Anne Of Green Gables By L.M.Montgomery
” మెరిల్లా, ఒక్క నిమిషం డయానా దగ్గరికి వెళ్ళి రావద్దా నేను ? ”ఆదుర్దా గా అడిగింది ఆన్.
” ఎందుకూ ఈ చీకట్లో పడి ? ఇద్దరూ కలిసేవచ్చారుగా బడినుంచి ? మంచులో నిలబడి అరగంటకి పైగా మాట్లాడేసుకున్నారు కూడానూ..అన్నేసి కబుర్లు ఏముంటాయోగాని ! మళ్ళీ ఏమిటట ? ”
” కాని తను నన్ను చూడాలనుకుంటోంది- ఏదో ముఖ్యమైన సంగతే ఉంది ”
” అదెలా తెలుసు నీకు ? ”
” కిటికీ లోంచి సైగ చేసిందిగా ? కొవ్వొత్తి వెలిగించి పెట్టి దాని మీదినుంచి అట్టముక్కని అటూ ఇటూ ఊపాలి… అది నేనే కనిపెట్టాను ”
” నువ్వే లే, అందులో అనుమానమేముంటుంది ! మీ పిచ్చి వ్యవహారం తో కిటికీ తెరలకి నిప్పంటిస్తారో ఏం పాడో ! ”
” లేదు లేదు..మేము చాలా చాలా జాగ్రత్తగా ఉంటాంగా…ఆ ఊపటాలకి ఒక లెక్క ఉందిలే – రెండుసార్లు ఊపితే – ‘ ఉన్నావా ? ‘ అని. మూడుసార్లు ఊపితే ‘ ఉన్నాను ‘ అని. నాలుగుసార్లైతే ‘ పనిలో ఉన్నాను ‘ అని. అయిదుసార్లు ఊపితే ‘ చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి, త్వరగా వచ్చెయ్యి ‘ అని. డయానా ఇందాక అయిదు సార్లు ఊపింది – ఆ సంగతేదో తెలుసుకోవాలని మహా ఆరాటంగా ఉంది నాకు ”
” సరే, సరేలే. అంత ఆరాటం తట్టుకోలేవుగాని, వెళ్ళి పది నిమిషాల్లో వచ్చెయ్యి ”
ఆన్ ఆ మాట గుర్తు పెట్టుకుని అలాగే వెనక్కి వచ్చేసింది. డయానా చెప్పే అతి ముఖ్యమైన సంగతులని పదినిమిషాల్లో కుదించుకోవటం ఎంత కఠినమైన పనో , ఆ కొద్ది సమయాన్నీ ఆన్ ఎంత బాగా వినియోగించుకుందో – నరమానవుడెవరికీ ఊహకందదు.
” నీకు తెలుసా మెరిల్లా, రేపు డయానా పుట్టినరోజు. బడినుంచి వచ్చేసిన దగ్గర్నుంచి, రాత్రంతా నన్ను వాళ్ళింట్లో ఉండిపోయేలాగా వాళ్ళమ్మని అడుగుతానంది. ఇంకానేమో , డయానా వాళ్ళ కజిన్స్ న్యూ బ్రిడ్జ్ నుంచి రేపు సాయంత్రానికి వస్తున్నారు – మంచి గుర్రపు బగ్గీ ఉంది వాళ్ళకి, అందులో వస్తున్నారన్నమాట. రేపు పొద్దుపోయాక డిబేటింగ్ క్లబ్ లో కచేరీ ఉందట- డయానానీ నన్నూ వాళ్ళు అక్కడికి తీసుకుపోతారట..నువ్వు ఒప్పుకుంటేనేలే..వెళ్ళనా మెరిల్లా..పంపించవూ నన్ను ? ”
”ఊహూ.నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. అవి చిన్నపిల్లలు వెళ్ళేవి కావు ”
” కాదు మెరిల్లా , అక్కడంతా మర్యాదగానే ఉంటుంది ” – ఆన్ నచ్చజెప్పబోయింది.
” కాదనటం లేదు నేను. అవి అయేప్పటికి అర్థరాత్రి దాటిపోతుంది, అంతసేపు మేలుకుని ఉంటే పిల్లలకి ఆరోగ్యాలు పాడైపోవూ ? మిసెస్ బారీ ఎలా వెళ్ళనిస్తోందో డయానాని – చాలా పద్ధతిగలదాన్నంటుంది మళ్ళీ ”
ఆన్ కళ్ళనీళ్ళపర్యంతమైంది – ” చాలా ప్రత్యేకమైన సందర్భం కదా మెరిల్లా ? పుట్టినరోజు ఏడాదికి ఒకసారే కదా వచ్చేది , అస్తమానమూ రాదు కదా ? ప్రిస్సీ ఆండ్రూస్ అక్కడ పద్యం చదువుతోంది – ‘ నిషేధాజ్ఞ గంట మోగరాదీరాత్రి ‘ అని- అది నీతిబోధకమైనదే కదా ?? భజనమండలి వాళ్ళు నాలుగు విషాద గీతాలు పాడతారట, చర్చ్ లో పాడే కీర్తనల్లాంటివే ! ఆఖరికి పాస్టర్ గారి ఉపన్యాసం కూడా ఉందట- ఆయన చర్చ్ లో మాట్లాడినా ఇంకెక్కడ మాట్లాడినా ఒకటే కదా చెప్పు , విని తీరాల్సిందే కదా ? వెళ్ళనివ్వు మెరిల్లా, నన్ను ” – బతిమాలింది.
” చెప్పింది అర్థమైందా లేదా నీకు ? వెళ్ళి బూట్లు విప్పేసి నిద్రపో, ఎనిమిది దాటుతోంది ”
” ఈ ఒక్క మాటా విను మెరిల్లా , దయచేసి ! మిసెస్ బారీ వాళ్ళింట్లో ‘ అతిథుల గది ‘ ఇస్తానన్నారట నాకు – చిన్నపిల్లని, ఎంతో గౌరవం కదా అది నాకు , ఆలోచించవూ ? ”
” నీకిప్పుడు ఆ గౌరవం తో ఏమీ అవసరం లేదులే. వెళ్ళి నిద్రపో, ఇంకేం చెప్పకు నాకు ”
ఆన్ దిగులు దిగులుగా, కళ్ళ నీళ్ళు కార్చుకుంటూ , పైకి వెళ్ళాక , అప్పటిదాకా వసారాలో నిద్రపోతున్నట్లు పడుకున్న మాథ్యూ కళ్ళు తెరిచాడు .
” ఆన్ ని వెళ్ళనిస్తే బావుంటుంది మెరిల్లా ” – మెల్లిగా అన్నాడు.
” అస్సలు వీల్లేదు. దాన్ని పెంచుతోంది ఎవరటా- నువ్వా , నేనా ? ” కస్సుమంది మెరిల్లా.
” అది కాదూ ” నసిగాడు.
” అయితే నువ్విందులో కలగజేసుకోకు ”
” నీ అభిప్రాయం లో నేను కలగజేసుకోవట్లేదు – నా అభిప్రాయం చెబుతున్నా అంతే ”
” ఆన్ చంద్రమండలానికి వెళతానన్నా పంపించమంటావు నువ్వు ” – కొంచెం ప్రసన్నంగానే ఎత్తిపొడిచింది – ” డయానా ఇంట్లో రాత్రికి ఉండేందుకైతే పంపించేదాన్నే ..ఆ కచేరీ వ్యవహారం నచ్చలేదు నాకు. ఆ రాత్రప్పుడు ఇంటికొస్తుంటే చలిగాలికి జలుబూ దగ్గూ పట్టుకుంటే ఏం చెయ్యాలి ? ఆ కచేరీ హడావిడి లో ఉన్నవీ లేనివీ తలకెక్కించుకుని ఉబలాటపడిపోతుంది, ఒక వారం వరకూ మామూలు మనిషి అవదీ పిల్ల- నాకు తెలీదా
దీని సంగతి ? ”
” నువ్వు ఆన్ ని పంపించటమే మంచిదని నేను అనుకుంటున్నాను ” – మాథ్యూ తొణక్కుండా చెప్పేశాడు. అతనికి వాదించటం బొత్తిగా రాదుగాని, అన్న మాటనే పట్టుకు కూర్చోవటం మటుకు బ్రహ్మాండంగా వచ్చు. మెరిల్లా ఇంకేం మాట్లాడలేక అక్కడినుంచి వెళ్ళిపోయింది.
మర్నాడు పొద్దున ఫలహారం అయాక ఆన్ గిన్నెలు కడుగుతోంది- అటుగా వెళుతూన్న మాథ్యూ మెరిల్లా ఉన్న వైపుకి తొంగి చూసి మళ్ళీ చెప్పాడు –
” ఆన్ ని నువ్వు పంపించి తీరాలి మెరిల్లా ”
మెరిల్లా మొహం కందగడ్డలా అయిపోయింది.
అప్పటికి, కోపాన్ని దిగమింగుతూ
” సరే. నువ్వు ఊరుకునేట్లు లేవుగా అసలూ..సరే . ”
ఆన్ అంతా వింటూనే ఉంది, చెంగుమని గెంతింది అక్కడికి – చేతిలో తడిగిన్నెలు తుడిచే గుడ్డతో సహా.
” మళ్ళీ చెప్పు మెరిల్లా, మళ్ళీ చెప్పు ”
” ఒకసారి చెప్పాగా, చాల్లే. నువ్వు ఆ చలిలో నడిచి న్యుమోనియా తెచ్చుకుంటే నాకేం పూచీ ఉండదు గుర్తు పెట్టుకో. కొత్త చోట పడుకుని ఇంకే జబ్బైనా చేసినాదానికీ మాథ్యూనే బాధ్యత వహించాలి, నేను కానే కాదు . ఆన్ షిర్లే, ఆ గుడ్డ లోంచి జిడ్డు నీళ్ళు కారుతున్నాయి, నేలంతా పాడయేట్లుంది, గిన్నెలు సరిగా కడిగావా లేదా అని ? ”
” నాతో నీకు విసుగు పుడుతుంటుంది, తెలుసు నాకు . నా తప్పులకి బాధపడుతుంటాను – కానీ, చేసే అవకాశం ఉండి కూడా కొన్ని తప్పులు చెయ్యను- వాటిని తలుచుకుని తృప్తి పడుతుంటాను. ”- ఆన్ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసింది-
” మళ్ళీ కడుగుతాలే. నేలంతా ఇసకతో రుద్ది శుభ్రం చేస్తాలే. ఓ- మెరిల్లా, నా మనసంతా కచేరీ మీదే ఉంది, జన్మలో వెళ్ళలేదు నేను. బళ్ళో చాలా మంది వెళ్ళారట ఎప్పుడో ఒకప్పుడు, మాట్లాడేసుకుంటూ ఉంటారు- నేను వెర్రి మొహం వేస్తుంటాను. నాకెలా అనిపిస్తోందో నీకు అర్థం కాలేదు – మాథ్యూ కి అర్థమైంది. అర్థం చేసుకోబడటం ఎంతో ఆనందం గా ఉంటుంది. ”
ఆ ఉత్సాహం తో , బళ్ళో ఆన్ పాఠాల మీద శ్రద్ధే పెట్టలేదు. గిల్బర్ట్ బ్లైత్ , స్పెల్లింగ్ లోఆమె ని ఓడించేశాడు- నోటి లెక్కల్లో ఆన్ అతనికి ఆమడ దూరం వెనక పడింది. అవేవీ మామూలుగా కలిగించే అవమానాన్ని కలిగించలేదు – కచేరీ గురించీ డయానా వాళ్ళింట్లో అతిథుల గది గురించీ తలుచుకుంటూ ఉండిపోయింది. ఆన్, డయానా ఆపకుండా మాట్లాడుకుంటూనే ఉన్నారు – మిస్టర్ ఫిలిప్స్ ఏ కళ నున్నాడో , పట్టించుకోలేదు. నిజానికి బళ్ళో అందరూ అదే సందట్లో ఉన్నారు. అవొన్లియా క్లబ్ లో ఇదివరకు చిన్న చిన్న కార్యక్రమాలు జరిగాయిగాని, ఇంత భారీ ఎత్తున జరగటం ఇదే మొదలు. పది సెంట్ లు టికెట్, ఆ డబ్బు తో లైబ్రరీ కి చాలా పుస్తకాలు కొంటారట. పాల్గొనే పిల్లలందరూ ఎన్ని రోజులనుంచో సాధన చేసుకుంటున్నారు – వాళ్ళ తమ్ముళ్ళూ చెల్లెళ్ళూ వాళ్ళ కంటే హడావిడి పడిపోతున్నారు.
ఆన్ ఆనందం బడి వదలగానే ఇంతెత్తున పొంగింది, అది పెరిగి పెరిగి కచేరీ సమయానికి అవధులు దాటిపోయింది. డయానా ఇంట్లో చాలా నాగరికమైన టీ ఏర్పాట్లు జరిగాయి. అది అయాక డయానా గదిలో ఇద్దరూ ముస్తాబయారు. ఆన్ జుట్టుని కొత్తరకంగా దువ్వింది డయానా. డయానా జుట్టులో రిబ్బన్ లు ఆన్ అందంగా ముడి పెట్టింది. ఇంకా రకరకాల ప్రయత్నాల తర్వాత ముస్తాబు పూర్తయింది , ఇద్దరి మొహాలూ సంతోషం తో , ఉద్వేగం తో కందిపోయి ఉన్నాయి. ఆన్ దుస్తులు మెరిల్లా పద్ధతిలో కొంచెం సాదాగానే ఉన్నాయి . డయానా టోపీ , జాకెట్- అన్నీ మంచి సొగసుగా ఉన్నాయి. ఆన్ కి ఒక్క క్షణం బాధేసింది- సర్దుకుని, తన బట్టలూ చాలా అందంగా ఉండేందుకు తన ఊహాశక్తిని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది.
కాసేపటికి డయానా కజిన్ లు , వచ్చారు. వాళ్ళ బట్టలు మరీ నాజూకుగా ఉన్నాయి. అందరూ కలిసి బయల్దేరారు. వాళ్ళ గుర్రం బగ్గీ మంచు కప్పిన నున్నటి దారివెంట జారుతున్నట్లు వెళుతూంటే ఆన్ కి దివ్యంగా ఉంది. తెల్లటి మంచుకొండల వెనక సూర్యాస్తమయం అద్భుతంగా ఉంది. సెయింట్ లారెన్స్ సరస్సు చుట్టూ దట్టంగా మంచు, లోపల నిండా నీలి రంగు నీరు- అందులోకి ప్రవహించే ఎర్రటి సూర్యకిరణాలు . ముత్యాలూ నీలాలూ తాపిన పాత్రలో మధువులూ జ్వాలలూ కలిసి పొర్లిపోతున్నట్లుంది. దూరంగా స్లెడ్జ్ బళ్ళ గంటల సవ్వడి , ఎవరివో నవ్వుల ధ్వని- వనదేవతల ఉల్లాసం అంతటా వ్యాపిస్తున్నట్లుంది.
” నువ్వు చాలా బావున్నావు ఆన్ ! నీ గౌన్ రంగు నీకు బాగా నప్పింది ” – డయానా ప్రేమగా చెప్పింది.
ఆ సాయంత్రపు కార్యక్రమాలు – ప్రేక్షకులలో కనీసం ఒకరి ని – అమితంగా పర వశులను చేసేశాయి . ఒకదానికన్న ఇంకొకటి మరీ మరీ బావుందని ఆన్ డయానా తో అంది. కొత్త గులాబి రంగు గౌనూ , మెడ చుట్టూ ముత్యాల తో ప్రిస్సీ ఆండ్రూస్ తయారై వచ్చింది. మిస్టర్ ఫిలిప్స్ ప్రత్యేకం గా పట్నం నుంచి తెప్పించి ఇచ్చిన కార్నేషన్ పూలు తలలో పెట్టుకొచ్చింది. ఆమె ‘ ని షే ధాజ్ఞల గంట మ్రోగరాదీ రాత్రి ‘ పద్యాన్ని చదివి అభినయిస్తుంటే ఆన్ ఆ విషాదం లో లీనమైపోయి కంటతడి పెట్టుకుంది. తర్వాత చార్లీ స్లోన్ ‘ అతనూ కోడి పెట్టా ‘ పద్యం చదువుతూంటే పడీ పడీ నవ్వింది. చుట్టూ ఉన్నవాళ్ళు పద్యం లో హాస్యం కంటే ఆమె నవ్వును చూసి నవ్వారు. మిస్టర్ ఫిలిప్స్ – ‘ సీజర్ శవం ముందు మార్క్ ఆంటోనీ ఉపన్యాసం ‘ చదివాడు. ప్రతీ వాక్యాన్నీ పట్టి పట్టి – ప్రిస్సీ ఆండ్రూస్ వైపు చూస్తూ చదివాడు. ఆన్ కి ఎక్కడలేని ఆవేశమూ పుట్టుకొచ్చింది- ఒక్క రోమన్ సైనికుడు దారి చూపిస్తే చాలు, యుద్ధానికి బయల్దేరిపోవాలనుకుంది.
ఒకే ఒక్క అంశం ఆన్ కి నచ్చలేదు – అది గిల్బర్ట్ బ్లైత్ చదివిన ‘ రైన్ నది పైన బింజెన్ ‘ పద్యం. రోడా ముర్రే దగ్గరున్న లైబ్రరీ పుస్తకం తీసుకుని చదువుతూ ఉండిపోయింది. గిల్బర్ట్ పద్యం అయాక డయానా చేతులు నొప్పెట్టేలా చప్పట్లు కొడుతూంటే ఆన్ కదలకుండా నిటారుగా బిగిసి ఉండిపోయింది.
అంతా అయి ఇంటికొచ్చేప్పటికి పదకొండైంది- ఎంత తృప్తి గానో జరిగిన ఆస్వాదన తర్వాత , దాన్ని గురించి మళ్ళీ మళ్ళీ ముచ్చటించుకునే ఆనందం ఇంకా మిగిలే ఉంది. అందరూ మంచి నిద్రలో ఉన్నట్లున్నారు – ఇల్లంతా చీకటిగా, నిశ్శబ్దంగా ఉంది. సన్నటి నడవా లోంచి ఆన్ కి ఇచ్చిన గదిలోకి దారి ఉంది. తలుపు తెరిస్తే లోపల వెచ్చగా హాయిగా ఉంది. నెగడులో నిప్పు కణికలు మినుకు మినుకు మంటున్నాయి.
” అమ్మయ్య. బట్టలు మార్చేసుకుందామా డయానా ? ఎంత బాగా జరిగిందో కదా అంతా ? మన చేతా ఎప్పుడైనా పద్యాలు చదివిస్తారంటావా ? ”
” ఆ. కొన్ని రోజులయాక, బహుశా. పెద్ద పిల్లల చేతే చదిస్తుంటారు మామూలుగా. గిల్బర్ట్ మనకంటే రెండేళ్ళే పెద్ద వాడనుకో, అయినా బాగా చదువుతాడు కాబట్టి అవకాశం ఇస్తుంటారు. ఎంత గొప్పగా చదివాడు ఆన్..నువ్వేమీ మెచ్చుకోకుండా ఎలా ఉండగలిగావు ? ” – డయానా అతను చదివిన పద్యం లో కొన్ని వాక్యాలు తన్మయత్వం తో ఉచ్చరించింది.
ఆన్ గంభీరంగా పలికింది – ” నువ్వు నా ప్రాణస్నేహితురాలివి అయినా కూడా అతని గురించి నా ముందు మాట్లాడకూడదు – నేను సహించను. ..’’ – మాట మారుస్తూ , ఎవరు ముందు మంచం మీదికి ఎక్కుతారో పోటీ పెట్టుకుందామా ? ”
డయానాకి ఆ పందెం నచ్చింది- ఇద్దరూ కాస్త వెనక్కి వెళ్ళి, పరిగెత్తుకుంటూ మంచం మీదికి దూకారు. మంచం ఖాళీ గా లేదు, ఏదో ఉంది దాని మీద.
ఆ పైన ఒక కేక – ” చచ్చాన్రోయ్ ” అని.
ఆన్, డయానా ఎలా మంచం దిగారో, ఎలా గదిలోంచి బయటికి వెళ్ళారో – వాళ్ళకే తెలీదు. ఒళ్ళు తెలిసే సరికి కాళ్ళూ చేతులూ వణుకుతూ మేడ మెట్ల పైన ఉన్నారు.
” అది ఎవరు…’ వాళ్ళు ‘ ఎవరు ? ” – చలితోనూ భయం తోనూ గజగజమంటున్న పళ్ళ మధ్యలోంచి ఆన్ అడిగింది.
డయానాకి తెరలు తెరలుగా నవ్వొస్తోంది. ” ఆంట్ జోసెఫిన్ ! ఎలా వచ్చిందో అక్కడికి !! అసలే భలే కోపం ఆవిడకి, మనం వెళ్ళి మీదపడ్డాం….” – భయం లోనుంచి నవ్వు ముంచుకొచ్చి డయానా కి మాట రాలేదు.
” ఆంట్ జోసెఫిన్ ? ”
” ఆ. మా నాన్నకి ఆంట్ , నిజానికి. డెబ్భై ఏళ్ళుంటాయి, సణుగుతునే ఉంటుంది – అసలెప్పుడైనా ఆవిడ చిన్నపిల్లగా ఉందనే అనిపించదు. ఎప్పుడో ఇక్కడికి వస్తుందని తెలుసుగాని అప్పుడే వచ్చేస్తుందని తెలీదు. మహా పద్ధతైన మనిషి – తెగ తిడుతుంది మనల్ని రేపు…ఇక మనం వెళ్ళి మిన్నీ మే మంచం మీద దాని పక్కన పడుకోవాల్సిందే – నిద్రలో పక్కనవాళ్ళని ఎలా తంతుందో తెలుసా అది ! ”
[ ఇంకా ఉంది ]
”




ఎంత బాగుందీ.థాంక్ యు
థాంక్ యూ సో మచ్ అండీ
చాలా బాగుంది. పఠ వారమ్ వారమ్ … వారం వారం అన్నట్టుంది.
ధన్యవాదాలండి :)
చాల బాగుంది
ధన్యవాదాలండీ.
చిన్నప్పుడు ఎక్కడికి కదలాలన్నా ఇలాంటి చర్చలు, కన్నీళ్లు … ఆఖరున పసివాళ్ళ గెలుపు :) కళ్ళకు కట్టినట్టు ప్రతీ వాక్యం mam , ‘ …. జరిగిన ఆస్వాదన తర్వాత , దాన్ని గురించి మళ్ళీ మళ్ళీ ముచ్చటించుకునే ఆనందం ఇంకా మిగిలే ఉంది. ” సూపర్బ్ Mam