అణచినవాడే శూరుడు! లొంగిపోతే పతివ్రత!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)నలదమయంతులు, ఓడిసస్ పెనెలోప్ ల కథల మధ్య పోలికల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నామంటే, తేడాలు కూడా ఉన్నాయి కనుకే. అంటే, తేడాల మధ్యనే పోలికలను గుర్తిస్తున్నామన్నమాట. ఆ సంగతిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు సుసూక్ష్మమైన పోలికలను చూద్దాం:

మొదటి పోలిక

రెండు కథలూ ఎటువంటి దేవతారోపాలూ లేని ఇద్దరు మానవుల గురించి, అందులోనూ ఇద్దరు పురుషుల గురించి చెబుతున్నాయి. ఆ చెప్పడంలో మళ్ళీ ఒక తేడా ఉంది. నలుని ఉదాసీనంగానూ, విధి లేదా ఒక అదృశ్యశక్తి అతని కష్టాలకు కారణమైనట్టుగానూ కథకుడు చిత్రిస్తున్నాడు. అతణ్ణి విధి చేతిలో పావుగానే తప్ప, కష్టాల నుంచి గట్టెక్కడానికి పురుష(మానవ) ప్రయత్నం చేసినవాడిగా చూపించడం లేదు. ఇందుకు భిన్నంగా, ఇంతకుముందు చెప్పుకున్నట్టు, దమయంతి క్రియాశీలగా కనిపిస్తుంది. అంటే, దమయంతి అనే స్త్రీకి గల క్రియాశీల స్వభావాన్ని కథకుడు బహిర్గతం చేస్తూనే, దానిమీద పలచని తెర వేసి, నలుడు అనే పురుషుడి ముఖంగా కథ చెబుతున్నాడన్న మాట.

స్త్రీ, పురుష స్వామ్యాల కోణం నుంచి చూస్తే, భారతీయ తాత్వికతకు గల ప్రత్యేకతను ఇది వెల్లడిస్తుంది. ఎలాగంటే, సామాజిక స్థాయిలో స్త్రీ స్వామ్యం మీద పురుషస్వామ్యాన్ని ప్రతిష్టించడమే ఇక్కడ జరిగింది కానీ, తాత్విక స్థాయిలో స్త్రీస్వామ్యాన్ని పూర్తిగా అణగదొక్కలేదు. అంతర్లీనంగా రెండు స్వామ్యాల మధ్య ఒక రాజీసూత్రం కనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం భారతీయ స్వభావంలోనూ, చరిత్రలోనూ ఉంది. మనది నేటికీ బహుళ దేవీ, దేవుల ఆరాధనా రూపంలో బహురూప ఆస్తికత కొనసాగుతున్న దేశమని చెప్పుకున్నాం.

ఓడిసస్ నలుడికి భిన్నం. నలుడిలో ఉదాసీనత కనిపిస్తే, ఓడిసస్ లో క్రియాశీలత కనిపిస్తుంది. నలుడు ఎంత యోధుడో మనకు తెలియదు. కథకుడు ఆ కోణానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ ఓడిసస్ ను యోధుడిగా చూపించడానికి కథకుడు ప్రాధాన్యం ఇస్తున్నాడు. అతను ట్రాయ్ యుద్ధంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత పన్నెండు ఓడలలో సహచరులను వెంటబెట్టుకుని సాహసయాత్ర ప్రారంభించాడు. ఒక పట్టణం మీద పడి జనాన్ని చంపి స్త్రీలను, సంపదను సహచరులతో కలసి పంచుకున్నాడు. యోధలక్షణంతోపాటు ఇది అతని పురుష, లేదా మానవ ప్రయత్నాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత అతనికి పరీక్షలు, కష్టాల పరంపర ప్రారంభమవుతుంది. నలుడు ఎదుర్కొన్న పరీక్షలు, కష్టాల వెనుక ప్రతికూల(కలి), అనుకూల(కర్కోటకుడు) శక్తులు ఉన్నట్టే, ఓడిసస్ వెనుక కూడా (జియస్, పోసిడియన్, అయోలస్, హెర్మెస్) ఉన్నారు. అయితే, నలునికి భిన్నంగా ఓడిసస్ మానవీయమైన తెలివితోనూ, వీరత్వంతోనూ, పురుషకార్యంతోనూ కష్టాలనుంచి గట్టెక్కడానికి ప్రయత్నిస్తాడు. నలుని విషయంలో కథకుడు విధిపాత్రను ప్రముఖంగా సూచిస్తున్నట్టు కనిపిస్తే; ఓడిసస్ విషయంలో పురుషయత్నాన్ని ప్రముఖంగా సూచిస్తాడన్నమాట.

ఓడిసస్ ఒంటి కన్ను రాక్షసుడైన పోలిఫెమస్ బారినుంచి బయటపడిన తీరే చూడండి. అతని చేత మద్యం తాగించి నిద్రపుచ్చడంలో, అతని కన్ను పొడిచేసిన తర్వాత పొట్టేళ్ళ కడుపుకు వేలాడుతూ తప్పించుకోవడంలో ఓడిసస్ బుద్ధిబలాన్ని ఉపయోగించుకుంటాడు. ఆ తదుపరి ఘట్టంలో అయోలస్ అనే వాయుదేవుడినుంచి సహాయం పొందుతాడు. అయితే సహచరులు చేసిన తప్పువల్ల మళ్ళీ కష్టాల్లో పడతాడు. ఆ తర్వాత నరమాంసభక్షకులు ఉండే దీవికి చేరుకుని అక్కడ ఒక అందమైన యువతిని చూసి సమ్మోహితుడవుతాడు. పదకొండు ఓడలను, ఎంతోమంది సహచరులను కోల్పోవడం రూపంలో అందుకు ప్రతిఫలం చెల్లించుకుంటాడు.

download

అక్కడినుంచి సిర్సే అనే అప్సరస ఉండే దీవికి చేరుకుని, తన సహచరులను ఆమె పందులుగా మార్చివేసినట్టు తెలిసి ఆమెను శిక్షించడానికి ఒక కత్తి తీసుకుని బయలుదేరతాడు. అప్పుడతనికి హెర్మెస్ అనే దేవుడి సాయం లభిస్తుంది. సిర్సేను లొంగదీసుకుని సహచరులను రక్షించుకోవడమే కాక, ఆమెతో పడకసుఖం కూడా పొందుతాడు. ఆమె సూచనపై అధోలోకానికి వెళ్ళి పితృదేవతలకు తర్పణం ఇస్తాడు. ఆ తర్వాత సౌరద్వీపానికి వెడతాడు, మరోసారి తుపానులో చిక్కుకుని, ఉన్న కొద్దిమంది సహచరులనూ, ఓడనూ కూడా కోల్పోతాడు. ఒంటరిగా ఇంకో దీవికి చేరి అక్కడ కలిప్సో అనే అప్సరసతో ఎనిమిదేళ్ళు కాపురం చేస్తాడు. మళ్ళీ తెప్ప మీద బయలుదేరి విధ్వంసానికి గురై ఈదుకుంటూ వెళ్లి కొందరు బాలికల సాయంతో ఫేషియన్లను కలుస్తాడు. వారు అతణ్ణి ఓడలో క్షేమంగా స్వస్థలానికి పంపిస్తారు. అక్కడ అతను పెనెలోప్ స్వయంవరపరీక్షను వీరోచితంగా ఎదుర్కొని తిరిగి ఆమెను గెలుచుకుంటాడు.

ఇలా అనుకూల శక్తులనుంచి సాయం పొందుతూనే ప్రతికూలశక్తులను బుద్ధిబలంతోనూ, భుజబలంతోనూ ఎదుర్కొంటూ అనేక కష్ట నష్టాలనుంచి పురుషప్రయత్నంతో బయటపడిన మానవమాత్రుడిగా ఓడిసస్ ను చిత్రించే కథకుని వ్యూహం అడుగడుగునా స్ఫురిస్తూ ఉంటుంది. ఇందుకు భిన్నంగా నలదమయంతుల కథలో ఇటువంటి బుద్ధిబలాన్ని సమయస్ఫుర్తిని దమయంతి ప్రదర్శిస్తుంది. రెండు కథల్లోనూ దేవతలపై మనిషిది పైచేయిగా చూపడం కనిపిస్తుంది. ఇంకొక విధంగా, చెప్పాలంటే దేవతల మధ్యలోంచి క్రియాశీలుడైన నరుడు ఆవిర్భవించడం గురించి ఈ కథలు చెబుతున్నాయి.

రెండవ పోలిక

ఇది మరింత సుసూక్ష్మంగా అర్థం చేసుకోవలసిన పోలిక. ఇక్కడ జోసెఫ్ క్యాంప్ బెల్ తన విశ్లేషణలో పేర్కొన్న female principle అడుగుపెడుతుంది. ఆ మాటను ‘స్త్రీ సూత్రం’ గా అనువదించుకుందాం. ఓడిసస్ కథలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది కనుక ముందు దాని గురించి చెప్పుకుందాం. ఓడిసస్ కు– నీళ్ళు పట్టుకుంటున్న ఒక అందమైన యువతి; సిర్సే, కలిప్సో అనే అప్సరస,లు నౌసికా అనే బాలిక, ఎథెనా అనే అనుకూల దేవత వరసగా తారసపడతారు. అందమైన యువతి రూపంలో అతనికి ఎదురై, సమ్మోహన పరచిన తొలి అనుభవం నరమాంసభక్షకుల రూపంలో పెద్ద ప్రమాదాన్ని కొనితెచ్చింది. ఆ తర్వాత ప్రతికూలశక్తిగా ఓడిసస్ కు ఎదురైన సిర్సే చివరికి అతనికి లొంగిపోయి అనుకూలశక్తిగా మారిపోయింది. అతను ఆమె పొందును అనుభవించడమే కాక ఆమె నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుని మార్గదర్సనం కూడా పొందాడు. సిర్సే దగ్గరే అతని నగ్నత్వం గురించిన ప్రస్తావన వస్తుంది.

ఇక కలిప్సో మొదటినుంచీ అనుకూలత పాటించిన అప్సరస. ఆమెతో అతను ఎనిమిదేళ్ళు కాపురం చేయడానికి కారణం, మోహపాశంతో తనను బంధించివేసింది కనుకనే. ఆమెకు ఇష్టంలేకపోయినా ఆ పాశాన్ని తెంచుకుని బయటపడ్డాడు. సిర్సే దగ్గర ఎదురైన నగ్నత్వ భయానికి భిన్నంగా కలిప్సో దగ్గర అతనికి వస్త్రం లభించింది. మళ్ళీ నౌసికా అనే బాలిక తారసపడిన సందర్భంలో నగ్నత్వప్రస్తావన వచ్చింది. అప్పుడతను పూర్తి నగ్నంగా మారాడు. అయితే, ఆ బాలిక అతనికి వస్త్రం కూడా ఇచ్చి రాజభవనానికి తీసుకువెడుతుంది. చివరగా అతను కొడుకును, భార్యను కలసుకోడానికి ఎథెనా సాయపడుతుంది. ఈ ‘స్త్రీ సూత్రా’నికి కీలకమైన తాత్వికమైన వివరణ ఉంది. దాని గురించి త్వరలోనే చెప్పుకోబోతున్నాం.

నలదమయంతుల కథకు వస్తే; ఈ స్త్రీ సూత్రం అన్నది ఓడిసస్ కథలో కనిపించినంత స్పష్టంగానూ, వివరంగానూ కాక, లీలగా ధ్వనిస్తూ ఉంటుంది. ఈ కథలో ప్రధాన స్త్రీపాత్ర దమయంతి ఒక్కతే. ఆమె అప్సరసో, లేక అందమైన అపరిచిత యువతో కాదు, నలునికి అర్థాంగి. కాసేపు ఆ సంగతిని పక్కన పెట్టి ఓడిసస్ కథలోని స్త్రీ సూత్రాన్ని ఆమెకు అన్వయించుకుని చూద్దాం. దమయంతిని వివాహమాడాకే నలునికి కష్టాలు మొదలయ్యాయి. ఆమెతో ఉన్నప్పుడే అతడు నగ్నంగా మారాడు. ఆమె చీరలోని అర్థభాగంతోనే తన నగ్నత్వాన్ని కప్పుకున్నాడు. చివరికి ఆ చీరను తెంచుకుని బయటపడ్డాడు. తిరిగి దమయంతిని కలసుకున్న సందర్భంలోనే పోగొట్టుకున్న తన వస్త్రాన్ని మళ్ళీ సంపాదించుకుని, ధరించి నలుడిగా మారాడు. ఓడిసస్ కథలోనూ, ఈ కథలోనూ కూడా స్త్రీ సమక్షంలో పురుషుడి నగ్నత్వానికీ, వస్త్రానికీ ఏదో ప్రతీకాత్మక, తాత్విక ప్రాముఖ్యం ఉన్నట్టు అనిపిస్తుంది.

oedipus

ఈ నగ్నత్వ ప్రస్తావన వచ్చే మరో ప్రసిద్ధ కథ ఊర్వశీ-పురూరవులది. ‘నువ్వు ఎప్పుడైతే నాకు నగ్నంగా కనిపిస్తావో అప్పుడే నిన్ను విడిచి వెళ్లిపోతాను’ అని ఊర్వశి పురూరవుడికి షరతు పెడుతుంది. ఒకరోజున పురూరవుడు నగ్నంగా కనిపించేసరికి అతణ్ణి విడిచి వెళ్లిపోతుంది. ఈ కథకు వేరే అన్వయాలు ఉన్నాయి. వాటి గురించి తర్వాత చూద్దాం.

ఇక్కడ ఇంకొక విషయం గుర్తుచేసుకోవాలి. పైన చెప్పిన స్త్రీ సూత్రమూ, లేదా స్త్రీ స్వామ్య, పురుష స్వామ్యాలలో గ్రీకు తాత్వికతకు, భారతీయ తాత్వికతకు తేడా ఉందని చెప్పుకున్నాం. గ్రీకు తాత్వికతలోనే కాక సామాజిక స్థాయిలో కూడా స్త్రీ-పురుష స్వామ్యాల మధ్య తీవ్ర ఘర్షణా, ఒకదానిపై ఒకటి పై చేయిని చాటుకునే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో పురుషుడు విజయం సాధించి వీరుడిగా, క్రియాశీలిగా ఆవిర్భవించడం ఉన్నాయి. భారతీయ తాత్వికతలో స్త్రీ-పురుష స్వామ్యాల మధ్య ఘర్షణతోపాటు సర్దుబాటు, సయోధ్య ఉంటూనే; సామాజిక స్థాయిలో స్త్రీ స్వామ్యంపై పురుషస్వామ్యం పై చేయిని చాటుకోవడం ఉంది. అయితే, పురుషుని నరుడిగా, వీరుడిగా, క్రియాశీలిగా అవతరింపజేయడం భారతీయ, గ్రీకు సందర్భాలు రెండింటిలోనూ ఉమ్మడి అంశం.

ఈ కోణంలోకి వెళ్లినప్పుడు భారతీయ, గ్రీకు పురాణ కథలలోనే కాక; ప్రపంచ పురాణ కథలు అనేకంలో ఆశ్చర్యకరమైన పోలికలు కనిపిస్తాయి. ఉదాహరణకు ఒక బాబిలోనియా పురాణ కథలో మర్దుక్ అనే దేవుడు తియామత్ అనే స్త్రీశక్తిని, లేదా దేవతను చంపుతాడు. తియామత్ పై రాక్షసి అన్న ముద్ర పడుతుంది. అది, స్త్రీ స్వామ్యం నుంచి పురుషుడు వీరత్వంతో బయటపడి క్రియాశీలి అవడానికి ప్రతీక. మన రామాయణానికి వస్తే, రాముడు తాటక అనే రాక్షసిని చంపుతాడు. లక్ష్మణుడు శూర్పణఖ అనే రాక్షసి ముక్కు చెవులు కోస్తాడు. కృష్ణుడు పూతన అనే రాక్షసిని చంపుతాడు. ఇంద్రుడు ఉష అనే దేవతను చంపుతాడు. నరుడిగా ప్రత్యేకమైన గుర్తింపు పొందిన అర్జునుడు పులోమ, కాలక అనే రాక్షసస్త్రీలను కాకపోయినా వారి సంతానాన్ని చంపుతాడు. ఊర్వశి అనే అప్సరసతో పొందుకు నిరాకరిస్తాడు. ఓడిసస్ సిర్సేను చంపకపోయినా ఆమెపై కత్తి దూస్తాడు.

అర్జునుని నరుడు అన్నట్టుగానే రామాయణంలో రాముని నరాంశను నొక్కి చెప్పడం కనిపిస్తుంది. ‘నేను దశరథ మహారాజు కొడుకుని, మనిషిని మాత్రమే’ నని రాముడు ఒక సందర్భంలో చెప్పుకుంటాడు. అలాగే రాముని ‘పురుషోత్తముడు’ అన్నారు. అంటే ప్రపంచ పరిణామంలో ఒక దశలో స్త్రీ స్వామ్యంపై పురుష స్వామ్యాన్ని స్థాపించి వీరుడు, సాహసి, క్రియాశీలుడైన నరుని ఆవిర్భవింపజేయవలసిన అవసరం కలిగిందని ఈ కథలన్నీ సూచిస్తున్నాయన్న మాట.

స్త్రీపై రాక్షసి అన్న ముద్ర వేయడమే కాక, పురుషుడి కష్టాలకు, అతడు ఆత్మన్యూనతలోకి, నిష్క్రియత్వంలోకి జారిపోవడానికి స్త్రీయే కారణమన్న సూచనను ఉద్దేశపూర్వకంగానో, అనుకరణప్రాయంగానో ఆయా పురాణ కథలు అందిస్తున్నట్టు కనిపిస్తుంది. కొన్ని పోలికలు చూడండి…నలదమయంతుల కథలో నలుడు దమయంతిని పెళ్లాడిన తర్వాతే రాజ్యం కోల్పోయి కష్టపరంపరలో చిక్కుకుంటాడు. ప్రవాస జీవితం గడుపుతూనే బాహుకుడనే పేరుతో, వికృత వేషంలో, అంటే మారువేషంలో దమయంతి ‘పునస్స్వయంవరా’నికి వెడతాడు. పెనెలోప్ తో వివాహం అయిన తర్వాతే ఓడిసస్ యుద్ధానికీ, అక్కడినుంచి సముద్రంలో సాహసయాత్రకు బయలుదేరి వెళ్ళి పదేళ్లపాటు అనేక కష్టానష్టాలకు గురై చివరికి నోమన్ అనే మారుపేరుతో బిచ్చగాడి వేషంలో పెనెలోప్ పునస్స్వయంవరానికి వెడతాడు.

రాముడు విశ్వామిత్రుని వెంట అడవికి వెళ్ళి అక్కడినుంచే నేరుగా సీతాస్వయంవరానికి వెళ్ళి సీతను వరిస్తాడు. ఆ తర్వాత పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేస్తాడు. అలాగే, పాండవులు ద్రౌపది స్వయంవరానికి వెళ్లే ముందు బ్రాహ్మణ వేషాలలో అరణ్యవాసమే చేస్తున్నారు. ద్రౌపదితో వివాహం తర్వాతే వారు అర్థరాజ్యం పొందారు, ఆ రాజ్యాన్ని కోల్పోయి ఈసారి ద్రౌపదితోపాటు మళ్ళీ అడవుల పాలయ్యారు. వారు రాజ్యం కోల్పోవడం వెనుక ద్రౌపది పాత్ర కూడా ఎంతో కొంత ఉంది.

అయితే, ఈ పోలికలు అన్నీ అచ్చు గుద్దినట్టు ఒకే సూత్రాన్ని అనుసరించడంవల్ల కాకపోవచ్చు. కొన్ని కథానిర్మాణంలో అనుకరించిన స్థూలమైన పోలికలు కావచ్చు. స్త్రీ స్వామ్యంపై పురుష స్వామ్యాన్ని స్థాపించే ప్రయత్నం మాత్రం అన్నింటిలోనూ సమానం. ఉదాహరణకు, నలదమయంతులు, ఓడిసస్ పెనెలోప్ ల కథల నిర్మాణం స్థూలంగా ఒకలానే ఉంటుంది. కానీ నలదమయంతుల కథలో వాస్తవంగా క్రియాశీల అయిన దమయంతి ముఖంగా కాక, ఉదాసీనుడైన నలుని ముఖంగా కథ చెబుతుంటే; ఓడిసస్ కథలో ఓడిసస్ నే క్రియాశీలుడిగా చూపిస్తూ అతని ముఖంగా కథ చెబుతున్నాడు. స్త్రీ స్వామ్యంమీద పురుష స్వామ్యం పైచేయిని నొక్కి చెప్పడం రెండింటా సమానం. అదే మిగతా ఉదాహరణలలోనూ కనిపిస్తుంది.

రామాయణకథ తెలిసిన వారికి ఒక సందేహం కలిగితీరాలి. అదేమిటంటే, తాటక, పూతన తదితరులే కాక, రావణుని చెల్లెలు అయిన శూర్పణఖ కూడా రాక్షసి అయినప్పుడు రావణుని భార్య అయిన మండోదరి ఎందుకు కాలేదన్నది. పౌరాణిక సంప్రదాయం మండోదరిని పతివ్రతగానూ, ఉత్తమురాలిగానూ గుర్తిస్తుంది. దీనికి మనం చెప్పుకోగలిగిన తార్కిక సమాధానం బహుశా ఒక్కటే: స్త్రీస్వామ్యంలో ఉన్న స్త్రీలు రాక్షసులు, పురుష స్వామ్యాన్ని, పురుషుడి ఆధిపత్యాన్ని అంగీకరించిన వారు ఉత్తమురాళ్ళు, పతివ్రతలు అయ్యారన్నమాట!

అదలా ఉంచితే, ఇక్కడినుంచి మనం మరిన్ని తాత్వికపు లోతుల్లోకి వెళ్లవలసి ఉంటుంది. అది తర్వాత…

 -కల్లూరి భాస్కరం

మీ మాటలు

  1. V.V.Satyanarayana Setty says:

    చ రి త్ర ను ఈ వి ధం గా నే చూ డా లి .
    …………వి .వి . స త్య నా రా య ణ శె ట్టి .

మీ మాటలు

*