నీలగిరి తోడాలు…చరిత్ర విడిచిన ఖాళీలు!

కల్లూరి భాస్కరం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

వ్యక్తులతోనైనా, వస్తువులతోనైనా, మరి దేనితోనైనా  కానివ్వండి… చిరపరిచయం మన చూపులకు, ఆలోచనలకు సంకెళ్ళు వేస్తుంది. వాటి వైశాల్యాన్ని తగ్గించివేస్తుంది. అలాకాకుండా చిరపరిచయం నుంచి చూపును తప్పించి వివిధ కోణాలలోంచి నిశితంగానూ, కొత్తగానూ చూడడం ప్రారంభించామనుకోండి…ఆ చూపులోంచి కొత్త విశేషాలు, సరికొత్త ఆశ్చర్యాలు పుట్టుకొస్తాయి. అలా ఆ రెండు చూపుల మధ్యనే ఆశ్చర్యాల పుట్టుక!

దేవాలయాలనే తీసుకుందాం. మన దేశంలో అవి అసంఖ్యాకాలు. మనలో చాలామంది దగ్గరలో ఉన్న దేవాలయాలను తరచు సందర్శిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు తీర్థ యాత్రల పేరుతో దూర దూర ఆలయాలను కూడా దర్శించి వస్తూ ఉంటారు. చిరపరిచయం వల్ల దేవాలయం ఫలానా విధంగా ఉంటుందన్న కల్పనకు మనం అలవాటు పడిపోతాం కనుక, ఫలానా విధంగా ఎందుకు ఉంది, అసలు దీని చరిత్ర ఏమిటి అనే ఆలోచన సర్వసాధారణంగా చేయం. చేసే వాళ్ళు అసలే ఉండరని కాదు.  వాళ్ళు మినహాయింపులు. నేను అంటున్నది జనసామాన్యం గురించి.

దేవాలయ నిర్మాణాన్నే కాస్త పట్టి చూడండి. దానికొక నిర్దిష్టత ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే, చిన్న చిన్న గుళ్ళు, మందిరాలను అలా ఉంచితే ఇంచు మించు ప్రతి దేవాలయానికీ చుట్టూ ప్రహరీగోడ ఉంటుంది. ఓ ప్రవేశద్వారం, లోపలికి వెళ్ళాక ఒక ధ్వజస్తంభం, ఆ తర్వాత ఎత్తుగా ఒక నలుచదరపు అరుగు, దానికి మెట్లు, ఆ అరుగు తర్వాత గర్భగుడి ఉంటాయి. గర్భగుడి పైన, పోను పోను సన్నబడే శిఖర నిర్మాణం ఉంటుంది. ప్రహరీ గోడకు, ప్రధాన నిర్మాణానికీ మధ్య నలువైపులా ప్రదక్షిణ మార్గం ఉంటుంది. కొన్ని పెద్ద ఆలయాలలో అయితే వంటశాల ఉంటుంది. గోశాల కూడా ఉండచ్చు. అలాగే పూజారుల నివాసగృహాలు కూడా. స్థూలంగా నని ముందే అన్నాను కనుక  కొన్ని వివరాలు తప్పిపోవచ్చు.

చిరపరిచయం నుంచి చిరభావనలూ పుట్టుకొస్తాయి. ఇలాంటి ఈ దేవాలయ నిర్మాణం మన దేశానికే, మన సంస్కృతికే ప్రత్యేకమనీ, ఇంకెక్కడైనా ఉన్నా మన దగ్గరనుంచే వెళ్లిందనే భావన వాటిలో ఒకటి. కానీ పురాచరిత్రకారుల పరిశీలనలు ఈ అభిప్రాయానికి విరుద్ధంగా ఉన్నాయి.  జోసెఫ్ క్యాంప్ బెల్(Oriental Mythology)నే ఉటంకించుకుంటే…

మెసొపొటేమియాలో దక్షిణంగా ఒబెయిద్(Obeid), ఉరుక్(Uruk), ఎరిడు(Eridu) అనే చోట్లా; మెసొపొటేమియాలోనే నేటి బాగ్దాద్ కు ఉత్తరంగా ఉన్న ఖఫజా(Khafajah), దక్షిణంగా ఉన్న ఉకైర్(Uqair) అనే చోట్లా; మెసొపొటేమియాకు దూరంగా తూర్పు సిరియాలో టెల్ బ్రాక్(Tel Brak) అనే చోటా జరిపిన తవ్వకాలలో మొత్తం ఆరు దేవాలయ సముదాయాలు బయటపడ్డాయి. ఇవి ఉజ్జాయింపుగా క్రీ. పూ. 4000-3500 ఏళ్ల నాటివని నిర్ణయించారు. సిరియాలో పుట్టిన మూలరూపమే ఇతర ప్రాంతాలకు విస్తరించినట్టు టెల్ బ్రాక్ ఆలయసముదాయం సూచిస్తోంది.

Near East

ఒబెయిద్ ఆలయంలో దేవత పేరు నిన్ హుర్ సగ్(Ninhursag). ఖపజాలో దేవత పేరు ఇనన్న(Inanna). మిగతా ఆలయాలలోని దేవతల పేర్లు తెలియవు. ఒబెయిద్, ఖఫజా, ఉకైర్ ఆలయ సముదాయాలు రెండు వైపులా ఎత్తైన ప్రహరీ గోడలతోనూ, అండాకారంలోనూ ఉండి యోని ఆకారాన్ని సూచిస్తూ ఉంటాయి. భారతదేశంలోని అమ్మవార్ల ఆలయంలో గర్భగుడిలో యోని ఆకారంలో ఉండే నిర్మాణంలానే ఇది కూడా ప్రకృతిలోని పునరుత్పాదక శక్తికి; అంటే సంతానాన్ని కని, పెంచి, పోషించే స్త్రీత్వానికి ప్రతీక.

ఈ ఆలయ సముదాయంలో ప్రధాన నిర్మాణం పది నుంచి ఇరవై అడుగుల ఎత్తైన అరుగు మీద ఉంటుంది. ఆ అరుగుకు మెట్లు ఉంటాయి. అన్నీ ఇటుకతో కుదిమట్టంగా పెట్టె ఆకారంలో నిర్మితమై ‘ఆధునిక’ శైలిని తలపిస్తూ ఉంటాయి. మూలలు రంగు రంగుల నునుపు రాళ్ళతోనూ, రంగుల అద్దకాలతోనూ అలంకృతమై కనిపిస్తాయి. పూజారుల నివాసాలు, ఆలయసేవలకు ఉద్దేశించిన ఇతర ప్రదేశాలు, వంటశాలలు, ముఖ్యంగా పశువుల కొట్టాలు ఈ సముదాయంలో భాగాలు. ఒబెయిద్ శిథిలాలలో వివిధ రంగుల్లోని నునుపురాళ్ళు తాపడం చేసిన తావులు కనిపించాయి. పూజారుల బృందం అక్కడే పవిత్ర గోమాతల పాలు పితికి, నిల్వ చేసేవారని అవి సూచిస్తున్నాయి.  అనంతర కాలానికి చెందిన అసంఖ్యాక లిఖిత పత్రాల ప్రకారం, ఈ ఆలయసముదాయంలో కొలుపులు అందుకుంటూ వచ్చిన నిన్ హుర్ సగ్ జగజ్జనని.  మనుషులు, దేవతలు, పశువులతో సహా అందరికీ, అన్నింటికీ తల్లి.  ముఖ్యంగా రాజులకు సంపదను అందించి, వారి రక్షణకు బాధ్యత వహించేది ఆ తల్లే.  ఆమె తన క్షీరధారలతో అందరినీ పోషిస్తుంది. ఆలయ సముదాయంలోని గోమాతలే ఆమె ప్రతిరూపాలు. వాటి పాలే ఆమె ప్రసాదం.

భారతదేశంలో అమ్మవారి ఆలయాలలో ఇప్పటికీ అన్నం పాయసాన్నో, పాల ఉత్పత్తులతో చేసిన మరో పదార్ధాన్నో ప్రసాదంగా ఇస్తారని క్యాంప్ బెల్ అంటారు. సరే, ఆ సంగతి మనకూ తెలిసినదే. ఆయన అంతకంటే ఆసక్తికరమైన ప్రస్తావన చేశారు. అదేమిటంటే, దక్షిణభారతంలో(తమిళనాడులో)ని నీలగిరులలో ‘తోడా’లని పిలిచే ఒక నిగూఢమైన తెగ ఉంది. ఇరుగు పొరుగు వారితో ఈ తెగ వారికి జాతిపరమైన ఎలాంటి సంబంధాలు లేకపోవడమే ఆ నిగూఢతకు కారణం. పైన చెప్పిన మెసొపొటేమియా ఆలయ సముదాయాల్లానే వీరికి కూడా చిన్న చిన్న ఆలయసముదాయాలు ఉంటాయి. వాటిలో కూడా పశువుల్ని ఉంచి పూజిస్తూ ఉంటారు. లేగ దూడ వీరు బలి ఇచ్చే ప్రధాన జీవి. అమ్మవారి కుమారుడికి అది ప్రతీక. వీరి దేవత పేరు తోగోర్ష్. విశేషమేమిటంటే ఈ దేవతను ఉద్దేశించిన ప్రార్థనలో ‘నిన్ కుర్ షగ్’ అనే మాట కనిపిస్తుంది. ఆ మాటకు అర్థం వారికి తెలియదు. పైన చెప్పిన ఒబెయిద్ అమ్మవారు ‘నిన్ హుర్ సగ్’ కు, ఈ ‘నిన్ కుర్ షగ్’ అనే మాటకూ పోలిక స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.

అంటే, ఇరాన్ కు తూర్పుగా వ్యవసాయ-పశుపాలక నాగరికత వ్యాపించడానికి పదిహేను వందల ఏళ్ల క్రితమే రాజు గారికి చెందిన పశువుల కొట్టాలు కూడా భాగమైన నిన్ హుర్ సగ్, ఇనన్న అమ్మవార్ల ఆలయాలలో గంటల గణగణలు, దీపాలను తిప్పడం వంటి అర్చనా సేవలూ, ప్రార్థనలూ, మంత్రాలు, బలులతో కూడిన పూర్వరంగం అంతా ఏర్పడిందనీ; ఈ తంతు భారతదేశంలోని అమ్మవారి వరకూ చేరుకుని వేల సంవత్సరాలుగా ఇప్పటికీ కొనసాగుతోందనీ క్యాంప్ బెల్ అంటారు.

నీలగిరి ‘తోడా’ల గురించిన పై సమాచారంతో సహా ఈ మొత్తం వివరాలు ఎంతో విపులంగానూ, వివరంగానూ చెప్పుకోవలసిన మరో నిగూఢ చరిత్ర వాకిట మనల్ని నిలబెడుతున్నాయి. అయితే, ఆ వాకిలి దాటి మరింత లోపలికి వెళ్లడానికి నేనిప్పుడు సిద్ధంగా లేను కనుక ఒకటి రెండు అంశాలను మాత్రం ప్రస్తావించి ఆపేస్తాను:

ప్రముఖ చరిత్రకారుడు నీలకంఠశాస్త్రి తన A HISTORY OF SOUTH INDIA (Fourth Edition, Oxford India Paperbacks, 1995)లో, The earliest peoples and culture అనే అధ్యాయంలో నీలగిరుల గురించి కొంత స్పృశించారు. దాని ప్రకారం, అక్కడ చనిపోయినవారి స్మారకార్ధం నిలిపిన శిలాకృతులు(cairns), ముందు ఒక్క చక్రం మాత్రమే ఉండే చిన్న చిన్న తోపుడు బళ్ళు(barrows), కుండలు(pottery) మైదాన ప్రాంతాలలో వాటికంటే భిన్నంగా ఉంటాయి. అక్కడి కంచు పాత్రలు ఊర్(Ur-మెసొపొటేమియా)లో దొరికిన బంగారు పాత్రను పోలి ఉంటాయి. ఇంకా మరికొన్ని అంశాలలో కూడా మెసొపొటేమియాకు, నీలగిరులకు ఉన్న అజ్ఞాత సంబంధాన్ని సూచించే సామ్యాలు  పురాతత్వశాస్త్రజ్ఞులకు దొరికాయి.

అదలా ఉంచితే, చాలా ఏళ్ల క్రితమే వచ్చిన ఎస్.ఎస్. రాజమౌళి సినిమా ‘మర్యాద రామన్న’ ఈ మధ్య టీవీలో వస్తుంటే యధాలాపంగా చూశాను. అందులో ఒక సన్నివేశం మెసొపొటేమియా, నీలగిరులలోని పశువుల కొట్టాలను గుర్తుచేసింది. రాయలసీమ ముఠా హత్యలు, గ్రామీణ నేపథ్యంతో తీసిన ఆ సినిమాలో ముఠా నాయకుడి విశాలమైన ఇంటి చావిడిలోనే పశువుల కొట్టం కూడా ఉంటుంది. అదేమిటని హీరో అడిగినప్పుడు, పశువులు మాకెంతో పూజనీయాలనీ, అందుకే ఇంట్లోనే ఉంచుకుని వాటితో మేము సహజీవనం చేస్తామనీ ముఠా నాయకుడు జవాబు చెబుతాడు. ఇప్పటికీ అక్కడక్కడ కొనసాగుతున్న ఆ పురా చారిత్రక వారసత్వం తాలూకు ఆనవాయితీని(కాకపోతే పై ఉదాహరణలలో దేవాలయం అయితే, ఇక్కడ ఇల్లు అయింది) దర్శకుడు ఎక్కడి నుంచో తీసుకుని సినిమాలో వాడుకున్నారని అనిపించింది.

***

తొలి ఆలయ ఆవరణలు

తొలి ఆలయ ఆవరణలు

దేవాలయనిర్మాణమే కాదు; అనేక సాంస్కృతిక అంశాలు, మతవిశ్వాసాలు, ఆరాధనా పద్ధతులు, పురాణగాథలు, వ్యవసాయ-పశుపోషణలు, శాస్త్ర, సాంకేతిక విషయాలు సమీప ప్రాచ్యం నుంచే నేల నలుచెరగులకూ వ్యాపించాయని పురాచరిత్ర కారులు అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, నేటి ప్రపంచ భౌతిక, ఆధ్యాత్మిక జీవితపు నమూనాకు పుట్టిల్లు సమీప ప్రాచ్యం! ఏ ఒక్కరో కాదు; గార్డన్ చైల్డ్, సర్ జేమ్స్ ఫ్రేజర్, జోసెఫ్ క్యాంప్ బెల్, జార్జి రాక్స్ సహా ఎందరో అంటున్న మాట ఇది. క్యాంప్ బెల్ (Occidental Mythology) మాటల్లోనే చెప్పుకుంటే…

తూర్పు, పడమటి దేశాల పౌరాణిక చింతనకు సంబంధించిన అనేక మౌలిక అంశాలు కంచు యుగ వారసత్వాలే. అయితే ఇప్పటికీ చాలామంది అనుకుంటున్నట్టు ఈ వారసత్వానికి పుట్టిల్లు భారతదేశమో, చైనాయో కాదు; సమీప ప్రాచ్యం, లెవెంట్. ఇందుకు సంబంధించిన పూర్వరంగం ఈ ప్రాంతంలో క్రీ.పూ. 7500 నాటికే ఏర్పడిందని ఇక్కడ జరిగిన పురాతత్వ పరిశోధనలు చెబుతున్నాయి. ఆ కాలానికే ఆసియా మైనర్, సిరియా, ఇరాక్ ఉత్తర ప్రాంతం, ఇరాన్ లలోని సురక్షిత స్థితిలో ఉన్న పర్వత లోయలలోనే వ్యవసాయ, పశుపోషణ నైపుణ్యాలు అభివృద్ధి చెందాయి. ఇవే మనిషి అస్తిత్వంలోనూ, సామర్ధ్యాలలోనూ విప్లవాత్మకమైన పరివర్తన తీసుకొచ్చాయి. అప్పటివరకూ అనిశ్చితం, ప్రమాదకరం అయిన ఆహారసేకరణ(వేట, అటవీ ఉత్పత్తులు)పై ఆధారపడుతూ వచ్చిన మనిషి ఇప్పుడు వ్యవసాయదారుడిగా మారాడు. స్వయంపోషక గ్రామాలు అవతరించాయి. అవి క్రమంగా తమ సంఖ్యను పెంచుకుంటూ  క్రీ.పూ. 2500 నాటికి తూర్పు, పశ్చిమాలకు విస్తరించాయి.

ఈ మధ్యలో, క్రీ.పూ. 3500 లో ఈ అభివృద్ధికి కేంద్రమైన సమీప ప్రాచ్యంలోని మెసొపొటేమియాలో రెండవ విప్లవాత్మక పరివర్తన సంభవించింది. లిఖిత సంప్రదాయం, గణితం, నిర్మాణశైలులు, శాస్త్రీయ పద్ధతులలో ఖగోళ పరిశీలన, దేవాలయ నిర్మాణం; అన్నింటినీ మించి పరిపాలనా కళ అవతరించాయి. ఈ పరిజ్ఞానమూ, వీటి అనుసరణా క్రీ.పూ. 2850 నాటికి ఈజిప్టుకు, క్రీ.పూ. 2500 నాటికి క్రీటుద్వీపానికీ, సింధు లోయకూ, క్రీ.పూ. 1500 నాటికి చైనాకు, క్రీ.పూ. 1000-500 నాటికి మెక్సికో, పెరూ లకూ చేరుకున్నాయి.

భారతదేశాన్ని, ఈ దేశ సంస్కృతీ నాగరికతలను ఇప్పటి సరిహద్దుల మధ్య ఊహించుకోడానికి అలవాటు పడి, మొత్తం ప్రపంచ నాగరికతకు, అభివృద్ధికి పుట్టిల్లు ప్రాచీన భారతదేశమేనని భావించుకునేవారిని  పై వాక్యాలు నొప్పించి, కోపం తెప్పించే మాట నిజమే. వీటిని ఖండించే పటిష్టమైన వాదనను ఎవరు ముందుకు తెచ్చినా తెరచిన బుద్ధితో దానిని స్వీకరించవలసిందే. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి. పురా మానవుడి ప్రపంచానుభవం, నేటి మన ప్రపంచానుభవం ఒకలాంటివి కావు. నేడు మనం భావిస్తున్నట్టు; ఆయా  దేశాల సరిహద్దులు, సాంస్కృతిక, మత విభజనలు, జాతీయతలను స్థిరమైనవిగా భావించడం అతనికి తెలియదు. నాటి జీవన పరిస్థితులలో అందుకు అవకాశం కూడా లేదు. ఎప్పటికప్పుడు సరిహద్దులను చెరిపివేయడం, కొత్త సరిహద్దులను నిర్మించడం అతను చేస్తూ వచ్చిన పని. అలాగే అతను భిన్న భిన్న మత సంస్కృతులలో కలసిపోయాడు. ఇతరులకు తన మత సంస్కృతులను ఇచ్చి వారివి తను తీసుకున్నాడు. అలా మిశ్రమ మతసంస్కృతులను నిర్మించుకుంటూ వెళ్ళాడు. కనుక పురాకాలపు అభివృద్ధి, నాగరికతలతో సహా అన్నీ ఉమ్మడి సృష్టి. అందులో మన వాటా కచ్చితంగా ఉంది.

సమీప ప్రాచ్య వారసత్వం మనకు ఎలా అందిందో చెప్పుకోవలసింది చాలా ఉంది. దానిని మరో సందర్భానికి వాయిదా వేసి కొంత విలక్షణత కలిగిన క్రీటు ద్వీపం మీద అది ఎలా ప్రసరించిందో చెప్పడానికి ప్రస్తుతం పరిమితమవుతాను.

***

 

రాంభట్ల(జనకథ) ప్రకారం, పశ్చిమార్యుల లెక్కలో ప్రథమ ధర్మశాస్త్రకర్త పేరు మినోస్. ఆయన క్రీ.పూ. 15వ శతాబ్దికి చెందినవాడు, క్రీటు దీవిలోని నోసోస్ నగరపాలకుడు. ఆయన ధర్మశాస్త్రకర్త మాత్రమే కాదు, నౌకాదళ నిర్మాత కూడా. మనకు కూడా చిరపరిచితుడైన ఒక ధర్మశాస్త్రకర్త ఉన్నాడు. ఆయన పేరు మనువు. ఆయన జలప్రళయ సమయంలో ఓడను నిర్మించి జీవులను రక్షించా డంటుంది శతపథబ్రాహ్మణం. ఈవిధంగా మినోస్ కు, మనువుకు నామసామ్యం మాత్రమే కాదు; ధర్మశాస్త్ర కర్తృత్వం, నౌకా నిర్మాణంలో కూడా సామ్యం ఉంది.

అయితే, మనకు మనువులు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం ఉన్న మనువు వైవస్వత మనువు. నడుస్తున్నది వైవస్వతమన్వంతరం. 36 లక్షల సంవత్సరాలు ఒక చాతుర్యుగం అయితే, అలాంటి 71 చాతుర్యుగాలు ఒక మన్వంతరం అవుతుంది. కనుక మానవ కాలమానంలో మనువుల కాలాన్ని లెక్కగట్టడం అసాధ్యం. స్థూలంగా అతి ప్రాచీను డనుకుందాం. అలాగే, క్రీటు పాలకుడు మినోస్ కూడా ప్రాచీనుడై ఉండచ్చు.  మన దగ్గర చాలామంది మనువులు ఉన్నట్టే క్రీటులోనూ చాలామంది మినోస్ లు ఉండి ఉండచ్చు. మొదటి మినోస్ పేరే తర్వాతి పాలకులకు పదవీ నామంగా సంక్రమించి ఉండచ్చు. వీరిలో ఒకరు ధర్మశాస్త్రకర్త అయుండచ్చు.  క్రీటు నాగరికతా కాలాన్ని మినోస్ పేరిటే మూడు దశలుగానూ, మళ్ళీ ఒక్కొక్క దశను మూడు అంతర్దశలుగానూ విభజించారు. ఈ దశలు అన్నీ క్రీ.పూ. 2600తో ప్రారంభమై, క్రీ.పూ. 1100లతో గ్రీకుల ఆక్రమణతో ముగుస్తాయి. అక్కడ కొత్త రాతి యుగం ఇంకా ముందే క్రీ.పూ. 4000లో మొదలైంది.

క్రీటు నాగరికత గ్రీకు పితృస్వామిక నాగరికతకే కాక, ఈజిప్టు, మెసొపొటేమియా పూజారి నాగరికతకు కూడా కొన్ని విషయాల్లో భిన్నంగా ఉంటుంది. ఇది మాతృస్వామికం. దేవతకు, పూజారిణులకే ప్రాముఖ్యం. పురుషదేవుళ్లు చాలా తక్కువ. మతపరమైన తంతులు కూడా దేవతలకు, స్త్రీలకు చెందినవే. ఇంకా విశేషమేమిటంటే, ఈ తంతులలో లైంగిక సంబంధమైనవి లేవు. అలాగే లింగ చిహ్నాలు కనిపించవు. ఆ విధంగా క్రీటు నాగరికతలో ఇప్పుడు మనం చెప్పుకునే ‘సభ్యత’ ఉట్టిపడుతూ ఉంటుంది.

ఇక స్త్రీలు పురుషులకు అన్ని విధాలా సమానులు. హుందాగా, స్వేచ్ఛగా పురుషులతో కలసిపోయి సంచరించేవారు. వారి దుస్తులు కూడా ఆధునికమైన దుస్తుల్ని తలపిస్తాయి. వారు కూడా వృషభ యుద్ధాల(Bull Fights)లో పాల్గొనేవారు. ఎద్దు కొమ్ముల మీంచి, దాని పృష్ఠభాగం మీంచి పిల్లి మొగ్గలు వేసేవారు. అథ్లెటిక్ బెల్టులు ధరించేవారు. అంతటి స్త్రీ-పురుష సమానత్వం కలిగిన సభ్యనాగరికత తర్వాతి కాలంలో కనిపించదని క్యాంప్ బెల్ అంటారు.

ఇంకా విశేషమేమిటంటే, గ్రీకు ఆక్రమణదారులు అడుగుపెట్టేవరకూ క్రీటులో కోటల వంటి రక్షణలు లేవు. ఆయుధసంపద ఉన్నట్టు సాక్ష్యాలు లేవు. నోసోస్ నగరం తలుపులన్నీ తెరచి ఉంచిన ఒక పెద్ద రాజప్రాసాదం మాత్రమే. క్రీటు వాసులు అందరూ సుఖ సంతోషాలతో జీవించేవారు. ఈ వివరాలన్నీ, ధర్మం నాలుగు పాదాలతో నడిచినట్టు మన పురాణాలు చెప్పే ‘కృత’యుగాన్ని గుర్తుచేస్తూ ఉండచ్చు. ‘కృత’యుగం అనే మాటే ‘క్రీటు’యుగంలా ధ్వనిస్తున్నా ఆశ్చర్యంలేదు.

అదలా ఉండగా, క్రీటులో కొత్త రాతి యుగ అవశేషాలు ఆసియా మైనర్ సంబంధాన్ని సూచిస్తాయి. నైరుతి అనటోలియా(టర్కీ)లో దొరికిన క్రీ.పూ. 5500 నాటి మృణ్మయ సామగ్రి క్రీటుకు చెందిన తొలినాటి అమ్మవారి ఆరాధన నేపథ్యాన్ని సూచిస్తాయి. వీటిలో దేవతల నగ్నరూపాలున్నాయి. ఆగ్నేయ అనటోలియాను ఆనుకుని ఉన్న ఉత్తర సిరియాలో క్రీ.పూ. 4500-3500 నాటి స్త్రీమూర్తులు విస్తారంగా దొరికాయి. ఇక్కడ దొరికిన ప్రతీకాత్మక మూర్తులలో అనేకం తర్వాతి కాలంలో క్రీటులో ప్రముఖంగా మారాయి. వాటిలో వృషభ శిరస్సు, జంటగొడ్డలి, తేనెతుట్ట సమాధి(beehive tomb), పావురాలు, గోవు, గొర్రె, మేక, పంది ఉన్నాయి.

మరికొన్ని విశేషాలు తర్వాత…

 

 

 

 

 

మీ మాటలు

  1. సుందరం says:

    శ్రీ భాస్కరం గారూ,
    మళ్లీ మీరు వివిధ దేశాల/కాలాల చరిత్రలో జరిగిన సంఘటనలను ఆయా ప్రదేశాలలో దొరికిన ఆధారాల సహాయంతో ‘పురాగమనం’ లో చరిత్రల నడుమ ఉన్న సారూప్యతలని మథించి “తటస్ఠ దృష్టి” తో మాకు అందించడం బాగుంది.
    రామాయణం లో సుగ్రీవుడు ‘సీతాన్వేషణ’ కై వానరులను భూమి నలుదిక్కులకూ పంపే సందర్భంలో తను చూసిన/ తనకి తెలిసిన ప్రదేశాలగురించి వారికి వివరించిన సమయానికీ, మీరు శోధిస్తున్న ఇతర చరిత్రలకీ ఎక్కడైనా ‘లంకె’ కుదురుతోందా అని నా సందేహం? (గమనిక: రామయణం అనేది ఒక కావ్యరూపమైన చరిత్ర/కల్పన అనేది నమ్మడం వ్యక్తిగతమైన అభిప్రాయమని, కేవలం ‘పురాగమనం’ లో మీరు చూస్తున్న రకరకాల చరిత్రల మధ్య ఉన్న సారూప్యతలనుండి మరో అంశాన్ని/కోణాన్ని స్పృశించడమే నా ఉద్దేశ్యం).

    మరో ఆశ్చర్యకరమైన అంశం, మీ ఈ ‘చరిత్ర మథనం’ లో ఎక్కువ తెలుగు పదాలే వేరే భాషల పదాలతో సరిపోలడం (లోన్ వర్డ్స్)!!
    ధన్యవాదములతో
    సుందరం

    • కల్లూరి భాస్కరం says:

      ధన్యవాదాలు సుందరంగారూ…మీ స్పందన చూసిన తర్వాత రామాయణంలో సుగ్రీవుడు చెప్పిన ఆయా ప్రదేశాల వివరాలలోకి వెళ్లాలన్న కుతూహలం కలిగింది. అయితే అవి చారిత్రక ప్రదేశాలతో ఎంతవరకు సరిపోలతాయో చెప్పలేం.

  2. MOHANKUMAR says:

    కల్లూరి భాస్కరంగారికి నమస్కారం. రామాయంణంలో సుగ్రీవుడు చెప్పిన ఆయా ప్రదేశాల వివరాలలోకి వెళ్లాలన్న కుతూహలం కలిగింది అన్న మీ మాట చూడగానే చాలా సంతోషం వేసింది. మరి త్వరగా ఆ విశేషాలు మాముందు ఉంచాలని కోరుకుంటున్నాను.

మీ మాటలు

*