Anne Of Green Gables By L.M.Montgomery
ప్రిస్సీ ఆండ్రూస్ కి ఆల్జీబ్రా పాఠం బోధపరుస్తూ మిస్టర్ ఫిలిప్స్ క్లాస్ వెనక ఒక మూల కూర్చుండిపోయాడు. తక్కిన పిల్లలు ఇష్టారాజ్యం గా పచ్చి ఆపిల్ పళ్ళు తింటూ కాలక్షేపం చేసుకుంటున్నారు – ఇంకా, పలకల మీద పిచ్చి గీతలూ బొమ్మలూ గీసుకుంటున్నారు , అతి రహస్యంగా చెవులుకొరుక్కుంటున్నారు. ఆన్ ని ఆకర్షించాలని గిల్బర్ట్ బ్లైత్ యథాశక్తి ప్రయత్నిస్తున్నాడు గాని , ఆన్ కి ఆ ధ్యాసే లేదు. తను ఎక్కడుందో కూడా మర్చిపోయినట్లుగా , అరచేతుల్లో గడ్డం ఆనించుకుని కిటికీ లోంచి ప్రకాశమాన సరోవరాన్ని చూస్తోంది. ఆ నీలిరంగు నీటిమీద తన సొంత స్వప్నలోకాల్లో తేలిపోతోంది.
గిల్బర్ట్ కి ఇలా తననే ఆడపిల్లయినా పట్టించుకోకపోవటం కొత్త , ఏ మాత్రం రుచించలేదు. అందరూ తనని గమనించే తీరాలి… ఎవరికీ లేని పెద్దకళ్ళున్న ఆ సూదిగడ్డం అమ్మాయైనా సరే.
దగ్గరికి వచ్చేసి , ఆన్ పొడుగాటి జడని అందరికీ ప్రదర్శిస్తున్నట్లు పట్టుకుని…అందరికీ వినబడేలాగా, ఆన్ కి గుచ్చుకుపోయేలాగా , గొణిగాడు – ” ఎర్ర కారెట్ , ఎర్ర కారెట్ ”
వినిపించింది..తన ఊహాసౌధాలు కూలిపోతూండగా ఆన్ దిగ్గున లేచి నిలుచుంది. కళ్ళలో మండుతూన్న క్రోధం, నిరసన …కన్నీళ్ళు కూడా భగ్గుమంటున్నాయి.
” నికృష్టుడా ! ఎంత ధైర్యం నీకు !!! ”
థాట్ ! థాట్ !! తన పలకని గిల్బర్ట్ తలకేసి బలంగా మోదింది ..అది ముక్కలైంది , తల కాదు – పలక.
అవోన్లియా బళ్ళో ఇలాంటి దృశ్యాలని తనివితీరా ఆస్వాదించే అలవాటు. ఇది మహా రసవత్తరంగానూ ఉంది ..అంచేత అందరూ సంభ్రమాశ్చర్యానందాలతో – ” ఓ….” అని అరిచారు. డయానా ఊపిరందక ఉక్కిరిబిక్కిరైంది. ఉత్తుత్తినే ఏడ్చేస్తుండే రూబీ గిల్లిస్ బావురుమంది . కీచురాళ్ళకి దారాలు కట్టి కవాతు చేయిస్తున్న టామీ స్లోన్ దారాలు వదిలేసి నోరు తెరుచుకు ఉండిపోయాడు … వాటి దారిన అవి పోయాయి.
మిస్టర్ ఫిలిప్స్ అప్పటికి స్పృహలోకి వచ్చి గబ గబా అక్కడికి చేరి ఆన్ జబ్బ పట్టుకు నిలదీశాడు – ” ఏమిటిదంతా, ఆన్ షిర్లే ? ”
ఆన్ జవాబు చెప్పలేదు . తను ‘ ఎర్ర కారట్ ” అని పిలవబడ్డానని అందరి ముందూ చెప్పుకోవటం ఆమెకి అసాధ్యమైనపని.
గిల్బర్ట్ దృఢంగా ఒప్పేసుకున్నాడు – ” తప్పు నాదే మిస్టర్ ఫిలిప్స్. నేనే ఏడిపించాను ఆమెని ”
మిస్టర్ ఫిలిప్స్ మీద ఆ మాటలేమీ పనిచేయలేదు.
” నా విద్యార్థులలో ఒకరికి ఇంత కోపమూ కసీ ఉండటం చూస్తే నాకు సిగ్గుగా ఉంది ” అని నొచ్చుకున్నాడు… అక్కడికి తను పాఠాలు చెప్పటం వల్లనే మానవ సహజమైన అన్ని దుర్గుణాలూ బలహీనతలూ నశించిపోతాయన్నట్లుగా . ” ఆన్, వెళ్ళి ఈ మధ్యాహ్నమంతా స్టేజ్ మీద నిలబడే ఉండు నువ్వు ” – తీర్మానించాడు.
తనని బెత్తం దెబ్బలు కొడితేనే ఆన్ కి నయం గా ఉండేది – ఈ శిక్ష కొరడా దెబ్బల్లాగా ఉంది . కాని మారుమాట్లాడకుండా వెళ్ళి దాన్ని పాటించింది. మొహం పాలిపోయి ఉంది, ఏ భావమూ కనిపించటం లేదు. మిస్టర్ ఫిలిప్స్ చాక్ పీస్ తో బోర్డ్ మీద పెద్దక్షరాలతో రాశాడు – ” ఆన్ షిర్లే కి కోపం ఎక్కువ. ఆమె నిగ్రహాన్ని సాధన చేయాల్సిఉంది ”
ఆ వాక్యాల కిందనే ఆన్ ఆ మధ్యాహ్నమంతా నిలుచుని ఉంది. ఏడవలేదు, తల దించుకోలేదు. రగులుతున్న ఆగ్రహం ఆమెకి అవమానాన్ని భరించే శక్తిని ఇచ్చింది. డయానా సానుభూతి చూపులనీ, నిరసన గా చార్లెస్ స్లోన్ తల ఆడించటాన్నీ, జోసీ పై ద్వేషపు నవ్వులనీ ఆమె ఒకేలా ఎదుర్కొంది. గిల్బర్ట్ ` అతనివైపుకి చూడనేలేదు !!! జన్మలో అతని మొహం చూడదుగాక చూడదు !!!!
బడి వదిలేశాక ఆన్ తన ఎర్ర జుట్టు తలని ధీమాగా పైకెత్తుకుని బయటికి నడిచింది. గిల్బర్ట్ వరండా లో ఆమెని ఆపే ప్రయత్నం చేశాడు.
” ఆన్, క్షమించు నన్ను , నీ జుట్టుని వేళాకోళం చేసినందుకు . చాలా తప్పు అది , నిజం చెబుతున్నాను…మనసులో పెట్టుకోకు నువ్వు ”- వీలైనంత నిజాయితీగా అన్నాడు.
విననట్లే , తిరస్కారంగా – అతన్ని దాటుకుని వెళ్ళిపోయింది ఆన్. డయానా వారించబోయింది – ” ఆన్…ఉండు ..” – సగం మెచ్చుకోలు, సగం అయిష్టం కలిగాయి ఆమెకి ఆన్ ధోరణి చూస్తే. తనే అయితే ఎప్పటికీ గిల్బర్ట్ ని అలా నిర్లక్ష్యం చేయనేలేదు.
” గిల్బర్ట్ బ్లైత్ ని ఎప్పటికీ క్షమించేదిలేదు ” ఆన్ తిరుగులేనట్లు చెప్పింది – ” నా హృదయం లో శూలాలు దిగిపోయాయి’’ డయానా కి ఆ మాటలు పెద్దగా బుర్రకెక్కలేదు గాని , పరిస్థితి అర్థమైంది.
” నీ జుట్టు గురించి ఏడిపించాడని బాధపడద్దు ఆన్ ” ..ఓదార్చింది. ” అందరు అమ్మాయిలనీ అలాగే ఏదో ఒకటి అంటూనే ఉంటాడు కదా . నా జుట్టు ఇంత నల్లగా ఉంటుందని ఏడిపించాడు తెలుసా..నన్ను కనీసం పన్నెండుసార్లు ‘ నల్ల కాకి ‘ అని ఉంటాడు. ఇంతవరకూ ఎవ్వరికీ క్షమాపణ చెప్పుకోవటం నేను చూడనేలేదు ”
” కాకి అనిపించుకోవటానికీ కారట్ అనిపించుకోవటానికీ చాలా తేడా ఉంది ” ఆన్ నిర్వేదం గా చెప్పింది…” గిల్బర్ట్ బ్లైత్ నన్ను అతి తీవ్రంగా గాయపరచాడు డయానా ”
తర్వాత ఇంకేమీ సంభవించకపోతే ఆ గొడవ అంతటితో సమసిపోయి ఉండేదే. కాని ఒకసారి మొదలయాక ఇలాంటివి ఆగవు.
మధాహ్నాలప్పుడు అవొన్లియా బడి పిల్లలు గుట్ట మీది స్ప్రూస్ చెట్ల తోపులో చెట్టు బంకని గిల్లుకుంటూ గంతులేస్తుంటారు.[ దాన్ని చ్యూయింగ్ గం లాగా నములుతారు ] ఆ తోపు మిస్టర్ బెల్ ది, అతని పచ్చిక బీడుకి ఆనుకుని ఉంటుంది. మిస్టర్ ఫిలిప్స్ ఎబెన్ రైట్ వాళ్ళింట్లో అద్దెకి ఉంటాడు. ఆ బీడు లోంచి చూస్తే అక్కడినుంచీ మిస్టర్ ఫిలిప్స్ బయల్దేరాడో లేదో పిల్లలకి కనిపిస్తుంది, టీచర్ కనిపిస్తూనే పరుగు లంకించుకుంటారు. శాయశక్తులా పరుగెత్తినా రెండు మూడు నిమిషాల ఆలస్యం అవుతూనే ఉంటుంది, పిల్లలు రొప్పుతూ రోజుతూ వచ్చేసరికి.
ఆ మర్నాడు మిస్టర్ ఫిలిప్స్ కి ‘ సంస్కరణల ‘ మీద ధ్యాస మళ్ళింది [ అప్పుడప్పుడూ అలా తేడా చేస్తుంటుంది అతనికి ] . తను వచ్చేసరికి విద్యార్థులంతా ఎవరి చోట్లలో వాళ్ళు కూర్చుని ఉండాలని ఆశించాడు ఆ రోజు, ఎవరు ఆలస్యంగా వచ్చినా వాళ్ళకి దండన తప్పదు.
ఆవాళ అందరు అబ్బాయిలూ కొందరు అమ్మాయిలూ యథాప్రకారం స్ప్రూస్ తోపులోకి వెళ్ళారు. కాస్తంటే కాస్త .. బంక దొరకగానే వెనక్కి వచ్చేయాలనే వాళ్ళ ఉద్దేశం. అయితే అలా కుదిరింది కాదు.. ‘ నములు బంక మైకం ‘ వాళ్ళని కమ్మేసింది. చెట్టు మీదినుంచి ‘ వచ్చేస్తున్నాడు ‘ అని జిమ్మీ గ్లోవర్ కేక పెట్టే దాకా అక్కడే ఉండిపోయారు.
ఆడపిల్లలు నేల మీదే ఉన్నారు గనక తక్షణం పరుగు పెట్టి ఒక్క అర క్షణం ముందుగా క్లాస్ లోకి చేరగలిగారు. మగపిల్లలు చెట్లు దిగి కాళ్ళకి పనిచెప్పేసరికి ఆలస్యం అవనే అయింది. ఆ తోపుకి ఆ చివరన ఆన్ కూడా ఉంది..నములు బంక కోసం కాదు… తన ‘ సొంత స్వప్న లోకాల్లో ‘ విహరించుకుంటూ. జుట్టులో రైస్ లిల్లీ పూలు గుచ్చుకుని, కూనిరాగాలు తీసుకుంటూ ఆ నీడల లోకం లో తననొక వనదేవత లాగా ఊహించుకుంటూ తిరుగుతోంది. ప్రమాదపు హెచ్చరిక ఆమెకీ వినిపించింది . వేగంగా పరుగెత్త టం వచ్చు కాని , ఎంత చేసీ మగపిల్లల గుంపుతో కలిసి మటుకే అక్కడ అడుగుపెట్టటం వీలయింది. అప్పటికి మిస్టర్ ఫిలిప్స్ క్లాస్ లోపలికి వెళ్ళిపోయి టోపీని గోడ మీది మేకుకి తగిలిస్తున్నాడు.
మిస్టర్ ఫిలిప్స్ లో సంస్కరణాభిలాష ఆపాటికి బాగా ఉపశమించి ఉంది..పన్నెండు మంది అబ్బాయిలని ఒకేసారి శిక్షించి హడావిడి చేసే ఓపిక బొత్తిగా లేదు…కాని తన మాట వృధా పోకూడదు గనుక ఎవరో ఒకరి మీద తన ప్రతాపాన్ని ప్రదర్శించాలి. ఆయాసపడుతూ తన సీట్లో కూలబడుతున్న ఆన్ మీద అతని దృష్టి ఆగింది. ఆన్ చెవి పక్కనుంచి ఇంకా ఒక రైస్ లిల్లీల గుత్తి వేలాడుతూనే ఉంది , అది క్లాస్ రూం తో బొత్తిగా పొసగని అవతారం గనుక మిస్టర్ ఫిలిప్స్ విజృంభించాడు.
” ఆన్ షిర్లే ! నీకు అబ్బాయిలతో కలిసి తిరగటం బాగా నచ్చుతుంది లా ఉంది, నీ ఇష్టాన్ని ఈ మధ్యాహ్నం గౌరవించదలచుకున్నాను. ఆ పూల గుత్తి తీసి పడేసి వెళ్ళి గిల్బర్ట్ బ్లైత్ పక్కన కూర్చోమ్మా , పద ”
తక్కిన అబ్బాయిలు కిసుక్కుమన్నారు. డయానా ఆందోళనగా ఆన్ జుట్టులోంచి పూలగుత్తి లాగేసి ఆమె చెయ్యిగట్టిగా పట్టుకుంది . ఆన్ గుడ్లప్పగించి టీచర్ వైపు చూస్తుండిపోయింది.
” నేను చెప్పింది వినబడిందా, ఆన్ ? ” కటువుగా అడిగాడు మిస్టర్ ఫిలిప్స్.
” వినబడిందండీ. కాని మీరు నిజంగానే అంటున్నారా అని… ” ..మెల్లగా అడిగింది.
” నిజంగానే , ఏ- మీ సందేహం అక్కర్లేదు. చెప్పినట్లు చెయ్యి ” ..పిల్లలందరికీ, ముఖ్యంగా ఆన్ కి – అసహ్యం పుట్టించే వ్యంగ్యం మిస్టర్ ఫిలిప్స్ గొంతు లో ఉట్టిపడుతోంది.
జారుడు మెట్లలో ఆఖరిది ఇది ఆన్ ప్రాణానికి . పదమూడు మందీ చేసిన తప్పుకి తననొక్కదాన్నే శిక్షిస్తుండటం ఘోరం, ఆ శిక్ష లో ఒక అబ్బాయి పక్కన కూర్చోబెట్టటం ఇంకా ఘోరం, ఆ అబ్బాయి గిల్బర్ట్ బ్లైత్ అవటం మహా ఘోరం. ఇది అతి దుర్భరం, భరించే ప్రయత్నం కూడా చేయలేనని ఆన్ కి అర్థమైంది. పట్టలేననంత ఆగ్రహం తో, అవమానం తో నిలువెల్లా వణికిపోయింది.
గిల్బర్ట్ నీ ఆన్ నీ చూసి తక్కిన పిల్లల గుసగుసలూ మోచేత్తో ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుని నవ్వుకోవటాలూ కాసేపు సాగాయి. ఆన్ తలెత్తకుండా తదేకంగా నేలచూపులు చూస్తోంది..గిల్బర్ట్ తన భవితవ్యమంతా వాటిమీదే ఆధారపడిఉన్నంత దీక్షగా భిన్నాల లెక్కలు చేసుకుంటున్నాడు ..త్వరలోనే పిల్లల దృష్టి వాళ్ళ మీదినుంచి మళ్ళిపోయింది. మిస్టర్ ఫిలిప్స్ , క్లాస్ కి వచ్చేముందర ‘ ప్రిస్కిల్లా కోసం ‘ అనే పద్యమాలికను తయారు చేసుకోవటం మొదలుపెట్టి ఉన్నాడు – వాటిలో ఒకచోట ఎంతకీ ప్రాసకుదర టం లేదు , దాన్ని సాధించటం లో నిమగ్నుడై ,అతనూ ఆన్ ని పట్టించుకోవటం మానేశాడు. అది అదనుగా గిల్బర్ట్ ఒక గులాబి రంగు పిప్పరమెంట్ ని సంచిలోంచి బయటికి తీసి ఆన్ మోచేయి కి లోపలి వైపున డెస్క్ మీద పెట్టాడు. అది హృదయాకారం లో ఉంది, దాని మీద బంగారు రంగు అక్షరాలతో ‘ నువ్వు మంచిదానివి ‘ అని రాసి ఉంది. ఆన్ అటూ ఇటూ చూసి, దాన్ని తీసుకుని కింద పడేసి బూట్ కాలితో కసిదీరా పొడిపొడి చేసేసింది. గిల్బర్ట్ వైపుకి తల తిప్పి చూడనే లేదు.
బడి అయిపోయాక ఆన్ తన డెస్క్ దగ్గరికి నిటారుగా నడుచుకుంటూ వెళ్ళింది. అక్కడి తన వస్తువులన్నీ..పలకా, పుస్తకాలూ, బలపాలూ పెన్సిళ్ళూ అన్నిటినీ ఒకచోట పేర్చింది. తీసుకుని బయల్దేరింది.
సగం దూరం వెళ్ళాక, ” ఇవన్నీ ఇంటికెందుకు పట్టుకు పోతున్నావు ఆన్ ? ” డయానా భయం భయంగా అడిగింది, అప్పటివరకూ ఆ మాట అడిగేందుకు ధైర్యం చాలలేదు ఆమెకి.
” నేనిక బడికి రాదలచుకోవటం లేదు ” – ఆన్ గంభీరంగా జవాబు ఇచ్చింది. డయానా వెర్రి మొహం వేసుకుని చూస్తుండిపోయింది.
” దానికి మెరిల్లా ఒప్పుకుంటుందా ఏమిటి ? ” – డయానా ఆశ.
” ఒప్పుకు తీరాలి. మళ్ళీ బడికి వెళ్ళి ఆ మనిషి మొహం చూసేది లేదు , అంతే ”
”ఆన్…అయ్యో ” డయానాకి ఏడుపొచ్చేస్తోంది. ” నువ్వు ఆ మాట నిజంగా అనట్లేదు, నాకు తెలుసు. నువ్వు రాకపోతే ఎలా..ఆ మిస్టర్ ఫిలిప్స్ దరిద్రుడు నన్ను ఆ దిక్కుమాలిన పిల్ల గెర్టీ పై పక్కన కూర్చోబెడతాడు…నువ్వు లేకపోతే నాకెలా తోస్తుంది ..”
” నీకోసం ఏమైనా చేస్తాను డయానా..నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ఇమ్మన్నా సరే. ఇది మాత్రం అడగద్దు నన్ను, నా ఆత్మ దగ్ధమైపోతుంది ”
” మరి ఇదంతా ఉంది కదా ” – డయానా బెల్లించబోయింది. ” మనం వాగు పక్కన కొత్త బొమ్మరిల్లు కట్టుకుందామనుకున్నాం కదా ? వచ్చేవారం నాట్యగోష్ఠి పెట్టుకుందామనుకున్నాం కదా ? నువ్వెప్పుడూ నాట్యానికి వెళ్ళనేలేదని చెప్పావు…జేన్ ఆండ్రూస్ మనకి నాట్యం చేసుకుంటూ పాడేందుకు కొత్త పాట నేర్పిస్తానంది కదా ?? ఆలిస్ ఆండ్రూస్ బొమ్మల పుస్తకం పట్టుకొస్తానంది కదా ?? వాగు పక్కనే కూర్చుని ఒక్కొక్క అధ్యాయమూ పైకి చదువుకుందామనుకున్నాం కదా …నీకు పైకి చదవటమంటే ఎంతో ఇష్టం కదా ఆన్..నువ్వు లేకపోతే ఇదంతా ఎలా ?? రావూ ? ”
ఆన్ వీసమెత్తు కూడా చలించలేదు. ఆమె దృఢంగా నిశ్చయించేసుకుంది- మళ్ళీ బళ్ళోకి వెళ్ళదు, మిస్టర్ ఫిలిప్స్ మొహం చూడదు – అంతే . ఇంటికి వెళ్ళి మెరిల్లా దగ్గర ఈ విషయం ప్రకటించింది.
” ఏడిశావులే . నీ మొహం ” మెరిల్లా కొట్టిపడేసింది.
” కాదూ కాదు !” – ఆన్ రోషంగా చూసింది – ” నీకు అర్థం కావట్లేదా మెరిల్లా ? నాకు అవ- మా- నం – జరిగింది ”
” అవమానమా నీ తలకాయా. రేపు మామూలుగా బడికి వెళ్ళు ”
” లేదు మెరిల్లా. నా వల్ల కాదు. ఇంట్లోనే చదువుకుంటాను. నీకు అన్ని పనులూ చేసిపెడతాను, నువ్వు చెప్పినట్లే నోరు మూసుకుని ఉంటాను , ఎలా చెబితే అలా వింటాను. బడికి మాత్రం వెళ్ళను ”
అప్పటికి ఈ బుజ్జిదాని మొండితనం మెరిల్లా బుర్రకెక్కింది. ” ఇది నిజంగానే అంటోంది. ఒక్కొక్కసారి ఎంత మొండికెయ్యగలదో నాకు గాక ఎవరికి తెలుసు !! మిస్టర్ ఫిలిప్స్ దే తప్పని నాకూ అనిపిస్తోంది. అయినా ఆ మాట పైకి అనకూడదు కదా . మిసెస్ రాచెల్ ని వెళ్ళి అడిగితే సరి. ఈపాటికి ఆవిడకి అంతా తెలిసిపోయే ఉంటుంది ” . ఇంకేమీ రెట్టించలేదు ఆన్ ని.
మెరిల్లా వెళ్ళేసరికి మిసెస్ రాచెల్ ఎప్పటి ఉత్సాహం తో బొంత కుట్టుకుంటోంది.
” నేనెందుకు వచ్చానో నీకు తెలిసే ఉంటుంది ” మెరిల్లా కొంచెం సిగ్గుపడుతూ అంది.
మిసెస్ రాచెల్ తల ఊపింది , చెప్పమన్నట్లుగా.
”అదే..బళ్ళో ఆన్ గొడవ. ఇక ససేమిరా బడికి వెళ్ళనని భీష్మించుకు కూర్చుంది. పిల్ల చూస్తే బొత్తిగా డీలా పడిపోయినట్లుంది. అసలు వెళ్ళటం మొదలెట్టినప్పటుంచీ ఇలాంటి అల్లరేదో జరుగుతుందని భయపడుతూనే ఉన్నాను. దీని స్వభావానికి ఇంతవరకూ అంతా సాఫీగా వెళ్ళటమే ఆశ్చర్యం. నాకేమీ పాలుపోవటం లేదు. ఏం చెయ్యమంటావో చెప్పు ”
” నన్ను అడుగుతున్నావు గనుక ..” – మిసెస్ రాచెల్ మొదలెట్టింది . ఆవిడకి సలహా అడగబడటమంటే ఎంతో ప్రీతి అని తెలిసిన సంగతే. ” నేనైతే కొన్ని రోజులు ఆన్ మాటే వింటాను. ఆన్ కోపానికి మిస్టర్ ఫిలిప్స్ నిన్న దాన్ని దండించటం సరైనదే. ఇవాళ మటుకు తప్పు పూర్తిగా అతనిదే. పదముగ్గురు ఒకే తప్పు చేస్తే దీనికొక్కదానికే ఎలా శిక్ష వేస్తాడు ? పైగా ఒక అబ్బాయి పక్కన కూర్చోబెట్టటమా..అదేమీ మర్యాద గా లేదు. ఇందాకే టిలీ బట్లర్ బళ్ళోంచి ఇంటికి వెళుతూ నాకు అంతా చెప్పుకొచ్చింది. అదీ దాని తోటి ఆడపిల్లలూ అందరూ ఆన్ వైపే మాట్లాడుతున్నారట. మిస్టర్ ఫిలిప్స్ మీద అందరికీ మండిపోతోందట. ఆన్ కి బళ్ళో ఇంత పలుకుబడి ఉంటుందనుకోలేదు నేను, ఆశ్చర్యం వేసింది సుమా ”
” అయితే నిజంగానే బడికి పంపకుండా ఉంచెయ్యమంటావా ? ” – మెరిల్లా నమ్మలేక పోయింది.
” ఆ. అవును..అది వెళ్తాననేవరకూ. నేననుకోవటం , ఒక వారం రోజులు గడిస్తే అదే చల్లబడుతుంది. ఇప్పుడు బలవంతంగా పంపితే మంచి కన్నా చెడే ఎక్కువ. నా ఉద్దేశం లో ఇలాంటివాటి గురించి ఎంత తక్కువ హడావిడి జరిగితే అంత నయం. బళ్ళోకి వెళ్ళనంత మాత్రాన ఆన్ పెద్దగా నష్టపోయేదేమీ ఉండదు- ఆ మిస్టర్ ఫిలిప్స్ పాఠాలు అంత గొప్పగా ఏం ఉండవు లే . అతను చిన్నపిల్లలని అసలు పట్టించుకోకుండా క్వీన్స్ అకాడెమీ లో చేరబోయే పెద్ద పిల్లలకే మొత్తం సమయం కేటాయిస్తుంటాడట. ఇక క్రమశిక్షణ అంటావా..అతని పద్ధతులని ఆ మాటతో పిలవనేకూడదు. ట్రస్టీ లలో ఒకరు వాళ్ళమామయ్యకాబట్టిగాని , లేదంటే ఈ ఏడాది అతని ఉద్యోగం ఊడేదే ! ఏమిటో..ఈ ఊళ్ళో చదువు సంధ్యలు – ఇక మీదట ఎలా తెల్లారుతాయో ఏమో !!! ”
మిసెస్ రాచెల్ మాట ని మెరిల్లా అక్షరాలా పాటించింది. బడికి వెళ్ళటమన్న మాటే ఇంట్లో వినిపించలేదు. ఆన్ ఇంట్లో పనులకి సాయం చేసింది, శ్రద్ధగా పాఠాలు చదువుకుంది , సాయంకాలాలు డయానాతో ఆడుకుంది. ఏ దారివెంట వెళుతుంటేనో, ఆదివారం చర్చ్ లోనో గిల్బర్ట్ బ్లైత్ ఎదురైతే ఆమె మొహం ద్వేషం తో నిండిపోయేది. గిల్బర్ట్ ఆమె చేత క్షమించబడాలని ఎంత ప్రయత్నిస్తే ఆన్ అంత గా బిగుసుకుపోయేది. వాళ్ళిద్దరి మధ్యనా శాంతి నెలకొల్పాలనే డయానా ప్రయత్నాలు ఎంతమాత్రమూ ఫలించలేదు. గిల్బర్ట్ ని ఆన్ తన జీవితాంతమూ అసహ్యించుకుంటూనే ఉండేలా ఉంది.
గిల్బర్ట్ మీద ఎంత ద్వేషమో డయానా మీద అంత ప్రేమ ఆన్ కి..అది రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఆన్ హృదయం లో ప్రేమా ద్వేషమూ రెండూ అతి తీవ్రంగానే ఉంటుంటాయి, మధ్యే మార్గం ఆమెకి చేతనవదు.
ఒక రోజున మెరిల్లా బుట్టలో ఆపిల్ పళ్ళు నింపుకుని తోటలోంచి వస్తోంది. తూర్పు కిటికీ లోంచి సందెవెలుగు ని చూస్తూ ఆన్ కుమిలి కుమిలి ఏడుస్తోంది.
” ఎందుకెందుకు..ఏమైంది ? ”
” ఓ..మెరిల్లా. డయానా అంటే నాకు చాలా చాలా ఇష్టం. తను నాతో లేకుండా ఉండలేను. పెద్దయాక తనకి పెళ్ళైపోతుంది కదా, భర్త తో వెళ్ళిపోతుంది కదా ..అది తలచుకుని ఏడుస్తున్నాను. భ-ర్త- అట…వాణ్ణి తలుచుకుంటేనే అసహ్యమేస్తోంది. అదంతా కనిపిస్తోంది నాకు మెరిల్లా…డయానా మంచులాగా తెల్లగా ఉన్న మెత్తటి పెళ్ళి గౌన్ లో ఎంత అద్భుతంగా ఉందో ! నేను తోడు పెళ్ళికూతురిని…నా గౌనూ బావుంది, దానికి బుట్ట చేతులు కూడా ఉన్నాయి. గుండె పగిలిపోతున్నా అణుచుకుంటూ చిరునవ్వుతో తిరుగుతున్నాను. ఇదిగో..డయానా వెళ్ళిపోతోంది…వీడ్కోలు చెప్పాలి…” – ఒక్కసారిగా గొల్లు మంది ఆన్.
మెరిల్లా చటుక్కున అటువైపుకి తిరిగిపోయింది, మొహం కనిపించకుండా. కాని లాభం లేకపోయింది- దగ్గరగా ఉన్న కుర్చీలో కూలబడి పొట్ట చెక్కలైపోయేలా నవ్వింది…నవ్వుతూనే ఉంది , ఆవైపు వెళుతూన్న మాథ్యూ ఆశ్చర్యంగా ఆగిపోయాడు..మెరిల్లా ఇంతగా విరగబడినవ్వి ఎన్నేళ్ళైపోయింది !!!
” ఆన్ షిర్లే ! ” – నవ్వులోంచి మాట పెగిలాక అంది ఇలా – ” ఏం చోద్యమే నీది !!! లేని బాధలు అరువు తెచ్చుకు మరీ ఏడుస్తుంటావు సరే , అంత అలవిగాని బాధలే తెచ్చిపెట్టుకోవాలా.. కాస్త మోతాదైనవి ఊహించుకోరాదా , నీ ఊహా శక్తి మండిపోను ! ”
– [ ఇంకా ఉంది ]





థాంక్ యు
చాలా సంతోషం :)
“లేని బాధలు అరువు తెచ్చుకు మరీ ఏడుస్తుంటావు సరే , అంత అలవిగాని బాధలే తెచ్చిపెట్టుకోవాలా.. కాస్త మోతాదైనవి ఊహించుకోరాదా…”
నిజమేనేమో అనిపిస్తోంది.
ఏదో ఒక మరోలోకం అంటారే, అలాంటి చోట ఉన్నట్టుంటుంది ఈ కథ చదువుతూ ఉంటే! థాంక్స్ మైథిలి గారూ!
ధన్యవాదాలండీ …అవును, స్వప్నలోకం…అందులో మెరిల్లా కామన్ సెన్స్ :)
మైథిలీ Mam , భలే వుంది చదువుతుంటే, క్లాస్ రూం, రూం లోని పిల్లలూ, తోపూ … ఫిలిప్స్ మాస్టర్ .. ఆన్ కోపం, రోషం రెప్ప వేయకుండా చదివించారు, Thank u so much, ఎప్పటిలాగానే మంచి మంచి తెలుగు పదాల సరాలు :)
థాంక్ యూ రేఖా :) మన ఇళ్ళలో వినే మాటలే కదా అవి ..