మన లోపలి మరో ప్రపంచం 

భవాని ఫణి 
bhavani-phani.

మన శరీరంలో అతి క్లిష్టమైన భాగం ఏమిటంటే , మెదడని ఠక్కున చెప్పేస్తాం . సాంకేతికంగా ఇంత అభివృద్ది సాధించినా మెదడు లోపల ఏం జరుగుతుందో , ఎలా జరుగుతుందో తెలుసుకోవడం కోసం మనిషి ఇంకా శ్రమిస్తూనే ఉన్నాడు . ఒక్కోసారి మన ప్రవర్తనా విధానం మనకే అంతు పట్టదు . ఒకేలా ఉండే సందర్భాల్లో వేరు వేరుగా ప్రతిస్పందిస్తూ ఉంటాం. మనమేం కోరుకుంటున్నామో మనకే అర్థం కాదు. అది అర్థం చేసుకోగలిగిన మనిషి , మనిషెందుకవుతాడు, మహర్షి అయిపోతాడని సర్ది చెప్పుకుంటాం .

అసలు మనిషి కోరుకునేది ఏమిటి? ఆహారమా?  ధనమా? పేరు ప్రతిష్టలా? ఆరోగ్యమా ? సుఖశాంతులా ? లేక అన్నీనా ? అసలు ఎందుకు ఇవన్నీ ? సంతోషంగా ఉండటం కోసమే కదా!  సంతోషమే లేనప్పుడు ఎన్నున్నా వృధానే అనుకుంటాం . అది నిజమేనా? మరి మనిషి లోపల ఉండే మిగిలిన భావనల మాటేమిటి? విషాదం , కోపం, చిరాకు , భయం ….. వంటి లక్షణాలు మన వ్యక్తిత్వంపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయి?  అటువంటి భావాలకి రూపం ఇస్తే అవి ఎలా ఉంటాయి? ఇలా మనకి కలిగే అనేక సందేహాలకి సమాధానాలు వెతికే ప్రయత్నం చేసింది ఈ యానిమేటెడ్ చలన చిత్రం . ప్రతి సన్నివేశంలోనూ అంతర్లీనమైన సందేశాన్ని ఇమిడ్చి రూపొందించిన  పిక్సార్ వారి మరో ఆణిముత్యం  ఇన్ సైడ్ అవుట్ (Inside Out -2015).

తన టీనేజ్ కుమార్తె ప్రవర్తనా విధానంలో కలిగిన మార్పుల్ని గమనించిన పీట్ డాక్టేర్ అనే వ్యక్తి ఈ అత్యద్భుతమైన యానిమేటెడ్ చిత్రాన్ని రూపొందించి దర్శకత్వం వహించాడు .  మన మెదడు ఒక పెద్ద భవంతి అనుకుంటే , లోపల నివసించే భావనలన్నీ మన ఆలోచననీ , నడవడికనీ,  ప్రవర్తననీ నియంత్రిస్తూ ఉంటే వాటి మధ్య జరిగే సంఘర్షణ ఎలా ఉంటుంది ? ఆ ఘర్షణ కారణంగా  మన వ్యక్తిత్వంలో, బాహ్య ప్రవర్తనలో  కలిగే మార్పులు ఎలా ఉంటాయి? అనే అంశాలని ఎంతో నిశితంగా పరిశీలించి, పరిశోధించి ఈ చిత్రానికి ప్రాణం పోసింది చిత్ర నిర్మాణ బృందం  . మెదడు నిర్మాణం , పని తీరు గురించి సమగ్రంగా తెలుసుకోవడం కోసం అనేకమంది మానసికశాస్త్ర నిపుణుల సహాయం తీసుకున్నారు . అలాగే చిత్రంలోని ముఖ్య పాత్ర పదకొండేళ్ల  అమ్మాయి కావడంతో , పదకొండు నుండి  పద్ధెనిమిది సంవత్సరాల వయసుగల ఆడపిల్లలతో మాట్లాడి వాళ్ల భావనల్ని గమనించి సమీక్షించారు.

ఆ అమ్మాయి పేరు రైలీ .  ఆ పాప పుట్టుకతో కథ ప్రారంభమవుతుంది . ఆమె బాహ్య ప్రవర్తననీ , మెదడు లోపలి కార్యకలాపాలనీ మనం  ఏకకాలంలో చూడగలుగుతాం.  .రైలీ పుట్టగానే ఆమె మెదడులోజాయ్(సంతోషం) ఏర్పడుతుంది . జాయ్ రైలీ ప్రవర్తనని నియంత్రిస్తూ ఉంటుంది  ఇంతలో విషాదం కూడా ఆమెకి తోడవుతాడు . వాళ్లిద్దరూ కలిసి ఆ పాపని నవ్విస్తూ ఏడిపిస్తూ ఉంటారు . మొదట్లో ఉన్నవి ఆ రెండు భావనలే . .

మెల్లగా పాప నడవటం మొదలు పెట్టేసరికి వాళ్లతో భయం వచ్చి కలుస్తాడు . అతను రైలీని  ప్రమాదాల బారిన పడకుండా కాపాడుతూ ఉంటాడు . పెరిగే కొద్దీ మరో భావన చిరాకు కూడా వస్తుంది . దాని వెనకే కోపం వస్తాడు .  పదకొండేళ్ల వయసు వచ్చేసరికి రైలీలో ఈ ఐదు భావనలూ ఏర్పడి, తమ తమ పనులు చేసుకుంటూ ఉంటాయి(రు) . కానీ ప్రధానంగా పాప ప్రవర్తన మీద పట్టు కలిగి ఉన్నది మాత్రం జాయ్ నే . ఆమెకి పాపలో విషాదం ఎందుకున్నాడో అర్థం కాదు . వాడు పాపని బాధపెడతాడని జాయ్ భయం . అందుకే వాడిని నియంత్రణ యంత్రాలకి , జ్ఞాపికా గోళాలకీ దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది . ప్రతి రోజూ వందలకొద్దీ జ్ఞాపికా గోళాలు తయారై, రోజు పూర్తయ్యే సమయానికి కోర్ మెమొరీకి జతకూడుతూ ఉంటాయి . రోజు వారీ పనులకి అవసరం లేని జ్ఞాపికా గోళాలు, దీర్ఘకాలిక జ్ఞాపికా గదుల్లోకి(long term memory) చేరిపోతూ ఉంటాయి .ఇక ఎందుకూ  పనికి రాని, పాతబడిన  జ్ఞాపకాలు వ్యర్థాలుగా నాశనం చేయబడతాయి.

insideout original

ఇలా అంతా సవ్యంగా నడిచిపోతున్న సమయంలో రైలీ జీవితంలో ఒక మార్పు సంభవిస్తుంది . ఆమె కుటుంబం మరో ప్రాంతంలో నివసించడానికి వెళ్లాల్సివస్తుంది . అక్కడి కొత్త వాతావరణం, కొత్త స్కూల్ ఆమెని , ఆమెలోని ఐదు భావనల్నీ అయోమయానికి గురి చేస్తాయి . అనుకోకుండా విషాదం కొన్ని జ్ఞాపికా గోళాల్ని ముట్టుకోవడంతో రైలీని విషాదం ఆవహించి, స్కూల్లో అందరిముందూ ఏడ్చి అవమానపడుతుంది . జాయ్ పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేస్తుండగా ఆమె , విషాదంతో  కలిసి లాంగ్ టర్మ్ మెమరీ గదుల్లోకి జారిపడిపోతుంది . ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ లో ఉన్న భావనలు భయం , చిరాకు, కోపం . అంటే రైలీలో ఆ భావనలు తప్ప  సంతోషం, విషాదం ఉండవు . ఆ స్థితి ఆమె ప్రవర్తనలో విపరీతమైన మార్పుని తీసుకొస్తుంది .
ఓ పక్క  జాయ్,విషాదంతో కలిసి హెడ్ క్వార్టర్స్ చేరుకునే ప్రయత్నం చేస్తుంటుంది . కానీ అక్కడ కోపంచేతిలో నియంత్రణ  ఉండటం వల్ల అప్పటివరకు ఆమెలో ఏర్పడి ఉన్న వ్యక్తిత్వ ద్వీపాల్లో (personality islands ) స్నేహితుల ద్వీపం , నిజాయితీ ద్వీపం , తుంటరితనపు(goofy )ద్వీపం , హాకీ(ఆమెకిష్టమైన ఆట) ద్వీపం అన్నీ నాశనమవుతాయి . ఇక మిగిలింది కుటుంబ ద్వీపం ఒక్కటే . ఆ సమయంలోనే కోపం, ఆమెలో ఇల్లు వదిలి వెళ్లిపోవాలనే ఒక ఆలోచన (ఐడియా) ప్రవేశపెడతాడు . ఆ కారణంగా రైలీ ఇల్లు విడిచి వెళ్లిపోతుంది.
లోపలి గదుల్లో ఉన్న జాయ్ ఎన్నో కష్టాలు పడుతూ చివరికి హెడ్ క్వార్టర్స్ చేరుకుంటుంది . ఆ క్రమంలో విషాదంఉపయోగం ఏమిటో కూడా తెలుసుకుంటుంది . చివరగా అతనికి  నియంత్రణ బాధ్యతని అప్పగిస్తుంది . అప్పుడు రైలీ భావోద్వేగానికి గురై  తిరిగి మానసికంగా సాధారణ స్థితికి  చేరుకుంటుంది .  అప్పటినించీ భావనలన్నీ కలిసికట్టుగా రైలీ వ్యక్తిత్వాన్ని నియంత్రిస్తూ ఉంటాయి . ఆమె ఎదిగే కొద్దీ మరెన్నో భావనలు కూడా వాటికి జత కలుస్తూ ఉంటాయి . ఇదీ క్లుప్తంగా కథాశం . మన ప్రవర్తననీ, లోపల కలిగే భావాల్నీ ఈ చలన చిత్రంలో చక్కగా సమన్వయపరిచి చూపారు  . ఏ భావనకి ఉండే గొప్పతనం , స్థానం దానికి ఉండాలనీ , వాటి పాళ్లు ఎక్కువా తక్కువా అయితే అప్పటివరకు  మన లోపల నిర్మితమై ఉన్న భావోద్వేగాల ప్రపంచం నాశనం అయిపోతుందనీ తెలియజేసారు .

అంతేకాక లోపలి గదుల్లో జాయ్ కి ఎదురయ్యే, రైలీ ఊహత్మక నేస్తం ‘బింగ్ బాంగ్ ఏనుగు’ , ఆమె ఊహత్మక ప్రపంచం , కలల్ని చిత్రీకరించి ప్రదర్శించే బృందం , ఆమె కోసం ప్రాణాలిచ్చే ఊహత్మక స్నేహితుడూ  అందరూ కలిసి ఎవరి లోపల వాళ్లు నిర్మించుకునే మరో ప్రపంచాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరింపజేస్తారు.  లోపల జరుగుతున్న విషయాలనీ, బాహ్య ప్రవర్తననీ అలా పోల్చి చూడటం ఒక గమ్మత్తైన అనుభూతిని కలిగిస్తుంది . ఇలా భావనల్ని మనుషుల రూపంలో చూపడం వల్ల, ఆ భావనల భావ వ్యక్తీకరణని నిర్వచించడం కత్తి మీద సామే . ఉదాహరణకి పేరులోనే సంతోషాన్ని కలిగి ఉన్న జాయ్, బాధ కలిగే సన్నివేశాల్లో ఎలా స్పందిస్తుంది? తాకిన ప్రతీ జ్ఞాపకాన్నీ విషాదమయం చేసే విషాదం , ఆనందం కలిగితే ఎలా ప్రవర్తిస్తాడు వంటి విషయాలని మనం  ఆసక్తితో గమనిస్తాం . ఇది పిల్లల కంటే పెద్దలకే అర్థవంతంగా అనిపించే , సంతృప్తి కలిగించే చలన చిత్రం .  ఒక్కసారే కాకుండా చూసే కొద్దీ కొత్త కొత్త విషయాలు అర్థం అవుతున్నట్టు అనిపించడం  దీనిలోని ప్రత్యేకత.  ఈ 3D యానిమేటెడ్ చలన చిత్రం, పిక్సార్ యానిమేటెడ్ స్టూడియోస్ ద్వారా నిర్మితమై వాల్ట్ డిస్నీ పిక్చర్స్ సంస్థ ద్వారా విడుదల చేయబడి విజయవంతంగా ప్రదర్శితమవుతూ విమర్శకుల మన్ననలు పొందుతోంది.

.

ఆ ఊహే నిజమైతే…బాహుబలి!

మోహన్ రావిపాటి 

 

పెరట్లో నులక మంచం పడుకొని  మీద నాన్న చెప్పే రాజకుమారుడి కథ వింటూ , చుక్కలు చూస్తూ , ఆ చుక్కలు దాటుకుంటూ మనం నిర్మించుకున్న ఊహాలోకం లో పాత్రలన్నీ ఒక్కసారి  కళ్ళముదు మెదిలితే తట్టుకోగలమా !!

“అనగనగా రాజుగారు, ఆ రాజు గారి మీద ఆయన తమ్ముడి కుట్ర, రాజుగారికి కి పుట్టిన బిడ్డ ను అడవిలో వదిలేస్తే. ఒక పేదరాసి పెద్దమ్మ, ఆ బిడ్డడ్ని పెంచి పెద్ద చేస్తే, ఆ బిడ్డ పెరిగి ప్రజా కంటక పరిపాలన చేస్తున్న బాబాయి తో యుద్దం చేసి   చంపి ప్రజలందరికి సమ్మకమైన పరిపాలన ఇవ్వటం “ ఎంత చిన్న కథ ?? కానీ నాన్న ఇలా చెప్పాడా !! లేదే !!

ఆ రాజ్య సౌందర్యం, అక్కడి ఉద్యానవనాలు, రాజభవనాలు, హంసతూలికా తల్పాలు, , వింజామర వీచికలు,ఒక్కటా….. రెండా !! నాన్న చెప్తుంటే ఆ రాజ్యం నా కళ్ళముందు నేను నిర్మించుకున్న ఊహాలోకంలో మొత్తం కనిపించేది, కానీ దాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా నిజ జీవితంలో  చూడగలనా ! నా ఊహలన్నిటికీ ప్రాణం పోసి నా కళ్ళ ముందు కనిపిస్తుంటే అందులో నేను ఇప్పుడు ఏ భవనం ముందు నుంచోవాలి ?? ఏ ఉద్యానవన విహారం చెయ్యాలి??

దట్టమైన అడవిలో అటు ఇటు పరుగెడుతున్న లేళ్ళు, జింకలు, పురివిప్పు ఆడుతున్న నెమళ్ళు. సెలయేళ్ళు  అంతెత్తు  నుండి కిందకు దూకుతున్న జలపాతాలు,  ఆకాశాన్ని అంటుతున్న కొండలు,  వీటిలో నేను నిజంగా ప్రవేశించినప్పుడు నేను ఏ చెట్టు కింద ఆగుతాను, ఏ సెలయేట్లో స్నానం చేస్తాను ?? ఏ జలపాతం కింద నిలువెల్లా తడుస్తాను ??

రాకుమారుడు కత్తి దూసి పోరాడుతుంటే ఆ అగ్గిరవ్వలకు   గడ్డ కట్టిన హిమనగవులు కరిగి  నేలకు జారుతుంటే నేనక్కడ ఉండగలనా ?? ,పొగరు బట్టిన  అడవి దున్న ను  ఒక్క చేత్తో నిలవరించగల చేవ , తెగువ ఉన్న యువరాజు దాని కొమ్ములు వంచి నేల మీద పడేస్తే రేగిన దుమ్ము నా కంట్లో పడినప్పుడు , నేను నిజంగా కళ్ళు ముయ్యగలనా !!  మదించిన ఏనుగు కుంభస్థలం మీద ఒక్క మోదు మోది దాన్ని నేలకూల్చిన్నప్పుడు నా కళ్ళముందు అంత పెద్ద ఏనుగు ప్రాణాలోదిలేసినప్పుడు, నేనక్కడ నిజంగా ఉండగలనా ??

యుద్ద తంత్రాలను అన్నీ ఔపాసొన పట్టి , యుద్ద యంత్రాల సహాయంతో శత్రువుల మధ్య అగ్నిగోళాలు తో మంటలు మండిస్తుంటే శత్రువుల హాహాకారాలు నా చెవుల్లో వినిపిస్తుంటే , నా నోటి నుండి జయ జయ ధ్వానాలు నిలవిరించుకోవటం నాకు సాధ్యమా !! ఎప్పుడూ ఎవ్వరూ కనీ వినీ ఎరుగని యుద్దవ్యూహాలను అమలు పరచి శత్రువు ను తుదముట్టించే అవకాశం వచ్చి కూడా, తన ప్రజల రక్షించటం కోసం ఒక్క క్షణం ఆగి , మరు క్షణంలో వ్యూహాన్ని మార్చి శత్రువును చంపేసిన రాజకుమారుడు నా కళ్ళముందు నడుస్తుంటే నా రోమాలు నిక్కబొడుచుకోకుండా ఆపటం నాకు సాధ్యమా ??

ఇవన్నీ ఊహాలోకంలో నాన్న చెప్పిన కథ కాదు, నా కళ్ళముందు రాజమౌళి సృష్టించిన ఒక లోకం, ఆయన సృష్టించిన మాహిష్మతి రాజ్యం, దాని చుట్టూ అల్లుకున్న కథ, చందమామ కథ చదవటం చాలా తేలిక, ఆ కథ ను మన ఊహాలోకంలో సృష్టించుకోవటం కూడా తేలికే . కానీ ఆ సృష్టి ని నిజం చెయ్యాలంటే అది రాజమౌళి కే చెల్లింది . భారతీయ సినిమా చరిత్రలో ఇదో ప్రత్యేకమైన సినిమా . ఈ సినిమా విడుదల కు ముందు మూడు రోజులనుండి ఇండియా లో ఏ ఇద్దరు కలిసినా ఈ సినిమా గురించే మాట్లాడుకున్నారు . అంత క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా నిజంగా ఒక అధ్బుతమే .

మాహిష్మతి రాజమాత అయిన శివగామి (రమ్యకృష్ణ) ఒక చిన్న బిడ్డని రక్షించి ఒక గిరిజన తెగకు చెందిన వారికి ఇస్తుంది , అక్కడ పెరిగి పెద్ద అయిన శివుడు (ప్రభాస్ ) ఆ అడవిలో గూడెం పక్కన ఉన్న ఎక్కడో ఆకాశం నుండి పడుతున్నట్లు ఉరికే జలపాతం కేసి చూస్తూ ఆ కొండను ఎక్కాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు . ఒకరోజు ఆ జలపాతం పై నుండి ఒక మాస్క్ ఒకటి కింద పడుతుంది దానితో పైన ఎవరో ఉన్నారు అని నిర్దారించుకొని కష్టపడి ఆ కొండ ఎక్కి అక్కడ అవంతిక (తమన్నా) ని కలుస్తాడు,  తమన్నా కొంత మంది అనుచరులతో కలిసి మాహిష్మతి రాజ్యంలో బందీ గా ఉన్న దేవసేన (అనుష్కా) ను రక్షించాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది, ఆమె ఆశయ సాధన కోసం శివుడు బయల్దేరి మాహిష్మతి రాజ్యానికి వెళ్తాడు

మాహిష్మతి రాజ్యానికి అధిపతి అయిన భల్లలదేవ (దగ్గుబాటి రానా)  చేతిలో బందీగా ఉన్న దేవసేన ను విడిపించుకొనే ప్రయత్నంలో యువరాజు ( అడవి శేష్ ) ను చంపేస్తాడు శివుడు . అదే క్రమంలో శివుడు కట్టప్ప ( సత్యరాజ్ ) కూడా తలపడబోతాడు, కానీ శివుడిని చూసిన కట్టప్ప “బాహుబలి “ అని సంభోధించటంతో ఆగిపోతాడు, .మాహిష్మతి రాజ్య ప్రజలందరూ బాహుబలి ని దేవుడిలా ఎందుకు కొలుస్తారు ?? అసలు ఆ బాహుబలి ఎవరు ?? అన్నది శివుడికి వివరిస్తాడు కట్టప్ప

ఇది సాధారణ కథే , కానీ దాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు అమోఘం, ప్రతి ఫ్రేమ్ అధ్బుతంగా ఉంటుంది, తెరపై సినిమా లా కాకుండా మన కళ్ళముందు జరుగుతున్నట్లు ఉంటుంది . ముఖ్యంగా ఆ జలపాత దృశ్యాలు, రాజ సౌధాలు, యుద్ద దృశాలు ఇంతకు ముందు ఎప్పుడు ఏ ఇండియన్ సినిమాలోనూ చూసి ఉండము, హాలీవుడ్ స్థాయిలో ఉంటాయి, . ఇలా విజువల్స్ తో  మనల్ని రెండున్నరగంటల పాటు కట్టిపడేస్తుంది

నటీనటుల గురించి చెప్పాలంటే, ముందుగా చెప్పుకోవాల్సింది రమ్యకృష్ణ గురించి, రాజమాత గా ఆమె కళ్ళతో నటించిన తీరు అధ్బుతం, ముఖ్యంగా రాజద్రోహి ని ఒక్కవేటుతో చంపిన వెంటనే కనీసం షాట్ కట్ కాకుండా బిడ్డను లాలించిన సమయంలో ఆ రెండు విరుద్దమైన భావాలను ఒకేసారి పండించిన తీరు చూస్తే నిజంగా ఆమె ఎంత గొప్ప నటో మనకు అర్దం అవుతుంది, ఆ తర్వాత చెప్పుకోవాల్సింది సత్యరాజ్ గురించి, రాజు మీద ద్వేషం, రాజ సింహాసనం మీద గౌరవం, అటు ద్వేషాన్ని , ఇటు గౌరవాన్ని రెండిటినీ ఒకరి మీదే చూపించే పాత్ర. అందులో సత్య రాజ్ నటన అధ్బుతం, ఆ తర్వాత రానా, కళ్ళతోనే క్రూరత్వాన్ని చూపించాడు, ఇక ప్రభాస్ అటు శివుడిగా, ఇటు బాహుబలి గా రెండిటి మధ్య వేరియేషన్ స్పష్టంగా చూపగలిగాడు, కాకపోతే వాచకం ఇంకొంచెం గంభీరంగా ఉంటే బాగుండేది,ముఖ్యంగా బాహుబలి పాత్ర కు సరిపడా వాచకం ప్రబాస్ గొంతు కు లేకపోవటం కొంచెం నిరుత్సాహ పరిచేదే . నాజర్ కు ఇలాంటి పాత్రలు కొత్త కాదు, తనకు అలవాటు అయిన పాత్రను తేలిగ్గా నడిపించేశాడు, ఇక అనూష్కా, మొదటి భాగంలో అనుష్కా కి నటించటానికి పెద్ద స్కోప్ లేదు, ఆమె కనిపించేదే ఒక 10 నిమిషాలు, ఉన్నది మూడు డైలాగ్స్,ఇక తమన్నా విషయానికి వస్తే , తమన్నా బాగా నటించలేదు అని చెప్పలేము కానీ, మిగతా వారి నటన ముందు కొంచెం తేలిపోయింది, ముఖ్యంగా కత్తి యుద్దం చేస్తున్నపుడు, ఆ ఆగ్రహం, కోపం కళ్ళలో కనిపించలేదు, దానికి తోడు పర్సనాలిటి కూడా గ్లామర్ హీరోయిన్ కి సరిపోయేదే కానీ ఇలా ఒక వారియర్ కి పనికి వచ్చే పర్సనాలిటీ కాకపోవటం కూడా ఒక కారణం.

ఇక సాంకేతిక విషయాలకు వస్తే ఇది ఖచ్చితంగా హాలివుడ్ లో వార్ సినిమాలతో పోల్చాలి, సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ ఒక వండర్ క్రియేట్ చేశాడు, కళా దర్శకుడిగా శిబూసిరిల్  ఒక అందమైన లోకాన్ని సృష్టించాడు, కీరవాణి హాలీవుడ్ స్థాయిలో నేపధ్య సంగీతాన్ని ఇవ్వలేకపోయినా, అద్భుతంగానే ఇచ్చాడు. పీటర్ హెయిన్స్ పోరాటాలు,సినిమాకు నిజంగా ప్రాణం పోశాయి. యుద్ద దృశ్యాలు, ఆ యుద్ద యంత్రాలు, మహాద్భుతం అని చెప్పాలి,

కాకపోతే ఈ సినిమా రెండు భాగాలు గా ఉండటం, ఇది మొదటి భాగం కావటంతో కథ మధ్యలో ఆగిన ఫీలింగ్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఒక సినిమా ఇంటర్వెల్ వరకు చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, క్యారక్టర్స్,క్యారక్టరైజేషన్స్ , వాటి సెటప్ , ఇవన్నీ అయిపోయి అసలు కథలోకి వెళ్లకుండానే సినిమా అయిపోతుంది , ఇది ప్రేక్షకుడిని కొద్దిగా అసంతృప్తి కి గురి చేసినా, చూస్తున్నంత సేపు మరో లోకంలో ఉంటాడు . పూర్తి కథ తెలియయాలంటే రెండవ భాగం కోసం ఎదురు చూడాల్సిందే,

చిన్నప్పుడు మా నాన్న కూడా అంతే ఒకే రోజు కథ మొత్తం చెప్పే వాడు కాదు, సగం చెప్పి, మిగతా సగం నువ్వు ఊహించు అని చెప్పి, మరిసటి రోజు నా ఊహాలు విని, అప్పుడు మిగతా కథ పూర్తి చేసేవాడు, ఈ సినిమా అయిపోగానే నాకు అదే గుర్తు వచ్చింది ,

అక్కడక్కడా చిన్న చిన్న లోపాలున్నా, ఇది భారతీయ తెరపై ఒక అద్భుతమైన సినిమా అనే చెప్పాలి, అందరూ ఒకసారైనా చూడాల్సిన సినిమా.

*

బూతు కన్నా యమ డేంజర్… ఎస్కేపిజం!

 ‘‘బృహస్పతి’’

 

(తెలుగు సినీరంగంలో పాత ఒరవడి ఒకటి ఇప్పుడు కొత్తగా మొదలైంది. వందల కోట్లపెట్టుబడులకు తోడు అందివచ్చిన అంతర్జాతీయస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో భారీ చిత్రాలను హాలీవుడ్ చిత్రాలకు దీటుగా నిర్మిస్తున్నారు. దీనికి మనం గర్వించాలి. ఈ చిత్రాల కథలు, తీరుతెన్నులను చూసి అప్రమత్తం కూడా కావాలి. 65 ఏళ్ల కిందటే ఈ సమస్యపై ‘‘బృహస్పతి’’ కలంపేరుతో ఒకరు తెలుగు స్వతంత్ర వారపత్రిక(1949 సెప్టెంబర్ 16 సంచిక)లో  కళాక్షేత్రం శీర్షిక కింద రాసిన వ్యాసం ఇది. సేకరణ: వికాస్)

 

చాలా ఏళ్ల క్రితం కొత్తగా మార్క్సిజం అవగాహన చేసుకుంటున్న నా మిత్రుడొకడికి ధర్మసందేహం కలిగింది: ‘‘జన సామాన్యం(అప్పట్లో) నాదియా స్టంటు చిత్రాలు ఎగబడి చూస్తున్నారు గదా, అదే నిజమైన  ప్రజాకళ అనుకోవద్దా? వాటిని అల్పసంఖ్యాకులైన మనవంటి మేధావులు తిట్టటం ప్రజాసామాన్యానికీ వారి అభిరుచులకూ ద్రోహం కాదా?’’

ఈ ప్రశ్నకు నాకు అప్పట్లో తోచిన సమాధానం: ‘‘మేధావులు ప్రజాస్వామ్యాన్ని అభిమానించవచ్చు గాని వారి దారిద్ర్యాన్నీ తక్కువ అభిరుచులనూ అభిమానించనవసరం లేదు. ప్రజాసామాన్యం జీవితంలో అవసరమైన మార్పులు తెచ్చేదెవరు? వారిని అభిమానించే మేధావులే’’

ఇవాళ కూడా ప్రజాసామాన్యం ప్రకటించే తక్కువ తరగతి అభిరుచులు సమస్యగానే ఉన్నాయి. వాళ్లిప్పుడు ‘నాదియా’ స్టంటు చిత్రాలు చూడడం లేదుగాని ‘జానపద’ కుంటి చిత్రాలు చూస్తున్నారు. ప్రజల అభిరుచి అంతేననే సమాధానంతో తృప్తిపడనవసరం లేదు.

కళాభిరుచిలో కూడా ఇతర విషయాలలోలాగే, వ్యక్తి వైఖరీ, సముదాయ వైఖరీ ఉన్నాయి. ఈ తారతమ్యం అర్థం చేసుకోకపోతే, వెనక నా మిత్రుడికి వచ్చినట్లే అనేకమందికి అనేక ధర్మసందేహాలు కలిగి, తప్పుడు సిద్ధాంతాలు ప్రచారంలోకి వస్తాయి- ఇప్పుడు వస్తున్నాయి కూడానూ. ఇటువంటి సిద్ధాంతాలు మచ్చుకు ఒకటి, రెండు మనవి చేస్తాను.

ప్రజలకు నచ్చటమే అభ్యుదయ కళకు గీటురాయిగా పెట్టుకోవడం గురించి ఇంతకుముందే చెప్పాను. ఇంకో సిద్ధాంతమేమిటంటే, మధ్యతరగతి వాళ్ల అభిరుచులు మంచివి కనక, ఆ అభిరుచులను ఏదో విధంగా ప్రజాసామాన్యానికి అంటగట్టి అదే ప్రజాభిరుచి చేయాలని. మరో అభిప్రాయమేమిటంటే ప్రజాసామాన్యానికి కూడా కళలా అని!

ఇటువంటి సిద్ధాంతాలను ప్రతిపాదించేవాళ్లు గ్రహించని విషయమేమిటంటే, ప్రజాసామాన్యానికి కళలతో అవసరం ఉండటమే కాక, కళలను ఆస్వాదించే శక్తి కూడా ఉన్నదని. వారికి లేని శక్తి ఏమిటంటే, ‘‘శిల్పం కోసం శిల్పాన్నీ’’, ‘‘పాండిత్యం కోసం పాండిత్యాన్నీ’’ ఆరాధించటం. మధ్యతరగతి వాళ్ల అభిరుచులలో ఈ రెండు అంశాలూ తప్పిస్తే అవే ప్రజాసామాన్యం యొక్క అభిరుచులు కూడానూ. ఈ వ్యత్యాసం ఉన్నంతమాత్రం చేత ప్రజలకు కళలవసరం లేదని గాని, అవగాహన కావనిగాని భావించనవసరం లేదు. శిల్పనైపుణ్యాన్నీ, పాండితీ ప్రకర్షనూ చూసి ఆనందించటమే కళల యొక్క పరమార్థాన్ని గుర్తించటమని మధ్యతరగతివారు సంతృప్తి చెందనవసరం అంతకన్నా లేదు.

maya mahal

అయితే ఈ  మాట అనుకున్నంత మాత్రం చేత ‘నాదియా’, ‘జానపద’ చిత్రాల సమస్య తేలదు. ఈ చిత్రాలను జనసామాన్యం ఎందుకు ఎగబడి చూస్తున్నారు? శిల్పం గాని, పాండిత్యం గాని లేకపోవటం మించి వీటిలో ఇంకేమైనా ఉందా? లేదు! వీటిని కళాపిసాసతో ప్రజలు చూడడం కూడా లేదు. నిత్యజీవితం దుర్భరమైన ప్రజ తన చుట్టూ ఉన్న సాంఘిక వాతావరణాన్ని మరవడానికి ఈ అభూతకల్పనల శరణుజొచ్చుతున్నది. దీన్ని ‘‘ఎస్కేపిజం’’ అంటున్నాం. కానీ ఇందులో ‘‘ఎస్కేపిజం’’ కన్న కూడా విశేషమైన అంశం ఒకటుంది. అదేమింటంటే వ్యక్తి ప్రేరణలను తృప్తిపరచుకోవటం. ఇది అచ్చంగా ప్రజాసామాన్యం సొత్తు కాదు. ప్రబంధాలలోని పచ్చి శృంగారం ఆప్యాయంగా పఠించేవారంతా కవితా ప్రియత్వంతో ప్రేరేపించబడ్డవాళ్లే ననుకోనవసరం లేదు. అనేకమంది మేధావులు ఈ విధంగా వ్యక్తిగతమైన ఆనందాన్ని పొందుతారు కనక వాళ్లలో నిజమైన కళాపిపాస లేదనటం కూడా తప్పే.

‘‘ఎస్కేపిజం’’ కూడా వ్యక్తిగత ప్రేరణే. దాన్ని మధ్యతరగతివాళ్లు కూడా అలవంబిస్తారు. అయితే కళల ద్వారా ‘‘ఎస్కేపిజం’’ వాంఛించినప్పుడు మధ్యతరగతివాళ్లు శిల్పానికి భంగం రాకుండా చూస్తారు. సామాన్య ప్రజలకు అది అవసరం లేదు.

యుద్ధం జరుగుతున్న కాలంలో ‘‘ఆర్సినిక్ అండ్ ఓల్డులేస్’’ అనే నాటకం అమెరికాలోనూ, ఇంగ్లండులోనూ కూడా అతి విజయవంతంగా నడిచింది. ఆ నాటకంలో ఒక పిచ్చివాళ్ల కుటుంబం ఉంటుంది. వాళ్లలో ఇద్దరు వయసుమళ్లిన స్త్రీలు ఎంతో సద్బుద్ధితో జీవితంలో ఆనందం కోల్పోయిన ముసలి వాళ్లను చేరదీసి హత్యచేసి ఎంతో భక్తిశ్రద్ధలతో వారికి రహస్యంగా ఉత్తరక్రియలు చేస్తూ ఉంటారు. ఈ నాటకంలో శిల్పసమృద్ధికేమీ లోటు లేదుగానీ కళాప్రయోజనం మృగ్యం. అయినా ప్రజలు- అన్ని తరగతుల వాళ్లూ- ఈ నాటకం చూడటానికి వేలం వెర్రిగా ఎగబడ్డారు. యుద్ధకాల జీవితం గురించి మరచిపోవటానికీ, హత్యలు చేసేవాళ్లను చూసి నవ్వుకోవటానికీ ఈ నాటకం మంచి అవకాశం ఇచ్చింది.

ఈ పనినే ప్రస్తుతం ‘జానపద’ చిత్రాలు కూడా చేస్తున్నాయి. ఈ చిత్రాలను మధ్యతరగతి మేధావులు సహించలేకుండా ఉన్నారంటే వారందరూ ‘ఎస్కేపిజం’ కోరనివాళ్లని భావించరాదు. అందులో చాలా మంది ఈ చిత్రాలతో శిల్పసౌష్ఠవం ఉంటే తప్పక ఆనందించగలరు. అందువల్ల, ఏతావాతా, తేలేదేమంటే, కొందరు ప్రాజ్ఞులు ‘జానపద’ చిత్రాలనూ, వాటిని చూసే అల్పసంఖ్యాక ప్రజలనూ తిట్టటానికి నిజమైన కారణం కళాభిమానం కాదు, ప్రజాభిమానమూ కాదు.

కాని ఈ ‘జానపద’ చిత్రాలకు విరుద్ధంగా తీవ్రమైన ప్రచారం జరిగి వీటిని నిర్మూలించవలసిన అవసరం ఉంది. ఇది ప్రజాజీవితాన్ని విధ్వంసం చేసే యుద్ధకాలం కాదు, ప్రజాజీవితం నిర్మాణం కావలసిన కాలం;  ప్రజలు తమ జీవిత సమస్యల నుంచి పరారీ కావలసిన కాలం కాదు, వాటిని దృఢంగా ఎదుర్కోవలసిన కాలం. నైతికంగా తాగుడు ఎటువంటిదో ఈ తుచ్ఛమైన ‘జానపద’ చిత్రాలూ అటువంటివే. వీటి ద్వారా సాంఘిక ప్రయోజనం సాధ్యమవుతుందని ఎంత మతిమాలిన ప్రభుత్వం కూడా అనలేదు. అయినా అసంఖ్యాక ప్రజలు తాత్కాలిక ఆనందం కోసరం ఈ చిత్రాల మీద అంతులేని డబ్బు ఖర్చు చేస్తున్నారు. కాని ప్రభుత్వాన్ని నిషేధించమంటే ఈ చిత్రాలను నిషేధించదు. చిత్రనిర్మాణం ఒక పరిశ్రమ. పరిశ్రమలంటే మన ప్రభుత్వానికి భక్తివిశ్వాసాలు జాస్తి.  పెట్టుబడిదార్ల లాభాలు అతి పవిత్రమైనవి. ప్రజాక్షేమం కన్న పెట్టుబడిదార్ల లాభాలు అత్యంత పవిత్రమైనవి. ప్రభుత్వం గీసిన నీతినియమాల గిరిలో ఉండి చిత్రనిర్మాతలు ఎంత పనికిమాలిన చిత్రాలైనా తీయవచ్చు.

నన్నడిగితే చిత్రాలలో ‘‘బూతు’’ కన్నా ‘‘ఎస్కేపిజం’’ చాలా ప్రమాదకరమైనది. ‘‘ఎస్కేపిజం’’ కాకబోతే ‘‘బూతు’’లో తప్పేమీ లేదు. సినిమా చిత్రాలు చూసే వాళ్లంతా నిన్ననే కళ్లు తెరచిన పసిపాపలు కారు.

చిత్రనిర్మాతల లాభకాంక్షకూ కళాప్రయోజనానికీ ఉన్నది కేవలం బాదనారాయణ సంబంధం. ప్రజలలో ఉండే చైతన్యాన్ని అణచిపెట్టి, వారి మౌఢ్యాన్ని బలపరచే కళలను కళాభిమానులైన మేధావులు తీవ్రంగా నిరసించవలసి ఉన్నది. ఈ పనిని పత్రికలు కూడా దీక్షగా సాగించాలి.

*

 

 

 

 

శ్రావ్యంగా ‘శబ్దిం’చిన సంగీతం 

భవాని ఫణి 
bhavani phani.The Sound of music! 
చలన చిత్రం(1965) చూసినప్పుడు దృశ్యకావ్యం అనే పదానికి నిజమైన అర్థం తెలుస్తుంది . తరం నించి తరానికి ఆస్తిపాస్తులు ఇచ్చినంత ప్రేమగా ఈ చలన చిత్రంపై ప్రేమని కూడా వారసత్వ సంపదగా ఎందుకు అందిస్తారో  అర్థమవుతుంది . ఒక గొప్ప అనుభూతి గుండెల్లో గూడు కట్టుకుని పది కాలాలు పదిలంగా నిలిచిపోతుంది .. సంగీతం ఎంత సౌందర్యవంతమో మరోసారి అనుభవంలోకి వస్తుంది . భావాలకి పదాల రెక్కలు తొడిగి, సంగీత సామ్రాజ్యంలోకి విడిచిపెట్టినప్పుడు వెలువడే ఓ ఆహ్లాదకరమైన స్వేచ్ఛ అనబడే రెక్కల తాలుకూ చప్పుడు రివ్వుమంటూ గుండెల్లోకి దూసుకొస్తుంది .
ఆత్మకథ ఆధారంగా నిర్మించిన చిత్రమైనప్పటికీ కథలో మార్పులు చేసి నాటకీయత జోడించడం వల్ల దీన్ని ఒక కల్పిత కథగా తీసుకోవడమే మంచిది . ఈ చిత్రానికి ఆయువుపట్టు ఇందులోనే పాటలే . ప్రతి మాటా పాటే అయినా కృత్రిమత్వం కనిపించదు. సంగీతమెంత ప్రకాశవంతమో  ,ఆ ధ్వనిహారంలో కుదురుకున్న అక్షరాలు కూడా కలిసికట్టుగా అంతే కాంతివంతంగా మెరుస్తాయి.
మేరియా ఒక సాధారణమైన స్త్రీ .
సన్యాసినిగా మారాలన్న కోరికతో ఒక క్రైస్తవ మఠంలో శిక్షణ పొందుతూ ఉంటుంది .
కానీ ఆమె మనసు, ఆమెని రోజంతా పర్వతాల్లోనే విహరించమంటుంది .
చీకటి పడిపోయి , నక్షత్రాలు వచ్చేసి ఇక చాల్లే వెళ్లెళ్లమంటున్నా
పచ్చని నీడలేవో ఆమెని తమతోనే ఉండి పొమ్మంటాయి.
ఆమె ఆగుతుంది , వింటుంది.
ఆ పర్వతాలు ఏళ్ల తరబడి వాటిలో దాచుకున్న సంగీతాన్ని ఆమెకి వినిపిస్తాయి .
అలా విన్న ప్రతి పాటనీ పాడమంటూ ఆమె హృదయం  మరీ మరీ మారాం చేస్తుంది .
అంతే కాక ఆమె చిన్ని హృదయం పక్షి రెక్కల్లా కొట్టుకోవాలనుకుంటుంది .
కొలనులోంచి వృక్షాల మీదకి ఉదయిస్తానంటుంది.
చిరుగాలి మోసుకొచ్చే చర్చి గంటల చిరుధ్వనికి మెల్లగా నిట్టూర్చమంటుంది.
రాళ్ల పైకెక్కి జారిపడే సెలయేటి ప్రవాహంలా బిగ్గరగా నవ్వుకోవాలంటుంది. .
ఇంకా ఎన్నెన్నో అల్లరి పనులు చెయ్యమని గొడవ చేస్తుంది .  .
అందుకే ఆమెని ఒంటరితనం ఆవరించినపుడు పర్వతాల్లోకి వెళ్తుంది .
మునుపు విన్నవేవో మళ్లీ మళ్లీ వింటుంది .
ఆ సంగీత ధ్వనుల ఆశీర్వాదాలతో ఆమె పాడుతూనే ఉంటుంది .
నిజానికి ఆమె ఎవరు? ఏమిటి ? అనేది మఠంలోని సన్యాసినుల మాట(పాట)ల్లో అయితే  ఇలా అందంగా ఆవిష్కరింపబడుతుంది .
మేఘాన్ని పట్టుకుని ఎవరైనా నేలకి నొక్కిపెట్టగలరా?
ఎవరైనా చంద్రకిరణాన్ని అరచేతిలో ఆపగలరా?
కెరటాన్ని ఇసుక మీద నిలిపి ఉంచగలరా?
మేరియా కూడా అంతే మరి . మరి మేరియా అనే ఈ సమస్యని  ఎలా పరిష్కరించాలి . అందుకే ఆమెని కొన్ని రోజులు మఠానికి దూరంగా ఉంచాలని నిర్ణయించుకుని ఒక కెప్టెన్ ఇంటికి పంపుతారు సన్యాసినులు  . కెప్టెన్ జార్జ్, భార్యని పోగొట్టుకుని తన ఏడుగురు పిల్లలతో కలిసి నివసిస్తూ ఉంటాడు . ఆ పిల్లల సంరక్షణ బాధ్యత స్వీకరించేందుకు ఆమె ఆ ఇంటికి వస్తుంది . ఆ అల్లరి పిల్లల్ని ఆకట్టుకుని మచ్చిక చేసుకుంటుంది .
బాధలోనో , భయంలోనో ఉన్నప్పుడు ఆమె ఏం చేస్తుందో పిల్లలకి ఇలా చెప్తుంది
గులాబీలపై నీటి చుక్కల్నీ, పిల్లిపిల్లల మెత్తదనాన్నీ తలుచుకుంటుందట
ఎప్పుడో కనురెప్పలపైన పడిన మంచు ముత్యాలని మననం చేసుకుంటుందట
వసంత కాలంలోకి కరిగిపోయే తెల్లని శీతలాన్ని స్ఫురణకి తెచ్చుకుంటుందట
తమ రెక్కల మీద చందమామని మోసుకెళ్లే పెద్ద పక్షుల గుంపుని జ్ఞాపకంగా పిలుస్తుందట
…………
అలా ఆమె బాధలో ఉన్నప్పుడు తనకిష్టమైన విషయాలన్నీ గుర్తు చేసుకుంటుందట.
వాళ్ల భయాల్ని పోగొట్టడంతో సరిపెట్టుకోక, ఆనందంగా జీవించడమెలాగో నేర్పుతుంది . తప్పిపోయిన వారి బాల్యాన్ని తెచ్చి మళ్లీ  వాళ్లకే బహుమానంగా ఇస్తుంది. సంగీతంలోని మాధుర్యాన్ని చవి చూపిస్తుంది . అప్పుడొచ్చే  డో-రే-మీ పాట గురించి తెలుసుకోవాలంటే వినడమొక్కటే మార్గం .
ఆ క్రమంలోనే ఎప్పుడో ఆ పిల్లల తండ్రి జార్జ్ తో  ప్రేమలో పడుతుంది . తప్పు చేస్తున్నానన్న భావంతో, తిరిగి మఠానికి వెళ్లి తన సమస్యని  ముఖ్య సన్యాసినితో చెప్పుకుంటుంది .అప్పుడామె, మగవాడ్ని ప్రేమిస్తే దేవుడిని ప్రేమించనట్టు కాదే! అని నవ్వుతుంది . మేరియాకి ఇలా సలహా ఇస్తుంది .
ప్రతి పర్వతాన్నీ ఎక్కాలాట
ప్రతి ప్రవాహంలోకీ దిగి చూడాలట.
ప్రతి ఇంద్రధనుస్సునీ అనుసరించాలట.
ఇవ్వగలిగినంత ప్రేమని కోరుకునే స్వప్నాన్ని చేరుకునేవరకు
తెలిసిన ప్రతి దారిలోనూ నడవాలట .
ఆ పరిష్కారమార్గానికి తృప్తి చెందిన మేరియా, మళ్లీ జార్జ్ దగ్గరికి వచ్చి అతని ప్రేమని కూడా పొందుతుంది . అందుకు కారణం కూడా ఒక పాటలా ఇలా చెబుతుంది .
ఏమీ లేకపోవడంలోంచి ఏమీ రాదట.
తన చెడ్డ బాల్యంలోనో, దుర్భరమైన యవ్వనంలోనో ఏదో మంచి పని చేసి ఉంటుందట.
అందుకే ఆమె అతని ప్రేమని పొందగలిగిందట.
ఆ ప్రేమ ఫలించి వాళ్లు వివాహం చేసుకోవడం. సన్యాసిని కావాలని కలలు కన్న మేరియా, జార్జ్ భార్యగా , ఏడుగురు పిల్లల తల్లిగా మారి  పరిపూర్ణమైన జీవితాన్ని పొందడం చాలా సాధారణమైన కథే . కానీ ఈ చలన చిత్రాన్ని అసాధారణంగా మార్చినవి మాత్రం సంగీతం , సాహిత్యమే . ఆ సంగీత ప్రవాహంలో మునకలు వేస్తూ, మధ్య మధ్యలో నీటి బిందువుల్లా వేళ్లసందుల్లోంచి జారిపోయే సాహిత్యపు చల్లదనాన్ని అనుభవించడం ఎంత బాగుంటుందో అనుభవించినప్పుడే తెలుస్తుంది. అలాగే ఫేర్వెల్ పాట , సిక్స్ టీన్ గోయింగ్ ఆన్ సెవెంటీన్ పాట … చెప్పాలంటే ఆసలన్ని పాటలూ అద్భుతం అనేకంటే వాటి గురించి చెప్పడానికి మరో పదం లేదు. అందుకే ఈ శ్రావ్యమైన సంగీతధ్వని, తరంగాల తరగలుగా చాలా కాలం పాటు మన జ్ఞాపకాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది . .

వెల్వెట్ కాని వెల్వెట్ 

లాల‌స‌

 

లాలస

నేనొక రహస్యానికి అందమైన నవ్వు ముసుగు వేశాను ప్రియా, బహరూపియా…

 ఈ అందమైన పాట ఇద్దరు హింసా పీడితుల గుండె చప్పుడులా వినపడుతుంది బాంబె వెల్వెట్ లో. సినిమా కూడా అందమైన ముసుగు లాంటిదే. బహరూపియా లా ( మారు వేష కత్తె లేదా మారువేషగాడి)లానే ఉంటుంది.  పరికించి చూడకపోతే ఈ సినిమాలోని  అసలు రహస్య‌మైన  క్రాప్టింగ్, కథనంలో తొణికిసలాడే కవిత్వమే కనపడదు. 60 ల నాటి బొంబాయి నైట్ లైఫ్, నేర ప్రపంచానికి ఒక ఒపెరా లాంటి చిత్రరూపమది. అందుకే సినిమా మేకింగ్ చర్చల్లో, కళాత్మకతకు ప్రామాణికతలు నిర్దేశించుకునే పెంచుకునే క్రమంలో.. ఇవాళ కాదు రేపైనా noir తరహా సినిమాల ఒరవఢిలో ఒక కీలకమలుపుగా ఉండిపోతుంది. 

కథ ఏమీ లేదు అనిపించవచ్చు రెండు ముక్కల్లో చెబితే.

ఇందులో ఒక్కరంటే ఒక్క‌రు  కూడా మర్యాదస్తులు కారు.  కనీసం సగటు మానవులూ కారు. హింసతోనో,  ప్రతిహింసతోనో  తమ భౌతిక లక్ష్యం చేరడానికి  హత్య, మోసం, కుట్ర, ఛిద్రం ఏదైనా చేయడానికి సిద్ధమయ్యే వారే. ఇక్కడ నైతిక‌తకు తావు లేదు. డబ్బు, హోదా, అధికారం నిచ్చెన ఎలాగైనా ఎక్కాల‌నే  అరాటమే వారి ఆత్మ‌. ఇక పాత్రలకు వస్తే  , నేర ప్రపంచం అంచుల్లోబాల్యం చితికిపోయిన వాడు  బాక్సర్ బలరాజ్ ( రణబీర్ కపూర్).  జీవితంలో బిగ్ షాట్ కావాలంటే గన్ షాట్లు త‌ప్ప‌వ‌నుకునే వాడు.   నేరస్తులు తన కుటుంబాన్ని మింగేస్తే పెద్ద పాటకత్తె కావాలనుకుని బొంబాయికి ఒంటరి గా వచ్చిన అందమైన గులాబీ లాంటి జాజ్ సింగర్ రోజీ (అనుష్క శ‌ర్మ‌)..  రోజీ కోసం ఎన్ని తూటాలన్నా పేల్చడానికి సిద్దమయ్యేంత వివశత్వం బలరాజ్కి.  తన వ్యాపార సామ్రాజ్యాన్ని నల్ల బజారులో, రియల్ ఎస్టేట్లో విస్తరించాలనుకునే క్రూరమైన అందమైన వ్యాపారి కంబట్టా ( కరణ్ జోహర్),  కంబట్టా పెట్టుబడి దారు ప్రతినిధి అయితే అతని ప్రత్యర్ధి కమ్యూనిస్టు ప్రతినిధి…. ఈ ఇద్దరు పెద్ద తలకాయల ఉచ్చులో  వేడినెత్తురు బలరాజ్, నిశ్బబ్దం ఖంగుమనిపించే రోజీ చిక్కుకుంటారు.

 చిన్న కథే. కానీ నేర ప్రపంచంలోనూ అంతరాలు ఉంటాయి.లక్ష్యం, కాంక్షా ఒకటే కావచ్చు కానీ  అక్క‌డ కూడా  కొందరు పాత్రధారులైతే మరి కొందరు సూత్రధారులౌతారు. పాత్రధారులు సూత్రధారులవ్వానుకుంటే నెత్తురు ఏరులై పారుతుంది. నీ నేర ప్రపండానికి నేను  కేవలం పాత్రధారును కాదు నాకు కూడా కాస్త వాటా ఇమ్మని బలరాజ్ కంబట్టాను అడుగుతాడు ఒకసారి. కంబట్టా  ఏమీ మాటాడడు.. గది నుంచి బయటకు వచ్చి విరగబడి నవ్వు కుంటాడు. ఈ నవ్వులో మర్మం మీకు అర్ధం అయితే ఈ సినిమా అర్ధమైనట్లే. 

 సినిమాను నేరం, హింస, సంగీతం ఒకదాని తరువాత ఒకటి నిశ్శబ్దంగా ఆవిష్కరించుకుంటే పోతూ ఉంటాయి. కథ బొంబాయిలోని ప్రముఖ వాణిజ్య కేంద్రం నారిమన్ పాయింట్ ఎలా ఏర్పడింది, రియల్ ఎస్టేట్ కుంభకోణాలు, టాబ్లాయిడ్ యుద్ధాలు మధ్య నడుస్తుంది, కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా ఎటువంటి మెలోడ్రామా లేకుండా ( ఘనత వహించిన మన రాంగోపాల్ వర్మ గారి మార్కు మెలోడ్రామా అసలే లేదు)  ఇందులో మిమ్మల్ని ఉత్కంఠకు గురి చేసే వేగం ఉండదు, పగలబడే హాస్యమూ లేదు, వేడెక్కించే రొమాన్సూ లేదు. అసాధారణ స్థాయి అందుకోవడానికి నేరం నుంచి బయలు దేరిన అందరినీ చివరకు  నేరమే తరముకుంటూ ఎలా వస్తుందో చూడవచ్చు. ఒక కవితాత్మక న్యాయంతో సినిమా ముగుస్తుంది. 

Bombay-Velvet

కథనం లో నిదానం భరించే ఓపిక లేకపోతే మీకు నచ్చకపోవచ్చు ఒకసారి ధియేటర్ వెళ్ళాక కూడా సినిమా మిమ్మల్ని పట్టుకునే ఉంటుంది అని డైరెక్ట‌ర్ అనురాగ్ కాశ్య‌ప్ సినిమా ఫ్లాప్ త‌రువాత అన్న మాట   ముమ్మూటికీ నిజం. జ్ఞాన్  ప్రకాష్ రాసిన ముంబై ఫాబుల్స్ పుస్తకం ఆధారంగా తీసిన ఈ సినిమా గురించి ఇలా చెప్పుకోవచ్చు.కొన్ని నవలలకు గొప్ప విజువల్ అప్పీలు ఉంటుంది. వాటిని చదువుతుంటే ఒక మంచి సినిమాలోని దృశ్యాలు ఒక దాని తరువాత ఒకటి మన కళ్ళ ముందున్నట్లు ఉంటుంది. కానీ చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఏదైనా సినిమాను  చూస్తే గొప్ప శిల్పంతో అత్యంత సూక్ష్మ వర్ణనతో రాసిన నవలలోని పుటల్లా అనిపిస్తుంది. బాంబే వెల్వెట్ అలాంటి అరుదైన పుస్తకం లాంటి సినిమా.

 ఇందులో  లోపాలు లేవ‌నీ కాదు. ఉన్నాయి. ఒక శిల్పం చెక్కుకుంటూ వెళ్ళిపోయినట్లు ఉంటుంది. ఏ పాత్ర‌నీ,  ఏ స‌న్నివేశాన్నిఇంక‌నివ్వ‌దు. ప్రేమ‌, నేరం స‌హా ఏ భావాభినేశం కూడా  మ‌న‌కి ఎక్కేలోపే ఇంకో స‌న్నివేశం వ‌చ్చేస్తుంది. బ‌హుశా చాలా మందికి న‌చ్చ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మూ అదే. కానీ అదో శిల్పంలా చూస్తే న‌చ్చ‌నూ వ‌చ్చు. అస‌లు విష‌యం ఏమిటంటే సినిమాను ఆర్ట్ ఫాంగా రాసే వాళ్ళు చేసిన స‌మీక్ష‌ల‌లో  ఎవ‌రూ ఈ సినిమాను చూడ‌ద్దు అన‌లేదు. సినిమా మీద కాకుండా  సినిమా మీద త‌మకున్న అంచ‌నాల‌ను ( సిద్దాంతమూ, రెగ్యుల‌ర్ గా సినిమాల్లో ఉండ‌వ‌ల‌సిన మ‌ర్యాదా మ‌ప్పిత‌మూ) రివ్యూ చేసే  చాద‌స్తం,అజ్క్షానం మంద ఇంట‌ర్నెట్  లో పోగై  అంతా పోగై డిజాస్టర్ అంటూ సమీక్షలు రాసి చంపేశారు. ప్రేమించిన వాళ్ళు ప్రేమించుకోక పెళ్ళెందుకు చేసుకుంటారు? ఏస్ త‌ప్పు ఇది విముక్తి సిద్దాంతానికి వ్య‌తిరేకం అనుకునే చాద‌స్తం మంద కూడా సినిమా రివ్యూలు రాసేసే ఇంట‌ర్నెట్ కాలం మ‌రి. అనురాగ్ కాశ్య‌ప్ భారీ మూల్యం చెల్లించాడు. 

 అయితే కొన్ని సినిమాలకు ప్రేక్షకుల మెప్పు కోసం కాదు కానీ సినిమా మేకింగ్ స్థాయిని పెంచడానికి తరువాత కాలంలో ఉపకరిస్తాయి. వక్త్ సినిమా ( గురుదత్) విడుదలై యాభై సంవత్సరాల పై మాటే. అది కూడా ఆ  రోజు ప్రేక్షకులకు నచ్చలేదు.కానీ సినిమా మీద ఇష్టం ఉన్న సినిమా వాళ్ళని అడగండి వక్త్ సినిమా మాకు ప్రాణం అని చెప్పకుండా ఉండరు. ( దేశమంతా అభిమానించే మణిరత్నంకు వక్త్ సినిమా అంటే చాలా అభిమానం, దాన్నుంచి చాలా  నేర్చుకున్నా అని  చాలా సార్లు చెప్పాడు).

 కాశ్య‌ప్ గురువు వ‌ర్మ అయితే కాసింత అసూయ ప‌డ్డ‌ట్లు ఉన్నాడు. నా సినిమా ప్రేక్ష‌కుల‌కు  న‌చ్చ‌క‌పోయినా ప‌ర్లేదు కానీ అది నా ఫేవ‌రెట్ సినిమా అన్న శిష్యుడిని ట్విట్ట‌ర్ లో మంద‌లించాడు. అహంకారానికి, ఆత్మ విశ్వాసానికీ తేడా ఉంటుంది అని ట్వీటాడు. అంతకు ముందు చాలా సార్లు వ‌ర్మే నా సినిమాలు ఎవ‌రైనా న‌చ్చితే చూడండి లేకుంటే లేదు అన్న‌ట్లు గుర్తు. ఇపుడు హ‌టాత్తుగా ఆయ‌న‌కు విన‌యం గుర్తుకు వ‌చ్చిందంటే అది కితాబే అనే అనుకోవాలి. 

ఇంకా సరిగ్గా చెప్పాలంటే చాలా సార్లు గొప్ప ప్రేమకథలు విషాదాంతాలౌతాయి. బాంబే వెల్వెట్ కూడా అంతే. సినిమా కళతో దర్శకుడి కున్న ప్రేమే ఈ సినిమా అయితే   అది బాక్సాఫీస్ దగ్గర విఫలమైంది. విఫల ప్రేమకథలు కూడా అజరామరాలు, ఈ సినిమా కూడా అంతే..

*

 

ఎవరు “ఉత్తమ్”? ఎవరు విలన్?

మోహన్ రావిపాటి
mohan
త్రేతా యుగం లో  ఉత్తముడు  ఒక లోకంలో , అధముడు (విలన్) మరో లోకం లో ఉండే వారట. ద్వాపరయుగంలో  ఉత్తముడు ,అధముడు (విలన్) పక్క పక్కనే అన్నదమ్ముల రూపంలో ఉండే వారట. ఇప్పుడు కలియుగంలో ఉత్తముడు,(విలన్) ఒకరిలోనే ఉన్నారు . అలాంటి కథ చెప్పే  ప్రయత్నమే ” ఉత్తమ విలన్” .  పరిస్థితులను బట్టి మనిషి లోఉన్న ఈ మంచి చెడు బయటకు  వస్తూ ఉంటాయి . ఇలాంటి ఒక కథ అది కమల్ హాసన్ లాంటి ఇమేజ్ ఉన్న ఒక నటుడు సినిమా ద్వారా చెప్పాలి అనుకోవటం సాహసమే .
కమల్ హాసన్ విభిన్నమైన పాత్రలు పోషించటానికి ఎప్పుడూ సిద్దం గానే ఉంటాడు . ఒక ఇమేజ్ చట్రం లో బందీ కాకుండా తనను తాను ఎప్పటి కప్పుడు కొత్తగా మలచుకోవటం ఆయనకు ఎప్పుడు అలవాటే. అందుకే కమల్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది .ఈ సినిమాకూడా  అలాంటి క్రేజ్ తోనే  విడుదల అయ్యింది .  కమల్ హాసన్ నుండి ప్రతి ప్రేక్షకుడు ఒక వైవిధ్యాన్నే కోరుకుంటాడు , కాకపొతే ఒక్కోసారి ఆ వైవిధ్యాన్ని సామాన్య ప్రేక్షకుడు కు అర్ధం అయ్యేలా చెప్పటంలో  విఫలమవుతూ ఉంటాడు . ఈ “ఉత్తమ విలన్ ” కూడా  సామాన్య ప్రేక్షకుడి కి కొంచెం దూరంగానే ఉండి పోతాడు.
భారతీయ ప్రేక్షకులకు సర్రియలిజం సినిమా చూపించటం , ఆ సినిమాను సామాన్యప్రేక్షకుదు అర్ధం చేసుకోవాలి అనుకోవటం కొంచెం సాహసమే.
“మనోరంజన్” (కమల్ హాసన్) ఒక సూపర్ స్టార్ , అయన కొత్త సినిమా రిలీజు సందర్భంగా మనోరంజన్ కొడుకు, మనోరంజన్ ఇంకా ఇప్పటికీ కుర్ర హీరోల పాత్రలు వెయ్యటం నచ్చదు. ఇలా ఉండగా మనోరంజన్ కి బ్రెయిన్ ట్యూ మర్ ఉందని తెలుస్తుంది . ఇక చివరి సినిమా గా మంచి సినిమా చెయ్యాలి అన్న ఉద్దేశ్యంతో  తన కు కెరీర్ మొదట్లో మంచి చిత్రాలు ఇచ్చిన తన గురువు మార్గదర్శి ( కె.బాల చందర్) ని తన చివరి సినిమా  దర్సకత్వం వహించమని అడుగుతాడు . ఈ నిర్ణయం నచ్చని మనోరంజన్ భార్య ( ఊర్వశి) మామ పూర్ణ చంద్ర రావు( కె.విశ్వనాధ్) తో గొడవ పడి ఇంటి నుండి బయటకు వస్తాడు . ఈలోపు జాకబ్ ( జయరాం) మనోరంజన్ ని కలుస్తాడు . మనోరంజన్ వరలక్ష్మి ని పెళ్లి చేసుకోకముందు అతనికి యామిని కి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తాడు . యామిని మనోరంజన్ ద్వారా గర్భవతి అయినట్లు మనోర్మణి అనే కూతురు  చెప్తాడు . యామిని ని నుండి ఎటువంటి పరిస్థితుల్లో విడిపోవాల్సి వచ్చింది , అందుకు కారణం ఎవరు ?అనేది ఓ వైపు సాగుతుండగా , మనోరంజన్ చివరి చిత్రం ద్వారా 12 వ శతాబ్దం లో జరిగిన ఒక కథ  ను పాయింట్ గా తీసుకోని  మనిషి ప్రవర్తనను మనకు తెలియ చెప్పే ప్రయత్నం చేస్తాడు .
నిజానికి ఇది సర్రియలిస్టిక్ కథ, 12 వ శతాబ్దంలో జరిగిన కథకు ఇప్పటి కథకు నేరుగా ఎలాంటి లింక్ ఉండదు . కాని దాని ద్వారా మానసిక సంఘర్షణ ,మనషి ప్రవర్తన చెప్పే ప్రయత్నం చేసాడు,కానీ ఇది సా మాన్య ప్రజలను చేరుకోలేకపోయింది. మధ్య మధ్యలో వఛ్చే  ఆ కథకు ఇప్పటి కథకు మధ్య సంబంధం అర్ధం కాక కన్ఫ్యూజ్ అవుతాడు
ఇక సాంకేతిక అంశాల కొస్తే కమల్ హాసన్ అధ్బుతంగా నటించాడు అని ఎప్పటిలాగే చెప్పాలి.  దీనికి కథ, స్క్ర్నీన్ ప్లే కూడా కమల్ హాసనే సమకూర్చాదు. స్క్రీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది . రమేష్ అరవింద్ దర్సకత్వం లో పేరు పెట్టాల్సింది ఏమీలేదు శామ్ దత్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఎలివేట్ అయ్యింది జిబ్రాన్ సంగీతం సినిమా మూడ్ కు అనుగుణంగా పర్ఫెక్ట్ గా సరిపోయింది.
 
మొత్తం మీద ఇది ప్రేక్షకుడు కు అర్ధం కాని ఒక మంచి  సినిమా . టైటిల్ కి తగ్గట్టే ఇది ఉత్తమ చిత్రం కానీ ప్రేక్షకుడి కి అర్ధం కాక చెత్త చిత్రంగా ఉండి పోతుంది.

లెఫ్ట్ వాళ్ళకి అంబేద్కర్ ఏమిటో తెలియదు: నకుల్

 పి. విక్టర్ విజయ్ కుమార్

 

గత వారం ముజఫర్ నగర్ మీద డాక్యుమెంటరీ గురించి మీరు చదివారు.  నిండైన గడ్డం తో , గొప్ప చదువరి చూపులతో కనిపించే ఉత్సాహ వంతమైన యువ మేధావి నకుల్ సింగ్ సాహ్నీ నుండి డాక్యుమెంటరీ  దృక్పథం, ప్రణాళిక విషయాలతో పాటు పెరుగుతున్న మత ఛాందస వాదం  కుల రాజకీయాలు, ముజఫర్ నగర్ ఊచకోత సంఘటన యొక్క ప్రత్యేక స్వరూప లక్షణాలు, భారతీయ కిసాన్ యూనియన్  తిరోగమన పాత్ర, ప్రస్తుత పరిస్థితుల్లో మత ఛాందసవాద వ్యతిరేక పోరాటం లో అంబేద్కర్ ప్రాముఖ్యత, హిందూ ఛాందస వాదానికి వ్యతిరేకంగా పోరాడగలిగే సైద్ధాంతిక ఆలోచన ధోరణి లాంటి విషయాలపై  నకుల్ తో కాసేపు..

విజయ్ : నకుల్ గారు, మీరు  మీ టీం  కృషి ఘనంగా అభినందనీయం. శుభాకాంక్షలు ! ఈ దేశం లో ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా హిందూ ఛాందస వాదం పేట్రేగి పోతున్న సమయం లో , ద్వేషం  అసహనమే రాజకీయాలను నడుపుతున్నప్పుడు చాలా సమయానుకూలంగా మీ డాక్యుమెంటరీ రావడం జరిగింది. నేను హైదరాబాద్ నుండి ఇక్కడికి  వచ్చి సమయం వీలు చేసుకుని ఈ సినిమా చూడ్డమే కాకుండా 10 డీ వీ డీ లు స్నేహితుల కోసం కొన్నాం.

నకుల్ : విజయ్ గారు,   మీకు సినిమా నచ్చడం సంతోషం.

విజయ్: ఈ డాక్యుమెంటరీ సున్నితంగా సూక్ష్మంగా మత ఛాందస వాదాన్ని పరిశీలిస్తుంది.  ” ముజఫర్ నగర్ బాకీ హై …” తీయడం లో మీ దృక్పథం ఏంటి ? అసలు ఇదే ప్రధాన విషయంగా ఎందుకు ఎన్నుకోవాలనిపించింది ?

నకుల్ : మనం కొని సంవత్సరాలు వెనక్కు వెళ్ళాలి. ”  Immoral Daughters of the land ”  అనే డాక్యుమెంటరీ మీద పని చేస్తున్నప్పుడు ఈ ఆలోచన తట్టింది. ఆ డాక్యుమెంటరీ హర్యానాలో ఖాప్ పంచాయితీల గురించి మరియు పరువు హత్యల గురించి తీయడం అయ్యింది. అకస్మాత్తుగా పరువు హత్యలు ఎందుకు పెరుగుతున్నాయో అర్థం చేసుకోదల్చుకున్నాను. ఒక ప్రధాన విషయం తెలిసిందేమంటే – నిమ్న కులాలలో పెరుగుతున్న ప్రకటిత భావనకు వ్యతిరేకంగా అగ్ర కులాలలో పెచ్చరిల్లిన విరోధం ప్రధాన కారణం. సరిగ్గా ఇదే అంబేద్కర్ చెప్తాడు. ” ఒక యువతి తన కులానికి బాహ్యంగా ఉన్న వ్యక్తితో పెళ్ళి చేసుకున్నప్పుడు, కుల వ్యవస్థను కాపాడే ఈ వివాహ వ్యవస్థను వ్యతిరేకించి,  ఈ కుల వ్యవస్థకున్న ఒక ప్రధాన పునాదిని పగలగొడుతున్నట్టే ! ” . ఈ డాక్యుమెంటరీ మీద పని చేస్తున్నప్పుడు డిసెంబర్ 2010 లో హర్యానా కు బయటి ప్రాంతాల్లో నివసిస్తున్న  జాట్ కులసముదాయం లో ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలని  ముజఫర్ నగర్ వెళ్లాను. ‘ఖాప్ పంచాయత్ విధానం ‘ తిరిగి తెరపైకి రావడం నేను గమనించాను. జాట్ అస్తిత్వ రాజకీయాలు  అంతర్లీనంగా దళిత , మహిళా వ్యతిరేకమైనవి.

అప్పట్లో , పశ్చిమ యూ పీ లో , ఈ జాట్ అస్తిత్వ రాజకీయాలు త్వరలో హిందూ మతతత్వ రాజాకీయాలలోకి జారుకుంటున్నాయనే విషయం నాకు అనిపించింది. ఆ ప్రదేశాలు ముస్లిం జనాభా ఎక్కువగా కలిగినందువలన , ఆ రాజకీయాలు ముస్లిం మైనారిటీ వ్యతిరేక రూపాన్ని తీసుకుంటాయనే భావన నాకు కలిగింది. తిరిగి వచ్చాక మితృలతో మాట్లాడుతూ  అన్నాను ” ఈ జాట్ అస్తిత్వ రాజకీయాలు విషపూరితమైన హిందుత్వ రాజకీయాలుగా రూపు దిద్దుకుంటాయనే ఒక చెడు భావన నాలో ఉంది ” అని. మరి అదే జరిగింది ఇప్పుడు !. జాట్ ఛాందసవాదం అంటే అంతర్లీనంగా సాంఘిక ఛాదస్తాన్ని ఎగదోయడం, కులాంతర వివాహాలు చేసుకోకుండా మహిళలను నిరోధించడం. ఇలాగే, ఈ కులాంతర వివాహాలను అరికట్టకుంటే త్వరలో ఇది ముస్లిం లను హిందూ స్త్రీలు పెళ్ళి చేసుకోవడం కూడా ఆపలేదు. ఐతే ఈ ధోరణి ఎంత దాకా తెగించ గలదు అని నేను ఊహించలేదు . వాస్తవానికి, ఈ డాక్యుమెంటరీ, ముందు తీసిన డాక్యుమెంటరీకి తరువాయి భాగం లానే. అక్కడి నుండే నేను తీగ లాగాను.

విజయ్: హిందూ అగ్రకుల శక్తులు సమర్థిస్తున్న కుల తత్వ వాదము, కుల రాజకీయాలే ఈ మత ఛాందస వాదాన్ని ప్రోత్సాహిస్తున్నాయని మీరు అనుకుంటున్నారా ? కుల రాజకీయాలే మత రాజకీయాలకు భూమికగా నిలుస్తున్నాయా ?

నకుల్ : మత తత్వ వాదం అంటే బ్రాహ్మినీక మనువాద సిద్ధాంతానికి పొడిగింపే. మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఛాందస వాదం పెరిగేకొద్ది – ఇది కేవలం ముస్లిం లకు మాత్రమే అభద్రత కాదు, మహిళలకూ మరియు పెద్ద స్థాయిలో దళితులకు కూడా. ఈ రాజకీయాలు అంతర్లీనంగా మైనారిటీ, మహిళా, దళిత వ్యతిరేక రాజకీయాలే. ఆ విధంగా ఈ ముజఫర్ నగర్ సంఘటన ఏ విధంగా పితృ స్వామ్యం, కులతత్వం మరియు మత తత్వం అనుసంధించబడ్డవో చెప్పడానికి అద్భుత ప్రామాణికం. హెడ్గేవార్ ఒక ఆర్ ఎస్ ఎస్ సంస్థను స్థాపించడం ఎందుకనే ఒక ప్రశ్నకు బదులిస్తూ ఇలా అన్నాడు ” ముస్లింల లో అగ్రెషన్ పెరుగుతుంది ” అని. అదే పొడిగిస్తూ ఇలా అన్నాడు ” దీనితో పాటు నిమ్న కులాల్లో కూడా అగ్రెషన్ పెరిగిపోతుంది ” అని. ఆయన పుట్టి పెరిగిన మహారాష్ట్రలో జ్యోతిబా ఫులే నుండి అంబేద్కర్ వరకు ఈ ఉద్యమాలు బ్రాహ్మాణధిపత్యాన్ని ప్రశ్నించడం పెరిగిపోయింది. ఆర్ ఎస్ ఎస్ ప్రధాన ఉద్దేశ్యం బ్రాహ్మనీక ఆధిపత్యాన్ని ఎత్తి పట్టడమే. అందువలన ఇది కేవలం ముస్లిం వ్యతిరేక తత్వమే కాడు , దళిత వ్యతిరేక తత్వం కూడా. కాబట్టి ఈ మత తత్వ వ్యతిరేక పోరాటం పురుషాధిక్య వ్యతిరేక  కుల వ్యతిరేక పోరాటాలతో గాఢంగా మిళితమవ్వాలి. ఈ మత ఛందస వాదులే కదా అంబేద్కర్ ప్రవేశ పెట్టిన హిందూ కోడ్ బిల్లును కూడా వ్యతిరేకించారు ?! వీళ్ళు బహిరంగంగానే మనుస్మృతిని సమర్థిస్తారు. ఇంకా కాంగ్రెస్ దాన్ని వ్యతిరేకిస్తున్నట్టు కొంతైనా నటిస్తుంది. అదే బీ జే పీ మనుస్మృతిని ఇప్పటికీ పూజింపదగినదిగా భావిస్తుంది.  అవును, మీరు చెప్పిన దానితో నేను పూర్తిగా ఎకీభవిస్తున్నాను – ఇవన్నీ ఒకే హిందూ ఛాందసవాదాన్ని సమర్థించే భావజాలాలే.

nakul

విజయ్ : మనకు స్వాతంత్ర్యం వచ్చాక ఎన్నో హేయమైన మత ఘర్షణలు జరిగాయి.   అయితే ఈ ముజఫర్ నగర్ అల్లర్లలో ఎవైనా ప్రత్యేకాంశాలు మీరు గమనించారా ?

నకుల్ : ప్రతి మత ఘర్షణలో ఎదో ఒక ప్రత్యేకత ఉంటుంది. మిగతా అల్లర్లను ఇంత దగ్గిరగా నేను అధ్యయనం చేయలేదు కాబట్టి ఇదమిద్ధంగా వ్యాఖ్యానించలేను. కానీ నాకు కొన్ని పరిశీలనలు ఉన్నాయి. బాబ్రి మజీదు సంఘటన సమయంలో కూడా ఇక్కడ చిన్నా చితక అల్లర్లు తప్ప , అది కూడా , పట్టణ ప్రాంతానికి పరిమితమై ఉన్నాయి. ఈ సారి మాత్రం ఈ అల్లర్లు గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించాయి. ప్రతి అల్లరి వెనుక ఉండే సహజ సిద్ధమైన ఆర్థిక మూలాలు ఇందులో కూడా ఉన్నాయి.  భారతీయ కిసాన్ సంఘం ను విచ్చిన్నం చేసి రైతు ఉద్యమాలను నీరు గార్చడం ఒకటి. రైతు ఉద్యమాన్ని నీరు గార్చడం తో పాటు ఇది బీ జే పీ కీ మిల్ ఓనర్లకు దోహదం చేసింది. 2005 నుండి చూస్తే షుగర్ మిల్స్ క్రమంగా ప్రైవేటు పరం చేయడం జరుగుతూ ఉంది. ఇందులో కులం , మతం మాత్రమే కాదు – కార్పోరేట్ ల లోభం కూడా ఉంది. ఎన్నో అంశాలు కలిసి దగ్గరకు వచ్చాయి. నిజాయితీగా చూస్తే – మోదీ గుజరాత్ అల్లర్లకు ప్రధాన కారణం అని ప్రతి కార్పోరేట్ కు తెలుసు మరెందుకు ఆయన్ను సమర్థించాయి ?

విజయ్ : మీరు క్షేత్ర స్థాయిలో పని చేసారు. బీ జే పీ అధికారం కోసం అర్రులు జాస్తున్నప్పుడు , మోదీ పదవి కోసం తీవ్రంగా మోహం లో ఉన్నప్పుడు జరిగిన ఈ అల్లర్లు మునుపు అల్లర్లతో పోల్చి చూస్తే – ముందుగానే ఊహించి, ప్రణాళిక బద్ధంగా , నేర్పుగా రచించబడ్డ  అల్లర్లుగా అనిపిస్తుందా ?

నకుల్ : అవును. ఇవి ముందుగానే రచించ బడ్డ అల్లర్లు. గుజరాత్ అల్లర్లు ఒక స్థాయిలో రచించబడ్డదైతే ఇవి ఇంకో స్థాయిలో రచించబడ్డాయి. ఇది డాక్యుమెంటరీలో కూడా చూపించడం జరిగింది. వీళ్ళు స్థిరంగా చిన్న చిన్న అల్లర్లను మలుస్తూ వచ్చారు. ముస్లిం జనాభా అధికంగా ఉండదం వల్ల పశ్చిమ యూ పీ ని ఎన్నుకున్నారు. వీళ్ళకూ తెలుసు – ముస్లిం లు తిరగబడితే ఈ గొడవలు త్వరగా వ్యాపిస్తాయి అని. భారతీయ కిసాన్ సంఘం ను ఉపయోగించుకున్న విధాన్ని చూసినా, రైతు ఉద్యమాన్ని నీరు గార్చిన విధానాన్ని గమనించినా, పన్నాగ పూర్వకంగా హిందూ స్త్రీల భద్రత గురించి ప్రచారం చేయడం పరిశీలించినా ఇది తేట తెల్లం అవుతుంది. ఇదంతా 6 – 7 నెలల ముందు నుండే పన్నాగం పన్నిన్నట్టు నాకు అనిపిస్తుంది.

విజయ్ : భారతీయ కిసాన్ సంఘం (బీ కే యూ ) గురించి – బీ కే యూ నిజాయితీగా రైతు సమస్యల కోసం అంతకు మునుపు పోరాడిందంటారా ? కనీసం ఆ మేరకు ఆ అల్లర్ల మునుపు వరకైనా చేసిందంటారా ?

నకుల్ : 1989 లొ చూస్తే బీ కే యూ చారిత్రక రైతు ఉద్యమాన్ని నడిపిందన్న మాట వాస్తవం. అయితే ఆ ఉద్యమం ధనిక రైతులకు ప్రాతింధ్యం వహించందనే మాట కూడా వాస్తవమే.

విజయ్ : ప్రాంతీయంగా బీ కే యూ ఉద్యమం ను హిందూ అగ్రకుల వ్యవసాయదారులు, ధనిక రైతుల సముదాయం చేజిక్కించుకుని ఒక నమ్మకమైన స్థానాన్ని సంపాయించుకుని, ఒక సంక్షేమ కారణం కోసం మాత్రమే పోరాటం చేసే నాయకత్వంగా నమ్మబలికే రూపాన్ని తీసుకున్నాక – తమ స్థాయిని ఇప్పుడు అల్లర్లను రెచ్చ గొట్టాడానికి ఉపయోగించుకున్నాయా ?

నకుల్ : మీరు సినిమాను గమనిస్తే గులాబ్ అహమ్మద్ అనే ముస్లిం నాయకుడు బీ కే యూ నుండి విడిపోతాడు.  బీ కే యూ ఉద్యమం ముస్లిం లను మరియు జాట్లను కలిపి ఉండడం వలన బలహీన పడ్డట్టు బీ జే పీ భావించింది. ఇది విచ్చిన్నం చేయడం ద్వారా మొత్తం రైతు సంఘటననే నిర్వీర్యం చేయొచ్చని భావించింది. ఆ తర్వాత బీ కే యూ కేవలం జాట్లు శాసించే సంస్థగా  మిగిలిపోయింది.

విజయ్ : మీ సినిమా ఎలా సాగిందో , ఎలా నమూనాగా రూపొందించుకున్నారో , ఆ విధానం ఎలా ఉందో వివరిస్తారా ?

నకుల్ : అల్లర్లు జరిగిన ఒక వారం తర్వాత నేను షూటింగ్ మొదలు పెట్టాను. ఎలా వెల్తున్నామో మాకు క్రమంగా అర్థం అయ్యింది అప్పుడు. ఎలా మాముందు వాస్తవాలు రూపుదిద్దుకుంటూ వచ్చాయో అలా మేము ప్లానింగ్ వేసుకుంటూ వెళ్ళాము. నెలకు 10-15 రోజులు మా మకాం అక్కడే. ఒక 2-3 నెలల తర్వాత కూర్చుని – స్క్రిప్ట్ పోగు చేయడం మొదలు పెట్టాను. మేము – నాతో పాటు ఇద్దరు జర్నలిస్టులు – అందులో ఒకరు నా భార్య, తారిక్ అన్వర్, కెమెరా మ్యాన్ మహమ్మద్ గని, కామేష్, పులోమా పాల్, ఆషిష్ పాండే మిగతా మిత్ర బృందం ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. కెమెరా మ్యాన్ మహమ్మద్ గని పేరు మేము చాలా సార్లు మార్చి మార్చి జాగర్త పడ్డాము. ( నవ్వులు)

విజయ్ : షూటింగ్ తీసే సమయం లో ప్రాక్టికల్ సమస్యలు ఏవి ఎదుర్కున్నారు ? ఈ డాక్యుమెంటరీని అడ్డుకునే ప్రయత్నాలు ఏమన్నా జరిగావా ?

నకుల్ : మీరు సినిమా చూసారు. అందులో బీ జే పీ ఎం ఎల్ యే ఒకరు కెమెరాని మూసేస్తాడు. ఇది మొహమ్మీదనే చేస్తాడు. ప్రత్యక్షంగా ఏవీ నిర్దుష్టమైన బెదిరింపులు లేవు . కానీ, ఆ ప్రాంతపు మితృలు మాత్రం నన్ను ” నీ గురించి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ” అంటూ జాగర్త పరిచే వాళ్ళు.

nakul2

విజయ్ : వాస్తవానికి, అమిత్ షా రెచ్చ గొట్టే ఉపన్యాసం కూడా మీ కెమెరాలో చిక్కించుకున్నారు…..

నకుల్ : అవును. అది బట్ట బయలు చేసాక అమిత్ షా ను ఎన్నికల ప్రచారం ఒక వారం మేరకు చేయకుండా ఎన్నికల సంఘం నిరోధిస్తూ ఆంక్షలు విధించింది. నా భార్య ఒక ఆర్టికల్ కూడా వ్రాసింది. మేము ఈ క్లిప్ ను నెట్ లో పెట్టాము. కొన్ని పార్టీలు , ఈ క్లిప్ ఆధారంగా ఎన్నికల సంఘం కు ఫిర్యాదు చేసాయి.

విజయ్ : ఈ అల్లర్లలో దళితుల పాత్ర సహజంగానే వారికుండే సాంఘిక ఆర్థిక కారణాల దృష్ట్యా ఒక ప్రాధాన్యతను సంతరించుకుని ఉంటుంది. నాకు ఇందులో ఒక వ్యక్తి చెప్పే మాటలు గుర్తు ఉన్నాయి ” వాళ్ళకు ఈ విషయంలో ఏది ఎన్నుకోవాలో అస్కారం, అవకాశం లేదు. వాళ్ళు పారిపోయైనా వెళ్ళాలి లేదా బానిసలా బతకాలి ” అని. ఈ హిందూ ఛాందస వాదులు ఈ అల్లర్లు రెచ్చ గొట్టాడానికి దళీతులను వాడూకున్నట్టుగా మీకు అగుపించిందా ?

నకుల్ : ఈ నిర్దుష్టమైన అల్లర్ల విషయం లో కాదు. ఈ సినిమాలో ముస్లిం లు ‘ దళితులను మాలానే పరిగణించారు ‘ అని అనడం కనిపిస్తుంది. బీ ఎస్ పీ,   BAMCEF  యొక్క పాత్ర కూడా ఉంది ఇందులో. ఇందువలన కొన్ని దళిత కులాలు, ఉప కులాలు రాజకీయ చైతన్య వంతులు అవ్వడం జరిగింది. చాలా మందికి బీ జే పీ దళిత – ముస్లిం అల్లర్లను రెచ్చ గొట్టే ప్రయత్నం లో ఉందని అర్థం అయ్యింది . దళిత – ముస్లిం అల్లర్లను సృష్టించడానికి బీ జే పీ మురాదాబాద్ లో కూడా కృషి చేసింది . కానీ సఫలీకృతం అవ్వలేదు. ఎవో కొన్ని వాల్మీకి సముదాయం లోని కొన్ని సెక్షన్ లు బీ జే పీ కి మద్దతు ఇవ్వడం కనిపించింది. కాన్షీ రాం తర్వాత, మాయావతి బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని చంపి వేసింది. ఆ తర్వాత బాం సెఫ్ ఉద్యమాన్ని కూడా క్రమ క్రమంగా చంపేసింది. అధికారం సంఘటించడం అవసరమే కాని అందుకు సిద్ధాంతాలను పణం పెట్టి కాదు. ఈ సినిమాలో ఒక దళితుడు చెప్పడం గమనించవచ్చు ” ఆమె పండిట్ లను చుట్టూ పోగేసుకుంది ” అని. అయితే , కాన్షీ రాం పోషించిన పాత్ర, దాని ప్రభావం ఇప్పటికీ ఉంది. బీ ఎస్ పీ ఒక్క సీట్ కూడా గెలవ లేకపోయింది కాని, 19 శాతం ఓట్లు సంపాయించగలిగింది కదా? ఎవరు వీళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు ?. ఆ ప్రాంతాలలో దళిత – ముస్లిం అల్లర్లను రెచ్చ గొట్టడం బీ జే పీ కీ సులభతరం కాదు.

విజయ్ : మీరు బీ జే పీ , ఆర్ ఎస్ ఎస్ వాళ్ళ నడవడిక గమనించినట్టైతే అంబేద్కర్ ను మమేకం చేసుకోడానికి ఆశ మీరిన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అంబేద్కర్ హిందూ ఛాందస వాదానికి వ్యతిరేకంగా పోరాడిన వీరోచిత సైనికిడు. ” నేను హిందువులకు తోటలో పాము లాంటివాడిని ” అని స్పష్టంగా అన్నాడు. హిందూత్వం అని కూడా ఉల్లేఖించకుండా సరాసరి ” హిందువులే ” అనేసాడు. ఈ తృణీకార, నిస్పృహ వైఖరి వారిపై నిర్మొహమాటంగా ఎదురు తిరగడం లాంటిది. ఈ విషయం లో మీ నిర్దుష్ట అభిప్రాయం ఏంటి ? ఎందుకు వాళ్ళు ఇలా చేస్తున్నారు అంటారు ?

నకుల్ : నా మట్టుకు నేను ఈ విషయం లో లెఫ్ట్ ను తప్పు పడతాను. లెఫ్ట్ అంబేద్కర్ ను మమేకం చేసుకోలేకపోయింది. అందుకే రైట్ చేసుకుంటుంది. లెఫ్ట్ కుల సమస్యను సరిగ్గా అవగాహన చేసుకోలేక పోయింది. అంబేద్కర్ ను మొత్తానికే నిర్లక్ష్యం చేసారు. సోవియట్ యూనియన్ నుండి తీసుకున్న నమూనాను పూర్తిగా భిన్నమైన ఈ దేశ సమాజం లో  ‘ కాపి అండ్ పేస్ట్ ‘ చేయ జూసారు. అసలు కులం, వర్గం లో సమైక్య భాగంగా ఎందుకు గుర్తింపు పొందలేక పోయింది ? . ఈ నాటికీ లెఫ్ట్ ఈ విషయం అర్థం చేసుకోలేదు. సీ పీ ఎం పార్టీ కాంగ్రెస్ ను ఇటీవలే పూర్తి చేసుకుంది. కానీ పోలిట్ బ్యూరోలో ఒక్క దళిత వ్యక్తి లేడు. లెఫ్ట్ అంబేద్కర్ ను దత్తత తీసుకుని ఉంటే రైట్ కు వేరే గతి ఉండేదే కాదు. అద్వాని రథ యాత్ర చేసినప్పుడు కులతత్వ రాముడి బొమ్మ పక్కనే అంబేద్కర్ బొమ్మను పెట్టుకునే సిగ్గుమాలిన తనం ప్రదర్శించారు. కానీ దురదృష్టం ఏంటంటే మార్క్స్ పక్కన పొరపాట్న కూడా అంబేద్కర్ ఫోటో పెట్టిన పాపానికి లెఫ్ట్ పోలేదు. కాబట్టి ఎవరిని ఈ విషయం లో నిందించాలి ?

విజయ్ : రాజ్యం ఏదన్నా అణచివేయలేకపోతే మమేకం చేసుకుంటుంది. అంబేద్కర్ ను మమేకం చేసుకోవడం అంటూ జరిగితే చాలా వినాశనం జరుగుతుంది.

నకుల్ : ఖచ్చితంగా అవును. చూడండి..” ఘర్ వాప్సీ ” కి అంబేద్కర్ స్పష్టంగా వ్యతిరేకం. కానీ ఈ విషయం లో అంబేద్కర్ ను అనుకూల స్వభావిలా చిత్రీకరించే యత్నాలు జరుగుతున్నాయి.

విజయ్ : నాకు ఈ డాక్యుమెంటరీ లో వ్యక్తిగతంగా కష్టం కలిగించిన విషయం ఒకటి ఉంది. హిందూ ఛాందస వాదమే కాదు అసలు హిందూత్వానికే వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన వ్యక్తి అంబేద్కర్. ఆర్ ఎస్ ఎస్ హెడ్ క్వార్టర్స్ అయిన నాగ్ పూర్ లో బుద్ధిజం స్వీకరించిన సాహసం ఆయనది. చాలా ప్రణాళికా బద్ధంగా హిందూత్వం పై దాడి చేసిన వ్యక్తి ఆయన. ఈ సినిమాలో అంబేద్కర్ ను మెరుగుగా వాడే అవకాశం మీరు వినియోగించుకోలేదెందుకని ? ఈ సినిమా మొత్తం అంబేద్కర్ గురించి నిశ్శబ్దంగా ఉంది. ఈ సినిమాను ఈ విషయం లో మెరుగు పరిచే అవకాశం ఉందని మీరు అనుకోవడం లేదా ?

నకుల్ : ఈ సినిమా అతని తాత్విక వాదాన్ని ఎన్నొ విధాలుగా తీసుకువస్తుంది. మత ఛాందస వాదం పై పోరుకు అంబేద్కర్ తాత్విక వాదాన్ని మరింతగా అన్వేషిస్తుంది.బీ ఎస్ పీ ఈ విషయం లో విఫలమయ్యింది అనే విషయం కూడా సినిమలో చెప్ప బడుతుంది. మనకు అంబేద్కర్ కావాలి. భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఎంతో మంది కావాలి. ఈ కుల, మత, వర్గ అంశాలు ఒకటినొకటి ముడి వేసుకున్న పరిస్థితిని మనం అంగీకరించాలి. మీరు చెప్పదల్చుకున్నదేంటో నాకు అర్థమయ్యింది. ఐతే ఈ సినిమా ఇంకా ఎన్నో విషయాల గురించి చెప్తుందనే విషయాన్ని కూడా చూడాలి. సినిమా లింగ సమస్యను, బీ కే యూ పరిస్థితిని …ఇలా ఎన్నిటినో చూపుతుంది. మీరు చెప్తున్నట్టుగా చేయాలంటే ప్రత్యేకమైన సినిమా తీయాల్సి ఉంటుంది. అంబేద్కర్ గురించి ప్రత్యేక ఉల్లేఖనలు ఉన్నాయి. అలాగే భగత్ సింగ్ గురించి కూడా. భగత్ సింగ్ మరియు అంబేద్కర్ కలిసి సహ జీవనం చేయగలరు అని కూడా గమనించాలి.

విజయ్ : హిందూ ఛాందస వాదాన్ని ఎదుర్కునడానికి ప్రత్యేక సైద్ధాంతిక వాదం ఏది సరి అయినది అని మీరు అనుకుంటున్నారు ? లేదా ఈ సమస్యను ఒక సాధారణ కోణం లో చూడ వలసిందేనా ?

 నకుల్ : నా ఉద్దేశ్యం లో సాంప్రదాయ మార్క్సిజం విఫలమయ్యింది. అంబేద్కర్ ను, ముస్లిం లను అర్థం చేసుకోగలిగే మార్క్సిజం కావాలి మనకు. చాలా మంది అగ్ర కులాల వాళ్ళు పైకి రిజర్వేషన్ లు ఎందుకు అని ప్రశ్నించినా – వాళ్ళ మనసుల్లో మన దేశం లో దళితుల పట్ల వ్యవస్థీకృతమైన వివక్ష ఒకటి ఉందనే విషయాన్ని ఒప్పుకుంటారు. ఐతే ఇంకా ఆ విధంగా ముస్లిం లు కూడా వివక్షకు గురవుతున్నారనే విషయాన్ని ఒప్పుకునే స్థాయికి రాలేదు. ప్రతి అగ్ర కుల వ్యక్తికి ” నాకు కులమంటే నమ్మకం లేదు ” అని చెప్పడం చాలా సులభం. ఎందుకంటే వాళ్ళూ దళితులకు మల్లే  దైనందిన వ్యవహారాల్లో కులం గురించి ఙ ప్తికి  తెచ్చు కోవాల్సిన పరిస్థితి రాదు. సాంఘిక న్యాయం వర్గ పోరాటం అంత ప్రధానమైనది.

 విజయ్ : ఇప్పుడు చివరి ప్రశ్న. ఇది మీ గురించే. మీ గురించి చెప్పండి. మీ భవిషత్ ప్రణాళికలు ఏవన్నా ఉంటే చెప్పండి

 నకుల్ : నేను ఢిల్లీ యూనివర్సిటీ నుండి ఇంగ్లీష్ ఆనర్స్ లో గ్రాడ్యుయేషన్ చేసాను. తర్వాత పూనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో  2005-06 లో చేరాను. ”  Once upon a time in chheharta  ” అని నా మొదటి డాక్యుమెంటరి. శ్రామిక వర్గ పోరాట చరిత్ర గురించి తీసిందది. తర్వాత బోంబే లో 2 సంవత్సరాలు గడిపాను. ఐతే సృజనాత్మకతను పరిమితం చేస్తుందనే ఉద్దేశ్యం తో  కమర్షియల్ సినిమాల వేపు మొగ్గు చూపలేకపోయాను. ఖచ్చితమైన భవిష్యత్ ప్రణాళికలు లేవు కాని …ఒకటి మాత్రం చేస్తా – అది ” సినిమాలు తీస్తూ ఉండడమే ! ” ( నవ్వులు)

*

ముజఫర్ నగర్ రావణ కాష్టం ఆరిపోదు !!

పి. విక్టర్ విజయ్ కుమార్ 

 

మునుపెన్నడూ లేని ధోరణులను మన దేశ రాజకీయాల్లో చూస్తున్నాము. ” పబ్లిక్ గా ఏమి చేసినా సరే – అది చట్ట బద్ధంగా ఐనా సరే, చట్ట వ్యతిరేకంగా ఐనా సరే, అక్రమంగా అయినా సరే, అన్యాయంగా అయినా సరే…ఎటొచ్చీ జాగ్రత్తగా , సక్రమంగా, సంబంద్ధంగా తయారు చేసిన ఒక ప్రణాళిక ఉంటే చాలు….ఈ దేశ ప్రధాన మంత్రి అయిపోవచ్చు  ” . ” దేశ పరువు ప్రతిష్ట ” అనే అప్రస్తుతమైన కల్పిత పదాలని కనుగొన్న ” భావ చిత్ర  రాజకీయ ” (image politics) శకం కు  మనమిప్పుడు సాక్షులుగా ఉన్నాము. మీడియా రొదలు, ఆగి ఆగి, గొంతు మార్చి మార్చి వినిపిస్తే నిజమని నమ్మే ధోరణి ఒక సూత్రంగా మారి, మనుగడ సాగించే  ” వ్యక్తి పూజ ” రాజకీయాలను మనమెప్పుడో జీర్ణించేసుకున్నాం.

ఐతే ఈ రోజు రాజకీయల్లో నిజమెంత అని ప్రజలు ఒక అంచనాకు వస్తున్న ప్రయత్నం లో ఉండగా నకుల్ సింగ్ సాహ్ని అనే 32 ఏళ్ళ యువకుడు ” ముజఫర్ నగర్ దాడులు ( అల్లర్లు ?? ) ”  మరియు వాటి రాజకీయత కు సంబంధించిన అల్లికను దులిపి నిర్భీతితో ముసుగు తొలగించే అడుగు వేసాడు.

” ముజఫర్ నగర్ బాకీ హై…..” ( ముజఫర నగర్ సశేషమే ! ) అనే డాక్యుమెంటరీ మత ఛాందస వాదపు గొంతుకను సున్నితంగా , సూక్ష్మంగా తెగ కోసి దాని జిత్తుల పార్శ్వాన్ని ఎండగట్టే కృషి పట్టుదలతో తయారు చేసిన ఒక కళాఖండం. ఎన్నికల సమయంలో, ముందుగానే రచింపబడ్డ వందకు పైగా మరణాలు , ఎన్నో సామూహిక మాంభంగాలు – ముఖ్యంగా ముస్లిం మైనారిటీ ప్రజలను ఊచ కోత కోసిన ‘ ముజఫర్ నగర్ ‘ మన దేశ సామాజిక చిత్తరువుపై చెరగని నల్లటి మచ్చను వదిలివెళ్ళింది.

ఉత్తర ప్రదేశ్ చరిత్రలో మొట్ట మొదటి సారి ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా ఎన్నిక అవ్వని ఒక పరిణామాన్ని కేవలం ఉత్తర ప్రదేశ్ కే కాదు దేశ రాజకీయాలకు రుచి చూపించింది ?!!

అదే నకుల్ గారి యొక్క డాక్యుమెంటరీలో అగుపడే ఒక సాధారణ వ్యక్తి మాటల్లో చెప్పాలంటే –

” దీని బాధ్యత ప్రభుత్వానిదే. అది కాంగ్రెస్ కావచ్చు, ఎస్ పీ కావచ్చు, బీ ఎస్ పీ కావచ్చు. ఎవరి స్వార్థం మాత్రమే వాళ్ళు చూసుకుంటారు. ఐతే మోదీ విషయం లో – నేను నూటికి నూరు శాతం ఖచ్చితంగా చెప్పగలను దీనికి ఆయనే కారణం అని. యూ పీ లో మోదీకి ఎప్పుడూ ఉనికి లేదు. గతం లో ఒక భారీ ర్యాలీని తీసిన సమర్థత లేదు ఇక్కడ. మొట్ట మొదటి సారిగా ఇక్కడ ఆయన అడుగు పెట్టాడు. అప్పటి నుండి ఇక్కడ ఈ అస్తవ్యస్థత ఏర్పడింది. ”

ఈ దేశం లో జరిగే పరిణామాలను అర్థం చేసుకోవడానికి మనకు ఎంతో ప్రశంసించబడ్డ మేధావులు , సాంఘిక శాస్త్రవేత్తల సహాయం అవసరం లేదు – ఒక సాధారణ మనిషి కున్న సమాచారం, విశ్లేషణను సరిగ్గా గమనిస్తే చాలు. నకుల్ గారు మనల్ను ఆ దృక్పథం లో క్షేత్ర స్థాయికి తీసుకెళ్ళి ఎంతో చాతుర్యంగా లింగ సమస్యకు , మత ఛాందస వాద సమస్యకు మరియు కుల సమస్యకు ఉన్న అంతర్లీన బంధనాలను ఎంతో సమర్థవంతంగా ఎండగడతాడు.

1424293384-672_Nakul-pic

” షుగర్ బౌల్ ”  గా ప్రసిద్ధి పొందిన ముజఫర నగర్ సెప్టెంబర్ 2013 లో మతతత్వ విషాన్ని వెళ్ళగక్కి దేశ ప్రజాస్వామిక వాదులకు చేదు రుచి చూపించింది.  3.3 లక్షల హెక్టేర్లకు పైగా వ్యవసాయిక భూమిని కలిగి, 10 కి పైగా షుగర్ ఫేక్టరీలు ఉండి మరియు ఎన్నో స్టీల్ మిల్స్ కలిగిన ముజఫర్ నగర్ ఉత్పాదక ఉపాధిని కల్పించే గలిగే సమర్థతో , ఈ దేశం లో జీవించడానికి అనుకూలంగా ఉండే ప్రదేశాల్లో ఒకటిగా పేర్కొనబడవచ్చు. దేశ రాజధానికి కేవలం 120 కి.మీ దూరంగా ఉన్న ఈ ప్రాంతం ఎంతో ప్రణాళికా ప్రాముఖ్యతను కలిగి ఉందని చెప్పుకోవచ్చు. దేశం లో మిగతా ప్రదేశాల్లా కాక, మూడో వంతుకు పైగా ముస్లిం జనాభాను కలిగి ఉంది. ముజఫర్ నగర్ జనాభా సాంద్రత 1000/ చ.కి.మీ కి పైగా  ఉంది. ఇది సగటు దేశ జనాభా సాంద్త్రత 382/చ.కి.మీ తో పోలిస్తే చాలా ఎక్కువ. దీన్ని బట్టి చూస్తే ఈ ప్రాంతం ఎంత ఉపాధి సౌకర్యాలు కల్పించే ప్రదేశమో తెలుస్తుంది. ఐతే ఇక్కడ సెక్స్ నిష్పత్తి చూస్తే – దేశ సగటు 940 ఉండగా ( ప్రతి వేయి మంది పురుషులకు) – కేవలం 889 గా మాత్రమే ఉంది.

ఈ ప్రదేశం లో మత ఛాందసవాదం ఇంతగా ఎలా పాతుకుపోయిందో ఎంతో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉండగా , డాక్యుమెంటరీలో ఆ ప్రదేశ వికాసమంతా కొన్ని వర్గాల మధ్యనే , ముఖ్యంగా జాట్ల మధ్య, కేంద్రీకృతం అయినట్టు తెలుపుతుంది. ఈ జాట్ సముదాయం ఒక బలవంతమైన శక్తిగా , మత ఛాందస వాదానికి ఒక ప్రధాన చట్రంగా నిలిచింది.

ఈ డాక్యుమెంటరీ అమిత్ షా రెచ్చగొట్టే  ఉపన్యాసాన్ని కూడా మనముందుకు తీసుకు వస్తుంది. ” పశ్చిమ ప్రాంతపు ఉత్తర్ ప్రదేశ్ లో  ఎన్నికలు మన పరువుకు సంబంధించిన వ్యవహారం. మనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన ఎన్నికలు ఇవి. మరియు మనకు అన్యాయం చేసిన వారికి ( ??) ఒక గుణ పాఠం నేర్పించాల్సిన ఎన్నికలివి “. ఈ ఉపన్యాసం ను వీడియో క్లిప్ ద్వారా బయట పెట్టడం వలన ఎన్నికల సంఘం అమిత షా ను ప్రచారంలో నిరోధించాలని కట్టుదిట్టం చేసింది.

muja1

డాక్యుమెంటరీ షూట్ చేసే బృందము  వి ఎచ్ పీ నాయకులను, భారతీయ కిసాన్ సంఘం కార్యకర్తలను, బీ ఎస్ పీ, ఎస్ పీ నాయకులను, దళిత ముస్లిం సెక్షన్ లను మరియు జాట్లను కలిసి, వారి అభ్హిప్రాయాలను, అనుభవాలను సేకరిస్తుంది.

ఈ డాక్యుమెంటరీలో సమయానుకూల బేక్ గ్రౌండ్ స్కోర్, స్క్రీన్ ప్లే,  ఎడిటింగ్ చూస్తే  మంచి టెక్నికల్ విలువలు కూడా అగుపిస్తాయి. ఫోటోగ్రఫీ మనల్ను జనాల మధ్య తిప్పుతూ విషయాన్ని ఎంతో సహజంగా అర్థం చేయించే విధంగా ఉంటుంది. సంఘటన విశదీకరణ లో దర్శకత్వ ప్రతిభ కనిపిస్తుంది. ఎన్నో వదంతులను ఈ డాక్యుమెంటరీ నివృత్తి చేస్తుంది. పాకిస్తాన్ లో తీసిన ఒక వీడియో క్లిప్ ను ప్రాంతీయంగానే జరిగిన ఒక సంఘటనగా మలిచి  హిందూ మత ఛాందస వాదులు ద్వేషాన్ని ప్రబలింపజేస్తూ వదంతులు సృష్టించడానికి ఎలా ఉపయోగించుకున్నారో చూపిస్తుంది. ఈ ముజఫర్ నగర్ సంఘటన లో ఒక విశేషాంశం ఏమంటే హిందూ స్త్రీలపై అత్యాచారాలు అనే విషయాన్ని  ఒక పని ముట్టుగా విరివిగా వాడుకోవడం.

ఇంటర్వ్యూ చేయబడిన ప్రజలు ఎంతో ఆసక్తికరమైన అంశాలు తెలియజేసారు.

” కులం , మతం తో సంబధం లేకుండా మగాళ్ళందరూ ఒకటే. పరువు అనే విషయం కేవలం స్త్రీల భుజ స్ఖందాలపై ఉంచి దాన్ని కాపాడే బాధ్యత కేవలం మహిళలదే అని అనుకుంటారు ”

” దళితులు కూడా మాలాగనే కూలీలు. కానీ కత్తులు కొడవళ్ళు పట్టుకుని మమ్మల్ని వాళ్ళు వెంటాడారు. ఇలా చేయమని వాళ్ళకు ఆదేశాలున్నాయి. లేకపోతే తమ పొలాలలో పనులు దొరకవని భయం పుట్టించారు. బలహీనుడు అంత కన్నా ఏం చేయగలడు ? పరిస్థితుల నుండి పరిగెత్తన్నా వెళ్ళాలి లేదా బానిసలా అణిగి మణిగి ఉండాలి ”

” మాకు అంబేద్కర్ స్పష్టంగా చెప్పాడు. మేము హిందువులం కామని ”

డాక్యుమెంటరీ , భగత్ సింగ పోస్టర్ ఉండగా, సమ సమాజాన్ని ఆకాంక్షిస్తూ, ఒక గీతం తో ముగుస్తుంది. ఒక చోట ఒక చిన్నపిల్లాడు తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నప్పుడు , ఈ దేశం లో మైనారిటీల పరిస్థితిని గుండెను తడిమేలా అద్దం పడుతాడు.

” ఇది మా ఇల్లే. పోలీసులు తగల బెట్టారు ”  …..!!!

నిండైన గడ్డం తో , గొప్ప చదువరి చూపులతో కనిపించే ఉత్సాహ వంతమైన యువ మేధావి నకుల్ సింగ్ సాహ్నీ నుండి డాక్యుమెంటరీ  దృక్పథం, ప్రణాళిక విషయాలతో పాటు పెరుగుతున్న మత ఛాందస వాదం మరియు కుల రాజకీయాలు, ముజఫర్ నగర్ ఊచకోత సంఘటన యొక్క ప్రత్యేక స్వరూప లక్షణాలు, భారతీయ కిసాన్ యూనియన్  తిరోగమన పాత్ర, ప్రస్తుత పరిస్థితుల్లో మత ఛాందసవాద వ్యతిరేక పోరాటం లో అంబేద్కర్ ప్రాముఖ్యత, హిందూ ఛాందస వాదానికి వ్యతిరేకంగా పోరాడగలిగే సైద్ధాంతిక ఆలోచన ధోరణి లాంటి విషయాలపై …..                                                        “సారంగ”  ప్రత్యేక ఇంటర్వ్యూ వచ్చే వారం..

 

 

యంత్రంలోని మనిషితనం వాల్-ఇ

భవాని ఫణి

bhavani-phani.నడిచే అవసరం లేకుడా జీవితాంతం కేవలం పడక కుర్చీల్లో ప్రయాణించగలిగే అవకాశం కలిగితే ? దంతధావనం కూడా యంత్రాలు చేసిపెట్టే సదుపాయం ఉంటే ? ఒక బటన్ నొక్కగానే శరీరంపైనే దుస్తుల రంగు మారిపోయే సౌకర్యం ఏర్పడితే ? అటువంటప్పుడు మానవుడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలని అనుకుంటే వాల్ -ఇ తప్పనిసరిగా చూడాల్సిందే .

సాధారణ చలనచిత్రాలతో పోలిస్తే యానిమేటెడ్ చలనచిత్రాల నిర్మాణానికి అయ్యే ఖర్చు, శ్రమ రెండూ ఎక్కువే . కానీ ఆ చిత్రాలతో చెయ్యగలిగే చమత్కారాల పరిధి చాలా విస్తృతమైనది . చాలా మటుకు యానిమేటెడ్ చలనచిత్రాల్లో తొణికిసలాడే జీవకళ , సహజత్వం, మానవీయతా విలువలని గమనిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది . అలా  ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్న చిత్రం వాల్-ఇ (Wall -E ). ఇది కేవలం పిల్లలు చూడదగ్గ చిత్రమని భావిస్తే అది ఖచ్చితంగా పొరపాటే . ఈ మధ్య కాలంలో సంచలనం సృష్టించిన ఇంటర్ స్టెల్లార్ చిత్ర దర్శకుడు నోలాన్, 2008లో విడుదలైన ఈ చలన చిత్రాన్ని చూసి ప్రేరణ పొందాడంటే దాని గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు . అవును . వాల్ -ఇ కూడా సైన్స్ ఫిక్షనే. నిజానికి వాల్ -ఇ చిత్రమే ఇంటర్ స్టెల్లార్ కంటే ఎక్కువ భావోద్వేగాన్ని కలిగిస్తుందని చెబితే అతిశయోక్తి కాదు .
ఈ చలన చిత్రం గొప్పతనం ఏమిటంటే మన భూమి ఎదుర్కొంటున్న అతి తీవ్రమైన సమస్యల గురించి , సరళంగా ఆలోచనాత్మకంగా చర్చించడం . వాటిలో ముఖ్యమైనవి రెండు అంశాలు.
1. మనం తయారుచేస్తున్న చెత్త ,మన భూమిపై మనకే స్థానాన్ని మిగల్చదని తెలపడం
2. శరీర భాగాలకి బదులుగా యంత్రాలని వాడితే మానవ జీవ పరిణామక్రమంలో చోటు చేసుకునే మార్పులని ఊహించడం
అంతే కాకుండా ఇది, భూమిపై మనుషులు వదిలి వెళ్ళిన ప్రేమ భావాన్ని ఆకళింపు చేసుకుని వంటబట్టించుకున్న ఒక రోబోట్ కథ కూడా . దర్శకుడు ఆండ్రూ స్టాన్టన్ ,ఈ చలనచిత్ర నేపధ్యాన్ని ‘నిర్హేతుకమైన ప్రేమ, జీవితపు అనుసరణీయతని ఓటమి పాలు చేయగలదని చూపడంగా’ అభివర్ణించాడు.(irrational love defeats life’s programming)
ఇంకా ఈ చలన చిత్రంలో నాస్టాల్జియా(స్వదేశంపై గల వ్యామోహం), మానవ జాతి మనుగడకు వాటిల్లబోయే ముప్పు, కార్పొరేట్ వ్యవస్థ కలిగించే మార్పులు వంటి అంశాలెన్నో అంతర్లీనంగా ఇమిడి ఉన్నాయి .

చిత్ర కథ విషయానికి వస్తే  గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్త కారణంగా భూమి నివాసానికి అననుకూలంగా మారిపోవడంతో , మనుషులంతా భూమిని వదిలిపెట్టి ఒక అంతరిక్ష నౌక యాగ్జియం(axiom )లో నివసించేందుకు వెళ్ళిపోతారు  . ఇది జరిగిన ఏడువందల సంవత్సరాల తర్వాత కథ మొదలవుతుంది . శుభ్రం చేసే పనిలో భాగంగా భూమి మీద మనుషులు వదిలి పెట్టిన మర యంత్రాలు వాల్-ఇ లు(Wall -E : Waste Allocation Load Lifter –Earth-Class)  . కొన్ని సంవత్సరాల తర్వాత భూమిని శుభ్రపరచడం అసాధ్యంగా భావించి మనుషులు వాటిని కూడా నిలిపివేస్తారు . కానీ ఒకే ఒక వాల్-ఇ మాత్రం ఇన్ని సంవత్సరాల నుండీ భూమిని శుభ్రం చేస్తూ , తనని తానే మరమ్మత్తు చేసుకుంటూ , మానవులు వదిలి వెళ్ళిన చెత్త నుండి తనకి నచ్చిన వస్తువులని భద్ర పరుచుకుంటూ ఒంటరిగా జీవిస్తూ (?) ఉంటుంది . భూమి మొత్తానికి దానికి తోడుగా ఉన్నది అతి మొండి ప్రాణిగా పేరుపడిన ఒక బొద్దింక మాత్రమే.

తన పొట్టలోకి చెత్తని వేసుకుని దీర్ఘ ఘనాలుగా నొక్కి వాటిని ఒక దానిపై ఒకటి పేర్చుకుంటూ పోవడం దాని పని . కేవలం చెత్తని ఒక క్రమంలో అమర్చడం కోసం తయారు చేసిన అతి ప్రాథమికమైన రోబోట్ అది . అలా అది అక్కడా ఇక్కడా తిరుగుతుండగా  దానికి ఒక మొక్క కనిపిస్తుంది . భూమిపై పచ్చదనం అంతరించిపోయి చాలా సంవత్సరాలు కావడంతో ఆ మొక్క వాల్-ఇ దృష్టిని ఆకర్షిస్తుంది . దాన్నికూడా తన సేకరణలతో పాటుగా భద్రపరుస్తుంది  .

అండాకారంలో ఉండే తెల్లని అత్యాధునికమైన మరో రకమైన రోబోట్లు ఈవ్(EVE: Extra-Terrestrial Vegetation Evaluator)లు . వాటి పని భూమిపై పచ్చదనాన్ని వెతకడం. ఒకవేళ ఎప్పటికైనా భూమిపై మళ్ళీ మొక్కలు  మొలవడం మొదలైతే , భూమి మళ్ళీ నివాసయోగ్యంగా మారతుందని , అప్పుడు అంతరిక్షాన్ని వదిలి మనుషులు భూమిపై నివసించవచ్చన్న ఆలోచనతో తయారుచేయబడినవి ఈవ్ లు.  అటువంటి ఒక ఈవ్ రోబోట్, అంతరిక్ష నౌకనుండి భూమి పైకి వచ్చినప్పుడు దానికి వాల్-ఇ తో పరిచయం ఏర్పడుతుంది . వాల్-ఇ ,ఈవ్ ని ఇష్టపడుతుంది (పడతాడు) . కానీ తన కర్తవ్య నిర్వహణ నిమిత్తం మొక్కని తీసుకుని ఈవ్ అంతరిక్ష నౌకకి వెళ్ళిపోతుంది .  ఈవ్ కోసం వాల్-ఇ కూడా యాగ్జియంకి చేరుకుంటాడు . ఈవ్ ని కలుసుకుని  భూమి మీదకి తీసుకురావాలని  ప్రయత్నిస్తాడు . ఆ క్రమంలో అనేక అవాంతరాలని ఎదుర్కొని, ఈవ్ తో పాటుగా మనుషుల్ని కూడా తిరిగి భూమికి ఎలా చేరుస్తాడన్నది కథాంశం .

ఈ చలన చిత్రంలో ఎక్కువగా ఆకర్షించే విషయం అంతరిక్ష నౌకలోని మనుషుల శరీరాకృతి . ఏళ్ళ తరబడి అన్ని పనులకీ  యంత్రాల మీదే ఆధారపడుతూ, శరీరానికి కేవలం విశ్రాంతినే ఇవ్వడం వల్ల అక్కడి మనుషుల చేతులు కాళ్ళు చిన్నవిగా మారిపోతాయి. కేవలం పొట్ట మాత్రమే పెరుగుతుంది. ముఖం , మెడ కలిసిపోయి ఉంటాయి . వాళ్ళకి లేచి నిలబడటం కూడా తెలీదు.  ఒక పడక కుర్చీలో కూర్చుని ప్రయాణించడం తప్ప వారికి పనేమీ ఉండదు . పళ్ళు తోమడం , బట్టలు మార్చడం వంటి పనులు కూడా యంత్రాలే చేస్తాయి. మనం ప్రస్తుత  జీవన విధానాన్ని ఇదే విధంగా కొనసాగిస్తే అటువంటి రోజులు ఎంతో దూరంలో లేవని ఈ చిత్రం తెలియజేస్తుంది .

అంతేకాక అంతరిక్ష నౌక కెప్టెన్ తను చెందిన భూమి గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో మట్టి , భూమి,సముద్రం, నాట్యం వంటి పదాల్ని వెతుకుతూ, వాటికి చెందిన రికార్డెడ్ వీడియోలు చూస్తూ నాస్టాల్జియాకి గురికావడం మనల్ని కూడా గొప్ప భావోద్వేగానికి గురి చేస్తుంది . “మనుషులు మట్టిలో విత్తనాలు వేసి , నీళ్ళు పోసి పిజ్జాల్లాగా ఆహారాన్ని పండించేవారట!” అని అతను తెగ ఆశ్చర్యపోతాడు . అలాగే వాల్ -ఇ, తను చూసిన ఒక పాత సినిమా పాటలోని హీరో హీరోయిన్ల మాదిరిగా ఈవ్ తో చేతులు కలిపి పట్టుకోవాలని  తాపత్రయపడటం ముచ్చట కలిగిస్తుంది . ఇటువంటి సన్నివేశాల ద్వారా మనం చిన్న చిన్న మానవ సంబంధిత ఉద్వేగాలని, భావాల్నికూడా యంత్రాల నుండి నేర్చుకునే దుస్థితికి త్వరలోనే దిగజారిపోతామని  ఈ చలనచిత్రం సూచిస్తుంది .  .

ప్రమాదవశాత్తూ తమ కుర్చీ వాహనాల్లోంచి జారిపడిన అంతరిక్ష నౌకలోని మనుషులు , లేచి నిలబడలేని అశక్తతలో ఒకరి మీద ఒకరు పడి కొట్టుమిట్లాడటం మన స్వయంకృతాపరాధపు భవితవ్యానికి ప్రతీక అయితే  , వారిలోనుండి ఒకరిద్దరు వ్యక్తులు లేచి నిలబడే ప్రయత్నం చేసి మిగిలిన వారికి స్పూర్తిగా నిలవడం , మనిషిలోని ఆశావహదృక్పధానికీ, పట్టుదలకీ ఉదాహరణ .

మొత్తానికి ఈ చిత్రం భవిష్యత్తుపై భయాన్ని కలిగించి , చేస్తున్న పొరపాట్ల గురించి ఆలోచించుకునే దిశగా మనల్ని నడుపుతుంది. మన జీవితాల్లోని యాంత్రికత మనల్ని ఎటువంటి ప్రమాదంలోకి నెడుతుందో సున్నితంగా తెలియజేస్తుంది . అత్యద్భుతమైన యానిమేషన్ సహజమైన వాతావరణాన్ని సృష్టించి ఒక కొత్త కోణంలోమనం సృష్టించుకుంటున్న  అసహజత్వాన్ని మనకి చూపుతుంది. మానవ తప్పిదాల్ని యంత్రాలు సరిదిద్దే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరిస్తుంది .

ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సందేశాత్మక చిత్రాన్ని సృజనాత్మక మేధకు అత్యుత్తమ నమూనాగా  అభివర్ణించవచ్చు . ఈ చలనచిత్రంలోని మనుషులకి మళ్ళీ తమ జీవితాల్ని మొదటి దశనుండీ నిర్మించుకునే అవకాశం వాల్-ఇ కారణంగా లభించింది . మరి మనకి లభిస్తుందో లేదో! ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ చిత్రాన్ని చాలా మంది చూసే ఉంటారు . ఒకవేళ చూడకపోతే తప్పనిసరిగా చూడండి. పిల్లలకి కూడా చూపించండి.
~

“ఎవడే సుబ్రహ్మణ్యం”: ఒక అంతర్ యాత్ర!

mohan

మోహన్ రావిపాటి 

మనమెవరమో మనకు నిజంగా తెలుసా ! మన పేరు, సమాజంలో మన హోదా, మనం విద్యార్హత, మన ఉద్యోగం, ఇవేనా మనం ? అసలు నిజంగా మనం అంటే ఎవరో మనకు తెలుసా !! అసలు తెలుసుకొనే ప్రయత్నం ఎప్పుడైనా చేశామా !! మీరెవరు అని మనల్ని ఎవరైనా ప్రశ్నించినప్పుడు మనం ఏమని సమాధానం ఇస్తున్నాం ? అసలు మనం అనుకొనే మనం కాక ఇంకేదైనా మన గురించి మనం తెలుసుకోవాల్సి ఉందా !! మనకున్న డబ్బుతోనో, లేదా మన హోదాతోనో, మనల్ని మనం మరొకరికి పరిచయం చేసుకోకుండా అసలు మరోలా ఎప్పుడైనా పరిచయం చేసుకొనే ప్రయత్నం చేశామా !! పోనీ మనల్ని ఎవరైనా అలా పరిచయం చేసుకున్నారా !! లేదు కదా !! అసలు మనం ఎప్పుడూ ఆ దిశ గా ఆలోచన కూడా చేయలేదు కదా !!

కరెన్సీ వెంటో, హోదా వెంటో, పేరు ప్రఖ్యాతుల వెంటో, మరో దాని వెంటో మనం పడుతున్నాం తప్ప మనల్ని మనం ఎప్పుడైనా చూసుకున్నమా !! అసలు మనల్ని మనం ప్రశ్నించుకున్నామా !! సమాజంలో మన స్థానం ఏమిటా అని ఆలోచిస్తూ జీవిస్తున్నాం కానీ , సమాజానికి మనలో ఏ స్థానం ఉందో ఆలోచించామా !! అసలు మనకోసం సమాజం ఉందా !! సమాజం కోసం మనం ఉన్నామా !!  ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలు .

ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం  తెలుసుకోవటానికి చేసిన స్వయం శోధనా ప్రయాణమే “ఎవడే సుబ్రహ్మణ్యం”

సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు(నాని) ఒక సీడ్స్ కంపెనీ లో జి.యం. కంపెనీ మరో కంపెనీ ని టేకోవర్ చేసుకోవటం ద్వారా లాభాలు తీసుకువచ్చి దాని ఓనర్ కూతురు ని పెళ్ళిచేసుకోవాలన్నది అతని ప్లాన్. ఆ రెండో కంపెనీ పెద్ద లాభాపేక్ష లేకుండా రైతులకు సహాయంగా ఉంటూ ఉంటుంది. ఆ కంపెనీ షేర్ హోల్డర్స్ ని మభ్యపెట్టి షేర్స్ కొనుగోలు చేస్తూ ఉంటాడు సుబ్బు, అదే సమయంలో ఓనర్ కూతురు తో అతని పెళ్ళి నిశ్చయమవుతుంది, ఆ నిశ్చిత్తార్ధం జరుగుతున్నప్పుడే సుబ్బు చిన్ననాటి స్నేహితుడు ఋషి ( విజయ్ దేవరకొండ) సుబ్బును కలుస్తాడు.

జీవితాన్ని జీవితంలా చూడటమే నా పాలసీ అనుకొనే మనస్తత్వం ఋషిది. డబ్బు కన్నా జీవితం ముఖ్యం అనుకుంటూ ఉంటాడు, తన చిన్నప్పటి కల హిమాలయాల్లో  ఉన్న  ‘దూధ్ కాశీ” ని సుబ్బు తో కలిసి దర్శించి రావాలి అని,  సుబ్బును దానికోసం కన్వీన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, సుబ్బు షేర్స్ కొనే ప్రయత్నం లో ఆనందిని ( మాళవికా నాయర్) దగ్గర ఉన్న షేర్స్ కొనటానికి వెళ్లినప్పుడు ఆ అమ్మాయి సుబ్బుకు, ఋషి కి స్నేహితురాలు అవుతుంది . అనుకోకుండా రోడ్ యాక్సిడెంట్ లో ఋషి చనిపోతాడు, ఆ ఆస్తికలను దూధ్ కాశీ లో కలిపితేనే తన దగ్గర ఉన్న షేర్స్ ని సుబ్బుకు అమ్ముతాను అనే కండిషన్ పెడుతుంది ఆనందిని.

yevad2 జీవితాన్ని ఎప్పుడూ డబ్బులు, లెక్కల్లో కొలిచే సుబ్బుకు , జీవితాన్ని కేవలం జీవితం లా చూడాలి, జీవితంలో డబ్బు కన్నా ఆనందం , మరో మనిషి పట్ల ప్రేమ, ఇంకా ముఖ్యం అనుకొనే ఋషి మనస్తత్వాల మధ్య సంఘర్షణే కథాంశం , ఋషి మరణించినా ఆస్తికల రూపంలో వారి వెంటే ఉంటూ ఆ సంగతి ఎప్పుడూ వారికి మానసికంగా గుర్తు చేస్తూ ఉంటాడు . ఆ ప్రయాణం లో సుబ్బు తనను తాను ఎలా సంస్కరించుకున్నాడు . తన మెటీరియలిస్టిక్ జీవితాన్ని ఎందుకు వదులుకున్నాడు,అసలు జీవితం లో ఆనందం అంటే ఏమిటి ? ఎప్పుడు ఆనందంగా ఉంటాం ?? వీటన్నిటిని సుబ్బు తెలుసుకోవటమే ఈ సినిమా .

కొన్ని సన్నివేశాలు గమ్యం సినిమాని గుర్తు తెచ్చినా, సినిమా ఒక విభిన్నమైన కథాంశం తో కూడిన సినిమా అనే చెప్పాలి . గమ్యం లో హీరోయిన్ వెతుక్కుంటూ వెళ్ళే ప్రయత్నంలో గాలిశీను అనే పాత్ర ద్వారా. ఆ మార్పు కు నాంది పలుకుతాడు, ఈ సినిమాలో స్నేహితుడి ఆఖరి కోరిక కోసం బయల్దేరిన హీరో కి హీరోయిన్ పాత్ర ద్వారా ఆ మార్పు కు నాంది పలుకుతాడు, ఏదో ఒక బలమైన పాత్ర్ర లేకుండా ఒకరి జీవిత గమనాన్ని మార్చటం సులభం కాదు. అందుకే అలాంటి పాత్ర .

ఇక నటీనటుల విషయానికి వస్తే మరోసారి నాని తాను ఎంత గొప్ప నటుడినో నిరూపించుకున్నాడు, విజయ్ దేవర కొండ రూపంలో మరో మంచి నటుడు తెలుగు తెర కు పరిచయం అయ్యాడు, ఇక మాళివికా నాయర్ అత్యధ్బుతంగా నటించింది, దర్శకుడు నాగ్ అశ్విన్ ని ఇలాంటి విభిన్న కథాంశాన్ని ఎంచుకున్నందుకు అభినందించాలి,అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించినా , తప్పక చూడాల్సిన సినిమా.

*

నా ప్రయాణం కథ వైపు, పాత్రల వైపు: క్రాంతి మాధవ్

 

తెలుగు సినిమాలన్నీ నేల విడిచి సాము చేస్తున్నాయి తెలుగు సంస్కృతి ని సాంప్రదాయాన్ని మర్చిపోయి పూర్తి పట్టణీకరణ చెందిన కథలలో మునిగిపోతున్నప్పుడు ,ఒక అచ్చు పల్లెటూరి కథతో మన సంస్కృతిని , సాంప్రదాయాన్ని మనం మర్చిపోయిన మన మూలాలను మనకు కొత్తగా పరిచయం చేసిన చిత్రం “ఓనమాలు “ తో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న, క్రాంతి మాధవ్ తెలుగులో ఫీల్ గుడ్ ప్రేమ కథలు రావటం లేదు అనుకుంటున్న సమయంలో “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు “ అంటూ మరో సారి తియ్యగా పలకరించాడు. సాధారణంగా ముందుగా దర్శకుడు గా పరిచయం అయ్యి సక్సెస్ సాధించాక, దర్శక నిర్మాత గా మారతారు, కానీ సినిమా మీద ప్రేమతో ముందుగా దర్శక నిర్మాత గా మారి ఆ తర్వాత దర్శకుడి గా మారాడు. మొదటి సినిమాలో నిర్మాత గా హిట్ కొట్టకపోయినా, దర్శకుడిగా మాత్రం సూపర్ హిట్ అయ్యాడు . రెండో సినిమాతో అటు దర్శకుడి గా హిట్ కొడుతూనే, నిర్మాత కి పెద్ద కమర్షియల్ హిట్ కూడా ఇచ్చిన  క్రాంతి మాధవ్ గారి సినిమా ప్రయాణం గురించి కొన్ని మాటలు

1)    మీ  విద్యాభ్యాసం , సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది ?

నా విద్యాభ్యాసం అంతా ఖమ్మం, వరంగల్ లలో జరిగింది, పి.జి( మాస్ కమ్యూనికేసఃన్స్ )  మాత్రం మణిపాల్ లో చేశాను, పి.జి చేస్తుండగానే అక్కడి ప్రొఫెసర్ AF మాధ్యూస్ ద్వారా నాకు సినిమాలంటే ఇంట్రస్ట్ కలిగింది. అప్పటివరకు సినిమాలంటే నాకున్న ధృక్పధం  మారిపోయింది . సినిమాని ఎలా ప్రేమించాలో తెలిసింది . జర్నలిస్ట్ అవుదామని అక్కడ జాయిన్ అయిన నాకు సినిమా కంటే పెద్ద మీడియా ఏది లేదు. అనిపింఛేంతంగా మాధ్యూస్ గారు నన్ను inspire చేశారు, అలా సినిమాలద్వారా నేను అనుకున్న భావాలను బలంగా చెప్పే అవకాశం ఉంటుంది అనే ఈ రంగంలోకి ప్రవేశించాను

2)   మీ అభిమాన దర్శకులు ఎవరు ?

నేను బాగా అభిమానించే దర్శకుడు గురుదత్ . ప్యాసా సినిమా దాదాపు వంద సార్లు చూసుంటాను. ఆలాగే  కె.బాలచందర్ గారు, కె.విశ్వనాధ్ గారు,జంధ్యాల గారు , వంశీ గారు, టి,కృష్ణ దర్శకత్వం అంటే నాకు బాగా ఇష్టం

10389654_10153185585521834_1496572497810951411_n

3)   మీ రెండు సినిమాలు, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్ద పీట వేశాయి, మీరు కావాలని ఇది ఎంచుకున్నారా ?

కావాలని ఏమి లేదండి ! కథ లోని పాత్రలు ఎటువైపు ప్రయాణం చేస్తే , నేను అటువైపు ప్రయాణం చేస్తాను. నేను మా తాతయ్య గారి దగ్గర ఎక్కువ పెరిగాను, పల్లెటూరు అన్నా అక్కడి ఆప్యాయతలు అన్నా నాకు ఇష్టం . మొదటి సినిమా “ఓనమాలు” లో ఒక మాష్టారు, సమాజం పట్ల,మనుషుల పట్ల ప్రేమను పెంచుకున్నాడు . రెండవ సినిమా “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు “ ఇద్దరు వ్యక్తుల ప్రేమ కథ . ఆ నేపధ్యంలో జరిగే సంఘటనలనే నేను చెప్పాను.

4)   మీ సినిమాలలో పాత్రలు, సంబాషణలు చాలా సహజంగా కనిపిస్తాయి . దీనికేమైనా ప్రత్యేక కారణం ఉందా ?

నేను ఎక్కువగా సమాజాన్ని,  వ్యక్తులను పరిశీలిస్తాను, వారి మనస్తత్వాలను , వారు మాట్లాడే విధానాన్ని పరిశీలిస్తూ ఉంటాను, అది ఒక కారణం అయ్యుండవచ్చు. నాకు సమాజం అంటే చాలా ఇష్టం . వ్యక్తులు అంటే ఇష్టం . అందుకే వాటినే నా సినిమాలలో ప్రతిఫలించేలా చూసుకుంటాను.

IMG_20150220_192953

క్రాంతి మాధవ్ తో మోహన్ రావిపాటి

 

5)   మీమీద సాహిత్య ప్రభావం ఎంతవరకు ఉంది ?

నేను సాహిత్యాన్ని పెద్దగా ఏమి చదవలేదు.కానీ సాహిత్యం అంటే చాలా ఇష్టం, గౌరవం. కాకపోతే మా ఇంట్లో సాహిత్య చర్చలు ఎక్కువగా జరిగుతుండేవి , మా తాత గారు ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ ఉండేవారు . ఆయనకు ఎక్కువగా కమ్యూనిష్ట్ భావనలు ఉండేవి . ఉదాహరణకు “దాస్ కాపిటల్ “ గురించి చర్చ వస్తే అది కార్ల్ మార్క్స్ గురించి, అప్పటి రష్యా సామాజిక పరిస్థితుల గురించి, కమ్యూనిజం గురించి ఇలా పలు రకాలుగా చర్చలు జరిగేవి, ఇవి వింటూ పెరిగాను, నేను చదివిన పుస్తకాలలో మాక్సిమ్ గోర్కీ రాసిన “అమ్మ” నాకు బాగా ఇష్టం అందులో కథ తో పాటు ఒక సమాజం ఉంది. సమాజం లో అంతర్లీనంగా ఉన్న ఒక పెయిన్ ఉంది.

6)   అంటే మీ మీద రష్యన్ సాహిత్యం, కమ్యూనిజం ప్రభావం ఉన్నాయనుకోవచ్చా ??

అలా ఏమి లేదు, అన్నీ రకాల సాహిత్యాలతో పాటే రష్యన్ సాహిత్యం కూడా . కమ్యూనిజం ప్రభావం కూడా అంతే నేనెప్పుడూ అభివృద్ది కి వ్యతిరేకం కాదు . అభివృద్ది ఎప్పుడూ మనిషికి కావాల్సిందే , కాకపోతే ఆ అభివృద్ది మనుషులను దూరం చేయకూడదు, మనిషి మనిషికి దూరం అయ్యాక, వచ్చే అభివృద్ది ఎవరికోసం, మనుషులను దగ్గరచేసే అభివృద్ది కావాలి అనేదే నేను కోరుకొనేది

7)   ప్రస్తుత రచయితలలో మీరు ఎవరి రచనలు ఎక్కువగా ఇష్టపడతారు ?

సాహిత్యం గురించి నాకు పెద్దగా తెలియదు , నేను చదివిన వారిలో ఛామ్ స్కీ రచనలు ఇష్ట పడతాను , అలాగే ఫిక్షన్ లో పోలో కోయిలో రచనలు ఇష్టపడతాను

8)   ఒకప్పుడు మన తెలుగు సాహిత్యం నుండి విరివిగా సినిమాలు వచ్చేవి , ఇప్పుడు దాదాపుగా లేవు, మీరు అలాంటి సినిమాలు రూపొందించే ఆలోచన ఏమైనా ఉందా ?

ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచనలుఏమీ లేవండి , కాకపోతే ఆ సాహిత్యం ద్వారా నాకు తెలిసిన సామాజిక నేపధ్యాన్ని నాకు బాగా నచ్చితే వాడుకుంటానేమో

9)   మీ మొదటి సినిమా, సామాజికాభ్యుదయం ప్రధానాంశం గా వచ్చింది, రెండవ సినిమా పూర్తి స్థాయి ప్రేమ కథ. మరి మీ మూడవ సినిమా ఎలాంటిది ఊహించవచ్చు ?

నాకు అన్ని రకాల జోనర్ సినిమాలు చేయాలని ఉంది. నా మూడవ చిత్రం పూర్తి స్థాయి హాస్య చిత్రం గా చేస్తాను

10) అంటే ఆరోగ్యకరమైన హాస్యాన్ని ఆశించవచ్చు అంటారా ?

తప్పకుండా, మనకు హాస్యం అనగానే జంధ్యాల గారు గుర్తు వస్తారు .ఆయన సినిమాలలో లాగే నా సినిమాలో కూడా నా మేకింగ్ ఆఫ్ స్టయిల్ లో కుటుంబ విలువలతో కూడిన హాస్యం తోటే ఉంటుంది

రెక్కలు తెగిన పక్షి చేసిన సాహసం

ఈ సారి 87 వ అకాడమీ (ఆస్కార్ ) అవార్డ్ లలో BIRDMAN (The Unexpected Virtue of Ignorance) ఉత్తమ చిత్రం  అవార్డ్ ని కైవసం చేసుకుంది . దానితో పాటుగా  ఉత్తమ  డైరెక్టర్ ,  స్క్రీన్ ప్లే ,  సినిమాటోగ్రఫీ  అవార్డ్స్ కూడా తన ఖాతాలో వేసుకుంది .ఇంతకీ  అసలు ఎవరీ బర్డ్ మాన్? ఏమిటితని గొప్పతనం?

కొన్ని దశాబ్దాల క్రితం హాలీవుడ్ లో బర్డ్ మాన్ గా  ఒక వెలుగు వెలిగి మరుగున పడిపోయిన Riggan Thomson అనే ఒక సూపర్  హీరో కథ ఇది .  ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక play  ద్వారా తిరిగి తన ప్రతిభని నిరూపించుకోవాలని అతను  తాపత్రయ పడుతుంటాడు. What We Talk About When We Talk About Love అనే ఒక షార్ట్ స్టోరీని కొద్దిపాటి మార్పులతో  ప్లేగా మలచి, దర్శకత్వం వహించి, నటించే ప్రయత్నంలో అనేక రకాల సమస్యల్ని ఎదుర్కొంటాడు. మరో పక్క తనకి విపరీతమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టిన బర్డ్ మాన్ పాత్ర వల్ల  ప్రభావితమై, బర్డ్ మాన్ స్వరాన్ని వింటున్నట్టుగా ఊహించుకుంటూ ఉంటాడు  ఆ స్వరం అతన్ని తిరిగి బర్డ్ మాన్ గా మారమనీ, తామిద్దరూ ఒకటేననీ నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది .ఎక్కువగా మనిషిని వేదనకు గురి చేసే విషయం ఏమిటి?
ఏదైనా ఉండటం, లేకపోవడం కాదు . కావాలనుకున్నది దక్కకపోవడం కాదు . అసలు తనకేం కావాలో తనకే తెలియకపోవడం . ఆలోచనల్లో అటువంటి సందిగ్ధత కలిగిన మనిషి, మానసికంగా తనని తానే ముక్కలు ముక్కలు చేసుకుంటూ తట్టుకోలేనంత ఆవేదనకి గురవుతాడు . అటువంటి ఓ వ్యక్తి కథ బర్డ్ మాన్ . అలాగే కీర్తి, పేరు ప్రతిష్టలు మహా చెడ్డవి . ఓసారి అందలమెక్కించి, మత్తులో ముంచి తమకి బానిసగా చేసుకుంటాయి . అప్పుడు నరం నరం, ఆ మత్తుని బాలన్స్ చేసుకోవాలని తపన పడుతూ, ఎలాగైనా వాటిని తిరిగి పొందాలని శక్తికి మించి పోరాడుతూ చిత్ర హింసకి గురవుతూ ఉంటుంది . ఇది అటువంటి వ్యక్తి కథ కూడా .  కీర్తికాంక్షకీ , సెల్ఫ్ రియలైజేషన్ కీ మధ్య నలిగిపోయిన  ఒక నటుడి కథే బర్డ్ మాన్ . ఈ సినిమాలో మరో చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే ఈ చిత్రమంతా చాలా మటుకు ఒకే షాట్ లో చిత్రించారు . సినిమాటోగ్రాఫర్ ఎక్కడా బ్రేక్ ఇవ్వకుండా తన కూడా మనల్ని తిప్పుకుంటూ ఆశ్చర్యానికి గురి చేస్తాడు .
220px-Birdman1967
ఒక థియటర్ కి చెందిన గదిలో నేలకి కొంచెం ఎత్తుగా  గాలిలో కూర్చుని మెడిటేషన్ చేస్తున్న ఒక ముసలి శరీరం తాలూకూ వ్యక్తితో  చిత్రం ప్రారంభమవుతుంది. అతనే Riggan. తన అసహనం మీదా, కోపం మీదా, విసిగిస్తున్న బర్డ్ మాన్ స్వరం మీదా విజయం కోసం అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు . మంచి తండ్రిని కాలేకపోయానన్న బాధ మరో వైపు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. .ఒక పక్క తను చాలా గొప్పవాడినన్న అహంభావం , మరో పక్క బర్డ్ మాన్ గా  తప్ప తనకే విధమైన గుర్తింపూ లేదన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ల మధ్య అతను నలిగిపోతూ ఉంటాడు. డ్రగ్ ఎడిక్ట్ గా మారి రికవర్ అవుతూ, Riggan  దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్న అతని కుమార్తె Sam గా Yemma stone నటించింది . ఒక సందర్భంలో అతి పెద్ద డైలాగ్ చెబుతూ ఆమె కనబరిచిన నటనా చాతుర్యం మెచ్చుకోవాల్సిన విషయం. పేరు ప్రతిష్టల వల్ల కలిగే మత్తు చేసే నష్టం కూడా తక్కువేమీ కాదని చెప్పడం కోసం సింబాలిక్ గా,Sam ని  డ్రగ్ ఎడిక్ట్ గా చూపారనిపించింది .
గొప్ప నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు కోసం చేసే ఈ ప్రయత్నం లో Rigganకి  మరో విచిత్ర మనస్తత్వం కలిగిన వ్యక్తి, సహ నటుడు అయిన  Mike(Edward Norton) తో కలిసి పని చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది . ఆధిపత్యం కోసం వాళ్ళిద్దరి మధ్య పోరు నడుస్తూ ఉంటుంది . Broadway నటిగా పేరు తెచ్చుకోవాలని ఏళ్ళ తరబడి తపన పడి, అడుగడుగునా అవమానాల్నే ఎదుర్కుంటూ తన స్వాభిమానం కోసం వెతుకులాడే నటి Lesley పాత్రలో Naomi Watts కనిపిస్తుంది .
విపరీతమైన మానసిక సంఘర్షణ తట్టుకోలేక , అవమానాల్ని ఎదుర్కోలేక, తనలోని బర్డ్ మాన్ విజయం సాధించడం ఇష్టం లేక, ప్లే చివరిలో వచ్చే ఒక సన్నివేశంలో Riggan నిజంగానే తనని తాను షూట్ చేసుకుంటాడు . దాంతో, అప్పటివరకు ఏ విధమైన టాలెంట్ లేకుండా సెలబ్రిటీ హోదా కారణంగా థియేటర్ని ఆక్రమించావంటూ అతన్ని అసహ్యించుకుని , తన రివ్యూ ద్వారా  అతని ప్లేని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన క్రిటిక్ Tabitha Dickinson, అతని ప్లేని ఆకాశానికి ఎత్తేస్తూ రివ్యూ రాస్తుంది . స్టేజ్ మీద అతని ఆత్మహత్యా ప్రయత్నాన్ని సూపర్ రియలిజంగా అభివర్ణిస్తుంది . ఒక్కసారిగా అతని పాపులారిటీ విపరీతంగా పెరిగిపోతుంది . కానీ తనని తాను కాల్చుకున్న కారణంగా అతను తన ముక్కుని కోల్పోతాడు.
కొత్తగా పెట్టబడిన ముక్కుతో తన అసలు రూపాన్ని కూడా కోల్పోతాడు . చివరగా అతను హాస్పిటల్ కిటికీ తలుపు తెరుచుకుని బయటకి ఎగిరిపోయే ప్రయత్నం చెయ్యడం, అతని కుమార్తె అతని కోసం క్రిందికి చూసి , కనబడకపోవడంతో ఆకాశంలోకి చూసి నవ్వడంతో చిత్రం ముగుస్తుంది .
చిత్రంలోని చాలా భాగాన్ని ఒకే షాట్ లో చూపగలిగే విధంగా కథనీ ,సన్నివేశాల్నీసృష్టించి చిత్రీకరింపజేసిన దర్శకుడు Alejandro González Iñárritu ప్రతిభ, చిత్రీకరించి చూపిన సినిమాటోగ్రాఫర్ Emmanuel Lubezk గొప్పతనం కూడా ప్రశంసార్హమైనవి . ఏక బిగిన ఆపకుండా నటించాల్సివచ్చినా నటీనటులంతా ఎమోషన్స్ ని చక్కగా పండించారు . ఏమీ కాలేకపోయానన్న ఒక వ్యక్తి ఆవేదనని ఉన్నతంగా చిత్రించి చూపిన ఈ చలన చిత్రం, తన ప్రతిభకి  తగ్గ పురస్కారాన్ని ఆస్కార్ రూపంలో అందుకోనే అందుకుంది.
-భవాని ఫణి
bhavani-phani.

బోలెడు నవ్వులూ, కాసింత ఫిలాసఫీ- కలిసి ఈ సినిమా!

*సూదు కవ్వుం  ( దీనికి మూర్ఖంగా ఉండే మొండితనమూ,మొండిగా ఉండే తెలివితేటలూ అవసరం )
పొద్దెక్కుతూ ఉంది, మంచంపైనుంచి దొర్లికింద పడ్డాడు ‘ కేశవన్ ‘, ఏమయ్యిందబ్బా అంటూ తలగోక్కుంటూ చూస్తే తిరుచ్చి నుంచి రాత్రికిరాత్రి పారిపోయొచ్చేసిన ‘ పగలవన్ ‘. ” ఎన్నాడా పన్నిట్టే ” అన్న ప్రశ్నకు  కొడుకు నయనతారకు లక్షన్నర పెట్టి గుడి కట్టిన విషయం తెలిసి కళ్ళుతిరిగి కింద పడిపోయిన తండ్రినుంచి, తరిమికొట్టిన జనాలనుంచి తప్పించుకుని చెన్నై వొచ్చేశాననే సమాధానం. అలారమూ అప్పుడే మోగింది దాంతోబాటే లేచాడు ‘ శేఖర్ ‘, ఇంకో రూమ్మేటు. ఆఫీసుకు టైమయ్యిందని బాత్రూములో దూరిన కేశవన్, వెన్నంటే పరిగెత్తిన శేఖర్.  చూస్తూ నిలబడ్డ పగలవన్ !  షాట్ ఓకే.
చూస్కోరా మనోణ్ణి అని అప్పగించి కేశవన్ ఆఫీసుకెళ్ళిపోతాడు. తర్వాత శేఖర్ హడావుడిగా స్నానమూ, వేషమూ ముగించి  బాగా ఎండ తగిలేచోట టేబిల్ ముందు కూర్చుని క్వార్టరూ, స్టఫ్ఫూ తెరుస్తుంటే నోరెళ్ళబెడుతూ పనికెళ్ళలేదా అని పగలవన్  అడుగుతే అందరూ పని చేసే తీరాలా అంటూ ఓ ఉపన్యాసమూ, తన గురించిన ఉపోద్ఘాతమూ మొదలెడతాడు శేఖర్. ఓ ఫైవ్ స్టార్ హోటెల్లో వాలెట్ పార్కింగ్ వద్ద పనిచేస్తూ ఉన్నప్పుడు పార్కింగు కోసం వచ్చిన ఓ బీ ఎం డబ్ల్యూ కారు తాళాలు చేతికొచ్చినంత మాత్రానే వళ్ళు మరిచిపోయి ఓ రౌండు వేసొద్దాం, ఏమౌతుందిలే అని హోటెల్ పరిసరాలు దాటుతూంటే పట్టుకుని పన్లోంచి తీసేస్తారు. అలా ఎందుకు చేశావని అడిగినందుకు ” నా ఫేమిలీ లో ఒక్కరైనా కనీసం కారును తుడిచినోడు కూడా లేడు, నేను- అలాంటి ఫారిన్ కారునే నడిపా, చాలు జీవితానికి అంటాడు.
” మీ ఫిలాసఫీ నాకు నచ్చింది బాస్ “_పగలవన్
” నయనతారకు గుడి కట్టినోళ్ళకంతా నా ఫిలాసఫీ నచ్చుతుంది “_ శేఖర్.
ఆఫీసులో పని మధ్యలో కేశవన్ కో సమస్య. లవ్ చెయ్యమంటూ చాన్నాళ్ళుగా వెంటపడుతున్న ఓ అమ్మాయి సరిగ్గా ఆరోజే సీరియస్ గా కేఫ్టేరియా లో ఉన్న కేశవన్ ను బెదిరిస్తుంది. కట్టర్ ఒకటి తీసుకుని చేయి కోసుకోబోతుంది. అడ్డు వచ్చిన కేశవన్. ఆ అంటూ అరుపు. బాస్ ముందు ఇద్దరూ. ఆ అమ్మాయి కూర్చుని ఏడుస్తూ, కేశవన్ నిలబడి చేతికున్న కట్టువంక చూస్తూ. చెడామడా బాస్ తిడతాడు కేశవన్ ను. చదువుకున్న వాడివేనా, అమ్మాయిల మొహం ఎప్పుడూ చూడలేదా అంటూ. మనోడికి కళ్ళు తిరిగింది. అదన్నమాట సంగతి. కథ అడ్డంగా తిప్పేసిందన్నమాట ఆ అమ్మాయి. మనోడి ఉద్యోగం ఊడి, తన పేరూ బ్లాక్ లిస్టులో చేరి రూం లో ఉన్న శేఖరూ, పగలవన్ సరసన చేరతాడు. ముగ్గురికీ ఉద్యోగం లేదు. గడవడం ఎలా అన్న సమస్య.
ఇలాంటి సంధర్భంలో కళ్ళద్దాలూ, మారుతీ వేనూ, నోట్లో వెలిగించిన సిగరెట్టూ, రఫ్ గా ఉన్న ఓ మొహమూ, భయంగొలిపేలా ఉన్నా అమాయకత్వం ఉట్టిపడే  ‘దాస్ ‘. వెంటే తన మరదలు. ఐస్ క్రీం తింటూ, చిట్టిపొట్టి మోడెర్న్ బట్టలతో భలే ఉందిలే అమ్మాయి. దాస్ సద్యోగం ఏంటంటే కిడ్నాపింగ్. దాన్లో ఏమైనా తోపా? కానే కాదు. ఏదో బతుకు తెరువుకోసం సిన్సియర్ గా ఈ పనినే ఎన్ని ఎదురుదెబ్బలు తింటున్నా వదలకుండా చేస్తున్న వ్యక్తి. ఓ సారి వంటరిగా ఉందని కిడ్నాప్ చేయబోయిన ఓ అమ్మాయి, ఆ అమ్మాయి స్పోర్ట్స్ వుమెన్ అని తెలీదు మరి, వెంటబడి మరీ తంతుంది. ఇంకోసారి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ సిగరెట్ తాగుతూ పరధ్యానంగా ఉంటాడు.అదే టైంలో ఆ వీధి దాదా ఒకడు నడుచుకుంటూ దగ్గరకు వచ్చి టైమెంత అని అడిగితే పరధ్యానంగా చిల్లర లేదు పొమ్మంటాడు. దాదాకు అవమానం అయిపోతుంది. తరుముతాడు. మనోడూ పారిపోతాడు. మన దాస్ కి ఓ రకమైన  ఆబ్సెంట్ మైండెడ్ పర్సనాలిటీ డిజార్డరు. ఆ రోగమేం లేదు. మనం తగిలించామంతే.
 SD-Title
మన ముగ్గురు రూమ్మేట్లూ, దాస్ తన మరదలితో ఓ బార్లో వేర్వేరుగా ప్రత్యక్షం.. కాకతాళీయంగా అక్కడికే ఆరోజు ( ఆ రోజే మరి ) చిల్లర లేదనిపించుకుని నవ్వులపాలైన పిల్ల దాదా తన గూండాలతో హాజరు. ఏడుస్తూ బాధపడుతూంటాడు. బుద్ది తక్కువై పొద్దుటి విషయం తెలీని అసిస్టెంట్ గూండా ” చిల్లర లేదని శనగపప్పుల్ని తెచ్చా” అన్నందుకు అనుచరుని చావగొడతాడు. దూరంగా కూర్చుని తాగుతున్న దాస్ ని చూస్తాడు . అంతే ఆవేశం తన్నుకొచ్చి దాస్ దగ్గరికెళ్తూ దగ్గర్లో ఉన్న టేబిల్ మీద బీరు సీసా తీసుకుంటాడు. దాస్ తలమీద ఒక్కటివ్వబోతుంటే బాటిల్ ఎంతకీ చేతికి రాదు. చూస్తే ఆ బాటిల్ మన తిరుచ్చి పగలవన్ ది. అదే బాటిల్తో దాదా తల మీద ఒక్కటి పడుతుంది. గొడవ గొడవ. తాగేసున్న బార్లో అందరూ తన్నుకోవడం మొదలు. పోలీసులూ ప్రత్యక్షం. గోడదూకిన మన రూమ్మేట్లని అరుస్తూ పిలుస్తాడు దాస్, వేన్ లోకి వచ్చెయ్యమని. అందరూ దాస్ ఇంట్లో సమావేశం. పూర్తికాని తాగుడు అక్కడ కొనసాగిస్తారు.
పొద్దున్నకల్లా ముగ్గురికీ అర్థమౌతుంది. ఈ దాస్ అనే మనిషి ఒకటి కాదు రెండు డిజార్డర్లతో బాధ పడుతున్నాడని. ఒంటరి సినిమాలో గోపీచంద్ లా. మరదలు లేదు. ఉందని దాస్ భ్రమతో మాట్లాడేస్తూ ఉంటాడు. పొద్దున్న లేచి వీళ్ళకి తన బతుకు తెరువు గురించి చెప్పడం మొదలెడుతూ తన వృత్తిలో ఉన్న కిటుకులూ, అయిదు సూత్రాలూ చెప్తాడు. పగలవన్ కూ, శేఖర్ కూ ” పిచ్చ పిచ్చ ” గా నచ్చుతుంది దాస్ చేస్తున్న పని.  దాస్ పని కిడ్నాపింగ్ అని తెలిసిన మరుక్షణం కేశవన్ వెళ్ళిపోతాడు. కానీ ఎక్కడో పగలవన్ కూ, శేఖర్ కూ దాస్ బాగా నచ్చేసి ఉంటాడు. ఆరోజు రాత్రి కేశవన్ వీరిద్దరికీ చెప్తాడు,  ప్రయత్నిస్తే పని దొరుకుతుంది. నిజాయితీ గా కష్టపడదాం అని మినీ లెక్చర్లు ఇస్తాడు. పొద్దున్నకల్లా ఇద్దరూ మాయం. కేశవన్ కూ అర్థమైపోయింది ఎక్కడ చేరారో ఈ ఇద్దరు సైకోలు.
ఇప్పుడు మన ‘ అరుమై ప్రకాశన్ ‘ వంతు. రూలింగు పార్టీ మంత్రి గారి కొడుకు. అత్యంత నిజాయితీ పరుడైన రాజకీయ నాయకుడికి పుట్టిన ఏకైక సంతానం. డిగ్రీ అయిదేళ్ళుగా తగలేస్తూ, వీధి చివర్న రోజుకు మూడు పేకెట్ల సిగరెట్లు, పది పదిహేను టీ లు ఊదేస్తూ,పొద్దస్తమానం ఏదో ఆలోచనల్లోనే ఉంటూ గడుపుతూ వ్యాపారం కోసం నాన్న దగ్గర డబ్బులు తీసివ్వమని తల్లితో మొరపెట్టుకుంటూ ఉన్న పుత్ర రాజు. తండ్రి నిజాయితీ కోసం ఎంత దూరం వెళ్తాడంటే లంచం ఇవ్వడానికొచ్చిన ఓ ఇద్దరు వ్యాపారుల్ని రెడ్ హేండెడ్ గా అవినీతి నిరోధక అధికారికి పట్టించేసి పేపర్లకెక్కే విపరీతమైన ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న ఓ పాతకాలపు నాయకుడు.
మన దాస్ కిడ్నాపింగు అంత పెద్ద దందా కాదు. ఓ యాభై వేలదాకా రేంజి లోనే పని కానిచ్చేస్తాడు. అంత కన్నా ఎక్కువ డిమాండు చేయడు. మధ్యతరగతి మనుషుల్నే కిడ్నాప్ చేస్తాడు. రాజకీయం, పలుకుబడి, పోలీసులు, ధనవంతుల్ని దాస్ ఎప్పుడూ టార్గెట్ చెయ్యడు. ఇలా ఉంటే ఓ సారి ఓ పిల్లవాణ్ణి కిడ్నాప్ చేసి డబ్బులు తీసుకుని వెనక్కి వెళ్తుంటే  సెల్లు మోగుతుంది. అదేవర్నుంచో కాదు, గతంలో ఓ సారి ‘ అరుమై ప్రకాశన్ ‘ తండ్రి యాంటి కరప్షన్ అధికారులకి పట్టిచ్చిన వ్యాపారిదే. మంత్రిగారి కొడుకుని కిడ్నాప్ చెయమని ఆఫర్. వీళ్ళ నియమాలు ఒప్పుకోవు. బాగా డబ్బులూ ఇవ్వజూపుతాడు. ఒక్కసారిగా పెద్దమొత్తం వస్తుందని దాస్ ను తక్కిన ముగ్గురూ ( ఇద్దరేగా? కేశవన్ పేరు బాగా చలామనీ అయిపోయి అప్పటికే ఉద్యోగం దొరకదని వీళ్ళతో చేరిపోతాడు ) ఒప్పిస్తారు.
ఆ రోజు మంత్రిగారి ఇంటివద్ద అప్పటికే మాటు వేసి, రెక్కీలు వేసి సిద్ధంగా ఉన్న నలుగురూ విస్తుపోయేలా అరుమై ప్రకాశన్ ను ఇంకో ముఠా కిడ్నాప్ చేసేస్తుంది. వీళ్ళకు మతి పోతుంది. వాళ్ళను వెంబడిస్తే ఓ చోట బండి దిగి నింపాదిగా నడుచుకుంటూ ఇంట్లోకెళ్తున్న అరుమై ప్రకాశన్. కట్ చేస్తే ఆ కిడ్నాప్ అయిడియా మొత్తం మంత్రి గారి అబ్బాయిదే. అక్కడే మాటు వేసి ఆ సాయంకాలానికి ఆ ఇంట్లో మేడమీద బాగా తాగేసి స్పృహ లేని స్థితిలో ఉన్న అరుమై ప్రకాశన్ ని వీళ్ళ స్థావరానికి తెచ్చేసుకుంటారు. వీళ్ళకూ అనుభవం లేదు. పెద్ద వ్యవహారాలూ దాస్ ఇంతకు ముందెన్నడూ చేయలేదు. ఫోన్ చేసి మంత్రిగారిని డబ్బు ప్రాధేయపడుతూంటే మంత్రి మొహం మీద కట్ చేస్తాడు. వీళ్ళకూ పాలు పోని స్థితిలో అరుమై ప్రకాశన్ అయిడియా ఇస్తాడు. మీకు సగం నాకు సగం అయితేనే అంటాడు. మీకు చేతకాక నా ప్లాన్ కూడా చెడగొట్టినందుకు మీకు పైసా కూడా రాదు. నేను మంచోణ్ణి కాబట్టి మీకు సగం. మన దాస్ & కో కూడా వప్పుకుంటుంది.
ఫోన్ చేసి గొంతు ఎవరో నొక్కేస్తున్నట్లు నటిస్తూ వాళ్ళమ్మతో అరుమై ప్రకాశన్ తనను కిడ్నాప్ చేసిన గాంగ్ మనుషులు చంపేస్తున్నారంటూ, రెండు కోట్లు డిమాండు చేస్తున్నారని, తండ్రి ఎలాగూ ఇవ్వడు కాబట్టి పార్టీ ఆఫీసు ముందు ధర్నా చేసేలా పురిగొల్పుతాడు అరమై ప్రకాశన్. మంత్రి గారి భార్య కూడా అలాగే గోల గోల చేస్తుంది. ఇక టీ వీ చానళ్ళూ, పేపర్లూ ఆ గొడవలూ సరేసరి. పార్టీ లీడరు పిలుస్తాడు మంత్రిని. ” ఏమైనా  దాచావా అంటే లేదు, నేనెంత నిజాయితీ పరుణ్ణో తెలీదా ” అంటే, ఇక గొడవ పెద్దది చెయ్యకూడదని పార్టీ ఫండు నుంచి రెండు కోట్లు తీసి మంత్రి గారి భార్య చేతిలో పెడతారు  పార్టీ పెద్ద మనుషులు. దాస్ అనుచరులు ఎక్కడి రావాలో చెప్తుంటే,  అప్పటికే పెద్ద పోలీసు అధికారి హోదాలో ఉన్న మంత్రి గారి బావ మరిది ఆవిడకు  జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు. దాస్ కంపెనీ చేతికి డబ్బులొచ్చేసిన తర్వాత డబ్బులు పంచే గొడవలో అరుమై ప్రకాశన్ మొత్తం డబ్బులున్న బేగ్ తీసుకుని నడుస్తున్న వేన్ నుండి దూకి పారిపోతాడు. పట్టుతప్పిన బండికి ప్రమాదం జరిగి కింద పడ్డ దాస్ & కో బాగా దెబ్బలు తగిలించుకుని ఉంటారు. పనిలో పనిగా దాస్ కూడా ఆ సంఘటనని వాడుకుంటూ ఏక్సిడెంటులో తన మరదలు చచ్చిపోయిందని కూడా ఏడుస్తూ ఆ బంధానికి ముగింపు పలికేస్తూ ఉంటాడు. వీళ్ళకు తెలుసు కాబట్టి దాస్ ను కాసేపు భరించి సాయంకాలానికి ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తారు.
అతను డాక్టరు కాదు. అయినా డాక్టరులాగా వద్దకొచ్చిన పేషంట్లకు ఏ డాక్టరు దగ్గరికెళ్ళాలో ప్రిస్క్రిప్షను రాసి ఇస్తూంటాడు. ఫుల్ టైం లో రౌడీ. పార్ట్ టైం లో సినిమా కథకు తగ్గ హీరో కోసం కొత్తమొహం కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే తారసపడతారు మన దాస్ & ఫ్రెండ్స్. నయనతార ఫేన్ అయిన మన తిరుచ్చిపగలవన్ ను చూసి సినిమాలో వేషం వేస్తావా, నీకోసమే ఇన్నాళ్ళుగా చూస్తున్నా అంటూ మతిలేనివాడిలా ఏదేదో మాటాడేస్తూ ఉంటాడు. మీరు గ్రహించారిప్పటికే- ఇతను కూడా ఓ రకమైన మనోవ్యాధిగ్రస్థుడని.  ముక్తాయింపు ఏమిటంటే ఇతను దాస్ కు స్వయానా సోదరుడు. తన దగ్గరకొచ్చిన దాస్ బృందం దగ్గర విషయం తెలుసుకుని వాళ్ళకి అప్పటికి ఆశ్రయం తన దగ్గర కల్పిస్తాడు.
ఇలా ఉండగా మంత్రిగారు పరువు పోయిందని తన బామ్మర్ది అయిన పోలీసు అధికారితో ఎలాగైనా ఆ కిడ్నాపింగ్ గుంపును పట్టుకోవాలని వత్తిడి తీసుకొస్తాడు. ఎప్పుడూ బదిలీలమీద ఉండే బ్రహ్మ అనబడే ఓ పోలీసు ఇనస్పెక్టరును ఆ పనిమీద నియమించమని ఆర్డరు వేస్తాడు. కానీ అధికారి వప్పుకోడు. ఎందుకంటే …. అతనో పెద్ద ఉన్మాది. నేరస్థుల్ని పట్టుకోవడం కన్నా రకరకాలుగా హింసించి చంపడంలోనే ఎక్కువ ఆనందం పొందే మనిషి. కథలోకొచ్చేద్దాం. మంత్రి గారు పట్టు వదలడు. ఇక ఏం చేయడం అని బ్రహ్మ ను రప్పిస్తాడు. ఇదే సమయంలో ఈ వార్తను పేపర్లలో చదివిన్ అ డాక్టరు దాస్ బృందానికి తెలియజేస్తాడు. దాస్ బృందం డబ్బెలాగూ పోయింది. ఓ సైకో పోలీసు ఇనస్పెక్టరు కూడా వెంట పడడం మొదలయ్యింది. ఏదో ఒకటి  మళ్ళీ ‘ అరుమై ప్రకాశన్ ‘ ని కిడ్నాప్ చేద్దాం అని నిర్ణయిస్తారు. డాక్టరు గారు ఓ తుపాకీ కూడా సప్లై చేస్తారు.
అరుమై ప్రకాశన్ ఇంటిముందు నిలబడ్డ దాస్ మిత్రులకు ఇంటిముందు ఆగున్న పోలీసు జీపు కనబడుతుంది. చూస్తే అది బ్రమ్మీ గారిది.
చావుదగ్గరికొచ్చాం కదా అని వీళ్ళు బిక్కచచ్చిపోయి ఆలోచిస్తూంటారు. లోపల విచారిస్తున్న బ్రహ్మ అరుమై ప్రకాశన్ చెప్తున్న మాటల్ని నమ్మడు. కార్డు చేతిలో పెట్టి చెంప వాయగొట్టి సాయంత్రానికి నిజం చెప్పమని వార్నింగు ఇప్పించి ( ఎందుకంటే ఈ బ్రహ్మ పాత్రకు మాటలు లేవు. కేవలం సైగలే. మూగోడు కాదు. మాట్లాడ్డం ఇష్టం ఉండదంతే ) బయటికొస్తాడు. సిగరెట్ వెలిగించడానికి అగ్గిపెట్టే కోసం వెతుకుతూంటే వేన్ లో కూర్చున్న దాస్ మనుషులు కనబడతారు. అగ్గిపెట్టెకోసం వాళ్ళదగ్గరకెళ్తే వీళ్ళు జడుసుకుని పారిపోతారు. బ్రహ్మకు అనుమానం బలపడి వెంబడిస్తాడు. వాన్ ని వదిలేసి రోడ్డుమీద పారిపోతున్న వీళ్ళు ఓ నల్లటి కారుని ఆపి దాన్ని తీసుకుని ఓ చోట ఆగుతారు.
” అలాగే, నల్లటి కారు కదా, లోపల మనిషి వెయిట్ చేస్తోందా అని ఫోన్లో అంటూ వీళ్ళ కారులోకే వచ్చి కూర్చుంటాడు అరుమై ప్రకాశన్. అది సంగతి. మంత్రి కొడుకు డబ్బుతో జల్సాలు చేస్తూ మళ్ళీ వీళ్ళకే దొరుకుతాడు. ఆఫర్ ఇస్తాడు సగం డబ్బులిచ్చేస్తానని. సరే పోలీసుల దగ్గర మేమే కిడ్నాప్ చేశామని చెప్పొద్దని మాట తీసుకుని వదిలేస్తారు. ఈ తతంగమంతా డాక్టరు గారు వీడియో తీసి వీళ్ళు తప్పించుకునే దారి చూపిస్తాడు. దురదృష్టం కొద్దీ ఆ మినీ కేసెట్ దారిలో కిందపడి ముక్కలైపోతే చేసే దారిలేక వీరు పోలీసులకు లొంగిపోతారు.
కోర్టులో హాజరు చేసిన వీళ్ళని వీరు కాదు కిడ్నాప్ చేసిందంటూ అరుమై ప్రకాశన్ వీళ్ళని అప్పటికి కాపాడేస్తాడు. విడుదలైనట్లు సంతకం పెట్టించుకుని వీళ్ళని ఓ వేన్ లో మారుమూల తోటలోకి తీసుకెళ్ళి, ఓ చీకటి కంటైనర్లో బ్రహ్మ తీవ్రంగా హింసించడం మొదలు పెడతాడు. కొట్టీ కొట్టీ విసుగొచ్చి చంపేద్దామని మారు తుపాకీ తీయబోతుంటే వెనుక నడుం తుపాకీ దగ్గర పేలి ( సినిమాల్లో గన్ ఎక్కడ పెట్టుకుంటారో తెలుసుగా? )  బ్రహ్మ తీవ్రంగా గాయపడతాడు. అక్కడికక్కడే దాస్ గాంగ్ ను వదిలేసి పోలీసులు బ్రహ్మ ను తీసుకుని ఉన్నఫళంగా వెళ్ళిపోతారు. డాక్టరు దగ్గరికొచ్చిన దాస్ బృందాన్ని కలుస్తాడు అరుమై ప్రకాశన్. ఎలాగైనా తనను గాంగులో కలుపుకోమని, కాస్త పరిస్థితులు చక్కబడే వరకూ ఎలాగైనా తనను బీహార్ ఎక్కడైనా పంపెయ్యమని చెప్తాడు. అప్పుడే ఇంటెలిజెన్సు దాడి చేసి అరుమై ప్రకాశన్ ని తీసుకెళ్ళిపోతారు.
కొన్ని గంటల ముందే ఆ రోజు కొడుకు నిర్వాకం పసిగట్టిన మంత్రిగారు అరుమై ప్రకాశన్ తో పెనుగులాడి డబ్బు దాచిన బాగ్ ను తీసుకుని  మంత్రిగారి దగ్గరికి  నిజాయితీ నిరూపించుకునేందుకు వెళ్ళీ బాగ్ తెరిచి చూపించబోతూంటే మొత్తం న్యూస్ పేపర్ల కట్టలే కనిపిస్తాయి. మన అరుమై ప్రకాశన్ తండ్రితో పెనుగులాటలో గదిలో తలుపేసుకున్న సంధర్భంలో డబ్బుల్ని మంచం కిందికి తోసేసి పేపర్ల కట్టల్ని బాగ్ లో సర్దేసి ఉంటాడు. నిర్ఘాంతపోయిన మంత్రి గారి మొహం చూస్తూ పార్టీ నాయకుడు ( ముఖ్యమంత్రో ఏమో )  అరుమై ప్రకాశన్ ని ఎలాగైనా పట్టుకు తెమ్మని ఇంటెలిజెన్సు కు చెప్తాడు.
ముగింపు:  అరుమై ప్రకాశన్ తెలివితేటలకు మెచ్చి అందుకు గుర్తింపుగా  మంత్రి గారి కొడుక్కి ఎన్నికల టికెట్ కంఫర్మ్. తండ్రికి బలవంతపు రిటైర్మెంట్.  కొడుకు ఎన్నికల్లో గెలుస్తాడు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కేశవన్, బీం యెం డబ్ల్యూ శేఖర్ లు కొత్త యువ మంత్రి గారి ప్రైవేట్ మనుషులవుతారు. హాస్పిటల్లో బ్రహ్మ పళ్ళు కొరుకుతూ టీవీలో యువ మంత్రి గారి ప్రమాణ స్వీకారం చూస్తూంటాడు. నయనతారకు గుడి కట్టిన తిరుచ్చి పగలవన్ సినిమాలో నటిస్తూ డాక్టరుగారి దర్శకత్వంలో  ఆ చెంపా ఈ చెంపా వాయించుకుంటూ, టేకుల మీద టేకులు తినేస్తూ ఉంటాడు.
చివరగా దాస్ తన ఇంట్లో కిడ్నాపింగ్ సూత్రాలు ఓ కొత్త బాచ్ కు బోధిస్తూంటాడు.  ముందు వరుసలో చూస్తే శ్రద్ధగా లీనమై వింటూ, మొదట్లో దాస్ చేత చిల్లర లేదనిపించుకున్న గూండా ! సమాప్తం. !
నలన్ కుమారస్వామి దర్శకత్వం. ఇదే అతని దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా. విజయ్ సేథుపది దాస్ గా బాగా నటించాడు.. శేఖర్, పగలవన్ పాత్రలు గుర్తుండిపోతాయి. జిగర్ థండా సినిమాలో హీరో స్నేహితుడిగా చేసిన కరుణాగరణ్ ( అలాగే పలకాలి మరి :) ) ఈ సినిమాలో అరుమై ప్రకాశన్ గా మంచి నటన కనబరిచాడు. సన్నివేశాన్ననుసరించి  రెండుమూడు నిమిషాల్లో ముగిసిపోయే  పాటల్ని చొప్పించిన డైరెక్టరును మెచ్చుకోవాలి. బడ్జెట్ గురించి చెప్పనక్కరలేదు. తమిళ సినిమాల సంగతి తెలిసిందే.. ( చూడుడు భారతీ రాజా సినిమాలు ). నలభై కోట్ల దాకా వసూళ్ళు సాధించిందంటే ఈ సినిమా ఎంత బాగా జనాలకు కనెక్టు అయ్యిందో తెలిసిపోతుంది.
తెలుగులో ఓ పెద్ద తమిళ హీరో చేస్తున్నట్లు ఈ మధ్యన వచ్చిన కొన్ని ట్రైలర్లు చూస్తే అర్థమయ్యింది. ( హ హ హ మీరు సరిగ్గానే గెస్ చేశారు. పవన్ కళ్యాన్ అభిమానులైతే ఇంకా బాగా ఊహించగలరు. ) ఇంకా కొందరు పెద్ద పెద్ద నటులు కూడా నటిస్తున్నారనీనూ తెలిసింది. చెన్నై ఎక్ప్రెస్ తీసిన రాకేష్ శెట్టి హిందీలో ఈసినిమాను లుంగీ డాన్సుల్తో మక్కీకి మక్కీ దించెయ్యడానికి రెడీ అయ్యారనీనూ వికీపీడియా కోడై కూస్తోంది.
సర్కాస్టిక్ కామెడీ సినిమా. మారుతున్న విలువల్నిఅత్యంత దగ్గరగా చూపిస్తూ నవ్వొచ్చేలా తీసిన సెటైరికల్ సినిమా ఇది. తప్పక చూడండి.
-శ్రీరామ్ కన్నన్

ఆమె చెప్పిన అతని కథ

theory1అంతో ఇంతో చదువుకున్న ప్రతివారికీ స్టీఫెన్ హాకింగ్ పేరు తప్పక తెలుస్తుంది   అతనో గొప్ప మేధావి . భౌతిక శాస్త్ర రంగంలో అతను చేసిన కృషి ,పరిశోధన అసామాన్యం . ఒక ఫిజిసిస్ట్ గానే కాక ఫిజిక్స్ ని ఎంతో సులువుగా అందరికీ  అర్థమయ్యే రీతిలో వివరించిన రచయితగా కూడా ఆయన ప్రపంచానికి సుపరిచితుడు . ఆయన రచించిన ఎ బ్రీఫ్ హిస్టరీ అఫ్ టైం  ఎన్నో క్లిష్టమైన సైన్స్  సిద్ధాంతాలని,  సైన్స్ గురించి పెద్దగా అవగాహన లేని  వారికి కూడా అర్థమయ్యేలా  సరళంగా విడమర్చి  వివరించడంలో ఘన విజయం సాధించింది .  అటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి , అతనితో గడిపిన తన జీవితం గురించి అతని మాజీ భార్య జేన్ వైల్డ్ హాకింగ్ రాసిన మెమోయిర్ Travelling to Infinity: My Life with Stephen  ఆధారంగా నిర్మించిన చిత్రం The theory of everything . 

ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు . ఆ సామెత ఉద్దేశ్యం స్త్రీకి ప్రాధాన్యత నివ్వడమో, లేక అప్పుడు కూడా ఆమెని అతని వెనకనే ఉంచడమో తెలీదు గానీ ప్రతీ విజయం వెనుక మాత్రం ఎన్నో అపజయాలుంటాయి. నిరాశ, నిస్పృహ నిండిన రోజులు , కష్టాలు, కన్నీళ్ళు ఉంటాయి . ఆ సమయంలో వెనక నిలబడి వెన్నుతట్టి ధైర్యం చెప్పే తోడు ఎటువంటి వారికైనా అవసరం . అటువంటి తోడు జీవిత భాగస్వామే అయితే అది నిజంగా అదృష్టమే . పారనోయిడ్ స్క్రిజోఫీనియాతో జీవితమంతా బాధపడిన మేధావి మేథమెటీషియన్ జాన్ నాష్ విషయంలో కూడా అతని భార్య ఎలీసా సహాయం చెప్పుకోదగ్గది .

ఇక్కడ స్టీఫెన్ హాకింగ్ వంటి జీనియస్ జీవితం కూడా అతి చిన్న వయసులోనే ముళ్ళ బాటల వైపుకి మళ్ళి పోయింది . ఇరవై యేళ్ళయినా నిండకుండానే అతి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో(ఆక్స్ఫర్డ్ ,కేంబ్రిడ్జ్) అతని ప్రతిభ గుర్తింపు పొందుతూ ఉండగానే ఓ మహమ్మారి రోగం అతని శరీరంలోకి చొరబడింది .  ALS లేదా మోటార్ న్యూట్రాన్ డిసీజ్ అని పిలవబడే ఈ వ్యాధి  మెల్ల మెల్లగా శరీరంలోని ప్రతి భాగాన్నీ నిర్వీర్యం చేసి చివరికి ప్రాణాలు తీస్తుంది . మెదడునీ ఆలోచననీ మాత్రం సాధారణంగా వదిలి పెడుతుంది. వస్తూనే ఉగ్ర రూపాన్ని చూపిన ఈ వ్యాధి స్టీఫెన్లో అప్పుడప్పుడే చిగురులు తొడుగుతున్న యవ్వనాన్నీ, అది తెచ్చిన ఉత్సాహాన్నీ సమూలంగా పెకిలించి వేసింది  . మరణానికీ తనకీ ఉన్న దూరం రెండేళ్ళేనని డాక్టర్ చెప్పిన మాటలు  అతన్ని అంతులేని దుఖంలో పాతిపెట్టాయి .

అంతటి లోతైన నిరాశలోంచి  అతన్ని ఒంటి చేత్తో బయటకి లాగి పడేస్తుంది ఆ అమ్మాయి . ఎన్నో రోజుల పరిచయం కాకపోయినా అతని మీద అనంతమైన ప్రేమని పెంచుకున్న జేన్ వైల్డ్ అతనితో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడుతుంది . ప్రేమికురాలి నుండి భార్య స్థానాన్నీ , కాలక్రమంలో అతని పిల్లలకి తల్లి స్థానాన్నీ సంతోషంగా స్వీకరిస్తుంది . కళ్ళముందే అతను రెండు కర్రల ఊతంతో నడవడం నుండి వీల్ చైర్ లోకి మారడాన్నీ, తనకి మాత్రమే అర్థమయ్యేంత అస్పష్టత లోకి మాటని కోల్పోవడాన్నీ ఎంతో ప్రేమతో స్వీకరిస్తుంది . అతను బ్లాక్ హోల్స్ గురించీ , విశ్వం పుట్టుక గురించి థియరీల మీద ధియరీలు ఊహిస్తుంటే ప్రాక్టికల్ గా మొత్తం కుటుంబ భారాన్ని తన భుజాల మీద వేసుకుని తన ముగ్గురి  పిల్లలతో పాటుగా శారీరకంగా పసివాడిలాంటి భర్తని కూడా ఓర్పుతో సాకుతుంది  .

ఓ దశలో స్టీఫెన్ పూర్తిగా మాటని కోల్పోతాడు  చావుని అతి దగ్గరగా చూసి వచ్చినా ధైర్యం కోల్పోని స్టీఫెన్, స్పీచ్ సింథసైజర్ సహాయంతో రాసిన సైన్స్ పుస్తకం ఎ బ్రీఫ్ హిస్టరీ అఫ్ టైం పెద్ద సంచలనమవుతుంది . అతని గొప్పతనాన్ని ప్రపంచమంతా మరింతగా గుర్తిస్తుంది. ఇంతలో నర్స్ గా అతని జీవితంలోకి ప్రవేశించిన Elaine Mason వల్ల స్టీఫెన్ ,జేన్ ల జీవితాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయో , చివరికి ముప్పై ఏళ్ళ వాళ్ళ ప్రేమ కథ ఏ రకమైన మలుపు తిరిగిందో  తెరమీద చూసి తెలుసుకోవాల్సిందే.

స్టీఫెన్ హాకింగ్ పాత్రధారి Eddie Redmayne నటన అద్భుతం , అతి సహజం అని చెప్పాలి . నిజంగా స్టీఫెన్ హాకింగ్ వచ్చి నటించాడా అని సందేహం కలిగేంత సహజంగా ఉంటుంది అతని నటన.  మాట్లాడలేని స్థితిలో ఉన్న వ్యక్తిగా సందర్భానుసారంగా కళ్ళతోనే  ప్రేమనీ, దుఃఖాన్నీ , అసహాయతనీ , చిలిపితనాన్నీ అతను అలవోకగా పలికించాడు . గొప్ప విల్ పవర్ , ప్రేమ తత్త్వం కలిగిన స్త్రీగా Felicity Jones కూడా ఎంతో సహజంగా నటించింది . చూడ్డానికి కథంతా రెండు గంటల్లో ఇమిడిపోయినా నిజానికి అంతటి సుదీర్ఘమైన సమయం పాటు, అతను అనారోగ్యంతోనూ, ఆమె క్లిష్ట పరిస్థితులతోనూ పోరాడిన వైనం చూసి ఎన్నో మంచి పాఠాలు నేర్చుకోవచ్చు . అతని ఆత్మస్థయిర్యాన్నీ , ఆమె స్థిత ప్రజ్ఞతనీ మెచ్చుకుని తీరాల్సిందే . ఒక సినిమా చూస్తున్నట్టు కాక నిజమైన జీవితాన్ని చూస్తున్న అనుభూతి కలిగేలా చెయ్యడంలో దర్శకుడు

James Marsh విజయం సాధించాడు .  జేన్ దృష్టి కోణంలో నుండి చెప్పబడటం వల్ల  సైన్స్ విషయాలకి పెద్దగా ప్రాధాన్యతనివ్వకుండా సున్నితమైన మానవ సంబంధాలని ఎలివేట్ చేస్తూ కథ సాగుతుంది .

కొన్ని నిజాల్ని చూపలేదన్న ఒక వాదన ఉన్నప్పటికీ స్టీఫెన్ వంటి జీనియస్ గురించీ , జేన్ వంటి ప్రేమ మూర్తి గురించీ తెలుసుకోవడం కోసం తప్పక చూడాల్సిన చిత్రం . ఐదు అకాడమీ అవార్డ్ లకి నామినేట్ కావడంతో పాటు , గోల్డెన్ గ్లోబ్ వంటి మరెన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డ్ లు గెలుచుకుంది ఈ బయోగ్రఫికల్ మూవీ . ప్రస్తుతం ఈ చలన చిత్రం భారతీయ సినిమా ధియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది

దేవుడే కీలుబొమ్మ?!

gopala

గోపాల…గోపాల ….. హిందీ సినిమా “ఓ మై గాడ్ “ కి రీమేక్ గా తెలుగు లో రూపొందిన చిత్రం, హిందీ సినిమాలో మామూలు సినిమా గా విడుదలై, అనూహ్య విజయాన్ని సాధించిన చిత్రం అయితే తెలుగు కు వచ్చే సరికి ఒక మల్టీ స్టారర్ చిత్రం గా మారింది . మల్టీ స్టారర్ అందులోనూ పవన్ కళ్యాణ్, అందులోనూ దేవుడు గా నటించటంతో  ఈ సినిమా ఓపెనింగ్స్ కి ప్రేక్షకులు బారులు తీరారు . దాదాపు సంవత్సర కాలంగా తెలుగు ప్రేక్షకులను ఊరిస్తూ వచ్చిన ఈ చిత్రం  ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే ఆ మాత్రం హడావుడి, ఉత్సాహం సహజం .

ఇక కథాంశం కి వస్తే , రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఒక వినూత్నమైన పాయింట్ ని బేస్ చేసుకున్న కథ. దేవుడు అస్తిత్వాన్ని ప్రశ్నించే కథ. సంస్కృతి , సాంప్రదాయాలు, భక్తి విపరీతంగా ఉన్న మన దేశంలో ఇలాంటి ఒక కథ ను సినిమాగా మలచాలి అనుకోవటం ఒక పెద్ద సాహసమే.  ఒక వైపు” పీకే” సినిమా పై వివాదం కొనసాగుతుండగా , ఇలాంటి సినిమా ఇక్కడ విడుదల కావటం ఒక విశేషం.  ఈ సినిమా మీద కూడా అప్పుడే వివాదాల నీడ పడింది . దేవుడున్నాడా ! లేదా !! అనే  వాదన తో ప్రారంభం అయి, దేవుడి అస్తిత్వం ద్వారా, అసలు దైవత్వం అంటే ఏంటో తెలియచేసే ప్రయత్నం ఈ సినిమా .

నిజానికి ఇప్పుడు భక్తి అనేది ఒక వ్యాపారం . ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే భక్తి అనేది భయం గా మారి, దెయ్యానికి దేవుడికి ఇద్దరికీ భయపడే పరిస్థితి. ఇద్దరికీ భయపడితే దెయ్యానికి, దేవుడికి తేడా ఏముంటుంది ??. దేవుడిని గౌరవించాలి, అతను చూపించిన  మార్గాన్ని అనుసరిస్తూ జీవనం సాగించాలి , కానీ మనం చేస్తున్నదేమిటి ?? దేవుడిని ఒక వ్యాపార వస్తువు చేసి, మన లోని బలహీనతలను, మన తప్పులను మన్నించమని , మనం చేసిన తప్పులకు బదులుగా దేవుడికి కానుకలు సమర్పిస్తూ , ఆ కానుకల వల్ల మన ఖాతాలో  పాపాలు తగ్గాయి, పుణ్యాలు పెరిగాయి , కాబట్టి మనం పుణ్యాత్ములం అనే ఒక భ్రమ లో బ్రతుకుతున్నాం.

అందుకే దేవాలయాలకు,చర్చిలకు, మసీదులకు  అంత గిరాకీ పెరిగింది,  వీధికొక్క దేవుడు పుట్టకొస్తున్నాడు, ఇంతకు ముందు పురాణాలలోనో, బైబిల్ లోనో, ఖురాన్ లో ఉదహరించిన  దేవుళ్లే కాకుండా , ఆ దేవుళ్ళకు రిప్రజంటేటివ్ గా బాబాలు, ముల్లాలు, ఫకీర్లు , బిషప్ లు …పేరు ఏదైతేనేం ఆ దేవుడి పేరు మీద వ్యాపారం చేసే వాళ్ళతో నిండిపోయింది, దేవుడుని గదిలో బందీని చేసి ఆ దేవుడిని ఒక బొమ్మను చేసి, ఆ బొమ్మ కి ఒక క్రేజ్ వచ్చేలా చేసి , ఆ బొమ్మను ఊరూరా తిప్పి ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకొనే వ్యాపారం, నిజంగా దేవుడున్నాడో లేదో తెలియదు కానీ, ఆ దేవుడి పేరు మీద వ్యాపారం మాత్రం నూటికి నూరు శాతం నిజం . ఇలాంటి వ్యాపారం మీద వ్యంగ్యాస్త్రం ఈ సినిమా . దేవుడు గుళ్ళో లేడు, చర్చిలోనో, మసీదులోనో లేడు , మనిషిలో ఉన్నాడు , మనిషి చేసే మంచిపనే దైవత్వం అని చెప్పే ప్రయత్నం ఈ సినిమా. కథాంశం పరంగా ఈ సినిమా ఒక మంచి సినిమా అనటంలో ఎలాంటి సందేహం లేదు .

దేవుడి బొమ్మలతో వ్యాపారం చేసే గోపాల రావు దుకాణం భూకంపం లో కూలిపోతుంది. దాని కోసం ఇన్సూరెన్స్ క్లైమ్ కోసం ప్రయత్నం చేస్తాడు, కాకపోతే ఇది ‘యాక్ట్ ఆఫ్ గాడ్ ‘మామూలు భాషలో చెప్పాలంటే ప్రకృతి వైపరీత్యం కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ క్లైమ్ ని తిరస్కరిస్తుంది . ఏమి చెయ్యాలో పాలుపోని పరిస్థితుల్లో గోపాలరావు ఆ దేవుడి వల్ల దుకాణం కూలిపోయింది కాబట్టి దేవుడే నష్ట పరిహారం చెల్లించాలి అనే వాదనతో కోర్ట్ ని ఆశ్రయిస్తాడు . ఇక్కడే అసలు దేవుడు అంటే ఎవరు అనే ప్రశ్న ఎదురు అవుతుంది . ప్రత్యేకంగా దేవుడు అంటే ఎవరు అని చెప్పలేనప్పుడు దేవుడి ప్రతినిధులుగా చెప్పుకుంటూ ఆశ్రమాలు నిర్వహిస్తున్న, వాటికోసం దేవుడి పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ఆశ్రమ నిర్వాహకులు నష్ట పరిహారం చెల్లించాలి అని వాదిస్తాడు, ఇది దేవుడినే ప్రశ్నించటం అని ఆశ్రమ నిర్వాహకులు వాదిస్తారు, కొంతమంది గోపాల రావు పై భౌతిక దాడులకు కూడా ప్రయత్నిస్తారు.

సరిగ్గా అప్పుడే దేవుడే స్వయంగా గోపాలరావును రక్షిస్తాడు. తనని రక్షించింది దేవుడు అని తెలియని గోపాల్రావు అతడిని తనలాగే మామూలు మనిషి అనుకుంటాడు . అప్పటినుండి దేవుడు గోపాలరావుకు తోడుగా ఉంటూ తన అస్తిత్వాన్నే ప్రశ్నిస్తున్న గోపాలరావు ద్వారా తన అస్తిత్వాన్నే తానే స్వయంగా ప్రశ్నించుకోవటం విచిత్రం .  తన అస్తిత్వం ఎక్కడో లేదు . ప్రతి మనిషి లో ఉంది. ఎదుటి మనిషిలోని మానవత్వాన్ని గుర్తించటమే దైవత్వం అని మనకు తెలియ చెప్పటమే స్టూలంగా కథాంశం . కానీ ఆ తెలియచెప్పే పద్దతే ఒక మెసేజ్ లానో, ఉపదేశం లానో కాకుండా ఇప్పటి జనరేషన్ కు తగ్గట్లు ఎక్కడా డైరెక్ట్ గా చెప్పకుండా చెప్పటమే ఈ సినిమాలో ఆకట్టుకొనే అంశం . అసలు దేవుడు బొమ్మలు అమ్ముకొనే గోపాలరావుతో దేవుడినే బొమ్మను చేసి ఆడుకొనే వ్యవస్థను ప్రశ్నించటం అనే ఎత్తుగడలోనే కథకుడి గొప్పతనం కనిపిస్తుంది .

ఇలాంటి గొప్ప ఆలోచన చేసిన ఉమేష్ శుక్లా ,భావేష్ మండాలియా నిజంగా అభినందనీయులు . ఈ సినిమాలో మరో గొప్ప విషయం అసలు  దేవుడిని వ్యాపారం చేసే ఏ వ్యవస్థకు  వ్యతిరేకంగా, గోపాలరావు తన పోరాటం చేశాడో ఆ గోపాల రావునే ఆ వ్యవస్థ దేవుడిని చెయ్యటానికి ప్రయత్నించటం ( నిజానికి సహజంగా ఇదే జరుగుతుంది),  కాకపోతే ఇది సినిమా కాబట్టి ఒక సినిమాటిక్ ఎండ్ తో ఆ ప్రయత్నాన్ని హీరో వమ్ము చేస్తాడు. దైవత్వాన్ని కాక, దేవుడిని నమ్మే సమాజం మీద సంధించిన వ్యంగాస్త్రం ఈ సినిమా ,

ఇక సాంకేతికాంశాల  విషయానికి వస్తే  ఇది కథా బలమున్న సినిమా గా కన్నా, మల్టీ స్టారర్ సినిమాగానే ప్రాచుర్యం పొందింది, ప్రేక్షకులు కూడా దీన్ని అలాగే రిసీవ్ చేసుకున్నారు .  పవన్ కళ్యాణ్ తన స్టైల్ ఆఫ్ పెర్ఫార్మేన్స్ తో దేవుడిగా ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు అనటం లో సందేహం లేదు  వెంకటేష్ తన పరిధి మేరకు బాగానే నటించాడు కానీ, పరేష్ రావల్ తో పోల్చి చూస్తే కొంచెం నిరాశ తప్పదు . పోల్చక పోతే ఏ బాధా లేదు . శ్రియ కు నటించటానికి పెద్ద ఆస్కారం లేదు. ఇక దర్శకత్వం విషయానికొస్తే హిందీ సినిమాని ఫ్రేమ్ టు ఫ్రేమ్ తెలుగులో సెట్ చేయటంలో సక్సెస్ సాధించాడు అనే చెప్పాలి . చివరకు ఉత్తరాది వారు వాడే డ్రస్సులే తెలుగులో కూడా వాడారు అంటే ఆ సినిమాని తెలుగులోకి అనువదించటానికి  ఎంత ప్రయత్నించారో  తెలుసుకోవచ్చు . అనూప్ రూబెన్స్ సంగీతం , జయన్ విన్సెంట్ ఫోటోగ్రపీ సినిమా స్థాయి కి తగ్గట్లే ఉన్నాయి. మొత్తం మీద ఈ సినిమా అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని, వెంకటేష్ ఫ్యాన్స్ ని తృప్తి పరుస్తుంది అనటంలో సందేహం లేదు, రెగ్యులర్ కమర్షియల్ అంశాలు లేకపోవటంతో ఈ సినిమా మిగతా ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో వేచి చూడాలి.

-మోహన్ రావిపాటి

mohan 

‘పాత్రో’చితంగా…

images

నిన్న ఆహుతి ప్రసాద్
ఇవ్వాళ గణేష్ పాత్రో…మొన్నటి బాలచందర్ విషాదం నించి కోలుకోకముందే…!
మృత్యువు ఎంత గడుసుదీ!
అది మనతోనే పుట్టింది. మనతోటే పెరుగుతుంది. వుండీ వుండీ మనకీ తెలియకుండా ‘మన’ని ‘తన’లోకి లాగేసుకుంటుంది.
పొద్దున్నే ఒకరు ఫోన్ చేసి, “సార్, గణేష్ పాత్రో గారూ…” అని నానిస్తే, “ఏమైందీ” అని అడిగాను.
“అహ! వారి ఫోన్ నంబరు తెలిసేమోననీ…” అన్నారు. వెంటనే ఫోన్ పెట్టేశారు.
గంట తరవాత హైదరాబాద్ నించి ఓ ఫోను. “GP…మరి లేరు!” అని.
మరో గంటకి వరసగా ఫోన్లు.
“సారీ…బాడీ హాస్పిటల్లో ఉందా? ఇంటికి తెచ్చారా?” అని.
ఎంత విచిత్రం!

శ్వాస ఉన్ననాళ్ళూ యీ శరీరం ‘శివం’
శ్వాస ఆగిన మరుక్షణం ‘శవం’
అప్పటిదాకా మనిషికి అన్ని పేర్లూ, బిరుదులూ, లాంచనాలూ అన్నీ పోయి కేవలం “బాడీ” అనే పదం మాత్రం మిగుల్తుంది. అప్పుడెప్పుడో శోభన్ బాబు గారు పోయినప్పుడూ అంతే!
“సార్…బాడీ హాస్పిటల్లో ఉందా? ఇంటికి తెచ్చారా?” అని ఇది సర్వ సహజం. ఈ ఒక్కదాన్నీ మించిన వేదాంతం ఎక్కడుంది? ‘బాడీ’ కేవలం body…! పేరెత్తరు! తెచ్చుకున్న పేరూ, పెట్టుకున్న పేరూ, పెట్టిన పేరూ అన్నీ శ్వాస ఆగగానే క్షణంలో మాయమవుతాయి.
సరే…

ఎక్కడో పార్వతీపురం దగ్గిర పుట్టారు. నాటకాలు రాశారు. నటించారు, స్పురద్రూపి కనుక! మధ్యతరగతీ, దిగువ మధ్య తరగతి జీవితాల్ని ఆపోశన పట్టారు. చెన్నపట్నం గమ్యం అయింది. ‘రాజీ పడడం’ అనే మాట గణేష్ పాత్రోకి తెలీదు.
మాట మనిషిని చంపుతుంది.
మాట మనసుని చంపుతుంది.
మాటే- మనిషినీ మనసునీ కూడా బతికిస్తుంది.
మాట నిన్ను గెలిపిస్తుంది. నిన్ను చిత్తుగా ఓడిస్తుంది. మాటే నిన్ను హిమాలయ శిఖరం మీద కూడా నిలబెదుతుంది. ఆ ‘మాట’ ని ఎలా వాడాలో, ఎంత వాడాలో, ఎప్పుడు వాడాలో తెలిసిన రచయిత – మాటల రచయితా, కథా రచయితా గణేష్ పాత్రో గారు.

ఈ చలనచిత్ర పరిశ్రమలో సముద్రాల వంటి సీనియర్ల ‘యుగాన్ని’ అలాగే ఉంచితే (వారిని జడ్జ్ చేయడం సముద్రాన్ని చెంచాతో కొలవడం లాంటిది గనక) ఆ తరవాత మనకి కొందరు మాటల మాంత్రికులు కనపడతారు- పింగళి నాగేంద్ర రావు, ఆచార్య ఆత్రేయ, ముళ్ళపూడి రమణ- ఇలాంటి మహానుభావులు.
వారికంటూ వారొక ‘పంధా’ ను సృష్టించి మనకి ‘సంభాషణా రచన’ ఎలా చేయాలో పాఠాలుగా బోధించారు. గణేష్ పాత్రో కూడా నిస్సందేహంగా ఆ కోవకి చెందినవాడే.
ఓ అక్షరం ఎక్కువుండదు.
ఓ అక్షరం తక్కువుండదు.
తూచినట్టు వుంటాయి మాటలు.
తూటాల్లా వుంటాయి మాటలు.
ఏ పాత్రకి ఏ భాష వాడాలో, స్పష్టంగా తెలిసిన రచయిత గణేష్ పాత్రో. అందుకే, ఆయన మాటలు ‘పాత్రో’చితంగా – ఒక ఎక్స్పర్ట్ టైలర్ కొలతలు తీసి కుట్టిన వస్త్రాల్లా వుంటాయి.
నటుడి హావభావాల్ని బాగా అబ్సర్వ్ చేస్తారు.

ఏ పదాలు ఆ నటుడి ముఖతా వస్తే పండుతాయో పరకాయ ప్రవేశం చేసి మరీ రాస్తారు.
అందుకే- ఆయన సంభాషణలకి అలవాటు పడ్డ నటులందరూ అనేది ఒకే మాట- “ఆయన డైలాగులే ఎలా నటించాలో మాకు నేర్పుతాయని”
ఇంతకంటే గొప్ప మెప్పుదల ఏముంటుందీ?
ఆ మెప్పుని వందల సార్లు పొందారు పాత్రో.

ఆయన కెరీర్లో ఒక్క పాటే రాశారు – “హలో గురూ ప్రేమ కోసమే” అని- నేననే వాడ్ని “పాత్రో గారు ఇంకొన్ని పాటలు రాయచ్చుగా” అని- ఆయన నవ్వి, “మీరూ ఇంకొన్ని సినిమాలకి సంభాషణలు రాయొచ్చుగా? మరెందుకు రాయలేదూ? మీరు డైలాగ్స్ రాస్తే, నేను పాటలు రాస్తా!” అనే వారు. (‘అలజడి’ అనే ఏకైక సినిమాకి నేను మాటలు రాసా. దర్శకత్వం: తమ్మారెడ్డి భరద్వాజ)

గ్రాఫ్ చూస్తే-
రుద్రవీణ, సీతరామయ్య గారి మనవరాలు, మరో చరిత్ర, గుప్పెడు మనసు, ముద్దుల కిట్టయ్య, ముద్దుల మావయ్య (భార్గవ్ ఆర్ట్స్ అన్ని సినిమాలకి ఆయనే మాటలు రాసారు)- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు – ఇలా ఎన్నెన్ని హిట్స్! మధ్యతరగతి, కింది తరగతి వాళ్ళ ప్రతి కదలికనీ గమనించారు. ప్రతి ఉద్వేగాన్నీ అక్షరాలుగా మలిచారు. మనని మనకి కొత్తగా చూపించారు. వాడిన డైలాగ్ వాడలేదు. సన్నివేశాలు ఒక్కోసారి ఒకేలా వున్నా “డైలాగ్స్”లో వైవిధ్యాన్ని చూపించి “శభాష్” అనిపించుకున్నారు.

వ్యక్తిగా ఆయనది ప్రత్యేకమైన వ్యక్తిత్వం.
ఆయన “సంభాషణ”లకి కూడా తనదైన “వ్యక్తిత్వం’ వుంది. ఇది స్పష్టంగా మనం చూడొచ్చు. ఇదో విచిత్రమైన లక్షణం. మరొకరి దగ్గిర కనబడదు. ఎవరినీ అడగరు, ఎవరినీ పొగడరు. ‘పని’ కోసం- వస్తే, ప్రాణం పెట్టి రాయడం, లేకపొతే హాయిగా చదువుకోవడం. ఆయనతో అనేక సాహిత్య చర్చల్లో పాలు పంచుకునే భాగ్యం కలిగింది. మంచి వక్త.
ఏమని చెప్పనూ? నాలుగేళ్ళుగా మెల్లమెల్లగా నీరసపరుస్తున్న కేన్సర్ తో పోరాడి- ఇక దాని ‘బాధ’ నన్నేం చేయలేదంటూ, శరీరాన్ని ఇక్కడే వదిలేసి మరో నూతన ‘వస్త్రం’ ధరించడానికి ఎక్కడి నించి వచ్చారో ఆ పుట్టింటికి వెళ్లిపోయారు.

“జో జాయేగే ఉస్ పార్ కభీ లౌట్ కే …న ఆయే…” (ఆ వొడ్డుకి వెళ్ళిన వారెవరూ ఈ వొడ్డుకి తిరిగి రాలేరు)
“ఓ జానే వాలో …హో సకే తో లౌట్ కే ఆనా” (వీలుంటే మా కోసం మరో సారి తిరిగి వస్తారా?”)
బస్…

‘రాం తేరి గంగా మైలీ’ చిత్రంలో ఓ అద్భుత దృశ్యం వుంది.
ఓ పెద్ద మంచు గడ్డ పాక మీంచి కింద పడుతుంది. ఆ క్షణమే ‘కెవ్వు’ మన్న బిడ్డ ఏడుపు – అప్పుడే పుట్టింది- వినిపిస్తుంది. రాజ్ కపూర్ ఎంత గొప్ప సింబాలిజం చూపించాడూ..
మన జీవితం అనేది పెద్ద మంచు ముద్ద.
అది క్షణక్షణం కరిగిపోతూనే వుంటుంది. (జీవితంలాగే చివరంటా)
గాలి గాలిలో, మట్టి మట్టిలో, నిప్పు నిప్పులో నీరు నీటిలో ఆత్మ ఆకాశంలో-
గణేష్ పాత్రోజీ, మీ పాత్రని ఈ భూమ్మీద అద్భుతంగా పోషించారు. మాకివాల్సింది అక్షరాల రూపంలో అద్భుతంగా ఇచ్చేసారు.

అందుకే, అల్విదా.

మీ ఆత్మ పరమాత్మలో లీనమగు గాక
అనంత శాంతి మీకు లభించు గాక.

– భువన చంద్ర

bhuvanachandra (5)

PK:చీకటి మత గురువులపై చెర్నాకోల

imagesHJG8UATD

ఆ మధ్య ఆఫీసులో ఒక స్నేహితుడు నాకు సంగీతమంటే ఇష్టమంటే యే సంగీతం ఇష్టం ఏ సంగీత కారులు ఇష్టం అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆయనకూ సంగీతమంటే ప్రాణమని ఉపోద్ఘాతమిస్తూ ! నాకు హిందుస్తానీ అంటే చాలా ఇష్టం – ముఖ్యంగా బడే ఘులాం అలీ ఖాన్ అంటే అని నేను చెప్ప గానే నొసలు చిట్లించి యేం ఇక గాయకులే కరువా? ఆయన తప్ప మరొకరు లేరా? అంటే యెందుకు లేరు ఉస్తాద్ హమీద్ అలీ ఖాన్ , ఉస్తాద్ రషీద్ ఖాన్ ఉస్తాద్ అమీర్ ఖాన్ అని నేను పేర్లు చెప్తుంటే నన్ను ఆపేసాడు. వద్దు వద్దు ఇంక ఆపు – ఇంకెవరూ లేరా అంటే అప్పుడు కానీ నాకు తట్ట లేదు – ఉన్నారు పండిట్ భీం సేన్ జోషి పండిట్ జస్రాజ్ పండిట్ శివకుమార్ శర్మ అంటూ పేర్లు చెప్తుంటే ఆయన ముఖం కొంచెం వికసించింది. అయినప్పటికీ ముఖం గంభీరంగా పెట్టుకుని నాకందుకే ముస్లిం లు పాడే హిందుస్తానీ సంగీతమన్నా, ఖాన్ లు  డామినేట్ చేసే  హిందీ సినిమాలన్నా అసలు ఇష్టం ఉండదు. మొత్తం వాళ్ళే డామినేట్ చేస్తున్నారు అంటూ అసహనం ప్రదర్శించాడు. అదేమిటీ అవడానికి ముస్లిం లైనా హిందుస్తానీ సంగీతాన్ని ఔపోసన పట్టి భజనలు కూడా పాడుతున్నారు కదా అన్నాను. యేమో నాకసలు పడదు. హాయిగా కర్ణాటక సంగీతమే బాగుంటుంది హిందుస్తానీ అంటే నాకసలు పడదు అని చివాల్న లేచి వెళ్ళిపోయాడు.

ఒక భిన్నమైన వాతావరణంలో ఉన్నాం మనమిప్పుడు ముఖ్యంగా గత యేడాది కాలంగా, పార్లమెంటు యెన్నికలు జరిగి బీ జే పీ ఆర్ యెస్సెస్స్ శక్తులు అధికారంలోకి వచ్చాక! మనుషుల్ని ఫలానా అని ముద్ర వేసింతర్వాత కానీ వారి టాలెంటుని కానీ విజయాల్ని కానీ అపురూపమైన వారి వ్యక్తిత్వాల్ని చూడడానికి నిరాకరిస్తున్న వాతావరణం. ఒక సంగీత కారుడేమిటి, ఒక నటుడేమిటి ఒక సినిమా యేమిటి యేదైనా అది ఫలానా మతానికి చెందిన వారయితే దాని పట్ల యేహ్య భావం లేదా ముభావం ప్రకటించడం జరుగుతున్న వాతావరణం. ముఖ్యంగా ఇది మతానికీ, మతాచారాలకు , మత గురువులకు, మత సంప్రదాయాలకు సంబంధించిందయితే అది మరీ సున్నితమైన అంశంగా మారి వాగ్వివాదాలకు, ఘర్షణలకు దారి తీయడం జరుగుతోంది.

మతం మీద, దేవుడి మీదా, మత సంప్రదాయాలమీద, మత గురువుల మీదా విమర్శ చేసేటప్పుడు చేసే విమర్శ యేమిటి అది సరయిందా సవ్యమేనా కాదా అందులో నిజమెంత కల్పితమెంత అనే చర్చ కాకుండా విమర్శ చేసిన వాడెవడు, వాడి మతమేమిటి, వాడి కులమేమిటి, వాడి ఫలానా మతం మీదనే యెందుకు చేసాడు, వేరే మతాల మీద యెందుకు చెయ్యలేదు – మిగతా మతాలు సవ్యంగా ఉన్నాయని వాడి ఉద్దేశ్యమా లేక విమర్శ చేస్తే ఆయా మతాల వారి ఊర్కోరు గనక అన్ని విమర్శలనీ  గంగిగోవుల్లా మనమే భరిస్తున్నాం కాబట్టి మనమే తేరగా దొరికామా వాడికి – అంటూ అనేక భిన్న కోణాల్లో విమర్శ చేసిన వాడి మీద దాడి చేస్తారు. ఈ విమర్శ అంతా మనల్ని తెగిడి వేరే మతాల వారిని పొగడడానికీ నెత్తికెక్కించుకోవడానికీ మాత్రమే అని తేల్చి పారేస్తాం.

యింతకీ ఈ చర్చంతా ఈ మధ్యే విడుదలయిన పీకే అనే సినిమా గురించి అని వేరే చెప్పనక్కరలేదనుకుంటా!

పీ కే సినిమాలోకి వెళ్ళే ముందు 2012 లో వచ్చిన మరో సినిమా గురించి చెప్పుకోవాలి. ‘ఓ మై గాడ్ ‘ అనే పేరుతో వచ్చిన సినిమా దేవుని పేరు మీద జరిగే వ్యాపారాల మీదా , తంతుల మీదా, అర్థం పర్థం లేని మత సంప్రదాయాల మీద తీవ్రమైన విమర్శలే చేసింది. ఆ సినిమా లో పరేష్ రావల్ అనే నటుడు ప్రదాన పాత్ర పోషించాడు. ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించాడు. అయితే అన్ని విమర్శలు హేతువాద దృక్పథంతో చేసిన OMG సినిమా ఆసాంతం కృష్ణ భగవానుని పాత్ర పై ఆధారపడి నడుస్తుంది. బహుశా తన హేతు వాద విమర్శలకు, మత గురువులపై, సంప్రదాయా లపై  విమర్శలకు తీవ్రమైన వ్యతిరేకత వస్తుందనేమో కృష్ణుని పాత్రని తోడు తెచ్చుకున్నా రు.

అయితే సినిమా గురించి సర్వత్రా ప్రశంసలూ పొగడ్తలూ  సద్విమర్శలూ మాత్రమే వినబడ్డాయి, నటుడు  పరేష్ రావల్ పై ప్రశంసల జల్లు కురిసింది. ఇప్పుడు మూడేళ్ళ తర్వాత దాదాపు అట్లాంటి కథాంశం తోనే (అట్లా అంటే పీకే సినిమాని చిన్నది గా  చేసి  చూసినట్టు అవుతుందేమో ) వచ్చిన సినిమా పీ కే,  ఓ యెం జీ ఎక్కడ ఆగిపోయిందో  అక్కడ్నుంచి విమర్శని ముందుకు తీసికెళ్ళింది, యెక్కడ ఓ యెం జీ అధైర్య పడి విఫలమైందో  అక్కడ ధైర్యం చేసి విజయం సాధించింది (పూర్తి అని నేననను – కానీ ఓ యెం జీ కన్న ఒక పది మెట్లు ఎక్కువే) యేది చెప్పడానికి ఓ యెం జీ కృష్ణున్ని యెంచుకుందో దాన్ని మించి చెప్పడానికి పీకే మనిషిని యెంచుకుంది! అందుకే పీకే ఓ యెం జీ కన్నా చాలా అడుగులు ముందుకేసింది . అయితే మరి యెందుకు పీకే కు ఓ యెం జీ కన్నా నిందలు, తిట్లూ, శాపనార్థాలూ  ఎక్కువ వస్తున్నాయి. యెందుకు పీకే గురించి చర్చ మోడరేట్ గా జరగడం లేదు – అయితే ఒక చివర లేదూ మరో చివర అనే తీవ్ర స్థాయిలో యెందుకు జరుగుతోంది. ఓ యెం జీ వచ్చినప్పుడు యెవరూ ఆ సినిమాలో ఒక ఫలానా మతాన్నే యెందుకు విమర్శించారు యితర మతాలనెందుకు విమర్శించలేదు అని యెవరూ అడిగినట్టు గుర్తు లేదు – పీకే ను మాత్రం యెందుకు యితర మతాలని విమర్శించలేదు అని తీవ్రంగా దూషిస్తున్నారు.

నా మట్టుకు నాకు కొన్ని  కారణాలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. మొదటిది పరేష్ రావల్ మతం, అతని రాజకీయ విశ్వాసాలు, అతని రాజకీయ పార్టీ – రెండోది –పోయిన యెన్నికల్లో ఆ పార్టీ భారీ మెజారిటీ తో గెలిచి అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. గత యెన్నికల విజయం తర్వాత భారత దేశ రాజకీయాలని శాసిస్తున్న అభిప్రాయాలు విశ్వాసాలు, యెటువంటి విమర్శలనూ యెంతమాత్రమూ సహించలేని ఒక తీవ్రమైన అప్రజాస్వామిక పరిస్థితి  దేశంలో భౌతికంగానూ, ప్రపంచ వ్యాప్తంగా దేశీయుల virtual world లోనూ నెలకొని ఉన్నది. తామనుకున్న అభిప్రాయాలపై  యెటువంటి  విమర్శను కానీ చర్చను గానీ సహించక దాడులకు దిగే ఒక అప్రజాస్వామిక పరిస్థితి. ముఖ్యంగా ఒక మతం వారిపై ప్రకటిత అప్రకటిత ద్వేషాలతో రగిలిపొతూ వారిని తీవ్రంగా isolate చేసే పరిస్థితి. అందుకే పీకే సినిమా వెనుక ప్రదానంగా ఉండి, తెరపై ఆ పాత్ర పోషించిన ఆమిర్ ఖాన్ ముస్లిం కావడం వల్లా సినిమా పై విమర్శలూ దాడులూ ప్రధానంగా ఆ కోణం నుండే జరుగుతున్నాయి.

యింతకీ పీకే సినిమా లో ఉన్నదేమిటి? అందులో చిత్రించిదేమిటి, చర్చించిదేమిటి? యెందుకింత రభస జరుగుతోంది? స్థూలంగా పీకే కథ ఇది – మనుషులు నివసించడానికి అనువైన మనలాంటిదే మరో గ్రహం (కొన్ని కాంతి సంవత్సరాల దూరం లో ఉన్నది) నుండి ఒక అంతరిక్షనౌక లో ఒక గ్రహాంతరవాసి భూమి మీద అడుగు పెడతాడు. అడుగు పెట్టీ పెట్టడం తోనే తాను వచ్చిన అంతరిక్షనౌక ను తిరిగి పిలవడానికి ఉపయోగించే రిమోట్ కంట్రోల్ చోరీ అవుతుంది. యిక తర్వాత ఆ గ్రహంతర వాసి తన రిమోట్ కంట్రోల్ ని తిరిగి సాధించుకోవడానిక్ చేసే నానా ప్రయత్నాలే సినిమా కథ.

తన గ్రహంపై బట్టలు లేకుండా నగ్నంగా ఉండే గ్రహాంతర వాసి భూమ్మీద మనుషుల్ని చూసి బట్టలు  కట్టుకోవడం తెల్సుకుంటాడు. పోయిన తన రిమోట్ కోసం దేవుళ్ళని ప్రార్థించాలనీ , అందుకు భూమ్మీద అనేక దేవుళ్ళున్నారనీ  , ఆయా దేవుళ్ళకు వేర్వేరు నివాసాలున్నాయని (చర్చి, గుడి, మసీదు వగైరా ), ఆయా దేవుళ్ళకు బ్రోకర్లు, మేనేజర్లు అనేకం ఉన్నారని, ఆయా దేవుళ్ల దగ్గరికి చేర్చడానికి అనేక మార్గాలూ మతాలున్నాయని అర్థం చేసుకుని తన ప్రార్థనలు మొదలు పెడతాడు. అన్ని ప్రార్థనలూ విఫలమౌతాయి. యే  దేవుళ్ళూ ఆయన ప్రార్థనలు వినరు. యింక విసుగొచ్చి, నిరాశ నిస్పృహ లకు లోనయి దేవుళ్ళు కనబడడం లేదు అని కరపత్రాలు పంచుతున్నప్పుడు జగ్గు అనే ఒక టీ వీ రిపోర్టర్ కు పరిచయమౌతాడు. ముందు యితని కథ నమ్మక పోయినా , చేతులు పట్టుకుని మనసుల్ని చదవగలనని నిరూపించిన జగ్గు  తర్వాత అతనికి సాయం చెయ్యాలనుకుంటుంది. పోయిన రిమోట్ కంట్రోల్ తన కుటుంబం అమితంగా గౌరవించి కొలిచే తపస్వి అనే మత గురువు తనకు హిమాలయాల్లొ దొరికిన శివుని గజ్జె అని ప్రచారం చేసుకోవడం చూసి యెట్లాగయినా దాన్ని తిరిగి పీకే కి ఇప్పించాలనుకుంటుంది. అమాయకత్వం తో పీకే వేసే సూటి ప్రశ్నలు మతగురువులు దేవున్ని చేరుకోడానికి రాంగ్ నంబర్లని వాటిని వ్యతిరేకించాలని మీడియా ద్వారా  ఒక ఉద్యమం లేవదీస్తుంది.

అయితే జగ్గు తాను బెల్జియం లో చదువుకునేటప్పుడు పాకిస్తాన్ కు చెందిన ఒక ముస్లిం యువకున్ని ప్రేమిస్తుంది. తన కుటుంబ గురువు అయిన తపస్వి ముస్లిం  మతానికి చెందిన వారంతా నమ్మక ద్రోహులు  కాబట్టి ఆ యువకుడు కూడా ఆమెకు ద్రోహం చేస్తాడని చెప్పడం నిజంగానే తనకు ద్రోహం జరగడం ఆమె మనసులో చెరగని ముద్ర వేస్తుంది. సినిమా చివరి ఘట్టానికి ముందు తీవ్రవాదుల (ముస్లిం) బాంబు దాడిలో తనకు తొట్ట తొలుత ఆశ్రయమిచ్చిన భైరన్ సింగ్ తన రిమోట్ చోరీ చేసిన వ్యక్తీ మరణించడంతో తన చివరి ఆశా కోల్పోయిన పీకే చివరి ఘట్టం లో టీవీ స్టూడియో లో తపస్వి తో తలపడతాడు. దేవుళ్ళనీ , ‘ధర్మాన్నీ’  రక్షించే మహా బాధ్యత మత గురువులు తీసుకోవాల్సిన అవసరం లేదనీ, అన్నిటికన్న మానవత్వం గొప్పదనీ, దాన్ని కాపాడాలనీ, యెవడూ ఈ భూమ్మీద ఫలానా మతస్తుడనే స్తాంపుతో పుట్టరనీ, అట్లే ఫలానా మతస్తులంతా మోసగాళ్ళో నేరస్తులో కారనీ అందరూ ఆ సృష్టికర్తముందు సమానమనీ, ఆ సృష్టికర్త తన రక్షణ తాను చూసుకుంటే మనుషులు మానవీయతను కాపాడాలనే సందేశంతో ముగుస్తుంది.

మొత్తం సినిమాలో పొరపాట్లు లేవని కాదు . కొంత నాటకీకరణ, కొని నమ్మశక్యం కాని కల్పనలు, సినిమాటిక్ స్వేచ్చలూ, డాన్సింగ్ కార్ల లాంటి వెకిలి తనమూ ఉన్నది. సినిమా హాస్య ప్రదానంగా సాగినా అటువంటివి సినిమాని పలుచన చేస్తాయి. ఒక వేశ్య దగ్గర 6 గంటల్లో భాష మొత్తం నేర్చుకున్న(సినిమాలో తీసుకున్న ఇదో  స్వేచ్చ) పీకే కాండోమ్స్ గురించి తెలవనట్టు ప్రశ్నించడం వెకిలితనానికి పరాకాష్ట. అయినప్పటికీ  ఈ లోపాలనన్నింటిని అధిగమించి సినిమాని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళింది దాని కథాంశం. దాదాపుగా ఇదే కథాంశంతో ఓ యెం జీ వచ్చిన పీకె ఆ సినిమాని దాదాపు అన్ని అంశాల్లోనూ మించిపోయింది. పాత్ర చిత్రీకరణే ప్రదాన తేడా! పీకే లో ప్రధాన పాత్ర ఒక అమాయకుడు. ఈ లోకం పోకడలు తెలువని ఒక పసివాడి లాంటి వాడు. ప్రశ్నించడం, హేతుబద్ధంగా ఆలోచించడం, మానవీయంగా ప్రవర్తించడం మాత్రమే అతనికి తెలుసును.

ఓ యెం జీ లో ప్రదాన పాత్ర ఒక వ్యాపార వేత్త – వ్యాపార దృష్టి తోనీ దేవుళ్ళనీ దేవుళ్ళ పేర్ జరిగే తంతునీ వ్యతిరేకిస్తాడు. పీకే లో కేవలం ఒక మతం పైననో ఒక దేవుని పైననో మాత్రమే విమర్శ చేయలేదు. అందరు దేవుళ్లనూ అన్ని మతాలనూ హేతుబద్దంగా ప్రశ్నించారు. దేవుళ్లకి బ్రోకర్లుగా మేనేజర్లుగా తమను తాము చెప్పుకుంటున్న వారిని విమర్శించారు. దేవునితో మాట్లాడుతున్నాము, మాట్లా డుతాము మాట్లాడిస్తాము అని,  మనుషుల భయాలనీ, అభద్రతలనీ  మూఢ భక్తి గా మార్చుకుని కోట్లకు పడగలెత్తుతూ,  రాజకీయ పలుకుబడులతో  అండదండలనీ, భోగభాగ్యాలనూ  అనుభవిస్తూ భారతీయ సమాజం శాస్త్రీయంగా హేతుబద్దంగా ముందుకు పోకుండా అంధకారం లో కి నెట్టి వేస్తున్న నియంతల్లాంటి మతగురువులను యెండగడుతుందీ సినిమా! వారిని గుడ్డిగా నమ్ముతున్న కోటానుకోట్ల భక్త జనానికి కనువిప్పు కలిగించే ప్రయ్నం చేస్తుందీ సినిమా! ఆ ప్రయత్నం లో సినిమా సఫలీకృతమయ్యిందనే చెప్పాలి.

అయితే సినిమా మీద వస్తున్న విమర్శలు చిత్రంగా ఉన్నయి. ఒకటి ఆమిర్ ఖాన్ ముస్లిం కావడం వల్ల హిందూ మతాన్ని విమర్శించాడనీ (సినిమా దర్శకుడు రాజ్ కుమార్ హీరానీ, నిర్మాత విధు వినోద్ చోప్రా  హిందువులే మరి) , సినిమా లో పాకిస్తాన్ కు చెందిన ఒక ముస్లిం యువకున్ని మన దేశానికి చెందిన మతగురువు కన్న యెక్కువ నమ్మకస్తునిగా చూపించి మన మతాన్నీ ప్రజలకు ఆరాధ్యులైన మతగురువులని మన ‘శత్రు దేశమైన’ పాకిస్తానీయుని కన్నా హీనంగా చూపించడం ఘోరమైన నేరమనీ మరో  విమర్శ. హిందూ దేవుళ్ళని, విగ్రహారాధనీ తూలనాడాడని, ముస్లింలని క్రైస్తవులనీ యెమీ విమర్శించలేదని యింకో విమర్శ! యివేవీ నిజాలు కావు.

అయినా నిజమైన మానవత్వం యెక్కడున్నా దాన్ని స్వీకరించాలనే కనీస యింగిత ఙ్నానాన్ని మన పొరుగు దేశమ్మీద ఉన్న ద్వేషం మింగేయడం విచారకరం. ప్రతి దాన్నీ మత దురహంకారమూ  , విమర్శ సహించలేని చాందసవాదమనే  నల్ల కళ్ళద్దాలని పెట్టుకుని చూస్తే అట్లానే అనిపిస్తుంది. అయితే కొన్ని సార్లు అమాయకత్వంతోనో  , వినికిడి ఙ్నానంతోనో కూడా అటువంటి అభిప్రాయం కలగవచ్చు. మన మతాన్ని విమర్శించారు అన్న కోపం కన్నా వేరే మతాలను విమర్శించలేదు అనే క్షోభ సరైంది కాదు. అది మనల్ని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనీయదు. పైగా వెరే మతాలు వెనుకబడి ఉన్నాయి, మూర్ఖంగా ఉన్నాయి కాబట్టి మేమూ  అట్లే యింకా వీలయితే అంతకన్నా హీనంగా ఉండడమే బాగుంటుంది అనుకుంటే అది  మనం హాయిగా మరింతగా తిరోగమించడానికి దోహదం చేస్తుంది.

సినిమాలో ప్రొజెక్ట్ చేసి, చర్చించిన అంశాలమీద దృష్టి వుంచి చర్చ జరిగితే అది మన పొరపాట్లని సరిదిద్దుకోవడానికీ మానవీయంగా, శాస్త్రీయంగా, హేతుబద్దంగా  ముందుకు పోవడానికి ఉపయోగబడుతుంది. లోపాల్ని యెత్తి చూపే చూపుడు వేలు యెటువంటిది అది యెవరిది అనే శుద్ద చాందస తర్కంలోనే మునిగిపోతే మనకు ఆ చూపుడు వేలే తప్ప మన లోపాలెప్పుడూ మనకు కనబడవు – మనల్ని మనం యెప్పుడూ సరిదిద్దుకునే అవకాశమూ రాదు యెప్పుడూ మన చూపుడు వేలు వేరే వాళ్ల వైపు ఎత్తి చూపడం తప్ప!

-నారాయణస్వామి వెంకట యోగి

swamy1

Interstellar: మనిషికీ సైన్సుకీ మధ్య…

imagesODLF8DC7

Interstellar సినిమా రెండో సారి చూశాను మొదటిసారి చూసినప్పుడు అర్థం కాని విషయాలు రెండోసారికైనా అర్థమవుతాయని ఆశతో వెళ్లాను. కొంత నయం. ఇంకో రెండు సార్లు చూస్తే అర్థమయిపోతుంది. చాలా రోజుల తర్వాత నాలో సైన్స్ జిజ్ఞాస మళ్ళీ ఊపిరి పోసుకుంది. ఈ వ్యాసంలో ఆ సినిమాలోని సైన్స్ ని నేను వివరించబోవడంలేదు. కాని కొన్ని ముఖ్యమయిన విషయాలు చర్చించుకోవడానికి ఆ సినిమా గొప్ప ఉదాహరణ.

క్లుప్తంగా Interstellar కథ ఇది:

కొన్ని దశాబ్దాల తర్వాత భూమి ఇక మనిషిని తట్టుకోలేని రోజులవి. మానవ జాతి అంతరించిపోవస్తున్న కాలం అది. ఇసుక తుఫానుల వల్ల, పంటలు పండకపోవడం వల్ల, ఆహార కొరత వల్ల జనాభా క్షీణిoచిపోతూ ఉంటుంది. కూపర్ అనే రైతు (ex-NASA Aircraft Pilot), అతని కూతురు కొన్ని విచిత్ర సంఘటనల ద్వారా, అప్పటికే మూతపడిపోయింది అనుకున్న NASA రీసెర్చ్ సెంటర్ ఒకదాని లోకి వచ్చి పడతారు. అక్కడి ముసలి ప్రొఫెసర్ కూపర్ కి మానవ జాతి అంతరించిపోబోతోంది అని వివరించి, అంతరిక్షంలో సుదూరాన ఉన్న కొన్ని గ్రహాల మీదకి వెళ్లి, వాటిలో ఏది మానవుల మనుగడకి అనువైనదో కనుక్కుని రావడానికి ఒప్పిస్తాడు. కూపర్ ఇంకో ముగ్గురు మనుషులూ, ఒక రోబోట్ తో కలిసి ఈ అన్వేషణ కి బయల్దేరతాడు. మనకి తెలిసిన సైన్స్ కి అవతలి చివర ఉన్న ఎన్నో వింతలూ, సమస్యలూ దారిలో ఎదుర్కొంటూ చివరికి ఎం చేశాడా అన్నదే సినిమా.

ఇదేదో మాములు హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా అనుకోవద్దు. ఇందులో మానవ సంబంధాలని అత్యద్భుతంగా చిత్రించాడు నోలాన్. Warm Holes, Black Holes, Time Dilation లాంటి ఎన్నో క్లిష్టమైన అంశాలు ఇందులో ఉన్నప్పటికీ హ్యూమన్ ఎలిమెంట్ ని ఎక్కడ వదలకుండా చాలా చక్కగా తీశాడు. అన్నింటికంటే మించి మానవ జాతి భౌతిక శాస్త్రం(Physics) లో ఇప్పటి వరకూ సాధించిన అభివృద్ధికి ఈ సినిమా దృశ్య రూపం. అంతేకాక మనం ఇంకా ఏమేమి తెలుసుకోవాలి అనుకుంటున్నామో అవి కూడా ఊహామాత్రంగా చూపిస్తుంది. శాస్త్ర అభివృద్ధి లో, లేదా ఇంకా విస్తృత స్థాయిలో చెప్పాలంటే, మానవాభివృద్ధి లో కళ పాత్ర ఏమిటి అనే చర్చ మన ముందుకు పెడుతుంది ఈ సినిమా.

మనిషి ప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాడు. ప్రతి భౌతిక సంఘటన, ప్రతి భౌతిక వస్తువూ మనిషి మెదడులో ఏదో ఒక చైతన్యాన్ని కలిగిస్తుంది. ఈ చైతన్యం ఆధారంగానే మనిషి ప్రకృతిని, సమాజాన్ని అర్థం చేసుకుంటాడు. మనిషి ప్రపంచాన్ని ఆకళింపు చేసుకునే ఈ క్రమంలో అనేక చైతన్య రూపాలు పుడతాయి. వాటిలో కళ ఒకటి. ఉదాహరణకి వేట ఒక శాస్త్రం. ఆదిమ మానవుడు వేటలో ప్రావీణ్యం తెచ్చుకోడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. వేటలోని మెళకువలను, సూత్రాలను అనుభవాల ద్వారానే అతను నేర్చుకున్నాడు. నిజానికి ఏ శాస్త్రానికైనా పునాది మానవానుభావమే. అలాంటి అనుభవాలు, అనుభూతులు, ఆవేశాలు, భావాలు మొదలైనవి గుంపులోని మిగతా సభ్యులతో సంజ్ఞల ద్వారా, భాష ద్వారా, గోడల మీద బొమ్మల వెయ్యటం ద్వారా పంచుకున్నాడు. కాలక్రమేణా ఇవి కొన్ని నిర్దిష్ట రూపాలు తీసుకున్నాయి. అలా పుట్టినవే నేడు మనం చూస్తున్న అనేక కళారూపాలు.

సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికీ ప్రత్యేకమైన అనుభవాలు కొన్ని ఉంటాయి, వాటి వల్ల కలిగిన ప్రత్యేకమైన చైతన్యం కూడా కొంత ఉంటుంది. ఇలాంటి ప్రత్యేక చైతన్యాల నుంచే సమాజ చైతన్యం (Social Consciousness) పుడుతుంది. ఇక్కడ సమాజ చైతన్యం అంటే ఆ సమాజం తనని తానూ, తన చుట్టూ ఉన్న ప్రకృతినీ అర్థం చేసుకునే క్రమమే. ఇది ఎప్పుడూ ఆ సమాజంలో చలామణి అవుతున్న భౌతిక పరిస్థితులు, ఉత్పత్తి సంబంధాలు, మానవ సంబంధాలకి లోబడి ఉంటుంది. ఒక తరం తన అనుభవాల ద్వారా పొందిన చైతన్యాన్ని తన తరువాతి తరానికి సమగ్రంగా అందించినప్పుడే రెండవ తరం చైతన్య స్థాయి మొదటి దానికంటే ఉన్నతంగా ఉంటుంది, పురోగతి సాధ్యపడుతుంది. ఈ అవసరాన్ని కళలు చాలా సమర్ధవంతంగా తీరుస్తాయి. సులువుగా చెప్పాలంటే సమాజంలో అంతర్భాగమైన రకరకాల మనుషుల యొక్క ప్రత్యేక చైతన్యాలని తీసుకుని సమాజం మొత్తానికి సమానంగా పంచిపెట్టి, ఒక నిర్దిష్టమైన సమాజ చైతన్యం రూపొందేలా చెయ్యడం కళ పని. మనిషి ప్రపంచాన్ని అవగతం చేసుకోవడానికి కళ ఒక సాధనం.

our-legend-of-cinema-christopher-nolan-1007037965

నిప్పు కనిపెట్టడం ప్రకృతి పై మానవుడు సాధించిన మొదటి విజయం. బండి చక్రమొక విప్లవం. భాషలకి లిపి తయారు చేసుకోవడం ఒక విప్లవం (చిత్ర కళ లిపికి మూలం అయ్యింది). ఇవన్నీ చాలా శాస్త్రీయమైన, సైన్సుతో ముడిపడి ఉన్న విప్లవాలే. భూమి నుంచి ప్రసవ రహస్యాన్ని కనిపెట్టి అడివి మనిషి వ్యవసాయదారుడిగా మారడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. కొన్ని వందల తరాలు మారాయి. ఆ చైతన్యం (సైన్స్) ఇన్ని తరాల పాటు, ఇన్ని ప్రాంతాలలో విస్తరిస్తూ రావడంలో కళ పాత్ర అత్యంత కీలకం. అసలు కళ పుట్టుకే ఒక విప్లవం.

నిజానికి కళ, సైన్స్ రెండింటి జన్మస్థానం ఒక్కటే – మానవ జీవితానుభవం.

ఆ రెండింటి లక్ష్యం కూడా ఒక్కటే – సర్వ మానవ శ్రేయస్సు.

కళ, సైన్స్ ఒక దానిని ఒకటి సంపూర్ణం చేసుకుంటూ ముందుకు సాగుతాయి. ఆ రెండిటినీ విడగొట్టడం అనేది కుట్ర. కళని సైన్స్ ని దూరం చేసి, ఆ రెండూ రెండు వేరు వేరు రంగాలుగా తయారు చెయ్యడం కుట్ర. సైన్స్ కళ నుండి విడివడినప్పుడు మానవ జాతి పురోగతి మందగిస్తుంది. సమాజ చైతన్యం సమాజం మొత్తానికి చెందకుండా కొంత మందికి మాత్రమే పరిమితమై పోతుంది. శాస్త్రాలు మొత్తం సమాజం అభివృద్ధికి ఉపయోగపడకుండా, “టెక్నాలజీ” అనే పేరుతో కొంత మంది అభివృద్ధికి మాత్రమే ఉపయోగపడతాయి. ఒక వైపు మనం అంగారకుడిని అందుకుంటుంటే ఇంకోవైపు దొంగ బాబాలు దేశం లో స్వైరవిహారం చేస్తుండటం ఇందుకు ఒక ఉదాహరణ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సైన్స్ అంటే స్పేస్ సైన్స్ (Space Science) మాత్రమే కాదు. ఇంకా ఎన్నో శాస్త్రాలు – ముఖ్యంగా సామాజిక శాస్త్రాలు – మానవులకు తక్షణ అవసరాలుగా ఉన్నాయి. వాటన్నిటి మీదా సినిమాలూ, కథలూ, కవితలూ, నాటకాలూ మొదలైనవి రావాలి. ప్రచారం జరగాలి. సమాజ చైతన్యం పై ప్రతి మానవుడికీ సమానమైన హక్కు ఉంది.

ఈ నేపధ్యంలో ఈ సినిమా ఒక చిన్న విజయాన్ని నమోదు చేసింది అని చెప్పొచ్చు. భౌతిక శాస్త్రాన్ని చాలా చక్కటి కథతో హృద్యంగా చిత్రీకరించారు. అలాగని ఈ చిత్రం లో వ్యాపార కోణం లేదు అని నేను అనడం లేదు. వెయ్యి కోట్ల బడ్జెట్ తో వ్యాపారం కోసమే ఈ సినిమా తీశారు. అందులో సందేహం లేదు. ఈ చిత్రంలో చూపించినది అంతా శాస్త్రీయమైనది అని కూడా నేను అనడం లేదు. ఏ కళలోనైనా స్వాభావికంగానే వాస్తవికతతో పాటు కొంత ఊహ, కొంత అధివాస్తవికత ఉంటాయి. ఆ ఊహలు భవిష్యత్తులో మానవ జాతి ఛేదించాల్సిన ఎన్నో ప్రశ్నల వైపు, సాధించాల్సిన ఎన్నో విజయాల వైపు నడిచే ఉత్సాహాన్నిస్తాయి.

 -వినోద్ అనంతోజు

vinod anantoju

 

‘‘ఇంటర్ స్టెల్లార్’’ లో దాగిన రహస్యాలు కొన్ని!

our-legend-of-cinema-christopher-nolan-1007037965

చిన్నప్పుడు రెన్ అండ్ మార్టిన్ గ్రామర్ పుస్తకం కొనుక్కుని గ్రామర్ నేర్చుకోవాలంటే దానితో పాటు మరో కీ పుస్తకం కూడా కొనుక్కుంటే కానీ సాధ్యపడేది కాదు. ఇప్పుడు అత్యధిక కలెక్షన్లనూ, మనసులనూ దోచుకుంటున్న ‘‘ఇంటర్ స్టెల్లార్’’ సినిమాని బాగా అర్ధం చేసుకోవాలన్నా మరో కీ కావాలనిపిస్తోంది. శాస్త్రీయ నారికేళ పాకం చెట్టుదింపుకుని కాయకొట్టుకుని కొబ్బరిముక్క జాగ్రత్తగా తీసుకుని తింటే కానీ రుచితెలియని విధంగా. సినిమాని అర్ధం చేసుకోవడానికి నామట్టుకు నాకయితే మరికొంత రిపరెన్స్ సాయం తీసుకోవాల్సి వచ్చింది. అందుకే మిత్రులతో ఆ తాళం చెవిని పంచుకుందాం అనుకుంటున్నాను.

భూమి నివాసయోగ్యం కాకుండా పోతుంటే ఏం చేయాలి. తినడానికి తిండి పండించుకోలేని స్థితి, వుండటానికి అనువుగా లేని వాతావరణం ఏర్పడుతుంటే ఏం చేయాలి. ప్లాన్ ఏ, లేదంటే ప్లాన్ బి పనిచేస్తాయేమో ననే ప్రయత్నం ‘‘ ఇంటర్ స్టెల్లార్’’ భూమిలాగానే నివాసానికి అనుకూలంగా వుండే ఇతర గ్రహాలను అన్వేషించడం అక్కడ మళ్ళి మానవ జీవితాన్ని ప్రారంభించడం కోసం చేసే ప్రయాణం తాలూకు కథనం ఇది. ఇక ఈ చిత్ర రచయిత, నిర్మాత, దర్శకుడు క్రిస్టొఫర్ నోలాన్ గురించి చెప్పాలంటే దీనికిముందు తీసింది పట్టుమని పదిసినిమాలే అయినా వందల సంవత్సరాలు గుర్తుంచుకోవలసిన అంశాలని వాటిలో చర్చించాడాయన. నగరాన్ని దాని ఆస్తులనూ నేరస్తుల పాల బడకుండా అడ్డుకునే సూపర్ హీరో బ్యాట్ మెన్ ఆయన సృష్టే, ట్రయాలజీలు తీసినా వెయ్యికోట్ల బిజినెస్ చేయగలగటం అంటే ఫిక్షన్ తాడుపై బ్యాలెన్స్ చేస్తున్నా ప్రేక్షకుల నాడివదలడు అనడానికి నిదర్శనం.

సినిమాలో కీలకంగా వచ్చే కొన్ని పదాలు తెలిస్తే సినిమాలోకి ప్రవేశించడం మరీ సులభం అవుతుంది.

టైటిల్ గా వున్న ఇంటర్ స్టెల్లార్ అంటే తారాతీరం (occurring or situated between stars) అనే అర్ధంలో డిక్షనరీలు ఇచ్చాయి కానీ విశ్వంలోని నక్షత్రాల మధ్య వున్న ఖాళీని కాకుండా రెండు విశ్వాల మధ్య నున్న ఖాళీ ప్రదేశాన్ని ఈ పేరుతో పిలుస్తారు. అవును ప్రపంచంలో ఒక్కటే విశ్వం కాదు అనేక విశ్వాలు వున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు ఒకవిశ్వానికీ మరో విశ్వానికీ మధ్యనున్న ఖాళీ ప్రదేశాన్నే ఇంటర్ స్టెల్లార్ అని పిలుస్తున్నారు.

AI

ఐదు డైమెన్షన్ల(5D) ప్రపంచం : మనం మనుగడ సాగిస్తున్న ప్రపంచానికి పొడవు, వెడల్పు, లోతు అనే మూడు డైమెన్షన్లతోనే(3D) గమనిస్తున్నాం. కానీ కాలం (time), ప్రదేశం/స్థలం (space) అనే మరో రెండు డైమెన్షన్లు కూడా విశ్వానికి వున్నాయి. కాంతి వేగంతో ప్రయాణించేప్పుడూ, వేర్వేరు గురుత్వాకర్షణలలలో వున్నప్పుడూ మనం లెక్కించుకునే కాలంలోనూ, ప్రదేశం లోనూ మార్పులు వస్తాయి. ఐన్ స్టీన్ సాధారణ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం అత్యధిక ద్రవ్యరాశుల వద్ద కాలం నెమ్మదిస్తుంది. ప్రదేశం సాగుతుంది. అందుకే హీరో కూపర్ వెళ్తూ వెళ్తూ తన పదేళ్ళ కూతురికి తను వచ్చే సరికి తనవయస్సు కూతురు వయస్సు ఒకటిగానే వుంటాయని చెపుతారు.

 

బ్లాక్ హోల్ (కాల రంధ్రంకాలబిలం, కృష్ణ బిలం, కర్రి గుండం) : విశ్వంలోని ప్రతి ద్రవ్యరాశికీ ఆకర్షించే గుణం వుంటుంది దాన్నే గురుత్వాకర్షణ అంటున్నాం. దాన్నుంచి ఏదైనా విడిపోవాలంటే కొంత వేగంతో దూరంగా వెళ్ళాలి దాన్ని పలాయన వేగం అంటున్నాం. భూమిమీదనుంచి బయటకు పంపే రాకెట్లకు ఈ వేగాన్ని అందిస్తేనే అవి భూమి ఆకర్షణనుంచి బయటకు వెళ్తున్నాయి. కానీ బ్లాక్ హోల్ అనే ప్రాంతంలో కాంతికూడా ఆకర్షణనుంచి విడివడలేదు. అంటే కాంతివేగంతో ప్రయాణించగలవస్తువైనా ఈ కృష్ణబిలం నుంచి బయటకు రాలేదు. అందుకే బ్లాక్ హోల్ అంటే నిర్వచనంగా పలాయన గమన వేగము కాంతి యొక్క వేగం కన్నా ఎక్కువ ఉంటుందో దానినే కాల రంధ్రం లేదా కాలబిలం అంటున్నారు. కాంతి కూడా బయటకు రాదు కాబట్టే అది చీకటి గుహ అయ్యింది. విశ్వంలో గుర్తించిన విశాలమైన ఖాళీలు దానివైపు ఆకర్షింపబడుతున్న దూరపు నక్షత్రాల ఆదారంగా దీన్ని పరోక్షంగా గుర్తించడమే.

కాలబిలం లోపలనే అనేక పిల్ల విశ్వాలున్నాయనీ భూమ్మీద నివసిస్తున్నామనుకుంటున్న మనం కూడా ఒకానొక కాలబిలంలో బంధీలమేననేది ఒక సిద్ధాంతం. అయితే ఒక కాలబిలంలోపటి విశ్వలోకి ప్రవేశించిన మనుషులు మరోకాలబిలంలోని మనుషులతో కొంతమేరకు గమనించడం, వారితో సంభాషించేందుకు కొంత అవకాశం వుంటుంది అనేదాని బేస్ మీదనే సినిమా మొదట్లో ప్రయోగశాల ప్రదేశం తాలూకు అక్షాంశ రేఖాంశాలను మోర్స్ కోడ్ పద్దతిలో కనుక్కోవడం దగ్గరనుంచి, చివర్లో హీరో మన ప్రపంచంలోకి చేరుకోవడం వరకూ వుంటుంది. కాల బిలంలో ప్రవేశించిన వారు చనిపోవడం అంటే కాలబిలాలలోని ఈవెంట్ హారిజన్ (నిర్ణీత సరిహద్దు) ప్రవేశమార్గాలను దాటేసి పై భాగంలోని వెనక్కి వెళ్లలేని చోటు (పాయింట్ ఆఫ్ నో రిటర్న్) కు చేరుకోవడమే అని దానికిలోకి పడిపోయే లోగానే ఈ ప్రపంచంలోకి లాక్కోబడటంతో అతను మళ్ళీ భూమ్మీద జీవించేలా దేహంతో చేరతాడు. అయినా ఈవెంట్ హారిజన్‌కు ఆవల మరో లోకముందని దాన్ని క్యాచీ హారిజన్ (Cauchy horizon) అంటారట, ఈ ప్రదేశంలో కాలం, రోదసి రెండూ సుస్థిర దశల్లోకి చేరిపోయి, నిలకడగా ఉంటాయి. ఈ క్యాచీ సరిహద్దు లోపలే ఆధునాతన నాగరికతా ప్రపంచాలు మనుగడలో ఉండి ఉంటాయని ప్రొఫెసర్ డొకుచోవ్ బలంగా వాదిస్తున్నప్పటికీ బిగ్ బ్యాంగ్ సిధ్దాంత కారులు దీన్ని కొట్టిపారేస్తున్నారు.

warmhole

వామ్ హోల్ : విశ్వాంతరాళంలో కాంతిసంవత్సరాలదూరాన్ని దాటుకుంటూ ప్రయాణించేందుకు కనుక్కున్న ఒకానొక షార్ట్ కట్ రూట్ గా దీన్ని చెప్పుకోవచ్చు. అందుకే దీన్ని ఐన్ స్టీన్ రోసెన్ వంతెన అని పిలుస్తారు. రెండు చివరల మధ్య నున్న ఒక టన్నెల్ లాంటి వంతెన ఇది. బ్లాక్ హోలో లో ప్రవేశించిన ఏ పదార్ధాన్నీ బయటకి వదలని స్థితి వుంటే దీనిలోకి వచ్చిన పదార్ధాన్ని కాంతివేగంతో మరో చివరకు నెట్టేస్తుంది. దీనినే సినిమాలో ప్రయాణానికి కీలక సూత్రంగా వాడారు. ప్రయాణానికి కావలసిన ఇంధనాన్నీ, కాలాన్నీ మన పరిమితుల రీత్యా సరఫరా చేయడం అసంభవం అందుకే వార్మ్ హోల్ కున్న ఈ శక్తిని వాడుకోవడం ద్వారా కావాలసిన తీరానికి సులభంగా చేరవచ్చనే ఊహాత్మక లెక్కలతో వీరి ప్రయాణం ప్రారంభం అవుతుంది. నిజానికి ప్రయాణం ప్రారంభం అయ్యేప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేందుకు ఎటువంటి సక్రమమైన దారీ వీరికి తెలియదు.

మోర్స్ కోడ్ : ఈ మధ్యే టెలిగ్రాఫుల ద్వారా సందేశాలను పంపుకునే శకం ముగిసింది కానీ టెలిగ్రాఫుకు కారణం అయిన మోర్స్ కోడ్ ఉపయోగం మాత్రం ముగిసి పోలేదు. కేవలం ఆన్ ఆఫ్ ద్వారా బైనరీ విధానాన్ని (ద్విసంఖ్యామానాన్ని) కంప్యూటర్లలో వాడుకున్నట్లు బిప్ అండ్ గ్యాప్ ద్వారా డాట్ (చుక్క) మరియు డాష్(గీత) అను మాత్రం వాడుతూ సందేశాలను పంపేందుకు ఈ మోర్స్ కోడింగ్ విధానం ఉపయోగపడుతుంది. అందుకే అంతరిక్షంలోకి పంపే అనేక సందేశాలను కోడింగ్ విధానంలోనే తయారు చేసారు. సినిమా మొదట్లో పరిశోధన శాల అడ్రస్ ను ఇదే పద్దతిలో మరో కాలబిలంలో నివసించే వారెవరో అక్షంశరేఖాంశాల (longitude and latitude) కో ఆర్డినేషన్ ను అందించటం ద్వారా గైడ్ చేస్తారు. చివర్లో హీరో కూడా వాచ్ లో సెకన్ల ముల్లులో సహాయంతో తన బిడ్డకు ఈ మోర్స్ సందేశాన్నే పంపించి తన ఉనికిని తెలియజేస్తాడు.

కృత్రిమ మేధస్సు(Artificial Intelligence) : కేవలం మనిషి తలలో వుండేదే మేధస్సా అస్సలు శరీరంతోనే పనిలేకుండా తెలివితేటలు తమంతట తామే పనిచేస్తే ఎలావుంటుంది. పరిస్థితులను అర్ధం చేసుకోవడం, స్పందించడం, నిర్ణయాలు తీసుకోవడం, లాంటివన్నీ మనిషికి ఆవల జరిగే పద్దతి కృత్రిమ మేధస్సు. ఈ మధ్య అగ్రరాజ్యం అమెరికానుంచి మానవ మెదడును మ్యాప్‌ చేసేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రకటించిన కార్యక్రమం కింద భారత నాడీ శాస్త్రవేత్త పార్థా మిత్రాకు గ్రాంట్‌ లభించింది కూడా. ఇలా శరీరమో దేహమో ఆకారమో లేకుండా కేవలం ఎఐ తీసుకునే నిర్ణయాలు వగైరా ఈ సినిమాలో కనిపిస్తాయి.

కథనం : నాసాలో పైలెట్ ఇంజనీర్ గా పనిచేసిన కూపర్ (మాథ్యూ) మానవాళికి తిండిగింజల అవసరం గుర్తించి వ్యవసాయం చేస్తుంటాడు. అతనితో పాటు పదేళ్ళ కూతురు మర్ఫి (మెంకజీ ఫాయ్) , కొడుకు మరియు మామగార్లతో కలిసి వుంటాడు. పదేళ్ళ పాప ఘోస్టుగా పిలుచుకునే ఒకానొక మేధాశక్తి ఆమెను కమ్యూనికేట్ చేయాలని ప్రయత్నిస్తుంటుంది. ఆ క్రమంలోనే ఒకనాటి ఇసుకతుఫాను గాలివల్ల గదిలో ఏర్పడిన గీతలను మోర్సు పద్దతిలో అర్ధం చేసుకుని అవి సూచించే అక్షాంశరేఖాంశాలున్నప్రాంతానికి చేరతారు తండ్రీ కూతుళ్ళు.

ఆ ప్రదేశం ప్రొఫెసర్ బ్రాండ్ ( మైఖెల్ ఖైనే) ఆద్వర్యంలో నిర్వహింపబడుతున్న నాసా వారి రహస్య ప్రయోగశాల. వీరు మానవాళిని రక్షించేందుకు ప్లాన్-A, ప్లాన్ –B అంటూ రెండు పద్దతులు తయారుచేసుకుని వాటిని ప్రయోగించేందుకు ప్రయత్నిస్తుంటారు. దానిలో కూపర్ ని కూడా ఒక నిపుణుడైన పైలెట్ గా సహాయం చేయమని అడుగుతారు. దీనిలో ప్రధానాంశం జీవనానికి అనువుగా వుండే గ్రహాలపైకి మానవాళిని పంపించడం. అందుకు పిండదశలో జీవాన్ని నిల్వచేసి అక్కడికి పంపి మళ్ళీ జీవం ప్రారంభం అయ్యేలా చూడటం. దీనిలో ప్రొఫెసర్ బ్రాండ్ కూతురు స్వయంగా బయాలజిస్టు అయిన అమెలియా ( అన్నే హాత్ వే), ఫిజిస్టు రొమిల్లీ ( డేవిడ్ గాసీ) జియో గ్రాఫర్ డోయల్ ( వెస్ బెన్ ట్లీ) లతో పాటు మరో రెండు కృత్రిమ మేధస్సుకలిగిన రోబోట్లు TARS మరియు CASE కూడా పనిచేస్తుంటాయి. అతి సుధీర్ఘ ప్రయాణాన్ని సులభతరం చేసుకునేందుకు వార్మ్ హోల్ సహాయం తీసుకోవాలనేది ఈ ప్రయత్నంలో ముఖ్యమైన అంశం. దానివల్ల కాలంతో పాటు ఇంధనం కూడా కలిసి రావడంతో అసాధ్యం అనుకున్న ఈ గ్రహాంతరాలను మించిన విశ్వాంతర ప్రయాణం సాధ్యం అవుతుంది అని ప్రొఫెసర్ బ్రాండ్ వివరిస్తాడు.

తన తండ్రి ఈ ప్రయాణంలో వెళ్ళిపోవడానికి పదేళ్ళ మర్ఫీ ససేమిరా అంటుంది. కానీ తను తరిగి వస్తానని తను వచ్చేటప్పటికి ఆ అమ్మాయి వయసు, తనవయసూ ఒకేలా వుంటుందని నచ్చజెప్పి, కూపర్ బయలుదేరతాడు. అనుకున్నట్లుగానే ప్రయాణంలో వార్మ్ హోల్స్ సహాయం ఉపయోగపడుతుంది. అచ్చం నీళ్ళతోనూ, పూర్తిగా మంచుతోనూ వున్న వివిధ గ్రహాలను గమనించుకుంటూ వీరి ప్రయాణం సాగుతుంది. ఈ ప్రయాణంలోనే భూమినుంచి పంపే విడియో ఫుటేజిలను గమనిస్తూ తమ వారు ఎలావున్నారో కూపర్ తదితరులు గమనిస్తుంటారు. కూపర్ మామగారు చనిపోతాడు. కొడుకు బిడ్డ పెద్దవాళ్ళవుతారు. మర్ఫీ కూడా ప్రొఫెసర్ బ్రాండ్ కు సహాయంగా వుంటూ తన తండ్రి ప్రయాణ సమాచారాన్ని తెలుసుకుంటూ వుంటుంది. ప్రొఫెసర్ బ్రాండ్ తన తుదిగడియల్లో చెప్పిన నిజం అసలు తిరుగు ప్రయాణంపై తన సమీకరణాల్లో సరైన ఆధారాలేవీ లేవనే విషయం ఆమెను హతాసు రాలిగా చేస్తుంది. అయినా తన తండ్రి ఇచ్చిన మాట ప్రకారం తిరిగొస్తాడనే ఆశతోనే ఎదురు చూస్తూ బ్రాండ్ అసంపూర్తిగా వదిలేసిన ఆ సమీకరణాన్ని తను పూర్తి చేసేందుకు శాయశక్తులా తన ప్రయత్నాలు చేస్తూ గడుపుతుంది. 40 సంవత్సరాల వయస్సుకూడా దాటుకుని ముసలి తనానికి కూడా వచ్చేస్తుంది.

 

అక్కడ ప్రయాణంలో ఇంధనం అయిపోవస్తుంది. మరొక్క గ్రహాన్ని మాత్రమే చూడగల స్థితికి వస్తారు. అయినా సరే అవకాశం వున్న గ్రహాలను వెదికేందుకు చేతనైనంత ప్రయత్నం చేయడంతోపాటు. స్వంతంగా ఆలోచించగల రెండు రోబోట్లనూ ఆ సమాచార సేకరణ కోసం అంతరిక్షంలో వదిలుతారు. సింగ్యులారిటీ పై సమాచారాన్ని గ్రహించే సందర్భంలో కూపర్ అదనపు డైమెన్షన్ లోకి పడిపోతాడు. అక్కడినుంచి పాక్షిక పద్దతిలోనే ప్రపంచాన్ని గమనించే స్థితిలోకి మారతాడు. కూపర్ కి అప్పుడే అర్ధం అవుతుంది. ఈ అదనపు డైమెన్షన్ లో నివసించగలిగే వారే భవిష్యత్తు మానవులు అని, అక్కడి నుంచి తన బిడ్డతో పూర్వపు ఘోస్ట్ లాగా కమ్యూనికేట్ అయ్యేందుకు ప్రయత్నిస్తాడు.

Morse Code

గురుత్వ తరంగాలను ప్రయోగించటం ద్వారా ఒక వాచ్ లోకి మోర్స్ కోడ్ పద్దతిలో సమీకరణాన్ని సాధించే పద్దతిని తెలియజేస్తాడు. ఆ సమీకరణం ఆధారంగా ఆమె తండ్రిని భౌతిక ప్రపంచంలోకి తీసుకు వస్తుంది. పూర్తిగా ప్రపంచంలోకి వచ్చిన కూపర్ కి తన కూతురు ముసలి వయస్సులో మంచపట్టిన స్థితిలో కనిపిస్తుంది. ఏ తల్లిదండ్రులకైనా చూడలేని స్థితి తమ బిడ్డలు మరణం అంచున వున్నారని తెలియటం అందుకే నువ్వు నాకోసం ఆలోచించకు దానికి నా బిడ్డలున్నారు అంటుంది మర్ఫీ. అతని తర్వాతి కర్తవ్యంగా వదిలేసిన ఎడ్మండ్ గ్రహాన్నీ, అమెలియానీ అన్వేషించడం ప్లాన్ బిలో భాగంగా జీవ పిండాలను ఆ గ్రహంపై పెంచేందుకు తగిన పద్దతులను అన్వేషించడం ప్రారంభించమంటుంది. ఇతని ప్రయాణం మళ్ళీ ప్రారంభం అవుతుంది. అడ్మండ్ పై అప్పటికే అమెలిన్ తన ప్రధమిక ప్రయత్నాలలో వుందన్న విషయం చూపటంతో సినిమా ముగుస్తుంది.

కేవలం శాస్త్రీయతే కాకుండా మానవీయకోణంలో నడిచే సంభాషణలు కూడా ఈ సినిమాలో కట్టిపడేస్తాయి. మచ్చుకు స్థల కాలాలను అధిగమించగలిగేది ప్రేమ ఒక్కటే అంటూ ప్రొఫెసర్ బ్రాండ్ చెప్పటం. మానవజాతి భూమ్మీద పుట్టిందంటే దానర్ధం భూమ్మీదే అంతరించి పోవాలని కాదు లాంటి డైలాగులు బావున్నాయి. ఇంత సంక్లిష్టమైన ‘సైన్స్‌ ఫిక్షన్‌’ చిత్రాన్ని తండ్రీ కూతుళ్ళ మధ్య వున్న అనుబంధం చుట్టూ అల్లి, ఏమాత్రం సైన్సు పరిజ్ఞానం లేని వారికి కూడా అర్థమయ్యే టంతగా తీర్చిదిద్దిన స్క్రీన్ ప్లే ని ప్రత్యేకంగా మెచ్చుకోవాలి.

నోలన్ ‘సిజిఐ'(కంప్యూటర్‌ జనరేటెడ్‌ ఇమేజరీ) తక్కువగా వాడి సహజత్వానికి దగ్గరగా వుండాలని కెమెరాతో తీసిన దృశ్యాలనే ఎక్కువగా వినియోగిస్తాడు. అందుకే తారాతీరాలలోనూ, విచిత్ర వాతావరణలోని గ్రహాలలోనూ సంచరించడాన్ని కళ్ళకు కట్టినట్లే చూపడం వల్ల కావచ్చు బిగ్ స్క్రీన్ టిక్కెట్లకు అంత రష్ ఏర్పడింది. మొత్తానికి ఒక మంచి సైన్సు పిక్షన్ చూడాలని కోరుకునే వారు తప్పకుండా చూడాల్సిన సినిమా ఈ ఇంటర్ స్టెల్లార్.

 -కట్టా శ్రీనివాస్

 

హామ్లెట్ నుంచి హైదర్ దాకా…!

images1

ప్రపంచ సాహిత్యంతో ఏ మాత్రం పరిచయం ఉన్న వారికైనా తెలిసిన షేక్స్ పియర్ ప్రఖ్యాత నాటకం “హామ్లెట్”. అత్యంత విజయవంతమైన విషాదాంత కథ అయిన దీన్ని సినిమా గా మలచటం అంత తేలికైన పని కాదు, దీనికి బహుశా షేక్స్ పియర్ ఆత్మను ఒడిసి పట్టిన విశాల్ భరద్వాజ్ మాత్రమే సరైన వ్యక్తి . ఇంతకు మునుపే “మాక్బెత్” ఆధారంగా “మక్బూల్”, “ఒథెల్లో” ఆధారంగా” ఓంకార” లాంటి చిత్రాలు తీసి అదే దారిలో “హామ్లెట్” ఆధారంగా రూపొందించిన చలన చిత్రం “హైదర్”

విశాల్ భరద్వాజ్, షేక్స్ పియర్ కథల ఆధారంగా నిర్మించే చిత్రాల విషయంలో ఎంచుకొనే నేపధ్యం ఆ చిత్రానికి ఆయువు పట్టు , అలాగే ఈ సినిమాకి 1995 లో కాశ్మీర్ సమస్య ను నేపధ్యంగా తీసుకోవటంతో ఈ సినిమా ను ఒక క్లాసిక్ గా నిలబెట్టింది . మానవ నైజాలు, అధికారం / ఆధిపత్యం కోసం జరిగే కుట్రలు, మోసాలు ఇదే నేపధ్యం, ఈ నేపధ్యం కొత్త కాకపోవచ్చు, కానీ దాన్ని కాశ్మీర్ సమస్యకు ముడిపెట్టటం, దాన్ని హామ్లెట్ ఆధారంగా నడిపించటం ఇది సినిమాని మరింత రక్తి కట్టించేలా చేశాయి,. అదే సమయంలో టెర్రరిజానికి, సైన్యానికి మధ్య జరుగుతున్న యుద్దంలో సామాన్యులు ఎలా బలవుతున్నారో కూడా మనకు కళ్ళముందు చూపుతుంది ఈ సినిమా . నిజానికి హామ్లెట్ లో ముఖ్యమైన మలుపు ఒక కల రూపంలో ఉంటుంది . ఇలాంటి ఒక ఇల్యూజన్ ని ఇలాంటి మోడరన్ కథలో విశాల్ భరద్వాజ్ చెప్పిన విధానం చాలు, అతను ఎంత ప్రతిభావంతమైన దర్శకుడో చెప్పటానికి, మరో గొప్ప విషయం హామ్లెట్ లో లా ఇందులో హామ్లెట్ తండ్రి చనిపోయాడు అని మనకు ముందుగా తెలియదు, అలా నేరుగా చెప్పాల్సిన పాయింట్ ని ఇల్యూజన్ గా, ఇల్యూజన్ గా చెప్పాల్సిన పాయింట్ ని నేరుగా చెప్పటం ద్వారా హామ్లెట్ కు సరికొత్త రూపు అందించాడు విశాల్ భరద్వాజ్.

images

కాశ్మీర్ తీవ్రవాదులకు కి ఆశ్రయం ఇస్తున్నాడు అనే కారణంతో భారతసైన్యం డా.హిలాల్ మీర్(నరేంద్ర జా) ని మాయం చేస్తుంది, అతని భార్య గజాలా (టాబూ) , తన తండ్రిని వెతుక్కుంటూ వస్తాడు హైదర్ (షాహీద్ కపూర్) , ఆ వెతుకులాటలో అతని తండ్రి మాయానికి తన బాబాయి ( కె కె మీనన్) కారణం అని తెలుస్తుంది, అదే సమయంలో తన తల్లి ని బాబాయి పెళ్ళి చేసుకుంటాడు , అసలు హిలాల్ మీర్ ఏమయ్యాడు, అతని మాయానికి కెకె కి సంబంధం ఉందా ?? తల్లి కి కూడా సంబంధం ఉందా ?? అసలు తండ్రి మాయానికి బాబాయికి సంబంధం ఉంది అని హైదర్ కి ఎవరు చెప్పారు ?? ఆ సమాచారం నిజమేనా ?? ఇన్ని ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే హైదర్ ని చూడాల్సిందే

నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి ఆంటే, తాబూ ఇంతకు ముందే తన ప్రతిభ నిరూపించుకుంది కాబట్టి కొత్తగా చెప్పేదేమీ లేదు ,ముఖ్యంగా చెప్పుకోవాల్సింది షాహీద్ కపూర్ గురించి, ఇన్ని రోజులు కేవలం లవర్ బాయ్ గా కనిపించిన షాహీద్ కపూర్ లో ఇంతటి నటుడు ఉన్నాడంటే నమ్మశక్యం కాదు, అంత అధ్బుతంగా నటించాడు, ఎక్కడా మనకు హైదర్ తప్ప షాహీద్ ఎక్కడ మనకు కనిపించడు. నేపధ్య సంగీతం కూడా విశాల్ భరద్వాజే సమకూర్చుకోవటంతో ఎక్కడ ఎంత మోతాదులో ఎలాంటి ఫీల్ ఇవ్వాలో అలాగే ఉంది, పంకజ్ కుమార్ సినిమాటోగ్రఫీ కాశ్మీర్ అందాలనే కాదు, దాని వెనుక ఉన్న ప్రమాదాలను, మోసాలను, మాయలను కూడా కళ్ళముందుంచింది.

ఈ సినిమా గురించి చెప్పుకోదగ్గ మరో గొప్ప విషయం, అసలు ఈ సినిమాని విడుదల చేయటానికి భారత ప్రభుత్వం కానీ, సైన్యం కానీ ఏ మాత్రం అభ్యంతరం వ్యక్తం చెయ్యకపోవటం. ఒకటి, రెండు సన్నివేశాలు భారత సైన్యానికి వ్యతిరేకంగా ఉన్నా దాన్ని కథలో భాగంగానే చూడాలి తప్ప, అది ఏ ఒక్క వర్గానికో వ్యతిరేకంగా చూడకూడదు, మనకు ఇన్నాళ్ళు కాశ్మీర్ కు సంబంధించి, ఏదో ఒక వర్గానికి సంబధించిన కోణంలో మాత్రమే చూడటానికి అలవాటు పడ్డ మనకు, ఇది కాశ్మీర్ గురించి ఇరు వర్గాల కోణంలో చూపించటం ఒక విశేషం.

-మోహన్ రావిపాటి

mohan

విజయానికి క్షితిజ ‘రేఖ’ ఆమె!

index
ఒకప్పుడు లక్షలాదిమంది అభిమాన తారగా, కలలరాణిగా వెండితెరపై తిరుగులేని ఆధిపత్యం చలాయించిన నటి రేఖ. కెరీర్ ఆరంభంలో విమర్శకు గురైన తన రూపురేఖలను కాస్త మార్చుకొని అందాల తారగానే కాక, ప్రతిభావంతురాలైన నటిగా ప్రశంసలు పొందిన ఆమె జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలో. ఎంతమంది మగవాళ్లతో ఆమె పేరు కలిసి వినిపించిందో. అయినా ఒంటరిగానే వాటిని ఎదుర్కొంటూ, బలమైన వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలిచిన రేఖ జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలు.

* మనదేశంలో ఫిట్‌నెస్ వీడియో ట్రెండును ప్రారంభించింది బిపాషా బసు, శిల్పాశెట్టి అని మనలో చాలామంది అనుకొంటూ ఉంటారు. కానీ ఈ ట్రెండును ప్రారంభించింది రేఖ. అవును. 1980లోనే ‘రేఖాస్ మైండ్ అండ్ బాడీ టెంపుల్’ అనే వీడియోను ఆమె విడుదల చేసింది. అంటే బిపాషా, శిల్పా కంటే రెండు దశాబ్దాల ముందుగానే వీడియో ద్వారా ఫిట్‌నెస్ శిక్షణ ఇచ్చింది రేఖ.
* స్కూలుకెళ్తూ మధ్యలోనే చదువు మానేసిన రేఖ బాలనటిగా పన్నెండేళ్ల వయసులో తెలుగు సినిమా ‘రంగుల రాట్నం’ (1966)లో మొదటిసారి నటించింది. అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ఖిలాడియోం కా ఖిలాడి’లో నటనకు గాను ఉత్తమ విలన్‌గా ఆమె స్టార్ స్క్రీన్ అవార్డును గెలుచుకుంది. అయితే ఆ కేరక్టర్ అంటే తనకు అయిష్టమని తెలిపింది రేఖ.
* బాలీవుడ్ సెక్స్ సింబల్‌గా పేరుపొందడానికి ముందు మరీ నలుపుగా ఉందనే విమర్శకూ, చిన్నచూపుకూ గురయ్యింది. ఆమెలో దక్షిణభారత రూపురేఖలు ఎక్కువగా ఉన్నాయనీ, ఆమె ముఖం ‘అగ్లీ’గా ఉంటుందనీ, హిందీ సినిమాలకు పనికిరాదనీ విమర్శకులు ఆమెను కించపరిచారు. కానీ తర్వాతి కాలంలో వారే ఆమెను చక్కని నటిగా, అగ్రతారగా అంగీకరించక తప్పలేదు.
* 1976లో వచ్చిన ‘దో అంజానే’ సినిమా నటిగా రేఖ జీవితాన్ని మలుపు తిప్పింది. అప్పటివరకూ కనిపించిన తీరుకు భిన్నంగా ఇందులో ఆమె కొత్త రూపుతో కనిపించి, ఆకట్టుకుంది. మరో రెండేళ్లకు వచ్చిన ‘ఘర్’ ఆమె నట జీవితంలో ఓ మైలురాయి. అత్యాచార బాధితురాలిగా ఆమె ప్రదర్శించిన నటన ఫిలింఫేర్ నామినేషన్‌ను తెచ్చిపెట్టింది. దాని వెంటనే అమితాబ్ బచ్చన్ జోడీగా ఆమె నటించిన ‘ముకద్దర్ కా సికందర్’ విడుదలై ఆ దశాబ్దంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ సినిమాతో బాలీవుడ్ అగ్ర తారల జాబితాలో చోటు సంపాదించింది రేఖ.
* చాలామంది నటులతో ఆమె పేరు కలిసి వినిపించింది. రాజ్ బబ్బర్, వినోద్ మెహ్రా, నవీన్ నిశ్చల్‌తో పాటు తనకంటే చిన్నవాళ్లయిన సంజయ్‌దత్, అక్షయ్‌కుమార్‌తోనూ ఆమెకు సంబంధం అంటగడుతూ ప్రచారం జరిగింది. అయితే ఎక్కువగా ఫేమస్ అయ్యింది మాత్రం అమితాబ్-రేఖ ప్రేమాయణమే. ‘గంగా కీ సౌగంధ్’ సినిమా సెట్స్‌పై రేఖతో అనుచితంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిపై అమితాబ్ చేయిచేసుకోవడంతో ఆ ఇద్దరి మధ్యా అనుబంధం ఉందంటూ వదంతులు మొదలయ్యాయి.
* పారిశ్రామికవేత్త ముఖేష్ అగర్వాల్‌తో ఆమె పెళ్లి జరిగింది. కానీ పెళ్లయిన ఏడాదికే ముఖేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు’ అనే సూసైడ్ నోట్ దొరికింది. అయితే అమితాబ్, రేఖ మధ్య అనుబంధాన్ని తట్టుకోలేకనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడంటూ ప్రచారంలోకి వచ్చింది.
* ప్రస్తుతం రేఖ టైటిల్ రోల్ పోషించిన ‘సూపర్ నాని’ సినిమా ఈ అక్టోబర్ 31న విడుదలకు సిద్దంగా ఉంది. ఇంద్రకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భారతీ భాటియా అనే మధ్యవయస్కురాలి పాత్రను చేసింది రేఖ. ప్రతి స్త్రీలోనూ అంతర్గతంగా అమితమైన ప్రతిభా సామర్థ్యాలు దాగుంటాయనీ, కావలసినదల్లా అవి తనలో ఉన్నాయని తెలుసుకోవడమేననీ చెప్పే ఓ గుజరాతీ నాటకం ఆధారంగా ఈ సినిమా తయారైంది. అలా తన శక్తి ఏమిటో తెలుసుకున్న ‘సూపర్ నాని’గా కొద్ది రోజుల్లోనే రేఖ మన ముందుకు రాబోతోంది.

(అక్టోబర్ 10 రేఖ పుట్టినరోజు)

-బుద్ధి యజ్ఞ మూర్తి

జీవితంలోంచి పుట్టిన కామెడీ…ఇదిగో ఇలా తెర మీదికి నేరుగా!

శ్రీరాం కన్నన్

శ్రీరాం కణ్ణన్

జీవితంలో హాస్యం జీవితంలోంచే పుడుతుంది. గ్రహించే మెళకువా, దాన్ని సెల్యులాయిడ్ మీదికి ఎక్కించే నేర్పూ ఉండాలి. దాన్ని ఆస్వాదించే ప్రేక్షకులూ ఉండాలనుకోండి 

 

” You had to learn at a certain age what sarcasm is ” అంటుంది పెన్నీ మార్షల్ అనే మహిళా దర్శకురాలు. ఫ్రెంచ్ సినిమాల్లో కొట్టొచ్చినట్లు కనిపించే ఈ వ్యంగ్యం చైనీస్ సినిమాల్లోనూ చూడొచ్చు. మన సినిమా విషయానికొద్దాం.

1947 ప్రాంతం. ఓ తెల్లాయన దేశం విడిచిపోతూ దక్షిణ దేశమంతా తిరుగుతూ ఫోటోలు తీస్తూ ‘ ముండాసుపట్టి ‘ అనే గ్రామానికి వస్తాడు. అక్కడ ఉన్న జనాన్ని ఫోటోలు తీస్తూంటాడు. గ్రామంలో కలరా వ్యాపిస్తుంది. కొంతమంది చనిపోతారు. జనాలు చనిపోవడం ఈ ఫోటోలు తీయడం వల్లనే అనే నమ్మకం బాగా ప్రబలి గ్రామ దేవతైన మునేశ్వరుని దగ్గర మొర పెట్టుకోవడానికొచ్చే సంధర్భంలో ఆ గ్రామదేవత విగ్రహం నవపాషాణం ( ‘ రహస్యం ‘ సీరియల్ చూడని వారు బెంచీ మీద ఎక్కండి ) తో తయారయ్యిందని ఆసరికే దాన్ని దొంగలించడానికొస్తారు కొంతమంది బందిపోట్లు. వీళ్ళు కాళ్ళా వేళ్ళా పడి బతిమాలుతుండగా అప్పుడే ఓ ఉల్కాపాతం సంభవించి ఈ దొంగల్లో కొంతమీద పడి ఆ శిల దొర్లుకుంటూ వెళ్ళి సరిగ్గా విగ్రహం తీసేసిన స్థలంలోకెళ్ళి కూర్చుంటుంది. మిగిలిన దొంగలూ పారిపోతారు.

అసలు విగ్రహాన్ని తీసుకుని. ఈ గ్రామస్థులు ఆశ్చర్యానందాలతో ఆ కొత్త రాయికి ప్రణమిల్లి ఆ మునేశ్వరుడే కొత్తరూపంలో గ్రామాన్ని రక్షించడానికొచ్చాడని భావించి పూజలు చేయడం, గ్రామంలో ప్రబలిన వ్యాధి అకస్మాత్తుగా మాయమైపోవడమూ జరుగుతుంది. ఈ తెల్లాయన మళ్ళి వచ్చి ఆ ఉల్కాపాతం జరిగిన స్థలంలో కొన్ని చిన్న చిన్న శిలాజాల్ని పరిశీలిస్తుండగా గ్రామస్థులు ఆ తెల్లాయన్ని వెళ్ళగొడ్తారు. ఆయన ఇంగ్లాండు వెళ్ళిపోయి పరీక్ష చేస్తే అది చాలా విలువైన లోహానికి చెందినదని తేలుతుంది. దాన్ని అక్కణ్ణుంచి తీసుకొచ్చే ప్రయత్నమూ మానుకుంటాడు గ్రామస్థులు ఎలా తిరగబడతారో అప్పటికే తెలుసుంటుంది కాబట్టి.

ప్రస్తుత కాలం 1982 ( సినిమాలో ఈ చిన్న డీటైలును కూడా ఎక్కడా మర్చిపోకుండా విలన్లు ఒకచోట క్రికెట్ కామెంటరీ వింటూ ఉండే సన్నివేశం చూపిస్తాడు దర్శకుడు. అప్పట్లో క్రికెట్ ఎందుకు అని అడిగే వాళ్ళు ఇంతకుముంది బెంచీ ఎక్కినవాళ్ళతో కలవండి ). మన హీరో ఓ ఫోటో గ్రాఫర్ . పేరు గోపి. అతనికో అసిస్టెంటూ ఉంటాడు.పేరు అళగు మణి. ఇతనికో ఫోటో స్టూడియో. ఓ రోజు పొద్దున్నే ఒక గ్రామీణుడొచ్చి స్టూడియో బోర్డ్ చూసి ఎదురుగా ఉండే ఫోన్ బూత్ నుంచి కాల్ చేస్తాడు. ఇక అక్కడ మొదలయ్యే సన్నివేశాలుమనం దొర్లి దొర్లి నవ్వడం ఒకటే తక్కువగా నవ్విస్తాయి.

సినిమా హీరో అవ్వాలని ఇంట్లోంచి పారిపోయి ప్రయత్నాలు చేస్తూ ఉన్న ఒకతను. పేరు మునీస్ కాంత్. ( రజనీకాంత్ ను ఇమిటేట్ చెయ్యడం అన్నమాట ) ఎనిమిదణాలకోసం రిక్షా అతనితో గొడవ పెట్టుకునే పరిస్థితి. చేతిలో ‘ ముప్పై రోజుల్లో గొప్ప నటుడవ్వడం ఎలా ‘ అనే పుస్తకం. నవ్వకండి. మద్రాసులో ఇప్పటికీ కోడంబాక్కంలో ఇలాంటి శాల్తీలు దొరుకుతారు. తాను నటించిన సినిమా నూర్రోజులు ఆడేంతవరకూ ఊళ్ళో అడుగు పెట్టను అని ఒట్టుపెట్టుకుని తిరుగుతున్న వ్యక్తి. అందుకే కొన్ని స్టిల్ ఫోటోలు తీసి తన జీవితంలో దీపాన్ని వెలిగించమని అడుగుతాడు. దానికి డబ్బులు కావాలని అయిదు కాపీలు అయిదు రూపాయలు అవుతుందంటాడు. మునీస్ కాంత్ కాసేపు ఆలోచించి రూపాయికి ఎన్నొస్తాయంటాడు. నెగటివ్ మాత్రమే వస్తుందంటే పరవాలేదు నా బొమ్మ తెలుస్తుంది కదా అంటాడు. ” అందంగా ఉండే వాళ్ళే నెగటివ్ లో దెయ్యాల్లా ఉంటే మరి దెయ్యం లా ఉండే నువ్వు నెగటివ్ లో ఎలా కనిపిస్తావో తెలుసా? ఫో, పోయి అయిదు రూపాయలు పట్రా ” అని వెళ్ళగొడ్తారు. మునీస్ కూడా అయిదురూపాయల్తో వస్తానని శపథం చేసి వెళ్ళిపోతాడు.

ఇలా ఉంటే ఓ రోజు ఓ సెకండరీ స్కూల్లో గ్రూప్ ఫోటో కు పిలుపొస్తుంది. గోపి వెళ్ళి ఫోటొ తీయడానికి ఏర్పాట్లు చేస్తూంటే, ఓ అమ్మాయి క్లాసులోంచి కదలదు. ఫోటోకూ రానంటుంది. జ్వరంగా ఉందని చెప్పి ఫోటొ దిగదు. గోపి వెళ్ళి చూస్తాడు.లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఆ అమ్మాయి ఇతన్ని నోట్స్ లో బొమ్మ గీసేసి ఉంటుంది ఇంతలోనే. గోపీ కూడ రెండ్రోజులకు ఫోటో కాపీలు రెడీ చేసి అందరికీ ఇద్దామని స్వయంగా స్కూలుకొస్తాడు. ఓ ఫోటో ప్రత్యేకంగా అట్టమీద అతికించి బాగా కనిపించేలా కూడా తెస్తాడు. అప్పుడే తెలుస్తుంది ఆ అమ్మాయికి పెళ్ళి నిశ్చయమైపోయి స్కూలు మానేసిందని. మనోడు తల వేళ్ళాడేసుకుని వెనక్కొచ్చేస్తాడు. ఓ రోజు ఓ పెద్దాయన వచ్చి ఓ ఫోటో తీయాలంటాడు. ( ట్రైలర్ లో చూడండి :https://www.youtube.com/watch?v=NjwnL6jrtuw ) ఊరు మనం చెప్పుకున్న ముందాసుపట్టి.ఊళ్ళో ఒకాయన చావు బతుకుల్లో ఉన్నాడు చనిపోయాక తీయాలంటాడు. బైక్ మీద వెళ్తూ ఫోటో అంటే ఊళ్ళో ఉన్న భయం గురించి చెప్తూ ప్రపంచాన్నే ఫోటో తీస్తున్న శాటిలైట్లు ఉన్న కాలంలో ఈ భయాలేమిటి అని ప్రశ్నిస్తే అందుకే మా ఊళ్ళో వర్షాలు పడ్డం లేదంటాడు ఆ పెద్దాయన ! వీళ్ళూ బయలు దేరి వెళ్తే అక్కడ పెద్దమనిషి ఇంకా పోలేదు. ఆశ్చర్యంగా మన హీరోయిను చనిపోతూన్న వాళ్ళ తాతకి సపర్యలు చేస్తూ కనిపిస్తుంది. పేరు చెప్పలేదు కదా, కలైవాణి. మనోడి ఆనందానికి పట్టపగ్గాలుండవు. పెద్దాయన పరిస్థితి మూలంగా పెళ్ళి వాయిదా పడి ఉంటుంది. మనోడి హుషారు చూడాలి.

పెద్దాయనా పోడు. వీళ్ళనూ ఊళ్ళోనే ఉండేలా ఏర్పాట్లు చేస్తారు పిలిచిన కలైవాణి ఇంట్లో వాళ్ళు. పెంపుడు మేకను ( దాని పేరు సుబ్రమణి ) తీసుకొచ్చి ఫోటో తీయించాలని అడిగే సీను, మొగుణ్ణి ఫోటో తీసి లేపెయ్యమని పెళ్ళామూ, పెళ్ళాన్ని ఫోటో తీసి పంపించే పని చెయ్యమని మొగుడు ఒకరికి తెలియకుండా ఒకరు గోపి ని అడిగే సీన్లు, మేకను బలిచ్చేసిన తర్వాత భోజనంలో ఓ ముక్క తీసుకుని సుబ్రమణి అస్సలు గుర్తుపట్టడానికి వీలు కావట్లేదు అని జోకులేసే సీన్లూ, ప్రసాదం కోసం అసలు సంగతి తెలియకుండా టెంకాయలు తలపై కొట్టించుకునే సీన్లు,పాటలో ఫోటో తీయడానికి కేమెరా బయటికి తీస్తుంటే జనాలు ఇల్లొదిలి బయటకు పారిపోయే సన్నివేశాలు, నవ్వులే నవ్వులు. ఊళ్ళోవాళ్ళు ఏవో నమ్మకాల్తో పాడు పెట్టిన ఓ స్కూలు ఉంటుంది. దాని సంగతి తర్వాత. కలైవాణికి గోపి తన ప్రేమ సంగతి మాటల్లో చెప్పేస్తాడు. ఐ లవ్ యూ అని. ఆ అమ్మాయి షాక్. అప్పుడే అరుపులు వినిపిస్తాయి ఇంట్లోంచి పెద్దాయన పోయాడని. అప్పుడే సినిమాలో సూపర్ హిట్ సాంగ్ ” రాసా మగరాసా ఎన్నయ్యా.” ( ఇక్కడ వింటూ చూడండి : http://www.youtube.com/watch?v=o4Tv8BvEccc ). శవ దహనానికి ఏర్పాట్లు చేస్తూంటే బాక్ గ్రౌండ్ లో ఈ పాట సంగీతమూ, నేపథ్యమూ అస్సలు చూసి తీరాలి. నవ్వకండి. నిజంగానే బావుంటుంది. వ్యంగ్యం కాదు. నిజమే.

పెద్దాయన చివరి ( మొదటిది కూడా  ) ఫోటొ తీసుకుని గోపి, అళగుమణి వచ్చేస్తారు. అప్పటికే ఆ ఫోటో మీద ఎన్నో కలల మిద్దెలూ మేడలూ కట్టేసుకుని ఉంటాడు గోపి. ఫోటో చూపి కలైవాణి నాన్నను మెప్పించినట్లు, కలైవాణిని తనకిచ్చి పెళ్ళి చేసేలా వప్పించినట్లు … ఇలా అన్నమాట! కలల్లోంచి ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు గోపి ఒక్కసారిగా డార్క్ రూంలోంచి అరుపులు వినిపిస్తే. లోపల అళగుమణి పాడైపోయిన నెగటివ్ ను చూపిస్తాడు. ఫోటో కలలు ఉన్నఫళాన కల్లలైపోయాయి మన గోపీకి. ఏం చెయ్యాలి. ఫోటో లేదంటే ‘ముండాసుపట్టి’ జనం చంపేస్తారు. ఫోటో రావడానికి ఇంకో మార్గమూ లేదు. అళగుమణి ఓ సలహా ఇస్తాడు. స్టూడియో కాల్చెయ్యమని. అప్పుడు జనం స్టూడియోతో బాటు నెగటివ్ కూడా కాలిపోయిందని చెప్తే నమ్మి వదిలేస్తారు కదా అని. దానికి తగ్గట్లు వీళ్ళూ ప్లాన్ చేసి కొవ్వొత్తిని కాగితాలకట్ట దగ్గర వెలిగించి స్టూడియో మూసేసి సినిమాకెళ్ళిపోతారు. సినిమా మధ్యలో ఓ పిల్లవాడు అగ్నిప్రమాదం గురించి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తాడు. వీళ్ళూ గంతులేసుకుంటూ, పైకి మాత్రం బాధ నటిస్తూ వెళ్తే వీరిది తప్ప మిగతా పక్కనున్న దుకాణాల్లో మంట రేగి ఉంటుంది.వీళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. అప్పుడు ఊడిపడతాడు మన మునీస్ కాంత్ చేతిలో అయిదు రూపాయలతో.

స్టిల్ ఫోటోలు తియ్యడానికి లోపలికెళ్ళిన అళగుమణి కి అప్పటికప్పుడు మెరుపులాంటి ఆలోచన వస్తుంది. బయటికొచ్చి గోపి కి చెప్తాడు. మనోడి మొహంలో వెయ్యివోల్టుల వెలుగు. మునీస్ కాంత్ తో మాటలు కలుపుతూ ఉంటే అళగుమణి బయటికెళ్ళి ఓ సినిమా వ్యక్తిలాగా గోపి కి ఫోన్ చేస్తాడు. ఇలా భారతీరాజా మన ఊరి చుట్టుపక్కల సినిమా షూటింగ్ చేయబోతున్నాడని, ఓ చావు సన్నివేశం షూట్ చేస్తున్నాడని, ఆ శవంలా నటించడానికి ఓ కొత్త మొహం కోసం ఎదురుచూస్తున్నాడని మాట్లాడుతూ ఉంటాడు ఫోన్ లో. మన మునీస్ ఇక బతిమాలడం మొదలెడతాడు. వీళ్ళు చాలా కష్టపడుతూ ఒప్పుకున్నట్లు నటించి చివరికి కొన్ని ఫోటోలు శవంలా స్టిల్స్ తీయించి అతన్ని ఆశలపల్లకిలో ఊరేగించి పంపేస్తారు.

10711274_732677873434030_923886551_n

మన గోపి, అళగు మణి ఊళ్ళోకెళ్ళి ఫోటో అప్పగిస్తారు భద్రంగా. వీళ్ళకు ఆ పూట అక్కడే భోజనం. ఇంతలో అకస్మాత్తుగా అరుచుకుంటూ వచ్చి ఊడిపడతాడు మునీస్ కాంత్ ఆ ఇంటికి. చిన్నాన్నా అంటూ. చనిపోయిన పెద్ద మనిషి మన మునీస్ చిన్నాన్న. ఇంట్లోవాళ్ళు అతన్ని వదిలేసి ఉంటారు సినిమాల్లోకి ట్రై చేస్తున్నాడని. ఫోటో అంటేనే భయపడే వాళ్ళు సినిమా అంటే చెప్పేదేముంది. దగ్గరకొచ్చి చూస్తాడు కదా అది తన ఫోటోనే ! తిరిగి చూస్తే వీళ్ళిద్దరు తోడు దొంగలు. అరచి గీ పెట్టి నానా యాగీ చేసి అందరికీ చెప్పేస్తాడు అది తన ఫోటోనే అని. అసలు ఫోటో పోగొట్టినందుకు ఊళ్ళో వాళ్ళు వీళ్ళని తరుముకుంటారు. వీళ్ళు బండి మీద పారిపోతుండగా పట్టేసుకుంటారు. ఊళ్ళో గుడి దగ్గర అదే, సినిమా మొదట్లో ఉల్కాపాతంలో పడ్డ రాయి దేవుడుగా ఉండే చోట పంచాయితీ. మామూలుగా ఆ సమయంలో శిక్షను నిర్ణయం చేసే గుడి గంట ఎంతకీ మోగదు. వాళ్ళకి అదంటేనే గురి. దానికి తోడు ఓ పూజారి. ఇక శిక్ష నిర్ణయం కాకపోయే సరికి వీళ్ళకు శిక్షగా ఓ బావి తవ్వమని తీర్పిచ్చి వీళ్ళకు కాపలాగా మునీస్ కాంత్ నే పెట్టి పని పూర్తి చేయించే బాధ్యత అప్పగిస్తారు.

ఇక అప్పటినుంచి బావి తవ్వుతున్నప్పుడు బయటపడే ఓ మనిషి ఎముకలగూడు చూపించి అది ఇంతకు ముందు బావి తవ్వమని శిక్ష పడ్డతను అని చెప్పే సన్నివేశం, ఇంట్లో పెద్దాయన పటానికి నైవేద్యాలు పెట్టడాలు, దాన్ని తినడానికి ట్రై చేస్తే మునీస్ ను పెద్దలు వారించే విధానం, ” ఫోటో నాది కానీ ఫోటో లో ఉన్నతను మాత్రం చిన్నాన్నా? ” అని ఇతను ఆవేశంగా గొడవపడే సన్నివేశం, బావి తవ్వే సాకులో కలైవాణి ని సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేలా గోపి వాళ్ళు పన్నే పన్నాగాలు చూడాలి. మొత్తానికి కలైవాణి గోపి కి పడిపోతుంది. ఇంతలో వాయిదా పడ్డ పెళ్ళి పనులు తిరిగి ప్రారంభం అవుతాయి. కలైవాణికి ఇష్టం ఉండదు. నాన్నతో అంటుంది పెళ్ళి వద్దు అని. మామూలే,నాన్న చెంప పగలగొడతాడు. వారంలో పెళ్ళి ఖాయం చేస్తాడు. గోపి ఆలోచిస్తూంటాడు ఏం చేయాలా అని.

ఊళ్ళో రాయి గ్రామనికంతా దేవుడు కాబట్టి, దేవుడు లేకుండా పెళ్ళి జరగదు కాబట్టి ఆ రాయిని మాయం చేస్తే అన్న ఆలోచన వస్తుంది గోపి కి. కలైవాణికో తమ్ముడు. వాడు అక్క బాధ చూళ్ళేక గోపి దగ్గరకొచ్చి ఓ ఐడియా ఇస్తాడు. గుడీ తలుపుల తాళాల గుత్తి తను నాన్న దగ్గర్ణుంచి తెచ్చేట్లు, వాళ్ళు రాయిని మాయం చేసి, దాచిపెట్టి తిరిగి వాళ్ళే రాయిని వెతికి తెచ్చి అప్పగించేట్లు, అంత ప్రాణప్రదమైన దేవుణ్ణి తిరిగి తెచ్చినందుకు ఏం కావాలన్నా కలైవాణి వాళ్ళ నాన్న ఇస్తాడని గురి కుదురుతుంది. అనుకున్నట్లుగానే రాయిని దొంగిలించి ఊళ్ళో పాడుబడ్డ స్కూల్లో దాచేస్తారు. సరిగ్గా పెళ్ళిలో మంగళసూత్రం కట్టే సమయానికి వార్త తెలుస్తుంది. దేవుడి రాయిని ఎవరో మాయం చేసేశారని. పెళ్ళి మళ్ళీ ఆగిపోతుంది. కలైవాణి నాన్న అందర్నీ నాలుగు దిక్కులకూ పంపిస్తాడు. గోపి వాళ్ళు ముందే అనుకున్నట్లుగా పాడుపడ్డ స్కూలు వైపు నడుస్తారు గంపెడు ఆశలతో.

ఆల్రెడీ ఓ విలన్ ఉంటాడు. మన పాత సినిమాల్లో ఆనందరాజ్. అతనికి నలుగురు భార్యలు. అందరూ ….ఒక్కొరొక్కరుగా ఇతని పరిస్థితి చూసి పారిపోయుంటారు ఇంకొకర్తో. పర్యవసానంగా అతను తన లైంగిక పటుత్వం పెంచుకోవడానికి ఎవరో చెప్పారని పిల్లుల మాంసంతో చేసిన సూప్ సేవిస్తూ ఉంటాడు. సినిమా మొదట్లో ఇంగ్లాండు వెళ్ళిపోయిన తెల్లవాని కొడుకు తండ్రి డైరీ చాలా కాలం తర్వాత చూసి ఆ గుళ్ళో రాయిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని విలన్ తో ఒప్పందం చేసుకుని ఉంటాడు. అలా ఆ రాయిని దొంగతనం చేయడానికి యత్నాలు సాగిస్తూ ఉంటాడు. అందులో భాగంగా కలైవాణి ఇంట్లో తన మనిషిని పనివానిగా కూడా అప్పటికే ఉంచి ఉంటాడు. ఇలా పాడు బడ్డ స్కూల్లోంచి రాయిని తిరిగి దొంగతనం చేయిస్తాడు విలన్ తన మనిషి చేత.

దేవుని రాయికోసం వెళ్ళిన గోపి వాళ్ళు రాయి లేకుండడం చూసి నిశ్చేష్టులై కాసేపు ధీర్ఘంగా ఆలోచించి తెలుసుకుంటారు ఇంట్లో పనివాడే ఈ పని చేసినట్ళు. వీళ్ళతో బాటు వచ్చిన మునీస్ కాంత్ కూడా రాయి కోసం గోపి వాళ్ళతో బాటు విలన్ ఇంటికి పరిగెత్తుతాడు . విలన్ ఇంటికి వెళ్ళడం, చేజింగులూ, పారిపోవడాలూ తర్వాత రాయిని తీసుకొచ్చి భద్రంగా అప్పగిస్తారు. ఈ సందట్లో విషయం పూర్తిగా అర్థమైన మునీస్ కాంత్ ఆ చేజింగులు జరిగే సంధర్భంలో పైకొచ్చే దారిలేని ఓ బావిలో పడిపోతాడు. ఈలోగా ముందే గుళ్ళో పూజారిని అతని గతమూ, వర్తమానమూ తెలుసుకుని అతన్ని లొంగదీసుకుని గోపి దేవుణ్ణి తెచ్చాడు కాబట్టి అతను ఏమడిగినా ఇచ్చేలా అతన్ని తృప్తి పరచమని పూనకంలో చెప్పిస్తారు. సరేనంటాడు కలైవాణి నాన్న. గోపి తడుముకోకుండా ముందే అనుకున్నట్లు కలైవాణిని తనకిచ్చి పెళ్ళి చెయ్యమని అడుగుతాడు. సరేనంటాడు కాబోయే మామగారు.

పెళ్ళీ అయిపోతుంది. శుభం అనుకుంటాం. అప్పుడు మళ్ళీ ఊడిపడతాడు మునీస్ కాంత్ అసలు సంగతి లబలబ కొట్టుకుంటూ చెప్తూ. పరిస్థితి చూసి హీరోయిన్, హీరో చెయ్యి పట్టుకుని పారిపోతుంటుంది. వీళ్ళతో హనుమంతుడు అళగుమణి కూడా.అర్థమైన ఊళ్ళో జనం కత్తుల్తో వీళ్ళ వెంట పడతారు.. పారిపోతుండగా మధ్యలో బైక్ ఆగిపోతుంది. కత్తులు ఎగురుతూ వస్త్తూంటాయి. ఊరికి ఊరు మొత్తం దగ్గరికొచ్చేస్తుంటుంది. కలైవాణి, అళగు మణి చేష్టలుడిగి చూస్తూ ఉంటారు. అప్పుడు గోపి చెప్తాడు అళగుమణి తో ” దాన్ని” బయటకు తీయరా ఊరి జనం సంగతి చూస్తాను. అని – శుభం.

ఈ సినిమా తీసింది రాం కుమార్ అనే కొత్త దర్శకుడు. విజయ్ టీవీ వాళ్ల ‘నాళయ ఇయక్కునర్’ ( Tomorrow’s Director ) అనే ప్రోగ్రాములో దాదాపు పది దాకా షార్ట్ ఫిలింస్ తీసినతను. సన్నివేశాల చిత్రీకరణలో కొత్తదనంలో నోస్టాల్జిక్ గుభాళింపులు మేళవించడం చూడచ్చు. సంగీతం సూపర్. రెండు పాటల్లో ” రాసా మగరాసా ” పాటైతే కేక. ఫోటోగ్రఫీ బావుంది. భారతీ రాజా సినిమాల ప్రభావం నుంచి తమిళ సినిమా ఇంకో వందేళ్ళైనా పోదు. ఆయనది అలాంటి మార్క్. నటీ నటులు – నందిని,విష్ణు విషాల్ బాగా నటించారు. అళగు మణి గా కాళి వెంకట్, మునీస్ కాంత్ గా రాందాస్ . ఇక అందరూ కొత్తోళ్ళే. అందరూ బాగా జీవించారు

తెలుగులో తీస్తే మాత్రం మనోళ్ళు అడాప్టేషన్ పేరుతో కథను చంపేసి పంచింగులూ, ఫైలింగులూ మీద దృష్టి పెట్టి సినిమాను చంపెయ్యడం మాత్రం తథ్యం. ఇక్కడ గమనించాల్సిందేమంటే కథలో నటీనటులకన్నా సన్నివేశాల ప్రాధాన్యమే ఎక్కువగా కనిపించింది. కథ నడిచే తీరు ఎక్కడా బోరు కొట్టకుండా, సరైన వేగంతో నడిచి ట్విస్టుల పేరుతో జనాల్ని కంఫ్యూజ్ చెయ్యకుండా  కూల్ గా నడుస్తుంటుంది.కథలో భాగంగా మన ఇంటెలిజెన్సుని చాలెంజ్ చేసేలా మాత్రం ఉండదు. తమిళం తెలిసిన వాళ్ళు తప్పని సరిగా చూడాల్సిన సినిమా.

I want to thank Mr. Chandru Muthu for suggesting this movie. Thank you Sir, its a wonderful movie !

  -శ్రీరాం కణ్ణన్

గమ్యం దగ్గిరే అని చెప్పే చిత్రం “ఎంతెంతదూరం ..?”

poster_ed

వేణు నక్షత్రం గారి ఎంతెంత దూరం సినిమా చూసాను. ఇది చాల చక్కగా తీసిన సినిమా. ఈ సినిమా చూస్తున్నపుడు నాకు నా బాల్యం గుర్తుకొచ్చినది. నేను కూడా గ్రామీణ ప్రాంతములో తెలంగాణా ప్రాంతములో పుట్టి పెరిగాను. అవే గుడిసెలు అవే మిద్దెలు- వాటన్నిటి మధ్యలో పుట్టి పెరిగాను . దాని తరువాత ఈ పిల్లలు ఏ పరిస్థితులలో అక్కడ చదువుకుంటున్నారు, తల్లిదండ్రులు ఏ పరిస్థితులలో పిల్లలని పోషిస్తున్నారు, వాళ్ళకుండే అలవాట్లు ఏంటి ? వాళ్ళకుండే సాధకభాదకలేంటి? తరవాత భార్యా భర్తల మధ్య ఒక సంఘర్షణ ఒక విద్యార్థికి తల్లితండ్రులకి మధ్య సంఘర్షణ, తరువాత ఒక దొరకు ఒక పాలేరుకు మధ్య సంఘర్షణ . తరువాత బానిసత్వము దాని తరువాత ఈ దొరతనము అవ్వన్ని కూడా చాల చక్కగా దర్శకుడు వివరించారు.

పేదరికం అనేది చదువులో మార్కులు సంపాయించడంలో కాని లక్ష్యానికి ఎక్కడ కూడా అడ్డం కాదు, ఆ పట్టుదల అనేది ఉంటే ఏదైనా సాదించవచ్చు అనేది ఆ అబ్బాయి పాత్ర ద్వారా చూపించారు . తరువాత రెండవది తల్లి పాత్ర చాల చక్కగా చూపించారు దర్శకుడు. బాధ్యతరహితంగా తిరిగే ఒక తండ్రి వున్నప్పుడు , ఆ ఇంటి ఇల్లాలు బాధ్యతగ తన కొడుకు ను ఎలా చదివించు కోగలిగింది ?తరువాత తల్లికి తండ్రికి మధ్య ఎలాంటి సంఘర్షణ చక్కగా వివరించారు ఈ చిత్రంలో .

పేద వారిలో తండ్రి కొడుకుల బంధం, ఉన్నత చదువుల కోసం కొడుకు తండ్రి తో ఘర్షణ చాల అద్భుతంగా చిత్రీకరించారు. భూస్వాములు ఎలా బ్రతుకుతారు గ్రామీణ ప్రాంతాలలో, ఒక్కపుడు ఏవిదంగా బ్రతికేవారు తరువాత వాళ్ళు చేసుకునే పండగలు వారి పబ్బాలు అలాగే వాళ్ళకుండే ఆలోచనా విధానంఏంటి? అలాగే పాలేర్ల పిల్లలని ఏ విధంగా చూస్తారు , తెలంగాణా ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాలలో ఉండే ఈ సమాజాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు దర్శకులు . అందులో నటించిన నటీ నటులు చాల చక్కగా నటించారు, వాళ్ళు మన కళ్ళకు కట్టినట్టుగా మన గ్రామీణ సమాజాన్ని మన ముందుంచారు నిజం చెప్పాలంటే జీవించేసారు వాళ్ళ పాత్రలలో. ఒక పేద తండ్రి పాత్ర లో , మాభూమి, కొమరం భీమ్ , దాసీ లాంటి ఎన్నో ఆణిముత్యల్లాంటి చిత్రాల్లో నటించిన డాక్టర్ భూపాల్ రెడ్డి నటించాడు అనే కంటే జీవించాడు అని చెప్పొచ్చు. ప్రముఖ టీవీ సినీ నటి , నంది అవార్డు గ్రహీత మధుమణి చక్కగా తల్లి పాత్రలో ఒదిగి పోయారు . వీరిద్దరికి దీటుగా వూరి పెత్తందారు పాత్ర లో జి.ఎస్ నటన కూడా చెప్పో కో దగ్గది. ఇంకా కొన్ని ఒకటి , రెండు సన్నీ వేషాల్లో కన పడ్డ చిన్న పాత్రలు అయినా , మురళి గోదూర్, చాయ తమ పాత్రలకి చక్కగా సరి పోయారు .

ఈ సీక్వెన్స్ అఫ్ ఈవెంట్స్ కూడా ఎక్కడా బోర్ కొట్టినట్టుగా అనిపించదు చాల గ్రిప్పింగ్ గా ఉంటుంది. ఈ సినిమాలో ప్రతి క్షణం కూడా మనకి ఈ అబ్బాయి నిజంగా చదువు కుంటాడ చదువుకోడా అని ఈ భూస్వామి ఇతన్ని కొడతాడ లోకపోతే ఈ పిల్లవాడికి మార్కులు ఎక్కువగా వచ్చినయని భూస్వామి బిడ్డకి తక్కువ వచ్చినయని ఈ పిల్లవాడిని కానీ అతని తండ్రిని కానీ నిలతీస్తడా అన్న విషయాలన్నీ చాల చక్కగా వివరించారు దర్శకుడు . తండ్రికి కొడుకు మీద ఎంత కోపం ఉన్నా కూడా ఇంత పేదరికంలో కూడా ఎన్ని భాదలున్న కూడా పిల్లవాడు మంచి పనిచేసాడని పిల్లవాన్ని అక్కున చేరుచుకోవడం అనేది చాల బాగా చిత్రీకరించారు. చివరగా ఈ పేదరికంలో ఉన్న కూడా మద్యం అనేది ఎలా వీళ్ళని కబలిస్తుంది అనేది కూడా చక్కగా చూపించారు . మా చిన్నతనం నుంచి ఉన్న సమస్యలే ఇప్పటికి ఉన్నాయి కాకపోతే సమస్యలు ఇంకా ఎక్కువయినవి. పేదరికంతో పాటు మధ్యంపానం కూడా తోడయినది కాబట్టి బ్రతుకులన్ని బజారున పడుతున్నాయి , దీని గురించి కూడా చక్కగా వివరించారు

still3_ed

ముఖ్యంగా ఈ చిత్రానికి ప్రాణం డాక్టర్ పసునూరి రవీందర్ కథ, దాన్ని దృశ్య రూపకం లో మలచడం లో దర్శకుడు వందకు వంద శాతం న్యాయం చేయకలిగాడు అనటంలో ఏ సందేహం లేదు. శరత్ రెడ్డి కెమరా మ్యాజిక్ కూడా దీనికి తోడయ్యింది . ఇక పోతే ఈ చిత్రం మొదటి ఫ్రేమ్ నుండి చివరి వరకు , అందరిని ఎలాంటి ఆధునిక సంగీతపు పోకడలకు పోకుండా గ్రామీణ వాతావరణంలో విహరిస్తున్నట్టు గా ఒక అనుభూతికి లోనయ్యే చక్కటి సంగీతాన్ని విష్ణు కిశోర్ అందించగా , ఏ ఒక్క పది సెకండ్ల ఫ్రేమ్ కూడా మనకు అవసరం లేదు అనడానికి వీలు లేకుండా తన కత్తెరకు పని చెప్పాడు ఎడిటర్ అమర్ దీప్ నూతి .

సినిమా అంటే టీం వర్క్ , ఎవరిని ఎలా ఉపయోగించు కోవాలో అంత వరకే వుపయోగించు కొని ఒక చక్కటి చిత్రాన్ని అందించడం లో వేణు నక్షత్రం దర్శకునిగా వంద శాతం సక్సెస్ కాలిగాడు ఈ చిత్రంతో .
ఆయనకు మంచి ఫ్యూచర్ వుంది . కళ్ళకు కట్టినట్టుగా చిత్రీకరించే ఒక కళ ఆయనకు అబ్బినట్టుగా వుంది అని నాకు అనిపిస్తుంది . రాబోయే రోజుల్లో ఇంకా మంచి సినిమాలు తీస్తారని నేను ఆశిస్తున్నాను .

Video:

Enthentha dooram Trailer:

-డాక్టర్ ప్రవీణ్ కుమార్

PraveenKumar-IPS.1jpg

సాహిత్యం- సాహిత్తెం

 

 

కలలు చమత్కారంగా ఉంటవి. దెయ్యాలూ భూతాలు కలలోకి వచ్చినా మర్నాడు లేచాక మనకి కనిపించవు కదా? మంచి కలలొస్తే మంచి జరుగుతుందనీ, పాడు కల వస్తే చెడు జరుగుతుందనీ ఎక్కడైనా ఉందా? కల వచ్చిన మర్నాడు పొద్దున్నే కొంత సుఖమో కష్టమో అనిపించవచ్చు గానీ తర్వాత రోజూ పనుల్లో పడి ఇవన్నీ మర్చిపోతూంటాము కదా? కానీ నా కొచ్చిన కల వింతగా ఉంది.

 

లేకపోతే ఇది చూడండి. రాత్రి పడుకున్నానన్న మాటే గానీ ఎప్పటికో గాని నిద్రలేదు. అప్పుడొచ్చిన కలలో నేనూ, బిల్ గేట్సూ, వంగూరి చిట్టెన్ రాజు గారూ కలిసి నడుస్తున్నాం. ఇప్పుడు మనమో విమానం ఎక్కాలి అన్నారు బిల్ గేట్స్. “ఎక్కడికండి మనం వెళ్ళేది? ఇండియాకేనా?” అని ఎంతో ఉత్సాహంగా అడిగేను. సమాధానం లేదు. నాకేమో ఒళ్ళు జలదరిస్తోంది వీళ్ళతో వెళ్ళడానికి. వాళ్ళేమో సమాధానం చెప్పరు. విమానం వచ్చింది. ఎక్కాక పైలట్ కూర్చుని ఏవో మీటలన్నీ నొక్కుతున్నాడు. “బోయ్” మని చప్పుడు. విమానం తూర్పు కేసి ఎగురుతోంది అని నేనంటే వీళ్ళు “ఇండియాకి కాదు వెళ్ళేది ఆఫ్రికాకి” అనడం.

 

గేట్స్ గారితో వెళ్ళడం అంటే ఏ ఫస్టు క్లాసులోనో వెళ్ళచ్చేమో, వైన్ అదీ తాగి, పీక దాకా తినేసి, సీటు నూట ఎనభై డిగ్రీలు వచ్చేదాకా కాళ్ళు తన్ని పడుకోవచ్చు అనుకున్నాను కానీ వీళ్ళు నన్ను ఎకానమీలో ఎక్కించారని ఎక్కేదాకా తెలీలేదు. తీరా ఎక్కిన తర్వాత దాహంతో నోరు పిడచగట్టుకుపోతూంటే, ఓ కోక్ ఇమ్మన్నా, కాసిని మంచినీళ్ళిమ్మన్నా గంటు మొహం పెట్టుకుని ఏదో ముష్టి పారేసినట్టు తెచ్చి మొహం మీద విసరడం.

 

ఇంక ఎలాగా తప్పదు కదా? వాళ్ళు పెట్టిన గడ్డీ గాదం (అవే లెండి, ఆంగ్లంలో సలాడ్లు అంటారు కదా) తిని ఓ కునుకు తీసి లేచేసరికి సీటు బెల్ట్ పెట్టుకోమని ఆర్డర్. అప్పటికే రాజు గారూ, గేట్స్ గారూ రడీగా ఉన్నారు. నేనే లేటుగా లేచింది. కిందకి దిగి “ఇది హైద్రాబాదులా లేదే, ఇదే ఊరండి రాజు గారు?” అనడిగాను. సమాధానం లేదు.

 

కాస్త ముందుకెళ్ళాం. ఇక్కడకెందుకొచ్చామో నాకర్ధం కాలేదు. చుట్టూ చూసాను. మమ్మల్ని దింపిన విమానం వెళ్ళిపోతోంది మళ్ళీ. కార్లూ అవీ ఉన్నట్టులేదు. ఇండియా అయితే ఎడ్లబండో, ఏనుగో కనపడాలి కదా విమానం దిగిన పదినిముషాల్లో? రాజుగారి కేసి ప్రశ్నార్ధకంగా చూస్తే ఆయనే చెప్పేరు ఈ సారి – “ఇది ఆఫ్రికా, మనం ఇక్కడ చూడాల్సినవి కొన్ని ఉన్నాయి.”

 

“మరి బిల్ గేట్స్ గారేరీ?” అన్నాను ఆయన మాతో లేకపోవడం గమనించి.

 

“ఆయనకి వేరే పనులున్నాయి, పోలియో, మలేరియా మందులు ఇప్పించడానికీ, దానికీను. ఆయనరారు మనకి తప్పదు.” చెప్పేరు రాజు గారు.

 

“మనకి ఎందుకు తప్పదు?”

 

“నేను కధలు రాస్తాను. నువ్వు నాకన్నా బాగా రాస్తావు; అందుకని” వెర్రి వెధవని కాకపోతే రాజుగారు నన్ను వెక్కిరిస్తున్నారని తెలియలేదు.

 

ఎదురుగా “విలియం ఎండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ లైబ్రరీ” అని పెద్ద పెద్ద అక్షరాలతో పెద్ద భవనం కనిపించింది. “మనమే ఎం.బి.ఏ చేసుంటే నేను ఏ వాల్ స్ట్రీట్ లోనో లక్ష డాలర్లు సంపాదించేవాడిని, నువ్వు ఏ కోటి డాలర్లో తెచ్చేవాడివి గేట్స్ గారిలానే.” నేను ఆ బిల్డింగ్ బోర్డు చూసి నోరు వెళ్ళబెట్టగానే చెప్పేరు రాజుగారు.

 

ఏమైనా నేను కోటి డాలర్లు తెస్తున్నట్టే అనిపించింది. మీరు ఎందుకు ఎం. బి. ఏ చేయలేదని రాజుగార్ని అడుగుదామనుకున్నాను కానీ ఊరుకున్నాను.  జేబులన్నీ వెతికి తుపాకులూ అవీ ఉన్నాయా అనే చూసి, ఏమీలేవని నిర్ధారించుకున్నాక లైబ్రరీ లోపలకి వదిలేరు.

 

పుస్తకాలు కుప్పలకొద్దీ బీరువాల్లో దాచి ఉంచారు. చూస్తూ పోయేసరికి ఓ చోట తెలుగు సాహిత్యం అని ఉంది. కనుబొమ్మలు పైకెత్తి రాజు గారు కేసి చూసాను ఆశ్చర్యంతో.

 

“ఇప్పుడర్థం అయిందా?” అన్నట్టూ నవ్వుతున్నారు ఆయన. ఆయన పబ్లిష్ చేసిన పుస్తకాలూ, అందులో నేను అప్పుడప్పుడూ రాసిన కధలూ అన్నీ ఉన్నట్టున్నాయి.

 

“ఇక్కడకి తెలుగు సాహిత్యం ఎలా వచ్చిందో?” అని నేననుకునేలోపల రాజుగారే చెప్పారు, “తెలుగు వాడు లేని నేల ఎక్కడుందోయ్ ఈ భూమ్మీద?”

 

“ఇక్కడ ఆఫ్రికాలో ఎవరు చదువుతారండీ ఇవి?” అడిగేను ఆయన్ని.

 

“ఎవరో చదువుతారని కాదు, ప్రపంచం నాలుగు మూలలా మువ్వన్నెల తెలుగు సాహిత్య పతాకం ఎగరవల్సిందే,”

 

మళ్ళీ నడవడం మొదలు పెట్టాం. “ఇక్కడ్నుంచి, రచయితల సెక్షన్” అని రాసి ఉంది.

 

మొదటి చోట కొంతమంది తెలుగు వాళ్ళు కాయితాలు ముందేసుకుని ఏవో రాస్తున్నారు. మేము రావడం చూసారు కానీ ఏమీ పట్టించుకున్నట్టు లేదు. కాయితానికి రెండంటే రెండే లైన్లు రాసి పారేస్తున్నారు పక్కన. కాయితాలు ఖరాబు చేస్తున్నట్టు అనిపించి ఏదో అనబోయేను కానీ రాజు గారు నా నోటి మీద చెయ్యేసి నొక్కేసి అక్కడ్నుంచి దూరంగా తీసుకెళ్ళి చెప్పేరు, “వీళ్ళు రాసేవి నానీలు. నోరెత్తావా, పెన్నుతో పొడిచి చంపేస్తారు.”

 

ఒళ్ళు జలదరించింది.  కాస్త ముందుకెళ్తే కొంత మంది కాయితాల మీదే రాసుకుంటూ కనిపించేరు. దగ్గిరకెళ్ళి చూద్దుం కదా, వాళ్ళు రాసేవి సమస్యా పూరణాలు. ఓక్కో చోట ప్రాసకోసం “గూగిలించుచో” అనో, “యాహూలించుచో” అనో “బింగులించుచో” అని రాసేస్తున్నారు. “ఇదేమిటండీ రాజుగారు ఇవి అంతర్జాలంలో ఉండేవి కదా, అవి తెలుగు పదాలు ఎలా అవుతై?” అనడిగేను. రాజుగారు సమాధానం చెప్పేలోపుల అక్కడే ఉన్న ఒకాయన చెప్పేడు, “కొత్త కొత్త పదాలు మనం సృష్టించపోతే బాష ఎలా ఇంప్రూవ్ అవుద్దోయ్ చెవలాయ్?” మొహం గంటు పెట్టుకుని రాజు గారి కేసి  చూస్తే ఆయన “ఊరుకో, ఊరుకో తెలుగు పద్యాల్లో కాసినేనా తెలుగు పదాలున్నాయని సంతోషపడు” అని చెప్పి ముందుకి లాక్కేళ్ళేరు.

 

ఇంకాముందుకి వెళ్లేసరికి అక్కడంతా కలగా పులగంగా ఉంది వాదోపవాదనలతో. నేను అడిగేలోపులే రాజుగారు చెప్పేరు, “వీళ్ళందరూ ఎడిటర్లు, మనం రాసేది ఎలా తీసిపారేద్దామా అని చూస్తూ ఉంటారు. ఓ రకంగా డాక్టర్ల లాంటి వాళ్ళు, అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగమ్ము ఖంఢించి.. లాంటి వాళ్ళనుకో”.

 

“అదేమిటండోయ్, డాక్టర్లకీ ఎడిటర్లకీ పోలిక?” వెర్రిమొహం వేసి అడిగాను.

 

“అదంతే. ఎవడికి ఎప్పుడు రోగం వస్తుందా, ఎప్పుడు పేషంట్ మన దగ్గిరకి వస్తాడా అని డాక్టర్లు చూస్తూ ఉంటారు. అలాగే ఎవడు ఏమి రాసి రచయిత అవుదామా అని చూస్తూ ఎడిటర్లకి పంపిస్తే వాళ్ళు ఏ కారణం చూపించి రాసినది అవతల పారేద్దామా అని వీళ్ళు చూస్తూ ఉంటారు.” విడమర్చి చెప్పేరు రాజు గారు.

 

“ఛా, అలా అంటారేంటండీ? నాకు అలా అవలేదే? నేనేం రాసినా వేసుకుంటున్నారు ఎడిటర్లు.”

 

“చెప్పేనుగా నువ్వు నాకన్న మంచి కధలు రాస్తావని?” గుంభనంగా నవ్వుతున్నారు రాజు గారు. మట్టిబుర్ర కాకపోతే ఈ పాటికైనా రాజుగారు నన్ను వెక్కిరిస్తున్నారని తెలియలేదు.

 

మళ్ళీ ముందుకి నడిచాం.  అందరూ కంప్యూటర్లమీద చక చకా ఏదో టైప్ చేస్తున్నారు. కాయితం లేదు, కలం లేదు. ఏదో రాయడం, పబ్లిష్ చేయడం వెంట వెంటనే జరిగిపోతున్నాయి. ఆశ్చర్యంగా చూద్దును కదా, రాజుగారు నన్ను వెనక్కి లాగి చెప్పేరు, “వీళ్ళు బ్లాగు రైటర్లు. అలా చూడకూడదు, అవి పబ్లిష్ అయ్యేదాకా”.

 

“ఇక్కడ చూడకపోతే పబ్లిష్ అయ్యేక ఎలా చూస్తామండి?”

 

“అవి పబ్లిష్ అయ్యేక, మాలిక అనీ కూడలి అనీ బ్లాగుల సమాహారాల్లో వస్తాయి. అక్కడ్నుంచి చూసి కామెంట వచ్చు.”

 

“కామెంటడం అంటే?” కామెర్లు అంటే తెలుసు, కామేశ్వరీ తెలుసు. కామెంటడం అంటే తెలియక అడిగేను సిగ్గు పడుతూ.

 

“వాళ్ళు రాసి పారేసాక మన అభిప్రాయం కామెంట్ రూపంలో పెట్టడాన్ని కామెంటడం అన్నారు. అలాగే ధన్యవాదాలు చెప్పడాన్ని నెనర్లు అనీ, ఈకలనీ ఏవోవో పేర్లు. పక్కనున్న సెక్షన్లో ఇందాకే చెప్పేడు కదా ఒక మహామహుడు, కొత్త పదాలు సృష్టించకపోతే తెలుగు ఎలా నిలబడుద్దో చెవలాయ్ అనీ? అయినా ఇన్ని ప్రశ్నలు అడక్కూడదు.”

 

“రాసేసినవి ఎడిటర్లకి పంపొచ్చు కదా? బ్లాగులో రాసుకోడం ఎందుకో?” నా మనసులో సందేహం అనుకోకుండా నోట్లోంచి బయటకొచ్చేసింది.

 

“చెప్పాను కదా, పాతిక కధలు పంపిస్తే ఎడిటర్లు ఒకటో రెండో వేసుకుంటారు. మిగతావి చెత్తబుట్టలోకే. వాళ్ళు పబ్లిష్ చేయకపోతే నిరుత్సాహ పడిపోకుండా, ఈ బ్లాగుల్లో మనకి మనవే పబ్లిష్ చేసుకోవచ్చు. ఎడిటర్లు నీ రచన బావోలేదు అంటే, నీ సలహా ఎవడిక్కావాలోయ్ ఇదిగో నేనే పబ్లిష్ చేసుకోగలను అని వీళ్ళు ఇలా రాస్తారు.”

 

“అలా ఏది పడితే అది రాసేయొచ్చా బ్లాగులో?”

 

“ఆ, మన ఇష్టం. ఆ తర్వాత ఏదైనా తేడాలొస్తే దాంతో తంటాలు పడాల్సింది కూడా మనమే.”

 

కంప్యూటర్ల దగ్గిర కూచున్నవాళ్ళు మమ్మల్నీ, రాజు గారి చేతిలో ప్రింట్ పుస్తకాలనీ చూసి నవ్వడం. ఈ రోజుల్లో పుస్తకాలెవడు చదువుతాడోయ్ చెవలాయ్ అనడమూను. రాజు గారు పబ్లిషర్ అని చెప్తే ఇంకా నవ్వులు.

 

తెలుగు సాహిత్యం ఎంత పైపైకి పోతోందో, నేనెంత వెనకబడి ఉన్నానో ఇదంతా చూసేసరికి అర్ధమైంది. కళ్ళు తిరిగేయి గిర్రున.  రాజుగారు నా చేయి పట్టుకుని బయటకి నడిపించుకొచ్చేరు. దారిలో తత్త్వ బోధ చేస్తున్నట్టూ చెప్పేరు రాజుగారే, “చూసావా తెలుగు సాహిత్తెపు మువ్వెన్నల  జండా ఎంత గొప్పగా పైపైకి పోతోందో?”

 

“సాహిత్యం అనకుండా సాహిత్తెం అన్నారేమిటబ్బా?”

 

“మన కవులు రాసినదీ సాహిత్యం. ఇప్పుడొచ్చేది సాహిత్తెం. అంతే తేడా”

 

ఇంతట్లో మేడూరు వచ్చి ఉయ్యూరు మీద పడిందన్నట్టూ ఎవరికో నేను కధలు రాస్తానని తెల్సింది. నాకేసి వేలెత్తి చూపించి చెప్పేడు, “జాగ్రత్త, నువ్వు మా గురించి రాసావా, మరి చూస్కో!” అన్నాడు.

 

“ఏం చేస్తారేం?” అని ఇంకేదో అడగబోతుండగా రాజుగారు వారించి నన్ను బయటకి తీసుకొచ్చేరు. లోపలకి వెళ్ళిన దారి వేరూ, బయటకొచ్చిన దారి వేరూను. బయటకి రాగానే తలుపు దగ్గిరే జీరాఫీ, చిరుతపులీ కనిపించేయి.

 

ఇది ఇండియా అయితే జిరాఫీ ఉండదే, చిరుతపులి ఇండియాలో ఉంటే దాన్ని చంపేసి చర్మం అమ్ముకోరూ ఈపాటికి అనుకుంటూంటే వెనకనుంచి చింపాంజీ అరుపు వినిపించింది. భయపడి పక్కనే ఉన్న రాజు గారి చెయ్యి పట్టుకున్నాను.

 

“చూసావా, నేచెప్పలే? ఇది ఆఫ్రికా” అని మృదువుగా చేయి విడిపించుకుని భుజం తట్టేరు రాజు గారు. బుర్ర పక్కకి తిప్పిచూస్తే ఏదో జలపాతం. చల్లని నీళ్ళు మొహం మీద పడ్డాయి. చటుక్కున మెలుకువొచ్చింది.

 

పగటి కలలకి పాటి లేదు. అరచేతి మీద “శ్రీరామ” అని రాసి కళ్ళకద్దుకున్నాను. అంతే!

 

[ఉపసంహారపు చివరితోక:  తెలుగు వారి గోల్డ్ నిబ్బు, విశ్వనాథ గారి ‘జూ’ కధ గుర్తొచ్చిందా? అది చదివాక రాసినదే ఈ కధ. ఆయన కాలిగోరుక్కూడా పనికిరాని వాణ్ణి కనక ఇవే చిట్టెన్ రాజుగారికీ , విశ్వనాథగారికిచ్చే క్షమాపణలు]

 

– ఆర్. శర్మ దంతుర్తి

ఆ ‘మాలపిల్ల’ మాదిరిగా మాటలు రాసేవారున్నారా ఇప్పుడు?

 

గుడిపాటి వెంకటాచలం తన రచనల ద్వారా సమాజంలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. స్త్రీలోకంలోనైతే ఆయన విప్లవమే తెచ్చారు.
ఆయన రచనల అండగా తెలుగు సమాజంలోని స్త్రీలు ప్రశ్నించడం నేర్చుకున్నారు. సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం పోరాడారు. విజయాలు సాధించారు. చలం ప్రభావం పాజిటివ్‌గానైనా, నెగటివ్‌గానైనా పడని రచయిత ఒకప్పుడు లేడంటే అతిశయోక్తి కాదు. అలాంటి చలానికి నాటకీయ సన్నివేశాలు, కృతక సంభాషణలతో నిండివుండే సినిమాలంటే ఏవగింపు. మరి అదే చలం సినిమాకి పని చేయాల్సి వస్తే ఏం చేస్తాడు? సంభాషణలు రాయాల్సి వస్తే ఎలా రాస్తాడు?
కథల్లో కానీ, నవలల్లో కానీ చలం సృష్టించిన పాత్రలను చూస్తే, అవి మాట్లాడుకోవడం చూస్తే – కృతకంగా కాక సహజంగా ఉన్నట్లు కనిపిస్తాయి. వ్యావహారంలో మనుషులు ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకుంటున్నట్లే అనిపిస్తాయి. రచనల్లో గ్రాంథిక భాష రాజ్యం చేస్తున్న కాలంలో చలం భాష, చలం శైలి ఆకర్షణలో, మాయలో కొట్టుకుపోయారు జనం. పదాలతో, శైలితో అంతటి గారడీ చేసిన చలం 1938లో వచ్చిన ‘మాలపిల్ల’ సినిమా కథనీ, సంభాషణల్నీ రాసిన తీరు అద్వితీయం!
స్వాతంత్ర్యానికి తొమ్మిదేళ్ల ముందు వచ్చిన ‘మాలపిల్ల’ సినిమా తెలుగునాట పెను సంచలనమే కలిగించింది. బ్రాహ్మణాధిపత్యం పూర్తిగా చలామణీ అవుతున్న కాలంలో, అంటరానితనం తీవ్రంగా ఉన్న కాలంలో బ్రాహ్మణాధిపత్య సమాజాన్ని సవాలు చేస్తూ, అస్పృశ్యతను ధిక్కరిస్తూ, అణగారిన కులాలకు అండగా నిలుస్తూ ‘మాలపిల్ల’ అనే పేరుతో ఒక సినిమా రావడమంటే మాటలా! దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం సంకల్ప బలానికి చలం సునిశిత కలం తోడైతే వచ్చే మహోన్నత ఫలం ‘మాలపిల్ల’ కాకుండా మరొకటి ఎలా అవుతుంది!!
https://www.youtube.com/watch?annotation_id=annotation_3277241873&feature=iv&src_vid=4h26GRojjfY&v=v_dz61Nz8_8
మనం ఇప్పుడు ‘మాలపిల్ల’ కథ గురించి కాక, అందులోని సంభాషణల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోబోతున్నాం. ఆ సినిమాకి ముందు వచ్చిన సినిమాల్లోని సంభాషణలకూ, ‘మాలపిల్ల’ సంభాషణలకూ పొంతననేది కనిపించదు. టాకీ యుగం ప్రారంభమైన కాలంలో అప్పటి నాటకాల భాషలోనే సినిమాల సంభాషణలు నడిచాయి. ఆ భాషను ‘మాలపిల్ల’ భాష సమూలంగా మార్చేసింది. నిజానికి ‘మాలపిల్ల’ తర్వాత వచ్చిన కొన్ని సాంఘిక సినిమాల సంభాషణలు పాత వాసనలోనే నడిచాయి. ఐతే అతి త్వరలోనే ‘మాలపిల్ల’ సంభాషణలకు లభించిన ఆదరణను రచయితలు అందుకోక తప్పలేదు. పాత్రోచితంగా, సందర్భోచితంగా ఆ చిత్రంలోని సంభాషణలను చలం నడిపించిన తీరు అనన్య సామాన్యం.
‘మాలపిల్ల’లో నీళ్లకోసం చెరువు వద్దకు వచ్చిన మాలలను బ్రాహ్మణుల నాయకత్వంలోని అగ్ర కులాల వాళ్లు అడ్డుకుంటారు. నీళ్లు తీసుకెళ్లడానికి వీల్లేదని కట్టడి చేస్తారు. అదే సమయంలో పెద్ద వర్షం మొదలవుతుంది. మాలలు తడుస్తూ సుందరరామశాస్త్రి ఇంటి ముందుకు వస్తారు. వారిలో నాగాయ్ అనే యువకుడు “బాపనోళ్లది ఎప్పుడూ తిని కూర్చునే ఖర్మ. మాలోళ్లది ఎప్పుడూ బువ్వలేక మలమలమాడే ఖర్మ.. గుళ్లో కూర్చుని సుఖంగా ప్రసాదాలు మింగమరిగిన దేవుడు మురికి మాలపల్లిలోకి వచ్చి మా కష్టాలు తీరుస్తాడా?” అంటాడు. ‘మాటల తూటాలు’ అంటే ఇవే కదా. అగ్ర వర్ణాలు – నిమ్న వర్ణాల మధ్య, ఉన్నోళ్లు – లేనోళ్ల మధ్య తేడాని రెండంటే రెండు ముక్కల్లో ఎంత శక్తిమంతంగా చెప్పాడు చలం! ఈ విషయంలో దేవుడినీ వదల్లేదు. దేవుడు కూడా పెద్ద కులాలవైపే ఉన్నాడని సూటిగా ఆ పాత్రతో చెప్పించాడు.
index
‘నేనున్నంత కాలం గ్రామంలో కుల ధర్మాలకు ఏమాత్రం విఘాతం రానివ్వన’ని శాస్త్రి బీష్మించినప్పుడు మాలల నాయకుడు మునెయ్య అంటాడు – “మీరు చెరువు కట్టేశారు. దాన్ని విడవండి. ధర్మయుద్ధం చెయ్యండి. అంతేకానీ మాకు నీళ్లివ్వవద్దని ఏ ధర్మశాస్త్రం మీకు బోధించిందో మాకు తెలీదు. మా పిల్లల్నీ, ఆడాళ్లనీ మాడ్చారా, మీ పిల్లలూ, ఆడాళ్లూ క్షేమంగా ఉండరు. మమ్మల్ని మృగాల కింద నొక్కిపట్టారు. అవును. మృగాలమే. చేసి చూపిస్తాం. జాగర్త.” అని హెచ్చరిస్తాడు. తమకు నీళ్లివ్వకుండా చెరువు కట్టేసి అధర్మయుద్ధం చేస్తున్నారని తేల్చేసిన మునెయ్య, తమకు నీళ్లివ్వవద్దని ఏ ధర్మశాస్త్రం బోధించిందో చెప్పమని అడుగుతున్నాడు. అంతేనా, తమని మృగాలకింద తొక్కిపెడితే, నిజంగా మృగాలమవుతామని హెచ్చరిస్తున్నాడు. అంటే తిరగబడతామని చెబుతున్నాడు. అగ్ర వర్ణాల అకృత్యాల వల్ల, నిమ్న కులాలు ఎట్లా యాతనలు అనుభవిస్తున్నాయో ప్రత్యక్షంగా చూశాడు కాబట్టే మాలల తరపున ఉండి ఆ మాటలు పలికించాడు చలం.
‘మాలపిల్ల’ టైటిల్ రోల్ చేసింది – తెలుగు సినిమా తొలి స్టార్ హీరోయిన్ కాంచనమాల. ఆమె పాత్ర పేరు శంపాలత. ఆమె మునెయ్య కూతురు. సుందరరామశాస్త్రి కొడుకు నాగరాజు (వెంకటేశ్వరరావు)కూ, ఆమెకూ మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఆ ఇద్దరూ సన్నిహితంగా మాట్లాడుకుంటూ మునెయ్యకి దొరికిపోతారు. “అయ్యా మీరు పెద్దలు. మీ కులంలో ఆడోళ్లు లేరా. మురికోళ్లు, అంటరానోళ్లు.. ఈ పిల్లలెందుకు కావాల్సొచ్చారు నాయనా. మేం అరమైలు దూరంలో ఉంటేనే మీరు మైలపడతారే. ఇలాంటి పనులకు అభ్యంతరాలు లేవు కావచ్చు. వీళ్లకి ఉన్నదల్లా ఒక్కటే. అది శీలం. దాన్నీ దోచుకోవాలా! ధనం, అధికారం, సుఖం చాలవేం? వెర్రిపిల్లల్ని చేసి ఒంటరిగా కలుసుకుని, మెరిపించి, మాయమాటలు చెప్పి నమ్మించాలని చూశారూ. శాస్త్రులవారి వంటి మహాత్ముల కుమారులు చెయ్యదగ్గ పనికాదు” అంటాడు మునెయ్య. తన కథల్లోని శైలి తరహాలోనే ఈ సినిమాలోని సంభాషణలనూ గొప్ప లయతో నడిపించాడు చలం. కేవలం మనం చలం సమ్మోహన శక్తిని శైలికే పరిమితం చెయ్యడం పొరపాటు. ఆయన సంభాషణా శిల్పం కూడా అసాధారణం. ఇన్ని దశాబ్దాల తర్వాత, ఇవాళ్టి సినిమాల్లో ఎంతమంది రచయితలు ఇలాంటి శైలితో, ఇలాంటి శిల్పంతో సంభాషణలు రాయగలుగుతున్నారు?
అప్పటికింకా నాగరాజుకు, శంపాలతకు తమ మధ్య ప్రేమ పెనవేసుకుంటున్నదనే సంగతి తెలీదు. స్నేహమైతే ఏర్పడింది. అంతలోనే మునెయ్యకు దొరికారు. నాగరాజును అపార్థం చేసుకున్న మునెయ్య.. చెడుబుద్ధితోనే అతను శంపకు చేరువవుతున్నాడని తలచాడు. ఒక పెళ్లికాని అమ్మాయి తండ్రి ఎలా స్పందించాలో అలాగే స్పందించాడు మునెయ్య. పైగా నాగరాజు సాక్షాత్తూ తమని మృగాల కింద భావించే శాస్త్రి కొడుకు. కరడుకట్టిన దురాచారవాది కొడుకు. తామా తక్కువ కులంవాళ్లు. దుర్బలులు. శంపని లోబరచుకోవడానికి మాయమాటలు చెప్పి దగ్గరవుతున్నాడని సంశయించాడు మునెయ్య. అలాంటి స్థితిలో అతని నోటినుంచి ఎలాంటి మాటలు వస్తాయి? ఎంత శక్తివంతంగా వస్తాయి? ఆ సందర్భానికి తగ్గట్లు మునెయ్య నోటినుంచి వచ్చిన మాటల్ని ఇంతకంటే శక్తివంతంగా, ఇంతకంటే సమర్థవంతంగా ఎవరు రాయగలరు?
‘మాలపిల్ల’లో మాలలకు దన్నుగా చౌదరి నాయకత్వంలోని ‘హరిజన సేవాసంఘం’ నిలుస్తుంది. మాలలను మృగాలుగా పెద్ద కులాలు చూస్తుంటే, కాదు, వాళ్లూ అందరిలాంటి మనుషులేనని సంఘం వాదిస్తుంటుంది. మాలల పక్షం వహిస్తే కమ్మ కులాన్నుంచి వెలేస్తామని ఒకతను చౌదరిని బెదిరిస్తాడు. దానికి చిన్నగా నవ్వి “కులం.. వెలి.. మా కులం హరిజన కులం. వాళ్లతో నీళ్లు త్రాగి, వాళ్లతో పరుండటమే మా నిత్య కృత్యం” అని చెప్పిన చౌదరి “రండి. మాలగూడేనికే పోదాం. మాలల్లో మాలలమై మాలలూ మనుషులేనని లోకానికి చాటుదాం” అంటూ సంఘ సభ్యులతో అక్కడికే వెళ్తాడు. ఆ పాత్రచేత అలా చెప్పించిన చలం నిజ జీవితంలో బ్రాహ్మణ సమాజం తనను వెలేస్తే, మాలపల్లెల్లోనే నివసించిన సంగతి గమనించదగ్గ విషయం.
Mala Pilla_C53242-83C451
ఈ కథలో శంపకు చేదోడు వాదోడుగా ఉండే పాత్ర అనసూయ. ఆమె శంప చెల్లెలే. చిన్నదైనా అక్కకి సలాహాలు, ధైర్యం ఇవ్వగల గడుగ్గాయి. తెలివైంది. శంపను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న నాగరాజు, ఆమెని వెతుక్కుంటూ బయలుదేరతాడు. మార్గంలో అనసూయ కనిపిస్తే శంప గురించి ఆమెని అడుగుతాడు. ఎందుకని ప్రశ్నిస్తుంది అనసూయ. “నేను శంపాలతను పెళ్లి చేసుకుంటాను” అంటాడు రాజు. అనసూయ పెద్దగా నవ్వుతుంది. ఆరిందాలా “పెళ్లి? పెళ్లి? మాలపిల్లని? మీకు మతిపోయినట్టుంది” అంటుంది. దాంతో “మీ చిన్నికృష్ణుని పాదాల సాక్షిగా పెళ్లి చేసుకుంటాను” అని చెబుతాడు రాజు (చిత్రంలో శంప, అనసూయ కృష్ణభక్తులు). అప్పుడు అనసూయ ఏమనాలి? ఏ ఇతర రచయితైనా అనసూయతో ఎలాంటి మాటలు పలికిస్తాడు? కచ్చితంగా చలం పలికించినట్లు “ఎక్కడి మాటలు లెండి. మీ నాన్నగారు గుండెపగిలి చావరూ? మిమ్మల్ని నరుకుతారు మీ బ్రాహ్మలు” అని పలికించలేడు. 76 సంవత్సరాల క్రితమే ఒక సినిమాలోని పాత్రల చేత ఇలాంటి సునిశితమైన, బాకుల్లాంటి మాటలు పలికించడం ఒక్క చలానికే సాధ్యం.
మాలలకు నీళ్లివ్వకుండా చేసి, వాళ్లు నీళ్ల కోసం అలమటించేలా చేస్తున్నందుకు నిరసనగా మాలలంతా చౌదరి నాయకత్వంలో అగ్ర కులాల వారి పొలం పనులకు, ఇతర పనులకు వెళ్లకుండా సమ్మెకట్టారు. ఆ పనులకు పొరుగూళ్లనుంచి మనుషులు రాకుండా చూశారు. దాంతో చౌదరి వాళ్లతో ఒకసారి మాట్లాడమని శాస్త్రికి చెబుతాడు ఆయనకు అనుయాయిగా ఉండే మల్లికార్జున శర్మ. శాస్త్రి కోపంతో ఊగిపొయ్యాడు. “పోండి. పోండి. అందరూ పోండి. నా కొడుకే నాకు ఎదురు తిరుగుతున్నాడు. నేనొక్కణ్ణే ఏకాకినై నిలుస్తాను. రానీ మాలల్ని. నా ఇంటిచుట్టూ మూగి నా అగ్నిహోత్రాల్ని మలినం చెయ్యనీ. నా వంటలో గోమాంసాదులు వెదజల్లనీ. పూర్వం రాక్షసులు  రుష్యాశ్రమాల్ని ధ్వంసం చెయ్యలా. నేనే నిలుస్తాను. ఆ శ్రీరామచంద్రుడే ఉంటే మళ్లా నా ఇంటికొచ్చి కావలి కాస్తాడు. నాకెవ్వరితోనూ నిమిత్తం లేదు నాయనా. పోండి” అంటాడు.
వర్ణ భేదాల్ని నిక్కచ్చిగా పాటిస్తూ, కరడుకట్టిన బ్రాహ్మణిజానికి నిలువెత్తు నిదర్శనంలా కనిపించే సుందరరామశాస్త్రి అవసరమైతే ప్రాణాలైనా వదులుకుంటాడు కానీ ఆచారాలనూ, కట్టుబాట్లనూ వదులుకుంటాడా? తమ అవసరం కోసం బెట్టుని వదిలి మెట్టు దిగుతాడా? మాలలతో రాజీకి వస్తాడా? అలాంటి స్థితిలో ఉన్న శాస్త్రి నోటివెంట ఇలాంటి మాటలు కాకుండా వేరేవి ఎలా వస్తాయి? ఆద్యంతం శాస్త్రి పాత్ర తీరుకు తగ్గట్లు (ఇదే మాట అన్ని పాత్రలకూ వర్తిస్తుంది) చలం రాసిన మాటలు ఆ పాత్రకి వన్నె తెచ్చాయి. చలం మాటల్ని శాస్త్రి పాత్రలో గోవిందరాజుల సుబ్బారావు పలికిన తీరు అసామాన్యం. డైలాగులు పలకడంలో, ఆ పలికేప్పుడు హావభావాలు ప్రదర్శించడంలో ఎస్వీ రంగారావుని మించిన నటుడు లేడని మనవాళ్లు అంటుంటారు. అయితే ఆయనకటే ముందు అలాంటి నటుడు ఒకరున్నారనీ, ఆయన గోవిందరాజుల సుబ్బారావనీ ఒప్పుకోక తప్పదు. ‘కన్యాశుల్కం’లో లుబ్దావధాన్లుగా ఆయన నటనని మరవగలమా? ఆయన ఎక్కువ సినిమాలు చేయలేదు కాబట్టి, తొలి తరం ప్రేక్షకులు ఇప్పుడంతగా లేరు కాబట్టి ఆయన గురించి చెప్పుకునేవార్లు లేకుండా పోయారు. అందుకే ఆయనకు రావలసినంత పేరు రాలేదు.
మాటల రచయిత చలం

మాటల రచయిత చలం

శంపాలతనూ, అనసూయనూ తీసుకుని కలకత్తా పారిపోయాడు నాగరాజు. దీంతో ఇటు శాస్త్రి కుటుంబం, అటు మునెయ్య కుటుంబం దిగాలుపడ్డాయి. శంపాలతను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నానని తండ్రికి ఉత్తరం రాశాడు రాజు. ఆగ్రహంతో ఊగిపోయిన శాస్త్రి తనకసలు కొడుకు పుట్టలేదని అనుకుంటాననీ, పుట్టినా చచ్చిపొయ్యాడనుకుంటాననీ చౌదరితో అన్నాడు. ఆవేశపడకుండా ఆలోచించమన్నాడు చౌదరి. మనుషుల్లో విభజన ఏ శాస్త్రంలో ఉందో చూపించమన్నాడు.
“మేనమామ కూతుర్ని వదిలి మాలపిల్లను వివాహం చేసుకున్నాడంటే దాన్ని తేలిగ్గా చూస్తున్నారు కానీ అది సామాన్యమైన పని కాదు. పెద్ద ఇంటి బిడ్డ, ఉదార స్వభావం కలవాడే ఆ పని చేయగలడు. ఏరి? ఎందరుంటారు అలాంటివాళ్లు? కామానికి లొంగేనండీ, ఎంగిలి బతుకులు బతుకుతూ ఎంతమంది లేరు ఈ దేశంలో. అమాయకురాళ్లను వలలో వేసుకున్నవాళ్లు ఎందరు లేరు? చేరదీసినదాన్ని పెండ్లి చేసుకుని తన పేరును, తన హోదాను దానికి కూడా ఇవ్వగలిగినవాళ్లు ఎందరు? వెయ్యిమందిలో ఒక్కడుంటాడో, ఉండడో. ఆ ఒక్కడే మనిషి. తక్కినవాళ్లంతా నీచులు. వారే సంఘద్రోహులు. నిజమైన అస్పృశ్యులు. అలాంటివాళ్లంతా మనలో ఉన్నారు. మనతో తిరుగుతున్నారు. మన మర్యాదలు పొందుతున్నారు. దానికి తప్పులేదు. మాలలనంటితేనే తప్పు. మీరేమన్నా అనండి. నాగరాజు ధన్యుడు. వారడ్రస్ తెలీదు కానీ అక్కడికి పోయి స్వయంగా ధన్యవాదాలు చెప్పేవాణ్ణి” అన్నాడు చౌదరి.
గూడవల్లి రామబ్రహ్మం

గూడవల్లి రామబ్రహ్మం

ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లు చౌదరి చేత పలికించిన ఈ మాటల ద్వారా రెండు ప్రయోజనాలు సాధించాడు చలం. ఒకటి – ఒక ‘మాలపిల్ల’ను వివాహం చేసుకోవడం ద్వారా బ్రాహ్మణుడైన నాగరాజు చేసింది చాలా గొప్ప పని అని చెప్పడం, రెండు – సంఘంలో పైకి పెద్ద మనుషులుగా, మర్యాదస్తులుగా చలామణీ అవుతూ చాటుమాటుగా పరాయి స్త్రీలతో వ్యవహారాలు నడిపేవాళ్లను ఎండగట్టడం. ఈ రోజుల్లో కులాంతర, వర్ణాంతర, మతాంతర వివాహాలు సాధారణమయ్యాయి కానీ, ఆ రోజుల్లో అలాంటివి గొప్ప పనులే. తక్కువ కులం అమ్మాయిని ప్రేమించి ధైర్యంగా పెళ్లి చేసుకున్నవాడే మనిషనీ, అమాయకురాళ్లను వలలో వేసుకుని ఎంగిలి బతుకులు బతుకుతున్నవారంతా నీచులనీ, వారే సంఘద్రోహులనీ, నిజమైన అస్పృశ్యులనీ చౌదరిచేత చెప్పించాడు చలం. అలాంటి వాళ్లంతా మనతో తిరుగుతూ మర్యాదలు పొందుతున్నారని ఎండగట్టాడు. నిజానికి ఆ మాటలు పలికింది చౌదరి కాదు. చలమే. అవి అచ్చంగా చలం భావాలే.
ఇవాళ్టి సినిమాల్లోనూ ఈ తరహా డైలాగులు రాయగల రచయిత ఒక్కడైనా ఉన్నాడా? మరి దురాచారాలు, కట్టుబాట్లు అధికంగా రాజ్యం చేస్తున్న కాలంలో ‘మాలపిల్ల’ వంటి సినిమా రావడం పెద్ద సాహసం, గొప్ప విషయమైతే, అందులో బ్రాహ్మణాధిపత్య సమాజానికి సూటిగా, బాణాల్లా తగిలే పదునైన సంభాషణలు రాయడం ఇంకెంత సాహసం, ఇంకెంత గొప్ప విషయం! నేటి సినీ రచయితలు తప్పకుండా అధ్యయనం చెయ్యాల్సిన సినిమా ‘మాలపిల్ల’ అయితే, అందులోని సంభాషణలు వారికి మార్గదర్శకమయ్యే గొప్ప పాఠాలు!!
-బుద్ధి యజ్ఞ మూర్తి
261374_585952121417138_1370360100_n

ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా…

Missamma

ఒకప్పటి సినిమాల్లో పాటలుండేవి. అంతే కాదు పాటకు సినిమా కథకి సినిమా మొత్తం నిర్మాణానికి ఒక అంగాంగి సంబంధం ఉండేది. సినిమా మొత్తాన్ని ఒక కావ్యంగా అంటే సుష్ఠు నిర్మితితో చేయాలని పాటల్ని దానిలో విడతీయలేని భాగం చేయాలనే తపన ఒకటి కూడా ఉండేది. తెలుగు సినిమాహాళ్ళల్లో పొగరాయుళ్ళు సినీమాలో పాట మొదలు కాగానే బయటికి పోయి ఆవురావురు మంటూ ఒక సిగరెట్ లాగించేసి తిరిగి పాట అయి పోయే సరికే లోనికి వస్తూ ఉండేవారు. ఇక్కడ తాత్పర్యం ఆ పాట వినకపోయినా చూడక పోయినా సినిమా అర్థం కాని పరిస్థితి కాని వచ్చే లోపం ఏమీ లేదని.

కాని ఒకప్పటి సినిమాల్లో పరిస్థితి ఇలా ఉండేది కాదు. సినిమాలో పాటకు సినిమా కథకు కథ నడిచే పద్ధతికి అంత విడదీయరాని సంబంధం ఉండేది. పందొమ్మిది వందలో ఏభై దశకంలో వచ్చిన సినిమాల్లో చాలా వాటిల్లో చందమామ పాటలు ఉండేవి. అంటే చందమామా అని వంత వచ్చే జానపద గీతాల గురించి కాదు చెప్పేది. ప్రణయ సందర్భంలో కాని విషాద సందర్భంలోగాని ఇంకో సందర్భంలో కాని నాయికా నాయకులు ఇతరులు కూడా చందమామని పాటలో పెట్టి లేదా అతన్ని ఉద్దేశించి పాటలు పాడేవారు. మనకి 1931లో మాట్లాడే సినిమా మొదటిది భక్త ప్రహ్లాద రాగా 1937 దాకా పౌరాణిక సినిమాలే వచ్చాయి. మొదటి సాంఘిక సినిమాగా మాలపిల్ల వచ్చింది అదే సంవత్సరంలో వచ్చింది దేవత సినిమా. ఇక అక్కడనుండి సాంఘిక సినిమాలు రావడం ఎక్కువైంది. ఈ సాంఘిక సినిమాల్లో పైన చెప్పినట్లుగా చందమామను తలచుకునే పాటలుండేవి. వీటిలో అద్భుతమైన సాహిత్యం ఉండేది. తొలినాటి నుండి ఇటీవలి సినిమాల దాకా చందమామ పాటలు చాలా వచ్చాయి. వాటిలో మంచి వాటిని తీసుకొని ఇక్కడ వివరించి చెప్పాలనే ఉద్దేశం ఈ వరుస వ్యాసాలు రాస్తున్నాను.

మిస్సమ్మ సినిమా 1955 లో వచ్చింది. అంటే ఇప్పటికి దాదాపు అరవై సంవత్సరాలు అయింది. కాని తెలుగు వారు ఈ తియ్యటి సినిమాని మర్చిపోలేదు. ఇప్పటికీ ఏ ఛానల్లో వచ్చినా దాన్ని నూరు శాతం ఆనందిస్తున్నారు. ఇందులోని ప్రతిపాట ఒక ఆనంద రసగుళిక. ఇందులో రెండు చందమామ పాటలున్నాయి. వీటినే నేను వెన్నెల పాటలు అని అంటాను. మిస్సమ్మలో లీల పాడిన రావోయి చందమామ మా వింత గాథ వినుమా అనే పాట ఇప్పటికీ ఎంత బహుళ వ్యాప్తంగా అందరికీ  ఆనందాన్ని కలిగిస్తుందో చెప్పవలసిన పనిలేదు. దానికన్నా నాకు నచ్చిన వెన్నెల పాట ఇంకొకటి ఉంది. దాన్ని కింద ఇస్తున్నాను. చదవండి వినండి తర్వాత దీన్ని చదివితే  మీ ఆనందం మిన్నుముట్టుతుంది.

 

ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీమాయ.

వినుటయె కాని వెన్నెల మహిమలు

వినుటయె కాని వెన్నెల మహిమలు

అనుభవించి నేనెరుగనయా

అనుభవించి నేనెరుగనయా

నీలో వెలసిన కళలు కాంతులు

నీలో వెలసిన కళలు కాంతులు

లీలగ ఇపుడే కనిపించెనయా

ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీమాయ.

 

కనుల కలికమిడి నీకిరణములే

కనుల కలికమిడి నీకిరణములే

మనసును వెన్నగ చేసెనయా

మనసును వెన్నగ చేసెనయా

చెలిమికోరుతూ ఏవో పిలుపులు

నాలో నాకే వినిపించెనయా

ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీమాయ.

ఈ పాట వినడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

http://www.raaga.com/player4/?id=2159&mode=100&rand=0.2477618893608451

 

ఈ పాట మాధుర్యం వింటే బాగా తెలుస్తుంది. అంతే కాదు సినిమా చూస్తే ఈ పాటలోని గొప్పతనం తియ్యదనం ఏమిటో తెలుస్తుంది. ఇందులో నాయకుడు ఎన్టీఆర్, నాయిక సావిత్రి ఇద్దరూ 1950ల్లో బి.ఎ పాసయ్యారు. ఆనాటికి బి.ఎ పాసు కావడమంటే నేడు పి.హెచ్.డి చేసిన వారికున్నంత స్థాయితో లెక్కవేసేవారు. అయితే ఉద్యోగానికి వచ్చిన అడ్వర్టైజ్ మెంట్లో స్కూలు పంతులు గార్ల ఉద్యోగాలు పడ్డాయి. అందులో మెలికేమిటంటే ఒక ఆడ బి.ఎ ఒక మగ బి.ఎ కావాలని ఇద్దరూ భార్యాభర్తలు అయి ఉండాలని ప్రకటనలో ఉంది. సావిత్రి ఎన్టీఆర్ ఉద్యోగాలకోసం తిరిగి తిరిగి విసిగి పోయారు. దీన్ని చూచి పెళ్ళికాని వాళ్ళిద్దరూ మాకు పెళ్ళి అయిందని అబద్ధం ఆడి, రాసి ఉద్యోగంలో చేరారు. కథలో గమ్మత్తు ఏమిటంటే అప్పటిదాకా వాళ్ళిద్దరికీ పరిచయం లేదు. పరిచయం అయిన రెండు మూడు రోజులకే ఈ ఉద్యోగానికి అప్లై చేశారు. ఆ అమ్మాయి క్రిస్టియన్ అతను హిందూ, ఇద్దరికీ పెళ్ళి కావడం అప్పటి పరిస్థితిలో సాధ్యం  అయ్యే పని కాదు. రెండు నెలలు పని చేసి గొంతు మీద ఉన్న బాకీ తీర్చుకొని పోదామని ఆమె చేరింది.

aVy3KQJ9_592

అబద్ధాలతో బతుకుతుంటారు. భార్యాభర్తలు గా నటించడానికి చాలా కష్టపడుతుంటారు. బయటివాళ్ళు వరుస పెట్టి పిలిస్తే ఆమెకు నచ్చదు. ఒకే ఇంటిలో ఇద్దరు వేరు వేరు గదుల్లో ఉంటారు. ఎవరి వంట వారే చేసుకుంటారు. వీరి రహస్యం వీళ్ళ నౌకరు దేవయ్యకే తెలుసు. వాళ్ళు పనిచేసే బడి యజమాని జమీందారు ఆయన భార్య వీరిద్దరినీ తమ కూతురు అల్లుడూ లాగా చూసుకుంటారు. అలాగే పిలుస్తుంటారు. అలా వరుసలు పెట్టి పిలవడం ఆమెకు ఇష్టం ఉండదు. జమిందారు కూతురు, జమున ఎన్టీఆర్ కి దగ్గర కావడం కూడా సావిత్రికి నచ్చదు. ఆమెకు ఎన్టీఆర్ పైన తనకే తెలియని ప్రేమ కలుగుతున్న కొద్దీ జమిందారు కూతురు జమున పైన అసూయ నానాటికి పెరుగుతుంటుంది. క్రమంగా ఎన్టీఆర్ (రాజారామ్ నాయుడు)ని గాఢంగా ప్రేమిస్తుంది. ఆ విషయాన్ని ఆమె కూడా సరిగ్గా గమనించదు. కాని ప్రవర్తనలో అది అడుగడుగునా అసూయ రూపంలో బయట పడుతుంది. ఈ అసూయతో ఎన్టీ ఆర్ పైన జమునపైన విపరీతమైన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తుంది.

ఈనాటి సినిమాల్లో ఐ లవ్ యూ చెప్పడం ఒక తప్పని సరి ఫార్ములాగా నిలిచింది. ఎన్నో సార్లు ఎంత మంది సమక్షంలోనో చెప్పాలి. ప్రేమ కోసం యుద్ధాలు చేయడాలు వగైరా ఫార్ములాల గురించి ఇక్కడ చెప్పవలసిన పని లేదు. కాని ఇక్కడ సావిత్రి పాత్రను తీర్చిదిద్దిన తీరు గురించి బాగా చెప్పాలి. ఒక కావ్యంలోనో నవలలోనో నాయిక పాత్రను ఒక మంచి నిపుణుడైన కవి ఎలా తీర్చి దిద్దుతాడో సినిమాలో ఈ పాత్రలను అలా తీర్చాడు దర్శకుడు ఎల్వీ ప్రసాద్. నాయిక సావిత్రి ఎన్టీఆర్ ని అంత గాఢంగా ప్రేమించినా అది ఆమె వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దడంలో సహజమైన ఒక పద్ధతిలో చూపుతాడు ఒక మానసిక స్థితిని ఒక నవలలో అద్భుతంగా వర్ణించిన పద్ధతిలో ఆ పాత్ర ప్రవర్తనని చూపుతాడు. కాని ఎక్కడా సావిత్రి నాయకుడిని ప్రేమిస్తున్నానని చెప్పదు. ప్రవర్తనలో కనిపిస్తుంది అదీ వ్యతిరేక రూపంలో. ఇలా సాగే క్రమంలో నాయికతో ఎలా గైనా కాలం గడపాలని కడుపుకోసం నానా కష్టాల పడుతుంటాడు ఎన్టీఆర్. ఈ కష్టం చివరి దశకు వచ్చింది. సావిత్రి గర్భవతిగా పొరపాటు పడి ఆమెకు సీమంతం చేస్తారు జమీందారు దంపతులు వాళ్ళింట్లోనే. అప్పటికే చాలా అసూయని ఆగ్రహాన్ని ఎన్టీఆర్ పైన చూపిస్తూ ఆయన చేస్తున్న తప్పులను తిడుతూ వచ్చిన సావిత్రికి తను అతనిపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నానని అనుకుంటూనే ఉంటున్నా అదే కొనసాగిస్తుంది. సీమంతం చేసిన తర్వాత ఆరాత్రి అక్కడే నిద్రపోవాలని వాళ్ళిద్దరినీ ఒక గదిలోనికి పంపిస్తారు. ముందుగా గదిలో ఉన్న నాయకుడు తర్వాత సావిత్రి లోనికి వచ్చి ఇదంతా అతని కుట్ర అని తనను ఇలా మోసం చేయడానీకే ఇదంతా చేస్తున్నారని తిడుతుందని నాయకుడు తెరచాటున దాక్కుంటాడు. తర్వాత సావిత్రి లోనికి వచ్చిన తర్వాత ఆమెను భయపెట్టి కిటికీలోనుండి బయటికి దూకి ఇంటికి పోతాడు ఆమెను ఇబ్బందికి గురిచేయడం ఇష్టం లేక.

images

సావిత్రి ఇంట్లో వాళ్ళని పిలిచి తనను తన ఇంటికి పంపించమంటుంది. ఆమె అలా ఇంటికి పోయేసరికే కిటికీ లోనుండి దూకి కాలు విరగ కొట్టుకొని (నాటకం) మంచంలో దీనంగా పడి ఉన్న నాయకుడు కనిపిస్తాడు. ఆమెకు అతనిపైని ప్రేమ అతని పట్ల సానుభూతి ఒక్కసారిగా పొంగాయి. అతన్ని మోసుకొని పోయి లోపలున్న తనుపడుకునే పందిరిమంచం మీద పడుకో బెడుతుంది. కాలి బాధతో నిద్రపోలేనంటాడు. తనకు తెలియకుండానే తనలో ఆతని పట్ల ఎంతో గాఢమైన ప్రేమ ఉందని ఆమె తెలుసుకుంటుంది. అతన్ని నిద్రపుచ్చడానికి పాట అందుకుంటుంది. ఇంత కథా సందర్భాన్ని గర్భీకరించుకొని వచ్చిన పాట పైన చెప్పిన వెన్నెల పాట. తన ప్రవృత్తిని తన మనఃస్థితిని ఈ పాటలో కవి వెల్లడిస్తాడు. సినిమా మొత్తానికి కథని మాటలని అందించిన కవి ఒక్కడే కావడం వల్ల కథా సందర్భాన్ని తెలుసుకొని దానికి ఇమిడేలా పాటనురాసాడు పింగళి నాగేంద్రరావు.

ఇప్పడు పాటని చూస్తే విషయం మనకు తెలుస్తుంది. తనలో కలిగిన ప్రేమను ఆ స్థితిని ఏమిటో ఈ మాయ అని అనుకుంటుంది గదిలోనుండి బయటికి వచ్చి బల్లమీద కూర్చుని నింగిలోని చందమామ వైపు చూస్తూ పాడుతుంది సావిత్రి ఈ పాటని. ముఖంమీద వెన్నెల పడే తీరును కెమేరా కళతో చిత్రించిన తీరు కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఓ చల్లని రాజా వెన్నెల రాజా ఏమిటో ఈ మాయ అని చందమామతో చెప్పుకుంటుంది. ఈ స్థాయిలో కూడా నాయిక తన ప్రేమని నాయకుడి ఎదురుగా కూర్చుని చెప్పదు. కుస్తీపట్లుపట్టే లా ఉండే కొరియోగ్రఫీతో నాయికా నాయకులు ఒకరిమీద ఒకరు యుద్ధం చేస్తూ ఉండేలా ఉండే నేటి రోమాంటిక్ డ్యుయెట్లని తలచుకొని ఆ పాటల్ని చూస్తే ప్రేమని ఎంత సున్నితంగా నిజమైన శృంగరంగా చిత్రించారో తెలుస్తుంది.  వినుటయె కాని వెన్నెల మహిమలు అనుభవించి నేనెరుగనయా. అంటుంది. వెన్నెల మహిమ తనపైన ఎలాఉందో అర్థం అయింది. ఇక్కడ వెన్నెల తనలోని ప్రేమకి ప్రతీక చందమామ శైతల్యం ఇక్కడ ప్రణయానికి చిహ్నం. నాయికా నాయకులు కలిసి ఉన్నప్పుడు చందమామ చల్లని రాజు, అదే విరహంలో చందమామ చల్లని వెన్నెలే నాయికకు వేడి మంటలుగా తోస్తుంది. విప్రలంభ శృంగారంలో, విరహంలో  చంద్రుడిని తిట్టడం అప్పటి కావ్యాల నుండి ఇప్పటి దాకా వస్తూనే ఉంది. వెన్నెల మండెడిదీ అని ఒక పాటలో అన్నమయ్య కూడా రాసాడు. వెన్నెల మహిమ ఎలా ఉంటుందో ప్రణయంలో అది ఎంత చల్లాగ ఉంటుందో తనకు ఇప్పటి దాకా తెలియదని చెబుతూ తనకు నీపై ప్రేమ కలిగిందని నాయకుడికి నర్మగర్భంగా చెబుతుంది ఇక్కడి నాయిక సావిత్రి.

13909646434184550535-1

కనుల కలికమిడి నీకిరణములే మనసును వెన్నగ చేసెనయా అని అంటుంది. కనులకలికమిడి అని చెప్పడం అద్భుతమైన తెలుగు పలుకుబడి. తల నెప్పి కలిగినప్పుడు సొంటితో కలికం చేసి కంట్లో రాస్తారు. మొదట భగ్గున మండుతుంది. తర్వాత అద్భుతమైన చల్లదనాన్ని ఇచ్చి తలనొప్పిని పోగొడుతుంది. ఇక్కడ చందమామ కిరణాలే కంట్లో కలికం పెట్టినట్లుగా చేసి మనసును వెన్నెగ చేసాయట. ఇది కవి చేసిన అద్భుతమైన ఊహ. ఆమె మనస్సు వెన్నలా కరిగి ప్రియుడిపైన ప్రేమను వర్షించే స్థితికి చేరిందని చెబుతుంది ఆమె. ఇక చివరిగా చెలిమి కోరుతూ ఏవో పిలుపులు నాలో నాకే వినిపించెనయా అని అంటుంది. ఏమిటో  ఈ మాయ అని చివరిగా పాటని ముగిస్తుంది. తనలో అతనిపైని ప్రేమని పూర్తిగా తెలుసుకున్నానని నాయకుడికి చెప్పే తీరుని వర్ణించిన ఈ పాట ఒక మంచి శృంగార రసగుళిక. వెన్నెలని ప్రేమకి ప్రతీకగా చెప్పిన తీరు చాలా బాగుంది.

పింగళి నాగేంద్ర రావు రాసిన ఈ పాటకి సాలూరు రాజేశ్వరరావు కూర్చిన సంగీతం మరింత మాధుర్యాన్ని తెచ్చింది. అంతే కాదు సినీమా ఈ ఘట్టానికి వచ్చే సరికే ఈ పాటని చూసిన ప్రేక్షకులకి మనస్సంతా ఆనందం ప్రేమ నిండిపోతాయి. ప్రేక్షకులు పాత్రలతో తాదాత్మ్యం చెందుతారు. సింధుభైరవి రాగంలో వచ్చిన ఈ పాట మనస్సుకు హత్తుకునే తీరులో ఉంటుంది. ఈ రాగానికి కూడా ప్రణయాన్ని పలికించే గుణం ఉంటుంది.

ఇలాంటి అద్భుతమైన వెన్నెల పాటలు తెలుగు సినిమాల్లో ఆనాటి వాటిల్లో చాలా ఉన్నాయి. వరుసగా వాటి సాహిత్య ఔన్నత్యాన్ని పరిచయం చేస్తాను.

పులికొండ సుబ్బాచారి

subbanna

 

 

 

కలవరపెట్టే అతి సంచయేచ్ఛ … “సర్ ప్లస్”

నేను తృప్తిగా, సాదా సీదాగా  జీవితం గడపాలనుకుంటున్నాను

“జనం అందరూ ఒక్కసారిగా మారిపోతారు.  వాళ్ళ నోటివెంట , “నాకు పెద్ద పెద్ద కార్లు వద్దు. నాకు ఇంకో పెద్ద Mac కంప్యూటర్ అక్కర్లేదు. నేను డీజల్ బ్రాండ్ జీన్స్ వేసుకోవాలనుకోవటం లేదు” అనే రోజులు వస్తాయి”.

ఏ వర్యావరణవేత్త నోటివెంటనైనా ఇలాంటి మాటలు వస్తే ఏమీ ఆశ్చర్యం లేదు. కానీ, ప్రపంచంలోని 80 శాతం సంపదను తింటూ కూర్చున్న 20 శాతం అగ్ర రాజ్యాల్లో ఒకటైన అమెరికా అధ్యక్షుడి నోటి వెంట వస్తే?   ఊహించటానికే ఇదెంతో బాగుంది కదా!!

‘సర్ ప్లస్’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ లో ‘ఎరిక్ గాండినీ’,  జార్జ్ బుష్  చేత గమ్మత్తుగా పై మాటల్ని పలికిస్తాడు. పైగా ఈ ఇటాలియన్ ఫిల్మ్ మేకర్  ‘మనమంతా  వినిమయ సంస్కృతి అనే ఉగ్రవాదం నీడన బ్రతుకుతున్నాం’  అని కూడా భయపెడుతున్నాడు ట్యాగ్ లైన్ పెట్టి మరీ !!   ఇతని సినిమా “సర్ ప్లస్ ” – ‘టెర్రరైజ్ డ్  ఇన్ టు బీయింగ్ కన్స్యూమర్స్’  – 2003 లో తయారయింది.

వస్తు వ్యామోహ తత్వం విశ్వరూపమెత్తి, ప్రకృతి ఇచ్చిన ఆస్తుల్ని కొల్లగొట్టి మనుషుల్ని డొల్లలుగా మార్చిందని చాలా మంది కళాకారులూ, పర్యావరణ వేత్తలూ  ఏనాటి నుంచో  చెప్తూనే ఉన్నారు. సంపద అనే అమృతాన్ని పంచిపెట్టే తీరులో ప్రభుత్వం మోహినీ అవతారమెత్తి,  కార్పొరేట్  దేవతలకే అంతా ధార పోసి, 90 శాతం సగటు దానవులకు ఏమీ లేకుండా చెయ్యటమే ఈ నాటి మాయ అని కూడా చాలామంది గుర్తించారు. ఈ మాయను మన కళ్ళముందు డాక్యుమెంటరీ రూపంలో విప్పి చూపే ప్రయత్నం చేసిన కొద్దిమందిలో గాండినీ ఒకరు.

ఈ ఫిల్మ్ లో జార్జ్ బుష్  సొంత మాటలూ ఉంటాయి. ఇంకా అతని నోట చాలామంది వినాలనుకునే ఒప్పుకోళ్ళనూ, సామ్యవాదపు మాటల్ని కూడా “అనిపిస్తాడు” ఫిల్మ్ మేకర్.  మార్కెట్ ఎకానమీని బుజాన మోసే నాయకుల చేత, అందులో ఉన్న మోసాన్ని గురించి నిజాలు మాట్లాడించటం మంచి హాస్య స్ఫోరకంగా కూడా ఉంటుంది.

2001 లో ఇటలీ లోని జెనోవాలో జరిగిన జి-8 సమావేశం, అక్కడ,  నిండా అస్త్ర శస్త్రాలు ధరించి, ఏ మాత్రం గొడవ అయినా అణచటానికి సిద్ధంగా ఉన్న పోలీస్ బలగాలు… దీనితో ఫిల్మ్ మొదలవుతుంది. ఏ నిముషం ఏమి జరుగుతుందో అనే ఉద్రిక్తత మనలో మొదలవుతుంది.  అంతర్జాతీయ వ్యాపార సంస్థ  వ్యవహారాలు నచ్చని కొంతమంది పర్యావరణ వేత్తలు, ఆందోళనకారులు రాళ్ళు విసిరి, షాపుల అద్దాలు విరగ్గొట్టి, వాహనాలను తగలేస్తారు.  పోలీస్ ఫైరింగ్ లో ఒక యువకుడు చనిపోతాడు.

“నా ఉద్దేశ్యంలో బ్యాంకులు,  చెయిన్ మార్కెట్ లు, ఖరీదైన షాపుల వంటి కార్పొరేట్ ఆస్తులను గురి పెట్టి ధ్వంసం చెయ్యటం చట్టబద్ధమైన పనే.  మనుషుల ప్రాణాలు తియ్యకుండా ఆస్తుల మీద రాళ్ళు వెయ్యటంలో తప్పేముంద”ని ప్రశ్నిస్తాడు జాన్ జేర్జాన్. ఈయన ఒక రచయితా, అరాచక వాదీనూ.

 జాన్ జేర్జాన్.

‘ఆస్తి ధ్వంసం చెయ్యటం’ అనే దానిని పోరాట రూపంగా గుర్తిస్తాడు ఈ రచయిత. అలాగని ఈయన తన వ్యక్తిగత జీవితంలో ఆస్తులు ఆశించ లేదు. సృష్టించ లేదు. ఎవరి ఆస్తులూ ధ్వంసం చెయ్యనూ లేదట. చాలా కాలం తన రక్తాన్ని అమ్ముకుంటూ అతి తక్కువలోనే జీవించాడట. “అసలు జనం ఎందుకు  ఆస్తి ధ్వంసం చేస్తారని ప్రశ్నించుకోకుండా ఇదంతా అర్ధంపర్ధం లేని హింస అని తేల్చేస్తే ఎలా?” అంటాడు జేర్జాన్.

“నా దృష్టిలో టీవీ ముందు కూర్చోవటం, మత్తు మందు కొట్టటం, పనికిమాలిన ఉద్యోగాలు చేస్తూపోతుండటం.. ఇదీ అర్ధం పర్ధం లేని హింసంటే ! అదేపనిగా పని చెయ్యటం, అదేపనిగా వస్తువుల్ని వినియోగిస్తూ ఉండటం .. ఇదీ హింస స్వరూపం.”  అని తేల్చేస్తాడు.  “చాలా సౌకర్యవంతమైన జీవితం, మంచి ఉద్యోగం, అంతులేని భౌతిక సుఖాలు.. ఇదంతా పరమ శూన్యమైన వ్యవహారమని కొంతమందికైనా అర్ధం అవుతుంది. వాళ్ళు తృప్తికీ స్వేచ్ఛకీ ఉన్న హద్దుల్ని చెరిపేస్తారు.” . ఇవీ జేర్జాన్ అభిప్రాయాలు.

‘స్వాంటే’  ఒక MNC లో పని చేసిన వ్యక్తి. చిన్న వయసులోనే  మిలియన్ల డాలర్లు సంపాదించిన ఇతనికి ఆ డబ్బంతా ఏమి చేసుకోవాలో అర్ధం కాలేదు. చవకైన చక్కని జీవితాన్ని కోల్పోతున్నట్టు అనిపించిందట అతనికి. ఆరుబయట మూడు రాళ్ళతో పొయ్యి  పెట్టుకుని సూర్యాస్తమయ వేళలో వండుకుని స్నేహితులతో తినటాన్ని ఆనందిస్తాడు. “డబ్బంటే మనసు మూలల్లో నాకు అసహ్యం. ఇప్పుడిక నాకు దానిగురించి ఆలోచించే అవసరం లేదు.  ఖర్చు పెట్టాలంటే ఎటు చూసినా ఎన్నో మార్గాలు. కానీ నేనా పని  అంత సులభం గా చెయ్యలేను. నిరంతరంగా సంపాదిస్తూ పోతుంటే,  కొన్నాళ్ళకు  ఎక్కువ డబ్బుకు మనం అలవాటు పడతాం.  డబ్బు ఒక రంగుల రాట్నం.  అది అదుపుతప్పి తిరిగేస్తోంది.  ఒక ఇల్లు, భార్య, పిల్లలు .. ఎంత సంపాదించినా జీవితంలో ఇంతకంటే ఏముంది?” …  అంటాడు.  వస్తు వ్యామోహ తత్వానికి ఇలాంటివాళ్ళు సవాళ్లు.

                                 ‘డబ్బనే రంగుల రాట్నం అదుపుతప్పి తిరుగుతోంది’…. స్వాంటే.                                                           ‘ఇంకా, ఇంకా కావాలి’ …. తాన్యా

 

“మనల్ని మన వ్యాపారాలు చేసుకోనీయకుండా, షాపింగ్ చేసుకోనీయకుండా భయపెట్టే ఉగ్రవాదులను అసలు ఒప్పుకోం”… అంటాడు జార్జ్ బుష్ తన మాటల్లోనే.

“అన్నీ కొనేసి వాడాలనే కోరిక మనలో భయోత్పాతాన్ని కలిగిస్తోంది. ఇదీ ఉగ్రవాదం అంటే!  ఈ భయోత్పాతాన్ని కలిగించి పెంచి పోషించేది వ్యాపార ప్రకటనల రంగం.  ఆ బ్రాండ్, ఈ బ్రాండ్ లేదా మరో బ్రాండ్ … ఎంపిక లో స్వేచ్ఛ ఇంతవరకే కదా!”  అంటాడు జేర్జాన్.  కానీ ఎంపికలో ఉండే ఆ కాస్త స్వేచ్ఛలో బోలెడంత వైవిధ్యం కూడా ఉంది.  ఎలా అంటారా? ఇలా …

ఒక బొమ్మల షాపు చూపిస్తాడు.  బొమ్మలంటే మామూలు బొమ్మలు కావు. లవ్ డాల్స్.  రక రకాల తలలు. కళ్ళు. ముక్కులు. శరీరపు వంపులు. సూపర్ మోడల్ శరీరాలు.  పొట్టి, పొడవు, సన్నం..   ఒక రకం శరీరానికి నాలుగైదు రకాల తలల్లో ఎలాంటి తల కావాలంటే అలాంటి తల అమర్చి ఇస్తారు.  మగ శరీరాలు కూడా దొరుకుతాయి.  ఎంత వెరైటీ!  ప్రాణమున్న మనుషుల అవసరం లేకుండా  సెక్స్ అవసరాలు తీర్చుకునేందుకు బొమ్మల్ని కూడా తయారు చేసే స్థాయికి చేరింది మార్కెట్.  ఒక్కొక్క బొమ్మ ఏడు వేల డాలర్ల దాకా ఖరీదు చేస్తుందట.

“ఇలాంటి వ్యవస్థను కొనసాగించటంలో ఎటువంటి ఆరోగ్యకరమైన లక్షణమూ లేదు. భావి తరాలకోసం భద్రపరిచే విలువ గల పని ఒక్కటైనా ఉందా వీటిలో?  – జేర్జాన్.

 

ఈ నమూనా జీవితానికి పూర్తిగా విరుద్ధమైన జీవితాన్ని చూపించాలంటే  ఒకే ఒక్క ఆధారం.  క్యూబా .. అక్కడ ఖాళీగా అతి తక్కువ సామాన్లతో ఉండే దుకాణాలు…  తన రేషన్ కార్డు చూపిస్తూ ఒక పెద్దావిడ  “బియ్యం, పప్పు, వంట నూనె, టూత్ పేస్టు తో సహా అన్నీ ప్రతి మనిషికీ లెక్క ప్రకారం అందుతాయి. ఏ ఒక్కరికీ  లేకపోవటం ఉండదు. కనీసావసరాలు అందరికీ తీరుతున్నాయి. ఇంతకంటే ఇంకేం కావాలి?”  అంటుంది.

కానీ.. కావాలి…  చాలా మందికి చాలా కావాలి…  తాన్యా ఒక యువతి.  “రైస్, బీన్స్ .. రైస్ అండ్ బీన్స్. క్యూబాలో ఇంతే కదా. నేను యూరప్ లో స్నేహితుల ఇంటికి వెళ్లాను. అక్కడ సూపర్ మార్కెట్ మొదటిసారి చూసినప్పుడు నోరు తెరిచేసాను. ఆపిల్ పళ్ళు, మంచి సుగంధ ద్రవ్యాలు. షాంపూలు. ఇంగ్లాండ్ లో ఉన్నన్ని రోజులూ నేను బీన్స్ తినటం మానేసాను.  టీవీ చూస్తూ చానల్స్ మారుస్తూ, తింటూ, తింటూ ..  మెక్ డోనల్డ్స్.. అవీ ఇవీ ..  ఇలా తిని, తిరిగి ఇంటికొచ్చేసరికి 180 పౌండ్స్ బరువున్నాను.” అంటుంది. ఇదంతా చెప్తున్నప్పుడు ఆమె ముఖంలో వెర్రి ఆనందం…  చుట్టూ సముద్రమంత సంపద. మధ్యలో ఉన్న క్యూబా ద్వీపంలో తయారయే ఆ కాసింత తిండీ అందరూ సర్దుకు తినాలి.  ఉన్న వస్తువులను అందరూ పంచుకోవాలనే నిస్వార్థతత్వాన్నీ, సర్దుబాటునూ నిదురలేపే ప్రయత్నం చేస్తోంది  సామ్యవాదం.  దీనికి వ్యతిరేకంగా మార్కెట్ వ్యవస్థ మనముందు వస్తువులను పరిచి పెడుతోంది.  వ్యాపార ప్రకటనలనే అగ్గిపుల్లలతో .. ఆ వస్తువులన్నిటినీ సొంతం చేసుకోవాలనే కోరికనూ, స్వార్దాన్నీ మనలో రాజేస్తోంది.  దాని బలం ముందు మనిషితనం నిలవటం ఎంత కష్టం? ప్రపంచమంతటా సామ్యవాదమే ఉంటే కేవలం “రైస్ అండ్ బీన్స్” కాక ఇంకొంచెం మంచి తిండి “అందరూ” తినొచ్చునని తాన్యాకు అర్ధం కావటమూ అంతే కష్టం.

(క్యూబా లో టూత్ పేస్ట్ ట్యూబ్ పైన ఏ అక్షరాలూ లేకుండా ఉండటం ఈ ఫిల్మ్ లో చూసి ఒకనాటి  విషయం గుర్తుకొచ్చింది. “టూత్ పేస్ట్ దేశం అంతటా ఒకే ధరలో దొరకాలి. అసలు ఏ వస్తువైనా అమ్మటానికి వ్యాపార ప్రకటన ఎందుకు? ఒకే వస్తువుకు రకరకాల పేర్లెందుకు?” అని మార్కెట్ వ్యవస్థను చీల్చి చెండాడేసే వారు కమ్యూనిస్ట్ అయిన మా ఎకనామిక్స్ మాస్టారు).

“గనుల్లో, సైన్యాల్లో మనుషులు నిర్బంధించబడుతున్నారు. జీవితం అంతా వెచ్చించి, సృష్టిస్తూ, వినియోగిస్తూ పోవటం మనం ఎన్నుకున్న మార్గం  కాదు. జడత్వం తో ఈ మార్గంలో నడుస్తున్నాం.  ప్రపంచమంతా ఒకటే రకం వ్యవస్థ ఉండాలంటూ అన్ని చోట్లా ఆక్రమించుకుంటూ, వైవిధ్యాన్నీ, స్వేచ్ఛనూ చెరిపేసే ఒక విధ్వంస రూపాన్ని ప్రతిష్టిస్తున్నారు. కొన్ని లక్షల సంవత్సరాలుగా ప్రకృతికి ఎటువంటి నొప్పీ కలిగించలేదు మనిషి. ఒక్కసారిగా 3 శతాబ్దాలలో అంతులేని విధ్వంసాన్ని సృష్టించాడు.”  అంటాడీ ఫిల్మ్ మేకర్.

అలంగ్ .. గుజరాత్ తీరాన ఉన్న ఒక చిన్న రేవు. ఇక్కడ పెద్ద పెద్ద ఓడలను విరగ్గొట్టే పని నడుస్తూ ఉంటుంది. అమెరికా, ఇంగ్లాండ్,  ఇంకా ఇతర డబ్బున్న దేశాల పాత ఓడలు ఇక్కడ పోగు పడతాయి.  (ఇక్కడ పని చేసే 50000 మంది పనివాళ్ళకు ఎటువంటి రక్షణ లేదు. సంవత్సరానికి కనీసం 50 మంది దాకా ఈ పనుల్లో చనిపోతూ ఉంటారట. 2012 లో ఇక్కడకొచ్చిన  దాదాపు 425 యు.ఎస్., ఇంగ్లాండ్ ఓడలు వదిలిన కాలుష్యం అక్కడి పనివాళ్ళను ఏ అనారోగ్య తీరాలకు చేర్చిందో తెలియదు. డబ్బు కోసం మన ప్రభుత్వాలు కాలుష్యానికి ద్వారాలు తెరిచి దేశాన్ని టాయిలెట్ గోతిగా మార్చేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు).  అలంగ్ లో షిప్ బ్రేకింగ్ కంపనీలో కళ్ళకు రక్షణ లేకుండా వెల్డింగ్ పని చేస్తున్న కూలీలూ, వాళ్ళ కళ్ళ చికిలింపులూ, ఆ భయానక వాతావరణమూ … కొన్ని ఫ్రేముల్లో చూపి భయపెదుతుంది ‘సర్ ప్లస్’.  ప్రమాదకరమైన పరిస్థితుల్లో ‘యంత్ర భూతముల కోరలు తోముతూ’, ఎంతమంది బ్రతుకులీడుస్తున్నారో లెక్కలు చెప్పేవారూ తక్కువే.

“మనుషులు కనిపెట్టిన అతి శక్తివంతమైన ప్రసార సాధనం 30 సెకన్ల వ్యాపార ప్రకటన” – అంటాడీ ఫిల్మ్ మేకర్.  కళ్ళనూ మెదడునూ ఆక్రమించే వ్యాపార ప్రకటనల చురుకైన టెక్నిక్ నూ, మ్యూజిక్ వీడియోల ఆకర్షణనూ  బాగా అర్ధం చేసుకున్న ఈయన, ఆ టెక్నిక్ ను మరింత సమర్ధవంతంగా వాడి, మామూలు డాక్యుమెంటరీ ఫిల్మ్ పరిధుల్ని దాటేసి, ‘సర్ ప్లస్’ visual technique ను మంచి స్థాయికి  తీసుకువెళ్ళాడు. వ్యాపార ప్రకటనలు మత్తులో ముంచే పనిలో ఉంటే, ఇతడు ‘పెను నిద్దుర’ను వదిలించే పని పెట్టుకున్నాడు ఈ ఫిల్మ్ తో.

వ్యాపార ప్రకటనల ముల్లును, ముల్లు తోనే తీసినట్టుగా, ‘జి-8 వరల్డ్ షాప్’ పేరుతో జార్జ్ బుష్ తదితరులు రకరకాల తిండి వస్తువుల ప్రకటనలు ఎలా చేస్తారో వారినోట “పలికిస్తూ”  గేలి చేస్తాడు. మెరిసిపోతున్న అమెరికా నగరంలో  ఒక బిల్ బోర్డు పై ఒక బలిసిన పంది బొమ్మ త్రేన్చుతూ ఉండే దృశ్యం చూపిస్తూ, “సగటు ఉత్తర అమెరికావాసి ఒక మెక్సికన్ కంటే 5 రెట్లు, చైనా వాసి కంటే 10 రెట్లు, భారతీయుడి కంటే 30 రెట్లు తింటాడని”ని లెక్క చెపుతాడు.  (జార్జ్ బుష్  భారతీయుల తిండి యావ పెరిగి, దాని మూలంగా కరువు వస్తోందని పాపం ఆ మధ్య బాధ పడ్డాడు.  ఇప్పుడు టీవీ చానెల్స్ లో వచ్చే రకరకాల వంటకాల తయారీలు చూస్తుంటే నిజంగానే మన సగటు తిండి లెక్క ఏమైనా పెరిగిందేమో అనిపిస్తోంది).

మరి క్యూబా సంగతికొస్తే, అమెరికా లాంటి పహిల్వాన్ తో పోటీ పెట్టుకుని ఒక పక్క నిలబడుతూనే, మరోవైపు తమ వ్యవస్థ ఉత్తమమైనదని రుజువు చేయటం మాటలా? అక్కడి బిల్ బోర్డు పై “పొదుపు చెయ్యండి. అవసరమైనంత మాత్రమే వాడుకోండి” అని రాసి ఉంటుంది.  “క్యూబా వినిమయ సంస్కృతిని ప్రోత్సహించదు. మేము ప్రజాస్వామికంగా ఉంటాం. వ్యాపార ప్రకటనలు కుదరవ”ని ప్రకటిస్తాడు ఫిడెల్ కాస్ట్రో.

‘అభివృద్ధి, అభివృద్ధి అభివృద్ధి’ అంటూ ఉన్మాదిలా గంతులేసుకుంటూ  “మూడే మాటలు..  నా కంపెనీని నేను ప్రేమిస్తాను”. అంటాడు మైక్రోసాఫ్ట్  సి.ఇ.ఓ. స్టీవ్ బాల్ మర్.  అదే మంత్రం జపిస్తూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు డ్రిల్ చేస్తుంటారు ఆఫీసుల్లో నీరసంగా.  పనిలోని పరాయీకరణతో పాటు ఇలాటి వ్యవస్థ ఎక్కువ కాలం నిలవదనే సూచన కనిపిస్తుంది.  “నా కంపనీని నేను ప్రేమిస్తాను” అని కిక్కిరిసిన జనంతో ఉన్న ఫిడెల్ కాస్ట్రో చేత కూడా “అనిపిస్తాడు”. ఇక్కడ కంపెనీ అంటే ప్రజానీకం.

“ప్రపంచీకరించబడిన ఈనాటి ఆర్ధిక వ్యవస్థ ఒక పెద్ద జూదశాల” – ఇది ఫిడెల్ కాస్ట్రో అభిప్రాయం.

ఈ ఫిల్మ్ లో  తాన్యా, స్వాంటే  సైకిల్స్ తొక్కుతూ ఉంటారు. పెద్ద పెద్ద చెయిన్ స్టోర్స్ లో కనిపించేటటువంటి ట్రాలీలను మనిషి తోసుకు పోతుంటే కెమెరా వృత్తంగా తిరుగుతూ ఉంటుంది. రైలు, ఫ్యాక్టరీ, సుత్తితో కొడుతూ ఉండటం, ఎత్తైన మహా కట్టడాలు ..  ఈ దృశ్యాల మీద కెమెరాను  పానింగ్ చేస్తూ, ఒకే మాటను మళ్ళీ చెప్తూ, మళ్ళీ మళ్ళీ చెప్తూ, ఒకే దృశ్యాన్ని మళ్ళీ చూపిస్తూ, మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఒక విలక్షణమైన లయను సాధించాడు ఈ  డైరెక్టర్. ఈ విష వలయాన్ని ఛేదించటం కష్టమనే ఊహ మనలో మెదులుతూ ఉంటుంది.  డాక్యుమెంటరీ అంటే ఏదో నిస్సత్తువగా నాలుగు దృశ్యాలతో చెప్పాలనుకున్నది చెప్పటం కాకుండా,  మన మేధనూ, హృదయాన్నీ, చెవినీ, కంటినీ చురుగ్గా ఆక్రమించి పని చేయించేస్తూ ఉంటాయి ఈ ఫిల్మ్ లోని దృశ్యాలు, శబ్దాలు, మాటలు, సంగీతమూ..

భారీ పరిశ్రమల్లో వస్తువుల్ని తయారు చెయ్యటం, పాత వాటిని చెత్త పోగులు వెయ్యటం,  విరగ్గొట్టటం .. ఈ మూడు పనులనూ పదేపదే చూపిస్తూ, విహ్వలమైన సంగీతాన్ని జోడించి, మనం నిరంతరం ‘ఇదే జీవితం’ అనుకుంటూ చేస్తున్న  ఈ పనుల్ని మించిన హింస ఇంకేమీ లేదని స్ఫురింపజేస్తాడు.  వస్తువుల సృష్టిలోనూ, వ్యామోహంలోనూ  ఉండే మాదకత (తాన్యా),  ఉన్మాదం(స్టీవ్ బాల్ మర్),  హింస(అలంగ్) లను  అంతే బలంగానూ, ఉన్మాదంగానూ చూపిస్తాడు.  జోహన్ సోడర్ బర్గ్ చక్కని ఎడిటింగ్ పనిని గుర్తించనిదే  ‘సర్ ప్లస్’ గురించి రాయటం పూర్తి కాదు.

ఈ ఫిల్మ్ చాలా ఆలోచనలు రేకెత్తిస్తుంది. ప్రకృతి పట్ల ఎటువంటి గౌరవం, ఆరాధన లేకుండా పూర్తి స్థాయి వినియోగదారులుగా మాత్రమే మనం మిగలటంలోని బాధ, అతిగా పనిలో దూసుకుపోతూ , దొరికిన కాస్త ఖాళీ సమయంలో టెక్నాలజీని విపరీతంగా వాడుకుంటూ బ్రతకటంలోని ఇరుకుతనం, ఆర్ధిక అసమానతలను అసలేమీ గుర్తించకుండా బతికెయ్యటంలోని విషాదం… కళ్ళముందు నిలబడతాయి.

ఈ నాశనానికి ముఖ్య కారణమైన వ్యవస్థకూ, దేశానికీ ప్రతినిథి అయిన వ్యక్తి  “ మేమే కాదు ప్రపంచమంతా ఈ సంపద సృష్టిలో భాగస్వాములు కావాలి” అని మామూలుగా తన పద్ధతిలో బోధిస్తూనే ఉన్నాడు.  ప్రపంచమంతా వింటూ, ఆచరిస్తూనే ఉంది.  అలాంటి అమెరికన్ ప్రెసిడెంట్  “నేను తృప్తి గా, సాదా సీదాగా బ్రతుకుతాను” అనగలిగిన రోజున మాత్రమే ప్రపంచంలో మార్పు సాధ్యమని భావిస్తున్నాడా ఈ ఫిల్మ్ మేకర్?  లేక మనలోని వినియోగదారుడిని  నిరంతరం తట్టి లేపుతూ ఉండే  ఈ ఉగ్రవాదానికి  ఇంత absurd గానూ  తెర దించటమే సరైనదని అనుకున్నాడా?

*****

మనిషి అవసరాన్ని ప్రకృతి తీర్చగలదు కానీ మనిషి దురాశను మాత్రం తీర్చలేదని గాంధీ ఏనాడో చెప్పాడు.  మనం ప్రగతి పేరుతో బోలెడన్ని వస్తువుల్ని మన చుట్టూ పేర్చుకుంటూ, ఇంకా కొత్త వస్తువుల్ని కనిపెడుతూ, చాలా ముందుకు వచ్చేశాం.  ఉన్న వాటినే వాడుకోవటానికి సమయం లేకనూ, కొత్త వాటిమీద మోజుతోనూ పాత వస్తువుల్ని చెత్తబుట్టల్లో వేస్తున్నాం.  వెనక్కి తిరిగి చూస్తే మనం నడిచిన మార్గం వస్తువులతో మూసుకుపోయి ఉంది.  కనబడని ఉగ్రవాదుల్లాంటి వ్యాపార ప్రకటనలు  “పక్కింటి వాళ్ళ కారు మీ కారు కంటే పెద్దదిగా ఉందా? కొత్త.. పేద్ద.. కారు కొనుక్కొని , ఉన్న దానిని అమ్మి పారేయండి మా ఫలానా వెబ్ సైట్ లో” అని మోగుతూనే ఉన్నాయి. ఈ సర్ ప్లస్ నమూనాలో బ్రతకటం చాలా మందికి ఇష్టంగా లేదు. కానీ చట్రం గట్టిగా బిగుసుకుంది.

‘సర్ ప్లస్’  ఫిల్మ్ వచ్చి పదేళ్లయింది. అందులో ఊహించినట్టుగా, ఆశించినట్టుగా మార్కెట్ ఎకానమీ కూలిపోలేదు ఇంకా!  వాల్ స్ట్రీట్, ఈజిప్టు ఉద్యమాలు దిశా నిర్దేశం  లేని ఆందోళనలుగా మిగిలాయి.  ప్రభుత్వాల, కార్పొరేట్ ల కొమ్ములు వంచాలని చాలా మంది వ్యక్తులూ, సంస్థలూ  ప్రయత్నిస్తూనే ఉన్నారు.  భూమి తల్లినీ, దానినే ఆశ్రయించుకున్న వేలాది మనుషులనూ కాపాడే బాధ్యత మీద వేసుకుని, గ్రీన్ టెర్రరిస్టులనే ముద్ర వేయించుకుంటున్నారు.  అగ్ర రాజ్యాలకు పూర్తి వ్యతిరేక దిశలో వెళ్తూ ఇప్పటి వరకూ ప్రాణాలు నిలుపుకున్న క్యూబా వంటి దేశాలు తక్కువ.  వస్తువులతో కిక్కిరిసిన ఈ పునాదులు లేని భవంతి ఎప్పుడు దానంతట అదే కూలుతుందా ఎప్పుడు కొత్త వెలుతురు వస్తుందా అని మౌనంగా ఎదురుచూసే వాళ్ళూ ఉన్నారు.

‘సర్ ప్లస్’ లో అన్నిటికంటే భయపెట్టేవి చెత్త డంప్ లూ, టైర్ల గుట్టలూ… ఎటు చూసినా రోడ్లమీద వాహనాలు కనిపిస్తూనే ఉన్నా, “ఇన్ని వాహనాలున్నాయా ప్రపంచంలో?” అని మనం బెదిరిపోయే దృశ్యం అది. “ఇంత అతిగా అన్నిటినీ వాడుతూపోవటం  ఎక్కువ కాలం కుదరదు.  ప్రకృతినుండి మనను వేరుచేసి treadmill మీద నిలబెడుతున్నాయి ఈ పెద్ద పెద్ద రోడ్లు.  వీటిని చీల్చేసే పని భారీ ఎత్తున జరిగితే చూడాలనిపిస్తోంది” అని జేర్జాన్ అంటూ ఉంటే,  ఆ విధ్వంసం  తరువాత … వినూత్నమైనదీ, మనిషిని తను చేసే పనితోనూ, ప్రకృతి తోనూ ముడి వేసి ఉంచేదీ అయిన నమూనా మనకు కావాలనిపిస్తుంది. ఆ కొత్త వ్యవస్థ – ప్రాంతీయ జ్ఞానాన్నీ, ఇంతవరకూ చూసిన వ్యవస్థల మంచి చెడ్డల ఆధారంగా కలిగే సరికొత్త ఊహలనూ కలుపుకునేదైతే ఎంతో బాగుంటుందనిపిస్తుంది.

ఈ చిత్రాన్ని యూ ట్యూబ్ లో కూడా (తక్కువ visual quality తో)చూడవచ్చు.

ల.లి.త.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

అందం, ప్రతిభా, వ్యక్తిత్వం = సుచిత్రా సేన్!

 suchitra-sen-best-bengali-bollywood-movies-list

మొన్న శుక్రవారము 17 జనవరి 2014 బెంగాలీ చిత్రతార ఒకటి అస్తమించినది.  82 ఏళ్లు నిండిన సుచిత్రా సేన్ ఇక లేరు. ఆమె నేటి బంగ్లాదేశ్‌లోని పాబ్నాలో 1931లో రొమా (రమ) దాస్‌గుప్తాగా జన్మించినది. ఎనిమిది పిల్లలలో (మూడు మగ, ఐదు ఆడ) ఆమె ఐదవది. ఆమె అసలు పేరు కృష్ణ, కాని బడిలో చేర్పించేటప్పుడు, వాళ్ల నాన్నగారు రమ అని పేరిచ్చారట. కొందరు ఆమె శాంతినికేతనములో విద్యాభ్యాసము చేసినదంటారు.

 

అతి రూపవతియైన ఆమెకు పదహారవ ఏడే పెళ్లయినది.  ఆమెకు సంగీతమంటే యిష్టము.  చలనచిత్రాలలో పాడాలని ఆమె కోరిక.  కాని ఆమె అదృష్టము మరొక విధముగా పరిణమించినది.  వెండి తెర మరుగున గాక, వెండితెర మీదనే ఆమెకు అవకాశము లభించినది. ఆమె మొదటి చిత్రము 1953లో విడుదల అయినది.  ఆమెకు దర్శకుడు నితీశ్ రాయ్ సుచిత్ర అని పేరు నిచ్చాడట. తరువాత ఆమె వెండితెరపైన సుచిత్రా అనే పేరుతో స్థిరపడినది. ఆమె తన నాన్నమ్మను నటనవిద్యలో గురువుగా భావించింది. ఆమె సుచిత్ర నటనను ప్రోత్సహించడము మాత్రమే కాక విమర్శించేది కూడ. ఆమెతో నాయకుడుగా ఉత్తం కుమార్ నటించాడు.  ఉత్తం, సుచిత్రాల జోడీ అలా 1953లో ఆరంభమైనది.  వాళ్లిద్దరు తరువాత ఎన్నో చిత్రాలలో కలిసి నటించారు.  పెళ్లికి పిదప నటన ప్రారంభించి కొనసాగించిన నాయికలు అరుదు.  అట్టి అరుదైన నాయికలలో ఆమె ఒకతె, మరొకరు గడచిన వారము మరణించిన తెలుగు నటి అంజలీదేవి.

 

సుచిత్రా సేన్ బెంగాలీ చిత్రములో వహించిన పాత్రలను తెలుగులో సావిత్రి, హిందీలో వహీదా రహ్మాన్ పోషించారు. దీనిని బట్టి మనము బెంగాలీ చిత్రాలను చూడకపోయినా ఆమె నటనను గురించి ఊహించుకోవడానికి అవకాశము ఉంటుంది.  ఉత్తంకుమారుతో ఆమె జోడీ హిందీలో రాజ్‌కపూర్-నర్గీస్, తెలుగులో నాగేశ్వరరావు-సావిత్రి లాటిది. వారిరువురు నటించిన చిత్రాలను ప్రేక్షకులు అమితముగా ఆదరించారు.  ఏ కళాకారులకైనా ఆ కళను అనుభవించే రసికులు ఆదరిస్తే అంతకన్న కావలసినదేముంది?

 

ఆమె 52 బెంగాలి, ఏడు హిందీ చిత్రాలలో నటించింది. అందులో 30 చిత్రాలలో ఆమెతో కూడ ఉత్తంకుమార్ నటించాడు. అలా వారిరువురు నటించిన మొదటి చిత్రము సారే చూయతర్, చివరి చిత్రము ప్రియ బాంధవి.  ఆమె నటించిన కొన్ని గొప్ప చిత్రాలు – అగ్నిపరీక్ష (తెలుగులో మాంగల్యబలం), ఉత్తర్ ఫల్గుని (హిందీలో మమత), దీప్ జ్వేలే జాయ్ (హిందీలో ఖామోషీ, తెలుగులో చివరకు మిగిలేది), సాత్ పా కే బంధా, హిందీ చిత్రములు దేవదాస్, ఆంధీ. ఇందులో సాత్ పా కే బంధా చిత్రములోని నటనకు ఉత్తమ నటి పురస్కారము మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవములో దొరికింది.  అంతర్జాతీయ రంగములో అలాటి ఉత్తమ నటనా పురస్కారమును నర్గీస్ తరువాత అందుకొన్న భారతీయ మహిళ ఆమెయే.

 

ఆమె కుమార్తె మూన్ మూన్ సేన్, మనుమరాళ్లు రైమా, రియా. ఆమెకు పద్మశ్రీ, బంగభూషణ్ పురస్కారములు ఇవ్వబడినవి. చిత్రజగత్తునుండి విరమించిన పిదప హాలీవూడ్ నటి గ్రెటా గార్బోవలె ఆమె ఎవరి కళ్లకు కనబడక ఏ కొద్దిమందితో మాత్రమే సంబంధము నుంచుకొని రామకృష్ణ ఆశ్రమపు కార్యక్రమాలలో కాలము గడిపినది. బంగభూషణ్ బహుమతిని ఆమె తరఫున ఆమె కుమార్తె మూన్ మూన్ అందుకొన్నది.  ఢిల్లీలో బహుమతిని అందుకొనవలసి వస్తుందని భారత చిత్ర జగత్తులో అతి ప్రశస్తమయిన దాదాసాహేబ్ ఫాల్కే బహుమతిని కూడ నిరాకరించినదట.

 

ఆంగ్లేయ చిత్ర విమర్శకుడు Derek Malcolm అంటాడు – ” ఆమె నిజంగా చాల అందగత్తె, ఆమెలో ఒక స్థిర చిత్రములాటి భంగిమ ఉన్నది, ఆమె ఎక్కువగా నటించ నక్కర లేదు.”  సుచిత్రా సేన్‌ను ఒక గొప్ప “మహానాయిక”గా అందరు ఎందుకు పరిగణిస్తున్నారు?  దీనికి గల కొన్ని కారణములను మనము తెలిసికోవాలి.  ఆమె సౌందర్యవతి, అందులో సందేహము ఏమీ లేదు.  కానీ చలన చిత్ర నాయికలు చాల మంది అందగత్తెలే, కుందనపు బొమ్మలే. అందమొక్కటే చాలదు, నటనాకౌశల్యము కూడ కావాలి.  ఆ నటన సంభాషణలను హావభావములతో వల్లించుట మాత్రమే కాదు.  ఒక చూపుతో, ఒక శిరఃకంపనముతో, ఒక సైగతో, ఒక నిట్టూర్పుతో, ఒక చిన్న పెదవి విరుపుతో గుండె లోతులలో ఉండే అనుభూతులను బయటికి తేవాలి. రచయిత కల్పించిన పాత్రలో మమైకము కావాలి. దర్శకుని భావాలను అర్థము చేసికొని వాటికి తన ముఖమునే అద్దముగా పెట్టాలి.  సుచిత్ర గ్లిసరిన్ వాడదని చెబుతారు.  సెట్టుపైన వెళ్లినప్పుడు కన్నీళ్లు తనంతట వచ్చేవట.

ఆమెకు ఆత్మవిశ్వాసము ఎక్కువ.  అందుకే నాయకుల ఆధిక్యత ఉండే చిత్రరంగములో తన పేరును నాయకునికి సమానముగా ప్రదర్శించమని దర్శకులను, నిర్మాతలను అడిగి వారిని ఒప్పించినది.  అందుకే చిత్రములలో సుచిత్రా సేన్, ఉత్తం కుమార్ అని నాయకీనాయకుల పేరులను చూపేవారు, ఉత్తం కుమార్, సుచిత్రా సేన్‌లని కాదు. సత్యజిత్ రాయ్ ఆమెను తాను తీయాలనుకొన్న ఛౌధురాణి చిత్రములో నాయికగా ఎన్నుకొన్నాడు. కాని రాయ్ తన చిత్రములోతప్ప మిగిలిన వాటిలో ఆ చిత్రము పూర్తి అయ్యేవరకు నటించరాదన్నాడట. మిగిలిన దర్శకనిర్మాతల చిత్ర నిర్మాణమునకు అది అడ్డవుతుంది కనుక అందుకు సుచిత్ర ఒప్పుకోలేదు. ఒక వేళ అలా సత్యజిత్ రాయ్ చిత్రములో ఆమె నటించి ఉంటే అది ఎలా ఉండి ఉంటుందో అన్నది ఇప్పుడు ఊహాతీతమయినది. రాజ కపూర్ చిత్రములో నటించడానికి కూడ ఆమె నిరాకరించినదట.

Suchitra-sen6-400-x-300

ఆమె నటించిన కొన్ని చిత్రములను సంక్షిప్తముగా పరిశిలిస్తే ఆమెను ఎందుకు గొప్ప నటి అంటారో మనకు తెలుస్తుంది,  కథా పాత్రల వైవిధ్యమును మనము అర్థము చేసికొనవచ్చును. ఇందులో ఎన్నో చలన చిత్రాలు యూట్యూబులో చూచి ఆనందించవచ్చును.

 

అగ్నిపరీక్ష (1954) – మాంగల్యబలం తెలుగు చిత్రము చూసిన వారికి ఈ కథ విదితమే. చిన్నప్పుడు బొమ్మల పెళ్లిలా జరిగినదానిని తండ్రి నిరాకరించాడు.  పెద్దైన తరువాత ఒక యువకుడిని చూసి ప్రేమించింది తపసి.  అతనిని పెండ్లాడుట సరియా కాదా అనే సందిగ్ధములో నున్నప్పుడు, ఆమె నాన్నమ్మ ఆమెకు సీతలా నీవు కూడ నీ అగ్ని పరీక్షలో కృతార్థురాలవుతావు అని చెప్పింది. చిన్నప్పటి గ్రామానికి వెళ్లగా అక్కడ తన ప్రేమికుడినే చూసింది.

 

దేవదాస్ (1955) – దేవదాసు కథ అందరికీ తెలిసినదే. ఇందులో పార్వతి పాత్రకు జీవం పోసింది సుచిత్ర. ఆ పాత్రలోని గాంభీర్యము, ఔన్నత్యము, ప్రేమ, ఆవేదన చక్కగా తన నటనలో  ప్రతిబింబము చేసినది. నాయకుడు దిలీప్ కుమార్‌తో సరిసమానముగా నటించి అతని ప్రశంసలు మాత్రమే కాక దర్శకుడు బిమల్ రాయ్‌చేత కూడ మన్ననలను అందుకొన్నది. ఉత్తమ నటిగా ఆమెకు బహుమతి దొరికినది.  చంద్రముఖిగా నటించిన వైజయంతిమాలకు ఉత్తమ సహాయనటిగా బహుమతి లభించినా, ఆమె తనకు కూడ ఉత్తమ నటి బహుమతి ఇవ్వలేదని తన బహుమతిని నిరాకరించినది.

 

రాజలక్ష్మి శ్రీకాంత (1958) – దీని కథ శరత్ వ్రాసిన శ్రీకాంత్ నవలలోని ఒక భాగము.  ఈ శ్రీకాంత్ నవల కొందరు శరత్ ఆత్మకథపైన ఆధారపడినదని చెబుతారు.  శ్రీకాంత్ నవలను నాలుగు భాగములుగా విడదీయవచ్చును.  శ్రీకాంత్ నవల అందులోని కథానాయకుడు తన జీవితములో ఎదుర్కొన్న నాలుగు స్త్రీలను గురించిన కథ.  వాళ్లు – అన్నదా, రాజలక్ష్మి, అభయ, కమలలత.  ఇందులో రాజలక్ష్మిని గురించిన ఉదంతము ఈ చిత్రము. శ్రీకాంత్ ఒక చోట నిలకడగా ఉండడు, ఒక విధముగా దేశదిమ్మరి. అలా ప్రయాణం చేసేటప్పుడు ప్యారిబాయి రూపములో తన చిన్ననాటి స్నేహితురాలైన రాజలక్ష్మిని మళ్లీ చూస్తాడు. వారి రాగద్వేషాలు ఈ చిత్రపు కథ.  ఇందులో రాజలక్ష్మి తపన, ఆసక్తి, ప్రేమానురాగలను సుచిత్ర చాల చక్కగా తన నటనలో చూపినది.

 

దీప్ జ్వేలే జాయ్ (1959) – ఈ చిత్రము తెలుగులో చివరకు మిగిలేది, హిందీలో ఖామోషీ అనే పేరుతో విడుదల అయినది. మానసిక రోగముతో బాధపడే ఒక వ్యక్తిని కాపాడబోయి అతనికి ప్రేమికురాలుగా నటించి నిజముగా ప్రేమలో పడినది ఒక నర్సు.  అతడు చికిత్స పొంది వెళ్లిపోయిన తరువాత అలాగే ఇంకొక రోగితో నటించినప్పుడు మళ్లీ ప్రేమలో పడి తాను కూడ చిత్త భ్రమను పొందుతుంది.  ఖామోషిలో నటించిన వహీదా తన నటన సుచిత్రా సేన్ నటనకు సరి తూగదని తానే చెప్పినదంటే సుచిత్ర ఎంత గొప్పగా నటించినదో ఈ చిత్రములో!

 

ఉత్తర్ ఫల్గుని (1963), మమతా (1966) – ప్రేమికుడు విదేశాలకు వెళ్లగా, పరిస్థితులవల్ల తండ్రి మరొకనితో పెళ్లి జరుపుతాడు. ఆ భర్త త్రాగుబోతు, తన భార్యనే అమ్మడానికి సందేహించడు, వాడిని వదలి పారిపోయి పన్నాబాయిగా మారుతుంది. తన కూతురిని ఒక క్రైస్తవ మొనాస్టరీలో వదలి వెల్లిపోతుంది. విదేశాలకు వెళ్లిన ప్రేమికుడు ఆమెను ఒక రోజు చూస్తాడు.  ఆమెను తన యింటికి పిలిపించుకొని పాట పాడిస్తాడు, కాని తన ముఖము చూపడు. పారితోషికాన్ని అతని కార్యదర్శి ఇవ్వబోగా ముఖముచూపని వారిచే పారితోషికము గ్రహించనని చెప్పుతుంది. తరువాత అతడే ఆమె కూతురు సుపర్ణ బాధ్యతలు వహించి ఆమెను విదేశాలకు పంపుతాడు. ఆమె కూడ బారిస్టరుగా తిరిగి వస్తుంది. తన మాజీ త్రాగుబోతు భర్త బ్ల్యాక్మెయిల్ చేస్తుంటాడు, అప్పుడు తన కూతురి భవిష్యత్తు పాడవ కూడదని వాడిని హత్య చేస్తుంది. ఆమెను తప్పించడానికి ఆమె ప్రేమికుడే వాదిస్తాడు, అప్పుడు ఆమె కూతురు ఆమె అపరాధి ఆమె శిక్షార్హురాలు అని చెప్పగా, అతడు ముద్దాయి ఎవరోకాదు, సుపర్ణ తల్లి అని చెబుతాడు.  తల్లిగా, కూతురిగా రెండు పాత్రలను సుచిత్ర ఈ చిత్రములో పోషించింది. తల్లి పాత్రలోని ఆవేదన, కూతురి పాత్రలోని చలాకీదనము రెంటిని బింబప్రతిబింబాలుగా ప్రదర్శించింది ఇందులో.

 

ఉత్తమ్ కుమార్ తో సుచిత్ర

ఉత్తమ్ కుమార్ తో సుచిత్ర

సాత్‌పాకే బంధా (1963)  (హిందీలో కోరా కాగజ్) – పెళ్లి అనేది ఏడడుగుల బంధమే కదా? దానినిగురించిన కథ ఇది.  తండ్రి ఒక విద్యాధికారి, తల్లి మామూలు మనిషి, కూతురు అర్చనకు ఒక కళాశాల ప్రాధ్యాపకుడు సుఖేందుతో ప్రేమ. తండ్రి ఒప్పుకొంటాడు, తల్లికి ఇష్టము లేదు. పెళ్లి అవుతుంది. అర్చన తన భర్త సుఖేందును సంతృప్తిపరచడానికి ఎంతో కష్టపడుతుంది. కాని సుఖేందుకు భార్యను అర్థము చేసికోలేక పోయాడు.  వాళ్లిద్దరి మధ్య దూరము పెరుగుతుంది. తల్లి తన కూతురు ఒక పేద అధ్యాపకునితో కష్టపడుతుందని తాను వాళ్లిద్దరి మధ్య జోక్యము కలుగజేసికొంటుంది. చివరకు ఇద్దరు ఒకరినొకరు ఇంకా ప్రేమించుకొంటున్నా కూడ విడాకులు తీసికొంటారు. ఐనా సుఖేందు రాకకోసం అర్చన ఎదురుచూస్తూనే ఉంటుంది.

 

ఆంధీ (1975) – సుచిత్రా సేన్ ఆఖరి చిత్రాలలో ఇదొకటి. ఇందులో ఆమె పాత్రకు, ఇందిరా గాంధీ జీవితానికి లంకె ఉన్నదని ఒక ప్రచారము ఉండేది. ఇందులో ఆమె వస్త్రాలంకారము, కేశాలంకారము మున్నగునవి కూడ దీనిని బలపరిచింది. ఇరవై వారాల తరువాత ఈ చిత్ర ప్రదర్శనను ఆపారు. అవి ఎమర్జెన్సీ రోజులు, ఈ తరము వారికి ఆ విషయాలు తెలియవు. కొద్దిగా సందేహము కలిగినా ఇలాటివి సర్వసామాన్యము ఆ కాలములో. కిశోర్ కుమార్ కాంగ్రెస్ మహాసభలో పాడడానికి నిరాకరించాడని అతని పాటల ప్రసారమునే ఆకాశవాణిలో ఆపిన దినాలు అవి!  తనకు  ఆదర్శవంతురాలైన నాయకురాలు ఇందిరా గాంధి అని సుచిత్ర పాత్ర ఇందిరా గాంధి చిత్రపటము ముందు చెప్పిన మాటలను చిత్రముతో జత చేసిన తరువాత మళ్లీ చిత్రాన్ని విడుదల చేయుటకు అనుమతించారు. తన తండ్రిచే ప్రోత్సహించబడి రాజకీయాలలో చేరి ఎన్నికలలో పోటి చేస్తున్న ఒక రాజకీయవాదిగా సుచిత్ర ఇందులో నటించినది. విడాకులు పొందిన భర్తను మళ్లీ కలిసినప్పుడు పాత జ్ఞాపకాలు ప్రేమ మళ్లీ చిగిరింది. ఇందులోని ఆరతీదేవి పాత్ర నెరసిన వెండ్రుకలు, ఆమె కట్టుకొన్న చీరలు ఇందిరా గాంధీకి సరిపోయేటట్లు ఉండడము ఒక విశేషము.

 

ఆమె నటించిన చిత్రములలో నాకు నచ్చిన రెండు పాటలను మీకు జ్ఞాపకము చేస్తున్నాను –

 

(1) అగ్నిపరీక్ష చిత్రములోని కే తుమి ఆమారే డాకో అనే పాట ( – http://www.youtube.com/watch?v=xR6OllPrZ_U&list=PLE0072797BFB1F116 ). మాంగల్యబలములోలోని పెనుచీకటాయె లోకం పాట ఈపాటపై ఆధార పడినదే.

 

(2) మమత చిత్రములోని ఛుపాలో దిల్ మే యూఁ ప్యార్ మేరా (  http://www.youtube.com/watch?v=lZCHYFkED5M ). ఈ పాట పారసీక ఛందస్సు ముతకారిబ్ ముసమ్మన్ ముజాఫ్ మక్బూజ్ అస్లం ముజాయిఫ్ పైన ఆధారపడినది.  దీనిని గురించి అంతర్జాల పత్రికయైన మాలికలో నేను చర్చించియున్నాను.

 

ఒక తార భూమిపైన అస్తమయమై ఆకాశములో ఉదయించింది.  మరో ప్రపంచము అనేది ఉంటే అక్కడ దివంగతుడైన ఉత్తం కుమార్‌తో మళ్లీ నటించడానికి నాందీవాక్యమును సుచిత్రా సేన్ పలుకవచ్చును.

– జెజ్జాల కృష్ణ మోహన రావు

222121_10150170989267886_3694186_n

ఇది ‘పెట్టుబడి’ చేసిన హత్య!

Uday-Kiran-Modeling-Pic‘‘ప్రముఖ సినీనటుడు ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్య’’ అన్న వార్త టెలివిజన్‌ తెరమీద స్క్రోల్‌ రూపంలో చూసినపుడు నాకు పెద్దగా ఆశ్చర్యంకానీ, దు:ఖం కానీ కలగలేదు. వైయక్తిక దు:ఖానికి తప్పిస్తే, సామాజిక అవ్యవస్థకి మనం మనుషులుగా స్పందించడం మానేసి చాలాకాలమయింది కనుక…దు:ఖం స్థానంలో ఒక నిర్లిప్తత, ఒక ఉదాసీనత ఏదో కలిగింది. చిత్ర సీమకు ఇలాంటి రోజు ఏదో ఒక రోజు వస్తుంది అని తెలుస్తూనే వుంది కనుక ఆశ్చర్యం లాంటి భావమేదీ కలగలేదు.
ఆ ఏదో ఒక రోజు ఇంత త్వరగా రావడం మాత్రం ఖఛ్చితంగా విషాదమే!
సినిమా అవకాశాలు తగ్గిపోవడమూ, ఆర్ధిక ఇబ్బందులు, పరాయీకరణ లాంటి కారణాల వలన డిప్రెషన్‌కి గురి అయి ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించి ఇవ్వాళో, రేపో కేసు మూసివేయ వచ్చు. కానీ ‘‘హత్య’’కి ఆత్మహత్యకి మధ్య ఉన్న ఒక సన్నని రేఖను వాళ్ళెప్పుడూ, ఎప్పటికీ ఛేదించలేరు. అది వాళ్ళ తప్పు కూడా కాదు సమాజంలో కొండలా పేరుకుని పోయిన రుగ్మత, పోలీసులకి భౌతిక, ప్రాసంగిక సాక్ష్యాలు కావాలి. వాటి అవసరం లేకుండానే సమాజం, ఏది హత్యో, ఏది ఆత్మహత్యో నిర్ధారణ చేయవచ్చు కానీ మన సమాజం ఆ దిశగా ప్రయత్నించదు అది మన దురదృష్టం.
‘‘ఉదయ్‌ కిరణ్‌’’ హత్య, పోనీ ఆత్మహత్య వెనుక నాలుగు శక్తులు ప్రధానంగా పనిచేశాయి అని ఈ వ్యాసకర్త బలమయిన నమ్మకం. ఒకటి సినిమా, రెండు సమాజము, మూడు ప్రేమ రాహిత్యము చివరగా చెపుతున్న కారణం  అత్యంత బలమయినది. ఏ ఆత్మహత్య వెనుక అయినా, కొంచెం లోతుగా పరిశీలిస్తే ఈ నాలుగు అంశాలు తప్పిస్తే మరేమీ కన్పించవు.
ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్య వార్త లోకానికి వెల్లడి కాగానే మొదటి చూపుడు వేలు సినిమా రంగం వైపే చూపించింది. అవునన్నా, కాదన్నా యివ్వాళ సినిమా రంగంలో  సామాన్యుడికి స్థానం లేదు.
ప్రపంచీకరణ విధానాలు ఆంధ్రదేశంలో అమలు కావడం మొదలయిన తర్వాత, ఆ విధానాలకు బలంగా ప్రభావితమయినది మాత్రం సినిమా రంగమే 1980 దశకం దాకా రాష్ట్రం ఎల్లలు దాటని సినిమా రంగం షూటింగ్‌లు, సినిమా వ్యాపారము 1990 తర్వాత మెల్ల మెల్లగానూ 2000 తర్వాత ఉధృతంగానూ విశ్వవ్యాప్తమయినాయి.

ప్రేమాభిషేకం లాంటి సినిమా ఇరవై, ముప్పై లక్షలులో తయారయిందంటే మనకు ఆశ్చర్యంగా ఉండవచ్చు. ఇవ్వాళ ‘‘కోటి’’ రూపాయల బడ్జెట్‌ లేకపోతే ఎంత చిన్న సినిమా అయినా తయారుకాదు. ఒకప్పుడు ‘‘అడవిరాముడు’’ అనే సినిమా రాష్ట్రవ్యాప్తంగా 27 ధియేటర్లలో విడుదల అయితేనే ఒక రికార్డు. కానీ ఇవ్వాళ సినిమా రెండు వేలకు పైగా ధియేటర్లలో విడుదల అవుతుంది పెట్టుబడి వరదలాగా చిత్రసీమలోకి వచ్చి చేరుతున్నది ప్రభుత్వ రాయితీలూ యింతకు ముందు కంటే పదిరెట్లు పెరిగాయి. ఇన్ని సానుకూల అంశాలు ఉన్నప్పుడు చిత్రసీమ కళకళలాడుతూ ఉండాలికదా… అలా వుండలేదు ఎందుకని?
దీనికి ప్రధానమయిన కారణం కేంద్రీకరణ, పెట్టుబడి, అవకాశాలు, మార్కెటీకరణ లాంటి అన్ని అంశాలలో కేంద్రీకరణ కేవలం నాలుగయిదు కుటుంబాలకే పరిమితం కావడంతో ఈ దుస్థితి ఏర్పడిరది. ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్య వార్త వినగానే ఏ రాజకీయాలూ తెలియని ఒక సినిమా ప్రేమికుడి ప్రతిస్పందన ‘‘తొక్కేశారు’’అని.
అక్కినేని కుటుంబం నుండి అయిదుగురు నటులు చిరంజీవి కుటుంబం నుండి ఐదుగురు నటులు, దగ్గుబాటి కుటుంబం నుండి ఇద్దరు నటులు, మంచు వంశం నుండి నలుగురు నటులు ఇవ్వాళ ఇండస్ట్రీలో ఉన్నారు. వీళ్ళ అధీనంలోనే రాష్ట్రంలో తొంభైశాతానికి పైగా ధియేటర్లు వున్నాయి, వీళ్ళ చేతుల్లోనే మీడియా వుంది. దర్శకులు, నిర్మాతలు కుటుంబాల వారీగా విడిపోయారు ఈ నటులు ఎవరిని చెపితే వారినే తీసుకునే స్థితిలో వున్నారు చిన్న సినిమాకు, చిన్న నటులకు అవకాశం ఎండమావి.
ఈ పెద్ద కుటుంబాలలోని హీరోలకి ఒక్క హిట్‌ వస్తే చాలు పది, పదిహేను మంది నిర్మాతలు క్యూ కడతారు. ఆ పదింటిలో మరొక్క హిట్‌ వస్తే మరొక పది, పదిహేను సినిమాలు చేతిలోకి వస్తాయి. ఈ హీరోల సినిమాలకి ఆయా సామాజిక వర్గాలకి చెందిన రాజకీయ పార్టీలు, యువజన సంఘాలు వెన్నుదన్నుగా నిలుస్తాయి. లక్షలు వెచ్చించి కాంప్లిమెంటరీ టిక్కెట్లు కొంటాయి మీడియా సినిమా వసూళ్లు ఇన్ని కోట్లు దాటాయి అన్ని కోట్లు దాటాయి అని ప్రచారంతో హోరెత్తిస్తుంది. ఇన్ని సౌకర్యాలు చిన్న సినిమాకు ఏవి? చిన్న సినిమాకు ధియేటర్లు దొరకటమే కష్టం, దొరికినా ‘‘సినిమా బావుంది’’ అనే మౌత్‌ పబ్లిసిటీ వ్యాపించే లోగానే ధియేటర్ల నుండి ఆ సినిమాను ఎత్తేస్తారు అందుకేనేమో చిన్న సినిమాల వైపుకి వెళ్లకుండా ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కలసి ఒక పెద్ద హీరో సినిమాను ఇవ్వాళ తీస్తున్నారు. ఒక పెద్ద హీరో సినిమాకు ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. ఇక నిర్మాతలు, దర్శకులు అయితే తమ సృజనాత్మకతను అంతా ఆ పెద్ద హీరోల ప్రాపకం కోసం ఖర్చు పెడుతున్నారు. ఇటీవల ఒక ఆడియో ఫంక్షన్‌లో ఒక నిర్మాత ‘‘నాన్నా దేవుడు ఎలా వుంటాడు?’’ అని మా అబ్బాయి అడిగితే గదిలోకి తీసుకెళ్లి ఫలానా హీరో ఫోటో చూపించాను అని చెప్పడం ఈ కేంద్రీకరణకి పరాకాష్ట.
నాగార్జున మొదటి సినిమా ‘విక్రమ్‌’ నాగేశ్వరరావుగారి అబ్బాయి ఎలా చేశాడో అన్న ఉత్సుకతతో జనం చూశారు. తరువాత కెప్టెన్‌ నాగార్జున, అరణ్యకాండ, మజ్నూ వరకు వరుస ఫ్లాప్‌లు. బాలకృష్ణకి సుల్తాన్‌, కృష్ణబాబు, రాణా సమయంలో వరుస అపజయాలు. చిరంజీవి ఏకంగా సంవత్సరంపాటు ముఖానికి రంగేసుకోలేదు, ఫెయిల్యూర్‌కి భయపడి అయినా వాళ్లంతా ఎలా నిలదొక్కుకున్నారు వారి వెనుక బలమయిన డబ్బువుంది. దాన్ని మించిన అక్కినేని ఫ్యామిలీ, నందమూరి వంశం చిరంజీవి మెగాస్టారిజం అనే దుర్బేధ్యమయిన గోడలు వున్నాయి. ‘‘మనవాడు పడిపోకూడదు’’ అని కాపు కాసిన కుల సంఘాలు ఉన్నాయి.  ఉదయ్‌ కిరణ్‌ వెనుక యివేమీ లేవు.
ఇవ్వాళ ఉదయ్‌ కిరణ్‌ అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకున్నాడు ఇంతకు ముందే ఒక నిర్మాత ఒక భారీ సినిమా నిర్మించి విడుదల చెయ్యలేక హుస్సేన్‌ సాగర్‌ లో దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు మరో నిర్మాత బాగా నడుస్తున్న సినిమాను మరో పెద్ద హీరో సినిమా కోసం ధియేటర్‌ నుండి తీసివేస్తున్నారని ‘‘కూకట్‌ పల్లి’’ చౌరస్తాలో  ధర్నా చేసి పోలీస్‌ కేస్‌ పెట్టాడు.
ఇవన్నీ చదువుతుంటే మీకు ఏం అనిపిస్తోంది? కె.వి. రెడ్డి, బి.ఎన్‌. రెడ్డి తరంలో సినిమా ఒక కళ. అది ప్రజల ప్రయోజనాలని కలవరించింది, కాంక్షించింది.
బాపు, విశ్వనాధ్‌, దాసరినారాయణరావుల తరంలో ‘సినిమా’ కళాత్మక వ్యాపారం కళాత్మక విలువలు కాపాడుకుంటూనే వ్యాపార సూత్రాలను అందిపుచ్చుకుంది.
ఎస్‌.ఎస్‌ రాజమౌళి, వి.వి. వినాయక్‌ల తరంలో సినిమా కళకాదు, వ్యాపారమూ కాదు. డబ్బు తయారుచేసే యంత్రం. వ్యాపారంలో, యుద్ధంలో కొన్ని నైతిక సూత్రాలు, విలువలు వుంటాయి కానీ యంత్రానికి అదేమీ తెలియదు. మానవీయ స్పర్శ ఇప్పటి సినిమాకు లేదు.
విశ్వనాధ్‌ ప్రతి సినిమాకు ‘‘ఎస్‌’’ అనే అక్షరంతో మొదలయ్యే పేరు పెడతానో, మూడు అక్షరాల పేర్లు మహేష్‌ బాబుకి కలసి వస్తుందనో, వి.వి. వినాయక్‌ హీరోయిన్‌కి ‘నందిని’ అనే పేరు పెడితే హిట్‌ అవుతుందనో, కృష్ణవంశీ సినిమాలో హీరోయిన్‌ ఎప్పుడూ ‘‘మహాలక్ష్మీ’’ అనో సినిమా పరిశ్రమకి సెంటిమెంట్లు ఎక్కువ అని మనం అనుకుంటాం కానీ… సెంటిమెంట్‌ లేనిదే సినిమా పరిశ్రమలో!
సెంటిమెంట్‌ అంటే ఒక మానవీయ స్పర్శ. సెంటిమెంట్‌ అంటే భావోద్వేగాల కలబోత. సెంటిమెంట్‌ అంటే మనిషి పట్ల ప్రేమ, సెంటిమెంట్‌ అంటే మనిషిని సొంతం చేసుకునే గుణం ఇవేవీ ఇవ్వాళ ఇండష్ట్రీకి లేవు.
అందుకే ఉదయ్‌కిరణ్‌ గురించి నాలుగు మంచి మాటలు చెప్పిన సిన జీవుల ముఖాల మీద దు:ఖం సగం కరిగిన మేకప్‌ లాగా కనిపించింది.
ఇక రెండో చూపుడు వేలు సమాజం ఆంధ్రదేశంలో ఎన్నికలు ఏడో ఋతువు అన్నాడు నగ్నముని, ఎనిమిదో ఋతువు కూడా వుంది అది ఆత్మహత్య. ఉద్యమాల పేరుతో, వ్యవసాయ రంగం సంక్షోభం పేరుతో, మానసిక ఒత్తిడి పేరుతో ఈ పదిహేనేళ్ల కాలంలో ఆంధ్రదేశంలో ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య కనీసంలో కనీసం యాభైవేలు పదిహేనేళ్ల కాలంలో ఆత్మహత్యల్లో ఆంధ్రదేశ పోగ్రెస్‌ రిపోర్ట్‌ యాభైవేలు.
ఇది ఏ రకంగా చూసినా ఆందోళన కలిగించే విషయమే నిర్భయ ఉదంతం జరిగినప్పుడు ఒక టి.వి ఛానల్‌ ఢల్లీిలో జరిగిన కొవ్వొత్తుల ప్రదర్శన ‘‘లైవ్‌’’ లో చూపించింది. విరామ సమయంలో అది చూపించిన ప్రకటన గుర్తుందా? ‘‘అమ్మాయిలను పడగొట్టడం ఎలా?’’ అనే విరాట్‌ కోహ్లి ప్రకటన నిర్భయకి నివాళులు అర్పిస్తూనే ఈ ప్రకటనను చూసి మనం ఆనందించాం అంటే మన చైతన్యస్థాయి ఏ రకంగా వుందో తెలుస్తూనే వుంది.
ఇలాంటి సమాజం ‘‘ఆత్మహత్యలు’’ లాంటి మానసిక సంక్షోభాలను ఎలా దాటుతుంది? ఒక ఆత్మహత్య జరిగినప్పుడు కవులు ఒక కవిత రాసి, ఒక కవిత్వ సంకలనం వేసి తమ బాధ్యత తీరిపోయింది అనుకుంటారు. సామాజిక అధ్యయన పరులు రెండురోజులు ఓపెన్‌ ఫోరంలలోనూ, బిగ్‌ డిబేట్లలోనూ చర్చోపచర్చలు చేసి తమ పని అయిపోయింది అనుకుంటారు. ఎవరికి వారు తమ తమ లోకంలోకి జారుకుంటారు ఒక సమగ్రమయిన కార్యచరణ తీసుకుని ముందుకి కదలరు ఎందుకని? ఇవ్వాళ ప్రతి మనిషీ ఒక ఒంటరి ద్వీపం భౌతికంగా అతడు సమాజంలో నివశిస్తున్నాడు తప్పిస్తే దానితో అతనికేమీ సంబంధం లేదు అతడొక ఒంటరి ద్వీపం అతడొక రహస్యగాయం అతడు ఏ పరమార్ధాన్ని కౌగిలించుకోలేని నిలువెత్తు స్వార్ధం. అతడొక కాగితం పువ్వు.
అందుకే ఈ సమాజంలో ఆత్మహత్యలు అనేవి ‘‘ఎనిమిదో’’ ఋతువు అనేది.
ఇక మూడవ చూపుడు వేలు ప్రేమరాహిత్యం. ఉదయ్‌కిరణ్‌ మృతశరీరాన్ని తీసుకోవడానికి తండ్రి నిరాకరించాడన్న వార్త కలచివేసింది తండ్రి వంద తప్పులు చేసి వుండ వచ్చు కొడుకూ వంద తప్పులు చేసి వుండవచ్చు ఆ తప్పులు తండ్రులవీ, కొడుకులవీ తప్పిస్తే తండ్రీకొడుకుల బంధానిది కాదుకదా!
‘‘అంగా దంగాత్సంభవతి నిజస్నేహజో దేహసౌర:
ప్రాదుర్భూయ స్థితి ఇవ బహిశ్చేతనా ధాతురేక:
సాంద్రానంద క్షుభిత హృదయ ప్రస్రవేణావస్తికం
గాఢాశ్లేషస్సహిమమ హిమశ్చ్యోత మాశంసతవ’’
అంటాడు ఉత్తరరామ చరిత్రలో భవభూతి. పుత్రుడి శరీరం తండ్రి ప్రతి అంగం నుండి ఉదయిస్తుందట అంటే తనే మరోసారి పుడతాడన్న మాట. అలాంటి పుత్రుడు విగతజీవిగా పడివున్నప్పుడు తండ్రి నిరాకరించాడంటే  ఆ బంధం ప్రేమాన్వితం అనాలా? ప్రేమరాహిత్యం అనాలా? ఈ ప్రేమరాహిత్య మూలం కూడా సామాజిక మూలంలోనే దాగి వుంది.

భార్య అంటే భర్తకి ప్రేమ వుండదు. భర్త అంటే భార్యకు ప్రేమ వుండదు తల్లి దండ్రులు పిల్లలని తమ కోరికలకి ప్రతిరూపం కావాలని అనుకుంటారు. కానీ వాళ్లకీ ఒక లోకం ఉందని గ్రహించరు మనుషుల మధ్య మిగిలీ మిగలని మానవ సంబంధాలని కలిపి విడదీస్తున్న ఊహా మేఘం డబ్బు. డబ్బులేని చోట ప్రేమ వుంటుందా? డబ్బుకొద్దీ ప్రేమ అని బాలచందర్‌ ఊరికే అన్నాడా…? ఇటీవలి సినీ నటి అంజలి ఎపిసోడ్‌ గుర్తుందా?

ఇక చివరి చూపుడు వేలు ఉదయ్‌ కిరణ్‌  చివరగా చెపుతున్నా మొదట చెప్పవలసింది ఉదయ్‌ కిరణ్‌ గురించి…!
అవును ఉదయ్‌ కిరణ్‌ హత్యకి అతడే కారణం మన పక్కంటి పిల్లాడిలాగా కనిపించే ఉదయ్‌ కిరణ్‌ మన పక్కింటి పిల్లాడి  లాగానే ఒత్తిడి తట్టుకోలేకపోయాడా? 2000 నుండి 2013 వరకు సినిమా రంగంలో వున్నాడు కదా…! ఆ మాయాజలతారు మృదుచేలాంచలములకొసగాలుల విసురు పట్టుకోలేక పోయాడా? ఆ పాకుడు రాళ్లమీద కాలు బలంగా నిలపలేక పోయాడా?

ఒక రంగంలో వైఫల్యం ఎదురయినప్పుడు మరోరంగాన్ని ఎంచుకోవాలనే ప్రాప్త కాలజ్ఞత ఎందుకు లోపించింది? జీవితాన్ని సున్నా నుండి ప్రారంభించి గెలవగలిగే ఆత్మస్థైర్యాన్ని ఎందుకు కోల్పోయాడు. జీవితాన్ని ఒంటరిగా గెలవాలనే విషయాన్ని ఎందుకు మర్చిపోయాడు తను పోషించిన పాత్రలను తనెందుకు మనసులోకి తీసుకోలేక పోయాడు? శిఖరం మీద ఎవరూ ఎల్లకాలం ఉండరనే విషయం త్వరగానే గ్రహింపుకి వచ్చివుండాలి కదా..

ఒక విజయం ఆత్మవిశ్వాస స్థాయిని పెంచుతుంది. ఒక అపజయం ఆత్మవిశ్వాస స్థాయిని పడవేస్తుంది నిజమే! ప్రాణం పోసే శక్తి మనకు లేనప్పుడు ప్రాణం తీసుకునే హక్కు మనకు ఉందా అనేదే అసలు ప్రశ్న…బ్రతకడానికి వందకారణాలు అవసరం లేదు ఒక్క కారణం చాలు ఎందుకంటే జీవితం ఒక్కటే కనుక. మరణానికే వంద కారణాలు కావాలి.

ఏదయితేనేం హృదయ కమలం వాడిపోయింది. ఉదయ్‌కిరణ్‌ ఇక లేడు. అతడి పందొమ్మిది సినిమాలు అతడి మరణాంతరం కూడా జీవిస్తాయి.
అతడి మరణం నుండి అయినా చిత్రసీమ పాఠం నేర్చుకుంటుందా? దాసరి నారాయణరావు, తమ్మారెడ్డి భరద్వాజ లాంటి పెద్దలు సీరియస్‌గా ఆలోచిస్తారా…. సగటు సినీ ప్రేమికుడిగా అడుగుతున్న ప్రశ్నలకు స్పందిస్తారా…. లేక ఇది ఒక కామా మాత్రమేనా…..?

 – వంశీ కృష్ణ

తెలుగు సినిమాకు మడి కట్టిన మిథునం

midhunam3

ఇంత ఆలస్యంగా ఇపుడెందుకు అనేది ముందుగా మాట్లాడుకోవాలి. మిధునం తెరపై చేసిన హడావుడి కంటే తెరవెనుక చేస్తున్న హడావుడి ఎక్కువ. అదిప్పటికీ తెగట్లేదు. ఇంకా  తెలుగు సినిమా ప్రేక్షకుల అభిరుచి లోపం గురించి బాధపడుతున్నవారూ, ఇంతటి సంస్కారవంతమైన సినిమాను ఆదరించలేని మన దౌర్భాగ్యం గురించి వగచుతున్న వారూ   ఇంటర్‌నెట్లో కనిపిస్తూనే ఉన్నారు. కాస్తో కూస్తో ఆరోగ్యంగా ఆలోచిస్తారని భావించేవారు కూడా ఈ శోకగీతంలో తమవంతుగా గొంతు కలుపుతున్నారు. మిధునం గురించి ఎవరో ఏదో  విమర్శనాత్మకంగా మాట్లాడారని తెలిసి ఇంత మంచి సినిమాను మెచ్చుకోవడానికి సంస్కారం ఉండాలి అని ఒక్కవాక్యంలో తిట్టిపోశారు ఒక కవిమిత్రుడు. ఆ మధ్య పాలపిట్ట అనే  మ్యాగజైన్‌లో ఇంకొక వ్యాఖ్య చేసి ఉన్నారు. ఇంత గొప్ప సినిమాను విమర్శించడానికి అసలు ఎవరికైనా నోరెలా వస్తుంది అన్నది సారాంశం. అభిరుచి కలిగిన మరికొందరు సాహితీ  మిత్రుల ధోరణి కూడా అలాగే ఉంది. ఒక సినిమా గురించి ఇన్ని తప్పుడు అభిప్రాయాలు అచ్చోసి వదిలేస్తా ఉంటే చూస్తూ ఊరుకోవడం సామాజికుల పని కాదు. బెటర్‌ లేట్‌ దెన్‌ నెవర్‌.

మిధునం గురించి తరచుగా వినపడే మాటలేమిటి? అది సంస్కారవంతమైన సినిమా.  మానవసంబంధాలను ఉన్నతీకరించిన సినిమా. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య  అనుబంధాన్ని అపురూపంగా చిత్రించిన సినిమా. నగరజీవనంలో మృగ్యమైపోతున్న సున్నితమైన అంశాలను ఎత్తిపట్టిన సినిమా. ఎక్కడికి పరిగెడుతున్నామో ఎందుకు  పరిగెడుతున్నామో తెలీని మ్యాడ్‌ రష్‌లోంచి బయటకు వచ్చి మనలోపలికి మనం తరచి చూసుకునేలా చేసిన సినిమా. కొంచెం అటూ ఇటూగా ఇలాంటివే. సంస్కారం అనే పదం  వినిపించినంతగా సెన్సిబిల్‌ సినిమా అని వినపడదు. సెన్సిబిల్ అనేది సాధారణంగా విలువలకు సంబంధించిన పదంగా వాడుతున్నాం. అస్తిత్వ్‌ సెన్సిబిల్‌ సినిమా, షిప్‌ ఆఫ్‌ థీసెస్‌  సెన్సిబిల్‌ సినిమా అంటాం. కానీ సంస్కారం కథ వేరు. ఎలాగైనా వాడుకోదగిన ఎలాస్టిసిటీ ఉన్న పదం.  సంస్కారం, సంప్రదాయం, ధర్మం స్టేటస్‌ కోయిస్టులకు ఇష్టమైన పదాలు. అవి  వ్యవస్థీకృత విలువలకు సాంస్కృతికపరమైన ఔన్నత్యాన్ని కట్టబెట్టే పదాలు. అందరూ కావాలని అదే అర్థంతో వాడతారని కాదు. కానీ వాడుకలో స్థిరపడిన రూఢి అర్థమైతే అదే.

ఇంతకూ ఏమిటీ సినిమా? శ్రీరమణ గారి మిధునం కథకు  తెరనుకరణ. ఒక పల్లెటూరులో విశాలమైన  పెరడు, చేద బావి, లతలు, తీగలు, చెట్లు చేమలు, గొడ్డూ గోదాతో  పెనవేసుకున్న ఆలుమగల అనుబంధం. సంప్రదాయంగా వస్తున్న ప్రచారానికి అనుగుణంగా కనిపించే స్టీరియోటైప్‌ తిండిపోతు అప్పదాసు, బుచ్చిలక్ష్మి దంపతుల కథ.  సోమయాజి,  సోమిదేవమ్మలకు ఆధునిక రూపమన్నమాట. ముగ్గులు వేయడాలు, ఇల్లు అలకడాలు, నోములు, పూజలు, ఆలుమగల మధ్య అలకలు, చిలిపి సరదాలు, అప్పలస్వామి  తిండియావకు సంబంధించిన రుచులూ, సంప్రదాయ జీవనవిధానానికి సంబంధించిన అభిరుచులూ అన్నీ కలగలిపి కట్టిన ఇంగువ మూట ఈ సినిమా. ఇద్దరే పాత్రలు. లంకంత కొంప.  అందులో చెప్పన్నారు తీగలు, చెట్లు. అన్నీ నేరుగా కోసుకుని తినేయడమే. అప్పదాసు తన పనులన్నీ చేసుకోవడమేకాదు, ఇతరులు చేసే పనులను కూడా నశ్యం పీల్చినంత వీజీగా  చేసేస్తూ ఉంటాడు. దూది ఏకుతాడు. కుండలు చేస్తాడు. బంగారం పని చేస్తాడు. చెప్పులూ కుడతాడు. సినిమాలో విశ్వనాధ్‌ ఎక్కువగానే కనిపిస్తారు. బాపు అపుడపుడు కనిపిస్తారు.  సంప్రదాయ జీవనవిధానాన్ని ఆకాశానికెత్తుతూనే ఆధునికతతో భాగంగా వచ్చిన పర్యావరణ స్పృహను, ప్రైవసీ భావనను కలిపి కొట్టడం తెలివైన ఎత్తుగడ.

timthumb.php

60దాటిన అమ్మానాన్నల ప్రేమ కథ అని ఒకట్యాగ్ లైన్‌ ప్రచారం చేశారు. ఈ అమ్మ “కాలుమోపితే ఎండిపోయిన కందిచేను పూత పెట్టే లచ్చుమమ్మ” కాదు. “ఎద్దోలె ఎనుకాకు  ఒక్కొక్క అడుగేసి నాట్లేసి నాట్లేసే లచ్చుమమ్మ” కాదు.   ఎకరాలకెకరాల చెట్లను, గొడ్డుగోదలను చిరునవ్వు తొణక్కుండా పోషించే సూపర్‌మామ్‌ బుచ్చిలక్ష్మి. ఆ నాన్న కూడా “శిలువ  మోస్తున్న ఏసుక్రీస్తులా నాగలి భుజాన వేసుకున్న” రైతో మరొకరో  కాదు. శిష్ట జీవనం సాగిస్తూనే సహస్రవృత్తుల సమస్త చిహ్నాలను తనలోనే ప్రదర్శించే సూపర్‌మాన్‌ అప్పదాసు.   శ్రమైక జీవన సౌందర్యం అని శ్రీశ్రీ అన్నాడు కదాని శ్రమను మరీ ఇంత అందంగా చూపిద్దామంటే ఎలాగండీ భరణి గారూ! శారీరక శ్రమ మరీ అంత గ్లామరస్‌గా ఏమీ ఉండదండి! అది  కష్టజీవులకందరికీ తెలుసండీ. శ్రమను గౌరవించడమంటే దాన్ని గ్లామరైజ్‌ చేసిచూపడం కాదండీ! ఆధునిక పరిశ్రమ వృత్తులు అనే బానిసత్వంలో మగ్గిపోయిన మనుషులకు కొత్త  వెలుగు చూపించింది. శ్రమచేసే కులాలకు వెసులుబాటునిచ్చింది. “వేల సంవత్సరాలుగా చలనం లేకుండా పడి ఉన్న” భారతీయ సామాజక వ్యవస్థలో ఆధునిక పరిశ్రమ కుదుపు  తెచ్చింది. రైళ్ల ప్రవేశంతో ఏమేం జరుగుతాయని విశ్వనాధ సత్యనారాయణ బెంగటిల్లాడో అవన్నీ ఇపుడు జరుగుతున్నాయి. చెప్పుల గూటాల నుంచి, మగ్గం గుంతల నుంచి కొలిమి  మంటలనుంచి బయటపడడం వల్లే ఇవాళ అలాంటి కులాల పిల్లలు చాలా మంది అంతకుముందెన్నడూ చూడని రీతిలో డాక్టర్లు, లాయర్లు, కంప్యూటర్‌ ఇంజనీర్లు అయి సామాజిక  సంపదలో తమవంతు వాటా అందుకునే ప్రయత్నంలో ఉన్నారు. అంతకు ముందు తమను చిన్నచూపు చూసినవారి సరసన కూర్చోగలుగుతున్నారు.  మళ్లీ ఇపుడు వృత్తులను  ఆరాధించే పద్ధతిలో  వాటి చిహ్నాలను చూపిస్తే  అబ్బో, మమ్మల్ని గౌరవించాడు అని ఎగబడి చూడాలా! ఏమియా ఇది! ఏమి మాయయా ఇది!

 

అప్పదాసు స్వర్గానికి సెంటీమీటర్‌ దూరంలో అని వర్ణించే రుచులు తెలుగునాట కేవలం ఐదు శాతం లోపువారి రుచులు. ఆ వ్రతాలు, నోములు, వగైరా కూడా మైనార్టీ వ్యవహారమే.  అయినా సరే, ఇది తెలుగువారు సగర్వంగా ఎగరేసిన పతాకం, తెలుగుదనానికి అచ్చమైన చిరునామా, తెలుగోడి సత్తా లాంటి మాటలు బోలెడన్ని వినిపించాయి. వినిపిస్తూనే  ఉన్నాయి. కేవలం ఐదు శాతం లోపు ఉన్నవారిలోని సంప్రదాయవాదుల ఆచార వ్యవహారాలు, వారి గోములు, అలకలు, చిలిపితనాలు మొత్తం తెలుగుదనానికి పర్యాయపదంగా  చాటగలిగిన ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది? ఆ ప్రచారాన్ని నోరుమూసుకుని చూసే దశకు  మనం ఎందుకు చేరుకున్నాం? ఒక కులం చిహ్నాలు కనిపించినంత మాత్రాన దాన్ని  వ్యతిరేకించాలా, అందరికీ వర్తించే కొన్ని అనుభూతులుంటాయి కదా అనే ప్రశ్నలు తలెత్తొచ్చు. అంతవరకే ఉంటే సమస్య లేదు. సినిమాను సినిమాగా చూసి మంచిచెడ్డల గురించి  మాట్లాడొచ్చు. కానీ ఇది తెలుగు సంస్కృతి,సంస్కారం అనడంలోనే అసలు సంగతి దాగిఉంది. కొలకలూరి ఇనాక్‌ కథనో, నాగప్పగారి సుందర్రాజు కథనో, వేముల ఎల్లయ్య కక్కనో ఇలాగే  సినిమా తీసి ఇది తెలుగు సంస్కృతి అంటే ఇలాగే ఆమోదించి ఉండేవారా? గ్రామీణజీవితాన్ని నిజాయితీగా చిత్రించిన నామిని, బండినారాయణస్వామి కథలను సినిమాలుగా తీస్తే  ఇలాగే తెలుగు సంస్కృతి అని నెత్తిన పెట్టుకునే వారా? ఇలాంటి ప్రశ్నలు వేసుకోకపోవడంలోనే బానిసత్వం ఉంది. సమాజంలో ఆధిపత్యంలో ఉన్నవారి సంస్కృతే మొత్తం సమాజపు  సంస్కృతిగా ప్రచారంలో ఉంటుంది. ఇతరులది ఇతరంగానే ఉంటుంది. పట్టణీకరణతో ఆధిపత్య ప్రదర్శనకు అవకాశం లేకుండా పోయిన కులాలు ఏదో రూపంలో తిరిగి తలెగరేయడానికి  ప్రయత్నిస్తా ఉన్నాయి. తెలుగు సమాజంలో ఆర్థిక రాజకీయ ఆధిపత్యం కోల్పోయి చాలాకాలమే అయినా సంస్కృతి విషయంలో పట్టు నిలుపుకోవడానికి బ్రాహ్మణవాదులు  పెనుగులాడుతూ ఉన్నారు. ఇదే సమయంలో కొంతమంది ఇతర అగ్రవర్ణ లిబరల్స్‌లో కూడా నగరీకరణ మీద విసుగు కనిపిస్తోంది. నగరజీవితపు పరుగుపందెంపై నిరసనా,  పల్లెజీవితంతో పాటు కోల్పోయిన ఆనందాలపై వలపోత ఇతరత్రా సమూహాలకు పాకుతున్నది. ముఖ్యంగా పట్టణీకరణవల్ల ప్రయోజనాలు పొందడంలో ముందున్న సమూహాల్లో.  ఆయా కుటుంబాల్లో రెండో అర్బన్‌తరం కూడా వచ్చేసి ఉంటుంది. ఇతరత్రా ఆధిపత్యాన్ని సవాల్ చేయలేనపుడు ఈ రకంగా ఆమోదనీయమైన మార్గంలో ముందుకు రావాలని ఆ  సమూహం ప్రయత్నిస్తోంది. భాష పేరుతో సంస్కృతి పేరుతో ముందుకొస్తున్న బృందాలను, వారి భాషను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఇరవై యేళ్ల క్రితం హైదరాబాద్‌  శంకర్‌మఠ్‌, విద్యానగర్‌ లకు చెందిన వృద్ధులు సాయంత్రాల్లో ఆర్ట్స్‌ కాలేజీ రైల్వేస్టేషన్‌ బెంచీలమీద సాయంత్రం కూర్చుని అమెరికాలోని సంతానం గురించి బెంగగా గోముగా చిరుకోపంగా  మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు. ఇపుడు అలాంటి వృద్ధులు అన్ని ప్రాంతాల్లో అన్ని కులాల్లో పెరిగిపోయారు.

వాళ్లు పిల్లలను అడగాల్సిన అవసరం లేకుండా ఖర్చు చేసుకునే స్వ్చేఛ్చ ఉండాలనుకుంటారు. పట్నవాసపు ఉద్యోగ జీవితాలు, నెలవారీ పెన్షన్లు, అద్దెలు మధ్యతరగతి వృద్ధులకు  అలాంటి అవకాశాన్ని కల్పించాయి. అలాగే ఆధునికతతో పాటు వచ్చిన ప్రైవసీ అనే భావన పల్లెటూరి వృద్ధులకు లేని ఒక అదనపు సౌకర్యాన్ని వారికి కల్పించింది.  అదే సమయంలో  పల్లెటూరి మాదిరి(ఇది కూడా భ్రమే) కొడుకు కోడళ్లపై కొంతైనా పెద్దరికం చెలాయిద్దామని ఉంటుంది.  మనమడు, మనుమరాలు కంప్యూటర్లతోనో ఫ్రెండ్స్‌ తోనో కాకుండా తమ ఒడిలో  కబుర్లు చెప్పుకుంటూ, కొడుకు కోడళ్లు అన్ని విషయాల్లో సలహాలడుగుతూ ఉంటే బాగుండునని కూడా ఉంటుంది. వృద్ధులనే కాదు, పల్లె, పట్టణ జీవితం రెండూ తెలిసిన తరంలో  చాలామందికి రెంటిలోని సానుకూలమైన అంశాలను అందుకోవాలని ఉంటుంది.  రెండు జీవన విధానాలకు మధ్య వైరుధ్యం ఉన్నదని తెలిసినప్పటికీ ఒకదాన్ని వదులుకోవడానికి  మనసు అంగీకరించదు. ఆచరణలోనేమో ఆర్థికాభివృద్ధికి అవసరమైన వలసబాటలో పయనిస్తారు.  గ్రామీణ జీవనంలో కోల్పోయిన ‘ఆనందాల’ కోసం గొణుగుతూ ఉంటారు. ఎన్‌ఆర్‌ఐల్లో  ఈ వలపోత మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆకలి తీరిన మనిషి ఆనక తనదైన సొంత అస్తిత్వం కోసం ఆరాటపడతాడు. అక్కడ సొంత అస్తిత్వాన్ని  విజువల్‌గా చూపించుకోవడానికి భరతనాట్యాలు, బతుకమ్మలు ఆడుతుంటారు. పర్వాలేదు. మనకు తెలుగు భాషా సంస్కృతుల రక్షణ గురించి ఉపన్యాసాలు ఇవ్వనంత వరకూ అది  అర్థం చేసుకోదగిన ఆరాటమే.. పల్లెటూరి జీవన విధానం పట్ల ఉన్న గ్లామర్‌ను, పట్టణాలకు మాత్రమే పరిమితమైన ప్రైవసీ అనే కాన్సెప్ట్‌ని కలిపి వడ్డించింది ఈ సినిమా. రెండూ అతకని  విషయాలు. అందుకే ఈ సినిమా శిల్పారామంలో ప్రదర్శించే పల్లెలూరి ఇల్లులాగా ఉంది తప్పితే సహజంగా లేదు. పట్టణీకరణ ఆరంభదశలో అంటే 60, 70ల కాలంలో తెలుగుసినిమా  “రెక్కలు వచ్చి పిల్లలు వెళ్లారు, రెక్కలు అలిసి మీరున్నారు, పండుటాకులమై మిగిలేము” అని పాడుకుంది. పట్నపు కోడలనగానే మిడ్డీనో గౌనో వేసి నోట్లో సిగరెట్‌ పెట్టి నానా యాగీ  చేసింది. నాటి పల్లె నేటి పట్నమయ్యింది. నాటి పట్నం ఇపుడు అమెరికా అయ్యింది.  కాకపోతే పల్లె పట్టణాన్నిఆడిపోసుకున్నంత ఈజీగా ఆడిపోసుకోవడం కష్టం. సంపదను  చాలామందే అనుభవిస్తున్నారు. దగ్గరి బంధువో, స్నేహితుడో ఎవరో ఒకరు అమెరికాలో లేని మధ్యతరగతి ఇల్లు ఒక్కటి కూడా కానరాని స్థితి.  అందువల్ల ఆ భాష వదిలేసి దాని  బదులు ఉమ్మడి మిత్రుడు గ్రామం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు.  ప్రాక్టికల్‌గా మనం వెళ్లకపోయినా అలా అనుకుంటూ ఉండొచ్చు. అదొక అందమైన కలగా చూసుకుంటూ  ఉండొచ్చు. ఈ దశకు చాలామందే చేరుకున్నారు. ఈ పరిణామమే ఈ సినిమాకు ప్రేరణ.

ఇందులో సోమయాజుల వారు భార్య చీర ఉతకడం, ఆ సందర్భంగా ఏమిటండీ ఇది అని ఆమె కంగారుపడిపోతే ఆయనగారు రోమాంటిక్‌ డైలాగులు కొట్టడం లాంటి లిబరల్‌ షో  చేశారు. కానీ సోమయాజివారు తూగుటుయ్యాలలో పవ్వలిస్తుంటే సోమిదేవమ్మ గడపమీద కొంగుపర్చుకుని తలవాల్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఎవరెక్కడుండాలో అక్కడే  ఉండాలమ్మా! సరదాగా ఒక పూట రోల్‌ ఛేంజ్‌ చేసుకుంటాం కానీ పూర్తిస్థాయిలో మార్చుతామంటే ఊరుకోము! అంతేనా భరణిగారూ! “వంటావార్పూ, పిండిరుబ్బడం, బట్టలుతకడం,  ముగ్గువేయడం లాంటివన్నీ చేస్తా ఉంటే జబ్బులెందుకొస్తాయి” అని సోమయాజి ఉరఫ్‌ అప్పదాసు ఉరఫ్‌ భరణి గారు ఒక ఉపన్యాసమిస్తారు. ఈ పనులన్నీ ఎవరు చేసేవి? ఈ  ఉపదేశం ఎవరికిస్తున్నట్టు? ఒకసారి కాళ్లు పట్టిచ్చి, మరోసారి జడవేసి నాలుగు రొమాంటిక్‌ డైలాగులు చిలకరించినంత మాత్రాన సారం మారుతుందా!   ఏ సంప్రదాయ  జీవనవిధానమైనా స్ర్తీలను అణచివుంచేదే. ఆడవాళ్లను ఆడిపోసుకోవడమొక్కటే కాదు. ఇందులో మూఢనమ్మకపు ప్రచారమూ దాగి ఉంది. మనం కెమికల్స్‌ కూడు తిని అనారోగ్యంగా  తయారయ్యామని, గ్రామాల్లో  రోగాలు రొస్టులు లేకుండా ఇంతకంటే ఆరోగ్యంగా జీవిస్తారని  మేధావులకునేవారు కూడా నమ్మేస్తూ ఉంటారు. ఇది కూడా పల్లెజీవితం తెలీని గ్లామర్‌  వ్యవహారమే. పల్లెల్లో కనీసం రోగం పేరుకూడా తెలీకుండా రాలిపోతూ ఉంటారు. అది కేన్సర్‌ అని గుండెపోటు అని తెలీకుండా హఠాత్తుగా పోతే కాటికి మోసుకుపోతా ఉంటారు. చివరికి  మలేరియాతో కూడా చచ్చిపోవడమే. అక్కడ అరవై దాటితే కృష్ణా రామా అని మూలన కూర్చోవాల్సిన వయసుకు చేరుకున్నట్టే. వారి వారి ఆర్థిక స్థోమతను బట్టి ఈ వయసు కొంచెం  అటూ ఇటూగా ఉంటుంది. పెరిగిన ఆరోగ్యస్పృహతో మెరుగైన వైద్యసౌకర్యాలతో హెల్త్‌ చెకింగులతో, ఇన్సూరెన్స్‌లతో మనం వారికంటే మెరుగైన పరిస్థితుల్లో ఉన్నాం.  70ల్లో కూడా  టింగురంగా అంటూ టీషర్ట్‌, నిక్కరూ వేసుకుని తిరుగుతూ పల్లెలు మనకంటే ఆరోగ్యంగా ఉండేవని ఆడిపోసుకోవడం లేదా చొంగకార్చడం ‘అత్యాధునిక’ మాయ.

mithunam2

ఇదంతా రాజకీయమండీ, సినిమా గురించి మాట్లాడతారనుకుంటే ఇవన్నీ చెబితే ఎలాగండీ అనబోదురేమో! ఏది రాజకీయం కాదండీ!  మేమొక సినిమా తీశాం, మంచి సినిమా  తీశాం, అందమైన సినిమా తీశాం అని చెప్పుకోవచ్చు. ఎవరిది వారికి ఇంపుగానే ఉంటుంది కాబట్టి చెప్పుకోవడం వరకూ తప్పులేదు. చాలామంది చెపుతూనే ఉంటారు. కానీ తెలుగు,  సంస్కృతి, సంప్రదాయం వగైరా మాటలేటండీ! అది రాజకీయం కాదా అండీ!  అందులో సున్నితమైన అనుభూతులున్నాయి కదా వాటిమాటేమిటి, ఆ వరకు తీసుకుని సినిమాను  ప్రశంసించవచ్చుకదా అందురేమో! ఆ అనుభూతులను చూపించడంలో  నిజాయితీ కావాలి. ఈ సినిమాలో ఏ మాత్రం అలసట లేకుండా ఇద్దరు వృద్ధులు ఆ లంకంత కొంపను అన్ని  చెట్లను మెయిన్‌టెయిన్‌ చేస్తా ఉంటారు. చెప్పనలవి కానన్ని వంటలు చేసుకుంటా  ఉంటారు. ఆవులను గేదెలను పోషిస్తా ఉంటారు. మూడో మనిషి కనిపించడు. సాధ్యమా  ఇది?మామూలు మసాలా సినిమాలో ఒక హీరో వందమందిని కొట్టేయడానికి దీనికి తేడా ఏమైనా ఉందా! అంతేనా! ఆ ముసలాళ్లిద్దరూ ఉష్ర్టపక్షుల్లా మరో మనిషి అంటూ సొంటూ  లేకుండా జీవిస్తా ఉంటారు. ఇది ఏమి సామాజికత స్వామీ! ప్రైవసీ పేరుతో సాటి మనుషులకు దూరంగా బతికేయడం గొప్ప సంస్కృతా! వృద్ధులకు ఇతరుల మాదిరే ప్రైవసీ కచ్చితంగా  అవసరం. కానీ ఇలానా! అసలు మనిషి అనేవాడు(రు) ఇంత అన్‌సోషల్‌గా జీవించగలడా(రా)! చేదబావిని చూపించి నీళ్లు తోడుకోవడం అనేది ఆరోగ్యానికి అవసరమైన శ్రమ అని డైలాగ్‌  కొట్టించితిరి కదా, మరి గ్యాస్‌ స్టవ్‌ ఎందుకు వాడితిరి? అక్కడ కూడా నిప్పుల కుంపటి పెట్టి ఊదుతూ ఉంటే ఊపిరితిత్తులకు ఎక్సర్‌సైజ్‌ అని చెప్పించకపోయారా! అక్కడ కంఫర్ట్‌  కావాల్సివచ్చింది. అంటే దర్శకుడు చూపించదల్చుకున్న సింబాలిజమ్‌ మేరకు సంప్రదాయాన్ని, ఆధునికతను, సౌకర్యాలను టైలరింగ్‌ చేసుకున్నారని అర్థమవుతుంది. చేదబావి,  బాదం చెట్టు లాంటివి శిష్ట సంప్రదాయ జీవులు తమను తాము ఐడెంటిఫై చేసుకునే సింబల్స్‌. వాటిని డిస్ట్రబ్‌ చేయడం డైరక్టర్‌కు ఇష్టం లేదు. పైకి అభిరుచిప్రధానమైనదిగా  కనిపించినప్పటికీ సారాంశంలో ఈ సినిమా అందించేంది వేరు. ఇది పర్ణశాలలో విహరిస్తున్న జింకకాదు. మాయారూపంలోని మారీచుడు.

” రిటైర్‌మెంట్‌ తర్వాత ఊర్లో ఒక రిసార్టు లాంటిది కట్టుకుని అక్కడికి వెళ్లిపోవాలని చాలామందికి ఉంటుంది. వెళ్లరు. కానీ అలాంటి కల అయితే ఉంటుంది. వెళ్లినా వెళ్లకపోయినా  ఈ సినిమా ద్వారా అలాంటి వారికి ఆ అనుభూతిని క్రియేట్‌ చేసి పెట్టాం” అని భరణి ఒక ఇంటర్య్వూలో చెప్పారు. కరెక్ట్‌గా చెప్పారు. ఇది వారి సినిమానే. ఆచరణతో సంబంధం లేని  సంపన్న కోరికలు కాబట్టే ఇది హాలీవుడ్‌ ఏలియన్స్‌ సినిమాల మాదిరి ఉంటుంది. కాకపోతే అందులో అన్నీ అంతరిక్షపు హైటెక్‌ సామాగ్రి, ఇందులో ముగ్గులూ దప్పళాలున్నూ!

జి ఎస్‌ రామ్మోహన్‌