స్న్యాప్ అవుట్

-మమత కొడిదెల 

~

Mamata K.మనసంతా అల్లుకుపోయిన సాలేగూళ్ళతో కుస్తీ పడుతూ ఇంటి పనులు చేసుకుంటోంది అమ్మ.

“ఆడుకోడానికి వెళ్తున్నా” అని ఒక అరుపు అమ్మ వైపు విసిరేసి బయటకు ఎగిరిపోయింది పాప. ఇక పనులు తొందరగా తెముల్తాయిలే అని అమ్మ ఊపిరి పీల్చుకునేంతలో తలుపు నెమ్మదిగా తరచి మెల్లగా నడుచుకుంటూ వచ్చి అమ్మ పక్కన నిలుచుంది.

“వచ్చేశావేం? నీ స్నేహితులెవరూ లేరా?” విసుగును దాచేసి పాప వైపు చూసింది అమ్మ.

మొఖంలో ఏ భావమూ లేకపోయినా అమ్మ లోపలికి చూస్తున్నాయి ఆ పసి కళ్ళు, తనేం చెబితే అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో బేరీజు వేసుకుంటున్నట్లు. అప్పుడే ఇంత కాలెక్యులేటేడ్ గా వుండాల్సొస్తోందే పిల్లలకు.

“ఏరా తల్లీ?”

ఆ నెమ్మది పిలుపుతో పాప ముఖంలోకి దుఃఖం వెల్లువెత్తింది. చేతులు చాపిన అమ్మ వొడిలోకి దూకింది. అమ్మ మెడను కావలించుకుని పూడుకుపోయిన గొంతుతో అంది, “నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ గరాజ్ లో ఏదో పార్టీ చేసుకుంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకెవరో వచ్చారట. కానీ నేను ఇన్వైటెడ్ కాదట. నేను కూడా వాళ్ళను నా పార్టీకి ఇన్వైట్ చెయ్యను.”

పాపను హత్తుకుని కూర్చుంది అమ్మ. పక్కింటి గరాజ్ లోంచి పిల్లల కేరింతలు తేలివచ్చి కొన్ని రోజులుగా అమ్మలో బాధపెడుతున్న ఆలోచనలను తట్టి లేపాయి. శాశ్వతమనుకున్న పాత స్నేహాలు కొన్ని, మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తూ పరవళ్లెత్తిన కొత్త స్నేహాలు కొన్ని హఠాత్తుగా మౌనం దాల్చడం వల్ల  బాధగా ఉంది అమ్మకు. ఎవరి జీవితాల్లో వాళ్లు అని ఎంత సర్దిచెప్పుకున్నా కొన్ని రోజులుగా బాధ తగ్గట్లేదు.

పాప కన్నీళ్ళతో అమ్మ భుజం తడిసిపోయింది. “ఎందుకు వాళ్ళు నాతో ఆడట్లేదు? నేను ఏమన్న మిస్టేక్ చేస్తే నాకు చెప్పొచ్చు కదా?”

ఆత్మావలోకనం మంచిదే, కానీ ఆత్మను ముంచెత్తేది కాకూడదు. పాపను ఎలా సముదాయించాలో అర్థం కాలేదు అమ్మకు. అట్లా ఉక్కిరిబిక్కిరైనప్పుడు అమ్మ పాఠాల్లోకి దిగిపోతుంది.

“అమ్మను చూడు తల్లీ.” పాప ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని అంది అమ్మ. కన్నీళ్ళతో తడిసిన ఆ మొఖాన్ని చూసి అమ్మ గుండె కలుక్కుమంది. కళ్ళు చికిలిస్తూ అమ్మ వైపు చూసింది పాప.

“ఒక్కదానివే ఆడుకోవడం అలవాటు చేసుకోవాలి నువ్వు. నీతో ఆడకపోవడానికి వాళ్ళకేదో రీజన్ వుండే వుంటుంది. దాన్ని రెస్పెక్ట్ చెయ్యాలి నువ్వు. నీకు బాధగా వుందని అమ్మకు అర్థం అయింది కన్నా. కానీ, జస్ట్ స్న్యాప్ అవుట్ ఆఫ్ ఇట్. వెళ్లి నీ బొమ్మలతో ఆడుకో. పోనీ, అమ్మను డిస్టర్బ్ చెయ్యకుండా ఇక్కడే ఆడుకో. ఈ పని తొందరగా పూర్తి చేసేస్తా. మనిద్దరం చా..లా… సేపు ఆడుకుందాం. సరేనా తల్లీ?”

కాసేపు ఏం మాట్లాడకుండా అమ్మ వళ్లోనే కూర్చుంది పాప. మెల్లగా ఏడుపు ఆపి, బెక్కుతూ అమ్మ షర్టుతో మొఖం తుడుచుకుంది.

“తాతను ప్లే ఏరియాకు తీసుకెళ్ళమని అడగనా?” ఒక్క క్షణం కూడా ఒక్కతే ఆడుకోవడం ఇష్టం లేదు పాపకు. అంతగా బాధ పడుతున్న పిల్లను ఒంటరిగా ఆడుకొమ్మని పట్టుపట్టడం అమ్మకూ ఇష్టం లేదు.

Mandira Bhaduri

Mandira Bhaduri

 

*

రెండు గంటల తరువాత ఆడుకుని వచ్చింది పాప. స్నానం చేయించి బట్టలేస్తున్న అమ్మకు ఇంకో స్నేహితుల గుంపుతో ఎలా ఆడుకుందో గుక్క తిప్పుకోకుండా చెప్తోంది పాప. ఆ మాటలు వింటూ పాప మొఖంలోకి చూసింది అమ్మ. అలసటతో, అంతకంటే ఎక్కువ సంతోషంతో ఎరుపెక్కిన పాప బుగ్గలను ముద్దు పెట్టుకుంది.

అమ్మ బుగ్గలను తన చిట్టి చేతుల్లోకి తీసుకుని అంది పాప, “అమ్మా, నా ఫ్రెండ్స్ కు ఏదో రీజన్ వుంది. ఐ రెస్పెక్ట్ దైర్ రీజన్. నేను అలా అనుకోగానే హ్యాపీగా అనిపించింది. అందుకే ప్లే ఏరియాలో మిగతా ఫ్రెండ్స్ తో అంత బాగా ఆడుకున్నా.”

తనను బాధ పెట్టిన స్నేహితులను ఆటల్లో పడి మర్చిపొయ్యిందని అనుకుంది అమ్మ. ఒక గుంపు స్నేహితులను మరో గుంపు స్నేహితులతో రిప్లేస్ చేస్తున్నట్లు కాక ఆటల్లో పడకముందే పాప తన మనసును సర్దుకుంది. అప్పుడు ఇంకా సంతోషంగా ఆడుకోగలిగిందని అర్థం అయ్యింది అమ్మకు.

అప్పుడే గరాజ్ నుంచి ఇంటి బయటకు వచ్చినట్లున్నారు పక్కింటి పిల్లలు. ఇంటి ముందు కేకలు ఎక్కువయ్యాయి. నైట్ డ్రెస్ ను సర్దుకుంటూనే కిటికీ దగ్గరికి పరిగెత్తి ‘హాయ్’ అని అరిచింది పాప.

“హాయ్, ఆడుకుందాం రా!!” వాళ్ళూ గోల గోలగా ఆహ్వానించారు పాపను.

“ఇప్పుడే స్నానం చేసేసా. మీరు ఆడుకుంటుంటే చూస్తా.” అంటూ లాన్ చైర్ ను గరాజ్ నుంచి బయటకు లాక్కెళ్లింది పాప.

 

*

ఆరోజు రాత్రి నిద్రలో ఆటల కలలొచ్చి ఉలిక్కిపడుతూ సర్దుకుంటున్న చిన్నారి మొఖంలో చెరగని చిరునవ్వును చూస్తూ గడిపింది అమ్మ. ఎన్నో రోజుల తరువాత ప్రశాంతత అమ్మలో.

*

మీ మాటలు

  1. మమతా !

    చిట్టి కథే ..కాని ఎంత పెద్ద సందేశం ఇచ్చింది ..అవును చిన్న పిల్లల మనసులు స్వచ్చమైనవి , ఒక కారణం చెప్పి బుజ్జగిస్తే సర్దుకుని , ఆటల ఆన్మదం లో పడిపోగలరు ..ఆ అమాయక బాల్యాన్ని ఎక్కడ ,ఎప్పుడు పారేసుకుంటామో మనం ..దూరమైన స్నేహ బంధాలో ,మరో బంధాలో తలుచుకు తలుచుకు ఎంత బాధ పడతాం .. అది వారి నిర్ణయం అని వారిని గౌరవించి , అంతే గౌరవంగా ఆ స్ఫేస్ మనకి మనం ఇవ్వడం ఎప్పుడు నేర్చుకుంటామో మనం ..ఎవరూ కూడా ఒక స్నేహాన్నో ,ప్రేమనో బెగ్గింగ్ చేయక్కరలేదు , అని నేర్చుకుని ముందుకు సాగిపోగల ధైర్యం .. సమన్వత ( బాలంస్ ) ఈ పెద్ద వాళ్ళకి కలుగుతే ఎంత సౌఖ్యం ..
    థాంక్యూ ..
    వసంత లక్ష్మి ..

  2. మామత
    నీ చిన్న కధ చాలా పెద్ద విషయం గురించి చెప్పింది.కధ బాగుంది.

    విమల

  3. Mythili Abbaraju says:

    ‘మీరు ఆడుకుంటుంటే చూస్తా’ … దట్స్ గుడ్ పాపాయీ… శాంతంగా పెరిగి పెద్దవుతావు…_/

  4. rambabu thota says:

    అమ్మ లోపలికి చూస్తున్నాయి ఆ పసి కళ్ళు, తనేం చెబితే అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో బేరీజు వేసుకుంటున్నట్లు. అప్పుడే ఇంత కాలెక్యులేటేడ్ గా వుండాల్సొస్తోందే పిల్లలకు…….ఆత్మావలోకనం మంచిదే, కానీ ఆత్మను ముంచెత్తేది కాకూడదు….ఈ రెండు లైన్ల వెనుక ఉన్న అవగాహనలో ఎంతో ప్రేమ కనిపిస్తుంది.

  5. మమత కథ చాలా సున్నితమిన అంశంతో చక్కగా చెప్పావు. నాకు నువ్వు తెలుసు మమతా

  6. మమత says:

    వసంత లక్ష్మి గారు, మైథిలి గారు, రాంబాబు గారు, విమల, రజని – Thank you :)

    రజని – మీరు కూడా నాకు తెలుసనుకుంటున్నా – ఎన్. వేణు మామయ్య చెల్లి కదా????

మీ మాటలు

*