మజిలి

 

 

– ఊర్మిళ

~

 

ఓ ముడుచుకున్న

మాగన్ను దావానలమా!

ఓ తిరగబడ్డ కాలమా!!

మరీచికా గగనమా

శూన్యం నిండిన విశ్వాంతరాళమా!

ఖండఖండాలుగా

స్రవించిన రుధిరమా!

వలయ వలయాలుగా

ఘనీభవించిన దేహమా!!

వెయ్యిన్నొక్క అలలుగా

ఎగసిన ఆశల శిఖరమా!

అగాథం అంచులో

వేలాడుతున్న జీవిత చక్రమా!

పిడచకట్టిన కుహరంలో

తిరగాడుతున్న దాహమా!

ఎండిన మొండి మానుపై

తెగిపడిన గాలిపటమా!

శ్మశాన సమాధులపై

లిఖించిన మోహగీతమా!

పేర్చిన చితిమంటలో

ఎగసిన మమతల మకరందమా!

సూర్యాస్తమయాల కౌగిలిలో

నలిగి నర్తించిన కాంతిపుంజమా!

పెనుగాలి తుపానులో

సుడులు తిరగాడిన విహంగమా!

కారుమబ్బుల కారడవిలో

నిటారుగా నిలిచిన తిమింగలమా!

మొగ్గ తొడిగిన మామిడి చెట్టుపై

ఊయలూగుతున్న నిశాచరమా!

ఒగ్గిపట్టిన దోసిలిలో

రాలిపడిన ధూళి లేపనమా!

గరకు తేలిన నేలపై

పరుగుపెడుతున్న పాదరసమా!

పూపుప్పొడిలా

రాలిపడిన నిశి నక్షత్ర సంయోజనమా!

పొద్దు తిరుగుడు పువ్వులో

పారాడిన పసరికమా!

విచ్చుకున్న ఉమ్మెత్త పొదిలో

విరబూసిన పచ్చగన్నేరు లాస్యమా!

 

ఏది నీ మజిలీ!

బాటసారి దారి పొడవునా…

గిరకలేని బావులే కదా..! *

*

 

మీ మాటలు

  1. rama krishna sangem says:

    వావ్, రొమాంటిక్ నిహిలిజం అద్భుతం….

  2. కె.కె. రామయ్య says:

    ఊర్మిళ గారూ, అద్భుతం…. మీ కవితా విహంగ విన్యాసం. పదపదం లో తొణికిసిలాడిన లాస్యం.

  3. Narayanaswamy says:

    చాల బాగుంది ఊర్మిళ గారూ – కొత్త అభివ్యక్తి – కొత్త ఊహలు – బాటసారి దారిపొడుగునా గిరకలేని బావులే కదా – నిజమే కదా – కవితలోప్రతి వాక్యం కొత్తగా, కొత్త మెటఫర్ ల తో ఉన్నది – అభినందనలు

మీ మాటలు

*