రాముడు, ఓడిసస్…ఇద్దరూ సౌరవీరులే!

కల్లూరి భాస్కరం 

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)తూర్పు, పడమరల మధ్య ఆశ్చర్యకరమైన అనేక పోలికల గురించి చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటిదే…

భాగవతం ప్రకారం; అపారమైన రక్తపాతం, విధ్వంసం నిండిన మహాభారతాన్ని చెప్పిన తర్వాత వ్యాసుడు తీవ్ర మానసిక అశాంతికి లోనయ్యాడు. అప్పుడు నారదుడు ఆయన దగ్గరకు వచ్చి విష్ణుభక్తి ప్రధానమైన భాగవతాన్ని చెప్పమనీ, అప్పుడు నీ మనసుకు శాంతి కలుగుతుందనీ చెప్పాడు. వ్యాసుడు అలాగే చేసి శాంతి పొందాడు.

గ్రీకుల హోమర్ కూడా మొదట యుద్ధ ప్రధానమైన ‘ఇలియడ్’ ఇతిహాసాన్ని చెప్పాడు. ఆ తర్వాత తత్వ ప్రధానమైన ‘ఒడిస్సే’ చెప్పాడు. ఈ రెండింటి కాలిక నేపథ్యం క్రీ.పూ. 1250-1150.  మూడు శతాబ్దాల తర్వాత, క్రీ.పూ. 850లో ఇలియడ్, క్రీ.పూ. 750లో ఒడిస్సే రూపొందాయి. వ్యాసుడు అనే పేరు కేవలం ఒక్క వ్యక్తిని కాక ఒక పదవిని సూచిస్తుందనీ, ఆ పదవిలో ఉన్నవారిని అందరినీ వ్యాసులనే అంటారనీ చెప్పే సంప్రదాయం మనకు ఉంది. హోమర్ విషయంలోనూ గ్రీకులలో అలాంటి సంప్రదాయమే ఉంది. ఇది వ్యాస, హోమర్ ల మధ్య ఇంకొక పోలిక.

మహాభారతానికీ, ఇలియడ్ కూ ఉన్న పోలికలు చూద్దాం.  కురు-పాండవ వీరులందరూ  దేవతాంశతో(దుర్యోధనుడు లాంటి కొంతమంది రాక్షసాంశతో లేదా కలిఅంశతో) పుట్టినట్టు మహాభారతం చెబుతోంది. ఇలియడ్ లోని వీరులు కూడా దేవతాంశ(“divine race of heroes”)కలిగినవారే. మహాభారతం ప్రధానంగా పితృస్వామిక వ్యవస్థను, అందులో ప్రాధాన్యం వహించే పురుషుడిలో ఉండవలసిన ఉత్తమగుణాలను నొక్కి చెబుతుంది. అతడు అధర్మాన్ని అణగదొక్కి ధర్మస్థాపన చేయవలసిన వీరుడు, సాహసి, కష్టసుఖాలను సమంగా తీసుకునే స్థిరచిత్తుడు, ప్రజలను చల్లగా చూసే పాలకుడు, మాట తప్పనివాడు, నీతిమంతుడు, గొప్ప సహనం, సంయమనం ఉన్నవాడు…ఇలాంటి ఇంకా అనేకానేక సుగుణాల రాశి.  స్థూలంగా ధర్మరాజు, అర్జునుడు తదితరులు ఈ సుగుణాలకు ప్రాతినిధ్యం వహిస్తే; వీటికి విరుద్ధమైన గుణాలకు దుర్యోధనుడు, కొంతవరకు కర్ణుడు మొదలైనవారు  ప్రాతినిధ్యం వహిస్తారు.

ఈవిధంగా ధర్మం-అధర్మం, నీతి-అవినీతి, మంచి-చెడు అనే పరస్పర వ్యతిరేకమైన జంట పదాలూ; వాటికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు, శక్తుల మధ్య సంఘర్షణా; ఆ సంఘర్షణలో ధర్మం, నీతి, మంచి విజయం సాధించడం అనే ఒక సూత్రం లేదా ఒక మూస క్రమంగా రూపొందింది.  ఇంతకుముందు చెప్పుకున్నది ‘స్త్రీసూత్రం’ అయితే, దీనిని ‘పురుషసూత్రం’ అందాం. ఇది పితృస్వామికం నుంచి రూపొందిన సూత్రం. ఎందుకంటే, మాతృస్వామికానికి చెందిన ఆదిమ పౌరాణికతలో ఇలాంటి ద్వంద్వాలు లేవు. ఈ విషయం ఇంతకుముందు చెప్పుకున్నాం. అలాగని నేటి కొలమానంలో చూసి, ధర్మానికీ, నీతికీ, మంచికీ చోటులేని వ్యవస్థగా దానిని భావించడం తొందరపాటు అవుతుంది. అది తనదైన, ప్రకృతిసిద్ధమైన ఒక ధర్మాన్ని అనుసరించిన వ్యవస్థగా కనిపిస్తుంది.  

ఇలియడ్ కు వస్తే, మహాభారతంలానే అది కూడా పైన చెప్పిన పితృస్వామిక పురుషుడిలో ఉండవలసిన ఉత్తమ లక్షణాలకు, పురుషోచిత కార్యాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇలియడ్ లో ప్రధాన దైవం అపోలో. ఈయన వెలుగు నిచ్చే దేవుడు. అంటే సూర్యునిలాంటివాడు.  అలాగే, వీరత్వంలాంటి గుణాలను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లి పురుషుని పురుషోత్తముడిగా మలచేది ఈయనే. వీరరస ప్రధానమైన ఇలియడ్ లో మృత్యువు ఒక్కటే చరమసత్యం; అందులో భయాశ్చర్యాలకు తావు లేదు. ఆ మృత్యువుకు అవతల, దానిని దాటలేని నిస్సహాయత తప్ప మరే శక్తీ లేదు. జీవితం తాలూకు అందాలు, అత్యున్నత సాఫల్యాలు, ఉత్తమశ్రేణికి చెందిన అందగత్తెల ప్రేమ, పొందుతో సహా నిజమైన పురుషుడికి అర్హమైనవి ఎన్ని అనుభవించినప్పటికీ మృత్యువు అనే చెలియలికట్ట వాటన్నింటినీ నీటి బుడగలుగా మార్చివేస్తుంది. అంతిమంగా చూసుకుంటే మిగిలేది బూడిదే. ఈ విషాద ధ్వని ఇలియడ్ అంతటా పరచుకుని ఉంటుందని క్యాంప్ బెల్ అంటారు.

విచిత్రంగా మహాభారతానికీ ఇక్కడ చాలావరకూ పోలిక కుదురుతోంది. ప్రధానంగా ధర్మరాజు, అర్జునుడు, కృష్ణుడు పురుషోత్తమత్వం అనే కొలమానానికి దగ్గరగా ఉంటారు(ప్రత్యేకించి కృష్ణుడికి పురుషోత్తముడు అనే పేరు ఉంది, దానిని అలా ఉంచుదాం). అర్జునుడు వీరుడే గాక, ఎందరో అందగత్తెల ప్రేమను, పొందును అందుకున్నవాడు. ఒక కోణం నుంచి చెప్పుకుంటే అర్జునుడే మహాభారతంలో నాయకుడు. శత్రువును చంపడం, లేదా శత్రువు చేతిలో చావడాన్ని మించిన ధర్మం వీరుడికి(క్షత్రియుడికి) మరొకటి లేదని మహాభారతం అడుగడుగునా చెబుతుంది. చివరికి కురుక్షేత్రయుద్ధ రూపంలో మృత్యుతాండవం విపరీతమైన రక్తపాతాన్ని, విధ్వంసాన్ని సృష్టించింది. తదుపరి మహాభారత కథలో చివరివరకు ఒక విషాదపు నీడ పరచుకుని ఉంటుంది. అంతటి ధర్మరాజు కూడా జనం మెప్పు పూర్తిగా పొందలేకపోయాడనీ, అర్జునుడంతటి మహావీరుడు కూడా దారిదోపిడీ దొంగల చేతిలో ఓడిపోయాడనీ మహాభారతమే చెబుతోంది. ఎంతో వివరంగా చెప్పుకోవలసిన ఈ అంశాలలోకి మరీ లోతుగా వెళ్లడానికి ఇది సందర్భం కాదు.

ఇక విష్ణుభక్తిని, తత్వాన్ని ప్రతిపాదించే భాగవతం ఒకవిధంగా మహాభారతానికి తాత్వికమైన కొనసాగింపు అనుకుంటే,  ఇలియడ్ కు ఒడిస్సే తాత్వికమైన కొనసాగింపు.

ఒడిస్సే లో ప్రధానదైవం హెర్మెస్. ఆయన అధోజగత్తుకు, లేదా రహస్యజగత్తుకు  దారి చూపే దేవుడు. పునర్జన్మకు, మరణానంతర జ్ఞానానికీ, ఒకదానినొకటి పెనవేసుకున్న జంటపాముల ప్రతీకకు చెందినవాడు. విధిని నిర్దేశించే అఫ్రోడైట్, హేరా, ఎథెనే అనే దేవతాత్రయంతో సంబంధం కలిగిన పురుషదైవం. ఒకరకంగా మహాభారత యుద్ధానికి భూదేవి, ద్రౌపది కారణమైనట్టుగా ట్రోజన్ యుద్ధానికి ఈ ముగ్గురు దేవతలే కారణమవుతారు.

‘ఇలియడ్’ వీరత్వానికి చెందిన పురుషసూత్రం మీద ఆధారపడినదైతే, ‘ఒడిస్సే’ స్త్రీపై విజయాన్ని సూచించే స్త్రీసూత్రం మీద ఆధారపడిన రచన. ట్రోజన్ యుద్ధం పదేళ్లపాటు జరుగుతుంది. ఆ యుద్ధంలో పాల్గొన్న ఓడిసస్ మరో పదేళ్లపాటు స్త్రీ సూత్రానికి చెందిన అధోజగత్తులో లేదా రహస్యజగత్తులో సంచరిస్తాడు.  పురుషసూత్రానికి అనుగుణంగా స్త్రీ సృష్టించే అనేక ప్రతికూలతలను వీరోచితంగానూ, యుక్తితోనూ అధిగమిస్తాడు. అదే సమయంలో ఎంతో విధ్వంసాన్ని ఎదుర్కొని, సహచరులను నష్టపోతాడు. చివరికి ఒంటరిగా ఇంటికి చేరి భార్య పెనెలోప్ ను మరోసారి స్వయంవరంలో గెలుచుకుంటాడు. పెనెలోప్ అంతవరకూ అతనికోసం(పతివ్రతలా) నిరీక్షిస్తూనే ఉంటుంది. అది తన యాత్రలో ఓడిసస్ స్త్రీసూత్రంపై సాధించిన విజయానికి కొనసాగింపు.

పోలిక చూడండి. రామాయణంలో సీత కూడా లంకలో రాముడికోసం నిరీక్షిస్తూ ఉంటుంది. రాముడు యుద్ధం తర్వాత సీతను కలుసుకుంటాడు. ఆయన విధించిన శీలపరీక్షలో నెగ్గి సీత పాతివ్రత్యాన్ని స్థాపించుకుంటుంది. అలాగే దమయంతి కూడా(పతివ్రతాధర్మం) నలుని కోసం నిరీక్షిస్తుంది. అనేక ప్రతికూల పరిస్థితులతో పురుషోచితంగా పోరాడిన తర్వాత నలుడు చివరికి దమయంతిని కలసుకుంటాడు.

స్త్రీసూత్రాన్ని జయించడంలోనే కాక, సూర్యసంబంధంలోనూ మన కథలకు, ఓడిసస్ కథకు పోలిక ఉందని  వెనకటి వ్యాసాలలో చెప్పుకున్నాం. ఓడిసస్ సౌరద్వీపానికి వెళ్ళినతర్వాతే ఒంటరిగా మిగిలి తిరిగివస్తాడు. ఆవిధంగా అతడు సౌరవీరుడు. సూర్యవంశీకుడైన మన రాముడూ సౌరవీరుడే. మాతృస్వామ్యానికి చెందిన దేవత ప్రతీకలలో వెలుగు, చీకట్ల మిశ్రమమైన చంద్రుడు ముఖ్యుడైతే, పితృస్వామ్యంలో పూర్తిగా వెలుగునిచ్చే సూర్యుడు ముఖ్యప్రతీక అన్న సంగతి గుర్తుచేసుకుని ఇంకో ఉదాహరణ చూద్దాం.

చాంద్రమానం, సౌరమానం అనే రెండు కొలమానాలు మనకు తెలుసు. చాంద్రమానం ప్రకారం ఏడాదికి 12 నెలలు, 354 రోజులు+కొన్ని గంటలు ఉంటాయి. సౌరమానం ప్రకారం ఏడాదికి 364 రోజులు+కొన్ని గంటలు. గ్రీకు ఇతిహాసకాలంలో చాంద్ర, సౌరమానాలు రెంటినీ సమన్వయం చేసే ప్రయత్నం జరిగింది. దానిప్రకారం 19 ఏళ్ళకు ఒకసారి చంద్ర, సూర్యులు కలసుకుంటారు. ఇరవయ్యేళ్లు ఇంటికి, భార్యకు దూరంగా ఉన్న ఓడిసస్ 19వ ఏట చివరిరోజున ఇంటికి చేరుకుంటాడు. సరిగ్గా అదే రోజున వెలుగుకు అధిదేవత అయిన అపోలోకు చెందిన పండుగ, సూర్యుని పండుగ వస్తాయి. ఓడిసస్ అధోజగత్తులో పశ్చిమంగా ప్రయాణించి, అక్కడి పితృదేవతలను సందర్శించి(ఇది మరో పోలిక. పితృదేవతలను సందర్శించడం మన కథలలో కూడా ఉంది), తూర్పు కొసకు చేరుకుంటాడు. అది సూర్యుడు ఉదయించే ప్రదేశమే కాక, ఉషోదేవత నర్తించే ప్రదేశం కూడా. ఇంటి దగ్గర పెనెలోప్ చంద్రునిలా వస్త్రం అల్లుతూ, అల్లినది విప్పుతూ ఉంటుంది. నేతపనికి చంద్రుడికి సంబంధం ఉందని ఇంతకుముందు చెప్పుకున్నాం.

19, 20వ శతాబ్ది ప్రారంభ కాలానికి చెందిన పండితులకు ఈవిధంగా సూర్య, చంద్రులను ఆయా విషయాలకు అన్వయించడం పరిపాటిగా ఉండేదని క్యాంప్ బెల్ అంటారు. ప్రపంచ పౌరాణిక వారసత్వం తాలూకు భావచిత్రాలు చాలావరకూ కంచు యుగానికి చెందిన విశ్వసంబంధ(cosmological) ప్రతీకలనుంచి పుట్టినవి కావడమే అందుకు కారణం. క్రీ.పూ. ప్రథమ సహస్రాబ్దికి వెడితే, మనసును లోపలికి తిప్పడంవల్ల , అంటే అంతర్ముఖత్వం వల్ల వ్యక్తి అనే సూక్ష్మరూపానికీ, విశ్వమనే బృహద్రూపానికీ తేడా లేదనే ఎరుక కలుగుతుందనే విశ్వాసం తూర్పు, పడమటి దేశాలకు చెందిన బహుళదేవతారాధకులు అందరిలోనూ ఉండేదని క్యాంప్ బెల్ అంటారు. ఆ ఎరుక సిద్ధించినప్పుడు నిత్యత్వమూ- కాలమూ; సూర్య- చంద్రులూ, స్త్రీ-పురుషులూ—ఇలా రెండుగా కనిపించేవి అన్నీ ఒకటిగా మారిపోతాయి. అలాగే, ఓడిసస్ కథలో సూర్య-చంద్రులు ఒకటవుతారు. ఇందులో సూర్యాస్తమయం అంతర్ముఖత్వానికీ, సూర్యోదయం పైన చెప్పిన ఎరుకకూ ప్రతీకలు.

ఇదే సందర్భంలో మన దగ్గర ఉన్న కుండలినీయోగాన్ని క్యాంప్ బెల్ ప్రస్తావిస్తారు. వెన్నెముకకు రెండువైపులా రెండు శక్తి మార్గాలు ఉంటాయి. మనసును, ఊపిరిని నియంత్రించడంద్వారా సర్పశక్తిని పైకి తీసుకువెళ్లే ఈ మార్గాలలో  ఒకదానిని చంద్రనాడి, రెండవ దానిని సూర్యనాడి అంటారు. సర్పం, సూర్యచంద్రులతో సహా వివిధ పౌరాణిక ప్రతీకలను పొందుపరచిన అనేక చిత్రాల గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. కంచుయుగానికి చెందిన ఈ ప్రతీకాత్మక చిత్రాలు ఏ ఒక్క సంస్కృతికో కాక, బహుళ సంస్కృతులకు చెందినవని కూడా అనుకున్నాం. ఇవి యూరప్, చైనా, జపాన్, అజ్టెక్ లకు కూడా తెలిసిన ప్రతీకాత్మకత అంటారు క్యాంప్ బెల్.

కనుక, ఇరవయ్యేళ్ళ తర్వాత, సూర్య-చంద్రులు కలసుకునే రోజున ఓడిసస్ తన భార్య పెనెలోప్ ను కలసుకోవడం వెనుక ఇంత  తాత్వికార్ధం ఉంది. అంతకుముందు పదేళ్లపాటు అధోజగత్తులో అతను ఎదుర్కొన్న అనుభవాలు; మాంత్రిక ప్రపంచానికి చెందిన సిర్సే, కలిప్సో, నౌసికాలతో అతని కలయికలు మానసిక శిక్షణను, సాహసాలను సూచిస్తాయి. ఒక్క పెనెలోప్ మాత్రమే ఈ కథలో మాంత్రికప్రపంచానికి చెందని సాధారణస్త్రీ.  అంటే పురుషుడు స్త్రీకి సంబంధించిన పై అనుభవాలను అన్నింటినీ పొందితేనే నిజ జీవితంలో స్త్రీని పరిపూర్ణంగా కలసుకోగలడని ఇందులోని ధ్వని. మన కథల్లో ఈ స్త్రీవిజయానికి సంబంధించి ఇప్పటికే ఇచ్చిన అనేక ఉదాహరణలను ఇక్కడ అన్వయించుకోవచ్చు.

***

ఈ పోలికలు యాదృచ్ఛికం కావనీ, వీటి వెనుక కంచుయుగానికి చెందిన ఉమ్మడి పౌరాణిక వారసత్వం ఉందనీ, అంతకంటే ముఖ్యంగా ఉమ్మడి చారిత్రకత ఉందనీ ఈపాటికి అర్థమై ఉండాలి. అంతేకాదు, అది ఒకనాటి ముఖ్య చారిత్రక పరిణామాన్ని కూడా సూచిస్తోంది. దాని గురించి చెప్పుకునే ముందు ఓడిసస్ కథ నేపథ్యంలో భారతీయ, గ్రీకు తాత్వికతల సారూప్యతనూ, తేడానూ కూడా చూపుతూ క్యాంప్ బెల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటితో ఎవరు ఎంతవరకు ఏకీభవిస్తారన్నది అలా ఉంచితే, భారతీయుల గురించిన పాశ్చాత్యుల ఆలోచనాసరళిని అవి పట్టి చూపుతాయి:

మొదటిది, ఓడిసస్ సౌరద్వీపం నుంచి ఏకాకిగా తిరిగిరావడం భారతీయ తాత్వికతలోని అంతిమ ఆదర్శమైన ఆత్మజ్ఞానాన్ని సూచిస్తుందని ఆయన అంటారు. అదే ఓడిసస్ ఒక భారతీయ ఋషి అయుంటే సౌరద్వీపం వరకూ వెళ్ళినవాడు ఏకాకిగా మారి, సముద్రం మీద తేలుతూ ఇంటికి తిరిగివచ్చి భార్య కలసుకునేవాడు కాదనీ, సూర్యుడిలో ఐక్యమయ్యేవాడనీ; విరక్తి(disengagement)కీ, రక్తి(tragic engagement)కీ మధ్య ఉన్న ఆ అంతరమే భారతీయ, గ్రీకు తాత్వికతల మధ్య ఉందనీ ఆయన అంటారు.

రెండోది, సిర్సే మార్గదర్శనంలో ఓడిసస్ ఒకవైపు పితృలోకానికీ, ఇంకోవైపు సౌరద్వీపానికి వెళ్లడం; భారతీయ ఉపనిషత్తులు చెప్పే ధూమ(smoke), అగ్ని(fire)మార్గాలు రెంటినీ సూచిస్తుంది.  నిజానికి ఈ రెండు మార్గాల సంప్రదాయం భారతీయులదీ కాదు, గ్రీకులదీ కాదు; ఆదిమ పౌరాణికతనుంచి అందిన ఉమ్మడి సంప్రదాయం. కేనోపనిషత్తులోని ఒక కథప్రకారం ఈ సంప్రదాయాన్ని పితృస్వామిక దేవుళ్ళకు కాళికాదేవికి సాత్వికరూపమైన ఉమా హైమవతి బోధిస్తుంది.

మూడోది, గ్రీసు, భారతదేశాలలో పరస్పర విరుద్ధ వ్యవస్థలైన పితృస్వామ్య, మాతృస్వామ్య తాత్వికతల మధ్య సంభాషణకు, సమన్వయానికి అవకాశం ఏర్పడింది. కానీ బైబిల్ సంప్రదాయం పూర్తిగా పురుషుడివైపు మొగ్గుతూ ఉద్దేశపూర్వకంగా ఆ అవకాశాన్ని తుడిచిపెట్టింది. అయితే, భారత్, గ్రీసులలో మాతృస్వామ్య, పితృస్వామ్యతాత్వికతల  మధ్య సర్దుబాటు, సమన్వయం జరిగినా వాటి ఫలితాలు మాత్రం రెండు ప్రాంతాలలోనూ ఒకలాంటివి కావు. భారత్ లో అంతిమంగా అమ్మవారితాత్వికతే పై చేయిని సాధించి, ఆ మేరకు పురుష ఆహాన్ని, పురుషుడి చొరవను కుదించివేసింది. గ్రీసులో ఇందుకు భిన్నంగా పురుష సంకల్పమూ, అహమూ పై చేయిని సాధించడమే కాక; ఒక దశలో గ్రీసును ప్రపంచంలోనే అద్వితీయస్థానంలో నిలబెట్టాయి. జగత్తుకు చెందిన ప్రత్యక్షవాస్తవాలను హేతుబద్ధంగా పరిశీలిస్తూ, బాధ్యతాయుతంగా నిర్ధారణలు చేస్తూ; దేవుళ్ళను సేవించుకోవడం కాక, మనిషి అభివృద్ధిని, పరిణతిని అంతిమ లక్ష్యంగా చేసుకుంది. కార్ల్ కెరెన్యి మాటల్లో చెప్పాలంటే, “గ్రీకు ప్రపంచం ప్రధానంగా సూర్యరశ్మి నిండిన ప్రపంచం. అయితే దాని కేంద్రస్థానంలో ఉన్నది మాత్రం సూర్యుడు కాదు, మనిషి”.

తీగ కదిపితే డొంకంతా కదలడం అంటే ఇదే… ఈ తాత్విక అంతరాల తేడాలను పట్టుకుని  ఎంత దూరమైనా పోవచ్చు. చారిత్రకంగా చెప్పుకుంటే, సమీప ప్రాచ్యం నుంచి వ్యాపించిన దేవతా ప్రధానమైన ఆదిమ పౌరాణికతకు తూర్పు-పడమరలు రెండూ వారసులే ననుకున్నాం. విశేషమేమిటంటే, తూర్పు-పడమరల మధ్య పైన చెప్పిన తాత్వికమైన చీలికకు కూడా పుట్టిల్లు సమీప ప్రాచ్యమే. అందులోంచే వైయక్తిక ప్రాధాన్యం కలిగిన నరుడు పుట్టుకొచ్చాడు. తాత్వికమైన చీలిక అంటే ఇక్కడ ప్రాధాన్యాలలో తేడాగానే అర్థం చేసుకోవాలి కానీ, కత్తితో కోసినట్టు రెండు తాత్వికతలూ పూర్తిగా వేరయ్యాయని కాదు. అందుకే మన దేశంలో దేవతా ప్రాధాన్యం కలిగిన మాతృస్వామిక ఆదిమ పౌరాణికత, పితృస్వామిక పౌరాణికత రెండూ కొనసాగుతూ ఒక మిశ్రమ తాత్వికతను ముందుకు తెచ్చాయి. అలాగే పడమటి దేశాలలో పితృస్వామిక పౌరాణికత క్రమంగా మనిషి కేంద్రమైన వ్యక్తివాదానికి, వ్యక్తి చొరవకూ దారితీసినా; మాతృస్వామిక ఆదిమ పౌరాణిక ఛాయలు అంతర్లీనంగా కొనసాగుతూనే ఉన్నాయని క్యాంప్ బెల్ అంటారు.

నరుడితో మొదలుపెట్టి నలుడి గురించి చెప్పుకుని అక్కడినుంచి ఓడిసస్ మీదుగా అనేక విషయాలను చుట్టబెడుతూ సాగిన వ్యాసప్రస్థానం ఇక ముగింపునకు వస్తోంది…

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. సుందరం says:

    “నరుడితో మొదలుపెట్టి నలుడి గురించి చెప్పుకుని అక్కడినుంచి ఓడిసస్ మీదుగా అనేక విషయాలను చుట్టబెడుతూ సాగిన వ్యాసప్రస్థానం ఇక ముగింపునకు వస్తోంది…”

    కేవలం పదుల వయసు లో ఉన్న ప్రస్తుత సమాజం- కొన్ని వందల సంవత్సరాల క్రితమే మొదలైన ‘ఆధునిక చరిత్రకారుల’ అధ్యయనాలను చదువుతూ, వేల సంవత్సరాల సంస్కృతి కలిగిన మన పూర్వ చరిత్ర ను పాశ్యాత్య దేశాల చరిత్రకారుల ‘రంగుటద్దాలతో’ చూసినట్లుగా ఉన్న కొన్ని వ్యాసాలు తప్పితే, మొత్తంమీద మీ ‘పురాగమనం’ మమ్మల్ని ఒక అలౌకిక జగత్తులో విహరింపచేసిందనడంలో అతిశయోక్తి లేదు. పురా సమాజాల్లో ఉన్నచాలా విషయాలను, ఆచారాలను ‘వాస్తవిక దృష్టి’ తో విశ్లేషించి వాటిలో ఉన్న అనేక అబ్బురపరచే పోలికలు మీరు విశదీకరించిన తీరు అద్భుతం.
    ఇలా ‘పురా-ప్రస్తుత’ లోకాల్లో మమ్మల్ని ఊయలలూపుతున్న మీ ‘వ్యాస పరంపర’ ఇక చివరి అంకానికి వస్తోందన్న విషయాన్ని మాత్రం ‘జీర్ణం’ చేసుకోలేకపోతున్నాము. కానీ ‘కాలోహి దురతిక్రమహ’ అన్నట్లుగా ఎన్ని ‘విశెషాలు’ జరిగినా అవి చరిత్ర పుటల్లో ‘నిక్షిప్తం’ కావడం, వాటినుండి ముందుకు పోవడం అనేది ప్రకృతి సహజం. అయినా ఈ మీ ‘వ్యాస పరంపర’ కేవలం చిన్న విరామం తీసుకొని ‘సశేషం’ గా మాత్రమే అయి మళ్లీ త్వరలో మరిన్ని కొత్త విషయాలను మాకు తెలుపుతారని ఆశిస్తూ…
    ధన్యవాదములతో
    సుందరం

  2. Dr.Vijaya Babu, Koganti says:

    “అలాగని నేటి కొలమానంలో చూసి, ధర్మానికీ, నీతికీ, మంచికీ చోటులేని వ్యవస్థగా దానిని భావించడం తొందరపాటు అవుతుంది. అది తనదైన, ప్రకృతిసిద్ధమైన ఒక ధర్మాన్ని అనుసరించిన వ్యవస్థగా కనిపిస్తుంది.”

    “క్రీ.పూ. ప్రథమ సహస్రాబ్దికి వెడితే, మనసును లోపలికి తిప్పడంవల్ల , అంటే అంతర్ముఖత్వం వల్ల వ్యక్తి అనే సూక్ష్మరూపానికీ, విశ్వమనే బృహద్రూపానికీ తేడా లేదనే ఎరుక కలుగుతుందనే విశ్వాసం తూర్పు, పడమటి దేశాలకు చెందిన బహుళదేవతారాధకులు అందరిలోనూ ఉండేదని…”

    “కార్ల్ కెరెన్యి మాటల్లో చెప్పాలంటే, “గ్రీకు ప్రపంచం ప్రధానంగా సూర్యరశ్మి నిండిన ప్రపంచం. అయితే దాని కేంద్రస్థానంలో ఉన్నది మాత్రం సూర్యుడు కాదు, మనిషి”.

    “అందులోంచే వైయక్తిక ప్రాధాన్యం కలిగిన నరుడు పుట్టుకొచ్చాడు. తాత్వికమైన చీలిక అంటే ఇక్కడ ప్రాధాన్యాలలో తేడాగానే అర్థం చేసుకోవాలి కానీ, కత్తితో కోసినట్టు రెండు తాత్వికతలూ పూర్తిగా వేరయ్యాయని కాదు.”

    ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ విశ్లేశణాత్మక వ్యాసం ! మీ తార్కిక పరిశీలనకు నమోవాకాలు.

    • కల్లూరి భాస్కరం says:

      విజయబాబుగారూ…ధన్యవాదాలు.

  3. కల్లూరి భాస్కరం says:

    ధన్యవాదాలు సుందరం గారూ…

    1. ‘ముగింపునకు వస్తోంది’ అన్న నా మాటను మీరు అలా అర్థం చేసుకున్నారా? “నరుడితో మొదలుపెట్టి నలుడి గురించి చెప్పుకుని అక్కడినుంచి ఓడిసస్ మీదుగా అనేక విషయాలను చుట్టబెడుతూ సాగిన వ్యాసప్రస్థానం ఇక ముగింపునకు వస్తోంది…” అన్న నా వాక్యాన్ని మరోసారి పరిశీలించగలరు.

    2. “కొన్ని వందల సంవత్సరాల క్రితమే మొదలైన ‘ఆధునిక చరిత్రకారుల’ అధ్యయనాలను చదువుతూ, వేల సంవత్సరాల సంస్కృతి కలిగిన మన పూర్వ చరిత్ర ను పాశ్యాత్య దేశాల చరిత్రకారుల ‘రంగుటద్దాలతో’ చూసినట్లుగా ఉన్న కొన్ని వ్యాసాలు తప్పితే,”–అన్న మీ అభిప్రాయం మీద, లేదా మీ వాక్యనిర్మాణం మీదా నాకిలా స్పందించాలనిపించింది.

    మీ అభిప్రాయంలో వేల సంవత్సరాల సంస్కృతి కలిగిన పూర్వ చరిత్ర మనకు మాత్రమే ఉందనీ, పాశ్చాత్య చరిత్ర కారులవి ‘రంగుటద్దా’ లనే ఒక నిశ్చితత్వం కనిపిస్తోంది. ఆ నిశ్చితత్వం ఉండడంలో నాకు ఎలాంటి పేచీ లేదు. మీ అభిప్రాయస్వేచ్ఛను నేను గౌరవిస్తాను. అయితే మీరే కాదు ఎవరైనాసరే, ఒక నిశ్చితాభిప్రాయాన్ని ప్రకటించేటప్పుడు ప్రశ్నలు, సందేహాలకు చోటివ్వకూడదు. ఉదాహరణకు, వేల సంవత్సరాల సంస్కృతి కలిగిన మన పూర్వచరిత్ర అన్నప్పుడు ఎన్ని వేల సంవత్సరాలో నిర్దిష్టంగా చెప్పాలి. వేల సంవత్సరాల పూర్వచరిత్ర కలిగిన పురాతన నాగరికతలు మరికొన్ని ఉన్నాయి కనుక మనది అంతకంటే పూర్వమని చెప్పగలగాలి. ఆ స్పష్టీకరణ లేనప్పుడు ఆ మాటకు చెల్లుబాటు ఉండదు. అలాంటిదే రంగుటద్దాలు అనే మాట కూడా. ఇలాంటి మాటల్ని మనం అలవాటుగా, లూజుగా వాడేస్తుంటాం. రంగు లేని అసలు అద్దాలను మనం చూపించగలిగినప్పుడే ఎదుటివారివి రంగుటద్దాలని మనం అనగలుగుతాం.

    నిశ్చితాభిప్రాయంగా ముందుకు తెచ్చినప్పుడే ఇలాంటి చిక్కులు. అలాకాక ఒక అభిప్రాయాన్ని ప్రకటించేటప్పుడు దానిని సమర్థించే ఉపపత్తులు అందుబాటులో లేనప్పుడు దానిని సందేహార్థకంగా ప్రకటించుకుంటే ఇబ్బంది లేదు. అభిప్రాయ ప్రకటనలో, వాక్యనిర్మాణంలో మనలో చాలామంది విస్మరించే జాగ్రత్తను ఎత్తి చూపడమే ఇక్కడ నా ఉద్దేశం.

  4. Niharika says:

    స్త్రీ పురుషస్వామ్యాల సారూప్యత,ఆధిపత్యత వంటి విషయాల గురించి తార్కికంగా వివరిస్తూ వస్తున్న మీ వ్యాస పరంపర అత్యంత ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి.

    అసంధర్భం అని మీరు అనుకోకపోతే ఒక విషయం మీకు మనవి చేసుకోవాలనిపిస్తోంది.కాలానుగుణంగా చరిత్రలో కొన్ని మార్పులు సంభవించాయి. మాత్రృస్వామ్యం నుండి పితృస్వామ్యానికి మనం ఎలాగయితే చేరామో పితృస్వామ్యం నుండి మాతృస్వామ్యానికి మారబోతున్నామేమో అన్న సూచనలు కనిపిస్తున్నాయి.ఉదాహరణకు జయలలిత, సోనియా గాంధీ,మమతా బెనర్జీ,మాయావతిల వలే కఠిన రాజకీయ నిర్ణయాలు తీసుకునే నారీమణులు వస్తూ ఉంటే మాతృస్వామ్యంలోకి మారడానికి ఎంతోకాలం పట్టదు. భావితరాలు పురుషుల వీరత్వం గురించి తెలుసుకోవాలంటే బాహుబలిలాంటి సినిమాలు చూసుకుని మురిసిపోవాల్సిందేనేమో అనిపిస్తోంది. నాకు ఒక నిశ్చితాభిప్రాయం అంటూ ఉండదు కానీ మాతృస్వామ్యానికి నేను వ్యతిరేకిని అని మనవి చేసుకుంటున్నాను.

    • కల్లూరి భాస్కరం says:

      నీహారికగారూ…స్పందనకు ధన్యవాదాలు.

  5. సుందరం says:

    శ్రీ భాస్కరం గారూ,
    మీ వివరణాత్మక సమాధానానికి ధన్యవాదములు.
    1. మీ ప్రస్తుత ‘ పురాగమన వ్యాస పరంపర’ ఇంక ముగింపుకు వస్తోందేమోనని అని అనుకున్నాను, కానీ అది నలుడి నుండి మొదలై ఓడిసస్ దాకా సాగిందనేది, కేవలం ఒక మలుపు మాత్రమేనని, మీ వ్యాస పరంపరా ప్రస్థానం ఇంకా కొనసాగుతుందన్నది, మీ ప్రతిస్పందనని బట్టి అర్థం ఔతున్నది, సంతోషం.

    2. మీరు చేస్తున్న ఈ చరిత్ర మథనం లో మీరు అనేక గ్రంథాలు, వ్యాసాలు, ఇవేకాక మన పురాణేతిహాసాలు, ఉపనిషత్తులు లాంటి అనేక విషయాలను శోధించి, క్రోడీకరిస్తున్నారు. నేను, కేవలం ‘చరిత్ర’ మీద ఆసక్తి ఉన్న ఒక పాఠకుడిని మాత్రమే. ముఖ్యంగా మొన్నటి మీ “అశోకుడి గురించి మనకు తెలిసి ఒక వంద సంవత్సరాలు’ మాత్రమే అన్నప్పుడు ఒక సారి మీ పాత వ్యాసాలు మళ్లీ చదవడం జరిగింది, అందులో కూడా కొన్ని వ్యాసాలలో ‘మన దేశ పురా చరిత్రకు ఋజువులు/ప్రామాణికమైన సరైన ఆధారాలు లేవనీ, దానికి మీరు ఉదహరించిన కొన్ని ‘ఆధునిక పాశ్యాత్య చరిత్ర కారుల రచనలు’ ఉదహరిస్తూంటే అవి, మీ “తటస్థ దృష్టి” గా కాక వారి ఆలోచనలనే ప్రతిబింబిస్తున్నట్లు ఉన్నాయని “రంగుటద్దాలు” అనే మాట వాడడం జరిగింది, నొప్పించి ఉంటే క్షంతవ్యుడిని. కానీ మన చరిత్రకు సరైన ఆధారాలు అంటే, శ్రీ కృష్ణుడు పుట్టిన చోటు, రాముడి జనన ధృవపత్రం లాంటివి మాత్రం బహుశా ఎవరూ చూపించలేకపోవచ్చునేమో. మన చరిత్ర నమ్మకానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, కొన్ని విషయాలు/వర్ణనలు మరీ వాస్తవానికి దూరంగా ఉండవచ్చు కానీ పూర్తిగా అన్నీ అభూత కల్పనలుగా మాత్రం కొట్టిపారవేయలేము కదా. మన తో పాటు ఇంకా అనేక ప్రాచీన నాగరికతలు (గ్రీక్, చైనా లాంటివి) ఉన్న దేశాలు, వాటి ఉనికిని స్పష్టం గా చాటుకుంటూంటే, మనం మాత్రం ఎందుకు చెప్పుకోలేకపోతున్నామన్నదే నా విచారం.

    ధన్యవాదములతో

    సుందరం

  6. Niharika says:

    రాముడు త్రేతాయుగానికి చెందినవారు, కృష్ణుడు ద్వాపర యుగానికి చెందినవారు.కొన్ని వేల సంవత్సరాలనాటి వీరుల గాధలను గుర్తించుకోడానికి కారణం వారి త్యాగాలే అయినా మధురలో జన్మ స్థలానికి వివాదమేదీ లేదు. రాముడికే వివాదం ఉంది అంటే కారణం ఏదో ఉండే ఉంటుంది.యుగాలనాటి చరిత్రకి ఆధారాలు వెతికేకన్నా ప్రస్థుతాన్ని గురించి ఒక నిర్ణయానికి రావడం సముచితంగా ఉంటుందేమో ?

    మన ఉనికిని ఎందుకు చాటుకోలేకపోతున్నాము అంటే దానికి కారణం హిందువుల నిర్లక్ష్యమే కారణమేమో అనిపిస్తుంది.అపుడు వ్యాపారం కోసం వచ్చిన వారు మన స్వాతంత్ర్యాన్ని ఒకరకంగా హరిస్తే ఇపుడు పెట్టుబడులు పెట్టండి అని విదేశీయులను ఆకర్షించడం ద్వారా మన స్వాతంత్రాన్ని మనమే వారికి దాసోహం చేస్తుంటే చరిత్ర గురించి ఆలోచించే తీరికా కోరికా ఎవరికున్నాయి ?

  7. కల్లూరి భాస్కరం says:

    సుందరంగారూ…
    ‘రంగుటద్దాలు’ అన్నందుకు నేనేమీ నొచ్చుకోలేదండీ. క్షంతవ్యుడి నన్న పెద్ద మాట మీరు వాడాల్సిన అవసరమే లేదు. మనం ఇలాంటి మాటల్ని అలవాటుగా, లూజుగా వాడడం గురించే చెప్పాలనిపించింది. అది కూడా కేవలం మిమ్మల్ని ఒక్కరినే ఉద్దేశించి కాదు. ఈ అలవాటు మనకు సమకాలీన రాజకీయ సంస్కృతినుంచి వచ్చినట్టుంది. మాటల్ని చాలా ఆషామాషీగా వాడడం ఈ సంస్కృతిలో సర్వసామాన్యం. అదే మహాభారత, రామాయణాలలోకి వెడితే మాటకు గల విలువ ఏమిటో, మనం మాట్లాడేది ఎంత అర్థవంతంగా, బాధ్యతాయుతంగా ఉండాలో విస్తారంగా చెప్పడం కనిపిస్తుంది.
    ఇక మీ మిగతా అభిప్రాయాలకు వస్తే, రాముడు, కృష్ణుడు అభూతకల్పనలని నేను ఎక్కడా అనలేదు. అలాగే మిగతా ప్రాచీన నాగరికతల్లా మన దేశం తన ఉనికిని చాటుకోలేకపోతోందన్న మీ అభిప్రాయంతో నేను ఏకీభవించలేను. మన చరిత్రదీపం చిన్నది కావచ్చు కానీ ప్రపంచం మన ఉనికిని గుర్తించగల ప్రత్యేకతలు మనకూ ఉన్నాయి.

మీ మాటలు

*