విస్మృతి

సుధా కిరణ్

 

జ్ఞాపకాలకీ, విస్మృతికీ మధ్య

దిగంత రేఖలా చెరిగిపోయిన

సన్నటి కన్నీటి పొరలాంటి గీత

జ్ఞాపకాలు

ఒక్కొక్కటిగా ఆకులవలె రాలిపోతూ

ఎన్నటికీ తిరిగి చిగురించని

శిథిల శిశిరపు కరకు జాడలు

జ్ఞాపకాలు..

చినుకులు చినుకులుగా

నిస్సహాయంగా నేలకు జారిపోగా

గాలి ముందు దీపంలా దీనంగా

మోకరిల్లిన ముదిమి మేఘం

అలలు అలలుగా విస్మృతి విస్తరించిన సముద్రమొకటి

తలపుల కెరటాలు తరలిపోగా దిగులు దీపస్తంభంలా నిలిచిన కడపటి తీరమొకటి..

 

జ్ఞాపకాల వెలుతురు

కొద్ది కొద్దిగా కుదించుకుపోతుందో

విస్మృతి చీకటి

మెలమెల్లగా విస్తరిస్తుందో

జ్ఞాపకాలు

జడివానలో కొట్టుకుపోతాయో

జ్ఞాపకాలు..

కరిగి, యిగిరి, ఆవిరై, ఎగిరి పోతాయో

మనుషులు, ముఖాలు, పేర్లు, మాటలు

జ్ఞాపకాలతో తెగని పెనుగులాట

చిరునవ్వులు, కన్నీళ్లు, గాయాలు, ఘటనలు

గుర్తుకురాని తనంతో ఎడతెగని యుద్ధం

చీకటిలో కదలాడే నిశ్శబ్దపు నీడలకై వెదుకులాట

వెలుగులో  కనిపించని నక్షత్రాలకై శూన్యాకాశంలో అన్వేషణ

వూడలుదిగిన మర్రిచెట్టులాంటి రాత్రి ఋతువులు లేని కాలమొకటి

కాలం కాటేసిన తలపుల వాకిలిలో తలుపులు మూసుకుపోయిన మలిసంధ్య జీవితమొకటి…

 

(ఓవెన్ డార్నెల్ కవిత ‘యాన్ అల్జీమర్స్ రిక్వెస్ట్’ కి కృతజ్ఞతలతో..)

*

Sudha Kiran_Photo

మీ మాటలు

  1. గొప్ప పద చిత్రాలు ! కవిత ఎంతో బాగుంది సర్

  2. Narayanaswamy says:

    చాలా కదిలించే కవిత – చదివాక కళ్ళు మూసుకుంటే ఒక దుఃఖ మేఘం ఆవరిస్తుంది – జ్ఞాపకాలు విస్మృతి ని దాటి చుట్టుముడతాయి –

    జ్ఞాపకాలు..

    చినుకులు చినుకులుగా

    నిస్సహాయంగా నేలకు జారిపోగా

    గాలి ముందు దీపంలా దీనంగా

    మోకరిల్లిన ముదిమి మేఘం

    వేటాడే వాక్యాలు!

  3. Aranya Krishna says:

    ఇటువంటి ఆర్ద్రమైన వ్యక్తీకరణలు మనలోని మానవత్వాన్ని నిలబెడుతుంటాయి. మంచి కవిత. అభినందనలు సుధా కిరణ్ గారు!

  4. Doctor Nalini says:

    సుధాకిరణ్ గారు,మా నాన్న క్రమక్రమంగా మాకు మానసికంగా దూరం కావడాన్ని , మా అమ్మ ఎదుర్కున్న వంటరితనాన్ని మరొక్కసారి గుర్తు చేసారు . ప్రసాద మూర్తి గారు కూడా గతంలో నాన్నని ఉద్దేశించి “బతికే జ్ఞాపకం ” అనే ఒక మంచి కవిత ఆంధ్రజ్యోతిలో రాసారు. ఆ మరుపు వాళ్లకి వరం కాని caretakers కి నరకం . అందుకే మా neurologist అమ్మ ఎలా వుందని మాత్రమే అడిగేది .

  5. అల్జీమర్ వృద్ధాప్యంలో ఒక శాపం. జ్ణాపకాల విస్మృతుల మధ్య వున్న రేఖను చాల గొప్పగా అక్షరీకరించారు.మీ కవిత ముసురు కున్న ముదిమి దుఃఖ మేఘాన్ని నిలబెట్టింది.

  6. Sudha Kiran says:

    భవాని గారూ, స్వామీ, రాజారావు గారూ ధన్యవాదాలు
    అరణ్యకృష్ణా యెన్నాళ్ళైంది?
    నళిని గారూ..ఇలాంటి అనుభవాలు చాలా బాధపెడుతూ సలుపుతాయి..చాల రోజుల క్రితం ఆంధ్రజ్యోతిలో చైనా-అమెరికన్ రచయిత్రి ‘ఏమీ టాన్’ వాళ్ళ అల్జీమర్స్ తో చనిపోయిన అమ్మ గురించి రాసిన ‘ద్వేషపు మాటలు’ సంస్మృతి వ్యాసం చదివేరా?

మీ మాటలు

*