తొలి తవ్వకాలలో చితాభస్మం దొరికింది!

స్లీమన్ కథ-13

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

క్రిస్టమస్ రోజును పిల్లలతో గడపే అవకాశం కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఉండేవాణ్ణని వాషింగ్టన్ లో ఉన్నప్పుడు అనుకున్నాడు. తనను గాఢంగా ప్రేమిస్తున్నానని చెప్పిన సోఫీ ప్రాణాలు కాపాడడానికి, ఆకాశమే హద్దుగా ఏమైనా చేసి ఉండేవాడినని ఇప్పుడు అనుకుంటున్నాడు. హాంబర్గ్, బెర్లిన్ లలో ఉన్న పేరుమోసిన డాక్టర్ల నందరినీ ఆమె మంచం దగ్గరికే రప్పించి ఉండేవాడు. తను స్వయంగా ఆమెకు అహర్నిశలూ పరిచర్యలు చేసి ఉండేవాడు. ఆమె పట్ల తన ఆర్తీ, అంకితభావమూ బహుశా ఆమె ప్రాణాలను కాపాడి ఉండేవి. ఎంతో నైర్మల్యం, నిష్కల్మష హృదయం కలిగిన ఈ దేవతపై తన ప్రేమలో ఎలాంటి స్వార్థమూ, లైంగికవాంఛా లేవనీ; అది పూర్తిగా అమలిన ప్రేమ అనీ మనసుకు చెప్పుకున్నాడు.

ఆమె శవపేటిక ఫోటో పంపమని ఉత్తరం రాశాడు. ఆమెతో కలసి ప్రపంచాన్ని పది సార్లైనా చుట్టిరావడానికి తన ఆస్తి నంతటినీ కరిగించి ఉండేవాణ్ణని తోబుట్టువులకు రాశాడు. తను అమెరికా వెళ్లబోయేముందు సోఫీ తన తలవెంట్రుకనొకదానిని తనకు పంపితే దానిని నిర్లక్ష్యంగా ఓ పెట్టెలో పడేసిన సంగతిని గుర్తు చేసుకుని తన కృతజ్ఞతారాహిత్యానికి కుమిలిపోయాడు. ఆ తలవెంట్రుకను తన జీవితం మొత్తంలోనే ఒక పవిత్రనిధిగా భావిస్తాననీ, దానిని వజ్రాలు పొదిగిన బంగారు తొడుగులో ఉంచి జీవితాంతం గుండెలకు హత్తుకుంటాననీ అనుకున్నాడు.

సోఫీని అతను ప్రేమించింది స్వల్పకాలమే. ఆ తర్వాత తన మనసులోంచి ఆమెను తుడిచేసుకున్నాడు. అతని హృదయానికి దగ్గరైన అతి కొద్దిమందిలో ఆమె ఒకతె. మిన్నా మెయింక్, సోఫీ స్లీమన్…ఈ ఇద్దరే తనను నిస్వార్థంగా ప్రేమించారనుకున్నాడు. తన జీవనగమనంలోని అనేక ఘట్టాలలో సోఫీని ఎంతో ఇష్టంగా గుర్తుచేసుకున్నాడు. ఎకతెరీనాతో పెళ్ళికి ముందు తోబుట్టువులకు ఉత్తరం రాస్తూ ఆమె గురించి వాకబు చేశాడు. ఆమెను పెళ్లాడడం గురించి ఆలోచిస్తున్నట్టు అందులో సూచించాడు. అది, పదిహేనేళ్ళ క్రితం. అయితే, ఆమెపై ఒక స్పష్టమైన అభిప్రాయం ఏదీ అతనికి లేదు. ఇప్పుడామె హఠాత్తుగా కన్ను మూసింది. అంతే హఠాత్తుగా సమాధిలోంచి లేచి వచ్చి అతన్ని వెంటాడుతోంది.

మతం మీద, పరలోకం మీద అతనికి పెద్ద నమ్మకం లేదు. మానవప్రయత్నాన్నే నమ్మాడు. మనిషే అన్నిటికీ కొలమానం అనుకున్నాడు. తగిన పరిశ్రమా, నైపుణ్యాలే పెట్టుబడిగా సంపద గడించి ఈ భూమ్మీద లభించే సకల సౌఖ్యాలను అనుభవించే హక్కు ప్రతివారికీ ఉందని అనుకునేవాడు. కానీ ఇప్పుడా తాత్వికత పునాదులు కదిలిపోతున్నట్టు అనిపిస్తోంది. సోఫీ మరణంపై అతని దుఃఖవివశత్వంలో అతిశయం, స్వానుభూతి ఉన్న మాట నిజమే. వాటితోపాటు, ఆ వెంటనే జర్మనీకి వరసపెట్టి రాసిన ఉత్తరాల్లో అతనప్పుడన్న నైరాశ్యస్థితీ ఉట్టిపడుతోంది. సోఫీ తన జీవితం చివరి ఆరునెలలలో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించిందని తెలిశాక అతనిలోని దుఃఖం, అపరాధభావం మరింతగా కట్టలు తెంచుకున్నాయి. తన సంపదలో లక్షో వంతు ధారపోసినా ఆమె సుఖంగా జీవించి ఉండేదన్న ఊహ ఛెళ్ళున చరచినట్టై తన పట్ల తనకే ఏవగింపు కలిగి, సిగ్గుతో చితికిపోయాడు. ఒక్కసారిగా ఆత్మపరిశీలనలో కూరుకుపోయాడు. అసలు తనెందుకు జీవిస్తున్నాడు, ఇన్ని ఆస్తిపాస్తులుండి కూడా తనకు సంతోషం ఎందుకు కరవైపోయింది; ఇంటికీ, ఇల్లాలికీ, పిల్లలకీ, వెచ్చని ఆత్మీయస్పర్శకూ దూరంగా, ఓ బిచ్చగాడిలా దేశదిమ్మరి జీవితం ఎందుకు గడుపుతున్నాడన్న ప్రశ్నలతన్ని ముంచెత్తాయి. ఎక్కడో భగవంతుడున్నాడు, ప్రపంచంలో ఏమూలో ఇంత శాంతి దొరుకుతుందనుకున్నాడు.

అలా కలగుండు పడుతున్న సమయంలోనే, తన బాల్యాన్ని మంత్రముగ్ధం చేసిన హోమర్ అతనికి హఠాత్తుగా గుర్తుకొచ్చాడు. ట్రాయ్ కథను పొందుపరిచిన ఇలియడ్ కర్తగా కాదు; ఒడిస్సే కర్తగా! అందులోని నాయకుడు ఒడీసియస్ కూడా తనలానే  దేశదిమ్మరి. తిరిగి తిరిగి చివరికి స్వస్థలమైన ఇథకా చేరుకుంటాడు. అయోనియన్ సముద్ర తీరంలో ఎత్తైన కొండమీద ఉన్న తన కోటకు వెళ్ళి భార్య పెనొలోపిని కలసుకుంటాడు. తను కూడా వెంటనే బయలుదేరి ఇథకాకు వెళ్ళాలి! అక్కడి ఒడీసియస్ కోటను అధిరోహించాలి. ఏమో ఎవరు చెప్పగలరు…ఏదో అద్భుతం జరిగి తను వెతికే తన పెనొలోపి అక్కడ కనిపించినా కనిపించవచ్చు. తన దేశదిమ్మరి జీవితానికి అంతటితో తెర పడినా పడచ్చు.

***

స్లీమన్ ఏ విషయంలో నైనా సత్వర నిర్ణయాలు తీసుకునే మనిషిగా పైకి కనిపిస్తాడు. కానీ అది కొంతవరకే నిజం. డబ్బుకు సంబంధించిన విషయాల్లోనూ, ఎంతో జటిలమైన వ్యాపార లావాదేవీల్లోనూ అతని బుర్ర పాదరసంలా పనిచేసి, అప్పటికప్పుడు తిరుగులేని నిర్ణయాలు తీసుకుంటాడు. వ్యాపారపు లెక్కలు కట్టడంలోనూ అంటే చురుగ్గా పనిచేస్తాడు. కానీ ఇతర విషయాల్లో, ముఖ్యంగా వ్యక్తిగత విషయాల్లో చాలా మందకొడిగానూ, అనిశ్చితంగానూ వ్యవహరిస్తాడు. తన బలహీనతలు, లోపాలు ఆ సమయంలో జుట్టు విరబోసుకుని అతని ముందు ప్రత్యక్షమవుతాయి. ఇంతవరకూ సాగిన అతని జీవిత క్రమాన్ని చూస్తే, అది తిరిగిన ప్రతి ముఖ్యమైన మలుపు వెనకా ఒక విచిత్రమైన పోలిక కనిపిస్తుంది. తన చేతిలో లేని ఏ అదృశ్యశక్తులో ప్రతిసారీ అతన్ని ఆ మలుపు వైపు నెట్టాయి.

ఇప్పుడు కూడా అతనికి హఠాత్తుగా హోమర్ గుర్తొచ్చి ఆయన ఇతిహాసాలకు రంగస్థలమైన గ్రీస్ కు బయలుదేరి వెళ్లాలని నిర్ణయించుకోడానికి, చరిత్ర మీద మొదటినుంచీ తనకున్న ఆసక్తి ఒక్కటే కారణం కాదు. పురాతత్వశాస్త్రంలో తనకు గొప్ప పరిజ్ఞానం, ప్రావీణ్యం ఉన్నాయనీ కాదు. చనిపోయి దయ్యంలా వెంటాడుతున్న సోఫీ, భార్య తిరస్కృతీ, ఒంటరితనం అతన్ని అటువైపు బలవంతంగా తోశాయి. సోఫీ మరణం కలిగించిన దుఃఖం అతనిలో అంతర్మథనాన్ని రేపి తనకంటే అన్నివిధాలా శక్తిమంతమైన భగవంతుని ఉనికి గురించి ఆలోచింపజేసింది. ఆ దివ్యశక్తికి దాసోహమై తన జీవితాన్ని దాని చేతుల్లో పెట్టడం తప్ప మరో మార్గం లేదనిపించింది. తన జీవితశోధన; ఎంతో ఉత్సాహం, ఉత్సుకత నిండిన బాల్యంవైపు, బాల్యంలో తనను సూదంటురాయిలా ఆకర్షించిన హోమర్ వైపు అతన్ని నడిపించింది. ఈ సంక్షోభ క్షణాలలో హోమర్ అతనికి గుర్తొచ్చింది ఒక కవిగానో, తన భాషాశాస్త్ర అధ్యయనానికి ప్రేరణ అయిన ఒక సంక్లిష్ట భాషలో సిద్ధహస్తుడిగానో, అటిక్ నాటకకర్తలకు పితామహుడిగానో కాదు…మనిషి శిరసెత్తుకుని జీవించగలిగిన ఒక అద్భుత సమ్మోహకర సత్య ప్రపంచాన్ని సృష్టించిన దేవుడిగా!

1868 వేసవిలో అతను గ్రీసుకు బయలుదేరాడు. అప్పటికే తనో పురాతత్వశాస్త్ర కావాలని నిర్ణయించుకున్నాడు. ఇథకా వెళ్ళి అక్కడ ఐటియొస్ కొండ మీద ఒడీసీయస్ కోటను తవ్వి తీయాలని సంకల్పించుకున్నాడు. ఒడీసియస్ తన సుదీర్హయాత్రను ముగించుకున్నాక చింకిపాతలతో ఒక బిచ్చగాడి వేషంలో ఆ కోటలోకే ప్రవేశించాడు.

స్లీమన్ ముందుగా రోమ్ కు, నేపుల్స్ కు వెళ్ళి అక్కడినుంచి ఓడలో కోర్ఫుకు దారితీశాడు. అక్కడ ఒకరోజు మాత్రమే ఉన్నాడు. కోర్ఫు పురాతన నామం కొర్సైరా. హోమర్ పేర్కొన్న స్చేరియా దీవి బహుశా అదే నని ఊహ. అది ఫెయేషియన్ల నివాసప్రదేశం. ఫెయేషియన్ల రాజు అల్సినొవస్ కు అక్కడ అద్భుతమైన సౌధం ఉంది. ఒడీసియస్ సముద్రతీరానికి నగ్నంగా కొట్టుకు వచ్చినప్పుడు అల్సినొవస్ కూతురు నౌసికాయే అతనికి ఎదురై దుస్తులిచ్చి చక్కటి రథం మీద రాజసౌధానికి తీసుకెళ్లింది. ఆ సౌధం ఆనవాళ్ళు ఎక్కడైనా కనిపిస్తాయేమోనని స్లీమన్ వెతికాడు కానీ కనిపించలేదు. దగ్గరలో ఉన్న ఒక ప్రవాహాన్ని చూసి, నౌసికా తన దుస్తులు ఉతుక్కుని చెలికత్తెలతో విహరించిన ఇతిహాసప్రసిద్ధమైన ప్రవాహం అదే కావచ్చనుకున్నాడు. అందులో నగ్నంగా ఈతకొట్టాడు. ఆ తర్వాత, అక్కడే ఉన్న పొదలను చూశాడు. నౌసికాను, ఆమె చెలికత్తెలను చూడగానే ఒడీసియస్ దాక్కొన్న పొదలు అవే అయుంటాయనుకుని వాటి వెనక నగ్నంగా నిలబడి కాసేపు తనను ఒడీసియస్ గా ఊహించుకుని సంతోషించాడు. కాకపోతే అతనికోసం ఏ కన్యలూ వచ్చి అక్కడ వాలలేదు. అతన్ని తీసుకెళ్లడానికి ఏ అద్భుతరథమూ రాలేదు!

మరునాడు ఆవిరిపడవ ఎక్కి సెఫలోనియా వెళ్ళాడు. అయోనియా దీవులలో అదే పెద్దది. దాని పురాతన రాజధానిని రోమన్లు ధ్వంసం చేశారు. అక్కడ ఆసక్తికరమైన దేదీ అతనికి కనిపించలేదు. అక్కడినుంచి  ఓ చిన్న సముద్రపు పాయను దాటి ఇథకాలో అడుగుపెట్టాడు. ఇతర దీవులను చూసినప్పుడు హోమర్ పేర్కొన్నవేనా అన్న అనుమానం కలిగింది కానీ, ఇథకాలో మాత్రం ప్రతిదీ హోమర్ ను గుర్తుచేసింది. “ప్రతి కొండ, గుట్ట, సెలయేరు, ఆలివ్ తోపు అచ్చంగా హోమర్ వర్ణించినట్టే ఉన్నాయి. ఒక్క గెంతులో వందతరాల వెనక్కి, గ్రీకు వీరుల ఉజ్వల యుగంలోకి వెళ్ళి పడ్డాను” అని రాసుకున్నాడు.

ఇథకాలో అడుగుపెట్టిన మరుక్షణం ఎవరో మంత్రించినట్టు అయిపోయాడు. దేనినీ విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క చోటుకీ వెళ్ళాడు. ప్రతిదీ కళ్ళు విప్పార్చుకుని చూశాడు. 120 డిగ్రీల ఎండ కాస్తోంది. అయినాసరే పట్టలేని సంతోషంతో పిచ్చెత్తినట్టు తిరిగాడు. హోటళ్లు లేవు. ఇద్దరు వృద్ధకన్యలు నడిపే సత్రంలో వసతి దొరికింది. ఓ మిల్లు పనివాడు పరిచయమయ్యాడు. అతని దగ్గర ఓ గాడిద ఉంది. స్లీమన్ ను ఆ దీవి అంతా తిప్పి చూపిస్తానన్నాడు. దీవి సన్నగా, ఎత్తుపల్లాలతో ఎనిమిది(8) అంకె ఆకారంలో ఉంది. హోమర్ ఇతిహాసం ప్రకారం ఒడీసియస్ కోట ఈ దీవిలోనే ఉంది.

ఆ మిల్లు పనివాడి పేరు పానగిస్ ఆస్ప్రైరికా. ఒడీసియస్ కు చెందిన కథలన్నీ అతనికి కరతలామలకం. వాటిని విరామం లేకుండా వల్లిస్తూపోయాడు. స్లీమన్ మధ్య మధ్య అతని వాక్ప్రవాహానికి అడ్డుతగిలి, “ఫోర్సిస్ ఓడరేవు అదేనా? అప్సరసల గుహలు ఎక్కడున్నాయి? లయర్టిస్(ఇతను ఒడీసియస్ తండ్రి అనీ, లేదా తండ్రి లాంటివాడనీ రెండు వాదాలు ఉన్నాయి)పొలం ఎక్కడుంది” అంటూ ప్రశ్నలు గుప్పించేవాడు. ఆ మిల్లు పనివాడు ఓ కథల పుట్ట. అవి తప్ప అతనికింకేమీ తెలియవు. స్లీమన్ కు విసుగొచ్చి, “ఇక్కడి రోడ్లు అంతూపొంతూ లేకుండా సాగుతున్నాయి. అలాగే ఇతగాడి కథలు కూడా” అని రాసుకున్నాడు. అయితే స్లీమన్ కు అతను బాగా నచ్చాడు. ఇద్దరూ జంటగా తిరిగారు. ఆ గ్రామస్తులు కూడా అతనికి నచ్చారు. అక్కడి రైతులు సీదా సాదాగానూ, స్నేహపాత్రులుగానూ, శ్రమజీవులుగానూ కనిపించారు. వాళ్ళలో సహజమైన ఉదాత్తత ఉట్టిపడుతోందనీ, వాళ్ళ కళ్ళలో నిజాయితీ ప్రతిఫలిస్తోందనీ, తమ పూర్వీకుడైన ఒడీసియస్ కు అన్నివిధాలా తగిన వారసులనీ అనుకున్నాడు. అన్నింటినీ మించి, ఒడీసియస్ నివసించిన కోటను తవ్వి తీయబోతున్నానన్న ఊహ అతనిలో అంతులేని ఆనందోత్సాహాలు నింపింది. రెండు రోజుల తర్వాత ఐటియొస్ కొండ ఎక్కాడు.

అది పెద్దగా ఖర్చులేని చిన్న ప్రారంభం. వెంట నలుగురు పనివాళ్లు, ఒక గాడిద. ఏడాది మొత్తంలోనే ఎండలు బాగా మండే కాలం కనుక, ఉదయం అయిదుకే బయలుదేరాలని ఉత్తర్వు చేశాడు. తను నాలుగుకే లేచి, సముద్రస్నానం చేసి, ఓ కప్పు బ్లాక్ కాఫీ తాగి బయలుదేరాడు. కొండ ఎక్కడానికి రెండు గంటలు పట్టింది. పైకి వెళ్ళాక పెలొపనీసెస్ పర్వతాలను ఆనుకుని ద్రాక్షమద్యం రంగులో ఉన్న సముద్రం కనిపిస్తుందనుకున్నాడు(హోమర్ తన ఇలియడ్ లో అలా వర్ణించాడు). ఆ ఎత్తునుంచి గ్రీస్ మొత్తాన్ని చూడచ్చేమో నని కూడా అనిపించింది.

మొదటిరోజు తవ్వకాల్లో చెప్పుకోదగినవేవీ దొరకలేదు. ఓ రైతు ఒక పురాతన కలశాన్ని, ఓ వెండి నాణేన్నీ తీసుకొచ్చి ఇచ్చాడు. కోరింత్ కు చెందిన ఆ నాణేనికి ఒకపక్క మినర్వా(ఒక గ్రీకు దేవత) శిరస్సు, ఇంకో పక్క ఓ గుర్రపు బొమ్మ ఉన్నాయి. మరునాడు, ఓ వలయాకారపు గోడ లోంచి మొలుచుకొచ్చిన చెట్ల కొమ్మలను పీకించి, దాని ఈశాన్యం దిక్కులో తవ్వమని పనివాళ్ళకు చెప్పాడు. సరిగ్గా అక్కడే ఒడీసియస్ తన శోభనం గదిని నిర్మించి ఉంటాడని అతనికి మెరుపులా తోచింది.

పనివాళ్లు అక్కడ తవ్వకుంటూ పోయారు. మూడు గంటల తర్వాత, 3 మీటర్ల వెడల్పు, 4.75 మీటర్ల పొడవు ఉన్న ఒక భవనం తాలూకు పునాదిరాళ్ళు బయటపడ్డాయి. ఒడీసియస్ శోభనం గదిని కనిపెట్టాననుకుని స్లీమన్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. అక్కడ, మట్టి కప్పేసిన ఒక అర్ధచంద్రాకారపు రాయి కనిపించింది. దానిని జాగ్రత్తగా పైకి తీసి, తనే చేతిగొడ్డలితో అక్కడ తవ్వడం ప్రారంభించాడు. నాలుగు అంగుళాల లోతున ఓ సున్నితమైన కలశం తగిలింది. గొడ్డలి దెబ్బకు అది ముక్క ముక్కలైపోయింది. ఆ తర్వాత మరో ఇరవై కలశాలు బయటపడ్డాయి. కొన్ని నిటారుగానూ, కొన్ని పక్కలకు ఒరిగిపోయీ ఉన్నాయి. వాటన్నింటిలో బూడిద ఉంది. అది కచ్చితంగా మనుషుల చితాభస్మమే అనుకున్నాడు. వాటి పక్కనే బలికి ఉపయోగించే ఆరంగుళాల కత్తి, పెదవులకు రెండు వేణువులను ఆనించుకుని ఉన్న అమ్మవారి మట్టిబొమ్మ, కొన్ని జంతువుల ఎముకలు కనిపించాయి. శాసనాలేవీ కనిపించలేదు.

స్లీమన్ ఉత్సాహానికి పట్టపగ్గాలు లేవు. పనివాళ్ళ వైపు తిరిగి, ఈ కలశాల్లో ఒక దాంట్లో ఒడీసియస్ చితాభస్మం ఉండి ఉంటుందన్నాడు. “క్యుమై నుంచి తెచ్చి, నేపుల్స్ మ్యూజియంలో భద్రపరచిన పురాతన కలశాల కన్నా కూడా ఇవి చాలా పురాతనమని నేను నమ్ముతున్నాను. వీటిలో ఉన్నది ఒడీసియస్, పెనొలోపిల చితాభస్మమో, వాళ్ళ వారసుల చితాభస్మమో కావడానికి ఎంతైనా అవకాశముం”దని డైరీలో రాసుకున్నాడు.

ఈ తొలి ఫలితాలు అతనిలోని పురావస్తుదాహాన్ని అమాంతం పెంచేశాయి. మొదటిసారి తనో పవిత్రస్థలిలో నిలబడి ఉన్నాననీ, ఎన్నో రహస్యాలను పొదవుకున్న పురాతనగతం ఆ భూమిలోంచి తననే తేరిపార చూస్తోందనీ అనుభూతి చెందాడు. అతనూహించినట్టు, బయటపడింది శోభనం గది కాదు; చితాభస్మం. అయినాసరే, కృతజ్ఞతాభావం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అనాయాసంగా లభించిన ఈ తొలి ఫలితాలు అతనికొక నష్టమూ కలిగించాయి. తనలో స్వభావసిద్ధంగానే ఒక గొప్ప పురాతత్వశాస్త్రవేత్త ఉన్నాడని ఇప్పుడు మరింత గట్టిగా నమ్మడం ప్రారంభించాడు. ఆ తదుపరి తవ్వకాలలో కూడా ఇదే ప్రణాళికను అనుసరిస్తూవెళ్ళాడు. ప్రతిచోటా ఓ ‘ఈశాన్యం మూల’ ఉండనే ఉంటుంది. హోమర్ పంక్తుల్ని పదే పదే నెమరువేసుకుంటూ, ఒకవిధమైన స్ఫురణతో ఒక ప్రదేశాన్ని ఎంచుకునేవాడు. ఇక్కడ నిధి నిక్షేపాలు ఉండచ్చని నిర్ణయానికి వచ్చేవాడు. అక్కడ తవ్వమని పనివాళ్ళకు చెప్పేవాడు. ఒక ప్రదేశాన్ని తను ఎందుకు ఎంచుకున్నాడో, ఎప్పుడో కానీ సహేతుకమైన వివరణ ఇచ్చేవాడు కాదు. స్ఫురణతోపాటు, తను గతంలోకి పయనిస్తున్నానన్న ఉత్సుకతా, ఉత్సాహాలే అతన్ని ముందుకు నడిపించాయి.

తొలి ఫలితాల రోజున అతను ఎంత ఉత్తేజితుడైపోయాడంటే; దహించే ఎండనూ, దప్పికనూ కూడా మరచిపోయాడు. మధ్యాహ్నం అయ్యేసరికి, పొద్దుటినుంచీ తాము ఏమీ తినలేదన్న సంగతి గుర్తొచ్చింది. పనివాళ్లను భోజనానికి పంపేసి తను ఆ కొండ కొనకు కొంచెం దగ్గరలో ఉన్న ఒక ఆలివ్ చెట్టు నీడలోకి వెళ్ళాడు. అంతలో ఒక విషయం అతనికి మెరుపులా స్ఫురించింది. ఇరవయ్యేళ్ళ తర్వాత స్వగృహానికి వచ్చిన యజమాని ఒడీసియస్ ను గుర్తుపట్టి అతని పెంపుడు కుక్క ఆర్గస్ పట్టలేని సంతోషంతో మరణిస్తుంది. అది చూసి ఒడీసియస్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. సరిగ్గా తను నిలబడ్డ చోటే ఆ ఘటన జరిగి ఉంటుందని స్లీమన్ అనుకున్నాడు. ఆ ఊహతోపాటు మరికొన్ని ఊహలూ గొలుసుకట్టుగా అతని బుర్రను తాకాయి. బహుశా ఇక్కడే, లేదా ఇక్కడికి దగ్గరలోనే పందుల కాపరి యూమస్ ఈ మాటలు అనుంటాడనుకున్నాడు: ”ఒక మనిషి ఎప్పుడైతే దాస్యంలోకి జారిపోయాడో అప్పుడే సర్వసాక్షి అయిన ఆ జియస్ అతని విలువలో సగం హరించేస్తాడు.”

బ్రెడ్డుతోనూ, వైన్ తోనూ భోజనం చేశాక పనివాళ్లు కునుకుతీశారు. స్లీమన్ తవ్వకాన్ని కొనసాగించాడు. మద్యం ప్రభావం చూపించింది. ఇథకా వైను, బోర్డా వైనుకన్నా మూడురెట్లు ఘాటుగా ఉందనుకున్నాడు. ఆ రోజు తవ్వకాల్లో ఇంకేమీ దొరకలేదు. ఆ మరునాడూ అంతే…

(సశేషం)

 

 

 

మీ మాటలు

  1. గ్రీకు ఇతిహాసాల మీద ఉత్సుకత రగిలిస్తున్నారు.

మీ మాటలు

*