గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్-17

 

 

                    Anne Of Green Gables By L.M.Montgomery

గ్రీన్ గేబుల్స్ పరిసరాలలో అక్టోబర్ నెలకి చాలా అందం. కొండవాలులో బర్చ్ చెట్లకి బంగారపు ఎండ రంగు వస్తుంది. తోపులోపై మేపుల్ చెట్లు ఎర్రగా  ధగధగమంటాయి. దారివెంబడి చెర్రీ వృక్షాలకి మెరిసే జేగురు రంగూ , ఆకుపచ్చని పసుపు రంగూ. కోత ముగిసిన పంటపొలాలలో కొత్త గడ్డి , సూర్యుడి కిందన.

ఆ వర్ణవైభవం ఆన్ కి పండగలా ఉంది.

” ఓ, మెరిల్లా ! ” ఒక శనివారం ఉదయం గంతులేసుకుంటూ వచ్చింది..సందిట్లో మేపుల్ రెమ్మలు. ” ఈ లోకం లో అక్టోబర్ నెల అనేది ఉండటం ఎంత బావుందని ! ఇది గనక లేకుండా సెప్టెంబర్ నుంచి సరాసరి నవంబర్ వచ్చేస్తుంటే దరిద్రంగా ఉండేది. ఇవి చూడు..తాకితే పులకింతలు ..బోలెడన్ని పులకింతలు – రావట్లేదూ నీకు ? నా గదిలో అలంకరించుకుంటాను వీటిని ”

” హ్మ్మ్ ” – మెరిల్లా సౌందర్యస్పృహ పెద్దగా అభివృద్ధి చెందిన దాఖలాలు కనిపించలేదు. ” బయటివన్నీ తీసుకొచ్చి గదినిండా  పేరుస్తావు..పడకగది ఉన్నది నిద్రపోయేందుకు ”

” కలలు కనేందుకు కూడా. గదిలో అందమైనవి ఉంటే ఊహించుకోవటానికి బావుంటుంది. ఆ పాత నీలం రంగు కూజాలో పెట్టుకుంటాను వీటిని, నా మంచం పక్కనే ”

” సరేలే. మెట్ల మీదంతా ఆకులు పోసేయకు. నేను ఊళ్ళోకి వెళుతున్నాను, సహాయకేంద్రం లో మీటింగ్ ఉంది నాకు. చీకటి పడేదాకా ఇంటికి రాను . మాథ్యూ కీ జెర్రీ కీ భోజనం ఏర్పాట్లు నువ్వే చూడాలి, తెలిసిందా ? టీ కోసం నీళ్ళు మరగబెట్టటం మర్చిపోయావు , కిందటిసారి నేను లేనప్పుడు… భోజనాల బల్ల దగ్గర కూర్చునేవరకూ గుర్తే రాలేదు నీకు ”

” నా వల్ల పెద్ద తప్పే జరిగిపోయింది అప్పుడు ” – ఆన్ చింతించింది. ” కాని ఆ మధ్యాహ్నం వయొలెట్ లోయ కి పెట్టాల్సిన పేరు గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. మాథ్యూ పాపం ఏమీ అనలేదు, తనే వెళ్ళి కెటిల్ ని పొయ్యి మీద పెట్టివచ్చాడు. ‘ కాసేపు ఆగితే కొంపలేం మునగవులే ‘ అని కూడా అన్నాడు.  ఈ లోపు నేను మంచి గంధర్వగాథ  చెప్పాను మాథ్యూకి,  కాలం ఎలా గడిచిపోయిందో తెలీనే లేదు తెలుసా !  భలే ఉంటుంది ఆ కథ , మెరిల్లా . చివరికేమవుతుందో మర్చిపోయాను, అందుకని నేనే ముగింపు తయారుచేసి చెప్పాను. ఎక్కడ దాకా అసలు కథో, ఏది నేను అల్లిందో – తేడా అస్సలు తెలీలేదన్నాడు మాథ్యూ ”

” మాథ్యూ కి నువ్వేం చేసినా బాగానే ఉంటుందిలే , నువు అర్థరాత్రి వరకూ అన్నం పెట్టకపోయినా ఏం పర్వాలేదు అతనికి. నేను మటుకు ఊరుకోను, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో. డయానా ని నీకు తోడు పిలుచుకుంటావా పోనీ…ఏమో, నీకు ఇంకా తిక్కలొస్తాయి డయానా ఉంటే . కానీలే,  పిలువు ”

” ఓ…” ఆన్ మురిసిపోయింది – ” నీకు కూడా ఊహించటం వచ్చనిపిస్తోంది మెరిల్లా, లేకపోతే ఇలా చెప్పవు. ఎన్ని రోజులనుంచీ ఊహించుకుంటున్నానో – ఇలా డయానా  నేనూ మటుకే , పెద్దవాళ్ళకి మల్లే ఇల్లు చక్కబెట్టుకోవటం .. ! నాకెవరైనా తోడుంటే నేను టీ కి నీళ్ళు పెట్టటాలూ అవీ మర్చిపోను కూడా కదా ! మరీ- ఆ గులాబిమొగ్గల టీ సెట్ వాడుకోవద్దా నేను…సరేనా ? ”

” ఇంకా నయం ! ఎప్పుడైనా బయటికి తీస్తానా నేను దాన్ని – పాస్టర్ గారొచ్చినప్పుడో, మనింట్లో సహాయకేంద్రం మీటింగ్ లు జరిగినప్పుడో తప్పించి ! మామూలు మట్టి రంగు టీ సెట్ నే వాడాలి నువ్వు. అయితే ఆ మట్టి జాడీ లో చెర్రీ జామ్  ఉంది కదా, అది కొంచెం తీసుకోండి పర్వాలేదు  – ఈపాటికే దాన్ని వాడేసి ఉండాల్సింది. ఒవెన్ లో పళ్ళ కేక్ ఉంది, పెద్ద ముక్క ఒకటి కోసుకోండి, అక్కడే బిస్కెట్లు కూడా ఉన్నాయి ”

anne17-1

” బల్ల దగ్గర నేనే అన్నీ వడ్డిస్తాను, కెటిల్ లోంచి నేనే టీ పోస్తాను ”…ఆన్ పరవశించిపోతోంది – ” డయానాని టీ లోకి పంచదార కావాలా అని అడుగుతాను ..తను వేసుకోదు , తెలుసు – కాని తెలీనట్లే అడుగుతానన్నమాట. ఇంకొంచెం కేక్ తినమనీ ఇంకాస్త జామ్ వేసుకోమనీ అడగటం – ఆహ్ ! డయానా నేనూ మన కచేరీ చావడిలో కూర్చోమా ? ”

” ఏం అక్కర్లేదులే. మీ ఇద్దరికీ ఈ వరండా చాలు. అన్నట్లు  , మొన్న చర్చ్ లో పార్టీ అయాక కొంచెం రాస్ప్ బెర్రీ కార్డియల్ మిగిలింది , అది తాగచ్చు మీరు కావలిస్తే , అలమార్లో రెండో చెక్కలో ఉంటుంది చూడు. దాంతోబాటు బిస్కెట్ లు తినచ్చు. మాథ్యూ వచ్చేసరికి ఆలస్యమవుతుందిలే , బంగాళాదుంపలు పడవలోకి ఎత్తిస్తుంటాడు కదా. ఈ లోపు మీరు బుద్ధిగా ఉండండి ”

ఆన్  ఒక్క పరుగున డయానా వాళ్ళ ఇల్లు ‘ తోటవాలు ‘ చేరింది. ఫలితంగా – మెరిల్లా అటు వెళ్ళగానే డయానా ఇటు వచ్చేసింది –  మంచి గౌను వేసుకుని పద్ధతిగా తయారై.

మామూలుగా అయితే తలుపుకొట్టకుండా వంటింటి గుమ్మం లోంచి వచ్చేస్తుంది  – ఇప్పుడు మర్యాదగా వాకిలి తలుపు కొట్టింది . ఆన్ కూడా వీలైనంత పద్ధతిగానే తయారై ఉంది- వెళ్ళి తలుపు తీయగానే ఇద్దరూ షేక్ హాండ్ లు ఇచ్చుకున్నారు… మొదటిసారి కలుసుకుంటున్నట్లుగా. ఈ  వ్యవహారం ఇద్దరూ ఆన్ గదిలొకి వెళ్ళి కుర్చీల్లో పదినిమిషాలపాటు ఆసీనులయేవరకూ సాగింది. డయానా పాదాలని ఒద్దిగ్గా పెట్టుకు కూర్చుంది అంతసేపూ.

” మీ అమ్మగారెలా ఉన్నారు ? ” ఆన్ బహు మర్యాదగా ప్రశ్నించింది. ఆ పొద్దుటే మిసెస్ బారీ పరిపూర్ణారోగ్యంతో ఆపిల్ పళ్ళు కోస్తుండగా  ఆన్ కి కనిపించి ఉంది.

” ఆవిడ కులాసాగానే ఉన్నారు, ధన్యవాదాలు. మిస్టర్ కుత్ బర్ట్ ఈ మధ్యాహ్నం బంగాళాదుంపలని లిల్లీ శాండ్స్ రేవుకి పంపిస్తున్నారనుకుంటాను, అవునా ? ” డయానా అడిగింది. అదంతా ముందే తెలుసు ,  ఉదయాన మాథ్యూ బండి లోనే ఎక్కి హార్మన్ ఆండ్రూస్ ఇంటికి వెళ్ళింది డయానా.

” ఆ. అవును. ఈసారి బంగాళా దుంపలు బాగా పండాయి. మీ నాన్నగారి పంట కూడా బావుందనుకుంటాను ”

” అవును. బావుంది, థాంక్ యూ. మీ ఆపిల్స్ అన్నీ  కోసేశారా ? ”

” ఇంకా బోలెడున్నాయి ” – ఆన్ చెంగున లేచింది , అక్కడితో గాంభీర్యం అంతరించింది. ” తోటలొకి పోదాం రా, డయానా. చెట్ల మీద మిగిలినవన్నీ మనకేనని మెరిల్లా చెప్పింది , కోసుకుందాం. మెరిల్లా ఎంత మంచిదో…పళ్ళ కేక్, చెర్రీ జామ్  తీసుకోవచ్చంది మనల్ని , టీ తోబాటుగా. ఇంటికొచ్చినవాళ్ళకి ఏం పెడుతున్నామో ముందే చెప్పటం మర్యాద కాదుగా..అందుకని మనకి తాగటానికి  ఏముందో మాత్రం చెప్పను నీకు. దాని పేరులో మొదటి అక్షరాలు ‘  ఆర్ ‘ , ‘ సి ‘ – ఎర్రగా ఉంటుంది అది. ఎర్రటి పానీయాలు భలే ఉంటాయి కదూ, వేరే రంగుల్లోవాటికంటే   రెట్టింపు రుచిగా ఉంటాయి !

పళ్ళబరువుకి వంగిఉన్న కొమ్మలతో ఆపిల్ తోట ఆహ్లాదకరంగా ఉంది.  తోటలో  ఒకమూలన  గడ్డి ఇంకా ఆకుపచ్చగానే ఉంది , సాయంత్రపు నీరెండ వెచ్చగా అలముకుంది . ఆ మధ్యాహ్నమంతా ఇద్దరూ అక్కడే –  ఆపిల్ లు కొరుకుతూ, బిగ్గరగా మాట్లాడేసుకుంటూ .ఆన్ తో  చెప్పాల్సినవి చాలా ఉన్నాయి డయానాకి. గెర్టీ పై పక్కన కూర్చోవాల్సి వస్తోంది రోజూ ..ఆ పిల్ల రాస్తుంటే పెన్సిల్ కీచ్ కీచ్  మంటూనే ఉంటుంది, డయానికి గొప్ప చికాగ్గా ఉంది. రూబీ గిల్లిస్ పులిపిరులన్నీ పోతాయిట –  ఏటిపక్కన ఇంట్లో ఉండే పెద్దావిడ  మేరీ జో దగ్గర్నుంచి చిన్న గుండ్రాయి తెచ్చుకుందట , నెల పొడుపు  రోజున దాంతో  అన్నీ రుద్దేసి , తల తిప్పకుండా ఎడం బుజం మీంచి దాన్ని వెనక్కి పడేస్తే ఇక పులిపిరుల మాటే ఉండదట.  ఎమ్మా వైట్ పేరునీ చార్లీ స్లోన్  పేరునీ కలిపి గోడ మీద రాశారట – ఎమ్మా కి పిచ్చికోపం వచ్చి ఏడ్చేసిందట. శా మ్  బట్లర్ మిస్టర్ ఫిలిప్స్ ని క్లాస్ లో  ఎగర్తించి మాట్లాడాడట  – మిస్టర్ ఫిలిప్స్     శా మ్  ని బెత్తం దెబ్బలు  కొట్టాడట. శామ్   వాళ్ళ నాన్న వచ్చి ‘మళ్ళీ నా పిల్లలెవరిమీదైనా చెయ్యి పడిందా, జాగ్రత్త ! ‘అని  మిస్టర్ ఫిలిప్స్ ని గట్టిగా హెచ్చరించి వెళ్ళాడట. మాటీ ఆండ్రూస్ కొత్తగా ఎర్ర టోపీ పెట్టుకొస్తోందట , దానికి నీలం రంగు కుచ్చులున్నాయట. బాగానే ఉందిగానీ మాటీ బాగా ఎచ్చులు పోతోందట- అందరికీ చిరాకేస్తోందట. లిజీ రైట్, మామీ విల్సన్ – మాట్లాడుకోవట్లేదట- లిజీ వాళ్ళక్క ప్రేమిస్తున్నవాడిని మామీ వాళ్ళక్క లాక్కుందని అట. ఆన్ బళ్ళోకి రాకపోవటం ఎవరికీ బాగోలేదట , మళ్ళీ వచ్చేస్తే బావుండుననుకుంటున్నారట…గిల్బర్ట్ బ్లైత్-

ఆన్ అతని గురించి ఏమీ వినదల్చుకోలేదు. రాస్ప్ బెర్రీ కార్డియల్ తాగటానికి వెల్దామని మాట మార్చేసి లేచింది.

anne17-2

వంటింటి అలమర   రెండో చెక్కలొ వెతికింది ఆన్ – అక్కడేం కనిపించలేదు. చూస్తే అది పైచెక్క లో ఉంది.  జాగ్రత్తగా దాన్ని దింపి సీసా, గ్లాసులూ ట్రే లో అమర్చింది.

‘ కొంచెం తీసుకో డయానా ” – మర్యాదగా చెప్పింది – ” నేనిప్పుడేమీ తీసుకోలేను.. చాలా ఆపిల్స్ తిన్నానేమో కదా ”

డయానా ఒక గ్లాస్ లో సగం పైదాకా పోసుకుని, ఇష్టంగా మొహం పెట్టి కొంచెం కొంచెం పుచ్చుకుంది.

” ఎంత బావుంది ఆన్ ! రాస్ప్ బెర్రీ కార్డియల్ ఇంత రుచిగా ఉంటుందని నాకు తెలీనే తెలీదు ”

” నీకు నచ్చటం ఎంతో సంతోషంగా ఉంది. కావల్సినంత పోసుకుని హాయిగా  తాగుతూ ఉండు. వంటింట్లో పొయ్యి రాజేసి ఇప్పుడే వస్తాను నేను – అబ్బా ! ఇల్లు చూసుకోవటమంటే అల్లాటప్పా పని కాదూ… ”

ఆన్ తిరిగి వచ్చేసరికి డయానా రెండో గ్లాస్ కార్డియల్ తాగుతోంది. ఆన్ బలవంతం చేస్తే, మూడోది నింపుకుందుకూ అభ్యంతరం పెట్టలేదు.  ఆ గ్లాస్ సైజు భారీగానే ఉంది ..కార్డియల్ రుచి అంత బావుంది మరి !

” ఇంత మంచిది నా జన్మలో తాగలేదు. మిసెస్ లిండ్ తెస్తూ ఉంటుంది మా ఇంటికి , దానికీ దీనికీ పోలికే లేదు !!! ” – డయానా ప్రకటించింది.

” మెరిల్లా తయారు చేసింది గా మరి, మిసెస్ లిండ్ చేసిందానికంటే ఖచ్చితంగా బావుంటుంది ” – ఆన్ విశ్వాసంగా అంది. ” మెరిల్లా వంట నేర్చుకోమంటుంది నన్ను, నాకూ నేర్చుకోవాలనే ఉంటుంది గాని , బాగా కష్టమైన పని. ఊహించుకుందుకు ఏ- మీ ఉండదు ..అంతా లెక్క ప్రకారమే చెయ్యాలి. మొన్నామధ్య కేక్ చేస్తూ పిండి కలపటం మర్చిపోయాను. అప్పుడు మనిద్దరి గురించీ ఒక విషాదగాథ ని ఊహించుకుంటున్నాను. నీకు మశూచి వచ్చిందట, నీ దగ్గరికి రావటానికి అందరూ భయపడుతుంటే , నేను నీ పక్కనే ఉండి రాత్రింబవళ్ళు సేవ చేశానట. నీకు నయమైపోయి, నాకు మశూచి వచ్చేసి నేను చచ్చిపోయానట. నన్ను స్మశానం లో పొప్లార్ చెట్ల కిందన  సమాధి చేశారట. నువ్వు నా సమాధిమీద ఎర్ర గులాబీ మొక్క నాటి నీ కన్నీళ్ళతో దాన్ని పెంచుతున్నావట…నీకోసం ప్రాణాన్ని త్యాగం చేసిన స్నేహితురాలిని నువ్వు నిరంతరమూ స్మరిస్తూనే ఉన్నావట. నా కళ్ళ నుంచి నీళ్ళు కాలవలు కట్టాయి… పిండి కలపటం మర్చిపోయాను ..కేక్ నాశనమైపోయింది ! మెరిల్లా మండిపడిపోయింది… కేక్ చేసేందుకు పిండి నిజంగా అవసరంలాగే ఉంది డయానా !

ఇంకోరోజున – రాత్రి భోజనాలయాక ప్లమ్ పుడ్డింగ్ , సాస్ – ఎక్కువ మిగిలిపోయాయి. వాటిని భద్రం చేసి మూతపెట్టమనీ మర్నాడు తినచ్చనీ మెరిల్లా చెప్పింది. అలాగే చేద్దామనుకున్నాను..ఈలోపల  గాఢంగా ఊహించు కోవటం మొదలుపెట్టాను  . నేను ‘ నన్ ‘ అయిపోయానట..నేను ప్రొటెస్టెంట్ నే లే, కాథలిక్ ని అని ఊహించుకున్నాను. ముసుగు వేసుకుని, భగ్నహృదయం తో , బయటి ప్రపంచానికి దూరంగా..ఒంటరిగా – జీవితం వెళ్ళబుచ్చుతున్నట్లుగా ….పుడ్డింగ్ సంగతి తెల్లారాక గుర్తొచ్చి వెళ్ళి చూస్తే మూత పెట్టటం మర్చిపోయాను.. సాస్ లో ఒక ఎలక తేలుతోంది. జాగ్రత్తగా చెంచా తో దాన్ని తీసి అవతల పారేసి చెంచాని మూడు సార్లు రుద్ది  కడిగాను. అప్పుడు మెరిల్లా , పాలు తీస్తూ పెరట్లో ఉంది. మిగిలిఉన్న పుడ్డింగ్ సాస్ ని పందులకి పోయనా అని మెరిల్లాని అడుగుదామనే అనుకున్నాను ..ఈ లోపు ఇంకో ఊహ.

మంచు పడుతూ ఉన్న అడవిలో నేనొక దేవకన్యని అయినట్లూ , ఎర్రటి పసుప్పచ్చటి ఆకులున్న చెట్ల మధ్యలోంచి ఎగిరి వెళుతూన్నట్లూ….ఎంత అద్భుతం గా ఉందనీ …సరే- మెరిల్లాకి చెప్పటం మర్చిపోయి ఆపిల్స్ కోసేందుకు తోటలోకి వెళ్ళిపోయాను, సాయంత్రం మిస్టర్ చెస్టర్ రాస్, వాళ్ళావిడా వచ్చారు. వాళ్ళు చా- లా నాగరికంగా, నాజూగ్గా ఉంటారు , తెలుసుగా ! నేను శుభ్రంగా మొహం కడుక్కుని తయారయాను. అందంగా ఉండకపోయినా, పెద్ద మనిషి తరహాగా కనిపించాలని నా ప్రయత్నం. అందరం భోజనాలకి కూర్చున్నాం. మెరిల్లా ఒకచేత్తో పుడ్డింగ్, ఇంకో చేత్తో సాస్ [ అప్పుడు  మళ్ళీ వెచ్చబెట్టింది దాన్ని ] తెస్తోంది…..ఆ భయంకరమైన నిమిషం లో…లేచి నిలుచుని శక్తికొద్దీ అరిచాను – ‘ మెరిల్లా..దాన్ని అవతల పారేయి..ఎలక చచ్చిపోయింది దాంట్లో, నీకు చెప్పటం మర్చిపోయాను ‘ అని. మిసెస్ చెస్టర్ రాస్ నా వైపు చూసింది చూడూ….ఇంకో వందేళ్ళకీ ఆ చూపు మర్చిపోలేను. ఆవిడ ఇంటిని ఎంతో నైపుణ్యం తో దిద్దుకుంటుందట…మమ్మల్ని గురించి ఏమనుకుని ఉండాలి చెప్పు ? మెరిల్లా మొహం ఎర్ర…గా….కొలిమి లాగా అయిపోయింది. ఏం మాట్లాడకుండా వెళ్ళి అవి పడేసి స్ట్రాబెర్రీ ప్రిజర్వ్ తెచ్చి వడ్డించింది. నాకూ పెట్టింది…ఒక్క చెంచా కూడా లోపలికి వెళ్ళలేదు..నా తలలో నిప్పులు చెరుగుతున్నాయి  …అరె ! డయానా..ఏమైంది నీకు ? ”

డయానా లేచి నిల్చుంది, తూలింది – మళ్ళీ కూర్చుంది. రెండు చేతులతో తల గట్టిగా పట్టుకుంది .

” నాకు..నాకేమిటో గా ఉంది ఆన్. వికారం పెడుతోంది..ఇంటికెళ్ళిపోవాలి…”

” అయ్యో..అలా అనకు. టీ తాగకుండా ఎలా వెళ్తావు..ఉండు , క్షణం లో అంతా సిద్ధం చేస్తాను ”

” లేదు. వె- ళ్ళా – లి , అంతే ”

‘’ ఇదెక్కడైనా ఉందా చెప్పు..వచ్చినవాళ్ళు టీ తాగకుండా వెళతారా ? ఒకవేళ నీకు నిజంగా మశూచి వస్తోందనిపిస్తోండా డయానా ? నన్ను నమ్ము – నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను, సేవ చేస్తాను. టీ మాత్రం తాగి వెళ్ళు ”

” నాకు కళ్ళు తిరుగుతున్నాయి ”

నిజంగానే  డయానా నిల్చోలేకుండా ఉంది. ఆశాభంగం తో కంటతడి పెట్టుకుంటూ ఆన్ , డయానాని పట్టుకుని నడిపించుకు వెళ్ళి ఇంట్లో దిగబెట్టి వచ్చింది. తిరిగొచ్చే దారంతా ఏడ్చుకుంటూనే ఉంది. రాస్ప్ బెర్రీ కార్డియల్ ని అలమర లో పెట్టి , దిగులుమొహం తో అంతా సర్దేసి, కళ్ళు తుడుచుకుని మాథ్యూ కీ జెర్రీకీ భోజనం ఏర్పాట్లు చేసింది …ఆమె ఆనందమంతా ఆవిరైపోయింది.

మర్నాడు ఆదివారం- జోరున వాన. రోజంతా ఇంట్లోంచి ఆన్ బయటికి రాలేదు. సోమవారం మధ్యాహ్నం మెరిల్లా ఏదో పని మీద మిసెస్ రాచెల్ ఇంటికి వెళ్ళిరమ్మంది. ఆన్ త్వరగానే తిరిగి వచ్చింది..కళ్ళమ్మట నీళ్ళు కారిపోతున్నాయి. వంటింటి సోఫాలో బోర్లాపడి  భోరుమంది.

” ఏయ్..ఏమైంది ? మళ్ళీ ఆవిడ తో దెబ్బలాడావా ? ” మెరిల్లా కంగారుగా, అనుమానంగా అడిగింది.

ఆన్ జవాబు చెప్పలేదు, ఎక్కిళ్ళు ఎక్కువయ్యాయి.

” ఆన్ షిర్లే ! నిన్నొక ప్రశ్న వేసినప్పుడు జవాబు చెప్పాలని కదా అర్థం ? ఏమైంది – చెప్పు ? ”

ఆన్ లేచి కూర్చుంది. శోకం మూర్తీభవించినట్లుంది.

” మరేమో..మిసెస్ రాచెల్ ఇవాళ మిసెస్ బారీ వాళ్ళింటికి వెళ్ళిందట. మిసెస్ బారీ చాలా చాలా కోపంగా ఉందట…శనివారం మనింట్లోంచి డయానా సారా తా గేసి వ చ్చిందని చెప్పిందట. నేను చాలా ఛండాలపు పిల్లననీ , ఇంకెప్పటికీ డయానాని నాతో ఆడుకోనివ్వననీ అందట….”

మెరిల్లాకి ఆశ్చర్యం తో నోట మాట రాలేదు.

” డయానా ఏమిటి..మనింట్లో సారా తాగటమేమిటి ..నీకు పిచ్చెక్కిందా లేకపోతే మిసెస్ బారీకా ? అసలేం ఇచ్చావు తాగటానికి నువ్వు ???”

” రాస్ప్ బెర్రీ కార్డియల్ తప్ప ఇంకేం ఇవ్వలేదు. అదే మూడు గ్లాసులు తాగిందంతే..అయితే మాత్రం..అది సారా కాదుగదా ? ”

” ఏది – ఏమిచ్చావో చూపించు ? ”

చూ స్తే – అది అప్పుడప్పుడూ, ఎంతో అవసరం పడినప్పుడు మాత్రమే – పుచ్చుకునే ఘాటైన ద్రాక్షసారా . మెరిల్లాకి తను రాస్ప్ బెర్రీ కార్డియల్ సీసాని నింపేందుకు తీసుకెళ్ళి నేలమాళిగలోనే వదిలేశాననీ పొరబాటున దాని బదులు ద్రాక్షసారా ని తెచ్చి అక్కడ పెట్టాననీ అప్పటికి గుర్తొచ్చింది.

మెరిల్లా నొచ్చుకుంది, ఒకవైపునుంచి నవ్వొస్తోంది.

” నువ్వు ఈ ద్రాక్షసారా  ఇచ్చావు డయానాకి..ఆన్…కార్డియల్ కీ దీనికీ తేడా తెలుసా నీకు ? చిక్కులు నీ వెంబడిపడి  వస్తుంటాయి , నువ్వే వాటినిరమ్మని పిలుస్తుంటావో ఏమిటో …”

” నేను దాన్ని రుచి చూడలేదు..” ఆన్ చెప్పుకొచ్చింది – ” అదే కార్డియల్ అనుకున్నాను. ఎంత గొప్ప- గా ఆతిథ్యం ఇవ్వాలనుకున్నానో ..అంతా పాడైపోయింది. డయానా తూలుకుంటూ వెళ్ళిందట. వాళ్ళమ్మ ఏదో అడిగితే పిచ్చి నవ్వులు నవ్విందట. పడుకుని గంటలు గంటలు నిద్రపోయిందట. ఊపిరి వాసన చూస్త  తాగేసి వచ్చిందని మిసెస్ బారీ కి తెలిసిందట. మర్నాడంతా ఘోరమైన తలనొప్పిట డయానాకి. మిసెస్ బారి…అయ్యో..నేనిదంతా కావాలనే చేశాననుకుంటోంది , చెప్పినా  నమ్మదు ”

” డయానాని తిట్టాలి ఆవిడ . ఎంత బావుంటే మాత్రం మూడు గ్లాసులు తాగుతుందా , అంత జిహ్వ చాపల్యమా పిల్లకి ? అంత తాగితే రాస్ప్ బెర్రీ కార్డియల్ కి అయినా జబ్బు చేస్తుంది. ఎప్పుడో ఒంట్లో బాగుండనప్పుడు కొద్దిగా తీసుకుందుకని దాచాను దీన్ని..ఇహ ఇప్పుడు ఊళ్ళో నా గురించి కూడా కథలు కథలుగా చెప్పుకుంటారు. సరేలే, ఏడవకు ఆన్..ఇందులో నీ తప్పేముంది – పొరబాటు నాదే ”

” నన్ను ఏడవనీ మెరిల్లా. నా గుండె బద్దలైపోతోంది. డయానా నేనూ ఇక విడిపోవాలి….జీవితాంతం కలిసి ఉండాలని వాగ్దానాలు చేసుకున్నాం …ఇలా జరిగిపోయింది ”

” పిచ్చిదానిలా మాట్లాడకు. మిసెస్ బారీ నువ్వు ఇదంతా సరదాగా చేశావనే అనుకుంటుంది బహుశా. అది కూడా కాదని చెప్పు వెళ్ళి. అంతా వివరంగా చెబితే నీ తప్పేం లేదని తెలుస్తుంది ఆవిడకి ”

”నాకు ధైర్యం చాలటం లేదు మెరిల్లా. పోనీ నువ్వు వెళ్ళి చెబుతావా ? నీ మాటైతే వింటుందేమో ? ” ఆన్ ఆశగా ప్రాధేయపడింది.

మెరిల్లాకీ అదే మంచిదనిపించింది . ” సరే . వెళ్తాలే.  నువ్వు ఏడుస్తూ కూర్చోకు, అంతా చక్కబడుతుందిలే ”

కానీ ఆ సాయంత్రం మెరిల్లా మిసెస్ బారీ దగ్గర్నుంచి వస్తున్నప్పుడు ఆమె కి అలా అనిపించలేదు. ఆన్ ఆత్రంగా వాకిట్లోనే ఎదురుచూస్తూ ఉంది.

మెరిల్లా మొహం చూస్తే విషయం  అర్థమైపోతోంది.

” ఏం లాభం లేదు కదూ మెరిల్లా ? మిసెస్ బారీ నన్ను క్షమించలేదు కదూ ? ”

” మిసెస్ బారీ !!! ఎంత మొండి మనిషి ఆవిడ ! చెప్తే వినదే అసలు !!! అంతా పొరబాటున జరిగిందంటే నమ్మదే !!! పైగా అంత ఘాటైన ద్రాక్షసారాని ఇంట్లో ఎందుకు  పెట్టుకున్నానని  ఆక్షేపి స్తుంది. నాకు మండుకొచ్చింది ఇంక- కాస్తే   తీసుకుని ఉంటే ఏమీ అయిఉండేది కాదనీ,  ఆశ కొద్దీ వాళ్ళమ్మాయి ఏకంగా మూడు గ్లాసులు తాగిందనీ, అదే నా పిల్ల అయితే నాలుగు తగిలించి ఉండేదాన్ననీ అనేశాను ”

anne17-3

మెరిల్లా విసవిసా వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆన్ బయల్దేరింది..చలి గా ఉన్న ఆ వేళ, తల మీద టోపీ కూడా పెట్టుకోకుండా. హేమంతానికి వడలిఉన్న క్లోవర్ పొలాల్లోంచి , పొడవాటి వంతెన మీంచి, స్ప్రూస్ తోపు లోంచి..స్థిరంగా, పట్టుదలగా నడిచివెళ్ళింది. పడమటి అడవుల వెనక  వెలవెలబోతున్న చంద్రుడు , గుడ్డి వెలుగు. మెల్లిగా తలుపు తట్టింది. తెరిచిన మిసెస్ బారీకి, చలికి  పాలిపోతున్న చిన్న ఆకారం ప్రత్యక్షమైంది.

ఆవిడ మొహం కఠినంగా అయిపోయింది. గాఢమైన ఇష్టాయిష్టాలు ఆవిడవి..ఆ కోపం కూడా భగ్గుమని చల్లారే తాటాకు మంట కాదు ,  ఏళ్ళతరబడి లోపల ఉండిపోయే రకానిది. ఆన్ ఇదంతా బుద్ధిపూర్వకంగానే చేసిందని , ఈ పిల్ల కల్మషం లోంచి తన కూతురిని రక్షించుకోవాలని నిశ్చయించేసుకుని ఉంది.

” ఏం కావాలి నీకు ? ” కొట్టినట్టు అడిగింది.

ఆన్ చేతులు జోడించింది – ” నన్ను క్షమించండి మిసెస్ బారీ. నేను కావాలని చేయలేదు. మీరే ఒక బీద అనాథ పిల్ల అయిఉండి, దొరక్క దొరక్క మీకొక ప్రాణస్నేహితురాలు దొరికితే ఆమె ని ఇంటికి పిలిచి  సారా తాగించి మైకం తెప్పిస్తారా చెప్పండి ? తెప్పించరు కదా ?? నేను రాస్ప్ బెర్రీ కార్డియల్ అనే అనుకున్నాను, రాస్ప్ బెర్రీ కార్డియల్ అనే నమ్మాను. డయానాని నాతో ఆడుకోనివ్వనని అనకండి దయచేసి, నేను బతికున్నంతకాలమూ దుఃఖిస్తూనే ఉంటాను ”

మెత్తని గుండె గల మిసెస్ రాచెల్ ని కరిగించినట్లుగా మిసెస్ బారీ హృదయాన్ని ఆ మాటలు కరిగించలేదు. ఆన్ వాడే పెద్ద పెద్ద మాటలూ నాటకీయ ధోరణీ ఆవిడకి అసలు నచ్చవు, ఇప్పుడూ నచ్చలేదు. ఈ పిల్ల మాటలు వినటం తనకి తలవంపులు  అనుకుంది.

” నువ్వు డయానా తో స్నేహం చేసేందుకు తగవు. వెళ్ళు. నీ పాటికి నువ్వు ఇంటికి వెళ్ళి బుద్ధిగా మసలుకో. ఇటువైపుకి రాకు ” క్రూరంగా చెప్పింది.

ఆన్ పెదాలు వణికాయి.

” ఒక్కసారి..ఒకే ఒక్కసారి..డయానాని నాతో మాట్లాడనివ్వరూ ? వీడ్కోలు చెప్పేందుకైనా ? ”

” డయానా ఇంట్లో లేదు. వాళ్ళ నాన్నతో కార్మొడీ వెళ్ళింది ” దఢేల్ మని తలుపు మూసేసింది మిసెస్ బారీ.

ఆన్ నిరాశగా, నిశ్శబ్దంగా- ఆ చీకట్లో పడి ఇంటికి పోయింది.

”నా ఆఖరి ఆశ కూడా పోయింది మెరిల్లా ” – నిర్లిప్తంగా చెప్పింది – ” నేనే వెళ్ళి మిసెస్ బారీని వేడుకున్నాను. ఆవిడ చాలా అవమానించింది నన్ను , పద్ధతిగా పెరిగిన మనిషి కాదనుకుంటాను ఆవిడ. ఇక దేవుడిని ప్రార్థించుకోవటం తప్ప నాకేం మిగల్లేదు..దానివల్లా పెద్ద లాభమేమీ ఉండదనుకుంటాను. మిసెస్ బారీ అంత గండాగొండి మనిషిని దేవుడు కూడా ఒప్పించలేడు ”

” ఆన్..అలా అనకూడదు, తప్పు  ” – వారించింది, ఇంకేమీ అనలేక.

ఆ రాత్రి మాథ్యూ కి అంతా చెప్పాక, ఆన్ ఎలా ఉందో చూసేందుకు వెళ్ళింది. ఏడ్చి ఏడ్చి ముడుచుకుపడుకుంది ఆన్. నిద్రలో కూడా మొహం లో దైన్యం. మెరిల్లా మనసు ఒక్కసారి గా ద్రవించిపోయింది.

” పిచ్చి పిల్ల..ఎలా బతుకుతుందో  ” –  ముంగురులు సర్ది, వంగి, కన్నీటితో తడిసిఉన్న బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది.

 

 

[ ఇంకా ఉంది ]

 

 

 

 

మీ మాటలు

  1. చదివిన వారికి అందరికీ ‘ఆన్’ లాగానే చిన్నప్పుడు స్నేహితలతో కలిసి పెద్దవాళ్ళలా ఇల్లు చక్కబెట్టేసిన ముచ్చట గుర్తొచ్చేసి వుంటుంది … అలా కళ్ళకు కట్టేసింది ఎప్పటిలానే మీ రచన !!! ఇక ‘ ఆన్ ‘ కి గాయాలే గాయాలు ..పాపం పిచ్చి పిల్ల .. వచ్చే వారం కి అయినా మిసెస్ బారీ మనసు కరిగితే బావుండు :(

  2. Mythili Abbaraju says:

    సుతి మెత్తని గుండె , దానినిండా మమత – గాయాలకి కొరతెక్కడ ! :(

  3. హరితా దేవి says:

    చాలా చాలా థాంక్స్ మైథిలి గారు

    • Mythili Abbaraju says:

      :) నా బీటా రీడర్ కి ధన్యవాదాలు @హరితాదేవి గారు

  4. వారం వారం ఆన్ కథాసుధాపానం!
    ” పిచ్చి పిల్ల..ఎలా బతుకుతుందో ” – ముంగురులు సర్ది, వంగి, కన్నీటితో తడిసిఉన్న బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. — ఇది చాలదూ!

  5. Mythili Abbaraju says:

    ధన్యవాదాలండీ _/\_

మీ మాటలు

*