చైనా గోడ మీంచి ఇటుక తెచ్చుకున్నాడు! 

 

స్లీమన్ కథ-11

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

పర్వతాలు, ఎడారి మీదుగా మెలికలు తిరుగుతూ 14వందలమైళ్ళ దూరం వ్యాపించిన చైనా గోడ గురించి స్లీమన్ కు చిన్నప్పటినుంచీ తెలుసు. తను అక్కడికి వెళ్ళినట్టు, ఆ గోడ ఎక్కినట్టు కలలుగనేవాడు. అంతకంటే విశేషంగా, అతి పురాతనకాలంలో ఈ భూమ్మీద గొప్ప సృజనాత్మక నైపుణ్యాలు కలిగిన ఓ అద్భుతమైన జాతి ఉండేదనీ, అది అంతర్ధానమైపోయిందనీ, చైనా గోడ దగ్గరికి వెడితే ఆ జాతికి సంబంధించిన రహస్యాలను పట్టుకోవచ్చుననీ అనుకునేవాడు.

పెకింగ్ ను సందర్శించిన మరునాడే నౌకరును వెంటబెట్టుకుని మంచూరియా సరిహద్దుల్లో, చైనా గోడకు సమీపంలో ఉన్న కౌ-పా-కౌ కు బయలుదేరాడు. రెండు రోజుల తర్వాత అక్కడికి చేరాడు. అతనిలో ఉల్లాసం, ఉత్సాహం ఉరకలేస్తున్నాయి. ఎండ బాగా కాస్తోంది. తలకు అరబ్ తలపాగ చుట్టుకున్నాడు. దారి పొడవునా ఉన్న గ్రామాల వాళ్ళు అతనివైపు వింతగా చూశారు. ఆయన చైనా గోడ చూడడానికే ఏకంగా యూరప్ నుంచి వచ్చాడని నౌకరు చెప్పినప్పుడు అతనేదో తమాషా చేస్తున్నాడనుకుని అంతా నవ్వేశారు. ఆ సరిహద్దు గ్రామాలవాళ్లు స్లీమన్ కు ఎంతో నచ్చారు. అమాయకత్వం, ఔదార్యం మూర్తీభవించిన ఈ జనాలు పెకింగ్ లో తను చూసిన క్షీణజాతికన్నా భిన్నంగా ఉన్నారనుకున్నాడు.

ఎండ మొహం మీద పడి చురుక్కుమనిపిస్తోంది. పైగా ప్రయాణంతో అలసిపోయాడు. అయినాసరే, గోడ దగ్గరికి చేరుకోగానే ఎండ తీవ్రతా, అలసటా అన్నీ మరచిపోయాడు. అప్పటికప్పుడు దానిని ఎక్కడానికి సిద్ధమయ్యాడు. గోడ దిగువున ఉన్న గుట్ట ఎగుడు దిగుడుగా, పైకి పొడుచుకొచ్చిన రాళ్ళతో అడుగు తీసి అడుగు పెట్టలేనట్టుగా ఉంది. ఎవరైనా సహాయకులు తోడు వస్తారేమోనని వాకబు చేశాడు. చివరికి నౌకరుతో సహా ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ఒంటరిగానే ఎక్కడానికి సిద్ధమై అతి కష్టం మీద పైకి చేరుకున్నాడు.

తనతో ఒక కొలతబద్దను తీసుకెళ్లాడు. గోడకు ఉపయోగించిన ఇటుకల పరిమాణాన్ని కొలిచాడు. అవి 67 సెంటీమీటర్ల పొడవు, 25 సెంటీమీటర్ల ఎత్తు, 17 సెంటీమీటర్ల మందం ఉన్నాయి. ఆ తర్వాత గోడ ఎత్తు కొలిచాడు. అది కొన్ని చోట్ల 20 అడుగులు, కొన్నిచోట్ల 30 అడుగుల ఎత్తుంది. కాపలా బురుజుల మధ్యదూరం 300 అడుగులుంది. ఆ ఇటుకలు కచ్చితంగా క్రీ.పూ 200 నాటి హన్ రాచరిక కాలానికి చెందినవనుకున్నాడు. కానీ నిజానికవి క్రీ.శ. 1400 నాటి మింగ్ రాచరిక కాలానికి చెందినవి. ఆ ఎత్తైన గోడ మీంచి కింద దూరదూరాలకు వ్యాపించిన కొండలు, గుట్టలు చూస్తూ అతను పట్టలేని తమకంతో మైమరచిపోయాడు.

ఆ ఎత్తునుంచి ప్రపంచం చాలా చిన్నదిగానూ, ఓ నీడలానూ కనిపిస్తున్న ఆ అద్భుత దృశ్యాన్ని ఎంతసేపు చూసినా అతనికి తనివితీరలేదు. సాయంత్రంవరకూ ఆ గోడమీదే ఉండిపోయాడు. మధ్యాసియానుంచి విరుచుకుపడుతున్న ఆటవికపు దాడులనుంచి ఆ గోడను కాపాడడానికి చేసిన వీరోచిత పోరాటాల గురించి తను చదివినవన్నీ గుర్తుచేసుకున్నాడు. జావాలో, సియేరా నెవాడాలో ఎత్తైన ప్రదేశాలనుంచి తను కిందికి చూసినప్పుడు కనిపించిన అద్భుత దృశ్యాలను నెమరేసుకున్నాడు.

sliiman

చీకటి పడుతున్న సమయానికి గోడనుంచి ఓ ఇటుకను జాగ్రత్తగా వేరుచేసి దానిని ఓ తాడుతో ఎలాగో వీపుకి కట్టుకున్నాడు. ఆ తర్వాత పొట్టను గోడకానించి నెమ్మదిగా కిందికి జారాడు. దిగిన వెంటనే ఇటుకను చూసుకున్నాడు. అది భద్రంగా ఉన్నందుకు పొంగిపోయాడు. విపరీతమైన దాహంతో మంచినీళ్ళకోసం కేకలు పెట్టేటప్పటికి అక్కడి రైతులు పరుగుపరుగున నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళకు తను తెచ్చిన ఇటుకను సగర్వంగా చూపించాడు. ఆ ఒక్క ఇటుక కోసం అంత దూరం నుంచి వచ్చి ఇంత కష్టపడాలా అనుకుంటూ వాళ్ళు పగలబడి నవ్వేశారు. “నేను మంచినీళ్లు అడగ్గానే వెంటనే తీసుకొచ్చి ఇచ్చిన ఔదార్యం, దయా కలిగిన ఈ జనం కచ్చితంగా తమ జీవితంలో ఎప్పుడూ నల్లమందు సేవించి ఉండ”రని డైరీలో రాసుకున్నాడు.

తన ప్రయాణానుభవాలను అతను వెంటనే కాకుండా కొన్నిరోజుల తర్వాత డైరీలో పొందుపరిచాడు. ఒకప్పుడు చైనాకు రక్షణ కుడ్యంగా ఉండి ఇప్పుడు శిథిలమవుతున్న ఈ అద్భుతనిర్మాణం తనను ఆకట్టుకున్నంతగా ప్రపంచంలో మరేదీ ఆకట్టుకోలేదన్నాడు. జావా అగ్నిపర్వతాలను, హిమాలయాలను, సియేరా నెవాడా శిఖరాలను, దక్షిణ అమెరికాలోని కార్డిల్లేరా పీఠభూమిని అధిరోహించానని చెబుతూ తన పర్వతారోహణ నైపుణ్యాలను అతిశయోక్తులతో చాటుకున్నా; చైనా గోడ మీంచి కిందికి చూసినప్పుడు తను పొందానని చెప్పిన భావోద్వేగాలు మాత్రం నిజం.

చైనా గోడ తను చిన్నప్పటినుంచీ ఊహించుకుంటున్నదానికంటే కూడా వందరెట్లు వైభవోపేతంగా ఉందనీ, తనను ఆశ్చర్యచకితం చేసిందనీ, మతిపోగొట్టిందనీ, తనలో గొప్ప ఆరాధనాభావాన్నీ, ఉత్తేజాన్నీ నింపిందని రాశాడు. ఎత్తైన పర్వతశిఖరాలతో పోటీపడుతున్న బురుజులతో ఈ బ్రహ్మాండమైన గోడను చూస్తున్నకొద్దీ జలప్రళయానికి ముందునాటి ఓ మహోన్నతజాతి ఏదో దీనిని నిర్మించినట్టు తోస్తూ వచ్చిందనీ అన్నాడు. ఇంకా ఇలా రాశాడు:

క్రీ.పూ. 220 ప్రాంతాలలో దీనిని నిర్మించినట్టు నాకు తెలుసు. అయినాసరే, మామూలు మనుషులు దీనిని నిర్మించారంటే నాకు నమ్మశక్యం కావడంలేదు. అంత పెద్ద పెద్ద బండరాళ్లను, భారీ గ్రానైట్ శిలలను, అన్నన్ని ఇటుకలను అక్కడికి ఎలా రవాణా చేశారో, వాటిని అంత పైకి ఎలా తరలించారో అంతుబట్టలేదు. గోడ దిగువనే ఉన్న లోయలో ఆ ఇటుకల్ని కాల్చి ఉంటారని అనిపించింది. ఉత్తరం వైపునుంచి వచ్చిపడుతున్న శత్రువులను నిలవరించడానికి ఉద్దేశించిన ఇంత పెద్ద నిర్మాణం చేయాలంటే హెర్క్యులస్ కు ఉన్నంత శక్తి కావాలి.

ఈరోజున ఇంత ఘనమైన నిర్మాణమూ నిర్లక్ష్యానికి గురై పాడుబడినట్టు ఉంది. సైనికులకు బదులు బురుజుల్లో పావురాలు ప్రశాంతంగా గూడు కట్టుకుంటున్నాయి. వసంతాగమనాన్ని సంకేతిస్తున్న పసుపు, ఊదారంగు పువ్వుల మధ్య తొండలు తమ సంతానాన్ని వృద్ధి చేసుకుంటున్నాయి. ఇప్పుడీ కట్టడం భూమ్మీంచి ఎప్పుడో నిష్క్రమించిన ఒక యుగం తాలూకు అంత్యక్రియల చిహ్నమా అన్నట్టు మిగిలిపోయింది.

ఇప్పటినుంచీ తన డైరీని అతను చాలా జాగ్రత్తగా రాశాడు. ముందే ప్రచురణకు ఉద్దేశించాడా అన్నట్టుగా చక్కని మాటలు, వాక్యాలు పొదుగుతూ వర్ణనాత్మకశైలిలో రాసుకుంటూ వెళ్ళాడు. ఇవే రోజుల్లో మిత్రులకు రాసిన ఉత్తరాల్లో కూడా రచయిత కావాలన్న తన ఆకాంక్షను నొక్కి చెప్పేవాడు. కావలసినంత సంపాదించుకున్న తర్వాత రచయితగా గడపడాలన్నదే మొదటినుంచీ తన జీవితాశయమనీ; రష్యాను విడిచిపెట్టి యూరప్ లో ఎక్కడో ఒకచోట స్థిరపడి సహరచయితలతో పరిచయాలు పెంచుకుంటూ రచనకే అంకితమైపోవాలనుకుంటున్నాననీ, నా దృష్టిలో ఇంతకన్నా గొప్ప వ్యాసంగమేదీలేదనీ రాసేవాడు. ఈ తూర్పు దేశాల యాత్రానుభవాలను పొందుపరుస్తూ తన నలభై మూడో ఏట వెలువరించిన మొదటి పుస్తకం తొలి పుటల్లోనే తన భావిజీవితంలో ప్రాధాన్యం వహించబోయే ఇతివృత్తమేమిటో సూచించాడు. అవి—కూలుతున్న శిథిలాలు, బ్రహ్మాండమైన పురాతనపు రాతి కట్టడాలు, సమాధైపోయిన ఉత్సవపూరిత గతం…

ఓసారి చైనా గోడను చూసి, దానిమీద నిలబడిన తర్వాత  ఇక ఆ దేశం మీద అతనికి ఆసక్తి తగ్గింది. మిగతా యాత్రావిశేషాలను క్లుప్తంగా, యధాలాపంగా రాసుకుంటూ వెళ్ళాడు. చైనా మహిళల విలక్షణమైన నడక మీద మాత్రం కాస్త ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు. వాళ్ళ పాదాలను దగ్గరగా చూశాననీ, గెంతుతున్నట్టు వాళ్ళు ఎలా నడుస్తారో కచ్చితంగా చెప్పగలిగిన యూరోపియన్ రచయితలెవరూ తనకు కనిపించలేదనీ రాశాడు. ఆ తర్వాత, మూడు కాలివేళ్ళను అరికాళ్ళలోకి ఎలా చొప్పిస్తారో, ఆ విలక్షణమైన నడకను ఎలా సాధిస్తారో వివరించాడు. చైనీయుల నాటకాల గురించి కూడా రాశాడు. నటులు ధరించే బరువైన జలతారుదుస్తులు, ముసుగులు, వారి హావభావాలు, పురుషపాత్రధారులు పెద్ద గొంతుతో మాట్లాడడం-అన్నీ అతనికి విచిత్రంగానే అనిపించాయి.

అక్కడినుంచి జపాన్ వెళ్ళాడు. ఆ దేశం అతన్ని మత్తులో ముంచెత్తింది. ఎంతో ఆహ్లాదభరితంగానూ, ఓ నిగూఢప్రదేశంగానూ, నమ్మశక్యం కాని ఓ దేవకన్యల కథలానూ అనిపించింది. తరచు వర్షం పడుతున్నా, రాబర్ట్ థామస్ లాంటి స్నేహపాత్రుడైన దుబాషీ వెంట లేకపోయినా  అక్కడ ఉన్నన్ని రోజులూ చాలా ఉల్లాసంగా గడిపాడు. అక్కడి కబుకీ నాటకాలకు వెళ్ళాడు. బహిరంగస్నానశాలలను సందర్శించాడు. జపాన్ మహిళలు ధరించే సిల్కు కిమోనాలను, వాళ్ళ స్నేహశీలతను చూసి ఆనందించాడు. అక్కడి విదేశీ రాయబారులతోనూ స్నేహంగా మెలిగాడు. స్నానశాలకు వెళ్లినప్పుడు అతని వాచీ ఛైనుకున్న ఎర్రని పగడం కుతూహలం కలిగించడంతో దానిని చూడడానికి అక్కడి యువతులు చుట్టూ మూగడం, వాళ్ళ చొరవా అతన్ని ముగ్ధుణ్ణిచేశాయి. తను దిగిన చిన్న చిన్న సత్రాలు, అక్కడి సిబ్బంది మాటి మాటికీ వంగి అభివాదం చేయడం, ఎక్కడికి వెళ్ళినా సభ్యత, గౌరవం వెల్లివిరిసే వాతావరణం అతనికి ఎంతగానో నచ్చాయి. తన జపాన్ అనుభవాలను చాలా తీరుబడిగానూ, అక్కడ గడిపిన ప్రతిక్షణాన్నీ నెమరేసుకుంటూనూ ఒకవిధమైన మైకంతో రాశాడు. అతని పుస్తకంలో ఆ భాగాలే అత్యుత్తమంగా నిలిచాయి.

అదృష్టవశాత్తూ జపాన్ మికాదో[చక్రవర్తి]కి, షొగున్[సైనిక గవర్నర్: చక్రవర్తే నియమించినా 1192-1867 మధ్యకాలంలో సైనిక గవర్నర్లే పూర్తి అధికారాన్ని చలాయిస్తూ వచ్చారు. సైనిక గవర్నర్ కీ, చక్రవర్తికీ మధ్య తరచు ఘర్షణలు తలెత్తుతూ ఉండేవి]కూ మధ్య స్వల్పకాలిక శాంతి నెలకొనే అరుదైన రోజుల్లో స్లీమన్ జపాన్ ను సందర్శించాడు. అప్పటికి పన్నెండేళ్ళ క్రితమే అమెరికా నౌకాదళాధికారి కమొడోర్ పెరీ(1794-1858) ఎడో(Yedo)అఖాతం మీదుగా జపాన్ చేరుకుని తన డిమాండ్ల పత్రాన్ని చక్రవర్తికి ఇవ్వబోయినప్పుడు, అక్కడ ఇద్దరు చక్రవర్తులున్న సంగతి తెలిసి తెల్లబోయాడు. స్లీమన్ అక్కడికి వెళ్లడానికి ముందు సంవత్సరమే చోషును పాలించే దైమ్యో(సామంతరాజు) విదేశీ నౌకలపై అదే పనిగా కాల్పులు జరిపించినందుకు ప్రతీకారంగా బ్రిటిష్, ఫ్రెంచ్, అమెరికా, డచ్ నౌకాబలగాలు షిమొనోసెకీ(ఒక జపాన్ నగరం)పై పెద్దయెత్తున దాడిచేశాయి.

అయితే, సమకాలీనచరిత్రపై స్లీమన్ కు ఆసక్తి లేదు. జపాన్ అతని కళ్ళముందు ఉత్సవభరితంగా ఆవిష్కృతమైంది.  చరిత్రప్రసిద్ధమైన తోకైదో రాజమార్గం మీదుగా వర్ణరంజితంగా సాగిన షొగున్ ఊరేగింపును చూసి మైమరచిపోయాడు. దాని అద్భుతత్వానే కాక, ఆటవికత్వాన్ని కూడా కళ్ళకు కట్టిస్తూ ఎంతో జాగ్రత్తగా చిత్రించుకుంటూ వచ్చాడు.

 ఆ ఊరేగింపు ముందుభాగంలో వెదురు కర్రల మీద పెద్ద పెద్ద సామాను మోస్తూ కూలీలు నడిచారు. వారి వెనకాల తెలుపు, నీలం, నలుపు రంగు దుస్తులు ధరించి, విల్లమ్ములు తదితర ఆయుధాలు పట్టుకున్న సైనికులు నడిచారు. వారి వెనక వాళ్ళ అధికారులు అధికార లాంఛనాలతో పసుపు, నీలం, లేదా తెలుపు కోట్లు ధరించి గుర్రం మీద వచ్చారు. వారి వెనకాల సామాన్లు మోస్తూ మళ్ళీ కొందరు కూలీలు, వారి వెనకాల గుర్రం మీద తెలుపు దుస్తులతో మరింత పెద్ద అధికారులు; వారి వెనకాల బల్లేలు ధరించిన సైనికులు, శతఘ్ని, పదాతి దళాలు; వారి వెనక కూలీలు, వారి వెనక గుర్రాల మీద మరింత పెద్ద హోదా ఉన్న వారు; వారి వెనక మళ్ళీ సైనికులు, వారి వెనక నాలుగు అలంకృత అశ్వాలు, వాటి వెనక అశ్వపాలకులు వచ్చారు.

చివరగా ఓ అందమైన గోధుమరంగు గుర్రం మీద షొగున్ వచ్చాడు. అతనికి ఇరవయ్యేళ్లు ఉంటాయి. చక్కని ముఖం. రంగు కొంచెం నలుపు. బంగారు జలతారు పని చేసిన తెల్లని అంగరఖా ధరించాడు. మెరుగుపెట్టిన టోపీ పెట్టుకున్నాడు. అతని బెల్టుకు రెండు కృపాణాలు వేలాడుతున్నాయి. అతనికి అటూ ఇటూ ఇరవైమంది ప్రముఖులు తెల్లని అంగరఖాలు ధరించి గుర్రాల మీద వచ్చారు.

ఆ ఊరేగింపు స్లీమన్ మనసుకు ఎంతగా హత్తుకుపోయిందంటే, మరునాడు ఆ ప్రదేశాన్ని చూడడానికి గుర్రం మీద వెళ్ళాడు. ముందురోజు తను నిలబడ్డ చోటుకు దగ్గరలోనే, దుమ్ముధూళితో నిండిన రోడ్డు మీద పూర్తిగా ఛిద్రమైపోయిన మూడు మృతదేహాలను చూసి విస్తుపోయాడు.  రైతులో, సైనికులో గుర్తుపట్టడానికి వీల్లేనంతగా అవి చిన్నాభిన్నమైపోయి ఉన్నాయి. ఎవరో, ఏమిటో అర్థం కాక ఆ భీకరదృశ్యాన్ని గుడ్లప్పగించి చూస్తూ కాసేపు ఉండిపోయాడు. అదే చోట రెండువేలమంది సైనికులతో, సేవకులతో మిరుమిట్లు గొలిపేలా సాగిన షొగున్ ఊరేగింపును తను కళ్ళారా చూశాడు. కానీ ఆ ఊరేగింపు ఈ మూడు మృతదేహాలను తొక్కుకుంటూ సాగినట్టు తనకు తెలియనే తెలియలేదు!

అప్పటికే అస్వస్థుడిగా ఉండి ఓ ఏడాదిలో మరణించబోతున్న బక్కపలచని షొగున్ ఆదేశాల మీదే ఆ ముగ్గురినీ నరికి చంపారా?! మృతదేహాలను అక్కడే ఎందుకు వదిలేశారు? వాటిని తొక్కుకుంటూ ఎందుకు వెళ్లారు? కుతూహలం చంపుకోలేక యొకొహామాకు తిరిగొచ్చి దీని గురించి జాగ్రత్తగా ఆరా తీశాడు. చివరికి అతనికి అందిన సమాచారం ఏమిటంటే, షొగున్ ఊరేగింపుగా వెడుతున్నప్పుడు పొరపాటున కూడా ఎవరూ రోడ్డుకు అడ్డంగా వెళ్లకూడదు. మామూలుగా అయితే ముందుగా హెచ్చరిక సిబ్బందిని పంపించి ఊరేగింపుకు ఎవరూ అడ్డు రాకుండా చూస్తారు. కానీ ఆరోజు ఎలా జరిగిందో కానీ పొరపాటున ఓ రైతు రోడ్డుకు అడ్డంగా వచ్చాడు. అప్పుడు ఒక అధికారి చూసి, అతన్ని ముక్కలు ముక్కలుగా నరికేయమని తన సైనికుల్లో ఒకరిని ఆదేశించాడు. ఆ సైనికుడు అందుకు తిరస్కరించాడు. అప్పుడా అధికారి పెద్ద కరవాలం తీసి మొదట సైనికుణ్ణీ, తర్వాత రైతునీ నరికి చంపేశాడు. సరిగ్గా అదే క్షణంలో గుర్రంమీద అక్కడికి వచ్చిన అతని కంటే పై అధికారి ఇది చూసి ఇతనికి మతిచలించిందేమో అనుకుని అప్పటికప్పుడు అతన్ని చంపేశాడు. అలా ఆ రోడ్డు మీద పడున్న మృతదేహాలలో ఒకటి రైతుది, ఒకటి సైనికుడిది, ఇంకొకటి సైనికాధికారిదీ అన్నమాట!

యొకొహామా నుంచి ఎడో నగరానికి వెళ్ళాడు. అక్కడి పెద్ద పెద్ద కోట బురుజుల్ని, ప్రాసాదాలను, కిక్కిరిసిన రోడ్లను చూసి ముగ్ధుడయ్యాడు. సెప్టెంబర్ ప్రారంభానికల్లా జపాన్ మొహంమొత్తింది. తన యాత్రానుభవాలను వెంటనే కాగితం మీద పెట్టాలని కూడా అనుకున్నాడు. దాంతో ‘ది క్వీన్ ఆఫ్ ది ఏవాన్’ అనే ఓ చిన్న ఇంగ్లీష్ నౌక ఎక్కి పసిఫిక్ మీదుగా శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరాడు. కావలసినంత సమయం చిక్కడంతో చైనా-జపాన్ యాత్రా విశేషాలను రాయడం ప్రారంభించాడు. అది 220 పేజీల పుస్తకం అయింది. రెండేళ్ల తర్వాత దానిని La chine et le Japon au temps present అనే శీర్షికతో పారిస్ లో ముద్రింపజేశాడు. ఈ తొలి పుస్తకం అతనిలో సంతృప్తిని, గర్వాన్ని నింపింది.

జపాన్ నుంచి బయలుదేరిన కొన్ని రోజుల తర్వాత, తను సెయింట్ పీటర్స్ బర్గ్ కు వ్యతిరేక దిశలో సరిగ్గా భూమి అంతానికి చేరుకున్నా ననుకున్నాడు. కానీ అతని ఊహ తప్పు. కనీసం ఓడ కెప్టెన్ ను అడిగి ఉంటే ఆ సంగతి చెప్పేవాడు.

ఇప్పటికీ ఇల్లూ వాకిలీ పట్టని ఈ దేశదిమ్మరి కొన్ని రోజులు మాత్రం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండి, తర్వాత ఓడలో నికరాగువాకు బయలుదేరాడు. మరోసారి పనామా మీదుగా వెళ్ళడం ఇష్టంలేక నికరాగువాను దాటి హవానా వెళ్ళాడు. అక్కడ కొంత ఆస్తిని కొన్నాడు. కొన్ని వారాలు అక్కడ గడిపిన తర్వాత మెక్సికో వెళ్ళాడు. ఆ నగరంలో ప్రతిదీ అతనికి నిరుత్సాహమే కలిగించింది. చివరికి 1866 వసంతంలో పారిస్ చేరుకున్నాడు. అక్కడ సైనే, కెతీడ్రా ఆఫ్ నోట్రె డేమ్ కు దగ్గరలో ఒక అపార్ట్ మెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు, తన నలభై నాలుగో ఏట, తనేం కాదలచుకున్నాడో స్పష్టత వచ్చినట్టు అనిపించింది. విద్యార్థిగా మారి సర్బాన్ యూనివర్సిటీలో తరగతులకు హాజరవుతూ భాషాశాస్త్రవేత్త కావాలని నిర్ణయించుకున్నాడు. విరామ సమయంలో తన చైనా, జపాన్ యాత్రావిశేషాలను ప్రచురించాలనుకున్నాడు.

మూడు విడతలుగా అపారమైన సంపదను మూటగట్టి, ప్రపంచంలోని సగం దేశాలను చుట్టి, ఏమాత్రం అనుకూలించని భార్యతో ముగ్గురు పిల్లల్ని కని, పదమూడు భాషలు నేర్చి, ఓ పెద్ద గ్రంథాలయాన్ని సమకూర్చుకున్న ఈ పెద్దమనిషికి తన జీవితాన్ని ఎటు తీసుకెళ్ళాలో ఇప్పటికీ తెలియడం లేదు.

కాకపోతే, క్రమంగా అతని అడుగులు ట్రాయ్ వైపు పడుతున్నాయి…

(సశేషం)

 

 

 

మీ మాటలు

  1. ఒక్క పెట్టున ఇన్ని దేశాలు తిరిగిరావాలంటే బోలెడంత డబ్బు అవసరం కదా? ఇప్పుడంటే ఒక క్రెడిత్ కార్డు పట్టుకెళ్ళినా సరిపోతుంది.
    అప్పుడెలా చేసేవారో! బ్యాంకింగ్ వ్యవస్థ ఎల వుండేదో!

మీ మాటలు

*