గణపతి కొమ్ము కిరీటం చెప్పే ‘శృంగార’గాథ

కల్లూరి భాస్కరం 

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

ప్రపంచ పురాచరిత్రలోకి వెడుతున్న కొద్దీ మత, తాత్విక, సాంస్కృతికరంగాలలో భారతీయ ప్రత్యేకత గురించి, విశిష్టత గురించి మనం కల్పించుకునే ఊహలు మంచు బిందువుల్లా కరిగిపోయే మాట నిజమే.  అలాగని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇప్పటిలా వేగవంతమైన ప్రయాణసాధనాలు, సమాచార వినిమయ సదుపాయాలు లేని కాలంలో కూడా దాదాపు ప్రపంచం అంతా ఒకే రకమైన విశ్వాసాలను, తంతులను, తాత్వికతను పంచుకున్న తీరు ఆశ్చర్యచకితం చేసి, మన ఆలోచనావైశాల్యాన్ని అనేకరెట్లు పెంచుతుంది. మనకు పురాప్రపంచాన్ని వినూత్నంగా పరిచయం చేస్తుంది.

సుమేరు పురాణకథ ప్రకారం, మొదట అర్థనారీశ్వరులుగానూ, ‘అంకి’ అనే పర్వతరూపంలోనూ ఒకటిగా ఉన్న స్త్రీపురుషులను ‘ఎన్ లిల్’ అనే కొడుకు విడదీశాడని చెప్పుకున్నాం. బైబిల్ కథలో కూడా ఇలాంటిదే జరుగుతుంది.  మొదట ఈవ్ కూడా ఆడమ్ లో భాగంగా ఉంది. అంటే అర్థనారీశ్వర రూపమన్నమాట. అప్పుడు యెహోవా ఆడమ్ నుంచి ఈవ్ ను వేరు చేశాడు.  వారు వేరు పడగానే సృష్టి ప్రారంభమైంది. ఈవ్ నిషిద్ధఫలాన్ని తినడం దీనికి నాంది. బైబిల్ పూర్తిగా సెమెటిక్ పితృస్వామిక పురాణం కనుక అందులో ఆడమ్ అనే పురుషుని నుంచే ఈవ్ అనే స్త్రీ పుట్టింది. మన పురాణకథలు మాతృస్వామ్య/పితృస్వామ్యాల మధ్య రాజీకీ, సమన్వయానికీ చెందినవి కనుక మొదట జగజ్జననే పురుషుణ్ణి సృష్టిస్తుంది. ఆ పురుషుడు మిగతా సృష్టి నంతటినీ చేస్తాడు.

అంకి, ఆడమ్ ల గురించిన పై వివరాలు వెంటనే మన పురాణకథను ఒకదానిని గుర్తుచేస్తాయి. అది, కుమారస్వామి పుట్టుక.  ‘కుమారసంభవం’ పేరుతో సంస్కృతంలో కాళిదాసు, తెలుగులో నన్నెచోడుడు ఈ కథను గొప్ప కావ్యాలుగా మలిచారు. శివపార్వతులు కూడా అర్థనారీశ్వరులు. పార్వతికి మరో రూపం సతీదేవి. ఆమె దక్షయజ్ఞ సందర్భంలో యోగాగ్నిని కల్పించుకుని అందులో ఆహుతవుతుంది. దాంతో శివుడు విరక్తుడై తపస్సులో మునుగుతాడు. సతీదేవి హిమవంతుడి కూతురుగా జన్మించి పార్వతి పేరుతో పెరుగుతుంది.  అంతలో, తారకుడనే రాక్షసుడి బాధలు పడలేకపోతున్న దేవతలు, శివపార్వతులకు జన్మించే కుమారుడే అతన్ని చంపగలడు కనుక వారిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటారు. తపస్సులో ఉన్న శివుడిపై మన్మథుని ప్రయోగిస్తారు. శివుడు మూడో కన్ను తెరిచేసరికి మన్మథుడు బూడిదవుతాడు. అతని అర్థాంగి రతీదేవి శోకిస్తుంది. ఈలోపల అక్కడ పార్వతి కూడా శివుని పెళ్లాడడం కోసం తపస్సు ప్రారంభిస్తుంది. చివరికి శివుడు మెత్తబడతాడు. పార్వతి తపస్సు ఫలించి, శివపార్వతుల పెళ్లి జరుగుతుంది. మన్మథుడు మళ్ళీ పుడతాడు. కుమారుడు జన్మిస్తాడు.

ఈ కుమారసంభవ కథ కేవలం ఒక భారతీయ పురాణ ’కథ’ను మాత్రమే చెబుతోందనుకుంటే అంతకన్నా పొరపాటు ఉండదు. క్లుప్తంగా చెప్పాలంటే, అది ప్రపంచమంతటా ఉన్న ఒకానొక ఆదిమ తాత్వికతను, దానిని అంటిపెట్టుకుని ఉన్న ఒక తంతును చెబుతోంది. అది కూడా వ్యవసాయసంస్కృతితో గాఢంగా అల్లుకున్న తంతు. సర్ జేమ్స్ ఫ్రేజర్ తన Golden Bough లో ఇందుకు సంబంధించి విస్తారంగా దండగుచ్చిన వివరాలన్నింటిలోకీ ఇప్పుడు వెళ్లలేం కానీ, ఒకటి చూద్దాం:

సుమేరుల మహాదేవుడు దుముజీ; ఇతర చోట్ల తమ్మూజ్, అడోనిస్, డయోనిసస్ అనే దేవుళ్లూ శివునికి ప్రతిరూపాలని చెప్పుకున్నాం. బాబిలోనియా, సిరియాలకు చెందిన సెమెటిక్ ప్రజలు అడోనిస్ ను పూజించేవారు. సెమెటిక్ భాషల్లో అడోన్ అంటే ప్రభువు అని అర్థం. ఆ దేవుని అసలు పేరు తమ్మూజ్. ప్రాచీన గ్రీకులు ఈ సెమెటిక్ దేవుడినే తాము కూడా పూజించడం ప్రారంభించి ‘ప్రభువు’ అనే ఆయన బిరుదునే అసలు పేరుగా మార్చుకున్నారు. బాబిలోనియా పురాణాలలో జగజ్జనని అయిన ఇష్టార్ కు తమ్మూజ్ ప్రియుడు, భర్త. ప్రకృతిలోని పునరుత్పాదక శక్తులకు ప్రతీక ఇష్టార్. అలా ఉండగా, తమ్మూజ్ ఏటా మరణించి అధోలోకానికి వెళ్ళిపోతాడు. అది దుమ్ము, ధూళీ నిండిన ఓ చీకటి గుయ్యారం. దాంతో ఇష్టార్ శోకంలో మునిగిపోయి ప్రియుణ్ణి వెతుకుతూ అధోలోకానికి వెడుతుంది.

ఆమె కనుమరుగవడంతో మనుషులు, పశువులన్న తేడా లేకుండా ప్రతిజీవిలోనూ పునరుత్పాదనకు అవసరమైన పరస్పర వాంఛ అంతరించిపోతుంది. ఫలితంగా సృష్టి స్తంభించిపోతుంది.  ఇష్టార్ అధోలోకంలో ఉన్నట్టు ‘ఈ’ అనే(మన బ్రహ్మదేవుడి లాంటివాడు)దేవదేవుడు తెలుసుకుని ఆమెను పైలోకానికి రప్పించడానికి వార్తాహరుని పంపిస్తాడు. అల్లతు లేదా ఎర్ష్-కిగల్ అనే రాణి అధోలోకాన్ని ఏలుతూ ఉంటుంది.  జీవజలంతో తమ్మూజ్ ను బతికించి ఇష్టార్ తనతో తీసుకువెళ్లడానికి రాణి అయిష్టంగానే ఒప్పుకుంటుంది. ఇష్టార్ ప్రియుని వెంటబెట్టుకుని సంతోషంగా పైలోకానికి తిరిగివస్తుంది. ఇష్టార్ రాకతో ప్రకృతి అంతా పునరుజ్జీవనం పొందుతుంది. స్త్రీపురుషులలో తిరిగి వలపులూ, మోహాలూ విజృంభిస్తాయి. సృష్టి యథావిధిగా సాగుతుంది.

తమ్మూజ్ మరణాన్ని సంకేతించే విషాదపూరితమైన తంతును ఏటా వేసవి మధ్యలో జరుపుతారు. ఆ సందర్భంలో స్త్రీ, పురుషులందరూ శోకాలు పెడతారు. బాబిలోనియా పురాణాలలో ఇలాంటి శోకగీతాలు ఎన్నో కనిపిస్తాయి. ఆ సందర్భంలో తమ్మూజ్ బొమ్మను చేసి, దానిని నీటితో శుద్ధి చేసి, తైలంతో అభిషేకించి, ఎర్రని వస్త్రం చుట్టబెట్టి, దాని ముందు ధూపం వెలిగిస్తారు. ఒక ప్రస్తావన ప్రకారం, జెరూసలెం ఆలయం ఉత్తరద్వారం దగ్గర స్త్రీలు తమ్మూజ్ కోసం శోకాలు పెట్టేవారు.  తమ్మూజ్ మరణం వాడిపోయే మొక్కలకు ప్రతీక. ఆవిధంగా ఇది వ్యవసాయసంబంధమైన తంతు. తమ్మూజ్  బతికి ఇష్టార్ వెంట పైలోకానికి రావడం; వారి రాకతో ప్రకృతి అంతా పునరుజ్జీవనం పొందడం పంటలకు, మొక్కలకు అనుకూలమైన పరిణామానికి సూచన. ఆవిధంగా అది సంతోషాన్ని వ్యక్తపరిచే సందర్భం కూడా. అప్పుడిక జరగవలసిన తంతు, కళ్యాణం.

పై కుమారసంభవం కథకు, ఇష్టార్-తమ్మూజ్ ల కథకు మధ్య కొన్ని తేడాలు ఉన్నా పోలికలూ స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. కుమారసంభవం కథలో శివపార్వతులు, రతీమన్మథులు అనే రెండు జంటలు ఉంటే; ఇష్టార్-తమ్మూజ్ ల కథలో ఒక్క జంటే ఉంది.  తమ్మూజ్ ను వెతుక్కుంటూ ఇష్టార్ వెళ్లిపోవడంతో జీవుల్లో లైంగికేచ్ఛ అంతరించి పునరుత్పత్తి ఆగిపోయినట్టు సూటిగా ఉంటే, కుమారసంభవంలో సూచ్యంగా ఉంది. తారకాసురుణ్ణి చంపగల కొడుకును కనడం కోసమే అయినా, మొత్తం మీద దేవతల ప్రయత్నం శివునిలో శృంగారభావన రేకెత్తించి పార్వతిని పెళ్లాడేలా చూసి సృష్టికార్యానికి ఉన్ముఖణ్ణి చేయడమే. మొదట ఆ ప్రయత్నం బెడిసికొట్టి, అక్కడ తమ్మూజ్ మరణించినట్టే ఇక్కడ మన్మథుడు బూడిదయ్యాడు. అంటే, సృష్టి స్తంభించే ప్రమాదం తలెత్తిందన్నమాట. ఇక్కడ మన్మథుని మరణానికి రతీదేవి శోకించినట్టే, తమ్మూజ్ కోసం ఇష్టార్ శోకించింది.  తమ్మూజ్ ను ఇష్టార్ కోరుకున్నట్టే పార్వతి శివుని కోరి తపస్సు ప్రారంభించింది. చివరికి శివుడు మెత్తబడి పార్వతిని పెళ్లాడడానికి అంగీకరించాడు. దాని పర్యవసానంగా మన్మథుడు మళ్ళీ పుట్టాడు. ఈవిధంగా మన్మథుడు ఓడి గెలిస్తే, శివుడు గెలిచి ఓడాడు.

అక్కడ తమ్మూజ్ తిరిగి పుట్టడం, ఇష్టార్ తో కలసి పై లోకానికి రావడం ప్రకృతి పునరుజ్జీవనానికి సంకేతమైనట్టే; ఇక్కడ శివపార్వతుల కళ్యాణం, మన్మథుని పునరుజ్జీవనం ప్రకృతి పునరుజ్జీవనానికి సూచనలు. ఇందులో జరిగింది ఏమిటంటే, వ్యవసాయ సంబంధమైన ఒక తంతుతోనూ, తాత్వికతతోనూ ముడిపడిన ఒక ఆదిమ పురాణ కథ పునాది మీదే శివపార్వతుల కళ్యాణమూ-కుమారస్వామి పుట్టుకా అనే కథను నిర్మించడం! అదలా ఉంచితే, కుమారస్వామి పార్వతికి పుట్టలేదని చెప్పే కథ కూడా ఉంది. ఇప్పుడు అందులోకి వెళ్ళడం లేదు.

వ్యవసాయ సంబంధమంటే, భౌతిక వాస్తవికతతోనూ, ప్రయోజనంతోనూ ముడిపడినదన్నమాట. క్రమంగా ఆ భౌతికమైన పునాది నేలలో కప్పడిపోయి పై నిర్మాణం మాత్రం మిగిలింది. ఆ నిర్మాణం మీద మళ్ళీ రకరకాల తాత్విక భాష్యాలు అవతరించాయి. అవి భౌతికమైన పునాదితో ఎలాంటి సంబంధం లేని భాష్యాలు. ఇక కావ్యప్రియులకు ‘కుమార సంభవం’ అనగానే రసం, అలంకారం మొదలైన కావ్యసామగ్రి అంతా అమరిన ఒక గొప్ప కావ్యం మాత్రమే  గుర్తొస్తుంది.

ఇప్పుడొకసారి రాంభట్లగారిని పలకరించడం సందర్భోచితంగా ఉంటుంది. ఆదిమకాలంలో రసాలంకారా లనేవి మనిషి మనుగడనుంచి, అంటే భౌతికవాస్తవికత నుంచి ఎలా అవతరించాయో ఆయన(జనకథ)చాలా ఆసక్తికరంగా వివరిస్తారు. ఎలాగంటే, గణదశలో గుంపు మనువులు ఉండేవి. మనువుకు అర్హమైన గణంలోని ప్రతి మగవాడూ ‘గణపతి’. ప్రతి మగువా గణపత్ని. గణపతులలో శృంగార సామర్థ్యం కలిగిన ఒకరిని ప్రధాన గణపతిగా ఎన్నుకునేవారు. గణకన్యలు అతనిని పూలతో అలంకరించేవారు. తలపై శృంగ(కొమ్ము) కిరీటం పెట్టేవారు. ఈ ‘శృంగం’ అనే మాటనుంచే అలంకరించడం అనే అర్థంలో ‘శృంగారం’, ఆపైన రసరాజమైన శృంగారరసం పుట్టాయి. కొమ్ములు దర్పానికి, అంటే మగటిమికి చిహ్నాలు. మన్మథుడికి కందర్పుడనే పేరు ఉంది. దర్పకలీలకు శృంగారమని పేరు. గణపతికి గణకన్యలు జరిపే అలంకారం నుంచే ఇప్పుడు గుళ్లల్లో జరిపే నిత్య వార మాసాద్యలంకారాలు పుట్టాయని రాంభట్ల అంటారు.

BH-7-ISHTAR-&-TAMMUZ

ఏ కన్య అయినా గణపతి శృంగారసామర్థ్యం మీద పెదవి విరిస్తే, గణకన్య లందరూ అతన్ని చుట్టుముట్టి మెడలో వేసిన పూలమాలలు పీకి పారేస్తారు. కిరీటం తీసేసి కొమ్ములు విరుస్తారు. ‘అవమానించడం’ అనే అర్థంలో ‘శృంగభంగం’ అనే మాటకు ఇదే మూలం కావచ్చు. గణదాయీలు అడ్డుపడకపోతే అతని ప్రాణాలకే ముప్పు రావచ్చు. ఈ గణపతి ఆచారాలు నిన్నమొన్నటి వరకూ చాలా తండాలలో ఉండేవి. మన సాహిత్యంలో రసరాజు అయిన శృంగారం పుట్టిన వైనం ఇదీ. శృంగారంతోపాటు హాస్యకరుణలు కూడా గణపతి నుంచే పుట్టాయి. ఈ మూడూ మూల రసాలని రాంభట్ల అంటారు.

ఇప్పుడు వీటి పుట్టుకకుగల భౌతిక నేపథ్యాన్ని చూద్దాం.

మోర్గాన్ పురాచరిత్రను శావేజీ, బర్బర అనే రెండు దశాలుగా విభజించారు. మళ్ళీ ఒక్కొక్క దశలో మూడు అంతర్దశలు ఉంటాయి. శావేజీ మహాదశ ముగిసి, బర్బర ప్రథమదశలోకి అడుగుపెట్టే నాటికి జనం స్థిరనివాసానికి అలవాటుపడి గ్రామాలు ఏర్పరచుకున్నారు. పెద్ద ఎత్తున వ్యవసాయాన్ని ప్రారంభించేముందు పెరటిసాగు, కంచె పశుపాలన చేపట్టారు. గ్రామాలలో ప్రతి గణానికీ నివేశనస్థలంతోపాటు శ్మశానం కూడా ఉండేది. పురాతత్వ ఆధారాలను బట్టి మొదట్లో మృతదేహాలను పాతిపెట్టేవారు. దహనం చేయడం ఆ తర్వాత వచ్చింది.

గణ మానవుడికి ఇద్దరు తల్లులు. అతను ఒక తల్లి గర్భం నుంచి పుడతాడు. చనిపోయిన తర్వాత ఖననం చేస్తారు కనుక, మరో తల్లి గర్భంలోకి చేరతాడు. భూమి కూడా తల్లే. అందుకే భూమాత అంటాం. గణపతికి ‘ఇద్దరు తల్లులు కలిగినవాడా’(ద్వైమాతుర గణాధిపా) అన్న సంబోధన ప్రసిద్ధమే. ఇది జనన మరణ చక్రం. పుట్టుకకు ముందు శృంగారం, చావుకు తర్వాత కరుణ. ఇదీ ఆ రెండు రసాల పుట్టుక క్రమం. ఇవి రెండూ హాస్యం ద్వారా వ్యక్తమవుతాయని రాంభట్ల అంటారు.

దీనిని వ్యవసాయానికి అన్వయించండి. విత్తనాలను భూమిలో పాతి పెట్టడం చావుకు సూచన. కనుక అది శోకించవలసిన సందర్భం. అయితే అది నిజ శోకం కాదు, కల్లశోకం, లేదా భావశోకం. అది హాస్యం ద్వారా వ్యక్తమవుతుంది. అంటే, అది హాస్యకరుణ. మరణించి తల్లి గర్భం చేరిన విత్తనాలు తిరిగి ఆ తల్లి గర్భం నుంచే పుట్టాలి. అంటే వెంటనే శృంగార చర్యలు మొదలవాలన్నమాట. అది కూడా కల్ల శృంగారం లేదా భావశృంగారం. అదీ హాస్యం ద్వారానే వ్యక్తమవుతుంది కనుక హాస్యశృంగారం.

ఈవిధంగా కరుణశృంగారాల ప్రదర్శన నాడు గణాల మనుగడతో నేరుగా ముడిపడింది. ఎందుకంటే, పాతిపెట్టిన విత్తనాలు మొలకలై తిరిగి పుడతాయి. ఒక విత్తనం నుంచి వంద విత్తనాలు ఆవిర్భవిస్తాయి. ఈ ఎరుక ఆనాటి జనం చేత ఆనందతాండవం చేయించిందని రాంభట్ల అంటారు. ఇలా ఒక భౌతికచర్యతో ముడిపడి, ఒక ప్రయోజనం కోసం అనుకరణ, లేదా అభినయ రూపంలో పుట్టి, హాస్యం ద్వారా వ్యక్తమైనవే కరుణశృంగారాలు. అవే ఆ తర్వాత కావ్యరసాలుగా మారాయి.

ఈ కరుణ శృంగారాల అభినయమే ఆయా పంటల పండుగలకూ మూలమైంది. గణపతి విత్తనాలకు ప్రతిరూపమయ్యాడు. ఖననం స్థానంలో దహనం మొదలైనప్పుడు ఈ పండుగల్లో కామదహనమూ చేరింది. మనం హోలీ పేరుతో జరుపుకునేది అదే. కామదహనమప్పుడు బూడిద ఎత్తిపోసుకోవడం, రంగులు, నీళ్ళు చల్లుకోవడం శృంగార హాస్య కరుణాభినయాలలో ప్రధానాంశమయ్యాయి.

ఈ కామదహనం మన దగ్గరే కాక, యూరప్, మధ్యాసియాలలో కూడా ఉంది. యూరప్ లో ‘కార్నివాల్’ పేరుతో దీనిని జరుపుతారు. కార్నివాల్ అంటే పంటల పండుగ. కేవలం ఖననం చేయడమే ఆనవాయితీగా ఉన్న సెమెటిక్ జనంలో కరుణాభినయం మాత్రమే చేసే పండుగలు ఉన్నాయి. శృంగారం వారి సామాజిక నీతికి విరుద్ధం. ఇలా ప్రపంచమంతటా జరిగే ఈ పంటల పండుగల గురించి జేమ్స్ ఫ్రేజర్ విస్తారమైన సమాచారం ఇచ్చారు. అది భారతీయ విలక్షణత, విశిష్టత, ప్రత్యేకతల గురించి మనం కల్పించుకునే ఊహల్ని పటాపంచలు చేయడమే కాదు; ప్రపంచ మతసాంస్కృతిక రేఖాపటంలో మనల్ని భాగస్వామిని చేస్తుంది.

ఇలా చూసినప్పుడు కుమారసంభవకథకు  ఏ ఆదిమ భౌతికవాస్తవికత మూలమో అర్థమవుతుంది. అది కేవలం కు’మారు’ని పుట్టుక గురించి మాత్రమే కాక, ‘మారు’ని పుట్టుక గురించి కూడా చెబుతోంది. మారుడంటే మన్మథుడు. బహుశా ఇష్టార్-తమ్మూజ్ కథలో లానే ఇందులో కూడా మన్మథుడు మరణించడం, రతీదేవి శోకించడం, మన్మథుడు మళ్ళీ పుట్టడమే మూల కథ అయుంటుంది. ఆ మూల కథను అలా ఉంచుతూనే దాని మీద శివపార్వతుల కథను నిర్మించి, దానికే ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే, మూలకథలో మన్మథుడితోపాటే ప్రకృతి పునరుజ్జీవనం పొందడం ప్రధానం కాగా; దానిని అప్రధానం చేసి, తారకాసురుణ్ణి చంపడం కోసం శివపార్వతులకు కుమారస్వామి పుట్టడాన్ని ప్రధానం చేసి ఉండచ్చు. భౌతికమూలాలనుంచి పురాణకథలను తప్పించి భావాంబరవీథిలో వాటిని ఎలా విహరింపజేశారో గ్రహించడానికి ఇదొక నిదర్శనమూ కావచ్చు.

***

మొదట అద్వైతస్థితిలో ఒకటిగా ఉండి; ఆ తర్వాత కొడుకు పుట్టడంతో ఇద్దరుగా విడిపోయిన స్త్రీ పురుషులను మళ్ళీ ఒకటి చేసే ప్రక్రియే ఏటా దేవీ దేవతలకు జరిపే కళ్యాణమని క్యాంప్ బెల్ అంటారు. ఈ అద్వైతస్థితిని, అర్థనారీశ్వర మూర్తిని పునర్నిర్మించడం రెండు రకాలుగా జరుగుతుంది. మొదటిది, ధ్యానం ద్వారా భావన చేయడం. రెండవది, సౌభాగ్యవర్ధనంతో ముడిపడిన మాంత్రిక చర్యల ద్వారా ప్రకృతిని పునరుజ్జీవింప జేయడం. మరోవైపు కంటికి, బుద్ధికి రెండు(ద్వైతం)గా కనిపిస్తున్నా; ఒక అంతరవులో లేదా విధానంలో ఆదిమ అద్వైతస్థితినీ గుర్తించడం లేదా భావన చేయడం జరుగుతూనే ఉంటుంది.

ఇది ద్వైత-అద్వైతాల మధ్య నిరంతర ఘర్షణ. ఇదే పురాతన కంచుయుగానికి చెందిన తాత్వికత. నటరాజులోనూ, సుమేరు మట్టిపలక మీదా కనిపించేది ఇదే ననీ, తూర్పుదేశాలలో ఇది ఇప్పటికీ అస్తిత్వంలో ఉందనీ, దీని మూలాలు క్రీటు నాగరికతలో ఉన్నట్టు కనిపిస్తుందనీ క్యాంప్ బెల్ అంటారు.

దాని గురించి తర్వాత…

 

 

 

 

మీ మాటలు

  1. P Mohan says:

    భాస్కరం గారూ,
    ఎప్పట్లానే విభ్రమం గొలిపింది. ఇటీవల గుణ సినిమా మళ్లీ చూశాను. సినిమా చివరిలో కమల్ హాసన్ చనిపోయిన హీరోయిన్ను(ఉమాదేవి)ని భుజంపై మోసుకెళ్లడం అచ్చం సతిని శివుడు మోసుకెళ్లినట్లు భలే తీశాడు సంతాన భారతి. మన కథలు ఫురా ప్రపంచం నుంచి నేటి వరకు సూత్రం తెగకుండా సాగడం వింతగా ఉంది.

    • కల్లూరి భాస్కరం says:

      ధన్యవాదాలు మోహన్ గారూ……”మన కథలు ఫురా ప్రపంచం నుంచి నేటి వరకు సూత్రం తెగకుండా సాగడం వింతగా ఉంది.” అని మీరు అన్నది నిజం. ఆ తెగని సూత్రం వింతగానే కాదు అద్భుతంగా కూడా ఉంటుంది, అందులోని మజాను ఆస్వాదించగలిగేవారికి. మీరు చెప్పిన గుణ సినిమా చూడలేదు. చూడాలి.

  2. జయదేవ్.చల్లా says:

    ఇస్త్టార్ పాత్రకీ ..ముస్లిముల ఇఫ్తార్ విందుకి కూడా చారిత్రిక మైన లింకు ఉన్నదని భావిస్తున్నారా..బాగా యోచిస్తే మంచి సమాచారం దొరుకుతుంది ..అందునా మీవంటి జిజ్ఞాసువులకు…

    • భాస్కరం కల్లూరి says:

      ఇష్టార్…ఇఫ్తార్…స్టార్…తార….ఈ పేర్లు అన్నింటిలో ‘తార’ ఉంది. తార అమ్మవారి పేర్లలో ఒకటి. ఇంకొంచెం ధృవీకరించుకోవాలి. అమ్మవారి ఆరాధనకు సంబంధించిన మూలాలు ఇస్లాం లోనూ, క్రైస్తవం లోనూ ఉన్నాయి. దానికి సంబంధించిన సమాచారం చాలా iఉంది. కొంత నా పురాగమనం వ్యాసాలలో కూడా ఇచ్చాను.

  3. జయదేవ్.చల్లా says:

    గణపతి కొమ్ము గురించిన సమాచారం ఏ గ్రంధంలోనిదో తెలుపగలరు..సాధారణంగా శృంగభంగం అనేది రుష్యశ్రు౦గుని నుంచి పుట్టిన నానుడిగా చెబుతారు..

    • భాస్కరం కల్లూరి says:

      గణపతి కొమ్ము గురించిన సమాచారాన్ని రాంభట్ల కృష్ణమూర్తిగారి జనకథ పుస్తకం నుంచి తీసుకున్నాను. ఆయన సోర్స్ చెప్పలేదు. కానీ కచ్చితంగా సోర్స్ ఉంటుందని చెప్పగలను. వెతకాలి. ఋష్యశృంగుని కథను పరిశీలిస్తే, శృంగభంగానికీ ఆయన కథకూ ఎలాంటి సంబంధమూ కనిపించదు.

  4. jayadev.challa says:

    దశరధుడు పంపిన కన్యకల వలన -అయన పెంపుడు కుమార్తె శంతను వివాహమాడి తన బ్రంహచర్యా వ్రతాన్ని వీడిన[భంగపరచుకున్న] రుష్యశ్రుగుని కధ మీకూ తెలిసే ఉంటుంది కానీ శృంగాభంగానికీ-రుష్యశ్రుగుని కధకూ లింక్ లేదంటున్నారు..మార్మికమైన అర్ధం ఋష్యశృంగుని కధలో కనిపిస్తూనే ఉన్నదీ కదా..శ్రుంగభంగం అంటే కేవలం కొమ్ము విరవడమో-వేరొకరు ఆ పని చేయడమో కాదు కదా..కాదు అనే అనుకుందాం అప్పుడు గణపతే స్వయంగా తన దంతపు కొమ్మును సగానికి విరచి రాక్షస సంహారం చేశాడు ,ఈ నేపధ్యంలో గణపతి తనకు తానుగానే శృంగభంగం చేసుకున్నట్లు మన భావించాల్సి ఉన్నదా?దీర్ఘకాలంగా అవలంబిస్తున్న వొక నియమాన్నో-లేక నిస్ట్టనూ లేక మితిమీరిన గర్వాన్నో ,ఆహాన్నో అణచడాన్ని శ్రున్గభన్గమైనధిగా చెబుతుంటారు..

  5. భాస్కరం కల్లూరి says:

    జయదేవ్ గారూ…దశరథుడు తన కుమార్తెను ఋష్యశృంగుడికి ఇచ్చి పెళ్లిచేయడం…గణపతి తన దంతపు కొమ్ము విరిచి రాక్షస సంహారం చేయడం…గురించి మీరు ప్రస్తావించారు. మన దగ్గరే కాక ప్రపంచంలో పలుచోట్ల పురాణ ఇతిహాస కథలు అంతకు ముందునాటి వ్యవస్థ తాలూకు విశ్వాసాల మీదా, తంతుల మీదా, కథల మీదా నిర్మాణమయ్యాయి, ఈ విషయాన్ని నా పురాగమనం వ్యాసాలు చాలా వాటిల్లో చర్చించాను. గణపతి కొమ్ము కిరీటం గురించిన వివరణ పురాణ, ఇతిహాసాల ముందు నాటిది.
    శిరస్త్రాణం మీద కొమ్ముల గురించిన ప్రస్తావన హోమర్ ఇలియడ్ లో కూడా కనిపిస్తుంది. ది గోల్డ్ ఆఫ్ ట్రాయ్ రాసిన Robert Payne వివరణ ప్రకారం వీరుడి పుంస్త్వాన్ని నొక్కి చెప్పడం కూడా శిరస్త్రాణం మీద కొమ్ములు ఉండడంలోని ఉద్దేశం. ఆవిధంగా చూసినప్పుడు శృంగారంలో పుంస్త్వానికి అంటే శృంగార సామర్థ్యానికి కొమ్ము కిరీటం సూచన అవుతుంది. అది లోపించిందని అనిపించినప్పుడు కొమ్ము విరవడం అంటే శృంగభంగం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన ఇతర సోర్సులు కూడా తప్పక లభిస్తాయనే అనుకుంటున్నాను.

మీ మాటలు

*