ఆంధ్రా యూనివర్సిటీలో అద్భుతమైన ఒకే ఒక వత్సరం

వంగూరి చిట్టెన్ రాజు 

 

chitten rajuనేను ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం లో చదివిన ఒకే ఒక సంవత్సరం (1961-62) నా ఇంజనీరింగ్ డిగ్రీ చదువులో మొదటి సంవత్సరం మాత్రమే. కానీ ఆ ఒక్క సంవత్సరమూ నాకు అనేక అపురూపమైన అనుభవాలనీ, ఇప్పటికీ గుర్తుండే జ్ఞాపకాలనీ మిగిల్చింది.

అందులో మొదటిది అంత వరకూ ఇంట్లో అమ్మా, బాబయ్య గారూ, అన్నదమ్ములూ, అప్పచెల్లెళ్ళ మధ్య పెరిగిన నేను ఒక్క సారిగా నా వయసు కుర్రాళ్ళతో హాస్టల్ నివాసం, ఒక విధంగా ఆ స్వాతంత్ర్య వతావరణం, హాస్టల్ లో పెట్టే “మాస్ భోజనం”, చదువు బాధ్యత, కొంచెం వ్యక్తిగతా రాహిత్యంగా …అంటే నాకు నేనుగా కానీ, “ప్లీడరు గారి అబ్బాయి” లా కానీ ఏ విధమైన ప్రత్యేక గుర్తింపూ లేకుండా  “నలభై మంది విద్యార్ధులలోను ఒక్కడిగా”, “నలుగురితో పాటు  నారాయణ” లాగా మాత్రమే చెలామణీ అవడం అన్నీ కొత్తే. అప్పటి దాకా అలవాటు లేని మరో సమస్య డబ్బు వాడకం. కాకినాడ లో ఇంట్లో ఉన్నంత కాలం జేబులో డబ్బు అయిపోగానే, తిన్నగా ఆయన్ని అడిగే దమ్ముల్లేక రహస్యంగా మా బాబయ్య గారు తోట లో ఉన్నప్పుడో, భోజనం చేస్తున్నప్పుడో  ఆయన గదిలోకి దూరి పోయి, ఆయన డబ్బు దాచుకునే పెట్టె లోంచి రెండు, మూడు రూపాయలు కొట్టెయ్యడం, ఆ రాత్రి లెక్కలు చూసుకున్నప్పుడు “ఏ వెధవ రా డబ్బులు కొట్టేశాడు?” అని కోప్పడినప్పుడు ఒప్పేసుకోవడం జరిగేది. వైజాగ్ లో హాస్టల్ కి వచ్చాక ప్రతీ రోజూ అలా డబ్బులు లెక్కెట్టుకుని జాగ్రత్తగా ఉండాల్సిన పని నేనే చేసుకోవడం సరి కొత్త అలవాటు అయింది.

అప్పుడు నెల మా 5th బ్లాక్ హాస్టల్ మెస్ బిల్లు నెలకి 40 రూపాయలు ఉండేది. “అంత తిండి ఏం పెడతార్రా హాస్టల్ లో, వెధవ బంగాళా దుంపల వేపుడికీ, చారుకీ అంత డబ్బే “ అనేది మా అమ్మ. ఇక పై ఖర్చులకి 10 రూపాయలు అయ్యేవి. నేనూ, పేరి శాస్త్రీ, ఇతర మిత్రులూ కలిసే తిరిగే వాళ్ళం కాబట్టి ఖర్చులు పంచుకునే వాళ్ళం.

విశాఖపట్నం, ఆంధ్రా యూనివర్సిటీ అనగానే నాకు ఠక్కున జ్ఞాపకం వచ్చేది అక్కడి ఓపెన్ ఎయిర్ ధియేటర్, అందులో నేను చూసిన నాటకాలు, పాల్గొన్న సమావేశాలు మొదలైనవి. ఆ హాలు ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు కానీ అప్పుడు అది Erskin College of Natural Sciences బిల్డింగ్ లో ఉండేది. గూగుల్ లో వెతికితే కనపడిన ఆ బహిరంగ వేదిక ప్రాంగణం ఫోటో ఒకటి జతపరుస్తున్నాను. ఈ వేదిక 1957 లో కట్టినప్పుడు అంత పేరు రాలేదు కానీ బళ్ళారి రాఘవ గారి కోరిక మీద తోలేటి కనక రాజు, సంబందన మొదలియార్ కమిటీ వారి సిఫార్సు ని పాటిస్తూ నాలుగేళ్ల తరువాత ..అంటే 1961 లో ఆంధ్రా యూనివర్సిటీలో Department of Theater Arts ప్రారంభించి నాటక, దర్సకత్వం, నటన మొదలైనవి ఒక పాఠ్యాంశం గా మొదలు పెట్టారు.  ఒక విశ్వవిద్యాలయంలో నటన లో శిక్షణ ఒక సబ్జెక్ట్ గా బోధించడం యావత్ భారత దేశం లోనే అది మొట్టమొదటి సారి. ఆ డిపార్ట్ మెంట్ హెడ్ గా కె.వి. గోపాల స్వామి నాయుడు గారిని నియమించారు…Rest is History అనే ఇక చెప్పుకోవాలి. ఎందుకంటే అ తరువాత ఆయన యూనివర్సిటీ రిజిస్త్రార్ గా ఎన్నో ఏళ్ళు పనిచేసినా ఆంధ్రా యూనివర్సిటీ నాటక విభాగం ద్వారా ఆయన రంగ స్థలానికి చేసిన సేవ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర లేదు.

నాటక, సినీ రంగాలలో ఎంతో లబ్ధ ప్రతిష్టులైన చాట్ల శ్రీ రాములు, కె. వేంకటేశ్వర రావు, సాక్షి రంగా రావు, గొల్లపూడి మారుతీ రావు, అమెరికాలో మా గురువు గారు పెమ్మరాజు వేణుగోపాల రావు గారు, దేవదాస్ కనకాల, అబ్బూరి, ఇలా కొన్ని తరాల వారు ఆయన శిష్య పరంపరలో తరించిన వారే!

ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ విశ్వ విఖ్యాత నాటక విభాగం ప్రారంభించిన 1961 లోనే నేను ఆంధ్రా యూనివర్సిటీలో చేరాను కానీ ఈ విషయాలు నాకు తెలీదు. నాకు తెలినదల్లా కే.వి. గోపాల స్వామి నాయుడి గారి అధ్బుతమైన ప్రసంగాలు, ఆయన నిర్వహించిన అఖిల కళాశాల నాటక పోటీలు, నా అనుభూతులూ మాత్రమే. ఆయన గురించి నాకు ఒక విషయం బాగా జ్ఞాపకం. ఆయన ప్రసంగించడానికి వేదిక మీదకి రాగానే ఆ మొత్తం ఓపెన్ ఎయిర్ థియేటర్ చప్పట్లతో మారుమోగి పోయేది. పైగా ఆయనకి ఒక సరదా అలవాటు ఉండేది. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏ కోతి కుర్రాడైనా ప్రేక్షకులలోంచి గట్టిగా అరిస్తే, ఆయన కూడా స్టేజ్ మీద నుంచి వాడి అరుపుని అనుకరిస్తూ అరిచే వారు. దాంతో కుర్రాళ్ళు ఇంకా రెచ్చిపోయే వారు. ఉదాహరణకి ఎవడైనా “కొయ్, కొయ్”  అని అరిచాడనుకోండి, రిజిస్త్రార్ అంతటి పదవిలో ఉన్న అయిన నాయుడు గారు అటు తిరిగి “నువ్వు కొయ్, నీ బాబు కొయ్. ఒరేయ్ నీ కంటే రౌడీ ని రా” అని అరిచే వారు.

ఆ రోజుల్లోనే ఆ ఓపెన్ ఎయిర్ ధియేటర్ స్టేజ్ వెనకాల అద్భుతమైన తెరలు కట్టడానికీ, back projection లాంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాట్లు ఉండేవేమో అని నా అనుమానం. ఎందుకంటే ఒక సారి గుంటూరు మెడికల్ కాలేజ్ వాళ్ళు వేసిన ఒక డ్రామాలో back drop  అంతా ముందు సాయంత్రం ఆకాశం, మెల్లిగా సూర్యుడు అస్తమించి చంద్రుడు పైకి  రావడం, ఒక దాని తరవాత ఒకటిగా నక్షత్రాలు పొడుచుకుంటూ మొత్తం ఆకాశం చంద్రుడూ, నక్షత్రాలతో అద్భుతమైన ఆవిష్కరణ జరగడం చూసి మా అందరికీ మతిపోయింది. “ఇంటర్ కాలేజియేట్ డ్రామా పోటీలు” ఏడాది కోసారి జరిగినప్పుడు ఇలాంటి డ్రామాలు అనేకం చూసే అదృష్టం నాకు కలిగింది. అన్నింటికీ పరాకాష్ట “చింతామణి” నాటకం. సుమారు మూడు గంటలు సాగిన ఈ పాప్యుల నాటకంలో రేలంగి సుబ్బిశెట్టి గా  ప్రధాన పాత్ర వేశాడు. చింతామణి గా వేసిన ఆ సినిమా నటి పేరు మర్చిపోయాను కానీ ఆమె తల్లిగా నల్ల రామమూర్తి వేశాడు. వీళ్ళిద్దరూ మా కాకినాడ వాళ్ళే.  ఇతర పాత్రధారులు “ఈలపాట” కొత్త రఘు రామయ్య, మాధవపెద్ది సత్యం మొదలైన హేమా హేమీలు.

AU Open Air Theater photo

ఆ రోజుల్లో ఇలాంటి డ్రామాలు ఎప్పుడూ లైవ్ మ్యూజిక్ తోటే ఉండేవి. అలాంటిదే మరో నాటకం నాగభూషణం “రక్త కన్నీరు”.  అంతకు ముందు కాకినాడలో కూడా నాటకాలు అడపా దడపా చూసినా నాలో నాటకాభిలాషకి బీజాలు ఇక్కడే పడ్డాయి అనడానికి ఏమీ సందేహం లేదు.  అంత పెద్ద ఆడిటోరియం లో నటీనటుల అందరి మాటలూ స్పష్టంగా వినపడే విధంగా మైకులు ఎలా ఏర్పాటు చెయ్యగాలిగారో నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే! ఇక మాధవ పెద్ది, రఘురామయ్య నాటకానికి అవసరం ఉన్నా లేక పోయినా ఏదో వంక పెట్టి అద్భుతంగా పద్యాలు చదివి మా విద్యార్థుల చేత పదే, పదే చప్పట్లు కొట్టించుకున్నారు. ఇక రేలంగి సరే, అప్పటికే కొంచెం భారీగా ఉన్నా తనదే అయిన డైలాగ్ డెలివరీ తో హాస్యం బాగానే పండించాడు. అందులో ఒక డైలాగ్ నాకు ఇంకా గుర్తే…. సుబ్బిశెట్టి చింతామణి తో “ఇదిగో, నువ్వు లోపలికెళ్ళి ఆ ఆయింట్ మెంటు మందు అర్జంటుగా పట్రా..నీ సరదా తీరుతుంది, నా దురదా తీరుతుంది”….కొంచెం అదోలా ఉన్న ఈ డైలాగ్ ఎవరికీ అర్థం కాక పోయినా రేలంగి చెప్పాడు కాబట్టి అందరూ పోలో మని నవ్వారు.

మా ఇంజనీరింగ్ కేంపస్ లో అస్సలు బిల్డింగులే లేవు కాబట్టి ఎప్పుడైనా స్టేజ్ కావాల్సిన ప్రోగ్రామ్స్ ..అంటే ఏన్యువల్ డే లాంటివి ఆ ఓపెన్ ఎయిర్ ధియేటర్ లోనే ఇంజనీరింగ్ విద్యార్థులు నిర్వహించుకునే వారు. అప్పుడు ఇచ్చే విందు గురించి చాలా గొప్పగా చెప్పుకునే వారు. ఇప్పుడు తలచుకుంటే నవ్వు వస్తుంది కానీ, ఆ విందు అంత గొప్పగా ఉండడానికి కారణం ఆ రోజు మనిషికి ఒకటే ఇచ్చే ఎంతో అపురూపమైన చిన్న సైజ్ ఏపిల్ పండు, ఎక్కడో హైదరాబాద్ నుంచి తెప్పించిన అనాబ్ షాహీ ద్రాక్ష పళ్ళు మనిషికి పది, చిన్న ఐస్ క్రీం లేదా ఫ్రూట్ సాలడ్, బాస్మతీ రైస్ తో చేసిన బిరియానీ, నమ్మండి, నమ్మక పొండి…కాల్చిన బ్రెడ్ టోస్ట్, దాని మీద అక్షరాలా అర చెంచాడు బట్టర్ మరియు ఫ్రూట్ జామ్….ఇవన్నీ తింటూ లండన్ లోనో అమెరికాలోనో ఉంటున్న ఫీలింగ్ చాలా మంది కుర్రాళ్ళకి ఉండేది అ రోజుల్లో. పైగా నాకు తెలిసీ ఒక్క 4th బ్లాక్ లోనే నాన్-వెజిటేరియన్ భోజనం ఉండేది. ఏ పార్టీ లోనూ అస్సలు మాంసాహారం ఉండేది కాదు.  బహుశా ఎక్కువ ఖరీదు కూడా ఒక కారణం కావచ్చును.

ఆ రోజుల్లోనే నేను అక్కినేని నాగేశ్వర రావుని మొదటి సారి కలుసుకున్నాను. అడపా దడపా ఆయనతో నా యాభై ఏళ్ల చిరు అనుబంధం గురించి ఇది వరలో నేను వివరంగా వ్రాశాను కానీ ఆ నాడు ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన తొలి పరిచయం వివరాలు మటుకు ఇక్కడ ప్రస్తావించడం అప్రస్తుతం కాదు. సినిమాలలో  ఔట్ డోర్ షూటింగ్ దృశ్యాలు ఒక వేళ ఉన్నా అన్నీ మద్రాసులోనే తీయబడే ఆ రోజుల్లో, బహుశా మొట్ట మొదటి సారిగా ఒక తెలుగు సినిమా విశాఖపట్నం రామకృష్ణా బీచ్ లో షూటింగ్ జరుపుకోవడం ఒక సంచలనాన్ని సృష్టించింది. ఆ సినిమా పేరు అందరికీ తెలిన “కులగోత్రాలు.”

సినిమా కథా పరంగా హీరో నాగేశ్వర రావు పైలా పచ్చీసుగా తిరిగే  ఒక కాలేజీ విద్యార్థి అయితే అప్పుడు నేను ఆంధ్రా యూనివర్సిటీలో నార్త్ కేంపస్ లో మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న “బుద్దిమంతుడైన” కుర్రాణ్ణి.  అప్పటికే ఆయన “నట సామ్రాట్” బిరుదు పొంది నాలుగేళ్ళు అయిన 38 సంవత్సరాల యువ అగ్రతార అయితే నేను కేవలం నూనుగు మీసాల పదిహేడు సంవత్సరాల వయసులో “నాగ్గాడి” సినిమాలు రొమాంటిక్ గా ఉంటాయి అనుకునే అభిమానిని.  సినిమా నిర్మాతలు ఎంత రహస్యంగా ఉంచినా, నాగేశ్వరరావు మధ్యాహ్నం భోజనం విరామం కోసం, యూనివర్సిటీ లేడీస్ వైటింగ్ రూము కి వస్తాడనే వార్త మొత్తం విశ్వవిద్యాలయం కేంపస్ అంతా గుప్పు మనే లోపుగానే ఎక్కడో నార్త్ కేంపస్ లో ఉన్నప్పటికీ చప్పున అందుకున్న వాళ్ళలో నేనొక్కడిని కావడం నా అదృష్టమే! నాకు ఏ మాత్రమూ ఇష్టం లేని, క్లిష్టమైన “ఇంటెగ్రల్ కాలుక్యులస్” క్లాస్ లో ఉండగా ఎవడో నాకు ఒక చిన్న చీటీలో ఈ వార్త అందించాడు. అప్పటి యూనివర్సిటీ కేంపస్ లో మెయిన్  గేట్ నుంచి వైస్ చాన్సెలర్ గారి ఇంటి మీదుగా బహుశా అర మైలు కొండెక్కి కేఫటేరియాకి ఎదురుగుండా, ఓపెన్ ఎయిర్ ధియేటర్ పక్కన ఆ లేడీస్ వైటింగ్ హాలు అని చూచాయగా తెలుసు. అంతే. వెంటనే లఘు శంక వంక తో క్లాసు ఎగ్గొట్టి, ఒకరిద్దరు స్నేహితులతో అప్పటి ఎర్ర మట్టి గుట్టలలో అ లేడీస్  రూము కేసి పరిగెట్టడం మొదలు పెట్టాను.

ఆ రోజుల్లో “ఫేషన్” అయిన హవాయి చెప్పులు ఎర్ర మట్టితో కొట్టుకు పోయి, వేసుకున్న పంట్లాం వెనక వేపు కూడా ఎర్రగా మచ్చలతో ఉన్న నన్ను గుమ్మం దగ్గరే “సైంధవులు” అడ్డుకున్నారు.  అప్పటి కింకా ఎక్కువ మంది విద్యార్ధులకి తెలియక యువజన సందోహం లేదు తెలియదు కాబట్టి  లోపల్నించి చూసి “పరవా లేదు. అతన్ని రానియ్యండి.” అని అక్కినేని గారు అనబట్టి నన్ను లోపలికి వెళ్ళనిచ్చారు. ఎదురుగుండా కుర్చీలో కూచుని స్వచ్చమైన, తెలుగు తేజస్సుతో మహా ఠీవి గా ఉన్న ఆయన నన్ను పలకరించి “ఏం చదువుతున్నారు? క్లాసులు లేవా?” అనేసి నోట మాట పెగలక నేను గుర్, గుర్ అని అవస్త పడుతుంటే నవ్వేసి నాతో వచ్చిన ”ఇద్దరు మిత్రుల” నీ అదే ఆప్యాయతో పలకరించారు. పక్కనే ఉన్న అందాల నటి కృష్ణ కుమారి గారితో కూడా నాది అదే పరిస్తితి. అటు “నట సమ్రాట్” ని చూసి తరించాలా, పక్కనే   నాగేశ్వర రావు తో సహా… ఎంతో  పొడుగ్గా, తెల్లగా పొందికగా ఉన్న అద్భుతమైన అందాల రాశి  కృష్ణ కుమారిని చూడగానే పెరిగిపోయిన లబ్ డబ్ అనే గుండె చప్పుడు ఎలా తగ్గించుకోవాలా అనే దుస్థితి నా జీవితంలో ఆ ఒక్క సారే కలిగింది. ఆయనతో అరగంట పైగా, భయం, భయంగా మాట్లాడాక, ఇక టైమ్ అయిపోయింది అని తెలియగానే మేము నమస్కారం పెట్టేసి బయటకి వస్తుంటే అక్కినేని గారు “ఇదిగో అబ్బాయ్, అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే నువ్వు శ్రద్ధ గా చదువుకో . లేక పొతే నా లాగా వేషాలు వేసుకుంటూ బతక వలసి వస్తుంది, జాగ్రత్త” అన్నారు నవ్వుతూ!

మరి కొన్ని ఆంధ్రా యూనివర్సిటీ విశేషాలు …తరువాతి సంచికలో …

 

 

 

మీ మాటలు

*