దాచేస్తే దాగని మాతృస్వామిక సత్యాలు!

కల్లూరి భాస్కరం 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)మనకు తెలుసు…మన పురాణ కథలలో ప్రకృతి అంతా సమాన భాగస్వామి అవుతుంటుంది. ‘ప్రకృతి అంతా’ అన్నప్పుడు అక్షరాలా ప్రకృతి అంతా అనే! అందులో ఎలాంటి మినహాయింపూ లేదు. ఉదాహరణలను చెప్పుకుంటూ వెడితే అంతే ఉండదు. అయినా కొన్ని చెప్పుకుంటే, హిమవంతం ఒక కొండ, ఆ పర్వతరాజు కూతురు పార్వతి. శివుడు నాగాభరణుడు, వృషభవాహనుడు. విష్ణువు గరుడ(పక్షి)వాహనుడు. దుర్గ సింహవాహిని. వినాయకుడు మూషికవాహనుడు. కుమారస్వామి నెమలివాహనుడు. బ్రహ్మ కమలాసనుడు. మన్మథుని విల్లు చెరకుగడ. తుమ్మెదలు దానికి అల్లెతాడు. పువ్వులు ఆయన బాణాలు. చిలుక వాహనం…

ఒక కోణం నుంచి చూస్తే మన పురాణ, ఇతిహాస, కావ్యాలు మనిషి జీవితంలో ప్రకృతి ఎంత అవిభాజ్యమో, రెండింటి మధ్యా సామరస్యం ఎంత అవసరమో చెబుతున్నట్టు ఉంటాయి. ప్రకృతిలోని ప్రతి అందాన్ని, ప్రతి అద్భుతాన్ని రెండు దోసిళ్లతో అందుకుంటూ జీవితాన్ని ఉత్సవభరితం చేసుకోమని బోధిస్తున్నట్టు ఉంటాయి. అడుగడుగునా ప్రకృతి సంబంధమైన పదజాలమూ, అలంకారాలతోపాటు అదనంగా ప్రకృతివర్ణనలు ఉంటాయి.

అసలు మొత్తం రామాయణ కథనే ప్రకృతి పరంగా అన్వయించుకోవచ్చు, అందులో గుహుడు, శబరి లాంటి గిరిజనులు లేదా వనచరులు ఉన్నారు. వానరాల వంటి తరుజునులు ఉన్నారు. సంపాతి, జటాయువు వంటి పక్షులు ఉన్నారు. చివరికి ఉడుత ప్రస్తావన కూడా ఉంది. అద్భుతమైన గుహలు, పర్వతాలు, చెట్లు, నదులు, సెలయేళ్లు, సముద్రాలతో కూడిన మొత్తం ప్రకృతి సన్నివేశం అంతా ఉంది. మామూలుగా ఉండడం కాకుండా రాముడు ప్రకృతిలోని వీటన్నింటితో సహజమైత్రితోనూ, సామరస్యంతోనూ ఉండడాన్ని కూడా రామాయణం ప్రత్యేకించి చెబుతోంది.

చివరిలో కూడా రామాయణం ప్రకృతి పరమైన ఒక సందేశాన్ని ఇస్తోంది. అదెలాగంటే, రావణవధ తర్వాత రాముడు పుష్పకవిమానం ఎక్కి సీతాలక్ష్మణులతో, వానరవీరులతో అయోధ్యకు తిరిగి వస్తూ మార్గమధ్యంలో భరద్వాజమహర్షిని సందర్శిస్తాడు. అప్పుడా మహర్షి ఏదైనా వరం కోరుకోమని రాముని అడుగుతాడు. చెట్లు అన్ని కాలాలలోనూ  పుష్కలంగా పండ్లు కాస్తూ ఉండేలా వరమివ్వమని రాముడు అడుగుతాడు. అందులో, చెట్లను విచక్షణారహితంగా నరకవద్దన్న సందేశం ఉంది. అడవుల పరిరక్షణ ఉంది. ఆవిధంగా పర్యావరణ ప్రబోధం ఉంది. వానరులకు చెట్లు ఆవాసాలు, ఫలాలు ఆహారమూ కనుక; తనకు ఎంతో సాయం అందించిన వానరుల పట్ల రాముడు కృతజ్ఞతను చాటుకోవడమూ ఉంది.

ప్రకృతి అంతా సమాన భాగస్వామి అవుతున్నది మన పురాణకథల్లోనేనా? కాదు, అనేక ప్రాంతాల పురాణకథల్లో! ఆ సంగతిని మరోసారి గుర్తుచేయడానికే పై ఉపోద్ఘాతం.

ముందుగా ఈ చిత్రాలు చూడండి…ఒకటి సరస్వతి చిత్రం. ఆమె పక్కన నెమలి ఉంది. కొన్ని చిత్రాలలో హంసలు ఉంటాయి. సరస్వతి హంస ఆసనం మీద కూర్చుని ఉన్న చిత్రాలూ కనిపిస్తాయి. రెండవది శృంగేరి శారదాదేవి చిత్రం. ఆమె నాలుగు చేతులలో ఒక చేతి మీద చిలుక వాలి ఉంది.

sarasvati

ఇంతకుముందు జియస్ మిలికోయిస్ అనే సర్పదేవుడికి కొందరు మొక్కుతున్న చిత్రం గురించీ, రాక్షసుడైన ఆ దేవునికి ఏటా పందులను బలి ఇవ్వడం గురించీ (‘యెహోవా కూడా కాళియమర్దనుడే’ అనే వ్యాసంలో)చెప్పుకున్నాం. తర్వాతి కాలానికి చెందిన ఒలింపియన్ తరహా తంతులకు భిన్నంగానూ, విపరీతంగానూ కనిపించే ఇలాంటి తంతులు ఒకవిధమైన ‘శైత్యాంధకారా’(chilly gloom)న్ని సూచిస్తూ ఉంటాయని లూసియన్ అనే ఒక గ్రీకు వ్యాఖ్యాత అంటారు. జోసెఫ్ క్యాంప్ బెల్ ఆ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తారు. కంచు యుగానికి చెందిన హోమర్ కు ముందునాటి గ్రీసు, మినోవన్, సైక్లాడిక్ దీవుల నాగరికతల వాతావరణం శైత్యాంధకారాన్ని తలపించేది కాదనీ; కాకపోగా అప్పటి కళాకృతులను గమనిస్తే, సృష్టి ప్రక్రియకు అనుగుణంగా సరసంగా, సమరసంగా జీవించే వాతావరణం వాటిలో కనిపిస్తుందనీ ఆయన అంటారు.

srungeri sarada

ఆ సందర్భంలోనే ఆయన ఇంకోటి కూడా అంటారు: (గ్రీకు)ఇతిహాసకాలంలో కూడా అమ్మవారు సర్పాలు, సింహాలు. చేపలు, చెరువులు, పావురాల గూళ్ళు, తాబేళ్ళు, పీతల్లాంటి అనేక కాళ్ళ సముద్రజీవులు, మేకలు, వృషభాలు మొదలైన సమస్త పరివారంతోనూ ఉంటుంది కానీ ఆమె ఎల్లప్పుడూ భయపెట్టేలా ఉండదు.

ఇక్కడ మనకు వెంటనే  గుర్తొచ్చే పోలిక, కాళికాదేవి.

 

గ్రీకు పురాణాలలో అఫ్రోడైట్ శృంగార, ప్రేమ, కామదేవత. మన లక్ష్మీదేవిలానే ఈమె సముద్రంలోంచి పుట్టింది.  మన మన్మథుడిలానే గొప్ప గొప్ప దేవుళ్ల మనసులలో సైతం శృంగార భావనలను రెచ్చగొట్టి అల్లరి పెట్టే చిలిపి దేవుడు ఈరోస్.  కొన్ని గ్రీకు పురాణ కథల ప్రకారం ఇతడు అఫ్రోడైట్ కొడుకు. హోమర్ ముందు కాలం నుంచీ, అంటే గ్రీకు ఇతిహాస కాలానికి ముందు నుంచీ ఉన్న శృంగార/ప్రేమ/కామాలను సంకేతించే దేవతారూపాలు వీరిద్దరూ. అయితే, అప్పట్లో అఫ్రోడైట్ ఆరాధనకు ఉన్న ప్రాచుర్యం ఈరోస్ ఆరాధనకు లేదు.

ప్రస్తుతానికి వస్తే, శారదాదేవి చేతి మీద చిలుక ఉన్నట్టే, అఫ్రోడైట్ చేతిలో పావురం ఉంది! మన సరస్వతిలా హంసలతోనూ, లేదా హంసవాహనం మీదా ఉన్న అఫ్రోడైట్ చిత్రాలు కూడా కనిపిస్తాయి.

ఈ పావురం ప్రతీకే ఒక క్రైస్తవ ఉదంతంలో కూడా కనిపిస్తుంది, దేవుడైన ‘హోలీ ఘోస్ట్’ ఒక పావురం రూపంలో మేరీ దగ్గరికి వస్తాడు. అయన ప్రభావంతో మేరీ తన చెవిలోంచి దేవుడి కుమారుని కంటుంది. అతను ఒక గుహలో పుడతాడు. ఈయన రొట్టె(bread)కూ, ద్రాక్షాసవా(wine)నికీ చెందిన వాడనీ, జననమరణాల చక్రంలో తిరుగుతూ ఉంటాడనీ ఈ ఉదంతం చెబుతుంది. దీనికి సంబంధించిన ఇతర అనేక వివరాలను అలా ఉంచితే,  క్యాంప్ బెల్ ప్రకారం, పావురం కూడా సర్పంలానే హోమర్ ముందు కాలానికి చెందిన జగజ్జనని పరివారంలో భాగం.

పై కథలాంటిదే గ్రీకు పురాణాలలోనూ కనిపిస్తుంది. దాని ప్రకారం, భూదేవత డిమీటర్, దేవతల నాయకుడు జియస్ ల కూతురు పెరెస్పోన్. డిమీటర్ కూతుర్ని క్రిటు ద్వీపంలోని ఒక గుహలో ఉంచి, తన రథాన్ని లాగే రెండు సర్పాలను దానికి కాపలా ఉంచుతుంది. వినడానికి దారుణంగానే ఉంటుంది కానీ, జియస్ సర్పరూపంలో ఆ గుహలోకి వెళ్లి పెరెస్పోన్ తో సంభోగిస్తాడు. ఇలాగే మన పురాణాలలో సరస్వతిని బ్రహ్మదేవుడికి కూతురిగానూ, భార్యగానూ కూడా చెప్పడం కనిపిస్తుంది.

వీటి వెనుక ఉండగల ఇతరేతర అన్వయాలలోకి ఇప్పుడు వెళ్ళలేం కనుక, ప్రస్తుతానికి వస్తే; మరో కథ ప్రకారం, పెరెస్పోన్ ప్రశాంతంగా గుహలో కూర్చుని విశ్వవస్త్రాన్ని నేస్తూ ఉంటుంది. అప్పుడు తల్లి డిమీటర్ తన కూతురు జియస్ కంటబడేలా చేస్తుంది. జియస్ సర్పరూపంలో గుహలోకి ప్రవేశిస్తాడు. పెరెస్పోన్ డయోనిసస్ అనే కొడుకును కంటుంది. ఇతను కూడా పైన చెప్పుకున్న చావు పుట్టుకల దేవుడు. అంటే రొట్టెకు, ద్రాక్షాసవానికి చెందిన దేవుడన్నమాట.

మన అమ్మవారి పరివారంలో చిలుక, హంస మొదలైనవి భాగమైనట్టే; గ్రీకు పురాణాలలో అమ్మవారి పరివారంలో భాగమైన పావురం క్రైస్తవ కథలోకి కూడా ప్రవేశించిన వైనాన్ని పై ఉదాహరణలు చెబుతున్నాయి. అలాగే, పెరెస్పోన్, మేరీలకు గుహలో కొడుకు పుట్టడంలో కూడా పోలిక కుదిరింది. ఈ ఉదాహరణలు ఆయా ప్రాంతాల పురాణకథల పరస్పర ప్రభావాన్నే కాక వాటి నిరంతరాయతను కూడా సూచిస్తాయి.

aphrodite

ఈ కథలు సూచించే మాతృస్వామ్య/పితృస్వామ్య స్పర్థ గురించి మరికొన్ని విషయాలు చెప్పుకుని మాతృస్వామ్యంలో  అంతర్లీనంగా ఉన్న జగజ్జనని తాత్వికతలోకి వెడదాం.

ఇంతవరకు చెప్పుకున్న రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, జియస్, యెహోవా మొదలైన ఉదాహరణలలో మాతృస్వామ్య/పితృస్వామ్య స్పర్థ ఎలా వ్యక్తమవుతోందో; మాతృస్వామ్య దేవతా రూపాలపైనా, తాత్వికతపైనా పితృస్వామ్యం పై చేయిని చాటుకోడానికి  ఎలా ప్రయత్నించిందో చూశాం. అయినాసరే, మాతృస్వామిక అవశేషాలు వీటిలో తొంగిచూస్తూనే ఉన్నాయి. గ్రీసు విషయానికే వస్తే, ఇక్కడి మాతృస్వామిక దేవతలను పితృస్వామిక దేవుళ్ళు రూపుమాపలేదనీ, వారిని వివాహమాడారనీ క్యాంప్ బెల్ అంటారు. మన దగ్గర కూడా సరిగ్గా అదే జరిగినట్టు కృష్ణుడి ఉదాహరణ ద్వారా చెప్పుకున్నాం. అమ్మవార్ల సమూహానికి ప్రతీక అయిన బృందను పెళ్లాడడం ద్వారా, కాత్యాయనిని (గోపికా వస్త్రాపహరణం కథలో)ఆరాధించేకంటే ముందు తనను ఆరాధించమని చెప్పడం ద్వారా కృష్ణుడు అమ్మవారి ఆరాధనను నిరాకరించకుండానే ద్వితీయస్థానానికి తరలించాడనీ అనుకున్నాం.

గ్రీకు-రోమన్ కథలతో పోల్చితే, పాత నిబంధన(Old Testament)లోని కథలు మాతృస్వామిక దేవతలపై పితృస్వామిక దేవతలు మరింత నిశ్చయాత్మకమైన విజయాన్ని సాధించినట్టు చెబుతాయని క్యాంప్ బెల్ అంటారు.  గ్రీకు-రోమన్ పురాణకథలలో వెనకటి దేవతలు, దేవుళ్ళ ప్రాధాన్యం తగ్గింది కానీ వారు అదృశ్యం కాలేదు. వారే కాకుండా, మాతృస్వామికతకు చెందిన వ్యవసాయపు తంతులు, స్త్రీల తంతులు, ముఖ్యంగా డిమీటర్, ఆర్ఫిక్స్ మార్మికతలు కూడా కొనసాగాయి. అంతేకాదు, Virgin and the Mass కు చెందిన కథలూ, తంతుల రూపంలో ఇవే తంతులు క్రైస్తవంలోకి కూడా వెళ్ళాయి.

మన అనుభవం ప్రత్యేకించి చెప్పనవసరంలేదు. మాతృస్వామిక దేవతలే కాకుండా; ఆ కాలపు వ్యవసాయ, స్త్రీ సంబంధమైన తంతులు; మార్మికతను చాటే రకరకాల తాంత్రిక పద్ధతులూ నేటికీ మన దగ్గర సజీవాలు.

ఇంకా విశేషం ఏమిటంటే, బైబిల్ పౌరాణికత మాతృస్వామిక దేవతలను రూపుమాపినట్టు కనిపించినా; మాతృస్వామ్య కాలానికి చెందిన సౌభాగ్య తంత్రాలను ఇజ్రాయెల్ పొడవునా జనం ఆదరిస్తూ, గౌరవిస్తూ వచ్చారని Samuel and Kings లోని ప్రతి అధ్యాయమూ చెబుతుందని క్యాంప్ బెల్ అంటారు. సాంప్రదాయిక బైబిల్ పండితులు మోజెస్ రాసినట్టు విశ్వసించే పెంటాట్యూక్ (Pentateuch: బైబిల్ లోని మొదటి అయిదు పుస్తకాలను పెంటాట్యూక్ అంటారు. ఇది గ్రీకు పదం. ‘పెంటా’ అంటే అయిదు అనీ, ‘ట్యూక్’ అంటే లిఖితపత్రమనీ అర్థం. ఆ అయిదు పుస్తకాలు: జెనెసిస్, ఎక్సోడస్, లెవిటికస్, నెంబర్స్, డ్యుటెరానమి. వీటిని Laws of Moses అనీ; హిబ్రూ భాషలో ‘ధర్మశాస్త్రం’ అని అర్థమిచ్చే ‘తోరా’ అనీ పిలుస్తారు)లోకి కూడా పురాతన భూమాతకు, ఆమె సర్పభర్తకు సంబంధించిన సంకేతాలు ప్రతీకల రూపంలో నిశ్శబ్దంగా అడుగుపెట్టాయి.

ఉదాహరణకు, నిషిద్ధఫలాన్ని తిన్నప్పుడు, ‘ఎందుకు ఈ పని చేశా’వని స్త్రీని యెహోవా అడుగుతాడు. సర్పం వంచనతో నన్ను తినిపించిందని స్త్రీ చెబుతుంది. అప్పుడు సర్పంతో యెహోవా, ‘నువ్వు ఈ తప్పు చేశావు కనుక, నిన్ను శపిస్తున్నాను. ఇక నుంచి పొట్టతో నేలమీద పాకుతూ, బతికినంతకాలం దుమ్ము తింటూ బతుకు. నీకూ, ఈమెకూ మధ్య; నీ సంతానానికీ, ఈమె సంతానానికీ మధ్య శత్రుత్వాన్ని కల్పిస్తున్నాను. అతను (ఆమె సంతానం)నీ పడగ మీద కొడతాడు, నువ్వు అతని పాదాన్ని కాటేస్తావు’అంటాడు.

అలాగే, ‘నీ భర్త అయిన సర్పానికి నువ్వు అణగిమణగి ఉండుగాక’ అని స్త్రీని శపిస్తాడు. ఇది నూతనయుగం మీద పితృస్వామికపు సీలు వేస్తున్న మాట అని క్యాంప్ బెల్ అంటారు.  ఆ తర్వాత, ‘స్త్రీ ఇచ్చిన ఫలాన్ని తిన్నావు కనుక, ఏ మట్టిలోంచి పుట్టావో ఆ మట్టిలో కలసిపోయే దాకా నీ ఆహారాన్ని శ్రమించి చెమటోడ్చి సంపాదించుకో’ అని పురుషునితో యెహోవా అంటాడు.

ఈ స్త్రీ పురుషులు పుట్టిన ఆ మట్టి మరేదో కాదు; భూమాతే! కాకపోతే యెహోవా మాటలు ఈ భూదేవతకు అంతవరకు ఉన్న పురుషభావారోప(anthropomorphic) లక్షణాలను తొలగించివేస్తున్నాయి. అంటే, భూదేవతను మామూలు మట్టిగా మార్చివేస్తున్నాయి. అయితే, తన నూతన భర్త యెహోవా కూడా తన ఊపిరిని ఊది మట్టి నుంచే సంతానాన్ని సృష్టించాడు కనుక భూమాత , అంటే స్త్రీ, సంతాన సంబంధమైన తన ప్రాథమిక లక్షణాన్నిఅలాగే నిలుపుకుంది. ఒకవైపు యెహోవా రూపంలో పురుషుడు సంతాన ప్రక్రియలోకి వేలు పెట్టి అది తన ద్వారానే జరుగుతున్నట్టు భ్రమింపచేయడానికి కృత్రిమంగా ఎంత ప్రయత్నించినప్పటికీ, మరోవైపు సంతానం కనడంలో స్త్రీకి గల సహజసిద్ధమైన పాత్రను ఈ కథనం మరుగుపుచ్చలేకపోయింది. మట్టినుంచి, అంటే భూమాతనుంచి పుట్టిన సంతానం చనిపోయిన తర్వాత కూడా మట్టిలోనే చేరుతున్నారు తప్ప తండ్రిని చేరడంలేదు.

పైన యెహోవా సృష్టికర్త అయినట్టే, మనదగ్గర కూడా మాతృస్వామిక పురాణకథలను పితృస్వామికంగా మార్చిన ఫలితంగా బ్రహ్మ సృష్టికర్త అయ్యాడు. అయితే, మాతృస్వామిక పురాణకథలు కూడా మన దగ్గర ప్రాచుర్యంలో ఉన్నాయి కనుక, వాటిలో అమ్మవారే సృష్టికి మూలం అవుతుంది. చివరికి సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా ఆమె సృష్టే అవుతాడు.

పై విధంగా చూసినప్పుడు, పాత విశ్వాసప్రపంచానికి చెందిన టైటాన్ల లానే, పితృస్వామ్యపు సీలుతో పుట్టిన కొత్త విశ్వాసప్రపంచానికి చెందిన ఆదం, ఈవ్ లు కూడా భూమాత సంతానమే. మొదట వీరిద్దరూ ఒకటిగానే ఉన్నారు. ఆ తర్వాత రెండయ్యారు. యెహోవా శాపానికి దీటుగా స్పందించడంలో ఆదంలో వెనకటి టైటాన్ స్వభావమూ వ్యక్తమవుతుంది. ‘సమస్త ప్రాణులకూ తల్లి’ అనే అర్థంలోనే తన భార్యను అతడు ఈవ్ అని పిలుస్తాడు. ఈవిధంగా భూమాత కోల్పోయిన పురుషభావారోప లక్షణం ఈవ్ కు సంక్రమిస్తోంది. అలా చూసినప్పుడు, ఆదం ఆమెకు భర్తే కాక, కొడుకు కూడా అవుతాడు. అంతకుముందు యెహోవా మొదట మట్టిలోంచి పురుషుణ్ణి సృష్టిస్తాడు. అది స్త్రీకి కంటె పురుషునికి ప్రాధాన్యం ఇవ్వడానికి సూచన. ఆ తర్వాత ఆ పురుషుడి పక్కటెముకనుంచి స్త్రీని సృష్టిస్తాడు. స్త్రీ సంబంధం లేకుండా పురుషుడే సంతోనోత్పత్తి చేయగలడని చెప్పడం అది.

మహాభారతంలో ద్రోణుని ఓడించే కొడుకు కోసం ద్రుపదుడు యజ్ఞం చేసిన ఘట్టంలో  స్త్రీ సంబంధమైన శోణితమే కాక, పురుష సంబంధమైన శుక్రం కూడా లేకుండా మంత్రశక్తితోనే సంతానం కలిగిస్తామని యాజుడు అనడం (సంతానోత్పత్తిలో స్త్రీది అట్టడుగుస్థానమే-వ్యాసం) ఇలాంటిదే. అయితే, మాతృస్వామ్యంలోకి పితృస్వామిక ఆధిక్యతను చొప్పించడానికి ఇంత పెద్ద కసరత్తు చేసినప్పటికీ మాతృస్వామిక లక్షణాలు పురుషుడి రాజకీయాన్ని, ఆధిపత్యాన్ని అధిగమించి పురాణాలలో తమ ఉనికిని కాపాడుకుంటూ ఉండడం ఇక్కడ గమనించవలసిన విశేషం.

ఇంకా విశేషం ఏమిటంటే, కంచుయుగపు తొలినాటి సీళ్ళ ప్రకారం యెహోవా కూడా సర్పశక్తికి ప్రాతినిధ్యం వహించేవాడే. ఆవిధంగా భూమాతకు సర్పభర్త అవుతాడు. ఉదాహరణకు, మోజెస్ (ఈజిప్టు)ఫారోను మాంత్రిక సర్పదండంతో బెదిరించినప్పుడు, ‘నీ చేతిలో ఉన్నది ఏమి’టని మోజెస్ ను యెహోవా అడుగుతాడు. ‘ఇదొక దండ’మని మోజెస్ జవాబు చెబుతాడు. ‘దానిని నేల మీద ఉంచు’ అని యెహోవా అంటాడు. మోజెస్ దానిని నేల మీద ఉంచగానే అది సర్పంగా మారిపోతుంది. దానిని చూసి మోజెస్ పారిపోతాడు. అప్పుడు యెహోవా ‘దాని తోకపుచ్చుకొని పైకి తీయ’మని చెబుతాడు. మోజెస్ అలా చేయగానే అది తిరిగి దండంగా మారిపోతుంది. ఆ తర్వాత ఆ మాంత్రిక సర్పదండమే ఎడారిలో ఒక రాతినుంచి నీటిని సృష్టిస్తుంది. ఎడారి జనం యెహోవాకు వ్యతిరేకంగా గుసగుస లాడుకుంటున్నప్పుడు యెహోవా వారి మధ్యకు భయంకరమైన పాములను పంపిస్తాడు.

భయంగొలిపే ఒక పాము బొమ్మను తయారుచేయించి దానిని ఒక స్తంభం మీద నిలపమనీ, పాముకాటుకు గురైనవారు దానిని చూసినప్పుడు వారికి ప్రాణభయం ఉండదనీ మోజెస్ కు యెహోవా చెబుతాడు. మోజెస్ అలాగే ఒక కంచు సర్పాన్ని చేయించి దానిని ఒక స్తంభంపై నిలుపుతాడు. రాజు హెజెకియ్య కాలం వరకూ(క్రీ.పూ.719-691) జెరూసలెంలో ఉన్న ఆ కంచుసర్పాన్ని అందరూ భక్తితో సందర్శించుకునేవారు. దాని ముందు ధూపం వేసేవారు. దానికి ‘నెహుస్తాన్’ అని పేరు. అయితే, హెజెకియ్య ఆ కంచుసర్పాన్ని ధ్వంసం చేయించాడు.

క్యాంప్ బెల్ ఇంకో సంగతిని కూడా ప్రస్తావిస్తారు. యెహోవాను ప్రధానంగా ఆరాధించే పూజారితెగ పేరు ‘లెవీ’. యెహోవా జయించిన సర్పం పేరు ‘లెవియథాన్’. అలాగే సర్పపాదాలతో ఉన్న యెహోవా చిత్రాలు కూడా ఉన్నాయని ఆయన అంటారు. పై ఉదాహరణలన్నీ మాతృస్వామికరూపమైన సర్పంతో పితృస్వామిక యెహోవాకు ఉన్న సంబంధాన్ని సూచిస్తాయి.

అదలా ఉండగా, పాముకాటుకు గురైనవారు జెరూసలెంలోని స్తంభం మీద ఉన్న కంచుసర్పాన్ని దర్శించుకునేవారు అన్నప్పుడు; కంచిలో వరదరాజస్వామి ఆలయంలోని బంగారు, వెండి బల్లులు; వాటిని తాకితే బల్లిపాటు వల్ల కలిగే అనర్థాలు ఉండవన్న విశ్వాసం గుర్తుకొచ్చి ఉండాలి.

మిగతా తర్వాత….

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. DR.R.Suman Lata says:

    కల్లూరి.గారి విశ్లేషణలు చాల. -చాల బాగుంటున్నాయి. క్రమం. తప్పక. చదివించి. ఆలోచింప.చేస్తున్నండు.కు. సంతోషం..నాకు. మొదటి.నుండీ. కావాలంటే. దొరుకుతాయా.?నేను. గత. కొద్ది. నెలల.నుండి. మాత్రమె. ఈ. వెబ్. చూస్తున్నాను..—-డా.సుమన్. లత.

    • కల్లూరి భాస్కరం says:

      ధన్యవాదాలు డా. సుమన్ లతగారూ…’పురా’గమనం అనే కాలమ్ పేరుమీద క్లిక్ చేస్తే అన్ని వ్యాసాలూ లభ్యమవుతాయి.

  2. రామాయణాన్ని భారతాన్ని రంగనాయకమ్మ గారు
    ఈ ద్రుష్టి కోణంలో రాయగలిగి వుంటే చరిత్రను పురాణాన్ని పరిసీలించిన పరిశోధించిన రెండు గొప్ప తాత్విక గ్రంధాలు మనకు లభించివుండే వి
    శతాబ్దాల విశ్వాసాల్ని ఎగతాళి చేసినట్టుకాకుండా గతితార్కిక క్రియకు గొప్ప సిలబస్ దొరికి వుండేది

  3. కల్లూరి భాస్కరం says:

    ధన్యవాదాలు విశ్వనాథరెడ్డి గారూ…మీ వ్యాఖ్య ఎంతో ఉత్సాహం నింపుతోంది.

మీ మాటలు

*