చరిత్ర, అచరిత్రల మధ్య మనం!

కల్లూరి భాస్కరం 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)రెండేళ్ళు పైనే అయింది…

ఏదో పని మీద నాకు బాగా పరిచయమున్న ఒక ప్రొఫెసర్ గారి ఇంటికి వెళ్ళాను. ఆయన ఫ్రాక్, పశ్చిమ సాహిత్యాలలో తాత్వికధోరణులలో లోతైన అధ్యయనం ఉన్నవారు. ఎన్నో పుస్తకాలు రచించినవారు. నేను ఎంతో గౌరవించే వ్యక్తి. అప్పటికి ఈ వ్యాసపరంపర ప్రారంభించకపోయినా వీటిలో చర్చకు వస్తున్న అనేక విషయాలను యధాలాపంగా ఆయనతో ముచ్చటించడం ప్రారంభించాను. ఆయన మధ్య మధ్య స్పందిస్తూ ఎంతో ఆసక్తితో వింటున్నట్టు కనిపించారు. అలా గంటన్నర కాలం దొర్లిపోయింది. ఆ తర్వాత ఇంటికి వచ్చేశాను.

వచ్చిన కాసేపటికి ఆయన ఫోన్ చేశారు. “మీరు మాట్లాడిన విషయాలు చాలా ఆలోచింపచేసేలా ఉన్నాయి. వాటిని మీరు తప్పకుండా పుస్తకరూపంలోకి తేవాలి. అది మంచి పుస్తకం అవుతుంది” అన్నారు. నేను ఆయనకు ధన్యవాదాలు చెప్పాను.

మూడు, నాలుగు రోజుల తర్వాత మరోసారి ఆయన ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళిన వేరే పని గురించి కాసేపు మాట్లాడి సెలవు తీసుకున్నాను. ఆయన నన్ను సాగనంపడానికి గుమ్మం దాకా వచ్చారు. నేను చెప్పులు వేసుకుంటుంటే, ఉన్నట్టుండి ఆయన, “మీరు నాతో కిందటిసారి మాట్లాడిన విషయాలు రాయకండి” అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యానికి రెండు కారణాలు. మొదటిది, అంతకుముందు స్వయంగా ఫోన్ చేసి మరీ నన్ను అభినందించి, పుస్తకరూపంలోకి తేవాలని నొక్కి చెప్పి, అది మంచి పుస్తకం అవుతుందని అన్నవారే ఇంతలో అభిప్రాయం మార్చుకోవడం! రెండవది, అసలు రాయనే వద్దని అనడం!

ఈ మధ్యలో ఇంకో నిజం కూడా ఉంది. అది: నేను మాట్లాడిన విషయాల గురించే ఈ మూడు నాలుగురోజులుగా ఆయన ఆలోచిస్తూ, ఇంకా చెప్పాలంటే, మథనపడుతూ ఉండడం!

నేను ఆశ్చర్యం నుంచి తేరుకోడానికి క్షణకాలం పట్టినట్టుంది. ఆపైన, “చరిత్ర…” అంటూ ఏదో అనబోయాను.

ఆయన వెంటనే తుంచేస్తూ, “మనకు చరిత్ర అవసరం లేదండీ” అన్నారు.

అనేసి ఆయన లోపలికి వెళ్ళిపోయారు. నేను బయటికి నడిచాను.

***

రెండేళ్ళు దాటిపోయినా అప్పటి ఆ సన్నివేశం నా జ్ఞాపకాలలో నిన్న మొన్నటి దన్నంత స్పష్టంగా ఇప్పటికీ ఉండిపోయింది. “మనకు చరిత్ర అవసరం లేదండీ” అన్న ఆయన మాటలు ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.  ఆ మాటల్ని తప్పుపట్టడానికో, విమర్శించడానికో నేనీ విషయం ప్రస్తావించడంలేదు. వాటిని వీలైనంత తటస్థంగా పరిశీలించడం నా ఉద్దేశం.

“మనకు చరిత్ర అవసరం లేదండీ” అన్న ఆ వాక్యం వెనుక-ఆలోచించిన కొద్దీ- ఒక విలక్షణమైన భారతీయ మనస్తత్వం ఉన్నట్టు అనిపిస్తోంది. అంతేకాదు, కొన్ని వేల సంవత్సరాలుగా మన రక్తంలో లోతుగా ఇంకిపోయిన ఒక తాత్వికత కూడా.  కాలాన్ని గతం, వర్తమానం, భవిష్యత్తుగా విభజించడమే చూడండి. అది కేవలం వ్యావహారిక సౌలభ్యం కోసం. ఆవిధంగా అది ‘వ్యావహారిక సత్యం’ మాత్రమే. అయితే మన తాత్వికత ప్రధానంగా మూడు కాలాలకూ అతీతమైన సత్యానికి చెందినది. దానిని ‘పారమార్ధిక సత్యం’ అందాం. అందులో గతం, వర్తమానం, భవిష్యత్తు అనే విభజన కుదరదు. అక్కడ కాలాన్ని అఖండంగా చూడవలసిందే.  అందులోకి వెళ్లినప్పుడు వ్యావహారిక సత్యం లానే వ్యావహారిక సౌలభ్యం కోసం ఏర్పరచుకున్న కాలం కూడా మాయగా లేదా మిథ్యగా పరిణమిస్తుంది.

కనుక పారమార్థిక సత్యానికి భంగం కలగకుండా ఎంత మేరకు వాడుకోవాలో అంత మేరకే వ్యావహారిక కాలాన్ని వాడుకోవాలి తప్ప మరీ లోతుగా వెళ్లకూడదు. పురాణాలు కృత, త్రేత, ద్వాపర, కలి యుగాలుగా కాలాన్ని విభజించి ఒక్కొక్క యుగానికీ లక్షలాది సంవత్సరాలను ఆపాదించడం, లక్షల సంవత్సరాల వ్యాప్తి ఉన్న మన్వంతరాలను కల్పించడం వ్యావహారిక కాలాన్ని అప్రధానంగా మార్చే ప్రయత్నంలో భాగమనే నేను అనుకుంటాను. దశరథమహారాజు అరవై వేల సంవత్సరాలు పరిపాలించాడనీ, రాముడు పదివేల సంవత్సరాలు పరిపాలించాడనీ రామాయణం చెబుతోంది. వ్యావహారిక కాలానికి ప్రాధాన్యం లేదని– చెప్పకనే చెప్పడం ఇది.

తాత్విక స్థాయిలో కాలాన్ని అఖండంగా చూడడమంటే కాలానికి గల చలనశీల స్వభావాన్ని కూడా నిరాకరించడమే. అందులో కాలం స్థాణువుగా మారిపోతుంది. పారమార్థిక రంగానికి చెందిన ఆ స్థాణుత్వం అక్కడితో ఆగకుండా వ్యావహారిక రంగం మీదా; అంటే సమాజ, సాహిత్య, ఆర్థిక, రాజకీయాల మీదా ప్రభావం చూపుతుంది. అంటే అవి కూడా స్థాణుత్వాన్ని పొందుతాయి. ఉదాహరణకు ఒక రచన ఒకానొక కాలంలో, సమాజంలో, చారిత్రక పూర్వాపరాల మధ్య అవతరిస్తుంది. కానీ అవతరించిన వెంటనే అది చలన శీలత కలిగిన కాలంతో సంబంధాన్ని తెంచుకుని ఒక కాలాతీత స్వతంత్ర అస్తిత్వాన్ని తెచ్చుకుంటుంది. ఆ రచనకు సంబంధించిన పఠనపాఠన వ్యాఖ్యాన సంప్రదాయమూ దానికి అనుగుణంగానే ఉంటుంది. రామాయణ, మహాభారతాలనే తీసుకుంటే; ఇప్పటికీ వాటిని వ్యాఖ్యానించేటప్పుడు సంప్రదాయ పండితులు వాటి పాఠాన్ని, వాటికి సంబంధించిన వ్యాఖ్యాన సంప్రదాయాన్ని దాటి వాటి వెనుక ఉన్న సమాజమూ, చరిత్రలలోకి తొంగి చూసే సాహసం చేయరు. ఏ కాస్త స్వతంత్రించినా అది సంప్రదాయం అంగీకరించిన పరిధిలోనే. నా ‘కాలికస్పృహ-మరికొన్ని సాహిత్యవ్యాసాలు’(2006)లో కూడా దీని గురించి కొంత చర్చ చేశాను.

భారతదేశం ఇప్పటికీ క్రీస్తుపూర్వకాలంలోనే ఉందనీ, క్రీస్తుశకంలోకి రాలేదనీ ఈ వ్యాసపరంపరలో ఆయా సందర్భాలలో అంటూ వచ్చాను. అది పైన చెప్పిన స్థాణుత్వాన్ని సూచించడమే.

చరిత్ర విషయానికి వస్తే, అది చలనశీలత కలిగిన వ్యావహారిక కాలానికి చెందినది కనుక అందులోకి వెళ్ళడం; కాలాన్ని అఖండంగా చూసే తాత్వికతకు విరుద్ధం అవుతుంది. ఆ అఖండతా సూత్రం మీద ఆధారపడే రచనలకు అవాంఛనీయ వ్యాఖ్యానాలూ, వివరణలూ పుట్టుకొస్తాయి. దాంతో సంప్రదాయపాఠమే కాక మన విశ్వాసాలూ దెబ్బతింటాయి. “మనకు చరిత్ర అవసరం లేదండీ” అని ప్రొఫెసర్ గారు అనడం వెనుక ఇంత లోచూపు ఉందని నేను అనుకుంటున్నాను.

సరే, కాలం గురించిన ఈ దృష్టిభేదం వల్ల, అనువుగా ఉన్నప్పుడు వ్యావహారిక కాలాన్ని, లేనప్పుడు పారమార్థిక కాలాన్ని ఉపయోగించుకునే అవకాశం ఏర్పడింది కనుక దానిని దుర్వినియోగం చేసేవారూ ఉంటారు.

***

కొన్ని ఇతర పురాతన నాగరికతల పరిస్థితి వేరు. వాటితో పోల్చితే “మనకు చరిత్ర అవసరం లేదు” అన్న ప్రొఫెసర్ గారి వ్యాఖ్య ఎంత సనాతన సత్యమో; మనల్ని అది ఎంత విలక్షణ స్థితిలో నిలబెడుతుందో అర్థమవుతుంది. అవి తమ చరిత్రను పదిలపరచడంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాయి. వాటికి చెందిన కనీసం నాలుగైదు వేల సంవత్సరాల నాటి ఉత్తర ప్రత్యుత్తరాలు, యుద్ధాల వివరాలు, జామా ఖర్చులు, భూమి పంపకాలు, భూదానాలు, కూలీలకు ఇచ్చిన వేతనాలతో సహా అనేక లిఖిత ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇక తవ్వకాలలో దొరికిన పురావస్తు ఆధారాల సంగతి చెప్పనే అక్కర్లేదు. వీటి ఆధారంగా ఈ నాగరికతలకు సంబంధించిన  చరిత్రరచన పెద్ద ఎత్తున జరిగింది.

Heinrich Schliemann

కొన్ని పురాతన లిపులను ఛేదించడానికి ఎందరో పండితులు ఒక జీవితకాల తపస్సుగా ఎంత కృషి చేశారో; ఎండనకా, కొండనకా శ్రమిస్తూ తవ్వకాలు జరిపించి పురా చరిత్ర ఖజానాను వెలికి తీయడానికి జీవితాలను ఎలా ధారపోశారో చెప్పే పుస్తకాలు కూడా వచ్చాయి. ప్రాచీన గ్రీసులో భూగర్భంలో సమాధి అయిన నగరాలను తవ్వి తీసిన Heinrich Schilemann పై Robert Payne రాసిన THE GOLD OF TROY, C.W. Ceram రాసిన THE SECRET OF THE HITTITES ఇప్పటికిప్పుడు నాకు గుర్తొస్తున్న రెండు పుస్తకాలు. ప్రాచీన సమీప ప్రాచ్యంలోని వివిధ దేశాలకు చెందిన పత్రాలు, ఆ దేశాల రాజుల మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు వగైరాల ఇంగ్లీష్ అనువాదాన్ని పొందుపరచిన THE ANCIENT NEAR EAST(MARK W. CHAVALAS సంపాదకత్వంలో) లాంటి పుస్తకాలూ వచ్చాయి.THE SECRET OF THE HITTITES

అదే మన విషయానికి వస్తే కొన్ని వాస్తవాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఉదాహరణకు, చరిత్రకు తెలిసినంతవరకు ఇంచుమించు భారతదేశం మొత్తాన్ని ఏలిన తొలి రాజు అశోకుడి గురించి వందేళ్ల క్రితం వరకూ మనకు స్పష్టంగా తెలియకపోవడమే చూడండి. ఒక పాశ్చాత్య శాసన పరిశోధకుడు బయటపెట్టిన ఆధారాన్నిబట్టి  ప్రాచీన సింహళ పత్రాలను గాలించిన తర్వాతే అశోకుడు అనే గొప్ప రాజు గురించి నికరంగా మనకు తెలిసింది. దీనిపై రొమీలా థాపర్ (A HISTORY OF INDIA, Volume.one)ఇలా అంటారు:

Until a hundred years ago, Ashoka was merely one of the many kings mentioned in the Mauryan dynastic list included in the Puranas.  But in 1837, James Princep deciphered an inscription written in the earliest known Indian script, Brahmi. The inscription referred to a king called Devanamapiya Piyadassi(the beloved of gods, Piyadassi). The mysterious king Piyadassi remained a puzzle, since the name did not tally with any mentioned in the sources. Some years later the Buddhist chronicles of Ceylon were examined and were found to refer to a great and benevolent Mauryan king as Piyadassi. Slowly the clues were put together and seemed to make sense, but the final confirmation came in 1915 with the discovery of another inscription in which the author calls himself King Ashoka, Piyadassi. It was evident that Piyadassi was a second name used by Ashoka.

“మనకు చరిత్ర అవసరం లేదు” అనే నమ్మకాన్ని పట్టుకుని అలా ఉండిపోతే ఆ దారి వేరు. కానీ పాశ్చాత్య గవాక్షం నుంచి చరిత్ర కిరణాలు వేడి వేడిగా మన కళ్ల మీద పడి చురుక్కు మనిపించడం ప్రారంభం కాగానే ఒక విచిత్రమైన పరిస్థితిలోకి జారిపోయాం. మాకూ చరిత్ర ఉంది, మా దగ్గరా చరిత్ర రచనలు ఉన్నాయని చెప్పుకోడానికి పోటీ పడ్డాం. తీరా చూస్తే చరిత్ర లక్షణాలు బొత్తిగా లేని కల్హణుడి రాజతరంగిణి తప్ప మన దగ్గర నిక్కమైన చరిత్ర రచన ఒక్కటీ లేదు. ఇది కోశాంబీ మాట.  ఆయన (AN INTRODUCTION TO THE STUDY OF INDIAN HISTORY) ఇలా అంటారు:

India, for all its great literary heritage, has produced no historical writers comparable to Herodotus, Thucydides, Polybius, Livy, Tacitus. Many Indian kings of the middle ages were incomparably superior in their education and literary ability to contemporary rulers in Europe; they personally led great armies to victory in heavy warfare. Nevertheless, not one seems ever to have thought of composing a narrative like Caesar’s Commentaries or Xenophon’s Anabasis. The tradition was of graceful drama, an occasional hymn in praise of gods, or a witty epigram. There remains only one Indian chronicle worth the name, the Rajatarangini  by a Kasmiran named Kalhana, composed in Sanskrit verse during A.D. 1149-50, and continued by two successors. This chronicle suffers from all the mannered conventions of Sanskrit poetry, in particular the fatal double entendre that manages only to obscure whatever reality the author meant to portray. The period was of desperate struggle between the central power and feudal lords in Kasmir, but even the portion dealing with the actual time and place can hardly be compared in quality, depth, content to the account by Thucydides Peloponnesian war. For the rest of the country, till the Muslim period, we have nothing even as good as Kalhana,…

The sources for the older period survive as Puranas,  which in their present form, are only religious fables and cant, with whatever historical content the works once possessed heavily encrusted by myth, diluted with semi-religious legends, effaced during successive redactions copied by innumerable, careless scribes; so that one finds great difficulty in restoring as much as the king-lists. Cuneiform records, even the Sumerian, yield much more information, particularly about social conditions in their respective countries.

పై వాక్యాల సారాంశాన్ని చెప్పుకుంటే…గొప్ప సారస్వత వారసత్వం ఉండి కూడా భారతదేశం హెరొడోటస్ తదితరులతో పోల్చదగిన చరిత్రకారులని సృష్టించలేకపోయింది. మధ్యయుగాలనాటి మన రాజులు, తమ కాలం నాటి యూరప్ రాజులతో పోల్చితే విద్యలోనూ, సాహిత్య నైపుణ్యాలలోనూ మిన్న అయినప్పటికీ  సీజర్ కామెంటరీస్, క్జెనోఫోన్ అనబాసిస్ లాంటి రచనలను రూపొందించే ఆలోచన చేయలేదు. ఎంతోకొంత చరిత్రగా చెప్పదగిన కల్హణుని రాజతరంగిణి కూడా శ్లేషతో సహా సంస్కృత కావ్య మర్యాదలను పాటించడంవల్ల రచయిత చెప్పదలచుకున్న వాస్తవాలు కూడా వాటికింద కప్పడిపోయాయి. తూసిడైడ్స్ రచించిన ‘పెలోపొనేసియన్ వార్’ కు అది ఏవిధంగానూ సాటి కాలేకపోయింది. పురాణాలలో ఏ కొంచెం చరిత్ర ఉందనుకున్నా; మతపరమైన కథలు, పరిభాష, కల్పనలు వాటిలో విపరీతంగా పేరుకుపోవడం వల్లా ,లేఖకుల నిర్లక్ష్యం వల్లా  అది కూడా తుడిచిపెట్టుకుపోయింది. వీటికి భిన్నంగా సుమేరియాకు చెందిన క్యూనీఫామ్ పత్రాలు ప్రత్యేకించి ఆయా దేశాలలోని సామాజిక పరిస్థితులతో సహా ఎంతో సమాచారాన్ని ఇస్తున్నాయి.

పై వాక్యాలను చూసినప్పుడు నాకు వెంటనే మహాభారతంలోని ఒక ముచ్చట గుర్తొస్తోంది. పాండవులు జూదంలో రాజ్యం కోల్పోయి వనవాసం చేస్తున్నప్పుడు కృష్ణుడు వారిని చూడడానికి వెడతాడు. జూద సమయంలో తను ద్వారకలో లేననీ, ఆనర్తదేశంలో సాళ్వుడితో యుద్ధం చేస్తున్నాననీ, ఒకవేళ తనే ద్వారకలో ఉండి ఉంటే, దుర్యోధనుడు పిలవకపోయినా హస్తినాపురం వచ్చి జూదం ఆపించేవాడిననీ ధర్మరాజుతో అంటాడు. మహాభారత కథ నిజంగా జరిగిందా అన్న చర్చను అలా ఉంచితే, కృష్ణుడి ఈ మాటల్లో నాకు అరుదైన చరిత్రస్పర్శ తోచి ప్రాణం లేచొచ్చింది.

తీరా మహాభారతవ్యాఖ్యాత నీలకంఠాచార్యులు ఆ మాటలకు ఇచ్చిన వివరణ చూడగానే నీరుగారి పోయాను. దానికి ఆయన తాత్వికమైన అర్థం చెప్పి ఆ చరిత్రస్పర్శను కాస్తా తుడిచిపెట్టేశారు. ఆయన ప్రకారం, ఇక్కడ ద్వారక అంటే నవద్వారాలు కలిగిన దేహమనే నగరం. అంటున్నది ధర్మరాజుతో కనుక అది అతని దేహనగరం అన్నమాట. తను ద్వారకలో లేడంటే అర్థం, జూదమాడే సమయంలో ధర్మరాజు తనను తలచుకోలేదనీ, తలచుకుని ఉంటే వచ్చి జూదం ఆపించేవాడిననీ కృష్ణుడు చెబుతున్నాడు!

వ్యావహారిక కాలమానాన్ని అనుసరించే చరిత్ర మనకు లేకపోవడం, అది మనకు అలవాటులేని ఔపోసన కావడం; అయినా సరే మాకు చాలా చరిత్ర ఉందని చెప్పుకోవలసి రావడం మనల్ని చాలా గంద్రగోళం లోకీ, ఒక్కోసారి హాస్యాస్పద పరిస్థితులలోకీ నెడుతోంది. మరోవైపు మనది అన్నింటికంటే కూడా అతి పురాతన నాగరికత అని చెప్పుకునే అవకాశాన్నీ చరిత్ర లేమి ఇచ్చింది. అలాగే, మానవ కాలమానానికి లొంగకుండా  దివ్యకాలమానాన్ని అనుసరించే చరిత్రనే అసలు చరిత్రగా చెప్పుకోడానికీ దారి తీయించింది. దానికి మళ్ళీ మన జాతీయతా భావన, ఆత్మగౌరవం లాంటివి కూడా జతపడి దానినో భావోద్వేగ విషయంగానూ, రాజకీయ అంశంగానూ మార్చి వేశాయి.

ఇంతకీ ఈ ఉపోద్ఘాతం అంతా దేనికంటే, పురా ప్రపంచంలో మన ఉనికి ఎలా ఉందో తెలుసుకోడానికి ప్రధానంగా ఇతర పురాతన నాగరికతలకు చెందిన ఆకరా(సోర్సులు)లే గతవుతున్నాయి. అవి ఒక్కోసారి మన గురించి మనం కల్పించుకున్న ఊహల్ని తలకిందులు చేసేలానూ ఉన్నాయి. ఒకటి చెప్పాలంటే, మన దగ్గర ఉన్న అనేక మతవిశ్వాసాలు, ఆరాధనాపద్ధతులు, సాంస్కృతిక ధోరణులు వాస్తవానికి సమీపప్రాచ్యం(నేటి టర్కీ, దాని చుట్టుపక్కల ప్రాంతాలు)నుంచి వ్యాపించినవని ఆధునిక పురాచరిత్రకారుల నిర్ధారణ. ఆ క్రమంలో అవి క్రీటులోకీ  ప్రసరించాయి.

దాని గురించి తర్వాత…

మీ మాటలు

  1. Saradhi Motamarri says:

    భాస్కరం గారు,

    ఒక వేళ, మన చరిత్ర పూర్వకమైన రచనలు కాల గర్భంలో కలిసిపోయిన అవకాశముందా? చుడండి, అన్నమయ్య గురించి మనకు తెలిసినది ఆయన తరువాత 550 సంవత్సరాలకు!

    ఆంతరంగిక కల్లోలాలలో, కొంత మంట గలసిన అవకాశం కుడా ఉంది.

    ఇటివల సాయి పాపినేని గారి వ్యాసం కూడా బాగా ఉన్నదండి – పురాణాల కాల నిర్ణయంలో.

    బహుశ, ఆర్య అనార్య వాదన వల్ల, మనం చాలా నష్ట పోయామేమో!

    • కల్లూరి భాస్కరం says:

      “ఒక వేళ, మన చరిత్ర పూర్వకమైన రచనలు కాలగర్భంలో కలిసిపోయిన అవకాశముందా?”
      ఋషులు తమ శాస్త్రవిజ్ఞాన పరిశోధనలను పొందుపరిచిన తాళపత్రగ్రంథాలను పాశ్చాత్యులు ఎత్తుకుపోయి ఉపయోగించుకున్నారన్న ఇలాంటి వాదమే మన దగ్గర ఇంకోటి ఉందండీ. ఇవి ఓదార్పు మాటల్లా అనిపించి మన పరిస్థితిని మరింత దయనీయంగా చూపిస్తాయి. మీరన్నట్టు కొన్ని కాలగర్భంలో కలిసిపోవడానికీ, కొన్ని ఆంతరంగిక కల్లోలాలలో మంట కలవడానికీ అవకాశమున్నా; ఇంకా ఎన్నో ప్రాచీన రచనలు ఆ విధ్వంసం నుంచి తప్పించుకుని మనకు అందుబాటులో ఉన్నాయి. ఒక్క చరిత్ర రచనలే పూర్తిగా ధ్వంసమై పోయాయనుకోవడం హేతుబద్ధంగా అనిపించదు. ఒకవేళ ఆర్య, అనార్యవాదం వాదం వల్ల మనం నష్టపోయామనుకుంటే, దానిని తిప్పికొట్టే వనరులు మన దగ్గర ఉన్నాయా అన్నది అసలు ప్రశ్న.

  2. సుందరం​ says:

    శ్రీ భాస్కరం గారూ,
    మన ‘చరిత్ర’ కాల గణనలో ఉన్న అంతరాలు బహుశా అప్పటి రాజులు పాటించే ‘ధర్మాన్ని’ బట్టి కూడా ఆయా సమయాలలో ఉన్న చరిత్రకారులు అన్వయించి వుండుచ్చునేమో!, తదనంతర కాల రాచరిక మార్పులకు మళ్లీ కొత్త రూపు/అనుగుణమైన మార్పులు చేర్పులూ కూడా చేరి ఉండొచ్చు కదా. ఆశోకుడు ముందు ‘హిందూ’ ధర్మాన్ని అనుసరించుతూ ఉన్న రాజు “దేవానాంప్రియ ప్రియదర్శి” (దేవతలందరికీ ఇష్టమైన ఇష్టుడు?) [dEvAnAMpriya priyadarSi] అన్న బిరుదుతో పరిపాలించి, తన రాజ్య విస్తరణా కాంక్షలో భాగంగా జరిగిన “కఌంగ” [kaLiMga] యుద్ధంలో జరిగిన “మారణ కాండ”కు తను ‘బౌద్ధ మతాన్ని’ స్వీకరించి ఆ మత వ్యాప్తి కి పాటు పడ్డాడని కదా అతని “శాసనాల” ద్వారా మనకు తెలిసిన చరిత్ర.
    అంటే అప్పటి రాజాజ్ఞ మేరకు ముందు ఒకలా, తరవాత మళ్లీ రాజు మారిన ధర్మానుసారం చరిత్రను మార్చి ఉండవచ్చును కదా. ఇలా రాజులు మారే కొద్దీ వారి వారి ధర్మ అనుసరణ తో చరిత్రకూడా ‘వంపు’ లు తిరిగి ఉండుచ్చునేమో. కానీ మనకున్న ‘భారతీయ పురాణేతిహాసాలు’ నిజమని నమ్మినా/నమ్మకపోయినా ( ఇది వ్యక్తిగతమైన నమ్మకాన్ని బట్టి అని నా ఉద్దేశ్యం), ప్రధాన సంఘటనలు ఒకలానే జరిగాయని, రాముడి తరవాతే కృష్ణుడు అన్నది చారిత్రకంగా/కల్పనాపరంగా సత్యమే కదా.

    అయినా కూడా మీ ‘వ్యాస’ పరంపర చూస్తే మన భారతీయ చరిత్ర లో చాలా మటుకు సంఘటనలు ఒకే రీతిన సాగినట్లు ఉన్నాయి కదా, అంటే కొన్నివిశేషణాలు/ విశ్లేషణలు ఎక్కువైనా, ముఖ్య భూమికల/కథ ల స్వరూపం మారలేదు కదా (అంటే ధర్మరాజు జూదంలో ‘రాజ్యం’ కోల్పోవడం అన్నది ‘కథా పరంగా’ నిజమే కదా!!).
    అలాగే తరతరాలుగా ఉన్న చాలా సంప్రదాయాలు కూడా ‘పరంపరా ​​నుగతం’ గా ముందు తరాలు అందుకుంటూనే, వాటిని కాపాడుతున్నాము కదా. ఒకటే మీరు అన్నట్లు, మన చరిత్రకు ఒక క్రమానుగతమైన కాల గణన లేదు , ఇది కూడా మనం పాటించే ‘పంచాంగ’ పద్దతి మీద ఆధారపడింది కావచ్చు… ఉదా: మనకు ‘కృష్ణాష్టమి’ శ్రావణ మాసం లో వస్తుంది, ఇక్కడ ఉత్తర భారతంలో అది వేరే మాసంలో వస్తుంది, కానీ “అదే రోజు” వస్తుంది. అంటే ‘జరిగిన సంఘటన’ ఒకటే, అది మళ్లీ మళ్లీ అదే రోజు వస్తోంది, అంటే చరిత్ర మారిపోవడం లేదు, కానీ ‘జరిగిన సమయ’ నిర్ధారణ వేరుగా ఉంది.

    సుందరం​

  3. krishna says:

    రోమిలా థాపర్ చరిత్ర లో 90% అబద్దాలే ….ఆమె ని ఉటంకించడం ఎ విధం గా ప్రామాణికం కాదు.

  4. కల్లూరి భాస్కరం says:

    సుందరం గారూ…మన పురాణ ఇతిహాసాలు కొన్ని వాస్తవిక ఘటనలనే నమోదు చేసిన మాట నిజమే. దాంతోపాటు ఎన్నో కల్పనలూ చొప్పించాయి. దాంతో కల్పనల్లోంచి నిజాలను వెలికి తీయడానికి ఎంతో శ్రమపడాలి. వెలికి తీసినా వాటిపై ఏకాభిప్రాయం కుదరక పోవచ్చు. అందుకే పురాణ ఇతిహాసాలు చారిత్రకాంశాలను ప్రతిఫలిస్తాయి తప్ప చరిత్రలు కావు. ఒక ఉదాహరణ చూడండి. నిన్నమొన్నటి కృష్ణదేవరాయల గురించి పెద్దన మొదలైన కవులు తమ కావ్యాలలో రాశారు. అవి చదువుతున్నప్పుడు వాస్తవికాంశాలను చదువుతున్నట్టు అనిపించదు. పైన వ్యాసంలో కోశాంబీ అన్నట్టు మన దృష్టి కావ్య మర్యాదలవైపు వెళ్లిపోతుంది. అదే ఫర్గాటెన్ ఎంపైర్ చదువుతుంటే వాస్తవికాంశాలు చదువుతున్నట్టు అనిపిస్తుంది. చరిత్ర రచన మన దగ్గర ఒక ప్రత్యేక డిసిప్లిన్ కలిగిన ప్రక్రియగా అభివృద్ధి చెందలేదు.

  5. johnson choragudi says:

    భాస్కరం గారూ

    నమస్తే

    మీరన్న ‘ఇప్పటికీ మన దేశం క్రీస్తు పూర్వం లోనే వుంది, క్రీస్తు శకం లోకి రాలేదు’ అన్న నిర్ధారణ చర్చ కు లైఫ్ లైన్. తాత్విక స్థాయి లో ‘కాలాన్ని’ చూసే వారికే అర్ధమయ్యే విషయమిది.

    తెలుగు లో అరుదయిన అంశాల మీద చర్చ కు ఉపక్రమించిన మీకు ధన్యవాదాలు.

    శుభాకాంక్షలతో

    జాన్సన్ చోరగుడి

    • కల్లూరి భాస్కరం says:

      నమస్తే జాన్సన్ గారూ…మీ స్పందన ఎంతో ఉత్సాహదాయకం.

    • N. S K Chakravarthy says:

      చరిత్రకు నోచుకోని విచిత్ర యుగం! – ‘‘చరిత్ర పూర్వయుగం’’
      పురాతత్వశాఖ వారి తవ్వకాలలో బయటపడుతున్న మహా విషయాలకు సముచిత ప్రచారం లేదు. మూఢ విశ్వాసాలను వదిలించుకోవాలన్న ప్రచారం జరుగుతున్న సమయంలోనే మూఢ విశ్వాసాలు మన నెత్తికెక్కి కూర్చుని ఉండడం విచిత్రమైన వర్తమానం. ఈ మూఢ విశ్వాసాలు మన విద్యారంగాన్ని రెండువందలు ఏళ్లకు పైగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ మూఢ విశ్వాసాలు విదేశీ దురాక్రమణదారుల వారసత్వ శకలాలు. ఒక్కొక్క ‘శకలం’ సకలంగా మారి మన జీవన రంగాలను ముక్కలు ముక్కలుగా మార్చివేస్తున్నాయి. మన వ్యవహారంలో, విజ్ఞానంలో సమన్వయం, సమగ్రత్వం లోపించడానికి హేతునిబద్ధత అడుగంటి పోవడానికి ఇలా ‘శకలం’ సకలమై కూర్చుని ఉండడం ప్రధాన కారణం. శకలాలను మళ్లీ ఒకటిగా కూర్చి సకలత్వాన్ని సాధించడానికి ఇప్పుడైనా కృషిజరగాలి. విద్యాప్రణాళికలలో, పాఠ్యపుస్తకాలలో, భాషాస్వరూపంలో సంస్కరణలు జరిగిపోవాలని ప్రచారం చేస్తున్నవారు ‘తవ్వకాల’ద్వారా బయటపడుతున్న చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక వాస్తవాలను మన జాతీయ జీవనంతో సమన్వయం చేసుకోవాలి! భారతీయ సంస్కృతి గొప్పదని అంటున్నవారే ‘ఆర్యు లు’అనేవారు బయటినుంచి మన దేశానికి వచ్చిపడినారని కూడ పాఠ్యాంశాలలో ఇప్పటికీ ఇరికిస్తూ ఉన్నారు. ఇది మూఢ విశ్వాస చిహ్నం….
      ‘చరిత్ర’కు ప్రారంభ బిందువును నిర్దేశించడం పాశ్చాత్యుల విశ్వవిజ్ఞాన అవగాహనా రాహిత్యానికి శతాబ్దుల సాక్ష్యం! ఆ చారిత్రక ప్రారంభ బిందువునకు ముందున్న కాలాన్ని ‘చరిత్ర పూర్వయుగం’గా చిత్రీకరించడం కాలగతికి పాశ్చాత్య చరిత్రకారులు చేసిన ఘోరమైన గాయం… ఈ ‘తథాకథిత’- సోకాల్డ్- చరిత్ర పూర్వయుగం- ప్రి హిస్టారిక్ ఏజ్-లో మాత్రం మానవులు లేరా? కనీసం ప్రాణులు లేవా? వారిది లేదా వాటిది మాత్రం చరిత్రకాదా?? చరిత్ర కాదనడం చరిత్రకు జరిగిన అన్యాయం. ఈ అన్యాయం చేసింది మిడిమిడి జ్ఞానం కలిగిన పాశ్చాత్య మేధావులు! ఈ ‘శకల’మే ‘సకల’మని ఐరోపా చరిత్రకారులు మనకు క్రీస్తుశకం పద్దెనిమిదవ, పంతొమ్మిదవ శతాబ్దులలో పాఠాలను చెప్పారు. ఆ పాఠాలను ఆ తరువాత మరింత నిష్ఠతో శ్రద్ధతో వల్లెవేస్తున్నాం! అందువల్లనే గొప్ప విషయాలను చెప్పదలచుకున్న మేధావులు, లేదా చెబుతున్నట్టు అభినయిస్తున్న మహా మేధావులు ‘చరిత్ర పూర్వయుగం’-ప్రిహిస్టారిక్ ఏజ్- అన్న విచిత్ర పద జాలాన్ని ఉటంకించడంతో ప్రారంభిస్తున్నారు!
      ప్రాచీన రాజధాని అమరావతి నవ్యాంధ్రప్రదేశ్‌కు మళ్లీ రాజధాని అవుతున్న సందర్భంగా ఈ ‘‘చరిత్ర పూర్వయుగం’’అన్న అర్థంలేని పదజాలం మళ్లీ విరివిగా ప్రచారవౌతోంది! ఈ ప్రచారం అతి ప్రాచీన అమరావతికి అవమానం. ఎందుకంటె అమరావతి లేదా కొందరు అంటున్నట్టు ‘ధాన్యకటకం’ ఐదువేల వంద ఏళ్లకు పూర్వం జరిగిన మహాభారత యుద్ధ సమయంలో ఉంది. అంతకు పూర్వం వేలాది ఏళ్లుగా ఉంది! కానీ బ్రిటిష్‌వారు మప్పిపోయిన ‘‘చరిత్ర పూర్వయుగం’’అన్న విచిత్ర పదార్థాన్ని ప్రచారం చేస్తున్నవారు ‘అమరావతి’ చరిత్రను రెండువేలు లేదా రెండు వేల ఐదువందల ఏళ్లకు పరిమితం చేస్తున్నారు! బ్రిటిష్‌వారు కాలాంతకులు, కాలాన్ని అంతంచేసినవారు… వారి వారసులు కూడ కాలాంతకులే! ‘‘చరిత్ర పూర్వయుగం’’ ఒకటుందని నమ్మడం ప్రచారం చేయడం మూఢ విశ్వాసబద్ధమైన బుద్ధికి నిదర్శనం! చరిత్ర అనాది… అనంతం… అందువల్ల చరిత్ర క్రమం ఆద్యం త రహితం! ‘‘చరిత్ర పూర్వయుగం’’,‘‘కోతియుగం’’,‘‘రాతియుగం’’,‘‘లోహయుగం’’ అన్నవి బ్రిటిష్‌వారు, పాశ్చాత్యులు ‘‘విజ్ఞానం’’గా భ్రమించిన మూఢవిశ్వాసాలు… బ్రిటిష్‌వారు మన దేశాన్ని వదలి వెళ్లినప్పటికీ, వారు అంటించిపోయిన ఈ మూఢ విశ్వాసాలు మన పుస్తకాలను, మస్తకాలను వదలకపోవడం భావదాస్య ప్రవృత్తికి ప్రత్యక్ష ప్రమాణం!
      పురాతత్త్వశాఖ వారి త్రవ్వకాలలో బయటపడుతున్న ప్రాచీన అవశేషాలు ‘‘హరప్పా మొహంజాదారో నాగరికత’’ కాలంనాటివని, అంతకు పూర్వంనాటివని వర్గీకరణలు జరుగుతున్నాయి. అంతవరకు కాలానికి సంబంధించిన పేచీలేదు. కాని ‘‘హరప్పా నాగరికత’’ లేదా ‘‘సింధునదీ పరీవాహక ప్రాంత- ఇండస్ వ్యాలీ నాగరికత’’అన్న పదజాలం మన జాతీయ అద్వితీయ తత్త్వానికి విఘాతకరమైనవి! ఈ దేశంలో గతంలో రెండుమూడు జాతులవారు పరస్పరం కొట్టుకొని చచ్చారన్న అబద్ధాన్ని ప్రచారం చేయడానికి బ్రిటిష్‌వారు ఈ ‘‘హరప్పా నాగరికత’’ను ‘‘కనిపెట్టి’’ పోయారు. ఈ హరప్పా నాగరికత కాలంనాటి మానవ అస్థిపంజరాలు నాలుగు ఇటీవల హర్యానాలో జరిగిన తవ్వకాలలో బయటపడినాయి. ఈ అస్థిపంజరాలు ఐదువేల ఏళ్లనాటివట! హరప్పా, మొహంజోదారో అన్న ప్రాచీన నగరాలు సింధూ పరీవాహ ప్రాంతంలో ప్రాచీన కాలంలో ఉండి ఉండవచ్చు. కానీ నగరాల పేరుతో ‘నాగరికత’లు, ‘‘రాజ్యాలు’’ ఉండడం భారతీయ చరిత్రలో సంభవించలేదు. ఇలా ఉండడం గ్రీకుల పద్ధతి పాశ్చాత్యుల పద్ధతి! నగరాలు మన దేశంలో రాజధానులు మాత్రమే. ‘‘నాగరికత’’అన్నది దేశమంతటా విస్తరించి ఉండిన ఒకే ఒక అద్వితీయ సాంస్కృతిక వ్యవస్థ! అందువల్ల బ్రిటిష్‌వారు కనిపెట్టిన ‘‘హరప్పా నాగరికత’’ నిజానికి భారతదేశమంతటా సమకాలంలో విస్తరించి ఉండిన అద్వితీయ సామాజిక వ్యవస్థ! అది వేద సంస్కృతి, సనాతన సంస్కృతి, భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి….
      ఇలా దేశమంతటా ఉండిన దాన్ని ఒక ప్రాంతానికి పరిమితం చేయడం పాశ్చాత్యుల పరిమిత బుద్ధికి నిదర్శనం. ‘తక్షశిల’ప్రాచీన విద్యాకేంద్రం, రాజ్యంకాదు, రాజధాని కూడ కాదు. కానీ గ్రీకు బీభత్సకారుడైన అలెగ్జాండరు క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలో మన దేశంలో కొంత భాగాన్ని గెలిచాడన్న అబద్ధాన్ని పాశ్చాత్య చరిత్రకారుడు క్రీస్తుశకం పద్దెనిమిదవ శతాబ్దిలో ప్రచారం చేశారు. ఈ అబద్ధ ప్రచారంలో భాగంగా విశ్వవిఖ్యాత విద్యాకేంద్రమైన ‘తక్షశిల’ను ఒక ప్రత్యేక రాజ్యంగా కల్పించారు!! ఇదే పద్ధతిలో దేశమంతటా ఒకే జాతీయ సంస్కృతి అనాదిగా ఉండడం వాస్తవం కాగా, ఈ వేద సంస్కృతికి భిన్నమైన ‘‘హరప్పా నాగరికత’’ను పాశ్చాత్యులు ఏర్పాటుచేశారు. పైగా ఈ ‘‘హరప్పా నాగరికత’’ ధ్వంసమైన తరువాత మాత్రమే క్రీస్తునకు పూర్వం పదిహేనవ పన్నెండవ శతాబ్దుల మధ్య వేద సంస్కృతి ఈ దేశంలో పుట్టుకొచ్చిందన్న మరో భయంకర అబద్ధాన్ని కూడ పాశ్చాత్యులు మన చరిత్రకు ఎక్కించిపోయారు!! ఈ దేశంలో ‘యుగాలు’గా వేద సంస్కృతి పరిఢవిల్లుతోందన్నది వాస్తవ చరిత్ర. ఈ చరిత్రను చెరచి, వేదాల ప్రాచీనతను కేవలం మూడువేల ఐదువందల ఏళ్లకు కుదించడానికి బ్రిటిష్‌వారు చేసిన కుట్రలో ఈ తథాకథిత ‘‘హరప్పా నాగరికత’’ భాగం… ఈ కుట్రను భగ్నంచేయడానికి వీలైన అవశేషాలు తవ్వకాలలో అనేక ఏళ్లుగా బయటపడుతున్నాయి. ఇప్పుడు హర్యానాలో జరిగిన త్రవ్వకాలలో ఏడువేల ఐదువందల ఏళ్లనాటి పట్టణం బయటపడింది! ‘‘హరప్పా నాగరికత’’ కేవలం ఐదువేల ఏళ్ల ప్రాచీనమైనదన్న పాశ్చాత్య అబద్ధాన్ని ఈ ‘‘పట్టణం’’ ఇలా బట్టబయలుచేసింది.. భూస్థాపిత సత్యమిలా భువనమెల్ల మార్మోగెను….
      హరప్పా నాగరికతను ధ్వంసంచేసిన తరువాత వేదాలు వైదిక సంస్కృతి విలసిల్లాయన్న పాశ్చాత్యుల ‘‘అబద్ధాల చరిత్ర’’కు పెద్ద అవరోధం మహాభారత యుద్ధం. మహాభారత యుద్ధం కలియుగం పుట్టడానికి పూర్వం ముప్పయి ఆరవ ఏట జరిగింది! కలియుగం పుట్టిన తరువాత మూడువేల నూట రెండేళ్లకు క్రీస్తుశకం పుట్టింది. ఇలా క్రీస్తునకు పూర్వం 3138 ఏళ్లనాడు మహాభారతయుద్ధం జరిగిందని అమెరికా శాస్తవ్రేత్తలు సైతం నిర్ధారించిన సంగతి దశాబ్దిక్రితం ప్రముఖంగా ప్రచారమైంది. అమెరికా శాస్తవ్రేత్తలు నిర్ధారించకపోయినప్పటికీ ప్రాచీన భారత చరిత్రకారులు చేసిన నిర్ధారణలు నిజంకాకుండా పోవు. కాని పాశ్చాత్య భావదాస్య సురాపానం మత్తుదిగని భారతీయ మేధావులు అమెరికావారి ఐరోపావారి నిర్ధారణలను నమ్ముతున్నారు. ఆ నిర్ధారణ కూడ జరిగింది కనుక ఇకనైనా ‘హరప్పా’నాగరికత అన్న మాటలను వదలి పెట్టి దేశమంతటా అనాదిగా ఒకే వేద సంస్కృతి కొనసాగుతున్న వాస్తవాన్ని చరిత్రలో చేర్చాలి! ప్రాథమిక స్థాయినుండి స్నాతకోత్తర స్థాయివరకు గల విద్యార్థులకు బోధించాలి! మహాభారత యుద్ధం జరిగిననాటికి, క్రీస్తునకు పూర్వం మూడువేల నూటముప్పయి ఎనిమిదేళ్లనాటికి, దేశమంతటా ఒకే జాతీయత ఒకే సంస్కృతి నెలకొని ఉన్నాయి! అలాంటప్పుడు అదే సమయంలో ‘‘వేద సంస్కృతితో సంబంధం లేని, వేదాలకంటె ముందు ఉండిన’’ ఈ హరస్పా ఎలా ఉండి ఉంటుంది??
      చరిత్రను ఆవహించిన మూఢవిశ్వాసాన్ని ఇకనైనా వదలగొట్టాలి!
      ‘రాతియుగం’, ‘కోతియుగం’వంటివి కృతకమైన కల్పితమైన కాలగణన పద్ధతులు. ‘చరిత్ర పూర్వయుగం’అన్నది ఉండడానికి వీలులేదు. ఎందుకంటె సహజమైన విశ్వవ్యవస్థ తుది మొదలు లేకుండా వ్యవస్థీకృతమై ఉంది! ఈ ‘తుది మొదలులేనితనం’ కాలానికీ- టైమ్- దేశానికీ- స్పేస్-వర్తిస్తున్న శాశ్వత వాస్తవం. ఈ వాస్తవం ప్రాతిపదికగా కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం, కలియుగం వరుసగా తిరుగుతున్నాయి. శిశిర ఋతువు తరువాత వసంత ఋతువువలె రాత్రి తరువాత పగటివలె కలియుగం తరువాత మళ్లీ కృతయుగం రావడం చరిత్ర! ఇది సనాతనమైన నిత్యనూతనమైన హేతుబద్ధమైన వాస్తవం! ఈ వాస్తవం ప్రాతిపదికగా విద్యార్థులకు ఇకనైనా చరిత్రను బోధించాలి! ‘రాతియుగం’తోకాక కృతయుగంతో చరిత్రను మొదలుపెట్టాలి. కృత త్రేత ద్వాపర కలియుగాలు ఒకదానితరువాత ఒకటి రావడం ఖగోళ విజ్ఞానపు గీటురాయిపై నిగ్గుతేలిన నిజం!
      ఈ ఖగోళ వాస్తవాలను ఎవ్వరూ మార్చలేరు… వక్రీకరించలేరు. ఈ ఖగోళ వాస్తవం ప్రకారం ‘సప్తర్షులు’అన్న అంతరిక్ష సముదాయం భూమినుండి చూసినప్పుడు వందేళ్లపాటు ‘అశ్వని’వంటి నక్షత్రాలతో కలసి ఉదయిస్తుంది. ఈ సప్తర్షి మండలం అలా ‘రేవతి’వరకూ గల నక్షత్రాలతో ఉదయించే కాలఖండం రెండువేల ఏడువంద ఏళ్లు. ఈ ఖగోళ వాస్తవం ప్రాతిపదికగా కలియుగంలో ఇది యాబయిరెండవ శతాబ్ది! ఇది 5117వ సంవత్సరం. శాతవాహన ఆంధ్రులు కలియుగంలో 2269నుండి 2775వరకు 506 ఏళ్లపాటు మొత్తం భారతదేశాన్ని పాలించారు, దేశానికి రాజధాని గిరివ్రజం…!! ధాన్యకటకం అప్పటికే ఉంది, ధాన్యకటకం అమరావతి కావచ్చు, కోటిలింగాల కావచ్చు! ధాన్యకటకం రాజధానిగా సహస్రాబ్దులు పాలించిన తరువాతనే ఆంధ్రులు గిరివ్రజం రాజధానిగా భారత సమ్రాట్టులయ్యారు. ఇదీ యుగాల చరిత్ర…. ‘చరిత్ర పూర్వయుగం’ లేదు!
      హెబ్బార్ నాగేశ్వరరావు, ఆంధ్రభూమి, ఏప్రిల్ 30, 2015

  6. N. S K Chakravarthy says:

  7. Dr. Vijaya Babu, Koganti says:

    భాస్కరం గారు , మంచి ఆలోచనాపుర్వకమైన చర్చకు ఎప్పటిలాగే ఆద్యులు మీరు.
    మన ప్రాచీన గ్రంధాలు సాహిత్యం మిరన్నట్లుగా తాత్వికతను బొధించినంతగా పాశ్చాత్యుల వలే చరిత్రకు ప్రాధాన్యాన్ని ఇచ్చినట్లు కనిపించదు. మనది వేద భూమి కావచ్చు మనం సంస్క్రతి వారసులం కావచ్చు. కొన్ని వాస్తవాలు అంగికరించి నిజాల్ని నిజాలుగా అంగికరించె ప్రయత్నం చేయాలి. చరిత్ర ను కూడా పట్టిమ్చుకున్నట్లయితే చాలా విషయాలను , గొప్పతనాల్ని నిరూపించాల్సిన ఇంత ప్రయత్నాలూ అవసరముండేవి కావేమో. కొన్ని రకాల భావ జాలాలనుండి బయట పడగలిగితే వాస్తవాలుతప్పక గోచరిస్తాయి.

    • కల్లూరి భాస్కరం says:

      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు విజయబాబుగారూ…

మీ మాటలు

*