జోరుగా హుషారుగా జారిస్టు రష్యాలో…

స్లీమన్ కథ 

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

1844, మార్చి1…హైన్ రిచ్ స్లీమన్ 22వ పుట్టినరోజు…

ఇప్పటినుంచి అతన్ని ‘స్లీమన్’ అన్న ఇంటిపేరుతోనే పిలుచుకుందాం.

స్లీమన్ ఆరోజు హెర్ హైన్ రిచ్ ష్రోడర్ (మనదగ్గర శ్రీ లా జర్మన్ భాషలో ‘హెర్’ గౌరవవాచకం) కార్యాలయంలోకి అడుగుపెట్టాడు. ఏమ్ స్టడామ్ లో పెద్ద ఎత్తున ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు సాగించే ఓ సంస్థకు ష్రోడర్ అధిపతి. స్లీమన్ ఓ ఉద్యోగానికి దరఖాస్తు ఇచ్చాడు. అందులో తన అర్హతలను పొందుపరిచాడు… ఏడు భాషలు తెలుసు. అంకెల్లో నేర్పు ఉంది, మెసెంజర్ బాయ్ గా రెండేళ్ళ అనుభవం…

వెంటనే అతన్నిఇంటర్వ్యూ చేశారు. ఈ కుర్రాడు తనకు బాగా పనికొస్తాడని ష్రోడర్ తొలి చూపులోనే గ్రహించాడు. ఇతను వ్యాపార సూక్ష్మాలను బాగా పట్టుకోగలడని కూడా ఆయనకు అనిపించింది. పైగా తన క్రిష్టియన్ పేరే అతనిది కూడా!

కొన్ని నిమిషాల్లోనే అతన్ని బుక్-కీపర్ గా నియమిస్తూ కాగితం ఇచ్చారు. జీతం నెలకు 600 గోడెన్లు. కొన్ని వారాల్లోనే జీతాన్ని1,000 గోడెన్లకు పెంచారు.

స్లీమన్ భాషల అధ్యయనాన్ని కొన్ని మాసాలపాటు పక్కన పెట్టాడు. దానికి బదులు తన బహుభాషా పరిచయాన్ని వినియోగంలోకి తేవడం ప్రారంభించాడు. అందులో త్వరత్వరగా దూసుకు వెళ్ళాడు కూడా. చూస్తుండగానే ఆ కార్యాలయంలోని ప్రధాన లేఖకుల్లో ఒకడైపోయాడు. ఇప్పుడతను ష్రోడర్ ఆంతరంగిక బృందంలో సభ్యుడు!

రష్యానుంచి తమ ఆఫీసుకు రష్యన్ భాషలో ఉత్తరాలు రావడం స్లీమన్ గమనించాడు.  తన భాషాధ్యయనం మళ్ళీ మొదలెట్టాల్సిన అవసరం అతనికి కనిపించింది. కొన్ని వారాల్లోనే రష్యన్ నేర్చుకుని ఆ భాషలోనే ఆ ఉత్తరాలకు సమాధానం రాస్తానని ఆఫీసులో ప్రకటించాడు. దాదాపు ఇంగ్లీష్ నేర్చుకున్న పద్ధతిలోనే రష్యన్ నేర్చుకోవడం ప్రారంభించాడు. ఎప్పుడైనా, మరీ అవసరమనుకుంటే తప్ప వ్యాకరణం జోలికి వెళ్లకపోవడం అతను అనుసరించిన పద్ధతి.

ఫ్రెంచ్ రచయిత ఫినెలున్ రాసిన ఉలిసిస్ కొడుకు కథ(Les Aventures de Telemaque)కు పేలవమైన రష్యన్ అనువాదాన్ని సంపాదించాడు. అది  సుదీర్ఘమైన చుట్టుతిరుగుడు వాక్యాలతో ఉంది. ఓ నిఘంటువును, ఓ పాత గ్రామర్ ను కొనుక్కున్నాడు. నిఘంటువులో అర్థాలు చూసుకుంటూ మొదటిసారి కథంతా చదివాడు. ఆ అర్థాలను కూడబలుక్కుంటూ స్థూలంగా కథను అర్థంచేసుకున్నాడు. అతని జ్ఞాపకశక్తి ఎంత అమోఘమంటే, ఒక మాటకు నిఘంటువులొ ఒకసారి అర్థం చూసిన తర్వాత రెండోసారి చూడాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు.

అతను రష్యన్ నేర్పే ఒక ట్యూటర్ కోసం వెతికాడు. ఎవరూ దొరకలేదు. దాంతో పనిగట్టుకుని ఏమ్ స్టడామ్ లోని రష్యన్ కాన్సూల్ కు వెళ్ళి తనకు రష్యన్ నేర్పవలసిందిగా అక్కడి వైస్-కాన్సూల్ ను అర్థించాడు. నాకంత తీరిక లేదంటూ అతను నిరాకరించాడు. అయినాసరే, పట్టు వదలకుండా తను సొంతంగా నేర్చిన తప్పుల తడక రష్యన్ లోనే చిన్న కథలూ, వ్యాసాలూ రాస్తూ సాధనచేశాడు. ఫినెలున్ రచనను కంఠతా పట్టేశాడు. ఆ భాషలోని గాంభీర్యానికీ, శ్రావ్యతకూ అతనెంత ముగ్ధుడైపోయాడంటే, పేరాలకు పేరాలను బిగ్గరగా చదివి ఆనందించేవాడు.

తనకో శ్రోత కూడా ఉంటే మరీ బాగుంటుందనిపించింది. గంటకు నాలుగు ఫ్రాంకుల చొప్పున ఇచ్చేలా ఓ పేద యూదును శ్రోతగా కుదుర్చుకున్నాడు. రాత్రిపూట అతన్ని ఎదురుగా పెట్టుకుని రష్యన్ లో అనర్గళంగా దంచి మాట్లాడుతుంటే లాడ్జీ టొపారం లేచిపోయేది. లాడ్జీ లోని మిగతా వాళ్ళకు అది తీవ్ర అసౌకర్యంగానూ, నిద్రాభంగంగానూ ఉండేది. దాంతో వాళ్ళు యుద్ధానికి వచ్చేవాళ్లు. ఆ కారణంగా అతను రెండుసార్లు లాడ్జీ మారాల్సివచ్చింది.

ఆరువారాలు గడిచేసరికల్లా  అతను రష్యన్ లో తొలి ఉత్తరం రాశాడు. అది కూడా ఆ భాషకు చెందిన అన్ని మర్యాదలనూ పాటిస్తూ! వాసిలీ ప్లొట్నికోవ్ అనే అతనికి రాసిన ఉత్తరం అది. మాస్కోకు చెందిన ఓ అతిపెద్ద నీలిమందు వ్యాపారసంస్థకు ప్లొట్నికోవ్ లండన్ ఏజెంట్ గా ఉన్నాడు.

విచిత్రంగా ఆ ఉత్తరమే స్లీమన్ ఇరవయ్యేళ్ళ భావి జీవితానికి రూపునిచ్చింది.

ఆ రోజుల్లో భారత్, ఆగ్నేయాసియా దేశాలనుంచి నీలిమందును దిగుమతి చేసుకునేవారు. ఏమ్ స్టడామ్ అతి పెద్ద నీలిమందు వర్తకకేంద్రాలలో ఒకటిగా ఉండేది. ఆ నగరంలో తరచు నీలిమందు వేలం జరుగుతూ ఉండేది. స్లీమన్ కు ఎనిమిది భాషలు తెలుసు కనుక అతని కంపెనీ అతన్నే వేలానికి పంపించేది. రష్యాకు సంబంధించిన అన్ని విషయాలపై ఆసక్తి ఉన్న స్లీమన్ వేలానికి వచ్చిన రష్యన్ వర్తకులను పరిచయం చేసుకుని మాటామంతీ సాగించేవాడు. రష్యా పరిస్థితుల గురించి అడిగి తెలుసుకునేవాడు. అక్కడి వ్యాపార అవకాశాల గురించి వాకబు చేసేవాడు. తను మాస్కో వచ్చి ఓ రష్యన్ సంస్థ భాగస్వామ్యంతో దిగుమతుల వ్యాపారం  చేస్తే ఎలా ఉంటుందని అడిగేవాడు.

హాలెండ్ లో ఓ జర్మన్, తమతో తమ భాషలో మాట్లాడడం వాళ్ళకు ఆశ్చర్యం కలిగించేది. క్రమంగా అతని మీద వాళ్ళకు ఇష్టం ఏర్పడింది.

అయితే, ఈ ఉద్యోగంలోకి వచ్చాక కూడా రెండేళ్లపాటు అతను ఇరుకిరుకు లాడ్జీ గదుల్లోనే గడిపాడు. ఇతర ఖర్చులు కూడా కనీసస్థాయికి తగ్గించుకుంటూ ఎప్పటిలానే డబ్బు కూడబెడుతూ వచ్చాడు.  చక్కెర ఎక్కువ వేసుకుని కప్పుల కొద్దీ టీ తాగే ‘దురలవాటు’ మాత్రం అతనికి ఉండేది. చక్కెర అతనిలో ఉండి ఉండి శక్తినీ, ఉత్తేజాన్నీ నింపేది. రాత్రిళ్ళు నిద్ర కాచుకుని చదువుకోడానికీ, ఆలోచించుకోడానికీ అందువల్ల వీలయ్యేది.

ఈరోజుల్లోనే వాళ్ళ నాన్నకు తరచు ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. బాధ్యతగా నడచుకోమనీ, ప్రయోజనకరమైన జీవితం గడపమనీ ఆ ఉత్తరాల్లో తండ్రికి హితబోధ చేస్తూ తనే తండ్రి పాత్ర పోషించేవాడు. తనను చూసైనా నేర్చుకోమని చెప్పేవాడు. కుటుంబం నాశనమైపోకుండా కాపాడుకోవాలన్న తపన ఆ ఉత్తరాల్లో ఉండేది. మరోవైపు తండ్రికి రకరకాల కానుకలూ పంపిస్తూ ఉండేవాడు. తను పొదుపు చేసిన తొలి మొత్తాలతో రెండు పెట్టెల బార్డో వైన్ సీసాలు(Bordeaux: ఫ్రాన్స్ లోని ఓ నగరం. వైన్ పరిశ్రమకు ప్రపంచప్రసిద్ధి చెందింది), ఓ పెట్టెడు సిగార్లు తండ్రికి పంపించాడు.

ఆర్థికంగా స్థిమిత పడుతున్న కొద్దీ మిన్నాతో పెళ్లి తలపులు మళ్ళీ అతన్ని ముసురుకోవడం ప్రారంభించాయి. మంచి బ్యాంక్ బ్యాలెన్స్ తో పెళ్లి చేసుకుని స్థిరపడడం ఇప్పుడతనికి ‘పగటికల’ కాదు. ‘బ్రదర్స్ ష్రోడర్’ స్థాయిని అందుకోబోయే వ్యాపారవేత్తగా కూడా తననిప్పుడు ఊహించుకుంటున్నాడు. ఎనిమిది భాషల్లో పరిజ్ఞానం తనకో ప్రపంచ వ్యాపార సామ్రాజ్యాన్ని కట్టబెట్టగలదని కూడా నమ్ముతున్నాడు.

నీలిమందు వేలానికి వెడుతున్న సందర్భంలోనే జివాగో అనే ఓ రష్యన్ దిగుమతుల వ్యాపారి అతనికి పరిచయమయ్యాడు. ఆ పరిచయం స్నేహంగా మారింది.  కలసి వ్యాపారం  ప్రారంభించే దిశగా మంతనాలు మొదలుపెట్టారు. “జివాగో & స్లీమన్” అనే పేరుతో ఓ వ్యాపారసంస్థను ప్రారంభించడానికీ, లాభాలు ఇద్దరూ సమానంగా పంచుకునే షరతు మీద తను 60 వేల సిల్వర్ రూబుళ్లను పెట్టుబడి పెట్టడానికీ జివాగో ముందుకొచ్చాడు.

ఈ సంగతి యజమాని హైన్ రిచ్ ష్రోడర్ చెవిదాకా పాకింది. పనికొస్తాడనే ఉద్దేశంతో మంచి జీతమిచ్చి తెచ్చుకున్న ఈ కుర్రాడు చేజారిపోతాడని ష్రోడర్ అనుకున్నాడు.  ఓ రోజున తన దగ్గరకు పిలిపించుకుని, “సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఉంటూ రష్యాలో మన వ్యాపార లావాదేవీలు చూస్తావా?” అని అడిగాడు. దాంతోపాటు బ్రెమన్, ట్రియెస్ట్, స్మిర్నా, లె ఆఫ్రే, రియో డిజెనీరో లలోని మన కంపెనీ శాఖలకు కూడా నువ్వే ముఖ్యప్రతినిధిగా ఉంటావన్నాడు. ఆ ప్రతిపాదన స్లీమన్ కు ఎంతగానో నచ్చింది. వెంటనే ఆమోదం తెలిపాడు.

1845 జనవరిలో, ఏమ్ స్టడామ్ లో తన చివరి రోజుల్ని సెయింట్ పీటర్స్ బర్గ్ లో తను ప్రాతినిధ్యం వహించబోయే వ్యాపారసంస్థల అధిపతులతో మాట్లాడుతూ గడిపాడు. తన వ్యాపారదక్షత మీద అతనికి ఎంత నమ్మకం చిక్కిందంటే, మీకు లాభాలు చూపించేవరకూ నాకెలాంటి ఫీ చెల్లించాల్సిన అవసరం లేదని వాళ్ళకు ఖండితంగా చెప్పాడు.

మిన్నా గురించి వాకబు చేయమనీ, తనిప్పుడు ఆమెను పెళ్లాడే స్థితిలో ఉన్నట్టు తెలియజేయమనీ కోరుతూ న్యూ స్ట్రెలిజ్ లో తనకు పరిచయమైన సంగీత విద్వాంసుడు హెర్ లవాకు సెయింట్ పీటర్స్ బర్గ్ కు బయలుదేరేముందు ఉత్తరం రాద్దామనుకున్నాడు.  అంతలో, తనక్కడ స్థిరపడ్డాకే ఆ పని చేయచ్చనిపించి విరమించుకున్నాడు.  తనకు పట్టిన అదృష్టం గురించి వివరిస్తూ తండ్రికి ఉత్తరం రాశాడు.  ఇది కూడా పట్టుదలతో, ఏకాగ్రతతో తను చేసిన కృషి ఫలితమనీ, “ఏ  అదృష్టమైనా  ఓ అనర్హుడిమీద ఆకాశం మీంచి ఊడిపడ”దనీ అందులో ఎత్తిపొడిచాడు.

ఓడ మునిగిపోయి, చావు బతుకుల మధ్య వేలాడుతూ అతను హాలెండ్ తీరానికి కొట్టుకొచ్చి అప్పటికి నాలుగేళ్లే అయింది. ఇప్పుడతను పాతికేళ్ళ యువకుడు. ఏమ్ స్టడామ్ లో చెప్పుకోదగ్గ మిత్రులెవరూ లేరు. ఆ నగరాన్ని విడిచి వెడుతున్నందుకు అతనేమంత బాధపడలేదు.  మొదట కోచ్ లోనూ, తర్వాత మంచు మీద నడిచే స్లై బండి మీదా పదహారు రోజులపాటు ఒళ్ళు హూనమయ్యే ప్రయాణం చేసి, ప్రపంచంలోని అతి పెద్ద వ్యాపార సంస్థలలో ఒకటైన ‘బ్రదర్స్ ష్రోడర్’ కు ముఖ్యప్రతినిధిగా 1845 ఫిబ్రవరి 1న సెయింట్ పీటర్స్ బర్గ్ లో అడుగుపెట్టాడు.

***

సెయింట్ పీటర్స్ బర్గ్ అప్పటికింకా శైశవదశలోనే ఉంది. నికొలస్-I గద్దె మీద ఉన్నాడు. అతనిది కాఠిన్యం ఉట్టిపడే నలుచదరపు మొహం. ఆరడుగుల ఎత్తరి.  అంతకుముందు అతను ఆశ్విక దళాధికారిగా ఉండేవాడు.  దేవుడి దయవల్ల జార్ చక్రవర్తి కాగలిగిన ఓ ఆశ్విక దళాధికారిగానే తనను భావించుకునేవాడు. చక్రవర్తి పదవిని తుదికంటా అనుభవించే హక్కు తనకొక్కడికే ఉందని అతనికి అనిపించేది. దాంతో తన మంత్రుల్ని చూడగానే మొహం చిట్లించుకునే వాడు. తెల్లగా తళ తళా మెరిసిపోయే ఇటాలియన్ తరహా ప్రాసాదాలను వరసపెట్టి నిర్మింపజేయడం అతని ప్రధాన వ్యాపకాలలో ఒకటి. అతను తన ఆహార్యంలో ఎంతో శ్రద్ధ తీసుకునేవాడు. ఒక ఆశ్వికదళాధికారికి తగినట్టుగా అతని ఛాతీ ఒద్దికగా నొక్కుకుపోయినట్టు ఉండేది. ఉచ్చనీచాలు లేకుండా అంతఃపుర స్త్రీలను అనుభవించేవాడు. అతన్ని చూడగానే దాదాపు అందరూ భయంతో వణికేవారు. ఎందుకంటే, అతని ఎడమకన్ను కుడి కన్ను కన్నా ఎక్కువ ఎర్రగా, చింతనిప్పుల్లా ఉండేది. అమానుషత్వం కరడుగట్టిన మనిషన్న భావన కలిగించేది. ఈ విషయంలో అతనికి అలెగ్జాండర్ ది గ్రేట్ తో పోలిక కుదిరింది. అలెగ్జాండర్ కళ్ళు కూడా భీకరంగా ఉండేవి. ఉక్కు పోతపోసినట్టు ఉండే సైనికులకు కూడా అతన్ని చూడగానే పాదాలు చల్లబడేవి.

జార్ చక్రవర్తి నికొలస్-1 (1796-1855)

నీకొలస్-I హయాంలో సెయింట్ పీటర్స్ బర్గ్ వైపరీత్యాలకు చిరునామాగా ఉండేది. వెడల్పాటి వీథులు, ఒకటీ అరా ఫ్యాక్టరీలు, లెక్కలేనన్ని ప్రాసాదాలూ, పేదల పూరిళ్లూ…రోడ్లమీద రద్దీ ఉండేదికాదు. అంత విశాలమైన వీథులూ పాడుపెట్టినట్టు నిర్మానుష్యంగా ఉండేవి. చిత్తడినేలల మీద పీటర్ ది గ్రేట్ నిర్మించిన ఈ నగరాన్ని పునర్నిర్మించే బాధ్యత తనకుందనీ, తను పీటర్ ది గ్రేట్ వారసుణ్ణనీ నికొలస్-I అనుకునేవాడు. శీతాకాలంలో నగరమంతా మంచు దుప్పటి కప్పినట్టుగా తెలుపు ఓడుతూ ఉంటుంది.

రాజోద్యోగులు ఆస్థానం తాలూకు అంతూపొంతూలేని పనికిమాలిన వ్యాపకాల్లోనూ వ్యవహారాల్లోనూ మునిగితేలుతూ ఉండేవారు. సేవకులు దుస్సహమైన పీడన కింద అణగారిపోయేవారు. విద్యార్థులు నిరంకుశ రాచరికాన్ని అంతమొందించే ఆలోచన అప్పటికే చేస్తున్నారు. ఆ ఏడాదే దోస్తోయెస్కీ రాసిన తొలి నవల Poor Folk వెలువడింది. పెట్రాషయెస్కీ వర్గంగా ప్రసిద్ధిలోకి వచ్చిన ఓ బృందం జార్ కు వ్యతిరేకంగా కుట్ర చేస్తోంది. యువకుడైన దోస్తోయెస్కీ కూడా అందులో సభ్యుడు. రష్యా అంతటా సామాజిక చైతన్యం క్రమంగా మేలుకుంటోంది. కట్టు బానిసల్లా బతుకుతున్న జనంలో ఆగ్రహావేశాలు రగలుకొంటున్నాయి.

స్లీమన్ మాత్రం పీటర్స్ బర్గ్ గురించి దీనికి పూర్తిగా విరుద్ధమైన ఊహల్లో మునిగితేలుతున్నాడు. ప్రపంచంలోనే ఓ అత్యుత్తమ ప్రదేశంలో తాను నివసిస్తున్నాననుకుంటున్నాడు. అతని ఉద్దేశంలో పీటర్స్ బర్గ్ వాసయోగ్యమే కాక; వ్యాపారానికి బాగా అనువైన, సురక్షితమైన నగరం. అక్కడి ఇళ్ళు, వీథులు ఎంతో అందంగానూ, శుభ్రంగానూ, ఆహ్లాదకరంగానూ అతనికి కనిపించాయి. అతను రాసే ఉత్తరాల్లో కూడా జార్ నికొలస్ ను మంచి తెలివైన, వైభవోపేతుడైన చక్రవర్తిగా పొగడ్తలతో ముంచెత్తేవాడు. రష్యన్ వర్తకుల గురించి మాత్రం అతనికి ఎలాంటి భ్రమలూ లేవు. అందరు వర్తకుల్లానే వాళ్ళు కూడా వ్యాపారపు మెళకువలు బాగా తెలిసిన కొరకరాని కొయ్యలే. కాకపోతే వాళ్ళ మీద తను రెండాకులు ఎక్కువే చదివానని అతను అనుకుంటున్నాడు. ష్రోడర్ ముఖ్యప్రతినిధిగా తన గొంతు గట్టిగా వినిపించగల స్థితిలో కూడా ఉన్నాడు. దానికితోడు ఉరకలేసే ఉత్సాహం, అంతులేని దాహం…కాళ్లలో చక్రాలు ఉన్నాయా అన్నట్టుగా నిర్విరామంగా ఒకచోటి నుంచి ఒకటికి కదలి వెళ్లిపోతూ ఉండడమే.

పీటర్స్ బర్గ్ లో ఏడు రోజులున్నతర్వాత, తను లావాదేవీలు జరపబోయే సంస్థలతో సంబంధాలను కల్పించుకోడానికి స్లై మీద మాస్కో వెళ్లిపోయాడు. పెద్ద పెద్ద వర్తకప్రముఖులతో కూడా తేలిగ్గా కలసిపోయి, త్వరలోనే వాళ్ళ తలలో నాలుకలా మారిపోగల చాకచక్యం అతనికి ఉంది. పీటర్స్ బర్గ్ లో అడుగుపెట్టిన క్షణం నుంచే అంతర్జాతీయ వర్తక ప్రతినిధిగా తన పాత్రను విజయవంతంగా పోషించాడు. ష్రోడర్ తో పాటు మరో ఆరేడు సంస్థలకు అతను ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు. ప్రారంభ సంవత్సరాలలో అతనికి కమీషన్ గా ఇచ్చింది అర్థశాతమే. తొలి ఏడాదిలోనే 1,500,000 గోడెన్ల వ్యాపారం జరిగి, ఆ అర్థశాతం కమీషన్ నుంచే అతనికి 7,500 గోడెన్ల ఆదాయం సమకూడింది. అప్పటికి రెండు మూడేళ్ళ క్రితం అతను కలలో కూడా ఊహించలేని రాబడి అది. పొద్దుట చీకటితోనే లేచి, దాదాపు అర్థరాత్రివరకూ తన డెస్క్ దగ్గర నిలబడి ప్రతి చిన్న వివరం మీదా దృష్టి పెట్టి, లాభం ఎక్కువా తక్కువా అని చూడకుండా దానిని సాధించే ప్రతి ఉపాయాన్నీ అనుసరిస్తూ పోయిన ఫలితమే ఈ విజయం.

Heinrich Schliemann. Portrait of Heinrich Schliemann (1822-90), German archaeologist and discoverer of the ruins of the legendary city of Troy. After finishing his formal education at 14, Schliemann went into business and made his fortune. In 1863 he reti

ఆ ఏడాదిలోనే అతను నాలుగుసార్లు మాస్కోకు వెళ్ళి వచ్చాడు. అక్టోబర్ నాటికి వ్యవహారాలు ఎంత సాఫీగా సాగిపోతూవచ్చాయంటే, వ్యాపార పర్యటనకు విహారయాత్రను కూడా జోడిస్తూ జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్ లను ఓసారి చుట్టివచ్చాడు. మధ్యలో కొన్ని గంటలు ఏమ్ స్టడామ్ లో ఆగి హైన్ రిచ్ ష్రోడర్ ను కలిసి తమ పాత సంబంధానికి కొత్త తళుకు నద్దాడు. ఆయన మీద అతనికి గాఢమైన కృతజ్ఞతాభావం ఉంది.

తన పర్యటనలో అతన్ని ఎక్కువ ఆకట్టుకున్నది పారిశ్రామిక అభివృద్ధి. రైళ్లు, వంతెనలు, ఫ్యాక్టరీలు, టెలిగ్రాఫ్ వగైరాలతో యూరప్ నూతన పారిశ్రామిక శకంలోకి శరవేగంతో దూసుకువెడుతోందనీ, రష్యా మాత్రం వెనకబడిపోయిందనీ అనుకున్నాడు. తన దత్తత దేశానికి పారిశ్రామిక ప్రయోజనాలు తెచ్చిపెట్టడం కోసమే తనను ప్రత్యేకంగా ఎంచుకున్నారని కూడా అతనికి అనిపించేది. క్రమంగా తనను ఓ రష్యన్ గానే భావించుకోవడం ప్రారంభించాడు. జార్ గురించి మాట్లాడేటప్పుడు “మన జార్” అనీ; రష్యాను “మన రష్యా” అనీ అనేవాడు.

సంపదను అనుభవిస్తున్నా అతని పొదుపు అలవాటు పోలేదు. ప్రయాణాలలో అతను పెద్ద పెద్ద హోటళ్లలోనే దిగేవాడు. కానీ అతి తక్కువ కిరాయి ఉన్న గదినే ఎంచుకునేవాడు, అది కూడా సాధారణంగా చిట్టచివరి అంతస్తులో. సరిగ్గా పైకప్పు కింద ఉండడమే అతనికి ఇష్టంగా ఉండేది. ఏమ్ స్టడామ్ లో చవకబారు లాడ్జీలలో మిద్దె కింద ఉంటూ రెండేళ్లలో ఏడు భాషలు నేర్చుకున్నప్పటినుంచీ అతనికి కలిగిన ఇష్టం అది.

లండన్ అతనికి నచ్చింది. కాకపోతే అక్కడి విలక్షణమైన విక్టోరియన్ తరహా ఆదివారాలను గడపడం మాత్రం నచ్చలేదు. బ్రిటిష్ మ్యూజియం అంతా కలయ తిరిగి శవపేటికల్లోని మమ్మీలు; గ్రీకు, రోమన్ కళాత్మక కలశాల జాబితాను జాగ్రత్తగా రాసుకున్నాడు. మాంచెస్టర్ కు రైలు ప్రయాణం అతనికి చాలా ఆహ్లాదం కలిగించింది. యూరప్ మొత్తంలో అతి వేగంగా వెళ్ళే రైలు అదే. ఆ రోజుల్లో మాంచెస్టర్ ప్రపంచంలోనే అతి పెద్ద పారిశ్రామిక కేంద్రం. ఎక్కడ చూసినా కణకణా మండే బొగ్గు కొలుముల, పొగ గొట్టాలతో ఫ్యాక్టరీల సందడే సందడి. జర్మనీకి పంపడం కోసం అక్కడ నిర్మిస్తున్న ఓ అతి పెద్ద రైలును, “ కాగితాన్ని కత్తిరించించినంత అవలీలగా” ఇనుమును కత్తిరించడాన్ని అతను విప్పారిన కళ్ళతో చూశాడు. ఆవిరి ఓడలు, ఓడ రేవులు, ఇనప కర్మాగారాలు, ఇంగ్లండ్ లో ఈ చివర దక్షిణం నుంచి, ఆ చివర ఉత్తరపు కొసన ఉన్న స్కాట్లాండ్ కు సందేశాన్ని పంపగలిగే టెలిగ్రాఫ్…ప్రతిదీ అతనికి ఆశ్చర్యానందాలు కలిగించాయి. నమ్మశక్యం కానంత అద్భుతంగా తోచాయి. ‘సృష్టికర్త’ చేసిన ఈ అమోఘమైన ఏర్పాట్లన్నీ వ్యాపారాభివృద్ధి కోసమే ననుకున్నాడు. పారిశ్రామిక విప్లవాన్ని అంత నిర్మలంగా ఎవరూ చూసి ఉండరు.

స్వస్థలమైన మెక్లంబర్గ్ లో ఆగకుండా లే అఫ్రే, పారిస్, బ్రస్సెల్స్, కొలోన్ , డుస్సేడార్ఫ్, హాంబర్గ్, బెర్లిన్ మీదుగా అతను సెయింట్ పీటర్స్ బర్గ్ కు తిరిగివచ్చాడు. మెక్లంబర్గ్ కు వెళ్లకపోవడానికి ఓ కారణం ఉంది. మిన్నా గురించి వాకబు చేయమనీ, ఆమెను తను పెళ్లాడే స్థితిలో ఉన్నాననీ న్యూ స్ట్రెలిజ్ లోని హెర్ లవాకు ఆ ఏడాదిలోనే ఉత్తరం రాశాడు. అతని నుంచి వచ్చిన జవాబు అతనికి పిడుగుపాటు అయింది. ఆ ఆఘాతం అతనిని చంపినంత పని చేసింది.

అతనా ఉత్తరం రాయడానికి కొన్ని వారాల ముందే మిన్నా మెయింకేకు ఓ స్థానిక రైతుతో పెళ్లి జరిగిపోయింది!!!

                                                                                                                     (సశేషం)

 

 

 

 

మీ మాటలు

  1. భాస్కరం గారూ..
    ఏదో హిస్టారికల్ సినిమా చూస్తున్నట్లు ఉంది. స్లీమన్ అసలు కథ కోసం ఎదురు చూస్తూ..

    • కల్లూరి భాస్కరం says:

      నేను కూడా స్లీమన్ అసలు కథలోకి రావడానికి ఆత్రంగా ఎదురుచూస్తున్నాను మోహన్ గారూ…

  2. రెండేళ్లలో ఏడు భాషలు నేర్చుకోవడమా.. అదీ 19వ శతాబ్దంలో.. నమ్మశక్యం కాని విషయం. కానీ నమ్మాల్సిందే. నిజంగానే సగం సినిమా చూపించారు మీరు. చదువుతుంటే అక్షరాలు కాకుండా దృశ్యాలు కనిపించాయి. మలిభాగం ఎప్పుడో మరి.

    • కల్లూరి భాస్కరం says:

      థాంక్స్ రాజశేఖర రాజుగారూ…రెండేళ్లలో ఏడు భాషలు నేర్చుకోవడం నమ్మశక్యమా అనిపిస్తుంది కానీ స్లీమన్ లాంటి అదో టైపు మనుషులకు అసాధ్యం కాదేమో!

మీ మాటలు

*