కాండీడ్-5

 

 

6వ అధ్యాయం

 

భూకంపంలో పట్టణం ముప్పావు భాగం నాశనమైంది. మిగతా పట్టణాన్ని కాపాడుకోవడానికి అధికారులు రంగంలోకి దిగారు. భూకంపాలను నివారించడానికి కొంతమందిని కనులపండువలా సెగమంటల్లో సజీవదహనం చేయడమే అమోఘమైన ఉపాయమని కొయింబ్రా విశ్వవిద్యాలయం అదివరకే ప్రకటించేయడంతో, ఆ దారి మినహా మరో పరిష్కారం తోచలేదు అధికారులకు.

వావీవరసా లేని పెళ్లి చేసుకున్న ఓ బాస్క్ జాతీయుణ్ని, భోంచేస్తుండగా కోడిమాంసంలో వచ్చిన పందిమాంసం ముక్కల్ని పక్కన పడేసిన ఇద్దరు యూదులను పట్టుకున్నారు. విందు పూర్తయ్యాక పాంగ్లాస్, కాండీడ్ లను బంధించారు. నానాచెత్తా వాగినందుకు గురువును, గంగిరెద్దులా విన్నందుకు శిష్యుణ్ని దోషులుగా తేల్చేశారు. ఇద్దరినీ విడివిడిగా.. సూర్యకాంతి సోకి ఇబ్బంది పెడుతుందన్న భయం లేశమాత్రం లేని నేలమాళిగల్లో పడేశారు. వారం తర్వాత బయటకు తీసుకొచ్చి బలి దుస్తులు తొడిగి, తలలపై పొడవాటి కాగితపు టోపీలు పెట్టారు. కాండీడ్ బట్టలు, టోపీపై.. కిందికి తిరగబడిన మంటలు, పంజాలు, తోకల్లేని దెయ్యాల బొమ్మలు ఉన్నాయి. పాంగ్లాస్ బట్టలు, టోపీపై ఉన్న దెయ్యాలకు మాత్రం పంజాలు, తోకలు ఉన్నాయి. మంటలు కూడా పైకి లేచాయి. తర్వాత వాళ్ల వెనక మేళతాళాలతో అట్టహాసంగా బలి జాతర ప్రారంభించారు. వీనుల విందైన చర్చి పాటలను కూడా పాండించారు. కాండీడ్ ఆ గానమాధుర్యంలో ఓలలాడుతుండగా శిక్ష కింద చెళ్లుమని కొరడా దెబ్బ పడింది. బాస్క్ జాతీయుణ్ని, ఇద్దరు పోర్చుగీసు యూదులను సజీవ దహనం చేశారు. పాంగ్లాస్ ను ఉరి తీశారు. బలి వేడుకలో ఉరితీత ఆచారం కాకపోయినా అలా చేశారు. సరిగ్గా అదే రోజు మళ్లీ భారీ భూకంపం వచ్చింది.

candid

 

ఒళ్లంతా నెత్తురోడుతున్న కాండీడ్ భయంతో గడగడ వణికిపోయాడు. ఆ వణుకులోనే గురువులా మీమాంసలో పడిపోయాడు. ‘లోకాలన్నింటిలో ఇదే సర్వోత్తమ లోకమైతే, ఇక ఆ మిగతా లోకాలెలా తగలడి ఉంటాయో? బల్గర్ల చేతిలో ఇదివరకే కొరడా దెబ్బలు తిన్నాను కనక ఇప్పుడీ దెబ్బలు పెద్ద విశేషమేమీ కాదు. కానీ పాంగ్లాస్ సంగతేంటి? తత్వవేత్తల్లో దిగ్గజం లాంటి ఆ పెద్దాయనను ఉరితీశారు. దీనికి కారణమేంటి? పరమోత్తముడైన జేమ్స్ రేవులో జలసమాధి కావడం ఈ ఘటనల పరంపరలో భాగమా? దారుణంగా హతమైపోయిన తరుణీమణి క్యూనెగొండ్ కు ఆ ఘోరం తగిందేనా?’

అలా ఉపదేశాలు, కొరడా దెబ్బలు, ఉపశమనాలు, దీవెనలు, ఆలోచనలు అన్నీ ముగించుకున్న కాండీడ్ గాయాల నొప్పితో నిల్చోలేక అవస్థ పడుతుండగా ఓ వృద్ధురాలు దగ్గరికొచ్చింది. ‘ధైర్యం చిక్కబట్టుకో అబ్బాయ్! మెల్లగా నా వెంట కదులు’ అంది.

 

7వ అధ్యాయం

 7chap

ధైర్యంగా ఉండాలని చెప్పడం మటుకైతే చాలా తేలిక. పాటించడమే కష్టం. కాండీడ్ ఎలాగోలా కూడదీసుకుని కాళ్లీడ్చుకుంటూ ముసలమ్మ వెంట నడిచాడు. ఆమె అతణ్ని చివికిపోయిన గుడిసెలోకి తీసుకెళ్లింది. తిండి, మంచినీళ్లు ముందు పెట్టింది. గాయాలకు కుండెడు లేపనం, తొడుక్కోవడానికి రెండు జతల బట్టలు ఇచ్చి, మెత్తని పక్క అమర్చింది.

‘భోంచేసి, ఈ రాత్రికి సుఖంగా నిద్రపో! అటోచా మేరీమతా, పడువా ఆంథోని, కాంపోస్టెలా జేమ్స్ అవధూతలు నిన్ను కంటికి రెప్పలా కాపాడుగాక! నేను రప్పొద్దున మళ్లీ వస్తా’ అంటూ వెళ్లబోయింది.

ఇంతవరకు పడ్డ కష్టనష్టాలకే తేరుకోలేకపోతున్న కాండీడ్ ఆ ముసలావిడ ఆదరణ చూసి మరింత చకితుడయ్యాడు. కృతజ్ఞతతో ఆమె చేతిని ముద్దాడబోయాడు.

‘ముద్దాడాల్సింది నా చేతిని కాదులే. తిరిగి రేపొస్తా. మందు పూసుకుని, శుభ్రంగా భోంచేసి, హాయిగా నిద్రపో’ అందామె.

కాండీడ్ తన ఇక్కట్లను క్షణంలోనే మరచిపోయి కడుపునిండా బుక్కి, కంటినిండా నిద్రపోయాడు. ముసలామె పొద్దున్నే అల్పాహారం తెచ్చింది. వీపు చూసి మందు రాసింది. మధ్యాహ్నం భోజనం తెచ్చింది. రాత్రీ  తెచ్చింది. ఆ మర్నాడూ ఈ సేవలను తేడా లేకుండా చేసింది.

‘ఎవరివమ్మా నువ్వు? నాపై నీకెందుకింత ఆపేక్షా, ఆదరణా? నీ ఉపకారానికి బదులుగా నేనేమివ్వగలను?’ అడిగాడు క్షతగాత్రుడు.

ఆమె బదులివ్వకుండా వెళ్లిపోయింది. మళ్లీ పొద్దుగూకగానే వచ్చిందిగాని, భోజనం మటుకు తేలేదు.

‘అబ్బాయ్! ఒక్క మాట కూడా మాట్లాడకుండా నాతో రా..’ అంటూ అతని చేయి పుచ్చుకుని దారి తీసింది.

పావు మైలు నడిచి ఊరిబయటి తోటల, కాలవల మధ్య ఏకాంతంగా ఉన్న భవనం వద్దకు తీసుకెళ్లింది. తలుపు తట్టగానే తెరచుకుంది. ముసలమ్మ అతణ్ని ఓ మూలలోని మెట్లెక్కించి అందంగా అలంకరించిన గదిలోకి తీసుకెళ్లింది. పెద్ద ఆసనంపై కూర్చోబెట్టి, మళ్లీ వస్తానని చెప్పి తలుపు మూసి వెళ్లిపోయింది. కాండీడ్ కు అంతా కలలా అనిపిస్తోంది. గతం పీడకలలా, వర్తమానం తీపికలలా తోస్తోంది.

ముసలావిడ త్వరగానే వచ్చింది. రత్నాభరణాలు ధరించి, మేలిముసుగు వేసుకున్న గొప్పింటి యువతిని నెమ్మదిగా నడిపిస్తూ తీసుకొచ్చింది. ఆ యువతి కాండీడ్ ముందుకు రావడానికి కాస్త తడబడింది.
‘ఆ మేలిముసుగు తీసెయ్యి’ ముసలమ్మ కాండీడ్ తో అంది.

కాండీడ్ నెమ్మదిగా కదిలి వణుకుతున్న చేత్తో ముసుగు తీశాడు. సంభ్రమాశ్చర్యాలతో నోరెళ్లబెట్టాడు. తన కట్టెదుట ఉన్నది క్యూనెగొండేనా? ఇది కలా, నిజమా? తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. విస్మయంతో శక్తి సన్నగిల్లి, నోటమాట రాక దభిళ్లున ఆమె కాళ్లపై పడిపోయాడు. క్యూనెగొండ్ కూడా తన వంతుగా దభీమని దివానంపైన కూలబడిపోయింది. ముసలమ్మ వాళ్లద్దరిపైనా పన్నీరు చిలకరించింది. ఇద్దరూ తెప్పరిల్లుకుని కబుర్లు మొదలుపెట్టారు. మొదట సగం సగం మాటలు, తర్వాత సగం సగం ప్రశ్నలు, సమాధానాలు, ఊర్పులు, నిట్టూర్పులు, వగర్పులు, కన్నీళ్లు, వలపోతలు కొనసాగాయి. ఇద్దరూ మామూలు స్థితికి రావడంతో ముసలమ్మ కల్పించుకుని.. గొంతును వీలైనంత తగ్గించి కబుర్లాడుకోవాలని చెప్పి అక్కణ్నుంచి వెళ్లిపోయింది.

‘నువ్వు నిజంగా క్యూనెగొండ్ వేనా? అయితే నువ్వింకా బతికే ఉన్నావన్నమాట! నిన్నిలా పోర్చుగల్లులో కలుసుకోవడం చిత్రంగా ఉందే! మరైతే, ఆ దుర్మార్గులు నిన్ను బలాత్కరించి, ఒళ్లు చీరేశారని పాంగ్లాస్ చెప్పింది నిజం కాదన్నమాట..’

‘ఆయన చెప్పింది నిజమే. కాని, ఆ రెండు ఘోరాలకే మనుషులు చావరు.’

‘మీ అమ్మానాన్నలు? వాళ్లనూ చంపేశారా?’

‘ఔను..’ గుడ్ల నీళ్లు కక్కుకుంది క్యూనెగొండ్.

‘మీరి నీ అన్న?’

‘అతణ్నీ చంపేశారు.’

‘మరి నువ్వు పోర్చుగల్లుకు ఎలా వచ్చావు? నేనిక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది? ఈ ఇంటికి నన్నెలా రప్పించుకోగలిగావు?’

‘అంతా వివరంగా చెబుతాగాని, ముందు నీ సంగతి చెప్పు. నువ్వు నాకు అమాయకంగా ముద్దిచ్చి, దారుణంగా తన్నులు తిన్నాక ఏం జరిగిందో అంతా వివరంగా చెప్పు.’

ఆమె మాటంటే అతనికి శిలాశాసనమే. చెప్పడానికి బోల్డంత సిగ్గేసినా, గొంతు వణికి మాటలు తడబడినా, వెన్నుగాయం సలుపుతూనే ఉన్నా.. ఆమె నుంచి విడిపోయిన క్షణం నుంచి ఈ క్షణం దాకా ఏం జరిగిందో ఎంతో అమాయకంగా, ఉన్నదున్నట్టు పూసగుచ్చినట్టు చెప్పాడు. క్యూనెగొండ్ చలించిపోయింది. పాంగ్లాస్, జేమ్స్ ల మరణానికి దుఃఖిస్తూ పైలోకానికేసి చూసి కన్నీటిబొట్లను టపటపా రాల్చింది. కాండీడ్ కథనం పూర్తి చేయగానే తన కథ వినిపించడం మొదలుపెట్టింది. కాండీడ్ ఆమె చెబుతున్నంతసేపూ రెప్పవాల్చకుండా ఆమెనే చూస్తూ, ఎంతో శ్రద్ధగా, ఒక్కమాట కూడా చెవిజారిపోకుండా విని ఉంటాడని మీరే ఊహించుకోగలరు.

 

8వ అధ్యాయం

8chap (1)

‘ఒక రోజు రాత్రి నేను గాఢనిద్రలో ఉండగా దేవుడి దయవల్ల బల్గర్లు అందాలు చిందే మా థండర్ టెన్ ట్రాంక్ కోటలోకి చొరబడి నా తల్లిదండ్రులను ఖూనీ చేశారు. మా నాన్న, అన్నల గొంతులను పరపరా కోశారు. మా అమ్మను ముక్కలుముక్కలుగా నరికారు. ఆ రక్తపాతం చూసి మూర్ఛపొయ్యాను. ఆరడుగుల ఎత్తున్న ఓ భారీకాయుడు నన్ను చెరచడానికి మీదపడ్డాడు. దాంతో స్పృహలోకొచ్చి గట్టిగా కేకలేశాను. పెనుగులాడాను, కరిచాను, రక్కాను. వాడి కనుగుడ్లను పీకిపారేద్దామనుకున్నాను. మా ఇంట్లో జరిగింది యుద్ధంలో జరిగే మూమూలు తంతేనన్న సంగతి అప్పుడు నాకు తెలియదు. ఆ పశువు నా ఎడమ తొడపై తీవ్రగాయం చేశాడు. ఆ మచ్చ ఇప్పటికీ ఉంది.’

‘అయ్యయ్యో! ఏదీ చూపించవూ..’

‘తర్వాత చూద్దువుగానీలే. ముందు నా కథ సాంతం చెప్పనివ్వు.’

‘సరే, అలాగే’ అని కాండీడ్ ఊ కొట్టగానే క్యూనెగొండ్ మళ్లీ కొనసాగించింది.

‘ఇంతలో ఓ బల్గర్ దళనాయకుడు లోనికొచ్చాడు. నెత్తురోడుతున్న నా దురవస్థను కళ్లారా చూశాడు. నాపై పడ్డ ఆ సైనికుడు కాస్త కూడా పక్కకు కదల్లేదు. సైనికుడు వందనం చెయ్యకపోవడంతో తనకు పెద్ద అగౌరవం జరిగిపోయిందని ఆ దళనాయుడు ఉద్రేకంతో రెచ్చిపోయి ఆ నరపశువును గుంజి, పక్కకు ఈడ్చిపారేశాడు.

తర్వాత నా గాయాలకు కట్టుకట్టించి, యుద్ధఖైదీగా తన మాకాంకు తీసుకెళ్లాడు. నేను అతని బట్టలు ఉతికేదాన్ని. అతనికి ఉన్నవి కొన్నే అనుకో. వంట కూడా చేసేదాన్ని. నేను చాలా అందగత్తెనని, పనికొస్తానని అతడనుకున్నాడు. ఆ మాట పైకే అనేవాడు కూడా. అతడూ అందగాడేననుకో. ఒళ్లు పుష్టిగా మంచి ఆకారంలో, తెల్లగా, కోమలంగా ఉండేది. అంతే, అంతకుమించి పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. తెలివితేటలు గుండుసున్న. తత్వశాస్త్రం ఒక్కరవ్వ కూడా అర్థం కాదు. పాంగ్లాస్ పండితుడి వద్ద శిష్యరికం చేయలేదని ఘంటాపథంగా చెప్పొచ్చు. మూడు నెలల తర్వాత అతని దగ్గరున్న డబ్బంతా ఖర్చయిపోయింది. నాపైన మోజూ తీరిపోయింది. దీంతో నన్ను డాన్ ఇసాకర్ అనే యూదుకు తెగనమ్మేశాడు. ఇసాకర్ కు పోర్చుగల్లు, హాలండ్ లలో వ్యాపారాలున్నాయి. కామపిశాచి. నేనంటే పడిచస్తాడు. కానీ అంతకుమించి ఏమీ చేయలేడులే. నేను ఆ బల్గర్ సైనిక పశువుకంటే ఇతగాడినే తేలిగ్గా అడ్డుకోగలుగుతున్నాను. మర్యాదగల మగువ ఒకసారి బలాత్కారానికి గురైతే గురికావచ్చు కాని, ఆ అనుభవంతో ఆమె గుణగణాలు మరింత ఇనుమడిస్తాయి. నన్ను ఎలాగైనా మంచి చేసుకుని లోబరచుకోవాలని ఇసాకర్ ఈ ఇంటికి తీసుకొచ్చాడు. థండర్ టెన్ ట్రాంక్ కోటకు సాటివచ్చే కోట ఈ ఇలలో లేదని ఇంతవరకూ అనుకునేదాన్ని. కానీ అది శుద్ధ పొరపాటని ఇప్పుడర్థమైంది.. ’ గదిని చుట్టూ కలియజూస్తూ చెప్పసాగింది క్యూనెగొండ్.

‘ఈ పట్టణంలోని ఉన్నత మతవిచారణాధికారి ఓ రోజు నన్ను ప్రార్థన వేడుకల్లో చూశాడు. అలాగా ఇలాగా కాదు, కళ్లు తిప్పుకోకుండా చూశాడు. తర్వాత నాతో వ్యక్తిగత విషయాలను ఏకాంతంగా మాట్లాడాల్సి ఉందని కబురు పెట్టాడు. నన్ను అతని భవంతికి తీసుకెళ్లారు. అతనికి నా పుట్టుపూర్వోత్తరాలను వివరించాను. నేను ఓ ఇజ్రాయెల్ జతీయుడి వద్ద ఉంటూ నన్నూ, నా వంశాన్నీ, అంతస్తును ఘోరాతిఘోరంగా కించపరచుకుంటున్నానని ఆక్షేపించాడు. తర్వాత.. నన్ను మర్యాదగా తనకు అప్పగించాలని ఇసాకర్ కు ప్రతిపాదన పంపాడు. ఇసాకర్ రాజులతో డబ్బులావాదేవీలు నడిపేవాడు కావడం వల్ల, బోల్డంత పలుకుబడి ఉండడం వల్ల ఆ మతపెద్దను లెక్కచేయలేదు. దీంతో మతపెద్ద ఇసాకర్ ను సజీవదహనం చేయిస్తానని బెదిరించాడు. ఈ యూదు వెధవ భయపడిపోయి రాజీకొచ్చాడు. ఈ ఇల్లూ, నేనూ ఇద్దరికీ చెందేటట్టు ఒప్పందం రాసుకున్నారు. సోమ, బుధ, శనివారాల్లో ఇసాకర్, మిగతా వారాల్లో మతపెద్ద అని వాటాలు పంచుకున్నారు. ఒప్పందం కుదిరి ఇప్పటికి ఆరు నెలలయినా గొడవలు మాత్రం పోలేదు. శనివారం రాత్రుళ్లు పాత కాలమానానికి చెందుతాయా, కొత్త కాలమానానికి చెందుతాయా అని తేల్చుకోలేక గింజుకుంటున్నారు. ఇక నా సంగతి అంటావా? ఇద్దరినీ దగ్గరికి రాకుండా అడ్డుకుంటూ వస్తున్నాననింతవరకు. అందుకే నేనంటే ఇంకా పడి మోహంతో పడి చస్తున్నారు..

మళ్లీ భూకంపాలు రాకుండా ఉండడానికి, పనిలో పనిగా ఈ యూదును జడిపించడానికి  విచారణాధికారి సజీవదహన వేడుక జరిపించాలనున్నాడు. నన్నూ ఆహ్వానించాడు. బాగా అనుకూలంగా ఉండే చోట కుర్చీ దొరికింది. ఊరేగింపుకు, బలితంతుకు మధ్య పరిచారికలు చిరుతిళ్లు, రుచికర  పానీయాలు అందిస్తూ సేదదీర్చారు. పందిమాంసం తినడానికి నిరాకరించిన ఇద్దరు యూదులను, వావీవరసా లేని పెళ్లి చేసుకున్న ఆ బాస్క్ మనిషిని నిలువునా తగలబెడుతుంటే భయంతో కొయ్యబారిపోయాను. ఇక.. బలిదుస్తుల్లో ఉన్న పాంగ్లాస్ పండితుణ్ని చూసే సరికి నాలో రేగిన ఆశ్చర్యం, ఆందోళన, భయం, నిరాశా, నిస్పృహలను నువ్వే ఊహించుకో. కళ్లు నులుముకుని పాంగ్లాస్ ను ఉరితీసే వరకు చూసి, శోషతో పడిపోయాడు. స్పృహ వచ్చీ రాగానే నగ్నంగా ఉన్న నువ్వు కనిపించావు. గుండె గుభిల్లుమంది. ఆ క్షణంలో నాకు కలిగిన భీతి, ఆందోళన, క్షోభ, దుఃఖపరితాపాలను సులువగానే ఊహించుకోగలవనుకుంటాను. ఆ బల్గర్ దళనాయకుడి ఒళ్లు కంటే నీ ఒళ్లే తెల్లగా, మృదువుగా మెరుస్తూ ఉందని గట్టిగా చెప్పొచ్చు. నిన్ను ఆ దీనస్థితిలో చూడగానే నాకు పిచ్చి ఆవేశం తన్నుకొచ్చింది. ‘పశువుల్లారా.. ఆపండి!  అని గొంతుచించుకుని అరుద్దామనుకున్నాను. కానీ మాట పెగల్లేదు. అయినా నిన్నలా కొరడాలతో పూర్తిగా చిత్రవధ చేసేశాక వలపోసుకుని ఏం లాభంలే! ‘నా ప్రాణసుఖుడు కాండీడ్, మా విజ్ఞానఖని పాంగ్లాస్ లు లిస్బన్ కు ఎలా చేరుకోగలిగారు? ఒకరు వంద కమ్చీ దెబ్బలు తినడానికి, మరొకరు ఉరికొయ్యకు వేలాడ్డానికా వచ్చారు! అదే నేనంటే పడిచచ్చే మతపెద్ద ఆదేశాపైనేనా.. అయ్యో! ఎంత ఘోరం..! ప్రతీదీ మన మంచికేనన్న మెట్టవేదాంతాన్ని పాంగ్లాస్ నా బుర్రకెక్కించి ఎంత దారుణంగా మోసగించాడు! అని నాలో నేను అనుకున్నాను.

ఆ క్షణంలో ఎంత మనోవేదనతో కుంగిపోయానో ఊహించుకో. ఒక క్షణం దుర్భర ఉద్విగ్నతతో ఒళ్లు తెలియకుండా పోయింది. మరుక్షణం నిస్సత్తువ ఆవరించి మృత్యువాకిట ఉన్నట్టనిపించిది. నా తల్లిదండ్రుల నరికివేత, నా సోదరుడి ఖూనీ, ఆ బల్గర్ సైనికుడి అకృత్యం, చేసిన గాయం, బల్గర్ దళనాయకుడి ఇంట్లో వంటగత్తెగా బానిస బతుకు, ఇప్పుడీ భరించలేని యాదు వద్ద, నీచుడైన మతపెద్ద వద్దా అదే బతుకు, పాంగ్లాస్ ఉరితీత,  నిన్ను చావగొడుతూ భేరీలు, బాకాలతో.. దేవా కరుణామయా! కరుణించవా.. అంటూ హోరుమని వినిపించిన భక్తిపాట.. అవన్నీ నాకు బుర్రలో గిర్రున తిరిగి మాచెడ్డ కంపరం పుట్టించాయి. అయితే  ఆ రోజు నిన్ను మా ఇంట్లో కడసారి కలుసుకున్నప్పుడు ఆ తెరవెనక నువ్విచ్చిన తియ్యని తొలిముద్దును మాత్రం మరచిపోలేకపోయాను. ఇన్ని అగ్నిపరీక్షల తర్వాత నిన్ను మళ్లీ నా చెంతకు చేర్చినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాను. నిన్ను కంటికి రెప్పలా కాపాడి, వీలైనంత త్వరగా నా దగ్గరికి తీసుకురావాలని ఈ ముసలమ్మను పురమాయించాను. ఆమె నమ్మినబంటులా నా కోరిక నెరవేర్చింది. నిన్ను మళ్లీ చూడ్డం, నీతో మాట్లాడ్డం, నీ మాటలు వినడం.. అబ్బ! చెప్పలేనంత సంతోషంగా ఉంది. సరే, ముచ్చట్లకేం, మళ్లీ చెప్పుకుందాం. నీ కడుపులో ఎలకలు పరిగెడుతూ ఉంటాయి. నాక్కూడా అలాగే ఉంది. పద భోంచేద్దాం.’ తన కథ ముగించింది ప్రియురాలు.

ఇద్దరూ భోంచేశారు. తర్వాత అందమైన పాన్పుపై పవళించారు. ఇంతలో ఆ ఇంటి యజమానుల్లో ఒకడైన డాన్ లోపలికొచ్చేశాడు. ఆ రోజు శనివారం కావడంతో తన హక్కును దర్జాగా చలాయించుకోవడానికి, తన సుకుమార ప్రేమను చాటిచెప్పుకోవడానికి అడుగుపెట్టాడు.

(సశేషం)

మీ మాటలు

  1. చందు - తులసి says:

    భూకంపం రావద్దంటే మనుషుల సజీవదహనం చేయటమేంటి సార్…..చాదస్తం కాకుంటే… పాపం ఎన్ని కష్టాలండీ కాండీడ్ కు..

    • కష్టపడాల్సిందే వెధవ. గంగిరెద్దులా ఊకొడితే, నువ్వూ, నేనూ అంతే.

  2. భాస్కరం కల్లూరి says:

    మంచి వ్యంగ్యమూ, హాస్యమూ మేళవించిన కాండీడ్ ఆసక్తికరంగానే కాదు, ఆలోచనాత్మకంగా ఉంది. విశ్వవిఖ్యాత మహారచయిత వోల్టేర్ రచన అలా ఉండడంలో ఆశ్చర్యమేముంది? మనిషిలోని దాంభికత్వం, మూర్ఖత్వం వంటి రకరకాల అవగుణాలపై ఎక్కు పెట్టిన ఈ రచన పోను పోను మరింత పదునెక్కుతుందని అనుకుంటున్నాను. అనువాదంలో కూడా మెరుపులు మెరిపిస్తున్నారు. అభినందనలు మోహన్ గారూ…

    • భాస్కరం గారూ, థ్యాంక్సండి.
      వోల్టేర్ ఒక్క రాజకీయ విప్లవాన్ని సమర్థించకపోవడం మినహాయిస్తే ఆయన నిలదీయని అన్యాయమే లేదు. ముందే చెప్పినట్టు మన అవగుణాలు వున్నంత వరకూ ఆయన రిలవెన్స్ ఉంటుంది. పోతే, అనువాదంలో తొలి అడుగులే నావి. మీ వంటి పెద్దలు మెచ్చుకుంటే సంతోషంగా ఉండదూ మరి.

  3. కె.కె. రామయ్య says:

    మోహన్ గారూ … రెప్పవాల్చకుండా, ఎంతో శ్రద్ధగా, ఒక్కమాట కూడా జారిపోకుండా కాండీడ్ ని చదువుతున్నామని, కొన్ని సార్లు పదే పదే చదువుతున్నామని మీరు ఊహించుకోగలరో లేరో అని మళ్లీ రాస్తున్నానిక్కడ. అబ్బ! చెప్పలేనంత సంతోషంగా ఉంది సార్. ప్రతి గురువారం వచ్చే మీ కాండీడ్ ఆలస్యం అయితే ఆ గురువారం ఇండియాలోని కాలమానానికి చెందుతాయా, లేక అఫ్సర్ గారి అమెరికా కాలమానానికి చెందుతాయా అని తేల్చుకోలేక గింజుకుంటున్నాను.

    • రామయ్యగారు బోల్డు థ్యాంక్స్.
      ఇంత ప్రేమగా చదువుతున్నారని అసలూహించలేదు. వోల్లేర్ తో షేక్ హ్యాండ్ చేసినంత సంతోషంగా ఉంది.
      కాండీడ్ ను అనువాదానికి ముందు రెండుమూడుసార్లు, అనువాదం చేసేటప్పడు, తర్వాత సరిదిద్దుకునేప్పుడు చదివాను, చదువుతూ పోతున్నాను. ప్రతిసారీ ఎన్నో కొంత విషయాలు తెలుస్తున్నాయి. కాండీడ్ అంటే ఎంత పిచ్చి అంటే దాన్ని 20 శతాబ్దికి అన్వయిస్తూ తీసిన ఫ్రెంచి సినిమాను కూడా అర్థం కాకున్నా మూడుసార్లు చూసినంత పిచ్చి. వోల్టేర్ అంతిమయాత్రకు పదిలక్షల మంది వచ్చారంటే ఆయన ఎంత గొప్పమానవుడో అర్థమౌతుంది.

మీ మాటలు

*