సుషుమ్న

Art: Satya Sufi

Art: Satya Sufi

      

హాల్ లో  దివాన్ మీద కొత్త దుప్పటి.   టీపాయ్ మీద చక్కగా మడత పెట్టిన ఈరోజు దినపత్రిక.  ఇంకా చదవలేదు.  చాలా సార్లు అలానే ఉంచేస్తాను. చదవను.  కుదరదు.  కుదుర్చుకోను.  ఫ్లవర్ వాజ్ లో తాజా పూలు పెట్టి టీపాయ్ మీద అందంగా అమర్చి చూసుకున్నాను.  బావున్నాయి.  కర్టెన్లు కూడా కొత్తవి.  లేత పసుపు రంగు మీద పచ్చ పచ్చని పూలతో అవి కూడా బావున్నాయి.   కర్టెన్ల వెనక కిటికీలు మూసి వున్నాయి.  వీధి గది కూడా మూసే వుంది.   సేఫ్టీ కోసం అన్ని వైపులా మూసే ఉంచాను!

ఇంతలోకి కాలింగ్ బెల్ ఒకటే మోత.  తలుపు రంద్రం లోంచి చూసేప్పటికి   ఎవరో అపరిచిత వృద్ధుడు. మొత్తంగా  తెల్ల బడిన జుత్తు.    మేని చామన ఛాయ.  దయగా ప్రేమగా కనబడుతున్న కళ్ళు. ముఖం బిగువుగా వుంది.  వయసు అంచనా కష్టం!  తక్కువలో తక్కువ ఎనభై ఉండొచ్చు .  తలుపు తీశాను.

“ఎవరూ?”ప్రశ్నార్ధకంగా అడిగాను.

“ఆనందాన్ని”చిరునవ్వు నవ్వాడు.  ఏ ఆనందం?  ఎటువైపు బంధువు?  పోనీ ఎవరేనా పాఠకుడా?  ప్రశ్నార్ధకంగా చూశాను.

“గుర్తుకు రావడం లేదా?”

“లోపలి రానిస్తే గుర్తుచేస్తాను”మళ్ళీ అతనే అన్నాడు.

“రండి”పక్కకి జరిగి దారి ఇచ్చాను.  వృద్దుడు.  చూసి భయపడాల్సిండీ, అనుమానించాల్సిందీ కనబళ్ళేదు.

చనువుగా లోపలి వచ్చేశాడు.   సోఫాలో కూలబడబోతూ చుట్టూ చూశాడు.  కొద్దిగా మొహం చిట్లించాడు.  గబా గబా కర్టెన్లన్నీ పక్కకి లాగాడు.  కిటికీలన్నీ తెరిచాడు.  బొత్తిగా మొహమాటం లేనివాడల్లె వుంది!  ఏదో సొంతింట్లో తిరిగినట్టు  అటూ  ఇటూ  తిరిగాడు.  పుస్తకాల షెల్ఫ్ చూశాడు.   తెల్ల బోయి  అతని వంక చూస్తూ కాసేపు వుండిపోయాను.

“మంచి నీళ్ళు తీసుకుంటారా?” దూకుడుకి అడ్డు కట్ట వేసి ఒక చోట కూర్చో పెడదామని అడిగాను.

“వద్దు.  నీతో కొంచం పని వుండి వచ్చాను”

 

“పనా?!  ఏం పని?”

“కథ రాసి పెట్టాలి”

“కథా?  ఏం కథ?  ఎందుకూ? మీరెవరు?”ఏదైనా చిన్న పత్రిక నడిపే వాడా?  లేదా ఏదైనా సినిమా మనిషా?  సినిమా మనిషైతే  నా దగ్గరకు రాడే!

“ఒక కథ చెబుతాను.  కథ కాదు, నా  తెలిసినదేదో అనుకో.  దాన్ని నువ్వు రాయాలి”

“మీకు తెలిసిందే ఐతే  మీరే రాసుకోవచ్చుగా?”

“నువ్వు నా కన్నా బాగా రాయగలవు.  రచయిత్రివి కదా”

“ఐతే?”

“నన్ను నేను మౌఖికంగా వ్యక్త పరచగలను కానీ సరిగా రాయలేను.  అందుకే నీ సహాయం కావాలి”

“సరే చెప్పండి”ఇలాంటివి నాకసలు ఇష్టం వుండదు.  కానీ పాపం ముసలాయన.  తాపత్రయం కొద్దీ  వచ్చి ఉంటాడు.  రాయడం రాయక పోవడం తరవాతి సంగతి కదా.  చెప్పే నాలుగు ముక్కలు చేవినేసుకుంటే పోయేదేముంది.

సోఫా లోంచి లేచాడు.  తత్తర బిత్తరగా గదిలో తిరిగాడు.  దినపత్రిక చేతిలోకి  తీసుకున్నాడు.  వణుకుతూ పేజీలు  తిప్పాడు.

“ఇది చాలా ఎర్రబడి పోయింది.  పాపం.  రక్తం బైటికి కారి గడ్డ కట్టింది చూసావా?  మురిగి భరించలేని వాసన వేస్తోంది.  దీన్ని బైట పారేయోచ్చుగా”

“ఏమంటున్నారు?!”
“మనిషికీ మనిషికీ యుద్ధం ఎందుకు జరుగుతోందో నీకు తెలుసా?  ఆసలు యుద్ధం జరగాల్సింది బాహ్య క్షేత్రం మీద కాదు.  మనిషిలోపలనే.  యుద్ధం మొదలయ్యేది లోపలనే.  అంతం కావలసిందీ లోపలనే.  ఇప్పుడంతా సిస్టమ్ లీకేజ్.  చాలా ప్రమాదం.   తిరగబడి పోతోంది.  అదంతా ఎందుకలా జరిగిపోతుందో  తెలుసా?యుద్ద్ధాలూ, పోరాటాలూ, వీటి గురించి  ఆలోచిస్తావా  ఎప్పుడైనా?  మాట్లాడతావా ఎప్పుడైనా?  లేకపోతే ఒక ప్రేమ కథ, ఒక దయ్యం కథ, ఒక ముసలి మనిషి కథతో సరిపెట్టేస్తావా?”నా పక్కనే కూలబడి రెట్టించి  అడిగాడు.

కొంచెం కోపం వచ్చింది.  చిరాకు కూడా.

“నువ్వు ఏది రాసినా పర్లేదు.  కొద్దిగా కామన్ సెన్స్.  కానీ ఈ మురుగు వాసన గురించి రాయకపోతే చాలా నష్టం.  ఇది అంటువ్యాధి.  నీ ఇల్లంతటికీ అంటుకుంటుంది.”

లేచి వేరే కుర్చీలో కూర్చోబోయాను.  రెక్క పట్టుకుని ఆపాడు.

“నా చిన్నప్పుడు మా ఇంట్లో ఒక తోట.  నల్లని రేగడి మట్టి.  పుచ్చిపోయిన విత్తనం  వేసినా మొలకెత్తేది.  అంత చక్కని మట్టి.  మట్టిలో మధ్యలో ఒక రాతి బొమ్మ వుండేది.  బీజాన్ని చల్లుతున్న రైతు బొమ్మ.  ఎంత బాగుండేదనుకున్నావ్!  రోజూ  చూసే వాణ్ణి.  ఆ విగ్రహపు ముక్కు రంధ్రాలు చాలా పెద్దగా ఉండేవి.  నాకు ఆశ్చర్యం కలిగించేవి”

కథ చెబుతానని సోది చెబుతున్నాడు.  మనసులో విసుక్కున్నాను.

“నాకు నుదురు మీద రెండు పుట్టు మచ్చలున్నాయి.  ఒకటి కుడి పక్క,  నెల వంకని పోలి ఉంటుంది.  ఇంకొకటి ఎడమ పక్క, సూర్యుడి చిహ్నంలా వుంటుంది”జుట్టు వెనక్కి లాగి రెండు పుట్టుమచ్చలు చూబించాడు.  నిజంగానే రెండుపక్కలా రెండు మచ్చలేవో వున్నాయి.  కానీ, మధ్యలో ఈ పుట్టుమచ్చల శాస్త్రం ఏంటి!  విసుగు చిరాకుగా రూపు దిద్దుకోడం మొదలైంది.

 

“పదేళ్ళ పిల్లాడిగా వున్నప్ప్పుడు నాకు ప్రతి రోజు ఓ కల వచ్చేది.  ఆ అడవి మనిషి విగ్రహం పక్కన  నేను; ఆకాశంలో ఓ పక్క సూర్యుడు; ఇంకో పక్క చంద్రుడు.  ఇంతలో  రెండు జంతువులు విగ్రహం లోంచి బైటికొచ్చేవి.  ఆ జంతువులు మొదట  చిన్నగా ఉండేవి.  చూస్తుండగా పెద్దగా మారేవి.  ఒకటి కుందేలు,  ఇంకోటి గుర్రం.  కుందేలు వెండి రంగులో, గుఱ్ఱం బంగారు రంగులో ప్రకాశించేవి.   బైటికి వస్తూనే వేగంగా పరుగు మొదలు పెట్టేవి.  గుర్రాన్ని తాకాలని పరిగెత్తేవాడిని.  దొరికేది కాదు.  కనీసం కుందేలుని పట్టుకోవాలని ప్రయత్నించే వాడిని.  అదీ దొరికేది కాదు. పరిగెట్టేవి.  కుందేలు చంద్రుడిలోకి దూకేది.  గుర్రం సూర్యుడి మీదికి  దూకేది ”

మాయలేడి లాగా మాయా జంతువులు!  అయినా కలలో మాయా జంతువులూ, మనుషులూ, దయ్యాలూ, భూతాలూ ఇవ్వన్నీ అందరికీ కనబడుతుంటాయి.  పనిగట్టుకుని వాటి గురించి చెప్పుకోడం ఎందుకు!

“పూల తోటలో  సూర్యుడు ఉదయించే వేళ ఎర్రటి తూనీగ కనబడేది.  నాకొక్కడికే.  సాయంకాలం చంద్రుడు వచ్చే సమయానికి తెల్లటి సీతాకోక చిలక కనబడేది.  అదీ నాకొక్కడికే.   నీకు సీతా కోక చిలక ఇష్టమా లేక తూనీగా ఇష్టమా?”

తిక్క వాగుడికి తోడు  ఏదిష్టం అని  వెధవ క్విజ్ !  నేనేం చెప్పలేదు.

“ఈ రహస్యం నీకు తెలుసా?”

“ఏ రహస్యం?”

“జన్మ రహస్యం.  నా రహస్యం, నీ రహస్యం.   ఒక సాయంకాలం సూర్యుడు ఒక పక్క అస్తమిస్తూ వుండంగానే ఇంకో పక్క ఆకాశంలో చంద్రుడు కనిపించాడు.  ఆ సాయంకాలం విగ్రహం ముక్కు రంద్రాల్లోంచి రెండు ధగ ధగ లాడే కుంకుడు గింజంత వజ్రాలు బైట పడ్డాయి.  ఆ వజ్రాల్లో ఒకటి నీలి రంగుది.  ఇంకోటి నారింజ రంగుది”

“కుంకుడు గింజంత వజ్రాలా!” ఇతని పూర్వీకులు బాగా ధన వంతులై ఉండుంటారు.  అందుకే వజ్రాలని దాచి పెట్టారు!

“చూసావా ఎప్పుడైనా అటువంటి  వజ్రాల్ని”

“చూళ్ళేదు”

“కావాలా?”

ఆశ్చర్యం స్థానంలోఅనుమానం.  కావాలని చెప్పలేదు, వద్దని చెప్పలేదు.

“ఆ వజ్రాల్లో ఎర్రదానిని ఎడం చేతిలోకి తీసుకున్నాను.  నీలం దానిని కుడిచేతిలోకి తీసుకున్నాను.  అప్పుడేమైఁదో తెలుసా?  నా శరీరంలో ఎడమ సగభాగం చల్లగా అయిపోయింది.  కుడి భాగం వేడెక్కిపోయింది.  ఇలా ఎక్కడైనా జరగుతుందని నీకు ఇంతకూ ముందు తెలుసా? నువ్వు నేను చెప్పేది నమ్ముతున్నావా? నమ్మట్లేదా?”నా ముఖం వంక చూసి అతని మాటల్ని నేను అనుమాన పడుతున్నానని కనిబెట్టేశాడు. నమ్మినా నమ్మక పోయినా తను చెప్పేది చెప్పేదే అన్నట్టు ముందుకు వెళ్ళాడు.

“ఆ వజ్ర్రాల్ని చేతిలోకి తీసుకుంటూనే నేను ఉన్నట్టుంది అనంతం లోకి వ్యాపించాను.  రెప్ప మూసి తెరిచేలోగా నేను అంతరిక్షంలో వున్నాను.  అక్కడో ప్రాణ పుంజం వుంది.  దాని కిరణాలు అన్నివైపులా వ్యాపించి వున్నాయి”ఉత్తేజంగా చెబుతున్నాడు.

“ఔనా?!”

“నాకు అసలు విషయం  తెలిసిపోయింది”గొంతు తగ్గించి చెప్పాడు.

“ఏంటదీ?!”

“ఆ ప్రాణ  పుంజం ఎంతవరకూ చొచ్చుకుని పోతుందో అంతవరకూ  ప్రాణ శక్తి మనుగడ.  ఉపసంహరిస్తే నిర్జీవం.  అసలుకి మొదటి మనిషి లోపటి ధాతువులు ఒక్కటే.  కానీ కారణం  లేకండా రెండు భాగాలైపోయాడు.  ఇద్దరు మనుషులుగా మారిపోయాడు.  ఆ ఇద్దరూ  రెండు  కేలండర్లు తయారు చేసుకున్నారు.  ఒకరు సూర్యుడి గమనం లెక్కేశాడు, ఒకరు చంద్రుడి గమనం లెక్కేశాడు”

“ఐతే ఏంటి?!”

“ఇంతమాత్రానికే ఇద్దరూ ఒకరితో ఒకరు ఘర్షణ పడుతున్నారు.  మళ్ళీ ఈ ఒక్కో కేలండర్ వాళ్ళూ తమలో తాము తెగలుగా విడిపోయారు.   గొడవ పడుతూనే వున్నారు.  ఎప్పటినుంచి అనుకున్నావు?  నీకసలు ఊహకే అందని కాలం నుంచీ.  మరీ పాత విషయం కదా. అందుకే ఎవరూ గుర్తించుకోలేక పోయారు”

“కేలండర్ల గురించే గొడవలా?”

“గొడవలే కాదు.  పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి.  జరుగుతున్నాయి. జరగబోతున్నాయి”

“కేలండర్ గురించి ఎవరైనా ఎందుకు గొడవ పడతారు?  మీరు చెప్పేది మరీ అర్ధం లేకుండా వుంది”

“నువ్విలాగే అంటావని ఊహించాను.  సరే ఐతే నువ్వు చెప్పు, ఎందుకు యుద్ధాలు జరుగుతాయో?”

“యుద్ధాలు ఎక్కువ భాగం  ఆర్ధిక కారణాల వల్ల జరుగుతాయి.  బైటికి కనబడని బలమైన డ్రైవ్స్ వల్ల జనాలు ఒకరి నొకరు చంపుకుంటారు.  నాకు తెలుసు, యుద్ధాలు అతి తెలివిగలవాడి పన్నాగంతో ప్రారంభం అవుతాయి.  చాలా మటుకు వాడికే లాభిస్తాయి”నిజానికి పిచ్చోడితో నేను ఇన్నేసి మాటలు మాట్టాడకూడదు.  కానీ,  ఎందుకో నాక్కూడా తెలుసులేవో అని చెప్పాలని పించింది.

“నేను చెప్పిన దానికీ, నువ్వు చెప్పిన దానికీ తేడా లేనే లేదు.  కేలండర్లు వేరు కావడం గురించే నువ్వు కూడా చెబుతుంట!  మనిద్దరి భావనా ఒకటే.  చూడు, అన్నం అందరికీ కావాలి.  కానీ కొంచమే వుంది.  సరిపోదు.  సరిపోవాలంటే ఇంకా చాలా పండించాలి.  పండించడానికి చోటు కావాలి.  వేరుకి నీళ్ళు కావాలి.  మొక్కకి వెలుతురు కావాలి.  ఇవ్వన్నీ ఒక్కచోటనే దొరకవు మరి.  దొరకప్పోతే ఎవడైనా  ఏం చెయ్యగలడు?”

Kadha-Saranga-2-300x268

ఖర్మ కాబోతే తలా తోకా లేని ఇతని వాగుడేంటి.  పొద్దున్నే అనుకోకుండా ఇంత పెద్ద సమస్యలో ఇరుక్కు పోవడమేంటి!.   ఈ పిచ్చాడు ఇలా వాగీ వాగీ ఉన్నట్టుండి జేబులోంచి కత్తి తీసి దాడిచేస్తే , మీద పడి కరిచేస్తే.  దేవుడా ఇప్పుడు ఏమిటి చెయ్యడం.  ఇటువంటి ఇబ్బందులు వస్తాయనే సేఫ్టీ కోసం పెప్పర్ స్ప్రే తెచ్చి పెట్టాను.  సమయానికి అది ఎక్కడ పెట్టిందీ గుర్తుకు రావడం లేదు.

“నేను చెప్పేది నువ్వు నమ్ముతున్నట్టు లేదు” నా భావనలు కనిబెట్టినట్టుగా చిన్నగా నవ్వాడు.  ముందుకు జరిగాడు.  కుడి చేతి గుప్పిడి మూసి వుంది.  తెరిచి చూబించాడు.  నిజంగానే మెరుస్తున్న రెండు రంగు రాళ్ళు వున్నాయి చేతిలో.   నా రెండు చేతుల్నీ తన చేతుల్లోకి తీసుకున్నాడు.  నాకు ఖంగారు పుట్టింది.  చేతుల్ని వెనక్కి లాక్కోవాలని చూసాను, గట్టిగా పుట్టుకుని వున్నాడు.  నా వల్ల కాలేదు.    ఏదో కనికట్టు చేస్తున్నాడు.

“మనం ఇంతకూ ముందు కలవక పోయినా నువ్వు నన్ను ఇప్పటికే గుర్తు పట్టి వుండాలి”

“అయ్యో, నిజంగా మీరెవరో నాకు తెలీదు.  నేను గుర్తు పట్టలేదు.  దయచేసి మీరు ఇంక బైటికి వెళ్ళండి”ఎలాగో ఈ నాలుగు ముక్కలూ మాట్టాడగలిగాను.

“గుర్తు పట్టలేదా?  నేను పురుషుడిని కదా.  ఎందుకు గుర్తు పట్టలేదు?” దబాయించాడు..

వీడమ్మా భడవా. ముసిలాడు సామాన్యుడుకాదు.  ఇది మామూలు పిచ్చి కాదు.  ఈ పురుషుడి బారినుండి ఇప్ప్పుదేలా బైట పడాలి.  సమయానికి ఇంటి పురుషుడు బైటికి వెళ్ళాడు.

“మన మధ్య కూడా లెక్క లేనన్ని వైరుధ్యాలు.  కానీ, నిజానికి మనమిద్దరం కూడా ఏకాంశులం.  జ్ఞాపకం వుందీ?”

“నాకేం జ్ఞాపకం లేదు.  ముందు మీరు ఇంట్లోంచి బైటికి వెళ్ళండి ” హిస్టీరిక్ గా అరిచాను.  తల విదిలించాడు.

“చూస్తున్నవన్నీ ఒకే ధాతువుల నుండి వేరు పడ్డ శరీరాలు.   ఆ లెక్కన  నేను నీకు సోదరుణ్ణి.  సరేలే, ఈ పిలుపులు అన్నీ సబ్ కాన్సియస్ మైండ్ చేసే మేజిక్కులు.  నాకూ తెలుసు.  కానీ నేనేమంటానంటే, అర్ధం చేసుకో.  ఎలాగోలా.  బీజంలో ప్రాణం వుండాలి.  అది మెత్తటి సారవంతమైన క్షేత్రంలో వుండాలి.  అప్పుడే మొలకెత్తుతుంది.  శరీరాలు బిగుసుకు పోతే అవి స్కలనానికి పనికిరావు.  నేను చెప్పింది రాయి.  నువ్వు రాయక పోతే నేను మళ్ళీ వస్తాను”లేచి వడి వడిగా నడుస్తూ వెళ్ళిపోయాడు.  నేను ఒక్క అంగలో తలుపు దగ్గరికి వెళ్లి గబాల్న తలుపేసేశాను.

“రాయకపోతే మళ్ళీ వస్తాను.  తీశావా పెన్నూ పేపరూ, ఇంకా లేదా?”తలుపు బైట నుంచీ కేకలు వేశాడు.  నాన్న చిన్నప్పుడు హోమ వర్క్ చేశావా లేదా అని అరిచినట్టుగా వుంది.  భయపడ్డాను.  నాన్నకి భయపడినట్టే.  దడ దడ లాడతా నాలుగు తెల్ల కాగితాలు తీసుకుని వంకర టింకరగా ఏదోలా రాసేశాను.  చమటలు కారి పోతున్నాయి.  కాగితం తడిసి పోయింది.    ఎలాగోలా రాసేశాను.  హడావిడిగా రాయటాన పెన్ను ఒత్తిడి కలిగించి కుడిచేతి వేళ్ళు ఎర్రగా తేలాయి.

మీ మాటలు

  1. A different kind of story I have never read!

  2. టి. చంద్రశేఖర రెడ్డి says:

    అవును. కథ విభిన్నంగా ఉంది. కథనం సింబాలిక్ గా సాగటం వల్ల విలక్షణంగా, విశిష్టంగా కూడా అనిపించింది. అక్కడక్కడ దొర్లిన అక్షరదోషాలు నివారించగలిగే ఉంటే, కథ కలిగించిన అనుభూతి మరింత పరిపూర్ణమయేది.

    ఈ కథకి నా ఊహ అనుమతించిన మేరకు, నేను గీసుకున్న రేఖారూపం విడిగా సారంగ సంపాదకవర్గానికి ఈ మెయిల్ ద్వారా పంపిస్తున్నాను. వీలైతే కథకు అనుసంధానించండి.

    టి. చంద్రశేఖర రెడ్డి

    • గ్రీష్మ కలిదిండి says:

      పై కథలోని విలక్షణత , విశిష్టత ఏమిటో కొంచం వివరిస్తారా రెడ్డి గారూ ? రచయిత్రి తన సైన్స్ పరిజ్ఞానాన్ని రంగరించి అల్లిన ఈ కథ ఎంతమందికి అర్థమయి ఉంటుందో చెప్పండి ? ఇలాంటి ఇతివృత్తాలు కవిత్వం గా రాసుకుంటె పేచీ ఉండదు. కథ వేరు , కవిత వేరు. ఈ రెండు ప్రక్రియలని సంకరం చేసి పాఠకులను విభ్రాంతికి గురిచేయకండి – పాఠకుల్లో 99 శాతం సాదాగా కథని కోరుకుంటారు . లేదా, టెక్నీక్ వాడినా వస్తువు అర్థం కావాలనుకుంటారు. మీలాంటి మేధో వర్గం శాతం ఎంత?

      • సైన్స్! ఇందులో నాకు సోషల్ ఎక్కువ కనబడింది! శతాబ్దాల నుండీ నడుస్తున్న క్రిస్టియన్ , ఇస్లారం యుద్ధాలు , దానికి వున్న కారణాలు సూటిగా కాకుండా మార్మికంగా చెప్పాలని ప్రయత్నం చేసినట్టు వుంది. ఇసలాం, క్రైస్తవ , హిందూ పునాదులు, వారి వారి నమ్మకాలనూ కోఆర్డినేట్ చేయాలని

  3. బాగుంది. కొంచం అర్ధం చేసుకోవడం కష్టంగా వుంది.

  4. అప్పుడప్పుడూ ఒక్క శాతం మేధావుల కోసం కూడా ఎవరో ఒకరు కథలు రాయొద్దా

    • గ్రీష్మ కలిదిండి says:

      ఎందుకు రాయకూడదండి బాబూ . భేషుగ్గా రాయొచ్చు . కాకపొతె అందరికీ మీరన్నట్టు శతాబ్దాల నుండీ నడుస్తున్న క్రిస్టియన్ , ఇసలాం యుద్ధాలు , దానికి వున్న కారణాల మాదిరి కాకుండా మరోలా అర్థం కావచ్చు. ఇలాంటి మార్మిక కథలు శూన్యం లో సాగిపోయే మేఘాల్లాంటివి – ఒక్కొక్కరికి ఒక్కో ఆకృతిలో ( మీకు కొంగ లా కనిపిస్తే నాకు గుర్రం లా) అర్థమవుతాయి.
      “నేను తోలు మల్లయ్య కొడుకును ” వంటి జీవిత సారం పిండిన మంచి కథ రాసిన రచయిత్రి “చిక్కుముడి ” వంటి కథ రాశారెందుకని కొంత ఆశ్చర్య పోయా అంతే.
      ఆ ఒక్క శాతంలో మీరు ఉన్నందుకు – శుభాకాంక్షలు.

  5. Sharada Sivapurapu says:

    అన్ని యుద్ధాల తరవాత స్త్రీ పురుషుల మధ్య కూడా లేని సఖ్యత వాళ్ళ జరుగుతున్న యుద్ధం గురించి కూడా చెప్పారు. కధ నాకు నచ్చింది. యుద్ధమెపుడూ ఆలోచనల్లొస జరగాలి. దినపత్రిక ఎర్రబడింది. మురుగు వాసన వస్తోంది, అవును. నుదిటి మీద నెలవంక ఎర్రని సూర్యుడిలా మచ్చలు హిందూ ముస్లిం యూనిటీ అనుకుంటా. తప్పయితే చెప్పండి. రైతు ముక్కు రంధ్రాలు పెద్దగా ఉండటం కాలుష్యం లేని గాలా? ఒక్క రాళ్ళ విషయం అర్ధమయ్యి కానట్టుగా ఉంది. ఈ కామెంట్ రాయడానికి కూడా కధ మళ్ళీ చదివాను . ఆలోచింపచేసే కధ. చిన్న కధలో పెద్ద విషయాల్ని ఎన్నో చెప్పారు.

    • రైతు ముక్కు రంధ్రాలు పెద్దగా ఉండటానికి సంబంధించి కథ పేరులో సూచన వుంది. హిందువులు ప్రాచీన కాలంలో శ్వాసని గమనించే ధ్యానం చేసేవారు. మిగతా మతాల్లో అటువంటి ధ్యానాలు ఉన్నాయో లేవో మరి తెలీదు. ఎర్రని వజ్రం సూర్య నాడిని, నీలం వజ్రం చంద్ర నాడిని, సుషుమ్న వాటి సంయోగ కేంద్రాన్నీ సూచిస్తాయి. శ్వస గమనం కాల వ్యవధుల్ని బట్టి మారుతూ ఉంటుంది. సూర్య నాడీలో వున్నపుడు మానసిక స్థితి ఒక్కోలా ఉంటుంది. చంద్ర నాడీలో వున్నపుడు వేరేగా ఉంటుంది. దీనినినే ఆధునిక వైద్య పరి భాషలో మస్తిష్కార్ధ గోళాలూ, ఇతర కేంద్రాలుగా గుర్తించారు. మెదడు ఎడమ భాగంలో లాజిక్ , కుడి భాగంలో క్రియేటివిటీ వుంటాయని వైద్య శాస్త్రం చెబుతుంది. ఇఇ కథలో చాలా innaate థియరీ వుంది. రాయడానికి ఇక్కడ స్థలం చాలదు.

మీ మాటలు

*