శిశిరరేఖ

 

 

– ప్రసాద్  బోలిమేరు

~

ఓ పక్క
రాగాలు
పండుటాకుల్లా రాలి తేలుతుంటే
ప్రతికొమ్మా ఓ వాయులీనమే
వెర్రెక్కిన గాలికుంచెకు నేలనేలంతా
రాగక్షేత్రమే
 
మరోపక్క
వగరెక్కిన మోహం
పాటలపులకింతగా
రెమ్మరెమ్మా ఓ సింగారగానం
 
కాదా?
ఈ రుతువుల స్వరమేళనం
పురాతనగేయపునర్నవీకరణం
పులకరిస్తున్నప్రాణానుకరణం
పురిటినొప్పుల బృందగానం
 
ప్రతి సీతాకోకచిలుకా
నిలకడ లేని ఓ వన్నెల ఆలొచనే
రేపటివిత్తుని మోసుకెళ్తున్న
ఓ పరాగరేణువే
ప్రతి ఫలమూ ఓ పువ్వు ధ్యానమే

ప్రతి ఆరాటం
వీడుకోలు, ఆహ్వానాల సంయోగం
శిశిర పవనాల నీడ
వసంత కవనాల జాడ
చూలాలి బుగ్గ మీది

తీపి ఏడుపు చార.

నిన్నటి విషాదగానం గుర్తులేకుంటే
రేపటి నిషాద గీతాన్నెలా గుర్తుపట్టాలి?

*

మీ మాటలు

  1. chandolu chandrasekhar says:

    మీ కవిత ప్రక్రుతి వర్ణమాల .ప్రతి సీతాకోకచిలుక .నిలకడ లేని వన్నెల ఆలోచనే .మంచి భావన , అనాదిగా ప్రకృతి కి మనిషి విడదీయరాని రాగబంధం .ముగింపు కొంచెం contradict వుంది ,నిన్నటి విషాదం రేపటి నిషాద మైతే గతించిన చీకటి యుగమేగా

  2. Bhavani Phani says:

    పురాతనగేయపునర్నవీకరణం!! ఎంతో బావుంది

  3. శ్రీనివాసుడు says:

    ‘‘ప్రతి సీతాకోకచిలుకా
    నిలకడ లేని ఓ వన్నెల ఆలొచనే’’ – చాలా బాగుంది.

  4. narayana swamy says:

    ప్రతి ఆరాటం
    వీడుకోలు, ఆహ్వానాల సంయోగం
    శిశిర పవనాల నీడ
    వసంత కవనాల జాడ
    చూలాలి బుగ్గ మీది

    తీపి ఏడుపు చార.

    నిన్నటి విషాదగానం గుర్తులేకుంటే
    రేపటి నిషాద గీతాన్నెలా గుర్తుపట్టాలి?

    చాలా బాగుంది కవిత – అభినందనలు ప్రసాద గారూ

మీ మాటలు

*