అతని కారునల్లని సంతకం!

పి. మోహన్ 

 

P Mohanకళాకారులందరి లక్ష్యం జనాన్ని చేరుకోవడం. చిత్త లక్ష్యం వారిని చేరుకోవడమే కాకుండా చైతన్యవంతం చేయడం కూడా. కనుక అతని మార్గం భిన్నం. పునజ్జీవనం పేరుతో పాత కథలకు కొత్త మెరుగులద్ది తృప్తిపడిపోయే నాటి బెంగాల్ కళాశైలి అతనికి నచ్చలేదు. జనానికి అర్థం కాని సొంతగొడవల, డబ్బాశల పాశ్చాత్య వాసనల బాంబే, కలకత్తా శైలులు అసలే నచ్చలేదు. తన బొమ్మలు జనబాహుళ్యానికి అర్థం కావాలి, తను చెప్పేదేమిటో వాళ్ల మనసుల్లోకి నేరుగా వెళ్లాలన్నదే అతని సంకల్పం. ‘ఒక చిత్రం గురించి నువ్వూ నేనూ ఏమనుకుంటున్నాం అనేదానికి కాకుండా, ఎక్కువమంది ఏమనుకుంటున్నారనే దానికి ప్రాధాన్యమివ్వడమే అభ్యుదయ మార్గం’ అన్న లెనిన్ మాట దివిటీ అయ్యింది. అందుకే జనానికి కొరుకుపడని పిచ్చిప్రయోగాలవైపు, గ్యాలరీలకు పరిమితమయ్యే ఆయిల్స్, వాటర్ కలర్స్, వాష్ వంటివాటివైపు కాకుండా జనంలోకి ఉప్పెనలా చొచ్చుకెళ్లే ప్రింట్లకు మళ్లాడు.

ప్రజాకళాకారులకు ప్రింట్లకు మించిన ఆయుధాల్లేవు. ఆయిల్ పెయింటింగ్ వేస్తే, అది కళాఖండమైతే ఒక ఇంటికో, గ్యాలరీకో పరిమితం. ప్రింట్లు అలా కాదు. కొద్దిపాటు ఖర్చుతో ఇంటింటికి, ప్రతి ఊరికి, లోకానికంతటికీ పంచి, జనాన్ని కదం తొక్కించొచ్చు. ఒక్కోటీ ఒక్కో కళాఖండం. అందుకే అవి రష్యా, చైనా, మెక్సికన్ విప్లవాలకు పదునైన ఆయుధాలు అయ్యాయి. జర్మనీలో కేథే కోల్విజ్, హంగరీలో గ్యూలా దెర్కోవిట్స్, మెక్సికోలో సికీరో, ఒరోజ్కో, లేపోల్దో మెందెజ్,  చైనాలో లీ కున్, అమెరికాలో చార్లెస్ వైట్.. అనేక దేశాల్లో అనేకమంది జనచిత్రకారులు ప్రింట్లతో సమరశంఖాలు పూరించారు. వాళ్లకు ముందు స్పెయిన్లో గోయా యుద్ధబీభత్సాలపై, మతపిచ్చి వెధవలపై లితోగ్రాఫులతో ఖాండ్రించి ఉమ్మేశాడు. ఎడ్వర్డ్ మంక్, పికాసో, మతీస్.. ప్రింట్లతో చెలరేగిపోయారు. వీళ్లందరికంటే ముందు యూరప్ లో ద్యూరర్, బ్రూగెల్, రెంబ్రాంత్ లు ప్రింట్లలో కావ్యాలు చెక్కితే.. హొకుసాయ్, హిరోషిగే వంటి అమరకళావేత్తలు రంగుల ప్రింట్లతో తూర్పుకళ సత్తా చాటారు. చిత్తపై వీళ్లందరి ప్రభావం ఎంతో కొంత కనిపిస్తుంది. కానీ అతని కళ భారతీయతకు ఎన్నడూ దూరం కాలేదు. కాళీఘాట్ వంటి బెంగాలీ జానపద కళాశైలులు, మొగల్ సూక్ష్మచిత్రాలు, ప్రాచీన భారత కుడ్యచిత్రాల్లోని, శిల్పాల్లోని సరళత, స్పష్టత అతని చిత్రాల్లో కొత్త సొగసులు అద్దుకున్నాయి.

chitta1

ప్రింట్ల శక్తి, సౌలభ్యాలన్నింటిని చిత్త పూర్తిగా వాడుకున్నాడు. తర్వాత వాటిని అంత బలంగా వాడుకున్నవాడు చిత్తకంటే ఆరేళ్లు చిన్నవాడైన హరేన్ దాస్ ఒకడేనేమో. కరువుకాటకాలు, విప్లవం, శాంతి, ప్రణయం, ప్రసవం, పసితనం.. ప్రతి బతికిన క్షణాన్నీ చిత్త తన ప్రింట్లలో నిండైన భావసాంద్రతతో బొమ్మకట్టాడు. కరువుపై అతని ప్రింట్ల పుస్తకాలను బ్రిటిష్ వాళ్లు తగలబెట్టారంటే అతని కళాశక్తి ఎంతటితో అర్థం చేసుకోవచ్చు.

చిత్త అనగానే తొలుత ఎవరికైనా గుర్తుకొచ్చేది అతని పోరాట చిత్రాలు, బెంగాల్ కరువు చిత్రాలే. కరువు పీడితులను అతనంత బలంగా ప్రపంచంలో మరే కళాకారుడూ చూపలేదు. అతని కరువు చిత్తరువులు ఆకలి పేగుల ఆర్తనాదాలు, ఆరిపోయిన కన్నీటి చారికలు.

 

1943-44 నాటి బెంగాల్ కరువు 30 లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. ప్రకృతి విపత్తు, మనిషి స్వార్థం కలగలసి కరాళనత్యం చేశాయి. 1942లో వచ్చిన తుపానులో పంటలు దెబ్బతిన్నాయి. రోగాలు పెచ్చరిల్లాయి. మరోపక్క.. రెండో ప్రపంచ యుద్ధంలో బర్మాపై దాడి చేసి బెంగాల్ సీమలోకి చొచ్చుకొస్తున్న జపాన్ ఫాసిస్టులపై పోరాడుతున్న సైనికులకు బళ్లకొద్దీ తిండిగింజలు తరలించారు. బర్మా నుంచి బియ్యం సరఫరా ఆగిపోయింది. దేశభక్తులు కొందరు తమ పంటను బ్రిటిష్ వాడికి అమ్మకుండా నదుల్లో పడేశారు, కాల్చేశారు. కొందరు దేశీవ్యాపారులకు అమ్మేశారు. నల్లబజారు జడలు విప్పింది. పోలీసులు, అధికారులు కొమ్ముకాశారు. జనం పిడికెడు తిండిగింజల కోసం పొలాలు, బొచ్చెలు బోలెలు అమ్ముకున్నారు. అడుక్కుతిన్నారు, వలస పోయారు. ఏదీ చేతకాకపోతే దొంగతనాలకు, కరువు దాడులకు పాల్పడ్డారు. అవి చేతగాని ఆడకూతుళ్లు ఒళ్లు అమ్ముకున్నారు. లక్షల మంది మంచినీళ్లు దొరక్క మలేరియాతో చచ్చిపోయారు. ఒకప్పుడు పాడిపంటలతో కళకళలాడిన వంగదేశపు పల్లెసీమల్లో ఎక్కడ చూసినా పీనుగులు, ఆకలి కేకల సజీవ కంకాళాలే కనిపించాయి. కరువును దగ్గరగా చూసి రిపోర్ట్ చేయాలని పార్టీ చిత్తను నవంబర్ లో మిడ్నపూర్ కు పంపింది. చిత్త ఆ శవాల మధ్య, ఆకలి జీవుల మధ్య తిరుగాడి మానవ మహావిషాదాన్ని నిరసనాత్మక నలుపు రూపాల్లోకి తర్జుమా చేశాడు.

2 (5)

సంచిలో కాసిన్ని అటుకులు, స్కెచ్ ప్యాడు, పెన్నుతో కాలినడకన క్షామధాత్రిలో తిరిగాడు. కనిపించిన ప్రతి ఆకలిజీవినల్లా పలకరించి, బొమ్మ గీసుకున్నాడు. కూలిన గుడిసెలను, నిర్మానుష్య పల్లెలనూ గీసుకున్నాడు. ‘ఈ బొమ్మలతో వాళ్లను నేనేమాత్రం ఆదుకోలేనని తెలుసు. కానీ, అవి కళ అంటే విలాసమని భావించేవాళ్లకు ఒక పచ్చినిజాన్ని చాటి చెబుతాయి’ అన్నాడు. చిత్త అలా తిరుగుతున్నప్పుడే అతని తండ్రి కరువు సహాయక కార్యక్రమాల్లో ఉన్నాడు. ఎక్కడెక్కడినుంచో దాతలు పంపిన తిండిగింజలు దారిలోనే మాయమైపోతున్నాయని, బాధితులకు దొరుకుతున్నది పిడికెడేనని కొడుక్కి చెప్పాడు. చిత్త ఆ కరువు సీమలో ఎలా తిరిగాడో అతని చెల్లి ‘ఒంటరి పరివ్రాజకుడు’ వ్యాసంలో రాసింది. ‘అన్నయ్య ఊర్లు తిరిగి చింపిరి జుట్టుతో, మాసిన బట్టలతో, చెప్పులతో ఇంటికి వచ్చేవాడు. బోలెడన్ని బొమ్మలు గీసుకుని తెచ్చేవాడు. అమ్మ గదిలో కూర్చుని తను చూసిన ఆకలి జనం బాధలను రుద్ధకంఠంతో గంటలకొద్దీ వివరించేవాడు.’

chitta2

చిత్త కరువు నీడలను చిత్రించడంతోపాటు తన పర్యటన అనుభవాలను వివరిస్తూ ‘పీపుల్స్ మార్చ్’ ప్రతికలో సచిత్ర వ్యాసాలూ రాశాడు. కరువులో కాంగ్రెస్, హిందూమహాసభల కుళ్లు రాజకీయాలను ఎండగట్టాడు. ఆ రుద్రభూమిలో జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆస్తులు పోగేసి కొత్త మేడ కడుతున్న వైనాన్ని, ఆ కామందును తిడుతూ ఊరివాళ్లు కట్టిన పాటనూ పరిచయం చేశాడు ‘అభివృద్ధి’ పేరుతో ఈ నేలమీది సమస్త వనరులనూ దేశవిదేశీ పెట్టుబడి దెయ్యాలకు కట్టబెడుతూ, ‘సొంత అభివృద్ధి’ చూసుకుంటున్న నేటి జనసంఘీయులను చిత్త చూసి ఉంటే బొమ్మలతో చావచితగ్గొట్టి ఉండేవాడు.

మిడ్నపూర్ పర్యటన అనుభవాలతో, బొమ్మలతో చిత్త 1943లో ‘హంగ్రీ బెంగాల్’ పేరుతో ఓ చిన్న పుస్తకం అచ్చేశాడు. ఆకలి వ్యథలను కేవలం సాక్షిలా కాకుండా ఆర్తితో, ఆక్రోశంతో వినిపించాడు. ఓపిక ఉంటే, వినండి అతడు బొమ్మచెక్కిన ఆ అభాగ్యుల దీనాలాపనలను…

‘‘ఓ రోజు దారి పక్కన ఇద్దరు ముసలి ఆడవాళ్లు, ముగ్గురు నడీడు వితంతువులు, ఒక యువతి కనిపించారు. ఎక్కడినుంచో తెచ్చుకున్న కాసిని తిండిగింజలను మామిడి చెట్టుకింద పొయ్యి వెలిగించి వండుకుంటున్నారు. వితంతువుల్లో ఒకామె చేతిలో 11 రోజుల పసికందు ఉంది. మరొకామె గర్భిణి. వాళ్లకు తిరిగి తమ ఊళ్లకు వెళ్లాలని ఉంది. దగ్గర్లో ఓ కామందు వస్త్రదానం చేస్తున్నాడని, అందుకోసం ఆగిపోయామని చెప్పారు. ‘రేపు మా అన్నయ్య ఎడ్లబండిలో వస్తాడు, ఊరికి వెళ్తాను’ అని బాలింత చెప్పింది.. పక్షం రోజు తర్వాత అదే దారిలో రిక్షాలో వెళ్లాను. ఓ పోలీసు ఇద్దరు చింపిరి యువకులతో, ఇదివరకు నేను మాట్లాడిన యువతితో గొడవ పడుతున్నాడు. రిక్షావాలా చెప్పాడు.. ‘ఈ ఆడాళ్లు ఒళ్లు అమ్ముకోవడం మొదలుపెట్టారు. పాపం ఇంకేం చెయ్యగలరు? రోజుల తరబడి, వారాల తరబడి తిండి లేకపోతే మానం మర్యాదలకు విలువేముంటుంది బాబూ?’..

chitta3‘‘కరువుపై సభ పెట్టడానికి ప్రభుత్వం అనుమతివ్వడం లేదని పార్టీ కామ్రేడ్లు చెప్పారు. పార్టీ పోస్టర్లను ఓ సీఐడీ చింపేసి జనాన్ని భయపెట్టాడు. ఈ ప్రాంతంలో మళ్లీ పోస్టర్లు కనిపిస్తే చావగొడతామని బెదిరించాడు.. ఇంతకూ ఆ పోస్టర్లో ఏముంది? కరువును ఎదుర్కోడానికి అందరూ ఏకం కావాలన్న పిలుపు, దేశనాయకులను విడుదల చేయాలన్న డిమాండ్, మా భూమిని మేం కాపాడుకుంటామన్న ప్రకటన..

‘‘కుదుపుల బస్సులో ఇబ్బంది పడుతూ మధ్యాహ్నానికి కాంతాయ్ చేరుకున్నాం. రాత్రుళ్లు నిద్రలేకపోవడంతో ఒంట్లో నలతగా ఉంది. కాంతాయ్ లో ఆ రోజు సంత. బియ్యం ఎక్కడా కనిపించలేదు. పప్పు దినుసుల అంగళ్ల వద్ద జనం మూగి ఉన్నారు. అయితే స్వర్ణకారుడి వద్ద, పాత్రల అంగళ్ల వద్ద అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. ఒక్కో అంగడి వద్ద పది, పదిహేను మంది రైతులు తమ వంటసామాన్లను అమ్మడానికి వరుసగా నిల్చుని ఉన్నారు.  ఇత్తడి కంచాలు, గిన్నెలే కాదు దీపపు కుందీలు, దేవుడి గంటలు, హారతి పళ్లేలు వంటి పూజాసామగ్రినీ అమ్మడానికి తెచ్చారు. ఒకచోట బెనారస్ లో తయారైన శ్రీకృష్ణుడి కంచుబొమ్మ కూడా కనిపించింది. అది రెండు రూపాయల 12 అణాల ధర పలికింది. ఈ దేవుళ్లు తమ పేదభక్తులను వదలి బానపొట్టల హిందూవ్యాపారుల చెంతకు చేకుంటున్నారు…  మధ్యాహ్నం రెండుకల్లా అంగళ్ల నుంచి జనం వెళ్లిపోయారు. అదే రోజు ఓ ఓడ సంతలో అమ్మిన వంటసామాన్లతో కోలాఘాట్ కు బయల్తేరింది. రెండు పడవల్లో కూడా పాత్రలు తీసుకెళ్లారు. నెల రోజుల నుంచి ఇదే తంతట.. రైతులు ఒక్క పాత్రకూడా ఉంచుకోకుండా అన్నింటినీ తెగనమ్మడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది..

3 (4)

‘‘ఓ రోజు పల్లె పొలిమేరలో నడుస్తున్నాం. ‘అదిగో, అటు చూడు, వరిపొలంలో ఏదో కదులుతోంది!’ అన్నాడు తారాపాద. ఓ ఆరేళ్ల పిల్లాడు పండిన పొలం మధ్య మౌనంగా కూర్చుని ఉన్నాడు. ఏపుగా పెరిగిన పొలం నీడలో ఆ పిల్లాడి తెల్లకళ్లు తప్ప మరేమీ కనిపించడం లేదు. మాటలకందని దృశ్యం అది. ఆ పిల్లాడు మేం పిలవగానే వచ్చాడు. ఎముకలతో తయారైన చిన్ననల్లబొమ్మలా ఉన్నాడు. అతని చిట్టికథ తెలుసుకున్నాం. అతని తండ్రి జ్వరంతో, తల్లి మలేరియాతో చనిపోయారు. పెద్దన్న చెప్పాపెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. పదేళ్లున్న మరో అన్న.. జనం వదిలిపోయిన ఆ గ్రామంలోని ఓ బ్రాహ్మడి ఇంట్లో పాలేరు. ఆ ఇంటివాళ్లు పెట్టే తిండిని అన్నదమ్ములు పంచుకుని తినేవాళ్లు. అయితే కొన్ని రోజులుగా ఇతనికి తిండిపెట్టడం లేదు. అన్నం కావాలని ఏడిస్తే కొట్టారు. ఇప్పటికీ చెయ్యి నొప్పెడుతోంది. చివరికి ఇతన్ని ఇంట్లోంచి గెంటేశారు.. మళ్లీ మీ అన్నదగ్గరికి వెళ్తావా అని అడిగాడు తారాపాద. అతడు తలను గట్టిగా అటూ ఇటూ ఊపి, పోను అన్నాడు. గంజిపోసి, బట్టలిచ్చే అనాథాశ్రమం దగ్గర్లో ఉందని అతనికి అర్థమయ్యేలా చెప్పి, వెళ్తావా అని అడిగాం. సరేన్ననాడు. అతని పేరు అనంత. నిన్ను ఎత్తుకుని నడుస్తాం అని చెప్పాం. అతడు టక్కున ఉహూ అన్నాడు..

‘‘సాయంత్రం అయిదవుతుండగా జనుబాషన్ గ్రామానికి వెళ్లాం. ఐదు గుడిసెలే ఉన్నాయి.. ఊరి ఆనవాళ్లే లేవు. చిన్నసంచి, రెండుమూడు మట్టికుండలతో ఎక్కడికో వలసపోతున్న భార్యాభర్తలు కనిపించారు. ఆడమనిషి కొత్త ముతక చీరకట్టుకుని ఉంది. దాన్ని దగ్గర్లోని గంజికేంద్రంలో ఇచ్చారట. భర్త తుండుగుడ్డకంటే కాస్త పెద్దగా ఉన్న ధోవతీ కట్టుకుని ఉన్నాడు. వాళ్ల దీనగాథ అడిగాం. ఆ పల్లెలో మూడువందల మంది ఉండేవాళ్లట. తుపానులో వందమంది, మలేరియా, ఆకలితో మరికొందరు పోయారట. బతికినోళ్లు పట్నానికి వెళ్లగా, వీళ్లిద్దరే మిగిలిపోయారట. ఇప్పుడు వీళ్లూ వెళ్తున్నారు. ‘సరేగాని, ఈ మునిమాపున ఎందుకు వెళ్తున్నారు?’ అని అడిగాం. దొంగల భయం వల్ల అని చెప్పారు. పది రోజుల కిందట ఓ రాత్రి వీళ్లు అడుక్కుని తెచ్చుకున్న బియ్యం వండుకుంటుండగా 40 మంది బందిపోట్లు వచ్చిపడ్డారట. ఇద్దరినీ తీవ్రంగా కొట్టారట. భర్త రెండు రోజులపాటు పైకి లేవలేదట. దొంగలు సగం ఉడికిన అన్నంతోపాటు, వీళ్ల దగ్గర మిగిలున్న రెండు ఇత్తడిపాత్రలను, చివరికి మురికి గుడ్డలను కూడా దోచుకెళ్లారట. ఈమెకు ఒంటిపై కప్పుకోవడానికి రెండు రోజులపాటు గుడ్డకూడా లేదట..

chitta6

‘‘గోపాల్ పూర్ లో రోడ్డు పక్కన ఓ వితంతువు శ్యామా గడ్డి విత్తనాలు సేకరిస్తోంది. మూడు గంటలు కష్టపడితే పిడికెడు గింజలు దక్కాయి. ఆమెకు ఆ పూటకు అవే భోజనం..

‘‘అతని పేరు క్షేత్రమోహన్ నాయక్, అందరి మాదిరే రైతు. భార్యాబిడ్డలు ఆకలి, మలేరియాలతో చనిపోయారు. వాళ్ల అంత్యక్రియలు పూర్తికాకముందే అతనికీ మలేరియా సోకింది. మేం అతన్ని చూసేసరికి అతని కళేబరం కోసం కుక్కలు, రాబందులు కాట్లాడుకుంటున్నాయి. దహనం కోసం ఆ శవాన్ని నిన్న రాత్రి శ్మశానానికి తీసుకొచ్చారు. చితి వెలిగించేలోపు అక్కడున్నవారికీ జ్వరం కమ్మేసింది. శవాన్ని అలాగే వదిలేసి ఇళ్లకు పరిగెత్తారు. ఇప్పుడు వాళ్ల  శవాలను మోసుకెళ్లడానికి ఎవరైనా మిగిలి ఉంటారా?.. క్షేత్రమోహన్ కు పట్టిన దుర్గతి బెంగాల్ జిల్లాల్లో అసాధారణమైందేమీ కాదు. కానీ.. క్షేత్రమోహన్ నోటికాడి కూడు లాక్కుని, బోలెడు లాభాలు కూడబెడుతున్నవాళ్లను మనమింకా క్షమించడమే కాదు ప్రోత్సహిస్తున్నాం కూడా..’’

ఇలాంటి మరెన్నో మింగుడుపడని నిజాల ‘హంగ్రీ బెంగాల్’ పుస్తకం సంగతి తెల్లదొరలకు తెలిసింది. అచ్చేసిన ఐదువేల కాపీలనూ తగలబెట్టారు. చిత్త తన తల్లికి పంపిన ఒక పుస్తకం మాత్రం భద్రంగా మిలిగింది. పార్టీ పత్రికలకు చిత్త వేసిన బొమ్మల బ్లాకులు కూడా పోయాయి. అతన్ని పోలీసులు పట్టుకుపోతారనే భయంతో పత్రికల నిర్వాహకులే వాటిని నాశనం చేశారు.

మిడ్నపూర్ కరువు ప్రాంతాల పర్యటన తర్వాత చిత్త 1944లో జూన్-ఆగస్టు మధ్య మరో కరువు సీమకు వెళ్లాడు. బిక్రమ్ పూర్, కాక్స్ బజార్, మున్షీగంజ్, చిట్టగాంగ్ లలో కరువు దెబ్బకు సర్వం కోల్పోయిన జనం బొమ్మలు గీశాడు. వాటి వెనక వాళ్ల పేర్లు, ఊళ్లు, వాళ్ల కష్టాలను నమోదు చేశారు. జాలరి అబ్బుల్ సత్తార్, రైతు అలీ అక్బర్, నేతగాడు గనీ, రోగిష్టి హలీషహర్, వేశ్యగా మారిన చిట్టగాంగ్ బట్టల వ్యాపారి భార్య అలోకా డే, ఆస్పత్రితో అస్థిపంజరంలా పడున్న ముసలి మెహర్జెన్, ఒంటికింత బట్టలేక తనకు వీపులు తిప్పి ఇంట్లోకి వెళ్లిపోయిన బాగ్దీ కుటుంబం.. అన్నింటిని గుండెబరువులో ఆవిష్కరించాడు. ‘ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపా’న్నీ జడుసుకునేలా చూపాడు. ఆకలి తాళలేక పిచ్చెక్కి రాయి గురిపెట్టిన బాలుడి బొమ్మచూస్తే కన్నీళ్లూ, క్రోధమూ వెల్లువెత్తిపోతాయి.

బెంగాల్ కరువును చిత్త మిత్రులైన సోమనాథ్ హోరే, జైనుల్ అబెదిన్ లతోపాటు గోపాల్ ఘోష్, గోవర్ధన్ యాష్ వంటి ఇతర బెంగాల్ చిత్రకారులు కూడా వేశారు. అయితే వాళ్ల బొమ్మలు చిత్త బొమ్మలంత శక్తిమంతంగా కనిపించవు. నందలాల్ బోస్, గోపాల్ గోష్ వంటి బెంగాల్ స్కూల్ వాళ్లకు ఆ కరువు కలిపురుషుడి బీభత్సమైతే, చిత్తకు అది మనిషి స్వార్థం సృష్టించిన మృత్యుకాండ. అందుకే అతని చిత్రాల్లో అంత మానవతా, భావగాఢతా, కన్నీరూ. ‘మనిషి తన మానవతకు పట్టే నీరాజనమే కళ’ అని అంటాడు ప్రముఖ కళావిమర్శకుడు హెర్బర్ట్ రీడ్. ఆధునిక భారతంలో ఆ నీరాజనం పట్టిన పిడికెడు మందిలో చిత్త ఒకడు.

                                   నాలుగు భాగాల్లో ఇది రెండో భాగం. మూడో భాగం వచ్చేవారం..

 

మీ మాటలు

  1. kandukuri ramesh babu says:

    ప్రింట్లను గొప్ప సాధనంగా మలుచుకున్న తీరు చదువుతుంటే ఇప్పటి మాధ్యమాల్లో ఫొటోగ్రఫి ఎంత చక్కటి ఆయుధమో అర్థమౌతున్నది. మీ వ్యాసం చాలా మేలు చేసింది నాకు. అట్లే, చిత్తప్రసాద్ గురించి ఆర్టిస్టు మోహన్ గారు రాసే వాటిల్లో పీపుల్ కన్ సర్న్ కన్నా ఆర్టిస్టుగా చిత్ర ప్రసాద్ గొప్పతనమే తెలిసేలా రాస్తారు. మీరు ఆ దాన్నుంచి దూరం జరిగి ఆ చిత్రకారుడి ఇతివృత్తం లేదా వస్తువు జీవితం అన్న స్పృహ కలిగేలా చదువుతుంటే కళాకారుడి బాధ్యత అంటే ఏమిటో బాగా అర్థం చేయించారు. సజీవ కళాకారులను ఇలా పరిచయం చేయడం చాలా అవసరం. లేకపోతే గ్యాలరీ ఆర్టిస్టుల మధ్య పీపుల్స్ ఆర్టిస్టులు చచ్చిపోతారు. చాలా థాంక్స్ మోహన్ గారు.

  2. P Mohan says:

    ధన్యవాదాలు రమేష్ గారూ.
    చిత్తప్రసాద్ అంతలా కాకున్నా జనజీవితాన్ని అపురూపంగా చిత్రమయం చేసిన వాళ్లు కొందరున్నారు. మీరన్నట్టు వాళ్లు గ్యాలరీ ఆర్టిస్టుల మధ్య చచ్చిపోయారు.

మీ మాటలు

*