ఎట్టకేలకు ట్రాయ్ నేల మీద…

 

స్లీమన్ కథ-14

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

స్లీమన్ గ్రామస్తులను కలసి, ఆ కొండ మీద ఇంతకుముందు ఎవరికైనా నిధినిక్షేపాలు దొరికాయా అని వాకబు చేశాడు. ఎప్పుడో 1811-14 ప్రాంతంలో కెప్టన్ గితారా అనే వ్యక్తి అక్కడ గాలింపులు జరిపాడనీ, అతనికి బంగారు చెవిపోగులు, మురుగులు దొరికినట్టు విన్నామనీ, అంతకుమించి తమకేమీ తెలియదనీ కొందరు చెప్పారు.

తను ‘లయర్టిస్ పొలం’ అనుకున్నచోట నిలబడి ఒడిస్సే లోని చివరి అధ్యాయాన్ని వల్లిస్తూ, దానిని వాళ్ళ మాండలికంలో గ్రామస్తులకు అనువదించి చెప్పడం ప్రారంభించాడు. అతని చుట్టూ మూగిన గ్రామస్తులు, ఒక విదేశీయుడు తమ పురాణకథల్ని తమ భాషలో అలా అనర్గళంగా అప్పజెబుతుంటే ఆశ్చర్యానందాలతో తలమునకలైపోయారు. తన ఇథకా మకాంలో అత్యంత మహత్తర క్షణాలు ఇవే ననుకుంటూ ఆ అనుభవాన్ని స్లీమన్ ఇలా గుర్తుచేసుకున్నాడు:

మూడు వేల ఏళ్ల క్రితం వైభవోపేతులైన తమ పూర్వీకులు మాట్లాడిన భాషలో హోమర్ అత్యంత శ్రావ్యంగా రాసిన ఆ ఘట్టాలను వింటుంటే వాళ్ళలో ఉత్సుకత, ఉద్వేగం కట్టలు తెంచుకున్నాయి. ఆ క్షణంలో తాము నిలబడి ఉన్నచోటే లయర్టిస్ ఎదుర్కొన్న దుర్భరమైన కష్టాల గురించీ, చనిపోయాడనుకున్న కొడుకు ఇరవయ్యేళ్ళ తర్వాత తిరిగి వచ్చినప్పుడు అతను పట్టలేని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవడం గురించీ విని అందరూ కన్నీటి ప్రవాహంలో మునిగిపోయారు. నా వల్లింపు పూర్తి కాగానే ఆడ, మగ, పిల్లలతో సహా అంతా నా దగ్గరికి వచ్చి ఆలింగనం చేసుకున్నారు. “మాకు ఎంత సంతోషం కలిగించావో చెప్పలేం. వెయ్యి సార్లు నీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం” అన్నారు. నన్ను తమ భుజాల మీద మోసుకుంటూ ఊళ్ళోకి తీసుకెళ్లారు.

అక్కడి తవ్వకాల్లో ఇంకేవీ దొరక్కపోవడంతో ఓడమీద కోరింత్ కు బయలుదేరి వెళ్ళాడు. అదో అధ్వాన్న ప్రదేశం. హోటళ్లు లేవు. మరోసారి ఓ చీకటి గుయ్యారం లాంటి సత్రంలో నల్లుల మధ్య గడిపాడు. పొద్దుటే లేచి సముద్రానికి వెళ్ళి ఓ అరగంటసేపు ఈత కొట్టాడు. ఆ తర్వాత ఓ మార్గదర్శిని, తనకు రక్షణగా ఇద్దరు సైనికులను నియమించుకున్నాడు. ఒక గాడిదను సంపాదించుకున్నాడు. అక్కడినుంచి దక్షిణంగా బయలుదేరి, చర్వాటి అనే గ్రామంలో మార్గదర్శినీ, సైనికులనూ ఉంచేసి తను మైసీనియాకు వెళ్ళాడు. అక్కడి సింహద్వారం(Lion Gate)తప్ప ఇంకేవీ అతన్ని అంతగా ఆకట్టుకోలేదు. మధ్యాహ్నానికి తిరిగి చర్వాటి వచ్చేసరికి మార్గదర్శి, సైనికులు నిద్రపోతున్నారు. వాళ్ళ ముఖం మీద నీళ్ళు చిలకరించి లేపాడు. వెంటనే బయలుదేరి ఆర్గోస్ కు వెడదామన్నాడు. సాయంత్రానికల్లా ఆర్గోస్ చేరుకోవడం అసాధ్యమని వాళ్ళు అన్నారు. ఈ ఊళ్ళో నిమిషం కూడా ఉండలేననీ, ఇంత దరిద్రంగా, మురికిగా ఉన్న ఊరు గ్రీస్ లోనే ఎక్కడా చూడలేదనీ, మంచి ఆహారం కాదు సరికదా స్వచ్ఛమైన నీళ్ళు కూడా లేవనీ అంటూ వాళ్ళకు నచ్చజెప్పి, సైనికులకు చిన్న చిన్న కానుకలు ఎరేసి ఆర్గోస్ కు బయలుదేరదీశాడు. దూర ప్రయాణం, దానికితోడు ఎండ… ఆర్గోస్ చేరేసరికి బాగా అలసిపోయాడు.  ప్రాచీన గ్రీస్ లో ఆర్గోస్ గొప్ప నగరమనీ, ఈ నగరవాసులు లలితకళలకు, ముఖ్యంగా సంగీతానికి ప్రసిద్ధులనీ రాసుకున్నాడు. అక్కడ దొరికే ‘మంచి నాణ్యమైన, మధురమైన మద్యా’ల గురించి రాస్తున్నప్పుడు మరింత మైమరచిపోయాడు.

మరునాడు మధ్యాహ్నం టిరిన్స్ కు బయలుదేరాడు. బ్రహ్మాండమైన గోడలతో అదో పెద్ద కోట. అయితే అదేమంత గొప్పగా అతన్ని ఆకట్టుకోలేదు. టిరిన్స్ గురించి రాసిన రెండు పేజీలను భాషాశాస్త్రసంబంధమైన ప్రశ్నలతో నింపేశాడు. శిథిలాలతోనూ, వెంట ఉన్న సిబ్బందితోనూ విసిగిపోయినట్టున్నాడు; దగ్గరలోని నాప్లియా అనే పట్టణానికి ఒంటరిగా నడిచివెళ్ళాడు. మరోసారి సముద్రతీరానికి చేరుకున్నందుకు సంతోషించాడు. అక్కడి వాతావరణం కూడా చల్లగా హాయిగా అనిపించి ఉల్లాసం నింపింది. జీను లేకుండా గాడిద మీద తిరిగే బాధ తప్పింది. మంచి హోటల్, రుచికరమైన తిండి దొరికాయి. దాంతో అంతవరకూ ఉన్న ప్రయాణం బడలిక తీరేలా కొన్ని రోజులు విశ్రాంతిగా గడిపాడు. ఆ తర్వాత హైడ్రా దీవికి వెళ్లాలనుకున్నాడు.

ఓడకోసం ఎదురుచూస్తూ, ఓ రోజు మధ్యాహ్నం కొన్ని పుస్తకాలు చేతిలో పట్టుకుని ప్రధాన రహదారి మీద నడిచి వెడుతున్నాడు. కాళ్ళకు సంకెళ్ళు ఉన్న అయిదుగురు ఖైదీలు దుమ్ము కొట్టుకున్న ఆ రోడ్డు మీద వెడుతూ కనిపించారు. స్లీమన్ చేతిలో ఉన్న పుస్తకాలను చూసి ఓ ఖైదీ అతన్ని సమీపించి, ఓ పుస్తకం కానీ, వార్తాపత్రిక కానీ ఇవ్వగలరా అని అడిగాడు. అతను చక్కని రూపురేఖలతో, భారీగా, హుందాగా, ఒక రైతులా కనిపించాడు. స్లీమన్ వెంటనే ఓ పుస్తకం ఇచ్చాడు. అతను ధన్యవాదాలు చెప్పి, ఆ పుస్తకాన్ని తలకిందులుగా పట్టుకుని తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. విస్తుపోయిన స్లీమన్, “చదవగలవా?” అని అడిగాడు. “ఒక్క ముక్క కూడా చదవలేను. కానీ త్వరలోనే నేర్చుకోవాలని ఉం” దని అతను సమాధానం చెప్పాడు. అంతలో మిగిలిన ఖైదీలు కూడా వారిని సమీపించారు. మీకు  సంకెళ్ళు ఎందుకు వేశారని స్లీమన్ అడిగాడు. మేము కొండ ప్రాంతానికి చెందిన రైతులమనీ, నిష్కారణంగా పోలీసులు మమ్మల్ని అరెస్టు చేసి హింసిస్తున్నారనీ వాళ్ళు చెప్పారు. వాళ్ళ మాటల్లో ఎంతో మర్యాద ఉట్టిపడింది. చదువుమీద వారి ఆసక్తి స్లీమన్ ను ప్రత్యేకించి ఆకట్టుకుంది. ఆ అయిదుగురూ ఓ హత్యానేరాన్ని ఎదుర్కొంటున్నారనీ, త్వరలోనే వారికి మరణశిక్ష అమలుచేయబోతున్నారనీ ఆ తర్వాత తెలిసింది.

అక్కడినుంచి ఓడలో బయలుదేరి ఎథెన్స్ కు చేరుకున్నాడు. తనకు సెయింట్ పీటర్స్ బర్గ్ లో గ్రీకు బోధించిన థియోక్లిటస్ విమ్పోస్ ఇప్పుడు మాంటినీయాలో బిషప్ గా, ఎథెన్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఇక్కడే ఉంటున్నాడు. ప్రాణం లేచొచ్చిన స్లీమన్ అతనితో స్నేహయాత్రను పునః ప్రారంభించాడు. ఇద్దరూ విడదీయలేని జంటలా కొన్ని రోజులపాటు తిరిగారు. ఆగస్టులో కాన్ స్టాంటినోపిల్ మీదుగా ట్రాయ్ కి దారితీశాడు. కాన్ స్టాంటినోపిల్ లోని రష్యన్ కాన్సూల్ అతనికి ఒక మార్గదర్శిని, రెండు గుర్రాలను సమకూర్చాడు.

sliiman

ఏవో స్వప్నలోకాల్లో విహరిస్తున్నట్టుగా ట్రాయ్ మైదానంలో తిరిగాడు. అది ఎత్తుపల్లాలు, మలుపులతో ఉన్న మెత్తని నేల. అక్కడక్కడ సింధూరం, సూచీపత్రం చెట్ల తోపులున్నాయి. నీళ్ళు తియ్యగా ఉన్నాయి. గాలి మద్యంలా మత్తెక్కిస్తోంది. అక్కడి బునర్ బషీ అనే ప్రాంతమే ఒకప్పటి ట్రాయ్ అని చాలాకాలంగా భావిస్తూవచ్చారు. కిక్కిరిసినట్టు ఉన్న చిన్న చిన్న ఇళ్లతో ఆ ప్రాంతం ఇప్పుడు పేదరికం ఓడుతూ కళావిహీనంగా ఉంది. అక్కడ టర్కులు, అల్బేనియన్ గ్రీకులు ఎక్కువమంది నివసిస్తున్నారు. దోమల వల్ల ఇళ్ల గోడల నిండా నల్లటి మచ్చలు పడ్డాయి. ఓ ఇంటి వాళ్ళు ఓ పాత్రతో స్లీమన్ కు పాలు తీసుకొచ్చి ఇచ్చారు. ఆ పాత్రను చూడగానే అతనికి కడుపులో తిప్పినట్టు అయింది. దానిని శుభ్రం చేసి కనీసం పదేళ్ళు అయుంటుందనుకున్నాడు. ఆ అపరిశుభ్రత, అనాగరిక జీవన శైలీ; మార్గదర్శుల అజ్ఞానం అతన్ని బెంబేలెత్తించాయి. అయితే, ఇళ్ల కప్పుల మీద రెక్కలార్చుతూ తిరుగుతున్న గూడకొంగల్ని చూసి సంతోషించాడు. తను బాల్యాన్ని గడిపిన అంకెర్షాగన్ ను ఆ పరిసరాలు గుర్తుచేశాయి. “గూడకొంగల వల్ల ఎన్నో ఉపయోగాలు. అవి పాములను, కప్పలను తింటాయి” అని రాసుకున్నాడు.

ట్రాయ్ తెల్లగా మెరిసిపోయే పాలరాతి నిర్మాణాలతో, హుందాగా, ఠీవిగా, అజరామరంగా ఉంటుందని అతను ఊహించుకున్నాడు. కానీ బునర్ బషీని చూడగానే నీరుగారిపోయాడు. ప్రతిచోటా మురికీ, చెత్తకుప్పలూ. చుట్టుపక్కల ఉన్న చిత్తడినేలలనుంచి ఒకవిధమైన దుర్గంధం వీస్తోంది. అక్కడికి సముద్రం పదిమైళ్ళ దూరంలో ఉంది. అఖియన్లు రోజూ ఏడెనిమిదిసార్లు ట్రాయ్ నుంచి సముద్రతీరానికి వెళ్లివచ్చేవారని హోమర్ రాసిన సంగతి గుర్తొచ్చింది. దాంతో బునర్ బషీయే ట్రాయ్ కాకపోవచ్చనీ, ఆ లోయకు పశ్చిమం కొసన ఉన్న హిస్సాలిక్ కొండే కచ్చితంగా ట్రాయ్ అయుంటుందనీ అనుకున్నాడు. Dissertation on the Topography of Troy(1822) రాసిన ఆంగ్లపండితుడు చార్లెస్ మెక్లారెన్ కూడా అలాగే భావించాడు.

దర్దనెల్స్(టర్కీలో ఒక నగరం)లో అమెరికా వైస్-కాన్సూల్ గా పనిచేసిన మరో ఆంగ్లేయుడు ఫ్రాంక్ కల్వర్ట్ అభిప్రాయం కూడా అదే. హిస్సాలిక్ కొండలో సగభాగం అతని ఆస్తి. ఆస్ట్రియా కాన్సూల్ వాన్ హాన్ తో కలసి కల్వర్ట్ ఆ ప్రదేశంలో ప్రాథమికమైన తవ్వకాలు చేపట్టి, రెండు కందకాలు తవ్వించాడు. ఆ కొండకు తూర్పు వాలున, పెద్ద పెద్ద రాళ్ళతో నిర్మించిన ఓ ప్రాసాదం లేదా దేవాలయం తాలూకు అవశేషాలు బయటపడ్డాయి. ట్రాయ్ ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టానన్న నిర్ధారణకు వచ్చి, తన పరిశోధన ఫలితాల గురించి ఆర్కియలాజికల్ జర్నల్ కు రాశాడు. ట్రాయ్ ని కనిపెట్టిన గౌరవం బ్రిటిష్ కు దక్కాలనే ఆకాంక్షతో ఆ ప్రదేశంలో పెద్ద ఎత్తున తవ్వకాలను చేపట్టవలసిందిగా బ్రిటిష్ మ్యూజియంను కోరాడు. కానీ ఆ వైపునుంచి స్పందన లేదు. ఇక, కల్వర్ట్ తమ్ముడు ఫ్రెడరిక్ కూడా బునర్ బషీకి దగ్గరలో అయిదువేల ఎకరాల ఎస్టేట్ కు యజమాని. తన ద్రాక్షతోటలకు సమీపంలో ఉన్న ప్రదేశమే ట్రాయ్ అని అతనూ అంతే గట్టిగా నమ్మాడు.

స్లీమన్ చేసిందల్లా కల్వర్ట్ అడుగుజాడల్లో వెళ్లడమే. హిస్సాలిక్ కొండ మీద దృష్టి పెట్టాడో లేదో; మబ్బులన్నీ ఇట్టే విడిపోయి, అంతా తేటతెల్లంగా ఉన్నట్టు అతనికి అనిపించింది. ఆ కొండకు వెళ్ళే దారులు, దాని ఆకారం, పరిమాణం, చివరికి ఫ్రాంక్ కల్వర్ట్ తవ్వించిన కందకాల దగ్గర కనిపించిన ఆధారాలతో సహా అన్నీ ట్రాయ్ ఇదేనని నిరూపిస్తున్నాయనుకున్నాడు. ఆ కొండ పై భాగంలో తవ్వితే ప్రియామ్(ట్రోజన్ యుద్ధసమయంలో ట్రాయ్ ను పరిపాలించే రాజు) ప్రాసాదం తాలూకు శిథిలాలు బయటపడచ్చని అనుకున్నాడు. అతని ఊహ ప్రకారం ఆ కొండమీదే కోట ఉండేది. ఆ కొండను చుట్టుకుని, కోటకు దిగువున ఎథెన్స్ నగరం విస్తరించి ఉండేది. కొండ చుట్టూ భూమిలో ఎన్నో శిథిలాలు సమాధై ఉండచ్చనీ, ఆ కొండ మీదే అనేక పాలరాతి భవనాలు, నిధినిక్షేపాలు, గ్రీకు హీరోల సమాధులు ఉండి ఉండచ్చనీ భావించాడు. రెండు వారాలు కూడా తిరక్కుండానే హడావుడిగా ఆగస్టు 21న కాన్ స్టాంట్ నోపిల్ కు తిరిగి వెళ్ళి, ఫ్రాంక్ కల్వర్ట్ ను కలసుకుని తన సూత్రీకరణలపై చర్చలు జరిపాడు.

లేడికి లేచిందే పరుగులా తక్షణమే రంగంలోకి దిగిపోవాలన్న స్లీమన్ అత్యుత్సాహం; భారీ ప్రణాళికలతో, హఠాత్ నిర్ణయాలతో హిస్సాలిక్ కొండ మీద అతను అక్షరాలా మెరుపుదాడికి సిద్ధమైనట్టు కనిపించడం కల్వర్ట్ కు వింత గొలిపాయి. ఆయన నిదానస్తుడు, ఆచి తూచి నిర్ణయాలు తీసుకునే మనిషి. ఇది తవ్వకాలకు అనువైన సమయం కాదనీ, వచ్చే వసంతం దాకా ఆగడం మంచిదనీ సలహా ఇచ్చాడు. ఈలోపల జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లూ చేసుకోవాలనీ, ముఖ్యంగా టర్కీ ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకోవాలనీ చెప్పాడు. హిస్సాలిక్ కొండలో సగభాగానికి తనే యజమాని అయినప్పటికీ, అడ్డురాబోనని హామీ ఇచ్చాడు. కల్వర్ట్ ఔదార్యం, మంచితనం స్లీమన్ ను విచలితుణ్ణి చేసి ఆయనపై గౌరవాన్ని పెంచాయి. ఇంకొకరైతే ఇదే అవకాశం అనుకుని తనతో బేరసారాలకు దిగి ఉండేవారని అనుకున్నాడు.

కల్వర్ట్ సలహా పాటిస్తూ తన ఉత్సాహానికి కళ్ళెం వేయక తప్పలేదు. అందుకు ఇంకో కారణం కూడా ఉంది. అది, ఎకతెరీనాతో విడాకుల వ్యవహారం. వచ్చే వసంతం నాటికే అది సానుకూలమయ్యేలా చూస్తామని ఇండియానాపొలిస్ లోని మిత్రులు అతనికి మాట ఇచ్చారు. ఆ ప్రకారం వసంతం నాటికి అమెరికా వెళ్ళి ఆ పని పూర్తి చేయాలనీ, ఆ వెంటనే ట్రాయ్ కి తిరిగి రావాలనీ, ఈ లోపల పారిస్ వెళ్ళిపోయి శీతాకాలం అంతా అక్కడే గడుపుతూ గ్రీస్ లో తన ఆరువారాల పర్యటన విశేషాలతో పుస్తకం రాయాలనీ నిర్ణయించుకున్నాడు.

అనుకున్నట్టే, Ithaka, der Peloponnes und Troja అనే పేరుతో ఆ పుస్తకం పూర్తి చేశాడు. పురాతత్వ పరిశోధకుడిగా, భాషాశాస్త్రవేత్తగా, పురావస్తు తవ్వకాల నిపుణుడిగా, చరిత్రకారుడిగా, వ్యాపారవేత్తగా, ఉత్సుకత ఉరకలేసే బాలుడిగా తన అవతారాలన్నింటినీ అందులో గుప్పించేశాడు. అక్కడక్కడ మెరుపులున్నా, మొత్తం మీద ఆ పుస్తకం ఓ పరిశోధక విద్యార్థి రాసిన పత్రంలా చప్ప చప్పగా తయారైంది. దేవుడతనికి మంచి ఐశ్వర్యం, గొప్ప స్ఫురణ, బహుభాషా పాండిత్యం ఇచ్చాడు కానీ; దురదృష్టవశాత్తూ చక్కని శైలిని ఇవ్వలేదు. చాలాచోట్ల అతని రాత డబ్బు లావాదేవీల నమోదులా ఉంటుంది. దానికితోడు, అతని ఆలోచనల్లో స్పష్టత లోపించింది. నోయ్ స్ట్రీలిజ్ లో చిన్నప్పుడు చదువు చెప్పిన టీచర్ అతని శ్రద్ధాసక్తులను మెచ్చుకుంటూనే ఈ లోపాన్ని ఎత్తి చూపించాడు కూడా. ఆపైన తన పుస్తకంలో అసలు విషయం నుంచి పక్కకు వెళ్ళి భాషాశాస్త్ర సంబంధమైన చర్చలను అదే పనిగా సాగదీశాడు.  మధ్య మధ్య విశాలమైన అతని మెదడు లోతుల్లోంచి కొంత సరుకు ఉన్న ఆలోచనల బుడగలూ పైకి తేలాయి.

అతనిలో ఒకవైపు కీర్తి దాహం, ధనదాహం, అహం, అతిశయం, దాదాపు పరిచితులందరి పట్లా తృణీకారభావం; మరోవైపు అతి సామాన్యులతో కూడా కలసిపోయే తత్వం, వారిపై సానుభూతి, మెచ్చుకోలు వంటి మానవీయస్పందనలు! తనలోని ఇలాంటి వైరుధ్యాలను దాచుకోడానికి అతను ఏనాడూ ప్రయత్నించలేదు. ఈ పుస్తకమూ వాటికి అద్దం పట్టింది. తన జ్ఞానాన్ని అంతటినీ అందులో ఆడంబరంగా ప్రదర్శించాడు. తన వాదాన్ని వ్యతిరేకించే ఉటంకింపులను పూర్తిగా పక్కన పెట్టేసి, సమర్ధించే ఉటంకింపులను వరసపెట్టి ఇచ్చుకుంటూ పోయాడు. భాషాశాస్త్ర పరమైన ప్రతి జటిలమైన అంశాన్నీ తనదైన పద్ధతిలో చీల్చి చెండాడేశాడు. హోమర్ ను స్ట్రాబో(క్రీ.పూ. 64-క్రీ.శ. 24: గ్రీకు భౌగోళికశాస్త్రజ్ఞుడు, తత్వవేత్త, చరిత్రకారుడు)వ్యతిరేకించిన ఘట్టాలలో హోమర్ ను కాపాడే బాధ్యతను తన భుజస్కంధాలపైకి తీసుకుని స్ట్రాబోను దుమ్మెత్తిపోశాడు. ఆయా ప్రదేశాలగురించి తన ఆరాధ్యకవి అందించిన సమాచారంలో ఏ ఒక్కరు ఏ చిన్న లోపాన్ని ఎత్తి చూపినా వాళ్లమీద విపరీతమైన అసహనాన్ని కుమ్మరించాడు. ఒక మతఛాందసుడి తరహాలో అతను హోమర్ ను సాక్షాత్తు దేవుడిగా ఆకాశానికి ఎత్తడం, ప్రతిపక్షవాదాలను గుడ్డిగా నరికి పోగులు పెట్టడం ఈ పుస్తకంలో కనిపిస్తుంది.

ఇంగ్లీష్ లో హడావుడిగా రాసిన ఈ పుస్తకాన్ని జర్మన్ లోకి అనువాదం చేసి లీప్జిగ్ పబ్లిషర్ కు పంపించాడు. ఆ సంస్థ అతని ఖర్చుతోనే 750 కాపీలు ప్రచురించింది. ఒక రచయితగా తన మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో, ఆ పాత్రను ఎంత గాఢంగా తీసుకున్నాడో పదమూడేళ్ళ కొడుకు సెర్గీకి రాసిన ఈ ఉత్తరం వెల్లడిస్తుంది:

నా పురావస్తుపరిశోధనను పుస్తకరూపంలోకి తేవడంలో పగలూ, రాత్రీ శ్రమిస్తున్నాను. ఈ పుస్తకం రచయితగా నాకు పేరు తెస్తుందని ఆశపడుతున్నాను. నేను జియోగ్రాఫిక్ అండ్ ఆర్కియలాజికల్ సొసైటీలో సభ్యుణ్ణి. నా పుస్తకంలోని ముప్పై పేజీలను మిగతా సభ్యులకు చదివి వినిపించాను. నా పరిశోధనాంశాలపై వాళ్ళు ఎంతో ఉత్సుకతను చూపించారని చెప్పడానికి సంతోషిస్తున్నాను.

ఈ పుస్తకం పాఠకాదరణ పొందితే నా శేషజీవితం అంతా పుస్తకాలు రాస్తూనే గడపాలని నిర్ణయించుకున్నాను. మంచి పుస్తకాలు రాయడం కన్నా ఆసక్తికరమైన వ్యాసంగం ఇంకొకటి లేదని నేను నమ్ముతున్నాను. ఒక రచన చేసేటప్పుడు రచయిత ఎంతో సంతోషాన్నీ, సంతృప్తినీ, శాంతినీ పొందుతాడు. ఆ మనస్థితిలోంచి సమాజంలోకి వచ్చిన తర్వాత తన పరిశోధనా ఫలాల గురించీ, తన తపస్సు గురించీ వేలాది విషయాలు ఇతరులకు బోధించగలుగుతాడు. ప్రతి ఒకరూ రచయితల మార్గదర్శనాన్ని కోరుకుంటారు, వాళ్ళను నెత్తిన పెట్టుకుంటారు. ఈ వ్యాసంగంలో నేనింకా అభ్యాసదశలోనే ఉన్నాను కానీ, పదింతల మంది మిత్రుల్ని మాత్రం సంపాదించుకోగలిగాను…

నిజానికి అతనికి సన్నిహిత మిత్రులంటూ ఎవరూ దాదాపు లేరు. అలాంటి స్నేహంకోసం, తనను అర్ధం చేసుకునే ఒక తోడు కోసం అతను రహస్యంగా పడే తపనా, ఆర్తీ అతని ఉత్తరాలన్నింటిలో కనిపిస్తాయి. గ్రీస్ అనుభవం అతన్ని జనసామాన్యానికి ఎంతో కొంత దగ్గర చేసింది కానీ, ఇప్పటికీ తనదైన ఏకాంతదుర్గంలో తను ఉంటున్నాడు. ఎదుటి వాళ్ళ మనోభావాలపై బొత్తిగా ఖాతరు లేకపోవడం, అదిలించి బెదిరించి పని చేయించుకోవడం, ముక్కోపం, ఎదుటివాళ్లకు ఎంతో హాస్యాస్పదమనిపించేలా తన గురించి తను గొప్పగా ఊహించుకోవడం…అన్నీ మామూలే.

అదలా ఉండగా, తన పేరుకు ముందు ‘డాక్టర్’ అని ఉండాలని అతని చిరకాలవాంఛ. ఒక విశ్వవిద్యాలయంనుంచి డాక్టరేట్ తెచ్చుకున్నాడు కూడా.

(సశేషం)

 

 

 

 

మీ మాటలు

*