ముందడుగు ఇది…

suneeta2

అక్టోబర్ 19న నేను పనిచేసే అన్వేషి సంస్థ భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ సభ్యురాలు జకియా సోమన్ని వారు మూడు తలాక్ లకి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారోద్యమం గురించి మాట్లాడమని ఆహ్వానించింది. ఇది ఆ విషయం పైన గత మూడు నెలల్లో సంస్థ పెట్టిన మూడవ చర్చ. అంతకు నెల క్రితం ముంబై కి చెందిన ప్రముఖ లీగల్ ఆక్టివిస్ట్ ఫ్లేవియా ఆగ్నెస్ కూడా అన్వేషి కి వచ్చి ఈ విషయంపై తన అభిప్రాయాలని చర్చకి పెట్టారు. ఆవిడ బి ఎం ఎం ఏ చేస్తున్న ప్రచారోద్యమం అనవసరమని, ఇది హిందూత్వ వాదులకి ఉపయోగ పడుతుందని బలంగా వాదించారు.

మామూలుగా 20  మంది మించకుండా హాజరయ్యే ఇటువంటి చర్చలకు జకియా మాట్లాడే రోజు సమయానికి ముందే హాలు నిండేటంత అంతకు ముందు ఎప్పుడూ రాని ముస్లిం స్త్రీలు హాజరయ్యారు. ఆమె అహ్మదాబాద్ లో తన నేపధ్యం, తన అమ్మమ్మ ఇల్లు ఎన్ని సార్లు మత కలహాల్లో దగ్ధ మయింది, తన వైవాహిక జీవితంలో పడిన హింస, గుజరాత్ మారణ కాండతో తానెలా ముస్లిం కమ్యూనిటీ కోసం పని చెయ్యటం ప్రారంభించారో చెప్పారు. తాను గుజరాత్ ఊచ కోత బాధితులకి సహాయం చేసే పనిలో నిమగ్నమయిన తరువాతే తనని తాను ఒక ముస్లిం గా భావించుకోవటం ప్రారంభించానని చెప్పారు. ఆ అవగాహన తన జీవితాన్ని మార్చిందని కూడా చెప్పారు.

ఇదంతా చెప్పిన తరువాత తాము చేపట్టిన ప్రచారోద్యమం గురించి, తాము షరియత్ పరిధిలో, ఖురాన్లో చెప్పినట్లు మాత్రమే భర్తలు భార్యలకు తలాక్ ఇచ్చే విధంగా ముస్లిం కుటుంబ చట్టాలని మార్చాలని, వాటిని క్రోడీకరించమని అడిగామని చెప్పారు. దీనికి తమ వద్దకి వచ్చిన అనేక మంది బాధిత ముస్లిం స్త్రీల జీవిత పోరాటాలే కారణమని కూడా చెప్పారు. నల్ల జాతి ఇస్లామిక్ స్త్రీవాది అయిన అమీనా వదూద్ నుండి, షరియత్ పరిధిలో ముస్లిం స్త్రీలు తమ హక్కులు సాధించుకోవాలనే  ముసావా అనే అంతర్జాతీయ ఇస్లామిక్ మానవ హక్కుల నెట్ వర్క్ నుండి తాము స్ఫూర్తి పొందామని చెప్పారు.

అయితే హాజరయిన ముస్లిం స్త్రీలు జకియా మాట్లాడటం ప్రారంభమైన దగ్గరినుండి ప్రతి నిముషం ఆమెని అడ్డుకున్నారు. ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించారు. ఆవిడకి ఖురాన్ లో, హదీస్ లో ఏమి తెలుసో ప్రశ్నించారు. ఆవిడ హిందూ పురుషుడిని పెళ్లి చేసుకున్నందు వల్ల ముస్లిం కాదని, ముస్లిం లకి ప్రతినిధిగా ఉండటానికి అర్హత కోల్పోయిందని వాదించారు. కొంత మంది మూడు తలాక్ లనేవి కేవలం ముస్లింల వ్యతిరేక ప్రచారం మాత్రమే నని, తాము ఎక్కడా వినలేదని, చూడలేదని అన్నారు. ముస్లిం స్త్రీలకి సరయిన చదువు ఉంటే ఇటువంటి వాటికి బలి కాకుండా ఉంటారని వాదించారు. జమాత్ ఏ ఇస్లాం లో పని చేసిన ఖలీదా పర్వీన్, ముస్లిం స్త్రీలకి పేదరికం, చదువు లేకపోవటం, పితృస్వామ్యం వల్ల సమస్యలు ఉన్నాయని అయితే వీటిని కమ్యూనిటీ లోపలే చర్చించుకోవాలని, కోర్టుకి, ప్రభుత్వం దగ్గరికి వెళ్లి చట్టాల్లో మార్పుల కోసం అడగటం అనవసరమని అన్నప్పుదు అందరూ చప్పట్లు కొట్టారు. ఆ తరువాత అందరూ బయటికి వెళ్లి పది నిమిషాల పాటు జకియా సోమన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసి వెళ్లిపోయారు. వీరందరూ ముస్లిం గర్ల్స్ అసోసియేషన్ అనే సంస్థకి చెందిన వారని తరువాత తెలిసింది. మర్నాడు సాయంత్రం ఆల్ ఇండియా మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ కార్యాలయం దారుస్సలాం లో జరిపిన సభలో కొంత మంది ముస్లిం స్త్రీల దుర్భర పరిస్థితుల గురించి ప్రసంగిస్తే మరి కొంత మంది జకియా సోమన్  పైన ఇదే రకమైన విమర్శలు గుప్పించారు. ఆమెకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారిని ప్రశంశించారు. తాము గనక ఉండి ఉంటే ఆమెకి తస్లీమా నస్రీన్ కి పట్టించిన గతే పట్టించి వుండే వారమని కూడా కొందరు అన్నారని వినవచ్చింది. ఇటువంటి వారిని పిలిచిన వారిది కూడా తప్పే నని అభిప్రాయ పడ్డారు మరి కొంత మంది.

అన్వేషి సంస్థ స్త్రీలకి సంబంధించిన కుటుంబ చట్టాలు, వాటిలో మార్పుల గురించి గత ముప్ఫయి ఏళ్ల లో అనేక చర్చలు నిర్వహించింది. 1990 ల మధ్యలో షాబానో వివాదం తరువాత వుమ్మడి పౌర స్మ్రితి వుండాలని అనేక స్త్రీల సంస్థలు వాదించి, దాని నమూనాలు తయారు చేసిన సమయంలో రెండేళ్ల పాటు చట్టం, చట్ట సవరణల గురించి సామూహిక అధ్యయనం జరిపి, వుమ్మడి పౌర స్మ్రితి గురించి మాట్లాడే ముందు కుటుంబ చట్టాల విభిన్నత గురించి తగినంత అవగాహన వుండాలని, స్త్రీలకు న్యాయమంటే ఏకరూప ఉమ్మడి చట్టం అవసరం లేదని, వివిధ చట్టాలలో సంస్కరణలు చేసే విధంగా కృషి చెయ్యాలని వాదించి, ముంబై కి చెందిన మజ్లీస్ తో కలిసి స్త్రీవాద సంస్థ లన్నింటికీ ఒక అప్పీల్ ని పంపించింది – వుమ్మడి పౌర స్మ్రితి ముస్లింలని టార్గెట్ చెయ్యటానికి హిందూత్వ వాదులు వాడుకుంటున్నారు కాబట్టి, దాని గురించి మాట్లాడటానికి ఇది సమయం కాదని, స్త్రీ వాద సంస్థలు ఈ ప్రయత్నం మాను కోవాలని అడిగింది. గత ఇరవై ఏళ్లలో అఖిల భారత ప్రజాస్వామిక స్త్రీల సంస్థ తో సహా అందరూ స్త్రీలకి న్యాయం కోసం ఉమ్మడి పౌర స్మృతి  మార్గం కాదని, ఆయా కుటుంబ చట్టాలలో తగిన మార్పులు చేసుకోవాలనే ప్రజాస్వామిక అవగాహనకి వచ్చారు.

suneeta1ఇదంతా వర్ణించటం ముస్లిం గర్ల్స్ అసోసియేషన్ కి చెందిన స్త్రీలని విలన్లు గా, జకియా సోమన్ని హీరోయిన్ గా చూపించటానికి లేదా అన్వేషి సంస్థ గొప్పతనం చెప్పుకోవటానికి కాదు. నా ఉద్దేశంలో జకియా సోమన్ పట్ల అక్కడ వ్యక్తమైన వ్యతిరేకత – భారతీయ ముస్లిం సమాజాల్లో కుటుంబ చట్టాల గురించిన చర్చ మెజారిటీ హిందూత్వ వాద నీడలో జరగటం వల్ల జరుగుతున్న దుష్ఫరిణామాలకి ఒక చిహ్నం తప్ప మరేమీ కాదు. ముస్లిం గర్ల్స్ అసోసియేషన్ మరియు భారతీయ ముస్లిం మహిళా అందోళన్ రెండూ కూడా 1990 ల తరువాత, ఇంకా చెప్పాలంటే 2002 లో గుజరాత్ ఊచ కోత తరువాత పుట్టినవే. రెండూ కూడా బలంగా ఇస్లాం తమకు కావలిసిన హక్కులు, అధికారాలు ఇస్తాయని నమ్ముతాయి. ఇది కేవలం ఈ రెండు సంస్థల, సంఘటనల అవగాహనే కాదు. హైద్రాబాదు లో పని చేసే అనేక చిన్న ముస్లిం స్త్రీల సంస్థలు, తమ స్త్రీలకి సరయిన చదువు – ముఖ్యం గా ఇస్లాం గురించి – ఉంటే తమ హక్కులు తామే సాధించుకోగలరని, కుటుంబ సమస్యలని పరిష్కరించు కోగలరని, హింసకు వ్యతిరేకంగా పోరాడగలరని భావిస్తాయి.

అయితే ఏది సరయిన ఇస్లామిక్ అవగాహన, షరియత్ అంటే ఏమిటి, ముస్లిం పర్సనల్ చట్టాలంటే ఏమిటి, ఏ ఏ హక్కులు, అధికారాలు స్త్రీలకి వున్నాయి, అవి ఎవరి ఆధ్వర్యంలో సాధించుకోవాలి, ఎలా సాధించుకోవాల్సిన పద్ధతులపై మాత్రం తీవ్ర బేధాభిప్రాయాలు వున్నాయి. ఇస్లాం మత చట్టాలు మత విశ్వాసాలలో భాగమైనవి కాబట్టి అవి అచంచలమైనవి అని ముస్లిం గర్ల్స్ అసోసియేషన్ వారు వాదిస్తే, వాటిని చారిత్రిక సందర్భం బట్టి అర్ధం చేసుకోవాలని బిఎంఎంఎ భావిస్తుంది. ముస్లిం పర్సనల్ చట్టాలు షరియత్ నుండే పుట్టాయి కాబట్టి వాటిని ఎవరూ మార్చలేరని, మార్చ కూడదని ఎంజిఎ వాదిస్తే, అవి షరియత్ స్ఫూర్తి తో రూపొందింన భారత దేశ రాజ్యాంగ చట్టాలని, మారుతూనే వస్తున్నాయని, కాబట్టి వాటిని మార్చుకోవచ్చని బిఎంఎంఎ అంటుంది. పితృస్వామ్యం వల్ల ముస్లిం స్త్రీలు తమకి రావాల్సిన అధికారాలు సాధించుకోలేక పోతున్నారని ఖలీదా పర్వీన్ మరియు జకియా సోమన్ ఇద్దరూ అంగీకరించినప్పటికీ, ఖలీదా తమ సమాజంలోనే పోరాడి సాధించుకోవాలని భావిస్తే జకియా ప్రభుత్వ సహాయం తీసుకోవాలని భావిస్తున్నారు.

స్త్రీలు ముస్లిం సమాజంలో ఉంటూ పోరాడాలి అనే భావన సాంప్రదాయక ధోరణిగా అనిపించి నప్పటికీ ప్రజాస్వామ్యం కరువైన లౌకికత చేసే చేటు గురించి 1985 తరువాత కలిగిన అవగాహన లో ఇది కొత్త రాజకీయ అర్ధం సంతరించుకుంది. ఈ విషయాన్ని చర్చించిన పార్థ ఛటర్జీ వంటి రాజకీయ సిద్ధాంత కర్త మైనారిటీ సమాజంలో స్త్రీల పోరాటం గురించి చర్చిస్తూ ముస్లిం స్త్రీలు ఒక పక్క తమ సమాజాలని బయటి సమాజ దాడి నుండి రక్షించుకుంటూ ఇంకో పక్క తమ హక్కుల కోసం పోరాడాల్సి వస్తుందని అన్నారు. గత ముప్ఫయి ఏళ్ల ముస్లిం స్త్రీల పోరాటాలని అర్ధం చేసుకోవటానికి ఈ చట్రం చాలా ఉపయోగ పడుతుంది. ఈ ప్రక్రియలో స్త్రీలు కూడా తమ సమాజ ప్రతినిధులుగా ఎదుగుతున్నారు, అంగీకరించ బడుతున్నారు. ముస్లిం స్త్రీలు తమ హక్కుల గురించి మాట్లాడే స్థాయికి చేరుకోక ముందే తమ సమాజాలలో – విద్య లేక ఆరోగ్యం గురించి – లేదా సమాజాలపై దాడులు – హిందూత్వ దాడులు, పోలీసుల దాడుల గురించి – అనేక సంవత్సరాలు పని చేసి వుంటారు. ఉదాహరణకి భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ గుజరాత్లో ఊచకోతకు గురయిన ముస్లిం ల కోసం పని చెయ్యటమే కాక, ఆ తరువాత కుటుంబ సమస్యల పరిష్కారం కోసం షరియత్ అదాలత్ లని స్థాపించారు. అలాగే వివాహ సమయంలో భార్యా భర్తలిద్దరూ సంతకం చెయ్యాల్సిన నిఖానామా లో స్త్రీల హక్కులు కూడా స్పష్టం గా పొందుపరచి వాటిని ప్రచారం చేసి అనేక పెళ్లిళ్లలో వాటిని వాడుకునేలా కృషి చేశారు. ఈ ప్రక్రియలో సమాజం మొత్తం, పురుషులతో సహా, వారిని కొంత మేరకు తమ ప్రతినిధులుగా ఒప్పుకుంటుంది.  తమిళ నాడు లో షరీఫా ఖానం తో సహా అనేక మంది ముస్లిం స్త్రీలు నడిపే తమిళ్ నాడు ముస్లిం స్త్రీల జమాత్ దీనికి మంచి ఉదాహరణ. ఇది పుదుకోట్టై లోని పేద ముస్లిం స్త్రీలు కుటుంబ సమస్యలని ఖురాన్ పరిధిలో పరిష్కరించు కుంటూ దురాచారాలకు వ్యతిరేకంగా సామూహికంగా పనిచేస్తున్న క్రమంలో ఏర్పడింది. మొదట్లో పురుష జమాత్ లు వ్యతిరేకించినా క్రమేణా వాళ్ళే కుటుంబ సమస్యల కేసుల్ని వీరికి పంపించటం మొదలు పెట్టారు.

హిందూత్వ వాదులు ముస్లిం సమాజాలలో జరిగే పోరాటాలని తమ స్వప్రయోజనాల కోసం వాడుకోనంత వరకూ ఈ విషయాలపై పోరాడే స్త్రీలని ఆయా సమాజాలు కష్టం గా నైనా అంగీకరిస్తాయని గత ఇరవయి ఐదేళ్ల ముస్లిం సమాజాల చరిత్ర మనకి అర్ధం చేయిస్తోంది. భారతీయ ముస్లిం మహిళా ఆందోళన పట్ల హైద్రాబాదుతో సహా కొన్ని చోట్ల వ్యక్తమవుతున్న తీవ్ర వ్యతిరేకత దీని నుండే పుడుతోంది. వారు నరేంద్ర మోడీ వద్దకి వివాహ చట్టాల మార్పు కోసం వెళ్ళటం అనేది కొందరికి కోపం తెప్పిస్తే, కోర్టుకి వెళ్ళవలసిన అవసరం ఏముంది అన్నది మరి కొందరి బాధ. ‘దీనితో భారతీయ జనతా పార్టీకి జుట్టు అందించినట్లు కాలేదా? ముస్లిం సమాజాల పట్ల వ్యక్తమయ్యే అనేక అపోహలని – పురుషులు ఒకరి కన్నా ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటారు, ఎప్పుడు పడితే అప్పుడు భార్యలకు తలాక్ ఇచ్చేస్తారు, అసలు వుమ్మడి పౌర స్మ్రితి రావడమే దీనికి పరిష్కారం – బల పరిచినట్లు అవుతోంది కదా?’ అనేవి వారికి వస్తున్న విమర్శ. ‘అయితే మరి తమతో మాటైనా చెప్పకుండా భర్తలు తమకి తలాక్ నామా పంపిస్తున్నారని మా దగ్గరకి వస్తున్న ముస్లిం స్త్రీల సంగతేమిటి? ముస్లిం స్త్రీలు తమ వివాహ చట్టాల్లో మార్పుల కోసం ఎంత కాలం ఆగాలి? కాంగ్రెస్ వున్నప్పుడు చెయ్యదు, బిజెపిని అడగ కూడదు, సమాజ పెద్దలుగా అంగీకరించబడిన ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆ బాధ్యత ఎందుకు తీసుకోదు?’ అని బి ఎం ఎం ఏ వేస్తున్న అన్న ప్రశ్నలు ముస్లిం సమాజాల్లో, బయటా కావాల్సినంత చర్చని లేవదీస్తున్నాయి. అంతే కాక ‘ముస్లిం స్త్రీలు తమ సమాజంలో ఉంటూ తమ హక్కుల కోసం పోరాడాలి’ అన్న సూత్రీకరణకి  ‘ముస్లిం వివాహ చట్టాలలో షరియత్ ననుసరించి తగిన మార్పులు చెయ్యాలి’ అనే అర్ధాన్నిచ్చి కొత్త సవాలు విసురుతున్నాయి.

భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ మూడు తలాక్ లకి వ్యతిరేకంగా జరుపుతున్న ప్రచారోద్యమం, సుప్రీమ్ కోర్టులో వేసిన కేసు మళ్ళా తలెత్తిన ఉమ్మడి పౌర స్మ్రితి గురించిన అనవసర చర్చలో తేలిపోవచ్చు. వారి సర్వేలలో అసమగ్రత, వారి సభ్యత్వం లో లోపాలు, వారికి చట్టాల గురించిన అవగాహనా లేమి పరిశీలన లో ముందుకి రావచ్చు. ముస్లిం సమాజాలపై యుసిసి పేరుతో జరిగే దాడిని తిప్పి కొట్టటంలో భాగంగా మనలో కొంతమందికి వీరిని వ్యతిరేకించాల్సి కూడా రావచ్చు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల తరువాత భారతీయ జనతా పార్టీ నే ఈ వివాదాన్ని పక్కన పడెయ్యచ్చు. కానీ తమ సమాజంలో ఎప్పటి నుండో నలుగుతున్న సమస్యని అందరి దృష్టికి తెచ్చి తమ పెద్దలతో సహా అందరూ చర్చించేలా చేసారని మాత్రం ఒప్పుకోవాల్సి ఉంటుంది. సుప్రీమ్ కోర్టు తీర్పులకన్నా ఇటువంటి చర్చలే సామాజిక మార్పు కి దారి తీస్తాయి. ఇది ముస్లిం సమాజాల అంతర్గత మార్పులకి, ముస్లిం స్త్రీలు తమ సమాజ ప్రతినిధులుగా ఎదిగే ప్రక్రియకి చిహ్నం. దీనిని తమ స్వప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్న హిందూత్వ వాదుల అవకాశ వాదమే ముస్లిం సమాజాలని ఆత్మ రక్షణ లోనికి నెట్టి ముస్లిం స్త్రీల గొంతుని పైకి రాకుండా, మార్పుకి అవకాశమివ్వకుండా చేస్తోంది.

 

References

 

Voice of the voiceless (Status of Muslim Women Part II) Report prepared by Syeda Hameed in 1999 for National Commission for Women: http://ncw.nic.in/pdfReports/vov-part-2.pdf

Faizan Mustafa ‘The debate on triple talaq must be based on proper research and data’,  http://thewire.in/77923/muslim-personal-law-reforms-bmma-studies/

 

Anveshi Law Committee “Is gender justice only a legal issue?: Political stakes in UCC debate’, Economic and Political Weekly, Vol. 32, No.9- 10,

http://www.epw.in/journal/1997/9-10/perspectives/gender-justice-only-legal-issue.html

 

A.Suneetha “Muslim women and marriage laws: the debate on the model nickhanama”, Economic and Political Weekly, No.43, 2012

http://www.epw.in/journal/2012/43/review-womens-studies-review-issues/muslim-women-and-marriage-laws.html

A.Suneetha “ Between haquq and taleem: Muslim women’s activism in contemporary Hyderabad”, Economic and Political Weekly, No. 34. 2012 http://www.epw.in/journal/2012/34/special-articles/between-haquq-and-taaleem.html

 

 

 

 

 

 

మీ మాటలు

  1. ప్రసాద్ చరసాల says:

    “ఆ తరువాత అందరూ బయటికి వెళ్లి పది నిమిషాల పాటు జకియా సోమన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసి వెళ్లిపోయారు. వీరందరూ ముస్లిం గర్ల్స్ అసోసియేషన్ అనే సంస్థకి చెందిన వారని తరువాత తెలిసింది. మర్నాడు సాయంత్రం ఆల్ ఇండియా మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ కార్యాలయం దారుస్సలాం లో జరిపిన సభలో కొంత మంది ముస్లిం స్త్రీల దుర్భర పరిస్థితుల గురించి ప్రసంగిస్తే మరి కొంత మంది జకియా సోమన్ పైన ఇదే రకమైన విమర్శలు గుప్పించారు. ఆమెకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారిని ప్రశంశించారు. తాము గనక ఉండి ఉంటే ఆమెకి తస్లీమా నస్రీన్ కి పట్టించిన గతే పట్టించి వుండే వారమని కూడా కొందరు అన్నారని వినవచ్చింది. ఇటువంటి వారిని పిలిచిన వారిది కూడా తప్పే నని అభిప్రాయ పడ్డారు మరి కొంత మంది.”

    ఈ ప్రవర్తనే RSS ముఠాలకు మందుగుండు. ఎక్కడా ఏమాత్రం ముందడుగు వేయనీకుండా వందల ఏళ్ళక్రితపు ఆచారాలనే పట్టుకొని వేళ్ళాడాలనే ఈ అభివృద్ది నిరోధకులే ముస్లిములకు అసలు విలన్లు. తలాక్, బహు బార్యత్వపు సమస్యకు ముస్లిములు అంగీకరించడమే RSS కుట్రలకు విరుగుడు. విశాల అంగీకారం వున్న ఈ అంశాలను, చిన్న చిన్న సాకులను చూపి అడ్డగిస్తున్నన్న రోజులూ కాషాయ ముటాలకు పండగే! వీళ్ళు చేస్తున్నదీ, వాళ్ళు కోరుకుంటున్నదీ అదే!

    థూ!

    • ప్రసాద్ గారు,

      మీరు వ్యాసం మొత్తం చదివితే అభివృద్ధి నిరోధకులని మీరు అంటున్న వారు స్త్రీ పురుష సమానత్వం గురించి చేసిన, చేస్తున్న సంస్కరణల గురించి అర్ధం చేసుకోవచ్చు. ఆర్ ఎస్ ఎస్ ని, వీర్నిని ఒకే గాటన కట్టటం ప్రగతి శీల వాదులు అని అనుకుంటున్న వారు చేస్తున్న చాలా పెద్ద తప్పు. ఆర్ ఎస్ ఎస్ ఎప్పుడూ కూడా స్త్రీ పురుష సమానత్వం గురించి మాట్లాడలేదు, పని చేయలేదు, హిందూ కోడ్ బిల్ ని వ్యతిరేకించిన వారిలో జన సంఘ్ వారు ప్రముఖులు. ఈ హిందూ ఛాందస వాదుల వారసత్వాన్ని ఈ విషయంలో మనం ఇప్పటికీ కావాల్సినంత ప్రశించలేదు. వీరు ఇప్పటికీ గుళ్ళల్లో స్త్రీలు ప్రవేశించటాన్ని వ్యతిరేకించే ముఠాలని సమర్థిస్తారు; కుల పరమయిన వివక్ష ని బీఫ్ బాన్ పేరుతో ప్రోత్సహిస్తారు; కులాంతర, మతాంతర వివాహాలని రక రకాల పేర్లతో అడ్డుకుంటారు, లేదా అడ్డుకునే వారిని ప్రోత్సహిస్తారు.

      దీనికి భిన్నంగా ముస్లిం పెర్సనల్ లా బోర్డు కి చెందిన వారిలో, మరియు రాజకీయ నాయకులలో అనేక మంది ప్రగతి శీల మత పెద్దలు ఇది వరకు వున్నారు, ఉంటూనే వున్నారు. అత్యధిక ముస్లిం స్త్రీలకి తమ సమాజాలే, కుటుంబాలే పెద్ద దిక్కు, వారికి కావలసినంత చదువు, ఉద్యోగాలు ఇవ్వకుండా అట్టి పెట్టింది, వారి మతమో లేక వారి సమాజం కాదు, లౌకిక మని చెప్పుకున్న స్వాతంత్రానంతర భారత ప్రభుత్వం. కావాల్సినన్నిస్కూళ్ళు, కాలేజీలు పెట్టక, చదువులో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వక ఆ సమాజాల్ని మతపరమైన వివక్ష తో ఈ అరవయ్యేళ్ళ నుండి వెనక బడేటట్లు, ఆయా స్త్రీలకి ఏ దారులు లేకుండా చేస్తున్నది భారత ప్రభుత్వ విధానాలే. పైగా వారిపై భౌతిక దాడులు, వారి అస్తిత్వంపై దేశ భక్తి పేరుతో భావజాల పరమయిన దాడులు చేస్తున్నది ఆర్ ఎస్ ఎస్ మరియు వారి స్నేహితులే.

      భారతీయ ముస్లింల వంటి అణగదొక్క బడిన సమూహాన్నీ, ఆర్ ఎస్ ఎస్ ని ఒకే గాటన మనం ఎప్పుడూ కట్టకూడదు. ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన సత్యం ఏమిటంటే, ఏ సమూహాల నయితే మెజారిటీ సమాజాలు అణగదొక్కుతాయో వాటిలోని స్త్రీలు ఇంకా నిస్సహాయులుగా తయారవుతారని. జకియా సుమన్ కి ముస్లిం గర్ల్స్ అసోసియేషన్ నుండి వ్యక్తమయిన వ్యతిరేకత ముస్లిం స్త్రీలని, వారి సమాజాలకి దూరంగా, వేరుగా ఉద్దరించాలని భారతీయ జనతా పార్టీ చేస్తున్న అవకాశం వాద ప్రయత్నాల్ని ధిక్కరించటమే. అటువంటి ప్రయత్నాలు తమకి, తమ సమాజాలకు పనికిరావని, కేవలం మెజారిటీ సమూహాల చీత్కారానికి తమని గురి చెయ్యటానికి మాత్రం పనికొస్తాయని వారి ఆందోళన. దానిని అర్ధం చేసుకోవటానికి చేసిన ఒక చిన్న ప్రయత్నమే నా వ్యాసం.

      మన విమర్శ ముస్లిం స్త్రీల పోరాటాలకు, వారి జీవితాలని మెరుగు పరచు కోవటానికి చేస్తున్న ప్రయత్నాలకు సహాయ పడాలి అంటే మనం ఈ ‘హిందూత్వ వాదులు, ఇస్లాం వాదులు’ ఒకటే నన్న చట్రం నుండి చాలా త్వరగా బయట పడాలి. ఆర్ ఎస్ ఎస్ లో అందరూ ఒకలాగా ఆలోచించ వచ్చు కానీ, ‘ముస్లిం’ లలో మనం అభివృద్ధి నిరోధకులు అంటున్న వారిలో ఈ విషయాలపై లోతుగా, కానీ భిన్నంగా ఆలోచించే వారు చాలా మంది వున్నారు. ‘ముస్లిం’ ఆలోచనా పరులలోని ఈ భిన్నత్వాన్ని అర్ధం చేసుకోవాలి, ఆహ్వానించాలి. ఎంత వరకు ప్రయాణం చేస్తారో అంత వరకూ కలిసి ప్రయాణం చెయ్యాలి. వ్యాసం మరలా చదివి మీరు ఈ విషయాల గురించి పునరాలోచిస్తారని నా ఆశ, నమ్మకం.

      సునీత

మీ మాటలు

*