వాళ్ళూ, వాళ్ళ పిల్లలూ…

-మెర్సీ మార్గరెట్
~

mercy

 

 

 

 

 

ఈ నీలాకాశం కిందే
మూడొంతుల నీళ్ళతో  నిత్యం పరిభ్రమించే భూమి మీదే
వారు వాళ్ళ పిల్లల్ని పెంచుతారు

తమ తల్లులు తమని పెంచినట్టు
తండ్రులు పొట్టపై పడుకోబెట్టుకునో, పక్కలో రొమ్ముపై ఆనించుకునో
నానా రహస్యాలు మాట్లాడుకున్నట్టు
చుక్కల్ని లెక్కిస్తూనే కథల్లో లౌక్యం నేర్చుకుంటూ
వారూ పెరుగుతారు
తమ తల్లిదండ్రులు నేర్పిన ఆశలతో
తమలో వారు నాటిన విలువలతో

యేమేమి నేర్పుతారో
యే తర్పీదు నిస్తారో
సద్బోధనో, వైద్యమో, ఔషదమూలికలు కనుగొనడమో
పరామర్శ చేయడమో , పరిచర్య చేయడమో
గురువులైన తలిదండ్రులే తమ ఒడిలో
యే కొత్త ఆకాశాన్నో , యే స్వచ్చమైన పావురాళ్ళనో
లాలనగా పెంచుకుంటారు
ఒకరికొకరు తోడు మనుషులని మళ్లీ మళ్ళీ వల్లెవేయించి
నేర్పుతారేమో మరీ పాఠాలు

ఒకానొక రోజు
ఆ పిల్లల్లకూ పిల్లలు పుడతారు
వాళ్ళూ అమ్మా నాన్నలవుతారు
తమ తల్లులు తమని పెంచినట్టు
తండ్రులు పొట్టపై పడుకోబెట్టుకుని, పక్కలో రొమ్ముపై ఆనించుకుని
తమని పెంచినట్టు వాళ్ళ పిల్లల్నీ పెంచుతారు

కానీ వీళ్లు తమ పిల్లలతో
మతోన్మాదం గురించి మాట్లాడతారు
మక్కా మసీదు, లుంబినీ వనంలో బాంబు పేలుల్ల గురించి
11/9 సంఘటన
పాలస్తీనా, ఇశ్రాయేల్ యుద్ధం గూర్చి
ఆ రాత్రి ఫారిస్ ముఖంపై జరిగిన ఆత్మాహుతి దాడి గురించి
మాట్లాడతారు

తమ పిల్లల వీపు నిమురుతూ
వాళ్ళ కళ్ళలోకి చూస్తూ చెపుతారు కదా
మనిషికి మనిషే తోడు
మృగాల్లా మీరెప్పుడూ ఆలొచించొద్దూ అని
అంతేగా మరి
వాళ్ళూ ఎప్పుడో అమ్మానాన్నలై
గురువులుగా మారుతారు.

*

మీ మాటలు

  1. Dr.Pasunoori Ravinder says:

    మెర్సీగారు…అభినంద‌న‌లు..
    మంచి క‌విత రాశారు. వ‌ర్థ‌మాన ప‌రిస్థితుల మీద మంచి స్పంద‌న‌.
    అయితే… మృగాళ్లాగ మీరెప్పుడూ ఆలొచించొద్దు!! అనే వాక్యం ద‌గ్గ‌రే పోయెం ఆపి ఉంటే బాగుండ‌నిపించింది.
    -ప‌సునూరి ర‌వీంద‌ర్‌

మీ మాటలు

*