గమనమే గమ్యం -24 వ భాగం

olgaఅన్నపూర్ణ ఏ క్షణమైన అరెస్టు కావొచ్చునని అందరూ అనుకుంటున్నారు. అబ్బయ్య తన ఉద్యోగం ఒదలటానికి సిద్ధంగా లేడు. ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరి వంతూ అన్నపూర్ణే పని చేయాలని. పిల్లను అమ్మమ్మ గారి ఊరు పంపించారు. అన్నపూర్ణ రోజుకో ఊరు తిరిగి క్విట్‌ ఇండియా ప్రచారం చేస్తోంది. ఆమె వెళ్ళిన చోటల్లా ఏదో ఒక బ్రిటీష్‌ ప్రభుత్వ వ్యతిరేక చర్య చేయకుండా, చేయించకుండా వెనక్కు రావటం లేదు. తెనాల్లో రైలు పట్టాు పక్కకు తొలిగాయి. ఇంకో ఊళ్ళో టెలిఫోను వైర్లు తెగాయి. మరో చోట ప్రభుత్వ ఆఫీసులో ఫైళ్ళు తగబడ్డాయి. ఏ రోజు ఎక్కడుంటుందో తెలియకుండా జాగ్రత్త పడుతోంది. అబ్బయ్యను పోలీసులు ప్రశ్నించి, రోజూ పోలీస్‌ స్టేషన్‌కొచ్చి కనపడమని చెప్పి ఒదిలేశారు. వారి ఇంటి మీద నిఘా – భర్తను కలుసుకోవటానికి అన్నపూర్ణ ఒచ్చిన , ఆమెను కుసుకోవాలని అబ్బయ్య కదిలినా తమ పని సువవుతుందని పోలీసు అబ్బయ్యను అరెస్టు చేయలేదు. అసలు సమస్య అన్నపూర్ణ అని వాళ్ళకు తొసు.

ఒకే సమయంలో, ఒకే సందర్భంలో అన్నపూర్ణ రహస్య మీటింగు జరపటమూ, తను బహిరంగంగా తిరిగి మాట్లాడగలగటమూ చిత్రమనుకుంది శారద.

అన్నపూర్ణ అరెస్టు కాకుండా ఉండాలని తనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో ఆశ్రయం అడగటం, ఆ సంగతి అన్నపూర్ణకు తెలియపరచటం ఈ పనిలో ఏమరుపాటు లేకుండా ఉంది శారద.

నందిగామ దగ్గర ఊళ్ళో తెలంగాణా నుంచి వచ్చిన నాయకులతో రహస్య సమావేశానికి రకరకాల మార్గాల్లో ప్రయాణం చేసి వెళ్ళింది శారద. తెలంగాణా పోరాటానికి ఆంధ్ర ప్రాంతం నుంచి ఇంకా పెద్ద ఎత్తున ఎలా మద్దతివ్వాలా , ఆహారం, ఆయుధాల వంటి వారి అవసరాలు ను ఎలా తీర్చాలా అని ఇరువైపు వాళ్ళూ కూర్చుని మాట్లాడుకున్నారు. తెలంగాణాలో జరుగుతున్న ఒక్కొక్క సంఘటన గురించి చెబుతుంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళ రక్తం ఉడుకెక్కుతోంది. అందులోనూ వచ్చింది యువకులు . వాళ్ళల్లో చలసాని వాసుదేవరావుని ని చూస్తె శారదకు ముచ్చటేసింది. ఒట్టి ఉద్రేకమే కాదు అతని మాటల్లో వివేకం ఉట్టిపడుతుంది. తెలంగాణా ప్రాంతంలోని భూస్వామ్య సమాజానికీ, ఆంధ్రప్రాంతపు భూస్వామ్య సమాజానికి ఉన్న తేడా చక్కగా వివరంగా చెప్పాడు. ఆంధ్రప్రాంతంలో కూడా రైతును మరింత వేగంగా సంఘటితం చేయాల్సిన అవసరం గురించి, రైతు దయనీయ పరిస్థితి గురించి అంకెలతో సహా చెప్పాడు. శారద అతనిలో భవిష్యత్తుని చూసింది. కాట్రగడ్డ వెంకట నారాయణ, బాపయ్య, శ్రీనివాసరావు, వెంకటరెడ్డి- ఆ యువకులను చూస్తే శారదకు ఉప్పు సత్యాగ్రహానికి ముందు తమ ఇంట్లో చేరిన యువ బృందం గుర్తొచ్చింది. వాళ్ళల్లో కొందరిప్పుడు కాంగ్రెసు, కొందరు కమ్యూనిస్టు పార్టీలో ఉన్నారు . మరి కొందరు లోహియాకు అభిమానులై సోషలిస్టుయ్యారు. ఈ యువకులందరూ కమ్యూనిస్టులు . వాళ్ళను చూస్తే శారదకు గర్వం అనిపించింది. వాళ్ళందరికంటే తను పెద్దది. ఐన శారద కలా అనిపించలేదు. ఈ యువకులు తనకంటే నాలుగడుగులు ముందే ఉన్నారనిపించింది . మా తరం ఈతరాన్ని సృష్టించింది. వీరికి తిరుగులేదు. వీరి వయసులో తమకున్న అస్పష్టతలు , అయోమయాలు , సందేహాలు వీరికి లేవు. ఎలాంటి యువతరం ఇది. వీళ్ళు దేశానికి కొత్త రూపాన్నిస్తారు. భవిష్యత్తంత వీరిదే. వీళ్ళ నాయకత్వంలో నటాషా పని చేస్తుంది అనుకుంటే మురిపెంగా అనిపించింది శారదకు.

చర్చలు రెండు రోజు పాటు రాత్రింబగళ్ళూ సాగాయి. నైజాంలో రాబోయే గడ్డు రోజులను ఎదుర్కొనేందుకు తాత్కాలిక ప్రణాళిక ఒకటి రాసుకున్నారు . రెండోరోజు రాత్రి పదిగంట తర్వాత శారద నందిగామ నుంచి బయల్దేరింది. కొంతదూరం పొలాల గుండా నడిచి రోడ్డెక్కితే అక్కడేదో బస. తెల్లారేవరకూ అక్కడ ఉండేందుకు డాక్టరు గారి కోసం ఏర్పాట్లున్నాయి . బాగా తెల్లారాక ఆవిడ బండిలో దగ్గరున్న రైలుస్టేషన్ కు వెళ్ళి రైల్లో బెజవాడ వెళ్ళిపోవాలని అన్ని జాగ్రత్తలతో ముందే నిర్ణయమయింది.

శారదకు తోడుగా చలసాని వాసుదేవరావునీ, నారా యణనీ, వెంకటరెడ్డిని పంపారు. శారద నడుస్తూ వాళ్ళతో మెల్లిగా మాట్లాడుతోంది.

వాసుదేవరావు ఉత్సాహం గా తన కుటుంబం గురించి చెబుతున్నాడు.

‘‘మా ఇంట్లో అందరం కమ్యూనిస్టులమే డాక్టరు గారు. మా నాన్న బసవయ్య మాకు పెద్ద అండ. మేమేం చేసిన మా వైపే మాట్లాడతాడు. మా చెల్లెళ్ళు మన పాటలు పాడుకుంటూ పెరుగుతున్నానరు. అందరూ చదువుకుంటున్నారు. మా చిన్న తమ్ముడు ప్రసాదున్నాడాండీ. వేలెడు లేడు జండా పుచ్చుకుని పరిగెత్తుతాడు. మా చెల్లెళ్ళు కూడా మీలా డాక్టర్లు కావాలని మా నాన్న చెబుతుంటాడండీ. ఆడపిల్లలందరికీ మంచి చదువుంటే మన దేశం తొందరగా మారుతుంది. మన మహిళా సంఘంలో చూడండి కాస్త చదువు నేర్చుకునే సరికి వాళ్ళ ముందు, వాళ్ళ ఉపన్యాసాల ముందు, నాటకాలు , బుర్రకథలూ చెప్పే వాళ్ళ నేర్పు ముందు మేమెవరం ఆగలేం డాక్టరు గారూ – మహిళా ఉద్యమం గురించి మీకు నేను చెప్పేదేముంది. అదంత మీ సృష్టి గదా’’.

‘‘నేనేం చేశాను వాసూ?- మీ అందరూ గ్రామాల్లో వాళ్ళకు అన్ని రకాలుగా మద్దతిచ్చారు. వాసూ మీరంత నవ యువకులు . ఒక్క విషయం చెబుతాను. ఆలోచించండి . ఇప్పటికిప్పుడు కాదు. ప్రతిరోజూ ఆలోచించండి ’’.

‘‘చెప్పండి డాక్టర్‌ గారూ’’

పొలాల మధ్య ఆ సన్నని డొంకదారిలో మసక వెన్నెల్లో బాగా చూసుకుంటూ, ఆగుతూ నడుస్తున్నారు. పైన ఆకాశంలో నక్షత్రాలు రెండు వైపులా ఏపుగా పెరిగిన జొన్నచేలు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలో చిన్నగా మాట్లాడుతున్న శారద గొంతు సెలయేటి పాటలా ఉంది.

‘‘వాసూ. ఆలోచించండి . స్త్రీలు మహిళా సంఘాల్లోకి బాగా వస్తున్నారు. పార్టీ చెప్పిన పనులు చేస్తున్నారు. కానీ వారు నాయకులు గా ఎదగగలిగే పరిస్థితి ఉందా? వాళ్ళకు నాయకత్వ శిక్షణ ఇస్తున్నాం ? మనందరం ఏం చెబితే అది చేసే అనుచరులుగా తయారు చేస్తున్నామా ? నిజంగా వాళ్ళకేం కావాలి? వల్ల ఆశలేమిటి? కలలేమిటి? స్త్రీ పురుష సమానత్వం గురించి మనం వాళ్ళకు కొత్తగా చెబుతున్నదేమిటి? స్త్రీలకు సమానత్వమంటే అర్థం ఏమిటని మీరంతా ఆలోచించండి . ఆడవాళ్ళను సమానంగా చూడటానికీ – వాళ్ళను ఉద్ధరించటానికీ తేడా ఉంది. ఆ తేడా గురించి ఆలోచించండి ’’ ఒక ఆర్తితో చెబుతున్న ఆ మాటలు ఆ యువకుల మనసుల్లో ఏదో సంచలనం రేపాయి.

వాసు, నారా యణ, వెంకటరెడ్డీ కూడబలుక్కున్నట్టు

‘‘మాకందరికీ మీరు చెప్పాల్సింది చాలా ఉంది డాక్టరు గారు. మేం తొందరలో యువజన సమావేశం ఏర్పాటు చేస్తాం. మీరు వచ్చి మాకు పాఠాలు చెప్పాలి.’’

ఇదే మాట పెద్ద నాయకుల తో చెబితే వారు నవ్వి తీసిపారేసేవారు . ఈ యువకులు ఆలోచిస్తున్నారు. తెలుసు కోవాలనుకుంటున్నారు. వీరే గొప్ప ఆశ పార్టీకి, దేశానికి. వీరి కుటుంబాలకు కూడా. శారదకు తృప్తితో, ఆశతో గుండె నిండిపోయింది.

తన ముందూ వెనకా నడుస్తున్న ఆ యువకులను ఆ మసక వెన్నెల్లో కళ్ళారా చూస్తుంటే సూర్యోదయం త్వరలో జరుగుతుందనిపించింది. ఆ రాత్రి – తన తర్వాతి తరం యువకుతో కలిసి నడిచిన ఆ రాత్రి ఒక సుందర భవిష్యత్‌ స్వప్నాన్ని చేరువ చేసిన రాత్రి అనుకుంది శారద. తన జీవితంలో మర్చిపోలేని రోజుల్లో అదొకటి అనుకుంది.

మాటలు . ప్రశ్నలు . సమాధానాలు . వినిపించీ వినిపించని నవ్వు, ఆ గతుకు డొంకదారి విజయ పథమే అనిపించింది వారందరికీ. తారురోడ్డు ఎక్కేసరికి తెల్లవారు ఝాము కావొస్తున్నట్లుంది. వీరు నిల బడిన చోటికి దూరం నుంచి ఎవరో నడచి వస్తున్నట్లు లీల గా కనపడుతోంది.

olga title

‘‘ఈ వేళప్పుడు ఒక్కరే ఇక్కడ’’ వెంకట రెడ్డి మాటలే అందరి మనసుల్లో. ఆ ఆకారం దగ్గర కొచ్చేసరికి శారద గుర్తు పట్టేసింది.

‘‘అబ్బయ్యా ` నువ్వా? . ఏంటోయ్‌ ` ఈ వేళప్పుడు ` ’’

‘‘ఇవాళ సాయంత్రం అన్నపూర్ణను అరెస్టు చేశారు. నందిగామ జైల్లో ఉంది. ఆమెను చూసి, మా అత్తగారి ఊరు వెళ్ళి పిల్లల్ని చూసి వస్తున్నాను .

మీరేమిటిక్కడ అని అబ్బయ్య అడగలేదు. అందరివీ రహస్య సమావేశాలే. రహస్య జీవితాలే.

‘‘పిల్లలెలా ఉన్నారోయ్‌’’

‘‘బాగా దిగులు పడ్డారు. పెద్దది నాతో వచ్చేస్తానని ఏడుపు. సముదాయించి వాళ్ళను నిద్రపుచ్చి నేనిలా పారిపోయి వస్తున్నా ’’ అబ్బయ్య గొంతు నిండా దిగులే.

‘‘నారాయణా ` అబ్బయ్య తెలుసుగా’’

‘‘తెలుసండీ’’ అన్నారందరూ

‘‘మా యువరక్తం. దేశ భవిత’’ అంది శారద అబ్బయ్యతో గర్వంగా.

‘‘నేను వెళ్తాను. అన్నపూర్ణను తొందరగానే విడుదల చేస్తారనుకుంటా. జైలు కిటకిటలాడుతోంది. మీరు జాగ్రత్తగా వెళ్ళండి ’’. అబ్బయ్య మరోవైపు వెళ్ళాడు.

శారద కాసేపు విశ్రాంతి తీసుకోవాల్సిన ఇంటికి ఆమెను చేర్చి వాళ్ళు ముగ్గురూ మళ్ళీ చేలకడ్డంబడ్డారు.

***

మీ మాటలు

  1. చందు - తులసి says:

    అన్నపూర్ణ, శారద లాంటి వాళ్లు సర్వస్వం ధారపోసిన త్యాగాల ఫలితమే ఇవాళ్టి మన స్వేచ్ఛ. అటువంటి వారి త్యాగాలను మరొక్క సారి గుర్తుచేసుకునే అవకాశం కల్పించిన ఓల్గా మేడం గారికి కృతజ్ఞతలు.
    ఎటువంటి ఆడంబరం లేకుండా నిర్మలంగా సాగే మీ వాక్యం కొత్తతరానికి ఆదర్శం.

మీ మాటలు

*