముక్కలయే అనుభవం నాకు కాలేదు, మేరీకిలా.

నేను చాలా సార్లు ఆలోచించాను, మనలని ఎక్కువగా నొప్పించే శక్తి మనల్ని ప్రేమించే వాళ్ళకుందా, లేక మనల్ని ద్వేషించే వాళ్ళకుందా అని. ఇప్పుడనిపిస్తోంది- ఎవరికీ కాదు, మనల్ని నొప్పించుకునే శక్తి అందరికంటే మనకే ఎక్కువగా వుంది, అని. మేరీ తన కలలన్నీ నేల కూలిపోతూంటే నిస్సహాయురాలిలా చూస్తూండి పోయింది. నేనేమో బ్రతుకుతో అడుగడుగునా పోరాటం చేస్తూనే వున్నాను. నువ్వేమో ఒక చిన్న పొరపాటు వల్ల అందమైన కుటుంబ జీవితానికి దూరమై పోయావు. ఇతర్లు చేసిన హాని నించి మనకి సహాయం చేయడానికి చట్టలూ, న్యాయ వ్యవస్థా వుంది కదా? అలాగే మనుషులని తమ నించి తాము కాపాడుకోనెటట్లు చేసే న్యాయ వ్యవస్థ వుంటే ఎంత బాగుండేది కదూ? అప్పుడు మన ముగ్గురం ఇలా వుండేవాళ్ళం కాదు!

ఇప్పుడైతే నా ఆశలన్నీ పిల్లల మీదనే పెట్టుకున్నా! నా బ్రతుక్కంటే క్లెమెన్స్ బ్రతుకు సంతోషకరంగా వుంటే నాకంతే చాలు!

నా ఇష్ట ప్రకారమే పెళ్ళి చేసుకోమని దాన్నెప్పుడూ బలవంత పెట్టను. తెలివైన వాళ్ళని కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోనివ్వకపోతే యేలా? మీ ఇంగ్లీషు వాళ్ళలో లోపమేంటో తెల్సా? ఆడపిల్లలకి నిర్ణయాలు తీసుకొనే స్వతంత్రం వుంది కానీ, అలా నిర్ణయాలు తీసుకోవడానికి కావల్సిన శిక్షణ మాత్రం లే దు. ఇప్పుడు నాకు ఎక్కడ పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్లల్ని చూసినా అదొకలాంటి భయం వేస్తుంది.

నీ మేన కోడ ళ్ళిద్దర్నీ చదివించు! వాళ్ళు మానసికంగా, శారీరకంగానూ దృఢంగా వుండేటట్లు శిక్షణ ఇప్పించు. వాళ్ళ అమ్మకంటే ఎక్కువ లోక ఙ్ఞానం వచ్చేలా తీర్చి దిద్దు.

కుటుంబంలో శాంతీ, చదువుకునే వసతీ వుంటే చాలు, ఆడపిల్లలు ఏదైనా నేర్చుకోగలరూ, ఎక్కడైనా నిలదొక్కుగోలరు. ప్రేమా, పెళ్ళీ,సంతోషమూ, అంటావా? అవి వాళ్ళు వాళ్ళ ఙ్ఞానాన్నీ, తెలివితేటల్నీ, స్వతంత్ర్యాన్నీ ఉపయోగించుకోవడాన్ని బట్టి వుంటుంది. ఆపైన కొంచెం అదృష్టం కూడా కల్సి రావాలనుకో!

కానీ వాళ్ళకు చదువులు చెప్పించకుండా, అందమైన బొమ్మల్లా తయారు చేస్తే మాత్రం వాళ్ళు బాధ్యత ఎప్పటికీ తెలుసుకోరు. అందుకే నా మాట విని వాళ్ళిద్దరికీ మగపిల్లల్లాగే చదువులు చెప్పించు. అమాయకత్వానికీ, అఙ్ఞానానికీ చాలా తేడా వుంది. అందుకే కొంచెం ప్రపంచ ఙ్ఞానం అవసరం. దానికి చదువొక్కటే మార్గం.

జేన్ అంతా నీ పోలికే ననీ, ఎల్సీ తన తల్లి పోలికనీ రాసావు. పిల్లల కబుర్లు నీ ఉత్తరాల్లో చదివి చాలా ఆనందిస్తాను. నీతో చెప్పానో లేదో కానీ ఈ మధ్య క్లెమెన్స్ చిన్న చిన్న అబధ్ధాలాడటం నేర్చుకుంటోంది. దానికి ఎవర్నీ నొప్పించడం ఇష్టం వుండదు. అందుకే చిన్న చిన్న అబధ్ధాల సహాయంతో ఇరుకున పెట్టే సంఘటనలనించి తప్పించుకోవాలనుకుంటుంది. అయితే మనిషన్న తర్వాత నొప్పిని భరించటం నించీ, నొప్పి కలిగించటం నించీ సంపూర్తిగా తప్పించుకోలేమని చెప్పాను. నొప్పించినా సరే, అవసరమైతే చేదు మందు తాగించక తప్పదు కదా!

కిందటి వారం, ఒక రోజు ఆర్నాల్డ్ అల్లరి చేస్తూ హాల్లో పూల కుండీని పగల గొట్టాడు. నాక్కోపం వస్తుందని భయపడి, క్లెమెన్స్ అన్నని రక్షించటానికి, తానే ఆ కుండీని పగలగొట్టానని అంది. కానీ దానికి నిజాన్ని నా దగ్గర ఎక్కువ సేపు దాచే చాకచక్యం లేకపోయింది. అబధ్ధమాడినందుకు మందలించాను.

“అమ్మా! ఆర్నాల్డ్ మీద నీక్కోపం వస్తుందనీ, ఆ కోపాన్ని వాడు తట్టుకోలేడనీ భయ పడ్డాను. అందుకే అబధ్ధమాడాను! అన్నకి కూడా సంతోషమే కాదా?” అంది క్లెమెన్స్.

“లేదు క్లెమెన్స్! మామూలు మనుషులు వాళ్ళు చేసే పనుల పర్యవసానాలు భరించగలిగే వుంటారు. కుండీ పగలగొట్టేటప్పుడు ఆర్నాల్డ్ కి నాక్కోపం వస్తుందనీ తెలుసు, దాన్ని తను తట్టుకోక తప్పదనీ తెలుసు. తమకోసం పక్క మనిషి అనవసరమైన త్యాగాలు చేయడం ఎవరికీ ఇష్టం వుండదు. కాబట్టి అలాటి అలవాటు మానుకో. భవిష్యత్తులో నిజంగా నువ్వు ఇతర్ల కోసం ఇష్టాలని వదులుకోవాలసిన తరుణాలు రాక తప్పదు. అయితే అలాటి సమయాల్లో కూడ, నిజాన్ని మాత్రం దాచకు”, అని చెప్పాను.

వీలైనంతవరకూ వాళ్ళిద్దరూ స్వతంత్రంగా ఆలోచించుకోవడమే అలవాటు చేస్తున్నాను. ఎందుకంటే నేనింక ఎక్కువ రోజులు బ్రతకనని అనిపిస్తోంది! ఒక్కసారి పిల్లలిద్దర్నీ తీసుకొని రావొచ్చుగా నువ్వు? క్లెమెన్స్, ఆర్నాల్డ్ ఇద్దరికీ నేను నీ మేనకోడళ్ళ గురించి చెప్పాను. కలుసుకోవాలని కుతూహలంగా వున్నారు. వీలైతే వాళ్ళను తీసుకొని ఒక్క సారి రా.

వుండనా,

మార్గరెట్

 

ఆ వుత్తరం వెనక హొగార్త్ గారి చేతి రాతలో “మార్గరెట్- మరణం- డిసెంబరు 18, ” అని వుంది. అంటే ఆ వుత్తరం రాసిన కొన్నాళ్ళకే మార్గరెట్ మరణించిందన్నమాట.

“మావయ్య ఈ వుత్తరాలు నాకు చూపించి వుంటే బాగుండేది. కొన్ని విషయాలు ఎవరితోనూ పంచుకోలేం కాబోలు!” జేన్ అంది బాధగా.

“మా అమ్మ గురించిన ప్రస్తావన ఎక్కడా లేదు. ఆమెకోసం మనం వెతికి ప్రయోజనం వుండదు. ఆ విషయం వదిలేద్దాం లే జేన్!” ఫ్రాన్సిస్ అక్కణ్ణించి నిరాశగా లేచాడు.

ఛానెల్ 24/7 – 14 వ భాగం

sujatha photo

  (కిందటి వారం తరువాయి)

మనం బతికివున్న నిముషంకన్నా మంచి ఘడియ ఇంకేముంటుందీ.. దేవుడొక్కడే ఇరవై నాలుగు గంటలూ బతుకంతా కృషి చేస్తూ మనందరి కోరికలు తీరుస్తూ కూర్చుంటాడా..? కాళ్ళు నొచ్చుకోవా? మొన్న ఎండిగారికి మంచి ఆశీర్వచనం అందరూ చూస్తుండగానే చెప్పారు ఈ చారిగారే. రెండో నిముషంలో అడుగుపెట్టి చూడకుండా అక్కడేదో వైరు తన్నేసి బొక్కబోర్లా పడ్డాడెందుకు ఎండి. ఈ ఆశీర్వచనం పనిచేయలేదా?, ఈయన చెప్పే లక్ష్మీయంత్రం నాలుగు వేలు పెట్టి కొనుక్కుంటాను. మరి నా జీతం రెండేళ్లదాకా పెంచనని మేనేజ్‌మెంట్ చెప్పారు కదా. నాకు ధనలాభం ఎలా వస్తుంది? ఒకవేళ ఏదైనా సంచో పాడో, డబ్బులకట్టో రోడ్డు మీద దొరుకుతుందా అనుకొంటే ఇంతింత అద్దాలలో నాకు అడుగు ముందు ఏమవుతుందో కనబడి చావదు. మీ లక్ష్మీయంత్రం కథేమిటి అని చారి పని పట్టాలని శ్రీధర్ తన ప్రశ్నలతో ఇప్పటికే సిద్ధంగా వుండే వుంటాడు. కనుక వీడే అసలైన శనిగ్రహం చారి పాలిట. ఆయన శనిదోష నివారణ పూజలు ఎన్ని చేసినా ఈ విగ్రహం చలించదు కదా” అనుకొన్నాడు నవ్వుకొంటూశ్రీకాంత్.

“చారిగారు నేను ఎండి్‌గారితో మాట్లాడి ఫైనల్ చేస్తాను” అన్నాడు.

“సరేనండి నేను కూడా ఎండి్‌గారిని ఒకసారి కలిసి వెళతాను” అన్నాడు చారి.

 ***

“నేను ఎస్.ఆర్.నాయుడుని, బెహరా బావున్నారా?”

“ఓ..మీరా.. గుడ్… ఎలా వున్నారు? మిమ్మల్ని కలిసి చాలా కాలం అయింది” అన్నాడు బెహరా.

అతని గొంతులో ఒక చానల్ హెడ్‌తో మాట్లాడుతున్న గౌరవం గానీ అభిమానం కానీ లేవు. ఎస్.ఆర్.నాయుడుకి ఒక్క నిముషంలో ఈ ధ్వని తెలిసింది. తప్పదు. ఇతనితో మాట్లాడేందుకు ఉదయం నుంచి ట్రై చేస్తున్నాడు. అతన్ని ట్రాప్ చేసేందుకే నెలరోజులనుంచి కష్టపడుతున్నాడు. ఇప్పటికి చిక్కాడతను.

“చెప్పండి బెహరా నేనేం చేయాలి?”

“మీరేం చేయాలో నేనేం చెప్తాను. అంతా చేసేది మీరే కదా” నవ్వాడు బెహరా.

చాలా కక్షగా ఉందతనికి. ఒకప్పుడు తనెవరో ఏమిటో ఎవ్వళ్ళూ ఎరగరు.నిజమైన ప్రేమతో యూనివర్సిటీలో తనతో చదువుకొన్న రవళిని కోరి, ఆమెని వేటాడి పెళ్లాడాడు. వాళ్ల నాన్నకు, అమ్మకు ఎన్‌జి్ఓ ఉండటం, దాన్ని ప్రపంచ వ్యాప్తంగా వాళ్లు ప్రమోట్ చేసుకోవటం తన ఎదురుగా.. రవళి భర్తగా ఆ ఇంటికి వెళ్లాకే ఆ పాలిటిక్స్ తెలిశాయి. వాళ్లు ఎన్‌జి్ఒ పనిచేసే చోట కూలిజనం అవసరాలు, వాళ్లనెలా దోచుకోవాలో వాళ్లకే ముందు తెలుసు. ఎంబిఏలో గోల్డ్ మెడలిస్ట్ అయిన తనకి అర్ధం కదా? డబ్బు రుచి చూపించింది వాళ్లే. ఎంతో జీవితం చూసిన వాళ్లకే ఆశవుంటే తనలాంటి యువకుడికి ఆశ వుండదా? పేదవాళ్ల జీవితాలను బంధించే చిన్న వడ్డీకి అప్పు రూపం పోసుకొంది వాళ్ల ఇంట్లొనే. పెట్టుబడి వాళ్లే పెట్టారు. రవళి కూడా డైరెక్టర్. ఎవ్వరూ ఊహించని ప్రగతి. ఇంతింతై ఎదిగిన బిజినెస్, అప్పు ఇస్తామని క్యూ కట్టిన బ్యాంకులు, విరాళాలు కురిపించిన ఫారినర్స్… తనో సామ్రాట్. ఇప్పుడు వాటాలు కావల్సి వచ్చాయి. కమలకి, ఆమె మొగుడికి, మధ్యలో రవళి పావు. చానల్ పెడితే ఏం కావాలన్నా దాన్ని సాధించవచ్చు. కేసులు లేకుండా తప్పించుకోవచ్చు. జర్నలిజం ముసుగు ఎంత విలువైందో చెప్పింది ఎస్ఆర్‌నాయుడు. తను దొరక్కుండా పోతాడా? ఇప్పటికే దొరికాడు. వాళ్లు అనుకోవటం ప్రపంచవ్యాప్తంగా పదిమందిని పోగేసుకొని టీవీల్లో గోలచేసి తనను వంచాలని. కానీ తనకు తెలుసు. ఎలాగైనా తనకు ఇది లాభసాటి ప్రమోషన్. ప్రపంచానికి ఎంత ఓపిక వుంటుంది. ఎన్నిసార్లు తన సంగతి పట్టించుకొని, తిండితిప్పలు మానేసి తన ఆఫీస్ వంక చూస్తూ కూర్చుంటారు. వాళ్లని సంతోషపెట్టేందుకు వాళ్ల పూర్తి జీవితాన్ని కాజేసినందుకు, మహేష్‌బాబో, పవన్‌కళ్యాణో వున్నారు. పది రూపాయలు ఫోన్‌కు ఖర్చుపెట్టి బంగారు నాణాలు గెల్చుకొమ్మని పిలిచే గేమ్ షోలున్నాయి. పట్టుచీరెల అంచులు  చూసి ధరలు చెప్పి ఉత్తపుణ్యానికి చీరె మీ ఇంటికి తీసుకుపొమ్మనే యాంకర్లున్నారు. ఉదయం లేస్తూనే దేవుడి స్తోత్రాలు, కాస్తాగితే జ్యోతిష్యచక్రాలు, ఎనిమిది దాటితే ఏ పనీ చేయకపోయినా హాయిగా కార్లో తిరిగే జీవితమున్న రాజకీయ నేతలు, అన్ని చానల్స్‌కి ఇటోకాలు, అటోకాలు వేస్తూ ఎవడెవడు ఏమేం కాజేశాడో, ఎవడికి ఎంత ఆస్తి వుందో లెక్కలు, ఆధారాలతో చెపుతూ కాలక్షేపం చేసే రాజకీయ వేత్తలున్నారు. వాళ్లకి చానల్స్ కావాలి. ఇంకా మనమేం కొనుక్కోవాలి, మనకేం కావాలో, ఎంత వండాలో ఎలా పడుకోవాలో, రోగమొస్తే ఎక్కడ పాకేజీలుంటాయో, రాని గుండెజబ్బులకు కూడా ముందే డబ్బు కట్టేస్తే గుండెపోటొస్తే ఎలా ఖర్చు లేకుండా ఆపరేషన్లు చేస్తారో.. ఒకటేమిటి మన బతుకు వాళ్ళే బతికి పెట్టె చానల్స్ వుండగా సామాన్యునికి బెహరా కావాల్సి వచ్చాడా…?

బెహరాకి ఇంకా  హుషారొచ్చింది. ఎస్ఆర్‌నాయుడిని ఫుట్‌బాల్‌లా తన్నగలడు.

“ఏం సార్.. నన్నేం చేయాలనుకొన్నారు?” అన్నాడు నవ్వుతూ.

ఎస్ఆర్‌నాయుడుకి వళ్లు మండింది.

“అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏం వ్యాపారం బెహరా? ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇవ్వాళ చానల్స్ చుట్టూ ఆ బాధితులు గుంపులుగా వున్నారు. ఇదంతా చూసి కమల, రవళి ఎలా వున్నారో తెలుసా?”

“ఈ విషయాలు గుండెల్లో దాచుకోలేక ప్రపంచానికి చాటాలని మీ దగ్గరకు పరుగెత్తి వచ్చి వుండాలే” అన్నాడు బెహరా వెటకారంగా.

ఎస్ఆర్‌నాయూడు గుటక వేశాడు. బిపి అమాంతం వెరిగిందతనికి.

“బెహరా! ప్రజల ప్రాణాలను నువ్వలా దూదిపింజల్లా చూడటం బావుండలేదు. హోం మినిస్టర్ కూడ ఇందాక మాట్లాడారు. ఆయన కూడా లైవ్‌కి వస్తానంటున్నారు. ఇదంతా సి.ఎం. పేషీలో డిస్కషన్ అవుతోంది. నాతో వాళ్లంతా టచ్‌లో వున్నారు” అన్నాడు బెదిరింపుగా.

బెహరాకి కోపం నషాలానికి ఎక్కింది.

“ఆ.. సర్.. తప్పనిసరిగా చర్చించండి. మీరు తెలుసుకోవలసిన ఈ పదేళ్ళ బిజినెస్ గురించి కాదు. దీన్ని గురించి నేనేం ఆలొచిస్తున్నానన్నది లెక్కలు వేశారు మీరు. ఇప్పటికే వందకోట్లున్నాయి. నా పెళ్లాం బిడ్డలు మీ ఆఫీసులోనే పడి వున్నారు. నాది అనుకొన్న కుటుంబం వాటాకోసం రోడ్డెక్కింది. వాళ్లు సమాధానపడినా మీలాంటివాళ్లు, మా కేస్ టేకప్ చేసిన క్రిమినల్ లాయర్లు, నా బిజినెస్ షేర్లు కోరుతున్న సొకాల్డ్ మినిష్టర్లు ఎవ్వరూ ఊరుకోరు. నేను మీకు పైసా ఇవ్వను. ఎవ్వళ్లకీ  ఇవ్వను. ఏం కోరి మీరు రచ్చ చేశారో…? మీ మీద కేస్ వేస్తున్నాను. మీ రైవల్ గ్రూప్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నాను. నన్ను మీరు మీ లాభం కోసం రోడ్డుకెలా ఈడ్చారో చెప్పేస్తా. నాకేంటండి భయం. నా డబ్బు ఆశించింది మీరు. డబ్బు సంపాదించుకొనేందుకు మెట్లు వేసుకొన్నవారికి, దాన్ని కాపాడుకోవటం ఎలాగో తెలియదా? మీరే నా గురువులు. రేపే యాడ్ ఇస్తా. మీతో ఎవరికైతే పడదో వాళ్లచేతే పేపర్ పెట్టిస్తా. చానల్ పెట్టిస్తా. మీరు నా డబ్బులు వరకే కాజేయాలనుకొన్నారు. నేను మొత్తంగా మీ జీవితం మొత్తాన్ని రోడ్డుపైన పెట్టిస్తా. మీకేమైనా డౌట్లున్నాయా?”

ఎస్ఆర్‌నాయుడుకు మాట రాలేదు.

“బెహరా నీకు నాపైన ఏదన్నా పర్సనల్ గ్రడ్జ్ వుందా?”

బెహరా వికటంగా నవ్వాడు.

“మీరెవరు సార్. నేను కోపం తెచ్చుకోవటానికి.. నాకు మీమెదెందుకు కోపం. మీరంటే  నాకెంతో అభిమానం. ఎన్నోసార్లు మీ ఎదురుగ్గా కూర్చుని మీ ఎడిటోరియల్స్ గురించి డిస్కస్ చేశాను. మీ పుస్తకాలు నేను అచ్చువేయించా.. నేనేం ఆశించలేదు. మీవంటి గొప్పమనిషికి నేను ఉడతాభక్తిగా చేశాను. నా జీవితాన్ని దగ్గరగా చూసి ఇవ్వాళ నన్ను నేల్లోకి తొక్కాలని మీరు అనుకొన్నారు. మీ ముందు నేనెంత సార్”

ఎస్ఆర్‌నాయుడుకు గొంతులో ఏదో అడ్డం పడింది.

“నీ చానల్ ఎప్పుడు వస్తుంది బెహరా?”

బెహరా మళ్లీ నవ్వాడు.

“సో.. సారీ సార్.. ఊరికే అన్నాను. నాకేం కావాలి సర్. నా చుట్టూ చేరిన వాళ్ల గురించి చెప్పాను. నన్ను చానల్ పెట్టమని, పేపర్ పెట్టమని మీ సీనియర్స్ నన్నడగరా? నేను అడక్కుండానే నా వ్యాపారాలు కాపాడుకోవటానికి నేనేం చేయాలో వారు చెప్పరా?”

“బెహరా.. నీ బెదిరింపులకు నేను మారిపోయానని చెప్పటంలేదు కానీ ఈ విషయం నా చేతిలో లేదు. ఈ కాంపిటీషన్‌లో ఎక్కడో ఏదో కొట్టుకుపోతోంది. సర్వైవల్ కోసం ఏదయినా నేనూ చేశానేమో..”

“అదేంటి సార్.. సారీ సర్..  మీరంటే నాకెంతో ఇష్టం. ఇవ్వాళ్టికీ మీరు ఉదయం చేసే రౌండప్ చూడందే నాకు రోజు మొదలు కాదు. చాలా గుడ్డిగా మీరు చెప్పే ఎనాలసిస్ ఫాలో అవుతాను. మీరు ఏ అక్షరం పలికితే అది నాకు మంత్రం. నేను మీ విషయంలో చాలా ఎమోషనల్ సర్” అన్నాడు బెహరా.

“బెహరా నేనేం చేయాలి?” అన్నాడు ఎస్ఆర్‌నాయుడు.

“మీకు ఎలా అనిపిస్తే అలా సర్. మీరేం చేసినా నేనేమీ అనుకోను. మీరంటే నాకు చాలా ఇష్టం సార్.” అంటూనే పోన్ పెట్టేశాడు బెహరా.

ఫోన్ పెట్టేసి వెనక్కి వాలిపోయాడు ఎస్ఆర్‌నాయుడు .

తనను తనెంత ఎత్తున పెట్టుకోగలిగాడో, తనంతట తను ఎలా కిందికి దిగుతున్నాడో తెలిసిపోతోంది. కిందికి జారకుండా ఉండలేడా? ఎవరెలా ఆడిస్తే ఎలా ఆడే కోతిబొమ్మనా ?ఎవరెవరి అవసరాలో తనకు గాలం వేస్తుంటే ఆ ఉచ్చులోంచి ఎప్పుడైనా తప్పించుకోవాలని ఆలోచించాడా? అది ఉరితాడు అని గ్రహించాడా? బంజారాహిల్స్‌లో కడుతున్న మేడ ఇటుకరాళ్లతో కాక పరువు ప్రతిష్టలతో కడుతున్నట్లనిపించింది ఎస్ఆర్‌నాయుడుకు.

తలతిప్పి చుట్టూ చూశాడు. తను రాసిన పుస్తకాలు, ఎడిటోరియల్స్, అందంగా ముద్దుగా తనవేపు చూస్తున్నాయి. నీ జీవితం ఇది, నీ వేళ్లెంత గొప్పవి. నీ తెలివితేటలెంత విలువైనవి. నువ్వు  ప్రజలకెంత ఉపయోగపడగలవు అంటున్నాయి. తను తలుచుకొంటే ప్రతిక్షణం తను అర్ధం చేసుకొన్న, తను క్షణ్ణంగా పరిశీలించి, పరిశోధించిన ఈ ప్రపంచాన్ని, ఎన్నో రహస్యాలను ప్రతివాళ్లూ ఎలా తెలుసుకోవాలో మూలసూత్రాలన్నీ చెప్పగలడు. ఈ ప్రపంచం ఎంత అందమైనదో, ఎంత అపురూపమైనదో చెప్పగలడు. మానవ సంబంధాలు ఎంత గొప్పవో నిరూపించగలడు. ఈ ప్రపంచంలో మనుష్యులందరికీ తను ఆప్తుడు, దగ్గరివాడు. ప్రతివాళ్లకు ఎవరికి వాళ్లకే తను సొంతం. నాకేం కావాలి. దక్షిణామూర్తి గుర్తొచ్చాడు ఎస్ఆర్‌నాయుడుకు.

నాలుగేళ్ళ క్రితం ఓ మినిష్టర్ పెళ్లిలో కలసి భోజనం చేసి బయటికి వచ్చాక, దక్షిణామూర్తి నిన్ను డ్రాప్ చేయనా అన్నాడు తను. తన విశాలమైన కారు ఆదికేశవులు ఇచ్చింది. డిల్లీలో తనకు కారు లేదు. తను మినిష్టర్ ఇంటి పెళ్లికి వస్తుంటే గెస్ట్‌హౌస్ బుక్ చేసి కారు అరేంజ్ చేసారు ఆదికేశవులు. కారు దగ్గరకు వస్తూనే తనకు వేరే పని వుందన్నాడు దక్షిణామూర్తి. ఎక్కడ దిగావన్నాడు తను. రైల్వే స్టేషన్‌లోనే వుండి. తెల్లవారు జామున ట్రైన్ ఎక్కేస్తానన్నాడు. స్టేషన్‌కు బస్‌లోనో, ఆటోలోనో వెళ్లిపోతానన్నాడు. ఆరోజు ఆయన తిరస్కారం తనపైన అసూయగా అనుకొన్నాడు తను. కారు, హోదా చూసి ఓర్చుకోలేకనే అనిపించిందా  టైంలో. అన్నేళ్లు కలిసి పని చేసి అతన్ని ఇంకోలా ఎలా అర్ధం చేసుకొన్నాడు.

పదిహేనేళ్ల నుంచి ఇద్దరూ కలిసి పనిచేశారు. ఎడిటోరియల్, కాలమ్స్, ఎనాలసిస్‌లు, న్యూస్‌స్టోరీస్ పోటీలు పడి రాసేవాళ్లు. తను రాసిన ప్రతి అక్షరం ప్రజల మనసుల్లో హత్తుకుపోయి వుంది. ఇవ్వాళ తనపట్ల ప్రపంచం చూపిస్తున్న నమ్మకానికి అవ్వాళ్టి అక్షరాలు, ఆ నిజాయితీ పునాది. ఆ పునాదిపైన తను నిర్మించిన భవనం ఎలాంటిది?

 (సశేషం)

 

 

ఆఫ్రికన్ వ్యాసవాల్మీకులు

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)శిశువు చిత్రనిద్రలో ప్రాచీనస్మృతులూచే చప్పుడు

అన్న శ్రీశ్రీ కవితా వాక్యం నాకు ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది.  పురాచరిత్రలో, పురావస్తువులలో ‘ప్రాచీనస్మృతులూచే చప్పుడు’ వినగలిగే చెవి ఉన్నవారందరికీ ఎలెక్స్ హేలీతో చుట్టరికం కలుస్తుంది.  అతని కథ సొంత కథలానే అనిపిస్తుంది. రోసెట్టా శిలను చూసినప్పుడు అతని కళ్ళలో తళుక్కుమన్న మెరుపునూ, అతని హృదయస్పందననూ వారు పోల్చుకోగలరు. న్యూయార్క్ లో అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీకి వెళ్ళినప్పుడు, వేల సంవత్సరాల క్రితం శిలగా ఘనీభవించిపోయిన ఒక వృక్షఖండాన్ని చూసి నేను అటువంటి సంచలనానికే లోనయ్యాను. అక్కడే బాబిలోనియా చక్రవర్తి హమ్మురాబి శిక్షాస్మృతిని చెక్కిన శిలను చూశాను. ఆధునిక చరిత్రకారులను ప్రామాణికంగా తీసుకుంటే హమ్మురాబి(క్రీ.పూ. 1750) మన మహాభారత కాలానికి కూడా వెనకటి వాడన్న సంగతి గుర్తొచ్చి కన్నార్పకుండా దానినే చూస్తూ ఉండిపోయాను.

ఇప్పటికీ ఎలెక్స్ హేలీ మన బంధువే నన్న విశ్వాసం మీకు కలగకపోతే ఇంకో విషయం చెబుతాను.  అతను తన పూర్వీకుడైన కుంటా కింటే జన్మస్థలాన్ని వెతుక్కుంటూ వెళ్లింది ఎక్కడికో కాదు; మనమూ, మనతోపాటు ప్రపంచమంతా ఒకనాడు జీవించిన గతంలోకి! గణసంస్కృతిలోకి!  గణదశలో ప్రపంచ మానవాళి ఒకే అనుభవాలను, ఒకే విధమైన సెంటిమెంట్లను, చివరికి ఒకే విధమైన పురాణగాథలను పరస్పరం పంచుకున్నారు.

ఇంకో విషయం చెబుతాను, ఆశ్చర్యపోకండి… ఎలెక్స్ హేలీ  తన పూర్వీకుని జన్మస్థలానికి వెళ్ళి అక్కడ దర్శించినది మరెవరినో కాదు;  మన వాల్మీకినీ, వ్యాసునీ, వైశంపాయనునీ; గ్రీకుల హోమర్ ను, హెసియాడ్ నే! పశ్చిమ ఆఫ్రికాలోని ఒక మారుమూల గ్రామంలో 1966లో అతను దర్శించిన ఆ వ్యాస/వాల్మీకి/ హోమర్ పేరు:  కెబ్బా కంజీ పొఫానా!

విషయంలోకి వద్దాం.

కుంటా కింటే నుంచి ఏడు తరాలుగా అందుతున్న ఆఫ్రికన్ పదాలు నిర్దిష్టంగా ఏ ఆఫ్రికన్ భాషకు చెందినవో కనిపెట్టగలమా అన్న ప్రశ్న తన ముందు వేళ్లాడుతున్న దశలో, కన్సాస్ నగరంలో ఉంటున్న కజిన్ జార్జియా ఏండర్సన్ ను హేలీ కలుసుకున్నాడు. తన చిన్నప్పుడు హెమ్మింగ్ ఇంటి వసారాలో అమ్మమ్మ ముచ్చట్లలో పాల్గొన్నవారందరిలో ఆమె చిన్నది. ఎనభై ఏళ్ల వయసులో అనారోగ్యంతో మంచం పట్టింది. హేలీ తన ఆలోచన చెప్పగానే సంభ్రమాశ్చర్యాలతో  ఒక్కసారి లేచి కూర్చుంది. “మంచి పని చేస్తున్నావు బిడ్డా,  పైనుంచి మీ అమ్మమ్మ, మిగితా పెద్దలూ నిన్ను చల్లగా చూస్తారు” అంటూ దీవించింది.

ఆ తర్వాత హేలీ వాషింగ్టన్ డీ,సీ. లో ఉన్న జాతీయ పురాపత్ర ప్రదర్శనశాలకు వెళ్ళి,  అమెరికా అంతర్యుద్ధం(1881-1885) తర్వాత నార్త్ కరోలినాలో సేకరించిన జనాభా వివరాలు కావాలని అడిగాడు. క్షణాలలో అతనిముందు మైక్రోఫిల్మ్ చుట్టలు ప్రత్యక్షమయ్యాయి. వాటిని మిషన్ లో ఉంచి తిప్పడం ప్రారంభించాడు. 1800 ల నాటి పాతకాలపు రాత పద్ధతిలో రాసిన పత్రాలవి. ఒక చోట అతని కళ్ళు మంత్రించినట్టు ఆగిపోయాయి. ‘టామ్ ముర్రే, బ్లాక్, బ్లాక్ స్మిత్- ఇరేన్ ముర్రే, బ్లాక్, హౌస్ వైఫ్-…’ అనే పేర్లు కనిపించాయి. వాటి కిందే అమ్మమ్మ అక్కల పేర్లు ఉన్నాయి. హెన్నింగ్ ఇంటి వసారాలో చిన్నప్పుడు విన్న పేర్లే అవి! అప్పటికి అమ్మమ్మ పుట్టనే లేదు.

న్యూయార్క్ లో ఉంటున్న హేలీ వాషింగ్టన్  పురాపత్ర ప్రదర్శనశాలకు, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ కు, డాటర్స్ ఆఫ్ అమెరికన్ రివల్యూషన్ లైబ్రరీకి తరచు వెళ్ళడం ప్రారంభించాడు. ఇంతకీ ఆ ఆఫ్రికన్ పదాలు ఏ భాషకు చెందినవన్న ప్రశ్న మాత్రం చిక్కుముడిగానే ఉంది. ఆఫ్రికాలో అనేక తెగలు మాట్లాడే భాషలున్నాయి. తమ పూర్వీకులది ఏ భాషో తెలుసుకోవడం ఎలా? న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితిలో అనేక భాషలవారు ఉంటారు. సాయంత్రం అంతా ఇళ్లకు వెళ్లిపోయే సమయంలో సమితి కార్యాలయానికి వెళ్ళి కనిపించిన ప్రతి ఆఫ్రికన్ కూ ఆ మాటలు వినిపించి అవి ఏ భాషవో చెప్పమని అడుగుతూ వచ్చాడు. అలా వారం రోజుల్లో పాతికమందిని అడిగాడు. ఎవరూ చెప్పలేకపోయారు. అప్పుడు ఒక మిత్రుడి సాయంతో డా. జాన్ వాన్సినా అనే పేరు సంపాదించాడు. బెల్జియంకు చెందిన వాన్సినా కొంతకాలం ఆఫ్రికన్ గ్రామాలలో తిరిగి మౌఖిక సంప్రదాయం గురించి పుస్తకం రాశాడు. విస్కాన్సిన్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు. హేలీ ఆయన అపాయింట్ మెంట్ తీసుకుని మ్యాడిసన్ వెళ్ళాడు. హేలీ నోట విన్న ఆ ఆఫ్రికన్ మాటలూ, అమ్మమ్మ ద్వారా అవి తనకు అందాయని అతను చెప్పడం మౌఖిక చరిత్రకారుడైన వాన్సినాను ఆకర్షించాయి. మరో ఆఫ్రికన్ నిపుణుడితో మాట్లాడి, అవి మాండింకా భాషాపదాలని తేల్చాడు. మాండింగో జనం ఆ భాష మాట్లాడతారు. ‘కాంబీ బోలోంగో’ అనే మాటలోని ‘కాంబీ’ గాంబియా నదిని సూచిస్తుందన్నాడు. ఆ తర్వాత అనుకోకుండా హెలీకి ఎబౌ మాంగా అనే ఆఫ్రికన్ విద్యార్థి గురించి తెలిసింది. అతను న్యూయార్క్ కు అరగంట దూరంలో ఉన్న హామిల్టన్ కాలేజీలో చదువుకుంటున్నాడు. అవి మాండింకా పదాలేనని అతను కూడా ధ్రువీకరించాడు.

హమ్మయ్య, తమ పూర్వీకులు ఎక్కడివారో తెలిసింది! వారు గాంబియా నది ప్రవహించే గాంబియా అనే దేశానికి చెందినవారు. ఇక నిర్దిష్టంగా ఏ గ్రామానికి చెందినవారో తెలియాలి. ఎబౌ మాంగాతో కలసి హేలీ సెనెగల్ రాజధాని డాకర్ కు, అక్కడినుంచి గాంబియాకు వెళ్ళాడు. అదో చిన్న దేశం. రాజధాని బంజూల్. ఆ దేశచరిత్ర తెలిసినవారిని కొందరిని కలుసుకున్నాడు. మా దేశంలో పాత ఊళ్ళ పేర్లు, శతాబ్దాల క్రితం ఆ ఊళ్ళలో మొదట స్థిరపడిన కుటుంబాల పేర్లతోనే ఉంటాయని వారు చెప్పారు. ఒక మ్యాప్ తెప్పించారు. అందులో ‘కింటే కుండా’ అనే ఊరు పేరు, దానికి దగ్గరలోనే ‘కింటా కుండా జానేయా’ అనే ఊరు పేరు కనిపించాయి.

ఆ తర్వాత, తను కలలో కూడా ఊహించని ఒక విషయం వారు చెప్పారని హేలీ అంటాడు. వందల ఏళ్ళకు విస్తరించిన వంశచరిత్రలను చెప్పే గాథికులు ఇప్పటికీ మారుమూల గ్రామాలలో ఉన్నారనీ, వారు మౌఖిక చరిత్రను వల్లించే సజీవ పురావస్తు పత్రాలని వాళ్ళు చెప్పారు. అదో వ్యవస్థ. గాథికులలో పెద్ద, చిన్న తేడాలు ఉంటాయి. పెద్ద గాథికునికి సాధారణంగా అరవై, డెబ్భై ఏళ్ళు ఉంటాయి. అతని కింద శిష్య గాథికులు ఉంటారు. నలభై, యాభై ఏళ్ల తర్వాత వాళ్ళు పెద్ద గాథికుని హోదాను అందుకుంటారు. వీరు కొన్ని ప్రత్యేక సందర్భాలలో గ్రామ-తెగ-కుటుంబ-వీర గాథలను గానం చేస్తారు.  నల్లజాతీయులు నివసించే ఆఫ్రికా అంతటా ఈ మౌఖిక గాథికులు ఉన్నారనీ, పునరుక్తి లేకుండా మూడు రోజులపాటు ఆఫ్రికా చరిత్రను చెప్పగలిగినవారు కూడా వీరిలో ఉంటారనీ వారు హెలీకి చెప్పారు. చివరగా, కింటే తెగ గాంబియాలో ప్రసిద్ధమే కనుక ఒక గాథికుని గుర్తించి తెలియజేస్తామని హామీ ఇచ్చారు. న్యూయార్క్ కు తిరిగొచ్చిన హేలీ ఆఫ్రికా చరిత్రను నమిలి తినడం ప్రారంభించాడు.

DeniseArt

గాథికుల దగ్గర కాసేపు ఆగుదాం. హేలీ వారిని griot  అనే మాటతో సూచించాడు. ఆ మాటకు, ‘A storyteller in Western Africa who perpetuates the oral tradition and history of a village or family’ అని ఒక నిఘంటువు అర్థం చెప్పింది. ఫ్రెంచ్ guiriot, బహుశా పోర్చుగీస్ criado, లాటిన్ creatus లకు ఆ మాటతో సంబంధం ఉన్నట్టు చెప్పింది. criado అనే మాటకు ‘ఇంటి పనివాడు’ అనే అర్థమూ, creatus అనే మాటకు పెంచబడినవాడు లేదా శిక్షణ పొందినవాడు అనే అర్థాలు ఇచ్చింది. అలాగే, సృష్టించడం అనే అర్థం ఉన్న create అనే మాటకు, creatus కు సంబంధం ఉంది. అదే నిఘంటువు griot అనే మాటకు, ‘(In Western Africa) a member of a caste responsible for maintaining an oral record of tribal history in the form of music, poetry and storytelling’ అని మరికొంత వివరణ ఇచ్చింది.  జార్జి థాంప్సన్ తన ‘Studies In Ancient Greek Society’ అనే రచనలో ‘Ritual origins of Greek Epic’ గురించి రాస్తూ ministrel అనే మాట ఉపయోగించాడు.

మన విషయానికి వస్తే, పురాణ ఇతిహాసాలలో ‘సూతుడు’ అనే మాట ఉంది. రెండు భిన్న కులాలవారికి పుట్టిన సంకీర్ణవర్ణంగా సూతులను పేర్కొంటారు. వాల్మీకిని బోయగా, వ్యాసుని బెస్తకన్యకు పుట్టినవాడుగా చెప్పడం వారి సంకీర్ణవర్ణానికి సూచన. పోర్చుగీస్ criado అనే మాటకు ‘ఇంటి పనివాడు’ అనే అర్థం కూడా ఇవ్వడం ఇక్కడ ఆసక్తికరం. కులవ్యవస్థలో పనివాళ్లు కింది కులానికే చెందుతారు. గ్రీకు పురాణ కథకులు హోమర్, హెసియాడ్ లను జార్జి థాంప్సన్ ministrels అన్నాడు. griot అనే మాటతో సహా ఈ మాటలన్నీ స్థూలంగా ఒకే అర్థం చెబుతున్నాయి. స్వల్ప భేదాలు ఉండచ్చు కానీ వీరంతా గణసమాజం సృష్టించిన ఒకే వ్యవస్థకు చెందినవారు. గణపురుషులు, గణ వీరుల గాథలను; వంశచరిత్రలను సంగీత, కవిత్వయుక్తంగా గానం చేయడం వీరి వృత్తి. మళ్ళీ మనదేశంలో ప్రతి కులానికీ ఆశ్రిత కులాలు అనే వ్యవస్థ ఉంది. ఆశ్రిత కులాలవారు తమను పోషించే కులస్థుల చరిత్రను, కుల పురాణాలను గానం చేస్తారు. వీరందరినీ ఏ పేర్లతో పిలిచినా,  ప్రస్తుతానికి ‘గాథికులు’ అనే ఒకే మాటతో పిలుచుకుందాం. ఆఫ్రికన్ గాథికులకు ఉన్నట్టే మన గాథికులకూ శిష్యపరంపర ఉంది. వ్యాసుని శిష్యులు:  సుమంతుడు, జైమిని, పైలుడు, శుకుడు, వైశంపాయనుడు. వ్యాసుడు ఈ అయిదుగురికీ భారత కథనంలో శిక్షణ ఇచ్చాడు. అయితే వైశంపాయనుని కథనమే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక వాల్మీకి కుశలవులకు రామాయణ కథనంలో శిక్షణ ఇచ్చాడు.

అంతలో, కింటా కుంటే వంశచరిత్ర చెప్పే గాథికుని గుర్తించామనీ, గాంబియా కు రావలసిందనీ హేలీకి కబురు వచ్చింది.   అనంతర కథ తర్వాత.

-కల్లూరి భాస్కరం

రంగు రాయి

hrk photo

తెలుసు. ఇది కల. మొదటి సారి కాదు, వెయ్యిన్నొకటో సారి కంటున్న కల. చిన్నప్పట్నుంచి ఎన్నో సార్లు కన్న కల, కొంచెం కూరుకు పట్టగానే ఎట్నించి వస్తుందో తెలియదు, వచ్చి నన్ను ఎత్తుకుపోతుంది. ఇదిగొ అదే మళ్లీ ఇప్పుడు. తెలియదని కాదు. తెలుసు.

ప్రతి సారీ ఎవరో దీన్ని నా కళ్ల మీద కప్పి వెళ్తారు. నన్నొక మసక వెలుగులో వదిలి వెళ్తారు. నేనొక విహ్వలమైన కనుగుడ్డునై తిరుగుతుంటాను. అణువణువు ఆర్తిగా కదుల్తుంది. ఆసరా కోరుతుంది. ఆసరా అందక గింజుకుంటుంది. కల కదా, కాసేపట్లో అయిపోతుందని అనిపించదు. క్షణాన్ని అనంతంగా సాగదీసినట్లుంటుంది.

కలలో పడిపోయిన ఒక ఇంటి గోడలు. చిందరవందరగా పడి వున్న రాళ్లు. కొన్ని, ఏ రాయికి ఆ రాయి. ఇంకొన్ని, ఎగుడు దిగుడుగా ఒక దాని మీదొకటి. ఒకదానితో ఒకటి అమరడానికి వీలుగా ఎప్పుడో గడేకారి చేతిలో ఉలి దెబ్బలు తిన్న రాళ్లు.

ఆ రాయి వంటింట్లో ఒక మూలన గోడ లోపల్నించి ముందుకు పొడుచుకొచ్చినట్లుండేది. అన్నం తింటూ ప్రతి సారీ కాసేపయినా ఎందుకో ఆ రాయి వైపు చూసే వాన్ని.  ‘ఎందుకట్టా వుండడం’ ఆని నేను అడిగినట్టు, ‘ఏమో, వున్నానంతే’ అని అది నాలుక చాచి నన్ను వెక్కిరించినట్టు మా మధ్య ఒక మౌన సంభాషణ జరిగేది.  ‘ఏందిరా, బువ్వ దినుకుంట అట్టా దిక్కులు జూచ్చొంటావు. ద్యానాలు సాలిచ్చి తిను. తల్లెలొ ఈగెలు వడ్తాయి. యాన్నాన్నో సూసుకుంట మెతుకులు తల్లె సుట్టు పోచ్చావు. బండలు తుడ్స ల్యాక నా రెట్టలు గుంజుతొండాయి…’ అని అమ్మ నన్ను కోప్పడేది.

అదిగో, ఒక రాళ్ల గుట్ట కింది నుంచి పాం పిల్లలా నిక్కి చూస్తున్నది, ఐమూలగా విరిగిపోయిన కిటికీ ఊచల చట్రం. వంటింటి వెనుక-గోడకు ఏడడుగుల మనుషులు చెయ్యెత్తినా అందనంత ఎత్తున వుండేది కిటికీ. దాని మీదికి ఎక్కి కూర్చోవాలని, అటు వైపు ఏముందో చూడాలని అనిపించేది. అవతల ఏమున్నాయని అడిగితే, ‘ఏముంటాయిరా తిక్కోడా, మనొల్లదే సేను, ఇంటెన్క మన జాలాడి (స్నానాల గది) నీల్లు పార్తాయి. బుర్ద బుర్ద’ అని పెద్దవాళ్లు నవ్వే వాళ్లు. కిటికీ బాగా కిందికి వుంటే ఎక్కి కూర్చోవచ్చని ఆశ పడే వాడిని. ఆ మాట అనే వాడిని కూడా. ‘ఆఁ, బలె జెప్పినావులేరా, నువ్వు కూకోనీకి కిట్కి కిందికి పెట్టియ్యాల్నా? పిల్లకాకి, నీకేం దెల్సు. కిందికి వుంటే దొంగోల్లు దాన్ని ఊడ బెరికి ఇంట్లొ దూరనీకెనా?’ అని నా నెత్తిన చిన్ని మొట్టి కాయ వేసే వాళ్లు. ‘ఒరేయ్, గదురోన్ని నెత్తిన కొట్ట గుడ్దు (కొట్ట గూడదు), గాశారం సాలక ఆయం పాట్న తగిల్తె ఎవుని పండ్లు పట్టుకోని సూడాల…’ అని మా జేజి వాళ్లను గదమాయించేది.

దొంగలను నేను ఎప్పుడూ చూళ్లేదు. చూసినంత బాగా తెలుసు. పెద్ద వాళ్ల మాటల్లో చాల సార్లు విన్నాను. ఇంకో పక్కన ముక్కలు ముక్కలుగా పడి వున్న ఆ పల్చని బండలు మా ఇంటి గరిసెలవి. గరిసె బండలను చూస్తే ఎన్నెన్నో దొంగల కథలు గుర్తుకొస్తాయి. గరిసెల్లో జొన్నలు, కొర్రలు పోసే వాళ్లు. గరిసెలు నిండుగా వున్నప్పుడు, అంటే ధాన్యం బాగా పైకి వున్నప్పుడు అమ్మ నన్ను దింపి చిన్న తట్టగంపలో జొన్నలు పైకి తెప్పించేది. పిండి చేసి రొట్టెలు చేసేది. దంచి సంకటి చేసేది. గరిసెలో చీకటి చీకటిగా చిత్రంగా ఉండేది. గుండ్రం గుండ్రంగా చేతికి చల్లగా తగిలే జొన్నలతో ఇంకాసేపు ఆడుకోవాలనిపించేది.

ఒక సారి అమ్మ పొద్దున్నే వంటింట్లోకి వెళ్లి పెద్దగా కేకలు వేయడం మొదలెట్టింది. ‘జాలాడి తూము లోంచి యా పామన్న దూర్న్యాదేమోరా, సూడు పో’ అని జేజి మా నాన్నను లేపి పంపింది. నాన్న వెనుక నేను, మా తమ్ముడు. ‘మీరు యాడికి రా’ అని జేజి అరుపులు. లోపలికి వెళ్లి చూస్తే ఏముంది?! ఆ కిటికీకి బాగా కింద వంటింటి వెనుక గోడకు పెద్ద కన్నం. దాని లోంచి చూస్తే అవతల చేని లోని నల్లమట్టి బెడ్డలు బెడ్డలుగా, మా జాలాడి నీళ్లతో కలిసి బురద బురదగా కనిపిస్తోంది. గరిసెల దగ్గర్నించి కన్నం వరకు జొన్నలు చెదరు మదురుగా పడి వున్నాయి. హడావిడిగా మోస్తున్నప్పుడు పడిపోయిన గింజలు. ఇంట్లో దొంగలు పడడం, కన్నం వేయడం అంటే ఏమిటో అప్పుడే తెలిసింది. తరువాత ఎన్ని కథలు విన్నానో. ఎప్పుడెప్పుడు ఎట్టెట్టా ఇంట్లో దొంగలు పడ్డారో జేజి వైనవైనాలుగా చెప్పేది. ఇప్పుడా కిటికీ విరిగి పడి రాళ్ల మధ్య నుంచి దొంగ చూపులు చూస్తోంది.

గరిసె బండలను చూస్తే, పెద్దవాళ్లు చెప్పిన మరో ఘటన మనసులో కదిలి భయపెడుతుంది. గరిసెలో దిగేప్పుడు బయట అమ్మ కాకుండా ఇంకెవరైనా వున్నారేమోనని భయంగా చూసుకునే వాన్ని. మా మామ అన్న ఒకాయన వాళ్లింటి గరిసెలో ఊపిరాడక చచ్చిపోయినాడంట. మా మామకూ ఆయన అన్నకు ఆస్తి పంపకాలలో తగాదా వచ్చింది. తమ్ముడు గరిసెలో ఏదో మూలన బంగారం దాచిపెట్టాడని అన్నకు అనుమానం. అన్న గరిసెలో దిగి బంగారం కోసం వెదకడం మొదలెట్టాడు. మా మామ గరిసె మీద బండ మూసి కూర్చున్నాడు. గాలి పోవడానికి సందు లేని బండ. అన్న ఎంత అరిచినా తమ్ముడు బండ తీయలేదట. ఊపిరాడక ప్రాణం వదిలాక బయటికి తీసి ఏవో కతలు అల్లి చెప్పినాడంట మా మామ. వాళ్లు బాగా ఉన్నోళ్లు. అంత ఆస్తికి మా మామ ఒక్కడే. ఇక, నోరు తెరిచే దెవరు? ఈ కథ విన్నాక, మా ఇంటికొచ్చినప్పుడు మామను చాల సార్లు చూశాను. నెమ్మది మాట, నెమ్మది నడక. ఆయన మాట మీద మా నాన్నకు మంచి గురి. అలాంటాయన ఆ పని చేసుంటాడని ఎలా అనుకుంటాం. అదేదో పుకారు. అయినా, కథ చెప్పుకోడానికి, వింటానికి బాగుండేది. పెద్ద వాళ్లు ఆ కథ చెప్పుకుని పగలబడి నవ్వుకునే వాళ్లు. చివరాఖర్న ‘గరిసెలో దిగేటప్పుడు బామ్మర్దిని నమ్ముకోవాల గాని తమ్మున్ని నమ్మకో గుడ్దు రోయ్’ అని నీతి కూడా చెప్పుకునే వాళ్లు.

రాళ్ల గుట్టల్లో ఇంకో పక్కన బాగా పొడుగు, వెడల్పు, మందం వున్న కొన్ని బండలు సగం వరకు మట్టిలో కూరుకుపోయి వున్నాయి. అన్నిటి కంటె పెద్ద బండ మా ఇంటి ముందు పెద్దరుగుది. మిగిలిన చిన్న ముక్కలు అక్కడే ఎడమ వైపు అరుగువి. తలవాకిలి దాటి ఇంట్లోకి వెళ్లాలంటే ముందుగా ఆ రెండరుగుల మధ్య బండ-చట్టం మీద నడవాలి. పెద్దరుగు మీద గోడ వారగా ఎప్పుడూ ఒక రంగుల సిరిచాప చుట్ట వుండేది. చాప కొసన దారాలు అరుగు మీంచి కొద్దిగా వేలాడుతుండేవి. నేను కింద నిలబడి సిరిచాప ముట్టుకోడానికి చెయ్యెత్తే వాన్ని, ఎంత పొడుగు వున్నానో చూసుకోడానికి. మొదట్లో అందేది కాదు. చాప నాకు అందేంత దగ్గరయ్యే కొద్దీ పెద్ద వాన్ని అవుతున్నానని మురిసిపోయే వాన్ని.

పూర్తిగా చేతికి అందాక కూడా నాకు చాప మీద ఆసక్తి పోలేదు. అదొక సంకేతం.

అరుగు మీద చాప విప్పి పరిచారంటే, బయటి నుంచి బంధువులెవరో వచ్చారన్న మాట. ఆ రోజు ఇంట్లో వరి బువ్వ. మిగిలిన రోజుల్లో కొర్రన్నం లేదా జొన్న సంకటి. విసుగొచ్చేది. బంధువులొస్తే ఒక్కోసారి మాంసం కూడా వుంటుంది. వచ్చిన వాళ్లు చిన్న వాడినని నన్ను ముద్దు చేస్తారు. అందరు కాదు గాని మా మామ లాంటి వాళ్లు తియ్య-కారాలు కొనుక్కోడానికి ఒక బొట్టో, అర్ధణానో ఇస్తారు. సిరిచాప మీద కూర్చుని వాళ్లు మాట్లాడుకునే మాటలు అర్థం కాకపోయినా వింటానికి భాగుంటాయి. వాళ్లకు కనపడేట్టు, రెండరుగుల మధ్యన చేరి; నేనూ మా తమ్ముడు జొన్న-దంటు బెండ్లు, ఈనెల బండికి చిన్ని రాతి ఎద్దులు కట్టి ఆడుకునే వాళ్లం. నేను మా కళ్లం లోంచి బంక మట్టి తెచ్చి బస్సు చేసి ‘పాం పాం’ అంటూ నడిపే వాన్ని. అది చూసి అరుగు మీది వాళ్లు ‘ఈడు సేద్ద్యానికి పన్కి రాడు. తెల్లపుల్లగ బట్టలేస్కోని బస్సుల్లో తిరుగుతాడు, యా పట్నంల బతుకుతాడు’ అనే వాళ్లు.  ‘ఏమో ఎవుని నొస్ట ఏం రాసి పెట్న్యాదో. పిల్లొల్లు గుడ్క మన లెక్క ఎద్దు గుద్ద పొడ్సుకుంటా పల్లె కొంపలో పడుండాల్నా?’ అనే వాడు మా నాన్న కలలు కనే కళ్లతో.

చిన్నప్పుడు నాన్న మాటలు అంతగా అర్థమయ్యేవి కాదు. ఏదో మెచ్చికోలు మాటలు అనిపించేదంతే.

పెద్దయ్యే కొద్దీ అవి బాగా అనుభవానికి వచ్చాయి. ఊళ్లో ఒకేలా మార్పు లేకుండా దొర్లే రోజులు; తెల్లారు ఝామున లేచి ఇంటి పనులన్నీ చేసుకుని, అన్నం ఎక్కడుందో మాకు చెప్పి ‘పెద్దోడా బయిటికి వొయ్యెటప్పుడు వాకి లెయ్యి, కుక్కలు వడ్తే రాత్రికి బువ్వ వుండద’ని అరిచి చెప్పి వెళ్లి మునిమాపుకు గాని రాని అమ్మ. పుస్తకాల్లోని అమ్మల్లా నన్నూ తమ్మున్ని లాలించడానికి, ప్రేమగా దగ్గరికి తీసుకోడానికి తీరిక లేని అమ్మ. అప్పుల ఊబిలో కూరుకు పోయి దిక్కు తోచక, మరెక్కడా కసి తీరక మా వీపుల మీద ములుగర్ర విరగ్గొట్టే నాన్న; ‘ఈళ్ల కేముంది, కొట్టం మింద సెత్త లేని నాయాండ్లు, పిల్లనిచ్చేటోడు గుడ్క దొర్కడు’ అని తిరస్కారంగా చూసే కలిగినోళ్లు; పట్నంలో చిన్న ఉద్యోగమైనా నీడ పట్టున బతకొచ్చునని, ఫ్యాను గాలి కింద పడుకోవచ్చని, వారానికి ఒక సారి సెలవుల్లో సినిమాలకు షికార్లకు వెళ్లొచ్చని అందరూ అనుకునే మాటలు…. వూళ్లో వుండడం నాకు ఒక మజిలీ మాత్రమే, ఎప్పటికీ వుండబోయేది లేదనే బాధ; అలా జరగదు, బతుకంతా ఆ ఇరుకులోనే గడపాలనే దిగులు… రెండూ ఒకే సారి కదుల్తుండేవి.

ఈ రాళ్లన్నీ కాదు, నాకు చాల ముఖ్యమైనవి రాళ్లు వేరే ఉన్నాయి. దుమ్ము పడినా ఎండకు మెరుస్తున్నఎర్ర రంగుపట్టెల రాళ్లు. వాటిని చూస్తే ఏడుపొస్తుంది. తల వాకిలికి రెండు పక్కల.,  కింద గడప దగ్గర్నుంచి పైన సుంచు-బండ (అటక) వరకు స్కేలు పెట్టి దిద్దినట్లుండేవి రంగుపట్టెలు. అవంటే నాకు చాల ఇష్టం. ఎర్ర రంగుపట్టెలు వూళ్లో అన్ని ఇళ్లకూ ఉంటాయి. మావి అన్నిటి లాంటివి కావు. మిగతా ఇళ్ల వాకిళ్లకు ఎర్రమన్నుతో పూసిన మొరటు పట్టెలుంటాయి. ఇంటి వాళ్లకు ఓపిక కుదిరి, బండి కట్టుకెళ్లి ఎక్కడి నుంచో ఎర్రమన్ను తెచ్చి పూస్తే కొన్ని రోజులు కొత్తగా ఉంటాయి. లేకుంటే మాసిపోయి, వెలిసిపోయి ఉంటాయి. మా ఇంటి పట్టెలు అట్టాంటి ఎర్రమన్నువి కావు. నూనె రంగులతో తీర్చినవి. మాసిపోకుండా నిగనిగలాడుతుండేవి. అవి మా ఇంటి ప్రత్యేకత. ఒక్కో ఇంటికి ఒక ప్రత్యేకత. ఇపుడు దుమ్ములో అడ్డదిడ్డంగా పడిన రంగుపట్టెల రాళ్లను చూస్తుంటే ఏదో లోయ లోనికి కొద్ది కొద్దిగా జారిపోతున్నట్లు దిగులు.

ఇదంతా కల. తెలుసు. ఇది భయం కాదు. దిగులు.

దిగులేనా? నిజంగా నేను దిగులు పడతున్నానా? కలను ఎంజాయ్ చేస్తున్నానా? ఏమో!

ఉన్నట్టుండి నాకు మా వంటింట్లోని చిన్నరుగు గుర్తొచ్చింది. రాళ్ల గుట్టల్లో ఆ పొడుగాటి పల్చని బండ కోసం కనుగుడ్డు వెదుక్కుంది. నేను, తమ్ముడు చాల చిన్నప్పట్నించి సునాయాసంగా ఎక్కి కూర్చుని అన్నాలు తిన్న చిన్నరుగు. దాని మీద ఆ స్తంభానికొకరం ఈ స్తంభానికొకరం కూర్చుని లేనిపోని కబుర్లన్నీ చెప్పుకున్న, కొట్లాడుకున్న చిన్నరుగు.

ఉన్నట్టుండి, తమ్ముడు చొక్కా జేబు లోంచి చిన్న గులక రాయి తీసి చేత్తో పట్టుకుని, ‘అనా, నేను సిన్నోన్నని ఊకూకె కొడుతొండావు. రాయితొ కొడ్తె నెత్తిన బొర్ర పడ్తాది సూడు’ అని బెదిరిస్తున్నాడు. వాడు నిజంగానే రాయి విసురుతాడనిపించింది. ‘అమా, ఈడు జూడే’ అని నేను అరుస్తున్నాను. ‘ఏందిరా ఇద్దరు ఎప్పుడు జూసినా? వాదు ల్యాక వల్లూరికి వోతొండ ఇరుగు పొరుగు నా సవుతులార ఇల్లు బద్రమే అన్నెట్టూ…..” అని అమ్మ కోప్పడుతోంది, పొయ్యి దగ్గర పొగ చూరిన వెలుగు లోంచి.

అంతలోనే గుర్తొచ్చింది. ‘ఇప్పుడు తమ్ముడు లేడు కదా?. అమ్మ… అమ్మ… మాత్రం ఎక్కడుంది? మరి ఈమె, వీడు… ఎవరు వీళ్లు? ఏమిటిదంతా’ అని మనసు గింజుకుంది.  లోతు నీళ్లల్లోంచి పైకి వస్తున్నప్పుడు, ఇంకా ఊపిరి తీసుకోడానికి వీల్లేనప్పటి మంచు తెర లాంటి స్థితి

‘ఇగో అనుమంత్రెడ్డీ’ ఎవరో పిలుస్తున్నారు. కలలోని వాళ్లు కాదు. భుజం మీద ఎవరిదో చెయ్యి. అది కూడా కలలోని మనుషులది కాదు. కళ్లు తెరిచా‍ను. మా పొట్టి వేపమాను కొమ్మల్లోంచి ఎండ పొడ మంచం మీద పడుతోంది. మంచం పక్కన రాజేశ్వరమ్మ పిన్ని నవ్వు మొహంతో చూస్తోంది. ‘ఏం సిన్నా! ఏమన్న కల వడింద్యా? ఏందేందో అంటొండావు. ఎవురితో మాట్లాడుతొండావూ?” అడిగింది దీర్ఘాలు తీస్తూ. ఒక్క క్షణం నేనెక్కడున్నానో తెలియలేదు. “నేను ఎక్కడున్నాను?” అడిగాను, పిచ్చి చూపులు చూస్తూ.  “యాడొండావు. మన ఇంటి కాడొండావు. ఇట్టా పదేండ్ల కొగ సారి వూరి మొగం జూచ్చె ఎట్ట తెలుచ్చాది నాయ్నా! మీకేం పట్నం బొయి హాయిగ వుండారు. ఈడ మనొల్లు ఎట్టా బతుకుతొండారొ అని ఎప్పుడన్నా అనుకుంటావా? సర్లె సర్లె, లేసి మొగం గడుక్కో. కాపి సల్లారిపోతాది”, ఈసారి పిన్ని నవ్వులో కొంచెం నిష్ఠూరం. నాకు లేవాలని లేదు. “కొంచెం వుండు పిన్నీ, అయిదు నిమిషాలు’ అని మళ్లీ కళ్లు మూసుకున్నాను.

మనసు చాల గజిబిజిగా వుంది. నా చుట్టూ అసహజమైనదేదో వుంది. నాకు ఇష్టం లేనిది ఏదో వుంది. తెలిసీ తెలియక కెలుకుతోంది. అదేమిటో తెలియడం లేదు. ఇల్లు… పడిపోయిన ఇంటి గోడలు, రాళ్లు… మగత మెలకువలో దొర్లుతున్నాయి. బాగా మందుకొట్టిన రాత్రి తెలవారు ఝాము మెలకువలో కలిగే పశ్చాత్తాపం లాంటి నొప్పి.

నన్ను బాధ పెట్టేది ఏమిటో వెంటనే గుర్తొచ్చేదే గాని, పిన్ని నిష్ఠూరం మాటలతో మనసు అటు వైపు పోయింది. మా చిన్నాన్నకు ఇద్దరు కొడుకులు. ఇద్దరూ పెద్దగా చదువుకోలేదు.  రియల్ ఎస్టేట్, కాంట్రాక్టు పనుల్లో తిరుగుతుంటారు. చిన్నాన్న, పిన్ని వ్యవసాయం చూసుకుంటూ వూళ్లో వుంటారు. అందరూ పట్నం పోదామని ఆలోచిస్తుంటారు. పట్నంలో ఏం చేయాలో తోచక ఊళ్లో వుండిపోయారు. నా మాదిరి తన కొడుకులకు పట్నంలో ఉద్యోగం లేదని పిన్ని దిగులు. వాళ్ల ఉద్యోగాల గురించి నేను పట్టించుకోడం లేదని నిష్ఠూరం. ఉద్యోగాలు ఏమంత గొప్ప కాదని వ్యాపారాలే మేలని చెప్పినా వినదు.

ఈ అపార్థాల వైకల్యంతో కలగలిసిన కల. ఇప్పటిది కాదు. మొదటి సారి, కలకు నిజానికి తేడా తెలియని వయసులో కలత పెట్టిన కల. తరువాత నేను ఎక్కడ ఎలా ఉన్నా చెప్పా పెట్టకుండా వచ్చి కళ్ళ మీద వాలుతుంటుంది. అదే కల, అవే దృశ్యాలు.

కలలో రంగుపట్టెల రాళ్ల ముక్కలు చూస్తుంటే, అవి ఇక వుండవనే స్పృహతో పాటు, అవి కూడా లేకపోతే వూరిలో మా ఇంటికి ఏ ప్రత్యేకత వుండదనే బాధ. ఏ గుర్తింపు లేకుండా పిండిలో రేణువుల్లా ఎందుకు వున్నామని విచికిత్స, చదువుకుని పట్నం వెళ్లి ప్రత్యేకత సంపాదించాలని కోరిక, అదంత సులభం కాదు, ఎన్నో పరీక్షలు పాసు కావాలి అని నిరాశ.. ఉప్మా ప్లేటులో కాఫీ ఒలికి, తడిసిపోయినట్టు, దాన్ని తీసుకెళ్లి సింకులో పారబోయాలన్నంత చికాకు.

ఆ భయాలు, విచికిత్సలు ఇప్పుడుంటానికి వీల్లేదు. ఊరు వదిలేసి హైదరాబాదు చేరి చాల కాలమయ్యింది. నేనే కాదు, తమ్ముడు, అమ్మ చాల మంది బావలు, బా‍మ్మర్దులు హైదరాబాదుకు చేరారు. అర్ధాంతరంగా తమ్ముడు, ఆ తరువాత అమ్మ చనిపోయారు. తమ్ముడు వుండినా వూరికి వెళ్లి చిన్నరుగు మీద కబుర్లు చెప్పుకుంటామా? ఊరికి వెళ్లాలని వుంటుంది. మా ఇల్లు కళ్లారా చూసుకోవాలని వుంటుంది. వెళ్తే ఎక్కడ వుండటం? తమ్ముడు వున్నప్పుడే ఇంటిని చిన్నాన్న వాళ్లకు అమ్మేశాం. మాది కాని ఇంట్లో ఒకటి రెండు రోజులకు మించి వుండలేను. నేను హైదరాబాదులో హాయిగా వుంటే తాము, తమ పిల్లలు పల్లె కొంపలో వుండిపోయారని, దానికి నేను ఏమైనా చెయ్యొచ్చు కదా అని, చెయ్యడం లేదని దాయాదుల కళ్లల్లో అప్రకటిత ఫిర్యాదు. ఊరికి వెళ్లడం కుదరదు. కల వదలదు. వదలడానికి అది వట్ఠి జ్ఙాపకం కాదు. భవిష్యత్తు కూడా.

ఆ రోజు ఊళ్లో, మాఅఅ పొట్టి వేపచెట్టు నీడ కింద పడుకుని వున్నప్పుడు, మళ్లీ అదే కల. ఇదేమిటని అనుకుంటుండగా, అక్కడి అసహజమేమిటో చటుక్కున తోచింది. ఎవరో వీపున చరిచినట్లయ్యింది. కళ్లు తెరిచి మంచం మీద కూర్చున్నాను.

పొట్టి వేపచెట్టు కింద పడుకుంటే, దాని నీడ పక్కకు పోయే సరికి మా ఇంటి నీడ నా మీద పడా‍లి. పడడం లేదు. అక్కడ మా ఇల్లు లేదు. ఇల్లు వుండిన చోట, ఆ స్థలం మధ్యలో, తడి తడి ప్లాస్టరింగ్ వాసన వేస్తున్న కాంక్రీటు ఇల్లు. చిన్నాన్న వాళ్లు ఇంటిని మా నుంచి కొన్నాక, కొన్నాళ్లు అందులోనే కాపురం చేశారు. కొడుకులు వ్యాపారాల్లో గడించిన డబ్బుతో, పాత ఇల్లు పడగొట్టి కొత్తగా కట్టారు. ఇప్పుడు నేను వచ్చింది కొత్తింటి గృహప్రవేశానికి. కొత్తింటికి ఒక పక్కన, ఇంకా బయటికి తీసుకెళ్లి పడేయని పాత ఇంటి రాళ్లు, కిటికీ చట్రాలు, పగిలిన బండలు. అన్నీ మా ఇంటివే. కల కాదు. నిజం.

‘ఏం వోయ్. పల్లెటూల్లో ఫ్యాను ల్యాక పొయినా బాగ నిద్ర పట్టి నట్టుందే? ఏందో శాన దీర్గాలోశన్లో వుండావబ్భా!”

పలకరింపు విని, ముఖం మీది చెమట తుడుచుకుంటూ తల పైకెత్తి చూశాను. వీరా రెడ్డి మామ. వాళ్ల కల్లానికి వెళ్లాలంటే మా ఇంటి మీదుగానే వెళ్లాలి. మామ ధోవతి చుంగులు పైకి సర్దుకుని నాకు కొంచెం దూరంగా మంచం మీద కూర్చున్నాడు. తనది ఎప్పుడూ నవ్వుతున్నట్టుండే మొహం. మాట కూడా అంతే. ప్రతి దాన్నీ తేలిగ్గా‍ తీసుకుని మాట్లాడుతున్నట్టు వుంటుంది. కాని, అవి అనుభవాలతో పండిన మాటలు. అనుభవం పండితే అన్నీ తేలికే.

“ఎక్కడికి మామా! కల్లానికా?” అని ఎదురు పలకరించి, జవాబు కోసం చూడకుండా, “పాత రాతి మిద్దెలు ఎత్తుగా, చల్లగా వుండేవి కదా!? అవి పడగొట్టి పట్నంలో మాదిరి ఈ పొట్టి ఇళ్లు ఎందుకు మామా? ఈ ఖర్చులెందుకు? అర్థం కావడం ల్యా” అన్నాను, నా దీర్ఘాలోచనకు ఒక నెపం కల్పిస్తూ.

“అంటె, ఏమంటావ్వొయ్య్, మీరంతా పట్నంల ఫ్యాన్లేసుకోని, ఏసీలేసుకోని సల్లగ పండుకాల. మేము ఇట్నె యాపసెట్ల కింది సింత సెట్ల కింద బతకాల్నా?”, అని నవ్వేశాడాయన. “అట్ట గాదు గాని అల్లుడా! రాతి మిద్దెలయితే, పైన మట్టి మెత్తు ఏస్కో వాల్య. యాడాదికి ఒగ సారి బండి గట్క పొయ్యి, సౌడు మన్ను తోల్కోని రావాల్య. ల్యాకుంటే పైన బొక్కలు వడి పొట్కు వెడ్తాది. వానకు గోడలు వుబ్బిపొయ్యి, రాల్లు పక్కకు జరుగుతాయి. వుశారుగుండి సగేసుకోక పోతె గోడ పడిపోతాది. ఇప్పుడయ్యన్ని ఎవుడు జేచ్చాడు? ఆ ఓపిక ఎవుడికుంది? అన్ని సిటికెల పందిరి లెక్క అయిపొవ్వాల.”

ఆయన చెప్పింది కూడా నిజమే కదా అనుకుంటూ మౌనంగా వుండిపోయాన్నేను.

“అయిన గాని, ఇయ్యాల్రేపు పల్లె అని పట్నమని తేడా యాడ కాలవడింది లే. మీ కాడ వుండేటివన్ని మా కాడి గ్గూడ వచ్చొండాయి. అగో, ఈ బజారు దాటి పోతె బస్టాండు. నీ సిన్నప్పుడు మనూల్లొ బయిట కాపి నీల్లు దొర్కుతొండెనా. ఇప్పుడు బస్టాండు కాడికి వొయ్యి సూడు. ఐదు టీ హోటళ్లు, ఆడ పట్టకుండ పిల్లోల్లు. అప్పుడు ఒక బస్సు రెండు టిప్పులు తిర్గు తొండె. ఇప్పుడు రెండు బస్సులు కల్సి ఎనిమిది సార్లు తిర్గినా సీటు దొర్కదు. ఎవునికి వూర్లొ కాలు నిలవడదు. ఏం శాతగా‍నోనికి సేద్దెం. శాతనైనోడెవుడు పల్లెకొంపల్లొ వుందామనుకోడం ల్యా. ఈడ ఏందో కారిపోతోందని, ఏందో పొగొట్టుకున్న్యామని వూకె నోటి మాటకు అంటొంటారు నీ లెక్కటొల్లు. అదే నిజమైతె మీరు ఈడికి ఒచ్చి వుండొచ్చు గదా. రిటైరయినోల్లన్న రావొచ్చు గదా? యా రారు! ఈడ యా టీచరుద్యోగమో వున్నోల్లు గుడ్క ఈడ వుండరు. కర్నూల్లొ కాపిరం. ఈడికి ఏందదీ… అప్పండౌన్. అన్ని వుత్త మాటలు. ఆడ మీకు బోరు గొట్టినప్పుడు, ఏందన్న కస్టమొచ్చినప్పుడు అట్టా అంటొంటారు. ఈడ వుండెటోల్లు గుడ్క ఎవురు ఈన్నే వుండాలని అనుకోడం ల్యా. సదువు ఒంట బట్టినోల్లు, శాతనైనోల్లు యాదో ఒగ పని జూస్కోని పట్నం జేరుతొండారు. ల్యాకుంటే, ఈడ్నె ఉండి సుట్టుపట్ల యా బూముల యాపారమో సూసుకుంటొండారు. అది గుడ్క కుదరనోల్లు శాన కమ్మి. ఈడ వుండెటోల్లు గుడ్క, మరీ బాతిగానోల్లు దప్ప, పాత ఇండ్లు ఎవురుంచుకుంటారు? ప్యాదోల్లు గుడ్క వుంచుకోడం ల్యా. ఇందిరమ్మ ఇండ్లో ఇంగొగటో… సిమెంటు ఇండ్లు ల్యాకుంటే ఎవురు ఒప్పుకోడం ల్యా.”

మామ మాటలు వింటుంటే నాకెందుకో ఎమ్మేలో నా క్లాసుమేటు, నక్సలైటు నాగేశ్వర రావు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. వాళ్ల పార్టీ ముందుగా పల్లెల్లో అధికారం సంపాదించి, పల్లెలతో పట్టణాలను ముట్టడిస్తుందని అనే వాడు. ఆ సంగతేమో గాని, ఇప్పుడు పట్నాలు పల్లెలను ముట్టడిస్తున్నాయి.

ఇది మంచికా చెడుకా?

ఏది మంచి ఏది చెడు?

చిన్నా‍న్న వాళ్ల గృహ ప్రవేశం చూసుకుని హైదరాబాదు వచ్ఛాక ఇంత వరకు మళ్లీ మా వూరికి వెళ్ల లేదు. అక్కడి నుంచి బయల్దేరే ముందు మా ఇంటి రాళ్ల దగ్గరికి వెళ్లి కాసేపు నుంచున్నాను. టేబుల్‍ మీద పెట్టుకుందామని, రంగుపట్టెల రాళ్ల ముక్కల్లో ఒకటి చేతిలోకి తీసుకున్నాను. నా ఆలోచనకు నాకే నవ్వొచ్చింది. రంగు రాయిని గుట్ట మధ్యకు విసిరి వచ్చేశాను.

— హెచ్చార్కే

 

 

శిశిరానంతర వేళ ..!

DSC_1454 

మంచి కథలకు హామీ ఇస్తున్న కొత్త రచయిత్రి సాయి పద్మ. లేటుగా రాయడం మొదలుపెట్టినా లేటెస్టుగా రాస్తున్న రచయిత్రి కూడా. మార్చి 10, 1972లో పుట్టారు. విజయనగరం జిల్లాలోని గజపతినగరం సొంత ప్రాంతం. సామాజిక కార్యకర్తగా చరుగ్గా పనిచేస్తున్నారు. ఆదివాసీ, గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు నడుపుతున్నారు. భర్త ప్రజ్ఞానంద్‌తో కలసి వికలాంగులు, వృద్ధుల కోసం గ్లోబల్‌ఎయిడ్‌ అనే సంస్థ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. ఇప్పటి వరకు మూడు కథలు రాశారు. మొదటి కథ ‘వైదేహీ మైధిలీయం’ ఈ ఏడాదిలోనే ‘కౌముది’లో ప్రచురితమైంది. రెండో కథ ‘రంగం పిన్ని ఆకాశం’ నాట్స్‌ బహుమతి పొందింది. మూడో కథ ఇదిగో -ఇప్పుడు ఇక్కడ ఇలా ప్రచురితమైంది. గొప్ప ప్రామిసింగ్‌ రైటర్‌గా సాయిపద్మ ఎదుగుతోందనడానికి ఈ కథ ప్రత్యక్ష ఉదాహరణ.—వేంపల్లె షరీఫ్

***

మా సుందరం ఉన్నాడే , ఒకలాంటి వాడు కాడు. రెండు గంటల నుండీ వాడి కోసం వెయిట్ చేస్తున్నానా … వస్తాడు, తీయగా ఒక నవ్వు నవ్వి ఏదో లాజికల్ గా చెప్తాడు. నేనప్పుడు చల్ల బడి పోతాను. సుందరం గొప్పవాడు అనటంలో సందేహం లేదు . పోలియో చిన్నప్పుడే సోకింది సుందరాన్ని. ఒక కాలు ఈడ్చుకుంటూ నడుస్తాడు, వీలైనంత తన నడకని కవర్ చేస్తాడు కూడా. “ఒరే సత్తిగా .. మనం కాళ్ళీడ్చినా.. మన బ్రతుకు ఈడ్చినట్టు ఉండకుండా చూసుకోవాలిరా ..!!” అంటాడు .. ఆ సమయంలో నిజం చెప్పాలంటే వాడు నాకు గీతాచార్యుడే.

సుందరం తండ్రి చిన్నప్పుడే తాగి తాగి పోయాడు. –“పేరుకి పెద్ద బేమ్మర్ల కుటుంబమే గానీ , ఎవరూ ఏ కాపర్సూ విదల్చలేదోయ్” అంటాడు వాడు నవ్వుతూ..! వీడ్ని పెంచటానికి వీళ్ళమ్మ …సోమిదేవమ్మ పడని కష్టం లేదు . చాలా మంది ఇళ్ళల్లో వంట చేసింది . గుళ్ళో ప్రసాదాలు తినేవాళ్ళు తల్లీ కొడుకూ చాలా సార్లు. కానీ, కొడుకు చదువు ఎక్కడా ఆగనివ్వలేదు. వాడికి కావలసిన జోళ్ళ కోసం , ఒక డాక్టర్ గారి ఇంటిలో పనికి వొప్పుకొని, చేయించింది.  మా సుందరం గాడు కూడా , ఒక్క సంవత్సరం కూడా ఫెయిల్ కాకుండా చకా చకా చదివేశాడు. ఉద్యోగం కూడా అలాగే, మేము ఇంకా పైకి, పైపైకి చదవాలా, ఏం చేయాలి అన్నప్పుడు .. అప్పుడే సిటీ అవుతున్న మా వూళ్ళో వేళ్ళూనుకుంటున్న ప్రభుత్వ రంగ సంస్థ లో ఉద్యోగం సంపాదించాడు. వికలాంగ కోటాలో ఉద్యోగం వచ్చినా , ఎప్పుడూ రిలాక్స్ కాలేదు. ” అమ్మ చాలా కష్టపడిందిరా .. నా బ్రతుకు పరుగు తీయాలని .. తను నిమిషం, నిమిషం కాలం ఈడ్చింది ..” అనేవాడు. వాడి తెలివితేటలకి అక్కడ మనుషులు వాళ్ళ అవసరాలూ, బలహీనతలూ కూడా దాసోహం అన్నాయి సహజంగానే . కొంచంగా మొదలై వాడి ప్రస్థానం అంచెలంచలుగా ఎదిగింది. తల్లి చేత పని మాన్పించేసాడు. మా సుందరం గొప్పవాడు కాడు అంటే అందుకే వొప్పుకోను నేను .

అదిగో వస్తున్నాడు .. కాళ్ళీడ్చుకుంటూ ..ఉత్సాహంగా .. గట్టిగా అడుగుదాం అని డిసైడ్ అయ్యా నేను ..” ఏరా.. రెండు గంటల నుండీ వెయిటింగ్ ఇక్కడ .. మళ్ళీ అక్కడికేనా ??’- వాడి మొహంలో ఇరవై ఏడేళ్ళ యవ్వనపు గర్వపు అతిశయం .. ” అవునోయ్ మై డియర్ సత్తీ ..: చెప్పాడు వాడు. ఎన్నో తీరని కాంక్షలని తీరాలని దాటించి , సగర్వంగా ఉన్న వాడి మొహం చూస్తే .. గట్టిగా అడగాలని అనిపించలేదు నాకు. మెత్తపడుతూ.. ” అలా  తరచుగా అలాంటి చోటుకి వెళ్ళటం .. మంచిది కాదేమోరా .. ఆలోచించు ”

ఒక నిమిషం ఆగి చెప్పాడు వాడు – ” నిజమేరా… కానీ కరుణ అలాంటిది కాదు.. నాకు మంచి .. ” వాడింకా ఏదో చెప్పబోయేంతలో , నాకు ఒక అసహనం ముంచుకొచ్చింది.. ” సాని దాని దగ్గర నువ్వు సంసారం ఎలా చేయాలో తెలుసుకోనక్కరలేదురా వొరేయ్ .. అలాంటి కబుర్లు చెప్పకు .. పెళ్లి చేసుకుంటావు కదా .. ఈలోగా .. ఇవన్నీ అవసరమా .. ఏదన్నా జబ్బు లాంటిదేదన్నా తగులుకుంటే .. చావాలి మళ్ళీ.. ఆలోచించు .. కాదు అసలింక అక్కడికెళ్ళటం మానేయ్ ..!” తిరుగులేనట్టు చెప్పాను నేను.. ఎన్ని వాదించినా , నా మాట , అపేక్ష, ప్రేమ అంటే వాడికి గురి అని నాకు తెలుసు .. !!

” కానీ కరుణ కి .. అలాంటి జబ్బులు లేవురా .. !!” ఇంకా ఏదో చెప్పాలనుకున్న వాడి ఉత్సాహానికి నా చూపు ఆనకట్ట వేసింది .

” అవన్నీ అనవసరం అబ్బాయి…. ఓకే.. మీ అమ్మ చూసిన సంబంధాలలో పెద్దింటి అమ్మాయిలకి నీ ఉద్యోగం నచ్చింది , కానీ నీ అవిటితనం నచ్చలేదు .ఇప్పటికి రెండు సంబంధాలు అదే కారణం మీద తప్పిపోయాయి అని నువ్వే చెప్పావు .  పెళ్లి, కుటుంబం అవసరం ఉన్న ఒక అనాధని తెచ్చి పెళ్లి చేసుకో .. నిజానికి అంత ఉద్యోగం చేస్తున్నావు ..ఎవరికి ఏం కావాలో క్షణాల మీద ఎరేంజ్ చేస్తావు.. వాళ్లకి కావలసింది ఇచ్చి , నీకు కావలసినవి నువ్వు తీసుకోలేవూ .. మనం అనాధ శరణాలయానికి వెళ్తున్నాం .. అక్కడ ఒక పిల్లని సెలక్ట్ చేస్తున్నాం ” మళ్ళీ నా మాట అనబడే బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాను.

రెండు నెలలలో మా వల్లంపాటి సోమ సుందరం పెళ్లి ప్రసన్న కేర్ అఫ్ అనాధ శరణాలయం తో జరిగిపోయింది. మా సుందరం సెటిల్ అయ్యాడు మొత్తానికి.

***

 సుందరం గారి కోసం వెయిట్ చేయాలంటే విసుగ్గా ఉంటుంది. నిజానికి నాకైతే సుందరం గాడు అనాలనిపిస్తోంది అనుకోండి. అలా అనకూడదు, అనాధ శరణాలయపు అమ్మాయిని నన్ను ఎంచుకొని,దయతో తాళి కట్టాడు కదా నాకు.. ఆ… కట్టేడు లెద్దూ , గట్టిగా రెండు తులాల తాడు కూడా చేయించలేదు . ప్రసన్న సున్నితం, సున్నితం అనుకుంటూ , తల్లీ కొడుకూ ఎలాగైతేనేం , తులం బంగారంతో కానిచ్చేసారు. సర్లే , చేసుకున్నాక అంతా నాదే కదా అని ఊరుకున్నా.. !

అదిగో సుందరం గాడు వస్తూనే ఉన్నాడు.. కుంటుకుంటూ .. అదే నచ్చదు నాకు. మా ఆశ్రమంలో ఉన్న కుంటోడు రాజు గుర్తొస్తాడు. నేను తెల్లగా ఉన్నానని ఒకటే లైన్ వేసేవాడు. జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలిందని .. వాడ్ని చేసుకుంటే నాకేం వస్తుంది ?? కొంచం మర్యాదగా , చాలా నిర్మొహమాటంగానే వాడికి చెప్పాను ఆ మాట .. వింటేనా … మా శరణాలయం మాస్టారితో కూడా మాట్లాడాడు . ఈ కుంటోడికి ఏం చూసుకొని ఇంత గర్వం? నాలాంటి అందగత్తెకి ఇలాంటి వాళ్ళు ఎలా సరిపోతారని అనుకుంటారో అర్ధం కాదు. మాస్టారికి అదే చెప్పాను . సార్… నాకున్నది అందం ఒక్కటే, నేను ఇలా ఇక్కడే ఉండి, ఇక్కడే పెళ్లి చేసుకొని ఉండాలని లేదు. నాకు నా అందం ఇచ్చే ప్రతీ సౌకర్యం కావాలి… అని చెప్పేసాను . చాలా వింతగా చూసాడు ఆయన. చూస్తే చూడనీ .. రాజు గాడి బెడద నాకు వదిలించారు మరి వాడికి ఏం చెప్పారో ..! అదే మాస్టారు ముభావంగా చెప్పారు-“ ఇదిగో ప్రసన్నా, ఆ అబ్బాయి నిన్ను ఇష్టపడ్డాడు. నీ కలలో కూడా నువ్వు ఊహించని ఉద్యోగం, డబ్బు ఉన్నవాడు. మరి ఈ సారికి నీ లెక్కలతో ఎక్కువ నాన్చకుండా ఏదో ఒకటి తేల్చుకో, కానీ ఒకటే చెప్పగలను , అదృష్టం అందమైన శరీరాలలో లేదు , అందమైన మనస్సులో ఉంటుంది .. ఫలితం నువ్వు ఎంచుకున్నదాన్ని బట్టే ఉంటుంది. “- అంటూ ఇలా చాలా సేపు చెప్పారు. ఏదో ఒకటి, ఇక్కడ నుండి వెళ్ళచ్చు. అయినా మనసు, ప్రేమ అనుకుంటూ కూర్చుంటే , జీవితం, యవ్వనం, ఐసు పుల్లలా కరిగిపోతాయి, తర్వాత మొహం చూసే వాళ్ళు ఉండరు. సరే అన్నాను పెళ్ళికి. రాజు గాడికి ఈ విషయం తెలీకుండా  ఉంటే బాగుండును. లేకపోతే వాడ్ని కాదని ఇంకో కుంటి వాడ్ని చేసుకున్నానని వెటకారం చేసేవాడు.

” ప్రసూ.. ప్రసూ ” అంటూ వచ్చాడు సుందరం. సరిగ్గా నడవటం రానివాడికి పిలవటం ఏం వస్తుందిలే .. బలవంతాన నవ్వు పులుముకున్నా. మనం ఏది వద్దు అనుకుంటే అదే వెంట పడుతుంది ఎందుకో .. ఈ కుంటితనం నాకెంత అసహ్యమో , అదే తాళి అయి గుండెల మీద వేళ్ళాడటం కంటే జీవితంలో విచిత్రం ఉండదు .

” నేను లేనని దిగులుగా ఉందా ?” అడిగాడు సుందరం . నామొహం .. ఇంత త్వరగా వచ్చేసావేంటి? అనుకున్నా- అంటే ఇంకేమన్నా ఉందా .. ఇతన్ని వంచాల్సింది, మంచం దగ్గరే , కంచం దగ్గర మన పప్పులు ఉడకవు – అనుకుంటూ తల దించుకున్నా. ఇంత సిగ్గరి అయిన పెళ్ళాం దొరకడం అదృష్టం కదూ .. మావవుడికి, ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు.

పెళ్లి అయి సంవత్సరం అయింది . మొదటి రాత్రి పూర్తిగా సుందరం ఫెయిల్, అతన్ని నేను పాస్ అవనీలేదు. అతను నన్ను పూర్తిగా లొంగదీసుకున్నానని అనుకుంటే , అతని ఆధిపత్యం మొదలవుతుంది. దానికే ప్రేమ అని పేరు పెడతాడు. సుందరం తెలివైన మంచివాడు. అతని తెలివితేటల్ని, లాజిక్ ని పక్కన పెట్టేలా చేసి  .. మంచితనాన్ని, ఒక బలహీనతగా వాడుకోవాలి . అతని బలహీనతలు- తనలోని కామం, కోరిక , నన్ను ఇష్టపడటం. జీవితం సులభంగా దొరకదు అంటాడు సుందరం . మరి నాకు .. చాలీ చాలని ఆశ్రమజీవితం, వదిలేసిన బట్టలు, వాడేసి పేజీలు నలిపేసిన పుస్తకాలూ, నాకు మాత్రం ఈజీ గా దొరికిందా జీవితం ?

సుందరానికి శారీరక సుఖం అంటే ఇష్టం. అతనిలోని ప్రేమ ఉధృతి నాకు కూడా ఇష్టమే. కానీ , రెండు విషయాలు చికాకు పెడతాయి. అతని అవిటితనం, రెండోది నా అందానికి ఏ మాత్రం తగని అతను నన్ను అనుభవిస్తుంటే, నాకు దొరికిందేమిటి? నా లాభం ఏమిటి ? అనే ప్రశ్న నన్ను ఇబ్బంది పెడుతుంది. కావలసినంత డబ్బు ఇవ్వడు. ఇష్టం వచ్చినవి అన్నీ కొనుక్కోటానికి ఉండదు. దేవుడి దయ వల్ల మా అత్తగారు ఆమె ఉన్న వూరు వదిలి రాదు కాబట్టి , మేమిద్దరమే . ఏం చేసినా – ఈ మొదటి సంవత్సరాల లోనే చేయాలి . ఆశ్రమం లో చూడలేదూ.. అందం తగ్గిందని , నాగలక్ష్మి ని మళ్ళీ వాళ్ళాయన వదిలేస్తే , మళ్ళీ అక్కడే డేకురుతోంది అందరికీ వండి పెట్టుకుంటూ..!!

మొదటి రాత్రి అతనికి నేను సహకరించలేదు. తెలీక కాదు, పూర్తిగా తెలిసే…. ఒకళ్ళ బలహీనత ఎత్తి చూపటం ఎంత సేపు ..? మర్నాడు చాలా బాధ పడ్డాడు. సిగ్గు విడిచి తనకో వేశ్య తో పరిచయం ఉందని , అక్కడ ఆమెతో చాలా సుఖపడ్డానని , నేర్చుకున్నానని చెప్పాడు. దొరికావు గురూ అనుకున్నాను .. ఏడిచాను . బ్రతిమాలాడు. ఇంకెప్పుడూ పోను అని చెప్పాడు . ఏ ఉద్యోగం చేసినా, కింద తరగతి నుండి మధ్య తరగతికి ప్రమోట్ అయిన  మగవాడి ఆయువుపట్టు పరువు.  అనాధ పిల్లని తెచ్చి పెళ్లి చేసుకున్నా , వదిలేసింది అనే పేరు వస్తే సుందరం తట్టుకోలేడు అని నాకు తెలుసు. అందుకే బెట్టుగా కానిస్తున్నా సంసారం. డబ్బు ఇచ్చే సుఖం ముందు సుందరం ఇచ్చే సుఖం .. అతని కామన , కోరిక నాకు గుదిబండ లా తయారయాయి. ఆలోచిస్తుంటే, ఆరు నెలల క్రితం అతని కోరికని నాకు లాభంగా ఎలా మార్చుకోవాలో తట్టింది. ఏమీ లేదు.. సింపుల్ గా రేట్ పెట్టా అంతే .. ! ఈ ఆరు నెలల సంపాదన … రెండు లక్షలు , మూడు తులాల బంగారం . నా పేరిట ఒక డెభ్భై వేల ఫిక్స్డ్ డిపాజిట్. బాగుంది కదూ .. ! దీన్ని బట్టి సుందరం కోరిక తీవ్రత, అతని ప్రేమ అర్ధం చేసుకోండి. అన్నీ ప్రేమగానే మంచం దగ్గరే అడిగాను అనుకోండి.

బంగారు గుడ్లు పెట్టె బాతుని కోసుకొని తిన్నా కూడా మంచిదే . అది సరిగ్గా వర్క్ అవుట్ అయితే ..!!

అందుకే సుందరం విడాకులు అడగగానే మొదట ఆశ్చర్యం, తర్వాత ఆనందం వెల్లువలా వచ్చాయి. పడుకోడానికే మూల్యం చెల్లించినపుడు విడిపోడానికి … మంచి బేరం ! సరిగ్గానే అడిగాను వెలకట్టి. ఆఫీసులో లోన్ , తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నాను అన్నాడు .. కళ్ళల్లో నీళ్ళతో తను డబ్బు ఇచ్చాడు. మనసులో సంతోషంతో, ముఖంలో  ముభావంతో నేను మ్యూచువల్ విడాకుల కాగితాల మీద సంతకం చేసాను. చేసే ముందు ఒక గంట చెప్పాడు, సుందరం అతన్ని వదులుకోవటం వల్ల నేనేం కోల్పోతున్నానో .. !! సంఘం ,పరువు, ప్రేమ, తోడు వగైరా వగైరా . వినాలి మరి డబ్బు కదా ..!

మొదటి సారి నా అనాధ జీవితం నాకు నేర్పినదేమిటో అర్ధం అయింది. నాకు డబ్బుతో కూడిన స్వేచ్ఛ కావాలి. సుందరాన్ని పెళ్లి చేసుకొని నేను దానికి పునాది వేసాను. ఇప్పుడు నేను ఆకాశంలో ఎగిరే పక్షిని.

సుందరం అనుకున్నంత చెడ్డవాడు కాడు. సుందరం గారు నా మాజీ భర్త.

***

 ఈ మధ్య పంతులు రావటం లేదు ఎందుకో.. ఎందుకేంటి పెళ్లి చేసుకున్నాడు కదా. సుందరం పంతులు అంటే నాకు భలే ఇష్టం. అతనితో పరిచయం కూడా విచిత్రంగా జరిగింది . ఒక నలుగురు ఫ్రెండ్స్ తో వచ్చాడు. కస్టమర్స్ వచ్చారు అంటే .. కాంతం అదే మా వ్యభిచార గృహ దెయ్యం అనబడే మేడం మమ్మల్ని పిలిచింది. వెళ్లాం అందరం . మధ్యలో కూర్చున్నాడు సుందరం. లేతగా ఉన్నాడు ఇక్కడేం పని? అనుకున్నా . పేర్లు చెప్పమన్నారు. నేను సుందరం వైపే చూస్తూ .. “ కరుణ’ అన్నాను . చప్పున నాలిక కరచుకున్నాను. మా దెయ్యం ఉరిమి చూసింది నావైపు . కస్టమర్ ఎవరొచ్చినా కరీనా అని చెప్పమంటుంది . దాని పిచ్చి గానీ , అది పెట్టుడు పేరు అని తెలీదూ.. వినేవాళ్ళకి .

నా పేరు వినగానే సుందరం తలెత్తి – “ నాకు ఈ అమ్మాయే కావాలి ‘ అన్నాడు .

అతన్నే చూస్తున్న నాకేం ఉంటుంది , అభ్యంతరం .. సరే అన్నాను . చేసిన ప్రతీ వెధవ పనికీ “ ప్రేమ ‘ అనే పేరు అడ్డేసుకొని , నన్ను వాడేసుకొని ఒక వెధవ ఇక్కడ అమ్మేసుకున్నాడు. అక్కడనుండీ ఏ తోవ ఎటు పోయినా ఉన్నవరకూ తిని బ్రతికితే చాలు అని ..రోజులు లేక్కేసుకొనే నాకు ..ఎవడైతే ఏంటి ? ఎక్కువ హింసించకుండా ఉంటే  చాలు. మా వూరి ప్రేమికుడే నా బ్రతుకుని , శరీరాన్ని అమ్మేసి .. ఆ విషయం మా అమ్మా నాన్నలకి తెలిసినా కిమ్మనకుండా ఉన్నప్పటి నుండీ .. నాకు మనుషుల మీద పెద్ద నమ్మకాలు గాని, మానవత్వం మీద మోజు గానీ లేవు .

గదిలోకి వెళ్లాం. జాకెట్ విప్పబోతుంటే “ వద్దు .. మీకిష్టమేనా .. మాట్లాడుకుందాం .. నాకు కొత్త” అన్నాడు సుందరం . అతని పేరు తర్వాత తెలిసింది లెండి .. పంతులూ అంటే నవ్వేడు. నా ఇష్టం అడగటం నిజంగా నాకు కొత్త. నా ప్రేమికుడు కూడా ఎప్పుడూ అడగలేదు . వాడెందుకు అడగలేదని .. అడగాలని కూడా నాకు తోచలేదు.

అలా మొదలైంది మా కధ. పంతులికి చాలా నేర్పించాను నేను. శరీరం ఏమిటో, ఎలా ప్రేమించాలో, ఆడదాని శరీరం ఏమిటో , ఎందుకో .. నా కస్టమర్ లే కదా నా యూనివర్సిటీ. సుందరం భలే చురుకైన వాడు సుమా.. ఇట్టే నేర్చుకుంటాడు. అది ప్రేమ అంటారో, మోహం అంటారో, దాహం అంటారో తెలీదు. తనకోసం నేను ఎదురుచూసే స్థాయి కి తీసుకొచ్చాడు. ఎంత సున్నితమైన వాడో .. మనిషంటే, మగాడంటే నేర్పించాడు . అనుభవానికీ సంగమానికీ కూడా తేడా ఏమిటో.. !

అదొక యోగం .. పెద్ద మాటలు చెప్తున్నాను కదూ.. నిజానికి , నా దగ్గర కొచ్చేసరికి పంతులికి తానేమిటో తెలీదు.. మగాడనే స్పృహ లేదు. ధ్యాసంతా తన కుంటితనం మీదే .. నెమ్మది నెమ్మది గా , అతనిలో స్వచ్చత, పసిపిల్లాడి లాంటి మనసు , కష్టాలను చూసి రాటు తేలినతనం, అయినా ఒక నెమ్మదితనం . నా గాయాలకు సానుభూతి లేపనం . నా శరీరం పచ్చిగా ఉంటె , పడుకోనిచ్చే వాడు. నన్నే అలా చూస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. అతను వెళ్ళిపోయాక నా కళ్ళల్లో నీళ్ళు , మనసులో హాయి .. !

సుందరం  నన్నే అడిగేవాడు. నేను కూడా సుందరం రాగానే , తనకే అందుబాటులో ఉండేదాన్ని. అవొక అందమైన రోజులు. అస్థిరమైనవి. శాశ్వతం కాదు. కానీ ఆ క్షణాల అందం ముందు .. నేను అనుభవించిన నరకం బలాదూర్. అది ప్రేమ కాదు. సుందరం నాకు శాశ్వతం కాదు. కానీ ఆ నిమిషం, ఆ క్షణం నేను ఒక సమానమైన ఆడదాన్ని. వేశ్యని కాదు. ఆ ఫీలింగ్ ఎంత గొప్పగా ఉంటుందో నేను చెప్పలేను .

సుందరం వస్తే రేట్ తగ్గించమని దెబ్బలాడే దాన్ని . నా రేట్ నా చేతిలో లేకపోవటం గొప్ప దౌర్భాగ్యం . ఒకసారి అలానే ఏడిచాను. ఒక సాడిస్ట్ వెధవని గదిలోకి పంపింది కాంతం…గాయాలైపోయాయి,వాడి  పైశాచికత్వానికి పీలికలై ..రక్తపు చారికలైన వొళ్ళు. సుందరం కళ్ళల్లో నీళ్ళు. ఎన్ని .. ఆయింట్మెంట్ లు కొని తెచ్చి రాసాడో తెలీదు. రెండు రోజులు తనే వచ్చాడు కస్టమర్ లా.. నాకు మంచి స్నేహితుడు సుందరం.

సంబంధాలు కుదరనప్పుడు బాధ పడేవాడు. ఎన్ని మాట్లాడుకునేవాళ్ళమో.. నాకూ ప్రపంచానికీ కిటికీ సుందరం. అతని నుంచే చూసా నేను … మా ఊహల్ని.. బాధల్ని, ఆశల్ని నిరాశల్ని కూడా. నేనే చెప్పాను….కుటుంబం లాంటి ఎక్కువ రక్షణ వలయాలు లేని చోట నుండి పిల్లని తెచ్చి పెళ్లి చేసుకోమని. ఆమెకి తానే కుటుంబం ప్రేమ , తోడు నీడ అవగలడని. నిజమే తన ఫ్రెండ్ కూడా అదే చెప్పాడు అన్నాడు. తెలీకుండా నాలో సుందరం అంటే అంత ప్రేమ ఏర్పడిందా ? నేను గమనించనేలేదు అనుకున్నా.

సుందరం పెళ్లి అయిపొయింది. నన్ను పిలవలేదు. పాపం పిలవలేడు. సుందరానికి సంసారం నేర్పిన మాస్తార్ని కదా .. మాస్టారు ఎప్పుడూ స్కూల్ లోనే ఉండాలి. స్టూడెంట్స్ కదా .. ఒక్కో దశ దాటి వెళ్తూ ఉండాలి.

పెళ్లి తర్వాత సుందరం రాలేదు. అర్ధం చేసుకోగలను.

సంవత్సరం తర్వాత అనుకుంటా .. ఒకరోజు సడెన్ గా  వచ్చాడు. ఎప్పుడూ ముటముట లాడే మొహంది కాంతం కూడా మనఃస్పూర్తిగా ఆహ్వానించింది సుందరాన్ని. వొళ్ళు చేస్తాడనుకున్న సుందరం కొంచం డల్ గా , నీరసంగా ఉన్నాడు. ఎలా ఉన్నావు కరీనా .. అని అడిగాడు .. ఒక్క దెబ్బ వేయబోయి .. ఇద్దరం నవ్వుకున్నాం . మళ్ళీ పాతరోజుల్లా అనిపించింది.

” ఎలా ఉంది మీ ఆవిడ ?” అని అడిగాను..

” నన్ను పెళ్లి చేసుకుంటావా  కరుణా ?” సుందరం జవాబులా వినిపించే ప్రశ్న .

ఒకటే నవ్వాను. ” పెళ్ళాం వస్తే ఇంత మతి పోతుందా పంతులూ .. సానిదాన్ని నన్ను చేసుకోవటం ఏంటీ ?” నాకింకా నవ్వు ఆగటం లేదు .

” నిజమే అమ్మలూ.. తప్పే చేసాను. పెళ్లి చేసుకోవటం తప్పు. అంతకన్నా పెద్ద తప్పు నిన్ను చేసుకోక పోవటం .. అసలు మొదట్లో ఆ ఆలోచన రాకపోవటం . .! ” సుందరం మాటలకి, వాటిల్లో ఉన్న తీవ్రతకి నాకు నోట మాట రాలేదు.

” నేను అవిటి వాడ్ని. నువ్వు వేశ్యా వృత్తి లో ఉన్నావు. ఇలా తెలిసిన విషయాలు కాకుండా.. నన్ను చేసుకోవటానికి నీకు అభ్యంతరం ఏమన్నా ఉంటె చెప్పు .. !!”  పంతులు మాటల్లో అదే తీవ్రత.

” అలా అడిగితే … నేను పెళ్లి ..ఊహించలేదు ..!!” నా గొంతు లో వణుకు , గుండె వేగం తెలుస్తున్నాయి  నాకే .

కరుణా – మనం పెళ్లి చేసుకుందాం. శారీరక సుఖం కోసం మాత్రమే కాదు. కలిసి ఉండటం కోసం. గతంలో, నీ దగ్గరకి రావటం .. డబ్బులిచ్చి నీ శరీరాన్ని కొనుక్కోవటం ఎప్పుడూ తప్పు అనిపించలేదు. ప్రసన్న తో కలిసిన ప్రతీ నిమిషం వ్యభిచారం చేస్తుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఆమె గుండెల మీద తాళి .. ఆమెతో సుఖం కోసం నేను కట్టిన లైసెన్స్ లా .. ప్రతీ కలయికకీ .. నేను ఇచ్చే బహుమతులు తాకట్టు కి కట్టే వడ్డీ లా .. ఓహ్.. ఆ నరకం చెప్పలేను. నా కోరిక మీద నాకు అసహ్యం వేసేది .. ఆమె లేకుండా నేను ఉండలేనా .. ఇదేనా జీవితం. అనిపించేది. ముఖ్యంగా నగ్నమైన నా అవిటితనం తన కళ్ళల్లో నిద్ర లేపిన అసహ్యం తలచుకుంటే , ఆమెతో సుఖించినందుకు నామీద నాకే అసహ్యం వేసేది . నరకం చూసాను కరుణా ..

నువ్వు గుర్తు రాని క్షణం లేదు. ఆమె కి డబ్బు కావాలి. నేను, నా disability వద్దు. ధర్మేచ అర్ధేచ .. ఆమెకి అర్ధం అయినది కేవలం ఆర్దికమే అని తెలిసినప్పుడు.. అది  నాకు అర్ధం అయినప్పుడు… ఈ సంఘం, సాంప్రదాయం … వాటి కోసం నేను అణచుకున్న కాంక్షలు … ఈ బంధనాల తాళ్ళు ఒక్కసారి తెగిపోయి ఊపిరి తీసునట్టు అనిపించింది. ప్రసన్న కి కావలసిన డబ్బు, స్వేచ్చ ఇచ్చేసాను. నాకు కావలసిన అనురాగం, శాంతి, సంతోషం ఇవ్వగలవా ..???

అంత గొప్ప మాటకి నేనేం సమాధానం చెప్పగలను.. నిశ్శబ్దంగా నా ప్రేమ రాహిత్యాన్ని నెట్టేసిన  అతని  పాదాన్ని ముద్దెట్టుకోవటం తప్ప .

సుందరం అంత గొప్ప స్నేహితుడే కాదు, ప్రేమికుడు కూడా ..!!

***

నేనే సుందరాన్ని. చాలా రోజులు బ్రతుకు ఈడ్చాను. అమ్మ చెప్పిందని, పెళ్లి చేసుకుందామని పెళ్లి చూపుల్లో కూర్చున్నాను . వాళ్ళ చూపుల్లో నా హోదా మీద ఆశ, నా అవిటితనం మీద వెరపూ చూసాను. స్నేహితుని ప్రోద్బలంతో శరణాలయంలో ప్రసన్నని చూసాను. తల దించుకున్న ప్రసన్న  మోహంలో నా మీద అసహ్యం చూడలేనితనం మీద నా మీద నాకే అసహ్యం వేసింది. ఆమెతో సంసారం ఆమె చూపులనే కత్తుల తో, ఆమె కట్టే డబ్బు లెక్కలతో సహజీవనం అని అర్ధం అయ్యాక… నేనిలా జీవితాంతం బ్రతుకు ఈడ్చగలనా అని భయం వేసేది. నాకోసం నాకేం కావాలి? అని ప్రశ్నించుకుంటే, కరుణ చూపు రోజూ ఒక సజీవ జ్ఞాపకంలా వెంటాడేది. నేనెందుకు కరుణ ని అడగలేదు, ఈ ఆలోచన నాకెందుకు ముందు రాలేదు అని తిట్టుకున్నా, నా జీవితం నా చేతుల్లోకి తీసుకున్నాను . ఇంక తప్పదు ..! కరుణ ని అడగాలంటే సిగ్గు వేసింది… కానీ ఆమె చూపులోని ప్రేమ, సమానత్వం నాకు ధైర్యాన్ని ఇచ్చింది.

ఇన్నాళ్ళకి సంతోషానికి అర్ధం దొరికింది. సమాజం అవిటిది. స్వతస్సిద్ధ వికలాంగత్వం ఉంది దానిలో. దానికి నచ్చేలా ఉండాలని నా నడక కి ముసుగు వేసి, కష్టపడ్డాను. సమాజానికి లేని కరుణ .. నా కరుణ లో దొరికింది. నా నగ్నత్వానికి సిగ్గుపడని నా కరుణ తో కొత్త జీవితం .. నాలా ప్రారంభిస్తున్నాను. ఒక వేశ్య అయిన కరుణని పెళ్ళే చేసుకోవాలా? అని అడిగాడు నా స్నేహితుడు సత్తి . “ చేసుకోవాలి .. నా అవిటితనం నేనెలా తెచ్చి పెట్టుకోలేదో, వేశ్య అవుదామని తను కూడా అనుకోలేదు. ఆమె వ్యభిచారి అయితే, ప్రసన్నతో నేను చేసినదాన్ని కూడా వ్యభిచారం అనే అంటారు.. కనీసం మనసున్నవాళ్ళు ..!” – నా జవాబుకి వాడి కళ్ళు చెమర్చటం నేను చూసాను. నా బాధ అర్ధం చేసుకున్న నా స్నేహితుడు నా శక్తి. నేను సుఖపడాలని తపించే అమ్మకి, నా సంతోషం ఎక్కడ ఉందో చెప్పగలిగే సామర్ధ్యం నాకుందని నాకు తెలుసు.

కరుణ మనసులోని సుందరం కోసం, కరుణ ప్రేమ కోసం నేను ఏమైనా చేయగలను అనుకోవటం ఎంత శక్తో తెలుస్తూనే ఉంది.నా జీవితం ఇంక కాళ్ళీడ్చుకుంటూ నడవదు… వీళ్ళ పనికిమాలిన రూల్స్ కి అందనంత వేగంతో పరుగు మొదలెడుతోంది. ఇంక నాకు తీరిక లేదు . నేను నాలా ఉండటం లో ఉన్న సంతోషం దేనికీ సాటి రాదు.

నేను నిజంగా తెలివైన మంచివాడ్ని అని నాకిప్పుడిప్పుడే నమ్మకం కలుగుతోంది  ….!!!!!

 

–సాయి పద్మ

 

 

 

 

 

“మాటాడలేకపోతున్న నా కన్నీళ్లను కనీసం ప్రేమించు …”

కవులు కవిత్వం రాసి, ఒక కొత్త లోకంలో ఉంటారు, కొత్త కొత్త లోకాల్ని చూపిస్తారు. గొప్ప గొప్ప కవులు ఆ పనిని మరీ గొప్పగా చేస్తారు. తాము చదివిన కవిత్వంలోని తమకు నచ్చిన వాటితో బాటు, తాము కొత్తగా చెప్పాలనుకున్నవీ వారి రాతల్లో కనిపిస్తాయి. తమకు నచ్చనివి, ఎదిరించాలనుకున్న వాటి జాడలూ ఉంటాయి. భారతీయ సంస్కృత కావ్య ప్రభావాలతో నేపాల్ లో కవిత్వం వస్తున్నప్పుడు, అందుకు భిన్నంగా తమదైన భాషతో, భావాలతో కవిత్వం చెప్పి ఒప్పించిన ఆధునికుల్లో లక్ష్మీ ప్రసాద్ దేవ్కోట ముందున్నారు. 25 ఏళ్ల సాహిత్య జీవితంలో 40కి పైగా గ్రంధాలు రచించారు. వాటిల్లో లఘు కవితలనుండి దీర్ఘ కవితల వరకూ ఉన్నాయి, కథలు, నాటకాలు, అనువాదాలు, నాటకాలు, ఒక నవల కూడా ఉంది.. అతి సహజంగా సున్నితంగా సామాన్య జనులు వాడే భాషే వారి రచనల్లో కనిపిస్తుంది.

devkota

12 నవంబరు 1909 న బ్రాహ్మణ కుటుంబంలో దేవ్కోట జన్మించారు. లక్ష్మీ పూజ రోజున జన్మించారు కాబట్టి లక్ష్మీప్రసాద్ పేరు పెట్టారు. 16 ఏళ్లకే వివాహమై సంసారం బాధ్యతలు మీద పడ్డాయి. ఫలితంగా ఆర్ధికపరమైన అనేక ఇబ్బందులు పడ్డారు.  ఉపాధ్యాయుడిగా, చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ కాలం గడిపినా, ఎంతగానో ప్రేమించిన తన పిల్లల మరణాలు, వారిని మానసికంగా కృంగదీశాయి. దానికి తోడు అప్పటి రాజ వంశం రాణాలతో పడక కొన్నాళ్లు వారణాసిలో తలదాచుకోవల్సొచ్చింది. దేవ్కోటే లేకుండా, కుటుంబం నేపాలులో గడపడం భారమై, భార్య ఒత్తిడికి తలొగ్గి రాణాలకు ఎదురు తిరగనన్న వాగ్ధానంతో తిరిగి రావల్సొచ్చింది.

Laxmi-Prasad-Devkota

1936లో ప్రచురించిన ఈ “మూనా మదన్ ” ఒక విషాదాంత ఖండ కావ్యం. . నేపాల్ సాహిత్యంలో 20వ శతాబ్దంలో వచ్చిన  అత్యుత్తమ కావ్యంగా ఇప్పటికీ కొనియాడబడుతోంది. మొదటి ముద్రణ 200 ప్రతులైతే, 1986 సరికి 18వ ముద్రణకొచ్చి, 25 వేల ప్రతులు అమ్ముడయాయి, 1983 లోనే 7 వేల ప్రతులు అమ్ముడయాయి. ఇప్పటికీ వేలకొద్దీ అముడవుతూనే ఉన్నాయి. 2012 నాటికి 24వ ముద్రణకు నోచుకుంది. ఇప్పటివరకూ పదిలక్షల ప్రతులకంటే ఎక్కువ అమ్ముడయాయని అంచనా. 1959లో మరణశయ్యమీద ఉంటూ కూడా, తన సాహిత్యాన్నంతా తగలెట్టినా, ఈ ఒక్క కావ్యాన్ని మాత్రం తగలెట్టకుండా చూడాలని వేడుకున్నాడు. ఈ కావ్యం మీద అతనికంత మమకారం. నేవార్ భాషలోని బౌద్ధ జానపద  గేయం ఈ కావ్యానికి ఆధారమని విమర్శకులంటారు. ఈ కావ్యం ఆంగ్లం, రష్యన్, కొరియన్, చైనీస్, మైథిలి, అవధి భాషల్లో అనువాదమైంది. ఈ కావ్యం ఆధారంగా అనేక నాటకాలు ప్రదర్శించబడుతూనే ఉన్నాయి. నేపాలీలో చలనచిత్రంగా కూడా రూపొందింది.

Devkota Stamp

అయిదుగురు కుమార్తెలు, నలుగురు కుమారుల సంతానంలో, ఒక కుమార్తె ఇద్దరు కుమారులు వారి జీవిత కాలంలోనే మరణించారు.  మరణించే ఏడాది ముందు ఒక మూడునెలలపాటు నేపాల్ ప్రభుత్వంలో విధ్యామంత్రిగా పనిచేసారు. 14 సెప్టెంబరు 1959 న కేన్సర్ మూలంగా లక్ష్మీప్రసాద్ దేవ్కోటే మరణించారు.  లక్ష్మీ ప్రసద్ దేవ్కోటా ని మహకవిగా నేపాల్ కీర్తిస్తుంది.   2009 లో దేవ్కోటా శతాబ్ది ఉత్సవాలు నేపాలులో ఘనంగా జరుపుకున్నారు. ఆ సందర్భంగా తపాలాబిళ్లని సైతం విడుదలచేసింది.

 

మూనా:

అగ్గి

అగ్గి రాజుకుంటోంది నా మనస్సులో

వెళ్లొద్దు, నా జీవితం నుండి వెళ్లొద్దు

నా కళ్ల కాంతి, నా రాత్రి నక్షతం

నీ వెలుగును తీసేయవద్దు

నా గుండె చీల్చి చూడు

బహుశా నా గుండెలో దృశ్యం

నీ మనస్సు మారుస్తుందేమో

బదులుగా తాగడానికి విషం నాకు ఇవ్వు

నా కన్నీళ్లలో బాధ చూడు

కానీ కన్నీళ్లు మాటాడవు

ఆలోచనలు మనసులో ఉండిపోతాయి

మాటాడలేకపోతున్న నా కన్నీళ్లను కనీసం ప్రేమించు

 

మదన్:

మూనా ప్రియా, ఇలా మాటాడొద్దు

నేను తిరిగొచ్చేస్తాను

లాసాలో ఇరవయి రోజులే ఉంటాను

ఇరవయి రోజులు ప్రయాణంలో –

నవ్వు, నువ్వు నవ్వుతే

నేను ఇంద్ర భవనంలో ఉన్నట్టుంటుంది

నా సంకల్పం, సాధించడమో చావడమో

నా దారిలో నీ కన్నీళ్ల అడ్డు వేయొద్దు

సూర్యుడితో కొంగలు తిరిగొస్తాయి

మనం కల్సుకునే రోజు మరో గొప్ప రోజవుతుంది

 

మూనా:

నా రాముడా, నా కృష్ణుడా

రాత్రి సూర్యుడా

నువు ఎగిరిపోయేందుకు తయారవుతుంటే

నా నవ్వుల్ని ఎలా కలపను?

ఇక్కడ నన్ను వదలొద్దు

నీ పక్కనొక చిన్న వెలుగుని

నువు లేకుండా నేనొక రాయిని

నీతో నన్ను తీసుకుపో

నా చేతులు కలుస్తే

మనం అడవుల్ని, కొండల్ని, శిఖరాల్ని

ఖూనీకోర్లను సైతం ఎదుర్కోగలం

 

మదన్:

మూనా, నా మూనా

అమ్మ వైపు చూడు, ఆమె వైపు

దీపాన్ని పోషిస్తున్న నూనెలా ఇంకి పోతోంది

మనిద్దరమూ కలిసి ఆమేను వదిలేయలేం

ఇక్కడే ఉండి, ఆమెను భద్రంగా చూసుకో

దాదాపు అరవయి చలికాలాల్ని ఆమె చూసింది

నీ మెరిసే  మొహంతో ఆమె మురిసిపోవాలి

 

మూనా:

అమ్మ ప్రేమ, ఆమె నెరిసే జుత్తు, బలహీన శరీరం,

ఇవేవీ నీ కాళ్లని కట్టిపడేయటం లేదు

ఆమె వాత్సల్యపు నీడలు పిలుస్తాయి

కానీ అవి నిన్ను ఆపలేవు

అమ్మ ప్రేమంత అమూల్యమైనదా

ఏమి గడిస్తావు ఆ ప్రాంతంలో

బంగారం మూటలు నీ చేతికంటుకునే మురికి

సంపదతో ఏమి చేసుకుంటాం

చారు, కూరగాయలు, మానసిక శాంతి చాలు

ఉండిపో, అలోచనల్ని శాంతపర్చు

 

మదన్:

నేనేమి చేయను?

– మా అమ్మ గొంతులోకి ఒక గుక్కెడు పాలు

– ఆమె విశ్రాంతికోసం ఇంటి కలలు

– తనవారికోసం కుళాయిలు

– నీ సున్నితమైన చేతులకు సుందరమైన గాజులు

– అప్పుల్లో అపాయంలో ఉన్న ఇంటికి గట్టి పునాదులు

ఈ కోరికలు మనస్సులో జోరీగలా పాట పాడుతున్నాయి

మూనా, వాటి సంగీత స్వరాలు నా కాళ్లను ముందుకు తోస్తున్నాయి

పైన దేవుడి దయవలన నాకు దృఢమైన హృదయమే ఉంది

కోపోద్రిక్తమైన వరదల్ని బాగానే దాటగలను

కానీ అనుకోనివి జరుగుతే, నేనీ పాటతోనే మరణిస్తాను

 

మూనా:

నా లోహృదయంలో ముడి బిగించు

తిరిగి రావద్దులే

మరచిపోలేని నీచిత్రాన్ని గుర్తుగా గీసుకుంటాను

లాసా కన్యలు నర్తిస్తారు

బంగారంతో చేసిన బొమ్మల్లా ఉంటారు

బంజరు భూములు, కొండలమీద వారు ఆడుతుంటే

వారి స్వరాలు ప్రవాహంలా నవ్వుతాయి

నా ప్రియా, సరే వెళ్లు

ఇంటిని నగరాన్ని చీకటి చేసి

కన్నీటికీ శక్తి లేదు

చీకటిలో జ్ఞాపకాలు బహుశా తళుక్కుమంటాయి లేదా మెరుపులా మెరుస్తాయి

దుఃఖం నా దుస్తులమీద చిమ్ముతుంది

మదన్ టిబెట్ ప్రయాణాన్ని వివరిస్తూ కథకుడు

నగ్న భూమి, పూర్తీ ఏటవాలుగా కొండలు

వెయ్యి సహస్రాలు నీళ్లలో దిగి నడవాల్సిన నదులు

టిబెట్ రహదారి నిర్మానుష్యం,  రాళ్లు రప్పల మయం

పొగమంచుతో విషపూరిత తుంపర

చల్లటి మంచు వర్షంతో బరువెక్కి తిరుగుతున్న గాలి

 

గుండ్రంగా గుండు గీయించుకున్న బిక్షువులు

మందిరాలు, దహనపు దుంగలు

ఆ తరువాత మంటల ముందు ప్రాణమొచ్చినా

రహదారిలో చచ్చుబడుతున్న కాళ్లు చేతులు

చలికి కొరుక్కుంటున్న పళ్లకు

తడాకు కొమ్మల చక్కని బొంత

ఉడకేసినా తినలేని

పచ్చి ముతక బియ్యం

 

చివరికి  సాయంత్రపు చూపుకి

బంగారం పైకప్పు దర్శనం

లోయల అంచున, పొటాలా పాదాల దగ్గర

లాసా తానే నవ్వుతోంది

పొటాలా కొండలా ఆకాశాన్ని అంటుతోంది

రాగి బంగారంతో అల్లినట్టున్న కొండ

 

యాత్రికులు బంగారం పైకప్పు చూసారు

గంధర్వుడి దుస్తుల్లా సకల రంగుల రాళ్లతో అలంకరించిన

జడల బర్రె జుత్తుతో కప్పి దాచిన, బంగారం బుద్దుడున్న

దలైలామా విశాల భవనం

గుంటలుపడ్డ కళ్లతో గురువులకు

వంగి నమస్కరిస్తున్న బాటసారులు

మంచుతోకప్పిన శిఖరాలు, చల్లటి నీళ్లు

ఆకుపచ్చని ఆకులతో చిగురిస్తున్న చెట్లమీద

తెల్లగా విచ్చుకుంటున్న తుమ్మ పూలు

 

ఇంటివద్ద మూనా పరిస్థితి వివరిస్తూ కథకుడు:

విచ్చుకున్న పద్మంలా, ఏకాంతంలో మూనా

వెండి మేఘాల అంచుల్ని చంద్రకాంతి తాకుతున్నట్టు

ఆమె సున్నితమైన పెదాల నవ్వు, ముత్యాల జల్లు

దగ్గరపడుతున్న చలికాలపు పూవులా ఆమె వాడిపోతోంది

ఆమె కన్నీళ్లు రాలి డుతున్నాయి

విశాల నేత్రాల్ని తుడుచుకుంటూ మదన్ తల్లిని చూసుకుంటోంది

కానీ ఆమె తన ఒంటరి గదిలో నిద్రిస్తున్నపుడు

వేలకొద్దీ వ్యాకులాలతో ఆమె దిండు తడుస్తూనే ఉంది

ఆమె పగలూ పొడవైనవే

రాత్రులూ పొడవైనవే

+

గుండెల్లో గుచ్చుకున్నా

పక్షి తన రెక్కల్లో బాణం దాస్తున్నట్టు

నిశ్శబ్దంలో మరుగుపరుస్తూ

ఆమె దుఃఖాన్ని తన హృదయంలో దాస్తుంది

దినాంతపు దీపం మినుకుమినుకు మంటున్నట్టు

ఆమె ప్రకాశిస్తుంది

 

ఆకురాలు కాలమొస్తున్నపుడు

వాడిపోతున్న పూవందమూ పెరుగుతుంది

నల్ల అంచుల మేఘాలు వెండివవుతున్నపుడు

చంద్రుడూ ప్రకాశిస్తాడు మరింత కాంతిగా

వీడ్కోలు సమయంలో మదన్ మొహం గుర్తుచేసుకుంటే

ఆమె గుండెల్లో దుఃఖం తళుక్కుమంటుంది

చలికాలపు కన్నీరు పూలమీద పడుతుంది,

నక్షత్రకాంతి, రాత్రి కన్నీరై నేలమీద పడుతుంది

 

స్త్రీలు రరకాల కధలతో వస్తారు

పురుషులు ప్రేమను ఒలకబోస్తారు

చూడు –  గులాబీ అందమైనది

కానీ సోదరా దాన్ని ముట్టుకోవద్దు!

కోరికతో దాన్ని పాడుచేయొద్దు

ప్రాణం, అద్భుతమైన దేవుని రత్నం

వికృతపర్చే ప్రయత్నం చేయొద్దు

 

మూనా:

కీటకాల నగరానికి వెళ్లు

నీ మాటలు చెప్పు

చంద్రుడిని కింద పడేయ్

కొండల్ని పైకి లేపు

 

అతని పాదాలకోసం

నా స్వర్గం కోసం ఎదురుచూస్తాను

దేవుడు నాలుగు అందమైన రోజులు సృష్టించాడు

అది జీవితం

వాటిని పాడుచేయడానికి బురద జల్లొద్దు

 

మదన్ తిరుగు ప్రయాణాన్ని వివరిస్తూ కథకుడు:

మృదువైన  స్పటికపు బంగారం, కొత్త దేశం,

కొత్త కాంతి, కస్తూరీ సుగంధం

ఆరునెలలు గడిచిపోయాయి, ఏడవది మొదలవుతుంటే

తన మూనాని, తన  అమ్మని తలుచుకుని

అమాంతం ఉలిక్కిపడ్దాడు మదన్

తన గుండెలో నీళ్లు పరుగెట్టాయి

 

ఒక పావురం నగరం మీద ఎగురుతూ

రేవు దగ్గర నదిని దాటింది

మదన్ మనస్సు ఇంటికి ఎగిరింది

కూర్చుని తిరిగిరావడం ఊహిస్తే

దుఃఖంతో విశాలమైన  నేత్రాలతో

బాదంకాయల్లా మూనా కళ్లు

 

‘ఠంగ్ ‘ మని సంఘారామం గంట మోగింది

మేఘాలన్నీ ఒకచోట కలుసుకున్నాయి

కొండనీడలు సాయంత్రానికి పొడవయాయి

వేదన ధ్యానంలో గాలికి చల్లబడ్డాడు

లేచి చూస్తే చంద్రుడు ఉన్నితో కప్పబడ్డాడు

తన తల్లి, తన మూనా అతని కళ్లల్లో నాట్యం చేస్తున్నారు

ఆ రాత్రి అతనికి స్పష్టమయింది

అతని దిండు కన్నీటితో తడిసింది

 

అతని హృదయాన్ని వేధిస్తూ ఎరుపెక్కుతున్న ఆకాశం

అతను బంగారం మూటల్ని మూట కట్టుకున్నాడు

కస్తూరి సంచుల్ని సర్దుకున్నాడు

దేవుణ్ని తలుచుకుని మరి కొందరు మిత్రులతో

లాసానుండి బయలుదేరాడు

 

మూనా:

ఏమి పీడకల!

ఒక దున్నపోతు నన్ను కిందికి లాగింది

నేను బురదలో పడిపోయానత్తా

నల్లటి దున్నపోతు నన్ను కిందికి తోసేసింది

 

మదన్ తల్లి:

రా తల్లీ!

బయంతో వణికిపోకు

నీకొచ్చే చెడునంతా

నా తలమీదికి నేను తీసుకుంటాను

అలా ఊగిపోకు

 

మూనా:

నా కనురెప్పలు అదురుతున్నాయి

నా గుండె నొప్పెడుతోంది

ఏదో చెడు నీడ ఇంటిలోకి ప్రవేశించింది

బహుశా తొందరలోనే రావాలనుకుంటున్నా

అతనికి సమయం దొరకడం లేదేమో

ఎత్తైన పర్వతాల దారేమో

అందుకే రాలేకపోతున్నాడేమో

 

కథకుడు:

తిరుగుప్రయాణంలో మదన్ కలరా వ్యాధిని పడతాడు

 

మదన్:

కాకులకి, గద్దలకి

నన్ను వదిలేయొద్దు! నన్ను వదిలేయొద్దు

మిత్రులారా! నేనింకా చావలేదు

నేను నిల్చోగలను

నా గొంతు ఎండిపోతొంది

గుండెలో మంటగా ఉంది

నా కన్నీళ్లు తుడవండి

నాకింకా శ్వాస ఉంది.

 

మదన్ సహచరులు:

మా దగ్గర మందులు లేవు

ఉండటానికి ఇక్కడ ఎవరూ లేరు

మనలో ప్రతి ఒక్కరం ఏదో రోజు చావాల్సిన వారమే

ఇక్కడే ఉండు! దేవుడు నీకు మోక్షం ప్రసాదిస్తాడు.

 

కథకుడు:

మదన్ మోచేతులానించి లేస్తాడు

అతని మిత్రులు వెళ్లిపోయారు, దినాంతం ఎరుపులో కొట్టుకుపోతోంది

గాలి నిద్రపోతోంది, పక్షులు నిశ్చలమైనాయి, చలిగా ఉంది, అతను కింద పడిపోతాడు

 

మదన్:

ఏమిటీ మంట?

అడవి కాలుతోందా?

ఈ మంట మరణించినవారిని చంపుతుందా?

ఇది బందిపోటా,  దొంగా?

ఇదేమన్నా రాక్షసా?

 

కథకుడు:

సహాయం కోసం అరుద్దామనుకున్నాడు మదన్ .

 

టిబెట్ వాసి:

ఏవరు ఏడుస్తున్నారు? ..

నిన్నిలా వదిలివెళ్లిన నీ మిత్రులు చెడ్డవాళ్లు

మా ఇల్లు కొన్ని మైళ్ల దూరంలో ఉంది

నిన్ను అక్కడకు తీసుకుపోతాను

నువు చావవు, బాగవుతావు.

 

మదన్:

టిబెట్ సోదరుడా, నువు దేవుడువి,

నీ మాటలు అపురూపంగా ఉన్నాయి

నాది గొప్ప వంశమని, గొప్ప కులానికి చెందినవాడినని చెప్పారు

గౌరవంతో నీ పాదాల్ని ముట్టుకుంటాను సోదరా

నీ పాదాల్ని పట్టుకుంటాను.

మనిషి గొప్పతనం తెలిసేది అతని హృదయాన్ని బట్టి

అతనితో తెచ్చుకున్న వంశాన్ని బట్టి.

కులాన్నిబట్టీ  కాదు

 

కథకుడు:

టిబెట్ వాసి అతన్ని తన ఇంటికి తీసుకుపోతాడు, ఉన్నిమీద పరుండబెడతాడు, నీళ్లిస్తాడు, దయ చూపిస్తాడు, మూళికలకోసం వెదుకుతాడు, వాటిని దంచి రసాన్ని తాగిస్తాడు. శక్తికోసం జడలబర్రె పాలిస్తాడు. మదన్ ఇంటిదగ్గర నారింజ పూలు పూస్తున్నాయి, ఆలోచనలు మెత్తగా అశుభంగా ఉన్నాయి.

 

మూనా:

నువు నన్ను మరచిపోయావు

నువు నన్ను ఎలా మరచిపోగలవు నాకు చెప్పు?

ఏ పాపిష్టి దేవుడు నిన్ను తీసుకువెళ్లాడు

కొండల్ని తెరలు కప్పేసాయి, నేను చూడలేను

నిన్ను నేను చూసే చిత్రం శూన్యంగా ఉంది

నా కలల్లో నీ స్వరం కుశలం కథలు చెబుతాయి

వాటితో ఎగిరిపోడానికి నాకు రెక్కలు లేవు

ప్రియా నిన్ను వెదకలేను

ఈ సంపదనొదిలి ఆ నగరంలో ఎందుకుంటున్నావు?

నువు కుశలమే కదా? నా ఆలోచనలొచ్చినపుడు

నీ కళ్లు కన్నీళ్లతో నిండవా

ధూళి అంటదా, ముళ్లులా బాధించవా?

 

కథకుడు:

టిబెట్ వాసికి ధన్యవాదాలు చెప్పి, కృతజ్ఞతగా కొంత బంగారం ఇవ్వాలనుకుంటాడు మదన్, కానీ టిబెట్ వాసి భౌతిక పారొతోషకాల్ని నిరాకరిస్తాడు.

 

టిబెట్ వాసి:

ఈ పచ్చ బంగారంతో నేనేమి చేసుకోను?

నా పిల్లలు ఈ బంగారాన్ని తిననూ లేరు,

వారికి వెచ్చదనమూ ఇవ్వదు

నా భార్య చనిపోయి స్వర్గంలో ఉంది

మేఘాలే ఆమె అలంకరణలు, ఆమె ఆభరణాలు, బంగరమూనూ.

 

కథకుడు:

మదన్ దుఃఖపడతాడు.

 

టిబెట్ వాసి:

అదృష్టం కలిసొచ్చి నేను సాయపడ్డాను

సాయాన్ని సంపదతో తూచలేను

నా పిల్లకోసం మీ తల్లిని ప్రార్ధించమనండి చాలు

 

కథకుడు:

స్పష్టమైన మొహం చూసి మదన్ తల్లి పిలుస్తుంది

గాలి ప్రత్యుత్తరంగా  మందమారుతమై తాకుతుంది

కళ్లల్లో కన్నీళ్లు లేవు, శాంతం తప్ప

సాయంత్రపు మెత్తదనం కొలనులో ప్రతిఫలిస్తుంది

ఆమే మూనాని దగ్గరకు తీసుకుంటుంది.

 

మదన్ తల్లి:

నా సమయం దగ్గరపడింది, నేను ఈ జీవనదిని దాటిపోవాలి

నా కొడుకు పెళ్లామా ఏడ్చి లాభం లేదు

పిల్లా, ఇది అందరి దారి

పేదలు సంపన్నుల రహదారి

ఈ మన్ను మన్నుగా మారి

దుఃఖ తీరంలో కోల్పోతుంది

విచారపు వరదకు ఎదురొడ్డి నిలవాలి

ఓడిపోవద్దు

నేను ప్రపంచ పుష్పాన్ని చూసాను

వాడిపోవ డమూ చూసాను

నా వేదనలో, కూతురా, దేవుడ్ని గుర్తించగలిగాను

ఇక్కడ నాటిన విత్తనాలు స్వర్గంలో పెరుగుతాయి

నీవీ ప్రాంతాన్ని వదిలినపుడు

ప్రేమతో నువు ఇచ్చినవే నీకు తిరిగొస్తాయి

నా వైపు చూడు, నాకు నేను చేసినవన్నీ తీసుకుపోతాను

నువు కలలో చూసిన బంగారం నేను తీసుకుపోతాను

నేను వెళ్లాలి, కానీ మదన్ వస్తున్నాడా?

ఈ ప్రపంచానికి నా కళ్లు మూతపడకముందే

నాకు వాడిని చూడాలని ఉంది

వాడిని చూడకముందే గనక నేను చనిపోతే

ముసలామె ఏడ్వద్దందని వాడికి చెప్పు

 

మూనా:

అమ్మా! మీ జ్ఞాపకాల్ని కన్నీళ్లతో కడిగి మెరిపిస్తాను

ఏమీ కాలేదు, ఇంకా మీరు కలత చెందొద్దు

 

కథకుడు:

మదన్ తల్లికి వణుకు మొదలవుతుంది,

స్వరం క్షీణిస్తుంది,

మూనా చేతులకోసం వెదుకుతుంది

దొరికినపుడు పట్తుకుని

దూరపు గొంతుతో “నా కొడుకేడి?” అనడగుతుంది

ప్రచండ గాలి కొమ్మల్ని ఊపుతుంది

కాకి అరుస్తుంది, ప్రయాణీకులు శిఖరాల్ని చూస్తారు.

 

మదన్ అరచేతుల్లో మొహం

భుజాలు మోకాళ్లమీద పెట్టుకుని

అరుస్తున్న కాకిని చూస్తాడు

 

మదన్:

మా నగరాన్ని చూసావా?

మా ఇల్లు ఆ లోయలో పరిశుభ్రంగా ఉంటుంది

మా అమ్మ దగ్గరకు వెళ్లు, ఆమెది తెల్ల జుత్తు

మూనా దగ్గరకూ వెళ్లు, ఆమె మెరుస్తుంటుంది

వాళ్లకు చెప్పు నేను బాగున్నానని

నాకోసం ఆందోళన చెందొద్దని

ఇంటిముంగిట చెట్ల ఫలాలు పక్వానికొచ్చుంటాయి

వెళ్లు తిను, వారికి నా కధ చెప్పు

 

కథకుడు:

రాత్రి నగరంలో వింత అరుపులు వినిపిస్తున్నాయి.

తడిసిన కళ్లు, కాంతిహీనంగా దీపాలు, తీవ్రమైన గాలులు,

కుక్కల అరుపులు, కనిపించని చంద్రుడు.

మదన్ మరణించినట్టు పుకారు ఇంటికి చేరుతుంది

ఆకులు కన్నీరు కారుస్తున్నాయి

లేత చెట్టు విరిగి నేల రాలుతుంది

ముసలామె శ్వాస పెనుగులాడుతుంది

మూనా కూలిపోతుంది.

 

మదన్:

నేనెందుకొచ్చానమ్మా?

ఏమి చూడాలనొచ్చాను?

అమ్మా, నువు నా గుండె కోస్తున్నావు

నా మొహం చూడు, అమ్మా, నన్ను చూడు

నేనొచ్చాను. నేను పాపం చేసాను. నన్ను చూడు

నేను దగ్గరగా ఉంటే నువ్వెటో చూస్తున్నావు ఎందుకు

ఏడుస్తున్న నన్ను చూడు. ఓదార్చు నన్ను

వెళ్లొద్దు, వెనక్కొచ్చేయ్

నన్ను పోల్చలేదా?

నిన్ను కనీసం చూసుకోలేకపోయాను

నీ మొహంమీద విస్తరించిన ఈ శాంతి ఏమిటి?

నాతో మాటాడు. నీ సున్నితమైన మనస్సుని

నేను బాధించగలనా

అమ్మా, నేను బంగారం మూటలు తెచ్చాను

నా పాదాల దగ్గరుంచాను

మనం విశ్రాంతి గది కట్టుకుందాం

నువు చెప్పిన దగ్గర. కుళాయిలు

తిరిగొచ్చేయ్, ఆకాశాం వైపే చూపిస్తూ అటు చూడొద్దు

 

కథకుడు

మూనా కనిపించక, సోదరి ఇంటికి వెళతాడు మదన్

 

మదన్:

చెప్పక్కా, చెప్పు, నా మూనా ఎక్కడ?

అమ్మ మరణిస్తున్నా, ఆమె అక్కడ లేదు

 

మదన్ సోదరి:

నువులేకపోవడం భరించలేక,

దుఃఖంతో ఆమె తన తల్లిదండ్రుల దక్కరకు వెళ్లింది

తిరిగి రాలేదు

మదన్:

అమ్మనొక్కర్తినీ వదిలి వెళ్లిందా?

నేను లేనపుడు ఆమెను ఎలా వదిలి వెళ్లగలిగింది?

 

మదన్ సోదరి:

ఆమెకే ఆరోగ్యం బాగులేక,  ఆమె వెళ్లిపోయింది

కోడలుగా వజ్రంలా మెరిసింది

ఆమెకు బాగులేకే వెళ్లింది

 

మదన్:

మూనా ఎలా ఉంది, ఎవరు వెళ్లారు ఆమెను చూసేందుకు?

ఆమె నీళ్లు అడిగుంటుంది

తాగేందుకు ఎవరిచ్చారు ఆమెకు నీళ్లు?

 

మదన్ సోదరి:

ఆమెకు నీళ్లవసరం లేదు, ఆమెకు బాగయింది

నీ మూలికలు ఆమెకు అవసరం లేదు

తమ్ముడా, ఆమెను నేను కలిసేదాన్నే

కానీ ఆమె ఇంటికి దారి నాకు తెలియలేదు

 

మదన్:

ఆమెకు బాగయితే తిరిగి రాలేదెందుకు?

ఎందుకు తిరిగి రాలేదు?

 

మదన్ సోదరి:

తల్లిదండ్రులనుంచి ఇంటికొచ్చేందుకు

ఆమె దారులకోసం వెదికింది, దారులేవీ లేవు

 

మదన్:

ఇదేదో వింతగా ఉంది. నువు చెప్పేదేమిటి?

 

మదన్ సోదరి:

కాంతి నిండిన నగరంలో

ఆమె మేఘాల్లో ఉంది

 

మదన్:

అక్కా, మూనా ఇక్కడే ఉందని చెప్పు

ఈ భూమిమేదనే ఉందని చెప్పు

ఆమె వెనక్కు ఎప్పుడొస్తుందో చెప్పు

 

మదన్ సోదరి:

జీవనది కావల ఆమె ఉంటోంది

కానీ ఆమె పువ్వులతోబాటు నవ్వుతోంది

నీటితోబాటు నర్తిస్తోంది

నక్షత్రాలతోబాటు మిణుక్కుమంటోంది

కోకిలతో మాటాడుతోంది

మెరిసే ఆమె కళ్లు

మంచుతో కన్నీరు కారుస్తున్నాయి

ఆమె విచారంగా ఉన్నప్పుడు

మంచు ముద్దకట్టడం చూస్తావు

తమ్ముడా, మూనా చావలేదు

పక్షులు ఆమె పాటను కట్టాయి

అవి పాడగా నువు విను

 

మదన్:

మూనా చావలేదు, ఆమె బతికే ఉందని చెప్పు

ఆమె తల్లిదండ్రుల దగ్గరే ఉందని చెప్పు

నా ఆశల వ్రేళ్లు,   నా మానసిక రెక్కలు

మూనా ఇక్కడే ఉందని చెప్పండి

ఆమె ఎప్పుడు తిరిగొస్తుందో చెప్పండి

 

మదన్ సోదరి:

ఇక్కడ ఈ బూమికీవల ఆమె లేదు,

దుఃఖం చొరబడనిచోట ఆమె ఉంటోంది

ఊహలకావల స్వర్గం తోటలో

ఆమె ఆనంద పుష్పాలను కోసుకుంటోంది

 

మదన్:

కృరమైన అక్కా, నీ మాటలే మరణం.

ఆశల మొగ్గలు నా కళ్లముందే వికసించి నేలరాలడం

చెవులు విని, గుక్కెడు విషం తాగడం

మూనా, ఓ మూనా, నువు నా ఆరాధ్యానివి

నా జీవిత బంధానివి.

నా జీవితమా ఎందుకు వదిలిపోయావు

 

అక్కా, నేను మూనాని చూడాలి

ఆమెను పిలువు అక్కా , కాస్సేపైనా ఆమెను చూడనివ్వు

ఓ మూనా, నా మూనా, కిందికి దిగిరా నా దగ్గరకు

నా రాణీ, నిన్ను కాస్సేపైనా చూసుకోనీ.

 

మదన్ సోదరి:

నా తమ్ముడా, బంగారం, మనస్సు కుదుటబెట్టుకో

ఈ పాడు జీవితం పోవాలి,

పిడికెడు బూదిదను చివరకు గాలి ఎగరేసుకుపోతుంది

ఈ మాంస పుష్పం వాడి నేలరాలాల్సిందే

 

మదన్:

తెలుసా అక్కా , నా గుండె పగిలిపోతోంది

మనం బంగారంతో ఏమి చేసుకుంటాము అంది మూనా

భగవంతుడా, ఆమెను అలా తయారుచేసి

నువ్వు చేసింది నువ్వే ఎలా ధ్వంసం చేయగలవు

ఈ పుష్పాన్ని నువ్వెలా మలిచావు

ఎలా లాక్కుపోగలిగావు

ఈ పుష్పాన్ని నువు నాకిచ్చావు

ఎలా నాశానం చేయగలిగావు ఇలా?

నేనామెను ముందు చూసినపుడు

మూనా మొహాన్నే ముందు చూసాను అక్కా

మూనా మరణిస్తుందని ఏనాడూ అనుకోలేదు

ఆమె ఎప్పటికీ చావదనుకున్నాను అక్కా

అగ్ని ఎలా ఆహుతి చేసిందామెని?

నా గుండెకు హత్తుకోడానికి

ఆమె నాకు ఎక్కడ దొరుకుతుంది

ఆమె బూడిద నాకు ఇవ్వు అక్కా

ఆ బూడిదను నా గుండెకు పులుముకుంటాను

అమ్మా, మూనా, నేనిక్కడ ఉండను

నేనిక్కడ ఉండను అక్కా

నేనుండను

 

ఈ భూమి వైపు చూడొద్దు మూనా

నేను కూడా వస్తున్నాను

నువు వదిలి వెళ్లిన

కన్నీటి గుర్తులతో

ప్రేమ రత్నాలతో

నేను కూడా వస్తున్నాను

 

–         అనువాదం: ముకుంద రామారావు

 

 

నినదించే కవిత్వం ‘చెర’ ప్రతి పదం!

cherabandaraju1

చెరబండ రాజు ఇక లేడు.

ప్రజలకోసం అంకిత భావంతో అశ్రాంతమూ శ్రమించిన వాడు… పది సంవత్సరాలపాటు ప్రభుత్వం అతన్ని వెంటాడింది. ప్రజలకోసం ప్రజలభాషలో కవిత్వం రాసేవాళ్లని రాజ్యం పెట్టే హింసలు గిరిజన, రైతాంగ వీరులని పెట్టే హింసలకి తులతూగుతుంది. అయితే అతని మార్గదర్శకుడూ, శ్రీకాకుళం విప్లవ కవీ అయిన సుబ్బారావు పాణిగ్రాహిలా అతన్ని ప్రభుత్వం చంపలేదు… అతను బ్రెయిన్ ట్యూమర్ వల్ల చనిపోయాడు,అంతమాత్రం చేత అతని ఆరోగ్యం మీద అతను పదే పదే జైలుకి వెళ్లిరావడం యొక్క ప్రభావాన్ని తక్కువ అంచనా వెయ్యలేం. అతను మొదటిసారి 1971లో PD Act క్రిందా, 1973లో MISA Actక్రిందా, సికిందరాబాదు కుట్రకేసులో ఇరికించి 1974 లోనూ అరెస్టు అవడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ లో ఇతర విప్లవ కవుల్లా ఎమర్జెన్సీ సమయం అంతా జైల్లోనే గడిపేడు… ఆ సమయంలో అతను పేగు సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నప్పటికీ. (బ్రెయిను ట్యూమరు అనంతర పరిణామం).  అతని సన్నిహిత మిత్రులతనిని ముద్దుగా ‘చెర ‘ అనిపిలుస్తారు… అతని జీవితానికి ‘చెర ‘ అంత చక్కగా అమిరిపోయింది.

పూర్వపు హైదరాబాదుజిల్లాకి చెందిన అంకుశపురం గ్రామంలో బద్దం భాస్కర రెడ్డి గా జన్మించిన చెరబండ రాజు, ప్రాచ్యభాషాహిత్యంలో పట్టా తీసుకుని హైదరాబాదులోనే ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు బోధించేవాడు. అతను మరో అయిదుగురు  కవులతో కలిసి దిగంబర కవులలో ఒకడిగా 60వ దశకం చివరలో ఒక్క సారిగా తెరమీదకి వచ్చేడు.  వాళ్ళు …. చెరబండ రాజు జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, నగ్నముని, మహాస్వప్న, భైరవయ్య… వంటి చిత్రమైన పేర్లు పెట్టుకుని అద్భుతమైన కవిత్వం రాసేరు. ఆ ఉద్యమం ప్రాధమికంగా వ్యక్తుల్నీ, సిద్ధాంతాల్నీ లక్ష్యపెట్టకుండా పేరుకుపోయిన విశ్వాసాల్ని విధ్వంశం చేయ సంకల్పించినది… దానికి వాళ్ళు ఎన్నుకున్నవికూడా ఘాటైన అశ్లీలమైన పదాలు… భ్రష్ట ఛిద్ర శృంగార జీవితాల్లోంచి ఎంచుకున్న ప్రతీకలూను. దానికి తగ్గట్టే ఆ రోజుల్లో గౌరవించడానికి యోగ్యతగల వ్యక్తులు గాని, సిద్ధాంతాలు గానీ లేవు.

అవి చెకోస్లోవేకియా సోషలిజానికి అనువుగా ఉండడానికి రివిజనిజం యుద్ధ టాంకులు నడిపి అణగదొక్కిన రోజులు; ఒక తరం తరం యువత యావత్తూ అసాంఘిక కార్యకలాపాలవైపూ, అరాచకపు అలవాట్లవైపూ మరలిపోతుంటే, ఇంకోవైపు  ప్రాన్సులో కోపోద్రిక్తులైన విద్యార్థులని ంచుకుందికి జీన్ పాల్ సార్ట్ర వంటి సంప్రదాయ వ్యతిరేకి తప్ప వాళ్లగోడు వినే నాథుడు ఎవరూ దొరకలేదు; మనదేశంలో చూడబోతే, శ్రీకాకుళంపోరాటంలో నక్సల్ బరీ ఉద్యమం దాని ప్రభావం పూర్తిగా కనబరచలేదు; మావో ఆలోచనా విధానంలోని మౌలిక విశిష్టతగాని, అద్భుతమైన శ్రామికవర్గపు సాంస్కృతిక విప్లవాన్ని గాని ప్రపంచం అర్థం చేసుకోని రోజులవి. అధికార మార్క్సిస్టులని కోశాంబి తిరస్కారంగా మాటాడే మార్క్సిస్టులు దిగంబరకవులని అనామకమైన బూర్జువా అరాచకపు కవులుగా కొట్టి పారేసినా, అధికార మార్క్సిస్టుల ప్రాపకంలో, మద్రాసు సినీ కవిత్వపు అంతస్సంస్కృతితో అభ్యుదయ ముద్రతోఅలరారేవారి ముతక చవకబారు బజారు అశ్లీల సాహిత్యంకంటే, వీరి నిజాయితీ గల ఆగ్రహంలోంచివచ్చిన అశ్లీల పదజాలమే ప్రశ్నించగల యువతరాన్ని ఆకట్టుకుంది. దిగంబర కవులు అన్ని సిద్ధాంతాలకీ వ్యతిరేకత ప్రకటించి, వ్యవస్థీకృత రాజకీయాలకి వ్యతిరేకులైనప్పటికీ, సామాజిక, రాజకీయ  సమస్యలకి విముఖులు కారు. 1965లో వాళ్ల ప్రథమ కవితా సంకలనంతో పాటు వాళ్లు విడుదల చేసిన మేనిఫెస్టో ఒక అస్తిత్వవాద కరపత్రంగా కనిపిస్తుంది.

(ఇన్ని సాంఘిక, ప్రకృతిసిద్ధ మైన కార్య నిమగ్నతల మధ్య, నిన్ను నువ్వు ఇరికించుకున్న వేల తొడుగుల ముఖాల మధ్య, విరామమెరుగని జీవన పోరాటాల మధ్య, నువ్వు ఒంటరివే, జీవన్మరణ పోరాటంలో ఒంటరి సైనికుడవే.) వీరి కవితలు పాఠకుడిని పదే పదే తనకున్న సామాజిక తొడుగులని విడిచిపెట్టి , తమని తాము దిగంబరంగా చూసుకోమని అర్థిస్తాయి. మనిషి తపనపడే సామాన్య విషయాలని  గర్హిస్తాయి:

నాకోక సారి చెప్పు,

నువ్వు ఏడవని రోజుందా?

పొగచూరిన నీ ముఖం

నాకు బొగ్గుగనుల్ని గుర్తుచేస్తుంది

(నిఖిలేశ్వర్)

ఆ రోజుల్లో కూడా వాళ్ళు దిగంబరంగా చూడమన్నది మనిషి స్వభావంగా మారిన అవినీతిమయమైన సమాజపు దుర్మార్గాన్ని; వాళ్లు పీలికలు చెయ్యమన్నది శాంతి, ప్రగతి అంటూ మోసకారి రాజకీయ నాయకులూ, ఆదర్శవాదులూ ప్రజాస్వామ్యానికి తొడిగిన బూటకపు ముసుగుని; నాగరికత తెచ్చిపెట్టుకున్న గౌరవనీయతని. ఇది ముఖ్యంగా చెరబండరాజు, నగ్నముని, నిఖిలేశ్వర్ ల విషయంలో ఎక్కువ వర్తిస్తుంది. చెరబండరాజు విషయంలో ఇతరకవులు భావించినట్టు మనిషి నగ్నత్వాన్ని కప్పిఉంచే సామాజిక వ్యక్తిత్వంకంటే, ఆ వ్యక్తిలోని ఆత్మవంచనని ఎక్కువగా అతను నిరసించాడు.

ఏది ఏమైనా, ఒక ఏడాది తర్వాత వచ్చిన తమ రెండవ మేనిఫెస్టోలో “ప్రస్తుతం ఉన్న క్రూర సమాజాన్ని రూపుమాపి, సరికొత్తదీ, ఉదాత్తమైన సమాజాన్ని తీసుకు రావాలనుకుంటున్న ఆకాంక్షని ప్రకటించారు. ఈ క్రింది పంక్తులు ఆ రోజుల్లో చెరబండరాజు కవిత్వానికి అద్దం పడతాయి:

అవకాశవాద పెత్తందారుల బూట్లు నాకుతూ

వాళ్ళ నీడల్లోనే నువ్వు భవంతులు కట్టుకున్నావు

ఆ పునాదులు కదిలేలోపు

నిన్ను పంపిస్తాను,

లేదు, జైలుకి మాత్రం కాదు

కసాయి కొట్టుకి.

1968లో విడుదల చేసిన వాళ్ళ మూడవ మేనిఫెస్టోలో, వాళ్ళ ఆవేదనలు ఇంకా స్పష్టంగా సామాజికమైపోయాయి.

వాళ్ళ సైద్ధాంతిక వ్యతిరేకత కొనసాగుతూనే ఉంది. అయితే వాళ్ళు ఒకటి గుర్తించేరు: పేదరికమూ, ఆకలీ విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నంతకాలమూ, మార్క్సిజాన్ని ఎదిరించేసాహసం ఎవరూ చెయ్యలేరని. పేదరిక నిర్మూలనానికి  మార్క్సిజం గురించి ఇంత చిన్న ప్రాధమిక అవగాహనతో, విరసం (విప్లవ రచయితల సంఘం) ఆవిర్భవించే వేళకి ఇందులో కనీసం నలుగురైనా మార్క్సిస్టు- లెనినిస్టు రచయితలుగా ఎదిగేరు.  కమ్యూనిజం రివిజనిజంగా రూపుదిద్దుకున్న కాలంలో, ప్రతిఘటనలు కూడా శూన్యవాదంలోకి దిగడం సహజమైనప్పటికీ, లక్ష్యం పట్ల నిబద్ధతా, సైద్ధాంతిక అరాజకత్వం రెండూ జంటగా ఎక్కువ్కాలం కొనసాగలేవు. ఎప్పుడో ఒకప్పుడు ఆ రెండింటిలో ఏదో ఒకటి రెండవదానిపై పైచేయి సాధించవలసిందే. ఆరుగురు దిగంబరకవుల్లో నలుగురు విషయంలో మొదటిది గెలిచింది(మిగిలిన ఇద్దరిలో ఒకరు తర్వాత ఆచార్య రజనీష్, మరో కొంతమంది బాబాలకి భక్తుడిగా మారిపోయాడు) శ్రీకాకుళం నక్సల్బరీ ఉద్యమ ప్రేరణతో ఈ నలుగురూ, శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, వరబర రావు, రమణారెడ్డి వంటి మరికొంతమంది రచయితలూ కలిసి 1970, జులై 4 న విరసం స్థాపించేరు. ఆ నలుగురిలో చెరబండరాజు ఒకరు. 1971-72 లో దానికి అతను జనరలు సెక్రటరీగా ఉండడమే కాకుండా, దానికి మరణ పర్యంతం కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా కొనసాగేరు.

ఇంతకుముందు చెప్పినట్టు, దిగంబరకవిగా ఉన్నప్పుడుకూడా  అందరిలోకీ ఎక్కువ సామాజిక స్పృహ కనపరిచింది చెరబండ రాజే. దిగంబర కవుల మూడవ సంకలనం వచ్చే వేళకి అతని పదాల్లో విచక్షణారహితంగా తిరస్కారం కనిపిస్తూ, హృదయాన్ని కదిలించడానికి బదులు ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ, అతని కవిత్వం విప్లవభావాలతో గుర్తుపట్టగలిగేదిగా  ఉంది. వందేమాతరం అన్న కవితలో భారతమాతని ఒక వేశ్యగా వర్ణిస్తూ, ఆమెని ఇలా సంబోధిస్తాడు:

నీ అందం ఎలాంటిదంటే

అంతర్జాతీయ విఫణిలో నీ

అంగాంగమూ తాకట్టుపెట్టబడింది

నీ యవ్వనం

ధనవంతుల కౌగిళ్ళలో

ఆదమరచి నిశ్చింతగా నిద్రిస్తోంది.

(ఇది రాసిన చాలా రోజుల తర్వాత, ఎమర్జెన్సీ రోజుల్లో ఈ కవితని జైల్లో చదివినప్పుడు, భారతమాతను ఇలా తూలనాడినందుకు ఒక ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త అతనిపై దాడి చేశాడు)

అయితే, విప్లవకవిగా మారిన తర్వాత చెరబండరాకు క్రమంగా వచన కవిత్వం నుండి కవిత్వ రూపంగా పాటకి మరలిపోయాడు. విప్లవకవిగా ఉన్న రోజుల్లో వచనకవిత్వమూ, పాటా ఉన్న 8 సంకలనాలు వేసినప్పటికీ, నిరక్షరాస్యులూ, పాక్షిక అక్షరాస్యులూ అయిన పాటక జనానికి రాజకీయ పరిజ్ఞానాన్ని కవిత్వంద్వారా అందించాలంటే,పాట సరియైన మాధ్యమం అనిగుర్తించిన కొద్దిమంది కవుల్లో అతనొకడు. ఈ విషయంలో అతనికి ముందు సుబ్బారావు పాణిగ్రాహి, అతనికి తోడుగా శివసాగర్ ఉన్నారు. శ్రీశ్రీ భాషా, ప్రతీకలూ మధ్యతరగతికి సరిపోయినట్టుగా, వీరు ముగ్గురూ ముందుతరం వామపక్షభావజాలాకవిత్వానికి వారధిలా పనిచేశారు. అందులోని తీవ్రవాద భావజాలమూ, చెప్పేవిధానమూ పక్కన బెడితే, జననాట్యమండలికి చెందిన రచయితలూ, గేయకారులూ, ముఖ్యంగా గద్దర్ లాంటి వాళ్ళు కేవలం పాటలు రాయడమే గాక, ప్రజలభాషలో రాస్తూ, వాటిని జానపద సరళిలో పాడి ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు.

నక్సల్ బరీ తర్వాత తెలుగులో వచ్చిన వామపక్షభావజాలకవిత్వానికి చెరబండరాజు ఒక మార్గదర్శకుడవడం ప్రభుత్వానికి నచ్చలేదు.

మేం కొండలు పగలగొట్టాం

మేం బండరాళ్లను పిండి చేశాం

మా రక్తం రాయిగా

ప్రాజెక్టులు నిర్మించాం

కష్టం ఎవడిది?

కాసులెవడివి?

… అదికూడా నిరుపేదల్లో నిరుపేదలైన శ్రామికులకి అర్థం అయేరీతిలో రాయగల కవి, ఆ ప్రాజెక్టుల లబ్ధిదారుల ప్రయోజనాలను సం రక్షించే ప్రభుత్వాలకి ప్రమాదకర వ్యక్తిగా కనిపించడం సహజమే.

అందుకే చెరబండరాజు ఇంకెవరూ అనుభవించని హింసని అనుభవించాడు. మిగతా ముగ్గురు దిగంబరకవులతోపాటు అతను 1971లో  ప్రివెంటివ్ డిటెన్షన్ ఏక్ట్ క్రింద 50 రోజులు నిర్బంధించబడ్డాడు; 1973లో 37 రోజులు MISA (Maintenance of Internal Security Act) క్రింద అరెస్టుకాబడ్డాడు. రెండు సందర్భాలలోనూ అతని మీద అభియోగం అతను తన కవిత్వంద్వారా యువతని సాయుధపోరాటం వైపు పురికొల్పుతున్నాడని. సికిందరాబాదుకుట్రకేసులో అతన్ని ఇరికించడంతో 1974లో అతన్ని స్కూలు టీచరు ఉద్యోగమ్నుండి తొలగించడం జరిగింది. ఎమర్జెన్సీ తర్వాత అతను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోబడినా, మూడురోజులు తిరక్కుండా DIG (Intelligence) అతన్ని తిరిగిపనిలోకి తీసుకున్నందుకు DEO ని చీవాట్లు పెట్టడంతో అతనిదగ్గరనుండి తిరిగి ఉద్యోగం నుండి తొలగిస్తూ తంతి వచ్చింది. మార్చి 1980లో అప్పటి విద్యాశాఖమాత్యులు ఉపాధ్యాయుల నియోజకవర్గం నుండి ఎన్నికైన MLC అడిగిన ప్రశ్నకి అసెంబ్లీలొ అతన్ని పదవిలోంచి తప్పించినట్టు ప్రకతించారు. అతను చనిపోవడానికి కొన్ని వారాలు ముందు, అతను హాస్పిటల్లో స్పృహలేకపడిఉన్నప్పుడు, అతన్ని లాంఛనంగా ఉద్యోగంలోకి తీసుకున్నారు.

అతను అనుభవించిన రాజ్యహింస గురించి చెరబండ రాజు ఒక చోట మంచి కవిత చెప్పేడు:

 

పొరపాటున అమాయకత్వంకొద్దీ

నేను ఆకాశంవైపు చూడడంతటసిస్తే

వాళ్ళు నా చూపుల వాలుని కొలుస్తారు

నా అడుగుజాడలు పడ్ద మట్టిని

ప్రయోగశాలల్లో పరీక్షిస్తారు

నా పాటల్లో చరణాల నిర్మాణ

సరళిని పసిగట్టడానికి.

 ఈ మధ్యలో అతనికి కేన్సరు సోకింది… మూడుసార్లు శస్త్రచికిత్స చేశారు. అతనికి చూపు పోయి, చివరకి చాలా కాలం అపస్మారకస్థితిలో ఉండి జులై 2 న కన్నుమూసాడు.

సాధారణంగా విప్లవకవిత్వం అంటే నినాదాల ఘోష అన్న అపవాదు ఉంది. దాన్నే సరిగ్గా నిలబెట్తి, చెరబండరాజు కవిత్వంలో నినాదాలుగా చెప్పగలిగిన ఎన్నో పదాలున్నాయని చెప్పవచ్చు. (ఈ మధ్య ఒక విమర్శకుడు చెప్పినట్టు అది అంత సామాన్యమైన విషయమేమీ కాదు.) తెలంగాణా నగరాల్లోని గోడలనిండా కనపడే  శ్రీ శ్రీ, గద్దర్, శివసాగర్ లతోపాటు అతని నినాదాల్లోనూ, అతని కవిత్వానికి  ప్రతిస్పందించిన వాళ్ల హృదయాలలోనూ అతను శాశ్వతంగా నిలిచి ఉంటాడు.

 

(కె. బాలగోపాల్ ఇంగ్లీష్ లో రాసిన వ్యాసానికి నౌడూరి మూర్తి తెలుగు అనువాదం )

Courtesy: Economic and Political Weekly, July 24, 1982.

 

 

త్రిపుర traits:ఒక జ్ఞాపకపు ఛాయ!

tripura_336x190_scaled_cropp

ఎవరైనా సమకాలీన రచయిత గొప్ప అక్షరంగా పరిచయమయ్యాక, నన్ను తరచి తవ్విపోశాక, చెప్పరాని చనువై మనసయ్యాక, ఆ రచయితని వ్యక్తిగతంగా కలవడానికి ఆరాటపడను. తీరా కలిస్తే- సిరా మరకలు కూడా అంటని కుదురైన జమాబందీలానో, మహా పోతరం కమ్మిన ఆరోగ్య సూత్రంలానో, అతి భద్రమైన జీవిత బీమాలానో, ఫక్తు డీఏ ఎరియర్‌లానో, జున్ను ముక్కల్ని దాష్టికంగా కప్పెట్టిన మిరియాల పొడిలానో ఎదురవుతాడేమోనన్న జంకు వల్ల కావచ్చు; లేదా దురద పుడితే నాలానే గోక్కుంటున్నాడేమిటన్న లౌకిక విస్మయాలతో సదరు రచయిత (కవి) చవకవుతాడేమోనన్న నా వెరపు వల్ల కావచ్చు- నాలోకి తెగబడిన రచయితని బయట కలవాలని ఎగబడను.

కానీ త్రిపురని కలుసుకోవాలని ఆత్రపడకపోవడానికి పై శంకలేవీ కారణాలు కాదు; వస్తు-రూప ద్వంద్వానికి అంతు చిక్కని, నెపం వంటి కేవల రూపాన్ని మించి ప్రచ్ఛన్నంగా పరుచుకొని సారమై నిలిచిన త్రిపుర రాతల లోంచి ఆయన మూర్తిమత్వాన్ని ఊహిస్తూ… గుట్టలుగా పోగుపడ్డ నా appraisals  వల్లనే ఆయనని కలవాలని వెంపర్లాడలేదు. ‘త్రిపుర ఎలా ఉంటారు?’ అన్న ప్రశ్న త్రిపురని కలవడం కంటే మనోహరంగా ఉండేది.

“మెత్తగా నల్లగా చుంచులాంటి ముఖాలు. రహస్యంగా నక్కలాంటి ముఖాలు. అప్పుడే చంపిన గేదెని చీరుతున్న పులి ముఖాలు. దుమ్మలగొండి ముఖాలు. బెదిరిన కుందేలు ముఖాలు. సన్నగా పగగా పాము ముఖాలు. మార్కోవిచ్ సిగరెట్ ప్యాకెట్ మీద ముఖం లాంటి ముఖాలు. డిటెక్టివ్ ముఖాలు. దొంగ ముఖాలు.”

బింబం మాటున సత్యాన్ని అద్దం వెనక వార్నిష్‌ని గోకి తెలుసుకోవాలన్న ఆయన ఉత్సుకతకి అక్షరాలై బద్దలైన అద్దంలో మన ఇన్నిన్ని ముఖాలు చూపెట్టిన త్రిపుర ముఖం ఎలా ఉండి ఉండొచ్చు?

-బిత్తరపడి చేజారిన బాల్యంలోంచి చేజేతులా చేసుకున్న యవ్వనానికి పారిపోయిన కాలనాగు శేషాచలపతి. ‘మృదువైన కాంతిలో పడగెత్తి నాట్యం చేసే’ నాగుబాము శేషు convulsive స్ఫురద్రూపంతో వణికిస్తుందా?

-గదుల్లో ఇమడని ధ్యానం, చింతన చినబోయిన మౌనం, దారులు ఒగర్చే యానం- భాస్కరం. అనుభవాలు అంటని, రంగులు ముంచని, మనసు మళ్లిన ‘ఓల్డ్ టెస్ట్‌మెంట్ ప్రొఫెట్’ భాస్కరం ఒంటరితనంలా వణికిస్తుందా?

-పోటీ… పొగరు… పంతం… పరుగు… పాముల నిచ్చెన్ల బండ బతుకు కొత్త altruistic  గమ్యాల దిశగా తీసుకున్న యూ టర్న్- వీరాస్వామి. ‘పసుపు కాని, ఆకుపచ్చ కాని, మిరమిట్లు గొలపని, నాలుగు ముఖాల అందం’- జర్కన్ వంటి వీరాస్వామిలా విలువ, ఖరీదు అర్థం కానట్టుంటుందా?

-‘కనిపించని ద్వారం’మీద దిష్టిచుక్క కాదు, నిన్నలోకి నెర్రెలిచ్చిన తలపోతల అద్దంలో ‘పాపిటి దగ్గర గరుకు నల్లటి పుట్టుమచ్చ’ మాత్రమే కాదు, కొంకర్లుబోయిన ముఖంలో కవళికలు మారినా కాంతి తరగని కళ్ల కింది నల్లని వలయం- నారాయణ. కెరటాల హోరులో బదుళ్ల నిశ్శబ్దాన్ని భరించలేకి ఆ ప్రళయ తరంగ తాండవంలోకి జారిన నారాయణ ఒకానొక బుడగై చిట్లినట్టుంటుందా?

-‘పిలకలు, కిర్రుచెప్పులు, చెవులకి కుండలాలు, ఆరవేసిన అంగవస్ర్తాలతో’ భగవంతం సనాతనత్వంలా ఉంటుందా?

కళ్లు ‘బోధిసత్వ అవలోకితేశ్వరుడివిగా, ఒళ్లు హెర్క్యులస్‌ది’గా గొప్ప విరోధాభాసలా ఉంటుందా? పోనీ ఇవేమీ కాకుండా, ఇన్ని అక్షర అతిశయోక్తుల్ని కలగన్న సుబ్బారాయుడిలా next door సుబ్బారావులా సాదాసీదాగా ఉంటుందా? సీజరు కాని, జుడాస్ కాలేని, ఎటుకీ చెందని ఆ ముఖాన్ని ఏమరుపాటుగా ఉన్నప్పుడు పొంచి చూసేయాలి. నా ఎడతెగని ఎక్స్‌పెక్టేషన్ల కుంచెలతో గీసుకున్న ముఖాలతో పోల్చి చూసుకోవాలి.

కనక, త్రిపురను చూడటం కంటే, తొంగి చూడటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. అందుకే ఆయనను కలిసిన దాని కంటే పొంచి చూసిన సందర్భాలే ఎక్కువ. వైజాగ్‌లో నేనున్నప్పుడు రామలక్ష్మీ ఎస్టేట్స్‌కి అలా ఉట్టినే వచ్చి వెళ్లిపోతుండటం చూసి లక్ష్మి గారి కళ్లలో ‘మిలియన్ డాలర్ల ఆశ్చర్యం.’  ‘బెంగాలీ కథల మీ అనువాదం అద్భుతమ’ని (నిజమే కావచ్చు) ఎన్నిసార్లు చెప్పగలను?

ముఖాముఖినో, పొంచి ఉండో చూడడానికి త్రిపుర ఇప్పుడు లేరన్న ఆలోచ తెరలుతెరలుగా సంవేదనై కమ్ముతుంటే అనిపిస్తోంది – ఆయనతో ఇంత ముడివడిపోయానా అని.

నన్ను అనుక్షణం అంటిపెట్టుకుని ఉండే కవులు, రచయితలు… అన్నమయ్య, కృష్ణశాస్త్రి, బాదెలేర్, చలం, బుచ్చిబాబు, ఫ్లెబర్, మొపాసా. వీరందరూ నేను పుట్టకముందే నన్ను దొంగిలించిన తీవ్ర నేరం వల్ల నా వాళ్లయ్యారు. అటువంటి సారూప్యాలేవీ లేని కాఫ్కా, త్రిపుర, మో… వంటివారు కూడా నా వాళ్లు కావడం నాకెప్పుడూ ఆశ్చర్యమే.

వాళ్ల ప్రపంచాలు ఆత్మాశ్రయాలనే ఆరోపణల మాటున అత్యంత విశాలమైనవి. వారి రచనల ద్వారా వారు చేసిన అన్వేషణ అనంతమైనది. ఆధునికత అనే ఔషధం వికటించి కలిగిన సైడ్ ఎఫెక్ట్స్ వీరిని బాధించినంతగా నన్ను ఇబ్బంది పెట్టలేదు. త్రిపుర విషయానికొస్తే,  ‘భౌతికంగానూ, మానసికంగానూ ఈ కథల పరిధి చాలా పెద్దది’(పాలగుమ్మి వారి మాటల్లో). ఆయన పాత్రలు చాలా elitist, ఐతే ఆర్థికంగా, లేదా తాత్వికంగా. శేషు లాంటి దాష్టికరాయుళ్లకి బెలూచిస్థాన్, జర్మనీలు స్పిరుచ్యువల్ హోమ్స్, భాస్కరం వంటి ఏక్ నిరంజన్‌లకి ‘తెల్లగా నిర్మానుష్యంగా ఉందనిపించే సైబీరియా’ స్పిరిచ్యువల్ హోమ్. రాణీవాసపు చెర వైభవాల లలితాదేవి, విమల ప్రభాదేవీలు, ఇన్‌గ్రెడ్ బెర్గ్‌మెన్‌లా ఉండే జాహ్నవులు, Monty Clift లా ఉండే శివరామన్‌లు… అవే కావు, మురికివాడలు, గల్లీలు, పేదరికం, నక్సలిజం… కూడా ఉన్న ప్రపంచం త్రిపురది. అందులో ‘గొలుసులు-చాపం-విడుదల భావం’ ఒక్కటే నాది. మా హోమియో డాక్టర్ (నా గురువుగారు కూడా) ఎన్‌వీ బ్రహ్మం గారు- నేను Argentum nitricum కేసు అనేవారు.

‘ఎందులోనూ ఏ చెయ్యీ బాగా ఎట్టకుండానే ఎళ్దామనుకుంటాను, మన దారిని మనం. అయితే అన్నిట్నీ గుద్దేస్తూ.

…ఎందుకు అన్నిట్నీ గుద్దేస్తుంటారూ? కళ్లకి చూపు తక్కువా, వొళ్లు ఊపు ఎక్కువా? మతిమరుపా, కండ కావరమా, మదవా రోగమా? అసలు తత్వమే అంతా? నడుస్తూ యింట్లోనే అందర్నీ అలా గుద్దేయడమేమిటి? బుర్ర దువ్వుకుంటూ అద్దాన్నే గుద్దేయడం… అలా గుద్దుకుంటూ నడిస్తే గాని…’- ఇవే లక్షణాలు!

‘మెదడులోని మతడల్ని చూశావా ఎప్పుడేనా, తమ్ముడూ, మెదడులోని మెకానిజం? ఆలోచింపజేస్తుందే ఆ మెకానిజం? చూళ్ళేదూ, అవును నీకెందుకూ అలాటివి. పోయి, వీధుల్లో ఆడపిల్లల్ని చూస్తానంటావ్ కాబట్టి నీకేం తెలీదు, వెళ్ళి చూడు…’

– వాళ్లన్నయ్య ఆ కథా నాయకుడితో అన్నాడా, త్రిపుర నాతో అన్నారా?

(పై కథని మినహాయిస్తే) త్రిపుర కేవలం శైలీగత కారణాలతోనే నాకు దగ్గరయ్యారా? నాకూ సరైన స్పష్టత లేని ఈ ప్రశ్నే బహుశా ఆయనని, ఆయన రచనల్ని కొన్నిసార్లు scepticalగా చూసేలా చేసిందేమో.

ఉపరితలంలో చూస్తే ఆయన కథలు రాసిన కాలం 1963- 73 (ఆ తరవాత నాదీ అని పైన చెప్పుకున్న కథ 1981లో, 1987లో మరొకటి). అంటే 1928లో పుట్టిన రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర్రావ్ అనే త్రిపుర తన 35-45 ఏళ్ల మధ్య ఓ 13 కథలు రాశారు. సాధారణంగా రచయితలు తమ యవ్వన ప్రాదుర్భావ వేళ కవిత్వం రాస్తారు. జలపాతం ఉధృతిని మైదానం నెమ్మదించాక వచనం వైపు మళ్లుతారు. కానీ త్రిపుర విషయంలో ఇది తిరగబడింది. ఆయన 50 ఏళ్లు పైబడ్డాక కవిత్వం మొదలెట్టారు (తన 47వ పుట్టినరోజు నాడు 1975లో రాసిన సెగ్మెంట్స్ ఇంగ్లీష్ దీర్ఘ కవిత సెమీ ఆటోబయోగ్రాఫికల్). ఇంకా కచ్చితంగా చెప్పాలంటే తన 70వ పడిలో రాశారు కవిత్వం. ఇటువంటి విలోమ ప్రయాణం గురజాడలో మాత్రమే ఉంది. అయితే, గురజాడ సీరియస్ సాహిత్యవేత్త. అంటే త్రిపుర నాన్ సీరియస్ అని కాదు. సవాలక్ష వ్యాపకాల వల్ల తాను రాయాలనుకున్న, ‘రాయవల్సిన’ దాంట్లో పదో వంతు మాత్రమే రాసినా (యుగకర్త, మహా కవి వంటి విశేషణాలు తీసేసి చూసినా), గురజాడ ఓ సాహిత్య ఉద్యమకారుడు.

ఈ విధంగా చూస్తే, త్రిపుర సాహిత్యం తెలుగు పాఠక లోకానికి ఏమవుతుందో గానీ, త్రిపురకి మాత్రం తన సాహిత్యం ఓ passing cloud, ఆ మబ్బు రాల్చే సాంత్వన జల్లు అయితే కావచ్చు. అసలు తానొక రచయితగా కూడా claim చేసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు (తనమీద, తన రచనల మీద రచయిత చేసుకునే ఏ తెలుపు నలుపు క్లెయిమ్స్ అయినా పట్టించుకోవాల్సిన అవసరం పాఠకుడికి లేదనుకోండీ). ఆయనకి తన రాతలంటే ఖాతరు లేదు గానీ సాహిత్యం, ముఖ్యంగా ఇంగ్లీషు సాహిత్యంతో జన్మాంతర బంధం, ఆత్మగత సంబంధం. గురజాడని ఆధునికతకి ఒక కొండ గుర్తుగా తీసుకుంటే ఆయన మొదలు, స్వాతంత్ర్యానికి ముందటి వరకూ పుట్టిన కవులూ రచయితలు (ముఖ్యంగా బ్రిటిషిండియాలో ఉన్న కోస్తాంధ్ర రచయితలు) అందరూ ఇంగ్లీష్ సాహిత్య ప్రేమికులే. అందులోనూ వ్యాహాళికి నాయుడుపేట నుండి మద్రాసు వెళ్లి ఆల్బర్ట్ కామూ, సార్ర్త్‌లతో తిరిగి రాగలిగిన వెసులుబాటున్న పెద డాక్టరు గారబ్బాయి త్రిపుర పేరు ప్రత్యేకంగా ప్రస్తావించవలసిందేముంది? ఎమ్మే ఇంగ్లీష్ చేసిన కలోనియల్ బుర్రలు రెండాకులు ఎక్కువ చదవడంలో విడ్డూరమేముంది? ఉంది! ఆ విషయంలో త్రిపుర మహా తేడా. బెనారస్ యూనివర్సిటీలో అగ్రికల్చరల్ ఎమ్మెస్సీ అర్ధాంతరంగా ఆపేసేనాటికి కూడా ఆయనకి వ్యవసాయంలో ఓనమాలు తెలియవు; ఫీల్డ్ ఫిజియాలజీ చేయవలసి వచ్చిన నాటికి అసలు వరి కంకే తెలియదు. పాత గురువు గారి సలహా మీద ఎమ్మే ఇంగ్లీష్ ఆనర్స్‌లో చేరడం-ఎకడమిక్ ఎదుర్రాయి కొట్టుకోవడం కాదు.

అలాగని అది తోవ చూపించిన వేలు కూడా కాదు. రెక్కమాను శిథిలమైన కూడలిలోకి ఆయనని నడిపించిన చేయి. ఏ తోవ ఎటు పోతుందో వెదుక్కోవడమే ఆయన చదువు.

అధ్యయన విషయంలో కూడా త్రిపుర గొప్ప తేడా మనిషి. ఆయన ఏ పుస్తకాన్నీ ఏకబిగిన చదవగలిగేవారు కూడా కాదు (ముఖ్యంగా తనని డిస్కవర్ చేసి సారూప్యాల్ని ఘనంగా ఎత్తిచూపిన బెకెట్, కాఫ్కా, కామూ వంటి రచయితల్ని). కొన్ని పుస్తకాలు ఏళ్లు గడిచినా పేజీలుగా ముందుకు నడవని సందర్భాలు కోకొల్లలు. తెల్లని కాగితాల మీద కథలని చీమలబారుల్లా ఎడమ నుంచి కుడికి పరుచుకున్న అక్షరాల్ని వాటి నిజ రూపాలతో దర్శించడమనే శాపాన్ని ఆయన జన్మతః పొందారు.  Genuine poetry can communicate before it is understood అన్న టీఎస్ ఎలియట్ రివలేషన్‌కి మరికొంత పొడిగింపు త్రిపుర అభిశప్తానుభవం: ‘పూర్తి’గా చదవకముందే ఎన్నో గ్రంథాల ఆత్మదర్శనం కావడం.

‘ఆలోచన’కి ‘తెలుసుకోవడాని’కి మధ్య అఖాతాన్ని గెంతి, దుమికి ‘సీసాలో బాతు పైకి వచ్చేసింది’ అని మాండో రూపంలో చెప్పే జవాబులు సృజన సాహిత్యంలోనో, తాత్విక వాఙ్మయంలోనో కుదురుతుందేమో కానీ ఇలా ఒకానొక పచ్చి వచన వ్యాసంలో ప్రతిపాదించడం ‘గేమ్ రూల్’ కాదని, అబ్సర్డ్ అని ఇంగిత జ్ఞానం నాకు లేకపోలేదు. అయితే త్రిపుర విషయంలో ఆయన సాహచర్యం వల్ల, అంతకుమించి, ఆయనను పొంచి చేసిన అపరాధ పరిశోధన తరహా పరిశీలన వల్ల నేను గ్రహించిన సత్యమది.

గ్రంథ సారాన్ని దివ్య చక్షువులతో గ్రహిస్తారన్న మిత్‌ను గానీ, ’రాబో’ సినిమాలో యంత్రుడిలా అలా అలవోకగా పుస్తకాలని స్కాన్ చేసిపారేస్తారన్న సోషియో ఫాంటసీనో ఏకరువు పెట్టడం లేదు నేను. ప్రభావాలకి గురికావడంలో కూడా తన, తన ముందు తరం రచయితల (ఒక్క తెలుగులోనే కాదు)కి కూడా త్రిపుర పూర్తిగా భిన్నమైన వారని గ్రహించినట్లు విన్నవించుకోడమే నా అభిమతం. శామ్యూల్ బెకెట్ ‘వెయిటింగ్ ఫర్ గోడో’ ప్రభావంగా చెప్పుకునే ‘భగవంతం కోసం’ రాసేనాటికి ఆ నాటకాన్ని త్రిపుర చదవలేదు. దానిమీద వచ్చిన సమీక్ష (కూడా) చదవలేదు, చూశారంతే. విశాఖపట్నం ఏవీఎన్ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ఓ మలయాళీ కాకా హోటల్లో కూర్చుని కబుర్లాడుకునేటప్పుడే – భగవంతం పదమూడో నంబర్ బస్సులోనో, ఇటు ఏడో నంబర్ బస్సులోనో వస్తాడని త్రిపుర ఎదురు చూశారు. నాటి ఎదురుచూపు కథగా ఆకారం తీసుకోవడానికి ‘వెయిటింగ్ ఫర్ గోడో’ అన్న శీర్షిక ఒక ప్రేరణ వంటి నెపం. అలానే, ఆయనకి కాఫ్కా రచనల కంటే Kafkaesque తనమే ఎక్కువ చేరువని ఆయన కాఫ్కా థీమ్ కవితా సంకలనం (త్రిపుర కాఫ్కా కవితలు) చెప్పకనే చెబుతుంది.

తన సృజనాత్మక రచన విషయంలోనే కాదు, ఆయన ప్రసంగాలలో కూడా ఇదే ఒరిజినాలిటీ కనబడుతుంది. ఓసారి విజయవాడలో యూజిన్ అయొనెస్కో మీద ప్రధాన ప్రసంగానికి ‘మో ఆయనను ఆహ్వానించారు. మూడు గంటలు పైగా సాగిన నాటి ప్రసంగంలో ది న్యూ టెనెంట్, ది చైర్స్, ది లెసన్, అమెడీ వంటి అయొనెస్కో నాటకాల ప్రస్తావనైతే ఉంది గానీ, స్థూలంగా ఆ ప్రసంగమంతా అయొనెస్కో ఆత్మతో (అప్పటికి అయొనెస్కో చనిపోయాడు) త్రిపుర చేసిన సంభాషణ; ఏ అకడమిక్ పుస్తకాల్లో కనిపించని వ్యాఖ్యానం, ప్రకాశంగా చేసిన స్వగతం. ఈ సమావేశానికి హాజరు కూడా కాని విలేకరులు తమ సాహితీ ‘source’ల ద్వారా కనుక్కుని రాసిన వార్త శీర్షిక ఇది: అబ్సర్డ్ నాటకకర్త అయొనెస్కోపై మరో ప్రముఖ అబ్సర్డ్ రచయిత త్రిపుర ప్రసంగం!

 

**      **      **      **

సౌరభమ్ములేల చిమ్ము పుష్పవ్రజంబు, చంద్రికలనేల వెదజల్లు చందమామ, గాడ్పేల విసురు, ఏల సలిలమ్ము పారు… అన్న కవిత గుర్తుకు తెస్తూ, రచన కూడా ఒకానొక ప్రాకృతిక ధర్మమేమో అన్పించేలా సృజన చేసిన త్రిపుర స్వయంప్రకాశకత్వాన్ని సూక్ష్మంగానైనా గ్రహించాను. నాకు తెలిసిన అక్షర ప్రపంచంలో మహా కవుల్ని, గొప్ప రచయితల్ని కలిశాను గానీ, నేను దర్శించిన తొలి ‘ఒరిజినల్’ రచయిత త్రిపురే. ఆ రెవలేషన్ తాలూకు ఉద్వేగం జ్వరంలా నిలువెల్లా కమ్మిన ఓ సందర్భంలో ఒక catharsis ఉపశమనం లాంటి సాష్టాంగ దండప్రమాణం చేశానాయనకి.  ‘a’uthor గా కూడా గుర్తింపుకి ఇష్టపడని తనని ‘A’uthor గా డాబు చేసిన నా సాష్టాంగ నమస్కారం ఆయనని చాలా గాయపరిచింది. ఆ భంగపాటుని ఎంతమాత్రం దాయనితనం ఆయన కళ్లలో ప్రస్ఫుటంగా కన్పించి మళ్లీ కలవడానికి కొంతకాలం ముఖం చెల్లలేదు.

పాద నమస్కారాల కాలం పరిఢవిల్లుతున్నందువల్ల ఆయన నన్నప్పుడు ఆశీర్వదించి తన అనుంగు శిష్యుడిగా స్వీకరించి అక్కున చేర్చుకున్నా అంతకంటే ఎక్కువ సిగ్గుపడేవాడ్నే. అంటే, ఆ క్షణం ఒక్కటే ఒక స్థితి; ముందు వెనకలు పొడిగింపులు లేని స్థితి, ఆయనకైనా, నాకైనా. రచయితగా ఆయన విస్తృతిని నేను దర్శించిన ఆ క్షణంలోనే, రచయితగా తన పరిధిని ఆయన ప్రదర్శించారు. అటువంటి అపురూపమైన క్షణం వెలిగించగలగడం ఒక్క త్రిపురకు తప్ప తెలుగుదేశంలో మరొకరికి సాధ్యమవుతుందని అనుకోను. జీవితాన్ని గాఢంగా తరచి, మథించి, శోధించి, అనుభవించి, అంతలోనే తామరాకు మీద నీటిబీట్టులా తటస్థమవడమే సాహితీ తత్వవేత్త త్రిపురలోని వెలుగునీడలు. కాలక్రమణికతో గణాంకాల బట్టీ త్రిపురని చూస్తే చాలా ప్రశ్నలు ఎదురవుతాయి. 85 ఏళ్ల నిండైన జీవితంలో (63 ఏళ్లు సాహిత్యంతో, తత్వ శాస్త్రంతో మమేకమై ఉండి కూడా) ఆయన పట్టుమని పదిహేను కథలకి మించి ఎందుకు రాయలేదు, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన బెనారస్ హిందూ వర్సిటీలో వామపక్ష రాజకీయాల్లో ఉండి, ఆ తరవాత ఉద్యోగరీత్యా దేశదేశాలూ తిరిగి, అగర్తలాలో నక్సల్స్‌తోనూ సంబంధాలు పెట్టుకొని, ఒకపక్క మార్క్స్‌నీ మరోపక్క బుద్ధుడ్నీ మధ్యలో స్పినోజా, షొపన్ హావర్‌లనీ చదువుకున్న త్రిపుర తన 35 వ ఏట (1963) వరకూ రాయాలని అనిపించకపోవడమేమిటి? 45వ ఏడు వచ్చేసరికి, అంటే పదేళ్లలో 13 కథలు రాసేసి, ఇహ కలం మూసేయడమేమిటి? లెడ్జర్ బుక్కు జీవితంలో లౌకిక, సాంసారిక బ్యాలెన్స్ షీటు తయారు చేసుకునే భద్రమైన జీవితాన్ని ప్రేమించేవాడైతే తనని తాను Segments గా నిర్దాక్షిణ్యంగా కోసుకుని చూసుకునేవారా?

సెగ్మెంట్స్ ఒక సెమీ ఆటోబయాగ్రఫికల్ కవిత. 1975లో తన 47వ పుట్టినరోజు సందర్భంగా ఈ దీర్ఘ కవిత రాశారు త్రిపుర. ప్రపంచ ప్రఖ్యాత పెరూ మహాకవి César Vallejo కవిత  »El alma que sufrió de ser su cuerpo’  శీర్షికే ఎపిగ్రాఫ్‌గా మొదలవుతుంది దీర్ఘ కవిత. 46 ఏళ్లు మాత్రమే బతికిన  వల్లెజో  (1892`1938) తన జీవిత కాలంలో వెలువరిచినవి కేవలం మూడు సంపుటాలే (అందులో ఒకటి ఆయన మరణానంతరం విడుదలైంది). కానీ ఆధునిక కవుల్లో ప్రపంచవ్యాప్తంగా అంతటివాడు లేడన్న పేరు. మౌలికంగా ఆయన విప్లవ కవి, స్వయంగా స్పెయిన్ అంతర్యుద్ధంలో కమ్యూనిస్టుల తరఫున పోరాడిన యోధుడు. చే గువేరాని అత్యంత ప్రభావితం చేసిన కవి  వల్లెజో. అమెరికా చే గువేరాని మట్టుపెట్టాక, చేగువేరా సంచీలో దొరికిన పుస్తకంలో తన స్వదస్తూరీలో రాసుకున్న  వల్లె, నెరూడా వంటి అతి కొద్దిమంది కవితలు బయటపడ్డాయి. మన మహాకవి శ్రీశ్రీ కూడా  వల్లెజో కవిత్వాన్ని అనువాదం చేశారు. అయితే, త్రిపుర ఎంచుకున్న  వల్లె కవిత పూర్తిగా భిన్నమైంది, తాత్వికంగా చాలా గాఢమైనది,  వల్లె దాదాపు మృత్యుశయ్య మీద ఉన్నప్పుడు రాసినది. ఆ కవితా శీర్షికకి అర్థం ‘దేహమై క్షోభ పడ్డ ఆత్మ’. అంతుచిక్కని రుగ్మతతో అర్ధాంతరంగా కన్నుమూసిన  వల్లెజో దేహాత్మల ద్వంద్వాన్ని ప్రదర్శిస్తూ, అంతలోనే ఆ ద్వైతాన్ని రద్దు చేయడమే ఆ కవిత.

సెగ్మెంట్స్ కవిత రాసేటప్పటికి త్రిపుర మనఃస్థితి కూడా అంతటి సంక్షోభమయమే, సంవేదనాత్మకమే.

1950 ప్రథమార్ధం నాటికే బెనారస్‌లో చదువు, ఉద్యోగం, విరమణ కూడా అయిపోయాయి. 1954`57 వరకు మాండలే (బర్మా)లో ఉద్యోగం;  1957`59 మధ్య మదనపల్లి, విశాఖల్లో చిన్న మజిలీల తరవాత ఆయన అగర్తలా (త్రిపుర)లోని మహారాజా బీర్‌బిక్రమ్ కాలేజీలో చేరారు. ఆయనకి నక్సల్స్‌తో సంబంధాలుండేవి, వారికి సాయం చేయడానికి బ్యూరోక్రసీతో సన్నిహితంగా మెలిగారు కూడా. ఆయనలో ‘జుడాస్’ ఎలిమెంట్ లేకపోవడం వల్ల తమ రహస్య బృందంలో ‘జుడాస్’ని కనిపెట్టలేక, ఆ ద్రోహాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించి, మతి చెడి పిచ్చాస్పత్రి పాలయ్యారు. ఇదంతా ఆయన వెదుకులాట. తోవలు వెదుక్కున్నారు, కనుక ఎదురు దెబ్బలూ తిన్నారు, అసలు తోవంటూ ఏదీ లేదన్న తాత్విక స్థితికి చేరుకున్నారు 1963`73 మధ్య రాసిన 13 కథల్లో, ఆ కథల్లో కదలాడిన భాస్కరం, శేషు, వీరాస్వామి, రాజు, మున్నీ, ముక్తాదేవి, కల్యాణి… అనేక పాత్రలతో ఆయన చెప్పాలని ప్రయత్నించిన వాక్యం

‘చచ్చిపోలేదు గానీ, జీవితంలో మిగిలి ఉంది ఏమీ లేదు’.

ఆ ప్రకారం చూస్తే కథలకి కలం మూసేసిన రెండేళ్లకి రాసిన Segments ఆయన అర్ధాంతర సాహిత్య ప్రస్థానానికి ఒక ముగింపు; ఆత్మకథలో ఆఖరి అంకం. ఏదో తనకి సానుకూలమైన సమాధానం చెప్పుకుని తప్పుకోవడమో, సౌలభ్యం చూసుకుని తప్పించుకోవడమో కాదు, దారి లేదని తెలుసుకోవడం. తనకు తాను కూడా మిగలని స్థితిలో శాంతి లేదు, సుఖం అంతకంటే లేదు. వెయ్యి యుద్ధాలతో తలపడే తెగువును మించినదేదో ఉండాలి, ఆ లోన పెనుగులాటని తట్టుకోవడానికి.

సోదరుడు Abel ని హత్య చేసి కూడా, »…am I my brother’s keeper? అంటూ దేవుడ్నే బుకాయిస్తాడు Cain. »…am I my brother’s keeper?? అన్న వాక్యాన్నొక allusion లా వాడతారు త్రిపుర తన  Segmentsలో. ప్రలోభాలకి లొంగి  ద్రోహం చేసి తమ్ముడి దుర్మణానికి కారణమవడమే కాకుండా, తన మతిస్థిమితం కోల్పోవడానికి కూడా కారణమైన ‘జుడాస్’ ల ప్రస్తావన ఉండే గానీ, వారి మీద నింద లేదు; స్వీయనింద ఉంది.

Couldn’t you too have died you’re your brother did,/ or at least bled… (నువ్వూనూ నీ తమ్ముళ్లానే/ చావలేకపోయావా?/ కనీసం గాయపడనైనా లేకపోయావా? ..అనువాదం ‘మో’)

YOUR WERE CLEVER / you did not spill a single/ drop of your brother’s / blood coarsing in your arteries..  అంటూ తనని తాను నిర్దాక్షిణ్యంగా చీల్చుకుంటారు. ఓ నిరపాయకర ప్రేక్షకుడిగా కేవల సానుభూతిపరుడిగా రణక్షేతాన్ని చూడడం, తమ్ముళ్ల త్యాగాన్ని భద్రంగా కీర్తించడం ఆయనను ఆత్మనిందకు పురిగొల్పుతాయి. కానీ కన్ఫెషన్‌తో కుమిలిపోతున్న ఈ కవి స్వాభావికంగా ఏకాకి.

..the skeletal arms of giant trees/ bend close from either side darkly to embrace me/ into/ their land of ‘No’/ which’s but/ a heartbeat away/ gurgling its marshy messages:/ soft black whispers./ “vanish into Zero the Perfect State”

సంపూర్ణమైన సున్నాలోకి అదృశ్యమవ్వాలనే వాంఛ మరో పక్క. ఇదీ ఆయన పెనుగులాట. సామాజికతకి, ఆత్మాశ్రయతకి మధ్య ఆయన నలిగిపోయారు. I see now CLEARLY/ my mirror reflects my terrible shame…..  అని కుంగిపోతారు తన నలభయ్యేడు సాయంతనాల సాంధ్యధూళిలో.

‘చచ్చిపోలేదు గానీ, జీవితంలో మిగిలి ఉంది ఏమీ లేద’న్న దిగులే ఆయన చేత సెగ్మెంట్స్ అనే ఎపిలోగ్ రాయించింది. ఆ తరవాత రాసిన కథలు (గొలుసులు-చాపం-విడుదల భావం  1981;  వలస పక్షుల గానం  1987), కవిత్వం (బాధలూ సందర్భాలూ 1990; త్రిపుర కాఫ్కా కవితలు  2001) ఆయన తనని ఏకాంతపరచుకునేందుకు మీటుకున్న ఏక్‌తార సాంత్వన సంగీతం మాత్రమే.

**      **      **      **

పట్టుమని పదమూడు కూడా లేని ఆయన కథల్ని text కి సంబంధం లేకుండా context పరంగా చూస్తే మరొకటి స్ఫురిస్తుంటుంది. అదేమిటో చెప్పాలంటే, ముందు ప్రదీప్ చౌధురి గురించి, ఆయనకి త్రిపురతో ఉన్న అనుబంధం గురించి చెప్పుకోవాలి. పశ్చిమబెంగాల్ సాహిత్య ప్రపంచంలో 1961`65 మధ్య వచ్చిన ఉప్పెన- హంగ్రీ జనరేషన్. మన దిగంబర కవులకు మల్లే హంగ్రీ జనరేషన్ కవులు మలయ్‌రాయ్ చౌధురి, అతని సోదరుడు సమీర్‌రాయ్ చౌధురి, శక్తి చటోపాధ్యాయ, దేవీరాయ్ (హరధోన్ ధార) కూడా అమెరికా ‘బీట్ జనరేషన్’తో ప్రేరణ పొందారు. అయితే బీట్ కవుల్లో ‘పేరుమోసిన’  ఎలెన్ గిన్స్‌బర్గ్ మన కాశీఘట్టాలు, కలకత్తా వీధుల్లో తిరిగి, మన అఘోరాలతో, బూడిద స్వాములతో చెట్టపట్టాలేసుకుని బతికినప్పటి (1963) వరకూ బీట్ కవిత్వాన్ని హంగ్రీ జనరేషన్ కవులు చూడనేలేదని కొందరు సాహిత్య చరిత్రకారులు వాదిస్తారు. ఈ వివాదాలు సాహిత్య పరిశోధకులకే వదిలేసి స్థూలంగా చెప్పుకుంటే, పశ్చిమబెంగాల్ హంగ్రీ జనరేషన్, మన దిగంబర కవులూ, కొలంబియా Papelipolas, స్పానిష్ Generation µ68 వంటి కవి బృందాల ఆక్రోశం, ఆగ్రహాల్లో సారూప్యాలున్నాయి.

Statusquoని నడ్డి విరిచి, ధ్వంసం చేసి కొత్త దారి వేయాలన్న వారి ఉద్రేకాల్లో పోలికలున్నాయి. అటువంటి హంగ్రీ జనరేషన్ కవులలో ప్రదీప్ చౌధురి ఒకడు. మాతృభాష బంగ్లాతో పాటు ఇంగ్లీషు, ఫ్రెంచిలలో కూడా అదే స్థాయి అభివ్యక్తి ఉన్నవాడు.అందరిలోనూ బహుశా చిన్నవాడైనందు వల్లనేమో కొంచెం దుందుడుకువాడు కూడా. 13,14 ఏళ్లకే కవిత్వం మొదలెట్టి ‘చెడి’పోయాడు. నలభయేడేళ్లకే చనిపోయిన బీట్ కవి, రచయిత Jack Kerouac తో మమేకమైనవాడు (Kerouac స్మరణలో శుద్ధ కవిత్వమై, పచ్చి వచనమై కూడా తేలిపోయినవాడు). తండ్రి ఉద్యోగరీత్యా కలకత్తా వదిలి ఢిల్లీ, అగర్తలాల్లో చదువుకున్న ప్రదీప్‌కి పాఠాలు చెప్పినందుకే కాదు, ప్రేరణ అయినందువల్ల కూడా త్రిపుర గురువు అయ్యారు, మిత్రుడయ్యారు, తరవాత సహోద్యోగి కూడా అయ్యారు (ప్రదీప్ కొంతకాలం జూనియర్ లెక్చరర్‌గా మహారాజా బీర్‌బిక్రమ్ కళాశాలలో పని చేశారు). ఈ గురుశిష్యుల మైత్రి ఆనాటి నుంచీ కొనసాగింది. త్రిపుర Segments(1975)ని ప్రదీప్ తాను నడిపే త్రిభాషాపత్రిక ‘స్వకాల్’ లో 1979లో ప్రచురించారు కూడా.

ప్రదీప్ గురించి త్రిపుర నాకు చెప్పిన అనేక సంగతుల్లో ఒకానొక అప్రధానమైన సంఘటన:

పేరున్న ఓ కళాశాల వారు విశ్వకవి రవీంద జయంతి సందర్భంగా అట్టహాసంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ప్రదీప్‌ని ముఖ్య అతిథిగా రవీంద్రుడి మీద ప్రధాన ప్రసంగానికి ఆహ్వానించారు. ఆర్భాటమైన ఆవరణ, మంద్రంగా రవీంద్ర సంగీతం, రంగులన్నీ అక్కడే పుట్టాయా అన్నట్టున్న శోభాయమానమైన ఆ ప్రాంగణం చుట్టూ ఒక చెయ్యి త్రిపుర భుజం మీద వేసి, మరో చేత్తో నాటు సారా ప్యాకెట్లు తాగుతూ కలియదిరుగుతున్నాడు ప్రదీప్. అప్పటికే నిలదొక్కుకోలేని స్థితిలో తప్పతాగి ఉన్న ప్రదీప్, త్రిపుర ఎంత వారించినా వినకుండా జేబులోంచి ప్యాకెట్ల మీద ప్యాకెట్లు తీస్తూ తాగుతూనే ఉన్నాడు. సభ ఆరంభమై ముఖ్య అతిథి ప్రదీప్‌ను వేదిక మీదకి ఆహ్వానించారు నిర్వాహకులు. అతికష్టంమీద వేదిక మీద మైకు దగ్గరకు వెళ్లిన ప్రదీప్, భళ్లున పెద్ద వాంతి చేసుకుని,  ‘రవీంద్రుడు బెంగాలీ సాహిత్యానికి, ప్రపంచ సాహిత్యానికి చేసిన కాంట్రిబ్యూషన్ పట్ల నా అభిప్రాయం ఇదే’ అన్నాడు(ట).

త్రిపుర కథలని contextual గా చూస్తే- తెలుగు కథ స్తబ్ధత మీద, వస్తు-రూపాల మొనాటనీ మీద నిరసనగా భళ్లున కక్కిన వాంతి అని అనిపిస్తోంది. తెలుగు కథకి గురజాడ కంటే ముందు ఓ సాంఖ్యాయన శర్మ, లేదా మరో భండారు అచ్చమాంబ కథలు రాశారంటూ సాహితీ పరిశోధకులు నిగ్గుతేల్చుతున్నారు గానీ, ఆ తొలినాటి కథకుల ఔత్సాహిక తప్పటడుగుల్ని పక్కన పెట్టి, సీరియస్ కథకి pioneer గా గురజాడని తీసుకుంటే 20వ శతాబ్దపు తొలి దశకంలో ప్రారంభమై, రెండు, మూడు, నాలుగో దశకాల్లో ఉచ్ఛ దశకు చేరుకున్న తెలుగు కథ, 1950ల్లో నెమ్మదించి, ఆ దశకం చివరి నాటికి క్షీణ దశకి చేరుకుంది. ఆధునికతకి ముందటి కంటే ఆధునిక యుగంలో కాలం నడకలో వడి హెచ్చింది. అంతకుముందు పరిణామాలన్నీ ఒకెత్తు, ఒక్క 20వ శతాబ్దపు మార్పులన్నీ ఒకెత్తుగా దూకిన కాలంలో పుట్టి, కలం పట్టిన వారిలో కూడా అదే దూకుడు ఉండాలి. దశాబ్దంలోపే దూసుకొస్తున్న కొత్త తరం వెనకటి తరం కంటే ఎక్కువ సౌకర్యాలు పొందే సుఖానికే కాదు, మరింత చిక్కని సంక్లిష్టతలు ఎదుర్కోవాల్సిన కష్టానికీ సిద్ధం అవాల్సి వచ్చింది. వెనకటి తరం వేసిన దారిలో కొంత అనాయాసమైన ప్రయాణం చేస్తూనే, ఆ దారిని మరింత వెడల్పు చేయాల్సిన తరాలు, అలా చేయకపోగా దానిని ఒక ఇరుకు డొంక చేసేశాయి. కథంటే ప్రాపగాండా, ముందే సిద్ధం చేసుకున్న ఒక ప్రతిపాదన, ఎత్తులు నిర్ణయమైపోయిన శకుని పాచిక. పాత్రలు తాను ఆడించినట్లు ఆడే తోలు బొమ్మలు, తానొక సృష్టికర్త. కథ చెప్పే గొంతుకలో గొప్ప గోరోజనం. ఆ కనిపించని కన్ను, తెర వెనక మూకీకి తెలియని సంగతులే లేవు, చూడని లోతులూ లేవు, ఆడా మగా తేడాల్లేకుండా పాత్రల అంతరంగాల అల్లకల్లోలాల్ని అక్షరాల్లోకి అలవోకగా ఆవిష్కరిస్తుంది.

Leo Tolstoy ‘వార్ అండ్ పీస్’ కథానాయిక నటాషా పాత్రకి పూర్తి ప్రేరణగా పరిశోధకులు నిర్ధారించిన ఆయన చిన్న మరదలు  Tanya Behrs ఆయననొక ఉత్తరంలో నిలదీస్తుంది-  ‘సైనికాధిపతుల్ని, యోధుల్ని, భూస్వాముల్ని పాత్రలుగా మలచటంలో ఎంతో నేర్పు ఉండొచ్చు. కానీ ప్రేమలో మునిగి ఉన్న ఒక స్త్రీ మనసులోకి మీరెలా తొంగిచూడగలరు?’ అంటే ఆధునిక సాహిత్యం అనుభవాత్మకమే కానీ, ఊహాత్మకం, వ్యూహాత్మకం కాదని, కాకూడదన్నదే టాన్యా నిలదీత అంతరార్థం. రాయడానికి ముందు తన పాత్రలు చెప్పేది శ్రద్ధగా వింటానని Charles Dickens అంతటి మహా రచయిత వినయంగా ప్రకటించిన చోటే author- authority కి పర్యాయపదమైపోయాడని,  ‘కొత్తా దేవుడి’ అవతారమెత్తాడని  Roland Barthes (Death of the author)  వంటి విమర్శకులు గోలపెట్టారు. రచయిత అంటే author కాదని, అతనొక

scripter మాత్రమేనని అన్నారు. రచనతో పాటు పుట్టాడే తప్ప సర్వాంతర్యామిలా సకలం తెలిసిన మిడిసిపాటుతో ‘వివరించటం’, ‘ప్రబోధించటం’ కూడదని గగ్గోలుపెట్టారు.

గొప్ప రచనలు ఏవైనా ఏ కాలంలోనైనా సిద్ధాంతాలకి precursors లాంటివే గానీ, సైద్ధాంతిక దిశానిర్దేశం నుంచి పుట్టనే పుట్టవు. 1960 దశకం చివరి దశలో పుట్టి, మరో దశాబ్దం ఆలస్యంగా భారతదేశంలో ప్రవేశించిన రోలాండ్ బార్త్ వంటి కొత్త తరం విమర్శకుల స్ఫూర్తి 1963 నాటికే త్రిపుర రాసిన కథలలో between the lines తొణికిసలాడటం ఓ అద్భుతం.

రచనతో పాటే పుట్టటం అన్న స్ఫూర్తిని మరో రకంగా అన్వయించుకుని,  ‘నేను’ కేంద్రకంగా, డాబుసరిగా ఒక సొంత డప్పులా, అద్దం ముందూ ఆత్మవంచనలా ‘ఉత్తమ పురుష’ కథల శైలి కూడా కదం తొక్కింది (తొక్కుతోంది) తెలుగు సాహిత్య సీమలో.

“మీలో ఒక గొప్ప గుణముంది. ఏ అనుభవాన్నీ కాదనరు. కానీ వాటిని మీ రక్తంలోకి అరబడనీయరు. అవునా?’ అన్నాడు, మళ్లీ రాత్రి అనుభవం నా కళ్లలో ఇంకా మిగిలి ఉందేమో అని పరీక్షగా చూస్తూ.

అవునో కాదో అప్పుడు చెప్పలేకపోయాను. జవాబు ఇదీ అని ఊహించుకుని మాటల్లో చెప్పదలచుకుంటే, చెప్పడానికి ప్రయత్నిస్తే ఒఖ్ఖసారిగా గర్వం,  ‘అహం’ తెలియకుండా వెనకపాటుగా ముట్టడి చేసి… మాటల్లో విపరీతమైన ‘ట్విస్ట్’, అసత్యం… బంగారు పూత… వెలిగే అసత్యం. ‘నిజం’ యొక్క కఠోరత్వాన్ని కప్పి పుచ్చే అసత్యపు ఆకర్షణ… ఇవీ, నిజం యొక్క అసలు వెలుగును చూడలేక బెదరడం, భయం; మనసుతో ‘తెలుసు’కోగలిగినా,  ‘తెలుసుకోవడం’ నా శిక్షణలో ఒక భాగమైనా, ’నేను’ అన్న మాటలలో ఖంగుఖంగుమని సత్యం ఎప్పుడూ మోగదని, ఏది నిప్పులాగ నిజమో, ఏది వేషధారణో చెప్పలేననీ…”

 

ఇది జర్కన్ కథలో వీరాస్వామి, కథకుడు భాస్కరం మధ్య సంభాషణ, స్వగతం. ఇదే సాహిత్యంలో ఉండాలని త్రిపుర పదేపదే ప్రస్తావించే కన్ఫెషనల్ ఎలిమెంట్. ‘నేను’ని నిర్దయగా చీల్చి చూసుకోవడం. స్వోత్కర్ష గొప్ప సుఖమే గానీ, ఈ నేరాంగీకారం ఎంతమాత్రం సులువు కాదు.

‘యవ్వన ప్రౌఢ దశల్లో నేను తిరిగిన ప్రదేశాలు, పడ్డ మధనలు కథల్లో ప్రాణం పోసుకున్నాయి. ముఖ్యంగా నేను విద్యార్థిగా బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్న రోజులు, ఆ రోజుల్లో నాకు బాగా చనువైపోయిన నగువా, యూనివర్సిటీ గేట్, యూనివర్సిటీ ఘాట్, బిర్లా, బ్రోచా హాస్టల్సు, దశాశ్వమేథ్ ఘాట్, గల్లీలు, గంగ, ఆనాటి కొత్త ప్రభావాలు, ఊహల్లో నమ్మకాల్లో ఉప్పెనగా వచ్చిన పరిణామాలు, మానసిక సంఘర్షణలు, ఎన్నో- వాటిని గురించి నేను రాయలేకపోయాను. ఈ కథకుడు రాయగలిగాడు. నేను, నా మూలతత్త్వం, కథల్లో బయటపడితే నేనేదో బట్టబయలైపోతానన్న సంకోచం ఉండేది నిన్న మొన్నటిదాకా. అంచేత కథల్లో సన్నివేశాలకు, పాత్రలకు రవంత దూరంగా వుండడానికి ప్రయత్నించేవాణ్ణి, వాటితో నాకెంత గాఢమైన బంధం వున్నా. ఈ కథకుడు ఆ బంధాన్ని స్పష్టంగా బయటపెట్టడానికి సిగ్గుపడలేదు, సంకోచించలేదు. అందుకు నా జోహారులు’ అన్నారు పాలగుమ్మి, త్రిపుర కథలకు రాసిన ముందుమాటలో. స్వాభావికమైన వినయం, విస్తృతమైన అధ్యయనం వల్ల అబ్బిన జ్ఞానం వల్ల సర్వశక్తిమంతులమని, అపరబ్రహ్మలమని పాలగుమ్మి వంటి మహా రచయితలు అహంకరించలేదు గానీ వారు కూడా రచనల్లో తమని దాచుకోవడానికే ప్రయత్నించారు. గొప్ప సాహితీవేత్త కావడమే కాకుండా, బెనారస్ నేపథ్యముండటం వల్ల కూడా పాలగుమ్మిని ‘త్రిపుర కథల’ ముందుమాటకు ఎంచుకున్నారేమో అత్తలూరి నరసింహారావు.

నిజానికి బెనారస్ విశ్వవిద్యాలయం పాలగుమ్మి జీవితంలో ఓ మజిలీ కాదు, అతి ముఖ్యమైన మలుపు. బెనారస్‌కి ముందు పాలగుమ్మి మీద సంప్రదాయ సాహిత్య ప్రభావం ఎక్కువ. సంస్కృత వాఙ్మయం కూడా కరతలామలకం. ఆయన అప్పటికే అష్టావధానాలూ చేసేవారు. బెనారస్ విశ్వవిద్యాలయం ఆయన ఆలోచనల్ని ఆధునికత వైపు మళ్లించింది. ఈ మార్పు పాలగుమ్మి సాహిత్య జీవితాన్ని పరిశీలిస్తే అర్థమవ్వాలే గానీ ప్రత్యక్షంగా ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు, త్రిపుర కథలకి రాసిన ముందుమాటలో తప్ప (‘ఆనాటి కొత్త ప్రభావాలు, ఊహల్లో నమ్మకాల్లో ఉప్పెనగా వచ్చిన పరిణామాలు, మానసిక సంఘర్షణలు, ఎన్నో- వాటిని గురించి నేను రాయలేకపోయాను’). ఆ విధంగా ‘త్రిపుర కథలు’ ఆయన నాస్టాల్జియాని కెరలించాయి. ‘నేను, నా మూలతత్త్వం, కథల్లో బయటపడితే నేనేదో బట్టబయలైపోతానన్న సంకోచం ఉండేది నిన్న మొన్నటిదాకా’ అన్నారాయన. నిన్నామొన్నటి వరకంటే ఎప్పటివరకు? 1980లో ఈ పరిచయ వాక్యాలు రాయకముందటి వరకు; ఇంకొంచెం hypothetical గా చెప్పుకుంటే ‘త్రిపుర కథలు’ తనని పట్టి కుదపక ముందువరకూ అనుకోవచ్చేమో. ఎందుకంటే, ఆ ‘నిన్నామొన్నటి’ తరవాత కలిగిన కొత్త ఎరుకతో పాలగుమ్మి ఏ రచనా చేయలేదు. కనుక ఎంత కాదన్నా పాత నమ్మకాలు, అలవాట్లు ఓ పట్టాన పోవు కాబట్టి ‘ఇటువంటి కథలు నేను రాయగలనా’ అని నిట్టూర్పు వంటి ప్రశంసతో ముగించారు పాలగుమ్మి.

చైతన్యవంతమైన 1980ల నాటికే అలా ఉంటే, అప్పటికి 20 ఏళ్ల క్రితం, ఆధునిక కథాసాహిత్యం నిలవ నీరైపోయిన 1960లలో ఎంత స్తబ్ధత, మొఖం మొత్తే మొనాటనీ ఉండి ఉండొచ్చు? గబ్బిలాలై వేలాడే నిన్నటి నమ్మకాలు, పాత హాంగోవర్లు, మార్పు పట్ల ససేమిరాలు, ముఖం తిప్పేసుకోవడాల మీద ప్రదీప్ కక్కిన నిరసన వంటివే త్రిపుర కథలు కూడా. ‘అబ్సర్డ్ నాటకకర్త అయొనెస్కోపై మరో ప్రముఖ అబ్సర్డ్ రచయిత త్రిపుర ప్రసంగం’ అంటూ రాసేసిన విలేఖరుల మిడిమిడి జ్ఞానాన్ని పోలిన అజ్ఞానంతోనే- ఆయనని ప్రముఖ అబ్సర్డ్ రచయితగా చేసి, తనకి సంబంధం లేని విశేషణాల భుజకీర్తులు తగిలించిన తెలుగు సాహితీ ప్రపంచం పట్ల ఏవగింపు కూడానేమో.

అయితే, ఊసిన కారాకిళ్లీ మరకలో ఎరుపు మెరుపులు చూసినట్టు, ఆ కథల టెక్స్ట్‌లోని వచన కవిత్వాల జమిలీకి వ్యామోహపడి, తన నిగూఢ తాత్విక శైలీ విన్యాసానికి వ్యసనపడింది తెలుగు సాహిత్యం. పాపులర్ అయ్యే ప్రమాదం తప్పింది గానీ, context  అర్థం కాని సాహిత్యలోకానికి ఓ cult figure గా మిగిలారు త్రిపుర.

నరేష్ నున్నా

 

కవితాత్విక కథ ‘వాంగ్మూలం’

rm umamaheswararao

ఉమా మహేశ్వరరావు

నా స్నేహితురాలు ఒకరు ఒక సంఘటన గురించి చెప్పిన మాటలు తరచూ గుర్తుకొస్తూ ఉంటాయి. ఆమె, ఆమె స్నేహితుడూ సముద్రంలో మునుగుతున్నారంట. ఆనందమూ అలలూ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్న వేళ, హఠాత్తుగా విరుచుకుపడ్డ ఒక అల ఆ ఇద్దర్నీ లోపలికి గుంజేసుకుంది. ఇక అంతా ముగిసింది అని అర్ధమయిపోయింది వాళ్ళిద్దరికీ. అప్పుడొక అల ఎదురొచ్చి, ఈడ్చి విసిరేసిందంట ఇద్దర్నీ గట్టు మీదకి. చావుకీ బతుక్కీ మధ్యన ఉండే సున్నితపు రేఖను చూసిన ఆ ఇద్దరూ తడి ఇసుక మీద కూలబడి వెక్కి వెక్కి ఏడ్చిన ఆ క్షణాల గురించి ఆమె ఇట్లా చెప్పింది.. ‘ఇంకొన్ని క్షణాలు..కొన్నే..అంతా అయిపోయి ఉండేది కదా, హాయిగా , ప్రశాంతంగా అని ఏడుపు తన్నుకొచ్చింది నాకు. అప్పుడే అతనూ ఏడుస్తున్నాడు, అయ్యో..అన్యాయంగా ముగిసిపోయి ఉండేదే అని.’

– విన్నపుడు విడ్డూరంగానే అనిపించినా, ఈ మాటల లోతు అర్ధమయ్యేకొద్దీ ఇవి మరింతగా నన్ను వెంటాడడం మొదలుపెట్టాయి. ఎన్నో సందర్భాలను కొత్తగా గుర్తు చేస్తునేవున్నాయి.

నాలుగేళ్ళ కిందట.. పడవ అంచున నిలబడి నయాగరా కిందకి ఇంకా ఇంకా దగ్గరవుతూ, ఆ జడిలో, ఆ జలపాతపు హోరులో ముద్ద ముద్దయిపోతూ, ఆ మహా సౌందర్యం ముందు మోకరిల్లి, ‘ఇక చాలు’ అనిపించిన క్షణం గుర్తుకొచ్చింది.

పాతికేళ్ళకి ముందు.. తిరుమల కొండకు తొలి నడకలో, వాన వెలిసిన సాయంత్రం అవ్వాచారి కోన బండ అంచున నిలబడి, దిగజూసినపుడు, ఓహ్..మసక కమ్మిన లోయలోపలి మరో లోకపు వింత శబ్ద సంగీతంలో మైమరచి దూకేద్దామనిపించిన క్షణం గర్తుకొచ్చింది.

ఇంకా ఎంతో ముందు.. పిర్రల మీద చినిగిన నిక్కర్లేసుకుని ఎర్రమట్టి లారీలెక్కి ప్రళయకావేరిని చీల్చుకుంటూ సముద్రం ముందుకు చేరి, మునిగి, తేలి, ఆడి, నురగలెత్తే ఆ గాఢ నీలిమ, అమ్మలా చేతులు సాచి పిలుస్తున్నట్టు బ్రమసిన క్షణం గుర్తుకొచ్చింది.

అసహ్యం, వికృతం, క్రూర బీభత్సంగా కనిపించే మరణం ఒక మోసకారి, మాయావి, ఒక రహస్య ప్రేయసి. ఒక్కోసారి మరణం మీద మనకున్నది ద్వేషమో, మోహమో అర్ధం కాదు. ఇట్లాంటి మరణం మీద కథ రాసింది స్వాతి బండ్లమూడి. కొత్త పేరు. భలే రాసిందే అని ముచ్చటపడి, కథ అచ్చేసిన వసంత(ఆంధ్రజ్యోతి ఆదివారం పత్రిక ఎడిటర్ )గారికి ఫోన్ చేస్తే కొన్ని వివరాలు చెప్పారు. చిన్న పిల్లే. గట్టి గడుగ్గాయి.  వాక్యంలో, కథనంలో, కథలో ఎంత ఆరిందాతనం!

కథ పేరు వాంగ్మూలం.

ఏభై ఏళ్ల ఒంటరి రచయిత. తాగుబోతు. రాతలో, బతుకులో పండిపోయినవాడు.

ఒక్కటే కథ  అచ్చయిన మరో కుర్ర రచయిత. తెలివి, బిడియం, మొండితనం, పట్టుదలాగల పిల్లవాడు.

ఈ ఇద్దరికీ స్నేహం. ప్రేమ, వాత్సల్యం అతడంటే సీనియర్ రచయితకి. ఆ పిలగాడు ఒక అద్దం అతనికి. తననే చూసుకుంటూ ఉంటాడు పిలగాడిలో. అద్దంలోని తనతో తాను మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడుతూ ఉంటాడు కథంతా. వాంగ్మూలం కథ నడక శైలి ఇది. అతను ఎవరితో మాట్లాడుతున్నాడు? పిలగాడితోనా, పాఠకులతోనా, కథ నడుపుతున్న రచయితతోనా, తనతోనేనా? ఏక కాలంలో అందరినీ కలగలిపి తనలో లీనంచేసుకుని మాట్లాడుతూ ఉంటాడు అతను.

ఏం మాట్లాడుతాడు..

పిలగాడి తెలివికీ, వయసులో ఉండే పట్టుదలకీ, మొండితనానికీ మురిసిపోతూ మాట్లాడుతూ ఉంటాడు. తొలి కలయికలో, తాగుడు బల్ల ముందు కూర్చున్న పిలగాడిని, ‘అలాగ ఫోటోలో దేవుడిలా కూచుంటావేం? నిజంగానే తాగవా?’అని అడిగినపుడు అతనికి శివాని గుర్తుకొచ్చింది. శివాని అతని సహచరి. శివాని గురించి పిలగాడికి ఎలా చెబుతున్నాడో చూడండి, ‘సృష్టిలో ఎక్కువైపోయి ప్రతిదాన్నీ లయం చెయ్యడానికి, శిమెత్తినప్పుడు లయతో తాండవమాడ్డానికి తోడుండే శక్తి తన అస్తిత్వాన్నంతా ఆక్రమించకుండా శివుడు ఎలాగాపాడో సగం శరీరం దగ్గరే! ఎలాగో నిభాయించాడు. తట్టుకు నిలబడ్డాడు.’ అట్టాంటి శివాని, మూడేళ్ళ కొడుకుపోయాక ఎన్ని నెలలకీ మనిషి కాలేక తనూ వెళ్ళిపోయింది. శివాని పోయిన రెండు పుష్కరాల తర్వాత అతని జీవితంలోకి వచ్చాడు ఈ పిలగాడు. ‘ ఎప్పటికీ చేతికి తగలని పచ్చగడ్డి పరక కోసం బీడునేలమీద తడుములాడినట్టు తనక్కావల్సిన దేనికోసమో చాన్నాళ్ళు’అతని దగ్గర శివాని వెతుకులాడినట్టుగానే, ఇప్పడు పిలగాడి దగ్గర అతనూ వెతుకులాడుతున్నాడు. ‘పిచ్చిలో ఉన్న ఆనందం పిచ్చోడికి తప్ప తెలీదు’అని తెలిసిన వాడు అతను. కథలు..కబుర్లు..తాగి తూలే మాటలు.. వాటిల్లోనే ఎన్నో తాత్విక సత్యాలు. నిండా పాతికేళ్లు లేని ఆ పిలగాడు అతనితో అంటాడు గదా, ‘ ఐనా పెద్దాయనా! మనమీ కాలంలో పుట్టి ఈ చట్టాలు, ఇప్పుడున్న సమాజమే ప్రామాణికం అనేసుకుని ఏదో రాసేస్తాం కానీ: ఈ స్థలం, కాలం, ఇప్పటి నైతికత ఇవన్నీ అబద్దం, అసంబద్ధం అయి మరో చోట, నక్షత్రాల ధూళి రాలిపడే అనంతమైన శూన్యంలో, ఉల్కాపాతాల మౌనంలో కాంతియుగాలకవతలకి మేధస్సుని పంపి రాయగలిగితేనే సృజనకి అర్ధం’. పాతికేళ్ళ కిందటి ఆవేశమూ, ఇప్పటికీ ఆగని అన్వేషణా గుర్తుచేసాయి అతనికి పిలగాడి మాటలు. తిరిగిన స్థలాలు, బతికిన కాలాలు జ్ఙప్తికొచ్చాయి. అకౌంట్స్ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేసి ఏ రైలో ఎక్కి ఎక్కడో దిగి పల్లెటూరి హోటల్లో టీకప్పులు కడిగి, గోవా బీచ్ లో టాయలెట్ల సఫాయీలో పనిచేసి, అజంతా గుహల్లో గైడుతనం వెలగబెట్టి..ఎన్నెన్నో అనుభవాలు..?! గాలివాటుకి ఎగిరిపోయి పతనమైన పతంగులు. ‘యుగాల తరబడి ఇందరు వెతుకుతున్న ఈశ్వర ప్రేమ హౌరానదికి అవతల ఎక్కడో ఏ ఇరుకు సందుల్లోనో దొరికినప్పుడు’ ఆ  ప్రేమనిచ్చిన బసంతిని గుర్తుచేసుకున్నాడతను. పాతికేళ్ళు నిండని పిలగాడితో, ఆ పిలగాడిలోని తనతో అన్నీ చెప్పేసుకున్నాడతను, ఆర్తిగా, ఆత్రంగా.

ఎందుకు? ఎందుకా పిలగాడి ముందు జీవితాన్ని విప్పి పరిచాడు అతను? ఎందుకంటే, ‘తను ఆగిపోయిన చోటు నుంచి ముందుకు కాకుండా పైపైకి వెళ్ళి, నక్షత్రాల మధ్య ఖాళీలో గడ్డ కట్టిన ఇంకు పెన్నుని గట్టిగా విదిలించికొట్టే దమ్ము’ ఆ పిలగాడికి ఉందనే నమ్మకం కలిగింది కాబట్టి. ఆ నమ్మకం ఆశగా మారుతున్న వేళ పిలగాడు అతనికి రాధ గురించి చెప్పాడు మురిసిపోతూ. కొద్ది నెలలకే పిలగాడి మురిపెపు గొంతులో నిరాశ. వైఫల్యపు ధ్వని. ‘దాని దుంప తెగ, ఎంత దౌర్భాగ్యపు జీవితమండీ’అని ఆ పిలగాడు అన్న మాటతో, అతను, తెగిన పతంగి.. తన దారాన్ని తనే మళ్ళీ ముడేసుకుని, ఈ టైంలో బస్సులుంటాయా అనే ఆలోచన అయినా లేకుండా కొరియర్ కవర్ మీది అడ్రస్ పట్టుకుని పరుగు తీశాడు పిలగాడిని వెతుక్కుంటూ. గది తలుపు తోసుకుని, ‘నేనెవరో చెప్పుకోరా ఇడియట్’ అంటూ అడుగుపెడితే, నేలంతా పరచుకున్న పుస్తకాలు, ఒలికిపోయిన ఇంకు మరకలు, ఒంటిమీద స్పృహ లేకుండా పడివున్న పిలగాడు. డస్ట్ బిన్ లో చింపి పారేసిన డైరీ కాగితాల మధ్యలో రెస్టిల్ షీట్లు.

‘గుండె పగిలిపోతోందిరా చిన్నోడా’ అంటూ అప్పుడంటాడు కదా అతను, ‘నిద్ర మాత్రలేసుకునే ముందు చిన్న చీటీ ముక్క రాయాలనీ, రాసేముందు ఇంటి గోడలకి బీటలేస్తూ మొండిగా బతికే ఏ పిచ్చి పూల చెట్టునో గుర్తు తెచ్చుకుని బతకాలనీ, నీ ప్రాణమ్మీద నీకథికారం లేదనీ, నీ నిరాశకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ బతుక్కి లేదనీ, రెండు మైలు రాళ్ళ మధ్య నిశ్శబ్దంలో అలసట తీర్చుకోవాలే కానీ అర్ధంతరంగా ఆగిపోకూడదనీ, ఇలా చేసిన నీ తలపొగరుకి శిక్షగా ‘లవ్యూ రా బంగారు కొండా’ అని ఇక నేనెప్పుడూ చెప్పబోననీ’అతను మందలిస్తూ దుఖిస్తూ..

ఇదీ కథ..

తాగుబోతు రచయిత వదరు మాటల్లా మొదలై లెక్కాపక్కా లేనితనంలోంచి  మూడేళ్ళ బిడ్డనీ, శివానినీ పోగొట్టుకున్న పశ్చాత్తాపపు దుఖంలోంచి, మొండితనపు తెలివి తేటల పిలగాడి ప్రేమలో పడి, కొండల్లోంచి దూకే జలపాతం నదిలా పారినంత నిమ్మళంగా మారి, పిలగాడిలోని తనను  తాను చూసుకుంటూ దిద్దుకుంటూ, తుఫానుకి పెకలించుకుని బయటపడిన వేళ్ళను మళ్ళీ మట్టిలోకి పాదుకుంటూ అతను అతనుగా మారి నిలబడ్డమే కథ. కథలో పిలగాడు ఒక ప్రతిబింబం.  బింబ ప్రతిబింబాల మధ్య స్వగతంలా సాగే  సంభాషణ.  గాఢమైన కవితాత్మక వాక్యాలు, తాత్విక మాటల పోగులు. చిక్కటి కవిత్వం రాసే స్వాతి కథ రాసినా కవిత్వమే పొంగుతుంది. ఒక చోట.. ‘ తనలోని సుఖాన్ని తనకే తిరిగి ఇచ్చే మరో సాధనం కోసం వెర్రెక్కిన శరీరపు కేకలు, ఏ అస్థిపంజరాల్ని కప్పిన అవసరాల్నో చేరిన చోట- ఎవరివో స్త్రీ దేహాలు, స్నేహాలు, దాహాలు, మోహాలు. మొహం మొత్తుళ్ళు, విదిలింపులు, వదిలింపులు, డబ్బుల ఎరలు, ఏ చెట్టువో రాలి నీటివాలుకి కొట్టుకొచ్చిన అడివిపూలు- ఎటర్నల్ స్ట్రగుల్ ఆఫ్ ది యానిమల్ ఇన్ స్టింక్ట్’

ఇంకో చోట- ‘ నీడ నుంచి నిజాన్ని విడదీసి చూపడానికి విషపుటాలోచనలు చేస్తున్న మోసపు ఉదయాన్న: నిశ్చింతగా పడుకున్న రాత్రినెవరో రాక్షసంగా నేల అడుక్కి తొక్కేస్తుంటే, ఆ ఊపుకి రోడ్డు మీద తూలిపడుతున్న ప్రతీదాన్నీ కేర్లెస్ గా చూసుకుంటూ..’

-ఈ చిన్న కథ నిండా ఇట్లాంటివే ఎన్నో.

కథ ముగింపు చదివాక, ఎందుకో వజీర్ రహ్మాన్ ‘చివరికి’ కవిత గుర్తొచ్చింది.

చివరికేం మిగలదు!

చావుని పల్కిన భయానక సర్పం కూడా

నీటిమీద గీతమల్లే చెరిగిపోతుంది

దేహసారాన్ని పీల్చుకుని

సమాధిని చీల్చుకుని

ఏ పిచ్చి మొక్కో మత్తుగా తలెత్తి మాయమౌతుంది

ఏ పుర్రె యెమికో మిగుల్తుంది

ఎండలో దుమ్ములో దొర్లుతో,

నక్కలు కూడా కాదని వొదిలే చిన్న మురికి బొమికె

ఇంతే- చివరికేం మిగలదు!

దేహమోహ సీమని

మైక సంగీత మయం చేసిన

యవ్వన మృదు పుష్పం సైతం మన్నులో మన్నై మలినమై

ఎమికపై నూగారు గర్తు కూడా!’ అంటూ స్మశాన వైరాగ్యపు నిరాశతో మొదలు పెట్టి, చివరికేం మిగలదా? అనే ప్రశ్న వేసి, సౌందర్యభరిత జీవితాన్ని పటంగట్టి ముందుంచి ఆశను నింపుతాడు ఇలా గుండె నిండుక్కీ..

‘చివరికి మళ్ళీ

ఎక్కడో ఏ కొండ పంచనో

గడ్డిపూల గుంపులో నించుని

సృష్టి వైచిత్రికి తలలూపుతో మిగులుతాం-

ఏ చీమల బారులోనో

హడావుడిగ నడిచి వెడుతో

నరజీవుల వికృత చేతలకి నివ్వెరపోతో మిగులుతాం-’

మనసు నిండా తెలియని చీకటి కమ్ముకున్నపుడంతా ‘సాహసి’లోని ఈ కవితను నేను చదువుకుంటూ ఉంటాను. కొండ పంచన గడ్డిపూల గుంపు పరిమళాన్ని గుండెల నిండా నింపుకోవడానికి. నైరాశ్యపు అంచులమీద, మన అడుగులో అడుగు వేసి నడుస్తూ, మాయ చేసి మనల్ని మంచి గడ్డిబాట మీదకు మళ్ళించి, మనలో   జీవితేచ్ఛను రగిలించే కవిత ఇది.   ‘వాంగ్మూలం’ కథలో కూడా నాకు ఈ మాయ లక్షణమే కనిపించింది. రాయలసీమ బైరాగులు పాడే తత్వాలు చెప్పే సత్యాలకు అక్షర రూపాలే కదా వజీర్ రహ్మాన్ ‘చివరికి’, స్వాతి బండ్లమూడి ‘వాంగ్మూలం’ అనిపించింది. ఈమె రాసిన మొదటి కథేనా ఇది? ఇంతకు ముందూ, తర్వాతా ఇంకేమైనా కథలు రాశారా? నాకయితే ఎక్కడా తారసపడలేదు. అయినా, ఈ కథ చదివినపుడు మాత్రం   తెలుగు కథకు కొత్త భరోసా స్వాతి బండ్లమూడి అనే నమ్మకం కలిగింది.

***

వాంగ్మూలం బొమ్మ

వాంగ్మూలంswatikumari

గుండె పగిలిపోతోందిరా చిన్నోడా..

యాభయ్యేళ్ల ఒంటరోడిని, తాగుబోతు నా కొడుకుని, అర్ధరాత్తుళ్ళు ఫోన్‌ చేసి “లవ్  యూ రా  బంగారుకొండా” అంటే సంస్కారపుజబ్బు ముదిరినోడివి కాబట్టి నా మత్తు సంగతి కనిపెట్టి నీ నిద్రమత్తుని దాచిపెట్టి “ఇవ్వాళ కూడా డోసెక్కువైందా?” అని విసుక్కోకుండా అడిగినప్పుడు ఎంత ముచ్చటేసేదిరా!

సఫరింగ్, సఫరింగ్, సఫ – రింగ్, టేబిల్ మీద ఖాళీగా గ్లాసుల అడుగుజాడల రింగులు. వలయాలు, వేదనా వలయాలు, శోధనా వలయాలు. కళ్ళు తిరిగి వళ్ళు తిరిగి… ర్రేయ్, ఇంతకుముందు ఇక్కడో నయాగరా ఉండాలి, సింకులో నీళ్లాపేసిన బాస్టర్డ్ ఎవడ్రా?  కాగితాలున్నయ్ కాబట్టి సరిపోయింది మాటలు కక్కడానికి.

పత్రికలో పడిన నీ ఒకేఒక్క కథ, ఆపైన నీ ఉత్తరాలు చూసి మొదటిసారి నిన్ను కలిసినప్పుడు నేను ఊహించినట్టే ఉన్నావ్. ఐనా ఏం ఊహించాను నేను? తెలివి, మొండితనం, వయసులో ఉండే పట్టుదలా, అదే నాకు తెలిసిన నువ్వు, నాకెప్పటికీ దొరకని నాలాంటి నువ్వు, ఆ సాయంత్రం అంతసేపూ తాగుడూ వాగుడూ నాదే అయాక “అలాగ ఫోటోలో దేవుడిలా కూచుంటావేం? నిజంగానే తాగవా!” అని నేను దేవుణ్ణీ, నిన్నూ ఒకేసారి అనుమానిస్తే “తాగినవాళ్లని ఇంతదగ్గరగా కూడా ఎప్పుడూ చూళ్ళేదు మాస్టారూ!” అన్చెప్పి “కేవలం మీ కోసమే ఇంతసేపూ…” అన్న ముక్కని చెప్పకుండా అభిమానంగా నవ్వినప్పుడు; అప్పుడు గ్లాసు దించి మరోసారి నీ మొహంలోకి చూస్తే, ఎందుకో…

ఎందుకో! శివాని గుర్తొచ్చింది –

పెళ్లాం, బెటరాఫ్- ఇలా ఎలా రిఫర్ చేసినా చిరాకు పడేది శివాని, ఆ పేరు చూసే ప్రేమించుంటాను. సృష్టిలో ఎక్కువైపోయిన  ప్రతిదాన్నీ లయం చెయ్యడానికి, శివమెత్తినప్పుడు లయతో తాండవమాడ్డానికి తోడుండే శక్తి తన అస్తిత్వాన్నంతా ఆక్రమించకుండా ఎలాగాపాడో సగం శరీరం దగ్గరే! నిభాయించాడు, తట్టుకు నిలబడ్డాడు. మరి మాటలా! నాలాంటోడివల్ల కాలేదు. ఇందాకన్నాగా  ‘మా ఆవిడ’ అని తన గురించెవరికైనా చెబ్తే- ‘నేను నువ్వే అవుతాను కానీ, నీకు మరేదో ఎలా అవుతాను?’ అని పెళ్లిలో చదవని మంత్రాల్నేవో కొత్తగా నేర్పలేక మళ్ళీ వెంటనే మూగగా అయిపోయేది.

మూడేళ్ల కొడుకుపోయి ఎన్ని నెల్లకీ మనిషి కాలేదు. శరీరంకోసం తప్ప ఓదార్చడానికి ముట్టుకోడం రాని మగాణ్ణే అప్పటికి. తన ఏడుపు నన్ను అస్తమానమూ డిఫెన్స్ లో ఎందుకు పడేసేదో ఎప్పుడాలోచించినా అర్థం కాదు. సొంతసొత్తులా తప్ప సాటిమనిషిలా చూడలేనని తెలిశాక కూడా, ఎప్పటికీ చేతికి తగలని పచ్చగడ్డి పరకకోసం బీడునేలమీద తడుములాడినట్టు తనక్కావల్సిన దేనికోసమో చాన్నాళ్లు  నాదగ్గర వెతుకుతూనే ఉండేది. ఇప్పుడు నాకు పగులుతున్నట్టుగానే తనకీ గుండె ఎన్నిసార్లు పగిలి ఉంటుందో! ఒకరోజు నిజంగానే నా శక్తినంతా లాక్కుని జీవితాన్ని, మనుషుల్ని దేబిరించకుండా హుందాగా తనకి నప్పుతుందేమో అన్న ఆశతో మరే లోకానికో వెళ్లిపోయాక, వెళ్ళిపోయి రెండు పుష్కరాలు దాటాకా నువ్వు…

ఇప్పుడిదో కొత్త పిచ్చి – ’పిచ్చిలో ఉన్న ఆనందం పిచ్చోడికి తప్ప తెలీదు’ అని నేనంటే “నెరుడాని మీవాదం కోసం వాడేసుకుంటారు – స్పానిష్ మీ బలహీనత” అని నువ్వు ఎడ్మైరింగ్ గా నవ్వేవాడివి, “నువ్వు గత జన్మలో రష్యా వోడివిరా” అని నేనన్నప్పుడు కృతజ్ఞతతో నవ్వినట్టు…

“కథొకటుంది మాస్టారూ- మూడు ముక్కల్లో చెప్పొచ్చు. పెళ్ళాన్ని దారుణంగా చంపేసి రేప్పొద్దున ఉరికంబం ఎక్కబోతున్న హంతకుడి గురించి ఇద్దరు సెంట్రీలు మాట్లాడుకుని, నైట్ డ్యూటీలని బూతులు తిట్టుకుని ఒక దమ్ములాగి సెల్స్ లో రౌండులకెళ్ళటం మొదటి భాగం. చనిపోయిన భార్య ప్రియుడు, ఈ గొడవల్లో తను ఏ రకంగానూ ఇరుక్కోకుండా ఇన్‌ఫ్లుయెన్స్ తో ఎలా నెట్టుకొచ్చాడో; చిత్తుగా తాగి బార్లో ఫ్రెండ్స్ దగ్గర కోతలు కొయ్యడం రెండోది. ఖైదీ కొడుకు అనాథాశ్రమంలో భయంగా ముడుచుకుపడుకుని తను స్కూలుకెళ్ళి వచ్చేలోపు అమ్మా నాన్నా ఇద్దరూ కనపడకుండా పోవడమేంటో అర్థంకాక ఎక్కిళ్ళు బయటికి వినపడకుండా నోరుమూసుకుని, కాసేపటికి కళ్ళు తుడుచుకోకుండానే నిద్రపోవడం- ముగింపు ; అంతే కథ. మొత్తం కథలో ఆ హంతకుడిని నేరుగా చూపించకుండా పొగమంచు కప్పెయ్యాలన్నమాట, రాయొచ్చంటారా?” అని మొహమాటంగా సలహా అడిగినప్పుడు-

“నా అనుభవంలోంచి చూస్తే అంత గొప్పకథ కాదుకానీ, నీ వయసుకి గ్రాండ్ గానే ఉంటుందిలే, కానియ్”  అని ఉడికిస్తే “ఒక్కసారైనా అన్‌కండీషనల్‍గా మెచ్చుకోరుగా మీరు” అంటూ నువ్వు ఉక్రోషపడితే ’నాకేవఁవుతాడ్రావీడు? నిండా పాతికేళ్ళు లేవు, నాకొడుకే బతికుంటే వీడంతై, ఇలా లోలోపల దావానలంతో దహించుకుంటూ ఉండేవాడా?’ అనొక విపరీతపు ఆలోచన సెంటిమెంట్ తో సతమతం చేస్తుండేది.

“ఐనా పెద్దాయనా! మనమీకాలంలో పుట్టి ఈ చట్టాలు, ఇప్పుడున్న సమాజమే ప్రామాణికం అనేసుకుని ఏదో రాసేస్తాం కానీ; ఈ స్థలం, కాలం, ఇప్పటి నైతికత ఇవన్నీ అబద్ధం, అసంబద్ధం అయిన మరోచోట, నక్షత్రాల ధూళి రాలిపడే అనంతమైన శూన్యంలో, ఉల్కాపాతాల మౌనంలో కాంతియుగాలకవతలకి మేధస్సుని పంపి రాయగలిగితేనే సృజనకి అర్ధం” అని నువ్వూగిపోతుంటే పాతికేళ్ల క్రితపు నా ఆవేశమూ, దాన్లోంచి పుట్టి ఇప్పటికీ ఆగని నా అన్వేషణా గుర్తొచ్చేవి.

“ఏమన్నావు? స్థలం, కాలం – ఎన్ని స్థలాల్లో తిరిగాను, ఏ కాలాల్లో బతికాను. పిచ్చి పట్టినవాడిలా ఏ రైల్లో ఎక్కడ ఎక్కానో, అదెక్కడికెళ్తుందో తెలీకుండానే. నిద్ర లేచినప్పుడే స్టేషనొస్తే అదే నాఊరు. పడమటి కనుమల్లో ఏదో పల్లెటూరి హోటల్లో  టీకప్పులు కడగటంలో మొదటిసారి మెడిటేషన్‌ దొరికినప్పుడు, గోవాబీచ్ లగ్జరీ రిసార్ట్లో టాయిలెట్ల సఫాయీలో నాలుగు డబ్బులు పోగవగానే సింబాలిజం, ఫ్యూచరిజం, ఫిలాసఫీ అని ఇష్టమొచ్చిన పుస్తకాల కోసం ఖర్చు పెట్టేసినప్పుడు; నేనొదిలేసొచ్చిన ఎకౌంట్స్ మేనేజర్ పోస్ట్ లో గోతికాడ నక్కలా దూరి వారానికార్రోజులు సగం టీలు, సగం గాసిపింగూతో గడిపేసే శివప్రసాద్ కి ఫోన్‌చేసి ‘నిజంగానే నేను గొప్పగా బతుకుతున్నాన్రా ఫూల్’ అని పగలబడి నవ్వాలనిపించేది.

అజంతా గుహల్లో గైడుగా వెలగబెట్టినప్పుడు చరిత్రని పొయెటిగ్గా చెబుతుంటే ఆ కాసేపట్లోనే శిల్పి హృదయ రహస్యాల్ని కళ్లతో కొనేసుకోవాలని తపించి, కళలోని అందాన్ని తప్ప ఆత్మని పట్టుకోలేక అల్లాడే యాత్రీకుల అలసటని, ఫోటోల్ని తప్ప   జ్ఞాపకాల్ని దాచుకోలేని యాంత్రికతనీ చూసి జాలిగా ఓదార్చాలనిపించేది.

ఇంకా ఎన్నెన్ని స్థలాలు, ఎలాంటి అనుభవాలు!

దారంతెగి గాలివాటుకి ఎగిరిపోయి పతనమైన పతంగులు, వివస్త్రంగా ఉబ్బి వరదల్లో కొట్టుకోచ్చే దిక్కులేని శవాలు, ఇసుక తుఫానులు చెరిపేసిన ఎడారిఒంటెల ప్రయాణపు గుర్తులు, అసంతృప్త  ఆగ్రహాలు నిండిన సముద్రపు సుడుల్లో అలవాటుపడ్డ మొండి ధైర్యంతో సాగిపోయే ఓడలు చేరని తీరాలు.

ఏ స్థలాల్లోవి, ఏ కాలానివి ఈ జ్ఞాపకాలన్నీ?

తనలోని సుఖాన్ని తనకే తిరిగి ఇచ్చే మరో సాధనం కోసం వెర్రెక్కిన శరీరపు కేకలు, ఏ అస్థిపంజరాల్ని కప్పిన అవసరాల్నో చేరిన చోట- ఎవరివో స్త్రీ దేహాలు, స్నేహాలు, దాహాలు, మోహాలు. మొహంమొత్తుళ్ళు, విదిలింపులు, వదిలింపులు, డబ్బుల ఎరలు, ఏ చెట్టువో రాలి నీటివాలుకి కొట్టుకొచ్చిన అడివి పూలు – ఎటర్నల్ స్ట్రగుల్ ఆఫ్ ది యానిమల్ ఇన్‌స్టింక్ట్స్…

యుగాల తరబడి ఇందరు వెతుకుతున్న ఈశ్వరప్రేమ హౌరా నదికి అవతల ఎక్కడో ఏ ఇరుకు సందుల్లోనో దొరికినప్పుడు; బసంతీ! నా చెవిలో ఏదో అన్నావ్? ఆర్ట్ సినిమాలో నటన మర్చిపోయిన హీరోయిన్లాగా. మనసుతో శరీరాన్ని కోరుకోవడం మర్చిపోయిన చాలా ఏళ్లకి, పరిచయం పాతబడి వెళ్ళిపోతుంటే- నేనిచ్చిన డబ్బులు చనువుగా నా జేబులో తిరిగి పెట్టేస్తూ ఏమిటి బసంతీ అన్నావ్ నాకెప్పుడూ అర్థంకాని మరోలోకపు భాషలో!! ఎప్పుడో శివాని కోసం పిచ్చెక్కిపోయిన మొదట్లో భావుకత్వమంతా కళ్లల్లో వెలిగించుకుని నుదుటిమీద ఆర్తితో పెట్టిన ముద్దు, కామంతో కాదు, రిచువల్ గా, అలవాటుగా కాదు.. ‘ఐ కేర్ ఫర్ యూ’ ఆని అంత సున్నితంగా చెప్పడం మళ్ళీ నీదగ్గరే. ఒకసారెళ్ళిన చోటకీ, వదిలేసొచ్చిన మనుషుల దరిదాపుకీ వెళ్ళే అలవాటు లేదు నాకు. ఎక్కడున్నావో, ఎప్పుడైనా తలచుకున్నావో లేదో, అప్పటికి కష్టంగా అనిపించినా తప్పలేదు. నాకు తెలుసు నీతో నేనుండలేను, అసలెవరితోనూ, ఎక్కడా  ఉండిపోలేను శాశ్వతంగా, పదిహేనేళ్లవదూ? ’బై బై బసంతీ’ అనికూడా చెప్పకుండా వెనక్కి తిరిగి చూడకుండా లేటైపోతున్న ఏ రైలు కోసమో అన్నట్టు త్వరత్వరగా నడుచుకుని వచ్చేసి…”

ఎక్కడి చట్టం, సమాజం, నైతికత, నైతికాతీతత! నిజంగానే నువ్వు రాయగలవురా చిన్నోడా; నేనాగిపోయిన చోటునుంచీ ముందుకు కాకుండా పైపైకి వెళ్ళి,  నక్షత్రాల మధ్య ఖాళీలో గడ్డకట్టిన ఇంక్ పెన్నుని గట్టిగా విదిలించి కొట్టి… నీకా దమ్ముంది.

“ప్రయోగాల మీద అంత తపన ఉన్నవాడివి, ఈ మూడుముక్కల కథలెందుకు నీకు?” అనడిగితే “లేద్సార్, ఈ ఒక్కసారికీ రాధికకి మాటిచ్చాను. తను పనిచేసే వీక్లీలో స్టోరీసెక్షన్‌కి మారింది. మీకెప్పుడూ చెప్పలేదుకదా తను చాలా ఇంటెలిజెంట్ అండ్ సెన్సిబుల్ గా అనిపిస్తుంది” అని మురిసిపోయినోడివి – ఇన్ని నెల్ల తర్వాత మళ్ళీ మొన్ననగా ఫోన్‌ చేసి “మనకి నచ్చేది లోకంలో నిజంగా ఉందని తెలిసీ, అందుబాటులో ఉండీ, మనది కానప్పుడు, ఎలాగండీ తట్టుకునేది?” అని ఏదో గొప్ప ఆశాభంగాన్ని మగాడివి కాబట్టి ఏడవకుండా మానిప్యులేట్ చేస్తుంటే- ఏంట్రా ఇంత ముదురుగా మాట్లాడావ్! ఒకవేళ తాగి ఉన్నావా అని అనుమానమేసి పట్టరాని కోపమొచ్చింది.

————————

అప్పటిదాకా ఎక్కింది దిగితూ, అప్పుడే లోపలికి దిగింది నరాల్లోకి ఎక్కుతున్న మైకంతో, తడిపిన కొద్దీ ఎండిపోతున్న గొంతుతో- ఎక్కినమెట్లు దిగుతున్నానో, దిగవల్సిన మెట్లు ఎక్కుతున్నానో మెట్లకే తెలియాలి. నీడనుంచి నిజాన్ని విడదీసి చూపడానికి విషపుటాలోచనలు చేస్తున్న మోసపు ఉదయాన్న; నిశ్చింతగా పడుకున్న రాత్రినెవరో రాక్షసంగా నేల అడుక్కి తొక్కేస్తుంటే, ఆ ఊపుకి రోడ్డుమీద తూలిపడుతున్న ప్రతీదాన్ని కేర్లెస్ గా చూసుకుంటూ..

అదే మొదటిసారి పనిగట్టుకుని ఫలానా చోటకని అనుకుని ఎవర్నైనా చూడ్డానికి రావడం.

“మీ పుస్తకాన్ని ప్రచురిస్తాం” అని ఎవరైనా అడిగితే “చేసుకోండి, నాకెందుకు చెప్పడం?”

“మరి రాయల్టీలు?”

“ఊళ్ళో నా తమ్ముడున్నాడు, వాడికిచ్చెయ్యండి. నా తాగుడుకి డబ్బులు చాలక ఉత్తరం రాస్తే వాడే పంపుతాడు.”

అంత నిర్లక్ష్యం, అంత పొగరుబోతు దిలాసా! అలాంటిది నిన్న రాత్రి నువ్వు ఫోన్లో “దాందుంపా తెగ, దౌర్భాగ్యపు జీవితమండీ!” అనగానే ఈ టైంలో బస్సులుంటాయా అనే ఆలోచన లేకుండా నువ్వు పుస్తకాలు కొరియర్ పంపిన కవరు వెనక అడ్రెస్ పట్టుకుని, ఇందాకా వస్తే…

గది తలుపు తోసుకుని “నేనెవరో చెప్పుకోరా ఇడియట్?” అని నీ ఆశ్చర్యం చూద్దామనుకుంటే…

నీలాగే నీగది కూడా నేనకున్నట్టే ఉంది. నేలంతా పరుచుకున్న పుస్తకాలు, టేబుల్ మీద ఒలికిపోయిన ఇంకు మరకలు,  కానీ వంటి మీద స్పృహేదీ? పక్కన సూసైడ్ నోటేదీ? డస్ట్ బిన్‌ లో చింపిపారేసిన డైరీ కాయితాల మధ్యలో రెస్టిల్ షీట్లు ఏ వివరాలూ చెప్పవు. అసలెవరైనా ‘నా చావుకెవరూ కారణం కాదు ‘ అని రాశారంటే అ కారణమైన వాళ్లని కాపాడ్దానికే అని అర్థం. మరి అసలేమీ రాయకుండా ఇలాటి పని ఏ చివరి జ్ఞాపకాన్ని కాపాడ్డానికి?

పెద్ద పనిమంతుడిలా కథల్రాయడమే కానీ నిద్రమాత్రలేసుకునే ముందు చిన్న చీటీ ముక్క రాయాలనీ, ఆ రాసేముందు ఇంటిగోడలకి బీటలేస్తూ మొండిగా బతికే ఏ పిచ్చిపూలచెట్టునో గుర్తుతెచ్చుకుని బతకాలనీ, నీ ప్రాణమ్మీద నీకధికారం లేదనీ, నీ నిరాశకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ బతుక్కి లేదనీ, రెండు మైలురాళ్ల మధ్య నిశ్శబ్దంలో అలసట తీర్చుకోవాలే కానీ అర్ధాంతరంగా ఆగిపోకూడదనీ, ఇలాచేసిన నీ తలపొగరుకి శిక్షగా ’లవ్ యూ రా బంగారుకొండా’ అని ఇక నేనెప్పుడూ చెప్పబోననీ,

ఈమాత్రం ఊహించలేనివాడివా నువ్వు అని తలచుకున్నకొద్దీ…

గుండె పగిలిపోతోందిరా చిన్నోడా!

————*****————-

-స్వాతికుమారి బండ్లమూడి

అందరి కుటుంబాలనీ ఆదుకోవడమే ఆయన జీవితాదర్శం….

మా అమ్మ, నాన్న గారు

1940 దశకంలో దొంతమ్మూరు గ్రామంలో (తూ.గో. జిల్లా కిర్లంపూడి దగ్గర గ్రామం) మా కామేశ్వర రావు మామయ్య గారు హఠాత్తుగా పోయారు. దానితో సుమారు 400 ఎకరాల మిరాశీ అనే పొలం వ్యవహారాలూ కూడా మా నాన్న గారే తన భుజాలకి ఎత్తుకున్నారు. ఆ తరువాత మరొక ముఫై ఏళ్ళు మా బంధువులందరి కుటుంబ బాధ్యతలనీ ఆయనే తన సర్వశక్తులూ ఓడి, ఎక్కడా ఓడకుండా నిండు కుండలా అందరినీ గట్టెక్కించి, అందరికీ జీవితంలో మంచి బాటలు వేసి నడిపించి, ఆఖరి రోజులలో మా కళ్ళ ముందే అలసి పోయి సొలిసి…పోయారు మా నాన్న గారు. మా పెద్దమ్మాయి పుట్టిన కబురు తెలిసాక, అమెరికాలో పుట్టిన మొట్టమొదటి మనవరాలు ఎలా ఉంటుందో అనే కోరిక తీరకుండానే 1983 లో ఆయన పోయారు. అప్పుడు ఆయన వయస్సు 76 ఏళ్ళు. ఆయనే మా “బాబయ్య గారు”. మా కుటుంబంలో నాన్న గారిని బాబయ్య గారు…(బాబయ్యారు) అని పిలవడం అప్పుడు అలవాటు. మా నాన్న గారు మా పిల్లలు ముగ్గురిలోనూ ఎవరినీ చూడ లేదు. కన్న తండ్రికి కన్న పిల్లలని కూడా చూపించ లేక, ఆఖరి క్షణాలలో ఆయన్ని చూడలేని ఈ “త్రిశంకు స్వర్గం” లో నా పరిస్థితిని తల్చుకున్నప్పుడల్లా “ఈ అమెరికా ఎందుకు వచ్చాం రా” అని మధన పడుతూనే ఉంటాను.

మా తాత గారు సంపాదించిన ఆస్తిపాస్తులు, చేసిన దాన ధర్మాల వాగ్దానాలు అన్నీ ఏకైక కుమారుడిగా ఆయనకి వారసత్వ బాధ్యతలుగా రావడం, వాటిని ఆయన మన:స్ఫూర్తిగా స్వీకరించి సంపూర్తిగా నిర్వహించడమే మా నాన్న గారి జీవితానికి నిర్వచనం. ఆయన చెయ్య లేని పని ఒకే ఒక్కటి. ఆ ప్రస్తావన తరువాత తెస్తాను. మా తాత గారు సూర్య ప్రకాశ రావు గారు పుట్టినప్ప్పుడే తల్లిని పోగొట్టుకుని, బీదరికం అనుభవిస్తూ, మేనమామ కుంటముక్కల హనుమయ్య గారి ప్రాపకం, పిఠాపురం రాజా వారి ఆర్ధిక వేతనాలతో రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల, తరువాత మద్రాసు లా కాలేజీ లో చదువుకునే రోజులలోనే మా బామ్మ గారు (కాట్రావులపల్లి) ఆది లక్ష్మి మాణిక్యంబ గారిని పెళ్ళి చేసుకున్నారు.

మా అమ్మ,, నాన్న గారి పెళ్లి సుభ లేఖ

1900  లో ఆయన కాకినాడ లో కృతివెంటి పేర్రాజు పంతులు గారి దగ్గర జూనియర్ లాయర్ గా చేరారు. ఆలస్యంగా చదువు మొదలుపెట్టడం వలన అప్పటికే ఆయన వయస్సు ముఫై దాటింది. తన స్వార్జితంతో మొదటి ఆస్తిగా ఫిబ్రవరి  2, 1921 లో ఆయన కాకినాడలో ఇప్పటి గాంధీ నగరంలో (అప్పటికి అది పిఠాపురం రాజా వారి పేరిట వెలిసిన రామారావు పేట.) ఒక్కొక్కటే 1800  గజాలు ఉండే పక్క పక్కనే ఉండే రెండు ఇళ్ళ స్థలాలు – వెరసి 3600  గజాల స్థలం కొన్నారు.  ఆ తరువాత ద్రాక్షారామం దగ్గర ఇంజరం గ్రామంలో 40 ఎకరాలు పొలం కొని దగ్గర బంధువు ఒకాయనకి (పండ్రవాడ గవర్రాజు) యాజమాన్యం ఇచ్చారు. కానీ, మా తాత గారికి స్వగ్రామమైన దొంతమ్మూరు గ్రామం మీద ఉన్న అభిమానంతో అక్కడ 350 ఎకరాలు ఒక్క సారిగా అమ్మకానికి రావడంతో, పైగా అది హనుమయ్య గారి మిరాసీ పక్కనే ఉన్న భూమి కావడంతో మా తాత గారు ఆ పొలం కూడా మార్చ్ 30, 1922 నాడు కొన్నారు.   బొబ్బిలి సంస్థానానికి చెందిన ఎస్టేట్ లో ఒక భాగమైన ఈ పొలానికి వారి బంధువులైన చెలికాని ధర్మారాయణం గారి దగ్గర ఈ పొలం కొన్న దగ్గర నుండీ మా తాత గారికి లాయర్ వృత్తి మీద శ్రద్ధ తగ్గి వ్యవసాయం మీద ఆసక్తి పెరిగింది.

ఆ ఆసక్తితో బొబ్బిలి రాజా గారి దగ్గర మామిడి తోటలు వెయ్యడానికి మరొక 1000  ఎకరాల బంజరు భూములకి పట్టా మా తాత గారు కౌలుకి తీసుకున్నారు.  కేవలం మూడు, నాలుగేళ్ల సమయంలో అత్యధికంగా ఆర్ధిక పెట్టుబడి పెట్టి, వ్యవసాయం లో అనుభవం లేని మా తాత గారు ఆ సమయంలో దురదృష్టశాత్తు  ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఆర్ధిక మాంద్యంలో—ది గ్రేట్ డిప్రెషన్ – లో తను కూడా కూరుకుపోయారు.  సుమారు 1923 మా బాబయ్య గారు నుంచి  1940  దాకా మా తాత గారు విపరీతమైన ఆర్ధికపరమైన కష్టాలు పడ్డారు.

కానీ మొండి పట్టుదలతో, అకుంఠితమైన దీక్షతో, అన్ని ఆర్ధిక లావా దేవీలనీ అధిగమించారు. కుటుంబ బాధ్యతలను అన్నింటినీ పరిపూర్తిగా నిర్వహించారు. అందులో ఏకైక కుమారుడిగా మా నాన్న గారి సహకారమూ, సమర్ధవంతమైన నిర్వహణా లేక పోతే ఈ నాడు ఆ కుటుంబాలన్నీ ఎలా ఉండేవో నేను ఉహించనే లేను.

1907 లో కాకినాడలో పుట్టిన మా నాన్న గారు అక్కడే చదువుకున్నారు.  మా తాత గారు 1921 లో కొన్న నాలుగేళ్ళకి  1925 లో స్థలంలో ముందుగా ఆగ్నేయం మూల ఒక ఐదు గదుల చిన్న ఔట్ హౌస్ కట్టుకుని ఆ ఇంట్లో గృహ ప్రవేశం చేశారు. 1926 లో పెళ్లి అయ్యాక,  మా అమ్మ ఆ ఇంటికే  1930 ప్రాంతాలలో కాపరానికి వచ్చింది. వారి పెళ్లి శుభ లేఖ ఇందుతో జతపరుస్తున్నాను. మా నాన్న గారు, చదువుకొంటున్నా, మా తాత గారికి నిలదొక్కుకొనడంలోనే సహాయం పడడంలోనే ఎక్కువ సమయం గడిపే వారు. కాకినాడ తరవాత, మద్రాసు, త్రివేండ్రం లలో చదువుకుని 1937 లో మా నాన్న గారు లా డిగ్రీ పూర్తి చేసి మా తాత గారికి చేదోడు వాదోడుగా ఉండడానికి కాకినాడలో ప్రాక్టీస్ పెట్టారు. ప్రాక్టీస్ పెట్టారన్న మాటే కానీ. ఆయన జీవితానికి ఏకైక  ధ్యేయం మా తాత గారిని అన్ని కష్టాల నుంచీ గట్టేక్కించడమే.  అందుకు అన్ని కోర్టు తగాదాలు పరిష్కరించడం, ఆస్తి పాస్తులు నిలబెట్టుకోవడం, , మా తాత గారు బంధువులకి చేసిన వాగ్దానాలని నెరవేర్చడం , అంతే గాక, మమ్మల్ని..అంటే తన సొంత తొమ్మండుగురు పిల్లలనీ పెంచి, పెద్ద చేసి చదివించడం, పెళ్ళిళ్ళు చెయ్యడం…వీటన్నింటి తోనే ఆయన జీవితం అంతా గడిచిపోయింది. అటు మా అమ్మ కూడా మా అమ్ముమ్మకీ, మూర్తి రాజు తాత గారికీ ఏకైక సంతానం కావడంతో మా అమ్మ కి సంక్రమించిన సారవంతమైన జేగురు పాడు పొలాలు కూడా మా నాన్న గారే చూడ వలసి వచ్చేది. అలాగే 1940 దశకంలో దొంతమ్మూరు గ్రామంలో మా కామేశ్వర రావు మామయ్య గారు హఠాత్తుగా పోయినప్పుడు సుమారు 400 ఎకరాల మిరాశీ అనే పొలం వ్యవహారాలూ కూడా మా నాన్న గారే తన భుజాలకి ఎత్తుకున్నారు. టూకీగా చెప్పాలంటే మా నాన్న గారు ఒంటి చేత్తో, మూడు దూర గ్రామాలలో (గొల్లప్రోలు దగ్గర దొంతమ్మూరు పొలాలు, ద్రాక్షారం దగ్గర ఇంజరం, రాజమండ్రి దగ్గర జేగురు పాడు) విసిరేసినట్టు ఉన్న 2000  ఎకరాల వ్యవసాయం, చేసి, అప్పులు తీర్చడానికి దూరంగా ఉన్నవి అమ్మేసి, మా తాత గారి కోరిక ప్రకారం తన ఐదుగురు అప్పచెల్లెళ్ళ కుటుంబాలని, ఇతర బంధువులకీ తానే పెద్ద దిక్కుగా ఆదుకోవడం, వారి పిల్లలని చదివించడం, అన్నింటినీ మించి మా తొమ్మండుగురినీ పెంచి పెద్ద చేసి, మా కాళ్ళ మీద మేము నిలబడేలా తీర్చి దిద్దిన మా నాన్న గారికి ఎన్ని జీవన సాఫల్య పురస్కారాలు ఇస్తే సరిపోతుంది?  ఎన్ని నోబుల్ బహుమతులు, ఆస్కార్ లు ఇస్తే ఆయన అప్రకటిత విజయాలకి సరితూగుతాయి?

నాకు తెలిసీ మా నాన్న గారు ఎప్పుడూ ఎక్కడికీ “వెకేషన్ ‘ కి వెళ్ళ లేదు. పొలాలు చూసుకోడానికి గుర్రం మీదో, గుర్రబ్బండి మీదో వెళ్ళే వారు. రోజుల తరబడి చెట్ల కిందనే కేరేజ్ లో వచ్చిన అన్నం తిని, నిద్ర పోయే వారు. కనీసం ఒక సారి ఆయన గుర్రం మీద నుంచి కింద పడి చెయ్యి విరగ్గొట్టుకున్నారు. నా చిన్నప్పుడు ఆ గురబ్బండి అవశేషాలు మా తోటలో ఉండేవి. మా తాత గారివీ, బామ్మ గారివీ అస్తికలు కలపడానికి కాశీ వెళ్ళారు కానీ, మా నాన్న గారు తన కర్తవ్యాలని విస్మరించి పుణ్యం కోసం పాకులాడడానికి సకల తీర్దాలు సేవించ లేదు. ఇంట్లో కూడా వినాయక చవితి లాంటి పండగలే తప్ప చీటికీ, మాటికీ వ్రతాలు చేసేసి దేవుణ్ణి ఎప్పుడూ ఇబ్బంది పెట్ట లేదు. కథలు, కవిత్వాలు వ్రాయ లేదు.

ఒక ప్రత్యేకమైన విశేషం ఏమిటంటే కాంగ్రెస్ మహా సభలు జరిగినప్పుడు గాంధీ గారు  1923  లో కాకినాడ వచ్చినప్పుడు, మా నాన్న గారు తన మిల్లు బట్టలన్నింటినీ నిప్పుల్లో వేసేసి, అప్పటి నుంచీ జీవితాంతం ఆయన ఖద్దరు బట్టలే కట్టారు. ఆఖరికి కోర్ట్ కి వేసుకునే నల్ల కోటు, గౌను, బౌ, పూజా, పునస్కారాలకీ, ఒకటేమిటీ, అన్నీ ఖద్దరే. ఆయన కట్టుకున్న పంచెలు, కండువాలు కొన్ని నా దగ్గరే హ్యూస్టన్ లో ఉన్నాయి.

ఆడ పిల్లలలకి ఆస్తిలో వాటాలు ఇచ్చే సాంప్రదాయం కానీ, చట్టరీత్యా కానీ లేని ఆ రోజులలో, మా నాన్న గారు తన ముగ్గురు అక్కలకీ, ఇద్దరు చెల్లెళ్ళకీ తగిన వాటాలు ఇచ్చి మా తాత గారి, బామ్మ గారి కోరిక నిలబెట్టారు. అంతే గాక వారందరినీ, వారి పిల్లలనీ మా ఇంట్లోనే ఉంచుకుని చదివించారు. అందులో మా అమ్మ సహకారం నూటికి నూట యాభై  శాతం అని వేరే చెప్పక్కర లేదు. అలాగే మా బామ్మ గారి చెల్లెలు (మా చెల్లంబామ్మ గారు, రాజమండ్రి) కుమారుడు మా నాన్న గారికి వరస కి తమ్ముడుయిన మా సూరీడు బాబయ్య గారినీ, మా చిట్టెన్ రాజు బాబయ్య తో సహా మా తాత గారి సవితి తమ్ముళ్ళ పిల్లలందరినీ మా నాన్న గారే చదివించి, పెళ్ళిళ్ళు చేసారు.

వ్యక్తిగతంగా, మా నాన్న గారికి కొన్ని మంచి, తమాషా అలవాట్లు ఉండేవి. ఉదాహరణకి ప్రతీ రోజూ రాత్రి పడుకునే ముందు  ఆ రోజు డబ్బు లెక్కలు ఆదాయం, వ్యయం అణా పైసలతో సహా చిన్న  2 “ x 3 “  కాగితాల మీద ఖచ్చితంగా రాసి చూసుకునే వారు. తేడా వచ్చిందో అయిందే అందరి పనీ! మాకు ఆయన్ని చిల్లర ఖర్చులకి డబ్బు అడగడానికి ఎప్పుడూ  భయమే! ఇప్పటి లాగా వారానికింత “అలవెన్స్” అంటూ ఉండేది కాదు. యాభై మంది పిల్లలు ఇంట్లో ఉంటే ఎలవెన్సా , పాడా? మేము ఎప్పుడైనా పరీక్షలు పాస్ అయి పోయాక స్నేహితులతో సరదాగా సోడాలు తాగడానికి బేడా, పావలా కావలసి వచ్చినప్పుడు ముందు మా అమ్మ చేతో, మా చిట్టెన్ రాజు బాబయ్య చేతో అడిగించే వాళ్ళం. అత్యవసర పరిస్తితులలో ఆయన అలా తోట లోకి వెళ్ల గానే ఆయన డబ్బు పెట్టుకునే పెట్టె తీసి ఆ బేడా, పావలా తీసుకుని పారిపోయే వాళ్ళం. ఇక ఆ రాత్రి ఆయనకి  లెక్క తేలక అందరినీ అడిగి, ఆఖరికి మా దగ్గర నిజం రాబట్టి “అడిగితే ఇవ్వనా?” అని కోప్పడే వారు. అడిగితే ఇస్తారు అని తెలుసు కానీ , అడగడానికే భయం! ఆ రోజుల్లో మా చిన్న పిల్లల మనస్తత్వాలు, పెద్ద వాళ్ళంటే ఉండే భయభక్తుల గురించి మా అమెరికా పిల్లలకి నేను ఎన్ని విధాలుగా చెప్పినా వాళ్లకి అర్ధం కాదు.

ఇక మా తాత గారు చుట్ట కాల్చే వారు కానీ మా నాన్న గారికి ఆ అలవాటు కూడా లేదు. ఆయనకున్న ఒకే అలవాటు పనులన్నీ ఆఖరి క్షణం దాకా వాయిదా వేసి వారు. నాకు కూడా అదే ‘అలవాటు’ వచ్చింది. ఆఖరికి కోర్ట్ లో వెయ్య వలసిన దావాలు, ప్రతి వాదాలు, అర్జీలు అన్నీ కూడా రేపు “కాల దోషం” పట్టిపోతుంది అనే దాకా ఆలోచిస్తూనే ఉండే వారు. ఆ ముందు రోజు రాత్రి దస్తావేజు రాసే వారు. ఇది నాకు ఖచ్చితంగా ఎందుకు తెలుసు అంటే ..నాకు వయసు వచ్చాక అర్ధరాత్రి దాకా నేను కూడా ఆయన  గదిలోనే కూచుని ఆయన వ్రాసిన దస్తావేజులు చదివి ..తప్పులు దిద్దేవాడిని. …ఎందుకంటే “రాజా గాడికి తెలుగు, ఇంగ్లీషూ రెండూ బాగా వచ్చును.” అనే వారు మా నాన్న గారు. అప్పుడప్పుడు ఆయన వాడి, నేను ప్రతివాదిగా రిహార్సల్స్ కూడా చేయించే వారు. అవన్నీ నా జన్మలో మర్చిపోలేని జ్జాపకాలు.

మా నాన్న గారికి మరొక తమాషా అయిన అలవాటు ఉండేది. అదేమిటంటే ఎప్పుడైనా ఏ బజారుకో ఇంకెక్కడికైనా వెళ్ళవలసి వస్తే, ఖద్దరు పంచ, కండువా వేసుకుని శుభ్రంగా తయారు అయి వీధి గుమ్మం దగ్గర నుంచునే వారు. ఆయన్ని చూడగానే మా పేటకి కొత్తగా వచ్చిన ఓ రిక్షా వాడు బేరం కోసం ఆగే వాడు. “బజారుకి ఎంత?” అని వాణ్ణి అడిగి, “లేదులే, నేను ఎక్కడికీ వెళ్ళడం లేదు. ఉత్తినే అడిగాను “ అని పంపించేసే వారు. వాడు బుర్ర గోక్కుంటూ వెళ్ళిపోయే వాడు. అలా ఆయన వీధి గుమ్మం దగ్గర కనీసం గంట నుంచుని వచ్చే, పోయే ట్రాఫిక్ నీ, జనాల్నీ చూస్తూ, ఆ తరువాత ఏ ఖాళీ రిక్షా వచ్చినా ఎక్కేసే వారు. మా గాంధీ బొమ్మ దగ్గర ఎప్పుడు ఉండే రిక్షా వాళ్లకి ఈయన అలవాటు తెలుసు కాబట్టి, ఆయన వీధి గుమ్మంలోకి వచ్చి నుంచున్న గంట దాకా దగ్గరకి వచ్చే వారు కాదు. “ఒక్క వెధవా రాడేం” అని ఆయన విసుక్కునే వారు. మా నాన్న గారు చాలా అరుదుగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జరిగే ఈ తతంగం చాటు మాటు నుంచి చూసి మేము నవ్వుకునే వాళ్లం.

అలాంటి అలవాటే ఇంకోటి ఉండేది మా నాన్న గారికి. అదేమిటంటే పని వాళ్లకి జీతాలు ఇవ్వవలసి వచ్చినప్పుడు “పెద్దబ్బాయ్ యింకా పొలం నుంచి రాలేదు. వాడు వచ్చాక కనపడు” అనే వారు. పెద్దబ్బాయ్..అంటే మా పెద్దన్నయ్య మా నాన్న గారి దగ్గర వ్యవసాయం చెయ్యడం మొత్తం నేర్చుకున్నాక, మా నాన్న గారు రిటైర్ అయ్యారు. మా పెద్దన్నయ్యే పంటలు అమ్మాక మా నాన్న గారికి సొమ్ము అప్పజేప్పే వాడు. అన్నింటినీ పోస్ట్ పోన్ చేసే అలవాటు ఉన్న మా నాన్న గారు ఇలాంటి చిన్న చిన్న ఖర్చులకి కూడా మా పెద్దన్నయ్య పొలం నుంచి రాలేదు అని వంక పెట్టె వారు. ఇది అందరికీ సరదాగానే ఉండేది. కానీ, మా పొలాలన్నీ వర్షాధారం పొలాలు కాబట్టి ఒక ఏదు పంటలు పండీ, రెండేళ్ళు పండకా వాటి మీద నుంచి వచ్చే ఆదాయం నిలకడగా ఉండేది కాదు. అమెరికా నుంచి నేనూ, మా తమ్ముడూ ఆర్ధికంగా ఎంత సహాయం చేసినా మా నాన్న గారికి వేరే ఆదాయం లేదు కాబట్టి తన ఆఖరి రోజులలో మానసికంగా ఇబ్బంది పడ్డారు అని నా అనుమానం.

మరొక ఆశ్చర్య కరమైన విశేషం ఏమిటంటే, మా నాన్న గారు తన మొత్తం జీవితంలో మహా అయితే ఐదారు సినిమాలు చూసి ఉంటారు. అందులో ఝనక్ ఝనక్ పాయల్ బాజే ఒకటే ఆయన చూసిన హిందీ సినిమా.  మా చిన్నప్పుడు ఏ కళని ఉన్నారో ఒక రోజు నన్ను, మా తమ్ముడినీ “ఒరేయ్ ఇవాళ అదేదో రోజులు మారాయ్ అనే వ్యవసాయం సినిమా వచ్చిందిట. చూద్దాం “ అన్నారు. అది వినగానే మేమిద్దరం ఆఘమేఘాల మీద తయారు అయిపోయాం. నేను ఆ రోజు స్పెషల్ కాబట్టి పొట్టి లాగు బదులు పైజామా వేసుకున్నాను. “రిక్షా కుదుర్చుకోడానికి మీకు ఎలాగా గంట పడుతుంది. మీరు వెళ్ళి వీధి గుమ్మంలో నుంచోండి. ఈ లోగా నేను తయారయి వస్తాను అంది మా అమ్మ. మొత్తానికి అందరం రిక్షా ఎక్కాం. మా అమ్మా, నాన్న గారు, మా తమ్ముడూ సీటులో కూచున్నారు. ఇంక చోటు లేక నేను రిక్షాలోనే ముందు ఉన్న ఇనప రాడ్ పట్టుకుని నుంచుని నెహ్రూ గారి లాగ ఫీలయిపోతూ క్రౌన్ టాకీస్ కి వెళ్ళాం. అక్కడ తెలిసింది . రోజులు మారాయ్ సినిమా వంద రోజులు పూర్తి చేసుకుని అంతకు ముందు వారమే అది వెళ్ళిపోయి “అక్కా చెల్లెళ్ళు” అనే మరొక సినిమా ఆడుతోంది అని. ఇక తప్పక మేము ఆ సినిమా చూసాం. నేను మా నాన్న గారితో చూసిన ఒకే ఒక్క సినిమా అదే! ఆ సినిమాలో రమణా రెడ్డి చేసిన మేజిక్కులు మా నాన్న గారికి నచ్చాయి.

మా బాబయ్య గారు పోయి ముఫై ఏళ్లయినా, కుటుంబ సంక్షేమం, బంధువుల బాగోగులే తన జీవితంగా మలచుకున్న మా నాన్న గారి నుంచి నేర్చుకోవలసినది యింకా చాలా ఉంది. నేను అమెరికా రావడం వలన ఆయనకి ఎక్కువ సేవ చెయ్యగలిగానా, లేక అక్కడే ఇండియాలోనే ఉండిపోయి ఉంటే ఆయన్ని యింకా బాగా చూసుకునే వాడినా అనేది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది.

విప్లవాల్లోని ఒంటరితనం గురించి రాయాలి : అల్లం రాజయ్య

rajayya1

 అల్లం రాజయ్య గారితో ఇంటర్వ్యూ కోసం ఫోన్ చేసాను. అసలు ఆయనను ఇంటర్వ్యూ చేసే అర్హత నాకు ఉందా.. అని ఎన్నో ప్రశ్నలు.

మరో అరగంటాగి వస్తారా, కూర వండుతున్నా అన్నారు. అయితే ఇప్పుడే వస్తాను, ఇంటర్వ్యూ అంటే మరీ ఫార్మల్ కాదులెండి అని మరో పది నిమిషాల్లో ఇంటి బెల్లు కొట్టాను. ఆయన తన కథల్లోని సామాన్య రైతు పాత్రల్లా సజీవంగా కళ్ల ముందు ఎటువంటి భేషజం లేకుండా లోనికి ఆహ్వానించారు.  అంత వరకు ప్రశ్నలు వేసిన మనసుని పక్కకు నెట్టి పరిచయంగా వంటింట్లో నిలబడి, ఆయన చేస్తున్నది గమనిస్తూ మాట్లాడడం మొదలు పెట్టాను. వాళ్ల చిన్నమ్మాయి  ఇంట్లో ఉన్నారు రాజయ్య గారు. అమ్మాయి వచ్చే లోగా కాస్త వండి పెట్టాలన్న ఆప్యాయత కలిగిన ఆ తండ్రి హృదయానికి . అందుకు జోహార్లు మనసులో అర్పించకుండా ఉండలేకపోయాను. అలా  ఆయన్ని చూడగానే మా నాన్నగారు జ్ఞాపకం వచ్చి క్షణం లో బిడియాలన్నీ పోయాయి నాకు.

అమెరికా లో మీకు బోరుగా లేదాండీ. అనడిగాను, ఏమీ లేదమ్మా, ఎక్కడుంటే అక్కడ ఏదో ఒక పనితో పొద్దు పోతుంది. ఈ పిల్లల్ని వాళ్ల చిన్నప్పుడు పట్టించుకునే సమయం లేకపోయింది. ఇప్పుడైనా వీళ్లతో గడపడం బావుంది. అన్నారు. మనుమరాలిని ఒక పక్క ఆడిస్తూ. అక్కడ గంట సేపు ఉందామనుకున్న నేను నలభై ఏళ్ల తన జీవన యానం గురించి ఆయన చెప్తూంటే ఆ దృశ్యాలన్నిటిలోకి ప్రవేశిస్తూ, ప్రవహిస్తూ మైమరిచి మూడు గంటలైనా అక్కడే ఉండిపోయాను. ప్రతి సంఘటన ఆయన మాట్లాడుతూంటే ఆ వెనుకే నేను అక్కడ అడుగుపెడ్తూ ఉన్నాను. అదొక అద్భుతమైన భావన. గుండె చెమ్మగిల్లిన కన్నీటి అలజడి. పోరాటాల అలుపెరగని ఆయాసం. సమాజం, మనుషుల మధ్య  సంబంధ బాంధవ్యాల తాత్త్విక యోచన. అడవి పొడవునా పరుచుకున్న మట్టి తీగెల రక్త సింధూరం.   రాయడం తక్షణ అవసరమని భావించి నలభై ఏళ్ల పాటు ఉధృతంగా రచనోద్యమాన్ని భుజానికెత్తుకున్న అలుపెరగని శ్రామికుడు.
ఒక శ్రమ జీవి, ఒక ఉద్యమ కర్త, పీడిత జనం తరఫున నిలబడ్డ కథకుడు, ఉపాధ్యాయుడు….రకరకాల రూపాల్లో నా చుట్టూ ప్రత్యక్షమైన అల్లం రాజయ్యలలో కథకుడితో ఇంటర్వ్యూ ఇది.

rajayya-geeta

Qకథా రచయిత కావడానికి దోహదపడిన మీ  తొలి రోజుల గురించి చెబుతారా?

నేను  తెలంగాణాలోని  కరీంనగర్ జిల్లా, మంథని తాలూకా లోని దగ్గరలో ఉన్న మారుమూల గ్రామమైన గాజుల పల్లి లో  పేద రైతు కుంటుంబానికి చెందిన వాడిని. అప్పట్లో  గ్రామాలలో భూస్వామ్య వివక్ష  ఉండేది. పేద వాళ్ల పట్ల చాలా వివక్ష ఉండేది. అంతరానితనం బాగా ఉండేది. మేం మధ్య కులాలకు చెందిన వాళ్లం. మా నాన్న ఊర్లో పెద్దమనుషులలో ఒకరు. సహజంగానే మా ఇంటి ముందు పంచాయితీలు జరిగేవి. వాటి సారాంశమంతా పేద ప్రజల్ని ఎలా అణిచిపెట్టాలనే. ఇవన్నీ చూసి చిన్నతనంలో నాకు బాగా బాధ కలిగేది.  నా మీద చెరగని ముద్ర వేసాయి. మాతో పాటూ పొలాలలో పనిచేసే మనుషులపట్ల వివక్ష అంతా అన్యాయమైందనే భావన కలిగేది.

1965 ప్రాంతం లో నేను అయిదో తరగతి చదివే సమయంలో మా అమ్మమ్మ ఊరుకు వెళ్లాను. అది మా ఊరి కంటే పెద్ద గ్రామం. వ్యవసాయం బాగా అభివృద్ధి చెందిన గ్రామం. అక్కడే దొరల వ్యవస్థని, అనేక గ్రామీణ వృత్తుల్ని నేను చూసాను.  అక్కడికి వెళ్లాక ఇంకా బాగా అంతరాలకు సంబంధించిన విషయాలు బాగా అర్థం అయ్యాయి. అక్కడి నుంచి మంథనికి హైస్కూలు చదువు కోసం వెనక్కు  వచ్చాను మళ్లీ.
Qస్వయంగా మీరు వివక్షని అనుభవించేరా?
అంతే కదా. నేను వెనక్కు వచ్చే సమయానికి నాకు బాగా ఊహ తెలిసింది. క్లాసులలో మొదలుకుని అన్ని చోట్లా ఒక కులాన్ని, మరొక కులం వాళ్లు వివక్ష గా చూసేవారు. హైస్కూలుకు లో అడుగు పెట్టిన తొలి నాళ్లలోనే ఒక యుద్ధవాతావరణం ఏర్పడింది. మేం గ్రామీణ పిల్లలం దుమ్ము కొట్టిన కాళ్లతో, ఒంటి నిండా వెండి ఆభరణాలతో, జుట్టు తో, వ్యవసాయ పిల్లల్లా, ఎక్కడో అడివి నుంచి వచ్చిన వాళ్లలా కనిపించే వాళ్లం. మమ్మల్ని అంతా విచిత్రంగాచూడడం, ప్రతీ దానికీ అపహాస్యం చేసేవాళ్లు. దాంతో మా హైస్కూల్లో రెండు గ్రూపులుగా ఏర్పడి అస్తిత్వాల కోసం కొట్లాటలు జరుగుతూ ఉండేవి.
అప్పటి భయంకరమైన భూస్వామ్య సమాజాల్లో మనుషుల మధ్య వివక్ష, హింస, దోపిడీ అన్నీ బాగా ఉన్న వ్యవస్థ అది. ఆ క్రమంలో విద్యార్థి నాయకుడిగా ఎదిగిన నేను జూనియర్ కాలేజీ నిర్మాణం కోసం పిల్లలందర్నీ పోగుచేసి చుట్టు పక్కల గ్రామాలన్నీ తిరిగి కర్రల్ని సంపాదించి స్వయంగా పాటుపడ్డాను.1969 లో చివరి హెచ్ ఎస్సీ లో స్కూల్లో జనరల్ సెక్రటరీగా అగ్ర కులాలకు వ్యతిరేకంగా నిలబడి గెలిచాను.

ఇక విద్యార్థి జీవితం ముగిసాక ఉద్యోగాలలో ఎవరు ఉంటున్నారు అనే ఆలోచన మొదలైంది. సహజంగా అన్ని ఉద్యోగాలలోనూ ఆంధ్ర ప్రాంతం వారే ఉండే వారు. అప్పట్లోనే నేను ప్రత్యేక తెలంగాణా ఉద్యమం లో బాగా ఉధృతంగా పాల్గొన్నాను. అందువల్ల మా చదువు కూడా ఒక సంవత్సరం పోయింది. కేవలం విద్యార్థి ఉద్యమం కావడం వల్ల అప్పట్లో ఉద్యమం  పూర్తిగా నిలబడలేకపోయింది. అది కొంత హింసాత్మకంగా మారింది కూడా.

Q
పుస్తకాలతో మీ అనుబంధం గురించి-

అదే వస్తున్నా. ఇక మరో పక్క నా జీవితంలో రచయితగా అంకురార్పణ జరుగుతూ వచ్చింది. ఎనిమిదో తరగతి నుంచీ నాకు పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. మా మేనత్త, మా ఇండ్లల్లో ఓరల్ ట్రెడిషన్లో చాలా కథలు చెప్పేవారు. అంతే కాకుండా గ్రామాలలో జానపద కళాకారులు చెప్పే కథల్ని బాగా వినే వాళ్లం. ఎనిమిది లో లైబ్రరీకి మొదటిసారి వెళ్లాను. లైబ్రరీ ఎంతగా ఇష్టమైందంటే దాదాపు హెచ్ ఎస్సీకి వచ్చే సరికి నేను లైబ్రరీలో పుస్తకాలన్నీ  చదివేసాను. అక్కడే రష్యన్ సాహిత్యం, రవీంద్రనాథ్ టాగూర్, బంకించంద్ర , ప్రేం చంద్ ఇలా భారతీయ సాహిత్య కారులే కాకుండా, ప్రపంచ సాహిత్య కారులందరూ రాసిన సాహిత్యాన్ని చదివేసాను.

Qమీరు చదివిన సాహిత్యం ఎలా ప్రభావితం చేసింది?

ఒక పక్క ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, మరో పక్క వ్యక్తిగత జీవితంలో సాహిత్య పరిచయం. ముఖ్యంగా చలం రచనలతో బాగా ప్రభావితమయ్యాను.
సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలనే తపన తో అస్తవ్యస్త, గందరగోళ జీవితం ప్రారంభమైంది. రాజకీయాలు, సాహిత్యమూ మధ్య చదువు వెనక పడిపోయింది.
70 లలో వరంగల్ లో కాలేజీలో చేరాను. చేరాక పునరాలోచన మొదలయ్యింది. చదువైన సంవత్సరం తర్వాత కొంత గందరగోళ పరిస్థితినించి బయటికి వెళ్లాలనిపించి వ్యవసాయం చేసాను. మళ్లీ అక్కడా గిట్టుబాటు ధరలు లేకపోవడం, గ్రామాల్లో ఉండే సంక్షోభం వల్ల మళ్లా బయటికి వెళ్లిపోయాను. ఆనాటి గ్రామీణ సంక్షోభం, బయటి నుంచి వచ్చిన నాగరికతకు చెందిన కొత్తఆలోచనలు, గత జీవితంలోని పరిస్థితుల నించి వరంగల్ కు వెళ్లాను. అక్కడ సాహితీ మిత్రులు కలిసారు. కరీంనగర్ చుట్టు పక్కల పేద ప్రజలకు ఏదైనా న్యాయం జరిగేదుందా అని నిరంతరం ఆలోచన చేసేవాణ్ణి. నేనుచదివిన సాహిత్యంలో ఇతర ప్రాంతాలలో ఉన్న హాయైన జీవితం మా తెలంగాణా ప్రాంతంలో ఎందుకు లేదనే ప్రశ్న వెంటాడేది. 73 ప్రాంతం లో ఒక పక్క ఉద్యమ జీవితంతో బాటూ వివాహ జీవితం ప్రారంభమైంది. వెనువెంటనే నేను ఉద్యోగం వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది.  ఆ ప్రయత్నంలో భాగంగా నాకు 75 లో అదిలాబాద్ లో ఉద్యోగం రావడం తో నా ప్రస్థానం కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ కు మారింది.

Qమీ మొదటి కథ “ఎదురు తిరిగితే” గురించి చెప్పండి.

ఎమర్జెన్సీ సమయానికి  గ్రామాలకు వెళ్ళడం, ప్రజల్ని కొంత ఉత్తేజితుల్ని చేసేవాళ్లం. పత్రికలకు కరపత్రాలు రాసేవాణ్ని మొదట. మా ఊరికి పి.వి.నరసింహారావు వచ్చినపుడు ఆ సభలో  ఉన్న ఒక హరిజనుడు ఈ ప్రాంతానికి సంబంధించిన అన్యాయాల గురించి  అడిగిన ప్రశ్నలకు స్పందించి నేను మొట్టమొదట “ఎదురు తిరిగితే” కథని యథాతథంగా పేర్లు కూడా మార్చకుండా రాసేను. ఆ కథలో గ్రామీణ దోపిడీ, అణిచివేత, అసంబద్ధ సంబంధాలు, గ్రామీణ వ్యవస్థ కు సంబంధించి ఒక పరిపూర్ణ చిత్రం అది. తర్వాత “క్రాంతి ” అనే పత్రికను కొద్దిరోజులు నడిపాం. ఇక కరీంనగరలో మిత్రులందరం కలిసి “విద్యుల్లత” అనే పత్రికను ప్రారంభించారు.

Q
మీ రచనా ప్రస్థానం గురించి చెప్పండి.

మిత్రులు “బద్లా”  అనే కథా సంపుటి వేసారు. అది ఆ తర్వాత బాన్ అయ్యింది. అందుకోసం నన్నొక కథను అడిగారు. అప్పటికే నేను కథ రాసినా అందులో చేర్చే సాహసం చెయ్యలేదు. నిజానికి పదోతరగతి నుంచి డైరీలు, కవితలు, కథలు రాసేవాణ్ణి. “ముగింపులు-ముందడుగులు” అని నవల కూడా రాసేను. అప్పటి సాహిత్యం అంటే సుమారుగా మూణ్ణాలుగు వేల పేజీలు రాసి  ఉంటాను. అదంతా గాంధీ ప్రభావంతో రాసిన అహింసా రాతలు. అవన్నీ ఎక్కడా ప్రింట్ చేయించలేదు. కాలక్రమంలో అన్నీ ఎటో పోయాయి. అయితే అలా నాకు రచన అలవాటు అయ్యింది. అయితే నా ప్రాంతపు  ప్రత్యేకత అప్పటికి నా రచనల్లోకి అడుగుపెట్టలేదు.  మొట్ట మొదటగా “ఎదురు తిరిగితే” తో సిసలైన కథా ప్రస్థానం ప్రారంభమైంది.
Qకథల గురించి-

భారతీయ సమాజంలో ఉత్పత్తి విధానంలో ఉండే అమానవీయతని గురించి నేను సిరీస్ ఆఫ్ స్టోరీస్ రాసాను. అందులో మొదటిది మహదేవుని  కల- ఉత్పత్తి విధానంలో ఉత్పత్తికి, వ్యక్తిగత ఆస్తికి వచ్చిన సంఘర్షణ కు రూపం ఆ కథ. రెండోది “మనిషి లోపలి విధ్వంసం”. వ్యవసాయాధార భారతీయ సమాజంలో ఉత్పత్తి విధానం మనిషి లోపల విధ్వంసానికి ఎలా కారకమవుతుందో చిత్రించాను. తర్వాత మధ్యవర్తులు. చదువు భూమి పుత్రుల్ని వేరుచేసి, మరలా వాళ్లనే వాహికలుగా చేసుకుని కింది సెక్షన్లని దోపిడీ చెయ్యించడం.
నీల, కమల కథలు స్త్రీల సమస్యలకు సంబంధించినవి. ఏ సమాజం మారినా స్త్రీ పాత్ర మరలా ఒకటే. అత్యంత అమానవీయ, అప్రజాస్వామికంగా మహిళల్ని చూడడానికి వ్యతిరేకంగా రాసినవి.
ప్రత్యర్థులు- రాజకీయ నాయకులకు  సంబంధించినది. ఒక సమాజంలో ఎందుకు ఒక వ్యక్తి భూస్వామి గానూ, మరొక వ్యక్తి దోపిడీకి గురవుతూ కనిపిస్తాడు. అనేది ప్రశ్న.

చివరిది “అతడు” – ఇలాంటి అమానవీయ సమాజంలో నేడు అన్ని రకాల వైరుధ్యాలను అర్థం చేసుకుని, పరిష్కరించి, ప్రజలను ముందుకు తీసుకుపోయే కార్మిక వర్గ పార్టీ గురించి రాసినది.

ఇక కార్మిక కథలు. బొగ్గు గనులకు సంబంధించిన కథలు అనేకం రాసేను. నాతో రచయితలు అందరి కథలూ కలిపి సమిష్టిగా దాదాపు 50,60  అన్ని రకాల పుస్తకాలు

ప్రచురించేం. నాకు ఉద్యోగం, ఉద్యమం, వ్యక్తిగతం, రచన..ఇలా నాలుగు జీవితాలుండేవి. అన్నీ సమతూకం గా చూసుకుంటూ క్రమంగా  రాసిన కథలన్నీ మొదట ప్రజా తంత్ర లో, తర్వాత ఎక్కువగా సృజన ,అరుణ తార, ఆంధ్ర జ్యోతి  లాంటి అన్ని పత్రికలలో   అచ్చయినాయి.

Qమీ “మనిషి లోపలి విధ్వంసం” కథ అన్ని భారతీయ భాషలలోకి అనువాదం అయ్యింది కదా? ఆ కథ లో ఉన్న గొప్ప ఫిలసాఫికల్ థాట్ గురించి చెప్పండి.

Allam Rajaiah
మాడ్ ఆఫ్ ప్రొడక్షన్  “మనిషిలోపలి విధ్వంసం”. భారతీయ ఉత్పత్తి విధానం మనుషుల్ని వ్యక్తిత్వం లేకుండా ఎందుకు తయారుచేస్తూంది?  ఆత్మహత్యలకు ఎందుకు ప్రేరేపిస్తూంది?
మనిషికి చావు, పుట్టుకలు ఎక్కడి నించి ప్రారంభం అవుతాయి? నా ఉద్దేశ్యంలో మనిషికి చావు పుట్టిన మొదటి సంవత్సరం నుంచే ప్రారంభమవుతుంది. చిన్నతనం నుంచీ వేసే ప్రతి ప్రశ్ననీ సంహరించి రోజూ మనిషిని చంపుతూ ఉంటాం. ముందుగా కుటుంబం ఒక భయంకరమైన యూనిట్, తర్వాత స్కూలు , ఉద్యోగం, ఉత్పత్తి విధానం ఇవన్నీ అంత కంటే  భయంకరమైన యూనిట్లు, కాంపులు. ఇన్నిటిని తప్పించుకుని మనిషి ఎక్కడ బతుకుతాడు? ఒక రోజులో నిర్ణయమవుతుందా మనిషి చావు?  విధ్వంసమనేది ఎక్కడ జరుగుతుందనే కథ”మనిషి లోపలి విధ్వంసం”. ఇది అన్ని భారతీయ భాషల్లోకి ట్రాన్సిలేటయ్యింది.  ఇంటర్నెషనల్ లెవెల్ కు కూడా పోయింది. అలెక్స్ అనే అతను ఈ కథ మీద ఎంఫిల్ చేయడానికి అమెరికా నుంచి వచ్చాడు నా దగ్గరికి.
Qనవలల గురించి-
జగిత్యాల జైత్యయాత్ర 79 లో జరిగిన తర్వాత మొత్తం గ్రామాలలో ఉండే భూమి సమస్య, రైతు కూలీ పోరాటాల సంఘటనలకు ప్రతి స్పందనగా “కొలిమి అంటుకున్నది” నవల రాసేను. ఆ తర్వాత ఊరు, అగ్ని కణం నవలలు. “అగ్నికణం”భూస్వామ్య ప్రాంతంలో మహిళలకు సంబంధించిన మానవీయ జీవితాలకు సంబంధించిన నవల.
ఇక గ్రామాలలో నిర్బంధం వచ్చాక అడవి పరిశీలన మొదలైంది. ఇక అప్పటి నుంచీ ఆదివాసీ కథల్ని రాయడం మొదలుపెట్టాను. చాలా మంది రాసేరు. అందులో భాగంగా నేను, సాహు కలిసి రాసిన పరిశోధనాత్మక నవల “కొమరం భీం”. నా చివరి నవల “వసంత గీతం”. అదంతా సాయుధ దళాల చిత్రీకరణ.

Q
విరసంతో మీ అనుబంధం గురించి చెప్పండి.

రైతు కూలీ సంఘాల ఏర్పాటు, విరసం లో సభ్యత్వం ఇదంతా ఒక ప్రయాణం. ఆ ప్రయాణం లో భాగంగా నేను తెలంగాణా, రాయల సీమ, కోస్తా ఆంధ్ర  జిల్లాలన్నిటి తో పాటు, ఇతర రాష్ట్రాలలో   కూడా తిరుగుతూ ఉండేవాణ్ణి. విరసంలో నేను ఎప్పుడూ సభ్యుడిగానే ఉన్నాను. నేను ప్రధానంగా రచయితను. సమాజంలోని మార్పులని రికార్డు చేసేవాణ్ణి. అందుకే  నేనెప్పుడూ నాయకత్వ సమస్యలకు పోలేదు. ఆ జిల్లాలకు సంబంధించిన అనేక కథలు అంటే రైతుకూలీ సంఘాలు, ఉద్యమాలు-మారేదశలు, సంఘాల్లో వచ్చే సమస్యలు వీటికి సంబంధించిన కథలు రాసేను.

Q
ఎవరికోసమైతే మీరు రచనలు చేసే వారో వాళ్లకు మీ రచనలు చేరేవంటారా?

నా మొదటి రోజుల్లో నేను ఓరల్ ట్రెడిషన్ లో రాసేవాణ్ని గనుక అనేక గ్రామాల్లో అవి చదువుకునే వాళ్లు.
ఎమర్జన్సీ తర్వాత నా మొదటి కథ అచ్చయ్యింది. నేను మా ఊరికి పోతూంటే ఒక చోట ఒక అరవై మంది నిలబడి ఒకతను కథ  చదువుతుంటే వింటున్నారు. అది తీరా చూస్తే నా కథ. అందులో ఉన్న వ్యతిరేకులు నన్ను కొట్టటానికి కూడా సిద్ధమయ్యారు. అలా నా కథ నా మీదనే ఎదురు తిరిగింది కూడా.

కార్యకర్తలకు చెప్పుకోవడానికి వీలైన కథలు కొన్ని రాసాను. అవి ముఖ్యంగా చైనా మొ.న దేశాల్లో ఉద్యమాల పాత్రను తెలియజేసేవి. మేధావి-మూర్ఖుడు-బానిస మొ.న చైనా కథలు  ఇలాంటివి. రైతుకూలీ మహాసభలు జరిగినప్పుడు అప్పటి వరకు జరిగిన అన్ని సంఘటనలూ అర్థంకావడానికి 3 గంటల వ్యవ్యధిలో ప్రదర్శించే పెద్ద నాటకాన్ని రాసేను.
Qసమాజంలో పీడన ఏదైనా మారిందంటారా ఇప్పటికి?
కింది సెక్షన్లలో కొంచెం తిండి దొరుకుతూంది ఇప్పుడు. పీడన రూపం మారినా భయంకరమైన దోపిడీ,హింసా  తగ్గిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఉద్యమాలు, ఎకనామిక్ గ్రోత్, మార్కెట్ వ్యవస్థ లో పెరిగిన స్కిల్డ్ వర్కర్ అవకాశాలు  ఇవన్నీ కారణాలు. ఇక దోపిడీ అన్ని రంగాలకు విస్తరించింది.
Qఆదివాసీ సమాజాలలో ఏదైనా మార్పు వచ్చిందా?

వనరులకు తప్ప ఆ సమాజం దగ్గర మార్కెట్ ఎకానమీకి పనికొచ్చే స్కిల్ లేదు. కనుక వాళ్లను నిజంగా అభివృద్ధి చెయ్యడానికి సంబంధించి మనస్ఫూర్తిగా ఏ సమాజమూ సిద్ధంగా లేదు. ఇప్పుడూ వనరుల దోపిడీ కొనసాగుతూనే ఉంది.  అక్రమ గనులు తవ్వకాల వల్ల నిర్వాసితులయిపోయిన జీవితాలెన్నో. ఆదివాసీ సమాజాలు సామ్రాజ్యవాద వ్యతిరేకంగా సమీకరించబడుతూ ఉన్నాయి. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు.

Qతెలంగాణా రచయితగా మీకు ఎప్పుడైనా ఐడెండిటీ క్రైసిస్  ఏదైనా వచ్చిందా?
లేదు. నాకెప్పుడూ రాలేదు.  ముందుకుపోతున్న జీవితంలో ముందుకు తీసుకెళ్తున్న అనేక మందితో  కలిసి నడవడం పట్ల ఉన్నదృష్టి నా రచనలపట్ల ఎప్పుడూ లేదు నాకు.
ఆచరణ ముఖ్యమైనది.   అదీగాక ఎవరు మంచి కథ రాసినా అది నాదే అన్న భావనకు లోనవుతాను. నాకు తెలిసినంతవరకు సాహిత్యం వ్యక్తిగతమయింది కాదు. అది నా స్వంత ఆస్తి కాదు. అందుకే నాకు సంక్షోభం లేదు.
Q2000 తర్వాత మీరు రచనలు చెయ్యకపోవడానికి కారణం ?
నా వరకు నేను భూస్వామ్య, పెట్టుబడిదారీ, ఉద్యమ సమాజాల్ని చిత్రించాను. 2000 నుండీ ఇప్పటివరకూ జరుగుతున్న ఈ పెను మార్పుల్ని చిత్రించలేదు.
అంతా ఇంకా పరిశీలన చేస్తూ ఉన్నాను. ప్రపంచ విప్లవాల్లో వచ్చిన ఒంటరితనం గురించి రాయాలని అనుకుంటున్నాను.  ఏదో ఒక ప్రక్రియ రోజూ రాస్తాను. కానీ ఫిక్షన్ రాయలేదు.  చాలా మంది రచయితలు రాసిన వాటీకి చేదోడు, వాదోడుగా ఉండడం, చదవడమూ చేస్తున్నాను ఇప్పటికీ.  అవసరమైతే క్లాసులు, చర్చావేదికలు పెట్టడం  మొత్తంగానైతే సాహిత్యం తోనే తిరుగుతున్నా.వీరోచితమైన, విషాద భరిత ఉప్పెన లాంటి  జీవితంలో నడిచొచ్చిన వాణ్ణి. నాకు తప్పకుండా రాయాలనిపిస్తే రాస్తాను ఎప్పుడైనా. రాయాల్సిన అవసరం పడాలి అంతే.

ఇంటర్వ్యూ: కె.గీత

రాజయ్య గారి ఫోటో: అల్లం చందన

 

ఇస్లాంలోని మంచి కూడా మనకి తెలియాలి: ఫర్హాద్ జమా

“మీ క్లాస్మేట్ ఫర్హాద్ జమా నవలలు రాస్తున్నాడంటా తెలుసా?” దుర్గ ఫోన్ లో చెప్పినపుడు నా స్మృతి పధంలో తెల్లటి పాల బుగ్గల కుర్రాడు చటుక్కున మెరిసాడు. క్లాస్  టాపర్స్ లో ఒకడైన ‘జామ’ పుస్తకాలు పట్టుకొని ఇంజనీరింగ్ కాలేజ్ లైబ్రరీకి, యూనివర్సిటీ లైబ్రరీకి తిరగడం ఒకటే నా కళ్ళ ముందు వెంటనే కదిలిన విషయం. అప్పటికి పాతికేళ్ళ క్రితం వదిలేసిన జ్ఞాపకాలవి. డిగ్రీ పూర్తి కాగానే, క్లాస్ లో ముప్పై ఆరు మందిలోనూ తరువాత కలిసిన వాళ్ళు తక్కువ. ఎవరికి వాళ్ళం ఇంకొకరికి తెలియని జీవిత దారుల్లో నడిచి పోయాం. ఆ రోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు పెద్దగా మాట్లాడుకొనే వాళ్ళం కాదు. అబ్బాయిలతో మాట్లాడితే ఏవో అంటగట్టేస్తారని మాకు భయాలు ఉండేవి. వాళ్ళకు ఇవే భయాలు మా కంటే ఎక్కువ మోతాదులో ఉండేవని తరువాత తెలిసింది. అయితే ఫైనల్ ఇయర్ హెచ్.సి.ఎల్  కాంపస్ ఇంటర్యూలో కాలేజ్ అంతటికి జామా ఒక్కడే  సెలెక్ట్ అయ్యాడని, అందులో చేరకుండా ఐఐటి ఖరగ్ పూర్ లో ఎమ్.టెక్ లో చేరాడని విన్నాను. తరువాత నేను అతని గురించి విన్నది ఇదే.  నెట్ లో అతని గురించి వెదికాను.

n270850

అప్పటికే అతని పుస్తకాలు రెండు ప్రచురణ అయ్యాయి. మొదటి పుస్తకం “మేరేజ్ బ్యూరో ఫర్ రిచ్ పీపుల్” విశేష పాఠకాదరణ పొందింది. దాదాపు లక్ష కాపీలు అమ్ముడు పోయి, తొమ్మిది ప్రపంచభాషలలో అనువదింపబడి ఉంది. (ఫ్రెంచ్, జర్మన్, డచ్, స్వీడిష్, స్పానిష్, ఇటాలియన్, సెర్బియన్, టర్కిష్, ఇండోనేషియన్). రెండో పుస్తకం  ‘మెనీ కండీషన్స్ ఆఫ్ లవ్’ అప్పుడే విడుదల అయ్యింది. వెంటనే పుస్తకాలు తెప్పించుకొని చదివాను. ఫేస్ బుక్ పుణ్యమా అని మా పాల బుగ్గల కుర్రాడు మళ్ళీ కలిసాడు. కాకతాళీయంగా అదే సంవత్సరం మా రీయూనియన్ జరగటం, విశాఖలో జమాను కలవటం జరిగింది. లండన్ లో స్థిరపడటం వలనేమో ఇంకా తెల్లగా, సుకుమారంగా మారి దర్శనం ఇచ్చాడు. ఈ ఇంటర్యూ లో సగభాగం అప్పుడు చేసేసిందే.

తరువాత విడుదలయిన అతని రెండు పుస్తకాలు (ఇవన్నీ సీక్వెల్) ‘వెడ్డింగ్ వాలా’, ‘మిసెస్ ఆలీస్ రోడ్ టు హాపీనెస్’ కూడా చదివాను. వెడ్డింగ్ వాలా గురించి చిన్న రివ్యూ కూడ అప్పట్లో  ఫేస్ బుక్ లో రాసుకొన్నాను. లండన్ లోని ఒక ఇన్వెస్ట్ మెంట్ బాంక్ లో ఐ.టి డైరెక్టర్ గా పనిచేస్తూ; ఉద్యోగానికి వెళ్ళే మెట్రో ప్రయాణంలోనూ (దాదాపు గంట), శని ఆదివారాలలోను ఈ నవలలు పూర్తి చేసాడంటే ఆశ్చర్యంగా ఉంటుంది.

అందమైన విశాఖ నేపధ్యంగా ఇతని నవలలు రూపొందాయి. మధ్య తరగతి ముస్లిం కుటుంబంలోని వ్యక్తులు మిష్టర్ ఆలీ, మిసెస్ ఆలీ ఈ నవలలలో ప్రధాన పాత్రలు. ఒక ముస్లిం కుటుంబం చుట్టూ హిందూ సమాజాన్నిఅల్లించి, కధలను విజయవంతంగా పండించాడు.  సమకాలీన సమస్యలు, మత రాజకీయాలు, సుందరమైన ప్రేమలు, మధ్యతరగతి కుటుంబ వెతల మధ్య ఇమిడిన గాఢానురాగాలు, మొలక బియ్యం సారం లాంటి వృద్ధ దంపతుల సాహచర్య సహజానుభూతులు, కొద్దిగా శృంగారం, చాలా హాస్యం…..వెరసి ఫర్ హాద్ జామా నవలలు. నా చిన్నప్పటి క్లాస్ మేట్, ఇప్పటి ఎన్నదగ్గ రచయిత ఫర్హాద్ జమా ఇంటర్యూ మీ కోసం……

zama

Q నలబ్భై ఏళ్ళు దాటిన వెంటనే మీ మొదటి నవల “మేరేజ్ బ్యూరో ఫర్ రిచ్ పీపుల్ ” మొదలు పెట్టానన్నారు. ‘మిడిల్ ఏజ్ క్రైసిస్ ‘ కాకుండ ఇంకేమైనా ఆ వయసులో,ఆ కాలంలో మిమ్మల్ని సాహిత్యరచనకు ప్రేరేపించిన కారణాలు ఏమైన ఉన్నాయా?

మా నాన్న స్వతహాగా రచయిత. నన్ను రాయమని పోరుతూ ఉండేవారు. రాయగలనని నమ్మకం లేక నేను ఆయన మాట తీసేసాను. ఒక రకంగా చెప్పాలంటే అది మిడిల్ ఏజ్ క్రైసిస్ అనవచ్చు., ఎందుకంటే నేను నా నలబ్భైయవ పుట్టిన రోజు నాడు రాయటం ప్రారంభించాను. కాని కొన్ని ఇతర కారణాలు కూడ ఉన్నాయి. అప్పుడు నా కెరీర్ లో ఒక కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాను. నా మీద వత్తిడి ఊహించనంతగా ఉంది. నేను దాని నుండి బయట పడటానికి దారులు వెతుక్కోవలసి వచ్చింది. సాహిత్యరచన అనే మార్పు నాకు అప్పుడు కావాల్సి వచ్చింది. ఇంకొక విషయం. నా కొడుకులు ఇంగ్లండులోనే పుట్టి, అక్కడే పెద్దవాళ్ళు అవుతున్నారు. నేను పుట్టి, పెరిగిన భారతదేశం వాళ్ళకు విదేశం అవుతుంది అనే విచారం ఉండేది.  నేనేమైనా చేసి నా దేశాన్ని వాళ్ళకు సజీవం చేయాలి అనుకొన్నాను.

అన్నింటి కంటే ముఖ్యమైన విషయం.  9/11   దాడులు, మరీ ముఖ్యంగా జులై 7, లండన్ అండర్ గ్రౌండ్ బాంబింగ్స్ తరువాత ముస్లిం వ్యతిరేక సెంటిమెంట్ పాశ్చాత్య దేశాల్లో వచ్చింది. కొంతమంది మల్టీ కల్చరలిజం ఓడిపోయిందని అన్నారు. నేనేమనుకొంటాను అంటే మల్టీ కల్చరలిజం పాశ్చాత్యానికి కొత్త కావచ్చు. కొన్ని పదుల సంవత్సరాల క్రితం, బహుశ 50,60 లలో ప్రారంభం అయి ఉండొచ్చు. కాని భారత దేశంలో వివిధ సంస్కృతులు, మతాలు కలిసి ఉండే సంప్రదాయం శతాబ్ధాల క్రితమే ప్రారంభం అయ్యింది. అందులోను విశాఖపట్నం, అలాంటి సహనం కలిగిన పట్టణం. పై కారణాలు అన్ని నన్ను రచనా వ్యాసాంగానికి  ప్రేరేపించాయి.

Q మొదటి నవల “మేరేజ్ బ్యూరో ఫర్ రిచ్ పీపుల్ “లో సున్నితమైన ప్రేమ కధను  సెజ్ లు, విద్యార్ధి ఉద్యమాలు, రైతుల ఆత్మ హత్యల నేపధ్యంలో రాసారు. 90 తరువాత కొద్ది కాలం మాత్రమే ఇక్కడ ఉన్న మీరు; మారిన భారతదేశ సామాజిక, సాంస్కృతిక  చిత్రాన్ని అంత అర్ధవంతంగా, ఆసక్తికరంగా ఎలా దృశ్యీకరించగలిగారు?

‘మేరేజ్ బ్యూరో ఫర్ రిచ్ పీపుల్’ రాసేటప్పటికి నా జీవితంలో సగ భాగం ఇండియా బయటే గడిపాననేది వాస్తవం.  కాని దాదాపు నా కుటుంబం అంతా ఇక్కడే జీవిస్తుంది. నేను కనీసం ఏడాదికి ఒక సారి ఇక్కడకు వస్తాను. భారతదేశానికి సంబంధించిన వార్తాపత్రికలు, మేగజైన్స్ ఎక్కువ చదువుతాను.  ఇక్కడ ఏమి జరుగుతుంది అనే విషయం గమనిస్తూ ఉంటాను. ఒక్కోసారి ఇక్కడ నివసించే వాళ్ళు కూడ ఇక్కడి విషయాల పట్ల గుడ్డిగా ఉంటారు. బయటనుండి తరచుగా వచ్చేవాళ్ళు విషయ పరిజ్ఞానంతో చూడ గలుగుతారు. ఆ పరంగా అది నాకు సహాయం చేసింది.

Qఆర్.కె నారాయణ్ ‘పిక్యోరియల్ నేరేషన్’ మీ కధల్లో కనిపిస్తుందని విమర్శకులు అన్నారు. అది మీకు కేవలం పుస్తకాలు చదవటం వలనే అబ్బిందా? మిమ్మల్ని ప్రభావితం చేసిన ఇతర రచయితలు ఎవరైనా ఉన్నారా?

ఆర్. కె నారాయణ్ నన్ను ఎన్నో విధాలుగా ప్రభావితం చేసాడు. అతని సరళమైన భాష, ఆమ్ ఆద్మీ చుట్టూ అల్లిన అతని కధావస్తువులు, సున్నితమైన హాస్యంతో కూడిన అతని బరువైన కధలు …. ఇవన్నీ నాకు ఇష్టం. నన్ను ప్రభావితం చేసిన ఇంకొక రచయిత్రి జాన్ ఆస్టన్. ఆమె రాసిన ఇంగ్లండు ఇప్పుడు అదృశ్యమైంది. ఆమె చెప్పిన పెద్దలు చెప్పిన వివాహాలు, కట్నాలు, పెళ్ళిలో డబ్బు ప్రాధాన్యత … ఇవన్నీ ఇప్పుడు ఇంగ్లండులో లేవు. కాని భారతదేశంలో ఇవన్ని ఇప్పటికీ ప్రాముఖ్యత గల విషయాలు. ఒక రచయిత కాని, రచయిత్రి కాని తను  చదివిన దాని వలనే ప్రభావితం అవుతారని నేను అనుకొంటాను. మనకు తెలిసి కావచ్చు, మనకు తెలియకుండా కూడ కావచ్చు.

 Qనాకిష్టమైన మీ రెండో నవల “మెనీ కండీషన్స్ ఆఫ్ లవ్” ( మొదటి నవల కొనసాగింపు)లో  ప్రేమ లోని  ప్రాక్టికాలిటీని, షరతులను క్షుణ్ణంగా చర్చించారు. ఘర్షణలకు, కష్టాలకు నిలబడలేని ప్రేమలలోని డొల్లతనాన్ని ఎండగట్టారు. మనలో మాట. ఎంతో బుద్దిగా అమ్మ, నాన్న చెప్పిన అమ్మాయిని చేసుకొని స్థిరపడిన మీరు,  సున్నితమైన ప్రేమలోని మరింత సున్నితమైన కోణాలను ఎలా తాకగలిగారు?

 అది కొంత కల్పితం, కొంత నిజం. ప్రేమ కోసం అంతా త్యాగాలు చేయాలి అనే కధలు చాలా ఉన్నాయి. మరి అలా చేయలేక పోతే? మెనీ కండీషన్స్ ఆఫ్ లవ్ లో ఒక దృశ్యం ఉంటుంది. చివర్లో ఉష వాళ్ళ నాయనమ్మను “ఎందుకు మా ప్రేమకు అన్ని షరతులు పెట్టావని” అడుగుతుంది. “ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు కాబట్టి పెట్టానని” చెబుతుంది. నేను మేరేజ్ బ్యూరో ఫర్ రిచ్ పీపుల్ నవలకు సీక్వెల్ రాయాలని అనుకొన్నపుడు ఈ దృశ్యం ముందు నా స్మృతిపధంలోకి వచ్చింది. నిజానికి మొత్తం పుస్తకమంతా ఈ దృశ్యానికి కొనసాగింపుగానే రాసాను.

Qమీ నవలలలోని ప్రధాన పాత్రలు మిష్టర్ ఆలీ అండ్ మిసెస్ ఆలీ. మధ్యతరగతి ముస్లిం కుటుంబ పాత్రలు. నిజానికి కధానాయకుడు మిష్టర్ ఆలీ అయినా, మీరు ప్రతిభావంతంగా మలిచిన పాత్ర మిసెస్ ఆలీ.  ప్రేరణ?

నాకు ముందే తెలిసిన విషయం, మిష్టర్ ఆలీ నా కధలో ఒక ముఖ్యమైన పాత్ర కాబోతాడని. ఆ పాత్రని కొద్దిగా మా నాన్న లాగే మలిచి, కావాలనే కొద్దిగా భిన్నంగా కూడ రాసాను. కాని కధ మొదలు పెట్టినపుడు మిసెస్ ఆలీ పాత్రను మా అమ్మను కేంద్రంగా చేసుకొని అంత ప్రాముఖ్యం లేని పాత్రగా మొదలు పెట్టాను. కాని నేను రాసే కొలది మిసెస్ ఆలీ పాత్ర ఎదిగి తనంతట తాను జీవం దాల్చింది. అందుకేననుకొంటాను, ఆమె చాలా శక్తివంతంగాను, వాస్తవికంగాను రూపొందింది.

Qమొదటి రెండు నవలలో బిడియస్తుడు, బుద్దిమంతుడు అయిన జామా, మూడో నవల ‘వెడ్డింగ్ వాలా’ లో హఠాత్తుగా హోమో సెక్యువాలిటీ, నక్సలిజం లాంటి కాంట్రావర్సెల్ అంశాలు ధైర్యంగా రాయగలిగాడు?

 నా మొదటి పుస్తకాన్ని నోస్తాలిజియాతో, విభిన్నసంస్కృతుల ప్రజలు భారతదేశంలో ఎలా కలిసి నివసించారో ప్రపంచానికి చెప్పటానికే రాసాను. తరువాత పుస్తకాలు రాసేకొద్ది నేను స్వేచ్చగా మరిన్ని కాంట్రావర్సెల్ విషయాల్ని ఎక్స్ ప్లోర్ చేయగలిగాను. ‘వెడ్డింగ్ వాలా’ సగం రాస్తుండగా ఢిల్లీ కోర్టు హోమోసెక్సువాలిటీ వ్యతిరేకచట్టాన్ని కొట్టి వేసింది. నేను కొద్ది రోజులు అయోమయంలో పడ్డాను. నేను ఆ తీర్పును పట్టించుకోకుండా, హోమోసెక్సువాలిటీ ఇంకా చట్ట విరుద్ధం అని రాయాలా, లేక ఆ నవలను పూర్తిగా వదిలి వేయాలో నిర్ణయించుకోలేక పోయాను. సీరియస్ గా ఆలోచించి తీర్పును కూడ కధలో భాగంగా, నాకు సంతృప్తి కలిగేటట్లు రాయగలిగాను.

నక్సలిజం చాలా సీరియస్ విషయం. నేను దానికి సింపతి ఆపాదించి కొంత పబ్లిసిటీ ఇవ్వగలిగాను. (ఇంగ్లండు, అమెరికా నుండి చాలా మంది నా పాఠకులు,నేను రాసినది చదివేదాక నక్సలిజం గురించి తెలియదని ఈమైల్ చేసారు.) కాని నేను ఆ విషయానికి పూర్తిగా న్యాయం చేయలేక పోయానని అనుకొంటాను.

Qమీకొచ్చిన అవార్డు గురించి చెప్పరా?

 చెప్పటానికి ఏముంది? అదొక గౌరవం. బ్రిటీష్ బుక్ అవార్డ్స్ వారి బెస్ట్ న్యూ నావలెస్ట్ లిస్ట్ తో సహా చాలా వాటిలో ఫైనలిస్టుగా వచ్చాను.  నాకు వచ్చింది మాత్రం మెలిస్సా నాథన్ అవార్డ్ ఫర్ కామెడీ రొమాన్స్. మెలిస్సా నాథన్ ఒక బెస్ట్ సెల్లింగ్ రచయిత్రి. చిన్న వయస్సులో కాన్సర్ తో చనిపోయారు. ఈ అవార్డ్ ఆమె పేరుతో ఆమె కుటుంబసభ్యులు ఇస్తున్నారు. జో బ్రాండ్ (ఫన్నీ కమేడియన్), సోఫియా కిన్సెల్లా ( మాస్ రచయిత) లాంటి వాళ్ళు ఆ జూరీ లో ఉన్నారు. ఆ అవార్డు పురుషుల్లో నేనే మొదట తీసుకొన్నందుకు సంతోషంగా ఉంది.

Q ఒక ముస్లిం రచయితగా మీ చివరి నవలలో(మిసెస్ ఆలీస్ రోడ్ టూ హేపీనెస్) ముస్లిం మత ఛాందస భావాలను కూడ తూలనాడారు. ఆ మతానికి సంబంధించి మీరు కోరుకొంటున్న సంస్కరణలు ఏమిటి?

 నేను పెరిగిన ఇస్లాం స్ట్రిక్ట్. కాని సున్నితమైన మతం. జీవితంలో క్రమశిక్షణ, మద్యాన్ని తిరస్కరించటం, రంజాన్ రోజుల్లో ఉపవాసాలు ముఖ్యమైనవి మాకు. అలాగే దానధర్మాలు కూడ. ఇస్లాం మతం అంటేనే కుల, మత సమానత్వం. స్త్రీలకు ఆస్తిహక్కు, విడాకుల హక్కు, అనాధల సంరక్షణ ఉన్న ప్రగతిశీల మతం అది. కొంతమంది ముస్లిమ్స్ , విద్వేషం ప్రబలేటట్లు దానిని వక్రీకరించటం బాధాకరంగా ఉంటుంది. మరికొంతమంది దానిని వెనకబడిన మతంగా చెప్పటం కూడ అంతే బాధాకరం.

Qమీ నవలలు ఫిక్షన్ అంటే నమ్మబుద్ది కాదు. చేతన్ భగత్ నవలల లాగా మీ నవలలు కూడ   స్వీయ అనుభవాల నుండి వచ్చాయా, అంత సజీవంగా ఉన్నాయి?

నేను నా నవలలో రాసిన అనేక దృశ్యాలు ఒక్కొక్కటే తీసుకొంటే చాలావరకు నిజాలు. నేను చూసినవి, అనుభవించినవి. కాని మొత్తంగా కధ లైన్ మాత్రం కల్పితం.

 – ఇంటర్వ్యూ: రమా సుందరి

 

ఉల్కాపాతం దాగివున్న అక్షరజ్వాల ‘చెర’ కవిత

వందేమాతరం

 

ఓ నా ప్రియమైన మాతృదేశమా

తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా

దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలం నీది

అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది

సంపన్నుల చేతుల్లో మైమరచి నిద్రిస్తున్న యవ్వనం నీది

 

ఊసినా దుమ్మెత్తి పోసినా చలనంలేని మైకం నీది

కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న

ఎలకల్నీ పందికొక్కుల్నీ భరిస్తూ నుంచున్న “భారతి” వమ్మా

నోటికందని సస్యశ్యామల సీమవమ్మా

వందేమాతరం వందేమాతరం

 

ఒంటిమీద గుడ్డలతో జెండాలు కుట్టించి

వివస్త్రనై ఊరేగుతున్న చైతన్య నీది

అప్పుతెచ్చి లేపిన మిద్దెల్లో

కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది

ఎండిన స్తనాల మీదికి ఎగబడ్డ బిడ్డల్ని

ఓదార్చలేని శోకం నీది

ఆకలికి ఎండి మాడి ఎరువు సొమ్ములతో వీధినబడ్డ సింగారం నీది

అమ్మా భారతీ నీ గమ్యం ఏమిటి తల్లీ

వందేమాతరం వందేమాతరం

cherabandaraju(1)

నేను డిగ్రీ ఆఖరి ఏడు  చదువుతున్నప్పుడు మిత్రుని ద్వారా ఈ అగ్ని గోళం వంటి కవిత పరిచయమై నాలో పేరుకున్న జఢత్వాన్ని పటాపంచలు చేసింది. చదవగానే అటు దు:ఖమూ ఆగ్రహమూ కలగలిసి నాభినుండి తన్నుకు వచ్చే దుఖాగ్రహ శకలాల ప్రేరేపితమైన ఉల్కాపాతం దాగివున్న అక్షరజ్వాల ఈ కవిత.

చెర తన కవితకు ప్రేరణ ఏమిటో చెప్తూ నా దేశ ప్రజలే నా కవితా వస్తువులు అంటాడు. దిగంబర కవితోద్యమం నా కవితావేశానికి వేదిక కల్పించి వెన్నెముక ఇచ్చి నిలబెట్టింది. మార్క్సీయమైన శాస్త్రీయ అవగాహన నా కవితాధ్యేయానికి స్పష్టతను ప్రసాదించింది అంటారు. దిగంబరకవిగా ఒకటి రెండు సభల్లో తనపై రాళ్ళు వేయించింది, ఎమర్జెన్సీలో జైల్లో ఒక ఆర్,ఎస్.ఎస్. వ్యక్తిచేత కొట్టించిందీ ఈ గేయమేనని చెప్పారు. అలాగే వందేమాతరం బంకించంద్ర వందేమాతరంనకు అనుకరణా కాదు, అనుసరణా కాదు. దానికి పూర్తి వ్యతిరేకమైనదన్నారు. వందేమాతరంలో బంకించంద్ర సుజలాం సుఫలాం అన్నప్పుడు మన భారతదేశ జల ఖనిజ సంపద మన కళ్ళముందు కదలాడుతాయి. కాని అవి ఎవరికి చేరాలో వారికి చేరడం లేదు కదా అని అందుకనే తాను నోటికందని సస్యశ్యామల సీమవమ్మాఅని రాసానన్నారు. ఈ వందేమాతరం దిగంబర కవుల మూడవ సంపుటంలో మొట్టమొదటి గీతం.

    ఈ తరానికి చెరబండరాజు చిరునామా. ఈ కవిత్వ తరానికీ చెరబండరాజు చిరునామానే. ఆయన కవితలలో దాగివున్న అనంతమైన ఉత్ప్రేరక శక్తి ప్రతి పద చిత్రంలోను దాగివున్న విస్ఫోటనాతత్వం వేరెవ్వరిలోనూ కానరావు. దిగంబరకవులందరిలోకి భవిష్యత్ తరంలోకి మార్పును ఆహ్వానిస్తూ దానికో శాస్త్రీయమైన సశస్త్రబలోపేతమైన మార్క్సిస్టు అవగాహనను చేర్చుకుంటూ వర్తమాన తరానికి దిక్సూచిగా తన ఆచరణ ద్వారా ముందు పీఠిన నిలిచిన వారు చెరబండరాజు కావడం యాధృచ్చికం కాదు. అందుకే చెరబండరాజు మనందరికీ చిరస్మరణీయుడు. 

వరుస మారిన వందేమాతరం ఇప్పటికీ మనకు  సజీవ సాక్ష్యం. నేటి కార్పొరేట్ శక్తులు ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకొని తమ అంతర్జాతీయ వ్యాపార లాభాల స్వలాభాలకు భారతదేశ అపార ఖనిజ సంపదను దోచుకుపోవడానికి సెజ్ ల పేరుతో పారిశ్రామిక అభివృద్ధి పేరుతో విధ్వంసకర అభివృద్ధి నమూనాను బలవంతంగా రుద్దుతూ పర్యావరణాన్ని  ధ్వంసం చేస్తూ, మనుషులలో నైతికతను చెరుస్తూ, మానవత్వాన్ని చెరబడ్తూ, ఓ అభధ్రతా బావాన్ని మనలోకి ప్రవేశపెడ్తూ ఈ దేశ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న ఈ సందర్భంలో చెర వందేమాతరం మరోమారు మనం ఆలపించి ఆచరణవైపు కదలాల్సిన యుద్ధసందర్భం ఇది.

–కెక్యూబ్ వర్మ

కెక్యూబ్ వర్మ

నెక్స్ట్ కేస్

ismail

సారూ! నన్ను బ్రతికించు… సారూ!” అంటూ కన్నీళ్లు పెట్టుకొంటోంది చెన్నవ్వ.

ఎక్కిళ్లతో ఎగిసెగిసి గస పోసుకుంటూ మాట్లాడుతోంది. రాత్రి ఒంటి గంట కావస్తూంది.

బయట హోరున వర్షం. అప్పుడే కరెంటు పోయింది.

మిణుకు మిణుకుమనే కొవ్వొత్తి కాంతిలో ఆ చిన్న గదిలో, సగం తుప్పు పట్టిన మంచం మీద చెన్నవ్వ, పక్కన నేను.

“ఇట్టాంటి పని మళ్లా ఎన్నడూ చేయను సారూ! యెంత కస్టమొచ్చినా కడుపులో పెట్టుకొనేదాన్ని, కానీ ఉన్న ఒక్క మగోడు పోయినాక, ఆ దుక్కం తట్టుకోలేక ఈ పని చేసినా సారూ!” ఏడుస్తూనే చెప్పింది.

“ఊరుకోమ్మా! నీకేం కాదులే…నేనున్నానులే.. అంతా బయటకు వచ్చేసింది. కాసేపు ఈ మందు ఇస్తే ప్రాణం అదే  కుదుటపడుతుంది”

ఏదో ఓదార్పుగా నాలుగు మాటలు చెప్తున్నా కానీ నా కళ్లన్నీ సూదిమొనంత అయిపోయిన ఆమె కనుపాపల మీదే ఉన్నాయి.

ఈ సారి కొంచెం మోతాదు పెంచి, సిరెంజిలో కాస్త ఎక్కువ మొత్తంలో ‘అట్రోపిన్’ తీసుకొని ఆమె నరంలోకి మెల్లగా పోనిచ్చాను. అంతకు ముందే ఇచ్చిన ‘ప్రాలిడాక్సైం’ విరుగుడు మహత్యమో, లేక వరుసగా ఇస్తూన్న అట్రోపిన్ చలవో, అప్పుడే తెరుచుకొన్న బిలంలా తన కనుపాపలు కాస్త పెద్దవవడం మొదలైంది.

తన కనుపాపనైతే చూడగలిగాను కానీ ఆ కన్నుల్లోంచి ‘ఆమె’ను చూడలేకపోయాను. ఎంత బాధ ఉంటే ఓ మనిషి ఆత్మహత్య అనే ఆఖరి మెట్టుకు చేరుకొంటాడు? ఆ బాధ తీర్చే శక్తి నాకుందా? ఇప్పుడు ఈ ప్రాణాన్ని బయటపడవేయగలను, కానీ ఆ బాధను తీసివేయడం నా చేతుల్లో లేదు కదా అని ఒక్క క్షణం అనిపించింది.

***

ఉరవకొండ ప్రభుత్వాసుపత్రి అవడానికి ఆసుపత్రే అయినా ఓ పెద్ద సైజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. వైద్యవిధానపరిషత్ కిందకు వచ్చే సామాజిక ఆరోగ్య కేంద్రం.
24 గంటల వైద్యసేవ కోసం ప్రభుత్వం కాంట్రాక్టు వైద్యునలయితే నియమించింది కానీ, అక్కడ ఆ సేవలందించడానికి కావాల్సిన పరికరాలు, సాధనా సంపత్తికి ఎప్పుడూ కొరతే.

నేను పని చేసేది గుంతకల్లు ప్రభుత్వసుపత్రే అయిన డిప్యుటేషన్ పై ఓ వారం రోజుల నుంచి ఉరవకొండలో ఉన్నాను.

సాయంత్రం పని అయిపోగానే అనంతపురం బయలుదేరేవాన్నే, కానీ ఆ రోజు డ్యూటీలో ఉన్న డాక్టరు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల వరుసగా రెండో రోజూ నేనే నైట్ డ్యూటీ చేయాల్సి వచ్చింది. శనివారం కావడం వల్ల, సాయంత్రం పెద్దగా ఓ.పి. లేదు. ఈ రోజు కాస్త ప్రశాంతంగా గడచిపోతుంది అనుకొనేటప్పటికి సన్నగా
జల్లు పడడం ప్రారంభించింది.

పక్కనే ఉన్న టీకొట్టు నుంచి అటెండరు మల్లన్న మంచి మసాల టీ పట్టుకొచ్చాడు.

ఉన్న ఒక్క నర్సు సునంద, మల్లన్న, నేను ఏదో పిచ్చాపాటీ మాట్లాడుకొంటూ ఉండగా  హడావుడిగా ఓ ఆటో వచ్చి ఆగింది. ఆటోలో నుంచి నురగలు కక్కుకూంటూన్న  బక్కపలుచటి మనిషిని ఓ ఇద్దరు చేతుల్లో మోస్తూ తెచ్చి రూంలో పడుకోబెట్టారు.

“సార్! దాని మొగుడు, పోయిన వారమే పురుగుల మందు తాగి పాణాలు తీసుకొన్నాడు. అబ్బుటి నుంచి ఏడ్చి, ఏడ్చి గుడిసెలోనే ఉన్నాది, ఈ పొద్దు పలకరిద్దామని వాళ్లింటికి పోతే కిందపడి కాళ్ళూ, చేతులూ కొట్టుకుంటాంది. ఆ పక్కన తాగి పడేసిన ఎండ్రిన్ డబ్బా ఉంది. అబ్బుడే ఊర్లోకి వచ్చిన షేర్ ఆటోలో ఈయమ్మని ఏసుకొచ్చినాం” అని ఒక్క గుక్కలో జరిగిందంతా చెప్పేసారు చిన్నహోతూరు
నుంచి ఆటో వేసుకొని ఆమెని తీసుకొచ్చిన ఊరివాళ్లు.

వాళ్లతో ఓ పక్క మాట్లాడుతూనే సిస్టర్ తెచ్చిన ఓ చిన్న ప్లాస్టిక్ గొట్టాన్ని తీసుకొని మెల్లగా ముక్కు ద్వారా పొట్టలొకి పంపి, స్టెతస్కోపుతో దాని చివర కడుపులోనే ఉందని నిర్దారించుకొని, ఓ పెద్ద సిరెంజితో రెండు బాటిళ్ల ‘నార్మల్ సెలైన్’ పంపి మళ్ళీ అదే సిరెంజితోనే తిరిగి ఆ సైలైనంతా బయటకు లాగి ‘గాస్ట్రిక్ లావాజ్’ చేయడం మొదలుపెట్టాను.

ఇది నేనిలా ఓ వైపు చేస్తూంటే, ముంజేతి నరానికి వదులు కాకుండా ఓ ఐ.వి.కాథటర్ని పెట్టి మెల్లగా తన రక్తనాళాల్లోకి సైలెను బాటిల్లోని మందును పంపసాగింది సిస్టర్ సునంద. మల్లన్న దగ్గర్లో ఉన్న కుర్చీని జరిపి
‘కూర్చోండి సార్’ అన్నాడు.

అప్పటి నుంచి ప్రతి పదిహేను నిముషాలకు ఒకసారి నేను, మరొకసారి సిస్టరు ఆమె కనుపాప తీరుని, మణికట్టు దగ్గర నాడీవేగాన్ని గమనిస్తూ తగిన మోతాదులో ‘అట్రోపిన్’ ఇస్తూ వచ్చాం. ఎప్పుడో అర్ధరాత్రికి  ఆమెకు కాస్త తెలివి వచ్చింది.

***

“నీ పేరేంటి? మీదే ఊరు? ఏం జరిగింది?” అంటూ ఒక్క ప్రశ్న తర్వాత ఇంకొక్కటి వేస్తూ పోయాను.

సగం తెరిచిన కనులతో మెల్లగా ఏదో గొణుగుతూ ఉంది.
అలా కొద్దిసేపయ్యాక నోట్లో ఊరుతూన్న లాలాజలం అంతా ‘అట్రోపిన్’ ఎఫెక్టుతో ఆగడం మొదలుపెట్టాక ఆమె మాటతీరు కాస్త మెరుగైంది.

“నా పేరు చెన్నమ్మ సారూ. ఊర్లో అంతా చెన్నవ్వ అని పిలుస్తారు. ఏదో ఇంత యవసాయం చేసుకొని బతుకుతాన్నాం. ఈ సారి అప్పుసప్పూ చేసి ఏసిన చెనిక్కాయంతా వానకు కొట్టుకుపోయింది. ఇన్నాళ్యూ వొర్సం లేక పంట ఎండిపోయె. ఊరంతా ఎడారి ఐపొయె.ఇప్పుడేమో ఈ పాడు వానలకు చేతికొచ్చిన పంట పోయింది. అది చూసి తట్టుకోలేక నా పెనిమిటి పోయినారమే ఎండ్రిన్ తాగి పాణాలిడిచినాడు. నన్నిట్లా వొదిలేసి ఆయప్ప దారి ఆయప్ప సూసుకొన్నాడు. అనంతపురం కూడా కొండబోయినాం కానీ ఏమీ పయోజనంలేకపాయ ఉన్న అప్పు సాలక నెత్తి మీద ఇంకో అయిదువేలు పడినాయి. నేనెక్కణ్నుంచి
తెత్తును సారూ! ఉండేకి ఓ గుడిసె, తినేకి ఇంత సంగటి కూడా కస్టమైపాయె ఈ అప్పులోళ్లతో. ఆ వడ్డీ అంతా యాడ నుంచి తెచ్చి కట్టేది సారూ. అందుకే ఈ పని చేస్తి..”

ఆగకుండా చెప్తునే పోతోంది చెన్నవ్వ.

“అట్లంటే ఎట్ల చెన్నవ్వ, మీ ఊరోళ్ళకు నీ గురించి తెలియదా? సర్పంచితో నేను మాట్లాడుతాలే, అప్పులోళ్లు సతాయిస్తే పోలీసోళ్లకు చెప్పాలి. నీవున్న పరిస్థితిలో ఎవరైనా నీకు సాయమే చేస్తారు. ఆ క్రాపు లోనో ఇంకోటో ఏదో ఒక దారి ఉండకపోదు” అని తనకి ఆత్మస్థైర్యం కలిగించే ప్రయత్నం చేశాను.

“లేదు సారూ, నేను చానా ధైర్న్యంగా బతికిందాన్నే. ఈ ఒక్కసారికీ నన్ను గడ్డకేయండి సారూ! ఇన్నాళ్యూ యాదో ఒకటి… తినో తాగో బతికినాం. కానీ ఆ పెనిమిటే పోయినంక ఆ బాధ తట్టుకోలేక ఈ పాడుపని చేసినాను కానీ బతికే ధైర్న్యంలాక కాదు” ఇంకిపోయిన కన్నీళ్లతో చెప్తోంది చెన్నవ్వ.

అలా ఆ రాత్రంతా మాటల్లో పడి తన గురించి, తన సంసారం గురించి,వాళ్ల దగ్గరి బంధువుల గురించి మాట్లాడుతూంటే తెల్లవారిపోయింది.

తన పెనిమిటంటే ఎంత ప్రేమో ఆ మాటల్లో ప్రతి వాక్యమూ  పట్టించింది.  ఒక మనిషిపై మరో మనిషి చూపే ప్రేమ, ఆప్యాయతలన్నా నాకు తగని ఆపేక్ష.

అందుకేనేమో నాకు తెలియకుండానే ఆ కొద్ది గంటల్లోనే ఎదో తెలియని సాన్నిహిత్యం ఏర్పడిపోయింది చెన్నవ్వతో.

ఉదయం ఎనిమిది గంటలయ్యేసరికి నా రిలీవర్ వచ్చాడు. చెన్నవ్వ పరిస్థితి బాగా మెరుగుపడింది.

అప్పటికే గుంతకల్లు ఏరియా ఆసుపత్రికి ఫోన్ చేసి ఈ విషయం కబురు చేయగానే, వాళ్ళు పంపిన అంబులెన్స్ కూడా సిధ్దంగా ఉంది.

చెన్నవ్వతో “గుంతకల్లులో ఇంకా మంచి వైద్యం దొరుకుతుంది, ఇంకా రెండు, మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలి. అక్కడ బాగా చూసుకొంటారు. సోమవారం నా డ్యూటీ గుంతకల్లులోనే, అక్కడ కలుస్తాను” అని ధైర్యం చెప్పి నేను అనంతపురం బస్సెక్కాను.

***

ఊరు చేరినా, పడుతూన్న వర్షం ఆగలేదు. సన్నగా అలా కురుస్తూనే ఉంది మూడు రోజులుగా.

ఇల్లు చేరగానే స్నానం చేసి అమ్మ పెట్టింది తిని వెంటనే పరుపు పై పడిపోయాను. ఒళ్లు తెలియని నిద్ర పట్టినా, కలలో ఎక్కడో లీలగా చెన్నవ్వ మాటలే వినపడుతున్నాయి.

“ఈ దేశంలో వ్యవసాయం దండుగ, ఐ.టి.యే సర్వరోగనివారణి” అని రాజకీయనాయకులు లెక్చర్లిచ్చే కాలం అది. అప్పటికి నేను పని చేసిన రెండు, మూడేళ్లలో దాదాపు యాభై, అరవై ఇలాంటి కేసులే చూసిన అనుభవం. చాలా కేసుల్లో, కొంత మందిని కాపాడగలిగినా, మరి కొంత మంది మరణం అంచుకు వెళ్లి తిరిగొచ్చినా… ఉన్న అప్పులకు మళ్ళీ ఇంకొన్ని తోడయ్యి వీళ్ల పరిస్థితి ఏంటి? అనే ఆలోచనలు సుళ్లు తిరిగేవి.

మళ్లీ సోమవారం పొద్దున కానీ కళ్లు తెరవలేదు. ఆ రోజు గుంతకల్లులో డ్యూటీ. ఉరవకొండకు డిప్యూటేషన్ పై వచ్చిన వారం రోజులు అయిపోయాయి. ఏడింటికల్లా అనంతపురం-గుంతకల్లు ప్యాసింజరు పట్టుకోవాలని రైన్ కోటు వేసుకొని, తలపై ఓ క్యాప్ పెట్టుకొని నా బైకుని రయ్యిమని స్టేషన్ వైపు పరుగులెత్తించాను.

***

గుంతకల్లు చేరగానే, అలా ఆస్పత్రిలో అడుగు పెట్టానో లేదో, గేటు దగ్గర ఏడుస్తూ ఓ పదిహేనేళ్ల కుర్రాడు, వర్షంలో తడుస్తూ నిలబడ్డాడు.

భుజం మీది తువ్వాలునైనా నెత్తిమీద పెట్టుకోకుండా తలో దిక్కూ చూస్తున్నాడు. లోపలికి రమ్మని చెప్పి “ఏమయ్యా! ఏమయ్యింది ?” అంటే “మా అత్త సచ్చిపోయింది సార్. ఆయమ్మ శవాన్ని ఇచ్చేదానికి పోలీసోల్లు లెక్క అడుగుతాండారు. ఓ పక్క అది పోయి మేమేడుస్తాంటే ఈల్లు లెక్కీలేదని సతాయిస్తాన్నారు. చేతిలో ఒక్క పైసా లేదు. ఏం జేయాల్నో దిక్కు తెల్డం లేదు సార్” అని దిగులుగా అన్నాడు.
మనస్సు చివుక్కుమంది. జేబులో చేయి పెట్టి దొరికిన ఓ వంద అతని చేతికిచ్చాను.

ఈ పోలీసు మామూళ్లు మామూలే అయినా పోస్ట్ మార్టం దగ్గర కూడా ఈ కక్కుర్తి ఏంటో అర్థం కాక చివ్వుమని కోపం వచ్చింది.

వీళ్ల సంగతేందో తేల్చాలని పోలిసు కానిస్టేబులు ఉండే మార్చురీ వైపు వెళ్ళాను. అక్కడ గుమ్మం దగ్గర ఎవ్వరూ లేరు. ఆ వర్షంలో కూడా పక్కనే ఓ తడిక కింద కానిస్టేబుల్ రమణ, మార్చురీ ‘తోటీ’ నంజయ్య దమ్ము కొడుతూ కనిపించారు.

“ఏం రమణా ఈ పిల్లోన్ని పైసలు అడిగావంట?” అని కాస్త కోపంగా అన్నాను. “ఏదో పేపర్లకి, మిగతా సరంజామాకి వాళ్లనే ఖర్చు పెట్టుకోమని చెప్పాను సార్, మాకిమ్మని కాదు” అంటూ ఏదో నసిగాడు రమణ .

అంతలో నంజయ్య తాగుతూన్న సిగరెట్ ముక్క పక్కన పారేసి “కరెక్టు టైంకి వచ్చారు సార్. పదండి నెక్స్టు కేసు మీదే” అంటూ నెత్తిన తుండుగుడ్డ వేసుకొని ఆ తడిక నుంచి బయటకు వచ్చాడు.

“సరే పద” అని తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాను.

ఆ చీకట్లో, మార్చురీ బల్ల మీద ఏ కదలిక లేకుండా, చల్లగా చెన్నవ్వ శరీరం.

బయట…

వర్షం ఆగిపోయింది.

 

 

 

బిల్లి

shahjahana

 ‘నఖాబ్’ తీసి ముస్లిం స్త్రీ ‘దర్దీ’ స్వరాన్ని వినిపించిన  తెలుగు రచయిత్రి షాజహానా. కవిత్వంలోనే కాకుండా, కథల్లో కూడా ఆమె తనదయిన గొంతుకని వెతుక్కుంటోంది. అస్తిత్వ ఉద్యమాల దశాబ్దంలో కవిత్వంలోకి అడుగుపెట్టిన షాజహానా అతి తక్కువ సమయంలోనే గుర్తింపు పొంది, అంతర్జాతీయ వేదికల మీద కూడా తన స్వరాన్ని వినిపించారు.

*

రెహానా వాళ్లాయనది చిన్న గవర్నమెంటుద్యోగం. దాంతో  ట్రన్స్‌ఫర్లు తప్పనిసరై జిల్లా అంతా తిరుగుతుంటారు. ఆ సందర్భంగానే ఈ పెద్ద నగరానికి వచ్చారిప్పుడు. ట్రాన్స్ఫరైనప్పటి నుండీ లెక్కలేసుకుంటూనే ఉన్నాడు రహీమ్. తక్కువ కాలం వెదుకులాటలో మూడంతస్తుల పైన ఇల్లు దొరికింది. ఊపిరి పీల్చుకున్నాడు రహీమ్.

చిన్న చిన్న ఊళ్లలో అందరూ చక్కగా మాట్లాడేవాళ్లు . ఇప్పుడిక ఎవరైనా మాట్లాడతారో లేదోనని బెంగగా వుంది రెహానాకి. మొత్తానికి వాళ్లు లారీడు సామానుతో సహా దిగిపోయారు. ఆ మూడంతస్తుల మెట్లెక్కుతుంటే చిన్నప్పుడు  చార్మినార్ మెట్లే గుర్తొచ్చాయి ఆమెకి. ఇంకా ఎన్ని మెట్లెక్కాలి? అన్నట్లు కోపంగా చూస్తుంది మాటిమాటికి. కిందవాళ్ల వాటా ముందునుంచే మెట్లెక్కాలి. మెట్ల పక్కన తులసికోట. ఒక మూల పిల్లి ఒకటి అరమోడ్పు కళ్లతో పడుకుని ఉంది. వీళ్ల అలికిడికి కళ్ళు తెరచి చూసి కూడా చూడనట్లు నిర్లక్ష్యంగా పొర్లింది వెల్లకిలా.

శనివారం, ఆదివారం రెండ్రోజులు  ఇంట్లో సామాను సర్దుకోవడంతో సరిపోయింది ఇద్దరికీ. బయట పూలకుండీలను సరిగ్గా కొంచెం ఎండ తగిలేలా ఉంచింది రెహానా. చుట్టు పక్కల పరిసరాల్ని గమనిస్తే ఎవరూ ఎవర్నీ పట్టించుకోని పరిస్థితి కనప్డింది రెహానాకి. భర్త ఆఫీసుకెళ్లాక తను ఒంటరేనని అర్ధమైంది ఆమెకి.

మొదటి వారం రోజులు బద్ధకంగా గడిచాయి. మళ్లీ ఆదివారం వచ్చింది. రహీమ్ మంచి మాంసం అర కిలో తెచ్చాడు. స్టౌ మీద తుకతుక ఉడుకుతూ చుట్టుపక్కలకి ఘుమఘుమ వాసనల్ని వెదజల్లుతుంది కూర. కొద్దిగా మసాలా, కొతిమిర వేసి దించేసింది రెహానా.

మధ్యాహ్నం అన్నం తిని ఎక్కడికో వెళ్లాడు రహీమ్. ఆమె ఒక్కత్తే ఉంది.

ఇంతలో కిందింటి పిల్లి ‘మ్యావ్’ అనుకుంటూ లోపలికొచ్చింది. ‘ఇష్ష్’ అంటూ బైటికి గెంటింది రెహానా. అది పోయినట్టే పోయి మళ్లీ వచ్చింది. నోరు నొప్పి పుట్టేటట్టు ‘ఇష్ష్! ఇష్ష్!’ అని ఎంతన్నా అది ఇంచు కూడా కదల్లేదు. పైగా తోక చివరి భాగాన్ని ఊపుతూ ఆమె కాళ్లను రాసుకుంటూ తిరగసాగింది. అంతకు ముందు వాళ్లిద్దరికీ ఎన్నో రోజుల పరిచయ బంధం ఉన్నట్లు.

దాని బాధ చూడలేక ఆకలేస్తుందేమోనని, రాతెండి ప్లేట్లో రెండు మూడు పలుచటి మాంసం ముక్కలు, కోస్తున్నప్పుడు పక్కకి పెట్టిన మాంసం తుక్కు అంతా తీసుకెళ్లి బయట పెట్టింది రెహానా. వెంటనే బయటికెళ్లింది పిల్లి. చక్కగా ప్లేటుని  చూసి తినడం ప్రారంభించింది. తిన్న తరువాత రెండుసార్లు అటుఇటు పచార్లు చేసి కిందికెళ్లిపోయింది.

అది మొదలు ప్రతిసారి మాంసం వండినప్పుడల్లా పిల్లి రావడం, రెహానా మాంసం పెట్టడం అలవాటైపోయింది. కొన్ని రోజుల తర్వాత ఒక ఆదివారం పిల్లి ప్లేట్లో మాంసాన్ని విదారగిస్తుంది. కిందింటి పిల్లి యజమాని మందపాటి చద్దర్లు డాబాపై ఆరేసుకోవడానికి వచ్చింది. ఆవిడ రెహానా వాళ్లింటి ముందు నుంచే పైకెళ్లాలి కాబట్టి యాదృచ్చికంగా వచ్చి పిల్లిని చూసింది.

దాని ముందున్న ముక్కలని చూసింది. వచ్చినంత వేగంగా కిందికి వెళ్లిపోయిందామె.

“ఏమైనా మర్చిపోయిందేమో” స్వగతంగా అనుకునేలోపు కిందనుంచి పెద్దగా అరుపులు వినిపించాయి. ఏమిటా అని రెహానా నాలుగు మెట్లు కిందికి దిగింది. రెహానాని చూసి మొహం తిప్పుకుంటూ ఆవిడ “ఇన్ని రోజులూ చక్కగా పాలు, పెరుగూ  పోసి పెంచాను. చండాలపు తిండి పెట్టి మా పిల్లిని అపవిత్రం చేసిందే. అయినా వెనుకా ముందు చూసుకో అక్కర్లా? ఎవరి పిల్లి  ఏంటి అని? మా ఇంట్లో పిల్లలతో సమానంగా పెరిగిన పిల్లి. మడీ, ఆచారం అన్నీ ఔపోసన పట్టిన పిల్లి అది. ఇన్నాళ్ల దాని నిష్టని ఒక్క రోజులో గంగలో కలిపింది కాదు. అయినా ఆ ఓనర్‌కి ముంధునుంచీ చెప్తూనే ఉన్నాం తురకలకి అద్దివ్వద్దనీను. అయినా వింటేనా.. వెధవకి డబ్బు ఆరాటం. అయినా రానీ. అతని సంగతీ తేలుస్తాను” చేతులు తిప్పుతూ ఆవిడ రెహానాని కడిగేసింది ఇంకా చాలా మాటలతో.

పిల్లి తన వంక పాపం అన్నట్లు చూస్తున్నట్టనిపించింది రెహానాకి.

“అది కాదండీ.. నాకు తెలీక” అని రెహానా ఏదో చెప్పబోయేంతలో “దాక్షాయణి ఏం జరిగిందే? రమ్మని పిలిచావూ.. వచ్చేలోగా ఎక్కడికి వెళ్లావు? ఏమిటా గలాటా? అలగా జనంలాగా.. ముందు ఇంట్లోకి  తగలడు” అనుకుంటూ బైటికొచ్చాడు వాళ్లాయన.

ఆమె రుసరుసలాడుతూ నావైపు , పిల్లి వేపు కూడ అసహ్యంగా చూస్తూ లోపలికి వెళ్లిపోయి కోపంగా తలుపేసుకుంది. ఆమె వెనుకే లోపలికి వెళ్లబోయిన పిల్లి ఏమీ అర్ధం కాక నిలబడిపోయి “మ్యావ్” అంది దిగులుగా..

 

 

+++++++++++++++++++

 

కూరగాయలు కొందామని కిందికి దిగుతుంది రెహానా. పిల్లి దాక్షాయణి వాళ్ళ గడపదాటి లోపలికెళ్లడానికి ప్రయత్నిస్తుంది. దాని సామ్రాజ్యం కదా మరి. సుడిగాలిలా దూసుకొస్తుంది ఆమె.

“అప్రాచ్యపు ముండా! ఏం మొహం పెట్టుకుని వస్తావే ఇంట్లోకి. నువు మలినమైపోయింది కాక మమ్మల్ని కూడా మలినం చేద్దామనే.. ఫోవే.. చీ.. పో! అవతలికి, నీకివాళనుంచి అన్నం లేదు సున్నం లేదు” అంటూ నిర్దాక్షిణ్యంగా పిల్లి ఇవతలికి కట్టేముక్కతో నెట్టి తలుపులు ధడేల్మని వేసుకుంది దాక్షాయణి.

ఆవిడ తిట్టింది పిల్లినా, తననా … అనుకుంటూ  కిందికెళ్లిపోయింది  రెహానా.

ఆ రాత్రంతా పిల్లిని గురించి ఒకటే కలలు రెహానాకి.

విచిత్రంగా కొన్ని పిల్లులు జందెం వేసుకుని ఉన్నాయి. జందెం వేసుకున్న పిల్లులు వేసుకోని పిల్లుల మీదికి యుద్ధానికొస్తున్నాయి. యుద్ధంలొ ఎవరు గెల్చారో ఓడారో తెలీదు.

మొత్తానికి ప్రతీ పిల్లికీ గాయమై రక్తం కారుతుంది. అది కూడా జీవహింసే కదా.. కలవరిస్తుంది రెహానా. ఆ  యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆమె పిల్లుల మీద పరిశోధించి పురాతన గ్రంధాలు చదివి శోధించి విలువైన పరిశోధనా వ్యాసాలు రాసి  పత్రికలకు పంపి పుస్తకంగా వేసింది.

ఒక సంఘం వారు పిలిస్తే పిల్లుల గురించి సభలో ఇలా మాట్లాడింది. “పిల్లులన్నీ మాంసం తినేవే. కానీ కొన్ని కొన్ని పిల్లులు కొన్ని కట్టుబాట్లు పెట్టుకుని మానేసినై. అన్నీ ఒక్కలాగే ఎందుకుండాలి. వాటికంటే మనం గొప్పవిగా కనపడాలని. అయితే వాటి జీన్స్‌లో మాంసం తిన్న ఆనవాళ్లు ఆ కోరిక గుప్తంగా ఉండి అవకాశం  వచ్చినప్పుడు బయట పడతాయి” ఆమె ఉపన్యాసం ముగియకుండానే వేదిక నాలుగువైపుల నుండీ జందెం పిల్లులు దాడి చేశాయి. వేదిక కూలి రెహానా మీద పడింది.

కెవ్వుమని అరిచింది రెహానా. ఆమె అరుపులకి ఆమే భయపడి దిగ్గున లేచి కూర్చుంది.

పక్కన వాళ్లాయన గండు పిల్లిలా చూస్తున్నాడు మొహంలో మొహం పెట్టి.

“ఏంటా అరుపులు! ఎవరైనా వింటే పొద్దున్నే తాగి గొడవ చేస్తున్నాననుకుంటారు.. రాత్రంతా పిల్లులు కొట్లాడినట్లు నా మీదికి కాళ్లు చేతులు విసిరింది కాక.. హారర్ సినిమాల్లో లాగా కెవ్వుమని అరవడాలేంటి?” విసుక్కున్నాడు రహీమ్.

ఆఫీస్ ఏర్పాట్లు అన్నీ అయ్యాక రహీమ్ వెళ్లిపోయాడు. చిన్నగా రెండు మెట్లు  దిగి తొంగి చూసిన రెహానాకి అక్కడ పిల్లి ముందు ప్లేటు ఎండిపోయి కనబడింది.

పాపం అది రాత్రంతా ఏమి తినలేదులా ఉంది అనుకోగానే మనసంతా బాధతో నిండిపోయింది రెహానాకి.

మధ్యాహ్నం సమయంలో వాకిలి ముందు ఏదో కదలాడుతున్నట్టుగా ఉంటే.. చూస్తే  పిల్లి. నీరసంగా ఉన్నట్లుంది అరుపు సరిగా రావడం లేదు. గబగబా ఇంట్లో ఉన్న ఎండురొయ్యలు తెచ్చి ప్లేట్లో వేసి పెట్టింది. ఆబగ తినేసింది పాపం పిల్లి. ఇంక అది ఆమె వెనుకే తిరగసాగింది. తర్వాత కుండీల పక్కన మంచి ప్రదేశం చూసుకుని ఆరామ్ గా నిద్రపోయింది.

ఆ రోజు నుండి దాక్షాయణి ఇంటిముండు ఎన్నడూ తచ్చాడుతూ కనబడలేదా పిల్లి.

 

 -షాజహానా

“అలసిన వేళనే చూడాలీ….”

 

అలా నా జీవితం నువ్వుపప్పు జీడిలా తియ్యగా కమ్మగా సా…….గుతూ వుండగా ,  ఒక వెచ్చని సాయంత్రం  ……

‘ సోగ్గాడిపెళ్ళం’ అనే పతిభక్త సినిమానుంచీ ” కొండకోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్యపైన ….రాయల్లెవున్న ఆ రామయ్యపైన ” అన్న ఏసుదాసు కీర్తనని భక్తితో ఆలకిస్తూ బిందె, చెంబూ బరబరా తోమి పడేసాను. ఉప్పూ చింతపండూ కలిపి తోమితే ఇత్తడి పుత్తడిలా మెరుస్తుందని ఆ మధ్యన మా అత్తగారు ఎవరికో చెపుతుంటే  పరధ్యానంగా  విన్నానేమో ….ఆ పాఠం అవసరానికి పనికొచ్చింది. (అదేవిటో నేను స్కూలుకెళ్ళి  శ్రద్ధగా నేర్చుకున్న పాఠాల కంటే , ఇలా అశ్రద్ధగా విన్న అత్తగారి పాఠాలే జీవితంలో ఎక్కువగా అక్కరకొస్తుంటాయి)

నే తోమి బోర్లించిన బుడ్డి చెంబు బాల భానుడిలా ప్రకాశిస్తుంటే , చెప్పొద్దూ ….నా తోముడు కళాప్రావీణ్యానికి నాకే తెగ ముచ్చటేసింది   . నా చేతిలో పడితే రాయైనా రత్నమై మెరుస్తుందేమో అన్న అనుమానం తన్నుకొచ్చింది. . “నువ్వు సూపరే పిల్లా” అని ఆయన అస్తమానూ  అనేది ఇందుకే కదా అని తలుచుకుంటే సిగ్గు ముంచుకొచ్చింది .  ఆ సిగ్గుతోనే  వంచిన నడుం ఎత్తకుండా రెండెకరాల   వాకిలీ గాలివాలుకు గబా గబా తుడిచేసి , ఓ  రెండు గాబుల నీళ్ళు తోడి కళ్ళాపు చల్లేసి , ఈ చివర్నించీ ఆ చివరికి  నాకొచ్చిన చుక్కలముగ్గులూ, చిక్కులముగ్గులూ అన్నీ పెట్టుకుంటూ కూర్చునేసరికి  సూరిబాబు మొఖం  వేళ్ళాడేసుకుని చెట్లవెనక్కి జారిపోయేడు .

అమ్మో…! అపుడే వంట వేళయిందా .  పొద్దున్నేకదా వండి పడేసాం!’ అని విసుక్కోకుండా మళ్ళీ హుషారుగా వండేసి- మళ్ళీతినేసి, మళ్ళీతోమేసి – మళ్ళీతుడిచేసి…..చీ…చీ…ఇంతేనా వెధవ జీవితం అన్న పాడుఆలోచన  అణుమాత్రమయినా  రానీయకుండా ……’పతియే ప్రత్యక్ష దైవమూ …నా అత్తారిల్లే స్వర్గమూ’ అని  పతిభక్తి పాటలు పాడుకుంటూ ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఎప్పుడెప్పుడు కిందా మీదా పడుతూ ఈ పాచి పనులన్నీ చేసేసుకుందామా అని కలలు కంటూ పడుకోటం  ‘ఆహా …. జీవితమే సఫలమూ ‘అని అరమోడ్పు కన్నులతో నేను తన్మయం చెందుతుంటే ….

కత్తిపీటా కూరలబుట్టా పట్టుకుని అటుగా వచ్చిన అత్తగారు నీరసంగా అరుగు చివర కూలబబడ్డారు. “ పంచాయితీ ఆఫీసులో ఎమ్మారావో ఎవడో  వచ్చి కూచున్నాడట  .  భోజనం ఏర్పాట్లు చూడమని మీ మావయ్య కబురంపేరు ” అంటూ ఉల్లిపాయలు ఒలవటం మొదలుపెట్టారు.  నాకళ్ళల్లో నీళ్ళొచ్చాయి అత్తగారి అవస్థ తలుచుకుని  ( సందేహం అక్కరలేదు నిజంగా అందుకే )

“ అప్పుడప్పుడూ కసురుకున్నా,  విసురుకున్నా నరసమ్మ చేసిన చాకిరీ తక్కువేం కాదేవ్. పాపం బండ గొడ్డులాగా రోజల్లా ఎంత పని చేసేది “అన్నారు అత్తగారు ఉల్లిపాయ తరుగుతూ  .  ” బాగా చెప్పారు ” అన్నాను    కళ్ళొత్తుకుంటూ . ఇంటిపనితో నాకూ వంట పనితో అత్తగారికి ఒళ్ళుపులిసిపోతుంటే మా జీవితాల్లో నరసమ్మలేని లోటు బాగా తెలిసొస్తుంది.

“ఇప్పుడు ఎన్ననుకుని ఏం లాభంలెండి  ! చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవా అన్నారు. నరసమ్మని వదిలించుకున్నాం అనుకున్నాం కానీ, అదే  మనల్ని  విదిలించుకుని వెళ్ళిపోయిందని అది వెళ్ళాకే తెలిసింది” అన్నాను నరసమ్మ దివ్యమంగళ రూపాన్ని ఓసారి  స్మరించుకుని.

“ మీ కొంపలో కాపీ గిన్ని తోమలేక సచ్చిపోతన్నాను  తల్లో- అని పాపం ఎంత మొత్తుకునేది . కనపడ్డవాడినల్లా కాఫీకి పిలుకొచ్చే  ఈ మగ మహారాజులకేం తెలుసు గిన్నెలు తోమలేక ,కూరలు తరగలేక ఆడవాళ్ళు పడే అవస్థలు ” అంటూ  ఆవేశ పడ్డారు అత్తగారు .

నరసమ్మకీ మాకూ మధ్య  ఋణానుబంధం   తెగిపోయి చాన్నాళ్ళయింది  . మరో నరుసు కోసం మేం తీవ్రంగా  ప్రయత్నించాం కానీ ఇంతవరకూ  మాకాభాగ్యం కలగలేదు.

“ఇక్కడపుల్ల  అక్కడ పెట్టక్కరలేదని  పెళ్ళికి ముందు పలికితిరే ! అంతా  ఉత్తుత్తేనా  . మల్లెపువ్వులాంటి  ఇల్లాలిని  మసిగుడ్డ వలె  మార్చితిరి కదా  ప్రభూ తమకిది  తగునా  .  అని వీలుచిక్కినప్పుడల్లా దెప్పిపొడుస్తూ “ బ్రోచేవారెవరురా….. ! “   అని ముక్కుచీది  రాగంతీస్తే  ,” పొలం  పనులు బిగ్గా  దొరుకుతుంటే ఇంటిపనికెవరొస్తారు . ఒకవేళ వచ్చినా మీరు నిలబడనిస్తారా . అయినా ఎవరింటి పని వాళ్ళు చేసుకోటం కూడా బరువే !    జోడెద్దుల్లా ఇద్దరున్నారుగా ఎంచక్కా ఆడుతూ పాడుతూ దున్నేసుకోండి “  అంటూ కాడి మా భుజాన పడేసి చల్లగా గట్టెక్కిపోయేరు . (అకటా!  ఎంత దయలేనివాడు ఈ గండరగండడు)

” ఇందుకే బాబూ….ఈ పల్లెటూర్లంటే నాకు చిరాకు.  ఇదే   మా సిటీలో అయితేనా ఓ…అంటే వందమంది   …” అంటూ పుండుమీద కారం చల్లేసి వెళ్ళింది మా చెల్లాయమ్మ  .

” మీ కొంపలో పని చేయలేనని వెళ్ళిపోయిందటగా నరసమ్మ….ఇంకా ఎవరూ కుదరలేదా ? ఎలా చేసుకుంటున్నారో పాపం”  అని సానుభూతి చూపించడానికీ, కోడలుతో అత్తగారు చేయిస్తుందా లేక కోడలే అత్తగారికి పని పురమాయిస్తుందా అని  కనిపెట్టిపోడానికి    వంతులవారీగా వచ్చివెళుతున్నారు అమ్మలక్కలు .

అక్కడికీ ఒకరోజు “అయిందేదో అయింది…ఏరు మీద కోపగించి నీరు తాగడం మానేస్తే ఎండిపోయేది మనగొంతే కదా! అబ్బులు ద్వారా నరసమ్మకి రాయబారం పంపిద్దాం.   సంధి ప్రయత్నాలు కావిద్దాం  . ఏవంటారూ ?” అని  అలిసిన ఒళ్ళు  నొక్కుకుంటూ ఆశగా అడిగాను  .   “అప్రదిష్ట  “  అంటూ ఒక్క ముక్కలో తేల్చేసారు  అత్తగారు .

ప్రత్యక్ష దైవాలకి మా మీద కనికరం ఎలానూలేదు . కనీసం మీరయినా మా ప్రార్ధన ఆలకించండి  అంటూ పటాల్లో దేవుళ్ళకి మొక్కుకున్నాం. శుక్రవారంలోగా పనిమనిషి దొరికితే పాయసం వండి నైవేద్యం పెడతానని లచ్చిందేవికి మా అత్తగారు ఆశపెడితే ,   ఆలస్యం అయినా పర్లేదు ఆదివారం నాటికయినా పనయ్యేటట్టుచూడు స్వామీ  అంటూ నేను ఆంజనేయుడికి అప్పాలదండ మొక్కేసాను .  శుక్రవారాలూ ఆదివారాలూ  క్రమం తప్పక   వస్తూనేవున్నాయి .  పాయసం అప్పాలతో మాకు మొహం మొత్తిపోయాకా ….గ్రామ దేవతకి కోళ్ళూ కొబ్బరికాయలూ కూడా మొక్కేశాం. మా ఇంటికో పనిమనిషి వచ్చేవరకూ పండుగలూ , బంధువులూ రాకూడదనీ…..పంచాయతీ అఫీసులన్నీ మూతపడిపోవాలనీ కోరుకున్నాం.

అలా నే  కోరుకున్నవన్నీ జరిగిపోతే మూడు మూళ్ళు పదహారయ్యేది ,నా జడ రెండు బారలయ్యేది, మా తోడికోడలు ముక్కు తప్పడయ్యేది

మా అత్తగారు   ఉల్లిపాయలు తరిగిన పళ్ళెం నా చేతికిచ్చి  …నీరసంగా గోడకి ఘటం జారేసారు  . కాళ్ళు సాగదీసి మెల్లగా ఓ మూలుగు మూలిగి” ఏమేవ్…ఆ  జీడిపిక్కల కత్తిపీట ఇలా తగలెయ్ ….. గుప్పెడు జీడిపప్పు కొట్టి కోడిగుడ్డు  కూరలో వేద్దాం  . కాసేపట్లో సంతలోంచీ చేపలూ  రొయ్యలూ వచ్చిపడతాయ్ . ఉల్లిపాయ నూరి ఉంచితే  పలావూ , పులుసూ   చేసి తగలెయ్యొచ్చు. ( మా అత్తగారికి కోపం వస్తే అన్నిటినీ తగలేస్తానంటారు – అపార్ధం చేసుకోకూడదు మనం … అదొక ఊత పదం అంతే )  . నిచ్చెనేసుకుని అటకమీంచీ పలావుడేగీశా దించి, తోమి తగలెయ్ . అలాగే మూడు సేర్లుడికే తెపాళా తీసి ఎసరు పడెయ్. అంటానికి ఒక్కడే అంటారు కానీ , తినేటప్పుడు  నలుగుర్ని వెంటేసుకొస్తారు .   ఒక్కడికీ పెట్టి మిగిలినవాళ్ళని  మీ ఇంటికెళ్ళి తినండి అంటామా….హవ్వ…అప్రదిష్ట అంటూ పనిలో పడ్డారు.

నేను దేబ్యం మొహం పెట్టుకుని  కాకినాడలో కాపురం పెట్టిన మా పద్దూని  తల్చుకున్నాను. చీకటి పడుతందనగా రెండు గుప్పెళ్ళు బియ్యం కుక్కర్లో పోసి, ఒక అరటికాయో రెండు బంగాళాదుంపలో అలా అలా వేయించేసి, ఎంచక్కా చిలకలా ముస్తాబయ్యి  సన్నజాజులు మాల కట్టుకుంటూ  ” నీవులేక వీణా  …… “ లాంటి  ఎదురుచూపుల పాటలు పాడుకోవటం, వంట చెయ్యడం విసుగనిపిస్తే సుబ్బయ్య హొటల్నుంచీ  బోయినం పార్సిల్  తెచ్చుకోవటం, బోరు కొట్టినపుడల్లా సినిమాకో వాకలపూడి బీచ్ కో జంట గా వెళ్ళిరావటం ,  అహ ఏమి హాయిలే హలా ….అంటూ మధురస్వప్నాలు చూపించి  నన్ను పెళ్ళికి ఉసిగొలిపింది పాపాత్మురాలు కనిపిస్తే పీక పిసికేద్దును.

సంతలో దొరికిన జల చరాలు చాలవన్నట్టూ  , చేలోంచీ ‘గిన్నికోడి ‘ అనబడే  భూచరాన్నొకదాన్ని  భుజాన్నేసుకుని  ఒగుర్చుకుంటూ  వచ్చిపడిపోయాడు  అప్పడు .(  ఊర్లో ఉన్న నూటొక్క మంది అప్పయ్యలకు లేని భాగ్యం వీడికి ఉండటం మూలాన అందరూ వాడిని మెల్లకన్నప్పడు అంటారు . చేలో కోళ్ళనీ దూళ్ళనీ మేపుతుంటాడు . వాడి మకాం కూడా చేలోనే . ఇంటిమీద కాకి అరిచినా  రోడ్డుమీదకి గవర్నమెంటు జీపొచ్చినా  ఉరుకులు పరుగులమీద ఊళ్ళోకొచ్చి పడిపోతాడు )

” మళ్ళీ  ఇదెందుకురా   ఏ అరటికాయో ,ఆకాకరకాయో  వండుదాంలే ? ” అన్నారు అత్తగారు విసుగ్గా .

దానికి వాడు గిలగిచ్చకాయలా ఒళ్ళంతా  ఊగిపోయేలా నవ్వేసి “బలేవోరే అయ్యాగారూ….. ఎమ్మారావుగారికి  కాయా కసరా  ఏసి పత్తిం బోయినం ఎడతారా ! కక్కా ముక్కా ఒండి పులావు కబాబూ  సేయ్యాలండి   . ఆనక ఆరు ఒణ్ణం తిని సెయ్యి కడుక్కున్నప్పుడల్లా మన లోగిట్లో తిన్న బోయినo గేపకం  వచ్చీయాలండి. అసలుండీ …ఆరు బోయినానికుంటారని కబురు తెలుసుంటే , ఏజెన్సీనించీ ఏట మాసం అట్టుకొచ్చీద్దునండి. ఇలా ఉన్నపళంగా బోయినం అంటే ఉన్న దాంతోనే సర్దుకోవాలండి మరి “ అని కొంచెం నిట్టూర్చేసి,     తలకున్న తువ్వాలు  విప్పి దులిపి నడుముకి  ముడేసాడు.   “సిన్నయ్యగారూ  పెద్ద కత్తిపీట, మాసం కత్తీ   ఇలాగడెయ్యండి చనంలో ఈటిని వొంటకి రెడీ సేసేత్తాను అని   కదనోత్సాహంతో  కదులుతున్నవాడు నా కళ్ళకి కూర్మావతారంలా  కనిపించాడు.  “పోన్లేరాబాబు సగం భారం తగ్గించావు “అని మనసులోనే  ఒక నమస్కారం చేసుకుని వాడడిగిన   సరoజామా అందించాను  .   ఉత్తప్పుడు  మెట్ట తాబేలులా ముక్కుతూ మూల్గుతూ తిరుగుతాడా  ఇంటికెవరన్నా చుట్టాలో పక్కాలో వచ్చారని తెలిస్తేమాత్రం  పీత పరుగే …. పట్టపగ్గాలుండవు  .  ఊళ్ళోకి అప్పుల వసూళ్ళకి వచ్చే బేంకోళ్ళు, తగువులు తీర్చడానికొచ్చే పోలీసోళ్ళు, సీజన్లో వచ్చే పొగాకు బోర్డోళ్ళు పంచాయతీ మీటింగులకి హాజరయ్యే ఆఫీసర్లూ అంటే వాడికి  అదోరకమైన గౌరవం ఎందుకోమరి . ఇక ఎలక్షన్ల  ప్రచారంకోసం  పిడత మొహం పెట్టుకొచ్చే ప్రతి రాజకీయనాయకుడూ వాడికి  పవర్ స్టారే   .  పార్టీలతో సంబంధంలేకుండా అందర్నీ ఆదరించేయాలని తహతహలాడిపోతాడు .

గుమ్మంలోఅడుగుపెట్టినవాళ్ళకి   కాళ్ళు తొలుపుకోటానికి  చెంబుతో  నీళ్ళందించడం  దగ్గరనుంచీ  భోజనం పూర్తయ్యాకా చేతులుమీద నీళ్ళు పొయ్యటం వరకూ అన్నీ తానే  చేసేయలన్నట్టూ  తెగ  తారట్లాడిపోతాడు. ఆఖర్న చేతులు తుడుచుకోటానికి తువ్వాలు అందిస్తూ ” బోయినం ఎలావుందండీ ” అనడుగుతాడు మహా భక్తిగా . తిన్నవాడు  తనముందు  బ్రేవ్ మని ఒక్కసారయినా త్రేంచకపోతే……” సగం సగవే తిన్నట్టున్నారు  ఒంటకాలు బాగా కుదరలేదంటారా?” అని మామీదే అనుమానపడతాడు.  మనుషుల్ని మేపటమంటే మహా సరదా వాడికి రాజుగారి మల్లేనే.

తెచ్చినవాటికి తోళ్ళూ కీళ్ళూ పీకే పనిలో అప్పడు ,  తాలింపు చూడ్డంలో అత్తగారూ  వాళ్ళిద్దరికీ  అసిస్టెంటులాగా అవీ ఇవీ అందిస్తూ నేనూ ఫుల్ల్ బిజీగా వుండగానే …  పంచాయతీలో కూర్చుని ప్రైవేటు తగూలు తీర్చే పాత ప్రసిడెంటు సుబ్బరాజు గారి పాలేరు చందర్రావు    చేతులు నలుపుకుంటూ వచ్చి నిలబడ్డాడు . ”  సుబ్బరాజుగారు  …పది టీలట్టుకురమ్మన్నారండి   ” అంటూ .

అత్తగారు  పళ్ళు పటపటలాడించేరు  పైకి వినిపించకుండా . నేను తలబాదుకున్నాను  మా అత్తగారు చూడకుండా( ఏ నోముఫలమో…ఏ జన్మ వరమో అని తలపోస్తూ)   .

“బుల్లిరెడ్డిగారింట్లో అన్నదమ్ములిద్దరి మద్దినా తగువయ్యింది కదండీ . ఏడాదిబట్టి పీక్కున్నా ఎటూ  తెగలేదండి  . ఆ తగువు తెగ్గొడ్డటానికి   అనపర్తినుంచీ రెడ్లొచ్చేరండి.   సిన్నకోడలు గారిది  ఆవూరే  గావాలండి   . ఈళ్ళూ ఆళ్ళూ  మాటమీద మాట పెంచేసుకుంటన్నారండి. తగువు కోసం కూకున్నోళ్ళందరి బుర్రలు వీటెక్కిపోనియ్యండి. ఇయ్యాల ఎలా అన్నా ఈ తగూ అటో ఇటో తేలిపోవాలని  మా రాజుగారి పంతం అండి. ఎంకన్నా ఎల్లి టీలట్టుకురా తాగేసి తగూ తీర్చేద్దారి అని  నన్ను  పురమాయించేరండి ” అంటూ ….అన్నదమ్ములిద్దరి మధ్యనా అగ్గెలా పుట్టిందో అదెలా రాజుకుని మంటయ్యిందో దాంతో ఎవరికి ఎంత కాలిందో ….ఆ మంట ఇప్పుడెక్కడకొచ్చి ఆగిందో అన్ని గుక్క తిప్పుకోకుండా  సినిమా రిలీజు రోజున మొదటి ఆట చూసొచ్చినోడిలా చెప్పేసుకు పోతున్నాడు  మహోత్సాహంగా .

అదేం పట్టించుకునే స్థితిలో లేని అత్తగారు “  తగలేసినట్టేవుంది…అలాయితే తగువెట్టుకున్న బుల్లిరెడ్డి ఇంటికో , తగువు తీర్చేయాలని సరదా పడుతున్న  మర్యాదరామన్న  (సుబ్బరాజు గారన్నమాట) ఇంటికో వెళ్ళకుండా  మా ఇంటికొచ్చి టీ పెట్టమంటావేం రా ….అంత లోకువగా కనిపిస్తున్నామా ఊరుమ్మడి చాకిరీలు చేయడానికి “ అంటూ  వేడిపెనం మీద  నీళ్ళు చల్లినట్టూ  చిటపటలాడిపోయేరు .

” అయ్యబాబో. ..అలా కోప్పడకండి అయ్యగారు . బుల్లిరెడ్డిగారి ఇల్లు ఆ సివరెక్కడో ఉందండి. అక్కడనించీ అట్టుకొచ్చీసరికి టీలు సల్లారిపోవాండీ (  తగువు కూడా సల్లారిపోవచ్చు)…..ఇంక సుబ్బరాజుగారి అయ్యగారి సంగతి తవరికి తెల్దేటండీ.  అయినా మీకూ ఆరికీ పోలికేటండీ అయ్యగారూ ….. ఎన్నేళ్ళబట్టీ సూత్తనానండీ మిమ్మల్నీ …  మీ సేతికి ఎముకలేదండి మీ నోట్లో నాలుక లేదండి . మీకసలు ఇసుక్కోటమే తెలదండీ ….మీ అసుంటోరిని  నేనీ సుట్టుపక్కల మూడు  జిల్లాల్లో సూళ్ళేదండి అని అప్పటికప్పుడు  అలవాటయిన అస్టోత్తరం చదివేసి , చివరికి  గోడమీదఉన్న కాశీ అన్నపూర్ణమ్మని,   గరిటపట్టుకు కూర్చున్న మా అత్తగార్నీ మార్చి మార్చి చూసి “ఎన్నాళ్ళబట్టో అడుగుదారనుకుంటన్నానండి అయ్యగారూ ఆరు మీకేవవుతారండి “అనేసాడు  . అప్పటిదాకా గుంభనంగా కూర్చుని లోపల్లోపల మురిసిపోతున్న అత్తగారు ఈ అధిక మోతాదుకి  అవస్థపడ్డి  చాల్లేరా ఇక ఆపు  అని చిరుకోపం ప్రదర్శించారు  .    “ఫలానా ఊరెళ్ళాం పచ్చి మంచినీళ్ళు పుట్టలేదు అని చెప్పుకుంటే  మనకేసిగ్గుచేటు  . అయినా వాళ్ళకేం లేక వస్తారా …ఏదో పాపం పనిమీదొచ్చేరు . అంటూ యాలక్కాయలేసి డికాషన్ లేకుండా చిక్కగా టీ పెట్టిమ్మని నాకు  పురమాయించి  , “ఇంటికెళ్ళేటపుడు ఓసారి కనపడరా ….. పులావు  పెడతానూ “ అనేసరికి ఆ  బట్రాజు మొహం చేటంత చేసుకున్నాడు .

ఏవిటో  ఈ మాత్రం పొగడ్తలకోసం ఒళ్ళు హూనం చేసుకుని  పడీ పడీ చాకిరీ చెయ్యటం అబ్బే…. అత్తగారూ ఈ వరస నాకేం నచ్చలేదండి. అంతగా కావాలంటే చివర్లో ఎప్పుడో ‘మహా సాధ్వి  మా అత్తగారు’  అంటూ మీపేరుతో  ఒక వ్రత కథ, రెండు భజన కీర్తనలూ నేనే రాసి పెడతానుకదా   అని చింతిస్తూ   అత్తగారి ఆజ్ఞ శిరసా వహించాను చేసేదేంలేక.

వాడలా ట్రే పట్టుకుని గుమ్మం దాటాడోలేదో…..”చిన్నరాజుగారు గానుగ సెట్టుకాడ కూకున్నారండి . అయిసు     నీళ్ళట్టుకు రమ్మన్నారండి “అంటూ ఓ  పిల్లోడు పరిగెత్తుకొచ్చి నిల్చున్నాడు .   ఇదిగో ఇందుకే నాకు మండిపోయేది. వీధిలో కూర్చుని అదీ ఈదీ అని ప్రాణాలు తోడేస్తారు. పనులు తెమలనివ్వరు.

వంటింట్లో  పొయ్యిముందు బాసీపట్టం వేసికూర్చున్న అత్తగారు  గిన్నియ్యి, గరిటియ్యి, చింతపండు నానబెట్టు,  మసాలా నూరిపెట్టు అనీ……దొడ్లోంచీ ఆ కన్నప్ప గాడేమో  కత్తిపీటమీద నీళ్ళొయ్యండి, సేపలు తోమడానికి బూడిదియ్యండి , రొయ్యలమీదికి ఏణ్ణీళ్ళు  కాయండి  అనీ  నన్ను ఒక్క క్షణం కుదురుండనీయకుండా బొంగరంలా తిప్పేస్తున్నారు.   ఆ తిరుగుడు చాలదన్నట్టూ టీలనీ, మజ్జిగలనీ, మంచినీళ్ళనీ, వీధిలోంచీ వచ్చిపడే అబ్బాయిగారి ఆర్డర్లు  . కాళ్ళకి చక్రాలు కట్టుకుని  అందరికీ అన్నీ అవిర్చి నేనూ బోల్డంత కష్టపడినా చివరాకరికి నే చేసిన పని లెక్కలోకి రాదు . వంటెవరు చేసారు అంటే అన్నివేళ్ళూ అత్తగారివైపే చూపిస్తాయి  అన్ని నోళ్ళూ అత్తగారినే పొగుడుతాయి అదేవిటో !

ఏమాటకామాటే  మా అత్తగారు   ప్రారంభంలో విసుక్కున్నా  పనిలో పడ్డాకా మాత్రం   శ్రద్దగా దీక్షగా మనసంతా లగ్నం చేసేస్తారు .  శంకరశాస్త్రి సంగీతం పాడినట్టూ, ఆయనెవరో డోలు వాయించినట్టూ, మా పొట్టి బ్రహ్మం సన్నాయి మోగించినట్టూ ….ఆయాసపడయినా సరే  అంతుచూస్తారు .అబ్బా అదేనండీ…. అనుకున్న రిజల్ట్  రాబడతారూ అని.

రామాలయంలో భజన సంఘం తమ గొంతులు సవరించుకుంటూ  మైక్ టెస్టింగ్ చేసుకుంటున్న వేళకి  ఒక మహా యజ్ఞం పూర్తయినట్టూ అందరం హమ్మయ్యా అనుకుంటూ అరుగుమీద  చతికిలపడేసరికి  వీధి గేటు తీసుకుని ముందుగా పెద్దరాజుగారూ ఆయన  బృందంతోనూ , ఆ వెనకే చిన్న రాజుగారు మరో బృందంతోనూ వచ్చేసారు.   అత్తగారు ” నే చెప్పలేదూ…ఇద్దరూ చెరో బేచీని తీసుకొచ్చేసారు చూసేవా !”అన్నట్టూ కళ్ళెగరేసి  వడ్డన్లు చేయడానికి ఉపక్రమించారు. ఆ వెంటనే అప్పడు  వాకిట్లోకి ఒక్క గెంతు గెంతి మడతమంచాలూ , ఫ్రేము కుర్చీలూ సర్దేసి వచ్చినోళ్ళని కూర్చోబెట్టేసాడు.   మారాజుగారు బిత్తిరి చూపుచూసుకుంటూ వచ్చి…. “అమెరికాలో ఉంటున్న అచ్చిగాడి మావిడితోట కౌలు విషయం మాట్లాడ్డానికొచ్చేరోయ్ .   ఎలాగూ భోజనాల వేళయింది కదా అని   ఇంటికి తీసుకొచ్చేసాను . అందులో ఒకడు మనకి బాగా అలవాటయినోడే బాగోదుకదా మరి  “  అని కామెడీ హీరోలా భుజాలెగరేసుకుంటూ వెళ్ళిపోయేరు .

నాకు తిక్కరేగిపోయింది మా రాజుగారి ఘనకార్యానికి . మాంగారు కనీసం కబురయినా చెప్పేరు . ఏ కబురూ లేకుండా   వెంటేసుకొచ్చేస్తే వెంటనే   ఆకేసి అన్నం పెట్టేయడానికి ఇదేవన్నా చందావాళ్ళ సత్రమా . “అబ్బే….నాకు మీ వరసేం నచ్చలేదు . అయినా ఇదేం పద్ధతీ ..టాఠ్ “ అని ప్రైవేటు చెప్పేయాలనిపించింది . పొద్దుటినుంచీ పాడుకున్న పతిభక్తి పాటలు గొంతుకడ్డం పడ్డాయి కానీ లేపోతేనా ….పిక్కపాశం పెట్టి గోడకుర్చీ వేయించేయొద్దూ.

ఉత్తరంవైపు సావిట్లో  భోజనాల బల్లమీద మంచినీళ్ళతో సహా అన్నీ అమర్చేసి,  విస్తళ్ళలో  పచ్చళ్ళూ కూరలూ ఒక వరుసలో సర్ధి ,మధ్యలో  పులావు పెట్టి, నేతిగిన్నే …అన్నం పళ్ళెం, పెరుగు కేనూ ఇంకో బల్లమీద విడిగా వుంచి  అన్నిటినీ ఒక్కసారి పరకాయించి చూసి ” వడ్డనలయ్యాయని చెప్పరా ” అంటూ అప్పడికి   పురమాయించి, ఘోషా పాటిస్తూ  వంటింట్లోకి వచ్చేసారు అత్తగారు .

ఓ చేత్తో నీళ్ళ బకేట్టూ , ఇంకో చేత్తో ఇస్త్రీ తువ్వాలుతో  అరుగు చివర నుంచున్నాడు  అప్పడు. “కాళ్ళు కడుక్కుని భోజనానికి కూర్చోండి” అంటూ మాంగారు అతిధుల్ని ఆహ్వానిస్తే , అబ్బాయిగారు  ఫేనేసి కుర్చీలు జరిపేరు  .  మా భక్త కన్నప్ప    సావిడి గుమ్మానికి  అతుక్కుపోయి  తొండలా మాటిమాటికీ మెడసాగదీసి చూస్తున్నాడు  అన్నీ సరిగా  జరుగుతాయో లేదో అని ఊరికే టెన్షన్ పడిపోతూ   .  ఓసారొచ్చి,” అయ్యగారో…బలేవోరే నిమ్మకాయ సెక్కలు  మర్సిపోయేరు …ఏటండీ బాబూ మీరు” అని   విసుక్కుని వెళ్ళాడు . ఇంకోసారొచ్చి నెయ్యి ఏడిసేసేరా ఎక్కడా కమ్మని వోసనొత్తాలేదు” అని అనుమానపడ్డాడు .

వంటలన్నీ సరిగా కుదిరాయో లేదో, వడ్డనలు సరిగా జరుగుతున్నాయో లేదో అని అత్తగారు తెగ ఇదయిపోతూ వంటిల్లంతా  కలియ తిరిగేస్తున్నారు . కాసేపటికి    “చ…చ…చా…”అని చేతులు నలుపుకుంటూ తల బకురుకుంటూ  యమ యాతన  పడిపోతూ వచ్చాడు అప్పడు .

వాడి వాలకం చూసి కంగారు పడ్డ అత్తగారు ” ఏవిట్రా ?” అంటూ గుడ్లు తేలేసారు .   తెగబాధ పడిపోతూ  వాడు చెప్పుకొచ్చిన  చేట భారతాన్ని సంక్షిప్తం చేస్తే….

అనుమానిస్తూనే అందరితోపాటు భోజనానికి కూర్చున్న ఎమ్మారావు గారు , విస్తట్లో చెయ్యి పెట్టగానే  గండు చీమ కుట్టినోడిలా ఎగిరి పడీ  ముక్కూ కళ్ళూ చిట్లించి  ” రాజుగారూ …ఈవన్నీ  నాకు పరిచయంలేని పదార్ధాలండీ  అని మొహమాటపడి , అప్పటికీ అర్ధం కాక గుచ్చి గుచ్చి చూస్తున్నవాళ్ళతో ” మేం బ్రాహ్మలం అండీ ”  అనేసరికి మాంగారు “అచ్చొచ్చో….”అని నొచ్చుకుని , గిన్నెలన్నీ మూతలు తీసి చూస్తే ఒక్కదాంట్లోనూ ఎమ్మారావు గారు గుర్తుపట్టి తినగల  పదార్ధమొక్కటీ కనపడక పోయేసరికి , కంగారు పడిపోయి  “మీ పేరు చూసి పొరపాటుపడ్డాను చూశారా…అహ ఏం అనుకోకండి .   నిమషంలో వంట చేయిస్తాను కాసేపు  ఇలా వచ్చి కూర్చోండి “అన్నారట. దానికి ఆ ఎమ్మారావుగారు ఇంకా కంగారుపడిపోయి ….”అయ్యయ్యో …ఇప్పుడవన్నీ ఏం వద్దండీ “ అనేసి   మా అత్తగారు ఆచారంకొద్దీ దూరంగా పెట్టిన అన్నం లో పెరుగు  కలుపుకొని భోజనం అయిందనిపించేరట.  బంతిలో కూర్చున్న మిగతా అతిధులు   ముందు బాగా కంగారుపడి, ఆనక కొంచెం మొహమాటపడి , చివరికి తిండిలో పడ్డారట సుబ్బరంగా .

“అంతటి ఎమ్మారావు బాబుగారు అలా అసంటా కూకొని, పెరుగన్నంలో పచ్చడి నంజుకు తింటంటే నా పేణం ఉసూరుమనేసింది అయ్యగారో “ అని కన్నప్ప  అదే పనిగా బాధ పడిపోయాడు.

” అదేవిట్రా క్రితం సారొచ్చినపుడు ఎంచక్కా తిన్నాడు కదా . ఇంతట్లోనే  బ్రాహ్మెడెలా అయిపోయాడు ” అని అత్తగారు ఆశ్చర్యపోయారు.

అప్పటికీ అనుమానం తీరక …..ఒరేయ్….వచ్చినాయనకి బట్టతలుందా . చూడ్డానికి హైబ్రీడ్ బొబ్బాసి చెట్టులా బరువుగా భూమికి జానెడున్నాడా  ? అనడిగారు. ఇంకా ఏదో గుర్తుచేసుకోటానికి ప్రయత్నిస్తూ ….

” అచ్చిచ్చీ…..మట్టలు చెక్కేసిన తాటిసెట్టులా నిటారుగా అంతపొడుగుంటేనీ ……పైగా గిరజాల జుట్టండీ ఆరికి అన్నాడు ”

గిరజాల జుట్టు బట్టతలవ్వడానికి చాన్సుంది కానీ…..అటు సూర్యుడు ఇటు పొడిచినా బట్టతలమీద గిరజాలు మొలవటం అసంభవం కదా అని అర్ధం చేసుకున్న అత్తగారు…..” అయితే వచ్చింది  వేరే ఎమ్మారావా అని సాలోచనగా అనుకుంటూ ….

” అసలెంత మంది ఎమ్మారావులుంటారే……?”   అన్నారు నన్ను పట్టి కుదుపుతూ .

అసలే ఆకలికి సగం మతి పోయున్నానేమో ……ఒక వెర్రినవ్వునవ్వి సినిమాల్లో రామారావు నాగీస్ రావు లాగా   ఒక్కడే ఎమ్మారావు ఉంటాడనుకున్నారా ! ఎంతమందుంటారో సరిగ్గా లెక్క తెలీదు కానీ మొత్తానికి   ఎక్కువే వుంటారు … ఉన్నవాళ్ళు కుదురుగా ఉండకుండా అక్కడోళ్ళు ఇక్కడికీ ఇక్కడోళ్ళు అక్కడికీ మారుతుంటారు . అంటూ వెర్రి సమాధానం చెప్పేసాను .( అది ఆకలివేళ కాకపోతే ప్రభుత్వ శాఖలు  పరిపాలనా తీరుతెన్నులు వంటి మరిన్ని విషయాలు విశదీకరించేదాన్ని )

” ఏడ్చినట్టుంది . అంతమందిని పెట్టుకోటం ఎందుకూ ,అటూ ఇటూ  అలా పరుగులెత్తిచ్చడం ఎందుకూ  బుద్ధి  లేని గవర్మెంటు ” అనేసారు అత్తగారు .

” బాగాచెప్పారు …అయినా మావయ్య ముందే కనుక్కోవలిసింది కదా ” అని అనుకోకుండా అమోఘమయిన పాయింటందించేసాను  అత్తగారికి.

ఆ పాయింటుమీద జువ్వలా లేచిన అత్తగారు  ” అదీ….చూసావా  మీ మావయ్య నిర్వాకం .  అంతా  పుల్లయ్య యవ్వారం. బొత్తిగా వ్యవహారం తెలీని మనిషి అంటూ  నిప్పులు కక్కుతుంటే……    మొహం జేవురించుకుని       మాకేసి వస్తూ తూర్పు గుమ్మం దాటబోయిన మాంగారు ”  సడెన్ బ్రేకేసినట్టూ  అక్కడే ఆగిపోయి ” ఆ …ఆ….వస్తున్నా ” అని ఎవరో పిలుస్తున్నట్టూ పంచె సర్దుకుంటూ వేగంగా వెనక్కిమళ్ళేసేరు .

” ఏటండయ్యగారూ….ఆకురున కుంత పప్పుసారన్నా  కాసేరుగాదు ” అని  పెద్ద ఆరిందాలా అనేసాడు అప్పడు మా అత్తగారికేసి చూస్తూ ….( నన్నే అనాట్టా ….ఏమో?)

ఒళ్ళు చీరేస్తాను గాడిదా. వెధవ సన్నాసి సలహా ఒకటి పడేసి, ఇప్పుడేమో తప్పంతా మా మీదికి తోసేస్తావా అని ఒక్క టెంకి జెల్ల కొట్టాలనిపించింది నాకు.

“అందరూ సుబ్బరంగా తిన్నారు ఆ బాబొక్కడే అర్ధాకలితో చెయ్యి కడుక్కున్నారు “ అని తువ్వాలు నోట్లో కుక్కుకుని అదే పనిగా బాధ పడిపోతున్న భక్త కన్నప్పడిని ఓదారుస్తూ  “ సర్లేరా అయిందేదో అయింది ఎవరికెంత ప్రాప్తమో అంతే దక్కుతుంది . ఇలా జరగాలని రాసుంది.   …  తప్పించడం మన వశమా అని ,  ఆకేసి అన్నం పెట్టేరు అత్తగారు.  వాడు “ఇలా జరిగిపోయిందేటీ”  అని ముద్ద ముద్దకీ బాధపడుతూనే వున్నాడు  . ముద్ద  గొంతు కడ్డం పడి పొలమారిన ప్రతిసారీ మా అత్తగారు కొంచెం కొంచెంగా  గీతా మకరందం దానితో పాటూ  కాస్త కర్మ సిద్ధాంతం లాంటిదేదో  వడ్డిస్తూ వచ్చారు.

మొత్తానికి ఆద్యంతం బాధపడుతూనే  అప్పడు సుష్టుగా భోంచేసి ,మకాంలో ఉన్న  వాళ్ళావిడకీ, అమ్మకీ కూడా కేరేజీలు సర్దుకుని  ” ఇలా జరిగిందేటండీ అయ్యగారూ ” అని  తీవ్రంగా బాధ పడిపోతూ వెళ్ళిపోయాడు .

“హమ్మయ్యా…అందరి భోజనాలు అయిపోయినట్టేకదా .   రండి  మనంకూడా  మనకి ప్రాప్తమున్న పలావు మెతుకులు తినేసి త్వరగా బజ్జుందాం “ అని నేను అత్తగారిని కంగారు పెడుతుంటే ఆవిడ ,  తెల్లారితే శుక్రవారం వంటింట్లో అంటు ఉండటానికి వీల్లేదు  అన్నీ కడుక్కున్నాకే పడుకోటం అంటుంటే ……ఇంకేం చెప్పను హతవిధీ నా పై ప్రాణాలు పైకే పోయాయి

ముక్తాయింపు –  తాలింపు  :)

ఏది ఏవైనా  పతివ్రతా ధర్మాలంటూ కొన్ని ఉన్నాయికదా . ఒకటీ రెండూ పాటించాం కదా అని మూడూ నాలుగూ  అశ్రద్ధ  చేసి  ‘ సపతివ్రత ‘ అనిపించుకోటం  దేనికీ అనిచెప్పి,  విష్ణుమూర్తిలా ఒక పక్కకి తిరిగి హాయిగా నిద్రపోతున్న శ్రీవారి పాద పద్మములను చిన్నగా గిల్లి……కిటికీ దగ్గర చేరి పాత సినిమా హీరోయిన్లా ఒంటికాలిమీద వయ్యారంగా ఊగుతూ ”  రావోయి చందమామా…..  ” అని మంద్రస్థాయిలో  మొదలుపెట్టేసరికి   మబ్బులమాటునున్న  చంద్రుడు , మంచం మీదనున్న చంద్రుడు ఒకేసారి నాముందు ప్రత్యక్షమయ్యారు.

“చంద్రుడు వెండి కంచంలా లేడూ”  అన్నారు   ఆకాశంలోకి చూస్తూ.

నేను “ఊహు…” అని తల అడ్డంగా ఊపేను.

“పోనీ… వెన్నముద్దలా  ఉన్నాడా”అన్నారు.

నేను వూహుహు…అని తల అడ్డడ్డంగా ఊపేను.

పోనీ నువ్వే చెప్పవోయ్ అన్నారు  గారంగా.

నేను రెప్పవాల్చక చందమామని చూస్తూ,” మధ్యలో ఆ మసేవిటండీ మాడిపోయిన అన్నం తెపాళాలా  చిరాగ్గా . ఏవండీ ఓసారి చందమామను కిందికి దించండి సుబ్బరంగా తోమి బోర్లించేస్తాను “ అని  చూద్దునుకదా మబ్బు మాటున ఆ చందమామ , ముసుగు చాటున నా చందమామ భయం భయంగా నన్నే చూస్తూ ….

అయ్యో… ఏవయిందండీ …..ఎందుకలా బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు.

“రసికరాజ తగువారము కామా ….ఆఅ.ఆ..అ.ఆ.ఆఆ…………..….” అంటూ కిచకిచలాడేను వసంతకోకిల సినిమాలో శ్రీదేవిని తల్చుకుని .

అమ్మమ్మలు బతికించిన చరిత్ర

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

నలుగురు కూచుని నవ్వే వేళల, నా పేరొకపరి తలవండి’ 

గుర్తొచ్చిన ప్రతిసారీ ఈ పంక్తి మాటల కందని మహా విషాదాన్ని మోస్తున్నట్టు, ఆ విషాదాన్ని చుక్క చుక్కలుగా మన గుండెల్లోకి జార్చుతున్నట్టు అనిపిస్తుంది. లోపల ఎక్కడో కలుక్కుమంటుంది. గురజాడవారి పూర్ణమ్మ కథలోని పంక్తి ఇది. తనను ఒక ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నందుకు మనస్తాపం చెందిన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ ఆత్మహత్యకు సిద్ధపడుతుంది. దుర్గగుడికి వెళ్ళే నెపంతో బయలుదేరుతూ తోబుట్టువులను చుట్టూ కూర్చోబెట్టుకుని అప్పగింతలు చెబుతుంది. ఆ సందర్భంలో పై మాట అంటుంది.

ఏళ్ల తరబడి మన మధ్య గడిపిన రక్తబంధువులు హఠాత్తుగా తిరిగిరాని లోకాలకు తరలిపోయి కనుమరుగు కావడం ఆదిమదశనుంచీ మనిషిలో విషాదాన్ని గిలకొట్టుతూనే వచ్చింది. వారి స్మృతిని సజీవం, చిరంజీవం చేసే ఆలోచనలు అప్పుడే పుట్టాయి. అందులో భాగంగానే పితృదేవతలు అనే భావనా, పితృకర్మలూ విశ్వాసంలో భాగమయ్యాయి. ప్రపంచ పురాణగాథల కెక్కాయి. రక్తబంధువులందరూ ఏకశరీరంగా జీవించిన గణసమాజంలో ఈ విషాదవిశ్వాసాలు మరింత బలీయంగా ఉంటాయి. లిపి ఏర్పడని, లేదా లిఖిత సంప్రదాయం వేళ్లూనుకోని కాలంలో గణబంధువుల జ్ఞాపకాలను, చరిత్రను తరం నుంచి తరానికి అందించే బాధ్యతను మనిషి గళమే నిర్వహించింది. అలా అందించడం ఒక వ్యవస్థగా అభివృద్ధి చెందింది. ఇది ఏ ఒక్కచోటో కాదు, ప్రపంచమంతటా జరిగింది.

పైన పేర్కొన్న గురజాడ పంక్తిలోని విషాదం గణహృదయపు లోతుల్లోంచి పలుకుతున్న విషాదంలా నాకు అనిపిస్తూ ఉంటుంది. గణసమాజపు నుడికారం గురజాడ రచనల్లో ఎక్కువగా కనిపిస్తుందని  రాంభట్ల కృష్ణమూర్తి అనేవారు. కన్యాశుల్కం నుంచి అనేక ఉదాహరణలు ఎత్తి చూపేవారు.

అదలా ఉంచి ప్రస్తుతానికి వస్తే, నలుగురూ కూర్చుని తమ పూర్వీకులను స్మరించుకునే గణ సంప్రదాయం రూట్స్ రచనలో రెండువందల ఏళ్ల క్రితం నాటి వంశ మూలాలను, మూలస్థానాన్ని కనిపెట్టే ఉత్కంఠభరిత ప్రయత్నానికి దారితీయించింది. స్థూలంగా కథ ఇదీ:  కుంటా కింటే అనే నల్లజాతి యువకుడు పశ్చిమ ఆఫ్రికాలోని ఓ మారుమూల ప్రాంతానికి చెందినవాడు.  అతడు ఓ రోజున గిటార్ లాంటి వాయిద్యాన్ని తయారుచేసుకోడానికి కలప కోసం అడవికి వెళ్ళాడు. హఠాత్తుగా కొంతమంది అతనిపై దాడి చేసి వలేసి పట్టుకుని గొలుసులతో బంధించి ఓడలో అట్లాంటిక్ మీదుగా అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి తీసుకుపోయారు. అక్కడ మాసా జాన్ వేలర్ అనే తోటల యజమానికి బానిసగా  అమ్మేశారు. అతను కుంటా కింటేకు టోబీ అని పేరుపెట్టాడు. కుంటా కింటే తప్పించుకుని పారిపోవడానికి నాలుగుసార్లు విఫల యత్నం చేశాడు. అతనింక ఆ ప్రయత్నం చేయకుండా ఒక పాదాన్ని నరికేసారు. వైద్యవృత్తిలో ఉన్న వేలర్ సోదరుడు విలియం వేలర్ కొంత మానవత్వం ఉన్నవాడు. అతడు సోదరుడి చర్యను గర్హిస్తూ కుంటా కింటేకు వైద్యం చేసి అతడి ప్రాణాలు కాపాడాడు. సోదరునినుంచి తనే అతణ్ణి కొనుక్కుని గుర్రపు బండి నడపడానికి నియోగించాడు. తను ఏ విధంగానూ తన జన్మస్థానానికి వెళ్లలేనని గ్రహించిన కింటే పరాయి నేలలో ప్రవాసజీవితంతో క్రమంగా రాజీపడ్డాడు.

విలియం ఇంట్లో వంటమనిషిగా ఉన్న మరో బానిస బెల్ ను అతను పెళ్లి చేసుకున్నాడు. వారికి కూతురు పుట్టింది. ఆమెకు కిజ్జీ అని పేరుపెట్టారు. ఆమెకు వయసు వచ్చాక  మాసా లీ అనే మరో బానిస యజమానికి విలియం అమ్మేశాడు. మాసా లీ బలాత్కారంగా తనను అనుభవించడంతో కిజ్జీ గర్భవతి అయింది. ఆమెకు కొడుకు పుట్టాడు. అతని పేరు చికెన్ జార్జి. అతను పెరిగి పెద్దయ్యాక మటిల్డా అనే మరో బానిసను పెళ్లిచేసుకున్నాడు. అతని మూడో కొడుకు టామ్. అతనికి ఇరేన్ అనే అమ్మాయితో పెళ్లయింది. వారి కుమార్తెలలో ఒకరైన సింథియాకు విల్ పామర్ అనే అతనితో  వివాహం జరిగింది. వారి కూతురు బెర్తా, సైమన్ అలెగ్జాండర్ హేలీ అనే అతన్ని పెళ్లిచేసుకుంది. వారి కొడుకే రూట్స్ రచయిత ఎలెక్స్ హేలీ. కుంటా కింటేనుంచి అతనిది ఏడో తరం.

ఏడువందల పుటల ఉద్గ్రంథంలోని కథను పది పదిహేను వాక్యాలలో సంక్షేపించడం నిజానికి ఆ రచనకు తీరని అన్యాయం చేయడమే. సొంత మూలాలనుంచి వేరుపడి ఒక మహా సముద్రానికి ఆవల తమది కాని నేలపై తమది కాని భాషా సంస్కృతుల మధ్య బానిసజీవితం గడిపిన ఒక జాతి దుఃఖ విషాదాలకు అద్దంపట్టే రూట్స్ కు ఒక ఇతిహాసానికి ఉండే లక్షణాలు అన్నీ ఉన్నాయి. రెండువందల ఏళ్ళకు విస్తరించిన ఆ కథాగమనంలో అనేక మలుపులున్నాయి, మెరుపులున్నాయి. కరుణ భీభత్స భయానకాది రసాలను ఆవిష్కరించే ఘట్టాలు ఉన్నాయి.  సొంత అస్తిత్వాన్ని కోల్పోయి పరాయి అస్తిత్వంలో అనామకంగా కలిసిపోయిన ఒక జాతి పరిణామచరిత్ర ఉంది. మనిషిని పశువుగా, ఆస్తిగా పరిగణించి అతని పేగు బంధాన్ని నిర్దాక్షిణ్యంగా తెంచేసి ఇంకొకరికి అమ్మేసే బానిసవ్యవస్థలో చివరికి యజమానికీ బానిసకూ ఉన్న రక్తసంబంధాన్ని కూడా కాలరాసే కర్కశత్వం ఎంతగా రూపుకట్టిందో రూట్స్ చెబుతుంది. విచిత్రమేమిటంటే, దీని సామ్యాలు బానిసత్వం లేదా అర్థ బానిసత్వం కొనసాగిన మనదేశంతో సహా అనేక దేశాల బానిసవ్యవస్థలలో ఉన్నాయి. ఆసక్తికరమైన ఆ చర్చను మరో సందర్భానికి వాయిదా వేసి ప్రస్తుతానికి వద్దాం.

యజమాని పెట్టిన పెట్టుడు పేరును నిరాకరించిన కుంటా కింటే తన ఆఫ్రికన్ వారసత్వాన్ని కూతురు కిజ్జీకి అందించడానికి ప్రయత్నిస్తాడు. తన పేరుతోపాటు కొన్ని ఆఫ్రికన్ పదాలను ఆమెకు నేర్పుతాడు. ఉదాహరణకు, వర్జీనియాలో ప్రవహించే మట్టపోని అనే నదిని చూపించి ‘కాంబీ బొలోంగో’ అంటాడు. గిటార్ లాంటి ఒక వాయిద్యాన్ని చూపించి ‘కో’ అంటాడు. ఆ మాటలు రెండువందల ఏళ్లపాటు తరం నుంచి తరానికి అందుతూ ఉంటాయి. కిజ్జీ తన కొడుకు చికెన్ జార్జికి తాత, అమ్మమ్మల పేర్లు; తండ్రి తనకు చెప్పిన ఆఫ్రికన్ పదాలు అందిస్తుంది. తమ కుటుంబంలో బిడ్డ పుట్టిన ప్రతిసారీ కుటుంబ సభ్యులందరూ కూర్చుని కుంటా కింటేను, ఆ వంశం లోని మిగిలినవారిని తలచుకోవడం;  కుంటా కింటే అందించిన ఆఫ్రికన్ పదాలను గుర్తుచేసుకోవడం ఒక ఆనవాయితీగా మారుతుంది. ఇవే పేర్లు, పదాలు ఏడో తరానికి చెందిన రచయిత హేలీకి కూడా అందుతాయి. చిన్నప్పుడు టెన్నేస్సీ రాష్ట్రంలోని హెమ్మింగ్ పట్టణంలో తమ ఇంటి వసారాలో కూర్చుని అమ్మమ్మ సింథియా, మరికొందరు స్త్రీలు చెప్పుకునే  ముచ్చట్లనుంచి ప్రవహించిన ఆ పదాలు అతడు పెద్దయిన తర్వాత కూడా గుర్తుండిపోయాయి.

roots-vol-i-DVDcover

హేలీ తన పదిహేడో ఏట, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యు.ఎస్. తీర రక్షక దళంలో వంటశాలలో సహాయకుడిగా  నియమితుడయ్యాడు. ఓడలో ప్రయాణించేటప్పుడు తీరిక సమయంలో రచనాభ్యాసం చేస్తూ క్రమంగా రచయితగా మారాడు. ఇరవయ్యేళ్ల తర్వాత ఉద్యోగం మానేసి రచననే పూర్తికాలవృత్తిగా చేసుకున్నాడు. రీడర్స్ డైజెస్ట్ లాంటి మ్యాగజైన్లు అతనికి రాత పనులు అప్పగించాయి. అలాంటి సందర్భంలోనే అతనొకసారి లండన్ వెళ్ళాడు. అక్కడ ప్రతిచోటా కనిపించే చారిత్రక సంపద చూసి ముగ్ధుడయ్యాడు. ఒక రోజు బ్రిటిష్ మ్యూజియంకు వెళ్ళి అక్కడ ‘రొసెట్టా శిల’ ను చూశాడు. ఎందుకో అది నా కళ్లను కట్టి పడేసిందని అతను అంటాడు. అప్పటికప్పుడు మ్యూజియం లైబ్రరీలో దాని గురించి రాసిన పుస్తకం సంపాదించి చదివేశాడు.

ఈజిప్టులో నైలు నదీతీరంలో దొరికిన ఆ శిలపై మూడు వేర్వేరు లిపుల్లో చెక్కిన అక్షరాలు ఉన్నాయి. మొదటివి తెలిసిన గ్రీకు అక్షరాలు . రెండోవి ఒక అజ్ఞాతలిపిలో ఉన్నాయి. మూడోవి ప్రాచీన చిత్రలిపిలో ఉన్నాయి. జీన్ చంపోలియన్  అనే ఒక ఫ్రెంచి పండితుడు తెలిసిన గ్రీకు అక్షరాలతో మిగతా రెండు లిపుల్లోని ఒక్కొక్క అక్షరాన్నే పోల్చి చూసి ఆ మూడు  రకాల అక్షరాలూ ఒకే విషయం చెబుతున్నాయని తేల్చాడు. ఆవిధంగా మానవాళి పురాతన చరిత్రను నమోదు చేసిన చిత్రలిపిని అతను ఛేదించగలిగాడు.

అలా గతం తలుపులు తెరచిన ఆ తాళంచెవి తనను మంత్రముగ్ధం చేసిందనీ, దాంతో తనకు ప్రత్యేక వ్యక్తిగత సంబంధం ఏదో ఉన్నట్టు అనిపించిందనీ, అయితే ఆక్షణంలో అది ఎలాంటిదో పోల్చుకోలేకపోయాననీ హేలీ  అంటాడు. న్యూయార్క్ కు తిరిగివెడుతూ విమానంలో కూర్చుని ఉండగా అతనికి ఒక ఊహ తట్టింది. ఆ ఫ్రెంచి పండితుడు, తెలిసిన గ్రీకు అక్షరాల సాయంతో ఛేదించిన ఆ అజ్ఞాత లిపులకూ; తన చిన్నప్పుడు హెన్నింగ్ లో తమ ఇంటి వసారాలో కూర్చుని అమ్మమ్మ సింథియా, మిగతా ఆడవాళ్ళు చెప్పుకున్న మౌఖికచరిత్రనుంచి దొర్లిన విచిత్ర, అజ్ఞాత ఆఫ్రికన్ పదాలకూ చూచాయగా ఏదో పోలిక కుదిరిందనిపించింది. వాటి గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు. విమానం న్యూయార్క్ లో దిగబోతూ గాలిలో చక్కర్లు కొడుతున్న సమయానికి ఆ ఆలోచనలకు ఒక స్పష్టత వచ్చింది.   ఆ పదాలు నిర్దిష్టంగా ఏ ఆఫ్రికన్ భాషకు చెందినవి, ఆ భాషను కనిపెట్టగలమా అన్న ప్రశ్నలు అతని ముందు వేళ్లాడసాగాయి.

అక్కడినుంచి హేలీ చేసిన ప్రయత్నాలు అడుగడుగునా ఆసక్తిరేపే అపరాధపరిశోధక నవలను తలపిస్తాయి. చివరికి తన పూర్వీకుడు కుంటా కింటే జన్మస్థలాన్ని వెతుక్కుంటూ వెళ్ళి, రెండువందల ఏళ్లక్రితం ఆగిపోయిన అతని పూర్వచరిత్రను ఒక గాథికుని నోట ప్రత్యక్షంగా వినడం ఈ ఉత్కంఠభరిత గాథలో పతాక సన్నివేశం. దాని గురించి తర్వాత.

–కల్లూరి భాస్కరం

 

 

 

సీమాంధ్ర కత్తికి ఇంకెన్నాళ్లు ధారపడదాం ?

sangisetti- bharath bhushan photo

సీమాంధ్ర కవులు అభ్యుదయం, ప్రగతి, విప్లవం, వామపక్షం, ఇంకా పైకి కనపడని అనేక రూపాల్లో, హిడెన్‌ ఎజెండాలతో తెలంగాణపై తమ ఆధిపత్యాన్ని ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. ఇలా చలామణిలో పెట్టిన భావజాలం కారణంగానే నేటికీ తెలంగాణ సాహిత్యకారులు తమకు జరిగిన అన్యాయాన్ని, అభ్యుదయం ముసుగులో నొక్కేసిన/ నొక్కేస్తున్న సొంత గొంతుని పసిగట్టలేక పోతున్నారు. గొంతుని నొక్కుతున్నవారినే ఇంకా ఆరాధిస్తున్నారు. అందలాలెక్కిస్తున్నారు. తమ ఆత్మగౌరవాన్ని భంగ పరిచిన వారినే బానిస మనస్తత్వంతో భళిరా అని పొగుడుతున్నారు.1956 నుంచీ వారి మెప్పుకోసం, ఆమోద ముద్రకోసం తహతహలాడుతున్న తెలంగాణవాదులు చాలామందే ఉన్నారు. వీరంతా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయమిది. సాయుధ పోరాట కాలంలో ఏమి వ్రాయని శ్రీ.శ్రీ 1969లో మాత్రం ‘విడిపోవడమంటే చెడిపోవడం’ అని శాపనార్థాలు పెట్టిండు. అయినా శ్రీశ్రీని ఆరాధించే వీర తెలంగాణవాదులకు కొదువలేదు. ఆనాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పీడితుల పక్షాన గాకుండా దోపిడి పాలక వర్గాల పక్షాన నిలబడ్డ శ్రీశ్రీది ముమ్మాటికీ అభ్యుదయం ముసుగులో ఆధిపత్యమే! ఇట్లాంటి వారు చరిత్రలో ఇంకా చాలా మంది ఉన్నారు.

ఆస్థానాల శృంఖలాలు తెంపుకొని ఆవిర్భవించిన అభ్యుదయ కవిత్వం ఆచరణలో మాత్రం సీమాంధ్ర ఆధిపత్యాన్నే కొనసాగించింది. ఒకవైపు ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే తమ దబాయింపుని చలాయిస్తూనే తెలంగాణలో తమకు ఆమోదనీయతను సాధించుకున్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు భంగకరంగా వ్యవహరిస్తూ కూడా జేజేలు అందుకోవడం వీరికి మాత్రమే సాధ్యమయింది. పీడితుల పక్షాన నిలబడాల్సిన వారు అందుకు విరుద్ధంగా గుడ్డిగా పెట్టుబడిదారులు, దోపిడిదార్లతో అంటకాగుతూ అభ్యుదయవాదుల ముసుగులో అభినందనలు అందుకున్నారు. తాము తెలంగాణలో అడుగుపెట్టడానికి అనుకూలంగా ఉన్న సాయుధపోరాటాన్ని సమర్ధిస్తూ కవిత్వమల్లిన కవులు, అదే 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మీద దుమ్మెత్తి పోసిండ్రు. ఇట్లా ద్వంద్వ వైఖరులతో, విరోధబాసతో, పీడితులకు కాకుండా తమకు మాత్రమే మేలు జరిగే విధంగా తెలంగాణ కవులపై ‘థాట్‌పోలిసింగ్‌’కు దిగిండ్రు. ప్రస్తుత ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంలో గత చరిత్రను పునరావలోకనం చేసుకోవాలి. సీమాంధ్ర అభ్యుదయ వాదులు చారిత్రక క్రమంలో ఎలా వ్యవహరించారు. నిర్ణాయక సమయంలో ఎటువైపు మొగ్గారో నిగ్గు తేల్చాల్సిన సందర్భమిది. గతంలో జరిగిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకొని భవిష్యత్‌ తెలంగాణ సాధనకు మార్గాలు వేసుకోవాల్సిన చారిత్రక తరుణమిది. ఈ అభ్యుదయవాద కవిత్వం చారిత్రక క్రమంలో నిజంగా అభ్యుదయవాదం పక్షాన్నే నిలబడిరదా? లేదా అభ్యుదయం ముసుగులో వామపక్ష భావజాలం పేరుమీద ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకున్నారా? పీడిత, తాడిత ప్రజల పక్షాన నిలబడి ఉన్నారా? అని నేటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంలో జవాబులు దొరికే వరకూ పదే పదే వేసుకోవాల్సిన ప్రశ్నలు. ఎవరెవరు? యే యే ముసుగులేసుకొని తెలంగాణను అడ్డుకున్నారో తెలుసుకున్నట్లయితే ఆ ప్రమాదాల నుంచి బయటపడడానికి మార్గాలేర్పడతాయి. ఆ దారి వెతుక్కునేందుకు ఇదో చిన్న ప్రయత్నం.
1990వ దశకం ఆరంభంలో మొదలైన మలిదశ తెలంగాణ ఉద్యమం నేడు ఉచ్ఛదశలో ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తప్ప దేనికీ అంగీకరించేది లేదని తెగేసి తెలంగాణ సమాజం చెబుతుంది. ఇదే విషయాన్ని తెలంగాణ కవులు తమ రచనల ద్వారా తేటతెల్లం జేసిండ్రు. పొక్కిలి, మత్తడి, 1969`73 తెలంగాణ ఉద్యమ కవిత్వం, జాగో జగావో, ఊపిరి, దిమ్మిస, క్విట్‌ తెలంగాణ, మునుం, జిగర్‌ ఇలా వందల సంఖ్యలో వెలువడ్డ తెలంగాణ ఉద్యమ సంకలనాలు, అంతకు పదింతలు ఎక్కువగా ప్రతి జిల్లా నుంచి తెలంగాణ కవితా సంపుటాలు, వేల సంఖ్యలో పాటలు గత దశాబ్ద కాలంగా వెలువడుతూ వచ్చాయి. తెలంగాణ పేరు లేకుండా ఈనాడు ఏ సాహిత్య పత్రిక, సాహిత్యపేజీ అచ్చుకావడానికి వీలులేని పరిస్థితి ఉద్యమం కల్పించింది. వీటికి జోడిరపుగా, ఉద్యమానికి సంఫీుభావంగా సీమాంధ్ర కవులు ‘కావడి కుండలు’ వెలువరించారు. ప్రత్యేక తెలంగాణ న్యాయమైన, ప్రజాస్వామికమైన డిమాండ్‌ కావడంతో న్యాయం పక్షాన నిలబడుతూ, అన్యాయాన్ని ఎదిరించే ప్రతి ఒక్కరూ ఇందుకు మద్దతుగా నిలిచారు. కవిత్వంలో ప్రజల కష్టసుఖాలు ప్రతిఫలిస్తాయి. కవిత్వం భవిష్యత్తరాలకు చరిత్రను చెబుతాయి.
సమాజపు హృదయ స్పందనను రికార్డు చేస్తాయి. అయితే ఈ రికార్డు చేయడంలో ‘ప్రఖ్యాత’ ఆంధ్ర కవులు 1969 నుంచీ పక్షపాతంతోనే వ్యవహరించారు. ఉద్యమ ఉధృతిని పూర్తిగా విస్మరించారు. నిజానికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఎంత న్యాయమైన డిమాండో 2009లోనూ ఈనాడు కూడా అంతే న్యాయమైన డిమాండ్‌. సాయుధ పోరాట సమయంలో ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం, స్వేచ్ఛకోసం, దోపిడి, పీడనలపై తమ కలాన్ని రaులిపించారు. తర్వాతి కాలములో ఈ కవులే తెలంగాణ వందకు వంద శాతం న్యాయమైన, ప్రజాస్వామిక ఉద్యమం అయినప్పటికీ రెండు చేతులా దుమ్మెత్తి పోసిండ్రు. దునుమాడిరడ్రు. ద్వంద్వ వైఖరి అవలంభించే  ఇలాంటి వారిని ‘స్పేర్‌’ చేసినట్లయితే భవిష్యత్‌ తెలంగాణ నేటి ఉద్యమకారుల్ని ఎంతమాత్రం క్షమించబోదు. అయితే ఈ మలిదశ ఉద్యమంలో సీమాంధ్ర బహుజన కవులు తెలంగాణ ఉద్యమానికి సంఫీుభావంగా ‘కావడి కుండలు’ తీసుకొచ్చిండ్రు. అయినా కూడా ఇప్పటికీ కొంత మంది సీమాంధ్ర కవులు మౌనంగానే ఉన్నరు. మౌనం కోర్టు భాషలో అర్ధాంగీకారం కాగలదేమో కాని సాహిత్య భాషలో వ్యతిరేకమన్నట్లే. బహిరంగంగా వ్యతిరేకించే వారితో ఎలాంటి పేచీలేదు. వారు ప్రజాస్వామిక డిమాండ్‌కు వ్యతిరేకమని తేల్చి చెప్పవచ్చు. అయితే ఎటూ తేల్చి చెప్పకుండా నంగి నంగి మాటలతో నాన్చుడు ధోరణితో సందర్భానుసారంగా వైఖరిని మార్చుకుంటూ ప్రజల ఆకాంక్షలపై పూర్తి గౌరవాన్ని ప్రకటిస్తూ ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరించే వారితో నేడు తెలంగాణ సమాజం జాగ్రత్తగా ఉండాలి.
అభ్యుదయం మాటున ఆంధ్రాధిపత్యం!
1969లో ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా శ్రీరంగం శ్రీనివాసరావు, ఆరుద్ర, కె.వి.రమణారెడ్డి, కె. శివారెడ్డి, జంధ్యాల పాపయ్య శాస్త్రి ఇంకా అనేక మంది ఆంధ్ర కవులు కవిత్వాన్ని రాసిండ్రు. ఒక వైపు విప్లవ రచయితల సంఘం సూత్రప్రాయంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్ధతు నిస్తూ తీర్మానాన్ని ప్రతిపాదిస్తే దానికి అధ్యక్షుడిగా ఉన్న శ్రీ.శ్రీ అందుకు వ్యతిరేకిస్తూ ఉద్యమానికి మద్ధతు ఇస్తే తాను రాజీనామాను ప్రకటిస్తానని హెచ్చరించాడు. సంఘాన్ని బ్లాక్‌మెయిల్‌ చేసిండు. ఇదే శ్రీశ్రీ మరో వైపు అంతకుముందు ఆంధ్రరాష్ట్రాన్ని ఆకాంక్షిస్తూ తెలుగుతల్లి పేరిట కవితలల్లిండు. అంధ్రులు యేయే కారణాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని డిమాండ్‌ చేసిండ్రో అవే కారణాలతో 1956 నుంచి ఈనాటి వరకూ తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. శ్రీశ్రీకి ఆంధ్ర రాష్ట్రం న్యాయమైన డిమాండ్‌, తెలంగాణ ‘వేర్పాటువాదం’. ఇక్కడే ఆయన ద్వంద్వ నీతి తెలుస్తుంది. తెలంగాణ డిమాండ్‌ని వ్యతిరేకిస్తూ 1969లో శ్రీ.శ్రీ. ఇలా రాసిండు.
srisri
మర్కటాల కర్కటాల
సర్కస్‌ ఫీట్ల, పందెపు
కుక్కుటాల పోట్లాటలు
…..
విచిత్రమేమంటే మన
విశాలాంధ్ర గృహమందే
వేరు వేరు వంట గదులు
కోరి పోరు ధోరణులు
తిరుగుబాటు పేరిట ది
మ్మరులు చేయు హంగామా
చీలిక వాదుల సంఘపు
సెక్రటరీ చిరునామా
(సామ్యవాది మానిఫెస్టో)
విడిపోవడం అంటే చెడిపోవడం అని
వీళ్ళకెలా నచ్చచెప్పడం
చించడం సులభమే కాని అతికించడమే కష్టం
నిర్మూలనం కంటే నిర్మాణమే నయం
అలనాడు దేశాన్ని మూడుముక్కలు చేస్తూంటే
చూస్తూ ఉరుకున్నాడు గాంధీజీ
కొయ్యనీ, శస్త్ర వైద్యం చెయ్యనీ అని సలహా
యిచ్చాడు వియ్యంకుడు
డబ్బు సంచుల్తో అమ్మని కొనలేరు
అభిమానాన్ని కొనలేరు
ఆత్మల్ని కొనలేరు
పాపం అమాయకుడు తెలుగువాడు
మద్రాసు నుంచి పొమ్మంటే కర్నూలుకి వెళ్ళాడు
కర్నూలు కాదనుకొని హైద్రాబాదు కొచ్చాడు
ఇక్కణ్ణుంచి పొమ్మనడం ఏ భాషలోనూ సాధ్యంకాదు’ అన్నాడు.
నిజానికి పార్లమెంటులో ఆంధ్ర రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందేవరకు మద్రాసు నుంచి పొమ్మని ఏ తమిళుడు కోరలేదు. అక్కడ కూడా వీళ్లు అత్యాశకు పోయి మద్రాసు నగరం కావాలని అప్పటి ముఖ్యమంత్రి రాజాజి  చేత ‘క్విట్‌ ద డాగ్స్‌’ అని తిట్టించుకొని కర్నూలు చేరారు. కావాలనే పొట్టి శ్రీరాముల్ని పొట్టన బెట్టుకున్నరు. మరుగు దొడ్లు లేని ప్రాంతానికి గవర్నర్‌ రావటానికి నిరాకరించడంతో తెలంగాణాపై వీళ్ల కళ్లు పడ్డాయి. అప్పటికే అన్ని హంగులతో మిగులు బడ్జెట్‌తో ఉన్న హైదరాబాద్‌లో తిష్ట వేయడం కోసం కుతంత్రాలు చేసారు. ఇది చేసింది ‘ఏదో అమాయకమైన తెలుగువాడు’ కాదు. అప్పటికే బ్రిటిష్‌ పాలనలో ఉన్న వీళ్లు, విభజించు పాలించు పద్ధతినవలంభించారు. రాష్ట్రావతరణ నాడే ఉపముఖ్యమంత్రి ‘ఆరోవేలు’ అంటూ  ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచిండ్రు. మోసం, వంచనతో తెలంగాణను నిలువుదోపిడి చేసిండ్రు. ఇప్పడా వంచన పరకాల ప్రభాకర్‌ ‘నూటొక్క అబద్దాల’ ‘టక్కరి’ ఆంధ్రుడిగా రూపాంతరం చెందింది. ప్రత్యేకాంధ్ర మేధావి రూపంలో తెలంగాణపై విషంగక్కే చలసాని శ్రీనివాస్‌ రూపంలో టీవీల్లో చర్చలు చేస్తోంది. ఒక వైపు హైదరాబాద్‌ని దోపిడి చేసి ఉన్నకాడికి స్వాహా చేసి తామేదో త్యాగం చేసినట్టు ఫోజు పెట్టడమంటేనే వలసవాదుల దురహంకారపు ఆధిపత్యం అర్థమవుతుంది. ఉన్న జుట్టంతా ఊడబీకి ఫ్రీగా ‘గుండు చేస్తే’ ఎందుకేడుస్తవ్‌ అన్నట్టుగుంది ఆంధ్రకవుల దబాయింపు.
…..
ఐకమత్యంగా ఉంటే
యావద్భారతంలోనూ రాణించగలం
పిండికేతిగాళ్ళ తోలుబొమ్మలాటలు కట్టించగలం
కామ రాజకీయాలకు విడాకు లిప్పించగలం
    (జన్మ దినోత్సవం)
శ్రీశ్రీ ఉద్యమకారుల్ని పిండికేతిగాళ్ళతోటి పోల్చిండు. ఉద్యమాన్ని కామ రాజకీయాలని తూలనాడిరడు. కర్నూలు కాదనుకొని హైద్రాబాద్‌ కొచ్చినామని అంగలార్చిండు. అసలు వాళ్ళని రమ్మని బతిలాడిరదెవరు? ఆనాడే భార్గవ కమిటీ, లలిత్‌ కమిటీలు లెక్కగట్టి మరీ తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన కోట్ల రూపాయల సొమ్ముని సీమాంధ్రలో ఖర్చు పెట్టారని తేల్చి చెప్పిండ్రు. తెలంగాణకు రావాల్సిన ఉద్యోగాలని ప్రాంతేతరులు దోచుకు పోయారని లెక్కలేసి మరీ తేల్చిండ్రు. ఇంత అన్యాయం జరిగినా ఆయన తెలంగాణ ప్రజల ఆకాంక్షల వైపు గాకుండా దోపిడిదారుల, పీడకుల పక్షాన నిలబడిరడు. శ్రీశ్రీ వేసిన బాటలోనే సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రలో తెలంగాణను అనుబంధాలకు, ఉపశీర్షికలకు పరిమితం చేసిన ఆరుద్ర కూడా దోపిడిదారుల, పీడకుల తరపున వకాల్తా పుచ్చుకుండు.
Arudra
అన్న తమ్ముని యింట పగవాడా?
ఉన్న వూరును విడిచి పోవాలా?
కంట నెత్తుటి కణము కరుణ నోచని జనము
కాందీశీకుల బాట పట్టిందా?
స్వార్థ దేవత కచ్చ కట్టిందా
స్పర్ధానలము మిన్ను ముట్టిందా?
శ్రీలు పొంగిన గడ్డ పాలువారే గడ్డ
సిద్ధాన్నమే కుక్క ముట్టిందా?
రౌడీలకు సజ్జనులు జడవాలా?
రగడ చేస్తే అణిగి నడవాలా?
రక్షణే కరువాయె భక్షణే తిరమాయె
రాచరికమే కంపు గొట్టిందా?
ఒక్కతల్లికి మనము పుట్టాము
ఒక్క రక్తము పంచుకొన్నాము
ఒక్క దేహము నేడు ముక్కలుగునా మూడు
అక్కటా! శని మనకు పట్టిందా?
(అన్న తమ్ముని ఇంట పగవాడా?)
అన్న తమ్ముని ఇంట పగవాడా అని అమాయకంగా అడుగుతున్న ఆరుద్ర నాలుగువేల ఆరువందల మంది నాన్‌ముల్కీలు తెలంగాణలో పనిచేస్తున్నారని, న్యాయంగానైతే ఆ ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు దక్కాలని అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అఖిలపక్ష సమావేశంలోనే చెప్పిండు. ఈ విషయాల్ని ఎక్కడ లెక్క చెప్పకుండా తెలంగాణ ఉద్యమాన్ని తప్పుబట్టిండు.  ఆరుద్రనే కాదు కె.వి.రమణారెడ్డి కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నిరశిస్తూ కవిత్వాన్ని అల్లిండు. ‘జాతి వైర దుష్టజ్వాల’ అంటూ ఉద్యమాన్ని ఆడిపోసుకుండు. దీనికి మహబూబ్‌నగర్‌కు చెందిన ముకురాల రామారెడ్డి కవిత్వంలోనే అన్నన్నా రవణన్నా నీ ఆటలింక సాగవంటూ కవిత్వంలోనే జవాబిచ్చిండు.
‘‘..కుడిచేతిని ఎడమచేయి
పడగొట్టగ జూచినపుడు
కవి ప్రేక్షకుడై చూచే
కనికట్టు గారడీ గమ్మత్తు కాదిది
ఆ యింటివాని చేతులూ
ఈ యింటివాని చేతులూ
కలియబడుతున్న
‘జాతివైర దుష్టజ్వాల’ ఇది.
అవునా భువనఘోషనా ఇది.
అలనాడు సవరింపబడిన
‘తెలంగాణ కోటి రత్నాల వీణ’
తీగలను తెంపేసి
అతక నేర్చుకుంటున్నదా? నెరజాణ
‘‘వీర తెలంగాణానికి
వైరుల ఏకోదరులా?’’ అంటూ ముకురాల రామారెడ్డి జవాబిచ్చిండు.
ఇక ఫక్తు ఆరెస్సెస్‌ భావజాలం గల జంధ్యాల పాపయ్య శాస్త్రి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసినట్లయితే అది దక్షిణ పాకిస్తాన్‌ అవుతుందని రాసిండు. తెలంగాణ ప్రజలు మాట్లాడేది ‘తౌరక్యాంధ్రమని’ ఎగతాళి చేసిండు.ఈ విషయాన్ని ప్రొఫెసర్‌ జయశంకర్‌ గారు రికార్డు కూడా చేసిండు. ‘‘ 1968`69లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా నడుస్తున్నప్పుడు ఒక అనుభవం ఎదురైంది. ఆ రోజుల్లో జంధ్యాల పాపయ్య శాస్త్రి ఒక గేయంలో , ఒక వేళ ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే, అది దక్షిణ పాకిస్తానం అవుతుందని రాశాడు. అది అర్థం కాక నేను ఇంకో మిత్రుడు ఆయన దగ్గరికి వెళ్ళి ‘శాస్త్రి గారూ, మీ బాధేమిటని’ అడిగాము. దానికి ఆయన సమాధానమిస్తూ ప్రత్యేక తెలంగాణలో తెలుగంతా భ్రష్టుపట్టిపోయి, అది పూర్తిగా తౌరక్యాంధ్రం అవుతుందని అన్నాడు.’’ (సింగిడి` తెలంగాణ ముస్లిం ప్రత్యేక సంచిక, ఉర్దూ ఉసురు తీసిన ఆంద్రులు` జయశంకర్‌)
తెలుగుతల్లి, విశాలాంధ్ర పేరిట కవితలల్లిన పాపయ్యశాస్త్రి ఒక్కసారి కూడా న్యాయంగా ఆలోచించలేదు. కనీసం అవతలి పక్షంవారు ఏమడుగుతున్నారు? అని కూడా ప్రశ్నించుకోలేదు. ‘విజయీభవ’ పేరిట
‘పెద్ద తలలు గద్దెలకై
గుద్దులాడు కొంటున్నై
వద్దనవోయ్‌ స్వార్థబుద్ధి
కద్దనవోయ్‌ కార్య సిద్ధి’ అంటూ తెలంగాణ ఉద్యమాన్ని పదవుల కోసం గుద్దులాటగా వర్ణించిండు. బట్టకాల్చి మీదేసినట్లయితే అది ఆరిపేసుకునే పనిలోనే తెలంగాణ వాడుంటే ఈలోపు తమ దోపిడీని సులువు చేసుకోవచ్చనేది నాటికీ నేటికీ సీమాంధ్ర ఆధిపత్యవాదులు ఆచరిస్తున్న నీతి.
‘ తెలుగుతల్లి కన్నుల్లో
వెలుగుతుంది మన భాగ్యం
భాగ్యనగర వీధుల్లో
పండును మన సౌభాగ్యం’ అంటూ హైదరాబాద్‌లో సీమాంధ్రుల సంపదను ఆనాడే లెక్కేసిండు. విశాలాంధ్ర పేరిట
‘ఆ సీమని ఈ సీమని
ఆగం చేస్తారెందుకు
అంతా రాయలసీమే
అంతా మన తెలంగాణె’ అంటూ ప్రత్యేక తెలంగాణ వాదుల్ని జోకొట్టే ప్రయత్నం చేసిండు. ఆధిపత్య శక్తుల కొమ్ముకాసే వీరి పక్షపాత వైఖరి కారణంగా ఈనాడు తెలంగాణ ప్రజల్లో, మేధావుల్లో సీమాంధ్ర సాహితీవేత్తలు ఎంతటి ప్రతిభావంతులైనా వారి పట్ల గౌరవభావం ఏర్పడడంలేదు.
అలాగే అప్పటికి అంతగా పేరు పొందని చిన్నా చితక ఆంధ్ర కవులు కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై దుమ్మెత్తి పోసిండ్రు. ఇందులో వక్కలంక లక్ష్మీపతిరావు ఇలా రాసిండు.
అన్నాదమ్ములు కలబడి దేశం
ఛిన్నా భిన్నం చేస్తారా?
పచ్చని యింటికి చిచ్చులు రగిల్చి
పరమానందము చూస్తారా?
అంటే అన్న ఎంత దోసుకుంటున్నా తమ్ముడు మాత్రం సడి సప్పుడు చెయ్యకుండా ఉంటే అది ఐకమత్యము. అన్యాయాన్ని నిలదిస్తే అది చిచ్చులాగా వారికి కనబడిరది. మరో కవి ఎం.కె. సుగమ్‌బాబు తెలంగాణ ఉద్యమాన్ని సంకుచితమని తేల్చిసిండు.
ఆంధ్ర యేమిటి?
తెలంగాణా యేమిటి?
కులమేమిటి?
మతమేమిటి?
భాషేమిటి?
మనిషి యింతగా యెదిగినా
సంకుచితంగా ప్రాంతమ్మేమిటి?
ఇది నాచేయి
ఇది నాకాలు అని
కన్నతల్లిని కోతపాలు చేసే మూర్ఖతేమిటి
కసాయితన మేమిటి?
ఇంకెలా నిలుస్తుంది దేశం
ఏమైపోతుంది మృతవీరుల త్యాగం, సందేశం’
న్యాయంగా, హక్కుగా దక్కాల్సిన వాటా అడగడం ఆంద్రోళ్ళకు మూర్ఖత్వంగా, కసాయితనంగా కనిపించింది. ఇదే అంశాన్ని కొంచెం సున్నితంగా సంగిరెడ్డి వెంకటరంగారెడ్డి అనే కవి ఇలా చెప్పిండు.
ఒకే ఇంటివాళ్ళు
అన్నదమ్ములు
అన్నా తమ్ముడి పైసలు వాడుకున్నాడు
అన్న తమ్ముడికి అన్యాయం చేశాడు
తమ్ముడు కోపంతో కల్లెర్ర చేశాడు
తమ్ముడు అన్న చేసిన తప్పులను చూపాడు
తప్పులను సరిదిద్దుకొందాం అన్నాడు అన్నయ్య
తమ్ముడు సంతోషంతో ‘సరే’ అన్నాడు
అన్యాయం చేసినంతమాత్రాన విడిపోతామా అన్నాడు తమ్ముడు
కలతలున్నంత మాత్రాన బంధాన్ని తెంపుతామా అన్నాడు అన్నయ్య”తప్పులను సరిదిద్దుకోవాలని వెంకటరెడ్డి చెప్పిండ్రు.
ఈ తప్పులు సరిదిద్దుకోక పోగా అంతకు వేల రెట్లు అధికంగా చేసి వాటినే ఒప్పుల కుప్పలుగా చూపెట్టే ప్రయత్నం జేసిండ్రు సీమాంధ్ర పక్షపాత అధికారులు, వారికి వత్తాసుగా వలసాధిపత్య ప్రభుత్వం నిలిచింది. గిర్‌గ్లానీ కమిటీ ఎన్ని సార్లు నిబంధనలు ఉల్లంఘించారో తనకు ఇచ్చిన అరకొర సమాచారంతోనే లెక్కగట్టిండు. 1984 డిసెంబర్‌లో ఇచ్చిన 610 జీవో 29 యేండ్లయినా ఇంకా అమలుకు నోచుకోలేదంటే ఇంకెంత సహనం కావాలి. తరాలకు తరాలు ఓపిక పట్టాలంటే అయ్యే ముచ్చటేనా?
యూ టూ శివారెడ్డి!
హైదరాబాద్‌ని అమితంగా ప్రేమిస్తానంటూనే దానిపై అభ్యంతరకరమైన కవిత్వమల్లి తెలంగాణవాదుల మనోభావాల్ని గాయపరిచిన కవి శివారెడ్డి. తాను ఏ శిబిరంలో ఉన్నా అభ్యుదయవాదిగా ఆమోదముంటుంది. వీర తెలంగాణ వాదులకు సైతం ఆయన ఆరాధ్యనీయుడవుతాడు. ప్రస్తుత సందర్భంలో నర్మగర్భంగా తెలంగాణకు వ్యతిరేకంగా కవిత్వమల్లే ఈయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆనాడు వ్యతిరేకేసిస్తూ ఏకంగా ‘తెలుగు బావుటా’ (సమైక్యతా సూచికా గేయకావ్యం) పుస్తకాన్ని ప్రచురించాడు.
కుడి చేయి ఎడమ కంట్లో
వేలుబెట్టి పొడిచింది
ఎడమ చేయి కుడికంట్లో
జిల్లేడు పాలు కొట్టింది-
రెండు కళ్ళు
భోరున ఏడుస్తున్నాయి
ఈ దేహం ఒకటే
ఆ కళ్ళు, చేతులు
ఈ దేహానికి చెందినవే
సరిగ్గా ఇలానే వుంది
తెలుగు గడ్డ పరిస్థితి
….
మనుషుల మనసుల్లో
కీనీడల జాడల హెచ్చింది
మమత పెల్లుబికిన ఇంట్లో
మచ్చరం పెను త్రాచులా
బుసలు కొడుతుంది
నిన్నటి మిత్రులు
నేడు శత్రువులు
అన్నదమ్ములిరువురు
పందెంలో కోడి పుంజుల తీరు
ఈ స్వార్థం తిని బలిసిన
రాకాసి పురికొల్పిందిలా?
అర్థమేమున్నది ` ఆ వేటలో
నీది ఆంధ్ర, నాది తెలంగాణా
తెలంగాణాణా`ఆంద్ర
పర్యాయ పదాలు కావా!
నిన్న మొన్న పురుడు బోసుకున్న
తెలుగు తల్లి గుండెల్లో బల్లెపు పోటా!
సిగ్గు విడచి చెప్పులు జత పట్టుకున్నాయి కదూ’
. అంటూ ఆనాడు అందరం ఒక్కటిగా ఉండాలని పిలుపు నిచ్చాడు.
అయితే అప్పటికే హైదరాబాద్‌లో శివారెడ్డి ఉద్యోగం చేయడమంటేనే ఒక స్థానికుడి అవకాశం గల్లంతు కావడం. తెలంగాణ ఫ్యామిలీకి దక్కాల్సిన చదువులూ, స్థానిక రిజర్వేషన్లు ఇట్లా వచ్చిన అనేకమంది తెలంగాణ బిడ్డలకు దక్కకుండా చేసిండ్రు. అట్లా ఒక్క శివారెడ్డే కాదు అంతకు ముందు 1944 నుంచీ తెలంగాణలో కమ్యూనిస్టు ఉద్యమం ఊపందుకున్నాక ఆంధ్ర ప్రాంతం వారి రాక పెరిగి పోయింది. అడివి బాపిరాజు, విద్వాన్‌ విశ్వం, కొడవటిగంటి కుటుంబరావు, తల్లావరa్జల శివశంకర శాస్త్రి, మొక్కపాటి నరసింహశాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, కురుగంటి సీతారామభట్టాచార్య, పిల్లలమర్రి వేంకట హనుమంతరావు ఇలా అనేక మంది తెలంగాణను ముఖ్యంగా హైదరాబాద్‌ని కేంద్రంగా చేసుకొని ఉద్యోగాలు చేసుకున్నారు.  ఇదే విషయాన్ని”నల్లవలుస”లో “శిరసులు ఇలా చెప్పిండ్రు.
‘‘గురజాడ ‘ఒఖడే’
అడుగు జాడల్లో వలసవచ్చినవారు
వేయిన్నొఖడు
నయాదళారుల వలసే
మహా ప్రస్థానం
త్వమేవాహమ్‌
త్వమ్‌ శూన్యమ్‌ అహమ్‌ సర్వమ్‌
ఆర్యా` స్వాహా సర్వమ్‌
దళ నిర్మూళనమే
మరో` మహాప్రస్థానం?

ఉద్యమం మీద
తేలుతూ వచ్చావ్‌
ఆంధ్రప్రస్థ నిర్మాణంలో
మయుడివి కావు
మనిషిని వస్తువుగా,
మా భూమిని
ముక్కలుగా విక్రయించావ్‌
నీ గణాంకాల
గారడీలో
నేనొక్క
గుండుసున్నానిమ మాత్రమే!
ముల్కీ పత్రం
ఒక మురికి పత్రమే
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో దాదాపు అందరు సీమాంధ్ర కవులు ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా వ్యవహరించినప్పటికీ వారిని అందలం ఎక్కించే ఉద్దేశ్యంతో సాయుధ పోరాట సాహిత్యాన్ని దానికి వారు అందించిన తోడ్పాటును అటు అభ్యుదయవాదులు, విప్లవవాదులు ప్రచారంలో పెడుతుంటారు. నిజానికి 1946`51 నాటి ‘సాయుధ పోరాటం’ గురించి చాలామంది రచనలు చేసిండ్రు.
అయితే శ్రీ.శ్రీ ఒక్క కవిత కూడా రాయక పోవడానికి కూడా కారణముంది. ఆరుద్ర ‘త్వమేవాహా’నికి ఆపేరు సూచించిన శ్రీ.శ్రీ స్వయంగా నిజాం ప్రభుత్వం కొలువులో ఉన్నాడు. ప్రభుత్వ కొలువులో ఉంటూ దానికి వ్యతిరేకంగా రాస్తే ఉద్యోగం ఊడుతుందనే ఉద్దేశ్యంతో ఒక్క కవిత కూడా రాయలేదు. అలాగే తిన్న ఉప్పుకు ద్రోహం తలపెట్టొద్దు అనే ఉద్దేశ్యంతోనో ఏమో ఆ తర్వాత కూడా ఏమీ రాయలేదు. ఒక వైపు తాము నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టిన పేద రైతులు, ఉద్యమకారులు సాయుధ పోరాటం చేస్తూ ఉన్నారు. రోజూ  పోలీసుల చేతిలో కమ్యూనిస్టు కార్యకర్తలు, నాయకులు చనిపోయారు. చనిపోయిన వారిలో రజాకార్లు కూడా ఉన్నారు. బండి యాదగిరి లాంటి పాటగాడు, రేణికుంట రామిరెడ్డి లాంటి యోధుడు, అనభేరి ప్రభాకర్‌ లాంటి పోరాట నాయకులు అనేక వందల మంది 1946`48 మధ్య కాలంలో ఉద్యమంలో తమ ప్రాణాలర్పించారు. అయితే శ్రీ.శ్రీ నిజాం ప్రభుత్వ పోలీసు శాఖలో పౌరసంబంధాల విభాగంలో ఉంటూ ప్రభుత్వ ఎన్‌కౌంటర్ల గురించి, ఉద్యమ కారుల మరణాల గురించీ ఆంగ్లంలో ఇచ్చే వివరణలను తెలుగులో తర్జుమా చేసేవాడు. ఎంత మనసు చంపుకున్నా బూటకపు ఎన్‌కౌంటర్లనీ తెలుస్తూనే ఉన్నా శ్రీ.శ్రీ వాటిని ఎదురుకాల్పులుగా మార్చి రాసే పనిలో ఉన్నాడనే విషయాన్ని అవగాహనలోకి తెచ్చుకోవాలి. ఒక్క శ్రీ.శ్రీయే కాదు పైన పేర్కొన్న ఏ ఒక్క ఆంధ్రప్రాంత సాహితీ వేత్త ఆనాడు ప్రభుత్వ దమన కాండను నిలదీయలేదు.
 సాయుధ పోరాటంపై రాయకపోయినప్పటికీ ‘మహాప్రస్థానం’ పాడెను ఇప్పటికీ తెలంగాణ వాదులుమోస్తున్నారు. ఆరుద్ర తెలంగాణను చూడకుండానే ‘త్వమేవాహా’న్ని రాసిండు. కె.వి.ఆర్‌. భువనఘోష వినిపించిండు. అట్లాగే విరసం తరపున సాయుధపోరాట సాహిత్య చరిత్రను రికార్డు చేసిండు. తెలంగాణ మీద ఇంత ప్రేమ ఉన్న వీళ్ళు ప్రత్యేక తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి నిర్ద్వందంగా వ్యతిరేకించిండ్రు. తమ ఆంధ్రాధిపత్యాన్ని ప్రదర్శించారు. తాము చెప్పిందే న్యాయం, తాము రాసిందే వేదం అన్నట్టుగా వ్యవహరించిండ్రు.
1969లో ప్రత్యేక తెలంగాణ నినాదం ఉధృతంగా రావడంతో దాన్ని అధిగమించడానికి కమ్యూనిస్టు పార్టీలు, ఆ భావజాలం ఉన్న రచయితలు తిరిగి సాయుధ పోరాటాన్నే తెలంగాణపై ఆయుధంగా మలిచారు. సాయుధ పోరాటాన్ని తామే నడిపించామన్న తీరుతో ‘చరిత్ర’ రచనలు చేసిండ్రు. 1972 నాటికి ‘సాయుద పోరాట’ ఉద్యమానికి రజతోత్సవాలు జరిపి తమ అనుభవాల్ని అక్షరీకరించి ‘విశాలాంధ్ర’ కోసమే సాయుధ పోరాటం జరిగిందని తీర్పులిచ్చారు. సాయుధ ఉద్యమానికి 60 యేండ్లు నిండిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ పనిని ఇప్పటికీ సిపిఎం పార్టీ బాహాటంగా చేస్తూనే ఉంది. అందుకే ఆంధ్రప్రాంతం వారి రచనల్లో స్వప్రయోజనాలున్నాయి. హిడెన్‌ ఎజెండాలున్నాయి.
సీమాంద్ర ఆధిపత్య శక్తుల రహస్య ఎజెండాలను పసిగట్టి ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడుతూ దోపిడిదార్లను నిలదీయడమే నేటి తెలంగాణ కవుల కర్తవ్యం. ఎవరు ఏ రూపంలో వచ్చినా ఎన్ని మోసపు మాటలు చెప్పినా కరిగి పోవొద్దు. ఎబికె ప్రసాద్‌ లాంటి వాళ్ళు తెలంగాణమే ఆంధ్రప్రదేశ్‌ అని చెబుతూ ఎన్ని దోబుచులాటలాడిన మొక్కవోని ధైర్యంతో ఎదుర్కోవాలి. కొంతమంది తెలంగాణ వాదులు తెలంగాణ ప్రయోజనాల్ని పణంగా బెట్టి స్వీయప్రయోజనాల్ని నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. మనల్ని నరికే “గొడ్డలి కామాలు కావొద్దని కోరుకుంటున్నా!
జర్నలిస్టులుగా, సాహిత్యకారులుగా, మేధావులుగా, విశ్లేషకులుగా, ప్రొఫెసర్‌లుగా, విద్యార్థి నాయకులుగా, రాజకీయ దళారులుగా, దోపిడీదార్లుగా, కబ్జాదార్లుగా, పెట్టుబడిదార్లుగా ఇలా అనేక రూపాల్లో తెలంగాణ ప్రయోజనాలకు భంగకరంగా వ్యవహరిస్తున్న వారిని ఎదుర్కోవాలి.
అనేక రూపాల్లో, వివిధ మార్గాల్లో తాము తెలంగాణ శ్రేయోభిలాషులం అని చెబుతూనే ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ సాహిత్యకారుల గొంతును నొక్కేస్తూ కూడా వీళ్ళు గౌరవింపబడుతున్నారు. మీ కవిత్వంలో ఇమేజ్‌లు లేవు, మీ కథల్లో శిల్పం, శైలి లేదు, భాష ఇబ్బంది కరంగా ఉంది అంటూ తెలంగాణవాళ్ళను తొక్కేస్తున్నారు. ఈ ఆధిపత్యవాదులు వామపక్ష భావజాలం ముసుగులో ఎన్ని అడ్డంకులు కలిగించినా నిలదీయడానికి తెలంగాణ సాహిత్యసమాజం సిద్ధంగా లేదు. ఈ ఆధిపత్యాన్ని మౌనంగా అయినా సరే ఇంకా భరించినట్లయితే భవిష్యత్తెలంగాణ సమాజం క్షమించదు. అందుకే నిజంగా తెలంగాణకు మద్ధతిచ్చే వారెవరో, మద్ధతు ముసుగులో మనల్ని మంటగలిపేందుకు ప్రయత్నిస్తున్నదెవరో తెలుసుకొని మసులుకోవాలి. ప్రజాస్వామిక, న్యాయమైన ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేసే కవులను మొహమాటాలు, భేషజాలను పక్కన బెట్టి సాహిత్య సమాజంలో దోషులుగా నిలబెట్టాలి. ఈ పని ఎంత తొందరగా చేస్తే తెలంగాణకు అంత మేలు జరుగుతుంది. వీరు గుర్తించ నిరాకరించిన, నిరాదరణ చేసిన తెలంగాణ సాహితీ ప్రతిభ గుర్తింపుకు ఇది పునాది అవుతుంది.
–సంగిశెట్టి శ్రీనివాస్

 

‘చెర’గని జ్ఞాపకం…చెరబండ రాజు!

venu

వ్యాసకర్త ఎన్.వేణుగోపాల్

 

(జూలై 2:  ప్రసిద్ధ కవి చెరబండ రాజు వర్థంతి )

చిన్నా పెద్దా అందరమూ ప్రేమగా ‘చెర’ అని పిలుచుకుంటుండిన చెరబండరాజు చనిపోయి అప్పుడే ముప్పై ఒక్క ఏళ్లు గడిచిపోయాయి. చెర పుట్టినరోజు తెలియదు.“ హైదరాబాదుకు తూర్పున, అంకుశాపురం గ్రామంలో పదిహేను రోజుల ప్రసవవేదనలో అమ్మ చచ్చిపోతుందనగా నేలమీదికి కసిగా విసిరివేయబడ్డాడు. ఎప్పుడో తేదీ లేదు. బంగారమొడ్డించే పల్లెవాసుల చల్లని చూపుల్లో, పైరుపచ్చని పొలాల గట్ల మెద్ద కాలిబాటల చీలికల్లో పెరిగాడు. ఎదురైన ప్రతి హృదయానికీ అంకితమవుతాడు. సాగర తీరాల ఇసుక తిన్నెల మీద ఒంటరిగా కూర్చోవడం, వానలో నానడం, ఏకాకిగా ఉండడం, విషాదం ఇష్టం. మనిషికోసం పడి చస్తానంటాడు. ఒక్క భగవంతుని మీదే కసి, పగ” అని దిగంబరకవులు మొదటి సంపుటంలో పరిచయం రాసుకున్న నాటికైనా, చివరి వరకూ అయినా పుట్టినతేదీ తెలియనే లేదు. జ్ఞాపకం ఉన్న సంఘటనలను బట్టి పుట్టిన సంవత్సరం 1944 అని చెప్పుకునేవాడు. అది సరైనదే అయితే చెర ఇప్పుడు 69 నిండి డెబ్బైలలో ప్రవేశిస్తుండేవాడు.

చెరను బహుశా 1972లో మొదటిసారి చూసి ఉంటాను. అప్పటినుంచి 1982 జూలై 2న చనిపోయేదాకా ఆయనతో గడిపిన జ్ఞాపకాలు మానసాకాశం మీద ఎప్పటికీ చెరగని అరుణారుణతారలు. మనిషిని చూసినది పది సంవత్సరాలే, అందులోనూ ఆయన రెండేళ్లు ముషీరాబాద్ జైల్లోనూ, రెండేళ్ల కన్న ఎక్కువే గాంధీ రోగ నిలయం (గాంధీ ఆస్పత్రికి ఆయన పెట్టిన పేరు) లోనూ గడిపాడు. ఆయనను కలిసింది కూడా సభల్లో, అంబర్ పేట ఇంట్లో, జైలులో, కోర్టులలో, ఆస్పత్రిలో అప్పుడప్పుడూ మాత్రమే గనుక మొత్తంగా నెల కూడ ఉండదేమో. కాని వెయ్యి పున్నముల వెలుగు అది. ఆయన జీవితం మీద, కవిత్వం మీద ఎన్నో చోట్ల మాట్లాడాను, రాశాను. మాట్లాడినప్పుడల్లా , రాసినప్పుడల్లా కొత్త స్ఫురణకు వీలు కల్పించే నవనవోన్మేష స్ఫూర్తి అది.

ఆయన ఎక్కువకాలం గడిపిన అంబర్ పేట కిరాయి ఇల్లు ఇప్పుడు లేదు. ముషీరాబాద్ జైలును కూల్చేసి గాంధీ ఆస్పత్రి చేశారు. గాంధీ రోగనిలయాన్ని కూల్చేసి ఎవరికి రియల్ ఎస్టేట్ చేద్దామా అని ఆలోచిస్తున్నారు. ఆయన ఉద్యోగం నుంచి తొలగింపుకూ, అనారోగ్యానికీ గురయితే తెలుగు సమాజం అసాధారణంగా స్పందించి ఆయన సహాయనిధి సేకరించి కట్టించి ఇచ్చిన రెండుగదుల చిన్న ఇల్లు కూడ ఇప్పుడు అపార్ట్ మెంట్ గా మారిపోయింది. ఆయనకు అన్నివిధాలా సంపూర్ణంగా సహచరిగా ఉండిన శ్యామలక్క అకాలంగా అనారోగ్యంతో మరణించింది. ఆయన కంటిపాప ఉదయిని కాన్సర్ పీడితురాలయి ముప్పై ఏళ్లు నిండకుండానే ప్రాణాలు కోల్పోయింది. కొడుకు కిరణ్ తప్ప భౌతికంగా చెర జ్ఞాపకం అని చూపదగినవి దాదాపుగా ఏమీ లేవనే చెప్పాలి. కాని చిరస్మరణీయమైన చెర కవిత్వం ఉంది.

‘అమ్మమ్మ ఇందిరమ్మ చేసింది సాలుపొమ్మా’ అని గానానికి అనువుకాని, శ్రుతిలయలు తెలియని సన్నని గాత్రంతోనే ఆయన పాడిన పాటలు, ‘పాడుతాం పాడుతాం ప్రజలే మానేతలనీ ప్రజాశక్తి గెలుచుననీ’ అనీ, ‘విప్లవాల యుగం మనది, విప్లవిస్తె జయం మనది’ అనీ, ‘ఈ మట్టిని తొలుచుకొనీ విప్లవాలు లేస్తున్నై, ఎరుపెక్కిన ఈ మట్టికి మా నెత్తుటి స్వాగతాలు’ అనీ ఆయన చేతి సంకెళ్లనే సంగీత సాధనాలుగా మార్చి కూర్చిన అద్భుతమైన లయబద్ధమైన కవితానినాదాలు ఇంకా చెవుల్లో రింగుమంటూనే ఉన్నాయి.

cherabandaraju1

విప్లవ రచయితల సంఘం ఏర్పడినప్పటి నుంచి ఎమర్జెన్సీ విధించే దాక అంటే 1970 జూలై నుంచి 1975 జూన్ దాకా  ఐదు సంవత్సరాలలో హనుమకొండ-వరంగల్ లలో కనీసం యాభై సభలు, సమావేశాలు జరిగి ఉంటాయి. నేను 1973 జూన్ తర్వాతనే చదువు కోసం హనుమకొండ వచ్చాను గాని అంతకుముందరి సభలు కూడ చూశాను. అటువంటి సభల్లో ఏదో ఒకదానిలో, బహుశా చెర 1971లో మొదటిసారి ప్రెవెంటివ్ డిటెన్షన్ చట్టం కింద అరెస్టయి విడుదలైనాక జరిగిన సభలోనో, లేదా మరేదైనా సభలోనో చూసి ఉంటాను. ఇక నేను హనుమకొండకు చదువుకు వచ్చినాక నాలుగు నెలలకే అక్టోబర్ లో విరసం మొదటి సాహిత్య పాఠశాల జరిగింది. విరసం నాయకులందరినీ మూడు నాలుగురోజులపాటు సన్నిహితంగా చూడడం, వారి మాటలు, కవితలు, ఉపన్యాసాలు వినడం అప్పుడే. అందరితో, ముఖ్యంగా చిన్నపిల్లలతో స్నేహం చేసే చెర ప్రభావం ఆ సభల్లో పుస్తకాల దుకాణం దగ్గర కూచున్న నా మీద పడడం చాల సహజంగా జరిగింది.

ఆ సభలు జరిగిన రెండు మూడు రోజులకే ఒక రోజు పొద్దున్నే ఇంటికి వచ్చిన పోలీసులు మామయ్య (వరవరరావు) ను అరెస్టు చేసి తీసుకుపోయారు. అదే సమయంలో హైదరాబాదులో చెరను కూడ అరెస్టు చేశారు. అప్పటినుంచీ చెర మా కుటుంబ సభ్యుడే అయిపోయాడు. ఆ నిర్బంధం నెలన్నరలోనే ముగిసింది గాని, మరొక ఆరునెలలకు చెరనూ మామయ్యనూ సికిందరాబాదు కుట్రకేసులో ముద్దాయిలుగా కలిపి పెట్టారు. ఇక ముషీరాబాదు జైలులోనో, మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులోనో చెరను రెగ్యులర్ గా కలుస్తుండేవాళ్లం. కొన్నాళ్లకే చెర బెయిల్ మీద విడుదలై ఎమర్జెన్సీ విధించేదాకా జరిగిన సభల్లో పాల్గొన్నాడు. ఫిబ్రవరిలో హైదరాబాదులో జరిగిన రాడికల్ విద్యార్థి సంఘం మొదటి మహాసభల నాటికి జైలులో ఉన్నాడో విడుదలై పాల్గొన్నాడో గుర్తు లేదు గాని, ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో జరిగిన నాలుగైదు ఆర్ ఎస్ యు సభలకు ఉపన్యాసకుడిగా వచ్చాడు. ఏప్రిల్ లో తెలుగు మహాసభల దగ్గర శ్రీశ్రీతో పాటు నిరసన ప్రదర్శన జరిపి అరెస్టయ్యాడు. ఆ తర్వాత ఎమర్జెన్సీ రెండు సంవత్సరాలూ జైల్లో, కోర్టుల్లో కలవడమే.

ఎమర్జెన్సీ తర్వాత చెర బతికింది సరిగ్గా ఐదు సంవత్సరాలు, అందులోనూ రెండు, రెండున్నర సంవత్సరాలు ఆస్పత్రులలోనే ఉన్నాడు. మిగిలిన కాలమంతా ఎన్నో చోట్ల ఎన్నో సభల్లో కలుసుకుంటూ ఉండేవాళ్లం. 1979లో మా బాపును తీవ్రమైన లివర్ సంబంధిత సమస్యతో గాంధీ ఆస్పత్రిలో చేర్చి, పది పదిహేను రోజులు ఉన్నప్పుడు చెర కూడ ఆపరేషన్ కోసం అక్కడే ఉన్నాడు. అప్పటికే రాయడం మొదలుపెట్టిన నాకు ఆయన ఇచ్చిన ప్రోత్సాహం, నా కలం పేరు మీద ఆయన వ్యాఖ్య, ఆ గొంతు నా చెవుల్లో ఇప్పటికీ ధ్వనిస్తూనే ఉంది.

చెర జీవితం గురించి తలచుకున్నప్పుడల్లా ఆ విస్తృతీ, వైవిధ్యమూ చూసి చాలా ఆశ్చర్యం వేస్తుంది. బతికినది నిండా ముప్పై ఎనిమిదేళ్లు కూడా కాదు. అందులో మూడు సంవత్సరాలు జైలుకూ మూడు సంవత్సరాలు అనారోగ్యానికీ, ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగిస్తే ఆర్థిక ఇబ్బందులకూ, కేసులకూ పోతే, పదిహేను సంవత్సరాలు సాహిత్య, సామాజిక జీవితానికి ముందరి వ్యక్తిగత జీవితానికి పోతే ఆయన సాహిత్య, సామాజిక జీవితానికి మిగిలింది అటూ ఇటూగా పదిహేనేళ్లు మాత్రమే. కాని ఆ స్వల్ప కాలంలోనే ఆయన రెండు సాహిత్య ఉద్యమాలకు ప్రధాన భాగస్వామి అయ్యాడు. ఏడు కవితా సంపుటాలు అచ్చు వేశాడు, ఒక డజను దాకా కథలు రాశాడు. మరో డజను నాటికలు, నాటకాలు రాశాడు. మూడు నవలలు రాశాడు. ఒక అసంపూర్ణ నవల వదిలిపోయాడు. ఉపన్యాసాల కోసం, కవితాపఠనం కోసం రాష్ట్రమంతా తిరిగాడు. విప్లవ రచయితల సంఘానికి ఒక సంవత్సరం కార్యదర్శిగా పనిచేశాడు. హైదరాబాదులో విప్లవోద్యమానికీ, విప్లవ విద్యార్థి యువజనోద్యమాలకూ, జననాట్యమండలికీ పెద్దదిక్కుగా ఉన్నాడు.

ఈ పనులన్నీ కూడ ఏదో చేశాడంటే చేశాడన్నట్టు కాకుండా మనసు పెట్టి చేశాడు. శ్రద్ధగా చేశాడు. తెలుగు పండిత శిక్షణ పొంది, ప్రాచీన సాహిత్యం చదువుకున్నా, పాఠాలు చెప్పినా, వచన కవిత్వం మీద పట్టు సాధించాడు. ఎప్పటికప్పుడు వస్తుశిల్పాలను పదును పెట్టుకున్నాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని 1969లో వ్యతిరేకిస్తూ కవిత రాసినవాడే, 1972 నాటికి తన ఆలోచనలోని పొరపాటు గ్రహించి తెలంగాణ ఆకాంక్షలను సమర్థిస్తూ కవిత రాశాడు. నిరంతర సాధనతో తన వస్తువులను తానే మార్చుకున్నాడు. వస్తువు ఎంపికలో వైవిధ్యం సాధించాడు. అప్పటికి విప్లవ సాహిత్యోద్యమం కూడ సంకోచించిన అంశాలను వస్తువులుగా తీసుకుని రచన చేశాడు. వచన కవితా రూపంతో తన లక్ష్యం నెరవేరదనుకున్నప్పుడు తనను తాను మార్చుకుని పాట వైపు పయనించాడు. తన పాటలు తానే పాడాడు. నిర్బంధంలో చేతికి సంకెళ్లతో కోర్టుకు తీసుకు వస్తున్నప్పుడు అప్పటిదాకా విప్లవకారులకు, విప్లవ రచయితలకు అలవాటైన నినాదాల స్థానంలో సంకెళ్ల దరువుతో కవితా పాదాలు అల్లడం మొదలుపెట్టాడు. అలా రాసిన ఏడెనిమిది పాటల్లో ప్రతి చరణమూ ఆ తర్వాత విప్లవోద్యమ ఊరేగింపులలో నినాదంగా మారింది.

ఆలోచిస్తుంటే చెర కవిత్వం గురించీ, కవిత్వ శక్తి గురించీ, జీవితం గురించీ ఇప్పటికి చాలమంది చాలా చెప్పి ఉన్నప్పటికీ ఇంకా అన్వేషించవలసిందీ, వివరించవలసిందీ, విశ్లేషించవలసిందీ ఎంతో మిగిలి ఉన్నదనే అనిపిస్తున్నది.

అవును, చెరస్మరణ చిరస్మరణీయం.

—ఎన్.వేణుగోపాల్

 

ఇప్పటి నేల రూపాలు

నేల  ఇప్పుడు రూపాలు తెంపు కుంటుంది

ఒక్కో మనిషి కథని తనలోనే దాచుకొని
పునర్జీవనమే తెలీని దాని మల్లే
రక్త దీపార్చనల జాతర జరుపుకుంటుంది
నింగికి ,నేలకు ఇప్పటిది కాదు వైరం
ఆత్మ మాయని జార విడిచినప్పటి నుండి ..
నిజం
స్వాపికుడి దేహాన్ని వదలి
ఆత్మ అర్ధంతరంగా వెళ్లి పోతుంది
రైతు ఇప్పుడు
పొలం చుట్టూ తిరుగుతున్న దీపం పురుగు
మట్టిలోనే వూరబెట్టుకున్న దేహాలు
మట్టి మయమై పోయి మరణం లోకి ఎగిరి పోతున్నాయి
కలలన్నీ దుఖం తో నిండి పోయి
తల పాగా గాలిలో విదిల్చిన ప్రతి సారీ
కన్నీళ్ళే రాలి మొలకెత్తుతున్నాయి
బ్రతుక్కీ ,జీవితానికీ సమన్వయం కుదరనప్పుడు
మరణం ఒక్కటే కదా మిగిలిన దారి
మరణం ఎప్పుడూ తెరచి ఉంచిన
ఒక దీర్ఘ వాకిలి ….
తన,మన తేడా చూపక
ప్రాణ స్థితుల సౌందర్యాన్ని విచ్చినం చేసి
దుఃఖ గానాన్ని ఆవిష్క రింప చేస్తుంది ….
ఏదీ ఆకుపచ్చటి నేల ?
మృత్యు దీక్ష పట్టినట్లు ఎర్ర ఎర్రగా మారి
శ్రామిక జననాల రోదనని
గర్భ చీకట్లలో దాచుకుంటుంది …
ఇంత జరిగినా మట్టిబొమ్మ కదుల్తూనే వుంది
పుస్తె లమ్మినా అలంకార దాహంతీరని నేలకి మొక్కి
మట్టిబొమ్మ ముక్కలవుతూ కూడా కదుల్తుంది …!!