అంతా కాల కోలాహలమే!

 

-జయశ్రీ నాయుడు

~

 

తన సిరాను తనే తయారు చేసుకుని

జీవితపు కాగితాల మీదకు వొంపుతుంది

వ్యక్తి వాదమై జీవిస్తుంది

ప్రతి కలమూ కాలమే అయినా

సిరాల రంగులు రాతల రీతులూ వేరు వేరవుతాయి

రీతులన్నీ పరుగులు తీస్తూ

కొన్ని దారులు చేస్తాయి

ఇక మాటల గోదారి ఉరకలేస్తుంది

మాగాణి పైరులా పచ్చని బంధాలు

కొన్ని కోతల కరుకు గరుకు గళాలు

మరి కొన్ని అంతా కాల కోలాహలమే

బిందువులా జాలువారుతూ

అక్షరాల గళం లా కాగితం పై పరుచుకుంటు

జీవిత సేద్యం చేస్తావు

దెన్ హాపెన్స్

ది కాల్ బాక్

కొత్త కలాన్ని సిద్ధం చేసిందేమొ

పెన్ డౌన్ చేసి

ప్రపంచానికి శెలవు ఇవ్వమంటుంది

ఇంకి పోయిన సిరాని

తిరిగి కలం లోకి ఇంజెక్ట్ చెయ్యలేక

జ్ఞాపకాలైన అక్షరాల్నే చదువుకుంటూ

వ్యక్తి గా నిలబడే రూపాన్ని

మనసు మీద ప్రతి పూట కొత్తగా చిత్రించుకోవడం ఇదే…

మా ఆలోచనల కాన్వాస్ లకు

నువ్వు అరువిచ్చిన మేల్కొలుపు

ది మ్యూజిక్ నెవర్ డైస్!

*

మీ మాటలు

  1. Aranya Krishna says:

    ఎస్. హిజ్ మ్యూజిక్ అండ్ మాజిక్ విల్ నెవర్ డై! మంచి పోయం!

  2. Rajaram thumucharla says:

    అతనొక సంగీతం.ఆదీవాసీ నిర్వాసితుల సంక్షోభాన్ని సంగీతం చేసిన ఎర్ర సముద్రం.మీ పోయమ్ ఆయనకు గొప్ప నివాళి మేడమ్ జయశ్రీ గారు

Leave a Reply to Rajaram thumucharla Cancel reply

*